శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!

2 (1)

ముందుమాట

ముచ్చటగా మూడో నెలలోకి వచ్చాక ఇప్పుడు ముందుమాటేమిటని ఆశ్చర్యపోకండి. మంచో చెడో మూడు నెలలు గడిచాయి. చాలా వరకు మా శ్రమని గుర్తించి వచ్చిన అభినందనలు, అడపాదడపా కథల గురించి విమర్శలు వచ్చాయి. మమ్మల్ని తిట్టే వాళ్ళు ప్రైవేటుగా తిట్టారు. కారణాలు రెండు – ఒకటి మేము చేస్తున్నది గడ్డిమేటలో సూదిని వెతకడమనీ, రెండోది చివరికి ఇది గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని తిట్టుకునే పరిస్థితికి దారి తీస్తుందని. తెలుగు కథలో మంచి కథలు గగన కుసుమాలని చాలా మంది అభిప్రాయం. మేము ఆ అభిప్రాయాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ఈ ముందుమాట.

విషయానికి వద్దాం. ఈ మూడు నెలలలో మేము చేతనైనంత వరకు అన్ని కథలు చదవాలనే ప్రయత్నం చేశాము. బ్లాగులు, ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే పత్రికలు మినహాయించి అందిన ప్రతి కథా చదివాము. వీటిని ఏ ప్రాతిపదికన విశ్లేషించి, మంచి ముత్యాలను వెలికి తీయాలని అన్న విషయంలో మాలో మాకు చాలా చర్చలు జరిగాయి. అవగాహన కుదిరాక, ప్రతి కథని విశ్లేషించేందుకు వీలైయ్యేట్లుగా ఒక మూల్యాంకనా విధానాన్ని తయారు చేసుకున్నాం. సబ్జెక్టివ్ గా ఉండగలిగిన విషయాలని చర్చకు పెట్టి, తద్వారా ఆ అంశ ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. ఆ వివరాలన్నీ మరోసారి చెప్పుకుందాం. ఈ మూడు నెలలలో మేము గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మననం చేసుకుందాం.

స్థూలంగా నూటాయాభై కథలు ప్రతి నెలా తెలుగుసాహిత్యంలో వచ్చి కలుస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా ఆనందదాయకమైన సంఖ్య. అందులో పది మంచి కథలను వెతకటం మాకు ఏమంత కష్టం కూడా కావటంలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే, మంచి కథలు కాకపోయినా మరో పది దాకా కథలలో ఏదో ఒక మంచి అంశం వుండటం వల్ల (వస్తువో, శిల్పమో మరొకటో) ఇక్కడ ప్రస్తావించగలిగినవిగా ఉంటున్నాయి. ఇక ఆ పైన ఇక మంచి కథ దొరకడం కష్టంగా వుంటోంది. మరో రకంగా చెప్పాలంటే నూటాయాభై కథలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంచి కథలు వస్తున్నాయి. (మంచి నిర్వచనం కాస్సేపు పక్కన పెడదాం). అయితే ఇవన్నీ అద్భుతమైన కథలేనా అంటే ఒప్పుకోవడం కష్టం. కొన్ని కథలు వస్తుపరంగా గొప్పవిగా వుండి శిల్పంలోనే, నిర్మాణంలోనో, సమకాలీనతలోనో కుదేలౌతున్నాయి.

మరి కొన్ని కథలు కేవలం పదాడంబరమూ, శైలీ, శిల్పాలమీద ఎక్కువగా ఆధారపడి, వస్తువును విస్మరిస్తున్నాయి. ఈ రెండవ రకం క్రమంగా పెరుగుతున్న ట్రెండ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఇదో కొత్త మలుపుగా గుర్తించడానికి ఇంకొంచం సమయం పట్టవచ్చు. ఈ ట్రెండ్ మరీ ముఖ్యంగా వెబ్ పత్రికల్లో కనపడుతోంది. రైతులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, లాంటి కథాంశాలు ఇప్పటికీ కథలలో సింహభాగాన్నిఆక్రమిస్తున్నాయి. కానీ, చాలా కోణాల్లోంచి ఇప్పటికే చర్చించబడ్డ ఆ వస్తువుల్లోంచి ఎలాంటి నవ్యతనైనా రాబట్టడంలో మాత్రం ఎక్కువ కథలు విఫలమవుతున్నాయి. వాటితో పాటుగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్/కన్సూమరిజం, అస్తిత్వవాదం, ఉద్యోగాలలో స్త్రీలు, కార్పొరేట్ ప్రపంచంలోని నీలి నీడలు – ఇలాంటి వైవిధ్యమైన, సమకాలీనమైన కథలు కూడా వస్తున్నాయి! ఆయా వర్గాల గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి!

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వృద్ధాప్యంలో సంతానం చూపే నిర్లక్ష్య ధోరణి కథా వస్తువుగా ఎక్కువ మంది రచయితలు/రచయిత్రులు స్వీకరించడం కనిపిస్తోంది. ఇంక రసం ఏ మాత్రం మిగలని ఈ చెరుకుగడని వదిలేసి కొత్త సమస్యల వైపు తెలుగు కథ దృష్టి సారిస్తే కథలకి మరింత వైవిధ్యం సమకూరుతుందేమోనని మా అభిప్రాయం. అలాంటి కథలే రాయాలనుకున్నా – కనీసం “పరువు” (వాణిశ్రీ, ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చ్ 2014) లాంటి కథల్లో ప్రయోగించిన నవ్యతనైనా ప్రదర్శించగలగాలి.

చాలా కథలు పూర్తిగా అపరిపక్వ స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఇవి కథలేనా అని శంకించాల్సిన పరిస్థితి! వాటిని చదివిన పాఠకులుగా మా అభిప్రాయం లేదా అనుమానం – కొంత మంది రచయితలు/రచయిత్రులు కథ రాసిన వెంటనే పత్రికలకి పంపిస్తున్నారేమోనని. మా దృష్టిలో ఏ కథకూ మొదటి సారి రాసిన వెంటనే సమగ్ర స్వరూపం సిద్ధించదు. రాసిన తర్వాత రాసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు తమ రచనని తామే పాఠకులుగా మారి చదివితే రచనలో లోపాలు వాళ్ళకే స్ఫురిస్తాయి. ఒక అనవసరమైన వర్ణన, ఇతివృత్తానికి అనవసరమైన ఒక సంఘటన, చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముగింపు దగ్గరకొచ్చేసరికి అనవసరం అనిపించే పొడిగింపు – ఇలాంటివి. అవి సరిచేసి ప్రచురణకి పంపటం వల్ల మంచికథ రాసిన తృప్తి రాసినవాళ్ళకీ, చదివిన తృప్తి పాఠకులకీ కనీసం కొన్ని కథల విషయంలోనైనా పాఠకులకి దొరుకుతుంది.

 

మార్చి కథలు

ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చ్ నెల కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. అయితే, బాగున్న కథలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి. ముందుగా – టాప్ పది కథలలోకి దాదాపు చేరబోయి అడుగు దూరంలో ఆగిపోయిన కొన్ని కథలను గురించి –

ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద (స్వాతికుమారి బండ్లమూడి, ఈమాట), అనగనగా ఒక రాత్రి (పూర్ణిమ తమ్మిరెడ్డి, ఈమాట), మనిషివిత్తనం (వి. ప్రతిమ, చినుకు), నడుస్తున్న చరిత్ర (ఆదెళ్ళ శివకుమార్, గో తెలుగు 23 మార్చ్), పౌరుషం (సతీష్ పోలిశెట్టి, కినిగె పత్రిక) – ఈ ఐదు కథలలోనూ శిల్పపరంగానో, వస్తుపరంగానో చెప్పుకోదగ్గ విషయాలు వున్నాయి. మొదటి నాలుగు కథలలో శిల్పం చాలా గొప్పగా వున్నప్పటికి ఇతర విషయాలలో నిరుత్సాహపరిచాయి.

“ఒక ఆదివారం..” కథలో రచయిత్రి స్వగతం ఒక ప్రవాహంలా సాగిపోయింది కానీ ఆగి చూస్తే అందులో కథ చాలా పల్చగా వున్నట్లు తోచింది. అలాగే “అనగనగా..” కథలో కూడా ఒక ఫోక్ లోర్ లాంటి కథను అన్వయం చేస్తూ ఓ స్త్రీ కథ చెప్పే ప్రయత్నంలో కొన్ని విషయాలు స్పష్టపరచకపోవడం వల్ల కథ అసమగ్రంగా వున్నట్లు అనిపిస్తుంది. “నడుస్తున్న చరిత్ర” కథ చదవడానికి బాగున్నా దానిని కథగా అంగీకరించవచ్చా అన్నదే పెద్ద ప్రశ్న (ఇలాంటిదే “గింజలు” – ఆరి సీతారామయ్య, సారంగ 13 మార్చ్ కూడా) . ఆ ప్రశ్నపక్కనపెట్టి పరిశీలిస్తే ఎన్నెన్నో సంబంధిత సంఘటనలను తెచ్చి ఒకే కథలో పెట్టాలనుకోవడమనేది కధకు ఉండాల్సిన క్లుప్తత అనే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. “మనిషివిత్తనం” చాలా చర్చకు అవకాశం ఇచ్చే కథ. సంతానం కోరుకుంటున్న భర్త లోపాన్ని తెలుసుకోని, అందుకు అక్రమసంబంధం పెట్టుకోవడం కథాంశం. ఇందులో ఆ స్త్రీకి పరాయి వ్యక్తి పైన ప్రేమ వున్నట్లు చెప్పినా, ఒక సమస్యకి ఇలాంటి ఆమోదయోగ్యం కాని పరిష్కారం ఇవ్వడం సబబుకాదేమో ఆలోచించాల్సిన విషయం. ప్రేమ, నైతికానైతికాలు, జీవితం – ఇత్యాది విషయాలు కూడా కథలో సంతృప్తికరంగా చోటుచేసుకున్నట్లయితే, ఇది మంచి కథ అయి ఉండేది. అయితే ఈ కథను ద్వితీయ పురుషలో ప్రతిభావంతంగా రాయడం వల్ల పఠనానుభూతి బాగుంది. “పౌరుషం” కథ వస్తువు పరంగా బానేవున్నా, కొన్ని చోట్ల దారి తప్పటం, హడావిడి ముగింపు వల్ల అందుకోదగ్గ ఎత్తుకు ఎదగలేదు.

ఈ నెలలో వచ్చిన మంచి కథలు అన్నింటినీ కలిపి వ్యాఖ్యానం చేసే బదులు ఒక్కొక్క కథను విడిగా విశ్లేషించాలని అనుకున్నాము. విశ్లేషణ ఒక్కో కథకీ విడివిడిగా చేయడం వల్ల కథలు చదవదలచుకున్నవాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది పాఠకులు చేసిన సూచన మేరకు ఈ పనిని కూడా చేపట్టాం. ఈ పని చేస్తున్న మేము ముగ్గురం మేధావులమనో, గొప్ప విశ్లేషకులమనో కాక కాస్త తెలివిడి ఉన్న పాఠకుల చర్చలోని సారాంశాన్ని పొందుపరుస్తున్నామని ఈ వ్యాసం చదువుతున్న రచయితలు, పాఠకులు గుర్తించగలరు!

తప్పు – పి. రామకృష్ణ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 మార్చ్):వివాహానికి ముందే శృంగారం వల్ల నెల తప్పిన ఒక స్త్రీ భావ సంచలనం. తప్పు జరిగింది. తప్పు ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది జరిగాక అబ్బాయి ప్రవర్తనా, సంస్కారం ఏ పాటి ఉన్నాయో తనకి తెలుసు. ఈ ఆలోచనల్లోనే, ఆమెకు ఆ చిన్న ఇంట్లోనే రెండు ప్రపంచాలు ఉన్నట్టు అర్థమయ్యింది. “అడుసు తొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలిగానీ నరుక్కోకూడదు కదా!” అనే ఒక గొప్ప వాక్యంతో కథ ముగుస్తుంది. జ్యోతి పాత్ర అంతరంగ చిత్రణా, ‘ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి’ అనుకునే ఇంట్లో మనుషుల ఆలోచనల మధ్య వైరుధ్యాలూ ఇవన్నీ చాలా అద్భుతమైన స్థాయిలో చిత్రింపబడ్డ కథ. అయితే, ఇది ఎందుకో ఒక కథ రూపాన్ని సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం – రచయిత ముగింపు వాక్యం మీదే ఆధారపడటం తప్పించి కథలోంచి ఏ విశేషమూ బయటపడకపోవడం కావచ్చు.

చెలికాడు – అలపర్తి రామకృష్ణ (స్వాతి వీక్లీ, 14 మార్చ్):ఉద్యోగం చేస్తున్న భార్య, ఉద్యోగం వదులుకున్న భర్త. ఈ పరిస్థితుల్లో భర్త చేసేవన్నీ పనికిమాలిన పనులలాగా, ఖర్చుదారీ వ్యవహారాల్లాగా, అతని ఆత్మవిశ్వాసం అనవసరమైన పొగరులాగా భార్యకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను మాత్రం మారడు. అదే చిరునవ్వూ, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే కన్సర్న్. కథ చివర్లో అతనికి ఇంకొంచెం మంచి ఉద్యోగం రావడం అనేది కొంచెం నాటకీయమూ, కొంచెం యాదృచ్ఛికమూ అయినప్పటికీ – అతని పాత్రని చిత్రించిన తీరు మాత్రం ప్రశంసార్హం.

నమూనా బొమ్మ – బి. రమాసుందరి (తెలుగు వెలుగు, మార్చ్):“నీ మీద నేను జాలి పడగలిగిన పరిస్థితుల్లో నువ్వున్నంత కాలం నీ మీద నాకు అభిమానం ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి నువ్వు ఏ మాత్రం ఎదిగినా నువ్వంటే ఏవగింపు కలుగుతుంది” – అన్న కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ. సునిశితమైన పరిశీలన, కథనం మీద నియంత్రణం ఉన్న రచన. పాత్రల ప్రవర్తనలో అంతరార్థాన్ని సూచనప్రాయంగా చెప్పడం, భావాల్ని వ్యక్తీకరించడానికి వాడుకున్న వినూత్న ప్రతీకలు రచయిత్రి నేర్పుని తెలియజేస్తాయి. అయితే, కథ ముగిసిన తరువాత కూడా మరి కొంచెం సాగడం వల్ల ముగింపు బలహీనపడింది.

రచ్చబండ తీర్పు – డా. జి.వి. కృష్ణయ్య (చతుర, మార్చ్):మంచి కథ. నిడివి కొంచెం ఎక్కువేమో అన్న సందేహం వచ్చినా, కథ నడిపిన తీరు దాన్నిమర్చిపోయేలా చేస్తుంది. అట్టడుగు వర్గం మహిళని బలాత్కారానికి గురైతే, ఆ విషయం రచ్చబండకి రావడం కథాంశం.అది కేవలం “పిల్లల తప్పు” కింద భావించిన పెద్దలు ఓ అయిదువేలు నష్టపరిహారం ఇచ్చిన తీర్పుని గర్హిస్తూ బాధితురాలి భర్త “ఆ డబ్బు తీసుకొని మా ఆడోళ్ళ మానానికి వెలకట్టలేం. రేపొకరోజునమదమెక్కిన మగోడల్లా వచ్చి మా ఆడోళ్ళ రేటడుగుతాడు. అదింకా సిగ్గుమాలినతనం” అన్న మాటలు అన్యాయపు తీర్పుల్నీ, ఆడవాళ్ళంటే గౌరవంలేని పెద్దల్నీ, అలాంటి పెద్దలు నిర్వహించే రచ్చబండల్నీ – అన్నింటినీ ప్రశ్నిస్తాయి. రచయిత కథ నిడివి పట్ల ఇంకొంచెం శ్రద్ధ వహించగలిగి ఉంటే బాగుండేది.

బల్లిఫలితం – వేమూరి వెంకటేశ్వరరావు (ఈ మాట, మార్చ్): తెలుగులో అరుదుగా వచ్చే వైజ్ఞానిక కాల్పనిక రచన. ఇలాంటి కథలను మిగతా కథలను కొలిచినట్లు కొలిచి చూడలేము. సమకాలీనత, సామాజికత వంటి అంశాలు వుండకపోవచ్చు. కేవలం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కానీ ఈ కథ అలా చూసినా నిలబడుతుంది. సైన్స్ వెర్సస్ నమ్మకాల విషయంలో కథ ఎలా రాయబడాలో అలానే రాయబడింది – మంచి ఎత్తుగడ. బిగువైన కథనం. ముగింపులో చమత్కారం! గోపాలకృష్ణ వంటి అనవసరపు పాత్రలు, వివరాలను ఇంకొంచెం తగ్గించి ఉంటే కథలో గందరగోళం కొంచెం తగ్గి, చదువుకోవడానికి మరికొంచెం బాగుండేది.

పెద్దరికం అంటే – గంటి భానుమతి (ఆంధ్రభూమి మాస పత్రిక, మార్చ్): ఉరుకులు పరుగుల మధ్య తల్లిదండ్రుల దగ్గర్నుంచి సరైన అటెన్షన్ దొరకక ఏకాంతాల్లోకి దిగజారుతున్న కూతురి కథ. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సరైన దృక్పథం, ఉత్తరోత్తరా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకంలో నుంచే వస్తాయి. ఇది ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ. సమస్య మూలాల్లోకి వెళ్ళిన కథనం, ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారం దిశగా కథ మళ్లింపు ప్రతిభావంతంగా వున్నాయి. నిడివి, తల్లి పాత్ర చిత్రణలో నాటకీయత మినహాయిస్తే ఇది మంచి కథ.

విషయవలయాలు – జి. ఉమామహేశ్వర్ (సాహిత్య ప్రస్థానం, మార్చ్): అర్థరాత్రి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే అశ్లీల కార్యక్రమాలను చాటుగా చూసే కొడుకుని చూసి బాధపడే తల్లి కథ. చాలా సున్నితమైన, సమకాలీనమైన సమస్య. టీవీ ఛానెల్ వాళ్ళని ప్రమీల కలవటం లాంటి అనవసర సన్నివేశాలు నిడివిని పెంచాయి. ఇలాంటి కథలకు ప్రత్యేకంగా ముగింపు అంటూ ఉండదు కాబట్టి, కథ ముగిసే సమయానికి పైన చెప్పిన క్లుప్తతా రాహిత్యం వల్ల బలహీనపడి, మంచి వస్తువు అయివుండీ పాఠకుల మనస్సులో బలంగా నాటుకోదు.

 గౌతమి – రాధా మండువ (ఈ మాట, మార్చ్):తెలిసీ తెలియని వయసులో ప్రేమ-ఒక అమ్మాయి వైవాహిక జీవితంపై దాని ప్రభావం. ఇదీ వస్తువు. పాత్ర చిత్రణలో కథనంలో భాషా పరంగా ప్రతి వాక్యంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది. కాకపోతే కథానాయక పిచ్చిదానిలా నటించడం, భర్త మితిమీరిన మంచితనం కథని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది. కథా రచనలో గుర్తించదగిన ప్రావీణ్యం ప్రదర్శించిన రచయిత్రి ఇతివృత్తంలో ఈ loose ends వైపు దృష్టి పెట్టివుంటే బాగుండేది.

సందల్ ఖోడ్ – ఇబ్రహీం(ఆదివారం ఆంధ్రజ్యోతి, 23 మార్చ్): కనిపించని గంధపుచెక్కని వెతకడం కథాంశం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమించే తల్లి, గుర్తించని తండ్రి, ఈ రెండూ గుర్తించిన కొడుకు. హృద్యమైన కథ, అందమైన కథనం, అమ్మ గొప్పదనాన్ని చాలా లలితంగా మరోసారి చెప్పిన సందర్భం. కుటుంబ సభ్యులందరికీ అహర్నిశలూ సేవ చేస్తూ తాను గంధపు చెక్కలా కరిగిపోతూ తన వాళ్ళకి జీవన పరిమళాలని అద్దిన తల్లి. తాను పగలంతా వెతికినా దొరకని గంధపు చెక్కని తన తల్లిలో కొడుకు చూసుకోగలగటం కథ ముగింపు. అనుభూతి ప్రధానమైన కథ అన్నది మామూలు సందర్భాల్లో ప్రశంస గానూ, నాలుగు కథల మధ్యనుంచి దాన్ని ఎన్నుకోవడానికి పరిమితిగానూ పరిణమిస్తుంది. అలాంటి పరిమితులు నిజానికి తాత్కాలికమే – కొన్నేళ్ళ తర్వాతయినా ఎవరైనా అమ్మ మీద మంచి కథని ఒకటి చెప్పండీ అంటే, మనం అందరం “ఇబ్రహీంగారు రాసిన సందల్‌ఖోడ్ ఉందండోయ్!” అని మనస్ఫూర్తిగా చెప్పేయవచ్చు!

ముసుగు వేయొద్దు మనసుమీద – కొల్లూరి సోమశంకర్ (కినిగే పత్రిక, మార్చ్): అరిచి చెప్పినంతమాత్రాన బలంగా చెప్పినట్టు కాదు. కథల విషయంలో అయితే, ఎంత చెప్పీ చెప్పనట్టుగా చెబితే, ఆ విషయానికి అంత పదును. ఈ సూత్రాన్ని చాలా ఎఫెక్టివ్ గా తన కథలో వాడిన రచయిత కొల్లూరి సోమశంకర్. నిరంతరం మారిపోతూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పాత తరానికి చెందిన కొందరు పరిగెత్తలేక, శక్తిసామర్ధ్యాలు లేక వెనకబడిపోవడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అనిశ్చితితో, అవమానంతో లోపల్లోపలే కుమిలి కమిలిపోవడం నేటి వాస్తవం. అలాంటి ఒక వర్గాన్ని పట్టుకోవడమే రచయిత వస్తువు పట్ల ప్రదర్శించిన ప్రతిభ. అంతే కాకుండా, ఆ వర్గ ప్రతినిధిని రోజువారీ కూలికి రకరకాల జంతువుల ముసుగులు వేసుకొని పిల్లలకి వినోదం కలిగించే వీరేశానికి పరిచయం చేసి, ఇద్దరి జీవితాల అనిశ్చితుల మధ్యా పోలిక తీసుకువచ్చి – జీవితం పట్ల ఉన్న ఆశ, పాజిటివ్ దృక్పథం జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయీ అన్న చిన్న సూచనతో కథ ముగించడం – చాలా బాగుంది. కథ చదివే పాఠకుడిలో సమస్య పట్ల సానుభూతి కలిగించే దిశగా ఎలాంటి వాక్యాలూ కనిపించవు. క్లుప్తత. ఒక్కరోజు సాయంత్రం జరిగే కథ. కథా ప్రారంభంలో అసంతృప్తితో పరిచయమయిన పాత్ర, “లైఫ్ అన్నాక ఫైట్ చేయాలి కదా” అని లైవ్లీగా మాట్లాడే వీరేశంల మధ్య భిన్నత్వం. పరిష్కారం దిశగా ఒక ఆశావహమైన ముగింపు. ఇవీ ఈ కథను నిలబెట్టిన అంశాలు.

ఈ మాసం ఉత్తమ కథగా ఎన్నుకోవడంలో “సందల్ ఖోడ్”, “ముసుగు వేయద్దు మనసు మీద” ఈ రెండింటినీ పరిశీలించాము. సమగ్రంగా జరిగిన చర్చలోని సారం స్థూలంగా చెప్పాలంటే – “సందల్ ఖోడ్” ఒక అనుభూతిని మాత్రమే ఇస్తే, “ముసుగు వేయద్దు..” ఒక ఆచరణీయమైన సందేశాన్ని ఇస్తోంది. అందువల్ల ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” కథను ఈ మాసం ఉత్తమ కథగా నిర్ణయించాము.

 

ఉత్తమ కథ: ముసుగు వేయొద్దు మనసు మీద

రచయిత: కొల్లూరి సోమశంకర్

ప్రచురణ: కినిగే పత్రిక, మార్చ్-2014

 

సోమశంకర్ గారితో ఇంటర్వ్యూని తరువాతి భాగంలో ప్రచురిస్తాము!

 

కొసరు మెరుపు

పాతకథలని ప్రచురించే సంప్రదాయాన్ని తెలుగు వెలుగు, స్వాతి (మాస), గోతెలుగు.కామ్, విపుల వంటి పత్రికలు పాటిస్తున్నాయి. స్వాతి మాసపత్రికలో వచ్చిన “శత్రువు” (చలసాని ప్రసాదరావు),“గోతెలుగు.కామ్” 14.03.2014 సంచికలో వచ్చిన వెయిటింగ్ ఫర్ యాద్గిరి (భగవంతం) చదవదగ్గ కథలు. ఇవి కాక,మేఘాపహరణం (మాలతీచందూర్),మేలుమరువని కన్నీరు (కవికొండలవెంకటరావు),వారసత్వం (చొప్పదండి సుధాకర్),వెలుగు-నీడలు (ఇంద్రగంటిహనుమచ్ఛాస్త్రి),సుఖం (కె వి ఎస్ వర్మ) కథలు కూడా ప్రచురింపబడ్డాయి.

 

అమ్మా నాన్నా… కొన్ని అన్నం ముద్దలు!

Velturu2

1

తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు  కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు!

ఇంకా

 అసలు ఎప్పుడొచ్చిందో,  చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా  పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద ఇట్టే జారిపోతుందేమో అన్నట్టు  భయపెట్టే జీవితాన్ని గట్టిగా పొదివి పట్టుకోవాలనే పిచ్చి తపన గుర్తొస్తుంది.

చాలా చిత్రంగానే  వుంటుంది జీవితం మరి! దాటిపోయిన మజిలీలన్నీఅలా ఎలా జారిపోయాయా అని కలతబెడ్తాయి. కాని, కవిత్వమనే మాయా లాంతరు పట్టుకొని ఆ దాటిపోయిన వీధుల్లో గాలి కిన్నెర మీటుకుంటూ, సంచారం చేస్తూ పోతున్న వాణ్ని ఈ మధ్య చూసాను నేను! అతనేవో పాడుకుంటున్నాడు, వొక్కో సారి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వొక్కో క్షణపు అసహనంలో పక్కన ఎవరితోనో కాసేపు తగువు పడి, ఆ తరవాత పిల్లాడిలాగా కావిలించేసుకుంటున్నాడు. చాలా సార్లు అతను నేనే అనే ప్రతిబింబం అనిపిస్తాడు అందరికీ!

అతన్ని మనమూ మన లోకమూ  కాశిరాజు అని పిలుస్తున్నాం ఇప్పుడు  ఇంకేమని  పిలవాలో తెలియక!!

 

2

కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే  తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు; ఎదో reflexive mood (స్వానుశీలన)లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పటి కవుల దాదాపు అందరి కవితల్లోనూ మామూలుగానే కనిపించే ఈ స్వానుశీలన లక్షణం  కాశిరాజులో మాత్రం అదే ప్రధానంగా కేంద్రీకృతమై వుంటుంది.

Reflexivity – అంటే  తన లోపలికి తను చూసుకోవడం మాత్రమే కాదు, తలుపు ఓరగా తెరచి బయటికి చూడడమే కాదు. బయటికి ఎంత దూరం వెళ్తామో లోపలికీ అంతే దూరం వెళ్ళడం – అసలు సిసలు Reflexivity. కాశిరాజు కవిత్వమంతా ఈ Reflexive అలల చప్పుడు! కేవలం లోపలి మనిషి(insider)గా వుండే మామూలు Reflexivity ని కాశి కవిత్వం ఛాలెంజ్ చేస్తుంది. ఇతని కవిత్వంలోని ఈ స్వానుశీలన స్వభావం కేవలం తననే కాదు, బయటి పాత్రల్ని కూడా ప్రేమగా చూస్తుంది.

ఉదాహరణకి ఈ పంక్తులు చూడండి:

వర్షం వచ్చిన జాడ ఆ వాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది
మా దాహాలు తీరడానికి వాళ్ళు దు:ఖాల్లా ప్రవహిస్తారని
మాకెవ్వరికీ తెలీదు.

 

అమ్మా నాన్న కాశిరాజు కవిత్వంలో తప్పక కనిపించే పాత్రలు. కాని, అవి కాశిరాజు అనే వ్యక్తి తత్వానికి సంబంధించినంత వరకూ అతని లోపలి పాత్రలు కూడా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కాశిరాజు ఎప్పుడూ తనలోపలికి వెళ్ళిపోయి, అలా తవ్వుకుంటూ కూర్చుంటాడు.  ఇది కవిత్వంలో చాలా  కష్టమైన విద్య. కవి చాలా ఉద్వేగ భారాన్ని మోస్తూ బాలన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఉద్వేగాన్ని కేవలం ఉద్వేగంగా కాకుండా, దాన్ని కాసేపు objective గా కూడా చూడగలిగిన నిబ్బరం వున్నప్పుడే పై వాక్యాలు వస్తాయి.

 

తన కవిత్వం చదివే  పఠితని  కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.  ఇతని వొక్కో కవితా చదివేటప్పుడు గుండె చప్పుడు కాస్త పెరుగుతుంది. చదవడం అయిపోయాక అసలే చప్పుడూ వినపడని నిశ్శబ్దంలోకి శరీరాన్ని బట్వాడా చేసి వచ్చినట్టు వుంటుంది. అందుకే, కాశిరాజు కవితని ఆగి ఆగి చదవాలి. అలా ఆగినప్పుడల్లా అతని వూరులాంటి మన ఊళ్లోకి, అతని అమ్మానాయన లాంటి మన అమ్మానాయనల దగ్గిరకీ, వాళ్ళతో తెగిపోతున్న మన “కమ్యూనికేషన్” లోకి, మనల్ని చుట్టేసి వూపిరాడనివ్వని నగరపు మాయలోకీ వస్తూ పోతూ వుంటాం. మన గురించి మనం ఆలోచించుకునే/ బాధ పడే వ్యవధి ఇస్తూ, వాక్యాల్ని కూర్చుతూ వెళ్తాడు కాశిరాజు. ఆ వ్యవధిలో అతను మనల్ని Reflexive గా మార్చి, తన అమ్మానాన్నా కథలో మనల్ని పాత్రలుగా ప్రవేశ పెడతాడు.

కాశిరాజు కవిత తెగిపోతున్న ఆ తొలి సంభాషణల  గురించి ఎప్పటికీ తెగని మనియాది. ఈ కవిత రాసిన శరీరం ఆ కవిత రాయడం ముగిసాక ఎలాంటి నిద్రలోకి వెళ్తుందో తెలీదు. ఆ నిద్రల్లో అతన్ని ఏ కలల సర్పాలు ఎలా చుట్టుకుపోతాయో తెలీదు. సగం మాత్రమే నిండిన అతని కడుపు ఎంత మారాం చేస్తుందో!

కాశిరాజు

కాశిరాజు

3

కమ్యూనికేషన్

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు.

నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

Reflexivity ప్రధాన లక్షణంగా వుండే కవితల్లో dialogue రూపంలో వ్యక్తం కావాల్సిన విషయాన్ని  monologue  కింద మార్చుకుంటాడు కవి. అంటే- బయటికి ఎంతకీ చెప్పలేని, ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పైన చెప్పిన కవితలో ఈ కవి చేసిన పని అదే!

వొక మామూలు సంభాషణా వాక్యం- “ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా?”- అనే ఎత్తుగడలోనే కవి reflexive mood కి రంగం సిద్ధం చేసి పెట్టాడు. ఆ తరవాత చెప్పిన శారీరక మనఃస్తితులన్నీ ఆ mood కి భౌతిక ప్రతీకలు మాత్రమే!

ఈ కవితలో నిర్మాణపరంగా కవి వేసిన ఇంకో అడుగు: కవిత్వంలోకి కథనాత్మకత ప్రవేశపెట్టడం! తెలుగులో ఆరుద్ర, కుందుర్తి, శీలా వీర్రాజు, రంది సోమరాజు- మన తరంలో నందిని సిద్దా రెడ్డి, జూకంటి, కొన్ని కవితల్లో కొండేపూడి నిర్మల  కథనాత్మక కవిత్వం రాశారు. అవి దీర్ఘ కావ్యాలో, కవితలో అవ్వడం వల్ల వాటిల్లో కథ ప్రధానమై, కవిత్వం అప్రధానమైంది.

వాటికి భిన్నంగా కాశిరాజు చిన్న కవితలో కథనాత్మకతని తీసుకువచ్చాడు. అంటే, short narrative poem – చిన్న కథనాత్మక కవిత- అనే రూపానికి తనకి తెలియకుండానే నాంది పలికి, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాశి. దీర్ఘ కథనాత్మక కవితలకి భిన్నంగా ఈ తరహా కవితలో దీర్ఘమైన వర్ణనలు వుండవు. పాత్రలు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతూ కూర్చోవు. కథా, పాత్రలు రెండూ కవి అనుభూతిలో భాగమైపోతాయి, ఆ అనుభూతికి గోడచేర్పు అవుతాయి వొక విధంగా!

ఈ కవిత్వ నిర్మాణం సాధించడానికి కాశి వాక్యస్వభావాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఉప్పెనలాంటి వాక్యాలు వొకప్పుడు కవిత్వంలో బాగుండేవి. ఉదాహరణకి: శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు సాధారణంగా వేగంగా ఉరవడిగా ప్రవహిస్తాయి. అలాంటి ధోరణి అలాగే కాకపోయినా వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వుంది. ఇప్పటి కవిత్వ వాక్యాలు సెలయేటి నడకలు అని నాకు అనిపిస్తోంది. ఆగిఆగి వెళ్తూ, తనని తానూ తరచి చూసుకునే reflexive mood ఆ నడకలో కనిపిస్తుంది.

ఈ సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి!

* 

ఒక “బర్నింగ్ స్టార్” పుట్టిన వేళా..విశేషం!

unnamed
ఓపన్ చేస్తే…
04-04-2014

ఉదయం 10 గంటలు

ప్రసాద్ ఐమాక్స్ థియేటర్

స్క్రీన్ నెంబర్ -3

సినిమా మొదలయ్యింది….

తెరమీద ఒక కొత్త హీరో “బర్నింగ్ స్టార్” అంటూ ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల్లో కోలాహల. ఒక్కసారిగా “జై సంపూ…జైజై సంపూ” అనే నినాదాలు. మల్టిప్లెక్స్ థియేటర్ మాస్ థియేటర్ అయ్యింది. పంచ్ పంచ్ కీ ఈలలు. ఫీట్ ఫీట్ కీ గోలలు. డైలాగ్ కి కౌంటర్ డైలాగులు. యాక్షన్ కి విపరీతమైన రియాక్షన్లు.

నేను థియేటర్లో వెనక నిల్చున్నాను. నేను వింటున్నది, చూస్తున్నది నిజమోకాదో అనే ఒక సందేహం. నవ్వాలో ఆనందించాలో ఇంకా తెలీని సందిగ్ధ పరిస్థితి. బయటికి వచ్చాను. అక్కడ స్టీవెన్ శంకర్ అలియార్ సాయి రాజేష్ నిల్చుని ఉన్నాడు. మొదట అడిగిన ప్రశ్న “థియేటర్లో మనవాళ్ళు ఎంత మంది ఉన్నారు?” ‘రెండు వరుసలు’అని ఒకరి సమాధానం. “గోలచేస్తోంది మనవాళ్ళేనా? ” అనేది రెండో ప్రశ్న. “కాదు. మనవాళ్ళు సైలెంటుగా కూర్చుని విచిత్రాన్ని చూస్తున్నారు. ఎవరో కాలేజి స్టూడెంట్స్ లాగున్నారు. వాళ్ళు సంపూ ఫ్యాన్స్ అంట.” అని మరో వైపు నుంచీ సమాధానం. స్టీవెన్ శంకర్ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నా, తన రెప్పల వెనకదాగున్న కళ్ళలో ఒక కలను సాకారం చేసిన ఆనందం అందరం అనుభవించాం.

సెకండాఫ్ మొదలయ్యింది. అప్పటికి థియేటర్ యాజమాన్యం ఈ అరుపులూ కేకలకు భయపడి ఆ స్క్రీన్ దగ్గరికి వచ్చి ఏంజరుగుతుందో చూస్తున్నారు. సినిమాలోని కీలకఘట్టం. ఇక సినిమా అయిపోయిందేమో అని కొందరి లేస్తుంటే “ఇంకా ఉంది కూర్చోండి” అని మావాళ్ళు కొందరిని కూర్చోబెట్టడం కనిపిస్తోంది. తెరమీద ఒక మ్యాజిక్ జరిగింది. థియేటర్లో సగం మంది అధాట్టున లేచినిల్చుని చప్పట్లు. ఆడియన్స్ లో ఒకడు వెనక కుర్చీలవైపు తిరిగి “సంపూర్ణేష్ బాబూ….నువ్వు దేవుడయ్యా!” అని అరిచాడు. మాకు మతిపోయింది. ఒక స్టార్ జన్మించాడు.
Rajesh and Sampoo—————————
కట్ చేస్తే….
(ఫ్లాష్ బ్యాక్)
మే నెల మిట్టమధ్యాహ్నం, 2013
ఫోనొచ్చింది. “మహేష్ గారూ మీతో మాట్లాడాలి.”
“రండి సర్ ఆఫీస్ లోనే ఉన్నాను.”
సాయి రాజేష్, కోడైరెక్టర్ చైతన్య చరణ్ (నా షార్ట్ ఫిల్మ్ తో దర్శకత్వ విభాగంలోకి అడుగుపెట్టింది) వచ్చారు.
మా ఆఫీసులో నా రూంలో కూర్చున్నాం.
“ఒక సినిమా అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో” అంటూ ఒక కథ చెప్పాడు.
తను ఏంచెయ్యాలనుకుంటున్నాడో అర్థమయ్యింది.
“తమిళంలో శాం అడర్సన్, పవర్ స్టార్, మళయాళంలో సంతోష్ పండిట్ లాగా మనకూ ఒక స్టార్ అన్నమాట” అన్నాను.
“అంతకన్నా ఎక్కువేమో. వాళ్ళు unintentional గా తీసిన bad films వల్ల హిట్ అయ్యారు. స్టార్లు అయ్యారు. కానీ మనం ఇక్కడ conscious గా ఒక foolish film తియ్యబోతున్నాం. తెలుగు సినిమాలకు యాంటీ థీసీస్ లాంటి హీరోని తయారు చెయ్యబోతున్నాం. అతని పేరు ‘సంపూర్ణేష్ బాబు’.” నాకు ఆ పేరు వినగానే నవ్వొచ్చింది. కానీ దానివెనకున్న సీరియస్నెస్ అర్థమయింది.
“సరే ఇప్పుడు ఏంచేద్దాం” అన్నాను.
“మీరు ఇందులో యాక్ట్ చెయ్యాలి.” అని ఒక బాంబ్ పేల్చాడు.
“ఏదో స్క్రిప్టు డిస్కషనో, ప్రమోషనల్ స్ట్రాటజీవరకూ అనుకున్నానుగానీ…ఇదేంటండీ! నాకు యాక్టింగ్ రాదు.”
“మీరు ఓకే అంటే నేను యాక్టింగ్ చేయించుకుంటాను. మీకు నేను అనుకుంటున్న క్యారెక్టర్ లుక్స్ ఉన్నాయి.”
ఒక నిమిషం ఆలోచించాను.
“మీకు కావలసినంత టైం తీసుకుని ఆలోచించండి. ముఖ్యంగా మీకు సోషియల్ నెట్వర్క్ లో ఉన్న ఇమేజ్ కి ఇది ఏమైనా దెబ్బేమోకూడా ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. ఏం బలవంతం లేదు.” అని టైం ఇచ్చారు సాయి రాజేష్.
ఆ మాట తను అంటున్నప్పుడే నేను నిర్ణయం తిసుకున్నాను.
“ఆలోచించడానికి ఏమీ లేదు. రిస్క్ మీరు ఎలాగూ చేస్తానంటున్నారు కాబట్టి, నేను చేస్తాను. నాకు సోషియల్ నెట్వర్కులో ఏదైనా ఇమేజ్ ఉంటే అది నా ఇష్టమొచ్చినట్టు చేస్తాననేదే. నాకు ఈ కథ నచ్చింది. ఈ కథ ఎన్నుకోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు, కానీ నా కారణాలు నావి. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా పోకడలమీద ఒక గొప్ప సెటైర్ అవుతుందని నా నమ్మకం. నేను ఇదే కంటెంటుని, గొంతు చించుకుని కోపంతో చెబుతూ, రాస్తూ ఉంటాను. మీరు ఒక మెట్టు ఎదిగి ఆ విషయాల్ని సృజనాత్మకంగా తెరపైకి తీసుకుని వద్ధామనుకుంటున్నారు. I would be more than glad to be part of it.” అని కమిట్ అయ్యాను.
“ఈ సినిమా స్వభావరీత్యా నేను ఎవరికీ తెలీకుండా ఉండాలి. నా పేరుకూడా స్టీవెన్ శంకర్ గా మార్చుకుంటున్నాను. స్టీవెన్ శంకర్ గా నేను వెబ్ లో ప్రమోట్ చేసినా, డైరెక్టుగా తెలిసినవాళ్ళు మీరే కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసే రిస్క్ ఉంది. ఓకేనా” అని మళ్ళీ సందేహంగా అడిగారు సాయిరాజేష్.
“కొత్తగా నాకు పోయేదేమీ లేదులెండి. నేను ఎవర్నీ ప్లీజ్ చెయ్యడానికి పనులు చెయ్యను.” అని కొట్టిపడేసాను.
ప్రయాణం మొదలయ్యింది.
980319_10152010712366115_1155151759_o
——————————
కట్ చేస్తే….
రాష్ట్ర సంపూర్ణేష్ బాబు యువత సంపూర్ణేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
ఫేస్ బుక్ లో షేర్లు. చర్చలు. లైకులు. తిట్లు.
రాజమౌళి ట్వీట్ చేశారు. అంతే పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది.
“ఎవరీ సంపూర్ణేష్ బాబు? ఎక్కడినుంచీ వచ్చాడు? ఎవడో డబ్బున్న ఎన్నారై, సినిమా పిచ్చిపట్టి డబ్బులు తగలెయ్యడానికి వచ్చాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు. ఊహాగానాలైన సమాధానాలు.
వీటిల్లోని మిథ్స్ ని మరింతగా ప్రాపగేట్ చెయ్యాలి.
కలవాలనుకునే ఫ్యాన్స్ కి ఒక ఫోన్ నెంబర్. వచ్చినవాళ్ళందరితో ఫోటోగ్రాఫ్స్. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఇంటర్నెట్ ఉందో, అక్కడ అంతా సంపూర్ణేష్ బాబు పేరు చర్చల్లోకి వచ్చింది. పరిశ్రమలో అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.——————-
కట్ చేస్తే….
జూన్ 2, 2013
షూటింగ్ మొదలయ్యింది.
సంపూర్ణేష్ బాబుని కలిసాను.
సెట్లో అందరూ ముద్దుగా “సంపూ” అనో లేదా “బాబూ” అనే పిలిచేవారు.
ప్రతిభ ఉన్న కళాకారుడో కాదో అర్థమయ్యేది కాదు. సింపుల్గా, మర్యాదగా ఉండే మంచి వ్యక్తి. అంతవరకు ష్యూర్.
చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. సాయి రాజేష్ ని ‘అన్నా’ అనేవాడు. చైతన్యని ‘అక్క’ అనేవాడు. నన్ను ఒక్కోసారి అన్న, ఒక్కోసారి సార్.
మొదటగా చేసింది టెస్ట్ షూట్. టెక్నాలజీ టెస్టింగుతోపాటూ look and feel decide చెయ్యడానికి ఒక ప్రయత్నం. ఎలాగూ షూట్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రోమోలాగా చేద్దామనేది సాయిరాజేష్ ఆలోచన. ప్రోమో తయారయ్యింది. ప్రోమో చివరిలో ఒక డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడు ‘సంపూ’. కెమెరా మెన్ తో సహా యూనిట్ మొత్తం చప్పట్లు. ఏదో జరుగుతోందనేదిమాత్రం అర్థమయింది. సంపూ మామూలువాడైతే కాదు. డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు. అది అందరికీ తెలిసింది.జూన్17,2013 న ప్రోమో యూట్యూబ్ లో పెట్టి షేర్ చేశాం.
అంతే…..
ఐదురోజుల్లో ఐదు లక్షల వ్యూస్. ఒక చరిత్ర సృష్టింపబడింది.
ఒక సంచలనానికి నాంది పలికింది. సినిమా పరిశ్రమలోనూ, బయటా ఇదే వార్త.
ప్రతిషూటింగ్ లోనూ ఈ ప్రోమో చూపిస్తూ, నవ్వుకుంటూ చర్చ.
కష్టనష్టాలు, శ్రమ ఆనందాల మధ్య షూటింగ్ ముగిసింది.———————–
కట్ చేస్తే…
27 ఫిబ్రవరి, 2014
హృదయకాలేయం ఆడియో ఫంక్షన్
తాజ్ డెక్కన్
సంపూర్ణేష్ బాబు మొదటిసారిగా జనాల ముందుకు వచ్చాడు.
పంతొమ్మిది నిమిషాల నాన్ స్టాప్ స్పీచ్.
ఈ మధ్యకాలంలో ఏ ఆడియో ఫంక్షన్కూరాని రేటింగ్స్.
మాటీవీ వాళ్ళు తొమ్మిదిసార్లు రిపీట్ టెలీకాస్ట్ చేసిన ఆడియో ఫంక్షన్ హైలైట్స్.
హైలైట్స్ కే హైలైట్ సంపూ స్పీచ్.
ఇప్పటికి యూట్యూబ్ లో ఆ స్పీచ్ కి మూడు లక్షల హిట్లున్నాయ్.
అప్పటివరకూ ఇది షార్ట్ ఫిల్మా…అసలు వీళ్ళు ఫిల్మ్ తీస్తారా…ఇదేదో హంబక్ అన్నవాళ్ళ నోళ్ళు పర్మనెంటుగా మూతపడ్డాయి.
సినిమా విజువల్ క్వాలిటీ, సాంగ్స్, ప్రమోషన్లోని క్రియేటివిటీ చూసి చాలా మంది నోళ్ళు వెళ్ళబెట్టారు.
సంపూ అంటే అప్పటివరకూ ఉన్న అవహేళన, మర్యాదగా మారింది.

అదే టైంలో ఎవరో ట్విట్టర్లో సంపూని “నీ మొహం చూసుకో…నువ్వు హీరోవా?” అంటే, “దేవుడిచ్చిన రూపాన్ని నేను మార్చుకోలేను, నాలో చెడుగుణం ఏదైనా ఉంటే చెప్పండి మార్చుకుంటాను” అని సమాధానం చెప్పాడు. అవహేళన చేసిన వ్యక్తి సిగ్గుపడ్డాడ్డు. క్షమాపణలు అడిగాడు. దీనితో సోషియల్ నెట్వర్క్ లో సంపూకు గౌరవం పెరిగింది.

 

————————————–Hrudaya Kaaleyam Latest Posters

కట్ చేస్తే
4 ఏప్రిల్, 2014 సాయంత్రం 6 గంటలు.
అప్పుడే 10tv లో సినిమా రివ్యూ చెప్పి వచ్చి ఫ్రెష్ అవుతున్నాను.
ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గరనుంచీ ఫోన్.
“ఎక్కడున్నావ్”
“ఇంట్లో సార్”
“ఆఫీస్ కి రాగలవా”
“పదినిమిషాలలో ఉంటాను.”
ఆఫీస్ లోకి ఎంటర్ అవగానే… “మీ వాడు సాధించాడయ్యా. హిట్ కొట్టాడు.”
“పొద్దున ప్రసాద్స్ లో చూశాను సర్. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టిప్లెక్సుల్లో ఓకేగానీ, మధ్యాహ్నం క్రాస్ రోడ్స్ సప్తగిరికి వెళ్ళాను. 60% ఆక్యుపెన్సీ ఉంది. బహుశా సింగిల్ స్క్రీన్స్ లో వర్కౌట్ అవ్వదేమో” అంటూ ఏదో చెప్పబోయాను.ఆయన చిరగ్గా…”అసలేమనుకుంటున్నారయ్యా మీరు. ఇండస్త్రీ గురించి ఏం తెలుసు మీకు? గత ఐదారు సంవత్సరాలుగా ఆ థియేటర్లో జగపతిబాబు, శ్రీకాంత్, శ్రీహరి లాంటి హీరోల సినిమాలు రెగ్యులర్గా వచ్చేవి. మార్నింగ్ షోకి ఈ మధ్యకాలంలో వచ్చిన హయ్యెస్ట్ కలెక్షన్ ఎంతో తెలుసా…..ఐదువేలు. కానీ మీ ముక్కూ మొహం తెలీని హీరోకి వచ్చిన కలెక్షన్ అక్షరాలా పదహారు వేలు. మ్యాట్నీకి ఇరవైఎనిమిది వేలు. ఫస్ట్ షో ఫుల్లయ్యింది. ఇప్పుడే హౌస్-ఫుల్ బోర్డ్ పెట్టారని నాకు ఫోనొచ్చింది. నేను నీకు ఫోన్ చేశాను. మీ సినిమా హిట్టు. పో… మీ డైరెక్టర్ కి చెప్పుపో !” అన్నాడు.———————————–
ఒక ఔత్సాహిక కథకుడు,రచయిత,నిర్మాత.దర్శకుడికి ఒక ఆలోచనవచ్చింది.

రెగ్యులర్ తెలుగు సినిమా లెక్కలతో, హీరోల ట్యాంట్రమ్స్ తో పడేకన్నా, ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నిర్ణయించుకున్నాడు. ‘మీరు చెప్పింది చేస్తాను’ అనే ఒక డెడికేటేడ్ నటుడు దొరికాడు. అతనిప్పుడు స్టార్ అయ్యాడు. సంపూర్ణేష్ బాబు అయ్యాడు. బర్నింగ్ స్టార్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో అత్యంత క్రేజ్ సంపాదించిన హిట్ చిత్రానికి చిరుమానా అయ్యాడు.

– కత్తి మహేష్

పెరుగుతున్న గోడలు, కూలుతున్న పూదోటలు

Sketch56104048-2

 

 

బిచ్డే అభీ తో హమ్ బస్ కల్ పర్సో

జీయోంగీ మై కైసే, ఇస్ హాల్ మే బర్సో

మౌత్ నా ఆయీ తేరీ యాద్ క్యో ఆయీ

హాయ్ లంబీ జుదాయీ

చార్ దినోంకా ప్యార్ హో రబ్బా

బడీ లంబీ జుదాయీ, లంబీ జుదాయీ..

https://www.youtube.com/watch?v=hEejj51WJ7s

ఈ పాట నాకెంత ఇష్టం అంటే కొన్ని వందల సార్లు వినివుంటా. టేప్ రికార్డర్లు వుండే రోజుల్లో పదేపదే పెట్టుకు వినేవాడిని. ఇప్పుడిక యు ట్యూబ్ కూడా వచ్చేసింది కాబట్టి ఎప్పుడు కంప్యూటర్ పెట్టుకున్నా ఈ పాట ఒకసారి విని తీరాల్సిందే. అందరిలాగే ‘హీరో’ సినిమాలో పాటలో ఒక విరహగీతం మాత్రమే అనుకునే వాడిని. కానీ, ఆ తర్వాత తెలిసింది ఆ పాట అసలు రేష్మాది అని.
ఆ రస్టిక్, ముతక, గుండెల్ని పిండేసే ఆ గొంతు పాకిస్తాన్ గాయకురాలిదని. అయితే, ‘సోలిటరీ రీపర్’ ఎవరైతేనేం, ఆమె భాష ఏదైయితేనేం, నన్ను ఆ గొంతు వెంటాడింది. వెంటాడుతూనే వుంది. నేను ఆ పాటతో ప్రేమలో పడ్డ రోజుల్లో నాకు అసలు హిందీ ఒక్క ముక్క రాదు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు కూడా రాదు. హైదరాబాదు వచ్చేవరకూ అంతే. కానీ, ఏదో బాధని, ఇంకెంత మాత్రం భరింప రాని బాధని, పలికిస్తోందని అనిపించింది. అవధుల్లేని దుఖ్ఖం ఆమె హృదయంలోంచి ఉప్పెనలా వస్తోందని అనిపించింది.

ఇక ఆ పదాలకి అర్ధం తెలిసేక ఆ పాట మీద, ఆమె మీద గౌరవం పెరిగిందే కాని తగ్గలేదు. ఏ కవి లేదా కవయిత్రి ఏ దుఖ్ఖాన్ని ఆవాహన చేసుకుని రాసివుంటారు? ఏ తెగిన బంధం గుండెల్ని బద్దలు చేస్తే బెంగటిల్లి వుంటారు?

***

అలాటి ఒక రోజు, మళ్ళీ ఆపాట పెట్టుకుని చూస్తున్నా. ఆ పాటని, లేదా అలాటి కొన్ని పాటల్ని, జీవితాంతం పాడుతూ, పాడుతూ వడలిపోయిన రేష్మా ఎక్కడో స్టేజీ మీదకొచ్చింది. నాలాటి వాళ్ళు కొందరు, అక్కడ కూచుని వింటున్నవాళ్లు, లేచి నుంచుని ఆహ్వానిస్తున్నారు. ఆమె పాడటం మొదలుపెట్టింది. అందరూ పెదవులు కదుపుతున్నారు, తలలు ఊపుతున్నారు.
సరిగ్గా అప్పుడే మా అయిదేళ్ళ పాప వచ్చింది.
“నాన్నా, ఎవరు ఆమె,” అని అడిగింది.
“రేష్మా. చాలా బాగా పాటలు పాడుతుంది. నాకు చాలా ఇష్టం,” అన్నాను.
“ఆమెది ఏ ఊరు”

“పాకిస్తాన్”

“పాకిస్తానా? మరి పాకిస్తాన్ వాళ్ళు చెడ్డవాళ్లు కదా. మన మీద బాంబులు వేస్తారు కదా,” అంది, చాలా ఆశ్చర్యపోతూ.
ఆ ప్రశ్న ఒక షాక్ నాకు. పాకిస్తాన్ మీద, ముస్లింల మీద స్టీరియో టైపు కామెంట్లు మనకి అలవాటే. అందులో మనకి కొత్తేముంది అందులో? కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఇంత చిన్నపిల్లకి ఆ విషయం ఎవరు చెప్పి వుంటారు? ఎందుకంటే, మనం ఎందుకు చెప్తాం అలాటి అన్యాయమైన విషయాలు ఇంట్లో.
అప్పటికి ఏదో సద్ది చెప్పాను అలకి. కానీ, అప్పటినించి ఆ ప్రశ్నే వెంటాడుతుండేది. పిల్లల్ని ఎంత చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాం, ఒక దేశానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా? పిల్లల మనసుల్ని ఎంత నిర్హేతుకమైన నిరాధార విషయాలు చెప్పి కలుషితం చేస్తున్నాం?
మొత్తం దేశం దేశమంతా చెడ్డదై పోతుందా? మొత్తం మనుషులు చెడ్డవాళ్లై పోతారా? చేజేతులా పిల్లల దృష్టిని కురచ చేస్తున్నాం కదా. ఈ మకిలి ఆలోచనల్నుంచి, ఈ కనిపించని హింసకి expose కాకుండా పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అని అనిపించేది.

***

సరిగ్గా అప్పుడే గోపాల్ మీనన్ ముజఫర్ నగర్ ఊచకోత మీద తీసిన డాక్యుమెంటరీ కాపీ నగరానికొచ్చింది. లౌకిక, ప్రజాస్వామిక, సాహిత్య, సాంస్కృతిక ఫ్రంట్ వాళ్ళు వేస్తే చూడ్డానికి వెళ్ళేం అందరం. అల ఓ వందో, రెండువందలో ప్రశ్నలు అడిగింది, డాక్యుమెంటరీ చూస్తూ, స్వేచ్చ (టీవీ9 ఏంకర్) కూతురుతో ఆడుకుంటూ.
“హిందువులకి ముస్లింలు అంటే ఎందుకు అంత కోపం,” అని.
“ఆ పిల్లలు కూడా ముస్లింలేనా (హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిల్లల్ని చూసి),” అని.  బహుశా, పిల్లలని కూడా చూడలేదా అని కావచ్చు.
రిలీఫ్ కేంప్ లో వున్న పిల్లల్ని చూసి, “మరి ఆ పిల్లలు బొమ్మలు తెచ్చుకోలేదా,” అని.
బహుశా పిల్లల బొమ్మల ప్రపంచాన్ని కూల్చివేసిన దృశ్యమేదో ఆమెకి కనిపించి ఉండవచ్చు. ఆ మేరకు కొంత బాల్యపు అమాయకత్వం ఆమె కోల్పోయి ఉండవచ్చు.

***

ఈ ప్రశ్నల్ని కొన్నిటిని ఫేస్ బుక్ లో పెడితే ఒకరిద్దరు well-meaning మిత్రులు నన్ను కోప్పడ్డారు. పిల్లల్ని అలాటి దృశ్యాలకి expose చెయ్యడం తప్పు కదా అని. నిజమే. అందులో సందేహం ఏముంది. ఆ దృశ్యాలు చూసి చిన్న మనసులు బాధపడతాయి కావచ్చు. ఆ డాక్యుమెంటరీలో నిజానికి హింసాయుత సన్నివేశాలు కొన్ని మాత్రమే వున్నాయి. కానీ మిత్రుల సూచనల పై రెండో అభిప్రాయమే లేదు.
కానీ, మనకి ఎప్పుడూ కొన్ని మాత్రమే హింసాయుతంగా కనిపిస్తాయి. తెలుగు సినిమాల నిండా హింస. హింస అంటే కేవలం కొట్టుకోవడం, చంపుకోవడం మాత్రమే కాదు. బూతు, నాటు సంభాషణలు. మతపరమైన సన్నివేశాలు (అంటే దేవుడిని మొక్కడం, ప్రతిజ్ఞలు చెయ్యడం), శృంగార సన్నివేశాలు, అసభ్య నృత్యాలు, పాటలు – ఇవన్నీ మనకి చాలా సహజం అయిపోయాయి. వీటిని చూపించడం, వీటికి పిల్లల్ని expose చెయ్యడం మనకి తప్పని ఎప్పుడూ అనిపించని స్థాయికి వెళ్లిపోయాం.

ఇక సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో చిన్న పిల్లలకి కూడా అన్నీ రసాలూ (శృంగార, బీభత్స రసాలతో) సహా నేర్పిస్తాం. వాళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తాం. మనం ముచ్చటపడి చూస్తాం. కానీ, అందులో వున్న హింస ఎంత హింస? ముక్కుపచ్చలారని పిల్లలతో వాళ్లకి మరో పదేళ్ళకి గాని సహజంగా కలగని భావాల్ని పిలికిస్తారు ఆ నృత్యాలలో . కానీ, మనకది సహజం అయిపోయింది.  సాంప్రదాయం అయిపొయింది కాని హింస అనిపించలేదు . అనిపించదు.
ఒక హింసకి పోటీగా మరో హింసని చూపించే ప్రయత్నం చెయ్యడం లేదు నేను. హింస ఏ రూపంలో వున్నా వ్యతిరేకించాలి. కానీ, వ్యవస్థీకృత హింస వెయ్యి కనిపించని ముఖాలతో, కాళ్ళతో, చేతులతో మనల్ని ధృతరాష్ట్ర కౌగిలితో నలిపివేస్తున్నది. ప్రస్తుతం అది బలం పుంజుకుంటున్నది. భయపెడుతున్నది. నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నది.
పిల్లలపై సమాజం జరుపుతున్న ఈ హింసతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దవాళ్ళకి ఏది దారి?

***

రేష్మా నిలదీస్తోంది,

హిజ్రికీ ఊంచీ దీవార్ బనాయీ 

బాగ్ ఉజడ్ గయే ఖిలనే సే పెహ్లే 

పంచీ బిచడ్ గయే మిల్నే సే పెహ్లే 

 

మనుషుల మధ్య చాలా ఎత్తైన గోడల్ని కట్టేస్తున్నాం

పూవులు పూయకముందే తోటల్ని ధ్వంసం చేసేస్తున్నాం
కలవక ముందే మనుషుల ప్రేమల్ని కాలరాసేస్తున్నాం.

 – కూర్మనాధ్ 

అతడు – ఆమె – ఓ బొల్లిగిత్త !

కేశవరెడ్డి మేజిక్‌ రియలిజమ్‌

ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు? మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే. మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

   తెలుగులో రచనని, సామాజిక మార్పుకోసం ఒక పరికరంగా మార్చుకున్న సృజనకారులలో కేశవరెడ్డి ప్రముఖుడు. అధోజగత్‌ సహోదరుల వ్యదార్ధ జీవితాఇన్న కేశవరెడ్డి ఎన్నో నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కేశవరెడ్డి తాజా నవల ‘మునెమ్మ’ మిగతా నవలల కంటే కొంత భిన్నమయినది. సహజంగానే కేశవరెడ్డి రచనలలో విజువల్‌ ఇమేజ్‌ ఎక్కువ. దీనికి మేజిక్‌ రియలిజమ్‌ కలగలవడంతో, మునెమ్మ ఒక అద్భుతమయిన పఠన, దృశ్య కావ్యంగా మారింది.
శైలి, శిల్పము, వస్తువు ఈ మూడూ పడుగు పేకల్లా కలిసిపోతేనే ఏ రచనకయినా జవమూ, జీవమూ! ఈ మూడిరటిలో ఏది బ్యాలెన్స్‌ తప్పినా రచనలో ఏదో లోపించినట్లుగా వుండి పాఠకుడికి మేధోపరమయిన అసంతృప్తి ఏర్పడుతుంది.
అసలు రచన అంటే ఏమిటి? రచయిత స్థల కాలాలకి అతీతుడా లాంటి ప్రశ్నల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎవరయినా రచన జీవితానికి రెండో వైపు అని చెప్పగలరు. ‘మునెమ్మ’లో కేశవరెడ్డి చూపిస్తున్న ‘రెండో వైపు’ ఎలా వుందో పరిశీలించడమే ఈ వ్యాసం.
‘‘స్థలకాల బద్దుడయిన సామాజిక వ్యక్తి కాకుండా రచయిత రచన చేయలేడు. అందుకనే రచయిత వ్యక్తిగానే రచన చేస్తున్నట్టు కనిపించినా సమిష్టి జీవితపు వేళ్ళు లేకుండా రచనా వృక్షం మొలకెత్తడానికి కూడా అవకాశం లేదు. రచయిత చుట్టూ వున్న సామాజిక జీవితం రచయిత మెదడులో ఆవేశ భావ రూపాల స్థితని పొంది క్రమబద్ధంగా రూపొందుతుంది. ఈ క్రమాన్నే సృష్టి అంటాం. మనిషి అంతరింద్రియ వ్యాపార క్రమాలకు, సామాజిక క్రమాలకు వుండే సంబంధం అవగాహన చేసుకోకపోవడం వలన సాహిత్య సృజన విషయంలో అనేక తప్పుడు అభిప్రాయాలు ప్రపంచానికి వచ్చాయి’’
ఇది కేశవరెడ్డి ‘‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’’ నవలకు ముందు మాట రాస్తూ త్రిపురనేని మధుసూధనరావు వెలిబుచ్చిన అభిప్రాయం. ఆయన యింకా యిలా అంటున్నారు.
‘‘ మానవులు తమ సంకల్ప శక్తితో తమ యిష్టం వచ్చినట్టు మానవ సంబంధాలు పెట్టుకుంటారా? అలాగే కనిపించవచ్చు కానీ అది వాస్తవం కాదు. చచ్చిపోయిన వాళ్ళతో కానీ, పుట్టబోయే వాళ్ళతో కాని మానవులు యిష్టం వున్నా సంబంధం పెట్టుకోవడం కనీసం ప్రస్తుతానికి సాధ్యం కాదు. జీవించే వ్యక్తుల మధ్యన సంబంధాలు వుంటాయనేది వుల్లంఘించడానికి వీల్లేని సత్యం. ఎప్పుడో చచ్చిపోయిన ముత్తాతతో ముని మనుమడు సంబంధం పెట్టుకున్నట్టు ఎవరయినా రాయెచ్చు.

చచ్చిపోయిన తన పెళ్ళాం ఎక్కడో పుట్టి వయసొచ్చి ఏ బస్సులోనో కనపడినట్టు పూర్వజన్మ స్మృతితో ఆ పిల్ల ముసలాడిని పట్టుకుని నువ్వే నా మొగుడివి వదలను గాక వదలను అన్నట్టు రాయెచ్చు. కానీ అది నవల కాదు. అవి మానవ సంబంధాలు కావు. అది పురాణం, ఆ సంబంధాలు భ్రమాజనితాలు. భ్రమలకు కూడ పరిమితులుంటాయి. మానవ సంబంధాలను పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ఠ రూపంలోనే పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ట రూపంలోనే పెట్టుకోగలుగుతారు. ఆ సంబంధాలు స్థల కాల మార్పులకు ఆధీనంగా వుండలవసిందే’’.

munemma
మునెమ్మ నవలలో స్థలము, కాలము రెండు వున్నాయి. రచయితకు మాత్రమే కాలిక స్పృహ లోపించింది. అయితే కేశవరెడ్డి తన కధన చాతుర్యంతో ఏ అంశాన్నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. ‘అతడు అడవిని జయించాడు’, ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘మునెమ్మ’ ఇలా ఏ నవల నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. పాఠకుడి తను చదువుతున్నది వాస్తవమా, పురాణమా అన్న సంశయం కలుగుతూ వుంటుంది పదే పదే. మూగవాని పిల్లనగ్రోవి నవలలో బక్కిరెడ్డి చనిపోయినప్పుడు ప్రకృతి యావత్తు భోరు భోరుమని విలపించడమూ, మునెమ్మలో తరుగులోడిని సంహరించే సన్నివేశంలో బొల్లిగిత్త ఎవరెవరికి ఎలా ఎలా కనిపించింది అన్న సన్నివేశాన్ని చిత్రీకరించడం లాంటి లక్షణాలు కేశవరెడ్డి కధనాపటిమకు మెచ్చుతునకలు.
మేజిక్‌ రియలిజమ్‌ తోడ్పాటుతో కేశవరెడ్డిలోని ఈ లక్షణం మునెమ్మలో తారాస్థాయిని అందుకుంది. గాబ్రయేల్‌ గార్షియా మార్కుజ్‌ లాంటి నోబుల్‌ బహుమతి గ్రహీతలు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని వ్యవస్థలో మేజిక్‌ రియలిజమ్‌ మాటున దాక్కున్నారు. తెలుగులో మేజిక్‌ రియలిజమ్‌ కొత్తదేమీ కాదు. మునిపల్లె రాజు మేజిక్‌ రియలిజమ్‌ కథల పేరుతో ఒక కథా సంపుటాన్నే ప్రచురించాడు. వి. చంద్రశేఖరరావు చాలా కథలలో మేజిక్‌ రియలిజమ్‌ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మునిపల్లె రాజులో మేజిక్‌ రియలిజమ్‌ పరాకాష్ట నందుకుంటే కేశవరెడ్డి మునెమ్మలో ఇది తేటనీటి అడుగు చేపపిల్లల కదలికల్లాగా కనిపించీ కనిపించకుండా కనిపిస్తూ పాఠకుడిని సంభ్రమాశ్చర్యచకితులని చేస్తుంది. నిజానికి ఈ కధన పద్దతిని కనుక కేశవరెడ్డి కనుక ఎన్నుకోక పోయినట్లయితే యిది ఒక సాదా సీదా క్రైమ్‌ థ్రిల్లర్‌లాగా, షాడో ఇనవెస్టగేషన్‌లాగా మిగిలిపోయేది.
కథ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిత్తూరు జిల్లాలోని ఒంటిల్లు అనే కుగ్రామంలో మునెమ్మ, జయరాముడు అనే పడుచు జంట. వీళ్ళ బతుకు రధాన్ని లాగడానికి ఆధారమయిన ఓ బొల్లిగిత్త. బొల్లిగిత్తకి మునెమ్మపైన లైంగికపరమయిన ఆకాంక్ష కలగిందన్న ఒక చిన్న అనుమానం జయరాముడిలో మొదలయి, బొల్లిగిత్తను కసిదీరా చావ బాది, ఆ తర్వాత మద్దిపాలెం పరసలో అమ్మెయ్యాలని నిశ్చయించుకుంటాడు.
బొల్లిగిత్తను మద్దిపాలెం పరసకు తోలుకుపోయిన తర్వాత, ఒంటరిగా బొల్లిగిత్త తిరిగివస్తుంది. కానీ జయరాముడు రాడు. ఆ రాత్రి మునెమ్మకి కలలో తన భర్త జయరాముడిని ఎవరో హత్యచేశారన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత జయరాముడి హంతకుల కోసం మునెమ్మ వేట/ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మునెమ్మకి సినబ్బ తోడవుతాడు. సినబ్బకి ఆమెకి ఒక వరుసలో తమ్ముడు. ఒక వరుసలో మరిది. మునెమ్మ సినబ్బను మరిదిలాగా భావిస్తుంది. సినబ్బ మునెమ్మని తమ్ముడులాగా భావించుకుంటాడు. సినబ్బ ద్వారానే పాఠకుడికి కథను రచయిత చెప్తాడు. ఒక రకంగా రచయితకు సినబ్బ ప్రతినిధి.
ఒంటిల్లు నుండి మద్దిపాలెం దాకా, అక్కడినుండి రామినాయుడిపల్లె మీదుగా కాణిపాకం తిరగి ఒంటిల్లు దాకా సాగిన ఈ ప్రతీకార యాత్ర యావత్తు మునెమ్మ అతీంద్రీయ, తార్కిక, జ్ఞానశక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మునెమ్మ అనే ఈ సాధారణ వ్యకిలోని అసాధారణ తత్వానికి సినబ్బ అడుగడుగునా ఆశ్చర్య చకితుడు అవుతూ వుంటాడు.
తనకు వచ్చిన కల ఆధారంగా జయరాముడు ‘మరిక లేడు’ అన్న నమ్మకం మునెమ్మలో బలపడుతుంది. ఆ నమ్మకాన్ని సినబ్బకి చెపితే ‘‘అది ఆమెలో వున్న మూర్ఖత్వానికి పరాకాష్ట’’ అని భావించిన సినబ్బ నాలుగు రోజుల తరువాత అది మూర్ఖత్వం కాదని, ‘‘అంతర్‌దృష్టి’’అనీ అవధువుల లేని ఆవేదన ద్వారా పొందిన యోగమే ‘‘అంతరదృష్టి’’ అనీ అర్ధం చేసుకుంటాడు.
ఈ నవలలో కేశవరెడ్డి వదిలేసిన లూస్‌ ఎండ్స్‌ ఎన్నొ. జయరాముడి వ్యక్తిత్వంలో వస్తున్న ప్రతి మార్పుకి ఒక ఆధారభూతమయిన అంశాన్ని వివరిస్తూ, జయరాముడి కూడా తండ్రిలాగే తయారయ్యాడన్న వాస్తవానికి ఒక లాజికల్‌ రీజనింగ్‌ యిచ్చిన కేశవరెడ్డి, జయరాముడి హత్య వరకు అతి సాధారణ గృహిణిలాగా వ్ను మునెమ్మలో ఆ తర్వాత అద్భుతమయిన, ప్రేరణ, అతీంద్రీయ శక్తులకు మించిన జ్ఞానం కలగడం కావలసిన తాత్విక భూమికను ఏదీ చూపించలేదు. జయరాముడి వ్యక్తితవ్వంలో మార్పులకు ఇన్‌హెరిడిటీ/ జన్యుపరమయిన అంశాలు కారణం అయినట్లుగా మునెమ్మ అంతర్‌దృష్టికి ఏ రీజన్‌ లేదు.
వ్యవసాయక సమాజంలో పశువులకు, మనుషులకి మధ్య సన్నిహిత సంబంధాలు వుండటం సహజమే. పల్లె పట్టులలో వుండే ఎవరికయాని, తమతో సన్నిహితంగా వుండే మనుషులను పశువులను నాలుకతో నాకడమూ, మొహం మీదకు ముట్టె సాచి ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటి అంశాలు అనుభవంలోకి వచ్చేవే. మనుషుల స్పర్శను పశువులు కోరుకోవడంలో లైంగిక పరమయిన కాంక్ష వుంటుందా? నాలుగు కాళ్ళ జంతువులా కనిపించిన మునెమ్మ మీదికి బొల్లిగిత్త రెండు కాళ్ళు ఎత్తి నడుము మీద వేయడం యితరేతర పశువుల ప్రవర్తన కంటే భిన్నమయినదా? వ్యవసాయిక సమాజమునుండి వచ్చిన జయరాముడికి పశువుకి, మనిషికి మధ్య వుండే సంబంధం గురించిన అవగాహన లేశ మాత్రమయిన లేదా!
కథాకాలం స్వాతంత్య్రానికి  పూర్వం. అప్పటికి మనుషులు యింకా యింతగా కలుషితం కాలేదు. అలాంటప్పుడు తరుగులోడు , నాటువైద్యుడి సహాయంతో జయరాముడిని హత్యచేయండ కేవలం డబ్బుకోసమే అనుకుంటే అందులో సమంజసత్వం వుందా! హత్యకి మోటివ్‌ ఏం లేదు?
జయరాముడి హత్యకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం వెనుక మునెమ్మలో అపరాధ భావం వుండా? జయరాముడి బొల్లిగిత్తను చావబాదడానికి కారణం అది తనను కామించడమే అయితే, దాన్ని యాక్సెప్ట్‌ చెయ్యడం ద్వారా జయరాముడికి అన్యాయం చేశానన్న భావం/గిల్టీ మునెమ్మలో వుందా? మునెమ్మకి జయరాముడి పైన వున్న ప్రేమకి, బొల్లిగిత్తపైన వున్న ప్రేమకి వున్న సాంద్రతలో తేడాలున్నాయా? ఒక మనిషి ఏక కాలంలో మనిషిని, పశువుని ప్రేమించడం సాధ్యంకాదా? అది నేరమా?
జయరాముడి స్థానంలో బొల్లిగిత్తను అంగీకరించడం ద్వారా పోయటిక్‌ జస్టిస్‌ జరిగిందన్న సురేంద్రరాజు మాటలో కేశవరెడ్డి ఏకీభవిస్తున్నారా? ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌కి త్రిపురనేని మదుసూధనరావు రాసిన ముందు మాటని ‘‘నవలలోని కొన్న అంశాలను గురించి రచయిత పునరాలోచించవలసి వుందని’’ పేర్కొన్నారు. ‘‘కానీ అనాటి పరిస్థితులలో అలా పునరాలోచించాల్సిన అవసరం వుందని నేను భావించలేదు’’ అంటూ ఖండిరచిన కేశవరెడ్డి సురేంద్రరాజు మాటను ఖండిరచలేదు అంటే తన జస్టిస్‌గా అదే అనే కదా అర్ధం. అలాంటప్పుడు సింగిల్‌ ఉమెన్‌ సమస్యల పట్ల కేశవరెడ్డి దృక్పధం ఎలాంటి సంకేతాలని ఇస్తుంది.
ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు?
మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే.
మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

– వంశీకృష్ణ

మా సత్తెమ్మ తల్లీ, గుళ్ళూ, గోపురాలూ

chitten raju

మా చిన్నప్పుడూ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మేము శేరీ పొలం వెళ్ళినా, మొట్టమొదట చేసే పని, చెరువు గట్టు ఎదురుగా రావి చెట్టు క్రింద ఉన్న మా  సత్తెమ్మ తల్లికి మనసారా దణ్ణం పెట్టడం. ఆ తరవాతే పొలం లోకి అడుగుపెట్టినా, ఏ పనులు చేసినా.

ఈ సత్తెమ్మ తల్లి  ని ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు కానీ మా లోకారెడ్డి వారి చెరువా ఇస్తువా పంపు అనే శేరీ 1920 లలో మా తాత గారు కొన్నప్పటి నుంచీ, గ్రామాలకి గ్రామ దేవతలా ఈ సత్తెమ్మ తల్లే మా పొలాలకి అధిదేవత. రాతి రూపంలో పసుపు కుంకుమల తో ఉన్న ఈ అమ్మ వారికి రోజూ దీపం పెట్టడం, పూజలు చెయ్యడం లాంటి పూజా పునస్కారాలు ఉండవు.  కానీ ఏడాది పొడుగునా జరిగే విత్తనాలు జల్లి నారు పొయ్యడం, నాట్లు వెయ్యడం, కలుపు తీత, ఎరువులు వెయ్యడం, కోతలు, గడ్డి  కుప్పలు వెయ్యడం, కళ్లం తయారు చెయ్యడం, కుప్ప నూర్పులు, ఆరబెట్టడం, కాటా వేసి రైస్ మిల్లర్లకో వర్తకులకో అమ్మకం చేసి డబ్బు రూపేణా ఫలసాయం పొందే దాకా జరిగే ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా సత్తెమ్మ తల్లికి పూజ చేసి, కోడిని కోసి ఆశీస్సులు తీసుకోవడం మా తరతరాల ఆచారం.

ఇక పండగల సమయంలో, ముఖ్యంగా పెద్ద పండగ అయినా, మా పాలికాపుల ఇళ్ళలో పెళ్లి లాంటి ఏ శుభకార్యం జరిగినా మేక ని కొయ్యడం కూడా మా పాలికాపుల ఆచారం.  ఇలా కొలిచిన దానికి  ప్రతిఫలంగా సత్తెమ్మ తల్లి మా పొలం లో ఏ విధమైన దొంగ తనాలు, తప్పుడు పనులు జరగకుండా కాపాడుతుంది అని ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలలోనూ, మా కుటుంబానికీ నమ్మకం. నాకు తెలిసీ ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ విధమైన దొంగతనం అనేది జరగ లేదు.  ఇటీవల నేను అక్కడికి వెళ్లినప్పుడు మా సత్తెమ్మ తల్లికి దణ్ణం పెడుతూ తీయించుకున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి..మా పిల్లలతో సహా….ఎవరికైనా చూపిస్తే ..ఆ మాట కొస్తే కొంత మంది పెద్ద వాళ్ళు కూడా నవ్వుతారేమో నాకు తెలియదు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.నా యిచ్చయే గాక నాకేటి ఎరవు?” అన్నాడు కృష్ణశాస్త్రి.

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

మా సత్తెమ్మ తల్లికి సంబంధించి రెండు సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి. మా చిన్నప్పుడు వేసవి కాలంలో రాత్రి నూర్పులు అయ్యాక ధాన్యం కుప్పలు గా వేసే వారు. కుప్పకి సుమారు పాతిక బస్తాల చొప్పున చాలా కుప్పలే ఉండేవి. అప్పుడు నాకూ, మా తమ్ముడికీ, తన పెద్ద బావమరిది వెంకట్రావుకీ ఒక ప్రధానమైన డ్యూటీ వేసేవాడు. అదేమిటంటే ఆ కుప్పలన్నింటి మీదా ఆంజనేయ స్వామి ముద్రలు వెయ్యడం. అంటే మా పొలాలకి ఆంజనేయ స్వామిని అందంగా చెక్కిన ఒక రాజ ముద్రిక ఉండేది. ప్రతీ ధాన్యం కుప్ప మీదా మూడు వరసలలో , ఒక్కొక్క వరసకీ ఐదారు చొప్పున  అర చేతి సైజు లో ఉండే మట్టి పిడకలని మా ఉద్దారుడు…అంటే పెద్ద పాలికాపు….జాగ్రత్తగా సరి అయిన పద్ధతిలో  అతికించే వాడు. ఇక్కడ టెక్నాలజీ ఏమిటంటే ఎవరైనా ఆ కుప్పలో పై నుంచి కానీ, కింద నుంచి కానీ ధాన్యం లాగేస్తే ఈ మట్టి పిడక కిందకి పూర్తిగా జారి పోవడమో, కొంచెం చితికి బీటలు పడడమో జరిగి ఎవరు దొంగతనం చేశారో తెలియక పోయినా ఖచ్చితంగా ధాన్యం దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుందన్న మాట.

అందు చేత ఈ పిడకల “ప్లేసింగ్” ని మా పెద్దన్నయ్య స్వయంగా పర్యవేక్షించే వాడు.  కొంచెం దైవ భయం కూడా  జోడించడానికి  కొంచెం తడిగా ఉండే ఈ పిడకల మీద ఆంజనేయ స్వామి ముద్ర “అద్దే” వాళ్ళం. ““అద్దే” వాళ్ళం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే,  ఆ ముద్ర గట్టిగా కొడితే మట్టి పిడక చితికిపోతుంది. మరీ సున్నితంగా కొడితే ఆంజనేయ స్వామి కనపడడు.

ఇక ప్రతీ కుప్పా కళ్ళం లో నేల మీద పది, పదిహేను అడుగుల వృత్తులాకారంలో ఉండి ఐదారు అడుగులు ఎత్తు ఉండేవి. ఒక సారి కొత్తగా పని లోకి వచ్చిన ఒక కుర్ర కూలీ అత్యంత లాఘవంగా ప్రతీ కుప్ప నుంచీ ఎక్కడా ఈ “సెక్యూరిటీ” పిడకలు ఏ మాత్రం కదలకుండా కొంచెం ధాన్యం చొప్పున  అన్ని కుప్పల నుంచీ కలిపి అర బస్తాడు ధాన్యం దొంగతనం చేసి మసక చీకట్లో పారిపోతూ మా పొలం సరిహద్దుల దగ్గరకి రాగానే కాలు జారి కాలవ లో పడి లేవలేక పోయాడు. ఐదారు గంటల తరువాత మా పాలికాపులు అతన్ని చూసి బైటకి తీసి దొంగతనం చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక ఆ చుట్టు పక్కల అన్ని గ్రామాల లోనూ “రామం గారి శేరీ లో దొంగతనం చెయ్యబోతే వాణ్ణి సత్తెమ్మ తల్లి పొలం సరిహద్దులు దాటనియ్యకుండా కట్టి పడేసింది” అని నిస్సంకోచంగా నమ్మారు.

మా ఇంట్లో భోజనం చేస్తున్న కొందరు రైతులు

ఈ ఉదంతం బహుశా “దివాణం” గారి హయాం ..అంటే  మా నాన్న గారి హయాం లోనే జరిగినా, హేతువాద దృష్టిలో ఈ సంఘటన కేవలం కాకతాళీయమే అయినా, గత ఎనభై ఏళ్లగా మా పొలంలో అతి చిన్న దొంగతనం కూడా జరగక పోవడం మా సత్తెమ్మ తల్లి రక్షణే అని అందరి నమ్మకం.  అంతెందుకు,  మా “చిన్న దివాణం” హయాంలో ..అంటే మా పెద్దన్నయ్య హయాంలో ఒక సారి ఒక నక్సలైట్ తుపాకీ తో పొలంలో మా మకాం కి వచ్చి , ఏడాదికి పది వేలు ఇవ్వక పోతే రక రకాల ఇబ్బందులు పెడతానని బెదిరించాడు. అప్పుడు మా రైతులు సత్తెమ్మ తల్లి గురించి వివరంగా చెప్పి, దమ్ముంటే మళ్ళీ శేరీ లో అడుగుపెట్టమని ఛాలెంజ్ చెయ్యగానే దేవుళ్ళనీ , దేవతలనీ నమ్మని ఆ నక్సలైట్ కూడా మళ్ళీ  మా పొలం చుట్టుపక్కలకి రాలేదు.

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

ఇదంతా చదివి మా వంగూరి వారు గ్రామ దేవతల దగ్గర నుంచీ మనకున్న కోటానుకోట్ల  దేవదేవుళ్ళందరినీ ఆరాధించేస్తూ విపరీతమైన దైవ భక్తులు అని అనుకుంటే “తప్పులో కాలేసినట్టే”.  నాకు తెలినంత వరకూ మాకు మా ప్రాంతాలలో సాధారణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే స్థాయి లోనే మా దైవిక పరమైన వ్యాపకాలు ఉండేవి. ఇంచు మించు అన్నీ పండగలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు , పేరంటాల చుట్టూ తిరిగినవే.  మతపరమైన అంశాలలో ఎక్కడా “ఓవర్ ఏక్షనూ” లేదు. అలా అని ఆధిక్షేపణ అంతకంటే  లేదు. ఇంటా, బయటా సరి అయిన మోతాదులోనే ఉంటాం.  మా పూర్వీకుల విషయం నాకు స్పష్టంగా తెలియదు కానీ వారు తణుకు దగ్గర సిద్దాంతం గ్రామ కారణాలుగా ఉండే సమయంలో …అంటే 1690 సంవత్సరం ప్రాంతాల నాటి సూరప రాజు  గారి హయాంలోనే, ఆ తరువాతనో మా ముత్తాతలు ఒక వినాయకుడి గుడి కట్టి ఆలయ అర్చకులకి జీవనోపాధికి ఇచ్చారుట.

నేను సుమారు పదేళ్ళ క్రితం మొట్టమొదటి సారిగా మా పూర్వీకుల అన్వేషణలో అక్కడికి వెళ్లి  ఆ గుడి చూశాను. అప్పుడు చాలా పురాతనంగా ఆ గుడి పై భాగంలో “వంగూరి వారు కట్టించి ఇచ్చిన ఆలయము” అని సంవత్సరం కూడా వ్రాసి ఉంది కానీ చదవడానికి వీలులేని స్థితి లో ఉంది. క్రిందటేడు ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ సిద్దాంతం వెళ్లాను. ఇప్పుడు పురాతన కట్టడాన్ని నిర్మూలించి ఆ గుడిని ధర్మకర్తలు పున:నిర్మాణం చేసి ఆనాటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేశారు. మూడు దశాబ్దాల క్రితం నాటి “వంగూరి వారి వినాయకుడి గుడి”  ఈ నాటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

ఇక మా తరానికి వస్తే, ఐదారేళ్ళ క్రితం మా పొలానికి ఆనుకుని ఉన్న చిన జగ్గం పేట  గ్రామంలో ఆ పెద్దన్నయ్య కృష్ణుడి గుడి కట్టించడం చెప్పుకో దగ్గ విశేషమే!  ఈ గుడి కట్టించడానికి మా పెద్దన్నయ్య దైవ భక్తి చిన్న కారణం కానీ అంత కంటే ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి.  ఈ చిన జగ్గం పేట  వెయ్యి గడపల గ్రామంలో ఉప్పర్లు, మాలలు, గొల్లలు సమ సంఖ్యలో ఉంటారు. ఈ మూడు కులాల వారు అనేక తరాల నుంచీ మాతో బాటు మా  పొలాన్నే నమ్ముకున్న వాళ్ళే. గత అరవై, డభై ఏళ్లగా మేము ఎప్పుడైనా ఏ పెళ్ళిళ్ళ కొ, చదువులకో కొంత పొలం అమ్మినా, వీళ్ళలో ఏదో ఒక కులం వారు సమిష్టిగా కొనుక్కుని ఇప్పటికీ మా శేరీ లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.  సుమారు పదిహేనేళ్ళ క్రితం అప్పటి మునసబో, మరెవరో ఆ గ్రామంలో ఒక చిన్న సీతారామస్వామి దేవాలయం కట్టించారు.  ఈ గ్రామం  లో అదే మొట్టమొదటి దేవాలయం.

రామారావు పేటలో శివాలయం

రామారావు పేటలో శివాలయం

పక్కనే ఉన్న తాటిపర్తిలో ఒక ఆలయం ఉంది కానీ, విశేషం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల పది గ్రామాలలోనూ దేవుడికి దీపం పెట్టడానికి ఒక్క పూజారి కుటుంబం కూడా లేదు.  ఎందుకంటే, కరిణీకాలు రద్దు చేసెయ్యడం, పంతుళ్ళకి జీతాలు ఇవ్వక పోవడం మొదలైన రాజకీయ కారణాల వలన ప్రస్తుత  గ్రామీణ వాతావరణం  లో పొట్టపోసుకునే అవకాశాలు లేక బ్రాహ్మణ కుటుంబాలు పట్టణాలకో..ఆ మాట కొస్తే అమెరికాకో..వలస పోయారు.  ఇప్పుడు సీతారామస్వామి ఆలయం కొత్తగా చిన జగ్గం పేట లో వెలియగానే, ఎవరో ఒక పూజారి గారిని బతిమాలుకుని ఆయన తాటిపర్తిలో కాపరం ఉండేటట్టూ, రోజూ  అక్కడి గుడికీ, ఇక్కడి గుడికీ సైకిల్ మీద వచ్చి దీపం పెట్టి, ఆరాధన చేసేటట్టూ ఏర్పాటు చేశారు.

అప్పుడు ఈ గ్రామం లో ఉన్న గొల్లలు తమ కుల దైవం అయిన శ్రీ కృష్ణుడి కి కూడా గుడి కట్టిస్తే,  దాని పోషణ అంతా తాము చూసుకుంటాం అనీ, పూజారి గారికి కూడా భుక్తి గడుస్తుంది అనీ మా పెద్దన్నయ్య ని కోరారు. “తరతరాలుగా మన శేరీ నే నమ్ముకున్న  ఈ గ్రామ ప్రజల ఋణం ఇలాగైనా తీర్చుకుందాం” అనుకునీ, తన పేరు అక్కడ కలకాలం నిలబడుతుందనే సంతోషం తోటీ, తన 77 వ ఏట మా పెద్దన్నయ్య , ఆ సేతారామస్వామి గుడిలో కొత్త విగ్రహాలు పున;ప్రష్టాపన చేసి,  పక్క స్థలంలో శ్రీ కృష్ణుడి గుడి కట్టించి పుణ్యం చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య పోయినప్పుడు ఆ గ్రామ వాస్తవ్యులు ఆయన విగ్రహం చేయించి, గుడి ప్రాంగణంలో  పెట్టించారు. ఇందుతో ఆ గుడి, మా పెద్దన్నయ విగ్రహం దగ్గర నేనూ, ఆలయ నిర్వాహకుడి ఒకాయనతో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను.  అలాగే కాకినాడలో మా పెద్దన్నయ్య సంవత్సరీకాలకి వచ్చి భోజనం చేస్తున్న మా కొంతమంది రైతుల ఫోటో కూడా జతపరుస్తున్నాను.

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

గుళ్లూ, గోపురాల గురించి మాట్లాడుతున్నప్పుడు , మా కాకినాడ రామారావు పేట లో ఉన్న శివాలయం గురించి ప్రస్తావించకుండా ఉండ లేను.   ఎందుకంటే, నా జీవితంలో సుమారు ఇరవై ఏళ్ళు…అవును..ఇరవై ఏళ్ళు , నేను ఆ శివాలయాని కి వెళ్లి, ఏడడుగుల పొడుగున్న బక్క పలచటి ఆచారి గారు పెట్టే సాతాళించిన శనగలు తినని రోజు లేదంటే అతిశయోక్తి కానే కాదు.  ఆ శివాలయం ఇప్పటి ఫోటో ఒకటి జత పరుస్తున్నాను…ఎందుకంటే, మా చిన్నప్పుడు దేవుడి గుడిలో ఫోటోలు తీయించుకోవడం మాకు తెలియదు.  ఆ శివాలయం లోనే, ఆ వీధిలోనే ఉన్న ఈశ్వర పుస్తక భాండాగారం లోనే నేను కొన్ని వందల హరి కథలు, పురాణాలు, బుర్ర కథలు, ప్రవచనాలు విని తరించాను.

నా దృష్టి లో మానవ మేధస్సు సృష్టించిన రెండు అధ్బుతాల లో ఒకటి దేవుడు అనే సిద్దాంతం. మరొకటి ధనం. దేవుడి మీద నమ్మకమూ, డబ్బు మీద ఆశా, ఈ రెండూ తగిన మోతాదులో ఉంటేనే మన మనుగడ సమపాళ్ళలో ఉంటుంది.  నాకు ఏక్షన్ ఇష్టమే కానీ, ఓవర్ ఏక్షన్ ఇష్టం లేదు కాబట్టి నా ప్రయత్నం ఎక్కువ లేకుండానే  నా  జీవితంలో రెండిటికీ “సమ న్యాయం “ చేశాననే అనుకుంటున్నాను.

నేల మీద నమ్మకం వుంటే ఈ పుస్తకం చదవండి తప్పక!

samvedana logo copy(1)

గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు.

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

 

పుస్తక రచయిత విద్యాసాగర్

పుస్తక రచయిత విద్యాసాగర్

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.

14844_front_cover

మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.

22vzgss03-book__23_1594038e

విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.

గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.

తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.

అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.

జి ఎస్‌ రామ్మోహన్‌

 

ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక Butterfly Effect

ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect…

 

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ.  2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు  మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం.  ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం.  మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది.  నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై,  కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం.  తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది.  శైవక్షేత్రం శ్మశానమయ్యింది…

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.

బడబాగ్నికి సలిలం లక్ష్యం.

దేహాగ్నికి దేహమే లక్ష్యం.

ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.

నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా !    —   అల్లమప్రభు.

 

 

కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి,  దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

చౌరాబరీ గ్లేసియర్, కట్టడాలమధ్య ఒదిగిపోయిన కేదార్ నాథ్ గుడి

               

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది.  హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి.  పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ  చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన  అడుగుల్లో నావి కూడా ఉన్నాయి.  2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు,  కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి..  ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే  పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

దేవ ప్రయాగ శాంత మందాకిని

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో  మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ  మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు.  సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత  పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది.  అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది.  అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది.  హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది.  రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి.  ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది.  సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో  విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా.  ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

-రామ్ బాడా ధాబాలో వంట-

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో  వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు.  స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు.  హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ  సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి  పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర.  మొన్న జరిగిన విలయంలోనూ గుడి  చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను  టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

గుర్రం యజమాని దేవ ప్రయాగ దగ్గర కాంక్రీట్ అడవి

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే.  ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు.  లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

కౌశిక్ తో నేను. అలసిన దేహాలు.

 

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా  రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం.  రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు  అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా  రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి.  మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే.  “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు…  దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము.  వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు.  దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు.  కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది.  జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ  అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం..  ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి.  నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా…  కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక  కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది.  అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్  హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం.  కానీ, ఇంతలా   కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు.   మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు.  ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది.  ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు.  చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం… (

 

(మిగతా యాత్ర గురించి మరోసారి…)

 

lalitha parnandiల.లి.త.

 

 

 

 

ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!

murali

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది. కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

జీవితచరమసంధ్యాసమయంలో ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిని కవిత్వలక్షణం ఏమిటని శ్రీశ్రీ అడిగితే ఆయన అన్నారట: 1) రమ్యాక్షరనిబంధం వల్ల కంఠవశం కాగల రచన 2) జాతీయజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో మననం చేసుకోవటానికి అనువయిన పదసంచయనం 3) ధారావిశుద్ధి మూలాన రసనాగ్రనర్తకిగా ఉండటం.

శాస్త్రిగారు చెప్పిన ఆ మూడు లక్షణాలూ పదపరివృత్తిని బట్టి వస్తుతః సమానార్థబోధకాలే అయినా వాటిలో కొంత ఛాయావిభేదం లేకపోలేదు.

రమ్యాక్షరనిబంధమన్నది కవితాశైలికి సంబంధించిన మసృణత్వం. అది సందర్భవశమే కాని సర్వకాల సర్వావస్థాగతం కాదని పొరబడకూడదు. ‘రమ్యత’ అంటే పాఠకుడు ఒక రచనను చదివిన కొంతకాలం తర్వాత దానిని మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు – ప్రతిపాద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలగటం వల్ల, జీవితంలో తాను పొందిన సుఖదుఃఖాల అనుభవపరిణామం వల్ల, ఆత్మసంస్కారం వల్ల ఆ రచన మరింత కొత్తగానూ, మరింత దీప్తంగానూ భాసించే స్వభావాన్ని కలిగి ఉండటం అన్నమాట. కవియొక్క ప్రతిభాశక్తి కాలాంతరంలోని పాఠకుల అవగాహన పరిధికంటె ఎన్నోరెట్ల గాంభీర్యౌన్నత్యాలతో విలసిల్లితే గాని ఆ రమ్యాక్షరనిబంధం సాధ్యం కాదు. కవి ఎన్నెన్ని పూర్వజన్మలలో ఆరాధించి ఎంతమంది మహాకవుల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యఫలమో అది!

కవిత్వాన్ని జాతీయ జనజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో విశ్వజనీనంగా తీర్చిదిద్దాలన్న ఆదర్శంలో కవి మనీషిత, లోకహితైషిత గోచరిస్తాయి. వేణికలల్లటం కేవలం ఆఖ్యానశిల్పానికి పరిమితమైన ఔపచారిక శబ్దప్రవృత్తి కాదు. కథాగతులైన వ్యక్తుల శీలౌన్నత్యానికి, శీలభ్రష్టతకు కారణాలేమిటో నిరూపించి, లోకానికి ఉపదేశప్రాయమైన రచనను చేయగలగటం అన్నమాట. ఆ రచనకు మూలాన్ని జాతీయ జనజీవితాలలో నుంచి తీసుకోవటం వల్ల పాఠకుడు తన జీవితాన్ని దానితో సరిపోల్చుకొని, తన జీవితానికొక గమ్యాన్ని, ఒక ఆదర్శాన్ని కల్పించుకోగలుగుతాడు. కవిత్వ రచనోద్దేశం ఆ ఆదర్శకల్పనల ఫలమైన సమాజాభ్యుదయమే. ఒక్కొక్క యుగంలో పరిభాష మారుతుందే కాని పార్యంతికఫలశ్రుతి అదే.

ధారాశుద్ధి అంటే వర్షామేఘం నుంచి తెంపు లేకుండా స్రవించే నీటిచాలు లాగా కవిత్వం పరిశుద్ధమైన పదసంపదతో హాయిగా సాగిపోవటం. పద్యమైనా, గేయమైనా పాఠకులకే గాక రచించిన కవికి సైతం గుర్తుండని స్థితి ఏర్పడటానికి కారణం ఈ ధారావిశుద్ధి లోపమే. ఈ ధారావిశుద్ధి స్వస్వరూపంతో చదువరుల గుండెలకు హత్తుకొనిపోవాలనే విశ్వనాథ వారు కావ్యరచనావేళ ఒక పూర్తి సన్నివేశాన్ని పూర్తిగా మనస్సులో కూర్చుకొన్నాక లేఖకునికి చెప్పి వ్రాయించటం జరిగేది. అజంతా గారు ఒక గేయం పూర్తిగా మనస్సులో నిలిచిపోయిన తర్వాత దానిని ఎన్నోమార్లు నెమరువేసుకొని, ధారణను సరిచూసుకొని, నిబ్బరంగా కుదిరిందని అనిపించిన తర్వాతనే ఆ నిరాకార శబ్దస్రవంతిని కాగితం పైకి ప్రవహింపజేసేవారు. చెళ్ళపిళ్ళ వారికీ, శ్రీశ్రీకీ, ఎంతోమంది మహాకవులకూ అభ్యస్తపూర్వమైన కవితా రచనా దృగ్విషయం అది.

viswa

అనువాదాలపై ఆధారపడక స్వతంత్రావిర్భావవికాసాలను కలిగివుండటం కూడా ఉత్తమకవిత్వపు సాముద్రికలక్షణమని వెంకటశాస్త్రి గారు సూచించారట.

రూపానికి ప్రాధాన్యం ఇచ్చి వస్తువు విషయాన్ని ప్రసక్తింపలేదని ప్రథమదృష్టికి భాసింపవచ్చును గాని, ప్రతిపాద్యవస్తువుకు చిరంజీవిత వెంకటశాస్త్రిగారు అనుభవపూర్వకంగా చెప్పిన స్మరణయోగ్యత వల్లనే సిద్ధిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే.

భావికాలికాకాంక్ష లేని కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమని శ్రీశ్రీ తరచు అంటుండేవారు. అపురూపమైన ఆ సగుణశక్తిసాధన తోనే శ్రీశ్రీ తనకాలంనాటి మూడు తరాలకు నాయకత్వం వహింపగలిగారు. అభ్యుదయకవులు ఆయనను శబ్దబ్రహ్మగా ఆరాధించి, అనుకరించి, పదికాలాలపాటు పదిలంగా నిలిచే పదబంధాలెన్నిటినో కవిత్వపరిభాషలో నియతంగా నిలిపారు. ఆయన ప్రకల్పించిన శబ్దపు తంత్రులను మ్రోగించి, నూతనస్వరాలను పలికించి, ఆత్మీయాదర్శాలతో జాతి అంతరంగసంగీతాన్ని వినిపించారు.

అభ్యుదయకవిత్వావిర్భావదశకం

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది.

కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

srisri-profile

రాయప్రోలు కాల్పనికజీవనదిలో నుంచి తీసిన భావకవితాకుల్యను మళ్ళీ విశ్వనాథ సంప్రదాయజలధిలో కలిపివేయడంతో భావకవితాయుగంలో ఒక సువర్ణావృత్తి పూర్తయింది.

ఆ ఉరవడికి తట్టుకొని స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకొన్న సామాజిక శబ్దవిధాతలు అబ్బూరి రామకృష్ణారావు, ఉమ్రాలీషా, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్య, కుసుమ ధర్మన్న, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి కనుపిస్తారు. ఆ తర్వాత శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబులు సృష్టించిన అభ్యుదయ ప్రవర అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఆవంత్స సోమసుందర్, దాశరథి, బైరాగి, అజంతా, కవిరాజమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలుకొని కాళోజీ, డా|| సి. నారాయణరెడ్డిల దాకా నిరంతరాయితంగా కొనసాగింది.

బోయి భీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, చెరబండరాజు, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, కె. సత్యమూర్తి, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్, వేగుంట మోహన్ ప్రసాద్, గద్దర్, వంగపండు ప్రసాదరావు, ఓల్గా, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ముకుందరామారావు, పెన్నా శివరామకృష్ణ, త్రిపురనేని శ్రీనివాస్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్, యాకూబ్, శిఖామణి, ఖాదర్ మొహియుద్దీన్, సతీష్ చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి, మానస చామర్తి మొదలైన సమాజ ప్రియంభావుక కవులు తమతమ తీరుల కొత్త దారులను అభిమానించి వర్తమాన శరతల్పం మీదికి ప్రగతిశీల నవ్యోక్తివైఖరుల సంజీవనీ కావ్యజలధారను అమృతాయమానంగా తీసుకొనివచ్చినవారిలో కొందరు. వీరిలో పెక్కుమంది తమ వరివస్యతో అభ్యుయానంతర కవితా క్షితిజరేఖలను దిగంతాలకు విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.cherabandaraju

అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన వేగంతో మారుతున్న సమాజంలో ఈనాడు కవులు సామాజిక హృదయస్పందనకు నేతృత్వం వహింపలేకపోవటానికి కారణం ఏమిటి? సాహిత్యప్రక్రియలపై ప్రసారసాధనాలు, ప్రచార రాజకీయాల దాడి ఈ మధ్యకాలంలో పదునెక్కుతున్నది. సారస్వతవ్యాపారసంస్థల పురస్కారసంస్కృతి ఈ పతనావస్థకు ప్రతిఫలనం. అన్యభాషలలో వలె కాక తెలుగువారు కవుల చలనచిత్రరంగప్రవేశాన్ని విస్ఫారితనేత్రాలతో తిలకించటం వల్ల ప్రాంతీయ వాణిజ్యావసరాలు సాహిత్యపరిభాషను శాసించటం మొదలయింది. నిర్ణేతృక సర్వసైన్యాధ్యక్షపదవిని వదులుకొని కవులే బంట్లుగా బానిసతనానికి తలొగ్గుతున్నారు.  విజాతీయధోరణులతో స్వరూపస్థితిని కోల్పోతున్న జాతిని దళితవాదకవయితలు వచ్చి మేల్కొలుపకపోతే నేటి సాహిత్యం పూర్తిగా నిర్నిమిత్తమై, విస్మరణీయావస్థలోకి జారుకొనేదనటంలో అతిశయోక్తి లేదు.

ఓల్గా

ఓల్గా

శ్రీశ్రీ యుగప్రభావం నాటి ప్రతిభావిలసన క్రమంగా పరిమితం కాసాగినందు వల్ల కవులు అల్పప్రాయమైన రూపవాదానికి ప్రాధాన్యమిచ్చి, చిరంతనమైన సమసమాజాదర్శాన్ని గౌణీకరించి, కల్పనాశిల్పాన్ని అనాదరిస్తున్నారు. సాహిత్యికులలో వ్యుత్పత్తిగౌరవం, క్రాంతదర్శిత క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం వైపుకు పరుగులుతీస్తున్నది. అస్తిత్వవాదం నుంచి సంఘటితశక్తిగా ఆవిర్భవించి దళిత బహుజనకవిత్వం సమాజనిష్ఠం అవుతున్న రోజులలో కూడా కవులు వైయక్తికాదర్శాలతో వెలసిన వార్తాపత్రికలే వస్తునిర్దేశికలుగా సరిపెట్టుకొని, జాతిభవితవ్యం పట్ల మౌనం పాటిస్తూ స్వార్థ రాజకీయవిధాతల వేలుపట్టుకొని నడుస్తున్నారు. ప్రజాస్వామిక మానవసంబంధాలకు కట్టుబడిన చైతన్య ధనుష్పాణుల గొంతుక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంకా బలంగా వినబడుతుందని ప్రజలు బ్రతుకుబాటలో తమకు దారిచూపే శబ్దవిధాతల పాటకోసం వెయ్యికళ్ళతో వేచిచూడక తప్పటం లేదు.

ఏల్చూరి మురళీధరరావు

ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala

వందేళ్ల కిందటి తెలుగు మహిళ తిరుగుబాటు

venuరాని ‘సమయం’లో సమ్మె చేసి ఉద్యోగం పోగొట్టుకుని ఆరునెలలు నిరుద్యోగం చేసి, చివరికి బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ (ఐసెక్) లో రిసర్చ్ అసిస్టెంట్ గా చేరడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇరవై రెండు సంవత్సరాల కింద జరిగిపోయిన ఆ మార్పు అనేక కారణాల వల్ల ఒక్క క్షణం కింద జరిగినంత బలంగా మనసు మీద ముద్ర వేసుకుంది. ఐసెక్ లైబ్రరీ, అక్కడి మేధో వాతావరణం, స్నేహబృందం గొప్ప వరాలు. ప్రత్యేకించి ఆ లైబ్రరీ మహా ఖజానా. అప్పటికి విని మాత్రమే ఉండి, చూసే అవకాశం కూడ దొరకని ఎన్నో పుస్తకాలు అక్కడ చేతికందాయి. అప్పటికి కొనుక్కోలేని పుస్తకాలెన్నో ఎంతో కొంత సంపాదనవల్ల, ఐసెక్ లో విద్యార్థులకు, ఉద్యోగులకు చౌకగా ఫొటోకాపీయింగ్ సౌకర్యం ఉండడం వల్ల, సొంతానికి సంపాదించుకోగలిగాను. అక్కడ అట్లా దొరికిన విలువైన పుస్తకాలలో ఒకటి ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’.

అప్పటికే రాజకీయాభిప్రాయాలవల్ల పరిచయస్తుడు, ఐసెక్ లో పబ్లికేషన్ అసిస్టెంట్ కె జి వాసుకి నేనక్కడ చేరిన రెండు నెలల లోపలే హఠాత్తుగా “డు యు నో సుందరమ్మ?” అని అడిగాడు. ఎవరా సుందరమ్మ అని ఎదురు ప్రశ్నించాను. అంతటి సుప్రసిద్ధ తెలుగు వ్యక్తి తెలియని నా అజ్ఞానానికి ఆయన చాల ఆశ్చర్యపోయాడు. “దేరీజ్ ఎ రేర్ బుక్ కాల్డ్ రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఇన్ అవర్ లైబ్రరీ. దటీజ్ ఎ సెంచురీ ఓల్డ్ బుక్. యు డోంట్ నో అబౌట్ హర్” అని నా అజ్ఞానానికి జాలిపడుతూ, బైటికి ఇవ్వని, పరిమిత చలామణీకి మాత్రమే అనుమతించే ఆ పుస్తకం నాకిచ్చాడు. ఆ పుస్తకాన్ని రెండు దశాబ్దాల వెనుక చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానో, ఇవాళ చదివినా అట్లాగే ఉంది. ఆ పుస్తకం వంద సంవత్సరాల కిందటి తెలుగు సమాజ శకలం ఒకదాన్ని సజీవంగా చూపుతుంది. మన గతం గురించి చెప్పే ఆ పుస్తకానికి వర్తమానంలో కూడ ఎంతో ప్రాసంగికత ఉంది.

2014-04-02-257

ఆ పుస్తకంలో పొదిలి, పెదారికట్ల, రాజుపాలెం అనే మూడు గ్రామాల పేర్లున్నాయి. వీటిలో మొదటి రెండూ ప్రస్తుత ప్రకాశం జిల్లా గ్రామాలు. ఇంటిపేర్లతో సహా దాదాపు పది, పదిహేను మంది మనుషుల వివరాలున్నాయి. హిందూ కుల మత దురాచారాల పీడనలో మగ్గిన ఒక స్త్రీ తిరుగుబాటు గాథ అది. ఇష్టానికి వ్యతిరేకంగా, అసలు ఇష్టాయిష్టాలు తెలియని బాల్యంలో నాలుగు రెట్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిగి, రెండో భార్యగా వెళ్లి, పదమూడేళ్లు నిండకుండానే కూతురికి జన్మనిచ్చి, ఆ కూతురికి కూడ బాల్య వివాహం చేయబోతుంటే తిరగబడిన స్త్రీ గాథ అది. ఆ స్త్రీ క్రైస్తవమతంలో చేరడమే తిరుగుబాటుగా రచయిత్రి చేసిన నిర్ధారణను పాఠకులు అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. కాని పదహారు అధ్యాయాల పుస్తకంలో క్రైస్తవం గురించి మాట్లాడినవి మూడు నాలుగు అధ్యాయాలు మాత్రమే. మిగిలిన అధ్యాయాలన్నీ హిందూ కుల మతాచారాలు, బ్రాహ్మణులు తమ భుక్తికోసం సృష్టించిన ఆచారవ్యవహారాల విధినిషేధాలు ఒక స్త్రీని ఎట్లా పీడించగలవో, ఎంత వేదనకు గురి చేయగలవో చూపేవే.

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది. అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

2014-04-02-258

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది.

sundaramma-1 sundaramma-2 sundaramma-3 sundaramma-5 sundaramma-6 sundaramma-7 sundaramma-8 sundaramma-9 sundaramma-10 sundaramma-11 sundaramma-12 sundaramma-13 sundaramma-14

అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

నూట అరవై పేజీల ఈ చిన్న పుస్తకంలో ప్రధాన కథ అయిన తెలుగు సామాజిక జీవన చిత్రణలో భాగంగా దాదాపు ఎనభై చిత్రాలు (అవి ఇండియన్ ఇంక్ డ్రాయింగ్ లు గాని, పెన్సిల్ స్కెచ్ లు గాని కావచ్చు) ఉన్నాయి. తెలుగు ప్రజల ఆచారాలు, వృత్తులు, మనుషులు, పెళ్లి, ఇళ్లు, దేవతా విగ్రహాలు, పశువులు, పంటలు, ప్రకృతి, పక్షులు, ఎడ్ల బళ్లు, చెప్పులు, గొడుగులు, చేతికర్రలు, కోకలు, పంచెలు, తినుబండారాలు, రుద్రాక్షమాల, శంఖం, తాయెత్తు, తాళపత్రాలు, సొరకాయ బుర్ర వంటి ఎన్నో సాంస్కృతిక విశేషాలు జీవం ఉట్టిపడుతూ కాగితం మీదికెక్కాయి, ఆ బొమ్మలు వేసింది గెర్ట్రూడ్ ఎచ్ బి హుకర్. ఆ పుస్తకానికి ముందుమాట రాసినది ఇవరయో శతాబ్ది తొలి దశకాలలో అమెరికాలో అత్యంత ప్రముఖ సంఘసేవకురాలు హెలెన్ బారెట్ మాంట్ గోమరీ. అలా ముగ్గురు అమెరికన్ స్త్రీలు పాలు పంచుకున్న, ఒక భారత, అందునా తెలుగు స్త్రీ గురించి రాసిన ఈ పుస్తకాన్ని 1911లో న్యూయార్క్ కు చెందిన ఫ్లెమింగ్ ఎచ్ రెవెల్ కంపెనీ అనే క్రైస్తవ పుస్తక ప్రచురణ సంస్థ వెలువరించింది. అప్పటికి నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థ షికాగో, టొరాంటో, లండన్, ఎడింబరోలలో కార్యాలయాలతో పాశ్చాత్య ప్రపంచంలో అతి ప్రధానమైన క్రైస్తవ ప్రచురణ సంస్థగా ఉండేది. ఇప్పుడది బేకర్ పబ్లిషింగ్ గ్రూప్ లో ఒక భాగం.

 

ఒక అమెరికన్ రచయిత్రికీ, చిత్రకారిణికీ, సంఘసేవకురాలికీ, ప్రచురణకర్తకూ ఒకానొక తెలుగు స్త్రీ కథ వెలువరించవలసిన అవసరం ఏమి వచ్చింది? ఆ రచయిత్రి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ లో భాగంగా క్రైస్తవ మత ప్రచారానికీ, వైద్య సేవకూ, బహుశా మతాంతరీకరణకూ కూడ ప్రస్తుత ప్రకాశం జిల్లా, అప్పటి గుంటూరు జిల్లా గ్రామాలకు వచ్చింది. ఆమె జీవిత వివరాలు పుస్తకంలో ఎక్కడా లేవు గాని సుప్రసిద్ధ చర్చ్ సంగీతకారుడైన ఆమె కొడుకు రాబర్ట్ హాల్ ఎల్మోర్ జీవితచరిత్ర ప్రకారం, తల్లిదండ్రులు మాడ్ జాన్సన్ ఎల్మోర్, డా. విల్బర్ థియొడర్ ఎల్మోర్ రామపట్నం (రామయపట్నం) లో ఉండగా 1913లో ఆయన పుట్టాడని, 1915లో తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తున్నది. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున ప్రజలతో సంబంధం పెట్టుకున్న మాడ్ ఆ ప్రజల జీవితాలను, హిందూ మతం కింద ఆ ప్రజలు, ప్రత్యేకించి స్త్రీలు అనుభవిస్తున్న వేదనను స్వయంగా చూసింది. ఆ వేదన నుంచి బైటపడిన ఒకానొక యువతి గాథను చాల ఉద్వేగభరితంగా ఈ పుస్తకంలో చిత్రించింది.

ఇది వాస్తవ గాథనా, కల్పిత గాథనా కచ్చితంగా తెలియదు. ఆ గ్రామాలకు వెళ్లి వంద సంవత్సరాల కింద ఇటువంటి ఘటన జరిగిందా అని పరిశీలించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా, మద్రాసు ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతాంతరీకరణల చరిత్ర గురించి సవివరమైన పుస్తకం/కథనం ఒక్కటి కూడ దొరకలేదు. కాకపోతే క్రైస్తవంలోకి మారిన ఈ పుస్తక కథానాయకురాలి పేరు “వల్పుల” సుందరమ్మ కాగా, రామపట్నం థియొలాజికల్ సెమినరీలో రెవరెండ్ గా ఉండిన “వల్పుల” సి జాకబ్ 1909/10ల్లో దక్షిణాఫ్రికా వెళ్లాడని, ఆయన చరిత్ర తెలిసినవాళ్లు తనను సంప్రదించాలని ఇంటర్నెట్ మీద బ్రెండా ఫ్రాంక్నర్ 2013లో ఒక నోటీసు పెట్టారు!

అది నిజజీవిత గాథ అయినా కాకపోయినా, రచయిత్రికి ఆ నాటి తెలుగు సమాజంతోనూ, ఆచారాలతోనూ, హిందూ మత గ్రంథాలతోనూ తగినంత పరిచయం ఉందనడానికి పుస్తకంలో ఎన్నో అంతర్గత సాక్ష్యాలున్నాయి. బహుశా అందువల్లనే ఆ పుస్తకంలోని అనేక విషయాలు వర్తమానంలో కూడ ప్రాసంగికంగా ఉన్నాయి.

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

పుస్తకంలో బ్రాహ్మణ, అస్పృశ్య కులాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రధాన పాత్ర మధ్యంతర కులానికి చెందినదనే సూచన తప్ప స్పష్టత లేదు. అయినా మొత్తంగా సామాజిక, వ్యక్తిగత జీవితాలలో కుల, మతాల పాత్ర, ఆచార వ్యవహారాల పట్టు, ఆ ఆచార వ్యవహారాల పేరుతో సమాజం మీద బ్రాహ్మణుల ఆధిపత్యం గురించి పుస్తకం చాల సూక్ష్మమైన వివరాలు కూడ ఇస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరణతో ఆ ఆచారాలు తగ్గాయని, బ్రాహ్మణుల పట్టు తగ్గిందని చాల మంది అంటారు గాని సామాజిక జీవితంలో కుల మతాల పట్టు ఇప్పటికీ తగ్గలేదు సరిగదా, పెరిగిందేమో కూడ. పాత ఆచారవ్యవహారాలలో కొన్ని అంతరించి పోయాయేమో, కొన్ని మారిపోయాయేమో గాని ఆ స్థలం లోకి కొత్త ఆచార వ్యవహారాలు, కొత్త మూఢనమ్మకాలు వచ్చి చేరాయి. హిందూ మతం, దానిలో అంతర్భాగమైన కులం నిరంతరం పునరుత్పత్తి అవుతున్నాయి. నిజానికి హిందూ మతం, దాని పవిత్ర గ్రంథాలలో చెప్పిన విషయాల ఆధారంగానే హింసనూ, అసమానతనూ సమర్థించే మతం. ఒక వర్గం ఉత్పత్తిలో భాగం పంచుకోకుండా ఉత్పత్తి ఫలితాలను అనుభవించడానికి భగవంతుడి ఆమోదం ఉందని చెప్పే మతం. పూర్వజన్మ దుష్కృతాల పేరుతో, పునర్జన్మ అవకాశాల పేరుతో ఇప్పటి దోపిడీ పీడనలను సమర్థించే మతం, నిర్దాక్షిణ్యమైన మతం. ఏ మాత్రం ఆలోచనాపరులైనా, సున్నిత, మానవీయ భావాలున్నవాళ్లయినా దాన్ని అసహ్యంచుకోకుండా, అవకాశం వస్తే దాని నుంచి బైటికి వెళ్లకుండా ఉండలేరు. ఇక స్వయంగా ఆ మతగ్రంథాలే, భగవానువాచ ప్రకారమే స్త్రీల మీదా, “నిమ్న” కులాల మీద అణచివేతను, నిమ్నత్వాన్ని సమర్థించినప్పుడు, ఆ స్త్రీలు, నిమ్నకులాలు దానిలో కొనసాగడానికి కారణమే లేదు. బైటికి పారిపోవడం ఎంతమాత్రమూ ఆశ్చర్యకరం కాదు.

మతాంతరీకరణ చర్చ నిజానికి ఈ అంశం మీద, హైందవం నుంచి అత్యధిక సంఖ్యాకులను బైటికి తోసే స్థితి మీద జరగాలి. కాని ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మతాంతరీకరణకు ఆ రెండు మతాల బలప్రయోగమో, ప్రలోభమో కారణమని చర్చ జరుగుతున్నది. ఈ పుస్తకం తప్పనిసరిగా ఆ చర్చను మరొక కోణం నుంచి చూసే అవకాశం కలిగిస్తుంది. ముస్లిం పాలకులు హిందువులను బలప్రయోగం ద్వారా తమ మతంలోకి మార్చుకున్నారని, వలసవాద పాలకవర్గాలు హిందువులను ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి ఆకర్షించాయని ఒక అభిప్రాయం బలంగానే ఉంది. కాని మతాంతరీకరణకు భయం గాని, ప్రలోభం గాని మాత్రమే కారణాలు కావు, హిందువులు తమ మతం నుంచి బైటికి పోవడానికి బైటి నుంచి ఆకర్షణ ఎంత కారణమో, అందుకు సమానంగానో, ఎక్కువగానో లోపలి నుంచి వికర్షణ కూడ కారణమవుతుందని ఒప్పుకోవాలి. హైందవంలోని దుస్సహమైన పరిస్థితి కల్పించిన భూమిక మీదనే ఇతర మతాల ఆకర్షణ లేదా బలప్రయోగం బలపడ్డాయి. ఈ పుస్తకం హైందవం తనలోంచి స్త్రీలను ఎట్లా నెట్టి వేస్తుందో చూపుతుంది.

ఇక చివరిగా తెలుగు సాహిత్యంలో ప్రచార సాహిత్యం అనే పేరుతో చిన్నచూపుకు గురవుతున్న సాహిత్యధార గురించి కూడ ఈ పుస్తకం కొన్ని ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ప్రచార సాహిత్యం అనే మాట ద్వారా, ఆ సాహిత్యంలో సాహిత్యకత ఉండదని, దానిలో విశ్వసనీయ జీవిత చిత్రణ గాని, సాహిత్యానికి మౌలికమైన అనుభూతి సాంద్రత గాని ఉండవని, ప్రచార లక్ష్యంతో జీవితాన్ని, వస్తువును పలచబారుస్తారని, వక్రీకరిస్తారని ఒక అభిప్రాయం తెలుగు సాహిత్యంలో వంద సంవత్సరాలకు పైగా ఉంది. ప్రజా ఉద్యమాలు, ఉద్యమాలకు అనుబంధంగా సాహిత్యం పెరుగుతూ వచ్చిన కొద్దీ ఈ తప్పుడు అంచనా కూడ పెరుగుతూ వచ్చింది. మరొకవైపు ఆధునిక తెలుగు సాహిత్యమంతా స్పష్టమైన భావ ప్రచారం కోసమే జరిగింది. ఆమాటకొస్తే ప్రాచీన సాహిత్యంలో కూడ రాజాశ్రయం పొందినందువల్ల ఇవాళ్టికీ మిగిలిన సాహిత్యమంతా కూడ వర్ణాశ్రమ ధర్మ ప్రచారసాహిత్యమే. అయినా ప్రచార సాహిత్యం అంటే చిన్నచూపు కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలో ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ రచయిత అవగాహనను, మతాన్ని ప్రచారం చేయడానికి రాసిన పుస్తకమే అయినా, ఆ అవగాహనను వ్యతిరేకించేవారిని కూడ మెప్పించగల విశ్వసనీయ, ఉద్వేగభరిత జీవితచిత్రణ ఎలా చేయవచ్చునో చూపింది.

ఈ పుస్తకం చదవగానే, ఐసెక్ లైబ్రరీలో 1910ల నాటి దేశదేశాల సోషియాలజీ పత్రికలన్నీ ఉండేవి గనుక ఏమైనా సమీక్షలు వచ్చాయో వెతకడానికి ప్రయత్నించాను. అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీ తో సహా అక్కడ కనబడిన ఏ పత్రికలోనూ సమీక్షలు దొరకలేదు. కాని ఈ పుస్తకం వెలువడిన వెంటనే న్యూయార్క్ టైమ్స్ లోనూ, న్యూజిలాండ్ హెరాల్డ్ లోనూ వచ్చిన సమీక్షలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని దొరికాయి. ఆ సమీక్షలు కూడ చాల ఆలోచనాస్ఫోరకంగా ఉన్నాయి.

ఒక జీవిత చిత్రణగా, ఒక పరాయిదేశపు స్త్రీ తెలుగు స్త్రీ జీవితం గురించి చేసిన ప్రకటనగా, హైందవ పీడన నుంచి మహిళా విముక్తికి ఒక మార్గాన్ని సూచించిన ప్రచార రచనగా, ఒక సామాజిక శాస్త్ర వివరణగా ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’ కు ఆనాడు ఎంత విలువ ఉండిందో అంతకన్న ఎక్కువ విలువ ఇవాళ ఉంది.

-ఎన్. వేణుగోపాల్

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం

aluri-bairagi

1.

మనకు జీవితకాలం పాటు ‘నిరంతరానంద భిక్ష’  పెడుతూవుండే కవితో మనకు – వైయక్తిక స్థాయిలో – చాలా సంక్లిష్టమైన, ambivalent అయిన సంబంధం ఉంటుందనిపిస్తుంది.

 

గాథాసప్తశతి ని ‘The Absent Traveller’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన  Arvind Krishna Mehrotra,  ఆయన  Translator’s Note లో ఇలా అంటారు: ‘As readers we sometimes feel possessive about certain authors. They are our discoveries, and write only for us. When the whole world comes to know of them, the magic of their pages is destroyed and we feel robbed.’ ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఏ రచయిత మెదిలారో గాని, ఆలూరి బైరాగి కవిత్వంపైని నా లుబ్ధత్వం గురించే రాసారనిపించింది. బైరాగిని అందరూ చదవాలనీ, చర్చించుకోవాలనీ వుంటుంది. అదే సమయంలో, నేను మాత్రమే unlock చేయగల రహస్యమేదో ఆయన encrypt చేసి వదిలివెళ్ళారనిపిస్తుంది.‘రంగుల తోట’ అనే కవిత చివరలో ‘నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ అని నన్నుదేశించి రాసారనే అనుకుంటూవుంటాను. ‘ప్రశ్నను ప్రశ్నించిన కవి బైరాగి’ (‘మో’ మాట) ని కేవలం eulogize చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. మన సాహిత్యలోకం బైరాగిని అర్థంచేసుకోవడానికి చేసిన కృషి స్వల్పం. అలాగని గణించదగ్గ విమర్శ రాలేదనికాదు. ఇంతకంటే pressing, urgent  అవసరాల్ని literary mainstream పట్టించుకోవడం వల్ల ఆయన అర్థవిస్మృతుడు. అంతే.

 

2.

జెర్రులు ప్రాకుతున్నై, తేళ్ళు, త్రాచుపాములు నాచుట్టూ,

కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

ఏదో ప్రవాహంలో(బహుశా అది నెత్తురేమో)

కొట్టుకుపోతున్నాను. నాచుట్టూ నాతోబాటు వందలు వేలు

చేతులు, కాళ్ళు, తెగిన శిరస్సులు, మొండాలు, పీకిన గ్రుడ్లు

వెంట్రుకలు నాచులాగ, ప్రేవులు నరాలు కాడల్లా;

పొగచూరిన ఎర్రకిరసన్ వెలుతురులో

కనుపించని ఒక చిక్కని ద్రవంలోన (నెత్తురే అయిఉంటుంది)

గిలగిల తన్నుకొంటున్నాను మాంసపు ముద్దలాగ;

అరుస్తున్నాను భయంతో చుట్టూచూసి, వినరాని కేకలువేసి,

సమస్త జీవకోటులు కొట్టుక వస్తున్నాయి

ఎటువైపు తిరిగినా ఏదో ఒకటి తగులుతోంది

మెత్తగా, నున్నగా, చీదరగా.

బిలబిల ప్రాకుతున్నవి పురుగులు నా ముక్కులోకి, చెవుల్లోకి

ఒంటినిచుట్టి పట్టుకొనే జలగలమూక.

అదిగదిగో, కొట్టుకొని వస్తున్నది శిరస్సొకటి,

దాని నొసట ఎర్రని నోరు, మూడవకన్ను,

తెరచిన రంధ్రమొకటి వెక్కిరిస్తోంది

పుర్రెలపాటలాగ గుడగుడమనే సుడిగుండం

కొంగ్రొత్త ఉపనదులవి, మహానగరాల మురుగు మోస్తూ

ఆసుపత్రి కాల్వల్లోంచి చీముతో, రసితో నిండి.

వినీల లోహకాంతులు విరిసినాయి దిక్కులలో

మసిగుడ్డవలే గగనం పరుచుకొన్నది నల్లనిదై

ప్రవాహవేగంవల్ల కదులుతోంది ప్రతి జీవం

చావులోకి, బ్రతులోకి, నిదుర మగతల మూర్ఛలోకి.

 

ముందున్నది క్షితిజం కాదు, అంతులేని సొరంగమది

గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,

ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో

నే నెవణ్ణి, ప్రభువునా, బానిసనా,

మెదులుతున్న మాంసపుముద్దనా, మానిసినా?

ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

నూతన జననమా, లేక ప్రాక్తన మరణమా?

 

Literary Modernism యూరోప్ లోనూ, మన దేశంలోకూడా alienation/dehumanization ని చిత్రించడం ప్రధాన లక్షణంగా కలిగివుందని అందరికీ తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని కవిత్వంగా మార్చేక్రమంలో కవి వాడే tropes, techniques అతడి విలక్షణతని పట్టిస్తాయి.

 

‘నూతిలో గొంతుకలు’ కవితాసంపుటిలో ‘హామ్లెట్ స్వగతం’, ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే మూడు భాగాల ముందు eponymous కవితైన ‘నూతిలో గొంతుకలు’ ఐదు భాగాలుగా వుంది. ఈ ప్రారంభకవితలోని concerns నీ, themes నీ తరువాత వచ్చే మూడు స్వగతాలు dramatize చేస్తాయి. ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే భాగాలు స్థూలంగా చూస్తే స్వగతాలు కావుగానీ, జాగ్రత్తగా గమనిస్తే అవీ స్వగతాలే.

ప్రారంభ కవితలో digressions , సంవాదం, exposition , illustration  లాంటి discursive పద్ధతులెన్నో కనిపిస్తాయి. కొన్ని దృశ్యాల్ని condense చేస్తూ, కొన్నింటిని extend చేస్తూ సాగే శైలి దీర్ఘకవితల్లో కానవచ్చేదే. పైన quote చేసిన extended image అటువంటిదే.

 

‘కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

 

Loss of autonomy of the individual ని పైపంక్తుల్లో వ్యక్తీకరించిన పద్ధతి బైరాగి aesthetic (noun form లో) లోని ఒక కీలకమైన అంశాన్ని తెలియజేస్తుంది. ఎవరో తనని చొక్కాలా కత్తిరించి కుడుతున్నారనడంలో – bodily mutilation , invasion of the corporeal (ఇంకా చెప్పాలంటే, ‘body snatching’) ని ఆయన alienation కు సంకేతంగా వాడుతున్నారు. అప్పటి (1951) తెలుగు కవిత్వంలో కనిపించని ఆశ్చర్యకరమైన associations బైరాగి ఏర్పరిచారు. ఆయన కవిత్వ ‘ecosystem’ (కావ్యాంతర్గత జగత్తు) లో కొన్ని ప్రత్యేకమైన motifs పరిభ్రమిస్తూవుంటాయి. వేరే కవితల్లో ‘దేహపు పరిధానంలోంచి’ , ‘మాసిన చొక్కాలా దేహాన్ని వదలి’ వంటి మెటఫర్స్ కనిపిస్తాయి. భగవద్గీతలో శరీరాన్ని వస్త్రంతో పోల్చే శ్లోకం ప్రసిద్ధం.  పై image మిగతా related images ని ఎలా meta-morphose చేస్తోందో గమనించండి.

 

నేను ఈ కావ్యభాగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం, బైరాగి,  శరీరాన్ని (ఇది hyper-sexualized స్త్రీదేహం  కాదు)  కేంద్రంగా చేసుకొని ‘దుర్భరతర జీవిత బాధావధి’ ని దృశ్యమానం చేసారని చెప్పటానికే. ‘దైహికత’ (corporeality) గురించిన మన received, a priori knowledge అంతటినీ దైహికానుభవం defy చేస్తూనేవుంటుంది. అసలు ఒక శరీరావయవం కలిగుండటమంటే ఏమిటి? Surrealist paintings లోలా disembodied limbs, torso, eyes, nose ని శరీరపు ‘presumed’ unity నుంచి వేరు చేసి చూడటమంటే ఏమిటి? బైరాగి వాడిన విశేషణాలు చూడండి – ‘మెత్తగా’ , ‘నున్నగా’ , ‘చీదరగా’. ఆ disconcertingly visceral experience ద్వారా ఆయన సూచిస్తున్నదేమిటి? చుట్టూరా అవయవాలు, తనే  ఒక మాంసపుముద్ద. పోతున్నది ‘రుధిరామిష బిలం’ లోకి. ఆ contiguity , juxtaposition of visceral images ద్వారా fluid స్థితిలో ఉన్న subjectivity ని allegorize చేస్తున్నారు. ఇటువంటి interpretation ని బలపరిచే imagery ఇతర modernists లోనూ కనిపిస్తుంది. అలాగని, కేవలం allegorical potential (మరీ ముఖ్యంగా, ప్రతిదీ potential allegory అయినప్పుడు) ఉండటమే ఇక్కడ ప్రత్యేకత కాదు. బైరాగి కల్పనలో ముఖ్యమైంది ఆ visceral, visual immediacy.

 

చిన్న detour. ఈ పంక్తులు –

 

‘గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,’

 

చదివేటప్పుడు Roberto Bolano రాసిన Anne Moore’s Life కథలోని (ఆయన Last Evenings on Earth కథాసంకలనం లోది) ఈ భాగం స్ఫురిస్తుంది: ‘…It was as if the walls of the hotel room were made of meat. Raw meat, grilled meat, bits of both. …she looked at the walls and she could see things moving, scurrying over that irregular surface…’ పై రెండు సన్నివేశాలూ (కథ చదివి చూడండి) ఎక్కడో దిగంతంలో కలిసేవే.

 

ఇక ‘రక్త మఖం’ గురించి. ‘యజ్ఞం’ motif  బైరాగి కవితల్లో చాల చోట్ల కనిపిస్తుంది.’ఆగమగీతి’ కవిత ‘మానస యజనవాటిక పై మరల నేడు…’ అనే మొదలవుతుంది.’మృత్యు యజనపు జీవమంత్రం’, ‘యజనారణులు విఫలమైనవి/ ఇక ప్రజ్వరిల్లదీ హోమాగ్ని’ – యిలా. ఈ recurring motifs ని ఆయన మరింత శక్తిమంతం చేసుకుంటూపోయి, ఇంచుమించు ఒక private cosmogony వంటిది తయారుచేస్తారు.

 3444572043_9c3ce9bb22_o

 

3.

‘త్రిశంకు స్వర్గం’ బైరాగి దీర్ఘకవితల్లో అత్యంత విశిష్టమైనది. అది Nausea (Sartre) లా, The Stranger  (Camus) లా ఒక గొప్ప existentialist text. కానీ, దాని నిజమైన precursor మాత్రం, Soren Kierkegaard  రాసిన ‘Sickness Unto Death’ అనే తాత్త్విక రచన. Kierkegaard ని ‘Father of Existentialism’ అన్నారు. ఆయన దర్శనం theistic existentialist thought కి అత్యున్నత ఉదాహరణ.

 

(A section of the book relevant to this discussion and analysis can be accessed with this link (……………). Reading the whole excerpt will be helpful for understanding the drift of Kierkegaard’s argument.)

 

Kierkegaard దేన్ని ‘ఆమరణ రుగ్మత’ అంటున్నాడు? మరణహేతువైన వ్యాధి – అంటే terminal illness

– ‘Sickness Unto Death’ కాదు. మరణం రోగానికి అంతమేమో కాని, అదే అంతం కాదు. Kierkegaard ప్రకారం, మరణం అనేది పరమచరమాంతం అని భావించడమే రుగ్మత. Kierkegaard ‘నిస్పృహ'(despair) ని Sickness Unto Death అంటున్నాడు. ఈ నిస్పృహ భౌతికమృతితో ముగిసేది కాదు. అది ఎటువంటిది? Kierkegaard మాటల్లో –

 

‘On the contrary, the torment of despair is precisely this inability to die. Thus it has more in common with the situation of a mortally ill person when he lies struggling with death and yet cannot die. Thus to be sick unto death is to be unable to die, yet not as if there were hope of life; no, the hopelessness is that there is not even the ultimate hope, death. When death is the greatest danger, we hope for life; but when we learn to know the even greater danger, we hope for death. When the danger is so great that death becomes the hope, then despair is the hopelessness of not even being able to die.’

 

సరిగ్గా, ఈ స్థితినే ‘త్రిశంకు స్వర్గం’ లో బైరాగి చిత్రించారు. ‘రంగుల తోట’ అనే కవితలో, ఆయన ‘జీవిత జ్వరం’ అన్నది ఈ స్థితినే. Kierkegaard ‘నిస్పృహ’ – బైరాగి కవితలో ‘మెలకువ’ గా మారింది. ఆ మెలకువ – ఆ ‘స్వాప్నికసంయోగాల స్వేదదుర్భర జాగరణ’ – సర్వస్వం పొట్టబెట్టుకున్న రక్కసి.

 

ఈ కవితలో కేవలం psychological , spiritual torment  మాత్రమే లేదు. Mortality ఒక corporeal – visceral reality గా పరిణమించటమే కవిత ఇతివృత్తం. Kierkegaard అన్నట్లు అది – ‘to die dying, i.e., live to experience dying’.

 

‘జపాపుష్ప కాంతిలాగు, పచ్చిపుండు వాంతిలాగు

పసినెత్తురు కారుతున్న ఒక్క క్షణం!

చావు పుట్టుక బ్రతుకుల, విషమబాహు త్రిభుజంలో

మధ్యనున్న ఒక అదృశ్య బిందువులా

ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’

 

Conscious selfhood ను పొందటమంటే ‘కంది కనలి కెంపెక్కిన ఒకే ఒక జ్వలితజీవిత క్షణం’ – ఆ epiphanic second – కోసం సంసిద్ధమవటం. కాని కేవలం ఇదే బైరాగి ఎరుక కాదు.

 

‘విసుగు! విసుగు!

కనులముందు విసుగులేని ఇసుకబయలు

జీవితపు శూన్యంపై ముసుగు విసుగు!

ఎంతకూరాని తుమ్ము, వెళ్ళిపోని వాంతి

కడుపులో త్రిప్పుతోంది విసుగు త్రేపు!

….

మెరసే నున్నని చర్మంపై ప్రాకే దురద విసుగు!

విసుగు! జీవితాల ముసుగు

 

‘This too shall pass.’ ఆ రక్తోజ్వల ముక్తిక్షణం తరువాత ఏమిటి? Tedium. Banality. Boredom. Ennui. ఇదీ బైరాగి దర్శనం.

 

Kierkegaard పుస్తకం బైబిల్ లోని Lazarus ప్రస్తావనతోటి మొదలవుతుంది. బైరాగికి intense reading of the scripture వల్ల ఆయా పురాగాథల connotative possibilities అర్థమైనాయని చెప్పవచ్చు (T. S.Eliot ‘The Love Song of J.Alfred Prufrock’ లో ఒక్కసారి Lazarus ప్రస్తావనొస్తుంది). బైరాగి మొత్తం రచనల్లో Lazarus ఒక central myth . బైరాగి లోని మరో ముఖ్య లక్షణం – a Modernist predilection for the mythic: Gulliver, Hamlet, Jesus, నహుషుడు, మార్కండేయుడు, ‘జగతీవిషసార పాయి(శివుడు)’ పదేపదే ప్రస్తావించబడతారు.

 

బైరాగి వాడే భాష గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన శైలిలోని ఆసక్తికరమైన సమస్య గురించి ఆరుద్ర ఇలా అంటారు: ‘సరే, కల్తీలేని భారతీయ పద్ధతుల్లో వ్రాసే బైరాగి సంస్కృతపదభూయిష్టమైన మంచి కవిత్వం కూడా ఈ పండితులు గుర్తించరేం అని మధనపడ్డా.’ ప్రతి ప్రతిభావంతుడైన కవికీ తనదైన idiolect ఉంటుందని అనుకున్నా, బైరాగి భాషలోని సంస్కృతం పూర్తిగా క్లాసికల్ తెలుగుకావ్యాల సంస్కృతం కాదు. అలాగని సంస్కృతకావ్యాల లలితమృదుల సంస్కృతమూ కాదు. ఆయన, హిందీసాహిత్యంలో వాడే సంస్కృతపదాల కూర్పు వంటిది ఉపయోగించడం వల్లనూ, కఠిన శబ్దాలు – కర్ణపేయంగా అనిపించనివి – ఎన్నుకోవడం వల్లనూ పాఠకులు defamiliarization కి లోనవుతారు. పైగా, ఈ సంస్కృతం status-quoist కాదు. ‘Sanskrit cosmopolis’ (Sheldon Pollock) తాలూకు భాషా కాదు. ఆయన భాష సంస్కృతభాష లోనుంచి gothic, baroque  లక్షణాల్ని వెలికితీసి తయారుచేసుకున్న భాషనవచ్చు. అందుకే, ఆయన ‘దేవముఖ్యులు’ , ‘నవయుగ దైత్యులు’ లాంటి పదాల్ని వాడుతున్నప్పుడు, వాటిని మామూలు అర్థాల్లో వాడటంలేదనీ  , subvert చేస్తూ, problematize చేస్తూ ఉన్నారనీ తెలుస్తూంటుంది. ఇందుకు ఆధారాలు చాల కవితల్లో (‘రెండు క్రిస్మస్ గీతాలు’, ‘దైత్యదేశంలో గెలివర్’) కనిపిస్తాయి.

 

‘Beowulf’ epic ని గానం చేసిన అజ్ఞాత Anglo-Saxon కవులు సముద్రాన్ని whale-road అనీ, swan-road అనీ అన్నారు. మరీ అద్భుతంగా , శరీరాన్ని bone-house (banhus) అనగలిగిన ప్రజ్ఞ వారిది. ‘మేలుకొన్నవాడు’ అనే కవిత చివరలో –

 

‘విచ్ఛిన్న నైశసైన్యపు ప్రాణావశిష్ట భటుడు

అగ్రేసరుల ప్రథమ దూత,

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు పై ఉదర్కపు ఊహోద్ఘటుడు.

 

అన్న పంక్తుల్లో శరీరాన్ని ‘ఎముకలూ , మాంసముతో నిర్మించిన, కూలే స్థితిలో ఉన్న సేతువు’ అన్నారు. దేహం – లేదా ఒక  highly dynamic visceral-corporeal presence – గురించి ఇంత potent metaphor బైరాగి కవిత్వ తపః ఫలం.

 

(1978 లో మరణించిన బైరాగి- వాడ్రేవు చినవీరభద్రుడు, కవులూరి గోపీచంద్ అనే ఇద్దరు యువకుల సాహిత్య   చర్చల్లో పునరుత్ధానం పొందాడు. వారిలాగే ’80ల్లో చాలామంది ఎవరికి వారే బైరాగిని rediscover చేసారని తెలుస్తోంది. బైరాగి కవిత్వం గురించి వీరభద్రుడిగారితో మాట్లాడుతూ rhapsodic trance లోకి వెళ్ళి, తిరిగి  మర్త్యలోకానికొచ్చాక రాసుకున్న యాత్రాచరితమే యిదంతా. కాబట్టి ఈ వ్యాసానికి authorship నిర్ణయించటం చాలా nebulous/dubious విషయం. బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది.)

 

– ఆదిత్య

Painting : Robert Matta, Untitled Drawing, 1938.

పాదాల క్రింద నలగని ఆకు – కుష్వంత్ సింగ్

Krish.psd
నేలమీద అడుగులు వేస్తుంటే దారి పొడువునా పచ్చ టి ఆకులు పరుచుకుని తమ పై నుంచి నడిచివెళతారా అని దీనంగా చూస్తున్నాయి. తెల్లవారు జాము చల్లటి గాలి తగులుతుంటే పై నుంచి పచ్చటి ఆకులు దీవిస్తున్నట్లు రాలిపడుతున్నాయి. తలపై, భుజంపై ఒక్కో ఆకు కన్నీటి చుక్కల్లా పడుతూ పలకరిస్తున్నాయి. తడి పచ్చికపై కూడా అవే ఆకులు.పూలు ఆకుల వర్షాన్ని ఆనందిస్తున్నట్లు తలలూపుతున్నాయి. నేలపై కాగితపుపూలు, పచ్చటి ఆకులు కలిసి మట్టిని ముగ్గుల్లా అలంకరిస్తున్నాయి. స్కూలుకు వెళుతున్న పిల్లల్నీ అవే ఆకులు పలకరిస్తున్నాయి.

అవును ఇది శిశిరం. ఆకులు రాలే కాలం. ఢిల్లీలో చిరుచలిని ఎండ వేడిమి పారదోలుతున్న సమయంలో కాలం మారుతున్నదన్న స్ప­ృహ వెంటాడుతోంది. మృత్యువు అందమైనదా? లేకపోతే ఈ ఆకులు, పూలు రాలిపోతూ విషాదానికి బదులు ఆనందాన్ని ఎందుకు కలుగచేస్తున్నాయి? బస్‌స్టాప్ వద్ద పడిపోయిన ఒక పెద్ద రావి ఆకును ఏరి ఒక స్కూలు పిల్ల పుస్తకంలో దాచుకుంది. కాళ్ల క్రింద, వాహనాల క్రింద ముక్కలయ్యే బదులు లేత అక్షరాల మధ్య తల దాచుకునే అదృష్టం ఆ ఆకుకు కలిగింది.

పాదాల క్రింద ఆకుల ధ్వనిని వింటూ, ఆలోచిస్తూ వెళుతుంటే మొబైల్‌లో అందిన సమాచారం మరో పండుటాకు రాలిపోయిందని. 99 ఏళ్ల వయస్సులో కుష్వంత్ సింగ్ మరణించడం ఒక అసహజమైన సంఘటన ఏమీ కాకపోవచ్చు. కాని ఆయన మరణంతో ఒక చరిత్రతో సంబంధం ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి గతించినట్లయింది. లాల్‌కృష్ణ అద్వానీ, కుల్దీప్ న య్యర్, మన్మోహన్ సింగ్, కుష్వంత్ సింగ్ వీరందర్నీ ఒక చరిత్ర కలుపుతుంది. అది దేశ విభజనకు చెందిన చరిత్ర. వీరందరూ దేశ విభజనకు పూర్వం జన్మించారు. ఆ తరం పండుటాకులన్నీ ఒక్కొక్కటీ రాలిపోతున్నాయి. వీరందరిలో కుల్దీప్ నయ్యర్, కుష్వంత్ సింగ్ ప్రత్యేక తరగతికి చెందిన వారు. వారు విభజన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు, వాటి గురించి రాసిన వారు. అందరికంటే 99 ఏళ్ల కుష్వంత్ సింగ్ సీనియర్. ఆయన కుల్దీప్‌లా కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు, రచయిత, కవి హృదయం ఉన్న వ్యక్తి.

కుష్వంత్ సింగ్ లాహోర్‌లో ఏడేళ్లు లా ప్రాక్టీసు చేశారు. విభజన తర్వాత కూడా అదే కొనసాగించి ఉంటే దేశంలో ప్రముఖ న్యాయవాదిగానో, న్యాయమూర్తిగానో కొనసాగేవారు. లండన్, పారిస్ తదితర నగరాల్లో రాయబార కార్యాలయాల్లో, యునెస్కోలో పనిచేసే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అదే కొనసాగించి ఉంటే ఆయనొక ప్రముఖ దౌత్యవేత్తగా మారి ఉండేవారు. ఆయన తండ్రి ఢిల్లీప్రభుత్వంలో ఉన్నతాధికారి. అనేక వ్యాపారాలున్నవారు. అందులో ప్రవేశించినా ఆయనొక ప్రముఖ వ్యాపారి అయ్యేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇవన్నీ తృణీకరించి,రచయితగా, జర్నలిస్టుగా జీవితం కొనసాగించాలనుకున్నారు. జీవితాంతం తన రచనలపైనే బ్రతికారు. కవులు, కళాకారులు, రచయితల మధ్య జీవితాన్ని గడిపారు.

కుష్వంత్ సింగ్ రచనలు చాలా ఆలస్యంగా మొదలు పెట్టారు. లండన్‌లోని భారతీయ రాయబార కారాలయంలో పబ్లిక్ రిలేషన్ అధికారిగా ఉన్నప్పుడు ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్.కె.నారాయణ్‌లను చదివిన తర్వాత తానెందుకు రాయకూడదని అనుకున్నాడు. మొదట రాసిన మార్క్ ఆఫ్ విష్ణు అనే చిన్న కథల సంకలనంతో ఆయన రచయితగా రంగప్రవేశం రాశారు. ఆ తర్వాత సిక్కుల చరిత్ర రాశారు. తర్వాత దాదాపు 40 ఏళ్ల వయస్సులో దేశ విభజనపై మొట్టమొదటి సంచ లన నవల ట్రైన్‌టు పాకిస్తాన్ రాశారు. అంతే, రచయితగా ఆయన స్థానం సాహిత్య ప్రపంచంలో స్థిరపడిపోయిది. ఆకాశవాణిలో విదేశీ సర్వీసెస్‌లో ఉన్న్పపుడు నిరాద్ సి చౌదరి, రుత్ జాబాల, మనోహర్ మల్గోంకర్ మొదలైన రచయితలతో పరిచయం ఆయనకు రచనపై ఆసక్తి కలిగించింది. అంతమాత్రాన కుష్వంత్ సింగ్‌కు అంతకుముందుసాహిత్యంపట్ల అభిరుచి లేదని కాదు. ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు లాహోర్ కాలేజీలో రెండేళ్ల సీనియర్. గాలిబ్ ఆయన అభిమాన కవి. మాటిమాటికీ ప్రముఖ ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వాన్ని ఉటంకించకుండా కుశ్వంత్ సింగ్ ఉండలేరు.

1970567_10152240904637088_1438515080_n
దాదాపు 20 ఏళ్ల క్రిందట ఎపి టైమ్స్ కోసం ఆయనతో కాలమ్ రాయించేందుకు వెళ్లినప్పుడు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ కొంతమంది సాహితీ మిత్రులను కూడా తీసుకువెళ్లేవాడిని. స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటికీ డబ్బుల విషయంలో మాత్రం చాలా కరుకుగా ఉండేవారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన తిట్లను భరించాల్సిందే. అప్పటికే ఆయన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడుగా ఆయన తనదైన ముద్ర వేశారు. బంగ్లాదేశ్‌లో నరహంతకుడు టిక్కాఖాన్, పాక్ నియంత జియాఉల్‌హక్ మొద లైన వారి ఇంటర్వ్యూలు, కొన్ని పరిశోధనాత్మకమైన వ్యాసాల ద్వారా వీక్లీలో జర్నలిజంస్థాయిని ఆయన పెంచారు. వీక్లీ సర్క్యులేషన్ 80 వేలనుంచి 4 లక్షలు దాటేలా చూశారు. ఆ తర్వాత ఏ వీక్లీ అంత సంచలనం సృష్టించలేదు. అయితేనేం, వీక్లీసంపాదకుడుగా ఎమర్జెన్సీని నెత్తికెక్కించుకుని, సంజయ్ మారుతి కార్లఫ్యాక్టరీ గురించి సానుకూల వార్తలు రాసి తాను సర్కార్ పాదాల క్రింద తివాచీగా మారారు. దాని వల్ల ఇందిర రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తొలుత నేషనల్ హెరాల్డ్ సంపాదక పదవి, ఆతర్వాత రాజ్యసభ సీటు, హిందూస్తాన్ టైమ్స్ సంపాదకుడి పదవీ దక్కాయి. మేనకాగాంధీ ఆధ్వర్యంలోని సూర్య పత్రికకు కూడా సంపాదకుడుగా కొన్నాళ్లు వ్యవహరించారు. పద్మభూషణ్  దక్కించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌ను విమర్శించి ఆయన తన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇవ్వకపోతే, రాజ్యసభలో తనకు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌నే తీవ్రంగా విమర్శించకపోతే కుష్వంత్ సింగ్‌ను ఏ పంజాబీ క్షమించి ఉండేవారు కాదు.

ఎన్ని కక్కుర్తి పనులకు పాల్పడితేనేం, కుష్వంత్ సింగ్‌లో అంతర్గతంగా రచయిత, కవి ఉన్నారని చాలా సార్లు రుజువైంది. దాని వల్లే ధిక్కార స్వరం ఆయనకు సహజసిద్ద లక్షణమైంది. తొలుత ఉన్నతపదవులను వదులుకుని కేవలంరచయితగా స్థిరపడాలనుకున్న కుష్వంత్ తర్వాత రాజీపడితేనేం, ఆ రాజీ గురించి ధైర్యంగా చెప్పుకున్న వ్యక్తి. హిందూమతతత్వాన్ని, గుజరాత్ అల్లర్లను, అద్వానీ రథయాత్రను తీవ్రంగా విమర్శించిన కుష్వంత్ జీవితపు విలువలను ప్రేమించారు. యదాలాపంగానైనా ధిక్కార స్వరాన్ని వినిపించకుండా ఉండలేకపోయారు. దేవుడి ఉనికిని, ఆత్మలను ప్రశ్నించకుండా ఉండలేకపోఆరు. గత ఆరుదశాబ్దాలుగా ఆయన ధారావాహికంగా ఏదో రాస్తూనే ఉన్నారు. వ్యంగ్యం, హాస్యం మేళవించినప్పటికీ ఆయన రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. ఆయన వ్యాసాల్లో స్వేచ్చా ప్రియత్వం స్పష్టంగా కనపడుతోంది. అందుకే ఫైజ్ లాంటి కవులు ఆయనకు ఆప్తబంధువులయ్యారు.

నా జైలు గదిలో కాంతి పేలవమై
రాత్రి ప్రవేశించినపుడు 
నీ నల్లటి కేశాల్లో నక్షత్రాలు
మెరుస్తున్నట్లనిపించింది. 
నన్ను కట్టేసిన గొలుసులు
కాంతిలో మెరిసినప్పుడు 
ఉదయపు కాంతిలో
నీ ముఖం వెలిగిపోవడాన్ని చూశాను..

అన్న ఫైజ్ అహ్మద్ కవితను కుశ్వంత్ ఆయన మరణానంతరం రాసిన వ్యాసంలో ఉటంకించారు. జైలు జీవితం తనను మళ్లీ ప్రేమలో పడేసింది.. అని ఫైజ్ అన్నట్లుఆయన పేర్కొన్నారు.

భింద్రన్ వాలే బృందం వెంటాడినా, 1984 లో జరిగిన సిక్కుల ఊచకోతలో రాజ్యసభ సభ్యుడుగా ఒక దౌత్యవేత్త ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చినా, మృత్యువుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు. తన మృత్యువుపై తానే కథ రాసుకున్న వ్యక్తి కుశ్వంత్. మనిషి విశ్వాసానికి సంకేతాలు కావాలా? మృత్యువు సమీపించినప్పుడు అతడి పెదాలపై చిరునవ్వు చూడు.. అని ఇక్బాల్ రాసిన కవితను ఆయన అనేక సందర్భాల్లో ఉటంకించారు.

అవును.. కుశ్వంత్ రాలిపోయాడు. పండుటాకులా రాలిపోయాడు. ఉన్నట్లుండి ఒక సుడిగాలి ప్రవేశించింది. ఆ ఆకు నేలమీద పడీ పడగానే మట్టిని స్ప­ృశించి, గాలిలో తిరుగుతూ, తిరుగుతూ ఎక్కడికో అంతర్ధానమైంది. రాలిపోయాక కూడా పాదాలక్రింద నలిగి వ్రక్కలు కావాల్సిన ఆకు కాదది.

-కృష్ణుడు

రేఖాచిత్రం: శంకర్

On Being Called a Film Critic…!

unnamed
ఏరా ఇంత ఆలోచిస్తూ సినిమాని అసలు ఎంజాయ్ చేశావా?” అన్నాడు మా అన్నయ్య ఆశ్చర్యపోతూ.
ఒక్క క్షణం ఆలోచించి…
“ఏమో…అలా ఆలోచిస్తూనే నేను సినిమాని ఎంజాయ్ చేస్తానేమో!” అన్నాను నేను. 
డిగ్రీ మూడో సంవత్సరంలో అనుకుంటాను, అప్పటికి లిటరరీ థియరీలు, ఫిల్మ్ క్లబ్ లో ప్రపంచ సినిమాలూ చూసి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న టైం అది. సినిమాని ఒక లిటరరీ టెక్స్టులాగా తీక్షణంగా చూసి, ఆలోచించి, అర్థాలుతీసి, విశ్లేషించకపోతే సరైన జస్టిఫయబుల్ అనుభవంలాగా తోచని కొత్తబిచ్చగాడి బిహేవియర్ సమయం అది. మా అన్నయ్య మాత్రం చల్లగా (జాలిగా అని నా డౌట్) “ఇవివి సత్యనారాయణ సినిమాకి ఇంత అనాలిసిస్ అవసరమా?” అని తేల్చిపారేసిన జ్ఞానోదయపు క్షణం అది.
కానీ ఎందుకో అలవాటుపోలేదు.
సత్యజిత్ రే, ఘటక్, శ్యామ్ బెనెగల్, మణికౌల్, అకిరాకురసోవా, మాజిది మాజిది లాంటి మాస్టర్స్ ని చూశాక మైండ్ లో ఏవో కొన్ని నరాలు మళ్ళీ అతుక్కోకుండా తెగిపోయాయనుకుంటాను. అప్పటివరకూ చూసి ఎంజాయ్ చేసింది ఏదో సిల్లీ ట్రివియల్ గ్రాటిఫికేషన్స్ లాగా అనిపించడం మొదలయ్యింది. అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని సినిమాలు తప్ప మిగతావి అంతగా గౌరవప్రదంగా అనిపించడం మానేసాయి.
దానికి యాంటీడోట్ యూనివర్సిటీలో పడింది.
ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. ఫిల్మ్ అప్రిసియేషన్, ఫిల్మ్ క్రిటిసిజం, అండర్ స్టాండింగ్ సినిమా సబ్జెక్టులు శ్రధ్ధగా చదవడంతో పాటూ బాలకృష్ణకి పిచ్చఫ్యాన్. దానికి తోడు, ఒకటిన్నర గంట ఉండే ఇంగ్లీష్ సినిమాకి నలభైరూపాయల టికెట్టు పెట్టి చూడటం “గిట్టుబాటు కాదు” అని, కేవలం తెలుగు, హిందీ సినిమాలు మాత్రమే చూడటానికి ఇష్టపడే ఒక ఇంట్రెస్టింగ్ నమూనా.
మేమెప్పుడైనా సరదాగా ఏడిపిస్తే, “యూ బ్లడీ ఎలీటిస్ట్ ఫెలోస్! లెట్ మీ ఎంజాయ్ మై కైండ్ ఆఫ్ సినిమా” అనేవాడు.
కొంచెం సీరియస్గా కల్చరల్ స్టడీస్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫర్ డెవలప్మెంట్ లాంటి సబ్జెక్టులు కలగలిపి చదువుతూ ఉంటే మా బాలకృష్ణ ఫ్యాన్ ఫిక్సేషన్ ఏమిటో, మేము నిజంగానే ఎలీటిస్టులం ఎలా అయ్యామో అర్థమయ్యింది.
హైబ్రో, లోబ్రో కల్చర్ల పాలిటిక్స్ మొదలు, సినిమా అనే కొత్త మతం ఇమేజెస్ తో మైండ్ ని ఎంతగా మానిప్యులేట్ చేస్తోందో తెలుసుకోవడంతో పాటూ, “టేస్ట్” పేరుతో మనలోనూ పెరిగే ప్రెజుడిస్ లో ఆధిపత్యభావజాలం ఎంతుందో అదీ అర్థమయ్యింది.
కానీ ఏంచేద్దాం….
మనిషన్నాక నాలెడ్జిని పెంచుకుంటాడు. దాన్ని బట్టి క్రిటికల్ థింకింగూ అలవర్చుకుంటాడు.
కేవలం చూసి, స్పందించి ఆనందించడంతో తృప్తిపడకుండా, విశ్లేషించి-వివరించి సంతోషపడతాడు.
ఎవడి జ్ఞానాన్ని బట్టి వారి గ్రాటిఫికేషన్. ఎవరి అండర్సాండింగుని బట్టి వారి అనాలిసిస్.
అందుకే క్రిటిసిజంలో…ముఖ్యంగా పాప్యులర్ ఆర్ట్ అయిన ఫిల్మ్ క్రిటిసిజంలో ఆబ్జక్టివిటీ అనేదానికి పెధ్ధప్రాముఖ్యతలేదు.
film_critic_1294385
ఒకే సినిమాకి పది వేరు వేరు రివ్యూయర్ల అభిప్రాయాలు పదిరకాలుగా ఉండొచ్చు. అంతాకలిపి కొన్ని సినిమాలకి ఒకటే కావొచ్చు. రేటింగుల్లో తేడాలుండొచ్చు. ఈ మధ్యకాలంలో బ్లాగులు, ఫేసుబుక్కూ, ట్విట్టర్ల పుణ్యమా అని ఆడియన్స్ రివ్యూలు క్షణక్షణం అప్డేట్స్ లాగా వచ్చేస్తున్నాయ్. దాన్నీ ఎవరూ ఆపలేం. చూసిన ప్రతివారికీ అభిప్రాయం చెప్పే హక్కుంటుంది. కాకపోతే “క్రిటిక్” అనేవాడు(అనుకునేవాడు/ఎవడో వాడు క్రిటిక్ అని చెప్పినవాడు) చెబితేమాత్రం కౌంటర్ అటాక్ లు ప్రారంభం అవుతాయి.
వాడేదో సినిమాకి పెద్ద ద్రోహం చేసేస్తున్నాడనే ఫీలింగ్. అభిప్రాయాల మీద క్రిటిక్ అనేవాడేదో గుత్తాధిపత్యం తీసుకున్నట్లు. అన్నమాటకు ఆధారాలు సరఫరాచేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. “చెత్త అన్నావ్! ఇప్పుడు ఆ సినిమా హిట్ అయ్యింది” అనో, “బాగుంది చూడండి అన్నావ్! కలెక్షన్లు నిల్ అంటా” అని ఎకసెక్కాలు పోతుంటారు. క్రిటిక్ అనేవాడు సినిమా చూస్తుండగా తను పొందిన అనుభవాన్ని, తనకున్న జ్ఞానాన్ని కలగలిపి సినిమా ఎలాంటిది అనే నిర్థారణకు వస్తాడుగానీ, ఆడియన్స్ అనే ఒక కాల్పనిక యూనిట్టు ఆ సినిమాకు ఏ విధంగా రియాక్టు అవుతుంది అనే బేరీజు వెయ్యడానికి రాడు. సినిమాపై తనకున్న అవగాహనతో సినిమా లోని మెరిట్స్ ని, లోటుపాట్లని ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తాడేగానీ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనే ప్రిమొనిషన్ కోసం రాడు.

షో పూర్తయిన గంటలోగా రివ్యూ రాయాల్సి వస్తున్న ఈ కాలంలో అంతకన్నా ఆలోచించే ఓపికా, సమయం సోకాల్డ్ క్రిటిక్ కి ఉండవు. ఫ్యామిలీ హీరోల అజెండాల్ని, బిగ్ బడ్జెట్ సినిమాల ఇంట్రెస్టుల్ని, ఓవర్సీస్ రైట్స్ రేట్లలో తేడాల్ని నిర్దేశించే క్రిటిక్స్ ని వదిలేస్తే మిగతావాళ్ళు కేవలం సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.

ప్రతి ప్రేక్షకుడూ పొటెన్షియల్ రివ్యూయర్/క్రిటిక్ అవుతున్న ఈ సమయంలో “సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్” అంటూ సినిమాల గురించి రాసేవాళ్లను ఆరళ్ళు పెట్టడమూ చెల్లదు. వీలైతే మీకున్న జ్ఞానంతో మీ రివ్యూ మీరు రాసుకోండి. అప్పుడు మీరూ క్రిటిక్ అవుతారు. సింపుల్.

-కత్తి మహేష్ కుమార్

పాత చొక్కా: వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

Velturu2

అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

స్నేహితుల తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

 

1

IMG_6555

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే!

కవిత్వాన్ని గురించి మొత్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సమస్య మామూలే! కాని,  విడివిడిగా వొక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు  చెప్పే మాటలు కూడా నాకు అంతగా తృప్తినివ్వవు. కవిత చదివాక కలిగే వొకలాంటి తృప్తినీ, ప్రశాంతతనీ వచనంలో రాయలేకపోయినా, కనీసం కొంత మాట్లాడితే బాగుణ్ణు అనుకొని, గత కొద్ది కాలంగా కొన్ని కవితల ముందు ఎంతో కొంత నేర్చుకోవాలని తపించే విద్యార్థిలా నిలబడి, మాటలు కూడదీసుకుంటున్న సమయంలో అనుకోకుండా వర్మ రాసిన ఈ “పాతచొక్కా” కవిత తారసపడింది.

పాత చొక్కా…!

కవిమిత్రుడు హెచ్చార్కె కలిసినప్పుడల్లా తనకీ నాకూ జరిగే అనేకానేక సంభాషణల్లో ఈ పాత చొక్కా వొకటి. ఖమ్మంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హెచ్చార్కె తరచూ విప్లవ రచయితల సంఘం బాధ్యుడిగా ప్రసంగాలు ఇవ్వడానికి వస్తూండే వాడు. అతని ప్రసంగాలంటే నాకు ఇష్టంగా వుండేది. అంతకంటే ఎక్కువగా – అతనెప్పుడూ వేసుకొచ్చే వొక నీలంరంగు చొక్కా అంటే మరీ  ఇష్టంగా వుండేది. టీనేజర్ని కదా, నా జర్నీ కొంచెం అలాగే వుండేది! నాకు కూడా కచ్చితంగా అలాంటి నీలం రంగు చొక్కానే – సన్నటి వైట్ చెక్స్- తో వుండేది.  ఇద్దరమూ ఆ చొక్కాల మీద నిజంగానే   ఇష్టంగానే  మాట్లాడుకునే వాళ్ళం, విప్లవ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి!

కొంత కాలానికి మా స్నేహం పాతబడింది, ఆ నీలం చొక్కా మాదిరిగానే!

కాని, ఆ జ్ఞాపకం వుందే, అది ఇప్పటికీ వర్మ చెప్పినట్టు-  “మనసు కొక్కేనికి వేలాడుతూనే” వుంది ఎప్పటికప్పుడు  కొత్తబడుతూ!

ఇప్పుడు ఈ కవిత  చదివాక వెంటనే అనిపించింది, అసలు ఇన్నాళ్ళుగా నాతో వున్న, నాలో వున్న ఈ అనుభవాన్ని నేనే  ఎందుకు రాయలేకపోయానా అని. బహుశా, మంచి కవిత అనేది మనలోని అలాంటి వొక అశక్తతని కూడా కొన్ని సార్లు గుర్తుచేస్తుందేమో!

ఈ  కవిత మొదట చదివిన కొద్దిసేపటికి, ఆ తరవాత ఇంకో రెండు సార్లు చదువుకున్నాక ఇంకా అనిపించింది, రాసినా  నేను  ఈ కవిలా రాయలేను అని! మరీ దగ్గిరగా వుండే అనుభవం రాయడం ఎంత కష్టం!?

వొక  మంచి కవిత చేసే యింకో గొప్ప పని ఏమిటంటే — అది మన మనసు తెలిసో తెలియకో విధించుకున్న కొన్ని పరిమితుల్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పరిమితుల్ని తెగ్గొట్టి ఆ అనుభవాన్ని తిరిగి ప్రేమించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది!

అందరమూ అనుకున్నట్టు- ఇలాంటి పని చేసే కవిత్వానికి, ఆ శక్తి ఆ కవిత్వ వాక్యం నించి మాత్రమే రాదు. గొప్ప కవిత్వ వాక్యాలు రాసే కవులు మనకి చాలా మందే వున్నారు. కాని, వాక్యాలు ముందు పుట్టి తరవాత భావాన్ని చొక్కాలా వేసుకునేది మంచి కవిత్వం కాదని  ఖాయంగా చెప్పగలను.

2

ఈ కవితలో ప్రత్యేకించి చెప్పాల్సింది: metaphorization – పదచిత్రీకరణ.  సాధారణంగా చలనమున్న పదచిత్రాల్నీ(dynamic images),  ప్రతీకల్ని (ఉదాహరణకు: సెలయేరు) తీసుకోవడంలో వున్న సౌలభ్యం చలనరహితమైన పదచిత్రాల్ని(static images), ప్రతీకల్ని (ఉదాహరణకు: ఈ కవితలో పాత చొక్కా) తీసుకోవడంలో లేదు. ఇక అలాంటి చలనరహిత ప్రతీకల్ని చలనశీలమైన భావాల్ని పలికించడానికి ప్రయత్నిస్తే  చాలా సందర్భాల్లో కవిత శిల్పం దెబ్బతింటుంది. ఆ ఇబ్బందిని గట్టెక్కడం శిల్ప పరంగా ఈ కవితలో వొక నిర్మాణ  విశేషం.

ఆ ఇబ్బందిని గట్టెక్కడానికి ఈ కవి  చేసిన పనేమిటంటే, ఆ చలనరహితమైన ప్రతీకలూ వస్తువుల వెంటనే చలనశీలమైన వొక అనుభూతిని ఆసరా తీసుకున్నాడు.

ఉదాహరణకు ఇక్కడ “బొత్తాం” “చినుగు” చూడండి:

  1. బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ…(బొత్తాం – కళ్ళు చిట్లించి, ప్రేమ దారంతో  అమ్మ)
  2. స్నేహితుల తోపులాటలో చినిగి… ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న (చినుగు – దాన్ని కుట్టే నాన్న)

 

ఈ continuity ని  చివరంటా సాధించింది కవిత.

రెండో నిర్మాణ విశేషం: కవి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న క్రియా పదాలు. కవితలో రెండో పంక్తి లోని “వేలాడుతున్న” అనే పదం మొదలుకొని, చివరి పంక్తిలో వున్న “దాస్తున్న” దాకా క్రియ అనేది నిష్క్రియగా (dysfunctional)  కాకుండా, చాలా నిర్దిష్టమైన పని (very functional) కోసం వుపయోగించడం ఈ కవితలో బలంగా కనిపిస్తుంది.

మూడో విషయం: తన అనుభూతిని కవి ఎలాంటి frame నించి imagine చేస్తున్నాడో, ఆ ఊహకి ఎలాంటి రూపమిస్తున్నాడో అన్నదాన్ని బట్టి కూడా ఆ కవిత గుణం తెలుస్తుంది. అంటే, కవిత మొత్తంలో గుండె చప్పుడూ, ఆలోచనల అలజడీ కలగలిపే వాక్యాలు కొన్ని వుంటాయి. ఆ వాక్యాల్లో కవి పొదుపుగా దాచుకున్న అనుభూతి వినిపిస్తుంది. ఈ కవిత మొత్తం సాంద్రతని వొడిసిపట్టుకున్న వాక్యం నాకు అర్థమైనంత మటుకు ఇది:

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

3

ప్రతి బతుకు పుస్తకంలో అనేక  జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు.  అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

ఆ కొలమానంతో ఈ  కవిత – a celebration of the retrieval of a  memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

 – అఫ్సర్

పున్నాగపూల పరిమళం !

2(1)

ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి.
‘‘కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలేయాలి. కొన్ని పుస్తకాలని చదివి జీర్ణం చేసుకోవాలి.’’  అని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న జ్ఞాపకం. అలా చదివి జీర్ణం చేసుకోవల్సిన పుస్తకం ఎదురైతే మనం మనలాగా ఉండలేము కదా! అందుకే మరో వైపు మిత్రులతో ఈ సంభాషణ.
‘‘దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి తన అవసరాల కోసం వస్తువులను సృష్టించుకొన్నాడు. వస్తు మయ ప్రపంచంలో మనిషి మస్తుగా కూరుకుపోయిన తరువాత సాటిమనుషులను తనను సృష్టించిన దేవున్ని ప్రేమించడం మానేసి వస్తువులను ప్రేమించడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మనిషి మనిషిలాగా లేకుండా ఒక వస్తువులాగా మారిపోయాడు.’’ అని తరచూ ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఉపన్యసిస్తూఉంటారు.
ఒక వస్తువుగా మారిన మనిషి మరలా మనిషిగా మారాలంటే ఏం చేయాలి? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆహ్లాదంగా ఉంచడానికి మనిషిలో ఎలాంటి మెటామార్ఫసిస్‌ జరగాలి? అతడి అంతరంగంలో ఎన్ని యుద్ధాలు జరగాలి? ఈ సంగ్రామంలో ఎన్ని సార్లు క్షతగాత్రులవ్వాలి?
”The Greatest Discovery of My Generation is that Human beings by changing the inner attitudes of their needs can change the outer aspects of their lives”    అని కదా హెన్రీజేమ్స్‌ అన్నది. తమ తమ సోకాల్డ్‌ అవసరాల అంతర్గత దృక్పధాలను ఎలా మార్చుకోవాలి. అలా మార్పును పరిపూర్ణంగా పొందే ప్రాసెస్‌ ఎంత హృద్యంగా, ఎంత సహజంగా జరగాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే నేను ఇటీవల చదివిన పుస్తకం. ఆ పుస్తకం పేరు పున్నాగపూలు. ఒక తెలుగు నవల. రచయిత్రి జలంధర.Jalandhara Garu
పున్నాగపూలని ఒక నవల అనడం కంటే అనేకానేక బాధిత వ్యక్తిత్వాలు అనే పున్నాగపూలను మార్పు కోసం చేసే ప్రయత్నం అనే దారంతో గుదిగుచ్చి పాఠకుడి మెడలో వేసిన వసివాడని హారం అంటే బాగుంటుంది.
రాధ ఒక అందమైన మంచి అమ్మాయి. మంచి ఇల్లాలు. మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్‌ రోల్‌ లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారయిపోతారు. అట్లా రూపుదిద్దుకున్న ఇల్లాలు రాధ.
సదరు రాధ తన భర్త రాజారావుకి జబ్బుచేస్తే జి.కె. హాస్పిటల్స్‌లో చేర్పించడానికి వెళుతుంది. అక్కడ హాస్పటల్‌ లో తనను తాను పూర్తిగా కనుగొని, సంపూర్ణమైన వ్యక్తిగా తయారు కావడం ఈ నవల యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇలా మారడం అనేది ఒక రోజులోనే, ఒక రాత్రిలోనో, ఒక క్షణం లోనో జరిగిన మెటామార్ఫసిస్‌ కాదు. హాస్పిటల్‌కి వచ్చే రక రకాల వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళకు ఎదురైన సమస్యలు, వాళ్ళు ఎన్నుకున్న పరిష్కారాలు ఇవన్నీ రాధను సంపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా రాధ ఆలోచించడం నేర్చుకుంటుంది.
ఈ క్రమంలో జలంధర తనదైన స్వరంతో చాలా విషయాలు మాట్లాడింది.
‘‘పిల్లలను పెంచుతూ మాటలు నేర్పిస్తాము. పాటలు నేర్పిస్తాము. టేబుల్‌ మేనర్స్‌ నేర్పిస్తాము. ఆలోచించడం మాత్రం చాలా తక్కువ సార్లు నేర్పిస్తాము. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగిచూడగలమో, ఆ తలపు తీయడమెలాగో మాత్రం నేర్పించము. తెలివితేటలు నేర్పించే చదువు వేరు. వివేకము జీవితానికి అది ఇచ్చే ఎరుక వేరు. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. కాని నేర్పించము’’. అంటుంది జలంధర.
నిజమే! మన పిల్లలకి మనం ఆలోచించడం నేర్పిస్తున్నామా? గర్భస్త పిండంగా ఉండగానే కార్పోరేట్‌ స్కూలుకి డొనేషన్‌ ఇచ్చి సీటు రిజర్వు చేసుకొంటాము. 3వ ఏట నుండే, వీలుంటే ఇంకా ముందే ప్రీ స్కూల్‌లకి పంపిస్తాము. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించడమే నాణ్యమైన విద్య అందించడం అనుకుంటాము. కానీ ఆ విద్య పిల్లలను మరమనుషులుగా మారుస్తున్నదని గుర్తించము. తీరా వాళ్ళు మనం ఆశించినట్లుగా తయారవకపోతే నింద మాత్రం మొత్తం వ్యవస్థ మీద వేస్తాము.
ట్రూత్‌ కెనాట్‌ బి టాట్‌
టీచింగ్‌ మీన్స్‌ హెడ్‌ టు హెడ్‌
ట్రూత్‌ ఈజ్‌ ట్రాన్స్‌మిషన్‌
ఫ్రం హార్ట్‌ టు హార్ట్‌
అన్న విషయం మనకే తెలియదు. మనం పిల్లలకి ఏం అనుభవం లోకి తీసుకొనివస్తాము. పై పెచ్చు మన మిడి మిడి జ్ఞానంతో వాళ్ళ ఆకుపచ్చటి లోకాన్ని పాడుచేస్తాము. శరీర శాస్త్రం ప్రకారం మనిషికి ఒక మెదడు ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా మనిషికి హెడ్‌ బ్రెయిన్‌, బాడి బ్రెయిన్‌ అని రెండు రకాల మెదడులు పనిచేస్తాయి.ఈ రెండిరటిని సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరు వేరని కొంతమందిని చూస్తే తెలుస్తుంది. మన లోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచనా స్రవంతులు తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల మెదడులు, వాటి ప్రభావం మన మర్చిపోకూడదు.
పసిపిల్లలు సాధారణంగా తమ బాడీ బ్రెయిన్‌ చెప్పిన మాటను వింటారు. వాళ్ళకు ఇష్టం లేనివి వద్దు అనుకుంటారు. నచ్చని పిల్లలను దగ్గరకు రానివ్వరు. మనం మన పెంపక దోషంతో ముందు పిల్లల ఇష్టా ఇష్టాలను అర్ధం చేసుకోకుండా మనకు మంచిది అన్నది. వాళ్ళమీద రుద్దుతారు. మన ప్రవర్తన, మన మాట వలన ఎదుటివాళ్ళు ఏం అనుకుంటారో, నిజం చెప్తే అంటూ మెల్లగా పిల్లలను ఆ బాడి బ్రెయిన్‌ విస్మరించి హెడ్‌ బ్రెయిన్‌తో ఆపరేట్‌ చేయించడం నేర్పిస్తాము.
మన బాడీ బ్రెయిన్‌ మన గురించి నిజాలు చెప్తుంది. మన హెడ్‌ బ్రెయిన్‌ నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్‌ అవుతుందో నీ నుండి ఏం కోరుకుంటుందో చెప్తుంది. మన అసలు భరించలేని మనుషులను ఒప్పుకొని భరిస్తే మిగతా ప్రపంచం మనల్ని సహన శీలి అని, మంచి వ్యక్తి అంటారనే ఆలోచనతో వాళ్ళను భరిస్తాము. ఈ భరించడం వెనుక హెడ్‌ బ్రెయిన్‌ ఉంటుంది. కానీ మన బాడి బ్రెయిన్‌ అనుక్షణం సన్నటి గొంతుకతో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది కాదు నీకు కావలసిందీ అని. బాడీ బ్రెయిన్‌ని ఎంత త్వరాగా మనం గుర్తిస్తే మనకది అంత త్వరగా మంచి గైడ్‌ అవుతుంది.
ఠాగూర్‌ అనే తెలుగు సినిమాలో శవాన్ని హాస్పిటల్‌కు తీసుకొని వస్తే నానా హడావుడి చేసి డబ్బు సంపాదించే డాక్టర్ని మన చూశాం. కాని ఈ జి.కె. హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్‌ కృష్ణ అలాంటి డాక్టర్‌ కాదు. ఒక పేషెంటు తన సంతోషం కొద్దీ కోటి రూపాయలు తెచ్చిఇస్తే ఆ డబ్బును తీసుకోకుండా చెడుమార్గంలో వచ్చిన డబ్బు చెడు వైబ్రేషన్స్‌ని కలుగజేస్తుందని తిప్పి పంపిస్తాడు. ప్రతి మనిషి ఇలాంటి హాస్పిటల్‌ ఒకటి మన దగ్గర ఉంటే ఎంత బావుంటుంది అనుకునేంత బావుంటుంది ఈ హాస్పిటల్‌. లోపలికి వెళ్ళగానే కనిపించే మొదటి బోర్డు మీదే ఇలా వుంటుంది.
Here the Patient understands that body heals, and not the Therapy  ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటానికి హాస్పిటల్‌లో రక రకాలు పద్దతులు అవలంభిస్తారు. ధ్యానం నుండి చిత్రలేఖనం దాకా. ఈ పద్దతులను చదువుతున్నపుడు మనం మొదట్లో ఆశ్చర్యపోతాం. కాని వాటి వెనుక ఉన్న రీజన్‌, తర్కము తెలిస్తే అద్భుతం అనిపిస్తుంది.
19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కేవలం నొప్పి తగ్గించడానికి మందు వేసుకొనే పద్దతి అమలు లోకి రాగానే వీలయినంత వరకు నొప్పికి కారణాలను అన్వేషించడం మనిషి మానేశాడు. ఎప్పుడైతే ఫిజికల్‌ పెయిన్‌ కి ఫిజికల్‌ లెవల్‌లో మాత్రమే కారణాలు వెతికి అంతర్లీనమైన కారణాలను కొంపలు అంటుకుపోతే తప్ప వెతకడం అనవసరం అనే స్థితికి వైద్యుడు, పేషెంటు ఇద్దరూ వచ్చేశారో అప్పుడే వైద్య రంగంలో మందులు పెరిగి నిజమైన వైద్యం తగ్గుముఖం పట్టింది. మనిషిలోగల అంతర్గమమైన శక్తికి ప్రాముఖ్యం తగ్గిపోయింది.
ఈ అంతర్గతమైన శక్తిని పునరుత్తేజితం చేయడానికే ధ్యానం. ఎఫర్మేషన్స్‌. ఎఫర్మేషన్స్‌ అనగానే మనకు మంత్రోపదేశం గుర్తుకొస్తుంది కదా. జలంధర ఇలా అంటోంది. ‘‘అర్దం చేసుకొని చదివితే అవన్ని ధ్యాన శ్లోకాలు. విజువైలేజేషన్‌ టెక్నిక్స్‌. సంకల్పాలు, స్తోత్రాలు, ఫల స్తుతులు, అఫర్మేషన్స్‌!’’ న చమాత్సార్యం, న లోభో, నాశుభామతి:’’ అని రోజు చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. వాటికి అర్దంతో పాటు సౌండ్‌, వైబ్రేషన్‌ కలిపి ప్రాక్టీస్‌ చేసినపుడు మన లోపల, మన ఆరాలోను, చుట్టుప్రక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది. అలా నీ వైబ్రేషన్స్‌కి తగిన మంత్రం ఇచ్చి నీ వైబ్రేటరీ లెవెల్స్‌ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం. కొంత మంది గురువులు తాము సిద్ది పొందిన మంత్రం ఇవ్వగలరు. కాని నీ జన్మకు ఏది కావాలో తెలుసుకొని, నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి, తన ఆత్మ శక్తితో నిన్ను నిరంతంర గైడ్‌ చేస్తూ జన్మ జన్మలకు కాపాడుకుంటూ వచ్చే గురువు దొరికితే అద్భుతం’’
నిజం. శ్రీ చక్రార్చన నిత్యం చేసేవాళ్ళు, గురువు దగ్గర మంత్రోపదేశం పొంది నిత్యం ధ్యానించేవాళ్ళ చాలామంది మొహాల్లో కనపడవలసినంత ప్రశాంతత కనపడదు. కొద్ది మంది బాబాలు గురుదేవులు కూడా ఇందుకు మినహాయింపుకాదు.
ఇక్కడ నా వయక్తిక అనుభవాన్ని ఒక దానిని చెప్తాను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు పనిచేస్తున్న బ్రాంచికి బదిలీ అయి వచ్చాను. మొదటి వారం రోజులలోనే ఒక వంద మంది దాకా నన్ను బాబాగారి దర్శనం అయిందా అని ప్రశ్నించారు. అప్పటిదాకా ఒక బాబా ఆ ఊళ్ళో ఉన్నాడని తెలుసును కాని, అంతగా జనాన్ని ప్రభావితం చేశాడని నాకు తెలియదు. పైగా ఆ బాబాగారు నిత్యాన్నదానం కూడా చేస్తారు. అప్పటికే పాల్‌ బ్రంటన్‌తో మొదలుపెట్టి చాలా పుస్తకాలు చదివి ఉండటం చేత బాబా అంటే అంతర్గతంగా ఉన్న ఉత్సుకతతో, ‘‘సత్సంగత్‌యే, నిత్సంగత్వం, నిత్సంగత్వవే నిర్మోహత్వం’’ అని భజగోవిందం శ్లోకం చదువుకుంటూ బాబా గారిని దర్శించుకుందామని ఒక మధ్యాహ్నం వేళ వెళ్ళాను. నేను వెళ్ళే సరికే అన్న దానం కార్యక్రమం జరుగుతోంది. అది అయిపోయింతర్వాత బాబాగారి దర్శన బాగ్యం కలిగింది. బాబా అంటే ఆశ్రమ వాతావరణం ఉంటుందనుకున్నాను. కాని అది మూడంతస్తుల బిల్డింగు. ఏదో కనస్ట్రక్షన్‌ వర్కు జరుగుతున్నది. బాబాగారు పనివార్లకు సూచనలు ఇస్తున్నారు. ఆయన కుడిచేతి రెండు వేళ్ళ మధ్య నిత్యాగ్ని హోత్రంలాగా రగులుతున్నది సిగరెట్టు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బాబాగారి కాళ్ళమీద పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న సాయిరాం స్వీట్స్‌ ప్యాకెట్టులోనుండి తీసి తలా ఒక లడ్డూ ఇచ్చారు. దాన్నే మహా ప్రసాదం అనుకొని అందరూ తీసుకొన్నారు.
బాబా అన్న మాట వినగానే, ఆశ్రమానికి వెళుతున్నపుడు, నా మనసులో కౌపీనం కట్టుకొని కూర్చొని మౌన ముద్రలో ఉంటే, చుట్టూ చేరిన కోతులు అల్లరి చేస్తూ మహా చిరాకు పెడుతున్న ధ్యాన ముద్ర చెదరని మహా మౌని ముద్ర ఉంది. ఈ బాబా రూపు చూడగానే నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. ఇలాంటి బాబా ఎలాంటి ఎఫర్మేషన్స్‌ ఇస్తాడు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను మొదటి సారి కలిసిన బాబా ఉదంతం ఇది.
ఇప్పుడు మంత్రోపదేశం గురించి జలంధర రాసిన ఈ మాటలు చదువుతుంటే నాకు అనివార్యంగా ఈ బాబా గుర్తుకొచ్చారు.
ఐ లవ్‌ మై సెల్ప్‌, ఐ యాక్సెప్ట్‌ మై సెల్ప్‌. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ బలహీనతలు బలాలు అన్నింటితోనూ నిన్ను నీవు ఒప్పుకోగలగటం ఎంత కష్టమో ప్రాక్టీసు చేస్తుంటే కాని అర్ధంకాదు. ఎదుటి వారిని ప్రేమించగలిగిన వాళ్ళు చాలా మంది త్యాగాలు చేస్తూ అనాధలకు సేవలు చేస్తూ త్యాగమూర్తులుగా కనపడేవాళ్ళు చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు. తమను తాము భరించలేరు. అన్నింటిలోకి తనను తాను భరించడమే కష్టం అంటుంది జలంధర.
ఇలా ఈ నవల గురించి ఎంతయినా చెప్పవచ్చు. ఏ కథతో అయితే జీవింతంలోని ఒక భాగం అర్ధం అయినట్లు ఉంటుందో అది మంచి కథ అని పెద్దిభొట్ల  సుబ్బరామయ్యగారు ఒక సారి అన్నారు. అది నవలకు కూడా వర్తిస్తుంది. ఈ పున్నాగ పూలు ఒక సారి చదవండి. మీ మానసిక ప్రపంచంలో ఏదో ఒక తలుపు తప్పక తెరుచుకుంటుంది.
ఈ వ్యాసంలో చాలా మాటలు నావి కాదు. అవన్నీ జలంధరవి. అందుకే ఈ వ్యాసం జలంధరతో కలసి వంశీరాసిన వ్యాసమని మీరనుకుంటే నాక్కొంచెం తృప్తి.

—వంశీ

ఆ ఎండాకాలాలు రమ్మన్నా రావు కదా మళ్ళీ!

Photo0025

ఇటీవల దొంతమ్మూరులో నేను, మా అన్నయ్య, మేనల్లుళ్ళు భాస్కర్, చినబాబు

నా కంటే 13 ఏళ్ళు పెద్ద అయిన మా పెద్దన్నయ్య, పదేళ్ళు పెద్ద అయిన మా చిన్న అన్నయ్య ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుచేత మా తాత గారూ, బామ్మా గారూ వాళ్ళిద్దరినీ, కలిసి పెరుగుతున్న మా మేనత్తల కొడుకు అయిన  హనుమంత రావు  బావనీ చాలా గారాబం చేసే వారు.  అంచేత ఆ ముగ్గురూ కలిసి నానా అల్లరీ చేసే వారు… ట….అందులో నాకు బాగా జ్జాపకం  ఉన్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఒకటేమో మా చిన్నన్నయ్య ఎప్పుడూ సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయంలో మా నాన్న గారి గది పక్కనే ఉన్న ఒక పెద్ద నేరేడి చెట్టు ఎక్కి కూచునే వాడు. (ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా అస్సలు నేరేడి చెట్టు అనేదే చూడ లేదు. ఔట్ ఆఫ్ ఫేషన్ అనుకుంటాను.) ఎవరు పిలిచినా భోజనానికి వచ్చే వాడు కాదు.

ఇక అందరి భోజనాలు అయిపోయాక, మా బామ్మ గారు ఒక బంగారం తాపడం చేసిన వెండి గిన్నెలో పులుసూ, అన్నం కలిపి “ఒరేయ్ చిన్న బుజ్జీ,  రారా,  నీ కోసం బంగారం పులుసు చేశాను ..అంటే గుమ్మడి కాయ పులుసు అన్న మాట …నాకు ఆకలి వేస్తోంది రారా.” అని బతిమాలే వారు. మా తాత గారు “ఒరేయ్ ఇదిగో రా నీ కోసం సరి కొత్త అర్ధణా కాసు తెచ్చానురా” అని లంచం చూపించే వారు. అప్పుడు మా చిన్నన్నయ్య కిందకి దిగి భోజనం చేసే వాడు.

ఇక వాళ్ళు ముగ్గురుకీ..అంటే మా పెద్దన్నయ్య, చిన్నయ్యా, హనుమంత రావు బావా…  దీపావళి అంటే భలే ఇష్టం. ఇంట్లో తెలిస్తే మా నాన్న గారు తిడతారని మెయిన్ రోడ్డు  లో అప్పటి కాకినాడ లాండ్ మార్క్ అయిన సిటీ ఎంపోరియం ఎదురుగుండా ఉన్న వానపల్లి ప్రకాశ రావు కొట్టులో ఖాతా మీద .. ఐదారు వందలు పెట్టి బాంబులు, టపాసులు, తారాజువ్వలు వగైరాలు తిన్నగా బస్సులో దొంతమ్మూరు పట్టుకెళ్ళి పోయే వారు.  ఒక సారి, బహుశా తన పదిహేనేళ్ళప్పుడు,  ఒక పెద్ద బాంబుని , ఒక పెద్ద ఇత్తడి బిందె లో పెట్టి వైరు బయటకి కనెక్ట్ చేసి చెరువు గట్టు మీద పెట్టి పేల్చగానే ఆ చుట్టు పక్కల పాకల్లో ఉన్న నాలుగైదు ఆవులు, గేదెలు ఠపీమని గుండె ఆగి చచ్చి పోయాయి. మా పెద్దన్నయ్యకి రెండు చెవులూ గళ్ళు పడిపోయాయి. ఆ తరువాత జన్మంతా  వినికిడి లోపంతో ఇబ్బంది పడ్డాడు. నాకూ ఒక చెవి కి వినికిడి లోపం ఉంది కానీ ఎందుకో తెలియదు. అందుకే నేను ఎవరినీ మాట్లాడనియ్యకుండా. నేనే గడ, గడా వాగుతూ ఉంటాను….అని అనుకుంటాను.

మరొక విశేషం ఏమిటంటే, తను తెలివైన వాడే అయినప్పటికీ మా పెద్దన్నయ్య ఎస్.ఎస్.ఎల్.సీ లో ఒక సబ్జెక్ట్ లో పరీక్ష తప్పాడు. ఇక చస్తే మళ్ళీ చదవను అనీ, మళ్ళీ రెండో పరీక్షలకి వెళ్ళమని  బలవంతం చేస్తే గన్నేరు కాయలు తిని ఆత్మహత్య చేసుకుని చస్తాను అనీ అందరినీ బెదిరించాడు. అప్పటి యింకా మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. మా నాన్న గారు ఐదు వందల ఎకరాల వ్యవసాయం చేస్తూ, ప్రతీ వారం కాకినాడ-జేగురు పాడు-దొంతమ్మూరు-చిన జగ్గంపేట తిరగ లేక అలిసి పోతూ ఉన్నారు. అంచేత వారి సలహా మా నాన్న గారు మా పొలాలన్నీ మా పెద్దన్నయ్యకి అప్పగించేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇది సుమారు 1950 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత 1983 లో ఆయన పోయే వరకూ మా నాన్న గారు మా “లోకారేడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే శేరీ పొలం” వెళ్ళ లేదు.  పొలం యాజమాన్యం అంతా మా పెద్దన్నయ్య చేతిలో పెట్టేశారు.

నేను ఎస్.ఎస్.,ఎల్. సి లో ఉండగా ..అంటే 1960 లో కరప కరణం గారు శ్రీ చాగంటి సుబ్బారావు గారి రెండో కూతురు సుబ్బలక్ష్మి తో  మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. మా ఇంట్లో జరిగిన, నాకు బాగా గుర్తున్న, అతి సరదా అయిన మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఇప్పుడు (2014) మా పెద్దన్నయ్య పోయి ఏడాది దాటింది. మా పెద్ద వదిన గారు అప్పుడు ఎంత సౌమ్యంగా, అమాయకంగా, ఆప్యాయంగా, పొడుగ్గా ఉండే వారో ఇప్పుడూ అంతే! వారి పెళ్లి అయి కాపురం పెట్టేంత వరకూ మేము వేసవి శలవులకి ఎప్పుడు మా మేనత్త రంగక్కయ్య ఇంటికే దొంతమ్మూరు వెళ్ళే వాళ్ళం. నాకు అస్సలు జ్జాపకం లేదు కానీ బాగా చిన్నప్పుడు దొంతమ్మూరు లో రోజూ పొద్దున్నే నాకు స్నానం చేయించి మా బామ్మ గారి వంద కాసుల బంగారం గొలుసు వేసి గోడ మీద  నుంచి పక్కింటి వెలమ దొరల రాణీ గారికి అప్పజెప్పేవారుట.  ఎందుకంటే తెల్లగా, బొద్దులా ఉండే నేనంటే ఆవిడకి   చాలా ఇష్టంట. పైగా నా పేరే రాజా కదా! వాళ్లకి ఘోషా కాబట్టి ఎప్పుడూ బయటకి వచ్చే వారు కాదు. కానీ సాయంత్రం దాకా నన్ను వాళ్ళింట్లోనే  ఉంచేసుకునే వారుట.  పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి,   చంటబ్బాయి, బోడబ్బాయి అని వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండే వారు. వారింటి పేరు పోశిన వారో, పడాల వారో నాకు ఇప్పటికీ తెలియదు.   ఇటీవల కాకినాడ వెళ్ళినప్పుడు పని కట్టుకుని దొంతమ్మూరు వెళ్ళి, కూలిపోయిన మా  మేడ అవశేషాలతో ఉన్న స్థలమూ, చిన్నప్పుడు వెలమ దొరల రాణీ గారి ముచ్చట తీర్చడానికి నన్ను దాటించిన ఆ  గోడ దగ్గర  నేను మా సుబ్బన్నయ్య, ఆ మేడ/స్థలం నలుగురు వారసులలో ఇద్దరు … అనగా..మా హనుమంత రావు  బావ రెండో కొడుకు ప్రకాశు అనే చిన్న బాబు (అవును…మా తాత గారి పేరే!), ఆఖరి వాడు భాస్కర్ ల తో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఆ గోడ వెనకాల కనపడుతున్న ఆధునిక మేడ నన్ను పెంచిన రాణీ గారి ముని మనుమరాలిదిట. ఆ తలుపు తట్టే ధైర్యం నాకు లేక “మళ్ళీ ఇక్కడికి వస్తే గిస్తే అప్పుడు చూద్దాం లే” అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

పాత మకాం

పాత మకాం

నాకు అప్పటికి అక్షరాభ్యాసం జరిగిందో లోదో తెలియదు కానీ, ఒక సంగతి  మటుకు ఇప్పటికీ భలే గుర్తుంది నాకు. అప్పుడు దొంతమ్మూరు లో  నిజమైన పాఠశాల లేదు. కానీ చింతా జగన్నాథం అనే ఆయన అసలు ఉద్యోగం ఏమిటో తెలియదు కానీ ఊళ్ళో నలుగురు పిల్లలనీ ఇప్పుడు కూలి పోయిన అప్పటి రాముల వారి కోవెల ఎదురుగుండా ఉన్న కుంటముక్కల నరసింహం గారి ఇంటి పెద్ద అరుగుల మీద కూచో బెట్టి “దుంపల బడి” నడిపే వారు. ఒక రోజు ఊళ్ళోకి మలేరియా నివారణ వారో, టీబీ కో టీకాలు వేసే వాళ్ళు వచ్చారని తెలియగానే పిల్లలందరూ కకావికలై పారిపోయారు. అలా పారిపోలేక వెర్రి మొహం వేసుకుని దొరికిన వాడిన నేనే.  అందు చేత ఆ రోజు ఊరి మొత్తానికి నాకే టీకాలు పడ్డాయి. మాములుగా ఆ టీకాలు నుదిటి మీద వేస్తారు. జన్మంతా ఆ మచ్చ  మిగిలి పోతుంది. కానీ ఆ టీకాలబ్బాయి  ఎర్రగా, బొద్దుగా ఉన్న నన్ను చూసి పోనీలో పాపం అని టీకాలు నా నుదిటి మెడ కాకుండా భుజాల మీద వేశాడు.  దాని తాలూకు మచ్చ కూడా ఇప్పుడు లేదు. కానీ నా మొహం మీద ఇప్పుడు చూసిన వాళ్ళు  నాకు చిన్నప్పుడు మశూచికం వచ్చిందనుకుంటారు. అవి మశూచికం తాలూకు కాదనీ, యవ్వన దశ ప్రారంభంలో ఎడా, పెడా వచ్చిన మొటిమలకి మందు వాడకుండా గిల్లేసుకోవడం  వలన మిగిలిన అవశేషాలు అనీ  మనవి చేసుకుంటున్నాను. చిన్నపుడు చికెన్ ఫాక్స్ వచ్చే ఉంటుంది కానే, నాకు గుర్తు లేదు. ఈ తరం వారికి తెలియదేమో కానీ టీకాలు అంటే నిజానికి ఒక పెద్ద సూది మందు. ఆ రోజులల్లో కొందరు ఒక కాల్తున్న పెద్ద చుట్టని నుదుటి మీద పెడితే మశూచికం రాదు అని కూడా అనుకునే వారు. దాని తాలూకు మచ్చ జన్మంతా ఉంటుంది మరి.

అన్నట్టు ఆ కుంట ముక్కల వారు (పెద్దబ్బాయి గారు అనే వారు ఆయనని) జమీందారులు. మా మేనత్త కుటుంబం వారూ కుంటముక్కల వారే! ఆ జమీందారుల (నరసింహం గారు & రామాయమ్మ గారు) రెండో కూతురు రాజా ని మా చిన్నన్నయ్య చిన్న వయసులోనే ప్రేమించి పెద్దదయ్యాక పెళ్లి చేసుకున్నాడు.

ఇక వేసవి శలవులలో మా పొలంలో అతి ముఖ్యమైన పనులు వేసిన కోతలయ్యాక వేసిన కుప్పలు  నూర్చడం, నూర్చిన ధాన్యం ఆరబెట్టి బస్తాలలోకి ఎక్కించి కుట్టడం, కాటా తూచి ధాన్యం మిల్లులకీ, వ్యాపారులకీ అక్కడికక్కడే అమ్మడం. ఊళ్ళో  మకాం ఉన్నప్పుడు రాత్రి జరిగే కుప్ప నూర్పులకి మా చిన్న పిల్లలని తెసుకెళ్ళేవాడు కాదు మా పెద్దన్నయ్య. కానీ పొద్దున్నే లేచి చద్దన్నం తిని, పొలం గట్ల మీద నుంచి మూడు కిలో మీటర్లు మా బావా వాళ్ళ మిరాసీ మీదుగా నడిచి  శేరీ చేరుకునే వాళ్ళం. మా ఉద్దార్డుడు నాగులో, మరొక   పాలికాపో కూడా  ఉండే వాడు.  ఇప్పటిలా అప్పుడు ట్రాక్టర్లు ఉండేవి కాదు. కుప్ప నూర్పులంటే పొలం లో ఒక కళ్ళం చేసి , పేడతో అలికి , మధ్య లో ఒక రాట పాతి, అంచెలంచెలుగా పాతిక పశువుల చేత కళ్ళం లో పరిచిన వరి ధాన్యం మొక్కలని తొక్కించే వారు. ఒక యాభై బస్తాల కుప్పకీ సుమారు ఒక రాత్రి అంతా పట్టేది. కుప్ప మీద నుంచి మొక్కలు కళ్ళెం లో వెయ్యడం, కళ్ళం పడిన లో ధాన్యాన్ని బండి మీద ఎక్కి పెద్ద చేటలతో గాలి లోకి ఆరేసి, రాలిన ధాన్యాన్ని  వేరే కుప్పగా వెయ్యడం మొదలైన పనులన్నీ మా పెద్దన్నయ్య అజమాయిషీ లో యాభై మంది  పాలికాపులు పది రోజుల పాటు పని చేసే వారు. ఇప్పుడు పాలికాపుల బదులు వారిని వ్యవసాయ కూలీలు అనడం వింటున్నాను.  ఇక పొద్దున్నే ఏ పది గంటలకో పొలం చేరుకున్న మా కుర్ర కారు సాయంత్రం దాకా చెరువు గట్ల మీదో, కళ్ళం లో ఉన్న ధాన్యం కుప్పల చాటునో ఆడుతూ, పాడుతూ గడిపేసే వాళ్ళం. మాతో సాయం వచ్చిన పాలికాపులు మమ్మల్ని మా అన్నయ్యకి అప్పగించేసి వెనక్కి మళ్ళీ ఊళ్ళోకి వెళ్లి, మా మేనత్త రంగక్కయ్య సద్దిన రెండు కేరియర్ల భోజనం పట్టుకుని తిరిగి వచ్చే వారు.  మధ్యాహ్నం నిప్పులు చెరుగుతున్న వేసవి కాలం ఎండలో చెరువు గట్టు మీద కూచుని అన్నాలు తినే వాళ్ళం.  రాత్రి అంతా కుప్ప నూర్పులు నూర్చిన పాలికాపులు ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన పనులకి కొత్త బేచ్ వచ్చే వారు.  మా పెద్దన్నయ్య పనులు చూసుకుంటూ ఉంటే మేము పొలం గట్లమ్మట తిరుగుతూ, తాటి ముంజెలు జుర్రుకుంటూ, తేగలు కాల్చుకుని తింటూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, జిగురు కోసం తుమ్మ చెట్లకి గంట్లు పెట్టుకుంటూ, చెరువు గట్టు మీద మామిడి కాయలు కోసుకుని, ముక్కలు చేసి ఉప్పూ, కారం నల్చుకుని తింటూ “శుభ్రంగా పాడై పోయే వాళ్ళం”.  సాయంత్రం చీకటి పడే లోపుగా మళ్ళీ ఇంటికి వెళ్లి పోయేవాళ్ళం.

ఇక నా  జీవితంలో  సాహిత్య పరంగా చెప్పాలంటే నేను వేసవి శలవులకి పదిహేనేళ్ళు వచ్చే దాకా దొంతమ్మూరు వెళ్ళినప్పుడు  అక్కడ చదివిన “చందమామ” పత్రికలనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ మేడ మీద రెండు    పెద్ద గదులు ఉండేవి, ఒక గదిలో రెండు, మూడు భోషాణం నిండా కొన్ని వందల “చందమామ” పత్రికలు ఉండేవి. ఇవి ఖచ్చితంగా మా హనుమంత రావు బావ కలెక్షన్ అయి ఉండాలి. మేము శేరీలో కుప్ప నూర్పులకి వెళ్ళకుండా ఊళ్ళోనే ఉన్నప్పుడు 1950- 1960 లలో వచ్చిన ఈ చందమామలు చదవడమే అద్భుతమైన కాలక్షేపం.  అప్పుడు అది కేవలం కాలక్షేపమే. కానీ నాకు కాస్తైనా  బుద్ది వికసించింది అని ఎవరికైనా అనిపిస్తే దానికి బీజాలు అప్పటివే!

ఆ నాటి కాల భంజకా, కంకాళా, చతుర్నేత్రుడు, మంత్రాల దీవి,  పక్కనే జిల్లేళ్ళ దిబ్బ, చుట్టూ భయంకరమైన మొసళ్ళతో ఉన్న మందాకినీ సరస్సు, దాని ఒడ్డున ఊడల మర్రి, ఏకాక్షి, తోకచుక్క, మకర దేవతా, పొట్టి రాక్షసుడూ, గీక్షసుడూ, దొంగముచ్చూ, పరోపకారి పాపన్నా, బండ రాముడూ, శూరసేన మహరాజూ, జిత్తుల మారి నక్కా, తెనాలి రామలింగడూ, కీలు గుర్రం, పట్టువదలని విక్రమార్కుడూ, అతనికి మౌనభంగం కలగగానే శవంతో సహా మాయమయిన బేతాళుడూ, అమర సింహుడూ మొదలైనవి మహత్తరమైన కాల్పనిక సాహిత్య సృష్టి. మహా భారతమూ, రామాయణమూ, ఇంచుమించు అన్ని ఇతిహాసాలూ నీతి కథలూ నేను చందమామలోనే ఎక్కువగా చదువుకున్నాను. అప్పుడు రచయితల పేర్లు చూసి చదివే వయసు కాదు. కొ.కు. గారు, దాసరి గారు వ్రాసే వారు అని తెలియదు, కానీ వ.పా గారు, చిత్రా గారు బొమ్మలు వేసే వారు అని తెలుసు. ఎందు కంటే ఆ బొమ్మలు చూస్తూ, మేము మేకప్పులు చేసుకుని, కిరీటాలు, కత్తులూ, ఇతర జానపద, పౌరాణిక, కాల్పనిక పాత్రలన్నింటినీ ధరించి ఆటలాడుకునే వాళ్ళం.

పెద్దన్నయ్య పెళ్లి 1960

పెద్దన్నయ్య పెళ్లి 1960

ఈ వయసు దాటాక, మా పెద్దన్నయ్య పెళ్లి అయ్యాక, పొలం పనుల మీద కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాత్రుళ్ళు ఉండిపోవలసి వస్తే దొంతమ్మూరు వెళ్ళకుండా పొలంలోనే ఉండడానికి వీలుగా మా అన్నయ్య ఒక మకాం కట్టుకున్నాడు. అంటే ఒక మూడు గదుల పెద్ద పాక అన్నమాట. అందులో ఒక వంట గది, ఒక పడక గది, మధ్య గది. ముందు వరండా, ఆ వరండాకి అటు, ఇటూ సామాను గదులు ఉండేవి. తాత్కాలింగా ఇది కట్టుకుని, తరువాత పెంకుటిల్లు కదదామనుకున్నాడో లేదో తెలియదు కానీ,  అప్పటి నుంచీ ఆ “పాత మకాం”  ప్రతీ వేసవి కాలం లోనూ మాకు విడిది గృహమే! ఆ మకాం ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో లో ఆ మకాం “నీరసం” గా, నిర్మానుష్యంగా ఉంది కానీ నా చిన్నప్పుడు , ముఖ్యంగా వేసవి కాలంలో, కళ, కళ లాడుతూ ఉండేది. ఆ “కళాకారుల” బృందంలో ప్రధాన భాగస్వాములం  నేనూ, మా తమ్ముడూ, నా పైవాడు సుబ్బన్నయ్య, మా ఆఖరి మేనత్త కొడుకు అబ్బులు బావ, మా పెద్ద వదిన పెద్ద తమ్ముడు వెంకట్రావు, రెండో తమ్ముడు కంచి రాజు, అప్పుడప్పుడు మా అందరికంటే పెద్దవాడే అయినా చిన్నవాడిలా మాతో కలిసిపోయే మా అమలాపురం పెద్ద బావ ఇలా చాలా మంది అ పాత మకాం లోనే రెండు, మూడు నెలలు ఉండిపోయే వాళ్ళం.  అక్కడ కరెంటు ఉండేది కాదు. రాత్రి అవగానే కిరసనాయిల్ లాంతర్లు, పెట్రో మేక్స్ లైట్లే !

ఆ పెట్రో మాక్స్ లైట్ల వెలుతురు లో రాత్రుళ్ళు  కుప్పలు నూరుస్తూ మా పాలికాపులు పాడుకున్న పాటలు నాకు యింకా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా “తాచు” అనే వాడు రాగం ఎత్తుకుంటే ఒళ్ళు గగుర్పొడిచేది. వాడు “గోంగూర” పాట పాడితే  పది సార్లు పాడించుకునే వాళ్ళం. సగం మగ కూలీలు, సగం ఆడ కూలీలు పోటాపోటీ గా నిఘం గానే సరసాలాడుకుంటూ,  ఆడుతూ, పాడుతూ పని చేసుకుంటూ కళ్ళారా చూసిన వాణ్ణి నేను.  పక్కనే ఉన్న గడ్డి మెట్ల మీద పై దాకా నిచ్చెన వేసుకుని ఎక్కి, నా దగ్గర ఉన్న ఒక పెద్ద నక్షత్రాల పటం పరిచి, చిన్న బేటరీ లైట్ వేసి, పైన ఆకాశం లో ప్రతీ నక్షత్రాన్నీ, క్రింద ఈ మ్యాప్ లో గుర్తించి అక్కడ ఉన్నన్నాళ్లు కొన్ని గ్రహాలూ, నక్షత్రాల గమనాన్ని కాగితాల రాసుకుని  అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందిన చిన్నవాణ్ణి నేను.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక కొన్ని రోజుల పాటు ఏ ప్రతీ రాత్రీ నేను చూసిన ఒక అతి పెద్ద  తోకచుక్క నీ, మొత్తం ఆకాశంలో బహుశా మైళ్ళ కొద్దీ పొడుగ్గా ఉన్న అద్భుతమైన ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను.

ఒక్క పేరాలో చెప్పాలంటే …..పైన ఆకాశంలో ప్రస్ఫుటంగా ఒక తోక చుక్క, చుట్టూ దూరంగా నక్షత్రాలు, క్రింద భూమి మీద ప్రేమగా, పల్లెపడుచులు పేడతో అల్లిన కళ్ళం లో తాళ్ళతో కట్టేసిన రాట చుట్టూ తిరుగుతూ, కాళ్ళతో తొక్కుతూ కింద వరి కంకుల నుంచి ధాన్యం గింజల్ని వేరు చేస్తున్న మా పాడి పశువులు, ఆ ధాన్యాన్ని దగ్గరకి చేర్చి కుప్పగా వేస్తూ, కొత్త వరికంకుల్ని వేస్తున్న మా పాలికాపులు, పైన ఎక్కడో గడ్డి మేటు మీద ఆకాశం, నక్షత్రాల పటం చూస్తూ, అందరికీ వివరిస్తూ నేను, ఎక్కడైనా పాటలు వస్తాయేమో అని మా ట్రాన్సిస్టర్ రేడియో తో తంటాలు పడుతున్న వెంకట్రావో, మరొకరో….ఎవరికైనా కాఫీలు కావాలా అని అడుగుతూ మా పెద్ద వదిన గారూ, ధాన్యం కుప్పల మీద సెక్యూ రిటీ కోసం “ఆంజనేయ స్వామి” మట్టి ముద్ర లు వేస్తూ మా తమ్ముడూ, మా సుబ్బన్నయ్యా,  పెట్రోమేక్స్ లైట్ వెలుగులోనే పేక ముక్కలూ పంచుతూ మా అబ్బులు బావా ..ఈ మొత్తం సీనరీ అంతటినీ అజమాయిషీ చేస్తూ “ఆవకాయ ..నా బెస్ట్ ఫ్రెండ్ “ అని ఆ మాత్రం భోజనానికే అఖండంగా ఆనందించే మా పెద్దన్నయ్యా…ఇదే “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే  శేరీ” లో నేను గడిపిన మా చిన్నప్పటి వేసవి శలవుల తీరుతెన్నుల కి నేను ఇవ్వగలిగిన పరిమితమైన అక్షర రూపం.

– వంగూరి చిట్టెన్ రాజు

రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

రాత్రి జీవితాన్ని గెల్చిన వాళ్ళ కథలు – “ Tales of Night Fairies ”

                  

     ‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై, మరొకరికి పండై’ …. అలిశెట్టి ప్రభాకర్.

ఆమెను ‘వేశ్య’ అని నాజూకుగా పుస్తకాల భాషలో పిలుస్తారు. ఇంకా కస్టమర్లు ఎక్కడికక్కడ రకరకాల మాండలీకాల్లో మొరటుగానూ, ముద్దుగానూ కూడా పిలుస్తారు.  ఈ రోజు ఆమెనే ‘సెక్స్ వర్కర్’ అంటున్నారు.  ఆ పేరు వినగానే మన కళ్ళముందు చకచకా కొన్ని దృశ్యాల్లో ఆమె జీవితచక్రం గిర్రున తిరిగేస్తుంది. ప్రియుడు మోసంచేసి వేశ్యాగృహాల్లో అమ్మెయ్యటం, బలవంతంగా ఆ ఊబిలోకి దిగటం, కొన్ని అబార్షన్లూ, ఒకరిద్దరు పిల్లలూ, చివరకు రోగాలపాలై ఒళ్ళు శిధిలమై, దిక్కు ఉండో లేకో చావటం… ఇదీ ఆ జీవిత చక్రం.  సమాజపు అంచులలో ప్రమాదకరమైన జీవితాలు గడిపే వీళ్ళకు పోలీసుల, రౌడీల చేతుల్లో తనువు పుండైపోకుండా చూసుకోవటమే ఒక నిరంతర పోరాటం. ఇలా మరకలు పడ్డ జీవితాలక్కూడా మెరుగులు పెట్టుకునే గడుసర్లు లేరా? అంటే … ఉన్నారు. “Tales of Night Fairies” అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లు హక్కుల పోరాటంతో తమ జీవితాల్ని ఎలా బాగుచేసుకున్నారో  చూడవచ్చు.

“సోనాగచ్చి”- కలకత్తా లోని మూడువందలేళ్ళనాటి రెడ్ లైట్ ఏరియా. అక్కడ మామూలు కుటుంబాలుండే ఇళ్ళతో పాటు, పక్కనే ‘లైన్ ఇళ్ళు’ అనే వేశ్యాగృహాలు కూడా ఉంటాయి. ఇక్కడుండే సెక్స్ వర్కర్ల  గురించి  డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ‘సోహినీ ఘోష్’ కు చిన్నతనంనుంచే ఉందట. సోహినీ ఘోష్ తల్లి తన ఉద్యోగరీత్యా కలకత్తా అంతా తిరుగుతూ ఉండేదట. ఆవిడ సోనాగచ్చిలో తిరిగేటప్పుడు కొన్ని ఇళ్ళ గోడలమీద “ఇది మర్యాదస్తుల ఇల్లు” అని రాసి ఉండటం చూసిందట. తల్లి తనకు ఈ విషయం చెప్పినప్పటి నుంచీ ఇది తనలో కుతూహలాన్ని రేపిందని చెప్తుంది సోహినీ.

డాక్టర్ స్వరజిత్ జానా ‘సోనాగచ్చి ప్రాజెక్ట్’ పేరుతో  హెచ్.ఐ.వి. ని  అదుపు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ 1990 లలో చేపట్టారు. ఇక్కడుండే సెక్స్ వర్కర్లను ఈ పనిలో భాగస్వాములను చెయ్యటం ఈయన చేసిన గొప్ప పని. ఈ క్రమంలోనే 1995 లో సోనాగచ్చిలో దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ (DMSC) ఏర్పడింది. ‘Adult sex work’ ను నేరంగా పరిగణించకుండా దానికి ఒక సామాజిక గుర్తింపునిచ్చి, సెక్స్ వర్కర్లకు శ్రామిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇవ్వాలంటూ ఈ కమిటీ పోరాడింది.  ఈ కమిటీలో 60,000 మంది సభ్యులున్నారు. ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేసుకోవటం వల్ల పోలీస్ దాడులు పూర్తిగా ఆగకపోయినా, కొంతయినా తేడా వచ్చిందని చెప్తుంది సాధనా ముఖర్జీ అనే సెక్స్ వర్కర్.  “ఒకసారి ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి బంధించి, డబ్బులిస్తేనే వదులుతామని చెప్పారు. అప్పుడు మేము అక్కడ ధర్నా చేసి ఆఫీసర్ ను సస్పెండ్ చేయించాం. అలాగే రేప్ కేసులు కూడా తీసుకొనేవారు కాదు పోలీసులు.  పైగా “మిమ్మల్ని ఎవరైనా రేప్ చెయ్యటం ఏమిట”ని తేలిక మాటలు మాట్లాడేవారు. అలాంటిది ఈ రోజు మేం పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చోగల్గుతున్నాం”… అంటుంది శిఖా దాస్.

ఈ చలిచీమలన్నీ ఒకచోట చేరి ఇంత బలంగా తయారవటమే కాక, కలకత్తాలో మార్చ్ 2001 లో సెక్స్ వర్కర్స్ మిలీనియం కార్నివాల్ ను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహించి, మర్యాదస్తుల్ని నివ్వెరపరిచారు. సెమినార్లు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు .. అన్నీ నిర్వహించారు. ఈ కార్నివాల్ ను అడ్డుకుందుకు ఢిల్లీ మహిళా సంఘాలు చాలా ప్రయత్నించాయట. “మాలో చాలా మందికి చదువు రాదు. కార్నివాల్ లో సరదాగా అందరూ పాల్గొంటారు. ప్రపంచానికి “మేమూ నవ్వుతాం. ఆడుకుంటాం, పాడుకుంటాం” అని చూపించాలని మా ప్రయత్నం. మీరు అనుమతి ఇవ్వకపోతే వేలాదిమందిమి అందరం కలిసి రోడ్లమీద కూర్చుంటాం” అని బెదిరిస్తే గానీ మాకు ఈ పండగ జరుపుకుందుకు చివరి నిముషం వరకూ అనుమతి దొరకలేదు” అంటుంది మాలా సింగ్.  ఈ కార్నివాల్ కు వచ్చి చూసి “మీరు ఇలాంటి పండుగ ఎప్పుడు జరుపుకున్నా మాకు అభ్యంతరం లేద”ని చెప్పిన వాళ్ళ నుంచి వీళ్ళు సంతకాలు కూడా సేకరించారు.  సోనాగచ్చిలో వీళ్ళు బృందాలుగా ఏర్పడి, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా అందరినీ ప్రోత్సహించటం, హెల్త్ క్యాంప్స్ నిర్వహించటం, కండోమ్ వాడకం, వ్యక్తిగత శుభ్రత వంటి విషయాలు బోధించటం … చేస్తుంటారు.

సోహినీ ఘోష్ వీళ్ళలో ఒకరుగా కలిసిపోయి రాబట్టిన విషయాలేమిటో చూడండి….

ఉమా మండల్ :  అరవైలలో ఉన్న ఈమె గొడవలు పడకుండా కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయిలకు సలహాలిస్తుంది. హెల్త్ క్యాంపుల్లో చురుగ్గా తిరిగి అందరితోనూ పని చేయిస్తుంది.

ఉమా మండల్

“ఒక సెక్స్ వర్కర్ మాత్రమే ఇంకో సెక్స్ వర్కర్ తో సులభంగా కలిసిపోయి మాట్లాడగలదు. బైటివాళ్ళు ఈ పని చెయ్యటం కష్టం. అందుకే మాలో మేమే బృందాలుగా ఏర్పడి అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నాం”.

“కోమల్ గాంధార్ … ఇది మా థియేటర్ గ్రూప్ పేరు. ‘కోమల్’ అంటే సున్నితం. ‘గాన్’ అంటే పాటలు. ‘ధార్’ అంటే కత్తికున్న పదును. సున్నితంగా పాడుతూ ఆడుతూ పదునుగా మా పరిస్థితిని వివరిస్తాం. మనుషుల ఆలోచనల్లోని  సంకోచాలను వదిలిస్తాం”.

“శ్రమచేసి వస్తువుల్ని సృష్టించే వాళ్ళను శ్రామికులంటారు. ‘మీరేం సృష్టిస్తున్నారు?’ అని మమ్మల్ని అడుగుతారు. మేం జనం మనసుల్లో ఆనందాన్ని సృష్టిస్తున్నాం”.

సాధనా ముఖర్జీ :  దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటు కాకముందు కూడా సోనాగచ్చిలో సమస్యలు పరిష్కరించిన ధైర్యస్తురాలు.

మాలా సింగ్                                                                                                            సాధనా ముఖర్జీ

“నేను ఈ పనిలో ఉన్నానని మా ఇంట్లోవాళ్ళకు చాలాకాలం వరకూ తెలియదు. నా భర్త చాలా డబ్బున్నవాడని చెప్పి, మా నాన్నకు డబ్బు పంపిస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా నాన్న నా దగ్గరకు వచ్చినపుడు ఆయనకు వీధి వాతావరణంలోనే తేడా తెలిసిపోయి నన్ను నిలదీశాడు. నిజం చెప్పాక కన్నీరుమున్నీరయిపోయాడు. కానీ నన్ను వదులుకోలేకపోయాడు”.

“ఇంతకుముందు మేము కూడా ఈ పని చెడ్డ పనీ, అనైతికమూ అనుకునేవాళ్ళం. అలాగని మనకెలా తెలుసు? పుడుతూనే ఈ ఆలోచనలతో మనం పుట్టలేదు. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ‘తప్పుడు ఆలోచనలు’, ‘దిగజారిన ఆడవాళ్ళు’, ‘నిషిద్ధ స్థలాలు’ అనే పరిభాష నేర్చుకుంటాం. ఇవన్నీ గొప్ప మేధావులు, గౌరవనీయులు సృష్టించినవే!!

“ఇంతకుముందు ఆడవాళ్ళను బలవంతంగా ఇందులోకి దించేవాళ్ళు. నేనూ అలా వచ్చినదాన్నే. కానీ నా సంపాదనతో నా కుటుంబం మొత్తం బతుకుతోంది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టలేను. ఇప్పుడు కొందరు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు”.    

“ఇంట్లోకి ఎవరిని రానివ్వాలీ ఎవరిని రానివ్వొద్దన్నది మా నిర్ణయమే. ‘నేనూ డబ్బులిస్తానుకదా’ అన్నా సరే మా ప్రాంతంలోనే ఉండే మగవారిని మేము రానివ్వం”.

మాలా సింగ్:  ఢిల్లీ లో తిరిగి అక్కడి జీ.బీ.రోడ్డు సెక్స్ వర్కర్లను కూడా చైతన్యపరచే పని చేస్తూ, వీధి నాటకాల్లో పాల్గొని మాట్లాడుతూ అందరికీ పెద్ద దిక్కులా ఉండే ఈమె కమిటీలో అతి చురుకైన వ్యక్తి.

“తొమ్మిదేళ్ళ వయసులో నన్ను ఈ పనిలోకి బలవంతంగా దించారు. రెస్క్యూ హోం నుంచి ఒక పోలీసు నన్ను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్ళి చెప్పలేనంత హీనంగా అత్యాచారం చేశాడు. నా తొడల్ని కత్తులతో చీల్చాడు. పోలీసు స్టేషన్లో కంటే మా సెక్స్ వర్కర్ కాలనీలోనే ఎక్కువ భద్రంగా ఉంటాం”.

“ఈ పని తప్పని మొదట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఆలోచన మారింది. నాకూ మా అమ్మకూ పెద్ద తేడా నాకేం కన్పించటం లేదు. మాకు తిండీ, బట్టా అమర్చటం కోసం మా అమ్మ మా నాన్నతో పడుకుంది. నేనూ అదే పని కొంతమందితో  చేస్తున్నాను. తేడా ఏమిటంటే నేనీ పనికి డబ్బు తీసుకుంటున్నాను. ఆ డబ్బుతో నా పిల్లలకు తిండీ, బట్టా ఇస్తున్నాను”.  

“నేను అడుక్కోవటం లేదు. దొంగతనం చెయ్యటం లేదు. కష్టపడి బతుకుతున్నాను.  నాకు జబ్బు చేస్తే ఎవరూ పట్టించుకోరు.  నా డబ్బులు తింటూ ఈ పోలీసులు నన్ను కొడుతున్నారు. పోలీసులను ఎప్పుడూ అసహ్యించుకునేదాన్ని. అవకాశం వస్తే వీళ్ళ పని పట్టాలని ఉండేది. ఒకసారి తాగినమత్తులో ఒక పోలీసు మా వాడకు వచ్చి ఆడవాళ్ళను బాగా కొట్టాడు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళి, పరీక్షలు చేయించి, డాక్టర్ల దగ్గర అవసరమైన  పత్రాలు తీసుకున్నాను. మరునాడు ఈ ఆడవాళ్ళను, డాక్టర్ ఇచ్చిన పత్రాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి కేసు పెడతానన్నాను. పోలీసులు బ్రతిమాలటం మొదలెట్టారు.  మా మీదకు తాగి రాబోమనీ, రైడ్స్ చెయ్యబోమనీ ఉదయం తొమ్మిది లోపు మా ఇళ్ళకు రాబోమనీ రాతపూర్వకంగా ఇమ్మని అడిగి, అలాగే రాయించుకున్నాను. పోలీసు ఆఫీసర్, నేనూ ఆ కాగితం మీద సంతకాలు చేశాం. ఒక కాపీని మా ఆఫీసులో ఉంచాను. కలానికున్న బలం చూడండి. అంతకు ముందెప్పుడూ ఈ కలంపోట్ల తోనే మేము ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మేమూ వాళ్ళ ఆటలోనే వాళ్ళను చిత్తు చెయ్యటం నేర్చుకున్నాం”.

 “ప్రభుత్వం సెక్స్ వర్కర్ల ఉద్ధరణ గురించి చెప్పినప్పుడు నాకైతే నవ్వు వచ్చింది. ఒక్కసారిగా మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందనుకున్నారు? మానవ హక్కులూ, శ్రామిక హక్కులూ అడుగుతున్నాం కదా!  ఏమీ అనలేక, పునరుద్ధరణ పేరుతో మమ్మల్ని అదుపు చేద్దామని చూస్తున్నారు. అసలు నన్ను ఉద్ధరించే అవకాశమే వాళ్ళకు లేదు. ఎందుకంటే నేను పని చేస్తూ నా బతుకు నేను బతుకుతున్నాను. బెంగాల్లో ఒక నలభై వేలమందిని ఉద్ధరించారని అనుకుందాం. మనది పేద దేశం. మరో నలభై వేలమంది ఇందులోకి రారని నమ్మకమేమిటి? ఢిల్లీలో స్త్రీల జాతీయ కమిషన్ లో మోహినీ గిరిని కలిసి ప్రస్తుతం మాతోనే ఉంటున్న ఒక 500 మంది వయసు మళ్ళిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. ‘వీళ్ళకు పని లేదు. ఎవరూ పనిమనుషులుగా కూడా తీసుకోవటం లేదు. వీళ్ళకు ఆధారం కల్పించమ’ని అడిగాను. ఆ తరువాత అక్కడినుంచి ఏ జవాబూ లేదు. మాటకీ చేతకీ ఇంత తేడా ఉంటుంది”. 

శిఖా దాస్ :  శిఖా ఈ వృత్తిలోకి రాకుండా ఉందామని చాలా ప్రయత్నించింది. చదువుకుందామని అనుకుంది. రెండు సార్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంది. పని మనిషిగా చేసింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లో పని చేసింది. చెత్త కాగితాలు ఎత్తింది. కానీ సెక్స్ వర్కర్ కూతురనే ముద్రా తప్పలేదు. చివరకు ఆ వృత్తీ తప్పలేదు.  తెలివిని కూడా కలబోసుకున్న ఈ బెంగాలీ అందం, డాక్టర్ జానా ప్రోత్సాహంతో 1999లో జమైకా వెళ్లి, అక్కడి సభలో పదిహేను నిముషాలు జంకూ గొంకూ లేకుండా మాట్లాడి అందర్నీ ముగ్ధులను చేసిందట.

సోహినీ ఘోష్ తో  శిఖా దాస్.                                                                                    దీప్తి పాల్, సాధనా ముఖర్జీ

“నేను సోనాగచ్చిలోనే పుట్టాను. అమ్మ ఒక సెక్స్ వర్కర్. నన్ను బళ్ళో వేసింది. అక్కడ అందరూ ‘మీ నాన్న కనిపించడేమ’ని అడిగేవారు. నేను జవాబు చెప్పలేక అమ్మను అసహ్యించుకునేదాన్ని. ఈ రోజు అమ్మను అలా తిట్టుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. నాకూ బడికి వెళ్తున్న ఒక పాప ఉంది. బోర్డింగ్ స్కూల్ లో వేశాను. అక్కడి కాగితాల్లో నా వృత్తి ‘సెక్స్ వర్కర్’ అని రాశాను. పాపకు అన్నీ అర్ధం అవుతున్నాయి. ఏదేమైనా తానెవరో దాచవద్దని చెప్పాను”. 

“ప్రభుత్వం మాకు శ్రామిక హక్కులు ఇవ్వటం లేదు. చిన్న పిల్లలు ఇందులోకి రాకుండా చేసుకొనే ‘self regulatory boards’ కావాలి మాకు. కొత్తవాళ్ళు దీనిలో చేరేముందు మేం పరీక్షించాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకు పంపించేస్తాం. కుటుంబం ఆమెను ఆదరించకపోతే ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పిస్తాం”.

“కస్టమర్లను కండోమ్ వాడమని అడిగే ధైర్యం రావాలంటే ముందు మా శరీరాలమీద మాకొక్కరికే అదుపు ఉండాలి”.

తన విదేశయానం గురించి చెప్తూ శిఖా ఇలా అంటుంది. “విమానం ఫ్రాంక్ ఫర్ట్ లో ఆగింది. చలికి బిగుసుకుని నా దుపట్టాను చుట్టూ కప్పుకున్నా. ఫ్రాంక్ ఫర్ట్ దాటాక హిందీ తెల్సిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. సిగరెట్టు వెలిగించా. ఆల్కహాల్ ఇస్తున్నారు విమానంలో…  బీర్ నాకెంతో ఇష్టం…  కానీ ఎక్కువగా  తాగేస్తే,  ‘ఒక్కదాన్నే వెళ్తున్నా కదా నన్నెవరు చూసుకుంటార’ని భయం వేసి తాగలేదు. పైగా విమానంలో టాయిలెట్ కి వెళ్తే తలుపు బిగుసుకుని లోపలే ఉండిపోతానని మరో భయం”.

“సమావేశంలో నాకు అయిదు నిముషాలు కేటాయిస్తే, నేను పదిహేను నిముషాలు మాట్లాడేను. అది అవగానే అందరూ నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. నా మాటలు బాగా నచ్చాయని చెప్పారు. చదువు రాని ఒక భారతీయ సెక్స్ వర్కర్ ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తుందని వాళ్ళు ఊహించలేదు. అక్కడ ఎవరో నాకో నెక్లెస్ బహుమతిగా ఇస్తే నకిలీదేమో అనుకున్నా. ఎవర్నీ నమ్మకపోవటం ఈ వృత్తిలో అలవాటయింది”.

“నేను చచ్చిపోయేక నా పిల్లలు ఈ జమైకా ఫోటోలు చూసి ‘జీవితంలో కొంతైనా సాధించింది. చెప్పుకోదగ్గ మనిషి’ అని నా గురించి  అనుకుంటారు”.

ఇవీ సోహినీ ఘోష్ తన ఫిల్మ్ లో బంధించిన Night Fairies  చెప్పిన కథలు…

***

ఎనభైల్లో శ్యాం బెనెగల్ ‘మండీ’ అనే సినిమా తీశాడు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళను ఓ పక్క వాడుకుంటూనే…  అవసరమైతే తరిమి కొడుతూ, మళ్ళీ దగ్గరకు తీస్తూ సమాజం ఎలా ఆడిస్తుందో చూపిస్తాడు బెనెగల్. అలాగే ఎంత చావగొట్టినా ఈ పురాతన వృత్తి చావదని కూడా నిష్కర్షగా, హాస్యంగా చెప్పేస్తాడు. ప్రపంచంలో డబ్బు, సెక్స్  అవసరాలూ, స్త్రీలూ, పురుషులూ ఉన్నంత కాలం ఈ వృత్తి కూడా నిలిచే ఉంటుందనిపిస్తుంది. దీనిని ఆపటం ఎవరివల్లా కాదు కాబట్టి, ఈ ‘adult sex work’ ను చట్టబద్ధం చేసి, ప్రాంతాలవారీగా ‘మేము సెక్స్ వర్కర్లం’ అని చెప్పుకునే వాళ్ళకు భద్రత కల్పించి, వేధింపులు లేకుండా చెయ్యటమే సమాజమూ, ప్రభుత్వమూ చేయదగ్గ పని.  పూర్తి స్థాయి సెక్స్ వర్కర్లు, అదీ చదువులేని పేదవారికి ఎటువంటి భద్రతా లేదనటంలో ఏ సందేహమూ లేదు.  ‘సెక్స్ వర్కర్’ అనే మాటను మనం వాడుతున్నామంటేనే, వారిని పనిచేసేవారిగా గుర్తిస్తున్నాం. కాబట్టి అన్ని రకాల పనివారికీ ఇచ్చే భద్రతా, రక్షణా వీరికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉందనే అర్ధం కదా!  ‘ఇది మా వృత్తి’ అని చెప్పుకోకుండా వీలైనంత రహస్యంగా డబ్బుకోసం, ఉన్నతస్థాయి జీవన విధానం కోసం  ఒంటిని అమ్ముకుంటున్న అమ్మాయిలూ, గృహిణుల సంఖ్య కూడా సమాజంలో ఇవాళ పెరుగుతోంది. అలాగే మగ సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా. సరే ఇదంతా మరో సామాజిక సమస్య.

ఈ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లను ఒక అర్ధవంతమైన ప్రశ్న అడుగుతుంది ఒక సంఘసేవిక. “మీ వాదనలతో ‘నీతి’ అనేది ప్రమాదంలో పడింది. నా ఉద్దేశ్యంలో వేశ్యావృత్తి అంటే  ఆడవాళ్ళమీద జరిగే హింస. మీరేమంటారు?”  ఈ ప్రశ్నకు సుదీపా బిశ్వాస్ అనే ‘DMSC’ సభ్యురాలి జవాబు ఇది-  “మేము పనిచేసే చోటు అందరికీ తెలుసు. అది స్పష్టంగా హద్దులు గీసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ వృత్తి జరుగుతుందని తెలిసి, అవసరమైన వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం వస్తారు. వాళ్ళ జీవితాల్లోని ఇరుకుదనాన్నుంచి కొంతసేపు తప్పించుకోవటానికి మా దగ్గరకు వస్తే, అది తప్పని నాకు అనిపించటం లేదు. ఇతరులకు సంతోషాన్నిచ్చి మేం డబ్బు తీసుకుంటున్నాం. అదే సమయంలో మేమూ ఆనందాన్ని పొందుతున్నాం. ఇది  హింసాత్మకమైన వృత్తిగా మేము భావించటం లేదు. ఇది  బాధాకరమైనదే అయితే, ఇన్ని వేల ఏళ్ళుగా నిలిచి ఉండేది కాదు”.

   ఈ వృత్తి బాధాకరమైనదైనా కాకపోయినా, దానిచుట్టూ బాధల విషనాగులు చుట్టుకుని కాటేయడానికి సిద్ధంగా ఉంటాయనటం అబద్ధం కాదు. పోలీసులు, రౌడీలు, మేడమ్ లు, గుప్త రోగాలు, తాగుడు, సిగరెట్లు … ఇవేమీ అబద్ధం కాదు. దీప్తి పాల్ ఇలా అంటుంది. “మొదట్లో ఇంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం కాదు. ఒకసారి ఒకడు శాంతి దీ మెడమీద కత్తి పెట్టి “అయిదు వందలు ఇస్తావా, కత్తి దించమంటావా?” అని బెదిరించాడు. అందరం నిశ్చేష్టులమైపోయాం. మరోసారి ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. నేనప్పుడు బాగా తాగి ఉన్నాను. తాగితే నేను ఎవరికీ భయపడను. వాడిని నాలుగు తన్నేను. అంతే.. ఆ తరువాత వాడు రెండు చేతులతో రెండు బాంబులు తీసుకొచ్చి నా మీద విసిరేస్తానన్నాడు. ఇంతలో సాధన వెనుకనుంచి నెమ్మదిగా వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని, ‘విసురు. అందరం చచ్చిపోదాం’ అంది”.

ఈ దీప్తి పాల్, సాధనా ముఖర్జీ.. ఇద్దరూ కలిసి వీళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసే గూండాలను ఎదిరించారు. లట్టూ అనే గూండా రేజర్ తో దీప్తి ముఖాన్ని చీరేశాడట. అతన్ని ఎదుర్కోవటానికి సాధన మిగతా సెక్స్ వర్కర్స్ అందరినీ కూడగట్టింది. ఇన్ని అపాయాలనూ అన్యాయాలనూ ఎదుర్కొన్న తరువాత DMSC ఏర్పడి, బలోపేతమయింది.

2002 లో సోహినీ ఘోష్ తీసిన ‘Tales of Night Fairies’లో ఉన్నది ‘సెక్స్ వర్కర్ల సాధికారత’ అనే అంశం ఒక్కటే కాదు.  వాంఛల గురించి ఏ అరమరికలూ లేకుండా ఈ సెక్స్ వర్కర్లు మాట్లాడటం కూడా ఉంది. నితాయ్ గిరి ఒక మగ సెక్స్ వర్కర్. అతనికి జుట్టూ, గోళ్ళూ పెంచుకుని ఆడపిల్లలా తయారవటం ఇష్టం.  తన మగ శరీరంలోని ఆడ కోర్కెల్ని అర్ధం చేసుకొని, అంచనా వేసుకొని ఈ వృత్తిలోకి దిగటానికి ముందు అతను సమాజంతోనూ, ఇంట్లో వారితోనూ, పేదరికంతోనూ, తనతో తాను కూడా ఎంతో పెనుగులాడేడు. DMSC, కోమల్ గాంధార్ అతనికి పెద్ద ఆసరాగా, జీవితానికో ధ్యేయంగా నిలిచాయంటాడు.  అలాగే చిన్నప్పుడే హింసాత్మకమైన అత్యాచారానికి గురైనా, ఆ అనుభవంతో మనసును వంకరలు పోనివ్వకుండా  “జీవితంలో చక్కని విషయాలు రెండే. ఒకటి మంచి తిండి. రెండోది సెక్స్” అని మాలా సింగ్ చెప్పగలగటం కూడా నాకు విశేషంగా అనిపించింది.

 నితాయ్ గిరి                                                                                                

ఈ నిషేధ ప్రాంతాల గురించీ, నిషిద్ధ స్వప్నాల గురించీ మాట్లాడుతూ “చిన్నప్పుడు నన్ను మా అమ్మానాన్నలు చాలా సినిమాలకు తీసుకెళ్ళే వారు. కానీ,  కొన్ని సినిమాలకు మాత్రం నన్ను ఎందుకు తీసుకు వెళ్ళరో నాకు అర్ధం అయేది కాదు. వాటిగురించి చాలా కుతూహలంగా ఉండేది. నా కౌమారప్రాయంలో నేనూ నా స్నేహితురాళ్ళూ కలిసి ఒక ఊహాలోకంలో విహరించేవాళ్ళం.  “Prostitute’s Paradise” అనే ఊహాత్మక హోటల్లో, అందర్నీ మోహంలో ముంచెత్తే దేవకన్యల్లా మమ్మల్ని మేం ఊహించుకుంటూ ఉండేవాళ్ళం” అంటుంది సోహినీ ఘోష్.  అంటే … స్త్రీలు తమ ఫాంటసీలనూ, sexuality నీ కొంచెం లోతుగా వెదికి, నిర్భయంగా బైటకు చెప్పగల్గితే, పాతివ్రత్యం, వ్యభిచారం .. అనే భావజాలాల మధ్య ఉన్న సన్ననితెర కదిలి, లక్ష్మణ రేఖలు చెరిగిపోతాయేమో!  ఇంతగా ఎరుసు లేకుండా సోహినీ వీరితో కలిసిపోయి కెమెరా పట్టుకుంది కాబట్టే ఈ స్త్రీలంతా అరమరికలు లేకుండా తనతో మాట్లాడగలిగారు. ఫలితంగా ఒక మంచి సినిమా వచ్చింది. ఎనభైల్లోనే స్త్రీ వాదులు ధైర్యంగా శరీర భాష గురించి రాసిన కవితలను ‘ఒళ్ళు కొవ్వెక్కి’ రాసే తీరిక రాతలుగా పరిగణించిన ఒక ప్రపంచం మనకు తెలుసు.  అలాగే, ట్రాన్స్ జెండర్, లెస్బియన్, హోమో, ఇంకా రకరకాలైన  తమ లోపలి ముఖాలను దర్శిస్తూ, ‘మేం ఇదీ.. మాకిది కావాలి’ అని ధైర్యంగా చెప్పే సమూహాలున్న మరో ప్రపంచం కూడా మన పక్కనే ఉండటాన్ని ఈరోజు చూస్తున్నాం.

మొత్తానికి ‘Tales of Night Fairies’ సెక్స్ వర్కర్ల జీవితాల్లోని వెలుతురు కోణాలను మెరిపించి, వీరి చరిత్ర ఇంకెన్ని రకాల మలుపులు తిరుగుతుందో.. అనిపించేలా చేస్తుంది.

         lalitha parnandi  ల.లి.త.

ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !

muraliఛందోవిరహితమైన శబ్దం లేదనీ, శబ్దవర్జితమైన ఛందస్సు ఉండదనీ కవిత్వరచన వ్యవస్థితమైన పూర్వపు రోజులలో “ఛందస్సు లేని కవిత్వ”మన్న ఊహకే ఉపాధి ఉండేది కాదు. గద్యబంధంలో కూడా వృత్తగంధాన్ని సంవీక్షించి గద్యాన్ని ఛందోభేదంగానే పరిగణించిన ఒకనాటి లాక్షణికుల కావ్యశాస్త్రనిర్దేశపు ముత్యాలగొడుగుకింద మన కవులకు ముక్తచ్ఛందమన్న తిరుగుబాటు ఆలోచన రావటానికి అవకాశం లేకపోవటం సహజమే. ఆ అవకాశం మధ్యయుగాలను దాటి ఆధునికయుగంలో ప్రప్రథమంగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచిభాషలో సంచయించి, గతితార్కికభౌతికవాద ప్రభావం వల్ల సోవియట్ రష్యాలో బోల్షెవిక్కుల విజయానంతరం ప్రపంచకవితారంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మకమైన పరిణామాల కారణంగా వివిధరీతుల విస్తరించింది. ఛందోనియమాలతోపాటు కనీసం గుర్తింపదగిన గతివిధానమైనా లేని కేవల భావలయాత్మకవచనంలో వృత్తరీతి లేని అసమగణాల సంవిధానంతో పదపంక్తులను రూపొందించుకొని కవిత్వరచన చేయవచ్చుననే స్వచ్ఛందధోరణి సరిక్రొత్తగా ప్రచారంలోకి వచ్చి, అచిరకాలంలో ఆ వ్యవస్థ విశ్వమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్ల వచనానికి చైతన్యస్రవంతి శిల్పం ఎటువంటిదో – పద్యానికి ఛందోముక్త “వెర్స్ లిబర్” అటువంటిదని పాశ్చాత్య లాక్షణికులు భావించారు.

తనకాలం నాటికే ప్రభావశీలమై, భారతీయ కవిత్వంలోకి ప్రవాహవేగంతో చొచ్చుకొనివస్తున్న ఈ ప్రయోగవాదం అవ్యవస్థావాద సిద్ధాంతకర్తల ప్రాయౌగికదృష్టితో ముగ్ధుడై ఉన్న శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించటం సహజమే.

 

కమ్యూనిస్టు మేనిఫెస్టో చల్లని గొడుగునీడలో కర్తవ్యస్ఫూర్తిని పొందిన శ్రీశ్రీ ఆ భాషాకవుల మార్గంలో కొత్తదీపాల వెలుగులను చూశారు. దాని ఫలితమే మహాప్రస్థానం కావ్యసృష్టి. ఆ తర్వాతిది ఖడ్గసృష్టి.

 

ఖడ్గసృష్టిలో “ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి” పారేయాలన్న వచనకవిత్వ మౌలికసూత్రీకరణను శ్రీశ్రీ ‘కొంటెకోణాలు’ గేయంలో అలవోకగా చెయ్యలేదు. శబ్దస్ఫూర్తిని మించిన భావవ్యక్తి అందులో ఉన్నది. శ్రీశ్రీ విశాలమైన వైదుష్యనేపథ్యం ఉన్నది.

 

1928లో శ్రీశ్రీ తొలి పద్యకవితా సంకలనం ‘ప్రభవ’ వెలువడింది. భాషపై ఎంతో ప్రభుత్వాన్ని సంపాదించి, పద్యరచనలో కొంత పరిణతిని సాధించినా – స్వీయవిమర్శ చేసుకోగలిగిన శ్రీశ్రీకి ఆ ప్రస్థానం సంతృప్తి నివ్వలేదు. ఆ సంపుటిలో చేర్చిన

అలఘుధ్వాంతవితానసంభరితరోదోంతర్మహాగహ్వర

స్థలి యంభోనిధి యయ్యె; సంతతజలస్రావాతిరేకంబునన్

విలయాంభోధరఘోషసమ్మిళితగంభీరాట్టహాసధ్వనీ

చలితప్రాకటదిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా శంకరా!

వంటి రచనల కూర్పు వస్తువివేకసాధనకే తప్ప ఆయన అంతరాత్మ అందులో ధ్వనింపలేదు. అందులోని “ధ్వనీచలిత” వంటి వాచకదోషాలను గుర్తింపగల వివేకబోధ ఉన్నవాడు. పౌర్వికుల నీడలో నిలిచి ఉండే నిస్తేజస్వి కూడా కాదు. దానికితోడు తన భావోద్వేజనకు సంప్రదాయకవిత్వంలో ఉన్న పరిమితి కూడా శ్రీశ్రీ గుర్తింపుకు వచ్చింది. ఆ పరిణామవయోవస్థలోని సందిగ్ధావస్థను ఆ తర్వాత ఆయన తన ‘సుప్తాస్థికలు’ కవితలో పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మార్క్సిస్టు దర్శన కవితాదర్శనపు మహానిధి ఆయన చేతికి వచ్చింది. సరికొత్త ఛందోవిచితి సాక్షాత్కరించింది. ఆ అభిజ్ఞానం తోనే ఆయన నిగళాలను ఛేదించాలని నిశ్చయించుకొన్నారు.

 srisri

రష్యన్ భాషాచ్ఛందోనైపథ్యం

శ్రీశ్రీకి ఆంగ్లభాషాముఖంగా సోవియట్ సాహిత్యపరిచయం కలిగేనాటికే ఐరోపీయభాషాకుటుంబంలోని రష్యన్ ఛందోరీతులలో సంప్రదాయానువర్తన యుగం ముగిసి ఆధునిక ప్రయోగశకం పరాకాష్ఠకు చేరుకొన్నది. ఫ్రెంచి, జర్మను భాషానువాదాలతోనూ, జానపద సంగీత పరిచయంతోనూ అలెగ్జాందర్ పుష్కిన్ నూతన విద్యాద్వారాలను తెరిచి రష్యన్ ప్రజాజీవితాలలోకి ఆంగ్లేయులకు బైరన్ లాగా ఐరోపీయమారుతపోతాలను ఆహ్వానించాడు.  గెటే కవిత్వంలోని కాలాతీతమైన సౌందర్యదీధితి, షిల్లర్ ఆశావాదంతోడి ఆధ్యాత్మికభావసౌగంధ్యం,  షెల్లీ లలితభావవాదకల్పనాశిల్పంలో భావివిప్లవాల క్రాంతదర్శిత, బైరన్ శృంగారభంగీభణితిలోని అపురూపమైన రాజసం, బ్రౌనింగు ఆత్మాశ్రయధోరణి, హ్యూగో చిత్రణలోని విషాదకిర్మీరాలు, బార్బియర్ కవితలలోని అంతరంగసంగీతం పుష్కిన్ ఆవిష్కరించిన నూత్నచ్ఛందోగతులలోకి అడుగుపెట్టాయి. షేక్స్పియర్ సానెట్టుల విశ్వజనీన కావ్యవిశిష్టపదరచనారీతిని దెల్విగ్, ఓదోవ్‌స్కీ, పోలెజాఫ్‌లు; షెల్లీ కాల్పనికవాద లలితగీత సరణిని లెర్మొంతోవ్ ప్రవేశపెట్టి రష్యన్ ఛందోగతులకు నవీన యుగకర్త లయ్యారు. గొగోల్ నేర్పిన ధ్వన్యాత్మకవిప్లవశీలితను కవిత్వంలో ప్రవేశపెట్టి – పాతబడిన ఛందస్సులలో పరివర్తనను తీసుకొనిరావాలనీ, లేదా వాటిని పూర్తిగా పరిహరించి నవగతినిర్మితిలో స్వేచ్ఛాగానఝరుల సంగీతభంగీతరంగాలను నినదింపజేయాలనీ తుర్గెనీవ్, తొల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్)లు ప్రయత్నింపసాగారు. పాశ్చాత్య విద్యాభ్యాసం చేసివచ్చిన నవకవుల ప్రభావంతో చెహొవ్ సమకాలీన జీవితంలోని నైరాశ్యాన్నీ, పాలకుల పతనావస్థనూ, సమాజంలో లోపిస్తున్న ఆదర్శాలనూ గుర్తించి సాహిత్యానికి స్వతంత్ర దిశానిర్దేశం చేయాలని సంకల్పించుకొన్నాడు. అక్షరసంహతిలో ఛందోనియమరహితమైన నవ్యపథాన్ని అభిమానించాడు. ఆ సమయంలో రష్యన్ ఛందోగ్రంథాలలోనూ, ఆంగ్లచ్ఛందస్సులను వివరించే రష్యన్ పాఠ్యపుస్తకాలలోనూ సంప్రదాయచ్ఛందస్సులకు నిరసనగా ప్రొక్రూస్టియన్ బెడ్ అనే కొత్త వైమర్శిక పదబంధం వచ్చి చేరింది.  తనకు మార్గదీపకులైన క్రొపోత్కిన్, బకూనిన్ వంటి అరాచకవాద సామాజిక సిద్ధాంతకర్తల ప్రబోధాల మూలంగా శ్రీశ్రీకి దీని పరిచయం కలిగి ఉంటుంది.

 

ప్రొక్రూస్టియస్ తల్పం

గ్రీకు పౌరాణికగాథల నుంచి సాహిత్యక్రియాకల్పంలోకి ప్రవేశించిన ఆధునిక పదబంధం ఇది. ఏథెన్సు నుంచి ఎల్యూసిస్‌కు వెళ్ళే పవిత్రమార్గంలో ఉన్న కొరిడల్లాస్ పర్వతశ్రేణికి రాజు పొసైడాన్ కొడుకు ప్రొక్రూస్టియస్. వట్టి కుతంత్రపరుడు. అతని వద్ద ఒక మాయాతల్పం ఉండేది. అది ఎటువంటివాళ్ళకైనా సరిగ్గా సరిపోతుందని, దానిమీద పడుకొనేవారికి ఆహ్లాదం కలుగుతుందని అతను ఆ దారిని వచ్చినవాళ్ళను మభ్యపెట్టి దానిపై పడుకోమనేవాడు. ఆ ఆగంతుకులు మంచం కన్నా పొడుగ్గా ఉంటే కట్టుతాళ్ళు బిగించి, వాళ్ళ కాళ్ళుచేతులు అందుకు సరిపడేట్లు నరికి ప్రొక్రూస్టియస్ పైశాచికానందం పొందేవాడు. పొడుగ్గా లేనివాళ్ళ కాళ్ళుచేతులు సాగలాగి తెగనరకటం మాత్రం తప్పేది కాదు. పొట్టివాళ్ళు పడుకొంటే ఆ మంచం మరీ పొట్టిదయ్యేది. కాళ్ళుచేతులు తెగగొయ్యటం తప్పేది కాదు. కాళ్ళుచేతులు నరికినా తప్పులేదు కాని అవి మంచాన్ని మించకూడదని అతని వాదన.

రష్యన్ లాక్షణికులు ఛందస్సును ఈ ప్రొక్రూస్టియన్ మంచం తోనూ, వ్యతిక్రమాన్ని సహింపని ఛందోనియమాలను కట్టుతాళ్ళతోనూ సరిపోల్చటం శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. అంతకు మునుపే మయకోవ్‌స్కీ కాల్పనికవాదుల ఆత్మాశ్రయ కృత్రిమాదర్శాలు ఆగామి సామ్యవాద సమాజంలో ప్రొక్రూస్టియన్ శయ్యాగతికి నోచుకోక తప్పదని విమర్శించటం మనకు తెలిసిన సంగతే.

 

గ్రీకువీరుడు థెస్యూస్ వచ్చి ప్రొక్రూస్టియస్‌ను మాటల్లో పెట్టి అదే మంచానికి కట్టి చంపినపుడు – నిజానికి అతని వద్ద రెండు మంచాలున్నాయని, బాధితుల ఒడ్డుపొడుగులను బట్టి వాటిని మారుస్తుండేవాడని రహస్యం బయటపడుతుంది.

 

ఛందోవ్యవస్థలో ఈ రెండే గద్యం, పద్యం అని సంకేతితా లన్నమాట. పద్యానిర్మాణం చేసేవారు పాదాక్షర గణానుసారం సిద్ధిసాధనకు శబ్దంలోని దీర్ఘానికి లేని లఘిమను, లఘువుకు కూడని దీర్ఘిమను కల్పించినా తప్పులేదు కాని, ఛందోభంగాన్ని మాత్రం సహించేందుకు వీలులేదన్న నియమం – “అ‌పి మాషమ్ మషమ్ కుర్యాత్, ఛందోభంగం న కారయేత్” అన్నది ప్రొక్రూస్టియన్ శయ్యాసంస్థితమైన భాష దుఃస్థితికి అద్దం పడుతుంది.

 

లాటిన్ భాషాచ్ఛందోవిధానంలో ఇది మరొక విధంగా ఉన్నది. పాదాంతంలో పదచ్ఛేదం వల్ల సాధించే భావలయకు ప్రొక్రూస్టియన్ లయ అని పేరు. ఇది మన ఛందోనిబంధంలోని అంత్యప్రాస విధివిధానంలో ఉన్నదే. “అందంగా మధురసని / ష్యందంగా …”, “జాతి జాతి నిర్ఘాత పాత సం / ఘాత హేతువై …”, “జగతి మరపు, స్వప్నం, ని / శ్శబ్దం, ఇది …” వంటి పాదాలు ఈ అంత్యప్రాస నియతిలోని వివిధ భావగతులకు ఉదాహరణాలు.

 0148

ఇంగ్లీషులో దీనినే డ్రోలరీ (శబ్దడోలిక = తూగు) అంటున్నాము.  శ్రీశ్రీ ప్రయోగాలలో ఇది విస్తృతంగా కనుపిస్తుంది.

 

శ్రీశ్రీని ప్రభావితం చేసిన మహాకవులలో ఒకరైన ఎడ్గార్ ఆలెన్ పో “ది పర్లాయిన్‌డ్ లెటర్” అన్న కథలో పారిస్ నగర రక్షకభటులు నేరపరిశోధనసమయాలలో సడలింపు లేని చట్టాలకు ఒదిగి, పరిశోధనలో స్వేచ్ఛాసంచారం లేక చేతులు కట్టి పడవేసినట్లు ఉండవలసి రావటాన్ని ప్రొక్రూస్టియన్ తల్పంతో ఉపమించటం కూడా పో అభిమాని అయిన శ్రీశ్రీ దృష్టిపథంలో ఉండే ఉంటుంది.

 

కానీ రష్యన్ లాక్షణికులు పై దృక్కోణాలను అనుసరింపక ప్రొక్రూస్టియన్ తల్పాన్ని కేవలం ఛందోబందోబస్తుల ఏర్పాటుకు పర్యాయపదంగా మాత్రమే పరిగణించారు. ఆ సాహిత్యప్రభావమే శ్రీశ్రీ అమోఘమైన వాక్కులో ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి  అన్న వచనకవితాగతినిర్దేశక మార్గదీపక పదబంధంగా రూపుదిద్దుకొన్నది.

ఛందస్సుకు అక్షరగతులు, మాత్రానియమాలు కట్టుతాళ్ళన్న ప్రసక్తి లేకపోతే “ఛందో-బందోబస్తు” లన్న రూపణకు పద్యంలో స్థానం లేదు.

 

ఛందోరీతుల కల్పనలో సమకాలీన  తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. శ్రీశ్రీ సాధించిన ఛందోవిజయవిలాసం వల్ల తెలుగు సాహిత్యం మరింత ప్రజాసన్నిహితమై విశ్వతోముఖంగా వికసించిందనేది చర్వితార్థం.

 

 ఏల్చూరి మురళీధరరావు

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌!

యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  ‘మెయిన్‌ల్యాండ్‌’కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ”ఈజీ గోయింగ్ పీపుల్‌”. స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
వికార ప్రదర్శనకు   ‘మనం’ కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.

racism
ఈ ‘మనం’ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ ‘మనం’ ప్రాంతం అవుతుంది. అపుడు ‘వాళ్లు’ నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి “అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు ‘వాళ్లు’ పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ ‘మనం’ కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ ‘మనం’ అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ ‘మనం’ మతం అవుతుంది.  అపుడు ‘వాళ్లు’ క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం.

ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాంసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ.

ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం.

నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి ‘అందాల్ని’ ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!

జి ఎస్‌ రామ్మోహన్‌

కాందిశీకుడి ప్రేమ

 kurma

రెండునెలలుగా ప్రయత్నిస్తున్నాను తప్పించుకోడానికి. కానీ, ఇక తప్పింది కాదు. అఫ్సర్ పట్టుదలముందు నా ప్రయత్నాలు ఫలించలేదు. కాలమ్ రాయడమంటే సాహసమే కదా. నెలా నెలా రాయాలంటే ఎంత కష్టం. డెడ్ లైన్లను అసహ్యించుకునే అనేకానేక జర్నలిస్టులలో నేను కూడా ఒకడిని. పీకమీదకొచ్చేదాకా అక్షరం కదలదు. అట్లని రాయడానికి ఏమీ లేదని కాదు. కేవలం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రాయాలి. తమకు మాత్రమే తెలిసిన, తాము మాత్రమే చూసిన, అర్ధం చేసుకున్న ప్రపంచాన్ని తప్పనిసరిగా అందరూ రాయాలి.

ఇంత సంక్లిష్టమైన, విశాలమైన, సుందరమైన, నీచమైన, ప్రేమాస్పదమైన లోకాన్ని గురించి ఎంతెంత మంది, ఎన్నెన్ని తీర్ల చెప్తే తప్ప ఎలా పూర్తిగా వర్ణించగలం?

పతంజలిగార్ని ఏదైనా సభలో మాట్లాడమంటే అనేవారు, మాట్లాడడం ఎందుకండీ అని. “ఏవో నాలుగు ముక్కలు రాసుకోవడం సులభం కదండీ. మాట్లాడే పని ఎందుకు మనకి” అనేవారు.

నన్నోసారి అడిగారు, ఈ మధ్య ఏం రాసేరండీ అని. నేనన్నాను, “రాయడం ఎందకండీ, రాయడం కంటే చదవడం సులభం కదండీ,” అని. గురువుగారికి తనమాటల్నితనకే అప్పచెప్తున్న విషయం అర్ధం అయి నవ్వేరు. ఆయన నవ్వే అందమైనది.

తప్పించుకోడానికి అంటాం కానీ, జర్నలిస్టులకు రాయడం తప్ప ఇంకేం చేతనవుతుంది? కొందరు జర్నలిస్టులు (రచయితలు కూడా అయిన పతంజలిగారి లాటి వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు) గొప్పగా రాస్తారు. ఇంకొందరు ఓ మోస్తరు రాస్తారు. కానీ, రాయడం రాయాలి కదా ఏదో ఒకలాగా. జర్నలిస్టు సాక్షి కదా — సమస్త వైతరణీ నదులకూ, హింసా-ప్రతిహింసలకూ, వింతలకీ, వినోదాలకీ, చారిత్రక సంక్షోభాలకీ, వేదనలకీ, ప్రేమలకీ, వంచనలకీ. ఏదో ఒకటి రాస్తూనే వుండాలి, ప్రతిరోజూ.

అందుకే మొత్తానికి రాద్దామనే నిర్ణయించుకున్నాను. నాకళ్లతో చూసింది, నాకు అవగతమైంది, నాకు సాధ్యమైనంతమేర రాద్దామని. సరిగ్గా రాద్దామనుకున్న సమయానికి తెలంగాణా వచ్చేసింది. ఇక తెలంగాణ గురించి కాకుండా ఈ ఉద్వేగభరితమైన సందర్భంలో ఎవరైనా ఇంకేం రాయగలరు? జరిగేది అధికారమార్పిడి మాత్రమే. రాత్రికి రాత్రి ఏదో స్వర్గం వచ్చేస్తుందని కాదుకాని, ఇది ఒక తప్పనిసరి పోరాటం. ఒక అనివార్యమైన మజిలీ.

charminar

నా జీవితంలో దాదాపు సగం హైదరాబాద్ లోనే గడిచిపోయింది. పుట్టి పెరిగి, చదువుకున్న ఉత్తరాంధ్రలో ఎన్ని సంవత్సరాలు వున్నానో, ఇక్కడ కూడా అన్నే సంవత్సరాలు వున్నాను. ఇరవై ఏళ్ల పాటు చాలా దగ్గరి నుంచి చూశాను తెలంగాణాని, ఇక్కడ ప్రజల్ని. జిల్లాల్లో ఎన్నో సార్లు తిరిగాను, రైతులతో మాట్లాడాను. కేవలం జర్నలిస్టు కళ్ళతో మాత్రమే కాదు, విప్లవోద్యమం దృక్కోణంతో కూడా చూశాను. ఇక్కడి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి తెలంగాణా ప్రజలు ఎదుర్కొనే కనిపించని దాడిని కూడా చూశాను. మా బంధువులు కొందరు, “అదేవిట్రా, వీడికి తెలంగాణా భాష వచ్చేసింది,” అని మొహం మీదే అనడం చూశాను.

“మదర్ టంగ్ కదా, వస్తుంది,” అని అప్పటికైతే వాడు సమాధానం ఇచ్చాడు. కానీ, వాడి మనసు విరిగే వుంటుంది.

ఇలాటి ఎన్నో సందర్భాలకి సాక్షి అయినవారెవరైనా తెలంగాణాకు బేషరతు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం గాని, ఇస్తే ఏం ఆశ్చర్యం. ఇక ఈవాదనల్ని చేస్తున్నందుకు అక్కల దగ్గర్నుంచి, కజిన్ల దగ్గర్నుంచి, ప్రాణమిత్రుల్నించి ఎదుర్కొన్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు. ఆస్తికి సంబంధించిన, ఆధిపత్యానికి సంబంధించిన ఎవరివో వాదనల్ని మనం మీదేసుకుంటున్నామని వాదించేను. కొందరు నిజంగానే కలిసివుంటే మంచిది కదా అన్న మానవ సహజమైన, న్యాయబధ్ధమైన వాదన చేశారు. మా ఫాదర్ కూడా అన్నారు, కలిసి వుండాలి అనుకోవడం తప్పెలా అవుతుందని.

అవును, కలిసి వుండాలనుకోవడం తప్పెలా అవుతుంది? మనం మనుషులం కదా. ప్రేమికులం కదా. నలుగురు మనుషులు కలిసి జీవించడాన్ని కలగన్న వాళ్ళం కదా. కానీ, మరి కలిసి వుండడానికి మనం అర్హులం అయివుండాలి కదా. అంటే, కలిసివుండాలి అనుకునేవారు అందరూ అర్హులుకాదని కాదు. ఒక జాతిగా మరో జాతిని ఎలా చూసేం అన్నదాని బట్టి వుంటుంది కదా ఆ అర్హత.

అందుకే, తెలంగాణా వచ్చిన రోజున విజయనగరం నుండి మా ఫాదర్ ఎస్ ఎమ్ ఎస్ ఇచ్చారు, “అభినందనలు” అని. అవును, మాది ఉత్తరాంధ్రనే. మా శుభాకాంక్షలు మా పిల్లలకి, పోరాడినవాళ్ళకి, తెలంగాణకి. వాళ్ళు ఇక మానవీయ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగించాలి. మొన్నటి లాగానే, రేపు కూడా మా మద్దతు వుంటుంది.

– కూర్మనాథ్

ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1

venu

‘వర్తమాన కాలమూ గత కాలమూ

బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి

భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది

కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే

కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి టి ఎస్ ఇలియట్.

 

‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్నాడు చరిత్రకారుడు ఇ ఎచ్ కార్.

 

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఒక కలనేత. ఒక పిచికగూడు. వినీలాకాశంలో రకరకాల చిత్తరువులు గీసే మేఘమాల. తెలంగాణలోనైతే దసరా పండుగరోజున శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించే ప్రాచీన గతమూ, ఊరేగింపులో అటూ ఇటూ ఊగుతున్న, అప్పటికప్పుడు కోసిన జొన్న కర్రల వర్తమానం. పీరీ ఎత్తుకుని ఊగుతున్న అబ్బాసలీ కాళ్ల మీద బిందెడు నీళ్లు గుమ్మరించిన పెద్దింటి హిందూ అగ్రవర్ణ ముత్తైదువు కన్నీటి బిందువుగా రాలుతున్న ఆశన్న – ఊశన్నల అమరత్వం, ఇవాళ్టి గునుగు తంగెడు కట్ల బంతి గొట్టం రకరకాల పూల బతుకమ్మల ముందర ఏడేడు తరాల గాథల పాటల చప్పట్లు తవ్విపోస్తున్న సబ్బండవర్ణాల అక్కచెల్లెళ్ల ఆనందహేల. ఏ వర్తమాన దుఃఖానికైనా తాతముత్తాతల శోకాన్ని ప్రవహించే మా ఇంటి ముందరి చాకలి లచ్చవ్వ రోదన… ఎన్నెన్నో దృశ్యాలు అల్లుకుపోతున్న తెలంగాణ వర్తమానంలో, కాదు గతవర్తమానభవిష్యత్తుల మధ్య విభజన లేని లిప్తలో ఇది రాస్తున్నాను.

 

‘సారంగ’కు ఏదైనా శీర్షిక రాయమని అఫ్సర్ అడిగినప్పుడు, నేనేదో రాయగలనని కాదు గాని, తనతో ముప్పై ఏళ్లకు పైబడిన గాఢమైన స్నేహం వల్ల మాట తీసేయలేక ఒప్పుకున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో గత వర్తమానాల సంభాషణ గురించి రాయడానికి ఈ శీర్షికలో ప్రయత్నించ వచ్చుననుకున్నాను. గతమూ వర్తమానమూ కేవలం కాలసూచికలు మాత్రమే కాదు, నిరంతర చలనశీలతకు చిహ్నాలు. ఇవాళ వర్తమానమైనది రేపటికి గతమైపోతుంది. గతమూ నిశ్చలం కాదు. ఇవాళ గతం అనుకున్నదాన్ని కొత్తగా చూసే ఆకరాలు, ఆధారాలు ఆవిష్కృతమై గతం మారుతూనే ఉంటుంది. కాగా వర్తమానం అనే మాటకే కాలసూచికగా మాత్రమే కాక, వార్త, సమాచారం, సందేశం, వృత్తాంతం అనే అర్థాలు కూడ ఉన్నాయి. అందువల్ల కాలానికీ, సమాచారానికీ, వృత్తాంతానికీ, విశ్లేషణకూ, మరో చూపుకూ, కొత్త చూపుకూ అవకాశమిచ్చే ‘గతవర్తమానం’ శీర్షిక ఎంచుకున్నాను.

 

ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో జరిగిన ఒక మతాంతరీకరణ మీద అప్పుడే వెలువడిన ఒక పుస్తకాన్ని ఇప్పుడు కొత్తగా చూసి ఏమి ఆలోచించవచ్చునో రాయడంతో ఈ శీర్షిక ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఈలోగా నిరంతర గతమూ, నిరంతర వర్తమానమూ, అనంత భవిష్యత్తూ అయిన నా కన్నతల్లి తెలంగాణ లేతమొగ్గలా పువ్వులోకి విచ్చుకుంటున్న సందర్భం, భవిష్యత్తులోకి గెంతుతున్న సంరంభం నా ఈ శీర్షికకు నాందీప్రస్తావనగా మారాయి.

కుటుంబరావు గారి ‘చదువు’లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోయి జర్మనీ గెలిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు “ఏమవుతుందీ? … ఇంగ్లీషు మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు” అని జవాబు చెప్పించినట్టు, తెలంగాణ ఎన్నడూ ఓడిపోకుండానే తనది కాని మరొక భాషలో, కాకపోతే మరొక మాండలికంలో, మరొక యాసలో పాఠాలు చదువుకోవలసి వచ్చింది. ఇప్పుడిక్కడ నేను రాస్తున్న భాష, కనీసం అతి ఎక్కువ పదాలు, క్రియాంతాలు నేను మాట్లాడే భాషవి కావు. ఈ దేశంలో పాలకవర్గాలు బలప్రయోగం అవసరం లేకుండానే పాలితులను లొంగదీయ గలిగాయని కొశాంబీ అన్నట్టు, బలప్రయోగం అవసరం లేకుండానే, ఏ యుద్దంలోనూ ఓడిపోకుండానే నా భాష నాకు దూరమైపోయింది. కనుమరుగైపోయింది. నా భాష మాత్రమే కాదు, తెలుగు భాషలోని అద్భుతమైన మాండలికాల సొగసులన్నీ అణగిపోయాయి. తన కాలానికీ, సుదూర భవిష్యత్తుకూ కూడ గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని వ్యక్తం చేసిన గురజాడ అప్పారావు కూడ “…ప్రామాణికమైనదిగా గుర్తింపుపొందిన ఒక వ్యవహార భాష ఉందని ప్రసిద్ధ పండితులూ, తెలుగుదేశ ప్రజలూ అంగీకరిస్తున్నారు. అది కృష్ణా, గోదావరి జిల్లాల తెలుగు తప్ప మరొకటి కాదు” (డిసెంట్ పత్రం) అని, ఈ “ప్రామాణిక” భాష పెత్తందారీతనానికి లొంగిపోయారంటే ఈ అంకుశం ఎంత మెత్తనిదో, ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

 

ఆ మాట అన్నందుకు ఆయనకు ఏదో దురుద్దేశాన్ని, స్వార్థ ప్రయోజనాన్ని అంటగట్టనక్కరలేదు. ఏ దురుద్దేశమూ, స్వార్థ ప్రయోజనమూ లేకుండానే భావజాలపు మత్తు తన పాత్ర నిర్వహిస్తుంది. ఆ భావజాలపు మత్తే తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదన్నది. అసలు తెలంగాణకు భాష లేదన్నది. సాహిత్యం లేదన్నది. చరిత్ర లేదన్నది. మర్యాద తెలియదన్నది. తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య సృజించారని తేలినవారి స్వస్థలాల గురించి కూడ అపనమ్మకం ప్రకటించింది. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని కాలువలు వచ్చి, కాలువల కింద వ్యవసాయం వచ్చి, వ్యవసాయంలో మిగులు వచ్చి, ఆ మిగులు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు, ముద్రణ, ప్రచురణ, ప్రచార మాధ్యమాల రంగాలకు, సినిమాకు వ్యాపించి తన భాషే ప్రమాణం, తన జీవన విధానమే ప్రమాణం అని స్థిరీకరించింది.

 

ఒక బహుళ సమాజంలో, వైవిధ్య భరిత సమాజంలో మిగిలిన అంశాలన్నిటినీ తోసివేసి, అణచివేసి, ఒకేఒక్క “ప్రమాణాన్ని” నిర్ణయించడం రెండు దుష్పరిణామాలకు – అనుకరణకైనా, న్యూనతకైనా – దారి తీస్తుంది. అణచివేతకు గురైన సమూహాలన్నీ తామూ ఆ “ప్రమాణాన్ని” అందుకోవాలని వెంపరలాడతాయి, అనుకరిస్తాయి. అనుకరణ సంస్కృతి ప్రబలుతుంది. తమ మూలాలను మరచిపోయి, తొక్కివేసి “ప్రమాణాన్ని” అనుకరించాలని ప్రయత్నించేవారు పెరుగుతారు. మరి ఆధిపత్య ప్రమాణం ఇలా చేరవచ్చేవారందరినీ చేర్చుకోజాలదు గనుక ఆ “ప్రధానస్రవంతి” లోకి కొందరికే ప్రవేశం దొరుకుతుంది. కాగా అణచివేతకు గురైన అసంఖ్యాకులు తాము ఆ ప్రమాణాన్ని అందుకోలేమని, తమకు అది అందుకునే అర్హత, యోగ్యత, సామర్థ్యం లేవని ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అందువల్ల “ప్రమాణపు” బలం మరింత పెరుగుతుంది.

kancharlagopana

తెలంగాణలో పుట్టిన సాహిత్యకారులలో, తెలంగాణ సాహిత్య సంప్రదాయంలో కనీసం ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచీ ఈ అనుకరణనైనా, న్యూనతనైనా గుర్తించవచ్చు. హైదరాబాదులో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1901), స్థానిక ప్రభువైన మల్కిభరాముడినో (ముల్క్ ఇబ్రహీం కుతుబ్ షా), ఆ గోల్కొండ రాజ్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగానార్యనో, ఆ ప్రాంతంలోనే అద్భుతమైన వాగ్గేయకారుడిగా ఎదిగిన కంచర్ల గోపన్ననో కాకుండా ఆ ప్రాంతంతో ఎన్నడూ సంబంధం లేని, ప్రామాణిక తెలుగు సాహిత్య చరిత్ర కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టడం ఈ అనుకరణ – ఆత్మ న్యూనతా సంస్కృతికి చిహ్నమే. అలాగే హనుమకొండలో ఏర్పడిన రెండో తెలుగు గ్రంథాలయానికి (రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1904), తెలుగు జాతినంతా ఏకం చేసిన స్థానిక ప్రభువంశం కాకతీయుల పేరు కాకుండా, స్థానిక కవి పోతన పేరు కాకుండా ఒక చిన్న తెలుగు ప్రాంతాన్ని పాలించిన, హనుమకొండతో ఏ సంబంధమూ లేని రాజరాజ నరేంద్రుని పేరు పెట్టడమూ ఈ అనుకరణ-ఆత్మన్యూనతల ఫలితమే. ఈ సంప్రదాయమే ఇవాళ నేను వాడే భాష దాకా, నా భాష వాడడానికి బెరుకు పడేదాకా కొనసాగుతున్నది.

అయితే ఈ సంప్రదాయాన్ని తోసిరాజని తన ప్రత్యేక అస్తిత్వాన్ని, తన సంస్కృతిని, తన భాషా సాహిత్యాలను, తన ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపట్టిన సంప్రదాయం కూడ కనీసం 1930ల నుంచీ ఉంది. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న వ్యాఖ్యకు స్పందనగా 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక 354 మంది తెలంగాణ కవులను చూపింది. అయినా ఇరవై సంవత్సరాల తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి తన తొలి నవల ప్రజల మనిషి వెలువరిస్తూ, అందులో తెలంగాణ జనసామాన్యం వాడే భాష వాడినందుకు “చాలా భయంతో ఈ నవలను బైటికి తెస్తున్నాను” అని ప్రకటించారంటే తెలంగాణ సాహిత్యకారులు అనుభవించిన ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

విలీనం తర్వాత, సోదరులనీ, ఒకే భాషకు చెందినవారనీ చెప్పిన తర్వాత ఆధిపత్య, ప్రామాణిక భాషతో పోల్చుకుని ఈ “భయం” తగ్గలేదు సరిగదా పెరిగింది. తెలంగాణ భాష, “ప్రామాణిక” భాషకు, “ప్రామాణిక” నిఘంటువులకు తెలియని తెలంగాణ పదాలు ఇంకా అవహేళనకూ, అవమానానికీ గురవుతూనే వచ్చాయి. తెలంగాణ భాష అయితే తౌరక్యాంధ్రమో, కాకపోతే అలగా జనాల మొరటు భాషో అయిపోయింది. దాదాపు సగం ప్రాంతంలో జనవ్యవహారంలో ఉన్న మాటలు కేవలం తమకు తెలియనందువల్ల, తమ నిఘంటువుల్లోకి ఎక్కనందువల్ల అవమానించదగినవని మహాఘనత వహించిన కోస్తాంధ్ర సాహిత్యకారులు అనుకున్నారు. కోస్తాలో కొన్ని కులాల, చిన్న చిన్న ప్రాంతాల భాషను, చిన్న సమూహాల నుడికారాన్ని తెలంగాణ పాఠకులు చదువుతూ, నేర్చుకుంటూ, ఆనందిస్తూ, తమ పదజాలంలో భాగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే తెలంగాణ మాండలికం విస్మరణకు, అవహేళనకు  గురయింది.

 

ఇటువంటి అవహేళనలకు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తన మొదటి కవితాసంపుటం ‘చలినెగళ్లు’ లో ఒక కవితలో ‘శ్మశానంలో కోర్కెలు తీరని బొక్కల వలె’ అని వరవరరావు రాస్తే, ఒక సుప్రసిద్ధ కోస్తా సాహిత్య విమర్శకుడు తెలంగాణలో ‘బొక్కలు’ అంటే ఎముకలు అని తెలుసుకోకుండా, తనకు తెలిసిన ‘రంధ్రాలు’ అనే అర్థమే సర్వస్వమైనట్టు ఇంత అశ్లీలం రాయడమా అని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత పునః ప్రారంభమైన సృజన లో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగపోరాటాల వెల్లువలో కరీంనగర్ మాండలికంలో అల్లంరాజయ్య కథలు వెలువడుతున్నప్పుడు చాల మంది ప్రగతిశీల రచయితలు కూడ మాండలిక రచన సరైనది కాదంటూ, సృజన అల్లం వాసన వేస్తున్నదంటూ చర్చోపచర్చలు నడిపారు.

D98571616a copy ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం కాళోజీ చెప్పినట్టు “రెండున్నర జిల్లాల రెండున్నర కులాల దండిబాస” లోనే ఉంది. ఆ భాషను అందరూ ఆదరించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో వచ్చిన రచనలనూ తెలుగు సాహిత్యమంతా సాదరంగా ఆహ్వానించింది. కాని తెలంగాణ మాండలికంలో సాహిత్య సృష్టి మాత్రం అపరాధమైపోయింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలకు గొంతు ఇవ్వడానికి ప్రయత్నించి ‘మీ వాయిస్ కల్చర్ సరిగా లేదు’ అని తిరస్కారానికి గురైన తెలంగాణ పాత్రికేయులు, రచయితలు ఎందరో ఉన్నారు. 2002లో వెలువడిన నా కవితా సంపుటానికి పావురం (పక్షి కాదు, తెలంగాణలో ప్రేమ, నెనరు, వాత్సల్యం) అని పెట్టాలనుకున్నప్పుడు ఏ ఒక్క “ప్రామాణిక” నిఘంటువులోనూ ఆ మాట చేరలేదని గుర్తించాను. “ఎన్నో తెలంగాణ మాండలిక పదాలకు ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఐనా ఇవి ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కలేదు” అంటూ శబ్దరత్నాకరంలో స్థానం పొందని శబ్దాల జాబితా 1988లోనే ఒక పుస్తకం రాశారు రవ్వాశ్రీహరి. ఆ కృషినే కొనసాగించి ప్రధానంగా తెలంగాణ పదాలతో ఒక నిఘంటువు తయారుచేశారు. నలిమెల భాస్కర్ కూడ ఆ ప్రయత్నం చేశారు.

ఇది కేవలం భాష విషయంలో, కొన్ని పదాల విషయంలో మాత్రమే జరిగినది కాదు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సాహిత్యకారుల ప్రతిపత్తి, తెలంగాణ చరిత్ర వంటి అన్ని విషయాలలోను ఈ చిన్నచూపు, వివక్ష, నిర్లిప్తత, లోతైన పరిశోధన లేకుండానే తీర్పులు చెప్పడం వంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి.

ఉదాహరణకు కాకతీయుల మీద చాల సమగ్రమైన పరిశోధన చేసిన పి వి పరబ్రహ్మ శాస్త్రి 1978లో ప్రచురితమైన తన గ్రంథాన్ని ‘తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల శాసన పరిశోధన కష్టమయింది’ అనే అర్ధ సత్యంతో ప్రారంభించారు. కాని అప్పటికి డెబ్బై ఏళ్లుగా కొమర్రాజు లక్షణరావు, లక్ష్మణరాయ పరిశోధనా మండలి, మారేమండ రామారావు, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్రరావు, యాజ్దాని వంటి ఎంతో మంది పరిశోధకులు సాగించిన కృషిని ఇలా ఒక్కమాటతో కొట్టివేయడం ఆశ్చర్యమే గాని అసహజం కాదు.

ఇటువంటిదే మరొక ఉదాహరణ చెప్పాలంటే 1944లో హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో కీలకశక్తి, ప్రచురణకర్త, స్వయంగా రచయిత, బ్రిటిషాంధ్ర లో నిర్బంధ పరిస్థితులవల్ల హైదరాబాదు నుంచి తెలుగుతల్లి పత్రిక తేదలచినప్పుడు దాన్ని నిర్వహించినవాడు, 1945 మహాసభల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. కాని 1947లో ఆయనను నిజాం ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి నిరాకరించింది. ఆయనను రచయితగా అరెస్టు చేశారనడానికి ఆధారం లేదని తీర్మానాన్ని తోసిపుచ్చారు. తెలంగాణ రచయితల సాహిత్య ప్రతిపత్తి గురించి కోస్తా రచయితల వైఖరి అది.

ఇక బమ్మెర పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని సకల ఆధారాలూ ఉన్నప్పటికీ ఆయనను కడపకు తరలించడానికి ఒక శతాబ్దం పాటు సాహిత్యకారులనుంచి రాజకీయ నాయకులదాకా ఎందరెందరో ఎంత ప్రయత్నించారో చెప్పనక్కరలేదు.

రెండు తెలుగు భాషల మధ్య, రెండు సాహిత్య సంప్రదాయాల మధ్య, “ప్రామాణిక”, ప్రామాణికేతర సాహిత్య ధారల మధ్య కొన్ని దశాబ్దాలుగా సాగిన సంబంధంలో ఒక పార్శ్వం ఇది. దీన్ని ధిక్కరిస్తూ స్వాభిమానాన్ని ప్రకటించిన పార్శ్వం కూడ అంతే బలమైనది. ఒకరకంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన ఆ స్వాభిమాన కాంక్ష, వాస్తవచరిత్ర రచనాకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో బలోపేతమయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సాహిత్య చరిత్ర పునర్లేఖనం – వాస్తవ లేఖనం – జరగవలసి ఉంది. వర్తమానం గతంతో సంభాషించవలసి ఉంది. వర్తమానం ప్రసరించే కొత్త వెలుగులో గతం భాసిల్లవలసి ఉంది. గతవర్తమానాల మేలుకలయికగా భవిష్యత్తును సంపద్వంతం చేయవలసి ఉంది.

 

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy

శేఖర్ మిత్రులం !

sekhar1
ప్రియ కార్టూనిస్ట్ మిత్రులారా!

మనలో చాలా మందికి తెలిసే వుంటుంది,మనలో వొకడు మన వాడు, మలి తరం రాజకీయ కార్టూనిస్టులలో మహా చురుకులు పుట్టించిన శేఖర్ గత కొంత కాలం గా తీవ్ర అనారొగ్యం తో పోరాడుతున్నారు.

ఆయన జీవిత కాలంలో ఎదుర్కొన్న సమస్యలు , సాగించిన పోరాటాలు ఒకెత్తు, ఇప్పుడిది మరో ఎత్తు, పెదాల పై చిరునవ్వు ఆరనీకుండా, కుంచెలొ సిరా ఇంకనీకుండా ఆయన చేస్తున్న ఈ పోరాటం కేవలం యోధానుయోధులు మాత్రమే చేయగలిగినది. శరీరం లోని ప్రతి కండరం యమ యతనలకు గురై బాహ్య ఆకారం శుష్కించిన ఆయన మనో నిబ్బరం ఆత్మ విశ్వాశం ముందుకన్నా మరింత కాంతులీనుతూనే వుంది.

అయినా మనం మనకు చేతనైనంతలొ ఆయనపై మనకు గల ప్రేమ ను తెలిపే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా వున్న కార్టూనిస్టులం అందరం కలిసి ఒక రోజు శేఖర్ తో గడుపుదాం,మీరు మాలో ఒక భాగం అనే విషయం ఆయనకు తెలుపుదాం, మేం చేసిన పుణ్యం ఏదైనా వుంటే అది మిమ్మల్ని మాకోసం కాపాడుకుంటుంది అనే విషయం గుర్తించమందాం.

ఇదే సమయం, మనలోని “మనిషి” మరో మనిషి కోసం కలవడానికి.

ప్రియమిత్రులారా ఇదంతా ఒకరు నెత్తిన వేసుకుని ఫలనా రోజు, ఫలానా చొటు అని నిర్ణయించి మీ రాక కై ఎదురు చూస్తున్నాం అనే ఆహ్వనం కానే కాదు, శేఖర్ నా సోదరుడే కాదు మీకుకూడా, మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనేదే నిజం. ఈ రెండు మూడు రోజుల్లో మీ అందరి సలహాల మేరకు కార్యక్రమం నిర్ణయించబడుతుంది, మీ సలహాల సూచనల కోసం ఎదురు చూస్తున్నాం .

మీతో పాటు మీ అందరి గొంతుల తరపున

అన్వర్.

కలవరపెట్టే అతి సంచయేచ్ఛ … “సర్ ప్లస్”

నేను తృప్తిగా, సాదా సీదాగా  జీవితం గడపాలనుకుంటున్నాను

“జనం అందరూ ఒక్కసారిగా మారిపోతారు.  వాళ్ళ నోటివెంట , “నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు. నాకు ఇంకో పెద్ద Mac కంప్యూటర్ అక్కర్లేదు. నేను డీజల్ బ్రాండ్ జీన్స్ వేసుకోవాలనుకోవటం లేదు” అనే రోజులు వస్తాయి”.

ఏ వర్యావరణవేత్త నోటివెంటనైనా ఇలాంటి మాటలు వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ, ప్రపంచంలోని 80 శాతం సంపదను తింటూ కూర్చున్న 20 శాతం అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వస్తే?   ఊహించటానికే ఇదెంతో బాగుంది కదా!!

‘సర్ ప్లస్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ‘ఎరిక్ గాండినీ’,  జార్జ్ బుష్  చేత గమ్మత్తుగా పై మాటల్ని పలికిస్తాడు. పైగా ఈ ఇటాలియన్ ఫిల్మ్ మేకర్  ‘మనమంతా  వినిమయ సంస్కృతి అనే ఉగ్రవాదం నీడన బ్రతుకుతున్నాం’  అని కూడా భయపెడుతున్నాడు ట్యాగ్ లైన్ పెట్టి మరీ !!   ఇతని సినిమా “సర్ ప్లస్ ” – ‘టెర్రరైజ్ డ్  ఇన్ టు బీయింగ్ కన్స్యూమర్స్’  – 2003 లో తయారయింది.

వస్తు వ్యామోహ తత్వం విశ్వరూపమెత్తి, ప్రకృతి ఇచ్చిన ఆస్తుల్ని కొల్లగొట్టి మనుషుల్ని డొల్లలుగా మార్చిందని చాలా మంది కళాకారులూ, పర్యావరణ వేత్తలూ  ఏనాటి నుంచో  చెప్తూనే ఉన్నారు. సంపద అనే అమృతాన్ని పంచిపెట్టే తీరులో ప్రభుత్వం మోహినీ అవతారమెత్తి,  కార్పొరేట్  దేవతలకే అంతా ధార పోసి, 90 శాతం సగటు దానవులకు ఏమీ లేకుండా చెయ్యటమే ఈ నాటి మాయ అని కూడా చాలామంది గుర్తించారు. ఈ మాయను మన కళ్ళముందు డాక్యుమెంటరీ రూపంలో విప్పి చూపే ప్రయత్నం చేసిన కొద్దిమందిలో గాండినీ ఒకరు.

ఈ ఫిల్మ్ లో జార్జ్ బుష్  సొంత మాటలూ ఉంటాయి. ఇంకా అతని నోట చాలామంది వినాలనుకునే ఒప్పుకోళ్ళనూ, సామ్యవాదపు మాటల్ని కూడా “అనిపిస్తాడు” ఫిల్మ్ మేకర్.  మార్కెట్ ఎకానమీని బుజాన మోసే నాయకుల చేత, అందులో ఉన్న మోసాన్ని గురించి నిజాలు మాట్లాడించటం మంచి హాస్య స్ఫోరకంగా కూడా ఉంటుంది.

2001 లో ఇటలీ లోని జెనోవాలో జరిగిన జి-8 సమావేశం, అక్కడ,  నిండా అస్త్ర శస్త్రాలు ధరించి, ఏ మాత్రం గొడవ అయినా అణచటానికి సిద్ధంగా ఉన్న పోలీస్ బలగాలు… దీనితో ఫిల్మ్ మొదలవుతుంది. ఏ నిముషం ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత మనలో మొదలవుతుంది.  అంతర్జాతీయ వ్యాపార సంస్థ  వ్యవహారాలు నచ్చని కొంతమంది పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులు రాళ్ళు విసిరి, షాపుల అద్దాలు విరగ్గొట్టి, వాహనాలను తగలేస్తారు.  పోలీస్ ఫైరింగ్ లో ఒక యువకుడు చనిపోతాడు.

“నా ఉద్దేశ్యంలో బ్యాంకులు,  చెయిన్ మార్కెట్ లు, ఖరీదైన షాపుల వంటి కార్పొరేట్ ఆస్తులను గురి పెట్టి ధ్వంసం చెయ్యటం చట్టబద్ధమైన పనే.  మనుషుల ప్రాణాలు తియ్యకుండా ఆస్తుల మీద రాళ్ళు వెయ్యటంలో తప్పేముంద”ని ప్రశ్నిస్తాడు జాన్ జేర్జాన్. ఈయన ఒక రచయితా, అరాచక వాదీనూ.

 జాన్ జేర్జాన్.

‘ఆస్తి ధ్వంసం చెయ్యటం’ అనే దానిని పోరాట రూపంగా గుర్తిస్తాడు ఈ రచయిత. అలాగని ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఆస్తులు ఆశించ లేదు. సృష్టించ లేదు. ఎవరి ఆస్తులూ ధ్వంసం చెయ్యనూ లేదట. చాలా కాలం తన రక్తాన్ని అమ్ముకుంటూ అతి తక్కువలోనే జీవించాడట. “అసలు జనం ఎందుకు  ఆస్తి ధ్వంసం చేస్తారని ప్రశ్నించుకోకుండా ఇదంతా అర్ధంపర్ధం లేని హింస అని తేల్చేస్తే ఎలా?” అంటాడు జేర్జాన్.

“నా దృష్టిలో టీవీ ముందు కూర్చోవటం, మత్తు మందు కొట్టటం, పనికిమాలిన ఉద్యోగాలు చేస్తూపోతుండటం.. ఇదీ అర్ధం పర్ధం లేని హింసంటే ! అదేపనిగా పని చెయ్యటం, అదేపనిగా వస్తువుల్ని వినియోగిస్తూ ఉండటం .. ఇదీ హింస స్వరూపం.”  అని తేల్చేస్తాడు.  “చాలా సౌకర్యవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, అంతులేని భౌతిక సుఖాలు.. ఇదంతా పరమ శూన్యమైన వ్యవహారమని కొంతమందికైనా అర్ధం అవుతుంది. వాళ్ళు తృప్తికీ స్వేచ్ఛకీ ఉన్న హద్దుల్ని చెరిపేస్తారు.” . ఇవీ జేర్జాన్ అభిప్రాయాలు.

‘స్వాంటే’  ఒక MNC లో పని చేసిన వ్యక్తి. చిన్న వయసులోనే  మిలియన్ల డాలర్లు సంపాదించిన ఇతనికి ఆ డబ్బంతా ఏమి చేసుకోవాలో అర్ధం కాలేదు. చవకైన చక్కని జీవితాన్ని కోల్పోతున్నట్టు అనిపించిందట అతనికి. ఆరుబయట మూడు రాళ్ళతో పొయ్యి  పెట్టుకుని సూర్యాస్తమయ వేళలో వండుకుని స్నేహితులతో తినటాన్ని ఆనందిస్తాడు. “డబ్బంటే మనసు మూలల్లో నాకు అసహ్యం. ఇప్పుడిక నాకు దానిగురించి ఆలోచించే అవసరం లేదు.  ఖర్చు పెట్టాలంటే ఎటు చూసినా ఎన్నో మార్గాలు. కానీ నేనా పని  అంత సులభం గా చెయ్యలేను. నిరంతరంగా సంపాదిస్తూ పోతుంటే,  కొన్నాళ్ళకు  ఎక్కువ డబ్బుకు మనం అలవాటు పడతాం.  డబ్బు ఒక రంగుల రాట్నం.  అది అదుపుతప్పి తిరిగేస్తోంది.  ఒక ఇల్లు, భార్య, పిల్లలు .. ఎంత సంపాదించినా జీవితంలో ఇంతకంటే ఏముంది?” …  అంటాడు.  వస్తు వ్యామోహ తత్వానికి ఇలాంటివాళ్ళు సవాళ్లు.

                                 ‘డబ్బనే రంగుల రాట్నం అదుపుతప్పి తిరుగుతోంది’…. స్వాంటే.                                                           ‘ఇంకా, ఇంకా కావాలి’ …. తాన్యా

 

“మనల్ని మన వ్యాపారాలు చేసుకోనీయకుండా, షాపింగ్ చేసుకోనీయకుండా భయపెట్టే ఉగ్రవాదులను అసలు ఒప్పుకోం”… అంటాడు జార్జ్ బుష్ తన మాటల్లోనే.

“అన్నీ కొనేసి వాడాలనే కోరిక మనలో భయోత్పాతాన్ని కలిగిస్తోంది. ఇదీ ఉగ్రవాదం అంటే!  ఈ భయోత్పాతాన్ని కలిగించి పెంచి పోషించేది వ్యాపార ప్రకటనల రంగం.  ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ లేదా మరో బ్రాండ్ … ఎంపిక లో స్వేచ్ఛ ఇంతవరకే కదా!”  అంటాడు జేర్జాన్.  కానీ ఎంపికలో ఉండే ఆ కాస్త స్వేచ్ఛలో బోలెడంత వైవిధ్యం కూడా ఉంది.  ఎలా అంటారా? ఇలా …

ఒక బొమ్మల షాపు చూపిస్తాడు.  బొమ్మలంటే మామూలు బొమ్మలు కావు. లవ్ డాల్స్.  రక రకాల తలలు. కళ్ళు. ముక్కులు. శరీరపు వంపులు. సూపర్ మోడల్ శరీరాలు.  పొట్టి, పొడవు, సన్నం..   ఒక రకం శరీరానికి నాలుగైదు రకాల తలల్లో ఎలాంటి తల కావాలంటే అలాంటి తల అమర్చి ఇస్తారు.  మగ శరీరాలు కూడా దొరుకుతాయి.  ఎంత వెరైటీ!  ప్రాణమున్న మనుషుల అవసరం లేకుండా  సెక్స్ అవసరాలు తీర్చుకునేందుకు బొమ్మల్ని కూడా తయారు చేసే స్థాయికి చేరింది మార్కెట్.  ఒక్కొక్క బొమ్మ ఏడు వేల డాలర్ల దాకా ఖరీదు చేస్తుందట.

“ఇలాంటి వ్యవస్థను కొనసాగించటంలో ఎటువంటి ఆరోగ్యకరమైన లక్షణమూ లేదు. భావి తరాలకోసం భద్రపరిచే విలువ గల పని ఒక్కటైనా ఉందా వీటిలో?  – జేర్జాన్.

 

ఈ నమూనా జీవితానికి పూర్తిగా విరుద్ధమైన జీవితాన్ని చూపించాలంటే  ఒకే ఒక్క ఆధారం.  క్యూబా .. అక్కడ ఖాళీగా అతి తక్కువ సామాన్లతో ఉండే దుకాణాలు…  తన రేషన్ కార్డు చూపిస్తూ ఒక పెద్దావిడ  “బియ్యం, పప్పు, వంట నూనె, టూత్ పేస్టు తో సహా అన్నీ ప్రతి మనిషికీ లెక్క ప్రకారం అందుతాయి. ఏ ఒక్కరికీ  లేకపోవటం ఉండదు. కనీసావసరాలు అందరికీ తీరుతున్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి?”  అంటుంది.

కానీ.. కావాలి…  చాలా మందికి చాలా కావాలి…  తాన్యా ఒక యువతి.  “రైస్, బీన్స్ .. రైస్ అండ్ బీన్స్. క్యూబాలో ఇంతే కదా. నేను యూరప్ లో స్నేహితుల ఇంటికి వెళ్లాను. అక్కడ సూపర్ మార్కెట్ మొదటిసారి చూసినప్పుడు నోరు తెరిచేసాను. ఆపిల్ పళ్ళు, మంచి సుగంధ ద్రవ్యాలు. షాంపూలు. ఇంగ్లాండ్ లో ఉన్నన్ని రోజులూ నేను బీన్స్ తినటం మానేసాను.  టీవీ చూస్తూ చానల్స్ మారుస్తూ, తింటూ, తింటూ ..  మెక్ డోనల్డ్స్.. అవీ ఇవీ ..  ఇలా తిని, తిరిగి ఇంటికొచ్చేసరికి 180 పౌండ్స్ బరువున్నాను.” అంటుంది. ఇదంతా చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో వెర్రి ఆనందం…  చుట్టూ సముద్రమంత సంపద. మధ్యలో ఉన్న క్యూబా ద్వీపంలో తయారయే ఆ కాసింత తిండీ అందరూ సర్దుకు తినాలి.  ఉన్న వస్తువులను అందరూ పంచుకోవాలనే నిస్వార్థతత్వాన్నీ, సర్దుబాటునూ నిదురలేపే ప్రయత్నం చేస్తోంది  సామ్యవాదం.  దీనికి వ్యతిరేకంగా మార్కెట్ వ్యవస్థ మనముందు వస్తువులను పరిచి పెడుతోంది.  వ్యాపార ప్రకటనలనే అగ్గిపుల్లలతో .. ఆ వస్తువులన్నిటినీ సొంతం చేసుకోవాలనే కోరికనూ, స్వార్దాన్నీ మనలో రాజేస్తోంది.  దాని బలం ముందు మనిషితనం నిలవటం ఎంత కష్టం? ప్రపంచమంతటా సామ్యవాదమే ఉంటే కేవలం “రైస్ అండ్ బీన్స్” కాక ఇంకొంచెం మంచి తిండి “అందరూ” తినొచ్చునని తాన్యాకు అర్ధం కావటమూ అంతే కష్టం.

(క్యూబా లో టూత్ పేస్ట్ ట్యూబ్ పైన ఏ అక్షరాలూ లేకుండా ఉండటం ఈ ఫిల్మ్ లో చూసి ఒకనాటి  విషయం గుర్తుకొచ్చింది. “టూత్ పేస్ట్ దేశం అంతటా ఒకే ధరలో దొరకాలి. అసలు ఏ వస్తువైనా అమ్మటానికి వ్యాపార ప్రకటన ఎందుకు? ఒకే వస్తువుకు రకరకాల పేర్లెందుకు?” అని మార్కెట్ వ్యవస్థను చీల్చి చెండాడేసే వారు కమ్యూనిస్ట్ అయిన మా ఎకనామిక్స్ మాస్టారు).

“గనుల్లో, సైన్యాల్లో మనుషులు నిర్బంధించబడుతున్నారు. జీవితం అంతా వెచ్చించి, సృష్టిస్తూ, వినియోగిస్తూ పోవటం మనం ఎన్నుకున్న మార్గం  కాదు. జడత్వం తో ఈ మార్గంలో నడుస్తున్నాం.  ప్రపంచమంతా ఒకటే రకం వ్యవస్థ ఉండాలంటూ అన్ని చోట్లా ఆక్రమించుకుంటూ, వైవిధ్యాన్నీ, స్వేచ్ఛనూ చెరిపేసే ఒక విధ్వంస రూపాన్ని ప్రతిష్టిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రకృతికి ఎటువంటి నొప్పీ కలిగించలేదు మనిషి. ఒక్కసారిగా 3 శతాబ్దాలలో అంతులేని విధ్వంసాన్ని సృష్టించాడు.”  అంటాడీ ఫిల్మ్ మేకర్.

అలంగ్ .. గుజరాత్ తీరాన ఉన్న ఒక చిన్న రేవు. ఇక్కడ పెద్ద పెద్ద ఓడలను విరగ్గొట్టే పని నడుస్తూ ఉంటుంది. అమెరికా, ఇంగ్లాండ్,  ఇంకా ఇతర డబ్బున్న దేశాల పాత ఓడలు ఇక్కడ పోగు పడతాయి.  (ఇక్కడ పని చేసే 50000 మంది పనివాళ్ళకు ఎటువంటి రక్షణ లేదు. సంవత్సరానికి కనీసం 50 మంది దాకా ఈ పనుల్లో చనిపోతూ ఉంటారట. 2012 లో ఇక్కడకొచ్చిన  దాదాపు 425 యు.ఎస్., ఇంగ్లాండ్ ఓడలు వదిలిన కాలుష్యం అక్కడి పనివాళ్ళను ఏ అనారోగ్య తీరాలకు చేర్చిందో తెలియదు. డబ్బు కోసం మన ప్రభుత్వాలు కాలుష్యానికి ద్వారాలు తెరిచి దేశాన్ని టాయిలెట్ గోతిగా మార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు).  అలంగ్ లో షిప్ బ్రేకింగ్ కంపనీలో కళ్ళకు రక్షణ లేకుండా వెల్డింగ్ పని చేస్తున్న కూలీలూ, వాళ్ళ కళ్ళ చికిలింపులూ, ఆ భయానక వాతావరణమూ … కొన్ని ఫ్రేముల్లో చూపి భయపెదుతుంది ‘సర్ ప్లస్’.  ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘యంత్ర భూతముల కోరలు తోముతూ’, ఎంతమంది బ్రతుకులీడుస్తున్నారో లెక్కలు చెప్పేవారూ తక్కువే.

“మనుషులు కనిపెట్టిన అతి శక్తివంతమైన ప్రసార సాధనం 30 సెకన్ల వ్యాపార ప్రకటన” – అంటాడీ ఫిల్మ్ మేకర్.  కళ్ళనూ మెదడునూ ఆక్రమించే వ్యాపార ప్రకటనల చురుకైన టెక్నిక్ నూ, మ్యూజిక్ వీడియోల ఆకర్షణనూ  బాగా అర్ధం చేసుకున్న ఈయన, ఆ టెక్నిక్ ను మరింత సమర్ధవంతంగా వాడి, మామూలు డాక్యుమెంటరీ ఫిల్మ్ పరిధుల్ని దాటేసి, ‘సర్ ప్లస్’ visual technique ను మంచి స్థాయికి  తీసుకువెళ్ళాడు. వ్యాపార ప్రకటనలు మత్తులో ముంచే పనిలో ఉంటే, ఇతడు ‘పెను నిద్దుర’ను వదిలించే పని పెట్టుకున్నాడు ఈ ఫిల్మ్ తో.

వ్యాపార ప్రకటనల ముల్లును, ముల్లు తోనే తీసినట్టుగా, ‘జి-8 వరల్డ్ షాప్’ పేరుతో జార్జ్ బుష్ తదితరులు రకరకాల తిండి వస్తువుల ప్రకటనలు ఎలా చేస్తారో వారినోట “పలికిస్తూ”  గేలి చేస్తాడు. మెరిసిపోతున్న అమెరికా నగరంలో  ఒక బిల్ బోర్డు పై ఒక బలిసిన పంది బొమ్మ త్రేన్చుతూ ఉండే దృశ్యం చూపిస్తూ, “సగటు ఉత్తర అమెరికావాసి ఒక మెక్సికన్ కంటే 5 రెట్లు, చైనా వాసి కంటే 10 రెట్లు, భారతీయుడి కంటే 30 రెట్లు తింటాడని”ని లెక్క చెపుతాడు.  (జార్జ్ బుష్  భారతీయుల తిండి యావ పెరిగి, దాని మూలంగా కరువు వస్తోందని పాపం ఆ మధ్య బాధ పడ్డాడు.  ఇప్పుడు టీవీ చానెల్స్ లో వచ్చే రకరకాల వంటకాల తయారీలు చూస్తుంటే నిజంగానే మన సగటు తిండి లెక్క ఏమైనా పెరిగిందేమో అనిపిస్తోంది).

మరి క్యూబా సంగతికొస్తే, అమెరికా లాంటి పహిల్వాన్ తో పోటీ పెట్టుకుని ఒక పక్క నిలబడుతూనే, మరోవైపు తమ వ్యవస్థ ఉత్తమమైనదని రుజువు చేయటం మాటలా? అక్కడి బిల్ బోర్డు పై “పొదుపు చెయ్యండి. అవసరమైనంత మాత్రమే వాడుకోండి” అని రాసి ఉంటుంది.  “క్యూబా వినిమయ సంస్కృతిని ప్రోత్సహించదు. మేము ప్రజాస్వామికంగా ఉంటాం. వ్యాపార ప్రకటనలు కుదరవ”ని ప్రకటిస్తాడు ఫిడెల్ కాస్ట్రో.

‘అభివృద్ధి, అభివృద్ధి అభివృద్ధి’ అంటూ ఉన్మాదిలా గంతులేసుకుంటూ  “మూడే మాటలు..  నా కంపెనీని నేను ప్రేమిస్తాను”. అంటాడు మైక్రోసాఫ్ట్  సి.ఇ.ఓ. స్టీవ్ బాల్ మర్.  అదే మంత్రం జపిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రిల్ చేస్తుంటారు ఆఫీసుల్లో నీరసంగా.  పనిలోని పరాయీకరణతో పాటు ఇలాటి వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదనే సూచన కనిపిస్తుంది.  “నా కంపనీని నేను ప్రేమిస్తాను” అని కిక్కిరిసిన జనంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చేత కూడా “అనిపిస్తాడు”. ఇక్కడ కంపెనీ అంటే ప్రజానీకం.

“ప్రపంచీకరించబడిన ఈనాటి ఆర్ధిక వ్యవస్థ ఒక పెద్ద జూదశాల” – ఇది ఫిడెల్ కాస్ట్రో అభిప్రాయం.

ఈ ఫిల్మ్ లో  తాన్యా, స్వాంటే  సైకిల్స్ తొక్కుతూ ఉంటారు. పెద్ద పెద్ద చెయిన్ స్టోర్స్ లో కనిపించేటటువంటి ట్రాలీలను మనిషి తోసుకు పోతుంటే కెమెరా వృత్తంగా తిరుగుతూ ఉంటుంది. రైలు, ఫ్యాక్టరీ, సుత్తితో కొడుతూ ఉండటం, ఎత్తైన మహా కట్టడాలు ..  ఈ దృశ్యాల మీద కెమెరాను  పానింగ్ చేస్తూ, ఒకే మాటను మళ్ళీ చెప్తూ, మళ్ళీ మళ్ళీ చెప్తూ, ఒకే దృశ్యాన్ని మళ్ళీ చూపిస్తూ, మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఒక విలక్షణమైన లయను సాధించాడు ఈ  డైరెక్టర్. ఈ విష వలయాన్ని ఛేదించటం కష్టమనే ఊహ మనలో మెదులుతూ ఉంటుంది.  డాక్యుమెంటరీ అంటే ఏదో నిస్సత్తువగా నాలుగు దృశ్యాలతో చెప్పాలనుకున్నది చెప్పటం కాకుండా,  మన మేధనూ, హృదయాన్నీ, చెవినీ, కంటినీ చురుగ్గా ఆక్రమించి పని చేయించేస్తూ ఉంటాయి ఈ ఫిల్మ్ లోని దృశ్యాలు, శబ్దాలు, మాటలు, సంగీతమూ..

భారీ పరిశ్రమల్లో వస్తువుల్ని తయారు చెయ్యటం, పాత వాటిని చెత్త పోగులు వెయ్యటం,  విరగ్గొట్టటం .. ఈ మూడు పనులనూ పదేపదే చూపిస్తూ, విహ్వలమైన సంగీతాన్ని జోడించి, మనం నిరంతరం ‘ఇదే జీవితం’ అనుకుంటూ చేస్తున్న  ఈ పనుల్ని మించిన హింస ఇంకేమీ లేదని స్ఫురింపజేస్తాడు.  వస్తువుల సృష్టిలోనూ, వ్యామోహంలోనూ  ఉండే మాదకత (తాన్యా),  ఉన్మాదం(స్టీవ్ బాల్ మర్),  హింస(అలంగ్) లను  అంతే బలంగానూ, ఉన్మాదంగానూ చూపిస్తాడు.  జోహన్ సోడర్ బర్గ్ చక్కని ఎడిటింగ్ పనిని గుర్తించనిదే  ‘సర్ ప్లస్’ గురించి రాయటం పూర్తి కాదు.

ఈ ఫిల్మ్ చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది. ప్రకృతి పట్ల ఎటువంటి గౌరవం, ఆరాధన లేకుండా పూర్తి స్థాయి వినియోగదారులుగా మాత్రమే మనం మిగలటంలోని బాధ, అతిగా పనిలో దూసుకుపోతూ , దొరికిన కాస్త ఖాళీ సమయంలో టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటూ బ్రతకటంలోని ఇరుకుతనం, ఆర్ధిక అసమానతలను అసలేమీ గుర్తించకుండా బతికెయ్యటంలోని విషాదం… కళ్ళముందు నిలబడతాయి.

ఈ నాశనానికి ముఖ్య కారణమైన వ్యవస్థకూ, దేశానికీ ప్రతినిథి అయిన వ్యక్తి  “ మేమే కాదు ప్రపంచమంతా ఈ సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి” అని మామూలుగా తన పద్ధతిలో బోధిస్తూనే ఉన్నాడు.  ప్రపంచమంతా వింటూ, ఆచరిస్తూనే ఉంది.  అలాంటి అమెరికన్ ప్రెసిడెంట్  “నేను తృప్తి గా, సాదా సీదాగా బ్రతుకుతాను” అనగలిగిన రోజున మాత్రమే ప్రపంచంలో మార్పు సాధ్యమని భావిస్తున్నాడా ఈ ఫిల్మ్ మేకర్?  లేక మనలోని వినియోగదారుడిని  నిరంతరం తట్టి లేపుతూ ఉండే  ఈ ఉగ్రవాదానికి  ఇంత absurd గానూ  తెర దించటమే సరైనదని అనుకున్నాడా?

*****

మనిషి అవసరాన్ని ప్రకృతి తీర్చగలదు కానీ మనిషి దురాశను మాత్రం తీర్చలేదని గాంధీ ఏనాడో చెప్పాడు.  మనం ప్రగతి పేరుతో బోలెడన్ని వస్తువుల్ని మన చుట్టూ పేర్చుకుంటూ, ఇంకా కొత్త వస్తువుల్ని కనిపెడుతూ, చాలా ముందుకు వచ్చేశాం.  ఉన్న వాటినే వాడుకోవటానికి సమయం లేకనూ, కొత్త వాటిమీద మోజుతోనూ పాత వస్తువుల్ని చెత్తబుట్టల్లో వేస్తున్నాం.  వెనక్కి తిరిగి చూస్తే మనం నడిచిన మార్గం వస్తువులతో మూసుకుపోయి ఉంది.  కనబడని ఉగ్రవాదుల్లాంటి వ్యాపార ప్రకటనలు  “పక్కింటి వాళ్ళ కారు మీ కారు కంటే పెద్దదిగా ఉందా? కొత్త.. పేద్ద.. కారు కొనుక్కొని , ఉన్న దానిని అమ్మి పారేయండి మా ఫలానా వెబ్ సైట్ లో” అని మోగుతూనే ఉన్నాయి. ఈ సర్ ప్లస్ నమూనాలో బ్రతకటం చాలా మందికి ఇష్టంగా లేదు. కానీ చట్రం గట్టిగా బిగుసుకుంది.

‘సర్ ప్లస్’  ఫిల్మ్ వచ్చి పదేళ్లయింది. అందులో ఊహించినట్టుగా, ఆశించినట్టుగా మార్కెట్ ఎకానమీ కూలిపోలేదు ఇంకా!  వాల్ స్ట్రీట్, ఈజిప్టు ఉద్యమాలు దిశా నిర్దేశం  లేని ఆందోళనలుగా మిగిలాయి.  ప్రభుత్వాల, కార్పొరేట్ ల కొమ్ములు వంచాలని చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ  ప్రయత్నిస్తూనే ఉన్నారు.  భూమి తల్లినీ, దానినే ఆశ్రయించుకున్న వేలాది మనుషులనూ కాపాడే బాధ్యత మీద వేసుకుని, గ్రీన్ టెర్రరిస్టులనే ముద్ర వేయించుకుంటున్నారు.  అగ్ర రాజ్యాలకు పూర్తి వ్యతిరేక దిశలో వెళ్తూ ఇప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకున్న క్యూబా వంటి దేశాలు తక్కువ.  వస్తువులతో కిక్కిరిసిన ఈ పునాదులు లేని భవంతి ఎప్పుడు దానంతట అదే కూలుతుందా ఎప్పుడు కొత్త వెలుతురు వస్తుందా అని మౌనంగా ఎదురుచూసే వాళ్ళూ ఉన్నారు.

‘సర్ ప్లస్’ లో అన్నిటికంటే భయపెట్టేవి చెత్త డంప్ లూ, టైర్ల గుట్టలూ… ఎటు చూసినా రోడ్లమీద వాహనాలు కనిపిస్తూనే ఉన్నా, “ఇన్ని వాహనాలున్నాయా ప్రపంచంలో?” అని మనం బెదిరిపోయే దృశ్యం అది. “ఇంత అతిగా అన్నిటినీ వాడుతూపోవటం  ఎక్కువ కాలం కుదరదు.  ప్రకృతినుండి మనను వేరుచేసి treadmill మీద నిలబెడుతున్నాయి ఈ పెద్ద పెద్ద రోడ్లు.  వీటిని చీల్చేసే పని భారీ ఎత్తున జరిగితే చూడాలనిపిస్తోంది” అని జేర్జాన్ అంటూ ఉంటే,  ఆ విధ్వంసం  తరువాత … వినూత్నమైనదీ, మనిషిని తను చేసే పనితోనూ, ప్రకృతి తోనూ ముడి వేసి ఉంచేదీ అయిన నమూనా మనకు కావాలనిపిస్తుంది. ఆ కొత్త వ్యవస్థ – ప్రాంతీయ జ్ఞానాన్నీ, ఇంతవరకూ చూసిన వ్యవస్థల మంచి చెడ్డల ఆధారంగా కలిగే సరికొత్త ఊహలనూ కలుపుకునేదైతే ఎంతో బాగుంటుందనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో కూడా (తక్కువ visual quality తో)చూడవచ్చు.

ల.లి.త.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ”

chitten raju

అది మార్చ్ 30, 1922 తారీకు. అంటే 90 ఏళ్ల పై మాటే. ఆ రోజు తను పెరిగిన మేనమామల గ్రామం మీద ఉన్న మమకారాన్ని తీర్చుకుని ఇప్పటికీ చాలా వరకు మా హయాంలోనే ఉన్న “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు” తన స్వార్జితంతో బొబ్బిలి సంస్థానానికి చెందిన చెలికాని రంగరాయణం గారి దగ్గర నుండి మా తాత గారు సూర్యప్రకాశ రావు గారు కొనుగోలు చేసిన రోజు. అది దొంతమ్మూరు గ్రామ శివారులో చిన జగ్గం పేట గ్రామానికి ఆనుకుని ఉన్న 350 ఎకరాల పొలానికి అధికారికంగా ఉన్న పేరు. ఆ ప్రాంతాలలో అంత విస్తీర్ణం ఉన్న పొలాన్ని “శేరీ” అంటారు. అంత కన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న వాటిని “మిరాశీ” అనీ పిలుస్తారు. మా తాత గారిని చదివించిన  మేనమామ కుంటముక్కుల హనుమయ్య గారి మిరాశీ  పొలానికి సరిహద్దుల్లోనే ఈ శేరీ అమ్మకానికి రావడంతో మా తాత గారు వెనకాడ లేదు.

కాకినాడలో నేను పుట్టి పెరిగిన 1925 నాటి “వంగూరి హౌస్” ఎలాగో  1922 నాటి ఈ  “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ”  పొలమూ అలాగే నా జీవితంలో ఇప్పటికీ అంతర్భాగమే. సుప్రసిద్ధ గాయకులు పి.బి. శ్రీనివాస్ గారి పొలాలు మా పొలాల సమీపంలోనే. నిజానికి ఈ వ్యాసం ఇప్పుడే మా పొలం వెళ్లి తిరిగి వచ్చి గాంధీ నగరంలో మా “వంగూరి హౌస్” నుంచే వ్రాస్తున్నాను. ప్రతీ దేశానికీ రాష్ట్రాలు, రాష్ట్రానికీ జిల్లాలు, పట్టణాలు, పట్టణాలలో పేటలూ ఎలా ఉంటాయో అలాగే 350 ఎకరాల మా శేరీ లో చాలా  “మళ్ళు”, వాటికి ఆసక్తికరమైన పేర్లూ ఉన్నాయి.  ఉదాహరణకి మా శేరీ లో ఉండే కొన్ని వాటాల పేర్లు వరకట్టు, చవిటి రేవడి, తోటూరి వారి వాటా, దాట్లప్పయ్య రేవడి,  మాలోళ్ళ వాటా, సప్పావోడి వాలు, చిన్న చెరువు మళ్ళు, పర్ర, అమర్కోట మాణిక్యం వాటా, దరువు మొదలైనవి. ఎందుకో తెలియదు కానీ నాకు ఇవి చాలా ఇష్టమైన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు విన్నా చాలా మ్యూజికల్ గా వినిపిస్తాయి. అలాగే ఒక విధంగా శేరీ సరిహద్దులు అనదగ్గ రావి దొడ్డి కాలువ, శుద్ధ గెడ్డ, జగ్గమ్మ చెరువు గట్టు, తాటిపర్తి చెరువు, పుంత మొదలైనవీ, వీటన్నింటికీ మధ్యలో ఉన్న పది ఎకరాల చెరువూ, జగ్గమ్మ చెరువు కి వచ్చే వర్షం నీరులో మూడింత  ఒక వంతు మా చెరువు లోకి తరలించే “జంతి” అనే రెండు కాలువల సంగమం పేర్లలో ఉండే తెలుగు  సహజత్వం నాకు చాలా ఆహ్లాదంగా వినపడుతుంది.  ఈ పేర్ల వెనక ఖచ్చితంగా ఉండే చారిత్రక నేపధ్యం ఎవరికీ తెలియదు కానీ మా నాన్న గారు ముఫై ఏళ్లకి పైబడి గుర్రం మీదా, గుర్రబ్బండి, ఎడ్ల బండి మీదా కాకినాడ నుంచి వెళ్ళి దగ్గర ఉండి వ్యవసాయం చూసుకునే వారు కాబట్టి ఆయనని “దివాణం” గారు అనీ, ఆయన పోయి 30 ఏళ్ళు దాటినా మా పొలాన్ని “శేరీ రామం” గారి పొలాలు” అనీ ఆ ప్రాంతాలలో అంటారు. మా నాన్న గారు ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య ని  “చిన్న దివాణం” అని పిలిచి, ఆ తరువాత మాత్రమే “దివాణం” అని ప్రమోషన్ ఇచ్చారు. ఇక ఆ ప్రాంతాలలో నా చిన్నప్పటి చిరునామా “పెకాస రావు గారి మనవడు”, లేదా  “రామం గారబ్బాయి” ..అంతే…..ఇప్పుడు కూడా నేను  ”దివాణం గారి తమ్ముడు రాజా గారు”, మహా అయితే  ప్రస్తుతం నా పై వాడూ, డాక్టరూ అయిన మా సుబ్బన్నయ్య మా పొలాల యాజమాన్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను “డాక్టర్ గారి తమ్ముడు”  అనేదే నా అక్కడ నా ఉనికి. అలా పిలిపించుకోవడం నాకు భలే ఇష్టం.

మా అమ్మాయిలతో నా పొలంలో

మా పొలాలకి ఎక్కడో ఉన్న ఏలేశ్వరం కొండలలో వర్షం కురిసి, జగ్గమ్మ చెరువు లోకి నీరు వస్తేనే మా చెరువు నిండితే పంటలు పండేవి. లేకపోతే ఎండి పోయేవి.  పైగా ఏ మాత్రం భారీగా వర్షాలు కురిసినా శుద్ధ గెడ్డ నిండి పోయి వరదలు వచ్చి పంటలని ముంచేసేవి. ఈ కారణాల వలన ఒక ఏడూ పండీ, మరొక ఏడు ఎండీ, వ్యవసాయం గిట్టుబాటు కాకా,  పెళ్ళిళ్ళు, చదువులు మొదలైన భారీ ఖర్చులు వచ్చినప్పుడు ,   మా నాన్న గారూ, ఆ తరువాత మా అన్నయ్యలూ దూరంగా ఉన్న వాటాలని అమ్మినప్పుడు మా రైతులే అవి కొనుక్కున్నారు.  ఇప్పటికీ మా పొలంలో పని చేసే వారందరూ మూడు, నాలుగు తరాల నుండీ  మా శేరీనీ నమ్ముకున్న వారే! నమ్ముకుని బాగు పడ్డ వారే. ఉదాహరణకి మా నాన్న గారి దగ్గర “ఉద్దారుడు” …అంటే పాలికాపులకి నాయకుడిగా పని  చేసిన  గుడాల వేంకటేశు ఎప్పుడూ నేల  మీద అణుకువ గానే  “ఆయ, ఆయ్” అనడమే నేను చూశాను.  ‘ఎంకటేశు’ ఎప్పుడో పోయినా మా పొలంలో పని చేసి అతను కూడబెట్టిన సంపద తో ఇప్పుడు అతని కుటుంబం మా అందరి కంటే  ధనవంతులు. అంతెందుకు, నేను మొన్న …అంటే ఫెబ్రవరి 2, 2014 నాడు మా పొలానికి వెళ్ళినప్పుడు, మా మూడో తరం పాలికాపు వీర్రాజు కి తీసిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. “నీకు ఎన్నేళ్ళురా వీర్రాజు?” అని అడిగితే “ ఆ మాత్రం తెల్దేటండీ. ఓ పదేళ్లుంటాయండి” అని, “ఏరా, ఉండవురా?”  అని పక్కనే ఉన్న అతని  60 ఏళ్ళు దాటిన కొడుకు ని అడిగాడు. మా పొలం లోనే పుట్టి, పెరిగిన ఈ  వీర్రాజుకి కనీసం తొంభై ఏళ్ళు  ఉంటాయి. ఎప్పుడో అక్కడే రాలిపోతాడు. శేరీ రామం గారబ్బాయి ..అంటే నేను వాడిని పలకరించగానే  గుర్తు పట్టిన  వీర్రాజు కళ్ళలో మెరిసిన ఆప్యాయతకి కి నేను తగనేమో అనిపించింది.

Veerraju

మా చిన్నపుడు పొలంలో కనీసం యాభై పాడి పశువులు, పాతిక మందికి పైగా పాలికాపులు, ఇద్దరు, ముగ్గురు ఉద్దారులు, స్టేటస్ సింబల్ గా రెండు వేల రూపాయల అత్యధిక విలువ గల మైసూరు ఎడ్ల తో సహా సొగసైన గూడు బండి, వాటికి విలువైన మువ్వలు, ఇతర ఆభరణాలు, ప్రత్యేకంగా ఒక పాలికాపు.. నాగులు…ఉండే వారు. ప్రతీ పశువుకీ, ముఖ్యంగా ఆవులన్నింటికీ తెల్లావు, కర్రావు, గంగ, కామధేను, గుడ్డావు, కుంటావు మొదలైన పేర్లు ఉండేవి. వాటిల్లోంచి కనీసం ఒక ఆవు, గేదె  కాకినాడ లో మా ఇంటి ప్రాంగణంలో ఉండేవి. మా పొలం వెళ్ళాలంటే  బస్సులో ..సుమారు పది మైళ్ళు..అవును అప్పుడు  కిలో మీటర్లు లేవు …. పిఠాపురం మీదుగా గొల్లప్రోలు దాటాక, చేబ్రోలు కి ముందు వచ్చే అడ్డ రోడ్డు దగ్గర దిగాలి. వారం ముందుగానే మా పెద్దన్నయ్యకి కబురు పెడితే ఈ ప్రతిష్టాత్మకమైన మైసూరు ఎడ్ల బండి అన్ని హంగులతోటీ పంపించే వాడు. అక్కడ నుంచి  మా పొలానికి తాడిపర్తి, చిన జగ్గం పేట  మీదుగా రెండు మైళ్ళు ఈ బండిలో మేము మల్లీశ్వరి, రోజులు మారాయి వగైరా సినిమా పాటలు పాడుకుంటూ విపరీతంగా ఫీలయి పోతూ శేరీ “మకాం” …అవును … అది పొలంలో మేము నివశించే పెద్ద తాటాకుల పాక …అక్కడికి చేరుకునే వారం. ఈ రోజుల్లో అలాంటి ఇళ్ళని షోగ్గా “ఫార్మ్ హౌస్” అంటారు.  ఆ నాలుగు గదుల  “ఫార్మ్ హౌస్” ముందు ఈ రోజుల్లో అయితే దాన్ని “పాండ్” అనబడే పెద్ద “గొయ్యి” లో నించి నీళ్ళు తోడుకుని, మరిగించి, చల్లార్చి, “గుడ్డ ఫిల్టర్” లో ఫిల్టర్ చేసి అవి మంచి నీళ్ళగా తాగే వాళ్ళం.  ఈ మొత్తం 15 మైళ్ళ లోపు …. అంటే 30 కి. మీ.  లోపు  ప్రయాణానికి…వారం రోజులు సన్నాహాలూ,  కాకినాడలో బస్ స్టాండ్ దాకా రిక్షా, తరువాత బస్సు, ఆఖర్న ఎద్దు బండి, ఒక వేళ జగ్గమ్మ చెరువు నిండి  పోయి, బండి వెళ్ళ లేక పొతే, మోకాలు నీటి లోంచి నడిచి మరో అర మైలు నడిచి అంతా కలిపి ఇంచు మించు ఒక రోజు ప్రయాణం చేస్తే యావత్ ప్రపంచం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయే ఆ ఏకాంత ప్రదేశానికి చేరుకొని మహాదానంద పడేవాణ్ణి.  ఇప్పుడు హాయిగా మినరల్ వాటర్స్ బాటిల్స్ పట్టుకుని, కారు లో వెళ్లి గంట సేపు గడిపేసి అరగంట లో వెనక్కి  తిరిగి వచ్చేసి ఆయాస పడిపోతున్నాను. అప్పుడూ, ఇప్పుడూ వీర్రాజు హాయిగా యింకా మట్టి ముంత లోనే  ఆవకాయ ముక్క నల్చుకుని గంజి అన్నం  తింటున్నాడు.  ఆ  పాక బదులు చిన్న సిమెంటు ఇల్లు,  పశు సంపద బదులు అద్దెకి తెచ్చుకునే ట్రాక్టరు, ఆడుతు పాడుతు పని చేసే పల్లె పడుచుల బదులు సెల్ ఫోన్లలో సినిమా పాటలు వింటూ పని “నటించే” వ్యవసాయ కూలీలు ఒకటేమిటి ఇప్పుడు మొత్తం సీనరీ మారి పోయి అలనాటి సీనరీలు సినిమాలకే పరిమితం అయిపోయాయి. అప్పుడు నేను స్వహస్తాలతో రోజు కూలీ రూపాయి పావలా ఇచ్చిన జ్జాపకం. ఇప్పుడు ప్రభుత్వం వారి “పనికి ఆహార పథకం” లేని  రోజు మాత్రమే కూలి కి వచ్చే వారి కూలి రోజుకి 300 రూపాయలు దాటింది. ఓడలు బళ్ళు అయ్యాయి. రోజులు మారాయి..ఖచ్చితంగా …

గిరిజ,

ఇక్కడ ఒక పిట్ట కథ ఏమిటంటే , ప్రతీ వేసవి కాలం లో లాగా 1964, మే నెలలో నేను కుప్పనూర్పులకి పొలం వెళ్లాను. బాహ్య ప్రపంచంతో మాకు ఏకైక సంబంధం ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. ఆ రోజు  రేడియో పెట్టగానే “బినాకా గీత మాలా” “బావ గారి కబుర్లు”, “భక్తీ రంజని” లాంటి ఏ ప్రోగ్రామూ లేదు సరి కదా గంటల తరబడి ఏడుపు సంగీతమే. కనీసం మధ్యలో అప్పుడప్పుడైనా ఒక్క మాట కూడా  లేదు. రేడియో పాడై పోయింది కాబోసు అనుకుని ఎం చెయ్యాలో తెలియక భోరుమని ఏడ్చాను. రెండు రోజులయ్యాక తరువాత కాకినాడ వెళ్ళినప్పుడు తెలిసింది  ఆ రోజు (మే 27, 1964) నెహ్రూ గారు చనిపోయారని. గాంధీ గారి కంటే నాకు ఎక్కువ ఇష్టమైన నెహ్రూ గారు  పోతే, ఆలిండియా రేడియో వారు వార్తలు నిరాటంకంగా ప్రసారం విషయాలు ప్రజలకి చెప్పాలి కానీ ఇలా సంతాప సూచకంగా మూడు రోజులు మౌనం పాటించడం లాంటి బుద్ది తక్కువ ఆలోచన ఎవరికి కలిగిందో మరి. చిన్నప్పుడు మా స్కూల్ లో జరిగే  “ఐక్య రాజ్య సమితి” దేబెట్ల లో నేను ఎప్పుడూ తెల్ల టోపీ , లాంగ్ కోటూ వేసుకుని , అందులో గులాబీ పువ్వు పెట్టుకుని  నెహ్రూ గారి పాత్రం ధరించే వాణ్ణి. అప్పటికి రెండు, మూడేళ్ళ క్రితమే నెహ్రూ గారు కాకినాడ వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో మొట్ట మొదటి ఆయనని చూసి ఆ మహానుభావుడి ప్రసంగం విని, ఆయన పట్ల నా ఆరాధాన యింకా పెంచుకున్న నాకు ఆయన మరణ వార్త చాలా బాధించింది. మూడు రోజుల తరువాత మాత్రమే తెలిసినందుకు ఆలిండియా రేడియో మీద విపరీతమైన కోపం వచ్చింది.  నెహ్రూ గారు నేను ఏడ్చిన మాట నిజమే కాని, దానికి కారణం రేడియో పాడాయి పోయింది అనుకోవడమే!  అది తల్చుకున్నప్ప్పుడల్లా ఇప్పటికీ నాకు అదోలా ఉంటుంది.  ఈ రోజుల్లో అయితే  ఎవరైనా ఇంట్లోంచి హాస్పిటల్ కి వెళ్ళే దారిలో ఉండగానే టీవీ చానెల్స్ పసిగట్టేసి, దహన సంస్కారం దాకా  అన్నీ మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అప్పుడు అది ఒక రకం దౌర్భాగ్యం, ఇప్పుడు మరొక రకం. అనావృష్టీ, అతివృష్టీ..

శేరీ తో నా చిన్నప్పడు అద్భుతమైన అనుబంధాలు రెండు విధాలుగా ఉండేవి. మొదటిది తుమ్మ జిగురు. ఎందుకంటే, ఆ రోజుల్లో   మా పొలం గట్లు అన్నింటిమీదా తుమ్మ చెట్లు ఉండేవి. వాటి ఖాండానికి  ఒక చిన్న గాటు పెట్టి వదిలేస్తే కొన్ని రోజులకి తుమ్మ జిగురు ఊరేది.  ఆ తుమ్మ జిగురు ప్రతీ రోజూ వాడనిదే నా దిన చర్య పూర్తి అయ్యేది కాదు. మా స్కూల్ లో ఇచ్చే సైన్సు ప్రాజెక్టుల కంటే  ఆ రోజుల్లో వచ్చే అద్భుతమైన “ఇల్లస్త్రేటెడ్ వీక్లీ” అంత కంటే  ముఖ్యంగా “స్పోర్ట్స్ ఇలస్త్రేటేడ్” అనే పత్రిక లో వచ్చిన క్రికెట్ వీరుల బొమ్మలు కత్తిరించి, ఈ తుమ్మ జిగురుతో పేపర్ మీద అంటించి  ఆల్బమ్స్ తయారు చేయడం అప్పుడు నాకున్న అతి ముఖ్యమైన హాబీ. అందు వలన ఈ తుమ్మ జిగురు సప్లై కనక ఆగిపోతే నా ప్రాణం ఉసూరు మనేది. పోనీ బజార్లో కునుక్కుందామా అంటే, ఆ బాటిల్స్ లో ఉండేది  కూడా సరిగ్గా మా పొలం లో ఫ్రీ గా వచ్చే లాంటి సరుకే. అందు చేత నేను వారం, పది రోజులకి ఒక సారి “ పెద్దన్నయ్యా, ఇచ్చట కాకినాడలో మేము క్షేమం. అక్కడ  శేరీ మకాం లో నువ్వు క్షేమం అని తలుస్తాను.  ఇచ్చట  మా స్కూలు  సైన్సు  మాస్టారు అయిన “దొర” గారు ఎక్కువ పని ఇవ్వడం వలన నాకు అర్జంటుగా అతి ఎక్కువ గా తుమ్మ జిగురు కావలెను. ఈ సారి పొలం నుంచి నువ్వు ధాన్యం మొదలైనవి బండి లో పంపించినప్పుడు పొలంలో మొత్తంలో ఉన్న వంద తుమ్మ చెట్ల నుండీ జిగురు సేకరించి, నేను బాగా చదువుకోడానికి సహకరించ వలెను” అని ..అవును… ..పోస్ట్ కార్డులే  వ్రాసే వాణ్ణి.  దానికి సమాధానంగా మా పెద్దన్నయ్య “ఒరేయ్ తుమ్మ జిగురూ” అని సంబోదిస్తూ నాలుగైదు పేజీల సమాధానం వ్రాసి, జిగురుతో అంటించిన కవరూ, కావలినంత జిగురూ పంపించే వాడు.

రెండోది ప్రతీ వేసవి కాలం లోనూ నేనూ, మా తమ్ముడు  ఆంజీ అనబడే హనుమంత రావూ, మా పెద్దన్నయ్య బావ మరిది చాగంటి వెంకట్రావూ, అబ్బులు బావా వగైరా కుర్ర గేంగ్ అంతా సుమారు రెండు నెలలు మా పొలం లోనే మకాం వేసే వాళ్ళం. ఆ వివరాలు ప్రస్తావించే ముందు మా పెళ్ళయిన వారం రోజులలో మా ఆవిడ కి మా పొలం చూపించడానికి వెళ్ళినప్పుడు నా రెండో చెల్లెలు భాస్కర అన్నపూర్ణ తో ఫోటో, అలాగే అమెరికా లో పుట్టి పెరిగిన మా అమ్మాయిలకి కూడా “రామం గారి శేరీ” లో “రాజా గారి వాటా”  చూపించి, మా రైతులతో దిగిననప్పటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. వచ్చే నెల మరి కొన్ని ““ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ” విశేషాలతో కలుసుకుందాం.  అన్నట్టు మొన్న మా పొలం వెళ్ళినప్పుడు ఒక్క తుమ్మ చెట్టు  కూడా కనపడ లేదు.  ఎందుకంటే వాటి నీడకి పంట తక్కువ రాలుతోంది అని  పొలం  గట్ల మీద మా చిన్నప్పటిలా తుమ్మ చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మొదలైనవే కాక కంది, మినప, పత్తి లాంటి పొదల మొక్కలు కూడా ఈ రోజుల్లో వెయ్యడం లేదుట.  అంత కంటా దారుణం సెల్ ఫోన్ల్ నుంచి వచ్చే రేడియేషన్ కి పిచ్చుకలు మూకుమ్మడిగా చచ్చి పోయి, ఉన్న వాటికి రాలడానికి ఏ రకమైన చెట్లూ లేకా ఎక్కడా అసలు ఒక్క పిచ్చుకైనా  కూడా కనపడ లేదు.  ఆ అర్భక జాతి మన పురోగతికి ఆహుతి అయిపోయింది అన్న  మాట . హతోస్మి !

   — వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

 

ఇప్పుడు మనవి రాతి మొహాలు….మొరటు ఊహలు!

‘‘సౌందర్యం ఇటు వైపు నుండి చూస్తే సరిగ్గా కనిపించకపోతే, అటు వైపు దగ్గరగా వెళ్ళి కళ్ళతో ముట్టుకుని చూడాలి’’ అన్నాడు వారెన్‌ స్టీవెన్‌సన్‌ అనే ఆంగ్ల కవి.
‘‘జీవితంలో సౌందర్యాన్ని మించిన ఆనందమూ, సౌందర్యాన్ని మించిన విషాదమూ లేనే లేదు’’ అన్నాడు బుచ్చిబాబు అనే తెలుగు రచయిత.
‘‘సౌందర్యం’’ అంటే ఏమిటి? అని అడిగితే ఎవరికి తోచిన జవాబు వారు చెబుతారు. నైఘంటికార్ధం వేరే ఏదో ఒకటి వుండే వుంటుంది. కానీ చాలా సందర్భాలలో నైఘంటిక అర్ధాలకు, జీవన అనుభవాలకు పొత్తు కుదరదు. పొంతన జరగదు. ఉదాహరణకి ‘‘ఇల్లు’’ అంటే నిఘంటువుల్లో నాలుగు గోడలు, ఒక కప్పు కలిగి వుండి మనుషులు నివసించే ప్రదేశము అని వుంటుంది. కానీ ఇల్లంటే మనుషులు నివసించే ప్రాంతం మాత్రమే కాదు. ఆ మనుషుల మధ్య సజీవమయిన బంధం ఒకటి వుండాలి. అది నిరంతరం కాంతులీనుతూ వుండాలి. ప్రాకృతిక శక్తులకు ఎదురొడ్డి నిలిచే ధైర్యాన్ని ఆ బంధం ఇవ్వాలి. దు:ఖ సమయాలలో ఓదార్పు నివ్వాలి గుండె దిగులుగా కొట్టుకుంటున్నప్పుడు ‘‘నేనున్నాను’’ అనే సాంత్వన వీచిక అవ్వాలి. మనిషిలోపల రాక్షసత్వం మొగ్గతొడుగుతున్నప్పుడు దాన్ని సంహరించే సింహవాహని కావాలి. అందంగా, ఆనందంగా, స్వచ్ఛ సుందర శుభ్ర నీలంలాగా మనుషులు ఆనంద యాత్ర సాగించే పరిమళ భరిత తరుచ్ఛాయ కావాలి. ఈ లక్షణాలు అన్నీ వుంటేనే అది ఇల్లు అవుతుంది. హృదయాల నిలయం అవుతుంది.
నైఘంటిక అర్ధాలు వేరు జీవన అవసరాలు వేరు. అలాగే ‘‘సౌందర్యం’’ అంటే ఏదో ఒక నైఘంటిక అర్ధం వుంటుంది. కానీ అది జీవన వ్యాపారానికి సరిపోదు.  జనన మరణాల భ్రమాన్విత లోకంలో లోలకంలాగా తిరిగే, మనిషికి అన్ని అయి సేద తీర్చే సర్వరోగ నివారిణి అవదు. ‘‘సౌందర్యం ఏమిటన్న మొదటి ప్రశ్న దగ్గరికే వస్తే, సౌందర్యం అంటే సౌందర్యమే అని జవాబు చెప్పి తప్పించుకునే చమత్కారం వద్దు కానీ… ‘‘ప్రేమలాగే సౌందర్యం కూడా ఒకే భావన, ఒక అనుభూతి, ఒక పరవశగానం, ఒక పరిమళ ప్రవాహం’’. ఈ భావనని మాటల్లోకి అనువదించలేము. మౌనంలోకి కుదించనూ లేము. వేగుంట మోహనప్రసాద్‌ సాంధ్య భాషలో చెప్పాలంటే అది ఉండుండీ సలపరించి ఊండ్‌. అది ఒక గాయం.
సౌందర్యం ఎలా వుంటుందీ అంటే…? అది ఎలా అయినా వుండవచ్చు. ధనుర్మాసంలో, గొబ్బిళ్ళ మద్యన లయ బద్ధంగా కాళ్ళు కదులుతుంటే, చలిని చీల్చుకుని స్వరాన్ని పెకలించునప్పుడు, హరిదాసు పాటలో ధ్వనించే ‘‘జీర’’ లాగా వుండొచ్చు. తులసి ఆకుల మీద జారిపోతున్న పాదరసం లాంటి, మంచు బిందువులా వుండొచ్చు. పట్టు పరికిణీ కట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకొని ఆ పారాణి పరికిణీకి అంటకుండా ఒక చేత్తో పరికిణి ఎత్తి పట్టుకుని, మరో చేత్తో పూల సజ్జ పట్టుకుని దైవ దర్శనానికి అమ్మవెంట అడుగులో అడుగు వేసే ఆరిందాలాగా వుండొచ్చు. పచ్చికొట్టిపోయిన ప్రియురాలి లేత పెదవి ఎరుపులాగా వుండొచ్చు. సౌందర్యం ఎలా గయినా వుండొచ్చు. ఎందుకంటే సౌందర్యం ఒక భావన మాత్రమే. సౌందర్యం ఒక సున్నితమయిన ఊహ మాత్రమే. సౌందర్యం ఒక గుడి గోపురం మీద నుండి ఒక్కసారిగా పైకెగసిన పావురాల రెక్కల సవ్వడి మాత్రమే.
వంశీ ఏమిటి ఇవ్వాళ సౌందర్యం చుట్టూ గిరికీలు కొడుతున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదు. మొన్నీమధ్య ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అసంకల్పితంగా, అప్రయత్నంగా విన్న ఒక పాట కొద్దిసేపు కలవరానికి గురిచేసింది. ఆ పాట ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆ పాట గురించి తర్వాత చెప్తాను.

పదిహేను, ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన 1942 ఎ లవ్‌ స్టోరీ అనే సినిమాలో జావేద్‌ అఖ్తర్‌ అనుకుంటాను, ఒక పాట రాశాడు. ఆ పాట ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఎంత సౌందర్యాత్మకంగా వుంటుందీ అంటే ‘‘ఇంత’’ అని చెప్పలేనంత.
ఆ పాటలో కవి ఏం చెతున్నాడు? ఏమీ చెప్పడం లేదు. ఒక అందమయిన అపురూపమయిన, లేలేత మావిచిగురు లాంటి అమ్మాయిని చూసినపుడు అతడి భావనామయ దృష్టి ఎంతెంత దూరం ప్రయాణం చేసిందో అంత దూరాన్నీ అలతి, అలతి పదాలతో దండగా అల్లి మన మెడలో వేస్తున్నాడు.
‘‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా’’! అంటూ మొదలుపెట్టిన కవి మనలని తన వెంట ఎలా తీసుకెళుతున్నాడో చూడండి.
ఆ అందమయిన అమ్మాయి వికసిస్తూవున్న గులాబీపువ్వులాగా వున్నదట. భావుకుడయిన కవి రాసిన లాలిత్య పదగుంఫనాభరిత కవితలాగా, కవి కలలాగా వుందట. మెరిసేసూర్యకిరణంలాగా వుందట. అడవిలో ఛెంగు, ఛెంగుమని గెంతులేస్తున్న హరిణముద్రలాగా వుందట.
ఇంకా ఎలా వుందట? చంద్రుడు వెలిగించిన రాత్రిలాగా వుందట. సంగీతంలోని సుస్వరంలాగా వుందట. గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతిలాగా వుందట. తొలి ఉషోదయమపు చెదరని అందంలాగా వుందట. హేమంత రుతువును వెచ్చచేసిన సూర్యకిరణ సందోహంలాగా వుందట. ఒక వీణా నినాదంలాగా, ఇంద్ర ధనుస్సులోని ఆత్మలాగా.
ఇంతదాకా రాసిన కవి దాహం తీరిందా? లేదు. ఆవిడ చుట్టూ యింకా ఎన్నెన్ని ఊహాల మాలలు అల్లుతున్నాడో చూడండి. విస్తరిస్తున్న తరుఛ్చాయలాగా వుందట. విస్మయం గొలిపే అలల సయ్యాటలాగా వుందట. మలయాద్రి పవనాలు తోడ్కొని తీసుకొస్తున్న పరిమళంలాగా వుందట.
పట్టు పురుగు జారవిడిచిన సిల్కు దారంలాగా వుందట. దేవతలు పాడుతున్న సంగీతం లాగా, చందనపు చెక్కలతో వెలిగించిన అగ్నిలాగా…
నిజంగా అ అమ్మాయి అలా వుందో లేదో తెలియదు కాని, కవి ఆ అమ్మాయిని చూసినపుడు ఇన్ని భావనలు పొందాడు. ఊహ ఎంత దూరం ప్రయాణించ గలదో . అంత దూరమూ ప్రయాణించాడు. ఈ పాటనంతా ఉదహరించింది నేను కవి ఊహా పటిమను గుర్తు చెయ్యడానికో, కవిత్వ సౌందర్యాన్ని కరతలామలకం చెయ్యడానికో కాదు. కవి సంస్కారాన్ని గుర్తుచెయ్యడానికి కవి సౌందర్యాభినివేశాన్ని లేదు మరో మాటలో చెప్పాలంటే కవి ఈస్థటిక్స్‌ని గుర్తుచెయ్యడానికి.
ఒక అందమయిన స్త్రీ మూర్తిని చూడగానే కవి ఎన్ని అందమయిన ఊహాలు చేశాడు? ఒక్క ఊహలో అయిన అశ్లీలత కానీ, అసభ్యత కానీ ఉందా? లేదు.. స్త్రీ పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం అన్నింటినీ మించి రక్త మాంసాలున్న సజీవ మూర్తి అన్న గ్రహింపు వుంటే కానీ, స్త్రీని గౌరవించాలనే సంస్కారం అబ్బదు.
ఇప్పుడు బస్సు ప్రయాణంలో నేను విన్న పాట గురించి. ప్రస్తావిస్తాను.
అక్కడ కవితో అందమయిన అమ్మాయి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ యిక్కడ అందమయిన అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని ఆగ్లంంలో చెప్పి వుంటంది. అందేకేనేమో కవి.

‘‘గాల్లో తేలినట్టుందే,
గుండె జారినట్టుందే
ఫుల్లు బాటిల్‌ ఎత్తి దింపకుండా తాగినట్లుం దే ’’ అంటున్నాడు.
స్త్రీని గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతితో పోల్చిన సంస్కారమెక్కడ…? ఇంటాక్సికేషన్‌ కలిగించే ఫుల్‌బాటిల్‌తో పోల్చి చూసిన సృజన సౌందర్యమెక్కడ?
మరో కవి

‘‘అమ్మో! బాపుగారి బొమ్మో
ఓల్డ్‌ మంక్‌ రమ్మో’’ అనీ అంటున్నాడు.
ప్రేయసిని బాపూ బొమ్మతో పోలుస్తూనే ఓల్డ్‌మంక్‌ రమ్ముతోనూ కొలుస్తున్నాడు.
పైన వివరంచిన పాటలోవి కవి ఉహాలే, క్రింద చెప్పిన పాటల్లోనూ కవి ఊహలే! కానీ ఎంత వ్యత్యాసం. ఎంత అగాధం. ఈ తేడా ఎందుకువచ్చింది. ఈ పతనానికి మూలం ఎక్కడుంది? ఈ అవ్యవస్థకి కారణం ఏమిటి? వంశీ మళ్ళీ మొదటికే వస్తున్నాడు అనుకోకపోతే, దీని మూలం మన గ్లోబలైజేషన్‌లో వుంది. ఈ పతనానికి కారణం మన నూతన ఆర్థిక విధానంలో వుంది. ‘‘గదినీ, మదినీ తెర్చి అన్ని పవనాలనీ ఆహ్వానించాలని’’ అని దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అన్న మాట వాస్తవమే కానీ మనం తెర్చిన గది మనది కాకుండా పోయిన విషాద దృశ్యం యిది. పడమటి గాలుల విసురు ఇంత బలంగా వున్నపుడు మనం ‘‘నిర్భయ’’ చట్టాలు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు. నిర్భయ, అభయ, అనూహ్య ఎవరియితేనేం ఒక్కొక్కరు మన సంస్కారం అనే ధవళ వస్త్రం మీద పులిమిన కటిక కాటుక చీకటి లాంటి మరకలు.
మన సమాజంలో ఎన్ని వైరుధ్యాలు? ఎన్ని విరోధాబాసలు? మరెన్ని మానసిక వైక్లబ్యాలు? వీటన్నింటిని తల్చుకుని సమాజం తనను తాను ఎసర్ట్‌ చేసుకునే దశలో సునామీ లాగా వచ్చిన ప్రపంచీకరణ మన మూలాలను పెకిలించడం మొదలు పెట్టి దశాబ్దంకాలం పైనే అయింది.
తొంభై దశకంలో పుట్టిన ఇప్పటి కొత్త తరానికి, మన సాంప్రదాయం ఒక విలువలేవీ తెలియవు. అలా ఒక తరం నుండి మరొక తరానికి ప్రయాణించాల్సిన ఒక సత్‌ సంప్రదాయాపు ‘‘నోవా’’ ను మనకు మనమే పగుల గొట్టుకున్నాం.
బహుశా ఈ విపత్తును ముందే ఊహించాడేమో 80వ దశకంలోనే ఒక మైనారిటీ భాషా సముదాయానికి చెందిన ఒ.పి. శర్మ సారధి తన ‘‘నగర మధనం’’ అనే నవలలో, ఈ స్థితిని చిత్రవిచిత్రంగా చిత్రించాడు. ఆ నగరంలో ప్రతి మనిషికి ఒక ముసుగు వుంటుంది. వాళ్ళ చేతి సంచిలో రక రకాలు ముసుగులు వుంటాయి. అవసరార్ధం ఏ ముసుగు కావలసి వస్తే ఆ ముసుగు తగిలించుకొని జీవితం గడిపేస్తూ వుంటారు. ఈ నవల ‘‘డోగ్రి’’ భాషకి చెందినది. దీని గురించిన మరోసారి చెప్పుకుందాం.
ఇవ్వాళ మన మొహాల  మీద ముసుగు లేదుకానీ మన మొహాలు  ఉండాల్సిన రీతిలో లేవు. మన పెదవులకి నవ్వటం తెలియదు. మన నోటికి నిజం చెప్పడం తెలియదు. మన కళ్లకి కరుణ కురిపించడం తెలియదు. మన హృదయాలకి ప్రేమించడం తెలియదు. మన చేతులకి దానం చేయడం తెలియదు.
మన డ్రాయింగ్‌ రూంలో ఒక కంప్యూటర్‌, ఒక హోమ్‌ ధియేటర్‌. మన గోడలకి స్ల్పిట్‌ ఎ.సి. మిషన్‌, మన యింటి ముందు ఒక కారు. మన చెవులకి తగించుకున్న ఒక బ్లూటూత్‌.
మన ఆలోచనలన్నీ పోటీలేని పరుగులో విజయం వైపు. మన ధ్యాస అంతా మన బ్యాంక్‌ బాలెన్స్‌ వైపు. అందుకేనేమో మన మొహంలో వచ్చిన మార్పులేవీ మనకు తెలియదు. మనవి రాతి మొహాలు. మనవి మొరటు ఊహలు.
అందుకేనోమో స్తన్యమిచ్చిన అమ్మను కూడా ఫుల్‌ బాటిల్‌తో పోల్చగలిగిన సృజన మనకు అబ్బింది.

ఒక్క క్షణం ఆగి, నడచి వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూద్దామా? మన మొహాన్ని స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి నీళ్ళతో కడిగేద్దామా…?
శిశిరంలో మోడయిన తరువు, వసంతంలో తిరిగి చిగురించినట్లుగా మళ్ళీ కొత్తగా మొలకెత్తుదామా?

—  వంశీకృష్ణ

అవసరం

bhuvanachandra (5)

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?”

“పెళ్ళాంగా కనిపించటానికట!”

“ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?”

“ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం మనకెలా తెలుస్తుందీ?”

“ఏం? మనం పెళ్ళాలం కామా? మనమూ ఆడవాళ్ళమేగా?”

“ఆడవాళ్ళమైనంత మాత్రాన పెళ్ళాలుగా మారడానికి మనకి ఆస్తులున్నయ్యా అంతస్తులున్నాయా? పెళ్ళి చేయడానికి తల్లీ తండ్రీ అన్నా వదినా ఉన్నారా?”

“సరేలే వీడికిదేం పిచ్చీ! పూలు తీయమనడం ఎందుకూ?”

“రోడ్డు మీద నన్ను చూశాడు…. మెల్లగా పక్కన చేరాడు వస్తావా అన్నాడు… తల ఊపాను. పమిట చెంగు భుజాల మీదుగా కప్పుకుని ‘పక్కా’ పెళ్ళాం లాగా వాడి పక్కన నడిచాను. సినిమాకి వెళ్దామన్నాడు. సరసానికి ఇబ్బంది ఉండని చోటు అదేగా! సరే అన్నాను. టిక్కెట్ల క్యూలో నిలబడ్డప్పుడు అన్నాడా మాట ‘పూలు తీసెయ్’ అని. ఎందుకన్నట్లుగా చూశా.

“భార్యగా సహజంగా కనపడాలంటే పూలు పెట్టుకోకూడదంట అంతేనా సినిమా జరుగుతున్నంత సేపూ ఆబగా వాడి చేష్టలు పైగా ఇలాంటి సోది ….. ఒళ్ళు నెప్పి, తలనొప్పి వచ్చాయనుకో”

“పెళ్ళాలతో సినిమా హాళ్ళల్లో అలా సరసాలాడతారా? దానికి లేని సిగ్గు పూలు పెట్టకుంటే వచ్చిందా?”

“సిగ్గా పాడా – నేనలాంటి దాన్నని జనం అనుకుంటే వాడి హోదాకి భంగం కాదూ”

“ఇంతకీ తీసేశావా?”

“తియ్యనా మరి?”

“నేను రాను నీ దారి నువ్వు చూసుకో అని చెప్పొచ్చుగా?”

“చెప్పొచ్చు కాని అవసరం ఎవరిదీ?”

“వాడు కాకపోతే వాడి అబ్బ …. వాడి తాత…”

“సరే – నేను కాకపోతే వాడికి మరోతి”

“ఊఁ ఆ తరవాత?”

“ఎందుకులే!”

“చెబుదూ..”

“వాడేనాడూ ఇలా ఎవర్నీ పిలిచి ఎరగడట. నన్ను చూడగానే నేను బాగా తెలిసిన దానిలా కనిపించానట. తను మొదటి సారి ప్రేమించిన అమ్మాయి నాలాగే ఉండేదట”

“ఆహా! ఎవతో పుణ్యం చేసుకున్నది?”

“వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలు వీడంటే పడి ఛస్తారట. ఈ నాటి వరకూ ఏ ఆడదానికీ లొంగలేదట”

“ఓరి వీడి ప్రవరాఖ్యతనం తగలెయ్యా”

“అంతేనా ఇంకా చాలా చెప్పాడు. పెళ్ళి కూడా అయిందట పెళ్ళాం లక్షాధికారట వీడి మాట జవదాటదట”

“మరి ఆ ఏడిచేదేదో పెళ్ళాం దగ్గరే ఏడవొచ్చుగా?”

“అదీ అడిగాను – ఆవిడ సంసారానికి పనికి వచ్చేదేకాని సరసారనికి పనికి రాదట. ఎప్పుడూ పూజలు, వ్రతాలు అట”

“పిల్లలు….”

“ఉన్నారట”

“వీడు సరసం చెయ్యకుండానే పిల్లలెలా పుట్టారూ!!?”

 

 

 

 

“అది నేను అడగ్గూడదుగా!”

“ఇంకా…’

“మాటలు తగ్గించి చేతలకి దిగాడు”

“ఏం చేశాడేమిటి?”

“అక్కడా ఇక్కడా తడిమాడు – ఆహా! ఓహో అన్నాడు. మాట్లాడుతూనే సడెన్ గా లేచి ‘ఇక బయటకి పోదాం’ అన్నాడు”

“ఓరినీ! అదేమిటే!”

“నన్ను చూడగానే దగ్గరగా ఉండాలనిపించిదటగానీ దగ్గరకొచ్చాక మనసులో ఏదో పాపం చేస్తున్నట్లు అనిపించిందట. అందుకే ఏ తప్పూ జరగకముందే వెళ్ళిపోదామన్నాడు”

“ఓహో! జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి కాబోలు…”

“జ్ఞానచక్షువులా వాడి బొందా! నాకు అర్థం కావలసింది నాకు అర్థం అయింది”

“హ! హ! నువ్వు భలే చెప్తావే…. ఇంతకీ ఒట్టి బేరమేనా?”

“లేదులే… కొన్ని పచ్చనోట్లు నా చేతిలో కుక్కి ‘నేను ముందు వెళ్ళిపోతా నువ్వు కాసేపయ్యాక వెళ్లు’ అన్నాడు”

“వచ్చేటపుడు కలిసే వచ్చారుగా సినిమానించి వెళ్ళేప్ఫుడు విడిగా ఎందుకూ వెళ్ళడం?”

“అప్పుడు కోరికతో కూడిన వేడి! ఇప్పుడు చల్లబడిన నాడి”

“ఊఁ ఆ తరవాత?”

“ఇంకేముంటుంది …. కాసేపు ఆ చెత్త సినిమా చూసి నా దారిన నేనొచ్చా”

“ఇంతకీ ఏం చేస్తుంటాడో తెలుసా?”

“ ఆ వివరాలు మనకెందుకూ? అతని అవసరం అతనిది….. మన అవసరం మనదీ!”

“అబ్బ ఎన్నాళ్ళే ఇలా?”

“ఏం చేస్తాం? మనకి అందం ఆరోగ్యంతో పాటు చదువూ ఉంది. లేనిదొకటే…. మగతోడు. ఆ తోడు కావాలంటే లక్షల కట్నం పోయాలి. మనకొచ్చే జీతం బెత్తెడే ….. దాన్ని మూరడు చేస్తే గాని మంగళసూత్రం మెడలో పడదు. అది పడిందాకా మనకీ తిప్పలు తప్పవు”

“అదేనే బాధ. మగవాడికి ఆడది అవసరం…. ఆడదానికి మగవాడు అవసరం. సృష్టిలో జంతువులూ పక్షులూ సహజంగా బ్రతుకుతాయి – మనకే – ఈ మనుషులకే….. సహజమైన అవసరం కూడా డబ్బులు చల్లితే గానీ తీరదు. మగవాడికి మగువతో పాటు అది తెచ్చే డబ్బు కూడా కావాలి”

“చూశావా! ఒక్క అవసరం ఎన్ని పనులు చేయిస్తుందో”

“అవును. రేపు మనకొచ్చేవాడు ఎలాంటి వాడో!?”

“ఇప్పుడు నీకు తగిలిన వాడి లాంటోడైతే పువ్వులు తీయమంటాడు… మంచివాడైతే పువ్వులు కొని తీసుకొస్తాడు….. ఇంతవరకు గ్యారంటీగా చెప్పగలను”

“హ్హ! హ్హ! హ్హ! హ్హ!!!

 

 

*********

 

  • ఇది నేను బెంగుళూరులో ఉండగా నా చెవులతో విన్న ఇద్దరు యువతుల సంభాషణ. నేను హిందీ పేపర్ చదువుకోవడం చూసి నాకు తెలుగు రాదని వాళ్ళు యదేచ్ఛగా మాట్లాడుకున్నారు. సంభాషణ విన్నాక నా మనసంతా ఒక వేదనతో మూగబోయింది…. ఆ రాత్రి కూర్చుని వాళ్ళ సంభాషణని యధాతధంగా రాసుకున్నాను.

మళ్ళీ నా డైరీలు తిరగేస్తుంటే ఈ నాలుగు పేజీలు బయటపడ్డాయి. చదివి ఇదీ ఓ చరిత్రకెక్కని కథ కనుక ‘సారంగ’ కి పంపుతున్నాను.

కాలం మారిందని అంటున్నాం గదా……. మారిందా?

 -భువనచంద్ర

 

అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి

“నేను శోధన నాళికలలో జీవిస్తున్నాను. భ్రమ విభ్రమాలలో జీవిస్తున్నాను.” అని కనుల గాజుబుడ్లలో కలల రసాయనాన్ని నింపుకుని కవిత్వపు ఔషధాన్ని వెలువరించే చిత్కళ అజంతా- స్వప్నలిపి లోని కవిత్వం. బాధాగ్ని కుసుమాల పరిమళం, స్వప్నఖచిత శరీరాల రహదారి పాట, వేళ్లపై ప్రజ్వరిల్లే వైశ్వానర గోళాలు కలిసి నగ్నాక్షరాలుగా మారే క్రమంలో నా పద్యాలన్నీ చిత్తుప్రతులే  అనుకునే తుదిలేనితనం ఈ కవిత్వ లక్షణం. రాళ్ళు రువ్వితే గాయపడ్డ నీళ్ళు ఉవ్వెత్తున ఒళ్ళు విరుచుకుని ఊరిమీద పడ్డాయనే విశేషాన్ని చెప్పి కూడా “సుదీర్ఘంగా సాగుతున్న వాక్యం మీద ఒక వైపు రివాల్వర్, మరో వైపు పూలమాల/ నా చేతులు అవేనా?” అని అనుమానపడతాడు కవి.”శబ్ధ శరీరం మీది ఆఛ్ఛాదనల్ని విసర్జించి”  అందాకా దాగిన ఉమ్మెత్త చెట్లను, ఊసర క్షేత్రాలను/ఉద్రేకవంతమైన సరస్సులను, ఉరితీయబడుతున్న అక్షరాలను ఆవిష్కరించేందుకు వాస్తవానంతర ఊహాపత్రాలపై రాసుకున్న స్వప్నలిపి ఇది.

PQAAAJ9573n0A4gC1sSCu1EDVSXaXFx_88MLNtPyURkLyqs34FwYHhPWWUJ_x7KoX90nE_U-XyPUDEQVkg3Z1t7faJQAm1T1UH5aj_8VLErZ7mIBLlRS08t4SXK_

  నీ గదిగోడలపై అగ్నిచక్షువు నేనే

 

ఘూర్ణిల్లుతున్న విషాద వృక్షచ్ఛాయలలో అదృశ్యలోకాలను ఆవిష్కరిస్తున్న స్వాప్నికుడా

నేను నీలోనే ఉన్నాను, నీ కన్నీళ్లలోనే ఉన్నాను

నిషిద్ధ నగరంలో నీ ఆక్రందన ఎన్నోసార్లు విన్నానుకదా

నీ గది గోడలపై అగ్నిచక్షువు నేనే

 

నడిరాత్రి, నడివీధి స్వప్నకవాటాలు తెరుస్తున్నారు ఎవరో

నవ్వుతున్న పెద్దపులి కావచ్చు

వధ్యశిలలపై అరణ్య కుసుమాలు వెదజల్లుతున్న పరివ్రాజకుడు కావచ్చు

అజ్ఞాత యోధులను ఆశీర్వదిస్తున్న వనదేవత కావచ్చు

కాలమేఘాంచలాలపై వస్తున్న మృత్యు రధచోదకుడు కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి అలజడి సృష్టిస్తున్నారు ఎవరో

నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు

చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు

జీవన సంకేతాలను కలుష భూయిష్టం చేస్తున్న విద్రోహి క్షుద్ర విన్యాసం కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి మృత్యురేఖపై నగ్నతాండవం చేస్తున్న స్వాప్నికుడా

జ్వలిస్తున్న కన్నీళ్లలో ప్రతిఫలిస్తున్న ఆకారం నీదేనా?

మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!

 

రాక్షసుని వెన్నెముకపై ప్రతిష్ఠించిన నగరంలో మనిషి చిత్రవధ ప్రత్యేక కళ

కలలలో సైతం అతడు శృంఖలుడే.

—***—-

వ్యాఖ్యానం:

 

కలలు నిషేధించబడిన ఛాయాలోకంలో తిరుగుతూ, వాస్తవాల వలువల్ని జార్చేసిన ఊహా శరీరాల్ని స్వప్నిస్తాడు ఒకడు. మొదలు తెగి విరిపడిన ఆశా విషాదాల అరకొర నీడల్లో  తన అంతర్లోకాలను పరచుకుంటాడు. అజ్ఞాతంగా, అనామకంగా అతని మారుమూల గదిలో ఆర్తారవాల్ని ఆలకించి జ్వలించే నిప్పుకళ్ళు మాత్రం ఒక్క కవివే.

 

ఆ స్వాప్నికుడి చుట్టూ లోకం పరిచే భ్రమలు, వెంట పరిగెట్టించుకుని నీరివ్వక నీరుగార్చే ఎండమావులు. అతని గది నుండి బయటికి ఆకర్షిస్తూ తెరుచుకున్న స్వప్నకవాటల అవతల పొంచి చూస్తున్నది “నవ్వుతున్న పెద్దపులి కావచ్చు”.  అక్కడ నుండి కనపడే దారుల్లో అప్పటివరకూ నడిచి వెళ్ళి ఆవేశపు అడవుల్లో అదృశ్యమైన వాళ్ల అడుగుజాడలు కాస్త గజిబిజిగానే ఉండొచ్చు. బహుశా అవి ఏ ఎదురుదాడుల మోతల్లోనో చిందర వందరగా చెరిపోయాయేమో! ఆ యుద్ధాల అంతంలో శాంతిని కూర్చుకుని దారిపొడవునా పూలనో మేఘాలనో పరచుకుంటూ నడిచెళ్తూ ఉన్నది ఒక పరివ్రాజకుడో ఒక మృత్యు రధచోదకుడో!

 

స్వప్నాల సెగకు తాళలేక , ఎంత నియంత్రించుకున్నా తనలోంచి వెలికొచ్చే ఆక్రందనలకు ఆగలేక తన నిద్రా సౌఖ్యం లోంచి, భద్రగదిలోంచి తెగించి బయటికొచ్చాడతను. నడివీధిలో నడిచెళ్ళే అతనికోసం ఆ నడిరేయి ఒక అమ్ములపొదిలా చీకటి చాటున ఎదురుచూస్తుండొచ్చు. దారిలో కనపడని ప్రతి ఎదుర్రాయి అతని తెగువపై ఎక్కు పెట్టబడిన ఒక ఆయుధమే. అతని చుట్టూరా రొదపెట్టే  అలజడికి కారణం “నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు/చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు.”

 

బహుశా ఆ ప్రయాణం నడక కాదు. రగిలే జ్వాలపైన నక్షత్రాల కళ్లతో వెలిగే ఆకాశం కింద సన్నటి తాడు పైన దిగంబర నాట్యంలాటి విన్యాసం. ఏమాత్రం ఏమారినా “మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!” అనే హెచ్చరిక అతని నాట్యానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంది.

 

సాంఘికంగా, సామాజికంగా బందీగా బ్రతికే మనిషి వాటి నియమాలను, అలవాట్లను కాదని, ఊహల్లో సైతం స్వేచ్ఛనివ్వని శృంఖలాలను తెంచుకునే రాపిడిలోని గాయాలను, విముక్తికో, నవీనతకో చేసే మార్గాన్వేషణలోని అనుక్షణ జరామరణాలను  హృదయానుకంపనతో స్పృశించిదీ కవిత.

 1swatikumari-226x300–బండ్లమూడి స్వాతికుమారి