దైవాన్ని కొలవడానికి దేహాన్ని శిక్షించాలా?

sathyavati“ప్రతి కాథలిక్ బాలకలోనూ చిన్నప్పుడు తనొక సన్యాసిని(నన్) కావాలనే కోరిక వుంటుంది. యౌవనం వచ్చేవరకూ ఆకోరిక ఆమెలో నిలిచేవుంటుంది.నాకూ అలాగే వుండేది.నేను ఒంటరిగా చర్చ్ కు వెళ్ళినప్పుడంతా “నేనూ ఒకప్పుడు నన్ అవుతాను” అనుకునేదాన్ని.కానీ నాకు ప్రభువునుంచీ పిలుపు రాలేదు. యౌవ్వనం నాలో ఒక తుఫాను రేపింది. నాశరీరపు కోరికలను నేను తలుపు వెనక్కి నెట్టలేదు.అందుకు విరుద్ధంగా నా పరువాన్ని ఆస్వాదించాలనుకున్నాను …జీవితం దాని దారిన అది సాగింది నాకు పదహారేళ్ళకే వివాహం అయింది..” అంటుంది సారాజోసెఫ్  ఆమె వ్రాసిన  “ఒథప్పు”అనే నవల ముందుమాటలో.వివాహం అయినా ఆమె క్రీస్తు గురించి ఆలోచిస్తూనే వుంది..ఆర్థిక ,సామాజిక,జెండర్ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ ,వ్యవస్థీకృతమైన మతానికి భిన్నంగా ఒక కొత్త ఆధ్యాత్మికత గురించిన అన్వేషణే  “ఒథప్పు” నవల. మత రాజకీయాలను తీవ్రమైన విమర్శకు పెట్టిన నవల.స్త్రీల ఆధ్యాత్మికతకు కొత్త నిర్వచనాన్ని సూచించిన నవల కూడా.

“మనశ్శరీరాలు మమేకమైనప్పుడు స్వతస్సిద్ధంగా పొంగి వచ్చే సంగీత ఝరి వంటి ప్రేమ, స్త్రీలకు ఆనందాన్నిస్తుందే తప్ప, కేవల శారీరవాంఛా పరిపూర్తి  కాదు. వాళ్లకు లైంగికత అనేది కేవలం భౌతికపరమైన  విషయంకాదు. స్త్రీల విషయంలో వాళ్ల ఆధ్యాత్మికనూ లైంగికతనూ విడదీసి చూడకూడదు.బ్రహ్మచర్యం లేదా కన్యాత్వం అనేది ప్రకృతి తోనూ శరీరంతోనూ చేసే యుద్ధంలాంటిది. చర్చిలలోనూ మఠాలలోనూ అనేక పవిత్ర వస్త్రాలు కప్పుకుని చాలామంది  తమ శరీరాలతో పోరాడుతూ ఊపిరాడకుండా సతమతమౌతూ వుంటారు.ఆ పవిత్ర స్థలాలలో అత్యాచారాలూ ఆత్మహత్యలూ హత్యలూ కూడా జరుగుతూవుంటాయి….. ఒక స్త్రీ ఆధ్యాత్మికత ఆమె తన పురుషుడితో పంచుకునే ప్రేమ పూరిత శృగారంలోనూ  ,ప్రసవ వేదనలోనూ వుంటుంది,”  అంటుంది  ప్రముఖ మళయాళ స్త్రీవాద రచయిత్రి , ఉద్యమ కార్యకర్త కూడా అయిన సారా జోసెఫ్.

ఆడపిల్లలకు శరీర జ్ఞానంలేకుండా పెంచుతారు.అద్దంలో తమ నగ్న శరీరాన్ని చూసుకోడం కూడా ఒక తప్పుగా సిగ్గులేని చర్యగా భావించేలా నియంత్రిస్తారు.ఇంక సన్యాసినులు (నన్స్) అనేక పొరల బట్టల కింద తమశరీరాన్ని కప్పిపెట్టి ,దాన్ని అభావం చేసుకుంటారు.తమ శరీరాలకు తాము పరాయివాళ్ళైపోతారు.

గొప్ప సేవాభావంతో క్రీస్తు పట్ల ఆరాధనతో కాన్వెంట్ కు వెళ్ళి, కొన్నాళ్లకి అక్కడ ఇమడలేక బయటికివచ్చి, అనేక కష్టాలకూ అవమానాలకూ అపనిందలకూ గురై తన అంతరాత్మను తప్ప మరి దేనినీ లక్ష్యపెట్టక  జీవితాన్ని ఎదుర్కున్న ఒక మేరునగధీర కథ  ఈ నవల. “ఒథప్పు” అనే పదానికి చాలా అర్థాలున్నాయట. “అపవాదు” అనీ,  ” దారి మళ్ళించడం”  అనీ  “కళంకం” అని….ఈ నవలను ఆంగ్లంలో అనువాదం చేసి, ఉత్తమ అనువాదానికి క్రాస్ వర్డ్ బహుమతి అందుకున్న వాల్సన్ థంపు దీనికి ఆంగ్లంలో “ ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్” అని పేరు పెట్టాడు.

సన్యాసిని కావాలనే కోర్కె కలగడాన్ని “ప్రభువు పిలుపు”గా భావిస్తారు క్యాథలిక్కులు. తమ ఇంట్లో ఒక ఆడపిల్ల అట్లా ప్రభువు సేవకు జీవితాన్ని అంకితం చెయ్యడాన్ని ఒక ఖ్యాతిగానూ , అక్కడనించీ తిరిగిరావడాన్ని అపఖ్యాతిగానూ భావిస్తుంది ఆ కుటుంబం.  సమాజమూ,చర్చీ కూడా అట్లాగే భావిస్తాయి .నచ్చని చదువు మానవచ్చు,నచ్చని ఉద్యోగం మానవచ్చు,నచ్చని భార్యకో భర్తకో విడాకులిచ్చి రావచ్చు కానీ ఒక సారి సన్యాసం పుచ్చుకున్నాక సామాన్య జనుల్లోకి రావడాన్ని దారితప్పడంకిందా ,అది కుటుంబానికీ, ఆమె జీవితానికీ తెచ్చుకున్న ఒక మచ్చక్రిందా పరిగణిస్తారు. ఎవరూ అక్కున చేర్చుకోరు.

సంఘమూ మతమూ కొందరికి అంటగట్టే అలివిమాలిన త్యాగాలలో సన్యాసం కూడా ఒకటి. కొంతమంది ఆడపిల్లల్ని పెంచిపెద్ద చేసి,  పెళ్ళిళ్ళు చెయ్యలేక కూడా కాన్వెంట్ కి పంపిస్తారు. వాళ్ల వలన కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం అందుతుంది . వీళ్ళు ఇష్టమైనా కష్టమైనా అక్కడ బందీలే! ఈ నవలలొ ఆబులమ్మ ,ఆమె చెల్లెళ్ళ పరిస్థితి అదే!!

ఈ నవలలో ముఖ్యపాత్ర మార్గలిత సంపన్నుడైన చెన్నెరె వర్కె మాస్టర్ గారాబు బిడ్డ. ఇద్దరు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల. ఆమె నన్ గా మారతానంటే, మానవసేవచెయ్యడానికి సన్యాసమే పుచ్చుకోనక్కర్లేదనీ ఇంట్లోవుండికూడా చెయ్యొచ్చనీ  నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు తండ్రి. కానీ ఆమె పట్టు విడవదు. తల్లికి తన కూతురు నన్ అయిందంటే చాలా సంతోషం. అంత పట్టుదలతో విశ్వాసంతో కాన్వెంట్ కి వెళ్ళిన మార్గలిత అక్కడ ఎక్కువ కాలం వుండలేకపోతుంది.అక్కడి ద్వంద్వ విలువలు,నిర్బంధాలూ,వేధింపులూ ఆమెకు నచ్చవు. ఎంతో సంఘర్షణ పడి చివరికి కాన్వెంట్ వదిలి, వర్షంలో తడిసి  ముద్దై ఇంటికి వస్తుంది.

అప్పటికి ఆమె తండ్రి చనిపోయాడు.నిరంకుశుడైన పెద్దన్న జాన్  ఇంటిపెత్తనం తీసుకున్నాడు. సన్యాసిని వస్త్రాలలో కాకుండా .చీరె కట్టుకుని వచ్చిన కూతుర్ని చూసి తల్లి స్పృహతప్పి పడిపోతుంది.ఎవరో ఆమె వీపుమీద బలంగా తన్ని చీకటిగదిలో పడేసి తలుపులు మూశారు. (అది  త్వరగా పండడం కోసం అరటి కాయలు మగ్గేసే గది) .మూడు రోజులపాటు ఆకలితో దాహంతో కాలకృత్యాలు తీర్చుకునే వీలుకూడా లేకుండా ఆ చీకటిలో చెమటలో పడివుంది మార్గలిత. ఇంటికి మచ్చతెచ్చిన పిల్ల. వివేకవంతుడూ ప్రేమ మూర్తీ అయిన ఆమె తండ్రి బ్రతికి వుంటే అట్లా జరిగివుండేది కాదేమో!

మార్గలితకి కాన్వెంట్ లో వున్నప్పుడే రాయ్ ఫ్రాన్సిస్ కరిక్కన్ అనే అసిస్టెంట్ వికార్ తో పరిచయం అతను  పాటలు నేర్పడానికి కాన్వెంట్ కి వచ్చేవాడు..అతనికి కూడా తన పై స్థాయి ఫాదర్ డేనియల్ పద్ధతులు నచ్చవు.ఫాదర్ డేనియల్ శుద్ధ ఛాందసుడు. శాంతి గురించీ, సేవ గురించీ ప్రేమ గురించీ బోధించడం కాదు, ఆచరించాలంటాడు కరిక్కన్ .అతనివీ ఫాదర్ డెనియల్ వీ పొసగని అభిప్రాయాలు.కానీ తన అధికారంతో కరిక్కన్ నోరు మూయిస్తూ వుంటాడు ఫాదర్ డేనియల్.

కాన్వెంట్ జీవితంపైతన మనసులో  కలిగే భావాలన్నీ ఎప్పటికప్పుడు కరిక్కన్ కు ఉత్తరాలు వ్రాస్తూ వుంటుంది మార్గలిత.ఆమె అభిప్రాయాలకు అచ్చెరపడుతూ ఒకటికి రెండు సార్లు చదువుకుని వాటిని దాచుకుంటూ వుంటాడు కరిక్కన్. అతను కడుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడు. అతని తండ్రి పచారీ కొట్టుకి మూటలుమోసే కూలీ. తను కాన్వెంట్ వదిలిపోతున్నాననీ తనకు వెంటనే ఒక జత బట్టలూ కొంతడబ్బూ అందజెయ్యమనీ ఉత్తరం వ్రాసింది మార్గలిత. ఆ బట్టలు కొనడానికి అతను చాలాసందేహించాడు. ” ఒక ఫాదర్  చీరె కొంటే చూసేవాళ్ళేమనుకుంటారు?” అనుకుంటాడు, భయంభయంగా కొని ,దాన్ని చాలా సౌకర్యంగా అక్కడే మర్చిపోయివస్తాడు.

మూడు రోజుల చీకటి గది లో జ్వరంతో వుండి ఆమె మేనత్తకూతురు రెబెక్కా దయతో బయటపడ్డ మార్గలితకు ఆ ఇంట్లో ఎవరూ మందూ మాకూ చూడరు.ఆమె కాన్వెంట్ నుంచీ వచ్చేసిందని డాక్టర్ కి కూడా తెలియకూడదు.ఆమె పెద్దన్న జాన్,నగర మేయర్ కావడానికని చాలా కష్టపడి ప్రచారం చేసుకుంటున్నాడు.ఈ మచ్చ అతని ఎన్నికలమీద పడుతుంది.

ఆమె ఆ యింట్లో తిండీ నీళ్ళూ మందూ లేకుండా కృశించి చనిపోయినా వాళ్లకేం బాధలేదని అర్థం చేసుకుని అక్కడనుంచీ బయటపడి  తిరిగి తిరిగి చివరికి కరిక్కన్ దగ్గరికి చేరింది .కానీ కరిక్కన్ మార్గలిత అంత ధైర్యవంతుడుకాదు.అతనికి చర్చి  భయం, సమాజం భయం, దైవభీతి, కుటుంబం భయం, ఇట్లా చాలా  భయాలున్నాయి.ఆమెకు యొహానన్ కస్సీస్సా అనే సిరియన్ క్రిష్టియన్ ఫాదర్ ఇంట్లో ఆశ్రయం ఇప్పిస్తాడు. ఆమెపట్ల తనకున్న ఆకర్షణని సానుభూతినీ బయటపడనివ్వడు కస్సీస్సా . అతని భార్య సారా కోచమ్మా అతని తల్లి అన్నమ్మకుట్టీ మార్గలితను ఆదరిస్తారు.

ఆమె ఎన్నాళ్లని అక్కడుండాలి?ఆమెకో జీవనాధారం కావాలికదా?అందుకోసం ఆమె తండ్రి స్థాపించిన స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేర్చుకోమని జాన్ ని అడుగుతాడు కస్సీస్సా. మార్గలితతో తమకేం సంబంధం లేదనీ తమ ఇంటివ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మర్యాదగా వుండదనీ అతన్ని అవమానిస్తాడు జాన్. తండ్రి ఆస్తిలో తన వాటాకోసం కోర్టుకు వెళ్ళమంటాడు కస్సీస్సా. ఈలోగా ఊళ్ళో కొందరు కస్సీస్సా ఇంటిమీదకొచ్చి అతనికీ మార్గలితకూ సంబంధాలు అంటగడుతూ దుర్భాషలాడి గలాటా చేస్తారు. మార్గలిత ఎటువంటిదో ,తన భర్త ఎటువంటివాడో తెలిసినా అతనికి చెడ్దపేరురావడం సహంచలేని కస్సీస్సా భార్య ఆమెను ఇంటినుంచీ పంపెయ్యమంటుంది. అప్పడుకూడా కరిక్కన్ ఆమెకు సహాయం రాడు.

ఎవరూ పంపించనవసరం లేకుండా తనే ఆయింటినుంచీ బయటపడి రెబెక్కా సాయంతో ఫాదర్ ఆగస్టీన్ దగ్గరకు వెడుతుంది. ఫాదర్ ఆగస్టీన్ ఏ చర్చి అధికారానికీ తలవొంచని స్వతంత్రుడు,నిరాడంబరుడు, ఆచరణ శీలి. అడవిలో వుంటూ. దొరికింది తింటూ అక్కడుండే పేదలకు సాయం చేస్తూ వుంటాడు. రోడ్డుమీద నిరాధారంగా పడివున్న ఒక రోగిష్టి స్త్రీని తీసుకొచ్చి ఆమె మలమూత్రాలను కూడా అసహ్యం లేకుండా శుభ్రం చేసి ఆమె చనిపోయే క్షణాలలో అమెకు సాంత్వన ఇచ్చిన ప్రేమ మూర్తి.  చనిపోయిన స్త్రీ తాలూకు బిడ్ద కూడా చావుబ్రతుకుల్లోనే  వున్నట్టుంటాడు .వాణ్ణి దగ్గరకు తీస్తుంది మార్గలిత. వాడికి “నాను” అని ముద్దుపేరు పెట్టింది. తన ఉపచారాలతో వాడికి ప్రాణంపోస్తుంది. ఆ పిల్లవాడు ఆమెకు దగ్గరౌతాడు.

ఫాదర్ డేనియల్ బదిలీ కావడంతో కరిక్కన్ ఆస్థానంలో వికార్ గా నియమించబడతాడు. వికార్ అయినప్పుడు వచ్చే అదనపు అధికారాలూ వసతులూ ఆదాయమూ అతని మనసును మార్గలిత మీదనుంచీ మళ్ళిస్తాయని అంతా ఆశిస్తారు.  తన కొడుకు వికార్ అయితే తన హోదా పెరుగుతుంది కనుక, అతని తండ్రి పదివేలు అధిక వడ్డీకి అప్పచేసి ఇల్లు మరమ్మతు చేయిస్తాడు.తల్లీ చెల్లెళ్ళూ ఇల్లు అలికి అలంకరించి అతనికోసం ఎదురుచూస్తుంటారు.కానీ అతను  మార్గలిత ను వెతుక్కుంటూ వెళ్ళి . తనని క్షమించమంటాడు.మార్గలిత కరిగిపోతుంది. ఫాదర్ ఆగస్టీన్ గదిలో మొదటిసారి వాళ్లిద్దరూ దగ్గరౌతారు.

“నేను నా శరరంతోనే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను. నేను అశాశ్వతమైన శరీరాన్నీ శాశ్వతమైన ఆత్మనూ విడదియ్యలేను..ప్రేమలో నా ఆత్మ శరీరాన్నీ,నాశరీరం ఆత్మనూ అధిగమిస్తాయి ఇంత అపరూపమైన  ఆనందాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు .ఇది కేవలం ఆత్మకో శరీరానికో ప్రత్యేకమైన ఆనంద పారవశ్యం కాదు.ఇది ఆరెండింటి సమ్మేళనం. నేను మొత్తంగా ఒక ఆనందాంబుధిలో ఈదుతున్నాను. నాలోనించీ ప్రవహించే ఆనందం ఈ భూమికి  శాంతిని ప్రసాదించే నదిలాంటిది .నేనెంతో ప్రశాంతంగా ఆనందంగా వుంటాను,” అనుకుంటుంది మార్గలిత.

అతను మార్గలితను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు.వికార్ గా ఫాదర్ దుస్తుల్లో రావలసిన కొడుకు సాధారణ దుస్తుల్లో ఒక స్త్రీని వెంటపెట్టుకు రావడం చూసి అతను తెచ్చిన కళంకాన్ని తట్టుకోలేక ఆ క్షణమే అతని తండ్రి ఉరి వేసుకుంటాడు. కరిక్కన్ ని అందరూ ఏవగించుకుంటారు. తండ్రి అంత్యక్రియలకు కూడా అతన్ని అనుమతించరు, అట్లా నడివీధిలో నిలబడిన ఆ ఇద్దర్నీ తన ఇంటికి తీసుకుపోతాడు నాస్తికన్ జార్జి. ఒకటిరెండు రోజులు తను ఆదుకోగలడు కానీ తరువాత పనిచేసుకుని సంపాదించుకోమంటాడు. తన ప్రేమతో అతన్ని సాంత్వన పరచడానికి చాలా ప్రయత్నిస్తుంది మార్గలిత.అంత నిరాదరణలోనూ అవమానం లోనూకూడా ఆమె అధైర్య పడదు, ఆమెకు కరిక్కన్ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది.

ఉచిత సహాయాలు అందుకోడం ఇష్టపడని మార్గలిత  రేషన్ షాపు ఊడ్చి రోజూ పదిరూపాయలూ కాసిని బియ్యం సంపాదించి  ఇల్లు నడుపుతుంది . కానీ  తండ్రి మరణంతో ఒక అపరాధభావంతో కృంగిపోతాడు కరిక్కన్ .అతన్ని మార్గలిత ప్రేమకూడా శాంతపర్చలేకపోతుంది. ఆమెతో కలిసివున్నా ఆమెలా అతను ఆమెకు అంకితం కాలేకపోతాడు.. ఈ లోగా ఇద్దరూ ఉద్యోగాలకోసం ఎన్నో సేవాసంస్థలకు అర్జీలు పెడతారు.యొహానన్ కస్సీస్సా కూడా ప్రయత్నిస్తూ వుంటాడు. అప్పుడు కరిక్కన్ ఉలిక్కిపడ్డాడు. మార్గలిత కడుపులో తన శిశువు మొలకెత్తుతోందని తెలిసి. కరిక్కన్ కు దూరంగా వుంటూన్న అతని తల్లి కూడా ఉలిక్కి పడింది.

వాళ్ళు ఆ వూరు విడిచిపోకపోతే తను కూడా ఉరిపెట్టుకుంటానని అతడిని హచ్చరించింది.  కరిక్కన్  చెప్పకుండా అదృశ్యమైపోయాడు. తను పాపం చేశాడు.దానికి ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అతను తనను ఎంతో ప్రేమించిన మార్గలితను వదిలివెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకం మరో సారి నోరు తెరిచింది. “మార్గలిత దారితప్పిన మనిషి. ఆమె కడుపులో శిశువు కరిక్కన్ ది కాకపోవచ్చు. కరిక్కన్  చాలా మంచివాడు. ఈ ఘోరం భరించలేక వెళ్ళిపోయాడు  కాన్వెంట్ వదలి ఎక్కడెక్కడ తిరిగిందో ఏమో!”  అని వదంతులు పుట్టాయి.

ఉన్నట్టుండి ఒకరోజు ఆగస్టీన్  వచ్చి ” నాను”  ను  ఆమెకు అప్పగించి వెళ్ళిపోతాడు.  మార్గలిత తల్లి ఆమెకు తన భాగం ఆస్తి వ్రాసి ఇస్తుంది. ఆ పత్రాలు తీసుకొచ్చిన  అడ్వొకేట్ చిరమెల్ ఆమె పరిస్థితి తెలిసికూడా, (కరిక్కన్ బిడ్దను మోస్తున్నదని తెలిసికూడా) ఆమెను చర్చి ఆశీస్సులతో  పెళ్ళిచేసుకుంటానని,ప్రతిపాదిస్తాడు.తన భార్య పోయి పదకొండేళ్ళయిందనీ తన కూతురు  వైద్యం చదువుతున్నదని, ఒంటరిగా ఉండలేకపోతున్నాననీ అంటాడు.ఆమె ఒకప్పుడు నన్ కనుక ఆమెలో ఇంకా వినయం. పవిత్రత దైవభీతి ఉంటాయని తనకి నమ్మకం అంటాడు . తనది పరువుకల కుటుంబం అని చెన్నెరి కుటుంబంతో సరితూగే ఆర్థిక స్థితి అనికూడా చెప్పాడు.మార్గలిత చేసిన తప్పులనుకూడా మన్నిస్తానంటాడు.అదంతా వింటూ ఒక రాయివలె నిలబడిన ఆమెతో ఇంక మాట్లాడ్డానికి ఏమీలేక అతను వెళ్ళిపోతాడు. తనొక నిరాడంబరమైన జీవితాన్ని నిగడపాలని నిర్ణయంచుకున్నానని తల్లికి చెప్పి ఆ పత్రాలు ఆమెకు తిరిగి ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన మార్గలితను చిన్నన్న గుమ్మం తొక్కనివ్వడు . ఆ పత్రాలను మెట్లమీద పెట్టి వచ్చేస్తుంది.కడుపులో బిడ్డతోనూ పెంపడుబిడ్డతోనూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి  సంసిద్ధంగా…అది కథ.

“ నేను కాన్వెంట్ లంటే  సర్వ స్వతంత్రమైన స్త్రీ సంస్థలనుకునేవాడిని.వాటికి పూర్తి ఆర్థిక స్వాతంత్ర్యం వుంటుంది.వాటిమీద చర్చి  కి ఎలాంటి అధికారం వుండదు. వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ల ధ్యేయాలనూ సన్యాసినులే(నన్స్) ఎంచుకుంటారు వాళ్ల సంస్థల్లో వాళ్ళు సర్వస్వతంత్రులు. ఇళ్ళల్లో వుండే స్త్రీలకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులు తప్పవు. కానీ వీళ్ళకి అటువంటి బానిసత్వంలేదు. పురుషుల ఆధిపత్యమూ ,సహాయమూ లేకుండా సంస్థల్ని నడపడం,నిజంగా ఒక  విప్లవంలాంటది అనుకునేవాడిని.కానీ  అక్కడ ఉండే నిర్బంధాలను గురించీ హింస గురించీ  వేధింపుల గురించీ మాకు తెలియదు.కాన్వెంట్ లో చేరిన పదహారు పదిహేడేళ్ళ అమ్మాయిల మానసిక అవస్థలను గురించి తెలియదు,” అని పాల్ జకారియా అనుకున్నట్లు మనం కూడా అనుకుంటాం.

కానీ కొన్ని కాన్వెంట్స్ లో చర్చిల్లో ,కొందరు ఫాదర్లు మదర్ సుపీయర్లు ఎట్లా ప్రవర్తిస్తారో ,మతం అనేది మనుషులకు  దారిచూపే దీపంలా కాకుండా ఒక వ్యాపార సంస్థలా ఎట్లా తయారౌతోందో,ఒకప్పుడు సమాజంలో పాదుకోడానికి ప్రయత్నించిన హేతువాద భావాలూ, నాస్తికత్వమూ  వెనక్కి తగ్గి మళ్ళీ మహిమలకూ, మంత్రాలకూ, క్రతువులకూ ఎట్లా జనం బానిసలౌతున్నారో , చర్చిలో ,కుటుంబంలో సమాజంలో మతంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎట్లా కాపాడ బడుతుందో..వంటి ఎన్నో విషయాలను ఈ నవలలో చర్చకు పెడుతుంది సారాజోసెఫ్.

ఇంత ధైర్యంగా చర్చిని విమర్శిస్తూ వ్రాసిన నవల మళయాళంలో ఇటీవల ఇదేనేమో ! చర్చి  లో వుండే ఫాదర్లకు బ్రదర్లకు నిర్బంధ బ్రహ్మచర్యం విధించకూడదంటాడు యొహానన్ కస్సీస్సా. ఈ విషయంలో క్యాథలిక్ చర్చి పునరాలోచన చెయ్యాలంటాడు .సిరియన్ క్రిష్టియన్స్ లో ఈ నిబంధన లేదు. అందుకు కస్సీస్సా ఇల్లే ఉదాహరణ. కస్సీస్సా చాలా హేతుబద్ధంగా ఆచరణత్మకంగా ఆలోచిస్తాడు.

“చర్చి ఒక వ్యవస్థగా మారడం అందులోకి భౌతిక సౌఖ్యాలు ప్రవేశించడం సమాజంలో మారుతున్న విలువలు చర్చిలోకి కూడా ప్రవేశించడం క్రిష్టియానిటీ లో వుండవలసిన ఆధ్యాత్మికతను నిరాడంబరతనూ వెనక్కి నెడుతున్నాయి” అంటుంది ఈ నవలకు పరిచయవ్యాసం వ్రాసిన జాన్సీ జేమ్స్ .

ఎక్కడికక్కడ మళయాళీ సుగంధాన్ని కాపాడుతూ అనువదించిన వాల్సన్ థంఫు  “ఏవిశ్వాసంలో నైనా అసలు సత్యం  ఏమిటో తెలుసుకోడానికి  వ్యక్తి చేసే  అన్వేషణ కు ఈ నవల ఒక ఉదాహరణ.సారా జోసెఫ్ సంధించిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు వ్యవస్థీకృతమైన  కైస్తవ మతం సిద్ధంగా లేదు.మనకి కావలసినది బైబిల్ లో చెప్పిన క్రైస్తవం కానీ చర్చి క్రైస్తవం కాదు” అంటాడు. మతం ఒక శిల కాదు.అదొక ప్రవాహం అంటుంది సారా జోసెఫ్.అది ఒక్క క్రైస్తవానికే కాదు అన్ని మతాలకూ అన్ని విశ్వాసాలకూ వర్తిస్తుంది.

సారా జోసెఫ్ వ్రాసిన “అలహాయుదె పెన్మక్కల్” ( అలహా బిడ్దలు –అంటే దేవుని బిడ్డలు) నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.  “అలహాయుదె పెన్మక్కల్,” “మాటతి,” “ఒథప్పు” మూడు నవలలు కలసి ఒక ట్రయాలజీ లా వుంటాయి. సారా జోసెఫ్ మళయాళం ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు.అనేక సామాజిక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు రామాయణంలో శూర్పణఖ మంధర ,సీత పాత్రలను ఒక  కొత్త దృష్టికోణంతో విశ్లేషించారు. అనేక కథలు వ్రాసారు .కేరళలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు  “నేను స్త్రీగా పుట్టినందుకు గర్విస్తాను. స్త్రీల పై వివక్ష ,వారినికేవలం శరీరాలుగా మాత్రమే చూడడం ,వారికిచ్చే పరిమితమైన ప్రాధాన్యత ల గురించి  వ్రాయడం నా ముఖ్య కర్తవ్యం. అది నిర్వహించగలుగుతున్నందుకు కూడా నేను గర్విస్తాను,” అంటుంది  ,కేరళలో స్త్రీవాదోద్యమానికి నాందిపలికిన ఈ రచయిత్రి.

“ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్ ” గా ఈ నవలను అనువదించిన వాల్సన్ థంపు , డిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ .ధర్మశాస్త్రవేత్త ,శాంతి ఉద్యమ కారుడు.రచయిత. మతం గురించీ, అనేక సామాజిక సాంస్కృతిక అంశాల గురించీ విస్తృతంగా వ్రాసారు. సారా జోసెఫ్ కథలు అనేకం ఆంగ్లంలో అనువదించారు. ఈ నవల ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.

దూకే జలపాతం చెప్పిన కథ – కలాపి

rm umamaheswararao‘కలాపి’. మన్నం సింధుమాధురి రాసిన కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన కథ. కలాపి అంటే నెమలి. సింధుమాధురి మాత్రం నెమలి లాంటి కలాపి గురించి కథ రాయలేదు, జెర్రిగొడ్డు లాంటి కలాపి గురించి కథ రాసింది. ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్న కలాపి గురించి కథ రాసింది. ‘ఒక పాము నోట్లో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటూ కొండలెక్కే’సాహసి గురించి రాసింది. కలాపికి ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. ‘ఈ క్రీడ కలాపి శరీరానికే పరిమితం.’ ఈ క్రీడా వినోద యాత్రలో కలాపి పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో కథాఖరులో కలాపి చేతే చెప్పిస్తుంది సింధుమాధురి.

ఇట్లాంటి కథాంశంతో రాయడం ఒక సాహసమే. రాసి ఒప్పించడమూ, మెప్పించడమూ అంత సులువేమీ కాదు. ఐదుగురిని పెళ్ళి  చేసుకున్న ద్రౌపదిని అమోదించడానికి పవిత్రతనీ, దైవత్వాన్నీ కవచాలుగా వాడుకోక తప్పడంలేదు ఇప్పటికీ. మరి, మన మధ్య ఉన్న స్త్రీ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని భరించగలమా? భరించి సహించగలమా? సహించి ఆమోదించగలమా? ఆమోదనీయమైన పరిస్థితులనూ, కారణాలనూ వివరించగలగాలి. లేకుంటే ఎంత సమర్థంగా రాసినా, ఎంత గొప్ప శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించినా కథ తిరస్కరణకు గురవుతుంది.

కలాపి కథలో ఆమోదనీయత కోసం రచయిత చేసిన ప్రయత్నం సఫలమైంది. జాగ్రత్తగా కథను చదివితే అసలు రచయిత ఉద్దేశ్యం కలాపి జీవితాన్ని పాఠకుల ముందుంచడమే అనిపిస్తుంది. బహుశా నిజజీవితంలో రచయితకు పరిచయమున్న పాత్ర కలాపి. యథాతథ చిత్రణ మాత్రమే కథ కాదు. కథను మలచుకోవాలి.  మలచుకోవడంలో మెలకువ ఉండాలి. ఈ మెలకువ తోనే  సింధుమాధురి మరణశయ్య మీద ఉన్న కలాపి చేత ఇలా చెప్పించింది..

“ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు. ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. నాకు కావలసినది నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని ఇచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్ వాట్ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది అనుభవాలు మాత్రమే.”

కలాపి పాతికేళ్ళ అన్వేషణే ఈ కథ. కొండల మీద కుండపోతగా కురిసిన వానకి దూకే జలపాతం కలాపి. రాళ్ళని ఒరుసుకుంటూ, చెట్లని వేళ్ళు సహా పెకలించుకుంటూ, మట్టీ నీళ్ళూ ఒక్కటై పోయి సుడులు తిరుగుతూ … ఏ నదిలోనో, సముద్రంలోనో కలిసేక గానీ నెమ్మదించదు. ఈ వడిలో, ఈ దూకుడులో తనకు అయిన గాయాలు గానీ, తను చేస్తున్న గాయాలు గానీ  గుర్తుకు రావు. బాధ తెలియదు. ఈ పరుగులో , ఈ ప్రవాహంలో, ఈ ప్రయాణంలో తన ఉనికే ప్రధానం. ఎన్ని హొయలు పోయినా ఈ జడిలోనే, ఈ ప్రాయపు పడిలోనే. అనంత సాగరంలో కలిసిపోయాక తనకిక ఉనికి లేదు. విడి అస్తిత్వం లేదు. అప్పుడిక అన్వేషణ బయట కాదు, లోపల. లోలోపల, తనలోపల.

ఇరవై రెండేళ్ళ కలాపికీ, హంపీ దగ్గరలో ఉండే పదేళ్ళ అమ్మాయికీ స్నేహం. బహుశా ఈ పదేళ్ళ అమ్మాయి రచయిత. పాతికేళ్ళు దాటాక ఈ అమ్మాయి కలాపి కథ చెబుతుంది. ఈ అమ్మాయికి కలాపి అంటే వెర్రి వ్యామోహం. కలాపి రంగూ, రూపం, నడకా, నడతా ప్రతిదీ ఇష్టమే.  కలాపి నల్లని పిల్ల. ఆ నలుపు  భయపడేంత ఇష్టం ఈ పదేళ్ళ పిల్లకి. ‘మిగలపండిన నేరేడు కాయ ఫఠ్ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే..ఆ రంగు’అని కలాపి ఒంటి నలుపుని వర్ణిస్తుంది. అయితే, అదీ తృప్తినివ్వదు. ‘నెమలి నలుపు’ అంటుంది కాసేపు. కాదు కాదు, ‘మంచి నల్ల ఓండ్రు’ అంటుంది. ‘కారు మేఘపు నీలం కలిసిన రంగు’అనీ అంటుంది. అంతటితోనూ ఆగదు. ‘ అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి, ఆ మసిలో పచ్చకర్పూరం, తెల్ల వెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్ బ్లాక్’అంటుందా..దాన్నీ నిర్ధారించదు. ‘ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు’అని తేల్చేస్తుంది.

కలాపి ఒంటి మెరుపుని ఎట్లా వర్ణిస్తుందో చూడండి, ‘దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి, అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు’. బాబోయ్!  కలాపి ‘అవయవాల్లో చంద్ర చెక్క పచ్చడి బండ గట్టిదనం, చూపులో చుర్రుమని కాలే చురుకు’. ఇంక కలాపి ప్రేమలో పడకుండా కథ చదివే పాఠకులని ఆపడం ఎవరితరం?

యౌవనంలో ఉండే అందరమ్మాయిల్లాగే కలాపికీ అద్దం అంటే ఎంతో ఇష్టం. ‘అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినది ఏదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది’.

కలాపి సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వాడు. కలాపికి కొండలెక్కడం అంటే ఇష్టం. తుంగభద్ర ప్రేమికురాలు. నడుముకి తాడు కట్టుకుని ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ బల్లిలా బండలూ గుట్టలూ ఎక్కేది. ఈ పనిలో అంతు తెలియని ఆనందం ఆమెకి. చెమటలు కారే శ్రమా, శ్రమ వల్ల కలిగే అలసటా, అలసట నుంచి లభించే ఆనందమూ కలాపిని తరచూ హంపీకి రప్పించేవి.  వచ్చిన ప్రతిసారీ కలాపి కొత్త అందాలతో కనిపించేది.

యూనివర్శిటీ అధ్యాపకుడైన భర్తతో విడిపోయి, క్రికెటర్ ని పెళ్ళాడిన కలాపి‘కుబుసం విడిచిన తాచులా’కనిపించింది.  బరోడా రాజ కుటుంబీకుడి పరిచయం తర్వాత వింత ఆభరణాలు ధరించి ఆమె పర్వతారోహణకి వచ్చింది. ఇప్పుడామె ‘కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం’.తుంగభద్ర ఇసుకలో తడి కాళ్ళతో ‘వర్ష రుతువు ముందు పురి విప్పి ఆడే నెమలిలా’ఉంది.  తెల్లగా, పొడవుగా, స్టయిల్ గా పాత హిందీ సినిమా హీరోలా ఉన్న బరోడా రాజకుటుంబీకుడితో కలసి తుంగభద్రకి వచ్చిన కలాపి ‘ మిన్నాగులాగా పరుషపు చలాకీతో’ ఉంది. ఆ తర్వాత జపాన్ రాజకుటుంబానికి సన్నిహితుడిని ఆమె పెళ్ళి చేసుకుంది. దాదాపు పాతికేళ్ళ ప్రయాణం ఇది. ఎందరో మనుషులు, ఎన్నో ఆభరణాలు, ఎంతో సంపద. ఆఖరికి అనారోగ్యం. కలాపి శరీర సౌందర్యం మీద కలాపికే కాదు, కలాపి కథ చెప్పిన స్నేహితురాలికీ ఎంత మోహమంటే, చర్మపు కేన్సర్ తో ఒళ్ళంతా గాయాలతో ఉన్న కలాపి, ‘ఒంటి నిండా సూర్య కాంతమణులు ధరించినట్టుగా’కనిపించింది .

కలాపి, కొండలెక్కే సాహసి. శ్రీమంతుడి కూతురు. ఆధునిక స్త్రీ. అందమైనది. అందాన్ని ప్రేమించేది. కలాపి ఆరాధించే సౌంధర్యం పురాతనమైనది. తుంగభద్రా, హంపీ నగరమూ, రాజులు, రాణులు తిరుగాడిన ప్రదేశాలూ, శిధిలాలూ, శిల్పాలూ, రాళ్ళూ, గుట్టలూ..లోలోపలి పొరల్లో దాగిన పురాతనత్వం ఏదో ఆమెను మేల్కొలిపేది. హంపి ఆమె ఊరు కాదు, అక్కడ పుట్టలేదు. అక్కడ పెరగలేదు. అయినా తెలియని బంధమేదో పెనవేసుకుపోయింది.

యూనివర్శిటీ అధ్యాపకుడు, క్రికెటర్, బరోడా రాజకుటుంబం, జపాన్ సంపన్న జీవితం, ఎక్కడున్నా, ఏ దేశాలు తిరిగినా మళ్ళీ మళ్ళీ అక్కడకి రావలసిందే. అక్కడి గుట్టల్లో, గుహల్లో పడి దేన్నో వెతుక్కుంటున్నట్టుగా తిరుగాడవలసిందే. అలసట కలిగితే, అమ్మమ్మనో, నాయనమ్మనో, తాతమ్మనో గుర్తు చేసుకుంటుంది. వాళ్ళతో గడిపిన క్షణాలు ఆమెకి కొత్త శక్తినిస్తాయి. కొండలెక్కిన ప్రతిసారీ అమెకి కలిగే అనుభవం కూడా అదే. పురాతనత్వం నుంచి పునరుత్తేజం. వెతకడమే తప్ప, దేని కోసం వెతుకుతున్నదో ఆమెకీ తెలియదు. అయినా, వెతకడంలోని ఆనందం మాత్రం ఆమెకి అందేది. ఎందరు మనుషులు, ఎన్నెన్ని జీవితాలు, ఎన్ని ప్రదేశాలు..? ఆమె వెతకని చోటు ఏది? వెలుగు వెంటా, చీకటి వెంటా పడి పరుగెత్తింది.

కలాపి అన్వేషణ దేని కోసం?. మిల మిల మెరిసే శరీరం, ఖణ ఖణ మండే వయస్సు, గలగల పారే స్వభావం. ఉరకలెత్తే ఉత్సాహం. పగడాలు, ముత్యాలు, వజ్రాలు, అంతులేని సంపద వైపు పరుగులు . కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, చేతులు సాచి పిలిచే కొత్త  ప్రపంచాలు. కలాపి పరుగులో మిడిసిపాటు లేదు, ఇంకా ఇంకా ఏదో కావాలనే తపన తప్ప. ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి ఎగబాకినట్టే, ఒక మగవాడి మీదుగా ఇంకో మగవాడిని అందుకుంది కలాపి.

]ఈ ప్రయత్నంలో అలసటలేదు, ఆనందం తప్ప. కలాపి ప్రయాణంలో తప్పటడుగులుండవచ్చు, తప్పుల్లేవు. ఘర్షణలుండవచ్చు, పశ్చాత్తాపం లేదు. ప్రయాణం ఎక్కడికి అని అడగగలం గానీ, ప్రయాణమే ఎందుకూ అనడగలేం కదా! ప్రయాణంలో మరణం కూడా ఒక సంఘటనే. మరణంతో కలాపి ప్రయాణం ఆగలేదు. యుద్ధగాయాలతో ఉన్న దేశానికి తను చేయాల్సిందేమిటో కలాపి గుర్తించింది. చేయగలిగింది చేయడం మొదలు పెట్టింది.[/note

పడిలేచిన పరుగుల  ప్రయాణంలోనే కలాపికి తాను వెతుకుతున్నదేదో దొరికింది. అమూల్యమైన నిధి అది.   ఆ నిధి ఆమెకు రాజకుటుంబాల్లో దొరకలేదు. ఆమె కోసం తపించిన మగవాళ్ళ ప్రేమలోనూ లభించలేదు. దిగిన లోయలూ,ఎక్కిన కొండల్లోనూ కనిపిపంచ లేదు. పొందిన సుఖాలు, ధరించిన ఆభరణాలు..ఊహూ..ఎక్కడా జాడ లేదు.  అద్భుతమైన ఆ నిధి అచ్చంగా ఆమె లోనే ఉంది. అప్పటిదాకా తాను వెతుకులాడింది తనలో దాగిన తన కోసమే. తనకు తాను దొరికిపోయాక, తన ప్రయాణం కొనసాగుతుందనే నమ్మకం కుదిరాక కలాపి కన్ను మూసింది ప్రశాంతంగా, తన నేస్తం లడ్డూ గొంతు మీద పుట్టుమచ్చగా మారిపోయి.

-------------------

కలాపి

sindhu2( resize)"పెళ్ళితో పనిలేని ప్రేమలున్న దగ్గర ప్రేమతో! పనిలేని పెళ్ళిళ్ళు ఉండకూడదా''
ఎందుకో ఈ వాక్యాలు నన్నెప్పుడూ ఆకర్షిస్తాయి. ఆలోచింపచేస్తాయి. దానిలో ఉన్న లోతయిన భావం, బాధ  ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కలిగాయో అడగాలనిపిస్తుంది. కానీ  ఎవరి వాక్యాలో నాకు తెలీదు.

ఈ మాటలు నా గదిలో గోడ మీద వేలాడుతూ ఉంటాయి. వీటిని చదివి కొందరు నవ్వుతారు. ముఖం చిట్లిస్తారు అదోలా.

ఓ రోజు ఉదయం కోదండరామాలయం దగ్గర పుట్టి ఎక్కి, తుంగభద్ర దాటాను. మీన మండపం మీదుగా రాళ్ళు దాటుకుంటూ 'మొల్ల మందిరం' దగ్గర కూర్చున్నాను. జనం పెద్దగా తిరగని చోటు అది. అంత పొద్దున్నే అసలెవరూ ఉండరు. నిశ్శబ్దంగా అందమయిన సూర్యోదయాన్ని చూడచ్చు.

ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న తులసి టీని కప్పులో పోసుకుని, ప్రకృతితో కలిపి చప్పరిస్తున్నా. ఇంతలో నదిలోంచి పడవవాడి కేకలు వినిపించాయి. కొద్దిగా ఇవతలకి వచ్చి ఏంటని అడిగా.

"అక్కా మీ తమ్ముడూ ఇంకొకాయన నీ కోసం చూస్తన్నారు. నువ్వు కనపడితే రమ్మన్నారు. నువ్వు మొల్ల మందిరం దగ్గిర ఉంటావని అరస్తన్నా'' అంటూ నేనున్న గట్టుకి వచ్చాడు.
"సరే పద ''అని అతని పుట్టి ఎక్కా.

వడ్డుకి వచ్చాక చూస్తే, తమ్ముడూ అతని పక్కన ఇంకొక వ్యక్తి. అతనిని ఎప్పుడూ చూడలా. భారతీయుడిలా కూడా లేదు. సింహళీయుడి పోలికలు ఉన్నాయి. గుట్ట మీద ఉన్న నా కళాగృహ ( కవితల, కథల, చిత్రాల పూరిల్లు) కి నా వెంట వాళ్ళిద్దరూ వచ్చారు.  కూర్చున్నాక ఎవరూ అని తమ్ముడి వంక చూసి నొసలు ముడిచాను.

"శ్రీలంక నించీ వచ్చాడంట. కలాపి అక్క పంపిందంట. ఏమీ చెప్పటల్లేదు. నువ్వు కావాలి, మాట్లాడాలి అన్నాడు. తీసుకుని వచ్చా'' అని బయటకి వెళ్ళిపోయాడు.

కలాపి పంపిందనగానే సంతోషం వేసింది. అతిథులకి ఇచ్చే పాక చూపించి, "స్నానం కానిచ్చి రండి కాఫీ, టిఫిను అయినాక మాట్లాడదాం'' అని వంటమనిషికి పని పురమాయించాను.
కానీ అతను మాత్రం "ముందు ఈ ఉత్తరం  చదవండి '' అంటూ ఉత్తరంతో పాటూ ఒక ప్యాకెట్‌ నా చేతిలో పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు.

ఉత్తరం చేతిలోకి తీసుకున్నా.  అంత అందంగా లేని చేతి రాత. గజిబిజి అక్షరాలు.  ఎర్ర రంగు కాగితం మీద వణికి ఒలికినట్టున్నయ్యి.

కొలంబో,
చిన్ననాటి చిరునేస్తం లడ్డూకి,

కలాపి రాసే ఆఖరి ఉత్తరం. ఏంటి మధ్యలో పదేళ్ళు మాయమయ్యి అఖరి ఉత్తరం అంటంది అనుకుంటున్నావా. జీవితంలో, జీవనంలో పోరాడి పోరాడి అలసిపోయాను. దేని కోసమయితే అన్వేషించానో అది ఎవరిలోనూ దొరకలేదు. నేను నమ్మిన మనషుల్లోనే కాదు, నాకు ఇష్టమైన అద్దంలోనూ  కనిపించ లేదు.  చర్మపు క్యాన్సర్‌ అన్నారు. ఇంక బహుశా జీవితం నెలలే అనుకుంటాను. ఎందుకో నిన్ను చూడాలని పిస్తంది. నీ అల్లరి, తుంగభద్ర, మీ అమ్మమ్మ, నాగమ్మ కథలు, బంగ్లా శరణార్థులు, పది రూపాయలకి తెల్లవార్లు నడిపే పుట్టిలు, నీ బ్రహ్మజెముడు బూరల సంగీతం, తోట, దబ్బనం, పురికొసతో 'గయాన్‌'గాడు రెండు సంవత్సరాలు కష్టపడి  కుట్టిన నీ బొమ్మ, గడ్డి పీచులతో నువ్వు స్కర్టులు చేసి ఏమీ తెలియని తెల్లవాళ్ళకి అమ్మి వాళ్ళతో అవి కట్టిచ్చి డాన్సులు చేయించటం, యోగా నేర్పుతానని పది డాలర్లు తీసుకుని నెల రోజుల్లో నాలుగే ఆసనాలు తిరగా బోర్లా నేర్పటం.. ఇవన్నీ నీ సమక్షంలో గుర్తు చేసుకోవాలనిపిస్తంది. నా ఆఖరి కోరిక ఏమిటంటే నేను పంపిన ఇతనితో నీవు కొలంబో రావాలని. చిగుళ్ళు కనిపించేలా పళ్లు బయటపెట్టి నవ్వే నీ నవ్వుని చూడాలని. నువ్వు వచ్చి నన్ను ప్రశాంతంగా సాగనంపుతావని ఆశగా చూస్తున్నాను.
వచ్చేటప్పుడు మంచి అద్దం తీసుకుని రా.

ఇట్లు నీ త్రాచు పాము నేస్తం
కలాపి

ఉత్తరం చదవటం అయ్యేటప్పటికి నీటి చుక్క బరువుకి కనురెప్పలు వణికాయి. నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మ , నాయనమ్మ గుర్తొచ్చారు. ఇక ఇప్పుడు ఏదో చెయ్యాలి. దూకక ముందే ఈ దుఃఖానికి కట్ట కట్టాలి, మూటకట్టి మూలకి విసరాలి. గంటలో వస్తానని పనమ్మాయితో  చెప్పి గుట్ట దిగి  రోడ్డు మీద పడ్డాను. నడక పరుగుగా మారింది. పరుగు.. పరుగు.. పరుగు.. కన్నీరు మొత్తం చెమటలా కారి బట్టలన్నీ తడిచిపోయాయి. ఓ గంటన్నర పరిగెత్తి, బట్టల మీద ఉప్పు చారికలు తేలాక, నా నాలుక నాకే జిగురుగా తగిలినాక ఇక ఏమ్రాతం పరుగెత్త లేను అనుకున్నాక.. దబ్‌ మని తుంగభద్రలో దూకి, ఓ గంట సేపు నా ప్రియ నేస్తంతో దుఖాన్ని పంచుకున్నాను. నా కన్నీటిని కడిగి  తనలో కలిపేసుకుని నన్ను తేలికపరిచింది దుంగభద్ర. తడి గుడ్డలతోనే ఇంటికొచ్చి మంచం పైన అలసటగా అడ్డంగా పడ్డాను.

...

కలాపిని తలుచుకుంటే కళ్ళూ మెదడూ ఉత్తేజితం అవుతాయి. అమె రంగూ, రూపూ, కళ్ళూ అన్నీ నలుపే. ఆమె క్రిష్ణ. బరువయినది. మిగలపండిన నేరేడు కాయ ఫఠ్‌ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే.. రంగు, ఊహూ..సరీగ్గా అదీ కాదనుకుంటా, నలుపు పేరులా నెమలి నలుపు, కాదు..అదీ కాదు, మంచి నల్ల ఒండ్రు, కారు మేఘపు నీలం కలిసిన రంగా..!? అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి ఆ మసిలో పచ్చకర్పూం, తెల్లవెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్‌ బ్లాక్‌ రంగా..?  ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు. రంగ రంగా... అది రంగా.. కాదు నేనిక వర్ణించలేను.

కలాపి నాకు బంధువు కాదు, నా వయసుకు తగ్గ స్నేహితురాలూ కాదు. కానీ నాకు బాగా దగ్గర మనిషి.

కలాపి  మా అన్నయ్య నేస్తం. నన్ను పెంచుకున్న అమ్మకి అక్క కొడుకు అతను.  ఇద్దరూ బడిలో, కాలేజీలో కలిసి చదివారు.మొదట్లో కలాపిని చూసి భయం వేసేది. కొట్టేదా, తిట్టేదా అంటే అదేం కాదు. ఆమె అందానికి భయపడ్డాను. నిజం.. నలుపులో ఇంత అందం ఉంటందా అని భయపడ్డాను. నల్లని కళ్ళు, గోధుమ రంగు కనుపాపలు, దాని చుట్టూ నల్లటి చారలాంటి వలయం, ముక్కు కొన మీద పాయలాంటి గీత, అల్లుకుపోయి కలిసిపోయిన కనుబొమలు, పిరుదుల మీదుగా మోకాళ్ళు దాటిన జుట్టు, నల్లటి, మెత్తటి, పట్టు తప్పని ఆ జుట్టుని ఎప్పుడూ  పట్టి ఉంచే చేతి వేళ్ళ కళాత్మక కదలిక. తొలి పకలరింపులోనే తియ్యగా నవ్వుతుంది కలాపి. దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు, కలాపి ఒంటి మెరుపు. చెంద్రచెక్క పచ్చడి బండ గట్టితనం ఆమె శరీర అవయవాల్లో. ఆకారంలో ఠీవి, చూపులో చుర్రుమని కాలే చురుకు.

ఒక్క చూపు చూసిందంటే నిమషంలో ఎదుటి వాళ్ళని చదివేసుద్ది. నీ ఆలోచనలు నేను పసిగట్టాను అన్నట్టుంటాయి ఆ చూపులు. కలాపికి  అద్దం అంటే ఎంతో ఇష్టం. నిద్దర లెగవటం అద్దంలో తనని తాను చూసుకోవటంతోనే రోజు మొదలు పెడతది. ముందు నన్ను చూసుకుని నేను తృప్తి పడితే, ఇతరులకి మనని చూసి తృప్తి కలుగుతుంది అనేది. ఆమె నా కిష్టమయిన  నేస్తం.

కలాపి అందం, మనుషులకే కాదు ప్రకృతికి కూడా నచ్చుతుంది.

****

ఓ రోజు పొద్దున్నే అమ్మమ్మ లేపితే లెగిసి పాల దాలి దగ్గిర కూచ్చుని చలికాసుకుంటున్నా. మొఖం కడక్కుండానే కుంపటి దగ్గిర చేరానని అమ్మమ్మ సణుగుతోంది. పుల్లతో పిడక కచ్చికిలని కెలుకుతున్నా. కుంపట్లో నించి వచ్చే సన్నటి పొగ మొహానికి తగలకుండా అటూ, ఇటూ వంగుతున్నా.
"ఏయ్‌ లడ్డూ" అన్న పిలుపు.
అన్న అట్టాగే పిలుత్తాడు.
"ఎప్పుడొచ్చా"
"ఇప్పుడే'', పక్కనే పెద్ద బ్యాగు,పక్కనే ఇంకొక పెట్టెతో కలాపి. చూడగానే ఎక్కడ లేని సంతోషం.
"నువ్వు కూడా వచ్చావా? ఎన్ని రోజులుంటావు? రోజూ మనం రాళ్ళెక్కొచ్చు, గుట్టలెక్కొచ్చు. అన్నా.
ఇంతలో  మా పనిమనిషి నాగమ్మ "ఆ కళ్ళాపి అమ్మా యొచ్చిందమ్మా''అని ఇంట్లో అందరూ వినేలా అరిచి చెప్పింది.।
"ఏయ్‌ కళ్ళాపి కాదు, ముగ్గూ కాదు.. కలాపి అంటే నెమలి అని అర్థం'' అన్నా.
"ఏదో లెమ్మా మొకాలు కడిగితే పాలు కలుపుతా, వంకర పేర్లు.. వంకర పేర్లు.. నోర్లు తిరుగుతయ్యా పాడా. ఓ అందవా, సందవా, ఏ సుబ్భలచ్చిమో, పోలేరో, నాంచారో, నాగమ్మో అని పెట్టుకోక'' అనుకుంటా పోయింది.
"నాకివ్వాళ పాలొద్దు'' అన్నా.
చక్కా నేనూ కలాపి కాఫీ తాగుతాం. నాకు అప్పుడప్పుడూ కాఫీ ఇష్టం. ఇంటో ఇవ్వరు. కలాపి వస్తే  కాఫీ తాగిచ్చుద్ది.
"కలాపిీ.. స్నానం చెయ్యి. ఆవిరి కుడుములు, గురెళ్ళ పొడితో తిని మనం కొండెక్కటానికి ఎల్దాం'' అన్నా.
స్నానం చేసి వచ్చి అద్దానికి అతుక్కు పోయింది. అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినదేదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది.

అన్నయ్యా, కలాపిీ, నేనూ కొండ దగ్గరకి వెళ్లాము. కలాపి వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. పుట్టటమే శ్రీమంతురాలిగా పుట్టింది.  ఎప్పుడూ హంపీ వచ్చే కలాపి, మాతో మామూలు  జీవితం గడపటానికే ఇష్టపడేది. అన్నయ్య వచ్చినప్పుడు కలాపి రావటమో, కలాపి వచ్చిన రోజుల్లోనే అన్నయ్య రావటమో జరిగేది. వీళ్ళిద్దరి రాక నాకు మాత్రం చాలా హాయి. నన్ను ఇద్దరూ చాలా ప్రేమించేవాళ్ళు.

కలాపికి కొండలెక్కడం అంటే  ఇష్టం.  నడుంకి తాడు కట్టుకుని దానికో చిన్న సంచి తగిలించుకుని, జారకుండా చేతుల్లో కొంచెం పౌడరు పోసుకుని , ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ, బల్లిలా కలాపి  కొండలెక్కుతుంటే జనం నోళ్లు తెరుచుకుని చూసేవాళ్ళు. కొండలెక్కడం ఎలాగో నాకూ నేర్పింది. నేనూ, అన్నయ్యా చిన్న చిన్న రాళ్ళు నాలుగెక్కితే కలాపి రాతి కొండ సగం ఎక్కి ఎనక్కి తిరిగి చూస్తా, రా.... రా.... అని పిలిచేది. తనకి 22 ఏళ్ళ వయస్సుప్పుడు బహుశా నాకు పదేళ్ళు ఉంటయ్యేమో. అయినా గాఢ స్నేహితుల్లా తిరిగేవాళ్ళం.

కలాపి ప్రతి కదలికా నాకు అబ్బురంగానే ఉండేది. నా యవ్వనారంభంలో ఎన్నో విషయాల్లో కలాపి నాకు గురువు. హుందాగా సందర్భానికి తగ్గ బట్టలు ధరించటం ఎలాగో, శరీర కదలికలు అవతలి వాళ్ళకు ఎలాంటి సంకేతాలు ఇస్తయ్యో, కూర్చోటం, నడవటం, సాదాసీదాగా ఉండటం, మన గౌరవాన్ని కాపాడుకుంటూ అవతలి వాళ్ళని గౌరవించటం లాంటివెన్నో ఆమె నుంచి నేర్చుకున్నాను.

కలాపిది  వైకుంఠపాళి జీవితం. నిచ్చెనల పక్కనే పాములు,  కొండ చిలువలు. ఒక పాము నోట్టో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటా కొండలెక్కేది. దేనినీ తనకి అన్వయించుకునేది కాదు. అన్నీ శరీరానివే. శరీరం కోసం క్రీడ అనేది.
ఓసారి నన్నో ప్రశ్న అడిగింది.
"ఈ శరీరాన్ని ఇంత అందంగా అలంకరించి, మేపి, బట్టలు కట్టి, నగలు పెట్టి ఎవరి కోసం పెంచుతామో తెలుసా?''
"స్మశానం కోసం, మట్టిలో కలపటం కోసం'' అని తనే సమాధానం చెప్పింది.

నాకు  పరిచయం అయ్యేటప్పటికే ఆమెకన్నా ఐదేళ్ళు పెద్దవాడైన ఒక యూనివర్శిటీ క్రీడా అధ్యాపకుడితో కలాపికి పెళ్ళయింది.  అతడు మా అన్నకి పరిచయస్తుడు.  ఒకసారి అతడిని తీసుకుని మా యింటి కొచ్చింది. చాలా అందంగా ఉన్నారు ఇద్దరూ. కొన్నాళ్ళున్నారు. ఆంధ్రలో ఓ పట్టణంలో కాపురం పెట్టారంట. కలాపి అందానికి చుట్టు పక్కల వాళ్ళకీ, యూనివర్శిటీ విద్యార్థులకి మతి పోయేదంట. ఆమెకి ఎన్నో పేర్లు స్మితా పాటిల్‌, నీనా గుప్త లాంటివి.

వాళ్ళ  ఊరికి ఒకసారి పేరున్న  క్రికెట్‌ క్రీడాకారుడు వస్తే వీళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారంట. అంతే ఈమె అందానికీ, హుందాతనానికీ దాసోహం అయిపోయాడు. కలాపికి ఆ క్రికెటర్‌తో పెళ్ళయిపోయింది. అతన్ని మా ఇంటికి తీసుకొచ్చింది. అతను చాలా బాగున్నాడు. కలాపి కూడా బాగుంది, కుబుసం విడిచిన త్రాచులా. అద్దంలో చూసుకోవటం మాత్రం మానేది కాదు. రెండు రోజులుండి ఆమె భర్త వెళ్ళిపోయాడు. కలాపి ఓ నెల రోజులు ఉంది. అన్నయ్య కూడా వచ్చాడు. అందరం కలిసి కొండలు గుట్టలు ఎక్కుతా గుహల్లో తిరుగుతా, వెన్నెలలో ఆడుతా  గడిపేవాళ్ళం. అన్నయ్య దగ్గర ఉంటే ఎందుకో కలాపి వెలిగిపోతూ ఉండేది. ఎప్పుడూ ఇద్దరూ మాట్లాడుకుంటానో, మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటానో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడూ పోట్టాడుకునే వాళ్ళు కూడా.

తరవాత ఆమె మకాం హైదరాబాద్‌ మారింది. తన భర్తకి చాలా పరిచయాలని చెప్పేది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉన్నా తుంగభద్రకి వస్తూ ఉండేది. కొండలు ఎక్కటం మానేది కాదు వచ్చినప్పుడల్లా. ఇవే ఈ రాళ్ళే నా నిజమయిన చెలికాళ్ళు. జారకుండా పడకుండా క్లిష్టమయిన లోయల్లో ఒక్కొక్క బండరాయినీ ఎక్కుతుంటే పునరుత్తేజం అవుతాను. ఇది నాకు శక్తి , ఇదంటే మోజు అనేది. అర్ధం అయ్యీ కాని ఆ మాటలు  నాకు చాలా నచ్చేవి.

ఈసారి వచ్చినప్పుడు కలాపి కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం చూశాను.  సన్నటి దారాలకి రకరకాల రంగురాళ్ళు గుచ్చిన పట్టీలు కాళ్ళకి ధరించింది. పదిహేను రోజులుంది. ఉదయం, సాయంత్రం కూడా కొండలెక్కేది.చెమటలు కారిపోతూ, అలిసిపోతూ, ఆనందించేది. ఎందుకో నాకేదో అనుమానం వేసింది.
అన్నయ్య వడిలో తలా, కలాపి ఒడిలో కాళ్లూ పెట్టి పడుకుని "కలాపిీ'' అని పిలిచా. పలికింది.

"ఈసారి ఏదయినా కొత్త పని మొదలు పెడుతున్నావా? ఈ రాళ్ళని తెగ దాటేస్తున్నావు?''
నొసలు కొంచెం పైకెత్తి దించి పెదవి కొంచెం పక్కకి సాగదీసి నవ్వింది. "ఎంతో మంది పరిచయాలు ఉన్నా ,పన్నెండేళ్ళు చిన్నదానివయినా నువ్వే నాకు ఎందుకు స్నేహితురాలి వయ్యావో తెలుసా? నేను మనుషుల్ని చదివితే, నువ్వు నన్ను చదువుతావు. నువ్వో అమ్మవి'' అని దగ్గరకి తీసుకుంది. అప్పుడనిపించింది కలాపి స్పర్శ ఇక ఎవ్వరి దగ్గరా పొందలేనని. దేహపు రసాయినిక చర్య  అమ్మ తరువాత కలాపి దగ్గరే అనుభవించాను నేను.

"విషయం ఏంటి?''
"ఏముంది బరోడా రాజకుటుంబీకుడు ఒకడు నా భర్త కి మిత్రుడున్నాడు. అతను చాలా సంపన్నుడు.''
"అయితే ''
"ఎన్నో రాజాభరణాలు నా అందానికి కానుకగా ఇచ్చాడు''
"అందులో పగడాల నగలున్నయ్యా.''?
"ఉన్నయ్యి ఎందుకు?''
"తెలియదు, పగడాలంటే ఇష్టం.''
"అతను నన్ను పెళ్ళాడి బరోడా తీసుకెళతాడంట''.
"మరి ఇప్పుడున్నాయన?''
"విడాకులు ఇస్తన్నాడు'' అంది. ఏమీ అర్థం కాక వెర్రి దానిలా చూశాను.  అన్నయ్యా కలాపీ చాలా మౌనంగా,  తుంగభద్ర ఇసుకని కాళ్ళతో వెనక్కి నెట్టుతా నడుస్తా ఎక్కువసేపు గడిపారు. శక్తినింపుకున్న కళ్ళతో పొడవాటి తన జడ చివర్లు చూస్తా ఉంది కలాపి.  వర్ష ఋతువు ముందు పురివిప్పి ఆడే నెమలిలా ఉంది కలాపి నాకప్పుడు. ఆ విన్యాసపు నాట్య హొయలు ప్రకృతి కోసమే అన్నట్టు నడుస్తోంది. అన్నయ్యా కలాపీ ఇద్దరూ ఏం మాట్లాడుకోవట్లా . మౌనంగా ఉన్నారు. పిచ్చెక్కినట్టయ్యి నేనే అడిగా.

"మళ్లీ మా ఇంటికి ఎప్పుడొస్తావు?'' అన్నా
"నిన్నూ, తుంగభద్రనీ చూడకుండా ఉండలేను''
"మరి అన్నయ్యని?''
అప్పుడు కలాపి ఏం మాట్లాడకుండా పరవశంగా కళ్ళు మూసుకుంది. మూసిన రెప్పల కింద గోధుమ రంగు కనుపాపలు గుండ్రంగా తిరిగాయి. నెత్తి మీద ఒక్కటిచ్చి మనోహరంగా నవ్వింది.
" కలాపీ.. కొండలెక్కతా ఉంటావు కదా అలుపొచ్చినపుడు ఏం చేస్తావు''? అనడిగాను.
"నిండు తుంగభద్ర అలసిపోతుందా'' అని నన్నే ప్రశ్నించింది.
"ఒక వేళ అలసి పోతే''
"మా తాతమ్మనో, అమ్మమ్మనో, నాయనమ్మనో గుర్తు చేసుకుంటాను. వాళ్ళతో గడిపిన క్షణాలని, ఆనందమయిన, అందమయిన అనుభవాలని తలుచుకుంటాను, అంతే చిరునవ్వు మొలకెత్తుతుంది. నాకే కాదు, ఎవరికయినా. ''
కలాపి వెళ్ళిపోయింది, బరోడాకి.
నాకు ఉత్తరాలు రాసేది.
అప్పుడప్పుడూ ఫోన్‌ కూడా చేసేది.
కొంత కాలం తరువాత మళ్ళీ మా ఊరు వచ్చింది కలాపి.
ఇంకా అందంగా ఉంది. మిన్నాగులాగా పరుషపు చలాకీతో ఉంది.  మునుపటి కన్నా తియ్యగా ఉంది.  హిందీ బాగా నేర్చుకుంది. పాత హిందీ పాటలు ।పాడుతోంది. అతను కూడా పాత హిందీ సినిమా హీరోలా తెల్లగా, పొడవుగా, చాలా చాలా స్టైలుగా ఉన్నాడు.
కలాపి నాతో అంది "మేము విదేశీ యాత్రలకి వెళ్దామని అనుకుంటన్నాం. ఆయన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈయన చదువంతా కూడా బ్రిటన్‌లో జరిగింది''
నేను పకపకా నవ్వాను.
"ఏయ్‌ లడ్డూ..ఎందుకు నవ్వుతున్నావ్‌ అంది''.
"మన దేశంలో జనాన్నే పిచ్చెక్కిచ్చావు. ఇంక ఆ పిచ్చి విదేశీయులు. నిన్ను బతకనిస్తారా? ఎమ్మట పడి పీక్కు తింటారు. జాగ్రత్త.''
"పెద్ద దానివయ్యావు. మాటల్లో ఆరితేరావు.'' అంది.
"లడ్డూ ,ఆ సీతారాం బాబా గుహలో డేవిడ్‌తో బ్రహ్మజెముడు బూరల సంగీతం తరగతులు ఎంత వరకూ వచ్చాయి? ఏమన్నా నేర్చుకున్నావా'' అనడిగింది.
"రోజుకో బ్రహ్మజెముడు చెట్టు చస్తంది. సంగీతానికి గుహ సహకరించటం లేదు'' అన్నా.  పడి పడి నవ్వింది.
"ఈ సంవత్సరం డేవిడ్‌ రాలేదు కదా''.
"లేదు. కాలేజీలో చేరుతున్నాడంట. వచ్చే సంవత్సరం వస్తానన్నాడు.''
"నువ్వెన్ని రోజులు ఉంటావు విదేశాల్లో'' అనడిగా.
"వచ్చేదాకా తెలియదు''. అంది.
ఒక వారం తరవాత బయలుదేరి వెళ్ళింది. ముందుగా శ్రీలంక, అక్కడ నించీ సింగపూర్‌, మలేషియా, జపాన్‌, జర్మనీ చూసిందంట, ఉత్తరాలు రాసేది.
ఒక  సంవత్సరం దాకా ఉత్తరాలు రాలేదు. కలాపి ఏమయ్యిందో అర్థం కాలేదు. లోపలేదో దిగులుగా ఉండేది నాకు. తను  బాగుండాలి. తనిష్టమొచ్చినట్టుండాలి అనుకున్నాను. ఎందుకంటే కలాపిది ఓ శిఖరం లాంటి వ్యక్తిత్వం, నిటారుగా ఉంటేనే అందం. అది ఒంగినా, లొంగినా అందంగా కనిపించదు. తనేమయిందో తెలుసుకోవాలని బరోడాకి తనిచ్చిన నెంబర్‌కి ఫోన్‌ చేశాను. ఎవరూ లేరని  హిందీలో ఒక మగాయన చెప్పాడు.
తరువాత నాలుగేళ్ళకి కలాపి దగ్గర నించి ఒక ఉత్తరం వచ్చింది.  అచ్చమయిన తెలుగులో రాసింది.
బరోడా వ్యక్తితో విడిపోయినట్టూ, జపాన్‌ రాజకుటుంబపు బంధువుని వివాహం చేసుకున్నట్టు, అది చాలా వైభవంగా జరిగిందని రాసింది.
"పెళ్ళి కానుకగా చాలా నగలూ, సంపదా లభించాయి''అని రాసింది.
అంతే ఆ తర్వాత తన జాడ లేదు. ఏళ్ళు గడిచాయి. కలాపి కరగిపోని ఒక జ్ఙాపకంలానే ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక ఉత్తరంతో పలకరించింది. ఉత్తరం తెచ్చిన  వ్యక్తిని కూచోమని మాట్లాడతన్నాను. కలాపి హోటల్స్‌ కట్టిచ్చిందంట. పిల్లలు లేరని చెప్పాడు. తనిచ్చిన ప్యాకెట్‌ విప్పి చూశాను. అందులో మూడు రకాల మేలిమి పగడాల సెట్‌లు, గాజులు, పగడపు రంగు కంచి పట్టు చీర ఉన్నాయి. చిన్న చీటీ కూడా ఉంది. "ఇవి ధరించి నాకు కనిపించు'' అని ఉంది.

***

నాలుగో రోజుకి కొలంబో చేరుకున్నాం. చాలా విశాలమయిన భవంతి. సెక్యూరిటీ గార్డ్స్‌ కాపలాగా ఉన్నారు. స్నానం , టిఫిన్‌ అయ్యాక  కలాపిని చూడచ్చన్నారు. నాకు మాత్రం ఆత్రుతగా ఉంది. అక్కడున్న ప్రతి గదీ వెతికాను. ఆ ఇంటిలో ఎక్కడా కలాపి కనిపించలా. నాతో వచ్చిన సింహాళీయుణ్ణి అడిగితే, "ఇది ఆమె అతిథిగృహం. మీరు తొందరగా తయారయితే ఆమెని చూడవచ్చు'' అన్నాడు.

గబగబా స్నానం చేసి తయారయ్యాను. రెండు మైళ్ళ దూరంలోని  ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పగడపు రంగుచీర, పగడాల సెట్‌, నా విటాన్‌ పగడపు రంగు క్లచ్‌తో బయలుదేరాను. ఒక నర్స్‌ కలాపి గదిలోకి తీసుకెళ్ళింది. చల్లని ఏసి గది. బెడ్‌ మీద దోమతెరలాంటి వస్త్రం కింద ఒక శరీరం. చిరునవ్వుతో విడిపోవాల్సిన పెదాలు చిగురుటాకులా ఒణికిపోయాయి. ఎలా చెప్పను. ఏం రాయను తనసలు కలాపినేనా. కాదు.. ఛ.. అని అనుకునే లోపల తిరిగి చూసింది. కళ్ళలో మాత్రం అదే మెరుపు. ఆ.. అవును, ఈ కళ్ళు కలాపివే.  ఇంకెవరీకి ఉండవు. "లడ్డూ దగ్గరకి రాకు, దూరంగా ఉండు. నేను, నా చర్మం అసహ్యంగా మారిపోయాయి'' అంది.

నేను ఏం చెయ్యాలి? నన్ను నేను సిద్ధం చేసుకున్నా. నేను కలాపి స్థానంలో ఉంటే కలాపి ఏం చేసేది? లేకపోతే అమ్మ కలాపి స్థానంలో ఉంటే దగ్గరకి వెళ్లనా, ముట్టుకోనా? ఏదో చెయ్యాలి!.  చేతిలోంచి పర్స్‌ కింద పడిపోయింది. నా తటపటాయింపుకి ఆ శబ్దం ముగింపు పలికింది.  ఒక్క ఉదుటున మంచం దగ్గరకి వెళ్లాను. తనని రెండు చేతులతో లేపాను. హృదయానికి హత్తుకున్నాను. ఎందుకో "అమ్మా, అమ్మా, అమ్మా... ''అని మూడు సార్లు అన్నాను.  చీము, రక్తం కారే శరీరాన్ని  అలా పట్టుకుని ఓ గంటపాటు ఉండిపోయాను. కలాపి వారించలేదు. తను కోరుకున్నదే జరుగుతున్నట్టుగా ఉండిపోయింది. నా కనుపాపల్లో ఉబికే నీటి పొరల్ని గుండెల్లోకి అదిమేసుకున్నాను. నన్ను నేను జోకొట్టుకున్నాను.
కలాపి ఆఖరి కోరిక నేను నెరవేర్చాలి. చివరి శ్వాస దాకా ఆమె చెంతన ఉండాలి అని నిర్ణయించుకున్నా.

కింద వేసిన రబ్బరు షీట్లు తీసేయించి, లేత అరిటాకులు పరిపించాను.  చల్లని నీళ్లు తాగించాను. కలాపి మొహంలో బాధ లేదు. ఒక రకమైన నిశ్చింత. ఆమె గాయాలు తుడుస్తూ ఉండే దాన్ని.  ఈ పుళ్ళూ, గాయాలతో  కూడా కలాపి చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టింది.  వంటి నిండా  సూర్యకాంతమణులు ధరించినట్టు గా కనిపించేది కలాపి.
ఒక రోజు కలాపి మంచం ముందు పెద్ద స్కీన్‌ ఏర్పాటు చేశారు.  తన ముదు రిమోట్‌. "ఏంటి'' అన్నా. "చూడు'' అంది.

బాలికా పునరావాస కేంద్ర్రం ప్రారంభోత్సవం. నన్నే స్విచ్‌ నొక్కమంది.  నువ్వు మాత్రమే చెయ్యగలిగింది ఇది అని తన చేతే ప్రారంభం చేయించాను.
అప్పుడు కలాపి ఇలా చెప్పింది.

"లడ్డూ, ఎన్ని ఆభరణాలు..ఎన్ని ఆస్థులు.. ఏం చేసుకోను? సంపదనంతా డబ్బుగా మార్చాను. ఈ దేశం యుద్ధ గాయాలతో ఉంది.  అనాథలయిన స్త్రీలు, బాలికలు, లైంగిక హింసకి గురి అయిన వాళ్ళ పునరావాసం కోసం  ఈ డబ్బంతా ఖర్చు చేస్తున్నాను.  ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు.  ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. మగవాడెప్పుడూ శాశ్వతం కాదు. ప్రవాహంలాంటి వాడు. ఎక్కువ అడ్డుకట్టలు వేసినా, వదిలేసినా మనకి దక్కడు. నాకు కావలసిన శాంతి నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని యిచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్‌ వాట్‌ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది  అనుభవాలు మాత్రమే.'' నిదానంగా, శాంతిగా కలాపి గొంతులోంచి మాటలొస్తున్నాయి.।

"నేనప్ప చెప్పిన అన్ని పనులూ బాధ్యతగా పూర్తి చేసి నన్ను  సాగనంపటానికి ఓ వ్యక్తి వస్తాడు చూడు. అతను నాకు  జీవితంలో, అన్ని నిర్ణయాలలో తోడుగా నిలిచాడు. మొదటి నించీ కడ వరకూ మిగిలిన మనిషి''. అని చెప్పింది. ఈ మాటలు అంటున్నపుడు కలాపి ముఖంలో పాత కాంతిని కొత్తగా చూశాను. నాకు పరిచితమైన కాంతి అది.
మెల్లగా నీరసంగా అలసిపోయి ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తన్నాడు. అతను... అతను..అతను నా అన్న.

అమ్మ కలాపి దొంగ అనుకున్నా.
నా ఆఖరి కోరిక తీరుస్తారా అనడిగింది ఇద్దరినీ.
"ఏంటి'' అంటే
"అద్దం కావాలి, అద్దం. ''
"కళ్ళు మూసుకుని నేను చెప్పినప్పుడు తెరిస్తే నీకు  అద్దం చూపిస్తా ''అన్నాడు మా అన్న.
సరే అంది.
కళ్ళు మూసుకో అని పక్క గదిలోకి వెళ్లి అద్దం తెచ్చాడు. దాని పైన కలాపి యవ్వనంలో ఉండగా గీసిన బొమ్మ  ఉంది.
అది తన మొహం దగ్గరగా తెచ్చి," కళ్ళు తెరువు కలాపీ'' అన్నాడు.
తెరిచి చూసి, అందంగా చీమలు చుట్టి కుట్టిన సర్పంలా నవ్వింది.
విశాలమయిన ఆ గోధుమరంగు నల్ల వలయాల కళ్ళ దృష్టి అద్దంలోకి ఇంకి పోయింది.
కలాపి నా గొంతు మీద పుట్టు మచ్చగా మారిపోయింది.
--------------
అంకితం: కలాపి చిరకాల నేస్తం సురేన్‌కి

అలా మొదలయింది…

chitten rajuఅప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం ప్రకారం ఒకే కల పదే, పదే రావడం చాలా జాగ్రత్తగా గమనించదగ్గదే. కొండొకచో భయపడ దగ్గదే.

ఎందుకో తెలియదు కానీ, పూర్వం రోజులలో లాగా  దేవుడు కలలో కనపడి “ఫలానా చోట అమ్మాయి నీ కోసం పూజలు చేస్తోందీ, వెళ్ళి వరించూ”, లేదా “నా మీద ఒక కావ్యం రాసి నాకు అంకితం ఇయ్యి”, లేదా “ఫలానా వ్రతం చేసుకుంటే నీకు మగ పిల్లాడు పుడతాడు” మొదలైన కలల గురించిన కథలు ఈ మధ్య ఎక్కడా వినడం లేదు. ఆ దేవ దేవలతలకి కూడా ఈ నాటి తెలుగు వారి కలలలోకి వెళ్ళడానికి విసుగొచ్చిందేమో అని నా అనుమానం.

నా కేసులో ఈ ఒకే ఒక కల ఎప్పుడూ తెల్లారగట్టే రావడంతో నాకు మరీ బెంగ పట్టుకుంది. దానికి హిందూ సిధ్ధాంతం ప్రకారం రెండు కారణాలు. ఒకటేమో, తెల్లారగట్టే వచ్చే కలలు నిజమౌతాయిట. అంతకంటే అన్యాయం…ఆ కలలో కనక మన జీవితం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే, ఇంక అంతే సంగతులు…అనగా….మనిషి చచ్చిపోయే ముందు వాడి జీవితం అంతా ఫ్లాష్ బేక్ లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తెర మీద చూపించినట్టు కనపడితే మనం బాల్చీ తన్నేసే సమయం వచ్చేసిందన మాట. నాకు పదే, పదే వస్తున్న ఆ కలల సారాంశం అదే. నేను కాబట్టి సరిపోయింది కానీ ఈ కలల వ్యవహారానికి మరొకరు ఎవరైనా గుండె ఆగిపోయి టపా కట్టేసే వారు.

నాకు ఇలాంటి కలలూ-వ్యక్తులపై వాటి ప్రభావమూ మొదలైన వాటి మీద ఎక్కువ నమ్మకం లేదు, పైగా నేను చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి. కానీ నా జీవితంలో తారసపడిన వ్యక్తులూ, జరిగిన సంఘటనలూ ఆ కలలో కనపడీ కనపడనట్టు నా ఒక్కడికీ కనపడి ఠపీమని మాయమై పోవడం నచ్చ లేదు. అంచేత కోపం వచ్చి, అవన్నీ నేనే రాసి పెట్టుకుంటే, నిద్ర పట్టనప్పుడు చదువుకుని జ్ఞాపకం తెచ్చుకోవచ్చును కదా అనే ఆలోచన వచ్చింది. మన జీవితం గురించి మనమే రాసి పారేసుకుంటే దాన్ని ఆత్మ కథ అంటారుగా, ఇంతోటి నా ఆత్మ కథ నాకు తెలిసిన ఇంకెవరికైనా కావాలా అనే ప్రశ్న నాకు నేనే వేసుకున్నాను. ఇంకెవరికీ అక్కర లేక పోయినా, నాకే అది కావాలి కదా….అసలు జీవితంలో ఏం పొడిచేశాం అని బేరీజు వేసుకోవడంలో తప్పు లేదు కదా అని కూడా అనుకున్నాను.

తీరా “ఆత్మ కథ” రాసుకుందాం అనే ఆలోచన రాగానే “ఏ ఆత్మ కథా?” అనే ప్రశ్న ముందుకొచ్చింది.

ఎందుకంటే మొదటిదేమో నేనూ అందరిలాగానే నా ప్రమేయం ఏమీ లేకుండానే పుట్టాను, పెరిగాను, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, బుద్ధిగా సంసారం చేసుకుంటున్నాను ఎట్సెటరా. మనలో 99 శాతం ఇలాంటి బాపతే. ఎందుకు పుడతారో తెలియదు. పోయాక ఎక్కడికి పోతారో అంతకంటే తెలియదు.

ఇక రెండోదేమో అందరిలో కొందరిలా నేను కూడా కాస్తో, కూస్తో చదువుకున్నాను, ముందు ఉద్యోగమూ, తరువాత వ్యాపారమూ చేసి, కాస్తో, కూస్తో డబ్బు సంపాదించి, అందరిలో కొందరిలో కొందరిలా కాకుండా ఆ డబ్బు నిలబెట్టుకోలేక పోయాను. అలా లాభసాటి వ్యాపారం చేసినా డబ్బు నిలబెట్టుకోలేకపోవడాన్ని “బేపన వ్యాపారం” అంటారుట. దానికి నేనే ఉదాహరణ. ఇక్కడో ఒక జోకు గుర్తుకొస్తోంది. ఎవరో మరొకర్ని “బ్రామ్మడి చేత ఒక మిలియన్ డాలర్ల వ్యాపారం ఎలా చేయించాలీ?” అని అడిగాడుట. “దానికేముందీ, వాడి చేతిలో బాగా నడుస్తున్న పది మిలియన్ల వ్యాపారం పెట్టి నడిపించమంటే నెల తిరక్కుండా దాన్ని ఒక మిలియన్ చేసేస్తాడు” అని చమత్కారం.

మరి మూడో ఆత్మకథేమో…అందరిలో కొందరిలో మరి కొద్ది మందే ఉండే తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టాను, కథలు వ్రాశాను, రాయించాను. వాటిని కథలు అనకూడదనే వాదనలూ విన్నాను. నాటకాలాడాను. ఆడించాను. అయినా రిటైర్ అయిపోకుండా నా సొంత సుత్తితో చాలా మందిని చావగొడుతున్నాను.

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

ఇక, నేను బొంబాయి ఇండియన్ ఇన్సిస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ  (IIT, Bombay) లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారి ప్రభావంతో ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త ఇ. ఎఫ్. షుమాకర్ గారి “Small is Beautiful” పుస్తకంలో ప్రతిపాదించిన సిధ్ధాంతాలకి అనుగుణంగా కొందరితో కలిసి సంస్థాపించిన “Appropriate Technology Unit” ద్వారా మహారాష్ట్ర లో గ్రామ సమాజ సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఈ నాటి వరకూ కాస్తో, కూస్తో సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తున్నాను. బొంబాయిలో ఆ నాటి నా శిష్యులలో ఈ నాటి ప్రముఖులు కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్, InfOsys వారి నందన్ నిలేకానీ, మరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. ఇలాంటి వ్యాపకం మీద మాత్రమే వ్రాస్తే అది నా “నాలుగో ఆత్మ కథ” కిందకి వస్తుంది కదా!

ఇలా అనేక రకాల “ఆత్మ ఘోషలు” నాకు ఉన్నప్పుడు, దేని గురించి వ్రాయాలీ? ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం లేక, గొప్పవాళ్ళలా పెద్ద, పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా నాకు తోచిన అంశాల మీదా, వ్యక్తుల మీదా, సంఘటనల మీదా తోచినది తోచినట్టు వ్రాసుకుందామని అనుకుంటున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఏనాడూ, ఎప్పుడూ డైరీ రాయలేదు. రోజూ డైరీ వ్రాసుకున్న వాళ్ళే ఆత్మ కథ వ్రాసుకోవాలి అనే రూలూ లేదు. అందుచేత తారీకులూ, పేర్లూ, సంఘటనలూ కేవలం నా బుర్రలో ఉన్న మట్టి పదార్ధం లో అట్టడుగున జ్ఞాపకాల దొంతర్లలో ఎక్కడో దాక్కున్న వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నవే కానీ…చరిత్రలో నిక్షేపించే సత్తువ లేనివే!

ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇవి కేవలం నా జ్ఞాపకాలే! నా కోసం నేను వ్రాసుకున్నవే అని స్పష్టంగానే విన్నవిస్తున్నాను. ఆ మాట కొస్తే “అశోకుడు బాటకిరుపక్కలా వృక్షములు నాటించెను” అనేది ఎవరు చూశారు? దాన్ని ఎంత నమ్ముతున్నామో, నా జ్ఞాపక శక్తిని  కూడా అంతే నమ్ముకుంటాను.

చెప్పొద్దూ, నా జీవితంలో మొట్టమొదటి పరీక్ష నేను బాగానే పాస్ అయ్యాను. అంటే, బతికి బయట పడ్డాను అనమాట. ఇదెందుకు చెప్పవలసి వస్తోందంటే, నేను పుట్టినప్పుడు కవల పిల్లలంట. పుట్టగానే కుయ్, కయ్ అనడం కానీ, కాళ్ళూ, చేతులూ తప తపా కొట్టుకోవడం కానీ మా ఇద్ద్దరు నలుసులకీ లేక పోవడంతో మా అమ్మకి మొత్తం పదకొండు పురుళ్ళు పోసిన ఎరకల సత్తెమ్మ మమ్మల్ని బతికించడానికి తనకి తోచిన పధ్ధతులు..అనగా..లాగి లెంపకాయ కొట్టడం, నోట్లో వస పొయ్యడం లాంటి చిట్కాలు ప్రయోగించింది. దాంతో నేను కేరు, కేరు మని ఏడ్చి రాగాలు పెట్టి అందరినీ సంతోషపెట్టినా, నా తోటి వాడు చేతులెత్తేసి దేవుడి దగ్గరకి పారిపోయాడు. “వాడు కూడా బతికి ఉంటే, మా జంట ధాటీకి తట్టుకోలేక ఈ లోకం ఏమైపోవునో కదా!” అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

నేను కాకినాడలో బతికి బయట పడ్డాను అని తెలియగానే అదే రోజు అక్కడ జర్మనీలో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మరొక ఆరు నెలలలో జపాన్ లో ఆటంబాంబు పేలింది. రెండో ప్రపంచ యుధ్దం ఆగిపోయింది. ఆ ఏడే రేడియో అన్నయ్య, అక్కయ్య, “చిన్న పిల్లల కోసం ఇద్దరు పెద్దలు” అనుకుంటూ “బాల” పత్రిక మద్రాసులో మొదలుపెట్టారు…ఆ “బాల” పత్రికలోనే ఆ యేడే ముళ్ళపూడి గారి మొదటి రచనా, బాపు గారి మొదటి బొమ్మా ప్రచురించబడ్డాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు తెలుగు జాతి అంతటికీ. అప్పుడే పుట్టిన నా మీద కూడా ఆ దేవతల ఆశీర్వచనం పువ్వులు ఒకటో, రెండో, కొన్ని అక్షింతలూ పడే ఉంటాయి. లేక పోతే ఇవాళ ఈ వ్యాసం వ్రాయగలిగే అదృష్టానికి నోచుకోగలుదునా.?

ఆ నెలలోనే అంతకు వందల సంవత్సరాల ముందు ఇంగ్లండ్ లో షేక్స్ పియర్ అనే ఆయన పుట్టాడు. నేను పుట్టిన పాతికేళ్ళకి, అదే తారీకున  జెర్రీ సైన్ ఫెల్డ్ అనే అమెరికన్ కమేడియన్ పుట్టాడు. ఇవన్నీ కాస్సేపు గూగుల్ చేసి చదువుకుంటే మంచి ఫీలింగే వచ్చింది. కానీ, సరిగ్గా నేను పుట్టిన నాడే, ఆంటే అదే ఏడూ, అదే తారీకున ఏ ఒక్క తలమాసిన గొప్పవాడూ పుట్ట లేదు….నేనొక్కడినే ఆ “దడిగాడు వానసిరా”. “Your birth may be common, but, death will be history” అనే నానుడి నాకు భలే ఇష్టం.

మా అమ్మ పుట్టిల్లు కాకినాడ-రాజమండ్రిల దగ్గర ఉన్న పాలతోడు గ్రామం అయినా పక్కనే ఉన్న జేగురు పాడు లో మేనమామల ఇంట పుట్టింది. ఇరవై, ముఫై ఏళ్ళ క్రితం అక్కడ గోదావరి బేసిన్ లో “గాస్” ఉన్నట్టు ప్రభుత్వం వారు కనుక్కుని, ఆ తరువాత ప్రెవేటు కంపెనీ వారు రసాయనం ఫేక్టరీలు పెట్టే దాకా ఆ ఊరి పేరు ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రం ఆ ఊరు వెళ్ళిన గుర్తు.

కానీ పదేళ్ళ క్రితం పని కట్టుకుని నేనూ, మా పెద్దన్నయ్యా, మూడో అన్నయ్యా,  చెల్లెళ్ళూ కాకినాడ నుంచి ప్రత్యేకంగా నాకు వరసకి మేనల్లుడు అయ్యే అద్దంకి సుబ్బారావు కుదిర్చిన టాటా సుమో లో జేగురు పాడు వెళ్ళాను. వెళ్ళి అనేక కారణాలకి ఆశ్చర్య పోయాను, ఆనందపడ్డాను. ఊళ్ళోకి అడుగుపెట్టగానే, ఎక్కడ చూసినా “గ్రీన్ విలేజ్” “పర్యావరణాన్ని కాపాడండి”. Save Earth” లాంటి బోర్డుల తో అమెరికాని మించి పోయిన అవగాహన, ఆచరణ నాకు ఆ చిన్న పల్లెటూరులో కనిపించాయి. మొత్తం గ్రామం చుట్టుపక్కల అంతా పచ్చటి పొలాలతో సస్యశ్యామలంగా ఉంది. ఉన్న పది రోడ్లూ చాలా చిన్నవి అయినా పూర్తిగా సిమెంట్ రోడ్లతో, అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ మా అమ్మ పుట్టింటికి వెళ్ళే రోడ్డు మీద మేము వెళ్ళిన కారు పట్టక, ఎక్కడో పార్క్ చేసుకుని నడిచి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వరసకి చిన్నాన్న అయే చంటి నాన్న, భార్య, కూతురు ఎంతో ఆప్యాయంగా ఆ మండువా ఇంట్లోకి ఆహ్వానించారు.

ఇంటి ముందు రెండు అరుగులూ, గుమ్మం దాటగానే చెట్ల మధ్యన మండువా…అమెరికాలో దాన్ని పెద్ద ఫేషనబుల్ గా Atrium అంటారు…వెనకాల వేపు ఒక వరండా, రెండు గదులు, పక్కనే వంటిల్లు, వెనక గుమ్మంలోంచి మా అమ్మ ఇతర బంధువులైన భాస్కర మూర్తి గారి ఇల్లు….నేను ఐదారేళ్ళప్పుడు చూసిన, ఆడుకున్న ఆ దృశ్యాలన్నీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు కనపడ్డాయి. మా చంటి నాన్న వెనకాల ఒక గదిలోకి అందరినీ తీసుకెళ్ళిన నాతో “ఒరే, అమెరికాయ్. ఇదుగో ఈ గదిలోనే మీ అమ్మ పుట్టింది” అని ఒక గదీ, అందులో ఒక నులక మంచం చూపించాడు. నేను అవాక్కయిపోయాను. అసలు ఇటువంటి సంఘటన నేను ఊహించనే లేదు.

ఎందుకంటే, ఆ గది, బహుశా ఆ మంచమూ మా అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండి ఉంటాయి. మా అమ్మ అక్టోబర్ 8, 1916 రోజున ఆ గదిలో పుట్టింది. అంటే నేను ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ మార్చ్  27, 2013 రోజుకి 97 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏప్రిల్, 1999 లో పోయింది. …అవును…నేను పుట్టిన రోజు నాడే..ఏప్రిల్ నెలలోనే…ఎనభై మూడేళ్ళ వయసులో. అప్పుడు నేను  అమెరికాలో “మహద్భాగ్యం” అనుభవిస్తున్న కారణాన్న పదో రోజుకి కానీ వెళ్ళ లేక పోయాను. కనీసం అటువంటి సమయాలలో దానిని “అమెరికాలో దౌర్భాగ్యం” అనుభవిస్తున్నాను అని అనుకోవాలి.

1916 లో మా అమ్మ పుట్టిన ఆ చిన్న గదిని చూసి నేను అదోలా అయిపోతుంటే….మా చంటి నాన్న…”ఒరేయ్ రాజా…మొన్న దేనికోసమో అటకలో వెతుకుతూ ఉంటే ., ఇదిగో ఈ కాగితాలు కనపడ్దాయి. ఇవి మీ తాత గారి చేతి వ్రాతలో ఉన్న “శ్రీ రామలింగేశ్వర శతకం” వ్రాత ప్రతి. మొత్తం 15 పేజీలు, 108 పద్యాలూ. ఇక్కడే ఇండియాలో ఉంటే చెదలు పట్టేస్తాయి. అమెరికా తీసుకుపో” అని ఆ కాగితాలు నా చేతిలో పెట్టాడు. అవి ముట్టుకుంటే నుసి, నుసిగా అయిపోతున్నాయి. ఎందుకంటే మా తాత గారు అవి వ్రాసిన సంవత్సరం సుమారు 1904 .అంటే ఇప్పటికి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం. ఆ శతకంలో మొదటి పేజీ ఇందుతో జతపరుస్తున్నాను. తమ పూర్వీకుల సాహిత్య కృషిని పదిల పరుచుకునే అవకాశమూ, అభిలాషా, దేవుడి అనుగ్రహమూ ఎంత మందికి కలుగుతుందో కదా! ఆ అదృష్టం ఉన్నవారిని ఆ అపురూప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నా విన్నపం. మన సంస్కృతిని కాపాడుకోవడం అంటే అదే!

vanguri3 (2)

ఈ పై సంఘటన నిజంగానే….Deja Vu All over agian.”. ఎందుకంటే మా అమ్మ చనిపోవడానికి ఐదారేళ్ళ ముందు నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఇంచుమించు సరిగ్గా అవే మాటలు..అంటే “ఒరేయ్ ఇవి ఇండియాలో ఉంటే చెదలు పట్టిపోతాయి. నువ్వు అమెరికా పట్టికెళ్ళి దాచుకో. మన వంశంలో నా పుట్టింటివారైన నండూరి వారి వేపూ, వంగూరి వారైన అత్తారింటి వేపూ ఎన్ని తరాలు చూసినా మొదట మా నాన్న గారు..అంటే మీ తాత గారికీ, ఆ తరువాత నీకూ మాత్రమే రచనా వ్యాసంగం అబ్బింది.” అంటూ కొన్ని అచ్చు పుస్తకాలూ, కొన్ని వ్రాత ప్రతులూ నా చేతిలో పెట్టింది. మా అమ్మమ్మ పేరు బాపనమ్మ. వారికి మా అమ్మ ఒక్కర్తే సంతానం. అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఎవరూ లేరు. మా అమ్మ పేరు సర్వలక్ష్మి. కానీ పుట్టింట్లో అందరూ ’సరప్ప” అనే పిలిచేవారు. ఇప్పుడు మాకు మా అమ్మ వేపు మరీ దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. చంటి నాన్న లాంటి ఉన్న అతికొద్ది మందికీ ఇప్పటికీ నేను సరప్ప కొడుకునే!

క్లుప్తంగా చెప్పాలంటే, మా తాత గారైన నండూరి మూర్తి రాజు గారు కాకినాడ పి.ఆర్. కాలేజీలోనూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి 1904 లో బి.యే. పట్టాతీసుకున్నారు. అప్పటి చెన్న పట్నం రాజధానిగా ఉన్న మొత్తం దక్షిణాది రాష్టానికి తెలుగులో ఆయనకి స్వర్ణపతకం లభించింది. తరువాత న్యాయవాదిగా చదువుకుందామనుకున్నా, అయన తండ్రిగారైన సోమరాజు గారు అది “అన్యాయ వ్యాపార వృత్తి” అని అభ్యంతర పెట్టగా నెలకి రెండు రూకల స్వల్ప జీతానికి కాకినాడ  రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి కుదురుకున్నారు. తెలుగు భాషాభిమాని, గ్రాంధిక వాది కావడంతో తీరిక సమయంలో శుక్తి మతి, జపాను దేశ చరిత్ర మొదలైన గ్రంధాలు తొలి దశలో రచించారు. వివేకానందుడి ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి గవర్నర్ గరి చేత ఐదు కాసుల బంగారం బహుమానం పొందారు. ఆర్య మత బోధిని, వివేకోదయము మొదలైన పత్రికలలో వ్యాస పరంపర, అనీబిసెంటమ్మ ఇంగ్లీషులో వ్రాసిన రామాయణం ఆంధ్రీకరణ , షేక్స్ పియర్ హేమ్లెట్ నాటకం తెలుగు అనువాదం, 28 పాత్రలతో సావిత్రీ సత్యవంతం నాటకం, 16 పాత్రలతో విమలాప్రభాకరం అనే సాంఘిక నాటకం, వనజాక్షి అనే శృంగార ప్రబంధం, అమల వర్మ ఆనే నవల మొదలైన గ్రంధాలు ఆయన సుమారు పదేళ్ళలో రచించారు. వాటిల్ల్లో కొన్ని ఆయన మరణించిన తరువాత ముద్రించబడ్డాయి. ఆయన పుస్తకాలు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని గ్రంధాలయాల్లో ఇప్పటికీ కనపడతాయి. ఆయన చేతివ్రాతలో ఉన్న రెండు వందల పేజీలూ, ఐదు ముద్రించబడిన పుస్తకాలూ ఇప్పుడు నా దగ్గర హ్యూస్టన్ లో ఉన్నాయి. అందులో నా దగ్గర శిధిలావస్థలో ఉన్న “విమలాప్రభాకరం” నాటకం ముఖపత్రం ఇందుతో జతపరుస్తున్నాను. ఆయన రచనలన్నీ గ్రాంధికాలే!

విమలా ప్రభాకరము

విమలా ప్రభాకరము

మా అమ్మ పుట్టిన తరువాత ఆయనకి ఒక మగపిల్లవాడు ఎంతో ఆరోగ్యంగానే పుట్టాడు. ఆ సమయంలో మా తాత గారికి మన్యం ప్రాంతాలకి బదిలీ అయింది. అక్కడ ఉన్నది నాలుగు నెలలే అయినా ఆయనకీ అక్కడ విషజ్వరం సోకి మళ్ళీ కాకినాడ వచ్చెయ్యగానే ఆరోగ్యవంతుడూ, దృఢకాయుడూ అయిన మూడేళ్ళ కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. అది జరిగిన ఇరవై రోజులకి మా తాత గారు జేగురు పాడులో, 1920 లో అకాల మరణం పొందారు. అప్పుడు మా అమ్మ వయసు నాలుగేళ్ళు మాత్రమే. అందు చేత ఆయన ఎలా ఉంటారో మా అమ్మకి గుర్తు లేదు.

మా తాత గారు పోయినప్పటినుంచి మా అమ్మమ్మ మాతోనే ఉండి 1970 దశకంలో నేను బొంబాయిలో ఉండేటప్పుడు మరణించింది. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు, ఇంకా మా ఇంట్లోనే పెరిగిన యాభైకు  పైగా పిల్లలందరికీ ఆవిడే అమ్మమ్మ. మా మూర్తి రాజు తాత గారిది ఒకే ఒక్క ఫొటో మాత్రం మా ఇంట్లో ఉండేది. అది కూడా నిజానికి ఫొటో కాదు. తాశీల్దారు గా ఆయన పెయింటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టిన porttrait కి తీయించిన ఫొటో. దానిని ఇందుతో జతపరుస్తున్నాను. మా వంశంలో ఇంకెవరికీ లేని, రాని రచనావ్యాసంగం అబ్బిన ఆయనకీ  నాకూ భౌతికంగా పోలికలు నిజంగా ఆశ్చర్యకరమే!

మరొక యాదృచ్చికమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…..మా నాన్న గారి పేరు రామలింగేశ్వర శర్మ గారు. మా తాత గారు “శ్రీ రామలింగేశ్వర శతకం” రచింఛేటప్పటికి మా నాన్న గారు పుట్ట లేదు. కానీ కాకినాడలో మా అమ్మగారి నండూరి వారికుటుంబం, మా వంగూరి కుటుంబమూ దేవాలయం వీధిలో ఉండేవారు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలకీ స్వల్ప పరిచయం.

మా అమ్మ నాలుగో తరగతి వరకూ చదువుకుంది. తెలుగు పుస్తకాలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వచ్చును. మా అమ్మమ్మకి సంతకం పెట్టడం వచ్చును. ఇదీ మా తాత గారి దగ్గరనుంచి నాకు కాస్తో, కూస్తో వచ్చిన ఆస్తి “సాహిత్య జెన్యు సంక్రమణం”.

అద్దం లాంటి రోజొకటి

swatikumariప్రతికవీ ఏదో ఒక సందర్భంలో తన కవిత్వ స్వరూపమేమిటో, కవిత్వంతో తన అవసరమేమిటో ప్రశ్నించుకుంటాడు. యాధృచ్ఛికంగానో , ప్రయత్నపూర్వకంగానో దొరికిన ఆధారాల్ని సమకూర్చుకుని కొన్ని నిర్వచనాల్ని రచించుకుంటాడు. అలాంటి ఒకానొక సందర్భంలో “అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి” గా కవిత్వాన్ని అభివర్ణిస్తారు అవ్వారి నాగరాజు  గారు.

ఆయనే మరొకచోట “అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు/చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు.” అని తన పదాల స్వభావాన్ని చెప్పుకుంటారు. కవి చెప్పుకున్న ఈ లక్షణాలతో “దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు”లాంటి కవితనొకదాన్ని ఇక్కడ చూద్దాం;

 

అవ్వారి నాగరాజు కవిత “”ఒక రోజు ​గడవడం”

 

౧.ఎప్పటి లాగే ఉదయం :

 

నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే

చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

ఊపిరి వెన్నులో గడ్డకట్టి

తీగలు
తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే

ఇక దేహమంతా ప్రేమలు లేవు

 

లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల

ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు

సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ

రెక్కలు విరిగి –

 

ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను

తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో

ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

 

౨. పగటి పూట:

 

ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ

 

నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ నిన్నూ

అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా

తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –

కాసేపు నువ్వు

 

వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు.

తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా

నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు

నువ్వే ఒక ఓదార్పు మాటవు.

 

నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ,

ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,

అలసీ, నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

 

౩. రాత్రి:

 

ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-

నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-

 

ఏ యుగమో తెలియదు

ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి

***

ఒకరోజు గడవడమంటే,

వేలాదిగా విరజిమ్మబడ్ద జీవితశకలాల్లోంచి ఒక ముక్క తనకు తానొక రూపాన్ని దిద్దుకోవడం. ఒక నిర్ధిష్టత లేకుండా అస్తవ్యస్త కోణాల్లో పదునుతేలిన అంచుల్ని సానపట్టి నునుపుతేలుతున్న గాజు ముక్కొకటి అద్దంలా మారే ప్రయత్నం. అటువంటి ఒకరోజు గడవడంలోని గమనింపు, గమనమూ, గగుర్పాటు అవ్వారి నాగరాజు  కవితలో వ్యూహాత్మకంగా కనపడతాయి.

మొదటగా ఉదయం- ఉదయాలన్నీ పదిలం కావు, మెలకువలన్నీ మేలుకొలుపులూ కావు. ఒక్కో పొద్దు ఎలా మొదలౌతుందంటే,  వేకువ సంరంభం తన బింబాన్ని చూపేలోపే చేజారి బద్ధలైన అద్దంలో ముక్కలైన  బలహీనపు నిర్ణయాల భ్రమలా భళ్ళున తెల్లారుతుంది. అప్పుడు ఊపిరి వెన్నులో గడ్డకట్టి / తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే” మిగుల్తుంది. తెగిపోతున్న తీగల మధ్య శబ్ధం దిక్కుతోచక నిలిచిపోవడం ఒక దృశ్యంగానూ, శ్రవణానుభవంగానూ కూడా ఒకేసారి స్ఫురిస్తుంది. వెన్నులో జలదరింపు, వణుకు వల్ల ఊపిరి ఒక పదార్థంలా బరువుగా మారి గడ్దకట్టే సాంద్రతలో కవితలోని అనుభూతి తీవ్రమౌతుంది.

“లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల /ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు”  ముదురురంగుల కలయికలా అధికారికంగా, దర్పంగా, కొన్నిసార్లు వెగటైన ఎబ్బెట్టుగా కాక లేతరంగుల పెనవేత కళ్లద్వారా ఊహలోకి అందించే అహ్లాదం సున్నితమైన. హృద్యమైన అనుభూతులని ప్రతిబింబిస్తుంది. అటువంటి ఇరుసంధ్యల కలనేతలోని జతని పొందలేని రంగువెలసినతనం నిద్ర లేచిన నిముషాల్లో నిరీహను నింపుతుంది. రెక్కలు విరిగి అసరా చేసుకున్న చెట్టుని పెనుఉప్పెనేదో కుదుళ్లతో పెకిలించి ఆచోటులో వేల యాతనల కొమ్మలేసే శాపాల విత్తనాన్ని వదిలిపోతుంది. లేతదనంతో గాఢతని స్ఫురింపజేయడంలో కవి సాహసమూ, ’సున్నితమైనవన్నీ రెక్కలు విరిగి’ అన్నప్పుడు ఎగరడం, ఊహించడం, కలలు కనడం వంటి సున్నితత్వపు లక్షణాలను వాక్యాల చాటున దాచిన నేర్పరితనమూ కనపడతాయి.

పగటిపూట –  “ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,“  అన్న పంక్తుల్లో పగలంతా తల పైకెత్తుకున్న పనులు, నిర్దాక్షిణ్యంగా తనపై తను మోపుకున్న పదింతల బరువుల లక్ష్యాలు మనిషిని సతమతం చెయ్యడ౦ తెలుస్తాయి. అలాంటి సమయాల్లో బుద్ధితో ప్రమేయం లేకుండా, ఆలోచనల్తో పొత్తు లేకుండా అలవాటు ప్రకారం పాదాలు నడుస్తూ ఉంటాయి. పాదాలకి నడక ఎలానో, దారులకి గమ్యం అలానే అనివార్యం అని తెలిసి, దింపుకోతరం కాని బరువుని మరో భుజానికి మార్చుకునే నెపంతో తెలియకుండానే వెక్కిక్కి ఏడుపు తనలోంచి తనకి వినపడినప్పుడు, కన్నీళ్లతో తెరిపిన పడ్ద వేదన కరిగిపోతూ ఒక ఓదార్పుమాటని వదిలిపోతుంది. “తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా, నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు” అనడంలో ప్రకృతి సహజమైన బాసట, భరోసా మనిషి లోపలినుండే అవసరానుగుణంగా బయటికి రావడం అరుదైన ప్రతీక ద్వారా వ్యక్తమౌతుంది.

రాత్రి – రోజంతా గడిచి వెంట తెచ్చుకున్న అలసటనూ, వేసటనూ;  మాటలతో, వివరణతో, తర్కంతో  వదిలించుకోలేక  లోపలి రాపిడితో రాజీ ప్రయత్నంగా  కాస్త మసకనూ, మత్తూనూ ఎరగా వేసేందుకు రాత్రి వస్తుంది. చివరి మజిలీగా “గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-“ స్వాగతిస్తుంది. గూడుని గుహగా భావించడం రాత్రి తాలూకూ ఆలోచనారహితమైన ఆదిమత్వాన్ని సూచిస్తుంది. నిజమనే నిప్పును నిద్ర నివురుగా కప్పేసి రాతి ఆయుధాల రాపిడిలోని రవ్వల దిశగా చూపు మలుపుతుంది. అడవితనాన్ని వదల్లేని అనాది అనాగరిక ప్రవృత్తేదో కొనలపై తడి ఆరని కటిక చీకట్లో కరుడుకడుతుంది.

—-

చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

satish-219x300
బతికేసి వచ్చేసాననుకుంటాను
అనుభవాలన్నీ మూటకట్టుకుని తెచ్చేసుకున్నాననుకుంటాను.
ఇంతకన్నా ఏంకావాలీ- అని త్రేన్చేద్దామనుకుంటాను.

 

గడించేసాననుకుంటాను.
జేబుల్లో సంపాదన జేబుల్లోనే వుండి పోయిందనుకుంటాను.
రెండుచేతులూ జొనిపి కట్టల్ని  తాకుదామనుకుంటాను.

 

అనుభవాల మూటలూ,
నోట్ల కట్టలూ, అన్నీ వుంటాయి.
కొన్ని వెర్రి చేష్టలూ, కాసిన్ని చిల్లర నాణాలూ తప్ప.
జీవితమన్నాక చిన్న చిన్న ఖాళీలూ, జేబు అన్నాక కొన్ని కొన్ని చిరుగులూ తప్పవు.

 

వెయ్యి నోటు వదలి, రూపాయి బిళ్ళ కోసం వెనక్కి వెళ్తానా?
తప్పటడుగుల్తో ముందుకు వచ్చాను. వెనకడుగుల్తో వచ్చిన దూరాన్ని కొలుస్తానా?
తిరుగు బాట తప్పదు. వెతుకులాటే బతుకేమో!

 

పొందిన ప్రేయసిని వదలి, ప్రేమలేఖ కోసం పరిశోధనా?
ఏళ్ళతరబడి  హత్తుకున్నాను. అప్పటి క్షణాల ఎడబాటు ఇప్పుడు అవసరమా?
జ్ఞాపకం అనివార్యం. జారిపోయిందే జీవితమేమో!

 

నా బుగ్గ కంటిన  ఆమె కంటి చెమ్మా,
నా మునివేళ్ళ మీది ఆమె వెచ్చటి ఊపిరీ
అంతలోనే తడిగా, ఆ వెంటనే పొడిగా…
అన్నీ చిల్లు జేబులో నాణాలే.
వాటిలో ఒక్కటి దొరికినా సరే,
కూడ బెట్టిన సంపదంతా చిన్నబోతుంది.
బతికేసిన బతుకుంతా చితికి పోతుంది.

 

ఆ క్షణాని కది బెంగ.
కానీ, ఒక యుగానికి చరిత.

 

III III III

 

నన్ను పోల్చుకోలేని నగరానికొచ్చేశాననుకుంటాను
నా మానాన నేను బతకగల నాగరీకుణ్ణయిపోయాననుకుంటాను.
ముందు వెనుకలడగని ఒక మహా ప్రపంచంలో కలిసి పోయాననుకుంటాను.

 

గట్టెక్కేసాననే అనుకుంటాను.
విజయాలన్నింటినీ వెండి కప్పుల్లో నింపేశాననే అనుకుంటాను.
అలమర అద్దాలు జరిపి మెడల్స్‌ను తడుముకోవచ్చనే  అనుకుంటాను.

 

గదుల్లో ఏసీలూ, మెడనిండా మాలలూ, అన్నీ వుంటాయి.
దాటి వచ్చిన పల్లెలూ, దండ తప్పిన మల్లెలూ తప్ప.
ప్రవాసమన్నాక కొన్ని సంచులు మరవడాలూ, పాత డైరీలు వదలడాలూ తప్పవు.

 

ఈ-బుక్కుల్ని వదలి, పిచ్చి కాగితం వెంట పరుగెత్తుతానా?
తరగతులు దాటుతూ ఎదిగాను, స్థితిగతులు దించుకుంటూ పోనా?
తవ్వాలంటే దిగాల్సిందే. లోతుకు పోవటమే ప్రయాణమేమో!

 

నగరం నడి బొడ్డు వదలి, ఊరి వెలుపలకు దిగిపోవటమా?
కలగలిసిపోయాన్నేను. కుడిఎడమల తేడాలిప్పుడు కావాలా?
తిరిగి రావటం యాత్ర. మూలాన్ని చేరడమే ప్రవాసమేమో!

 

తెల్ల పువ్వు కోసం చెట్టుకూడా ఎక్కలేని వణుకూ
బుల్లి నవ్వు కోసం పూజారి కూతుర్నే గిచ్చిన తెగువా
ముందు చలి, తర్వాత వేడి
రెండూ వద్దనుకున్న వస్తువులే.

 

కలిపి దొరికితే చాలు
ఎక్కిన అంతస్తులు కూలిపోతాయి.
నగర అజ్ఞాతం ముగిసి పోతుంది.

 

ఇప్పటికిది ఆశే
కానీ, రేపటికదే శ్వాస.

 

III III III

 

పల్లెకొచ్చాక బెంగ తీరుతుందనుకుంటాను
కవులు కలవరించే గ్రామం మురిపిస్తుందనకుంటాను.
గుడిసెల మధ్య మేడల్ని చూసి నింగి నేలకొచ్చేసిందనుకుంటాను.

 

ఊరూవాడా ఏకమయందనుకుంటాను.
సరిహద్దు రేఖ చెరిగిపోయిందనే అనుకుంటాను.
పేట విందుల్లో ప్లేటందుకునే పెదరాయళ్ళని పొగడొచ్చనే అనుకుంటాను.

 

అంటనిపించని వంటలూ, చెమట కనిపించని సెంటులూ, అన్నీ వుంటాయి.
దుబాయిలో దిగబడిపోయనా కొడుకూ, పదిరోజులక్రితం పాడె యెక్కిన తల్లీ తప్ప.
ఎదగడమన్నాక, కౌగలింతల్ని కాజేసే దూరాలూ, శవాన్ని మోసిన కలల భారాలూ తప్పవు.

 

తరగని ఎడారుల్ని వదలి, ఎరగని పొలాల కోసం వచ్చేస్తానా?
మునివేళ్ళతో మట్టిలోనే రాశాను.భూమంత గుండ్రంగా కుండను చెయ్యలేనా?
ఓహ్‌! బురద మైలపడుతుందే. ఊరికి అవతలంటే, ఉత్పత్తికి ఆవలేగా!

 

తలలు గొరిగే పనే అక్కడ, వదలుకుంటే ఇక్కడ తలారి పనేగా!
ప్రాణమున్న శిలను శిరస్సుగా చెక్కటమే . పంచ ప్రాణాలతో చేస్తాను.
ముట్టుకుంటే కేశాలు మాసిపోవూ? అంటరానితనమంటే, వృత్తిలేని తనమేగా!

 

సెలవు కొచ్చినప్పుడు గొప్పలూ
కొలువు చేసినప్పుడు తిప్పలూ
అప్పుడే మిరిమిట్లూ, వెంటనే చీకట్లు
వాడలన్నీ క్రిస్మస్‌ చెట్లే.

 

ఏటి కొక మారు చాలు
ఒక రాత్రిలో ఏడాది కాపురం
సమాధి మీదే అమ్మ జ్ఞాపకం

 

వాడ వాడే,
నేనెగిరి పోయేది గాలి ఓడే

 

స్టేజీ ఎక్కుతున్న ‘పతంజలి’!

patanjali natakotsavaaluపతంజలి అంటే వొక ఖడ్గ ప్రహారం!

పతంజలిని అక్షరాల్లో చదవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వెన్నెముకలేని లోకమ్మీద కసిగా విరుచుకుపడే అతని పదునయిన వాక్య ఖడ్గం  మనం గర్వపడే మన కాలపు వీరుడు వదిలివెళ్లిన ఆస్తి.

అలాంటి వాక్యాల  సైన్యాన్ని రంగస్థలం మీద చూపించడం వొక సాహసం. కానీ, తెలుగు నాటకం అలాంటి సాహసోపేతమయిన ముందడుగుకి సర్వసిద్ధంగా వుందని నిరూపిస్తూ ఇదిగో ఈ పతంజలి నాటకోత్సవాలు ….ఈ వారం హైదరాబాద్ లో…మీరు హైదరబాద్ లో వుండీ వెళ్లలేకపోతే ఆధునిక తెలుగు నాటక రంగచరిత్రలో వొక అద్భుతమయిన సన్నివేశాన్ని కోల్పోతున్నట్టే!

సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ‘ప్రయోగానికి’ నాంది పలికారు.

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

kolluriసచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్.

క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ నేటి దాక ఎందరినో తన ఆటతీరుతోనూ, వ్యక్తిత్వంతోను ఆకట్టుకున్న వ్యక్తి టెండూల్కర్. మన దేశంలో సచిన్‌ని వేలంవెర్రిగా అభిమానించేవారున్నారు, ఆరాధించేవారున్నారు. సచిన్ ఒక ఐకాన్.

సచిన్ టెండూల్కర్ రికార్డులు, ఆటతీరు గురించి ఎన్నైనా పుస్తకాలు వచ్చివుండచ్చు, కానీ సచిన్ అంతటి గొప్పతనం ఎలా సాధించాడో, పొందిన ఔన్నత్యాన్ని ఎలా నిలుపుకున్నాడో చెప్పే పుస్తకాలు తక్కువ. అటువంటి పుస్తకమే “దేవుడిని మర్చిపోదామిక”. సచిన్ ఆట కన్నా అతని వ్యక్తిత్వమే అతనికి ప్రపంచవ్యాప్తంగా మన్ననలను అందిస్తోందని రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ అంటారు. టెండూల్కర్‌లా అయిపోవాలనుకునేవాళ్ళేమీ తక్కువ లేరు మన దేశంలో. “మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్‌ టెండూల్కర్ లూ లేరా మనకెగ్జాంపులు…..” అనుకుని ముందుకు దూకేవాళ్ళుంటే, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ” అని ప్రోత్సాహించేవాళ్ళూన్నారు.

అయితే టెండూల్కర్ ఆటలో అంత నిలకడగా రాణించడానికి రహస్యం టాలెంట్‍తో పాటుగా, సాధన, ఆట పట్ల మమకారం, వివాదరహితమైన వ్యక్తిత్వమే కారణాలు. టెండూల్కర్‌తో పాటు జట్టులోకి వచ్చి, ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ఆటగాళ్ళెందరో ఉన్నారు. వారికి, టెండూల్కర్‌కీ ఉన్నతేడా ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. మనలో చాలామంది చేసే పొరపాటుని ఈ పుస్తకం సున్నితంగా ఎత్తి చూపుతుంది. మనం గొప్ప వ్యక్తులను ఆరాధిస్తాం, వారిలా ఆ ఘనతని సాధించాలనుకుంటాం. వారి సుగుణాలను అలవర్చుకోకుండా, వ్యక్తి ఆరాధనకి, అనుకరణకి పూనుకుంటాం. సినిమా హీరోల నుంచి ఆటగాళ్ళ వరకూ చాలా మంది విషయంలో జరిగేది ఇదే.  ఈ తప్పునే చేయద్దంటున్నారు రచయిత.

టెండూల్కర్‌ని వ్యక్తిగా ఆరాధించద్దు, అతని సుగుణాలను గ్రహించి వాటిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలని సూచిస్తున్నారు. స్వామి వివేకానంద కూడా  “Learn Everything that is Good from Others, but bring it in, and in your own way absorb it; do not become others.” అంటూ ఇదే విషయాన్ని చెప్పారెప్పుడో.

సచిన్‌లో బాల్యంలో ఉన్న నెగెటివ్ లక్షణాలను కుటుంబం పాజిటివ్ లక్షణాలుగా మార్చిన విధానాన్ని మనం గ్రహించాలి. మనలో బోలెడన్ని నెగటివ్ లక్షణాలుంటాయి. కానీ వాటిని నెగటివ్ గానే ఉంచుతున్నామా… పాజిటివ్‌గా మలచుకుంటున్నామా? బలహీనతగా నిలిచిపోతున్నామా? బలంగా మలచుకుంటున్నామా అనేది కీలకం అని అంటారు రచయిత.

తన అభిమాన హీరో జాన్ మెకన్రోలోని దూకుడుని ఇష్టపడ్డ సచిన్, దాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు, మెకన్రో తీరుని ఆస్వాదించిన సచిన్ దాన్ని ఉన్నదున్నట్లుగా అనుకరించలేదు. తన హీరోలా ఆవేశాన్ని హావభావాల్లో కాకుండా… తన ఆటలో చూపించాడు. అభివృద్ధికి అనుకరణ తొలిమెట్టవ్వాలే కానీ, రెండో మెట్టూ… చివరి మెట్టూ కూడా కాకుడదూ అని అంటారు రచయిత.

“ఉన్నచోటనే ఉండాలంటే శాయశక్తులా పరిగెత్తాలి, మరింత ముందుకు వెళ్ళాలంటే…. రెట్టింపు వేగంతో పరుగెత్తాలి!” అనే లూయిస్ కరోల్ వాక్యాల్ని ఉటంకిస్తూ… “అలా రెట్టింపు వేగంతో పరిగెట్టిన వారే ఛాంపియన్లవుతారు! చదువులోనైనా…. ఆటల్లోనైనా… ఉద్యోగంలోనైనా… జీవితంలోనైనా!” అని చెబుతారు రచయిత. అది సచినైనా, మీరైనా, నేనైనా…ఎవరైనా అంటూ హామీ ఇస్తారు.

“చెడిపోయే వాతావరణంలో ఉంటూ కూడా… చెడిపోకుండా ఉండగలిగేవాడే గొప్పవాడు” అంటూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు బానిసవకుండా నిలబడేవాడే సచిన్‌లా నిలుస్తాడు అంటారు రచయిత. ఒత్తిడిని జయించేందుకు సచిన్‌ని ఉదాహరణగా చూపుతారు రచయిత. లక్షల మంది మధ్యలో ఉన్నా…. తానొక్కడే ఉన్నట్లు…. తాను ప్రపంచ ప్రభావంలో పడకుండా…. ప్రపంచాన్ని తన తన్మయత్వంలో మునిగేలా చేయలాంటే…. నా కోసం నేనాడుకుంటున్నానన్నట్లు ఆడాలి. ఉదాహరణలను, పోలికలను పట్టించుకోకుండా, మీ పని మీరు చేసుకుపోవాలి, పట్టుదలతో చేసుకుపోవాలి. ఎదుగుదలకి మొదటి పాఠం నిరంతరం సాన… అనుక్షణం పోటీ… పోటీ ఎవరితోనో కాదు… తనతో తనకే పోటీ. మొన్నటికీ నిన్నటికీ తేడా ఏమైనా ఉందా అని పోటీ…! నిన్నటికీ, నేటికీ ఏమైనా మెరుగయ్యానా అని పోటీ…. ఎందుకంటే మొన్న ఏం ఘనత సాధించామో నిన్నకి అక్కర్లేదు. నిన్న ఏం కీర్తి గడించామో నేడీ లోకం పట్టించుకోదు. నేడు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం.

పుస్తకం చివర్లో సచిన్‍తో రచయిత జరిపిన ఇంటర్వ్యూ ఉంది. అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా “అంకితభావం, ఆత్మగౌరవం, విజయేచ్ఛ” – విజేతల లక్షణాలని సచిన్ చెబుతాడు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి ఇవి థంబ్ రూల్స్ లాంటివి.

క్రికెట్ దేవుడిగా కంటే మాములు మనిషిగా సాధించిన ఘనతలెన్నో సచిన్ జీవితంలో ఉన్నాయి.  మనం అతనిలా ఆడలేకపోవచ్చు…. కానీ అతనిలా ఉండొచ్చు…. అతనిలా పరుగులు తీయలేకపోవచ్చు…. కానీ అతనిలాగానే పడకుండా నిలబడొచ్చు…! అతనిలా రికార్డులకెక్కలేకపోవచ్చు…. కానీ అతనిలా పైకెదగొచ్చు…..! అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

ప్రచురణకర్తల వివరాలు:

ప్రచురణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,

సికిందరాబాదు- 500009

sahrudayasanthosham@gmail.com

ఏకబిగిన చదివించే “దేవుణ్ని మర్చిపోదామిక, సచిన్‌ని గుర్తుంచుకుందాం” అనే ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.

“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

Siva_3అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ రాయలేదండీ..అయినా ప్రయత్నిస్తాను,” అని చెప్పాను. నాలో నేను అనుకున్నాను, “నేను మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒక సినిమా పాటని ఖూని రాగం చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి రాయలేకపోతానా,” అని.

వ్రాద్దామని కుర్చొంటే అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం ఏంటో! ఇది టి.వి లో ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ చూసాం కదా, దాని పైన బుక్కు రాయటం ఏం పెద్ద పనా అని అనుకొని ప్రయత్నించటం లాంటిదని.

బుర్ర బ్లాకై పోయింది. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ పాటలు వాన తుంపర్ల లాగా ఎడతెరిపి లేకుండా కురవసాగాయి. ”నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి,” అంటూ అమరగాయకుడు ఘంటసాల వారిని తలచుకొని ముందుకు సాగుదామనీ, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని, ఏకాగ్రతతో, కలానికి పని చెబుదామనీ, కూర్చొన్నా.

“మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నల డోలలూగెనే….కొమ్మల గువ్వలు గుస గుస మనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, నీవు వచ్చేవని,” అంటూ మంద్రస్థాయిలో మృదు మధురంగా భానుమతి గళం ఎక్కడి నించో వినిపించి ఇబ్బంది పెట్టేస్తోంది. ఒక సారి తల విదిలించుకొని, “ఫోకస్..ఫోకస్”, అని నాలో నేనే అనుకొని, కలం కదిపే లోపు, మళ్ళీ అదే గొంతు, “పిలచిన బిగువటరా? అవురవుర! చెలువలు తామే వలచి వచ్చినా” అని   మందలింపు. లెంపలేసుకొని, స్ఫూర్తి కోసం, కొన్ని భానుమతి పాటలు హమ్ చేస్తుండగా, “సడి సేయకో గాలి, సడి సేయ బోకే” అని లాలిత్యం ఉట్టిపడుతూ లీల సున్నితంగా నా పాట నాపేసి, ఏదో మత్తు లోకి తోసింది. “లాలీ..లాలీ..లాలీ..లాలీ.. వట పాత్ర శాయికీ వరహాల లాలీ” అంటూ సుశీలమ్మ నన్ను మరింత నిద్ర లోకి నెట్టే లోపల, “ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్లి పడ్డది,” అంటూ గుర్రపు డెక్కల తాళం లో జానకమ్మ నన్ను మొట్టి లేపింది.

మనస్సు పరిగెత్తినంత వేగంగా నా కలం పరిగెడితే ఈ పాటికి పది పేజీల కాలమ్ పూర్తయ్యేది అన్న ఆలోచన పూర్తయ్యేలోపే  మరొక ఆలోచన  నా వ్రాతకు ఆనకట్ట వేసింది.

“కొత్త పాటల తుంపరలు ఒక్కటీ నా మీద ఇంకా పడలేదేమిటబ్బా!  ఏ పార్టీ జరిగినా మా ఇంట్లో మ్రోగేవి, నేను రెండు గ్లాసుల వైన్ తాగిన తరువాత గెంతేవి ఆ పాటలకే కదా! ఇప్పుడేమిటీ పాటల గురించి వ్రాద్దామని కూర్చొంటే మాత్రం ఒక్కటీ నోట్లో ఆడట్లేదు? నేను మరీ ముసలాడినైపోతున్నానా? చాదస్తంగా ఓల్డంతా గోల్డేనని పాతవే పట్టుకు వేళ్ళాడుతున్నానా?” అంటూ కొన్ని నిమిషాల పాటు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండిపోయా. “కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అంటూ శ్రీశ్రీ నా చెవిలో దూరి అరుస్తున్నా సరే, ఆ నెగటివ్ ఆలోచనలను పక్కకు నెట్టి మళ్ళీ పన్లో పడిపోయా.

“మీకిష్టమైన పాటలేంటి?” అని ఎవరైనా అడిగితే, చటుక్కున నేను పుట్టకముందు పుట్టిన సినిమా పాటలే గుర్తుకొస్తాయి. ఒకసారి ఉండబట్టలేక, మా ఫ్రెండు ఒకడు కడిగేసాడు. నువ్వింకా “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని ఇక్ష్వాకుల కాలం నాటి పాటలు పాడుకుంటూ ఉంటే, రేపు మీ మనవళ్ళ కాలం వచ్చేనాటికి అంతే తాదాత్మ్యతతో, “సార్..రొస్తా రొస్తారా రొస్తా రొస్తా రొస్తా రా..” అనో “మై లవ్ ఇస్ గాన్.. మై లవ్ ఇస్ గాన్” అనో పాడుకుంటావా అని.

వాడెంత చురకేసినా నేను మాత్రం సీరియస్ గానే చెప్పా, శంకరాభరణం శంకరశాస్త్రి నన్ను ఆవహించినట్లుగా. “బాల్య, కౌమార్య, యౌవన, వృద్ధాప్యాలు పాటలు పాడేవాళ్ళకీ, శ్రోతలకీ ఉంటాయేమో కానీ, పాటలకు కాదురా! ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం దైవాంశసంభూతులైన కొందరి వ్యక్తుల భక్త్యావేశాలు ఒక ప్రవాహమై, శబ్ద రూపేణ ప్రాణం పోసుకొంటే, ఆ ధ్వనులేరా సాంప్రదాయ సంగీతమై, కొన్ని కోట్ల గళాలలో ప్రతిధ్వనిస్తూ, మన సంస్కృతి ఉమ్మడి ఆస్థిలా తరతరాలకూ సంక్రమిస్తూ, శాస్త్రీయబద్ధమైన కర్నాటక సంగీతంలా పక్వత చెంది, లలిత సంగీతంలా సరళీకృతమై,  పాశ్చాత్య రీతులతో సంగమించి, కొంత ప్రకాశించి, మరింత కృశించిన, నేటి మన తెలుగు పాట!”

ఏనాడో రచించిన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజు, శ్యామశాస్త్రి పాడిన కృతులు ఈనాటికీ  పాడుకుంటున్నాం. కనుక నా మనవళ్ళకు నేను వినిపించపోయే పాటల గురించి నువ్వు జోక్ చెయ్యకు. ఇంకొక వంద  ఏళ్ళు గడచినా “జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా” అని పాడేవాళ్ళు, అది విని ఆనందావేశాలలో తూలిపోయేవాళ్ళు, ఉంటూనే ఉంటారు”, అని నేను ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసానికి అలసిపోయి ఆగిపోయాను.

“అదే మరి, సంగీత రాజా ఇళయరాజా అత్యద్భుతంగా స్వరపరిస్తే అమృతం జాలువారే గాత్రాలతో బాలూ, శ్రేయా ఘోసాల్ పాడిన పాటేగా…నేను నా కార్లో ఎప్పుడూ అదే వింటూ ఉంటా” అంటూ తన సంగీతజ్ఞాన ప్రదర్శన చెయ్యటంతో నా బి.పి తార స్థాయిలోని నిషాదాని కంటింది.

“స్వరబధిరుడా (టోన్ డెఫ్), త్యాగరాజు, పల్లవి, అనుపల్లవి, పది చరణాలతో, వెయ్యేళ్ళు నిలిచిపోయేలా, నట రాగంలో చేసిన రామ సంకీర్తన గురించి నేను ప్రస్తావిస్తే, నువ్వు వేరే రాగం కూస్తావా,” అని విరుచుకు పడ్డాను. “ఇంతకు ముందు వీడి పాటే భరించలేమనుకున్నాం, వీడి మాట కుడా కర్ణ కఠోరం,” అని నాకు వినబడేలా  విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను? అదే నా పాత పాటల పైత్యం గురించి కదూ అసలిదంతా మొదలయ్యింది. పాత పాటలంటే ఏదో కొత్తగా అబ్బిన అభిరుచి గానీ, పెరిగిందీ, ఏళ్ల తరబడి ఆస్వాదించింది “కొత్త” పాటలనే. కొత్తవంటే ఏదో శాస్త్రీయ సంగీతం, ఉదాత్త సాహిత్యం, సింగినాదం అని ప్రాకులాడే కళాతపస్వి సినిమాల్లో పాటలే కాదు, “వినదగు నెవ్వరు కొట్టిన” అని అన్నిరకాల పాటలకూ, తలకాయ అడ్డంగా కొన్నిసార్లు, నిలువుగా మరిన్ని సార్లు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూనే పెరిగాను. అయినా మరీ దారుణం కాకపోతే, “సంగీతాన్ని కొట్ట్టటం” ఏమిటో! లావుపాటి బెత్తాలతో విపరీతంగా బాదే వెస్టర్న్ డ్రమ్ముల ప్రయోగం మన పాటలలో ప్రారంభించిన దగ్గరనించీ పాట కట్టటం నించి కొట్టటం అయ్యిందేమోనని నా వెధవనుమానం.

ఇలా కొత్త పాటల మేఘాలు కమ్ముకున్నాయో లేదో, తుంపర్లు కాదు, ఏకంగా వడగళ్ళే పడటం మొదలెట్టాయి, గానగాంధర్వ గళంలో. గత నలభై ఏళ్ళలో, నలభైవేల పై చిలుకు పాటలు పాడిన బాలు స్వర తరంగాలు చేరని చెవులు తెలుగు దేశం లో అస్సలు ఉండే ఛాన్సే లేదు. అన్ని పాటలున్నందుకేనెమో, ఓ పట్టాన గబుక్కున ఏదీ మనసుకు తట్టక పోయినా, ఒక సారి మొదలయ్యిందంటే మాత్రం తుఫానే.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో…” అని అబ్బురపడ్డా, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..” అంటూ పాఠాలు చెప్పినా,  “ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?” అంటూ అన్నగారి గొంతుతో వదినెమ్మను కవ్వించినా, తన గాత్ర వైవిధ్యంతో, అన్ని వర్గాల శ్రోతలని ఆకట్టుకోవటం, బాలూ కే చెల్లింది. అద్గదీ, దొరికింది నేను వ్రాయటానికి టాపిక్. “ఈ ఒక్కాయన కోటు తోకలు పట్టేసుకొని మన సినిమా పాటల సంద్రాన్ని అవలీలగా ఈదెయ్యచ్చు,” అనుకున్నానో లేదో, ఫుల్ వాల్యూం లో “సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది” అంటూ “చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం” అకంపెనీమెంట్ తో, వినిపించే సరికి మళ్ళీ తెలివిలోకొచ్చా.

సినిమా పాటంటే, ఓన్లీ గాయకులేనా గుర్తుకొచ్చేది? “పాటల గురించి వ్రాద్దామని కూర్చోన్నావు, పాటలు వ్రాసేవాళ్ళ నేల మరచితివీవు?” అంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి, వేటూరి, సీతారామశాస్త్రి గార్ల వరకూ కళ్ళ ముందుకొచ్చి కళ్ళెర్ర చేసినట్లుగా అనిపించింది.

స్వరకర్తల సంగతేమీటంటూ సాలూరి, పెండ్యాల నుండి కోటి, తమన్ వరకూ నిలదీసి ఇరుకున పడేశారు. వారందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళ నించి అంత గొప్ప వర్క్ ని రాబట్టుకున్న యల్.వి.ప్రసాద్, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగద్దర్శకులు మాత్రం మందహాసాలతో మాటల్లేకుండా నన్ను అయోమయంలోకి నెడుతుంటే, “ఏ తావున రా? నిలకడ నీకు?” అంటూ భానుమతి పాటే మళ్ళీ రియాలిటీ లోకి లాక్కొచ్చి పడేసింది.

“అసలు వీళ్ళందరి గురించి వ్రాయడానికి నీ కున్న అర్హతేంటి? పెద్ద పెద్ద పరిశోధనా గ్రంధాలే వచ్చాయి. మరిక నువ్వు కొత్తగా చెప్పొచ్చేదేంటి?” అంటూ సీరియల్ సెల్ఫ్ డౌట్ చుట్టేసింది.

“ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు” అన్న పాట కూడా  ఇప్పుడే గుర్తుకురావాలా! అసలు ఇంత ఆలోచన అవసరమా? నేను వ్రాయబోయేది చదివేది కూడా నాలాంటి సగటు పాట ప్రేమికులే కదా. నా కోసం, నా మూడ్ బట్టీ, నాకు నచ్చిన ఏ పాట(ల) నైనా, నాది చేసుకొని, నా భావాలను, అనుభవాలను, అనుభూతులను శ్రుతి మించకుండా వ్యక్తపరిస్తే, నచ్చి ఆదరిస్తారేమో! ఒక కొత్త ఆశ చిగురించినా, అఫ్సర్ గారికి ఏమీ వ్రాయలేదనీ, ఆలోచనలతోనే సమయం అంతా గడిపేశాననీ, ఎలా చెప్పాలా అన్న చిన్న విచారంతో నా కలానికి మూత బిగించా.

దేవస్మిత

samanya1resize22/10/2004

ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా వుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. దేవస్మితా చచ్చిపోతావా?మరి పిల్లల్నేం చేస్తావ్? నాకు నేనే వేసుకునే ఈ ప్రశ్నకు నాకు నేను ఏమని సమాధానం ఇచ్చుకోను?

10/12/2004

ఇవాళ అత్తమ్మ మాటల్లో మాటగా భోగం బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నది. విపరీతంగా కోపమొచ్చింది. చేతిలో ఉన్న మొబైల్ ని ఆవిడ మీదకి విసిరికొట్టాను. ఆవిడ దెబ్బని తప్పించుకున్నది. కానీ శశిధర్ చేతిలో నాకు దెబ్బలు తప్పి పోలేదు. నాలుగు గోడల మధ్యలో వున్నదాన్ని దెబ్బలెలా  తప్పించుకోగలను?

అమ్మా ఎంత గుర్తొస్తున్నావ్, నీమీద చాలా కోపమొస్తోంది. నీ నీడ నా  మీద పడనీయొద్దు అనుకున్నావ్ కదా? పాపం పిచ్చి అమ్మా ! నువ్వు నీడలా, నా వొంటి పైన పుట్టుమచ్చలా నన్ను వదలటమే లేదమ్మా…వేశ్యవి అమ్మా నాకు కథలు రాయడం రాదమ్మా, చెప్పడం కూడా రాదమ్మా లేదంటే నీకథ వింటే బండరాయి మా అత్త కూడా కరగాలేమో. కానీ అంతా ఉత్తిదే, బండరాళ్ళు ఎప్పటికీ కరగవు. అమ్మా!  నువ్వారోజు మీ పేద ఇంటి నుండి, మీ సంప్రదాయాల నుండి లేచిపోయి రాకుంటే నేనివాళ మంచి కుటుంబపు స్త్రీని అయి వుండేదాన్ని కదా, పోనీ నాకు జన్మనిచ్చిన మగాడు నిన్ను వదిలేయకుండా వుండి వుంటే, భాష తెలియని నగరంలో, దిక్కుతోచని దీనత్వంలో, ఆకలికి ఏడ్చే పసిబిడ్డ కోసమనో, మరే త్వరిత మార్గమూ లేకనో నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోక పోయి వుంటే భోగంతనం నా ఇంటిపేరు కాకపోయేది కదా అమ్మా!

ఇవాళ మా మిషనరీ స్కూల్, హాస్టల్ బాగా గుర్తొస్తోంది.అది గుర్తొస్తే భయమేస్తుంది. అమ్మ ఎందుకు ఎప్పుడో ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది? సెలవలలో వెళ్ళడానికి నాకో ఇల్లెందుకు లేదు? అమ్మ వున్నా నేను అనాధని ఎందుకవుతాను? ఇట్లా ఎన్ని ప్రశ్నలో. పాపం అమ్మ ఎంత బాధపడేదో. నా వత్తిడి భరించలేక తనుండే  వేశ్యా వాడకి తీసుకెళ్ళింది అమ్మ. ఆ వాడలో అమ్మ ఉంటున్న చిన్న గదిలో పరుపుపైన దగ్గరగా కూర్చోపెట్టుకుని  తన కథ చెప్పినప్పుడు అమ్మ వాడిపోయిన కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్ళు.  ప్చ్! ఆ కన్నీళ్ళు గుర్తొస్తే ఎంత బాధేస్తుందో. అమ్మ గది పరిశుభ్రంగా ఉండింది. గదిలో ఒక మూల అందమైన చెక్కడపు పూజామందిరం, ఆ మందిరంలో పతిత పావనుడు సీతా సమేత రాముడు. అక్కడున్న అందరూ అమ్మలా చీర కట్టుకుని లేరు, చాలా మంది చిన్న చడ్డీలతో, బ్ర్రాతో స్వేచ్చగా తిరుగుతున్నారు, చుట్టూ అంతటా మురికి, వచ్చిపోయే కస్టమర్లు. ఇంకా స్నానమైనా చేయని ఆ మురికి ఆడవాళ్ళతో యెట్లా రమిస్తారు? స్త్రీని కామించడానికి మగవాడికి ఏమీ అక్కర్లేదేమో, ఒక జననాంగమే చాలేమో!

అంతే ఆనాడు ఆ వాడలో కలిగిన భయం… ఆ రాత్రి అమ్మ పరుపుపైన ముడుచుకుని ముడుచుకుని, జుగుప్సతో, కలలో కలత నిద్రలో వొందల స్థనాలు పాములై సాగి సాగి, నన్ను చుట్టుముట్టి, నలిమి నుజ్జుచేసి, నా కన్నీళ్ళై…  ప్రభువా! జీసస్! నాయనా నాకొద్దీ కష్మలం, కల్మషం, వేలాంగాల వీర్యాలతో తడిసిన జననాoగాల వాడా సంచారం నాకొద్దు. జీసస్! జీసస్! రక్షించు. నేనే వారై, వారే నేనై … అంగమే అన్నమై కడుపులోకెళ్ళే స్త్రీలు నాకొద్దు జీసస్. జీసస్! కురిసే వాన చినుకులలో ఆకుల గొడుగు క్రింద అటుఇటు చంచలించే రంగు రంగు పిట్టలతో అందంగా, పరిశుభ్రంగా భద్రంగా వుండే ప్రపంచం కావాలి నాకు. పైన పరిగెడుతున్న మేఘాల్లా, ఆకాశం అంచున మిలమిలలాడే వెన్నెల్లా పరిశుభ్రత కావాలి. నన్ను పాపలా హత్తుకుని ప్రేమించే నీ లాటి భద్రమైన చేతులు కావాలి. అమ్మ వద్ద నుండి పారిపోవాలి పారిపోవాలి…. శశిధర్ నుండి అతని కుటుంబం చేసే అవమానాల నుండి పారిపోకపోవడానికి ఆరోజు నాలో కలిగిన ఆ భయమే కారణమేమో. లేదంటే మనిషిని మనిషి పశువులా కొట్టే హింసని తనేనాడైనా ఊహించిందా? పక్షినీ,పశువునీ, మనిషినీ సమంగా ప్రేమించే ధర్మం కదా తను నేర్చుకుంది.

కష్టపడి చదివి ఎయిర్ హోస్టెస్ వుద్యోగం సంపాదించి, అమ్మా రామ్మా నా వద్దకు రామ్మా అంటే అమ్మ ఏమన్నదీ, ”వద్దు బంగారూ నువ్వు మంచిగా పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, నేనొకదాన్ని ఉన్నానని మరిచిపో, ఎవరడిగినా అనాధనని చెప్పు.  పొరపాటుగా కూడా నా గురించి చెప్పకు,” అని. అలా చెప్పిందా తను శశిధర్ కి , లేక జీవితంలో నిజాయతీ ముఖ్యమనుకుందా?  శశిధర్ ఎంత మంచివాడు, ఎంత సున్నిత మనస్కుడు. శశిధర్ కి నిజమే చెప్పాలి తనని అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వేశ్య కూతురినైనంత మాత్రాన వదులుకుంటాడా? అసలు వదులుకోడు! ప్చ్! ఎంత నమ్మకం. ఎంత నిజాయితీగా శశిధర్ కి ఆ సంధ్య వేళ ఏర్పోర్ట్ వెలుపలి కాఫీడే కేన్ కుర్చీల్లో ఒక మూలగా కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అంతకంటే ఆత్మీయులు ఎవరున్నారు జీవితంలో, అందుకే పొంగి పొంగి వచ్చింది ఏడ్పు ఎంత ఆపినా ఆగిందా? కానీ దేవస్మితా నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు. అమ్మ అట్లాగే అమాయకంగా మోసపోయి కదా లేచొచ్చింది. అమ్మ కూతుర్ని నేను తెలివైన దాన్ని కాగలనా? ఏం చేసాడు శశిధర్. అతను చెప్పిన ప్రేమ, జీవితకాలపు బంధం అంతా వట్టి మాటలే. నా శరీర నగ్నత్వాన్ని, నా హృదయ నగ్నత్వాన్ని అనుభవించి పారిపోవాలనుకున్నాడు. మా అమ్మ నాన్నలు నాకు ఎదురు చెప్పరు అన్న నోటితోనే, వాళ్ళు వొప్పుకోవటం లేదు అనేశాడు. ఎందుకని? వేశ్య కూతురిననే కదా? అమ్మ పుడుతూనే వేశ్యగా పుట్టిందా? అనాధనంటే ఎందుకు ఇష్టపడ్డాడు. ఏ వేశ్యో కని  అనాధగా వదిలేసి ఉండకూడదా? అమ్మ బ్రతికి ఉండటమే అతని అభ్యంతరమా? వత్తిడి భరించలేక, చెప్పుకునే తోడు లేక అమ్మకి చెప్తే అమ్మ ఏం చేసింది. తన అడ్డు లేకుండా చేసింది. నిజంగా అనాధను చేసేసింది. అన్నేళ్ల కష్టాలను భరిస్తూ వచ్చి ఈ కష్టాన్ని భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య నారక్తంలో ఉందేమో లేకుంటే ఎందుకు ఊరికే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు? కుటుంబం వద్దనుకుంటే ఒక్క నిమిషంలో వదిలిపోయే హింస ఇదంతా,  కానీ ఎలా వదులుకోను?

03/03/2006

చిన్నీని, పాపని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. చిన్ని మధ్యలో పిజా తిని వెళ్దామన్నాడు. చేతిలో ఎప్పుడైనా డబ్బు ఉంటుందా! లేదు నాన్నా ఇంటికెళ్ళి నానమ్మనడిగి మనీ తీసుకుని తరువాత  వెళ్దామంటే వాడు ఊరుకున్నాడా ఒకటే ఏడుపు. చిరాకు పుట్టింది. తొడ పాశం పెట్టేసాను. వాడి ఏడుపు చూసి ఒకటే ఏడుపొచ్చింది. ఎన్నిసార్లడిగింది తను శశీని కొంత మనీ ఇవ్వు నాకు అన్నింటికీ మీ అమ్మనడగలేకున్నాను అని. అతను నా  పట్ల ఎందుకంత కఠినంగా  ఉంటాడు. ఔననో కాదనో చెప్పొచ్చు కదా. “అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన దానివి, నీకు పెద్ద వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందిలే. కానీ అట్లా నీకు పర్సనల్ మనీ ఇవ్వడం కుదరదు ఏదైనా అమ్మనడిగి తీసుకోవాల్సిందే,” అన్నాడు. అతను అదే తరహాలో మాట్లాడతాడని తెలిసినా మనసు మళ్ళీ మళ్ళీ చిన్నబుచ్చుకుంటుంది ఎందుకనో, పోనీ వుద్యోగం చేయనీయోచ్చు కదా అంటే పిల్లల్నెవరు చూస్తారు? అతని తల్లినెవరు కనిపెడతారు.ఆడపిల్ల అంటే ఇంకో అర్ధం అడ్జెస్ట్ మెంట్ అనేమో. ఎంతకని సర్దుకుపోను? చాలా ఫ్రస్ట్రెటింగ్ గా అనిపిస్తుంది.

08/12/2007

అత్తమ్మ కూతురి దగ్గరకు వెళ్ళిపోయినప్పటి నుండి ఏవిటో ఒకటే దిగులు. ఎప్పుడు ఇంటినిండా మనుషులు ఉండాలనిపిస్తోంది. ఒంటరి బ్రతుకు కావడం చేతేమో ఇల్లంతా బోసిగా అనిపిస్తోంది. ఆవిడకి నేనంటే ఎంత ద్వేషమైనా ఆవిడ మీద కోపం రాదు. ప్చ్ అందరం ఆఫ్ట్రాల్ వొందేళ్ళు బ్రతికి చచ్చే మనుషులమే కదా. శశిధర్ మీద వున్న కోపం కూడా ఆవిడ మీద కలగదు నాకు. ఎందుకో బాగా ఒంటరిగా అనిపిస్తోంది.నిజమే నేను అనాథని.

10 /01/2008

ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది.’జిన్నూ’ మాజీ ఎం ఎల్ ఎ  కొడుకుని కరిచింది. పసిబిడ్డ వాడిని కరవడం నిజంగా బాధే. కానీ వాడు దాన్ని ఎందుకు కొట్టాలి. వాళ్ళమ్మ  గొడవకు వచ్చింది. ఎంతచెప్పినా వినిపించుకోదే. చివరికి విసిగి ఇంట్లోకొచ్చి తలుపు వేసేయ్యగానే ఆవిడకి ఇగో దెబ్బతిన్నట్లుంది. కొడుకు చేతిలో కర్ర తీసుకుని సిటవుట్లో ఉన్న నిలువెత్తు యాక్వేరియంలు రెంటినీ పగలకొట్టేసింది. నేను తలుపు తీసుకుని వచ్చేలోపు వెళిపోయింది. నాకు గిర్రున తల తిరిగింది. ఎంత అహంకారం. తిని తిరగడం తప్పించి ఇంకోపని ఉండదు ఆవిడకి. డబ్బుందనే కదా ఆ అహంకారం. ఈవిడే కాదు ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళంతా డబ్బుండే వాళ్ళే. వాళ్ళతో కలవడం కూడా అసహ్యం నాకు. కిట్టీ పార్టీలని వీళ్ళు కలిసి మాట్లాడేదంతా బూతులే. ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవత్తె  ఎవడితో వుంది ఇదే. ఐ హేట్ దిస్ లొకాలిటీ. శశిధర్ నాకు ఆత్మనూన్యత అంటాడు. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వాళ్ళతో కలవనీయటం లేదంటాడు. నేనెందుకు ఇన్ఫీరియర్ గా ఫీలవుతాను వాళ్లకి తెలియనన్ని, ఎప్పుడు వినను కూడా వినని పుస్తకాలు నేను చదివాను, సంగీతం తెలిసినదాన్ని, దేశాలను చూశాను, మనుషులని కలిసాను.  మొద్దు  మొఖాలు వాళ్ళతో నాకు పోలికేంటి. ట్రూలీ ఐ హేట్ శశిధర్. చేపలన్నీ కిందపడి గిలగిలలాడుతుంటే ఏడుపు ఆగలేదు.  గబగబ పరిగెత్తి బకెట్లో నీళ్ళు తెచ్చి అన్నింటినీ తీసి బకెట్లో వేసినా చిన్ని చిన్ని చేపలు నాలుగు  చచ్చిపోయాయి.  కోపం గిర్రుమని వచ్చి తల తిరిగింది. వాళ్ళింటికి వెళ్లి ఆవిడని బయటకి పిలిచి పాప టెన్నిస్ బాట్ తో యాక్వేరియం పగలకొట్టిన చేతిమీద ఒక్కటిచ్చాను. అందరూ గొడవకొచ్చేరు. ఇంటికొచ్చి తలుపేసుకున్నాను. శశిధర్ రాగానే కంప్లైంట్ చేశారు. చెయ్యి విరగకొట్టానని నా మీద కేసు పెడతామన్నారు. శశిధర్ నా ముఖం మీద వుమ్మేసి  తన ఖర్మ కొద్దీ దొరికానన్నాడు.

03/03/2008

ఈ రోజొక తమాషా జరిగింది. కోర్టుకి వెళ్ళానా, కోర్టులో ఒకతను కనిపించాడు. చాలా అందగాడు. మగవాళ్ళ అందాన్ని నేనెప్పుడూ గమనించలేదు. అలా గమనించాల్సిన అవసరం లేకుండానే అతను అందగాడని తెలిసిపోతోంది. కోర్టులో ఎవరికో దారి ఇవ్వడానికి వెనక్కి జరిగానా,  వెనకే వున్న అతనికి గుద్దుకున్నాను. బేలన్స్ చేసుకోలేకపోతున్న నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు. సారీ చెప్పి వెనక్కు జరిగాను. అలా జరిగేప్పుడు చూసుకున్నాను నేనతనికి సరిగా భుజాల వరకు వున్నాను. చాలా పొడవుగా ఉన్నాడు. నేనే జండా కొయ్యలా ఉంటానని అంటాడు కదా శశిధర్, బహుశా అతను ఆరుంపావు అడుగులు ఉంటాడేమో. అక్కడ ఉన్నంత సేపు అప్పుడప్పుడు అతన్నే చూస్తూ ఉన్నాను.

08/05/2008

ఇవాళ లాయరాఫీసులో మళ్ళీ అతను కనిపించాడు. పలకరింపుగా నవ్వాను . చేతులు కట్టుకుని నిల్చున్నవాడు ఆ చేతులు విప్పకుండానే ‘హాయ్’అని చేతివేళ్లు కదిలించాడు. ఏదో టెన్షన్ లా వుంది. నేను వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి అతను కూడా వచ్చి కూర్చుని అక్కడున్న మేగజైన్ చదవటం మొదలు పెట్టాడు. ఎందుకనో అతన్ని చాలా సార్లు చూశానని అనిపించింది.  అతనితో అదే విషయం చెప్తే, తనో కాలమిస్టునని, ఫలానా ఇంగ్లీష్ మంత్లీ లో  తన ఫోటో చూసి ఉండొచ్చునని చెప్పాడు. అప్పుడు జ్ఞాపకమొచ్చింది.  తన రీసెంట్ రైటింగ్ పైన నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అదే చెప్పాను, అతను శ్రద్దగా విన్నాడు. చివరిగా వచ్చేస్తూ ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చూపించినట్లు నా మొబైల్ కనిపించట్లేదు ఒకసారి రింగ్ చేస్తారా అనాలేమో. కానీ నాకు అబద్ధం చేతకాదు. ఎందుకో మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తూ వుంది. మీరు చాలా అందంగా వున్నారు అందుకని అన్నాను. అప్పుడతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూసాను. కొంచమన్నా మార్పులేదు, సర్ ప్రైజ్. చాలా కేజువల్ గా చేయిచాచి కమల్ అగర్వాల్ అన్నాడు. నేను చేయి కలిపి దేవస్మిత అని నవ్వాను. మీ పేరు బాగుంది లైక్ యువర్ స్మైల్ అన్నాడు, అని మీ మొబైల్ కి రింగ్ చేసేదా అన్నాడు. ఇంటికొస్తున్న దారిలో నాకు నేనే నా ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయాను. యెందుకలా  ప్రవర్తించాను? అయినా నేను ఈ కాలపు అమ్మాయిని. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడటం తప్పేంటి? ఇదేం తప్పు కాదు నిజమే. కానీ, ఇంతకు ముందు నేనలా లేను కదా మరి.  మే బీ అయాం  ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్. ఫ్రాయిడ్ ని వెతకాలి.

16/08/2008

కమల్ తో బాగా స్నేహం కలిసింది. మాట్లాడేందుకు బోలెడు విషయాలు. కానీ అతను పైకి కనిపించినంత స్టేబుల్ కాదు. చాలా ఎమోషనల్. మార్వాడీ తండ్రికీ హిందూ తల్లికీ జన్మించాట్ట. అక్రమ సంతానం. మనువు ప్రకారం ఇతను ఏ చండాల కులంలోకి వస్తాడో.  విధిలేని పరిస్థితుల్లో తండ్రి అతన్ని అంగీకరించాట్ట అయినా తండ్రితో దాదాపుగా లేడు. సగం చదువు విదేశాలలో. తల్లీ, అతను. నేనో వేశ్య కూతుర్నని చెప్పాలనుకున్నాను. ఇష్టమనిపించలేదు. నా జీవితంలో ఇంకో మగాడ్ని నమ్మడమా? సమస్యే లేదు!

15/10 /2008

కమల్ ఇవాళ ఇంటికొచ్చాడు. నా పుస్తకాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని పుస్తక పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆకర్షణా కలిగింది. ఇతన్ని చూపించి శశీతో చెప్పాలి. చూశావా అతనెంత చదువుతాడో అని. నువ్వేం చదవవు. ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే వున్నావు. నాకు ఏ ఆకర్షణ లేదు నీ పై అని. అప్పుడేం అంటాడు శశిధర. నవ్వొస్తుంది. ఏముంది బూతుల  మేళం మొదలెడతాడు.  కమల్ వచ్చేసరికి నా సంగీత సాధన జరుగుతోంది. అందుకని పాడమంటున్నాడేమో  అనుకున్నాను. కానీ కాదు.  అతనికి సంగీతమంటే పిచ్చి. హిందుస్తానీ, వెస్ట్రన్ బాగా తెలుసు. అందుకని త్యాగరాజ  కీర్తన ”రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక/ భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక /పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు…”పాడాను. పాడి ముగించగానే కళ్ళు విప్పార్చుకుని నన్ను చూస్తూ ఆ పాట అర్ధమేమిటో చెప్తావా అన్నాడు. యేమని చెప్పను, అన్యమెరుగని ప్రేమని భక్తి అంటారని చెప్పాను, ఇంకా యేవో చెప్పాను. అర్ధం చెప్పగానే లేచి నా రెండు భుజాలు పట్టుకుని గొంతుపైన ముద్దుపెట్టాడు. విదిలించి కొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. అతనిపై నా భావమేంటి? నా పై అతని భావమేంటి? అతను అందంగా కనిపించడమంటే కామించానని అర్ధమా, విషయాన్ని ప్రేమించడమంటే ఆ సంబంధిత వ్యక్తిని ప్రేమించినట్లా, ఎందుకనో ఏడుపొచ్చింది. కాసేపాగి వచ్చి చూసేసరికి అతను లేడు.

22/10 /2008

కమల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాను. మనసుకేం కావాలో ఏం వద్దో క్లారిటీ లేదు. తను మెసేజ్ పెట్టాడు ”దేవీ నేను చేసింది తప్పని నీకు తోచి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పమంటావా ఐ నీడ్ యు వెరీ బాడ్లీ . అమ్మాయిలేం నాకు కొత్త కాదు. కానీ నువ్వు మాత్రం చాలా కొత్త. మనం ఇప్పుడు కావాలంటే విడిపోదాం, ఒక పదేళ్ళకి కలుద్దాం. అప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు రాదు. నాకు నువ్వు కావాలి. ఇద్దరు పిల్లల తల్లిని ఇలా అడగడం న్యాయం కాదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా, పిల్లల్తో సహా నాతో వచ్చేయగలవా,” అని. మెసేజ్ చదవగానే తలతిరిగింది. ఓటిదో మోటుదో ఒక కుటుంబం వుంది కదా నాకు. దాన్ని వదిలేయమని ఎలా అంటాడు ఇతను. చిరాకేసింది.

28/10/2008

కమల్ నుండి చిన్న పలకరింపు కూడా లేదు. ఏమిటో ఒక చెడ్డ నిశ్శబ్దం. హృదయంలోనూ, భౌతికంగానూ. నేనెందుకీ వత్తిడి భరించాలి. అతనితో మాట్లాడి మందలించేయాలి. అమ్మాయిలు మగవాళ్ళతో  స్వేచ్చగానో, కొంచెం చనువుగానో  ఉండకూడదా.  ఛీ! అయినా నేనేంటి మరీ టిపికల్ విమెన్ లాగా ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుంటున్నాను. తనకీ నాకూ మధ్య ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియనంత చిన్న పిల్లనా? యేరు దాటాక, తుంగ బుర్రలా నాకటువంటి ఉద్దేశం లేదు  అని చెప్పాలా? అది ఆత్మ వంచన కాదా? ఛీ! చిరాగ్గా వుంది ఏవిటో. శశి రేపు వెళిపోతాడు కదా, అప్పుడు పిలవనా. అయినా నేనెందుకు పిలవాలి.

10/11/2008

పిల్లల్ని స్కూల్ లో  వదిలి వస్తుంటే ఎదురుగా వున్నషాపింగ్ మాల్ నుండి వస్తున్నాడు కమల్ . ఒక క్షణం నన్ను చూసి వెళ్ళిపోయాడు. ప్రేమ అన్నాడు కదా ఇదేనన్నమాట ప్రేమ. కోపమొచ్చింది. అతనికి ఫోన్ చేసాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు, కట్ చేసి ఇంటికెళ్ళేసరికి ఇంటిముందు తన కారు.

17/02/2009

దేవస్మిత చెడిపోయింది. మామూలుగా చెడిపోతే పర్లేదు కానీ మనసా వాచా కర్మణా చెడిపోయింది. యెట్లా? రోజు రోజుకీ పెరిగిపోతున్న కాంక్ష.  ఎప్పుడూ తనతోనే వుండాలని, అతనితోనే చచ్చిపోవాలని, ప్రతిసారీ అతనంటాడు నాతో వచ్చేయవా అని. ముందూ వెనుకా ఎవరూ లేని దాన్ని వెళ్ళిపోతేనేం. కానీబాధేస్తుంది. పిల్లల్ని నాలానే చేయాలా? జీవితాంతం వాళ్ళమ్మని తల్చుకుని బాధపడాలా?

22/12/2009

ఇవాళ కమల్ ని శశిధర్ చూశాడు. ఊరికే చూడటం కాదు. నన్ను కమల్ ముందే దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. కమల్ అడ్డమొచ్చాడు, కమల్ నీ కొట్టడం మొదలెట్టాడు. నాకు ఏడుపొచ్చింది కమల్ ని బయటకి నెట్టి  తలుపేసాను. శశిధర్ ముఖం పాలిపోయింది. నాకు  కొంచమన్నా సిగ్గుగానో వెరపుగానో అనిపించలేదు. పైపెచ్చు ఏదో సాధించినట్టు మనసుకి హాయిగా అనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. పిల్లలొచ్చారని తలుపు తీశాను. అతను లేడు.

01/01/2010

శశిధర్ ఒక వారంగా ఇంటికి రాలేదు. ఇవాళే  వచ్చాడు అతను రాలేదని నాకు దిగులు కూడా అనిపించలేదు. కమల్ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాడు వచ్చేయమని. ఈ ఘర్షణ  క్రుంగదీస్తోంది వెళ్ళాలా వద్దా అని. పాప మెడ చుట్టూ చేతులేసి ఎంత మంచి అమ్మ మా అమ్మ అన్నపుడు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళను?

ఈరోజు శశిని చూడగానే చిరాకేసింది. పిల్లలు నిద్రపోయాక నా పక్కన చేరాడు. ఏం నేను చాలలేదా? అమ్మ బుద్ధులు తలెత్తాయా? అంటూ ఏమిటేమిటో అన్నాడు. మీద పడ్డాడు. అది కామమా? ఇంకో మగాడిని ఇష్టపడుతున్నానని తెలిసీ అతనికి నా మీద కామమెలా సాధ్యమయింది? నెట్టినా గిల్లినా కొట్టినా వదలలేదు. ఆశ్చర్యమేసింది. వళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి,”నీకో విషయం చెప్పాలి శసి ఐ స్లెప్ట్ విత్ హిమ్ సో మెనీ టైమ్స్. మన మధ్య ఇక కాపురం అసాధ్యం,” అన్నాను. నిజానికి నాట్ మెనీ  టైమ్స్, కానీ అట్లా చెప్పాలనిపించింది. కమల్ తాకిన శరీరాన్ని ఇతను తాకకూడదనా? ఏమో!  ఏమైనా నేను డ్యుయల్ సిం కార్డ్ మొబైల్ ని కాదు. కర్మ చాలక వేశ్య అయిన అమ్మ కూతురినే కానీ వేశ్యని కాదు. అయినా ఈ లోకంలో వేశ్యలు లేరు. విటులు మాత్రమే వున్నారు. వాళ్ళు కొంతమంది ఆడాళ్ళని ఉపయోగించుకుని వేశ్యలని పేరు పెడతారు. అంతే. ఐ హేట్ మెన్. అతను తలకింద చేతులుంచుకుని అలాగే నగ్నంగా పడుకున్నాడు. అతని నగ్నత్వం జుగుప్స కలిగించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెళ్లి హాల్లో పడుకున్నాను. తెల్లారేసరికి అతనులేడు.

26/01/2010

రెండో తేదీ కమల్ ని పిలిచాను. విషయం వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. రంగులు మారిన అతని ముఖాన్ని చూడగానే నాకు మనసులో నవ్వొచ్చింది. నేను ఇంకా కూడా శశీ భార్యనే. నన్ను తాకడానికి సర్వ హక్కులూ వున్నవాడు అతను. అట్లా కాదు నన్ను తాకనివ్వను అని నేనితనికి చెప్పానా? ఏవిటో చిరాగ్గా వుంది. ”మనం ఫారిన్ కి వెళ్దాం. నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నేను లింగ్విస్ట్ ఎక్సపర్ట్ ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ని,” అన్నాడు. నేను మాట్లాడలేదు. అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను అప్పుడొచ్చాడు శశిధర్. మళ్ళీ గొడవ. నాకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. కమల్ నన్ను బయటకి తీసుకొచ్చాడు. నేను కమల్ తో వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళే బస్సెక్కించమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. నేను కమల్ తో వెళ్లలేదని ఎలా తెలుసుకున్నాడో శశి జయంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. జయంతికి అన్నీ తెలుసు పదిరోజులకు నన్ను తీసుకుని ఇంటికి బయల్దేరింది. నాకసులు క్లారిటీ రావటంలేదు. పిల్లలు ఒకటే గుర్తుకొస్తున్నారు. కమల్ గుర్తుకొస్తున్నాడు. ఊర్లో దిగగానే హోటల్ రూం తీసుకుని కమల్ ని పిలిచాను.జయంతి తో  కలిసి డిన్నర్ కి వెళ్లాం అర్దరాత్రి దాటింది. వస్తూ వున్న దారిలో చీకటి  పూసినట్ట్లున్న చెట్టుకింద కమల్ హట్టాత్తుగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. జయంతి పక్కనే వుంది.  అయినా అన్ని రోజుల ఎడబాటు నన్నతనికి అల్లుకునేట్లు చేసింది. కార్లో జయంతి ముభావంగా కూర్చుంది. మరుసటి రోజు ఇంటికెళ్లాం. శశి, జయంతిని చూడగానే ముఖం దుఃఖంగా పెట్టాడు. పెట్టడమే కాదు అతని కళ్ళలో నీళ్ళొచ్చాయి. జయంతి అతనితో, ”జరిగిందేదో జరిగి పోయింది రెండు  చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. స్మిత నాకు ఎప్పటి నుండో  తెలుసు. తను అలాటిది కాదు. మీరు  కూడా అది అనాధ అని అలుసు తీసుకుని , ఏం చేసినా అడిగే వాళ్ళెవరూ లేరని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. తను జీవితం లో చాలా సఫరయింది ఇంకా ఎంతకని బాధ పడగలదు.  ఇకనైనా బాగుంటే  మంచిది. మీరు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు,” అంది. నేను  అక్కడినుండి లేచి వచ్చేసాను. ఏడుపొచ్చింది. చక్కటి కుటుంబాన్ని గురించి ఎన్ని కలలు  కన్నది తను. జయంతి చెప్పినా ఎవరు చెప్పినా గతం పునరావృతం కాగలదా? శనివారం జయంతి వెళిపోయింది.

8/4/2010

ఇప్పుడు శశి ఇంతకు ముందటిలా కాదు. ఎక్కడికెళ్ళినా పదే పదే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎన్ని సార్లడిగేదో తన, ఫోన్ చెయ్యవా రోజుకోసారన్నా అని. నీకులాగా నాకు పని లేదనుకున్నావా అనేవాడు. ఒక ఎయిర్ హోస్టెస్ గా ఒక పైలెట్ కి ఎంత పని ఉంటుందో తనకి తెలియదా? ఇప్పుడెట్లా సమయం దొరికింది? వెళ్తూ వెళ్తూ వేలకి వేలు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. కమల్ ప్రస్తావన అసలు రానీయడు. ఇది ప్రేమా? ఏమో నాలో ప్రేమ చచ్చిన తరువాత ఇతనిలో ప్రేమ మొదలయినట్లుంది పాపం. కానీ శశీ నీకోసం ఈ మనసు ఎంత తపన పడేదో. కలలొ నువ్వు తాకినా శరీరం పులకరించేది. నువ్వు విమానమెక్కిన ప్రతి సారీ నీకేమయినా అయితేనో అని వణుకొచ్చేది. అట్లా అయితే   గుండాగి చచ్చిపోతానేమో అనుకునేదాన్ని. ఒక వేళ  అట్లా కాకుంటే నీతో పాటూ ఆత్మ హత్య చేసుకుంటాను కానీ నిన్ను వదిలి బ్రతక గలనా అనిపించేది. నిన్ను  పిచ్చిగా ప్రేమించిన దేవస్మితని ఎంత పతనం చేసావు కదా? నా ప్రేమని పిచ్చి పురుగులా కాలికింద వేసి నలిపేసావ్. మళ్ళీ నువ్వు చెప్పినట్లు విని ఇంతకు మునుపులా నీ జీవితంలో ఉండడానికి నేను నువ్వు నడిపే విమానాన్నా శశీ?

24/05/2010

ఇక తనతో వచ్చేయాల్సిందే అన్నాడు కమల్. వెళ్లాలని నాకూ వుంది. శశిధర్ ని ఏం చెయ్యను? అన్నేళ్ళూ అతను నన్ను పెట్టిన హింసంతా ఏమయింది? ఇప్పుడింత సాత్వికంగా ఎలా వుండగలుగుతున్నాడు. అతని నిజ స్వభావం ఏది. ప్చ్! విసుగ్గా వుంది.

12/06/2010

ఈ రోజు కమల్ తో వుండగా అనుకోకుండా శశి వచ్చాడు. మళ్ళీ ఘర్షణ జరుగుతుందేమోనని చిరాకేసింది.  మీ ఇద్దరితో మాట్లాడాలి కూర్చోండి అన్నాను. ఆ క్షణం ఆలోచించేందుకు అవకాశముండి, ఆలోచించి  మాట్లాడి వుంటే ఏం మాట్లాడి ఉండేదాన్నో తెలీదు కానీ అప్పుడు మాత్రం చాలా మామూలుగామ, ”శశీ నాకు మీ ఇద్దరు కావాలి. పిల్లల కోసం, కుటుంబంగా నువ్వు కావాలి. ఎందుకంటె నా పిల్లలు నాలా బాధపడకూడదు. అట్లాగే  నా హృదయంలో హృదయం గా కమల్ కావాలి. నువ్వు లేకున్నా నేను బ్రతకగలను.కమల్ లేకుండా బ్రతకలేను. నేను కావాలని నీకు గాఢం గా  ఉంది కాబట్టి ఒకపని చేద్దాం, నేను ఇద్దరితోనూ ఉంటాను. మీ పెదనాన్నకి వున్న ఇద్దరు భార్యలు సర్దుకుపోయినట్లు మీ ఇద్దరు సర్దుకుపొండి, లేదా నేను కమల్ తో వున్నట్లు నీకు తెలియకపోతే ఎలా వుండేవాడివో అలా తెలియనట్లు వుండిపో. కానీ ఇకపై నన్ను కొట్టడం, తిట్టడం కుదరదు. అలాగే కమల్, నేను శశిధర్ తో వున్నా కూడా నువ్వు నాతో వుంటున్నావ్ కదా, అలానే ఇక మీదట కూడా ఉండు. ఒక ఇల్లు తీసుకో, నేను వస్తూ పోతూ ఉంటాను. ఇకపై నువ్వీ ఇంటికి రాకు. కానీ నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోకూడదు. నాకోసమే ఉండిపోవాలి,” అన్నాను. నా మాట వినగానే కమల్ లేచి నా వైపు కూడా చూడకుండా వెళిపోయాడు. శశిధర్ సరేననో,  కాదనో చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నేనొక్కదాన్నే గదిలో మిగిలిపోయాను.

2/8/2012

నాలుగు దిక్కులూ
నేనే అయిన ఏకాంతంలో
నీ జ్ఞాపకాల బురదలో
దిగులు కమలం పూస్తుంది.
ఒక నాలో ఇంకో నేను
నా రహస్య దుఃఖాన్ని ఓదార్చుకుంటాను
దుఃఖాన్నీ నేనే
ఓదార్పునీ నేనే అయిన
దిగులు దారుల ప్రయాణంలో
జీవితం
తిరిగి తిరిగీ చిగురించే
వసంతం కానందుకు ఆనందం వేస్తుంది.
ఎంత దూరం నడిచినా
దారీ తెన్నూ దొరకనీయని
నిశ్చయ నిష్ఫల స్వప్నం
నీవు .
అయినా ఎదురుచూపును
వదులుకోదు మనసు, ఎందుకనో!
నువ్వు నాకోసం
దుఃఖాన్ని మాత్రమే కేటాయించావని
తెలిసి పోయాక
సందేహం కలుగుతుంది.
ప్రియ పురుషుడా!
నేను దేన్ని ప్రేమిస్తున్నాను
నిన్నా??? దుఃఖాన్నా????

“నాకు American Way of Life బొత్తిగా నచ్చడం లేదు”

చికాగో  14 – 7 – 95

Dear Narendra,

క్షేమం.

ఫోనుపైన మాట్లాడుతూనే వున్నా వివరాలన్నీ చెప్పడం సాధ్యం కాలేదు. హైదరాబాదుకు ఫోన్ చేసి మీ మామగారితోనూ, దామల చెరువుకు ఫోన్ చేసి సాంబమూర్తితోనూ మాట్లాడాను. ఈ దేశంలో R.S.సుదర్శనంగారితోనూ, దాక్షాయణి దంపతులతోనూ, సిన్‌సినాటీలోని రోజాతోనూ మాట్లాడాను. న్యూయార్కు పరిసరాల్లో వున్న కిశోర్ ఎట్లాగో నంబరు తెలుసుకుని నన్ను కలిశారు. ఎటొచ్చి నైవేలీలోనూ, పలమనేరులోనూ టెలిఫోన్ సంబంధాలు నెట్టుకురానీకి వీల్లేకపోయింది. ఈ రోజు ఉదయం చిత్తూరునుంచి ఫోన్ చేసి మహి, గీత మాట్లాడారు. ఎలా బెంగపడుతు వుందో ఏమో. మీ అమ్మతో మాట్లాడి వుంటే బాగుండేది.

మద్రాసు ఎయిర్‌పోర్టులో మీరు అద్దాలకటు వైపునుండి వీడ్కోలు చెబుతూ వుంటే నా తొందరలో పరిగెత్తవలసి వచ్చింది. అవతల నా లగేజి, టికెట్టు కౌంటర్‌లోని అమ్మాయి దగ్గర వున్నాయి. నేను స్టేట్ బ్యాంకు కౌంటర్ దగ్గరకు వెళ్లి రూ.300/- ట్రావెల్ టాక్స్ కట్టి రసీదు తీసుకొస్తున్నాను. ఆ కౌంటర్ దగ్గరే  పులికంటి కృష్ణారెడ్డి కలిశారు. మేమెక్కిన విమానం ఉదయం 4.30 గంటల  ప్రాంతంలో డిల్లీలో దిగాం. అక్కడ  2 గంటల విరామం. అక్కడి ఏర్‌పోర్టులో చాలా పెద్దదైన బోయింగ్ విమానం ఎక్కించారు. అందులో 400 మంది ప్రయాణీకులుంటారు. ఆహార పానీయాదులకు కొరత లేదు. నేను sweets తినకూడదు కనుక నా ఆహారం పరిమితమైపోయింది. అయినా ఫరవాలేదు. 29 సాయంకాలము  3 గంటలకు డిల్లీ చేరుకున్నాము.

అక్కడ మళ్ళీ రెండు గంటల విరామం. న్యూయార్కు 8 గంటల ప్రయాణం. అయితే న్యూయార్కులో దిగినపుడు తేదీ మారలేదు. చీకటి మారలేదు. అక్కడ అప్పుడు సాయంకాలం 4 గంటలు అయింది.  మా టికెట్టు ఆ విమానంలో న్యూయార్కు వరకే. అందువల్ల 4 గంటల పాటు ఆగవలసి వచ్చింది. బాపు, జగ్గయ్యగార్లతో కలిసి మాకు తానా కార్యకర్తలు అక్కడ మాత్రం ఓ యింట్లో వంటల ఏర్పాటు చేశారు. స్నానం, భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి 9 గంటలకు విమానమెక్కించారు. రాత్రి 11 గంటలకు చికాగో చేరుకున్నాము.

సభా నిర్వాహకులు విమానాశ్రయంలో కలిసి దగ్గర్లోనే వున్న HYAT హోటలుకు తీసుకెళ్ళారు. అది పదంతస్తుల కట్టడం. వందలకొద్ది గదులున్నాయి. సభలకు ఈ దేశంలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు 7 లేక 8 వేలమంది వచ్చారు. బయటినుంచి వచ్చినవాళ్లందరికీ బసలు ఏర్పాటు చేశారు. మన దేశం నుండి దాదాపు వందమంది తానా ఆహ్వానితులు వచ్చినట్టున్నారు. సదాశివరావు, లవణం, ఇస్మాయిల్, చలసాని ప్రసాదరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొదలైన తెలుగువారు కలిశారు. జులై 1, 2, 3, తానా సభలు.నాలుగు రోజులపాటు హోటల్లో వున్నాము.

రెండురోజుల్లో ఉదయం ఉపాహారలు మాత్రం చేసి హోటల్లో బస చేయవలసి వచ్చింది. డా.రాశీ చంద్రలత, డా.సుబ్బారెడ్డి దంపతులది కడపజిల్లా. సభలు జరిగిన రోజుల్లో మాత్రమే మేము అందరితో కల్సి హోటల్లో భోజనం చేశాము. ఒక్కసారిగా 7, 8 వేలమంది ఒకే చోట కూర్చుని భోజనం చేయడం అపురూపమైన సన్నివేశం. ‘తానా’ సభల నిర్వాహకులు ఎంతో ఉదారంగా సర్వ సదుపాయాలు సమకూర్చారు. వేర్వేరు హాల్సులో సాహిత్య, సాంఘిక,  స్త్రీ ఉద్యమ సమావేశాలు జరిగాయి.

కొంతదూరంలోని పెద్ద గుళ్ళో సంగీత, నాట్య కార్యక్రమాలు జరిగాయి. ఒక సాహితీ సభలో నేను, కృష్ణారెడ్డి, మేడసాని మోహన్ పాల్గొన్నాము. విష్ణు, జాషువా, బాపిరాజుల వర్ధంతి సభలు జరిగాయి. మునుపటి సభల్లో కన్నా ఈ సభల్లో ఏర్పాటైన కార్యక్రమాలు బాగున్నట్టు చెప్పుకున్నారు. మమ్మల్ని యిక్కడికి ఆహ్వానించిన డా.రాణీసంయుక్త, డా. కట్టమంచి ఉమాపతి సంతృప్తి పొందగలిగారు. సభలు పూర్తయిన మరునాటినుంచి మా బస సంయుక్తగారి యింట్లోనే, 4,5 తేదీల్లో లవణంగారు కూడా మాతోబాటుగా యిక్కడే వున్నారు.

5వ తేదీ సయంకాలం గ్రేటర్ చికాగోలోని రామాలయంలోని  బేస్‌మెంటులో నాస్తికవాద ప్రవక్త లవణంగారు సత్యాహింసల గురించి  ప్రసంగించారు. సభలో మేడసాని మోహన్, ((నేలబర్కవము)), S.V.రామారావు (సుప్రసిద్ధ చిత్రకారులు, చికాగో వాస్తవ్యులు) పాల్గొన్నారు. నాలుగైదు సార్లు డౌన్‌టౌన్‌లోని రద్దీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి ఆకాశ హర్మ్యాలను చూపించారు. వివేకానందుడు ఉపన్యసించిన భవనం అక్కడే వుంది. C.S.టవర్ అనే 110 అంతస్థుల భవనాన్ని ఎక్కి, విశాల షికాగో నగరాన్ని చూచాము. ఈ నగరానికంతా నీళ్లు సరఫరా చేసే మిచిగన్ మహా సరస్సు వుంది. మరొకరోజు గ్రహాంతర పరిశోధనల మ్యూజియం, ప్లానిటోరియం చూశాము.

ఆ రెండు రోజుల్లోను మధ్యాహ్నాల్లో ఒకరోజు ఇటలీ హోటల్లో పిజ్జా, ఇంకొకరోజు చైనా హోటల్లో వాళ్ళ తిండి భోంచేసాము. ఈలోగా ఒక రోజు డాక్టరుగారింట్లో  నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి Blood Sugar చేక్ చేయించారు. 121 మాత్రమే వుంది. ఒకసారి సాయంకాలం కట్టమంచి వారి యింటికి వెళ్లి భోజనానికి పిల్చాము. ఒక యింటికి, మరొక యింటికి, యిళ్ళకు, బళ్లకూ, కార్యాలయాలకు మధ్య 20,25 మైళ్ల దూరముండడం యిక్కడ సామాన్యమైన విషయం. హోటల్లో వుండగానే శ్రీధర్‌కు ఫోన్ చేశాను. కలుపుగోలుగా వుండి యిక్కడివారిలో కలిసిపోయారు.

ఆదివారం నాడు రెండు కార్లలో విస్కాన్సిన్ వెళ్ళాము. ఆ నగరం ఒక పెద్ద పర్యాటక కేంద్రం. దాన్ని ఒరుసుకుని పారే నదిలోని ఒక జలాశయంలో రకరకాల సర్కస్ విన్యాసాలు జరుగుతాయి. నదిలో తొమ్మిదిమైళ్ల స్టీమరు లాంచీ ప్రయాణం. ప్రాచీన రెడ్ ఇండియన్ల గుహలు నదీతీరంలోని కొండల్లో కానవస్తాయి. 30 నుంచి ఈనాటివరకు గృహస్థులందరూ ఉద్యోగులు కావడంవల్ల పగటివేళ  దాదాపుగా అందరం ఇంట్లో వుంటున్నాము.

విష్ణు, వీణ అని వీరి ఇద్దరు పిల్లలు. వాళ్లు యింట్లో వుండడమే అబ్బురం.ఈ నగరంలో యిళ్లు దూర దూరంగా వుంటాయి. ఇరుగుపొరుగు అన్న ప్రసక్తే వుండదు. ఎక్కడో Busy Placesలో తప్ప పాదచారులే కనిపించలేదు. కార్లు, ఫోనులు లేకపోతే నగర జీవితం లేదు. ఈ ఇంట్లో వున్నవారు నలుగురు, ఉన్న కార్లు మూడు. ఈ పరిమితి వల్ల బయటకు వెళ్తే పార్కింగ్ ప్లేసులు దొరకడమే పెద్ద సమస్య.

ఇద్దరు ముగ్గురు కల్సి వచ్చిన కారులో వచ్చిన కత్తిరించి 475 డాలర్లకి బిల్లు వేశారు (475 x 32) ప్రతి వస్తువు గిరాకీగానే  వుంటుంది. కిలో చిక్కుడుకాయలు 6 డాలర్లు (32 x 6= రూ.192)సంపాదనలాగే వీళ్లకు ఖర్చు కూడా ఎక్కువే. సిన్‌సినాటి నుండి రాజా ఫోన్ చేసి తనకు పైసలు చాలడం లేదని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనవాళ్లకు ఈ దేశం పైన యింత వ్యామోహమెందుకో బోధపడడం లేదు.

నాకు American Way of LIfe బొత్తిగా నచ్చడం లేదు. కార్లకు హారన్లుండవు, ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూయబడి వుంటాయి. ఇంట్లో మనుషులున్నారో లేదో బోధపడదు. ఈ ప్రశాంతికి, క్రమబద్ధతకు మనం అలవాటు పడడం చాలా కష్టం. సరే అదంతా అలా వుంచితే వారంలో 5 రోజులు ఏకాగ్రతతో పని చేస్తారు గనుక వీళ్లకు weekendలో మాత్రమే విరామం. అందువల్ల మేము శని ఆదివారాల కోసం వేచి చూస్తు మిగతా 5 రోజులు ఏకాంత గృహంలో చదువుకుంటూనో, నిద్రపోతు, ఫోన్‌కాల్స్‌కు జవాబు ఇస్తూ గడపాలి.

కట్టమంచి ఉమాపతిరెడ్డిగారు గొప్ప గడుసరి వారు. మేము 60లలో సంపాదించాము. పెద్ద పెద్ద యిళ్లు కట్టుకున్నాము. మీరు ఏ గదిలోనైనా వుండొచ్చు. తొందరేముంది? మీరు  మీ దేశం వెళ్లి చెయాల్సిన అర్జంటు పనులేమున్నాయి. ఏవైనా రాయదల్చుకునే యిక్కడే రాసుకోండి. అని మోగమాట పెడుతున్నారు. చివరికలా కుదరదని, తిరుగు ప్రయాణానికి ఒక తేదీ నిర్ణయించుకుని కార్యక్రమాలన్నింటిని ఆ మేరకు ఏర్పాటు చేసుకోవడం బాగుంటుందని తెలియచెప్పుకున్న తర్వాత ఒక ప్లాను తయారు చేశారు.  15,16 తేదీలలో ఒహియో రాష్ట్రంలోని can bush, కడప సుబ్బారాయుడుగారు  డాక్టరు (శతావధాని సి.వి.సుబ్బన్నగారి తమ్ముడు) కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.. 20 నుండి 24 దాకా హూస్టన్, డల్లాస్ నగరాలు, 26న మళ్లీ యిక్కడే సభా కార్యక్రమం యింతవరకు ఏర్పాటయింది.

ఈలోగా తలవని తలంపుగా న్యూయార్క్ దగ్గరగా వున్న న్యూజెర్సీనుంచి ఒక ఫోను కాల్ వచ్చింది.  ఆయన పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ. న్యూజెర్సీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు. ఆయన చిరకాలంగా నా కథలు చదువుతున్నారట. ఎంతో ఆప్యాయంగా పలకరించి న్యూజెర్సీకి ఆహ్వానించారు.

మాకు నయాగరా చూడాలని వుందంటే డెట్రాయిట్‌లోని తన మిత్రునికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు. దాని ప్రకారం మేము 27న డెట్రాయిట్ వెళ్లాలి. 28న అక్కడే వుండాలి.29 శనివారం నయాగరా చూపిస్తారు. 30 ఆదివారం న్యూయార్క్ చేరుకోవాలి.  అక్కడ సత్యనారాయణగారు రిసీవ్ చేసుకుంటారు. సుదర్శనం, దాక్షాయిణి, కిశోర్ గార్లను కలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారాంతంలో తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకుని న్యూయార్కునుంచి విమానంలో సీట్లు రిజర్వు చేయించుకోవాలి.

ఈ వారంలో సుబ్బారెడ్డిగారు నన్ను వేర్వేరు హాస్పిటల్స్ తీసుకెళ్లి రక్త పరీక్ష, నేత్ర పరీక్ష చెయించారు. రక్తపరీక్ష రిపోర్తు వచ్చింది. ఫలితాలు తృప్తికరంగా వున్నాయని చెప్పారు. నేత్ర పరీక్ష చేసిన డా. చిత్ర.వి.నడింపల్లిగారు ఇల్లిందల సరస్వతీదేవిగారి కూతురట. ఈమె అత్తగారిల్లు తిరుపతి. డాక్టరు వి.రామకృష్ణ అని ప్రసిద్ధ నేత్ర వైద్యులుండేవారు. ఈమె ఆయన కోడలు.ఎంతో శ్రద్ధగా పరీక్షలు చేసి Prescription యిచ్చింది. అద్దాలు తిరుపతిలోనే కొనుక్కోమంది. ఇవీ విశేషాలు. కొనుక్కో దలచిన వస్తువులు కోసం Departmental Stores అన్నీ తిరుగుతున్నాము. వంద డాలర్లు పెడితే గాని మంచి  కెమెరా వచ్చేటట్టు తోచదు. వంద డాలర్లు  అంటే 3200 రూ గదా. అట్లాగే మిగిలిన వస్తువులన్నీ, బాగా తెలిసినవాళ్లని తీసుకెళ్లి ఏమైనా కొనుక్కోవాలి. ఈ మధ్య నైవేలికి, పలమనేరుకు కూడా జాబు రాశాను. అయితే యింత వివరంగా రాయలేదు.  నువ్వు జిరాక్సు తీసి పంపిస్తే వాళ్లు సంతోషిస్తారు. లతకు ఆశీస్సులు.  రాసాని దంపతుల్ని అడిగినట్టు చెప్పు. అల్లాగే జాన్, భాస్కర రెడ్డి యింకా మనవాళ్లందరినీ అడినట్లు చెప్పు.

శుభాకాంక్షలతో

రాజారాం గారి ఏకలవ్య శిష్యుడ్ని: డా. కేశవరెడ్డి

naanna2

( ఏప్రిల్ 1, మధురాంతకం రాజారాం గారి వర్థంతి సందర్భంగా )

“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో ఎంతో కొంత నిలదొక్కుకోగలిగినానంటే దానికి రాజారాంగారే కారణం. నేను మొట్టమొదట చూసిన, మాట్లాడిన రచయిత రాజారాంగారే. మొట్టమొదట చదివిన పాఠ్యేతర పుస్తకం రాజారాంగారి కథల పుస్తకాలే. వారిది మా పొరుగు గ్రామము కావడమే అందుకు కారణం.

రాజారాంగారిది, మా అమ్మగారు పుట్టిన ఊరు ఒకటే. అది చానా చిన్న పల్లెటూరు. నా చిన్నతనంలో మా అమ్మగారితో పాటు చాలా సార్లు ఆ ఊరికి వెళ్ళుతుండేవాడిని. మావాళ్లు చెప్పేవాళ్లు, “అద్దో ఆయనే రాజారాం అయ్యవారు. ఆయన కథలు రాస్తాడు,” అని. ఆయన ఆడ్డపంచ కట్టుకొని భుజంపైన కండువా వేసుకొని వీధి వెంబడి నడిచి వెళుతూ ఉంటే నేను పిట్టగోడమీద కూర్చొని చూస్తుండేవాడిని. అలా కొంతకాలం అయ్యాక, నాకొక ఐడియా వచ్చింది. ఇలా ఒక మారుమూల పల్లెటూల్లో పుట్టి పెరిగిన ఒక మనిషి కథలు రాయగా అదే నేపథ్యం కలిగిన నేను రాయలేనా? అని ఆలోచించాను.

ఇంతకీ ఆయన రచనలు ఎలా ఉంటాయి? వెంటనే వారి కథా సంపుటాలు రెండింటిని సంపాదించాను. తాను వెలిగించిన దీపాలు, కమ్మతెమ్మర అనే రెండు సంపుటాలను సంపాదించి చదివాను. అవే నేను మొట్టమొడట చదివిన పాఠ్యేతర పుస్తకాలు. ఒక్కొక్క కథను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చదివీ చదివీ వాటిలో ప్రతి వాఖ్యమూ కంఠతా వచ్చేసింది. ఆ కథల ద్వారా ఎంత ప్రభావితుడనయ్యానంటే నా తొలి రచనలలో రాజారాంగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అవే పదబంధాలు, అవే వాక్యనిర్మాణం. అలా కొన్ని కథలు రాసాను. ఆ తర్వాత నవలలు వ్రాయడం ప్రారంభించాను.

చదువుల నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, పాండిచ్చేరిలో గాని, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్లినా రాజారాంగారిని కలవకుండా తిరిగి వచ్చేవాడిని కాదు. కల్సినప్పుడల్లా ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం, కాని సాహిత్య మర్మాలను గురించి నేను ఎప్పుడూ అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆయన నాకొక గొప్ప ప్రేరణ ఇచ్చారు. సాధకుడిని నేనే.

ఆనాడు ఏకలవ్యుడు చేసింది ఇదే. ఏకలవ్యుడు గొప్ప విలుకాడు. కాని ద్రోణాచార్యుడు అడివికి వెళ్ళి అతనికి విలువిద్య నేర్పలేదు. అతనొక ప్రేరణ ఇచ్చాడు. అంతే సాధకుడు ఏకలవ్యుడే. బమ్మెర పోతన “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట,” అన్నాడు. అతడు తన భక్తి పారవశ్యంలో అలా అని ఉండవచ్చు కాని.. రామభద్రుడు దిగివచ్చి ఒంటిమెట్ట గ్రామానికి వెళ్ళి పోతనకు వ్యాకరణము, ఛందస్సు నేర్పలేదు. అతడొక ప్రేరణ ఇచ్చాడు. సాధకుడు పోతనామాత్యుడే. సాహిత్యం అత్యంత బౌద్ధికమైన ప్రక్రియ. ఇదొక ముక్తి మార్గము. దీనిని ఎవరూ ఎవరికీ నేర్పించలేదు. ఎవరికి వారు సాధన చేసి నేర్చుకోవలసిందే. అయితే ప్రతి రచయితకు ఏదో ఒక దశలో ఒక వ్యక్తి ప్రేరణగా నిలుస్తాడు. అలా నాకు ప్రేరణ ఇచ్చిన మధురాంతకం రాజారాంగారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్Edari Varsham-2 (edited)యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా ఎల్లలులేని విధంగా ఉంటుంది. పాఠకుడికి-రచయితకూ మధ్య ఉన్న అప్రకటిత నిశ్శబ్ధ అనుబంధం లాంటి జంట సంభాషణలాగా గడిచిపోతుంది. కానీ సినిమా అలాకాదు. అదొక పరిమితమైన దృశ్య మాధ్యమం. దానికి ఫ్రేములుంటాయి. సింటాక్స్ పరిథి ఉంటుంది. ఎల్లలు చాలా ఉంటాయ్. నటీనటులు, లొకేషన్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, బడ్జెట్ ఇలా  పరిమితులు చాలా అధికంగా ఉంటాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీలైనంత అధిగమిస్తూ, రచయిత ఇచ్చిన కథలోంచీ ఒక అంగీకారాత్మక భాష్యాన్ని స్క్రీన్-ప్లే గా కుదించి సినిమాగా తియ్యాలి. కొన్ని కొన్ని సార్లు సినిమా కథకన్నా గొప్పగా తయారవ్వొచ్చు. ఒక్కోసారి కథకన్నా వేరేగానూ తయారు కావచ్చు. చాలా వరకూ కూసింత కథ చదివిన పాఠకుడిని, సినిమా చూసే ప్రేక్షకుడినీ నిరాశపరచొచ్చు. దీనికి గల కారణాలు మాధ్యమాల మార్పు కొంత అయితే, రచనని విజువల్ లాంగ్వేజ్ లోకి మార్చలేని ఫిల్మ్ మేకర్స్ విజన్ కొరత మరింత.

సత్యజిత్ రే లాంటి ఫిల్మ్ మేకర్ బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవలను  పథేర్ పాంచాలి గా తీసినప్పుడు “అబ్బే నవల లాగా లేదు” అన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి సమాధానంగా సత్యజిత్ రే భాషాపరమైన లేదా రచనపరమైన సింటాక్స్ కి ,సినిమాటిక్ లాంగ్వేజ్ కీ మధ్య తేడాలను ఉంటంకిస్తూ పెద్ద వ్యాసమే రాయాల్సి వచ్చింది. అయినా తిట్టేవాళ్ళు తిట్టారు, అర్థం చేసుకున్నవాళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ అటు నవల ,ఇటు సినిమా రెండూ క్లాసిక్స్ గా మనం చదువుతున్నాం, చూస్తున్నాం. అందరూ సత్యజిత్ రేలు కాకపోయినా, సాహిత్యం నుంచీ సినిమాతీసే అందరు ఫిల్మ్ మేకర్స్ ఫేస్ చేసే సమస్యే ఇది.

తెలుగు ఇండిపెండెంట్ సినిమా గ్రూప్ సాహిత్యం నుంచీ కథను ఎన్నుకుని లఘుచిత్రం చేద్దాము అనుకున్నప్పుడు మొదట ప్రతిపాదించబడ్డ కథల్లో చలం, బుచ్చిబాబు, తిలక్ కథలు ఉన్నాయి. రిసోర్సెస్ పరంగా మాకున్న లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని కొద్ది పాత్రలతో మానవీయ కోణాన్ని ఆ రచయిత గొప్పతనాన్ని షోకేస్ చెయ్యగల కథకోసం వెతకగా ఫైనల్ చేసిన కథ “ఊరిచివర ఇల్లు”. కథని యథాతథం గా  తీద్దామా, అడాప్ట్ చేసుకుందామా అనే ప్రశ్న అస్సలు ఉదయించలేదు. ఎందుకంటే స్క్రీన్-ప్లే అనేది అనుసరణే అవుతుంది తప్ప కథానువాదం కానేరదు. నాతోపాటూ మరో ముగ్గురు రచయితలు వారి వారి వర్షన్స్ లో స్క్రీన్-ప్లే రాశారు. గ్రూప్ గా స్క్రీన్ ప్లే మీద చర్చ జరిగినప్పుడు నా వర్షన్ ని సినిమా తియ్యడానికి ఎంచుకోవడం జరిగింది.

“ఊరిచివరి ఇల్లు” కథ జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథ.

తిలక్ “ఊరిచివరి ఇల్లు” కథని అడాప్ట్ చేసుకుని  రాస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే రచయితగా నాకు మూడు విషయాలు పొసగలేదు. ఒకటి, రమ జగన్నాథానికి తనకు ప్రేమలో జరిగిన దురదృష్టం, ఆతర్వాత నమ్మిన పెద్దమనిషి చేసిన మోసం, ఇప్పుడు అవ్వ పంచన బ్రతుకుతున్న వైనం చెప్పేస్తే రమ ఒక వేశ్య అనే విషయం ఆల్రెడీ సజెస్ట్ అయిపోయిన భావన కలుగుతోంది. ముఖ్యంగా రమ పాత్రలోని సంశయం, మాటిమాటికీ రమ జగన్నాథం తో(సినిమాలో శేఖరం అయ్యాడు) ‘ఇంకేమీ అడక్కండీ’ అంటూ ఏడవటం చాలావరకూ ‘giving away’ ఫీలింగునే కలిగించాయి. పైగా కథాకాలం ప్రకారం చూస్తే ఆరంభంలో వచ్చే ఇంటి సెటప్ వర్ణన ‘సానెకొంప’ అనే విషయాన్ని అన్యాపదేశంగా రచయిత సజెస్ట్ చేసిన భావన కలిగింది. ఇలా రివీల్ అయిపోతే జగన్నాథం షాక్ కి విలువ తగ్గిపోతుంది. అంతేకాక దాన్ని విజువల్ గా చూపించాలంటే లాంగ్ షాట్లో వర్షం కురుస్తుండగా ఇంటిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి. అది కొంచెం కష్టమే అనిపించింది.  కాబట్టి తండ్రి గురించి చెప్పే విషయాలనుంచీ పెద్దమనిషి చేసిన మోసం వరకూ కొంత కన్సీల్ చేసేస్తే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగా ఉంటుందనిపించి దాన్ని తీసేశాను. షూటింగ్ సౌలభ్యం కోసం వర్షం ఎఫెక్ట్ లో ఉన్న ఇంటి ఇంటీరియర్లో ఆరంభపు సీన్ కానిచ్చేశాను.

రెండోది రమ-జగన్నాథం లు ఆ రాత్రి ప్రేమించుకున్నారా లేదా అనేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటం, ప్రేమను తెలుపుకోవడం వరకూ చాలా క్లియర్గా కథలో ఉంది. కానీ ఇద్దరిమధ్యా భౌతికమైన కలయిక జరిగినట్టు కథలో సజెస్ట్ చేశారని నాకు అనిపించిందేతప్ప జరిగినట్టు ఖచ్చితంగా చెప్పలేము. జగన్నాథం అవ్వమాటలకు అంతగా గాయపడాలన్నా, రమ తనని అంతగా మోసం చేసిందని అనుకోవాలన్నా,‘అమ్మాయి అంతగా నచ్చిందా’ అని అవ్వ ప్రశ్నించాలన్నా వీటన్నిటీకీ ఒక బలమైన ఫౌండేషన్ కావాలి. అది కేవలం ప్రేమ వెలిబుచ్చుకుంటే రాదు. ప్రేమించుకుంటేనే (through making love) వస్తుంది. తిలక్ గారు కూడా ఒక దగ్గర రమకు ఆవరించిన ఆవేశాన్ని, కమ్మిన మైకాన్ని గురించి చెబుతూ తన సెక్సువల్ అగ్రెషన్ ని చూపిస్తాడు. రమ ముద్దులు పెడుతుంటే ఊపిరాడక జగన్నాథం చేత “అబ్బ వదులు-వదులు రమా” అనిపించాడు. ఆ తరువాత రమ తయారైన తీరు గురించి వర్ణన, ఆపైన ఇద్దరి మధ్యా నడిచే రొమాన్స్ చెప్పకనే వారి కలయిక గురించి సజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా “ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సుయొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెలుచుకుంటూన్నట్టనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్టు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి వెయ్యిరేకుల పద్మంలా విరిసింది” అనే వాక్యాలు ఎంత బలీయంగా సెక్సువల్ రెఫరెన్సెస్ అనిపిస్తాయి అనడం నా interpretation కి మూలం. అందుకే స్క్రీన్ ప్లే లో నేను లిబర్టీ తీసుకుని వాళ్ళమధ్య ప్రేమ జరిగినట్టు రాశాను. ఒక పాటనేపధ్యంలో వాళ్ల మధ్య రొమాన్స్ కూడా తీశాం.

తిలక్ గారి మనవరాలు నిషాంతి ఒక నటి. ఎల్.బి.డబ్లు అనే తెలుగు సినిమాలో నటించింది. రమ పాత్రను తనైతే బాగుంటుంది, పైగా తిలక్ కథలో తిలక్ మనవరాలు నటిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అడగటం, స్క్రిప్టు పంపడం, చర్చించడం జరిగింది. తను కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయింది. కానీ స్క్రిప్టు చదివాక తను అన్న మాట “మీరు తిలక్ కథకి చలం స్క్రీన్ ప్లే రాశారనిపించింది” అని. బహుశా అది నేను చేసిన ఈ మార్పుని ఉద్దేశించో లేక నేను చెప్పబోయే మరో మార్పు గురించో మాత్రం తెలియలేదు. కాస్త సంతోషంగా మాత్రం అనిపించింది.

అవ్వ లేనిపోని అపోహల్ని జగన్నాథం లో కల్పించడం, నిద్రపోతున్న రమకు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా జగన్నాథం పర్సు పరుపు మీద పడేసి వెళ్ళిపోవడం. నిద్రలేచి విషయం తెలుసుకున్న రమ పర్సుపట్టుకుని పరుగెత్తడం. కదులుతున్న ట్రైన్ లో ఉన్న జగన్నాథానికి పర్సు అందించడం. ఆ పర్సులో చూసుకున్న జగన్నాథం డబ్బులు అన్నీ ఉండి కేవలం తన ఫోటో లేకపోవడం తరువాత కథలో జరిగే పరిణామాలు. ఫోటోలేని పర్సుని చూసి జగన్నాథం రమ డబ్బుకోసం తనని మోసం చెయ్యలేదు అనే గ్రహింపుకు వస్తే, ఇమ్మీడియట్ గా చైన్ అన్నా లాగి బండిని ఆపెయ్యాలి లేదా తరువాతి స్టేషన్లో దిగన్నా రావాలి. కథలోలాగా ఆ పాయింట్లో ముగిస్తే సినిమా చాలా అసంపూర్ణంగా ఉంటుంది. పైగా, ముసలిది చెప్పిన కొన్ని అబద్ధాల్ని నమ్మి ప్రేమించానని కన్ఫెస్ చేసిన ఇతగాడు, నిద్రపోతున్న రమని లేపి కనీసం “ఎందుకిలా మోసం చేశావ్” అని ప్రశ్నించకుండా అనుమానపడి పర్సు పరుపుమీద పడేసి వెళ్ళిపోతాడు. అట్లాటోడు తిరిగొస్తేమాత్రం రమకు ఏమిటి సుఖం? ఎంతవరకూ అలాంటివాడి ప్రేమ నిలబడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే శేఖరం(జగన్నాథం) పాత్రని అప్రస్తుతం చేసి (కనీసం చూపించనైనా చూపించకుండా) రమ- శేఖరం కోసం ట్రెయిన్ వెంబడి పరుగులెత్తి అలసి సొలసి ప్లాట్ ఫాం మీద పడిపోవడంతో ముగించి చివరగా “జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. ఏం కోల్పోయామో ఎప్పటికీ తెలుసుకోలేని వాళ్ళు శాపగ్రస్తులు” అంటూ శేఖరం ని శాపగ్రస్తుడిని చేసి వదిలేశాను. కథను అభిమానించిన చాలా మందికి ఈ ముగింపు నచ్చలేదు. కథలో ఉన్న హెవీనెస్ ఫిల్మ్ లో రాలేదన్నారు. అలా అన్న కొందరికి నేను చెప్పిన సమాధానం “ఒక ఫెమినిస్టుగా ఆ ముగింపు నాకు నచ్చలేదు. అందుకే కొంత మార్చాను” అని.

ఛివరిగా శీర్షిక గురించి. స్క్రిప్టు మొత్తం రాసేసరికీ కథ ధృక్కోణం తిలక్ గారి కథలోలాగా కాకుండా వేరేగా కనిపించడం మొదలయ్యింది. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథలాగా కాకుండా, వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలాంటి రమ జీవితంలో శేఖర్/జగన్నాథం ఒక తొలకరిజల్లులా కురిసి కనీసం తడి ఆనవాలు కూడా లేకుండా ఇగిరిపోయి, రమను మళ్ళీ ప్రేమకోసం అలమటించేలా వదిలేసిన ఒక శాపగ్రస్తుడి కథలాగా అనిపించింది. ఇందులో జరిగిన ఘటన ప్రముఖం. రమ ప్రేమ అనిర్వచనీయం. ఉన్నతం. శేఖరం ఉనికి అంత ఉదాత్తమైన ప్రేమకు అర్హం కాని దయనీయం. అందుకే లఘుచిత్రం “ఎడారి వర్షం” అయ్యింది.

STORY

FILM
Part1

Part 2

కలయో! వైష్ణవ మాయయో!

rekklagurram-1ఆయన యింత పని చేస్తారని కలలో కూడా వూహించలేదు.

ఇంతకు ఎవరాయన? ఏమిటా పని?

ఆయన మా తాతగారు.

అంటే మా అమ్మనాన్న..  సంస్కృతంలో మాతామహులు.

నేను మనవణ్ణి. దేవభాషలో దౌహిత్రుణ్ణి. మా తాతగారికి ఆరుగురూ ఆడపిల్లలే. లేటు వయసులో ఆయనకు వంశం నిలుపుకోవాలనే ఆలోచన వచ్చింది. నేను మూడో అమ్మాయి రెండో అబ్బాయిని.వాడిని దత్తత తీసుకొని మీరు అనుకున్నట్టు వంశం నిలుపుకోండని అంతా సలహా యిచ్చారు. నాకు హరిశ్చంద్ర నాటకంలో పద్యం జ్ఞాపకం వచ్చేది. “వంశం నిలపనేకద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణ..” అని దీర్ఘంగా సాగేది.

నాకప్పుడు పదహారు వెళ్లి పదిహేడు వచ్చింది గాని డిగ్రీ ఫస్టియర్‌లోంచి సెకండియర్‌లో పడలేదు. మా నాన్నమ్మ ససేమిరా,మాకు మాత్రం ఏనూరుగురున్నారని మా యింటి దీపాన్నివ్వడం,పైగా వాడేమన్నా పనికిమాలినవాడా? అని అడ్డంగా తల ఊపారు.

నాకు మాత్రం వుత్సాహంగానే వుంది. హాయిగా వడ్డించిన విస్తరాకులా ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా, కాలం చేసిన అమ్మమ్మ నగా నట్రా, నల్లమానుతో చేసిన పందిరి పట్టెమంచం యిలా బోలెడు హంగామాకి యజమానిని అయిపోవడం తమాషా కాదు. పోనీ బరువులెత్తాలా అంటే అదీ లేదు. కాకపోతే వంశం నిలపాలి. మరి కొన్ని హక్కులున్నప్పుడు కొన్ని బాధ్యతలు తప్పవు కదా. దత్తత స్వీకారోత్సవం అయిపోయింది.

చదువు జ్ఞానానికే గాని ధనార్జనకి కాదని నాకు తెలిసిన మరుక్షణం చదువుకి స్వస్తి చెప్పాను. తాతగారు కొన్నాళ్ళుండి వెళ్ళిపోయారు. ఆయన దైవభక్తుడు, దేశభక్తుడు. క్విట్ ఇండియా వుద్యమంలో బంగారం లాంటి వుద్యోగాన్ని,వుద్యోగరీత్యా సంక్రమించిన జట్కాబండిని త్యజించారని చెప్పుకునేవారు. అదేం కాదు ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి పెళ్ళికి ఎదిగి వచ్చారు. అంచేత పుల్‌టైమ్ ఆ పని మీద వుంటేగాని మూడు కన్యాదానాలు సాధ్యం కాదని నౌకరీ వదిలేశారు అని కొందru దగ్గిర వాళ్లనుకోగా విన్నాను. ఎందుకో నాకిదే సమంజసంగా అనిపించింది.

బ్యాంకు లాకర్ అంతా ఖాళీ అయింది గాని, ఒక్క రామకోటి పుస్తకం మాత్రం మిగిలింది. వదిల్తే మళ్లీ అంత పెద్ద లాకర్ దొరకదన్నినీ, స్టేటస్ సింబల్‌గా వుంటుందని దాన్ని మేపుతూ వస్తున్నాను. అమ్మమ్మ కట్టె వంకీ మార్చి అప్పట్లో మా ఆవిడకి రెండు జతల గాజులు చేయించడంతో లాకర్ రామనామంతో మిగిలింది. ఆరోజు నాకు వున్నట్టుండి, లాకర్‌ని వృధాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నాననే ఆలోచన వచ్చింది. వెళ్ళి తీశాను.

రామకోటి పుస్తకం అందులో మిగిలిన స్థిరాస్థి. నిరాసక్తంగ పుస్తకం తిప్పాను. ఒక మెరుపు. అందులో ఫిక్సెడ్ డిపాజిట్ బాండ్! దాని ముఖవిలువ లక్షా నలభై వేలు. నలభై ఏళ్ళ క్రితం ఆ బ్యాంకులోనే వేశారు. గడువు తీరి ముప్పై ఏళ్లు దాటింది. నా నుంచి తప్పించుకుంది. దాని విలువ యిప్పుడు పదకొండున్నర లక్షలు దాటింది. నాకు అంతా సినిమా చూస్తున్నట్లుంది.

“మీకు చాలా సార్లు రెన్యూ చేయమన్నాం. కాని తమరు పట్టించుకున్నారు కాదు,” అన్నాడు మేనేజరు. మనం రాసే రిమైండర్లు సారుదాకా వెళ్తాయా?  ఆ గుమస్తాలు చించి పడేసి వుంటారని బ్యాంకు పెద్ద గుమస్తా నాకు దన్నుగా నిలబడ్డాడు.

ఆ బాండ్ మీద అప్పటి  మేనేజర్ సంతకం, మొత్తం ఎంత పేరుకుంది లాంటి లెక్కలు సాగిస్తుండగా ఒకాయన దూసుకు వచ్చాడు. “వడ్డీ మీద టాక్స్ పడకుండా  నే చూసుకుంటాను. మీరలా వుండండి,” అన్నాడు చనువుగా.

“టాక్స్‌లు మర్చిపోవడం మన జన్మహక్కు. మీరెందుకు వర్రీ అవుతారు. నేను కట్టనుగాక కట్టను,” అని అరిచాను.

నాకే కాదు, ఇంటిల్ల్లిపాదికి మెలకువ వచ్చింది..

Image: Mahy  Bezawada 

మనిషి వోడిపోతున్నాడు, తుపాకి గెలుస్తోంది!

March_on_Washington_for_Gun_Control_032 (2)

1999లో ‘తుపాకి’ అని ఒక కథ రాశాను. అందులో అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో పెరుగుతున్న కిరణ్ అనే ఒక తెలుగు పిల్లవాడు, పదేళ్ళ వాడు, తనతోటి తెల్ల స్నేహితుల ప్రోద్బలంతో తనక్కూడా ఒక తుపాకి కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. కథ కొన్ని మలుపులు తిరిగాక, తుపాకి ఎటువంటి ఘాతుకాన్ని సృష్టిస్తుందో కళ్ళారా చూసి, తన కళ్ళముందే తన బడిలోనే తన ప్రాణ స్నేహితుడు ఆ మారణహోమానికి బలైపోవడం చూసి, కిరణ్ – నాన్నా, నాకు తుపాకి వద్దు – అనడంతో కథ ముగుస్తుంది. ఈ కథని నేను 1999 ఫిబ్రవరి ప్రాంతాల్లో రాశాను.

ఈ కథ రాసి, వంగూరి ఫౌండేషను వారి ఉగాది కథల పోటీకి పంపించాను. పంపిన కొద్ది రోజులకి (ఏప్రిల్ 20న) కొలరాడో రాష్ట్రంలో కొలంబైన్ హైస్కూలు మారణహోమం జరిగి ఈ దేశం మొత్తాన్నీ అచేతనం చేసేసింది కొన్నాళ్ల పాటు. ఆ మారణహోమానికి కారణం నా కథలో చెప్పినలాంటి జాతి విద్వేషం కాదు కానీ, మారణహోమాన్ని జరిపింది బడి విద్యార్ధులే, నా కథలో సూచించినట్టుగా కొంత మానసిక అనారోగ్య బాధితులే. నా కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ తరవాత అనేక తెలుగుకథల సంకలనాల్లో చోటు చేసుకుంది. కానీ ఈ కథని తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ బహుమతి గుర్తు రాదు. కొలంబైనే గుర్తొస్తుంది. బాధే మిగుల్తుంది.

అమెరికాకి తుపాకులు కొత్తకానట్టే తుపాకుల వల్ల జరిగే హింస, ప్రాణనష్టం కూడా కొత్త కాదు. వ్యక్తిగతంగా ఆయుధాలను కలిగి ఉండే హక్కు, వాటిని వాడగలిగే హక్కు అమెరికను రాజ్యాంగములో రెండవ సవరణద్వారా ఇవ్వబడింది. ప్రాథమిక పౌరహక్కులను నిర్వచించి ఆమోదించడంలో వాక్-స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన మొదటి సవరణ వెనువెంటనే ఈ సవరణ ఉండటం వలన ఆయుధధారణకి పౌరుల ఆలోచనా పరిధిలోనూ, అమెరికను రాజకీయ పరిధిలోనూ ఉన్న ప్రాముఖ్యత మనకి అర్ధమవుతున్నది.

రిపబ్లికన్ పార్టీ అంటే ప్రభుత్వపు చొరవని తగ్గించాలని ప్రయత్నించే పార్టీగా, తద్వారా ప్రజల వ్యక్తిగత హక్కుల్ని (ఆయుధ హక్కులతో సహా) కాపాడే పార్టీగా పేరుబడింది ఇటీవలి కాలంలో. ఆయుధాలని నిరోధించాలి, లేదా కనీసం నియంత్రించాలి అనేది లిబరల్ ఎజెండాగా ముద్ర బడింది. ఐతే సాధారణంగా లిబరల్ ఉద్యమాలని నెత్తికెత్తుకునే డెమోక్రాటిక్ నాయకులు కూడా ఈ ఆయుధ నియంత్రణని చేపట్టేందుకు సిద్ధంగా లేరు.

ఇరవయ్యో శతాబ్దపు చివరి భాగంలో రిపబ్లికన్ పార్టీకి జీవం పోసిన అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో ఆయన సహచరుడు జేంస్ బ్రేడీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల వలన ఆయనకు పక్షవాతం వచ్చింది. గాయాలనుండి కోలుకున్న తరవాత ఆయన చిన్న తుపాకుల నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ సంఘటన జరిగిన ఎనిమిదేళ్ళ తరవాత ఒక డెమొక్రాట్ అధ్యక్షుడు, బిల్ క్లింటన్ ఈ చట్టాన్ని అమలు చేశారు. దాన్ని బ్రేడీ చట్టమని వ్యవహరిస్తారు.

ఒక రిపబ్లికన్ అధ్యక్షుడి సహచరుడికి జరిగిన దుర్ఘటనకి సుమారు పదేళ్ళ రిపబ్లికన్ పార్టీ పరిపాలనలో రాజకీయ ప్రతిచర్య జరగలేకపోయింది అంటే అర్ధమవుతుంది ఈ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నదో! ఇదొక రాజకీయ వింత. బ్రేడిలా లో భాగంగా పెద్ద తుపాకులు, రైఫిళ్ళు, ఎక్కువ సంఖ్యలో తూటాలని నింపుకునే తుపాకులు (వీటన్నిటినీ కలిపి ఎసాల్ట్ వెపన్స్ అని వ్యవహారిస్తుంటారు) 1994లో నిషేధించబడినాయి. ఆ నిషేధపు గడువు 2004లో ముగిసిపోయింది, రిపబ్లికన్ పరిపాలనలో. దాన్ని తిరిగి ధృవీకరించే ప్రయత్నం చెయ్యలేదెవరూ. అప్పటికి అందరి దృష్టీ ఇరాకుయుద్ధం మీదా, తీవ్రవాదంపై యుద్ధమ్మీదా కేంద్రీకృతమై ఉంది.

చారిత్రికంగా రాజకీయంగా జరిగిన సంఘటనలు అలా ఉంచితే, ఇటీవలి కాలంలో, అంటే గత మూడు నాలుగేళ్ళలో జరిగిన తుపాకి కాల్పుల దాడులు, ఒకదాన్ని మించి మరొకటి దేశప్రజలందరిలో భయాందోళనలని రేకెత్తించాయి.

  • వర్జీనియా టెక్ (2007) 32 మంది మరణించారు, 17 మంది గాయపడ్డారు. జరిగింది యూనివర్సిటీ కేంపస్ లో, చేసింది ఒక యూనివర్సిటీ విద్యార్ధి, అతనికి చిన్నప్పటినించి మానసిక రుగ్మతలున్నాయి.
  • ఫోర్ట్ హుడ్, టెక్సస్ (2009) 13 మంది మరణించారు, 29 మంది గాయపడ్డారు. జరిగింది ఆర్మీ బేస్ మీద మెడికల్ సెంటర్లో. చేసింది ఆర్మీలో మేజర్ గా ఉన్న 39 ఏళ్ళ సైకయాట్రిస్ట్. ఇతనికీ దారుణమైన మానసిక సమస్యలున్నాయని దర్యాప్తులో తెలిసింది.
  • ట్యూసాన్, అరిజోనా (2011) కాంగ్రెస్వుమన్ గేబ్రియేల్ గిఫర్డ్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు మరణించారు, మరో 13 మంది గాయపడ్డారు. జరిగింది ఒక సూపర్ మార్కెట్లో, చేసింది 22ఏళ్ళ యువకుడు. అరెస్టయిన తరవాత అతను తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉన్నాడని తేలింది.
  • ఆరోరా, కొలరాడో (జూలై 2012) పన్నెండు మంది మరణించారు. డెబ్భై మంది గాయపడ్డారు. జరిగింది సినిమాహాల్లో, సినిమా జరుగుతుండగా. చేసింది 24 ఏళ్ళ యువకుడు, కాలేజి విద్యార్ధి. ఇతనికీ మానసిక రుగ్మత అని డిఫెన్సు లాయర్లు వాదిస్తున్నారు.
  •  విస్కాన్సిన్ గురుద్వారా (ఆగస్టు 2012) ఆరుగురు మరణించారు, నలుగురు గాయపడ్డారు. జరిగింది గురుద్వారా సిక్కు మతాలయంలో ఆదివారం ప్రార్ధనలు జరిగే సమయంలో. చేసింది నలభయ్యేళ్ళ ఆర్మీ వెటరన్. ఇతనికి జాత్యహంకార నేపథ్యం ఉన్నది.
  • న్యూటవున్, కనెక్టికట్ (డిసెంబర్ 2012) 27 మంది మరణించారు. అందులో ఇరవైమంది ఒకటో తరగతి చదువుతున్న ఆరేడేళ్ళ పిల్లలు. చేసింది 20 ఏళ్ళ యువకుడు. ఇతనికి మానసిక అనారోగ్యాలు ఉన్నవా లేదా అని ఇంకా తేలలేదు.

కొద్ది వ్యవధిలోనే చాలా మంది బలవ్వడం, ఇటువంటి సంఘటన జరుగుతందేమోనని ఊహించలేని చోట్ల ఇవి జరగడం, ఈ ఘాతుకాలకి ఒడిగట్టినవారు యువకులు కావడం ఈ సంఘటనల అన్నిటి మధ్యా సామాన్యంగా ఉన్న లక్షణాలు. అంతే కాదు, ముద్దాయిలు అందరూ ఏదో ఒక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది.

తుపాకి చెడ్డదా? తుపాకి పట్టుకున్న మనిషి చెడ్డవాడా? తుపాకి పట్టుకున్న మనిషిలో ఉన్న బుర్ర చెడ్డదా? అమెరికను సమాజం ఈ ప్రశ్నలతో కుస్తీ పడుతోంది ప్రస్తుతం.

కనెక్టికట్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదివరకెన్నడూ లేనంతగా తుపాకులని నియంత్రించాలనే డిమాండ్ మిన్నుముట్టింది. దేశ ప్రజలు ఇంకా ఆ విస్మయాన్నించి తేరుకోకముందే రాజకీయులూ, అరాజకీయులూ అరుపులు మొదలెట్టేశారు. వారికి తోడు మీడియా వారు శాయశక్తులా హోరెత్తిస్తున్నారు. మధ్యలో మామూలు ప్రజలు కూడా తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అర్జంటుగా తుపాకుల అమ్మకాల్ని అరికట్టాలి అన్నారు. లేదు లేదు, రిజిస్టరు చేసి ఉన్న దుకాణాలైతే పరవాలేదు, అక్కడక్కడా ఎగ్జిబిషన్లలాగా పెట్టి అమ్మేస్తున్నారు, వాళ్ళని అరికట్టాలి ముందు అన్నారు.

వారంరోజుల పాటు ఉగ్గబట్టుకుని నిశ్శబ్దంగా ఉన్న ఎన్నార్యే సింహం అప్పుడు గొంతు విప్పింది. తుపాకులు కాదు చంపేది, తుపాకుల్ని పట్టుకున్న మనుషులు అంది. గన్ను పట్టిన చెడ్డవాణ్ణి ఆపాలంటే అక్కడ గన్ను పట్టుకున్న మంచోడు ఉండాలన్నది. ముందు మానసిక ఆరోగ్య వ్యవస్థని చక్కబరచాలన్నది. చివరికి తప్పంతా వినోద పరిశ్రమదే, పిచ్చి పిచ్చి హింసతో నిండిన సినిమాలు, టీవీ షోలు, విడియో గేములు ప్రజలమీదికి వదిలేసి మన యువతని తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళన్నది, ఉరుమురిమి మంగలం మీద పడినట్టు. ఐతే ఈ సందడి అంతటిలోనూ అసలు కొన్ని మౌలికమైన విషయాలు వినబడకుండా పోతున్నాయి.

గేలప్ పోల్ ఒకదాని ప్రకారం 47 శాతం అమెరికను పౌరులు కనీసం ఏదో ఒకరకమైన తుపాకిని కలిగి ఉన్నారు. ఇంచుమించు వీరందరూ ఆయుధధారణ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించబోమని తెగేసి చెప్పారు. కేవలం 26 శాతం మంది మాత్రమే సభ్యసమాజంలో తుపాకులకి స్థానం లేదనీ, తుపాకులని పూర్తిగా నిషేధించాలనీ అభిప్రాయపడ్డారు. ఆయుధ హక్కులని తలకెత్తుకునే ఎన్నార్యే వంటి సంస్థలు రాజకీయంగా బలమైనవే, సందేహం లేదు. కానీ వాటికి ఆ బలం ఎలా వచ్చిందో పైన చెప్పిన గణాంకాలని బట్టి కొంత అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలకి అతీతంగా అనేక రాజకీయ నాయకులే స్వయంగా తుపాకి ధారులైనప్పుడు, రెండవ సవరణని అంతర్గతంగా నమ్మేవారై యున్నప్పుడు ఆ బలగాలని అధిగమించి తుపాకి నిషేధ ఉద్యమాలు ఏవో సాధిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది.

పైగా, ఇప్పుడూ కొత్త అమ్మకాలని నిషేధించడమో, వాటిపై మరిన్ని ఆంక్షలు విధించడమో ఈ సమస్యని పరిష్కరించలేదు. ఎందుకంటే, ఇప్పటికే సుమారు 30 కోట్ల తుపాకులు అమెరికను పౌరుల చేతుల్లో (ఇళ్ళల్లో) ఉన్నాయని అంచనా. అంటే, దేశంలో వివిధ మిలటరీ, పోలీసు, తత్సంబంధ యూనిట్ల తుపాకులు కాక, కేవలమూ పౌరుల ఆధీనంలో ఉన్నవి.

30 కోట్లు! అమెరికా జనాభా 32 కోట్లలోపే. అంటే ఇంచుమించు ప్రతి అమెరికనుకీ – అప్పుడే పుట్టిన పసిబిడ్డ నించీ కాటికికాళ్ళు చాచుకునున్న వృద్ధునివరకూ తలా ఒక తుపాకి ఉన్నదన్నమాట. ఇది కాక ఏటా సుమారు 40 లక్షల కొత్త తుపాకులు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. అందుచేత, ఏదో రాజకీయ మాయాజాలం జరిగి అకస్మాత్తుగా రెండవ సవరణ ఉపసంహరించబడినా కూడా ఇప్పటికే పౌరుల ఆధీనంలో ఉన్న ఈ 30 కోట్ల తుపాకులని నియంత్రించడం అసంభవమైన పని. న్యూటవున్ కేసులో నిందితుడు ఏడం లాన్జా తన తల్లికి చెందిన తుపాకులని ఉపయోగించాడు తన మారణహోమానికి – కొత్తగా కొనలేదు.

ఇక్కడ నా అనుభవంలోనించి ఒక చిన్న పిట్టకథ. టీనేజి వయసులో పిలిస్తే పలికినట్లు వస్తుండేది కోపం నాకు. సమాజం మీద, మనుషుల మీద, వారు వీరని లేదు. అవ్యాజమైన ప్రేమలాగానే ఈ అవ్యాజమైన కోపం. కాలేజి ముగిశాక క్రిక్కిరిసిన సిటీబస్సులో వస్తుంటే, మధ్యలో ఏదో స్టాపులో వాళ్ళు బస్సు ఆపి ఎంతకీ కదలకపోతే ఆ ఉక్కలో, చిరాకులో ఆ బస్సు డ్రైవరు కండక్టర్ల మీద విపరీతమైన కోపం వచ్చేది. నా చేతిలో గనకా ఆక్షణాన ఒక తుపాకి ఉంటే వాళ్ళని బెదిరించి వెంటనే బస్సు కదిలేలా చేసేవాణ్ణి. అప్పటికీ వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసి, నేనే బస్సుని నడిపించుకు పోయేవాణ్ణి (నాకు డ్రైవింగు రాకపోయినా) నా కలల్లో.

kottapaliఅదృష్టవశాత్తూ నా దగ్గర తుపాకి లేదు. నా తరం తోటి విద్యార్ధులు, కొన్ని వేలమంది విజయవాడ బస్సుల్ని ఉపయోగించి ఉంటారు. ముందటి తరవాతి సంవత్సరాల్లో లక్షలమందో, కోట్లమందో అవే బస్సుల్లో ప్రయాణించి ఉంటారు – వాళ్ళెవ్వరి దగ్గరా తుపాకులు లేవు. ఐతే ఇప్పటికీ ఒక ప్రశ్న. నా దగ్గరే గనక ఆ పూట తుపాకి ఉండి ఉంటే ఆ డ్రైవరు ప్రాణాలతో ఉండేవాడా?

వ్యక్తిగత బాధ్యత, దానికి తగిన ప్రవర్తన – పైన జరిగిన సంఘటనలు అన్నిటిలోనూ, తరవాత జరిగిన చర్చలో ఎక్కడా ఈ వ్యక్తిగత బాధ్యత గురించిన మాట వినబడలేదు. అతగాడికి మానస రుగ్మత అట .. అంతే, అదొక మంత్రం. ఆ మాట అనేస్తే అంతా అర్ధమైపోతుంది. ఇంక ఎవ్వరూ దాన్ని గురించి బాధపడక్కర్లేదు. ముద్దాయి ప్రాణాలతో ఉన్నసందర్భంలో అతను వ్యక్తిగతంగానే నేరారోపణ ఎదుర్కున్నప్పటికీ, తత్సంబంధ విశ్లేషణలో ఆ వ్యక్తికి సంబంధించిన కోణం దాదాపుగా కనుమరుగై ఉన్నది. ఇతరత్రా వ్యక్తిగత స్వేఛ్ఛనీ, వ్యక్తిగత హక్కుల్నీ, బాధ్యతల్నీ పరమ ప్రమాణంగా భావించే అమెరికను సమాజం, అమెరికను మీడియా, ఈ విషయంలో పరమ సైలెంటయిపోయింది. ఎందుకంటే – భయం. వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి అంటే, ఎవరికి వాళ్ళే తమని తాము అద్దంలో చూసుకోవాలి గనక.
పోయిన వారం ఇక్కడ మావూళ్ళో (డెట్రాయిట్లో) ఒక రేడియో షో వింటున్నాను. మాట్లాడుతున్న అతను మాజీ గేంగ్ మెంబర్. ప్రయత్న పూర్వకంగా అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ, తన చుట్టు పక్కల వాళ్ళకి సహాయం చేసేట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడట గత ఐదేళ్ళగా. అతను చెప్పాడు, ఈ సంఘటనని గురించి మాట్లాడుతూ – నిజమే తుపాకులున్నై. నిజమే మానసిక రుగ్మత కూడా ఉంది. ఐనా మనిషిగా నీకంటూ ఒక విలువుంది, ఒక ఛాయిస్ ఉంది. నువ్వు తుపాకి వాడక్కర్లేదు. ఆ రోజు ఆ బడికి పోయి ఆ పిల్లలందరినీ చంపనక్కర్లేదు. మనిషిగా నీకా ఛాయిస్ ఉంది. బాధ్యత కూడా. కానీ ఇది ఎవరికీ పట్టటంలేదు.

వినోదం వినోదం కోసమే. సినిమాలో చూపించే కాల్పుల్ని, చంపడాలని, నరుక్కోవడాలని ఎవరూ నిజమనుకోరు. చిన్నప్పుడు కత్తులు, బాణాలు, తుపాకుల వంటి ఆటవస్తువులతో ఆడుకున్నట్టే పెద్దయినాక ఈ వినోద సాధనాలు. అంతదాకా ఎందుకు – పరమశాంత స్వభావుడినైన నాకు విపరీతమైన రక్తపాతంతో నిండి ఉండే క్వెంటిన్ టరంటీనో సినిమాలంటే చాలా ఇష్టం. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేవరైనా – అమ్మో, అంత వయొలెన్సు మేం భరించలేం అంటే, నాకు నవ్వొస్తుంది. అది సినిమా, వినోదం కోసం తీసినది అనే విచక్షణ తెలియదా అని విస్తుపోతుంటాను.

న్యూటవున్ సంఘటన వంటి మహాఘాతుకచర్య తరవాత మొట్టమొదటి ప్రకటనలోనే ఎన్నార్యే వినోద పరిశ్రమ మీద విరుచుకు పడేప్పటికి సినిమా-టీవీ-విడియోగేంల వాళ్ళు మ్రాన్పడిపోయారు. ఈ హింస మా వల్ల రావడం లేదు అని గట్టిగా చెప్పలేరు. ఏమో ఎక్కడన్నా లింకున్నదేమో అని భయం. దీనికీ మాకూ ఏమీ సంబంధం లేదని అసలే చెప్పలేరు – మనసులేని కౄరులుగా కనిపిస్తామేమో అని మరింత పెద్ద భయం. మింగలేకా కక్కలేకా తలకిందులవుతున్నారు. ఏమాటకామాట – పరిశ్రమలో అతిహింస, తుపాకుల సంస్కృతికి సంబంధించిన సబ్జక్టులతో పని చేస్తున్న రచయితలూ, దర్శకులూ, నిర్మాతలూ అందరూ భుజాలు తడుముకుంటున్నారు.

ఇప్పటిదాకా బయటికి వచ్చిన ఇంటర్వ్యూలలో ఎవరికి వారు – నా సినిమా వరకూ, లేక నా టీవీషో వరకూ నేను బాధ్యతాయుతంగానే రాస్తున్నాను, నిర్మిస్తున్నాను, హింసని కథకి అవసరమైన మేరకే వాడుతున్నాను – అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు చిన్న నిజాలు మనవి చేస్తాను. భీకరమైన తుపాకి కాల్పులు, పేలుళ్ళు చూపించిన జేంస్ బాండ్ సినిమా అమెరికాలోకంటే విదేశాల్లో కొన్ని రెట్ల వసూళ్ళు చేసింది. మరి ఇలాంటి వయొలెన్సు ఇతర దేశాల్లో జరగదేం? జపాను, కొరియా వంటి దేశాల్లో అమ్ముడయ్యే వీడియో గేముల్లో విపరీతమైన హింస ఉంటుందట. మరి అక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగడం లేదేం?

ఏమన్నా అంటే .. దాన్ని గురించి మనకి పూర్తిగా తెలీదు, సరైన సమాచారం లేదు, గాడిద గుడ్డు లేదు అంటారు. తుపాకి సంస్కృతి అమెరికా సంస్కృతిలో ఒక భాగం. అది మనం ఒప్పుకుని తీరవలసిందే. అది ఒప్పుకున్నాక, రెండవ సవరణని గురించి తీవ్రంగానూ లోతుగానూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవ సవరణ తుపాకులు ధరించే హక్కుని ఆటపాటలకోసం చెప్పలేదు, మిలీషియాల మనుగడకోసం అని స్పష్టంగాచెప్పింది. మిలీషియా అంటే పౌర సైన్యం. ప్రభుత్వ సైన్యంలో చేరాలి అంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారే, మరి పౌరసైన్యానికి అర్హులుగా ఉండాలంటే కనీసార్హతల ప్రస్తావన ఉండవద్దా? కచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి – అందులో సందేహమే లేదు.

సమాజంలో ఈ రుగ్మతల పట్ల ఉన్న దురభిప్రాయాలు అలా ఉండగా, మంచి ఆరోగ్యబీమా పాలసీలు కూడా ఈ రుగ్మతలకి అవసరమైన ట్రీట్మెంటుని చిన్నచూపు చూస్తున్నాయి. ఇక్కడ శ్లేషని తమరు మన్నించాలి – ఈ తుపాకుల సమస్యని ఛేదించడానికి సిల్వర్ బులెట్ ఏదీ లేదు. అన్ని వైపులనించీ ఈ సమస్యని ఎదుర్కోవలసిందే. కానీ అన్నిటికంటే ముఖ్యం, మన బిడ్డల పైన, వారి పెంపకం పైన, వారికి మనమిచ్చే శిక్షణ పైన ఉండాలి మన దృష్టి. వారికి తుపాకి ధరించడానికి హక్కే కాదు, బయటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, తుపాకి ముట్టుకోకుండా ఛాయిస్ కూడా ఉన్నదని వాళ్ళకి తెలియాలి.

‘తుపాకి’ కథలో పిల్లవాడు కిరణ్ కి  ఆ ఛాయిస్ తెలిసింది. మరి అమెరికన్ పౌరులకి ఎప్పుడు తెలుస్తుందో?

Above Image by Slowking4 (Own work) [CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0)], via Wikimedia Commons Gun image by INVERTED (Own work) [Public domain], via Wikimedia Commons

తాతయ్య వేదాంతం- నా గాలిపటం!

పడమటి ఆకాశం తెల్లటి మబ్బు చారలతో విబూది పట్టెలు పులుముకున్న బైరాగి నుదురులా వుంది. జారిపోతున్న సూరీడు కుంకుమబొట్టులా ఆ పట్టీల నడుమ అమరీ, అమరక, అస్థిమితంగా వున్నాడు. సాయంత్రపు ఆటకు బయలుదేరుతున్న నాకు గొప్ప అదృష్టం ఎగురుతూ వచ్చి  నా  కాళ్లముందు వాలింది. అది అందమైన గాలిపటం!

మిరప్పండు రంగులో వుంది. దానికి తెల్ల తగరపు తోక వుంది. నాలుగు మూలలా మెరుస్తున్న డాబురేకులు మొనలను సూచిస్తున్నాయి. గాలిపటం సూత్రం, దానికి పది మూరల దారం కూడా వుంది.

తెగిన గాలిపటం గాలివాటున మా వాకిట్లో నా ముందు పడింది. అది తెచ్చిపెట్టిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో సుతారంగా దాన్ని రెండు చేతులతో అందుకున్నాను. ఎక్కడా చిన్న చిరుగు కూడా లేదు. దాన్ని  అటూ ఇటూ తిప్పి చూసి గుండెలకు హత్తుకున్నాను. విశాల్‌గాడు, బబ్లూ దీన్ని చూస్తే కుళ్లుకుంటారు.  ఆ ఆలోచన నాకు మరింత ఖుషీ ఇచ్సింది.

నా ఆనందం మనసుకి ఇంకుతుండగానే, “అదిగోరా.. అదిగో,” అంటూ కేకలు వినిపించాయి. నా గుండెలు ఝల్లుమనేలోగా మలుపు తిరిగి ముగ్గురు పిల్లలు పరుగులు, కేకలతో వస్తున్నారు. వాళ్లు ఉత్సాహంతో వెలిగిపోతున్నారు.

ఆ ముగ్గురిలో ఓ ఆడపిల్ల కూడా వుంది. ముగ్గురూ ఏడెనిమిదేళ్లు మించని నా తోటివాళ్లే. నా ఎదురుగా, దగ్గరగా వచ్చి నిలబడి ఆయాసపడుతున్నారు. వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎక్కడో దూరంగా నక్షత్రం నేలకు దిగినప్పుడు, దాని జాడ పసిగట్టిన జ్ఞానులు నిలువెల్లా ఎలా వెలిగిపోయారో తాతయ్య చెబుతుంటాడు. ఆ బొమ్మలు కూడా నాకు ఎరికే.

ఆ పిల్లకి చొరవ ఎక్కువనుకుంటాను. మాటా మంచి లేకుండానే, నేను రెండు చేతులా హత్తుకున్న రంగుహంగుల గాలిపటాన్ని ఆ అమ్మాయి సున్నితంగా లాగేసుకుంది. రెప్పపాటులో ఆ ముగ్గురూ గాలిపడగతో సహా మలుపు తిరిగి మాయమయ్యారు. నాకందుకే మలుపులంటే చచ్చే భయం!

నేను నీరుకారిపోయాను.  నా కళ్లలో నీళ్లురికాయి. అయినా గాలిపటం స్పష్టంగా నాకు కనిపిస్తూనే వుంది. నిస్పృహగా తిరిగి యింట్లోకి వస్తుంటే తాతయ్య గమనించాడు. నా కళ్లలో తడి గమనించాడు తాతయ్య. ఆయన చూపులో ప్రశ్నని గమనించి  జరిగిందంతా చెప్పాను.

తాతయ్య దగ్గరగా తీసుకొని తన కండువాతో కళ్లు అద్దాడు. “నీకో కథ చెప్పనా” అంటూ మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డున నిలబడి ఒకడు నాలాంటివాడు భోరు భోరున ఏడుస్తున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఋషి నీకొచ్చిన కష్టమేమిటని అడిగాడు.

ఏడ్చేవాడు శ్రుతి పెంచి నా వెండి పొన్నుకర్ర గోదాట్లో కొట్టుకుపోయింది. చాలా గొప్ప చేతి కర్ర… మంచి కొయ్య, దాన్నిండా చెక్కుడు పని. పైగా వెండిరేకు తాపడం… నా బంగారు వెండిపొన్ను కర్ర అంటూ ఎక్కిళ్లు పెడుతున్నాడు ఆ నా బోటిగాడు. ఋషి తాత్వికంగా నవ్వి “బిడ్డా! నాలుగుక్షణాల క్రితం నీది కాదు. మూడు క్షణాలు నీ చేతిలో వున్నందుకే యింత రోదన అవసరమా,” అని మొదలుపెట్టి రాజ్యాన్ని, రాణుల్ని పోగొట్టుకున్న రాజుల నిజాలు చెప్పాడు.

తాతయ్య చెప్పింది వేదాంతం. నా బాధ నా పోయిన గాలిపటం గురించి.

మా నాన్న ఫోను మాట్లాడుతూనే కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. పొద్దున నేను చెప్పగానే, “మీరు బ్లాక్ చేసి వుంటే చాలా తేడా పడేది. ఎంతసేపు హోల్డ్ చేశామన్నది కాదు పాయింటు…”

నాన్న మాటల్లో చాలా ఆసహనం ధ్వనిస్తోంది. నేను, తాతయ్య పక్కకి తప్పుకున్నాం. నాన్న అనుక్షణం షేర్ల మీద నడుస్తుంటాడు.

***

అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

br passportఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

**

          క్రీడాభిరామం శ్రీనాధుడిదే. మన వరంగల్లులోదే. అక్కడ ఒక చిన్నది అలవోకగా ఒక ప్రదర్శన ఇస్తోంది. కళ్ళు చెదిరిపోయే ప్రదర్శన .చూద్దామా-

        చం.      వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను వొప్పఁగఁ దొట్టి నీళ్లలో          

                   మునిఁగి తదంతరస్థమగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే

                   చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే

                   రనుపమలీల నిప్పడు చుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో

(క్రీడాభిరామము – పద్యం. 146)

ఓరుగల్లులో ఒక పడుచుపిల్ల చేస్తున్న అద్భుత విన్యాసాలను చూసి మంచనశర్మ ఆశ్చర్యచకితుడవుతున్న సందర్భం.

ఆ పడుచుపిల్ల – నిండా నీళ్ళున్న తొట్టెలోకి తన ముక్కెరను (ముంగర) విసిరేసింది.  ఆ తొట్టె చెంత – ప్రేక్షకులవైపు తిరిగి బోసి ముక్కుతో నిలబడింది.  చేతులు పొట్టకి పెట్టుకుని – అలవోకగా వెనక్కి వంగింది (మొగ్గవ్రాలి).  తొట్టె అంచుకి తన వెన్ను తాకకండా వంగింది.  తొట్టెనీళ్ళలోకి చాలా నేర్పు (విన్ననువు) ఒప్పేట్టు తలా మెడా ముంచింది.  అంతే నేర్పుగా అలవోకగా లేచి నిలుచుంది. ఇప్పుడు ఆమె ముక్కుకి ముంగర మెరిసిపోతోంది. చప్పట్లే చప్పట్లు.

చేటలో నల్లపూసలు పోసుకుంది.  ఒక చేత్తో పట్టుకుంది.  దారం ఎక్కించిన సూదిని మరో చేత్తో పుచ్చుకుంది.  చిగురాకులాగా ఎర్రగా ఉన్న తన నాలుకతో అతివేగంగా (శీఘ్రము) ఆ నల్లపూసలను దారానికి దండ గుచ్చింది.  సాటిలేని రీతిలో (అనుపమలీలన్‌) ఒయ్యారంగా నల్లపూసలపేరు తయారు చేసింది.  మళ్ళీ చప్పట్లే చప్పట్లు.

ఈ పడుచుపిల్ల ఇలాంటి విద్యలూ ఉపాయాలూ ఎన్ని నేర్చిందో ఎలా నేర్చిందో కదా – అని మంచనశర్మ ఆశ్చర్యపోయాడు.

తెల్లారగట్ల ప్రయాణం

“ఎన్నిగంటలకి పెట్టమంటావ్  అలారం,” అంటూ గడియారం పట్టుకొచ్చారు మా అత్తగారు.  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి.

ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది. ఇన్నాళ్ళూ తమతోపాటూ కలిసి తిరిగింది అలా పడుందన్న బాధ కాస్తయినా లేకుండా ఒకదాన్నొకటి రాసుకు పూసుకు తిరిగేస్తున్నాయి గంటలముల్లూ నిమిషాల ముల్లూ. “ఎప్పుడో  తెల్లారగట్ల పెళ్ళి ….ముహుర్తం  వరకూ ఎవరుంటున్నారు  రాత్రి భోజనాల్లో అయితే అందరూ కనిపిస్తారు. అంటే సాయంత్రానికి చేరుకుంటే సరిపోతుంది. పోనీ  మధ్యాన్నానికి  వెళ్ళగలిగితే ఊళ్ళో మిగతా చుట్టాల ఇళ్ళుకూడా చుట్టి రావచ్చు లేదంటే మళ్ళీ నిష్టూరాలు.  కాబట్టి పొద్దున్నే బయల్దేరాలి. తప్పుతుందా…తెల్లారు  గట్టే లేవాలి.”

“అవునవును   నాలుక్కి లేవలేకపోయినా కనీసం అయిదయ్యేసరికన్నా లేవాల్సిందేనండీ  హ…ఆ…..ఆ….” అని హాయిగా అవులిస్తూ నా అమూల్యమయిన సలహా ఆవిడముందు  పరిచాను.  ఆవిడ దాన్ని అధికారికంగా చుట్టేసి ఓ మూలకి విసిరేస్తూ…

“నీ మొహంలావుంది …..నాలుక్కి లేచి, టిఫినూ, అన్నంకూరా వండి ,నీళ్ళుకాచుకుని  స్నానాలు చేసి …  దేవుడికి దీపం పెట్టుకుని, ఇద్దరం టిఫిన్ తిని కాఫీ తాగి, మగమహారాజులిద్దర్నీ లేపి, వాళ్ళకీ ఇంత కాఫీ పోసి ….  ఇల్లు చూస్తుండమని శారదత్తయ్యకి చెప్పి మనం  ఎదురుచూసుకుని  బయల్దేరేసరికి  దుర్ముహుర్తం  వచ్చెయ్యదూ! రేపు శనివారం , అయితే అయిదు లోపులో లేదా ఎనిమిది తర్వాత పెట్టుక్కోవాలి ప్రయాణం.  అయిదు గంటలకి ప్రయాణం అంటే రెండు గంటల కైనా  లేవొద్దూ ….. అందుకనీ  ఒంటి గంటకి పెడతాను . అలారం మోగాకా బద్ధకంగా ఓ గంట అటూ ఇటూ దొర్లి లేచినా పర్లేదు.”  అంటూ ….అలారం  సెట్ చేసిన గడియారం  నా గదిలో టేబుల్మీద పెట్టి, “పడుకో పడుకో……మళ్ళీ  తెల్లారగట్లే లేవాలి,” అంటూ వెళ్ళిపోయేరు.  ఆ మాత్రం దానికి  “ఎన్నింటికి పెట్టనూ?” అని అడగడం ఎందుకూ…అన్నీ అబ్బాయి పోలికలే  అని అసందర్భపు అక్కసుని వెళ్ళబోసుకుంటూ.   టైం చూస్తే  పన్నెండున్నర !!

హత్తెరీ బేగ్గులు సర్ధుకోటంలో టైం చూసుకోలేదు  ఇంకేం  నిద్ర  అనుకుంటు తలుపు జారేయబోతుంటే  అత్తగారు , వీధరుగు మీద నిద్రపోతున్న అబ్బులు గాడిని  నిద్రలేపి “ఒరేయ్ తెల్లారగట్లే లేవాలి గుర్తుందా  పడుకో పడుకో ” అనడం వినిపించింది.

“మర్చేపోయాను…..నా గంధం రంగు చీర పెట్టేవా ?” అంటూ మళ్ళీ  వచ్చేసారు .  “ హా…….పెట్టానేమో లెండి!!” అన్నాను.  నాకు అర్జెంటుగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అసలే అలారం మోగడానికున్న టైం అరగంటేనాయే….

“ఏ గంధం రంగనుకున్నావూ …….మొన్న దీపావళికి మా పెద్దన్నయ్య పెట్టాడూ అదీ ……చింతపిక్క రంగు అంచూ……అక్కడక్కడా మామిడిపిందె బుటాలూ……”
“హా….హ……ఆ ……..” పెట్టానండీ అని ఆపద్ధర్మంగా అబద్ధం ఆడేసాను. ఇప్పుడు బీరువా తీస్తే …….ఆ బరబరలకి   నిద్రాభoగమయితే ముసుగులో  సింహం మేల్కొనవచ్చు….ఏమో మీదపడి నమిలేయొచ్చు. . ఇప్పటికే పది గాండ్రింపులయ్యాయి. “పగలంతా ఏ పెద్దగుర్రాలకి  పళ్ళు తోమారు  అత్తాకోడల్లిద్దరూ అర్ధరాత్రి  అపరాత్రి లేకుండా …వెధవ సర్దుళ్ళూ మీరూనూ” అంటూ.

మీకేం తెలుసు మా అవస్థలు .  అనుకోటానికి నాలుగు జతల బట్టలేకానీ….ఎన్నెన్ని చూసుకోవాలి . మేచింగు ప్రకారం   సాల్తీలన్నీ సర్దుకోవాలి , క్రితం సారి పెళ్ళికి కట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళకూడదు ,  రోజులో నాలుగు చీరలు  ఆ నాలుగు ఒకదానికొకటి సంబంధం లేని రంగులు వెతుక్కోవాలి,  ఆ రంగులకి సరిపోయే  బొట్టూ, గాజులూ…..అంటూ నాలువేళ్ళు ముడిచేసరికే నిద్రలోకి జారుకున్నారు .

“మా పెద్దొదిన  దిగుతుంది  పెళ్ళికి ….ఆవిడముందు ఆ చీర కట్టుకుని తిరిగితేకానీ   సిగ్గురాదు ….. జానాబెత్తెడు  కొలతతో ఉంది కొని పంపింది చూడు. పవిటేస్తే కుచ్చీళ్ళు రావు కుచ్చీళ్ళు పోస్తే పవిట చాలదు. చీరపెట్టలేదని నేనేవన్నా ఏడ్చానా?” తనధోరణిలో చెప్పుకుపోతున్నారావిడ. ఏంటో   పీత కష్టాలు పీతవి   హా…..ఆఅ….ఆ….అ.  గాట్టిగా ఆవులించి  గడియారం వంక చూస్తే  హమ్మో !! పెద్దముల్లపుడే పదడుగులేసేసింది.

నాకక్కడే  నేలమీద పడి  గడపమీద తలపెట్టుకునయినా  పడుకుండిపోవాలనిపించేంతగా  ముoచుకొచ్చేస్తుంది నిద్ర…..

“అవునూ ఎన్నిబేగ్గులయ్యేయీ…..మరీ ఎక్కువ లగేజీ అయితే బస్సుల్లో ఎక్కీ దిగీ కష్టం . అలాని మరీ కుక్కి పెట్టేసేవంటే వచ్చేప్పుడు బేగ్గులు పట్టవ్….ఇస్త్రీ బట్టల్లా  ఇడిసిన బట్ట్టలు సర్దలేం కదా! పోయిన సారి ఇలాగే   నీలపల్లి పెళ్ళిలో  బేగ్ పట్టక మూడు లంగాలు వదిలేసొచ్చాను. నే తర్వాత పంపిస్తాలే పిన్నీ అంది  మా చిన్నన్నయ్య మూడో కోడలు సుభద్ర . ఒకటే పంపటం….నిక్షేపంలాంటి లంగాలు. పరకాళ్ళా గుడ్డలే అనుకో తుని నించి తెప్పించేను    పదేల్లబట్టీ కట్టినా పిసరు రంగు దిగితేనా !!” ఓరి నాయనో…  ఈవిడని నీలపల్లిలో ఆపకపొతే యానం లో లాంచీఎక్కి , అలా  ఎదుర్లంక ,మురమళ్ళ ,అమలాపురం పెళ్ళిళ్ళకి కూడా పోయి  ఆయా పెళ్ళిళ్ళల్లో  వదిలేసొచ్చిన తువ్వాళ్ళూ, జేబురుమాళ్ళూ లెక్కేస్తూ కూర్చుంటారు  అని భయం వేసి, “అవన్నీ బస్సులో చెప్పుకోవచ్చులెద్దురూ ఇప్పుడు పడుకుందాం,” అనేసాను.

“సర్లే పడుకో…..మళ్ళీ తెల్లారగట్లే  లేవాలి. పొద్దున్న ఉప్మా లోకి కర్వేపాకు కోసిపెట్టేవాలేదా ! చీకట్లో దొడ్లో కెళీతే పురుగో పుట్టో ఉంటాయ్. ఓ సారిలాగే  తెల్లారు ఝాము ప్రయాణం… అపుడు మీ ఆయనకి మూడో ఏడు…మీ మావయ్యా నేనూ …..”

అబ్బాయిగారు నిద్రకీ మెలకువకీ మధ్య ఇబ్బందిగా కదులుతున్నారు. లేచారంటే ఓ గసురు గసురుతారు…….అని భయపడి . “హుష్…..అత్తయ్యా ఇలా రండి” అని ఆవిడ్ని  గుమ్మం బయటికి పిలుచుకెళ్ళాను.

ఏంటీ…..అని ఆవిడా గుసగుసగా అంటూ  నా చెవి దగ్గర చేరి చెయ్యడ్డుపెట్టి, ఆ  వస్తువులెక్కడ పెట్టేవ్. చంద్రహారం విడిగా జేబురుమాలులో ముడేయమన్నాను వేసేవా ……..ఏ బేగ్గులో పెట్టావో  నాకూ చెపితే  ఓ కన్నేసి ఉంచుతాను.  అసలే బస్సు ప్రయాణం  …..జాగ్రత్తగా పెట్టావా….అని అతి రహస్యంగా అడుగుతున్నారు. అంతే, …….

టేబుల్ మీద గడియారం  కర్ర్……..ర్ర్ర్….ర్ర్ర్ర్……………..ర్ర్ర్ర్ర్ర్ర్…..ర్ర్ర్ర్ర్ర్ మంటూ   రాక్షస స్వరంతో   గుక్కెట్టి ఏడ్చింది.  మా ఇంట్లో మగాళ్ళకి లానే దానికీ అత్తాకోడళ్ళిద్దర్నీ కలిపిచూస్తే కన్ను కుట్టేస్తుంది కాబోలు.

అప్పుడే తెల్లారిపోయిoదా లే…లే… ( అసలు పడుకుందెక్కడా!!). పొయ్యంటించు, అని మా అత్తగారు  తెగ హైరానా పడిపోయారు.  ఆ గోలకి అబ్బాయిగారు అదాట్న మంచమీంచి లేచి  నన్ను నమిలి మింగెయ్యాలన్న కోరికని అతికష్టం మీద ఆపుకుని ( పరగడుపున పచ్చిమాంసం అరగదనుకున్నారేమో), దుప్పటీ తలగడా తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. మాం గారు  లేచి ఓసారి పెరట్లో కెళ్ళొచ్చి పడుకున్నారు ( బాగా గుర్తుచేసావ్ అన్నట్టూ).

ఇక నా పరిస్తితి ఏం చెప్పుకోనూ…..హాఅ….ఆఆ…హా…ఆ…..    సీన్ కట్ చేస్తే,
నేనూ మా అత్తగారూ మా ట్రాక్టర్ డ్రయివరు అబ్బులూ విత్  అవర్ బేగ్స్ అండ్ బెడ్డింగ్స్  మా ఊరి పుంతరోడ్డులో ఉన్నాం.

సమయం మూడుగంటలా నలభై  అయిదు నిమిషాలు.   చెప్పానో లేదో…..మా అత్తగారు గడియారానికి గంటంపావు ముందుంటారు   ప్రయాణాలప్పుడు మరీనూ…
మా ఊరు  పెద్దరోడ్డుకి  దగ్గిరిలెండి. ఎలాగో ఆ రోడ్డుకి  చేరితే అక్కడినుంచి ప్రయాణం నల్లేరుమీద బండి నడకే.  ఇప్పుడు మేం వైజాగ్ వెళ్ళాలంటే వెనక్కి రామిండ్రీ వెళ్ళి బస్సెక్కి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలా ముందుకెళ్ళటం సుద్ధ దండగ కదా ! అందుకే ఇక్కడే  కాపుకాసి   ఆగిన బస్సులో ఎక్కేస్తుంటాం. అవును మేం చెయ్యెత్తితే బస్సులు ఆగుతాయ్   ‘ ఒక్కోసారి ‘ నిద్ర మొహాన లేపుకొచ్చేసాం ఏమో… అబ్బులు కునిపాట్లు పడుతూ  దెయ్యాలు తిరిగే ఏళప్పుడు ఈ పయాణేలేటండీ. కుంత తెల్లారేకా ఎల్లకూడదేటండీ అని  చనువుగా ఇసుక్కుంటున్నాడు.

నేను బితుకూమంటూ  “అవున్రోయ్ ” అనుకుంటూ చుట్టూ చూసాను. ఎదురుగ్గా తళ తళలాడే తార్రోడ్డున్నా. మా వెనకున్నది సన్నగా మలుపులు తిరిగిన డొంక దారి.  ఈ పక్కా ఆ పక్కా   చింపిరి   దెయ్యాల్లాగా   కనిపించాయి  అడ్డడిడ్డంగా పెరిగిపోయిన చెట్లూ కంపలూ.  ఎక్కడా నరవాసన  చీ…చీ…ఎక్కడా నరసంచారం లేదు.   “ఇక్కడవుతే మలుపుంది గనక  బస్సులు ఇసులో ( స్లో )అయ్యినపుడు మనల్ని  సూడగానే  ఆటోమేటిగ్గా ఆగుతాయండి”   అని మా అబ్బులి ఆలోచన. ఆందుకే  ఏ వాహనం ప్రయాణించవీల్లేని  చిట్టడవిలాంటి ఈ చీకటి ప్రదేసానికి అడ్డదారిన నడిపించి తీసుకొచ్చేసేడు.

ఇంట్లోకూడా దుప్పటి ముసుగేసి భయపడుతూ చూసే  పాటొకటి చప్పున గుర్తొచ్చేసింది. నిను వీడని నీడను నేనే………   నాకు భయం వేసి , మా అత్తగారికీ అబ్బులుకీ మధ్యకొచ్చి నుల్చున్నాను. చేతిలో బేగ్గు భుజం లాగేస్తుంది. కింద పెడదామంటే అంతా మట్టి ..పెంట…ఏమో ఇంకేవేం వున్నాయో!

అత్తగారు  చేతులు రెండూ నడుమ్మీద పెట్టుకుని, ఒరేయ్ ఏదో బస్సొస్తుంది చూడు అంటూ ఆర్డరేసారు కలిదిండి మహారాణిలా ( ఆవిడ పుట్టిల్లు అదేలెండి). వాడు నెత్తినున్న మూడుబేగ్గుల్నీ  ఓ చేత్తో కాసుకుంటూ  భుజాన్నున్న ఇంకో సంచీని సర్దుకుని రోడ్డు మధ్యకెళ్ళి చూసొచ్చాడు. “వత్తవయితే  రైటేగానండి  బస్సో లారీయో దగ్గిరికొత్తేగానీ తెల్దండి….” అనేసాడు.

చుట్టూ చీకటి, పక్కనున్న మాకు మేవే కనప్డటం లేదు. ఇంక మమ్మల్ని చూసి ఏ బస్సు ఆగిచస్తుంది. తెల్లారగట్ల కీ అర్ధరాత్రికీ తేడా తెలొద్దూ ఈ పెద్దావిడకి  విసుగ్గా మనసులో అనుకున్నా… ఆవిడకి కాస్త దూరంగా  జరిగి.

దూరం నించీ లైట్లు  కనపడగానే అబ్బుల్ని రోడ్డుమీదికి తోలేస్తున్నారు మా అత్తగారు.  వాడు  మూటలన్నీ నెత్తినపెట్టుకుని ముఠామేస్త్రిలాగా పోజుగా  చెయ్యూపుతూ నుంచోటం, ఆ వాహనం ఒంటికన్నో రెండుకళ్ళో వేసుకుని బోయ్….అంటూ దగ్గరికొచ్చేసరికి వీడు అమ్మోయ్ అని  పక్కకి ఒక గెంతు గెంతడం.     రక్షించండీ రక్షించండీ అని చేతులూపుతూ హాహా కారాలు చేస్తున్నట్టున్న మా అబ్బులి గాడి సైగలు చూసి రోడ్డు వొంపులో  ఒకటో రెండో బస్సులు కీచుమంటూ  స్లో అయ్యి , మళ్ళీ వేగంగా వెళ్ళిపోయేవి. బస్సు మమ్మల్ని దాటెళ్ళిపోయేకా ఒకటిరెండు బండబూతులు గాలికి ఎగిరొచ్చి పడేవి. మేం వచ్చి  అరగంట అయినట్టుంది. ఎక్కడో కోడికూత  వినిపించింది . హమ్మయ్య పోన్లే  బస్సు రాకపోతే పోయే వెలుగన్నా వస్తుంది అనుకొని నేను ఆనందపడుతుంటే… బస్సుకంటే ముందు  వెలుతురెక్కడ వచ్చేస్తుందో అని మా అత్తగారు కంగారుపడుతున్నారు.

టైమెంత అయ్యుంటుందంటావ్ అన్నారు మా అత్తగారు. నేను నా ఎడంచెయ్యి వెనక్కి దాచేసి  పైకి కిందికీ వెనక్కీ ముందుకీ చూసి ఏమో తెల్దండీ  అనేసాను. అబ్బులుగాడయితే ఎటూ చూడకుండా ….. “కరకెస్టుగా నాలుగున్నరకీ  అయిదున్నరకీ మజ్జిలో ఎంతో అయ్యుంటాదండి,”అన్నాడు  ఇబ్బందిగా కడుపు నొక్కుకుంటూ.

అంత కరకెస్టుగా ఎలా చెప్పేసేవ్రా బాబూ….అని మేం ఇద్దరం అడగలేదు. అప్పుడే …   పైనుంచీ రాలిపడ్డట్టూ  మా ముందు కొచ్చి నుంచుందో ఆకారం. నేను హడలిపోయి, తు…తు..తు..అనుకుని  తేరుకున్నాను. మా అత్తగారు  నువ్వట్రా సింగినాధం అన్నట్టు ఓ తేలిక చూపు విసిరి, గుళ్ళగొలుసు ఓసారి సర్దుకుని  రోడ్డుకేసి చూస్తూ ఠీవీగా నిలబడ్డారు.

“ఏట్రా అబ్బులూ……అయ్యగారిని ఇక్కడ నిలబెట్టేవ్.  బస్సు కోసరవా?  నీకు తెల్దేటిరా…..పైన దాబా ఒటేలు ఎట్టినకాడ్నించీ అక్కడే ఆగుతున్నాయ్ బస్సులు.  ఈర్ని అక్కడకి తీసుకుపో”  అందా సాల్తీ .

అబ్బులు గాడ్ని రెండు తన్నాలనిపించింది.  వివరం తెలకుండా ఇంత సేపూ అక్కడ నిలబెట్టినందుకు.  అత్తగారుండగా కోడలు పెత్తనం చేసిందంటారని ఊరుకున్నా . ఎలాగో  ఆయన్ని బ్రతిమాలి బస్సెక్కించే ఏర్పాట్లు చేయిద్దామనుకుంటే, “ఎందుకండి బాబూ….. గంపకింద కోడి కూయ్యకముందే  మిమ్మల్ని బస్సెక్కిచ్చీ పూచీ నాది,” అని  ఆ కబురూ ఈ కబురూ చెప్పేసి అర్జెంటుగా అవసరం పడిందని యాభైరూపాయలు పట్టుకుపోయాడు రాత్రి.

ప్రయాణం అనుకున్నప్పటినుంచీ మూడు అయిదులు మా అత్తగారిదగ్గరా, మూడు యాభైలు నా దగ్గరా గుంజేసినట్టు లెక్కతేలింది. “వాణ్ణనుకోటం ఎందుకూ మన బంగారం మoచిదయితే ….పెళ్ళికెళ్ళాలని ముచ్చట పడుతున్నారు. దగ్గరుండి రైలో బస్సో ఎక్కిద్దాం అని ఉండొద్దూ. పైగా పిలిచిన ప్రతీ పెళ్ళికీ వెళ్ళిపోటమే  మీ తిప్పలు మీరు పడండి అనేసారు చూడు”. అని మా అత్తగారు నిన్న రాత్రి భోజనాల దగ్గర బాధపడ్డారు. నేనూ నా వంతుగా  ‘భామాకలాపం’ సాగించినా  ఫలితం లేకపోయింది.

“లేదు మాయ్యా బస్సులిక్కడా ఆగుతాయ్……ఆ మద్దిన మా యమ్మనీ, మా యావిడ్నీ ఇక్కడే కదేటీ  గోపాలపొరం బస్సెక్కిచేను”  అని అడ్డoగా దబాయించేస్తున్నాడు  అబ్బులు.

ఏం చేద్దావండీ అని మా అత్తగారిని అడుగుదామని చూద్దును కదా ఆవిడప్పుడే పిలుపుకు అందనంత దూరంలో  ఉన్నారు  ఆది చూసి, ఆబ్బులుమాయ్య ( అదే ..అబ్బులుకి మాయ్య)  “అదేటండీ పెద్దయ్యగారు అటెల్లతన్నారు….. ఇటెల్లాలండి” అని   చెంబున్న చెయ్యెత్తేడు. ఈవిడేమో చుట్టున్న చెయ్యివేపు వెళ్ళిపోతున్నారు లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి.

ఏలాగో అరిచీ కేకలేసీ ఆవిడ్ని పట్టుకుని పూర్తి అపసవ్య దిశలో నడిపించుకొచ్చేసరికి అప్పటివరకూ మేం నుల్చుని ఉన్న ఆ చోట్లో  ఇత్తడి చెoబు మైలు రాయిలాగా  మసగ మసగ్గా కనిపించింది….తుప్పల వెనకనుంచీ  అలా తిన్నంగా ఎల్లిపోండి అని  అబ్బులు మాయ్య గారి సలహాకూడా వినిపించింది.

నాకు ఇంటికెళ్ళి ఇంకోసారి తలస్నానo చేసి రావాలనిపించింది. మా అత్తగారు ససేమిరా అంటారని ఊరుకున్నాను. మేం ఆ ‘ దాబా ఒటేలు కాడికి ‘  నడిచొచ్చేసరికి  ఎంచక్కా తెల్లారిపోయింది.   ఒకటో మూడో బస్సులు బోయ్..మని హారని కొట్టుకుంటూ మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయాయి.

మా మొదటిపెళ్ళిరోజు శ్రీవారు బహుమతిగా ఇచ్చిన (అంకెలేలేని ) టైటన్ వాచీలో చుక్కల్ని లెక్కపెట్టుకుని పెద్దముల్లుకీ చిన్న ముల్లుకీ ఉన్న దూరాన్ని బట్టి చూస్తే టైము అంచనాగా  అయిదున్నర  లెక్కకొచ్చింది.

ఇక దుర్ముహుర్తం వచ్చేసినట్టే అని మా అత్తగారూ ……ఇంకో అరగంట వరకూ పర్లేదని నేనూ వాదించుకున్నాం.

ఇదేం ఖర్మే ….దరిద్రగొట్టోడు  దండుకోటానికెళితే వడగళ్ళవాన కురిసిందనీ ……కదలక కదలక ఇల్లు కదిలితే ఇలా అయ్యిందేవిటీ అని అవిడ నానా హైరానా పడుతూ అబ్బులు కేసి కొరకొరా చూసి  ……టైమెంతయ్యిందీ అన్నారు పద్దెనిమిదోసారి. నేను వాచీ ఆగిపోయిందండీ  అని అలవాటుగా అబద్ధం ఆడేసాను.  అబ్బులుగాడు కడుపు పాముకుంటూ “కరకెస్టుగా ఆరయ్యుంటాదండి,” అన్నాడు కడుపే కైలాసం అన్నట్టు వాడికి కడుపే గడియారం.

ధాబా ఒటేలు నించి వస్తున్న కమ్మని వాసనలకి మా కడుపులో ఎలకలు  కలియతిరిగేస్తున్నాయి.  బస్సొచ్చేలోగా ఓ పనయిపోతుందని  అన్నవరం దాటాకా తిందామని  మేం తెల్లారగట్ల వొండితెచ్చుకున్న కరివేపాకు వేయని ఉప్మాని ముగ్గురం   నుంచున్న పళంగా  పంచుకు తినేసాం.

మేం మూతులు కడుక్కుని మంచినీళ్ళు తాగేసరికల్లా  బస్సొచ్చి సరిగ్గా మా ముందే ఆగింది. ముందు బోర్డు చూసుకుని, ఎందుకయినా మంచిదని కండక్టర్ని  కూడా అడిగి సందేహం లేకుండా గబగబా అందిన బేగ్గులు పుచ్చుకుని ముందు నేనూ,  వెనక అత్తగారూ బస్సులో కాళ్ళుపెట్టేసాం. తీరా చూస్తే ఇంకో రెండు బేగ్గులు కిందవుండిపోయాయ్. అబ్బులుగాడు అయిపూపజాలేడు. కండక్టరేమో “ఏటమ్మా ఎక్కుతే ఎక్కండి లేపోతే దిగండి. డోరుకడ్డంగా నిలబడిపోతే ఎలాగా అని  మమ్మల్ని అయితే బస్సులోకి లాగెయ్యడానికి లేకపోతే కిందకి తోసేయ్యడానికీ రెడీగా వున్నాడు.  అత్తగారు ఉండు నేను తెస్తా అని దిగేరు….అయ్యో పెద్దవిడ ఆవిడెక్కడ మోస్తారు అని నేనూ దిగాను. డ్రయివరు బస్సుని రయ్యిన లాగించేసేడు.  అపుడొచ్చాడు అబ్బులు ….. “ఊ కంగారడిపోతారేటండీ నోనొత్తన్నాను కదా”  అంటూ …అత్తగారు యధాలాపంగా వాడి నెత్తిన నాలుగు అక్షింతలు చల్లి శాంతించారు. అదయ్యాకా మాకు తెలుసున్నవాళ్ళు ఒకరిద్దరు కనిపించారు కానీ మేం వాళ్ళని చూళ్ళేదు  ఎక్కడికీ ప్రయాణం అనడుగుతారని.  అలా అడిగితే ప్రయాణం సాగదనీ….అనుకున్న టైముకి ఆశించిన విధంగా ప్రయాణం జరగనందుకు  కారణాలను మేం విశ్లేషించుకుంటూ ఉండగా ఓ రెండు బస్సులు ఖాళీ లేదు అని  అబ్బుల్ని లెక్కచేయకుండా వెళ్ళిపోయాయి.

నిన్న రాత్రనగా మొదలయిన ప్రయాణం  నిద్రలేక నిలబడలేక నీరసం వచ్చేస్తుందిరా దేవుడా.  నా సంగతొదిలేయ్….పాపం ఆ మహతల్లి  నీకు నైవేద్యం పెట్టకుండా ఏనాడన్నా తాను తిందా ….మాకు పెట్టిందా !! (ఏదో ఇలా ప్రయాణాలప్పుడూ ప్రాణం బాగోనప్పుడూ ఎలానూ తప్పదనుకో )  మహా సాద్విని  ఇలా కష్టపెడతావా? “కరుణామయా దేవా కరుణించగా రావా…..ఆపద్భాంధవ రావా …ఆపదలో కాపాడవా …” భక్త తుకారం పాట పూర్తయ్యేసరికి దేవుడే పంపినట్టూ  సరాసరి మాముందుకొచ్చి ఆగిందొక బస్సు. హమ్మయ్యా  నిరీక్షణ ఫలించింది అని సంబరంగా బస్సెక్కెయ్యబోతుంటే ఆ నిర్దాక్షిణ్యపు కండక్టరు, ఇది నాన్ స్టాప్,ఎక్కడపడితే అక్కడ దించుతాం కానీ ఎవళ్ళని పడితే వాళ్ళని ఎక్కించుకోం లేండి…లేండి, అని మా పరువు దుమ్ములో కలిపేసి పోయేడు.  నువ్వు చెప్పి చావొచ్చుకదా  మా అత్త్తగారు అబ్బులుమీద పడ్డారు.

వాడికి చాలా పౌరుషం వచ్చేసింది. దాంతో  ఏవైనాసరే ఈసారి వచ్చిన బస్సులో మమ్మల్ని ఎక్కించి తీరుతానని పంతం పట్టేడు .దాని ప్రకారం  నిద్రలో జోగుతున్నట్టూ ఆగాగి వస్తున్న  బస్సును రోడ్డుకు అడ్డం పడి ఆపేసాడు.

బస్సు ఆగగానే అబ్బులు కండక్టరుకీ డ్రయివరుకీ, ఆ మాటకొస్తే  యావన్మంది ప్రయాణికులకీ వినిపించేలా  “ఎవరనుకుంటునారండీ …పెసిడెంటుగారి తాలూకా ఈరు. బస్సెక్కిచుకోకపోతే  రేపీరూట్లో వొత్తారుకదా అప్పుడు సూద్దిరిగాని ఏవవుతదో . డోరు తియ్యండి డోరు తియ్యండి ….” అంటూ పెద్ద హడావిడిచేసి  లగేజీ  ముందు ఇంజను  మీదా  డ్రయివరు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళ కాళ్ళమీదా సర్దేసి, “కుదుపులేకుండా వుంటాది ఇక్కడ కూకోండి అయ్యగారూ” అని, ముందు నించీ మూడో సీటు దులిపి  మేం కూర్చున్నాకా  దిగి డోరేసి, రైట్ రైట్  అనేసరికి బస్సుకదిలింది. వాడు ఇవతలపక్క కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఆయ్….జాగర్తండి, బేగ్గులులన్నీ సరీగా ఉన్నయోలేదో సూసుకోండి, పెళ్ళవగానే బీగొచ్చేయండి …ఆయ్ ….మరెల్లిరండి….ఆయ్…అని చేతులూపేసాడు. బతుకు జీవుడా అనుకుంటూ  సీట్లో జారబడి అత్తగారు చూడకుండా వాచీ చూస్తే   పెద్దముల్లు పైచుక్క  మీదా చిన్నముల్లు కిందచుక్కకి కాస్త అవతలగానూ ఉన్నాయి…అంటే టైము   ఏడేకదండీ….ఏడే…..ఏడే…
ఎక్కెడ దిగుతారమ్మా – కండక్టర్ .
వైజాగు రెండు టిక్కెట్లు -అత్తగారు.
వైజాగయితే ఈ బస్సెక్కేరేటీ – వెనక సీటు ప్రయాణికుడు.
డయివరు గారూ బస్సాపండి  పాపం ఈళ్ళు సూసుకోకుండా ఏరే రూటు బస్సెక్కేసేరు  -ముందు సీట్లో మదర్ తెరీస్సా.
ఏటమ్మా  ఓ లగేజీలేసుకుని తోసుకుని బస్సెక్కేటవేనా ?  దిగండి దిగండి  -కండక్టరు డ్రయివరు తోపాటూ యావన్మంది   ప్రయాణికులూ.
అత్తగారు నేనూ ఒకేసారి తలతిప్పి ఒకర్నొకరం చూసుకున్నాం . కంగారులో ఇద్దరం చూడలేదు ఆ బస్సు ఎటువేపెళుతుందో!
బస్సాగింది . మేం  మోయలేని మా లగేజీ తో సహా మళ్ళీ రోడ్డున పడ్డాం .   ఆ కంపలూ  ఆ తుప్పలూ, ఆ  డొంకలూ  “హత్తేరీ …..మా ఊరు పుంతరోడ్డు.”

***

నోట్ :  ఇంట్లో పనివాళ్ళు ఆడవారిని అమ్మగారు అనీ, మగవారిని అయ్యగారు అనీ పిలుస్తారు కదా అన్నిచోట్లా . కానీ మా ఊర్లో ( చాలా ఊర్లల్లో) మగవారిని  రాజుగారు, పంతులుగారు , కాపుగారు ఇలా ….ఆడవారిని  చిన్నయ్యగారు, పెద్దయ్యగారు ,  అనీ అంటుంటారు . కథలో అదే రాసాను .

ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

mandira1పుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ-

వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి ఏటవాలుగా అమిరేట్టు పెట్టుకునో కనిపించడం వొక రొటీన్ దృశ్యం! ఇవాళ ఆ దృశ్యం నెమ్మదిగా కనుమరుగయిపోతోంది. ఇది పుస్తకాలకే కాదు, పత్రికలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మూడు నాలుగు పుస్తకాలేమిటి, రెండు మూడు పత్రికలేమిటి వొక్క చిన్న నోట్ బుక్ లాంటి పరికరంలో వందల పుస్తకాలూ పత్రికలూ అగ్గిపెట్టెలో చీరలా ఇమిడిపోతాయి! చూస్తూ చూస్తూ వుండగానే మన పుస్తకాల ‘గది’ ఎంత చిన్నదైపోయిందో! కానీ, ఆ గదిలో ఇమిడిన ప్రపంచం రెప్పపాటులోనే, మన చేతివేళ్ళ ఇంద్రజాలంతో ఇట్టే ఆకాశమంత విస్తరించింది.

చిన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఏ రోజు వస్తుందా అని రోజులు – మరీ ఆ సస్పెన్స్ తీవ్రతని నాటకీయంగా  చెప్పాలనుకుంటే- క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాళ్లం. నిజంగానే! వారపత్రిక లేని అలనాటి  చదువరి బాల్యాన్ని నేను వూహించలేను. ‘ఈవారం కవిత, కథ’ అనగానే కళ్ళలో చక్రాలు గిర్రున తిరిగి, ఆ పేజీల్లో ఎవరున్నారా అని ఆతృతగా వెతుక్కోవడం, ఆ చదివిన పేజీల్ని, వాటికి వాడిన చిత్రాల్ని అందంగా నెమరేసుకోవడం, ఎప్పటికయినా ఆ పేజీల్లో నేనొక పేజీ కాగలనా అనుకుంటూ కలలు కనేయడం…ఇవాళ నలభైలకి అటూ ఇటూ వున్న ప్రతి రచయితకీ  పఠితకీ అనుభవమే! ‘ఈ వారం మీ పత్రిక చదివాము, ఇంటిల్లి పాదీ ప్రతి పేజీ చదువుకునీ మళ్ళీ చదువుకుని ఎంత హాయిగా కాలక్షేపం చేశామో చెప్పలేను’ లాంటి లేఖలు నిన్నటి నాస్తాల్జియాకి గురుతులుగా మిగిలిపోయాయి. ఆ ‘ఇంటిల్లిపాదీ’ అన్న పదం ఇప్పుడెక్కడా వినిపించనే వినిపించదు ఆశ్చర్యంగా!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో  ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో  మీతో వో  కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ  బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.

ప్రతి గురువారం సారంగ వారపత్రిక మీ కంటి తలుపులు తడుతుంది, మీ పుస్తకాల గదిలోంచి కనుమరుగైపోయిన వారపత్రికా దరహాసమే కాంతిగా! ఈ కాంతిని అక్కున చేర్చుకోండి. ఈ రచనల వెలుగులో కాసింత తడవండి!
శీ ర్షి క లు
ప్రతి నెలా మొదటి గురువారం సారంగ అన్ని శీర్షికలతో కొంచెం ఎక్కువ సందడిగా వస్తుంది. ఆ తరవాతి గురువారాలు పరిమితమయిన శీర్షికలతో వస్తుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో సాహిత్య జర్నలిజానికి శ్రీకారం చుట్టిన శ్రీరమణ గారు చాలా కాలం తరవాత ‘సారంగ’ కోసమే రాస్తున్నశీర్షిక  ‘రెక్కల గుర్రం’  మీ కోసం! కథారచనలో ఆరితేరిన పి.  సత్యవతి గారు ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ రోజుకు కొన్ని గంటల తరబడి పస్తక పఠనంలో గడుపుతారు. అలా చదువుతున్న  కొన్ని పేజీల్ని మనతో పంచుకుంటారు. సమకాలీన కథ అనగానే గుర్తొచ్చే ఆత్మీయమయిన పేరు ఆర్. యం. ఉమా మహేశ్వర రావు. ‘సారంగ’ కోసం తన వర్తమాన కథానుభవాన్ని మనసు విప్పి చెప్పబోతున్నాడు ఉమా  ‘కథా సమయం’ లో నెలనెలా!

ప్రతి ఏడాది వొక ప్రముఖ కథా రచయిత  ‘కథా సారంగ’  శీర్షికని నిర్వహిస్తారు. ఈ ఏడాది  ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ నిర్వహించబోతున్నారు. ఈ శీర్షిక కోసం ప్రముఖ కథకులతో ప్రత్యేకంగా కథలు రాయించి మనకి అందించబోతున్నారు వేంపల్లె షరీఫ్. ప్రసిద్ధ సినీగేయ రచయిత భువనచంద్ర చాలా మందికి పాటల రచయితగానే తెలుసు. కానీ,ఆయనలో అందమయిన కథకుడు కూడా వున్నాడు. ఆయన అనుభవాల అమ్ములపొది నించి చేస్తున్న శరసంధానం  ‘Untold stories’  ప్రతి నెలా మీ కోసం!

తెలంగాణ చరిత్ర శోధనకి మారుపేరు సంగిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రతి నెలా  మన కళ్ల ముందు వుంచే శ్రీనివాస్ శీర్షిక  ‘కైఫియత్’ . అత్తగారిని కూడా నవ్వించగల అల్లరి కోడలు దాట్ల లలిత కథా శీర్షిక  ‘ఈదేసిన గోదారి’  ప్రతి నెలా మీ ఇంట నవ్వుల పంట! ప్రతి వారం మీ కోసం సీరియల్ నవల  ‘అల’  అనే శీర్షిక కింద మీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఈ సీరియల్ వచ్చే గురువారం మొదలవుతుంది. ప్రపంచ సినిమాని మీకు పరిచయం చేస్తున్నారు  ‘తెర’చాప’  శీర్షికలో మద్దూరి శ్రీరాం.

ఇవిగాక వారానికి కేవలం వొకే వొక కవితతో  ‘తరంగ’  ఈ వారం కవిత మీకు ప్రత్యేకం! వొక కవిత చదివిన అనుభవాన్ని మీ దోసిట వుంచే  ‘అద్దంలో నెలవంక,’  అచ్చయిన కథ వెనక దాచేసిన అసలు కథల్ని చెప్పే  ‘చెప్పని కథ’  శీర్షిక వచ్చే గురువారం.  ‘ఓ కప్పు కాఫీ’   ‘అక్షరాల వెనక’   ‘తలపుల నావ’  శీర్షికలు. మీకు ఇష్టమయిన రచయితలతో హాయిగా గడుపుకునే కాఫీ సమయాలు, ఉత్తమ పాఠకుల వేదిక  ‘పాఠకచేరీ’  మంచి కథల తలపోత  ‘కథనరంగం’  ప్రసిద్ధ రచయితలతో మీ జ్నాపకాల వెలుగు  ‘దీపశిఖ  అప్పుడప్పుడూ!

Painting by Mandira Bhaduri

నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

Sriram-Photograph“జూలిన్ షేనబెల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచ నాయకులను చర్చలకు ప్రేరేపించేటంతటి గొప్ప కళను సృజించడం’’ — జేవియర్ బార్డెం

మీరు ఒక క్రూరమైన, ప్రబలమైన శక్తి చేత అణచివేయబడుతున్నప్పుడు, ఆ శత్రుత్వంతో నిండిన పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారు?

ద్వేషానికి  లొంగిపోవడం ద్వారా మీలోని విచక్షణని విడిచిపెడతారా, లేక వాస్తవ  పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వైరి భావాన్ని  అధిగమించడానికి ప్రయత్నిస్తారా?

గొప్ప ఆలోచనాపరులు అరుదు. దర్శకుడు  జూలిన్ షేనబెల్ గాంధీవలె గొప్ప దార్శనికుడు, ఆలోచనాపరుడు.

ఎన్నో చలన  చిత్రాలు క్రూరమైన యుద్ధాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. కాని  అరుదుగా “మిరల్” వంటి కొన్ని చిత్రాలు మాత్రమే మనసులోని ద్వేషం యొక్క  మూలాల్ని శోధించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ విధంగా  ఆచరణాత్మకమైన పరిష్కారాల్ని, శాంతితో కూడిన ప్రపంచాన్ని సృష్టించుకోవడం  సాధ్యమేనన్న ఒక ఆశని మన నిస్పృహకు లొంగిపోయిన హృదయాలకు కలిగిస్తాయి. ఈ  సంక్షుభిత లోకానికి మిరల్ వంటి చిత్రాల అవసరం ఎంతో ఉంది. మానవ హృదయంలోని  బలీయమైన ప్రతీకారేచ్ఛ యొక్క తీవ్రతను చూసి తల్లడిల్లిన హృదయాలకు ఈ చిత్రం  ఓదార్పుని ఇస్తుంది.

“మిరల్” దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, పరిష్కారాన్ని చూపించడానికి కూడా   ప్రయత్నిస్తుంది. అయితే ఈ చిత్రం ఇజ్రాయిల్ కోణం నుండి లేదా పాలస్తీనా  కోణం నుండి కాకుండా ప్రజల కోణం నుండి మాట్లాడుతుంది. ప్రజల దైన్యానికి  ఇజ్రాయిల్ ఎంత కారణమో హమాస్ కూడా అంతే కారణం అని చెబుతుంది. హింస,  తీవ్రవాదం మానవ జీవితాన్ని ఎంతటి దయనీయ స్థితికి నెడతాయో వివరిస్తుంది.  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎంతోమంది దయాన్విత హృదయుల  జీవితాలకు అద్దంపడుతుంది.

1948, అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో,  దెయిర్ యాసిన్ నరమేథం తరువాత,  భీతిగొలిపే పరిస్థితుల్లో  వీధుల్లో తల్లితండ్రులు మరణించి అనాధలై భయంతో  వణికిపోతున్న 55 మంది చిన్నారుల్ని మహోన్నతురాలు హింద్  హుస్సేన్ జరేసులేం  తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకి ఆహారం,  ఆశ్రయం కల్పించే దయనీయమైన సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆరు  నెలల్లో ఆ 55 మంది కాస్తా 2,000 అవుతారు. వారికి ఆమె ఆహారాన్ని ఎలా  సమకూరుస్తుంది  ?  అమానవీయ పరిస్థితుల నుండి రక్షణ ఎలా కల్పించగలదు ? ఆమె తన  వ్యక్తి గత జీవితాన్ని, ఆనందాన్ని వారి కోసం వదులుకొని, ప్రమాదకరమైన రాజకీయ  అనిశ్చిత పరిస్థితులకు దూరంగా వారిని సంరక్షించేందుకు దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తుంది.

1778లో మిరల్ అనే 5 ఏళ్ల బాలికను  ఆమె తండ్రి తన భార్య మరణించించిన కారణంగా హింద్ హుస్సేన్ కు అప్పగిస్తాడు.  సంక్షుభిత బాహ్య పరిస్థితుల ఛాయలు తెలియకుండా దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్లో మిరల్ పెరుగుతుంది. ఆమె తన 17 ఏళ్ల వయసులో ఒక శరణార్థ  శిభిరంలోని పిల్లలకి బోధించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి పాలస్తీనా  శరణార్థుల దయనీయ పరిస్థితులను, బాహ్య ప్రపంచపు క్రూరత్వాన్నిచూస్తుంది.  తీవ్రవాది అయిన హని ప్రేమలో పడి “ఫస్ట్ ఇన్ఫిదా” విప్లవోద్యమం వైపు  ఆకర్షితమవుతుంది. విప్లవోద్యమానికి, విద్యయే శాంతికి మార్గమని నమ్మే హింద్  హుస్సేన్ ఆశయాలకి నడుమ  మిరల్  నలిగిపోతుంది.

miral-3

ప్రియుడు హనిని విప్లవకారులే  ద్రోహిగా ముద్రవేసి అనుమానించి చంపివేయడంతో హతాశురాలైన మిరల్ హింసతో నిండిన  తీవ్రవాదం సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రజల జీవితాల్ని మరింత దుర్భర  పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని అర్థం చేసుకుంటుంది. న్యూయార్క్ లోని  ప్రజలవలె ఇజ్రాయీయులు, పాలస్తీనీయులు, అలాగే అన్ని జాతుల ప్రజలు కలిసి ఒకే  దేశంగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తుంది. దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగంలో  సెటిలర్స్ గా జీవిస్తున్న ఇజ్రాయిల్ ప్రజల పై హమాస్ తీవ్రవాదుల హింస కూడా  వ్యతిరేకిస్తుంది.

రాజకీయ కారణాలకు, సామాన్య జీవితాలకు ఎంతో  వ్యత్యాసం ఉంటుంది. ఎన్నటికీ గెలవలేని యుద్ధంలో తరాల ప్రజల ఆనందాన్ని ఫణంగా  పెట్టే కంటే తక్కువ శాతం భూభాగాన్ని స్వీకరించి సర్దుకోవడానికి, ఇజ్రాయిల్  తో చర్చలకు ప్రయత్నిస్తున్న మితవాదులైనవారి వైపు మొగ్గు చూపుతుంది మిరల్. ఈ  చిత్రం సామాన్య ప్రజలలో మన చుట్టూ జీవించి ఉన్న మహాత్ములను పరిచయం  చేస్తుంది.  ఉద్యమాలు ఎలా  మేధావులు, ఆలోచనపరులైన వారి చేతుల్లో నుండి  ఆవేశపరులు  , రహస్య రాజకీయ ఆశయాలు గల వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయో,  ప్రజలు ఎలా రాజకీయ సిద్ధాంతాలకు ఉద్రేకులై హింసలో పడి తమ జీవితాల్ని నాశనం  చేసుకుంటారో సజీవంగా చూపుతుంది.

హింసతో కాకుండా సామరస్యంతో పరిష్కారం  సాధ్యం అని నమ్మే కొంతమంది ఆశకు బలాన్నిస్తుంది ఈ చిత్రం. హింసతో కూడిన  తీవ్రవాదం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో రవీంద్రనాథ్ టాగోర్ తన “చార్  అధ్యాయ్” నవలలో వివరించడం అప్పటి అతివాద భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల్ని  నిరాశ పరచింది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవోద్యమాల్ని నైతికంగా  దెబ్బతీయడానికి “చార్ అధ్యాయ్” నవలని ఉపయోగించుకొందని వారు ఆరోపించారు.  కాని మానవత్వంపై అచంచలమైన విశ్వాసం ఉన్న టాగోర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో  గాని, మరే ఇతర ప్రపంచ విప్లవోద్యమాలలోగాని హింసను, తీవ్రవాదాన్నిగాని  సహించలేదు.

“మిరల్” చిత్రం ఒక ప్రాంతంతోగాని, ఒక దేశంతో గాని లేదా ఒక  జాతితో గాని తమని తాము identify చేసుకునేవారికి నచ్చకపోవచ్చు. కాని  మనిషిని మనిషిగా ప్రేమించేవారి హృదయాలపై బలమైన ముద్రని వేస్తుంది.

మిరల్ (2010)

నిడివి:  112 నిముషాలు భాష: ఆంగ్లం దర్శకత్వం : జూలిన్ షేనబెల్ నటులు: ఫ్రిదా  పింటో, విలియమ్ డిఫోయ్, హియం అబ్బాస్, అలెగ్జాండర్ సిద్దిక్

హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

sangisetti- bharath bhushan photoహైదరాబాద్‌ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనానికి అక్షరరూపం భాస్కరభట్ల కృష్ణారావు నవలలు. 1950-66ల మధ్య మొత్తం నాలుగు నవలలు రాసిన ఈయన పైదాయిషీ హైదరాబాదీ.
నగరం స్మృతిని, జీవితాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ఆలోచనలను, ఉన్నత ఆదర్శాలను, అంతకుమించి అత్యున్నత జీవిత విలువల్ని ఒకవైపూ ఛిద్రమవుతున్న బతుకుల్ని, చిదిమేస్తున్న దోపిడీ వ్యవస్థ, దానికి అండగా నిలిచిన వెన్నెముకలేని రాజకీయాలు, అన్ని విధాలుగా భాగ్యవంతులైన వారు అభాగ్యులుగా మారిన అమానవీయతను మరోవైపూ తన నవలల్లో కృష్ణారావు అక్షరీకరించారు.

హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు భాస్కరభట్ల కృష్ణారావు నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ‘అభివృద్ధి’ ఆవరించి మెట్రో రైలుపేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌ బజార్‌లాంటి నవలల్లోని ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠీ విమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపు మార్చుకుంటున్నాయి. తరిగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో ప్రజాభిప్రాయాన్ని ‘బుల్‌డోజ్‌’ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.

‘బుల్‌డోజ్‌’కు గురవుతున్న చరిత్ర, సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు కృష్ణారావు నవలలు స్ఫూర్తి కావాలి. యుగసంధి  నవల మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో సీరియలైజ్‌ అయింది. తర్వాత 1957లో నవలగా వెలువడింది. ఇందులో 1920- 48 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా మొత్తం తెలంగాణలో చోటుచేసుకున్న సకల మార్పులు, ఉద్యమాలు, ఉద్వేగాలు, జీవితాలు, ఆర్థిక ప్రగతి, ఆదర్శాలు అన్నీ కలగలిసి ‘యుగసంధి.’.

ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటేనే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదుమిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దిశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము.

ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్నకాలంలో వాటిని చూసి అనుభవించి వ్యాఖ్యానిస్తే వాటిపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల, విశ్లేషణ మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనల్లో మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.

ఆనాటి వుద్యమాల డాక్యుమెంటు

1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ‘యుగసంధి’ నవలలో రికార్డయ్యాయి. ఉద్యమాలకు నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో ఈ అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల/ మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ‘అభ్యుదయ’ భావాల ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను ‘యుగసంధి’గా ఆవిష్కరించాడు రచయిత. నిజానికి ఈ రచయిత కథలు, నవలలు 1940-60వ దశకంలో చదువుకున్న తెలంగాణ వారందరికీ గ్రాహ్యమే. గోలకొండ పత్రిక, దక్కన్‌ రేడియో ద్వారా తెలంగాణ సాహితీ ప్రియులందరికీ పరిచయమే!

హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరిస్తున్న సందర్భంలో వచ్చిన ‘యుగసంధి’ నవలలో ఒక రాజ్యం అంతర్థానమై ఇంకొక రాష్ట్రం ఏర్పాటు సంధి కాలంలో హైదరాబాద్‌ ముఖ చిత్రాన్ని నవలాకర్త ఆవిష్కరిస్తాడు. నవల హైదరబాద్‌పై పోలీసు చర్యతో ముగిసినా ఆ తర్వాతి కాలంలో ఈ అంశాలేవి తెలుగు సమాజానికి పాఠ్యపుస్తకంగా గానీ, సాహిత్య రూపకంగా గానీ అందుబాటులోకి రాకపోవడంతో దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఇది ఒక్క భాస్కరభట్ల కృష్ణారావుకు జరిగిన అన్యాయం కాదు. 1956కు ముందు సాహిత్యసృజన చేసిన తెలంగాణ సాహితీవేత్తలందరికీ జరిగిన అన్యాయం. ఇక్కడి వారు ప్రచారానికి విముఖులు కావడం ఒక కారణం కాగా, వారి గురించి, వారి రచనల గురించి విమర్శ, విశ్లేషణ, చర్చ తెలుగు పత్రికల్లో తగినంతగా జరుగకపోవడం మరో కారణం.

ఈ కారణంగానే అటు ఒద్దిరాజు సోదరులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులెవ్వరికీ న్యాయంగా తెలుగుసాహిత్యంలో న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. తెలంగాణ సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ముడివేసి చూడడం కారణంగానే అంతకుముందూ ఆ తర్వాత వచ్చిన సాహిత్యానికి గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఉపశీర్షికలకు, ఫుట్‌నోట్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త పరిశోధనలకు, కొత్త రచనలకు ఊతమిస్తున్నాయి. ఇదే విషయాన్ని భాస్కరభట్ల కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘న్యూరైటింగ్‌’ పేరిట అనేక రచనలు వెలువడ్డాయని, ఎక్కడైనా పోరాటం ఉంటేనే సాహిత్య సృజన ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్పిండు.

bhaskerabhatla-1

అందుకే ఇప్పటికీ తమ హక్కుల కోసం, పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆఫ్రికన్స్‌, ‘బ్లాక్స్‌’ (పాజిటివ్‌ అర్థంలోనే) సృష్టిస్తున్న సాహిత్యం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. ఈ సాహిత్యం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో వందల సంఖ్యంలో సంకలనాలు పది జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. సంవేదనతో, ఆగ్రహంతో, పీడన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పది జిల్లాల కవులు, కథకులు, రచయితలు తమ గళాన్ని, కలాల్ని, పిడికిళ్ళను ఎత్తిపడుతున్నారు. అదే విధంగా గతకాలపు ఆణిముత్యాలు కూడా కొత్తగా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న ఈ నవలలు కచ్చితంగా జనం మరిచిన తెలంగాణను తెలుసుకునేందుకు అకరాలు అవుతాయి. గత కాలపు విస్మృత తెలంగాణను దర్శించేందుకు దివిటీలవుతాయి.

సరిగ్గా ఇవే విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గత కాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటేనే వాస్తవాల్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, జీవన్మరణ సంఘర్షణలు అన్నీ కలగలిసి ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలలుగా రూపుదిద్దుకున్నాయి ఈ రెండు నవలలు ఆనాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టాయి. రచయిత వీటిల్లో మానసిక సంఘర్షణలను, పరిస్థితులు, వ్యక్తులు, సమాజంపై వేసిన ప్రభావాల్ని భిన్న పార్శ్వాల నుంచి తడిమి పాఠకుణ్ని తనతో పాటు నడిపించాడు. చైతన్యస్రవంతి శిల్పంతో, అధివాస్తవికత భావనలతో తన నవలల్ని తీర్చి దిద్ది తెలుగు పాఠకులకు ఒక కొత్త తరహా సాహిత్య రుచిని చవి చూపించాడు.
అక్షరమక్షరం పాతల్ర మానసిక సంఘర్షణను, జీవన పోరాటాలను, నింపాదిగా ఉండనివ్వని ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటినీ ఈ నవలలు చిత్రించాయి. యుగసంధి నవలలో పైరవీలు, పటేలు`పట్వారీ తగాదాలు మొదలు, కొంతమంది రొహిలాలు, అరబ్బుల దౌర్జన్యాలు, విధవా వివాహాలు, ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, వందేమాతరం, కమ్యూనిస్టులు, రజాకార్లు, అతలాకుతలమైన హైదరాబాద్‌ జీవనం, అవి ఆయా కుటుంబాల్లో తీసుకువచ్చిన మార్పులు, కాలంతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న` మారుతున్న విలువలు, ఒకవైపు శుద్ధశ్రోతియ బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, మరో వైపు బ్రాహ్మణుడైనప్పటికీ జంధ్యంతో పాటు అన్నీ త్యజించి తాగుడు, డిబాచిరీకి అలవాటు పడ్డ ‘లంపెన్‌’ వ్యక్తి విశ్వేశ్వరరావునీ ఇందులో చిత్రించాడు.

మంచీ చెడుల సహ గమనం

హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ప్రగతిశీల భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి.భాస్కరభట్ల మొత్తం నాలుగు నవలలు రాసిండు. అవి వింతప్రణయం, భవిష్యద్దర్శనం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కరభట్ల నవలల్లో మొదటగా చెప్పుకోవాల్సింది యుగసంధి. ఇందులోని రఘు, రుక్మిణి, రమణ, పద్మ పాత్రలు భిన్న ధృక్కోణాల్లో ఆనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. భిన్నమైన ఆలోచనలు కలవాళ్ళని ఒక్కదగ్గర చేర్చి నవల నడిపించడమంటే చాలా క్లిష్టమైనపని. ఆ పనిని భాస్కరభట్ల విజయవంతగా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘యుగసంధి’ నవల్లో రఘుపాత్రలో అక్కడక్కడ భాస్కరభట్ల కనిపిస్తాడు.‘యుగసంధి’ నవల హీరో రఘు స్వయంగా ఇంగ్లీషు ఎమ్మే ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. రఘు పాత్ర  ద్వారా ఆనాటి తెలంగాణ సమాజానికి పరిచయమైన పాశ్చాత్య సాహిత్యాన్ని గురించి రచయిత విశ్లేషిస్తాడు.

నిజానికి హైదరబాద్‌లో 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు కూడా ఇంగ్లీషు మాధ్యమంగానే ఉన్నత చదువులు కొనసాగేవి. అయితే బ్రిటీషిండియాలో గాంధీ లేవదీసిన ‘ఉర్దూ`హిందుస్థానీ’ జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానలీఖాన్‌ తన పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడంతో ఇక్కడ విద్యాబోధన ఉర్దూమాధ్యమంగా ప్రారంభమయింది. ఈ విశ్వవిద్యాలయం ఉర్దూ మాధ్యమంగా ఆరంభం కావడానికి ప్రధాన కారకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సూచనల మేరకే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయినప్పటికీ నిజాం కాలేజి, దాంతోపాటు మరి కొన్ని కళాశాలల్లో బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే కొనసాగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాష చేయడంతో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు దెబ్బతిన్నాయని కూడా రచయిత చెప్పిండు.

ఎన్ని అవరోధాలు ఉన్నా నిజాం కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పంచభాషా సంస్కృతి ఉండేది. నగరంలోని దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఫార్సీ భాషలు వచ్చేవి. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ప్రభుత్వాలు ఎకాఎకిన తెలుగును అధికార భాష చేయడంతో ఈ భాష తెలిసిన ఆంధ్రప్రాంతీయులు ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అంతేగాకుండా స్థానిక పంచభాషా సంస్కృతి కూడా సర్వ నాశనమయింది. భాషారాష్ట్రాల పేరిట ఐదారు భాషలు, కలిసిమెలిసి ఉండిన సంస్కృతిని భ్రష్టుపట్టించి ఏకైక భాష ‘తెలుగు’కు మాత్రమే పట్టం కట్టారు. ఉర్దూ మూలంగా కన్నా ‘తెలుగు’ మాత్రమే వెలిగించే ప్రభుత్వాల మూలంగా హైదరాబాద్‌ పంచభాష సంస్కృతి, తెహజీబ్‌ కనుమరుగయ్యింది.

హైదరబాద్‌ నగరంలో ఉద్యోగం చేయాలంటే కేవలం ఉర్దూ, కొంత ఫార్సీ వస్తే చాలు అన్న పరిస్థితులున్న కాలంలోనే భాస్కరభట్ల కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ బి.ఎస్‌.సి చదివాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి లా చదివాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం సంపాదించి ఎందరో తెలుగువారికి అవకాశం కల్పించాడు. స్వయంగా తన నాటకాలు ప్రసారం చేయడమే గాకుండా, పాటలకు ప్రథమ స్థానం కల్పించాడు. హైదరాబాద్‌ రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశంలో విలీనం కావడంతో ‘దక్కన్‌ రేడియో’ కూడా ఆలిండియా రేడియోలో సంలీనమయింది. దీంతో తనదైన హైదరాబాద్‌ ముద్ర చెరిగిపోయి ప్రాంతేతర ‘తెలుగు ముద్ర’ పడింది.

అప్పటివరకూ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందగిరి ఇందిరాదేవి, మాడపాటి సత్యవతి లాంటి వారికి పుట్టినిల్లుగా ఉండిన ‘రేడియో’లో ప్రాంతేతరుల ప్రవేశం ప్రారంభమయింది. దీంతో ఉర్దూ, తెలుగు మిశ్రిత భాష క్రమంగా తెరమరుగయింది. ఇవే విషయాల్ని నేడు తెలంగాణవాదులు ఉద్యమ సందర్భంలో పదే పదే ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తనదైన తెలుగుభాషను కోల్పోయిందని చెబుతున్నారు. కేవలం భాష విషయమే గాకుండా ‘యుగసంధి’ నవల ద్వారా అనాటి అనేక సమకాలీన అంశాలను కూడా చరిత్రకెక్కించాడు.

‘యుగసంధి’ నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ఘంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు ‘వర్తక స్వాతంత్య్రం’, ‘వెట్టిచాకిరి’, మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో ఈ నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్జంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్య్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌`53 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

బ్రిటీషాంధ్రలో గాంధీజి పిలుపుమేరకు ఉద్యమాలు జరుగుతూ ఉండటం వాటి ప్రభావం హైదరబాద్‌లో ఏమాత్రం లేకపోవడంతో ఒక దశలో స్వయంగా ఉద్యమాన్ని లేవదీద్దామనే ఆలోచన కూడా ‘రఘు’కు వస్తుంది. అయితే అనంతర కాలంలో గోవిందరావ్‌ నానల్‌ వంటి వారు హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లో ‘సత్యాగ్రహం’ చేపట్టడంతో తాను కూడా అందులో చేరాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే తాను ఎమ్మే చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడంతో దానికి ‘రఘు’నాయకత్వం వహించి విజయవంతంగా ఒక సంవత్సరం పాటు నడిపిస్తాడు.

చందాలు వసూలు చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా నాగపూర్‌లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. అలా నాగపూర్‌ వెళ్ళి చదివిన ఉస్మానియా విద్యార్థుల్లో పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి విద్యార్థుల కష్టాలు, విద్యార్థినులచే వందేమాతర ఉద్యమం చేయించాలని ప్రయత్నించి విఫలమైన తీరు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.

స్వయంగా వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, ఎమ్మే ఇంగ్లీషు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయినా ఏ కళాశాల వారు కూడా రఘుకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి లేదనడానికి ఇదే సూచన. ఈనాడు కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల్ని అక్రమ కేసుల పేరిట భయపెడుతూ, మీకు ఉద్యోగాలు రావు అని హెచ్చరిస్తున్నారు. ఈ దశలో రఘుకి హైదరాబాద్‌ సివిల్‌సర్వీసెస్‌ రాయడానికి అవకాశమున్నా నిర్దయగా ఉన్న ప్రభుత్వంలో పనిచేయడానికి ఆయనకు మనస్కరించలేదు. నిజానికి ఒక మధ్యతరగతి హైదరాబాదీ ‘సివిల్‌ సర్వీస్‌’ ఉద్యోగం చేయాలని కలగనడమే ఒక అభివృద్ధి సూచిక. ప్రధాన పాత్ర పద్మ తండ్రి కూడా డాక్టర్‌ కావడం కూడా చూస్తే ఇది ఆనాటి ఉన్నత మధ్యతరగతి జీవితాలను చిత్రించిందనడంలో అతిశయోక్తి లేదు. అవినీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా యూనివర్సిటీకంతటికీ ప్రథముడిగా నిలిచినా లెక్చరర్‌ ఉద్యోగం కూడా రాని సందర్భంలో రఘు ఉద్యోగ ప్రయత్నాలే విరమించుకున్నాడు.

ఆనాడు తెలంగాణలో స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే అవకాశమున్న ఏకైక వృత్తి న్యాయవాదం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులందరూ లా చదివిన వారే. అడ్వకేట్లుగా రాణించిన వారే. ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించిన దాదాపు అందరూ న్యాయవాదులే కావడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే రఘు చివరికి లా చదివి అడ్వకేటుగా స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంతత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు రాని పరిస్థితే గాకుండా, జపాన్‌ సైనికులు మణిపూర్‌పై దాడి మొదలు, హైదరాబాద్‌ స్వతంత్ర ప్రతిపత్తి, సిడ్నీకాటన్‌ ఆయుధాల సరఫరా, రజాకార్లు ఇలా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలోని అన్ని అంశాల గురించి ఈ నవల చర్చించింది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొనే మహిళల గురించి ఒకవైపు, మరోవైపు సిగరెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని చిత్రించిండు.

స్త్రీల ఆధునిక జీవన దృశ్యం

మహిళలు కార్మికులుగా పనిచేయడమంటేనే అది అభివృద్ధికి చిహ్నం. ఎందుకంటే నగరాల్లో ఫ్యాక్టరీలు వెలువడడం, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్వీయ సంపాదనపై ఆధారపడడమంటేనే మారుతున్న సమాజానికి ఆనవాలు. ఇదే విషయాన్ని రమణ పాత్ర గురించి రచయిత ఇలా చెప్పాడు. ‘‘… తాను 20వ శతాబ్దపు యువతిగా బ్రతకదలచింది. తనకాళ్ళపై తాను నిలబడదలచింది. నేడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వుంటేనే గాని ఆమెకి సంఘంలో గౌరవం లేదు. తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం పాటు పడదలచింది’’. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి సంఘంలో గౌరవం వుంటుందనే విషయాన్ని 60యేండ్ల కిందనే గుర్తించి ప్రచారం చేశాడంటే ఆయన దార్శనికత అర్థమవుతుంది. నవలల్లో స్త్రీ పాత్రలను తీర్చి దిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని అనిపిస్తుంది. పదికి పైగా ఉన్న మహిళా పాత్రలను ఒకదానితో ఒకటి ఎక్కడా సారూప్యత లేకుండా భిన్నంగా మలిచాడు. వీటన్నింటిలోకి రుక్మిణి పాత్ర విశిష్టమైనది.

ఎనిమిదో ఏట పెళ్ళయి ఆర్నెల్లకే ‘మొగుడ్ని’ కోల్పోయిన రుక్మిణికి విధవా పునర్వివాహం గురించి, దాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన కందుకూరి వీరేశలింగం గురించీ, హైదరబాద్‌లో కూడా వాటిని చేసుకున్న వాళ్ళ గురించీ ‘బావ’ రఘు ద్వారా తెలుసుకుంది. నిజానికి సరోజిని నాయుడు` ముత్యాల గోవిందరాజుల వివాహం కందుకూరి వీరేశలింగం చేయించిన నాటినుంచే ఆయన గురించి తెలంగాణ వారికి కూడా కొంత తెలిసింది. ఆర్యసమాజ పద్ధతిలో వివాహం చేసుకుంటానని చెప్పిన ‘విశ్వేశ్వరరావు’ తుదకు డొక్కలో తన్ని మానవ మృగంలా తనని ఆక్రమించుకున్నా ఏమిజేయలేని స్థితికి చేరుకుంటుంది. నమ్మి విశ్వేశ్వరరావుతో వచ్చినందుకు మానంతో పాటు కంటె, గొలుసు కూడా అర్పించుకుంది. ఇలాంటి అభాగ్యురాళ్లు అప్పటికీ, ఇప్పటికీ మన కండ్లముందు కనబడుతూనే ఉంటారు. అయితే వారి పట్ల సంవేదనతో, సానుభూతితో, సాంత్వనతో రాసిన వాళ్ళు అరుదు. ఆ అరుదైన ఘట్టానికి ‘యుగసంధి’లో భాస్కరభట్ల జీవం పోసిండు.

చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ‘విధవ’ అయిన రుక్మిణి లంపెన్‌ ‘విశ్వేశ్వరరావు’ చేతిలో బలయిన తీరు. విశ్వేశ్వరరావు లైంగిక వాంఛను తీర్చడానికి అనుభవించిన హింసను నవలాకర్త భాస్కరభట్ల కృష్ణారావు మనస్సుల్ని కదిలించే విధంగా చిత్రిక గట్టిండు. ఈ నవల తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చిత్రిక గట్టాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలను, భాష, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను చర్చించాయి. భిన్న దృక్కోణాల్లో భిన్నమైన రీతిలో నవలలోని పాత్రలు సమాజాన్ని దర్శించాయి.

‘యుగసంధి’ నవల్లో ఈ భిన్నత్వాన్ని సహజసిద్ధంగా తీర్చిదిద్దిన పాత్ర రమణ. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి గౌరవం దక్కుతుందని నమ్మి దాన్ని సాధించుకునేందుకు ఆత్మగౌరవంతో ముందడుగేసిన మహిళ రమణ. త్యాగం, ఆత్మగౌరవం, పట్టుదల, తిరుగుబాటు, అభ్యుదయ భావాలు అన్ని కలగలిపిన పాత్ర రమణ.ఇక పోతే ‘పద్మ’ పాత్రలో ఆనాడు ‘స్త్రీ’ స్వతంత్రంగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు, దాన్ని దుర్వినియోగం కాకుండా ఆమె ఉపయోగించిన తీరు నవలలో ప్రస్తావనకు వస్తాయి. మనసులో ఉన్నది ఎదుటివారికి సూటిగా చెప్పే పాత్రగా పద్మని తీర్చాడు. రఘు డబ్బు తీసుకొని బాగా చదువుకున్నాడు. అదే డబ్బుని తీసుకోవడానికి కనీసం అప్పుగా కూడా తీసుకోవడానికి నిరాకరించి ‘రమణ’ తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.

రజాకార్ల రాజ్యంలో

ఇక్కడ రజాకార్ల గురించి కొంచెం విపులంగా చర్చించుకోవాలి. హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగిన నాడే రఘు`పద్మలకు కూతురు పుడుతుంది. ఆమె పేరు కళ్యాణి అని పెడతారు. లోక కళ్యాణం కోసం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారని రచయిత చెబుతాడు. అయితే తర్వాతి కాలంలో ఇది తప్పని రచయిత తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రజాకార్ల దౌర్జన్యాలు, దుర్మార్గాలు మాత్రమే రచయితకి కనబడ్డాయి. నిజానికి 1948లో రజాకార్ల గురించి కాళోజి ‘నల్లగొండలో నాజీల కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు’ అని నిరసించాడు. అయితే 1969 వచ్చే సరికి రజాకార్లే నయం ఈ ఆధిపత్య ఆంధ్రులకన్నా అనే అభిప్రాయాన్ని వ్యక్తం జేసిండు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి తెలంగాణవాదిగా మారిండు. దాశరథి 1964 నాటికి కొంత తెలంగాణ బాటపట్టిండు. ఇలా రజాకార్ల విషయంలో గానీ, తెలుగు భాష విషయంలో గానీ, పోలీసుచర్య విషయంలోగానీ అందరికీ ఎప్పటికీ ఒకే అభిప్రాయం లేదు. అది విషయపరిజ్ఞానంతో పాటు మారుతూ వచ్చింది. నిజానికి పోలీసుచర్య మూలంగా వేలాది కమ్యూనిస్టు వీరులు తెలంగాణలో పటేల్‌ సైన్యం చేతిలో హతులయ్యారు. నిజాం సైన్యం చేతిలో పదులు, వందల సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు/కార్యకర్తలు చనిపోతే అదే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో ఒకవైపు వేలాది ముస్లింలు మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాల్లో హతమయితే, మూడు వేలకు పైగా తెలంగాణ సాయుధ పోరాటవీరులు అమరులయ్యారు. ఇంతమందిని చంపి బలవంతంగా కైవసం చేసుకున్న హైదరాబాద్‌పై పోలీసుచర్య ఆక్షణంలో ‘లోకకళ్యాణం’ కోసం జరిగిందనే అభిప్రాయం కలిగి వుండవచ్చు.

అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే హైదరాబాద్‌పై పోలీసుచర్య ఒక్క రాజ్యాధినేత ఉస్మాన్‌అలీఖాన్‌ని మాత్రమే మార్చింది. (ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎందుకంటే 1956 వరకు హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌ ఉస్మానలీఖానే) నిజానికి మిలిటరీ, ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వ పాలనను కొనసాగించింది. ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అధికారుల్ని రుద్దింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెల్లోడి లాంటి అధికారులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు. రజాకార్ల అణచివేత పేరిట వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణాలను హరించిన జె.ఎన్‌.చౌదరి సైన్యం హీరోలుగా వెలిగిపోయారు. ఇంత విషాదం దాగి ఉన్న హైదరాబాద్‌పై పోలీసుచర్యపై ఇప్పటికీ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పోలీసుచర్య, రజాకార్లపై 1948`56ల కాలంలో చేసిన వ్యాఖ్యానంలో కొన్ని ఖాళీలున్నాయి. కొన్ని మార్పులున్నాయి. మరి కొన్ని చేర్పులున్నాయి. ఇవన్నీ మేళవించి ఆలోచిస్తే గానీ అసలు విషయం అర్థం కాదు. ఇట్లా కొత్త సమాచారం అందుబాటులోకి రావడం మూలంగా భాస్కరభట్ల కృష్ణారావు వ్యక్తపరచిన అభిప్రాయాల్లో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించే పని ఇప్పుడు జరుగుతోంది.

60 యేండ్ల కాలంలో రజాకార్ల విషయమై ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా దొరలు, దేశ్‌ముఖ్‌లు, దళిత, బీసీలు కూడా ఉన్నారనే విషయం రూఢీ అయింది. ముస్లిం మతంలోకి మారిన వారు కూడా చాలామంది దళితులే అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రజాకార్ల అణచివేత పేరిట వేలాదిమందిని భారతసైన్యం ఊచకోత కోసిందనే విషయం ప్రభుత్వం నియమించిన కమిటీలే నిర్ధారించాయి. అంతేగాకుండా హిందూత్వవాదులు ప్రచారం చేసినట్లుగా ఈ రజాకార్లకు నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందేది కాదు. అందువల్లనే వాళ్ళు నవలలోని పద్మ తండ్రి దేశ్‌ముఖ్‌ ఆంజనేయుల్ని కూడా డబ్బులివ్వమని డిమాండ్‌ చేస్తారు.

అలాగే సిగరెట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రషీద్‌ని కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అంతేగాకుండా రుక్మిణిని మత మార్పిడి చేయించాలని కూడా హెచ్చరిస్తారు. దీనికి రషీద్‌ తిరస్కరిస్తూ నేను జాతీయవాదిని రుక్మిణిని మతం మార్చుకొమ్మని చెప్పేది లేదని తెగేసి చెబుతాడు. తెగేసి చెప్పినందుకు గాకుండా అడిగిన డబ్బు ఇవ్వనందుకే ఆగ్రహంతో రజాకార్లు రషీద్‌ని కూడా చంపేస్తారు. అంటే రజాకార్లకు మతంతో సంబంధంలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ పబ్బం గడుపుకునేందుకే ముస్లింలీగ్‌ రాజకీయాల్ని హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఇత్తెహాదుల్‌ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇట్లాంటి సందర్భంలో మజ్లిస్‌పార్టీ, మతతత్వాన్ని బాహాటంగా ప్రచారం చేసిన కాసిం రజ్వీ చర్యల్ని తప్పకుండా ఖండిరచాల్సిందే. అయితే ఇక్కడ ముస్లింలందరూ కాసిం రజ్వీ అనుచరులే అన్న రీతిలో ఇప్పటికీ కొన్ని సంస్థలు, పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే లేదా వారి ఆలోచనల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలంటే ఇందులోని రషీద్‌ పాత్ర, రజాకార్ల చర్యల్ని రెండిటినీ జమిలిగా విశ్లేషించాల్సి ఉంటుంది. నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలస వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా ఈ న వల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా అర్థమవుతుంది.

వొక మాంత్రికుడితో కొన్ని మాటలు

 మార్చి 10 కేశవరెడ్డి గారి పుట్టిన రోజు 

MaheshVenkat_KesavReddy1

(ఎడమ వైపు నుంచి) డా. కేశవ రెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్

ధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

“హలో”

“సర్, నాపేరు మహేష్ అండీ, కేశవరెడ్డిగారేనా!” అంటూ నేను కొంచెం లోవాయిస్ లో…

“అవునబ్బా! కేశవరెడ్డినే. చెప్పండి.”

***

సంవత్సరం 2009.

“మునెమ్మ” చదివాక ఒక ఉన్మాదం ఆవరించింది. అప్పుడప్పుడే ఒక డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడం, కొన్ని సినిమాలకి స్క్రిప్టు సహకారం అందించడం ద్వారా మెయిన్ స్ట్రీం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న తరుణం. మునెమ్మ గురించి విన్నప్పుడే ఒక శక్తివంతమైన సినిమాకు సంబంధించిన సరంజామా అనిపించింది. ఒకసారి చదివాక ఆగలేని ఉత్సాహం నిండుకుంది. కాలేజిలో హెమింగ్వే  ‘ఓల్డ్ మెన్ అండ్ ది సీ’ చదువుతున్నప్పుడు తెలిసిన  రెఫరెన్స్ తో “అతడు అడవిని జయించాడు” పుస్తకం చదవటంతో డాక్టర్ కేశవరెడ్డి అనే పేరు పరిచయం అయ్యింది. మా చిత్తూరు రచయిత అనే అభిమానమో ఏమోగానీ, పేరు మాత్రం అలాగే గుర్తుండిపోయింది. మళ్ళీ మునెమ్మ దెబ్బకి ఆ పేరు మర్చిపోలేని విధంగా మెదడులో నిక్షిప్తమైపోయింది.

నా మిత్రుడు, సహరచయిత సిద్దారెడ్డి వెంకట్ (‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా దర్శకుడు) తో మునెమ్మ గురించి చర్చిస్తున్నప్పుడు “అరే! నువ్వు కేశవరెడ్డిగారిని ఇన్నాళ్ళూ మిస్ అయ్యావా. చదవాలి బాస్. ఆయన నవల ‘సిటీ బ్యూటిఫుల్’ చదివాకగానీ నాకు తెలుగులో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయని తెలీదు” అంటూ ‘సిటీబ్యూటిఫుల్’ నవలని పరిచయం చేశాడు. ఒక్కబిగిన చదివిన నవలలు నాజీవితంలో తక్కువే. సిటీ బ్యూటిఫుల్ ఆ కోవలోకి చేరింది. చైతన్య స్రవంతి శైలిని గురించి వినడం చదవడం అప్పటికే చేశాను. తెలుగులో అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ రచనలు ఆ శైలితో సుపరిచితమే. కానీ కేశవరెడ్డి విన్యాసంలోఆశైలి ఇంకో అద్వితీయమైన స్థాయికి చేరిందని నేను ఖరాఖండిగా చెప్పగలను. చైతన్య స్రవంతికి జేమ్స్ జాయ్స్ ఆద్యుడైతే, తెలుగులో చలం తరువాత ఆ శైలిని ఉఛ్ఛస్థితికి తీసుకెళ్ళిన రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కాశీభట్ల వేణుగోపాల్ లాంటివాళ్ళు దీన్ని ఇంటర్నల్ మోనోలాగ్ అన్నా, నాకైతే స్ట్రీమ్ ఆఫ్ కాంషస్నెస్ గానే అనిపిస్తుంది.

ఇక వేట మొదలయ్యింది. ఇన్ క్రెడిబుల్ గాడెస్, చివరి గుడిసె, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్జిముండాది చదివాకగానీ ఆకలి తీరలేదు. ప్రతిపుస్తకం చదువుతుంటే ఒక అద్భుతమైన సినిమా చూసిన అనుభవం. ధృశ్యాలు కళ్లముందు కదలాడి, ఉద్వేగాలతో శరీరాన్ని ఊపేసిన అనుభూతి. ఇంత సులువుగా, ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా రాయగలగడం ఒక సాధన.

***

“మీ మునెమ్మ నవల చదివాను సర్”

“ఎట్లుంది? బాగుందా?”

“అద్భుతంగా ఉంది సర్. ఆ నవలను సినిమాగా తియ్యాలనుంది సర్.”

“మునెమ్మనా…సినిమాగానా! మనోళ్ళు చూస్తారా? అయినా సినిమా అంటే పెద్ద కష్టం లేబ్బా.”

“నిజమే…కానీ తీస్తే బాగుంటుంది అనిపించింది సర్. మిమ్మల్ని కలవాలనుంది. మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వస్తున్నారా సర్”

“హైదరాబాదా…ఇప్పట్లో రాలేనుగానీ, నువ్వే మా నిజామాబాద్ కి రా ,కూచ్చుని మాట్లాడుకుందాం.”

“సరే సర్….సార్ మాదీ చిత్తూరు జిల్లానే సర్..పీలేరు దగ్గర యల్లమంద.”

“అవునా…నాకు బాగా తెలుసునే ఆ ఏరియా అంతా…సరే ఇబ్బుడు క్లినిక్ లో ఉండాను. మధ్యాహ్నంగా ఫోన్ చెయ్ మాట్లాడుకుండాము.” అంటూ అటువైపునుంచీ నిశ్శబ్ధం.

నేను ఫోన్ పెట్టేసాను.

***

అప్పట్నించీ అడపాదడపా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను అవడానికి చిత్తూరువాడినే అయినా, చదువురీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరగడం కారణంగా భాష చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోయి ఏవోకొన్ని పదాలలో తప్ప మా యాస నాకు దూరమయ్యింది. కానీ డాక్టర్ కేశవరెడ్డిగారితో మాట్లాడుతుంటే, ఆ యాస వింటుంటే ఏదో తెలీని ఆత్మీయత. ఆయన జీవితమంతా నిజామాబాద్ లో గడిపినా, అక్కడి యాసతో భాషతో ఒదిగిపోయినా తన ఇంటొనేషన్, కొన్ని టిపికల్ పదాలువాడటం అన్నీ ‘సిత్తూరు’తీరే.

కొన్నాళ్లకు మిత్రులసహాయంతో ధైర్యం చేసి మునెమ్మ నవల హక్కులు తీసుకోవడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ ప్రయాణం అయ్యాను. కలిసాను. ఫోన్లో ఎంత సింప్లిసిటీ వినిపించిందో అంతకన్నా సింపుల్ గా మనిషి కనిపించారు. క్లినిక్ నుంచీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం కలిసినవాళ్లం మాటల్లో సాయంత్రం ఎప్పుడయ్యిందో తెలీలేదు. ప్రపంచ సినిమాపై కేశవరెడ్డిగారికున్న పట్టు, తన దగ్గరున్న స్క్రీన్ ప్లే కలెక్షన్లూ చూశాక ఆయన నవలలు చదువుతుంటే సినిమా ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది. నాదగ్గరున్న చిట్టాకూడా ఏకరువు పెట్టాను. వెనుదిరిగి వచ్చాక పోస్టులో కొన్ని డివిడి లు.  పుస్తకాలు పంపాను.

మునెమ్మ మా సొంతమయ్యింది. పుస్తకం మీదో లేక నా ల్యాప్ టాప్ లోనో ఏదో పిచ్చిగా నోట్స్ రాసుకోవడం. మునెమ్మ పాత్రను, కథను, ఉపకథల్ని పొడిగించుకోవడం, కొత్త కోణాల్ని జోడించడం కేశవరెడ్డిగారికి ఫోన్ చేసి విసిగించడం. పాపం ఆయన ఎప్పుడూ విసుక్కున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. కొన్నిరోజులకి ఇప్పట్లో మునెమ్మను సినిమాగా తియ్యలేమనే నిజం తెలిసొచ్చింది. నేను నిరాశపడ్డా కేశవరెడ్డిగారు నిరాశపడలేదు. “సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసులేబ్బా! చూద్దాం ఏమవుతుందో” అనేవాళ్ళు. నేను చెప్పిన క్లైమాక్స్ మార్పులకు మించిన ముగింపులు కొన్ని తనే తయారుచేశారు. ఆయన స్వప్నించి మునెమ్మని సృష్టిస్తే నేను ఆ మునెమ్మను ఇంకా శ్వాసిస్తూ ఉన్నాను.

***

డాక్టర్ కేశవరెడ్డిగారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా కలిసే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడప్పుడూ ఫోన్లు. సాహితీచర్చలు. సినిమాల గురించి మాటలు. మునెమ్మ గురించి తక్కువగా మాట్లాడతాం.

***

తెలుగు నవలాకారుల్లో డాక్టర్ కేశవరెడ్డి ఒక మాంత్రికుడు. అత్యుత్తమ కథకుడు. ల్యాండ్ స్కేప్ ను, మిథ్ ను, మ్యాజిక్ ను, ఫోక్ లోర్  ని, జీవజంతువుల్ని కలగలిపి వాటితోనే మనుషులకు కథ చెప్పించగలిగిన అరుదైన కళాకారుడు. డాక్టర్ కేశవరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు.

  

అతను- ఆమె – నేను – ఒక కథ

rm umamaheswararao‘ఇది ఫెయిల్యూర్ స్టోరీ,’ తలకోన అడవిలో ఖదీర్ బాబు అన్న మాట ఇది.

ఆకాశం ఎత్తుకు ఎదిగి, నీలిమబ్బులతో గుస గుసలాడుతున్న మహా వృక్షాల నీడలో కథలు రాసే ఎందరో, అప్పుడు కూర్చుని ఉన్నారు. అయ్యో… ఈ అడివి చెట్లు, నీలి మబ్బులతో మాట్లాడే భాష ఖదీర్ కి అర్ధం కాలేదే! అనుకున్నాను.

బహుశా ఖదీర్ పుష్పవర్ణమాసంలో పుట్టలేదనుకుంటాను.

కథని కంప్యూటర్ తెర మీద చదవడం కంటికీ, మనసుకీ కూడా అంత హాయిగా ఉండదు. అసలే ఉబ్బదీసిన మధ్యాహ్నం చిరచిరలాడుతోంది. తిరుమల కొండ ఎండుబారిపోయి దిగులు నింపుతోంది. సవాలక్ష కారణాలతో మనసంతా చికాగ్గా ఉంది. ‘మహిత’ రాసిన సామాన్య మెయిల్ లో పంపిన కథ చదవకుండా ఆగడం ఎలా? కథ పూర్తి చేసి చూద్దును కదా, కిటికీ బయట దిరిసెన చెట్టు, ఎర్రటి ఎండలో దగ దగా మెరిసిపోతోంది. ఎండా కాలపు ధూళిలో, వెలుగు రేఖలు ముదురుపచ్చ ఆకులను ముద్దాడి, చేతులు సాచి పిలుస్తున్నాయి. కొమ్మల నిండా అటూ ఇటూ ఎగురుతూ కిచకిచలాడుతున్న పిచుకలు, గుబురు ఆకుల నడుమ మౌనంగా కూర్చున్న కోయిల.

ఆ వెలుగుపచ్చ అందానికీ, నాకూ మధ్య ఇనుప ఊచల కిటికీ.

ఇంతదాకా నేను చదివిన కథ నా కంటి ముందు ప్రత్యక్షమయిన అనుభూతి. కథలోకి నేను వెళ్ళానా? కథ నాలోకి ప్రవేశించిందా? కథా, నేనూ కలగలసిపోయిన వింత అనుభవం. గొప్ప సౌందర్యం ఏదో గాలి తెమ్మెరలా నన్ను స్పర్శించి, నా లోలోపలికి ప్రవేశించింది. కంప్యూటర్ తెరమీది కథలోంచా, కిటికీ బయటి గుబురు పచ్చ వృక్షం లోంచా? ఎక్కడి నుంచో అర్ధం కాలేదు.

లేచి వాకిట్లోకి వచ్చాను. గంగిరేణి చెట్టు కింద పండి రాలిన ఆకుల పసుపుదనం, గోడ మీద పాకుతున్న కమ్మెట పురుగు వయ్యారపు నడక, ఎదురుగా కొబ్బరాకుల మీద వాలుతున్న గద్ద నైపుణ్యం, చింకి పొదల మీద ఆరేసిన రంగుబట్టలతో వాలెండ వర్ణ విన్యాసం, ఎప్పుడూ చూసే వరండాలోని కలంకారీ చిత్రంలోనూ కనిపించిన కొత్త అందం. సమస్తమూ సౌందర్యభరితంగా కనిపించిన క్షణం అది.

సామాన్య రాసిన ‘పుష్పవర్ణమాసం’ కథ చదివాక నాకు కలిగిన అనుభవం ఇది.

పుష్ఫవర్ణమాసం ఏమిటి? ఏముంది ఆ కథలో…?

అతను, ఆమె. ఆ ఇద్దరే.

భర్త, ఇల్లు, పని, పనివాళ్లు… ఇంతేనా? రోజూ ఇంతేనా?

పంజరం బంగారమైనంత మాత్రాన అనందం కలుగుతుందా?

అప్పుడు చూసింది ఆమె అతన్ని, కిటికీ అవతల గుబురు మామిడి చెట్టుమీద ఆకుల్లో ఆకులా కలగలిసిపోయిన అతన్ని. అతని భుజం మీద కోయిల.

ఎవరతను? దయ్యమా? దేవుడా? భ్రమా?

ఎందుకో, రోజూ అతని కోసం ఎదురు చూసేది ఆమె. ‘సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను.’ పలకరిస్తే మాయమయ్యేవాడు. కొన్ని రోజులు కనిపించేవాడు కాదు. ఉగ్ర రూపమెత్తి కురిసిన వానని వింటూ ఆమె నిద్ర పోయిన రాత్రి, తెల్లవారింది బీభత్సంగా. రాలిన ఆకులు, తెగిపడ్డ పిందెలు, విరిగిన కొమ్మలతో యుద్ధక్షేత్రంలా మారిన మామిడి చెట్టు మీద మొఖం నిండా దిగులుతో కనిపించాడతను. ఏమయ్యారు, ఇన్ని రోజులు? అని నిష్టూరంగా పలకరించిన క్షణమే చెరిపేసిన గీతలా మాయమయ్యాడతను. ‘రాత్రి కురిసిన వానలా’ ఏడ్చి ఏడ్చి పడుకున్నది ఆమె. పొద్దున్నే సంపెంగ పూ చెట్టు కొమ్మ మీద కూర్చుని కిటికీ ఊచలు పట్టుకుని పలకరించాడతను.

అప్పుడు నేర్చుకుంది ఆమె ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష.’

ఇక, ఒకటే మాటలు, గలగలా జలపాతంలా. ఆ ఇద్దరి మీదా వాలిన పిట్టలు పాటలు పాడేవి. ఆ పాటల్లో వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించేవి. భూమికీ, ఆకాశానికీ మధ్య కిటికీ. బయట అతను, లోపల ఆమె. అతను రాని రోజు రాత్రి, ‘బల్లంతా బంగారు రంగు జలతారు వెలుతురు పరుచుకుని, మనసు నిండుగా ఉత్తరం రాసేది’ ఆమె.

ఆమె నవ్వులూ, మాటలూ, పాటలూ ఆ ఇంట్లోని వాళ్ళకి వింతనిపించాయి. ఆమెకి దయ్యం పట్టిందన్నారు. పుట్టింటికి పంపారు. తిరిగి వచ్చింది ఆమె, అతని కోసం ఆర్తిగా.

అప్పుడు అనిపించింది ఆమెకి, ‘లక్ష ఊచల పంజరమై, అతన్నీ, అతని పక్షుల్నీ బంధించెయ్యాలని.’

అప్పుడు అర్ధమైంది ఆమెకి, అతనూ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని. లంకె కుదరని మాటలేవో నడిచాయి, తడబాటుగా ఆ ఇద్దరి మధ్యా. ‘అడవి పచ్చరంగు చీర, ఆకాశ నీలం రవిక ధరించిన ఆమె, చినుకు చుంబించిన నేల పరిమళం’ లా కనిపించింది అతనికి. ‘ఆకాశ సముద్రాన్ని ఈదే చంద్రుడి’ లోంచి కొంత భాగం తీసుకుని ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి ఇచ్చాడు ఆమెకి.

అప్పుడు కలిగిందామెకి, ‘అతను కావాలి’ అని.

‘మనం మంచి స్నేహితులం, అంతే’ అన్నాడతను. అతను మాట్లాడుతుండగానే ఒక మొక్క ఆమె మనసులో మొలిచి, మారాకు వేసుకుని వేగంగా పెరిగింది. ‘అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు’ అతనితో వాదించగలదా ఆమె! ఇరవై నాలుగు రేకుల ‘వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది’. అతను రాలేదు, చాలా రోజులు. ‘అతను కావాలి’ అని ఆమె ఒంటరి ధ్యానం.

ఒక రోజు అతనొచ్చాడు. కృశించిపోయిన ఆమెని చూసి దిగులుపడి వర్షించాడు. ఇప్పుడతని చుట్టూ పక్షులు లేవు. ఎందుకు ఆమె అంతగా కోరుకుంది అతన్ని. ఏం చేసుకుంటుంది అతన్ని? అతనేమివ్వగలడు ఆమెకి? ఆమెకి లేనిదేమిటి? అతనికీ, ఆమెకీ మధ్య ఉన్న కిటికీని ఏం చేసి మాత్రం ఎవరైనా తొలగించగలరు?

అప్పుడు ఇంకా బలంగా అనిపించింది ఆమెకి, ‘అయినా సరే, అతను కావాలి’ అని.

అప్పుడు మాట్లాడాడు అతను అచ్చు ఒక మగవాడిలా ఆమెతో.

ఏడుపు దాచుకున్న వైరాగ్యపు నవ్వు ఆమె పెదవుల మీద నర్తించింది. అతను వెళ్ళిపోయాడు, తొలి పరిచయపు రోజుల్లో అతను ఇచ్చిన గోమేధికం మాత్రం ఉండి పోయింది, ఆమె మెడలో మోయలేనంత బరువుగా మారి.

దయ్యాలని తరిమేసే కామాక్షమ్మ గుడి మెట్ల మీద కూర్చుని ఆమె అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది, అతను వస్తాడనే నమ్మకంతో, మెడలో నిప్పులా కణకణ మండిపోతున్న బండరాయంత గోమేధికం ధరించి.

ఇంతకీ, అతనొస్తాడా?

ఈ కథలో రచయిత్రి సమాజానికి ఏం చెప్ప దలచుకుంది?

పెళ్ళయిన ‘ఆమె’,అతన్ని కోరుకోవడం అనైతికం కాదా?

దయ్యం ఏమిటి, అశాస్త్రీయంగా.

అసలు పుష్పవర్ణమాసం ఎక్కడుంది?

ఇట్లా అడిగే వాళ్ళతో ఏం మాట్లాడగలం?!

ఏ కథ అయినా మనసుకి దగ్గరగా ఎప్పుడు వస్తుంది? ఆ కథలో మనకి మనం కనిపించినపుడు. ముసుగులేసుకునో, రంగులు పూసుకునో, మనసు పొరల్లో దాక్కునో ఎక్కడో అక్కడ ఎలాగో ఒకలాగ మనకి మనం దొరికిపోతాం. అప్పుడిక అది మన కథే అనిపిస్తుంది. అద్దంలా మనల్ని మనకు చూపుతూనే, మెల్లగా ఎక్కడికో దారి తీస్తుంది. ఆ దారి మంచిదో చెడ్డదో తీర్పులు చెప్పకుండా, తేల్చుకోమని ఒక ఆలోచన ఇస్తుంది. అప్పుడిక మనసు, పగిలిన జిల్లేడు కాయలోంచి బయటపడి ఎగిరే విత్తనంలా మారుతుంది. ఎక్కడో ఏ చెమ్మ నేల మీదో వాలి, తొలి చినుకు కోసం ఎదురు చూస్తుంది.

పుష్పవర్ణమాసం కథ చదివాక, ‘ఆమె’ ఎవరు? ‘అతను’ఎవరు? అనే ప్రశ్రలు ఉదయిస్తాయి. ఆమె ఎవరో తెలిసిపోతుంది సులువుగానే. ఆమె ఎవరో తెలిసి పోయాక, అతని కోసం అన్వేషణ మొదలవుతుంది. అతను అమూర్తం. అతను అనేకం. ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నది అతని కోసమే కదా అనిపిస్తుంది. అబ్బ ఎంత సౌందర్యం! అతను కావాలి అనిపిస్తుంది. అతను కనిపించాక కానీ పంజరం గుర్తుకురాదు. సకల జీవన బంధాలనీ గుర్తు చేసే రెక్కల పిట్ట అతను. నడి అడవిలో గాలి ఊదే వెదురు గానం అతడు. మనిషా, దేవుడా, దయ్యమా..? ఎవరైతేనేం! అతని ప్రేమ కావాలనిపిస్తుంది, ఎక్కాల పుస్తకంలో ఇష్టంగా దాచుకున్న నెమలీక కొందరికి అతను. మరి కొందరికి మాత్రం అతను ఒక రహస్యోద్యమం. నిద్ర రాత్రి తల కింద దాచుకున్న ఆయుధం. పశువుల మందని అడవికి తోలుకెళ్ళే పాలేరు పిల్లగాడికి దొరికిన భరోసా. అందుకే, అతను కావాలి. అతని కోసమే నిరీక్షణ. అతనొస్తాడనే ఆశ. అతనొస్తాడనే నమ్మకాన్ని గుండెల నిండా నింపుతుంది పుష్పవర్ణమాసం కథ.

ఈ కథ నిర్మాణ రూపం మీద కూడా కొందరికి అసహనం, సూటిగా చెప్పొచ్చుగా, ఇన్ని ప్రతీకలెందుకని చిరాకు. మార్య్యూజ్ ని ఇలా ఎందుకు రాశావయ్యా అని అడగ్గలమా? అలా రాయడం అతని అవసరం, అప్పటి అవసరం. అవసరమే కదా కథకి రూపశిల్పాన్ని నిర్దేశిస్తుంది. అనుభవించి పలవరించినపుడే అది ప్రవాహంలా బయటకొస్తుంది. పుష్పవర్ణమాసం కూడా ఇంతే.

ఇంతకీ ఈ కథ నీకెందుకు నచ్చిందీ అనడిగితే, నేనేం చెప్పగలను?

బహుశా పుష్పవర్ణమాసంలో పుట్టానేమో అని తప్ప.

*****

పుష్పవర్ణమాసం

~సామాన్య

Painting of saamaanya -- pushpavarnamasam

ఆ  రోజు  నా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. మా గ్రామ దేవత కామాక్షమ్మ గుడికి ఎడం చేతి వైపున వుంటుంది సుబ్బరాయుని పుట్ట. అందరం అక్కడ చేరాం. పుట్టు వెంట్రుకలు తీస్తుంటే, పిల్ల పాపం ఘోరంగా ఏడ్చేస్తుంది. కొందరు పొంగళ్ళు పొంగించేందుకు  పొయ్యి పెట్టడం కోసం రాళ్ళు వెదుకుతున్నారు. మా గుడి ఆవరణ అంతా పరుచుకుని గల గల లాడుతూ, ఎండలో  వెండిలా మెరిసిపోతూ  వుంటుందో పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఎత్తుగా కట్టిన అరుగు వుంటుంది. పుట్ట దగ్గర జరుగుతున్న తతంగాలకి చిరాకు వచ్చి, నేను వెళ్లి ఆ అరుగు పైకి చేరి, మందిరం  ఆవరణలో అక్కడక్కడా తచ్చాడుతున్న భక్తుల్ని  చూస్తూ కూర్చున్నా.

గుడికి కుడి వేపున వున్న మండపంలో   స్తంభానికి ఆనుకుని ఎవరో ఒకామె  కూర్చుని వుంది. గొప్ప అందంగా వుంది. నేను అద్దాలు తీసి తుడిచి పెట్టుకుని మళ్ళీ చూశా. దానిమ్మ పువ్వు రంగు ఝరీ  చీరలో కొంత వాడిన మొగలిపువ్వులా వుంది. ఆవిడ వొంటి రంగు, చీర రంగుల అద్భుత సమ్మెళనమో, మరోటో, వద్దన్నా బలవంతంగా తనవైపుకి లాగేస్తుంది ఆమె  సౌందర్యం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీవిడ?  ఇంతక ముందెప్పుడూ ఇక్కడ  చూడలేదే … ? ఎవరినడగాలి ఈవిడ గురించి … ఆలోచిస్తుంటే  విఘ్నేస్వరుడి మందిరం లో నుండి బయటకొచ్చాడు చిన్న పూజారి శేషాచార్యులు . శేషు చిన్నప్పుడు నా ఆటల పాటల  జట్టులో ప్రధాన సభ్యుడు. నా కంటే ఏడెనిమిదేల్లు  చిన్న వాడు. వాడిని పిలిచి గుసగుసగా “ఏం శేషు! ఏంటి సంగతి ఈ మధ్య తపస్సులూ గట్రా మొదలెట్టావా ఏంటి? దేవకన్యలని గుడికి రప్పించావ్” అన్నా. తలా తోక లేని నా మాటలకి  అచ్చు చిన్నప్పట్లానే వెర్రి ముఖం ఒకటి పెట్టేసి, “దేవకన్యలేంటి పెద్దక్కా?” అన్నాడు ఆశ్చర్యపడిపోతూ, నేను ఇంకా గుస గుస పెంచి, అదిగో ఆ మండపం లో స్తంభానికి ఆనుకుని కూర్చుని వుందే ఎవరేమిటి  ఆవిడ దేవకన్య కాకపోతే” అన్నాను. అది విని శేషు ముఖం వికాసంగా పెట్టి “దేవకన్య కాదు పెద్దక్క, దెయ్యం” అన్నాడు పూలు కొబ్బరిచిప్ప  చేతిలో పెడుతూ.

అప్పుడే అటోచ్చిన మా అత్త   “పెద్దమ్మాయ్  నడువ్, నడువ్ ఎక్కడకొస్తే అక్కడ స్నేహితులు, మాటలూ…అందరూ నీ కోసం వెతుకుతున్నారు” అన్నది. నేను అరుగు దిగి అత్త వెనకాలే నడుస్తూ ఆవిడను చూసాను. అదే ఫీలింగ్. దానిమ్మ పూరంగు పట్టుబట్టలో చుట్టిన మొగలి పూపొత్తిని చూసినట్లు. ఆవిడ దెయ్యమేంటి, ఈ శేషుకి చిన్నప్పట్నుంచి వేపకాయంత వెర్రి వుంది.ఇప్పుడది తాటికాయ అయ్యుంటది. మా  గుడికి దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందినే తీసుకొస్తుంటారు. చాలా మంది నయమై కూడా వెళ్తుంటారు, కానీ వాళ్ళెవరూ ఈవిడలా శుభ్రంగా వుండరు, ఎందుకో ఆవిడతో మాట్లాడాలనిపించింది. ఆవిడ సౌందర్యం వల్లనేమో…మా అత్త చేతి నుండి నా చేతిని విడిపించుకుని ఇదిగో అత్తా నీ వెనకే వచ్చేస్తా గానీ నువ్వు  పద అని మండపం వైపు నడిచా.

పువ్వులా ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని వుంది ఆవిడ, నిశ్చలంగానో, పరధ్యానంగానో. నేను నిశ్శబ్దంగా, ధ్యానానికి వచ్చిన భక్తురాల్లా ఆవిడకి కొంచం ఎడమగా  కూర్చుని, శేషు  ఇచ్చిన కొబ్బరిచిప్ప  పగలకొట్టడం మొదలుపెట్టాను. ఆవిడ పరిసర స్పృహలో లేదు. దగ్గరగా ఇంకా బాగుంది. రింగుల జుత్తు, నిండు నవ్వు పెదవులు.

కాసేపటికి చేతికొచ్చిన చిన్న కొబ్బరి ముక్క ఆవిడ వైపుకు సాచి, పరిచయపూర్వకంగా నవ్వుతూ “తీసుకోండి” అన్నాను. ఆవిడ చిర్నవ్వి “థాంక్ యు” అంది.  అమ్మయ్య ఈవిడ  దయ్యం కాదు దేవతే. కానీ పలకరించడం  ఎట్లా?  కాస్తా బలంగా  ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి “మాది ఈ ఊరే. కానీ, మిమ్మల్ని ఇంతకు  ముందు ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు” అన్నాను. ఆవిడ నా మాట విని, పల్లవి అసలే లేని పాటలా “ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడికి రాలా నేను! దయ్యం పట్టిందట నాకు! దయ్యం పట్టాలని  నేను గాడాతి  గాడంగా కోరుకుంటున్నానూ… అయినా పట్టడం లేదు అని చెప్పా. ఎవరూ వినలా. ఇక్కడ తెచ్చి వదిలారు. కానీ నాకిక్కడ బాగుంది. సందె వాలిందంటే చాలు ఆ చెట్టు పైకి ఎన్ని పక్షులొస్తాయో తెలుసా. అతనితో పాటూ అట్లాగే వచ్చేవి రకరకాల పక్షులు, రంగు రంగులవి, సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను” అన్నది.

నాకు అయోమయం అనిపించింది. ఏం మాట్లాడుతుందీవిడ, శేషు చెప్పినట్లు ఈవిడ తేడానేనా ?కానీ టూ క్యూరియస్. అందుకే తల ఊపి “మీరు భలే అందంగా వున్నారు. ఎంతసేపైనా చూడాలనిపించేట్టు…ఇంతకీ ఎవరతను” అన్నాను

“ఎవరూ”

“అదే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సౌందర్యాన్ని వెంట తెచ్చేవాడని అతను.”

“ఓ! అతనా, అతను దయ్యం! , పేరు నాక్కూడా తెలియదు”

నేను ఆశ్చర్య పడ్డాను. తల ఒకసారి విదిలించి, వెళ్దామా అని ఆలోచించాను. పగలు మద్యాహ్నం లోకి  జారబోతుంది. సుబ్బరాయుడి పుట్ట దగ్గర, పొయ్యికి మూడురాళ్ళు దొరికినట్టే వున్నాయి సన్నటి పొగ లేస్తుంది. ఎందుకో పోలేక ఆగి, ఆవిడ వైపు చూసి “దయ్యాలు ఉన్నాయంటారా?” అన్నాను. ఆవిడ “దయ్యాలున్నాయి, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్లకి కనిపిస్తాయి” అన్నది. పుష్ప వర్ణ మాసమా…! అదేం మాసం? నేనెప్పుడూ వినలేదే ఆ పేరు, బహుశ   పుష్య మాసాన్ని ఈవిడిట్లా చెప్తుందేమో అనుకుని, “అవునా… ఎక్కడ చూసారు దయ్యాన్ని మీరు?” అన్నాను.

ఆవిడంది “ఒకరోజు మధ్యాహ్నం పన్నెండూ అట్లా అయి వుంటుంది. వైశాఖ మాసపు చివరి రోజులవి. నా పడక గదిలో దిళ్ళకి ఆనుకుని, కిటికీలోంచి చూస్తూ వున్నాను. పెద్ద కిటికీ మాది. కిటికీ లోంచి లోపలికి రావడానికి తెగ ప్రయత్నిస్తూ వుంటుంది సంపెంగ చెట్టు. ఆ పువ్వుల రంగూ, మధురమైన ఆ  వాసన ఎంత బాగుంటాయో. దాని వెనక జామ చెట్టు, బాగా పెద్దది. మా అత్తగారు కాపరానికి వచ్చినప్పుడు వేసిందట. అది కూడా పూత పూసింది. తెల్లటి జామి పూలు. దాని వెనక మామిడి చెట్టు. ‘బేనిషాన్’. బోలెడు కాపు కాసింది ఆ ఏడాది. గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయ్. ఆ అందమైన వర్ణాల కలివిడి ఎంత బాగుండిందో, చూస్తూ కూర్చున్నాను.

చాలా సేపటి నుండి ఒక కోయిల ఆర్తిగా, అదే పనిగా ఎవరినో పిలిచినట్టు కూస్తుంది. నేను లేచి, సరిగా కూచుని మామిడి చెట్టులో మూల మూలలా కోయిలని వెతకడం మొదలెట్టాను. అదిగో అప్పుడు చూశాను ఆ దయ్యాన్ని … అదే అతన్ని. కోయిల అతని భుజం పైనే వుంది. మొదట నాకేం అర్ధం కాలేదు. చెట్టు గుబురులో ఆకుల్లో ఆకులా అతను. ధ్యానంగా, ఎక్కడో దూరంలో నిమగ్నమై, శరీరం  మాత్రం అక్కడ వున్నట్లు. నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేచి టేబిల్ పైన నీళ్ళు తీసుకుని తాగి, గదిలోనే మూడు నాలుగు సార్లు అటూ ఇటూ నడిచి, మళ్ళీ  వచ్చి చూశాను. అతను అక్కడే, అట్లానే వున్నాడు. చుట్టూ  పింద, దోర మామిళ్ళు, భుజం పైన కోయిల, ఆకులు గాలికి అటూ ఇటూ కదుల్తుంటే అతనిపై  పరుచుకుంటున్న వెలుగునీడల తారాటలు… ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత సుందరమైన దృశ్యం కదా అది అని.

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయని. మా అమ్మ కూడా అదే మాసంలో పుట్టింది. ఎంత బాగుండేదో మా అమ్మ. మొక్కల్ని, సీతాకోకల్ని,ఆకాశాన్నీ, ఆరుద్రల్నీ, వాన చినుకుల్నీ అన్నింటినీ ప్రేమించేది, తియ్యగా పాడేది, గొప్పగా రాసేది. ఎంత బాగుండేదో తెలుసా! బహుశా మా అమ్మమ్మ ఆ మాసంలో పుట్టలేదనుకుంటా ఆవిడ నగల్ని, వాహనాల్ని, నౌకర్లు చాకర్లు ఉండే మేడల్ని ప్రేమించేది. మా అమ్మ చీటికి మాటికీ మా నానతో గొడవపడి, నన్ను తీసుకుని మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేది. కానీ మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మని నాన దగ్గరికే  పంపేసేది. ఒకసారి మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ, నేను కూడా పుష్ప వర్ణ మాసంలోనే పుట్టినందుకు బాగా దిగులు పడేది.ఆ దయ్యాన్ని చూడగానే నాకు అదంతా గుర్తొచ్చింది.

అట్లా నేను దాదాపు ఒక వారం రోజులు ఆ దయ్యాన్ని చూస్తూ వుండేదాన్ని. చూస్తూ చూస్తూ వుండగా నాకో రోజు అతన్తో మాట్లాడాలనిపించింది. ఏం చెయ్యాలి ఎలా అతని దృష్టి నా  వైపుకి తిప్పుకోవాలి. ఆలోచించి, ఆలోచించీ చివరికి  పని వాళ్ళని రప్పించి, దోర మామిళ్ళను కొయ్యమని చెప్పా. నేను ఆశించినట్టే ఆ మనుషుల అలజడికి అతను ధ్యానంలోంచి బయటకొచ్చాడు.

దయ్యాలలో మనీశ్వరుడు అనే దయ్యాలు కూడా ఉంటాయట. అవి ఎప్పుడూ మౌనంగా ఉంటాయట మా ఊర్లో చెప్పేవాళ్ళు. ఇతను అది కాదు కదా అనుకుంటూ, “మీరు నాకు కనిపిస్తున్నారు అదిగో ఆ గదిలోంచి మిమ్మల్ని చూశా, మీతో మాట్లాడాలని వుంది” అని చెప్పా. అతను తల వంచి ఎత్తైన ఆ చెట్టు పైనుంచి నన్ను చూశాడు. ఆ తరువాతి  నిమిషంలో అతనక్కడ లేడు. ఎంత గుచ్చి గుచ్చి,కొమ్మ కొమ్మా వెతికినా, అతను అక్కడ కనిపించలేదు. నా మాటలు విని, మామిడికాయలు కోస్తున్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నానేమో  అనుకున్నారు. నేను గబగబా నా గదిలోకి  వచ్చి  అక్కడినుండి చూశా. అతను లేడు. ఆ తరవాత నుండీ ప్రతి రొజూ అతని కోసం వెతికా. మధ్యాహ్నం పూట కదా అతను నాకు కనిపించింది. అందుకని, ప్రతి మధ్యాహ్నమూ అది పనిగా వెతికేదాన్ని. కానీ  అతను మళ్ళీ కనిపించలేదు.

ఒకరోజు పగలంతా బాగా ఎండ కాసింది, రాత్రి ఏడూ ఎనిమిది అవుతుండగా వర్షం మొదలయింది. ఉరుములూ, మెరుపులతో  ఆకాశం ఎర్రగా మెరుస్తూ ఉగ్రరూపమెత్తింది. రాత్రంతా వర్షమే. వర్షాన్ని వింటూ నిదురపోయాను. పొద్దుట లేచి చూద్దును కదా, ఎంత బీభత్సమో… ! మామిడికాయలు పిందెల తో సహా రాలి పొయ్యాయి. ఆకులూ, అక్కడక్కడా రాలి పడిన కొమ్మలూ  … గొప్ప యుద్ధక్షేత్రంలా వుంది అక్కడంతా. అదిగో ఆ రోజు మధ్యాహ్నం, మళ్ళీ చూశా అతన్ని. ఎంత దిగులో  ముఖం నిండా, గభ గభా లేచి, చెట్టు క్రిందకి వెళ్ళా. రాత్రి వర్షానికి తడిసి జడిసిన పక్షులు అతని దగ్గర సేద తీరుతున్నాయ్. నేను తల పైకెత్తి “ఇన్ని రోజులు రాలేదే, ఏమయ్యారు?” అన్నాను. అతను నన్ను చూశాడు. నేను అతన్నే చూస్తూ వున్నాను. చూస్తూ ఉండగానే, బోర్డు మీద వేసిన బొమ్మ డస్టర్తో చెరిపేస్తే ఎలా చెరిగిపోతుందో అలా చెరిగిపోయాడు. పక్షులు మాత్రం మిగిలాయి.

నాకు ఏడుపొచ్చింది. గదిలోకొచ్చి మామిడి చెట్టు వంక చూస్తుంటే, ఎందుకో తెలీదు… రాత్రి కురిసిందే ఉదృతమైన వర్షం, ఉరుముల మెరుపుల వర్షం, అట్లా వచ్చింది ఏడుపు. గది తలుపులు భిగించి, పెద్ద పెట్టున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుని ఏడ్చుకుని పడుకున్నాను. బహుశా గంట తర్వాత అనుకుంటా మెలకువ వచ్చింది. మామిడి చెట్టు వంక చూడటానికి తల తిప్పానో లేదో, నా కిటికీ దగ్గరగా ఊచల్ని పట్టుకుని, సంపెంగ పూచెట్టు కొమ్మ పైన కూర్చొని వున్నాడు అతను. నా మెలుకువ కోసమే చూస్తున్నట్లు, ఆత్రుతగా “ఎందుకు ఆ ఏడుపు?” అన్నాడు. నేనతన్ని చూశాను. యదావిదిగా అతని చుట్టూతా పక్షులు, సీతాకోకలూ, ఇప్పుడు సంపెంగలూ…చూసి చూసి, అతన్ని కళ్ళనిండుగా నింపుకుని “తెలీదు” అన్నాను. అతను నిశ్శబ్దంగా మామిడి చెట్టు వంకే చూసి, చాలాసేపటికి “ఒకటేరోజుటి వర్షం, చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో పిచ్చిదానిలాగా” అన్నాడు. అతని ముఖం నిండుగా దిగులు.

అట్లా మొదలయింది మా పరిచయం. అతను ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష’ మాట్లాడేవాడు. మొదట్లో ఆ భాష నాకు అర్ధమయ్యేదే కాదు. తరువాత నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ భాష, అతని మాటా ఎలా ఉంటుందంటే, అతనితో మాట్లాడిన తరువాత హృదయం, చినుకులతో తడిసిన పుడమిలా మారేది.

ఆ కొత్తల్లోనే ఒకసారి అడిగా “ఈ ఇంటితో మీకేమైనా అనుభందమా?” అని. ఎందుకడిగానో నిజంగా నాకూ తెలీదు. ఆ ప్రశ్న వినగానే అతను దిగులుగా తలవాల్చి “ఈ ఇంట్లో తనుంది” అన్నాడు.

“తనంటే?”

“నేనూ తనూ ప్రేమించుకున్నాం, కోతకొచ్చిన పంటని ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందే …అట్లా వాళ్ళ  ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ తరువాత నించీ నేనిట్లా. ఈ మామిడి చెట్టు వున్న చోటే. ఏడు మామిడి చెట్లు  పెరిగీ …మరణింఛీ … పెరిగాయి. కానీ ఆవిడ ఆ  ఇంట్లోంచి బయటకు రాదు ఎంత ప్రార్దించినా……..” అతని కళ్ళలో నీళ్ళు. ఎలా ఓదార్చను అతన్ని.

నాకు హట్టాత్తుగా గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తల్లో ఓ మధ్యాహ్నం తలారా స్నానం చేసి, ఎందుకో ఏడుస్తూ వట్టి గచ్చు మీదే పడుకున్నా. గచ్చు మీద పరుచుకుని నా జుత్తు. ఎందుకో, ఆ మగతలో ఎవరో తెల్లగా ఇంత పెద్ద కన్నులున్న ఒకావిడ చల్లగా నా నుదుటిని, జుట్టుని నిమిరినట్టు, నా దుఖాన్ని ఒదార్చినట్టు భ్రాంతి కలిగింది. మా అమ్మేమో అనుకున్నాను అప్పుడు. కానీ కాదు. ఆవిడ, ఇతను చెప్పే ఆవిడ. అతనితో  అన్నాను “ఆవిడ తెల్లగా ఉంటారా” అని. అతను దుఃఖంలోంచి ఒత్తిగిలి “తను మేలి ముత్యం లాగుంటుంది” అన్నాడు మురిపెంగా. అంతే ఆ తరువాత మా మధ్య ఆ సంభాషణ మళ్ళీ ఎప్పుడూ రాలేదు.

అతను ఎంత పురాతనుడో, ఎప్పటి వాడో, ఎక్కడి వాడో నాకేం అవసరం? నేనేం చేసుకుంటా ఆ వివరాలన్నీ? అదీకాక దుఃఖంతో నిండిపోయిన అతని గతాన్ని నేనెందుకు కదిలించాలి. అందుకే ఏడు మామిడి చెట్ల అతని గతాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు.

క్రమంగా అతను నాకొక వ్యసనమయ్యాడు. సంపెంగ పూ చెట్టుపైకి అతను రావడం ఆలస్యం  ఎక్కడెక్కడి  పక్షులూ  వచ్చి నా కిటికీ పైనా, నా పైనా, అతని పైనా వాలేవి. ఎన్నెన్నో పాటలు పాడేవి. ఆ పాటల్లో మా మాటలు మాకే కొన్నిసార్లు వినిపించేవి కాదు. ఆ పక్షుల్లో ఒక కోయిల నా గదిలోపలికొచ్చి గూడు పెట్టడం మొదలెట్టింది. ఎక్కడినుండో పుల్ల పుల్లా ఏరుకొచ్చి గూడు కట్టేది. పొరపాటున  అదెక్కడ  ఫాన్ రెక్కలు  తగిలి చచ్చిపోతుందోనని నాకు భయమేసేది. ఫాను స్విచ్చికి  గట్టి టేప్ ఒకటి అతికించి ఫాన్ తిరగకుండా చేసేశాను.

అప్పుడడిగాడు మా ఆయన ”ఫాన్ స్విచ్ ఎందుకిట్లా చేశావు” అని. నేను మామూలుగానే చెప్పా కోయిల గూడు కడుతుందండీ, ఫాన్ రెక్కలు  తగిలితే చచ్చిపోతుంది అని. విచిత్రంగా మా ఆయన నా వంక వెర్రి చూపు చూసి,”కోయిల  గూడా? ఎక్కడ? అసలు కోయిల గూడు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నావా?” అని వాదులాటకొచ్చాడు.

నేను ఓపికగా స్టూలు తెప్పించి కోయిల పేర్చిన పుల్లల్ని, సగం పూర్తయిన దాని గూటినీ  చూపించాను. అప్పుడు కోయిల, కిటికీ ఊచల మీదే నిలబడి మా ఆయన వంకే చూస్తుంది కూడా. అయినా సరే అదేం మా ఆయనకి  కనిపించలేదు. నా వంక అనుమానంగా చూట్టం మొదలెట్టాడు. ఇంట్లోవాళ్ళు, నేనతనితో  మాట్లాడేప్పుడు దొంగచాటుగా వినే వాళ్లు. ఏదో  పిచ్చి భాషలో మాట్లాడుతానట, నవ్వుతానట. ఆ విషయం మా ఆయన ఒక రాత్రి ప్రస్తావించాడు. నేనెట్లా చెప్పేది, నీలిమేఘం అడవితో మాట్లాడే భాష ఒకటి ఉంటుందని …ఆయనకి  నేనెట్లా అర్ధం చేయించగలను? ఆయన పుష్ప వర్ణ మాసంలో పుట్టలేదు కదా. ఆ దయ్యాన్ని, అదే అతన్ని నేనెలా ఈయనకి చూపించగలను? అందుకే అదేమీ లేదండీ, ఏదో పాట నేర్చుకుంటున్నాను, అంతే అని చెప్పా.

అప్పటి నుండి ఇక జాగ్రత్త పడడం మొదలు పెట్టాను. మా ఇంటికి  వెనక వైపు పది పన్నెండు మెట్లు పైన రెండు గదులున్నాయ్..ఒక దాంట్లో ఎప్పుడో ఒక వంటావిడ ఉండేదట. ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఎందుకనో ఆ గదికి, నేను వచ్చినప్పటినుండి తాళం వేళ్ళాట్టమే చూశాను గానీ, తెరవడం చూళ్ళేదు. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ వుంటుంది. దాంట్లో, మా తోటల్లోంచి కోసుకొచ్చిన దోర పళ్ళని పెట్టి మగ్గ వేస్తుంటారు. రక రకాల పళ్ళు. మగ్గిన తర్వాత ఇంటిలోపలికి తీసుకొస్తారు. ఆ గది భలే వుంటుంది. రంగురంగుల పళ్ళతో, మిళితమై పోయిన అనేక రకాల వాసనలతో…

మేమిద్దరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడా కిటికీ బయట తను, లోపల నేను. భూమికి ఆకాశానికి మధ్య కిటికీ వుంటే ఎట్లా వుంటుందో అట్లా అనిపించేది నాకు. ఒక్కోసారి అతను రెండు మూడు రోజులు వొచ్చేవాడు కాదు. అప్పుడు నేనతనికి, రాత్రంతా కూర్చుని నా మనసు నిండుగా  ఉత్తరం రాసేదాన్ని. ఒకరోజు అట్లాగే నా మనసుని బల్లపైన పరచి రాస్తూ కూర్చున్నాను. బల్లంతా బంగారు  రంగు జలతారు వెలుతురు పరుచుకుంది. అతని స్మృతి నా పెదాలపై నవ్వై పరుచుకుంది. నేను రాసుకుంటూ పోతున్నాను. హటాత్ గా మా ఆయన నిదరనించి  లేచి “ఏం చేస్తున్నావ్” అన్నాడు. అంతే నేను గబగబా నా మనసునంతా జవిరి నా రెండు చేతుల మధ్యకు నెట్టి, కష్టపడి ఆ కాంతినంతా దాచి దాచి “ఏం లేదు ఏదో రాసుకుంటున్నా” అన్నాను. ఆయన ఆశ్చర్య పడి,”చీకట్లో ఏం రాస్తున్నావ్” అన్నాడు. చీకటా! చీకటెక్కడ! మిల మిల మెరిసిపోయే ఇంత కాంతి ఉండగా…నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆయన చిరాకు పడి “వచ్చి పడుకో” అని గద్దించాడు. నేను నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నాను.

మరుసటి రోజు అతనొచ్చాడు. ఉత్తరం చదివావా అని నేనతన్ని అడగలేదు, అడగాల్సిన అవసరమూ లేదు. ఆ ఉత్తరాన్ని ఎలా చదవాలో అతనికి తెలుసు.

ఆ రోజుల్లో మేం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఏం మాట్లాడుకునే వాళ్ళమో ఇప్పుడు కొంచేమన్నా గుర్తు  లేదు. కానీ అతనితో మాట్లాడటం నాకు చాలా బాగుండేది. ఎందుకంటె అతను, చీకటిని బంతాడే సూర్యుడి లాగా, మరో ప్రపంచపు కల లాగా, స్వప్నాలకే స్వప్నం లాగా సంభాషించే వాడు.  కొండవాలు లో పుట్టిన అనాది  గానం లా ఉండే వాడు. అతనికి పక్షుల భాష, పూల భాషా అన్నీ  తెలుసు. ఒక సారి నా ముందే మా కుక్క అతనితో మాట్లాడటం నేను చూశాను.

మా ఇంట్లో నా గురించి గుస గుసలు ఎక్కువై పోయాయి. నేను ఒక్కదాన్నే వెళ్లి ఆ మూల గదిలో కూర్చుంటున్నానని, నాలో నేను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్నానని అనుకోవడం మొదలుపెట్టేరు. మా ఆయన విసిగి నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళాడు.అందరికీ, సంక్రాంతి పండుగకి ఊరికెళ్ళిఒదని  చెప్పుకున్నారు. మా ఊరంటే మామూలు రోజుల్లో నాకెంత సంతోషమో .ఈసారి అట్లా అనిపించలేదు. నా బట్టలంతా నాకు తెలీకుండానే  పనిపిల్ల ఎప్పుడో సర్ది పెట్టేసింది  .రాత్రి పదిగంటల వేళ మా ఆయన “బయల్దేరు” అన్నాడు.నేను ముందు మొరాయించాను,ఏడ్చాను, అతనికి చెప్పకుండా ఎలా వెళ్ళగలను ?.అతను నన్ను వెతుక్కోడా …ఏమనుకుంటాడు,ఇంకెప్పటికీ రాకుండా అద్రుశ్యమైపోడా?

మా ఆయన, అమ్మమ్మకి ఏమిటేమిటో చెప్పాడు.నేను మాట్లాడుతున్న పిచ్చి భాష గురించి చెప్పాడు.వినివిని మా అమ్మమ్మ “ఏం చేసేది నాయనా  అన్నీ వున్నా సుఖ పడే రాత  నా నుదుటున రాసిపెట్టలేదు ఆ దేవుడు ,లేకుంటే తల్లిలాగే ఇదీ పుష్పవర్ణ మాసంలోనే పుట్టాలా” అని ఏడ్వటం మొదలుపెట్టింది.

నేను మా అమ్మమ్మ తిప్పిన గుడులూ, మసీదులూ అన్నీ తిరిగాను.నాకేం కాలేదని చెప్పినా మా అమ్మమ్మ వినిపించుకోలా. నీలిమేఘం అడవితో మాట్లాడే భాష గురించి చెప్పబోయినప్పుడల్లా టపటపా చేత్తో తల బాదుకునేది.నేనింక భయపడి ఆమాటే ఎత్తడం మానేశా.కొన్ని రోజులకిక  నేను కుదుట పడ్డానని చెప్పి  మా అమ్మమ్మ నన్ను మా ఇంటికి తెచ్చి వదిలి వెళ్ళింది.

ఆ రోజు తలస్నానం చేసి, కిటికీ దగ్గర కూర్చుని, వేళ్ళతో జుత్తు చిక్కులు  తీస్తూ వున్నాను.దిగులుగా ఉంది. అతను ఇక రాడా …నన్ను మరిచిపోయుంటాడా! అని.అతను వచ్చాడు.అతనితో పాటు వచ్చిన పక్షులు ,మేత తెచ్చిన అమ్మకోసం నోరంతా తెరిచి అరుస్తాయే బుజ్జి పిట్టలు, అట్లా నన్ను చూసీచూడగానే అరవడం మొదలుపెట్టాయి.అతన్నట్లా చూడగానే నాకు  ఒక్క సారిగా లక్ష ఊచల పెద్ద పంజరాన్నై పోయి అతన్ని చుట్టేసి అతన్నీ, అతని పక్షుల్నీ అట్లాగే బంధించేయ్యాలనిపించింది.  అతను నన్ను చూసి   గొంతు పెగల్చుకొని ,చాలా నీరసంగా  “ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళారు వీణాధరి” అన్నాడు.అదే అతని పెదవులు నా పేరుని మొదటిసారి పలకడం.నేనెప్పుడూ అతనికి నా పేరు చెప్పలేదు ,అతని పేరూ అడగలేదు.ఆ తరువాత ఇంకొక్కసారి అతను నన్ను పేరుతో పిలిచాడు మా మొత్తం పరిచయంలో.

అతని నోటి వెంట  నా పేరు వినగానే ఒక్కసారిగా  శరీరమంతా కంపింఛి పోయింది .గుండె దడదడమని కొట్టుకుంది.కళ్ళలో నీరు కమ్మింది.ఆ ఉద్వేగం నుండి బయటకు రాక మునుపే ,అతను చాలా మొరటుగా “ఏం గొంతు నొప్పా? మాట్లాడవేం…? చెప్పడానికేం…? ” అని ఏకవచనంతో గద్దించాడు. ఆ గద్దింపుకి నవ్వొచ్చింది.అతని అక్కరకి ఏడుపు పొంగుకొచ్చింది . నవ్వి ,కళ్ళ నీళ్ళని కళ్ళలోనే దాచిపెట్టేసి ”అచ్చు దయ్యం లాగే మాట్లాడుతున్నారు” అన్నాను.అతను నెమ్మదిగా శాంతించాడు.ఎన్ని ఆలోచనలో  తెలుసా?పగలూ రాత్రి ఆ మామిడి చెట్టు మీదే కూర్చున్నా తెలుసా !అన్నాడు.అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” మీకు ముగ్గులేయడం వచ్చా ?” అన్నాడు పిచ్చిగా .మళ్ళీ “పండగకి ఏం చీర కట్టుకున్నారు” అన్నాడు .నేను ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కొత్త కొత్త ప్రశ్నలకి .ఎట్లాగో మనసు కూడదీసుకుని “అడవి పచ్చ రంగు చీర,ఆకాశ నీలం రవిక “అన్నాను.అతను కళ్ళు మూసుకుని ధ్యానంగా  “చినుకు చుంబించిన నేల పరిమళంలా ఉన్నావ్ ” అన్నాడు.

ఆ రోజు రాత్రి ,మా ఆయన పని మీద ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాడు.అతను మొగ్గలు విడుతున్నసంపెంగ చెట్టు మీద, నేను కిటికీ లోపల కూర్చుని వెన్నెల కౌగిట్లో తడిసి ముద్దయ్యాం.చంద్రుడు ఆకాశాన్ని  ఆ ఒడ్దు నుండి ఈ ఒడ్డుకి త్వరత్వరగా ఈదేస్తున్నాడు.అట్లా ఈదే చంద్రుడిలో కొంత భాగం తీసుకుని ,ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి నాకిచ్చాడు.ఆ పువ్వు ధగ ధగా మెరిసిపోతూంది.గమ్మత్తుగా గుబాలిస్తుంది .దాన్ని పక్కనుంచుకుని వేకువున, ఎప్పుడో అతను వెళ్ళాక నిదురపోయాను.

మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచి ఏదో దిగులు. ఒక చోట నిలువనీయని దిగులు .నాకేదో కావాలి ,ఏదో కాదు ,నాకు అతను కావాలి ,నాకు నాకే సొంతంగా కావాలి, అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి,హృదయం లోంచి  పొంగుకుని పొంగుకుని వచ్చింది దుక్కం  .ఏడుస్తుంటే నా గదిలో గూడు కట్టుకున్న కోయిల నన్నే రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టింది.చూసీ చూసి చివరకి  ” అతనితో నేను చెప్తానులే ఏడవకు” అన్నది.

అతనొచ్చాడు .ఇవాళ అతని ముఖం కాంతిగా ఉంది.పెదాలపై నవ్వుంది. అతనొచ్చీ రాగానే  కోయిల వెళ్లి అతని భుజంపై కూర్చుని, ఒక పాట పాడటం మొదలుపెట్టింది.’ ఆకుపచ్చటి పాట’.పాట వింటూ ఉండగానే అతని ముఖం వివర్ణమవడం  మొదలు పెట్టింది. పాట ముగిశాక, కోయిలని భుజంపై నుండి చేతిలోకి తీసుకుని “నువ్వు పాడకుంటే నేను తెలుసుకోలేననుకున్నావా  కోయిలా” అన్నాడు.

నేను తలవంచుకుని కూర్చున్నాను. మనసంత ఆందోళనగా, భయంగా ఉంది.దిగులు పొగలాగా కమ్ముకుంటూ ఊపిరాడనీయకుండా ఉంది.అయినా అట్లాగే దిగులుగా చెప్పాను “నాకు మీరు కావాలి” అని .అతనేం మాట్లాడలేదు చాలాసేపు .చివరికి “మీరు అతని భార్య వీణాధరి , మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలను”అన్నాడు.నాకేం మాట్లాడాలో తోచలేదు.సంపెంగల గాలికి పక్షులన్నీ శాంతిగా ,నిశ్సబ్దంగా కూర్చున్నాయ్.ఆ నిశ్శబ్దం లోంచి నేను మొండిగా  “నాకు నువ్వు కావాలి” అన్నాను.అంత ఏక వచనపు చనువు ఎట్లా పుట్టిందో  నాకు …మళ్ళీ రెట్టించి ”నాకు నువ్వు కావాలి”అన్నాను.నాకు అదొక్కటే తెలుసు మరి.

అతను నిట్టూర్చి “మీకు అట్లాంటి ఆలోచన కలగడానికి నేను చేసిన తప్పేంటి? అన్నాడు.అతను మాట్లాడుతూ ఉండగానే, హటాత్తుగా  నా మనసులో ఒక మొక్క మొలవడం చూశాను.  అది మారాకు  వేసుకుంటూ అతి వేగంగా పైకి వస్తున్నది .నేనా మొక్కనే గమనిస్తూ వున్నాను .అతను  “నాకు మీతో మాట్లాడటం బాగుంటుంది.అయినా  నేను ఆమెని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా.మనం మంచి స్నేహితులం అంతే ” అన్నాడు  .నేనేం మాట్లాడలేదు .నా మనసులో పుట్టిన మొలకను మొదలకంటా పీకి ,గోటితో చిన్న చిన్న తునకలుగా చేసి కిటికీలోంచి విసిరేశాను.అతనది చూశాడు, దిగులుగా “మీది చాలా మంచి జీవితం వీణా ,ఇది మీకు మంచిది కాదు ,కొంచెం  కూడా మంచిది కాదు”అన్నాడు.నేను ఊరుకున్నాను.అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు.ఒక వేసం   కాలపు నీల మేఘం, అతని ప్రియమైన మామిడి చెట్టును ఏం చెయ్యగలిగిందో  తెలిసిన వాడు ,అతనికి బదులు మాట్లాడటం నాకెలా సాధ్యం?.సాధ్యా సాధ్యాల ప్రసక్తి ఎలా వున్నా ,నాకు ఇష్టం లేదు అంతే.నేను ఊరుకున్నాను. అతను వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు అతను రాలేదు ,ఆ తర్వాత చాలా రోజులు రాలేదు. బట్టల అల్మారాలో  దాచిపెట్టుకున్న  వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది.నేను కృశించి పోవడం మొదలుపెట్టాను.అయినా అష్ట సిద్దులలోని మూడు సిద్ధులు ప్రాప్తి,ప్రాకామ్య,వశత్వాలు పొందాలని తీవ్రంగా ధ్యానించేదాన్ని.ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు,గది తలుపులు భిగించుకునే దాన్ని .తిండి తినేదాన్ని కాదు .ఒకే ఒక్క ఆలోచన  ‘అతను కావాలి’ .ఈ సంఘటనకు ముందువున్న యధాతధ స్థితి ఇంకెలా సాధ్యం.ఏమో ఇదంతా కాదు, నాకు అతను కావాలి .

ఒకరోజు అతనొచ్చాడు.నా అవతారాన్ని చూసి దిగులుపడి ,వర్షించి , చివరికి  అన్నాడు “ఎందుకట్లా?”అని. నేను “ఎందుకు రావటం మానేశావ్”?అన్నాను .అతను తలొంచుకున్నాడు.అతని చుట్టూ ఇప్పుడు పక్షులు లేవు.”తప్పు చేసానో ఏమో ?” ఇదంతా ఎలా జరిగింది.అతన్ని కోరుకోవడమేంటి,ఏం చేసుకుంటానతన్ని నేను? అతను నాకేం ఇవ్వగలడు?నాకు లేనిదేమిటి?మా మధ్యనున్న కిటికీని ఏం చేసి ఎవరమైనా తొలగించగలం? ఒకర్నొకరు ఏం చేసుకోగలం? ఇదంతా సరే,అయినా సరే అతను నాకు కావాలి ,నువ్వు నాదానివని   అతను నాకు చెప్పాలి

నా మౌనాన్ని, ఆలోచనలని విరగగొడుతూ అతను “రాకూడదని కాదు ,రాకుండా వుండగలిగీ కాదు,మీరు బాగుండాలి మీ జీవితం మంచిది.మీరు కోరుకుంటున్నది మంచిది  కాదు ” అన్నాడు.ఏడు మామిడి చెట్లను చూసిన వాడు కదా అతను, అందుకని ఏడుపుని ఆపేసుకుని ,నవ్వి ఊరుకున్నాను.అతను వెళ్ళిపొయ్యాడు.

మా ఇద్దరి పరిచయపు మొదటి రోజుల్లో అతను, నాకో గోమేధికం పొదిగిన  పతకాన్ని ఇచ్చాడు.చిన్న కుంకుడు గింజంత రాయి అది.ఆవు పంచతం రంగులో ,నిప్పు కణిక రంగులో మెరిసి పోయేది .అదంటే నాకు చాలా ఇష్టం.ఎప్పుడూ నా గుండెల మీద అందంగా నిలిపి వుంచుకునేదాన్ని.ఎప్పుడైతే అతను రావడం మానేసాడో ,అప్పట్నిండి అది ప్రతి రోజూ కొంత కొంతగా పెరగడం మొదలు పెట్టింది. విపరీతమైన భరువు,మోయలేనంత భరువు ,మెడలు వంచేసేంత భరువు,ఏ పనీ తోచనీయంత భరువు,ఆ భరువు మోయడం కన్నా చచ్చి పోతే పోతుంది కదా హాయిగా అనిపించేంత భరువు వేసేది ఆ రాయి.

మొదట్లో దాన్ని తీసేద్దామని ప్రయత్నించాను. నాకు చేత కాలేదు,నువ్విచ్చింది  నువ్వే తీసుకెళ్ళు అని అతనికే చెప్తామనుకున్నాను. అయినా ఎందుకు చెప్పాలి.అతనికి తెలియకనా.అందుకే ఒక సానరాయి తీసుకుని గోమేధికాన్ని కొంత కొంతగా అరగదీయడం మొదలుపెట్టాను,గది తలుపులు బంధించుకునే అరగదీసేదాన్ని,అయినా ఇంట్లోవాళ్ళు  నా మీద గూడచర్యం చేశారు.నాకు దయ్యం పట్టిందనీ ,ఇదంతా దయ్యం చేష్టలేనని తేల్చారు.అక్కడికీ నేను చెప్పా ,మీరనుకున్నట్టు నాకు ఏ దయ్యమూ పట్టలేదు ,పట్టాలని నేను తపస్సు చేస్తున్నా అని .గోమేధికాన్ని కూడా చూపించా. ఏం చెప్పినా ,ఏం చూపించినా వాళ్లకి కొంచం కూడా అర్ధం కాలేదు.ఎక్కడ నీ గోమేధికం ?,ఎక్కడ నీ దయ్యం? అన్నారు.నన్నిక్కడకి  తీసుకొచ్చి వదిలారు.నాకేం దిగులు లేదు ,ఇక్కడ చాలా బాగుంది ,ఎప్పుడో ఒక రోజు అతను వస్తాడు.మా మధ్య  మాటలు  లేవు   కానీ  , నా గురించి అతను యోచించే క్షణాలు నాకు ,అతని గురించి నేను కలగనే క్షణాలు అతనికీ ,తెలిసి పోతూనే ఉంటాయ్.ఈ గాలిలోనో,ఈ కొమ్మల్లోనో దాగి అతను నన్ను చూస్తూనే ఉంటాడు ,నాకు తెలుసు . అన్నట్లు నేను చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా ,చూడండీ పెద్ద మామిడికాయంత పెరిగి పోయింది ఈ గోమేధికం .మీకు కనిపిస్తుందా?’’ అన్నదావిడ.నేను భ్రాంతిలోంచి బయట పడ్డట్టు ఆవిడ గుండెవైపు చూశాను.మొదట ఏమీ కనిపించలేదు ,రెండవ క్షణంలో కనిపించింది ‘బండ రాయంత గోమేధికం’ కణకణ మండిపోతున్నట్లు నిప్పు రంగులో.

నేను దిగులుగా ఆవిడ వైపు చూసి “మీదే పొరపాటేమో అతను మొదటే చెప్పాడు కదా తను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు”అన్నాను.ఆవిడ చిన్నగా నవ్వింది .”అతను నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ పడ్డాననా మీ భావన ” అన్నది.నేను తలూపాను. ఆవిడ “మా మధ్య నడిచిన గాలికి కూడా అమ్బిగుఇట్య్ [ఆమ్బిగ్యుటి]  ఉంది.దానిని మీకెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు .నాకు కావలసినట్లు నేను, అతనికి కావలిసినట్లు అతను చెప్పుకోవచ్చు.మీ పేరేంటో నాకు తెలీదు కానీ  ,మీకో విషయం చెప్పేదా ,ఏనుగులను మచ్చిక చేసుకునే మావటీలు ,ఏనుగులతో ఒక ప్రత్యేక భాషలో సంభాషిస్తారు,అది మీకు ఐడియా ఉందా ? ఒకసారి నేనో  మావటీని ఇంటర్వ్యూ చేశా .’’ప్రేమని వ్యక్త పరచడానికి  ఏం పదాలు వాడుతారు మీరు ‘’అని. ఆ  ప్రశ్నకి అతనేం బదులిచ్చాడో తెలుసా ”అందుకేం పదాలూ లేవు .మన చేతలలలో, ప్రవర్తనలో నుండి మన ప్రేమ ,అనురాగ  భావనని అవి గ్రహించుకుంటాయి ” అని .ప్రేమ అట్లాటిది. దానికి భాషే అవసరం లేదు,ఆ ఇంట్లో వున్నావిడని ఇష్టపడ్డాడని కదా మీరు అడిగారు, ఆ ఇంట్లో వున్నది మరెవరో కాదు “నా మరో నేను ” అన్నది.

ఆవిడని తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారు .నేను లేచి మా  వాళ్ళ వైపు నడిచాను .వెళ్తున్న దారిలో ఎవరో ఒకావిడ మట్టిలో దొర్లి దొర్లి ఏడుస్తుంది.”ఒసేయ్ కామాక్షి ,నన్నొదిలి పెట్టే…నన్నొదిలి పెట్టే …నా చేతుల్ని  కట్టేయ్యకే కామాక్షి ,నేనీ బాలని తీసుకెళ్ళ డానికే వచ్చానే కామాక్షి ,దీని మీద నాకు మోజే కామాక్షి ,దీన్ని నేను వదిలి పెట్టనే …అని ఏడుస్తుంది .ఎందుకో  దిగులేసింది.చిన్నప్పటినుండీ అమ్మవారి మందిరం చుట్టూ,దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూనే పెరిగా .ఎప్పుడూ భయం కలగ లేదు. ఇవాళెందుకో మొదటి సారి భయమేసింది .ఇందాక నేను ఆవిష్కరించలేక పోయిన ”పుష్ప వర్ణ మాసం”నాకు ఆవిష్క్రుతమవడం మొదలు పెట్టింది   .దిగులు,ఆవిడ చెప్పిన పొగలా ఊపిరాడనీయకుండా నన్ను కప్పేయడం మొదలు పెట్టింది.

యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

sathyavati“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ శోకాన్ని భరించేది ఇరువైపులా కూడా స్త్రీలే. అయినా స్త్రీలు యుద్ధాలకి పరష్కారాలు చూపించడం ఎక్కడా వినలేదు.ఆత్మీయుల మరణ శోకపు కంటితడి తుడుచుకునే విరామంకూడా లేకుండానే వాళ్ళు కుటుంబాలకి ఆహారం సమకూర్చాలి. పురుషుల వీరోచిత కార్యాలతో దీన్ని పోల్చడం లేదు నేను. కుటుంబాన్ని చూసుకోడం ఒక గొప్ప విషయంగా స్త్రీలెప్పుడూ భావించలేదు.

తుపాకి పట్టుకుని ఉద్యమంలో పనిచెయ్యని స్త్రీల సేవలు తక్కువవేమీ కావు. తమ దుస్తుల మడతల్లో చీటీలు దాచుకుని చెక్ పోస్టుల మధ్యనుంచీ ధైర్యంగా వెళ్ళి అజ్ఞాతంలో వున్న ఉద్యమకారులకి సందేశాలు చేరవేశారు భోజనాలు అందించారు. పురుషులు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా వ్యవసాయం చేసి పంటపండించారు ఇంట్లో పురుషులు చేసే పనులన్నీ చేశారు. ఆ చీకటి దినాలలో కుటుంబం గడవడానికి స్త్రీలు పడ్డ కష్టాన్ని ఎవరూ ఎక్కువ కాలం జ్ఞాపకం వుంచుకోరు. ఎందుకంటే యుద్ధం పురుషులకు సంబంధించినది స్త్రీలది కాదు.”

“యుద్ధంకోసం ఎంత ఉత్సాహంతో పనిచేశారో అంతే ఉత్సాహంతో శాంతికోసం పనిచేస్తే ఎంత బాగుండేది? యుద్ధం స్వల్పకాలంలో ముగియాలి. ఎక్కువకాలం కొనసాగితే అది మనలో శక్తిని చంపేస్తుంది. ఈ యుద్ధం గ్రామాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇదొక పెను యుద్ధం. మనకన్న అతి పెద్దదైన భారత దేశం మనతో వంద సంవత్సరాలైనా యుద్ధం చెయ్యగలదు. మనకి కావలసింది శాంతి. ప్రజల జీవితానికి భద్రత.”

ఈస్టరీన్ కైర్ ఇరలు (Easterine Kire Iralu) వ్రాసిన “బిట్టర్ వర్మ్ వుడ్” అనే నవలలో తుపాకి పట్టుకుని స్వయంగా నాగా విముక్తి ఉద్యమంలో పాల్గొని, తరువాత ఉద్యమపు కలల నుంచీ బయట పడిన ఒక స్త్రీ అనేమాటలు ఇవి. ఇటీవల హిందూ లిట్ ఫర్ లైఫ్ పోటీలో షార్ట్ లిస్ట్ లో వచ్చిన అయిదు నవలల్లో ఒకటి. ఒక శక్తిమంతమైన నాగా సాహిత్యకారిణి సంయమనంతో వ్రాసిన నవల ఇది.

09TH_EASTERNINE_KI_1359464e

1937 లో జన్మించి 2007 లో హత్యకు గురైన మోసె జీవిత కథగా సాగే ఈ నవలలో నాగా విముక్తి ఉద్యమ చరిత్ర కూడా సమానాంతరంగా సాగుతుంది.

నాగా తెగల జీవితం వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ల శాంతియుత జీవనం, తెగల మధ్య సమానత్వం పరస్పర ప్రేమాభిమానాలు వర్ణిస్తూ మొదలై ఆ జీవితాల్లోకి వచ్చిపడిన మార్పుల మీదుగా సాగుతూ కళ్ళఎదుట జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేక ఎంతోమంది యువకులు ఉద్యమంలో చేరడం ఉద్యమం నుంచీ బయటికి రావడం, తరువాత ఉద్యమంలో చీలికలు, ఒకర్నకరు చంపుకోడం అదొక కల్లోల భూమిగా మారి సామాన్య ప్రజలకి ఇంటా బయటా భద్రతలేకుండా పోయిన కాలం దాపరించి మోసే. అతని వంటి అనేక మంది హత్యకు గురవడం స్థూలంగా కథ.

1832 లో ఈశాన్యప్రదేశాలను ఆక్రమించిన బ్రిటన్ ని, భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, తమనూ విముక్తం చెయ్యమనీ తమకుభారతదేశంలో చేరే ఉద్దేశం లేదనీ నాగా ప్రజలు కోరుతూనే వున్నారు.కానీ బ్రిటన్ తను ఆక్రమించిన భూభాగం మొత్తంఇండియాకు ధారా దత్తం చేసింది. తామెప్పుడూ భారతదేశంలో ఒక భాగం కారు కనుక తమది వేర్పాటు ఉద్యమం కాదని అంటారు వాళ్ళు.నాగా ప్రజలు నివసించే భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి భారత ఆక్రమణ నించీ తమకి విముక్తి కలిగించాలనేదే వాళ్ల ఉద్యమం.

కానీ స్వతంత్రం సాధించిన ఇండియా నాగా ల్యాండ్ ను అస్సాం లో ఒక భాగం చేసింది. అయితే భారత దేశ స్వాతంత్రానికి ఒకరోజు ముందే వాళ్ళు అనధికారికంగా నాగా స్వతంత్ర దినం జరుపుకున్నారు బ్రిటన్ ఆక్రమణకు ముందు నాగా తెగలలో కుల వ్యవస్థ, కులాల ఎక్కువ తక్కువలూ లేవు.తెగలన్నీ సమానమే. ఎవరితెగ ఆచారాలు వాళ్ళు పాటించుకునేవారు నాగా తెగలన్నీ దాదాపు తొమ్మిది పది దాకా వున్నాయి. తరువాత మిషనరీ లొచ్చి చాలమందికి క్రైస్తవం ఇచ్చారు ఇంగ్లీష్ నేర్పారు. క్రైస్తవం తీసుకున్నా పాత ఆచారాలను వదిలిపెట్టలేదు చాలామంది.

అట్లా క్రైస్తవం తీసుకున్నవారిలో మోసే కుటుంబంకూడా ఒకటి. మోసె తల్లి విలా (vilau) పొలంలో పనిచేసుకుంటూ వుండగా నొప్పులొచ్చి( 1937 లో) అక్కడే బిడ్దను ప్రసవిస్తుంది. అక్కడి చాలా మంది స్త్రీలకి అది మామూలే. ఆమె అత్తగారు ఖ్రియెన్యో ( khrienuo) ఆమె పక్క ఇంట్లో వుంటూ. విలా ని కూతుర్లా చూసుకుంటుంది ఒకే వంటిల్లుంటే స్నేహ బంధాలు నిలవవంటుంది ఆవిడ. విలా భర్త లూ ( Luo-o) బిడ్దను చూసి మురిసిపోతాడు. కానీ తరువాత కొద్దిరోజులకే అడవిలో ఒక చెట్టుకొట్టుకురావడానికి వెళ్ళి దానికిందపడి మరణిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ పొలంలో పనిచేసుకుంటూ మోసె ని ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.
మోసే ఆరేళ్ళొచ్చి స్కూల్ కి పోదామనుకునే వేళకి జపాన్ యుద్ధం వల్ల స్కూళ్ళన్నీ మూతపడ్డాయి వాళ్ళ తెగలో అనేకమందిలాగానే బాంబుల భయానికి మోసే కుటుంబం కూడా కోహిమా నుంచీ వెళ్ళిపోయి వేరే వూళ్ళోతలదాల్చుకోవలసి వచ్చింది. అప్పుడే అతను ఆకాశంలో ఒక విమానం మంటలు చిమ్ముతూ కూలిపోవడం చూశాడు. యుద్ధం ముగిసి స్కూళ్ళు తెరిచేసరికి మోసేకి ఏడేళ్ళొచ్చాయి.

ఒక మిషన్ స్కూల్లో చేరిన మోసేకి నీట్యూ ( nietuo) తో స్నేహమైంది, నీట్యూ కన్న మోసే కి గ్రహణ శక్తి ఎక్కువగా వుండేది. అతను స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ తల్లికీ నానమ్మకీ చెబుతూ వుండేవాడు. తల్లికి ఇంటిపనిలో సాయం చేసేవాడు పొలం పనిలోనూ సాయం చేసేవాడు. వేరు వేరు ఇళ్ళల్లో వున్నా ఆ ముగ్గురిదీ ఒక ప్రేమ మయమైన కుటుంబం. అప్పుడు వాళ్ళొక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నారు అది వాళ్ళ చిన్న ఇంటిని ప్రపంచంతో కలిపింది.అందులో రోజూ ఇంగ్లిష్ వార్తలు విని తల్లికీ నానమ్మకీ చెప్పేవాడు మోసె. నానమ్మ కి అవి విని మనమడి చేత చెప్పించుకోడం ఎంతిష్టమో! గబగబ పన్లు చక్కబెట్టుకుని వచ్చి కూర్చునేది.

1947 నాటికి మోసె మూడో తరగతిలోకొచ్చాడు.

ఆసంవత్సరం చాలా విశేషాలు చెప్పింది రేడియో! బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు దేశ విభజన గురించిన వార్తలే వార్తలు! ఇండియాలో ముస్లిమ్ ల హత్యలు,పాకిస్తాన్ లో హిందువుల హత్యలు!! తమ పొరుగువారిని చంపుకోడం నిజంగా ఎంత పిచ్చితనం అనుకున్నారు ఆ అత్తాకోడళ్ళు. రోడ్డుమీద నడిచిపోయే వాళ్ళు, స్కూల్లో పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో మోసె కి “నాగా విముక్తి” అనేమాటకుడా ఎక్కువ వినబడింది. నాగా ప్రజలు చాలా మంది ఇండియానుంచీ స్వతంత్రం కోరుకుంటున్నారని. అతని స్నేహితుడు నీట్యూ తండ్రి చెప్పాడు కొంతమంది గాంధీజీ దగ్గరకు వెళ్ళి తమకు స్వతంత్ర నాగా దేశం కావాలని అడిగారనీ దానికి గాంధీజీ మద్దతు ఇస్తానన్నారనీ చెప్పాడు.

ఒక రోజు రేడియో గాంధీ హత్య వార్త చెప్పింది. గాంధీ ఎవరు ఏమిటీ అని ఆముగ్గురూ మాట్లాడుకున్నారు.తను స్కూల్లో విన్నవీ పాఠాల్లో తెలుకున్నవీ చెప్పాడు మోసే ఆడవాళ్ళిద్దరికీ. గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాదు ప్రధాన మంత్రి వేరే వున్నాడు ఆయన పేరు నెహ్రూ ఆ ఇద్దరిపేర్లూ ఎప్పుడూ కలిసి వినిపించినా వాళ్ళూ అన్నతమ్ములు కారు. ఒక రోజు చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది,నాగాలకు స్వతంత్రం కావాలని వారిని ఇండియాలో విలీనం చెయ్యొద్దని వ్రాసినందుకు ఫిజో అనే ఆయన్ని ఇండియా ప్రభుత్వం అరస్ట్ చేసిందని. అప్పుడు నానమ్మ అంది “అవును నాగాలు ఇండియాలో ఎందుకు చేరాలి? వాళ్ళెప్పుడూ ఇండియాలో భాగం కారు” అని. “మనం జీసస్ ని ప్రార్థించాలి ఆయన్ని త్వరగా విడుదల చేయించమని. పాపం ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత తపిస్తున్నారో కదా?” అంది.

1950 నాటికి మోసే ఆరో తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళు సాయంత్రం చలిమంట దగ్గర కూచున్నప్పుడు విలా చెప్పింది “నేనివాళ పొలం నుంచీ త్వరగా వచ్చాను. రోడ్డు మీద చాలా సైనిక వాహనాలు వున్నాయి.చాలా సేపు అవి అక్కడే ఆగి వున్నాయి మాకు చాలా భయం వేసింది వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు.”

“అవును జపాన్ యుద్ధం అప్పుడు ఒకామెని సైనికులు ఎత్తుకెళ్ళారు.తిరిగొచ్చాక చాలా కాలం ఆమె ఏడుస్తూనే వుండేది,” అన్నది నానమ్మ. స్కూల్లో కూడా పిల్లల్ని బయట తిరగవద్దని చెప్పారు. ఇప్పుడు జపాన్ యుధ్ధమప్పుడు ఎంతమంది సిపాయిలున్నారో అంతమందికన్న ఎక్కువ వున్నారు. మోహరించిన భారత సైన్యం అది.

అప్పుడు డిసెంబర్ లో ప్లెబిసైట్ జరిగింది. అందరూ వెళ్ళి మాకు స్వతంత్రం కావాలనే అర్జీ మీద వేలుముద్రలు వేసొచ్చారు. కానీ ఇండియా ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టలేదు ఒకరోజు కోహిమాలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. వాళ్లమీద పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. గుంపు చెల్లాచెదరైనా ఒకతను గుండుతగిలి చనిపోయాడు పట్నంలో కర్ఫ్యూ విధించారు.

1952 లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. నాగాల్యాండ్ లోనూ వచ్చాయి,కానీ అక్కడంతా ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు చాలామందిని తీసుకుపోయి బలవంతంగా బ్యాలెట్ పేపర్లమీద వేలిముద్రలు వేయించారు అట్లా మోసే తల్లీ నానమ్మ కూడా వేసొచ్చారు. ఇండియా కి ఎవరు ప్రధాన మంత్రి అయితే మనకేమిటి? మనం ఎందుకు వోట్లు వెయ్యాలి? వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు అన్నది నానమ్మ. సైన్యం ధాన్యపు కుప్పల్ని తగలబెడుతోదనీ విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి అమాయక పౌరులను పొట్టన పెట్టకుంటోందనీ మోసే వింటున్నాడు. కానీ ఈ వార్తలేవీ వాళ్ళు వినే రేడీయోలో రావు. చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళి నాగా విముక్తి ఉద్యమంలో చేరిపోతున్నారు. పెళ్ళయిన వాళ్లు మాత్రమే ఊళ్ళల్లో మిగిలివుంటున్నారు తమ మీద జరుగతున్న దౌర్జన్యానికి నాగాప్రజలు కోపోద్రిక్తులౌతున్నారు. చాలా చోట్ల సైనకుల చేతిలో స్తీలు అత్యాచారాలకు గురౌతున్నారు. ఎవరికీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఒక సైనికుడు పేల్చిన తూటా పొలంనుంచీ వస్తున్న నానమ్మను బలితీసుకుంది.

ఆమె మరణం మోసే ను బాగా కదిలించింది. 1959 నాటికి మోసేకి 19 ఏళ్ళొచ్చాయి.

అతని తల్లి విలా కి అత్తగారి మరణం తరువాత ఏళ్ళకిమించిన వృద్ధాప్యం వచ్చినట్లయింది. స్కూల్ ఫైనల్ అవకుండానే మోసే చదువు మానేశాడు. సైనికుల ఆగడాలు చూస్తున్నకొద్దీ ఆగ్రహావేశాలు అదుపులోకి రావడం లేదతనికి. ఒకరోజూ అతనూ అతని స్నేహితుడు నీట్యూ అజ్ఞాత నాగా సైనికుల్లోచేరిపోయి అడవులకు వెళ్ళిపోయారు. తల్లి తన కొడుక్కి హృదయపూర్వకంగా అనుమతి ఇచ్చింది. ఏడు సంవత్సరాల కాలం అతను అడవులలోనే వుండిపోయాడు గెరిల్లా శిక్షణ తీసుకున్నాడు అక్కడ అతనికి తనతో పాటు గెరిల్లా శిక్షణ పొందుతున్న నీల్హౌనో (nielhounuo) పరిచయమౌతుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతా ఆమెని రైఫిల్ గర్ల్ అంటారు.

మోసె ప్రాణానికి తెగించి ఒకరోజు కోహిమా వచ్చి రహస్యంగా నాగా పతాకం ఎగరేసి పోతాడు. ప్రభుత్వ సైన్యాలకూ ఉద్యమకారులకూ మధ్య కాల్పులూ ఎదురుకాల్పులూ మొదలౌతాయి. వీరిద్దరిమధ్య సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకూంటూ వుంటారు. ఆపరిస్థితుల్లో అప్పటివరకూ అస్సాంలో ఒక భాగంగా వున్న నాగా ప్రాంతం 1963 లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ పరిణామం ఉద్యమకారులలో క్రోధాగ్ని రగిలిస్తుంది కొందరు కోహిమాకు వెళ్ళి రాష్ట్రావతరణ ఆపాలంటారు. కొందరు అప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగంది కనుక అట్లా చెయ్యడం మంచిది కాదంటారు. తీవ్రమైన చర్చలు జరగుతాయి. సీనియర్ నాయకులు హింస తగ్గించమంటారు. చివరికి వీరిమాట నెగ్గింది. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఉద్యమాన్ని వదిలి జన జీవనంలో కలిసే వారికి కొంత డబ్బో భూమో ఇస్తానని ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యమ కారులు ఇందుకు ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే బయటికొచ్చారు. ప్రభుత్వ సైనికులకీ ఉద్యమ కారులకీ మధ్య కాల్పులు ఉధృతమైన సమయంలో ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. అప్పుడే మోసే తల్లి విలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోదని తెలసి అతను తన స్నేహితుడు నీట్యూ తో కలిసి ఇంటికి వస్తాడు. “నేను రమ్మనలేదు కదా,” అంటుంది తల్లి. ఆమె క్యాన్సర్ చివరి దశలో వుంది. మోసే తల్లిదగ్గరే వుండిపోతాడు. తనకి అజ్ఞాత జీవితంలో పరిచయమైన నీల్హౌనో కూడా బయటికి వచ్చేసింది ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతనికి ప్రభుత్వం ఉద్యోగమేదో ఇస్తానంటే ఇష్టం లేక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు. అతని ఉద్యమ జీవితం ముగిసింది. అతనికొక కూతురూ అతని స్నేహితుడు నీట్యూకి కొడుకూ జన్మిస్తారు.

ఇంక అక్కడనంచీ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నీ ఆ స్నేహితుల సంభాషణల ద్వారా చర్చల ద్వారా మనకి అర్థం అవుతాయి. మోసే కూతురుకి గానీ నీట్యూ కొడుక్కిగానీ ఉద్యమం మీద ఆసక్తిలేదు. అతను చదువుకుని స్కూల్లో టీచరౌతాడు ఆమె స్వంతంగా నేత పని ప్రారంభిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటారు. మోసే మనమడు నీబో(niebou) డిల్లో శ్రీరామ్ కాలేజీలో చదువుకోడానికి వెడతాడు. అక్కద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపట్ల, విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులూ పౌరసమాజం చూపుతన్న వివక్ష వారిపై జరిగే దాడులూ దేశంలోని వివిథ ప్రాంతాలలో వారిపై చూపుతున్న జాతివివక్ష గమనిస్తాడు. అవడానికి తామందరూ భారత పౌరులే మరి!

ఒక దశలో చదువుమానుకుని వెళ్లిపోదాం అనుకుంటుండగా అతనికి రాకేశ్ అనే సహవిద్యార్థితో పరిచయం అవుతుంది. అతను అరవైల్లో నాగాల్యాండ్ లో పనిచేసిన హిమ్మత్ అనే ఆర్మీ కమాండెంట్ మనుమడు. ఆయన్ని కలుస్తాడునీబో. రిటైరైన హిమ్మత్ కి నాగాల్యాండ్ అంటే ఇష్టం ఆయన ద్వారా ఆర్మీ దృష్టి నుంచీ నాగా ఉద్యమాన్నీ ప్రభుత్వ వైఖరినీ చూస్తాం మనం. చాలాకాలం ఇంటికి దూరంగావుండడం కొత్త ప్రదేశం కొత్త భాష, తమలో ఎవరికి ఏం జరిగినా రెచ్చిపోయి కాల్పుల జరపడం వంటి సైనికుల మానసికావస్థలను గురించి చెప్పి అప్పటి సైనికుల చర్యల గురించి, “నేను ప్రభుత్వ ఆజ్ఞాబద్ధుడను.” అంటాడు. కానీ నాగాఉద్యమాన్ని సమర్థిస్తాడు. అజ్ఞాత సైనికుడైన మోసేని చూడాలనుకుంటాడు. మోసే 2007 లో హత్య కి గురౌతాడు. నాగా ఉద్యమ చరిత్రే కాదు, మొత్తం కుటుంబసభ్యుల మధ్య స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య పిల్లల తల్లితండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఎట్లా వుండాలో చెబుతుందీ నవల. అందరూ ఆలోచనాపరులే. అందరూ మనుషుల్ని ప్రేమించేవారే. చివరికి తన తాత మోసే ని చంపిన వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు నీబో.

ఫాక్షనిష్టులేం చేశారు?

దుకాణాలపెట్టుకునో మరో విధంగానో బ్రతుకుతున్న సీనియర్ ఉద్యమకారులపై దాడులు చేశారు అవమానించారు. కొంతమందిని చంపారు. బాగా చదువుకుని అందమూ ఆస్తీ వుండికూడా ఉద్యమంలో చేరి ఫాక్షన్ల మధ్య ఐక్యతకోసం ప్రయత్నించిన మాయంగర్ అనే యువకుణ్ణి హత్య చేసారు. అటు ప్రభుత్వమూ ఇటు ఫాక్షనిష్టులూ కూడా మోసే వంటి పాత ఉద్యమకారులపై నిఘా పెట్టారు. బలవంతపు వసూళ్ళకి దిగారు. దీనివలన నాగాప్రజలుకూడా ఇన్సర్జెన్సీని సమర్థిస్తున్నారని ఇండియన్ ప్రెస్ లో వార్తలొచ్చాయి. కిల్లీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్న బీహారీ యువకుడిని డబ్బు కోసం కాల్చబోతే అడ్డుపడబోయిన మోసేని కాల్చేశారు. జనం మధ్యలో నిర్భీతిగా కాల్పులు జరిపి తుపాకి భుజానికి ఆనించుకుని వెళ్ళిపోయారు.

ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నింటినీ ఒక చోటికి తెచ్చి వాళ్లమధ్య అవగాహన కల్పించే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యల కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఈ కన్నీటి కల్లోల ప్రాంతంలో శాంతి ప్రసరించే ఛాయలు కనపడుతున్నాయని ముందుమాటలో అంటుంది ఈస్టరీన్. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన మోసే తన బంధువు దే దేననీ సంఘటనలన్నీ యదార్థాలనీ చెప్పింది. ఇందులో హిమ్మత్ కూడా నాగాల్యాండ్ లో పనిచేసి వెళ్ళిన ఒక కమాండెంట్ కు పేరు మార్పేననీ అన్నది. ఈ పుస్తకం చివర పొందుపరిచిన నికేతు ఇరాలు ప్రసంగంలో ఇట్లా అంటాడు, “సార్వభౌమత్వం కాకుండా మరేదైనా అంగీకరించడానికి నాగాలు సిద్ధంగా వుంటే డిల్లీతో ఒక గౌరవనయమైన అంగీకారయోగ్యమైన అవగాహనకు రావడం కష్టం కాదు.అది ఇరువైపులకు మంచిది….ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నీ ఒక అవగాహనకు వచ్చి డిల్లీతో ఒక ఒప్పందానికి రావడం మంచిది తరవాతేం చెయ్యాలో భవిష్యత్తు తరాలు నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు కావాల్సింది శాంతి, అభివృద్ధి.”

యుద్ధాలు నిర్ణయించేది సైనికులూ కాదు ప్రజలూ కాదు రాజకీయ నాయకులు, అని అర్థం అయింది వాళ్లకి.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.

చీర చెప్పిన కథ!

bhuvanachandra“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?”

“అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న పెంచారు.. గొప్పగానే పెరిగాను. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది కమల.

” ఊ.. తరవాత?” అడిగాను.

“9thలో పెద్దమనిషినయ్యాను. అప్పటిదాకా నా గురించి నేనేం పట్టించుకోలేదనే చెప్పాలి. పెద్దమనిషి అయ్యాకే మొట్టమొదటిసారి నేను ‘అందగత్తె’నని నాకు తెల్సింది… నాకే కాదు మా ఊరందరికీ కూడా తెలిసింది..” నవ్వింది.

ఆ నవ్వులో ఓ నిర్లిప్తత వుంది. నేను మౌనంగా కూర్చున్నా.

” ఓ మాట చెప్పనా.. తను అందగత్తెనని ఆడదానికి ఎప్పుడు తెలుస్తుందో అప్పటినించే మనసు వెర్రితలలు వేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. చదువుమీద నాకు తెలీకుండానే శ్రద్ధ తగ్గింది. అప్పటిదాకా అసలు పేరే తెలియని క్రీములూ, పౌడర్లు, నెయిల్ పాలిష్‌లూ వాడటం మొదలుపెట్టి ఎవరు నా వంక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తున్నా పొంగిపోయేదాన్ని!” మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ‘గతపు’ కమల ప్రతిఫలించింది.

“అలాంటి అలంకార సామగ్రి అందరూ వాడేదేగా.. అలాగే ఏ ఆడపిల్ల ఐనా అందంగా వుంటే జనాలు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడటం ఆ పిల్ల పొంగిపోవటమూ సహజమేగా?” మామూలుగా అన్నాను.

“మీరొకటి మర్చిపోతున్నారు.. అప్పటి నా వయసు గురించీ, ఆ వయసులో కలిగే భావాల గురించి ఆలోచించండి. నేను ఏ స్టేజికి చేరుకున్నానంటే ఏ కుర్రాడైనా నా వంక చూడకపోతే అది ప్రెస్టీజ్‌గా తీసుకుని , ఎలాగైనా వాళ్ల అటెన్షన్ నా మీద పడేట్టు చేసుకునేదాన్ని. అప్పటికిగానీ నా ‘ఈగో’ చల్లారేది గాదు!”

పరీక్షగా ఆమె వంక చూశా. ఆ కన్ను ముక్కు తీరూ, ఆ పెదవుల వొంపూ, శరీరాకృతీ చూస్తే ఇప్పటికీ అంటే యీ వయసుకీ ఆమె అందంగానే వుందని చెప్పుకోవాలి. నలభై దాటాయి గనక శరీరం వొడలటం, అందం అలవటం తెలుస్తోంది. అలిసిపోయినా అందం అందమేగా. “కాలేజీ కొచ్చేసరికి నా శరీరాకృతి ఎంత అందంగా తయారైందో, నా మనసు అంతకన్నా ఎక్కువ అహంభావంతో నిండిపోయింది. డబ్బుకి పెద్దగా లోటు లేదు గనక నన్ను పొగిడే స్నేహితురాళ్ళనే చుట్టూ వుంచుకునేదాన్ని. వాళ్లకీ సరదాలు వుండేవి గనక నేను ఎక్కడికెళ్తే అక్కడికి నాతో వచ్చేవాళ్ళు…!”

“ఊ…”

“అప్పుడు పరిచయమైనవాడే మధు. చదువులో మా కాలేజీలోనే బెస్ట్. చదువుతున్నది డిగ్రీ అయినా అపారమైన తెలివితేటలుండేవి.

మా కాలేజీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలిగినవాడు అతనొక్కడే. అంతే కాదు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనివాడు అతనొక్కడే!”

“తరవాత?”

“కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‌లో ఓ నాటకం వెయ్యాల్సి వచ్చింది. దాన్ని సులభమైన వ్యావహారిక భాష లో రాసిందీ, డైరెక్ట్ చేసిందీ కూడా మధునే.శకుంతలగా నన్ను వెయ్యమన్నారు. మధు దుష్యంతుడుగా వేస్తేనే నేను వేషం వేస్తాననీ లేకపోతే వెయ్యననీ పంతం పట్టాను.!” అన్నది కమల. ఆమె చూపులు ఎక్కడో వున్నాయి. నాకు నవ్వొచ్చింది.

“కమలా.. యీ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం సినిమాటిక్‌గా ఉంది సుమా!” అన్నాను.

“సినిమా జీవితం కాకపోవచ్చుగానీ, జీవితం మాత్రం సినిమాలాంటిదే కవిగారు!” ఆమె గొంతులో కొంచెం కోపం.

” ఆ విషయం ప్రస్తుతానికి వొదిలేద్దాం. సరేనా.. సారీ. ఇప్పుడు చెప్పండి. మధుగారు దుష్యంతుడుగా వేశారా?”

“పంతం పట్టానన్నాగా. వెయ్యకుండా ఎలా ఉంటాడూ? ఆ సందర్భాన్ని ‘చనువు’గా మలుచుకున్నాను. అప్పుడే ఓ సంఘటన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది!” నిట్టూర్చింది.

” ఏ సంఘటన?”

” ‘ము’గారు మీకు తెలుసుగా.. ది గ్రేట్ హీరో. ఆయన మా కాలేజీ పూర్వ విద్యార్థి కావటంతో ఆయన్నీ యానివర్సరీకి ఆహ్వానించారు. మా శకుంతల నాటకం చూసి నా అందమూ, నటనా, ఆ నాటకానికే ఓ ‘వన్నె’ తెచ్చాయనీ, నేను ఫిలిం ఫీల్డులోకి వస్తే చిత్ర పరిశ్రమ నన్ను చేతులు జాచి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆ పొగడ్తలకి నేను పూర్తిగా ‘ఫ్లాట్’ అయిపోయాను. అంతేగాదు మధులో గొప్ప రచయిత వున్నాడనీ, అతను సినిమాల్లోకొస్తే ఆత్రేయగారంత పేరు తెచ్చుకొనగలడనీ కూడా అన్నారు.” ఓ క్షణం మళ్ళీ మౌనం మౌనంగా నర్తించింది.

“తరవాత?”

“మధూది దిగువ మధ్య తరగతి ఫేమిలీ. రెస్పాన్సిబిలిటీసూ ఎక్కువే. కానీ నేను పెంచుకున్న ‘చనువు’తో అతనిలో ఓ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. మావాళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. నేను నాటకంలో వేషం వెయ్యడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కానీ అప్పటికే నేను ‘హీరోయిన్’ కావాలని ఫిక్సైపోయా. బలవంతాన మధూని ఒప్పించి చాలా డబ్బు, నగలతో మద్రాసు పారిపోయా…!”

“ఓహ్..! సామాన్యంగా ఇలాంటి పని మగవాళ్లు చేస్తారు.”

“ఆశకి మగా, ఆడా తేడా లేదు కవిగారూ. టి నగర్. ఆనందన్ స్త్రీట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. మీకు నేను గుర్తుండకపోవచ్చుగానీ, మీ మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’ ప్రొడక్షన్ ఆఫీసూ అదే స్ట్రీట్‌లో ఉండేదిగా? చాలా సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీసులోనూ వేషం కోసం ప్రయత్నించా!” నవ్వింది కమల.

“నిజంగా? గాడ్… నాకు తెలీనే తెలీదే!” ఆశ్చర్యపోయాను.

“ఆశ్చర్యం ఎందుకూ? అందరూ మీలాంటి అదృష్టవంతులు కారుగా. సరే, మాట ఇచ్చాడు గనక మధు వచ్చాడు గానీ, అతనికి ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేకపోయింది. మూడు నెలలు కలిసి ఒకే బెడ్‌రూం ఫ్లాట్‌లో వున్నా అతను నన్ను కనీసం ‘టచ్’ కూడా చెయ్యలేదంటే నమ్ముతారా?”

“నమ్ముతా.. ఎందుకంటే పెళ్ళి చేసుకుని కూడా దశాబ్దాల పాటు ఒకేచోట వున్నా ప్రేమకి తప్ప శరీరాకర్షణకి లోబడని ‘జంట’ నాకు తెలుసు. వారి జీవితం జగద్విదితం..!”

“నాకే జాలేసి అతన్ని వెళ్ళిపొమ్మన్నా.. మరో ‘పైకి రాగలడనుకున్న’ యువకుడ్ని నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. ఓ రోజు రంగరాజపురం రోడ్డులో ‘ము’గారు కనిపిస్తే ‘గతం’ గుర్తు చేసి ఏమన్నా వేషం ఇప్పిస్తారేమోనని అడిగా. చిత్రమేమిటంటే ఆయనకి శకుంతల గుర్తుందేమోగాని ఆ వేషం వేసిన ‘కమల’ గుర్తులేదు. పైగా, “చూడమ్మా..అనేక ఫంక్షన్స్‌కి పిలుస్తారు. కొన్నిటికి వెళ్ళక తప్పదు. నీ విషయమే తీసుకో. ‘స్టేజీ’ మీద నువ్వు బాగా చేసి వుండొచ్చు. ఓ ‘మాదిరి’గా చేసినా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము మెచ్చుకుంటాం. దాన్నే ఓ ‘డిగ్రీ’ గా భావించి ఇలా వచ్చేస్తే ఎలా? హాయిగా ఇంటికెళ్ళి పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో వుండు” అని ఓ సలహా పారేసి తన దారిన తాను పోయారు!” సుదీర్ఘంగా నిట్టూర్చింది

కమల.

“ప్రస్తుతం పరిస్థితి ఏమిటి?”

“నేను ‘లేచిపోయానని’ మావాళ్లు మా వూళ్ళో తలెత్తుకోలేక వున్నవన్నీ అమ్మేసి ఇప్పుడు ‘బళ్ళారి’ దగ్గర ఓ విలేజ్‌లో వుంటున్నారు. నేను వెళ్ళినా నా మొహం చూడరని నాకు తెల్సు. అలాగే ఎవరు ‘పైకి’ వస్తాడని భావించి నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నానో అతను నిజంగా పైకి వచ్చాడు. హీరోగా కూడా చేశాడు. పేరు ‘ర’ తో మొదలవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా విభాగాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

“ఊ.. అతను మిమ్మల్ని ఎంకరేజ్ చేయ్యలేదా?” అడిగాను.

“నా నగలన్నీ అయిపోయేవరకూ ‘ఎంకరేజ్’ చేస్తూనే వున్నాడు. అతనికి మరో ‘నిచ్చెన’ దొరగ్గానే నన్నొదిలేసి అక్కడ చేరాడు. అయితే ‘ఆమె’ చాలా టఫ్. ఇప్పుడు అతని భార్యా, అతని పిల్లలకు తల్లి ఆవిడే!” నవ్వింది . ఆ నవ్వులో సంతోషము లేదు. దుఖము లేదు.

“ఫ్యూచర్ సంగతి ఏమిటి?” అడిగా.

“నిజం చెబితే నా వయసిప్పుడు నలభై ఆరేళ్ళు. అందరికీ నలభై అని చెపుతున్నాననుకోండి…. ! ఒక్క సంవత్సరం ఓపిక పట్టి నా డిగ్రీ పూర్తి చేసి వుంటే నా జీవితం మరోలా వుండేది. ఎక్కడో చదివా.. “ఎంత ముందుకొచ్చావంటే వెనక్కి తిరిగి వెళ్లలేనంత. వెళ్లినా ఎక్కడ్నించి పయనం మొదలైందో అక్కడికి చేరలేనంత!” అని . సో. ఫ్యూచర్ గురించి ఆలోచనే లేదు. ఊ..! చదువు కొద్దో గొప్పో వున్నది గనక నా జీవితాన్ని ఓ పుస్తకంగా అంటే ఓ బుల్లినటి ఆత్మకథగా తీసుకురావాలని వుంది. తేవొచ్చా?” నవ్వింది .

“ఎందుకు తేకూడదు?”

“ఆత్మకథలు గొప్పవాళ్లకేగా!. వాళ్ల జీవితాలైతే అందరూ చదువుతారు. నాలాంటివాళ్ల జీవితకథలు ఎవరు చదువుతారు ?”

“కమలగారూ.. నిజం చెప్పనా… ఆకాశాన్ని ఆక్రమించిన చెట్టుకైనా వేళ్ళు భూమిలోకే ఉంటాయి . ఆకులూ, కొమ్మలూ కాదు ఆత్మకథంటే.. ఆ చెట్టుకి పునాది అయిన వేళ్ళ కథలు. ఆ ‘వేళ్ళ’ కథలు చెట్టు చెబితేనే గానీ తెలీదు. కొమ్మల్ని బట్టి, కాండాన్ని బట్టి చెట్టు వయసునీ, గొప్పతనాన్నీ వూహించవచ్చు. కానీ ఎన్ని పురుగులు తల్లి వేరుని, మిగతా వేళ్లనీ కొరికాయో, కొరికే ప్రయత్నం చేశాయో ఆ చెట్టుకి తప్ప ఎవరికీ తెలీదుగా! తప్పక రాయండి. ఒట్టేసి చెబుతున్నా. మీ ‘స్క్రిప్టు’ మొదట నేను చదువుతా!” సిన్సియర్‌గా అన్నాను.

“వేరు పురుగుల గురించేగా రాయాల్సింది. అదీ తప్పే. నాకు ఇష్టం లేకుండా ఏదీ జరగలేదు. ఏ తప్పు జరిగినా నాకు తెలిసే జరిగింది. అందుకే నేనెవరినీ నిందించాలని అనుకోవట్లా. కానీ, జరిగింది జరిగినట్లు మాత్రం రాస్తాను.”

“గుడ్. నిజాన్ని నిజంగా వ్రాయగలగడం అంత కష్టం మరొకటి ఉండదు. చాలా ధైర్యం కావాలి!”

“అది వుంది లెండి. ఇంతకీ నేను వ్రాయబోయే కథలపేరు తెలుసా?”నవ్వింది. ఆ నవ్వులో చిన్న చిలిపిదనం దోబూచులాడింది.

“చెప్పండి!” ఉత్సాహంగా అన్నాను.

“చీర చెప్పిన కథలు!” పకపకా నవ్వింది.

 

*******************************************

 

అయ్యా… కమల ఇంకా మద్రాసులోనే ఉంది. ‘మధు’ ప్రస్తుతం ఓ గొప్ప కాలేజీలో లెక్చరర్‌గా ఉంటూ ఆ జాబ్ వదిలేసి ఆస్త్రేలియా వెళ్లాడట. ‘ది అన్‌టోల్ద్ స్టోరీస్’లో ఉన్న వ్యక్తులందరూ ప్రస్తుతం మన మధ్య వున్నవాళ్ళే. కొంతమంది ‘పర్మిషన్’ ఇస్తామన్నారు. ఇస్తే వారి ఫోటోల్ని, సెల్ నంబర్స్‌ని కూడా ప్రచురించడం జరుగుతుంది. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చవొచ్చనే అనుకుంటున్నాను. వీలున్నంతవరకూ ‘చీకటి’ వ్యవహారాల్ని ‘రాత’లోనే ‘ఎడిట్’ చేశానని మనవి చేస్తూ (పేర్లు మార్చానని చెప్పక్కర్లేదుగా)…

మీ భువనచంద్ర…