బృందావన కృష్ణుడు… సోషల్ ఇంజనీరింగ్!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)బుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే!

బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. సాలవృక్షం శాక్యులకు పూజనీయం(టోటెమ్). విక్రమార్కుని కథలోని సాలభంజికలు ఈ చెట్టు కలపతో చేసినవే.

అక్కడో సాలవనం ఉంది. అది అమ్మవారి వనం. అందులోని అమ్మవారి పేరు లుంబిని. బుద్ధుడి తల్లి మాయాదేవి దగ్గరలోని శాక్యులకు చెందిన ఒక పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి వనంలోకి వెళ్ళి అమ్మవారిని కొలిచింది. అప్పుడే నొప్పులు వచ్చి ఆ వనంలోనే బుద్ధుని ప్రసవించింది.

బుద్ధుణ్ణి మరచిపోయి ఉండచ్చుకానీ ఆ ప్రాంత జనం ఇప్పటికీ ఆ వనంలోని అమ్మవారిని పూజిస్తూ ఉంటారని కోశాంబీ అంటారు. కాకపోతే లుంబిని కాస్తా ఇప్పుడు ‘రుమ్మిందీ’ అయింది. ఆచారాలు ఎంత బలీయమైనవో, కాలాన్ని జయించి అవి ఎలా కొనసాగుతాయో ఇది చెబుతుంది.

ఇప్పుడు మళ్ళీ పురాణకథల్లోకి ఒకసారి వెడదాం:

ఉత్తరప్రదేశ్ లో కృష్ణుడి జన్మస్థానమైన మధుర, దానికి దగ్గరలో ఉన్న బృందావనం, గోకులం నేటికీ ప్రసిద్ధపుణ్యక్షేత్రాలు. ఈ మూడింటినీ కలిపి ‘వ్రజభూమి’ అంటారు. బృందావనం అమ్మవారివనమే. ‘బృంద’ కొందరు అమ్మవార్ల గుంపు (బృందం) ను సూచించే ఉమ్మడి పేరనీ, ఆ అమ్మవార్ల వనమే బృందావనమనీ కోశాంబీ వివరణ. తులసి రూపంలో ఈ దేవతను పూజిస్తారు. కంసుని వల్ల కృష్ణునికి ప్రాణభయం ఉండడంతో అతని పెంపుడు తల్లిదండ్రులైన యశోదా నందులు గోకులాన్ని బృందావనానికి తరలించారు. బృంద దేవతకు ఏటా జరిగే ఉత్సవాలలో నరబలి కూడా ఉండేదనీ, కృష్ణుడు దీనిని మాన్పించాడనీ కోశాంబీ అంటారు. దీని గురించి Myth and Reality లో మరింత సమాచారం ఉంది కానీ ఇప్పుడు అందులోకి వెళ్లలేం.

కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDIA in Historical Outline) అంటారు. ఉషస్సనే స్త్రీని ఇంద్రుడు చంపాడని చెబుతున్నా, ఆమె బతికి బయటపడినట్టుగా; పూతనను కృష్ణుడు చంపాడని అన్నా ఆమె చావలేదనీ, మధుర ప్రాంతంలో ఇప్పటికీ పిల్లలకు పూతన పేరు పెడతారనీ ఆయన వివరణ.

‘బహుశా’ అని కోశాంబీ ఎందుకు అన్నారో కానీ, పూతన అమ్మవారే ననడానికి, భాగవతం, దశమస్కంధంలోని పూతన వధ ఘట్టంలోనే స్పష్టమైన సాక్ష్యం ఉంది. గోపికలు కృష్ణుడికి రక్ష పెడుతూ, “నిన్ను తలచుకున్నవారికి వృద్ధ, బాల గ్రహాల వల్ల , భూతప్రేత పిశాచాల వల్ల ఎలాంటి భయమూ ఉండదనీ, పూతనాది మాతృకా గణాలు నశిస్తాయనీ” అంటారు. మాతృకా గణాలంటే అమ్మవార్లే. కుమారస్వామి కథలో కూడా ఈ మాతృకా గణాల ప్రస్తావన వస్తుంది. ఇక్కడ ‘గణాలు’ అనే మాట ‘సమూహాలు’ అనే అర్థంలో వాడినట్టు కనిపించవచ్చు కానీ, పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ మాట ఒకనాటి గణవ్యవస్థనే సూచిస్తూ ఉండవచ్చు. ఒకప్పుడు నిర్దిష్టార్ధంలో ఉపయోగించిన మాటలు కాలగతిలో నిర్దిష్టార్ధం కోల్పోయి సామాన్యార్ధం తెచ్చుకోవడం పరిపాటే. గ్రీకు పురాచరిత్ర సందర్భంలో జార్జి థాంప్సన్ కూడా ఇలాంటి ఉదాహరణలను కొన్నింటిని ప్రస్తావించారు.

వాస్తవంగా ఏం జరిగి ఉండచ్చంటే, పూతనను కృష్ణుడు చంపలేదు, లొంగదీసుకున్నాడు! అంటే, మాతృకాగణాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే, అమ్మవార్ల ఆరాధనకంటే ఉన్నతస్థానంలో, తన రూపంలోని పురుషదేవుడి ఆరాధనను స్థాపించడానికి ప్రయత్నించాడు. అమ్మవారి ఆరాధన అంతరించలేదు కానీ, ద్వితీయస్థానానికి జారిపోయింది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న భారతదేశ ప్రత్యేకతను వెల్లడిస్తుంది. ఇక్కడ ఏదీ ఒకదానినొకటి అంతరింపజేయదు. భిన్నత్వాల మధ్య సర్దుబాటు జరుగుతుంది. కృష్ణుడు చేసినదానిని సామాజికార్థంలో తీసుకుంటే, మాతృస్వామ్యంపై పితృస్వామ్యాన్ని స్థాపించడంలో ఆయన ఒక పాత్ర నిర్వహించాడన్నమాట.

sacred grove in vrindavan

బృందావనం కథ కూడా అమ్మవార్లపై కృష్ణుడు తన ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రక్రియలో భాగమే. బృందను కృష్ణుడు పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే, బృందారాధన(అమ్మవార్ల ఆరాధన)ద్వితీయస్థానానికి జారిపోవడమూ; కృష్ణారాధన, బృందారాధనల మధ్య సర్దుబాటూ జరిగాయన్నమాట. కృష్ణుడు నరబలిని మాన్పించడం ద్వారా బృందారాధనను సంస్కరించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడి భార్యల సంఖ్య 16,108కి చేరుకోవడంలోని రహస్యం, ఆయన అమ్మవార్లను పెళ్లాడి (పైన చెప్పిన సర్దుబాటు అర్థంలో), అప్సరసలతో రాసక్రీడలు జరపడమే. అప్సరసలే గోపికలుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవార్లతోపాటు అప్సరసలు కూడా ఇంతకుముందు చెప్పుకున్న స్త్రీ సూత్రం (female principle)లో భాగాలే. ‘ఎలుగుబంటి’ తెగకు నాయకుడైన జాంబవంతుడి కూతురు జాంబవతి, అప్పటికింకా ఆటవిక దశలోనే ఉన్న భోజకుల ఆడబడుచు రుక్మిణి మొదలైనవారిని కృష్ణుడు పెళ్లాడడం; భిన్న భిన్న తెగలలోకి కృష్ణారాధనను శాంతియుతంగా చొప్పించే ప్రయత్నమేనని కోశాంబీ అంటారు. కృష్ణుడి వివాహాలు మాతృస్వామ్యానికి చెందిన కొన్ని అనార్య తెగలను ఆర్యుల పితృస్వామిక వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియలో కీలకమైన ముందడుగుగా ఆయన వర్ణిస్తారు. నేడు మనం చెప్పుకునే ‘సోషల్ ఇంజనీరింగ్’ కు ఇది చక్కని ఉదాహరణ.

ఇలా కృష్ణుడు పితృస్వామ్య స్థాపనలో కీలక పాత్ర వహించాడనీ, లేదా పితృస్వామ్య స్థాపనలో భాగంగా కృష్ణుడి పాత్రను నిర్మించారనీ అనుకుంటే ఆయన దశావతారాలలో ఎందుకు చేరాడో అర్థమవుతుంది. అమ్మవార్ల ఆరాధనలోకి, లేదా మాతృస్వామిక రూపాలలోకి కృష్ణుడు తన ఆరాధనను చొప్పించిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గోపికావస్త్రాపహరణం ఒక కీలక ఉదాహరణ.

పోతన భాగవతం, దశమస్కంధంలోని ఆ కథ ఇలా సాగుతుంది:

హేమంత ఋతువులో మొదటి నెల తొలిదినాలలో నందుని మందలో ఉన్న గోపికలంతా పొద్దుటే లేచి కాళిందీనదికి వెళ్ళి స్నానం చేశారు. నది ఒడ్డున ఇసుకతో కాత్యాయినీరూపం చేసి, పువ్వులు,గంధంతో, ధూపదీపాలతో పూజించి నైవేద్యాలు పెట్టారు. కృష్ణుడిని తమకు పతిని చేయమని అమ్మవారిని ప్రార్థించారు. ఇలా నెలరోజులపాటు కాత్యాయనీ వ్రతం చేశారు.

ఆ నెలరోజుల్లోనే ఒకరోజున కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్లారు. ఒక నిర్జన ప్రదేశంలో చీరలు విప్పి గట్టున పెట్టి నదిలోకి దిగారు. దూరం నుంచే కృష్ణుడు ఇది చూసి, తన తోటి గోపకులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వారిని కదలకుండా అక్కడే ఉండమని చెప్పి తను పొదల మాటునుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి గట్టున ఉన్న చీరలను ఎత్తుకు వెళ్ళి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు.

గోపికలు చూశారు. ‘’మా మాన మెందుకు హరిస్తావు? మా చీరలు మాకు ఇచ్చేయి అని అనేకరకాలుగా ప్రార్థించారు. ‘’నీళ్ళలోంచి బయటకు వచ్చి మీ చీరలు తీసుకొండని కృష్ణుడు అన్నాడు. గోపికలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, “ఆడవాళ్ళు స్నానం చేసే చోటికి మగవాళ్ళు రావచ్చా? వచ్చినా ఇలాంటి పనులు చేయచ్చా? నీకు దాసులమవుతాం. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం. ఏమైనా ఇస్తాం. ఇప్పుడు మాత్రం దయచేసి మా చీరలు మాకు ఇచ్చేయి” అన్నారు.

‘’ఇంతకీ ఎవరు మొగుడు కావాలని వ్రతం చేస్తున్నారు? మీకు ఎవరి మీద వలపు కలిగింది?’’ అని కృష్ణుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు హృదయంలో మన్మథుడు సందడి చేస్తుండగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గోపికలు మౌనంగా ఉండిపోయారు.

‘’నా ఇంటికి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటామంటే మీ చీరలు మీకిస్తాను. నీళ్ళలోంచి బయటకు రండి’’ అన్నాడు కృష్ణుడు.

చలికి నీళ్ళలో ఉండలేక, బయటకు రాలేక గోపికలు సతమతమయ్యారు. ఏమైతే అయింది, వెడదామని కొందరు అన్నారు. వెడితే కృష్ణుడు మన సిగ్గు తీస్తాడని కొందరు అన్నారు. చివరికి ఎలాగో మనసు గట్టి చేసుకుని, అరచేతితో మానం కప్పుకుంటూ వరసకట్టి నీళ్ళలోంచి బయటకు వచ్చారు.

‘’ఎందుకు సిగ్గు పడతారు? నాకు తెలియని మీ రహస్యం ఏముంది? వ్రతనిష్టలో ఉండి ఇలా చీరలు విప్పేసి స్నానం చేయచ్చా? వ్రతఫలం దక్కాలంటే చేతులెత్తి మొక్కి చీరలు తీసుకొండని’’ డని కృష్ణుడు అన్నాడు.

వ్రతాలు చేసేటప్పుడు ఎవరిని తలచుకుంటే వ్రతభంగం ఉండదో ఆ దేవుణ్ణే తాము చూస్తున్నప్పటికీ, ‘అయ్యో చీరలు విప్పి ఈరోజు వ్రతభంగం చేశామే’ అనుకుంటూ గోపికలు రెండు చేతులూ ఎత్తి కృష్ణుడికి మొక్కారు. కృష్ణుడు చీరలు ఇచ్చేశాడు. “ చీరలు దొంగిలించి కృష్ణుడు మన సిగ్గు తీస్తే తీశాడు కానీ వ్రతంలో లోపం జరగకుండా మొక్కించి కాపాడాడు” అని అనుకుంటూ గోపికలు కృష్ణుని స్తుతించారు. చీరలు కట్టుకున్నారు.

అప్పుడు కృష్ణుడు వాళ్ళతో, ‘’సిగ్గుపడి మీ రహస్యం చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. నన్ను కొలవాలనే మీరు అనుకున్నారు. మీ నోము ఫలించేది నావల్లనే. నన్ను కొలిస్తేనే మీకు ముక్తి. ఆ తర్వాత అమ్మవారిని కొలిచి రాత్రిళ్ళు మీరు నన్ను పొందవచ్చు’’ అన్నాడు.

brundaavanamlo raadhaakrushnulu

ఈ ఘట్టానికే కాక, ఇలాంటి అనేక ఘట్టాలకు సంబంధించి సంప్రదాయం బోధించే ఆధ్యాత్మికఅన్వయాలు, రహస్యాలు వేరే ఉన్నాయి. అవి నా పరిశీలన పరిధిలోకి రావు కనుక వాటిలోకి వెళ్లను. పురాచరిత్ర కోణం నుంచి చూస్తే, గోపికలు కాళిందిలో స్నానం చేసి, ఇసుకతో కాత్యాయనీదేవి రూపం చేసి పూజించిన ప్రాంతంలో అమ్మవారి వనం ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ వివరాన్ని అందించడం కథకునికి అంత ముఖ్యంగా తోచి ఉండకపోవచ్చు. అతను ప్రధానంగా కృష్ణుడనే పురుషదేవుని పరంగా కథ చెబుతున్నాడు. అలాగే, గోపికలు యమునా నదికి వెళ్లి, చీరలు విప్పి స్నానం చేసిన ప్రదేశం స్త్రీలకు మాత్రమే ఉద్దేశించిన రహస్య ప్రదేశం కావచ్చు. అక్కడ అమ్మవారి వనమూ ఉండవచ్చు.

స్త్రీల రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కృష్ణుడు యథేచ్చగా ఉల్లంఘించాడన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్న గ్రీకు కథలతోనూ, దేవీభాగవతంలోని సుద్యుమ్నుని కథతోనూ దీనిని పోల్చి చూడండి. అర్తెమిస్ అనే గ్రీకు దేవత ఒక అడవిలోని కన్యాసరోవరంలో స్నానం చేస్తుండగా అక్కడికి వెళ్ళిన అక్తయాన్ అనే పురుషుణ్ణి అర్తెమిస్ లేడిగా మార్చివేసింది. దాంతో అతని వెంట ఉన్న వేటకుక్కలు లేడి రూపంలోని అక్తయాన్ పై దాడి చేసి చంపేసాయి. మరో కథలో డఫ్నే అనే యువతిని ప్రేమించిన ల్యుకప్పస్ అనే యువకుడు స్త్రీ వేషంలో వెళ్లి ఆమెతో స్నేహం చేశాడు. ఒకరోజున ఇతర చెలికత్తెలతో కలసి డఫ్నే దుస్తులు విప్పి జలక్రీడలాడడానికి సిద్ధమైనప్పుడు ల్యుకప్పస్ మగవాడని తెలిసి అతణ్ణి చంపేస్తుంది. దేవీభాగవతం కథలో అమ్మవారి వనంలోకి తెలియక ప్రవేశించిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. జగదేకవీరుని కథలో దేవకన్యలు స్నానం చేస్తుండగా చూసిన రాకుమారుని ఇంద్రకుమారి శిలగా మార్చివేస్తుంది.

కానీ, గోపికలు స్నానం చేస్తున్న రహస్యప్రదేశంలోకి కృష్ణుడు ప్రవేశించినా అతనికి ఏమీకాలేదు. పైగా, నగ్నంగా అతని ముందు నిలబడి గోపికలే శిక్షను ఎదుర్కొన్నారు. పై కథలలోని స్త్రీలకు, గోపికలకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. పై కథల్లోని స్త్రీలు తమ రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కచ్చితంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేశారు. తమ రహస్యప్రపంచ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. అందుకు భిన్నంగా గోపికలు బేలలుగా మారి తమ రహస్య ప్రపంచ ఆధిపత్యాన్ని పురుషుడికి ధారపోసేసారు. కృష్ణుడికి, వారికి జరిగిన సంభాషణ– వారు పురుషుడికి పూర్తిగా దాసోహమవడాన్నే వెల్లడిస్తుంది. ‘’నీకు దాసులమవుతాం, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం, ఏమి కోరినా ఇస్తాం, ఇప్పుడు మాత్రం చీరలు ఇచ్చేయ’’ మని వేడుకుంటారు. ఇది స్త్రీ అధికార పతనానికి కచ్చితమైన సూచన.

కృష్ణుడు కూడా వారిపై దాస్యాన్ని విధించడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. ‘’మీరు నా ఇంటి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటేనే చీరలు ఇస్తాను’’ అన్నాడు. గోపికలు అరచేత మానాన్ని కప్పుకుంటూ కృష్ణుడి ముందుకు వెళ్ళినా వారికి చీరలు దక్కలేదు. రెండు చేతులూ ఎత్తి మొక్కిన తర్వాతే దక్కాయి.

ఆ తర్వాత కృష్ణుడు గోపికలకు చేసిన ఉపదేశంలో, ‘’మీరు (ప్రధానంగా) మొక్క వలసింది అమ్మవారి( కాత్యాయని)కి కాదు, నాకు’’ అన్న సూచన స్పష్టంగా ఉంది. ‘’మీకు ముక్తిని ఇవ్వవలసింది నేనే (అమ్మవారు కాదు)’’ అన్న సూచనా అంతే స్పష్టంగా ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిషేధించలేదు. ‘’నన్ను కొలిచిన తర్వాత అమ్మవారిని కొలిచి నన్ను పొందండి’’ అన్నాడు. అంటే అమ్మవారి ఆరాధన ద్వితీయస్థానానికి జారిపోయింది. విశ్వాసరంగంలో ఇదీ భారతదేశ ప్రత్యేకత.

పురాచరిత్ర దృష్టి నుంచి చూస్తే, కృష్ణలీలను అర్థం చేసుకోవడంలో మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడం అనేది ఒక కీలకమైన దృక్కోణం.

***

జార్జి థాంప్సన్ ప్రకారం(Studies in Ancient Greek Society-The Prehistoric Aegean), ప్రాచీన గ్రీసులోనూ అమ్మవారి వనాలు ఉండేవి. అట్టికా అనే ప్రాంతంలో, ఒకే తెగకు చెందినవారు నివసించే స్థానిక స్వపరిపాలనా విభాగాలు (demes) 200 వరకు ఉండగా, వాటిలో ఒక చెట్టు పేరో, మొక్క పేరో పెట్టిన విభాగాలు 25 వరకూ ఉన్నాయి. అంటే, ప్రాచీన గ్రీసు అంతటా ఆయా తెగలలో వనమూలికల సంబంధమైన మాంత్రిక పద్ధతులు, చెట్లను పూజించడం ఉండేవనడానికి ఇది సూచన. Orgie అనే మాటకు విశృంఖల కామకేళి అని అర్థం. ఇది గ్రీకు పదం. ఈ పదానికి చెందినదే Orgas అనే మరో పదం. దున్నిన లేదా దున్నని ఒక పవిత్రక్షేత్రాన్ని(వనాన్ని) ఇది సూచిస్తుంది. ఇక్కడ Orgia అని పిలిచే రహస్య తంతులు జరుగుతాయి. ఇథికా అనే పట్టణం బయట ఉన్న పవిత్ర రావిచెట్ల వనం లాంటిదే ఈ పవిత్ర క్షేత్రం కూడా నని థాంప్సన్ అంటారు. ఇలాంటి వనాలే అయోనియన్ దీవుల్లోనూ ఉన్నాయనీ; యూరప్, ఆసియా గ్రామాలు అన్నిటా ఇవి కనిపిస్తాయనీ, భారతదేశంలో అయితే ఇప్పటికీ ఈ వనాలలో అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుందనీ ఆయన అంటారు.

పవిత్ర వనాలే కాదు, గుహలు కూడా ఆదికాలపు గుడులే!

దాని గురించి తర్వాత…

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. భాస్కరం గారూ
    అమ్మవారి వనాల విశ్లేషణ బావుంది. నా అనుభవంలోంచి ఒక ఉదాహరణ మీతో పంచుకుంటాను. మా ఇళ్ళల్లో ఒక ఆచారం ఉంది. కార్తీక మాసం మంగళవారాల్లో కాట్రేని పూజ చేస్తారు ఏటి గట్టు తోపులోకి వెళ్లి. ఆడాళ్ళు,మగాళ్ళు, పిల్లలు అందరూ వెళ్తారు.(ఇంటినుంచి వెళ్ళేటప్పుడు పెళ్ళికాని ఆడపిల్లలు అందరితో రాకుండా విడిగా రావాలి)
    చాకలికి నల్ల పెట్టకోడిని, నల్ల నూలు చీరను ఇస్తారు. మా వూరి ఏటి గట్టు(పెన్నా నది) వద్ద ఉన్న గంగమ్మ గుడి వద్ద తోపులో ఈ తంతు సాగుతుంది. చాకలి ఓ చెట్టు దగ్గరికెళ్ళి రాళ్ళకు పసుపు కుంకుమ, బొగ్గు పొడి ముగ్గు గట్రా పూజ చేస్తాడు. ఆ సమయంలో అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు వంటలు చేస్తుండాలి. చాకలి పూజ అయిపోయాక పెళ్ళికాని ఆడపిల్లలు తప్ప మిగిలిన ఆడాళ్ళు పులగం,పూలు, ఇంకా ఏవేవో పూజ దగ్గరకు తీసుకెల్తారు. తర్వాత కోడిని కోస్తాడు చాకలి. భోజనాలు అయ్యాక అక్కడి గంగమ్మ గుడిలో పూజలు.
    ఈ తంతులో ఇంటి నుంచి ఆడపిల్లలను విడిగా రానివ్వక పోవడం, కాట్రేని పూజ వద్ద తోలి ఘట్టానికి ఆడాళ్ళను రానివ్వకపోవడం, తరవాత రానివ్వడం, తర్వాత గంగమ్మకు పూజ చేయడం చూస్తే మీరు చెప్పిన స్పర్ధలానే అనిపించింది.
    ఈ ఆచారాన్ని మావాల్లె(బీసీ) కాకుండా బ్రాహ్మణులూ, వైశ్యులు కూడా చేస్తారు, కానీ కోడిని చాకలికి ఇస్తారు.

    • కల్లూరి భాస్కరం says:

      మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు మోహన్ గారూ…

      ఇందులో గమనించాల్సింది, ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, ఈ ఆచారాలు, తంతుల మూలాలు వేల సంవత్సరాల గతంలో ఉండడం. అది కూడా కేవలం మనదేశపు గతం మాత్రమే కాక, దాదాపు ప్రపంచపు గతం కావడం! ఇంకా ఆశ్చర్యం, వీటికి సంబంధించిన చరిత్ర తెలియకుండానే యాంత్రికంగా వీటిని పాటిస్తూ ఉండడం! ఈ ఆజ్ఞానాన్ని రుద్దిన అదృశ్యశక్తుల్ని పోల్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం. బొత్తిగా చరిత్ర పట్టని, చరిత్ర అక్కరలేని జాతి మనదే నేమో! అందుకే మన మత, సాంస్కృతిక జీవితం పేజీలు తారు మారు అయిపోయిన పుస్తకంలోని కథలానూ; కలగాపులగం చేసేసి పిల్లలకు జతపరచమని ఇచ్చే అంకెల్లానూ అనిపిస్తుంది.

      • మంజరి లక్ష్మి says:

        మీరు రాసిన పై వాక్యాలు చాలా బాగున్నాయి.

  2. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు మంజరి లక్ష్మి గారూ…

  3. Dr.Koganti Vijaya Babu says:

    భాస్కరం గారూ,
    ధన్యవాదాలు. రాబర్ట్ గ్రేవ్స్ వ్రాసిన ‘ ద గ్రీక్ మిత్స్’ లాంటి పుస్తకం చదూతున్నట్లుంది.
    విశ్లేషణకు అభినందనలు.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు విజయబాబుగారూ…రాబర్ట్ గ్రేవ్స్ ను చదువుతున్నట్టు మీకు అనిపించడం నా విశ్లేషణకు మంచి గుర్తింపు.

  4. lame attempt to fit Puranic lore into Marxist worldview. Marxism is dead and is only relevant in failed states. indian intellectuals need to move on from marxism.

  5. సుప్రసిద్ధ కవి, బహుభాషాకోవిదుడు, రామాయణ రహస్యాలు, స్వర్ణసీత వంటి విమర్శగ్రంథాలు రచించిన స్వర్గీయ డా. గుంటూరు శేషేంద్ర శర్మగారు మీ వ్యాసంలో చెప్పబడిన విషయాలనే చెబుతుండేవారు. వారి జీవితపు చివరి దశకంలో నాకు వారితో సాన్నిహిత్యం లభించింది. దశావతారాల్లో బలరాముడు విష్ణు అవతారం. అయితే ఆయన తమ్ముడు కృష్ణుడు సోషల్ ఇంజనీర్ కాబట్టే అన్నగారి స్థానంలో దశావతారాల జాబితాలో చేరాడని చెబుతుండేవారు. ఈ వాదనకు సమర్థనగా వారు ఒక పుస్తకాన్ని రచిద్దామని 2006లో ప్రణాళిక వేసుకున్నారు కూడా. అయితే అప్పటికే చివరిదశలోకి వచ్చేయడంతో ఆ పనిని సాకారం చెయ్యలేకపోయారు.

    • కల్లూరి భాస్కరం says:

      శేషేంద్రశర్మగారి గురించిన ఈ వివరం తెలిపినందుకు ధన్యవాదాలు పూర్ణ ప్రజ్ఞా భారతి గారూ…

  6. ch.venkateswarlu. says:

    కదంబ వనవాసినీ… అమ్మ రాజరాజేశ్వరి కదంబ వనంలో ఉండేదే కదా! ఆమె పూజలు ఇప్పటికీ సంప్రదాయ కుటుంబాల్లో జరుగుతూనే ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారికుంటే శివ క్షేత్రాలు పన్నెండు మాత్రమే. అమ్మవారికింకా వన్నె తగ్గలేదు.

మీ మాటలు

*