కలవరపెట్టే అతి సంచయేచ్ఛ … “సర్ ప్లస్”

నేను తృప్తిగా, సాదా సీదాగా  జీవితం గడపాలనుకుంటున్నాను

“జనం అందరూ ఒక్కసారిగా మారిపోతారు.  వాళ్ళ నోటివెంట , “నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు. నాకు ఇంకో పెద్ద Mac కంప్యూటర్ అక్కర్లేదు. నేను డీజల్ బ్రాండ్ జీన్స్ వేసుకోవాలనుకోవటం లేదు” అనే రోజులు వస్తాయి”.

ఏ వర్యావరణవేత్త నోటివెంటనైనా ఇలాంటి మాటలు వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ, ప్రపంచంలోని 80 శాతం సంపదను తింటూ కూర్చున్న 20 శాతం అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వస్తే?   ఊహించటానికే ఇదెంతో బాగుంది కదా!!

‘సర్ ప్లస్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ‘ఎరిక్ గాండినీ’,  జార్జ్ బుష్  చేత గమ్మత్తుగా పై మాటల్ని పలికిస్తాడు. పైగా ఈ ఇటాలియన్ ఫిల్మ్ మేకర్  ‘మనమంతా  వినిమయ సంస్కృతి అనే ఉగ్రవాదం నీడన బ్రతుకుతున్నాం’  అని కూడా భయపెడుతున్నాడు ట్యాగ్ లైన్ పెట్టి మరీ !!   ఇతని సినిమా “సర్ ప్లస్ ” – ‘టెర్రరైజ్ డ్  ఇన్ టు బీయింగ్ కన్స్యూమర్స్’  – 2003 లో తయారయింది.

వస్తు వ్యామోహ తత్వం విశ్వరూపమెత్తి, ప్రకృతి ఇచ్చిన ఆస్తుల్ని కొల్లగొట్టి మనుషుల్ని డొల్లలుగా మార్చిందని చాలా మంది కళాకారులూ, పర్యావరణ వేత్తలూ  ఏనాటి నుంచో  చెప్తూనే ఉన్నారు. సంపద అనే అమృతాన్ని పంచిపెట్టే తీరులో ప్రభుత్వం మోహినీ అవతారమెత్తి,  కార్పొరేట్  దేవతలకే అంతా ధార పోసి, 90 శాతం సగటు దానవులకు ఏమీ లేకుండా చెయ్యటమే ఈ నాటి మాయ అని కూడా చాలామంది గుర్తించారు. ఈ మాయను మన కళ్ళముందు డాక్యుమెంటరీ రూపంలో విప్పి చూపే ప్రయత్నం చేసిన కొద్దిమందిలో గాండినీ ఒకరు.

ఈ ఫిల్మ్ లో జార్జ్ బుష్  సొంత మాటలూ ఉంటాయి. ఇంకా అతని నోట చాలామంది వినాలనుకునే ఒప్పుకోళ్ళనూ, సామ్యవాదపు మాటల్ని కూడా “అనిపిస్తాడు” ఫిల్మ్ మేకర్.  మార్కెట్ ఎకానమీని బుజాన మోసే నాయకుల చేత, అందులో ఉన్న మోసాన్ని గురించి నిజాలు మాట్లాడించటం మంచి హాస్య స్ఫోరకంగా కూడా ఉంటుంది.

2001 లో ఇటలీ లోని జెనోవాలో జరిగిన జి-8 సమావేశం, అక్కడ,  నిండా అస్త్ర శస్త్రాలు ధరించి, ఏ మాత్రం గొడవ అయినా అణచటానికి సిద్ధంగా ఉన్న పోలీస్ బలగాలు… దీనితో ఫిల్మ్ మొదలవుతుంది. ఏ నిముషం ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత మనలో మొదలవుతుంది.  అంతర్జాతీయ వ్యాపార సంస్థ  వ్యవహారాలు నచ్చని కొంతమంది పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులు రాళ్ళు విసిరి, షాపుల అద్దాలు విరగ్గొట్టి, వాహనాలను తగలేస్తారు.  పోలీస్ ఫైరింగ్ లో ఒక యువకుడు చనిపోతాడు.

“నా ఉద్దేశ్యంలో బ్యాంకులు,  చెయిన్ మార్కెట్ లు, ఖరీదైన షాపుల వంటి కార్పొరేట్ ఆస్తులను గురి పెట్టి ధ్వంసం చెయ్యటం చట్టబద్ధమైన పనే.  మనుషుల ప్రాణాలు తియ్యకుండా ఆస్తుల మీద రాళ్ళు వెయ్యటంలో తప్పేముంద”ని ప్రశ్నిస్తాడు జాన్ జేర్జాన్. ఈయన ఒక రచయితా, అరాచక వాదీనూ.

 జాన్ జేర్జాన్.

‘ఆస్తి ధ్వంసం చెయ్యటం’ అనే దానిని పోరాట రూపంగా గుర్తిస్తాడు ఈ రచయిత. అలాగని ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఆస్తులు ఆశించ లేదు. సృష్టించ లేదు. ఎవరి ఆస్తులూ ధ్వంసం చెయ్యనూ లేదట. చాలా కాలం తన రక్తాన్ని అమ్ముకుంటూ అతి తక్కువలోనే జీవించాడట. “అసలు జనం ఎందుకు  ఆస్తి ధ్వంసం చేస్తారని ప్రశ్నించుకోకుండా ఇదంతా అర్ధంపర్ధం లేని హింస అని తేల్చేస్తే ఎలా?” అంటాడు జేర్జాన్.

“నా దృష్టిలో టీవీ ముందు కూర్చోవటం, మత్తు మందు కొట్టటం, పనికిమాలిన ఉద్యోగాలు చేస్తూపోతుండటం.. ఇదీ అర్ధం పర్ధం లేని హింసంటే ! అదేపనిగా పని చెయ్యటం, అదేపనిగా వస్తువుల్ని వినియోగిస్తూ ఉండటం .. ఇదీ హింస స్వరూపం.”  అని తేల్చేస్తాడు.  “చాలా సౌకర్యవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, అంతులేని భౌతిక సుఖాలు.. ఇదంతా పరమ శూన్యమైన వ్యవహారమని కొంతమందికైనా అర్ధం అవుతుంది. వాళ్ళు తృప్తికీ స్వేచ్ఛకీ ఉన్న హద్దుల్ని చెరిపేస్తారు.” . ఇవీ జేర్జాన్ అభిప్రాయాలు.

‘స్వాంటే’  ఒక MNC లో పని చేసిన వ్యక్తి. చిన్న వయసులోనే  మిలియన్ల డాలర్లు సంపాదించిన ఇతనికి ఆ డబ్బంతా ఏమి చేసుకోవాలో అర్ధం కాలేదు. చవకైన చక్కని జీవితాన్ని కోల్పోతున్నట్టు అనిపించిందట అతనికి. ఆరుబయట మూడు రాళ్ళతో పొయ్యి  పెట్టుకుని సూర్యాస్తమయ వేళలో వండుకుని స్నేహితులతో తినటాన్ని ఆనందిస్తాడు. “డబ్బంటే మనసు మూలల్లో నాకు అసహ్యం. ఇప్పుడిక నాకు దానిగురించి ఆలోచించే అవసరం లేదు.  ఖర్చు పెట్టాలంటే ఎటు చూసినా ఎన్నో మార్గాలు. కానీ నేనా పని  అంత సులభం గా చెయ్యలేను. నిరంతరంగా సంపాదిస్తూ పోతుంటే,  కొన్నాళ్ళకు  ఎక్కువ డబ్బుకు మనం అలవాటు పడతాం.  డబ్బు ఒక రంగుల రాట్నం.  అది అదుపుతప్పి తిరిగేస్తోంది.  ఒక ఇల్లు, భార్య, పిల్లలు .. ఎంత సంపాదించినా జీవితంలో ఇంతకంటే ఏముంది?” …  అంటాడు.  వస్తు వ్యామోహ తత్వానికి ఇలాంటివాళ్ళు సవాళ్లు.

                                 ‘డబ్బనే రంగుల రాట్నం అదుపుతప్పి తిరుగుతోంది’…. స్వాంటే.                                                           ‘ఇంకా, ఇంకా కావాలి’ …. తాన్యా

 

“మనల్ని మన వ్యాపారాలు చేసుకోనీయకుండా, షాపింగ్ చేసుకోనీయకుండా భయపెట్టే ఉగ్రవాదులను అసలు ఒప్పుకోం”… అంటాడు జార్జ్ బుష్ తన మాటల్లోనే.

“అన్నీ కొనేసి వాడాలనే కోరిక మనలో భయోత్పాతాన్ని కలిగిస్తోంది. ఇదీ ఉగ్రవాదం అంటే!  ఈ భయోత్పాతాన్ని కలిగించి పెంచి పోషించేది వ్యాపార ప్రకటనల రంగం.  ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ లేదా మరో బ్రాండ్ … ఎంపిక లో స్వేచ్ఛ ఇంతవరకే కదా!”  అంటాడు జేర్జాన్.  కానీ ఎంపికలో ఉండే ఆ కాస్త స్వేచ్ఛలో బోలెడంత వైవిధ్యం కూడా ఉంది.  ఎలా అంటారా? ఇలా …

ఒక బొమ్మల షాపు చూపిస్తాడు.  బొమ్మలంటే మామూలు బొమ్మలు కావు. లవ్ డాల్స్.  రక రకాల తలలు. కళ్ళు. ముక్కులు. శరీరపు వంపులు. సూపర్ మోడల్ శరీరాలు.  పొట్టి, పొడవు, సన్నం..   ఒక రకం శరీరానికి నాలుగైదు రకాల తలల్లో ఎలాంటి తల కావాలంటే అలాంటి తల అమర్చి ఇస్తారు.  మగ శరీరాలు కూడా దొరుకుతాయి.  ఎంత వెరైటీ!  ప్రాణమున్న మనుషుల అవసరం లేకుండా  సెక్స్ అవసరాలు తీర్చుకునేందుకు బొమ్మల్ని కూడా తయారు చేసే స్థాయికి చేరింది మార్కెట్.  ఒక్కొక్క బొమ్మ ఏడు వేల డాలర్ల దాకా ఖరీదు చేస్తుందట.

“ఇలాంటి వ్యవస్థను కొనసాగించటంలో ఎటువంటి ఆరోగ్యకరమైన లక్షణమూ లేదు. భావి తరాలకోసం భద్రపరిచే విలువ గల పని ఒక్కటైనా ఉందా వీటిలో?  – జేర్జాన్.

 

ఈ నమూనా జీవితానికి పూర్తిగా విరుద్ధమైన జీవితాన్ని చూపించాలంటే  ఒకే ఒక్క ఆధారం.  క్యూబా .. అక్కడ ఖాళీగా అతి తక్కువ సామాన్లతో ఉండే దుకాణాలు…  తన రేషన్ కార్డు చూపిస్తూ ఒక పెద్దావిడ  “బియ్యం, పప్పు, వంట నూనె, టూత్ పేస్టు తో సహా అన్నీ ప్రతి మనిషికీ లెక్క ప్రకారం అందుతాయి. ఏ ఒక్కరికీ  లేకపోవటం ఉండదు. కనీసావసరాలు అందరికీ తీరుతున్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి?”  అంటుంది.

కానీ.. కావాలి…  చాలా మందికి చాలా కావాలి…  తాన్యా ఒక యువతి.  “రైస్, బీన్స్ .. రైస్ అండ్ బీన్స్. క్యూబాలో ఇంతే కదా. నేను యూరప్ లో స్నేహితుల ఇంటికి వెళ్లాను. అక్కడ సూపర్ మార్కెట్ మొదటిసారి చూసినప్పుడు నోరు తెరిచేసాను. ఆపిల్ పళ్ళు, మంచి సుగంధ ద్రవ్యాలు. షాంపూలు. ఇంగ్లాండ్ లో ఉన్నన్ని రోజులూ నేను బీన్స్ తినటం మానేసాను.  టీవీ చూస్తూ చానల్స్ మారుస్తూ, తింటూ, తింటూ ..  మెక్ డోనల్డ్స్.. అవీ ఇవీ ..  ఇలా తిని, తిరిగి ఇంటికొచ్చేసరికి 180 పౌండ్స్ బరువున్నాను.” అంటుంది. ఇదంతా చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో వెర్రి ఆనందం…  చుట్టూ సముద్రమంత సంపద. మధ్యలో ఉన్న క్యూబా ద్వీపంలో తయారయే ఆ కాసింత తిండీ అందరూ సర్దుకు తినాలి.  ఉన్న వస్తువులను అందరూ పంచుకోవాలనే నిస్వార్థతత్వాన్నీ, సర్దుబాటునూ నిదురలేపే ప్రయత్నం చేస్తోంది  సామ్యవాదం.  దీనికి వ్యతిరేకంగా మార్కెట్ వ్యవస్థ మనముందు వస్తువులను పరిచి పెడుతోంది.  వ్యాపార ప్రకటనలనే అగ్గిపుల్లలతో .. ఆ వస్తువులన్నిటినీ సొంతం చేసుకోవాలనే కోరికనూ, స్వార్దాన్నీ మనలో రాజేస్తోంది.  దాని బలం ముందు మనిషితనం నిలవటం ఎంత కష్టం? ప్రపంచమంతటా సామ్యవాదమే ఉంటే కేవలం “రైస్ అండ్ బీన్స్” కాక ఇంకొంచెం మంచి తిండి “అందరూ” తినొచ్చునని తాన్యాకు అర్ధం కావటమూ అంతే కష్టం.

(క్యూబా లో టూత్ పేస్ట్ ట్యూబ్ పైన ఏ అక్షరాలూ లేకుండా ఉండటం ఈ ఫిల్మ్ లో చూసి ఒకనాటి  విషయం గుర్తుకొచ్చింది. “టూత్ పేస్ట్ దేశం అంతటా ఒకే ధరలో దొరకాలి. అసలు ఏ వస్తువైనా అమ్మటానికి వ్యాపార ప్రకటన ఎందుకు? ఒకే వస్తువుకు రకరకాల పేర్లెందుకు?” అని మార్కెట్ వ్యవస్థను చీల్చి చెండాడేసే వారు కమ్యూనిస్ట్ అయిన మా ఎకనామిక్స్ మాస్టారు).

“గనుల్లో, సైన్యాల్లో మనుషులు నిర్బంధించబడుతున్నారు. జీవితం అంతా వెచ్చించి, సృష్టిస్తూ, వినియోగిస్తూ పోవటం మనం ఎన్నుకున్న మార్గం  కాదు. జడత్వం తో ఈ మార్గంలో నడుస్తున్నాం.  ప్రపంచమంతా ఒకటే రకం వ్యవస్థ ఉండాలంటూ అన్ని చోట్లా ఆక్రమించుకుంటూ, వైవిధ్యాన్నీ, స్వేచ్ఛనూ చెరిపేసే ఒక విధ్వంస రూపాన్ని ప్రతిష్టిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రకృతికి ఎటువంటి నొప్పీ కలిగించలేదు మనిషి. ఒక్కసారిగా 3 శతాబ్దాలలో అంతులేని విధ్వంసాన్ని సృష్టించాడు.”  అంటాడీ ఫిల్మ్ మేకర్.

అలంగ్ .. గుజరాత్ తీరాన ఉన్న ఒక చిన్న రేవు. ఇక్కడ పెద్ద పెద్ద ఓడలను విరగ్గొట్టే పని నడుస్తూ ఉంటుంది. అమెరికా, ఇంగ్లాండ్,  ఇంకా ఇతర డబ్బున్న దేశాల పాత ఓడలు ఇక్కడ పోగు పడతాయి.  (ఇక్కడ పని చేసే 50000 మంది పనివాళ్ళకు ఎటువంటి రక్షణ లేదు. సంవత్సరానికి కనీసం 50 మంది దాకా ఈ పనుల్లో చనిపోతూ ఉంటారట. 2012 లో ఇక్కడకొచ్చిన  దాదాపు 425 యు.ఎస్., ఇంగ్లాండ్ ఓడలు వదిలిన కాలుష్యం అక్కడి పనివాళ్ళను ఏ అనారోగ్య తీరాలకు చేర్చిందో తెలియదు. డబ్బు కోసం మన ప్రభుత్వాలు కాలుష్యానికి ద్వారాలు తెరిచి దేశాన్ని టాయిలెట్ గోతిగా మార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు).  అలంగ్ లో షిప్ బ్రేకింగ్ కంపనీలో కళ్ళకు రక్షణ లేకుండా వెల్డింగ్ పని చేస్తున్న కూలీలూ, వాళ్ళ కళ్ళ చికిలింపులూ, ఆ భయానక వాతావరణమూ … కొన్ని ఫ్రేముల్లో చూపి భయపెదుతుంది ‘సర్ ప్లస్’.  ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘యంత్ర భూతముల కోరలు తోముతూ’, ఎంతమంది బ్రతుకులీడుస్తున్నారో లెక్కలు చెప్పేవారూ తక్కువే.

“మనుషులు కనిపెట్టిన అతి శక్తివంతమైన ప్రసార సాధనం 30 సెకన్ల వ్యాపార ప్రకటన” – అంటాడీ ఫిల్మ్ మేకర్.  కళ్ళనూ మెదడునూ ఆక్రమించే వ్యాపార ప్రకటనల చురుకైన టెక్నిక్ నూ, మ్యూజిక్ వీడియోల ఆకర్షణనూ  బాగా అర్ధం చేసుకున్న ఈయన, ఆ టెక్నిక్ ను మరింత సమర్ధవంతంగా వాడి, మామూలు డాక్యుమెంటరీ ఫిల్మ్ పరిధుల్ని దాటేసి, ‘సర్ ప్లస్’ visual technique ను మంచి స్థాయికి  తీసుకువెళ్ళాడు. వ్యాపార ప్రకటనలు మత్తులో ముంచే పనిలో ఉంటే, ఇతడు ‘పెను నిద్దుర’ను వదిలించే పని పెట్టుకున్నాడు ఈ ఫిల్మ్ తో.

వ్యాపార ప్రకటనల ముల్లును, ముల్లు తోనే తీసినట్టుగా, ‘జి-8 వరల్డ్ షాప్’ పేరుతో జార్జ్ బుష్ తదితరులు రకరకాల తిండి వస్తువుల ప్రకటనలు ఎలా చేస్తారో వారినోట “పలికిస్తూ”  గేలి చేస్తాడు. మెరిసిపోతున్న అమెరికా నగరంలో  ఒక బిల్ బోర్డు పై ఒక బలిసిన పంది బొమ్మ త్రేన్చుతూ ఉండే దృశ్యం చూపిస్తూ, “సగటు ఉత్తర అమెరికావాసి ఒక మెక్సికన్ కంటే 5 రెట్లు, చైనా వాసి కంటే 10 రెట్లు, భారతీయుడి కంటే 30 రెట్లు తింటాడని”ని లెక్క చెపుతాడు.  (జార్జ్ బుష్  భారతీయుల తిండి యావ పెరిగి, దాని మూలంగా కరువు వస్తోందని పాపం ఆ మధ్య బాధ పడ్డాడు.  ఇప్పుడు టీవీ చానెల్స్ లో వచ్చే రకరకాల వంటకాల తయారీలు చూస్తుంటే నిజంగానే మన సగటు తిండి లెక్క ఏమైనా పెరిగిందేమో అనిపిస్తోంది).

మరి క్యూబా సంగతికొస్తే, అమెరికా లాంటి పహిల్వాన్ తో పోటీ పెట్టుకుని ఒక పక్క నిలబడుతూనే, మరోవైపు తమ వ్యవస్థ ఉత్తమమైనదని రుజువు చేయటం మాటలా? అక్కడి బిల్ బోర్డు పై “పొదుపు చెయ్యండి. అవసరమైనంత మాత్రమే వాడుకోండి” అని రాసి ఉంటుంది.  “క్యూబా వినిమయ సంస్కృతిని ప్రోత్సహించదు. మేము ప్రజాస్వామికంగా ఉంటాం. వ్యాపార ప్రకటనలు కుదరవ”ని ప్రకటిస్తాడు ఫిడెల్ కాస్ట్రో.

‘అభివృద్ధి, అభివృద్ధి అభివృద్ధి’ అంటూ ఉన్మాదిలా గంతులేసుకుంటూ  “మూడే మాటలు..  నా కంపెనీని నేను ప్రేమిస్తాను”. అంటాడు మైక్రోసాఫ్ట్  సి.ఇ.ఓ. స్టీవ్ బాల్ మర్.  అదే మంత్రం జపిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రిల్ చేస్తుంటారు ఆఫీసుల్లో నీరసంగా.  పనిలోని పరాయీకరణతో పాటు ఇలాటి వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదనే సూచన కనిపిస్తుంది.  “నా కంపనీని నేను ప్రేమిస్తాను” అని కిక్కిరిసిన జనంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చేత కూడా “అనిపిస్తాడు”. ఇక్కడ కంపెనీ అంటే ప్రజానీకం.

“ప్రపంచీకరించబడిన ఈనాటి ఆర్ధిక వ్యవస్థ ఒక పెద్ద జూదశాల” – ఇది ఫిడెల్ కాస్ట్రో అభిప్రాయం.

ఈ ఫిల్మ్ లో  తాన్యా, స్వాంటే  సైకిల్స్ తొక్కుతూ ఉంటారు. పెద్ద పెద్ద చెయిన్ స్టోర్స్ లో కనిపించేటటువంటి ట్రాలీలను మనిషి తోసుకు పోతుంటే కెమెరా వృత్తంగా తిరుగుతూ ఉంటుంది. రైలు, ఫ్యాక్టరీ, సుత్తితో కొడుతూ ఉండటం, ఎత్తైన మహా కట్టడాలు ..  ఈ దృశ్యాల మీద కెమెరాను  పానింగ్ చేస్తూ, ఒకే మాటను మళ్ళీ చెప్తూ, మళ్ళీ మళ్ళీ చెప్తూ, ఒకే దృశ్యాన్ని మళ్ళీ చూపిస్తూ, మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఒక విలక్షణమైన లయను సాధించాడు ఈ  డైరెక్టర్. ఈ విష వలయాన్ని ఛేదించటం కష్టమనే ఊహ మనలో మెదులుతూ ఉంటుంది.  డాక్యుమెంటరీ అంటే ఏదో నిస్సత్తువగా నాలుగు దృశ్యాలతో చెప్పాలనుకున్నది చెప్పటం కాకుండా,  మన మేధనూ, హృదయాన్నీ, చెవినీ, కంటినీ చురుగ్గా ఆక్రమించి పని చేయించేస్తూ ఉంటాయి ఈ ఫిల్మ్ లోని దృశ్యాలు, శబ్దాలు, మాటలు, సంగీతమూ..

భారీ పరిశ్రమల్లో వస్తువుల్ని తయారు చెయ్యటం, పాత వాటిని చెత్త పోగులు వెయ్యటం,  విరగ్గొట్టటం .. ఈ మూడు పనులనూ పదేపదే చూపిస్తూ, విహ్వలమైన సంగీతాన్ని జోడించి, మనం నిరంతరం ‘ఇదే జీవితం’ అనుకుంటూ చేస్తున్న  ఈ పనుల్ని మించిన హింస ఇంకేమీ లేదని స్ఫురింపజేస్తాడు.  వస్తువుల సృష్టిలోనూ, వ్యామోహంలోనూ  ఉండే మాదకత (తాన్యా),  ఉన్మాదం(స్టీవ్ బాల్ మర్),  హింస(అలంగ్) లను  అంతే బలంగానూ, ఉన్మాదంగానూ చూపిస్తాడు.  జోహన్ సోడర్ బర్గ్ చక్కని ఎడిటింగ్ పనిని గుర్తించనిదే  ‘సర్ ప్లస్’ గురించి రాయటం పూర్తి కాదు.

ఈ ఫిల్మ్ చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది. ప్రకృతి పట్ల ఎటువంటి గౌరవం, ఆరాధన లేకుండా పూర్తి స్థాయి వినియోగదారులుగా మాత్రమే మనం మిగలటంలోని బాధ, అతిగా పనిలో దూసుకుపోతూ , దొరికిన కాస్త ఖాళీ సమయంలో టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటూ బ్రతకటంలోని ఇరుకుతనం, ఆర్ధిక అసమానతలను అసలేమీ గుర్తించకుండా బతికెయ్యటంలోని విషాదం… కళ్ళముందు నిలబడతాయి.

ఈ నాశనానికి ముఖ్య కారణమైన వ్యవస్థకూ, దేశానికీ ప్రతినిథి అయిన వ్యక్తి  “ మేమే కాదు ప్రపంచమంతా ఈ సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి” అని మామూలుగా తన పద్ధతిలో బోధిస్తూనే ఉన్నాడు.  ప్రపంచమంతా వింటూ, ఆచరిస్తూనే ఉంది.  అలాంటి అమెరికన్ ప్రెసిడెంట్  “నేను తృప్తి గా, సాదా సీదాగా బ్రతుకుతాను” అనగలిగిన రోజున మాత్రమే ప్రపంచంలో మార్పు సాధ్యమని భావిస్తున్నాడా ఈ ఫిల్మ్ మేకర్?  లేక మనలోని వినియోగదారుడిని  నిరంతరం తట్టి లేపుతూ ఉండే  ఈ ఉగ్రవాదానికి  ఇంత absurd గానూ  తెర దించటమే సరైనదని అనుకున్నాడా?

*****

మనిషి అవసరాన్ని ప్రకృతి తీర్చగలదు కానీ మనిషి దురాశను మాత్రం తీర్చలేదని గాంధీ ఏనాడో చెప్పాడు.  మనం ప్రగతి పేరుతో బోలెడన్ని వస్తువుల్ని మన చుట్టూ పేర్చుకుంటూ, ఇంకా కొత్త వస్తువుల్ని కనిపెడుతూ, చాలా ముందుకు వచ్చేశాం.  ఉన్న వాటినే వాడుకోవటానికి సమయం లేకనూ, కొత్త వాటిమీద మోజుతోనూ పాత వస్తువుల్ని చెత్తబుట్టల్లో వేస్తున్నాం.  వెనక్కి తిరిగి చూస్తే మనం నడిచిన మార్గం వస్తువులతో మూసుకుపోయి ఉంది.  కనబడని ఉగ్రవాదుల్లాంటి వ్యాపార ప్రకటనలు  “పక్కింటి వాళ్ళ కారు మీ కారు కంటే పెద్దదిగా ఉందా? కొత్త.. పేద్ద.. కారు కొనుక్కొని , ఉన్న దానిని అమ్మి పారేయండి మా ఫలానా వెబ్ సైట్ లో” అని మోగుతూనే ఉన్నాయి. ఈ సర్ ప్లస్ నమూనాలో బ్రతకటం చాలా మందికి ఇష్టంగా లేదు. కానీ చట్రం గట్టిగా బిగుసుకుంది.

‘సర్ ప్లస్’  ఫిల్మ్ వచ్చి పదేళ్లయింది. అందులో ఊహించినట్టుగా, ఆశించినట్టుగా మార్కెట్ ఎకానమీ కూలిపోలేదు ఇంకా!  వాల్ స్ట్రీట్, ఈజిప్టు ఉద్యమాలు దిశా నిర్దేశం  లేని ఆందోళనలుగా మిగిలాయి.  ప్రభుత్వాల, కార్పొరేట్ ల కొమ్ములు వంచాలని చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ  ప్రయత్నిస్తూనే ఉన్నారు.  భూమి తల్లినీ, దానినే ఆశ్రయించుకున్న వేలాది మనుషులనూ కాపాడే బాధ్యత మీద వేసుకుని, గ్రీన్ టెర్రరిస్టులనే ముద్ర వేయించుకుంటున్నారు.  అగ్ర రాజ్యాలకు పూర్తి వ్యతిరేక దిశలో వెళ్తూ ఇప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకున్న క్యూబా వంటి దేశాలు తక్కువ.  వస్తువులతో కిక్కిరిసిన ఈ పునాదులు లేని భవంతి ఎప్పుడు దానంతట అదే కూలుతుందా ఎప్పుడు కొత్త వెలుతురు వస్తుందా అని మౌనంగా ఎదురుచూసే వాళ్ళూ ఉన్నారు.

‘సర్ ప్లస్’ లో అన్నిటికంటే భయపెట్టేవి చెత్త డంప్ లూ, టైర్ల గుట్టలూ… ఎటు చూసినా రోడ్లమీద వాహనాలు కనిపిస్తూనే ఉన్నా, “ఇన్ని వాహనాలున్నాయా ప్రపంచంలో?” అని మనం బెదిరిపోయే దృశ్యం అది. “ఇంత అతిగా అన్నిటినీ వాడుతూపోవటం  ఎక్కువ కాలం కుదరదు.  ప్రకృతినుండి మనను వేరుచేసి treadmill మీద నిలబెడుతున్నాయి ఈ పెద్ద పెద్ద రోడ్లు.  వీటిని చీల్చేసే పని భారీ ఎత్తున జరిగితే చూడాలనిపిస్తోంది” అని జేర్జాన్ అంటూ ఉంటే,  ఆ విధ్వంసం  తరువాత … వినూత్నమైనదీ, మనిషిని తను చేసే పనితోనూ, ప్రకృతి తోనూ ముడి వేసి ఉంచేదీ అయిన నమూనా మనకు కావాలనిపిస్తుంది. ఆ కొత్త వ్యవస్థ – ప్రాంతీయ జ్ఞానాన్నీ, ఇంతవరకూ చూసిన వ్యవస్థల మంచి చెడ్డల ఆధారంగా కలిగే సరికొత్త ఊహలనూ కలుపుకునేదైతే ఎంతో బాగుంటుందనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో కూడా (తక్కువ visual quality తో)చూడవచ్చు.

ల.లి.త.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. చాలా బాగుంది.

మీ మాటలు

*