యెహోవా కూడా ‘కాళియ’ మర్దనుడే!

 

మొదటి దశలో విస్తారంగా దొరికిన నగ్నస్త్రీమూర్తులు, మూడవ దశకు వచ్చేసరికి అదృశ్యమయ్యాయనీ; మూడవ దశలో పురుషాధిక్యాన్ని చాటే పశుపాలన, యుద్ధాలు అడుగుపెట్టడమే అందుకు కారణమనీ — మధ్యయూరప్ నేపథ్యం నుంచి చెప్పుకున్నాం.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology)ను ఉటంకించుకుంటూ దానినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే:

కంచు యుగం(క్రీ.పూ. 3300-1200) చివరిలో, ఇనప యుగం(క్రీ.పూ. 1200-500) ప్రారంభంలో ఒక చారిత్రక ఘటన జరిగింది. పశువులను మేపుకుంటూ సంచార జీవితం గడిపే ఆర్యులు ఉత్తరం నుంచీ; గొర్రెలను, మేకలను కాచుకునే సెమెటిక్ జనాలు దక్షిణం నుంచీ పురాతన ప్రపంచంలోకి హింసాత్మకంగా అడుగుపెట్టారు. అక్కడ అప్పటికి పాత ఆరాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి.  అక్కడి జీవనవిధానం తమ జీవనవిధానానికి పూర్తి భిన్నంగా కనిపించింది.  ప్రకృతిలో కలసిపోయి చెట్లు చేమల మధ్య చాలా సహజంగా, సామరస్యంగా, భౌతిక అవసరాలు తీర్చుకుంటూ సాగే జీవనవిధానం పాతప్రపంచానిది. అందులో ‘వీరోచిత’మైనది ఏదీలేదు.

కానీ ఆర్యులూ, సెమెటిక్ జనమూ అలాంటివారు కాదు. సింహంలా మంచి గుండె దిటవు ఉన్నవారు. ఆయుధోపజీవులు, యుద్ధప్రియులు. కష్టించి ఆహారాన్ని సంపాదించుకోవడం మీద వారికి చులకనభావం. ఎక్కడ సంపదా, సుఖమూ కనిపించినా మీదపడి దోచుకోవడమే వారికి ఇష్టం. కనుక పాత ప్రపంచ జనాల జీవనవిధానం వారికి రోత పుట్టించింది. అలా ఉభయుల జీవనవిధానాలు, తాత్వికతల మధ్య ఘర్షణ ప్రారంభమైంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవల్సింది ఏమిటంటే, ఈ పరిణామం ఏ ఒక్క చోటో కాక; యూరప్, సమీపప్రాచ్యం, పశ్చిమాసియా, భారత్ తో సహా పలు చోట్ల జరిగింది. ఆర్యులకు సంబంధించి కోశాంబీ(AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY)ని ఉదహరించుకుంటే:

చరిత్రపరంగా ఆర్యులు ఒక గొప్ప ఫలితాన్ని సాధించారు. అంతవరకూ అనేక ఆదిమ, సాంప్రదాయిక, వ్యవసాయ సమాజాలు వేటికవి విడివిడిగా తమ పురాతన పరికరాలతో, విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ ఉండేవి. ఆర్యులు ఆ సమాజాల మధ్య ఉన్న అడ్డుగోడలను బద్దలు కొట్టారు. ఈ సమాజాలలో  సాంప్రదాయిక ధోరణులు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వాటి కారణంగా అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఉదాహరణకు మృతసముద్రం సమీపంలోని ఘాసూలియన్లూ, విసిరేసినట్టు ఉండే అలాంటి మరికొన్ని చిన్న చిన్న సమూహాలూ సంక్లిష్టమైన అలంకరణలకు ప్రసిద్ధులు. ఇక బ్రిటన్, ఐబేరియా, దక్షిణభారతాల జనం ఇంకా పెద్ద స్థాయిలో భారీ శిలా నిర్మాణాలు సాగించేవారు, వీరంతా తమ వద్ద ఉన్న కొద్దిపాటి మిగులునూ సమాజ పురోగతికి ఏమాత్రం తోడ్పడని పితృకర్మలకు వాడేశారు. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రమైన దీవి. వర్తకం ద్వారా గడించిన సంపదను అంతటినీ అది మతపరమైన తంతులకు ఖర్చు పెట్టేసింది. చివరికి ఆ దీవిలో ఎక్కడబడితే అక్కడ అలంకృత అస్థి కలశాలు మాత్రమే దొరికాయి. మెసపొటేమియా, సింధు లోయలు కూడా ఈ ప్రక్రియను మరింత ఎత్తులకు తీసుకువెళ్లి చివరికి ఎదుగూబొదుగూ లేని స్థితికి చేరుకున్నాయి.

మరింత అభివృద్ధి చెందిన ఆహారోత్పాదక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ సింధు లోయలోని నగర నిర్మాతలు వాటిని ఎలా ఉపయోగించుకోలేకపోయారో ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈజిప్టు తన మిగులును అంతటినీ, వాచీలు తయారు చేసేవారు కనబరిచేటంత సునిశితత్వంతో బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి వెచ్చించింది. పితృకర్మలు, పూజారి వ్యవస్థ క్రమంగా ఆ దేశాన్ని తినేశాయి. ఈ దశలో, చెల్లా చెదురుగా ఉన్న అనేక ఆదిమ సమూహాలను, వారి విశ్వాసాలను ఆర్యులు అణగదొక్కి వాటి అవశేషాలపై ఒక నూతన సమాజం ఆవిర్భవించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించారు. ఇది వారు ఉద్దేశపూర్వకంగానో, ఈ సమాజాల శ్రేయస్సును కోరో చేసింది కాదు. తక్షణ లాభం కొసం, తమ పద్ధతిలో క్రూరమైన దాడులు చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, దోపిడీలు సాగిస్తూ పోయారు.

ఒక సమూహాన్ని, పూర్తిగా భిన్నమైన వేరొక సమూహం లోబరచుకుని వారి ప్రదేశాలను ఆక్రమించుకున్నప్పుడు అక్కడి జీవన పద్ధతులు, సంస్కృతి, మత విశ్వాసాలు, ఆరాధనారూపాలు, తంతులు ఉన్నపళంగా అదృశ్యమైపోవు. ఉభయులు అనేక అంశాలను ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పర విలీనం జరుగుతుంటాయి. ఓడిపోయిన గుంపు కంటె గెలిచిన గుంపు నాగరికతలో, సంస్కృతిలో వెనకబడినదైనప్పుడు, ఈ ఆదానప్రదానాలలో  ఓడిపోయినవారిదే తరచు పై చేయి అవుతుంది. ఆర్యుల విషయంలో అదే జరిగింది. వారు తాము లోబరచుకున్న జనాల నుంచే ఎన్నో నేర్చుకున్నారు. మనదేశంలోని సింధు ప్రజలతో ఆర్యుల అనుభవమూ అదే.

Zeus of Meilichois

గ్రీసులో పిరయూస్(Piraeus) అనే చోట దొరికిన ఒక మట్టి పిడక (అతి పురాతన కాలంలో బంకమట్టితో చేసిన పిడకల మీద తుంగకాడతో రాసేవారు. దీనిని కీల లిపి అనేవారు. ఈ పిడకలపై చిత్రాలు కూడా గీసేవారు) మీద ఒక చిత్రం ఉంది. అందులో ఒక సర్పదేవుడికి కొందరు మొక్కుతూ ఉంటారు. ఈ సర్పదేవుడి పేరు ‘జియస్ మిలికోయిస్’. జియస్ నిజానికి విజేతలైన ఆర్యుల దేవుడు. సర్పం, ఓడిపోయిన పాత ప్రపంచానికి చెందిన ఆరాధనారూపం. సర్పాకారంలో ఉన్నది మిలికోయిస్ అనే ఒక రాక్షసుడు. అతడు భూమాతకు కొడుకూ, భర్తా కూడా. ఈ స్థానిక సర్పరూప రాక్షసుడు ‘జియస్ మిలికోయిస్’ ఎలా అయ్యాడంటే, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు స్థానికుల ఆరాధనాస్థలాలను కూడా ఆక్రమించుకుని వాటికి తమ దేవుళ్ల పేరు పెట్టుకున్నారన్నమాట.

కాలక్రమంలో రాక్షసుడనే పేరును ఆర్యులు నిందార్ధకంగా మార్చారు. అప్పుడలా నిందార్ధకంగా మారిన రాక్షస శబ్దం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సర్పరూప రాక్షసుడికి ఏటా వసంతకాలంలో పందులను బలి ఇవ్వడం ఆనవాయితీ. పందులను బలి ఇవ్వడం పురాతన ప్రపంచంలోని మాతృస్వామ్యానికి చెందిన తంతు.

భూదేవికి ఒక రాక్షసుని కొడుకుగా చిత్రించడం మన పురాణాలలోనూ ఉంది. ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న ఉదాహరణ, నరకాసురుడు.

జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రస్తావించిన ఇంకొక ఉదంతం చూద్దాం. క్రీ.శ. 222 కి చెందిన అయీలియన్ అనే రోమన్ రచయిత ఎపిరస్ (Epirus) అనే చోట ఉన్న ఒక పాముల తోపు గురించి రాశాడు. అతని కాలానికి వచ్చేసరికి అది అపోలో అనే గ్రీకు, ఆర్యదేవుడి ఆరాధనాస్థలంగా మారిపోయింది కానీ; నిజానికి ఇది కూడా పురాతన మాతృస్వామిక ప్రపంచానికి చెందిన అవశేషమే. ఏటా ఒకరోజున ఈ అపోలో దేవుడికి ఘనంగా నైవేద్యాలు అర్పిస్తారు. ఈ వనంలో ఒక వలయాకారంలోని రక్షితప్రదేశంలో పాములు ఉండేవి. వాటికీ కూడా నివేదనం జరిగేది. అయితే ఆ నివేదనం పురుషులు చేయడానికి వీలులేదు. స్త్రీ, అందులోనూ కన్యాపూజారిణి మాత్రమే చేయాలి. పైగా నగ్నంగా వెళ్లి మరీ నివేదనం ఇవ్వాలి. పాములు శాంతంగా ఉండి, ఆ నివేదనాన్ని స్వీకరిస్తే ఆ ఏడాది సుభిక్షంగా, రోగాలు రొష్టులు లేకుండా గడుస్తుందనీ, ఒకవేళ నివేదనాన్ని తిరస్కరించి పూజారిణిని భయపెడితే దుర్భిక్షం, రోగాలు సంభవిస్తాయనీ నమ్మేవారు.

Tree of the Hesperides

The tree of the Hesperides అనే చిత్రంలో ఒక పెద్దపాము చెట్టును చుట్టుకుని ఉంది. ఈ చెట్టు మొదట్లో ఉన్న గుహలోంచి నీటి ఊటలు ఉబుకుతున్నాయి. చెట్టు చుట్టూ ముగ్గురు అప్సరసలు (Hesperides) ఉన్నారు. మన పురాణ, ఇతిహాసాలలోనూ అప్సరసలు ఉన్న సంగతి తెలిసినదే. ‘అప్సరస’ అనే మాటే నీటి సంబంధాన్ని(సంస్కృతంలో అప్సు అంటే నీరు) చెబుతుంది. గ్రీకు చిత్రంలోని అప్సరసలు తండ్రి లేకుండా, నిశాదేవతకు పుట్టినవారు. తండ్రి లేకుండా పుట్టారన్న మాటకు; తండ్రి ఎవరో తెలియని వారు, లేదా తండ్రికి ప్రాధాన్యంలేని వ్యవస్థకు చెందినవారు అన్న అర్థం చెప్పుకుంటే అది మాతృస్వామ్య లక్షణాన్ని సూచిస్తుంది. ఈ దృశ్యం ఈడెన్ తోటను తలపిస్తుందని, ఈడెన్ తోట ఆ తర్వాత పితృస్వామ్యానికి చెందిన ప్రజాపతి (పేట్రియార్క్) జాగీరు అయిందనీ క్యాంప్ బెల్ అంటారు.

Medusa

ఇంకో చిత్రంలో కనిపించే దేవత పేరు, మెడూసా. ఈమె గురించి గ్రీకు ఇతిహాసకాలానికి చెందిన ఒలింపియన్ పితృస్వామిక కోణం నుంచి చెబుతారు కానీ, అందులో పురాతన ప్రపంచానికి చెందిన మాతృస్వామిక లక్షణాలూ ధ్వనిస్తూనే ఉంటాయి. మెడూసా గార్గాన్స్ రాణి. బుసకొట్టే పాములు ఆమె శిరోజాలు. ఆమె చూపులు మగవారిని శిలగా మార్చివేస్తాయి. పెర్సియస్(Perseus) అనే దేవుడు ఆమె తల నరికి, దానిని తీసుకుని పారిపోతాడు.  ఎథెనే అనే దేవత ఆ తలను తన డాలుకు అతికించుకుంటుంది. పోసిడియన్ అనే దేవుడు, తెగిన మెడూసా మెడ నుంచి పెగాసెస్ అనే రెక్కల గుర్రాన్ని సృష్టిస్తాడు. ఆ గుర్రాన్ని జియస్ రథానికి కడతారు. ఎథెనే ఆదేశంతో దేవవైద్యుడైన అస్లేపియస్(Asclepius) మెడూసా ఎడమవైపు, కుడివైపు ఉన్న నరాలనుంచి రక్తం సంగ్రహిస్తాడు. ఎడమవైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికీ, కుడివైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికీ ఉపయోగిస్తాడు.

ఈ వివరాలన్నీ మనకు బీభత్సంగా అనిపిస్తాయి. సరే, అది మన పురాణాలలోనూ కనిపించే అద్బుతత్వ, ప్రతీకాత్మక  శైలి అనుకుందాం. ఇందులో దేవవైద్యుడైన అస్లేపియస్ పేరు వినగానే, మన పురాణాలలోని దేవవైద్యులైన అశ్వినీదేవతలు గుర్తుకొచ్చి ఉండాలి.  ముఖ్యంగా గమనించవలసింది, ఇందులోని తాత్వికత. క్యాంప్ బెల్ మనకు బాగా తెలిసిన కాళికతో మెడూసాను పోల్చుతారు. అందులోకి వెళ్ళేముందు మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థను వెల్లడించే మరికొన్ని ఉదంతాలను, భారతీయ పురాణకథలతో వాటికి ఉన్న పోలికలను చూద్దాం:

గ్రీకు పురాణాల ప్రకారం ‘టైటాన్లు’ (భారీ ఆకారంతో రాక్షసంగా కనిపించేవారు) జగజ్జనని(Great Goddess Mother) సంతానం. టైటాన్ సగం మానవరూపంలో, సగం సర్పరూపంలో ఉంటాడు. అతని తల నక్షత్రాలను తాకుతూ ఉంటుంది.  సూర్యుడు ఉదయించే ప్రదేశం నుంచి, అస్తమించే ప్రదేశం వరకు చేతులు విస్తరించి ఉంటాయి. యురేనస్ అనే ఆకాశదేవుడికీ, జగజ్జనని రూపమైన గియా(Gaea) అనే భూదేవతకూ పుట్టిన ఈ టైటాన్లకు స్వర్గాన్ని లేదా ఆకాశాన్ని పరిపాలించే అధికారం ఇచ్చారు. ఆర్యులైన గ్రీకుల దేవుడు జియస్, గియా కడగొట్టు కొడుకైన టైఫాన్ పై విజయం సాధించి మౌంట్ ఒలింపస్ పై పితృస్వామిక దేవుళ్ళ ఆధిపత్యం నెలకొల్పుతాడు. మన పురాణాలలో మేరుపర్వతం దేవతల ఆవాసం అయినట్టే, మౌంట్ ఒలింపస్ గ్రీకు దేవతలకు ఆవాసం.

మాతృస్వామిక చిహ్నంతో పొరాడి విజయం సాధించిన ఉదంతం బైబిల్ లో కూడా ఉంది. యెహోవా విశ్వ సముద్ర సర్పమైన ‘లెవియథాన్’ పై విజయం సాధిస్తాడు.

ఇక మన పురాణాలకు వస్తే ఇలాంటి ఉదంతాలు అనేకం. రాముడు తాటకను చంపడం గురించి, కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. పైన చెప్పిన  టైటాన్స్ లానే తాటకను, పూతనను కూడా భారీ ఆకారాలతో భయం గొలిపే రాక్షసులుగానే మన కథలు చిత్రించాయి. సినిమాలు, హరికథలు, పురాణశ్రవణం ద్వారా మాత్రమే పురాణకథలతో అరకొర పరిచయం ఉన్నవారు నిజంగానే ఒకప్పుడు రాక్షసులనే జాతి ఉండేదని భ్రమిస్తూ ఉంటారు. నిజానికి రాక్షసత్వం అనేది మామూలు మనుషులపై ఆపాదనే తప్ప మరొకటి కాదన్న సంగతి రామాయణం, బాలకాండలో ఉన్న తాటక వృత్తాంతమే స్పష్టంగా చెబుతుంది. ‘వాల్మీకి నిజం దాచడు, అబద్ధం చెప్పడు’ అనేవారు రాంభట్ల. తాటక ఉదంతం ఆయన అన్నది ఎంత యధార్థమో చెబుతుంది.

తాటక ఒక యక్షిణి అంటుంది రామాయణం. అంటే, యక్షుల తెగకు చెందినది. యక్షులు చారిత్రకత కలిగిన తెగ. తెలుగులో ‘జక్కులు’ అనే మాట, యక్షశబ్దానికి వికృతి. ‘జక్క పురంధ్రి’ అనే ప్రయోగం ‘క్రీడాభిరామం’లో కాబోలు, ఉంది. యక్షప్రశ్నలు అనే మాట యక్షులనుంచే పుట్టింది. అడవిని ఆశ్రయించుకుని ఉండే యక్షులు దారినపోయేవారిని అటకాయించి, యక్షప్రశ్నలు వేసి, వారు జవాబు చెప్పలేకపోతే బలి ఇచ్చేవారట. బుద్ధుడు ఇలాగే తనకు తారసపడిన యక్షులలో ఉపదేశం ద్వారా పరివర్తన తెచ్చి ఆ దురాచారాన్ని మాన్పించాడని కోశాంబీ రాస్తారు. యక్షులకు సంబంధించిన ఈ చారిత్రక వివరం; యక్షుడికీ, ధర్మరాజుకీ మధ్య ప్రశ్నోత్తరాల రూపంలో మహాభారతానికి ఎక్కింది.

తాటక సుకేతు డనే మహాయక్షుని కూతురనీ, వేయి ఏనుగుల బలంతో పుట్టిన కామరూపిణి అనీ విశ్వామిత్రుడు రాముడికి చెబుతాడు. ‘యక్షులు అంత బలవంతులు కారని ప్రతీతి కదా! తాటకకు వేయి ఏనుగుల బలం ఎలా వచ్చింద’ని  రాముడు అడుగుతాడు.  విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ, సుకేతుడు సంతానం కోసం తపస్సు చేయగా బ్రహ్మ కొడుకును ఇవ్వకుండా ఒక్క కూతురినే ఇచ్చాడనీ, ఆమెకే వేయి ఏనుగుల బలం ఉండేలా వరమిచ్చాడనీ అంటాడు.

అలాగే, తాటక మొదట్లో మంచి రూపవతి. ఆమెను సుందు డనే అతనికిచ్చి పెళ్లి చేశారు. వారికి మారీచుడనే కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుని శాపం వల్ల రాక్షసుడై, అతని వల్లనే మరణించగా; తాటక, మారీచుడు అగస్త్యుని చంపబోయారనీ, అప్పుడు వారిని కూడా రాక్షసులు కమ్మని అగస్త్యుడు శపించాడనీ రామాయణం చెబుతోంది. ఒక సాధారణ యక్షస్త్రీకి, ఆమె భర్తకు, కుమారుడికీ రాక్షసత్వాన్ని ఆపాదించిన సంగతిని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.  స్త్రీని చంపడానికి రాముడు మొదట సందేహించినా విశ్వామిత్రుడు చెప్పడంతో ఆమెను చంపుతాడు.

మాతృస్వామ్య కోణం నుంచి తాటక కథను అన్వయించడానికి కనీసం రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సుకేతుడికి బ్రహ్మదేవుడు కొడుకును ఇవ్వకుండా కూతురినే ఇవ్వడం, ఆ కూతురు వేయి ఏనుగుల బలంతో పుట్టడం అనేవి– కొడుకు కంటే కూతురికీ; పురుషుడి కంటే స్త్రీకీ ఆధిక్యాన్నీ, బలాన్నీ కల్పించే మాతృస్వామ్య లక్షణాన్ని పరోక్షంగా సూచిస్తు ఉండచ్చు.  రెండోది, తాటక ఉండే ప్రదేశాన్ని విశ్వామిత్రుడు ‘తాటకవనం’గా పేర్కొనడం అమ్మవారి వనానికి సూచన కావచ్చు.

విశ్వామిత్రుడికి తాటకతోనూ; అగస్త్యుడికి సుందుడు, తాటక, మారీచులతోనూ ఉన్న శత్రుత్వం మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య స్పర్థ ఫలితం కావచ్చు.

బైబిల్ లోని యెహోవా, లెవియథాన్ అనే సర్పంతో పొరాడి విజయం సాధించినట్టే, మన దగ్గర కృష్ణుడు యమునానదిలోని కాళీయుడనే సర్పాన్ని మర్దించి తరిమేసిన కథ ఉంది. కృష్ణుడు బృందావనంలోని అమ్మవార్ల సమూహ దేవత అయిన బృందను పెళ్లాడడం ద్వారా అమ్మవార్లను లొంగదీసుకోవడం గురించి, అమ్మవారి ఆరాధన స్థానంలో తన ఆరాధనను ప్రతిష్టించడం గురించి ‘బృందావన కృష్ణుడు…సోషల్ ఇంజనీరింగ్’ అనే వ్యాసంలో చెప్పుకున్నాం. బృందావనం ఉన్నది యమున ఒడ్డునే. కనుక మాతృస్వామ్య ఆరాధనారూపమైన కాళీయుడనే సర్పాన్ని కృష్ణుడు మర్దించి తరిమేయడం బృందావనంలో ఆయన చేసినదానికి కొనసాగింపే.

మొత్తంమీద బైబిల్ యెహోవా, భాగవత కృష్ణుడు చేసింది ఒకటే…అది, మాతృస్వామిక ఆరాధనారూపంతో పోరాడి విజయం సాధించడం!

స్త్రీని చంపిన, లేదా శిక్షించిన చరిత్ర హనుమంతుడికీ ఉంది. దాని గురించీ, భారతీయ పురాణకథలతో ఇతర పురాణ కథలకు ఉన్న మరికొన్ని పోలికల గురించీ; వీటి వెనుక ఉన్న తాత్వికత గురించీ తర్వాత…

 -కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) 

మీ మాటలు

  1. Saradhi Motamarri says:

    When researchers have thrashed the Aryan-Dravidian Divide, which is manufactured idea, it is unclear how these stories are going to be valid.

    Please, read Dasaradhi Rangacharya gari, ‘Vedam Jeevana Nadam’, Rajeev Malhotra’s works, Sai Papineni gari ‘Andhra Nagari.’

  2. Srinivas Vuruputuri says:

    భాస్కరం గారికి

    కాళీయుడు “మాతృస్వామిక ఆరాధనారూపం” అనే కన్నా నాగజాతి ప్రజల నాయకుడని ఎస్.ఎల్.భైరప్ప చేసిన ఊహ సరైనదని నాకనిపించింది.

    తాటక వనం – అంటే తాటక నివసించే ప్రదేశం అనే సూటి అర్థాన్ని దాటి “అమ్మవారి వనం అయి ఉండాలి” అనే కష్టమైన ఇన్ఫరెన్సు లాగాలంటే ఇంకాస్త బలమైన ఆధారాలు చూపించగలగాలి కదా. మరే ఇతర వనాల పేర్లను ఈ విధంగా విశ్లేషించగలమా (నైమిశ/దండక/కామ్యక/ద్వైత/కపిల/కురు జాంగలం/ఖాండవ వగైరా…)

    ఏస్క్‌లిపియస్‌కీ అశ్విని దేవతలకి పేరులో పోలిక యాదృచ్ఛికమేమో. దేవవైద్యులు అన్న మాట అటుంచితే.

    సింధులోయలో అలంకృత అస్థికలశాల గురించి – “The bodies of the individuals were usually buried with their jewelry which usually consisted of bangles made from shell, steatite beads, etc, and the men usually wore earrings. Copper mirrors have been found only amongst the bodies of the females which show a specificity of grave goods by gender.” అని చదివానిప్పుడే. కుండల్లో పూడ్చేవారట, మృతదేహం చుట్టూ వివిధ పరిమాణాలలో బొమ్మలు వేసిన కుండలను పెట్టేవాళ్ళట. అక్కడక్కడ శవాలను దహనం చేసిన దాఖలాలున్నాయట. “మరింత ఎత్తుకి తీసుకెళ్ళాయి” అని మీరన్నప్పుడు నేనింకా ఎక్కువ ఊహించుకున్నాను. మొత్తం నాగరికతను ఎదుగూ బొదుగూ లేని స్థితికి తీసుకెళ్ళాయనే నిర్ధారణకి రుజువు చాలలేదేమోననిపించింది.

    ఈ వ్యాసం చదువుతుండగా మరో అనుమానం కలిగింది – మనదేశంలో అమ్మ దేవతలు భయంకరంగా ఎందుకుంటారు? బలులు ఎందుకు కోరుకుంటారు? వీలున్నప్పుడు దీనిగురించి కూడా రాయండి.

    శ్రీనివాస్

    • కల్లూరి భాస్కరం says:

      .శ్రీనివాస్ గారూ…

      1. కాళీయుడి గురించి:- నా సర్పయాగవ్యాసాలలో కాళీయ మర్దనాన్ని నాగజాతి-నాగజాతేతరుల ఘర్షణగానే అన్వయించాను. అలాగే, నాగజాతి పేరే సర్పారాధకులను సూచిస్తుంది కనుక, సర్పం మాతృస్వామిక ఆరాధనారూపం కనుక; అటు వ్యవస్థాపరంగానూ, ఇటు విశ్వాసపరంగానూ ఉన్న ఘర్షణను కూడా కాళీయమర్దనం ప్రతీకాత్మకంగా సూచిస్తూ ఉండవచ్చు. ఇందులో ఒకటి సరైనదనీ, ఇంకొకటి కాదనీ అనలేమేమో! మన పురాణ కథలతో ఇతర పురాణ కథలకు ఉన్న పోలికను సూచించడం కూడా ఇక్కడ నా థీమ్ లలో ఒకటి.
      2. తాటక వనం గురించి:- ఇక్కడ కూడా భారతీయ, భారతీయేతర పురాణకథలలో ఉన్న మాతృస్వామిక/పితృస్వామిక స్పర్థను చర్చించడమే నా ముఖ్యమైన థీమ్. తాటకవనం అమ్మవారి వనాన్నే సూచిస్తూ ఉండచ్చని అనడం లాంటివి ఇన్ఫరెన్సెస్ లేదా డీటెయిల్స్ కిందికే వస్తాయి. కొన్ని సరిపోవచ్చు, కొన్నిటికి మరింత పరిశీలన అవసరం కావచ్చు.
      3. అలంకృత అస్థికలశాల గురించి:- స్లాంట్ ఫాంట్ లో ఉన్న ఆ మొత్తం పేరా కొశాంబీ పుస్తకం నుంచి ఉటంకింపు. అందులో కూడా ఆయన చెప్పదలచుకున్న ముఖ్యాంశం ఆర్యుల చొరబాటుకు ముందు పురాతన ప్రపంచం ఏ స్థితిలో ఉందో చెప్పడం.
      4. అమ్మ దేవతలపై మీ అనుమానం గురించి:- రాబోయే వ్యాసాలలో దాని గురించి రాయబోతున్నాను.

      ధన్యవాదాలతో…

  3. ఎన్నో మంచి విషయాలని తెలియజేస్తున్నారు . ధన్యవాదాలు

  4. భాస్కరం గారూ
    మనకు తెలిసిన వాటిలోని మనకు తెలియని సంగతులను చాల హేతుబద్ధంగా, ఆలోచన రేపేలా చెబుతున్నారు. పాము మాత్రుస్వామానికి చిహ్నమని ఇప్పుడే తెలిసింది. పుట్ట పూజను ఆడవాళ్లే చేయడం ఇందుకేనేమో..

    • కల్లూరి భాస్కరం says:

      అవును మోహన్ గారూ…మనకు బాగా తెలుసుననుకునే విషయాల గురించి ఎంత తెలియదో పురా ప్రపంచంలోకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. నేను అందులో ఉండే విస్మయాన్ని అనుభవిస్తూనే ఈ వ్యాసాలు రాస్తున్నాను.

మీ మాటలు

*