పనామా అడవుల్లో…పద్నాలుగు రోజుల నరకంలో…

 

స్లీమన్ కథ-7

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సెక్రామెంటో అతనికి నచ్చింది కానీ, అక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోవడంలేదు. భవిష్యత్తు గురించిన సందిగ్ధంలో గడుపుతూనే, తనఖా మీద  తక్కువ కాలపరిమితికి చిన్న చిన్న మొత్తాలను అప్పుగా ఇవ్వడం ప్రారంభించాడు.  తూర్పు దేశాలను చుట్టొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.  కొన్ని బలహీనక్షణాలలో అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరి పసిఫిక్ మీదుగా చైనా, భారత్, ఈజిప్టులకు వెళ్ళి; అక్కడినుంచి ఇటలీ మీదుగా రైల్లో జర్మనీ వెళ్లిపోదామా అనిపించింది.  క్రమంగా అలాంటి ఊహల నుంచీ, కొత్త చోటు కలిగించిన ఉత్సుకతనుంచీ బయటపడ్డాడు. సెక్రామెంటోలోనే ఉండి భారీ అదృష్టాన్ని మూటగట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు..

ఏప్రిల్, మే మాసాలు రెండూ అందుకు సంబంధించిన ప్రాథమిక ఆలోచనలతోనూ, సన్నాహాలతోనూ గడిచిపోయాయి. జూన్ కల్లా బంగారం రజను కొనుగోలుదారుగా అవతారమెత్తి, సెక్రామెంటోలో జే అండ్ ఫ్రంట్ స్ట్రీట్స్ లో ముఖ్యకార్యాలయాన్ని తెరిచాడు.

అదే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి మెస్సర్స్ రోత్స్ చైల్డ్ ఏజంట్లతో, ఇతర వర్తకులతో సమావేశాలు జరిపాడు. ఓ రోజు పగలంతా ఇలాంటి సమావేశాలతో గడిపింతర్వాత హోటల్ గదికి వచ్చి విశ్రమించాడు. అంతలో ఉన్నట్టుండి నగరమంతా అగ్నిజ్వాలలు భగ్గుమన్నాయి. హోటల్ మంటల మధ్య చిక్కుకుంది. గంటల మోతకు మేలుకుని హడావుడిగా దుస్తులు వేసుకుని రోడ్డు మీదికి పరుగెత్తాడు.  ఓ వైపునుంచి గాలి వీస్తూ మంటల్ని ఎగదోస్తోంది. చుట్టూ ఉన్న ఇళ్ళు తన కళ్ల ముందే ఆహుతవడం చూశాడు. అక్కడినుంచి టెలిగ్రాఫ్ హిల్ కు పరుగెత్తాడు. “ ఆ అగ్నితుపాను హోరు, తుపాకీమందు పేలుళ్ళు, రాతిగోడలు బద్దలై కుప్పకూలుతున్న చప్పుళ్ళు, జనం ఆర్తనాదాలు, అంత పెద్ద నగరమూ తగలబడిపోతున్న ఆ దృశ్యమూ…ఓ మహావిలయాన్ని కళ్ళకు కట్టించా”యని మరునాడు డైరీలో రాసుకున్నాడు.

విదేశీ విద్రోహులెవరో ఆ చిచ్చు పెట్టారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో విదేశీయుల్ని, ముఖ్యంగా ఫ్రెంచివారిని శాన్ ఫ్రాన్సిస్కో జనం నరికి పోగులు పెట్టారని… అదేదో మామూలు విషయమన్నట్టు స్లీమన్ రాశాడు. ఓ పక్క మంటలు ఆరకుండానే, బూడిదకుప్పలు సెగలు కక్కుతుండగానే అమెరికన్లు ఏమీ జరగనట్టు నిర్లిప్తంగా నగర పునర్నిర్మాణంలో మునిగిపోవడం చూసి విస్తుపోయాడు. రాత్రంతా టెలిగ్రాఫ్ హిల్ మీదే గడిపి మరునాడు పొద్దుటే సెక్రామెంటోకు వెళ్లిపోయాడు.

అగ్నిప్రమాదానికి భయపడి, సెక్రామెంటోలో రాతితో, ఇనుముతో కట్టిన ఒకే ఒక భవంతికి తన కార్యాలయాన్ని మార్చుకున్నాడు. దొంగల భయంతో ఓ పెద్ద ఇనప్పెట్టెను కొనుక్కున్నాడు. ఉదయం ఆరునుంచి రాత్రి పదివరకూ దాని పక్కనే మఠం వేసుకుని కూర్చునేవాడు. ఇద్దరు గుమస్తాలను కుదుర్చుకున్నాడు; ఒకరు స్పానిష్, ఇంకొకరు అమెరికన్. ఆ రోజుల్లో బంగారు రజను వేటలో ప్రపంచం నలుమూలలనుంచీ జనం కాలిఫోర్నియాకు బారులుతీరేవారు. ఆవిధంగా ఒకే రోజున తనకు తెలిసిన ఎనిమిది భాషల్లోనూ మాట్లాడే అవకాశం స్లీమన్ కు లభిస్తూ ఉండేది. అప్పటికీ అతనికి రాని భాషలవాళ్ళూ ఎదురయ్యేవారు. శాండ్ విచ్ దీవుల్లోని స్థానికులు మాట్లాడే ‘కెనకా’ భాష వాటిల్లో ఒకటి. ఆ దీవి జనం సెక్రామెంటోకు ఎలా వచ్చారన్నది ఓ పెద్ద మిస్టరీ.

తనకు తీరిక దొరికిన అరుదైన క్షణాలలో అతను కాలిఫోర్నియా ఇండియన్లను పరిశీలిస్తూ ఉండేవాడు. “ఈ రాగి రంగు జనం చిన్నగా, పొట్టిగా, మురికి ఒడుతూ, సిఫిలిస్ తో తీసుకుంటూ మట్టికుప్పల మీద పాకే చీమల బారులా” అతనికి కనిపించారు.

శాక్ర మెంటో 1850

శాక్ర మెంటో 1850

అతను కలలుగన్న భాగ్యరాశి కొన్ని మాసాల్లోనే చేతికి అందింది. ఏకంగా 180 పౌండ్ల బరువైన బంగారం అతని ద్వారా చేతులు మారిన రోజులున్నాయి. రోజు రోజుకీ అతని సంపద ఎలా పెరిగిపోతూ వచ్చిందంటే, దాన్ని చూసి అతను భయపడ్డం ప్రారంభించాడు. గుమస్తాలూ, అతనూ ఎప్పుడూ కోల్ట్ రివాల్వర్ చేతిలో పట్టుకునే ఉండేవారు. తమ్ముడిలానే తను కూడా టైఫాయిడ్ వచ్చి చనిపోతానేమోనని అప్పుడప్పుడు అనిపించేది. అయితే ఆఫీసులో తన డెస్క్ దగ్గర గడిపే అన్ని గంటల సేపూ అతనిలో ఎలాంటి భయచిహ్నాలూ కనిపించేవి కావు.

అక్టోబర్ లో నిజంగానే పడకేసాడు. అదేపనిగా వాంతులు, సంధి ప్రేలాపనలు. ఒంటి మీద పసుపు మచ్చలు వచ్చాయి. డాక్టర్ క్వినైన్, కాలమెల్ ఇచ్చాడు. ఆరోజుల్లో యెల్లో ఫీవర్ కు ఇచ్చే మందులు అవే. అలాంటి సమయాల్లో గుమస్తాలే వ్యాపార వ్యవహారాలు చూస్తూ తనివితీరా కొల్లగొట్టేవారు. ఏ కొంచెమో కోలుకుని అతను తిరిగి డెస్క్ దగ్గరికి రాగానే సంపద గురించిన భయాలు మళ్ళీ పట్టుకునేవి. ఓ పెద్ద ఐశ్వర్యానికి వలేయడంలో ఉండే కష్టాలు, ఒంటరితనం ఎలాంటివో వర్ణిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు:

ఈ వారమంతా చచ్చే చావు అయింది. ఓ నల్లజాతి బానిస కూడా నేను పడ్డంత కష్టం పడడు. అయితే, బంగారం మూటల్ని, నగదును పక్కన పెట్టుకుని రాత్రిపూట ఒంటరిగా నిద్రించడంలో ఉండే ప్రమాదం ముందు శారీరకంగా పడే ఎంత కష్టమైనా దిగదుడుపే. నిండా తూటాలు నింపిన పిస్టల్స్ ను రెండు చేతుల్లో పట్టుకుని రాత్రంతా విపరీతమైన భయాందోళనలతో గడుపుతున్నాను. చీమ చిటుక్కుమన్నా వణికిపోతున్నాను. రోజూ ఒక్క పూటే, సాయంత్రం 6.30కు తినగలుగుతున్నాను. మిగతా కాలకృత్యాలను పూర్తిగా పక్కన పెట్టేయక తప్పడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కష్టం పగవాడికి కూడా వద్దు.

అస్వస్థత అతన్ని విడవకుండా వెంటాడుతోంది. కోలుకున్నాడనుకునే లోపల మళ్ళీ జ్వరం పట్టుకుంటోంది. అనారోగ్యం అతని సత్తువను పూర్తిగా తోడేసింది. స్వస్థత కోసం 1852 జనవరిలో శాంటక్లారా వ్యాలీకి వెళ్ళాడు. “నీ తమ్ముడి శరీరధర్మం, నీదీ ఒకటే. అతనిలానే నువ్వూ మరణించే ప్రమాదముం”దన్న డాక్టర్ హెచ్చరిక అతన్ని మరింత కుంగదీసింది.

అయినా అంతలోనే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. తన జవసత్త్వాలెలాంటివో అతనికి తెలుసు. ఓ పెద్ద అదృష్టాన్ని మూటగట్టుకునితీరాలన్న దృఢసంకల్పమే అతనిలో తిరిగి ఎక్కడలేని శక్తినీ నింపింది. ఫిబ్రవరి ప్రారంభానికల్లా వచ్చి సెక్రామెంటోలోని తన కార్యాలయంలో వాలిపోయాడు. ఉదయం 5 గం.లకల్లా లేవడం, డెస్క్ దగ్గర కూర్చోవడం, బంగారం రజను తూచడం, బ్యాంకు డ్రాఫ్టులు రాయడం, ఎనిమిది భాషల్లో మాట్లాడడం…అన్నీ షరా మామూలే.

వ్యాపారలావాదేవీలప్పుడు అతను మహా బిర్రుగా ఉండేవాడు. మొహంలో చిన్న నవ్వు మొలక కూడా ఉండేది కాదు. అంతా పద్ధతిగానూ, తూచినట్టూ వ్యవహరించేవాడు. విచిత్రమైన కీచుగొంతుతో మాట్లాడేవాడు. సంపదకు సంబంధించిన అన్ని రహస్యాలనూ ఛేదించడానికి కంకణం కట్టుకున్న ఓ శాస్త్రవేత్తలానూ, ఏవో గొప్ప ప్రయోజనం కోసం దానిని పోగేయడానికి పూనుకున్నవాడిలానూ కనిపించేవాడు. అయితే ఎలాంటి  ప్రయోజనం కోసం అన్నది అతనికే తెలియదు.

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

తనను ఓ అమెరికన్ గానే పిలుచుకునేవాడు. “మన బంగారం భూములు”, “మన శ్మశానవాటిక” అని అంటుండేవాడు.  అమెరికాలోనే స్థిరపడి భావిజీవితాన్ని ఇక్కడే గడిపేయాలని ఒక్కోసారి అనిపించేది. అంతలోనే, జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడుపుతున్నట్టు కలలు కనేవాడు.  రష్యా అయితే ఇప్పుడతని ఆలోచనల్లోంచి పూర్తిగా తప్పుకుంది. బంగారం మూటల పక్కన కూర్చుని తనకే తెలియని ఒక నిస్పృహలో, తనతో తనే విరోధిస్తూ గడుపుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం అతనిలో ఎలాంటి సందిగ్ధతా లేదు: తను ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోనైనా చేజిక్కించుకోవాలి, లేదా ఇక్కడే చావనైనా చావాలి!

మార్చి చివరినాటికి దాదాపు రెండోదే నిజమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఒంటి మీద పసుపుమచ్చలు వచ్చాయి. “నేనింక ఏమాత్రం వ్యాపార వ్యవహారాలు చూసుకోలేనని మీకు అనిపించినా వెంటనే నన్నో దుప్పట్లో చుట్టబెట్టి స్టీమర్ మీద శాన్ ఫ్రాన్సిస్కో పంపించేయం”డని గుమస్తాలకు చెప్పాడు.

అయితే, ఏదో అద్భుతం జరిగినట్టుగా కోలుకున్నాడు. అంతకుముందే అతను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రకారం, కోలుకున్న వెంటనే నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని రోత్స్ చైల్డ్ బ్యాంకుకు వెళ్ళాడు. తన ఆస్తుల బదిలీకీ, వ్యాపారం కట్టిపెట్టడానికీ ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్వాలేదు, తను డబ్బు సంచుల్ని బాగానే పోగేసాననుకుని సంతృప్తి చెందాడు. కొంతమంది కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఇంతకంటే భారీగానే సొమ్ము చేసుకుని ఉండచ్చు. కానీ తనంత వేగంగానూ, అతి తక్కువ రిస్కుతోనూ ఎవరూ సంపాదించి ఉండరు. కేవలం తొమ్మిది నెలల్లో తను సంపాదించిన మొత్తం 4 లక్షల డాలర్లు! ఇది ఎవరి కళ్ళకైనా మిరుమిట్లు గొలిపే మొత్తమే కానీ తనకు కాదు, తన శక్తియుక్తులకు ఇది ఏమాత్రం తులతూగదనుకున్నాడు.

అమెరికన్లను అతను ఇప్పటికీ మెచ్చుకుంటున్నాడు. కాకపోతే, వాళ్ళు మరీ మొరటువాళ్ళనీ, మంచీ మర్యాదా లేనివాళ్ళనీ ఇప్పుడతనికి అనిపిస్తోంది. ఇక్కడి ఆడవాళ్ళు బొత్తిగా ఆకర్షణ లేనివాళ్లని ముందే అనుకున్నాడు. విచిత్రంగా ఇప్పుడతనికి రష్యావైపు మళ్ళీ గాలి మళ్ళుతోంది. తన భావిజీవితాన్ని ఇంకెక్కడా కాదు, రష్యన్ల మధ్యే గడిపేస్తానన్న నిర్ణయానికి కూడా మరోసారి వచ్చేశాడు. ఎంతైనా రష్యన్లు మర్యాదస్తులనీ, వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడివాళ్లలా కాకుండా తనకు నచ్చే విధంగా బాధ్యతగా, ఒబ్బిడిగా ఉంటారనీ అనుకున్నాడు. ఇప్పుడు తను ఓ పెద్ద ఐశ్వర్యాన్ని వెంటబెట్టుకుని వెడుతున్నాడు కనుక మాస్కోలోనో, సెయింట్ పీటర్స్ బర్గ్ లోనో మరింత హుందాగా, వైభవంగా జీవించవచ్చు కూడా.

అందుకు తగ్గట్టే ఈసారి రష్యాకు మంచి పటాటోపంగా వెళ్లాలనుకున్నాడు. 600 డాలర్లు చెల్లించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పనామా వెళ్ళే స్టీమర్లో అన్ని హంగులూ ఉండే ఓ ప్రైవేట్ క్యాబిన్ ను బుక్ చేసుకున్నాడు. పనామా జలసంధిని దాటి, న్యూయార్క్ వెళ్ళే ఓడ అందుకుని, అక్కడినుంచి తీరుబడిగా రష్యా వెళ్లాలని అతని ఆలోచన.

అయితే, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన వారం రోజుల తర్వాత, టొవాంటెపెక్ గల్ఫ్ దగ్గర ఓడ తుపానులో చిక్కుకుంది. దాదాపు మునిగిపోయేంత పనైంది. ఆ గండం గడిచి పనామా నగరంలో అడుగుపెడితే మరో గండం ఎదురైంది. దొంగలు అతని సామాను కాజేయబోయారు. ఒకచేతిలో కోల్ట్ రివాల్వర్, మరో చేతిలో పొడవాటి బాకు పట్టుకుని స్లీమన్ రెప్పవాల్చకుండా కాపలా కాయాల్సివచ్చింది. అప్పటికి పనామా రైలురోడ్డు నిర్మాణం కొన్ని మైళ్ళ మేరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత కంచరగాడిదల మీద ప్రయాణం చేయాల్సిందే.

అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోనైనా దాడి చేస్తారన్న భయం…

చివరికి మ్యాపు సాయం కూడా లేని స్థితిలో ఆ అడవిదారి వెంట జీవచ్చవాల్లాంటి తమ దేహాలను తోసుకుంటూ వెళ్లారు. వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. దుర్భరమైన ఆ చలివాన వాళ్ళ మూలుగుల్ని కడంటా పీల్చిపారేసింది.  గమ్యస్థానమైన కోలన్ కు చేరతామన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఒకళ్లతో ఒకళ్ళు రేచుకుక్కల్లా కాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. కొంతమంది జిగట విరేచనాలతో, మరికొందరు యెల్లో ఫీవర్ తో మధ్యలోనే కన్నుమూశారు. వాళ్ళ మృతదేహాలను అడవి జంతువుల భక్షణకు వదిలేసి మిగతావాళ్లు ముందుకు వెళ్లారు. సముద్రంలో మునిగిపోయినవాళ్ళు దాని అట్టడుగుకి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో తిరిగినట్టుగా పద్నాలుగు రోజులపాటు సాగిన ప్రయాణభీభత్సం అది!

స్లీమన్ పరిస్థితి మరీ ఘోరం. అతను కనీసం కునుకు తీయడానికి కూడా లేదు. బాకూ, రివాల్వరూ పుచ్చుకుని తన సామానుకు కాపలా కాయక తప్పదు. అందులో బంగారం కడ్డీలు, రోత్స్ చైల్డ్ బ్యాంకు మీద తీసుకున్న డ్రాఫ్టులు, యూరప్ అంతటా ఉన్న వర్తకప్రముఖులకు ఉద్దేశించిన పరిచయలేఖలు ఉన్నాయి.

అతను తన భావోద్వేగాలను ఉన్నవున్నట్టు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. వాటిలో ఇదొకటి. ఒళ్ళు జలదరింపజేసే ఈ అనుభవం గురించి ఒక చిన్న పేరాలో ఇలా రాసుకొచ్చాడు:

మృత్యువు మాకెంత మాలిమి అయిపోయిందంటే, దాన్ని చూసి అసలు భయపడ్డమే మానేశాం. పైగా దాన్ని ఇష్టపడడం ప్రారంభించాం. మా కళ్ళముందే కొంతమంది కళ్ళు తేలేస్తూ మృత్యుముఖంలోకి వెళ్లిపోతుంటే మాలో మేము నవ్వుకుంటూ వినోదించాం. ఒకరిపై ఒకరం ఘాతుకాలకు పాల్పడ్డాం. అవెంత దారుణమైనవంటే, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే భయంతో నిలువునా గడ్డకట్టిపోతాను.

అవి ఎలాంటి ఘాతుకాలు, వాటిలో తను స్వయంగా పాల్గొన్నాడా అన్నది అతను ఏనాడూ వెల్లడించలేదు. మానభంగం, హత్య, నరమాంసభక్షణ…ఇలా ఊహించవలసిందే కానీ అవేమిటో తెలియదు. తదుపరి సంవత్సరాలలో తన జీవితం గురించి ఎప్పుడు రాసినా అమెరికాలో తను గడిపిన కాలాన్ని త్వర త్వరగా దాటేసేవాడు. పనామా జలసంధిపై తను చేసిన ప్రయాణం గురించైతే మళ్ళీ ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు. ఆ పద్నాలుగు రోజుల భయానక అనుభవాన్ని మరచిపోవడానికే ప్రయత్నించాడు.

కాకపోతే ఆ తర్వాత అతను మరింత నిర్దాక్షిణ్యంగానూ, ఇతరుల పట్లే కాక తన పట్ల తనే మరింత కరకుగానూ     మారినట్టు కనిపిస్తుంది. నీది బొత్తిగా తడిలేని రాతిగుండె అనీ, ఎంతసేపూ స్వార్థమే తప్ప ప్రపంచం ఏమైపోతున్నా నీకు పట్టదనీ ముందునుంచీ తోబుట్టువులు నిష్టురమాడేవారు. ఇప్పుడు మరింత బండరాయిగానూ, కర్కశంగానూ మారాడు. డబ్బు పిచ్చి కూడా వెనకటి కంటే ముదిరిపోయింది.  రాను రాను అతను తన ఊహల లోతుల్లో నిద్రిస్తున్న గ్రీకు వీరుల్లా మారుతూ వచ్చాడు.  మెలికలు తిరుగుతూ మృత్యుముఖంలోకి వెడుతున్న వాళ్ళను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటూ వినోదిస్తూ గడిపినవాళ్లే. అతనిలానే సంపద వేటలో ఆటవికత అంచులు దాటినవాళ్ళే.

మొత్తానికి అతను యూరప్ కు తిరుగుముఖం పట్టాడు. కాలి గాయానికి కట్టు కట్టించుకునేంత సేపే            న్యూయార్క్ లో  ఆగాడు. లండన్ లో దిగి  గాయానికి కాల్పుల చికిత్స చేయించుకున్నాడు. మెక్లంబర్గ్ లో కొన్ని వారాలు ఆగి పాత పరిచయాలను పునరుద్ధరించుకున్నాడు. తన ధనబలాన్ని ఆడంబరంగా ప్రదర్శించుకున్నాడు. తండ్రికి, చిన్నాన్నకు, తోబుట్టువులకు ఖరీదైన కానుకలు ఇచ్చాడు. తీరా మెక్లంబర్గ్ వచ్చాక, వ్యవసాయదారుడిగా స్థిరపడాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పేశాడు. రష్యాకు వెళ్లిపోవాలనీ, అక్కడో పెద్ద భవంతిని, లేదా కనీసం ఓ పెద్ద అపార్ట్ మెంట్ ను కొనుక్కోవాలనీ; మంచి కుటుంబం నుంచి వచ్చిన ఓ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనీ, బహుశా కొంత కాలానికి తను రష్యన్ ప్రభువర్గంలో చేరే స్థాయికి ఎదుగుతాననీ అనుకుంటున్నాడు.

తన వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. భావిజీవితం బంగారు బాటపై సాగిపోగలిగినంత సంపదను ఇప్పటికే గడించుకున్నాడు. తనిప్పుడు ఎవరికీ, దేనికీ తలవంచాల్సిన అవసరం లేదు. స్లై మీద సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెడుతూ, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడనుకున్నాడు. తను ఫస్టెన్ బర్గ్, ఏమ్ స్టడామ్ లలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజుల్లో; పుస్తకాలు, మద్యం, మగువ, పనివాళ్లు, ఇళ్లతో సహా పగటికలలు అనుకున్నవన్నీ ఇప్పుడు  చిటికెనవేలు ఆడిస్తే చాలు, రెట్టింపు లెక్కలో తన ముందు వాలిపోతాయనుకున్నాడు.

కానీ, గడిచిన పదిహేడేళ్ళ జీవితంలో డబ్బు తనకేనాడూ సుఖాన్నీ, సంతోషాన్నీ ఇవ్వలేదన్న సంగతిని అతను గమనించుకోలేకపోయాడు.

త్వరలోనే అతని జీవితకథలో కొత్తపుటలు చేరబోతున్నాయి.  ఎట్టకేలకు అతను ఒక ఇంటివాడు కాబోతున్నాడు….!

  (సశేషం)

 

మీ మాటలు

  1. N Venugopal says:

    భాస్కరం గారూ,

    చాల చాల బాగుంది. ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా.

    ఒక చిన్న సవరణ. మీరు సెక్రామెంటో అని రాస్తున్న నగరం ప్రస్తుత కాలిఫోర్నియా రాష్ట్రానికి రాజధానే అయితే దాన్ని సాక్రమెంటో అని గాని శాక్రమెంటో అని గాని పిలుస్తారు.

    వి.

    • భాస్కరం కల్లూరి says:

      థాంక్స్ వేణుగోపాల్ గారూ… అది శాక్రమెంటోనే!

మీ మాటలు

*