ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక Butterfly Effect

ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect…

 

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ.  2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు  మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం.  ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం.  మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది.  నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై,  కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం.  తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది.  శైవక్షేత్రం శ్మశానమయ్యింది…

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.

బడబాగ్నికి సలిలం లక్ష్యం.

దేహాగ్నికి దేహమే లక్ష్యం.

ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.

నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా !    —   అల్లమప్రభు.

 

 

కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి,  దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

చౌరాబరీ గ్లేసియర్, కట్టడాలమధ్య ఒదిగిపోయిన కేదార్ నాథ్ గుడి

               

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది.  హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి.  పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ  చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన  అడుగుల్లో నావి కూడా ఉన్నాయి.  2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు,  కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి..  ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే  పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

దేవ ప్రయాగ శాంత మందాకిని

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో  మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ  మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు.  సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత  పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది.  అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది.  అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది.  హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది.  రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి.  ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది.  సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో  విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా.  ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

-రామ్ బాడా ధాబాలో వంట-

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో  వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు.  స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు.  హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ  సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి  పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర.  మొన్న జరిగిన విలయంలోనూ గుడి  చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను  టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

గుర్రం యజమాని దేవ ప్రయాగ దగ్గర కాంక్రీట్ అడవి

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే.  ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు.  లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

కౌశిక్ తో నేను. అలసిన దేహాలు.

 

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా  రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం.  రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు  అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా  రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి.  మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే.  “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు…  దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము.  వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు.  దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు.  కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది.  జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ  అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం..  ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి.  నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా…  కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక  కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది.  అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్  హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం.  కానీ, ఇంతలా   కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు.   మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు.  ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది.  ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు.  చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం… (

 

(మిగతా యాత్ర గురించి మరోసారి…)

 

lalitha parnandiల.లి.త.

 

 

 

 

మీ మాటలు

  1. amarendra says:

    చాలా బావుంది

  2. amarendra says:

    ఊక దంపుడు ఉపదేశం అనుకోపోతే నాదో స్వానుభవ సలహా ..నెవెర్ గో to a పాపులర్ స్పాట్ ఇన్ పీక్ season – బె ఇట్ a హాలిడే destination ఆర్ రిలీజియస్ ప్లేస్ ..ఆఫ్ seasone బెస్ట్ season ..నేను బద్రి కేదార్ ఒక అర dazanu సార్లు వెళ్లాను ..లేటెస్ట్ జూన్ 2012.. సీజన్లో ముదిరే లోగా వెళ్లి వస్తూ వుంటాను..ముదిరిందా, సాక్షాత్తూ శంకరుడు కూడా మనల్ని రక్షించ లేడు!!
    లలిత గారి కథనం బావుంది..ఫోటోలు ఇంకా …

  3. Lalitha P. says:

    నిజం అమరేంద్ర గారూ! ఆఫ్ సీజన్లో వెళదామని నేనూ ప్రయతనిస్తూ ఉంటాను కానీ పిల్లలకు జూన్ లో సెలవులు ఉండవు కాబట్టి మే ప్రయాణాలు మాకు ఎక్కువ. మే లో జనం తక్కువగా ఉండే చోట్లు వెదుక్కుంటూ వెళ్తూ ఉంటాం. నేనూ జయసూర్య ఫోటోలు తీస్తూంటాం. మీరు అర డజను సార్లు ఈ దారుల్లో వెళ్ళారా? బాబోయ్. బ్యాక్ ప్యాక్ టూరిజం నాకు బాగా ఇష్టం కానీ చేసింది తక్కువే. lalithap62@gmail.com. This is my mail address. Please let me know yours
    coz we are birds of same feather. thank you.

  4. An absorbing write-up .
    The photos too are apt and beautiful.

    “We travel for romance, we travel for architecture, and we travel to be lost.” Ray Bradbury ‘s quote nicely sums up your experience…….

మీ మాటలు

*