‘జంట గొడ్డలి’ చెప్పే జగజ్జనని తత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

 నరుడే కదా ఈ పురాణ, ఇతిహాసకథలన్నీ చెబుతున్నది?! అలాంటిది తననుంచి తనను విడదీసుకుని, దేవతలు, రాక్షసులు, సిద్ధులు,సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య తనను ఎందుకు ఇరికించుకుంటున్నాడు?

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు,సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒకడుగా ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి ఈ ప్రశ్నను లేవనెత్తాను. కొన్ని వ్యాసాల క్రితం మరోసారి ముందుకు తెచ్చాను. ఇలా వెంటాడుతున్న ఈ ప్రశ్న, ఇప్పుడు సమాధానానికి ఏ కొంచెమైనా దగ్గరవుతుందేమో చూద్దాం.

అసలు ఈ ప్రశ్న తలెత్తడమే అపూర్వం అద్భుతం. ఇంత ముఖ్యమైన ప్రశ్న మన పురాణ, ఇతిహాస పండితులలో ఎందుకు పుట్టలేదో ఆశ్చర్యం. ఈ నరుడనే వాడికి పురాణ, ఇతిహాసాలలో గౌరవం లేదనీ, చులకనభావం ఉందనీ కూడా చెప్పుకున్నాం. మహాభారతంలోని ఈ  విచిత్రాన్నే చూడండి….’ఇతడు కేవల మర్త్యుడే’ అనడం చాలా చోట్ల వస్తుంటుంది.  ఉదాహరణకు, కర్ణుని గురించి దుర్యోధనుడు ఆ మాట అంటాడు. ధర్మరాజు గురించి అర్జునుడు అంటాడు. ఇక ద్రౌపది మానవమాత్రురాలు కాదు, అయోనిజ…

ఇదే సమయంలో ఇదే మహాభారతం, అర్జునుడికి ‘నరు’డనే నామాంతరాన్ని సృష్టిస్తోంది. అంతేకాదు, అతన్ని ‘నరవీరు’ణ్ణి చేస్తోంది. అప్పటికీ నరుడికి అంత ప్రాధాన్యం ఇవ్వడం మహాభారతకర్తకు ఇష్టం లేదు. కనుక అర్జునుని ‘నరు’డనే ఆదిముని అవతారంగా చిత్రిస్తున్నాడు. ఆపైన నారాయణుడనే దేవునితో అతణ్ణి కలిపి చెబుతున్నాడు. మహాభారతంలో నాయకుడంటూ ఒకరిని గుర్తించవలసివస్తే అది నరుడైన అర్జునుడే  అవుతాడు. అతడు నారాయణుడనే దేవుడి సాయంతో కురుక్షేత్రయుద్ధంలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నరుని వారసుడైన అభిమన్యుని కొడుకు పరీక్షిత్తే హస్తినాపురరాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు.

హోమర్ ‘ఒడిస్సీ’ లోని ఓడిసస్ లానే, మహాభారత నరుడు  స్త్రీ సూత్రాన్ని ఎలా జయించాడో చూడండి… కురుక్షేత్రయుద్దం సమీపిస్తున్న సమయంలో  పులోమ, కాలక అనే రాక్షసస్త్రీల కొడుకులైన పౌలోములను, కాలకేయులను చంపాడు. శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని, దేవలోకం వెళ్ళి ఇంద్రునినుంచి మరికొన్ని దివ్యాస్త్రాలను  పొందిన తర్వాత; ఊర్వశి అనే అప్సరస పన్నిన మోహపు ఉచ్చులో పడకుండా తప్పించుకున్నాడు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ఇదీ అతను రచించుకున్న పూర్వరంగం! ఆ వెంటనే మరో ‘నరు’డైన నలుని చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమం, నరుని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు కల్పించున్న ప్రణాళికను సూచిస్తూ ఉండచ్చు.

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒక అల్పజీవిగా ఇరుక్కుని ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. క్రమంగా నరుడు వీరుడిగా మారి ఆ ప్రపంచంలోంచి తనను తాను విముక్తం చేసుకుని విశ్వరూపం ధరిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆదిమ పౌరాణికతకు భిన్నమైన తాత్వికతను, తాత్విక ప్రతీకలను సృష్టించాడు.  ఈ పరిణామం తరతమ భేదాలతో దాదాపు ప్రపంచమంతటా జరిగింది. మెసపొటేమియా, భారతదేశం, గ్రీసు మొదలైన చోట్ల ఇది ఐతిహాసిక యుగాన్ని స్థాపించింది. గిల్గమేశ్, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, అర్జునుడు, సారగాన్, హమ్మురాబి, అచెలూయెస్(ఇలియద్), ఓడిసస్ మొదలైన వీరులను సృష్టించింది. వీరిలో పలువురు ఇతిహాస నాయకులయ్యారు.  గిల్గమేశ ఇతిహాసం (ఎపిక్ ఆఫ్ గిల్గమేశ్), రామాయణం, మహాభారతం, ఇలియద్, ఒడిస్సే మొదలైనవి వీరిని కీర్తించాయి.

ఇక ఇప్పుడు ఆదిమ పౌరాణికత, నూతన పౌరాణికతల మధ్యనున్న తాత్విక భేదాలలోకి వెడదాం:

‘యెహోవా కూడా కాళియ మర్దనుడే’ అనే వ్యాసంలో పాములే శిరోజాలుగా ఉన్న మెడూసా అనే దేవత గురించి ప్రస్తావించుకున్నాం. ఆ దేవత చూపులే మగవారిని దహించివేస్తాయి. పెర్సియస్ అనే దేవుడు ఆమె తలను నరుకుతాడు. ఎథెనా అనే దేవత ఆదేశం పై అస్లేపియస్ అనే దేవవైద్యుడు మెడూసా కుడి, ఎడమ నరాల నుంచి రక్తం సంగ్రహిస్తాడు. కుడి నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికి, ఎడమ నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికి వినియోగిస్తాడు. అంటే ప్రాణం పోయడం, తీయడం అనే రెండు శక్తులూ ఈ దేవతలో సహజీవనం చేస్తున్నాయన్న మాట.

kali

ఇటువంటి మెడూసాను క్యాంప్ బెల్ మన కాళికాదేవితో పోలుస్తారు. కాళిక తన కుడి చేత్తో వరాలు ఇస్తుంది, ఎడమ చేతిలో కరవాలాన్ని ధరించి ఉంటుంది. కాళి విశ్వంలోని అన్ని జీవులకూ జన్మనిచ్చే జగజ్జనని, అమ్మల గన్న యమ్మ. అయినాసరే, రక్తదాహాన్ని చాటుతున్నట్టుగా ఆమె ఎర్రని నాలుక చాస్తుంది. కపాలాలనే  హారంగా ధరిస్తుంది. తెగిన చేతులు, కాళ్లనే వస్త్రంగా చుట్టుకుంటుంది.  కాళి అనే పేరు నలుపును, కాలాన్నీ కూడా సూచిస్తుంది. జనన మరణాలు అనేవి కాలంలోనే సంభవిస్తుంటాయి. అందుకే యముణ్ణి కాలుడు అన్నారు.  జీవుల జనన, మరణాలను శాసించే దేవత కాళి. విశ్వానికి గర్భమూ, సమాధీ కూడా ఆమెయే. ఆమె అద్వితీయమైన(ఇంకొకటి లేని)ఆదిమశక్తి. ప్రకృతి యొక్క చరమసత్యం. దేవుళ్ళు అందరూ ఆమె ఆదేశాలను పాటించవలసిన ఆమె ప్రతినిధులు మాత్రమే.

మన ‘దేవీ భాగవతం’ ఈ జగజ్జనని అద్వితీయతను, ఆధిక్యాన్ని చెబుతుంది. మన పురాణాలు సృష్టి, స్థితి, లయం అనే మూడు మాటల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఇవి మూడు రకాల కార్యాలను సూచిస్తాయి. విడివిడిగా చెప్పుకుంటే; సృష్టి అంటే విశ్వాన్ని సృష్టించడం-ఇది బ్రహ్మదేవుడి పని. స్థితి అంటే విశ్వం సక్రమంగా నడిచేలా చూస్తూ దానిని పోషించడం-ఇది విష్ణువు పని. లయమంటే సృష్టిని అంతమొందించడం-ఇది శివుడు చేసే పని. కానీ ఆదిమ పౌరాణికతలో ఈ మూడింటినీ ఒక్క జగజ్జననే చేస్తుంది. ఈ శక్తులన్నీ ఆమెలోనే ఇమిడి ఉంటాయి. పైన చెప్పిన త్రిమూర్తులు కూడా ఆమె సంతానమే.

మన పురాణాలలో అత్రి మహాముని భార్య అనసూయ ఉదంతం పరోక్షంగా దీనినే చెబుతుంది. ఒకసారి త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు. ముగ్గురూ అతిథులుగా అత్రి ఆశ్రమానికి వెళ్లి, నువ్వు నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని అనసూయతో అన్నారు. ఆమె సరే నని  ముగ్గురినీ పసిపిల్లలను చేసి, తను నగ్నంగా మారి, వారి ముందు విస్తళ్ళు వేసి వడ్డించి, తను తిరిగి చీరకట్టుకుని వచ్చి వారిని పెద్దవాళ్ళుగా మార్చింది. ఆ తర్వాత వారిని మరోసారి పసిపిల్లలను చేసి తన దగ్గరే ఉంచుకుందని, అప్పుడు వారి భార్యలు వెతుక్కుంటూ వచ్చారని కథ.

మృత్యు, పునరుజ్జీవనాలు రెండింటికీ చెందిన దేవతారూపమూ, ఆ దేవతకు సంబంధించిన పురాణ కథలూ లెవంట్ (సైప్రస్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, లెబనాన్, టర్కీలను లెవంట్ అంటారు) అంతటా నూతన శిలా యుగం నుంచి, దాని అనంతర యుగంవరకూ కొన్ని వేల సంవత్సరాలపాటు సుపరిచితాలు. క్రీ .పూ. 5,500కు చెందిన సమీపప్రాచ్యంతో మొదలుపెట్టి, క్రీ.శ. 1531కి చెందిన గౌదలూపే(Gaudalupe: స్పెయిన్, అమెరికా, బొలీవియా, పెరూ, కొలంబియా, మెక్సికో సహా స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో కనిపించే ఒక ప్రాదేశిక నామం) వరకు ఈ దేవతామూర్తులు, ఆమెకు సంబంధించిన పురాణకథలలో ఒక అవిచ్ఛిన్నత కనిపిస్తుంది.  ఆసియా మైనర్, నైలు, గ్రీసు, సింధు లోయ సహా పురాతన ప్రపంచం అంతటా వివిధ వైఖరులకు చెందిన నగ్నస్త్రీ మూర్తులు విస్తారంగా కనిపించాయి. సృష్టిస్థితి లయాలతో సహా అన్నింటినీ సంకేతించే ఈ దేవతకు చెందిన ఒక రూపం తన రెండు చేతులతో స్తనద్వయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకో రూపం ఎడమ చేతితో జననేంద్రియాన్ని, కుడి చేతితో స్తనాన్ని చూపిస్తుంది. ఇంకొక రూపం మగశిశువుకు పాలిస్తూ కనిపిస్తుంది. వేరొక రూపం రెండు చేతులూ చాపి, వాటిలో పంటకు సంబంధించిన కంకులను, పువ్వులను, సర్పాలను, పావురాలను, ఇతర చిహ్నాలను పట్టుకుని పశువుల మధ్య నిలబడి కనిపిస్తుంది.

The Goddess of the Mountain

యూరప్ కు సంబంధించినంతవరకు అభివృద్ధి చెందిన తొలినాటి కంచుయుగ రూపాలు క్రీటుద్వీపంలో కనిపించాయి. ఈ ద్వీపంపై లెవంట్ ప్రభావం పడింది. క్రీ.పూ. 25౦౦-క్రీ.పూ. 12౦౦ ల మధ్యకాలంలో క్రీటు నాగరికత (మినోవన్ నాగరికత) ఉచ్ఛదశను చవిచూసింది. మన దేశంలో సింధు నాగరికతకు చెందిన హరప్పా-మొహెంజదారోల కాలం కూడా ఇదే.  క్రీటునగరం నోసోస్ లోని ప్రాసాదం శిథిలాలలో క్రీ.పూ. 1500 కు చెందిన ఒక సీలు దొరికింది. ఆ సీలు మీద ఒక దేవత బొమ్మ ఉంది. ఆమె జగత్ పర్వత దేవత(The Goddess of the World Mountain). ఆమె ఒక దండం లాంటిది పట్టుకుని కొండ మీద నిలబడి ఉంటుంది. రెండువైపులా రెండు సింహాలు ఉన్నాయి. ఆమె వెనకాల క్రీటు ఆలయరీతిని ప్రతిబింబించే ఒక భవనం ఉంది. ఆమె ఎదురుగా భక్తిని చాటే భంగిమలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు బహుశా చావు-పుట్టుకలను సూచించే ఆమె కొడుకు-భర్త; లేదా క్రీటు యువరాజు, లేదా ఒక భక్తుడు కావచ్చునని క్యాంప్ బెల్ అంటారు. ఒకవేళ అతను రాజే అయినప్పుడు, ఫ్రేజర్ చెప్పినదే నిజమైతే, ఎనిమిదేళ్ళ కోసారి శుక్ర-సూర్య ఆవృత్తి(Venus-solar cycle) పూర్తి అయినప్పుడల్లా రాజును నిజంగానో, ప్రతీకాత్మకంగానో బలి ఇచ్చేవారని కూడా ఆయన అంటారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్ధారణగా చెప్పలేకపోయినా, చావు-పునర్జన్మలను సంకేతించే యువకుని దేవతకు కొడుకుగా-భర్తగా స్పష్టంగా సూచించే దేవత చిత్రాలు అనేకం ఉన్నాయి. అలాగే రాజును బలి ఇవ్వడం గురించి చెప్పే చిత్రాలు, ఉదంతాలు కూడా.

వాటిని అలా ఉంచితే,  ఈమె పర్వతదేవత కావడం మన పురాణాలలోని పార్వతినీ; ఈమెకు రెండువైపులా సింహాలు ఉండడం –పార్వతికి మరో రూపమైన సింహవాహిని దుర్గను గుర్తుచేస్తాయి. పై దేవత పశువుల అధిదేవత(Lord of the Beasts)ను పోలి ఉందని పురావస్తు నిపుణులు అనడం గమనిస్తే, పశుపతి అయిన శివుడు వెంటనే గుర్తుకొస్తాడు. మొదట అమ్మవారి పాలనలో ఉన్న పశువులు, తర్వాత అయ్యవారి పాలనలోకి వెళ్ళాయన్నమాట.

The Goddess of the Double Axగ్రీసులోని క్రి.పూ. 2వ సహస్రాబ్దికి చెందిన పురాతన నాగరికతా ప్రాంతమైన మైసీనియాలో లభించిన ఒక గుండ్రని సీలు మీద ఒక చిత్రం ఉంది. ఆ చిత్రంలో ఉన్నది ‘జంట గొడ్డలి దేవత’(Goddess of the Double Ax). చిత్రంలో పైన సూర్యుడు, చంద్రవంక ఉన్నారు. చంద్రుడు క్షీణదశలో ఉండగా, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చంద్రుడి వెనకాల ఎడమ చేతిలో ఒక దండం పుచ్చుకుని చిన్న స్త్రీమూర్తి నిలబడి ఉంది. ఒక మైసీనియా డాలు ఆమెను కప్పుతోంది. మన మహిషాసురమర్దనిలా ఈ జంట గొడ్డలి దేవత యోధదేవత అనడానికి ఇది సూచన. అలాగే, దేవతకు చెందిన సంహార, లేదా మృత్యుదేవతా లక్షణానికి కూడా ఇది సూచన.(తాత్వికంగా చెబితే, ఈ సంహార కార్యాన్ని దుష్టశిక్షణ, శిష్టరక్షణగా అన్వయించడం తర్వాతి కాలంలో వచ్చింది. ఈ చిత్రం ప్రాతినిధ్యం వహించే ఆదిమ పౌరాణికకాలంలో ఆ అర్థం లేదు). ఈ చిన్న స్త్రీమూర్తి, బలి ఇచ్చిన ఆరు పశువుల శిరస్సులను తన కుడి చేతితో చూపుతోంది. దానికి సరిగ్గా అభిముఖంగా పుష్కలంగా పండిన పండ్లతో ఒక చెట్టు ఉంది. అది జీవవృక్షం(Tree of Life). ఒక చిన్న పిల్ల ఎగిరి పండ్లు కోసుకుంటోంది.

చిత్రం మధ్యలో కనిపిస్తున్నది, క్రీటుకు చెందిన జంట గొడ్డలి. దాని ఒక అంచు బలిని సూచిస్తోంది. రెండవ అంచు జీవవృక్షాన్ని సూచిస్తోంది. చెట్టు కింద కూర్చుని ఉన్నదే జంట గొడ్డలి దేవత. ఆమె ప్రసన్నవదనంతో ఉంది. ఆమె ఎదురుగా ఇద్దరు భక్తులు ఉన్నారు. ఆమె కుడి చేతితో ఒక పంట తాలూకు మూడు కంకులు వారికి ఇస్తూ, ఎడమ చేతితో తన స్తనం ఒకదానిని ఎత్తిచూపుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక చిన్నపిల్ల ఉంది. కాళ్ళు లేని ఆ పిల్ల భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి ఎడమచేతిలో చిన్న జంట గొడ్డలి, కుడి చేతిలో చెట్టుకొమ్మ ఉన్నాయి.

చిత్రంలో ఈ చివర, డాలుతో కప్పిన స్త్రీమూర్తి కిందికి దిగుతున్న భంగిమలో ఉండడం, ఆ చివర ఒక బాలిక పైకి ఎగిరి పండ్లు కోసుకుంటున్న భంగిమలో ఉండడం ఇందులోని తాత్విక సారాంశాన్ని వెల్లడిస్తాయి. కిందికి దిగుతున్నట్టు ఉన్న స్త్రీమూర్తి మృత్యువుకు, ఎగిరి జీవవృక్షం పండ్లు కోసుకుంటున్న బాలిక పునర్జన్మకు సంకేతాలు. అంటే చావు, పుట్టుకలు రెండింటికీ ఈ జంట గొడ్డలి జగజ్జననే అధిదేవత. జంట గొడ్డలి సంకేతించేది కూడా దానినే. ఒక్కోసారి చావు, పుట్టుకలను వేర్వేరు దేవతలతో సంకేతించినా వారు ఈ దేవత అంశలు మాత్రమే. పితృస్వామిక పురాణాలకు ముందు పౌరాణిక ఉద్యానవనమూ(Mythic Garden), స్వర్గమూ(Paradise) కూడా ఈ దేవతే. ఈమె కొడుకు దుముజి చంద్రుని క్షీణ, వృద్ధి దశలను సంకేతిస్తూ చావు-పుట్టుకల చక్రభ్రమణం సాగిస్తూ ఉంటాడు.

The Minoan Double Ax

పైన పేర్కొన్న జగత్ పర్వత దేవత చిత్రంలోని సింహాలు కూడా ఒకవైపు మృత్యుభయాన్ని, ఇంకోవైపు పునర్జన్మను లేదా అమరత్వాన్ని సూచిస్తాయి. అంటే భక్షణ, రక్షణ -రెండింటికీ ఇవి ప్రతీకలు. గ్రీకుదేవత మెడూసా, మన కాళికాదేవి సంకేతించేది కూడా సరిగ్గా ఇదే. అంటే జగజ్జనని ప్రపంచంలో చావు-పుట్టుక, భయమూ-నిర్భయమూ అనే ద్వంద్వాలు లేవు. ప్రకృతి నియతికి ప్రతిరూపంగా సాగే ఆ జీవనంలో మంచి-చెడు; వెలుగు-చీకటి, ధర్మమూ-అధర్మమూ అనేవి నేడు మనం భావించుకునే సరళిలో ఉండకపోవచ్చు. ద్వంద్వాలు అన్నీ ఒకదానిలో ఒకటి కలసిపోతున్న, ఒకదాని వెంట ఒకటిగా చక్రభ్రమణం సాగిస్తున్న ఒక అద్వితీయ ప్రపంచం అది. ప్రకృతిలో కూడా జరిగేది అదే. మొక్క మరణించి తన విత్తనంలోంచి తనే పునర్జన్మ ఎత్తుతూ ఉంటుంది. శిశిరంలో మోడువారిన చెట్టు వసంతం రాగానే చిగురిస్తుంది.  ప్రకృతికి ప్రతిబింబమే జగజ్జనని తాత్వికత కూడా.

ఈ ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, గుట్టలు, తోపులు, పక్షులు, పశువులు, సర్పాలు, చంద్రుడు, తారలతో సహా సమస్తమూ జగజ్జనని పరివారమే. వీటిలో మళ్ళీ కొన్ని ద్వంద్వాలకు తావులేని జగజ్జనని తాత్వికతకు అద్దంపట్టే ముఖ్యమైన ప్రతీకలు కూడా అయ్యాయి. వాటి గురించి కొంత ఇప్పటికే చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు తర్వాత…

 ~

దాచేస్తే దాగని మాతృస్వామిక సత్యాలు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనకు తెలుసు…మన పురాణ కథలలో ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతుంటుంది. ‘ప్రకృతి అంతా’ అన్నప్పుడు అక్షరాలా ప్రకృతి అంతా అనే! అందులో ఎలాంటి మినహాయింపూ లేదు. ఉదాహరణలను చెప్పుకుంటూ వెడితే అంతే ఉండదు. అయినా కొన్ని చెప్పుకుంటే, హిమవంతం ఒక కొండ, ఆ పర్వతరాజు కూతురు పార్వతి. శివుడు నాగాభరణుడు, వృషభవాహనుడు. విష్ణువు గరుడ(పక్షి)వాహనుడు. దుర్గ సింహవాహిని. వినాయకుడు మూషికవాహనుడు. కుమారస్వామి నెమలివాహనుడు. బ్రహ్మ కమలాసనుడు. మన్మథుని విల్లు చెరకుగడ. తుమ్మెదలు దానికి అల్లెతాడు. పువ్వులు ఆయన బాణాలు. చిలుక వాహనం…

ఒక కోణం నుంచి చూస్తే మన పురాణ, ఇతిహాస, కావ్యాలు మనిషి జీవితంలో ప్రకృతి ఎంత అవిభాజ్యమో, రెండింటి మధ్యా సామరస్యం ఎంత అవసరమో చెబుతున్నట్టు ఉంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని, ప్రతి అద్భుతాన్ని రెండు దోసిళ్లతో అందుకుంటూ జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోమని బోధిస్తున్నట్టు ఉంటాయి. అడుగడుగునా ప్రకృతి సంబంధమైన పదజాలమూ, అలంకారాలతోపాటు అదనంగా ప్రకృతివర్ణనలు ఉంటాయి.

అసలు మొత్తం రామాయణ కథనే ప్రకృతి పరంగా అన్వయించుకోవచ్చు, అందులో గుహుడు, శబరి లాంటి గిరిజనులు లేదా వనచరులు ఉన్నారు. వానరాల వంటి తరుజునులు ఉన్నారు. సంపాతి, జటాయువు వంటి పక్షులు ఉన్నారు. చివరికి ఉడుత ప్రస్తావన కూడా ఉంది. అద్భుతమైన గుహలు, పర్వతాలు, చెట్లు, నదులు, సెలయేళ్లు, సముద్రాలతో కూడిన మొత్తం ప్రకృతి సన్నివేశం అంతా ఉంది. మామూలుగా ఉండడం కాకుండా రాముడు ప్రకృతిలోని వీటన్నింటితో సహజమైత్రితోనూ, సామరస్యంతోనూ ఉండడాన్ని కూడా రామాయణం ప్రత్యేకించి చెబుతోంది.

చివరిలో కూడా రామాయణం ప్రకృతి పరమైన ఒక సందేశాన్ని ఇస్తోంది. అదెలాగంటే, రావణవధ తర్వాత రాముడు పుష్పకవిమానం ఎక్కి సీతాలక్ష్మణులతో, వానరవీరులతో అయోధ్యకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో భరద్వాజమహర్షిని సందర్శిస్తాడు. అప్పుడా మహర్షి ఏదైనా వరం కోరుకోమని రాముని అడుగుతాడు. చెట్లు అన్ని కాలాలలోనూ  పుష్కలంగా పండ్లు కాస్తూ ఉండేలా వరమివ్వమని రాముడు అడుగుతాడు. అందులో, చెట్లను విచక్షణారహితంగా నరకవద్దన్న సందేశం ఉంది. అడవుల పరిరక్షణ ఉంది. ఆవిధంగా పర్యావరణ ప్రబోధం ఉంది. వానరులకు చెట్లు ఆవాసాలు, ఫలాలు ఆహారమూ కనుక; తనకు ఎంతో సాయం అందించిన వానరుల పట్ల రాముడు కృతజ్ఞతను చాటుకోవడమూ ఉంది.

ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతున్నది మన పురాణకథల్లోనేనా? కాదు, అనేక ప్రాంతాల పురాణకథల్లో! ఆ సంగతిని మరోసారి గుర్తుచేయడానికే పై ఉపోద్ఘాతం.

ముందుగా ఈ చిత్రాలు చూడండి…ఒకటి సరస్వతి చిత్రం. ఆమె పక్కన నెమలి ఉంది. కొన్ని చిత్రాలలో హంసలు ఉంటాయి. సరస్వతి హంస ఆసనం మీద కూర్చుని ఉన్న చిత్రాలూ కనిపిస్తాయి. రెండవది శృంగేరి శారదాదేవి చిత్రం. ఆమె నాలుగు చేతులలో ఒక చేతి మీద చిలుక వాలి ఉంది.

sarasvati

ఇంతకుముందు జియస్ మిలికోయిస్ అనే సర్పదేవుడికి కొందరు మొక్కుతున్న చిత్రం గురించీ, రాక్షసుడైన ఆ దేవునికి ఏటా పందులను బలి ఇవ్వడం గురించీ (‘యెహోవా కూడా కాళియమర్దనుడే’ అనే వ్యాసంలో)చెప్పుకున్నాం. తర్వాతి కాలానికి చెందిన ఒలింపియన్ తరహా తంతులకు భిన్నంగానూ, విపరీతంగానూ కనిపించే ఇలాంటి తంతులు ఒకవిధమైన ‘శైత్యాంధకారా’(chilly gloom)న్ని సూచిస్తూ ఉంటాయని లూసియన్ అనే ఒక గ్రీకు వ్యాఖ్యాత అంటారు. జోసెఫ్ క్యాంప్ బెల్ ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారు. కంచు యుగానికి చెందిన హోమర్ కు ముందునాటి గ్రీసు, మినోవన్, సైక్లాడిక్ దీవుల నాగరికతల వాతావరణం శైత్యాంధకారాన్ని తలపించేది కాదనీ; కాకపోగా అప్పటి కళాకృతులను గమనిస్తే, సృష్టి ప్రక్రియకు అనుగుణంగా సరసంగా, సమరసంగా జీవించే వాతావరణం వాటిలో కనిపిస్తుందనీ ఆయన అంటారు.

srungeri sarada

ఆ సందర్భంలోనే ఆయన ఇంకోటి కూడా అంటారు: (గ్రీకు)ఇతిహాసకాలంలో కూడా అమ్మవారు సర్పాలు, సింహాలు. చేపలు, చెరువులు, పావురాల గూళ్ళు, తాబేళ్ళు, పీతల్లాంటి అనేక కాళ్ళ సముద్రజీవులు, మేకలు, వృషభాలు మొదలైన సమస్త పరివారంతోనూ ఉంటుంది కానీ ఆమె ఎల్లప్పుడూ భయపెట్టేలా ఉండదు.

ఇక్కడ మనకు వెంటనే  గుర్తొచ్చే పోలిక, కాళికాదేవి.

 

గ్రీకు పురాణాలలో అఫ్రోడైట్ శృంగార, ప్రేమ, కామదేవత. మన లక్ష్మీదేవిలానే ఈమె సముద్రంలోంచి పుట్టింది.  మన మన్మథుడిలానే గొప్ప గొప్ప దేవుళ్ల మనసులలో సైతం శృంగార భావనలను రెచ్చగొట్టి అల్లరి పెట్టే చిలిపి దేవుడు ఈరోస్.  కొన్ని గ్రీకు పురాణ కథల ప్రకారం ఇతడు అఫ్రోడైట్ కొడుకు. హోమర్ ముందు కాలం నుంచీ, అంటే గ్రీకు ఇతిహాస కాలానికి ముందు నుంచీ ఉన్న శృంగార/ప్రేమ/కామాలను సంకేతించే దేవతారూపాలు వీరిద్దరూ. అయితే, అప్పట్లో అఫ్రోడైట్ ఆరాధనకు ఉన్న ప్రాచుర్యం ఈరోస్ ఆరాధనకు లేదు.

ప్రస్తుతానికి వస్తే, శారదాదేవి చేతి మీద చిలుక ఉన్నట్టే, అఫ్రోడైట్ చేతిలో పావురం ఉంది! మన సరస్వతిలా హంసలతోనూ, లేదా హంసవాహనం మీదా ఉన్న అఫ్రోడైట్ చిత్రాలు కూడా కనిపిస్తాయి.

ఈ పావురం ప్రతీకే ఒక క్రైస్తవ ఉదంతంలో కూడా కనిపిస్తుంది, దేవుడైన ‘హోలీ ఘోస్ట్’ ఒక పావురం రూపంలో మేరీ దగ్గరికి వస్తాడు. అయన ప్రభావంతో మేరీ తన చెవిలోంచి దేవుడి కుమారుని కంటుంది. అతను ఒక గుహలో పుడతాడు. ఈయన రొట్టె(bread)కూ, ద్రాక్షాసవా(wine)నికీ చెందిన వాడనీ, జననమరణాల చక్రంలో తిరుగుతూ ఉంటాడనీ ఈ ఉదంతం చెబుతుంది. దీనికి సంబంధించిన ఇతర అనేక వివరాలను అలా ఉంచితే,  క్యాంప్ బెల్ ప్రకారం, పావురం కూడా సర్పంలానే హోమర్ ముందు కాలానికి చెందిన జగజ్జనని పరివారంలో భాగం.

పై కథలాంటిదే గ్రీకు పురాణాలలోనూ కనిపిస్తుంది. దాని ప్రకారం, భూదేవత డిమీటర్, దేవతల నాయకుడు జియస్ ల కూతురు పెరెస్పోన్. డిమీటర్ కూతుర్ని క్రిటు ద్వీపంలోని ఒక గుహలో ఉంచి, తన రథాన్ని లాగే రెండు సర్పాలను దానికి కాపలా ఉంచుతుంది. వినడానికి దారుణంగానే ఉంటుంది కానీ, జియస్ సర్పరూపంలో ఆ గుహలోకి వెళ్లి పెరెస్పోన్ తో సంభోగిస్తాడు. ఇలాగే మన పురాణాలలో సరస్వతిని బ్రహ్మదేవుడికి కూతురిగానూ, భార్యగానూ కూడా చెప్పడం కనిపిస్తుంది.

వీటి వెనుక ఉండగల ఇతరేతర అన్వయాలలోకి ఇప్పుడు వెళ్ళలేం కనుక, ప్రస్తుతానికి వస్తే; మరో కథ ప్రకారం, పెరెస్పోన్ ప్రశాంతంగా గుహలో కూర్చుని విశ్వవస్త్రాన్ని నేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి డిమీటర్ తన కూతురు జియస్ కంటబడేలా చేస్తుంది. జియస్ సర్పరూపంలో గుహలోకి ప్రవేశిస్తాడు. పెరెస్పోన్ డయోనిసస్ అనే కొడుకును కంటుంది. ఇతను కూడా పైన చెప్పుకున్న చావు పుట్టుకల దేవుడు. అంటే రొట్టెకు, ద్రాక్షాసవానికి చెందిన దేవుడన్నమాట.

మన అమ్మవారి పరివారంలో చిలుక, హంస మొదలైనవి భాగమైనట్టే; గ్రీకు పురాణాలలో అమ్మవారి పరివారంలో భాగమైన పావురం క్రైస్తవ కథలోకి కూడా ప్రవేశించిన వైనాన్ని పై ఉదాహరణలు చెబుతున్నాయి. అలాగే, పెరెస్పోన్, మేరీలకు గుహలో కొడుకు పుట్టడంలో కూడా పోలిక కుదిరింది. ఈ ఉదాహరణలు ఆయా ప్రాంతాల పురాణకథల పరస్పర ప్రభావాన్నే కాక వాటి నిరంతరాయతను కూడా సూచిస్తాయి.

aphrodite

ఈ కథలు సూచించే మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుని మాతృస్వామ్యంలో  అంతర్లీనంగా ఉన్న జగజ్జనని తాత్వికతలోకి వెడదాం.

ఇంతవరకు చెప్పుకున్న రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, జియస్, యెహోవా మొదలైన ఉదాహరణలలో మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ ఎలా వ్యక్తమవుతోందో; మాతృస్వామ్య దేవతా రూపాలపైనా, తాత్వికతపైనా పితృస్వామ్యం పై చేయిని చాటుకోడానికి  ఎలా ప్రయత్నించిందో చూశాం. అయినాసరే, మాతృస్వామిక అవశేషాలు వీటిలో తొంగిచూస్తూనే ఉన్నాయి. గ్రీసు విషయానికే వస్తే, ఇక్కడి మాతృస్వామిక దేవతలను పితృస్వామిక దేవుళ్ళు రూపుమాపలేదనీ, వారిని వివాహమాడారనీ క్యాంప్ బెల్ అంటారు. మన దగ్గర కూడా సరిగ్గా అదే జరిగినట్టు కృష్ణుడి ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం. అమ్మవార్ల సమూహానికి ప్రతీక అయిన బృందను పెళ్లాడడం ద్వారా, కాత్యాయనిని (గోపికా వస్త్రాపహరణం కథలో)ఆరాధించేకంటే ముందు తనను ఆరాధించమని చెప్పడం ద్వారా కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిరాకరించకుండానే ద్వితీయస్థానానికి తరలించాడనీ అనుకున్నాం.

గ్రీకు-రోమన్ కథలతో పోల్చితే, పాత నిబంధన(Old Testament)లోని కథలు మాతృస్వామిక దేవతలపై పితృస్వామిక దేవతలు మరింత నిశ్చయాత్మకమైన విజయాన్ని సాధించినట్టు చెబుతాయని క్యాంప్ బెల్ అంటారు.  గ్రీకు-రోమన్ పురాణకథలలో వెనకటి దేవతలు, దేవుళ్ళ ప్రాధాన్యం తగ్గింది కానీ వారు అదృశ్యం కాలేదు. వారే కాకుండా, మాతృస్వామికతకు చెందిన వ్యవసాయపు తంతులు, స్త్రీల తంతులు, ముఖ్యంగా డిమీటర్, ఆర్ఫిక్స్ మార్మికతలు కూడా కొనసాగాయి. అంతేకాదు, Virgin and the Mass కు చెందిన కథలూ, తంతుల రూపంలో ఇవే తంతులు క్రైస్తవంలోకి కూడా వెళ్ళాయి.

మన అనుభవం ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. మాతృస్వామిక దేవతలే కాకుండా; ఆ కాలపు వ్యవసాయ, స్త్రీ సంబంధమైన తంతులు; మార్మికతను చాటే రకరకాల తాంత్రిక పద్ధతులూ నేటికీ మన దగ్గర సజీవాలు.

ఇంకా విశేషం ఏమిటంటే, బైబిల్ పౌరాణికత మాతృస్వామిక దేవతలను రూపుమాపినట్టు కనిపించినా; మాతృస్వామ్య కాలానికి చెందిన సౌభాగ్య తంత్రాలను ఇజ్రాయెల్ పొడవునా జనం ఆదరిస్తూ, గౌరవిస్తూ వచ్చారని Samuel and Kings లోని ప్రతి అధ్యాయమూ చెబుతుందని క్యాంప్ బెల్ అంటారు. సాంప్రదాయిక బైబిల్ పండితులు మోజెస్ రాసినట్టు విశ్వసించే పెంటాట్యూక్ (Pentateuch: బైబిల్ లోని మొదటి అయిదు పుస్తకాలను పెంటాట్యూక్ అంటారు. ఇది గ్రీకు పదం. ‘పెంటా’ అంటే అయిదు అనీ, ‘ట్యూక్’ అంటే లిఖితపత్రమనీ అర్థం. ఆ అయిదు పుస్తకాలు: జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యుటెరానమి. వీటిని Laws of Moses అనీ; హిబ్రూ భాషలో ‘ధర్మశాస్త్రం’ అని అర్థమిచ్చే ‘తోరా’ అనీ పిలుస్తారు)లోకి కూడా పురాతన భూమాతకు, ఆమె సర్పభర్తకు సంబంధించిన సంకేతాలు ప్రతీకల రూపంలో నిశ్శబ్దంగా అడుగుపెట్టాయి.

ఉదాహరణకు, నిషిద్ధఫలాన్ని తిన్నప్పుడు, ‘ఎందుకు ఈ పని చేశా’వని స్త్రీని యెహోవా అడుగుతాడు. సర్పం వంచనతో నన్ను తినిపించిందని స్త్రీ చెబుతుంది. అప్పుడు సర్పంతో యెహోవా, ‘నువ్వు ఈ తప్పు చేశావు కనుక, నిన్ను శపిస్తున్నాను. ఇక నుంచి పొట్టతో నేలమీద పాకుతూ, బతికినంతకాలం దుమ్ము తింటూ బతుకు. నీకూ, ఈమెకూ మధ్య; నీ సంతానానికీ, ఈమె సంతానానికీ మధ్య శత్రుత్వాన్ని కల్పిస్తున్నాను. అతను (ఆమె సంతానం)నీ పడగ మీద కొడతాడు, నువ్వు అతని పాదాన్ని కాటేస్తావు’అంటాడు.

అలాగే, ‘నీ భర్త అయిన సర్పానికి నువ్వు అణగిమణగి ఉండుగాక’ అని స్త్రీని శపిస్తాడు. ఇది నూతనయుగం మీద పితృస్వామికపు సీలు వేస్తున్న మాట అని క్యాంప్ బెల్ అంటారు.  ఆ తర్వాత, ‘స్త్రీ ఇచ్చిన ఫలాన్ని తిన్నావు కనుక, ఏ మట్టిలోంచి పుట్టావో ఆ మట్టిలో కలసిపోయే దాకా నీ ఆహారాన్ని శ్రమించి చెమటోడ్చి సంపాదించుకో’ అని పురుషునితో యెహోవా అంటాడు.

ఈ స్త్రీ పురుషులు పుట్టిన ఆ మట్టి మరేదో కాదు; భూమాతే! కాకపోతే యెహోవా మాటలు ఈ భూదేవతకు అంతవరకు ఉన్న పురుషభావారోప(anthropomorphic) లక్షణాలను తొలగించివేస్తున్నాయి. అంటే, భూదేవతను మామూలు మట్టిగా మార్చివేస్తున్నాయి. అయితే, తన నూతన భర్త యెహోవా కూడా తన ఊపిరిని ఊది మట్టి నుంచే సంతానాన్ని సృష్టించాడు కనుక భూమాత , అంటే స్త్రీ, సంతాన సంబంధమైన తన ప్రాథమిక లక్షణాన్నిఅలాగే నిలుపుకుంది. ఒకవైపు యెహోవా రూపంలో పురుషుడు సంతాన ప్రక్రియలోకి వేలు పెట్టి అది తన ద్వారానే జరుగుతున్నట్టు భ్రమింపచేయడానికి కృత్రిమంగా ఎంత ప్రయత్నించినప్పటికీ, మరోవైపు సంతానం కనడంలో స్త్రీకి గల సహజసిద్ధమైన పాత్రను ఈ కథనం మరుగుపుచ్చలేకపోయింది. మట్టినుంచి, అంటే భూమాతనుంచి పుట్టిన సంతానం చనిపోయిన తర్వాత కూడా మట్టిలోనే చేరుతున్నారు తప్ప తండ్రిని చేరడంలేదు.

పైన యెహోవా సృష్టికర్త అయినట్టే, మనదగ్గర కూడా మాతృస్వామిక పురాణకథలను పితృస్వామికంగా మార్చిన ఫలితంగా బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. అయితే, మాతృస్వామిక పురాణకథలు కూడా మన దగ్గర ప్రాచుర్యంలో ఉన్నాయి కనుక, వాటిలో అమ్మవారే సృష్టికి మూలం అవుతుంది. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఆమె సృష్టే అవుతాడు.

పై విధంగా చూసినప్పుడు, పాత విశ్వాసప్రపంచానికి చెందిన టైటాన్ల లానే, పితృస్వామ్యపు సీలుతో పుట్టిన కొత్త విశ్వాసప్రపంచానికి చెందిన ఆదం, ఈవ్ లు కూడా భూమాత సంతానమే. మొదట వీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు. ఆ తర్వాత రెండయ్యారు. యెహోవా శాపానికి దీటుగా స్పందించడంలో ఆదంలో వెనకటి టైటాన్ స్వభావమూ వ్యక్తమవుతుంది. ‘సమస్త ప్రాణులకూ తల్లి’ అనే అర్థంలోనే తన భార్యను అతడు ఈవ్ అని పిలుస్తాడు. ఈవిధంగా భూమాత కోల్పోయిన పురుషభావారోప లక్షణం ఈవ్ కు సంక్రమిస్తోంది. అలా చూసినప్పుడు, ఆదం ఆమెకు భర్తే కాక, కొడుకు కూడా అవుతాడు. అంతకుముందు యెహోవా మొదట మట్టిలోంచి పురుషుణ్ణి సృష్టిస్తాడు. అది స్త్రీకి కంటె పురుషునికి ప్రాధాన్యం ఇవ్వడానికి సూచన. ఆ తర్వాత ఆ పురుషుడి పక్కటెముకనుంచి స్త్రీని సృష్టిస్తాడు. స్త్రీ సంబంధం లేకుండా పురుషుడే సంతోనోత్పత్తి చేయగలడని చెప్పడం అది.

మహాభారతంలో ద్రోణుని ఓడించే కొడుకు కోసం ద్రుపదుడు యజ్ఞం చేసిన ఘట్టంలో  స్త్రీ సంబంధమైన శోణితమే కాక, పురుష సంబంధమైన శుక్రం కూడా లేకుండా మంత్రశక్తితోనే సంతానం కలిగిస్తామని యాజుడు అనడం (సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగుస్థానమే-వ్యాసం) ఇలాంటిదే. అయితే, మాతృస్వామ్యంలోకి పితృస్వామిక ఆధిక్యతను చొప్పించడానికి ఇంత పెద్ద కసరత్తు చేసినప్పటికీ మాతృస్వామిక లక్షణాలు పురుషుడి రాజకీయాన్ని, ఆధిపత్యాన్ని అధిగమించి పురాణాలలో తమ ఉనికిని కాపాడుకుంటూ ఉండడం ఇక్కడ గమనించవలసిన విశేషం.

ఇంకా విశేషం ఏమిటంటే, కంచుయుగపు తొలినాటి సీళ్ళ ప్రకారం యెహోవా కూడా సర్పశక్తికి ప్రాతినిధ్యం వహించేవాడే. ఆవిధంగా భూమాతకు సర్పభర్త అవుతాడు. ఉదాహరణకు, మోజెస్ (ఈజిప్టు)ఫారోను మాంత్రిక సర్పదండంతో బెదిరించినప్పుడు, ‘నీ చేతిలో ఉన్నది ఏమి’టని మోజెస్ ను యెహోవా అడుగుతాడు. ‘ఇదొక దండ’మని మోజెస్ జవాబు చెబుతాడు. ‘దానిని నేల మీద ఉంచు’ అని యెహోవా అంటాడు. మోజెస్ దానిని నేల మీద ఉంచగానే అది సర్పంగా మారిపోతుంది. దానిని చూసి మోజెస్ పారిపోతాడు. అప్పుడు యెహోవా ‘దాని తోకపుచ్చుకొని పైకి తీయ’మని చెబుతాడు. మోజెస్ అలా చేయగానే అది తిరిగి దండంగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ మాంత్రిక సర్పదండమే ఎడారిలో ఒక రాతినుంచి నీటిని సృష్టిస్తుంది. ఎడారి జనం యెహోవాకు వ్యతిరేకంగా గుసగుస లాడుకుంటున్నప్పుడు యెహోవా వారి మధ్యకు భయంకరమైన పాములను పంపిస్తాడు.

భయంగొలిపే ఒక పాము బొమ్మను తయారుచేయించి దానిని ఒక స్తంభం మీద నిలపమనీ, పాముకాటుకు గురైనవారు దానిని చూసినప్పుడు వారికి ప్రాణభయం ఉండదనీ మోజెస్ కు యెహోవా చెబుతాడు. మోజెస్ అలాగే ఒక కంచు సర్పాన్ని చేయించి దానిని ఒక స్తంభంపై నిలుపుతాడు. రాజు హెజెకియ్య కాలం వరకూ(క్రీ.పూ.719-691) జెరూసలెంలో ఉన్న ఆ కంచుసర్పాన్ని అందరూ భక్తితో సందర్శించుకునేవారు. దాని ముందు ధూపం వేసేవారు. దానికి ‘నెహుస్తాన్’ అని పేరు. అయితే, హెజెకియ్య ఆ కంచుసర్పాన్ని ధ్వంసం చేయించాడు.

క్యాంప్ బెల్ ఇంకో సంగతిని కూడా ప్రస్తావిస్తారు. యెహోవాను ప్రధానంగా ఆరాధించే పూజారితెగ పేరు ‘లెవీ’. యెహోవా జయించిన సర్పం పేరు ‘లెవియథాన్’. అలాగే సర్పపాదాలతో ఉన్న యెహోవా చిత్రాలు కూడా ఉన్నాయని ఆయన అంటారు. పై ఉదాహరణలన్నీ మాతృస్వామికరూపమైన సర్పంతో పితృస్వామిక యెహోవాకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి.

అదలా ఉండగా, పాముకాటుకు గురైనవారు జెరూసలెంలోని స్తంభం మీద ఉన్న కంచుసర్పాన్ని దర్శించుకునేవారు అన్నప్పుడు; కంచిలో వరదరాజస్వామి ఆలయంలోని బంగారు, వెండి బల్లులు; వాటిని తాకితే బల్లిపాటు వల్ల కలిగే అనర్థాలు ఉండవన్న విశ్వాసం గుర్తుకొచ్చి ఉండాలి.

మిగతా తర్వాత….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్త్రీని ‘జయించా’కే సీత జాడ తెలిసింది!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రామాయణంలో సీతాన్వేషణ ఒక ముఖ్యమైన ఘట్టం. వానరరాజు సుగ్రీవుడు సీత జాడ కనిపెట్టడానికి వానరబృందాలను అన్ని దిక్కులకూ పంపుతాడు. దక్షిణ దిశకు పంపిన బృందంలో హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైనవారు ఉన్నారు.  సుగ్రీవుడు చండశాసనుడు. అందుకే ‘సుగ్రీవాజ్ఞ’ అనే నానుడి వచ్చింది. వానరబృందాలను పంపుతూ అతడు గడువు విధిస్తాడు. గడువులోపల తిరిగి రాకపోతే మరణదండన తప్పదు.

అయితే, హనుమంతుడి బృందం స్వయంప్రభ బిలంలో ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోయింది, దాంతో ఆ బృందంలో ఉన్నవారందరికీ ప్రాణభయం పట్టుకుంది. అక్కడే ఉండిపోయి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టడానికి యువరాజు అంగదుడు నిర్ణయించుకుంటాడు. హనుమంతుడు ఎంత నచ్చచెప్పినా నిర్ణయం మార్చుకోడు. అంతలో జటాయువు అన్న అయిన సంపాతి కనిపించి లంకను పాలించే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి చెప్పి, లంక ఎక్కడుందో చెబుతాడు. అప్పుడు సముద్రాన్ని దాటి వందయోజనాల దూరంలో ఉన్న లంకకు వెళ్ళి, సీత జాడ కనిపెట్టే బాధ్యతను హనుమంతుడు స్వీకరిస్తాడు.  ఆ ఘట్టాన్ని ‘సుందరకాండ’ పేరుతో వాల్మీకి ప్రత్యేకంగా చిత్రించాడు.

ఈ కాండలో హనుమంతుడే నాయకుడు. వాల్మీకి ప్రకారం, అతను బుద్ధికుశలత కలిగిన వారందరిలోనూ ఉన్నతుడు. మంచి మాట నేర్పు ఉన్నవాడు. వానరవీరులలో ముఖ్యుడు. బ్రహ్మచారి, అంటే స్త్రీ సంబంధం లేనివాడు. గొప్ప కార్యసాధకుడు. ఇవన్నీ ‘పురుష’ప్రయత్నాన్ని, ‘వీర’త్వాన్ని నొక్కిచెప్పే గుణాలు. సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళి సీత ఉనికిని కనిపెట్టడం అనే మహత్కార్యం సాధించాలంటే, హనుమంతుడిలో ఈ గుణాలు అన్నీ ఉండాలి.

అయితే, అతనిలో ఈ గుణాలు ఉన్నట్టు నిరూపణ ఎలా? దానికి అతి ముఖ్యమైన గీటురాయి, అతను ‘స్త్రీ సూత్రా’(female principle)న్ని అధిగమించగలగడం! ఈ ఘట్టంలో కథకుడు ఒకరిని కాదు, ఏకంగా ముగ్గురు స్త్రీలను ప్రవేశపెట్టి హనుమంతుడు తన బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ వారిని ఎలా జయించాడో చెప్పాడు. దుర్భేద్యమైన రావణాసురుని నగరంలోకి అడుగుపెట్టి సీత జాడ కనిపెట్టాలంటే, ఒక స్త్రీని జయిస్తే సరిపోదు, ముగ్గురు స్త్రీలను జయించినట్టు చెప్పాలి.

ఆ ముగ్గురిలో మొదటి స్త్రీ, ‘నాగమాత’ అయిన సురస; రెండవ స్త్రీ, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి; మూడవ స్త్రీ లంకానగరానికి అధిదేవత అయిన లంకిణి.

హనుమంతుడు సముద్రం మీద పయనిస్తుండగా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అతని బలపరాక్రమాలను, బుద్ధికుశలతను తెలుసుకోవాలని ముచ్చట పడ్డారు. “నువ్వు భయంకరమైన కోరలతో, పచ్చని కళ్ళతో, ఆకాశమంత నోటితో, పర్వతంలాంటి రాక్షసరూపం ధరించి క్షణకాలం అతనికి విఘ్నం కలిగించు” అని నాగమాత అయిన సురసను కోరారు. సురస వారు కోరిన రూపంలో సముద్రమధ్యంలోంచి  వెళ్ళి హనుమంతుని అడ్డగించింది. నిన్ను తినేస్తానంది. “నేను సీతను చూసొచ్చి రామునికి ఆమె కుశలం చెప్పిన తర్వాత నీలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు వెళ్ళనివ్వు’’ అని హనుమంతుడు అన్నాడు. సురస అంగీకరించకుండా తన నోటి వైశాల్యాన్ని పెంచుకుంటూ పోయింది.  హనుమంతుడు అంతకంటే ఎక్కువ ప్రమాణానికి తన దేహాన్ని పెంచుకుంటూ వెళ్ళి, హఠాత్తుగా బొటనవేలంత రూపం ధరించి సురస నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటికి వచ్చేశాడు. ఈవిధంగా ఉపాయంతో, స్త్రీ రూపంలో ఎదురైన మొదటి అడ్డంకిని దాటాడు.

కొంతదూరం వెళ్ళిన తర్వాత, సింహిక అనే రాక్షసి అతన్ని చూసింది.  ఇంతకాలానికి తినడానికి మహాజంతువు ఒకటి దొరికిందనుకుంది. హనుమంతుని నీడను పట్టుకుని కిందికి లాగడం ప్రారంభించింది. ఒక్కసారిగా తన వేగమూ, బలమూ సన్నగిల్లడంతో హనుమంతుడు ఆశ్చర్యంగా అన్నివైపులా చూశాడు. మహాశక్తిమంతమైన సింహిక కనిపించింది. తనను మింగడానికి తెరచిన సింహిక నోట్లోకి ప్రవేశించి వాడిగోళ్లతో ఆయువు పట్లను చీల్చి చెండాడాడు. సింహిక ఆర్తనాదం చేస్తూ కుప్పకూలింది. “ఈ మహాప్రాణిని చంపి నువ్వు అద్భుతకార్యం సాధించా”వంటూ దేవతలు, గంధర్వులు మొదలైనవాళ్లు హనుమంతుని అభినందించారు.

చివరికి త్రికూటపర్వతం మీద ఉన్న లంకానగరాన్ని చూశాడు. పైనుంచి అతనికి అది ‘నాగులతో నిండిన’ పాతాళ నగరం భోగవతిలా కనిపించింది. నగరంలోకి ప్రవేశించబోతుండగా భయంకరరూపం కలిగిన లంక అధిదేవత లంకిణి అతన్ని అడ్డగించింది. నన్ను జయించి కానీ నువ్వు లోపలికి వెళ్లలేవంటూ అరచేతితో అతన్ని బలంగా కొట్టింది. హనుమంతుడు ఆమెను పిడికిలి బిగించి కొట్టేసరికి ఆర్తనాదం చేస్తూ నేలకొరిగి, శరణు వేడి దారి ఇచ్చింది.

ఈవిధంగా అతను లంకలోకి ప్రవేశించడం, సీతను చూడడం, పలువురు రాక్షసులను చంపడం, రావణుని కలసుకుని రాముడు యుద్ధసన్నద్ధుడై వస్తున్నట్టు చెప్పడం, లంకా దహనం చేయడం తదుపరి పరిణామాలు.

హనుమంతుడు ‘నాగమాత’ సురసను జయించడమే చూడండి…దానర్థం, మాతృస్వామిక ఆరాధన రూపమైన సర్పాన్ని జయించడమే! ఈ విధంగా అతనికి భాగవత కృష్ణుడితోనూ, బైబిల్ యెహోవాతొనూ సామ్యం కుదురుతోంది. నాగులతో నిండిన పాతాళంలా లంక అతనికి కనిపించిందనడంలో కూడా నాగుల ప్రస్తావన ఉంది. అంతేకాదు, వాటితోపాటు లంకలోని రాక్షసులను కూడా ఈ సందర్భంలో కథకుడు ప్రస్తావించాడు.  లంకా నగరం నరులకు, వానరులకు కూడా భిన్నమైన జీవనవిధానమూ, విశ్వాసాలూ ఉన్న ప్రదేశమని ఈ రెండు ప్రస్తావనలూ సూచిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాక్షసత్వాన్ని ఆపాదనగా పరిగణించి, నాగుల ప్రస్తావనలను గమనంలో ఉంచుకుంటే లంకానగరం మాతృస్వామిక అవశేషాలు కలిగిన ప్రాంతం అనుకోవాలా?! ప్రస్తుతానికి దీనిని సందేహార్థకంగానే వదిలేద్దాం.

అలాగే, హనుమంతుడికి, ఓడిసస్ కు కూడా ఒక పోలిక కుదురుతోంది. హనుమంతుడు సముద్రం మీద లంఘిస్తే, ఓడిసస్ సముద్రయానం చేశాడు. ఇద్దరూ వీరులే. హనుమంతుడు తన ప్రయాణంలో ఒక ప్రతికూల స్త్రీ( సింహిక), ఇద్దరు అనుకూల (సురస, లంకిణి) స్త్రీల రూపంలో ‘స్త్రీ సూత్రా’న్ని ఎదుర్కొన్నట్టే; ఓడిసస్ కూడా నీళ్ళు పట్టుకునే ఒక అందమైన యువతి, సిర్సే, కలిప్సే అనే ఇద్దరు అప్సరసలు—మొత్తం ముగ్గురు స్త్రీల రూపంలో స్త్రీ సూత్రాన్ని ఎదుర్కొంటాడు. అందమైన యువతి పట్ల సమ్మోహితు డైనందుకు పదకొండు ఓడలను, పెద్ద సంఖ్యలో సహచరులను కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంటాడు. తర్వాత సిర్సే అనే ప్రతికూలశక్తిని దైవ సహాయంతో లొంగదీసుకుని, ఆ తర్వాత కలిప్సే అనే అనుకూలశక్తితో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. వీటికంటె ముందు పోలిఫెమస్ అనే ఒంటికన్ను రాక్షసుని ఉపాయంతో జయిస్తాడు. ఈ విధంగా హనుమంతుడి లానే ఓడిసస్ కూడా స్త్రీ సూత్రాన్ని అధిగమించడంలో బుద్ధిబలాన్ని, భుజబలాన్ని, ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాడు. ఇద్దరికీ దేవతల సహాయమో, ఆశీస్సులో లభిస్తాయి.

ఆ మాటకొస్తే,  హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి ముందే వానరులందరికీ స్వయంప్రభ బిలం రూపంలో ‘స్త్రీ సూత్రం’ ఎదురైందని అనుకోవచ్చు. అద్భుతత్వమూ, ఆకర్షణా ఉట్టిపడే అలాంటి బిలం ఆ పరిసరాలలో ఉంటుందని వారు ఊహించలేదు. అక్కడే వారు నెలరోజులు ఉండిపోయారని కథకుడు చెబుతున్నాడు. అంటే దాని ఆకర్షణకు లొంగి వారు తమ మీద ఉన్న కార్యభారాన్ని విస్మరించారన్నమాట. అలా వారు అక్కడ ఉండగానే సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోవడంతో వారికి మృత్యుభయం పట్టుకుంది. కలిప్సే మోహజాలంలో చిక్కుకుని ఎనిమిదేళ్లు ఆమెతోనే ఉండిపోయి యాత్రాలక్ష్యాన్ని విస్మరించిన ఓడిసస్ ను ఇది గుర్తుచేస్తుంది. స్త్రీ సూత్రం కార్యసాధనకు అడ్డంకి అని ఇందులోని ధ్వని.

స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే  హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు.  స్త్రీవధను ‘వీరత్వా’నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, వీటిమధ్య ఉన్న పోలికలు కేవలం యాదృచ్చికాలని కాకుండా, వీటి వెనుక ఒక కచ్చితమైన సరళి ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక పరిణామాన్ని ఇవి చెబుతున్నాయి. అది:  మాతృస్వామ్యంపై పితృస్వామ్యస్థాపన! అంటే, స్త్రీ ఆధిపత్యం నుంచి పురుషుడు బయటపడి ‘క్రియాశీలి’ కావడం!

hanuma

పురుషుడు స్త్రీపై ఆధిపత్యం సాధించిన తర్వాత, స్త్రీవధ వీరత్వానికి నిరూపణ కావలసిన అవసరం ఇక లేదు. అందుకు భిన్నంగా అది భీరత్వాన్ని సూచిస్తుంది.  స్త్రీని చంపడం మహాపాపంగా, హింసించడం అనాగరికంగానే కాక, అసలు స్త్రీతో యుద్ధం చేయడమే పురుషుడికి నామోషిగా పరిణమిస్తుంది. భీష్ముడి ఉదాహరణ అదే చెబుతుంది. శిఖండిని చూడగానే అయన అస్త్ర్రసన్యాసం చేస్తాడు.

తాటకను చంపబోయే ముందు రాముడు స్త్రీవధ తగునా అన్న ద్వైధీభావానికి లోనవుతాడు. అయినా చంపుతాడు. అంటే కథకుడు స్త్రీవధ తగదన్న సమకాలీన స్పృహను ప్రకటిస్తూనే, అది  ‘వీరోచితం’ అన్న ఒకనాటి సంగతినీ చెబుతున్నాడు. అలాగే, సింహికను చంపిన హనుమంతుడు, లంకిణి విషయానికి వచ్చేసరికి స్త్రీవధ తగదనుకుంటాడు.

అయితే, స్త్రీ ఏ ఉగ్రవాదో అయి ఆయుధంతో దాడి చేసినప్పుడో; ఆత్మరక్షణ అనివార్యమైనప్పుడో కూడా స్త్రీవధ కూడదా అన్న సందేహం ఇక్కడ కలుగుతుంది. అదే సమయంలో, వివిధ ప్రాంతాలకు చెందిన పురాణ, ఇతిహాస కథల మధ్య ఉన్న పోలికల వెనుక ఒక సరళి ఉన్నప్పుడు, అవి సాముదాయికంగా ఒకే విషయాన్ని చెబుతున్నప్పుడు; వాటి వస్తువులో ఒక ఐక్యత ఉన్నప్పుడు స్త్రీ వధను చెదురుమదురు ఘటనగా చూడాలా, లేక చరిత్రకోణంనుంచీ, వ్యవస్థా కోణంనుంచీ అన్వయించుకోవాలా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నా పరిశీలన రెండోదానికే మొగ్గు చూపుతోంది.

అదలా ఉంచితే, లంకిణిని లంకానగర అధిదేవత అనడం, దేవత కేంద్రంగా నిర్మించుకున్న ఒకనాటి నగరరాజ్యాలను సూచిస్తూ ఉండచ్చు.

***

మన పురాణ కథలతో ఇతర పురాణకథలకు ఉన్న మరికొన్ని ఆసక్తికరమైన పోలికలను చూద్దాం:

భూదేవత అయిన గియా కడగొట్టు కొడుకు టైఫాన్ పై గ్రీకు దేవుడు జియస్ విజయం సాధించి ఒలింపస్ పర్వతంపై దేవతల ఆధిపత్యాన్ని నెలకొల్పాడని చెప్పుకున్నాం. సగం మనిషి రూపంలో, సగం సర్పరూపంలో ఉండే టైఫాన్ తల నక్షత్రాలను తాకేలా ఉంటుందనీ, అతని చేతులు సూర్యోదయ ప్రదేశం నుంచి సూర్యాస్తమయ ప్రదేశం వరకు విస్తరించి ఉంటాయనీ కూడా చెప్పుకున్నాం. అతని భుజాల నుంచి వంద మహాసర్పాలు పడగవిప్పి వేలాడుతూ ఉంటాయి. అవి భయంకరంగా నాలుకలు చాపి ఉంటాయి. వాటి అనేక నేత్రాలు మంటలు చిమ్ముతూ ఉంటాయి. వాటి నుంచి వెలువడే  ఎడ్ల రంకెలతో, సింహగర్జనలతో, కుక్కల అరుపులతో, పాముల బుసబుసలతో పర్వతాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. టైఫాన్ ను జియస్ ఎదుర్కొని అంతమొందించకపోతే అతను సృష్టి అంతటికీ అధిపతి అయ్యేవాడట.

జియస్ అతని మీదికి యుద్ధానికి వెడుతుండగా భూమి బాధతో మూలిగింది. అతని చేతిలోని వజ్రాయుధం నుంచి వ్యాపించే జ్వాలలు; టైఫాన్ కళ్లనుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనుంచి జాలువారే మంటలు సముద్రాన్ని మండించసాగాయి. సముద్రం సలసల మరగడం ప్రారంభించింది. ఉవ్వెత్తున లేచిన అలలు తీరంలోని కొండలను, గుట్టలను మహోధృతంగా ఢీకొనసాగాయి. భూకంపాలు పుట్టాయి. మృత్యుదేవుడైన హేడ్స్ గడగడా వణకిపోయాడు.

ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే, టైఫాన్ ను ఎదుర్కోవడంలో కొద్దిసేపు ధైర్యం సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడట! కాసేపటికి బలాన్ని కూడదీసుకుని వజ్రాయుధాన్ని విసిరి ఆ మహాసర్పాల పడగలను దగ్ధం చేశాడు. టైఫాన్ కుప్పకూలిపోయాడు. అతని బరువుకి తల్లి అయిన భూదేవి గిలగిలలాడిపోయింది.

టైఫాన్ తో యుద్ధంలో కాసేపు ధైర్య సన్నగిల్లి జియస్ దిక్కుతోచని స్థితిలో పడిపోవడమే ఇక్కడ ప్రదానంగా గమనించవలసిన అంశం. మన పురాణఇతిహాస కథలలోని ఇలాంటి ఉదాహరణలు రెండు ఇప్పటికిప్పుడు నాకు  గుర్తుకొస్తున్నాయి. మొదటిది, రామరావణయుద్ధం; రెండవది, విష్ణువు-మధుకైటభుల యుద్ధం.

రాముడు రావణుని తలను ఛేదించగానే దాని స్థానంలో ఇంకొక తల పుట్టుకురాసాగింది. ఇలా కొంతసేపు గడిచింది. రాముడికి ఏం చేయాలో తోచలేదు. అతని నిస్సహాయతను గమనించిన రథసారథి మాతలి, “నువ్వు సాధారణమానవునిలా వ్యవహరిస్తున్నావు. బ్రహ్మాస్త్రం ప్రయోగించు” అని సలహా ఇచ్చాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అందుకుని రావణుని వక్షస్థలానికి గురిపెట్టి ప్రయోగించాడు. దాంతో రావణుడు నేలకొరిగాడు.

దేవీ భాగవతం ప్రకారం… విష్ణువు మధుకైటభులనే రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. వారిని చంపడం అసాధ్యమని ఒకదశలో ఆయనకు అనిపించింది. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు దేవిని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఎట్టకేలకు మధుకైటభులను చంపాడు.

ఇలా రాక్షసునితో జరుగుతున్న యుద్ధంలో జియస్, రాముడు, విష్ణువు ఒక దశలో నిస్సహాయస్థితిలోకి జారిపోవడంలో ఉన్న ఒక్క పోలికను మాత్రమే విశేషంగా చూపడం ఇక్కడ ఉద్దేశం కాదు. అంతకంటే ముఖ్యంగా దీని వెనుక ఒక ఉమ్మడి అంతస్సూత్రం లేదా తాత్విక సూక్ష్మం ఉంది. అది: సర్ప, రాక్షసశక్తుల అజేయతకు సంబంధించినది.

మన పురాణ, ఇతిహాస కథలలోని రాక్షసుల గురించే చూడండి…హిరణ్యకశిపుడు, రావణుడు, భస్మాసురుడు మొదలైన రాక్షసులందరూ తపస్సు చేసి తమకు అజేయ బలాన్ని ప్రసాదించమనీ, ఏవిదంగానూ మరణం లేకుండా వరమివ్వమనీ  సాధారణంగా బ్రహ్మదేవునో, ఒక్కోసారి శివునో ప్రార్థిస్తారు. మరణం అనివార్యమని బ్రహ్మ అంటూనే చాలా అరుదైన, అసాధారణమైన పద్ధతిలో వారికి మరణం సంభవించే వెసులుబాటు కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు తనకు దేవతల వల్లనే కాక; భూమిమీద, నీటిమీద, నరుల వల్ల, జంతువుల వల్ల కూడా మరణం రాకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు విష్ణువు నరసింహావతారం ఎత్తి అతణ్ణి తన తొడల మీద ఉంచి గోళ్ళతో గుండెను చీల్చి చంపుతాడు. అలాగే, రావణుడు ఎవరెవరి వల్లనో తనకు మరణం రాకూడదని అడుగుతాడు కాని, నరుని  విస్మరిస్తాడు. దాంతో విష్ణువు నరుడైన రామునిగా అవతారమెత్తి అతణ్ణి చంపుతాడు.

అలాగే, మధ్య మధ్య పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరించే సర్పం కూడా అజేయశక్తికి ప్రతీక. అంతేకాదు, జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం కూడా, ఈ చావులేని సర్పమూ, రాక్షసులూ మొదట్లో విశ్వవ్యవస్థ (cosmic order)కు, కాలానికి సంబంధించిన అంతుబట్టని నిగూఢత(dark mystery of time)కు ప్రతీకలు. ఈ శక్తులతో వీరుడు లేదా నరుడు తలపడ్డాడు. ఈ నరవీరుని రాకతో పాత విశ్వాసవ్యవస్థ , నాగరికత పతనమయ్యాయి. మినోవన్ క్రిటుసామ్రాజ్యం, భారతదేశంలో హరప్పా, మొహంజదారో నాగరికత విచ్చిన్నమయ్యాయి.

అయితే, పాతవిశ్వాస ప్రపంచం నుంచి కొత్త విశ్వాసప్రపంచంలోకి రావడంలో భారతదేశానికి, పశ్చిమదేశాలకీ మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉందని క్యాంప్ బెల్ అంటారు. దాని గురించి, ఇతర మరికొన్ని అంశాల గురించి తర్వాత….

*

యెహోవా కూడా ‘కాళియ’ మర్దనుడే!

 

మొదటి దశలో విస్తారంగా దొరికిన నగ్నస్త్రీమూర్తులు, మూడవ దశకు వచ్చేసరికి అదృశ్యమయ్యాయనీ; మూడవ దశలో పురుషాధిక్యాన్ని చాటే పశుపాలన, యుద్ధాలు అడుగుపెట్టడమే అందుకు కారణమనీ — మధ్యయూరప్ నేపథ్యం నుంచి చెప్పుకున్నాం.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology)ను ఉటంకించుకుంటూ దానినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే:

కంచు యుగం(క్రీ.పూ. 3300-1200) చివరిలో, ఇనప యుగం(క్రీ.పూ. 1200-500) ప్రారంభంలో ఒక చారిత్రక ఘటన జరిగింది. పశువులను మేపుకుంటూ సంచార జీవితం గడిపే ఆర్యులు ఉత్తరం నుంచీ; గొర్రెలను, మేకలను కాచుకునే సెమెటిక్ జనాలు దక్షిణం నుంచీ పురాతన ప్రపంచంలోకి హింసాత్మకంగా అడుగుపెట్టారు. అక్కడ అప్పటికి పాత ఆరాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి.  అక్కడి జీవనవిధానం తమ జీవనవిధానానికి పూర్తి భిన్నంగా కనిపించింది.  ప్రకృతిలో కలసిపోయి చెట్లు చేమల మధ్య చాలా సహజంగా, సామరస్యంగా, భౌతిక అవసరాలు తీర్చుకుంటూ సాగే జీవనవిధానం పాతప్రపంచానిది. అందులో ‘వీరోచిత’మైనది ఏదీలేదు.

కానీ ఆర్యులూ, సెమెటిక్ జనమూ అలాంటివారు కాదు. సింహంలా మంచి గుండె దిటవు ఉన్నవారు. ఆయుధోపజీవులు, యుద్ధప్రియులు. కష్టించి ఆహారాన్ని సంపాదించుకోవడం మీద వారికి చులకనభావం. ఎక్కడ సంపదా, సుఖమూ కనిపించినా మీదపడి దోచుకోవడమే వారికి ఇష్టం. కనుక పాత ప్రపంచ జనాల జీవనవిధానం వారికి రోత పుట్టించింది. అలా ఉభయుల జీవనవిధానాలు, తాత్వికతల మధ్య ఘర్షణ ప్రారంభమైంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవల్సింది ఏమిటంటే, ఈ పరిణామం ఏ ఒక్క చోటో కాక; యూరప్, సమీపప్రాచ్యం, పశ్చిమాసియా, భారత్ తో సహా పలు చోట్ల జరిగింది. ఆర్యులకు సంబంధించి కోశాంబీ(AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY)ని ఉదహరించుకుంటే:

చరిత్రపరంగా ఆర్యులు ఒక గొప్ప ఫలితాన్ని సాధించారు. అంతవరకూ అనేక ఆదిమ, సాంప్రదాయిక, వ్యవసాయ సమాజాలు వేటికవి విడివిడిగా తమ పురాతన పరికరాలతో, విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ ఉండేవి. ఆర్యులు ఆ సమాజాల మధ్య ఉన్న అడ్డుగోడలను బద్దలు కొట్టారు. ఈ సమాజాలలో  సాంప్రదాయిక ధోరణులు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వాటి కారణంగా అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఉదాహరణకు మృతసముద్రం సమీపంలోని ఘాసూలియన్లూ, విసిరేసినట్టు ఉండే అలాంటి మరికొన్ని చిన్న చిన్న సమూహాలూ సంక్లిష్టమైన అలంకరణలకు ప్రసిద్ధులు. ఇక బ్రిటన్, ఐబేరియా, దక్షిణభారతాల జనం ఇంకా పెద్ద స్థాయిలో భారీ శిలా నిర్మాణాలు సాగించేవారు, వీరంతా తమ వద్ద ఉన్న కొద్దిపాటి మిగులునూ సమాజ పురోగతికి ఏమాత్రం తోడ్పడని పితృకర్మలకు వాడేశారు. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రమైన దీవి. వర్తకం ద్వారా గడించిన సంపదను అంతటినీ అది మతపరమైన తంతులకు ఖర్చు పెట్టేసింది. చివరికి ఆ దీవిలో ఎక్కడబడితే అక్కడ అలంకృత అస్థి కలశాలు మాత్రమే దొరికాయి. మెసపొటేమియా, సింధు లోయలు కూడా ఈ ప్రక్రియను మరింత ఎత్తులకు తీసుకువెళ్లి చివరికి ఎదుగూబొదుగూ లేని స్థితికి చేరుకున్నాయి.

మరింత అభివృద్ధి చెందిన ఆహారోత్పాదక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ సింధు లోయలోని నగర నిర్మాతలు వాటిని ఎలా ఉపయోగించుకోలేకపోయారో ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈజిప్టు తన మిగులును అంతటినీ, వాచీలు తయారు చేసేవారు కనబరిచేటంత సునిశితత్వంతో బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి వెచ్చించింది. పితృకర్మలు, పూజారి వ్యవస్థ క్రమంగా ఆ దేశాన్ని తినేశాయి. ఈ దశలో, చెల్లా చెదురుగా ఉన్న అనేక ఆదిమ సమూహాలను, వారి విశ్వాసాలను ఆర్యులు అణగదొక్కి వాటి అవశేషాలపై ఒక నూతన సమాజం ఆవిర్భవించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించారు. ఇది వారు ఉద్దేశపూర్వకంగానో, ఈ సమాజాల శ్రేయస్సును కోరో చేసింది కాదు. తక్షణ లాభం కొసం, తమ పద్ధతిలో క్రూరమైన దాడులు చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, దోపిడీలు సాగిస్తూ పోయారు.

ఒక సమూహాన్ని, పూర్తిగా భిన్నమైన వేరొక సమూహం లోబరచుకుని వారి ప్రదేశాలను ఆక్రమించుకున్నప్పుడు అక్కడి జీవన పద్ధతులు, సంస్కృతి, మత విశ్వాసాలు, ఆరాధనారూపాలు, తంతులు ఉన్నపళంగా అదృశ్యమైపోవు. ఉభయులు అనేక అంశాలను ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పర విలీనం జరుగుతుంటాయి. ఓడిపోయిన గుంపు కంటె గెలిచిన గుంపు నాగరికతలో, సంస్కృతిలో వెనకబడినదైనప్పుడు, ఈ ఆదానప్రదానాలలో  ఓడిపోయినవారిదే తరచు పై చేయి అవుతుంది. ఆర్యుల విషయంలో అదే జరిగింది. వారు తాము లోబరచుకున్న జనాల నుంచే ఎన్నో నేర్చుకున్నారు. మనదేశంలోని సింధు ప్రజలతో ఆర్యుల అనుభవమూ అదే.

Zeus of Meilichois

గ్రీసులో పిరయూస్(Piraeus) అనే చోట దొరికిన ఒక మట్టి పిడక (అతి పురాతన కాలంలో బంకమట్టితో చేసిన పిడకల మీద తుంగకాడతో రాసేవారు. దీనిని కీల లిపి అనేవారు. ఈ పిడకలపై చిత్రాలు కూడా గీసేవారు) మీద ఒక చిత్రం ఉంది. అందులో ఒక సర్పదేవుడికి కొందరు మొక్కుతూ ఉంటారు. ఈ సర్పదేవుడి పేరు ‘జియస్ మిలికోయిస్’. జియస్ నిజానికి విజేతలైన ఆర్యుల దేవుడు. సర్పం, ఓడిపోయిన పాత ప్రపంచానికి చెందిన ఆరాధనారూపం. సర్పాకారంలో ఉన్నది మిలికోయిస్ అనే ఒక రాక్షసుడు. అతడు భూమాతకు కొడుకూ, భర్తా కూడా. ఈ స్థానిక సర్పరూప రాక్షసుడు ‘జియస్ మిలికోయిస్’ ఎలా అయ్యాడంటే, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు స్థానికుల ఆరాధనాస్థలాలను కూడా ఆక్రమించుకుని వాటికి తమ దేవుళ్ల పేరు పెట్టుకున్నారన్నమాట.

కాలక్రమంలో రాక్షసుడనే పేరును ఆర్యులు నిందార్ధకంగా మార్చారు. అప్పుడలా నిందార్ధకంగా మారిన రాక్షస శబ్దం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సర్పరూప రాక్షసుడికి ఏటా వసంతకాలంలో పందులను బలి ఇవ్వడం ఆనవాయితీ. పందులను బలి ఇవ్వడం పురాతన ప్రపంచంలోని మాతృస్వామ్యానికి చెందిన తంతు.

భూదేవికి ఒక రాక్షసుని కొడుకుగా చిత్రించడం మన పురాణాలలోనూ ఉంది. ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న ఉదాహరణ, నరకాసురుడు.

జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రస్తావించిన ఇంకొక ఉదంతం చూద్దాం. క్రీ.శ. 222 కి చెందిన అయీలియన్ అనే రోమన్ రచయిత ఎపిరస్ (Epirus) అనే చోట ఉన్న ఒక పాముల తోపు గురించి రాశాడు. అతని కాలానికి వచ్చేసరికి అది అపోలో అనే గ్రీకు, ఆర్యదేవుడి ఆరాధనాస్థలంగా మారిపోయింది కానీ; నిజానికి ఇది కూడా పురాతన మాతృస్వామిక ప్రపంచానికి చెందిన అవశేషమే. ఏటా ఒకరోజున ఈ అపోలో దేవుడికి ఘనంగా నైవేద్యాలు అర్పిస్తారు. ఈ వనంలో ఒక వలయాకారంలోని రక్షితప్రదేశంలో పాములు ఉండేవి. వాటికీ కూడా నివేదనం జరిగేది. అయితే ఆ నివేదనం పురుషులు చేయడానికి వీలులేదు. స్త్రీ, అందులోనూ కన్యాపూజారిణి మాత్రమే చేయాలి. పైగా నగ్నంగా వెళ్లి మరీ నివేదనం ఇవ్వాలి. పాములు శాంతంగా ఉండి, ఆ నివేదనాన్ని స్వీకరిస్తే ఆ ఏడాది సుభిక్షంగా, రోగాలు రొష్టులు లేకుండా గడుస్తుందనీ, ఒకవేళ నివేదనాన్ని తిరస్కరించి పూజారిణిని భయపెడితే దుర్భిక్షం, రోగాలు సంభవిస్తాయనీ నమ్మేవారు.

Tree of the Hesperides

The tree of the Hesperides అనే చిత్రంలో ఒక పెద్దపాము చెట్టును చుట్టుకుని ఉంది. ఈ చెట్టు మొదట్లో ఉన్న గుహలోంచి నీటి ఊటలు ఉబుకుతున్నాయి. చెట్టు చుట్టూ ముగ్గురు అప్సరసలు (Hesperides) ఉన్నారు. మన పురాణ, ఇతిహాసాలలోనూ అప్సరసలు ఉన్న సంగతి తెలిసినదే. ‘అప్సరస’ అనే మాటే నీటి సంబంధాన్ని(సంస్కృతంలో అప్సు అంటే నీరు) చెబుతుంది. గ్రీకు చిత్రంలోని అప్సరసలు తండ్రి లేకుండా, నిశాదేవతకు పుట్టినవారు. తండ్రి లేకుండా పుట్టారన్న మాటకు; తండ్రి ఎవరో తెలియని వారు, లేదా తండ్రికి ప్రాధాన్యంలేని వ్యవస్థకు చెందినవారు అన్న అర్థం చెప్పుకుంటే అది మాతృస్వామ్య లక్షణాన్ని సూచిస్తుంది. ఈ దృశ్యం ఈడెన్ తోటను తలపిస్తుందని, ఈడెన్ తోట ఆ తర్వాత పితృస్వామ్యానికి చెందిన ప్రజాపతి (పేట్రియార్క్) జాగీరు అయిందనీ క్యాంప్ బెల్ అంటారు.

Medusa

ఇంకో చిత్రంలో కనిపించే దేవత పేరు, మెడూసా. ఈమె గురించి గ్రీకు ఇతిహాసకాలానికి చెందిన ఒలింపియన్ పితృస్వామిక కోణం నుంచి చెబుతారు కానీ, అందులో పురాతన ప్రపంచానికి చెందిన మాతృస్వామిక లక్షణాలూ ధ్వనిస్తూనే ఉంటాయి. మెడూసా గార్గాన్స్ రాణి. బుసకొట్టే పాములు ఆమె శిరోజాలు. ఆమె చూపులు మగవారిని శిలగా మార్చివేస్తాయి. పెర్సియస్(Perseus) అనే దేవుడు ఆమె తల నరికి, దానిని తీసుకుని పారిపోతాడు.  ఎథెనే అనే దేవత ఆ తలను తన డాలుకు అతికించుకుంటుంది. పోసిడియన్ అనే దేవుడు, తెగిన మెడూసా మెడ నుంచి పెగాసెస్ అనే రెక్కల గుర్రాన్ని సృష్టిస్తాడు. ఆ గుర్రాన్ని జియస్ రథానికి కడతారు. ఎథెనే ఆదేశంతో దేవవైద్యుడైన అస్లేపియస్(Asclepius) మెడూసా ఎడమవైపు, కుడివైపు ఉన్న నరాలనుంచి రక్తం సంగ్రహిస్తాడు. ఎడమవైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికీ, కుడివైపునుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికీ ఉపయోగిస్తాడు.

ఈ వివరాలన్నీ మనకు బీభత్సంగా అనిపిస్తాయి. సరే, అది మన పురాణాలలోనూ కనిపించే అద్బుతత్వ, ప్రతీకాత్మక  శైలి అనుకుందాం. ఇందులో దేవవైద్యుడైన అస్లేపియస్ పేరు వినగానే, మన పురాణాలలోని దేవవైద్యులైన అశ్వినీదేవతలు గుర్తుకొచ్చి ఉండాలి.  ముఖ్యంగా గమనించవలసింది, ఇందులోని తాత్వికత. క్యాంప్ బెల్ మనకు బాగా తెలిసిన కాళికతో మెడూసాను పోల్చుతారు. అందులోకి వెళ్ళేముందు మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థను వెల్లడించే మరికొన్ని ఉదంతాలను, భారతీయ పురాణకథలతో వాటికి ఉన్న పోలికలను చూద్దాం:

గ్రీకు పురాణాల ప్రకారం ‘టైటాన్లు’ (భారీ ఆకారంతో రాక్షసంగా కనిపించేవారు) జగజ్జనని(Great Goddess Mother) సంతానం. టైటాన్ సగం మానవరూపంలో, సగం సర్పరూపంలో ఉంటాడు. అతని తల నక్షత్రాలను తాకుతూ ఉంటుంది.  సూర్యుడు ఉదయించే ప్రదేశం నుంచి, అస్తమించే ప్రదేశం వరకు చేతులు విస్తరించి ఉంటాయి. యురేనస్ అనే ఆకాశదేవుడికీ, జగజ్జనని రూపమైన గియా(Gaea) అనే భూదేవతకూ పుట్టిన ఈ టైటాన్లకు స్వర్గాన్ని లేదా ఆకాశాన్ని పరిపాలించే అధికారం ఇచ్చారు. ఆర్యులైన గ్రీకుల దేవుడు జియస్, గియా కడగొట్టు కొడుకైన టైఫాన్ పై విజయం సాధించి మౌంట్ ఒలింపస్ పై పితృస్వామిక దేవుళ్ళ ఆధిపత్యం నెలకొల్పుతాడు. మన పురాణాలలో మేరుపర్వతం దేవతల ఆవాసం అయినట్టే, మౌంట్ ఒలింపస్ గ్రీకు దేవతలకు ఆవాసం.

మాతృస్వామిక చిహ్నంతో పొరాడి విజయం సాధించిన ఉదంతం బైబిల్ లో కూడా ఉంది. యెహోవా విశ్వ సముద్ర సర్పమైన ‘లెవియథాన్’ పై విజయం సాధిస్తాడు.

ఇక మన పురాణాలకు వస్తే ఇలాంటి ఉదంతాలు అనేకం. రాముడు తాటకను చంపడం గురించి, కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. పైన చెప్పిన  టైటాన్స్ లానే తాటకను, పూతనను కూడా భారీ ఆకారాలతో భయం గొలిపే రాక్షసులుగానే మన కథలు చిత్రించాయి. సినిమాలు, హరికథలు, పురాణశ్రవణం ద్వారా మాత్రమే పురాణకథలతో అరకొర పరిచయం ఉన్నవారు నిజంగానే ఒకప్పుడు రాక్షసులనే జాతి ఉండేదని భ్రమిస్తూ ఉంటారు. నిజానికి రాక్షసత్వం అనేది మామూలు మనుషులపై ఆపాదనే తప్ప మరొకటి కాదన్న సంగతి రామాయణం, బాలకాండలో ఉన్న తాటక వృత్తాంతమే స్పష్టంగా చెబుతుంది. ‘వాల్మీకి నిజం దాచడు, అబద్ధం చెప్పడు’ అనేవారు రాంభట్ల. తాటక ఉదంతం ఆయన అన్నది ఎంత యధార్థమో చెబుతుంది.

తాటక ఒక యక్షిణి అంటుంది రామాయణం. అంటే, యక్షుల తెగకు చెందినది. యక్షులు చారిత్రకత కలిగిన తెగ. తెలుగులో ‘జక్కులు’ అనే మాట, యక్షశబ్దానికి వికృతి. ‘జక్క పురంధ్రి’ అనే ప్రయోగం ‘క్రీడాభిరామం’లో కాబోలు, ఉంది. యక్షప్రశ్నలు అనే మాట యక్షులనుంచే పుట్టింది. అడవిని ఆశ్రయించుకుని ఉండే యక్షులు దారినపోయేవారిని అటకాయించి, యక్షప్రశ్నలు వేసి, వారు జవాబు చెప్పలేకపోతే బలి ఇచ్చేవారట. బుద్ధుడు ఇలాగే తనకు తారసపడిన యక్షులలో ఉపదేశం ద్వారా పరివర్తన తెచ్చి ఆ దురాచారాన్ని మాన్పించాడని కోశాంబీ రాస్తారు. యక్షులకు సంబంధించిన ఈ చారిత్రక వివరం; యక్షుడికీ, ధర్మరాజుకీ మధ్య ప్రశ్నోత్తరాల రూపంలో మహాభారతానికి ఎక్కింది.

తాటక సుకేతు డనే మహాయక్షుని కూతురనీ, వేయి ఏనుగుల బలంతో పుట్టిన కామరూపిణి అనీ విశ్వామిత్రుడు రాముడికి చెబుతాడు. ‘యక్షులు అంత బలవంతులు కారని ప్రతీతి కదా! తాటకకు వేయి ఏనుగుల బలం ఎలా వచ్చింద’ని  రాముడు అడుగుతాడు.  విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ, సుకేతుడు సంతానం కోసం తపస్సు చేయగా బ్రహ్మ కొడుకును ఇవ్వకుండా ఒక్క కూతురినే ఇచ్చాడనీ, ఆమెకే వేయి ఏనుగుల బలం ఉండేలా వరమిచ్చాడనీ అంటాడు.

అలాగే, తాటక మొదట్లో మంచి రూపవతి. ఆమెను సుందు డనే అతనికిచ్చి పెళ్లి చేశారు. వారికి మారీచుడనే కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుని శాపం వల్ల రాక్షసుడై, అతని వల్లనే మరణించగా; తాటక, మారీచుడు అగస్త్యుని చంపబోయారనీ, అప్పుడు వారిని కూడా రాక్షసులు కమ్మని అగస్త్యుడు శపించాడనీ రామాయణం చెబుతోంది. ఒక సాధారణ యక్షస్త్రీకి, ఆమె భర్తకు, కుమారుడికీ రాక్షసత్వాన్ని ఆపాదించిన సంగతిని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.  స్త్రీని చంపడానికి రాముడు మొదట సందేహించినా విశ్వామిత్రుడు చెప్పడంతో ఆమెను చంపుతాడు.

మాతృస్వామ్య కోణం నుంచి తాటక కథను అన్వయించడానికి కనీసం రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సుకేతుడికి బ్రహ్మదేవుడు కొడుకును ఇవ్వకుండా కూతురినే ఇవ్వడం, ఆ కూతురు వేయి ఏనుగుల బలంతో పుట్టడం అనేవి– కొడుకు కంటే కూతురికీ; పురుషుడి కంటే స్త్రీకీ ఆధిక్యాన్నీ, బలాన్నీ కల్పించే మాతృస్వామ్య లక్షణాన్ని పరోక్షంగా సూచిస్తు ఉండచ్చు.  రెండోది, తాటక ఉండే ప్రదేశాన్ని విశ్వామిత్రుడు ‘తాటకవనం’గా పేర్కొనడం అమ్మవారి వనానికి సూచన కావచ్చు.

విశ్వామిత్రుడికి తాటకతోనూ; అగస్త్యుడికి సుందుడు, తాటక, మారీచులతోనూ ఉన్న శత్రుత్వం మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య స్పర్థ ఫలితం కావచ్చు.

బైబిల్ లోని యెహోవా, లెవియథాన్ అనే సర్పంతో పొరాడి విజయం సాధించినట్టే, మన దగ్గర కృష్ణుడు యమునానదిలోని కాళీయుడనే సర్పాన్ని మర్దించి తరిమేసిన కథ ఉంది. కృష్ణుడు బృందావనంలోని అమ్మవార్ల సమూహ దేవత అయిన బృందను పెళ్లాడడం ద్వారా అమ్మవార్లను లొంగదీసుకోవడం గురించి, అమ్మవారి ఆరాధన స్థానంలో తన ఆరాధనను ప్రతిష్టించడం గురించి ‘బృందావన కృష్ణుడు…సోషల్ ఇంజనీరింగ్’ అనే వ్యాసంలో చెప్పుకున్నాం. బృందావనం ఉన్నది యమున ఒడ్డునే. కనుక మాతృస్వామ్య ఆరాధనారూపమైన కాళీయుడనే సర్పాన్ని కృష్ణుడు మర్దించి తరిమేయడం బృందావనంలో ఆయన చేసినదానికి కొనసాగింపే.

మొత్తంమీద బైబిల్ యెహోవా, భాగవత కృష్ణుడు చేసింది ఒకటే…అది, మాతృస్వామిక ఆరాధనారూపంతో పోరాడి విజయం సాధించడం!

స్త్రీని చంపిన, లేదా శిక్షించిన చరిత్ర హనుమంతుడికీ ఉంది. దాని గురించీ, భారతీయ పురాణకథలతో ఇతర పురాణ కథలకు ఉన్న మరికొన్ని పోలికల గురించీ; వీటి వెనుక ఉన్న తాత్వికత గురించీ తర్వాత…

 -కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) 

‘అమ్మ’ను పుట్టించిన బొమ్మ

 

ముందుగా ఒకటి రెండు విషయాలు…

ఈ వ్యాసపరంపరలో మొదటినుంచీ ఒకటి జరుగుతోంది. అది ఇంతకుముందు చెప్పుకున్నదే. అదేమిటంటే, ఒక విషయాన్ని ఎత్తుకుంటే, అది తరచు అనేక మలుపులు తిరుగుతూపోతోంది. కనుక ఎక్కడ మొదలెట్టామో మధ్య మధ్య గుర్తు చేసుకోకతప్పదు. పన్నెండు వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభించి ఓడిసస్ కథ చెప్పుకుంటూ ఇంత దూరం వచ్చాం.

ఇంకోటి కూడా గమనించే ఉంటారు…అనేక వ్యాసాలుగా  మాతృస్వామ్య/పితృస్వామ్యాల గురించిన ప్రస్తావన దండలో దారంలా వస్తోంది. ఇక ముందు కూడా వస్తుంది.  బహుశా ప్రస్తుతానికి అదే ప్రధాన ఇతివృత్తం.

నేనిక్కడ గ్రీకు, బైబిలు పురాణ కథల గురించి, వాటిలోని దేవతల గురించి అదే పనిగా ప్రస్తావిస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు. అయితే, కేవలం వాటి గురించే చెప్పడం నా ప్రణాళిక కాదు. పైన చెప్పిన ప్రధాన ఇతివృత్తంలో భాగంగా చేస్తున్న ఈ ప్రస్తావనల ద్వారా  భారతీయ పురాణ కథలకు, వాటికి ఉన్న పోలికలను కూడా ముందుకు తెస్తున్నాను.

అలా తేవడంలో ఇంకోటి కూడా చేస్తున్నాను. “మన  దేవతలు, మన తాత్వికత కేవలం మనవే; మనకే ప్రత్యేకం; మనది మాత్రమే పుణ్యభూమి, కర్మభూమి’’ అంటూ పౌరాణికులవారు ఎంత గట్టిగా నొక్కి చెప్పినా అందులో ఆత్మస్తుతి ఉన్నంతగా నిజం లేదని, సవినయంగా మనవి చేస్తున్నాను.

నేను తాత్వికతలోకి, తాత్విక ప్రతీకల్లోకి, తాంత్రికతలోకి మరీ లోతుగా వెడుతున్నానన్న అభిప్రాయం మీకు కలిగి ఉండవచ్చు. అందులో బొత్తిగా నిజం లేదని అనను కానీ, వాస్తవంగా నేను చేయదలచుకున్నది చరిత్ర అద్దంలో వాటిని చూపించడమే!

***

చరిత్రలో ఏం జరిగిందంటే…

కొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి  రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది.  ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus of Willendorf) అంటారు.  అయితే,  వీనస్ అన్నారు కదా అని, ఈ మూర్తి  ఫ్రాన్స్ లోని లౌరే మ్యూజియంలో ఉన్న Venus of Milo లా అందంగా, ఆకర్షణీయంగా ఉండదనీ, స్థూల కాయంతో, బలిష్టమైన కటిప్రదేశంతో ఉంటుందనీ జార్జి థాంప్సన్ అంటారు.

venus of willendorf

venus of Willendorf

 

మధ్య యూరప్, మధ్యధరా ప్రాంతం, సమీప ప్రాచ్యానికి చెందిన కొత్త రాతియుగ(క్రీ.పూ. 10,020), రాగి యుగ(క్రీ.పూ. 5,500)నిక్షేపాలలో ఇలాంటి నగ్నస్త్రీ మూర్తులు వందల సంఖ్యలో దొరికాయి. ఇవి ఎక్కువగా కాల్చిన మట్టితో(టెర్రకోట) చేసినవే కానీ, కొన్ని శిలపై చెక్కినవీ ఉన్నాయి. పురుషమూర్తులు ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. అలాగే జంతు రూపాలు కూడా కనిపించాయి.

యూరప్ కు చెందిన డాన్యూబ్ నదీసంస్కృతి(క్రీ.పూ. 5,000)మొదటి దశలో ఇలాంటి స్త్రీమూర్తులు స్వల్పసంఖ్యలో కనిపించాయి. రెండో దశకు వచ్చేసరికి ఇవి ఎక్కువ సంఖ్యలో కనిపించి, మూడవ దశలో అదృశ్యమైపోయాయి. ఈ మూడవ దశ నాటికి పశుపాలన, యుద్ధాలు మొదలయ్యాయి.

అలాగే, రుమేనియాకు చెందిన గుమెల్నిటా(Gumelnita) సంస్కృతి(క్రీ.పూ. 5,000) మొదటి దశలో స్త్రీమూర్తులు విస్తారంగా కనిపించాయి. రెండో దశలో కూడా కొనసాగాయి కానీ, ఈసారి పురుషమూర్తులూ, కాల్చిన మట్టితో చేసిన పురుషాంగాలూ కనిపించాయి. మూడవ దశకు వచ్చేసరికి చెకుముకిరాయితో చేసిన బాణపు మొనలు, యుద్ధాలలో ఉపయోగించే గొడ్డళ్ళు కనిపించాయి. స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.

గ్రీసులోని థెసలేకు చెందిన కొత్తరాతియుగ నిక్షేపాలలో కూడా ఇదే కనిపిస్తుంది. థెసలే రెండవ దశను ‘దిమిని సంస్కృతి’(క్రీ.పూ. 5,000) అంటారు. ఈ సంస్కృతికి చెందిన మూర్తులలో కొత్తగా రెండు నమూనాలు అడుగుపెట్టాయి. మొదటిది, పసిబిడ్డను చేతుల్లో ఉంచుకుని కూర్చుని ఉన్న స్త్రీమూర్తి; రెండవది, మోకాళ్ళ మీద చేతులు ఆనించి కూర్చుని ఉన్న ithyphallic(erect phallus) పురుషమూర్తి. అయితే, ఈ దశకు వచ్చేసరికి వెనకటి దశలో కంటే మూర్తుల సంఖ్య, వాటి నాణ్యతా కూడా తగ్గాయి.  థెసలే మూడవదశలో కూడా ఈ క్షీణత కొనసాగి, ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమయ్యాయి.

పై యూరప్ మూడు ప్రాంతాలకు చెందిన మూడు దశల గురించి ఈమాత్రం వివరంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇవి ఒక ముఖ్యమైన సామాజిక పరిణామాన్ని చెబుతున్నాయి. మొదటి దశలో ప్రారంభించి రెండవ దశ వరకూ పురుషమూర్తులు స్వల్పసంఖ్యలోనూ, స్త్రీమూర్తులు  ఎక్కువ సంఖ్యలోనూ  కనిపిస్తూవచ్చాయి.  కానీ, మూడవదశకు వచ్చేసరికి స్త్రీమూర్తులు అదృశ్యమయ్యాయి.  ఆ దశలో పశుపాలనకు, యుద్ధాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా కనిపించాయి.  అంటే ఏం జరిగిందన్నమాట…స్త్రీ ప్రాధాన్యం పోయి, పురుషప్రాధాన్యం అడుగుపెట్టింది! వ్యవస్థాపరంగా చెబితే, మాతృస్వామ్యం స్థానంలో పురుషస్వామ్యం అడుగుపెట్టింది.

ఇంకా వెనక్కి, క్రీటుకు చెందిన మినోవన్ సంస్కృతి(క్రీ.పూ. 2700-1450)కి వెడదాం. అక్కడి తవ్వకాలలో కూడా పురుషమూర్తుల కంటే స్త్రీమూర్తులే ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. ఇవి పొట్టిగా, బలిష్టమైన పిరుదులతో, కూర్చుని కనిపిస్తాయి. ఈ తరహా మూర్తులే యూఫ్రటిస్ మధ్యతీరంతో సహా ఆసియాలోని సెమెటిక్ భూములు అంతటా కనిపించాయి. బాబిలోనియాలోని నిప్పూరులో దొరికిన క్రీ.పూ. 2700 నాటి మూర్తి ఒక ఉదాహరణ. ఈ మూర్తిని బాబిలోనియా అమ్మవారు(mother-goddess)గా గుర్తించారు. ఈవిధంగా స్త్రీమూర్తుల విషయంలో ఆగ్నేయ యూరప్ కు, నైరుతి ఆసియాకు మధ్య ఒక సంబంధం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు అన్నింటా స్త్రీ ప్రాధాన్యం కలిగిన మాతృస్వామ్యం ఉండేదనడానికి అది సూచన. మన దేశానికి చెందిన సింధు సంస్కృతి కూడా మినోవన్, బాబిలోనియా కాలానికి చెందినదే.

ఇంతకీ ఈ స్త్రీమూర్తులు ఎలాంటివో, వీటినుంచి ఆశించిన ప్రయోజనం ఏమిటో చూద్దాం:

జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY: THE PREHISTORIC AEGEAN) The making of the Goddess అనే అధ్యాయంలో దీనిగురించి చర్చించారు. దాని సారాంశాన్ని చెప్పుకుంటే, ఈ స్త్రీ మూర్తులే వివిధ ప్రాంతాలలోని అమ్మవారి రూపానికి మాతృకలు. విచిత్రం ఏమిటంటే, అమ్మవారి రూపాన్ని సృష్టించడానికి మూలమైన ఈ మూర్తులే క్రమంగా అమ్మవారికి మొక్కుగా అర్పించే మూర్తులు అయ్యాయి. అమ్మవారి ఆరాధన జరిగే అనేక ప్రాంతాలలో గుడులలోనూ, తోపులలోనూ ఈ మూర్తులు వందల సంఖ్యలో దొరకడం ఇందుకు నిదర్శనం.

venus of milo

venus of milo

 

అలాగే, ఈ మూర్తులు మొదట్లో ఆరాధనారూపాలు కావు, మాంత్రికత(magic)లో భాగమైన బొమ్మలు. అది కూడా ప్రారంభంలో  ఋతుస్రావానికి, ప్రసవానికి మాత్రమే సంబంధించినవి.  వాటి భంగిమలు దానినే సూచిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మూర్తులు  స్త్రీ-పురుష సంపర్కానీకీ, గర్భం ధరించడానికీ సంబంధం ఉన్నట్టు తెలియని కాలానికి చెందినవి. ఇప్పటికీ మరీ ఆదిమ దశలో ఉన్న జాతులవారికి ఈ రెండింటి సంబంధం తెలియదు. నేటి ఆస్ట్రేలియా ఆదిమ తెగలలో ‘కన్య’ అనే భావన లేదని థాంప్సన్ అంటారు.  పురుష సంబంధం, తద్వారా గర్భం ధరించే అవకాశం లేని స్త్రీని కన్య అనీ, ఆ రెండూ ఉన్న స్త్రీని గృహిణి అనీ అంటాం. పురుష సంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలియనప్పుడు ఆ విభజనకు అవకాశమే లేదు. ఇంతకుముందు ఇదే వ్యాసపరంపరలోని ‘ఋతుమతీ పునః కన్యా’ మొదలైన వ్యాసాలలో కూడా కన్య గురించి కొంత చర్చ జరిగింది.

ఒకవేళ పురుషసంపర్కానికి, గర్భధారణకు సంబంధం ఉందని తెలిసినా; గర్బధారణకు ఏదో మంత్రమో, మహిమో, దేవుడో కారణంగా చెప్పుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అంటే ఈ విశ్వాసం మూలాలు వేల సంవత్సరాల గతంలో ఉన్నాయన్నమాట.

మొదట్లో ఋతుస్రావానికీ, ప్రసవానికీ, సౌభాగ్య తంత్రానికీ సంబంధించిన ఈ మాంత్రిక మూర్తులు క్రమంగా పెళ్లి, చావు, రోగమూ, రొష్టుతో సహా అన్ని జీవన సందర్భాలకూ విస్తరించాయి. జీవితంలోని ప్రతి ఒక్క ఘట్టంలోనూ, సంక్షోభంలోనూ పునరుత్పాదక శక్తినీ, పునరుజ్జీవనాన్నీ నింపడానికే మాంత్రికతా ప్రయోగం.

క్రమంగా పురుషసంబంధానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెలిసిన ఫలితమే, అనంతరకాలపు నిక్షేపాలలో పురుషమూర్తులతోపాటు, పురుషాంగాలు బయటపడడం! ఇంతకుముందు ఒక వ్యాసంలో(‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య) చెప్పుకున్న దక్షిణాఫ్రికాలోని వాలెంగే కన్యల శిక్షణ తంతు ఈ దశకు చెందినది. ఈ దశలో కూడా మూర్తులను, స్త్రీ పురుష జననాంగాల రూపాలను తయారు చేసేది స్త్రీలే. అయితే అవి లైంగిక చర్యను బోధించే సామగ్రి మాత్రమే. మాంత్రికమైన తంతును మినహాయిస్తే, ఇవి నేడు స్కూళ్లలోనూ, కాలేజీలలోనూ శరీర నిర్మాణాన్ని బోధించడంలో ఉపయోగించే సామగ్రి లాంటివన్న మాట.

dimini figurine

Dimini Figurine

 

మూడవ దశకు వచ్చేసరికి మరో కీలక పరిణామం జరిగింది. స్త్రీ-పురుష జననాంగాలపై పురుషభావారోపణ (anthropomorphism) జరిగి, అవి దేవతారూపాలు తీసుకున్నాయి. మనదగ్గర పానవట్టం-లింగం ఒక ఉదాహరణ. అలాగే, ఈ దశలోనే పురాతన మూర్తులు వివిధ ఇతర దేవతారూపాలకు మాతృకలయ్యాయి.

ఇలా మనిషి రూపాలతో ముడిపడిన తంతులు ఏదో ఒక ప్రాంతానికో, లేదా గతానికో పరిమితం కావు. దిగువ పాతరాతి యుగం నుంచి ఇనప యుగం వరకు నిరంతరాయంగా కనిపిస్తున్న ఈ మూర్తులు ఈ మధ్యలోని వివిధ కాలాలలో వివిధ ప్రయోజనాలకు సాధనమయ్యాయని థాంప్సన్ అంటారు. మొత్తం మాంత్రికత చరిత్ర అంతా ఈమధ్యలోనే ఇమిడిపోయిందని కూడా ఆయన అంటారు. ఈ మూర్తులలో చాలావరకూ సమాధులలో దొరికాయి. తదుపరి కాలంలో మొక్కు చెల్లింపు రూపంలో తోపులలో దొరికాయి. ఆ తర్వాత దేవతా మూర్తులకు రూపమిచ్చాయి. మధ్య, దిగువ మినోవన్ సంస్కృతులలో ఈ మూడు రకాలవీ కనిపిస్తాయి. ఇలా పురావస్తు ఆధారాలు ఈ మూర్తులకు సంబంధించిన వేల సంవత్సరాల పరిణామ చరిత్రను చెబుతున్నాయి.

ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అనంతరకాలపు నిక్షేపాలలో మొక్కు చెల్లింపు రూపంలోని మూర్తులు ఎక్కువ సంఖ్యలో దొరికినా అన్నీ అలాంటివే కావని థాంప్సన్ అంటారు. దేవతకు చెల్లింపులు(offerings) జరపడం అనే ఆనవాయితీ ఇంకా అడుగుపెట్టని కాలానికి చెందినవి కూడా వాటిలో ఉన్నాయి.  ఆ దశలో ఆ మూర్తులు మాంత్రికశక్తిని నిక్షేపించిన మతపరమైన ఆస్తులు మాత్రమే. వాటిని స్త్రీల రహస్యప్రపంచమైన తోపులలో భద్రపరచడం మాత్రమే చేసేవారు. అవి మాంత్రికమైనవి కనుక వాటి వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల వాటికి నష్టం జరగకుండా నివారించడమే అందులోని ఉద్దేశం. అయితే దేవతాభావన ఒక రూపం దిద్దుకున్న తర్వాత ఈ మూర్తులను దేవతకు చెందినవిగానూ, ఆ దేవత నుంచే అవి మహిమను పుంజుకుంటున్నవిగానూ భావించడం ప్రారంభించారు. అప్పటినుంచీ ఈ మూర్తులు  కేవలం మతపరమైన సామగ్రిగా కాక, దేవతకు, లేదా ఆమె భక్తులకు ప్రతిరూపాలుగా గుర్తింపు పొందడం ప్రారంభించాయి.

దేవతకు మొక్కు కోవడం, మొక్కు చెల్లించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కోరుకున్నది నెరవేరిన తర్వాతో, నెరవేరడానికి ముందో మొక్కు చెల్లింపు జరగచ్చు. ఇప్పుడు ఇదొక  ‘మొక్కుబడి’గా మారింది కానీ, దీనికి కూడా వేల సంవత్సరాల గతం ఉంది. అంతే కాదు, ఈ మొక్కు చెల్లింపు మన దేశంలోనే కాదు; అనేక చోట్ల ఉంది. వాటి మధ్య పోలికలు కూడా ఉన్నాయి.  ఉదాహరణకు గ్రీసులో రైతు తన ఎద్దో మరో పశువో జబ్బు పడితే పేడతో దాని ప్రతిరూపం తయారు చేసి దేవతకు అర్పించేవాడు.  మన దేశంలోనూ దేవుడికో, దేవతకో మొక్కు కింద ప్రతిరూపాలను అర్పించే ఆనవాయితీ అనేక ఆలయాలలో కనిపిస్తుంది.

ఇంకో విశేషం ఏమిటంటే, ఇలా బొమ్మలను ఉపయోగించడం క్షుద్ర పూజల్లోనూ ఉంది. శత్రువు బాగుపడుతుంటే చూడలేక మైనంతో అతని బొమ్మను చేసి తగలబెట్టడం గురించి థాంప్సన్ ప్రస్తావిస్తారు. కానీ ఇప్పుడు మొక్కుకు, క్షుద్ర పూజలకు ఉన్న సంబంధం మరుగున పడిపోయింది. ఈ రెండూ అత్యంత ఆదిమ దశలో ఒకే కుదుట్లో పుట్టిన తంతులు. వాస్తవానికి అవి పుట్టినవి మాంత్రికతనుంచి! జబ్బు పడిన పశువు ఆరోగ్యాన్ని పుంజుకోడానికి జరిపే అభినయ మాంత్రికత(mimetic magic)లో భాగమే, ఆ పశువు బొమ్మను చేయడం. ఆ దశలో దానిని దేవతకు అర్పించడం అనేది లేదు. అది తర్వాతి కాలంలో వచ్చింది. ఆ బొమ్మ మంత్రపూతమైంది కనుక దానిని భద్రమైన ప్రదేశంలో ఉంచవలసిన అవసరం నుంచి, దేవతకు అర్పించడం అనే భావన పుట్టింది.

చనిపోయిన రాజకీయ నాయకులకు, ఇతర ప్రముఖులకు విగ్రహాలు స్థాపించడం వెనుక కూడా అత్యంత ఆదిమ దశకు చెందిన మాంత్రిక వారసత్వం ఉందంటే ఆశ్చర్యం కలగచ్చు. అతి పురాతన కాలానికి వెడితే, గ్రీసుపై పర్షియన్లు దండయాత్ర చేసినప్పుడు; ట్రోయిజెన్ పౌసానియస్ అనే చోట స్త్రీలను, పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అందుకు కృతజ్ఞతగా అక్కడ ఆ స్త్రీలు, పిల్లల విగ్రహాలను స్థాపించారు. అలాగే, తప్పి పోయిన, లేదా దేశాంతరానికి వెళ్ళి తిరిగి రాని వారి విగ్రహాలను స్థాపించేవారు. వారు సురక్షితంగా తిరిగి రావడం దాని వెనుక ఉద్దేశం. చనిపోయినవారి విగ్రహాలను స్థాపించడం, వారిని ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవడం కోసమే నని ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ మొదట్లో ఆశించినది అది కాదు; పరలోకంలో వారు సుఖంగా ఉండాలన్న భావనే ఈ ఆనవాయితీకి మూలం.

వెనకటి కాలంలో గ్రీసు అంతటా, అథ్లెటిక్స్ విజేతలకు, పదవీ కాలం ముగిసిన పూజారులకు, పూజారిణులకు విగ్రహాలు స్థాపించేవారు. వీరిని దేవుళ్ళుగా లేదా దేవతలుగానే భావించేవారు.  మన దగ్గర ఇప్పటికీ దివంగత  రాజకీయనాయకులకు, సినీనటులు వగైరాలకు విగ్రహాలను స్థాపిస్తుండడం తెలిసినదే. అభిమానం వికటించి బతికి ఉండగానే విగ్రహాలను స్థాపించడమూ చూస్తూ ఉంటాం.

మొత్తానికి తంతు మిగిలింది. దాని చరిత్రా, దాని వెనుక అసలు కారణమూ మరుగున పడిపోయాయి!

మరికొన్ని విశేషాలు తర్వాత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

 

 

 

 

మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!

పైగా ఆ తుప్పు పట్టిన తలుపు, తాళం చూస్తే అది నిజమేననిపించేది.

ఆశ్చర్యంగా, కుతూహలంగా ఆ సొరంగం వైపే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. అందు లోంచి వెడితే ఎంతో దూరంలో ఉన్న కాశీకి చేరుకుంటామన్న ఊహ అంత చిన్నప్పుడే నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది. ఆ తర్వాత కూడా కనకదుర్గ గుడికి ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా ఆ సొరంగం దగ్గరకు వెళ్లి దానివైపే చూస్తూ ఉండేవాడిని, అక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్లడాన్ని రకరకాలుగా ఊహించుకునేవాణ్ణి. ఆ సొరంగం ముచ్చట నా మీద ఎంతగా ముద్ర వేసిందంటే, పెద్దైన తర్వాత కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ సొరంగం దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అది అలాగే ఉందా అన్నది నాకు తెలియదు. నేను చివరిసారి వెళ్లి చాలా ఏళ్ళు అయింది.

లోకజ్ఞానం పెరిగిన కొద్దీ, ఆ సొరంగం లోంచి వెడితే కాశీలో తేలతామనడంలో ఆవగింజంత కూడా నిజం లేదని మనకు తెలుస్తూనే ఉంటుంది. కాని, ఇంకోవైపు అది నిజం ఎందుకు కాకూడదని కూడా అనిపిస్తుంది. నిజానికీ కల్పనకీ మధ్య అదో రకమైన డోలాయమాన స్థితి. సంగతేమిటంటే, వాస్తవికతను అంటిపెట్టుకునే నిగూఢతా ఉంటుంది. ఒక కోణంలో చూస్తే, వాస్తవికత ఎంత వాస్తవమో, నిగూఢతా అంతే వాస్తవం. ప్రకృతిలోనూ, మానవప్రకృతిలోనూ ఈ రెండూ అంతర్భాగాలు, బొమ్మా బొరుసూ లాంటివి. నమ్మకానికీ, అపనమ్మకానికీ కూడా ఇదే వర్తిస్తుంది. మనిషి జీవితం ఏదో ఒక రూపంలో ఈ రెంటి మధ్యా పయనిస్తూనే ఉంటుంది.
ఇలా అన్నానని నేనేదో తాత్విక చర్చలోకి వెడుతున్నాననో, తాడూ బొంగరం లేని ఊహల్ని సమర్థిస్తున్నాననో అనుకుంటున్నారేమో, అదేం లేదు. మానవపరిణామచరిత్రలోకి వెడితే ఈ నిగూఢత, రహస్యం, లేదా మిస్టరీ అనేవి మనిషి జీవితంలో ప్రముఖపాత్ర పోషించాయని మనకు తెలుసు. సొరంగాలు, లేదా గుహలు; ఇంతకు ముందు చెప్పుకున్న అమ్మవారి తోపులు వగైరాలు ఆ నిగూఢతను అంటిపెట్టుకుని ఉన్నవే. నిగూఢమైన తంతులలో అవి భాగాలు. వాటిని ఒక మార్మికత ఆవరించి ఉంటుంది.

ఉండవల్లి గుహాలయాలు

ఉండవల్లి గుహాలయాలు

సొరంగాలు, గుహలు, తోపుల చుట్టూ అల్లుకున్న మార్మికత ఎన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఊహల్లో జీర్ణించుకుని ఉందో! కనకదుర్గగుడిలోని ఆ సొరంగాన్ని చూడగానే, అది ఒకప్పుడు కాశీకి రహస్య మార్గం అన్న ఊహ పుట్టడం వెనుక ఇంత చరిత్ర ఉందన్న మాట.

సొరంగాలు, గుహలు చీకటి గుయ్యారాలుగా; లోపల ఏముందో అంతుబట్టనివిగా, ఎంత దూరం వ్యాపించాయో తెలియనివిగా ఉంటాయి. భూమి అడుగున అలాంటి ఒక అజ్ఞాతప్రపంచాన్ని మనిషి ఊహ సృష్టించి, దానికి ఒక పేరు పెట్టింది: అదే, పాతాళం! పాతాళం స్వర్గంలా ఆనందం, ఆహ్లాదం గొలిపే ప్రపంచం కాదు. భయ, బీభత్సాలను కలిగించేది. అక్కడ ఉండేది దేవతలు కాదు; కాలకూట విషాన్ని పుక్కిలించే మహాసర్పాలు. పాతాళం మన భాషల్లో ఒక న్యూనార్థకం, నిందార్థకం. పాతాళానికి సమానార్థకమైన under world కూడా అలాంటిదే. స్మగ్లర్లు, ఇతర నేరాలు చేసేవాళ్ళు ఉండే ప్రపంచం అది. పాతాళానికి తోక్కేయడం అనే నుడికారం మన భాషల్లో కనిపిస్తుంది. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు.

మన దగ్గరే కాదు, పాతాళం ఇతర పురాణకథల్లోనూ ఇలాంటి న్యూనార్థంలోనే కనిపిస్తుంది. గ్రీకుపురాణకథల్లోని పాతాళ ప్రస్తావనలను ఉదహరించుకునే సందర్భం ముందు రావచ్చు. అదలా ఉంచితే, మార్మికత, మాంత్రికత నిండిన పురా మానవ జీవితంలో గుహలు, పాతాళం ఒక ముఖ్యపాత్ర పోషిస్తూవచ్చాయి. మనదేశంలో అజంతా, ఎల్లోరా గుహల గురించి మనకు తెలుసు. అమరనాథ్ గుహ గురించి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇలాంటివే ఇంకా దేశంలో చాలా ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రాచీన ఆలయాలలో విడిగా గుహాలయాలు, భూగర్భ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. భూగర్భ ఆలయాలలోని దేవుడి పేరుముందు ‘పాతాళ’ అనే మాట చేర్చి చెబుతుంటారు. ఉదాహరణకు, శ్రీకాళహస్తిలో పాతాళ విఘ్నేశ్వరుని గుడి ఉంది. అందులోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అలాగే, కొండలను గుహలుగా తొలచి ఏర్పాటు చేసిన గుడులు అనేకచోట్ల కనిపిస్తాయి.

అన్నట్టు, కొందరు ఉగ్రదేవతల గుడులు పాతాళంలో ఉంటాయి. ‘పాతాళ భైరవి’ అనే సినిమా పేరులోనే పాతాళం ఉంది. ఆ ఉగ్రదేవతలను ఆరాధించే మాంత్రికుల నివాసం కూడా పాతాళంలోనే ఉంటుంది. అందుకే వారి ఉనికిని గుర్తించడం కష్టమవుతుంది. దాని నుంచే ‘సప్తసముద్రాలు-దానికి ఆవల ఓ మర్రిచెట్టు-దాని తొర్రలో చిలుక- ఆ చిలుకలో మాంత్రికుని ప్రాణం…’వగైరా అద్భుత కల్పనలు, మహిమలు పుట్టాయి.

అలవాటు వల్ల వీటిని యాంత్రికంగా తీసుకుంటాం. ఇందులో కొత్త ఏముందని అనుకుంటాం. కానీ చరిత్ర క్రమంలో వీటిని పెట్టి చూడండి…ఇవి కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తాయి. చరిత్రకోణం నుంచి చూసినప్పుడు ఆసక్తికరం కాని దేదీ ఉండదనిపిస్తుంది.

గుహల విషయానికి వెడితే, ఆదికాలపు గుడులు గుహలే ననీ; గ్రీకు సంప్రదాయమూ, పురావస్తు ఆధారాలు దానినే నిరూపిస్తున్నాయనీ థాంప్సన్ అంటారు. మన సంప్రదాయం కూడా అదే నని పైన చెప్పుకున్న గుహాలయాలు, పాతాళ ఆలయాలు చెబుతూనే ఉన్నాయి. గ్రీకు పురాణాలలోని డిమీటర్, పెరెస్పోన్ అనే అమ్మవార్లకు చెందిన పవిత్రగుహలను మెగరాన్ (megaron) అంటారు. హోమర్ కాలం నాటికి ఆ మాట ఇంటికీ, ప్రాసాదానికీ కూడా పర్యాయపదమైంది. హేడ్స్ అనే పాతాళదేవుడు, పెరెస్పోన్ అనే దేవకన్యను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేస్తాడు. అది జరిగిన చోటే మెగరాన్. థాంప్సన్ ప్రకారం పాతరాతియుగంలో గుహలే ఆలయాలుగానూ, నివాస స్థలాలు గానూ ఉండేవి. కొత్తరాతి యుగానికి వచ్చేసరికి గుహలలో నివసించడం ఆగిపోయింది. వాటిని ఆలయాలుగా, సమాధులుగా, ధాన్యాగారాలుగా ఉపయోగించడం మాత్రం కొనసాగింది.

అమరనాథ్ గుహాలయం

అమరనాథ్ గుహాలయం

గ్రీసులోని గుహాలయాలలో అనేకం ప్రాచీన క్రీటు ద్వీపానికి చెందినవి. క్రీటు రాజధాని నోసోస్ కు దగ్గరలోని ప్రముఖ గుహాలయమైన అమ్నిసోస్ ను హోమర్ కావ్యం ఒడిస్సీ కూడా ప్రస్తావించింది. ప్రాచీన గ్రీసుపై మాతృస్వామ్యానికి చెందిన క్రీటు సంస్కృతి ప్రభావం చాలా ఉంది. క్రీటులో నేల తొలిచి, చుట్టూ బండరాళ్ళు పేర్చి కృత్రిమ గుహలను కూడా కల్పించేవారు. అవే క్రమంగా చనిపోయినవారిని పూడ్చిపెట్టే సమాధుల నిర్మాణానికి దారితీసాయి.

అనటోలియా(నేటి టర్కీ)లో ఫ్రిజియన్లు, బహుశా వారికి ముందు హిట్టైట్లు సహజసిద్ధమైన గుట్టలలో గోతులు తవ్వి, ఎండా, చలి తగలకుండా వాటికి కలపతో రక్షణ కల్పించేవారు. ఇలాంటి గోతులనే కపడోసియా(టర్కీ మధ్యప్రాంతం), ఆర్మేనియా, ఇటలీ, జర్మనీ, లిబియా, స్పెయిన్ లలో ధాన్యాగారాలుగా లేదా గాదెలుగా ఉపయోగించేవారు. విశేషమేమిటంటే, ఈ గాదెల్లో తృణధాన్యాలను జాగ్రత్తగా భద్రపరిస్తే అవి ఎంతకాలమైనా చెడకుండా ఉండేవట. ఉదాహరణకు, గోధుమలు యాభై ఏళ్లపాటు; జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు నూరేళ్ళకు పైగా నిల్వ ఉండేవట.

రోమ్ లో ఇటువంటి నిర్మాణాలను ‘ముండస్’(mundus) అనేవారు. ఏదైనా నగరనిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు, మధ్యలో ఒక గొయ్యి తవ్వేవారు. అందులో ప్రథమఫలా(first-fruits)న్ని, అంటే కొత్తపంటలో కొంత భాగాన్ని అర్పించేవారు. ఈ ప్రథమఫలం గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, ఏటా కొత్త పంట రాగానే, ఆగస్టు 24న ప్రథమ ఫలాలను అర్పించే తంతు జరిగేది. తిరిగి నవంబర్ 8న దాని మూత తెరిచి అందులోంచే మరో పంటకు విత్తనాలు తీసుకునేవారు. ఆ మూత తెరవడం మతపరమైన తంతుగా శాస్త్రోక్తంగా జరిగేది. తలుపు తెరచి ప్రేతాత్మలను బయటికి రప్పించే పద్ధతిలో అది ఉండేది. ఎందుకంటే, ఆ ధాన్యాగారం కోశాగారాన్నీ, గిడ్డంగినే కాక సమాధినీ తలపించేలా ఉండేది. అంటే, ప్రేతాత్మలు, విత్తనాలు అందులో సహజీవనం చేసేవన్నమాట.

అలాగే, ఎల్యూసిస్ అనే చోట ఉన్న డిమీటర్ అనే దేవతకు గ్రీకు రాజ్యాలు అనేకం ప్రథమఫలాలను పంపించడం ఆనవాయితీగా ఉండేది. ఆకురాలు కాలం వరకు వాటిని నిల్వ ఉంచి, ఆ తర్వాత రైతులకు విక్రయించేవారు. రైతులు వాటిని మిగతా విత్తనధాన్యంలో కలిపి కొత్తపంటకు ఉపయోగించేవారు. ఇవన్నీ లౌకికమైన చర్యలే కానీ వీటిని మతపరమైన తంతుగా జరపడం తప్పనిసరి. ఆదిమకాలంలో లౌకికమైన చర్యకు, మతపరమైన తంతుకు తేడా ఉండేది కాదని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం.

మొదట్లో ఆలయాలుగా, నివాసాలుగా ఉపయోగపడిన గుహలు, పాతాళగృహాలు క్రమంగా సమాధులు, ధాన్యాగారాల నిర్మాణానికి నమూనాను అందించినట్టు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒకరకంగా ఆయా నిర్మాణాల తాలూకు పరిణామక్రమాన్ని, చరిత్రనే చెబుతుంది. ఇలా చూసినప్పుడు, అలవాటు పడిపోవడం వల్ల అంత విశేషంగా తీసుకోని గుహాలయాలు, పాతాళమందిరాలు పురాచారిత్రకు సాక్ష్యాలుగా సరికొత్త రూపంలో కనిపించి ఆసక్తిని రేపుతాయి.

అందులోనూ మన రామాయణం, మహాభారతం లాంటి ప్రాచీన సాహిత్యంలో పురామానవ చరిత్ర తాలూకు ఆనవాళ్ళను పట్టుకోవడం మరింత ఆసక్తికరం. గుహలు అనేటప్పటికి నాకు రామాయణం, కిష్కింధకాండలోని ఒక ఘట్టం చటుక్కున గుర్తుకొచ్చింది. అది ఇలా సాగుతుంది:

సుగ్రీవుడి ఆజ్ఞపై సీతను వెతకడానికి దక్షిణదిశకు వెళ్ళిన వానర వీరులలో హనుమంతుడు, అంగదుడు మొదలైనవారు ఉన్నారు. వారు సీతను వెతుకుతూ వింధ్యపర్వతం దాకా వెళ్ళారు. మొదట పర్వతం లోతట్టున ఉన్నగుహలను, అడవులను గాలించారు. గుట్టలు, గుబురులు శోధించారు. తర్వాత వింధ్యపర్వతం పై భాగం మీదికి వెళ్ళారు. అక్కడ ఇంకా పెద్ద గుహలు కనిపించాయి. వాటిలో అన్నింటికంటే పెద్దదైన ఒక బిలం వాళ్లను ఆకర్షించింది. దానిపేరు ఋక్షబిలం. అంటే, ఎలుగుబంట్ల బిలం. చెట్లూ, వాటికి దట్టంగా తీగలు అల్లుకోవడంతో దాని ముఖద్వారం సరిగా కనిపించడం లేదు. అంతలో లోపలి నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురుపక్షులు ఎగురుతూ వచ్చాయి. అవి నీటిలో తడిసి ఉన్నాయి. దప్పికతో ఉన్న వానరులు లోపల నీటి జాడ ఉన్నట్టు తెలిసి సంతోషించారు. అతికష్టం మీద లోపలికి ప్రవేశించారు. లోపల చాలాదూరం చిమ్మ చీకటి వ్యాపించి ఉంది. క్రమంగా వెలుగు కనబడింది. సింహాలు, ఇతర మృగాలు తిరుగుతూ కనిపించాయి.

కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంత వనం కనిపించింది. అందులో రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. బంగారాన్ని, వెండిని తాపడం చేసిన భవనాలు ఉన్నాయి. ఆ వనంలో ముందుకు వెళ్ళిన తర్వాత జింకచర్మాన్ని వస్త్రంగా ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె గొప్ప తేజస్సుతో దివ్యస్త్రీలా కనిపిస్తోంది. పరస్పరం పరిచయం చేసుకున్నారు. తన పేరు స్వయంప్రభ అనీ, తను మేరుసావర్ణి కూతురినని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ బిలం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది:
ఈ బిలంలోని భవంతులను, వనాలను మయుడనే దానవుడు సృష్టించాడు. అతడు హేమ అనే అప్సరసను మోహించాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మండిపడ్డాడు. అతణ్ణి చంపేసాడు. అప్పుడు బ్రహ్మ ఆ బిలంలోని వనాన్ని, బంగారు గృహాలను హేమకే కానుకగా ఇచ్చేసాడు. తన ప్రియసఖి అయిన హేమ ఈ వనాన్ని, భవనాలను సంరక్షించే బాధ్యతను తనకు అప్పగించింది.

ఇంతా చెప్పిన తర్వాత, “ఈ బిలంలోకి ప్రవేశించినవారు ప్రాణాలతో బయటపడడం కష్టమే. మీరు ఎలా బయటకు వెడతా’రని వానరులను అడిగింది. నువ్వే మిమ్మల్ని బయటపడేయాలని వారు ఆమెను ప్రార్థించారు. చివరికి ఆమె సాయంతో అందులోంచి బయటపడ్డారు.

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఒక నిర్జన పర్వత ప్రాంతంలో, ఎవరికీ అంత తేలికగా చొరడానికి వీలు కాని ఒక మహాబిలంలో, సింహాల వంటి క్రూర జంతువుల మధ్య, మగతోడు లేకుండా స్వయంప్రభ అనే స్త్రీ ఒంటరిగా నివసిస్తుండడమే చూడండి…ఇది లీలగా ఒకనాటి మాతృస్వామ్యాన్ని సూచిస్తోందా? పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని మరోలా అన్వయించుకోవడం కష్టమే. అలాగే, ఇది చదువుతున్నప్పుడే, ఓడిసస్ కథలో చెప్పుకున్న గ్రీకు అప్సరస సిర్సే గుర్తుకొచ్చి ఉండాలి. సిర్సే కూడా ఒక దీవిలోని అడవిలో నునుపు రాళ్ళతో కట్టిన ఒక భవనంలో ఒంటరిగానే ఉంటూ ఓడిసస్ సహచరులకు కనిపించింది. స్వయంప్రభ ఉన్న బిలంలో వానరులకు సింహాలు, ఇతర మృగాలు కనిపించినట్టే; సిర్సే భవంతికి అన్నివైపులా సింహాలు, తోడేళ్ళు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి మందు పెట్టడం వల్ల అవి సాధుజంతువులుగా మారిపోయాయని కథకుడు చెబుతున్నాడు.
సిర్సే లానే ఋక్షబిలం యజమానురాలు హేమ కూడా అప్సరసే. ఆమెను మోహించిన నేరానికి ఇంద్రుడు మయుని చంపాడు సరే, మయునికి చెందిన వనాన్ని, బంగారు గృహాలను హేమకు బ్రహ్మ కానుకగా ఇవ్వడమేమిటి? ఇందులో ఎలాంటి అర్థమూ కనిపించదు. అలాకాక, హేమకు, మయునికి ఏదో ఒక సంబంధం ఉందనుకుంటేనే అతని సంపద ఆమెకు లభించడంలో అర్థం ఉంటుంది. ఆ సంబంధం సిర్సేకు, ఓడిసస్ కు ఉన్న సంబంధం లాంటిదా?

సిర్సే తన భవంతి దగ్గరకు వచ్చిన ఓడిసస్ సహచరులను లోపలికి ఆహ్వానించి వారిని పందులుగా మార్చివేసింది. ఇది తెలిసి ఓడిసస్ ఆమెపై ప్రతీకారానికి బయలుదేరినప్పుడు హెర్మన్ అనే దేవుడు ఎదురై, ఆమెను లొంగదీసుకునే ఉపాయం చెప్పాడు. ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. దాంతో ఆమె లొంగిపోయింది. అలా జరిగి ఉండకపోతే తన సహచరులకు పట్టిన గతే అతనికీ పట్టి ఉండేది.

ఇదే కథను మయునికి, హేమకు అన్వయించి చూస్తే, సిర్సే వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి ఓడిసస్ బయటపడగా; మయుడు బయటపడలేకపోయాడనుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, హోమర్ ఓడిసస్ కథకు, వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టానికీ ఉన్న పోలిక!

ఇంకో స్పష్టమైన పోలిక చూడండి…’ఈ బిలంలోకి ప్రవేశించినవారు ఎవరైనా ప్రాణాలతో బయటపడడం కష్టం. మీరెలా బయటపడతా’రని వానరులను స్వయంప్రభ అడుగుతుంది. సిర్సే భవంతిలో ఓడిసస్ సహచరులకు, ఓడిసస్ కు ఎదురైన పరిస్థితి దాదాపు అదే.

ఇంతకీ రామాయణంలోని ఈ ఋక్షబిలం ఉదంతం, పురాకాలంలో గుహలే మానవ ఆవాసాలన్న చారిత్రక వివరాన్ని నమోదు చేస్తోందా?! అవుననే అనిపిస్తోంది. రామాయణంలో పురా చారిత్రక సమాచారం లభించడం ఎంత అపురూపం, ఎంత అద్భుతం!!

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

బృందావన కృష్ణుడు… సోషల్ ఇంజనీరింగ్!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)బుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే!

బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. సాలవృక్షం శాక్యులకు పూజనీయం(టోటెమ్). విక్రమార్కుని కథలోని సాలభంజికలు ఈ చెట్టు కలపతో చేసినవే.

అక్కడో సాలవనం ఉంది. అది అమ్మవారి వనం. అందులోని అమ్మవారి పేరు లుంబిని. బుద్ధుడి తల్లి మాయాదేవి దగ్గరలోని శాక్యులకు చెందిన ఒక పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి వనంలోకి వెళ్ళి అమ్మవారిని కొలిచింది. అప్పుడే నొప్పులు వచ్చి ఆ వనంలోనే బుద్ధుని ప్రసవించింది.

బుద్ధుణ్ణి మరచిపోయి ఉండచ్చుకానీ ఆ ప్రాంత జనం ఇప్పటికీ ఆ వనంలోని అమ్మవారిని పూజిస్తూ ఉంటారని కోశాంబీ అంటారు. కాకపోతే లుంబిని కాస్తా ఇప్పుడు ‘రుమ్మిందీ’ అయింది. ఆచారాలు ఎంత బలీయమైనవో, కాలాన్ని జయించి అవి ఎలా కొనసాగుతాయో ఇది చెబుతుంది.

ఇప్పుడు మళ్ళీ పురాణకథల్లోకి ఒకసారి వెడదాం:

ఉత్తరప్రదేశ్ లో కృష్ణుడి జన్మస్థానమైన మధుర, దానికి దగ్గరలో ఉన్న బృందావనం, గోకులం నేటికీ ప్రసిద్ధపుణ్యక్షేత్రాలు. ఈ మూడింటినీ కలిపి ‘వ్రజభూమి’ అంటారు. బృందావనం అమ్మవారివనమే. ‘బృంద’ కొందరు అమ్మవార్ల గుంపు (బృందం) ను సూచించే ఉమ్మడి పేరనీ, ఆ అమ్మవార్ల వనమే బృందావనమనీ కోశాంబీ వివరణ. తులసి రూపంలో ఈ దేవతను పూజిస్తారు. కంసుని వల్ల కృష్ణునికి ప్రాణభయం ఉండడంతో అతని పెంపుడు తల్లిదండ్రులైన యశోదా నందులు గోకులాన్ని బృందావనానికి తరలించారు. బృంద దేవతకు ఏటా జరిగే ఉత్సవాలలో నరబలి కూడా ఉండేదనీ, కృష్ణుడు దీనిని మాన్పించాడనీ కోశాంబీ అంటారు. దీని గురించి Myth and Reality లో మరింత సమాచారం ఉంది కానీ ఇప్పుడు అందులోకి వెళ్లలేం.

కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDIA in Historical Outline) అంటారు. ఉషస్సనే స్త్రీని ఇంద్రుడు చంపాడని చెబుతున్నా, ఆమె బతికి బయటపడినట్టుగా; పూతనను కృష్ణుడు చంపాడని అన్నా ఆమె చావలేదనీ, మధుర ప్రాంతంలో ఇప్పటికీ పిల్లలకు పూతన పేరు పెడతారనీ ఆయన వివరణ.

‘బహుశా’ అని కోశాంబీ ఎందుకు అన్నారో కానీ, పూతన అమ్మవారే ననడానికి, భాగవతం, దశమస్కంధంలోని పూతన వధ ఘట్టంలోనే స్పష్టమైన సాక్ష్యం ఉంది. గోపికలు కృష్ణుడికి రక్ష పెడుతూ, “నిన్ను తలచుకున్నవారికి వృద్ధ, బాల గ్రహాల వల్ల , భూతప్రేత పిశాచాల వల్ల ఎలాంటి భయమూ ఉండదనీ, పూతనాది మాతృకా గణాలు నశిస్తాయనీ” అంటారు. మాతృకా గణాలంటే అమ్మవార్లే. కుమారస్వామి కథలో కూడా ఈ మాతృకా గణాల ప్రస్తావన వస్తుంది. ఇక్కడ ‘గణాలు’ అనే మాట ‘సమూహాలు’ అనే అర్థంలో వాడినట్టు కనిపించవచ్చు కానీ, పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ మాట ఒకనాటి గణవ్యవస్థనే సూచిస్తూ ఉండవచ్చు. ఒకప్పుడు నిర్దిష్టార్ధంలో ఉపయోగించిన మాటలు కాలగతిలో నిర్దిష్టార్ధం కోల్పోయి సామాన్యార్ధం తెచ్చుకోవడం పరిపాటే. గ్రీకు పురాచరిత్ర సందర్భంలో జార్జి థాంప్సన్ కూడా ఇలాంటి ఉదాహరణలను కొన్నింటిని ప్రస్తావించారు.

వాస్తవంగా ఏం జరిగి ఉండచ్చంటే, పూతనను కృష్ణుడు చంపలేదు, లొంగదీసుకున్నాడు! అంటే, మాతృకాగణాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే, అమ్మవార్ల ఆరాధనకంటే ఉన్నతస్థానంలో, తన రూపంలోని పురుషదేవుడి ఆరాధనను స్థాపించడానికి ప్రయత్నించాడు. అమ్మవారి ఆరాధన అంతరించలేదు కానీ, ద్వితీయస్థానానికి జారిపోయింది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న భారతదేశ ప్రత్యేకతను వెల్లడిస్తుంది. ఇక్కడ ఏదీ ఒకదానినొకటి అంతరింపజేయదు. భిన్నత్వాల మధ్య సర్దుబాటు జరుగుతుంది. కృష్ణుడు చేసినదానిని సామాజికార్థంలో తీసుకుంటే, మాతృస్వామ్యంపై పితృస్వామ్యాన్ని స్థాపించడంలో ఆయన ఒక పాత్ర నిర్వహించాడన్నమాట.

sacred grove in vrindavan

బృందావనం కథ కూడా అమ్మవార్లపై కృష్ణుడు తన ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రక్రియలో భాగమే. బృందను కృష్ణుడు పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే, బృందారాధన(అమ్మవార్ల ఆరాధన)ద్వితీయస్థానానికి జారిపోవడమూ; కృష్ణారాధన, బృందారాధనల మధ్య సర్దుబాటూ జరిగాయన్నమాట. కృష్ణుడు నరబలిని మాన్పించడం ద్వారా బృందారాధనను సంస్కరించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడి భార్యల సంఖ్య 16,108కి చేరుకోవడంలోని రహస్యం, ఆయన అమ్మవార్లను పెళ్లాడి (పైన చెప్పిన సర్దుబాటు అర్థంలో), అప్సరసలతో రాసక్రీడలు జరపడమే. అప్సరసలే గోపికలుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవార్లతోపాటు అప్సరసలు కూడా ఇంతకుముందు చెప్పుకున్న స్త్రీ సూత్రం (female principle)లో భాగాలే. ‘ఎలుగుబంటి’ తెగకు నాయకుడైన జాంబవంతుడి కూతురు జాంబవతి, అప్పటికింకా ఆటవిక దశలోనే ఉన్న భోజకుల ఆడబడుచు రుక్మిణి మొదలైనవారిని కృష్ణుడు పెళ్లాడడం; భిన్న భిన్న తెగలలోకి కృష్ణారాధనను శాంతియుతంగా చొప్పించే ప్రయత్నమేనని కోశాంబీ అంటారు. కృష్ణుడి వివాహాలు మాతృస్వామ్యానికి చెందిన కొన్ని అనార్య తెగలను ఆర్యుల పితృస్వామిక వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియలో కీలకమైన ముందడుగుగా ఆయన వర్ణిస్తారు. నేడు మనం చెప్పుకునే ‘సోషల్ ఇంజనీరింగ్’ కు ఇది చక్కని ఉదాహరణ.

ఇలా కృష్ణుడు పితృస్వామ్య స్థాపనలో కీలక పాత్ర వహించాడనీ, లేదా పితృస్వామ్య స్థాపనలో భాగంగా కృష్ణుడి పాత్రను నిర్మించారనీ అనుకుంటే ఆయన దశావతారాలలో ఎందుకు చేరాడో అర్థమవుతుంది. అమ్మవార్ల ఆరాధనలోకి, లేదా మాతృస్వామిక రూపాలలోకి కృష్ణుడు తన ఆరాధనను చొప్పించిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గోపికావస్త్రాపహరణం ఒక కీలక ఉదాహరణ.

పోతన భాగవతం, దశమస్కంధంలోని ఆ కథ ఇలా సాగుతుంది:

హేమంత ఋతువులో మొదటి నెల తొలిదినాలలో నందుని మందలో ఉన్న గోపికలంతా పొద్దుటే లేచి కాళిందీనదికి వెళ్ళి స్నానం చేశారు. నది ఒడ్డున ఇసుకతో కాత్యాయినీరూపం చేసి, పువ్వులు,గంధంతో, ధూపదీపాలతో పూజించి నైవేద్యాలు పెట్టారు. కృష్ణుడిని తమకు పతిని చేయమని అమ్మవారిని ప్రార్థించారు. ఇలా నెలరోజులపాటు కాత్యాయనీ వ్రతం చేశారు.

ఆ నెలరోజుల్లోనే ఒకరోజున కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్లారు. ఒక నిర్జన ప్రదేశంలో చీరలు విప్పి గట్టున పెట్టి నదిలోకి దిగారు. దూరం నుంచే కృష్ణుడు ఇది చూసి, తన తోటి గోపకులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వారిని కదలకుండా అక్కడే ఉండమని చెప్పి తను పొదల మాటునుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి గట్టున ఉన్న చీరలను ఎత్తుకు వెళ్ళి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు.

గోపికలు చూశారు. ‘’మా మాన మెందుకు హరిస్తావు? మా చీరలు మాకు ఇచ్చేయి అని అనేకరకాలుగా ప్రార్థించారు. ‘’నీళ్ళలోంచి బయటకు వచ్చి మీ చీరలు తీసుకొండని కృష్ణుడు అన్నాడు. గోపికలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, “ఆడవాళ్ళు స్నానం చేసే చోటికి మగవాళ్ళు రావచ్చా? వచ్చినా ఇలాంటి పనులు చేయచ్చా? నీకు దాసులమవుతాం. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం. ఏమైనా ఇస్తాం. ఇప్పుడు మాత్రం దయచేసి మా చీరలు మాకు ఇచ్చేయి” అన్నారు.

‘’ఇంతకీ ఎవరు మొగుడు కావాలని వ్రతం చేస్తున్నారు? మీకు ఎవరి మీద వలపు కలిగింది?’’ అని కృష్ణుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు హృదయంలో మన్మథుడు సందడి చేస్తుండగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గోపికలు మౌనంగా ఉండిపోయారు.

‘’నా ఇంటికి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటామంటే మీ చీరలు మీకిస్తాను. నీళ్ళలోంచి బయటకు రండి’’ అన్నాడు కృష్ణుడు.

చలికి నీళ్ళలో ఉండలేక, బయటకు రాలేక గోపికలు సతమతమయ్యారు. ఏమైతే అయింది, వెడదామని కొందరు అన్నారు. వెడితే కృష్ణుడు మన సిగ్గు తీస్తాడని కొందరు అన్నారు. చివరికి ఎలాగో మనసు గట్టి చేసుకుని, అరచేతితో మానం కప్పుకుంటూ వరసకట్టి నీళ్ళలోంచి బయటకు వచ్చారు.

‘’ఎందుకు సిగ్గు పడతారు? నాకు తెలియని మీ రహస్యం ఏముంది? వ్రతనిష్టలో ఉండి ఇలా చీరలు విప్పేసి స్నానం చేయచ్చా? వ్రతఫలం దక్కాలంటే చేతులెత్తి మొక్కి చీరలు తీసుకొండని’’ డని కృష్ణుడు అన్నాడు.

వ్రతాలు చేసేటప్పుడు ఎవరిని తలచుకుంటే వ్రతభంగం ఉండదో ఆ దేవుణ్ణే తాము చూస్తున్నప్పటికీ, ‘అయ్యో చీరలు విప్పి ఈరోజు వ్రతభంగం చేశామే’ అనుకుంటూ గోపికలు రెండు చేతులూ ఎత్తి కృష్ణుడికి మొక్కారు. కృష్ణుడు చీరలు ఇచ్చేశాడు. “ చీరలు దొంగిలించి కృష్ణుడు మన సిగ్గు తీస్తే తీశాడు కానీ వ్రతంలో లోపం జరగకుండా మొక్కించి కాపాడాడు” అని అనుకుంటూ గోపికలు కృష్ణుని స్తుతించారు. చీరలు కట్టుకున్నారు.

అప్పుడు కృష్ణుడు వాళ్ళతో, ‘’సిగ్గుపడి మీ రహస్యం చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. నన్ను కొలవాలనే మీరు అనుకున్నారు. మీ నోము ఫలించేది నావల్లనే. నన్ను కొలిస్తేనే మీకు ముక్తి. ఆ తర్వాత అమ్మవారిని కొలిచి రాత్రిళ్ళు మీరు నన్ను పొందవచ్చు’’ అన్నాడు.

brundaavanamlo raadhaakrushnulu

ఈ ఘట్టానికే కాక, ఇలాంటి అనేక ఘట్టాలకు సంబంధించి సంప్రదాయం బోధించే ఆధ్యాత్మికఅన్వయాలు, రహస్యాలు వేరే ఉన్నాయి. అవి నా పరిశీలన పరిధిలోకి రావు కనుక వాటిలోకి వెళ్లను. పురాచరిత్ర కోణం నుంచి చూస్తే, గోపికలు కాళిందిలో స్నానం చేసి, ఇసుకతో కాత్యాయనీదేవి రూపం చేసి పూజించిన ప్రాంతంలో అమ్మవారి వనం ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ వివరాన్ని అందించడం కథకునికి అంత ముఖ్యంగా తోచి ఉండకపోవచ్చు. అతను ప్రధానంగా కృష్ణుడనే పురుషదేవుని పరంగా కథ చెబుతున్నాడు. అలాగే, గోపికలు యమునా నదికి వెళ్లి, చీరలు విప్పి స్నానం చేసిన ప్రదేశం స్త్రీలకు మాత్రమే ఉద్దేశించిన రహస్య ప్రదేశం కావచ్చు. అక్కడ అమ్మవారి వనమూ ఉండవచ్చు.

స్త్రీల రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కృష్ణుడు యథేచ్చగా ఉల్లంఘించాడన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్న గ్రీకు కథలతోనూ, దేవీభాగవతంలోని సుద్యుమ్నుని కథతోనూ దీనిని పోల్చి చూడండి. అర్తెమిస్ అనే గ్రీకు దేవత ఒక అడవిలోని కన్యాసరోవరంలో స్నానం చేస్తుండగా అక్కడికి వెళ్ళిన అక్తయాన్ అనే పురుషుణ్ణి అర్తెమిస్ లేడిగా మార్చివేసింది. దాంతో అతని వెంట ఉన్న వేటకుక్కలు లేడి రూపంలోని అక్తయాన్ పై దాడి చేసి చంపేసాయి. మరో కథలో డఫ్నే అనే యువతిని ప్రేమించిన ల్యుకప్పస్ అనే యువకుడు స్త్రీ వేషంలో వెళ్లి ఆమెతో స్నేహం చేశాడు. ఒకరోజున ఇతర చెలికత్తెలతో కలసి డఫ్నే దుస్తులు విప్పి జలక్రీడలాడడానికి సిద్ధమైనప్పుడు ల్యుకప్పస్ మగవాడని తెలిసి అతణ్ణి చంపేస్తుంది. దేవీభాగవతం కథలో అమ్మవారి వనంలోకి తెలియక ప్రవేశించిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. జగదేకవీరుని కథలో దేవకన్యలు స్నానం చేస్తుండగా చూసిన రాకుమారుని ఇంద్రకుమారి శిలగా మార్చివేస్తుంది.

కానీ, గోపికలు స్నానం చేస్తున్న రహస్యప్రదేశంలోకి కృష్ణుడు ప్రవేశించినా అతనికి ఏమీకాలేదు. పైగా, నగ్నంగా అతని ముందు నిలబడి గోపికలే శిక్షను ఎదుర్కొన్నారు. పై కథలలోని స్త్రీలకు, గోపికలకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. పై కథల్లోని స్త్రీలు తమ రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కచ్చితంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేశారు. తమ రహస్యప్రపంచ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. అందుకు భిన్నంగా గోపికలు బేలలుగా మారి తమ రహస్య ప్రపంచ ఆధిపత్యాన్ని పురుషుడికి ధారపోసేసారు. కృష్ణుడికి, వారికి జరిగిన సంభాషణ– వారు పురుషుడికి పూర్తిగా దాసోహమవడాన్నే వెల్లడిస్తుంది. ‘’నీకు దాసులమవుతాం, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం, ఏమి కోరినా ఇస్తాం, ఇప్పుడు మాత్రం చీరలు ఇచ్చేయ’’ మని వేడుకుంటారు. ఇది స్త్రీ అధికార పతనానికి కచ్చితమైన సూచన.

కృష్ణుడు కూడా వారిపై దాస్యాన్ని విధించడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. ‘’మీరు నా ఇంటి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటేనే చీరలు ఇస్తాను’’ అన్నాడు. గోపికలు అరచేత మానాన్ని కప్పుకుంటూ కృష్ణుడి ముందుకు వెళ్ళినా వారికి చీరలు దక్కలేదు. రెండు చేతులూ ఎత్తి మొక్కిన తర్వాతే దక్కాయి.

ఆ తర్వాత కృష్ణుడు గోపికలకు చేసిన ఉపదేశంలో, ‘’మీరు (ప్రధానంగా) మొక్క వలసింది అమ్మవారి( కాత్యాయని)కి కాదు, నాకు’’ అన్న సూచన స్పష్టంగా ఉంది. ‘’మీకు ముక్తిని ఇవ్వవలసింది నేనే (అమ్మవారు కాదు)’’ అన్న సూచనా అంతే స్పష్టంగా ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిషేధించలేదు. ‘’నన్ను కొలిచిన తర్వాత అమ్మవారిని కొలిచి నన్ను పొందండి’’ అన్నాడు. అంటే అమ్మవారి ఆరాధన ద్వితీయస్థానానికి జారిపోయింది. విశ్వాసరంగంలో ఇదీ భారతదేశ ప్రత్యేకత.

పురాచరిత్ర దృష్టి నుంచి చూస్తే, కృష్ణలీలను అర్థం చేసుకోవడంలో మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడం అనేది ఒక కీలకమైన దృక్కోణం.

***

జార్జి థాంప్సన్ ప్రకారం(Studies in Ancient Greek Society-The Prehistoric Aegean), ప్రాచీన గ్రీసులోనూ అమ్మవారి వనాలు ఉండేవి. అట్టికా అనే ప్రాంతంలో, ఒకే తెగకు చెందినవారు నివసించే స్థానిక స్వపరిపాలనా విభాగాలు (demes) 200 వరకు ఉండగా, వాటిలో ఒక చెట్టు పేరో, మొక్క పేరో పెట్టిన విభాగాలు 25 వరకూ ఉన్నాయి. అంటే, ప్రాచీన గ్రీసు అంతటా ఆయా తెగలలో వనమూలికల సంబంధమైన మాంత్రిక పద్ధతులు, చెట్లను పూజించడం ఉండేవనడానికి ఇది సూచన. Orgie అనే మాటకు విశృంఖల కామకేళి అని అర్థం. ఇది గ్రీకు పదం. ఈ పదానికి చెందినదే Orgas అనే మరో పదం. దున్నిన లేదా దున్నని ఒక పవిత్రక్షేత్రాన్ని(వనాన్ని) ఇది సూచిస్తుంది. ఇక్కడ Orgia అని పిలిచే రహస్య తంతులు జరుగుతాయి. ఇథికా అనే పట్టణం బయట ఉన్న పవిత్ర రావిచెట్ల వనం లాంటిదే ఈ పవిత్ర క్షేత్రం కూడా నని థాంప్సన్ అంటారు. ఇలాంటి వనాలే అయోనియన్ దీవుల్లోనూ ఉన్నాయనీ; యూరప్, ఆసియా గ్రామాలు అన్నిటా ఇవి కనిపిస్తాయనీ, భారతదేశంలో అయితే ఇప్పటికీ ఈ వనాలలో అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుందనీ ఆయన అంటారు.

పవిత్ర వనాలే కాదు, గుహలు కూడా ఆదికాలపు గుడులే!

దాని గురించి తర్వాత…

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

ఆదికాలపు గుడులు అమ్మవారి తోపులే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”

అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of the Universe అనడం గురించి గత వ్యాసంలో చెప్పుకున్నాం. వేరే భాషలో అన్నప్పటికీ ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.

ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.

Hekateఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. జార్జి థాంప్సన్ ప్రకారం, ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత కూడా. హెకటే, అర్తెమిస్ ఒకరే ననీ, ఈమె ప్రసూతి దేవత అనీ అంటారు. హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

ప్రతినెలా కృష్ణపక్షంలో పాడ్యమి రోజున, అంటే పౌర్ణమి మరునాడు స్త్రీలు గుండ్రని అప్పచ్చులు చేసి వాటి మీద కొవ్వొత్తి లాంటి దీపాలు గుచ్చి మూడు మార్గాల కూడలిలో ఉండే హెకటేకు నివేదనం చేస్తారు. ఇది చంద్రుడికి సంబంధించిన తంతు. మూడు మార్గాలు, చంద్రుడికి గల మూడు దశలను సూచిస్తాయి. నివేదనగా అర్పించే దీపాలను ప్రకాశికలు (shiners) అంటారు. చంద్రకాంతిని సంరక్షించడం వీటి వెనుక ఉద్దేశం.

మన దగ్గర కూడా స్త్రీలు శ్రావణమాసంలోనూ, కార్తీక పౌర్ణమి రోజునా వరిపిండి, బెల్లం కలిపి చలిమిడి ముద్దల్లా తయారుచేసి వాటి మీద వత్తి వేసి వెలిగించి పూజిస్తారు. ఇది కూడా చంద్ర సంబంధమైన తంతే.

నాకీ సందర్భంలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని ఒక తంతుపై కోశాంబి తన Myth and Reality లో చేసిన విశ్లేషణ గుర్తొస్తోంది. నాటకం తొలి అంకంలోనే ఒక కృష్ణపక్షం రోజున, నాయకుడైన చారుదత్తుడు సాయం సంధ్యాదికాలు చేసుకుని, గృహదేవతలకు నివేదన (బలి) సమర్పిస్తాడు. తర్వాత తన మిత్రుడైన మైత్రేయుని పిలిచి, కృతో మయా గృహదేవతాభ్యో బలిః, గచ్ఛ త్వం అపి చతుష్పథే మాతృభ్యో బలిం ఉపహార అని చెబుతాడు. “నేను గృహదేవతలకు బలి సమర్పించాను. నువ్వు చతుష్పథానికి, అంటే నాలుగు మార్గాల కూడలికి బలి తీసుకుని వెళ్లి అమ్మవార్లకు సమర్పించు” అని దీని అర్థం. సరిగ్గా అప్పుడే నాయిక వసంతసేన తన వెంటబడిన శకారుని తప్పించుకుంటూ చారుదత్తుని ఇంటికి వస్తుంది. అదే వారి తొలి కలయిక.

మార్గాల కూడలిలో బలి సమర్పించడంలో పైన చెప్పిన గ్రీకు తంతుకు, ఈ తంతుకు ఉన్న పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాకపొతే, గ్రీకు తంతు మూడు మార్గాల కూడలిలో జరిగేదైతే, మృచ్ఛకటికంలో పేర్కొన్నది నాలుగు మార్గాల కూడలిలో జరిగేది. అందులో స్త్రీలు అయితే, ఇందులో పురుషులు. ఈ తంతు కృష్ణపక్షంలో షష్ఠినాడు(ఆరవ రోజున), పట్టణశివార్లలో రాజమార్గం కూడలిలో జరిపేదిగా కోశాంబి గుర్తించారు. గుప్తుల కాలానికి (క్రీ.శ. ౩౦౦-5౦౦) ముందు నుంచే ఈ తంతు ఉండేదనీ, ఇది జనసామాన్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న తంతుగా కనిపిస్తుందనీ కోశాంబి అంటారు. గృహసంబంధమైన అన్ని తంతులను పూసగుచ్చినట్టు పొందుపరచిన బ్రాహ్మణ గ్రంథాలు దీనిని పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందంటారు. అలాగే, పి.వి. కాణే తన History of Dharmasastra లో సాయంకాలం ఇచ్చే ఇతర బలుల వివరాలు అన్నీ ఇచ్చి పై తంతు గురించి ఇవ్వకపోవడం, మొత్తంగా అమ్మవారికి జరిపే నివేదనల గురించి ముక్తసరిగా తేల్చివేయడంపై కూడా కోశాంబి విస్మయం వ్యక్తంచేస్తారు. పురామానవ పరిణామ శాస్త్రంపై బొత్తిగా లక్ష్యం లేకపోవడానికి ఇది నిదర్శనం అంటారు.

ఇక మనుస్మృతి (3-81-92) రోజూ నిర్వహించవలసిన ఒక తంతు గురించి చెబుతుంది. దాని పేరు వైశ్వదేవం. పిండాలు చేసి మొదట పితృదేవతలకు సమర్పించి, ఆ తర్వాత కుక్కలు మొదలైన జీవులకు, ‘అంటరాని’వారికి, రోగగ్రస్తులకు పెట్టడం ఈ తంతు. ఇందులో అమ్మవార్లకు నివేదనం ఇవ్వడం గురించి కానీ, చతుష్పథ ప్రస్తావన కానీ లేకపోవడాన్ని కోశాంబి ఎత్తిచూపుతారు. అమ్మవార్లకు బలి ఇవ్వడం మాతృస్వామికమైన తంతు అనీ, మనుస్మృతి పితృస్వామికానికి చెందినది కనుక అందులో అమ్మవారికి జరిపే తంతును పేర్కొనలేదనీ దీనినిబట్టి అనుకోవాలి. మృచ్ఛకటికం రచించిన శూద్రకుడు క్రీ.పూ. 2- క్రీ.శ. 4శతాబ్దాల మధ్య కాలానికి చెందివాడు కావచ్చని ఊహ. ఒకవేళ క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడనుకుంటే, అప్పటికి మాతృస్వామిక తంతులు కొనసాగుతున్నాయనీ, మనుస్మృతి అనంతర కాలంలో, బహుశా గుప్తుల కాలంలో సంకలనం అయిందనీ అనుకోవాలి. శూద్రకుని పేరు బ్రాహ్మణేతరుని సూచిస్తోంది కనుక, తనకు బాగా తెలిసిన బ్రాహ్మణేతరమైన తంతు గురించి ఆయన రాసి ఉండచ్చు.

అదలా ఉంచితే, గ్రీసులో జరిగే పండుగలలో, నిగూఢమైన తంతులలో హోమర్ పురాణగాధలకు ముందునాటి అవశేషాలు కనిపిస్తాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు. వాటిలో పురుష దేవుళ్ళకు కాక, స్త్రీ దేవతకే ప్రముఖస్థానం. ఆ దేవత కొలుపులు జరిగేది, మనకిప్పుడు బాగా తెలిసిన దేవాలయాలలో కాదు; మసకచీకటి(twilight) నిండిన తోపులు, లేదా వనాలలోనూ, పొలాలలోనూ, కందకాలలోనూ!

వనాలు, పొలాలలో అమ్మవారి కొలుపులు జరగడం అనేది గ్రీసులోనే కాదు, మొత్తం యూరఫ్ లోనూ, మనదేశంలోనూ, బహుశా ప్రపంచమంతటా ఉండేది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉండి ఉండచ్చు. ఇందుకు సంబంధించిన అనేక ప్రస్తావనలలో కొన్నైనా ఉటంకించుకోవలసిన అవసరం కనిపిస్తోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘సొంత కథ’ లో రాసిన వాక్యాలతో ప్రారంభిద్దాం:

ఊరికి ఒక మూల అమ్మవారి వనం ఉంది. ఒక విషముష్టి చెట్టు, నాలుగు ఊడుగు చెట్లు, కొన్ని బర్రెంక చెట్లు ఉన్నాయా వనంలో. వ్యవసాయ సమాజాన ఈ అమ్మవారి వనాలు ప్రపంచమంతటా ఉండేవి. అమ్మవారు సౌభాగ్యదేవత. ఈ వనాలు ఆమె ఆవాసం. ఈ వనంలో చెట్లు అల్లె కట్టినట్లు ఉంటాయి. అల్లి మధ్య ఏమీ ఉండదు. వనంలోని చెట్ల నెవరూ కొట్టరు. ఇప్పుడు పురుషాధిక్యాన్ని, పురుషదేవతలను ఆరాధించే దేశాల్లో ఒకప్పుడు జనం అంతా ఈ స్త్రీదేవతలనే, అంటే అమ్మవారినే ఆరాధించేవారని చరిత్రకారులంటున్నారు. గ్రామదేవత పేరు ఏదైనా కావచ్చు. ఆమె సౌభాగ్య దేవత. ఆమెనంతా గౌరి అంటారు.

గౌరికి ప్రాచీనకాలం నుంచీ వనాలే దేవాలయాలు- ఆమెకు ప్రత్యేకం గుళ్ళు ఉండవు. వ్యవసాయ కేంద్రాలైన పల్లెల్లో తప్ప వర్తక కేంద్రాలైన పట్నాల్లో గౌరి ఆరాధనలు కానరావు. రామాయణంలో గౌరీదేవి నివేశనం మిథిలానగరానికి ఆవల ఉండేదని వాల్మీకి అంటాడు. పెళ్ళికి ముందు తన సౌభాగ్యవర్ధనం కోసం చెలికత్తెలతో సీత గౌరీపూజకు వెళ్లింది. ఊరి చివరనే వసతి కల్పించుకున్న రాముడు ఆ సందర్భంలోనే సీతను చూశాడంటాడు వాల్మీకి. పెళ్ళికి ముందు కన్యలు గౌరీపూజ చేయడం ఆచారం. ఈ ఆచారం తెలుగునాట సంప్రదాయం పాటించేవారిలో నేటికీ కానవస్తుంది.

స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి, అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి పురుషులు ప్రవేశించకూడదనీ, ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం. మన దేవీభాగవతం లో కూడా అలాంటి కథే ఒకటుంది:

వివస్వంతుడనే రాజుకు శ్రాద్ధదేవుడనే కొడుకు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగపిల్లవాడి కోసం వశిష్టుని సలహాపై పుత్రకామేష్టి జరిపాడు. అయితే అతని భార్య శ్రద్ధాదేవి ఆడపిల్ల కోసం హోమం చేయించింది. కొంతకాలానికి ఆమె గర్భవతై ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ‘ఇల’ అని పేరుపెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు నిరుత్సాహం చెందిన భర్త ఈశ్వరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు అనుగ్రహించడంతో ఇల కాస్తా పురుషుడుగా మారిపోయింది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజున వేటకు వెళ్ళి ఒక మహావనంలో ప్రవేశించాడు. వెంటనే స్త్రీగా, అంటే ఇలగా మారిపోయాడు. దాని వెనుక కథ ఏమిటంటే, ఒకప్పుడు ఆ వనంలో శివపార్వతులు క్రీడిస్తుండగా మునులు ఆ సంగతి తెలియక ఆ వనంలోకి ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. శివుడికి కోపం వచ్చి, పురుషులెవరైనా ఈ వనంలోకి అడుగుపెడితే స్త్రీగా మారిపోతారని శపించాడు.

సుద్యుమ్నుడే కాక అతని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అతను ఏం చేయాలో తెలియక అడవిలో తిరుగుతూ చంద్రుడి కొడుకైన బుధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. వారికి పురూరవుడు జన్మించాడు. తర్వాత శివుని ప్రార్థించిన సుద్యుమ్నుడు ఒక నెల పురుషుడిగానూ, ఒక నెల స్త్రీగానూ ఉండేలా వరం పొందాడు. అందుకు కూడా సంతృప్తి చెందక ఈసారి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అతనికి ఎప్పుడూ పురుషుడిగానే ఉండేలా వరమిచ్చింది.

ఇది అంతిమంగా అయ్యవారి(శివుడు) మహిమ కంటే అమ్మవారి మహిమదే పై చేయి అని చెబుతున్న ఒక పురాణకథే కానీ, మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య పోటీని సూచించే ఒక చారిత్రకదశనూ ఇది ప్రతిఫలిస్తూ ఉండచ్చు. భర్త మగపిల్లవాడిని కోరితే భార్య ఆడపిల్లను కోరుకోవడమే చూడండి. కానీ ఆ ఆడపిల్లను మగపిల్లవాడిగా మార్చివేయడం ద్వారా భర్త తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు. కానీ శివుని శాపం వల్ల ఆ అబ్బాయే మళ్ళీ స్త్రీగా మారిపోవడం, మధ్యేమార్గంగా నెల రోజులు స్త్రీగానూ, నెలరోజులు పురుషునిగానూ ఉండవలసి రావడం; తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల పూర్తికాలం పురుషుడిగా మారిపోవడం సంభవించాయి. ఇందులోని మాతృస్వామిక/పితృస్వామిక స్పర్థకు సంబంధించిన కోణాన్ని మరీ సాగదీయకుండా మీ ఊహకే వదిలేస్తాను.

దేవీభాగవతంలోనే ఇలాంటి కథ మరొకటి ఉంది:

ఒకసారి నారదుడు విష్ణుమాయ ఎలాంటిదో చెప్పమని విష్ణువును కోరాడు. విష్ణువు సరేనని దగ్గరలో ఉన్న ఒక కొలను చూపించి అందులో మునగమన్నాడు. మునిగి బయటికివచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోయాడు. ఆమెను తాళధ్వజుడనే రాజు చూసి మోహించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి కొడుకులు కలిగారు. కొంతకాలానికి శత్రువులు రాజ్యంపై దండెత్తి కొడుకుల్ని చంపేశారు. అప్పుడు స్త్రీరూపంలో ఉన్న నారదుడు దుఃఖిస్తుండగా విష్ణువు ప్రత్యక్షమై ఎవరూ శాశ్వతం కాదని బోధించి మళ్ళీ వెనకటి కొలనులో మునగమన్నాడు. నారదుడు అందులో మునిగి మళ్ళీ పురుషుడిగా మారిపోయాడు.

కొంచెం విషయాంతరంలా కనిపించినా పై పురాణకథలతో ఉన్న పోలిక దృష్ట్యా ఒక గ్రీకు పురాణ కథనూ ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది:

జియస్ దేవతల నాయకుడు(మన బ్రహ్మదేవుడి లాంటివాడనుకుందాం). అతని అర్థాంగి హేరా. ఓసారి ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు, “సంభోగంలో మీ ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు” అన్నాడు జియస్ భార్యతో నవ్వులాటగా. హేరా “అది అబద్ధం” అంది. కాసేపు వాదించుకున్న తర్వాత, టెరేసియస్ అనే ఒక మునిని పిలిపించి తమిద్దరిలో ఎవరిది నిజమో చెప్పమని కోరారు.

అతన్నే అడగడానికి కారణం ఏమిటంటే, అతనోసారి అడవిలో తిరుగుతూ, సంభోగిస్తున్న పాముజంటను చూశాడు. కర్రతో వాటిని కొట్టాడు. వెంటనే స్త్రీగా మారిపోయాడు. అలా ఏడేళ్లపాటు స్త్రీగా ఉండిపోయాడు. ఎనిమిదో ఏట మళ్ళీ అదే అడవికి వెళ్లినప్పుడు ఆ పాముజంటే మళ్ళీ సంభోగిస్తూ కనిపించింది. కిందటిసారి కర్రతో కొట్టినప్పుడు స్త్రీగా మారిపోయాడు కనుక, ఈసారి కొడితే పురుషుడిగా మారిపోవచ్చుననుకుని అలాగే చేశాడు. పురుషుడిగా మారిపోయాడు. ఈవిధంగా అతనికి స్త్రీ గానూ, పురుషుడిగానూ జీవించిన అనుభవం ఉంది. అదీ అతన్ని తీర్పు చెప్పమనడానికి కారణం.

జియస్ చెప్పిందే నిజమని టెరేసియస్ అన్నాడు. దాంతో హేరాకు కోపం వచ్చింది. అంధుడివి కమ్మని శపించింది. అప్పుడు జియస్ జోక్యం చేసుకుని ఆ శాపానికి పరిహారంగా అతని భవిష్యత్తును చెప్పగల శక్తిని ఇచ్చాడు.

ఈ కథకు మన ప్రస్తుతాంశానికి అవసరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. మళ్ళీ అమ్మవారి వనాల దగ్గరికి వెడితే…

Golden Bough

Golden Bough

ఇంగ్లీష్ రొమాంటిసిస్ట్ చిత్రకారుడు జోసెఫ్ మల్లార్డ్ విలియం టర్నర్(1775-1851) గీసిన The Golden Bough చిత్రం ప్రసిద్ధం. ‘బంగారు కొమ్మ’అని ఆ మాటకు అర్థం. సర్ జేమ్స్ ఫ్రేజర్(1854-1941) మాంత్రికత, మతం పై తను రాసిన ప్రఖ్యాత రచనకు ఆ పేరే పెట్టి, ముఖచిత్రంగా ఆ చిత్రాన్నే వాడుకున్నారు.

ఇటలీలో ఇప్పుడు నేమి అనే గ్రామం ఉన్నచోట ఒక చెట్ల తోపు, నేమి అనే పేరుతోనే ఒక సరస్సు ఉన్నాయి. ఆ సరస్సులోని నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉంటాయంటే, ఆ సరస్సు అనే అద్దంలో అక్కడి దేవత డయానా తన ప్రతిబింబాన్ని చూసుకుంటుందనేవారు. ఆ సరోవర తీరంలోనే నిద్రపోతున్నట్టు ఉండే రెండు ఇటలీ గ్రామాలతో సహా ఎంతో ప్రశాంతత ఉట్టిపడే ఆ పరిసరాలను ఒకసారి చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరని ఫ్రేజర్ అంటారు. టర్నర్ చిత్రం స్వర్ణకాంతులనీనుతూ, ఒక స్వాప్నిక దృశ్యంలా ఉంటుందని అంటూ -ఆ చిత్ర పరిచయంతోనే తన రచన ప్రారంభిస్తారు.

ఇంతకీ విషయమేమిటంటే, ఆ సరోవరాన్ని అనుకుని ఉన్న చెట్ల తోపు, దేవత డయానాకు చెందిన ఒక పవిత్రవనం(Sacred Grove)! దాని గురించి ఆ తర్వాతి పేరాలోనే ఫ్రేజర్ ఇచ్చిన వివరాలు పై ఆహ్లాదకర చిత్రణకు భిన్నంగా విషాదాన్ని, భయాన్ని, గగుర్పాటును కలిగించేలా ఉంటాయి. ఈ పవిత్రవనంలో ఒక చెట్టు దగ్గర పగలంతా, రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఒక వ్యక్తి వేటగాడిలా పొంచి ఉంటాడు. అతని చేతిలో సంధించిన కరవాలం ఉంటుంది. అతని ముఖం క్రూరంగా భయంగొలుపుతూ ఉంటుంది. అతను ఆనుక్షణం వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అతను ఒక పూజారి, రాజూ కూడా. రెండు వ్యవస్థలూ ఒకరి కిందే ఉన్న కాలం అది. అయితే ఆ పూజారి-రాజు పదవి అతను మరణించిన తర్వాత అతని వారసులకో, మరొకరికో అనాయాసంగా అందేది కాదు. అతణ్ణి చంపి మరొకరు దానిని చేజిక్కించుకోవలసిందే. అందుకే ఆ వ్యక్తి ప్రతి క్షణం ప్రాణగండాన్ని, పదవీగండాన్ని ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండవలసిందే. అయినాసరే, ఏ క్షణంలోనైనా పదవితోపాటు, ప్రాణమూ పోకతప్పదు.

పూజారిత్వానికి సంబంధించిన ఈ విచిత్రమైన నిబంధనతో పొల్చదగినదేదీ ప్రాచీన ఇతిహాసకాలంలో కనిపించదనీ, దీనిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రాచీనతలోకి వెళ్లాలని ఫ్రేజర్ అంటారు. అంటే, స్త్రీ దేవతే ప్రాధాన్యం వహించిన మాతృస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట.

అదలా ఉంచితే, ‘దేవాలయం’ అనే మాటకు జర్మన్ భాషలో ఉన్న పర్యాయపదాలను పరిశిలిస్తే, జర్మన్ల అతి పురాతన ఆరాధనాప్రదేశాలు అడవులు, లేదా వనాలే నని అర్థమవుతుందని ఫ్రేజర్ అంటారు. ఆయన ప్రకారం, యూరప్ కు చెందిన ఆర్య తెగలు అన్నిటా చెట్లను పూజించడం ఉంది. కెల్టులలో ఆరాధనా ప్రదేశాన్ని సూచించే పురాతన పదం వ్యుత్పత్తిలో, అర్థంలో లాటిన్ పదం ‘నెమస్’ (nemus)కు తుల్యంగా ఉంటుంది. దానికి వనం లేదా తోపు అనే అర్థం. పైన పేర్కొన్న ‘నేమి’కి, లాటిన్ ‘నెమస్’ కు ఉన్న సంబంధం తెలుస్తూనే ఉంది. ప్రాచీన జర్మన్లలో పవిత్ర వనాలు సర్వసాధారణమే కాక, అందులోని చెట్లను నరికినా, బెరడు తీసినా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ప్రాచీన స్వీడన్ లోనూ, 14వ శతాబ్దిలో క్రైస్తవంలోకి మారేవరకు లిథుయేనియాలోనూ పవిత్రవనాలు సర్వ సామాన్యం. యూరప్ లోని ఫిన్నిష్-ఉగ్రియాన్, ఓల్గా తెగలకు చెందిన పవిత్రవనాలలోకి స్త్రీల ప్రవేశం నిషిద్ధం.

వ్యవస్థ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే, పవిత్ర వనాలలో ప్రవేశంపై ఉండే నిషేధమూ తారు మారు అయిందంటూ కోశాంబి (The Culture and Civilisation of ANCIENT INDIA in Historical Outline) ఇలా అంటారు:

కొన్ని చోట్ల (కొలీనా అని పిలిచే వ్యక్తి) స్త్రీ దుస్తులు ధరించి హోలీ మంట దగ్గర జరిగే నృత్యంలో పాల్గొంటాడు. బెంగళూరు లో ఏటా జరిగే కరగ ఉత్సవంలో పాల్గొనే ముఖ్య వ్యక్తి స్త్రీ దుస్తులు ధరిస్తాడు. పశ్చిమభారతంలోని పార్థీలు జరిపే సౌభాగ్యతంత్రాలలో కూడా పురుషులు స్త్రీ దుస్తులు ధరిస్తారు. ఈ తంతులు, ఉత్సవాలు అన్నీ మొదట్లో స్త్రీలకు చెందినవి. ఆ తర్వాత పురుషులు వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

అలాగే, బ్రాహ్మణ పురాణాలు అమ్మవారికి చెందిన పవిత్ర వనాలను ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటి వనాలు ఇప్పటికీ గ్రామాలలో రహదారికి దూరంగా కనిపిస్తాయి. అయితే, వలసవచ్చిన వ్యవసాయదారుల చేతుల్లోకి పూజారిత్వం పోకుండా, స్థానిక తెగ చేతుల్లో ఉంటే తప్ప; సాధారణంగా ఈ వనాలలోకి ఇప్పుడు స్త్రీల ప్రవేశం నిషిద్ధం. మొదట్లో ఈ నిషేధం పురుషులపై ఉండేది. సమాజం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే పూజారిత్వమూ, తంతులూ కూడా చేతులు మారాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

 

 

“చూడుమా చందమామా…అటు చూడుమా…”

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.

విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా… మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి…చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి.

ఆకాశమూ, చంద్రుడు, తారలు, వెన్నెల, పువ్వులు సినీ జగత్తుకే కాక కావ్యజగత్తుకూ తప్పనిసరి నేపథ్యాలు. కవిసమయాలుగా అలంకారశాస్త్రాలలో చోటుచేసుకున్నవి కూడా. కావ్యాలు, ప్రబంధాలలో ప్రకృతివర్ణనలు, విరహంలో ఉన్న ప్రేయసీప్రియులు చంద్రోపాలంభన పేరిట చంద్రుని ఆడిపోసుకోవడాలు సర్వసాధారణం. చాలా సినిమాల్లో చంద్రుని ఉద్దేశించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేయసీప్రియులు ఒకరిపై ఒకరి అనురక్తిని, కోపతాపాలను, ఫిర్యాదులను చెప్పుకోడానికి చంద్రుడే దిక్కవుతూ ఉంటాడు.

ఈ సందర్భంలో నాకు ఎంతో ఇష్టమైన రెండు పాటలు గుర్తొస్తున్నాయి. మొదటిది, ‘సువర్ణసుందరి’ సినిమాలోది. ఆ పాట సముద్రాల పేరుతో ఉన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసారంటారు. “హాయి హాయిగా ఆమని సాగే” అనేది ఈ పాట పల్లవి. అందులో ఒక చరణంలో “చూడుమా చందమామా, అటు చూడుమా చందమామా” అని ప్రేయసి అంటుంది. “కనుమా వయారి శారదయామిని కవ్వించే ప్రేమా” అని ప్రియుడు అంటాడు. “వగల తూలే విరహిణుల మనసున మోహము రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా” అని ప్రేయసి అంటుంది. “కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా” అని ప్రియుడు అంటాడు. చంద్రుడు, శారదయామిని(శరత్కాలపు వెన్నెల రాత్రి) విరహిణులు, మోహము, చంద్రోదయంతో కలువలు విరియడం-ఇలా కవితా సామగ్రి అంతా ఇందులో అమిరింది.

రెండో పాట ‘వాగ్దానం’ సినిమాలోది. దాశరథిగారు రాసిందనుకుంటాను. “నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’ అని ప్రేయసి కోరడం ఈ పాట పల్లవి. “ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగేను మనకోసమే” నని ప్రేయసి అంటుంది. “ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా” అని ప్రియుడు అంటాడు. “మేఘాలలో వలపు రాగాలలో దూరదూరాల స్వర్గాలు చేరుదమా” అని ప్రేయసి అంటుంది. ఆ తర్వాత తనే “ఈ పూలదారులూ ఆ నీలితారలూ తీయని స్వప్నాల తేలించగా” అంటుంది.

కేవలం ఈ రెండు పాటలను ఉదహరించి కవితాజగత్తులో చంద్రుడికి, తారలకు, పూవులకు, వెన్నెలకు ఉన్న ప్రాముఖ్యానికి పూర్తి న్యాయం చేయలేనని నాకు తెలుసు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, జార్జి థాంప్సన్ ను, జోసెఫ్ క్యాంప్ బెల్ ను చదివిన అనుభవం నుంచి ఇలాంటి పాటలు వింటున్నప్పుడు, కావ్యాలలోని చంద్రోదయ, చంద్రోపాలంభనలతో సహా ప్రకృతివర్ణనలు గుర్తొచ్చినప్పుడు వీటి మూలాలు ఏ ఆదిమ అస్తిత్వంలోకి వ్యాపించి ఉన్నాయో, వాటి పురాచరిత్ర ఎలాంటిదో, వాటి విశ్వజనీన స్వభావం ఎలాంటిదో స్ఫురించి విచిత్రమైన రహస్యానుభూతికి లోనవుతుంటాను.

ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రుడికి, పువ్వులకు, వెన్నెలకు కావ్యజగత్తులో ఎంత ప్రాధాన్యం ఉందో పురామానవ పరిణామ చరిత్రలోనూ అంతే ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యం బహుశా పురామానవఅస్తిత్వ చరిత్రనుంచే కావ్యజగత్తుకు విస్తరించింది.

ఈ మాటలు రాస్తున్నప్పుడు ఉన్నపళంగా జార్జి థాంప్సన్ అనే సముద్రంలోకి లంఘించాలని నాకు అనిపిస్తోంది కానీ, నాకు ఎంతో అపురూపం అనిపించే ఆ విషయంలోకి పూర్తిస్థాయిలో వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం కనుక వాయిదా వేస్తాను.

***

నలదమయంతులు/ఓడిసస్ కథల నేపథ్యంలో జోసెఫ్ క్యాంప్ బెల్ పేర్కొన్న female principle గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. దానిని ‘స్త్రీ సూత్రం’గా తర్జుమా చేసుకుందామని కూడా అనుకున్నాం. ఈ స్త్రీ సూత్రంలో భాగంగానే స్త్రీల మార్మిక లేదా మాంత్రిక ప్రపంచం గురించీ; ఆ ప్రపంచంలో చంద్రుడికీ, సర్పానికీ, పంటకీ ఉన్న ప్రాముఖ్యం గురించీ చెప్పుకున్నాం. అందులోకి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెడదాం:

ఆదిమ, పురాతన, ప్రాచ్య పురాణగాథలన్నీ ప్రధానంగా దేవత గురించే చెబుతాయి. దేవతతో ముడిపడి ఉన్న ఒక ప్రధాన ఆరాధనారూపం, సర్పం. దేవతకు సర్పం భర్త కూడా. ఇప్పుడు సైప్రస్, ఇజ్రాయిల్, సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనాలు ఉన్న ప్రాంతాన్ని ‘లెవంట్’ అని పిలుస్తారు. ఇప్పటికి పదివేల సంవత్సరాల క్రితమే లెవంట్ లో నాగదేవతను పూజించేవారు. పారిస్ లోని లౌరే మ్యూజియంలో సబ్బు రాయితో చేసిన ఒక ఆకుపచ్చని కలశం ఉంది. సుమేరులోని లగాష్ అనే నగరరాజ్యాన్ని పాలించే గుడియా అనే రాజు క్రీ.పూ. 2౦25 లో దేవత భర్త అయిన సర్పానికి ఈ కలశాన్ని సమర్పించాడు. దాని మీద ఒక చిత్రం ఉంది. అందులో మధ్యలో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న రెండు పాములు ఒక దండాన్ని చుట్టుకుని ఉంటాయి. డానికి అటూ, ఇటూ రెక్కలున్న జంతురూప రాక్షసులు నిలబడి ఉంటారు. పెనవేసుకున్న పాములు గ్రీకు దేవుడు హెర్మెస్ చేతిలోని దండాన్ని లేదా పాశాన్ని పోలి ఉంటాయి. హెర్మెస్ మార్మిక జ్ఞానానికి, పునర్జన్మకు చెందిన దేవుడు. ఓడిసస్ కథలో హెర్మెస్ ప్రస్తావన వచ్చింది. ఇతడు ఓడిసస్ కు అనుకూల దేవుడు.
the sepent lord

సర్పానికి పాతచర్మం వదిలేసి కొత్త చర్మం ధరించడం ద్వారా తిరిగి నవ యవ్వనాన్ని సంతరించుకునే అద్భుత సామర్థ్యం ఉందని చెప్పుకున్నాం. ఆ విధంగా సర్పం పునర్జన్మకు, మృత్యువు మీద గెలుపుకు ప్రతీకగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. వృద్ధి, క్షయాల రూపంలో ఇలాంటి సర్పలక్షణమే చంద్రుడికీ ఉంది. చంద్రుడు నీడ లేదా చీకటి అనే పాతచర్మం వదిలేసి, వెన్నెల అనే కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటాడు. స్త్రీ ఋతుక్రమానికీ, జీవిని పుట్టించే స్త్రీ గర్భానికీ తద్వారా కాలానికీ చంద్రుడు అధిష్టాన దైవం, కొలమానం కూడా. కాలంలోనే పుట్టుక, మరణం సంభవిస్తూ ఉంటాయి. ఆ విధంగా చంద్రుడు చావు-పుట్టుకల రహస్యానికి అధిదైవం. నిజానికి చావు-పుట్టుకలనేవి ఒకే నాణేనికి బొమ్మా-బొరుసు లాంటివి. చంద్రుడు సముద్రపు ఆటుపోట్లకు; పైరుపంటలకు కారణమైన రాత్రి కురిసే మంచుబిందువులకు కూడా ప్రభువు.

ఇక సర్పం జలాధిదేవత. అది నీటిలోనూ, భూమి మీదా కూడా ఉంటుంది. నీటి మీద అలల్లా అది పయనిస్తుంది, చెట్టు కొమ్మల మీంచి వేలాడుతూ ఉంటుంది. అప్పుడది మృత్యుఫలంలా కనిపిస్తుంది. సర్పం ఆకారం స్త్రీ(నోరు) పురుష(మిగతా శరీరం)జననేంద్రియాలను రెంటినీ గుర్తుచేస్తుంది. అలాగే, పాము కాటు అగ్నికీ, నీటికీ సూచన.

the serpent lord enthroned

సుమేరియాలో అక్కాడియన్ల కాలానికి (క్రీ.పూ. 2350-2150) చెందిన ఒక సీలు మీద ఒక పురుషదేవుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అతని ముందు అగ్నివేదిక ఉంటుంది. అతని చేతిలో అమరత్వాన్ని సూచించే ఒక పాత్ర ఉంటుంది. దాని పైన చంద్రవంక ఉంటుంది. ఆ దేవుడి వెనక పాములు పెనవేసుకున్న చిత్రం ఉంటుంది. ఆ దేవుడి ముందు కిరీటం ధరించిన భక్తుడు నిలబడి ఉంటాడు. అతనే ఆ సీలు జారీ చేసినవాడు. అతని వెనక తల మీదనుంచి పాము వేలాడుతున్న వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత్ర ఉంది, అతను ఆ దేవుడి ద్వారపాలకుడు.

The garden of immortality

The Garden of Immortality అనే మరో చిత్రంలో అందరూ స్త్రీలే ఉన్నారు. ఇది కూడా సుమేరియాకు చెందిన చిత్రం. ఇందులో చంద్రవంక, దాని కింద నైవేద్యంగా సమర్పించే ఒక ఫలమూ, చెట్టు ఉన్నాయి. ఓ పండ్ల కొమ్మను పట్టుకుని ఆ ఫలాన్ని స్వీకరిస్తున్న భక్తురాలు ఉంది. మిగిలిన ఇద్దరు స్త్రీలు అధోజగత్తులో ఉండే గుల-బావు అనే దేవత ద్వంద్వఅంశలు. వీరే అనంతరకాలానికి చెందిన గ్రీకు ఐతిహాసిక యుగంలో డిమీటర్, పెరెస్పోన్ అనే దేవతలయ్యారు.

కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడానికి జోసెఫ్ క్యాంప్ బెల్ ఈ చిత్రాలను ఉదహరించారు. అవేమిటంటే, ఈ చిత్రాలు సమీప ప్రాచ్యా(Near East)నికి చెందిన ఆదిమ పౌరాణిక వ్యవస్థకు సంబంధించినవి. వీటిలో పురుషదేవుడు, స్త్రీ దేవతా కూడా ఉన్నారు. అయితే ఈ దేవతలు నామరూపాలకు అతీతమైన ఒక సూత్రానికి లేదా తాత్వికతకు ముసుగులు మాత్రమే. ఇక్కడ ఆ తాత్వికతే ప్రధానం,

బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా తలకిందు లయిందో క్యాంప్ బెల్ వివరిస్తారు. పైన చెప్పిన వాటి ప్రతిరూపాలు అన్నీ బైబిల్ లోనూ కనిపిస్తాయి. అయితే, అవి పురాతన విశ్వాసాలకు భిన్నమైన వాదాన్ని ముందుకు తెస్తాయి. ఉదాహరణకు ఈవ్ కు సంబంధించిన చెట్టు సన్నివేశంలో కూడా ఒక సర్పం ఈవ్ తో సంభాషిస్తుంది. కానీ ఆ సర్పం అప్పటికి వేల సంవత్సరాలుగా పూజ లందుకుంటున్న దేవత అనే సూచన అందులో ఉండదు. పైగా ఈడెన్ తోటలోని చెట్టుకు వేలాడుతున్న జ్ఞానఫలాన్ని ఆదాము తిన్నట్టు తెలిసాక యెహోవా సర్పాన్ని శపిస్తాడు. ఆ తర్వాత ఆదామును తోటనుంచి బహిష్కరించి నేల దున్నుకుని బతకమని చెబుతాడు. ఈడెన్ తోటలోని జీవవృక్షానికి రక్షణగా, రెక్కలున్న పక్షి రూపంలోని సింహాలను, మంటలు చిమ్ముతూ అన్ని వైపులకూ తిరిగే కరవాలాన్ని తోటకు తూర్పున ప్రతిష్టిస్తాడు.

అంటే, పై చిత్రాలు అద్దంపట్టే ఆదిమపౌరాణిక వ్యవస్థలో లేని తప్పు, దైవాగ్రహం, ప్రమాదం, తోటనుంచి బహిష్కరణ, జీవవృక్షానికి కాపలా అనేవి బైబిల్ లో ప్రవేశించాయన్నమాట. ఆదిమ పౌరాణిక వ్యవస్థలో అపరాధభావన అనేది లేకపోవడమేకాక, జ్ఞానవృక్షఫలాన్ని ఎవరైనా అందుకోవచ్చు. అయితే అందుకు తగిన సంకల్పం, సంసిద్ధత ఉండాలి.

The Goddess of the Tree

The Goddess of the Tree అనే చిత్రంలో ఒక సర్పము, దానికి ముందు ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎదురుగా చంద్రవంకరూపంలో కొమ్ము కిరీటాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తారు. వారి మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు, దానికి రెండు ఫలాలు కనిపిస్తాయి. ఆ స్త్రీ సుమేరియన్ దేవత గుల-బావు; ఆ పురుషుడు ఆమె కొడుకు-భర్త అయిన దుముజి. ఆ ఫలాలలో ఒకటి జ్ఞానఫలం, రెండోది, అమరత్వఫలం. ఇది కంచు యుగానికి చెందిన చిత్రం. ప్రయత్నించి ఎవరైనా ఆ రెండు ఫలాలు పొందవచ్చు. బైబిల్ కథలో ఉన్నట్టు ఇందులో ఎలాంటి తప్పు, నిషేధమూ లేవు. ఇది బైబిల్ కు పూర్వపు చిత్రం.

Demeter and Plutus

దీనితో పోల్చగల గ్రీసు-రోమన్ చిత్రాలూ కనిపిస్తాయి. Demeter అనే చిత్రంలో కనిపించే ఈ స్త్రీ ఎల్యూసీనియన్ రహస్యాల దేవత అయిన డిమీటర్. ఆమె ఎదురుగా ఉన్న బాలుడు ఆమె కొడుకు ప్లుటూస్. ఒక సూచన ప్రకారం ప్లుటూస్ భూసంపదకు ప్రతిరూపం. ఇంకో విస్తృతార్థంలో నిగూఢత్వ దైవమైన డయోనిసస్ కు ప్రతిరూపం. ఆదిమ పౌరాణికతలోనూ, ప్రాచ్య పౌరాణికతలోనూ ఇటువంటి దేవుళ్ళు చాలామంది కనిపిస్తారు. వీరు విశ్వదేవత(The Great Goddess of the Universe) భర్తలు, కొడుకులు కూడా అవుతారు. చావు రూపంలోనో, లేదా మరో కల్పన ప్రకారం, వివాహ రూపంలోనో వీరు దేవత అక్కున చేరుతూ ఉంటారు. చంద్రుడి వృద్ధి క్షయాలలా, సర్పం పాతచర్మాన్ని విడిచేసి కొత్త చర్మాన్ని ధరించినట్టుగా వీరు చావు-పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన దీక్షా తంతులో భాగంగా ఈ మాతృ దేవత ఆరాధకులు తమ ఐహిక జీవితానికి చెందిన కష్ట సుఖాల నుంచి నిర్లిప్తత చెంది రహస్యాధిదేవత అయిన ఆ దేవతను ధ్యానిస్తారు. అనేక జీవుల రూపాలలో మళ్ళీ మళ్ళీ జన్మించే మూల జీవం ఏదైతే ఉందో దానితో మమేకం కావడానికి ప్రయత్నిస్తారు. శోకమూ, మృత్యువూ మాత్రమే తాండవించే ఈ లౌకిక ప్రపంచంలో సమాధిస్థితిని అమరత్వ ప్రతీకగా గుర్తిస్తారు.

స్పష్టత కోసం పైన చెప్పుకున్న వాటి సారాంశాన్ని ఇలా క్రోడీకరిస్తాను:

  1. చంద్రుడు, సర్పము, చెట్టు, ఫలాలు మొదలైనవి ఆదిమ పౌరాణికతకు చెందిన తాత్వికతలో ముఖ్యమైన ప్రతీకలు. ఇవి స్త్రీ సూత్రానికి చెందినవి.
  2. తర్వాత రూపొందిన బైబిల్ కూడా వీటిలో కొన్ని ప్రతీకలను స్వీకరించింది. అయితే ఆదిమ పౌరాణికతకు భిన్నమైన అర్థంలో వాటిని చిత్రించింది. ఆదిమ పౌరాణికతలో లేని తప్పు, నిషేధమూ, శిక్ష ఇందులో అడుగుపెట్టాయి.
  3. ఆదిమ పౌరాణికతకు చెందిన ప్రతీకలు, తాత్వికత తర్వాతి కాలపు గ్రీసు-రోమన్ చిత్రాలలోకి కూడా విస్తరించాయి. అయితే దేవతల పేర్లు మారాయి. ఇవే ప్రాచ్య పౌరాణికతలో కూడా కనిపిస్తాయి. ఇందులో స్త్రీ సూత్రం ఉంది. Demeter చిత్రం గురించిన వివరణలో మనదేశంలో నేటికీ ఉన్న అమ్మవారి ఆరాధన లక్షణాలను గమనించవచ్చు.

క్యాంప్ బెల్ ప్రకారం చారిత్రకంగా జరిగింది ఏమిటంటే, క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్ది నాటికి, మాతృస్వామ్యానికి చెందిన నూతన శిలా యుగ, కంచు యుగ నాగరికతలు వర్ధిల్లుతున్న భూముల్ని ఇనప యుగానికి చెందిన పితృస్వామిక హిబ్రూలు ఆక్రమించుకున్నారు. వారు మాతృస్వామిక పురాణగాథల్నే తీసుకుని వాటిపై పితృస్వామికతను ఆపాదిస్తూ తలకిందులు చేశారు. అందుకే వాటికి ఎంత గట్టిగా పితృస్వామికతను అన్వయించి చెప్పినా, బైబిల్ లోని మౌలిక ప్రతీకల అన్వయంలో అంతర్గతంగా ఉన్న అస్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రరూపంలో అవి హృదయానికి ఒక అర్థాన్ని అందిస్తుంటే, వాక్య రూపంలో మెదడుకు సరిగ్గా దానికి వ్యతిరేకమైన అర్థాన్ని అందిస్తుంటాయి. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం మూడూ పాత నిబంధన వారసత్వాన్ని పంచుకుంటున్నవే కనుక మూడింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు.

ఒక్క బైబిల్ లోనే కాదు, ఇలా అర్థం తలకిందులు కావడం గ్రీసు పౌరాణికతలోనూ కనిపిస్తుందంటారాయన. బహుశా ఈ ఛాయలు మన దగ్గరా కనిపిస్తాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా!

ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. మామూలుగా అయితే పెళ్లికొడుకును, పెళ్లికూతురును చేయడం తంతు అబ్బాయి, అమ్మాయిల ఇళ్ళల్లో విడివిడిగా జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో పెళ్లికూతురు, ఆమె తరపువారు కూడా పాల్గొన్నారు.

పెళ్లికొడుకును చేయడం పూర్తయింది. ఆ తర్వాత పెళ్లికూతురును తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆడవాళ్ళ హడావుడి ప్రారంభమైంది. ‘చందనబ్బొమ్మ…చందనబ్బొమ్మ’ అంటూ ఓ పెద్దావిడ తొందరపెట్టింది. పెళ్లి వస్తువుల్లోంచి ఓ చెక్కబొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. కొందరు ఆడవాళ్ళు కలసి వధూవరుల ముందు ఒక చీర ఉయ్యాల కట్టారు. అందులో బొమ్మను ఉంచి పెళ్లికూతురు, పెళ్ళికొడుకు చేత ఊపించారు.

పద్ధతుల్లో తేడా ఉండచ్చు కానీ, అన్ని ప్రాంతాల పెళ్లితంతుల్లోనూ ఈ చందనబ్బొమ్మ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.  శోభనం రోజున వధూవరుల మధ్య గంధర్వుడు తిష్టవేశాడని సంకేతిస్తూ ఓ చందనబ్బొమ్మను ఉంచుతారని ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. దాని అంతరార్థాన్ని సూచించే రాంభట్ల, తిరుమల రామచంద్ర గార్ల వాక్యాలను, కొన్ని పెళ్లిమంత్రాలను ప్రస్తావించుకున్నాం. ‘చందన’బ్బొమ్మ పేరులోనే ‘గంధ’ర్వ సూచన ఉంది.

అయితే,  పైన జరిపిన తంతు మరో రకం. అది పెళ్లి అయిన తర్వాత బిడ్డ పుట్టడాన్ని సూచించే తంతు. ఇక్కడ చందనబ్బొమ్మ అన్నా, దానిని ఓ కొయ్యబొమ్మగానే తీసుకుందాం. ఇందులో విచిత్రం ఏమిటంటే, పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడం తంతును జరిపించేయడం!

పెళ్లి తంతు నిజంగానే ‘తంతు’గా మిగిలిపోయిందనిపించింది, ఇది చూడగానే!  పద్ధతులు, ముందు వెనకలు పాటించకపోయినా తంతు జరిపించామనిపిస్తే చాలు! చెక్కబొమ్మ అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ బొమ్మతోనే పని జరిపించేస్తున్నారు. అదలా ఉంచితే, ఏ తంతు ఎందుకు జరుపుతున్నారో, దాని చరిత్ర ఏమిటో, ఎన్ని వేల సంవత్సరాలుగా అది తరం వెంట తరానికి సంక్రమిస్తూ వస్తోందో, మనకు తెలియకుండానే దానికి మనం ఎలా వాహికలమవుతున్నామో, కనిపించని ఓ పురాతన వృక్షపు వేళ్ళలా; మానవ అస్తిత్వపు వేళ్ళు అందులో ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో-అక్కడున్నవాళ్ళలో ఎవరికైనా తెలుసా అనిపించింది.

ఒక్క మాటలో చెప్పాలంటే,  ఆయా తంతుల రూపంలో మనం (ముఖ్యంగా ఆడవాళ్ళు) మనిషి అస్తిత్వ చరిత్రను అవిచ్ఛిన్నం చేస్తున్నాం. వేల సంవత్సరాల గతానికీ, వర్తమానానికీ మధ్య వారధి అవుతున్నాం. చరిత్రను అస్థిపంజర ప్రాయంగానే అయినా భద్రంగా మోసుకొస్తున్నాం. అయితే అలా మోసుకొస్తున్న విషయం మనకు తెలియదు!!

తెలియకపోగా మనం ఇంకొకటి కూడా చేస్తున్నాం. ఇలాంటి తంతు వెనుక తర్కాన్ని, హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నాం. మూఢాచారాలుగా కొట్టిపారేస్తున్నాం. నవ్వుకుంటున్నాం. వయసొచ్చిన ఇద్దరు యువతీ యువకులు ఒకటవడానికి ఇంత తంతు జరపాలా అంటున్నాం. ఒక కోణం నుంచి చూస్తే, నిజమే కదా అనిపిస్తుంది.

కానీ ఇంకో కోణం నుంచి చూడండి…ఈ తంతు పూర్తిగా అదృశ్యమైపోయిన పరిస్థితిని ఊహించుకుంటే భయమూ, దిగులూ కలగచ్చు. పెళ్లి తంతు, ఆ మాటకొస్తే ఏ తంతు అయినా అదృశ్యమైపోవడమంటే ఏమిటి? దాంతోపాటు అది మోసుకొచ్చే చరిత్ర కూడా అదృశ్యమైపోవడమా? గతంతో మనకు ఉన్న ముడి అదృశ్యమైపోవడమా? వేళ్ళు తెగిన చెట్టులా మనం నిర్జీవంగా శూన్యంలో వేలాడవలసి రావడమా?…

పశ్చిమదేశాల్లో చాలావరకూ జరిగింది ఇదే. ఇప్పుడిప్పుడు కీళ్ళు సడలుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ  మనదేశంలో వేళ్ళు ఎంతో కొంత పదిలంగానే ఉన్నాయి. మనదగ్గర గణవ్యవస్థ తాలూకు లక్షణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ ఆ సంగతి మనకు తెలియదు!

మన తెలియనితనం ఇంకా వేనవేల రూపాల్లో వ్యక్తమవుతూ ఉండచ్చు.  మనం ఆయా తంతులను మతవిశ్వాసంగా, అందులోనూ మన మతానికి మాత్రమే చెందిన విశ్వాసంగా అపోహ పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి తంతులే దాదాపు ప్రపంచమంతటా ఉన్నాయి, లేదా ఉండేవి. అలాగే, మతానికి, సంస్కృతికి ఉన్న తేడా మనలో చాలామందికి  తెలియదు. ఉమ్మనీటితోపాటు పసికందునూ పారబోసినట్టుగా మతవిశ్వాసంతోపాటు సంస్కృతినీ పారబోస్తున్నామా?

ఇందులో నేను వ్యక్తిగతంగా ఒక దాన్ని సమర్థించడం, ఇంకో దాన్ని వ్యతిరేకించడం అన్నది లేదు. ఇది బహిరంగంగా సాగించే ఆలోచనల కలబోత మాత్రమే. కాలంలో, ప్రకృతిలో సంభవించే ఏ పరిణామాన్నీ ఆపలేనంత చిన్నది మనిషి పిడికిలి. అందులో దేనిని బంధించాలని చూసినా అది వేళ్ళ సందుల్లోంచి తప్పించుకుంటూనే ఉంటుంది.

***

పెళ్లి తంతు ఇప్పుడొక వేడుకగా, ఆచారంగా; చందనబ్బొమ్మ ఒక బొమ్మగా కనిపించవచ్చు. కానీ పురామానవుడి విషయంలో ఆ తంతు కేవలం ఒక వేడుకా కాదు, ఆ బొమ్మ ఒక బొమ్మా కాదు. అతని జీవితంతో పూర్తిగా పెనవేసుకున్న మాంత్రికతలో అవి భాగాలు. ఆ తంతు మొత్తం మంత్రపూతమైన ప్రక్రియ. చందనబ్బొమ్మ మంత్రపూతమైన వస్తువు. ఉయ్యాలలో బొమ్మను ఉంచి వధూవరులు ఊపడం అనేది, భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేసి, రేపు బిడ్డ అనే ఫలితాన్ని పొందడం కోసమే. అంటే రేపటి ఫలితానికి అది రిహార్సల్. పురామానవుడి దృష్టిలో అసలుకు, రిహార్సల్ కు ఎలాంటి తేడా లేదు. ఉయ్యాల్లో ఊపిన ఆ బొమ్మ అతని దృష్టిలో ఆ క్షణంలో ఒక సజీవమైన పసిపాపే.

బొమ్మ ఒకటే కాదు; రాయి, రప్ప, కొండ, గుట్ట, చెట్టు, పుట్టతో సహా ప్రకృతిలో ప్రతిదీ పురామానవుడి దృష్టిలో మాంత్రికతకు అర్హమైనవే. అంతవరకూ ఒక రాయి అనుకున్నది హఠాత్తుగా దేవతగా మారిపోవచ్చు. అలాగే ఒక చెట్టు, ఒక పుట్ట…ఈ క్రమంలో మనిషి ఉపయోగించే శిలాసాధనాలు, లోహసాధనాలూ కూడా మాంత్రిక సామగ్రిగా మారిపోతాయి.

sindhu

శిలాసాధనాలకే వస్తే, రుబ్బురోలు-పొత్రం ఒక ఉదాహరణ. రాతియుగం చివరిలో, వ్యవసాయం ప్రారంభమైన తొలినాళ్లలో వాడుకలోకి వచ్చిన సాధనాలలో ఇదొకటి. వేల సంవత్సరాలుగా కాలంతోపాటు కలసి ప్రయాణిస్తూ వచ్చిన, మన్నికైన ఆదిమ సాంకేతిక పరికరం ఇది. మనదేశంలో అన్ని తరగతులవారిలొనూ  నిన్నమొన్నటివరకూ ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో వాడుకలో ఉంది. ఈ రుబ్బురోలు-పొత్రం గురించి కోశాంబి (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా ఉంటుంది.

రుబ్బురోలు-పొత్రం ఆనవాళ్ళు ప్రపంచమంతటా పురావస్తు తవ్వకాల్లో దొరికాయి. కాలగతిలో ఈ సాధనం భిన్నరూపాలు తీసుకుంటూ వచ్చింది.. మొదట్లో ఇది చిత్రంలో చూపిన ఆకారంలో ఉండేది. సింధులోయలో ఇలాంటివే దొరికాయి. అన్నింటి కన్నా ఆంద్ర ప్రాంతంలో ఉపయోగించే రుబ్బురోలు-పొత్రం మరింత సమర్ధమైన రూపం అంటారు కోశాంబి. పొత్రం రోట్లో దాదాపు పూర్తిగా నిండిపోతుంది. ఈ సాధనాన్ని వాడడంలో మళ్ళీ ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాల తేడాలు కూడా ఉన్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్ళు ఉపయోగించే విధానం సులువుగా ఉంటే,  నిమ్నవర్గాలవారు ఉపయోగించే విధానంలో శ్రమ ఎక్కువ.  ఇందులో ప్రాంతాల తేడాలు కూడా ఉన్నాయి. సులువైన విధానం ఉత్తరభారతీయులది. కాస్త శ్రమతో కూడింది దక్షిణభారతీయులది. రోలు-పొత్రము దక్షిణభారతానికి తదుపరి కాలంలో పరిచయమవడం కూడా ఒక కారణం. వాడడంలో ఉన్న తేడాలను బట్టి దక్షిణభారతంలోని బ్రాహ్మణులు ఉత్తరభారతంనుంచి వచ్చారని భావించడమూ ఉంది.

అదలా ఉంచితే, ఎప్పుడో ఊహకు అందని కాలంనాటి వ్యవసాయ ప్రారంభదశకు చెందిన ఈ సాధనం ఒక తంతులో భాగమైంది. శిశువుకు బారసాల జరిగే రోజున లేదా, డానికి ముందు పొత్రానికి ఒక కొత్త బట్టను టోపీలా తొడిగి, పసుపు, కుంకుమ అద్ది, ఒక ఆభరణం అలంకరించి ఉయ్యాలలో శిశువు చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత డానిని శిశువు పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పొత్రంలానే శిశువు కూడా దృఢంగా ఉండాలనీ, ఆరోగ్యంగా ఎదగాలని కోరుకోవడం ఈ తంతులోని అంతరార్ధం. అలాగే ఆ పొత్రం, డానికి చేసిన అలంకరణ అమ్మవారికి కూడా ప్రతీక. శిశువుకు అమ్మవారి ఆశీస్సులు లభించాలన్న కోరిక అందులో ఇమిడి ఉంటుంది. ప్రస్తుతం మనకు అవసరమైన ముఖ్య సమాచారం ఏమిటంటే, ఈ తంతులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. పిల్లలుగల ఒక ముత్తైదువ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇదీ, ఇంకా ఇలాంటి అనేక తంతులూ ఋషులు చెప్పినట్టు పేర్కొనే ప్రామాణిక గ్రంథాలలో ఉండవనీ, అయినాసరే బ్రాహ్మణులు కూడా వీటిని పాటిస్తారనీ కోశాంబి అంటారు.

అంటే, అజ్ఞాతకాలంనుంచీ ఆనవాయితీగా కొనసాగుతున్న ఇలాంటి తంతులను స్త్రీలే కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. మామూలుగా కాదు, అతి రహస్యంగా! ఒకే కప్పు కింద ఉంటున్నా తల్లులు కొడుకులకు తెలియకుండా కూతుళ్ళకు ఈ రహస్యవారసత్వాన్ని భద్రంగా బదిలీ చేసే తీరు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టుగా; తమను ఏమార్చి తమ కళ్ళ ముందే  అక్కలు, చెల్లెళ్ళు ఈ గుప్తవారసత్వాన్ని అందుకుని ఆరిందలుగా మారిపోతుండడం మగవాణ్ణి ఎప్పుడూ ఆశ్చర్యచకితం చేస్తూనే ఉంటుంది. ఈ తంతులపై ప్రత్యేకంగా స్త్రీముద్ర ఉండడానికి కారణం ఉహించలేనిదికాదు. ఇవి వారు మార్మికప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించినరోజులనుంచీ వస్తున్న తంతులు.

ఆ తర్వాత ఆ అధికారం స్త్రీ చేతుల్లోంచి పురుషుడి చేతుల్లోకి బదిలీ అయ్యాక పురుషుడి ముద్ర గల తంతులు మొదలయ్యాయి. అవి స్త్రీముద్ర గల తంతులతో పోల్చితే మరింత అభివృద్ధి రూపాన్నీ, ప్రామాణికతనూ తెచ్చుకుంటూ వ్యవస్థీకృతం అవుతూవచ్చాయి. క్రమంగా గ్రంథరూపం ధరించడమూ ప్రారంభించాయి. స్త్రీ తంతులకు  ఆ గ్రంథాలలో చోటివ్వకుండా పురుషుడు జాగ్రత్తపడ్డాడు. అయినాసరే, మౌఖికంగానే తరం వెంట తరానికి అందుతూ కాలాన్ని ప్రతిఘటించి అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే, ఆ మేరకు పురుషుడు రాజీపడ్డాడన్నమాట.

ఇది మన అనుభవం. కానీ, పాశ్చాత్య, ఇస్లామిక్ ప్రపంచాలలో స్త్రీ మార్మిక ప్రపంచాన్ని పనిగట్టుకుని అంతమొందించినట్టు కనిపిస్తుంది, ఆ క్రమంలోనే స్త్రీ ‘మంత్రగత్తె’ అయింది.

***

మనమిప్పుడు ఓసారి  జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AEGEAN)ను పలకరిద్దాం. స్త్రీ మార్మిక ప్రపంచం విశ్వవ్యాప్తం అనే కాక, ఆ ప్రపంచంలో ‘బొమ్మ’లకు ఎంతో ప్రాధాన్యం ఉందంటాడాయన. ఆయన ప్రకారం:

నేటి మన పిల్లలలానే ఆటవిక దశలోని పిల్లలు కూడా బొమ్మలతో ఆడుకునేవారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా బొమ్మలతో ఆడుకునేది ప్రధానంగా ఆడపిల్లలే. అలా బొమ్మలతో ఆడుకోవడం అనేది రేపు వారు పోషించబోయే  అమ్మపాత్రకు రిహార్సల్ మాత్రమే. అయితే ఈ ఆట, ఆధునిక కాలంలో కంటే ఆటవిక కాలంలో మరింత గంభీరమైన వ్యవహారం. దురదృష్టవశాత్తూ దాని గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఆటవిక పురుషుడు ఈ బొమ్మలాటలోకి తొంగి చూడకూడదు. చూస్తే తప్పవుతుంది.

అలాగే, పురుష మానవపరిణామ శాస్త్రవేత్త కూడా.  భర్తలకు తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న తమ రహస్యాలను స్త్రీలు తెల్లతోలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అసలే చెప్పరు.  మహిళల సామాజిక స్థాయి, మానవపరిణామశాస్త్ర అధ్యయనానికి వారిని ప్రోత్సహించదు. అందుకే స్త్రీల ఆదిమజీవితం గురించిన సగం చరిత్ర నమోదు కాకుండా పోయింది. ఈ పరిస్థితిలో మిస్ ఎర్తీకి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె దక్షిణాఫ్రికా వాలెంగ్ బాలికలను అమ్మపాత్రకు సిద్ధం చేసే తంతును పూసగుచ్చినట్టు రాశారు.

ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును ‘న్యంబుత్సి’ అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లినుంచి కూతురికి వారసత్వంగా అందుతూ ఉంటుంది. అందులో ఒక డోలు(drum), ఒక కొమ్ము(horn), స్త్రీ, పురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీ, పురుషుల కొయ్యబొమ్మలు ఉంటాయి. ఈ పరికరాలు అన్నింటికీ ఎర్రని రంగు పూస్తారు.

మొదటి రోజున న్యంబుత్సి పర్యవేక్షణలో ఆడపిల్లలందరూ డోలు వాద్యానికి అనుగుణంగా నగ్నంగా నృత్యం చేస్తారు. డోలు స్త్రీగర్భానికి ప్రతీక. మొదట్లో ఆడపిల్లలు భయంతో ఏడుపు మొదలుపెడతారు. సాయంత్రం వరకు అలా నృత్యం జరిగిన తర్వాత ‘పవిత్రమైన కొమ్ము’తో ఒక్కొక్క ఆడపిల్ల కన్నెపొర తొలగిస్తారు.

మరునాడు, లైంగికజీవితం గురించి ఒక పద్ధతిగా వారికి బోధిస్తారు. బుట్టలో ఉన్న స్త్రీపురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీపురుషుల బొమ్మలు అందుకే.  తమ పూర్వీకుల ఆత్మలు ఆవహించి ఉంటాయన్న భావనతో వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ తర్ఫీదులో భాగంగానే ఆడపిల్లలకు ఒక గుప్తభాషను బోధిస్తారు. ఒకరి వస్తువులు ఒకరు దొంగిలించమని కూడా ప్రోత్సహిస్తారు. మొదటి రోజున చేసిన నృత్యమే చివరిరోజున కూడా చేస్తారు. ఈసారి ఒంటినిండా ఎరుపురంగు పులుముకుంటారు. ఇప్పుడిక ఏ ఆడపిల్లా భయంతో ఏడవడు. చివరిసారి బుట్ట తెరచి అందులోని వస్తువులను చూపించమని న్యంబుత్సిని బతిమాలతారు. ఆమె అలాగే చేస్తుంది. ఆ వస్తువుల చుట్టూ వాళ్ళు ఆనందంతో చప్పట్లు చరుస్తూ, పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఆ పాట శిశువులను ఆహ్వానిస్తున్నట్టు  ఉంటుంది.

శిక్షణ అయిపోతుంది. న్యంబుత్సి తన బుట్ట సర్దుకుంటుంది. ఆడపిల్లలు ఇంటికి చేరుకుంటారు. తమ ఒంటి మీది అలంకరణలను తీసేస్తారు. తల్లి ఎంతో మురిపెంగా వాటిని తీసుకెళ్లి ఒక రహస్యప్రదేశంలో దాస్తుంది.

ఆదిమసమాజాల్లో నిర్బంధ లైంగిక విద్య ఉండేదని ఈ తంతు చెబుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం 

 

 

రహస్యప్రపంచ రారాణి… స్త్రీ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy Tales మధ్య పెరుగుతారు. Fairy Tales అంటే ‘పిల్లల కథలు’ అనే నిఘంటువు నిర్వచిస్తోంది. ఈ మాటకు తెలుగులో కచ్చితమైన సమానార్థకం నాకు వెంటనే స్ఫురించడం లేదు. ‘అద్భుత కథలు’ అనుకుందాం. ఈ అద్భుత కథల గురించి నేనిప్పుడు మీతో ఒక అద్భుతాన్ని పంచుకోబోతున్నాను.

నిజానికి ‘అద్భుత కథలు’, మనం అనుకునేంత అమాయకమైన కథలు కావు. అవి కేవలం పిల్లల కథలూ కావు. ఆ కథల వెనుక ఒక చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల మర్మమూ, పెద్ద తత్వమూ ఉన్నాయి. ఇలా అని పిల్లలకు ఉన్న కథలు కూడా లేకుండా చేస్తున్నానని మీకు అనిపిస్తే మన్నించాలి.

ఇంతకు ముందు మనం ఓడిసస్ అనే వీరుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఒక సినిమాలోని వీరుడి కథ చూద్దాం. ఆ సినిమా పేరులోనే వీరుడు ఉన్నాడు. దాని పేరు ‘జగదేకవీరుని కథ’. విజయావారు తీసిన ఈ సినిమా అరవై దశకం ప్రారంభంలో వచ్చింది. అప్పుడప్పుడే ఊహ వస్తున్న రోజుల్లో విజయవాడ, దుర్గాకళామందిరంలో కాబోలు చూశాను. ఆ తర్వాత కూడా టీవీలో అప్పుడప్పుడు చూశాను. కానీ ఆ చూడడం వేరు, ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి థాంప్సన్ లను చదివేవరకూ, ఈ సినిమా, ఇంకా ఇలాంటి సినిమాల అసలు మర్మం నాకు బోధపడలేదు.

జగదేకవీరునికథకు ఒక తమిళ మాతృక ఉందని, అది కూడా గొప్ప హిట్ సినిమా అని ఇది రాస్తున్నప్పుడే తెలిసింది. దాని పేరు ‘జగదల ప్రతాపన్’. 1944లో వచ్చిన సినిమా అది. మీకు తెలిసిన, లేదా తెలుసుకునే అవకాశం ఉన్న కథే అయినా ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు జగదేకవీరుని కథ క్లుప్తంగా చెబుతాను.

అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రతాప్. అతనొక రోజు తండ్రితో మాట్లాడుతూ తనకు దేవకన్యలను పెళ్ళాడాలని ఉందంటాడు. దాంతో తండ్రికి కోపం వస్తుంది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ప్రతాప్ ఒక మిత్రునితో కలసి దేవకన్యలను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అడవిలో ఒకచోట ఇంద్రకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి, నాగకుమారి జలకాలాడుతూ కనిపిస్తారు. ఇంద్రకుమారి ప్రతాప్ ను చూసి శపిస్తుంది. అతను శిలగా మారిపోతాడు. అతని తల్లి అమ్మవారి భక్తురాలు. కొడుకు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మవారు అవ్వ రూపంలో వచ్చి ప్రతాప్ కు శాపవిమోచనం కలిగిస్తుంది. అతనికి, అతని మిత్రునికి ఆశ్రయం ఇస్తుంది. ఇంద్రకుమారి జలకాలాడుతున్నప్పుడు ఆమె చీర ఎత్తుకు వస్తే ఆమె నీదవుతుందని ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ అలాగే చేస్తాడు.

ఈలోపల ఇంద్రకుమారి చేసిన ఒక తప్పుకు కోపించిన ఓ ముని, మానవమాత్రుడితో నీకు వివాహం అవుగాక అని శపిస్తాడు. అతను దొంగిలించిన నీ వస్త్రం నీకు లభించగానే శాపవిమోచనం అవుతుందంటాడు. ఇంద్రకుమారి ప్రతాప్ ను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలసుకుంటుంది. ఇద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళు ఒక రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఇంద్రకుమారి పొందు కోరుకుని, తన రోగానికి మందు తీసుకువచ్చే వంకతో ప్రతాప్ ను నాగలోకానికి, వరుణ లోకానికీ పంపిస్తాడు. అతను ఆ లోకాలకు వెళ్ళి నాగకుమారిని, వరుణకుమారినే కాక, అగ్నికుమారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపల తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రతాప్ లేనప్పుడు నలుగురు దేవతాస్త్రీలూ కలసి అతని తల్లిని మోసగించి ఆమె దగ్గర ప్రతాప్ దాచిన ఇంద్రకుమారి వస్త్రాన్ని అపహరిస్తారు. ఇంద్రకుమారి దానిని ధరించగానే శాపవిమోచనం కలుగుతుంది. నలుగురు దేవతాస్త్రీలూ దేవలోకానికి వెళ్లిపోతారు. అయినా ప్రతాప్ ను మరచిపోలేక పోతారు. ప్రతాప్ దేవలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుని మెప్పించి నలుగురు భార్యలనూ వెంటబెట్టుకుని మానవలోకానికి వస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

ఓడిసస్ కథకు, ఈ కథకు ఉన్న పోలికలు చూడండి. ఓడిసస్ లానే ప్రతాప్ కూడా మానవమాత్రుడు, వీరుడు. అతని లానే సాహసయాత్ర చేస్తాడు. ఓడిసస్ కు ఎదురైనట్టే ప్రతాప్ కూ అనేక పరీక్షలు, కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి గట్టెక్కడానికి ఓడిసస్ కు లానే దేవత(అమ్మవారు) సాయం లభిస్తుంది. ఓడిసస్ కు సిర్సే, కలిప్సో అనే అప్సరసలతో సంబంధం కలిగినట్టే ప్రతాప్ కు దేవకన్యలతో సంబంధం కలుగుతుంది. ఓడిసస్ ఒక దేవుడి సలహాతో సిర్సేను లొంగదీసుకుని ఆమెతో పడకసుఖాన్ని పొందుతాడు. అలాగే ప్రతాప్ అమ్మవారి సలహాతో ఇంద్రకుమారిని లొంగదీసుకుని పెళ్లిచేసుకుంటాడు. చివరగా ఓడిసస్ మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి పెనెలోప్ పునస్స్వయంవరంలో వీరత్వం చాటుకుని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు. అలాగే ప్రతాప్ కూడా మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

రెండు కథలూ పురుషప్రయత్నాన్నీ, పురుషుడిలోనీ వీరత్వాన్నీ, అతను ప్రతికూల స్త్రీని సైతం అనుకూలంగా మార్చుకోవడాన్నీ చెబుతూనే; ఆ పురుష ప్రయత్నానికి దైవసహాయం కూడా అవసరమని చెబుతున్నాయి. జగదేకవీరుని కథలో ప్రతాప్ పురుషప్రయత్నానికి ప్రతీక అయితే, అతని తల్లి దైవసహాయానికి ప్రతీక. ఆపైన రెండు కథలూ దైవసహాయం, పురుషప్రయత్నాల మధ్య సమతూకాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒకవిధంగా మానవుడి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.

వివరాలలో తేడా ఉండచ్చు, స్థూలంగా ఫార్ములా ఒకటే. ఒకటి గ్రీకు కథ, ఇంకొకటి భారతీయ కథ అనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అద్భుత కథల ఖజానాలోకి తొంగి చూస్తే ఇలాంటి ఫార్ములా కథలు ఇంకా మరెన్నో కనిపిస్తాయి. ఆయా దేశాలకు చెందిన ఇలాంటి అనేక కథలలోని వస్తువును, నిర్మాణ రీతులను ఎవరైనా లోతుగా పరిశీలించి, ఉమ్మడి అంశాలను గుర్తించారా అన్నది నాకు తెలియదు. నేను అందులోకి వెళ్లలేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ పోలికలను చూసినప్పుడు Fairy Tales అనేవి ప్రపంచంలో ఒకచోటినుంచి ఇంకోచోటికి వ్యాపిస్తూ వచ్చాయని కూడా అర్థమవుతుంది. Fairy Tales ప్రపంచవ్యాప్తం అవడమంటే, వాటి వెనుక ఉన్న ఒకే తత్వం కూడా ప్రపంచవ్యాప్తం అయిందన్నమాట.

The garden of immortality

The garden of immortality: ఈ సుమేరియన్ చిత్రంలో ముగ్గురు స్త్రీలు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు కనిపిస్తాయి

 

అందులోకి వెళ్లబోయేముందు ఇంకొక సూక్ష్మమైన పోలికను చెప్పుకోవాలి. ఓడిసస్, నలదమయంతుల కథలో ఉన్నట్టే జగదేకవీరునికథాగమనంలో కూడా వస్త్రం(వస్త్రం అన్నప్పుడు నగ్నత్వ సూచన కూడా అందులో గర్భితంగా ఉంటుంది)ఒక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి ఈ కథలో వస్త్రానిది మరింత స్పష్టంగా కనిపించే కీలకపాత్ర కూడా. ఇంద్రకుమారి నీకు లొంగాలంటే ఆమె వస్త్రం అపహరించుకురావాలని అవ్వ వేషంలో ఉన్న అమ్మవారు ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ ఇంద్రకుమారి వస్త్రం అపహరించడమంటే ఆమెను నగ్నంగా మార్చడమే. కాకపోతే, ఓడిసస్, నలదమయంతుల కథలో నగ్నత్వం పురుషుడిదైతే ఇక్కడ స్త్రీది. పక్షులు ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి తనకు లభించి, దానిని ధరించగానే బాహుకుడు నలుడిగా మారిపోతాడు. నగ్నంగా ఉన్న తనకు నౌసికా అనే రాచబాలిక ఇచ్చిన వస్త్రం ధరించిన తర్వాత ఓడిసస్ కు ఫేషియన్ల సాయం లభించి అతడు స్వస్థలానికి వెళ్లగలుగుతాడు. అలాగే ప్రతాప్ ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి పొందిన తర్వాత ఇంద్రకుమారి దేవకన్యగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది.

***

ఇప్పుడు విజయావారిదే ఇంకో ప్రసిద్ధ సినిమా చూద్దాం. అది, ‘పాతాళభైరవి’(1951). ఈ కథ కూర్పులో అనుసరించిన ఫార్ములా కూడా పై కథలోలానే ఉంటుంది. తోటరాముడు ఇందులో హీరో. అతి సామాన్యుడైన అతను ఉజ్జయిని రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నా తాహతుకు తగినంత సంపదను సాధించుకువస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేస్తానని రాజు షరతు పెడతాడు. తోటరాముడు స్నేహితునితో కలసి సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అతనికి పాతాళభైరవిని కొలిచే ఒక నేపాళమాంత్రికుడు తారసపడతాడు. ఒక వీరుని బలి ఇచ్చి శక్తులు పొందే ఆలోచనలో ఉన్న మాంత్రికుడు అతనికి సాయపడుతున్నట్టు నటిస్తూ అతనిచేత అనేక సాహసాలు చేయించి వీరుడే నని ధ్రువీకరించుకుంటాడు. అతని పన్నాగాన్ని తెలుసుకున్న తోటరాముడే మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహం పొంది అన్ని సంపదలూ సాధిస్తాడు. అంతలో మాంత్రికుని శిష్యుడు సంజీవిని సాయంతో గురువును బతికిస్తాడు. రాకుమారిని పెళ్లాడాలనుకున్న రాజుగారి బావమరిది తోటరాముని అడ్డు తొలగించుకోవాలనుకుని అతని దగ్గర ఉన్న పాతాళభైరవి శక్తిని అపహరించి మాంత్రికుడికి అందిస్తాడు. మాంత్రికుడు తోటరాముని సంపదను అంతటినీ మాయం చేసేసి, పెళ్లి పీటల మీంచి రాకుమారిని అదృశ్యం చేస్తాడు. అప్పుడు తోటరాముడు మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని చంపి రాకుమారిని, సంపదనూ కూడా తిరిగి దక్కించుకుంటాడు. అంటే, పైన చెప్పిన ఆయా కథల్లోలానే మంత్రతంత్రాలు, మహిమలతో కూడిన మార్మికప్రపంచంలోకి సాహసయాత్ర జరిపివచ్చిన తర్వాతే, తోటరాముడు వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి రాకుమారితోపాటు రాజ్యాన్నీ పొందాడన్నమాట.

ఇప్పుడిక పై రెండు సినిమా కథల తాత్విక మూలంలోకి వెడదాం:

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే. ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి…మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

సాత్విక పూజ బహిరంగం. ఉగ్రపూజ రహస్యం. అది ఏ పాతాళ గుహల్లోనో, నరసంచారం అంతగా లేని వనాలు, లేదా తోపుల్లోనో జరుగుతుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ఆవాసం పాతాళగుహే. అంతేకాదు, సాత్విక పూజ కంటే ఉగ్రపూజ పురాతనం, ఆదిమం.

ఈ ఉగ్ర, సాత్విక పూజా ప్రక్రియలు రెండూ ఒక తాత్విక సూత్రాన్ని చెబుతాయి: సాత్వికత లేదా ప్రసన్నత అనేది జీవం, జీవించడం, లేదా వెలుగు! ఉగ్రత అనేది హింస, ఆత్మహింస, చావు, కష్టాలు, చీకటి! మళ్ళీ ఈ సాత్వికత, ఉగ్రత అనేవి రెండూ ఒకే బొమ్మకు రెండు పక్కలే తప్ప వేర్వేరు కావు. ఎలాగంటే, జీవం నుంచి చావు పుడుతుంది. చావునుంచి జీవం పుడుతుంది. విత్తనాన్ని భూమిలో పాతి పెట్టడం చావు. దాని నుంచి మొక్క రావడం జీవం. కష్టసుఖాలు, చీకటి వెలుగులు ఇదే చక్రభ్రమణాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని, లేదా పునరుజ్జీవనాన్ని పొందాలంటే చావును ఎదుర్కోవాలి. సుఖాలను అందుకోవాలంటే కష్టాల కారడవిలోకి(నలుడు, జగదేకవీరుడు, తోటరాముడు), కడగండ్ల సముద్రంలోకి(ఓడిసస్) సాహసోపేతంగా అడుగుపెట్టాలి. వెలుగులోకి రావాలంటే చీకటిలోకి పయనించాలి.

ఈ చక్రభ్రమణానికి అద్దంపట్టే భౌతికరూపాలు కొన్ని ఉన్నాయి. అవి: చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క మొదలైనవి. చంద్రునికి వృద్ధి, క్షయాలు ఉంటాయి. వృద్ధి అంటే జీవవికాసం, క్షయమంటే చావు. అలాగే వృద్ధి అనేది వెలుగు, క్షయమనేది చీకటి. సర్పం పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్నే కుబుసం విడవడం అంటాం. పాత చర్మాన్ని వదిలేయడం చావు. కొత్త చర్మాన్ని ధరించడం పునర్జన్మ. ఒక కాలంలో మోడువారిన చెట్టు ఇంకోకాలంలో చిగురిస్తుంది. ఇందులోనూ చావు-పుట్టుకల క్రమం ఉంది. అలాగే, ఒక విత్తనాన్ని భూమిలో సమాధి చేస్తే(చావు) దాని లోంచి మొక్క పుట్టి అనేక విత్తనాలను ఇస్తోంది.

images1

అర్తెమిస్-అక్తియాన్…అక్తియాన్ పై వేటకుక్కలు దాడి చేస్తున్న దృశ్యం

ఇలా చంద్రుడికీ, సర్పానికీ, మొక్కకూ కూడా తనకు ఉన్నట్టే చావు-పుట్టుకల లక్షణం ఉండడం మనిషిని ఆకర్షించింది. అయితే మనిషికి భిన్నంగా చంద్రుడు, సర్పము, మొక్క మళ్ళీ మళ్ళీ చచ్చి, మళ్ళీ మళ్ళీ పుట్టడం ప్రత్యేకించి మనిషిలో ఆలోచనను, ఆశను రేకెత్తించింది. తనకూ అలాగే పునర్జన్మ, బహుశా ఇప్పటికంటే మెరుగైన జన్మ ఉంటుందనిపించింది. అలా మనిషిలో ఒక ఆదిమ తాత్వికత అంకురించింది. ఆ తాత్వికతకు అనుగుణమైన ఆచారకాండ రూపొందింది. చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క గొప్ప తాత్విక ప్రతీకలు అయ్యాయి. ఆ అవడం ఏదో ఒక్క చోట కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అయింది. ఒకచోట పుట్టిన ఈ తాత్వికతే ఇతర చోట్లకు విస్తరించిందన్న వాదమూ ఉంది.

మన దేవీ దేవులతోనూ, ఆరాధనా రూపాలతోనూ చంద్రుడికీ, సర్పానికీ, పంటకు లేదా మొక్కకూ ఉన్న ముడి తెలిసినదే. శివుని శిరసు మీద, అమ్మవారి శిరసు మీదా కూడా చంద్రవంక ఉంటుంది. శివుని మెడలో సర్పముంటుంది. సర్పాన్ని, చెట్టును పూజించడం మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది. అమ్మవారి చేతిలో చెరుకుగడో లేదా మరో రకమైన పంటరూపమో ఉంటుంది. ఇవే ప్రతీకలు ఇతర పురాతన మత విశ్వాసాలలో, ఆరాధనా ప్రక్రియలలో కూడా ఎలా ఉన్నాయో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆదిమ తాత్విక సూత్రంలోనూ, ప్రక్రియలోనూ కీలకభూమిక పురుషదేవుడిదీ, పురుషుడిదీ కాదు; స్త్రీ దేవతదీ, స్త్రీదీ!

ఆదిమకాలంలో స్త్రీ శాసించిన ఆ మతవిశ్వాసరంగం ఓ రహస్యప్రపంచం. ఆ రహస్యప్రపంచానికి స్త్రీ రారాణి. అది చీకటివెలుగులు, భయనిర్భయాలు, కష్టసుఖాలు, చావుపుట్టుకలు అన్నీ కలగలసిన ప్రపంచం. అక్కడి దేవతలోని ఒక అంశ ఉగ్రకాళిగా, మృత్యుదేవతగా, రక్తపిపాసిగా కనిపించి భయపెడుతుంది. అంతర్లీనంగా ఉండే ఆ దేవత మరో అంశ, ప్రసన్నత, సాత్వికత. అది బతుకునీ, సుఖాన్నీ, వెలుగునూ ఇచ్చి నిర్భయుణ్ణి చేస్తుంది. గుహలు, తోపులు,వనాలు ఈ రహస్యప్రపంచ స్థావరాలు. ఆదిమకాలంలో అవే దేవతాలయాలు.

మన పురాణ, ఇతిహాసాలలో ఈ గుహలు, తోపులు, వనాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, వీటి ప్రస్తావన ఇతర పురాణ, ఇతిహాసకథల్లోనూ రావడం! స్త్రీ రహస్యప్రపంచంలోకి మగవాడు అన్నివేళల్లోనూ ప్రవేశించడానికి వీల్లేదు. ప్రవేశిస్తే శిక్ష తప్పదు. అది మరణశిక్ష కూడా కావచ్చు. ఇప్పటికిప్పుడు స్ఫురించే ఒక కథలో నారదుడు స్త్రీల రహస్యప్రదేశంలోకి అడుగుపెట్టి స్త్రీగా మారిపోతాడు. ఇంకో కథలో పార్వతి తన ఒంటి నలుగుపిండితో గణపతిని చేసి, అతన్ని కాపలా ఉంచి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ప్రవేశించబోతాడు. గణపతి అడ్డుపడతాడు. శివుడు అతని శిరసును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను అతనికి తగిలిస్తాడు. ఇది కూడా స్త్రీ రహస్యప్రపంచాన్ని సంకేతిస్తూ ఉండచ్చు. దేవీభాగవతం వంటి అమ్మవారికి సంబంధించిన పురాణాలలో మరిన్ని ఉదాహరణలు లభించవచ్చు.

ఇందుకు సంబంధించిన కథలు మన దగ్గరే కాక, ఇతర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రీకు పురాణ కథ ఇలా ఉంటుంది: ఓ నడివేసవి రోజున అర్తెమిస్ అనే దేవత ఒక కీకారణ్యపు లోయలో వేటాడి అలసిపోతుంది. కన్యా కూపం(Maiden’s Well), లేదా కన్యా సరోవరంలో జలకాలాడుతూ ఉంటుంది. ఆమెలానే వేటకు వచ్చిన అక్తయాన్ అనే పురుషుడు తన వేటకుక్కల వెంట సరిగ్గా అదే ప్రదేశానికి వచ్చి ఆమెను చూస్తాడు. అతను తను చూసింది ఇంకొకరికి చెప్పకుండా నివారించడానికి అర్తెమిస్ అతన్ని ఒక లేడిగా మార్చివేస్తుంది. అతనితో ఉన్న వేటకుక్కలు లేడి రూపంలో ఉన్న అతని మీద పడి తినేస్తాయి.

జగదేకవీరుని కథలో దేవకన్యలు జలకాలాడుతుండగా చూసిన ప్రతాప్ శిలగా మారిపోతాడు!

ఇంకో గ్రీకు కథలో లూకిపస్ అనే యువకుడు డఫ్నే అనే యువతిని ప్రేమిస్తాడు. స్త్రీ వేషంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిహిత నేస్తాలలో ఒకడిగా అయిపోతాడు. మిగతా నేస్తాలతోపాటు ఆమె వెంట వేటకు వెడుతుంటాడు. ఒకరోజున యువతులందరూ దుస్తులువిప్పి లాడన్ అనే సరోవరంలో జలకాలాడాలనుకుంటారు. లూకిపస్ అందుకు నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. బలవంతంగా అతని చేత దుస్తులు విప్పించి, పురుషుడన్న సంగతి తెలుసుకుంటారు. అప్పటికప్పుడు అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు.

మన దేశంలో స్త్రీ రహస్యప్రపంచపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చాలా వ్యాసాల క్రితం ఒక వ్యాసంలో దీని గురించి రాశాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సుసూక్ష్మమైన పోలికలను చూద్దాం:

మొదటి పోలిక

రెండు కథలూ ఎటువంటి దేవతారోపాలూ లేని ఇద్దరు మానవుల గురించి, అందులోనూ ఇద్దరు పురుషుల గురించి చెబుతున్నాయి. ఆ చెప్పడంలో మళ్ళీ ఒక తేడా ఉంది. నలుని ఉదాసీనంగానూ, విధి లేదా ఒక అదృశ్యశక్తి అతని కష్టాలకు కారణమైనట్టుగానూ కథకుడు చిత్రిస్తున్నాడు. అతణ్ణి విధి చేతిలో పావుగానే తప్ప, కష్టాల నుంచి గట్టెక్కడానికి పురుష(మానవ) ప్రయత్నం చేసినవాడిగా చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దమయంతి క్రియాశీలగా కనిపిస్తుంది. అంటే, దమయంతి అనే స్త్రీకి గల క్రియాశీల స్వభావాన్ని కథకుడు బహిర్గతం చేస్తూనే, దానిమీద పలచని తెర వేసి, నలుడు అనే పురుషుడి ముఖంగా కథ చెబుతున్నాడన్న మాట.

స్త్రీ, పురుష స్వామ్యాల కోణం నుంచి చూస్తే, భారతీయ తాత్వికతకు గల ప్రత్యేకతను ఇది వెల్లడిస్తుంది. ఎలాగంటే, సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యం మీద పురుషస్వామ్యాన్ని ప్రతిష్టించడమే ఇక్కడ జరిగింది కానీ, తాత్విక స్థాయిలో స్త్రీస్వామ్యాన్ని పూర్తిగా అణగదొక్కలేదు. అంతర్లీనంగా రెండు స్వామ్యాల మధ్య ఒక రాజీసూత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం భారతీయ స్వభావంలోనూ, చరిత్రలోనూ ఉంది. మనది నేటికీ బహుళ దేవీ, దేవుల ఆరాధనా రూపంలో బహురూప ఆస్తికత కొనసాగుతున్న దేశమని చెప్పుకున్నాం.

ఓడిసస్ నలుడికి భిన్నం. నలుడిలో ఉదాసీనత కనిపిస్తే, ఓడిసస్ లో క్రియాశీలత కనిపిస్తుంది. నలుడు ఎంత యోధుడో మనకు తెలియదు. కథకుడు ఆ కోణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఓడిసస్ ను యోధుడిగా చూపించడానికి కథకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పన్నెండు ఓడలలో సహచరులను వెంటబెట్టుకుని సాహసయాత్ర ప్రారంభించాడు. ఒక పట్టణం మీద పడి జనాన్ని చంపి స్త్రీలను, సంపదను సహచరులతో కలసి పంచుకున్నాడు. యోధలక్షణంతోపాటు ఇది అతని పురుష, లేదా మానవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అతనికి పరీక్షలు, కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. నలుడు ఎదుర్కొన్న పరీక్షలు, కష్టాల వెనుక ప్రతికూల(కలి), అనుకూల(కర్కోటకుడు) శక్తులు ఉన్నట్టే, ఓడిసస్ వెనుక కూడా (జియస్, పోసిడియన్, అయోలస్, హెర్మెస్) ఉన్నారు. అయితే, నలునికి భిన్నంగా ఓడిసస్ మానవీయమైన తెలివితోనూ, వీరత్వంతోనూ, పురుషకార్యంతోనూ కష్టాలనుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. నలుని విషయంలో కథకుడు విధిపాత్రను ప్రముఖంగా సూచిస్తున్నట్టు కనిపిస్తే; ఓడిసస్ విషయంలో పురుషయత్నాన్ని ప్రముఖంగా సూచిస్తాడన్నమాట.

ఓడిసస్ ఒంటి కన్ను రాక్షసుడైన పోలిఫెమస్ బారినుంచి బయటపడిన తీరే చూడండి. అతని చేత మద్యం తాగించి నిద్రపుచ్చడంలో, అతని కన్ను పొడిచేసిన తర్వాత పొట్టేళ్ళ కడుపుకు వేలాడుతూ తప్పించుకోవడంలో ఓడిసస్ బుద్ధిబలాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ తదుపరి ఘట్టంలో అయోలస్ అనే వాయుదేవుడినుంచి సహాయం పొందుతాడు. అయితే సహచరులు చేసిన తప్పువల్ల మళ్ళీ కష్టాల్లో పడతాడు. ఆ తర్వాత నరమాంసభక్షకులు ఉండే దీవికి చేరుకుని అక్కడ ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితుడవుతాడు. పదకొండు ఓడలను, ఎంతోమంది సహచరులను కోల్పోవడం రూపంలో అందుకు ప్రతిఫలం చెల్లించుకుంటాడు.

download

అక్కడినుంచి సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుని, తన సహచరులను ఆమె పందులుగా మార్చివేసినట్టు తెలిసి ఆమెను శిక్షించడానికి ఒక కత్తి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతనికి హెర్మెస్ అనే దేవుడి సాయం లభిస్తుంది. సిర్సేను లొంగదీసుకుని సహచరులను రక్షించుకోవడమే కాక, ఆమెతో పడకసుఖం కూడా పొందుతాడు. ఆమె సూచనపై అధోలోకానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఇస్తాడు. ఆ తర్వాత సౌరద్వీపానికి వెడతాడు, మరోసారి తుపానులో చిక్కుకుని, ఉన్న కొద్దిమంది సహచరులనూ, ఓడనూ కూడా కోల్పోతాడు. ఒంటరిగా ఇంకో దీవికి చేరి అక్కడ కలిప్సో అనే అప్సరసతో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. మళ్ళీ తెప్ప మీద బయలుదేరి విధ్వంసానికి గురై ఈదుకుంటూ వెళ్లి కొందరు బాలికల సాయంతో ఫేషియన్లను కలుస్తాడు. వారు అతణ్ణి ఓడలో క్షేమంగా స్వస్థలానికి పంపిస్తారు. అక్కడ అతను పెనెలోప్ స్వయంవరపరీక్షను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు.

ఇలా అనుకూల శక్తులనుంచి సాయం పొందుతూనే ప్రతికూలశక్తులను బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ ఎదుర్కొంటూ అనేక కష్ట నష్టాలనుంచి పురుషప్రయత్నంతో బయటపడిన మానవమాత్రుడిగా ఓడిసస్ ను చిత్రించే కథకుని వ్యూహం అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా నలదమయంతుల కథలో ఇటువంటి బుద్ధిబలాన్ని సమయస్ఫుర్తిని దమయంతి ప్రదర్శిస్తుంది. రెండు కథల్లోనూ దేవతలపై మనిషిది పైచేయిగా చూపడం కనిపిస్తుంది. ఇంకొక విధంగా, చెప్పాలంటే దేవతల మధ్యలోంచి క్రియాశీలుడైన నరుడు ఆవిర్భవించడం గురించి ఈ కథలు చెబుతున్నాయి.

రెండవ పోలిక

ఇది మరింత సుసూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన పోలిక. ఇక్కడ జోసెఫ్ క్యాంప్ బెల్ తన విశ్లేషణలో పేర్కొన్న female principle అడుగుపెడుతుంది. ఆ మాటను ‘స్త్రీ సూత్రం’ గా అనువదించుకుందాం. ఓడిసస్ కథలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కనుక ముందు దాని గురించి చెప్పుకుందాం. ఓడిసస్ కు– నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతి; సిర్సే, కలిప్సో అనే అప్సరస,లు నౌసికా అనే బాలిక, ఎథెనా అనే అనుకూల దేవత వరసగా తారసపడతారు. అందమైన యువతి రూపంలో అతనికి ఎదురై, సమ్మోహన పరచిన తొలి అనుభవం నరమాంసభక్షకుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది. ఆ తర్వాత ప్రతికూలశక్తిగా ఓడిసస్ కు ఎదురైన సిర్సే చివరికి అతనికి లొంగిపోయి అనుకూలశక్తిగా మారిపోయింది. అతను ఆమె పొందును అనుభవించడమే కాక ఆమె నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని మార్గదర్సనం కూడా పొందాడు. సిర్సే దగ్గరే అతని నగ్నత్వం గురించిన ప్రస్తావన వస్తుంది.

ఇక కలిప్సో మొదటినుంచీ అనుకూలత పాటించిన అప్సరస. ఆమెతో అతను ఎనిమిదేళ్ళు కాపురం చేయడానికి కారణం, మోహపాశంతో తనను బంధించివేసింది కనుకనే. ఆమెకు ఇష్టంలేకపోయినా ఆ పాశాన్ని తెంచుకుని బయటపడ్డాడు. సిర్సే దగ్గర ఎదురైన నగ్నత్వ భయానికి భిన్నంగా కలిప్సో దగ్గర అతనికి వస్త్రం లభించింది. మళ్ళీ నౌసికా అనే బాలిక తారసపడిన సందర్భంలో నగ్నత్వప్రస్తావన వచ్చింది. అప్పుడతను పూర్తి నగ్నంగా మారాడు. అయితే, ఆ బాలిక అతనికి వస్త్రం కూడా ఇచ్చి రాజభవనానికి తీసుకువెడుతుంది. చివరగా అతను కొడుకును, భార్యను కలసుకోడానికి ఎథెనా సాయపడుతుంది. ఈ ‘స్త్రీ సూత్రా’నికి కీలకమైన తాత్వికమైన వివరణ ఉంది. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

నలదమయంతుల కథకు వస్తే; ఈ స్త్రీ సూత్రం అన్నది ఓడిసస్ కథలో కనిపించినంత స్పష్టంగానూ, వివరంగానూ కాక, లీలగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధాన స్త్రీపాత్ర దమయంతి ఒక్కతే. ఆమె అప్సరసో, లేక అందమైన అపరిచిత యువతో కాదు, నలునికి అర్థాంగి. కాసేపు ఆ సంగతిని పక్కన పెట్టి ఓడిసస్ కథలోని స్త్రీ సూత్రాన్ని ఆమెకు అన్వయించుకుని చూద్దాం. దమయంతిని వివాహమాడాకే నలునికి కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో ఉన్నప్పుడే అతడు నగ్నంగా మారాడు. ఆమె చీరలోని అర్థభాగంతోనే తన నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. చివరికి ఆ చీరను తెంచుకుని బయటపడ్డాడు. తిరిగి దమయంతిని కలసుకున్న సందర్భంలోనే పోగొట్టుకున్న తన వస్త్రాన్ని మళ్ళీ సంపాదించుకుని, ధరించి నలుడిగా మారాడు. ఓడిసస్ కథలోనూ, ఈ కథలోనూ కూడా స్త్రీ సమక్షంలో పురుషుడి నగ్నత్వానికీ, వస్త్రానికీ ఏదో ప్రతీకాత్మక, తాత్విక ప్రాముఖ్యం ఉన్నట్టు అనిపిస్తుంది.

oedipus

ఈ నగ్నత్వ ప్రస్తావన వచ్చే మరో ప్రసిద్ధ కథ ఊర్వశీ-పురూరవులది. ‘నువ్వు ఎప్పుడైతే నాకు నగ్నంగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను’ అని ఊర్వశి పురూరవుడికి షరతు పెడుతుంది. ఒకరోజున పురూరవుడు నగ్నంగా కనిపించేసరికి అతణ్ణి విడిచి వెళ్లిపోతుంది. ఈ కథకు వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. పైన చెప్పిన స్త్రీ సూత్రమూ, లేదా స్త్రీ స్వామ్య, పురుష స్వామ్యాలలో గ్రీకు తాత్వికతకు, భారతీయ తాత్వికతకు తేడా ఉందని చెప్పుకున్నాం. గ్రీకు తాత్వికతలోనే కాక సామాజిక స్థాయిలో కూడా స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య తీవ్ర ఘర్షణా, ఒకదానిపై ఒకటి పై చేయిని చాటుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పురుషుడు విజయం సాధించి వీరుడిగా, క్రియాశీలిగా ఆవిర్భవించడం ఉన్నాయి. భారతీయ తాత్వికతలో స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య ఘర్షణతోపాటు సర్దుబాటు, సయోధ్య ఉంటూనే; సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యంపై పురుషస్వామ్యం పై చేయిని చాటుకోవడం ఉంది. అయితే, పురుషుని నరుడిగా, వీరుడిగా, క్రియాశీలిగా అవతరింపజేయడం భారతీయ, గ్రీకు సందర్భాలు రెండింటిలోనూ ఉమ్మడి అంశం.

ఈ కోణంలోకి వెళ్లినప్పుడు భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

అర్జునుని నరుడు అన్నట్టుగానే రామాయణంలో రాముని నరాంశను నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ‘నేను దశరథ మహారాజు కొడుకుని, మనిషిని మాత్రమే’ నని రాముడు ఒక సందర్భంలో చెప్పుకుంటాడు. అలాగే రాముని ‘పురుషోత్తముడు’ అన్నారు. అంటే ప్రపంచ పరిణామంలో ఒక దశలో స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించి వీరుడు, సాహసి, క్రియాశీలుడైన నరుని ఆవిర్భవింపజేయవలసిన అవసరం కలిగిందని ఈ కథలన్నీ సూచిస్తున్నాయన్న మాట.

స్త్రీపై రాక్షసి అన్న ముద్ర వేయడమే కాక, పురుషుడి కష్టాలకు, అతడు ఆత్మన్యూనతలోకి, నిష్క్రియత్వంలోకి జారిపోవడానికి స్త్రీయే కారణమన్న సూచనను ఉద్దేశపూర్వకంగానో, అనుకరణప్రాయంగానో ఆయా పురాణ కథలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని పోలికలు చూడండి…నలదమయంతుల కథలో నలుడు దమయంతిని పెళ్లాడిన తర్వాతే రాజ్యం కోల్పోయి కష్టపరంపరలో చిక్కుకుంటాడు. ప్రవాస జీవితం గడుపుతూనే బాహుకుడనే పేరుతో, వికృత వేషంలో, అంటే మారువేషంలో దమయంతి ‘పునస్స్వయంవరా’నికి వెడతాడు. పెనెలోప్ తో వివాహం అయిన తర్వాతే ఓడిసస్ యుద్ధానికీ, అక్కడినుంచి సముద్రంలో సాహసయాత్రకు బయలుదేరి వెళ్ళి పదేళ్లపాటు అనేక కష్టానష్టాలకు గురై చివరికి నోమన్ అనే మారుపేరుతో బిచ్చగాడి వేషంలో పెనెలోప్ పునస్స్వయంవరానికి వెడతాడు.

రాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అక్కడినుంచే నేరుగా సీతాస్వయంవరానికి వెళ్ళి సీతను వరిస్తాడు. ఆ తర్వాత పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాడు. అలాగే, పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లే ముందు బ్రాహ్మణ వేషాలలో అరణ్యవాసమే చేస్తున్నారు. ద్రౌపదితో వివాహం తర్వాతే వారు అర్థరాజ్యం పొందారు, ఆ రాజ్యాన్ని కోల్పోయి ఈసారి ద్రౌపదితోపాటు మళ్ళీ అడవుల పాలయ్యారు. వారు రాజ్యం కోల్పోవడం వెనుక ద్రౌపది పాత్ర కూడా ఎంతో కొంత ఉంది.

అయితే, ఈ పోలికలు అన్నీ అచ్చు గుద్దినట్టు ఒకే సూత్రాన్ని అనుసరించడంవల్ల కాకపోవచ్చు. కొన్ని కథానిర్మాణంలో అనుకరించిన స్థూలమైన పోలికలు కావచ్చు. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం అన్నింటిలోనూ సమానం. ఉదాహరణకు, నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల నిర్మాణం స్థూలంగా ఒకలానే ఉంటుంది. కానీ నలదమయంతుల కథలో వాస్తవంగా క్రియాశీల అయిన దమయంతి ముఖంగా కాక, ఉదాసీనుడైన నలుని ముఖంగా కథ చెబుతుంటే; ఓడిసస్ కథలో ఓడిసస్ నే క్రియాశీలుడిగా చూపిస్తూ అతని ముఖంగా కథ చెబుతున్నాడు. స్త్రీ స్వామ్యంమీద పురుష స్వామ్యం పైచేయిని నొక్కి చెప్పడం రెండింటా సమానం. అదే మిగతా ఉదాహరణలలోనూ కనిపిస్తుంది.

రామాయణకథ తెలిసిన వారికి ఒక సందేహం కలిగితీరాలి. అదేమిటంటే, తాటక, పూతన తదితరులే కాక, రావణుని చెల్లెలు అయిన శూర్పణఖ కూడా రాక్షసి అయినప్పుడు రావణుని భార్య అయిన మండోదరి ఎందుకు కాలేదన్నది. పౌరాణిక సంప్రదాయం మండోదరిని పతివ్రతగానూ, ఉత్తమురాలిగానూ గుర్తిస్తుంది. దీనికి మనం చెప్పుకోగలిగిన తార్కిక సమాధానం బహుశా ఒక్కటే: స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!

అదలా ఉంచితే, ఇక్కడినుంచి మనం మరిన్ని తాత్వికపు లోతుల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అది తర్వాత…

 -కల్లూరి భాస్కరం

నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది. ఓడిసస్ దానిని ఎంచుకున్నాడు. ఈ మార్గాన్ని మనకు తెలిసిన భాషలో ‘ద్వైతమార్గం’ అందాం.

సౌరద్వీపం చేరుకున్నాక ఓడిసస్ నిద్రపోతుండగా అతని సహచరులు మానవ సహజమైన ఆకలితో ఆ ద్వీపంలోని అనేక పశువులను నరికి వండుకు తిన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అంతలో ప్రచండమైన పడమటి గాలి వీచి పెనుతుపాను సృష్టించింది. ఓడనూ, ఓడిసస్ సహచరులనూ కూడా ముంచి వేసింది. ఓడ స్తంభానికి వేల్లాడి ఓడిసస్ ఒక్కడే ప్రాణాలు దక్కించుకున్నాడు.

అతని యాత్రలో ఇది పతాకఘట్టం!

ఓడిసస్ నీళ్ళ మీద తేలుతూ సిల్లా, చరిబ్దిస్ ల మధ్యగా తొమ్మిదిరోజులపాటు ప్రయాణించి పదో రోజున ఒగీగియా అనే దీవికి చేరుకున్నాడు. అక్కడ లేత పచ్చిక బయళ్ళు, పూతోటలు, ద్రాక్షతోటలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఒక గుహలో కలిప్సో అనే అప్సరస నివసిస్తోంది. ఆమె తియ్యని గొంతుతో పాటలు పాడుతూ తన మగ్గం ముందు అటూ ఇటూ తిరుగుతూ బంగారపు కండెతో వస్త్రం నేస్తోంది.

ఓడిసస్ కు ఆమె ఆతిథ్యమిచ్చి తిరిగి అతను శక్తిని పుంజుకునేలా చేసింది . ఆమెతోనే అతను ఎనిమిదేళ్లు గడిపేశాడు. సిర్సే నేర్పిన పాఠాలను కలిప్సో సాహచర్యంలో మరింత ఒంటబట్టించుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా అతన్ని తదుపరి యాత్రలోకి ప్రవేశపెట్టమని హెర్మెస్ ద్వారా జియస్ కలిప్సోకు కబురుచేశాడు. ఆమె అయిష్టంగానే అంగీకరించింది. ఓడిసస్ ఒక తెప్పను నిర్మించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనికి స్నానం చేయించి చక్కటి దుస్తులు కట్టబెట్టింది. అతను వెడుతుంటే ఆమె ఒడ్డున నిలబడి వీడ్కోలు చెప్పింది.

అయితే, తన కొడుకు పోలిఫెమస్ కన్ను పొడిచేసినందుకు ఇప్పటికీ ఓడిసస్ మీద పోసిడిన్ కోపంగానే ఉన్నాడు. ఒక పెను తుపానును ప్రయోగించి ఓడిసస్ ఉన్న తెప్పను ధ్వంసం చేయించాడు. ఓడిసస్ రెండు పగళ్ళు, రెండు రాత్రులు ఈదుకుంటూ వెళ్ళి, ఫేషియన్లు అనే నౌకా నిపుణులు ఉండే ఒక దీవికి చేరుకున్నాడు. అప్పుడతను పూర్తి నగ్నంగా ఉన్నాడు. అదే సమయంలో నౌసికా అనే రాచబాలిక తన నేస్తాలతో కలసి ఆడుకోడానికి సముద్రతీరానికి వచ్చింది. వాళ్ళు ఆడుతున్న బంతి నీళ్ళలో పడిపోయింది. దాంతో అంతా కేకలు పెట్టారు. ఒక గుబురు మాటున ఉన్న ఓడిసస్ ఆ కేకలు విని, చెట్టుకొమ్మతో తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ ఇవతలకు వచ్చాడు. అప్పుడా బాలికలు అతనికి కట్టుకోడానికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకెళ్ళారు.

ఆరోజు రాత్రి ఫేషియన్లు అతనికి విందు ఇచ్చారు. ఆ పదేళ్ళలో తను చేసిన సాహసయాత్రల గురించి, పడిన కష్టాల గురించి ఓడిసస్ వాళ్లకు చెప్పాడు. అతనిపై సానుభూతి చూపిన ఫేషియన్లు, అతను స్వస్థలానికి వెళ్ళడానికి ఒక ఓడను, సిబ్బందిని ఏర్పాటుచేశారు. అతను ఒళ్ళు మరచి సుఖంగా నిద్రపోయేవిధంగా ఓడను తీర్చిదిద్దారు. ఓడ కెరటాలపై ఊయలలూగుతూ సాగిపోతుంటే ఓడిసస్ తీయని గాఢనిద్రలోకి జారిపోయాడు. అదెంత గాఢనిద్ర అంటే, చావుతో సమానమైనంత! అంటే, ఓడిసస్ ఇప్పుడు మార్మిక జగత్తు నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట. ఈ దశలో అతనికి మార్గదర్శనం చేసే బాధ్యతను ఎథెనే అనే దేవత స్వీకరించింది.

ఇలా ఉండగా, అక్కడ ఓడిసస్ భార్య పెనెలోప్ కు పునస్స్వయంవరం ఏర్పాటైంది. ఎంతోమంది వీరులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెనెలోప్ ప్రాసాదంలో ఆతిథ్యం పొందుతున్నారు. దాసీలతో వాళ్ళు కామకలాపాలలో మునిగి ఉన్నారు. దాంతో ఆ ప్రాసాదం ఓ వ్యభిచారగృహంగా మారిపోయింది. ఓడిసస్ కొడుకు తెలెమాకస్ వాళ్ళ మధ్య బరువెక్కిన హృదయంతో నిట్టూర్పులు పుచ్చుతూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఎథెనా మారువేషంలో వెళ్ళి తెలెమాకస్ కు కనిపించింది. అతనామెకు స్వాగతం చెప్పాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత, ‘నీ తండ్రి వస్తున్నాడు. అతనికి ఎదురువెళ్ళు’ అని ఎథెనా అతనికి సలహా ఇచ్చి ఫలానా మార్గంలో వెళ్ళమని చెప్పింది. అలా తండ్రీ-కొడుకు కలసుకునే ఏర్పాటు చేసింది.

untitled

 

ఆ తర్వాత ఆమె ఒక అందమైన రాకుమారుని వేషంలో సముద్రపు ఒడ్డున ఓడిసస్ కు కనిపించింది. ఆమె చేతుల్లో ఒక పొడవాటి ఈటె ఉంది. ఆమెను చూడగానే ఓడిసస్ కు ఎంతో సంతోషం కలిగింది. ఎథెనా అతన్ని ఒక బిచ్చగాడి రూపంలోకి మార్చేసింది. తండ్రీ, కొడుకులు ఒక పందుల కాపరి గుడిసెలో కలసుకున్నారు. ఆ తర్వాత ఓడిసస్ స్వగృహంలోకి అడుగుపెట్టాడు. అతన్ని అతని కుక్క, ఒక వృద్ధదాది తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు. అతని మీద గూఢచర్యం సాగించిన వృద్ధ దాది అతని మోకాలి మీద ఒక పంది చేసిన గాయాన్ని చూసి గుర్తుపట్టింది. ఓడిసస్ ఆమెను చూపులతోనే వారించి, అక్కడి అతిథులు దాసీలతో నిస్సిగ్గుగా సాగించే కామకలాపాలను కాసేపు గమనిస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత స్వయంవరఘట్టం మొదలైంది. ఓడిసస్ కు చెందిన అత్యంత శక్తిమంతమైన వింటిని ఎత్తి పన్నెండు గొడ్డళ్లను ఎవడైతే ఛేదిస్తాడో అతన్ని పెనెలోప్ వరిస్తుంది… అదీ పరీక్ష! లక్ష్యాన్ని ఛేదించడం కాదు సరికదా, కనీసం వింటికి నారి కూడా బిగించలేక అంతా తెల్ల మొహం వేశారు. అప్పుడు బిచ్చగాడి రూపంలో ఉన్న ఓడిసస్ ముందుకు వచ్చాడు. అవలీలగా వింటిని పైకెత్తి నారి బిగించి పన్నెండు గొడ్డళ్ళనూ ఛేదించాడు. అతనికి దేవతల సహకారం కూడా లభించింది. ఆ తర్వాత అతను స్వయంవరంలో పాల్గొన్న వీరులను కూడా అంతం చేశాడు.

అతనే ఓడిసస్ అన్న సంగతి తెలిసిపోయింది. పెనెలోప్ భర్తను సమీపించి, ’శయ్యాగారం సిద్ధమవుతోం’దని చెప్పింది. ఆపైన, ‘ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మీ యాత్ర గురించీ, మీరు పడ్డ కష్టాల గురించీ అన్నీ నాకు చెప్పాలి’ అంది.

download

ఎథెనా

 

***

జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ, మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!

కేవలం స్థూలమైన పోలికలకే ఇంత ఆశ్చర్యపోవాలా, అవి యాదృచ్ఛికం కావచ్చు, లేదా మన కథలనే వాళ్ళు తీసుకుని ఉండచ్చని పాఠకులలో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అర్థమైనంతవరకూ ఈ పోలికలు అంత ఆషామాషీ వ్యవహారం కావు. వాటి వెనుక కొన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలూ ఉన్నాయి. అంతకన్నా విశేషంగా కొన్ని తాత్విక సామ్యాలు ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు నలదమయంతులు-ఒడిసస్ పెనెలోప్ ల కథలలో ఉన్న పోలికలను మూడు అంచెలలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి: 1. స్థూలమైన పోలికలు. 2. సూక్ష్మమైన పోలికలు. 3. సుసూక్ష్మమైన పోలికలు.

స్థూలమైన పోలికలు

రెండు కథల్లోనూ భార్యాభర్తల మధ్య వియోగం సంభవించింది. భర్త ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండు కథల్లోనూ దేవతల ప్రమేయం ఉంది. రెండింటిలోనూ భార్య పునస్స్వయంవరం ఉంది. కాకపోతే, దమయంతి పునస్స్వయంవరం భర్తను తన దగ్గరకు రప్పించుకోడానికి అనుసరించిన ఒక చిట్కా మాత్రమే. కానీ పెనెలోప్ స్వయంవరం నిజంగా జరిగింది. అదొక్కటే తేడా. భర్త ఏళ్ల తరబడి దేశాలు పట్టిపోయి భార్యకు దూరమైనప్పుడు భార్య పునర్వివాహం చేసుకోవచ్చునన్న సామాజిక నీతిని రెండు కథలూ ప్రతిబింబిస్తూ ఉండచ్చు కానీ, నలదమయంతుల కథలో కథకుడు దమయంతి పునర్వివాహప్రయత్నాన్ని ఒక చిట్కాగా మార్చేసి దమయంతి పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓడిసస్-పెనెలోప్ ల కథలో ఇందుకు భిన్నంగా జరిగింది. నిజానికి పెనెలోప్ కూడా పునస్స్వయంవరాన్ని ఒక చిట్కాగానే ప్రయోగించి ఉండచ్చు, ఆమె కూడా దమయంతిలానే పతివ్రత కావచ్చు. అలా అనుకున్నప్పుడు మహాభారత కథకుడు కథనంలో చూపిన ఒడుపును హోమర్ (పెనెలోప్ కు నిజంగా పున్స్స్వయంవరం జరిపించడం ద్వారా) చూపించలేకపోయాడనాలి. మొత్తానికి రెండుకథల్లోనూ భార్యాభర్తలు చివరికి ఒకటయ్యారు. కథ సుఖాంతమైంది. కథాచట్రానికి సంబంధించినంతవరకూ ఇవీ రెండుకథల మధ్య ఉన్న స్థూలమైన పోలికలు.

సూక్ష్మమైన పోలికలు

రెండు కథల వివరాలలోకి వెడితే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే. కానీ సూక్ష్మంగా చూస్తే పోలికలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, నలుడి కష్టాలకు అడవి వేదికైతే, ఓడిసస్ కష్టాలకు సముద్రం వేదికైంది. బహుశా ఉభయుల ప్రాదేశిక నేపథ్యంలో ఉన్న తేడా ఇందుకు కారణం కావచ్చు. విస్తారమైన అడవులు ఉన్న భారతదేశ నేపథ్యం నలుడిది. గ్రీకులకు ఉన్న నౌకాయాన నేపథ్యం ఓడిసస్ ది.

ఇక రెండు కథల్లోనూ నగ్నత్వం, వస్త్రాల ప్రస్తావన ఏదో ఒక రూపంలో రావడం ఒక పోలిక. నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు. దమయంతి చీరలో అర్థభాగాన్ని కట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకుంటాడు. కథ చివరిలో దమయంతిని తిరిగి కలసుకునే సందర్భంలో, తను దావానలం నుంచి కాపాడిన కర్కోటకుని తలచుకోవడం, పోయిన తన వస్త్రం తిరిగి అతని వద్దకు రావడం, దానిని కట్టుకోగానే నలునిగా మారిపోవడం జరుగుతాయి.

K11.11Hermes

హెర్మెస్

ఓడిసస్ కథకు వస్తే, అతడు సిర్సే అనే అప్సరస దగ్గరకు బయలు దేరినప్పుడు హెర్మెస్ అనే దేవుడు ఎదురై, ‘సిర్సేతో నువ్వు నిరభ్యంతరంగా పడకసుఖం అనుభవించు కానీ, ఆమె నిన్ను నగ్నంగా మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోకు’ అని హెచ్చరిస్తాడు. ఓడిసస్ కలిప్సో అనే మరో అప్సరస దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె బంగారు కండెతో వస్త్రం నేస్తూ ఉంటుంది. ఎనిమిదేళ్లపాటు తనతో కాపురం చేసి ఓడిసస్ తిరిగి యాత్ర ప్రారంభించబోయే ముందు కలిప్సో అతనికి స్నానం చేయించి చక్కని వస్త్రం కట్టబెడుతుంది. పోసిడిన్ తను ప్రయాణించే తెప్పను ధ్వంసం చేయించినప్పుడు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన ఓడిసస్, ఫేషియన్ల దీవికి నగ్నంగానే చేరుకుంటాడు. అక్కడ బాలికల కేకలు విని చెట్టు కొమ్మతో నగ్నత్వాన్ని కప్పుకుంటూ గుబురులోంచి బయటకు వస్తాడు. అప్పుడా బాలికలు అతనికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకువెడతారు.

పేరు మార్పులోనూ నలునికీ, ఓడిసస్ కూ పోలిక ఉంది. కర్కోటకుడు నలుని రూపాన్ని వికృతంగా మార్చివేయడమే కాకుండా అతని పేరు బాహుకుడిగా మార్చివేస్తాడు. ఓడిసస్ ఒంటికన్ను రాక్షసుడైన పోలిఫెమెస్ ను కలసినప్పుడు తన పేరు ‘నోమన్’ అని చెబుతాడు.

కథ చివరిలో దమయంతిని కలవబోయే ముందు నలుడూ, పెనెలోప్ ను కలవబోయే ముందు ఓడిసస్ మారువేషంలోనే ఉండడం ఇంకొక పోలిక. కర్కోటకుడు నలుని వికృతరూపిగా మార్చివేస్తే, ఎథెనా అనే దేవత ఓడిసస్ ను బిచ్చగాడిగా మార్చివేస్తుంది. బాహుకుడే నలుడు కావచ్చుననే అనుమానంతో దమయంతి కొడుకును, కూతురినీ కేశిని అనే పరిచారికతో బాహుకుని దగ్గరకు పంపించినట్టే, ఎథెనా ఓడిసస్ దగ్గరికి అతని కొడుకు తెలెమాకస్ ను పంపిస్తుంది. నలదమయంతుల కథలో కేశిని అనే పరిచారిక నలుని గుర్తించే ప్రక్రియలో భాగస్వామి అవుతుంది. అలాగే ఒక వృద్ధదాది ఓడిసస్ ను గుర్తుపడుతుంది. ఇది వేరొక పోలిక.

సుసూక్ష్మమైన పోలికల గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

హోమర్ చెప్పిన ‘నరు’ని కథ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తమాషా ఏమిటంటే, బృహదశ్వుడనే ఆ ముని నలదమయంతుల కథంతా చెప్పి ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. అప్పటికే జూదమాడి రాజ్యం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు ఇప్పుడా విద్యను ఏం చేసుకుంటాడు? పోనీ నలునిలా జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడా అంటే అదీ లేదు. యుద్ధంలో గెలుచుకున్నాడు.

అలాగే, నలదమయంతులది ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథ అనుకున్నామా…తీరా చూస్తే కథకుడు ఒకచోట కాస్త పరాకు పడ్డట్టున్నాడు. ఇంద్రాదుల మహిమతో అదృశ్యంగా ఉండి దమయంతి దగ్గరకు నేరుగా వెళ్ళిన నలుడు, ఆమె చెలికత్తెలకు ఎలా కనబడినట్టు?

సరే, విషయానికి వస్తే; నలదమయంతుల కథను నాలుగు పొరల్లో అన్వయించుకోడానికి అవకాశం ఉంది:

మొదటి పొర

ఇది మామూలుగా అందరికీ అర్థమైపోయే పొర. ఎటువంటి దేవతారోపాలూ లేని నలుడు-దమయంతి అనే సాధారణ మానవమాత్రుల జంట ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నలుడికి జూదమనే వ్యసనముంది. అతను జూదంలో రాజ్యంతోపాటు మొత్తం సంపదను అంతా కోల్పోయి భార్యతో సహా కట్టు బట్టలతో అడవుల పాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరికీ వియోగం సంభవించింది. ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. చివరికి ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు. తిరిగి అతనికి రాజ్యం లభించింది.

స్థూలంగా ఈ పొర మానవజీవితంలోనూ, సంసారంలోనూ ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి, మానవసంకల్పానికి వ్యతిరేకంగా విధి ఆడే ఆట గురించి, కష్టాలను వెన్నంటే సుఖాలూ ఉండడం గురించి, పురుషప్రయత్నంతో కష్టాల నుంచి గట్టెక్కడం గురించి చెబుతుంది.

ఇది పూర్తిగా ఇద్దరు మానవమాత్రుల గురించి చెబుతున్న కథ అన్నది, ఈ పొరలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరం.

రెండవ పొర

అదనంగా ఈ పొరలో ప్రధానంగా రెండు విషయాలలో కథకుడు అడుగుపెడుతున్నాడు. ఈ కథాచిత్రణ వెనుక తన ఉద్దేశాన్ని లేదా తన దృక్కోణాన్ని వెల్లడిస్తున్నాడు. మొదటిది, యాగాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడం, శౌచం ఎంత ముఖ్యమో చెప్పడం. నలుని ఆవహించడం కలికి మొదట్లో సాధ్యం కాలేదు. ఎందుకంటే, అతడు పుణ్యకార్యాలు చాలా చేశాడు కనుక. కానీ, ఒకరోజు అతను మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు కనుక వెంటనే కలి ఆవహించాడు. అంటే శౌచం ఎంత ప్రధానమో కథకుడు చెబుతున్నాడు. అయితే, అదే కలి నలుని పాచికలలోకి తన బంటును అవలీలగా ప్రవేశపెట్టగలిగాడు. కారణం, జూదం అనేది ఎలాగూ చెడ్డ వ్యసనమే కనుక.

untitled

ఇక రెండవది, కష్టమైనా, సుఖమైనా; భర్త తప్పు చేసినా, ఒప్పుచేసినా అతనిని వెన్నంటి ఉండడమే భార్య ధర్మమనీ, ఆమే పతివ్రత అనీ దమయంతి పాత్ర ద్వారా చెప్పడం మీద కథకునికి ఆసక్తి. దమయంతి పతివ్రత కనుకనే తనను కామించిన కిరాతకుని శపించి చంపగలిగింది. అయితే, పునస్స్వయంవరానికి సిద్ధపడడంతో ఆమె పతివ్రతాగుణంపై నలునికి సందేహం కలిగింది. కేవలం అతనిని తన దగ్గరికి రప్పించే ఉద్దేశంతో ఒక్క ఋతుపర్ణునికి మాత్రమే పునస్స్వయంవరం గురించి వర్తమానం పంపించానని ఆమె చెప్పడంతో అతని సందేహం తీరిపోయింది.

అదే సమయంలో, భర్త ఏ కారణం చేతనైనా భార్యకు చాలాకాలంపాటు దూరంగా ఉన్నప్పుడు ఆమె పునర్వివాహం చేసుకోవచ్చునన్న ఒకనాటి సామాజికనీతినీ ఈ పునస్స్వయంవరం ప్రస్తావన వెల్లడిస్తూ ఉండచ్చు.

మూడవ పొర

ప్రకృతి లేదా స్త్రీ క్రియాశీల, పురుషుడు ఉదాసీనుడన్న సూత్రాన్ని ఈ పొరలో అన్వయించడానికి అవకాశం ఉంది. ఈ కథ నలుని ముఖంగానే చెప్పినట్టు, నలుని పాత్రే ఎక్కువ కొట్టొచ్చేలా ఉన్నట్టు పైకి అనిపిస్తుంది. కథకుడు పురుషప్రాధాన్యవాది అన్న విషయాన్ని ఇతర అంశాలు కూడా ద్రువీకరిస్తూనే ఉన్నాయి. కానీ కొంచెం నిశితంగా చూడండి…తమ ఇద్దరి సంబంధం విషయంలో దమయంతే ఎక్కువ చొరవ తీసుకున్నట్టు, నలుని తన వద్దకు రప్పించుకోవడంలో ఆమే ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతుంది.

దమయంతి మీద నలుడు మనసు పడినా తొలి చొరవ దమయంతిదే. ఆమె నలుని కోసం తపిస్తూ శుష్కించడం తెలిసి తండ్రి నలుని రప్పించడానికే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరడమైతే బయలుదేరాడు కానీ, ఇంద్రాదులు ఎదురై తమ తరపున దూతగా వెళ్ళి తమలో ఒకరిని పెళ్లాడమని దమయంతికి చెప్పవలసిందిగా కోరినప్పుడు అతను వారి కోరిక తీర్చడానికి దమయంతిని వదలుకోడానికి సిద్ధపడ్డాడు. ఆడిన మాట తప్పవని తెలిసే నిన్ను ఈ కోరిక కోరామని ఇంద్రుడు అనేసరికి తన ప్రతిష్టను కాపాడుకోడానికి దమయంతినే త్యాగం చేయడానికి మొగ్గుచూపాడు. దమయంతిని కలసి ఇంద్రాదుల కోరిక చెప్పి, దేవతల ఆగ్రహం నుంచి తనను రక్షించమని నలుడు కోరడంలో దమయంతిపై వలపుమీద స్వార్థానిదే పై చేయి అయింది.

దమయంతి స్పందన వేరు. ఆమె ఎలాగైనా నలుని పెళ్లాడడానికే నిశ్చయించుకుంది. నలుని ప్రతిపాదనకు మొదట్లో దుఃఖంలో కూరుకుపోయినా వెంటనే తేరుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగా అని ఆలోచించింది. నలుడు ఆ ప్రయత్నమే చేయలేదు. ‘ఇంద్రాదుల సమక్షంలోనే నిన్ను వరిస్తాను, అప్పుడు నీకు ఆడి తప్పిన దోషం రా’దని ఉపాయం చెప్పింది. నలుడు చేసిందల్లా ఆమె మాటను ఇంద్రాదులకు చేరవేయడమే.

తీరా ఇంద్రాదులు నలుగురూ ఆమె ఎత్తుకు పై ఎత్తు వేసి నలుని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని, అసలు నలుని గుర్తించి అతని మెడలో దమయంతి దండ వేసింది. ఈవిధంగా నలుని పెళ్లాడడంలో క్రియాశీల పాత్ర దమయంతిదే కాని నలుడిది కాదు.

ఆ తర్వాత నలుడు జూదంలో సమస్తాన్నీ కోల్పోయి అడవి పాలైనప్పుడు కూడా దమయంతి అతనితోనే ఉంది. అందుకు భిన్నంగా ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెను విడిచేసి వెళ్ళినది నలుడే. అంటే, ఇక్కడ కూడా నలుడు తన మనోభావాలకే ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా స్వార్థాన్నే చాటుకున్నాడన్నమాట.

పుట్టింటికి చేరుకున్న దమయంతి నలుని తన వద్దకు రప్పించుకోవడంలోనూ అడుగడుగునా క్రియాశీలంగా వ్యవహరించింది. తల్లితో తండ్రికి చెప్పించి నలుని వెతకడానికి బ్రాహ్మణులను పంపించే ఏర్పాటు చేసింది. నలుడు అజ్ఞాతంగా ఉంటాడన్న సంగతిని ఆమె ఉహించడమే కాదు; భార్యను వదిలేసి వెళ్ళడం న్యాయమా అని వెళ్ళిన ప్రతిచోటా సభలలో ప్రశ్నించమనీ, దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చుననీ బ్రాహ్మణులకు చెప్పి పంపించింది. ఋతుపర్ణుని దగ్గర పనివాడుగా ఉన్న బాహుకుడనే వ్యక్తి తనకు సమాధానం చెప్పాడని తెలపగానే, తనకు ‘రెండు మూడు రోజుల్లో’ పునస్స్వయంవరం జరపబోతున్నట్టు ఋతుపర్ణుడు ఒక్కడికే కబురు అందేలా చూసింది. ‘రెండు మూడు రోజుల్లో’ అని అనిపించడం కూడా నలుని రప్పించే వ్యూహంలో భాగమే. నలుని కంటె వేగంగా రథం తోలగలిగినవారు ఇంకొకరు లేరని ఆమెకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో జరగబోయే పునస్స్వయంవరానికి అయోధ్యనుంచి వందల మైళ్ళ దూరంలో ఉన్న విదర్భకు ఋతుపర్ణుని ఎవరైనా తీసుకురాగలిగితే, అది నలుని గుర్తించడానికి ఒక ముఖ్యమైన ఆధారం అవుతుందని ఆ కబురు పంపేటప్పుడే దమయంతి అనుకుందన్నమాట. ఈవిధంగా దమయంతి క్రియాశీలగానే కాక ఎంతో ఉపాయశాలిగానూ వ్యవహరిస్తుంది. ఇక బాహుకుడే నలుడన్న సంగతిని నిర్ధారణ చేసుకోడానికి అతనితో దమయంతి ఆడిన మైండ్ గేమ్, అందులో విజయం సాధించడం ఆమె బుద్ధికుశలతకు పరాకాష్ట.

నాలుగవ పొర

ఇది సంక్లిష్టమే కాక, కొంత వివరంగా చెప్పుకోవలసిన పొర. ఇందులో కొన్ని తాత్విక అంశాలు చర్చలోకి వస్తాయి. అవి ఎలాంటివో తెలుసుకోవాలంటే, ఒక గ్రీకు ఇతిహాస కథతో నలదమయంతుల కథకు ఉన్న పోలికల గురించి మొదట చెప్పుకోవాలి. ఆ ఇతిహాసం, హోమర్ (క్రీ. పూ. 85౦) చెప్పిన ‘ఒడిస్సే’(Odissey). హోమర్ ఇలియడ్(Iliad) అనే మరో ప్రసిద్ధ ఇతిహాసాన్ని కూడా చెప్పాడు. అది ట్రాయ్ యుద్ధం గురించి. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్(Odisseus) అనే యోధుడి కథ ‘ఒడిస్సే’. ఈ రెండూ ప్రతిపాదించే తాత్వికతలలో మౌలికమైన తేడా ఉంది. ముందుగా, జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో చర్చించిన ఒడిస్సే కథను వీలైనంత క్లుప్తంగా చెప్పుకుందాం.

ఓడిసస్ ఇథకా అనే ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య పేరు పెనెలోప్. ఓడిసస్ ట్రాయ్ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ యుద్ధం పదేళ్ళపాటు జరుగుతుంది. ఆ పదేళ్లూ అతను భార్యకు దూరమవుతాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అతను సహచరులను వెంటబెట్టుకుని పన్నెండు ఓడలలో సాహసయాత్ర ప్రారంభిస్తాడు. ముందుగా థ్రేసియన్లకు చెందిన ఇస్మారస్ అనే పట్టణంపై దాడి చేసి, జనాన్ని చంపేసి అక్కడి సంపదను, స్త్రీలను పంచుకుంటారు. అక్కడినుంచి తిరిగి యాత్ర ప్రారంభించిన తర్వాత జియస్ అనే దేవుడు పెద్ద తుపాను సృష్టిస్తాడు. ఓడ తెరచాపలు చిరిగి చీలికలు పీలికలైపోతాయి. అందరూ పూర్తిగా అదుపు తప్పి తొమ్మిదిరోజుల పాటు కెరటాలు ఎటు నెడితే అటు కొట్టుకుపోతారు. చివరికి తుపాను వారిని తెలిసిన ప్రపంచపు సరిహద్దులను దాటించి అజ్ఞాత ప్రపంచంలోకి తీసుకు వెడుతుంది.

పదో రోజున తామర పువ్వులు తినే(Lotus Eaters) జనం ఉండే భూమికి చేరుకుంటారు. ఓడిసస్ అనుచరులు తామర పువ్వులను తినగానే తామెవరో మరచిపోయి అక్కడినుంచి రావడానికి నిరాకరిస్తారు. ఓడిసస్ వాళ్ళను బలవంతంగా ఓడల్లోకి లాక్కువెళ్ళి, కట్టిపడేసి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఇప్పుడు అడుగడుగునా కష్టాలు, పరీక్షలు ఎదురయ్యే ఒక మార్మిక ప్రపంచంలోకి ఓడిసస్, అతని ఓడలు అడుగుపెట్టాయి. మొదట వారు ఒంటి కన్ను రాక్షసులు ఉండే భూమికి చేరుకుంటారు. వాళ్ళలో ఫోలిఫెమెస్ అనేవాడు మరింత భీకరంగా ఉంటాడు. అతను పోసిడన్ అనే దేవుడి కొడుకు. పోసిడస్ సముద్రంలో పెద్ద పెద్ద అలలకు ప్రభువు. మన వరుణదేవుడి లాంటివాడు. తన పొట్టేళ్ళ మందతో కలసి పోలిఫెమెస్ ఒక గుహలో నివసిస్తూ ఉంటాడు. ఓడిసస్ తన సహచరులలోంచి మెరికల్లాంటి వాళ్ళను పన్నెండుమందిని వెంటబెట్టుకుని ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. లోపల పుష్కలంగా వెన్న, మీగడ, ;పాలు; గొర్రెల మందలు ఉంటాయి. కాసేపటికి ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. అతణ్ణి చూడగానే భయపడి అంతా దాక్కుంటారు. రాక్షసుడు వాళ్ళను కనిపెట్టి అతిపెద్ద బండరాయితో గుహను మూసేసి వాళ్ళలో ఆరుగురిని తినేస్తాడు. ఓడిసస్ వాడికొన ఉన్న ఒక గుంజను సిద్ధం చేసుకుంటాడు. తర్వాత రాక్షసుడి దగ్గరికి వెళ్లి, తన పేరు నోమన్ అని చెప్పి అతనికి ద్రాక్షసారా ఉన్న ఒక పెద్ద తోలుతిత్తిని ఇస్తాడు. రాక్షసుడు ఆ సారా తాగేసి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఓడిసస్ గుంజతో అతని కన్ను పొడిచేస్తాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ చేతులతో తడుముకుంటూ వెళ్లి గుహను మూసిన బండరాయిని తొలగించి ప్రవేశమార్గంలో తను కూర్చుంటాడు. ఓడిసస్, మిగిలిన ఆరుగురు భారీ పొట్టేళ్ల కడుపుకు వేల్లాడుతూ బయటపడతారు.

అక్కడినుంచి ఓడలలో బయలుదేరి అయోలస్ అనే వాయుదేవుడి దీవికి చేరుకుంటారు. ఆ దీవిలో అయోలస్ ఆరుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళతో నివసిస్తూ ఉంటాడు. కొడుకులకు కూతుళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతను ఓడిసస్ కు తొమ్మిదేళ్ళ వయసున్న ఒక ఎద్దు చర్మంతో చేసిన సంచీలో ప్రయాణానికి తోడ్పడే రకాల వాయువులనుల కట్టి ఇస్తాడు. ఆ తర్వాత బలమైన పడమటి గాలి వీచి ఓడలను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళేలా చేశాడు. పదో రోజుకు స్వస్థలానికి దగ్గర అవుతుండగా, ఓడిసస్ నిద్రపోతుండడం చూసి అతని సహచరులు ,అయోలస్ ఇచ్చిన తోలుసంచిలో ఏవో నిధి నిక్షేపాలు ఉంటాయనుకుని దానిని తెరుస్తారు. అంతే, ఒక ప్రచండ వాయువు వీచి ఓడలను అయోలస్ దీవికే తిరిగి తీసుకొస్తుంది. ఈసారి వారికి ఆతిథ్యమివ్వడానికి, సహకరించడానికి అయోలస్ తిరస్కరిస్తాడు.

భగ్నహృదయాలతో అందరూ తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఈసారి ఏ వాయువూ వారికి సహకరించదు. ఏడో రోజున నరమాంస భక్షకులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితులైపోతారు. ఆమె ఆ దేశపు రాజుగారి కూతురు. వారిని తన ఇంటికి తీసుకెడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఒక పర్వతం ఆకారంలో భయంకరంగా ఉంటారు. తండ్రి ఓడిసస్ బృందంలో ఒకడిని పట్టుకుని తినబోతుంటే అందరూ భయపడి ఒడ్డుకు పరుగెడతారు. తండ్రి సింహనాదం చేయగానే అన్ని వైపుల నుంచీ లెక్కలేనంత మంది నరమాంస భక్షకులు వచ్చి వీరి మీద పడతారు. ఎంతో మందిని చంపేస్తారు. ఒక్క ఓడిసస్ ఓడను తప్ప మిగిలిన ఓడలను ధ్వంసం చేసేస్తారు.

Circe_by_cemac

గ్రీకు అప్సరస సిర్సే

 

 

ఓడిసస్ మిగిలిన సహచరులతో కలసి తిరిగి యాత్ర్ర ప్రారంభిస్తాడు. సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుంటాడు. సిర్సే సూర్యుని వల్ల సముద్రానికి కలిగిన కూతురు. మానవాళికి వెలుగునిచ్చేది ఆమే. ఓడిసస్ పంపించిన మనుషులు అడవిలోకి వెళ్లి నునుపు రాళ్ళతో కట్టిన సిర్సే భవంతిని సమీపిస్తారు. ఆ భవంతికి అన్ని వైపులా తోడేళ్లు, సింహాలు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి ఏదో మందు పెట్టడంతో అవి పూర్తిగా సాధుజంతువులుగా మారిపోయాయి. ఓడిసస్ సహచరులను చూసి అవి పెంపుడు కుక్కలలా తోక ఊపాయి. వారికి లోపలినుంచి తియ్యని గొంతుతో సిర్సే పాడుతున్న పాట వినిపించింది. వారు ఆమెను పిలిచారు. ఆమె బయటికి వచ్చి వాళ్లందరినీ లోపలికి ఆహ్వానించింది. వారంతా మంత్రించినట్టుగా లోపలికి వెళ్లారు. యురిలోకస్ అనే అతనికి మాత్రం ఇందులో ఏదో కుట్ర ఉందన్న అనుమానం కలిగి బయటే ఉండిపోయాడు. సిర్సే ఎత్తైన ఆసనాల మీద అందరినీ కూర్చోబెట్టి మందు కలిపిన ఆహారమూ, మద్యమూ ఇచ్చింది. దాంతో వారు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. సిర్సే వారిని మంత్రదండంతో తాకి పందులుగా మార్చేసి వారి ముందు పందులు తినే ఆహారం వేసింది.

ఇది చూసి భయపడిన యురిలోకస్ వెళ్ళి ఈ సంగతి ఓడిసస్ కు చెప్పాడు. ఓడిసస్ ఒక పెద్ద కంచు ఖడ్గాన్నీ, విల్లమ్ములను తీసుకుని సిర్సే భవంతికి బయలుదేరాడు. హెర్మెస్ అనే దేవుడు ఒక యువకుని రూపంలో, స్వర్ణదండం పట్టుకుని అతనికి ఎదురయ్యాడు. సిర్సే మాంత్రికతనుంచి అతన్ని కాపాడే ఒక దివ్యమైన మూలికను ఇచ్చాడు.

“సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు” అన్నాడు.

ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. సిర్సే అతనికి లొంగిపోయింది. తను పందులుగా మార్చిన ఓడిసస్ సహచరులను తిరిగి మనుషులుగా మార్చేసింది. వారు వెనకటి కంటే యవ్వనవంతులుగా, అందగాళ్ళుగా మారిపోయారు. ఓడిసస్ సిర్సే పొందులోనే ఎనిమిదేళ్లు గడిపేశాడు. ఆ తర్వాత సిర్సే,

“నువ్విప్పుడు ఇంకో యాత్ర చేయాలి. అధోలోకానికి( అంటే మన పాతాళం అన్నమాట)వెళ్ళాలి. అక్కడ హేడ్స్, భయం గొలిపే పెరెస్ఫోన్ ఉంటారు. భవిష్యత్తును చెప్పే తేబన్ టిరేసియస్ కూడా ఉంటాడు. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. నీకు మేలు జరుగుతుంది.” అని చెప్పి అతనికి మార్గదర్శనం చేసింది.

ఓడిసస్ తిరిగి ఓడలో బయలుదేరి ప్రపంచం అంచులకు పయనించాడు. సిమ్మేరియన్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పొగమంచుతోనూ, మేఘాలతోనూ కప్పబడి ఉంది. అక్కడ నిరంతరం రాత్రే కానీ పగలు లేదు. ఓడిసస్ అక్కడ ఒక కందకంలో– అంటే ఊర్ధ్వమార్గంలో కాకుండా– అధోమార్గంలో పితృదేవతలకు తర్పణం విడిచాడు. అన్నివైపుల నుంచి ప్రేతాత్మలు వచ్చి ఆశ్చర్యంతో కేకలు పెట్టాయి. అక్కడ ఓడిసస్ తన తల్లిని, టెరేసియస్ ను, ఫియడ్రాను, అగమెమ్నాన్ ను, యాచిలెస్ ను, క్రీటు రాజు మినోస్ ను, ఇంకా ఎందరో పితృదేవతలను, దండం పుచ్చుకుని మృతులకు శిక్షలు విధించే జియస్ కొడుకును (మన యముడన్న మాట) దర్శించాడు. అయితే, పెరెస్ఫోన్ వల్ల తనకు హాని జరుగుతుందేమోనని భయపడి తిరిగి సిర్సే దగ్గరికి వచ్చాడు. ఆమె నుంచి అంతిమ ఆదేశాలు పొంది తిరిగి యాత్ర ప్రారంభించాడు.

మిగతా కథ, విశేషాలు తర్వాత….

-కల్లూరి భాస్కరం

 

 

 

దమయంతి ఆడిన ‘మైండ్ గేమ్’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతుల కథ ఇదీ…

దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. ‘నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ కలిగేలా చేస్తా’నని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.

గుంపుతో కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. ‘నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను. సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం, అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది’ అంది.

దమయంతి సంతోషించింది. ‘నలుడి గురించి నాకు చెప్పినట్టే, నా గురించి కూడా నలుడికి చెప్పవా’ అని ప్రార్థించింది. హంస మళ్ళీ నలుడి దగ్గరకు వెళ్ళి దమయంతి గుణ రూపాలను వర్ణించి చెప్పింది. అప్పటినుంచీ ఇద్దరిలోనూ పరస్పర అనురక్తి పెరిగిపోయింది. ఎంతసేపూ నలుడి తలపులతోనే గడుపుతూ దమయంతి నిద్రాహారాలకు దూరమై శుష్కించింది. చెలికత్తెలు భయపడి ఆమె తండ్రి భీముడికి ఈ విషయం చెప్పారు. నలుని ఎలా రప్పించాలా అని ఆలోచించి అతను కూతురికి స్వయంవరం చాటించాడు.

రాజులందరూ ఆ స్వయంవరానికి బయలుదేరి వెళ్లారు. అలాగే నలుడూ బయలుదేరాడు. ‘యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గానికి వచ్చి సకల సుఖాలూ అనుభవించడం రాజులకు పరిపాటి కదా, ఇప్పుడు ఎందుకు రావడం లే’దని ఇంద్రుడికి అనుమానం వచ్చింది. నారదుని కారణం అడిగాడు.  ‘అతిలోక సుందరి అయిన దమయంతికి స్వయంవరం జరుగుతోంది, రాజులందరూ పరస్పర కలహాలు విడిచిపెట్టి, స్వయంవరానికి వెడుతున్నారు. అందుకే స్వర్గానికి రావడం లే’దని నారదుడు చెప్పాడు.

దాంతో ఆ స్వయంవరాన్ని చూడాలని ఇంద్రుడు కూడా వేడుక పడ్డాడు. అగ్ని, యమ, వరుణులతో కలసి భూలోకానికి వచ్చాడు. వారికి నలుడు కనిపించాడు. ‘మా తరపున దూతగా వెళ్ళి, మేము చెప్పినట్టు చేస్తావా?’ అని ఇంద్రుడు అతన్ని అడిగాడు. ‘తప్పకుండా! ఏం చేయమంటారో చెప్పండి’ అని నలుడు అన్నాడు. ‘దమయంతి దగ్గరకు వెళ్ళి మాలో ఒకరిని వరించమని చెప్పా’ లని ఇంద్రుడు అన్నాడు. నలుడు విస్తుపోయాడు. ‘నేను కూడా అందుకే వెడుతున్నాను. మీకు ఆ సంగతి తెలిసీ ఇలా కోరడం న్యాయమా?’అన్నాడు. ‘నువ్వు ఇచ్చిన మాట తప్పవని తెలిసి ఈ కోరిక కోరాం. ఇది దేవతలకు ఇష్టమైన కార్యం, కాదనకుండా చేసిపెట్టు. నేరుగా రాజగృహంలోకి ఎలా వెడతాననే సందేహం పెట్టుకోకు. నిన్ను ఎవరూ అడ్డుకోరు’ అన్నాడు ఇంద్రుడు.

చేసేది లేక నలుడు దమయంతి మందిరానికి చేరుకున్నాడు. అతణ్ణి చూసి చెలికత్తెలు అదిరిపడి, ఇతడెవరా అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నలుడు తనను దమయంతికి పరిచయం చేసుకుని,’ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవులు నన్ను నీ దగ్గరకు దూతగా పంపించారు. తమలో ఒకరిని పెళ్ళాడి, తమ అందరికీ సంతోషం కలిగించమని చెప్పమన్నారు’ అన్నాడు.

ఆ మాట వినగానే దమయంతి దుఃఖంతో కుప్పకూలింది. ‘నేనెక్కడ…ఇంద్రాది దేవతలెక్కడ? నేనెప్పుడూ వాళ్ళకు మొక్కుతూ ఉంటాను. నేను నీ ధనాన్ని. నీ కోసమే స్వయంవరం పేరుతో రాజులందరినీ ఇక్కడికి రప్పించాను. నువ్వే నా భర్తవు. నువ్వు ఒప్పుకోకపోతే ఉరేసుకునో, విషం తాగో, అగ్నిలో దూకో ఆత్మహత్య చేసుకుంటాను’ అంది.

‘మహాశక్తిమంతులు, లోకపాలకులు, సంపన్నులు, తేజస్వులు అయిన దేవతలను కాదని; వారి పాదధూళిపాటి కూడా చేయని నా లాంటి మనుష్యుని కోరుకుంటావా? దేవతల ఇష్టం తీర్చకపోతే మనుషులు అధోగతి చెందుతారు. కనుక వారికి ఇష్టం కలిగించి నన్ను కాపాడు’ అని నలుడు అన్నాడు.

దమయంతి చెక్కిళ్లపై కన్నీరు ధారలు కట్టింది. చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయి, ఆ తర్వాత, ‘నీకు ఆడి తప్పిన దోషం కలగని ఒక ఉపాయం తట్టింది. ఇంద్రాదులు స్వయంవరానికి వస్తే, వాళ్ళ ఎదుటే నిన్ను వరిస్తాను’అంది. నలుడు ఇంద్రాదుల దగ్గరకు వెళ్ళి దమయంతి అన్న మాటలు చెప్పాడు.

‘నలుని తప్ప ఇంకొకరిని వరించదట! ఎలా వరించదో చూద్దాం’ అని ఇంద్రాదులు నలుగురూ అనుకుని నలుని రూపంలోనే స్వయంవరానికి వెళ్లారు. ఎదురుగా అయిదుగురు నలులు ఉండడంతో, అసలు నలుని ఎలా గుర్తించాలో తోచని దమయంతి, మీరే మీ నిజరూపాలను ధరించి నలుని గుర్తించేలా చేయండని దేవతలను ప్రార్థించింది. దాంతో, రెప్పపాటులేని కళ్ళతో, చెమట లేని దేహాలతో, భూమిని అంటని పాదాలతో నలుగురూ ఆమెకు కనిపించారు. ఆమె అసలు నలుని మెడలో దండ వేసింది.

ఇద్దరికీ వివాహం జరిగిపోయింది.

***

ఇంద్రాదులు తిరిగి దేవలోకానికి బయలుదేరారు. దారిలో వారికి కలి ఎదురయ్యాడు. ఎక్కడికి వెడుతున్నావని ఇంద్రాదులు అడిగారు. ‘దమయంతి స్వయంవరానికి’ అని కలి చెప్పాడు. ‘ఇంకెక్కడి స్వయంవరం? అది అయిపోయింది. దమయంతి నలుడనే వాడిని వరించిం’దని వారు చెప్పారు. దాంతో కలికి నలుడి మీద కోపం వచ్చింది. అతన్ని రాజ్యభ్రష్టుని చేయడానికీ, ఆ దంపతులకు వియోగం కల్పించడానికీ నిర్ణయించుకున్నాడు. నలుడు ద్యూతప్రియుడనే సంగతి తెలిసి అతని పాచికలలోకి ప్రవేశించమని ద్వాపరం అనే తన బంటును నియోగించాడు. తను నలునిలో ప్రవేశించాలని చూశాడు కానీ, నలుడు యాగాలు మొదలైన పుణ్యకర్మలు చేసినవాడు కావడంతో అది సాధ్యం కాలేదు. అదను కోసం కలి నిరీక్షిస్తుండగా, ఒక రోజున నలుడు మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మరచిపోయి సంధ్యావందనానికి ఉపక్రమించడంతో ఇదే అదను అనుకుని కలి అతనిలో ప్రవేశించాడు. ఆ తర్వాత పుష్కరుడు అనే వాడి దగ్గరకు వెళ్ళి, ‘నువ్వు నలుడితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలుచుకో’ అని చెప్పాడు. అతనికి సహాయకుడిగా వృషుడు అనే వాడిని ఇచ్చి, పాచికలు తీసుకుని తను కూడా పుష్కరునితో కలసి నలుడు దగ్గరికి వెళ్ళి తమతో జూదమాడమని ఆహ్వానించాడు.

కొన్నేళ్లపాటు నలుడు జూదానికి బానిసై చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ లోపల అతనికి ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు కలిగారు. దమయంతి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపేసి తను నలుడితో ఉండిపోయింది. ఇద్దరూ కట్టుబట్టలతో మిగిలి రాజధానిని విడిచిపెట్టారు. మంచినీళ్ళతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఒక రోజు తన ఎదురుగా బంగారు రెక్కలతో తిరుగుతున్న కొన్ని పక్షులను చూసి, వాటిని పట్టి ఆకలి తీర్చుకోవచ్చు ననుకుని తన కట్టుబట్టను నలుడు వాటిపై విసిరాడు. అవి బట్టతో సహా ఎగిరిపోయి, ‘నీ రాజ్యాన్ని, ధనాన్ని హరించిన పాచికలమే మేము. నీ వస్త్రాన్ని కూడా అపహరించడానికి ఇలా పక్షి రూపంలో వచ్చా’మని చెప్పాయి.

నలుడు దమయంతి చీరచెరగును తనకు చుట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే వస్త్రంతో అడవి దారి పట్టారు. ఆకలి, దాహాలకు తోడు; నడిచి నడిచి అలసిపోయిన దమయంతి ఒకచోట ఆదమరచి నిద్రపోతున్న సమయంలో నలుడు తను కట్టుకున్న చీర భాగాన్ని తెంచుకుని ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నిద్రలేచి భర్తను వెతుక్కుంటూ వెడుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఒక కిరాతుడు కొండచిలువను చంపి ఆమెను కాపాడాడు. ఆ తర్వాత అతను తన పొందు కోరేసరికి ఆగ్రహించిన దమయంతి అతన్ని చావమని శపించగా అతను చచ్చి పడిపోయాడు. ఆమె భర్తను వెతుక్కుంటూ ఒక మునిపల్లె చేరుకుంది. అక్కడి మునులు, ‘నీ భర్త కనిపిస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కుతారు’ అని ఆమెకు భవిష్యత్తు చెప్పి అదృశ్యమయ్యారు. దమయంతి ముందుకు వెడుతుండగా ఒక వ్యాపారుల బృందం కనిపించింది. వారు సుబాహు అనే రాజు నగరానికి వెడుతున్నామని చెప్పగా ఆమె వారి వెంట వెళ్లింది. వ్యాపారులు దారిలో ఒక చోట నిద్రపోతుండగా ఒక మదపు టేనుగు వారిలో కొందరిని తొక్కి చంపేసింది. మిగిలినవారితో కలసి దమయంతి చివరికి సుబాహు నగరానికి చేరుకుంది. రాజమాత ఆమెను చూసి, దాదిని పంపి తన దగ్గరకు పిలిపించుకుని వివరాలు అడిగింది. దమయంతి భర్తకు దూరమయ్యానని మాత్రం చెప్పి సైరంధ్రీ వ్రతంలో ఉన్నా నంది. ‘బ్రాహ్మణులను పంపి నీ భర్తను వెతికిస్తాను. నువ్వు నా దగ్గర ఉండు’ అని రాజమాత అంది. దమయంతి ఒప్పుకుంది.

untitled

***

నలుడు దారుణ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక రోజున అడవి అంటుకుని ఆకాశానికి అంటేలా మంటలు లేచాయి. ఒక నాగకుమారుడు ఆ మంటల్లో చిక్కుకుని చేస్తున్న ఆర్తనాదాలు నలునికి వినిపించాయి. అతను వెంటనే మంటల మధ్యలోకి వెళ్ళి నాగకుమారుణ్ణి రక్షించాడు. తన పేరు కర్కోటకుడనీ, ఒక ఋషి శాపం వల్ల కదలలేననీ, తనను ఎత్తుకుని ఒక సరోవరం తీరంలో విడిచిపెట్టవలసిందని అతను కోరాడు. నలుడు అలాగే చేశాడు. అప్పుడు కర్కోటకుడు అతన్ని కాటేశాడు. దాంతో నలుడు పాత రూపం కోల్పోయి వికృతరూపిగా మారిపోయాడు. ‘నీ మంచి కోసమే నేను ఇలా చేశాను. నీ శరీరంలో నా విషం ఉన్నంతకాలం నీకు ఎవరి వల్లా ప్రాణహాని ఉండదు. నీకు యుద్ధాలలో విజయమూ, భార్యతో కలయికా, రాజ్యవైభవమూ కలుగుతాయి. నీ నిజరూపాన్ని ఎప్పుడు పొందాలనుకుంటే అప్పుడు నన్ను తలచుకో. నువ్వు పోగొట్టుకున్న వస్త్రం నీ దగ్గరకు వస్తుంది, దానిని ధరించగానే నీ నిజరూపం వస్తుంది. అయోధ్యా నగరంలో ఇక్ష్వాకువంశస్థుడైన ఋతుపర్ణుడనే రాజు ఉన్నాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి అతనికి నీకు తెలిసిన అశ్వహృదయ మనే విద్యను ఇచ్చి అతని దగ్గరనుంచి అక్షహృదయ మనే విద్య తీసుకో. బాహుకుడు అనే పేరుతో అతని దగ్గర వంటవాడిగా ఉండు’ అని కర్కోటకుడు చెప్పి అదృశ్యమయ్యాడు.

నలుడు ఋతుపర్ణుని కలసుకుని, తను అశ్వశిక్షలోనూ, వంటలోనూ నేర్పరిననీ, నీ కొలువులో చేర్చుకోవలసిందనీ కోరాడు. ఋతుపర్ణుడు అంగీకరించి అతన్ని అశ్వాధ్యక్షుడిగా నియమించి, వార్ష్ణేయుడు, జీవలుడు అనే ఇద్దరిని అతనికి సహాయకులుగా ఇచ్చాడు.

***

నలుడు రాజ్యం కోల్పోయిన సంగతి విదర్భరాజు భీముడికి తెలిసింది. కూతురు, అల్లుడు ఏమైపోయారో నని అతను దుఃఖిస్తూ వారిని వెతకడానికి అన్ని చోట్లకూ బ్రాహ్మణులను పంపించాడు. నలదమయంతుల ఆచూకీ చెప్పినవారికి వేయి గద్యాణాలు, వారిని వెంటబెట్టుకుని వచ్చినవారికి వేయి గోవులు, అగ్రహారాలు ఇస్తానని ప్రకటించాడు.

భీముడు పంపిన బ్రాహ్మణులలో ఒకడైన సుదేవుడు సుబాహుపురం చేరుకుని రాజగృహాన్ని సందర్శించి అక్కడున్న దమయంతిని చూశాడు. ఆమెను ఏకాంతంగా కలసుకుని తను వచ్చిన పని చెప్పాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రాజమాతకు దమయంతి విదర్భరాజు కూతురన్న సంగతి తెలిసింది. ఆమె సంతోషంతో దమయంతిని కౌగలించుకుని ‘నీ తల్లి, నేను అక్కచెల్లెళ్లమే’ నని చెప్పింది. ఆమె దగ్గర సెలవు తీసుకుని సుదేవునితో కలసి దమయంతి పుట్టింటికి వెళ్లింది.

ఈసారి భీముడు నలుని వెతకడానికి బ్రాహ్మణులను నియోగించాడు. ‘నలుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా ఉంటాడు కనుక, భార్యను ఏమాత్రం కనికరం లేకుండా విడిచిపెట్టి వెళ్ళడం న్యాయమా అని మీరు వెళ్ళిన ప్రతి చోటా సభలలో ప్రశ్నించండి. దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చు’ నని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది.

ఋతుపర్ణుని సభకు వెళ్ళి వచ్చిన పర్ణాదు డనే బ్రాహ్మణుడు, అతని కొలువులో నూరు గద్యాణాలకు పనిచేస్తున్న బాహుకుడు అనే ఒక వికృతరూపుడు తన ప్రశ్నకు సమాధానం చెప్పాడని దమయంతికి చెప్పాడు. అతడే నలుడు అయుంటాడని భావించిన దమయంతి ఈసారి సుదేవుని పిలిపించి, తనకు రేపో, ఎల్లుండో పునస్స్వయంవరం జరగబోతున్నట్టు ఋతుపర్ణునికి చెప్పమని పంపించింది.

***

ఋతుపర్ణుడు ఆ స్వయంవరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డాడు. వార్ష్ణేయుని వెంటబెట్టుకుని బాహుకుడు రథచోదకుడుగా విదర్భపురానికి బయలుదేరాడు. వాయువేగంతో రథం తోలుతున్న బాహుకుని నేర్పుకు ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతుండగా అతని ఉత్తరీయం జారిపడిపోయింది. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తెస్తాడనీ, వేగం తగ్గించమనీ బాహుకునితో అన్నాడు. ‘ఇంకెక్కడి ఉత్తరీయం? అది పడిన చోటునుంచి వందమైళ్ళ దూరం వచ్చేశా’మని బాహుకుడు చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ‘అందరికీ అన్ని విద్యలూ తెలియకపోయినా ప్రతివారికీ ఏదో ఒక విద్యలో నేర్పు ఉంటుంది. నేను వస్తువుల గుంపును ఒకసారి చూస్తే చాలు వాటి సంఖ్య చెప్పేస్తాను. కావాలంటే ఆ చెట్టు చూడు. దానికి ఆకులు, పండ్లు ఎన్నున్నాయో చెబుతాను. రెండు కొమ్మలకు పదివేల ఒకటి ఉంటే, మిగిలిన కొమ్మలకు రెండువేల తొంభయ్యే ఉన్నాయి’ అన్నాడు. ‘అయితే లెక్కపెట్టవలసిందే’ నంటూ బాహుకుడు రథం ఆపి దిగి, ఆ చెట్టును కూలదోసి లెక్కపెట్టాడు. సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పినన్నే ఉన్నాయి. ఆశ్చర్యపోయిన బాహుకుడు ఆ విద్యను తనకు ఉపదేశించమని కోరాడు. దీనిని అక్షహృదయం అంటారని చెప్పి ఋతుపర్ణుడు అతనికి ఉపదేశించాడు. సంతోషించిన బాహుకుడు, ‘నీకు అశ్వహృదయం అనే నా విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించు’ అన్నాడు. ‘ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచుకో. నేను కావలసినప్పుడు స్వీకరిస్తాను.’ అని ఋతుపర్ణుడు అన్నాడు.

అక్షహృదయం పొందగానే కలి అతన్ని విడిచిపెట్టేశాడు. వికృతరూపం తప్ప మిగిలిన దోషాలు అన్నీ తొలగిపోయాయి. రథం విదర్భపురంలోకి ప్రవేశించింది. రథం చప్పుడు వినగానే దమయంతికి అది నలుని రథధ్వనిలా అనిపించింది. తీరాచూస్తే నలుడు కనిపించలేదు. దాంతో నిరాశ చెందింది. భీముడు ఋతుపర్ణునికి తగిన విడిది ఏర్పాటుచేశాడు. పురంలో ఎక్కడా స్వయంవరం మాటే వినిపించకపోవడం, మిగతా రాజులెవరూ కనిపించకపోవడం చూసి ఋతుపర్ణుడు అనుమానపడ్డాడు. ‘దమయంతి ఇంకొకరిని పెళ్లాడే అధర్మానికి పాల్పడుతుందని తను ఎలా అనుకున్నాడు, స్వయంవరం అనగానే తగుదునమ్మా అనుకుంటూ ఎలావచ్చాడు’ అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఋతుపర్ణుడు అయోధ్యరాజనీ, వార్ష్ణేయుడు సూతపుత్రుడనీ తెలిసింది కనుక మూడో వ్యక్తి అయిన బాహుకుడు ఎవరో తెలుసుకుని రమ్మని కేశిని అనే పరిచారికను దమయంతి పంపించింది. రథశాల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న బాహుకుని దగ్గరకు కేశిని వెళ్ళి, ‘ఇక్కడికి ఏ పని మీద వచ్చావు, మీతో ఉన్న మూడో వ్యక్తి ఎవరు?’ అని అడిగింది. బాహుకుడు వచ్చిన కారణం చెప్పి, మూడో వ్యక్తి వార్ష్ణేయుడనీ, నలునికి రథచోదకుడిగా ఉండేవాడనీ చెప్పాడు.

దమయంతిని కలిసి బాహుకుని మాటలూ, ఆకారం గురించి కేశిని చెప్పింది. అతడే నలుడని దమయంతికి అనుమానం కలిగింది. ‘అతను ఋతుపర్ణుని వంటలవాడట కదా…అతని వంట గురించి తెలుసుకుని రా’ అని దమయంతి మళ్ళీ కేశినిని అతని దగ్గరికి పంపింది. కేశిని వెళ్ళి వచ్చి ‘అతని గురించి ఏం చెప్పను? అతను మామూలు మనిషి కాదు. అలాంటివాడిని ఇంతవరకు చూడలేదు, వినలేదు. నిజంగా అతన్ని దేవుడు అనచ్చు’ అంటూ అతను వంట చేయడంలో ఎన్ని మహిమలు ప్రదర్శిస్తాడో వర్ణించి చెప్పింది. దాంతో అతని వంటకాలు కొన్ని తీసుకురమ్మని దమయంతి మళ్ళీ కేశినిని పంపింది. కేశిని తెచ్చి ఇవ్వగానే వాటిని రుచి చూసిన దమయంతికి అతడు నలుడే నని మరింత గట్టిగా అనిపించింది. ఈసారి కొడుకునీ, కూతురునీ ఇచ్చి కేశినిని బాహుకుడి దగ్గరికి పంపించింది. వాళ్ళను చూడగానే కంట తడిపెట్టుకుంటూ బాహుకుడు తన ఒళ్ళో కూర్చొబెట్టుకున్నాడు. అంతలోనే జాగ్రత్తపడుతూ ‘వీళ్ళను చూడగానే నా పిల్లలు గుర్తొచ్చారు’ అని కేశినికి చెప్పి, ‘నువ్విలా మాటి మాటికీ రావడం బాగుండదు, ఇక రావద్దు’ అన్నాడు. ఇది తెలిసి, అతడు నలుడే నని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన దమయంతి తండ్రికి చెప్పి అతన్ని తనవద్దకు రప్పించింది.

బాహుకుడు దమయంతిని కలిశాడు. తనకు పునస్స్వయంవరం అన్న సంగతిని ఋతుపర్ణుడు ఒక్కడికే తెలియబరిచారనీ, అది నలుని విదర్భకు రప్పించడానికి మాత్రమె నని దమయంతి మాటల ద్వారా అతనికి తెలిసింది. దాంతో అతను కర్కోటకుడిని తలచుకోవడం, పక్షులు అపహరించిన అతని వస్త్రం తిరిగి అతని దగ్గరికి రావడం, అతను దానిని ధరించాగానే నలుని రూపంలోకి మారిపోవడం వెంటనే జరిగిపోయాయి.

దంపతులు ఇద్దరూ తిరిగి ఒక్కటయ్యారు.

నలుడు అక్కడినుంచి నిషధపురానికి వెళ్లి పుష్కరుని కలిశాడు. ‘నా రాజ్యాన్ని గెలుచుకోడానికి వచ్చాను. నాతొ యుద్ధమైనా చెయ్యి. జూదమైనా ఆడు’ అని అతణ్ణి ఆహ్వానించాడు. పుష్కరుడు జూదానికే మొగ్గు చూపించాడు. అందులో అతడు నలుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నలుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

***

ఈ కథను ఇంకా క్లుప్తం చేసి చెప్పచ్చు కానీ, కొన్ని కారణాల వల్ల ఈమాత్రం వివరంగా చెప్పవలసివచ్చింది. నలుని గుర్తించి, రప్పించడానికి దమయంతి చేసిన ప్రయత్నాలు; బాహుకుడే నలుడా అన్నది నిర్ధారించుకోడానికి అతనితో ఆడిన ‘మైండ్ గేమ్’ —ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథనరీతిని పట్టి చూపి, పురాణ కథలకు భిన్నంగా తోపిస్తాయి. అంతకంటే విశేషం, ఒక గ్రీకుపురాణకథతో ఈ కథకు పోలికలు ఉండడం!

దాని గురించి తర్వాత….

 -కల్లూరి భాస్కరం

నలుడు-నరుడు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)
అందరికీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని, లేదా అనుభవంలో ఉన్నదాన్ని నిజమని అంటాం. నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. నిజం అనే మాటకు భిన్నమైనది భావన. Perception అనే ఆంగ్లపదాన్ని భావనగా అనువదించుకోవచ్చు ననుకుంటాను. భావన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండచ్చు. భావనను నిరూపించడం ఒక్కొక్కసారి కష్టం కావచ్చు. అందుకు తగినన్ని ఆధారాలు ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది నిజం కాదని కొట్టి పారేయడమూ కష్టమే.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, నలదమయంతుల కథ పరిశీలనలో నేను ఈ నిజమూ-భావనల మధ్య సతమతమవుతుండడమే!

పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ; కనుక వారు కూడా నరులే ననీ అనిపిస్తుంది. అలాంటప్పుడు, నరుడు వేరు, పైన చెప్పినవాళ్లు వేరు అన్నట్టుగా ఎందుకు చెప్పినట్టు?
చాలా వ్యాసాల క్రితం, ఒక వ్యాసంలో ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చాను. నలదమయంతుల కథను పరిశీలించేటప్పుడు ఇంకొకసారి తెచ్చి, మరింత విపులంగా చర్చించవలసిన అవసరం కనిపించింది.

ఒకరకంగా ఇది ఎలాంటిదంటే, ఒక ఇంద్రజాలికుడు తను చేసిన గారడీని, లేదా సృష్టించిన భ్రమా ప్రపంచాన్ని తనే నిజమని నమ్మడం లాంటిది. పురాణ, ఇతిహాసాలకు ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. నిర్దిష్టమైన భాష, శైలి ఉంటాయి. అది– దేవతలు, పక్షులు, పాములు, పర్వతాలు, నదులు, మానవులతో సహా చరాచరప్రపంచం మొత్తం ఒక అలౌకిక స్థాయిలో కలగలిసిపోయి ఉండే అద్భుతప్రపంచం. అందులో మామూలు మనిషి కూడా అతిమానుష స్వభావంతో ఉంటాడు. అందుకే మనం పురాణ ఇతిహాస పాత్రలను మామూలు మనుషులుగా కాక; అతిమానుషులుగా, అసాధారణులుగా చూడడానికే అలవాటు పడిపోతాం. కానీ మామూలు మనిషిని కూడా గుర్తించకతప్పదు కనుక, అతనిని నరుడు అనే పేరుతో అతిమానుషులతో కలిపి పౌరాణికుడు చెబుతున్నాడన్నమాట.

ఉదాహరణకు, మహాభారత పాత్రలను కొన్నింటిని తీసుకుందాం. పాండవులను కానీ, ద్రౌపదిని కానీ మనం మామూలు మనుషులుగా చూడం. వారి పుట్టుక నుంచి పెరిగి పెద్దైన తర్వాత చేసిన పనులు, వ్యవహరించిన తీరు వరకు, దాదాపు అన్నింటి చుట్టూ ఒక అతిమానుషత్వం, అద్భుతత్వం ఆవరించి ఉంటాయి. పాండవులు దేవతల అంశతో పుట్టినవాళ్లు. ద్రౌపది యజ్ఞగుండం వద్ద అయోనిజగా ప్రత్యక్షమైంది. అర్జునుడు అసామాన్య వీరుడు. తపస్సు చేసి అనేక దివ్యాస్త్రాలను సంపాదించినవాడు. ఇంద్రుని ఆహ్వానం మీద దేవలోకం వెళ్ళి అర్థసింహాసన గౌరవం అందుకున్నవాడు. పాండవులు, ద్రౌపదే ఏమిటి; దుర్యోధనుడితో సహా మహాభారతంలోని ప్రధానపాత్రలన్నీ దేవతాంశతోనో, రాక్షసాంశతోనో పుట్టినవే. ఆ విషయాన్ని కథకుడు ప్రారంభంలోనే చెబుతాడు.

అయితే, ఈ అతిమానుష, అద్భుత ప్రపంచంలో ముందుకు వెడుతున్నకొద్దీ; సిద్ధసాధ్యకిన్నర కిన్నర కింపురుష యక్షరాక్షసగంధర్వదేవతల మధ్య చిక్కుకున్న నరుడనే మామూలు మనిషిని బయటికి లాగి ముందుకు తేవలసిన అవసరం కథకుడికి కలిగింది. ఆ అవసరం ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగిందనే ప్రశ్నలోకి పూర్తిస్థాయిలో వెళ్లడానికి పూర్వరంగంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నరుడు అనే మామూలు మనిషిని ముందుకు తేవడం కథకుడు తప్పనిసరై చేసిందే తప్ప అంత ఇష్టంతో చేసిన పనిగా అనిపించదు. అర్జునుడికే నరుడు అనే పేరు ఉండడమే చూడండి. మహాభారతంలో నరుడు అనే పేరు అర్జునుడికి తప్ప మరొకరికి లేదు. మిగిలిన పాండవులు, ఇతరులు నరులు కాదా అన్న ప్రశ్నను కాసేపు ఇక్కడ మరచిపోదాం. ఒక కోణంలో చూస్తే మహాభారతంలో నాయకుడు లేదా హీరో అర్జునుడే. అతను నరుడు కూడా, అంటే మామూలు మనిషి కూడా నన్నమాట. ఆవిధంగా చూస్తే కథకుడు పరోక్షంగా మామూలు మనిషిని కథానాయకుడిగా చేసి మహాభారతకథ చెబుతున్నాడన్న మాట.

అదే సమయంలో, మామూలు మనిషిని కథానాయకుని చేసి; పురాణ, ఇతిహాసాలకు ఉన్న ప్రత్యేక రూప, స్వభావాలను చెరపడం కథకుడికి ఇష్టం లేదు. లేదా శ్రోతలు కూడా అలాంటి కథను ఇష్టంగా వినకపోవచ్చు కూడా. కనుక అర్జునుడు నరుడు మాత్రమే కాదు, మరోవైపునుంచి చెప్పుకుంటే, ఇంద్ర వరప్రసాదంతో, అంటే దేవతాంశతో జన్మించినవాడు. ఇంకా ఎన్నెన్నో విశేషణాలు ఉన్నవాడు. అతను నరుడే అయినా మామూలు నరుడు కాదు; నరుడనే ఒక ఆదిముని అవతారం. ఆపైన నారాయణుడనే దేవుడితో(నరనారాయణులు) కలిపి చెప్పవలసినవాడు. అంటే మామూలు మనిషిని ముందుకు తెస్తూనే కథకుడు మళ్ళీ అతనికి దివ్యత్వాన్ని ఆపాదిస్తూ అతని చుట్టూ ఒక కాంతివలయాన్ని సృష్టిస్తున్నాడన్న మాట.

అర్జునుని నరునిగా పదే పదే నొక్కి చెప్పడం అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో కనిపిస్తుంది. అందులో కథకుడు అర్జునుని నరునిగా పరిచయం చేయడం మామూలుగా కాక, చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కిరాత వేషంలో వెళ్ళి అర్జునుడు వేటాడిన ఒక వరాహాన్ని తను కూడా బాణంతో కొట్టి పడగొట్టి అది తనదే నంటాడు. అప్పుడు వారిద్దరి మధ్యా యుద్ధం జరుగుతుంది. అర్జునుని శౌర్యధైర్యాలను మెచ్చుకున్న శివుడు వరం కోరుకోమంటాడు. పాశుపతాస్త్రం ఇమ్మని అర్జునుడు అడుగుతాడు. ఆ సందర్భంలో శివుడు, “పూర్వజన్మలో నువ్వు నరుడనే దేవరుషివి, నారాయణుడికి సఖుడివి” అంటాడు.
arjuna

అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన సంగతి తెలిసి ఇంద్రుడు, ఇతర దిక్పాలకులతో కలసి అతని దగ్గరకు వస్తాడు. “నువ్వు నరుడనే పూర్వఋషివి. బ్రహ్మ నియోగంతో మనుష్యుడవై ఉత్తమ క్షత్రియకులంలో పుట్టావు” అంటాడు. అర్జునుడికి అతను ఒక దండాన్ని, మిగిలినవారు తమ తమ అస్త్రాలను ఇస్తారు. ఆ తర్వాత, దేవలోకానికి వస్తే, మరికొన్ని దివ్యాస్త్రాలు ఇస్తానని ఇంద్రుడు అతనికి చెప్పి రథం పంపిస్తాడు. అర్జునుడు రథమెక్కి దేవతల రాజధాని అమరావతికి వెడతాడు. “నరుడనే ఆదిమునే ఇతని రూపంలో జన్మించా” డనుకుంటూ దేవతలందరూ అతనిని చూడడానికి వెడతారు. అప్పుడే దేవవేశ్య అయిన ఊర్వశికి, అర్జునుడికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది.
అర్జునుడు తన విడిదిలో గంధర్వుల సంగీతగోష్ట్టిని ఆనందిస్తుండగా; వెన్నెల రాత్రి తెల్లని చీరకట్టుకుని, సుగంధద్రవ్యాలను అలదుకుని, రకరకాల సువాసనలను విరజిమ్మే పూలు ముడుచుకుని, ఇంద్రుని మందిరం నుంచి బయలుదేరి అందెల రవళితో ఊర్వశి అర్జునుడి మందిరానికి వచ్చింది. ఆమెను చూస్తూనే అర్జునుడు భయభక్తులతో లేచి నిలబడి నమస్కరించాడు. ‘అమ్మా’ అని సంబోధిస్తూ, “నా మీద పుత్రప్రేమతో, నాకు శుభం కలిగించడానికి వచ్చి నన్ను కృతార్థుని చేశావు” అన్నాడు. అంటే, ఆమె రాకకు కారణం పసిగట్టాడా అన్నట్టుగా ముందరి కాళ్ళకు బంధం వేసాడన్నమాట.

తన కళ్ళనే తుమ్మెదలతో అర్జునుడి అందమనే మధువును తాగుతున్న ఊర్వశి అతని మాటలకు ఉలికిపడింది. “నీ గుణగణాల గురించి మునుల ద్వారా విని నీ పొందు కోరి వస్తే, నన్ను అమ్మా అని పిలుస్తావేమిటి? నేను నీకు తల్లిని ఎప్పుడయ్యాను? దేవలోకవేశ్యలమైన మా దగ్గర ఇలాంటి వావివరసలు నడవవు. ఈ లోకంలో స్త్రీ, పురుషులు విచ్చలవిడిగా క్రీడిస్తారు. అదిక్కడ తప్పు కాదు. ఈ లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా దివ్యపురుషుడివే. కనుక నా కోరిక తీర్చు.” అంది.

“ధర్మానికి ద్రోహం చేసే ఇలాంటి మాటలు నువ్వు నాతో మాట్లాడడం న్యాయమా? లోకాలను పుట్టించేది, గిట్టించేది దేవతలే కనుక వాళ్ళు ఎలా నడచుకున్నా తప్పులేదు. కానీ నేను కర్మభూమిపై జన్మించినవాణ్ణి. కర్మిష్టిని. ఇక్కడి ఆచారం నాకు పనికిరాదు. మా వంశకర్త అయిన పురూరవుడికి భార్యవు కనుక, ఇంద్రుని సేవించుకునేదానివి కనుక నువ్వు నాకు తల్లివి అవుతావు. నన్ను పుత్రవాత్సల్యంతో చూడు” అన్నాడు అర్జునుడు నిర్వికారంగా.

దాంతో ఊర్వశి కోపించడం, నపుంసకుడివి కమ్మని అర్జునుని శపించడం, అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారడానికి అతడు ఆ శాపాన్ని ఉపయోగించుకోవడం…అనంతర పరిణామాలు.

అర్జునుని మాటల్ని జాగ్రత్తగా గమనించండి…అతనొక సాధారణ మానవుడిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవతలు ఎలాగైనా ఉండచ్చు, మేము మనుషులమని అతను ఒత్తి చెబుతున్నాడు. దేవతలకు, మనుషులకు మధ్య ఒక విభజనరేఖ గీస్తున్నాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వారి నుంచి నరుని, అంటే మామూలు మనిషిని తప్పించి; అతనికి తనదైన ఒక ప్రత్యేకత ఉన్నట్టు ధ్వనింపజేసిన అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. బహుశా ఇదే మొదటిదేమో కూడా. ఎవరి గురించి అయినా గొప్ప చేసి చెబుతున్నప్పుడు, ఇతడు మామూలు మనిషి కాదంటూ, మనిషిని చిన్నబుచ్చి చెప్పడం మహాభారత కథకుడు సాధారణంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరి. ‘ఇతడు కేవల మర్త్యుడు కాడు’ అనీ, ‘ప్రకృతిజనుడు కాడు’ అనీ అనడం చాలాచోట్ల కనిపిస్తుంది.

అది అలా ఉంచితే, అర్జునుడు ఉర్వశిని తిరస్కరించడానికే కాక; ఊర్వశి-పురూరవుల సంబంధానికి కూడా ఆసక్తికరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

ప్రస్తుతానికి వస్తే, రోమశుడనే ముని ఇంద్రుని సందర్శించడానికి వెళ్లి, అతని పక్కన అర్థసింహాసనాన్ని అధిష్టించిన అర్జునుని చూసి ఇతడెవరని అడుగుతాడు. “ఇతడు నరు డనే మహర్షి. నరలోకంలో పుట్టాడు” అని ఇంద్రుడు చెబుతాడు. చివరిగా, అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించాడన్న సంగతి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రునికి తెలుస్తుంది. అతడు, “దేవతలు అర్జునుడికి పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చారటగా! అలాంటి నరుడు యోధుడై ఉన్నప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవడి తరం?” అని సంజయుడితో అంటాడు.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. అర్జునుడు నరుడన్న సంగతిని పదే పదే నొక్కి చెప్పడమూ, పాండవుల యుద్ధప్రయత్నాలూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదించుకునే క్రమంలోనే అతణ్ణి నరుడిగా కథకుడు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి నరుడు యోధుడిగా యుద్ధం చేసేటప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవరికి సాధ్యమని ధృతరాష్ట్రుడితో అనిపిస్తున్నాడు. యుద్ధం సమీపిస్తున్న కొద్దీ, యుద్ధమధ్యంలో కూడా నర నారాయణుల గురించి భీష్ముడు మొదలైన పాత్రల చేత చెప్పించబోతున్నాడు. అర్జునుని నరునిగా పరిచయం చేస్తున్న పై ఘట్టానికి సరిగ్గా ముందే; యుద్ధానికి అనుకూలంగా భీముడు, ద్రౌపది ధర్మరాజుతో చాలా వాడిగా, వేడిగా చర్చిస్తారు.

ఈ విధంగా చూసినప్పుడు అర్జునుని నరునిగా చెప్పడానికీ, యుద్ధానికీ ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎలాంటిదో ముందు ముందు వెల్లడవుతుందేమో చూద్దాం.

***
ప్రస్తుత సందర్భంలో మనం గుర్తించవలసిన మరో విశేషం ఏమిటంటే, అర్జునుని నరునిగా పరిచయం చేసిన ఘట్టం వెనువెంటనే, నల దమయంతుల కథ ప్రారంభమవుతుంది. ఇంకా విచిత్రంగా, మా మాదిరిగా ఇన్ని కష్టాలు పడిన నరులు ఎవరైనా ఉన్నారా అని బృహదశ్వు డనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడా ముని నల దమయంతుల కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

వారి పరిచయం సాదా సీదాగా, ఇంకా చెప్పాలంటే ఓ చందమామ కథలానూ, జానపద కథలానూ ప్రారంభమవుతుంది. నలుడు నిషధదేశపు రాజు వీరసేనుడి కొడుకు; దమయంతి విదర్భరాజు భీముని కూతురు, అంతే! వారు దైవాంశ సంభూతులు కారు. వారి పుట్టుక వెనుక ఎలాంటి దైవ కారణాలూ లేవు. వారి చుట్టూ ఎలాంటి కాంతి వలయాలూ లేవు. వారు గొప్ప గొప్ప పనులు ఏవీ చేయలేదు. మొదట వారు ఓ మామూలు ప్రేమికులు, ఆ తర్వాత మామూలు దంపతులు. అనేక కష్ట నష్టాలకు గురై, ఒకరికి ఒకరు దూరమై, ఆ తర్వాత కష్టాల నుంచి బయటపడి తిరిగి ఒకటైన మానవమాత్రులు వారు.

నలదమయంతుల కథానిర్మాణం చాలా చిక్కగా, మంచి నేర్పరి అయిన కథకుడు అల్లినట్టుగా ఉంటుంది. అందులో ఎత్తులు, పై ఎత్తులు, ఉపాయాలు, వ్యూహాలు, విస్మయం గొలిపే మలుపులు ఉంటాయి. భారతీయ సాహిత్యంలో కథ, నవలా లక్షణాలు ఉన్న తొలి కథ ఇదే ననిపిస్తుంది. ఈ మాట ఇంతవరకు ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు.

కథ, ఇతర విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

‘ఆమె మెచ్చినదే అందం’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నల దమయంతు లిద్దరు మనఃప్రభవానలబాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల చందనచారుచర్చలన్

మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ప్రసిద్ధపద్యం నల దమయంతులనే ప్రేమికుల విరహతాపం గురించి చెబుతోంది. ఆ తాపాన్ని ఉపశమింపచేసుకోడానికి వారు శీతలోపచారాలను ఆశ్రయించడం గురించి చెబుతోంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు; ‘మా మాదిరిగా భూమిని, రాజ్యాన్ని, బంధువులను విడిచిపెట్టి అడవులపాలై జంతువులతో కలసి జీవిస్తూ కష్టాలు పడిన నరులు ఇంకెవరైనా ఉన్నారా’ అని బృహదశ్వుడు అనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆ ముని నలదమయంతుల కథ చెబుతాడు.

నలుడు నిషధదేశపు రాకుమారుడు, దమయంతి విదర్భరాజు కూతురు.
నాకు ఎందుకో మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు…అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు, వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందున్న కథలకు, ఈ కథకు ఉన్న తేడాను వీలైనంత క్లుప్తంగా చూద్దాం.
ఆదిపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్న రురుడు-ప్రమద్వరుల కథ, వివాహం నిశ్చయమైన ఒక జంట గురించి చెబుతుంది. ఆవిధంగా వారిద్దరి మధ్య వివాహానికి ముందే అనురాగం ఏర్పడడానికి అవకాశం ఉంది కానీ, దానిని ప్రేమకథగా చెప్పలేం. ప్రమద్వర పాముకాటువల్ల మరణించగా తన ఆయుర్దాయంలో సగం ఆమెకు ధారపోసి రురుడు ఆమెను బతికించుకుంటాడు. ఆ తర్వాత వారి వివాహం జరుగుతుంది.

ఆ తర్వాత చెప్పుకోవలసింది యయాతి-దేవయాని; యయాతి-శర్మిష్టల త్రికోణ సంబంధకథ. రాచకూతురు అయిన శర్మిష్టపై అసూయతో, ఆమె కన్నా తను ఆధిక్యతను పొందాలనే కోరికతో దేవయాని యయాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కనుక వారిద్దరిదీ ప్రేమ సంబంధమని చెప్పడానికి లేదు. పైగా యయాతి శర్మిష్టమీదే తప్ప దేవయానిపై మనసు పడినట్టు కనిపించడు. శుక్రుడిపట్ల భయంతోనో, గౌరవంతోనో అతను దేవయానిని పెళ్లాడినట్టు కనిపిస్తాడు. కనుక అది ఒకవిధంగా నిర్బంధవివాహం.

nala

తొలిచూపులోనే అతనిని ఆకర్షించింది శర్మిష్ట. అయితే ఆ ఆకర్షణకు కారణం ఆమె అందమే కానీ, అందులో ప్రేమగా చెప్పదగిన మానసికకోణం ఏమీ లేదు. ఇంకా విశేషమేమిటంటే, యయాతితో తన సంబంధంలో మొదట చొరవ తీసుకున్నది శర్మిష్టే. అందుకు కూడా అసలు కారణం, దేవయానికి పట్టిన అదృష్టం తనకు పట్టలేదన్న చింతే. భర్త లేకపోవడంతో ఇంత యవ్వనమూ వృథా కావలసిందేనా అన్న విచారంతోపాటు; దేవయాని భర్తను, సంతానాన్ని పొందినట్టు తను పొందలేకపోయానే అన్న బాధా ఆమెలో ఉంది. పైగా యయాతికి, తనకు మధ్య ఉన్నది దాసి-యజమాని సంబంధమని ఆమె గుర్తుచేస్తుంది. అంటే, వారిది ప్రేయసి-ప్రియుల సంబంధం, భార్యా-భర్తల సంబంధం కాదు సరికదా; సమానుల మధ్య సంబంధం కూడా కాదన్నమాట. ఆపైన ఆమె ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా వారిది శారీరక సంబంధమే తప్ప ప్రేయసీ, ప్రియుల మధ్య తప్పనిసరిగా ఉండవలసిన మానసికబంధం కాదు.

శకుంతలా-దుష్యంతుల కథకు వస్తే, అది పైకి ప్రేమకథలా కనిపించే మాట నిజమే కానీ, అది గాంధర్వవివాహం అనే చట్రంలో జరిగిన కథ. పైగా అది ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే మానసిక బంధాన్ని కాకుండా ప్రధానంగా భార్య-భర్త-సంతానం మధ్య ఉండే ధార్మిక సంబంధాన్ని, గృహస్థధర్మాన్ని వేదప్రమాణంతో నొక్కి చెబుతుంది. ఆ తర్వాత వచ్చే గంగ-శంతనుడు, సత్యవతి-శంతనుల కథల్లో ప్రేమ, మనసు కాక పురుషుడిలోని కాముకత్వానిదే పై చేయి అవుతుంది. ఇక గాంధారి-ధృతరాష్ట్రులది, కుంతి,మాద్రి-పాండురాజులది పెద్దలు నిర్ణయించిన వివాహసంబంధం. వీటికి భిన్నంగా అంబ-సాల్వులది ప్రేమకథగా కనిపిస్తుంది. కానీ అది నలదమయంతుల కథలా పూర్తిస్థాయిలో చిత్రించిన కథ కాదు.

ఆ తర్వాత వచ్చేది హిడింబా-భీముల సంబంధం. ఇది పై కథలకు భిన్నంగానూ, శర్మిష్ట-యయాతి కథకు దగ్గరగానూ కనిపిస్తుంది. ఎలాగంటే, హిడింబా-భీముల కథలో కూడా చొరవ హిడింబదే. అసలు ప్రకృతి రీత్యా చూసినా స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ తీసుకునేది స్త్రీయే నంటూ రాంభట్లగారు ‘జనకథ’లో ఇలా రాస్తారు:

జంతువుల్లో మగ జంతువు ఉదాసీన, ఆడజంతువు క్రియాశీల. ఆడజంతువు సమ్మతించనిదే మగజంతువు దాని దరిదాపులకు కూడా చేరజాలదు. ఆమె కటాక్షం కోసం మగజంతువులు పుట్టుకతో సౌందర్యాన్ని సంతరించుకుంటున్నాయి. అయితే మగ జంతువు ఈడేరేదాకా ఆ సహజసౌందర్యం పొటమరించదు. అది ప్రకృతి పెట్టిన ఆన.
మనిషికి కూడా సహజసౌందర్యం ఉంటుంది. ప్రకృతి పెట్టిన ఆన ప్రకారం అది యౌవనారంభంలో వ్యక్తమవుతుంది. జంతువుల్లా పురుషుడు కూడా ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఒక్క సాంఖ్యతత్వం మాత్రమే చెప్పింది. మన పురాణాల్లో రాజులు తమ కూతుళ్లకు స్వయంవరం చాటిస్తారు. ఈ స్వయంవరాన్నే డార్విన్ “నేచురల్ సెలెక్షన్” అన్నాడు. ‘వధూ’ అంటే స్త్రీ సామాన్యవాచకం. ‘వరః’ అంటే కోరదగ్గవాడు. ఈ మాటల్ని బట్టే పురుషుడు ఉదాసీనుడని తేలుతుంది.

అదే పుస్తకంలో ఇంకో చోట ఆయన ఇలా అంటారు:

జంతుప్రపంచాన పోతులు సహజాలంకారాలను సంతరించుకుని పుడతాయి. అందులో సింహం, చీంబోతు, పొట్టేలు, వృషభం –వాటి దర్పమే వేరు. ఋతుకాలాన పెంటి జంతువుల చుట్టూ ఈ పోతుజంతువులు చేరి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాయి. ఎన్ని జంతువు లెంత ప్రదర్శనలు చేసినా పెంటి జంతువు అందులో బక్కపోతునే వరిస్తుంది. దాన్నే నేచురల్ సెలెక్షన్ అన్నాడు డార్విన్. అదే స్వయంవరం. వరణం దక్కని పోతులు పరస్పరం పోట్లాడుకుంటాయి.

జంతుప్రపంచం దాటివచ్చిన జనప్రపంచం కూడా అంతే. ‘ఆడది మెచ్చినదే అందం. మొగాడి కన్ను మసక’ అంటుంది మధురవాణి. ఆమె నోట ఈ మాట పలికించిన అప్పారావుగారు ఎంత గొప్ప శాస్త్రవేత్తో! వరమాల దక్కని పురుషులు కూడా జంతువుల్లానే పోట్లాడుకునే వారంటాయి మన పురాణాలు. ఈ స్వయంవరణ రహస్యం నేటికీ పరమ రహస్యంగానే ఉంది.

పురుషుడు ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల అన్న సూత్రీకరణకు యయాతి-శర్మిష్టల సంబంధం అతికినట్టు సరిపోతుంది. అలాగే భీమ-హిడింబల సంబంధం కూడా.
వారణావతంలో లక్క ఇంటి దహనం నుంచి పాండవులు తప్పించుకున్న తర్వాత ; హిడింబుడు అనే రాక్షసుడు, అతని చెల్లెలు హిడింబ ఉండే అరణ్యానికి చేరుకుంటారు. భీముని చూడగానే హిడింబకు అతనిపై కోరిక కలుగుతుంది. హిడింబునికి, భీమునికి జరిగిన యుద్ధంలో హిడింబుడు మరణించిన తర్వాత కుంతి, పాండవులు అక్కడినుంచి బయలుదేరతారు. వారితో హిడింబ కూడా బయలుదేరుతుంది. భీముడు అందుకు అడ్డు చెబుతాడు. అప్పుడు ధర్మరాజు జోక్యం చేసుకుని ఆమెను కూడా రానివ్వమంటాడు.
ఆ తర్వాత కుంతిని హిడింబ ఏకాంతంగా కలసుకుని ‘మన్మథ వాంఛ అన్ని ప్రాణులలోనూ సాధారణమే అయినా స్త్రీలలో అది మరింత విశేషంగా ఉంటుంది. భీమునిపై కోరికతో చుట్టాలను, చెలులను విడిచిపెట్టి వచ్చాను. మీరు నా ఇష్టాన్ని కాదంటే ఆత్మహత్య చేసుకుంటా’నని అంటుంది. నా దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయని కూడా చెబుతుంది. కుంతికి ఆమె మీద ఇష్టం కలుగుతుంది. తన మాటను, అన్న ధర్మరాజు మాటను మన్నించి ఆమెను చేపట్టమని కుంతి భీమునికి చెబుతుంది. ఇందువల్ల నీకు పుత్రసంతానం కలుగుతుందని, నీ తండ్రి పాండురాజు కూడా సంతోషిస్తాడని అంటుంది. భీముడు ఒప్పుకుంటాడు. అయితే పుత్రసంతానం కలిగే వరకే మా ఇద్దరి సంబంధం అని షరతు పెడతాడు. ‘నువ్వు శుచిగా ఉంటూ ఉత్తమ స్త్రీ గుణాలతో భీముడికి ప్రీతి కలిగేలా నడచుకో. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి. రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండం’డని హిడింబకు కుంతి చెప్పింది.

సరే, ఇందులో చొరవ హిడింబదే నన్న సంగతి అర్థమవుతూనే ఉంది. పైగా భీమునిపై ఆమెకు కలిగిన కోరిక శారీరకమైనదేనని ఆమె మాటలు వెల్లడిస్తున్నాయి. కుంతి దగ్గర పచ్చిగా ఆ సంగతి బయటపెట్టింది కూడా. కనుక, ప్రేమ, మనసు అనే నాజూకు భావనలకు అక్కడ అవకాశం లేదు. అలాగే, ఈ మొత్తం ఘట్టంలో వారిద్దరి మధ్య వివాహం అనే మాటే రాలేదు. రాకపోగా, నీకు కొడుకు కలుగుతాడు, పాండురాజు కూడా సంతోషిస్తాడని కుంతి భీమునితో అంటోంది. అంటే, ఇక్కడ వివాహవిధి కన్నా సంతానం పొందడమే ప్రధానంగా కనిపిస్తోంది. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి, రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండండని హిడింబకు కుంతి చెప్పడం కూడా, అది సాధారణ దాంపత్య సంబంధానికి భిన్నమైన సంబంధంగా ధ్వనింపజేస్తోంది. పుత్రుడు కలిగేవరకే మా సంబంధం అని భీముడు అనడం, అది అవసరార్ధం కల్పించుకున్న తాత్కాలిక సంబంధమేనని స్పష్టంగా చెబుతోంది. హిడింబ ఆటవిక స్త్రీ అనుకుంటే, భీముడికి, ఆమెకు కలిగినది అసమసంబంధం కనుక ఈ చిత్రీకరణ దానికి అనుగుణంగానే ఉంది. సంతానం కోసం ఆటవిక స్త్రీలతో సంబంధం పెట్టుకుని, సంతానం కలగగానే వారిని విడిచిపెట్టిన ఉదంతాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇది నేటికీ గిరిజన, గిరిజనేతరుల మధ్య జరుగుతున్నదే. చరిత్ర అవిచ్చిన్నతకు ఇదొక ఉదాహరణ.

హిడింబ-భీముల సంబంధం తర్వాత చెప్పుకోవలసింది ద్రౌపది-పాండవుల సంబంధం. అందులో కూడా ప్రేమ అనీ, మానసికమైనదనీ చెప్పదగిన బంధమేమీ లేదు. అది కూడా ప్రధానంగా రాజకీయ అవసరార్ధం జరిగిందిగానే కనిపిస్తుంది. ద్రౌపదిని వెంటబెట్టుకుని అర్జునుడు, భీముడు ఇంటికి వచ్చి, భిక్ష తెచ్చామని తల్లితో అన్నప్పుడు, దానిని అయిదుగురూ పంచుకోండని తల్లి అన్నప్పుడు, ‘ఆమెను చూడగానే పాండవులు అయిదుగురూ మన్మథ బాణాలకు గురయ్యారు’ అంటాడు కవి. ఆ మాట ప్రధానంగా శరీరకవాంఛనే సూచిస్తోంది.

కాకపోతే, రాచకూతురుగా, తండ్రిచాటు బిడ్డగా ద్రౌపదికి, ఆటవిక స్త్రీగా హిడింబకు ఒక స్పష్టమైన తేడా ఉంది. భీముడితో సంబంధంలో హిడింబ చొరవ తీసుకుంటే; పాండవులతో సంబంధంలో ద్రౌపది, తండ్రి ఎలా వంచితే అలా వంగే మైనపు ముద్ద, మౌనమూర్తి అయింది. తను స్వయంవరంలో అర్జునుని వరించినా, అత నొక్కడికే భార్య అయ్యే హక్కును ఆమె పొందలేక పోయింది. ఆవిధంగా అది ఉత్తుత్తి స్వయంవరమే అయింది.

ఆ తర్వాత వచ్చేదే నలదమయంతుల కథ. పైన చెప్పుకున్నట్టు, ప్రేమ, మనసు, విరహం వంటి దినుసులతో ఈ కథ; పై కథలకు భిన్నంగా, దాదాపు ఆధునిక ప్రేమ కథలకు దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, కనీసం ఉన్నత కుటుంబాలకు పరిమితమై చెప్పుకున్నా ప్రేమ, పెళ్లి అనేవి కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చెందినవే తప్ప రాజకీయ అవసరం కోసమో, మరొక అవసరం కోసమో పెద్దలు మెడ వంచి రుద్దేవి కావని చెబుతున్నట్టు ఉంటుంది. ఇలా ఈ కథలను ఒక క్రమంలో పేర్చుకుని చూసినప్పుడు మహాభారతం స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని కూడా చెబుతోందా అనిపిస్తుంది.

దమయంతి విదర్భరాజు కూతురు అన్నప్పుడు, అది నేటి మహారాష్ట్రలోని విదర్భనే సూచిస్తోందనుకుంటే, బహుశా ఇది దక్షిణ భారతం దిశగా భౌగోళిక విస్తరణ క్రమాన్నీ వెల్లడిస్తూ ఉండచ్చు. దానికి తగినట్టే స్త్రీపురుష సంబంధాలు మొరటుతనం నుంచి నాజూకును సంతరించుకుంటూ ఉండచ్చు.

మరింత విపులమైన పరిశీలన చేయవలసిన ఆ అంశాన్ని అలా ఉంచితే, నలదమయంతుల కథలో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తర్వాత….

-కల్లూరి భాస్కరం

ఏకలవ్యుడి బొటనవేలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది…

అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఆ సమయంలోనే కరటూరి సత్యనారాయణగారు వాణిజ్యపన్నుల అధికారిగా ఉండేవారు. సత్యనారాయణగారు కవి కూడా. ఆయన అప్పటికే కొన్ని పద్యకావ్యాలు రాశారు. కొత్తగా ‘కరుణాసౌగతము’ అనే ఖండకావ్యం రచించారు. అది బుద్ధుడికి సంబంధించిన కొన్ని కథలను దండగుచ్చిన కావ్యం. ఆ కావ్య ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.

వాణిజ్యపన్నుల అధికారికి సంబంధించిన కార్యక్రమం కదా… పట్టణంలోని వర్తకప్రముఖులందరూ రంగంలోకి దిగారు. ఉభయగోదావరి జిల్లాలలోని పలువురు సాహితీ ప్రముఖులను వక్తలుగా ఆహ్వానించారు. అందులో సంప్రదాయ, ఆధునిక అన్న తేడా చూపించలేదు. అలా ఆ సభ, ఓ అరుదైన ఉభయసాహితీ సమ్మేళనం. ఆధునికులలో నాకు బాగా గుర్తున్న పేరు ఆవంత్స సోమసుందర్ గారు. సంప్రదాయపండితులలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. స్థానిక సాహితీ ప్రముఖులు దిగుమర్తి సీతారామస్వామిగారు సభాధ్యక్షులు. మా నాన్నగారు వక్తలలో ఒకరు.

ఇంటికి వాహనం పంపించారు. మా నాన్నగారితో నేనూ వెళ్ళాను.

సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో. మేము వెళ్ళేటప్పటికే కుర్చీలు చాలావరకు నిండిపోయాయి. ఎక్కువమంది వర్తకులే. వారి మెడల్లో ఒంటిపేట బంగారపు గొలుసులు, చేతికి బంగారపు చెయిన్ తో రిస్టువాచీలు, వేళ్ళకు రవ్వల ఉంగరాలు జిగేలుమంటున్నాయి. సాహితీ ప్రముఖుల ఎదురుకోలు సన్నాహాలు, పన్నీటి చిలకరింపులు, స్వాగతాలు వగైరాలు ముగిసిన తర్వాత సభ ప్రారంభమయింది. కనీసం పదిమంది వేదికను అలంకరించినట్టు జ్ఞాపకం.

bhasaram garu

ఆవిష్కరణ ముగిసి ప్రసంగాలు జరుగుతున్నాయి. వివరాలు నాకు గుర్తులేవు కానీ, ‘ఎవరో రసమా. భావమా?” అనే చర్చ లేవదీశారు. చూస్తుండగానే ఆ చర్చ సంప్రదాయ, ఆధునికుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. సభాస్థలి వేడెక్కింది. అసలే కిక్కిరిసిన సభ. ఆపైన వేసవి కాలం. పైన పంకాలు తిరుగుతున్నా ఆ గాలి సరిపోవడం లేదు. వేసవి తాపానికి తోడు సభా తాపం. వర్తకశ్రేష్టులకు వేదిక మీద ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. బిక్కమొహాలు వేసి బెదురుచూపులు చూస్తున్నారు. వారి స్థూలకాయాలు కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతున్నాయి.

వక్తలను నియంత్రించడానికి అధ్యక్షులవారికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఎలాగో ఆవేశ కావేషాలు సద్దుమణిగి ఊపిరి పీల్చుకున్నాక సోమసుందర్ గారిని మాట్లాడమన్నారు. ఆయన ‘కరుణా సౌగతము’ అనే ఆ కావ్యంలోని అంగుళిమాలుని కథను ఎత్తుకుని, దానికి మహాభారతంలోని ఏకలవ్యుని కథ కూడా మేళవించి, ‘గురువులందరూ శిష్యద్రోహులే’ నంటూ కొత్త మంట రాజేశారు. దాంతో మళ్ళీ సంప్రదాయసాహితీవేత్తలనుంచి నిరసన…ఉభయుల మధ్య వాగ్యుద్ధం…

కాసేపటికి మా నాన్నగారి వంతు వచ్చింది… ఆయన ఒక స్వీయపద్యంతో ప్రసంగం ప్రారంభించారు. ఆ పద్యం ఇదీ!

నలువకు నాల్గు నాల్క లట నర్తనమాడెడు నీ తనుప్రభల్

తలకొక దారి వింత గతులన్ మెరయించిన మోసపోయి వా

దులు గొని మచ్చరింతురు బుధుల్ తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!

ఓ సరస్వతీదేవీ! బ్రహ్మదేవుడికి నాలుగు నాల్కలు కదా. ఆ నాలుకల మీద నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు. అప్పుడు నీ శరీర కాంతులు పండితులకు ఒక్కొక్క విధంగా వింత గతుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. దాంతో వారు మోసపోయి వాదులాటకు దిగి మత్సరం పెంచుకుంటారు. ఉగ్రమైన ఆ చీకటి నాలుకలపై వెలిగే నీ చిరునవ్వే మాకు వెన్నెల పండుగ- అని ఈ పద్యానికి అర్థం.

ఆశ్చర్యం! పద్యం ముగిసిందో లేదో, సభ అంతా చప్పట్లు… నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం హఠాత్తుగా మలయమారుతం వీచినట్టుగా వర్తక సభాసదుల ముఖాల్లో ఏదో తెలియని ఉల్లాసం. వారికి ఆ పద్యంలోని భావం అర్థమై కాదు. మా నాన్నగారని అనడం కాదు కానీ, పద్యం బాగా చదువుతారని ఆయనకు పేరు. శ్రావ్యమైన పద్యగానంతో సభ మీద ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు.

సరే, ఆయన సందర్భోచితంగా పద్యాన్ని ఎత్తుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆ వెంటనే పండిత సత్కారం నిర్వహించిన వర్తకముఖ్యుని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఈసారి సభలో నవ్వులు పూయించింది…

‘ఈయనెవరో మహానుభావుడు. ఈయనకు సంప్రదాయం తెలుసు. జంట వస్త్రాలతో సత్కరించాడు. నేను చాలా సభల్లో చూస్తూ ఉంటాను. శాలువా కప్పుతూ ఉంటారు. అలా ఏకవస్త్రం ఎవరికీ ఇవ్వకూడదు. పైన శాలువా కప్పుకుని కింద అలా వదిలేయాలనో ఏమిటో వాళ్ళ ఉద్దేశం’ అన్నారాయన. పండితచర్చ ఏమీ అర్థం కాక అంతసేపూ బిక్కచచ్చి ఉన్న వర్తకశ్రోతలకు అర్థమయ్యే మాటలివి. ఆ రిలీఫ్ వాళ్ళలో కనిపించింది.

కావ్యం మీద ఆయన ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ గురువులందరూ శిష్యద్రోహులే నన్న సోమసుందర్ గారి వ్యాఖ్యను ప్రస్తావించి, ‘అది ద్రోహం కాదు, శిష్యులపై గురువు చూపిన విశేష అనుగ్రహం’ అనడం మాత్రం గుర్తుంది. ఎంత మా నాన్నగారు అయినా, ఆయన మాట నన్ను ఒప్పించలేకపోయింది.

***

నేను ఒక ప్రత్యేక అవసరం కోసం కరటూరి సత్యనారాయణగారిని బ్రాహ్మణేతరకవిగా చెప్పాల్సివస్తోంది. ఆయన బుద్ధుడి కథలు ఇతివృత్తంగా ఆ కావ్యం రాయడమే చూడండి…బుద్ధుడి కథలతో బ్రాహ్మణకవులు రాసిన కావ్యాలు అంత ఎక్కువగా కనబడవు. తిరుపతి వెంకటకవుల ‘బుద్ధచరిత్రము’, పింగళి-కాటూరి కవుల ‘సౌందరనందము’ వంటివి కొన్ని మినహాయింపులు. బుద్ధుడి పట్ల బ్రాహ్మణేతరకవులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నట్టు కనిపిస్తుంది. కవులనే ఏమిటి, బ్రాహ్మణేతర మేధావులకు కూడా. తెలుగువాళ్లలో బుద్ధుడిపై, బుద్ధుడి తాత్వికతపై ఆసక్తితో ప్రత్యేక అధ్యయనాలు చేస్తూవచ్చిన వారిలో బ్రాహ్మణేతర మేధావులే ఎక్కువగా కనిపిస్తారు. చరిత్రలోకి వెడితే బుద్ధుడి కాలంలో, బహుశా ఇంకా అంతకుముందే వైదిక/సనాతన ధోరణులకు సమాంతరంగా భిన్న తాత్విక ధోరణి ఒక్కోసారి జ్ఞాతంగా, ఒక్కోసారి అజ్ఞాతంగా ప్రవహిస్తూనే ఉందని అర్థమవుతుంది. వెనకటి రాజుల కాలంలో భర్త వైదికమతాన్ని అభిమానిస్తే, భార్య బౌద్ధాన్నో, జైనాన్నో ఆదరించడం, వాటికి చెందిన వ్యవస్థలకు దానాలు చేయడం కనిపిస్తుంది. ఈ విషయంలో స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఒక సామ్యం కనిపిస్తుంది. బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

ఆశ్చర్యమేమిటంటే, ఏనాడో బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచీ ప్రారంభమైన సమాంతర తాత్వికత అనే పాయ ఒక అంతర్వాహినిగా మారి, కాలం కల్పించిన హద్దులను దాటుకుంటూ తెలుగునేల మీద నేటికీ ప్రవహిస్తూ ఉండడం!

***

సోమసుందర్ గారు ప్రస్తావించిన అంగుళిమాలుడి కథ ఇలా ఉంటుంది…

అంగుళిమాలుడు తక్షశిలలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మంచి చురుకు, ప్రతిభ ఉన్నవాడు. దాంతో తోటి విద్యార్థులకు అతనిపై అసూయ కలిగింది. గురువుగారికి అతనిపై ఉన్నవీ, లేనివీ నూరిపోశారు. ఆయన అంగుళిమాలుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. విద్యాభ్యాసం ముగిసి గురుదక్షిణ చెల్లించే సందర్భం వచ్చింది. ‘వెయ్యిమంది చిటికెన వేలు ఖండించి వాటిని నాకు గురుదక్షిణగా చెల్లించు’ అని అంగుళిమాలుని గురువు ఆదేశించాడు.

గురుదక్షిణ చెల్లించితీరవలసిందే. లేకపోతే గురుద్రోహం అవుతుంది. నేర్చుకున్న విద్య ఒంటబట్టకపోగా శాశ్వతంగా అపకీర్తిని మోయవలసివస్తుంది. కనుక గురువు కోరిన దక్షిణ చెల్లించడానికే అంగుళిమాలుడు సిద్ధపడ్డాడు. ఒక అరణ్యంలో ఉంటూ దారినపోయేవారిని అటకాయించి, చంపి వారి చిటికెన వేలును ఖండించి తీసుకునేవాడు. వాటన్నింటినీ మాలగా గుచ్చి తన మెడలో వేసుకునేవాడు. అందువల్ల అతనికి ‘అంగుళిమాలుడు’ అనే పేరు వచ్చింది. అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ళు అయ్యాయి. ఇంకొక్క వేలు దొరికితే వెయ్యీ పూర్తవుతాయి.

బుద్ధుడు అంగుళిమాలుడు ఉన్న అడవిమీదుగా ఒంటరిగా సంచారానికి బయలుదేరాడు. అనుయాయులు అంగుళిమాలుడి గురించి చెప్పి, వద్దని వారించారు. బుద్ధుడు వినలేదు. అంగుళిమాలుడు బుద్ధుణ్ణి చూశాడు. ఈరోజుతో వెయ్యి చిటికెన వేళ్లూ పూర్తవుతాయనుకుని సంతోషిస్తూ బుద్ధుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అందకుండా బుద్ధుడు ముందుకు వెళ్లిపోయాడు. అంగుళిమాలుడు ఆయన వెంటపడ్డాడు. కానీ ఆయనను అందుకోలేకపోయాడు. అలసిపోయి చెమటలు కక్కుతున్న స్థితిలో ‘ఆగు’ అని ఒక్క కేక పెట్టాడు. బుద్ధుడు ఆగాడు. అంగుళిమాలుడు బుద్ధుని సమీపించాడు. అతని చేతిలో కత్తి ఉంది. అయినా బుద్ధుడు ఏమాత్రం తొణక కుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అలాగే నిలబడిపోయాడు. అంగుళిమాలునికి ఆశ్చర్యం కలిగింది. చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. బుద్ధుని పాదాల మీద పడ్డాడు. ఆ క్షణంలోనే బుద్ధుని అనుయాయిగా అతను పునర్జన్మ ఎత్తాడు.

***

ఇప్పుడు ఏకలవ్యుని కథకు వద్దాం.

మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో ఇతని కథ ఉంది. దాని ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని ప్రసిద్ధిని విని ఆయన దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెళ్ళి ద్రోణుని కలిశాడు. అతను నిషాదుడు(బోయ)కనుక అతణ్ణి శిష్యుడిగా చేసుకోడానికి ద్రోణుడు ఒప్పుకోలేదు. దాంతో ఏకలవ్యుడు ఆయన అనుమతి తీసుకుని, మట్టితో ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుని భక్తితో దానికి మొక్కుతూ విలువిద్యను సాధన చేసి ప్రావీణ్యం సంపాదించాడు.

అలా ఉండగా పాండవులు, కౌరవులు కలసి గురువు ద్రోణాచార్యుని అనుమతి తీసుకుని ఏకలవ్యుడు ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. వేట కుక్కలను తీసుకుని వారి వెంట భటులు కూడా వెళ్లారు. ఆ కుక్కల్లో ఒకటి మిగిలిన కుక్కలనుంచి వేరుపడి ఏకలవ్యుడున్న చోటికి వెళ్ళి అతణ్ణి చూసి మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో లాఘవంగా ఏడు బాణాలను దాని నోట్లోకి ప్రయోగించి నోరు మూశాడు. అది ఆ బాణాలు అలా ఉండగానే కురుపాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు దానిని చూడగానే ఆశ్చర్యపోయారు. అంత లాఘవంగా బాణాలు ప్రయోగించింది ఎవరా అనుకుంటూ వెతుకుతూ ఏకలవ్యుడున్న చోటికి వచ్చారు. దుమ్ము కొట్టుకున్న బలిష్టమైన దేహంతో, జడలు కట్టిన జుట్టుతో, జింక చర్మం ధరించి, ధనుర్బాణాలు పట్టుకుని ఉన్న ఏకలవ్యుడు వారికి కనిపించాడు. అతనిపై వారికి అసూయ కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘నువ్వెవరు, ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నా’వని అడిగారు. తను హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణుని శిష్యుడినని అతను చెప్పాడు.

untitled1

హస్తినాపురానికి తిరిగి వచ్చిన కురుపాండవులు ఇదంతా ద్రోణుడికి చెప్పారు. ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే ఏకాంతంగా ద్రోణుని కలుసుకున్నాడు. ‘విలువిద్యలో నాకు ఎవరూ సాటిరాని విధంగా విద్య నేర్పుతానని మీరు మాట ఇచ్చారు. విలువిద్యలో నేనే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఆ బోయవాడికి సాటి రారు. నాకంటే, మీకంటే, లోకంలో అందరి కంటే ధనుర్విద్యలో అతడు నేర్పరి. పైగా మీ ప్రియశిష్యుడే నట’ అంటూ ఎత్తిపొదుపు మాటలు మాట్లాడాడు.

ద్రోణుడు అదిరిపడ్డాడు. ‘పద, అతణ్ణి చూద్దాం’ అంటూ అప్పటికప్పుడు అర్జునుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నదగ్గరకు వెళ్ళాడు. ఏకలవ్యుడు ఆయనకు ఎదురేగి పాదాభివందనం చేసి, ‘నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను’ అన్నాడు. ‘అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. ‘ఇది నా దేహం, ఇది నా సంపద, వీళ్ళు నా పరిజనం. వీటిలో మీకు ఏది ఇష్టమో చెప్పండి, సంతోషంగా ఇస్తాను’ అని ఏకలవ్యుడు అన్నాడు. ‘నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు బొటనవేలును ఖండించి ద్రోణుడి చేతుల్లో పెట్టాడు. ఆ బొటనవేలుతోనే అతని విలువిద్యా లాఘవమూ పోయింది. అర్జునుడి మనసు చల్లబడింది.

***

సరే, ఏకలవ్యుడిపై అర్జునుడి అసూయ, ద్రోణుడు అతనికి చేసిన అన్యాయం ఈ కథలో ఒక కోణం. చాలా కాలంగా చర్చలో ఉన్న కోణం. సౌదా తన ‘అపూర్వ పురాణకథలు’లో చిత్రించిన బర్బరీకుని పాత్ర కూడా ఇలాంటిదే. ఒక ఆటవిక స్త్రీకి భీముని వల్ల జన్మించిన బర్బరీకుడు కూడా మంచి విలుకాడు. అతను మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడతాడు. కానీ కృష్ణుడు అది జరగనివ్వడు. పైగా యుద్ధానికి ముందు అతణ్ణి ‘వీరబలి’ ఇస్తారు. దానికి ఉపశమనంగా అతని శిరస్సుకు యుద్ధాన్ని తిలకించే అవకాశం ఇస్తారు.

నేను ముందుకు తెచ్చే ప్రశ్నలు భిన్నమైనవి. అసలు విలువిద్యలో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అన్నది వాటిలో మొదటిది. ఏకలవ్యుడు అనే బోయకు ద్రోణుని గురువుగా చేసుకుని ఆయన దగ్గర ఉన్న అస్త్రవిద్య అంతా నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది రెండవది.

మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం. కానీ ఇక్కడ తలకిందులవుతోంది. ఆటవికుడైన ఏకలవ్యుడు శిష్యుడు, మైదానవాసి అయిన ద్రోణుడు గురువు అవుతున్నారు. విషాదం ఏమిటంటే, తనదైన విద్యను పరుల నుంచి ఏకలవ్యుడు నేర్చుకోవాలని అనుకోవడం.

ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. విలువిద్య ఆటవికులలో లేదా ఆదిమ జాతులలో ప్రధానంగా అన్నసంపాదనలో భాగంగా పుట్టిందే తప్ప మనుషుల్ని చంపే మారణాయుధంగా కాదు. విల్లు, బాణాలే కాక; ఇతర ఆయుధాలు కూడా అన్న సాధనాలుగా పుట్టినవే. రాంభట్ల కృష్ణమూర్తిగారి ‘వేదభూమి’ నుంచి ఉటంకించుకుంటే; శావేజీ ద్వితీయదశకు వచ్చేసరికి (మోర్గాన్ ప్రాక్చరిత్రను శావేజీ, బర్బరదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశనూ మూడు అంతర్దశలుగా విభజించాడు) మనిషి నిప్పులో చేపల్ని కాల్చుకుని తినగలిగే స్థితికి వచ్చాడు. రాతి పనిముట్లతో ముడిగల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు. గట్టి కొయ్యతో త్రిశూలాన్ని చేసుకున్నాడు. త్రిశూలం అంటే మూడు కొనలూ పైకి ఉండే ఆయుధం కాదు. ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటి అమరికే చేపల్ని పట్టుకోడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉండే కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవాడు. అది జంతువును పడగొట్టనైనా పడగొడుతుంది, గురి తప్పితే విసిరిన వాడి చేతికే తిరిగి వస్తుంది. దీనిని తెలుగులో ‘వలరి’ అన్నారు. అరవంలో ’వలయత్తడి’ అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. గద, త్రిశూలం, పాశం, చక్రం అనే ఆయుధాల పుట్టుక నేపథ్యం ఇదీ.

ధనుర్బాణాల విషయానికి వస్తే, అవి శావేజీ తృతీయదశ ప్రారంభంలో పుట్టాయి. ధనుర్బాణాలు చాలా సంక్లిష్టమైన యంత్రం. వేల సంవత్సరాల అనుభవం రాసిపడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని రాంభట్ల అంటారు. అదివరకటి ఆయుధాలు ముఖాముఖీ ప్రయోగించడానికి మాత్రమే వీలైనవి. బాణాలను చాటునుంచి కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఈ ఆయుధానికి మహత్యాలు పుట్టాయని ఆయన అంటారు.

ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది. ద్రోణుడు విలువిద్యను సాధనచేసి, ప్రావీణ్యం గడించింది, ఒక మారణాయుధంగా మాత్రమే! క్షత్రియులకు మారణాయుధంగానే విలువిద్యతో అవసరం కనుక ద్రోణుడు క్షత్రియ కూటమికి దగ్గరగా ఉన్నాడు. అది ఉభయులకూ లాభదాయకమైన సంబంధం. కనుక తన విద్యను అతను ఇంకొకరికి ఇచ్చే ప్రశ్న లేదు.

విలువిద్యతో ఏకలవ్యుడి అవసరం వేరు. అతనింకా అన్న సంపాదనకోసం విల్లమ్ములపై ఆధారపడే ఆటవిక దశలోనే ఉన్నాడు. అందుకు సరిపోయే విలువిద్య అతనికి అడవిలోనే లభిస్తుంది. ద్రోణుడి దాకా వెళ్ళనవసరమే లేదు. ఏకలవ్యుడు అడవికి కాబోయే రాజు కావచ్చు కానీ, అతనికి రాజ్య విస్తరణ దాహం ఉండే అవకాశం లేదు. శత్రుభయం ఉండే అవకాశమూ తక్కువే. ఒక వేళ ఉందనే అనుకున్నా; కురు-పాండవుల యుద్ధంలో మాదిరిగా భారీ సైనిక, ఆయుధసంపద, సంక్లిష్టమైన వ్యూహప్రతివ్యూహ చాతుర్యం అవసరంలేదు.

ఒక పోలిక చెప్పాలంటే, కత్తులు, కటార్లతో రెండు గుంపుల మధ్య జరిగే ఘర్షణకూ; శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలతో రెండుదేశాల మధ్య జరిగే యుద్ధానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో; విలువిద్య అవసరంలో ఏకలవ్యుడికీ, అర్జునుడి లాంటి క్షత్రియుడికీ అంత తేడా ఉంటుంది.

అయినా సరే, ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు.

తెగిన ఏకలవ్యుడి బొటనవేలు చెబుతున్న కథ కంటె, చెప్పకుండా దాచిన కథ వేరే ఉందా?! మనకు తెలియదు.

మరో అంశంతో వచ్చేవారం…

 

 

సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగు స్థానమే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం…

అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో కనిపించే ఆ చిత్రణ నన్నయ అనువాదంలో లోపించిందని కూడా చెప్పుకున్నాం. అయితే, సర్పయాగ ఉదంతంలో కొంత పరోక్షంగానూ, ధృష్టద్యుమ్న, ద్రౌపదుల వృత్తాంతంలో ప్రత్యక్షంగానూ ఇంకో విశేషం కూడా ఉంది. అది, మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారతతత్త్వ కథనము’లో చెప్పిన ప్రకారం సంస్కృత భారత కథనం ఇలా ఉంటుంది…

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. అప్పుడు యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.

“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది.

అప్పుడు యాజుడు-

“ఇది యాజుడు(అంతటివాడు) సిద్ధం చేయగా, ఉపయాజుడు(అంతటివాడు) అభిమంత్రించిన హవిస్సు. నువ్వు ఎలా ఉన్నాసరే, ఈ ప్రయోగంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. (నువ్వు రా, రాకపో) మేము శుక్లశోణిత సంబంధం లేకుండానే స్త్రీపురుషుల జంటను పుట్టించగలం” అన్నాడు.

వెంటనే హవిస్సును హోమం చేశాడు. అప్పుడు కిరీట, కవచాలతో; ఖడ్గ, ధనుర్బాణాలతో జ్వాలావర్ణంలో ఉన్న ఒక పురుషుడు గర్జిస్తూ అగ్నిగుండం నుంచి అవతరించాడు. అదే సమయంలో ఒక అసమాన సుందరి యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమయింది. ఆమె శరీర సుగంధం దూరదూరాలకు వ్యాపిస్తోంది. స్వర్గలక్ష్మే మనిషి రూపం ధరించిందా అన్నట్టుగా ఉంది.

“ఈమె క్షత్రియ వినాశనం అనే ఒక దేవకార్యాన్ని నిర్వహిస్తుంది. ఈమె వల్ల కౌరవుల్లో భయోత్పాతం పుడుతుంది” అని ఆకాశం నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది.

వారే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

***

హవిస్సును స్వీకరించడానికి ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం…నేను వెంటనే రాలేననీ, కొంతసేపు ఆగమనీ ఆమె కబురు చేయడం…ఆమె వచ్చినా రాకపోయినా శుక్ల, శోణిత సంబంధం లేకుండానే మేము స్త్రీ, పురుష జంటను సృష్టించగలమంటూ యాజుడు హవిస్సును అగ్నికి అర్పించడం…తక్షణమే అగ్నిగుండం నుంచి ధృష్టద్యుమ్నుడూ, యజ్ఞవేదిక మీద ద్రౌపదీ ప్రత్యక్షమవడం…ఈ సన్నివేశాల క్రమాన్ని ఒకసారి ఊహించుకోండి.

ఇందులో ఒక తొందర, ఒక టెన్షన్; సంభాషణ, అభినయంతో కూడిన ఒక నాటకీయత; అవన్నీ కలసి ఒక పతాకసన్నివేశానికి దారితీస్తుండడం స్పష్టంగా కనిపిస్తాయి. అంతిమంగా ఆ పతాకఘట్టం అప్పటికప్పుడు ఇరువురు స్త్రీ, పురుషుల అవతరణ అనే అద్భుతాన్ని ఆవిష్కరించింది!

ఇందులో అనుసరించిన నమూనా మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. అది, సామూహిక నృత్యం, గీతం, అభినయం; లేదా మరో సామూహిక చర్య రూపంలో ఆదిమసమాజాలు అన్నీ అనుసరిస్తూ వచ్చిన మాంత్రిక ప్రక్రియే. భౌతిక వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా కోరుకున్న భౌతిక ఫలితాలను సాధించగలమన్న ఊహే దీనికి ప్రాతిపదిక. న్యూజీలాండ్ లోని మావోరీ తెగకు చెందిన యువతులు పొలానికి వెళ్ళి ఆలుగడ్డల పంట వృద్ధిని నృత్య, గీతాల ద్వారా ఎలా అభినయిస్తారో గతంలో చెప్పుకున్నాం.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టంలోనూ, సర్పయాగ ఘట్టంలోనూ కూడా యాగమే ఈ మాంత్రిక అభినయానికి సందర్భం అవుతోంది. నిజానికి ధృష్టద్యుమ్న, ద్రౌపదుల ఉదంతంలో రెండు అద్భుతాలు జరిగాయి. మొదటిది, వారు ప్రత్యక్షమైన తీరు అయితే, రెండవది శుక్ల, శోణిత సంబంధం లేకుండానే; అంటే పురుషుడు-స్త్రీ కలయిక లేకుండానే వారు జన్మించడం. యోని సంబంధం లేదు కనుక వారు ‘అయోనిజు’లు. ‘అయోనిజ’గా మనకు పరిచయమైన మరో పాత్ర, సీత. ప్రస్తుత సందర్భంలో ధృష్టద్యుమ్న ద్రౌపదులే కాక; స్వయంగా ద్రుపదుడు, ద్రోణుడు మొదలైనవారు కూడా యోని సంబంధం నుంచి పుట్టినవారు కాదు కనుక ‘అయోనిజు’ల కిందికే వస్తారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ సీత, ద్రౌపదుల విషయంలో చెప్పినట్టుగా మిగిలినవారి విషయంలో అయోనిజ కోణాన్ని సంప్రదాయం నొక్కి చెప్పడం లేదని కూడా అనుకున్నాం.

అలాగే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల అవతరణ వెనుక ద్రుపదుని అసలు లక్ష్యం రాజకీయ సంబంధి. తనను అవమానించిన ద్రోణుడిపై పగ తీర్చుకునే కొడుకును పొందడమే అతని ప్రధాన లక్ష్యం. కిరీట, కవచాలతో, ఖడ్గ, ధనుర్బాణాలతో గర్జిస్తూ ధృష్టద్యుమ్నుడు జన్మించడం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉంది. అది శత్రువుకు ఇవ్వవలసిన సందేశమూ ఇస్తూనే ఉంది. లౌకికంగా చెబితే, తనను ఓడించగల ఒక వీరుని ద్రుపదుడు సిద్ధం చేశాడన్న కబురు ద్రోణుడికి అందుతుంది. ఆ వీరుని ద్రుపదుడు దత్తు చేసుకుని ఉండవచ్చు. యాజ, ఉపయాజుల సాయంతో జరిపిన తంతు దత్తతకు సంబంధించిన తంతే కావచ్చు. అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాంత్రిక రూపాన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుని ఉండచ్చు.

ద్రుపదుడి యజ్ఞానికి పూర్వరంగంలో జరిగింది గుర్తుచేసుకున్నా రాజకీయ అవసరానికే మాంత్రిక రూపాన్ని వాడుకున్నారన్న సంగతి అర్థమవుతుంది. అన్న యాజుడికంటే తపశ్శాలి అయిన ఉపయాజుడు స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒప్పుకోలేదు. ఏడాదిపాటు ద్రుపదుని తన చుట్టూ తిప్పుకున్న తర్వాత, ధనం అవసరమైన తన అన్నను అడగమని చెప్పాడు. అన్నకు సహాయకుడిగా మాత్రమే తను యజ్ఞంలో పాల్గొన్నాడు. ఈ వివరాలు ఈ యజ్ఞం వెనుక ఏదో మాయ ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. విచిత్రం ఏమిటంటే, సర్పయాగం కూడా అటువంటి అనుమానాలనే కలిగిస్తుంది.

ఇంకొకటి కూడా చూడండి. ద్రుపదుడు కొడుకునే కోరుకున్నాడు తప్ప యజ్ఞవేదిక మీద కూతురు కూడా ప్రత్యక్షమవుతుందని మొదట అనుకోలేదని పై వివరాలు సూచిస్తున్నాయి. యాజుడు హోమం పూర్తి కావస్తున్న దశలోనే కొడుకూ, కూతురూ కూడా కలగబోతున్నారని చెబుతాడు. అతనికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉందని ఆ సందర్భంలో కథకుడు అంటున్నాడు. పైగా ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన తీరు ఒక్కలానే లేదు. ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలోంచి ఉద్భవిస్తే, ద్రౌపది యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమైంది. అనంతర కథాక్రమాన్ని చూసినప్పుడు, సాక్షాత్తు అగ్నిగుండం నుంచి అవతరించిన ధృష్టద్యుమ్నుని కంటే యజ్ఞవేదిక మీద అవతరించిన ద్రౌపదే మహాభారతంలో కీలకపాత్ర అయింది.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ద్రోణుని వధించడమే లక్ష్యంగా ద్రుపదుడు పొందిన కొడుకు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేసిన తర్వాతే, అంతా వద్దు వద్దంటున్నా వినకుండా ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిరస్సును ఛేదించాడు. ఒక లక్ష్యంతో అగ్నిగుండం నుంచి పుట్టించినవాడు అలా చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ద్రౌపది అవతరించినప్పుడు అదృశ్యవాణి ఆమె గురించి చెప్పినట్టుగా ధృష్టద్యుమ్నుని గురించి చెప్పలేదు. కనుక అదృశ్యవాణి అనేది, జరిగిపోయిన కథను జరుగుతున్నట్టు చెప్పడంలో కథకుడు చేసిన ఆపాదనగా అర్థమవుతూనే ఉంది. అలా చూసినప్పుడు అసలు యజ్ఞమే ఒక ఆపాదన కావచ్చు. ద్రౌపదే అగ్నిగుండం నుంచి ఉద్భవించిందనీ, ధృష్టద్యుమ్నుడే యజ్ఞవేదిక మీద ప్రత్యేక్షమయ్యాడనీ చెప్పి ఉంటే అది భవిష్యత్తులో వారు నిర్వహించబోయే పాత్రలకు తగినట్టు ఉండేది. అయితే, ద్రుపదుడి కోణం నుంచి చూసినప్పుడు, కూతుర్ని పొందడం కన్నా కొడుకును పొందడమే అతని తక్షణావసరం కనుక, కొడుకు అగ్నిగుండం నుంచి పుట్టడమే అర్థవంతం కావచ్చు.

ద్రుపదుని భార్య సరళి ఇందులో మరో ఆశ్చర్యం. దత్తత స్వీకారమైనా, యజ్ఞమైనా ధర్మపత్నీ సమేతంగా చేయవలసిందే. సంప్రదాయం ప్రకారం, ధర్మపత్ని పక్కన లేనిదే భర్త ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదు. కానీ ఇక్కడ ద్రుపదుని భార్య దగ్గరలేకుండానే యజ్ఞం జరిగిపోతోంది. అందులోనూ అది పుత్రునికోసం జరుగుతున్న యజ్ఞం. కబురు పంపినప్పుడు, నేను రజస్వలస్థితిలో అస్పృశ్యంగా ఉన్నాననీ, స్నానం చేసి వచ్చేవరకూ ఆగండనీ ఆమె చెప్పి పంపింది. ఈ వివరాల రీత్యా చూసినా అది ఎలాంటి యజ్ఞం అన్న అనుమానం కలుగుతుంది.

లేక, దత్తత స్వీకారం లేదా యజ్ఞం అనే తంతు కన్నా ముఖ్యమని భావించిన ఒక అంశాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు ఈ చిత్రణను ఉపయోగించుకుంటూ ఉండచ్చు. అది మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

పైన చెప్పిన మొత్తం ఉదంతాన్ని ఓసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి…ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదుని భార్యను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రుపదుడు, ద్రోణుడు పుట్టిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, సంతానోత్పత్తికి స్త్రీ సంబంధం అవసరం లేదని మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు ఈ ఘట్టాన్ని వాడుకున్నాడా అనిపిస్తుంది. ద్రుపదుని భార్య యజ్ఞవేదిక దగ్గరకు రానీ, రాకపోనీ; తను సిద్ధం చేసి, ఉపయాజుడు అభిమంత్రించిన హవిస్సే స్త్రీ, పురుషులను పుట్టిస్తుందని యాజుడు చెబుతున్నాడు. ఆవిధంగా సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను నిరాకరిస్తున్నాడు. నిజానికి ఇక్కడ ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదునికీ, ద్రుపదుని భార్యకూ కూడా భౌతికంగా ఎలాంటి పాత్రా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ఇద్దరూ ఉద్భవించేనాటికి యవ్వన, లేదా కౌమారదశలో ఉన్నట్టు వారిని వర్ణించిన తీరు చెబుతోంది. కనుక, హవిస్సును స్వీకరించడానికి వెంటనే ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం, నేను అశుచిగా ఉన్నానని ఆమె వర్తమానం పంపడం, ఆమె రాకపోయినా సరే, శుక్ల, శోణిత సంబంధం లేకుండా మా మంత్రశక్తే పని జరిపిస్తుందని యాజుడు అనడంలో అర్థం లేదు. అయినా సరే, ద్రుపదుని భార్యను ముగ్గులోకి లాగి మరీ ఆమె అవసరాన్ని తోసిపుచ్చడం; సంతానోత్పత్తికి స్త్రీ అవసరం లేదని ఇంకోసారి నొక్కి చెప్పడానికే అనిపిస్తుంది. ఈ విధంగా ఇది మాతృస్వామ్య-పితృస్వామ్యాల ఘర్షణలో ఒక పార్శ్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంపై పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగార్ల మధ్య జరిగిన వాదోపవాదాల గురించి తెలుసుకోవడం ఈ సందర్భంలో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పెండ్యాలవారి వాదం ఎలా ఉందో చూద్దాం:

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్తులు కావచ్చునని నిరూపించడానికి పెండ్యాలవారు ప్రయత్నించారు. ఆయన ఇలా అంటారు:

“ఇతడు(ధృష్టద్యుమ్నుడు) అగ్నిగుండమున జన్మించెనని మహాభారతములో నున్నది. కానీ ద్రోణ సంహారమే ప్రయోజనముగా నగ్నియం దయోనిజుడై జన్మించిన ధృష్టద్యుమ్నుడు యుద్ధములో ద్రోణుని జయించి వధించి యుండవలెను. అట్లు గా కితడు అస్త్రసన్యాసము గావించి యోగశక్తిచే ప్రాణములు విడిచిన ద్రోణశవకంఠమును మాత్రమే ఖండించియున్నాడు. ద్రోణవధ కితడు నిమిత్తమాత్రుడై యున్నాడు గాని, యితనివలన నైన దేమియు లేదు. ఇంతమాత్రమున నిత డగ్ని యంద యోనిజుడై యేల జన్మించెనో తెలియకున్నది.”

“కావున నితడు ద్రోణవధార్థము దత్తతగా స్వీకరింపబడినవాడనియు, నితని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను.”

“ద్రౌపది ద్రుపదునకు ధృష్టద్యుమ్నునితోబాటు దత్తపుత్రిక యని నా యభిప్రాయము. పుత్రేష్టిని బట్టియు, పంచేంద్రోపాఖ్యానమును బట్టియు విచారించి చూడగా ఋషికన్యయైన యామెను ద్రుపదుడు దత్తపుత్రికగా స్వీకరించె ననియే తోచుచున్నది.”

ఇక్కడ పెండ్యాలవారు “ఇతని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను” అని అనడం ప్రత్యేకించి ఆకర్షించే అంశం. ‘గ్రంథస్వభావం’ అనడం ద్వారా ఆయన ఎనభై, తొంభై యేళ్ళ క్రితమే సాహిత్యచర్చలోకి రూపా (form) న్ని తీసుకొస్తున్నారు. సంప్రదాయసాహిత్యంలో దివ్యత్వ లేదా అద్భుతత్వ ఆరోపాల కింద దృశ్యాదృశ్యంగా ఉన్న వాస్తవికతను, చరిత్రను గుర్తించడానికి ఈ రూప సంబంధమైన అవగాహన కీలకమైన తాళంచెవి.

అదలా ఉంచితే, వారణాసివారు సంప్రదాయ పాఠాన్ని ఉన్నది ఉన్నట్టు సమర్థిస్తూ పెండ్యాలవారి వాదాన్ని ఖండిస్తారు. సంప్రదాయపాఠం గురించి ఆయన అభిప్రాయం ఇదీ:

“ఈ ద్రౌపదీధృష్టద్యుమ్నాద్యుత్పత్తులు దివ్యకృత్యములు. ఆ దివ్యకృత్యములను బోధించుచున్న భాష దివ్యభాష. అట్టి మహాభారతమును తలక్రిందు చేసినవారు విమర్శకులు.”

“ఇంతమాత్రమున కిత డగ్ని యందేల జన్మించెనో?” అన్న పెండ్యాలవారి వ్యాఖ్యకు వారణాసివారి సమాధానం ఇలా ఉంటుంది:

“ఇదేమి శంక? ఇంత పని చేయగలవాడైనపుడే అగ్నియందు జన్మించునని యున్నదా యేమి? మంత్రసంస్కృతమైన హవిస్సునందు ద్రోణాంతకుడగు పుత్రుని జన్మింపజేయు అమోఘశక్తి యేర్పడినది. అట్టి హవిస్సు అగ్ని యందుంచబడినది. అందుచే నగ్ని నుండియే జన్మించెను. దీనికి శంక యేమున్నది?”

అయితే, ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శవ కంఠాన్ని మాత్రమే ఖండించాడన్న పెండ్యాలవారి వాదాన్ని తోసిపుచ్చుతూ, ద్రోణుడు ప్రాణాలతో ఉండగానే ధృష్టద్యుమ్నుడు అతని కంఠాన్ని నరికాడని వారణాసివారు నిరూపించిన తీరు సమంజసంగా అనిపిస్తుంది.

ఇంతకు మించి ఆసక్తి గొలిపేది శుక్ర(శుక్ల), శోణితాలపై ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చ. పెండ్యాలవారు ఇలా అంటారు:

“స్త్రీపురుషుల శుక్రశోణిత సమ్మేళనము లేకుండగ జన్మ మొక్క శుక్లముచేతనే కలుగునని పూర్వపాశ్చాత్యశాస్త్రము లేవియు నంగీకరింపవు. ద్రోణజన్మకథ జూడగ ఘృతాచి యను నప్సరస భరద్వాజునకు ద్రోణుని గని యా బాలుని ద్రోణ కలశములో బెట్టగ భరద్వాజుడే పెంచి పెద్దవానిని జేసి యాతనికి ద్రోణుడని పేరు బెట్టి యుండె నని తోచును.”

శుక్ర, శోణిత సంబంధం లేకుండానే మనుషులతో సహా ప్రాణులు అనేకం పుట్టడం సాధ్యమే నని వారణాసి వారు అంటూ ఇందుకు సమర్థనగా వైశేషిక, వేదాంత దర్శనాల నుంచి; ఛాందోగ్యోపనిషత్తు నుంచి కొన్ని వాక్యాలను ఉదహరిస్తారు. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం, సంతానోత్పత్తిలో పురుషుడిది నాలుగవ స్థానమైతే, స్త్రీది అయిదవ స్థానం మాత్రమే. వారి వాదం ఇలా ఉంటుంది:

“(వైశేషిక దర్శనంలో) యోనిజము, అయోనిజము అని శరీరము ద్వివిధమనియు, శుక్రశోణిత సంబంధము లేకయే ధర్మవిశేషముచే కలుగునట్టి దయోనిజమనియు, నట్టిది దేవతల యొక్కయు, ఋషుల యొక్కయు శరీరమనియు, నట్టి అయోనిజు లుండిరనియు చెప్పబడినది.”

శుక్ర, శోణిత సంబంధంలేకుండానే క్రిమి కీటకాలు, చెట్లు మొదలైనవి పుట్టడం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ, మనుషుల్లోనూ అది ఎలా సాధ్యమో ఛాందోగ్యోపనిషత్తును ఉటంకిస్తారు. దాని ప్రకారం, ఈ లోకంలో జన్మించడానికి అయిదు మార్గాలు ఉన్నాయి. 1. ద్యులోకం, అంటే ఆకాశం 2. పర్జన్యం, అంటే మేఘం. 3. భూమి. 4. పురుషుడు. 5. స్త్రీ. వారి వారి అర్హతలను బట్టి అవరోహణ క్రమంలో ఈ మార్గాలలో జన్మిస్తారు. 4(పురుషుడు), 5(స్త్రీ) స్థానాల కలయిక వల్ల సంతానం కలుగుతుందని చెప్పారే కానీ, మిగిలిన స్థానాలలో కలగదని చెప్పలేదు. కనుక ద్రోణుడు మొదలైనవారు అయిదవ స్థానమైన స్త్రీతో నిమిత్తం లేకుండానే, నాలుగవ స్థానమైన పురుషునిద్వారానే పుట్టారు. ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మొదలైనవారు 4,5 స్థానాలతో; అంటే పురుష-స్త్రీ సంబంధంతో నిమిత్తం లేకుండానే పుట్టారు.

ఇదీ వారణాసి వారు వినిపించిన వాదం.

సంతానోత్పత్తిలో స్త్రీ స్థానం అట్టడుగుకి జారిపోవడం, పురుషుడిని స్త్రీ కంటే పైన ఉంచడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు. మాతృస్వామ్యంపై విజయం సాధించే ప్రయత్నంలో పురుషుడు సృష్టినే తలకించులు చేస్తున్నాడన్నమాట!

కొత్త అంశంతో వచ్చే వారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

చరిత్రలో ఒక అద్భుతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న మాటే చూడండి…

ఈ మాట వెలుగులో మనల్ని పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?!

ఇప్పటికీ మనదగ్గర బుద్ధి అనే పాత్రను ఖాళీగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నామనిపిస్తుంది. పైగా దానిని ఇంత అయోమయపు మట్టితో నింపుతున్నాం కూడా. మన దేశం ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదనడానికి ఇది కూడా ఒక నిదర్శనం.

ఈ సందర్భంలో నాకొకటి గుర్తొస్తోంది. ఓ రోజు పొద్దుటే టీవీలో ఒక ప్రసిద్ధ పౌరాణికుని ప్రవచనం వింటున్నాను. ఆయన భారతదేశం ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఇది కర్మభూమి అనీ, యజ్ఞభూమి అనీ, మిగతా భూములు పవిత్రమైనవి కావనీ అంటున్నారు. అలా కాసేపు ఆత్మస్తుతి, పరనింద చేసి, చివరగా భారతదేశం మొత్తమే ఒక దేవాలయం అని తేల్చారు.

విచిత్రం ఏమిటంటే, ఆయన సరిగ్గా ఆ మాటలు అంటున్నప్పుడే కింద వార్తలు స్క్రోల్ అవుతున్నాయి. వాటిలో ఒక టీచర్ అయిదేళ్ళ పసిపిల్లపై అత్యాచారం జరిపిన వార్త కూడా ఉంది!

ఆయన మాటలకూ, కింద స్క్రోల్ అవుతున్న ఆ వార్తకూ మధ్య ఎంత అంతరం, ఎంత అవాస్తవికత వ్యాపించి ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తాను. అంతకు మించి భయపెట్టేది అందులోని ఆత్మవంచన. ఆపైన ఆయన ఇంకో ఉద్ఘాటన కూడా చేశారు. అగ్ని ఆరాధన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదన్నదే ఆ ఉద్ఘాటన. నాకు ఆశ్చర్యమూ, బాధా కూడా కలిగాయి. ఆయనకు కొంచెం చరిత్ర తెలిస్తే ఎంత బాగుండుననిపించింది. నిజానికి అగ్ని ఆరాధన ప్రపంచమంతటా ఉంది. ఆ సంగతి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కూడా.

పురాతన మతాలకు భిన్నంగా యూదుల జుడాయిజం, క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!

దీనిని విమర్శగా కాక, ఆత్మవిమర్శగా తీసుకోవాలని కోరుతూ విషయంలోకి వెడతాను.

***

ప్రపంచంలో యూదుల ప్రాముఖ్యానికి కారణం, వారు లిఖిత సాహిత్యాన్ని అందించడమే నని వెల్స్ అంటారు. అంతేకాదు, ప్రపంచ చరిత్రను, శాసనాల సంపుటిని, ఉపదేశ గ్రంథాలను, కవిత్వాన్ని, కల్పిత సాహిత్యాన్ని, రాజకీయభావజాలాన్ని లిఖిత రూపంలో ప్రపంచానికి మొట్టమొదటగా అందించినది యూదులే. వీటిని పొందుపరచుకుంటూ క్రీ.పూ. 4-5 శతాబ్దాలలో రూపొందినదే హిబ్రూ బైబిల్. అదే క్రైస్తవంలో ‘ఓల్డ్ టెస్ట్ మెంట్’గా వ్యవహారంలోకి వచ్చింది.

యూదులు ప్రపంచం మొత్తంలోనే ఒక విలక్షణమైన జాతి. తటస్థంగా చెప్పుకుంటే, వారిలా విపరీతమైన వేధింపులకు, ఊచకోతకు గురైనవారు; వారిలా కొన్ని వందల ఏళ్లపాటు ప్రవాసదుఃఖాన్ని అనుభవించినవారు ఇంకొకరు కనిపించరు. చరిత్రపూర్వకాలం నుంచి, ఆధునిక కాలం వరకు వారి ఆరాట,పోరాటాలకు ఒక అవిచ్ఛిన్నచరిత్ర ఉండడం మరింత ఆశ్చర్యం గొలుపుతుంది. చరిత్రపూర్వకాలంలో ఈజిప్షియన్లు, చాల్దియన్లు తదితరులతో మొదలుపెట్టి ఆధునిక కాలంలో హిట్లర్ కత్తికి మెడవంచడం వరకు వారు పడిన హింసలోనూ ఒక క్రమం కనిపిస్తుంది.

అలాగే, రోమన్ల కంటే ముందు బహురూప ఆస్తికతను తుడిచిపెట్టి ఏకరూప ఆస్తికతను స్థాపించిడానికి ప్రయత్నించినవారు యూదులే. అది క్రీస్తుపూర్వ కాలంలో! అప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం క్రీస్తుశకంలో క్రైస్తవంతో ఒక కొలిక్కి వచ్చింది.

 

యూదులు లేదా హిబ్రూలు సెమెటిక్ జాతి. మొదట్లో వారికంత ప్రాముఖ్యమూ, గుర్తింపూ లేవు. క్రీ.పూ. 1000కి ముందే వారు జుడియాలో స్థిరపడ్డారు. ఆధునిక చరిత్రకారులనే ప్రమాణంగా తీసుకుంటే అది, మన మహాభారత కాలం కంటే కూడా ముందు. ఆ తర్వాత జెరూసలెం వారి రాజధాని అయింది. వారికి దక్షిణంగా ఈజిప్టు; ఉత్తరంగా సిరియా, అసీరియా, బాబిలోన్ ఉన్నాయి. అప్పట్లో చక్రం తిప్పుతూ వచ్చిన ఈ సామ్రాజ్యాల మధ్య ఒక రహదారిగా జుడియా ఉండేది. ఆ విధంగా యూదుల అస్తిత్వం మంచికైనా, చెడుకైనా ఈ సామ్రాజ్యాలతో పెనవేసుకోవలసివచ్చింది.

ప్రారంభంలో యూదులు అంత నాగరికులూ కారు, ఐకమత్యంగానూ లేరు. వారిలో చదవడం, రాయడం తెలిసినవారు కూడా చాలా కొద్దిమంది. మన కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతిలా వారికి కూడా ఒక ప్రజాపతి(పేట్రియార్క్) ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి(క్రీ.పూ. 1750)కాలం వాడని అంచనా. అబ్రహాం నాయకత్వంలో యూదులు సంచారజాతిగా ఉండేవారు. బైబిల్ కథనం ప్రకారం, అబ్రహాం కనాన్ అనే ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ పాడి పంటలతో తులతూగే ఈ ప్రాంతాన్ని మీకు నివాసంగా చేస్తున్నానని చెప్పాడు.

అబ్రహాం కొడుకు మోజెస్. అతని కాలంలో యూదులు ఈజిప్టుకు బందీలయ్యారు. చాలాకాలం పాటు అక్కడ ప్రవాస జీవితం గడిపారు. ఆ తర్వాత నలభై ఏళ్లపాటు దేశదిమ్మరులుగా గడిపారు. అప్పటికి పన్నెండు తెగలుగా విస్తరించారు. అయితే, అబ్రహాం తమకు వాగ్దానం చేసిన కనాన్ తీరప్రాంతాన్ని ఏజీయన్లు అయిన ఫిలిస్తీన్లు అప్పటికే ఆక్రమించుకుని ఉన్నారు. ఆర్యులు తరిమేస్తే ఫిలిస్తీన్లు అక్కడికి వలస వచ్చారని ఇంతకుముందు చెప్పుకున్నాం. అబ్రహాం వారసులు కనాన్ ఆక్రమణకు ప్రయత్నించారు. ఏవో కొన్ని కొండ ప్రాంతాలు మాత్రమే వారి చేజిక్కాయి. కొన్ని తరాలపాటు అబ్రహాం వారసులు ఆ కొండప్రాంతాలలో అనామక జీవితం గడిపారు. మధ్య మధ్య వారికీ, ఫిలిస్తీన్లకు, అక్కడున్న చిన్న చిన్న ఇతర తెగలవారికి ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. బైబిల్ లోని బుక్ ఆఫ్ జడ్జెస్ లో వాటి వివరాలు ఉన్నాయి.

జడ్జీలు అంటే ఇక్కడ యూదుల పూజారులు. వారే యూదులను పాలించేవారు. కానీ, యుద్ధాలకు నాయకత్వం వహించే వ్యక్తి అవసరమని భావించి క్రీ.పూ.1000 ప్రాంతంలో పూజారుల స్థానంలో యూదులు సౌల్ అనే అతన్ని రాజుగా చేసుకున్నారు. ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌల్ మరణించాడు. ఫిలిస్తీన్లు అతని మృతదేహానికి మేకులు కొట్టి ఒక గోడకు వేలాడదీశారు.

సౌల్ కొడుకే డేవిడ్! ‘డేవిడ్ అండ్ గోలియెత్’ కథలో హీరో. యూదుల చరిత్రలో ఎంతోకొంత స్వర్ణయుగంగా చెప్పుకోదగింది అతని కాలమే. అందుకు కారణం, ఫొనీషియన్ల నగరమైన టైర్ తో వారికి ఏర్పడిన స్నేహసంబంధాలు.

untitled

ఆ నగరాన్ని హీరామ్ అనే రాజు పాలించేవాడు. అతను మంచి మేధావి, ఉత్సాహవంతుడు. ఫొనీషియన్లు నౌకావర్తకంలో ఆరితేరినవారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాధారణంగా వారి వర్తక నౌకలు ఈజిప్టు మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకునేవి. అయితే, ఈజిప్టు అప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఆ మార్గంలో మరికొన్ని ఇతర ఆటంకాలూ ఎదురయ్యాయి. దాంతో హీరామ్ ఎర్రసముద్రం చేరుకోడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవలసివచ్చింది. యూదుల కొండ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం అనుకూలంగా కనిపించింది. హీరామ్ డేవిడ్ తోనూ, ఆ తర్వాత అతని కొడుకు సోల్మన్ తోనూ స్నేహం చేశాడు. అతని సాయంతోనే జెరూసలెంలోని ఆలయం, గోడలు, రాజప్రాసాదం నిర్మాణమయ్యాయి. దానికి ప్రత్యుపకారంగా తమ ప్రాంతం మీదుగా ఎర్ర సముద్రానికి వెళ్ళే మార్గాన్ని హీరామ్ ఉపయోగించుకోడానికి, తమ భూభాగం మీద నౌకలను నిర్మించుకోడానికి యూదులు అనుమతించారు. అప్పటినుంచి జెరూసలెం మీదుగా ఫొనీషియన్లు అటు ఉత్తరంవైపు, ఇటు దక్షిణంవైపు పెద్ద ఎత్తున వర్తకం సాగిస్తూవచ్చారు. ఈ క్రమంలో యూదుల రాజు సోల్మన్ కూడా అంతకుముందు ఎన్నడూ ఎరగని సంపదను, వైభవాన్ని గడించాడు. చివరికి ఈజిప్టు ఫారో కూడా తన కూతురిని అతనికిచ్చి పెళ్లి చేశాడు.

అయితే యూదుల వైభవం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సోల్మన్ మరణించిన తర్వాత ఈజిప్టు ఫారో షిషాక్(శశాంక్?) జెరూసలెంపై దాడి చేసి మూలమట్టంగా దోచుకున్నాడు. యూదుల రాజ్యంలోని ఉత్తరప్రాంతం జెరూసలెం నుంచి వేరుపడి, ఇజ్రాయిల్ పేరుతొ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. జెరూసలెం, జుడా రాజధానిగా ఉండిపోయింది.

పులి మీద పుట్రలా హీరామ్ కూడా మరణించాడు. దాంతో టైర్ నగరం నుంచి యూదులకు అందే సాయం ఆగిపోయింది. ఈజిప్టు మరోసారి బలం పుంజుకుంది. ఇజ్రాయిల్, జుడా రాజ్యాలు రెండూ అటు ఉత్తరరాన సిరియా, అసీరియా, బాబిలన్; ఇటు దక్షిణాన ఈజిప్టుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవడం ప్రారంభించాయి. క్రి. పూ. 721లో ఆసీరియా ఇజ్రాయిల్ ను కబళించి అక్కడి యూదులను బందీలను చేసింది. దాంతో ఇజ్రాయిల్ చరిత్రలోనే అదృశ్యమైపోయింది. క్రీ.పూ. 608 వరకు ఎలాగో అస్తిత్వాన్ని కాపాడుకున్న జుడాకూ చివరికి ఇజ్రాయిల్ కు పట్టిన గతే పట్టింది. మీదులు, పర్షియన్లు, చాల్దియన్లతో యుద్ధాలలో అసీరియా తలమునక లవుతున్న సమయంలో ఈజిప్టు ఫారో నెకో-2 అసీరియాపై దాడి చేసి జుడా మీద పడ్డాడు. అతనితో జరిగిన యుద్ధంలో జుడా రాజు జోసయ్య ఓడిపోయి, హతుడయ్యాడు. జుడా ఈజిప్టుకు సామంత రాజ్యం అయింది. అసీరియన్లతో జరిగిన యుద్ధంలో గెలిచి, బాబిలోన్ ను ఆక్రమించుకున్న చాల్దియన్ రాజు నెబుచాద్ నెజ్జర్ ఈజిప్టు ఫారో నెకో-2ను వెళ్ళగొట్టి జుడాను ఆక్రమించుకున్నాడు. జెరూసలెంలో తన కీలుబొమ్మను రాజుగా ఉంచి బాబిలోన్ నుంచే దానిని పాలించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. జనం తిరుగుబాటు చేసి బాబిలోన్ అధికారులను ఊచకొత కోశారు. దాంతో నెబుచాద్ నెజ్జర్ జుడా రాజ్యం మొత్తాన్నే తుడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. జెరూసలెం మీదపడి దోచుకుని నగరాన్ని తగలబెట్టాడు. జనాన్ని బందీలుగా బాబిలోన్ కు పట్టుకుపోయాడు.

క్రీ.పూ. 538లో పర్షియన్ రాజు సైరస్ బాబిలోన్ ను ఆక్రమించుకునేవరకు వారు అక్కడే ఉన్నారు., ఆర్యుడైన సైరస్ వాళ్ళందరినీ ఒకచోట చేర్చి తిరిగి స్వదేశానికి పంపేశాడు. జెరూసలెంలోని ఆలయాన్ని, గోడలను పునర్నిర్మింపజేశాడు.

పాలకోసం రాయి మోసినట్టుగా, రెండు వివరాల కోసం ఈ చరిత్ర అంతా తడమాల్సి వచ్చింది. మొదటిది, ఋగ్వేదం ‘పణు’లుగా పేర్కొన్న ఫొనీషియన్లతో యూదుల మైత్రి గురించి చెప్పుకోవడం. రెండవది, బాబిలోన్ జీవితం వారిలో తెచ్చిన మార్పు.

బాబిలోన్ వారిని నాగరికులుగా మార్చడమే కాదు, సంఘటితం చేసింది. అంతకంటె ముఖ్యంగా వారిని రాజకీయ ప్రజగా మార్చింది. హిబ్రూ బైబిల్ ను, తమవైన సంప్రదాయాలను వారు రూపొందించుకున్నది బాబిలోన్ లో ఉండగానే. బందీలుగా బాబిలోన్ కు వెళ్ళిన వారికి, స్వేచ్చ పొంది తిరిగి స్వదేశానికి చేరుకున్న వారికి మధ్య ఎలాంటి పోలికా లేదు. ప్రపంచంలో అప్పటికి ఎవరికీ లేని ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకున్నారు. అందులో ప్రముఖ పాత్ర వహించింది, సరికొత్త రకానికి చెందిన వ్యక్తులు. వారే, ప్రవక్తలు!

ఈ ప్రవక్తలు రక రకాల మూలాల నుంచి వచ్చినవారు. ఉదాహరణకు ఎజేకిల్ అనే ప్రవక్త పూజారుల కులానికి చెందినవాడు. అమోస్ అనే ప్రవక్త గొర్రెల కాపరులలా గొర్రె చర్మం ధరించేవాడు. వీరికి ఒకరి అనుమతి కానీ, పదవిలో ఒకరు ప్రతిష్టించడం కానీ ఉండవు. వీరు ఒక్క ధర్మదేవతకు తప్ప మరెవరికీ విధేయత ప్రకటించరు. వారు నేరుగా జనంతో మాట్లాడతారు. ‘దేవుడు నాతొ ఇలా పలికిస్తున్నా’ డని చెబుతారు. వీరు అణువణువునా రాజకీయాన్ని రంగరించుకుని ఉండేవారు. ఈజిప్టు, అసీరియా, బాబిలోన్ ల మీద తిరగబడమని జనాన్ని ఉద్బోధించేవారు. సోమరితనం నిండిన పూజారి వ్యవస్థను, రాజుల దుర్మార్గాలను ఖండించేవారు. వీరిలో కొందరు సంఘ సంస్కరణకు కూడా పూనుకున్నారు.

ఈ ప్రవక్తల ఉద్బోధలకు అక్షర రూపమిచ్చి భద్రపరిచేవారు. యూదులు ఎక్కడికి వెళ్ళినా వాటిని తమ వెంట తీసుకువెళ్ళారు. ఈ సరికొత్త మత స్ఫూర్తిని వెళ్ళిన ప్రతిచోటా వెదజల్లారు. సామాన్య ప్రజానీకాన్ని పూజారుల నుంచి, ఆలయాల నుంచి, రాజుల నుంచి తప్పించి ధర్మదేవతకు అభిముఖంగా నిలబెట్టారు. మానవాళి చరిత్రలో ఇదే వారికి అత్యంత ప్రాముఖ్యాన్ని కల్పించింది. వ్యక్తిగత నైతికతను నొక్కి చెప్పడం రూపంలో యూదులు ప్రపంచానికి ఒక కొత్త శక్తిని అందించారు.

వెనకటి నగర రాజ్యాలలోని దేవుణ్ణి మనుషులు తమ చేతులతో తయారుచేసి దేవాలయంలో ప్రతిష్టించేవారు. ఆ దేవాలయాన్ని శత్రువులు కూలగొడితే దానితోపాటు దేవుడు కూడా కుప్పకూలేవాడు. కానీ యూదుల దేవుడు ఒక కొత్త ఆలోచన. ఆయన అదృశ్యంగా ఉంటాడు. ఏదో ఒక నగరానికి, ప్రాంతానికీ పరిమితం కాడు. పూజారులకు, బలులకు అతీతంగా అయన స్వర్గంలో ఉంటాడు. దేవాలయం కేంద్రంగా ఉన్న నాటి నగర రాజ్యాలు, వాటిపై జరిగే దాడులు, బలులు మొదలైనవి యూదుల దేవుడి అవతరణకు చారిత్రక నేపథ్యం అన్న సంగతి అర్థమవుతూనే ఉంది.

ముందే చెప్పినట్టు యూదులది పుస్తక మతం. బైబిల్ వాళ్ళకు సర్వస్వం. అదే వారిని సంఘటితంగా ఉంచింది. అంతే కాదు, జెరూసలెం వారికి నామమాత్రపు రాజధాని మాత్రమే; వారి నిజమైన రాజధాని బైబిలే. ‘యూదులు పూర్తిగా ఒక సరికొత్త ప్రజారూపం. వారికి ఒక రాజు లేడు, ఒక ఆలయం లేదు, కేవలం లిఖిత అక్షరమే వారిని కలిపి ఉంచింది’ అంటారు వెల్స్.

***

ఇక ఇప్పుడు బయలుదేరిన చోటికి మళ్ళీ వెడదాం. ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు.

మన దగ్గర చరిత్ర స్పృహ ఉండి ఉంటే, ఫొనీషియన్లు, యూదుల గురించిన ఎంతో కొంత చరిత్ర మనం కూడా నమోదు చేసి ఉండేవారమేమో! యూదుల పుస్తకమతం గురించిన ప్రస్తావన మన పురాణ, ఇతిహాసాలలో కూడా కనిపించేదేమో! మనకూ, పురాతన నాగరికతలకూ మధ్య ఒక చారిత్రక వారధి రూపుకట్టి ఉండేది. మనకు మనం ఆపాదించుకునే విశిష్టతలు, ప్రత్యేకతల గురించిన ఊహలకు అంతగా అవకాశం ఉండేది కాదు.

అదలా ఉంచితే, ఆర్యుల రాకతో ఫొనీషియన్లతో సహా సెమెటిక్కుల ప్రాభవం ప్రతిచోటా ఎలా అదృశ్యమైపోయిందో వెల్స్ రాస్తారు. క్రీ.పూ. 17వ శతాబ్ది నాటికి మొత్తం నాగరిక ప్రపంచాన్ని సెమెటిక్కులే ఏలుతూ ఉండేవారు. అయితే, క్రీ.పూ. 3వ శతాబ్ది నాటికి ప్రపంచమంతటా సెమెటిక్ ప్రాబల్యాన్ని ఆర్యులు తుడిచిపెడతారనీ, సెమిటిక్కులు ఆర్యుల కింద అణగిమణగి జీవించవలసి వస్తుందనీ, తలోవైపుకీ చెదిరిపోవలసివస్తుందనీ ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క అరేబియాలోని సంచార జాతులైన బెడోవిన్లు ఆర్యుల దాడినుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోగలిగారు. మరోవైపు యూదులు అనే చిన్న సమూహం ఇంత సంక్షోభంలో కూడా జెరూసలెంలో తమ పురాతన సంప్రదాయాలను అంటిపెట్టుకుని సంఘటితంగా ఉండిపోయారు. వారిని అలా సంఘటితంగా ఉంచినది, వారి బైబిలు!

చరిత్రలో ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఆర్యుల కత్తికి తలవంచి గతవైభవాన్ని కోల్పోయిన బాబిలోనియన్లు, సిరియన్లు, ఫొనీషియన్లతో సహా అనేకులు క్రమంగా యూదు మతంలోకి ఆకర్షితులై బైబిల్ భాషే మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, టైర్, సిడాన్, కార్తేజ్, స్పెయిన్ లోని ఇతర ఫొనీషియన్ నగరాలతోపాటు ఫొనీషియన్లూ హఠాత్తుగా చరిత్రనుంచి అదృశ్యమైపోయారు. ఒక్క జెరూసలెం లోనే కాక, అంతకుముందు ఫొనీషియన్లు అడుగుపెట్టిన స్పెయిన్, ఈజిప్టు, అరేబియా, తూర్పు దేశాలతో సహా ప్రతిచోటా అంతే హఠాత్తుగా యూదులు ప్రత్యక్షమయ్యారు.

మిగతా విశేషాలు తర్వాత…

సూర్యుని పండుగే క్రిస్టమస్!

bull sacrifice of Mitras

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది…

ఆయన ఓ సినిమా పాటలో ‘బతుకు బరువు’ అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, ‘బతుకు మా సెడ్డ బరువు’ అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది. ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

పాపం, ఆ సవరణ సూచించిన సమయంలో చదలవాడ గుండెల్లో ఎంత బతుకు భారం మోస్తున్నారో! మరునాడే ఆయన మరణానికీ, ఆ సవరణకూ ఎలాంటి ముడి ఉందో తెలియదు. తెలిసే అవకాశంలేదు.

నిజమే, బతుకు మా సెడ్డ బరువే. ఇంతకీ మనిషి చరిత్రలో బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పుడు మారిందని అడిగితే, కచ్చితంగా చెప్పడం కష్టమే. లేక, మొదటినుంచీ అంతేనా?! ప్రకృతిశక్తులతో పోరాడుతున్న సమయంలోనూ బతుకు మా సెడ్డ బరువుగా అనిపించే ఉంటుంది. అయితే, అప్పుడు మనిషి ప్రకృతిశక్తులతో సంఘటితంగా పోరాడి ఉంటాడు. మనిషికి మనిషి తోడన్న భరోసా బతుకు భారాన్ని ఎంతో కొంత తగ్గించి ఉంటుంది. కానీ మనిషి మనిషితోనే పోరాడవలసిన దశ వచ్చేసరికి ఆ భరోసా పలచబారి బతుకు మా సెడ్డ భారంగా మారిపోయిందా?!

మొత్తానికి ఇహలోకం నరకమై, బతుకు భారమైపోయింది. కనుక కాసింత సుఖ సంతోషాలనిచ్చే స్వర్గం కోసం పాకులాడక తప్పదు. అంతవరకు ప్రకృతిశక్తులపై దేవతారోపణ చేసి ప్రసన్నత కోసం ప్రార్థించి ఉండచ్చు. కానీ తోటి మనిషే క్రౌర్యం మూర్తీభవించి కాలయముడు అయినప్పుడు ఒక చల్లని దేవినో, కరుణామయుడైన ఓ దేవుణ్ణో మానవరూపమిచ్చి సృష్టించుకోవడం అనివార్యమవుతుంది.

అసలు ఈ బతుకనే మా సెడ్డ బరువే లేకపోతే ఎలా ఉంటుంది?! అప్పుడు కావలసింది జన్మరాహిత్యం, లేదా మోక్షం. పోనీలే, ఈ జన్మలో సుఖం లేకపోతే వచ్చే జన్మలోనైనా ఉండకపోతుందా? దాంతో పునర్జన్మ మీద ఆశ…

ఇది చదివి నేనేదో ఆస్తిక-నాస్తిక చర్చలోకి వెడుతున్నానని దయచేసి అనుకోవద్దు. చరిత్రలోకి వెడితే, బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పటినుంచీ అయిందో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని నా తాపత్రయం.

   ***

ఈ బతుకు బరువవడం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో విధంగా అయుండచ్చు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం కనుక అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

క్రీస్తుశకం మొదటి రెండు శతాబ్దాలకు వచ్చేసరికి రోమన్ సామ్రాజ్యంలో మనిషి ఆత్మ సంక్షుభితం అయిపోయిందనీ, అంతులేని బాధా, నిస్పృహలలోకి జారిపోయిందనీ హెచ్.జి. వెల్స్ అంటారు. నిర్బంధమూ, క్రౌర్యమూ స్వైరవిహారం చేస్తూవచ్చాయి. గర్వించడానికీ, వైభవప్రదర్శనకూ లోటు లేదు. కానీ గౌరవప్రదమైన జీవితం, ప్రశాంతత, నిలకడైన సుఖసంతోషాలు లోపించాయి. పేదలు తిరస్కృతికి, అవమానానికి, దుర్భరమైన పీడనకు గురయ్యేవారు. అలాగని సంపన్నులు సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. నిరంతర అభద్రతలోనూ, ఎంతకూ తీరని కోరికల దాహంతోనూ అలమటించేవారు. రోమ్ నగరాలలో అర్థచంద్రాకారంలో రంగస్థలాలు ఉండేవి. అవే పౌరజీవితానికి కేంద్రంగానూ, కీలకంగానూ ఉండేవి. అక్కడ మనుషులకు, పశువులకు ప్రాణాంతకమైన పోరు జరుగుతూ ఉండేది. ఆ పోరులో వారు/అవి పడే చిత్రహింసలోనూ, అప్పుడు మడుగులు కట్టే ఎర్రని రక్తంలోనూ, పోరాడి పోరాడి నేల కొరిగే ఆ దురదృష్ట జీవుల్లోనూ వికృతానందాన్ని వెతుక్కునేవారు. కానీ అంతరాంతరాలలో అందరిలోనూ ఒక అశాంతి గూడుకట్టుకుని ఉండేది. అది మతరూపంలో వ్యక్తమవుతూ ఉండేది.

ప్రతి మతంలోనూ క్రమంగా ఆత్మ గురించిన భావన ఏర్పడుతూ వచ్చింది. మరోపక్క తర్కానికి అందని, చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బహుదేవతారాధన సాగుతూనే ఉంది. మతంలో ఓదార్పును వెతుక్కునే ప్రయత్నంలో ఈజిప్షియన్లలో అమరత్వంపై కోరిక బలంగా వ్యక్త మవడం ప్రారంభించింది. అంతవరకు ఏ మతంలోనూ లేని అమరత్వ భావనను ప్రపంచానికి పరిచయం చేసింది ఈజిప్షియన్ మతమేనని వెల్స్ అంటారు. ఈజిప్టు విదేశీ దురాక్రమణలకు గురవుతూ, ఈజిప్టు దేవతలు రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోతున్న కొద్దీ, అమరత్వంలో ఓదార్పును వెతుక్కోవడం ఈజిప్షియన్లలో బలీయమవుతూ వచ్చిందని ఆయన అంటారు.

విదేశీ దురాక్రమణలు మన దేశం మీదా జరిగాయి కనుక, ఒకవైపు బహుదేవతారాధన, ఇంకోవైపు ఆత్మ, అమరత్వం గురించిన ఆలోచనలతో ఈజిప్షియన్ అనుభవం మన దగ్గరా ప్రతిబింబించి ఉండచ్చు. ఈ సందర్భంలో వెల్స్ మన దేశం గురించి ప్రస్తావిస్తూ, బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచే ఈ దేశంలోని ఆడా, మగా జీవితానందాలను త్యాగం చేసేవారనీ, వివాహబంధాన్ని, సంపదను నిరసించేవారనీ, ఇహ లోకపు ఒత్తిడులు, సమస్యలనుంచి తప్పించుకుంటూ ఆధ్యాత్మిక శక్తుల కోసం పాకులాడేవారనీ, ఆ ప్రయత్నంలో శరీరాన్ని హింసించుకునే వారనీ, ఏకాంత జీవితానికి మొగ్గు చూపేవారనీ ఆయన అంటారు. గ్రీకులలో కూడా ఇలాంటి ఆత్మహింసా పద్ధతులనే అనుసరించే పంథాలు ఉండేవి. ఆ పంథాలవారు శరీర అవయవాలను నరుక్కునే వరకూ వెళ్ళేవారు. మన దగ్గర కూడా మధ్యయుగాలలో వీరశైవం మొదలైన పంథాలలో ఇటువంటి పద్ధతులు ప్రబలంగా ఉండేవి. జుడియా, అలెగ్జాండ్రియాలలోని యూదు తెగల్లో కూడా ఇహలోక జీవితం మీద తీవ్ర వైముఖ్యం ఉండేది. క్రీస్తు శకం తొలి రెండు శతాబ్దాలలో ఈ ధోరణి ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రతి ఒకరూ మోక్షం గురించిన అన్వేషణలో తలమునకలయ్యేవారు. ఆ కాలపు పరిస్థితుల వల్ల కలిగిన నిరాశా, నిస్పృహలే అందుకు కారణమని వెల్స్ అంటారు. అంతకు ముందు దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన ఒక సమష్టి మతవ్యవస్థ ఉండేది. దేవాలయం పట్ల, పూజారి పట్ల జనంలో అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. నియమనిబంధనలపై, మతపరమైన తంతుపై పట్టింపు ఉండేది. ఈ కాలానికి వచ్చేసరికి అవి అంతరించాయి. దుర్భరమైన బానిసత్వం. క్రౌర్యం, భయాందోళనలు, ఆత్మన్యూనత, స్వార్థం, అట్టహాసం పడగవిప్పిన నాటి వాతావరణంలో ప్రతి ఒకరూ విరక్తికీ, అభద్రతకూ లోనయ్యేవారు. జీవితం పట్ల నిరాసక్తత, నిస్పృహలలోనే శాంతిని వెతుక్కునే వారు.

ఈజిప్టులో టొలెమీ చక్రవర్తి నిర్మింపజేసిన సెరాపియమ్ లో పీడితులు, తాడితుల కన్నీళ్లు వరదలు కట్టేవి…

   ***

రోమ్ సామ్రాజ్యం విస్తరించిన కొద్దీ ఈ సెరాపిస్-ఐసిస్ ఆరాధనా రూపం పశ్చిమ యూరప్ కు కూడా వ్యాపించింది. సెరాపిస్-ఐసిస్ ఆలయాలు, పూజారి వ్యవస్థ, అమరత్వం గురించిన ఆకాంక్షలు స్కాట్లాండ్, హాలండ్ ల దాకా వెళ్ళాయి. అయితే దీనితో పోటీపడే మతాలూ చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది మిత్రాయిజం. ఇది పర్షియన్ల మతం. సంస్కృతంలో మిత్రు డంటే సూర్యుడని చెప్పుకున్నాం. బ్రాహ్మణులలో సంధ్యావందనం సూర్యుని ఉద్దేశించినదే. సంధ్యావందన మంత్రాలలో మిత్ర శబ్దం వస్తుంది. బ్రాహ్మణులలో, బహుశా క్షత్రియులలో కూడా మిత్రావరుణులు ఋషులుగా ఉన్న గోత్రాలవారు ఉన్నారు. క్షత్రియులలో సూర్యవంశ క్షత్రియులున్న సంగతి తెలిసినదే. పురాచరిత్ర కాలంలో సిరియాను మితానీ అనే తెగవారు పరిపాలించారు. వీరు మిత్ర సంబంధీకులే. ఒకనాటి అమెరికాతో సహా ప్రపంచమంతటా సుర్యారాధన ఉండేది. ఇంకా విశేషమేమిటంటే, డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్టమస్ కు, సుర్యారాధనకు సంబంధం ఉంది. అసలు డిసెంబర్ 25 సూర్యుడికి సంబంధించిన రోజు. సుర్యారాధకులను, అంటే మిత్రమతం వారిని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో వారికి ముఖ్యమైన రోజునే క్రిస్టమస్ గా మార్చారు. అంటే క్రైస్తవ మతంలో కూడా తనకు ముందున్న వివిధ ఆరాధనా పద్ధతులను తనలో కలుపుకునే థియోక్రేసియా జరిగిందన్నమాట. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశంలోకి ఇప్పుడు వెళ్ళలేం.

మిత్రమతం సెరాపిస్-ఐసిస్ ఆరాధనలా సంక్లిష్టమైన, అధునాతనమైన (అప్పటికి) ఆరాధనా విధానం కాదు. ఇది జంతుబలుల కాలానికి చెందిన మతం. ఈ మతం వారు ఒక మంచె మీద ఎద్దును ఉంచి డానిని బలి ఇచ్చేవారు. భక్తులు ఆ మంచె కింద నిలబడి ఆ ఎద్దు నుంచి ప్రవహించే రక్తంలో తడిసేవారు. ఈ రక్తం నుంచి కొత్త జీవితం పుట్టుకొస్తుందని నమ్మేవారు.

పై రెండే కాక మరెన్నో ఆరాధనా పంథాలు ఉండేవి. మన దేశంలో ఇప్పటికీ వివిధ కులాలవారికి, లేదా వేర్వేరు సామాజిక స్థాయులకు చెందినవారికి తమవైన ఆరాధనాపద్ధతులు, దేవీదేవతామూర్తులు ఉన్నట్టే, బానిసలతో సహా రోమన్ సామ్రాజ్యంలోని జనాలకూ ఉండేవి. రోమన్ నగరాలు అన్నింటిలోనూ అందరు దేవతలకు లెక్కకు మించిన ఆలయాలు ఉండేవి. అవిగాక రోమన్ల ప్రధానదైవమైన జూపిటర్ ఆలయం తప్పనిసరిగా ఉండేది. మరోవైపు రాజకీయ విధేయతను చాటుకోడానికి మొక్కుబడిగానైనా సీజర్ అలయానికీ వెళ్ళేవారు. అయితే, తమను ఈతిబాధలనుంచి కాపాడగలిగిన దయగల తల్లిగా ఐసిస్ నే నమ్ముకునేవారు.

ఆపైన మరెందరో స్థానిక దేవతలు ఉండేవారు. కొందరు దేవతల రూపాలు చిత్రవిచిత్రంగానూ ఉండేవి. ఉదాహరణకు సెవిల్లే అనే దేవత. ఫొనీషియన్లు కార్తేజ్ నగరంలో చాలాకాలంగా పూజిస్తూ వచ్చిన వీనస్ కు, ఈ దేవతకు సంబంధం ఉంది. మరోవైపు ఒక గుహలోనో, భూగర్భ ఆలయంలోనో మిత్రుని ఆరాధన జరుగుతూనే ఉండేది. ఇందులో సైనికులు, బానిసలు పాల్గొంటూ ఉండేవారు. మరోచోట యూదులు తమ ప్రార్థనామందిరంలో బైబిల్ చదువుకునే వారు. యూదుల దేవుడు అదృశ్యంగా ఉంటాడు. వారు విగ్రహారాధనకు విముఖులు. బహుశా వారు సీజర్ ఆలయానికి వెళ్ళి మొక్కడానికి, అక్కడ జరిగే పూజా తంతులో పాల్గొనడానికి వ్యతిరేకించి ఉంటారు. అలాగే, రోమన్ పాలకులు ఆదరించే ఇతర దేవుళ్ళను కూడా! అది వారికి రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టే ఉంటుంది.

ఇంతకీ ఈ వివరాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే బహురూప ఆస్తికత క్రీస్తుశకానికి ముందూ, ఆ తర్వాత మరికొంతకాలమూ రోమన్ సామ్రాజ్యంలోనూ ఉండేదని చెప్పడానికే. రోమన్ సామ్రాజ్యంలోనే కాదు, దాదాపు ప్రపంచమంతటా ఉండేది. ఈ సందర్భంలోనే మతరంగంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పునూ గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే, పైన చెప్పుకున్న వాటిలో అనేకం ఇష్టదేవతారాధనలు. వ్యక్తిగత ముక్తిని లేదా బాధలనుంచి విముక్తిని కోరే ప్రైవేట్ ఆరాధనలు. అంతకు ముందున్న మతరూపం ఇలాంటిది కాదు. అది వ్యక్తిగతం కాక, సామూహికం, సాంఘికం. అది పారలౌకికం-లౌకికం, లేదా మతం- ప్రభుత్వం అన్న విభజన లేని దశ. ఉదాహరణకు నగర దేవతారాధన ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన తంతు. ఆ తర్వాతే వ్యక్తిగతమైన తంతు. అప్పట్లో బలులు, పూజలు సామూహిక, బహిరంగ చర్యలే కానీ ప్రైవేట్ చర్యలు కావు. పైగా అవి సమష్టి భౌతిక అవసరాల కోసం జరిపే చర్యలు.

ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి. మతమూ, రాజకీయమూ ఇలా గాఢంగా పెనవేసుకున్న స్థితిలో రెండింటినీ విడదీయడానికి; అంటే రాజకీయం నుంచి మతాన్ని తప్పించడానికి మొదట ప్రయత్నించింది గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. విశేషమేమిటంటే, రెండువేల సంవత్సరాల క్రితమే మతాన్నీ, రాజకీయాన్నీ విడదీయాలన్న ఆలోచన జరిగినా, ఇప్పటికీ దాని సాధ్యాసాధ్యాల గురించీ, దాని అవసరం గురించీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం! కనీసం మనదేశానికి పరిమితమై చూసినా ఈ విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత ఏర్పడలేదు. ఇంకోటి గమనించాలి. గ్రీకులు గానీ, రోమన్లు గానీ మతాన్నీ, రాజకీయాన్ని విడదీయాలని అనుకోడానికి కారణం- నాటి బహురూప ఆస్తిక ధోరణులే. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, లేదా రాజ్యం ఏదో ఒక మతం వైపు అతిగా మొగ్గడం కందిరీగల తుట్టను కదపడమే నని వారు గ్రహించి ఉంటారు.

మొత్తానికి మతరంగంలో ఎన్ని మార్పులు జరిగినా అవన్నీ బహురూప ఆస్తికత అన్న చట్రంలోనే! ఆ చట్రం చెక్కు చెదరలేదు. కానీ ముందు ముందు ఆ చట్రం మీదే దెబ్బ పడబోతోంది. రాజకీయం నుంచి మతాన్ని వేరు చేయడానికి చూసిన రోమన్ పాలకులే క్రమంగా ఒకే ఒక అధికారికమతం వైపు అడుగు వేయబోతున్నారు. క్రౌర్యం, దౌర్జన్యం, పీడన, కన్నీళ్లు నిండిన నాటి పరిస్థితులలో; ఇంత శాంతి కోసం, కారుణ్యం కోసం సామాన్యజనం పరితపించడంలో ఆశ్చర్యంలేదు. పరోక్షంగా పాలకులను కూడా ఆ వాతావరణం ప్రభావితం చేయడంలోనూ ఆశ్చర్యంలేదు. దానికితోడు, అప్పటికి ఎంతో కాలంగానే ధర్మం, నీతి, కరుణ నిండిన ఒకే దేవుడి గురించిన భావనను యూదులు ప్రచారం చేస్తున్నారు. చివరికి అలాంటి దేవుడిలో శాంతిని వెతుక్కోడానికి నాటి పరిస్థితులు రోమ్ ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేశాయి.

మనం ఇప్పుడిక జీసస్ దగ్గరికి వస్తున్నాం!

     ***

తొలి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ సీజర్ కాలంలో జీసస్ జుడియాలో జన్మించాడు. ఆయన గురించిన మొత్తం చరిత్రలోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు. కాకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి ఒక రూపమిచ్చిన సెయింట్ పాల్ గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన అసలు పేరు సౌల్. ఆయన ఎన్నడూ జీసస్ ను చూడలేదు. పైగా మొదట్లో జీసస్ బోధలను వ్యతిరేకించాడు. జీసస్ ను శిలువ వేసిన తర్వాత స్వల్ప సంఖ్యలో ఉన్న ఆయన అనుచరబృందాన్ని హింసించడంలో ప్రముఖపాత్ర వహించాడు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా క్రైస్తవంలోకి మారి, తన పేరును పాల్ గా మార్చుకున్నాడు. ఆయన మంచి జిజ్ఞాసి అనీ, మేధావి అనీ, తన కాలం నాటి మతధోరణులను ఎంతో ఆసక్తిగా, లోతుగా ఆకళించుకున్నవాడనీ చెబుతారు. యూదుమతాన్ని, మిత్రమతాన్ని, అలెగ్జాండ్రియాలోని నాటి ఇతర మతాలను బాగా అధ్యయనం చేశాడు. వాటిలోని అనేక అంశాలను క్రైస్తవంలోకి తీసుకొచ్చాడు. ఉదాహరణకు, ఈజిప్టు దేవుడు ఓసిరిస్. ఈయన చావు-పుట్టుకల చక్రానికి ప్రతీక అని చెప్పుకున్నాం. సెయింట్ పాల్ జీసస్ కు ఓసిరిస్ తో సామ్యం చూపించి ఓసిరిస్ అనుయాయులను క్రైస్తవం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. జీసస్ కు కూడా పునరుత్థానాన్ని, అంటే చావు-పుట్టుకల చక్రాన్ని ఆపాదించాడు. అలాగే సూర్యారాధకులను క్రైస్తవం వైపు ఎలా ఆకర్షించారో పైన చెప్పుకున్నాం.

రోమన్ పాలకులు అనేకులు మొదట్లో క్రైస్తవాన్ని అంగీకరించలేదు. అణచివేయడానికి ప్రయత్నించారు. క్రీ. శ. 303 లో, డయోక్లెటియన్ చక్రవర్తి కాలంలో చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బైబిల్ రాతప్రతులను జప్తు చేసి ధ్వంసం చేశారు. క్రైస్తవులకు చట్ట రక్షణను తొలగించారు అనేకమందిని చంపేశారు. పుస్తకాలను ధ్వంసం చేయడం ఇక్కడ ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసిన విషయమని హెచ్. జి, వెల్స్ అంటారు. అక్షరానికి ఉన్న శక్తి ఆ కొత్త మతాన్ని సంఘటితంగా ఉంచుతోందని నాటి పాలకులు గ్రహించారు. క్రైస్తవం, జుడాయిజం అనే ఈ ‘పుస్తక మతాలు’ జనాన్ని విద్యావంతుల్ని చేసిన మతాలని కూడా వెల్స్ అంటారు. చదివి, అర్థం చేసుకోగలిగినవారివల్లే ఇవి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఇక్కడే వెల్స్ ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. పురాతన మతాలు ఏవీ ఈ రెండు మతాల్లా మనిషి బుద్ధికీ, మేధకు పని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పురాతన మతాల దగ్గరికి వచ్చేసరికి మనం బుద్ధిని, మేధను పక్కన పెట్టేయాలి.

క్రైస్తవాన్ని తుడిచిపెట్టడానికి డయోక్లెటియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజలే కాక, అధికారులు కూడా క్రైస్తవంలోకి మారిపోయారు. క్రీ.శ. 317లో, అప్పటి గలేరియస్ చక్రవర్తి క్రైస్తవం పట్ల సహనం పాటించాలని ఉత్తర్వు జారీ చేశాడు. క్రీ.శ. 324లో కాన్ స్టాన్ టైన్ చక్రవర్తి మరణశయ్య మీద ఉండి బాప్టిజమ్ తీసుకుని క్రైస్తవంలోకి మారాడు. తన సైనిక ఫలకాల మీదా, జెండాల మీదా క్రైస్తవ చిహ్నాలు ఉండేలా ఆదేశించాడు.

ఆ తర్వాతే కొన్నేళ్లకే క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతం అయిపోయింది. అంతవరకూ దానితో పోటీ పడిన పురాతన మతాలు అన్నీ అదృశ్యమైపోయాయి. లేదా క్రైస్తవంలో కలిసిపోయాయి. క్రీ.శ. 390లో థియోడోసియస్ చక్రవర్తి అలెగ్జాండ్రియాలోని బ్రహ్మాండమైన జూపిటర్ సెరాపిస్ విగ్రహాన్ని నేలమట్టం చేయించాడు. 5వ శతాబ్దినుంచి రోమన్ సామ్రాజ్యంలో అంతటా క్రైస్తవ ప్రార్థనా మందిరాలూ, క్రైస్తవ పూజారులే!

చక్రవర్తి నేలమట్టం చేయించిన జూపిటర్ సెరాపిస్ విగ్రహం, నిజానికి నేలమట్టమైన బహురూప ఆస్తికతకు ప్రతీక మాత్రమే. ఇలా ఏకరూప ఆస్తికతలోకి అడుగుపెట్టిన రోమ్, ఈ విషయంలో ప్రపంచానికే అతి పెద్ద వరవడి అయింది. అప్పటికీ బహురూప ఆస్తిక పంథాలను అనుసరిస్తూనే ఉన్నవారిని వెతికి వెతికి మరీ పట్టుకుని వారిపై మంత్రగాళ్ళు లేదా మంత్రగత్తెలన్న ముద్ర వేసి చంపుతూ వచ్చారు. అది నిఘంటువుకు witch-hunt అనే మాటను అందించింది.

మిగతా విశేషాలు తర్వాత….

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)–కల్లూరి భాస్కరం

 

 

 

 

అమ్మ…దేవత…జయలలిత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నాకు ఇక్కడ ఒకసారి వర్తమానంలోకి రావాలని బలంగా అనిపిస్తోంది…

అలాగని నేనిప్పుడు ప్రస్తావించబోయే అంశాలు, గత కొన్ని వ్యాసాలుగా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేనివి కావు. మన పురాచరిత్రకూ; లౌకిక, పారలౌకికతలతో జమిలిగా అల్లుకున్న మన సంక్లిష్ట మనస్తత్వానికీ, చర్చించబోయే అంశాలకూ ఏదో ముడి ఉందనుకుంటున్నాను. లోపలికి వెడుతున్నకొద్దీ అది ఎలాంటిదో అర్థమవుతుందేమో చూద్దాం.

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి… ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, ‘తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా’ అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

జయలలిత అశేష అభిమానుల దృష్టిలో కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆమె ‘అమ్మ’. జనానికి నిత్యజీవనభారాన్ని ఎంతో కొంత తగ్గించే కొన్ని జనప్రియ(పాపులిస్ట్) పథకాలను ఆమె అమలు చేశారు. ఆవిధంగా ఆమెను ‘అమ్మ’ అని పిలుచుకోవడంలో అభిమాన, ఆత్మీయతలతోపాటు ఆరాధనాభావం కూడా కలగలసి ఉంటుంది. అంటే, అమ్మ అక్షరాలా ‘దేవత’ అయిపోతుంది. ఆమె సాక్షాత్తు అమ్మ, దేవత అనే భావన జనంలో ఎంత బలంగా ఏర్పడిపోతుందంటే; ‘ముఖ్యమంత్రి’ అన్న లౌకిక నామం ఆ అభిమానపు వెల్లువలో కొట్టుకుపోతుంది. అంతేనా? ముఖ్యమంత్రి చట్టబద్ధంగా, నీతినిజాయితీలతో, జవాబుదారీ పాలన అందించాలన్న భావనకూ అదే గతి పడుతుంది. ‘అమ్మ’ తమను చల్లగా చూసినంతవరకూ ఆమె వ్యక్తిగత నీతినిజాయితీలు ఎలా ఉన్నా జనానికి అనవసరం.

నేనిక్కడ కేవలం జయలలితనే వేలెత్తి చూపించడం లేదు. ఆమె స్థానంలో ఆమెలా జనాభిమానాన్ని పొందిన ఎవరున్నా ఇదే జరుగుతుంది. లౌకిక ప్రపంచానికి చెందిన పాలకునిలో వ్యక్తిగత లోపాలు ఎన్ని ఉన్నాసరే, తమ భౌతికజీవితానికి మేలు చేసే పనులు చేసినప్పుడు అతనికి/ఆమెకు పారలౌకిక ప్రపంచానికి చెందిన దేవుడు/దేవతతో అభేదం కల్పించి విగ్రహంగా మార్చడం తరతమ భేదాలతో దేశమంతటా ఉంది. కాకపోతే, తమిళనాడు జనాలలో మాత్రం ఇది మరింత పతాకస్థాయిలో వ్యక్తమవుతుంటుంది. తాము అభిమానించి ఆరాధించేవారికి ఆలయాలు నిర్మించడం కూడా అక్కడే ఎక్కువ. మన రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ధోరణులు కనిపించినా తమిళనాడే దీనికి తగిన నమూనా అనిపిస్తుంది.

ఈ మనస్తత్వ మూలాలు ఎక్కడున్నాయని వెతుకుతూ వెనక్కి వెడితే, బహుశా మనం పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన నగరరాజ్యాల దశకు చేరుకుంటాం. ఆనాటి జనం నగర దేవతకు గుడి కట్టుకుని ఆమె చుట్టూ తమ లౌకిక, పారలౌకిక జీవితాన్ని గాఢంగా అల్లుకునేవారు. ఆ దేవత కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. పరిపాలన అంతా దేవత పేరు మీదే జరిగేది. వ్యవసాయభూములకు దేవతే యజమాని. భూముల పంపకానికి దేవాలయమే కేంద్రంగా ఉండేది. అన్నవితరణా అక్కడే జరిగేది. తమకు జీవనోపాధిని కల్పించేది, అన్నం పెట్టేది దేవతే కనుక అందులో లౌకికం, పారలౌకికం అన్న తేడాకు అవకాశమే లేదు.

ఆ ఛాయలే కాలం కల్పించిన వేల సంవత్సరాల హద్దులను దాటుకుంటూ తమిళనాడులోకి ఇప్పటికీ ప్రవహిస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ జయలలిత రూపంలో పాలక స్థానంలో ఉన్నది మనిషి కావచ్చు; కానీ ఆమె దేవతలానే తమకు పని కల్పించి, అన్నం పెట్టినప్పుడు దేవతే అవుతుంది. ఇదంతా కేవలం ఊహాప్రాయంగా తీసుకొచ్చిన పోలిక కాదు. ఈజిప్టు, మెసపొటేమియా, ఏజియన్, సింధు నాగరికతల నాటి నగర రాజ్యాల ఉమ్మడి వారసత్వం ప్రత్యేకించి దక్షిణభారతంలో, అందులోనూ తమిళనాడులో నేటికీ గజ్జె కడుతోందనడానికి అనేక చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. దానిని అలా ఉంచి, గత కొన్ని వ్యాసాలుగా చర్చించుకుంటున్న విషయానికి పరిమితమై చెప్పుకుంటే; రాజ్యం విస్తరిస్తూ కేంద్రీకృత అధికారం అనే అంకుశం జనజీవితంపై బిగుసుకుంటున్నకొద్దీ , ఆర్థిక అసమానతలు, బానిసత్వం, పీడన పెరిగిన కొద్దీ జనం తమను ఈతిబాధలనుంచి గట్టెక్కించే ఇష్టదేవతల కొలుపులూ పెరుగుతూవచ్చాయి. దాంతోపాటే, నగరరాజ్యాల కాలంవరకూ కొనసాగిన సమష్టి ఆరాధనా పద్ధతుల స్థానంలో వ్యష్టి(వ్యక్తిగత) ఆరాధనా పద్ధతులూ అడుగుపెట్టాయి. రోమన్ల కాలంలో ఆ పరివర్తన ఎలా ఎందుకు జరిగిందో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ఇంకొకటి గమనించాలి. లౌకికమైన ముఖ్యమంత్రి లాంటి పదవికి, పారలౌకికమైన దేవత హోదాకు మధ్య హద్దులు చెరిగిపోవడం; దాంతోపాటే లౌకికమైన అవినీతి తదితర బలహీనతలు కూడా పారలౌకికమైన గంగలో కలసి పోవడం కేవలం చదువుసంధ్యలు లేని అట్టడుగువర్గాల ఊహలోనే సంభవిస్తాయని అనుకోవద్దు. ధనవంతులు, విద్యావంతులలోనూ ఇదే ధోరణి ఉంటుంది. కాకపోతే అట్టడుగువర్గాలలో ఇది నాటుగానూ, మోటుగానూ వ్యక్తమైతే; మిగతావారిలో నాజూకుగానూ, మెరుగుపెట్టిన భాషలోనూ వ్యక్తమవుతుంది.

నా కీ సందర్భంలో ఒక వ్యక్తిగతమైన విషయం గుర్తుకొస్తోంది.

***

నాకప్పటికి ఇరవయ్యేళ్లు దాటాయేమో! మా ఊళ్ళో ఉన్నప్పటి సంగతి. ఓ రోజు నేను నిద్ర లేచేసరికి, మా ఇంటి దక్షిణం వైపు దొడ్లో మా నాన్నగారు, మా పినతండ్రిగారు దంతధావనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు కిటికీలోంచి నా చెవిన పడ్డాయి. వారిద్దరూ కంచి పరమాచార్యకు చాలాకాలంగా చాలా దగ్గరి అనుయాయులు. మా పినతండ్రిగారు వృత్తిరీత్యా పౌరాణికులు. ఆయన సహజమైన తన కథనచాతుర్యంలో భక్తి తన్మయత్వాన్ని రంగరించి ఒక ముచ్చట చెబుతున్నారు. నాన్నగారు ఊకొడుతూ వింటున్నారు. నేను కూడా ఆసక్తిగా వింటూ ఉండిపోయాను.

“అన్నయ్యా, ఏం జరిగిందో విన్నావూ? చెన్నపట్నం(మా పినతండ్రిగారు మద్రాసును ఎప్పుడూ చెన్నపట్నం అనే అనేవారు)లో ఆ చెట్టియార్ లేడూ! నువ్వూ వినే ఉంటావు. కోటీశ్వరుడు. తస్సదియ్య, గుర్రప్పందాల మీద సంపాదించాడు. చాలా వ్యాపారాలు పెట్టాడు. దొంగనోట్లు అచ్చేస్తాడని కూడా చెప్పుకుంటారు. అయితేనేం, శ్రీవారికి(కంచి పరమాచార్యకి) పరమభక్తుడు. ఏమైందో, గుర్రప్పందాలు కలసి రావడం మానేశాయి. వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దాంతో లబోదిబో మంటూ శ్రీవారి దగ్గరకు పరుగెత్తాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. శ్రీవారు అంతా విన్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత “మీ ఇంట్లో ఎక్కడైనా పత్తిచెట్టు ఉందా?” అని అడిగారు. అతను ఆశ్చర్యపోతూ, “ఉంది” అన్నాడు. “వెంటనే దాన్ని తీయించు. నీకు కలసివస్తుంది” అని శ్రీవారు అన్నారు. వాడు అలాగే చేశాడు. దాంతో వాడికి మళ్ళీ దశ ఎత్తుకుంది.”

ఈ ముచ్చట చెబుతున్నప్పుడు ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నది చెట్టియారూ, అతని గుర్రప్పందాలూ, దొంగనోట్లూ, వ్యాపారాలూ కావు. అతనికి సలహా ఇచ్చి గట్టెక్కించిన కంచి పరమాచార్యులవారి మహిమా, వారి మీద తన భక్తిప్రపత్తులూ…

నాది ఉడుకు రక్తం. దానికితోడు ఆధునికమైన వాసనలు. ఇది వినగానే చాలా కోపం వచ్చింది. గుర్రప్పందాలు ఆడేవాడి మీదా, అందులోనూ దొంగనోట్ల ఆరోపణ ఉన్నవాడి మీదా కంచివారు అనుగ్రహం ఎలా చూపిస్తారనుకున్నాను. మా పినతండ్రి గారి స్పందన, నా స్పందన గీత గీసినట్టు ఎలా వేరైపోయాయో చూడండి! పారలౌకికానికి చెందిన కంచివారి మహిమావిశేషాన్ని ఒత్తి చెప్పడం మీదే ఆయన ఆసక్తి. చెట్టియారు అంత డబ్బు ఎలా సంపాదించడన్న లౌకిక విషయం మీద ఆయనకు పెద్ద ఆసక్తీ లేదు, పట్టింపూ లేదు. కానీ నా తక్షణ స్పందన చెట్టియారు మీదా, అతను సంపాదించిన పద్ధతి మీదే, అంటే లౌకికం మీదే!

చెప్పొచ్చేదేమిటంటే, భారతదేశం ఇప్పటికీ మా పినతండ్రిగారి దగ్గరే భద్రంగా ఉంది, నా దాకా(నా లాంటి చాలామంది దాకా) రాలేదు.

ఆ తర్వాత చాలాకాలానికి ఆవేశం తగ్గి ఆలోచించిన కొద్దీ ఆయన స్పందనలో కూడా ఒక సహేతుకత, ఒక తర్కమూ లేకపోలేదనిపించింది. అంటే, ఇప్పుడు నేను ఉభయస్పందనలకు మధ్య ఒక తటస్థ పాత్ర తీసుకుంటున్నాను. ఎలాగంటే, చెట్టియారులో కూడా లౌకికం, పారలౌకికం అనే రెండు కోణాలు ఉన్నాయి. లౌకిక కోణంలో అతడు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉండవచ్చు. దానిపై నిఘా ఉంచి దోషి అని తేలితే అతనిని శిక్షించవలసింది లౌకిక యంత్రాంగం, అంటే ప్రభుత్వం. పారలౌకిక కోణానికి వస్తే, అతడు కంచి పరమాచార్యులవారికి భక్తుడు. ఆయనను నమ్ముకున్నవాడు. కనుక అందుకు ప్రతిగా కంచివారు అతన్ని కష్టాల నుంచి గట్టెక్కించారన్నమాట! ఇలా అన్నానని, కంచివారి చర్యనో, లేదా పత్తి మొక్క ఇంట్లో ఉండకూడదన్న నమ్మకాన్నో నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నానని అనుకోవద్దు. ఇందులో నా వ్యక్తిగతానికి తావులేదు.

ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యే ఉదాహరణతో కూడా దీనిని చెప్పుకోవచ్చు. ఒకతను అవినీతిమార్గంలో సంపాదించి స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని గుట్టలకొద్దీ దాచుకున్నాడనుకుందాం. అతను ఏ విదేశాలకో వెళ్లదలచుకుని విమానంలో టిక్కెట్టు బుక్ చేసుకుంటాడు. నువ్వు అక్రమంగా డబ్బు సంపాదించావు కనుక నీకు టిక్కెట్టు ఇచ్చేదిలేదని ఎయిర్ లైన్స్ వాళ్ళు అనరు. అది వాళ్ళ పని కాదు. అనకపోగా, ప్రయాణంలో అతని డబ్బుకు సరితూగే వసతులన్నీ కల్పించి అతన్ని ఎంతో మర్యాదగా చూస్తారు. అతని డబ్బు ఎలాంటిదన్నది పట్టించుకోవలసింది ప్రభుత్వమూ, అందులోని ఆదాయం పన్ను శాఖ మాత్రమే.

కానీ ఆ లౌకిక వ్యవస్థ ఉండవలసినంత బలంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆ వ్యవస్థను నడిపేవారు కూడా ఆ తానులో ముక్కలే కనుక. లౌకిక వ్యవస్థ చొరడానికి సాహసించని పారలౌకికపు హద్దులు ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. మన అనుభవంలో లౌకికం, పారలౌకికం కలసిపోవడమే కాదు; లౌకికాన్ని, పారలౌకికం పూర్తిగా లోబరచుకుంటుంది. లౌకికంగా మనం తప్పు పనులు ఎన్నైనా చేయవచ్చుగాక, పారలౌకికం వాటిని ప్రక్షాళన చేసేస్తుంది. కనుక మన అంతిమ హద్దు లౌకికం కాదు, పారలౌకికం మాత్రమే. ఇదేదో నేను విమర్శదృష్టితో అంటున్న మాటగా దయచేసి పొరబడవద్దు. కేవలం చారిత్రక తటస్థ దృష్టితో అంటున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ పారలౌకిక ప్రాబల్యం మనకు క్రీస్తుశకానికి పూర్వంనుంచీ ఇప్పటికీ పదిలంగా వస్తున్న చారిత్రక వారసత్వం.

ఇంకోవైపు నుంచి చూడండి…ఇది వర్తమానంతో నేరుగా ముడిపడి ఉన్న చాలా గంభీరమైన విషయమే తప్ప, ఆషామాషీ విషయం కాదని మీకే అర్థమవుతుంది. ఎలాగంటే, ఇప్పుడు మన దేశం అవినీతితో మహాయుద్ధం చేస్తోంది, లేదా చేస్తున్నాననుకుంటోంది. పాలకులు మారితేనో, లోక్ పాల్ లాంటి (లౌకిక) వ్యవస్థలలోనో దీనికి పరిష్కారం ఉంటుందనుకుంటోంది. కానీ నా ఉద్దేశంలో దీనికి పరిష్కారం పారలౌకిక ప్రపంచాన్ని శాసించే లోకపాలకుడైన ఆ భగవంతుడి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ లేదు.

క్షమించాలి…ఈ విషయంలో నేనంత ఆశావాదిని కాదు.

***

ఎంతమంది గమనించారో కానీ, లౌకిక, పారలౌకికతల పద్మవ్యూహంలో పడి గిజగిజలాడిన చరిత్ర పాశ్చాత్యసమాజాలకూ ఉంది. అంతేకాదు, అది ప్రాచ్య(తూర్పు)మతాల పుణ్యమంటూ వారు ఆడిపోసుకోవడమూ ఉంది. ప్రాచ్య మతాలు అన్నప్పుడు మనవే కాక, ఈజిప్టు, మెసపొటేమియా తదితర ప్రాంతాల మతాలు కూడా వస్తాయి. తేడా అల్లా ఆ పద్మవ్యూహంలోంచి బయటపడడానికి పాశ్చాత్యసమాజాలు ప్రయత్నించాయి. ‘పారలౌకికం’ అనే సరిహద్దు రాయిని అతి కష్టం మీద పెకలించి, వెనక్కి జరిపి, ఆ చోట్లో ‘లౌకికం’ అనే సరిహద్దు రాయిని ప్రతిష్టించుకున్నాయి. రెండింటి మధ్య సమతూకం తేవడానికే కాక, లౌకికం వైపు ఒకింత ఎక్కువ మొగ్గు చూపించాయేమో కూడా. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పారలౌకికత కన్నా ముందు మనం జీవించే ఈ లౌకిక జగత్తును మరింత వాసయోగ్యం చేద్దామన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రాచ్య, పాశ్చాత్యుల మధ్య ఉన్న దృష్టిభేదాన్ని ఎత్తి చూపిన పాశ్చాత్య రచయితలు కొందరు గుర్తొస్తున్నారు కాని, సర్ జేమ్స్ ఫ్రేజర్ ను ఒక్కరిని ఉదహరించుకుందాం. పనిలో పనిగా ఆయన ప్రాచ్య మతాల ప్రభావం యూరప్ ను పాడుచేసిందని ఒక రాయి కూడా విసిరాడు. తన Golden Bough అనే బృహద్రచనలో ఇలా అంటాడు:

Greek and Roman society was build on the conception of the subordination of the individual to the community, of the citizens to the state; it set to the safety of the commonwealth, as the supreme aim of conduct, above the safety of the individual whether in this world or in a world to come. Trained from infancy in this unselfish ideal, the citizens devoted their lives to the public service and were ready to lay them down for the common good…

All this was changed by the spread of Oriental religions which inculcated the communion of the soul with God and its eternal salvation as the only objects worth living for, objects in comparison with which the prosperity and even the existence of the state sank into insignificance. The inevitable result of this selfish and immoral doctrine was to withdraw the devotee more and more from the public service, to concentrate his thoughts on his own spiritual emotions, and to breed in him a contempt for the present life which he regarded merely as a probation for a better and an eternal…

A general disintegration of the body politic set in. The ties of the state and the family were loosened; the structure of society tended to resolve itself into its individual elements and thereby to relapse into barbarism; for civilization is only possible through the active co-operation of the citizens and their willingness to subordinate their private interests to the common good.

పాశ్చాత్య ప్రభావాలే మన లాంటి ప్రాచ్యదేశాలను పాడు చేశాయని మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రాచ్య మతాలే పాశ్చాత్యులను పాడు చేశాయని ఫ్రేజర్ అనడం విచిత్రంగా ఉంటుంది. పైగా పారలౌకికాన్ని లౌకికం భ్రష్టు పట్టించిందని మనం అనుకుంటుంటే, పారలౌకికమే లౌకికాన్ని భ్రష్టు పట్టించిందని ఫ్రేజర్ అంటున్నాడు. ప్రాచ్య మతాలు వెయ్యేళ్ళపాటు యూరప్ సమాజాన్ని నాశనం చేస్తే, చివరికి రోమన్ చట్టాన్ని, అరిస్టాటిల్ తాత్వికతను పునరుద్ధరించడం ద్వారా మధ్యయుగాలనాటికి యూరప్ తిరిగి తనవైన పురాతన కళా సాహిత్యాలు, జీవితాదర్శాలు, ప్రవర్తనాసరళి, ఆరోగ్యవంతమైన, పురుషప్రయత్నంతో కూడిన ప్రాపంచిక దృక్పథంవైపు మళ్లిందని ఆయన అంటాడు. ఆ సందర్భంలో ప్రాచ్య మతాల తీరు గురించి పై వ్యాఖ్యలు చేశాడు. వాటి సారాంశాన్ని ఇలా చెప్పుకోవచ్చు:

వ్యక్తి ప్రయోజనాలకన్నా సమష్టి ప్రయోజనాలు, పౌర ప్రయోజనాలకన్నా రాజ్యం ప్రయోజనాలు ప్రాధాన్యం వహించే విధంగా గ్రీకు, రోమన్ సమాజాల నిర్మాణం జరిగింది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వాటి ఉన్నతోన్నత లక్ష్యం సమష్టి సంపదా, శ్రేయస్సులే తప్ప వ్యక్తిగత సంక్షేమం కాదు. చిన్నతనం నుంచీ నిస్వార్థతను నూరిపోయడం వల్ల పౌరులు ప్రజాశ్రేయస్సుకు తమ జీవితాన్ని అంకితం చేసేవారు. ఉమ్మడి హితం కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రాచ్య మతాల వ్యాప్తితో ఇదంతా మారిపోయింది. పరమాత్మలో ఆత్మను లీనం చేయడం, ముక్తిని పొందడం తప్ప ఈ లోకంలో సాధించవలసిన లక్ష్యాలు ఏవీ లేవని అవి నొక్కి చెబుతాయి. దాంతో ఈ లోకంలో అభ్యుదయాన్ని సాధించాలన్న తపనే కాక రాజ్యం ఉనికి కూడా అప్రధానంగా మారిపోయింది. ఈ స్వార్థపూరిత, అనైతిక సిద్ధాంతం భక్తులను సమష్టి హితం నుంచి తప్పించివేసింది. లౌకిక జీవితంపై విముఖతను నూరిపోసింది. లౌకిక జీవితం కేవలం పరలోక జీవితానికి అవసరమైన శిక్షణ పొందడానికి మాత్రమే నన్న భావనను కలిగించింది. దాంతో రాజకీయవ్యవస్థ విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాజ్యానికీ, కుటుంబానికి మధ్య సంబంధాలు సడలిపోయాయి. సామాజిక నిర్మాణం వ్యక్తుల స్థాయికి కుదించుకుపోయింది. అది ఆటవిక ధోరణులకు దారితీయించింది. ఎందుకంటే, నాగరికత అనేది పౌరుల క్రియాశీల సహకారంతోనూ, తమ వ్యక్తిగతప్రయోజనాలకు బదులు ఉమ్మడి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఫ్రేజర్ చేసిన ఈ వ్యాఖ్యలు మనలో చాలామందికి కోపం తెప్పించే మాట నిజమే. వీటిలో యూరోపియన్ అహంకారమూ తొంగి చూస్తూ ఉండచ్చు. ఆయన ఇంత గొప్పగా చెప్పుకున్న యూరోపియన్ సమాజం కడిగిన ముత్యమని భావించే అమాయకులు ఎవరూ లేరు. కాకపోతే, మిగతా సంగతులు పక్కన పెట్టి, లౌకికం-పారలౌకికం అనే ఒక్క అంశానికి పరిమితమైనప్పుడు ఆయన మాటలు మనం మొహం చూసుకోడానికి అద్దంలా ఏమైనా ఉపయోగపడతాయా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవచ్చు.

మిగతా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

ఈజిప్టులో ‘ఈశాని’ పూజ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

జూలియస్ సీజర్ తనను దేవుడిగా ప్రకటించుకుని, గుడి కట్టించుకోవడం; రోమ్ ను సామ్రాజ్య దశవైపు మళ్ళించడం ఒక దానితో ఒకటి సంబంధం లేనివి కావు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే…అది వ్యక్తి ప్రాధాన్యం. వ్యక్తి రాజకీయ సామ్రాజ్యానికి అధికారకేంద్రం అయినట్టే, ఆస్తిక సామ్రాజ్యానికీ అవుతున్నాడు. గణతంత్రవాదులు సీజర్ ను చంపగలిగారు కానీ గణతంత్రాన్ని మాత్రం బతికించుకోలేక పోయారు. సీజర్ వరవడిలోనే రోమ్ క్రమంగా సామ్రాజ్యదశవైపు అధికారికంగా మళ్ళిపోయింది.

అయితే ఇక్కడ కొంత తేడా ఉంది. సీజర్ దేవుడిగా అవతరించినా అప్పటికి అనేకమంది దేవీ, దేవతలలో ఒకడు మాత్రమే. కానీ రాజకీయ సామ్రాజ్యంలో మాత్రం చక్రవర్తి ఏకైకుడు. ఆస్తికరంగాన్ని కూడా అలాంటి సామ్రాజ్యంగా మార్చడానికి మరికొంత కాలం పట్టింది. అందులో రోమన్లు పోషించిన కీలక పాత్ర గురించి చెప్పుకోబోయే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళడం అవసరం.

పురాచరిత్రలో ఒక ముఖ్యమైన తెగ అసీరియన్లు. వీరు మొదట్లో మెసపొటేమియాలోని బాబిలోనియా సామ్రాజ్యానికి ఉత్తర, తూర్పు దిక్కులలో సన్నని పీలికలా ఉండే టైగ్రిస్ నదీలోయలో ఉండేవారు. లోపలికి అంత తేలిగ్గా చొరడానికి వీలు లేని విధంగా ఆ లోయ చుట్టూ కొండలు. అసీరియన్లు క్రూరత్వానికి మారు పేరు. వీరి దేవుడు ఆసూర్. ఆ దేవుడి పేరు మీదనే వీరు ఆసూరు అనే నగరాన్ని, ఆ తర్వాత నినవే అనే నగరాన్ని కట్టుకున్నారు. మన పురాణ, ఇతిహాస ప్రసిద్ధులైన అసురులతో ముడిపెట్టుకుని అసీరియన్ల గురించి చెప్పుకోవలసిన ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే…

కాలక్రమంలో గొప్ప సైనిక శక్తిగా ఎదిగిన ఆసీరియన్లు క్రీ.పూ. 745 నాటికి బాబిలోనియాను ఆక్రమించుకున్నారు. బాబిలోనియా అప్పటికి అత్యధిక జనాభాతో, నినవే కన్నా చాలా పెద్ద నగరం. అక్కడి ప్రధాన దైవం బెల్ మర్దుక్. ఆసీరియన్లు ఆసూర్ అనే దేవుడిని కొలిచే వారే అయినా, బెల్ మర్దుక్ పై కూడా భక్తిప్రపత్తులు చాటుకునేవారు. మర్దుక్ పూజారులనే కాకుండా, బాబిలోనియాలోని వర్తకలను కూడా మర్యాదగా చూసేవారు. అంతేకాదు, శత్రువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన చరిత్ర తమకు ఉన్నా ప్రజలతో మాత్రం సామరస్యంగా ఉండేవారు. వాళ్ళ మనసు గెలుచుకోడానికి ప్రయత్నించేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, విజేతలు విజితులను(ఓడిపోయినవారిని) తమలో లీనం చేసుకోవడం కాక, తామే విజితులలో, వారి విశ్వాసాలలో కలసిపోవడం అప్పటి విధానం. అసీరియన్లలో సర్దనాపలస్ అనే పాలకుడు పూర్తిగా బాబిలోనియన్ గా మారిపోవడమే కాదు, ఆ నగరాన్ని గొప్ప మేధోనగరంగా తీర్చిదిద్దాడు. అప్పట్లోనే అతను మట్టి పలకల రూపంలో ఉండే పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు.

అయితే, నూట యాభై ఏళ్ల తర్వాత, క్రీ. పూ. 606లో మెసపొటేమియా ఆగ్నేయదిశనుంచి సెమెటిక్ జాతికి చెందిన చాల్దియన్లు, ఈశాన్య దిశనుంచి పర్షియన్లుగా గుర్తింపు పొందిన ఆర్యులైన మీదులు చుట్టుముట్టేసరికి ఆసీరియన్ రాజ్యం కుప్పకూలింది. ఉత్తరదిశలో నినవే నగరాన్ని కూడా కలుపుకుంటూ సియాక్జెరెస్ నాయకత్వంలో మీదుల రాజ్యమూ, బాబిలోనియాలో చాల్దియన్ రాజ్యమూ అవతరించాయి. మీదుల రాజ్యం తూర్పున భారతదేశ సరిహద్దుల దాకా విస్తరించింది.

చాల్దియన్లలో చివరి పాలకుడైన నబోనిడస్ విజ్ఞానవ్యాప్తిలో అసీరియన్ పాలకుడైన సర్దనాపలస్ ను కూడా మించిపోయాడు. పురాచరిత్ర మీద అతను పరిశోధనలు చేయించాడు. అప్పటికి రెండు వేల ఏళ్ల క్రితం బాబిలోనియాలో అక్కాడియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి సారగాన్ రాజ్యకాలాన్ని పరిశోధింపజేసి, నిర్ధారణ చేయడం ఆయన చేసిన పనుల్లో ఒకటి.

అదే సమయంలో నబోనిడస్ ఒక అనాలోచితమైన పని కూడా చేశాడు. అది చివరికి అతని రాజ్యానికే ఎసరు పెట్టింది. అదెలా జరిగిందంటే, బాబిలోనియా జనంలో అనైక్యతా ధోరణులు నానాటికీ పెరుగుతుండడం నబోనిడస్ గమనించాడు. ఆ రోజుల్లో ప్రజల లౌకిక, మత జీవితాలు రెండింటికీ దేవుడే కేంద్రబిందువుగా ఉండేవాడు. దేవుళ్ళ నందరినీ ఒక చోట చేర్చితే జనంలో ఐక్యత ఏర్పడుతుందని నబోనిడస్ అనుకున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న స్థానిక దేవతల నందరినీ బాబిలోనియా నగరానికి రప్పించి, వారికి అక్కడ దేవాలయాలు నిర్మింపజేయడానికి ప్రయత్నించాడు. రాజ్యంలో ప్రధాన దైవం బెల్ మర్దుక్ కనుక ఆ దేవుడి పూజారులు మంచి పలుకుబడీ, ప్రాభవాలతో మిగిలిన పూజారులకంటే ఉన్నతస్థితిలో ఉండేవారు. నేటి మన తిరుమల పూజారుల్లా అన్నమాట. స్థానిక దేవుళ్ళ నందరినీ రాజధానిలో కేంద్రీకరించి మర్దుక్ పక్కనే చోటు కల్పించే నబోనిడస్ ప్రయత్నం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

దాంతో వారు నబోనిడస్ నే పక్కకు తప్పించాలని పథకం వేశారు. పొరుగునే మీదు రాజ్యాన్ని ఏలుతున్న పర్షియన్ పాలకుడు సైరస్ తో కుమ్మక్కయ్యారు. సైరస్ బాబిలోనియా మీదికి యుద్ధానికి వచ్చాడు. కోట గోడల అవతల ఇరు సైన్యాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సైరస్ దే పైచేయి అయింది. అంతలో కోట ద్వారాలు తెరచుకున్నాయి. సైరస్ తన సైన్యంతో లోపలికి ప్రవేశించాడు. అతనికి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు.

బైబిల్ కథనం ప్రకారం, ఆ సమయంలో యువరాజు బెల్షజ్జర్ విందు ఇస్తున్నాడు. అంతలో ఒక చెయ్యి ప్రత్యక్షమై గోడ మీద నిప్పు కణికల్లా వెలిగే అక్షరాలతో కొన్ని మార్మికమైన మాటలు రాసింది. అవి అర్థం కాని యువరాజు అప్పటికప్పుడు డేనియల్ అనే ప్రవక్తను రప్పించి వాటి అర్థం చెప్పమని కోరాడు. ‘దేవుడు మీ రాజ్యానికి రోజులు లెక్కించాడు. మీ రాజ్యాన్ని అంతమొందించాడు. మిమ్మల్ని తాసులో పెట్టి తూచినప్పుడు మీలో ఎన్నో సుగుణాలు లోపించిన సంగతి బయటపడింది. దాంతో మీ రాజ్యాన్ని మీదులకు, పర్షియన్లకు ఇవ్వాలని నిర్ణయించాడు’ అని డేనియల్ ఆ మాటలకు అర్థం చెప్పాడు.

ఆ రోజు రాత్రే బెల్షజ్జర్ ను హత్య చేశారు. నబోనిడస్ ను బందీగా పట్టుకున్నారు. ఆ విధంగా పర్షియన్ల బాబిలోనియా ఆక్రమణ ఎంత ప్రశాంతంగా, చడీచప్పుడు లేకుండా జరిగిపోయిందంటే, ఆ సమయంలో కూడా మర్దుక్ ఆలయంలో నిత్యపూజాదికాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయట!

ఆ గోడమీది రాత రహస్యం బహుశా మర్దుక్ పూజారులకు తెలిసి ఉంటుందని హెచ్.జి. వెల్స్ చమత్కరిస్తారు.

Rembrandt_-_Belshazzar's_Feast_-_WGA19123

  ***

ఇంతకీ విషయమేమిటంటే, నబోనిడస్ తెలివితక్కువగా తలపెట్టి తన రాజ్యానికే ముప్పు తెచ్చుకున్న దేవుళ్ళ కేంద్రీకరణ చర్యనే అనంతర కాలంలో రోమన్లు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఈ మధ్యలో కనీసం మూడు, నాలుగువందల సంవత్సరాల అంతరం ఉంది. అప్పటికి రాజకీయంగా కేంద్రీకృత అధికారానికి అలవాటు పడుతున్నట్టే, ఆస్తికరంగంలో కూడా కేంద్రీకృత ధోరణులకు జనం అలవాటు పడుతూ ఉండాలి. అయితే అప్పటికి కూడా బహురూప ఆస్తికత కొనసాగుతూనే ఉంది. నబోనిడస్ చర్య ప్రధానదైవమైన మర్దుక్ ప్రాభవాన్ని తగ్గిస్తుందన్న ఉద్దేశంతో పూజారులు వ్యతిరేకించి ఉండచ్చు కానీ, స్థానిక దేవతల అస్తిత్వం మీద వారికి వ్యతిరేకత ఉండే అవకాశం లేదు.

రోమన్లు తమ అధీనంలో ఉన్న విశాల భూభాగాలపై ఏకీకృత నాగరికతను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రాంతానికీ ఇంకో ప్రాంతానికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు, సంస్కృతుల మధ్య అసమానతలు ఉండేవి. హెచ్.జి. వెల్స్ ఈ సందర్భంలో రోమన్ గణతంత్రాన్ని బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంతో పోలుస్తారు. రాజ్యం అంతటా అక్కడక్కడ రోమన్ స్కందావారాలూ, కాలనీలూ ఉండేవి. వాటిలో జనం రోమన్ దేవతలను పూజించేవారు. లాటిన్ మాట్లాడేవారు. అయితే, రోమన్ ఆక్రమణకు ముందు నుంచీ ఉన్న నగరాలు, పట్టణాలలో మాత్రం జనజీవితం ఎప్పటిలానే ఉండేది. రోమన్ అధికారానికి లొంగి ఉంటూనే అక్కడి జనం తమ వ్యవహారాలను తామే నడుపుకునేవారు. తమ దేవీ దేవతలను తమ పద్ధతిలో పూజించుకునేవారు.

మత తాత్విక రంగాలలో మార్పులు లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే, అవి బహురూప ఆస్తికత అనే చట్రం లోపలే జరుగుతూ వచ్చాయి. అంతకుముందు పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన జనం వందలు, వేల తరాలపాటు దేవాలయం చుట్టూ తమ జీవితాలను, ఆలోచనలను అల్లుకుని జీవించారు. మతపరమైన తంతును ఎంతో శ్రద్ధగా జరిపేవారు. నిత్యవిధులకు ఏమాత్రం భంగం కలిగినా ఏదో కీడు జరుగుతుందని భయపడేవారు. బలులు ఇచ్చేవారు. ఏదో మార్మికతా, అంతుపట్టని నిగూఢతా వారి ఆలోచనలను ఆక్రమించుకుని ఉండేవి. ఆర్యీకృత ఆధునిక ప్రపంచానికి వారి దేవతలు భయానకంగానూ, తర్కరహితంగానూ కనిపించవచ్చుకానీ, వారు మాత్రం గాఢస్వప్నంలో ఆయా దృశ్యాలను, వస్తువులను ఎంత స్పష్టంగా చూస్తామో అంత స్పష్టంగా వారిని దర్శించేవారు. వారితో మమేకమయ్యేవారు. అదొక స్వాప్నిక జగత్తు. ఆ కాలంలో సుమేరియాలో కానీ, ఈజిప్టులో కానీ ఏదైనా నగరాన్ని ఇతరులు జయించినప్పుడు మహా అయితే, అక్కడి దేవీ దేవతల పేర్లు మారేవేమో కానీ, పూజా విధానం, దాని వెనుక ఉండే స్ఫూర్తీ అలాగే ఉండేవి. స్వప్న ప్రపంచంలోని మూర్తులు మారేవే తప్ప స్వప్నం మాత్రం యథాతథంగా కొనసాగేది. తొలినాటి సెమెటిక్ విజేతలు, సుమేరియన్ల ఆలోచనా సరళి, ఆరాధనా పద్ధతులు ఒకలానే ఉండేవి కనుక సెమెటిక్ విజేతలు సుమేరియన్ల మత సంస్కృతులను దాదాపు యథాతథంగా స్వీకరించేవారు. ఈజిప్టుకు వస్తే, గ్రీకు టోలెమీల పాలనలోనూ, రోమన్ సీజర్ల పాలనలోనూ కూడా ఈజిప్టు దేవాలయాలు, పూజారివ్యవస్థ, పూజావిధానాలు ఈజిప్టువిగానే ఉండిపోయాయి.

విజేతలు, విజితులు ఒకరితో ఒకరు కలసిపోయినట్టే వారి దేవతలూ కలసిపోయేవారు. దీనినే థియోక్రేసియా అన్నారని ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దేవతల మధ్య పోలికలు లోపించి విలీనానికి అవకాశం లేనప్పుడు వారి మధ్య ఒక సంబంధాన్ని కల్పించేవారు. ఉదాహరణకు గ్రీకులు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి ముందు ఏజియన్లు అమ్మవారి రూపంలో స్త్రీదేవతను పూజించేవారు. గ్రీకులు ఆక్రమించుకున్నాక ఆ స్త్రీదేవతను ఒక పురుషదేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఇద్దరినీ విలీనం చేసుకున్నారు. అలాగే ఒక జంతు దేవతకు, పక్షి దేవతకు, సర్పదేవతకు, నక్షత్రదేవతకు, సూర్యుడికి, లేదా ఒక ఖగోళ విశేషానికి మానవ రూపమిచ్చో, లేదా యథారూపంలోనో పూజించేవారు. ఒక్కోసారి ఓడిపోయిన వారి దేవతలను క్షుద్రదేవతలుగా పరిగణించేవారు. ఆస్తిక చరిత్ర అంతా ఇలా దేవీదేవతలను ఇచ్చిపుచ్చుకోవడం, రాజీపడడం, స్థానిక దేవతలను సంస్కరించడమే నని హెచ్.జి. వెల్స్ అంటారు.

గమనించే ఉంటారు… వెల్స్ ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశ చరిత్ర చెప్పడంలేదు. అయినాసరే, పైన చెప్పిన ప్రక్రియ మనదేశపు దేవీ, దేవతలకు కూడా పూర్తిగా అన్వయిస్తుంది. వేర్వేరు దేవీదేవతలను పూజించేవారు ఇరుగుపొరుగున ఉన్నప్పుడు వారిని ఏకం చేయవలసివచ్చేది. అమ్మవారి రూపంలో స్త్రీ దేవతను ఆరాధించేవారిని, పురుష దేవుణ్ణి ఆరాధించేవారిని ఏకం చేయడం; సాధారణంగా ఆ ఇరువురి దేవతల మధ్య దాంపత్య సంబంధాన్ని కల్పించడం రూపంలో జరిగేది. శక్తి, శివుడు ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఈ సయోధ్య సూత్రం మీద ఆధారపడే అభివృద్ధి చెందినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. భ్రమరాంబా, మల్లికార్జునస్వామీ కొలువైన శ్రీశైలక్షేత్రాన్నే తీసుకుంటే, భ్రమరాంబ మొదట్లో ఆ ప్రాంతంలోని ఆటవికులైన చెంచులు పూజిస్తూ వచ్చిన అమ్మవారి రూపమని చెబుతారు. అప్పట్లో ఆమె ఉగ్రరూపిణి కూడా. బ్రాహ్మణీయ సంప్రదాయం ఆ రూపాన్ని స్వీకరించి, సాత్వికమూర్తిగా మలచి, బహుశా చెంచుల పూజా పద్ధతులను కూడా సంస్కరించి శివుని రూపమైన మల్లికార్జున స్వామి సరసన ప్రతిష్టించింది. ఆది శంకరాచార్య శ్రీశైలక్షేత్రంలో ప్రముఖ పాత్ర పోషించారనీ, అమ్మవారి ముందు వారే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని క్షేత్రచరిత్ర చెబుతోంది. చెంచులు భ్రమరాంబను తమ ఆడబడుచుగానూ, మల్లికార్జున స్వామిని అల్లుడిగానూ చెప్పుకుంటారు. అక్కడి పూజారి వ్యవస్థలో కూడా సర్దుబాటు కనిపిస్తుంది. మల్లికార్జునస్వామి అర్చకులు బ్రాహ్మణేతరులైన జంగములైతే, అమ్మవారి అర్చకులు బ్రాహ్మణులు. శ్రీ కాళహస్తి క్షేత్రానికి కూడా ఇదేవిధమైన ఆటవిక, బ్రాహ్మణీయ సంబంధం కనిపిస్తుంది. భక్త కన్నప్ప కథ దానికి సూచన. భద్రాచల క్షేత్రం అవతరించింది కూడా ఇలాంటి సయోధ్య సూత్రం మీదే. గిరిజన మహిళ అయిన పోకల దమ్మక్కకు రాముడు కలలో కనిపించి తనకు గుడి కట్టమని కోరినట్టు స్థలపురాణం చెబుతోంది. భద్రాచలం ప్రసాదంలో విప్పపూలు కూడా ఇవ్వడం గిరిజన సంబంధాన్ని సూచిస్తుంది.

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ భూమినీ, దేవాలయం ఉన్న ప్రాంతాన్నీ కూడా ‘క్షేత్రం’ అనడం రెండిటికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చని ఇంతకు ముందు ఒక వ్యాసంలో అన్నాను. వ్యవసాయ, జనావాసాలు విస్తరించడమంటే రాజ్యం విస్తరించడమే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే. స్థానిక దేవీ దేవతలను, పూజా విధానాలను సంస్కరించి, బ్రాహ్మణీయ సంప్రదాయంలో విలీనం చేయడం రూపంలో సామదాన ఉపాయాలను అనుసరిస్తూనే; అవసరమైతే, భేద, దండోపాయాలను కూడా అమలు చేసే ఏర్పాటుకు వీలుగా దేవాలయ నిర్మాణం ఉండేదనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన పురాతన నగర రాజ్యాల సరళీ వీటిలో ప్రతిబింబిస్తూ ఉండచ్చు. ఈ మాట అంటున్నప్పుడు, ప్రాచీన సుమేరుసంస్కృతికీ, ప్రత్యేకించి దక్షిణభారత సంస్కృతికీ ఉన్న పోలికల చర్చలోకి పరుగుపెట్టాలని కీబోర్డు మీద నా వేళ్ళు ఉత్సాహపడుతున్నాయి కానీ, దాంతోపాటు పై విషయాలు అనేకం మరింత విపులంగా చెప్పుకోవలసినవి కనుక ఆ ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పదు.

పైన జంతు దేవత, సర్ప దేవత, నక్షత్రదేవత అని హెచ్. జి. వెల్స్ అన్నప్పుడు వాటితో కూడా మనకున్న సామ్యాలకు లెక్కే లేదు. కుక్కకు కాలభైరవ రూపమిచ్చి జంతురూపంలోనూ, మనిషి రూపంలోనూ కూడా కొలవడం మన దగ్గర ఉంది. అలాగే, నందిని శివునికి వాహనమైన వృషభ రూపంలోనే కాక మానవ రూపంలోనూ చెప్పుకుంటాం. విష్ణువు వాహనమైన గరుత్మంతుడు అనే పక్షి విషయంలోనూ అంతే. సర్పానికీ, సూర్యచంద్రులకీ, ఇతర ఖగోళ విశేషాలకు మానవ ఆకృతిని ఇవ్వడం మన దగ్గరా మామూలే. సర్పాన్ని యథారూపంలో పూజించడమూ ఉంది.

ఇలాంటి బహురూప ఆస్తికత మన దేశంలో సమకాలీన వాస్తవం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం.

   ***

దేవతల కూర్పులు, చేర్పులు, మార్పుల (థియోక్రేసియా) ప్రక్రియను వెల్స్ ఈజిప్టు నేపథ్యం నుంచి వివరిస్తారు. ఇందులో దొర్లే దేవీ, దేవతల పేర్లు కొత్తగా అనిపించి ఆసక్తి గొలపక పోవచ్చు కానీ, వారిలో మన దేవీ, దేవతల పోలికలను పట్టుకుంటూ వెడితే ఆసక్తిని కలిగించవచ్చు.

ఈజిప్టు నగరరాజ్యాల దశనుంచి, ఐక్య సామ్రాజ్యంగా అభివృద్ధి చెందే క్రమంలో థియోక్రేసియా పెద్ద ఎత్తున సంభవించింది. వారి ప్రధాన దైవం ఓసిరిస్. ఈజిప్టు చక్రవర్తి(ఫారో) భూమి మీద ఈ దేవుడి ప్రతిరూపం. ఓసిరిస్ బలులు స్వీకరించే పంటల దేవుడు. విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడం, దానినుంచి మళ్ళీ మొక్క రావడం –చావు, పుట్టుకల చక్రానికి ప్రతీకగా చెబుతారు. ఈ పంటల దేవుడు కూడా అంతే. చచ్చి మళ్ళీ పుట్టడమంటే, మృత్యుంజయత్వమే. ఆవిధంగా ఓసిరిస్ మృత్యుంజయుడు. మన శివుడు కూడా మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయత్వాన్నే మనం అమరత్వం అంటాం. ఈ అమరత్వం అనే భావనను ఈజిప్షియన్లే ప్రపంచానికి పరిచయం చేశారని వెల్స్ అంటారు. అందుకు ప్రత్యేకమైన సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అందులోకి తర్వాత వెడదాం. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉంటాయి కనుక ఓసిరిస్ సూర్యుడు కూడా. ఆ తర్వాత ఓసిరిస్ ను ఎపిస్ అనే వృషభదేవుడిగా గుర్తించడం ప్రారంభించారు. అప్పుడతని అర్థాంగి ఐసిస్. ఆమె హేతర్ అనే పేరు ఉన్న గోదేవత కూడా. అంతేకాదు, ఆమె చంద్రవంక, సముద్రం నుంచి ఆవిర్భవించిన తారా కూడా. తార మన అమ్మవారి పేర్లలో ఒకటి. అమ్మవారి తల మీద, శివుని తల మీద చంద్రవంక ఉంటుంది. మన లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవిస్తుంది.

ఓసిరిస్ చనిపోయిన తర్వాత ఐసిస్ కు హోరస్ అనే కొడుకు పుడతాడు. ఇతడు మొదట్లో మన గరుత్మంతుడిలాంటివాడు. ఇతనే ఆ తర్వాత ఓసిరిస్ అవుతాడు. ఐసిస్ చంద్రవంక మీద నిలబడి కొడుకుని ఎత్తుకుని ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఈ రూపం బాల వినాయకుణ్ణి ఎత్తుకుని ఉన్న పార్వతిని గుర్తుచేస్తుంది. వృషభం, సూర్యుడు, చంద్రుడు, సర్పం మొదలైనవి నాటి బహురూప ఆస్తికతకు గుర్తుగా ఈజిప్టు, మనదేశపు ఆస్తికతలలోనే కాక, పురాతన ఆస్తికతలు అన్నిటా ప్రధాన పాత్ర వహించాయి. ఎంతో ఆసక్తికర సమాచారం ఉన్న ఆ కోణంలోకి ఇప్పుడు వెళ్లలేం.

గ్రీకులు ఈజిప్టును జయించిన తర్వాత నూతనంగా నిర్మించిన అలెగ్జాండ్రియా నగరం ఈజిప్టు మతజీవితానికే కాక, హెల్లెనిక్ (పురాతన గ్రీసు, దానిని దగ్గరలో ఉన్న దీవులు, క్రీటు ద్వీపం, ఆసియా మైనర్ తీరప్రాంతం, ఇటలీ దక్షిణ ప్రాంతాలను ఇలా పిలిచేవారు) ప్రపంచ మతజీవితం మొత్తానికి కేంద్రస్థానం అయింది. మొదటి టోలెమీ చక్రవర్తి అలెగ్జాండ్రియాలో ‘సెరాపియమ్’ అనే బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మింపజేసి, అందులో ఒకవిధమైన త్రిమూర్తులను ప్రతిష్టింపజేశాడు. వారు: సెరాపిస్, ఐసిస్, హోరస్ లు. సెరాపిస్ మరెవరో కాదు, ఓసిరిస్-ఎపిస్ లను కలిపేసి సృష్టించిన దేవుడు. నిజానికి ఈ త్రిమూర్తులు వేర్వేరు దేవుళ్ళు కారు, ఒకే దేవుడికి భిన్న అంశలు. ఈ సెరాపిస్ నే గ్రీకుల జియస్ (ఈయన మన బ్రహ్మ దేవుడిలాంటివాడు) గానూ, రోమన్ల జూపిటర్ గానూ, పర్షియన్ల సూర్యదేవుడిగానూ గుర్తిస్తారు.

హెల్లెనిక్ ప్రభావంతో ఈ త్రిమూర్తుల ఆరాధన ఉత్తరభారతం, పశ్చిమ చైనాల వరకూ వ్యాపించిందని వెల్స్ అంటారు.

మన దేశంలో అమ్మవారిని పూజించినట్టే అసంఖ్యాక భక్తులు ఐసిస్ ను ఆరాధించేవారు. ఆ చల్లని తల్లి తమను కష్టాలు, కడగండ్ల నుంచి గట్టెక్కిస్తుందని నమ్మేవారు. ఐసిస్ అనే పేరు మన ఈశాని(పార్వతి)ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ఆమె స్వర్గరాణి. దేవాలయాలలో ఆమె హోరస్ ఎత్తుకుని ఉన్న రూపంలో ఉంటుంది. ఆమె ముందు దీపారాధన చేసి, నైవేద్యాలు అర్పించేవారు. విశేషమేమిటంటే, ఐసిస్ ఆలయంలో అర్చకులు శిరోముండనం చేసుకునేవారు. బ్రహ్మచర్యం పాటించేవారు.

మన అమ్మవారి ఆలయాలలోని మనకు చిరపరిచితమైన దృశ్యాల ప్రతిబింబాన్ని ఈ వివరాలలో మీరు ఈపాటికి స్పష్టంగా పోల్చుకుని ఉండవచ్చు.

అదీ సంగతి!

 

 

మిగతా విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

 

 

 

 

చరిత్ర అద్దంలో ‘హిందుత్వ’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను…

వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు ఇంకొక ఉదాహరణ.

యూదులు పురాచరిత్రలో/చరిత్రలో కనీసం మూడువేల అయిదువందల సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. విశేషమేమిటంటే, వారు అంత సుదూరగతంలో ప్రపంచానికి అందించిన ఒక భావన, ఈ క్షణాన మనదేశంలో ఒక వర్గం నోట ఒక విలక్షణమైన వాదం వినిపించడానికి కారణమవుతోంది. ఆ వర్గం, హిందుత్వవాదులు. ఇది ఒకవిధంగా సున్నితమూ, వివాదాస్పద అంశమే కానీ, యూదుల గురించి చెప్పడానికి పూర్వరంగంలో ఆ అంశంలోకి వెళ్ళడం అనివార్యమవుతోంది. ఈ వ్యాసాలు అన్నింటిలో పాటిస్తున్నట్టే, చారిత్రక తటస్థతను పాటిస్తూ అందులోకి వెడతాను.

‘హిందూ’ అనేది ఒక ‘మతం’ కాదని పలు సందర్భాలలో హిందుత్వ సిద్ధాంత వాదులు నొక్కి చెప్పడం చూస్తూ ఉంటాం. హిందూ అనేది ‘ఒక జీవనవిధానం’ అని వారు అంటుంటారు. ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉటంకిస్తూ ఉంటారు. మతంగా కాకుండా, ఒక జీవనవిధానంగా ఉండడం ప్రపంచం మొత్తం మీద హిందువుల ప్రత్యేకతగా వారు ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఈవిధంగా వారికి సంబంధించినంతవరకు ‘మతం’ అనే మాటకు, ‘జీవనవిధానం’ అనే మాట ప్రత్యామ్నాయపదంగా మారింది.

అయితే, చారిత్రక దృష్టితో చూసినప్పుడు, తమది ‘మతం’ కాదని వారు అనడంలో కొంత నిజం ఉంది, కొంత నిజం కానిది ఉంది. మతం అనే మాటను విశాలార్థంలో తీసుకున్నప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక విశ్వాసాన్నీ, ఆరాధనా పద్ధతినీ అనుసరించేది ప్రతిదీ ఒక మతమే. ఆవిధంగా హిందూకు పూర్వరూపమైన వైదికం కూడా ఒక మతమే. బౌద్ధ, జైనాలను కూడా మతమనే అంటాం. అయితే, ఇవి క్రీస్తుపూర్వ కాలానికి చెందిన మతాలు. క్రీస్తుశకానికి దగ్గరగా, లేదా క్రీస్తుశకంలోకీ వస్తే, క్రైస్తవం, ఇస్లాం అనే రెండు మతాలు, ‘మతం’ అనే మాటను విశాలార్థం నుంచి తప్పించి; నేడు మన ఊహలో ఉన్న రూఢ్యర్థాన్ని లేదా పరిమితార్థాన్ని ఆ మాటకు ఇచ్చాయి. ఆ మతాల స్వభావం అందుకు అవకాశమిచ్చింది. ఎలాగంటే, అవి ఏకేశ్వర మతాలు! ఆ మతాలకు ఒక ప్రామాణిక పవిత్ర గ్రంథం ఉంటుంది.

ఇక్కడ యూదుల ప్రమేయం ఏమిటంటే, ఈ ఏకేశ్వర భావనను, పవిత్రగ్రంథ భావనను ప్రపంచానికి అందించినది వారే. అది కూడా క్రీస్తుపూర్వ కాలంలోనే. ఆవిధంగా మతం అనే మాటకు నేటి రూఢ్యర్థం యూదుల వల్ల వచ్చింది. క్రీస్తుపూర్వ కాలంలో వారు ప్రారంభించిన ఆ ప్రక్రియ క్రైస్తవంతోనూ, ఇస్లాంతోనూ ఒక కొలిక్కి వచ్చింది. అంతకంటే విశేషంగా అదే ప్రక్రియ, కాలాన్ని క్రీస్తుపూర్వంగానూ, క్రీస్తుశకంగానూ విభజించి కాలగణనానికి ఒక కొండగుర్తునూ ఇచ్చింది.

కనుక, ‘ఏకేశ్వర భావన కలిగి, ఒక ప్రామాణిక పవిత్రగ్రంథం ఉన్నదే మతం’ అనే రూఢ్యర్థంలో తీసుకున్నప్పుడు, తమది మతం కాదన్న హిందుత్వ వాదుల వాదనలో నిజం ఉంది. అలా కాకుండా, మతం అనే మాటను క్రీస్తుపూర్వపు విశాలార్థంలో తీసుకున్నప్పుడు వైదికమతంలానూ, బౌద్ధమతంలానూ హిందుత్వ కూడా ఒక మతమే అవుతుంది. ‘హిందూ’ అనేది ఒక మతం కాదనడంవల్ల ఇప్పుడు ఎలాంటి విచిత్ర పరిస్థితి ఏర్పడిందంటే, దానిని గుర్తించడానికి ఒక సరైన మాట లేకుండా పోయింది. చివరికి ‘హిందు’, ‘హిందుత్వ’అనే మాటలతో సరిపెట్టవలసివస్తోంది.

ఇంతకీ సారాంశం ఏమిటంటే, హిందూ అనేది మతం కాదని అనడంలో హిందుత్వ సిద్ధాంత వాదులు చెప్పకనే చెబుతున్నది, అది క్రైస్తవం లానూ, ఇస్లాంలానూ ఒక పవిత్ర గ్రంథం కలిగిన ఏకేశ్వరమతం కాదనే! అయితే ఆ మాట వారు స్పష్టంగా అనడం లేదు. హిందూ ఏకేశ్వరమతం కానప్పుడు సహజంగానే అది ‘బహుళేశ్వర మతం’ అవుతుంది. అప్పుడది ఏకేశ్వర, బహుళేశ్వర మత చర్చగా పరిణమిస్తుంది. కానీ, హిందుత్వ సిద్ధాంతవాదులు హిందూ అనేది బహుళేశ్వర మతం అని కూడా స్పష్టంగా అనడం లేదు. హిందూకు సంబంధించి మతం అనే భావననే తీసుకురావడానికి వారు ఇష్టపడడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా హిందూ ‘ఒక జీవన విధానం’ అనే మాటను ప్రచారంలోకి తెస్తున్నారు.

దానికి ఒక స్పష్టమైన నేపథ్యం ఉంది. అది, ‘మతతత్వం వర్సెస్ లౌకికవాదం’ అనే పేరిట చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చ. తమది మతతత్వం అంటూ లౌకిక వాదులు అదే పనిగా దాడి చేస్తున్నారు కనుక, హిందూ ‘ఒక మతం’ అనే భావననే తోసిపుచ్చడం హిందుత్వ వాదులకు ఒకానొక వ్యూహంగా మారింది. మతం అనే భావననే నిరాకరించడమంటే, మతాలకు సంబంధించిన చరిత్రను, చర్చను కూడా నిరాకరించడమే. అప్పుడీ చర్చ మొత్తం అకడెమిక్ చర్చకు ఏమాత్రం సందివ్వని రాజకీయ వ్యూహాత్మక చర్చగా పరిణమిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.

హిందూ ‘ఒక జీవన విధానం’ అన్నప్పుడు కూడా దానికి ఒక స్పష్టమైన నిర్వచనం సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర సమాజాలలోనూ, సంస్కృతులలోనూ లేని విలక్షణ జీవనవిధానం హిందువులకు మాత్రమే ఉందని– రెండు రెళ్ళు నాలుగు అన్నంత స్పష్టంగా నిరూపించనప్పుడు ఆ మాట కూడా బ్రహ్మపదార్థం లాంటి ఒక అనిర్వచనీయ భావనగానే మిగిలిపోతుంది.

 

***

చరిత్రలోకి వెడితే భిన్నదృశ్యం కనిపిస్తుంది. ‘ఒక మతం కాకపోవడం, ఒక జీవన విధానం కావడం’ అనేది హిందువుల ప్రత్యేకత అన్న వాదాన్ని మాటవరసకు అంగీకరిస్తే, అది ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఉన్న ప్రత్యేకతే. ఒకింత వివరంగా చెప్పుకుంటే, ఆ ప్రత్యేకత ఇలా ఉంటుంది:

ఒకప్పుడు జనం ఒక దేవినో, దేవుడినో కాకుండా అనేకమంది దేవీ, దేవతలను పూజించేవారు. ఇది ‘బహుళ దైవారాధన’. దీనిని ఒకవిధమైన ‘ఆస్తిక ప్రజాస్వామ్యం’ అనచ్చు. వేరే దేవీ, దేవతలను పూజించేవారు ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ ప్రాంతంలోని దేవీ, దేవతలను కూడా సాధారణంగా సొంతం చేసుకునేవారు. అంటే, విజేతలు, విజితులు (ఓడిపోయినవారు) ఒకరి దేవీ, దేవతలను ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఆస్తికరంగంలో పాలు, నీళ్లలా కలసిపోయేవారు. ఆ విధంగా దేవీదేవతల సంఖ్య కూడా పెరిగేది. జనం కలసిపోయి చుట్టరికాలు కల్పించుకున్నట్టే, దేవీ, దేవతల మధ్య కూడా చుట్టరికాలు ఏర్పడేవి. ఈ ప్రక్రియను చరిత్రకారులు ‘థియోక్రేసియా’అన్నారు. ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా, ఇప్పటికీ మనదేశంలోనూ జరుగుతూ వచ్చిన ఈ ప్రక్రియను హెచ్.జి. వెల్స్ (A Short History of the World) చాలా ఆసక్తికరంగా వివరించారు. అలాగే, రాజులను, చక్రవర్తులను దైవాంశ సంభూతులుగా కొలుస్తూ వాళ్ళకు గుడి కట్టడం కూడా ఉండేది.

దీనంతటినీ వ్యవహార సౌలభ్యం కోసం ‘బహురూప ఆస్తికత’ అనీ, దీనికి భిన్నమైనదానిని ‘ఏకరూప ఆస్తికత’ అనీ అందాం.

పైన చెప్పిన ‘బహురూప ఆస్తికత’ స్థానంలో క్రమంగా ‘ఏకరూప ఆస్తికత’ అడుగుపెట్టింది. ఏకరూప ఆస్తికత అడుగుపెట్టి బలపడడాన్నే నేటి మన కాలగణనలో క్రీస్తుశకం పేరిట కొండగుర్తుగా మార్చుకున్నట్టు పైన చెప్పుకున్నాం. ఆవిధంగా బహురూప ఆస్తికత క్రీస్తుపూర్వపు చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

ఇక్కడే ఇంకో తమాషా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజాస్వామ్యం వైపు వెళ్లిన, లేదా వెళ్లాలని భావిస్తున్న ప్రపంచం; ఆస్తికరంగంలో మాత్రం (మనదేశం వంటి మినహాయింపులతో) దానికి భిన్నమైన మార్గంలో, అంటే ఏకరూప ఆస్తికతలోకి వెళ్లింది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా తనను చెప్పుకునే పాశ్చాత్యక్రైస్తవ ప్రపంచం ఆస్తికంగా మాత్రం ఏకరూపతకు మళ్ళడం విచిత్రంగా ఉంటుంది. ఆ ఏకరూప ఆస్తికతను పురోగామిరూపంగా కూడా అది విశ్వసించింది. అందుకే తన వలసగా మార్చుకున్న భారత్ తో సహా అనేక దేశాలను క్రైస్తవీకరించే ప్రయత్నాలకు పాశ్చాత్యప్రపంచం మద్దతు ఇచ్చింది. కానీ అది బెడిసికొట్టడంతో వెనకడుగు వేసిన ఉదాహరణలూ ఉన్నాయి. చర్చితో పోరాడిన చరిత్ర కూడా తనకు ఉంది కనుక మతాన్నీ, రాజకీయాన్నీ అది విడదీసింది. తను ఆస్తికరంగంలో ఏకరూపతకు మళ్లినా రాజకీయంగా బాహుళ్యంవైపు, అంటే ప్రజాస్వామ్యంవైపు మొగ్గింది కనుక, అందులో భాగంగా భిన్న ఆస్తిక విశ్వాసాల ఉనికిని సూత్రప్రాయంగానైనా అది గుర్తిస్తుంది.

ఇస్లాం ప్రపంచానికి వస్తే, పాశ్చాత్యప్రపంచంలా అది ఏకరూప ఆస్తికతలోకి మళ్లినా, రాజకీయ ప్రజాస్వామ్యానికి పూర్తిగా మళ్లలేదు. కాలగణనం నుంచి చెప్పుకుంటే ఈ రెండు ప్రపంచాల మధ్యా ఉన్న ఒక పోలిక- క్రీస్తుపూర్వ కాలానికి చెందిన బహురూప ఆస్తిక నుంచి, క్రీస్తుశకానికి చెందిన ఏకరూప ఆస్తికతలోకి అవి రెండూ అడుగుపెట్టడం.

మనదేశానిది పూర్తిగా భిన్నమైన అనుభవం. మనం మొదటినుంచీ, ఇప్పటివరకూ కూడా భిన్న మతాలు, పంథాలు, ఆరాధనాపద్ధతుల రూపంలోని బహురూప ఆస్తికతలోనే ఉన్నాం. ఇందుకు మనదేశ భౌగోళిక పరిస్థితులు కూడా కొంత దోహదం చేశాయని కోశాంబీ సూత్రీకరణ. అలాగని మన దేశంలో అక్కడక్కడైనా ఏకరూప ఆస్తికతను విధించడానికి ప్రయత్నం జరగలేదని కాదు. క్రీస్తుపూర్వకాలంలో బౌద్ధం అనే ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. అయితే, బౌద్ధం స్వతస్సిద్ధంగా క్షీణించడం వల్ల నేటి హిందూకు పూర్వ రూపమైన వైదిక లేదా సనాతనమతం దాని స్థానంలోకి విస్తరించిందా, లేక బౌద్ధాన్ని అణగదొక్కి విస్తరించిందా అన్న ప్రశ్నకు అవకాశం ఉంది. అందులోకి నేను మరి అంత లోతుగా వెళ్లలేదు కనుక ప్రస్తుతానికి దానిని ప్రశ్నగానే వదిలేస్తాను. మనదేశంలో అక్కడక్కడ ఏకరూప ఆస్తికత విధించడానికి జరిగిన ఇతర ప్రయత్నాలు క్రీస్తుశకంలోకే వస్తాయి. వీరశైవ, వైష్ణవ మతాలు మొదలుకుని బ్రిటిష్ కాలంలో బ్రహ్మ సమాజం తదితర ఏకేశ్వర మతాలవరకూ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఏకరూప ఆస్తికతకు చెందిన క్రైస్తవ, ఇస్లాంల వరవడిలో పుట్టినవి.

బహురూప ఆస్తికత నుంచి ఏకరూప ఆస్తికతకు మళ్లడం అనేది అంత సునాయాసంగా ఏమీ జరగలేదు. అందులో ఎంతో పీడన, హింస ఉన్నాయి. పాశ్చాత్య ప్రపంచమూ, ఆ తర్వాత ఇస్లామూ బహురూప ఆస్తికతను పనిగట్టుకుని తుడిచిపెట్టి మరీ క్రీస్తుశకంలోకి అడుగుపెట్టాయి. ఈ కోణంనుంచి (ఇంకా మరికొన్ని కోణాలనుంచి కూడా) చూసినప్పుడు మనదేశం ఇంకా క్రీస్తుశకంలోకి రానే లేదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో ప్రస్తావించాను.

విచిత్రం ఏమిటంటే, క్రైస్తవ, ఇస్లాం మతాలలా తమది ఒక ‘మతం’ కాదనీ, ‘జీవనవిధాన’మనీ హిందుత్వ సిద్ధాంత వాదులు అంటూనే; మళ్ళీ ఆ మతాలనే వరవడిగా తీసుకుంటూ ఆ ‘జీవనవిధానా’న్నే ‘ఏకరూప జీవనవిధానం’గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇంకొకటి కూడా చేస్తున్నారు. అది, క్రీస్తు పూర్వదశనుంచీ ఈ దేశంలో ఉన్న ఒకవిధమైన ఆస్తిక ప్రజాస్వామ్యాన్నీ, నేటి రాజకీయ ప్రజాస్వామ్యాన్నీ కలగాపులగం చేయడం! ఈ దేశం మొదటినుంచీ ప్రజాస్వామ్యదేశమే(రాజకీయంగా, సామాజికంగా కూడా) నని విస్తృతార్థంలో నొక్కి చెబుతూ, దానికి ఆస్తిక ప్రజాస్వామ్యాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

***

మన దేశంలో బహురూప ఆస్తికత ప్రత్యక్ష సత్యం కనుక మరీ ఎక్కువ ఉదాహరణలు ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి కులానికీ, ప్రతి తెగకూ, ప్రతి ప్రాంతానికీ తమవైన దేవీ, దేవతలు ఉన్నారు. తమవైన పూజాప్రక్రియలు ఉన్నాయి. ఒక్క అమ్మవారి పూజల్నే తీసుకుంటే అందులో ఉండే వైవిధ్యం అంతాఇంతా కాదు. కొన్ని కులాల పూజల్లో జాతరలు, జంతుబలులు, గరగ నృత్యాలు, శరీరాన్ని హింసించుకోవడం మొదలైనవి ఉంటే; కొన్ని కులాల పూజల్లో సాత్విక నైవేద్యాలు, అష్టోత్తరశతనామాలు, సహస్రనామాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైనవి ఉంటాయి.

ఈ సందర్భంలో ఆది శంకరాచార్య గురించి ప్రస్తావించుకోవడం అవసరం. ప్రామాణిక చరిత్రకు తెలిసినంతవరకు మనదేశంలో తొలి మత సంస్కర్త ఆయనే. స్థూలంగా చెప్పుకుంటే, యజ్ఞాలు, జంతుబలులు ప్రాధాన్యం వహించే ఒకనాటి వైదిక మతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సంస్కరించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. మరోవైపు, జానపద పూజా పద్ధతులనూ, విశ్వాసాలనూ కూడా ఆయన చక్కదిద్దడానికి చూశారు. నేడు క్షుద్రపూజలుగా చెప్పుకునే కొన్ని రకాల ఉగ్రపూజా పద్ధతులను సాత్వికం చేయడం ఆది శంకరాచార్య ప్రధాన సంస్కరణగా కనిపిస్తుంది. ‘పంచాయతనం’ పేరుతో దేవీ దేవతల సంఖ్యను పరిమితం చేయడానికైతే ఆయన చూశారు కానీ, బహురూప అస్తికతను పూర్తిగా ఏకరూప ఆస్తికతగా మాత్రం మార్చలేదు. మన దేశస్వభావమూ, స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను అయిదుగురు దేవీ దేవతలకు పరిమితం చేసి ఉండవచ్చు. ఆ అయిదుగురు దేవీ, దేవతలు: అంబిక, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, విష్ణువు. దాంతోపాటు పూజా విధానాన్ని సరళమూ, సాత్వికమూ చేశారు. అయితే శంకరాచార్యులవారి ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పలేం.

శంకరాచార్య కాలం గురించే వివాదం ఉంది. ఆయన క్రీస్తు శకానికే చెందినవారన్న వాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏకరూప ఆస్తికత దిశగా ఆయన ఆలోచన చేశారా అనిపిస్తుంది. తాత్విక స్థాయిలో ఆయన అభివృద్ధి చేసిన అద్వైత సిద్ధాంతంలో దాని ఛాయలు కనబడవచ్చు. పూజా విధానం మేరకు పంచాయతనానికి పరిమితమయ్యారు.

శంకరాచార్యులవారి గురించి ఈ నాలుగు మాటలూ ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు చెప్పినవే కానీ, ఇది సమగ్ర, పరిశీలనా కాదు, అందుకు ఇది సందర్భమూ కాదు.

***

క్రీస్తు పూర్వకాలానికి చెందిన బహురూప ఆస్తికత ఏకరూప ఆస్తికతలోకి పయనించి క్రీస్తుశకాన్ని అవతరింపజేయడం రోమన్ సామ్రాజ్యకాలంలో జరిగింది. హెచ్, జి. వెల్స్ చిత్రించిన ఆ పరిణామక్రమాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

అది తర్వాత…

పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు!

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు…

మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు, అది వేరే విషయం. ఇసుక గూడు కట్టినంతసేపూ స్థిరంగానూ, నిజంగానూ అనిపిస్తుంది. కానీ కాలం ఆ వెంటనే, లేదా మరునాడో దానిని కూల్చివేస్తుంది. అలాగే కాలగతిలో మనిషి తను ఉండే ప్రాంతానికీ, దేశానికీ సరిహద్దులూ, తనకు కొన్ని రకాల గుర్తింపులూ(identities) కల్పించుకుంటూ ఉంటాడు. కానీ కాలం వాటిని చెరిపివేస్తూ ఉంటుంది. కొత్త సరిహద్దులు, గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి.

సారాంశం…కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదు!

కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదన్న సంగతిని గ్రహించడమే మనిషి పరిణతికి ఒక కొలమానం కావచ్చు. లేదా, ఎప్పటికప్పుడు కొత్త సరిహద్దులను, గుర్తింపులను కల్పించుకుంటూ సాగడమే మనిషి పరిణతికి నిజమైన కొలమానం అని కూడా ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. వీటిలో ఏది కరెక్టు అన్న వివాదంలోకి దిగడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ మొదటిదే కరెక్టు అనుకుంటే పురాచరిత్రలోకి వెళ్ళడం ఆ పరిణతికి ఏ కొంచెమైనా దోహదపడుతుందా…?

నేను ఇంతకు ముందు ఒకసారి నా అనుభవాన్ని రాశాను. అది, ఒక టీవీ చానెల్ లో కొందరు కాశ్మీరీ యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఒక చర్చలో పాల్గొన్న సందర్భం. మొదటినుంచీ ఆ కార్యక్రమాన్ని చూడకపోవడంతో ఎవరు ఏ పక్షమో వెంటనే తెలియలేదు. ఎందుకుంటే, వారి రూపురేఖలు, ఆహార్యమూ ఒక్కలానే ఉన్నాయి. క్రమంగా వారిలో ఒక పక్షంవారు ముస్లింలనీ, ఇంకో పక్షంవారు కాశ్మీరీ పండిట్లనీ తెలిసింది. ఆ క్షణంలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక జ్ఞానశకలమూ మెరుపులా నా మెదడును తాకింది. దాంతోపాటు అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, కాశ్మీరీలను కాశ్మీరీలుగానే తప్ప ముస్లింలుగానో, పండిట్లుగానో గుర్తించకూడదని! ఎవరేమనుకున్నా నా నిర్ణయస్వేచ్ఛ నాది.

రెండు పక్షాలవారూ రక్తసంబంధీకులని వారి రూపురేఖలే చెబుతున్నాయి. చర్చ సందర్భంలో వాళ్ళలో కొందరు ఆ మాట అన్నారు కూడా. కానీ మధ్యలో వాళ్ళలో కొందరు మతపరమైన కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. మతపరమైన వేర్వేరు గుర్తింపులతో వారిద్దరి ప్రపంచాలూ వేరై పోయాయి. భౌగోళికంగానూ, మనుషుల పరంగానూ వారికి పరస్పర భిన్నమైన భావాలు, బంధాలు, విశ్వాసాలు ఏర్పడ్డాయి. అయితే, గుర్తింపులు వేరయ్యాయి కానీ, ఉనికి మారలేదు. ఫలితంగా… ఘర్షణ!

ఇంతకీ ఈ గుర్తింపుల ప్రస్తావన దేనికంటే…

బైబిల్ లో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అది, డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ ఒక యూదు. బలంలోనూ, ఆకారంలోనూ సామాన్యుడు. గోలియత్ ఒక ఫిలిస్తీన్. బలంలోనూ ఆకారంలోనూ అసామాన్యుడు. పన్నెండు అడుగులవాడు. ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా అని పిలుచుకునే ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఫిలిస్తీన్లు, యూదులు పోరాడారు. ఉభయ సైన్యాలూ ఎదురెదురుగా నిలిచాయి. ఫిలిస్తీన్ సైన్యంలో అతి భీకరంగా ఉన్న గోలియత్ ముందుకు వచ్చాడు. అతన్ని చూడగానే యూదులు బెదిరిపోయి వెనకడుగు వేశారు. ఇలా గోలియత్ ముందుకురావడం, యూదు సేనలు భయపడి తోకముడవడం నలభై రోజులు సాగింది. అప్పుడు యూదురాకుమారుడు డేవిడ్ ధైర్యం చేసి గోలియత్ తో తలపడడానికి ముందుకొచ్చాడు. గోలియత్ ది భుజబలం అయితే, డేవిడ్ ది బుద్ధిబలం. ఒడిసెల్లోంచి రాళ్ళు విసరడంలో అతను నిపుణుడు కూడా. డేవిడ్ ఒక గులకరాయిని ఒడిసెల్లో పెట్టి గోలియత్ కణతకు తగిలేలా విసిరాడు. అంతే, గోలియత్ మొదలు తెగిన చెట్టులా కూలిపోయాడు.

untitled

ఈ కథ వినగానే మనకు రామాయణంలో కుంభకర్ణుడు గుర్తుకొస్తాడు. అతనిది కూడా భీకరమైన ఆకారం. అతను యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే వానరులు భయంతో తలోవైపుకీ చెదిరిపోతారు. వారు కూడా అప్పుడు రాళ్ళతోనూ, చెట్లతోనూ యుద్ధం చేశారు. చివరికి రాముడు బాణప్రయోగంతో కుంభకర్ణుని చంపేశాడు.

రాంభట్ల వెర్షన్ (వేదభూమి)ప్రకారం, ఫిలిస్తీన్లు మొదట క్రీటు దీవిలో ఉండేవారు. ఆవిధంగా వారు ఏజియన్లు. భూకంపం, అగ్నిప్రమాదం, గ్రీకు దాడుల ఫలితంగా వారు అప్పట్లోనే నేటి ఇజ్రాయిల్-పాలస్తీనా ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. వారిని ‘పులిసేతు’ లనేవారు. అదే ఫిలిస్తీన్ అయింది. మన దగ్గర మ్లేచ్చులు, అప్రాచ్యులు అనే మాటల్లానే, ఫిలస్తీన్ కూడా తిట్టుపదంగా మారింది.

హెచ్. జి. వెల్స్ ప్రకారం కూడా ఫిలిస్తీన్లు ఆసియా మైనర్ కు పశ్చిమంగా ఉన్న ఏజియన్ ప్రాంతం నుంచి మధ్యధరా సముద్రపు ఆగ్నేయ తీరంలోకి వలస వచ్చి నగరాలు కట్టుకున్నారు. వీరి వలసకు కారణం, ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్న మూడు ముఖ్యరకాలకు చెందిన సంచారజీవులలో ఒకరైన ఆటవిక నోర్డిక్ జాతివారు వచ్చి పడడం. ఇది క్రీ.పూ. 1200, లేదా ఒకింత ముందు జరిగింది. వీరితో పురాతన రేఖాపటం మీదికి కొత్త పేర్లు వచ్చాయి. వీరి చేతుల్లో ఇనప ఆయుధాలు ఉన్నాయి. వీరు గుర్రాలు పూన్చిన రథాలు వాడుతున్నారు. ఉత్తర సరిహద్దులలో వీరు ఏజియన్, సెమెటిక్ నాగరికతలకు ముప్పుగా మారారు. వీరే మీదులు, పర్షియన్లు, కిమ్మెరియన్లు, ఆర్మేనియన్లు, ఫ్రిజియన్లు, గ్రీకులు, తదితరులుగా చరిత్రకు పరిచయమయ్యారు. వేర్వేరు పేర్లతో ఉన్నా వీరంతా ఆర్యులు. ఒకే మూలభాషనుంచి చీలిపోయిన వేర్వేరు ఆర్యభాషలు మాట్లాడేవారు. వీరు ఒకవైపు పశువులను కాచుకుంటూ, ఇంకోవైపు నగరాల మీద దాడులకు, దోపిడీలకు పాల్పడేవారు. క్రమంగా మరింత బలపడి పశ్చిమాన ఉన్న నాగరికులైన ఏజియన్ల నగరాలను ఆక్రమించుకుని వారిని తరిమివేయడం ప్రారంభించారు. దాంతో ఏజియన్లు కొత్త ప్రదేశాలు వెతుక్కున్నారు. కొంతమంది నైలు నదీ డెల్టాలో స్థిరపడాలని చూశారు కానీ ఈజిప్షియన్లు వాళ్ళను తరిమేశారు. ఎట్రూస్కన్లు గా పరిచయమైన కొందరు ఆసియామైనర్ నుంచి జలమార్గంలో ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఈ వలసల్లో భాగంగా మధ్యధరా ఆగ్నేయ తీరానికి వచ్చినవారే ఫిలిస్తీన్లు.

ఈ చారిత్రక సమాచారం విసుగు పుట్టించచ్చు కానీ, ఎంతో అవసరమయ్యే ఈ వివరాలను ఇక్కడ ఇవ్వాల్సివస్తోంది. ఎందుకంటే, పైన చెప్పుకున్న అనేక పేర్లతో భారత దేశపురాచరిత్రకు కూడా సంబంధముంది. ఈ పేర్లు భిన్న ఉచ్చారణతో మన పురాణ, ఇతిహాసాలకు కూడా ఎక్కాయి. దీని గురించి ముందు ముందు చెప్పుకోవలసి రావచ్చు.

ప్రస్తుతానికి వస్తే, రాంభట్ల ఉద్దేశంలో పులిసేతులు లేదా ఫిలిస్తీన్లు ఆర్యులే! అంటే, వారు ఏజియన్ ప్రాంతంలోకి ముందే వచ్చి స్థిరపడినవారై ఉండాలి. చరిత్రకాలంలో వాళ్ళు ఇస్లాంలోకి మారారు. వారే కాదు, పురాకాలంలో మధ్య ఆసియా, పశ్చిమాసియాలకు చెందిన ఆర్యతెగలు అనేకం ఇస్లాంలోకి మారాయి. ఫిలిస్తీన్ల విషయానికే వస్తే, ఆర్యులుగా వారు పాశ్చాత్యప్రపంచానికీ, కొంతవరకు మనకూ యూదుల కంటే ఎక్కువ దగ్గర కావాలి. కానీ ఇస్లాం మతస్తులుగా వారు పాశ్చాత్యప్రపంచానికి విరోధులయ్యారు. పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికీ, ఇస్లామిక్ ప్రపంచానికీ క్రూసేడ్ల కాలంనుంచి, ఇప్పటివరకు జరుగుతున్న ఘర్షణలను ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ గా చెప్పుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో నేడు జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కూడా.

అంతమాత్రాన పాశ్చాత్యప్రపంచానికి యూదులు నెత్తి మీది దేవుళ్లేమీ కారు. ‘ఆర్యత్వం’ ఒక ఉన్మాదంగా ప్రకోపించి హిట్లర్ యూదులపై సాగించిన ఊచకోత ఇటీవలి చరిత్రే. అయితే, ముస్లింలు అనే ‘పెద్ద శత్రువు’తో పోల్చితే యూదులు ‘చిన్న శత్రువు’ కనుకా; ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రరీత్యా పాశ్చాత్యులకు యూదులు ఇప్పుడు మిత్రవర్గం అయ్యారు.

మన విషయానికి వస్తే, ఇస్లాం ప్రపంచం వెలుపల ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంవల్ల; మొదటి నుంచీ జాతుల విముక్తి పోరాటాలను సమర్థించే విధానం వల్ల మన దేశం పాలస్తీనా పక్షం వహిస్తూ వచ్చింది. కానీ క్రమంగా దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తొంభై దశకం నుంచే యూదుల దేశమైన ఇజ్రాయెల్ కు దగ్గరవడం ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తూ వచ్చిన ముస్లిం అనుకూలతా, దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే వైఖరీ—రెండూ కలసివచ్చి, బీజేపీ మొదటినుంచీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఈ మధ్య పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ పెద్దయెత్తున దాడులు జరిపి వందల సంఖ్యలో పౌరులను చంపడాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టడం; ఎన్డీయే ప్రభుత్వం అందుకు తిరస్కరించడం తెలిసినదే.

కాలగమనంలో పాత గుర్తింపులు పోయి కొత్త గుర్తింపులు ఎలా ఏర్పడుతూ ఉంటాయో; దాంతోపాటే మిత్రత్వశత్రుత్వాలు జాతిభేదాలను, ప్రాంత భేదాలను ఎలా అధిగమిస్తాయో చెప్పడానికే ఈ వివరణ. అదలా ఉంచితే, కాలం కల్పించిన అన్ని రకాల హద్దులను ముంచేస్తూ పురాచరిత్ర వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తుందో గ్రహించడానికి చక్కని ఉదాహరణ—నేటికీ కొనసాగుతున్న పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ. అలాగే, అతిపురాతన కాలం నుంచి నేటివరకు నిరంతర ఘర్షణకేంద్రంగా కొనసాగుతూ కాలానికి సవాలుగా నిలిచిన ఏకైక ప్రాంతం, బహుశా పశ్చిమాసియా.

ఫొనీషియన్ల గురించి చెప్పుకుంటూ యూదుల దాకా వచ్చాం. ఫొనీషియన్లు, యూదుల మిత్రత్వంతోపాటు ప్రత్యేకంగా యూదుల గురించే చెప్పుకోవలసింది ఉంది. అందులోకి వెళ్ళే ముందు…

***

ఇంతకుముందు వ్యాసంలో సుమేరుకు చెందిన గిల్గమేశ ఇతిహాసం(Epic of Gilgamesh)లోని ఎంకిడు పాత్రతో మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుడికి పోలిక ఉందని చెప్పాను. పైన చెప్పిన గోలియత్, కుంభకర్ణుని గుర్తు తెస్తాడన్నాను. ఈ సందర్భంలో రామాయణ సంబంధమైన మరికొన్ని పోలికలూ గొలుసుకట్టుగా గుర్తొస్తున్నాయి. విషయం పక్కదారి పట్టే మాట నిజమే కానీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పుకునే అవకాశం రాదన్న శంకతో ఇప్పుడే చెప్పాలనిపిస్తోంది.

చరిత్రకు తెలిసినంతవరకు తొలి అతిపెద్ద సామ్రాజ్యం(క్రీ.పూ. 500 ప్రాంతం) పర్షియన్లది. పర్షియన్లు కూడా ఆర్యులేనని పైన చెప్పుకున్నాం. వారిది జొరాష్ట్రియన్ మతం. భారత్ సరిహద్దులవరకు విస్తరించిన పర్షియన్ సామ్రాజ్యంలో మధ్యాసియా, పశ్చిమాసియాలు కూడా అంతర్భాగాలు. అంతటి మహాసామ్రాజ్య పాలకుల మతం నేడు భారత్ లోని కొద్దిమంది పార్శీలకు మాత్రమే పరిమితమవడం కాలవైచిత్రులలో ఒకటి. ఆనాడు పర్షియన్ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడింది చిన్నదేశమైన గ్రీస్ ఒక్కటే. పర్షియన్లలానే గ్రీకులు కూడా ఆర్యులే. పర్షియన్ చక్రవర్తి డరియస్ ‘ది గ్రేట్’ 1200 యుద్ధనౌకలతో పర్షియాను ఒక సముద్రశక్తిగా మార్చాడు. అందుకు ఫొనీషియన్ల సహకారం తీసుకున్నాడు. 300 నౌకలు ఫొనీషియన్లు సమకూర్చినవే.

అంతటి బలవత్తరుడైన డరియస్ కూడా గ్రీసును లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. హెరడోటస్ అనే చరిత్రకారుడు రాసిన ఆ వివరాలు ఎంతో ఆసక్తిగొలిపేవే కానీ ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేం. డరియస్ కొడుకు క్జెరెక్సెస్ ఎట్టకేలకు గ్రీసును జయించగలిగాడు. కానీ అది తాత్కాలిక విజయమే అయింది. చివరికి గ్రీకులే పర్షియన్ సామ్రాజ్యానికి చరమ గీతం పాడారు. అప్పటినుంచే అలెగ్జాండర్ ‘ది గ్రేట్’ చరిత్రలోకి వచ్చాడు.

సృష్టిలో రెండు విరుద్ధశక్తులు ఆధిపత్యం కోసం సంఘర్షిస్తూ ఉంటాయనీ, వాటిలో ఎటువైపు ఉండాలో మనుషులు నిర్ణయించుకోవాలనీ జొరాష్ట్రియన్ మతం చెబుతుంది. మొదటిది, మంచితోనూ, వెలుగుతోనూ నిండినదైతే; రెండోది, చెడుతోనూ, చీకటితోనూ నిండినది. అలాగే, ప్రతి కర్మకూ ఫలితం తప్పదన్న కర్మసిద్ధాంతాన్ని కూడా ఈ మతం చెబుతుంది. పర్షియన్లు మిత్రుని, అంటే సూర్యుని ఆరాధించేవారు. సూర్యుడు వెలుగుకు ప్రతీక.

రామాయణానికి వస్తే, రాముడు సూర్యవంశ క్షత్రియుడు.

పర్షియన్ల గురించి H.A. Davies అనే చరిత్రకారుడు (AN OUTLINE HISTORY OF THE WORLD) ఇంకా ఇలా అంటాడు: The Persians were, in many ways, a highly civilized people, and they had many admirable qualities, of which perhaps the most striking were their love of truth, their belief that it was disgraceful to fall into debt, and their courage.

రామాయణంలో, మొదటి సర్గ లోని రెండవ శ్లోకం (కో న్వస్మిన్ సాంప్రతం లొకే గుణవాన్ కశ్చ వీర్యవాన్/ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః) ప్రకారం రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కు, దృఢవ్రతుడు. గమనించండి…సూర్య సంబంధంతోపాటు; గుణగణాలలోనూ రాముడికీ, పర్షియన్లకూ మధ్య పోలికలు అచ్చుగుద్దినట్టు ఎలా ఉన్నాయో! ఇవి యాదృచ్ఛికం అనుకుంటారేమో, కాదు. పర్షియన్లకు, రామునికే కాక; రాజ్యస్థాపకులైన సారగాన్, హమ్మురాబీలకు కూడా ఇవే గుణగణాలనూ, సూర్యసంబంధాన్ని ఆపాదించారు. ప్రస్తుతం ఇందులోకి లోతుగా వెళ్లలేం.

untitled

ఇంతకంటే స్పష్టమైన ఇంకో పోలిక చూద్దాం. రాముడు రావణ సంహారం కోసం వానరసైన్యంతో కలసి లంకకు బయలుదేరితే, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరికీ సముద్రం అడ్డు వచ్చింది. సముద్రంలో వారధి నిర్మించి లంకకు వెళ్లాలని రాముడు అనుకున్నాడు. వారధి నిర్మాణానికి సహకరించమని కోరుతూ మూడురోజుల పాటు సముద్రుని ప్రార్థించాడు. ఆ మూడు రోజులూ దర్భలు పరచుకుని సముద్రతీరంలోనే పడుకున్నాడు. అయినా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం కలిగింది. భయంకరులైన దానవులతో నిండిన ఈ సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను అంటూ విల్లు అందుకుని ధనుష్టంకారం చేసి సముద్రునికి గురిపెట్టి బాణాలు ప్రయోగించాడు. అయినా సముద్రుడు లొంగలేదు. దాంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించదానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వారధి నిర్మాణానికి దారి ఇచ్చాడు.

ఇక హెరడోటస్ నమోదు చేసిన చరిత్ర ప్రకారం, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి వెడుతూ సముద్రానికి అడ్డంగా వారధి నిర్మింపజేశాడు. దానికి మద్దతుగా కొన్ని నౌకలను ఉంచారు. అంతలో పెద్ద తుపాను సంభవించి ఆ నౌకలను చెదరగొట్టేసింది. దాంతో క్జెరెక్సెస్ కు సముద్రం మీద కోపమొచ్చింది. పర్షియన్ చక్రవర్తినైన తనను ఇలా అవమానించడానికి సముద్రానికి ఎంత ధైర్యం అనుకున్నాడు. సముద్రుని బంధించినట్టుగా కొన్ని సంకెళ్ళను సముద్రంలోకి వేయించి, దానికి మూడు వందల కొరడా దెబ్బలు తినిపించవలసిందిగా ఆదేశించాడు.

పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన యుద్ధాల చరిత్రలో మన హనుమంతుడి లాంటి పాత్ర కూడా ఒకటి ఉంది. అతని పేరు, ఫిలిప్పైడ్స్. గ్రీసు దేశస్థుడు. మారథాన్ అనే చోట పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన తొలి యుద్ధంలో అతనొక ముఖ్యపాత్ర పోషించాడు. ఒలింపిక్స్ తో పరిచయమున్నవారికి మారథాన్ అనే పేరు పరిచితమే. పరుగుపోటీకి అది పర్యాయపదమైంది. హనుమంతుడికి మారుతి అనే పేరు ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించగలవాడిగా హనుమంతుడు ప్రసిద్ధుడు. అతడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. సీతను చూసిన తర్వాత రావణుని కూడా చూసి, రాముని సందేశం అందించాడు.

ఇప్పుడు ఫిలిప్పైడ్స్ ఏం చేశాడో చూద్దాం. గ్రీసులో స్పార్టా, ఏథెన్స్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. స్పార్టాన్లు భూయుద్ధంలో నిపుణులు. ఏథేనియన్లు నౌకాయుద్ధంలో నిపుణులు. పర్షియన్ల దాడి గురించిన భోగట్టా అందడంతో సాయం కోరుతూ స్పార్టాన్లకు ఏథేనియన్లు కబురు పంపించారు. సమయం తక్కువగా ఉండడంతో అత్యంత వేగంగా వెళ్లగలిగినవాడు కావాలి. ఎక్కువ దూరం పరుగెత్తడంలో శిక్షణ పొందిన ఫిలిప్పైడ్స్ ను అందుకు నియోగించారు. అతను ఏథెన్స్ లో బయలుదేరాడు. స్పార్టా అక్కడికి 150 మైళ్ళ దూరం. పైగా దారి అంతా కొండలు, గుట్టలు, సెలయేళ్ల మయం. ఫిలిప్పైడ్స్ మరునాటికల్లా స్పార్టా చేరుకుని కబురు అందించాడు. సాయం అందించడానికి సిద్ధమే కానీ, పౌర్ణమి తర్వాత, అంటే ఆరురోజులకు కానీ తాము బయలుదేరలేమని వారు చెప్పారు. ఆ సమాచారం అందుకుని ఫిలిప్పైడ్స్ అంతే వేగంగా తిరుగు ప్రయాణం సాగించి ఏథెన్స్ చేరుకున్నాడు. దారిలో పార్థెనియాస్ అనే కొండ దగ్గర పాన్ అనే దేవుడు అతనికి కనిపించి మీకు విజయం కలుగుతుందని చెప్పాడట. ఆ తర్వాత ఫిలిప్పైడ్స్ మారథాన్ చేరుకుని యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో ఏథేనియన్లు గెలిచారు. స్పార్టాన్లు ఆరు రోజుల తర్వాత బయలుదేరి వచ్చేసరికే యుద్ధం అయిపోయింది.

గెలుపు వార్తను కూడా ఫిలిప్పైడ్సే ఏథెన్స్ కు పరుగు పరుగున మోసుకెళ్ళాడు. ఏథెన్స్ చేరుతూనే తీవ్ర ఉద్వేగానికి లోనై చేతిలోని డాలు విసిరేసి, “మనం గెలిచాం” అంటూ ఆనందంతో ఒక్క గావుకేక పెట్టి, అప్పటికప్పుడు గుండె ఆగి కుప్పకూలి పోయాడు.

 

 

 

 

ప్రపంచ చరిత్రలో మనం!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది…
1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ ఎత్తులో ఊరేగాను. అప్పుడు నా కళ్ళను కమ్మేసిన విస్మయపు మెరుపు ఇప్పటికీ అలాగే ఉందేమో కూడా. నాలోని పురాచరిత్రాసక్తికి ఇంధనం అందించిన ఆ పుస్తకం, Myth and Reality. పురాకాలాన్ని ఒక అద్భుతంగా నా ముందు ప్రదర్శించిన అంశాలు ఆ పుస్తకంలో చాలా ఉన్నాయి.

వాటిలో పణుల గురించి చెప్పినది ఒకటి.

ఋగ్వేదంలో పణుల ప్రస్తావనను ఉటంకిస్తూ కోశాంబీ ఇంకో మాట అన్నారు. అదేమిటంటే, పురాచరిత్రకు చెందిన ఫొనీషియన్లే పణులు కావచ్చునని! మనం ఒక మిత్ గానూ, విశ్వాసంగానూ చూడడానికి అలవాటుపడిన ఋగ్వేదాన్ని(అలాగే ఆయా సందర్భాలలో మహాభారతం లాంటి ఇతిహాస కథలను, పురాణ కథలను కూడా) ఆయన ఆ మాటద్వారా చరిత్ర వాకిట నిలబెడుతున్నారు. అదే నాలో ఉత్తేజానికి, విస్మయానికి కారణం.

ఆ తర్వాత రాంభట్ల ఆ పురాకాలపు అద్భుతత్వంలోకి నన్ను మరింతగా తీసుకెళ్లారు. కోశాంబీకి, రాంభట్లకూ ఒక పోలిక ఉంది. రాంభట్ల శైలి వ్యాకరణ సూత్రాలలా ఉంటే, కోశాంబీ శైలి గణితసూత్రాలలా ఉంటుంది. అన్నట్టు కోశాంబీ గణితశాస్త్రజ్ఞుడు కూడా. మనదేశానికి సంబంధించి కోశాంబీ, రాంభట్లా ప్రస్తావించిన అనేక పురాచారిత్రక వివరాల గురించీ; వ్యక్తులు, తెగలు, ప్రదేశాల పేర్లు వగైరాల గురించీ అదనపు సమాచారాన్ని సంపాదించడానికి నాకు చాలాకాలం పడుతూ వచ్చింది. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. విచిత్రంగా, ఆ అదనపు సమాచారమూ; కోశాంబీ, రాంభట్ల నిర్ధారణలకు ధ్రువీకరణా పాశ్చాత్య పురాచరిత్రకారుల రచనల్లో కనిపిస్తూ వచ్చాయి. పురాకాలంలో ప్రపంచమంతా— కనీసం భారత్, మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ ల మేరకే చూసినా— ఒకే చరిత్రను పంచుకున్నాయనడానికి ఇది సాక్ష్యం.

ఇందులో ఒక తమాషా ఉంది. ఎంత ప్రపంచ చరిత్ర రాస్తున్నా భారతీయ చరిత్రకారుల రచనలు పాశ్చాత్య కేంద్రితం(centric) గానూ, పాశ్చాత్యచరిత్రకారుల రచనలు భారత్ కేంద్రితంగానూ ఉండవు. అంటే, తను పాశ్చాత్య చరిత్ర చెబుతున్నానన్న స్పృహ భారతీయ చరిత్రకారునిలోనూ, తను భారత్ చరిత్ర చెబుతున్నానన్న స్పృహ పాశ్చాత్య చరిత్రకారునిలోనూ నిర్దిష్టంగా ఉండదన్న మాట. పురాకాలానికి చెందిన ఒక ప్రాంతం, ఒక రాజ్యం, లేదా ఒక తెగ గురించి రాసేటప్పుడు అది అసలే ఉండదు. కానీ చాలాచోట్ల ఉభయుల రచనల్లోనూ ఉమ్మడి అంశాలు, పేర్లు దొర్లుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, రాంభట్ల అందించిన ఒక ఆసక్తికర సమాచారాన్నీ, పేర్లనూ పట్టుకుని పాశ్చాత్య చరిత్రకారుల రచనల్లో వాటి వివరాలు మరిన్ని సంపాదించడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది. సరే, రాంభట్ల గారికి సోర్సు చెప్పే అలవాటు అంతగా లేకపోవడమూ ఒక కారణం. పై అనుభవం ఎంతో వివరంగానూ, ఉత్కంఠతో కూడిన ఒక కథలానూ చెప్పుకోవలసినది కనుక ఇప్పుడు నేను అందులోకి వెళ్లను.

ప్రస్తుతానికి వస్తే, ఋగ్వేదంలో పేర్కొన్న పణులు, పురాచరిత్ర కాలానికి చెందిన ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికిప్పుడు నాకు అందుబాటులో ఉన్న హెచ్.జి. వెల్స్ రచన A SHORT HISTORY OF THE WORLD ఆధారంగా ఫొనీషియన్ల గురించి చెప్పుకుందాం.
***
అంతకంటే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళక తప్పదు…

ఇప్పటి నుంచి 9వేల సంవత్సరాల వెనక్కి వెడితే, అంటే క్రీ.పూ. 7000 నాటికి దిగువ మెసపొటేమియా (నేటి ఇరాక్ ప్రాంతానికి ఇది పురాతన నామం. ఇక్కడి పురాతన జనం సుమేరియన్లు. వీరి పేరు మీద దీనిని సుమేరియా అని కూడా అన్నారు. రెండు నదుల మధ్య ఉంది కనుక ‘లంక’ అని కూడా అనచ్చు)లో యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య సుమేరియన్లు నగరరాజ్యాలు స్థాపించుకున్నారు. దాదాపు ఇదే సమయంలో నైలు నదీ లోయలో ఈజిప్ట్ ప్రజలూ నగర రాజ్యాలను స్థాపించుకున్నారు. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే తొలి రాజ్యాలు.

నగరాలు వేటికి అవే స్వతంత్ర రాజ్యాలు. ప్రతి నగరానికీ ఒక దేవుడూ, పూజారీ ఉంటారు. పూజారే రాజుగా ఉంటాడు. ఒక నగరం ఇంకో నగరాన్ని ఆక్రమించుకోవచ్చు. ఆ నగర దేవుణ్ణి ఎత్తుకు పోయి తమ నగరంలో ప్రతిష్టించుకుంటే, ఆ నగరం వారి స్వాధీనంలోకి వచ్చేసినట్టే. ఓడిపోయిన నగరం గెలిచిన నగరానికి కప్పం చెల్లించుకుంటుంది. సుమేరియన్ల నగరం ‘నిప్పూరు’లో ఒక పురాతన శాసనం దొరికింది. ఆ శాసనంలో తొలి ‘సామ్రాజ్యం’ పేరు నమోదైంది. దాని పేరు ‘ఈరిచ్’. ఈ నగర దేవుడూ, రాజుగా ఉన్న పూజారీ పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్రసముద్రం వరకూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

‘నిప్పూరు’లో ‘ఊరు’ ఉంది చూడండి; అది మన తెలుగు ‘ఊరు’కు సమానార్థకమే. సమానార్థకమేమిటి, అది పదహారణాల తెలుగు మాటే కావచ్చు. అసలు మెసపొటేమియాలో ‘ఊరు’ అనే పేరుతోనే ఒక నగరం ఉండేది. మెసపొటేమియాకు చెందిన గిల్గమేశుని ఇతిహాసంలో(The Epic of Gilgamesh) గిల్గమేశుని నగరం పేరు ‘ఊరు’. ఇందులోని ఎంకిడు అనే పాత్రకు, మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుని కథకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ ‘ఎంకిడు’ అనే పేరు కూడా తెలుగు పేరులానే ధ్వనిస్తూ ఉండచ్చు. వీటి గురించి మరింత వివరంగా చెప్పుకునే అవకాశం ముందు ముందు వస్తుందేమో చూద్దాం. దానిని అలా ఉంచితే, ఆఫ్రికా ఊళ్ళ పేర్లలో కూడా ‘ఊరు’ ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. రూట్స్ నవలలో కుంటా కింటే ఊరి పేరు జఫూరు.

పద్ధతిగా వ్యవసాయమూ, సేద్యపునీటి వ్యవస్థా, దేవాలయనిర్మాణమూ ప్రారంభమైంది కూడా మెసపొటేమియా, ఈజిప్టులలోనే. సామాజిక వ్యవస్థలు ఏర్పడిందీ అక్కడే. అంటే, ఈ ప్రాంతాల ప్రజలు కొంత మేరకైనా కడుపులో చల్ల కదలకుండా స్థిరజీవితానికి అలవాటుపడినవాళ్ళన్నమాట. స్థిరజీవితం ఉన్నచోటే నాగరికత పుడుతుంది. చరిత్రకు తెలిసినంతవరకు వీరే తొలి నాగరికులు. సుమేరులకు లిపి కూడా తెలుసు.

ఆ తర్వాతి కాలంలో, అంటే, క్రీ.పూ. 6000-3000 మధ్యలో టైగ్రిస్ నది ఎగువన అసీరియన్లు నగరాలను స్థాపించడం ప్రారంభించారు. అప్పుడే, ఆసియా మైనర్(నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతం)లోనూ, మధ్యధరా సముద్ర తీరంలోనూ, దీవుల్లోనూ చిన్న చిన్న తెగలు నాగరికతవైపు అడుగులేస్తున్నాయి. ఇదే కాలంలో భారత్, చైనాలలో కూడా ఇదే విధమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. అంటే, ఇది మన దేశంలో సింధు నాగరికతకు చెందిన కాలం అన్న మాట.
ఇలా ఉండగా సుమేరు, ఈజిప్టు ప్రజల ప్రశాంత జీవన సరస్సును కల్లోల పరిచే ఒక పెద్ద పరిణామం త్వరలోనే జరిగింది— అది సంచార తెగల రూపంలో!
ఆ కాలంలో మూడు ముఖ్య ప్రాంతాలలో, మూడు ముఖ్య రకాలకు చెందిన సంచారజీవులు ఉండేవారు. మొదటి రకం, యూరప్ అడవుల్లో వేటాడుతూ, పశువులను కాచుకుంటూ జీవిస్తున్న నోర్డిక్ జాతివారు. క్రీ.పూ. 1500కు ముందు వీరు తొలి నాగరికులకు తెలియరు. రెండవ రకం, తూర్పు ఆసియాలో విశాల పచ్చిక మైదానాలలో జీవించే వివిధ మంగోల్ తెగలు, హున్నిస్ తెగలు. వీరు అప్పటికి గుర్రాలను మచ్చిక చేస్తున్నారు. వేసవి, శీతాకాల శిబిరాల మధ్య సంచారజీవితం గడుపుతున్నారు. హున్నిస్ తెగలకు, నోర్డిక్ తెగలకు మధ్య రష్యా చిత్తడి నేలలు, కాస్పియన్ సముద్రమూ అడ్డుగోడలుగా ఉన్నాయి. మూడవరకం, సిరియా, అరేబియా ఏడారుల్లో సంచారజీవితం గడుపుతున్న సెమిటిక్ తెగలు. వీరు గొర్రెలను, మేకలను, గాడిదలను కాచుకుంటున్నారు. వీరూ, పర్షియా దక్షిణ ప్రాంతంలో ఉన్న నల్లజనం ఈలమైట్లూ మొదటిసారిగా తొలి నాగరికుల(సుమేరియన్లు, ఈజిప్షియన్లు) సంపర్కంలోకి వచ్చారు. సెమెటిక్ తెగలవారు ఒకపక్క తొలి నాగరిక ప్రాంతాలపై దాడులు చేస్తూ, మరోపక్క వారితో వర్తక వ్యాపారాలు సాగించేవారు.

ఇక్కడ స్థిరజీవులకు, సంచారజీవులకు మధ్యనున్న తేడా గురించి హెచ్. జీ. వెల్స్ రాస్తారు.

స్థిరజీవనం సాగించే వ్యవసాయదారులకన్నా సంచారజీవులు దృఢంగా ఉంటారు. జనాభా పరిమితంగా ఉంటుంది. వీరికి శాశ్వత దేవాలయాలు కానీ, పటిష్టమైన పూజారివ్యవస్థ కానీ ఉండవు. అలాగని వీరిది అంతగా అభివృద్ధి చెందని జీవన విధానమని అనుకోనవసరం లేదు. వ్యవసాయదారులతో పోల్చితే, వీరిది అనేకవిధాలుగా సంపూర్ణజీవితం. ప్రతి వ్యక్తీ తన రక్షణ తను చూసుకోగలిగేలా ఉంటాడు. గుంపులో ఒకడుగా ఉండడు. వీరిలో నాయకుడికే ఎక్కువ ప్రాముఖ్యం, పూజారికి తక్కువ ప్రాముఖ్యం.

విస్తారమైన ప్రదేశాలను చూస్తారు కనుక సంచారజీవులకు విశాల జీవన దృక్పథం అలవడుతుంది. స్థిరజీవుల తీరు తెన్నుల్ని వారు ఆకళించుకుంటారు. అపరిచితులను చూడడానికి అలవాటుపడతారు. పచ్చికభూముల విషయంలో వారు ఇతర తెగలతో పోటీ పడవలసివస్తుంది. ఆ పోటీ సహజంగానే ఘర్షణలకు దారితీస్తుంది. కనుక అందుకు అవసరమైన వ్యూహాలను వారు రచించుకోవలసివస్తుంది. కనుమలు, కొండలు, గుట్టల మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు కనుక, వ్యవసాయదారులకు కన్నా వారికి లోహాలతో ఎక్కువ పరిచయం ఏర్పడుతుంది. ఆవిధంగా వారు మంచి లోహశాస్త్రనిపుణులు(metallurgists) అవుతారు. కంచును కనిపెట్టినదీ, ఇనుమును కరిగించడం నేర్చిందీ కూడా సంచారజీవులే ననడానికి ఆధారాలున్నాయి. ముడి ఇనుమునుంచి ఇనుమును వేరు చేసి తయారు చేసిన తొలి పరికరాలలో కొన్ని, తొలి నాగరికతాప్రాంతాలకు చాలా దూరంగా, మధ్య యూరప్ లో దొరకడం ఇందుకొక సాక్ష్యం.

మరోవైపు, స్థిరజీవనులకు వస్త్రాలు నేయడం, కుండలు చేయడం, ఇతర నిత్యావసరవస్తువులను తయారుచేయడం తెలుసు. ఇలా సంచార, స్థిరజీవనుల మధ్య ఉన్న జీవన వైవిధ్యం ఒకవిధమైన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలకూ దారి తీయడంలో విశేషం లేదు. అందులో ఒకవైపు దోచుకోవడం, ఇంకోవైపు వర్తక సంబంధాలను నెరపడం–రెండూ ఉంటాయి. ప్రత్యేకించి సుమేరియా గురించే చెప్పుకుంటే, దానికి ఒక పక్క ఎడారులున్నాయి. ఇంకో పక్క వివిధ ఋతువులు ప్రభావం చూపే ప్రాంతం ఉంది. సంచారజీవులు పంటభూములకు దగ్గరలో గుడారాలు వేసుకుని ఉండడం పరిపాటి కావచ్చు. వీరు వర్తకానికీ, దొంగతనానికీ కూడా పాల్పడుతూ ఇండచ్చు. నేటికీ జీప్సీలలో ఇది చూస్తూ ఉంటాం. (మన దగ్గర కూడా పల్లెటూళ్లలోనూ, పట్టణ, నగర శివార్లలోనూ ఖాళీ ప్రదేశాలలో గుడారాలు వేసుకునే సంచారజీవుల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటాం). సంచారజీవులు తమ వెంట తెచ్చిన విలువై రాళ్ళ(నవరత్నాలు)నూ, లోహాలనూ, తోలునూ; వేటాడే జాతులవారైతే జంతుచర్మాలనూ ఇచ్చి, స్థిరజీవనులనుంచి కుండలు, పూసలు, గాజు, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకునేవారు.

ఇలా ఉండగా…

క్రీ.పూ. 2750 (జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ. 2350) నాటికి ఈ సెమెటిక్ తెగలలోంచి ఒక మహానాయకుడు అవతరించాడు. అతను చదువుసంధ్యలు లేని ఒక బర్బరుడు(బార్బేరియన్). అతను సుమేరియా మొత్తాన్ని జయించాడు. పర్షియా సింధుశాఖనుంచి మధ్యధరాసముద్రం వరకూ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. అతని పేరు సారగాన్. అతని ప్రజలు అక్కడియన్లు. సారగాన్ తన ప్రజలకు సుమేరు లిపిని నేర్పించి, సుమేరు భాషను అధికారభాషగా, విద్యావంతుల భాషగా అమలు చేశాడు. ఇతను, ఇతని వంశీకులు సుమేరు ప్రజలతో, వారి భాషా సంస్కృతులతో పాలు, నీళ్లలా కలసిపోయారు.

200 ఏళ్ళ తర్వాత అమొరైట్లు సుమేరియాను ఆక్రమించుకుని తొలి బాబిలోనియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీనిని హమ్మురాబీ(క్రీ. పూ. 2100… జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ.1728) మరింత పటిష్టం చేశాడు. ప్రపంచానికి తొలి శిక్షాస్మృతిని ఇచ్చిన రాజుగా ఇతన్ని చెబుతారు.

ఇతని కాలంలోనే సెమెటిక్కులు ఈజిప్టును ఆక్రమించుకుని షెపర్డ్ రాజుల పేరుతో పాలించారు. అయితే, వీరు ఈజిప్టు భాషాసంస్కృతులతోనూ, ప్రజలతోనూ మమేకం కాలేదు. క్రీ. పూ. 1600 లలో ఈజిప్టులో పెద్ద యెత్తున ప్రజోద్యమం తలెత్తి వీరిని పారదోలింది.

ఫొనీషియన్ల గురించి చెప్పుకునే ప్రయత్నంలో ఈ చరిత్ర అంతా తడమాల్సివచ్చింది. ఇంతకీ విషయమేమిటంటే, సారగాన్, హమ్మురాబీ, షెపర్డ్ రాజుల్లానే ఫొనీషియన్లు కూడా సెమెటిక్కులు. వీరు సముద్రయానం చేస్తూ నావికులుగా, వర్తకులుగా ప్రసిద్ధి చెందారు. వీరు తొలి నౌకావర్తకులలో ఒకరు. మొదట్లో పశ్చిమ ప్రాంతంలో, ఎక్కువగా స్పెయిన్ లో ఉండేవారు. హమ్మురాబి కాలం నాటికి వీరు మధ్యధరా సముద్రప్రాంతం అంతటా విస్తరించి వలసలు ఏర్పాటు చేశారు. మధ్యధరా తూర్పు తీరం వెంబడి వీరు నెలకొల్పిన రేవు పట్టణాలలో టైర్, సిడాన్ ముఖ్యమైనవి. ఆఫ్రికా ఉత్తరతీరంలో వీరు నిర్మించిన నగరం కార్తేజ్. ఒకప్పుడు పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం అది.

ఫొనీషియన్లు మధ్యధరా జలాలలో తిరిగిన తొలి నావికులలో ఒకరే కానీ, తొలి నావికులు కారు. వారికి ముందే మధ్యధరా సముద్రతీరంలోనూ, దీవుల్లోనూ కొన్ని పట్టణాలూ, నగరాలూ ఉండేవి. బాస్క్, బెర్బర్, ఈజిప్షియన్ తెగలతో రక్తసంబంధం, భాషా సంబంధం ఉన్న ఏజియన్ జాతి లేదా జాతులకు చెందినవి ఇవి. వీరినే గ్రీకులుగా పొరబడతారు కానీ, కాదు. గ్రీకులకు పూర్వులైన వీరి నగరాలు గ్రీస్, ఆసియా మైనర్, మైసీనియా, ట్రాయ్ లలో ఉన్నాయి. వీరికే చెందిన క్రీటు ద్వీపంలోని క్నోసోస్ అప్పటికి మంచి ఉచ్చ దశలో ఉంది. ఈ ఏజియన్లే చరిత్రకు తెలిసిన తొలి నావికులు.

మన సింధు నాగరికత లానే క్రీటు నాగరికత కూడా ఒక విస్మృతనాగరికత. 19 వ శతాబ్ది చివరిలో జరిపిన పురావస్తు తవ్వకాలలో క్రీటు నగరం క్నోసోస్ బయటపడింది. అప్పటినుంచే ఏజియన్ నాగరికతా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసింది. క్రీ.పూ. 1400 నాటికి క్రీటు కూడా మన సింధు నాగరికత లానే హఠాత్తుగా అంతరించిపోయింది. తవ్వకాలలో బయటపడిన క్నోసోస్ శిథిలాలలో అగ్నిప్రమాదం, భూకంపం సంభవించిన ఆధారాలు కనిపించాయి. అవి రెండూ కబళించగా మిగిలిన దానిని గ్రీకులు దోచుకుని ఉంటారని ఊహ.

క్నోసోస్ నిజానికి ఒక నగరం కాదు, ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు పాలకుని పేరు మినోస్. ఈజిప్టు ఫారో లానే ఇది కూడా రాచరిక నామం. క్నోసోస్ కు మొదట్లో కోటగోడలు లాంటివి ఏవీ ఉండేవి కావు. రాజప్రాసాదంలో స్నానశాలల వంటి వసతులన్నీ ఉండేవి. క్రీటులో స్త్రీపురుషుల మధ్య పూర్తి సమానత్వం ఉండేది. నాటి క్రీటు స్త్రీలు ధరించిన దుస్తులు నేటి కాలపు దుస్తుల్ని తలపించేలా ఉంటాయి. క్రీటు ప్రజలు ఒక నిరంతర ఉత్సవ వాతావరణంలో ఉల్లాసంగా జీవించినవారుగా కనిపిస్తారు. స్త్రీపురుషుల జిమ్నాస్టిక్సే కాదు, యెడ్ల యుద్ధాలు(bull fights) కూడా క్రీటులో ఉండేవి. ఇప్పటికీ స్పెయిన్ యెడ్ల యుద్ధాలకు ప్రసిద్ధమే.
01bulfight.xlarge1

విశేషమేమిటంటే, ఇప్పటి బుల్ ఫైటర్లు ధరించే దుస్తులకు, అప్పటి క్రీటు బుల్ ఫైటర్లు ధరించిన దుస్తులకు పోలిక ఉండడం!

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, గ్రీకుల ఆక్రమణ కంటే ముందే క్రీటు దీవి పక్కన తిష్ట వేసిన సెమెటిక్ సంచారజీవులైన ఫొనీషియన్లు క్రీటుపై దాడులు చేస్తూ ఉండేవారు. మరోవైపు ఉత్తర దిశనుంచి గ్రీకు నావికులు దాడులు చేస్తూ ఉండేవారు. ఈ దాడుల ఫలితంగానే క్రీటు రాజప్రాసాదం చుట్టూ కోటగోడలు లేచాయి. ఆ రోజుల్లో నావికులు వర్తకవ్యాపారాలే కాక, దోపిడీలు చేస్తుండేవారని పైన చెప్పుకున్నాం.

ఫొనీషియన్లు క్రీటు వాసుల తర్వాతే చరిత్ర తెర మీదికి వచ్చి ఉండచ్చు కానీ, వారిని కూడా క్రీటులానూ, మరికొన్ని పురా నాగరికతల్లానూ పాత ప్రపంచానికి పరిమితం చేస్తూ కాలగర్భంలోకి నెట్టి వేసే ఒక కొత్త కెరటం త్వరలోనే మరింతగా ఉధృతంగా విరుచుకు పడింది. పైన చెప్పుకున్న గ్రీకులు ఆ కెరటంలో ఒక భాగమే. అది తొలి నాగరిక ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త ప్రపంచానికి జన్మ నిచ్చింది. ఆ కెరటం పేరు, ఆర్యులు!

ఈ మధ్యలో, ఇప్పుడు యూదులుగా మనకు బాగా తెలిసిన హిబ్రూలకు, ఫొనీషియన్లకు మధ్య ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఏర్పడి, ఫొనీషియన్ల సముద్రవర్తకం మరింత విస్తరించింది. అందులోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. క్రీటుతో సహా పైన చెప్పినదంతా(మధ్యలో మన గురించిన ఒకటి రెండు ప్రస్తావనలు తీసేస్తే) పాశ్చాత్యచరిత్రకారుని వెర్షన్ మాత్రమే. ఇందులో మన దేశం తాలూకు లింకులను గుర్తించాలంటే రాంభట్ల, కోశాంబీల వెర్షన్లు చూడాల్సి ఉంటుంది. ఇలా అనడమైతే తేలిగ్గా అన్నాను కానీ, పూర్తి స్థాయిలో అది ఇప్పట్లో సాధ్యమని చెప్పలేను.

దేవతల కుక్క

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

మళ్ళీ కథలోకి వెడదాం…

ఉపయాజుడు సహాయకుడిగా ద్రుపద దంపతుల చేత యాజుడు పుత్రకామేష్టి చేయించాడని చెప్పుకున్నాం. అప్పుడు మంత్ర, ఆహుతులతో తృప్తుడైన అగ్ని వల్ల ఒక పుత్రుడు పుట్టాడు. అతని దేహం అగ్నిజ్వాలలా ఉంది. ఒక చేతిలో కత్తి,                                 ఇంకో చేతిలో విల్లు ధరించాడు. నెత్తి మీద కిరీటం ఉంది. రథాన్ని అధిరోహించి ఉన్నాడు.

ఆ తర్వాత యజ్ఞకుండం లోంచి ఒక అమ్మాయి పుట్టింది. ఆమె దేహం నల్ల కలువలా, కోమలంగా, ఎలాంటి వంక లేకుండా, కలువ గంధంతో ఉంది. ఆమె కళ్ళు కలువపత్రాలలా ఉన్నాయి. ఆమె దివ్యతేజస్సుతోనూ, ప్రసన్నంగానూ, సంతోషంగానూ ఉంది.

కొడుకుకి ధృష్టద్యుమ్నుడనీ, కూతురికి కృష్ణ అనీ ఆకాశవాణే నామకరణం చేసింది. ఈ విధంగా కొడుకును, కూతురిని పొందినందుకు సంతోషించిన ద్రుపదుడు యాజునికి దక్షణలిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ఆ తర్వాత ధృష్టద్యుమ్నునికి ధనుర్వేదం నేర్పించాడు. కృష్ణకు యుక్తవయసు రాగా వివాహప్రయత్నం ప్రారంభించాడు.

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల (ద్రుపదుడి కూతురు కనుక కృష్ణ ద్రౌపది అయింది) పుట్టుక గురించి ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో నన్నయ కథనం ఇంత మేరకే ఉంది. కానీ సంస్కృత భారతంలో ఆసక్తికరమైన అదనపు సమాచారం ఉంది. అందులోకి వెళ్ళే ముందు నన్నయ కథనం విడిచిపెట్టిన కొన్ని సందేహాల జాగాలను చూద్దాం.

***

మొదటిది, తన అన్న యాజునితో పుత్రకామేష్టి జరిపించుకోమని ద్రుపదునికి సలహా ఇవ్వడానికి ఉపయాజుడు ఏకంగా ఏడాది సమయం ఎందుకు తీసుకున్నట్టు? ఈ ఏడాదిలో ఏం జరిగి ఉంటుంది? ద్రుపదుని కోరికకు తగిన అబ్బాయిని, అమ్మాయిని వెతకడానికి అంత సమయం పట్టిందనుకోవాలా? వారిద్దరినీ ద్రుపదుడు దత్తు తీసుకున్నాడనీ, పుత్రకామేష్టి అన్నది దత్తత స్వీకార ప్రక్రియను సూచిస్తోందనుకుంటే ఆ ఏడాది వ్యవధి అర్థవంతంగానే కనిపిస్తుంది.

ఇంతకన్నా ఎక్కువ అనుమానాన్నే కాక, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తిస్తున్నవి; ఉపయాజుడు తన అన్న గురించి అన్న మాటలు. నాకు సంపద మీద కోరిక లేకపోయినా మా అన్నకు ఉందని అతను చెబుతున్నాడు. పైగా, సంపద కోరుకునేవాడు అది మంచిదా, చెడ్డదా అన్నది పట్టించుకోడనీ, తన అన్న అలాంటివాడే ననీ- ఒక పండు ఉదాహరణద్వారా ఉపయాజుడు చెబుతున్నాడు. ఆపైన యాజుడు కుటుంబభారాన్ని మోస్తున్నాడని కథకుడే ఆ తర్వాత అంటున్నాడు. (కుటుంబ పోషణకోసం) తన అన్న ఎలాంటి అపవిత్రధనానికైనా ఆశపడతాడని ఉపయాజుడు అనడంలో ద్రుపదుని ధనం అలాంటిదే నన్న సూచన స్పష్టంగా ఉంది. ఈ సందర్భంలో, అంటే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల పుట్టుక సందర్భంలో, ద్రుపదుని ధనం ఎందుకు దోషభూయిష్ఠం అయినట్టు? ఈ ప్రశ్నకు ఇతరత్రా నమ్మశక్యమైన సమాధానం దొరకనప్పుడు అంతిమంగా, అనివార్యంగా కలిగే అతిపెద్ద అనుమానం; ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదైనా ‘గూడుపుఠాణీ’ ఉందా అన్నదే!

గూడుపుఠాణీ ఉందనే ఉనుకుంటే, అన్న కంటే ఎక్కువ తపశ్శాలి అన్న కీర్తి తనకు ఉంది కనుక, అందులో తను భాగస్వామి కావడానికి ఉపయాజుడు నిరాకరించి అన్న పేరు సూచించడం అర్థవంతంగానే ఉంటుంది. అన్నకు కుటుంబభారం ఉండడం ఒక వెసులుబాటు. కుటుంబపోషణకోసం అన్నప్పుడు మంచి ధనం, చెడ్డ ధనం అన్న విచక్షణలో కొంత మినహాయింపు ఉంటుంది. అయితే, స్వయంగా పుత్రకామేష్టి చేయించడానికి నిరాకరించిన ఉపయాజుడు అన్నకు సహాయంగా ఎందుకు వెళ్లాడన్న ప్రశ్న వస్తుంది. తనే ద్రుపదునితో క్రతువు చేయిస్తే ఉపయాజుడు అందులో ప్రత్యక్షభాగస్వామి అవుతాడు. అన్నకు సహాయకుడిగా పాల్గొంటే పరోక్షభాగస్వామి మాత్రమే అవుతాడు. తీవ్రతలో రెండింటి మధ్యా సహజంగానే తేడా ఉంటుంది. దానికి తోడు సోదరధర్మం అనే అదనపు కవచం ఉపయాజునికి ఉంది.

‘గూడుపుఠాణీ’ అనకపోతే, ఇప్పుడు అంతకంటే ఒకింత ఎక్కువ మర్యాదగా ధ్వనించే ‘రాజకీయం’ అనుకున్నా అనుకోవచ్చు. ద్రోణుడి మీద పగ తీర్చుకోడానికి సమర్థుడైన కొడుకునూ, అర్జునుని వరించగల కూతురునూ కనాలనే ద్రుపదుని నిర్ణయం, రాజకీయ నిర్ణయం! ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ద్రుపదుడు చేసిన పని, ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం! ఈ సందర్భంలో ద్రుపదునికి బ్రాహ్మణులతో రెండు రకాల అవసరం ఉంది. మొదటిది సరే, ప్రతీకారం తీర్చుకోవడం కూడా ఒక ‘యజ్ఞ’మే కనుక దానిని జరిపించవలసింది బ్రాహ్మణులే. గణసమాజంలో లేదా పురాతన సమాజంలో మతకర్మ, లౌకిక కర్మ అంటూ విడి విడిగా లేవనీ; ప్రతిదీ మతకర్మే ననీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

రెండోది, ద్రుపదుని పగకు లక్ష్యమైన ద్రోణుడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణులను మంచి చేసుకుని వారి మద్దతును కూడగట్టుకోవడం ద్రుపదునికి ఒక రాజకీయ అవసరం.

ఇక్కడ ద్రుపదుడికి సర్పయాగఘట్టంలోని జనమేజయునితో పోలిక అచ్చుగుద్దినట్టు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది. జనమేజయుడు అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడు. అతని తండ్రి పరీక్షిత్తును నాగప్రముఖులలో ఒకడైన తక్షకుడు చంపుతాడు. అందుకు తక్షకుని మీదే కాక నాగులందరి మీదా జనమేజయుడు పగబడతాడు. దీని పూర్వాపరాల గురించి నా సర్పయాగవ్యాసాలలో వివరంగా రాశాను కనుక ఇప్పుడు వాటిలోకి పూర్తిగా వెళ్ళకుండా ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒకటి, రెండు అంశాలకు పరిమితమవుతాను.

మొదట దీర్ఘసత్రయాగం చేసిన తర్వాత జనమేజయుడు సర్పయాగానికి పూనుకుంటాడు. అంతకంటే ముందు అతడు చేసిన మొదటి పని-పురోహితుని కోసం అన్వేషణ. ద్రోణునిపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ద్రుపదుడు చేసింది కూడా అదే. బ్రాహ్మణులను మంచి చేసుకుంటూ తనతో పుత్రకామేష్టి చేయించగల యాజ్ఞికుని అన్వేషణలో పడతాడు. జనమేజయుని విషయానికి వస్తే, అప్పుడప్పుడే అంత పెద్ద సత్రయాగం (సత్రయాగం పన్నెండేళ్ళపాటు జరిగే యాగం) చేసినవాడు అంతలోనే పురోహితుని వెతుకులాటలో పడడమేమి టనిపిస్తుంది. అందులోనే ఉంది అసలు మర్మం. అతనికి కావలసింది ఎవరో ఒక పురోహితుడు కాదు, నాగులతో సంబంధం ఉన్న పురోహితుడు! ఎందుకంటే తను నాగసంహారానికి బయలుదేరుతున్నాడు. తన రాజ్యంలోని బ్రాహ్మణులలో అనేకమంది అప్పటికే నాగులతో బంధుత్వాలు కల్పించుకున్నారు. కనుక నాగుల వధలో వారి మద్దతు అతనికి కీలకం అవుతుంది.

పురోహితుని అన్వేషణలో జనమేజయుడు అనేక మున్యాశ్రమాలను సందర్శిస్తాడు. అలాగే శ్రుతశ్రవుడు అనే మునిని కలసుకుని, అతని కుమారుడు సోమశ్రవసుని తనకు పురోహితునిగా ఇమ్మని అడుగుతాడు. కొన్ని షరతులమీద ఇవ్వడానికి శ్రుతశ్రవుడు ఒప్పుకుంటాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితుని చేసుకుని నాగులపై ప్రతీకార చర్యకు పూనుకుంటాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సోమశ్రవసుని తల్లి నాగజాతిస్త్రీ. ఆ విధంగా అతనికి నాగులతో సంబంధం. నాగసంబంధీకుడు పురోహితుడుగా ఉండగా తను నాగులను ఊచకోత కోస్తే తన రాజ్యంలోని నాగసంబంధీకులలో తన చర్యపట్ల ఆగ్రహం కొంతైనా పలచనవుతుంది. కొంత మేరకైనా తన చర్యకు నైతిక ఆమోదం లభిస్తుంది. ఇదీ పురోహితుని ఎంపికలో జనమేజయుడు పాటించిన రాజకీయపు మెళకువ.

నేటి ప్రజాస్వామిక రాజకీయాలలో కూడా ఇలాంటి మెళకువలను పాటించడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు, ఒక ప్రభుత్వమో పార్టీయో తమపట్ల వివక్షతోనో, వ్యతిరేకతతోనో వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాల వారు, లేదా ఆయా కులాల వారు ఆరోపించినప్పుడు; ఆ ఆరోపణను ఖండించడానికి ఆ వర్గాలవారినీ, కులాలవారినే బరిలోకి దింపుతుంటారు. ద్రుపదుడు, జనమేజయుడు పాటించినది సరిగ్గా ఇలాంటి రాజనీతినే.

Snakesacrifice

***

నన్నయ అనువాదం మీద నాకు అతి పెద్ద ఫిర్యాదు ఏమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలను ఆయన తన అనువాదంలోకి తీసుకురాకపోవడం. ఆయన ఏ ఉద్దేశంతో వాటిని పరిహరించాడో తెలియదు. ఏ ఉద్దేశంతో పరిహరించినా సంస్కృతభారతానికి ఉన్న పురాచారిత్రకతా లక్షణం తెలుగు భారతంలో చాలాచోట్ల లోపించింది. ఉదాహరణకు, జనమేజయుడు ఎవరో ఒక పురోహితుడి కోసం కాక, నాగజాతితో సంబంధం ఉన్న పురోహితుని కోసం అన్వేషణలో పడ్డాడన్న వివరం సంస్కృత భారతంలో ఉంది తప్ప తెలుగు భారతంలో లేదు. దాంతో కొందరు బ్రాహ్మణులకు నాగజాతీయులతో సంబంధం ఏర్పడిందన్న పురాచారిత్రక సమాచారం, జనమేజయుని చర్యలోని రాజకీయకోణం ఆ మేరకు మరుగున పడ్డాయి. అలాగని తెలుగు భారతం వాటిని పూర్తిగా మరుగుపరచిందా అంటే అదీ జరగలేదు. వాటిని ఎత్తి చూపే సాక్ష్యాలు తెలుగు భారతంలోనూ, అదే ఘట్టంలో వేరే చోట్ల కనిపిస్తూనే ఉంటాయి.

ఇలాగే, ద్రుపదునితో జరిపించిన పుత్రకామేష్టి గురించి కూడా సంస్కృత భారతంలో ఉన్న అదనపు సమాచారాన్ని, చిత్రణను నన్నయ పరిహరించాడు.

అదలా ఉంచితే, ద్రుపద, జనమేజయులు ఇద్దరి ఉదంతాలనూ కూడా ఇంతకు ముందు చెప్పుకున్న జార్జి థాంప్సన్ పరిశీలనల వెలుగులో చర్చించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, జనమేజయుని సందర్భంలో కోశాంబీని కూడా ఉటంకించుకోవలసిన అవసరం ఉంది.

సర్పయాగానికి ముందు జనమేజయుడు కురుక్షేత్రంలో సత్రయాగం జరుపుతుండగా ఒకరోజున సరమ అనే దేవశుని(దేవతల కుక్క) కొడుకు సారమేయుడు అనేవాడు ఆ యాగప్రదేశానికి ఆడుకోడానికి వెడతాడు. అప్పుడు జనమేజయుని తమ్ముళ్ళు ముగ్గురు-శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు-అనేవారు సారమేయుని కొడతారు. సారమేయుడు ఏడుస్తూ వెళ్ళి ఆ సంగతి తల్లి సరమకు చెబుతాడు. సరమ కోపంతో జనమేజయుని దగ్గరకు వెళ్ళి, ‘నీ తమ్ముళ్ళు ఏమాత్రం కనికరం, వివేకం లేకుండా నిరపరాధుడైన నా కొడుకును కొట్టారు. మంచి, చెడు ఆలోచించకుండా సాధుజీవులకు హాని చేసేవారికి అనుకోని ఆపదలు వస్తాయి’ అని హెచ్చరించి వెళ్లిపోయింది.

సరమ మాటలకు జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. యాగం పూర్తి చేసిన తర్వాత హస్తినాపురానికి వెళ్ళి సరమ హెచ్చరికకు ప్రతిక్రియగా శాంతి, పౌష్టిక విధులు నిర్వహించడానికి పురోహితుని అన్వేషణలో పడతాడు. ఆ తర్వాతి ఘట్టాలు అన్నీ అతని సర్పయాగానికి పూర్వరంగాన్ని కల్పించడానికి ఉద్దేశించినవి. నన్నయ భారతం చెబుతున్నది ఇంతవరకే. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో కొన్ని లింకులు తెగిపోయి స్పష్టత లోపించిన సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు భారతంలో తెగిపోయిన లింకులు’ అనే శీర్షికతో దీనిని నేను నా సర్పయాగవ్యాసాలలో చర్చించాను.

ఇందుకు భిన్నంగా సంస్కృత భారతంలో స్పష్టత కనిపిస్తుంది. ప్రధానంగా సంస్కృత భారతాన్ని ఆధారం చేసుకున్న పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత చరిత్రము’ ప్రకారం, జనమేజయుడు సత్రయాగం పూర్తి కాగానే తక్షకుని నివాసమైన తక్షశిల(నేటి పాకిస్తాన్ లో ఉన్న తక్షశిల ఒకప్పటి విద్యాకేంద్రం)పై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకుంటాడు. యుద్ధానికి ముందు యాగం జరిగింది చూడండి…ఇంతకుముందు చెప్పుకున్నట్టు, వాస్తవికంగా జరగబోయే యుద్ధంలో విజయాన్ని భ్రాంతిపూర్వకంగా ముందే సాధించడానికి ఈ యాగం. అయితే తక్షకుని, మరికొందరు ముఖ్యనాగులను అతను చంపలేదు. బహుశా వాళ్ళు తప్పించుకుని ఉంటారు. ఆ తర్వాత తన సహాధ్యాయి ఉదంకునితో ప్రోద్బలంతో తక్షకుని, ఇతర నాగులను చంపి శత్రుశేషం లేకుండా చేయడానికి సర్పయాగం తలపెడతాడు. అయితే బ్రాహ్మణులలోని నాగసంబంధీకుల మధ్యవర్తిత్వంతో అది మధ్యలో ఆగిపోతుంది.

తెలుగు భారతంలోనే కాక సంస్కృత భారతంలో కూడా ఒక విషయంలో స్పష్టత లోపించింది. అది సరమ హెచ్చరికకు సంబంధించినది. నీ తమ్ముళ్ళు నా కొడుకును అన్యాయంగా కొట్టారు కనుక నీకు అనుకోని ఆపదలు సంభవిస్తాయని జనమేజయుని సరమ హెచ్చరించినా, నిజానికి ఆ తర్వాత ఆపద సంభవించింది జనమేజయునికి కాదు; తక్షకునికీ, ఇతర నాగులకూ! కనుక సరమ మాటలు కథకు అన్వయించడం లేదు. అయితే, కోశాంబీ(The Culture & Civilization of Ancient India in Historical Outline) వివరణనుంచి చూసినప్పుడు కొంత అన్వయానికి వీలు కలుగుతుంది. ఎలాగంటే…

శత్రువులనుంచి కప్పం గుంజుకోడానికి ముందు దూతను పంపించి వారిని భయపెట్టడం ఆర్యులు అనుసరిస్తూ వచ్చిన ఒక పద్ధతి. సరమ దౌత్యం దానినే సూచిస్తుంది.

మహాభారతంలో కంటే ముందు సరమదౌత్యం ఋగ్వేదంలో కనిపిస్తుంది. అది చాలా ప్రసిద్ధం కూడా. ఇంద్రుడు దూతగా పంపిన సరమ అనే శునక దేవతకు, పణులకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో అది ఉంటుంది. ఇంద్రుడికి పశువులను కప్పంగా చెల్లించమని సరమ అడుగుతుంది. పణులు అందుకు తిరస్కరిస్తారు. అప్పుడు, మీకు ఆపదలు సంభవిస్తాయని సరమ వారిని హెచ్చరిస్తుంది. తదనంతర పరిణామం, ఇంద్రుడు వాళ్లమీద దాడి చేయడం.

దీనికి వ్యాఖ్యాతల వివరణ మరో విధంగా ఉంటుంది. దాని ప్రకారం, పణులు ఇంద్రుడి పశువులను దొంగిలించారు. వాటిని తిరిగి తనకు అప్పగించమనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ సరమను పంపి ఇంద్రుడు వారిని హెచ్చరించాడు. వాస్తవంగా సరమ-పణుల సంభాషణ రూపంలోని ఆ మంత్రంలో పణుల దొంగతనం గురించి లేదు. కనుక అది వ్యాఖ్యాతల కల్పన కావచ్చు.

దానిని అలా ఉంచితే, మన ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒక ముఖ్యమైన వివరాన్ని ఇక్కడ కోశాంబీ అందిస్తున్నారు. ఋగ్వేదంలోని ఈ సరమ-పణుల సంభాషణ, నిజంగా జరిగిన ఒక చారిత్రక ఘటనను తంతు రూపంలో స్మరించుకుంటోంది. అంటే, ఒక సందర్భంలో అలా దూతను పంపి శత్రువును కప్పం అడగడం, ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం, శత్రువు తిరస్కరించడంతో దాడి చేయడం, ఆ దాడిలో విజయం సాధించడం జరిగి ఉంటాయి. ఆవిధంగా ఈ దౌత్యప్రక్రియ ఒక ఆనవాయితీగా, లేదా మతకర్మగా మారిపోయింది. పురాసమాజంలో లౌకిక కర్మకు, మతకర్మకు తేడా లేదన్న సంగతిని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒక మంచి ఫలితం ఇచ్చిన ఏ కర్మ అయినా మతకర్మగా మారిపోతుంది. అది మతపరమైన తంతులో భాగమవుతుంది. అందుకే సరమ-పణుల సంభాషణ ఋగ్వేద మంత్రంగా మారిపోయింది.

ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే, ఈ సరమ-పణుల సంభాషణ రూపంలోని మంత్రం ఉచ్చరించడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు, అందులో అభినయం కూడా ఉంటుంది (“The exchange of words was not merely chanted, but obviously meant to be acted out, therefore the ceremonial commemoration of some historical event” అని కోశాంబీ వివరణ). అంటే, యుద్ధానికి ముందు విజయాన్ని అపేక్షిస్తూ చేసే యాగంలో ఈ సరమ-పణుల సంభాషణ ఒక తంతు రూపంలో మంత్రపూర్వకంగానూ, అభినయపూర్వకంగానూ భాగమవుతుందన్న మాట. జనమేజయుడు తక్షశిల పై దాడికి ముందు చేసిన సత్రయాగ సందర్భంలోనే అతనితో సరమ సంభాషణ జరగడం గమనార్హం.

పైన చెప్పుకున్నట్టు, ‘నీకు అనుకోని ఆపదలు వస్తా’యని సరమ జనమేజయుని హెచ్చరించినా, వాస్తవానికి ఆపద సంభవించింది తక్షకునికీ, ఇతర నాగులకూ కనుక, సరమ మాటలు కథకు అన్వయించని మాట నిజమే. అయితే, ఒక తంతులో భాగమైన ఆనవాయితీగా దానిని చూసినప్పుడు అన్వయం కుదురుతుంది.

ఒకానొక చారిత్రక ఘటన అనంతరకాలంలో మంత్రరూపంలోకి, అభినయరూపంలోకి మారి తంతులో ఎలా భాగమవుతుందో చెప్పడానికి కోశాంబీ ఇంకో ఉదాహరణ ఇస్తారు. అది, ‘సీమోల్లంఘన’. పూర్వం ఆశ్వయుజమాసంలో, అంటే శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి పండుగ వస్తుంది. ఆ పండుగ పేరులోనే యుద్ధ సూచన ఉంది. ఈ సందర్భంలో ఆయుధాలను పూజిస్తారు. యుద్ధానికి వెళ్ళేముందు రాజులు ఒక తంతు రూపంలో సీమోల్లంఘన జరుపుతారు. అంటే తమ రాజ్యం సరిహద్దులను దాటతారు. అది యుద్ధానికి వెడుతున్నట్టు అభినయపూర్వకంగా సంకేతించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల ఇప్పటికీ దసరా సందర్భంలో సీమోల్లంఘనను అభినయిస్తారు. శమీపత్రాలను(జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చుకోవడమూ ఉంది. పూర్వం శూలం, గద, విల్లు మొదలైన ఆయుధాలను జమ్మి కొయ్యతోనే తయారు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లబోయేముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచుకున్నారు…

సరే, దీనిపై మరిన్ని వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం కనుక, విషయానికి వద్దాం. సంస్కృత భారతంలో జనమేజయుని సర్పయాగ ఘట్టం, సరమ దౌత్యఘట్టం లానే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. నన్నయ అనువాదంలో ఈ రెండూ లోపించాయి. అలాగే, సంస్కృత భారతంలో ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టం కూడా అంతే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. మళ్ళీ నన్నయ అనువాదంలో ఇవి లోపించాయి. వాటి గురించి చెప్పుకునే ముందు, విషయాంతరంలా కనిపించినా ఒక ఆసక్తికరమైన చరిత్రను పాఠకులతో పంచుకోవాలనిపిస్తోంది. అది, పైన సరమ ఉదంతంలో చెప్పుకున్న ‘పణు’ల గురించి.

అది వచ్చే వారం…

 

 

యజ్ఞమూ…మాంత్రిక వాస్తవికతా…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

యాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు…

నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు. కానీ ఆయనను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే అందుకు చాలా వ్యాసాలు తీసుకుంటాయి. అదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అలాగని పూర్తిగా వాయిదా వేసే అవకాశమూ కనిపించడం లేదు. కనుక థాంప్సన్ అనే సముద్రంలోకి దూకడం అనివార్యమవుతోంది. త్వరగానే పైకి తేలడానికి ప్రయత్నిస్తాను.

నేను చాలా ఏళ్ల క్రితం మాంత్రిక వాస్తవికత (Magical Realism) మీద థాంప్సన్ రాసిన ఒక చిన్న పుస్తకం చదివాను. ఎంత థ్రిల్లయ్యానో చెప్పలేను. నృత్యం, కవిత్వం, సంగీతం, నాటకం మొదట ఒకటిగా ఎలా ఉండేవో, క్రమంగా ఎలా విడిపోయాయో అందులో ఆయన రాశారు. నేను థ్రిల్ అవడానికి అదొక కారణమైతే, మన సంస్కృత, దేశీయ నాటకాలు, ఇతర దృశ్య రూపాలు, జానపద కళల పరిణామ క్రమానికి కూడా ఆయన పరిశీలన యథాతథంగా అన్వయించేలా ఉండడం అంతకంటే పెద్ద కారణం. థాంప్సన్ తనకు బాగా తెలిసిన గ్రీకు, ఇతర యూరోపియన్ సంప్రదాయాల గురించే రాశారు తప్ప మన సంప్రదాయం ఆయనకు అంత బాగా తెలుసునని చెప్పలేం. కానీ ఆ పుస్తకం అద్దంలో మన సంప్రదాయాన్ని కూడా చూసుకోవచ్చు.

STUDIES IN ANCIENT GREEK SOCIETY

ఆ పుస్తకం నా దగ్గరనుంచి ఎలా మాయమైందో తెలియదు. దాని కోసం ఎంతో గాలించాను. దొరకలేదు. నెట్ లో వెతికాను. కనిపించలేదు. మరింత గట్టిగా శోధిస్తే కనిపించేదేమో తెలియదు. ఈ లోపల ఆయన రాసిన మరో పుస్తకం దొరికింది. దాని పేరు, STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AGEAN. రాంభట్ల గారు ఒకటి, రెండు విషయాలలో జార్జి థాంప్సన్ పేరు ప్రస్తావించడంతో వాటి గురించి ఉంటుందనే కుతూహలంతో ఆ పుస్తకం తెప్పించుకున్నాను. కానీ రాంభట్ల పేర్కొన్న సమాచారం అందులో దొరకలేదు. ఆయనకు సోర్సు చెప్పే అలవాటు లేకపోవడం ఓ సమస్య. కానీ పై పుస్తకంలో నేను పోగొట్టుకున్న పుస్తకంలోని విషయాలు కొంతవరకు ఉన్నాయి.

ఇందులో THE ART OF POETRY పేరుతో ఒక అధ్యాయం ఉంది. దాని ప్రారంభంలోనే నాకు ఇంకో ఆశ్చర్యం. కవిత్వం పుట్టుక, దాని స్వభావాల గురించి చెప్పడం ఈ అధ్యాయంలోని విషయమనీ, దానిని ఒక సైంటిఫిక్ అంశంగా తను చర్చించబోతున్నాననీ ఆయన అంటారు. కవిత్వాన్ని కవిత్వం కోసమే ఆస్వాదించి ఆనందించేవారికి ఈ రకమైన పరిశీలన అంత సమంజసంగానూ, ఆకర్షణీయంగానూ కనిపించకపోవచ్చనీ, కానీ నిజానికి శాస్త్రీయదృక్పథం నుంచి కవిత్వాన్ని అధ్యయనం చేయడంలో మరింత ఎక్కువ ఆనందం ఉంటుందనీ అంటారు. ఇక్కడ ఆశ్చర్యం దేనికంటే, ఈ వాక్యాలు చదవడానికి చాలా ముందే, 1992లో, ‘కవిత్వంలో వస్తు రూపాలు’ అనే శీర్షికతో నేను రాసిన వ్యాస ప్రారంభం ఇలా ఉంటుంది: ‘ఆధునిక కవిత్వంలో వస్తురూప పరిణామం గురించి చెప్పుకోవడం అంటే బతికి ఉండగానే పోస్ట్ మార్టం చేసినట్టు కొంత బాధగానే ఉంటుంది. అయినా చరిత్రకు అదేమీ ఉండదు.’ george derwent thompson

నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’ పుస్తకం (2006)లో ఈ వ్యాసం ఉంది. కవిత్వాన్ని లేబరేటరీలో బల్ల మీద పెట్టి ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని, ఏ పదానికి ఆ పదాన్ని విరిచి చూసి ఒక శాస్త్రవేత్తలా పరిశీలించాలనే ఒక ‘అకవిత్వ’ దాహం నాలో కలుగుతూ ఉంటుంది. థాంప్సన్ వాక్యాలకూ, నా వాక్యాలకూ పోలిక ఉండడమే నా ఆశ్చర్యానికి కారణం.

థాంప్సన్ ఈ అధ్యాయంలో పురామానవ పరిణామ కోణం నుంచి కవిత్వ పరిణామక్రమాన్ని చర్చించడం నాకు ప్రధాన ఆకర్షణ. గ్రీకు కవిత్వపు పురాచరిత్ర వెలుగులో ఈ పరిశీలన చేస్తున్నప్పటికీ గ్రీకు కవిత్వానికే పరిమితం కాననీ, ఆదిమజాతులకు చెందిన పాటలు, నృత్యాలతో పాటు; ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన ఇంగ్లీష్ కవిత్వాన్ని, ఆధునిక యూరోపియన్ కవిత్వ పరిణామంలో ఇప్పటికీ వెనకటి దశే కొనసాగుతున్న ఐరిష్ కవిత్వాన్ని కూడా ఉపయోగించుకుంటాననీ ఆయన అంటారు. ఆయన చెప్పకపోయినా ఈ పరిశీలన మన కవిత్వ పరిణామక్రమానికీ యథాతథంగా అన్వయిస్తుంది.

ఆయన పరిశీలన ఇంకా ఇలా ఉంటుంది:

ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికీ, గ్రీకు కవిత్వానికీ ముఖ్యమైన తేడా, గ్రీకు కవిత్వం సంగీతబద్ధంగా ఉండడం. గ్రీసులో పురాకాలంలో శుద్ధవాద్యసంగీతం లేదు. వాద్యసంగీతం విధిగా కవిత్వాన్ని అంటిపెట్టుకుని ఉండేది. ఐరిష్ కవిత్వం కూడా అంతే. ఇదేదో అనుమానప్రమాణంతో అంటున్న మాట కాదు. ఇది ఇప్పటికీ ఐరిష్ కవిత్వంలో ఒక సజీవ వాస్తవం. ఈ సందర్భంలో ఐరిష్ కవిత్వంతో థాంప్సన్ ప్రత్యక్షఅనుభవాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం:

“ఎంతో కాలంగా నాకు అచ్చులో తెలిసిన కొన్ని ఐరిష్ కవితలను మొదటిసారి ఒక నిపుణుడైన రైతు గాయకుడు సంప్రదాయ పద్ధతిలో గానం చేస్తుంటే విన్నాను. ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు పూర్తిగా సరికొత్త అనుభవం. ఐరిష్ కవిత్వానికి ఇంకొక లక్షణం ఉంది. ఇంగ్లీష్ ప్రజలు చాలా మంది దృష్టిలో ఇంగ్లీష్ కవిత్వం మూసేసిన పుస్తకం. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారిలో కూడా కవిత్వం అనేది వారి నిత్యజీవితంలోకి పెద్దగానూ, ప్రగాఢంగానూ ప్రవహించే విషయం కాదు. ఐరిష్ మాట్లాడే రైతాంగం విషయం ఇందుకు భిన్నం. వారి దృష్టిలో కవిత్వానికి పుస్తకంతో పనిలేదు. వాళ్ళలో చాలామంది ఇటీవలి వరకు నిరక్షరాస్యులు. కవిత్వం వాళ్ళ పెదవుల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు. వారి దైనందిన సంభాషణలో కూడా కవిత్వం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన ఘటన జరిగినప్పుడు దానిపై అప్పటికప్పుడు పాట కట్టి తమ అనుభూతిని ప్రకటించుకుంటారు. ఇటీవలివరకు అనేక ఐరిష్ గ్రామాలలో శిక్షణ పొందిన సాంప్రదాయిక గాయకుడు ఒక్కరైనా ఉండేవారు. ఆశువుగా కవిత్వం చెప్పే నేర్పు వారికి ఉంటుంది. ఆ క్షణంలో పొందిన ఉత్తేజాన్ని బట్టి అతను చెప్పే కవిత్వం, నేటి ఆధునిక ఇంగ్లీష్ కవిత్వం కన్నా కూడా ఎక్కువ వివరణాత్మకంగా ఉంటుంది.

నాకు బాగా తెలిసిన ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ కవి ఉండేవాడు. ఆయన చనిపోయి నలభై ఏళ్లయింది. ఆయన కవితలన్నీ చాలావరకూ ఆశువుగానూ, సందర్భానుసారంగానూ చెప్పినవే. ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒక విషయం చెప్పారు. ఆయన చనిపోయిన రోజు రాత్రి కూడా మంచం మీద పడుకుని మోచేతి మీద తల పెట్టుకుని ప్రవాహంలా కవిత్వం చెబుతూనే ఉన్నారట.

ఈయన తన వెనకటి తరానికి చెందిన కవి వద్ద శిక్షణ పొందిన వృత్తి కవీ, అసాధారణ ప్రజ్ఞావంతుడు అయితే కావచ్చు కానీ, మిగిలినవారికీ, ఇలాంటి వృత్తి కవులకు మధ్య మరీ అంత మందమైన గీత గీయడం కష్టం. స్థాయిలోనే తేడా ఉండచ్చు కానీ అందరూ కవులే. వాళ్ళ సంభాషణ చూస్తుండగానే కవితాత్మకంగా మారిపోతూ ఉంటుంది. “

ఈ సందర్భంలో థాంప్సన్ మరొకరి గురించిన ముచ్చట కూడా చెప్పారు. ఓ రోజు సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్నఆ గ్రామంలో ఆయన పచార్లు చేస్తూ ఆ ఊరి బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక తెలిసినామె కనిపించింది. ఆమె ఒక వృద్ధ రైతుమహిళ. అప్పుడే బొక్కెనలో నీళ్ళు నింపుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ నిలబడి ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ఏడుగురు కొడుకులు. ఏడుగురూ ‘కట్టకట్టుకుని’ (ఆమె అభివ్యక్తి) మసాచూసెట్స్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ కు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఒక కొడుకు దగ్గరనుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. ‘ఈ చివరి రోజుల్లో మా దగ్గర సుఖంగా ఉందుగాని, వచ్చేయి, నువ్వు సరే నంటే ప్రయాణానికి డబ్బు పంపిస్తా’మని దాని సారాంశం. ఈ విషయం ఆమె థాంప్సన్ తో చెప్పింది. ఆ తర్వాత; కొండలు, బండలు ఎక్కుతూ; ఎగుడు దిగుడు పచ్చిక బీళ్ళ మీద నడుస్తూ జీవితంలో తను పడిన కష్టాల గురించి, తను పోగొట్టుకున్న కోళ్ళ గురించి, పొగచూరిన చీకటి గుయ్యారం లాంటి తన చిన్న ఇంటి గురించి వర్ణించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అమెరికా గురించి మాట్లాడడం మొదలు పెట్టింది. ఆమె ఊహలో అమెరికా అంటే బంగారపు దేశం. అక్కడ కాలిబాటల మీద కూడా బంగారం దొరుకుతుందట. ఆ తర్వాత కార్క్ నగరానికి రైలు ప్రయాణం గురించి, అట్లాంటిక్ దాటడం గురించి మాట్లాడింది. ఆపైన తన శరీరం ఐరిష్ మట్టిలోనే కలసి పోవాలన్న తన కోరిక గురించి చెప్పింది. ఆమె మాట్లాడుతున్న కొద్దీ ఉత్తేజితురాలు కావడం ప్రారంభించింది. ఆమె భాష క్రమంగా మరింత ప్రవాహగుణాన్ని సంతరించుకోసాగింది. అది మరింత ఆలంకారికతను, లయాత్మకతను, శ్రావ్యతనూ పుంజుకుంటూ వచ్చింది. ఆమె దేహం స్వాప్నికమైన ఒక ఊయెలలో ఊగిపోతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆమె బొక్కెన తీసుకుని నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది. తను కవినన్న భావన ఏ కోశానా లేని ఈ నిరక్షరాస్య వృద్ధ మహిళ మాటల్లో కవిత్వానికి ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయని థాంప్సన్ అంటారు. ఇది ఒక ‘పూనకం’(inspired) అంటాడాయన. కవిని పూనకం పట్టినవాడని అనడంలో అర్థమేమిటో తెలుసుకోవాలంటే, ఈనాటికీ ఆదిమజాతుల పెదాలపై నర్తించే ఆదిమకవిత్వంలోకి తొంగి చూడాలంటారు. అయితే, వాళ్ళ సమాజం గురించి కొంతైనా తెలుసుకుంటే తప్ప వారి కవిత్వం అర్థం కాదు.

 

***

ఆధునికతలోకి, లిఖిత కవిత్వంలోకి చాలా ముందే అడుగుపెట్టిన యూరప్ అనుభవం నుంచి చూసినప్పుడు, ఐరిష్ ప్రజల్లో (వారూ యూరొపియన్లే అయినప్పటికీ) వెనకటి ఆశుకవిత్వ సంప్రదాయం కొనసాగుతూ ఉండడం థాంప్సన్ కు సరికొత్త అనుభూతిని కలిగించి ఉండవచ్చుకానీ, అది మనకు అంత ఆశ్చర్యకరం కాదు. మన దేశంలో ఆశుకవిత్వంతో సహా వివిధ సాంప్రదాయిక ప్రక్రియలు ఇప్పటికీ అంతో ఇంతో ఉన్నాయి.

దానిని అలా ఉంచితే కవిత్వం ఒక ప్రత్యేకమైన వాక్కు అంటారు థాంప్సన్. కవిత్వం పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవడమంటే మనిషి ఎలా పరిణామం చెందాడో తెలుసుకోవడమే. మరీ ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా, వాక్కుకు, కవిత్వానికి పరిమితమై చెప్పుకుంటే, వాక్కు అనేది సామూహికశ్రమలో భాగంగా పుట్టింది. శ్రమ చేసేటప్పుడు కండరాల కదలికకు అది సాయపడుతుంది. ఆవిధంగా శ్రమలో భాగమైన వాక్కును శ్రమకు కారణంగా, లేదా చోదకంగా మనిషి అర్థం చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం మాట అనుకుంటున్నది, అతని దృష్టిలో కేవలం మాట కాదు, మంత్రం! ప్రపంచవ్యాప్తంగా ఆదిమసమాజాలు అన్నీ నోటి నుంచి వెలువడిన మాటకు ఒకే విధమైన మాంత్రికతను ఆపాదించుకున్నాయి.

శ్రమ సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ, శ్రమలో గొంతు పాత్ర తగ్గిపొతూ వచ్చింది. వ్యక్తులు సమూహంగానే కాక విడివిడిగా కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే సామూహిక ప్రక్రియ వెంటనే అదృశ్యం కాలేదు. అది, ఒక అసలు కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రదర్శించే రిహార్సల్ రూపంలో మిగిలింది. ఇంతకు ముందు అసలు కార్యంలో భాగమైన సామూహిక కదలికలే ఒక నృత్యరూపంలో రిహార్సల్స్ గా మారాయి. ఈ మూకాభినయనృత్యం ( mimetic dance) ఇప్పటికీ ఆదిమజాతులలో ఉంది. అయితే, నృత్యంలో వాచికాభినయం ఉన్న చోట, ఆ వాచికం మాంత్రిక రూపం తీసుకుంది. అందుకే అన్ని భాషలలొనూ రెండు రకాల వాగ్రూపాలు కనిపిస్తాయి. మొదటిది, నిత్యజీవితంలో మాట్లాడుకునే సాధారణ వాక్కు. రెండవది, కవితాత్మకమైన వాక్కు. క్రతువు, అద్భుతత్వం, లయాత్మకత, మాంత్రికతలతో కూడిన సామూహిక చర్యలకు తోడ్పడే సాంద్రత ఈ కవితాత్మకమైన వాక్కులో ఉంటుంది.

ఈ విధంగా చూసినప్పుడు సాధారణ వాక్కు కంటే కవితాత్మక వాక్కే ప్రాథమికం అని తేలుతుంది. అందుకే ఇప్పటికీ ఆదిమ సమాజాలలో కవితాత్మక వాక్కు, సాధారణ వాక్కుల మధ్య తేడా పూర్తిగా ఏర్పడలేదు. ఐరిష్ ప్రజల దైనందిన సంభాషణ కూడా కవితాత్మకంగా ఉంటుందని అనడంలో మనకిది కనిపిస్తుంది. ఆదిమ సమాజాలలో దైనందిన సంభాషణ కూడా కవితాత్మకం అయినప్పుడు వారి కవిత్వం మాంత్రికం అవుతుంది. వాళ్లకు తెలిసిన కవిత్వ రూపం పాట ఒక్కటే. ఆ పాట ఏదో ఒక శారీరకమైన చర్యను అంటిపెట్టుకుని ఉంటుంది. వారి పాట, ఏ పనీ లేని తీరిక సమయంలో పాడుకునేది కాదు. పనిలో భాగంగా పాడుకునేది. వారికి పని-పాట వేరువేరు కావు. రెండూ ఒకటే. వారు పని ద్వారా ఏ భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారో పాట ద్వారా కూడా అదే భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బాహ్య వాస్తవికతను మార్చి దానినుంచి తమకు అనుకూలమైన ఫలితాలను పొందడానికి, మాంత్రిక స్వభావం కలిగిన పాట రూపంలో బాహ్య వాస్తవికత మీద భ్రాంతి వాస్తవికతను ప్రయోగిస్తారు.

 

అదీ విషయం!

ఈ సందర్భంలో మావొరీలు (న్యూజీలాండ్) జరిపే పొటాటో నృత్యాన్ని థాంప్సన్ ప్రస్తావించారు. ఆడపిల్లలు ఆలుగడ్డలు పండించే పొలానికి వెళ్లి పంట ఎదుగుదలకు అవసరమైన తూర్పు గాలి వీస్తున్నట్టు, వర్షం పడుతున్నట్టు, పంట మొలకెత్తి పెరుగుతున్నట్టు తమ శరీరపు కదలికల ద్వారా సూచిస్తూ పాట పాడుతూ నృత్యం చేస్తారు. అంటే వాస్తవంగా తాము కోరుకునేది ఊహాత్మకంగా సాధిస్తారు. వాస్తవికమైన క్రియకు భ్రాంతిపూర్వక క్రియను జోడించడమే మాంత్రికత.

యాజుడు జరిపించిన పుత్రకామేష్టి గురించి చెప్పుకుంటున్న ప్రస్తుత సందర్భంలో పైన చెప్పుకున్న ప్రతి వివరమూ గుర్తుపెట్టుకోవలసినవే. రిహార్సల్స్ రూపంలో జరిపేది సామూహిక నృత్యమే కానవసరం లేదు. సామూహికంగా జరిపే ఏ చర్య అయినా కావచ్చు. యజ్ఞం, యాగం, ఇష్టి వగైరాలు కూడా సామూహిక చర్యలే. ఒక వాస్తవిక ప్రయోజనం కోసం బాహ్య వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడమే వాటి ఉద్దేశం. అసలు యుద్ధంలో విజయం సాధించడానికి ముందు యాగం జరుపుతారు. అది యుద్ధానికి రిహార్సల్స్. అందులో విజయాన్ని భ్రాంతి పూర్వకంగా ముందే సాధిస్తారు. ఆ భ్రాంతి పూర్వక విజయం అసలు విజయాన్ని కట్ట బెడుతుందని నమ్మకం. ఇంకో ఉదాహరణ చూడండి…వర్షాలు పడనప్పుడు సహస్రఘటాభిషేకం చేస్తారు. అంటే ఆ జల పుష్కలత్వం గురించిన భ్రాంతి వాస్తవికత, వాస్తవికమైన జల పుష్కలత్వాన్ని ఇస్తుందని నమ్మకం. యజ్ఞంలో నెయ్యి, ధాన్యాలు వగైరాలే కాదు, పట్టుబట్టలు మొదలైనవి కూడా ఆహుతి చేస్తారు. అందువల్ల పుష్కలమైన పాడితోపాటు, అన్ని రకాల సంపదలూ లభిస్తాయని నమ్మకం. ఒక విత్తనం ఒక పెద్ద పండ్ల మొక్కను ఎలా ఇస్తోందో, అలాగే ఒక ఆహుతి అనంతమైన సంపదను ఇస్తుందని భావించారు.

మహాభారతంలో ఇటువంటి మాంత్రిక వాస్తవికతకు అద్దం పట్టిన ఘట్టాలలో సర్పయాగం; ద్రౌపదీ, ధృష్టద్యుమ్నుల జననం ఉన్నాయి.

మిగతా విశేషాలు వచ్చేవారం…

–కల్లూరి భాస్కరం

దత్త పుత్రిక ద్రౌపది?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ద్రుపదుడు రెండు రకాల ఆలోచనలు చేశాడు. మొదటిది, ద్రోణుని చంపగల కొడుకును పొందడం. రెండవది, అర్జునునికి భార్య కాగల కూతురుని పొందడం.

మొదటి కోరికలో కేవలం ప్రతీకార సంబంధమైన భావోద్వేగం ఉంటే, రెండో కోరికలో ముందుచూపు కలిగిన రాజకీయవ్యూహం ఉంది. అర్జునుని వరించగల కూతురిని పొందడం అంటే, పాండవులతో బంధుత్వం ద్వారా వారిని ద్రోణుడికి వ్యతిరేకంగా తనవైపు తిప్పుకోవడమే.

ద్రుపదుడి రెండు కోరికలనూ మనుష్యధర్మం నుంచి లేదా మనుష్య స్వభావం నుంచి అర్థం చేసుకుందాం. సహజపద్ధతిలో భార్య ద్వారా కొడుకును, కూతురిని కని ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే, సహజపద్ధతిలో కనే సంతానం సరిగ్గా ఒక కొడుకు, ఒక కూతురే అవుతారని ఎలా చెబుతాం? ఒకవేళ అయినా, ఆ కొడుకు ద్రోణుని చంపగలిగినవాడూ, కూతురు అర్జునుని వరించగలిగినదీ అవుతారన్న నమ్మకం ఏమిటి? ఆవిధంగా అది చీకట్లో రాయి విసరడం లాంటిది. దానికితోడు, వారు పుట్టి, పెరిగి తన ప్రతీకార సాధనకు ఉపయోగపడడం అనేది ఎంతో ఓపికతో నిరీక్షించవలసిన దీర్ఘకాలిక ప్రణాళిక కూడా.

ప్రతీకారేచ్ఛతో ఉన్న ద్రుపదుడు అంత అనిశ్చితమైన దీర్ఘకాలిక ప్రణాళిక అమలుజరిగే వరకూ వేచి చూడడం కష్టం. ఇంకో కోణం నుంచి చూస్తే, నిజానికి ద్రుపదుడు అంతకాలం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. రాజు తన రాజ్యంలో, లేదా తన గణంలో ఉన్న జనం అందరికీ తండ్రి లాంటివాడే కనుక; ద్రోణుని చంపగల శౌర్యసాహసాలు ఉన్న ప్రతి యువకుడూ ద్రుపదుడికి కొడుకే అవుతాడు. అలాగే అర్జునుని వరించగల ప్రతి అమ్మాయీ కూతురే అవుతుంది. ఒకవేళ తన రాజ్యంలో లేదా తన గణంలో అలాంటివారు లేనప్పుడు అతను దత్తు చేసుకోవచ్చు.

ఈ సందర్భంలో దత్తు గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దత్తు గణసమాజకాలంనుంచీ వస్తున్న ప్రక్రియ. మోర్గాన్ తన ‘పురాతన సమాజం’లో వివరించిన ప్రకారం అమెరికా ఆదివాసులలో దత్తత స్వీకారం ఇలా ఉంటుంది:

దత్తు చేసుకుని కొత్తవారిని సభ్యులుగా తీసుకునే హక్కు గణానికి ఉంటుంది. యుద్ధంలో పట్టుబడిన వారిని చంపెయ్యడమో, లేదా దయదలచి ఏదైనా గణంలోకి దత్తు తీసుకోవడమో చేసేవారు. దత్తులకు కూడా గణ హక్కులన్నీ లభిస్తాయి. వారిని సొంత మనుషులుగానే చూస్తారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తల్లి, తండ్రి వగైరా వరసలే వారికి ఆపాదిస్తారు. మొదట్లో, అనాగరిక యుగం తొలి దశలో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకునేవారు. మలి దశలో ఉన్న ఆదివాసులలో బానిసలు లేరు. అంటే, యుద్ధ ఖైదీలను దత్తు చేసుకునేవారన్న మాట.

దత్తు తతంగంలో భాగంగా, జనం రెండు వరసల్లో ఒకరి ఎదురుగా ఒకరు నిలబడతారు. వారి చేతుల్లో కర్ర, లేదా కొరడా లాంటివి ఉంటాయి. దత్తు కాబోయేవారు ఆ రెండు వరసల మధ్య నడుస్తూ వారితో దెబ్బలు తింటారు. దీనిని గాంట్ లెట్ (gauntlet) అంటారు. పట్టుబడిన ఖైదీలనో, లేదా ఇతర గణాలకు చెందినవారినో ఇలా దత్తు చేసుకుని, వారికి గణంలో చనిపోయినవారి స్థానమిచ్చి సంఖ్యను భర్తీ చేసుకుంటారు. గణంలో సభ్యుల సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఇలా సంఖ్య పెంచుకుంటారు. అయితే ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఒక దశలో సెనెకాలలో డేగ గణం వారి సంఖ్య తగ్గిపోయి అది అంతరించేలా ఉన్నప్పుడు తోడేలు గణం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని దత్తు చేసుకున్నారు. ఇందుకు రెండు గణాలూ సమ్మతించాయి. ఇరాక్యూలలో తెగసమితి సమావేశంలో దత్తు జరుగుతుంది. అది ఇంచుమించు మతకర్మ రూపం తీసుకుంటుంది.

సమితి సమావేశమయ్యాక, దత్తు చేసుకోబోతున్న వ్యక్తి ఏ గణం వాడో, అతని పేరేమిటో, అతను ఎలాంటివాడో, అతన్ని ఎందుకు దత్తు చేసుకుంటున్నారో, అతనికి పెట్టబోయే పేరు ఏమిటో సమితి నాయకులలో ఒకరు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు అతని రెండు చేతులూ పట్టుకుని దత్తత పాట పాడుతూ సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నడుస్తారు. మిగతా జనం ప్రతి చరణం చివరా పల్లవి ఎత్తుకుంటారు. పాట చరణాలు అన్నీ పూర్తయ్యేవరకూ అలా సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరి వరకూ మూడు చుట్లు చూడతారు. దాంతో దత్తు పూర్తవుతుంది.

ఒక్కోసారి ఇతరులను అభిమాన సూచకంగా దత్తు చేసుకోవడమూ జరుగుతుంటుంది. సెనెకాలలో డేగగణం వారు తనను అలాగే దత్తు తీసుకున్నారని మోర్గాన్ అంటారు.

దత్తు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయంగానో, సేవాభావంతో ముడిపడిందిగానో మారిపోయింది. ఉదాహరణకు, పిల్లలు లేనివారు ఎవరినైనా ఇష్టమైతే దత్తు చేసుకోవచ్చు, లేదా మానేయచ్చు. అలాగే కొందరు అనాథలను దత్తు చేసుకుంటారు. రాజకీయనాయకులు, ఆయా స్వచ్ఛంద సంస్థలవారు గ్రామాలనో, వెనకబడిన జిల్లాలనో దత్తు చేసుకుంటున్నామని చెబుతుంటారు. కానీ, గణసమాజంలో ఒక దశలో దత్తత అవసరంగానూ, అనివార్యంగానూ మారిపోయింది. సమాజనిర్మాణంలో భాగం అయింది. అది గణం నుంచి ప్రజలకు, లేదా పౌరులకు మారుతున్న దశ. గ్రీకులలో ఆ దశ గురించి మోర్గాన్ చర్చించారు.

మనం క్రూరమైన చట్టాలను ‘డ్రాకోనియన్’ చట్టాలు అంటాం. డ్రాకో(క్రీ.పూ. 624) అనే వ్యక్తి గ్రీకు తెగలలోని అధీనియన్ల కోసం చేసిన కఠిన చట్టాల కారణంగా ఆ పేరు వచ్చింది. అంటే, అప్పటికి గణం తాలూకు ఆచారాలు, అలవాట్ల స్థానే లిఖిత శాసనాలు తయారు చేసుకోవలసిన స్థాయికి గ్రీకులు పెరిగారన్నమాట. చట్టాల అవసరమైతే కలిగింది కానీ అప్పటికి చట్టాలు చేసే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఆ తర్వాత ధెసియస్(ఇతని తేదీ తెలియదు), సోలోన్(క్రీ.పూ. 594), క్లీస్తెనెస్(క్రీ.పూ. 509) అనే ముగ్గురు ఈ పరివర్తనలో ముఖ్యపాత్ర పోషించారు. క్లీస్తెనెస్ నాటికి ఈ పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. నేటికీ నాగరికదేశాల్లో కొనసాగుతున్న ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థకు రూపునిచ్చినది ఇతనే. అత్తికా అనే ప్రాంతాన్ని ఇతను నూరు ‘డెమో’(పట్టణం)లుగా విభజించాడు. ఆ పట్టణంలో ఉన్నపౌరులు అందరూ డెమోలు. వారు తమ పేర్లను, ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి. అప్పుడే వారికి పౌరహక్కులు లభిస్తాయి. డెమోలకు స్థానిక స్వపరిపాలనాధికారం ఉంటుంది. వీరొక ‘డెమార్క్’ ను ఎన్నుకుంటారు. ఈ డెమో అన్న మాటనుంచే డెమోక్రసీ అనే మాట వచ్చింది.

చూడండి…మనం గణం నుంచి పౌరుల దగ్గరకు వచ్చేశాం. ఇలా నాలుగు వాక్యాలలో చెప్పేసుకున్నాం కానీ, ఈ పరివర్తన జరగడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. అందుకు ఎంతో తెలివీ, అనుభవమూ అవసరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, గణవ్యవస్థ అనే తల్లిని శిథిలం చేసి ఈ పౌరవ్యవస్థ అనే శిశువు పుట్టింది.

ఇంతకీ గణవ్యవస్థను శిథిలం చేస్తూ ఈ పరివర్తన ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే, గణ నిర్మాణమూ, గణ స్వభావమూ, గణానికి గల పరిమితులే అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. గణం అనేది ఒక వ్యక్తి అనుకుంటే, గణంలో ఉన్నవారు అందరూ ఆ వ్యక్తికి గల వివిధ అవయవాల లాంటివారు. వ్యక్తికి విడిగా అవయవాలకు ఉనికి ఉండదు. అలాగే గణం బయట గణసభ్యులకు ఉనికి ఉండదు. అదసలు ఊహించడానికే సాధ్యం కాని విషయం. చెరువులోని చేపలు గట్టు మీద ఎలా బతకలేవో గణసభ్యులు కూడా గణం వెలుపల బతకలేరు.

కానీ, పైన చెప్పిన సోలోన్ (క్రీ.పూ. 594)కు ముందు గ్రీకు తెగలలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణదశలో ఉన్న జనం తప్పనిసరై ఉన్న చోటు వదిలి దూరప్రాంతాలకు పోవలసివచ్చింది. వ్యక్తులలోని సాహసప్రవృత్తి, వర్తక వాణిజ్యాలు, యుద్ధాలు మొదలైనవి ఇందుకు కారణమయ్యాయి. దాంతో వీరికి సొంత గణాలతో సంబంధాలు తెగిపోయాయి. మరో గణంతో సంబంధం ఏర్పడలేదు. ఆ విధంగా వీరు ఏ గణంతోనూ సంబంధం లేకుండా త్రిశంకు స్థితిలో ఉండిపోవలసివచ్చింది. క్రమంగా వీరి సంతానం కూడా పెరిగింది. ఏ గణంతోనూ సంబంధం లేకపోవడం అంటే ప్రభుత్వ పరిధిలోకి రాకపోవడమే. ప్రభుత్వ పరిధిలోకి రాని వారికి గుర్తింపు, గౌరవం కాదు సరికదా, ఉపాధి హక్కు, మత హక్కు, సహజవనరులలో భాగస్వామ్యంతో సహా ఏమీ ఉండవు. అది చావుతో సమానం. దీనికి పరిష్కారం, ఆయా గణాలవారు దయదల్చి వీరిని తమలో చేర్చుకోవడం. అక్కడ వచ్చింది దత్తతకు ప్రాధాన్యత.

గణాలకు గణాలు (లేదా కుటుంబాలకు కుటుంబాలు) తరలి వస్తే, ఒక గణంగా వారిని తెగలలోకి చేర్చుకోవచ్చు. వ్యక్తులుగా వస్తేనే అది కష్టమవుతుంది. అప్పుడు వారిని దత్తు చేసుకోవడమే మార్గం. అందులో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు, ఆస్తి ఉన్నవారికి దత్తత ద్వారా గణంలో సభ్యత్వం తేలిగ్గా లభించవచ్చు. కానీ పేదలకు అది కష్టమవుతుంది. గ్రీసులో క్రమంగా అలాంటి వారి సంఖ్య పెరిగిపోయింది. అది పెద్ద సంక్షోభానికి దారి తీసింది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలోనే గణవ్యవస్థ నుంచి పౌరవ్యవస్థకు పయనించడం సంభవించింది. అప్పటి ఆ ప్రయోగాలే నేటి ప్రజాస్వామికనిర్మాణాలకు మాతృకలయ్యాయి. నేటి పార్లమెంటు ఎగువసభ, దిగువసభ మొదలైనవి ఆ ప్రయోగాలనుంచి పుట్టినవే.

దత్తత గురించి చెప్పుకుంటూ చాలా దూరం వచ్చేశాం. మళ్ళీ అందులోకి వెళ్ళేముందు మరో రెండు ఆసక్తికర విషయాలు చెప్పుకోవాలి. గ్రీకు సమాజం గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గణసంబంధ ఆచారాలు, అలవాట్ల స్థానే కొత్త శాసనాలు తయారుచేసుకోవలసి వచ్చిందని పైన చెప్పుకున్నాం. ఆధునిక భారతదేశంలో మన అనుభవం కూడా ఇలాంటిదే. వివిధ ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లు ఉన్న ఈ దేశప్రజలను ఒక జాతిగా నిర్మించే ప్రయత్నంలో మన దగ్గరా ఇలాంటి శాసన నిర్మాణం జరిగింది, ఇంకా జరుగుతోంది. వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా)స్థానే ఉమ్మడి పౌర స్మృతిని నొక్కి చెప్పడం ఒక ఉదాహరణ.

రెండోది, గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గ్రీకుల అనుభవాన్ని మనకూ వర్తింపజేసుకోవచ్చు. అందులో మరింత ఆసక్తికరం ఏమిటంటే, మన వర్ణ, లేదా కులవ్యవస్థ చరిత్రనూ దాని నుంచి మనం పునర్నిర్మించుకోవచ్చు.

ఇప్పుడు మళ్ళీ దత్తతకు వస్తే…

సోర్సు చెప్పలేదు కానీ రాంభట్లగారు (జనకథ) అరుంధతీ, వశిష్టుల వివాహం గురించి ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. దాని సారాంశం ఇలా ఉంటుంది:

సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.

అయితే, ఆ మనువు సాధ్యం కావడానికి పూర్వరంగంలో పెద్ద కసరత్తు జరిగింది. ఎందుకంటే, వారిద్దరి గణాలూ అప్పటికి ఇంకా గణవివాహదశలో ఉన్నాయి. జంట మనువులతో వాటికి పరిచయం లేదు. అయినాసరే, ఒకరి మీద ఒకరు మనసు పడిన అరుంధతీ, వశిష్టులు జంట మనువు ఆడాలనుకున్నారు. అందుకు రెండు గణాలవారూ అనుమతించాలి. మామూలుగా అయితే అనుమతి అంత తేలిక కాదు. కానీ అప్పటికే కొన్ని తెలిసిన వ్రాతాల(మనువుకు యోగ్యమైన కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడతాయి)వారు జంట మనువుల్లోకి అడుగుపెట్టారు. పులస్త్య, పులహవ్రాతాలు వాటిలో ఉన్నాయి. కనుక అరుంధతీ, వశిష్టుల గణాలవారు కాస్త మెత్తబడ్డారు. అయితే, గణధర్మాన్ని భంగపరచి ఆ మనువును సాధ్యం చేయడం ఎలా?

అప్పుడు అరుంధతి గణదాయీలు (గణంలో పెద్దరికం వహించే మహిళలను గణదాయీలంటారు. తద్దినం మంత్రాలలో ఇప్పటికీ ‘దాయీ’ అనే ఈ వైదిక పరిభాషాపదం వినిపిస్తుంది. విశేషమేమిటంటే, గ్రీకు పురాణాలలోనూ ఈ పదం ఉంది. ఉదాహరణకు, హోమర్ దాయీలనే మాట) ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. అది, జంట మనువు ఉన్న వ్రాతాలవారికి అరుంధతి, వశిష్టులను దత్తత ఇవ్వడం. అందుకు ఇద్దరి గణాల వారూ అనుమతించారు. అరుంధతిని దత్తత తీసుకోడానికి పులస్త్యవ్రాతం లోని ఒక గణం వారు, వశిష్టుని దత్తత తీసుకోడానికి పులహ వ్రాతంలోని ఒక గణం వారు అంగీకరించారు. ఆ విధంగా వారిద్దరూ జంట మనువు ఆడారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి కానీ, అది మరెప్పుడైనా.

ఇప్పుడు కూడా దత్తత స్వీకారాలు జరుగుతూ ఉండచ్చు కానీ అవి పెళ్లిళ్ళలా, బంధుమిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుగుతున్న దాఖలాలు కనిపించవు. శాస్త్రోక్తంగా జరిపించగల పురోహితులు ఉన్నారో లేరో కూడా తెలియదు. నేను ఇంతవరకు శాస్త్రోక్తంగా జరిగిన దత్తత స్వీకారం ఒకే ఒకటి చూశాను. అది కూడా నా చిన్నతనంలో. మా పెద్దమ్మగారి అబ్బాయిని దత్తు ఇచ్చారు. కొవ్వూరు(ప.గో. జిల్లా)లో, అటూ ఇటూ ఉన్న బంధుమిత్రుల సమక్షంలో ఆ కార్యక్రమం భారీగా జరిగింది. అది మూడు రోజుల తంతు. నాకది లీలగా మాత్రమే గుర్తుంది కానీ, ఆ తర్వాత ఆ తతంగానికి సంబంధించిన వివరాలు తెలిసాక; ఆ మూడు రోజుల్లోనూ మా పెద్దమ్మ వైపు వాళ్ళలో ఎంతో దుఃఖమూ, విషాదమూ గూడు కట్టుకుని ఉండేవా అనిపిస్తూ ఉంటుంది. దత్తత ఇస్తున్న అబ్బాయి మరణించడం, అతనికి అంత్యక్రియలు జరిగిపోవడం, ఆ తర్వాత దత్తత తల్లిదండ్రులకు అతను మళ్ళీ పుట్టడం ఆ మూడురోజుల తంతులోనూ మంత్రపూర్వకంగా జరిగిపోతాయి.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

పరిశోధిస్తే ఈ దత్తత స్వీకార ప్రక్రియలో గణసమాజపు ఆనవాళ్ళు కచ్చితంగా దొరుకుతాయి. పైన చెప్పుకున్న అమెరికా ఆదివాసులు, గ్రీకులు జరిపిన దత్తత తంతుకు, శాస్త్రోక్తమైన మన తంతుకు మధ్య బహుశా పోలికలూ కనిపిస్తాయి. వేల సంవత్సరాలుగా తరం వెంట తరానికి ప్రవహిస్తున్న ప్రపంచ వారసత్వం అది.

ఇంకొకటి ఏమిటంటే, గణ సమాజంలో మతకర్మలు, లౌకిక కర్మలు అనే తేడా లేదు. ప్రతిదీ మతకర్మే. మంత్రపూర్వకంగా జరగవలసిందే. ఇప్పుడా కోణంలోకి వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.

ఇంతకీ విషయమేమిటంటే, ద్రోణుని చంపగల కొడుకును, అర్జునుని వరించగల కూతురుని ద్రుపదుడు మంత్ర పూర్వకంగా దత్తు తీసుకుని ఉండచ్చు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అభిప్రాయం, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్త సంతానమనే.

కథలోకి వెడితే…

ద్రోణునిపై ప్రతీకారానికి నిర్ణయించుకున్న ద్రుపదుడు ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించాడు. అలాగే ఒకరోజున గంగాతీరంలో వానప్రస్థంలో ఉన్న కాశ్యపగోత్రీకులైన యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు సోదరులను దర్శించుకున్నాడు. వారిద్దరిలోనూ తపోమహిమలో అధికుడైన ఉపయాజుని మరింతగా ఉపాసించి,‘సత్పుత్రుడు కలిగేలా నాచేత క్రతువు చేయించు. నన్ను కృతార్థుణ్ణి చేయి. నీకు లక్ష గోవులను ఇస్తాను’ అన్నాడు.

‘నాకు సంపద మీద కోరిక లేదు. ఆ కోరిక ఉన్న వారి దగ్గరకు వెళ్ళు’ అని ఉపయాజుడు అన్నాడు. అయినాసరే, ద్రుపదుడు ఒక ఏడాదిపాటు పట్టుదలగా అతన్ని ప్రార్థించాడు. మెత్తబడిన ఉపయాజుడు,‘ఓసారి మా అన్న ఈ వనంలో వెడుతుండగా నేల మీద ఒక పండు కనిపించింది. అది శుచా, అశుచా అనేది చూడకుండా ఆ పండు తీసుకున్నాడు. అలాగే ఫలం కోరుకునేవాడు, దానిని అంటిపెట్టుకుని ఉన్న దోషాలను పట్టించుకోడు. కనుక నువ్వు వెళ్ళి మా అన్న యాజుని ఆశ్రయించు. అతడు నీ కోరిక తీర్చగలడు’ అన్నాడు.

వెంటనే ద్రుపదుడు వెళ్ళి యాజుని కలసుకున్నాడు. అతను వేదవేత్త, తపశ్శాలి అయినప్పటికీ ఉంఛవృత్తితోనూ, భిక్షాటనతోనూ కుటుంబభారాన్ని మోస్తున్నాడు. ద్రుపదుడు ఉపయాజుని కోరినట్టే అతన్ని కూడా కోరి, లక్ష గోవులు ఇస్తానన్నాడు.

యాజుడు ఒప్పుకున్నాడు. నువ్వు కోరుకున్న కొడుకూ, కూతురూ పుడతారు అంటూ హామీ ఇచ్చి యజ్ఞానికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకుని, తమ్ముడు ఉపయాజుడు సహాయకుడుగా ద్రుపద, కోకిలాదేవిల చేత పుత్రకామేష్టి చేయించాడు.

మిగతా విశేషాలు తర్వాత…

( కల్లూరి భాస్కరం )

 

 

 

 

 

ఎందరో ‘అయోని’జులు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాస పరంపరలో మహాభారత పరిశీలననుంచి వీలైనంత త్వరగా బయటకు వద్దామని ఉంది. అందుకు ఇంకా ఎన్ని వ్యాసాల సమయం పడుతుందో ఈ క్షణాన నాకు అంచనా లేదు. బహుశా మరో పది వ్యాసాలు? ఉహూ…ఇప్పుడే కమిట్ అయిపోతే, దానిని నిలబెట్టుకుంటానన్న ధైర్యం లేదు.

అసలు మహాభారత పరిశీలననుంచి ఎప్పటికైనా బయట పడడం సాధ్యమా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. దానిని అలా ఉంచితే, ఇప్పుడీ వ్యాసాల సందర్భంలో మహాభారతం నుంచి బయటపడాలనుకోడానికి కారణం ఉంది. ఇప్పటికే చాలాచోట్ల ఆయా అంశాలను ప్రస్తావించి వదిలేశాను. ఆ ఖాళీలను పూరించుకుంటూ వెళ్ళాలి. ఆపైన ఇతిహాసంనుంచి పురాచరిత్ర మీదుగా చరిత్ర కాలంలోకి-వర్తమానం వరకూ -రావాలన్నది నేను వేసుకున్న పథకం. ఇతిహాసం దగ్గరే తిరుగుతూ ఉంటే నా పూర్తి పథకంలోకి వెళ్ళడం ఆలస్యమవుతూ ఉంటుంది.

సరే, ఇదంతా నా బాధ. నా బాధను పాఠక ప్రపంచం బాధగా మార్చడం సబబు కాదు కనుక ఇక్కడితో వదిలేస్తాను.

మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తన గురించి, ఆ పరివర్తనను దాదాపు ప్రపంచ పురాణ కథలు అన్నీ ప్రతిఫలిస్తూ ఉండడం గురించి ఇంతకు ముందు పలు సందర్భాలలో రాశాను. మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మహాభారత నేపథ్యంనుంచే చెప్పుకుందాం. ద్రౌపది జన్మవృత్తాంతం వాటిలో ఒకటి.

అంతకంటే ముందు, ఆమె తండ్రి ద్రుపదుడు, అతని మిత్రుడు ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతాలూ చెప్పుకోవలసినవే. సీతలానే ద్రౌపదిని ‘అయోనిజ’ (అంటే, స్త్రీ యోని నుంచి పుట్టనిది) అంటారని మనకు తెలుసు. ఆ మాటనే యథాతథంగా అన్వయించుకుంటే ద్రుపదుడు, ద్రోణుడు కూడా అయోనిజులే. అయినాసరే, సంప్రదాయం వారిని అయోనిజులని ఎందుకు అనలేదో తెలియదు.

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది.

పృషతునికి భరద్వాజుడు మిత్రుడు. పృషతుడు తన కొడుకు ద్రుపదుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి తను పాంచాలరాజ్యాన్ని పాలించడానికి వెళ్లిపోయాడు. అంతకుముందు భరద్వాజునికీ పృషతునికి ఎదురైన అనుభవమే ఎదురైంది. అతను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఓ రోజున గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస జలక్రీడలాడుతూ కనిపించింది. ఆమెను చూడగానే భరద్వాజుడికి కోరిక కలిగింది. స్కలనం జరిగింది. దానిని అతను ఒక ద్రోణి(దొప్ప)లోకి తీసుకున్నాడు. దానినుంచి శుక్రుని అంశతో ఒక శిశువు పుట్టాడు. ద్రోణినుంచి పుట్టాడు కనుక అతనికి ద్రోణుడనే పేరు వచ్చింది.

పృషత, భరద్వాజులలానే ద్రుపద, ద్రోణులు కూడా మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకేచోట వేదాధ్యయనం చేసి, విలువిద్య నేర్చుకున్నారు. కొంతకాలానికి ద్రుపదుడు తండ్రి స్థానంలో పాంచాలరాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడనే మునివద్ద విలువిద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆగ్నేయాస్త్రంతో సహా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. ఆపైన తండ్రి భరద్వాజుని ఆదేశంతో కృపుని చెల్లెలు అయిన కృపిని పెళ్లిచేసుకున్నాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు.

ఇక్కడ కృప, కృపిల జన్మవృత్తాంతం కూడా చెప్పుకోవాలి. వారు కూడా ‘అయోనిజు’లే. గౌతమ గోత్రీకుడైన శరద్వంతునికి కలిగిన కవలపిల్లలు వారు. శరద్వంతుడు పుడుతూనే శరసమూహంతో పుట్టాడు. వేదాధ్యయనాన్ని ఇష్టపడకుండా ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఇంద్రుడు అతనికి భయపడ్డాడు. అతని తపస్సు చెరచమని చెప్పి ‘జలపది’ (మూలంలో ఈ మాట ‘జానపది’. దీనర్థం జానపదస్త్రీ. నన్నయ ఈ మాటను జలపదిగా మార్చాడు)అనే అప్సరసను పంపించాడు. ఆమెను చూడగానే శరద్వంతునికి స్కలనం జరిగింది. అది ఒక శరస్తంభం మీద రెండు భాగాలుగా పడింది. ఒక భాగం నుంచి మగ శిశువు, ఇంకో భాగం నుంచి ఆడశిశువు పుట్టారు.

శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచి మరో చోటికి వెళ్లిపోయాడు. అంతలో ఆ ప్రాంతానికి శంతనమహారాజు వేటకు వచ్చాడు. ఆ పిల్లలను చూశాడు. జాలి కలిగింది. వారిని హస్తినాపురానికి తీసుకెళ్లి కృపుడు, కృపి అనే పేర్లతో పెంచాడు. కొంతకాలానికి శరద్వంతుడు శంతనుని దగ్గరకు వచ్చి వారు తన సంతానమే నని చెప్పి, కృపునికి ఉపనయనం చేసి, వేదాలు, ధనుర్విద్య నేర్పించాడు. శంతనుని కొడుకైన భీష్ముడు కూడా కృపుని ఆదరంగా చూస్తూ కురుపాండవులకు విలువిద్య నేర్పడానికి నియోగించాడు.

కురుక్షేత్రయుద్ధంలో పాల్గొని కౌరవపక్షంలో ప్రాణాలతో మిగిలిన ముగ్గురు వీరులలో (మిగిలిన ఇద్దరు: అశ్వత్థామ, కృతవర్మ) కృపుడు ఒకడు. యుద్ధం తర్వాత ధర్మరాజు కూడా అతనిని వెనకటి ఉపాధ్యాయ పదవిలోనే నియమించాడు.

ద్రోణుడి విషయానికి మళ్ళీ వస్తే, కుటుంబ పోషణకు ధనం అవసరం కనుక ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్ళి యాచించాడు. ‘నా దగ్గర ఉన్నదంతా దానం చేసేశాను. అస్త్రశస్త్రాలు తప్ప ఏమీ లేవు. కావాలంటే వీటిని తీసుకో’’ అని పరశురాముడు అన్నాడు. అంతకంటే అత్యుత్తమ ధనం ఏముంటుందంటూ ద్రోణుడు సంతోషంగా వాటిని స్వీకరించాడు. అక్కడినుంచి తన బాల్యమిత్రుడు, పాంచాలరాజు అయిన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ స్నేహాన్ని గుర్తు చేశాడు. ద్రుపదుడు రాజ్యగర్వంతో అతన్ని తూలనాడాడు. ‘నీ స్థాయి మరచి మాట్లాడుతున్నావు. ఒక పేదబ్రాహ్మణునికీ, రాజుకీ స్నేహమేమిటి? ధనవంతుడితో దరిద్రుడికీ, పండితునితో మూర్ఖునికీ, వీరుడితో భీరుడికీ స్నేహం ఎలా సాధ్యమవుతుంది? స్నేహమైనా, వివాహమైనా సమానులతోనే సాధ్యం. అదీగాక రాజులకు మిత్ర, శత్రు సంబంధాలు అవసరాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. నీలాంటి పేద విప్రులతో రాజులకు అవసరార్థమైన స్నేహం ఎప్పుడూ కలగదు. కనుక వచ్చిన దారిని పో’ అన్నాడు.

ద్రోణుడు ఆ అవమానానికి తల ఎత్తుకోలేకపోయాడు. మారు మాట్లాకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. భార్యను, కొడుకునీ, అగ్నిహోత్రాన్నీ, శిష్యులనూ వెంటబెట్టుకుని హస్తినాపురం దారి పట్టాడు. అక్కడ అతనికి కురు, పాండవులతో పరిచయమైంది. వారు అతని గురించి భీష్ముడితో చెప్పారు. భీష్ముడు అతనికి ఆశ్రయమిచ్చి కురు, పాండవులకు అస్త్రశస్త్రాలు నేర్పడానికి నియోగించాడు.

విద్యాభ్యాసం ముగిసింది. గురుదక్షిణ చెల్లించే సమయం వచ్చింది. ద్రుపదుడు తనకు చేసిన అవమానం హృదయశల్యంగా మారి అన్నేళ్లుగానూ ద్రోణుని నొప్పిస్తూనే ఉంది. ప్రతీకార క్షణం కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. ద్రోణుని ఓడించి బంధించి ప్రాణాలతో తన ముందు నిలబెట్టడమే తన గురుదక్షిణ అని కురుపాండవులకు చెప్పాడు. కౌరవులు ఆ పని చేయలేకపోయారు. అర్జునుడి నాయకత్వంలో పాండవులు ద్రుపదుని అవలీలగా ఓడించి బంధించి ద్రోణుడి ముందు ఉంచారు. ద్రోణుడి పగ చల్లారింది. ములుకుల వంటి మాటలతో ద్రుపదుని కుళ్లబొడిచి విడిచిపెట్టాడు. అటు ద్రుపదుడు కూడా ద్రోణునిపై ప్రతీకారం తీర్చుకోడానికి తన ప్రయత్నాలు తనూ మొదలుపెట్టాడు.

ఇది ఆదిపర్వం, ఆరవ ఆశ్వాసంలో నన్నయ చెప్పిన కథ. కానీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారత చరిత్రము’లో చెప్పిన ప్రకారం ద్రోణుడు ద్రుపదుని ఊరికే విడిచిపెట్టలేదు. పాంచాలరాజ్యంలో గంగకు ఉత్తరంగా ఉన్న అహిచ్ఛత్రాన్ని తనకు ఇచ్చే షరతు మీద విడిచిపెట్టాడు. అహిచ్ఛత్రానికి మాకంది రాజధాని. గంగకు దక్షిణంగా కాంపిల్య రాజధానిగా ఉన్న భాగమే ద్రుపదునికి మిగిలింది. ఆ విధంగా అహిచ్ఛత్రంపై అధికారం ద్రోణుడికి, అతని తర్వాత అతని కొడుకు అశ్వత్థామకు లభించింది. పెండ్యాలవారు ఏ సోర్సు నుంచి ఈ సమాచారం ఇచ్చారో చెప్పలేదు. నా దగ్గర ఆది సభారణ్యపర్వాలు ఉన్న సంస్కృత భారతం లేకపోవడంతో ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకునే అవకాశం కలగలేదు. అయితే, తిక్కన అనువదించిన భాగంలో కూడా పాంచాలరాజ్యంలో కొంత ప్రాంతానికి అశ్వత్థామ ఉత్తరాధికారి అన్న సూచన ఉంది. ఎన్నో ఆసక్తికర వివరాలు ఉన్న ఈ కోణాన్ని నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. విస్తరణ భయం వల్ల ప్రస్తుతం అందులోకి వెళ్లను.

కాకపోతే ఒక్క విషయం చెప్పుకోవాలి. కురుక్షేత్రయుద్ధం కేవలం కురు,పాండవుల యుద్ధమేనని చాలామంది అనుకుంటారు. కానీ, ‘wheel within the wheel’ (చక్రంలో చక్రం) అన్నట్టుగా, అది ఇంకా అనేకమంది వ్యక్తులు, వర్ణాలు, తెగలు తమ పాత పగలు, కక్షలు తీర్చుకోడానికి సొంత అజెండాలతో అనుకూల పక్షంలో చేరి సాగించిన యుద్ధం. అందుకే అది ఆనాటి ప్రమాణాలలో ఒక మహాయుద్ధంగా పరిణమించి, ప్రజల మనసులలో ఒక బలమైన పురాస్మృతి గానూ, దేశాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన ‘జలచ్ఛాయ’(watershed)గానూ మారినట్టు అనిపిస్తుంది. ఇటీవలి కాలానికి చెందిన రెండు ప్రపంచయుద్ధాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇది మరింత బాగా అర్థమవుతుంది. అసలు కేవలం కురుక్షేత్ర యుద్ధం గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక ఉద్గ్రంథం అవుతుంది. ఆ పని ఇంతవరకు ఎవరైనా చేశారో(నవల, కథ, నాటకం లాంటి ప్రక్రియలను మినహాయిస్తే) లేదో తెలియదు. నాకైతే ఉత్సాహం అయితే ఉంది కానీ…ఏమో?!

Wheel within the wheel లాంటిదే ద్రోణ-ద్రుపదుల శత్రుత్వం కూడా!

ప్రస్తుతానికి వస్తే,‘అయోనిజు’ల జాబితాలో ద్రౌపది మొదలైనవారే కాక ద్రుపదుడు, ద్రోణుడు, కృపుడు, కృపి కూడా చేరినట్టు పై కథనాలు చెబుతున్నాయి. నిజానికి ఈ జాబితా ఇంకా చాలా పెద్దది. వశిష్టుడు, అగస్త్యుడు, శుకుడు, ఋష్యశృంగుడు మొదలైనవారు కూడా ఇందులోకి వస్తారు. ఇక్కడ కూడా గతంలో చెప్పుకున్నట్టు, మహిమతో కూడిన ‘దేవధర్మా’న్ని, మహిమలేవీ లేని ‘మనుష్యధర్మా’న్ని కలగలపడం కనిపిస్తుంది. ఉదాహరణకు, ద్రోణుడు, ద్రుపదుడు యోని సంబంధం లేకుండా వీర్యం నుంచే పుట్టినట్టు కథకుడు చెప్పాడు. అయితే, ద్రోణుడు కృపిని పెళ్లి చేసుకుని సహజపద్ధతిలోనే ఆమె ద్వారా అశ్వత్థామను పొందాడు. ద్రుపదుడు కూడా మనుష్య ధర్మం ప్రకారమే కోకిలాదేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి సహజపద్ధతిలో సంతానం కలిగిందా లేదా అన్న వివరంతో కథకు సంబంధం లేదు. ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో ద్రుపదుడు సంతానంగా పొందిన ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మాత్రమే కథకు అవసరమయ్యారు కనుక వారి గురించే మనకు తెలుసు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

‘అయోనిజు’ లన్న ఒక్క అంశాన్ని పక్కన పెడితే, మిగిలిన వివరాలు; అంటే, ద్రోణుడు ద్రుపదుని ధనసాయాన్ని కోరడానికి వెళ్ళడం, అతడు అవమానించడం, ద్రోణుడు హస్తినాపురాన్ని ఆశ్రయించడం, వారి మధ్య పగ, ప్రతీకారం, యుద్ధం వగైరాలు అన్నీ మన సాధారణ బుద్ధికీ, తర్కానీకీ అందే మనుష్య స్వభాన్నీ, లేదా మనుష్య ధర్మాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే, దేవ, మనుష్య ధర్మాలను కలగపడంతోనే వస్తుంది చిక్కు. పూర్తిగా దేవధర్మాన్నో, లేదా మనుష్యధర్మాన్నో కథకు ఆపాదిస్తే మనం అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ రెండింటినీ కలగలిపినప్పుడు, అందులో కథకుడికి ఏదో వ్యూహం ఉందన్న అనుమానం కలగడం, అతడు దేనినో మరుగుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడనిపించడం సహజం.

ప్రస్తుత సందర్భంలో అదేమిటని ప్రశ్నించుకుంటే, సంతానం కలగడానికీ, యోనికీ ఉన్న సంబంధాన్ని అతడు మరుగుపరుస్తున్నాడు. సంతానం కలగడానికి యోని సంబంధం అవసరం లేదనీ, పురుషుని వీర్యం నుంచే నేరుగా సంతానం కలగడం సాధ్యమేననీ అతడు చెబుతున్నాడు. నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఆనాడే ఉందనడానికి నిదర్శనంగా కొందరు దీనిని అత్యుత్సాహంతో సమర్థించవచ్చు. కానీ టెస్ట్ ట్యూబ్ ప్రక్రియలో కూడా పురుష శుక్ల, స్త్రీ శోణితాల మధ్య కలయిక తప్పనిసరి. కానీ, ద్రోణుడు, ద్రుపదుల పుట్టుకలో ఆ కలయిక ఉన్నట్టు కథకుడు చెప్పడం లేదు.

ఇంతకీ ఇలా యోని సంబంధాన్ని పరిహరించడంలో కథకుని ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న వేసుకుంటే, రెండు సమాధానాలు స్ఫురిస్తాయి. మొదటిది, పృషతుడు, భరద్వాజుడు, శరద్వంతుడు మొదలైనవారు సంతానం కన్నది తక్కువ సామాజిక స్థాయి కలిగిన స్త్రీ ద్వారా కావచ్చు. వారు ఆటవిక, గిరిజన తెగలకు చెందినవారో, జానపదులో కావచ్చు. గంగ, సత్యవతి మొదలైన వారిని ఉదహరించుకుంటే ఇలాంటి సంబంధాలు; నదీ తీరాలు, ఇతర జలవనరుల తావులు లైంగిక క్రీడా స్థలాలు అయిన దశకు చెందినవి కావచ్చు. కోశాంబీ దీని గురించి ఇచ్చిన సమాచారాన్ని మరో సందర్భానికి వాయిదా వేస్తాను.

ఇక రెండో సమాధానానికి వస్తే, సంతానం కనడానికి యోని సంబంధం…ఆ మాటకొస్తే అసలు స్త్రీ సంబంధమే అవసరం లేదని కథకుడు చెప్పదలచుకున్నాడు. అంటే అతను మాతృస్వామ్యం మీద పితృస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్త్రీకి మాత్రమే సాధ్యమయ్యేదీ, పురుషుడికి సాధ్యం కానిదీ, సంతానాన్ని కనడం! ఆ తేడా పురుషుని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెబితే తప్ప మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయం సంపూర్ణం కాదు. కథకుడు అదే చేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సందర్భాన్ని అతడు పై కథలలోని పురుషుల న్యూన స్త్రీ సంబంధాన్ని కప్పి పుచ్చడానికి కూడా వాడుకుంటున్నాడు.

పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పే ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిందంటే, అందుకు యోని సంబంధమే కాక, వీర్యసంబంధం కూడా అవసరం లేదని చెప్పేవరకూ!

ఉదాహరణకు,‘సంకల్ప’ మాత్రంగానో, లేక మనసునుంచో సృష్టి చేసినట్టు చెప్పే కథలు కనిపిస్తాయి. బ్రహ్మ మానసపుత్రులుగా మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు పుట్టారనీ; మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టాడనీ, కశ్యపుని వల్ల చరాచరప్రాణులన్నీ పుట్టాయనీ ఆదిపర్వం తృతీయాశ్వాసం చెబుతోంది. అదెలాగంటే, బ్రహ్మ కుడి బొటనవేలి నుంచి మళ్ళీ దక్షుడు; ఎడమ బొటన వేలి నుంచి ధరణి అనే స్త్రీ పుట్టారు. వారిద్దరికీ అనేక మంది కొడుకులు పుట్టి సాంఖ్యయోగాభ్యాసంతో మోక్షం పొందారు. ఆ తర్వాత దక్షుడికీ, ధరణికీ యాభైమంది కూతుళ్ళు మాత్రమే కలిగారు. కొడుకులు లేకపోవడంతో దక్షుడు కూతుళ్లకే పుత్రీకరణ చేసి వారిలో పది మందిని ధర్ముడనే మనువుకీ, ఇరవయ్యేడుమందిని చంద్రుడికీ, పదముగ్గురిని కశ్యపునికీ ఇచ్చాడు. వారి నుంచి మొత్తం జీవులన్నీ పుట్టాయి.

ఇందులో గణసమాజ కోణం నుంచి చెప్పుకోవలసిన విలువైన సమాచారం చాలా ఉంది. ప్రస్తుతానికి దానిని అలా ఉంచితే, ఇందులోని ప్రారంభ వివరాలు పురుషుడి ముఖంగానే సృష్టి జరిగినట్టు, పురుషులే ముందు పుట్టినట్టు చెబుతున్నాయి. అయితే, సృష్టి చేయడంలో స్త్రీ పాత్రను పూర్తిగా నిరాకరించే అవకాశమూ లేదు. కనుక రెండవ దశలో స్త్రీని తీసుకొస్తున్నాయి. ఆ స్త్రీ కూడా మళ్ళీ బ్రహ్మ ఎడమ బొటన వేలి నుంచే పుట్టింది.

విశేషమేమిటంటే, ఇలా పురుషుడి ద్వారానే సృష్టి జరిగిందని చెప్పడం మన పురాణ, ఇతిహాస కథలలోనే కాక ఇతర పురాణ, ఇతిహాస కథలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు, క్రీ.పూ. 9వ శతాబ్దికి చెందిన యెహోవా సృష్టి గాథ ఇలా ఉంటుంది:

యెహోవా భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. అయితే వర్షం కురిపించకపోవడంతో భూమిమీద మొక్కలు, మూలికలు మొలకెత్తుకు రాలేదు. భూమిని దున్నడానికి మనిషీ పుట్టలేదు. అయితే, భూమిలోంచి ఒక పొగమంచు పైకివచ్చి నేలను తడిపింది. ఆ మట్టిలోంచి యెహోవా మనిషిని సృష్టించాడు. అతని ముక్కుపుటాలలోకి ప్రాణాన్ని ఊదాడు. అప్పుడు మనిషి ప్రాణిగా మారాడు. ఆ తర్వాత యెహోవా తూర్పు దిక్కున ఈడెన్ లో ఉద్యానవనాన్ని ప్రతిష్టించాడు. మనిషిని అందులో ఉంచాడు. చూడడానికి ఆహ్లాదం గొలుపుతూ, మంచి ఆహారాన్ని అందించే ప్రతి చెట్టునూ, మొక్కనూ అందులో సృష్టించాడు. వాటి మధ్యలో రెండు వృక్షాలను కల్పించాడు, ఒకటి, జీవ వృక్షం; రెండవది, మంచి, చెడులకు చెందిన జ్ఞానవృక్షం. ఆ ఉద్యానవనానికి నీరు అందించడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది మళ్ళీ నాలుగు నదులుగా చీలింది. మనిషిని ఆ ఉద్యానవనంలో ఉంచిన యెహోవా, దానిని జాగ్రత్తగా సంరక్షిస్తూ సాగు చేస్తూ ఉండమన్నాడు. అయితే ఒక హెచ్చరికా చేశాడు. ఈ ఉద్యానవనంలోని ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు స్వేచ్ఛగా తినచ్చు కానీ, జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రం తినద్దనీ, తింటే మరణిస్తావనీ అన్నాడు.

ఆ తర్వాత యెహోవా మనిషికి సాయపడడానికి జంతువులను సృష్టించాడు. ఇంతా చేశాక అతనికి మంచి తోడు లేదన్న సంగతిని గమనించి అతనికి గాఢనిద్ర ఆవహిల్లేలా చేశాడు. అతని పక్కటెముక నొక దానిని తీసి, ఆ తీసిన ప్రదేశాన్ని మాంసంతో పూరించి, పక్కటెముకను స్త్రీగా మార్చి అతనికి తోడుగా ఇచ్చాడు.

ఆ తర్వాత వారు నిషిద్ధ ఫలాన్ని ఆరగించి ‘పతనం’ కావడం, వారికి సంతానం కలగడం సంభవించాయి.

ఈ కథ కూడా మొదట పురుష ముఖంగానే సృష్టి జరిగినట్టు చెబుతూ, స్త్రీని ఆ తర్వాత ప్రవేశపెడుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం