‘అమ్మ’ను పుట్టించిన బొమ్మ

 

ముందుగా ఒకటి రెండు విషయాలు…

ఈ వ్యాసపరంపరలో మొదటినుంచీ ఒకటి జరుగుతోంది. అది ఇంతకుముందు చెప్పుకున్నదే. అదేమిటంటే, ఒక విషయాన్ని ఎత్తుకుంటే, అది తరచు అనేక మలుపులు తిరుగుతూపోతోంది. కనుక ఎక్కడ మొదలెట్టామో మధ్య మధ్య గుర్తు చేసుకోకతప్పదు. పన్నెండు వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభించి ఓడిసస్ కథ చెప్పుకుంటూ ఇంత దూరం వచ్చాం.

ఇంకోటి కూడా గమనించే ఉంటారు…అనేక వ్యాసాలుగా  మాతృస్వామ్య/పితృస్వామ్యాల గురించిన ప్రస్తావన దండలో దారంలా వస్తోంది. ఇక ముందు కూడా వస్తుంది.  బహుశా ప్రస్తుతానికి అదే ప్రధాన ఇతివృత్తం.

నేనిక్కడ గ్రీకు, బైబిలు పురాణ కథల గురించి, వాటిలోని దేవతల గురించి అదే పనిగా ప్రస్తావిస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు. అయితే, కేవలం వాటి గురించే చెప్పడం నా ప్రణాళిక కాదు. పైన చెప్పిన ప్రధాన ఇతివృత్తంలో భాగంగా చేస్తున్న ఈ ప్రస్తావనల ద్వారా  భారతీయ పురాణ కథలకు, వాటికి ఉన్న పోలికలను కూడా ముందుకు తెస్తున్నాను.

అలా తేవడంలో ఇంకోటి కూడా చేస్తున్నాను. “మన  దేవతలు, మన తాత్వికత కేవలం మనవే; మనకే ప్రత్యేకం; మనది మాత్రమే పుణ్యభూమి, కర్మభూమి’’ అంటూ పౌరాణికులవారు ఎంత గట్టిగా నొక్కి చెప్పినా అందులో ఆత్మస్తుతి ఉన్నంతగా నిజం లేదని, సవినయంగా మనవి చేస్తున్నాను.

నేను తాత్వికతలోకి, తాత్విక ప్రతీకల్లోకి, తాంత్రికతలోకి మరీ లోతుగా వెడుతున్నానన్న అభిప్రాయం మీకు కలిగి ఉండవచ్చు. అందులో బొత్తిగా నిజం లేదని అనను కానీ, వాస్తవంగా నేను చేయదలచుకున్నది చరిత్ర అద్దంలో వాటిని చూపించడమే!

***

చరిత్రలో ఏం జరిగిందంటే…

కొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి  రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది.  ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus of Willendorf) అంటారు.  అయితే,  వీనస్ అన్నారు కదా అని, ఈ మూర్తి  ఫ్రాన్స్ లోని లౌరే మ్యూజియంలో ఉన్న Venus of Milo లా అందంగా, ఆకర్షణీయంగా ఉండదనీ, స్థూల కాయంతో, బలిష్టమైన కటిప్రదేశంతో ఉంటుందనీ జార్జి థాంప్సన్ అంటారు.

venus of willendorf

venus of Willendorf

 

మధ్య యూరప్, మధ్యధరా ప్రాంతం, సమీప ప్రాచ్యానికి చెందిన కొత్త రాతియుగ(క్రీ.పూ. 10,020), రాగి యుగ(క్రీ.పూ. 5,500)నిక్షేపాలలో ఇలాంటి నగ్నస్త్రీ మూర్తులు వందల సంఖ్యలో దొరికాయి. ఇవి ఎక్కువగా కాల్చిన మట్టితో(టెర్రకోట) చేసినవే కానీ, కొన్ని శిలపై చెక్కినవీ ఉన్నాయి. పురుషమూర్తులు ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. అలాగే జంతు రూపాలు కూడా కనిపించాయి.

యూరప్ కు చెందిన డాన్యూబ్ నదీసంస్కృతి(క్రీ.పూ. 5,000)మొదటి దశలో ఇలాంటి స్త్రీమూర్తులు స్వల్పసంఖ్యలో కనిపించాయి. రెండో దశకు వచ్చేసరికి ఇవి ఎక్కువ సంఖ్యలో కనిపించి, మూడవ దశలో అదృశ్యమైపోయాయి. ఈ మూడవ దశ నాటికి పశుపాలన, యుద్ధాలు మొదలయ్యాయి.

అలాగే, రుమేనియాకు చెందిన గుమెల్నిటా(Gumelnita) సంస్కృతి(క్రీ.పూ. 5,000) మొదటి దశలో స్త్రీమూర్తులు విస్తారంగా కనిపించాయి. రెండో దశలో కూడా కొనసాగాయి కానీ, ఈసారి పురుషమూర్తులూ, కాల్చిన మట్టితో చేసిన పురుషాంగాలూ కనిపించాయి. మూడవ దశకు వచ్చేసరికి చెకుముకిరాయితో చేసిన బాణపు మొనలు, యుద్ధాలలో ఉపయోగించే గొడ్డళ్ళు కనిపించాయి. స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.

గ్రీసులోని థెసలేకు చెందిన కొత్తరాతియుగ నిక్షేపాలలో కూడా ఇదే కనిపిస్తుంది. థెసలే రెండవ దశను ‘దిమిని సంస్కృతి’(క్రీ.పూ. 5,000) అంటారు. ఈ సంస్కృతికి చెందిన మూర్తులలో కొత్తగా రెండు నమూనాలు అడుగుపెట్టాయి. మొదటిది, పసిబిడ్డను చేతుల్లో ఉంచుకుని కూర్చుని ఉన్న స్త్రీమూర్తి; రెండవది, మోకాళ్ళ మీద చేతులు ఆనించి కూర్చుని ఉన్న ithyphallic(erect phallus) పురుషమూర్తి. అయితే, ఈ దశకు వచ్చేసరికి వెనకటి దశలో కంటే మూర్తుల సంఖ్య, వాటి నాణ్యతా కూడా తగ్గాయి.  థెసలే మూడవదశలో కూడా ఈ క్షీణత కొనసాగి, ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమయ్యాయి.

పై యూరప్ మూడు ప్రాంతాలకు చెందిన మూడు దశల గురించి ఈమాత్రం వివరంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇవి ఒక ముఖ్యమైన సామాజిక పరిణామాన్ని చెబుతున్నాయి. మొదటి దశలో ప్రారంభించి రెండవ దశ వరకూ పురుషమూర్తులు స్వల్పసంఖ్యలోనూ, స్త్రీమూర్తులు  ఎక్కువ సంఖ్యలోనూ  కనిపిస్తూవచ్చాయి.  కానీ, మూడవదశకు వచ్చేసరికి స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.  ఆ దశలో పశుపాలనకు, యుద్ధాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా కనిపించాయి.  అంటే ఏం జరిగిందన్నమాట…స్త్రీ ప్రాధాన్యం పోయి, పురుషప్రాధాన్యం అడుగుపెట్టింది! వ్యవస్థాపరంగా చెబితే, మాతృస్వామ్యం స్థానంలో పురుషస్వామ్యం అడుగుపెట్టింది.

ఇంకా వెనక్కి, క్రీటుకు చెందిన మినోవన్ సంస్కృతి(క్రీ.పూ. 2700-1450)కి వెడదాం. అక్కడి తవ్వకాలలో కూడా పురుషమూర్తుల కంటే స్త్రీమూర్తులే ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. ఇవి పొట్టిగా, బలిష్టమైన పిరుదులతో, కూర్చుని కనిపిస్తాయి. ఈ తరహా మూర్తులే యూఫ్రటిస్ మధ్యతీరంతో సహా ఆసియాలోని సెమెటిక్ భూములు అంతటా కనిపించాయి. బాబిలోనియాలోని నిప్పూరులో దొరికిన క్రీ.పూ. 2700 నాటి మూర్తి ఒక ఉదాహరణ. ఈ మూర్తిని బాబిలోనియా అమ్మవారు(mother-goddess)గా గుర్తించారు. ఈవిధంగా స్త్రీమూర్తుల విషయంలో ఆగ్నేయ యూరప్ కు, నైరుతి ఆసియాకు మధ్య ఒక సంబంధం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు అన్నింటా స్త్రీ ప్రాధాన్యం కలిగిన మాతృస్వామ్యం ఉండేదనడానికి అది సూచన. మన దేశానికి చెందిన సింధు సంస్కృతి కూడా మినోవన్, బాబిలోనియా కాలానికి చెందినదే.

ఇంతకీ ఈ స్త్రీమూర్తులు ఎలాంటివో, వీటినుంచి ఆశించిన ప్రయోజనం ఏమిటో చూద్దాం:

జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY: THE PREHISTORIC AEGEAN) The making of the Goddess అనే అధ్యాయంలో దీనిగురించి చర్చించారు. దాని సారాంశాన్ని చెప్పుకుంటే, ఈ స్త్రీ మూర్తులే వివిధ ప్రాంతాలలోని అమ్మవారి రూపానికి మాతృకలు. విచిత్రం ఏమిటంటే, అమ్మవారి రూపాన్ని సృష్టించడానికి మూలమైన ఈ మూర్తులే క్రమంగా అమ్మవారికి మొక్కుగా అర్పించే మూర్తులు అయ్యాయి. అమ్మవారి ఆరాధన జరిగే అనేక ప్రాంతాలలో గుడులలోనూ, తోపులలోనూ ఈ మూర్తులు వందల సంఖ్యలో దొరకడం ఇందుకు నిదర్శనం.

venus of milo

venus of milo

 

అలాగే, ఈ మూర్తులు మొదట్లో ఆరాధనారూపాలు కావు, మాంత్రికత(magic)లో భాగమైన బొమ్మలు. అది కూడా ప్రారంభంలో  ఋతుస్రావానికి, ప్రసవానికి మాత్రమే సంబంధించినవి.  వాటి భంగిమలు దానినే సూచిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మూర్తులు  స్త్రీ-పురుష సంపర్కానీకీ, గర్భం ధరించడానికీ సంబంధం ఉన్నట్టు తెలియని కాలానికి చెందినవి. ఇప్పటికీ మరీ ఆదిమ దశలో ఉన్న జాతులవారికి ఈ రెండింటి సంబంధం తెలియదు. నేటి ఆస్ట్రేలియా ఆదిమ తెగలలో ‘కన్య’ అనే భావన లేదని థాంప్సన్ అంటారు.  పురుష సంబంధం, తద్వారా గర్భం ధరించే అవకాశం లేని స్త్రీని కన్య అనీ, ఆ రెండూ ఉన్న స్త్రీని గృహిణి అనీ అంటాం. పురుష సంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలియనప్పుడు ఆ విభజనకు అవకాశమే లేదు. ఇంతకుముందు ఇదే వ్యాసపరంపరలోని ‘ఋతుమతీ పునః కన్యా’ మొదలైన వ్యాసాలలో కూడా కన్య గురించి కొంత చర్చ జరిగింది.

ఒకవేళ పురుషసంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలిసినా; గర్బధారణకు ఏదో మంత్రమో, మహిమో, దేవుడో కారణంగా చెప్పుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అంటే ఈ విశ్వాసం మూలాలు వేల సంవత్సరాల గతంలో ఉన్నాయన్నమాట.

మొదట్లో ఋతుస్రావానికీ, ప్రసవానికీ, సౌభాగ్య తంత్రానికీ సంబంధించిన ఈ మాంత్రిక మూర్తులు క్రమంగా పెళ్లి, చావు, రోగమూ, రొష్టుతో సహా అన్ని జీవన సందర్భాలకూ విస్తరించాయి. జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టంలోనూ, సంక్షోభంలోనూ పునరుత్పాదక శక్తినీ, పునరుజ్జీవనాన్నీ నింపడానికే మాంత్రికతా ప్రయోగం.

క్రమంగా పురుషసంబంధానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెలిసిన ఫలితమే, అనంతరకాలపు నిక్షేపాలలో పురుషమూర్తులతోపాటు, పురుషాంగాలు బయటపడడం! ఇంతకుముందు ఒక వ్యాసంలో(‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య) చెప్పుకున్న దక్షిణాఫ్రికాలోని వాలెంగే కన్యల శిక్షణ తంతు ఈ దశకు చెందినది. ఈ దశలో కూడా మూర్తులను, స్త్రీ పురుష జననాంగాల రూపాలను తయారు చేసేది స్త్రీలే. అయితే అవి లైంగిక చర్యను బోధించే సామగ్రి మాత్రమే. మాంత్రికమైన తంతును మినహాయిస్తే, ఇవి నేడు స్కూళ్లలోనూ, కాలేజీలలోనూ శరీర నిర్మాణాన్ని బోధించడంలో ఉపయోగించే సామగ్రి లాంటివన్న మాట.

dimini figurine

Dimini Figurine

 

మూడవ దశకు వచ్చేసరికి మరో కీలక పరిణామం జరిగింది. స్త్రీ-పురుష జననాంగాలపై పురుషభావారోపణ (anthropomorphism) జరిగి, అవి దేవతారూపాలు తీసుకున్నాయి. మనదగ్గర పానవట్టం-లింగం ఒక ఉదాహరణ. అలాగే, ఈ దశలోనే పురాతన మూర్తులు వివిధ ఇతర దేవతారూపాలకు మాతృకలయ్యాయి.

ఇలా మనిషి రూపాలతో ముడిపడిన తంతులు ఏదో ఒక ప్రాంతానికో, లేదా గతానికో పరిమితం కావు. దిగువ పాతరాతి యుగం నుంచి ఇనప యుగం వరకు నిరంతరాయంగా కనిపిస్తున్న ఈ మూర్తులు ఈ మధ్యలోని వివిధ కాలాలలో వివిధ ప్రయోజనాలకు సాధనమయ్యాయని థాంప్సన్ అంటారు. మొత్తం మాంత్రికత చరిత్ర అంతా ఈమధ్యలోనే ఇమిడిపోయిందని కూడా ఆయన అంటారు. ఈ మూర్తులలో చాలావరకూ సమాధులలో దొరికాయి. తదుపరి కాలంలో మొక్కు చెల్లింపు రూపంలో తోపులలో దొరికాయి. ఆ తర్వాత దేవతా మూర్తులకు రూపమిచ్చాయి. మధ్య, దిగువ మినోవన్ సంస్కృతులలో ఈ మూడు రకాలవీ కనిపిస్తాయి. ఇలా పురావస్తు ఆధారాలు ఈ మూర్తులకు సంబంధించిన వేల సంవత్సరాల పరిణామ చరిత్రను చెబుతున్నాయి.

ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అనంతరకాలపు నిక్షేపాలలో మొక్కు చెల్లింపు రూపంలోని మూర్తులు ఎక్కువ సంఖ్యలో దొరికినా అన్నీ అలాంటివే కావని థాంప్సన్ అంటారు. దేవతకు చెల్లింపులు(offerings) జరపడం అనే ఆనవాయితీ ఇంకా అడుగుపెట్టని కాలానికి చెందినవి కూడా వాటిలో ఉన్నాయి.  ఆ దశలో ఆ మూర్తులు మాంత్రికశక్తిని నిక్షేపించిన మతపరమైన ఆస్తులు మాత్రమే. వాటిని స్త్రీల రహస్యప్రపంచమైన తోపులలో భద్రపరచడం మాత్రమే చేసేవారు. అవి మాంత్రికమైనవి కనుక వాటి వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల వాటికి నష్టం జరగకుండా నివారించడమే అందులోని ఉద్దేశం. అయితే దేవతాభావన ఒక రూపం దిద్దుకున్న తర్వాత ఈ మూర్తులను దేవతకు చెందినవిగానూ, ఆ దేవత నుంచే అవి మహిమను పుంజుకుంటున్నవిగానూ భావించడం ప్రారంభించారు. అప్పటినుంచీ ఈ మూర్తులు  కేవలం మతపరమైన సామగ్రిగా కాక, దేవతకు, లేదా ఆమె భక్తులకు ప్రతిరూపాలుగా గుర్తింపు పొందడం ప్రారంభించాయి.

దేవతకు మొక్కు కోవడం, మొక్కు చెల్లించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కోరుకున్నది నెరవేరిన తర్వాతో, నెరవేరడానికి ముందో మొక్కు చెల్లింపు జరగచ్చు. ఇప్పుడు ఇదొక  ‘మొక్కుబడి’గా మారింది కానీ, దీనికి కూడా వేల సంవత్సరాల గతం ఉంది. అంతే కాదు, ఈ మొక్కు చెల్లింపు మన దేశంలోనే కాదు; అనేక చోట్ల ఉంది. వాటి మధ్య పోలికలు కూడా ఉన్నాయి.  ఉదాహరణకు గ్రీసులో రైతు తన ఎద్దో మరో పశువో జబ్బు పడితే పేడతో దాని ప్రతిరూపం తయారు చేసి దేవతకు అర్పించేవాడు.  మన దేశంలోనూ దేవుడికో, దేవతకో మొక్కు కింద ప్రతిరూపాలను అర్పించే ఆనవాయితీ అనేక ఆలయాలలో కనిపిస్తుంది.

ఇంకో విశేషం ఏమిటంటే, ఇలా బొమ్మలను ఉపయోగించడం క్షుద్ర పూజల్లోనూ ఉంది. శత్రువు బాగుపడుతుంటే చూడలేక మైనంతో అతని బొమ్మను చేసి తగలబెట్టడం గురించి థాంప్సన్ ప్రస్తావిస్తారు. కానీ ఇప్పుడు మొక్కుకు, క్షుద్ర పూజలకు ఉన్న సంబంధం మరుగున పడిపోయింది. ఈ రెండూ అత్యంత ఆదిమ దశలో ఒకే కుదుట్లో పుట్టిన తంతులు. వాస్తవానికి అవి పుట్టినవి మాంత్రికతనుంచి! జబ్బు పడిన పశువు ఆరోగ్యాన్ని పుంజుకోడానికి జరిపే అభినయ మాంత్రికత(mimetic magic)లో భాగమే, ఆ పశువు బొమ్మను చేయడం. ఆ దశలో దానిని దేవతకు అర్పించడం అనేది లేదు. అది తర్వాతి కాలంలో వచ్చింది. ఆ బొమ్మ మంత్రపూతమైంది కనుక దానిని భద్రమైన ప్రదేశంలో ఉంచవలసిన అవసరం నుంచి, దేవతకు అర్పించడం అనే భావన పుట్టింది.

చనిపోయిన రాజకీయ నాయకులకు, ఇతర ప్రముఖులకు విగ్రహాలు స్థాపించడం వెనుక కూడా అత్యంత ఆదిమ దశకు చెందిన మాంత్రిక వారసత్వం ఉందంటే ఆశ్చర్యం కలగచ్చు. అతి పురాతన కాలానికి వెడితే, గ్రీసుపై పర్షియన్లు దండయాత్ర చేసినప్పుడు; ట్రోయిజెన్ పౌసానియస్ అనే చోట స్త్రీలను, పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అందుకు కృతజ్ఞతగా అక్కడ ఆ స్త్రీలు, పిల్లల విగ్రహాలను స్థాపించారు. అలాగే, తప్పి పోయిన, లేదా దేశాంతరానికి వెళ్ళి తిరిగి రాని వారి విగ్రహాలను స్థాపించేవారు. వారు సురక్షితంగా తిరిగి రావడం దాని వెనుక ఉద్దేశం. చనిపోయినవారి విగ్రహాలను స్థాపించడం, వారిని ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవడం కోసమే నని ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ మొదట్లో ఆశించినది అది కాదు; పరలోకంలో వారు సుఖంగా ఉండాలన్న భావనే ఈ ఆనవాయితీకి మూలం.

వెనకటి కాలంలో గ్రీసు అంతటా, అథ్లెటిక్స్ విజేతలకు, పదవీ కాలం ముగిసిన పూజారులకు, పూజారిణులకు విగ్రహాలు స్థాపించేవారు. వీరిని దేవుళ్ళుగా లేదా దేవతలుగానే భావించేవారు.  మన దగ్గర ఇప్పటికీ దివంగత  రాజకీయనాయకులకు, సినీనటులు వగైరాలకు విగ్రహాలను స్థాపిస్తుండడం తెలిసినదే. అభిమానం వికటించి బతికి ఉండగానే విగ్రహాలను స్థాపించడమూ చూస్తూ ఉంటాం.

మొత్తానికి తంతు మిగిలింది. దాని చరిత్రా, దాని వెనుక అసలు కారణమూ మరుగున పడిపోయాయి!

మరికొన్ని విశేషాలు తర్వాత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

 

 

 

 

మీ మాటలు

  1. కన్నెగంటి అనసూయ says:

    నమస్కారం భాస్కరం గారు…..చాల అథ్భుతమైన విషయాలు….తెలుస్తున్నాయి..థన్యవాదాలు

    • కల్లూరి భాస్కరం says:

      మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు అనసూయగారూ…

  2. Mangu Siva Ram Prasad says:

    భాస్కరంగారు పురా గమనంలో వస్తువును ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతులలోని మాతృ స్వామ్య పితృ స్వామ్య వ్యవస్థల ఉత్థాన పతనాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వాటి చారిత్రిక నేపథ్యంలో చూపడంలో తన ప్రజ్ఞా పాటవాలకు పదును పెడ్తున్నారు. విషయాన్ని చరిత్ర అద్దంలో ప్రతిఫలింప చేయడంతో మానవ సమాజాల జీవన వికాసక్రమం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం విశ్వాసనీయతను ప్రామాణికతను కలిగిస్తూంది. మానవ చరిత్రను ఒక నూతన కోణంలోంచి దర్శింపజేసే ప్రయత్నం ప్రశంసనీయం. ధన్యవాదాలు భాస్కరంగారు.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు శివరామప్రసాద్ గారూ…మీ స్పందన ఎంతో ఉత్తేజకరం.

  3. నిశీధి says:

    Very interesting sir, thanks for sharing this valuable information with us

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు నిశీధిగారూ…

మీ మాటలు

*