స్త్రీని ‘జయించా’కే సీత జాడ తెలిసింది!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రామాయణంలో సీతాన్వేషణ ఒక ముఖ్యమైన ఘట్టం. వానరరాజు సుగ్రీవుడు సీత జాడ కనిపెట్టడానికి వానరబృందాలను అన్ని దిక్కులకూ పంపుతాడు. దక్షిణ దిశకు పంపిన బృందంలో హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైనవారు ఉన్నారు.  సుగ్రీవుడు చండశాసనుడు. అందుకే ‘సుగ్రీవాజ్ఞ’ అనే నానుడి వచ్చింది. వానరబృందాలను పంపుతూ అతడు గడువు విధిస్తాడు. గడువులోపల తిరిగి రాకపోతే మరణదండన తప్పదు.

అయితే, హనుమంతుడి బృందం స్వయంప్రభ బిలంలో ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోయింది, దాంతో ఆ బృందంలో ఉన్నవారందరికీ ప్రాణభయం పట్టుకుంది. అక్కడే ఉండిపోయి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టడానికి యువరాజు అంగదుడు నిర్ణయించుకుంటాడు. హనుమంతుడు ఎంత నచ్చచెప్పినా నిర్ణయం మార్చుకోడు. అంతలో జటాయువు అన్న అయిన సంపాతి కనిపించి లంకను పాలించే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి చెప్పి, లంక ఎక్కడుందో చెబుతాడు. అప్పుడు సముద్రాన్ని దాటి వందయోజనాల దూరంలో ఉన్న లంకకు వెళ్ళి, సీత జాడ కనిపెట్టే బాధ్యతను హనుమంతుడు స్వీకరిస్తాడు.  ఆ ఘట్టాన్ని ‘సుందరకాండ’ పేరుతో వాల్మీకి ప్రత్యేకంగా చిత్రించాడు.

ఈ కాండలో హనుమంతుడే నాయకుడు. వాల్మీకి ప్రకారం, అతను బుద్ధికుశలత కలిగిన వారందరిలోనూ ఉన్నతుడు. మంచి మాట నేర్పు ఉన్నవాడు. వానరవీరులలో ముఖ్యుడు. బ్రహ్మచారి, అంటే స్త్రీ సంబంధం లేనివాడు. గొప్ప కార్యసాధకుడు. ఇవన్నీ ‘పురుష’ప్రయత్నాన్ని, ‘వీర’త్వాన్ని నొక్కిచెప్పే గుణాలు. సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళి సీత ఉనికిని కనిపెట్టడం అనే మహత్కార్యం సాధించాలంటే, హనుమంతుడిలో ఈ గుణాలు అన్నీ ఉండాలి.

అయితే, అతనిలో ఈ గుణాలు ఉన్నట్టు నిరూపణ ఎలా? దానికి అతి ముఖ్యమైన గీటురాయి, అతను ‘స్త్రీ సూత్రా’(female principle)న్ని అధిగమించగలగడం! ఈ ఘట్టంలో కథకుడు ఒకరిని కాదు, ఏకంగా ముగ్గురు స్త్రీలను ప్రవేశపెట్టి హనుమంతుడు తన బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ వారిని ఎలా జయించాడో చెప్పాడు. దుర్భేద్యమైన రావణాసురుని నగరంలోకి అడుగుపెట్టి సీత జాడ కనిపెట్టాలంటే, ఒక స్త్రీని జయిస్తే సరిపోదు, ముగ్గురు స్త్రీలను జయించినట్టు చెప్పాలి.

ఆ ముగ్గురిలో మొదటి స్త్రీ, ‘నాగమాత’ అయిన సురస; రెండవ స్త్రీ, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి; మూడవ స్త్రీ లంకానగరానికి అధిదేవత అయిన లంకిణి.

హనుమంతుడు సముద్రం మీద పయనిస్తుండగా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అతని బలపరాక్రమాలను, బుద్ధికుశలతను తెలుసుకోవాలని ముచ్చట పడ్డారు. “నువ్వు భయంకరమైన కోరలతో, పచ్చని కళ్ళతో, ఆకాశమంత నోటితో, పర్వతంలాంటి రాక్షసరూపం ధరించి క్షణకాలం అతనికి విఘ్నం కలిగించు” అని నాగమాత అయిన సురసను కోరారు. సురస వారు కోరిన రూపంలో సముద్రమధ్యంలోంచి  వెళ్ళి హనుమంతుని అడ్డగించింది. నిన్ను తినేస్తానంది. “నేను సీతను చూసొచ్చి రామునికి ఆమె కుశలం చెప్పిన తర్వాత నీలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు వెళ్ళనివ్వు’’ అని హనుమంతుడు అన్నాడు. సురస అంగీకరించకుండా తన నోటి వైశాల్యాన్ని పెంచుకుంటూ పోయింది.  హనుమంతుడు అంతకంటే ఎక్కువ ప్రమాణానికి తన దేహాన్ని పెంచుకుంటూ వెళ్ళి, హఠాత్తుగా బొటనవేలంత రూపం ధరించి సురస నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటికి వచ్చేశాడు. ఈవిధంగా ఉపాయంతో, స్త్రీ రూపంలో ఎదురైన మొదటి అడ్డంకిని దాటాడు.

కొంతదూరం వెళ్ళిన తర్వాత, సింహిక అనే రాక్షసి అతన్ని చూసింది.  ఇంతకాలానికి తినడానికి మహాజంతువు ఒకటి దొరికిందనుకుంది. హనుమంతుని నీడను పట్టుకుని కిందికి లాగడం ప్రారంభించింది. ఒక్కసారిగా తన వేగమూ, బలమూ సన్నగిల్లడంతో హనుమంతుడు ఆశ్చర్యంగా అన్నివైపులా చూశాడు. మహాశక్తిమంతమైన సింహిక కనిపించింది. తనను మింగడానికి తెరచిన సింహిక నోట్లోకి ప్రవేశించి వాడిగోళ్లతో ఆయువు పట్లను చీల్చి చెండాడాడు. సింహిక ఆర్తనాదం చేస్తూ కుప్పకూలింది. “ఈ మహాప్రాణిని చంపి నువ్వు అద్భుతకార్యం సాధించా”వంటూ దేవతలు, గంధర్వులు మొదలైనవాళ్లు హనుమంతుని అభినందించారు.

చివరికి త్రికూటపర్వతం మీద ఉన్న లంకానగరాన్ని చూశాడు. పైనుంచి అతనికి అది ‘నాగులతో నిండిన’ పాతాళ నగరం భోగవతిలా కనిపించింది. నగరంలోకి ప్రవేశించబోతుండగా భయంకరరూపం కలిగిన లంక అధిదేవత లంకిణి అతన్ని అడ్డగించింది. నన్ను జయించి కానీ నువ్వు లోపలికి వెళ్లలేవంటూ అరచేతితో అతన్ని బలంగా కొట్టింది. హనుమంతుడు ఆమెను పిడికిలి బిగించి కొట్టేసరికి ఆర్తనాదం చేస్తూ నేలకొరిగి, శరణు వేడి దారి ఇచ్చింది.

ఈవిధంగా అతను లంకలోకి ప్రవేశించడం, సీతను చూడడం, పలువురు రాక్షసులను చంపడం, రావణుని కలసుకుని రాముడు యుద్ధసన్నద్ధుడై వస్తున్నట్టు చెప్పడం, లంకా దహనం చేయడం తదుపరి పరిణామాలు.

హనుమంతుడు ‘నాగమాత’ సురసను జయించడమే చూడండి…దానర్థం, మాతృస్వామిక ఆరాధన రూపమైన సర్పాన్ని జయించడమే! ఈ విధంగా అతనికి భాగవత కృష్ణుడితోనూ, బైబిల్ యెహోవాతొనూ సామ్యం కుదురుతోంది. నాగులతో నిండిన పాతాళంలా లంక అతనికి కనిపించిందనడంలో కూడా నాగుల ప్రస్తావన ఉంది. అంతేకాదు, వాటితోపాటు లంకలోని రాక్షసులను కూడా ఈ సందర్భంలో కథకుడు ప్రస్తావించాడు.  లంకా నగరం నరులకు, వానరులకు కూడా భిన్నమైన జీవనవిధానమూ, విశ్వాసాలూ ఉన్న ప్రదేశమని ఈ రెండు ప్రస్తావనలూ సూచిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాక్షసత్వాన్ని ఆపాదనగా పరిగణించి, నాగుల ప్రస్తావనలను గమనంలో ఉంచుకుంటే లంకానగరం మాతృస్వామిక అవశేషాలు కలిగిన ప్రాంతం అనుకోవాలా?! ప్రస్తుతానికి దీనిని సందేహార్థకంగానే వదిలేద్దాం.

అలాగే, హనుమంతుడికి, ఓడిసస్ కు కూడా ఒక పోలిక కుదురుతోంది. హనుమంతుడు సముద్రం మీద లంఘిస్తే, ఓడిసస్ సముద్రయానం చేశాడు. ఇద్దరూ వీరులే. హనుమంతుడు తన ప్రయాణంలో ఒక ప్రతికూల స్త్రీ( సింహిక), ఇద్దరు అనుకూల (సురస, లంకిణి) స్త్రీల రూపంలో ‘స్త్రీ సూత్రా’న్ని ఎదుర్కొన్నట్టే; ఓడిసస్ కూడా నీళ్ళు పట్టుకునే ఒక అందమైన యువతి, సిర్సే, కలిప్సే అనే ఇద్దరు అప్సరసలు—మొత్తం ముగ్గురు స్త్రీల రూపంలో స్త్రీ సూత్రాన్ని ఎదుర్కొంటాడు. అందమైన యువతి పట్ల సమ్మోహితు డైనందుకు పదకొండు ఓడలను, పెద్ద సంఖ్యలో సహచరులను కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంటాడు. తర్వాత సిర్సే అనే ప్రతికూలశక్తిని దైవ సహాయంతో లొంగదీసుకుని, ఆ తర్వాత కలిప్సే అనే అనుకూలశక్తితో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. వీటికంటె ముందు పోలిఫెమస్ అనే ఒంటికన్ను రాక్షసుని ఉపాయంతో జయిస్తాడు. ఈ విధంగా హనుమంతుడి లానే ఓడిసస్ కూడా స్త్రీ సూత్రాన్ని అధిగమించడంలో బుద్ధిబలాన్ని, భుజబలాన్ని, ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాడు. ఇద్దరికీ దేవతల సహాయమో, ఆశీస్సులో లభిస్తాయి.

ఆ మాటకొస్తే,  హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి ముందే వానరులందరికీ స్వయంప్రభ బిలం రూపంలో ‘స్త్రీ సూత్రం’ ఎదురైందని అనుకోవచ్చు. అద్భుతత్వమూ, ఆకర్షణా ఉట్టిపడే అలాంటి బిలం ఆ పరిసరాలలో ఉంటుందని వారు ఊహించలేదు. అక్కడే వారు నెలరోజులు ఉండిపోయారని కథకుడు చెబుతున్నాడు. అంటే దాని ఆకర్షణకు లొంగి వారు తమ మీద ఉన్న కార్యభారాన్ని విస్మరించారన్నమాట. అలా వారు అక్కడ ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోవడంతో వారికి మృత్యుభయం పట్టుకుంది. కలిప్సే మోహజాలంలో చిక్కుకుని ఎనిమిదేళ్లు ఆమెతోనే ఉండిపోయి యాత్రాలక్ష్యాన్ని విస్మరించిన ఓడిసస్ ను ఇది గుర్తుచేస్తుంది. స్త్రీ సూత్రం కార్యసాధనకు అడ్డంకి అని ఇందులోని ధ్వని.

స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే  హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు.  స్త్రీవధను ‘వీరత్వా’నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, వీటిమధ్య ఉన్న పోలికలు కేవలం యాదృచ్చికాలని కాకుండా, వీటి వెనుక ఒక కచ్చితమైన సరళి ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక పరిణామాన్ని ఇవి చెబుతున్నాయి. అది:  మాతృస్వామ్యంపై పితృస్వామ్యస్థాపన! అంటే, స్త్రీ ఆధిపత్యం నుంచి పురుషుడు బయటపడి ‘క్రియాశీలి’ కావడం!

hanuma

పురుషుడు స్త్రీపై ఆధిపత్యం సాధించిన తర్వాత, స్త్రీవధ వీరత్వానికి నిరూపణ కావలసిన అవసరం ఇక లేదు. అందుకు భిన్నంగా అది భీరత్వాన్ని సూచిస్తుంది.  స్త్రీని చంపడం మహాపాపంగా, హింసించడం అనాగరికంగానే కాక, అసలు స్త్రీతో యుద్ధం చేయడమే పురుషుడికి నామోషిగా పరిణమిస్తుంది. భీష్ముడి ఉదాహరణ అదే చెబుతుంది. శిఖండిని చూడగానే అయన అస్త్ర్రసన్యాసం చేస్తాడు.

తాటకను చంపబోయే ముందు రాముడు స్త్రీవధ తగునా అన్న ద్వైధీభావానికి లోనవుతాడు. అయినా చంపుతాడు. అంటే కథకుడు స్త్రీవధ తగదన్న సమకాలీన స్పృహను ప్రకటిస్తూనే, అది  ‘వీరోచితం’ అన్న ఒకనాటి సంగతినీ చెబుతున్నాడు. అలాగే, సింహికను చంపిన హనుమంతుడు, లంకిణి విషయానికి వచ్చేసరికి స్త్రీవధ తగదనుకుంటాడు.

అయితే, స్త్రీ ఏ ఉగ్రవాదో అయి ఆయుధంతో దాడి చేసినప్పుడో; ఆత్మరక్షణ అనివార్యమైనప్పుడో కూడా స్త్రీవధ కూడదా అన్న సందేహం ఇక్కడ కలుగుతుంది. అదే సమయంలో, వివిధ ప్రాంతాలకు చెందిన పురాణ, ఇతిహాస కథల మధ్య ఉన్న పోలికల వెనుక ఒక సరళి ఉన్నప్పుడు, అవి సాముదాయికంగా ఒకే విషయాన్ని చెబుతున్నప్పుడు; వాటి వస్తువులో ఒక ఐక్యత ఉన్నప్పుడు స్త్రీ వధను చెదురుమదురు ఘటనగా చూడాలా, లేక చరిత్రకోణంనుంచీ, వ్యవస్థా కోణంనుంచీ అన్వయించుకోవాలా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నా పరిశీలన రెండోదానికే మొగ్గు చూపుతోంది.

అదలా ఉంచితే, లంకిణిని లంకానగర అధిదేవత అనడం, దేవత కేంద్రంగా నిర్మించుకున్న ఒకనాటి నగరరాజ్యాలను సూచిస్తూ ఉండచ్చు.

***

మన పురాణ కథలతో ఇతర పురాణకథలకు ఉన్న మరికొన్ని ఆసక్తికరమైన పోలికలను చూద్దాం:

భూదేవత అయిన గియా కడగొట్టు కొడుకు టైఫాన్ పై గ్రీకు దేవుడు జియస్ విజయం సాధించి ఒలింపస్ పర్వతంపై దేవతల ఆధిపత్యాన్ని నెలకొల్పాడని చెప్పుకున్నాం. సగం మనిషి రూపంలో, సగం సర్పరూపంలో ఉండే టైఫాన్ తల నక్షత్రాలను తాకేలా ఉంటుందనీ, అతని చేతులు సూర్యోదయ ప్రదేశం నుంచి సూర్యాస్తమయ ప్రదేశం వరకు విస్తరించి ఉంటాయనీ కూడా చెప్పుకున్నాం. అతని భుజాల నుంచి వంద మహాసర్పాలు పడగవిప్పి వేలాడుతూ ఉంటాయి. అవి భయంకరంగా నాలుకలు చాపి ఉంటాయి. వాటి అనేక నేత్రాలు మంటలు చిమ్ముతూ ఉంటాయి. వాటి నుంచి వెలువడే  ఎడ్ల రంకెలతో, సింహగర్జనలతో, కుక్కల అరుపులతో, పాముల బుసబుసలతో పర్వతాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. టైఫాన్ ను జియస్ ఎదుర్కొని అంతమొందించకపోతే అతను సృష్టి అంతటికీ అధిపతి అయ్యేవాడట.

జియస్ అతని మీదికి యుద్ధానికి వెడుతుండగా భూమి బాధతో మూలిగింది. అతని చేతిలోని వజ్రాయుధం నుంచి వ్యాపించే జ్వాలలు; టైఫాన్ కళ్లనుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనుంచి జాలువారే మంటలు సముద్రాన్ని మండించసాగాయి. సముద్రం సలసల మరగడం ప్రారంభించింది. ఉవ్వెత్తున లేచిన అలలు తీరంలోని కొండలను, గుట్టలను మహోధృతంగా ఢీకొనసాగాయి. భూకంపాలు పుట్టాయి. మృత్యుదేవుడైన హేడ్స్ గడగడా వణకిపోయాడు.

ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే, టైఫాన్ ను ఎదుర్కోవడంలో కొద్దిసేపు ధైర్యం సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడట! కాసేపటికి బలాన్ని కూడదీసుకుని వజ్రాయుధాన్ని విసిరి ఆ మహాసర్పాల పడగలను దగ్ధం చేశాడు. టైఫాన్ కుప్పకూలిపోయాడు. అతని బరువుకి తల్లి అయిన భూదేవి గిలగిలలాడిపోయింది.

టైఫాన్ తో యుద్ధంలో కాసేపు ధైర్య సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో పడిపోవడమే ఇక్కడ ప్రదానంగా గమనించవలసిన అంశం. మన పురాణఇతిహాస కథలలోని ఇలాంటి ఉదాహరణలు రెండు ఇప్పటికిప్పుడు నాకు  గుర్తుకొస్తున్నాయి. మొదటిది, రామరావణయుద్ధం; రెండవది, విష్ణువు-మధుకైటభుల యుద్ధం.

రాముడు రావణుని తలను ఛేదించగానే దాని స్థానంలో ఇంకొక తల పుట్టుకురాసాగింది. ఇలా కొంతసేపు గడిచింది. రాముడికి ఏం చేయాలో తోచలేదు. అతని నిస్సహాయతను గమనించిన రథసారథి మాతలి, “నువ్వు సాధారణమానవునిలా వ్యవహరిస్తున్నావు. బ్రహ్మాస్త్రం ప్రయోగించు” అని సలహా ఇచ్చాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అందుకుని రావణుని వక్షస్థలానికి గురిపెట్టి ప్రయోగించాడు. దాంతో రావణుడు నేలకొరిగాడు.

దేవీ భాగవతం ప్రకారం… విష్ణువు మధుకైటభులనే రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. వారిని చంపడం అసాధ్యమని ఒకదశలో ఆయనకు అనిపించింది. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు దేవిని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఎట్టకేలకు మధుకైటభులను చంపాడు.

ఇలా రాక్షసునితో జరుగుతున్న యుద్ధంలో జియస్, రాముడు, విష్ణువు ఒక దశలో నిస్సహాయస్థితిలోకి జారిపోవడంలో ఉన్న ఒక్క పోలికను మాత్రమే విశేషంగా చూపడం ఇక్కడ ఉద్దేశం కాదు. అంతకంటే ముఖ్యంగా దీని వెనుక ఒక ఉమ్మడి అంతస్సూత్రం లేదా తాత్విక సూక్ష్మం ఉంది. అది: సర్ప, రాక్షసశక్తుల అజేయతకు సంబంధించినది.

మన పురాణ, ఇతిహాస కథలలోని రాక్షసుల గురించే చూడండి…హిరణ్యకశిపుడు, రావణుడు, భస్మాసురుడు మొదలైన రాక్షసులందరూ తపస్సు చేసి తమకు అజేయ బలాన్ని ప్రసాదించమనీ, ఏవిదంగానూ మరణం లేకుండా వరమివ్వమనీ  సాధారణంగా బ్రహ్మదేవునో, ఒక్కోసారి శివునో ప్రార్థిస్తారు. మరణం అనివార్యమని బ్రహ్మ అంటూనే చాలా అరుదైన, అసాధారణమైన పద్ధతిలో వారికి మరణం సంభవించే వెసులుబాటు కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు తనకు దేవతల వల్లనే కాక; భూమిమీద, నీటిమీద, నరుల వల్ల, జంతువుల వల్ల కూడా మరణం రాకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు విష్ణువు నరసింహావతారం ఎత్తి అతణ్ణి తన తొడల మీద ఉంచి గోళ్ళతో గుండెను చీల్చి చంపుతాడు. అలాగే, రావణుడు ఎవరెవరి వల్లనో తనకు మరణం రాకూడదని అడుగుతాడు కాని, నరుని  విస్మరిస్తాడు. దాంతో విష్ణువు నరుడైన రామునిగా అవతారమెత్తి అతణ్ణి చంపుతాడు.

అలాగే, మధ్య మధ్య పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరించే సర్పం కూడా అజేయశక్తికి ప్రతీక. అంతేకాదు, జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం కూడా, ఈ చావులేని సర్పమూ, రాక్షసులూ మొదట్లో విశ్వవ్యవస్థ (cosmic order)కు, కాలానికి సంబంధించిన అంతుబట్టని నిగూఢత(dark mystery of time)కు ప్రతీకలు. ఈ శక్తులతో వీరుడు లేదా నరుడు తలపడ్డాడు. ఈ నరవీరుని రాకతో పాత విశ్వాసవ్యవస్థ , నాగరికత పతనమయ్యాయి. మినోవన్ క్రిటుసామ్రాజ్యం, భారతదేశంలో హరప్పా, మొహంజదారో నాగరికత విచ్చిన్నమయ్యాయి.

అయితే, పాతవిశ్వాస ప్రపంచం నుంచి కొత్త విశ్వాసప్రపంచంలోకి రావడంలో భారతదేశానికి, పశ్చిమదేశాలకీ మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉందని క్యాంప్ బెల్ అంటారు. దాని గురించి, ఇతర మరికొన్ని అంశాల గురించి తర్వాత….

*

మీ మాటలు

  1. డియర్ కల్లూరి జీ …ఇంతకు మీరు వ్రాస్తున్న వ్యాసాల్లో ని సారాశం చూస్తే హిందూ పురాణాలు అన్నీ గ్రీక్-రోమన్ ,ఇంకా ఇతర దేశాల పురాణాలకు నేటివిటీ అనువాదాలు అని మీరు చెప్పదలచుకున్నట్టుగా అనిపిస్తోంది..ఈ వ్యాసాలను వ్రాయడంలోని మీ కవి హృదయం ఏమిటో వివరించగలరు..

    • గ్రీక్-రోమన్ పురాణాలు హిందూ పురాణల అనువాదాలు .

  2. కల్లూరి భాస్కరం says:

    డియర్ JOYD గారూ…ఇంతవరకు నేను రాసిన 88 వ్యాసాలు మీ ఎదురుగా ఉన్నాయి. వాటిలో చాలా వాటిల్లో మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆ తర్వాత కూడా మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం దొరకకపోతే వాటికి అవకాశమిచ్చిన నా వ్యాసాలలోని అంశాలను నిర్దిష్టంగా పేర్కొని అడిగితే నాకు సమాధానం ఇవ్వడానికి అవకాశముంటుంది.

    మీకు కలిగే సందేహాలు, అభిప్రాయాలే చాలామందికి కలిగే అవకాశం ఉంది కనుక వారందరికీ కూడా నా మనవి ఇది.

  3. మాతృస్వామిక ఆరాధన రూపమైన సర్పాన్ని జయించడమే! ,. నాగ పూజ మాతృస్వామ్యానిక ప్రతీక అనే ఆధారాలు ఏమన్నా వున్నాయా సర్,. ఒక్కో కథకి మధ్య వున్న కాలవ్యవధులను పరిగణలోకి తీసుకోకుండా,. కేవలం సామ్యాలనే అర్థంచేసుకొనే ప్రయత్నాలలో కొంత పొరపాటు జరిగే అవకాశం వుంటుందేమో,.. ఉదాహరణకు రామాయాణం, గ్రీకు పురాణాల, భాగవతం, భారతం వీటి మధ్య వుండే దూరాలు వందల సంవత్సరాలలో వుంటాయనుకుంటాను., వీటి గురించి మీరేమైనా వివరించగలరా,.

  4. కల్లూరి భాస్కరం says:

    “నాగ పూజ మాతృస్వామ్యానిక ప్రతీక అనే ఆధారాలు ఏమన్నా వున్నాయా?”
    –గత అనేక వ్యాసాలుగా దీని గురించి రాస్తున్నాను. చూడగలరు.

    “ఒక్కో కథకి మధ్య వున్న కాలవ్యవధులను పరిగణనలోకి తీసుకోకుండా,. కేవలం సామ్యాలనే అర్థంచేసుకొనే ప్రయత్నాలలో కొంత పొరపాటు జరిగే అవకాశం వుంటుందేమో,..ఉదాహరణకు రామాయణం, గ్రీకు పురాణాలు, భాగవతం, భారతం వీటి మధ్య వుండే దూరాలు వందల సంవత్సరాలలో వుంటాయనుకుంటాను., ”
    –రామాయణం, గ్రీకు పురాణాలు, భాగవతం, భారతం వీటిమధ్య ఉండే దూరాలు వందల సంవత్సారాలలో ఉంటాయనుకుంటాను అని మీరు అనడమే చూడండి. అనుకోవడమే కానీ మనకు కచ్చితంగా తెలియదన్న మాట. అసలు విషయం ఏమిటంటే, మన దగ్గర కాలనిర్ణయం గురించిన పట్టింపు, అధ్యయనం మొదటినుంచీ లేవు. అందుకే మన పురాణకథలను లక్షలు కోట్ల సంవత్సరాల వెనక్కి సృష్టి ప్రారంభకాలానికి, యుగాలు, మన్వంతరాలకు జరిపే అవకాశం దొరికింది. ఇందుకు భిన్నంగా పాశ్చాత్య ప్రపంచంలో, సుమేరు, ఈజిప్టు లాంటి పురాతన నాగరికతలలో దాదాపు ఇప్పుడు మనకు తెలిసిన పద్ధతుల్లో చరిత్రను నమోదు చేయడం జరుగుతూ వచ్చింది. అలాగే పెద్ద ఎత్తున పురావస్తు తవ్వకాలను జరిపించి, ప్రాచీన చారిత్రక ఆధారాలను తవ్వి తీసే ప్రయత్నం కూడా మనవాళ్ళ కన్నా పాశ్చాత్యులే ఎక్కువ చేశారు. వారిది భౌతిక ఆధారాలపై చరిత్రను నిర్మించే పద్ధతి అయితే మనది ప్రధానంగా విశ్వాసం పై ఆధారపడే పద్ధతి. అందుకే మన రామాయణ, పురాణాదులు నేటి మామూలు కాల గణనానికి అతీతమైనవిగా చూడడాన్ని; ఇతర ప్రాంతాల పురాణాల కంటే చాలా ప్రాచీనమైనవనే భావనను సంప్రదాయం మనకు అలవాటు చేసింది. వందల సంవత్సరాల వ్యవధి ఉంటుందనుకుంటాను అని మీరు అనడంలోనే కేవలం విశ్వాసం మీద ఆధారపడిన అనిశ్చితి తొంగి చూస్తోంది, గమనించండి. మనకు కాలనిర్ణయం గురించిన డిసిప్లిన్ లేకపోవడంతో ఇతరుల పరిశీనల వెలుగులో మన వాటి కాలాన్ని అంచనా వేసుకోవడం అనివార్యమవుతోంది.

    సరే, దీనిని అలా ఉంచితే, కాలవ్యవధులకు, సామ్యాల పరిశీలనకు సంబంధం లేదు. రెండింటినీ వేర్వేరుగా చూడాలి, ఉదాహరణకు రామాయణం ఇతివృత్తంగా బయటి దేశం వారు ఎవరైనా ఇప్పుడు రాశారనుకోండి. మీరన్నట్టు వీటి మధ్య వేల సంవత్సరాల వ్యవధి ఉన్నట్టే కదా, అప్పుడు సామ్యాలను చూడడం పొరపాటు అవదు కదా. అదీగాక, రామాయణ, భారతాలు, గ్రీకు పురాణాల మధ్య ఎంత కాలవ్యవధి ఉందనుకున్నా నేటి కాలం నుంచి చూస్తే అవి ప్రాచీనాలే. కనుక వాటి మధ్య ఇప్పుడు సామ్యాలు చూడడంలో ఎలాంటి పొరపాటు ఉంటుందో నాకు అర్థం కాలేదు.

  5. వ్యాసం, మీ సమాధానం బావున్నాయి. మాతృస్వామిక విలువలపై వ్యతిరేకత ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీ పాత్ర లేని నాటకం, అన్ని అనర్థాలకు ఆడదే కారణం.. ఇలాంటివి. తెలుగులో ఇలాంటి వ్యాసాలు చాలా రావాలి. చరిత్ర పట్టని జాతి చరిత్రలో కలసిపోతుంది. అన్నీ వేదాల్లో ఉన్నాయి వాదన బీజీపీ అధికారంలోకి వచ్చాక బాగా ముదిరింది. మొన్న ఒక పైలట్.. 20 ఇంజిన్ల విమానాలు వేదకాలంలో ఉన్నయన్నాడు, అదీ సైన్స్ సెమినార్లో.

  6. విస్తృతమైన మీ పరిశీలన ముందు మాట్లాడేంత అవగాహన నాకు లేదని మీ వ్యాస సంపుటిని మళ్లీ ఒక్కసారి చదువుకున్నప్పుడు స్పష్టంగా తెలుస్తున్నప్పటికి నాకు తోచిన కొన్ని అంశాలు రాసే ప్రయత్నమే సర్ ఇది.
    కాలాల ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే రుగ్వేద అసుర కృష్ణుడు, మహాభారత ఫ్రౌడ, తత్వ, కుటిల కృష్ణుడు, భాగవతం సరస కృష్ణుడు భిన్నకాలాలకు చెందిన వీరి ముగ్గురును మనం ఒకే దృష్టితో అంచనా వేయగలమా., అదే నేను మాతృస్వామ్యానికి అన్వయించాను. రుగ్వేదంలో ఉషస్సు, రామాయణంలో తాటక, భాగవతంలో పూతన ల మీద విజయం పితృస్వామ్యాన్ని సూచించడం కోసమేనా,.(మాతృస్వామ్యం యెక్క పూర్తి లక్షణాలు నాకింక అర్థం కాలేదండి, అదే విధంగా స్త్రీ సూత్ర భావన కూడా) మాతృస్వామ్యక వ్యవస్థ మీరు చెబుతున్న కాలానికి కంటే చాలా ముందుగానే అంతరించి పోయివుండాలి. ఎందుకంటే ఋగ్వేదకాలం నాటికే పూర్తి స్థాయి పురుషాధిపత్వం మనకి కనిపిస్తుంది. ఈ రోజు భార్యలను కొట్టే భర్తలను చూపి ఇది కూడా మాతృస్వామ్యవ్యవస్థలపై పురుషుల్లో వున్న ధ్వేషం సరఫరా అవుతూనే వుందని చెప్పడం సరైనది అయ్యే అవకాశాలు తక్కువగానే వుంటాయనుకుంటాను. మహాభారతం ఏదో ఒక దినాన వాస్తవానికి కొంత దగ్గరగా నడిచిన కథే ,. ఇతిహాసాలలో చరిత్రను స్పృశించుకుంటూ కథాగమనంలో రచయిత తీసుకునే స్వేచ్ఛను కూడా మనం పరిగణలోకి తీసుకోవలసిన అవసరం వుంటుందేమో.
    మన పురాణాల ప్రాచీనత విశ్వాసం పైననే ఆధారపడే చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నదే, అందుకనే నేను సంశయంగానే వాడానండి.

    గ్రీకు, భారత పురాణాలపై మీకున్న పట్టు చాలా సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
    కొన్ని సార్లు ఒక దారపు వుండను తీసుకుని మరన్నీ చిక్కులు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది సర్ ఒక్కోసారి.
    మౌఖిక సంప్రదాయం గురించి చెబుతూ మహాభారతాన్ని కలిపేసారు., కాని దీని లో లేఖకునిగా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది కదా,.

    మాతృస్వామిక ఆరాధన రూపమైన సర్పాన్ని జయించడమే ( మీ వ్యాసాలన్నీ చదివానండి, కాని అర్థం చేసుకోలేక పోయాను. మీరు వివరించిన వ్యాసం పేరు ఇవ్వగలరా, పొరపాటున మిస్ అయ్యువుంటే చదువుతాను)
    ఒక స్త్రీని జయిస్తే సరిపోదు, ముగ్గురు స్త్రీలను జయించినట్టు చెప్పాలి. ( అలా చెప్పాల్సిన అవసరం ఏముంది)
    మాతృస్వామ్యంపై పితృస్వామ్యస్థాపన! అంటే, స్త్రీ ఆధిపత్యం నుంచి పురుషుడు బయటపడి ‘క్రియాశీలి’ కావడం! ( ఒక దాన్నించి ఇంకోదానికి బదిలీ సామరస్యంగా కాకుండా దౌర్జన్యంగా జరిగిందా,.దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా.)
    స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!
    ( ఇదే విషయాన్ని మనం పురుషులకు వర్తింపచేసుకోవచ్చా)
    లంకానగరం మాతృస్వామిక అవశేషాలు కలిగిన ప్రాంతం అనుకోవాలా?!( ఈ రోజుకి సమాజంలో మాతృస్వామ్య అవశేషాలు కనబడుతాయేమో)

    చాలా సందర్భాలలో,. మళ్లీ ఎప్పుడన్నాచెప్పుకుందాం, ప్రస్తుతానికి వాయిదా వేద్దాం లాంటి వల్ల మొత్తం మ్మీద ఈ వ్యాస సంపుటికి ఒక సమగ్రతను ఇస్తున్నట్లుగా తోచడం లేదు సర్. ఎటు తిరిగి విస్తారంగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఒక క్రమాన్ని ఆశ్రయిస్తే స్థూలంగా విషయాన్ని అర్థం చేసుకోవడంలో పాఠకులకు సౌలభ్యంగా వుంటుందనిపిస్తుంది.
    చరిత్రను ముఖ్యంగా అస్పష్టమైన ఆధారాలతో వున చరిత్రను భిన్న కోణాలతో ఊహించడం, దానికి దగ్గరగా వెళ్లే అవకాశాలను ఎక్కువ చేస్తుంది.
    అనేక ప్రక్షిప్తాల సమాహరాన్ని కదుపుతూ, నిజాన్ని పట్టుకునే మేధోశ్రమ భారాన్ని మోస్తున్నందుకు, వాటిని మీదైన రూపంలో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అభినందనీయం. పురాణాలు, చరిత్రల పట్ల నాకున్న తక్కువ పరిజ్ఞానంతో ఏమన్నా పొరపాటుగా మాట్లడివుంటే క్షమిస్తారని ఆశిస్తూ

  7. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు భాస్కర్ గారూ…మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒక్కొదానికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

    1.”విస్తృతమైన మీ పరిశీలన ముందు మాట్లాడేంత అవగాహన నాకు లేదని…”

    నేను చాలా వినయంగా మీకో నిజం చెప్పాలి. నేను మాత్రం నాది అంత విస్తృతమైన పరిశీలన అనుకోవడం లేదు. పోలిక చెప్పాలంటే, నేను రాస్తున్నది సముద్రంలోంచి తీసుకున్న ఒక చెంబు నీళ్ళతో సమానం అవుతుందో కాదో కూడా! నేను ఇవి రాస్తున్న క్రమంలోనే ఎన్నో విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. రాస్తూనే తెలుసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఈ కాలమ్ ప్రారంభించినప్పుడు ఇన్ని వ్యాసాలు రాస్తానని అనుకోలేదు. అందుకే ఈ పరంపర ఎన్ని వ్యాసాలతో ముగుస్తుందో ఇప్పుడే చెప్పగల ధైర్యం నాకు లేదు.

    2. మీరు మళ్ళీ కాలాల తేడాల గురించి ప్రస్తావించారు. నేను ఇంతకు ముందు ఇచ్చిన సమాధానానికి అదనంగా చెప్పాల్సింది ఏమీ కనిపించడం లేదు. ఇంకొంచెం స్పష్టతకోసం ఒక చిన్న పోలికతో చెబుతాను. మొన్న ఒక జర్మన్ విమానం ఫ్రెంచ్ ఆల్ప్స్ మీద కూలిపోయి 150 మంది మరణించారు. కనుక ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పగలవారు మిగలలేదు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోడానికి బ్లాక్ బాక్స్, వాయిస్ రికార్డర్ లాంటివే ఆధారం. వాటి ఆధారంగా ప్రమాదనేపథ్యాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కచ్చితంగా కాలనిర్ణయం చేయలేని పురాతనదశలో కొన్ని సామాజిక పరిణామాలు జరిగాయి. ప్రపంచ పురాణ ఇతిహాసాలు తమ పద్ధతిలో నమోదు చేసిన విషయాల ఆధారంగా ఆ పరిణామాలను అంచనా వేయవలసిందే. కొన్ని చోట్ల పురావస్తు ఆధారాలు కూడా ఇందుకు ఉపకరిస్తున్నాయి. ఈ పరిణామాలలో మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యాన్ని స్థాపించడం ఒకటని పురామానవపరిణామచరిత్రకారుల నిర్ధారణ. ప్రత్యేకించి మనదగ్గర చరిత్ర నమోదుతో సహా ఏ రకమైన డిసిప్లిన్ లేని దశలో ఇతర పురాణకథలతో ఉన్న సామ్యాలను ఆధారంగా పై పరిణామాన్ని పోల్చుకునే ప్రయత్నమే నేను చేస్తున్నాను.

    3. ఋగ్వేద కాలానికే పురుషాధిపత్యం ఉందన్న మీ అభిప్రాయం నిజమే. ఆ నిజానికి నేను చెబుతున్నదానికీ వైరుధ్యం లేదు. ఋగ్వేదం మాతృస్వామ్యం కన్నా ముందుదనే ఊహతో మీరు ఆ ప్రస్తావన చేసినట్టు కనిపిస్తోంది.

    4. దారపు ఉండను మరింత చిక్కుపడేలా చేస్తున్నానేమో అన్నారు. అలాంటిది ఉంటే పునఃపరిశీలనలో తప్పకుండా సవరించుకుంటాను.

    5. మహాభారతం లిఖితరూపం ధరించినంత మాత్రాన దానిని మౌఖిక లక్షణం పోదు. లిఖిత సంప్రదాయం గణపతి లాంటి లేఖకులను సృష్టించుకోడంలో విశేషమేమీలేదు.

    6. అనేక సందర్భాలలో మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం, వాయిదా వేద్దాం అని నేను అంటుండడం గురించి…నా వ్యాసాల ఫార్మాట్ రీత్యా అది తప్పడం లేదు. అయితే నేను అలా వాయిదా వేస్తున్నవి ఆ క్షణంలో రాస్తున్న అంశానికి అవసరం లేనివీ, ప్రత్యేకంగా చెప్పుకోవలసినవే అయుంటాయి. ఆ వాయిదా వల్ల చర్చిస్తున్న అంశం అసమగ్రం అయిందని ఎక్కడైనా అనిపిస్తే నిర్దిష్టంగా చెబితే సవరించుకుంటాను.

    7. సర్పం మాతృస్వామిక ఆరాధనా రూపం అవడం గురించి….!. రహస్యప్రపంచ రారాణి స్త్రీ 2. చూడుమా చందమామా, అటు చూడుమా…3. యెహోవా కూడా కాళీయమర్దనుడే వ్యాసాలను చూడండి.

    ఈ వివరణ ఇవ్వడానికి అవకాశమిచ్చిన మీకే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తప్పకుండా కొన్ని చోట్ల పోరపాట్లు, అస్పష్టత దొర్లే ఉంటాయి. వాటిని సవరించుకోడానికి, ఫార్మాట్ లో తలెత్తే లోపాలను గ్రహించడానికీ మీలాంటి వారి స్పందన ఎంతో ఉపయుక్తం అవుతుంది.

మీ మాటలు

*