రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

మీ మాటలు

  1. buchireddy gangula says:

    ప్రచారం లేని — గుర్తింపు లేని మంచి రచయిత అశోక్ గారు —-
    యిప్పటి కయినా వారిని గుర్తించి పరిచయం చేసినందుకు —థాంక్స్
    —————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  2. Lalitha P. says:

    అశోక్ కుమార్ గారి కథ కదిలించింది. కానీ పిల్లల్ని కనటం, పెంచటం ద్వారా జరిగే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణ బాధ్యత ఒక్క తల్లిదండ్రులదే కాదు. సమాజానిదీ ప్రభుత్వానిదీ కూడా. ఈ బాధ్యత నిర్వర్తించటం కోసం కొన్ని చట్టాలు చెయ్యాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కనీసంగా ఇవ్వాల్సిన విద్యా, ఆరోగ్య విషయాలనుంచే ప్రభుత్వం తప్పుకుంది. ఇక సమాజ నిర్మాణం, పిల్లల పెంపకం గురించి ఏం పట్టించుకుంటుంది?

    విచిత్రంగా కేంద్ర ప్రభుత్వంలో ఆరవ పే కమిషన్ సిఫార్సు ప్రకారం ఉద్యోగినులకు రెండేళ్ళ చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారు. పిల్లలకు ఒంట్లో బాగులేకపోతే నోట్లో ఇంత మందుపోసి ఆఫీసులకు పరుగెత్తే ఉద్యోగినులు దీనితో కాస్త ఊపిరి పీల్చుకుంటే, ఎక్కువ మంది మగాళ్ళు అచ్చం మగాళ్ళ లాగే కుళ్ళుబోతుతనం అంతా వెళ్లగక్కారు. ప్రభుత్వోద్యోగినులే ఇలావుంటే ఇక ప్రైవేట్ రంగంలోని ఒత్తిడీ, పేరూ, డబ్బు వ్యామోహాలనుంచి దూరంగా జరగ్గలగటం ఒక సగటు అమ్మకు తరమా? పని నెత్తినవేసుకోవటం మగవాళ్ళలో ఎంతమంది తరం?

మీ మాటలు

*