విష్టరాగ్ని కన్యలూ…విస్టాల్ వర్జిన్సూ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

అజ్ఞానం అనను కానీ, జ్ఞానశూన్యత రకరకాలుగా ఉంటుంది. అలాంటిదే విశ్వాసం కూడా. మందిలో ఒకడిగా జీవించడానికి మనం జ్ఞానశూన్యతనో, విశ్వాసాన్నో నటించడం కూడా ఒక నిత్యావసరంగా మారుతూ ఉంటుంది. రాంభట్లగారు అప్పుడప్పుడు చెబుతూ వచ్చిన పాఠాలలో అది ఒకటి. ‘మనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు, దృక్పథాలు ఉన్నాసరే, మందికి మరీ దూరంగా ఉన్నట్టు కనిపించకూడదు. మంది గొంతును అనుకరిస్తూ ఉండాలి. వాళ్ళలో కలసిపోవాలి’ అంటూ తన జీవితం నుంచే ఉదాహరణలు ఇస్తూ ఉండేవారు. అందులో ఎంతైనా వాస్తవం ఉందని అనిపించేది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మెళకువ నాకు పట్టుబడిందని చెప్పలేను. నావరకూ ఎందుకు, రాంభట్లవారే తన పాఠాన్ని తను ఎంతవరకు జీర్ణించుకున్నారో అనుమానమే.

దేశాలు, సంస్కృతుల మధ్య విపరీతమైన తేడాలను ఊహించుకోవడమూ; తన దేశం లాంటి దేశం, తన సంస్కృతి లాంటి సంస్కృతి మరెక్కడా లేదనుకోవడమూ జ్ఞానశూన్యతకు ఒకానొక ఉదాహరణగా నాకు కనిపిస్తుంది. కొన్ని కొన్ని ప్రత్యేకపరిస్థితులలో అలా అనుకోవలసిన అవసరం ఏర్పడుతుందని నేను కూడా అంగీకరిస్తాను. అయితే ఒక అవసరాన్ని జ్ఞానశూన్యత స్థాయికి సాగదీయడంలోని ఔచిత్యమే ప్రశ్నార్థకం అవుతుంది.

పురాచరిత్రలోకి వెళ్ళినకొద్దీ దాదాపు ప్రపంచమంతా ఒకే సంస్కృతిని పంచుకుందనడానికి ఆధారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఒక్క అగ్నినే తీసుకుంటే, అగ్నిహోత్రాలు, అగ్నికార్యాలు, అగ్నిసాక్షులు, యజ్ఞాలు మన ఒక్క సంస్కృతిలోనే ఉన్నాయని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా అగ్ని అతని జీవితంలో ఒకే విధమైన పాత్ర నిర్వహించింది. ఒకేవిధమైన పవిత్రతకు సంకేతంగా నిలిచింది.

అగ్ని గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే, పైకి తేలదానికి కనీసం ఓ పది వ్యాసాల వ్యవధి పడుతుంది. కనుక కొన్ని విశేషాలకే ప్రస్తుతం పరిమిత మవుతాను. అమెరికా ఆదివాసీ తెగ అయిన ఇరాక్యూల గురించి, వారి సమాఖ్య పనితీరు గురించీ మోర్గాన్ అందించిన సమాచారం ఇలా ఉంటుంది:

పక్క పక్కనే ఉన్న బంధుగణాలు పరస్పర రక్షణ కోసం సమాఖ్యలుగా ఏర్పడేవి (మనం ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్నట్టు గణాలు కొన్ని కలసి వ్రాతంగా ఏర్పడడం లాంటిదే ఇది కూడా). ఉత్తర అమెరికాను కనుగొనే నాటికి వివిధ ప్రాంతాలలో అనేక సమాఖ్యలు ఏర్పడి ఉన్నాయి. అలా సమాఖ్యలుగా ఏర్పడడం మేధా పరిణతికి సూచన. వీటిలో ఇరాక్యూ సమాఖ్య ఒకటి, అది అయిదు స్వతంత్ర తెగలతో ఏర్పడింది. ఈ అయిదు తెగలూ ఒకే ప్రభుత్వం కింద సమాన ప్రతిపత్తితో ఉంటాయి. తెగలు తమ ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకుంటారు. వారిని ‘శాకెమ్’ అంటారు. సమాఖ్యలో శాకెమ్ లు యాభైమంది వరకూ ఉంటారు. అవసరమైనప్పుడు ఆయా నిర్ణయాలు చేయడానికి వీరందరూ సమావేశమవుతూ ఉంటారు. ఒక్కో తెగ, వంతుల వారీగా ఆ సమావేశనిర్వహణ బాధ్యత తీసుకుంటుంది.

ఒకటి, రెండు రోజుల ముందే శాకెమ్ లు అంతా తమ సహాయకులతో వచ్చి సమావేశస్థలానికి దూరంగా మకాం చేస్తారు. సమావేశ బాధ్యత తీసుకున్న తెగ శాకెమ్ లు పొద్దుటే వచ్చి వారిని పలకరించి వెడతారు. సమావేశం రోజున శాకెమ్ లు అందరూ చర్మం దుస్తులు ధరించి ఓ కట్టెల కట్ట చేత్తో పుచ్చుకుని సమావేశస్థలానికి వస్తారు. అక్కడ వారికి సమావేశాన్ని నిర్వహించే తెగవారు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అంతా వలయంగా నిలబడతారు. సమావేశాన్ని నిర్వహించే శాకెమ్ తూర్పు దిక్కున నిలబడతాడు. మిగిలిన శాకెమ్ లు మిగిలిన దిక్కుల్లో నిలబడతారు. ఆ తర్వాత శాకెమ్ లు అందరూ ఉత్తరం నుంచి ప్రారంభించి మూడుసార్లు ఆ వలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సమావేశ నాయకుడు మళ్ళీ తూర్పున తన స్థానంలో నిలబడతాడు. తన చేతిలో ఉన్న కట్టెల కట్టను వలయంలో తన ముందు ఉంచుతాడు.

ఉత్తరం నుంచి ప్రారంభించి మిగిలిన శాకెమ్ లు కూడా అదే చేస్తారు. మళ్ళీ అదే క్రమంలో తాము తెచ్చుకున్న చర్మాన్ని కిందపరచి దాని మీద కూర్చుంటారు. అప్పుడు నాయకుడు లేచి తన సంచిలోంచి రెండు కట్టెలు, ఇంత పీచు తీసి కట్టెలను రాపాడించి నిప్పు చేస్తాడు. వలయంలో అడుగుపెట్టి తను ఇంతకుముందు ఉంచిన కట్టెలకు నిప్పు ముట్టిస్తాడు. ఆ తర్వాత ఆ కట్టెలతో మిగిలిన శాకెమ్ లు ఉంచిన కట్టెలకు కూడా నిప్పు ముట్టిస్తాడు. ఆయన సంజ్ఞ చేయగానే ఆయనతోపాటు శాకెమ్ లు అందరూ మళ్ళీ మూడుసార్లు అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి, ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం కూడా చేసి తమ తమ స్థానాలలో నిలబడతారు.

తాము అందరం పరస్పర స్నేహ అభిమానాల వెచ్చదనాన్ని పంచుకున్నామనీ; సమావేశాన్ని ఎంతో ఆత్మీయంగా, ఐకమత్యంగా జరుపుకుంటామనీ చెప్పడం ఈ మొత్తం తతంగానికి అర్థం. ఇందులో రెండు కట్టెలను రాపాడించి నిప్పు చేయడమే చూడండి. అగ్గిపెట్టెల వంటి సాధనాలు లేని కాలంలో నిప్పు చేసే పద్ధతి అది. దానిని మనవాళ్లు అరణి అంటారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వారికి ఎదురై, తన అరణి(నిప్పు చేయడానికి ఉపయోగించే కొయ్యలు)ఒక లేడి కొమ్ములకు చిక్కుకుందనీ, అది పారిపోయిందనీ, దాంతో తను అగ్నికార్యం చేయలేకపోతున్నాననీ, ఆ లేడిని పట్టుకుని నా అరణిని నాకు ఇవ్వవలసిందనీ అడుగుతాడు.

pix02

అనంతర కాలాలలో ఆయా పనులు సులువుగా చేయడానికి సాయపడే కొత్త కొత్త పరికరాలు ఎన్ని వచ్చినా తద్దినాలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాలలో పురాకాలం నాటి పరికరాలనే ఇప్పటికీ వాడడం చూస్తూ ఉంటాం. నిన్న మొన్నటి వరకు (బహుశా కొన్ని చోట్ల ఇప్పటికీ) యజ్ఞాలు మొదలైన వాటిలో శ్రోత్రియులు అరణి మథించి నిప్పు చేసేవారు. అంటే, పురాసామగ్రి కూడా విశ్వాసంలో భాగమైపోయిందన్నమాట.

ఇక మన పురాణ, ఇతిహాసాలనుంచి అగ్ని ప్రాధాన్యాన్ని ఎత్తి రాయడం ప్రారంభిస్తే దానికి అంతే ఉండదు. అగ్నిసాక్షిగా స్నేహాలు, పరిణయాల గురించి చెప్పనే అవసరం లేదు. రామాయణంలో రాముడు, వానరరాజు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్న అంగారపర్ణుని కథలో, పాండవుల వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేకపోవడంతో వారిని క్షత్రియులుగా గుర్తించలేకపోయానని అంగారపర్ణుడు అంటాడు. కురుక్షేత్ర యుద్ధ శిబిరాలలో కూడా బ్రాహ్మణ, క్షత్రియవీరులు రోజూ ఉదయమే అగ్నికార్యం చేసేవారని భైరప్ప తన ‘పర్వ’ నవలలో రాశారు. ఆర్యులు బళ్ళమీద అగ్నిహోత్రాన్ని పెట్టుకుని మరీ కైబర్-బొలాన్ కనుమల మీదుగా భారతదేశంలోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు.

ఎలాగూ మోర్గాన్ ను ప్రస్తావించుకున్నాం కనుక, కాస్త పక్కదారి పడుతున్నట్టు అనిపించినా సరే ఒక అంశాన్ని మీతో పంచుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది,
కొన్నేళ్ళ క్రితం టీవీలో ప్రసారమైన ఒక తమిళ డబ్బింగ్ సినిమా నాలో ఎంతో ఆసక్తిని రేపింది. దాని పేరు ‘అఖండుడు’. విక్రమ్ అందులో హీరో. అదేదో ఆర్ట్ సినిమా అనుకుంటారేమో, కాదు. నూటికి నూరు పాళ్ళు కమర్షియల్ మసాలా దట్టించిన సినిమా. అందులో నన్ను ఆకర్షించినవి రెండు: మొదటిది, బంగారం పని చేసే ఒక విశ్వబ్రాహ్మణుని కుటుంబనేపథ్యంతో ఆ సినిమా కథ అల్లడం. హీరో ఆ కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబ వాతావరణాన్ని, వారి సెంటిమెంట్లతో సహా అతి సహజంగా దర్శకుడు రవి కుమార్ కళ్ళకు కట్టించాడు. నేను గమనించినంతవరకు తమిళ సినిమాలు అన్నింటిలో ఈ నేటివిటీ టచ్ తప్పనిసరిగా ఉంటుంది. తెలుగు సినిమాలలో అది కనిపించదు. సరే, ఇది సినిమాలకు సంబంధించిన చర్చ కాదు కనుక వదిలేద్దాం.

ఇక నన్ను ఆకర్షించిన రెండో విషయానికి వస్తాను. హీరో జనాన్ని కాల్చుకుతినే ఒక రాజకీయనాయకుని చంపేస్తాడు. అతన్ని జైల్లో పెట్టి విచారణ ప్రారంభిస్తారు. అతను హత్య చేసిన సంగతిని పోలీసులు నిరూపించలేకపోతారు. దాంతో అతన్ని విడుదల చేస్తారు. విడుదలై అతను ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ముందు పీట వేసి దానిమీద అతనిని కూర్చోబెట్టి తల్లి, తండ్రి అతని తలకు చమురు పెడతారు. తర్వాత తల్లి అతనికి అభ్యంగన స్నానం చేయిస్తుంది.

ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అందులో నాకు లీలగా గణసమాజం తాలూకు అవశేషం తోచింది కానీ అదేమిటన్నది తెలియలేదు. ఆ తర్వాత మోర్గాన్ ‘పురాతన సమాజం’ లో రాసిన వాక్యాలు చదవగానే ఆశ్చర్యపోయాను. గ్రీకు గణసమాజంలోని ఫ్రాట్రే(ఇది మనం చెప్పుకున్న వ్రాతం లాంటిది), తెగ, జాతి గురించిన ప్రకరణంలో ఐస్కలస్ అనే అతను రాసిన ‘యూమెనాయిడ్స్’ అనే రచనను మోర్గాన్ ప్రస్తావించాడు. అందులో ఒరెస్టస్ అనే అతను తల్లిని చంపుతాడు. అతనికి శిక్ష పడకుండా చూడడానికి అతని ఫ్రాట్రే ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి విరోధి గణానికి చెందిన ఎవరిపైన అయినా ప్రతీకారం తీర్చుకుంటే, అతనిని శిక్షనుంచి తప్పించే బాధ్యత అతని గణానిది, లేదా ఫ్రాట్రేదే. అది గణసమాజ నీతి.

‘ఒకవేళ ఒరెస్టస్ శిక్ష తప్పించుకుంటే అతని మీద ప్రోక్షించడానికి, అంటే శుద్ధిస్నానం చేయించడానికి ఫ్రాట్రే వద్ద నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా?’ అని ఎరిన్సిస్ అనే వ్యక్తి ఆ సందర్భంలో అడుగుతాడు.

ఐస్కలస్ రాసిన ఆ ‘యూమెనాయిడ్స్’ అనే ఆ రచన ఏమిటో, ఒరెస్టస్ తల్లిని ఎందుకో చంపాడో తెలుసుకోడానికి ఇంటర్నెట్ గాలించాను. దొరకలేదు. కానీ, ప్రస్తుత సందర్భానికి ఎరిన్సిన్ అడిగిన ప్రశ్న ఒక్కటి చాలు. శిక్ష తప్పించుకున్న నేరస్తుని శుద్ధిస్నానం చేయించాలని అది చెబుతోంది. ఇరవయ్యొకొటో శతాబ్దిలోని ఒక తమిళ సినిమా దానినే చూపిస్తోంది. అంటే, గ్రీకు గణసమాజానికే కాకుండా బహుశా మొత్తం గణసమాజాలు అన్నింటికీ చెందిన ఒక పురాతన ఆచారాన్ని ఆ సినిమా వెల్లడిస్తోంది. గణసమాజపు ఆచారాల గురించిన పూర్తి అవగాహనతో ఆ సినిమా దర్శకుడు ఆ సన్నివేశాన్ని చిత్ర్రించి ఉండకపోవచ్చు. అప్పటినుంచీ ఇప్పటివరకూ కొనసాగుతున్న ఆ ఆచారాన్ని అతను సమాజం నుంచే తీసుకుని ఉండవచ్చు. అయినా ఆ చూపును అభినందించాల్సిందే.

గణసమాజ లక్షణాలు తమిళులలో మరింత ఎక్కువ పదిలంగా ఉన్నాయని రాంభట్ల కూడా అంటారు. ఎక్కువా, తక్కువా అన్నది అలా ఉంచితే, మన దేశం లాంటి తూర్పు దేశాలలోనే కాక, పాశ్చాత్య సమాజాలలోనూ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక మాట అంటే షాకింగ్ గా ఉండచ్చు. భాషలో, నుడికారంలో, పెళ్లిళ్లు, శ్రాద్ధాల వంటి తతంగాలలో వేదకాలపు గణ సమాజలక్షణాలను మనం నిలుపుకున్నట్టే; పాశ్చాత్యులు కూడా కొన్నింటిలో నిలుపుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పాశ్చాత్యుల ఆయా సందర్భాలలో పాటించే ఆచారాలను, అలవాట్లను గమనిస్తే; మనతో సమానంగా వారు కూడా వేదకాలపు సంస్కృతిని పంచుకుంటున్నారని అర్థమవుతుంది. సంస్కృతుల మధ్య మనం గీసుకునే గీతలు చెరిగిపోవడం కళ్ళకు కడుతుంది.

ఈ పోలికలకు సంబంధించి ఇప్పుడు మరీ ఎక్కువ వివరాలలోకి వెళ్ళను. ఒకటి చెప్పాలంటే, ‘బార్బెక్యూ’. అది వేదకాలం నుంచీ కొనసాగుతున్న సాముదాయిక విందు కార్యక్రమం. దానిని ‘శూలమాంసం’గా రాంభట్ల పేర్కొన్నారు.

అమెరికాలో ఇళ్లముందు బార్బెక్యూ పొయ్యిలు ఇప్పటికీ కనిపిస్తాయి. దగ్గరలోని అడవుల్లోకో, తోటల్లోకో వెళ్ళి బార్బెక్యూ చేసుకోవడం కనిపిస్తుంది. Margaret Mitchell రాసిన ఐతిహాసిక నవల (1936) GONE WITH THE WIND 1860ల నాటి అమెరికా అంతర్యుద్ధాన్ని, దాని అనంతర పరిస్థితులను చిత్రిస్తుంది.

అందులోని నాయిక స్కార్లెట్ బార్బెక్యూకు వెళ్ళినప్పుడే తను కోరుకున్న యువకుని నుంచి ప్రేమ తిరస్కారానికి గురవుతుంది.

రచయిత్రి ఇలా రాస్తుంది:

They crossed the river and the carriage mounted the hill. Even before Twelve Oaks came into view Scarlett saw a haze of smoke hanging hazily in the tops of the tall trees and smelled the mingled savory odors of burning hickory logs and roasting pork and mutton.
The barbecue pits, which had been slowly burning since last night, would now be long troughs of rose-wood embers, with the meats turning on spits above them and the juices trickling down and hissing into the coals.

మాంసభోజన ప్రియులనే కాక, మద్యప్రియులను కూడా అలరించే సందర్భం బార్బెక్యూ. యవ్వనారంభంలో ఉన్న యువతీ, యువకుల్లో ప్రేమలూ, మోహాలూ పురివిప్పి నర్తించే సందర్భం కూడా. ‘న్యూ వరల్డ్’ గా చెప్పుకునే అమెరికాలో అతి పురాతనమైన వేదకాలపు ఒక ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దృశ్యం ఒక్కసారిగా మనల్ని వేల సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యచకితం చేస్తుంది. యూరోపియన్ల ద్వారానే ఈ ఆనవాయితీ అమెరికాకు బదిలీ అయిన సంగతి తెలుస్తూనే ఉంది. అదలా ఉంచితే, యూరోపియన్లకు వేదకాలపు సంస్కృతితో సంబంధముందనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

వేదకాలపు జనానికి కూడా రకరకాల అగ్నులతో పరిచయముంది. వాటికి వారు పేర్లు పెట్టారు. ఉదాహరణకు, అగ్నిపర్వతాలనుంచి వెలువడే అగ్ని ‘పర్వతీయాగ్ని’. అగ్నిపర్వతం నుంచి ప్రవహించే లావా ‘సరస్వతీయాగ్ని’. నేల నెర్రెలలోంచి వెలువడే అగ్ని ‘మహీయాగ్ని’. అడవుల్లో రాజుకునే అగ్ని ‘వానస్పత్యాగ్ని’. పిడుగుపాటు వల్ల పుట్టే అగ్ని ‘వైద్యుతాగ్ని’. తాత్కాలికంగా బస చేసిన చోట వేసే నెగడు ‘వాసతేయాగ్ని’.

వీటిలో వాసతేయాగ్ని మినహా మిగిలినవి ప్రకృతి సిద్ధంగా సంభవించే అగ్నులు కాగా; జనం వినియోగించే అగ్నిని మళ్ళీ మూడు రకాలుగా విభజించారు. వాటిలో మొదటిది గార్హస్పత్యాగ్ని. ఇది గృహస్థులు ఇంట్లో ప్రతిష్టించుకునే అగ్ని. రెండవది, ఆహవనీయాగ్ని. వసంతారంభంలో ఊరి బయట వెలిగే అగ్ని ఇది. మూడవది దక్షిణాగ్ని. దీనికే ‘విష్టరాగ్ని’ అని కూడా పేరు. ‘విష్’ అంటే మహాజనం అని అర్థం. ఇది సాముదాయిక అగ్ని అన్నమాట. ఈ మూడింటికీ త్రేతాగ్నులని పేరు.

విష్టరాగ్నిని ఆరకుండా కాపాడే బాధ్యత కన్యలది. అందుకే వారిని విష్టరాగ్నికన్యలు అన్నారు. అగ్ని ఆరాధకులైన పారసీకులకు విష్టరాగ్ని దేవాలయాలు ఉంటాయి. విశేషమేమిటంటే, యూరప్ లో ఇటలీలో కూడా విష్టరాగ్ని దేవాలయాలు ఉండేవి. ఈ అగ్నిని కాపాడే కన్యలను వారు ‘విష్టాల్ వర్జిన్స్’ అన్నారు. ఈ విష్టాల్ శబ్దంలోని విష్ అనే మాట వేదకాలపు సంస్కృతంతో యూరప్ కు ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది.

Sir James Frazer రాసిన The Golden Bough ప్రకారం, ఇటలీలో నేమి అనేచోట డయానా అనే దేవతను పూజిస్తారు. ఆమెకే ‘విష్టా’ అని కూడా పేరు. ఆమెకు జరిపే పూజా తతంగంలో అగ్నికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. ఏటా ఆగస్టు 13న ఆ దేవతకు ఉత్సవం జరుగుతుంది. అది వేసవి సమయం. ఆ దేవాలయం ఉన్న తోపు అంతటా స్త్రీలు దీపాలు వెలిగిస్తారు. చర్చిలో కొవ్వుత్తులు వెలిగించే ఆనవాయితీకి ఇదే మూలం కావచ్చు. ఆ రోజున ఇళ్ళలో కూడా అగ్నిహోత్రం దగ్గర పూజా తంతు జరుపుతారు. డయానా దేవతకు ఉన్న విష్టా అనే పేరు, ఆమె ఆలయంలో నిరంతరం పవిత్రాగ్ని వెలుగుతూ ఉండడాన్ని సూచిస్తుంది. దేవాలయానికి ఈశాన్యంగా గుండ్రని నిర్మాణం ఉంటుంది. డయానాను విష్టా రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఇక్కడి పవిత్రాగ్నిని విష్టాల్ వర్జిన్స్ ఆరకుండా కాపాడుతూ ఉంటారు. ఇది అనాది కాలం నుంచీ నిన్న మొన్నటివరకూ ఉన్న ఆచారం.

యూరప్ ఉత్తరభాగమైన లేప్లాండ్ లో విష్టరాగ్ని కన్యలు నేడు కూడా కనిపిస్తారని రాంభట్ల అంటారు. అది ధ్రువప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక, రాత్రులు కనిపించని దీర్ఘవసంతం ఉంటుంది. వసంతారంభానికి ముందు ఇళ్లలోని అగ్నిని, అంటే గార్హస్పత్యాగ్నిని ఆర్పేస్తారు. ఆ తర్వాత కన్యలు అరణి మథించి నూతనాగ్నిని చేస్తారు. అదే విష్టరాగ్ని. ఊళ్ళో అంతా ఆ అగ్నిని తీసుకువెళ్లి గార్హస్పత్యాగ్నిని వెలిగించుకుంటారు. ఇక ఊరి బయట ఆహవనీయాగ్ని వెలిగినంతకాలం కన్యలు గాంధర్వ సంబంధాలు పాటిస్తారు. అందువల్ల వాళ్ళ కన్యాత్వానికి భంగం కలగదు. వసంతంలో అంతా ఆరుబయటే భోజనాలూ, విహారాలు సాగించే ఆ కాలాన్నే వేదాలు యజ్ఞ ఋతువు అన్నాయని రాంభట్ల వివరణ. మంచుపడే ప్రదేశాలలో ఆరుబయట సాగించే ఆ జీవనంలో భాగమే బార్బెక్యూ కూడా. మన దగ్గర కూడా కార్తీక మాసంలో వనభోజనాలు ఉన్నాయి.

గ్యాస్ పొయ్యిలు వచ్చిన ఈ రోజుల్లో సంగతి ఏమో కానీ, కట్టెలు, బొగ్గులు వాడిన రోజుల్లో శ్రోత్రియ కుటుంబాలలోనూ, ఎంతో కొంత మడీ, ఆచారం పాటించే కుటుంబాలలోనూ పురుడు, మైల వంటివి సంభవించినప్పుడు శుద్ధి తర్వాత పొరుగింటి నుంచి నిప్పు తెచ్చుకుని పొయ్యి వెలిగించుకునేవారు. ఆచారాలు వేల సంవత్సరాల కాలం వెంబడి ఎలా ప్రవహిస్తాయో తెలిపే ఇలాంటి ఉదాహరణలకు అంతేలేదు. కాలాన్నే కాదు, దేశాలను, ప్రాంతాలను కూడా అవి జయిస్తాయి. Sir James Frazer వివిధ దేశాలు, ప్రాంతాలలోని అగ్ని సంబంధ ఆచారాల గురించి మరెంతో సమాచారం ఇచ్చారు. అవన్నీ దాదాపు యావత్ప్రపంచం ఒకే సంస్కృతిని పంచుకున్న సంగతిని వెల్లడిస్తాయి.

వచ్చే వారం మరికొన్ని విశేషాలు…

 

  -కల్లూరి భాస్కరం

ఋతుమతీ పునః కన్యా…

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు ప్రతిఘటిస్తాడు. అలాగే స్త్రీని కట్టడి చేయాలని పురుషుడు ప్రయత్నిస్తాడు. స్త్రీ ప్రతిఘటిస్తుంది. ఇద్దరి మధ్యా ఒక వ్యూహాత్మక, నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి మధ్య సర్దుబాటు క్షణాలూ ఉంటూ ఉంటాయి. ఇలా చూసినప్పుడు స్త్రీ-పురుషుల చరిత్ర సమస్తం సయోధ్య-సంఘర్షణల చరిత్రే.

నాకీ సందర్భంలో ప్రసిద్ధ కథకుడు ఓ. హెన్రీ రాసిన ఒక కథ గుర్తొస్తోంది. పేరు గుర్తులేదు కానీ విషయం మాత్రం గుర్తుంది. కాకపోతే వివరాలలో ఒకింత తేడా వస్తే రావచ్చు:

కాయకష్టం చేసుకుని జీవించే ఒక పల్లెటూరి జంట. వారు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. భర్త ఓ ఉద్రేక క్షణంలో ‘నీకు విడాకులు ఇచ్చేస్తా’నని భార్యతో అంటాడు. ‘మరీ మంచిది, నేనూ అదే కోరుకుంటున్నా’నని భార్య అంటుంది. ‘అయితే, విడాకులు మంజూరు చేసే జడ్జి దగ్గరకు వెడదాం పద’ అంటాడు. ఇద్దరూ బండి కట్టుకుని పట్నానికి బయలుదేరతారు. జడ్జి ఇంటికి వెడతారు. భార్య వల్ల తను ఎలా కష్టాలు పడుతున్నాడో భర్త చెబుతాడు. భర్త తనను ఎలా కాల్చుకుతింటున్నాడో భార్య చెబుతుంది. మాకు విడాకులు ఇప్పించండని ఇద్దరూ అడుగుతారు.

‘మీకు విడాకులు మంజూరు చేస్తాను. అయితే, దానికి ఇంత రుసుము చెల్లించాలి(ఆ రుసుము అయిదురూపాయలు అనుకుందాం). ఆ డబ్బు మీ దగ్గర ఉందా?’ అని జడ్జి అడిగాడు.

భర్త దగ్గర సరిగ్గా అయిదు రూపాయలే ఉన్నాయి. చొక్కా జేబులోంచి అయిదురూపాయల నోటు బయటకు తీసి జడ్జి ముందు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని వారికి విడాకులను మంజూరు చేస్తూ ఆమేరకు ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. ‘ఇకనుంచి మీరు భార్యాభర్తలు కాదు. ఎవరి దారిన వారు వెళ్లిపోవచ్చు’ అన్నాడు.

అప్పటికే బాగా చీకటి పడిపోయింది. విడాకుల పత్రం చేతికి వచ్చాక ఒకరి మీద ఒకరికున్న కోపతాపాలు చల్లబడిపోయాయి. వచ్చేటప్పుడు భార్యాభర్తలుగా కలసి వచ్చినా, ఇప్పుడు విడాకులు తీసుకున్నారు కనుక ఎవరి దోవన వారు పోవలసిందే. అతనైతే బండి మీద వెళ్ళిపోతాడు. తనీ రాత్రి వేళ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు కదా అనుకుంటూ ఆమె బిక్కమొహం వేసింది.

అతను ఆమెను చూశాడు. జాలి కలిగింది. ‘నాతో బండి మీద రా’ అన్నాడు. ఆమె బతుకుజీవుడా అనుకుంది. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇకనుంచీ తాము భార్యాభర్తలు కామన్న నిజాన్ని తలచుకుంటూ ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. రేపటి పరిస్థితిని, ఇక తాము భార్యాభర్తలం కామన్న సంగతినీ ఊహించుకుంటున్న కొద్దీ; ఎవరి బతుకు వారు బతకవలసిందేనన్న నిజం వారిని కుంగదీయడం ప్రారంభించింది. విడాకులు తీసుకున్నందుకు పశ్చాత్తాపమూ, ఒకరి మీద ఒకరికి ప్రేమ, జాలి క్రమంగా ముంచెత్తాయి. ‘పొద్దుటే అతను ఇంత కూడు తిని పనికి పోతాడు. తను లేకపోతే అతనికి ఎవరు వండిపెడతారు? ఎంత ఇబ్బంది పడతాడు?’ అనుకుంటూ ఆమె!,,,’తను లేకపోతే నాకు ఎలా గడుస్తుంది? నేను లేకపోతే తనకు మాత్రం ఎలా గడుస్తుంది?’ అనుకుంటూ అతను! …తమ దగ్గరున్న విడాకుల పత్రాన్ని తలచుకుంటే వారికి ఒంటి మీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్టు అనిపిస్తోంది.

ఊరు చేరేసరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ‘మనం కలిసే ఉందాం. విడాకుల్ని రద్దు చేయమని అడుగుదాం’ అని భర్త అన్నాడు. దిగులు మాయమై భార్య ముఖం సంతోషంతో విప్పారింది. ‘సరే’ అంది.

మరునాడే ఇద్దరూ బండి కట్టుకుని జడ్జి దగ్గరకు వెళ్లారు. తమ నిర్ణయం చెప్పి, విడాకులు రద్దు చేయమని అడిగారు. ‘సరే, రద్దు చేస్తాను. అందుకు కూడా రుసుము చెల్లించాలి(అయిదురూపాయలు అనుకుందాం). మీ దగ్గర ఆ డబ్బు ఉందా?’ అని జడ్జి అడిగాడు. ఆ జంట తెల్లబోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మా దగ్గర ఆ డబ్బు లేదు’ అని అతను అన్నాడు.

‘మీ దగ్గర ఆ డబ్బు ఎప్పుడుంటే అప్పుడు వచ్చి చెల్లించి విడాకుల రద్దుపత్రం తీసుకు వెళ్లం’డని జడ్జి అన్నాడు.

సరే నంటూ నిరుత్సాహంగా ఆ జంట అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మరునాడు పొద్దుటే వాళ్ళు ఇద్దరూ మళ్ళీ జడ్జి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి ముఖంలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. అతను జడ్జి ముందు అయిదు రూపాయల నోటు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని విడాకులను రద్దు చేస్తూ ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. వారు అప్పుడే పెళ్ళైన కొత్త జంటలా ఒకరినొకరు మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.

ఓ. హెన్రీ కథల్లో ఉండే కొసమెరుపు లేదా ట్విస్టు ఈ కథలోనూ ఉంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, అయిదు రూపాయలు చెల్లించి విడాకుల రద్దు పత్రం తీసుకోమని చెప్పి జడ్జి పంపేసిన తర్వాత ఆ జంటకు ఏం చేయాలో తోచలేదు. అయిదురూపాయలు తాము ఇప్పట్లో సంపాదించడం కష్టం. కనుక అతను ఆ రోజు రాత్రి జడ్జి ఇంట్లో దొంగతనం చేశాడు. తను జడ్జికి ఇంతకుముందు ఇచ్చిన అయిదురూపాయలు దొరికింది. మరునాడు ఆ నోటే జడ్జికి ఇచ్చాడు. తన దగ్గర అయిదురూపాయలు మాయమైన సంగతి ఆ తర్వాత కానీ జడ్జీకి తెలియలేదు.

ఇది న్యాయవ్యవస్థపై సెటైర్ గా రాసిన కథ అని తెలుస్తూనే ఉంది. దానిని అలా ఉంచితే, మనకిప్పుడు కావలసినంతవరకు స్త్రీ-పురుషుల మధ్య సంఘర్షణ-సయోధ్యల గురించి కూడా ఈ కథ చమత్కారం మేళవించి చెబుతోంది.

***

మన ధర్మశాస్త్రాలు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో పట్టు-విడుపులు లేని వైఖరిని అనుసరిస్తాయని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అవి ఎంతో సడలింపునూ పాటించాయి. నిజానికి ధర్మశాస్త్రాలు చండశాసన ప్రవృత్తి గల ఒక వ్యక్తి లేదా వ్యక్తుల ఊహల్లోంచి పుట్టినవి కావు. అవి సమాజంలోంచి పుట్టినవి. స్త్రీ-పురుష సంబంధాలతో సహా సామాజిక సంబంధాల పరిణామ చరిత్రను నమోదు చేస్తూ పోయినవి. అయితే అవి కొన్ని సందర్భాలలో అసమానతలు, వివక్ష కలిగిన నిర్దిష్ట సామాజిక సంబంధాల పక్షం వహించిన మాటా వాస్తవం. ధర్మశాస్త్రాల గురించి నాకు పైపైన కలిగిన అభిప్రాయం మాత్రమే ఇది. సూక్ష్మంగా పరిశీలించినప్పుడు నా అభిప్రాయాలను సవరించుకోవలసిన అవసరం వస్తుందేమో చెప్పలేను.

కేవలం తటస్థ, చారిత్రక దృష్టినుంచి చెప్పుకుంటే, స్త్రీ శీలం గురించి నేడు మనకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలనుంచి చూసినప్పుడు పూర్వుల అభిప్రాయాలు చాలా విచిత్రంగానూ, ఆసక్తికరంగానూ, ఇంకా చెప్పాలంటే అమాయకంగానూ అనిపిస్తాయి. ఉదాహరణకు, తిక్కన భారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసంలో ధర్మరాజుకు వ్యాసుడు ప్రాయశ్చిత్త విధానాలను చెబుతూ అన్న కింది మాటలు నన్ను ఆశ్చర్యచకితం చేశాయి:

పరపురుషసంగమంబున బరిహృతయై యున్న యట్టి భామిని శుద్ధిం

బొరయు రజస్వలయై కంచరయగ భస్మమున శుద్ధమైన విధమునన్

పరపురుషునితో సంబంధం వల్ల విడిచిపెట్టబడిన స్త్రీ, బూడిదతో కంచు శుభ్రమైనట్టుగా రజస్వల కావడం ద్వారా శుద్ధి అవుతుందని ఈ పద్యానికి అర్థం.

స్త్రీ శీలానికి, ఆమె రజస్వల కావడానికీ ఇలా ముడిపెట్టడం నేడు మన ఊహకు అందని విషయం. సంస్కృత భారతంలో దీనినే ఇలా చెప్పారు:

స్త్రియ స్త్వాశంకితాః పాపా నోపగమ్యా విజానతా,

రజసా వా విశుధ్యంతే భస్మనా భాజనమ్ యథా           

దీనికి శలాక రఘునాథశర్మగారి అనువాదం ఇలా ఉంది:

వివేకము కలవాడు పాపము చేసిరను శంక గల స్త్రీలను పొందరాదు. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లు రజస్సు వారిని శుద్ధి చేయును.

తిక్కన పద్యంలో అర్థం సూటిగా ఉంటే, శ్లోకంలో అర్థం కొంత అస్పష్టంగా ఉంది. అనువాదంలోనూ అదే అస్పష్టత ఉంది. వివేకం ఉన్నవాడు పాపం చేశారన్న శంక కలిగినప్పుడు ఆ స్త్రీలను పొందరాదని మొదటి వాక్యం చెబుతోంది. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లుగా రజస్సు వారిని శుద్ధి చేస్తుందని రెండో వాక్యం చెబుతోంది. అంటే, రెండో వాక్యం మొదటి వాక్యాన్ని నిషేధిస్తోందన్న మాట. (స్త్రీ పరపురుష సంగమానికి పాల్పడినా) రజస్వల అయినప్పుడు శుద్ధి జరిగి ఆ పాపం పోతుందని ఈ వాక్యం చెబుతోంది. అప్పుడు మొదటి వాక్యం విధించే నిషేధం తొలగిపోతుంది. కానీ శ్లోకం ఆ సంగతిని సూటిగా చెప్పడం లేదు.

అంతకన్నా ఆశ్చర్యం, తిక్కన పద్యంలోనూ, సంస్కృత శ్లోకంలోనూ వ్యక్తమైన అభిప్రాయానికి సమర్థన, ఒకింత తేడాలో, నాకు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారి రచనలో కనిపించింది! ‘కౌణ్డిన్యస్మృతిః’ (ఎమెస్కో ప్రచురణ, 2010) అనే రచనలో,‘స్త్రీలు’ అనే శీర్షిక కింద ఆయన ఇలా రాశారు:

అనిచ్ఛన్తీ తు యా నారీ బలాత్కారేణ దూషితా,                                                                           

రాజోదర్శనతహః పశ్చాద్విశుద్ధ్యతి; నా సంశయః

తా. ఇష్టపడకపోయినా బలాత్కరింపబడి దూషితురాలైన స్త్రీ రజోదర్శనానంతరం పరిశుద్ధురాలవుతుందని ధర్మశాస్త్రకారుల నిర్ణయం. దీనిలో సందేహం లేదు.

రజస్వల, అంటే ఋతుమతి కావడంతోనే స్త్రీ పరిశుద్ధురాలు అవుతుందనడం, స్త్రీ శీలం గురించిన మన ఊహల్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. స్త్రీ శీలంపట్ల ఉన్న ఇంత సరళమైన భావనతో, శీల భంగానికి ఇది చూపించే పరిష్కారంతో నేడు ఎవరూ ఏకీభవించరని మనకు తెలుసు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి అవుతుందన్న ఊహలో   ఎంతో అమాయకత్వం ఉంది. మరోవైపు, స్త్రీ శీలం గురించి మనకంటే, మన పూర్వులే చాలా ఉదారంగానూ, విశాలంగానూ ఆలోచించారన్న అభిప్రాయం కూడా ఈ ఊహ కలిగిస్తుంది. అందులో స్త్రీ-పురుష సంబంధాల పట్ల గొప్ప సర్దుబాటు వైఖరి ఉంది.

దాంతోపాటు, తటస్థంగా చెప్పుకుంటే; స్త్రీ శీలం గురించిన పై భావన మరికొన్ని విలక్షణ పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ఎలాగంటే, స్త్రీ నెల నెలా ఋతుమతి అవుతుంది. ఋతుమతి కావడంతోనే అంతకుముందు పురుషసంబంధం తాలూకు దోషం అంతా పోయి తిరిగి శుద్ధి అవుతుంది. ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థాలను వివరించుకో నవసరం లేదు. తన ఇష్టం లేకుండా బలాత్కరింపబడిన స్త్రీలు ఋతుమతి కావడంద్వారా శుద్ధి పొందుతారని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అంటున్నారు. అయితే పూర్వుల ఊహ నుంచి చూస్తే, ఎటువంటి పురుష సంగమం ద్వారానైనా సరే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధిపొందుతుంది.

మొత్తం మీద చూస్తే, ఒక దశలో స్త్రీకి సంబంధించిన ఇతరేతర అంశాలపై కంటే, ఆమెకు గల ఋతుకాల ధర్మం మీదే పూర్వులకు ఎక్కువ పట్టింపు ఉండేదని అనిపిస్తుంది. ఋతుకాలమే వారి ఊహలో ఎక్కువ ప్రాధాన్యాన్ని పొందినట్టు అనిపిస్తుంది. అది సంతానయోగ్య కాలం కూడా కనుక సంతానానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని కూడా తోస్తుంది. ఋతుకాలంలో సంతానం పొందడం స్త్రీకి ఒక హక్కుగా గుర్తించారన్నఅభిప్రాయానికి సైతం శర్మిష్ట-యయాతి కథే కాక మరికొన్ని కథలు అవకాశమిస్తాయి. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతుందని పూర్వులు భావించడం ఋతుకాల ప్రాధాన్యానికి పొడిగింపే.

ఇప్పటి మన అవగాహనలో ఇది విపరీతంగా, అనైతికంగా తోచే మాట నిజమే. కానీ, అప్పటి పరిస్థితులు, అప్పటి ఒత్తిడులు, స్త్రీ-పురుష సంబంధాల గురించిన అప్పటి అవగాహన అలాంటివి కావచ్చు. అపారమైన భౌగోళిక విస్తీర్ణం, పరిమిత జనాభా ఉన్న ఆ కాలంలో సంతానోత్పత్తే అన్నింటికంటే ఉన్నతంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. సంతానవతికి, లేదా సంతానవంతుడికి ఆనాడే కాదు, నిన్న మొన్నటివరకు సమాజంలో ఎక్కువ గౌరవ ప్రతిష్టలు ఉండేవన్న సంగతి మనకు తెలుసు.

భూమిపై కానీ, ఇతర ఆస్తులపై కానీ ఉమ్మడి యాజమాన్యం పోయి, వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన తర్వాత; ఫలానా పురుషుడికే స్త్రీ సంతానం కనవలసిన అవసరం కలిగింది. భర్తకు సంతాన సామర్థ్యం లేనప్పుడు ధర్మశాస్త్రాలు నియోగాన్ని అనుమతించాయి.

ముందుజన్మలో ద్రౌపదిగా పుట్టబోతున్న ఇంద్రసేనకు శివుడు ప్రత్యక్షమై నీకు అయిదుగురు భర్తలు లభిస్తారని అన్నప్పుడు ఆమె ఏమందో మరోసారి గుర్తుచేసుకుందాం: ‘స్త్రీకి ఒక్కడే పతి కావడం లోక ప్రసిద్ధం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి అన్యపురుష సంపర్కాన్ని చెప్పారు. మూడో పురుషునితో సంబంధం పెట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నాలుగో పురుషునితో సంబంధం వల్ల ఆమె పతిత అవుతుంది. అయిదవ పురుష సంబంధంతో బంధకి అవుతుంది. కనుక నాకు అయిదుగురు భర్తలు వ’ద్దని ఆమె అంటుంది. కురుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు కర్ణుడు ఆమెను బంధకి అంటూ ఎద్దేవా చేస్తాడు. ఇంద్రసేన అన్న పై మాటల్లో స్త్రీపురుష సంబంధాలపట్ల ధర్మశాస్త్రాలు ప్రదర్శించిన సర్దుబాటు వైఖరి అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, పెండ్యాలవారితో తను జరిపిన వాదోపవాదాలలో సంప్రదాయపక్షం వహించిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నియోగవిధిని సమర్థిస్తారు కానీ, వితంతు వివాహాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. నియోగవిధి ఆమోదయోగ్యమై, వితంతు వివాహం కాకపోవడం వెనుక పైకి ఎలాంటి హేతుబద్ధతా కనిపించదు. బహుశా ఆస్తి సంబంధమైన అభ్యంతరాలు దాని వెనుక ఉండవచ్చు.

అదలా ఉంచితే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతున్న భావన పురాణ కథలలోని ఒక ముఖ్యమైన మర్మాన్ని, లేదా కల్పనను బట్టబయలు చేస్తోంది. అది, కన్యాత్వ వరం!

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

ఈ కన్యాత్వ వరం గురించి వెనకటి వ్యాసాలలో చాలా చెప్పుకున్నాం. క్లుప్తంగా మరోసారి గుర్తు చేసుకుంటే, పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు, సూర్యుడు కుంతికి, శివుడు ద్రౌపదికి కన్యాత్వవరం ఇచ్చారు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధురాలవుతుందన్న పై ఊహను ఇక్కడ వర్తింపజేసి చూడండి. స్త్రీ ఋతుమతి కావడానికి ముందు పురుష సంగమం పొందినా, ఋతుమతి కావడంతోనే శుద్ధి అవుతుందంటే అర్థం ఏమిటి? ఆమె వెనకటి స్థితికి, అంటే కన్యగా ఉన్న స్థితికి తిరిగి వెడుతుందనే. అలాంటప్పుడు ఆమెకు కన్యాత్వ వరం అంటూ ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఆమె కన్యే!

దీనినిబట్టి తేలుతున్నది ఒకటే…కన్య అంటే వివాహం కాని స్త్రీ మాత్రమే. పురుష సంపర్కం పొందని స్త్రీ అని కాదు.

గణసమాజంలో కూడా కన్య అంటే వివాహం కాని స్త్రీయే తప్ప పురుషసంపర్కం లేనిదని కాదు.

దాని గురించి తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

చేరా అంటే మంచి సంభాషణ!

10534397_326754877475156_564669077665495274_n

చేరాగారు ఇక లేరన్న దుర్వార్త వినడానికి రెండురోజుల ముందే హఠాత్తుగా ఆయన గుర్తొచ్చారు. అప్పుడప్పుడు పరిచితుల విషయంలో నాకు అలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అదెలా జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఎలా ఉన్నారో అనుకున్నాను. ఆయన ఆరోగ్యంగా లేరని తెలుసు కనుక ఎక్కువగా తిరగడం లేదని అనుకునే వాడిని. కానీ సభలకు, కచేరీలకు వెడుతూనే ఉన్నారని ఇప్పుడు తెలిసి అవునా అనుకున్నాను. నాకు సభలకు వెళ్ళే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఆయనను మిస్ అయినందుకు బాధపడ్డాను.

నగరజీవితం విచిత్రంగానూ, వైరుధ్యవంతంగానూ ఉంటుంది. నగరంలో మనుషుల మధ్య ఉన్నప్పటికీ మనుషుల సంపర్కాన్ని కోల్పోతూ ఉంటాం. ఎవరికి వారం మనలో మనం ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాం. ఏదో ఒక రంగంలో అభిరుచిని పంచుకునేవాళ్లు అందరూ ఒకే కాలనీలో ఉండే ఏర్పాటు ఉంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

నేను చదువుకునే రోజులలోనే చేరాగారితో పరిచయం. హైదరాబాద్ లోని ఒక సాంస్కృతిక సంస్థవారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో బహుమతిగా వచ్చిన కప్పును నాయని కృష్ణకుమారిగారి చేతుల మీదుగా పుచ్చుకుని విద్యానగర్ వెళ్లడానికి బస్సు ఎక్కాను. బస్సులో ఒకాయన పక్కన సీటు ఉంటే కూర్చున్నాను.

ఆయన నన్ను చూసి చిరునవ్వుతో పలకరించారు. తను కూడా ఆ సభకు వచ్చానని చెప్పారు. కొంత సంభాషణ జరిగాక, నేనే అడిగానో, ఆయనే చెప్పారో గుర్తులేదు కానీ నా పేరు చేకూరి రామారావు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ‘భారతి’లో ఆయన రాసిన భాషాశాస్త్ర వ్యాసాలు చూశాను కనుక వెంటనే ఆ పేరు గుర్తుపట్టాను.

అంతలో బస్సు విద్యానగర్ స్టేజ్ లో ఆగింది. ఇద్దరం దిగాం. ఇళ్ల వైపు నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన సమవయస్కునిలా, ఒక మిత్రుడిలా నాతో చనువుగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని అప్పుడే నాకు పరిచయం చేసింది. తన ‘భారతి’ వ్యాసాలు అర్థం కావడం లేదన్న ఫిర్యాదుపై అప్పట్లో ఆయన బాగా ఆలోచిస్తూ ఉండేవారు కాబోలు, దాని గురించి నన్ను గుచ్చి గుచ్చి అడిగారు. అర్థమయ్యాయని చెప్పగల స్థాయి నాకు అప్పుడు లేదు. నిజానికి ఇప్పుడూ లేదు. అది నా రంగం కాదు. అప్పుడు ఆయనకు ఏం సమాధానం చెప్పానో గుర్తులేదు.

అంతలో ఆయన ఇంటికి దారి తీసే సందు వచ్చింది. ‘రా, మా ఇల్లు చూపిస్తాను’ అంటూ తీసుకెళ్ళారాయన. అది రోడ్డుకు ఆట్టే దూరంలో లేదు. ఆ పక్క సందులోనే మా అన్నయ్య ఉంటున్న ఇల్లు.

ఆ తర్వాత కొన్నిసార్లు ఆయనింటికి వెళ్ళాను. సాహిత్యం గురించి మేము మాట్లాడుకునేవారం అనే సాహసం నేను చేయను. ఆయన మాట్లాడుతుంటే వినేవాణ్ణి. దిగంబర కవిత్వం పట్ల, అందులోని భావజాలం పట్ల ఆయనకు అభ్యంతరం ఉండేది కాదని మాత్రం తెలిసేది. అప్పటి సాహిత్యరాజకీయాలపై కూడా ఆయన చాలా ఆసక్తిని చూపుతూ ఉండేవారు. వాటి గురించి మాట్లాడేవారు. ఫలానా పత్రికలో ఫలానా వ్యాసం వచ్చింది చూడు అనేవారు. తన దగ్గర ఆ పత్రిక ఉంటే ఇచ్చేవారు. అప్పుడే అరసంలో చీలిక, సెవెన్ స్టార్ సిండికేట్ రభస వగైరాలు, శ్రీ శ్రీ, దాశరథి లాంటి కవుల వ్యక్తిగత వైరాలు, శ్రీ శ్రీ వారిపై గుప్పించిన కవితాత్మక దుర్భాషలు ఏదో పత్రికలో అచ్చవుతూ ఉండేవి. చేరాగారు వాటి గురించి ఎంతో కుతూహలంగా మాట్లాడుతూ ఉండేవారు.

అప్పట్లో ఆయన చెప్పిన ఒక పాఠం నాకు గుర్తుండిపోయింది.

అప్పటికి సాహిత్యాన్ని ఐడియలిస్టు వ్యూతో చూసే వయస్సు నాది. సాహిత్యరాజకీయాలు నాకు నచ్చలేదు. సాహిత్యంలో రాజకీయాలేమిటి అంటూ నేను ఆవేశపడ్డాను. చేరాగారు చిరునవ్వు నవ్వి ‘ఏం, సాహిత్యంలో రాజకీయాలు ఎందుకు ఉండకూడ’ దంటూ ఎంతో సౌమ్యంగా ఒక పాఠం చెబుతున్నట్టు నాకు వివరించుకుంటూ వచ్చారు. సాహిత్యమే కాదు, జీవితంలో రాజకీయం కానిదేదీ లేదని తేల్చారు.

సాహిత్యంపై నాకు అలా భిన్నదృక్పథాన్ని పరిచయం చేసింది ఆయనే.

ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది.

‘ఆధునిక సాహిత్యంలో కాలికస్పృహ’ అనే పేరుతో నా వ్యాసం ఒకటి ఉదయం పత్రికలో వచ్చినప్పుడు, చేరా గారు తన చేరాతలలో దాని గురించి రాశారు, సాహిత్యవివేచనకు కొత్త పనిముట్టుగా దానిని పరిచయం కేసారు. కొత్త కవులను, వారి ధోరణులను పట్టించుకోవడంలో చేరాతలు ముందున్న సంగతిని ప్రస్తావిస్తూ , వచనరచనలు గుర్తించడంలో వెనకబడినట్టు ఒప్పుకుంటూ ఆ వ్యాసం ప్రారంభించారు. ఆపైన కొత్త తరంలో గుర్తించదగిన వచనరచనా ధోరణులు లేకపోలేదన్నారు.

నేను ఒకింత వచన పక్షపాతిని కనుక ఈ వ్యాసప్రారంభం నాకు సంతోషం కలిగించింది.

నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ఉన్నప్పుడు సాహిత్యం పేజీ చూస్తున్న రోజుల్లో ఆయన అప్పుడప్పుడు మా కార్యాలయానికి వస్తుండేవారు. ఆయన వెంట తరచు హరి పురుషోత్తమరావుగారు ఉండేవారు. ఇద్దరి స్వభావాలలో తేడా ఉండేది. చేరాగారు సంభాషించేవారు, హరిగారు చర్చించేవారు.

చేరాగారు(భాషా)శాస్త్రం నుంచి సాహిత్యంలోకి వచ్చారు. ఆయనలో శాస్త్ర, సాహిత్య దృక్కోణాలు వేటికవే విడివిడిగా ఉండిపోయాయని నాకు అనిపించేది. భాష గురించి పరిశీలించేటప్పుడు ఆయనలో కనిపించే శాస్త్రవేత్త, సాహిత్యపరిశీలనకు వచ్చేసరికి తప్పుకుంటాడనిపించేది. సాహిత్యపరిశీలనలో ఆయనలోని భావుకుడు, అనుభూతివాది పైకి వచ్చేవాడు. చేరాగారితో నన్ను పోల్చుకునేంత సాహసం చేయను కానీ, నాది భిన్నమైన అనుభవం. నాది సాహిత్యదృష్టినుంచి శాస్త్రదృష్టికి పయనించే ప్రయత్నం. భావుకత, అనుభూతి ఒక్కటే నాకు సరిపోవు. వాటితోపాటు కాలికతా, సమాజమూ, చరిత్రా వగైరాలు మరికొన్ని కావాలి. చేరాగారే నాకు చెప్పిన పాఠం ప్రభావం కూడా దీని వెనుక గుప్తంగా ఉందేమో తెలియదు. అలాగని నేను విరివిగా రాసింది కూడా ఏమీలేదు.

నేను ఆంధ్రప్రభలో పద్య ప్రాసంగికత(రెలెవెన్స్) గురించి లేవనెత్తిన చర్చ సందర్భంలో ఈ దృక్పథ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆధునిక లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయడానికి పద్యం తగిన వాహిక కాగలదా అన్నది స్టూలంగా అప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్న. నా ప్రశ్నను వ్యతిరేకిస్తూ, అన్ని కాలాలలోనూ పద్యం సమర్థ వాహికే అవుతుందని నొక్కి చెబుతూ చేరాగారు చేరాతలలో రెండు వ్యాసాలు రాశారు. బేతవోలు రామబ్రహ్మంగారు తదితరులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే, పద్యం గురించి నేను చేసిన చర్చలో అసమగ్రత, అవ్యాప్తి, అతివ్యాప్తి లాంటి దోషాలు ఉన్నాయనే అనిపిస్తుంది. అయితే, పద్యం ఆధునిక, లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయగలదా అన్న నా మౌలిక సందేహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.

ఇన్నేళ్లలోనూ చేరాగారిని తరచు కలుస్తూ మాట్లాడి ఉంటే ఈ సందేహంపై మరికొంత చర్చ చేసి ఉండేవారమేమో! నగరజీవితం, వృత్తి జీవితం నాకా అవకాశమూ, తీరికా ఇవ్వలేదు.

ఆయన జ్ఞాపకాలను చరిత్రబద్ధం చేసే ప్రయత్నంలో ఈ నాలుగు మాటలూ. ఆయనకు నా నివాళి.

                                                                                                                       -కల్లూరి

పాండవుల పుట్టుకపై చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

సంప్రదాయ పాఠం లేదా వివరణ విడిచిపెట్టిన ఖాళీలను గురించి ఇంతకుముందు చాలా ఉదంతాలలో చెప్పుకున్నాం. కొన్ని మరోసారి గుర్తు చేసుకుందాం:

యయాతి-శర్మిష్టల సంబంధమే చూడండి. వారిద్దరూ మనకు తెలిసిన అర్థంలో భార్యాభర్తలు కారు. యయాతి అధికారిక భార్య అయిన దేవయానికి శర్మిష్ట దాసి మాత్రమే. అయినాసరే, యయాతికి శర్మిష్టకు సంబంధం ఏర్పడి ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో చివరివాడైన పూరునికే రాజ్యాధికారం లభించింది. ‘నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ నువ్వు భర్తవే’ అనీ,‘భార్య, పుత్రుడు, దాసి వారింపలేని ధర్మాలు’ అనీ శర్మిష్ట అన్న మాటలు సూటిగా ఉండి మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇటీవలి అమెరికా సహా ఒకనాటి బానిస సమాజాలు అన్నిటా దాసిపై, లేదా బానిసపై కూడా యజమాని లైంగిక హక్కును చలాయించిన సంగతి మనకు తెలుసు కనుక, ఆనాడు శర్మిష్ట ఆ హక్కు గురించే మాట్లాడుతున్నట్టు మనం ఈరోజున తేలికగా పోల్చుకోగలం.

ఈవిధంగా శర్మిష్ట మాటల్లో కూడా పురాచరిత్ర వ్యక్తమవుతోంది.

విశేషమేమిటంటే, మహాభారత కథకుడు ఎంతో విలువైన ఈ పురాచారిత్రక సమాచారాన్ని దాచకుండా అందిస్తున్నాడు. అంతకన్నా విశేషం ఏమిటంటే, సాంప్రదాయిక వ్యాఖ్యాతలు యయాతి-శర్మిష్టల సంబంధం ఎలాంటిదో వివరించకుండా మౌనం పాటించడం!

ఇంకో ఉదాహరణకు వస్తే, సత్యవతి, కుంతి కన్యగా ఉన్నప్పుడే సంతానాన్ని కన్నారు. అయినా సరే, ఇద్దరిలో కొంత తేడా ఉందని చెప్పుకున్నాం. పరాశరుని వల్ల సత్యవతికి వ్యాసుడు జన్మించడం వెనుక దైవ సంబంధం కానీ, వరప్రభావం కానీ ఏమీ లేవు. పరాశరుడు ఒక మునే కానీ దైవం కాదు. కానీ కుంతి కర్ణుని కనడం వెనక దుర్వాసుని వరంతోపాటు సూర్యుడనే దైవం ఉన్నారు. సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే…మహాభారత కథకుడు పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారి తల్లి అయిన కుంతికి ఒక ప్రత్యేకతను లేదా విశిష్టతను ఆపాదిస్తున్నాడు.

ఇలాంటి తేడాయే; ద్రౌపదీ-జటిలుడనే ముని కూతురూ, అజిత అనే రాచకూతురుల మధ్య కూడా కనిపిస్తుంది. జటిలుని కూతురు పదకొండుమందినీ, అజిత అయిదుగురినీ పెళ్లిచేసుకున్నట్టే; ద్రౌపది కూడా అయిదుగురిని పెళ్లాడింది. కానీ జటిలుని కూతురూ, అజితల వివాహం వెనక ఎటువంటి వరాలు, శాపాలు, దైవ కారణాలు ఉన్నట్టు కథకుడు చెప్పలేదు. ద్రౌపది వివాహం వెనుకే అలాంటివి ఉన్నట్టు చెబుతున్నాడు. కారణం కుంతి విషయంలో చెప్పుకున్నదే. ద్రౌపది పాండవుల భార్య, తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు!

ఇప్పుడు నియోగ పద్ధతిలో సంతానం కనడం గురించే చూడండి…తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగ పద్ధతిలో సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి ఆదేశించింది. వ్యాసుడు ఒక మునే తప్ప దైవం కాదు. కుంతికి దుర్వాసుడు ఉపదేశించినట్టుగా అంబిక, అంబాలికలకు, వారి దాసికి ఏ మునీ వచ్చి సంతాన మంత్రాన్ని ఉపదేశించలేదు. సహజప్రక్రియలోనే వారికి వ్యాసుని వల్ల సంతానం కలిగారు. తనకు దుర్వాసుని మంత్రం, సూర్యుని అనుగ్రహం ఉన్నప్పటికీ, సంస్కృత భారతం ప్రకారం కుంతి నవమాసాలు మోసే కర్ణుని కంది. దీర్ఘతముడు అనే ముని కూడా బలి అనే రాజు భార్యకు నియోగపద్ధతిలో, సహజప్రక్రియలోనే సంతానం ఇచ్చాడు. కల్మాషపాదుడనే రాజు భార్యకు వశిష్టుడు నియోగపద్ధతిలో, సహజవిధానంలోనే కొడుకును ఇచ్చాడు.

VanaParva

పాండురాజు కూడా నియోగ పద్ధతిలో తనకు సంతానం ఇమ్మనే కుంతిని అడిగాడు. ఆ విధంగా కలిగే సంతానం కూడా అన్నివిధాలా ఔరసునితో సమానమే నని కూడా అన్నాడు. నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని ఎలా తలచుకోమని కుంతి అనడంలో కూడా, తను కనవలసింది స్త్రీ-పురుష సంపర్కం ద్వారా అందరూ కనే సంతానమే తప్ప మరొకటి కాదన్న సూచన ఉండనే ఉంది. తీరా అందుకు అంగీకరించిన తర్వాత, తనకు దుర్వాసుడు ఇచ్చిన వరాన్నీ, ఆ వరప్రభావంతో ఏ దేవుణ్ణి తలచుకుంటే ఆ దేవుడు వచ్చి తనకు సంతానం ఇస్తాడన్న వివరాన్నీ ఆమె పైకి తీసింది. ఏ దేవుణ్ణి తలచుకోమంటావో చెప్పమని పాండురాజును అడిగింది. అలా క్రమంగా ఆమెకు దైవ సంబంధం వల్ల ముగ్గురు కొడుకులు, మాద్రికి ఇద్దరు కొడుకులు కలిగినట్టు కథకుడు చెబుతున్నాడు.

తనకు నియోగపద్ధతిలో సంతానం ఇమ్మని అడిగినప్పుడు పాండురాజు దృష్టిలో ఉన్నది తను పుట్టిన విధానమే. అంబాలికకు నియోగపద్ధతిలో వ్యాసుని వల్ల తను ఎలా పుట్టాడో ఆ ప్రక్రియలోనే తనకు సంతానం ఇమ్మని అతను కుంతిని అడిగాడు. ఆ సంగతి మహాభారతంలోనే స్పష్టంగా ఉంది(ఆదిపర్వం, పంచమాశ్వాసం, 59). కుంతికి గల వరమూ, ఆ వరప్రభావంతో దేవతలు వచ్చి ఆమెకు సంతానం ఇచ్చే అవకాశమూ అతని దృష్టిలో లేవు. అతనికి అంతవరకూ వాటి గురించి తెలియదు కూడా. ‘పరపురుషుని ఎలా తలచుకుంటా’మని కుంతి అన్నప్పుడూ తనకు దుర్వాసుడు ఇచ్చిన వరం ఆమె దృష్టిలో లేదు. అంటే, పాండురాజు, కుంతీ కూడా ఆ సమయంలో కేవలం నియోగం గురించే ఆలోచిస్తున్నారు. తీరా నియోగానికి తను ఆమోదించిన తర్వాత దుర్వాసుని వరం గురించీ, దేవతల గురించీ కుంతి చెబుతున్నదంటే, ఆ మాటలు నిజానికి ఆమెవి కావు, కథకుడివి. కారణం స్పష్టమే. తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారికి దైవసంబంధాన్ని ఆపాదించవలసిన అవసరం అతనికి కనిపించింది.

అదే సమయంలో కథకునిలోని వైరుధ్యాన్ని చూడండి…ఒకపక్క, కుంతికి సహజప్రక్రియలోనే సంతానం కలిగినట్టు తనే సూచిస్తున్నాడు. ఇంకోపక్క, దానికి మహిమను, దైవసంబంధాన్ని జోడిస్తున్నాడు…

***

మహాభారత కథకుని ప్రత్యేకతే అది. అతను నిజం దాచడు. కాకపోతే ఆ నిజంపై కల్పన అనే ఒక పారదర్శకమైన ముసుగు కప్పుతాడు. అందులోంచి నిజం కనిపించిపోతూనే ఉంటుంది.

పాండవుల పుట్టుకనే తీసుకోండి. కాస్త హేతుబద్ధంగా ఆలోచించేవారికి ఆ పుట్టుకపై తప్పనిసరిగా కొన్ని సందేహాలు కలుగుతాయి. భారత కథను ఉన్నదున్నట్టు తీసుకుంటూ విశ్వాసంలో భాగం చేసుకునే ఇప్పటివారికి, ఈ సందేహాలు ఈ కాలంలోనే పుట్టిన పెడధోరణిగా కనిపిస్తాయి. కానీ విశేషమేమిటంటే, పాండురాజు, మాద్రి మరణించిన తర్వాత కుంతి పాండవులను వెంటబెట్టుకుని కొందరు మునులతో కలసి హస్తినాపురానికి వచ్చినప్పుడు అక్కడి జనంలోనే కొందరికి పాండవుల పుట్టుకపై అనుమానాలు కలిగిన విషయాన్ని కథకుడు దాచకుండా చెబుతున్నాడు.

సంస్కృత భారతం ప్రకారం, పాండురాజు కన్నా గొప్పగా కనిపిస్తున్న వీరు అతని కొడుకులు ఎలా అవుతారని కొందరూ; కుంతి, మాద్రి పతివ్రతలు కనుక పాండురాజు కొడుకులేనని మరికొందరూ అనుకుంటే; పాండురాజు ఎప్పుడో శాపగ్రస్తుడైనప్పుడు ఇంత చిన్న వయసు పిల్లలు అతనికి ఎలా కలుగుతారని ఇంకొందరు అనుకున్నారట. అప్పుడు కుంతి వెంట వచ్చిన మునులే కాక, దేవతలు కూడా వీరు పాండురాజు కొడుకులే నని చెప్పారట. పాండవుల పుట్టుకను కొందరు అనుమానించిన సంగతిని మాత్రం తెలుగు భారతం పరిహరించింది.

శతశృంగం నుంచి పాండవులను హస్తినాపురానికి తీసుకొచ్చినప్పుడు వారి వయసు ఎంత అన్న విషయంలో కూడా సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుంది. పాండవులు ఒక్కొక్కరి వయస్సులలోనూ ఏడాది తేడా ఉందని చెబుతూనే, హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆ అయిదుగురూ అయిదేళ్ళ వయసు వారిగానే కనిపించారని సంస్కృత భారతం చెబుతోంది. తెలుగు భారతం పాండవుల వయసులలో ఏడాది తేడా ఉందని అంటూనే హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజు వయసు పదహారేళ్లని చెబుతోంది.

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన ‘మహాభారతతత్త్వకథనము’లో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:

ధర్మరాజును ధృతరాష్ట్రుడు యువరాజుగా అభిషేకించిన తర్వాత అతను విపరీతమైన జనాదరణను పొందాడు. దుర్యోధనుడు దానిని సహించలేకపోయాడు. తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు. పుత్రప్రేమకు లొంగిపోయిన ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతం అనే ప్రాంతానికి వెళ్లమన్నాడు. పాండవులు కుంతితో కలసి వారణావతానికి బయలుదేరారు. అప్పుడు, హస్తినాపురంలో వారిని అభిమానించే జనం కూడా వారివెంట కొంత దూరం వెళ్లారు. అలాగే విదురుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్నవారికి వినిపించినా అర్థం కాని మాటలతో ధర్మరాజుకు విదురుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు.

విదురుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ధర్మరాజు దగ్గరికి వచ్చి, విదురుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది. ధృతరాష్ట్రుడు మీ హితం కోరేవాడు కాదనీ, మీకు అపకారం చేస్తాడనీ, ఆహారంలో విషం కలిపే అవకాశం, అగ్ని ప్రమాదం మొదలైన వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ; దుర్యోధనుని కుట్ర కనిపెడుతూ అందుకు చేయవలసిన ప్రతీకారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాననీ విదురుడు చెప్పినట్టు ధర్మరాజు తల్లితో అన్నాడు. విదురుడు ధర్మరాజుతో మాట్లాడింది విదేశీ భాషలోనే ననీ, అది టిబెట్ భాష కావచ్చుననీ పెండ్యాలవారు అంటారు.

అంటే ఆ భాష ధర్మరాజుకే కాక విదురుడికీ తెలుసునన్న మాట.

ఇంకా విశేషం ఏమిటంటే, ఇంద్రుని వల్ల అర్జునుడు ఒక్కడే కుంతికి పుట్టాడనీ, ధర్మరాజు, భీముడు ఆమెకు పుట్టలేదనే భావన కలిగించే వాక్యాలు సంస్కృత భారతంలో ఉన్నాయి. ‘బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న పాండురాజుకు ధర్మదేవత ప్రత్యక్షంగా ధర్మరాజును పుట్టించాడు. అలాగే, మహాబలవంతుడైన భీముని వాయుదేవుడు ఇచ్చాడు. ఇంద్రుని వల్ల కుంతికే అర్జునుడు పుట్టాడు’ అని సంస్కృత భారతం(ఆది-అ 126)అంటోంది.

కుంతికి పృథ అనే పేరు ఉంది కనుక, పాండవులలో ఒక్క అర్జునుడికే పార్థుడనే(పృథ కొడుకు పార్థుడు అవుతాడు)పేరు ఉంది కనుక వాస్తవంగా కుంతికి పుట్టింది అతనొక్కడే కావచ్చునని పెండ్యాలవారి అనుమానం. యముడు, వాయువు తలచుకున్న వెంటనే కొడుకుల్ని ఇవ్వగా, ఇంద్రుడు ఏడాది పాటు తపస్సు చేస్తే కానీ కరుణించని సంగతిని ఆయన ఉదహరిస్తారు. ఇంకోచోట ఆయనే, పురాణ మునులలో ధర్ముడు, వాయువు అనే పేర్లతో ఇద్దరు మునులు; ఇంద్రుడు అనే పేరుతో ఇద్దరు మునులు ఉన్నారనీ, వీరి పేర్లతో ఋగ్వేదంలో సూక్తాలు కూడా ఉన్నాయనీ; కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ మునుల వల్ల కలిగి ఉండే అవకాశం ఉందని అంటారు. భైరప్ప అన్వయం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

పెండ్యాలవారి వాదాలను ఖండించడంలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఇటువంటి హేతుబద్ధ పరిశీలన, గ్రంథస్థ వివరాల జోలికి వెళ్లకుండా మునులు, దేవతలు చెప్పిన మాటలనే ప్రమాణంగా తీసుకున్నారు. అంటే, ఆయన వాదనలో కేవలం విశ్వాసానిదే పై చేయి అయిందన్న మాట.

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

మహాభారతంలో ఒక భౌగోళిక వివరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

తనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు…

అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం కలగకపోవడంతో నియోగపద్ధతిలో సంతానం కనమని కేకయరాజు భార్యకు చెప్పాడు. అప్పుడు శ్రుతసేన పుంసవన హోమం చేయించి ఋత్విజుల ద్వారా ముగ్గురు కొడుకులను కంది.

అయితే, పాండురాజు ప్రతిపాదనకు కుంతి వెంటనే ఒప్పుకోలేదు. ‘నువ్వు భరతకులశ్రేష్ఠుడివి. నీకు మేము ధర్మపత్నులం. పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటాం?’ అంది. ‘అదీగాక మా మీద నీ అనుగ్రహం ఉంటే సంతానం అదే కలుగుతుంది. అలాంటి ఒక పుణ్యకథను నేను పౌరాణికుల ద్వారా విన్నాను’ అంటూ ఆ కథ చెప్పింది.

“పూర్వం వ్యుషితాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతను పురువంశంవాడు. వంద అశ్వమేధయాగాలు చేశాడు. అతని భార్యపేరు భద్ర. వారికి సంతానం కలగలేదు. అతను భార్యతో విపరీతకామాసక్తితో నిరంతరం సంగమించేవాడు. దాంతో అతనికి రోగం వచ్చింది. ఆ రోగంతో కన్ను మూశాడు. భర్త వియోగాన్ని భార్య భరించలేకపోయింది. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను. నేనూ నీతోనే వస్తాను. లేదా నీ లాంటి కొడుకులనైనా నాకు ఇవ్వు’ అంటూ భర్త శవాన్ని కౌగలించుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడా శవంలోంచి ఒక దివ్యవాణి వినిపించింది. ‘విచారించకు. నీకు కొడుకులు కలిగేలా వరమిస్తున్నాను. ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ శుచిగా పాన్పు మీద పడుకుని నన్ను తలచుకో’ అని చెప్పింది. ఆమె అలాగే చేసింది. అప్పుడామెకు ముగ్గురు సాల్వులు, నలుగురు మద్రులు- మొత్తం ఏడుగురు కొడుకులు కలిగారు”.

ఈ కథ చెప్పిన కుంతి,‘ఆ రాజులానే నువ్వు మమ్మల్ని అనుగ్రహించి సంతానం పొందు’ అని పాండురాజుతో అంది. పాండురాజు దానికి సమాధానం చెప్పలేదు. ‘వెనకటి కాలంలో స్త్రీలు పురుషుల అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించేవారనీ, అఖిలప్రాణి సాధారణమైనధర్మం పాటిస్తూ ఋతుకాలం తప్పకుండా తమ తమ వర్ణాలలో స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ కూడా సంబంధం పెట్టుకునేవా’రని అంటూ, ఉద్దాలకుని కథ చెప్పాడు. ఆ కథలో ఉద్దాలకుని భార్యను ఒక వృద్ధవిప్రుడు సంతానం కోసం కామించగా, ఆమె కొడుకు శ్వేతకేతుడు ఆగ్రహించాడు. ‘ఇకనుంచి స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, అందువల్ల సకల పాపాలూ చుట్టుకుంటాయనీ, ఈ మేరకు తను కట్టడి చేస్తున్నాననీ, దీనిని మనుషులందరూ పాటించా’లనీ శాసించాడు.

కుంతి, పాండురాజుల మధ్య సాగిన ఈ కాస్త సంభాషణా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఉదాహరణకు, నీ చెల్లెలు శ్రుతసేన భర్త నియోగంతో క్షేత్రజులను కందని కుంతితో పాండురాజు అన్న తీరు చూస్తే, తన చెల్లెలు ఎలా సంతానం కన్నదో అక్కకే తెలియదా అనిపించి, అసంబద్ధంగా కనిపిస్తుంది. లేదా, తన కోరికను సమర్ధించుకోవడం కోసం, తన చెల్లెలు సంగతిని కుంతికి పాండురాజు గుర్తుచేశాడనుకుంటే బహుశా అది రెండు సూచనలు చేస్తోంది: మొదటిది, క్షేత్రజులను కనడం అనే ఆనవాయితీ, అందులో తప్పు లేదన్న భావనా అప్పటికే పాతుకుని ఉండడం. రెండోది, కుంతి కన్యగా ఉన్నప్పుడు కర్ణుని కన్న ఉదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆమె సామాజిక నేపథ్యంలో క్షేత్రజసంతానం ఏమంత ఆక్షేపణీయం కాకపోవడం. భైరప్ప తన ‘పర్వ’ నవలలో కూడా కుంతిది నిమ్నసామాజికవర్గంగా చిత్రిస్తారు. ఆమెకు ఒక తరం వెనకే, ఆమె కంటే ఉన్నత సామాజికవర్గంగా కనిపించే భరతకులానికి చెందిన క్షత్రియకుటుంబం నియోగ పద్ధతిని ఆశ్రయించి క్షేత్రజ సంతానాన్ని(వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించడం)పొందిన మాట నిజమే. కానీ అప్పటికే ఉన్నత సామాజిక వర్గాలలో అది ఆక్షేపణీయంగా మారుతూ ఉండవచ్చు.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

అదే సమయంలో ఇంకొకటి జరుగుతూ ఉండచ్చు. అది,నిమ్నసామాజికవర్గాల ఊర్ధ్వచలనం(upward mobility). పాండురాజుకు కుంతిని ఇవ్వడం ద్వారా భరతకుల క్షత్రియులతో వియ్యమందుతున్న భోజకులకు(కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజక తెగకు చెందిన యాదవుడు) కుంతి పుట్టింట కన్యగా ఉండి కొడుకును కన్న సంగతిని రహస్యంగా ఉంచవలసిన అవసరం కనిపించి ఉండవచ్చు. భైరప్ప అన్వయం ఇంచుమించు ఇలాగే సాగుతుంది.

నా అభిప్రాయంలో దీనిని మరోలా చూడవచ్చు: క్షేత్రజ సంతానం పట్ల కానీ, కన్యాగర్భం పట్ల కానీ ఉన్నత, నిమ్న సామాజిక వర్గాలలో(అలాంటి స్పష్టమైన విభజన నిజంగా ఉందనుకుంటే) ఎటువంటి అభ్యంతరాలు, లేదా ఆమోదాలు ఉన్నాయో మనకు కచ్చితంగా తెలియదు. మనకూ, వారికీ మధ్య; భిన్న కాలాలకు, విలువలకు చెందిన కథకుడు ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నది; అతని అభ్యంతరాలను, లేదా ఆమోదాలను కూడా సూచించే వ్యాఖ్యాన రూపంలోని కథ మాత్రమే. అతని గుప్పిటి సందులలోంచి జారిపడే వాస్తవాల తునకలే మనకు ఆధారం. ఆ తునకల ఆధారంగానే కథను మనం పునర్నిర్మించుకోవాలి. కుంతి-పాండురాజుల సంభాషణలో క్షేత్రజుల గురించి జరిగిన చర్చ అలాంటి తునకలలో ఒకటి.

క్షేత్రజ సంతానాన్ని ఆక్షేపణీయంగా భావించడం ప్రారంభించిన ఉన్నత సామాజిక వర్గానికి పాండురాజు ప్రతినిధి అనుకుందాం. క్షేత్రజ సంతానం అంత ఆక్షేపణీయం కాకపోయినా, ఊర్ధ్వచలనంలో భాగంగా ఆ ఆనవాయితీనుంచి బయటపడాలనుకునే నిమ్నసామాజికవర్గానికి కుంతి ప్రతినిధి అనుకుందాం. అప్పుడు వారిద్దరి సంభాషణా కొంత అర్ధవంతంగా కనిపిస్తుంది. తమ స్థాయిలో క్షేత్రజ సంతానం గౌరవప్రదం కాదని పాండురాజుకు తెలుసు. తన అన్న ధృతరాష్ట్రుడికి అలాంటి అవసరం లేదన్న సంగతి అతని దృష్టిలో సహజంగానే ఉంటుంది. తను క్షేత్రజ సంతానం పొందితే సాటివారిలో తలవంపుగానే ఉంటుంది. కానీ ఒక దశలో అంతకంటే గత్యంతరం లేదని అతనికి అనిపించింది. క్షేత్రజ సంతానానికి కుంతిని ఒప్పించడంతోపాటు, బహుశా అంతకంటే ఎక్కువగా తను సమాధానపడడానికి అతను ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది. ఎక్కువ ఆలోచనా, ధైర్యమూ చేయవలసి వచ్చింది. సమర్ధింపులనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఏకాంతంలో తన బాధను కుంతి దగ్గర వెళ్లబోసుకోవడం, పన్నెండురకాల కొడుకుల గురించి వివరించడం, క్షేత్రజులు ఔరసులకు ఏమాత్రం తక్కువ కారని అనడం, వెనకటి కాలంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉండేవో చెప్పడం, కుంతి చెల్లెలి ఉదాహరణను ప్రస్తావించడం -కుంతిని మానసికంగా సిద్ధం చేయడంగానూ, అంతకంటే ఎక్కువగా తను మానసికంగా సిద్ధపడే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

కుంతి సమస్య వేరు. తన సామాజిక నేపథ్యం రీత్యా క్షేత్రజసంతానం ఆమెకు అంత ఆక్షేపణీయం కాదు. ఆ విషయంలో స్వయంగా తనకే అనుభవం ఉంది కూడా. కానీ ఇప్పుడు తను భరతకుల క్షత్రియుల కోడలు. తన స్థాయి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ క్షేత్రజ సంతానం వైపు మళ్లడం ఆమెకు స్థాయీ పతనంగా కనిపిస్తుంది. డానికి తోడు తోటికోడలు గాంధారి ఆమె కళ్ల ముందు ఉంటుంది. గాంధారికి క్షేత్రజ సంతానం కనవలసిన అవసరం లేదు. కనుక క్షేత్రజ సంతానం కనడం కుంతికీ సాటివారిలో తలవంపే. అయితే, పాండురాజుకులానే ఆమెకూ గత్యంతరం లేదని తెలుసు.

ఈ మొత్తం చర్చ అంతా ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంతానం లేని తనకు ఉత్తమగతులు ఉండవన్న పాండురాజు చింత నుంచి ఇదంతా ప్రారంభమైంది. అయితే, అంత స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ ఆస్తిహక్కు, వారసత్వాల గురించిన చింత కూడా ఉంది. క్షేత్రజులు కూడా ఔరసుల లానే బంధువులు, దాయాదులు అవుతారని పాండురాజు అనడమే చూడండి. అలా అనడంలో ఆస్తిహక్కు గురించిన కోణమూ బయటపడుతూ ఉండచ్చు. ఈ కోణం నుంచి చూసినప్పుడు పాండురాజు-కుంతి సంభాషణ రూపంలో పైకి కనిపించే కథ వెనుక, కనిపించని కథ చాలా ఉందని అనిపిస్తుంది. కురు-పాండవుల మధ్య ఆస్తి పోరాటం తాలూకు మూలాలు అక్కడినుంచే ఉన్నాయని కూడా అనిపిస్తుంది. పాండురాజు-కుంతి సంభాషణలో కనిపించని టెన్షన్ చాలా ఉన్నట్టూ అనిపిస్తుంది.

వందల సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న పురాణ కథల విషయంలో ఒక సమస్య ఉంది. అవి కాలగతిలో ఒక విశ్వాసంగానూ; ప్రశ్నలకు, అనుమానాలకు, హేతుబద్ధతకు అతీతంగానూ ఘనీభవించిపోతాయి. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోడానికి అలవాటుపడిపోతాం. వాటిని తార్కికంగానూ, హేతుబద్ధంగానూ పరిశీలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఘనీభవస్థితి నుంచి అవి కరగడం ప్రారంభించి కొత్త కోణాలను బయటపెడుతూ కొత్త రూపాలు తీసుకుంటాయి.

ఏదో విధంగా తను సంతానవతి కావడం మినహా గత్యంతరం లేదని తెలిసినా, కుంతి భర్త దగ్గర వెంటనే బయటపడలేదు. తన వెనకటి సామాజిక నేపథ్యమూ, క్షేత్రజుని కనడంలో తనకున్న పాత అనుభవమూ ఆ క్షణంలో ఆమెను కెలుకుతూ ఉండచ్చు. మారిన తన సామాజికస్థాయి కారణంగా ఆమెలో కొంత జంకు, భర్త దృష్టిలో పలచనవుతానన్న భయమూ ఉండడం సహజమే. అందుకే భరతకుల శ్రేష్ఠుడవైన నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటామంది. తనతోపాటు, సవతి అయిన మాద్రిని కూడా కలుపుకుంది. అంటే, ఈ విషయంలో మొత్తం బాధ్యతను తనొక్కతే తీసుకోడానికి కుంతి సిద్ధంగా లేదన్న మాట. మాద్రిని కూడా భాగస్వామిని చేస్తే తనపై ఉన్న చిన్నతనపు భారం కొంత ఆమెకు బదిలీ అవుతుంది. ఆ తర్వాత నియోగపద్ధతిలో నకుల, సహదేవులను కనడం ద్వారా మాద్రి ఇందులో పూర్తి భాగస్వామిని అయింది కూడా.

పాండురాజు వల్ల తమకు సంతానం కలిగే అవకాశం లేదని కుంతికి తెలుసు. అలాగే, తను పురుష సంపర్కంతోనే సంతానం కలుగుతుందని తెలియని అమాయకురాలేమీ కాదు. కనుక, నీ అనుగ్రహం ఉంటే మాకు సంతానం అదే కలుగుతుందని ఆమె అనడంలో అర్థంలేదు. భర్త కోరికను వెంటనే ఆమోదించి తను తేలికవకూడదనే ఉద్దేశంతో ఆమాట అన్నట్టు తెలుస్తూనే ఉంది. ఆపైన, ఆమె చెప్పిన కథ వల్ల ఆ ఉద్దేశం మరింత హాస్యాస్పదమైన మలుపు తిరిగింది. చనిపోయిన భర్తను కౌగలించుకుని భార్య ఏడుస్తూ సంతానం ఇమ్మని అడిగినట్టూ, అప్పుడు, నీకు సంతానం కలిగేలా వరమిస్తున్నానని భర్త కళేబరం నుంచి దివ్యవాణి పలికినట్టు, ఆమెకు ఏడుగురు కొడుకులు కలిగినట్టు ఆ కథ చెబుతోంది.

కాస్త లోతుగా పరిశీలిస్తే పైకి అమాయకంగా కనిపించే ఈ కథలో అతితెలివి దాగి ఉన్న సంగతీ అర్థమవుతుంది. చనిపోయిన భర్త కూడా భార్యకు సంతానం అనుగ్రహించగలడని కుంతి ముఖతా కథకుడు చెబుతున్నాడు. అంటే, భర్తకు దివ్యత్వం (దివ్యవాణి)ఆపాదిస్తున్నాడు. కానీ మరోవైపు, వ్యుషితాశ్వుని భార్యకు మనుష్య ప్రక్రియలోనే సంతానం కలిగిన విషయాన్నీ తనే బయటపెడుతున్నాడు. ఎలాగంటే, వ్యుషితాశ్వుడు పురువంశ రాజు. అతని భార్యకు కలిగిన ఏడుగురు కొడుకులలో నలుగురు సాల్వులు, ముగ్గురు మాద్రులు. అంటే వారు సాల్వ, మద్రతెగలకు చెందిన పురుషుల ద్వారా కలిగిన సంతానమన్న మాట. దీనినిబట్టి ఇందులో భర్త నియోగం కూడా లేదనీ, భర్త మరణించాక భార్య ఇతరుల వల్ల సంతానం కన్నదనీ తెలిసిపోతోంది. పైగా, ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదవరోజు, లేదా పద్నాలుగవరోజు సంతానం పొందడానికి యోగ్యమైన సమయమన్న వివరాన్ని కూడా ఈ కథ చెబుతోంది. ఈ విధంగా కథకుడు ఎన్నోచోట్ల చేసినట్టుగా మనుష్యధర్మం మీదే దేవధర్మం లేదా దివ్యత్వం అనే ముసుగు కప్పి శ్రోతలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎప్పటిలా విఫలయత్నంగా మారుతోంది.

అంటే ఏమిటన్నమాట? భర్త కోరికకు వెంటనే ఆమోదించనట్టు కుంతి కనిపిస్తూనే, ఆ కోరికకు అనుకూలించే కథే చెబుతోంది.

ఇక్కడినుంచి పాండురాజు అక్షరాలా స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. వెనకటి కాలంలో స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఋతుకాలంలో ధర్మం తప్పకుండా స్వపురుషులతో, పరపురుషులతో సంతానం కనేవారని చెప్పడం దీనికి ప్రారంభం. ఆ తర్వాత ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు దానిని ఎలా నిషేధించాడో కూడా చెప్పాడు. నిషేధించినప్పుడు తను కుంతిని క్షేత్రజసంతానం కనమని అడగడం ఎలా పొసగుతుందనే ప్రశ్న వస్తుంది. దానికి పాండురాజే ఆ వెంటనే సమాధానం ఇస్తున్నాడు. శ్వేతకేతు నిషేధం మనుష్యజాతికి చెందిన స్త్రీల పరపురుష సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది. అది పశుపక్షులకూ, ఉత్తరకురుభూములలోని వారికీ వర్తించదు. పశుపక్షులలోనూ, ఉత్తర కురుభూములలోనూ వెనకటి ధర్మమే అమలు జరుగుతోంది!

అదీ సంగతి…స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్రలో భాగంగా పాండురాజు వాటి ప్రాంతీయభేదాల గురించి కూడా చెబుతున్నాడు. అంతేకాదు, కుంతిని క్షేత్రజులను ఇమ్మని అడుగుతున్న పాండురాజు ఇప్పుడు భార్యల సహితంగా హిమాలయాలకు అవతల ఉత్తర కురుభూములలోనే ఉన్నాడు!

మహాభారతంలో స్పష్టమైన భౌగోళిక వివరాన్ని అందిస్తున్న ఘట్టాలలో ఇదొకటి.

పాండురాజు, అతని భార్యల ప్రయాణమార్గాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మన్మథక్రీడలో ఉన్న మృగదంపతులను అన్యాయంగా చంపిన తర్వాత, మగమృగం తనను శపించిన తర్వాత విరక్తుడై తపస్సు చేసుకోవాలనుకున్న పాండురాజు భార్యలతో కలసి ఉత్తరదిశగా ప్రయాణం సాగించాడు. నాగశైలాన్ని, చైత్రరథాన్ని, హిమవంతాన్ని దాటివెళ్ళాడు. సురులు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉన్నాడు. అక్కడినుంచి మళ్ళీ బయలుదేరి ఇంద్రద్యుమ్న మనే కొలనునూ, హంసకూటాన్నీ దాటి ఎత్తైన శిఖరం కలిగిన శతశృంగం అనే పర్వతానికి చేరుకున్నాడు. అది కూడా సిద్ధులు, దేవతలు, యక్షులు నివసించే ప్రాంతం. ఆ శతశృంగంలోని ఉత్తరభాగంలో తపస్సు చేసుకుంటున్నాడు.

స్వర్గానికి వెళ్ళే మార్గంలోనే శతశృంగం ఉంది. దివ్యవిమానంలో వచ్చిపోయే దేవతలతో ఆ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. అప్పుడే ఊర్ధ్వలోకాలకు వెడుతున్న మునులు అతనికి కనిపించారు. ఆరోజు అమావాస్య కనుక బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకానికి వెడుతున్నామని చెప్పారు. పాండురాజు, భార్యలతో సహా వారి వెనక బయలుదేరేసరికి, మిట్టపల్లాలతో నిండిన ఈ మార్గంలో సుకుమారులైన కుంతీ, మాద్రులు నడవలేరనీ, అదీగాక ఇది దేవతలు వెళ్ళే మార్గాలనీ చెప్పి మునులు వారించారు. దాంతో పాండురాజు శతశృంగంలోనే ఆగిపోయి సంతానం కోసం ఆలోచన ప్రారంభించాడు.

అంటే, ఉత్తరంగా హిమాలయాలకు అవతల ఉన్న ప్రాంతాన్నే ఉత్తరకురుభూములు అంటారన్నమాట. హిమాలయాలకు ఇవతల ఉన్న ప్రాంతం కురుభూమి కనుక, అవతల ఉన్నవి ఉత్తర కురుభూములు అవుతాయి. పాండురాజు ఉన్న శతశృంగం ఉత్తరకురుభూములలో భాగమే. ఆ ప్రాంతమంతటా సిద్ధులు, యక్షులు, దేవతలు, మునులు నివసిస్తున్నారు. గమనించండి, అక్కడ ‘మనుషులు’ ఉన్నట్టు భారతం చెప్పడం లేదు.

పురాకాలంలో జాతులు, తెగల వర్గీకరణకు సంబంధించి ఇది ఒక ఆసక్తికరమైన వివరం. ఒకవిధమైన జీవనశైలిని, ఆచారాలను, ఆహారవిహారాలను పాటించేవారికి; భిన్నమైన జీవనశైలి, ఆచారాలు, ఆహారవిహారాలను పాటించేవారు తమకంటే పూర్తి భిన్నులుగా కనిపించడం సహజమే. అవి వారికి విచిత్రంగానూ, అద్భుతంగానూ కనిపించడం కూడా సహజమే. ఆ విలక్షణత వారికి ఒక మాంత్రికతను, మార్మికతను ఆపాదింప చేసేలానూ ఉండచ్చు. తమకంటే అన్నివిధాలా భిన్నులనే భావనతో వారిని వేరే పేర్లతో పిలిచి ఉంటారు. ముఖ్యంగా మన ప్రస్తుతాంశానికి సంబంధించి, అక్కడ స్త్రీ-పురుష సంబంధాలు కూడా కురుభూములలో కంటే భిన్నంగా ఉంటాయి.

శతశృంగంనుంచే స్వర్గానికి వెళ్ళే మార్గం ఉంది. అది కూడా మిట్టపల్లాలతో ఉంటుంది. అంటే, స్వర్గం మరెక్కడో లేదు, ఈ భూమి మీదే ఉందని ఈ వివరాలు చెబుతున్నాయి. హిమాలయాలకు అవతల ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు భౌగోళికంగా వేర్వేరు దేశాల పేర్లతో ఉండి ఉండవచ్చు. పాండురాజు ప్రయాణమార్గాన్ని సూచిస్తూ మహాభారతం పేర్కొన్న స్థలనామాల ఆధారంగా ఇప్పటి ప్రదేశాలను, దేశాలను గుర్తించడం ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ మనకు బాగా తెలిసిన హిమాలయాలను పేర్కొంది కనుక ఈ మొత్తం ఘట్టం భౌగోళిక సమాచారాన్ని ఇస్తున్నదనడంలో సందేహం లేదు.

మహాభారతంలో ఉత్తరకురుభూముల ప్రస్తావన, అదే స్వర్గమన్న సూచన, అక్కడ స్త్రీ-పురుషసంబంధాలు భిన్నంగా ఉంటాయన్న సంగతీ ఇక్కడ ఒక్కచోటే కాదు; చాలా చోట్ల వస్తుంది. ఆ వివరాలలోకి ఇప్పుడు పూర్తిగా వెళ్లలేం. కాకపోతే ఒక విషయం చెప్పుకోవాలి. పాండురాజు ప్రయాణ సమాచారం హిమాలయాలను కూడా దాటిపోయే మన పూర్వుల సంచార పరిధిని వెల్లడిస్తోంది. అంతేకాదు, ఆయా ప్రాంతాలు, మనుషులతో వారికి గల సంబంధాల వైశాల్యాన్నీ సూచిస్తోంది. దేశాలు, ప్రాంతాలు, మనుషుల మధ్య నేడు ఉన్నట్టు కృత్రిమమైన హద్దులు ఏవీ లేని కాలం అది. అటువంటి ఆ కాలం మన పూర్వుల దృష్టి వైశాల్యాన్ని ఎంత నిరవధికంగా పెంచి ఉంటుందో; రక రకాల ప్రాంతాలు, వ్యక్తులతో సంబంధాలు వారికి ఎటువంటి అనుభవాలు కలిగించాయో, వారి ప్రాపంచిక దృష్టిని ఏమేరకు ప్రభావితం చేసి ఉంటాయో-ఈరోజు అనేక హద్దులు, పరిమితులలో జీవించే మన ఊహకు అందడం కష్టం. మన పూర్వులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన ప్రపంచాన్ని చూశారన్న చరిత్రకారుడు హెచ్.జి.వెల్స్ మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, చివరిగా, కల్మాషపాదుడనే రాజు నియోగించడంతో, అతని భార్య వశిష్టుని వల్ల అశ్మకుడనే కొడుకును పొందిన ఉదంతాన్ని కూడా పాండురాజు కుంతికి చెప్పాడు. తర్వాత కుంతి నియోగపద్ధతిలో సంతానం కనడానికి అంగీకరించింది. తనకు పూర్వం దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది. ఆ మంత్రప్రభావంతో ఏ దేవతను ఆరాధించినా వారు వచ్చి తనకు సంతానం ఇస్తారనీ, ఎవరిని ఆరాధించాలో చెప్పమనీ అడిగింది. పాండురాజు యమధర్మరాజును ఆరాధించమని చెప్పగా కుంతి అలాగే చేసింది. అప్పుడు ఆమెకు ధర్మరాజు పుట్టాడు. ఆ తర్వాత వరసగా వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు ఆమెకు కలిగారు. ఆ తర్వాత మాద్రి కోరగా కుంతి వరప్రభావం వల్ల ఆమెకు కూడా నకుల, సహదేవులు కలిగారు.

పాండవుల జననంలో కూడా మళ్ళీ తెలివిగా దేవధర్మం, మనుష్యధర్మాలను జోడించడం ఉంది. దానితోపాటు, మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

మూడు ‘క్షేత్రా’ల ముడి

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నే నిప్పుడు ఒక విచిత్రమైన తర్కానికి లోనవుతున్నాను. దాని గురించి ముందుగా చెప్పాలనిపిస్తోంది.

ఈ వ్యాసాలను కేవలం ‘చూసే’ వారు ఉంటారు. యధాలాపంగా చదివేవారు ఉంటారు. ఆసక్తితో, ఇష్టంతో, లోతుగా చదివేవారు ఉంటారు. ఒకవిధమైన ఆసక్తి ఉన్నా అయిష్టంగా చదివేవారు ఉంటారు. ఆసక్తి లేకుండా కేవలం అయిష్టంగా చదివేవారు ఉంటారు. పాఠకులలో అనేక రకాలు. నేను కూడా ఇలాంటి పాఠకరకాలలో ఒక రకానికి చెందినవాణ్ణే కనుక ఈ వైవిధ్యాన్ని గౌరవిస్తాను.

ఈ పాఠకరకాలలో ఒక రకంవారికి, లేదా కొన్ని రకాల వారికి ‘మళ్ళీ మళ్ళీ ఇదేల భారతం’ అనిపిస్తూ ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళ దాకా ఎందుకు? ఎంతోమంది మహాపండితులు రాసిన భారతం, రామాయణం, పురాణాలు, ధర్మశాస్త్రాల సంగతులు నేనెందుకు రాస్తున్నానని ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది.

నేను విచిత్రమైన తర్కానికి లోనవుతున్నా నన్నది -ఇదిగో, ఇక్కడే!

నిజానికి నేనివి రాస్తున్నప్పుడు భారతం గురించి రాస్తున్నానన్న స్పృహ నాలో లేదు. భారత కథలు, పాత్రలు, ఘట్టాల గురించి ఇంతగా రాస్తున్నప్పుడు ఇది భారతం గురించి కాకుండా ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది తర్కం. సంగతేమిటంటే, భారతం మిషతో నేను భారతదేశం గురించి రాస్తున్నాను. భారతంలో కనిపించే భారతదేశ మూలాల గురించి, మన మూలాల గురించి రాస్తున్నాను. భారత, రామాయణాలను, పురాణాలను, ధర్మశాస్త్రాలను ఒకానొక కాలానికి చెందినవిగా మాత్రమే చూస్తూ; కాలమనే నదిలో ప్రవహిస్తున్న వాటికి ఆనకట్ట పడినట్టు ఊహించుకుంటున్నవారికి నేను భారతం గురించి మాత్రమే రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరల ఇదేల భారతం అనిపిస్తుంది. కానీ నా అవగాహన వేరు. నా ఊహలో కాలమనే నదిలో ప్రవహిస్తున్న భారతరామాయణాదులకు ఎలాంటి ఆనకట్టలూ లేవు. చాలామందికి అవి గతంలా అనిపిస్తాయి. కానీ అవి నాకు వర్తమానం!!!

ఇంకోలా కూడా చెప్పుకుందాం. మనం ఇప్పటికీ మనిషి గురించి చెప్పుకుంటున్నాం. ‘మళ్ళీ ఇదేల మనిషి గురించి’ అనుకోవడం లేదు. కానీ ఈ మనిషి ఎప్పటివాడు? మనం ఇప్పటికీ విశ్వం గురించీ, ప్రపంచం గురించీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విశ్వమూ, ప్రపంచమూ ఎప్పటివి? మనం ఇప్పటికీ భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ భారతదేశం ఎప్పటిది? అలాగే, భారతరామాయణాదులే కాదు; ప్రపంచ వాజ్మయం సమస్తం -మనిషి, విశ్వం, ప్రపంచం, భారతదేశం లాంటివే. కనుక వాటి గురించి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం.

ఇంకా నా ఉద్దేశంలో భారతం అంటే భారతదేశమే. భారతం గురించి చెప్పుకోవడం అంటే, భారతదేశం గురించి చెప్పుకోవడమే. ఇంకా చెప్పాలంటే ఒకనాటి ప్రపంచం గురించి చెప్పుకోవడమే. ఇంత వైవిధ్యవంతమైన ప్రపంచంలో ఏ విషయంలోనైనా ‘ఇది కచ్చితం’‘ఇది ఇంతే’ అనగలిగిన సాహసం ఏ మానవమాత్రుడికీ ఉండదని నేను నమ్ముతాను. అయినాసరే, ఒక విషయంలో మాత్రం నా అనుభవంనుంచి ఒకింత కచ్చితానికి దగ్గరగా మాట్లాడతాను. అదేమిటంటే, భారతంతో (అలాగే ఇతర పురాతన వాజ్మయంతో)తగు మేరకు పరిచయం లేకపోతే భారతదేశమూ, ప్రపంచమూ కూడా అర్థం కావు. సమకాలీనమైన ఏ సమస్య పైన అయినా మీరు సాధికారంగా మాట్లాడదలచుకుంటే, భారతం సహా పురావాజ్మయంతో మీకు కొంత పరిచయం ఉండితీరాలి!

ఒక ఇతిహాసం పేరే ఒక దేశానికి పేరైన ఉదాహరణ నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో మరొకటి లేదు. మళ్ళీ నేనిక్కడ భారతాన్నో, మరొకదాన్నో గ్లోరిఫై చేస్తున్నానని అనుకోవద్దు. నేను కవిత్వం రాయడం లేదు. అక్షరాలా ఉన్న మాట చెబుతున్నాను.

ఈ వ్యాసాల క్రమంలో ఇదే వివరణను-అచ్చంగా ఈ మాటల్లో కాకపోయినా-అప్పుడప్పుడు ఇచ్చుకుంటూనే వచ్చాను. అయినా మరోసారి ఇవ్వవలసి రావడం చూస్తే, నాకు ‘బ్రాహ్మణుడు-మేక’ కథ గుర్తొస్తోంది. ఆ కథలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞానికి మేకను తోలుకుపోతుంటే, ఆ మేకను కాజేయాలనుకున్న కొందరు దొంగలు దారిలో తలో చోటా కాపు కాసి,‘అదేమిటి అయ్యవారూ, కుక్కను తోలుకుపోతున్నారు’ అంటారు. నలుగురూ అలా అనేసరికి బ్రాహ్మణుడు అవునేమో ననుకుని దానిని వదిలేసి పోతాడు.

నేను కూడా ఆ బ్రాహ్మణుడిలా మోసపోకుండా జాగ్రత్త పడడానికే ఈ ఆత్మవిమర్శ లాంటి వివరణ.

***

మన ప్రాచీనులు లైంగికత్వాన్ని, స్త్రీ-పురుష సంబంధాలను మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన దృష్టి నుంచి చూశారనీ; లైంగిక సుఖాన్ని ప్రకృతిలో భాగంగా, అతి సహజంగా, స్వచ్ఛ, పవిత్ర కార్యంగా అర్థం చేసుకున్నారనీ కిందటి వ్యాసంలో అన్నాను. పురాచరిత్ర కోణం నుంచి ఇది చాలా ముఖ్యమైన వివరం. మనలో చాలామందికి ఈ విషయంలో తలకిందుల అభిప్రాయం ఉంది. లైంగికత విషయంలో మన పూర్వులు చాలా నిష్ఠను, కట్టడిని, నైతికతను పాటించారనీ; మన దగ్గరకు వచ్చేసరికి అవి పలచబారిపోయాయనీ వారు భావిస్తారు. ఈ విషయంలోనే కాక ప్రతి విషయంలోనూ వెనకటి తరాలవారి కంటే నేటి తరాలు అన్నివిధాలా పతనమై పోయాయనే ఒక సూత్రీకరణ వినిపిస్తూ ఉంటుంది. లోతుగా చూస్తే, ఈ అభిప్రాయంలో నిజం కన్నా అపోహే ఎక్కువ.

నేను లైంగికతపై ప్రాచీనుల దృష్టి గురించి పై మాటలు రాసిన తర్వాత, యధాలాపంగా ‘SEXUAL LIFE IN ANCIENT GREECE’ (ByHANSLITCH-1952 ముద్రణ) అనే పుస్తకం తిరగేయడం ప్రారంభించాను. ఈ పుస్తక రచయిత అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు నా అభిప్రాయాన్ని నూటికి నూరుపాళ్లూ ధ్రువీకరించేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. గ్రీకు కామెడీలో లైంగికోద్దీపక లక్షణం, అశ్లీలం చాలా ఎక్కువ పాళ్లలో ఉండడం గురించి రచయిత రాస్తూ, ప్రాచీనులు లైంగికత్వాన్ని చాలా అమాయకంగానూ, సహజంగానూ చూశారనీ, దానిపై ఎలాంటి రహస్యాల ముసుగులూ వేయలేదనీ అంటాడు. పైగా, లైంగికతను సమస్త ప్రాణుల అస్తిత్వానికి మూలమైన ప్రాథమిక అవసరంగా మతవిశ్వాసకోణంనుంచి చూసి ప్రస్తుతించారంటాడు(పేజీ-153).

అంతేకాదు,‘Religion And Erotic’ అనే అధ్యాయంలో,‘మతపరమైన అవసరాన్ని, మతపరమైన ఆకాంక్షను సఫలం చేసుకోవడం వెనుక చాలావరకూ లైంగికతే ఉందనీ, కొన్ని సందర్భాలలో అది ఉద్దేశపూర్వకంగా కూడా వెల్లడవుతుందనీ’ రచయిత అంటాడు(పేజీ-180). ఈ వాక్యం చూసినప్పుడు మనకు తాంత్రిక ధోరణులు గుర్తుకొస్తాయి.

అలాగే, లైంగికత విషయంలో యూదు-క్రైస్తవ దృక్పథం గురించి రచయిత ప్రస్తావిస్తాడు(పేజీ-180). మన దగ్గర ‘ఇనుప కచ్చడాలు కట్టుకున్న ముని మ్రుచ్చు’లన్నట్టుగానే, యూదు-క్రైస్తవ దృక్పథం కూడా శరీరాన్ని అన్ని విధాలా కష్టపెట్టుకోవాలనీ, కృశింపచేసుకోవాలనీ చెబుతుంది. అదే మనిషికి గొప్ప నైతికాదర్శమంటుంది. దేవతలు లైంగిక వాంఛకు అతీతులనీ, పవిత్రజీవితం గడిపినవారికే మరణానంతరం ఉత్తమగతి లభిస్తుందనీ అంటుంది. ఏకపక్షంగా ఈ అభిప్రాయాలను సమర్ధించేవారికి లైంగికతకు, మతానికి చాలా దగ్గర సంబంధం ఉందన్న సంగతిని అర్థమయ్యేలా చెప్పడం కష్టమంటాడు రచయిత.

లైంగికతకు, మతానికి ఉన్న ఈ ముడి గ్రీకు సమాజ, సంస్కృతులకే పరిమితం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంతో సహా ప్రాచీన సమాజాలు, సంస్కృతులు అన్నిటా ఈ ముడి ఉంది. తాంత్రిక ధోరణుల గురించి పైన ప్రస్తావించుకున్నాం. కేవలం పురాచరిత్ర కోణం నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాచీన సమాజాలు మతపరమైన తంతులో లైంగికతను కూడా భాగం చేసి, అక్షరాలా దానిని ‘సెలెబ్రేట్’ చేసుకున్నాయి. ఆధునిక కాలంలోనూ కొత్త కొత్త రూపాలలో ఈ ముడి కనిపిస్తూనే ఉంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్న ఈ కోణం గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక ప్రస్తుతానికి వస్తే…

***

పన్నెండు రకాల కొడుకుల గురించి చెప్పిన పాండురాజు, ఔరసులతో అన్ని విధాలా తులతూగే క్షేత్రజులను తనకు సంతానంగా ఇమ్మని కుంతిని కోరాడు. ఔరసుడి నుంచి అపవిద్ధుడి వరకూ ఉన్న ఆరు రకాల కొడుకులూ బంధువులే కాక దాయాదులు కూడా అవుతారన్నాడు. ఈ ఆరుగురిలోకి వచ్చే క్షేత్రజుడు, గూఢోత్పన్నుడు అనే రెండు రకాలవాళ్లూ నిజభర్తకు కలిగినవారు కాదు. అయినా సరే, వారు బంధువులే కాక, ఆస్తి హక్కు కలిగిన దాయాదులు కూడా అవుతారని చెప్పడం ద్వారా పాండురాజు వీరిని పూర్తి స్థాయిలో ఔరసులుగా గుర్తిస్తున్నాడు. మిగిలిన ఆరు రకాల వాళ్ళలో కూడా కానీనుడు, సహోఢుడు, పౌనర్భవుడు అనే ముగ్గురు కూడా నిజభర్తకు కలిగిన వాళ్ళు కాదు. పాండురాజు వీరిని బంధువులుగా గుర్తిస్తున్నాడు. ఇప్పటి వారసత్వ చట్టం గురించి నాకు అంతగా తెలియదు కానీ, అందులో ఇంత సడలింపు ఉంటుందని మాత్రం నేను అనుకోను. తెలిసినవారు చెప్పాలి.

ఈ ‘క్షేత్రజుడు’ అనే మాట పుట్టుక గురించి నా ఊహలు పరి పరి విధాలుగా పోయాయి. సంతానం కనే స్త్రీని క్షేత్రంగా, సంతానాన్ని ఇచ్చే పురుషుని బీజంగా, లేదా విత్తనంగా చెప్పడం ఉంది. ఈ క్షేత్ర, బీజాల పోలిక వ్యవసాయం విస్తరిస్తున్న దశకు చెందినదని అనిపిస్తుంది. మగవాడి చేయి పైన, స్త్రీ చేయి కింద అవడం కూడా అప్పటినుంచే నని పురాచరిత్రకారులు అంటారు. ఈ క్షేత్రం, బీజం అనే మాటలు కూడా వ్యవసాయానికి చెందినవే. స్త్రీ, పురుష సంబంధాలతో సహా మొత్తం సమాజ, సాంస్కృతిక జీవితం మీద వ్యవసాయసంస్కృతి ఎంత లోతైన ప్రభావం వేసిందో చెప్పడానికి ఇదొక ఆధారం కావచ్చు.

 

పంటను ఇచ్చే వ్యవసాయభూమి క్షేత్రమైనట్టే, సంతానాన్ని కనే స్త్రీ కూడా క్షేత్రం అయింది. ఆవిధంగా వాటి మధ్య పోలిక కుదిరింది. వ్యవసాయభూమిలానే స్త్రీని కేవలం క్షేత్రంగా గుర్తించడమంటే ఏమిటన్నమాట? వ్యవసాయభూమి ఏ ఒకరి యాజమాన్యం కిందో ఉండకుండా ఉమ్మడి వనరుగా ఉన్న దశ ఉందనుకుందాం. అప్పుడు ఆ భూమిలో విత్తు నాటిన వాడికే పంట మీద హక్కు ఉన్నట్టుగా; స్త్రీ క్షేత్రంలో బీజావాపన చేసినవాడికే సంతానం మీద హక్కు ఉంటుంది. శర్మిష్ట కథలో చెప్పుకున్నట్టుగా, ఋతుమతి అయిన స్త్రీకి వివాహంతో సంబంధం లేకుండా సంతానం పొందే హక్కు ఉందనుకుంటే, తన క్షేత్రంలో పుట్టే సంతానం మీద ఆ దశలో ఆమెకే హక్కు ఉండడానికీ అవకాశం ఉంది. గంగా-శంతనుల కథలో తనకు పుట్టే సంతానాన్ని ఏమైనా చేసుకునేలా శంతనుడితో గంగ ఒప్పందం చేసుకోవడమే చూడండి. అంటే ఆమె తన క్షేత్ర హక్కును స్థాపించుకోదలచిందన్న మాట. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో ఇచ్చిన అన్వయాన్ని బట్టి చూస్తే, గంగ తనకు కలిగిన ఏడుగురు సంతానాన్నీ తన దగ్గరే ఉంచుకుని; ఎనిమిదో సంతానమైన భీష్ముని విషయంలో శంతనుడు అడ్డు చెప్పాడు కనుక అతన్ని శంతనుడికి ఇచ్చేసి, ఒప్పందం నుంచి తప్పుకుంది.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

ఇంకో సినేరియోను చూద్దాం. క్షేత్ర ప్రాధాన్యం, బీజ ప్రాధాన్యం అనే మాటలూ, వాటి గురించిన చర్చా సంప్రదాయవర్గాలలో కూడా కనిపిస్తాయి. ఎక్కడ ఏ ప్రాధాన్యాన్ని వర్తింపజేయాలన్నది ఒక్కోసారి చిక్కుముడిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, సత్యవతి-పరాశరుడు; అంబిక, అంబాలిక-వ్యాసుల సంబంధాన్నే చూద్దాం. వ్యాసుడు మత్స్యకన్యకు పుట్టినా, ఆయనను సంప్రదాయం ‘పరాశరుని కొడుకుగా’; లేదా ‘పరాశరుని కొడుకుగా కూడా’ గుర్తిస్తుంది. పరాశరుని వర్ణమే ఆయనకు ఇస్తుంది. అంటే అక్కడ బీజప్రాధాన్యం చెబుతోందన్న మాట. అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. అలాగే, అంబిక దాసికి వ్యాసుడి వల్ల కలిగిన విదురుని దాసుడుగా, శూద్రుడుగా చెప్పడంలో కూడా క్షేత్రప్రాధాన్యమే ఉంది.

దీనినిబట్టి ఒకటి అనుకోవాలి: పురుషుడు కేవలం సంతానం కోరి ఒక స్త్రీ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే, అందుకు ఆమె ఒప్పుకుంటే ఆ సంతానం పురుషుడికే చెందుతుంది. అక్కడ బీజప్రాధాన్యం వర్తిస్తుందన్న మాట. తెలుగు భారతంలో పరాశరుడు సంతానం కోసమే సత్యవతి పొందు కోరినట్టు లేకపోయినా (నేను సంస్కృత భారతం ఇంకా చూడలేదు) సత్యవతి-పరాశరుల సంబంధాన్ని భైరప్ప ఇలాగే అన్వయిస్తారు. ఒకవేళ పురుషుడు కేవలం లైంగిక సుఖం కోసమే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, అప్పుడు ఆ స్త్రీ కనే సంతానం ఆమెకే, అంటే క్షేత్రానికే చెందుతుంది. గంగా-శంతనుల సంబంధం నిజానికి అలాంటిదిగానే కనిపిస్తుంది. చిత్రాంగద, విచిత్రవీర్యుల విషయానికి వస్తే, తన కోడళ్ళకు సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి నియోగించింది కనుక, ఆ సంతానానికి క్షేత్రప్రాధాన్యం కలిగి వారు క్షత్రియులయ్యారు. ప్రస్తుత సందర్భంలో పాండురాజు కూడా క్షేత్రపద్ధతిలో సంతానం ఇమ్మని కుంతిని అడుగుతున్నాడు కనుక, అంటే నియోగిస్తున్నాడు కనుక ఆ సంతానం అతనికే చెంది, అతనిలానే క్షత్రియులవుతారు.

వ్యవసాయభూమిపై ఉమ్మడి యాజమాన్యం పోయి వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన దశలో సినేరియో కొంత మారుతుంది. భూయజమాని తన క్షేత్రంలో తను పండించుకోవచ్చు, లేదా ఇంకొకరికి తన క్షేత్రాన్ని అద్దెకు ఇవ్వచ్చు. అప్పుడు క్షేత్రానికి యజమాని వేరొకరు అయినా పంట, పండించినవాడిదే అవుతుంది. వ్యవసాయ క్షేత్రానికి, స్త్రీ క్షేత్రానికి ఉన్న పోలికే పూర్వుల దృష్టిని ప్రముఖంగా ఆక్రమించుకుందనీ, వ్యవసాయక్షేత్రానికి వర్తింపజేసిన నీతినే యథాతథంగా స్త్రీ క్షేత్రానికీ వర్తింప జేశారనీ అనేక ఉదాహరణలను గమనిస్తే అనిపిస్తుంది.

ఇక, క్షేత్రం అనే మాట మరో సందర్భంలో కూడా కనిపిస్తుంది. అది: ‘పుణ్యక్షేత్రం’ అనడంలో. దేవాలయం ఉన్న చోటును పుణ్యక్షేత్రం అంటాం. ఇంతకీ వ్యవసాయక్షేత్రం, స్త్రీ క్షేత్రం, పుణ్యక్షేత్రం అనే ఈ మూడు క్షేత్రాలకూ మధ్య ఏమైనా ముడి ఉందా? ఉన్నట్టే కనిపిస్తుంది. లైంగిక సంబంధాన్ని, పునరుత్పత్తిని పూర్వులు మతకోణంలోంచి చూసి ఒక పవిత్రవిధిగా పరిగణించారు కనుక; వ్యవసాయ, స్త్రీ క్షేత్రాలు రెండూ పునరుత్పత్తికి చెందినవే కనుక ఆ రెండింటికీ పుణ్యక్షేత్రంతోనూ ఒక ముడి ఏర్పడింది. సౌభాగ్య(fertility)వర్ధనాలుగా వ్యవసాయ, స్త్రీ క్షేత్రాల మధ్య ఉన్న పోలికా, వాటిపై అభివృద్ధి చెందిన మతపరమైన తంతు, అందులో భాగమైన తాంత్రికతలో స్త్రీకి గల పాత్ర గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పుకున్నట్టు వ్యవసాయం మనిషి చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అంతకుముందు లేనంత అన్న పుష్కలత్వాన్ని వ్యవసాయం ఇచ్చింది. వ్యవసాయంతోనే స్థిరనివాసాలు ఏర్పడడం, జనాభా పెరగడం తదితర పరిణామాలు సంభవించాయి.

అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం కోసం అడవుల్ని నరకడం, జనాన్ని వ్యవసాయంవైపు మళ్ళించడం, వ్యవసాయభూముల విస్తరణకు వీలుగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేయడం అంత తేలికగా జరగలేదు. సామదాన దండోపాయాలను ఆశ్రయించవలసి వచ్చింది. వ్యవసాయాన్ని పవిత్రకార్యంగా సూచించే క్రమంలో దేవాలయం ఉన్న ప్రదేశం పుణ్యక్షేత్రం అయినట్టే; వ్యవసాయభూమి కూడా క్షేత్రం, అంటే పుణ్యక్షేత్రం అయింది. వ్యవసాయక్షేత్రాలు ఉన్న చోట దేవాలయక్షేత్రాలూ అవతరించాయి. సుమేరు, సింధు నాగరికతలలో వ్యవసాయభూములు దేవాలయ అధీనంలోనే ఉండేవి. ఏటా దేవాలయంలోనే పాచికలు వేసి భూములు పంచేవారు. మన దగ్గర కూడా దేవాలయాలకు మాన్యాలు కల్పించడం ఉంది. దేవాలయంలో ‘క్షేత్ర’పాలకులుగా కొందరు దేవతలు ఉంటారు. వ్యవసాయక్షేత్రాలకూ కాపలాదారులు అవసరమే.

ఇక స్త్రీ క్షేత్రానికీ, పుణ్యక్షేత్రానికీ ఉన్న ముడిని చూద్దాం. ఇందుకు దేవాలయాలలో మైథున చిత్రాలే గొప్ప సాక్ష్యం. సౌభాగ్య వర్ధనానికి- స్త్రీ, వ్యవసాయ, పుణ్యక్షేత్రాలు మూడూ కేంద్రాలే. సుమేరు, సింధు, గ్రీకు సహా ప్రాచీన సమాజాలు అంతటా దేవాలయాలలో ‘పవిత్ర వ్యభిచారం’ జరుగుతూ ఉండేది. దేవాలయాలలో శృంగారకేళి అన్న మాట వినడానికే మనకు ఈ రోజు చాలా కంపరంగా ఉంటుంది. కానీ లైంగిక క్రియకు, దేవాలయానికి ఒకే విధమైన పవిత్రత్రను ఆపాదించిన ప్రాచీనుల దృష్టిలో అది అపవిత్రం కాదు.

క్షేత్రంతోపాటు కలిపి చెప్పుకునే మరో మాట తీర్థం. ఈ తీర్థం కూడా సౌభాగ్యవర్ధన కేంద్రమే. పురాతన కాలంలో మతపరమైన ప్రతి పండుగా, ప్రతి ఉత్సవం, ప్రతి తీర్థక్షేత్రాలూ లైంగిక విశృంఖల సందర్భాలే. తీర్థాలు, తిరునాళ్ళలో ఇలాంటి ముచ్చట్లు ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ప్రముఖ రచయిత్రి లత ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు శివరాత్రికి పట్టిసీమ(ప.గో. జిల్లా) తీర్థానికి వెళ్ళి రాత్రివేళ కారులో తిరిగివస్తున్నప్పుడు గోదావరి గట్టు పొడవునా జంటలు కనిపించాయని రాశారు.

కోశాంబీ AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో ఇలా అంటారు:

When local gods were adopted as relatives, attendants, incarnations, variants of Brahmin deities, while the locality coincided with or developed into a centre of production, or of trade, there arose great religious pilgrimage centers like Banaras, Mathura and Nasik (page-45)

(స్థానిక దేవతలను [బ్రాహ్మణీయ దేవతలకు] బంధువులుగా, సేవకులుగా, అవతారాలుగా, బ్రాహ్మణ దేవతలలోనే భిన్న రకాలుగా మలచుకున్న చోట్ల; అప్పటికే ఉత్పత్తి కేంద్రంగానో, వర్తక కేంద్రంగానో ఉన్న చోట్ల, లేదా ఆ దిశగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోనే బెనారస్, మథుర, నాసిక్ లాంటి గొప్ప యాత్రాక్షేత్రాలు అవతరించాయి)

                                                                                                   మిగతా వచ్చే వారం

-కల్లూరి భాస్కరం

‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం. నా దగ్గర ఉన్న మపాసా కథల పెద్ద సంపుటాలు రెండింటిలో ఆ కథ కోసం వెతికాను. ఆ పేరుతో ఏ కథా కనిపించలేదు. ఇంటర్నెట్ లో గాలించాను. అందులోనూ కనిపించలేదు. నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలనూ శోధిస్తే ఆ కథ ఉన్న సంపుటం దొరుకుంతుందేమో తెలియదు. ఇంతకీ ఆ కథ ఆయన రాసిందా, ఇంకొకళ్లు రాసిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయినా, ప్రస్తుత సందర్భానికి సరిపోయేమేరకు అందులోని ఇతివృత్తం గుర్తుంది కనుక ఆ వెతుకులాటను, అనుమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.

పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.

ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.

అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.

ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!

ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.

1951

తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగపద్దతిలో సంతానం ఇవ్వమని సత్యవతి తన కొడుకైన వ్యాసుణ్ణి పురమాయించడం మనకు తెలుసు. అలాగే, నియోగ పద్ధతిలో తనను సంతానవంతుణ్ణి చేయమని పాండురాజు తన పెద్ద భార్య అయిన కుంతిని ప్రార్థించాడు. ఇలా నియోగ పద్ధతిలో సంతానం కనమనో, లేదా ఇవ్వమనో కోరిన ఉదాహరణలు మహాభారతంలో ఇంకా ఉన్నాయి.

‘నాకు కొడుకులను ఇవ్వు’ అని కుంతిని పాండురాజు చేతులు జోడించి మరీ ప్రార్థించేముందు వారిద్దరి మధ్యా కొంత సంభాషణ జరుగుతుంది. అందులో కూడా దేవధర్మమూ, పురాచరిత్ర రూపంలోని మనుష్యధర్మమూ కలగలసి కనిపిస్తాయి. అందులోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందో ఒకింత ముందునుంచీ చెప్పుకుందాం:

అన్న ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు. తమ్ముడు పాండురాజు దండయాత్రలు చేసి, రాజులను జయించి, గొప్ప గొప్ప ధనరాశులు తెచ్చి అన్నగారికి ఇచ్చాడు. అయితే, తండ్రి విచిత్రవీర్యుడిలానే పాండురాజుకు స్త్రీ లోలత్వం ఎక్కువ. దానికి తోడు వేట వ్యసనం. భార్యలు కుంతి, మాద్రులతో కలసి అతను వనవాసం చేస్తూ వేటతో వినోదిస్తూ ఉండేవాడు. తమ్ముడికి అవసరమైన సంభారాలన్నీ ధృతరాష్ట్రుడు అడవికే పంపిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఓ రోజున పాండురాజు యథావిధిగా వేటకు వెళ్ళాడు. ఒక్క మృగమూ కనిపించలేదు. దాంతో అతనికి కోపం వచ్చింది. అంతలో ఒక లేడి జంట మన్మథవాంఛతో క్రీడిస్తూ కనిపించింది. పాండురాజు కఠినహృదయంతో వాటి మీద బాణాలు ప్రయోగించాడు. అవి కుప్ప కూలిపోయాయి.

వాటిలో కొనప్రాణంతో ఉన్న మగమృగం పాండురాజుతో మనిషిలా మాట్లాడుతూ,’నేను కిందముడనే మునిని. ఈమె నా భార్య. ఈ కీకారణ్యంలో మేమిద్దరం మృగరూపం ధరించి రతిసౌఖ్యాన్ని అనుభవిస్తుండగా మామీద బాణాలు ప్రయోగించావు. వేట రాజుల కర్తవ్యం కనుక మృగరూపంలో ఉన్న మమ్మల్ని నువ్వు చంపడంలో తప్పులేదు. అయితే చూశావూ… కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా రతిక్రీడలో ఉండి పరుగెత్తలేని స్థితిలో ఉన్నమృగాలనూ, ప్రసవించే మృగాలనూ, రోగంతో బాధపడే మృగాలనూ చంపరు. అలాంటిది, ధర్మం తప్పరని పేరు పొందిన భరతాది రాజుల వంశంలో పుట్టి కూడా ఈ అధర్మాన్ని నువ్వు ఎలా చేశావు?’ అన్నాడు.

ఆ మాటతో పాండురాజుకు కోపం వచ్చింది. ‘శత్రువుల నైనా క్షమించి విడిచిపెడతారు కానీ, మృగాలు కనిపిస్తే రాజులు చంపకుండా వదలరు. నమ్మించి చంపినా, మాయాబలంతో చంపినా తప్పవుతుంది కానీ; ఇలా చంపడం తప్పుకాదు. పూర్వం అగస్త్యముని మృగమాంసంతో నిత్యశ్రాద్ధం చేస్తూ, మృగాలను చంపడం రాజులకు దోషం కాదని నిర్ణయించాడు. ఇందుకు నన్ను ఎలా నిందిస్తావు?’ అన్నాడు.

బాణపు నొప్పితో గిల గిల లాడిపోతున్న ఆ మృగం,సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నిరపరాధులమైన మమ్మల్ని చంపావు కనుక, నువ్వు కూడా ఇలాగే నీ భార్యతో సంగమించేటప్పుడు మరణిస్తావు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది’ అని శపించాడు. ఆ తర్వాత ఆ మృగదంపతులు కన్ను మూశారు.

ఇక్కడ రెండు కారణాల చేత కథకుడికి చేతులెత్తి మొక్కుతున్నాను. మొదటిది, రతిసౌఖ్యాన్ని అనుభవిస్తున్న, ప్రసవిస్తున్న, రోగంతో బాధపడుతున్న మృగాలను; కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా చంపరని అనడం. రాజులకు వేట కర్తవ్యం అంటూనే కథకుడు ఎరుకలను వారికంటే ఉన్నతులుగా చూపిస్తున్నాడు. కేవలం వినోదం కోసం వేటాడే రాజుల తీరును గర్హిస్తున్నాడు. తిరుమల రామచంద్రగారు ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే స్వీయచరిత్రలో వినోదం కోసం జంతువులను చిత్రహింస పెట్టడంలోని అమానుషత్వాన్ని ప్రత్యక్షసాక్ష్యంతో చిత్రిస్తారు.

ఇక రెండవది, అంతకంటే ఆశ్చర్యచకితం చేసేది,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో…(సర్వప్రాణులకు సాధారణంబయి ఇష్టంబగు సుఖావసరంబున నున్న మమ్ము…) అనే మాట మృగంతో అనిపించడం! విశేషమేమిటంటే, ఇదే మాటను కథకుడు మరి కొన్ని సందర్భాలలో మరికొందరి నోట అనిపిస్తాడు. తనకు కొడుకులను ఇమ్మని కుంతిని అడిగిన సందర్భంలోనే పాండురాజు ధర్మబద్ధమైన ఒక పురాణ కథ చెబుతాను విన మంటూ,‘పూర్వం స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా సంచరిస్తూ అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబున తమ తమ వర్ణాలలో ఋతుకాలం తప్పకుండా స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ సంబంధం పెట్టుకునే వారని అంటాడు. ఆ తర్వాత దానిని ఎలా నిషేధించారో వివరిస్తూ ఒక కథ చెబుతాడు.

అదేమిటంటే, ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతని భార్య గొప్ప సాధ్వి. వారికి శ్వేతకేతు డనే కొడుకు. అతను తపస్సంపన్నుడు. అలా ఉండగా, అతని తల్లి ఋతుమతి అయింది. అప్పుడు ఒక వృద్ధవిప్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు. కొడుకులు లేని ఆ విప్రుడు కొడుకుకోసం ఉద్దాలకుని భార్య పొందు కోరాడు. దాంతో శ్వేతకేతుకు కోపం వచ్చింది. ఇది ధర్మవిరుద్ధమనీ, ఇకనుంచీ స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, పెట్టుకుంటే సకలపాపాలూ చుట్టుకుంటాయనీ, మనుషులందరికీ ఈ విధమైన కట్టడి చేస్తున్నాననీ ప్రకటించాడు.

మరో సందర్భం చూద్దాం. తన కొడుకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత కురువంశానికి నువ్వు ఒక్కడివే మిగిలావు కనుక రాజ్యపాలన చేపట్టి, వివాహం చేసుకుని, సంతానం కనమని భీష్ముడితో సత్యవతి అంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముడు,‘దేవరన్యాయం’తో, అంటే నియోగ పద్ధతిలో విచిత్రవీర్యుని భార్యలకు సంతానం కలిగించే మార్గం ఉందని అంటూ దీర్ఘతముడనే ముని గురించి చెబుతాడు.

మమత అనే స్త్రీకి ఉతథ్యుడనే ముని వల్ల కలిగినవాడు దీర్ఘతముడు. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడు బృహస్పతి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతడు ‘దేవరన్యాయం’తో మమత పొందు కోరాడు. కడుపులో ఉన్న దీర్ఘతముడు కోపించి, ఇది ధర్మవిరుద్ధమంటూ అడ్డుచెప్పాడు. అందుకు ఆగ్రహించిన బృహస్పతి ‘సర్వభూతేప్సితమైన’ ఈ కార్యంలో నాకు అడ్డు చెప్పావు కనుక పుట్టుగుడ్డివి కమ్మని శపించాడు. అందుకే అతనికి దీర్ఘతముడనే పేరు వచ్చింది.

విచిత్రం ఏమిటంటే, తన తల్లిని బృహస్పతి కాంక్షించడం ధర్మవిరుద్ధమని అడ్డుచెప్పిన ఈ దీర్ఘతముడే సంతానం లేని బలి అనే రాజు కోరిన మీదట అతని భార్యకు ‘దేవరన్యాయం’తో సంతానం ఇస్తాడు. సరే, అది వేరే కథ. ‘మామతేయుడు’, అంటే మమత కుమారుడు అనిపించుకున్న దీర్ఘతముడు మాతృస్వామ్య వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చని కోశాంబీ అంటారు.

ప్రకృతి సహజమైన లైంగిక సుఖాన్ని ‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణంబైన ధర్మం’గా,‘సర్వభూతేప్సితమైన’, అంటే అన్ని ప్రాణులూ ఇష్టపడే కార్యంగా మహాభారత కథకుడు చెప్పడం నాకు ఎంతో అపురూపంగానూ, ఊహల్లో ఒకవిధమైన తాజాదనాన్ని నింపేదిగానూ అనిపిస్తుంది. ఈ చిత్రణ ప్రకృతి అంత సహజంగానూ, సూక్ష్మంగానూ ఉంది. మన పూర్వులు మనిషి సహజాతాలుగా ఆహార, నిద్రా, భయాలతో కలిపి మైథునాన్ని కూడా చెప్పడంలోనూ ఈ ప్రకృతిసహజత్వమే ఉన్నట్టుంది. కాలగతిలో జరిగింది ఏమిటంటే, లైంగిక సుఖాన్ని ఒక అవసరమైన సుఖంగా, సర్వప్రాణిధర్మంగా గుర్తించడం కూడా మరచిపోయే స్థాయికి ఆ మాట నిషిద్ధపదాల జాబితాలో అట్టడుగుకు చేరిపోవడం. సమాజం, కట్టుబాటు, నీతి, న్యాయం లాంటి అనేకానేక పొరల మాటున ‘లైంగిక సుఖం’ గురించిన మౌలిక భావన మటుమాయమైపోయింది. లైంగిక సుఖం అనే మాట చుట్టూ రకరకాల మందమైన పొరలు చుట్టుకుంటూ పోయిన అనుభవంనుంచి చూసినప్పుడు;‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’గా,‘సర్వభూతేప్సిత కార్యం’గా చెబుతున్న మన పూర్వులు లైంగిక సుఖాన్ని ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతిలో భాగంగా; ఎటువంటి ఆచ్ఛాదనలూ లేని ఒక వినిర్మల, స్వచ్ఛ, పవిత్రధర్మంగా చూశారా అనిపిస్తుంది.

లైంగికవాంఛ విషయంలో ఒక కట్టడి, ఒక పరిమితి, ఒక హద్దు తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక్కడ విషయం అది కాదు. పెండ్యులం ఒకవైపునుంచి, పూర్తిగా దానికి వ్యతిరేకమైన దిశకు తిరిగిపోవడం. అంటే సమతూకం లోపించడం. లైంగికత్వాన్ని కేవలం ప్రకృతిధర్మంగా అర్థం చేసుకోవడమనే పురాకాలపు ఒక పరాకాష్ట(extreme)నుంచి, లైంగికత్వాన్ని కేవలం ఒక సామాజిక నియతిలో భాగంగా చూసే మరో పరాకాష్టకు పయనించడం. ఆవిధంగా ప్రకృతిధర్మానికి, సామాజికధర్మానికి మధ్య తూకం తప్పిపోయింది. దీని పర్యవసానాలను మనం ఇప్పుడు బహుముఖంగా చూస్తున్నాం.

స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం, లైంగికతల విషయంలో మన పూర్వులు నేటి మన ఊహకు అందని, విచిత్రంగా కూడా అనిపించే సువిశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారని అన్నది అందుకే.

ప్రస్తుతానికి వస్తే,‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’,‘సర్వభూతేప్సిత కార్యం’ అనడంలో కథకుడు లైంగికతకు చెందిన పురాచరిత్రను కూడా చెబుతున్నాడు. కుంతి-పాండురాజు సంభాషణలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

***

చనిపోయిన ఆ మృగదంపతులను చూసి పాండురాజు బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపంతోపాటు వైరాగ్యమూ కలిగింది. ఎంత గొప్ప కులంలో పుట్టినా కర్మఫలం అనుభవించక తప్పదనుకున్నాడు. ఇక అన్ని బంధాలనూ విడిచిపెట్టి మునివృత్తిని స్వీకరించి, అన్ని ప్రాణులనూ సమబుద్ధితో చూస్తూ, హింసకు దూరంగా శేషజీవితాన్ని గడపాలనుకున్నాడు. కుంతి, మాద్రులకు తన నిర్ణయాన్ని చెప్పి, వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని కోరాడు. మేము చావనైనా చస్తాము కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళమని వారు చెప్పారు. అయితే నాతోనే ఉండండని వారికి చెప్పి, తమ దగ్గర ఉన్న అమూల్య మణిహారాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా మిగిలినవాటిని ధృతరాష్ట్రునికి పంపేశాడు.

ఆ తర్వాత, తనలానే తపస్వులుగా మారిన భార్యలిద్దరితో కలసి ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభించాడు. హిమాలయాలను కూడా దాటి, దేవతలు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంత కాలం ఉండి, అక్కడినుంచి మరింత ముందుకు వెళ్ళి శతశృంగం అనే ప్రదేశానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు.

ఆ శతశృంగం కూడా ఎందరో దేవతలు, సిద్ధులు, యక్షులు నివసించే ప్రదేశం. స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడికి దగ్గరలోనే ఉంది. దివ్యవిమానం మీద వచ్చిపోయే దేవగణాలతో ఆ మార్గం కోలాహలంగా ఉంటుంది. అక్కడి ఉత్తరభాగంలో పాండురాజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఓ రోజున వేలాదిమంది మునులు ఆ స్వర్గమార్గంలో పై లోకాలకు వెడుతూ కనిపించారు.

‘ఎక్కడికి వెడుతున్నా’రని పాండురాజు వారిని అడిగాడు.

‘ఈ రోజు అమావాస్య. ఎక్కడెక్కడి ఋషిగణాలు, పితృదేవతలు బ్రహ్మను సేవించుకోడానికి ఈ రోజున బ్రహ్మలోకానికి వెడుతుంటారు. మేము కూడా అక్కడికే వెడుతున్నా’మని వారు చెప్పారు.

అప్పుడు భార్యలిద్దరితో కలసి పాండురాజు వారి వెనక బయలుదేరాడు. మిట్టపల్లాలతో నిండిన ఆ మార్గంలో వాళ్ళు అతి కష్టం మీద నడుస్తున్నారు. మునులు వెనుదిరిగి చూశారు. కుంతి, మాద్రుల కష్టాన్ని గమనించారు.

‘వీళ్ళు అతి కోమలులు. కొండలు, గుహలతో నిండిన ఈ క్లిష్టమైన మార్గంలో వీళ్ళు రాలేరు. కనుక ఇక్కడ ఆగిపొండి. పైగా ఇవి దేవతలు వెళ్ళే దారులు’ అని పాండురాజుకు చెప్పారు.

‘మునులైనా సరే, సంతానం లేనివారు స్వర్గద్వారాన్ని చేరుకోలేరని విన్నాను. పుత్రులు లేని వారికి స్వర్గం లభించదని వేదం చెబుతోంది. నేను కొడుకులు లేని వాణ్ణి. ఏం చేయగలను?’ అని పాండురాజు మునులతో నిస్పృహగా అన్నాడు.

మునులకు అతని మీద జాలి కలిగింది. యోగదృష్టితో జరగబోయేది చూశారు. ‘నువ్వు పుత్రులు లేనివాడివి కావు. దైవకారణంతో నీకు యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల వరం వల్ల కొడుకులు కలుగుతారు. నీకు అక్షయలోకాలు సిద్ధిస్తాయి. కనుక సంతానం కోసం ప్రయత్నించు’ అని ముందుకు సాగిపోయారు.

ఆగిపోయిన పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ‘మనిషి పుడుతూనే దేవ, ఋషి, పితృ, మనుష్యరుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు. ఆ రుణాలను తీర్చుకుంటే తప్ప పుణ్యలోకాలు లభించవు. నేను మొదటి మూడు రుణాలనుంచీ బయటపడ్డాను. చనిపోతే అన్ని రుణాలూ తీరిపోతాయి కానీ; శ్రాద్ధాలతోనూ, సంతానంతోనూ తీరే పితృరుణం చనిపోయినా తీరదు. అదెలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మృగశాపం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదు’ అనుకుని దుఃఖించాడు.

ఒక రోజున కుంతితో ఏకాంతంగా మాట్లాడుతూ తన బాధంతా చెప్పి,‘ఇతరమైనవేవీ ఆలోచించకుండా ధర్మబద్ధంగా నాకు సంతానం ఇచ్చే వేరొక మార్గం చూడ’ మని కోరాడు. పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు:

  1. ఔరసుడు: తన వర్ణానికే చెందిన భార్య వల్ల తనకు కలిగిన కొడుకు ఔరసుడు. 2. క్షేత్రజుడు: తనకు సంతానం లేనప్పుడు నియోగ పద్ధతిలో అర్హుడైన వేరొక పురుషుని ద్వారా తన భార్యకు కలిగే కొడుకు క్షేత్రజుడు. 3. దత్తుడు: వేరొకరి కొడుకును శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటే అతడు దత్తుడు. 4. కృత్రిముడు: తల్లిదండ్రులు లేని అనాధను చేరదీస్తే అతడు కృత్రిముడు. 5. గూఢజుడు: తన భార్యకు పరపురుషుని వల్ల రహస్యంగా కలిగిన కొడుకు గూఢజుడు. 6. అపవిద్ధుడు: తల్లిదండ్రులు విడిచి పెట్టేసినప్పుడు దగ్గరకు తీసి పెంచితే అతడు అపవిద్ధుడు. 7. కానీనుడు: పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా కొడుకును కంటే అతడు కానీనుడు.8. సహోఢుఢు: గర్భవతి అని తెలిసో తెలియకో ఒకామెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు కలిగే కొడుకు భర్తకు సహోఢుఢు. 9. క్రీతుడు: ఇంకొకరి కొడుకును కొనుక్కుంటే అతడు క్రీతుడు. 10. పౌనర్భవుడు: భార్యా, భర్తలు విడిపోయినప్పుడు; లేదా భర్త మరణించినప్పుడు భార్యకు ఆ తర్వాత మరొకరి సంబంధంవల్ల కొడుకు పుడితే అతడు ఆమె అసలు భర్తకు పౌనర్భవుడు. 11. స్వయందత్తుడు: తల్లిదండ్రులు లేనివాడు, లేదా తల్లిదండ్రులు వదిలేసినవాడు తనంతట తాను ఇంకొకరికి అమ్ముడుపోతే అతడు స్వయందత్తుడు. 12. జ్ఞాతుడు: అన్నకో, తమ్ముడికో పుట్టినవాడు వరసకు తనకు కూడా కొడుకే. అటువంటివాడు జ్ఞాతుడు.

పన్నెండో రకం పుత్రుడి విషయంలో తేడాలున్నట్టున్నాయి. వర్ణసాంకర్యం వల్ల కలిగిన కొడుకును పారశవుడిగా, పన్నెండో పుత్రుడిగా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొదటి ఆరు రకాల పుత్రులూ బంధువులు, దాయాదులూ అవుతారనీ; చివరి ఆరు రకాల పుత్రులూ బంధువులు మాత్రమే అవుతారనీ పాండురాజు అంటాడు. దాయాదులకు ఆస్తిలో వాటా ఉంటుంది. పాండురాజు ఇంకో మాట కూడా అంటాడు…బంధువులు, దాయాదులు అయిన కొడుకులందరూ ఔరసునికి ఏమాత్రం తక్కువ కారు. వాళ్లలో క్షేత్రజుడు మరింత శ్రేష్ఠుడు. అందులోనూ దేవరన్యాయంతో పుట్టినవాడు ఇంకా శ్రేష్ఠుడు. కనుక నా నియోగంతో ధర్మమార్గంలో క్షేత్రజులను కనవలసిందని కుంతిని కోరాడు.

మిగతా వచ్చేవారం…

 

 

 

 

 

అత్తా-కోడళ్ళ వారసత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఇంకో కోణం నుంచి చూద్దాం…

ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు?

స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి ద్రుపదుడా? కాదు. వ్యాసుడా? కానే కాదు…

ఆ నిర్ణయం తీసుకోవలసింది నిజానికి ఇటు కుంతి! అటు ద్రౌపది!

కథకుడు ఏంచేస్తున్నాడంటే, నిజంగా నిర్ణయాధికారం ఉన్న వీరిద్దరినీ పక్కకు తప్పిస్తున్నాడు. మౌనమూర్తులుగా నిలబెడుతున్నాడు. ఏవిధంగానూ నిర్ణయాధికారం లేని పాత్రల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తున్నాడు. అందుకు సంబంధించిన ధర్మమీమాంసలో వారిని భాగస్వాములను చేస్తున్నాడు. ఈ వివాహానికి వారిచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీ చేతిలో ఉన్న అధికారాన్ని పురుషుడికి అప్పజెబుతున్నాడు. అనగా, వ్యవస్థనే ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ తలకిందులు చేస్తున్నాడు.

అయితే, ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు వ్యవస్థను తలకిందులు చేయడం అనే ఈ పనిని అతడు రాతితో గోడకట్టినట్టుగా చేయడం లేదు. వదులు వదులుగా చేస్తున్నాడు. తను వ్యవస్థను తలకిందులు చేస్తున్న సంగతి తెలిసిపోయేలా మధ్య మధ్య క్లూలు విడిచిపెడుతూ చేస్తున్నాడు. అది కథానిర్మాణ దక్షత పలచబారడం వల్ల కావచ్చు, లేదా వెనకటి వ్యవస్థ గురించిన అవశేషాలను సూచించడం అనివార్యమయ్యీ కావచ్చు…

అసలు ‘స్వయంవరం’ అనే మాటే చూడండి. ఆ మాటను వాస్తవికార్థంలో తీసుకుంటే ఒక స్త్రీ, పురుషుణ్ణి తనకు తానుగా వరించడం గురించి చెబుతుంది. అంటే, ఎవరిని భర్తగా వరించాలన్నది స్త్రీకి గల సంపూర్ణ స్వయంనిర్ణయాధికారం. ఇందులో ఇతర పురుషులకు ఎలాంటి పాత్రా లేదు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్న ఐరిష్ కథలో ఈ స్వయంవర లక్షణం మరింత స్పష్టార్థంలో కనిపిస్తుంది. ఆ కథలో మీవే అనే రాచకూతురు అయిలిల్ అనే రాకుమారుని స్వయంవరంలో తనే వరించింది తప్ప అతడు ఆమెను వరించలేదు. ఆ విషయం మీవే అతనితో స్పష్టంగా అంటుంది కూడా. అంతేకాదు, ఇంకా అనేక విషయాలలో మీవే తన మాతృస్వామిక హక్కును, స్వేచ్ఛను నొక్కి చెబుతుంది.

అయితే, ప్రస్తుత సందర్భంలో కథకుడు ‘స్వయంవరం’ అంటూనే ద్రౌపదిని ఒక మరబొమ్మగా మార్చిన సంగతి తెలిసిపోతూనే ఉంది. ఆమెతో అర్జునుని మెడలో దండవేయించి, ఆ తర్వాత ఆమె పాత్ర ఏమీ లేనట్టు పక్కన పెట్టేశాడు. అలాగే, పాండవులు అయిదుగురినీ పెళ్లాడాలా వద్దా అనే విషయంలో ఆమెకు గల నిర్ణయాధికారాన్ని కాస్తా తీసుకెళ్లి ధర్మరాజు, ద్రుపదుడు, వ్యాసుల చేతుల్లో పెట్టాడు.

ఈరోజున మనకు బాగా అర్థమయ్యే ఒక పోలికతో ఈ పరిస్థితిని చెప్పుకుందాం. నేటి ప్రజాస్వామిక భారత రాజ్యాంగం ఎన్నికలలో దళితుల వంటి బలహీనవర్గాలకు, స్త్రీలకు కొన్ని స్థానాలు రిజర్వు చేసింది. ఒక మహిళ, గ్రామ సర్పంచి కావచ్చు; ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నిక కావచ్చు; మంత్రిగా నియమితురాలు కావచ్చు. అయితే ఈ పదవులూ, నియామకాలు చాలా సందర్భాలలో కేవలం సాంకేతికంగా మారి, వారు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోతారు. గ్రామంలోని మోతుబరులో, ఇతర సందర్భాలలో భర్తో ఆమెను కీలుబొమ్మగా మార్చి వ్యవహారాలను తామే చక్కబెడుతూ ఉంటారు.

ద్రౌపది విషయంలో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. స్వయంవరం అనేది వెనకటి వ్యవస్థకు చెందిన ఒక ప్రక్రియ. ఒక దశలో అది లాంఛనంగా మారిపోయింది. కనుక ఆ లాంఛనాన్ని పాటిస్తూ ద్రౌపదికి స్వయంవర హక్కును, అంటే, తన వివాహం విషయంలో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చినట్టే ఇవ్వాలి, మళ్ళీ ఆ హక్కును ఆమె నుంచి తీసేసుకుని పురుషుడికి అప్పగించాలి!

ఇక్కడ కథకుడు చేసింది అదే.

కుంతి విషయానికి వద్దాం. తన కొడుకులు అయిదుగురూ ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలా, వద్దా అనే విషయంలో సంపూర్ణ నిర్ణయాధికారం ఆమెదే! అది ఆమె అత్తగారు అంబాలిక(పాండురాజు తల్లి)నుంచి, తన అత్తకు అత్త అయిన సత్యవతి నుంచి సంక్రమించిన మాతృస్వామిక హక్కు. ద్రౌపదికి అత్తగా తనూ, కోడలిగా ద్రౌపదీ కూడబలుక్కుని అమలు చేయవలసిన స్త్రీహక్కు. ఇందులో పాండవులకు, ద్రుపదుడికి, వ్యాసుడికి ఎలాంటి నిర్ణయాధికారమూ లేదు.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

సత్యవతి తన మాతృస్వామిక హక్కును కోడళ్ళు అయిన అంబిక, అంబాలికాలతో ఎలా అమలు చేయించిందో తెలిసినదే. కొడుకైన విచిత్రవీర్యుడు చనిపోయి, కురువంశం నిర్వంశమయ్యే పరిస్థితిలో ఆమె తన మాతృస్వామిక నిర్ణయాధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే, తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను చేపట్టి వారితో సంతానం కనమని తన సవతి కొడుకు భీష్మునితో చెప్పింది. భీష్ముడు నిరాకరించడంతో పరాశరునివల్ల తనకు కలిగిన వ్యాసుని అందుకు నియోగించింది. ఆ సందర్భంలో,‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో తల్లికీ అలాగే ఉంటుం’దని కూడా నొక్కి చెప్పి తన హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించింది.

సత్యవతి…అంబిక, అంబాలిక…కుంతి…ద్రౌపది..! ఇదీ వరుసక్రమం!

ఈ అత్తా-కోడళ్ళ క్రమాన్ని ఒకసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి. చూసినప్పుడు వీరి మధ్య మీకు ఎన్నో సారూప్యాలు, సమానధర్మాలు కనిపిస్తాయి. ఒక స్పష్టమైన, తమవైన హక్కులు కలిగిన ఒక అత్తా-కోడళ్ళ వారసత్వక్రమం కనిపిస్తుంది. ఒక అవిచ్ఛిన్న మాతృస్వామిక వారసత్వానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అర్థమవుతుంది. అయితే అలా అర్థమవడం కథకుని ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు. కనుక ఈ వారసత్వ క్రమంవైపు మన చూపు మళ్ళకుండా అతడు యథాశక్తి ప్రయత్నిస్తాడు. వీరిమధ్య పురుషస్వామ్యం తాలూకు విలువలను, పురుషుల పాత్రలను తెచ్చిపెట్టి, చర్చను వాళ్ళ మధ్యనే కేంద్రీకృతం చేసి విషయాన్ని కలగాపులగం చేస్తాడు. గంద్రగోళం సృష్టిస్తాడు. మన కళ్ళముందు గారడీ చేస్తాడు. అయితే, విచిత్రం, అది తగినంత శిక్షణ లోపించిన గారడీగా పరిణమిస్తుంది.

పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడే విషయంలో నిర్ణయాధికారం కుంతిదేననీ ఒకవైపు కథకుడు సూచిస్తూనే ఉన్నాడు. భిక్ష తెచ్చామని భీమార్జునులు అనగానే, దానిని అయిదుగురూ ఉపయోగించుకోండని కుంతి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అనేసింది. అంటే అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించేసిందన్నమాట.

ఆ తర్వాత, అంతమంది పురుషులూ కలసి ధర్మనిర్ణయం పేరుతో తలబద్దలు కొట్టుకోవలసిన అవసరమే లేదు. కానీ కథకుడు ఆ విధంగా మాతృస్వామిక అవశేషమైన ఆ నిర్ణయాన్ని కుంతి నోటితో ప్రకటింపజేస్తూనే, ఆ తర్వాత తన పని మొదలుపెడుతున్నాడు. అదేమిటంటే, కుంతి మాటల్లో కనిపిస్తున్న మాతృస్వామ్య అవశేషం మన దృష్టికి రాకుండా చేయడం, ద్రౌపది వివాహాన్ని పురుషస్వామ్యానికి అనుకూలంగా మలచడం! ఆ ప్రయత్నంలో భాగంగానే, భీమార్జునులు ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియక, రోజూలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని పొరబడి కుంతి అలా అన్నట్టు చిత్రిస్తున్నాడు. ఆ చిత్రణ ఇసుకగూడులా ఎలా పరిణమించిందో ఇంతకు ముందు చెప్పుకున్నాం.

కిందటి వ్యాసంలో ఇంకో ముఖ్యమైన వివరం నా చూపుల్ని తప్పించుకుంది. పాండవులు ద్రౌపది స్వయమవరానికి వెడతారనే కాదు, ఆ అయిదుగురూ ద్రౌపదిని పెళ్లాడతారని కూడా కుంతికి తెలుసు. వ్యాసుడు పాండవులకు ఎదురై చెప్పిన ద్రౌపది జన్మవృత్తాంతంలో ఆ సూచన ఉంది, చూడండి.

భీమార్జునులు ద్రౌపది అనే భిక్ష తెచ్చామని అనగానే కుంతి అయిదుగురినీ ఉపయోగించుకోమని అందంటే, ఊరికే అనలేదు. ఈ మాటను కేవలం తల్లి మాటను కొడుకులు గౌరవించాలనే సాధారణార్థంలో తీసుకోకూడదు. వాస్తవంగా ఈ మాట ద్వారా కుంతి కొడుకులను ఆదేశించే తన మాతృస్వామిక అధికారాన్ని చెలాయిస్తోంది. ఇది శాస్త్రనిబంధన లాంటిదే. ఎందుకంటే, పాండవులకు కుంతి తల్లి మాత్రమే కాదు, యజమానురాలు కూడా. తండ్రి కుటుంబానికి ఎలా యజమానో అలా అన్నమాట. తండ్రి మాటను కొడుకులు ఎలా పాటించాలో ఇక్కడ తల్లి మాటను అలాగే పాటించితీరవలసిందే.

ఒక ఉదాహరణ చూడండి…ఏకచక్రపురంలోని తమ ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించి చెప్పినప్పుడు, ద్రుపదనగరానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని పెద్దకొడుకుగా ధర్మరాజు తీసుకోలేదు. కొడుకుల అభిప్రాయాన్ని గమనించి, ద్రుపదనగరానికి వెడదామని కుంతే అంది. అప్పుడు ‘నువ్వు ఆదేశించినట్టే చేద్దా’మని పాండవులు అని తల్లితో కలసి ద్రుపదనగరానికి బయలుదేరారు. భిక్ష తెచ్చామని అనగానే అయిదుగురినీ ఉపయోగించుకోమని అనడం కూడా అలాంటిదే. ఆ తర్వాత ద్రౌపది వివాహంపై ద్రుపద, వ్యాసులతో జరిగిన చర్చలో ‘గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి చెప్పింది కనుక’ ద్రౌపదిని మేము అయిదుగురమూ పెళ్లాడవలసిందే’ నని ధర్మరాజు నొక్కి చెప్పాడు.

కనుక ఆ ఇంటికి యజమాని ధర్మరాజు కాదు, కుంతి! ద్రౌపది వివాహాన్ని ఎంతగా పురుషస్వామ్యానికి నప్పించడానికి ప్రయత్నించినా, కుంతే ఆ కుటుంబానికి యజమానురాలన్న మాతృస్వామిక ధర్మాన్ని కథకుడు దాచలేకపోయాడు. ఇక్కడ తల్లీ-కొడుకుల సంబంధాన్ని సాధారణార్థంలో(తల్లి పెద్దరికం, పూజనీయత వగైరా) తీసుకున్నారంటే పొరబడినట్టే. ఎందుకంటే, ఆ కుటుంబానికి ధర్మరాజు యజమాని కాకపోవడం, కుంతి యజమానురాలు కావడం పైకి కనిపించేటంత ఆషామాషీ విషయం కాదు. అది ఒకవిధంగా శాస్త్రసంబంధమైన నిష్కర్ష!

కుటుంబ సంబంధాలు గీత గీసినట్టు సప్రామాణికంగా ఉండవలసిన ఆనాటి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో ఆషామాషీని, అమాయకత్వాన్ని ఊహించడమే అసాధ్యం. కుటుంబ యాజమాన్యంపై తల్లీ-కొడుకుల మధ్య పోటీ ముగిసి, యాజమాన్యం కొడుకుకి బదిలీ అయిన పురుషస్వామ్యం తాలూకు నిబంధనలనుంచి చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. పురుషస్వామ్యాన్ని నొక్కి చెప్పడమే ఒకానొక ముఖ్య లక్ష్యంగా అవతరించిన రామాయణాన్నే తీసుకోండి. యాజమాన్య కోణం నుంచే చూసినప్పుడు, రామాయణ కథ మొత్తానికి ‘పితృవాక్య పరిపాలనే’ కీలకం. అలాగే, తండ్రి తర్వాత పెద్ద కొడుకే యజమాని. రాముడు-ఆయన సోదరుల సంబంధంలో అదే కనిపిస్తుంది.

అంటే ఏమిటన్న మాట? మాతృస్వామిక వ్యవస్థలో యజమానురాలైన కుంతి ఆదేశాన్ని శిరసావహించి పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడారు! పితృస్వామిక వ్యవస్థలో యజమాని అయిన తండ్రి దశరథుని ఆదేశాన్ని శిరసావహించి రాముడు అడవికి వెళ్ళాడు! ఈ రెండు ఉదాహరణాలూ వ్యవస్థలు ఎలా తలకిందులయ్యాయో సూత్రప్రాయంగా చెబుతాయి.

ఇంకా కావాలంటే పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ స్థానం ఏమిటో సందేహాతీతంగా చెబుతున్న మనుస్మృతిలోని మాటలే చూడండి. మనుస్మృతిలోని పంచమాధ్యాయంలో ‘స్త్రీధర్మములు’ అనే శీర్షిక కింద ఉన్న రెండు శ్లోకాలు ఇలా చెబుతున్నాయి:

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి

బాల అయినా, యువతి అయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చేయతగదు.

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణిగ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్

స్త్రీ బాల్యంలో తండ్రి అధీనం లోను, యవ్వనంలో భర్త అధీనంలోను, భర్త మరణించిన తరువాత పుత్రుల అధీనంలోనూ ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.

[మనుధర్మశాస్త్రము (మనుస్మృతి), తెలుగు రచన: కె.వై.ఎల్. నరసింహారావు]    

ఇంకా విశేషమేమిటంటే, స్త్రీ స్వాతంత్ర్యాన్ని కట్టడి చేసి, పురుషస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం ఒక దశలో ప్రపంచ స్థాయిలో జరిగింది. కనుక మూస పోసినట్టు పురుషస్వామ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. మన మనుస్మృతి లాంటి స్మృతులను ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు సృష్టించుకున్నాయి. మగపిల్లవాడికి ఒక వయసు వచ్చాక, అతనిని బాధ్యతాయుతుడైన కుటుంబ యజమానిగా, అంటే పురుషస్వామ్య ప్రతినిధిగా మలిచే ఒకానొక ప్రక్రియను ప్రతి సమాజమూ కల్పించుకుంది. తల్లితో సహా స్త్రీల ప్రభావం నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కకు తప్పించడం అందులో భాగం. ఆ ప్రక్రియ అతనికి ‘రెండో జన్మ’ నిస్తుంది. ఆ ప్రక్రియనే మన సంప్రదాయం ఉపనయనం గానూ, ఉపనయన సంస్కారం పొందిన వాడిని ‘ద్విజన్ము’డి గానూ పేర్కొంది. పురాతనసమాజాలు అన్నిటా ఇది అందరికీ అమలు చేసిన ప్రక్రియ అయినా మన వ్యవస్థలో మాత్రం కొన్ని కులాలకే పరిమితమైంది.

ఎలెక్స్ హేలీ ‘రూట్స్’ నవలలో కథానాయకుడైన కుంటా కింటేను ‘పురుషు’డిగా మలచే ప్రక్రియ గురించి సుదీర్ఘంగా రాస్తాడు. అది నాలుగు నెలలపాటు సాగే కష్టసాధ్యమైన ప్రక్రియ. ఓ రోజున అయిదారుగురు వ్యక్తులు పెద్దగా కేకలు పెడుతూ, ఈటెలతో బెదిరిస్తూ ఊరి మీదికి వచ్చి పడతారు. ఒక్కొక్క ఇంట్లోకే చొరబడి, పది పదకొండేళ్ళ కుర్రాళ్లను బయటకు లాగి, వాళ్ళ ముఖాలకు ముసుగులు కప్పి ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుపోతారు. వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నిబ్బరాన్ని, సమయస్ఫూర్తిని పెంచే అనేక క్లిష్టమైన శారీరక, మానసిక పరీక్షలకు గురిచేస్తారు. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోగల విధంగా వారిని తీర్చిదిద్దుతారు. ఆ పరీక్షలలో విఫలమైతే అంతకన్నా సిగ్గుచేటు ఉండదన్న అభిప్రాయాన్ని వారిలో నూరిపోస్తారు. చివరిగా వారికి ‘సుంతీ’ కూడా జరుగుతుంది. ఆ నాలుగు నెలల తర్వాతా వారు సంపూర్ణ ‘పురుషుడు’గా మారి ఇంటికి తిరిగివస్తారు. అక్కడినుంచి వారికి పూర్తిగా కొత్తజీవితం ప్రారంభమవుతుంది. ఇక వారు తల్లిదండ్రుల ఇంట్లో ఉండరు. వారికి ప్రత్యేకంగా తమదైన నివాసం ఏర్పడుతుంది. గ్రామ పెద్దలు వారికి కొద్దిపాటి పొలంతోపాటు, ఊరికి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పజెబుతారు.

మగపిల్లవాడిని ‘ద్విజన్ము’డిగా మార్చే ఈ ప్రక్రియలో తల్లి ప్రభావాలనుంచి అతణ్ణి దూరం చేయడం, తల్లికీ, తనకూ మధ్య ఎడం పాటింపజేయడం కూడా భాగం. శిక్షణ ముగించుకుని కుంటా కింటే తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టిన ఘట్టాన్ని, తల్లి పట్ల అతని దృక్పథంలో వచ్చిన మార్పును రచయిత ఇలా చిత్రిస్తాడు:

“తెల తెల వార్తూండగా ఊళ్ళో అడుగుపెట్టిన కుర్రవాళ్ళకి జనం నవ్వుతూ, తుళ్లుతూ, నాట్యం చేస్తూ, చప్పట్లు చరుస్తూ స్వాగతమిచ్చారు. ఆడవాళ్ళు ‘ఏయ్! ఓయ్!’ అని పట్టరాని సంతోషంతో పగలబడి నవ్వుతూ కేకలు వేశారు. కుర్రవాళ్లు తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో నెమ్మదిగా నడిచారు. మొట్టమొదట వాళ్ళ పెదాల మీంచి చిరునవ్వులు చిందలేదు; నోట్లోంచి మాట ముత్యాలు రాల్లేదు. గంభీరంగా ఉండిపోయారు.

తల్లి తనకేసి ఆపుకోలేని ప్రేమతో పరుగెత్తుకుని వస్తున్నప్పుడు కుంటాకి తను కూడా అట్లాగే ఆమెవైపు ఉరుకెత్తి వాటేసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతోంది. బింటా కొడుకు మెడ చుట్టూ చేతులు వేసింది. చెంపల్ని చేతుల్తో తడిమింది. కళ్ళవెంట సంతోషబాష్పాలు కారుతుంటే, “కుంటా, కుంటా” అని నెమ్మదిగా గొణిగింది. కుంటాకి తనిప్పుడు పురుషుణ్ణని స్ఫురణకొచ్చి వెనక్కి తప్పుకున్నాడు. ఆమె వీపుకి వేళ్ళాడే ఉయ్యాలలో ఏడుపు మొదలెట్టిన పసిగుడ్డుని స్పష్టంగా చూసే మిషతో తల్లి నుంచి వెనక్కి తప్పుకున్నట్టు నటించాడు. ఉయ్యాల్లోకి చేతులు దోపి రెండు చేతులతో చిట్టి తమ్ముణ్ణి పైకెత్తుకున్నాడు.

……….

కుంటా తమ్ముణ్ణి ఎత్తుకుని పాకలోకి వస్తుంటే బింటా కొడుకు ప్రక్కనే నడుస్తూ మురిసిపోయింది…ఇరుగుపొరుగు అమ్మలక్కలు బింటాతో “నీ కొడుకు ఎంత కళకళలాడుతున్నాడమ్మా! మగకళ ఎంత కొట్టొచ్చినట్టు కానొస్తోందే!” అంటూ వ్యాఖ్యానాలు చేస్తోంటే కుంటా వినిపించుకోనట్లే నటించాడు. కానీ, ఆ మాటలతని చెవులకు సంగీతంలా వినిపించాయి.

….ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోతూ బింటాకి మాటలు కరువయ్యాయి. అమ్మకోసం తను ఎంత తపించిపోయాడో, యింటికి తిరిగివస్తే ఎంత ఆనందంగా ఉందో ఆమెకు చెప్పాలనుకుంటూ ఉవ్విళ్లూరాడు. కానీ నోరు పెగల్లేదు. అమ్మతో సహా యే స్త్రీతోగానీ అటువంటి ముచ్చట్లాడ్డం పురుషలక్షణం కాదని అతనికి తెలుసు.

………

కుంటా ఆ రోజే కొత్త పాకలోకి మారాడు. బింటా కొడుక్కి కావలసిన సమస్త సామగ్రీ అమర్చిపెట్టింది. ఆఖరికి ప్రార్థన చేసుకోటానికి అవసరమైన పట్టా కూడా సమకూర్చిపెట్టింది. తల్లి “నీకిది అవసరమవుతుందిరా, అదవసరమవుతుందిరా” అంటూ రకరకాల పనిముట్లు సామాన్లు చేరుస్తుంటే కుంటా అసంతృప్తిగా గుర్రుమన్నాడు. అదొద్దు, ఇదొద్దు అంటానికి కారణాలు దొరక్క తల గోక్కున్నాడు.

“తలలో పేలు పడ్డట్టున్నై. కుక్కుతా, రారా” అంటూ బింటా ముందుకొచ్చింది.

“వొద్దు” అన్నాడు కుంటా అసహనంగా. బింటా కోపంగా నసుగుతూ వెళ్లిపోయింది.”

                                                                         [ఏడు తరాలు (ROOTS), తెలుగు: సహవాసి]

***

స్త్రీ-పురుష సంబంధాల గురించి, స్త్రీ ‘శీలం’ గురించి మనకిప్పుడు పట్టువిడుపులు లేని, మతవిశ్వాసంతో పోల్చదగిన నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలకు పునాదులు వేసి, కాలగమనంలో వాటిని పటిష్టం చేసుకుంటూ వెళ్లింది మన పూర్వీకులే. అయితే, స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం విషయంలో మన అనుభవాలూ, ఆలోచనలకీ; పూర్వీకుల అనుభవాలూ, ఆలోచనలకీ ఒక విచిత్రమైన తేడా ఉంది. వీటి విషయంలో పూర్వీకులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఇరుకుగానూ, వైవిధ్యరహితంగానూ మారిపోయింది. ఒక్క చిన్న పోలికతో చెప్పుకుంటే, మన పూర్వీకులు ఒక పెద్ద తానును కత్తిరించే పనిలో పడ్డారు. మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక చొక్కా గుడ్డ అయింది…

మరికొంత వచ్చేవారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

మోర్గాన్ కన్నా ముందు వ్యాసుడే చెప్పాడు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా ‘టెన్షన్’ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది అయిదుగురిని వివాహమాడడంలోని ‘అసంబద్ధత’ రాను రాను చిన్న గీతగా మారిపోయి, దానిని శాస్త్రానికి నప్పించడం ఎలాగన్నదే పెద్దగీతగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ‘దేవధర్మం’నుంచి సమస్యను ఎంత నరుక్కు వద్దామని అతడు చూసినా ‘మనుష్యధర్మం’ తాలూకు చిక్కులు అతని అంతఃకరణను వేధిస్తూనే వచ్చాయి.

ధర్మతత్వం తెలిసిన ధర్మరాజు, కుంతి, ద్రుపదుడు తమలో తాము సమస్యను పరిష్కరించుకోలేకపోయిన స్థితిలో వ్యాసుడంతటి వాడు రంగప్రవేశం చేయడమే చూడండి… సమస్య ఎంత సంక్లిష్టమో అదే చెబుతుంది. విచిత్రమేమిటంటే, వ్యాసుడికి కూడా ఇది దేవధర్మం అని నిష్కర్షగా చెప్పి సందేహాలకు తెరవేయడం సాధ్యం కాలేదు. ఆయన కూడా దేవధర్మం-మనుష్య ధర్మం అనే రెండింటి మధ్యా ఊగిసలాడడం కనిపిస్తుంది. ఆయన కంటె ముందు ధర్మరాజూ అలాగే ఊగిసలాడాడు. దాని గురించి మొదట చెప్పుకుందాం.

ద్రౌపదితో తమ అయిదుగురి వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు రెండు అంశాలను ముందుకు తెచ్చాడు: మొదటిది, గౌతమ గోత్రీకుడైన జటిలుడనే ఋషి కూతురు(ఆమె పేరు చెప్పలేదు) తపఃప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయినట్టు; దాక్షాయణి అనే మునికన్య,‘ప్రచేతసు’లనే ఒకే పేరుతో ఉన్న పదకొండుమందిని వివాహమాడినట్టు కథల్లో వింటుండడం. రెండవది, గురువులలోనూ పరమగురువు అయిన తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని అతిక్రమించడానికి వీలు లేదు కనుక.

దీనిప్రకారం, ద్రౌపదిని తాము అయిదుగురూ వివాహమాడడం వెనుక దైవ కారణం లేదా దేవధర్మం ఉందనే సమర్థన సంపూర్ణంగా సరిపోతుందని ధర్మరాజు అనుకోవడం లేదన్నమాట. దానికి మనుష్యధర్మాన్ని కూడా తోడు తెచ్చుకుంటున్నాడు. ఎలాగంటే, జటిలుడనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి గురించి చెప్పడంలో మనుష్యసంబంధమైన అటువంటి ఆనవాయితీ ఉందని చెప్పడమే ధర్మరాజు ఉద్దేశంగా కనిపిస్తుంది. గమనించండి…జటిలుడి కూతురు, దాక్షాయణి అనేకమందిని వివాహమాడడం వెనుక దేవధర్మం లేదా దైవకార్యం ఉందని చెప్పడం లేదు. కుంతి, ద్రౌపదుల వెనక అలాంటివి ఉన్నప్పుడు; జటిలుడి కూతురు, దాక్షాయణిల వివాహం వెనక కూడా ఉండి తీరాలి. అప్పుడే ఆ పాత్రల మధ్య సమధర్మాన్ని, సమన్యాయాన్ని స్థాపించినట్టు అవుతుంది. కానీ కుంతి, ద్రౌపదులను మాత్రమే మనుష్యధర్మం నుంచి మినహాయిస్తున్న కథకుడూ, కథకుని పాఠాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్న వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వంటి సంప్రదాయ పండితులూ జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో ఆ సూత్రాన్ని అన్వయించడం లేదు. అన్వయించకపోగా ఇక్కడ కథకుడు ధర్మరాజు ముఖతా ద్రౌపది వివాహాన్ని సమర్థించడానికి ఆ ఇద్దరినీ వాడుకుంటున్నాడు.

వ్యాసుడు, కర్ణుడు ఒకేవిధంగా(మునుల వరం, సద్యోగర్భం; కర్ణుడికి అదనంగా సూర్యసంబంధం)జన్మించినప్పటికీ ఇద్దరికీ ఒకేవిధమైన ప్రతిపత్తిని ఇవ్వలేదని చెప్పుకున్నాం. ఇక్కడ కుంతి, ద్రౌపదులతో పోల్చినప్పుడు జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో కూడా అదే జరిగింది. సంప్రదాయ పాఠం పూరించకుండా విడిచిపెట్టిన ఖాళీలలో ఇది కూడా ఒకటి.

ఇక ద్రౌపదితో తమ వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు చెప్పిన రెండో కారణానికి వస్తే, గురువులలోనే పరమ గురువు అయిన తల్లి చెప్పింది కనుక ఈ వివాహం జరిగితీరవలసిందే నంటున్నాడు. అంటే ఈ మాటతో అతడు పూర్తిగా సాధారణబుద్ధితో మనుషులందరూ అర్థం చేసుకోగల మనుష్యధర్మంలోకి జారిపోతున్నాడు. తల్లి ఆదేశాన్ని కొడుకు పాటించాలనడం వెనుక ఎలాంటి దేవధర్మమూ, దైవకారణమూ ఉండనక్కరలేదు. అది అసలు సిసలు మనుష్యధర్మం మాత్రమే.

ఆశ్చర్యమేమిటంటే, దేవధర్మం, దైవకారణాలనుంచి అంతిమంగా మనుష్యధర్మంలోకి జారిపోయే ఈ క్రమం వ్యాసుని మాటల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మరాజు ధర్మతత్వజ్ఞుడు కనుకా, అతడు ధర్మం తప్పే ప్రసక్తి లేదు కనుకా; కుంతీదేవి కూడా అబద్ధమాడే ప్రశ్న లేదుకనుకా; వీరి అభిప్రాయమే దేవతల అభిప్రాయం కూడా కనుకా మరేమీ ఆలోచించకుండా ద్రౌపదిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేసేయమని మొదట ద్రుపదునికి చెప్పాడు. తదుపరి మెట్టులో, దీని వెనుక అసలు రహస్యం వేరే ఉందంటూ నాటకీయంగా ద్రుపదుని చేయిపట్టుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తాను చెప్పబోయే రహస్యానికి ఒక గంభీర వాతావరణం కల్పించాడు. అది ద్రుపదుడిపై ఆడిన ఒక ‘మైండ్ గేమ్’ అనే సంగతి తెలిసిపోతూనే ఉంది.

ద్రౌపది వెనకటి జన్మలో ఇంద్రసేన అనే పేరు కలిగిన ‘పరమ పతివ్రత’ అంటూ వ్యాసుడు ఆమె కథ చెప్పడం ప్రారంభించాడు. ద్రౌపది అయిదుగురికి భార్య కాబోతోంది కనుక ఆమె పాతివ్రత్యం గురించి శ్రోతలు పరిపరి విధాలుగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ‘పరమ పతివ్రత’ అనే వ్యూహాత్మకమైన మాట ద్వారా ముందే కట్టడి చేస్తున్నాడన్న మాట. ఆ వెంటనే ఆమె ఎంత పతివ్రతో సోదాహరణంగా చెప్పాడు. ఆ తర్వాత ఆమె కామేచ్ఛ గురించి, ఆమె కోరికపై మౌద్గల్యుడు అయిదు అందమైన పురుషరూపాలు ధరించి ఆమెతో సంగమించడం గురించి, ఆమె అప్పటికీ సంతృప్తి చెందని స్థితిలో అతడు ఆమెను వదిలేసి తపస్సుకు వెళ్లిపోవడం గురించి(సంస్కృత పాఠం ప్రకారం ఆమెకు మరుజన్మలో అయిదుగురు భర్తలవుతారని మౌద్గల్యుడు శపిస్తాడు), ఆమె శివుడి గురించి తపస్సు చేసి అయిదుగురు భర్తలను, కన్యాత్వాన్ని పొందబోవడం గురించి చెప్పాడు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

ఇక్కడే ఇంద్రాది దేవతలు పాండవులుగా జన్మించారని అంటూ దానివెనుక ఉన్న దైవకార్యం గురించి కూడా వ్యాసుడు చెప్పాడు. అదేమిటంటే, వైవస్వత మనువు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తూ దీక్షలో ఉండి ప్రాణిహింస మానేశాడు. అప్పుడు మనుషులందరూ మరణం లేకుండా దేవతలతో సమానంగా అమరులైపోయారు. దాంతో దేవతలు దానిని సహించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మవాళ్ళను భయపడవద్దని చెబుతూ, ఎప్పటిలా యముడు మనుషుల ప్రాణాల తీసే బాధ్యతను నిర్వర్తిస్తాడనీ, ఆ వైవస్వతుని వీర్యంతోనూ, మీ (దేవతల) వీర్యంతోనూ సూర్యతేజస్వులైన అయిదుగురు పుట్టి యముడికి సాయపడతారనీ అంటాడు. అంటే, ఈ మాటల ద్వారా కథకుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని సూచిస్తున్నాడన్న మాట.

ఆ తర్వాత ఒకే ఇంద్రుడు అయిదుగురు ఇంద్రులుగా మారి యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల అంశతో పాండవులుగా జన్మించడం గురించి వ్యాసుడు చెప్పాడు. ఆపైన ద్రుపదుడికి దివ్యదృష్టి ఇచ్చి ద్రౌపదీ, పాండవుల పూర్వదేహాలు కూడా చూపించాడు. ఇలా ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం వెనుక ఉన్న శాపాలు, వరాలు, మహిమల రూపంలోని దేవధర్మాన్ని, దైవ కార్యాన్ని చెప్పిన తర్వాతా; అందుకు సాక్ష్యంగా ద్రౌపదీ, పాండవుల పూర్వ రూపాలు కూడా చూపించిన తర్వాతా వ్యాసునికి కానీ, ద్రుపదుడికి కానీ ఇక సందేహాలు ఉండడానికి వీల్లేదు.

కానీ చూడండి…పై కథనంతో ద్రుపదుడు కాదు సరికదా, స్వయంగా వ్యాసుడు కూడా సమాధానపడలేదన్న అభిప్రాయం అనంతర వాక్యాలను బట్టి అనిపిస్తుంది. ‘మనుష్యధర్మా’న్ని కూడా జోడిస్తే తప్ప పైన చెప్పిన దేవధర్మం, దైవకార్యాలను నమ్మరని వ్యాసుడికే అనుమానం వచ్చినట్టుంది. దాంతో దేవధర్మం అనే మెట్టు మీదనుంచి మనుష్యధర్మం అనే మెట్టు మీదికి ఒక్కసారిగా దిగిపోయాడు. పూర్వం నితంతుడనే రాజర్షి కొడుకులు అయిదుగురు అజిత, అనే రాకుమార్తెను స్వయంవరంలో గెల్చుకుని వివాహం చేసుకుని ఆమె ద్వారా సంతానం పొందారని చెప్పాడు. గమనించండి, ఈ వివాహం వెనుక ఎటువంటి వరాలు, శాపాలు, మహిమలు, దేవధర్మాలు, దైవకార్యాలు ఉన్నట్టు వ్యాసుడు చెప్పలేదు. ఆవిధంగా ఇది పూర్తిగా ‘మనుష్యధర్మం’ కిందికి వచ్చే వివాహమే. అంటే, ఇది కూడా జటిలుడనే ముని కూతురు ఏడుగురు ఋషులను, దాక్షాయణి అనే ఆమె పదకొండుగురు ప్రచేతసులను పెళ్లి చేసుకోడం లాంటిదే.

చివరిగా వ్యాసుడు,‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’అన్నాడు.

***

అదీ సంగతి!!!

నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. సంభ్రమాశ్చర్యాలతో కాసేపు అవాక్కునైపోయాను. దూకుతూ దూకుతూ ఉన్న నా మాటల జలపాతం కాస్తా ఎవరో మంత్రించినట్టు మధ్యలోనే స్తంభించినట్టు అయిపోయింది. నా లాప్ టాప్ కీబోర్డు మీద కదలడానికి వేళ్ళు మొరాయించాయి. చీకట్లో తడుముకుంటున్న కళ్ళకు హఠాత్తుగా ఒక మెరుపుతీగ తాకినట్టుగా ఈ వాక్యం నా బుద్ధిని తాకి వేయి వోల్టుల కాంతితో నింపివేసింది!

‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’

అంటే ఏమిటన్నమాట…పురాకాలంలో మహాత్ములు ఒకే స్త్రీని వివాహమాడిన చరిత్రలు ఉన్నాయని వ్యాసుడు చెబుతున్నాడు! ఇంకాస్త వివరంగా చెప్పుకుంటే, ఒకే స్త్రీని పలువురు పురుషులు పెళ్లిచేసుకోవడం అనే మనుష్యధర్మం అమలుజరిగిన ఒకానొక పురాచారిత్రక విశేషాన్ని ఈ వాక్యం ద్వారా వ్యాసుడు సూచిస్తున్నాడు!

అంటే, వ్యాసుడు ఈ వాక్యం ద్వారా అక్షరాలా పురాచరిత్రను చెబుతున్నాడు!

మహాభారతాన్ని పురాచరిత్రగా, పురామానవపరిణామ చరిత్రగా, చరిత్రగా చూస్తున్న నా దగ్గర, వ్యాసుడు పలికిన ఈ ఒక్క వాక్యం విలువను తూచగల తూనికరాళ్ళు లేవు. పురాచరిత్ర కోణం నుంచి మహాభారతాన్ని ‘డీకోడ్’ చేసే ప్రయత్నంలో కచ్చితంగా ఈ వాక్యం ఒక విలువైన ‘కీ’. చరిత్రలో ఏ గొప్ప రహస్యచ్ఛేదనానికీ తీసిపోని రహస్యచ్ఛేదనం ఇది. నావరకు నాకు ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు…

వ్యాసుడే కాదు,‘జటిలు డనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి అనే ఆమె గురించి కథల్లో వింటూ ఉంటా’మని అంటూ ధర్మరాజు ఉపయోగించిన ‘కథ’ అనే మాట కూడా పురాచరిత్రను సూచించేదే.

ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, వ్యాసుడూ, ధర్మరాజూ కూడా ఒకప్పటి గణవివాహదశ గురించి చెబుతున్నారు. దేవధర్మం, దైవకార్యం లాంటి ముసుగులు అన్నీ తీసేసి మరీ చెబుతున్నారు. ‘ప్రచేతసులనే పదకొండుగురు సోదరులను దాక్షాయణి పెళ్లాడిం’దని చెప్పడంలో ఈ గణసమాజ లక్షణం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సోదరులందరికీ ఒకే పేరు ఉందంటే వారందరూ ఒకే గణానికి చెందినవారని అర్థం.

మహాభారతంలో గణసమాజ చరిత్ర!! ఎంత అద్భుతం!! వేలు, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో మహాభారతం పఠన పాఠనాలలో ఉంది. కానీ ఏ ఒక్క పండితుడూ ఈ అద్భుతాన్ని గమనించినట్టు లేదు. ఇది నా పరిశీలనను మరింత ఉత్సాహవంతం, ఉత్తేజభరితం చేస్తున్న కోణం.

41S2DEZ512L

లూయీ హెన్రీ మోర్గాన్ అనే పండితుడు గణ సమాజంపై భగవద్గీతతో, బైబిలుతో పోల్చదగిన ఒక ప్రామాణిక గ్రంథం రాసిన సంగతిని ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను. దాని పేరు ‘ANCIENTSOCIETY’(పురాతన సమాజం). అమెరికా ఆదివాసుల మధ్య పన్నెండేళ్ళు గడిపి, వాళ్ళతో పూర్తిగా మమేకమై, వారికి దత్తుడుగా వెళ్ళి గణదశలో ఉన్న వారి సమాజాన్ని అన్నివైపులనుంచీ శోధిస్తూ 1877లో ఆయన ఆ పుస్తకం రాశాడు. గ్రీకు, రోమన్ సహా ఇతర గణసమాజాల లక్షణాలతో తన అధ్యయనాన్ని సమన్వయించాడు. భౌగోళిక దూరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకనాటి గణసమాజాలు అన్నిటా ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను వెల్లడించాడు.

చెప్పొచ్చేదేమిటంటే, లూయీ హెన్రీ మోర్గాన్ తన గ్రంథంలో ఏ వివాహదశలనైతే చర్చించాడో వాటిలోని ఒకానొక వివాహదశ గురించే మన వ్యాసుడు, ధర్మరాజు చెబుతున్నారు. ఇంకో ఆశ్చర్యానికి కూడా మీరు సిద్ధం కావాలి. అదేమిటంటే, గణవివాహదశ గురించి 19వ శతాబ్దంలో మోర్గాన్ చెప్పడానికి చాలా ముందే మన వ్యాసమహర్షి చెప్పడం!

మోర్గాన్ చెప్పిన గణసమాజ సంబంధాల గురించి ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూ ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేశాను. మరోసారి వాయిదా వేయక తప్పడం లేదు.

ఇప్పుడు మళ్ళీ ద్రౌపది వివాహం దగ్గరికి వెడదాం.

***

ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం కథకునిలో చాలా ‘టెన్షన్’ పుట్టించిందని మొదట్లో చెప్పుకున్నాం. దానినే మరికొంత విస్తరించుకుంటే…

ద్రౌపది వివాహంలో ఎదురైన ధర్మ సంకటం గురించిన చర్చ వాస్తవానికి రెండు దశల్లో జరిగింది. మొదటిది, పైన చెప్పుకున్న ద్రుపదుడు, ధర్మరాజు, వ్యాసుల మధ్య చర్చ జరిగిన చర్చ. రెండోది, అంతకుముందే కుంతి, పాండవుల మధ్య జరిగిన చర్చ. రెండో దశ చర్చలో వరాలు, శాపాలు వగైరాల రూపంలో ద్రౌపది వివాహాన్ని ఎలాగో ధర్మబద్ధం చేయడానికి కథకుడు ప్రయత్నిస్తే, మొదటి దశ చర్చలో కుంతి అన్న ఒక మాట ద్వారా ధర్మబద్ధం చేయడానికి ప్రయత్నించాడు.

అదేమిటంటే, స్వయంవరంలో గెలుచుకున్న ద్రౌపదితో కలసి భీమార్జునులు ఇంటికి వచ్చిన తర్వాత తామొక భిక్ష తెచ్చామని తల్లితో అనగా, ద్రౌపదిని తెచ్చిన విషయం తెలియక ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకున్న కుంతి,‘మీరు అయిదుగురూ దానిని ఉపయోగించుకోండి’ అనడం.

కథకుడు ఆమాటనే ఉపయోగించుకున్నాడు. అయితే ద్రౌపదిని తెచ్చిన విషయం కుంతికి తెలియక అలా అందన్న కథకుని కల్పన మొత్తం రాతితో గోడకట్టినట్టుగా కాక, ఇసుక గూడులా మారిపోయిన సంగతి మామూలు బుద్ధికే తెలిసిపోతోంది. అదెలాగో చెప్పుకోవాలంటే, కుంతి,పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ద్రుపదుడి నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ద్రౌపది స్వయంవరం గురించి వారికి చెప్పిన దగ్గరనుంచీ ఎత్తుకోవాలి.

ఆ బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించే కాక, ఆమె జన్మవృత్తాంతం మొత్తం చెప్పి అర్జునుడికి భార్యకావడం కోసమే ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రౌపదిని పొందాడని కూడా చెప్పాడు. అప్పుడు అర్జునుడితో సహా పాండవులు అందరూ ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లాలనుకోవడం సహజమే. పైగా స్వయంవరానికి నిర్ణయించిన పరీక్ష కూడా అర్జునుడి లాంటి మేటి విలుకాడు తన ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశం. అదీగాక, రాచకన్యకు ఏర్పాటు చేసిన స్వయంవరాన్ని ఏ రాచబిడ్డా వదలుకోడు. అది పరువు కూడా కాదు.

కనుక పాండవులు ద్రుపదనగరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డారు. ఆ సంగతిని కుంతి గమనించిందని కూడా కథకుడు ఆ వెంటనే చెబుతున్నాడు. అయితే, స్వయంవరం మాట ఎత్తకుండా,‘ఇక్కడే చాలాకాలం ఉండిపోయాం, ఎంతకాలం ఇక్కడ ఉన్నా ఉపయోగమేముంది, పరుల ఇంట్లో ఎంత కాలం ఉంటాం, దక్షిణ పాంచాలం ఎంతో బాగుంటుందనీ, పాంచాలరాజు ధార్మికుడనీ విన్నాం, అదీగాక అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే చక్కటి భోజనం పెడతారట, అక్కడికి వెడదాం’ అంది. పాండవులు సరే, నువ్వు ఆదేశించినట్టే చేద్దాం అని తల్లితో కలసి బయలుదేరారు.

ఇక్కడ కుంతి స్వయంవరం గురించి ఎత్తకుండా, తాము పాంచాలరాజ్యానికి వెళ్లడానికి ఇతర కారణాలు చెప్పింది కనుక; పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియదని కథకుడు అనడానికి అవకాశమున్నా అది పొసగదు. రాచబిడ్డలైన పాండవులు స్వయంవరానికి వెళ్ళి తీరతారనీ, వెళ్ళి తీరాలనే రాచసంప్రదాయం కుంతికి తెలియకుండా ఉండదు. అదీగాక, అర్జునుడికి భార్య కావడం కోసమే ద్రుపదుడు ద్రౌపదిని పొందాడనే సంగతి ఆమె కూడా వింది కనుక పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియకపోయే ప్రసక్తే లేదు.

సరే, పాండవులు ద్రుపద నగరానికి బయలుదేరి వెడుతున్నారు. అప్పుడు వారికి వ్యాసుడు ఎదురయ్యాడు. ‘ఒక మునికన్య భర్త కోసం తపస్సు చేసిందనీ, శివుడు ప్రత్యక్షం కాగా భర్త కావాలని అయిదు సార్లు అడిగిందనీ, నీకు మరుసటి జన్మలో అయిదుగురు భర్తలవుతారని శివుడు ఆమెకు చెప్పాడనీ, ఇప్పుడామె పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరిగిందనీ, ఆమెకు స్వయంవరం ప్రకటించారనీ, మీరు ద్రుపదపురానికి వెడితే మేలు జరుగుతుందనీ’ పాండవులకు వ్యాసుడు చెప్పాడు. అప్పుడు కుంతి అక్కడే ఉంది.

కనుక ఈవిధంగా కూడా పాండవులు ద్రౌపదీ స్వయంవరానికే వెడుతున్నారని కుంతికి తెలుసు!

ఆ తర్వాత మార్గమధ్యంలో వారికి కొందరు బ్రాహ్మణుల గుంపు కనిపించింది. మీరు ఎక్కడికి వెడుతున్నారని పాండవులు వారిని అడిగారు. ద్రౌపదీ స్వయంవరాన్ని చూడడానికి ద్రుపదపురం వెడుతున్నామని చెప్పారు. కుంతి, పాండవులు వాళ్ళతో కలసి ద్రుపదపురం వైపు ప్రయాణం సాగించారు.

కనుక పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లదలచుకున్న సంగతి కుంతికి తెలియకపోయే ప్రశ్న లేదు.

కుంతీ సహితంగా పాండవులు ద్రుపదనగరానికి చేరుకున్నారు. బ్రాహ్మణవేషంలోనే స్వయంవరంలో పాల్గొన్నారు. కుంతి విడిదిలో ఉండిపోయింది. పాండవులు తాము స్వయంవరానికి వెడుతున్నట్టు కచ్చితంగా తల్లితో చెప్పే ఉండాలి. కనుక, వాళ్ళు రోజూలానే ఆహారభిక్షకు వెడుతున్నట్టు కుంతి అనుకునే అవకాశమే లేదు.

అర్జునుడు మత్స్యయంత్రం కొట్టాడు. ద్రౌపది అతణ్ణి వరించింది. ఇంతమంది రాజులను స్వయంవరానికి ఆహ్వానించి, వారిని కాదని ద్రౌపదిని ఒక బ్రాహ్మణుడికి కట్టబెట్టడం రాజులను అవమానించడమే నని కర్ణ దుర్యోధనాదులు ద్రుపదునిపై దండెత్తారు. భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు.

అయితే, ఈ లోపలే, స్వయంవరం ముగిసిన వెంటనే ధర్మరాజు, నకుల, సహదేవులు విడిదికి చేరుకున్నారు. అంటే ఏమిటన్న మాట? అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెల్చుకున్న సంతోషకరవార్త ఆ ముగ్గురూ తల్లికి చెప్పేసి ఉండాలి. చెప్పకపోవడానికి కారణం లేదు.

ఆ తర్వాత, కర్ణ, దుర్యోధనాదులను ఓడించిన భీమార్జునులు ద్రౌపదిని వెంటబెట్టుకుని విడిదికి వచ్చారు. భిక్ష తెచ్చామని అన్నారు. ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియని కుంతి, ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని అయిదుగురినీ ఉపయోగించుకోమని అందని కథకుడు చెబుతున్నాడు.

ఈ కల్పన ఇసుకగూడు అన్న సంగతి తెలిసిపోవడంలేదా?

ఇంతకీ కథకుడు ఇంత అమాయకమైన కల్పన ఊరికే చేశాడనుకుంటున్నారా? కాదు. అతను ముఖ్యమైన కొన్ని అంశాలను మరుగుపుచ్చడానికి చేశాడు. వాటి గురించి తర్వాత…

 

 -కల్లూరి భాస్కరం

 

ద్రౌపది వివాహం: జంట సంకటం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కొన్నేళ్ళ క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది…

‘ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద విషయం కాద’ని దాని సారాంశం. దానిపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీవీ చానెళ్లలో చర్చలు జరిగాయి. నిజమే… ఆ వ్యాఖ్యను ‘దైవ దూషణ’ను మించిన అపచారంగా భావించడం సహజమే!

వేరే దేశాల అనుభవం ఎలా ఉన్నా, మన దేశంలో ఇప్పటికీ వివాహానికి ముందు ఆడపిల్లల లైంగిక సంబంధం, ఊహించడానికే దారుణమైన విషయం. దానిని ఏ రకంగా సమర్థించినా అది మనోభావాలను గాయపరుస్తుంది. కారణం, వివాహం అనే చెలియలికట్ట మన మనస్సులలో ఒక బలమైన సెంటిమెంట్ గా, అచంచలమైన విశ్వాసంగా పాతుకు పోవడమే. లైంగిక సంబంధం విషయంలో ‘వివాహానికి ముందు, తర్వాత’ అనేది ఏవిధంగానూ చెరపడానికి వీల్లేని శిలారేఖ.

నిజానికి వివాహానికి రెండు పార్స్వాలు ఉన్నాయి. ఒకటి- వ్యవస్థకు, కట్టుబాటుకు, ఆర్థికతకు సంబంధించిన లౌకికపార్శ్వం. రెండవది-సెంటిమెంటుకు, విశ్వాసానికి, భావోద్వేగాలకు సంబంధించిన పార్శ్వం. తటస్థంగా చెప్పుకుంటే, చరిత్రకు అందనికాలంలో కొన్ని లౌకిక కారణాల వల్లనే వివాహవ్యవస్థ ఏర్పడింది. కాలగతిలో అది ఒక సెంటిమెంట్ గా, విశ్వాసంగా, భావోద్వేగ అంశంగా మారి మన ఊహల్లో జీర్ణించుకుంది. ఇప్పుడు విచిత్రంగా అనిపించవచ్చు కానీ, వివాహం అనేది వ్యవస్థీకృతం అవుతున్న కాలంలో దానికి వ్యతిరేకమైన సెంటిమెంటు, విశ్వాసం, భావోద్వేగాలు ఉండి; వివాహవ్యవస్థను అవి ప్రతిఘటించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ప్రపంచ వాఙ్మయం అంతటా కనిపిస్తాయి. ఈ వ్యాసాల క్రమంలో వాటి గురించిన ప్రస్తావన ముందు ముందు రావచ్చు.

చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఒక పోలిక చెప్పుకోవాలంటే, అది వ్యవసాయం! వ్యవసాయం ఆహారోత్పాదనలో ఒక పురోగామి చర్య. కానీ వ్యవసాయాన్ని నామోషిగా భావించి, అందులో భాగం కావడానికి నిరాకరించి, సాంప్రదాయిక ఆహార సంపాదనకే కట్టుబడిన జాతులు ఉన్నాయి. అది కూడా సాధ్యం కానప్పుడు దొంగతనాన్ని ఆశ్రయించిన జాతులు ఉన్నాయి. కోశాంబీ ‘AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY’ లో ఈ జాతుల గురించి కొంత చర్చ చేశారు.

లైంగిక సంబంధాల విషయంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నా వివాహాన్ని మాత్రం ఒక ఉన్నతోన్నత విలువగా, వ్యవస్థగా దాదాపు ప్రపంచమంతా గుర్తించింది. ఆ గుర్తింపు వెనుక సంప్రదాయం కొన్ని వందలు, వేల సంవత్సరాలపాటు సాగించిన అకుంఠిత కృషి ఉంది. వివాహాన్ని వ్యవస్థీకరించడంలో సంప్రదాయం ఎదుర్కొన్న సవాళ్ళు, అనుభవాలు ఇప్పుడు మన ఊహకు అందగలిగినవి కావు. ఆ సవాళ్లలో నాటి వ్యవస్థాపరమైనవే కాక, ప్రకృతి పరమైనవి కూడా ఉన్నాయి. దేనినైనా వ్యవస్థీకరిస్తున్నప్పుడు ప్రకృతిధర్మానికి కూడా కత్తెర వేయక తప్పదు. అలాగని వివాహమనే కట్టడి చేయడంలో సంప్రదాయం పూర్తిగా కఠినంగా వ్యవహరించిందనుకోవడం కూడా పొరపాటు. ఎన్నో సడలింపులకు, సర్దుబాట్లకు అది చోటిచ్చింది. ఒక్కోసారి వివాహవ్యవస్థపైన ప్రకృతిసహజమైన లైంగికతకు, స్త్రీ-పురుష మనోభావాలకు పై చేయిని అంగీకరించడమూ అనివార్యమైంది.

మన సంప్రదాయానికే వస్తే, ధర్మశాస్త్రాలు ఎనిమిది రకాల వివాహాలను, పన్నెండు రకాల సంతానాన్ని అంగీకరించడమే ఉదాహరణ. వివాహవ్యవస్థకు అనుగుణంగా స్త్రీ-పురుష స్వేచ్ఛను, లైంగికతను నియంత్రించలేనప్పుడు; వాటికి అనుగుణంగా వివాహవ్యవస్థలోనే సర్దుబాట్లు చేయవలసివచ్చింది. దాని ఫలితమే అన్ని రకాల వివాహాలు, అన్ని రకాల సంతానాలు. వీటి గురించి వివరంగా చెప్పుకునే సందర్భం ముందు ముందు వస్తుందేమో, చూద్దాం.

విశేషమేమిటంటే, ఇన్ని వందలు, వేల సంవత్సరాల అనుభవంలో కూడా వివాహం అనేది అందరికీ ఒకే విధంగా వర్తించేలా పూర్తిగా వ్యవస్థీకృతం కాలేదు. ఎప్పటికైనా పూర్తిగా వ్యవస్థీకృతం అవుతుందో కాదో కూడా చెప్పలేం. ఇప్పుడు వివాహేతర ‘సహజీవనా’న్ని న్యాయవ్యవస్థ గుర్తించడాన్నే చూడండి. మనదేశపు అనుభవంనుంచే చూస్తే, వివాహవ్యవస్థ అన్ని కులాలలోనూ, అన్నివర్గాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా లేదు. ఒక ఉదాహరణ: మారు మనువులు. కొన్ని కులాలలో మారు మనువులుంటే కొన్ని కులాలలో లేవు.

గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో మారుమనువుల ప్రస్తావన వస్తుంది:

‘మా సూపరెంటు పిల్లలతో ఉన్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా ఉండలేదా?’ అని హెడ్ కానిస్టీబులు  అంటాడు.

‘మావగారి అబిప్పరాయం పెయ్యతో టొచ్చిన ఆవు మేలు కాదా అని’ మునసబు అంటాడు. ‘ముసలి బాపనోడు (లుబ్ధావధాన్లు) యెదవ గుంటని పెళ్లాడితే మీ నేస్తం కరణపోణ్ణి (రామప్పంతుల్ని) ఆ ముసలాడి యెదవ కూతుర్ని (మీనాక్షిని) పెళ్లాడమని బోద సెయ్యరాదా?’ అంటాడు.

‘మనకేల మావా? గవునర్ మెంటూ దేవుళ్లూ బ్రాహ్మలూ వారి నేరాలు వారివి’ అని హవల్దార్ అచ్చన్న అంటాడు.

‘మనలో మారుమనువు లుండేవి కావా?’ అని మునసబు అంటాడు.

చెప్పొచ్చేదేమిటంటే, ఇప్పుడు తాతముత్తాతల ఆస్తుల్ని అనుభవిస్తున్నవారికి, వారు ఆ ఆస్తులు కూడబెట్టడానికి ఎంత శ్రమించారో తెలియనట్టే; వివాహాన్ని ఒక సెంటిమెంటుగా విశ్వాసంగా జీర్ణించుకున్న మనకు, ఆ కట్టడికి రూపమివ్వడంలో సంప్రదాయం ఎంత చెమటోడ్చిందో తెలియదన్నమాట.

 

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

కన్యాత్వంతో పీటముడి ఉన్న వివాహం గురించి అవసరమైన ఈ నాలుగు మాటలూ చెప్పుకున్న తర్వాత విషయంలోకి వద్దాం.

మహాభారత కథకుడు కన్యాగర్భం, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం అనే రెండు ధర్మసంకటాలను ఎదుర్కొన్నాడని ఇంతకు ముందు అనుకున్నాం. నిజానికి ద్రౌపది వివాహంలో ఒకటి కాదు, రెండు ధర్మసంకటాలు ఉన్నాయి. మొదటిది, అయిదుగురిని వివాహమాడడం; రెండోది కన్యాత్వం. అదెలాగంటే, పెద్దవాడైన ధర్మరాజు మొట్టమొదట ఎప్పుడైతే ద్రౌపది పాణిగ్రహణం చేశాడో అప్పుడామె కన్యావస్థనుంచి వివాహితావస్థకు మారిపోతుంది. ఆ తర్వాతి నలుగురూ కన్యను కాక వివాహితను పెళ్లాడినట్టు అవుతుంది. అది శాస్త్రవిరుద్ధం. ఆవిధంగా ద్రౌపది వివాహం జంట సంకటంగా పరిణమించిందన్న మాట. ఈ రెండు సంకటాలను కథకుడు జమిలిగా ఎలా పరిష్కరించాడో చూద్దాం:

ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెల్చుకున్నాడు. తల్లి చెప్పడంతో పాండవులు అయిదుగురూ ఆమెను పెళ్లాడడానికి నిర్ణయించుకున్నారు. ధర్మరాజు ఈ నిర్ణయాన్ని ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడి ముందు ఉంచాడు. ఆశ్చర్యపోయిన ద్రుపదుడు,‘ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉండచ్చు కానీ, అనేకమంది పురుషులకు ఒక్కతే భార్య అన్నది ఏ యుగంలోనూ ఏ కథల్లోనూ వినలేదు. నువ్వేమో అన్ని ధర్మాలూ తెలిసినవాడివి. కనుక నువ్వు మాట్లాడేది ధర్మవిరుద్ధం కావడానికి వీల్లేదు. అయినా దీనిపై రేపు నువ్వు, నేను, కుంతీదేవి, దృష్టద్యుమ్నుడు చర్చించుకుని నిర్ణయం తీసుకుందా’ మన్నాడు.

ఆ తర్వాత హఠాత్తుగా వేదవ్యాసుడు ద్రుపదుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ద్రుపదు డాయనకు ధర్మరాజు ప్రతిపాదన గురించి చెప్పి,‘మీరు ఎరగని లోకాచారాలు ఉండవు కనుక మీరే ఇందులో ధర్మాధర్మ నిర్ణయం చేసి, ధర్మసంకరం కాకుండా చూడవలసిం’దని ప్రార్థించాడు.

అప్పుడు ధర్మరాజు జోక్యం చేసికొని,‘పరిహాసంగా కూడా నేను ఎప్పుడూ అధర్మం మాట్లాడలేదు. ధర్మం తప్పలేదు. కనుక తగునా, తగదా అనే ఆలోచన మానేసి ద్రౌపదిని మా అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయం’డని నిశ్చితంగా చెప్పాడు. ఆపైన,‘పూర్వం గౌతమ గోత్రానికి చెందిన జటిలు డనే ఋషి కూతురు తపః ప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయిందనీ, దాక్షాయణి అనే ముని కన్య ప్రచేతసులనే ఒకే పేరు గలిగిన పదకొండుమందికి భార్య అయిందనీ కథల్లో వింటూ ఉంటాం. అదీగాక, గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని త్రోసిపుచ్చడం సాధ్యం కాదు’ అని మరోసారి నిష్కర్షగా అన్నాడు.

అప్పుడు ద్రుపదుడు ‘ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించడం మన వల్ల కాదు. త్రిలోకపూజ్యుడు, త్రికాలవేది అయిన వ్యాసమహర్షి ఎలా చెబితే అలా చేద్దాం’ అన్నాడు. దానికి వేదవ్యాసుడు,‘ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు. కనుక అతను ధర్మ మార్గం తప్పే ప్రశ్న లేదు. అలాగే దేవతామూర్తి అయిన ఈ కుంతీదేవి నోట కూడా అబద్ధం రాదు. వీళ్ళ మాటలూ, దేవతల అభిమతమూ రెండూ ఒకటే. కనుక నిస్సంకోచంగా నీ కూతురిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయి. అదీగాక, దీని వెనుక ఒక రహస్యం ఉంది. వినడానికి నువ్వు ఇష్టపడితే చెబుతాను విను’ అంటూ ద్రుపదుని చేయి పట్టుకుని ఏకాంతప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఇలా చెప్పడం ప్రారంభించాడు:

“ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన అనే పరమ పతివ్రత. మౌద్గల్యుడు అనే మహాముని భార్య. కర్మవశాత్తూ ఆ మునికి కుష్టువ్యాధి వచ్చింది. దానికితోడు వృద్ధాప్యం. ఆపైన అతికోపం. అయినాసరే, అతని దుర్గంధంతో సహా అన్నీ భరిస్తూ, ఏమాత్రం అసహ్యించుకోకుండా ఇంద్రసేన అతనికి భక్తితో సేవలు చేస్తూ ఉండేది. అతను తిన్న తర్వాత అతని ఎంగిలినే తను తింటూ ఉండేది. ఒకరోజున అలా తింటుండగా అన్నంలో తెగిపడిన అతని వేలు ఒకటి కనిపించింది. ఇంద్రసేన ఏవగించుకోకుండా దానిని తీసి పక్కన పెట్టి ఎంతో ఇష్టంగా ఆ అన్నం తింది.

మౌద్గల్యుడు అది చూశాడు. ఆమె భక్తికి మెచ్చుకున్నాడు. ‘నీకు ఏది ఇష్టమో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. ‘నాకు కామేచ్ఛ ఎక్కువగా ఉంది. నువ్వు తపశ్శక్తితో ఈ బీభత్సరూపం వదిలేసి అందమైన అయిదుగురు పురుషుల రూపం ధరించి నాతో రమించి నన్ను సంతోషపెట్టు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు ఆ ముని ఆమెకు ఇష్టమైనట్టు అయిదు దేహాలు ధరించి అనేకచోట్ల విహరింపజేస్తూ అనేక వేల సంవత్సరాలపాటు ఆమెతో రమించాడు. ఆవిధంగా తను తృప్తి చెందిన తర్వాత ఆమెను వదిలేసి తను తపస్సుకు వెళ్లిపోయాడు.

అయితే, ఇంద్రసేన తృప్తి చెందలేదు. కొంతకాలానికి మరణించి కాశీరాజు కూతురుగా పుట్టింది. భర్త దొరకకపోవడంతో చాలాకాలం కన్యగానే ఉండిపోయింది. తన దౌర్భాగ్యస్థితికి విచారించి భర్త కోసం శివుని ఉద్దేశించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు ఆమెపై ప్రీతి చెంది ఆమె దగ్గరకు వచ్చి, వచ్చే జన్మలో మా అంశతో పుట్టేవారికి భార్య కావలసిందని కోరారు. ఇంద్రసేన తపస్సును కొనసాగించింది. అది క్రమంగా ఉగ్రతపస్సు అయింది. అప్పుడు ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు పతిదానం చేయమని అయిదుసార్లు అడిగింది. సరే, నీకు వచ్చే జన్మలో అయిదుగురు భర్తలు లభిస్తారని శివుడు అన్నాడు.

‘ఎక్కడైనా ఒక స్త్రీకి ఒక్కడే భర్త. పలువురు భర్తలు ఉన్నట్టు ఏ కథల్లోనైనా విన్నామా? ఇలాంటి లోకవిరుద్ధమైన వరం నాకు వద్దు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు శివుడు,‘నీకు అయిదుగురు భర్తలైనా నా వచనప్రభావం వల్ల అది ధర్మబద్ధమే అవుతుంది. నీ మీద దయతో ఇలాంటి వరం ఇస్తున్నా’ నన్నాడు. ‘అలా అయితే, ఆ అయిదుగురు భర్తలతో నేను ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంగమించేటప్పుడు నాకు కౌమారాన్ని (అంటే కన్యాత్వాన్ని), పతి సేవాభాగ్యాన్ని, కామోపభోగాన్ని, సౌభాగ్యాన్ని ఇవ్వవలసిం’దని ఇంద్రసేన అడిగింది. శివుడు సరే నన్నాడు…”

ఈ ఘట్టాన్ని వ్యాసుడు మరికాస్త పొడిగించి, దేవతలకు మేలు చేయడం కోసం ఇంద్రుడే అయిదు రూపాలు ధరించి యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల అంశతో పాండవుల రూపంలో మనుష్యజన్మ ఎత్తాడంటూ ఆ కథ కూడా చెప్పాడు. ఈవిధంగా కాశీరాజు కుమార్తెగా పుట్టిన ఇంద్రసేనే ఈ జన్మలో ద్రౌపదిగా యజ్ఞవేదిలో జన్మించిందని చెప్పిన వ్యాసుడు,‘ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే, ద్రౌపది, పాండవుల పూర్వదేహాలు చూడు’ అంటూ ద్రుపదునికి దివ్యదృష్టి ఇచ్చాడు. అప్పుడు ప్రకాశవంతమైన మణులు పొదిగిన విచిత్ర కిరీటాలతో, బంగారు ఆభరణాలతో, తాటి చెట్టంత ఎత్తైన దేహాలతో పాండవులూ; ఆ అయిదుగురికి భార్య కావడం కోసం తపస్సు చేసిన సకల లావణ్యమూర్తి అయిన ఆ కన్యకా పూర్వదేహాలతో ద్రుపదుడికి కనిపించారు. అతను ఆశ్చర్యపోయాడు.

వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు:

“పూర్వం నితంతుడనే రాజర్షి ఉండేవాడు. అతనికి సాల్వేయుడు, శూరసేనుడు, శ్రుతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే అయిదుగురు కొడుకులు ఉండేవారు. వారు మహా పరాక్రమవంతులు. అన్యోన్య స్నేహానికి, ఐకమత్యానికి కూడా ఆ సోదరులు ప్రసిద్ధులయ్యారు. వారు అయిదుగురూ ఔశీనరుడనే రాజుకూతురు అజితను స్వయంవరంలో గెల్చుకుని వివాహమాడారు. ఆమె వల్ల అయిదుగురూ విడివిడిగా సంతానం పొందారు.

వెనకటి మహాత్ములకు సంబంధించి కూడా ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. కనుక పాండవులు అయిదుగురికీ ఒకరి తర్వాత ఒకరుగా ద్రౌపదిని ఇచ్చి పాణిగ్రహణం చేయించు. ఇది మనం చేసేది కాదు, దైవనిర్ణయం.”

ద్రుపదుడు అంగీకరించాడు.

***

Back-To-Godhead-5-Husbands-of-Draupadi

ఇది తెలుగు భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. దాని ప్రకారం, మౌద్గల్యుడు ఇంద్రసేన కోరినట్టు ఆమెతో అయిదు రూపాలతో చిరకాలంపాటు సుఖించిన తర్వాత విరక్తుడై తపస్సుకు వెళ్లిపోవాలనుకుంటాడు. అప్పుడు,‘నేనింకా తృప్తి చెందలేదు, నన్ను విడిచిపెట్టి వెళ్లద్దు’ అని ఇంద్రసేన అంది. ‘నువ్విలా నాతో అనకూడని మాట అన్నావు కనుక ద్రుపదుని కూతురిగా పుట్టి అయిదుగురు భర్తలను పొందు’ అని మౌద్గల్యుడు ఆమెను శపించాడు. అప్పుడు ఖిన్నురాలైన ఇంద్రసేన శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ‘నువ్వు పై జన్మలో ఉత్తమస్త్రీవి అవుతావు. దేవేంద్రుడితో సమానులైన అయిదుగురు నీకు భర్త లవుతారు. నువ్వొక దైవకార్యానికి నిమిత్తమవుతావు’ అని వరమిచ్చాడు. అప్పుడు ఇంద్రసేన,‘నేను ఒక్క భర్తనే అడిగితే అయిదుగురు భర్తలంటున్నావేమిటి? ఒక స్త్రీకి ఒక్క భర్తే కానీ బహు భర్తలు ఉండకూడదు కదా?’ అంది. ‘నువ్వు పతిని ఇవ్వమని అయిదుసార్లు అడిగావు కనుక ఈ వరం ఇచ్చా’నని శివుడు అన్నాడు.

దానికి ఇంద్రసేన,‘ స్త్రీకి ఒకే భర్త ఉండాలనీ, పురుషుడికి అనేకమంది భార్యలు ఉండవచ్చుననీ మునులు నిర్ణయించారు. అదే లోకధర్మం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి, భర్తకంటె అన్య పురుషుడితో సంబంధాన్ని చెప్పారు. మూడో పురుషుడితో సంబంధం ఉంటే ప్రాయశ్చిత్తం చెప్పారు. నాలుగో పురుషుడితో సంబంధం వల్ల పతితురాలు అవుతుందని చెప్పారు. అయిదో పురుషుడితో సంబంధం వల్ల బంధకి అవుతుంది. ఇదీ ధర్మమార్గం. కనుక నాకు బహు భర్తలు వద్దు. నాకు అదే తప్పకపోతే ఒక వరం ఇవ్వు. ఒక్క పతితో ఉన్న ప్రతిసారీ నాకు కన్యాత్వం కలిగేలా అనుగ్రహించు’ అంది. శివుడు సరే నన్నాడు.

***

తెలుగు, సంస్కృత పాఠాలు రెంటిలోనూ కొన్ని సందేహాలు కలుగుతాయి. మొదటిది, నీకు అయిదుగురు భర్త లవుతారని మౌద్గల్యుడు శపించినప్పుడు; అలాంటి శాపం ఇవ్వవద్దనీ, ఒక్క భర్త మాత్రమే లభించేలా దానిని సవరించమనీ అతనినే ఇంద్రసేన కోరి ఉండవచ్చు. కానీ కోరకుండా శివుని గురించి తపస్సు చేసింది. అప్పుడు కూడా ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడగవలసింది పోయి, అయిదుసార్లు భర్తనిమ్మని అడిగింది. శివుడు అయిదుగురు భర్తలను ఇస్తాననేసరికి, అదెలా కుదురుతుంది, ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడిగింది. అలా కానప్పుడు, ఒక్కొక్క భర్తతోనే ప్రత్యేక సంగమాన్ని, కన్యాత్వాన్ని ఇవ్వమని కోరింది. అంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్తవద్దకు మారిన ప్రతిసారీ తను కన్యగా మారిపోవాలని ఆమె కోరిందన్నమాట.

చూడండి… ’ఒక భర్త-అయిదుగురు భర్తలు’ అనే అంశం చుట్టూ విషయం ఎలా పరిభ్రమిస్తోందో! ‘ద్రౌపదికి అయిదుగురు భర్తలు’ అనే విషయాన్ని చెప్పడం కథకుడికి ఎలాగూ తప్పదు. కానీ అందుకు ఏవో ప్రత్యేకకారణాలు చెప్పడానికి ప్రతి దశలోనూ ప్రయత్నిస్తున్నాడు. ఒక స్త్రీకి ఒకే భర్త అనే ధర్మాన్ని మధ్య మధ్య తీసుకు వస్తున్నాడు. లేదా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ద్రౌపది అయిదుగురికి భార్యే అయినప్పటికీ ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు ఆ ఒక్కడికే భార్య. ఆమెకు ఆ ఒక్కడే భర్త. ఎందుకంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె కన్యగా మారిపోతుంది. అప్పుడామె ‘అక్షతయోనిత్వం’ పొందుతుందన్న మాట. ఈ విధంగా చూసినప్పుడు ద్రౌపదికి అయిదుగురు భర్తలనడం కథకుడి దృష్టిలో కేవలం సాంకేతికవివరం, లేదా లోక వ్యవహారం మాత్రమే. నిజానికి ఆమె ప్రతిసారీ, ప్రతి ఒక్క భర్త దగ్గరకూ వెళ్ళేటప్పుడు కన్యగానే వెడుతుంది కనుక, అతనితో ఉన్నంతసేపూ అతనొక్కడే ఆమెకు భర్త. ఆమె ఏ భర్తతోనూ లేని కాలం ఉందనుకోండి, అప్పుడామె కన్యగానే ఉండిపోతుంది. ఆ సమయంలో ఆమె పంచభర్తృత్వమే కాదు, వివాహం కూడా రద్దైపోతుంది! ఇదో విచిత్రమైన పరిస్థితి.

అందుకే ద్రౌపదిని ‘పంచకన్యల’లో ఒకరుగా చెప్పారా?! సంప్రదాయం ప్రకారం, అహల్య, ద్రౌపది, కుంతి, తార(రామాయణంలో వాలి భార్య), మండోదరి(రావణుని భార్య) పంచకన్యలు. వీరిలో మండోదరి సంగతి తెలియదు కానీ; మిగిలిన నలుగురికీ ఒకరి కంటే ఎక్కువమంది పురుషులతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. అహల్య గౌతముడనే మునికి భార్యకాగా, ఇంద్రుడు ఆమెను కామించి సంబంధం పెట్టుకున్నాడు. కుంతి సంగతి తెలిసినదే. వాలి మరణించిన తర్వాత తార, వాలి తమ్ముడైన సుగ్రీవునికి భార్య అయింది. వీరందరికీ ఒకరిని మించి పురుషులతో సంబంధమున్న స్థితిలో ఆ దోషాన్ని నివారించడానికి వీరిని నిత్యకన్యలుగా సంప్రదాయం చెబుతోందనుకోవాలి.

ద్రౌపదికి ఒకడే భర్త అన్న విషయాన్ని కథకుడు ఇంకో విధంగా కూడా చెబుతున్నాడు. పూర్వజన్మలో ఆమె మౌద్గల్యుడి ఒక్కడికే భార్య. అతన్నే అయిదురూపాలు ధరించి తనతో సంగమించమని కోరింది. ద్రౌపదిగా జన్మించినప్పుడు ఆమెకు భర్తలైన పాండవులు కూడా ఇంద్రుడనే ఒక్కడికే భిన్న రూపాలు మాత్రమే. ఇలా చూసినా ద్రౌపదికి ఒకడే భర్త.

మొత్తానికి ‘ఒక స్త్రీకి ఒకడే భర్త’ అన్న వివాహవ్యవస్థలోకి ద్రౌపదిని తీసుకురావడానికి వరాలు, శాపాలు, దైవనిర్ణయాల రూపంలో కథకుడు ఆశ్రయించిన ఉపాయాలు అర్థమవుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఒక ధర్మసంకటం నుంచి అతను బయట పడ్డాడు. పాండవులలో పెద్ద అయిన ధర్మరాజును పెళ్లాడిన తర్వాత, ద్రౌపది కన్యాత్వాన్ని కోల్పోయి వివాహిత అవుతుంది కనుక, అప్పుడు తర్వాతివారైన భీమార్జున నకుల సహదేవులు ఒక ‘వివాహిత’ను పెళ్లాడడం అనే శాస్త్రవిరుద్ధమైన పరిస్థితి తలెత్తుతుంది కనుక దానికి పరిహారంగా ఆమెకు శివుడు కన్యాత్వవరం ఇచ్చినట్టు చెప్పాడు. ఆవిధంగా రెండో ధర్మ సంకటం నుంచి బయటపడ్డాడు.

తెలుగు భారతంలో ఇలా ఉంది: “…ముందర ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్రిం బాణిగ్రహణంబు సేయించి తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరు వరంబున గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన…”

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

సంప్రదాయపు ‘వీటో పవర్’-కన్యాత్వ చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

రాజుగారి దేవతావస్త్రాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకు ఆ కథ సారాంశం ఇలా ఉంటుంది:

ఒక నేత కార్మికుడు దేవతావస్త్రాలను నేస్తానని రాజుగారికి చెప్పాడు. నమ్మిన రాజుగారు అతనికి గడువు ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత నేతకార్మికుడు రాజుగారిని దర్శించుకున్నాడు. ‘ప్రభూ…ఇవిగో దేవతావస్త్రాలు’ అంటూ ఒట్టి చేతులు చూపించాడు. ‘ఏవీ? నాకు కనిపించడం లేదే’ అన్నాడు రాజు. ‘ఇవి దేవతావస్త్రాలు కదా, మామూలు కళ్ళకు కనిపించవు’ అన్నాడు నేతకార్మికుడు. ‘ఓహో, అలాగా, అయితే వాటిని నాకు ధరింపజేయి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘చిత్తం మహారాజా’ అంటూ నేత కార్మికుడు రాజుగారికి దేవతావస్త్రాలను ధరింపజేసినట్టు అభినయించాడు. ‘ఇదిగో ఇప్పుడు మీరు దేవతావస్త్రాలను ధరించారు’ అన్నాడు. అప్పుడు రాజు,‘దేవతావస్త్రాలు ఎలా ఉన్నాయి?’ అని తన పరివారాన్ని అడిగాడు. దేవతావస్త్రాలు కనిపించడం లేదన్నా, బాగులేవన్నా రాజు తలతీసేస్తాడని వాళ్ళకు తెలుసు. ‘అద్భుతం ప్రభూ, వీటిని ధరించిన తర్వాత మీ అందం ద్విగుణీకృతమైంది’ అని పరివారం ముక్తకంఠంతో అన్నారు.

ఈ కథ ఎందుకంటే,‘కన్యాత్వా’నికి, దేవతావస్త్రాలకు పోలిక ఉందని చెప్పడానికే.

కన్యాత్వం వివాహానికి ముందు ఉండి, తర్వాత అంతరించే ఒక శారీరక అవస్థ లేదా ప్రకృతి చేసిన ఏర్పాటు కాదనుకుంటే, నేతకార్మికుడు దేవతావస్త్రాలను సృష్టించినట్టే సంప్రదాయం కన్యాత్వం అనే ఒక ఊహను కల్పించుకుందన్నమాట. లెక్కల్లో కూడా చూడండి, ఒక ‘ఎక్స్’ను కల్పించుకుని దాని మీద లెక్క చేస్తారు. ఇంకో పోలిక చెప్పాలంటే, సాలె పురుగు తన కడుపులో ఉన్న ద్రవంతోనే దారాలు సృష్టించుకుని వాటితో గూడు అల్లుకుని అందులో ఉంటుంది. కన్యాత్వం కూడా అలాంటిదే అనుకుంటే, కన్యాత్వం అనే ఊహను సృష్టించిన సంప్రదాయమే, ఆ ఊహను వాస్తవంగా తనే నమ్మి, ఇతరులను నమ్మించడం ప్రారంభించిందన్న మాట.

అదే జరిగిందనుకున్నప్పుడు, అది తప్పా, ఒప్పా; అందులో మోసం ఉందా అన్న చర్చకే పరిమితమైతే అంతకన్నా పొరపాటు ఉండదు. తటస్థంగా చెప్పుకోవలసిన విషయాలలో ఇది ఒకటి. కన్యాత్వం అనే ఊహను సృష్టించుకోవలసిన అవసరం సంప్రదాయానికి నిజంగానే కలిగింది. ఎందుకంటే, ఒక పాతవ్యవస్థ స్థానంలో ఒక కొత్త వ్యవస్థను అది సృష్టిస్తోంది. అది అప్పటికి పురోగామి వ్యవస్థ కూడా కావచ్చు.

పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించే ఆ ప్రయత్నం లేదా ప్రయోగంలో మరో విశేషం ఉంది. మహాభారతం లాంటి ఇతిహాసాలు ఆ ప్రయోగాన్ని బహిరంగ ప్రయోగంగా నిర్వహించాయి. అంటే, అది పాఠకుల కళ్ళముందే జరుగుతోందన్న మాట. ఇది ఎలాంటిదంటే, ఒక పుస్తకం, లేదా పత్రిక తాలూకు అంతిమ ఉత్పత్తి(endproduct)ని మాత్రమే పాఠకులకు ఇవ్వడం కాకుండా, దాని ఎడిటింగ్ దశతో సహా ఇవ్వడం లాంటిది. ఇంకో పోలిక చెబితే, ఇతిహాసాలు ఆధారంగా లేబరేటరీలో తను చేస్తున్న ఆ ప్రయోగాన్ని ప్రయోక్తే నేటి టీవీ ప్రత్యక్ష ప్రసార పద్ధతిలో మనకు చూపిస్తున్నాడు. ఆవిధంగా ఇతిహాస కథలలో కేవలం కథలు మాత్రమే కాక, పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించడానికి కథకుడు చేసిన ప్రయోగం లేదా పెనుగులాట కూడా భాగం.

మహాభారత కథకుడు ఎదుర్కొన్న అనేక ధర్మ సంకటాలలో ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి రెండున్నాయి: మొదటిది, కన్యాగర్భం; రెండవది, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం. ఇవి రెండూ పాత వ్యవస్థకు చెందినవనుకుంటే, కొత్త వ్యవస్థలో ఇవి చాలా అసంబద్ధంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో వీటిని కొత్త వ్యవస్థకు అన్వయించడం ఎలా? కొత్తవ్యవస్థ వైపు నిలబడిన కథకుడు ఎదుర్కొన్న ప్రశ్నఇదే. దాంతో అతను కొన్ని ఉపాయాలను ఆశ్రయించాడు. పాత వ్యవస్థకు చెంది అసంబద్ధంగా కనిపించే అంశాల స్థానంలో వరాలు, శాపాలు, మహిమలు వగైరాలను ప్రవేశపెట్టి, తద్వారా వాటిపై చర్చను నిషేధించే ప్రయత్నం చేశాడు. అందుకు పురాణ, ఇతిహాసాలకు సహజంగా ఉండే మాంత్రికశైలి అతనికి ఉపయోగపడింది. అంటే, పాత అంశాలను కొత్త వ్యవస్థకు నప్పించే ప్రయత్నంలో రెండింటి మధ్యా వరాలు, శాపాల రూపంలో అతుకులు కల్పించాడన్న మాట. అయితే గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పుకున్నట్టు కథకుడు అలా అతుకు పెట్టే పనిని చాలా చోట్ల అంత సమర్థంగా చేయలేకపోయాడు. పాతవ్యవస్థ తాలూకు అవశేషాలను మనం ఊహించడానికి తగిన జాగాలను విడిచిపెట్టాడు.

అదిగో, ఆ జాగాలలోనే సంప్రదాయవాదులకు, ఇతరులకు మధ్య వాగ్యుద్ధం. సంప్రదాయేతరులు ఆ జాగాలలో నిలబడి యుద్ధం సాగిస్తే, సంప్రదాయవాదులు సాంప్రదాయికపాఠాన్నే-అందులోని మహిమలు, మంత్రాలు, వరాలు, శాపాలు వగైరాలతో సహా- మరింత ధాటిగా నొక్కి చెప్పడానికి ప్రయత్నించారు. పెండ్యాల, వారణాసి వార్ల వాదంలో ఇది మనకు కనిపిస్తుంది.

‘కన్యాగర్భం’ విషయానికే వస్తే, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వాదం ఇలా సాగుతుంది:

“నాడు కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యాశ్రమవాసపర్వములోని కుంతీ వ్యాసుల సంభాషణము చెప్పుచున్నది”

“వ్యాసుని తల్లి యగు సత్యవతి కూడ వ్యాసుని గని కన్యాభావము నొందుట గమనింపదగిన విషయము.”

“మామ యగు వ్యాసునితో గుంతి తన చిన్నతనపుజేష్టను వెల్లడించినటులు వ్యాసుని తల్లి సత్యవతి సవతి కొడుకగు భీష్ముని కడ తన చిన్నతనపు చేష్ట నిట్లు సంతోషపూర్వకముగానే చెప్పినది”

“వ్యాసభీష్ముల వంటి మహానుభావులట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించుట కానాటి దేశకాల పరిస్థితులే కారణమై యున్నవా? లేక వ్యాసభీష్ములు కూడ ధర్మవైరుధ్యమునకు ఇష్టపడి ఉండిరా? ఆలోచింప నాటి పరిస్థితులే అట్టివి కావచ్చునని తోచెడిని”

కన్యలు బిడ్డల్ని కనడం అప్పట్లో దోషం కాకపోవచ్చని, నాటి దేశకాలపరిస్థితులే అందుకు కారణం కావచ్చునని పెండ్యాలవారు అంటున్నారు. అలా అనడంలో సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే, ఆ పాఠం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహ చేస్తున్నారు. సంప్రదాయం అంగీకరించని దేశకాలపరిస్థితులు, హేతుత్వం అనే అదనపు పరికరాలను తన పరిశీలనకు వాడుకుంటున్నారు.

పూర్తిగా సంప్రదాయపక్షం వహించిన వారణాసివారి దృష్టిలో ‘ఒకప్పుడు కన్యాగర్భం దోషం కాదనీ, తర్వాత దోషంగా మారిందనీ’ అంటూ ఊహ చేయడం, కాలాల మధ్య తేడా తీసుకురావడం చాలా తీవ్రమైన విషయం. అలా చేసినప్పుడు మొత్తం సంప్రదాయ వ్యూహమే విఫలమైపోతుంది. కనుక కన్యలు సంతానం కనడం ఎప్పుడైనా దోషమే నని చెప్పడానికి ఆయన ప్రయత్నించారు.

 

మరి కుంతి, సత్యవతుల సంగతేమిటని అడిగితే, దానికి సంప్రదాయ పాఠంలోనే సమాధానం ఉంది. అదేమిటంటే, సాధారణులకు వర్తించే నియమం సత్యవతికి, కుంతికి వర్తించదు. వారు కన్యలుగా ఉండి సంతానం కనడం వెనుక ప్రత్యేక కారణముంది. వారిద్దరి వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; సూర్యుడు అనే దేవుడు ఉన్నారు. వారి వరాలు, మహిమలు ఉన్నాయి. ఆవిధంగా అవి దైవనిర్ణయాలు కూడా. సత్యవతి విషయంలో ఇంకో అదనపు విశేషం కూడా ఉంది. ఆమె కన్యాగర్భంలో జన్మించినది సాధారణవ్యక్తి కాదు, వ్యాసుడి వంటి మహర్షి. కనుక అది పూర్తిగా దైవ సంకల్పమే. వరాలు, మహిమలు, దైవసంకల్పాలు వగైరాలను అంగీకరిస్తే ఇంతవరకు సంప్రదాయ పాఠం పకడ్బందీగానే ఉంది. వారణాసి వారు చేసింది ఆ పాఠాన్ని మరోసారి నొక్కి చెప్పడమే.

8385917_f520

విషయాంతరం అనుకోకపోతే నాకిక్కడ ఒక విచిత్రం కనిపించింది. అదేమిటంటే, తెలుగు భారతం ప్రకారం సత్యవతికి వ్యాసుడు, కుంతికి కర్ణుడు ‘సద్యోగర్భం’లోనే జన్మించారు. అలాంటి ఒకే విధమైన విశేషజన్మ రీత్యా వ్యాసుడు, కర్ణుడు ఒకే విధమైన మహా పురుషులు కావాలి. పోనీ సద్యోగర్భాన్ని పరిహరించి చూసినా ఇద్దరి పుట్టుక వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; కర్ణుని పుట్టుక వెనుక అదనంగా సూర్యుడు అనే దేవుడు ఉన్నారు కనుక కర్ణుడు వ్యాసునితో సమానుడు, బహుశా అంతకంటే విశిష్టుడు కావాలి. కానీ కాలేదు. అతడు మహాభారతంలో మొదటినుంచి హీనజన్ముడిగానే గుర్తింపు పొందాడు. దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అర్జునుడితో జరిగిన అన్ని యుద్ధాలలో ఓడిపోయాడు. అనేక విధాలుగా అతడు శాపగ్రస్తుడు కూడా. మరి వ్యాసుడు అలా కావడానికి, కర్ణుడు ఇలా కావడానికి సంప్రదాయ భాష్యం ఎలాంటి వివరణ ఇచ్చిందో, లేక ఇస్తుందో తెలియదు.

వారణాసివారి ఖండనకు మళ్ళీ వస్తే, పెండ్యాలవారు ఉదహరించిన సంస్కృత భారతం, ఆశ్రమవాసపర్వం లోని కుంతి, వ్యాసుల సంభాషణను యథాతథంగా ఆయన ఎత్తిరాస్తూ; అప్పుడే కాదు, ఎప్పుడూ కన్యాగర్భం దోషమే నని నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం, తను కన్యాదశలో ఉండి కూడా మూర్ఖంగా దూర్వాసుని మంత్రం పఠించి సూర్యుని రప్పించినందుకు, పితృమర్యాదను కాపాడడానికి రహస్యంగా కొడుకును కని, నీళ్ళలో విడిచిపెట్టవలసి వచ్చినందుకు కుంతి వ్యాసుని దగ్గర బాధపడింది. ‘నిజముగా నా సూర్యదేవుని కటాక్షమున మరల నాకు కన్యాత్వము ప్రాప్తించినది. దుర్వాసోమహర్షి చెప్పినట్లే జరిగినది. నేను మూఢురాలనై పుత్రు నపేక్షించితిని. పుణ్యమో పాపమో నీ యొద్ద వివరింపబడిన ఈ విషయము నన్ను పీడించు చున్నది.’అని ఈ సందర్భంలో కుంతి అంటుంది.

అప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు: ‘నీవెట్లు చెప్పితివో అట్లది జరగవలసిన విధియై యున్నది (నీకు సూర్యాంశమున సూతుడు గూఢముగా బుట్టి దూరమైపోయి దుర్యోధనుని జేరి యుద్ధహేతువు కావలసిన విధి యట్లున్నది). నీ కపరాధము లేదు. నీవు కన్యకవై కదా అప్పుడుంటివి. అణిమాది సిద్ధులు కల దేవతలు శరీరముల నావేశింతురు. సంకల్పము చేతను, వాక్కు చేతను, దృష్టి చేతను, స్పర్శ చేతను, రతి చేతను ఐదు విధములుగా దేవతలు సంతతి నిచ్చుచుందురు. మనుష్యధర్మము దైవధర్మముచే దూషితము కాదు. కుంతీదేవీ! నీకు మనోవ్యధతో బని లేదు’.

దీనిపై వారణాసివారు వివరణ ఇస్తూ,‘వ్యాసభగవానుని మాటలలో గూడ దుర్వాసోమహర్షి యుపదేశము మొదలు సూర్యసంబంధ సుతోత్పత్తి, సుతపరిత్యాగాంతకృత్యములు విధివశమున జరిగినవి. ఆ ఘటన యంతయు నీకు కన్యాదశయందు అట్టి యిచ్ఛ లేనప్పుడు తటస్థించినది కనుకను దేవతలు సంకల్పాదులచే నైదు విధములుగా సంతతి నిచ్చువారు కనుక దేవధర్మముచే మనుష్యధర్మము దూషితము కాదు కనుకను నీ తప్పు లేదు అని యున్నది. ఈ కుంతీ సంభాషణములో కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యున్నదా? సూర్యానుగ్రహమున సుతుని గన్న కుంతీదేవికి అది దోషము కాదని యున్నదా?’ అంటారు.

సంప్రదాయపక్షం వహించిన వారణాసివారు ఇక్కడ విధి గురించి, దేవతలు అయిదు విధాలుగా సంతతి నివ్వడం గురించి వ్యాసుడు అన్న మాటల్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. కన్యకలు బిడ్డల్ని కనడం దోషం కాదని ఈ సంభాషణ చెప్పడం లేదంటున్నారు. ఆయన ప్రకారం, కన్యకలు సంతానం కనడం ఎప్పుడైనా తప్పే. అయితే కుంతికి కానీ, సత్యవతికి కానీ ఆ నియమం వర్తించదు. ఎందుకంటే వారి వెనుక ఒక ‘విధి’ ఉంది. వారికి ‘దేవధర్మ’మే కానీ ‘మనుష్య ధర్మం’ వర్తించదు. ‘అయిదు విధాలుగా సంతానం ఇచ్చే దేవతల ద్వారా’ సంతానం పొందే ప్రత్యేక అర్హత వారికి ఉంది.

అయితే సాధారణ హేతుబుద్ధితో పరిశీలించినప్పుడు ఈ వాదం సమాధానపరచకపోగా మరిన్ని సందేహాలను సృష్టిస్తుంది. ఎలాగంటే, విధిని అనుసరించి ‘దేవధర్మం’ ప్రకారం కన్యగా సంతానం కన్న కుంతి; అలా సంతానం కన్నందుకు, పితృ మర్యాదను కాపాడడానికి ఆ సంతానాన్ని నీళ్ళలో విడిచిపెట్టవలసివచ్చినందుకు ‘మనుష్యధర్మం’ ప్రకారం బాధపడుతుంది. అది పుణ్యమో, పాపమో అన్న విచికిత్సకు లోనవుతుంది. విధికి, దైవ సంకల్పానికి తను ఒక సాధనం ఎందుకు కావలసివచ్చిందో, తనే ఎందుకు కావలసివచ్చిందో పాపం కుంతికి వ్యాసుడు చెబితే తప్ప తెలియదు. చెప్పిన తర్వాత కూడా తెలిసిందో లేదో తెలియదు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, కుంతి సాధనం అయింది విధికీ, దైవసంకల్పానికీ కాదు; కథకుడికి! దేవధర్మం, మనుష్యధర్మం అనే రెండు చక్రాలతో కథ అనే బండిని నడిపించడం కథకునికి అవసరం. ఎందుకంటే, అతను రెండు భిన్న వ్యవస్థల మధ్య అతుకు పెడుతున్నాడు!

అప్పటికీ-దేవధర్మం ఏమిటి, అది కొందరి విషయంలోనే మనుష్యధర్మాన్ని అతిక్రమించి ఆవహించడమేమిటి, దేవతలు అయిదు విధాలుగా సంతానం ఇవ్వడం ఏమిటి అనే సందేహాలు సాధారణ హేతుబుద్ధిని సలుపుతూనే ఉంటాయి. అప్పుడిక సంప్రదాయం ప్రయోగించే అంతిమ అస్త్రం: శాస్త్రమర్యాద! వారణాసివారు చివరికి ఆ అస్త్రాన్ని కూడా ఇలా ప్రయోగిస్తారు:

‘…సూర్యుడేమి? శరీరధారియై కుంతీదేవి యొద్దకు వచ్చి సంతానమిచ్చుట యేమి అనిపించినది కాబోలు. వీరికి శాస్త్రమర్యాద నొకింత వినిపింతము.

‘తాత్పర్యమేమనగా (దేవతాధికరణము-బ్రహ్మసూత్రము)-యోగశక్తులను బట్టి సూర్యాది దేవతలకు జ్యోతిర్మండలాది రూపములతో నుండుటకును, ఇష్టము వచ్చిన విగ్రహము ధరించుటకును గూడ సామర్థ్యము కలదు. కనుకనే…సూర్యుడు పురుషరూపము ధరించి కుంతీదేవిని బొందెనని ఇతిహాసమందును చెప్పబడినది…

మనకు ప్రత్యక్షము కాకున్నను పూర్వులకు ప్రత్యక్షమగుటచే దేవతావిగ్రహాదికము ప్రత్యక్షసిద్ధము కూడ నగుచున్నది. కనుకనే వేదవ్యాసాదులు దేవతలతో ప్రత్యక్షముగా వ్యవహరించిరని చెప్పబడినది. ఇప్పటివారికి వలెనే పూర్వులకు కూడ దేవతలతో వ్యవహరించెడి సామర్థ్యము లేదని యెవ్వడనునో అతడు జగత్తునందు విచిత్రతయే లేదనువాడగును…ఇప్పటి వలెనే కాలాంతరమందు గూడ వర్ణాశ్రమధర్మము లవ్యవస్థితములే యనును. దానివలన వ్యవస్థావిధాయకమైన శాస్త్రము నిరర్థకమగును…

పరిశీలింపగా మన శాస్త్రమర్యాద యిట్లున్నది. ప్రతివాది ప్రసంగము లట్లున్నవి.

వారణాసివారి ఈ మాటలు సంప్రదాయ మర్మాన్ని కూడా వెల్లడిస్తున్నాయి.అదేమిటంటే, శాస్త్రం ఒక వ్యవస్థను, అంటే కట్టడిని చేస్తుంది. వర్ణాశ్రమధర్మాలు (ప్రస్తుత సందర్భంలో కన్యాత్వం మొదలైనవి) ఆ కట్టడిలో భాగాలే. శాస్త్రవిరుద్ధమైన స్వతంత్ర ఆలోచనలు చేస్తే వర్ణాశ్రమధర్మాలు (అలాగే కన్యాత్వం) ఒకప్పుడు లేవు, ఇప్పుడే ఉన్నాయనే విపరీతవాదానికి ఆస్కారం కలుగుతుంది. అది తప్పు. అంటే, అలాంటి కట్టడులు ఎప్పుడూ ఉన్నాయని ఈ మాటల్లోని సారాంశం. పాత వ్యవస్థ తాలూకు అవశేషాలను తుడిచి పెట్టి కొత్త వ్యవస్థను నెలకొల్పడం సంప్రదాయానికి ఎంత పెద్ద పరీక్ష అయిందో, ఆ సవాలును అది ఎలా అధిగమించిందో పరోక్షంగా ఈ మాటలు సూచిస్తూ ఉండచ్చు.

ఇంకో సందర్భంలో కూడా వారణాసివారు ఇలా అంటారు:

‘కర్ణోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును కుంతీదేవి వ్యాసమహర్షి తోడను, వ్యాసోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును సత్యవతీదేవి భీష్ముని తోడను చెప్పినపుడు ఆ మహానుభావులు అట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించిరట! అది యధర్మమే యైన యెడల వారు ధర్మముగా నంగీకరింపరు. వారట్లు యంగీకరించినపుడు అది యధర్మము కాదు. కనుక నధర్మమును ధర్మముగా నంగీకరించి రను మాట విరుద్ధము. పూర్వోక్తగ్రంథ సందర్భమేమి? యోగశక్తి తపోమహిమలచే జరిగిన యా లోకోత్తరఘటన యేమి? ఆ అక్షతయోనిత్వరూప కన్యాత్వ వరప్రాప్తి యేమి? భీష్మవేదవ్యాసులు దానిని ధర్మముగా నంగీకరించుట యేమి? దానిని ఈ మ. భా. చ. కారులు అధర్మ మనుట యేమి? ధర్మాధర్మ నిర్ణాయకు డా వ్యాసమునియా? యీ వ్యత్యాసమూర్తియా? “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ” అనుటను బట్టి అకార్య మేదియో కార్య మేదియో తెలిసి కొనుటకు శాస్త్రమే ప్రమాణము కాని మనుష్యబుద్ధి కాదు. అట్టి స్థితిలో శాస్త్రకర్త యగు వ్యాసభగవానుడు, శాస్త్రనిష్ణాతుడగు భీష్ముడు చెప్పినదే నిజము. “వారట్లు చెప్పుటకు నాటి పరిస్థితులే కారణము” అనుట తప్పు. పరిస్థితులను బట్టి అధర్మమెపుడును ధర్మము కానేరదు. ధర్మాధర్మ నిర్ణాయకము శాస్త్రము కనుక నెట్టి పరిస్థితులలో నైనను శాస్త్రీయమే ధర్మము. అశాస్త్రీయ మధర్మమే.

ప్రతివాదులు ఆ కుంతీ సత్యవతీ చరిత్రములలో రహస్యముగా బిడ్డలను గనుటను మాత్రమే గ్రహించిరి గాని ఆపై ముఖ్యమైన కన్యాత్వసిద్ధిని గ్రహింపలేదు. అదియే వారి హృదయ దోషము.

ఈవిధంగా మనుష్యబుద్ధిపై శాస్త్ర ప్రమాణం అనే అంకుశం బిగించిన తర్వాత ఇక మాట్లాడగలిగింది ఏమీ ఉండదు. అంతిమంగా సంప్రదాయం చెలాయించే ‘వీటో పవర్’ అది!

కొసమెరుపు ఏమిటంటే, శాస్త్రమే ప్రమాణమన్న వారణాసివారు కూడా కుంతి కన్యాగర్భాన్ని సమర్థించడానికి ‘మనుష్యబుద్ధి’తో ఒక విచిత్ర తార్కాన్ని ఆశ్రయించడం! కన్యగా ఉన్నప్పుడు సంతానం కనడంలో ఉన్న తప్పును గమనించకుండా బాల్య చాపల్యంతో(బాలభావేన) వ్యవహరించానని కుంతి అంది కనుక, అప్పటికామె బాలికే తప్ప యవ్వనవతి కాదని ఆయన అన్వయించారు. ఆవిధంగా ఆమెది కన్యాగర్భమే కాక, బాలికాగర్భం కూడా. పైగా కుంతికి అలాంటి కోరిక కూడా లేని స్థితిలో సూర్యుడి నిర్బంధంవల్ల అలా జరిగిందంటున్నారు. అంటే, అప్పటికి కుంతి రజస్వల కూడా కాలేదా అన్న సందేహం ఆయన సమర్థన వల్ల కలుగుతుంది. అదే ఆయన ఉద్దేశమైతే ఇక్కడ ప్రకృతి ధర్మం కూడా సంప్రదాయపు వీటో పవర్ ముందు తలవంచుతోందన్న మాట.

అంతిమంగా ఇంకొకటి గమనించాలి. పెండ్యాలవారు సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే సంప్రదాయ భాష్యం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహలు చేస్తున్నారు. వారణాసివారు పూర్తిగా సంప్రదాయ పాఠాన్ని, భాష్యాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అంటే, అందులో సంప్రదాయాన్ని నొక్కి చెప్పడమే తప్ప కొత్తదనం ఏమీ లేదన్న మాట. ఆవిధంగా వీరువురూ ఒకే విధమైన ఆధార భూమిక నుంచి మాట్లాడడం లేదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఇద్దరి వాదాలూ రైలు పట్టాలవంటివయ్యాయి. వాటి మధ్య కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు.

కన్యాత్వ చర్చ మరికొంత వచ్చే వారం…

 

 

ఆనాటి పండిత చర్చలు: పెండ్యాల వర్సెస్ శ్రీపాద, వారణాసి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం…

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము’ అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. ఆ ప్రతి నా దగ్గర ఉంది.

అప్పట్లో ఈ పుస్తకం ఒక సంచలనం అన్న సంగతి రచయిత, ఇతరులు రాసిన ముందు మాటలను బట్టి అర్థమవుతుంది. మహాభారతాన్ని చారిత్రక దృష్టినుంచి, హేతు దృష్టినుంచి చర్చించిన ఈ పుస్తకంపై తీవ్ర ఖండనలు వెలువడ్డాయి. దీనిపై ఖండన తీర్మానాలు చేయడానికి పలు చోట్ల పండిత సభలు కూడా జరిగాయి. ఈ పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది. రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు.

పెండ్యాలవారి రచనను ఖండిస్తూ 1948-49 ప్రాంతంలో ఆరు సంపుటాలుగా మరో రచన వచ్చింది. దానిపేరు ‘మహాభారత తత్త్వ కథనము’. ఈ గ్రంథ రచయిత వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ఈయన కూడా పిఠాపురం వాస్తవ్యులే. వీరిద్దరూ తమ వాదోపవాదాలు వినిపించడానికి అప్పట్లో పండితుల మధ్యవర్తిత్వంలో సభలు కూడా జరిగాయి. అది కూడా ఆసక్తి గొలిపే ఓ ముచ్చట. దానినలా ఉంచితే, 2003లో ‘మహాభారత తత్త్వ కథనము’ రెండు సంపుటాలుగా పునర్ముద్రణ పొందింది. ఆ సంపుటాలు నా దగ్గర ఉన్నాయి.

స్వవిషయం అనుకోకపోతే పాఠకులతో ఒక విషయం పంచుకోవాలనిపించింది. అది నా ‘జన్యు’ లక్షణాన్ని మరోసారి గుర్తుచేసిన విషయం కూడా.

ఈ వ్యాసం ప్రారంభించేముందు పెండ్యాలవారి ‘మహాభారత చరిత్రము’ తిరగేస్తుంటే దీనిపై మా నాన్నగారు కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు నమోదు చేసిన తన స్పందన వాక్యాలు కనిపించాయి. ఇంతకుముందు కూడా వాటిని చూశాను కానీ అంత పరిశీలనగా చూడలేదు. ఇప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యమనిపించింది. బహుశా ఈ సందర్భానికి అవి తగినట్టు ఉండడం వల్ల కావచ్చు.

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో మా నాన్నగారి గురించి రాశాను. ఆయన సంస్కృతాంధ్రాలలో కావ్యాలు రాసినవారు. పద్దెనిమిది పురాణాలను తెలుగు చేసినవారు. పండితులుగా ఆయన సంప్రదాయవర్గానికి చెందినవారే. ఏదైనా పుస్తకం చదివినప్పుడు అందులోని లోపలి పేజీలపై తన స్పందన నమోదు చేయడం ఆయనకు అలవాటు. ‘మహాభారత చరిత్రము’పై ఆయన స్పందన ఇలా ఉంది:

“పరమాద్భుత గ్రంథమిది. పూర్తిగా చదివాను. పూర్ణ సంఖ్య 9/9/98”

“చాలా లోతుపాతులు చూచి చక్కగా రూపొందింపబడినదీ రచన”

“(పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి) ఈయన నివాసము, ఎడ్రస్సు, ప్రస్తుత ఎడ్రస్సు ఏమో? తెలుసుకోవాలి”

“ఇది చేతనుంచుకొని మహాభారతము సవిమర్శముగా చదివి చెప్పాలి”

“శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి అనువాదం కూడా దీనితో జోడించి మరల చదవాలి”

“రాజసూయ విధానము, అశ్వమేధ విధానము పూర్తిగా పరిశీలింపబడిన గ్రంథము”

“వీరి పరువునష్టం దావా రికార్డు రాజమండ్రిలో సంపాదించాలి. ఆ కాగితాలు చాలా అవసరం”

పెండ్యాలవారు తమ పుస్తకం రెండోముద్రణకు రాసిన ఉపోద్ఘాతం చివరిలో,‘చదువరులకు ఒక మనవి’ అనే ఉప శీర్షిక కింద ఇలా రాశారు:

“నేను రాసిన విమర్శనాంశములలో బెక్కులు నాకు తెలియని తప్పులుండవచ్చును. భాషా స్ఖాలిత్యముండవచ్చును. ఎంతగా బరిశీలించినను ముద్రణస్ఖాలిత్యము లనివార్యములు. అభిప్రాయభేదము లనివార్యములే. అందులకని నన్ను దూషింపకుడని వేడుచున్నాను. నిజమగు తప్పులను సవరించుకొనుట కెప్పుడును వెనుదీయను. అభిప్రాయభేదములే లేకుండిన ‘ప్రస్థానత్రయ’మునకు ‘ద్వైతాద్వైతవిశిష్టాద్వైత’ భాష్యము లేల కలుగును? అట్లే భారత గాథా విశేషములపై నాకును నభిప్రాయభేదములున్నవని తలప గోరెదను. విమర్శించి సత్యముం గనుగొనువారికి నా విమర్శనము కొంత సహాయకారి యగుననియు నేరికై నంత గొంత యిది సహాయమొసగిన నందువలన నేను ధన్యుడ నగుదు ననియే నమ్ముచున్నాను. ఓం తత్సత్”

మా నాన్నగారు,‘అభిప్రాయభేదములే లేకుండిన’ అనే వాక్యం నుంచి చివరి వరకు, మార్జిన్ లో ఒక నిలువు గీత గీసి, పక్కనే “ఇది సత్యం, సర్వదా సత్యం” అని రాశారు.

ఈ పుస్తకం ముందు మాటలు తిరగేయడం , నాన్నగారి స్పందన చదవడం నాలో ఒకవిధమైన మెరుపుతీగలాంటి జ్ఞానశకలాన్ని ఆవిష్కరించాయి. అంటే రెవెలేషన్ లాంటిదన్నమాట. భారతరామాయణాలపై సంప్రదాయవిమర్శ ఒక మూసలో ఉంటుందనుకుంటాం. చాలావరకు అది నిజమే కూడా. అయితే సంప్రదాయపండితులందరూ ఒకే మూసలో ఉండరని ఈ పుస్తకం తిరగేస్తున్నప్పుడు అనిపించింది. వాళ్ళలోనూ ఛాయాభేదాలు ఉన్నాయి. మా నాన్న గారే కాక, అలాంటివారు- అంటే సంప్రదాయవాదానికి చెందినప్పటికీ నవీనత్వాన్ని పూర్తిగా నిరాకరించకుండా తెరచిన పుస్తకం లాంటి బుద్ధితో దానిని ఆస్వాదించగలిగినవారు, సంప్రదాయ పరిధిలోనే కొంత హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించగలిగినవారు ఈ పుస్తకంలో మరికొందరు కనిపిస్తారు. ఎవరివరకో ఎందుకు, పెండ్యాలవారితో ఘర్షణపడి కోర్టుకు కూడా ఎక్కిన శ్రీపాదవారే ఉదాహరణ. ఆయన నవీనత్వాన్ని ఆహ్వానిస్తారని అనలేకపోయినా కొంత స్వతంత్రించి హేతుబుద్ధితో ఆలోచించిన పండితులే.

పెండ్యాలవారే ఇలా రాస్తారు:

“వారు(శ్రీపాదవారు) నా గ్రంథమును నిరాకరింపుచు వ్రాసిన వ్యాసములలోనూ ఆ వ్యాసములన్నిటిని చేర్చి కూర్చిన ‘శ్రీ మహాభారత చరిత్ర నిరాకరణము’ అను గ్రంథములోనూ నేను వ్యాసాదులను నిందించితిననియు బురాణపురుషులను నిందించితిననియు, బెక్కుసారులు నన్ను దూషించిరి. కాని నా పుస్తకమునకు బూర్వమే వారు వ్యాస, భీష్మ, బలరామ, శ్రీరాముల గూర్చి యెట్లు వ్రాసిరో దిగ్మాత్రముగా వ్రాయుచున్నాడను.

కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవదాయభాగ విమర్శనము’న వ్యాసుని గూర్చి యిట్లు వ్రాసిరి.

(1)  “ధర్మశాస్త్రముల మాటకేమిగాని, మహానుభావుడై యడవులలో దపము చేసికొను వ్యాసుడంతవా డిట్టి పాడు పనికీయకొనెనని మన మొప్పుకొనుచున్నప్పుడు రెండు మూడు తడవులకు సందేహించి చర్చింపవలసి యున్నదా?”

అడవులలో దపము చేసికొను వ్యాసుడు రాజాంతఃపురము జొచ్చి ‘అంబికాంబాలికలను దాసిని’ గూడి బిడ్డల గనుట,‘ఒకటి కాదు, రెండు కావు, మూడుసారులు చేసిన పాడుపను’లనియే కృష్ణమూర్తిశాస్త్రిగారి ముఖ్యాభిప్రాయము.(మానవసేవ పత్రిక 1912 ఆగస్టు సంచిక)

భీష్ముని గూర్చి యిట్లు తమ వజ్రాయుధ పత్రిక (1927 సం.రము అక్టోబర్ సంచిక)లో వ్రాసి యున్నారు.

(2)“భీష్ముని మెచ్చుకొనినారు దానికి సంతోషింపవలసినదేకా? భీష్ముని బ్రహ్మచర్యము స్వచ్ఛందమైనది కాదు. తండ్రి కోర్కెం దీర్ప వ్రతంబు బూనెగాని విరక్తుండై కాదు. అది యుత్తమ మన నొప్పదు. భీష్ముం డుత్తమపాత్రమే గాని తాను సమర్థుండై యుండియు నెవరికిం జెప్పవలసినట్లు వారికి జెప్పి యుద్ధము గాకుండం జేయవలయు. అటులం జేయక తానొక పక్షముం జేరి పాండవులతో భండనము జేసినాడు సరే! దుర్యోధనుని యుప్పు దినుచున్నాడట! అందుచేత యుద్ధము జేసినాడనుకొందము. తన చేరిన పక్షమునకు జేటుగా దన చావునకు మార్గము తానే చెప్పి పరులకు లోలోన సలహా నిచ్చినాడు. ఇది స్వామిద్రోహము కాదా? స్వామిద్రోహపాతకము సామాన్యమా?”

(3) “వీరు (గరికపాటి రామమూర్తి గారు) రాముని మాత్ర మవతారపురుషుడని యన్యాయము లేనివాడని వ్రాసిరి. సంతోషమే గాని మాటవరసకుం జెప్పుచున్నాము. రాముడు మహానుభావుడే కదా, లోకవృత్తముతో నవసరము లేక యొకరి జోలికిం బోక యొక యడవిలో గూర్చుండి ముక్కు మూసికొని తపము జేయుచున్న శంబూకుని తల నరికినాడు. ఇది న్యాయమా? వాలి సుగ్రీవులు పోరాడుచుండ జాటునుండి వాలిం దెగవేసినాడు. ఇది న్యాయమా? అగ్నిశుద్ధిం బొందియున్న సీతను సంపూర్ణ గర్భవతిని నరణ్యములకుం బడద్రోసినాడు. ఇది న్యాయమా? (వజ్రాయుధ పత్రిక, సంపుటము 2, సంచిక 9)

(2,3 అంశములు శ్రీ గరికపాటి రామమూర్తి బి.ఎ గారి వ్రాతలను ఖండింపుచు కృష్ణమూర్తిశాస్త్రి గారు వ్రాసినవి)

Files.34

***

శ్రీపాదవారు భీష్ముడి గురించి, రాముడి గురించి ఇలా రాయడమే నమ్మశక్యం కాని ఆశ్చర్యం. శ్రీపాదవారు రాశారని చెప్పకుండా ఇవే వాక్యాలను చూపించి ఇవి ఎవరు రాసుంటారని ఇప్పటి వారిని అడిగి చూడండి, తప్పకుండా ఏ త్రిపురనేని రామస్వామి చౌదరిగారి పేరో చెబుతారు. అంటే, నాటి సంప్రదాయపండితులలోనే కొందరిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి అంశ కూడా ఉండడం ఎంత విలక్షణం! వ్యాసాదులను, పురాణపురుషులను నిందించారని పెండ్యాలవారిని దూషించిన శ్రీపాదవారే ఆ పని చేయడం ఎలాంటిది? వ్యక్తిగతంగా చెబితే, బహుశా అది ఆయనలోని ద్విధా వ్యక్తిత్వాన్ని(splitpersonality)ని సూచిస్తూ ఉండచ్చు. వ్యవస్థాగతంగా చెబితే, మహాభారత రామాయణాదులు అప్పటికి చాలావరకూ ఆయనలాంటి పండితుల విశేషాధికార పరిధిలోనే ఉన్నాయి. కనుక పండితులు వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేసినా అది పూర్తిగా ‘ఆంతరంగిక’ విషయం. ఈ పండిత సామ్రాజ్యంలోకి ఇతరులు అడుగుపెట్టడంతోనే సమస్య వచ్చినట్లుంది. అందువల్ల కలిగిన అభద్రతా భావం సంప్రదాయపండితవర్గాన్ని ఆత్మరక్షణలోకి నడిపించి, రామాయణభారతాదులకు వారిని కాపలాదారులుగా మార్చివేసి ఉండచ్చు. క్రమంగా కేవలం జబ్బపుష్టి మాత్రమే కలిగిన ‘లుంపెన్ శక్తులు’ ఈ కాపలా బాధ్యతలో పాలుపంచుకోవడం సహజ పరిణామం కావచ్చు.

చెహోవ్ రాసిన ‘గుల్లలో జీవించిన మనిషి’ కథలోలా రామాయణభారతాదులపై పండిత విమర్శ క్రమంగా ఒక గుల్లలో ముడుచుకోవడానికి లోతైన చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలూ ఉండచ్చు. ఇప్పుడంత లోతులోకి వెళ్లద్దు కానీ, ఎమ్మే పిహెచ్ డీలనే మూస పండితులను సృష్టించే యూనివర్శిటీల కార్ఖానా చదువు కూడా ఒకనాటి పండిత సంప్రదాయాన్ని చంపేసిందా అనిపిస్తుంది. నేటి పండితులు గడుసుగా సాంప్రదాయిక సాహిత్యానికి సంబంధించిన వివాదాల జోలికి వెళ్లకుండా అలంకారం, రసం, శిల్పం వగైరా కావ్యసామగ్రికి పరిమితమవడమే చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్రమహాభారతంలో అది కనిపిస్తుంది. ఆ ప్రచురణ వ్యాఖ్యాతలు నిజంగా వ్యాఖ్యానం అవసరమైన చోట ఎలా మౌనం వహించారో ఇంతకు ముందు ఒకటి రెండు సందర్భాలలో చెప్పుకున్నాం. బహుశా ముందు ముందు కూడా చెప్పుకోవలసి రావచ్చు.

అసలు సామాజిక, రాజకీయ, చారిత్రక పాఠం కూడా అయిన మహాభారతం లాంటి ఒక రచనను పూర్తిగా మత,ఆస్తిక వ్యవస్థ అయిన టీటీడీ ప్రచురించడంలోని ఔచిత్యమేమిటో తెలియదు. అప్పటికే సౌజన్యం, గడుసుదనం అనే సుతిమెత్తని లోహంతో తయారైన ఎమ్మే పండితుల పాళీపై టీటీడీ ప్రచురణ అదనపు అంకుశం. ఇదే ఏ వావిళ్ల వారి ప్రచురణో, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణో అయితే ఆ దారి వేరు. అప్పటికీ నేటి మన పండితులు స్వతంత్రవ్యాఖ్య చేస్తారన్న నమ్మకం లేదు.

విచిత్రం ఏమిటంటే, సంప్రదాయభిన్నంగా మాట్లాడడానికి ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంటే, సంప్రదాయ వర్గానికి చెందిన శ్రీపాదవారు ఏ జాగ్రత్తా తీసుకోకుండా వ్యాఖ్యానించడం! భీష్ముని గురించి ఆయన అన్న మాటలే చూడండి…నిజానికి భీష్మునిలో ఆయన ఎత్తి చూపిన లోపాలకు సాంప్రదాయిక పాఠం లోనే కావలసినంత సమర్థన ఉంది. ఆదిపర్వం తృతీయాశ్వాసం ప్రకారమే చూస్తే, కురుక్షేత్రయుద్ధం జరిగింది భూభారం తగ్గించడం కోసం. భూదేవి ప్రార్థనపై బ్రహ్మ దేవుడు రచించిన కురుక్షేత్రయుద్ధమనే విశాల వ్యూహంలో,‘భీష్మాది వీరులు దేవదానవ అంశలతో పుట్టి యుద్ధం చేసి మరణించడం’ ఒక భాగం. అప్పుడు బ్రహ్మదేవుని వ్యూహం అనే పెద్ద గీత ముందు; కురుపాండవ శత్రుత్వం, పాండవులకు రాజ్యం దక్కడం, ఆయా పాత్రల లోపాలోపాలు వగైరాలు చిన్న గీతలు అయిపోతాయి. అయినా సరే, మహాభారత అనువాదకులు కూడా అయిన శ్రీపాదవారు స్వతంత్రించి సంప్రదాయభిన్న వ్యాఖ్య చేయడం ఆసక్తికరం.

***

‘మహాభారత చరిత్రము’ రెండవ ముద్రణకు పెండ్యాలవారు రాసిన ఉపోద్ఘాతం, వారణాసివారి ‘మహాభారత తత్త్వకథనము’ చదవడం నిజంగా ఒక తాజాదనాన్ని కలిగించే అనుభవం. మహాభారతాన్ని సంప్రదాయేతర కోణం నుంచి పరిశీలించిన రచనలు కొన్ని పెండ్యాలవారి రచనలకు ముందే వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మద్రాసులోని గోఖ్లేహాలులో ఇచ్చిన మహాభారతోపన్యాసం పెక్కుమంది ఆంధ్రులను భారతంపై దృష్టి మళ్లించేలా చేసిందని పెండ్యాలవారు అంటారు. అప్పటికే రావుబహద్దర్ పనప్పాకం అనంతాచార్యులుగారు, విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ నిర్ణయము’ల గురించి గ్రంథాలు రాశారు. బ్రహ్మయ్యశాస్త్రిగారి గ్రంథాన్ని ఖండిస్తూ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ వినిర్ణయ’మనే గ్రంథం రాశారు. దుర్యోధనుని పక్షంలోనే న్యాయముందని చెబుతూ కోటమర్తి చినరఘుపతిరావు అనే కవి ‘సుయోధన విజయము’ అనే కావ్యం రాశారు. వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు సంప్రదాయాభిన్న వివరణతో ‘కర్ణచరిత్రము’ రాశారు. పూర్తిగా సంప్రదాయ పక్షం నుంచి ‘మహాభారత తత్త్వ కథనము’ రచించిన వారణాసివారు ఇలాంటి రచనలను అన్నిటినీ ఖండించారు. ఆర్ష సాహిత్యంపై సాంప్రదాయిక భాష్యం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఒక ఆసక్తికరమైన ఆధారం వారణాసివారి రచన.

అయినాసరే, భారత రామాయణాదులపై ‘వంగ మహారాష్ట్రాది’ భాషలలో వచ్చినన్ని రచనలు తెలుగులో రాలేదని పెండ్యాలవారు అంటారు. ఆయన ఇంకా ఇలా అంటారు:

‘ఆంధ్రభాషలో విమర్శన గ్రంథములు తక్కువ. మహాభారతమును తత్రస్థవ్యక్తులను విమర్శించుట మరియును దక్కువ. దుర్బలమానసులకట్లు విమర్శించుట భీతావహముగా నుండును. విమర్శించినవారి కేదేని యనిష్టము సంభవించునని వారు తలంతురు. నా నేత్రవ్యాధికి గారణమిదియ యని యసూయాపరులు హేళనము చేయుటయే కాదు, కొందరు మిత్రులును నయోక్తులతో నయనిష్ఠురోక్తులతో గూడ నను నీ కార్యమునుండి మరలింప బ్రయత్నించిరి.’

తన మహాభారత ప్రసంగాలపై వ్యక్తమైన వ్యతిరేక స్పందనకు ఉదాహరణగా పెండ్యాలవారు ఒక సందర్భాన్ని ఇలా పేర్కొన్నారు:

‘గడిచిన నవంబరు(1932 సం.)నెలలో మ.రా. సర్. కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారి యాధిపత్యమున (మద్రాసు)పచ్చయప్ప కలాశాలలో నే నిచ్చు నుపన్యాసమున సందర్భానుసారముగ ‘అశ్వమేధము లోని యశ్వసేవ’ను గూర్చి చెప్పుచున్నప్పుడు కొందరు కేకలు వైచిరి. అపుడు శ్రీ విద్వాన్ గంటి జోగి సోమయాజులు యం.యే. యల్.టి గారు ఈ యంశము నీ నాటి రాత్రి నేను చదివి రేపు సభలో యథార్థము జెప్పెదను గాన మరునాడు తిరిగి ఉపన్యసింప రమ్మని కోరి యట్లు సభ చేయించిరి…ఆ సభారంభముననే శ్రీ సోమయాజులుగారు లేచి నిన్నటి దినమున శాస్త్రిగారు చెప్పిన యశ్వసేవా విధానము సత్యముగా నట్లే యున్నది గాని యసత్యము గాదని చెప్పుటచే నందరును సావకాశముగా నా యుపన్యాసము నాలకించిరి.’

తన రచనను గర్హిస్తూ పండిత సభలలో చేసిన తీర్మానాల గురించి, వాటిపై పత్రికల స్పందన గురించి పెండ్యాలవారు ఒక చోట ఇలా రాశారు:

‘…పిమ్మట వారు(శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు) వెళ్ళిన రెండు పండిత సభలలో నన్నును, నా గ్రంథములను గర్హించు తీర్పులు పొడసూపినవి…కలువాయి(అనే ఊరు)లోని నిరాకరణపు తీర్పయుక్తమని ‘ఫెడరేటెడ్డు ఇండియా’ యను ఆంగ్ల వారపత్రిక యిట్లు నిరసించినది.

Finally a resolution was accepted condemning in unmeasured terms the work of Pendyala Subrahmanyasastry of Pithapuram who is alleged to have committed the sin of criticizing Bharatam and its author. It is unfortunate that our sense of veneration to all that is ancient should be so keen as to resent any criticism. Literary criticism is at its lowest ebb in Andhra and if the few who courageously come out with views of their own should be hunted out. I am afraid we are not advancing the cause of literature to any extent…

సంప్రదాయపు మూసను దాటి ఆలోచించగల మరో అరుదైన పండితుడు నాకు కనిపించారు: ఆయన, జమ్మలమడక మాధవరామశర్మ. పెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడకవారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా ‘మెజారిటీ’ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది.

***

క్షమించాలి, కన్యాత్వ చర్చలోకి వెళ్లకుండానే ఈ వ్యాసాన్ని ముగించాల్సివస్తోంది. దాని గురించి మరోసారి….

 

 

 

 

 

 

కన్యాత్వం: మరో రెండు కథలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

మహాభారతంలో ఉన్నదే నేను రాస్తున్నాను. అది అలా ఎందుకు ఉంది, ఫలానా పాత్రలు ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించాయంటూ తప్పొప్పులు ఎంచడం నా పరిధి కాదు. నాకు దాని మీద ఆసక్తి కూడా లేదు. కాలగమనంలో మనిషి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, అనేక ఘట్టాలను దాటుతూ, అనేక పరిమితులకు లొంగుతూ, అప్పటి జీవన పరిస్థితులను బట్టి, అనివార్యతలను బట్టి నైతికతను నిర్వచించుకుంటూ, వ్యూహాలను రచించుకుంటూ ముందుకు సాగాడు…

ఇది కొన్ని వేల సంవత్సరాల కాలగమనం గురించి. ఇప్పటి విషయానికే వస్తే, కేవలం రెండు మూడు తరాలకే నైతికతను, విలువలను తిరగరాసే పరిస్థితిని చూస్తున్నాం. ఒక్క ఉదాహరణే చెప్పుకోవాలంటే, ఇంతవరకూ అగ్నిసాక్షిగా జరిగిన వివాహం ఒక అనుల్లంఘనీయమైన విలువ. కానీ ఇప్పుడు అలాంటి వివాహంతో పనిలేని ‘సహజీవ’నాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తిస్తున్నాయి. ఇలాంటివే ఇంకా అనేకానేక ఉదాహరణలు…

ఇలాంటి విషయాలలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎలాగైనా ఉండవచ్చు. ఈ వ్యాసపరంపరకు సంబంధించినంతవరకు ఒకరి ఇష్టాన్ని సమర్థించడం, ఇంకొకరి ఇష్టాన్ని వ్యతిరేకించడం అన్న పనిని నేను పెట్టుకోలేదు. నేను ఇక్కడ గతాన్ని కేవలం తటస్థదృష్టితో మాత్రమే చూస్తున్నాను. అంతే తప్ప, మంచిచెడుల గురించి తీర్పు చెప్పే పనిని తలకెత్తు కోవడం లేదు. ఎవరి సంగతి ఏమైనా, అలా తీర్పు చెప్పే స్థాయి కూడా నాకు లేదని నేను నమ్ముతున్నాను. మన తీర్పు కోసం ఆగకుండా లోకంలో, ప్రకృతిలో అనేక పరిణామాలు జరిగిపోతూ ఉంటాయి. మన పుట్టుక మన తీర్పుతో, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే జరిగిపోతుంది. మనం మరొకరికి జన్మనివ్వడం కూడా మన తీర్పుతోనూ, ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండానే జరిగిపోతుంది.

మనం గడిచివచ్చిన కాలానికి కూడా ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తే…

***

250px-Ravi_Varma-Shantanu_and_Satyavati

మత్స్యగంధి అంది కదా…ఓ పుణ్యాత్ముడా! నేను చేపల కంపు కొట్టే జాలరిదాన్ని, పైగా కన్యను, నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కను, నాకు ఆ దోషం అంటకుండా అనుగ్రహించూ…అని.

పరాశరుడు ఆ మాటకు సంతోషించాడు. నా కోరిక తీర్చినందువల్ల నీ కన్యాత్వానికి భంగం కలగదన్నాడు. ఆపైన, నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప శూద్రకులంలో పుట్టినదానివి కావన్నాడు. అప్పటికప్పుడు ఆమె చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించే సుగంధాన్ని ఇచ్చాడు. అంతేకాక, ఆమెకు దివ్యవస్త్రాలను, ఆభరణాలను ఇచ్చాడు.

నీ కన్యాత్వానికి భంగం కలగదన్న వెంటనే ఇవన్నీ జరిగినట్టు చెప్పడం ద్వారా పరాశరుడు ఎంతో మహిమోపేతుడని కథకుడు సూచిస్తున్నాడన్నమాట. ఆవిధంగా, కన్యాత్వానికి భంగం కలగదని అనడం కూడా ఆయన మహిమలో భాగమేనని చెబుతున్నాడు. అంటే, కన్యాత్వానికి భంగం కలగకుండా చేయగల మహిమ పరాశరుడి లాంటి మహర్షికి తప్ప, ఇంకెవరికీ ఉండదని అందులోని ధ్వని.

ఈ కన్యాత్వంతో ముడిపడిన మరో రెండు ఉదంతాలు ఈ సందర్భంలో చటుక్కున గుర్తొస్తున్నాయి. వాటిలో మొదటిది బాగా ప్రసిద్ధమైన కుంతి కథ. రెండోది అంతగా ప్రసిద్ధం కాని మాధవి కథ.

కుంతి కథ

ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని కుంతి కథ ఇలా సాగుతుంది….

శూరుడు యాదవకులానికి పెద్ద. అతని పెద్ద కూతురు పృథ. ఆమె వసుదేవునికి చెల్లెలు కూడా. తన మేనత్త కొడుకైన కుంతిభోజునికి సంతానం లేకపోవడంతో పృథను శూరుడు అతనికి దత్తు ఇచ్చాడు (ఆ విధంగా ఆమె కుంతి అయిందన్నమాట). కుంతి దత్తత తండ్రి ఇంట్లో ఉంటూ అతని ఆదేశం ప్రకారం ఇంటికొచ్చిన బ్రాహ్మణులకు రుచికరంగా వండి పెడుతూ, దానాలు, సేవలు చేస్తూ ఉండేది.

అలా ఉండగా, ఒకరోజున దూర్వాసుడనే సిద్ధముని అతిథిగా వచ్చాడు. కుంతి అతనికి ఇష్టమృష్టాన్న భోజనం పెట్టింది. అతను చాలా సంతోషించి ఆమెకొక దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు నువ్వు కోరుకున్న లక్షణాలు కలిగిన కొడుకును ఇస్తాడని చెప్పి వెళ్లిపోయాడు.

కుంతి ఒక రోజున ఆ మంత్రశక్తిని పరీక్షించాలనుకుంది. ఏకాంతంగా గంగ ఒడ్డుకు వెళ్లింది. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుంది. దూర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని హృదయంలో నిలుపుకుని, సూర్యుడికి అర్ఘ్యమిచ్చింది. నీలాంటి కొడుకునిమ్మని చేతులు జోడించి అడిగింది.

సూర్యుడు తన తీవ్రతను ఉపసంహరించుకుని లేలేత కాంతితో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. కుంతి ఆ తేజోరూపం చూసి ఆశ్చర్యాన్ని, భయాన్ని, తత్తరపాటును పొంది అక్కడినుంచి పారిపోదామని చూసింది. సూర్యుడు ఆమెను భయపడవద్దని చెబుతూ, నువ్వు కోరిన వరం ఇవ్వడానికి వచ్చానన్నాడు.

అప్పుడు కుంతి సిగ్గుతో తలవంచుకుని,‘ఒక బ్రాహ్మణుడు నా మీద కరుణతో ఈ మంత్రాన్ని ఉపదేశించాడు, ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనిపించి అజ్ఞానంతో నిన్ను రప్పించాను, నా తప్పును క్షమించు. ఆడవాళ్లు అజ్ఞానంతో ఎప్పుడూ తప్పులే చేస్తూ ఉంటారు, అయినాసరే అందరూ దయతో వాళ్ళను కాపాడుతూనే ఉంటారు’ అంది.

అప్పుడు సూర్యుడు,‘నీకు దూర్వాసుడు ఇచ్చిన వరం గురించి, మంత్రశక్తి గురించి నాకు తెలుసు, నా దర్శనం వృథా కాదు, నీ కోరిక తీరుస్తాను’ అన్నాడు.

‘నేను మంత్రశక్తి తెలియక కోరాను, గర్భవతిని అయితే నా తల్లిదండ్రులు, చుట్టాలు నవ్వరా?’ అని కుంతి అంది.

‘’నీకు సద్యోగర్భం(అంటే నవమాసాలు మోయనవసరం లేకుండా అప్పటికప్పుడు)లో కొడుకు పుడతాడు. నీ కన్యాత్వం కూడా చెడదు’ అని సూర్యుడు వరమిచ్చి వెళ్లిపోయాడు.

అప్పుడు కుంతికి సహజకవచకుండలాలతో ‘కానీను’ (కన్యగా ఉన్నప్పుడు కన్న సంతానాన్ని కానీన శబ్దంతో సూచిస్తారు)డిగా కర్ణుడు పుట్టాడు. ఆశ్చర్యపోయిన కుంతికి ఏం చేయాలో తోచలేదు. ఈ లోకాపవాదం నుంచి ఎలా బయటపడతాను, ఈ విషయం జనానికి తెలియకుండా ఎలా ఉంటుంది, ఈ బాలుని తీసుకుని ఇంటికి ఎలా వెళ్లను అని ఆందోళన చెందింది. అప్పుడు రత్నాలు, బంగారం నింపిన ఒక పెట్టె సూర్యుని ప్రేరణతో నదిలో తేలుతూ ఆమె దగ్గరికి వచ్చింది. కొడుకును ఆ పెట్టెలో ఉంచి నదిలో విడిచిపెట్టి కుంతి త్వర త్వరగా ఇంటికి వెళ్లిపోయింది.

ఆ పెట్టె, రాధ అనే ఆమెకు భర్త అయిన ఒక సూతుడికి దొరికింది. అతడు అందులోని శిశువును భార్యకు ఇచ్చాడు. ఆమె సంతోషంతో ఆ శిశువుకు స్తన్యమిచ్చింది. వసువు(బంగారం)తోపాటు దొరికాడు కనుక అతనిని వసుషేణుడనే పేరుతో ఆ దంపతులు పెంచి పెద్దచేశారు. రాధ పెంచిన కారణంగా అతడు ‘రాధేయు’డిగా కూడా గుర్తింపు పొందాడు.

***

kunti-and-surya

ఇది నన్నయ భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. కర్ణుని పుట్టుక గురించి కుంతి ఆశ్రమవాసపర్వంలో వ్యాసుడికి వివరిస్తుంది. ఆ సమయంలో పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తుంది. ఆ వృత్తాంతం ప్రకారం, కుంతి గంగ ఒడ్డుకు వెళ్ళి మంత్రశక్తిని పరీక్షించలేదు. తన మేడమీద నిలబడి ఉదయభానుని చూస్తూ మంత్రం పఠించింది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంచుమించు పైన చెప్పిన విధంగానే వారిమధ్య సంభాషణ సాగింది. సూర్యుడు,‘నా రాక వృథా కావడానికి వీల్లేదు, వృథా అయితే నీకూ, ఆ దూర్వాసునికీ కూడా హాని కలిగిస్తాను’ అన్నాడు. సూర్యుని శాపం నుంచి దూర్వాసుని కాపాడాలనుకున్న కుంతి, చేసేదిలేక ‘నీ లాంటి కొడుకును ఇవ్వు’ అని అడిగింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి, మోహపరవశురాలిని చేసి, కొడుకు పుడతాడని చెప్పి వెళ్లిపోయాడు. ఆమె అంతఃపురంలోనే రహస్యంగా కొడుకును ప్రసవించింది. ‘పితృమర్యాద’ను కాపాడడం కోసం అతన్ని నీళ్ళలో విడిచిపెట్టింది.

ఈ రెండు పాఠాలలోనూ కొన్ని తేడాలే కాకుండా గమనించవలసిన కొన్ని విశేషాలు ఉన్నాయి. మొదటిది, కర్ణుడు ఎవరికైతే దొరికాడో ఆ సూతుడి పేరు చెప్పలేదు. సూతుడనే మాట అతని కులాన్ని మాత్రమే చెబుతుంది. అతడు ‘రాధఅనే ఆమెకు భర్త’ మాత్రమే. కుంతి కొడుకులు ‘కౌంతేయులు’ గా కూడా ప్రసిద్ధులైనట్టే; పెంచిన తల్లి పేరిట కర్ణుడు కూడా ‘రాధేయుడు’ గా ప్రసిద్ధుడయ్యాడు. కుంతి కొడుకులను తండ్రి పేరిట పాండవులు అన్నట్టే, కర్ణుని కూడా ‘సూతపుత్రు’డన్నారు, అది వేరే విషయం. ఇక్కడ తల్లి పేరిట ప్రసిద్ధులు కావడమే గమనించవలసిన విషయం.

దూర్వాసుని సంబంధంతోనే కుంతి గర్భవతి అయినట్టు, రహస్యంగా కొడుకును కన్న తర్వాత అతన్ని పెంచమని తనే రాధకు ఇచ్చినట్టు ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో చిత్రించారు. అదలా ఉంచితే, కర్ణుడు సహజ కవచ, కుండలాలతోనూ, రత్నాలతోనూ, బంగారంతోనూ దొరికాడన్న వివరాన్ని మనం స్థూలంగా ఇలా కూడా అన్వయించుకోవచ్చు:

రాధకు తన కొడుకును పెంపకానికి ఇస్తూనే, అందుకు అవసరమైన ధన సంపత్తిని కూడా కుంతి ముందే ఇచ్చింది. దాంతోపాటు అతనికి కవచ, కుండలాలు కూడా ఇచ్చింది. అవి రాచరిక చిహ్నాలు కావచ్చు. అతన్ని తమ స్థాయికి తగినట్టు రాచరిక హోదాలో పెంచమని చెప్పడం కుంతి ఉద్దేశం కావచ్చు. సరిగ్గా యుద్ధానికి ముందే ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చి కవచకుండలాలను యాచించి తీసుకువెళ్లిపోతాడు. అవి రాచరికానికి ప్రతీకలు అనుకుంటే, వాటిని అతనికి దూరం చేయడం రాచరిక హోదాను నిరాకరించడమే. సరిగ్గా యుద్ధానికి ముందే అది జరగడంలో ఉద్దేశం, యుద్ధంలో రాజన్యుల సాయం కర్ణునికి లేకుండా చేయడమే. శల్యసారథ్యం తెలిసినదే.

కుంతి యాదవుల ఆడబడుచు కదా, యాదవులకు రాజ్యార్హత ఉందా అన్న సందేహం రావచ్చు. రాంభట్ల కృష్ణమూర్తిగారి(జనకథ)ప్రకారం, యాదవులలో పశులకాపరులు పెద్ద యాదవులు, వారికి రాజ్యార్హత ఉంది. భోజకులు అలాంటివారే. కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజకుడు. కనుక అతనికి రాజ్యార్హత ఉంది. యాదవులలో వృష్ణికులు గొర్రెల కాపరులు, కనుక చిన్న యాదవులు. వారికి రాజ్యార్హత లేదు. కృష్ణుడు వృష్ణియాదవుడు. మరి అతను గోవుల కాపరి కాలేదా అనచ్చు. బహుశా అప్పటికి వృష్ణి యాదవుల సామాజిక హోదా ఊర్ధ్వ చలనానికి లోనవుతూ ఉండవచ్చు.

కర్ణుని పుట్టుక విషయానికి మరోసారి వెడితే, పరాశరుని శాపభయానికి మత్స్యగంధి లొంగిపోయినట్టే, సూర్యుని శాపభయానికి కుంతి కూడా లొంగి పోవడం గుర్తించదగిన ఒక పోలిక. అలాగే తెలుగు భారతంలో రెండు ఉదంతాలలోనూ ‘సద్యోగర్భం’లో కొడుకులు(వ్యాసుడు, కర్ణుడు) కలిగినట్టు ఉంది. కానీ కర్ణుడికి సంబంధించి పైన చెప్పిన సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేదు. సహజగతిలోనే అతడు కుంతికి పుట్టాడన్న భావన ఈ పాఠం కలిగిస్తోంది. ఇదే పాఠంలో ‘సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి మోహపరవశురాలిని చేశా’డనడం కూడా సాధారణ స్త్రీ-పురుష సంబంధాన్నే సూచిస్తూ ఉండచ్చు. ఈ వివరం తెలుగు భారతంలో లేదు.

ఇంకొక తేడా ఏమిటంటే,(పైన చెప్పిన) సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేనట్టే, కొడుకును కన్నా నీ కన్యాత్వం చెడదని దూర్వాసుడు కానీ, సూర్యుడు కానీ అన్నట్టు లేదు. ‘సూర్యుని ప్రభావం వల్ల మళ్ళీ నాకు కన్యాత్వం ప్రాప్తించిందనీ, దూర్వాసుడు చెప్పినట్టే జరిగిందనీ’ కుంతే వ్యాసునితో అంటుంది.

ఇక రెండో కథ చూద్దాం.

మాధవి కథ

images

ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసంలోని కథ ఇది. పాండవులతో శత్రుత్వం మానుకుని, సంధి చేసుకోమని కృష్ణుడితోపాటే కణ్వుడు, నారదుడు మొదలైన మునులు కూడా దుర్యోధనుడికి బోధిస్తారు. మొండికెత్తితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకో మంటూ నారదుడు గాలవుని గురించి చెబుతాడు.

గాలవుడు విశ్వామిత్రుని శిష్యుడు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత గురుదక్షిణ ఏమివ్వమంటారని గురువును అడిగాడు. ఏమీ వద్దని గురువు అన్నాడు. అయినా వినకుండా, మీరు అడిగితీరవలసిందే నంటూ నిర్బంధించాడు. విశ్వామిత్రుడు విసిగిపోయాడు. ‘అయితే సరే, మొత్తం శరీరమంతా తెలుపు రంగులో ఉండి, ఒక్క చెవి మాత్రం నీలవర్ణంలో ఉండే ఎనిమిదివందల ఉత్తమ జాతి గుర్రాలను తెచ్చి ఇవ్వు’ అన్నాడు.

గాలవుడు అలాంటి గుర్రాల వేటలో పడ్డాడు. ఎక్కడా దొరకలేదు. దాంతో విచారంలో మునిగిపోయాడు. ఆహారం, నిద్ర కూడా వదిలేసి గుర్రాలను వెతుకుతూ మహాపథం వెంట సాగిపోయాడు. ఒక చోట అతనికి గరుడుడు కనిపించాడు. బాల్యమిత్రుడైన అతనికి గాలవుడు తన ప్రయత్నం గురించి చెప్పాడు. అతని మీద జాలిపడిన గరుడుడు, దేవతల దగ్గర తప్ప అలాంటి గుర్రాలు దొరకవని చెప్పి, అతన్ని తన వీపు మీద ఎక్కించుకుని దేవేంద్రుడు ఉన్నవైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో గాలవునికి విపరీతమైన దాహం వేయడంతో అతన్ని ఒక కొండ మీద దింపాడు. ఇక ఇతనితో అంత దూరం వెళ్ళడం మంచిది కాదనుకున్నాడు. అక్కడినుంచి ప్రతిష్టానపురాన్ని పాలించే తన మిత్రుడు యయాతి దగ్గరికి అతన్ని తీసుకెళ్ళాడు. యయాతికి విషయం చెప్పాడు.

తన దగ్గర అలాంటి గుర్రాలు లేవని చెప్పిన యయాతి, అందగత్తె అయిన తన కూతురు మాధవిని గాలవునికి అప్పగించాడు. ఒకవేళ ఏ రాజు దగ్గరైనా అలాంటి గుర్రాలు ఉంటే, ఈమెను అతనికి చూపించు, ఈమె కోసం తప్పకుండా గుర్రాలు ఇస్తాడని చెప్పాడు.

గరుడుడు గాలవుని, మాధవిని తీసుకుని అయోధ్యరాజు దగ్గరకు వెళ్ళాడు. నా దగ్గర రెండువందల గుర్రాలు మాత్రమే ఉన్నాయని అతను చెప్పాడు. అప్పుడు మాధవి,‘నాకో మహాభావుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నాసరే, కన్యగానే ఉండిపోతాను. కనుక నన్ను ఈ రాజుకు ఇచ్చి రెండువందల గుర్రాలూ తీసుకో. ఆమేరకు అతనితో ఒప్పందం చేసుకో’ అని సలహా ఇచ్చింది.

కొడుకులు లేని ఆ రాజు మాధవిని తీసుకుని గుర్రాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆమెవల్ల వసుమనస్సుడనే కొడుకును పొందిన తర్వాత ఆమెను గాలవునికి తిరిగి ఇచ్చేశాడు. ఇలాగే మిగిలిన గుర్రాలు కూడా సంపాదించుకోమని గాలవునికి చెప్పి గరుడుడు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత మాధవిని తీసుకుని గాలవుడు కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీ రాజు తనవద్ద ఉన్న రెండువందల గుర్రాలు ఇచ్చి మాధవితో ప్రవర్ధనుడనే కొడుకును పొందాడు. ఆ తర్వాత భోజపురాన్ని పాలించే రాజువద్దకు వెళ్ళాడు. అతను కూడా తన దగ్గర రెండువందల గుర్రాలే ఉన్నాయని చెప్పి మాధవిని తీసుకుని గుర్రాలు ఇచ్చాడు. మాధవి వల్ల అతనికి శిబి అనే కొడుకు కలిగాడు.

అప్పుడు గరుడుడు మళ్ళీ వచ్చాడు. ‘అలాంటి గుర్రాలు ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయి, ఇక నువ్వు వెతకడం అనవసరం, ఈ ఆరువందల గుర్రాలను, మాధవిని కూడా తీసుకువెళ్లి నీ గురువుకు ఇవ్వు, ఈమెతో ఆయన కూడా కొడుకును కంటాడు’ అని సలహా ఇచ్చాడు. అతనికి తోడుగా తను కూడా విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, జరిగినదంతా చెప్పి, ఇతడు బాలుడు, దయతో ఇతన్ని క్షమించి ధన్యుణ్ణి చేయండని ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు సరే నని గుర్రాలను, మాధవిని స్వీకరించాడు. మాధవి వల్ల ఆయనకు అష్టకుడనే కొడుకు పుట్టాడు.

ఆ తర్వాత మాధవి తపస్సుకు వెళ్లిపోయింది.

***

‘నా కోరిక తీరిస్తే నీ కన్యాత్వం చెడ’దని మత్స్యగంధితో పరాశరుడు అన్నాడు. (తెలుగు భారతం ప్రకారం)‘నీకు సద్యోగర్భంలో కొడుకు పుడతాడు, నీ కన్యాత్వం చెడ’దని సూర్యుడు కుంతితో అన్నాడు. ‘ఒక మహానుభావుడు ఇచ్చిన వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నా కన్యగానే ఉంటా’నని గాలవునితో మాధవి అంది.

ఇంతకీ అసలు ఈ ‘కన్యాత్వం’ ఏమిటి? నేటి సాధారణ అవగాహనతో చెప్పుకుంటే, కన్య అంటే అవివాహిత. కన్యావస్థలో ఉన్నప్పుడు ఆమె పురుష సంపర్కం పెట్టుకోవడం, సంతానం కనడం తప్పు. అంటే కన్యాత్వం అనేది వివాహం అనే వ్యవస్థతో ముడిపడి ఉందన్న మాట. ఆవిధంగా అది వ్యవస్థ తీసుకొచ్చిన భావనే తప్ప ప్రకృతి సిద్ధంగా వచ్చిన భావన కాదు. ఒక స్త్రీ గర్భం ధరించడానికి ఆమె కన్యా లేక వివాహితా అన్న విచక్షణతో ప్రకృతికి సంబంధం లేదు.

కానీ పైన చెప్పిన మూడు కథలూ ఏం చెబుతున్నాయి? కన్యాత్వం అనేది ఒకటి ప్రకృతి సిద్ధంగా ఉంటుందనీ, కన్య గర్భం ధరిస్తే ఆ కన్యాత్వం పోతుందనీ, కానీ కన్య గర్భం ధరించినా కన్యాత్వం పోకుండా చూడగలిగిన మహిమ కొందరు మహానుభావులకు ఉంటుందనే భావన కలిగిస్తున్నాయి.

కన్యాత్వం అనేది ప్రకృతి నియమం కాదనీ, వ్యవస్థ చేసిన నియమమనీ అనుకుంటే; ఆ వ్యవస్థ చేసిన వారే ఈ కథల్లో ఆ వ్యవస్థ నుంచి పై ముగ్గురినీ మినహాయిస్తున్నారన్న మాట!

కన్యాత్వం గురించి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు, మత్స్యగంధి-పరాశరుడు; కుంతి-దూర్వాసుడు లేదా సూర్యుల ఉదంతాలలో కన్యాత్వం గురించి సంప్రదాయ పండితుల చర్చ ఎలా సాగిందో చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

పరాశరుని ఉదంతం: పండితుల మౌనం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 

 

 

 

 

కిందటి వ్యాసంలో చెప్పుకున్న విషయాన్ని సంగ్రహంగా పునశ్చరణ చేసుకుంటే…

పొర: 1లో చెప్పినది బీజరూప కథాంశం మాత్రమే. అందులోని పరాశర-మత్స్యగంధుల లైంగిక సంబంధం కానీ, ఆ ఇద్దరి వ్యక్తిత్వాలు కానీ ఫలానా రకమైనవని నిర్ధారణ చేయలేం. వాస్తవంగా మన ఎదురుగా ఉన్నది పొర:2 ఒక్కటే. పొర:1 లోని ఆ రెండు పాత్రలనూ తీసుకుని కథకుడు ఆ ఇద్దరి లైంగిక సంబంధం ఎలాంటిదో, వారి వ్యక్తిత్వాలు ఎలాంటివో చెబుతున్నాడు. ఆ చెప్పడంలో పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ, అతని ప్రవర్తనలోని వైరుధ్యాన్నీ మన ముందు ప్రదర్శిస్తున్నాడు.

అలా ప్రదర్శించడంలో అతని ఉద్దేశాన్ని ఇలా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది: 1. పురుషుడికి ఒక స్త్రీ పట్ల వాంఛ కలిగినప్పుడు ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ వాంఛను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. భయపెట్టో, ప్రలోభపెట్టో ఆమెను లొంగదీసుకోవచ్చు. స్త్రీ పురుషుడి దృష్టిలో ఒక భోగ్యవస్తువు మాత్రమే. 2. పురుషుడి మాటల్లోనూ, చేతల్లోనూ ఎలాంటి తప్పును కానీ, వైరుధ్యాన్ని కానీ వెతకడానికి వీల్లేదు. అతను ఏం మాట్లాడినా ఒప్పే, ఏం చేసినా ఒప్పే. అతని మాట లేదా చేత ఏదైనా సరే, అది శిలాశాసనం.

కథకుడు ఇక్కడ పితృస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

గాంధారి తండ్రి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానన్నాడు! ఆ సంబంధం గురించి కుటుంబసభ్యుల్లో ఎలాంటి చర్చ జరిగినా సరే, వారి ఇష్టాయిష్టాలు ఏవైనా సరే; వాటికి సుబులుని మాటతో అడ్డుకట్ట పడిపోవలసిందే. కన్యాశుల్కం నాటకంలో ‘తాంబూలాలిచ్చేసాను, తన్నుకు చావం’డన్న అగ్నిహోత్రావధాన్లు మాట కూడా ఇలాంటి శిలాశాసనమే.

ప్రస్తుతానికి వస్తే, ఈ కథలో మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి. కథకుడు ఆ అవశేషాలను మరుగుపుచ్చలేదు. కారణం ఒకటే; మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని లేదా ఆధిపత్యాన్ని కూడా చెప్పడం అతని ఉద్దేశం. అప్పుడు మాతృస్వామ్య అవశేషాలను మరుగుపుచ్చడం వల్ల ఆ ప్రయోజనం నెరవేరదు. ఇంకొకలా చెప్పుకుంటే, ఇదొక యుద్ధం లాంటిది. లేదా నేటి ఎన్నికల యుద్ధం లాంటిది. కథకుడు ఈ యుద్ధంలో పితృస్వామ్య పక్షం వహిస్తున్నాడు. యుద్ధం అన్నప్పుడు తప్పును కూడా ఒప్పుగా బుకాయించడం, రకరకాల సమర్థనలను, ఉపాయాలను, మాయోపాయాలనూ కూడా ఆశ్రయించడం మామూలే. ఈ కథలోనూ, ఇంకా ఇలాంటి అనేక కథలలోనూ కథకుడు ఒక కీలకమైన ఉపాయాన్ని, బహుశా మాయోపాయాన్ని ప్రయోగించాడు. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

Satyavati

మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి అనడానికి సాక్ష్యం ఈ కథలోనే ఉంది. మత్స్యగంధిపై కోరిక తీర్చుకోవడమే ప్రధానం తప్ప అనంతర పరిణామాలపై పరాశరునికి ఆసక్తి లేదన్న సూచనను కథాగమనమే అందిస్తోంది. ‘పరాశరుని మహిమ వల్ల మత్స్యగంధికి అప్పటికప్పుడు వ్యాసుడు జన్మించా’డనడం పరాశరుని మహిమోపేతుడిగా మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు చేసిన కల్పన అనుకుంటే, పరాశరుడు కొడుకు పుట్టేదాకా మత్స్యగంధితో ఉండలేదు. కోరిక తీర్చుకున్న వెంటనే తన దారిన తాను వెళ్లిపోయాడు. అంటే, తండ్రి-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరిగినట్టులేదు. విజ్ఞులెవరైనా జరిగినట్టు ఆధారం చూపిస్తే ఈ అభిప్రాయాన్ని సవరించుకోడానికి నేను సిద్ధమే.

అంటే ఏమిటన్న మాట…వ్యాసుడు అచ్చంగా ‘తల్లి కొడుకు’. సత్యవతి కొడుకుగా సాత్యవతేయుడు. అతను పుట్టగానే నమస్కరించింది తల్లికి మాత్రమే. తపస్సుకు వెడుతూ ‘నాతో పని ఉంటే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పాడు. ముందు ముందు అతనితో తల్లికి ఒక అవసరం కలగబోతోంది. అది, కురువంశాన్ని నిలబెట్టడానికి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలకు అతని ద్వారా సంతానం కలిగించడం. భర్త శంతనుడు మరణించడంతో, భీష్ముడు అవివాహితుడిగా ఉండిపోవడంతో సత్యవతే పితృస్వామిక బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ‘తండ్రికి కొడుకు మీద అధికారం ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నిన్ను ఒక పనికి ఆదేశిస్తున్నాను’ అని ఆ సందర్భంలో సత్యవతి వ్యాసుడితో అంటుంది. అంటే, మాతృస్వామ్య ప్రతినిధి అయిన సత్యవతి, కోడళ్ళకు సంతానం కలిగించవలసిన ఘట్టంలో తన మాతృస్వామిక అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధమైందన్నమాట.

ఇదే మాతృస్వామిక కోణాన్ని పరాశర-మత్స్యగంధు(సత్యవతి)ల లైంగిక సంబంధానికి వర్తింపజేస్తే, మత్స్యగంధికి ఆ సంబంధం పట్ల సూత్రరీత్యా వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఆ విధంగా అది ‘అసమ’ లైంగిక సంబంధం కాక,‘సమ’ లైంగిక సంబంధం కావచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని, లేదా ఆధిపత్యాన్ని చెప్పదలచుకున్న కథకుడు దానికి అనుగుణంగా పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని అసమ లైంగిక సంబంధంగా చిత్రించి ఉండవచ్చు.

పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని తలపించే పాత్రలు, చిన్న చిన్న తేడాలతో మహాభారతంలో మరి కొన్ని కనిపిస్తాయి. ఆదిపర్వంలో, సర్పయాగ సందర్భంలో చెప్పిన జరత్కారుడు-జరత్కారువుల సంబంధం, అదే పర్వంలో చెప్పిన కుంతి-దూర్వాసు(సూర్యు)ల సంబంధం, ఆ పర్వంలోనే ఖాండవదహన ఘట్టంలో చెప్పిన మందపాలుడు-చరిత అనే ఒక ఆటవిక యువతి సంబంధం ఇప్పటికిప్పుడు స్ఫురిస్తున్న ఉదాహరణలు. జరత్కారుడు అనే ముని అదే పేరు కలిగిన ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి కాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడామె పుట్టింటికి చేరుకుంటుంది. ఆమెకు ఆస్తీకుడనే కొడుకు కలుగుతాడు. ఇక్కడ కూడా తండ్రీ-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. ఇక కుంతీ-దూర్వాసు(సూర్యు)ల సంబంధం ప్రసిద్ధమే. మూడో ఉదాహరణకు వస్తే, మందపాలుడు అనే మునికి నిజభార్యవల్ల సంతానం కలగలేదు. సంతానం లేకపోతే స్వర్గం లభించదు కనుక అతడు చరిత అనే ఆటవిక యువతితో సంబంధం పెట్టుకుని సంతానం కంటాడు. ఆ విధంగా అతనికి రెండిళ్ళు ఏర్పడతాయి.

ఈ కథల పూర్తి వివరాలను వాయిదా వేస్తే, పరాశర-మత్స్యగంధులతో సహా ఈ నాలుగు ఉదాహరణలలో ‘పుట్టింటి’ పాత్రను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవడం అవసరం. మత్స్యగంధి పుట్టింటిలో ఉండగానే పరాశరునితో సంబంధం ద్వారా వ్యాసునికి జన్మనిచ్చింది. జరత్కారుడు తనను విడిచి వెళ్ళగానే జరత్కారు పుట్టింటికి వెళ్లిపోయింది. కుంతి పుట్టింట్లో ఉండగానే దూర్వాసు(సూర్యు)నితో సంబంధం ద్వారా కర్ణుని కన్నది. మందపాలుడు సంబంధం పెట్టుకున్న చరిత పుట్టింట్లోనే ఉండిపోయింది. తపతి-సంవరణుల కథలోకి వెడితే, తపతి కూడా పన్నెండేళ్ళు పుట్టింట్లోనే ఉండి కాపురం చేసింది.

ఇక ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల కథలో మరో పొరకు వద్దాం.

 

పొర:3

ఇది రెండవ పొర లోని కథను ఆధారం చేసుకుని పండితుల వ్యాఖ్యలు, వివరణలు,సమర్థనలు పేరుకోవడం ప్రారంభమైన దశ అని స్థూలంగా అనుకుందాం. విశేషమేమిటంటే, ఈ పొర ఇప్పటికీ మన కళ్ల ముందు ఉన్న పొర. అయితే, రెండవ పొరలోని కథ కాస్తా ఈపాటికే ప్రశ్నించడానికి వీలులేని మతవిశ్వాసంగా ఘనీభవించింది. దానర్థం, మీరు కథకు ఎన్ని పైపై మెరుగులైనా దిద్దండి, ప్రధాన కథలో వేలుపెట్టడానికి వీలులేదు. అలాగే, పండితుల భాష్యాలూ హద్దుల్లో ఉండవలసిందే. వారు తమ పాండిత్యాన్ని రంగరించి ఎలాంటి వివరణలైనా ఇవ్వవచ్చు, కానీ సంప్రదాయపరిధిని దాటడానికి వీలు లేదు. పోలిక చెప్పుకోవాలంటే ఇదొక వలయంలో నడక లాంటిది. మనం ఎంతసేపు నడిచినా ఆ వలయంలోనే నడుస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే చేరుతూ ఉంటాం. ఆ వలయమే మన ప్రపంచంగా మారిపోతుంది.

సాంప్రదాయికత మనల్ని నీడలా నిరంతరం అంటిపెట్టుకుని మన ఆలోచనలను ఎంతగా నియంత్రిస్తూ ఉంటుందంటే; సాధారణబుద్ధికి అసంబద్ధంగానూ, అన్యాయంగానూ అనిపించేవాటిని కూడా సంభవమైనవిగా, న్యాయమైనవిగా చూడవలసివస్తుంది. అప్పటికీ కొన్ని అంశాలు మన ఇంగితజ్ఞానానికి మరీ కొరకరాని కొయ్యలుగా కనిపిస్తే వాటికి ఏదో దైవిక కారణాన్నో, మహిమనో ఆపాదించి ‘కిట్టించ’ వలసివస్తుంది. అయినాసరే, కొన్ని పూరించని ఖాళీలుగా అలాగే మిగిలిపోతూ ఉంటాయి. ఆ ఖాళీలు వ్యాఖ్యాతల మౌనానికి అద్దం పడుతుంటాయి.

dushyanta

ఇతరేతరమైన దృష్టికోణాలూ, మేధో భారాలూ ఏమీ లేని; మహాభారతం పట్ల భక్తిభావమూ, పూజ్యభావమూ ఉండి, తుడిచిన పలకలాంటి బుద్ధి కలిగిన ఒక జిజ్ఞాసి పరాశర-మత్స్యగంధుల ఉందంతం చదివినప్పుడు ఎటువంటి భావసంచలనానికి లోనవుతాడన్నది ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అతనిలో మహాభారతం పట్ల భక్తి, పూజ్యభావమే ఎక్కువ మోతాదులో ఉంటే, పరాశరుని ప్రవర్తనను, అందులో కనిపించే వైరుధ్యాన్ని మామూలుగా తీసుకుంటాడు. ఇంగిత జ్ఞానాన్ని జోకొట్టి కథకుని వేలు పుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అంటే అక్కడ విశ్వాసం పనిచేసిందన్న మాట.

లేదా, ఇంగితజ్ఞానమే సలిపినప్పుడు పరాశరుని ప్రవర్తనకు నిజంగా ఆందోళన చెందుతాడు. అయోమయానికి లోనవుతాడు. ఇదేమిటి, ఇంత గొప్ప మహర్షి ఇలా ప్రవర్తించాడేమిటని అనుకుంటాడు. అతనికి పరాశరునిలోని లైంగిక దాహం, మత్స్యగంధి దేహంపై మనోవాక్కాయ కర్మలతో అతను చేసిన దాడి, అతను శాపమిస్తాడన్న భయంతో మత్స్యగంధి లొంగిపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇలా పైకి కనిపించేది నిజం కాదేమో, దీని వెనుక ఏవైనా అతీంద్రియ అన్వయాలు, అంతరార్థాలు ఉండి ఉంటాయేమో నని కూడా అనుకుంటాడు. అలాంటివి కనిపించనప్పుడు అతని ముందు ఉండేవి రెండే మార్గాలు: విశ్వాసాన్ని ఆశ్రయించడం, లేదా అలా సందేహస్థితిలోనే ఉండిపోవడం.

సంప్రదాయ పండితులు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి ఎలాంటి వివరణ ఇచ్చారో పరిశీలించడానికి ప్రయత్నించాను. నా ఎదురుగా దాదాపు 70 ఏళ్ల క్రితం వెలువడిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత తత్త్వ కథనము’, దివాకర్ల వేంకటావధాని, జి.వి. సుబ్రహ్మణ్యం గార్ల సంపాదకత్వ, వ్యాఖ్యానాలతో టీటీడీ ప్రచురించిన ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వం మొదటి భాగమూ ఉన్నాయి.

‘మహాభారతతత్త్వ కథనము’ సంప్రదాయబద్ధమైన రచన. సంప్రదాయవిరుద్ధమైన పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలపై ఖండనగా వెలువడిన రచన. ఇందులో గ్రంథకర్త మహాభారతంపై అంతవరకు సంస్కృత, ఆంధ్రాలలో వెలువడిన వ్యాఖ్యలనూ, భాష్యాలనూ మధ్య మధ్య విస్తృతంగా ఉటంకించారు. అయితే, ఇందులో వేదవ్యాసుడు నిషాదుడా లేక బ్రాహ్మణుడా అన్న అంశం పైనా, మత్స్యగంధి కన్యాత్వంపైనే చర్చ జరిగింది తప్ప పరాశరుని ప్రవర్తనపై చర్చ జరగలేదు. అంటే, సంప్రదాయపండిత లోకంలో పరాశరుని ప్రవర్తన అభ్యంతరకరం కాలేదన్న మాట!

ఎందుకని? పరాశరుడి వంటి మహర్షి మత్స్యగంధి అనే జాలరి యువతితో లైంగిక వాంఛ తీర్చుకోవడం, ఆమెకు కొడుకును ప్రసాదించడం వాస్తవంగా ఆమెను అనుగ్రహించడమే నన్న భావనతోనా? లేక, ఆ సంబంధం వల్ల వ్యాసునంతటివాడు జన్మించాడు కనుక, అది లోకోపకారానికి ఉద్దేశించిన జన్మ కనుక పరాశరుని ప్రవర్తనను ప్రశ్నించనవసరం లేదన్న భావనతోనా? లేక, స్త్రీని ఎలాగైనా లొంగదీసుకోవచ్చుననీ, పితృస్వామిక వ్యవస్థలో ఇది సహజమేనన్న భావనతోనా? లేక, పరాశరుని లైంగిక ప్రవృత్తిని అలా చిత్రించడం ఆనాటి కథన పద్ధతి అన్న భావనతోనా?

ఇలా మనం ఊహించుకోవలసిందే కానీ కారణం తెలియదు. అక్కడ మనకు ఎదురవుతున్నది మహామౌనం మాత్రమే.

ఇక టీటీడీ ప్రచురణకు వద్దాం. ఇది 2000లో ప్రథమ ముద్రణ పొంది, 2008లో తృతీయ ముద్రణ పొందిన ప్రచురణ. ప్రతి పద్య, గద్యాలకూ ప్రతిపదార్థం, తాత్పర్యం ఇవ్వడం; కొన్ని చోట్ల విశేషాలను చర్చించడం అనే ప్రణాళికను అనుసరించింది. విశేషాలలో కొన్ని చోట్ల ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, రసం లాంటి కావ్యసామగ్రికి సంబంధించిన అంశాలను, పాఠాంతరాలను ఎత్తి చూపడం; కొన్ని చోట్ల సాంప్రదాయిక భాష్యాలకు అనుకూలమైన అన్వయాలు ఇవ్వడం చేసింది. ప్రత్యేకించి మత్స్యగంధిపై పరాశరుని లైంగిక ప్రవర్తనకు సంబంధించిన ప్రస్తుత అంశంలో ‘విశేషం’ పేరుతో ఒక అలంకారం గురించి మాట్లాడింది, అంతే.

పరాశరునిలోని లైంగిక వైపరీత్యం విషయంలో వ్యాఖ్యాతలు పూర్తిగా మౌనం వహించడాన్ని అలా ఉంచుదాం. పరాశరుడు మత్స్యగంధిని చూసి చిత్తచాంచల్యానికి లోనైనట్టు చూపిస్తూ, చెబుతూనే; అతనిని జితేంద్రియుడిగా చెప్పడంలోని వైరుధ్యాన్ని కూడా కనీసం స్పృశించలేదు. ఎందుకంటే, సంప్రదాయం విధించిన పరిమితులు, నిషేధాలు అంత బలవత్తరమైనవి. ఏదైనా ఒక మతవిశ్వాసంగా మారి ఘనీభవించిందంటే, దాని ముందు మన హేతుబుద్ధి, ఇంగితజ్ఞానం వగైరాలు ఏవీ పనిచేయవు. వాటిని అటక ఎక్కించవలసిందే.

మహాభారతంలోని ఒక లైంగిక వైపరీత్యాన్ని చూపించి, దానిని నేటి కాలానికి అన్వయించే ప్రయత్నం చేయడం అతి స్పందనగా, అనవసరచర్చగా కొందరికి కనిపించవచ్చు. నిజానికి ఆ లైంగిక వైపరీత్యంపై స్పందించడమో, అతిస్పందించడమో ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం కాదు. స్త్రీ పట్ల నాటికీ, నేటికీ ఉన్న దృష్టి భేదాన్ని ఒక సామాజిక చారిత్రక కోణం నుంచి ముందుకు తేవడమే.

అదలా ఉంచితే…

పితృస్వామికత పక్షాన నిలబడిన కథకుడు ఈ కథలోనూ, ఇంకా మరికొన్ని కథలలోనూ వివిధ ఉపాయాలను, లేదా మాయోపాయాలను ఆశ్రయించాడని మొదట్లో చెప్పుకున్నాం. ‘కన్యాత్వ వరం’ అనేది వాటిలో ఒక కీలకమైన ఉపాయం, లేదా మాయోపాయం.

దాని గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

 

పరాశరుడు…మత్స్యగంధి… 2012, డిసెంబర్ 16

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

మనకు తెలుసు…పురావస్తు నిపుణులు చారిత్రకమైన ఆనవాళ్ళు దొరకవచ్చునని అనుమానించిన చోట తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలలో ఒక్కొక్కసారి భవనాలు, ఇళ్లేకాక కాక; నగరాలు, పట్టణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కాలగతిలో వాటిని భూమి కప్పేసిందన్నమాట. ఆ కప్పేసిన చోట మరో భవనం, లేదా మరో నగరం, లేదా మరో ఊరు ఏర్పడతాయి. దాని మీద మరొకటి ఏర్పడుతుంది. వాటిని పొరలు (layers) అంటారు. ఒక్కొక్క పొర ఎప్పుడు ఏర్పడిందో పురావస్తు నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈవిధంగా అనేక చారిత్రక రహస్యాలను కాలగర్భంతోపాటు భూగర్భం కూడా మోస్తూ ఉంటుందన్న మాట.

ఇప్పుడు ఇదే ప్రక్రియను పురాణ, ఇతిహాసాలకు అన్వయించి చూద్దాం. ఇవి ఇప్పటిలా లిఖిత రూపానికి చెంది, స్థిరమైన ఆకృతిని పొందిన అచ్చుపుస్తకాల వంటివి కావు. మౌఖిక సంప్రదాయానికి చెందినవి. అసలు కథ బీజరూపంలో అట్టడుగున ఉంటుంది. అది ఒక పొర. మాంత్రికతను ఆపాదించే అత్యుత్సాహంతో ఆ కథ ఒక అద్భుతత్వాన్ని సంతరించుకుంటుంది. అది ఇంకొక పొర. ఆ కథ చిలవలు పలవలు తెచ్చుకుంటూ మరింత విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కథ కాస్తా పెద్ద కథ, పెద్ద కావ్యం అవుతుంది. ఇదొక పొర. దానిమీద పండితుల భాష్యాలు, వ్యాఖ్యలూ,వివరణలూ మొదలవుతాయి. ఇది వేరొక పొర. కాలంలోనూ, సమాజంలోనూ, విలువల్లోనూ వస్తున్న మార్పులు కూడా ఈ ఒక్కొక్క పొరనే ప్రభావితం చేస్తూ, ఆ పొరలకు ఒక రూపం ఇస్తూ ఉంటాయి.

అయితే భూమిలో కప్పబడే పురానిర్మాణాలకు; పురాణ ఇతిహాసాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. పురానిర్మాణాలు లేదా వస్తువులపై మన ప్రయత్నం లేకుండానే పొరలు ఏర్పడుతుంటాయి. పురాణ ఇతిహాసాలు మనిషి బుద్ధికీ, ఊహాశక్తికీ చెందినవి. కనుక వాటి పొరలకు రూపమివ్వడంలో మనిషి ప్రయత్నం ఉంటుంది. అతని ఇష్టాయిష్టాలు పనిచేస్తాయి. పురాణ ఇతిహాసాలు మనిషి విశ్వాసంలో లేదా మతంలో భాగమైనప్పుడు ఈ పొరలు మందంగా మారిపోతాయి. అప్పుడు పొరలు ఏర్పడడం అనే ప్రక్రియే ఆగిపోవచ్చు కూడా. ఏవైనా విశ్వాసంలో, మతంలో భాగమయ్యాయంటే, వాటితో కాలానికీ, సమాజానికీ ఉన్న ముడి తెగిపోతుంది. వాటికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఏర్పడుతుంది. విశ్వాసమూ, మతమూ ఆమోదించిన మేరకే వాటి పొరల్లోకి తలదూర్చాలి తప్ప మన ఇష్టానుసారం తలదూర్చడానికి వీలులేదు. అడుగు పొరలనుంచి ఎంత దూరంగా వెడితే అంత క్షేమమన్న అప్రకటిత హెచ్చరిక అజ్ఞాతంగా ఉంటుంది. పొరల చుట్టూ మీద మౌనమనే ఉక్కుతెర వేలాడుతూ ఉంటుంది.

ఇప్పుడు మనం వ్యాసుని జన్మవృత్తాంతం చెప్పుకుని, ఈ పొరల సూత్రం దానికి ఏమైనా అన్వయిస్తోందేమో చూద్దాం.

***

Satyavati

తండ్రి దాశరాజు ఆదేశంతో మత్స్యగంధి యమునానదిలో పడవ నడుపుతుండగా, ఒక రోజున…

వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు అనే ముని ఆమెను చూశాడు. అప్పుడతను తీర్థయాత్రకు వెడుతున్నాడు. అతను మద మాత్సర్యాలు లేని సాధుస్వభావి. అతన్ని ముల్లోకాలూ పొగడుతుంటాయి. అతను గొప్ప బుద్ధి కలిగినవాడు, తపస్సపన్నుడు. వ్రతనిష్ఠ కలిగినవాడు.

ఏకవస్త్రంతో ఒంటరిగా ఉండి పడవ ఎక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని చూడగానే అతనికి ఆమెపై వాంఛ కలిగింది. తన దివ్యజ్ఞానంతో ఆమె ఎవరో తెలుసుకున్నాడు. పడవ ఎక్కాడు. పడవ ప్రయాణిస్తోంది. పరాశరుడు మత్స్యగంధినే చూస్తున్నాడు. ఆమెవి ఎంత అందమైన కళ్లో అనుకున్నాడు. ఆమె చనుదోయిని గిల్లాలని అతనికి అనిపిస్తోంది. ఆమె సన్నటి నడుము అతని మనసులో నిలిచిపోయింది. ఆమె కటి ప్రదేశాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆమె మీద తనకు కోరిక కలిగిందని సూచించే మాటలు ప్రారంభించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన మాటలకు సిగ్గుపడుతున్న ఆ కన్య మీద పడి సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.

ఎంత శాంతులైనా, ఎంత వాంఛను జయించినవారైనా ఆడది ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ మనస్సు చెదురుతుంది. మన్మధుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరం?!

ఈవిధంగా సిగ్గు విడిచేసి పరాశరుడు తన కోరిక వెల్లడించేసరికి ఆ కన్య సందిగ్ధంలో పడింది. తను ఒప్పుకోకపోతే శాపమిస్తాడేమోనని భయపడింది…

‘నేను జాలరిదాన్ని. నా ఒళ్ళంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది. అదీగాక నేను కన్యను. నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కగలను? కనుక దోషం అంటకుండా అనుగ్రహించు’ అంది.

మత్స్యగంధి మాటలకు పరాశరుడు సంతోషించాడు. ‘నా కోరిక తీర్చడంవల్ల నీ కన్యాత్వం చెడదు’ అని వర మిచ్చాడు. ‘నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప, శూద్రకులంలో పుట్టినదానివి కావు’ అంటూ ఆమె పుట్టుక గురించి చెప్పాడు. చేపల కంపు పోయి ఆమె శరీరమంతా సుగంధాన్ని తెచ్చుకునేలానూ, యోజనం దూరంలో ఉన్నవారికి కూడా ఆ సుగంధం తెలిసేలానూ అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలూ వచ్చేలా చేశాడు. మత్స్యగంధి పడవను ఒక ద్వీపానికి చేర్చింది.

అయినా ఒక శంక ఆమెను పీడిస్తూనే ఉంది.

‘అందరూ చూసేలా ఇలా బట్ట బయలు మనం ఎలా కలుస్తాం?’ అంది. అప్పుడు పరాశరుడు తాము ఎవరి కంటా పడకుండా మంచు చీకట్లు కల్పించాడు.

ఉత్తమగుణాలే ఆభరణాలుగా, ఎలాంటి దోషమూ లేని మనోహరరూపంతో ఉన్న సత్యవతికి బ్రహ్మతో సమానుడైన పరాశరమహర్షి వల్ల అప్పటికప్పుడు, సూర్యుని తలపించేలా వేదమయుడు, ఆదిముని, పుట్టుజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు.

పరాశరుడు సత్యవతికి కోరిన వరాలు ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు జింకచర్మాన్ని ధరించి, ఎర్రని జడలతో, దండకమండలాలతో తల్లి ముందర నిలిచి, ఆమెకు మొక్కి,‘మీకు నాతో పని కలిగితే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు. మహాభయంకరమైన తపస్సు చేసి వేదాలను విభాగం చేసి, ఆ తర్వాత విశ్వశ్రేయస్సుకోసం పంచమవేదమైన ఈ భారతసంహితను చేశాడు.

***

ఈ కథను నేను ఇంతకుముందు ఒకసారి చదివాను. అది, 2012, డిసెంబర్ 16 కు ముందు! ఇప్పుడు 2014, ఏప్రిల్ లో ఈ వ్యాసంకోసం మరోసారి చదివాను. నిజం చెప్పాలంటే, ఈసారి ఈ కథ చదివిన తర్వాత నేను మరింత ‘డిస్టర్బ్’ అయ్యాను. దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఏ స్థాయిలో నంటే, ఈ వ్యాసాలకు నేను నిర్దేశించుకున్న పరిమితులనుంచి కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించినా సరే, ఈ కథ నాలో కలిగించిన అలజడిని దాచుకోలేనంతగా!

2012, డిసెంబర్ 16 అని నేను ప్రత్యేకంగా ఒక తేదీని ఎందుకు ఇచ్చానో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఆ రోజున ఢిల్లీలో ‘నిర్భయ’గా అందరూ చెప్పుకుంటున్న ఒక అమ్మాయిని అత్యంత పైశాచికంగా చెరచి, హత్యచేసిన ఘటన జరిగింది. ఈ దేశంలో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. వాటిలో చాలా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ పత్రికలలో లోపలి పేజీ వార్తలు మాత్రమే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన జనాగ్రహమూ, అనంతర చర్యలూ మానభంగాల చరిత్రను, కనీసం భావనలోనైనా కొత్త మలుపుతిప్పాయి.

నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా దేశంలో మానభంగాలూ, హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే, మానభంగాలపై ఇంతకు ముందు లేనంత ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మానభంగాలకు ఇప్పుడు పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భావన అయితే ఏర్పడింది. మానభంగాలపై సమాజం స్పందనలో తీవ్రత పెరిగింది.

2009-09-30stolensistersupdatereport

అంతేనా? లైంగిక వేధింపులను, అత్యాచార ఘటనలను సాధారణంగా కప్పిపుచ్చడమే పరిపాటిగా ఉన్న సమాజంలో కొందరైనా ధైర్యం చేసి గతంలో లేదా వర్తమానంలో తమపై జరిగిన లైంగిక అత్యాచారాల గురించి చెప్పుకునే(పేరు బయటపెట్టకూడదన్న పరిమితికి లోబడి) అవకాశం కలిగింది. చివరికి లైంగిక వేధింపుల లేదా అత్యాచార నిందితులన్న ముద్రతో న్యాయమూర్తులను, పత్రికా సంపాదకులను కూడా బోనులో నిలబెట్టడం ఈ సరికొత్త స్పృహకు పరాకాష్ట. జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ. కె. గంగూలీ,‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతాలు ఈ క్రమంలోనే ముందుకొచ్చాయి. జస్టిస్ ఎ. కె. గంగూలీ తన పదవులను కోల్పోగా, తరుణ్ తేజ్ పాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

***

 

ఇప్పుడు పరాశరుడు-మత్స్యగంధి ఉదంతాన్ని చూడండి. పరాశరుడు వశిష్టు డంతటి మహర్షికి మనవడు, వ్యాసునంతటి మహర్షికి తండ్రి అనే వివరాన్ని కాసేపు పక్కన పెడదాం…కాసేపే!…

పైన చెప్పిన న్యాయమూర్తులు, సంపాదకుని ప్రతిబింబం పరాశరునిలో అచ్చుగుద్దినట్టు కనిపించడం లేదా?!.

ఒక నిర్జన ప్రదేశంలో, ఒంటరిగా అతనికి మత్స్యగంధి కనిపించింది. ఆమెపై అతనికి కలిగిన లైంగిక వాంఛ ఎన్ని రూపాలలో బయటపడాలో అన్ని రూపాలలోనూ బయటపడింది. ఉదాహరణకు, ఆమె కళ్ల దగ్గరనుంచి జఘనప్రదేశంవరకూ కాముకత్వం ఉట్టిపడే చూపులతో అతను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అది నేత్రపరమైన లైంగిక అత్యాచారం. ఆమె చనుదోయిని గిల్లాలనుకున్నాడు. అంటే, అతని కాముకత్వం క్రియారూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉందన్న మాట. ఆ తర్వాత నిస్సిగ్గుగా తన కోరికను వెల్లడించాడు. అది వాచికమైన లైంగిక అత్యాచారం. అంతేనా, సిగ్గుపడుతున్న ఆమె మీదపడి సిగ్గుపోగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది కాయికమైన(శారీరకమైన) లైంగిక అత్యాచారం. స్త్రీపై జరిగే అత్యాచారంలో అది ఆఖరి మెట్టు.

పోనీ ఇది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధమా, కాదు. కాదంటే శపిస్తాడేమోనన్న భయంతోనే మత్స్యగంధి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. న్యాయమూర్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న న్యాయవాద యువతులతో లైంగికంగా చొరవ తీసుకున్నారన్న ఆరోపణను; సంపాదకుడు తన సంస్థలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణను గమనించండి…అక్కడ జరిగింది కూడా; తమ అధికారాన్ని, లేదా తమతో ఆ యువతులకు ఉన్న అవసరాన్ని అడ్డుపెట్టుకుని వారిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే. పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఈ విషయంలో కూడా పై ఉదంతాలతో అతికినట్టు సరిపోతోంది.

***

మన పురాణ, ఇతిహాస కథలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో సాధారణంగా సంప్రదాయ పండితులనుంచి ఒక వాదం వినిపిస్తూ ఉంటుంది. వాటిలో పైకి కనిపించే అర్థం వేరు, అంతరార్థం వేరు అన్నదే ఆ వాదం. అంతరార్థం తెలుసు కోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. అందులో తగినంత శిక్షణ ఉండాలి. పరిశ్రమ ఉండాలి. అది కూడా గురుముఖతా జరగాలి. ఆ తర్వాత కూడా అనుమానాలు మిగిలిపోవచ్చు. అప్పుడు గురువాక్యాన్ని, లేదా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అనుమానాలకు అడ్డుకట్ట వేసేయాలి.

ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి కూడా ఇదే సూత్రాన్ని అన్వయించే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో తెలియదు. అందులోని ఔచిత్య, అనౌచిత్యాలను ప్రశ్నించే ఆసక్తి కూడా నాకిప్పుడు లేదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే, నా ప్రశ్న ఒకటే: పురాణ ఇతిహాసాలు అందరికీ అందుబాటులో ఉండే ప్రజాక్షేత్రంలో ఈనాడు ఉన్నాయి. ఆ అందరిలో అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ ఉంటారు. వారందరికీ అంతరార్థాలు బోధపరచుకునే శిక్షణ ఉండకపోవచ్చు. లేదా అటువంటి అంతరార్థాల సిద్ధాంతాన్ని వాళ్ళందరూ ఒప్పుకోకపోవచ్చు. అటువంటి వారికి పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఉన్నది ఉన్నట్టుగా ఇస్తున్న సందేశం ఏమిటి?

పోనీ దీని వెనుక ఏవో అంతరార్థాలు ఉంటాయని మనం మాటవరసకు ఒప్పుకున్నా, నేను పరిశీలించిన టీటీడీ వారి మహాభారత ప్రచురణలో వ్యాఖ్యాతలు ఈ ఉదంతం వెనుక ఏవో అంతరార్థాలు ఉన్నట్టు చెప్పలేదు. అందులోకి వెళ్ళేముందు, మొదటగా పేర్కొన్న పొరల సూత్రం ఈ ఉదంతానికి ఇలా అన్వయించుకుందాం:

పొర: 1

కథకు అట్టడుగున ఉన్న పొర ఇది. ఈ పొరలో జరిగింది ఒకటే. పరాశరుడు అనే పురుషుడికీ, మత్స్యగంధి అనే స్త్రీకీ లైంగిక సంబంధం ఏర్పడింది. వారికి వ్యాసుడు అనే కొడుకు పుట్టాడు. వారిద్దరి సామాజిక నేపథ్యం ఏదైనా కావచ్చు. అది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధం కావచ్చు, కాకపోవచ్చు. భిన్న సామాజిక నేపథ్యం ఉన్న స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధం అప్పుడు సహజం కావచ్చు, కాకపోవచ్చును కూడా. అది స్త్రీ-పురుషుల మధ్య సమాన ప్రతిపత్తి గల లైంగిక సంబంధం కావచ్చు; లేదా పురుషుడిది పై చేయి, స్త్రీది కింది చేయిగా ఉన్న అసమ లైంగిక సంబంధం కావచ్చు. ఈ ఘట్టంలో, అది కావచ్చా, ఇది కావచ్చా అనే చర్చలోకే అసలు వెళ్లకుండా ఒక పురుషుడికీ, ఒక స్త్రీకీ మధ్య ఏర్పడిన లైంగిక సంబంధంగానే దీనిని చెప్పుకుందాం. అంటే దీనికి ఎటువంటి సామాజిక, కాలిక, విలువల కోణాన్నీ ఆపాదించకుండానన్న మాట. ఇలా చూసినప్పుడు పరాశరుడికి ఒక న్యాయం జరిగే అవకాశముంది. ఎలాగంటే, తన కులాన్ని, తనకు ఉన్నట్టు తోపించే శాపానుగ్రహశక్తినీ అడ్డుపెట్టుకుని మత్స్యగంధిని అతను భయపెట్టి లొంగదీసుకుని ఉండకపోవచ్చన్న సంశయలాభా(benefitofdoubt)న్ని అతనికి ఆపాదించవచ్చు.

పొర: 2

పొర: 2 దగ్గరికి వచ్చేసరికి కాలం మారింది. సమాజమూ, దాని తాలూకు విలువలూ కూడా మారాయి. అందుకు తగినట్టు మహాభారత కథ చెప్పే కథకుడూ మారాడు. అతని వ్యూహాలు, ప్రాధాన్యాలూ మారాయి. అంటే ఏమిటన్న మాట, మొదటి పొరలోని పరాశరుని, మత్స్యగంధినే తీసుకుని తన వ్యూహ, ప్రాధాన్యాలకు అనుగుణంగా వారిని మలచుకుంటున్నాడన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు, దృష్టిపరంగా, వాచికంగా, కాయకంగా పరాశరునిలో చిత్రించిన లైంగిక అత్యాచార ప్రవృత్తి వాస్తవంగా అతనిది కాకపోవచ్చు, కథకుడు ఆపాదించినది కావచ్చు.

ఇక్కడ కథకుడు అన్నప్పుడు వ్యాసునో, నన్నయనో దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. వందల సంవత్సరాలపాటు మౌఖిక రూపంలో ఉన్న కథకు ఎందరో కథకులు ఉంటారు. కనుక ఒక కథకుని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం.

కథకుడు అలా ఎందుకు ఆపాదించాడన్న ప్రశ్న వేసుకుంటే, అతడు ఏ సామాజిక నేపథ్యం నుంచి ఆ కథ చెబుతున్నాడో ఆ సామాజిక నేపథ్యం అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. మొదటి పొరలోని పరాశరుడు వాస్తవంగా ఎలాంటి వాడో, అతనికీ మత్స్యగంధికీ ఏర్పడిన లైంగిక సంబంధం ఎలాంటిదో మనకు స్పష్టంగా తెలియదు. కానీ రెండవ పొర దగ్గరికి వచ్చేసరికి పరాశరుడు ఒక బ్రాహ్మణుడు గానూ, అందులోనూ శాపనుగ్రహశక్తి గల మహర్షిగానూ రూపుగడుతున్నాడు. మరోవైపు మత్స్యగంధి చేపల కంపు కొట్టే ఒక జాలరి యువతి, జానపదస్త్రీ, బ్రాహ్మణుల దగ్గర, ఋషుల దగ్గర ఏవో మహిమలు ఉంటాయనీ, వారిని కాదంటే శపిస్తారని మాత్రమే ఆమె వింది. దాంతో పరాశరుని కోరికకు ఆమె లొంగిపోయింది. ఈ పొర దగ్గరికి వచ్చేసరికి ఇది ఈ విధంగా ఒక అసమ లైంగిక సంబంధమన్న స్పష్టత వచ్చింది.

పరాశరుని పాత్ర చిత్రణలోని వైరుధ్యం చూడండి: అతను మదమాత్సర్యాలు లేని సాధుస్వభావి, శాంతుడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకునే వాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు, వ్రతనిష్ఠ కలిగినవాడు, తపస్సంపన్నుడు. తను తలచుకుంటే అప్పటికప్పుడు మంచు చీకట్లు సృష్టించగలిగినవాడు. మత్స్యగంధి ఒంటికి ఉన్న చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించగల సుగంధాన్ని ఇవ్వగలిగినవాడు. ఆమె ఒంటి మీద దివ్యవస్త్రాలను, ఆభరణాలను తెప్పించగలిగినవాడు. పైగా అతను మత్స్యగంధిని ఎప్పుడు చూశాడు? తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు!

ఇలా పరాశరుని శిఖరం మీద నిలబెట్టిన కథకుడే, మత్స్యగంధిని చూడగానే, నేటి భాషలో చెప్పుకునే ‘అత్యాచారా’న్ని తలపించేలా అతి కాముకత్వపు చీకటి లోయలోకి జారిపోయిన వాడిగా చూపిస్తాడు. పైగా ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఒంటరిగా ఆడది కనబడగానే చిత్త చాంచల్యానికి గురవుతారనీ, మన్మథుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరమనీ అంటాడు. ఈ మాటలోనే ఎంత వైరుధ్యమో చూడండి…ఒంటరి ఆడది కనబడగానే మనసు చెదిరేవారు కూడా ‘జితేంద్రియులు’ ఎలా అవుతారో తెలియదు.

తను ఎంత వైరుధ్యవంతంగా మాట్లాడినా చెల్లిపోతుందనీ, తన మాట ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని శిలాక్షరమనే ఒక ఆధిపత్య ధోరణి కథకునిలో వ్యక్తమవుతోందా? లేక పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ ప్రదర్శించే సమబుద్ధిని చాటుతున్నాడా? రెండింటికీ కూడా అవకాశముంది. రెండింటికీ సంబంధం కూడా ఉండచ్చు.

మిగతా వచ్చే వారం….

-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

గిరిక-అద్రిక: వడ్లగింజలో బియ్యపుగింజ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది. ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?! గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు! శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

మహాభారతంలో ప్రధాన కథ అయిన కురు-పాండవుల కథ వాస్తవంగా ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు రెండు ఆశ్వాసాలూ పాండవుల ముని మనవడైన జనమేజయుని సర్పయాగంతో ముడిపడినవి.

తృతీయాశ్వాసంలోని కురు-పాండవుల కథ కూడా ఉపరిచరవసువు కథతో ప్రారంభమవుతుంది. అతనికి సత్యవతి జన్మించడం గురించి, సత్యవతికి వ్యాసుడు జన్మించడం గురించి చెబుతుంది. వ్యాసుడు మహాభారత కథకుడే కాక, కురు-పాండవ వంశాన్ని నిలబెట్టినవాడు కూడా. వ్యాసుడి పుట్టుక గురించి చెప్పిన తర్వాత మహాభారత యుద్ధం అసలెందుకు జరిగిందో కథకుడు చెబుతాడు. ఆ తర్వాత దేవతలు, దానవులు, మొదలైనవారి అంశలతో కురు-పాండవవీరులు పుట్టి యుద్ధం చేశారని చెబుతాడు. ఆవిధంగా యుద్ధానికి, కురు-పాండవుల పుట్టుకకు అతి మానుష కారణాన్ని ఆపాదిస్తూ అదొక దైవనిర్ణయంగా చిత్రిస్తాడు. ఆ తర్వాత దేవదానవ ముఖ్యుల పుట్టుక ఎలా జరిగిందో చెబుతాడు. ఆ తర్వాత యయాతి మొదలైన కురు-పాండవ వంశ ప్రముఖుల గురించీ, వంశకర్తల గురించీ చెప్పుకుంటూ వెడతాడు.

కథ చెప్పడంలో కథకుడు మొదటినుంచీ ఒక వ్యూహంతో వెడుతున్నట్టు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటన్నది ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయం. ఒకటి చెప్పాలంటే, కురు-పాండవుల ప్రధాన కథలోకి పూర్తిగా వెళ్లడానికి ముందు అన్ని కథలూ ప్రధానంగా స్త్రీ-పురుష సంబంధాల గురించి, పుట్టుకల గురించి, వంశాన్ని నిలబెట్టిన వారి గురించీ చెబుతాయి. చదువుతూ వెడుతున్నకొద్దీ అసలు వీటి గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నాడనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని తీర్చుకునే ప్రయత్నం మనల్ని అనివార్యంగా మాతృస్వామ్య, పితృస్వామ్యాలవైపు నడిపిస్తుంది. అందులో మాతృస్వామ్యం తాలూకు కథలను పితృస్వామికంగా మార్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా కథకుడు మాతృస్వామ్య అవశేషాలను పూర్తిగా మరగుపరచలేకపోయిన సంగతీ తెలుస్తూ ఉంటుంది.

మహాభారతం ఎన్నో శతాబ్దాలుగా పఠన, పాఠన, ప్రచారాలలో ఉంది. వాటిని అలా ఉంచిన పౌరాణికులకు, సంప్రదాయ పండితులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. పురాణ, ఇతిహాసాలను వారు కాపాడుతూ వచ్చారు కనుకనే వాటి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. మహాభారత వ్యూహాన్ని తమవైన పద్ధతులలో, పరిమితులలో వారు కూడా చర్చించి ఉండచ్చు. నా పరిశీలన, వారి పరిశీలన ఒకలాంటివే కాకపోవచ్చు. ఇది కేవలం వైవిధ్యానికి చెందినదే తప్ప వారి విద్వత్తును ప్రశ్నించే ప్రయత్నం ఎంతమాత్రం కాదు. అర్జునుడు యుద్ధం ప్రారంభించేముందు భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలకు నమస్కార బాణాలు వేశాడని చెబుతారు. నేను చేసేది యుద్ధమనీ, నా దగ్గర బాణాలు ఉన్నాయనీ నేను అనుకోవడం లేదు కనుక పైన చెప్పిన పెద్దలకు నమస్కారం మాత్రమే చేసి ముందుకు వెడతాను.

***

వసువనే రాజు చేదిని పాలిస్తున్నాడు. అతను ఇంద్రుడితో సమానుడు. ఎంతో కీర్తిమంతుడు. అతను ఒక రోజు వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి అడుగుపెట్టగానే అతనికి వైరాగ్యం కలిగింది. ఆయుధాలు విడిచిపెట్టేసి తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. ‘ఇంతకాలం దయతో ప్రజలను కాపాడుతూ, వర్ణ ధర్మాలను రక్షిస్తూ మచ్చలేని చరిత్రతో రాజ్యాన్ని పాలించావు. ఇప్పుడు రాజ్యాన్ని వదిలేసి తపస్సులో మునగడం నీకు తగదు. ఇప్పటినుంచీ నువ్వు నాతో స్నేహం చేస్తూ, నా దగ్గరకు వస్తూ పోతూ రాజ్యం చెయ్యి’ అన్నాడు.

ఆపైన అతనికి దేవత్వం ఇచ్చాడు. బంగారాన్ని, రత్నాలను తాపడం చేసిన ఒక దివ్య విమానాన్ని; ఎలాంటి ఆయుధం నుంచి అయినా రక్షించగలిగిన, ఎప్పటికీ వాడని కమలాలతో కూర్చిన ఇంద్రమాల అనే హారాన్ని ఇచ్చాడు. దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడగలిగిన ఒక వెదురుకర్రను(అంటే రాజదండాన్ని)ఇచ్చాడు.

వసురాజు ఇంద్రుడు చెప్పినట్టు తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు. ఇంద్రుడిచ్చిన విమానం ఎక్కి పైలోకాలకు వెళ్ళి, వస్తుండడంతో అతనికి ఉపరిచరవసువు అనే పేరు వచ్చింది. ఇంద్రుడి మీద భక్తితో అతను ఏటేటా ఇంద్రోత్సవం కూడా జరిపేవాడు. అప్పటినుంచీ రాజులు ఇంద్రోత్సవం జరిపే ఆనవాయితీ మొదలైంది.

ఇంద్రుడి వరంతో అతనికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదుడు, రాజన్యుడు అనే అయిదుగురు కొడుకులు కలిగారు. వసురాజు ఆ అయిదుగురినీ అయిదు దేశాలకు రాజుల్ని చేశాడు. వారు వేర్వేరు వంశాలకు కర్తలయ్యారు. వసురాజు రాజర్షి అనిపించుకుంటూ రాజ్యం పాలిస్తుండగా…

అతని రాజధానికి దగ్గరలో శుక్తిమతి అనే నది ప్రవహిస్తోంది. కోలాహలుడు అనే పర్వతం ఆ నదిని కామించాడు. నదిని అడ్డగించి బలాత్కారం జరిపాడు. అప్పుడు వసురాజు తన పాదంతో ఆ పర్వతాన్ని తొలగించాడు. కోలాహలుని బలాత్కారం వల్ల శుక్తిమతి గర్భవతి అయింది. వసుపదుడు అనే కొడుకు,గిరిక అనే కూతురు కలిగారు. తనను అడ్డగించిన పర్వతాన్ని పక్కకు తప్పించినందుకు కృతజ్ఞతతో శుక్తిమతి తన కొడుకునూ, కూతురినీ వసురాజుకు కానుకగా ఇచ్చింది. వసురాజు వసుపదుని తన సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకున్నాడు.

గిరిక ఋతుమతి అయింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు వసురాజుకు చెప్పారు. వసురాజు వేటకు వెళ్ళాడు. వెళ్లాడన్న మాటే కానీ, నిండు యవ్వనంలో ఉన్న గిరికే అతని ఊహల్లో ఉండిపోయింది. అనురక్తితో ఆమెను తలచుకుంటూ ఉండగా అతనికి స్కలనం అయింది. ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలోకి తీసుకుని, దానిని ఒక డేగ మెడకు కట్టి, దానిని తీసుకువెళ్లి గిరికకు ఇమ్మని చెప్పాడు. ఆ డేగ ఆకాశంలో పయనిస్తుండగా ఇంకో డేగ చూసింది. దాని మెడకు కట్టిన ఆకులో మాంసఖండం ఏదో ఉందనుకుంది. దానికోసం డేగను అడ్డగించింది. రెండింటి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ఆకుదొప్ప చినిగిపోయి అందులోని వీర్యం యమునా నదిలో పడింది.

బ్రహ్మ శాపం వల్ల అద్రిక అనే అప్సరస చేపగా మారి యమునానదిలో తిరుగుతోంది. నదిలో పడిన వసురాజు వీర్యంలోని రెండు చుక్కలను ఆ అప్సరస తాగింది. దాంతో గర్భవతి అయింది. పదోమాసం రాగా ఒక జాలరి వలకు చిక్కింది. ఆ జాలరి కడుపు కోసి చూసేసరికి అందులో ఒక మగశిశువు, ఒక ఆడశిశువు కనిపించారు. ఆ శిశువులు ఇద్దరినీ ఆ జాలరి తీసుకువెళ్లి దాశరాజు అనే అతనికి ఇచ్చాడు. మనుష్య ప్రసవంతో శాపవిమోచనం అవుతుందని బ్రహ్మ చెప్పాడు కనుక అద్రిక వెంటనే చేప రూపం విడిచిపెట్టి దివ్యరూపం ధరించి దేవలోకానికి వెళ్లిపోయింది. చేప కడుపున పుట్టిన ఆ ఇద్దరికీ మత్స్యరాజు అనీ, మత్స్యగంధి అనే పేర్లు వచ్చాయి. మత్స్యరాజు మత్స్యదేశానికి రాజు అయ్యాడు. మత్స్యగంధిని మాత్రం దాశరాజు తన కూతురుగా చేసుకుని పెంచి పెద్దచేసి; ధర్మార్థంగా, అంటే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా యమునా నదిలో పడవ నడిపే పనిలో నియోగించాడు.

ఓ రోజున, వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు యమునానది పడవ రేవులో మత్స్యగంధిని చూశాడు…

ప్రస్తుతానికి కథను ఇక్కడ ఆపుదాం.

Ravi_Varma-Shantanu_and_Satyavati

***

వసురాజు చేదిని పాలించే రాజు అని తప్ప, సూర్యచంద్రవంశాలలో ఏ వంశానికి చెందినవాడో కథకుడు చెప్పలేదు. మహాభారతంలో చెప్పిన అనేకమంది రాజులతో పోల్చితే అతనంత ప్రసిద్ధుడుగా కనిపించడు. అతనొక చిన్న రాజు అనే అభిప్రాయమే కలుగుతుంది. అసలాలోచిస్తే, సత్యవతి అనే పేరు కూడా కలిగిన మత్స్యగంధి పుట్టుక గురించి చెప్పడమే కథకుని వ్యూహంలో ప్రధానం తప్ప, వసురాజు గురించి చెప్పడం కాదనిపిస్తుంది. మత్స్యగంధి గురించి చెప్పడానికే వసురాజును సృష్టించాడని కూడా అనిపిస్తుంది.

ఇంకోటి చూడండి…వసురాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి వెళ్ళగానే అతనికి వైరాగ్యం కలిగింది. అంతే, తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, నువ్వు ప్రజలను, వర్ణధర్మాలనూ కాపాడుతూ రాజ్యం చేయాలి తప్ప ఇలా తపస్సు చేయడం తగదని చెప్పాడు. మరి కొన్ని రాజోచిత పురస్కారాలతోపాటు ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడు. వసురాజు అంగీకరించి తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు.

వెంటనే మనకిక్కడ సంవరణుడు గుర్తుకు రావాలి. సంవరణుడు కూడా వేటకు వెళ్ళాడు. వసురాజును ‘తపస్సు’ ఆకర్షిస్తే, సంవరణుని ‘తపతి’ ఆకర్షించింది. రాజ్యాన్ని విడిచేసి ఆమె కోసం అక్కడే తపస్సు ప్రారంభించాడు. వశిష్టుడు వచ్చి వారిద్దరికీ వివాహం జరిగే ఏర్పాటు చేశాడు. సంవరణుడు ఆ తర్వాత తపతితో కాపురం చేస్తూ పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయాడు. రాజ్యంలో అనావృష్టి ఏర్పడడంతో వశిష్టుడు వచ్చి ఆ దంపతులను హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. వారికి కురుడు పుట్టాడు.

మొత్తానికి రాజుకూ, అడవికీ ఏదో దగ్గరి సంబంధం ఉంది. ఇంకా వెనక్కి వెడితే పురూరవుడికీ అడవితో సంబంధం ఉంది. కొంపదీసి, అడవినుంచి, అంటే ఆటవిక తెగలనుంచి తొలి రాజులను సృష్టించలేదు కదా?!

సంవరణుడి కథలో కన్నా వసురాజు కథలో ఈ సందేహం మరింత గట్టిగా కలుగుతుంది. అంతవరకూ రాజ్యపాలన చేస్తున్న వసురాజు అడవికి వెళ్ళగానే హఠాత్తుగా వైరాగ్యం పొందడానికీ, ఆయుధాలు పక్కన పెట్టేసి తపస్సులో కూర్చోడానికీ బలమైన పూర్వరంగాన్ని కథకుడు కల్పించలేదు. ఇంద్రుడు వచ్చి అతనికి రాజదండంతో సహా వివిధ కానుకలు ఇచ్చిన తర్వాత అంతలోనే అతను వైరాగ్యాన్నీ, తపస్సునూ వదలుకుని తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడనడం, అతన్ని చంచలమనస్కునిగా చూపుతోంది తప్ప అతని వ్యక్తిత్వాన్ని పెంచడం లేదు. ఈ రకంగా చూసినప్పుడు, అతన్ని ముందునుంచే రాజుగా చూపించడానికే ఈ బలహీన కల్పన అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే, అతను మొదటే రాజు కాడన్న మాట. ఆ అడవిలోని తెగకు అతను పెద్ద అయుండచ్చు.

ఇంద్రుడు వచ్చి అతనికి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు రాజదండాన్ని కూడా ఇవ్వడం -అతన్ని రాజుగా నియమించిన సంగతిని స్పష్టంగా చెబుతోంది. మొదట్లో రాచరికానికి ఇంద్రుడు ప్రతినిధి. అతడు ఇలా రాజుగా నియమించినవారు ఇంకా కొందరు కనిపిస్తారు. కనుక, ఇంద్రుడు నియమించేవరకూ వసురాజు రాజు కాడనుకుంటే, ఆటవిక తెగనుంచి ఒక రాజును సృష్టించారన్నమాట. వాస్తవానికి తెగ పెద్దకే రాజు అన్న పేరు కల్పించారన్నమాట. అంటే, తెగ పెద్ద అనే పదవిని సంస్కృతీకరించారన్నమాట.

అంతవరకూ రాజ్యార్హతలేని కులాలనుంచి, వృత్తులనుంచి రాజులను సృష్టించిన ఉదంతాలు మహాభారతంలోనే కోకొల్లలుగా ఉన్నాయి. దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం. ఈ కోణంలో వసురాజును రాజుగా నియమించడంలో విశేషం ఏమీ లేదు. అయితే, ప్రస్తుత కథకు వస్తే, ఇలా కొత్తగా రాజులను సృష్టించే ఆనవాయితీని ఉపయోగించుకుంటూ కథకుడు వసురాజును అనే పాత్రనే సృష్టించాడా అన్న అనుమానం కలుగుతుంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. అవేమిటంటే, కథకుడు మత్స్యగంధి అనే సత్యవతి పుట్టుక గురించి, ఆమెకు మహాభారతకర్త అయిన వ్యాసుడు పుట్టడం గురించి చెబుతున్నాడు. వీరిద్దరూ మహాభారతంలో ప్రముఖ పాత్రలు. కనుక వారి గురించి చెప్పడమే కథకునికి ప్రధానం. వసురాజు గురించి చెప్పడం కాదు. అంతేకాదు, సత్యవతి భవిష్యత్తులో శంతనుడు అనే భరతవంశపు రాజుకు భార్య కాబోతోంది. ఆమెకు ఆ అర్హత కల్పించాలంటే ఆమెను వాస్తవంగా ఒక రాజుకు పుట్టిన సంతానంగా చెప్పాలి!

అదీ సంగతి.

ఇంద్రుని సూచనపై ‘తిరిగి’ రాజ్యపాలన ప్రారంభించిన తర్వాత వసురాజుకు అయిదుగురు కొడుకులు కలిగినట్టు, వారిని అతడు అయిదు దేశాలకు రాజులను చేసినట్టు, వారు వేర్వేరు వంశాలను స్థాపించినట్టు కథకుడు చెబుతున్నాడు. ఆ తర్వాతే, శుక్తిమతి, కోలాహలుల ఉదంతం, వారికి వసుపదుడు, గిరిక కలగడం, వారిద్దరినీ శుక్తిమతి వసురాజుకు కానుకగా ఇవ్వడం, అతడు వసుపదుని సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకోవడం గురించి చెబుతున్నాడు. దీనిని బట్టి గిరికకూ, వసురాజుకూ వయసులో చాలా అంతరం ఉందన్నమాట. వసురాజు పేరుతో, లేని ఒక రాజును సృష్టించడం మీదే దృష్టి పెట్టిన కథకుడు ఈ చిన్న అనౌచిత్యాన్ని విస్మరించి ఉండచ్చు.

సరే, ఆ తర్వాత జరిగిన కథాక్రమాన్ని చూడండి. గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది.

ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?!

గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు!

శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

ఈవిధంగా వసురాజు పిల్లల్ని కన్నది గిరికే అనుకున్నప్పుడు మధ్యలో అద్రిక అనే అప్సరస ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వస్తుంది. సమాధానం స్పష్టమే. నదీ గణానికి చెందిన శుక్తిమతికీ, పర్వత గణానికి చెందిన కోలాహలుడికీ పుట్టిన గిరిక, తల్లిదండ్రులలానే ఒక నిమ్నజాతికి చెందినది. కానీ, ఒక భరతవంశ క్షత్రియుడు, పాండవుల ముత్తాత అయిన శంతనుడికి భార్య కాబోయే సత్యవతి పుట్టుక గురించి కథకుడు చెబుతున్నాడు. పైగా ఆ సత్యవతికే వ్యాసుడు జన్మించబోతున్నాడు. అటువంటప్పుడు సత్యవతి గిరిక సంతానమని చెప్పడం కథకునికి అభ్యంతరకరం కావడంలో ఆశ్చర్యంలేదు. శంతనుడి కాలానికి కూడా అది అంతే అభ్యంతరం అవునో కాదో, అనివార్యమై అతను ఆమెను చేపట్టాడో మనకు తెలియదు. వాస్తవంగా కథ కూర్చేనాటికి అది అభ్యంతరకరంగా మారి ఉండచ్చు. అందుకే, వసురాజును సృష్టించి రాచరిక వారసత్వాన్ని, అద్రిక అనే అప్సరసను సృష్టించి దైవసంబంధాన్ని సత్యవతికి ఆపాదించడం. ఈవిధంగా వసురాజును, అద్రికను పక్కకు తప్పించి చెప్పుకుంటే, గిరిక భర్త ఎవరై ఉండచ్చు? బహుశా మత్స్యగంధి లేదా సత్యవతిని పెంచి పెద్దజేసిన దాశరాజే!

కథకుడు సత్యవతికే కాక గిరికకూ, ఆమె సోదరుడు వసుపదుడికీ, సత్యవతి సోదరుడు మత్స్యరాజుకీ, చివరికి దాశరాజుకీ కూడా రాచసంబంధం కల్పించాడు చూడండి, క్షత్రియులతో చుట్టరికం కలిపించుకునేటప్పుడు అది అవసరమే. గిరిక వసురాజు భార్య అని చెప్పినా, మధ్యలో అద్రికను సృష్టించడం ద్వారా సత్యవతి మాత్రం ఆమె సంతానం కాదని చెప్పడానికి కథకుడు పన్నిన వ్యూహం, పేర్లలో ఉన్న సామ్యం ద్వారా బయటపడిపోయింది.

వచ్చేవారం వ్యాసుడి జన్మవృత్తాంతం గురించి….

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

అమ్మవారి పూజ ఐర్లాండ్ లోనూ ఉండేది!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే, పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి. ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా. పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

మరేం లేదు…దేశాలు, సరిహద్దులు, జాతీయత, మతాలు, విశ్వాసాలు, సంస్కృతి, సాహిత్యం, సిద్ధాంతాలు, రాజకీయాలు, పార్టీలు, స్త్రీ-పురుషుల తేడాలు, దేశాన్నో సమాజాన్నో ఉద్ధరించాలని అనుకోవడాలు, పోరాటాలు, విప్లవాలు…వగైరాల రూపంలో మనం చాలా పెద్ద అడల్టు బ్యాగేజీని మోస్తున్నాం, మోస్తాం, మోయవలసిందే. విషయం అది కాదు….

కాస్సేపు, మన తలకాయలను అణిచేసే ఈ బ్యాగేజిని పక్కన పెడదాం, కాసేపే… అది ఎక్కడికీ పోదు. మళ్ళీ దానిని మనం తలమీదికి ఎక్కించుకోవచ్చు. పక్కన పెట్టి ఏం చేద్దామంటే, ఈ ప్రపంచాన్ని, దీని చరిత్రను, ఈ భూమిని, ఈ మనుషుల్ని అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న ఒక కుర్రవాడిలా, తటస్థంగా, ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా చూద్దాం!

ఈ వ్యాసపరంపరలో నేను అదే చేస్తున్నాను. కనీసం అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి భిన్నంగా మీకు ఎక్కడైనా కనబడితే అది నా లోపమే, నా వైఫల్యమే. నా అడల్టు బ్యాగేజిని నేను పూర్తిగా దింపుకోలేదన్న మాట. ఈ వ్యాసపరంపర సందర్భంలో నేను ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నానంటే అది నా దృష్టిలో, మనిషి తన అనుభవాన్ని, ఆలోచనను ప్రోది చేసిన జ్ఞానసంపుటి మాత్రమే. ఒక పుస్తకం మీద మంచిదీ, లేదా చెడ్డదీ అని వేసే ముద్రలు నా దగ్గర ఏవీ లేవు; అది పుస్తకం మాత్రమే. కాకపోతే కొన్ని మామూలు పుస్తకాలు, కొన్ని గొప్పగా చెప్పిన పుస్తకాలు ఉండచ్చు. గొప్పగా ఉండడం, లేకపోవడం వేరు; మంచి-చెడు విభజన వేరు.

ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ఈ వ్యాసాలకు ఒక ‘బహిరంగ ఆలోచన’ స్వభావం ఉంది. అంటే ఈ వ్యాసాలలోని చాలా ఊహలు, ప్రతిపాదనల చివరిలో సందేహార్ధకాలు, కామాలు, సెమీ కోలన్లే కనిపిస్తాయి. ఫుల్ స్టాపులు ఎక్కడో కానీ కనిపించవు. మనిషి తన ప్రయత్నం లేకుండా హఠాత్తుగా ఇంత పెద్ద ప్రపంచం అనే ఒక అపరిచిత ప్రదేశంలోకి అడుగుపెడతాడు. తన ప్రయత్నం లేకుండానే నిష్క్రమిస్తాడు. ఈ మధ్యలో ప్రకృతి తనకు నిర్దేశించిన స్వల్ప జీవితంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అతను జరిపే నిర్విరామ అన్వేషణలో కామాలు, సెమీ కోలన్లు; సందేహార్ధకాలే తప్ప ఫుల్ స్టాపులకు అంతగా అవకాశం లేదని నేను నమ్ముతాను. ఫుల్ స్టాపు పెట్టడమంటే జ్ఞానానికి ఆనకట్ట కట్టడమే. ఇంకో విధంగా అది జ్ఞానాన్ని నిషేధించడమే. అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న కుర్రవాడిలా ప్రపంచాన్ని ఓ అద్భుతంగానూ, మిస్టరీగానూ  దర్శిస్తున్న(కనీసం ఈ వ్యాసపరంపర వరకు) నాకు జ్ఞానాన్ని ఏవేవో లేబుళ్లతో నిషేధించేవారంటే చాలా భయం. జ్ఞానాన్ని నిషేధించడమంటే నా ఉద్దేశంలో చావే!

ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఫుల్ స్టాపులు కనిపించని నా అన్వేషణలో నా వరకు నేను ఫుల్ స్టాపులు  పెట్టుకున్నవి కొన్ని లేకపోలేదు. ఒకటి చెప్పాలంటే, ఇది ఫలానా దేశానికి చెందిన సంస్కృతి, మతం, విశ్వాసం అనే విభజనను మించిన అతి పెద్ద మిత్ లేదని నేను అంటాను.  అడల్టు బ్యాగేజి ఏమీ లేని ఒక కుర్రాడిలా తెరచిన పుస్తకంలాంటి కళ్ళతో చూస్తే, ప్రపంచమంతటా ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే రకమైన విశ్వాసాలు- మనం కల్పించుకున్న అనేకానేక సరిహద్దులను ముంచేసి ప్రవహిస్తూ కనిపిస్తాయి. దీనినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే; నా దేశభక్తిని, జాతీయతను మీరు శంకించినా సరే, ‘భారతీయత’ అని చేప్పేది అంతా పెద్ద మిత్ అంటాను. అలా అనడానికి ఇవే వ్యాసాలలో కొన్ని ఉదాహరణలు ఇప్పటికే ఇచ్చాను. ఇక ముందు అటువంటివి మరిన్ని రాబోతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ఐరిష్ కథకు గల పురాచారిత్రక నేపథ్యంలోకి వెళ్లినప్పుడు కూడా కొన్ని ఉదాహరణలు దొరకచ్చు.

***

మనకు తెలుసు, మన దేశంలో అమ్మవారిని ఆరాధించడం ఉంది. ఆమె అమ్మలగన్న అమ్మ. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులకు కూడా ఆమె అమ్మ. అమ్మవారికి చెందిన పురాణాలలో అమ్మే త్రిమూర్తులకన్నా గొప్ప. అయితే, త్రిమూర్తులకు చెందిన పురాణాలలో త్రిమూర్తులలో ఎవరికి వారే గొప్ప. ఇది అమ్మవారు, త్రిమూర్తులు ఒకరి ఆధిక్యాన్ని ఒకరు గుర్తించి గౌరవించుకోడానికి జరిగిన ఏర్పాటు, లేదా సర్దుబాటు. సృష్టిలోనే స్త్రీ-పురుషుల మధ్య ఈ సమన్వయం, సర్దుబాటు ఉండవచ్చు. అందులోని ప్రాకృతిక ధర్మాన్ని నేను ప్రశ్నించడం లేదు. అది నా అధ్యాయనాంశం కాదు. సామాజిక, చారిత్రక కోణాలనుంచి వ్యాఖ్యానించడం పైనే ప్రస్తుతం నాకు ఆసక్తి.

67CABA81D0F1641449BD35D21666E

అమ్మవారిని(Mother-goddess) ఆరాధించిన కాలాన్ని స్థూలంగా రాగి-కంచుయుగంగా చరిత్రకారులు వర్గీlకరించారు. సమీప ప్రాచ్యం(Near East-నేటి టర్కీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, సిరియా, సౌదీ అరేబియా మొదలైన దేశాలను ఇలా పిలుస్తారు); సింధు నాగరికతా ప్రాంతాలలో ఈ యుగం క్రీ.పూ. 33000-1200 వరకు; దక్షిణాసియాలో క్రీ.పూ. 3000-1200 వరకు; యూరప్ లో క్రీ.పూ. 2300-600 వరకు; చైనాలో క్రీ.పూ. 2000-700 వరకు కొనసాగినట్టు అంచనా వేశారు. వ్యవసాయ సంస్కృతి పుట్టింది కూడా ఈ కాలంలోనే. ఆ తర్వాత ఇనప యుగం(Iron Age) మొదలైంది. ఈ కాలంలో ఒకవైపునుంచి ఆర్యులు, ఇంకోవైపునుంచి సెమెటిక్ జాతులవారు ఆయా రాగి-కంచుయుగ ప్రాంతాలలోకి విస్తరించి అప్పటికి అక్కడ ఉన్న వ్యవస్థలను కూలదోశారు.

గమనించవలసింది ఏమిటంటే, అమ్మవారి ఆరాధన ప్రాంతాలలో ఉన్న సామాజిక రూపం మాతృస్వామ్యం అయితే, ఆర్యులు, సెమెటిక్ జాతుల సామాజిక రూపం పితృస్వామ్యం. అయితే ఏ వ్యవస్థలోనైనా విజేతలు, పరాజితులు గీత గీసినట్టు ఎప్పటికీ వేర్వేరుగానే ఉండిపోరు. కాలం గడిచిన కొద్దీ ఒకరితో ఒకరు కలిసిపోతారు. మనుషులు కలవడమంటే వారి మత విశ్వాసాలు, సామాజిక రూపాల మధ్య కూడా కలయిక లేదా సర్దుబాటు జరగడమే. ఆవిధంగా స్త్రీ దేవతలు, పురుష దేవతల సహజీవనం ప్రారంభమైంది. ఇలా వివిధ ప్రాంతాలలో జరిగిన దేవతల కూర్పులు, చేర్పులు, తొలగింపులు వగైరాలను థియోక్రేసియా అన్నారు. ఆసక్తి గొలిపే ఆ ప్రక్రియ పూర్తి వివరాలలోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు.

నాగరికతకు కీలకంగా మారిన చోట్ల, స్థూలంగా క్రీస్తు శకారంభం తర్వాత మూడు నాలుగు వందల ఏళ్ల  వరకు ఈ సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. అంటే, బహుళ దేవతారాధన రూపంలో ఆస్తిక ప్రజాస్వామ్యం ఉండేదన్న మాట. అయితే రోమన్ చక్రవర్తి కాన్ స్టాన్ టైన్ క్రైస్తవానికి అధికార ప్రతిపత్తి కల్పించినప్పటినుంచీ, అనంతరం ఇస్లాం అవతరించిన తర్వాతా, ఇప్పుడు మనం ‘మతం’గా చెప్పుకునే వ్యవస్థీకృత, ఏకేశ్వరోపాసన మతాల ప్రాబల్యం మొదలైంది. ఇవి పితృస్వామిక మతాలు కూడా. పైన చెప్పిన రోమన్ చక్రవర్తి కాలంలో బహుళదేవతారాధన పద్ధతులను ‘పాగాన్’ పద్ధతులుగా చిత్రిస్తూ వాటిని తుడిచిపెట్టడం పెద్ద యెత్తున సాగింది. Witch-hunt(మంత్రగత్తెలన్న ముద్రతో వేటాడి మరీ చంపడం)అనే మాట అప్పుడే పుట్టింది.

విశేషమేమిటంటే, దాదాపు నాగరిక ప్రపంచమంతటా జరిగిన ఈ witch-hunt నుంచి, నా పరిశీలనకు అందినంతవరకూ, భారతదేశం ఒక్కటే తప్పించుకుంది. ఇక్కడ ఇప్పటికీ బహుళదేవతారాధన పద్ధతులు కొనసాగుతున్నాయి. దేవీ, దేవతల మధ్యనే కాదు, చెట్లు పుట్టలు, పశువులు, పాములు వగైరా ఆరాధనా లక్ష్యాల మధ్య కూడా నేటికీ అద్భుతమైన సర్దుబాటు, సయోధ్య కొనసాగుతున్నాయి.  ఇందుకు కారణం ఈ దేశపు ప్రత్యేక స్వభావమే. ఆ రకంగా చెప్పుకుంటే భారతదేశం నేటికీ అచ్చంగా రాగి-కంచుయుగ సంస్కృతిలోనే ఉంది. అంటే, క్రీస్తు శకం లోకి కూడా ఇంకా రాలేదన్నమాట. పాశ్చాత్యప్రపంచానికి భారత్ పట్ల ఆకర్షణకు బహుశా ఇది కూడా ఒక కారణం.  ఇవే మాటలు నేను గత వ్యాసాలలో కూడా చెప్పాను. సందర్భం వచ్చింది కనుక మళ్ళీ చెప్పాను.

తీరా ఐర్లాండ్ కథ ఒకటి ప్రస్తావించుకున్నాం కనుక, అందులోకి వెళ్ళడం కోసం అనివార్యంగా ఈ వివరాలు చెప్పుకోవలసివచ్చింది. నిజానికి ఇవి ఇంతకంటే చాలా సమగ్రంగానూ, లోతుగానూ చెప్పుకోవలసిన విషయాలు.

***

సంగతేమిటంటే, మన దేశంలో మనందరికీ బాగా తెలిసిన అమ్మవారి ఆరాధన, యూరప్ లో ఒక ఒంటరి దీవి అయిన ఐర్లాండ్ లో కూడా ఒకప్పుడు ఉండడం! ఎప్పుడు? సరిగ్గా సమీప ప్రాచ్యం, సింధు నాగరికతా ప్రాంతం మొదలైన చోట్ల  అమ్మవారి ఆరాధన కొనసాగుతున్న కాలంలోనే! అక్కడికి అసలు అమ్మవారి ఆరాధనా రూపం ఎలా వెళ్లిందన్నదే చరిత్రకారుల దృష్టిలో ఒక మిస్టరీ.

ఇంకొంచెం వివరాలలోకి వెడితే, యూరప్ లో వేట ప్రధానంగా జీవించిన పాతరాతి యుగంలో, అంటే క్రీ.పూ. 30,000-15,000 మధ్యకాలంలో ఐర్లాండ్ దాదాపు నిర్జనప్రదేశం. అప్పటికి బ్రిటన్ యూరప్ ప్రధాన భూభాగంలో ఒక భాగంగానే ఉండగా, ఐర్లాండ్ మాత్రం ఒక దీవిగా అవతరించింది.  ఫ్రాన్స్ దక్షిణ భాగం, స్పెయిన్ ఉత్తర భాగం మాత్రమే అత్యద్భుత చిత్రాలు కలిగిన గుహలతో నాటికి ప్రపంచం మొత్తంలోనే మతపరంగా గుర్తించగలిగిన ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పటికి వాటితో పోల్చగలిగినవేవీ భూమి మీద లేవు.

కానీ, పశ్చిమ యూరప్ లో కంచు యుగం ప్రారంభమయ్యే నాటికి, అంటే క్రీ.పూ. 2500 నాటికి ఐర్లాండ్ హఠాత్తుగా పాశ్చాత్య ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజపరిచే శక్తులలో ఒకటిగా మారింది. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, నిత్య యవ్వనులైన దేవతలు ఉండే దేవభూమి లాంటి ఐర్లాండ్ కు చెందిన అమ్మవారి మాంత్రికతా కథలే నేటికీ యూరప్ మొత్తంలో వ్యాప్తిలో ఉన్న జానపద కథలకు మాతృకలయ్యాయి.

మధ్య రాతి యుగం(Mesolithic age)లో మాత్రమే ఐర్లాండ్ లో జనావాసాల తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. ఈ యుగం ప్రారంభంలో ఐర్లాండ్ కు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత అదృశ్యమైపోయారు. వాళ్ళు ఎవరో, ఐర్లాండ్ కు ఏం తీసుకొచ్చారో, ఎప్పుడు, ఎందుకు అదృశ్యమైపోయారో తెలియదు. వాళ్ళ ఆనవాళ్ళు ఏమీ మిగలలేదు. ఐర్లాండ్ కు వీళ్ళ రాక, క్రీ.పూ. 7800-2500 మధ్యలో ఎప్పుడైనా సంభవించి ఉండచ్చు. ఇక క్రీ.పూ. 2500 నుంచీ ఐర్లాండ్ లో రాగి, కంచు యుగం తాలూకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ లో ఈ రాగి- కంచు యుగానికి చెందిన దశ తనదైన ఒక సంస్కృతిని సృష్టించింది. అది, అమ్మవారి ఆరాధన(Mother-goddess worship)కు, మాతృస్వామ్యా(Mother Right)నికి చెందిన సంస్కృతి.

క్రీ.పూ.  500-200 మధ్యలో ఇనుము చేతబట్టుకుని పితృస్వామిక కెల్టిక్ తెగలు ఐర్లాండ్ లో అడుగుపెట్టేవరకూ అదే సంస్కృతి అక్కడ కొనసాగింది. తమ కంటే పురోగామి స్వభావం కలిగిన ఇనప యుగానికి, పితృస్వామ్యానికి చెందిన కెల్టిక్ తెగల ప్రాబల్యంలో కూడా అక్కడి మాతృస్వామ్యానికి చెందిన మగరాయళ్ళ లాంటి గృహిణులు క్రీస్తు శకారంభం వరకూ తమ ఆచారాలను కొనసాగించారు. ఆశ్చర్యం గొలిపే ఆ ఆచారాల అవశేషాలు అనంతరకాలానికి చెందిన కెల్టిక్ పురాణ కథలలోనూ ప్రవేశించాయి. ఇంకా చెప్పాలంటే, కెల్టిక్ వీరయుగం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, అంటే క్రీ.పూ. 200-క్రీ.శ. 500 మధ్య కాలానికి సైతం ఐర్లాండ్ లోని ఎందరో శిష్ట, లేదా కులీన మహిళలు కెల్టిక్ పూర్వ తెగలకు చెందినవారే. వీరు తమ మాతృస్వామిక సంప్రదాయాలను పట్టుదలగా కొనసాగించారు.

ఇంతకు ముందు చెప్పుకున్న ఐరిష్ కథ దానికి ప్రతిబింబమే. ఈ కథ పేరు, “The Cattle Raid of Cooley”.

***

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే,  పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే  మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి.

ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా.

పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

‘ఒక మొగవాడి నీడలో ఇంకో మొగవాడు’ అన్నప్పుడు గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో ఒక సన్నివేశం, గిరీశం అన్న ఒక డైలాగూ గుర్తొచ్చి ఉండాలి. గిరీశం మధురవాణి ఇంటి తలుపు కొట్టినప్పుడు అప్పటికే అక్కడ ఉన్న రామప్పంతుల్ని మధురవాణి మంచం కింద దాచి తలుపు తీస్తుంది. అంతలో పూటకూళ్ళమ్మ చీపురు కట్ట పుచ్చుకుని గిరీశాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు, గిరీశం కూడా అదే మంచం కిందికి దూరతాడు. అక్కడున్న రామప్పంతుల్ని చూసి ‘సానిది విటుణ్ణి మంచం కింద దాచింది’ అనుకుంటాడు. అంటే, ఒక విటుడికి మరో విటుడితో బహిరంగంగా కనిపించే ధైర్యం ‘సాని’కి కూడా లేదన్నమాట. కానీ ఇక్కడ మీవే ‘సాని’ కాదు, తన దగ్గర ‘ఒక మొగాడి నీడలో ఇంకో మొగాడు’ ఎప్పుడూ ఉంటాడని చెప్పుకున్న గృహిణి!

తన దగ్గర ఉన్న తెల్ల కొమ్ముల ఎద్దును ఎరువిమ్మని డైరే అనే అతనికి కబురు పంపినప్పుడు మీవే ఏమందో చూడండి, తన కటి భాగంతో అతన్ని స్నేహం చేసుకొనిస్తానని చెప్పింది. అతను తిరస్కరించేసరికి సైన్యంతో అతని మీదికి యుద్ధానికి వెళ్ళి అతన్ని ఓడించి ఎద్దును ఎత్తుకు వచ్చింది. మీవే ఇక్కడ ‘స్వైరిణి’గా కనిపించే మాట నిజమే. అయితే తటస్థంగా చెప్పుకున్నప్పుడు, పురుషుడనే స్వైరుడికి ఆమె తలకిందుల రూపం మాత్రమే.

***

ఇంతకీ విషయమేమిటంటే; ఐర్లాండ్ గురించీ, పైన చెప్పిన కథ గురించీ జోసెఫ్ క్యాంప్ బెల్ తన ‘Occidental Mythology’లో రాస్తూ, అక్కడ వర్ధిల్లిన ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు అనంతరకాలపు కెల్టిక్ పురాణ కథలలోకి ప్రవేశించాయంటారు. అది మనకిక్కడ చాలా ముఖ్యమైన వ్యాఖ్య. కెల్టిక్ పురాణ కథల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పితృస్వామిక పురాణ కథలు అన్నిటా ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు తొంగి చూస్తూనే ఉంటాయి.

మహాభారతం కూడా మినహాయింపు కాదు. ఇందులో చాలాచోట్ల ఆ అవశేషాలు సూచనగానే కాక వాచ్యంగా కూడా కనిపిస్తాయి.

తపతి-సంవరణుల కథ గురించి ఈ కోణం నుంచి ఇప్పటికే కొంత చర్చించాం. సంవరణుడు తపతిని పెళ్లి చేసుకున్నాక పన్నెండేళ్ళు ఆమెతోనే అడవిలో ఎందుకు ఉండిపోయాడు. ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుందన్న ప్రశ్నలు మిగిలిపోయాయి. కథకుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. మాతృస్వామ్య సంప్రదాయం ప్రకారం సంవరణుడు ‘ఇల్లరికం’ ఉన్నాడా అన్న సందేహం కలుగుతుంది. దానిని ప్రస్తుతానికి సందేహంగా మాత్రమే వదిలేస్తాను. ఈ పన్నెండేళ్ళ కాపురంలో తపతి-సంవరణులకు సంతానమే కలగలేదా, వారిని హస్తినాపురం తీసుకువెళ్లాకే వారికి కొడుకు పుట్టడం ఏమిటనే ప్రశ్నలూ కలుగుతాయి. కథకుడు విడిచిపెట్టిన ఈ ఖాళీలను పూరించుకోడానికి ‘పర్వ’ నవలలో భైరప్ప చేసిన అన్వయం ఏమైనా ఉపకరిస్తుందా?!

ఇలాంటి సంబంధాలలో సంతానం మీద హక్కును స్త్రీ-పురుషులు పంచుకుంటారు. అందుకు సంబంధించి ముందే ఒక ఒప్పందం చేసుకుంటారు. సంవరణుడు తన దగ్గర ఇల్లరికం ఉన్నప్పుడు కలిగిన సంతానం తపతికి, అంటే తపతి తెగకు చెందుతుంది. ఆ తర్వాత సంవరణుని కోరిక ప్రకారం ఒక కొడుకుని కని ఇచ్చింది. గంగా-శంతనుల కథలో జరిగింది చూడండి, గంగ ఏడుగురు కొడుకుల్ని తన దగ్గరే ఉంచుకుంది. భీష్ముని ఒక్కడినీ శంతనుడికి ఇచ్చింది. తపతీ-సంవరణులు హస్తినాపురం వచ్చాకే కురుడు పుట్టాడని చెప్పడంలో కథకుడు పితృస్వామిక హక్కును స్థాపిస్తున్నాడు. పన్నెండేళ్లలో ఏం జరిగిందో చెప్పకుండా మాతృస్వామ్య హక్కును మరుగుపరుస్తున్నాడు!

మరో అంశంతో మళ్ళీ వారం…

 – కల్లూరి భాస్కరం

 

ఒక చెహోవ్ కథలోంచి ఐరిష్ కథలోకి….

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు. సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

 

నాకు ఎంతో ఇష్టుడైన రష్యన్ కథారచయిత యాంటన్ చెహోవ్ రాసిన కథ ఒకటుంది…

దాని ఇంగ్లీష్ అనువాదం శీర్షిక, THE MAN WHO LIVED IN A SHELL. ‘గుల్లలో జీవించిన మనిషి’ అని మనం అనువదించుకోవచ్చు. కొంచెం సంక్షిప్తం చేయాలనుకుంటే ‘గుల్ల మనిషి’ అన్నా అనచ్చు.

పైకి చాలా సీరియస్ గా చెబుతున్నట్టు అనిపించే ఈ కథ అడుగడుగునా హాస్యాన్ని పండిస్తూ పోతుంది. ఆ హాస్యంలో అంతర్లీనంగా విషాదమూ, బీభత్సమూ ఉన్నాయేమో కూడా. ఇద్దరు మిత్రులు ఉబుసుపోకకు చెప్పుకునే కబుర్లనుంచి ఈ కథ మొదలవుతుంది. ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

anton-chekhov-006

‘ప్రకృతిరీత్యానే తమలో తాము ముడుచుకుపోయి జీవించేవారు చాలామంది ఉంటారు. నత్త తన గుల్లలో మొహం దాచుకున్నట్టు వీళ్ళు కూడా మొహం దాచుకుంటూ ఉంటారు. మనిషి సామాజిక జీవి కాకముందు గుహల్లో ఏకాంతవాసం చేసిన కాలానికి వీరు తిరోగమించేవారిలా కనిపిస్తారు. నేను నేచురలిస్టును కాదు కనుక, మనుషుల్లో ఇలాంటి జీవులు కూడా ఒక రకమా అన్నది చెప్పలేకపోతున్నాను’ అంటూ మిత్రుడు కథ ప్రారంభించి, తనకు తెలిసిన అలాంటి ఒక జీవి గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

అతని పేరు బెలికోవ్. అతను ఓ గ్రామంలోని స్కూలులో గ్రీకు భాషను బోధించే ఉపాధ్యాయుడు. నడి వయసు మనిషి. బయటి వాతావరణం ఎంత బాగున్నా సరే అతను గొడుగు వేసుకునే వెడతాడు. మంచులో నడిచేటప్పుడు వేసుకునే బరువైన బూట్లే సర్వకాలాలలోనూ  వేసుకుంటాడు. పెద్ద కోటుతో ఒంటి నంతటినీ కప్పుకుంటాడు. కళ్ళకు నల్లని అద్దాలు ధరిస్తాడు. చెవుల్లో దూది పెట్టుకుంటాడు.

గొడుగును అతను ఓ కేసులో ఉంచుకుంటాడు. అతని వాచీకి కూడా ఒక తొడుగు ఉంటుంది. పెన్సిల్ చెక్కడానికి చిన్నపాటి చాకును ఒక కేసులోంచి బయటకు తీస్తాడు. ఆయన ముఖం కూడా ఒక కేసులో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే, ఆయన కోటు కాలర్ ను ముడుచుకోడు,  పైకి తెరచిపెట్టి ఉంచుకుంటాడు. దాంతో ఆ కాలర్ అతని ముఖానికి ఓ తొడుగులా ఉంటుంది. ఆయన గుర్రబ్బండిలో ఎక్కడికైనా వెడుతున్నప్పుడు తప్పనిసరిగా గూడు వేయవలసిందే. ఆయన పడుకునే గది కూడా ఒక పెట్టెలా ఉంటుంది. గాలి కొంచెం కూడా చొరడానికి వీలులేకుండా తలుపులు బిగించుకుంటాడు. పాదాల నుంచి మొహంవరకూ దుప్పటి కప్పుకుంటాడు.

చివరికి తన ఆలోచనలను కూడా ఆయన ఒక కేసులో పెట్టుకుంటాడు. స్కూల్లో అప్పుడప్పుడు వచ్చే సర్క్యులర్లలోనూ, వార్తాపత్రికల్లోనూ కనిపించే నిషేధాల సమాచారం మీదే ముందస్తుగా ఆయన దృష్టి పడుతూ ఉంటుంది. నిషేధాలే ఆయనకు అమితమైన ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అవే ఆయనకు అర్థమవుతూ ఉంటాయి. విద్యార్థులు రాత్రి తొమ్మిది తర్వాత వీథుల్లో తిరగడాన్ని నిషేధిస్తూ ఏదైనా సర్క్యులర్ వచ్చినా , ఏదైనా పత్రికలో సెక్స్ విషయాలపై వచ్చిన ఓ వ్యాసాన్ని ఖండించవలసివచ్చినా ఆయన ఆలోచనలు ఎంతో తేటగానూ, సూటిగానూ ఉంటాయి. ఇలాంటివి ఎప్పటికీ నిషేధించితీరవలసినవే!

ఎవరైనా ఒక మంచి పని తలపెట్టినా సరే, ఆయన మొట్టమొదటగా దానినుంచి కీడునే శంకిస్తాడు. ‘దీని వల్ల ఎటువంటి చెడూ జరగకుండుగాక!’ అని ఆకాంక్షిస్తాడు.

ఈ గుల్ల మనిషి గురించి ఇలా చెప్పుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచి అసలు విషయానికి వస్తే, ఆయన పనిచేసే స్కూలుకి చరిత్ర బోధించే ఒక ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతనికి ఓ పెళ్లి కాని సోదరి ఉంది. ఆమె పేరు వర్వా. వయసు ముప్పై దాటింది. గుల్ల మనిషి లానే ఆమె కూడా తేడా మనిషి. కాకపోతే ఒకరికొకరు  భిన్న ధ్రువాలు. ఆమె ఎప్పుడూ గల గలా మాట్లాడుతూ ఉంటుంది. ఉండి ఉండి అట్టహాసంగా నవ్వుతుంది. ఉక్రెయిన్ పాటలు గొంతెత్తి పాడుతూ ఉంటుంది.

అలా ఉండగా, వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారు. ఒకే చోట పక్క పక్కనే కూర్చున్నారు. ఆమె ఓ ఉక్రెయిన్ పాట పాడింది. మీ ఉక్రెయిన్ పాట గ్రీకు భాషలానే శ్రావ్యంగా ఉందని ఆయన అన్నాడు. దాంతో ఆమె ఉత్సాహంగా మరికొన్ని పాటలు పాడింది.

ఈ విచిత్రజీవులిద్దరూ పక్క పక్కన కూచున్న దృశ్యాన్ని మిగిలిన ఆడవాళ్ళు కన్నార్పకుండా చూశారు. అంతలో వాళ్ళకు ఓ ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది! బెలికోవ్ కు పెళ్లి కాలేదన్న సంగతి ఇంతవరకు తమకు తట్టకపోవడం ఆ క్షణంలో వాళ్ళకే ఆశ్చర్య మనిపించింది.

నిజానికి బెలికోవ్ ఆడవాసనకు ఆమడ దూరంలో ఉంటాడు. అందుకే మగవంటమనిషిని పెట్టుకున్నాడు. ఏ కళనున్నాడో కానీ వర్వాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆమె ఫోటోను కూడా తన డ్రాయర్ మీద పెట్టుకున్నాడు. ఆమె ఇంటికి రాకపోకలూ, ఆమెతో మాటలూ సాగిస్తూ వచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఓ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కళ్ళు నులుముకుంటూ మళ్ళీ మళ్ళీ చూశాడు. జ్వరం వచ్చినట్టు అయిపోయింది. వర్వా సోదరుడు ఒక సైకిల్ మీద వస్తూ కనిపించాడు! అదే దారుణమనుకుంటే, వర్వా అతని వెనకే ఇంకో సైకిల్ మీద వస్తోంది!!! అతను సైకిలు తొక్కడమే తప్పు. ఆపైన ఆమె…!

సైకిలు ఆయన నిషేధిత వస్తువుల్లో ఒకటి. అదే కాదు, ఆధునికమైనవన్నీ ఆయనకు నిషిద్ధాలే.

ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళాడు. ఇదెక్కడి దారుణం అన్నాడు. సైకిల్ తొక్కడమే కాక, నువ్వు ఎంబ్రాయిడరీ చొక్కాలు కూడా వేసుకుంటున్నావు, ఎంత తప్పు అన్నాడు. అవి తప్పెలా అవుతాయని అతనన్నాడు. మాటా మాటా పెరిగింది. నీ సంగతి హెడ్ మాస్టర్ తో చెబుతానని బెలికోవ్ బెదిరించాడు. చిర్రెత్తిన అతను చెప్పుకొమంటూ బెలికోవ్ కాలర్ పుచ్చుకుని తోసేసాడు. బెలికోవ్ కింద పడిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన వర్వా ఆ దృశ్యం చూసి అలవాటుగా అట్టహాసంగా నవ్వేసింది.  బెలికోవ్ బిత్తరపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. టేబుల్ మీంచి ఆమె ఫోటో తీసేశాడు.

కానీ  ఆమె సైకిలు తొక్కుతున్న దృశ్యాన్ని మాత్రం మనసులోంచి తీసేయలేకపోయాడు. అది కలిగించిన షాకునుంచి ఎప్పటికీ తేరుకోలేకపోయాడు. ఆ రోజే మంచం పట్టాడు.  రోజు రోజుకీ కృశించిపోయాడు. నెల రోజులకు కన్నుమూశాడు!

***

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు.

సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని  తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

ఇక్కడి నుంచి మనం ఓసారి కాలంలో వెనక్కి వెడదాం. అది కూడా 4,500 సంవత్సరాల వెనక్కి! అప్పుడు స్త్రీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా బెలికోవ్ లాంటి వారికి స్త్రీ సైకిల్ తొక్కడాన్ని మించిన తీవ్ర సాంస్కృతిక ఆఘాతమే.

నా ఉద్దేశంలో, కాలగతిలో అనేక ఆటుపోట్లకు, వడపోతకు గురవుతూనే కాలపరీక్షను తట్టుకుని ఎదైతే నిలబడి ఉందో అదే నిక్కమైన సాంప్రదాయిక విలువ. ఆ విలువను ఏదీ ధ్వంసం చేయలేదు. అది అన్ని కాలాలకూ, సమాజాలకూ చెందిన మానవాళి ఉమ్మడి విలువ.

***

కాలంలో వెనక్కి వెళ్ళి చెప్పుకోవలసిన కథే, నేను కిందటి వ్యాసం చివరిలో ప్రస్తావించిన ‘Mother Right’ గురించిన పురాతన ఐరిష్ కథ:

***

ఐర్లాండ్ రాజు ఎచాయిడ్ కు ఆరుగురు కూతుళ్ళు. వారిలో మీవే ఒకతె. ఆమె ఎంతోమంది రాకుమారులను కాదని కెల్టిక్ జాతీయుడు, లెయిన్ స్టర్ కు చెందిన అయిలిల్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఓ రోజు రాత్రి ఆ జంట క్రౌచాన్ అనే చోట ఉన్న తమ కోటలోని అంతఃపురంలో తమ పడకగదిలో విశ్రమించడానికి ఉపక్రమించారు. వారిమధ్య ఎంతో ప్రశాంతత, ఉల్లాసం వెల్లివిరుస్తున్న ఆ సరసమైన క్షణాలలో…

ఉన్నవాడు ఊరుకోకుండా అయిలిల్ ఓ విరసపు సంభాషణకు తెరతీశాడు:

“ఒక ఉత్తముడి భార్య ఉత్తమురాలే అవుతుందని నానుడి. అది నిజమే” అన్నాడు.

“ఆ నానుడికీ నీకూ ఏమిటి సంబంధం?” అని మీవే అడిగింది.

“ఏమిటి సంబంధమంటే, మన పెళ్ళైన రోజుకీ, ఇప్పటికీ చూస్తే నువ్విప్పుడు ఉత్తమ స్త్రీవి అయ్యావు” అన్నాడు అయిలిల్.

“అబద్ధం. నిన్నసలు చూడకముందు కూడా నేను ఉత్తమురాలినే”, అంది మీవే.

“నీ మాట విచిత్రంగా ఉంది. పెళ్ళికి ముందు నువ్వు ఉత్తమురాలివనే మాట నేను ఇంతవరకు ఎవరి నోటా వినలేదు. ఆడదానిగా నీ తళుకు బెళుకులనే నువ్వు నమ్ముకుంటూ వచ్చావనీ, శత్రువులు నీ సరిహద్దుల్లోకి చొరబడి నీ సంపదనంతా యథేచ్ఛగా దోచుకుపోయేవారనే విన్నాను” అన్నాడు అయిలిల్.

ఇక అప్పుడు మీవే అతని మాటకు మాట అప్పజెప్పడం ప్రారంభించింది.

“నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. మా నాన్నకు పుట్టిన ఆరుగురు కూతుళ్లలో నేనే గొప్పదాన్ని. నన్నే అంతా ఎక్కువగా ఆరాధించేవారు. మా నాన్న నాకే ఎక్కువ వైభవాన్ని కట్టబెట్టాడు. యుద్ధాలలో కూడా నేనే గొప్ప. నా చేతికింద మూడువేల మంది రాచయోధులు కిరాయికి ఉండేవారు. అందరూ సర్దారుల కొడుకులే. వాళ్ళలో ఒక్కొక్కరి కింద మళ్ళీ పదిమంది యోధులు ఉండేవారు. మళ్ళీ వాళ్ళలో ఒక్కొక్కరి కింద ఎనిమిది మంది యోధులు ఉండేవారు. మళ్ళీ ఆ ఎనిమిది మందిలోనూ ఒక్కొక్కరికి ఏడుగురు చొప్పున, ఆ ఏడుగురికీ ఆరుగురు చొప్పున…ఇలా యోధులు ఉండేవారు. వీళ్ళంతా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేలా అందుబాటులో ఉండేవాళ్లు. అందుకే మా నాన్న తన ఐర్లాండ్ రాజ్యంలోని క్రౌచాన్ అనే ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు. అందుకే నన్ను అంతా ‘క్రౌచాన్ రాణీ మీవే’ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది నా క్రౌచాన్ రాజ్యం లోనే….

ఆ తర్వాత ఏమైందంటే, నన్ను పెళ్లాడతానంటూ నీతో సహా ఏడుగురు రాజులు కబురు పంపారు. నేను మిగిలిన వాళ్లందరినీ తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నేను వధువుకు చెల్లించే కట్నం కింద ఏ ఆడదీ ఏ మగవాడినుంచీ కోరుకోని ఒక విచిత్రమైన కట్నాన్ని కోరుకున్నాను. అదేమిటంటే, నాకు కాబోయే మొగుడు పిసినారిగా ఉండకూడదు, అతనిలో అసూయ ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు…

నేనిలా ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా మొగుడు ఉదారుడు అయితేనే అతనిని మించిన ఔదార్యం నాకుందని  నిరూపించుకోవడానికి వీలవుతుంది. అతడు పిసినారి అయితే ఆ అవకాశం ఉండదు. అది సమవుజ్జీల మధ్య పోటీ అవదు. అలాగే, అతను పిరికివాడు అయితే, యుద్ధాలలో అతనిని మించిన విజేతను నేనే ననిపించుకోవడం కుదరదు. ఇక నాకు కాబోయే మొగుడిలో అసూయ ఉండకూడదని నేను ఎందుకు కోరుకున్నానంటే, నాకు అందుబాటులో ఒక మగవాడు, అతని వెనక్కాల ఇంకో మగవాడు లేకుండా నేను ఎప్పుడూ లేను. నీలో నేను కోరుకున్న ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను…

అదీగాక, నీకు పెళ్లి కానుకల కింది ఒక ఆడదాని హోదాకు తగినవన్నీ ఇచ్చాను. నీకు వినోదం కలిగించడానికీ, నీకు దుస్తులు అలంకరించడానికీ పన్నెండుగురు మగవాళ్ళను ఇచ్చాను. ఇరవయ్యొక్క బానిస కన్యల విలువ చేసే యుద్ధ రథాన్ని ఇచ్చాను. నీ మొహం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పున ఎర్రని బంగారం ఇచ్చాను. నీ ఎడమ మోచేయి బరువుకు తూగే తెల్ల కంచు(తగరం)ను ఇచ్చాను. ఇవి ఎందుకు ఇచ్చానంటే, నీకు ఎవరివల్లనైనా మానభంగం జరగచ్చు, అవయవలోపం కలగచ్చు, నిన్ను ఎవరైనా మోసం చేయచ్చు. అప్పుడు వాటికి బీమా కానీ, నష్టపరిహారం కానీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నీ మానాన్ని నేను ముందే కొనేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నా లోదుస్తుల  సేవలకు ఉపయోగపడే పింఛనీ(petticoat pensioner)వి మాత్రమే.”

ఈవిధంగా ఆమె తనను కడిగివిడిచిపెట్టడంతో మొహం కందగడ్డలా అయిపోయిన అయిలిల్, “అయితే, నీ ఆస్తి ఎంతో, నా ఆస్తి ఎంతో పోల్చి చూసుకుందాం, పద” అన్నాడు రోషంతో. ఆమె అంగీకరించింది.

ఇద్దరి ఆస్తులను విడివిడిగా ప్రదర్శనకు పెట్టారు. వాటిలో పానపాత్రలు, ఇనప సామగ్రి, కుండలు, గుండిగలు, బీరువాల దగ్గరనుంచి; బంగారు ఉంగరాలు, గాజులు, రకరకాల ఆభరణాలు, రంగు రంగుల దుస్తుల వరకూ సమస్తం ఉన్నాయి. ఆ తర్వాత అసంఖ్యాకంగా ఉన్న గొర్రెల మందల్ని, గుర్రాలను, పందులను కూడా రప్పించి బేరీజు వేశారు. ఇవన్నీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయని తేలింది.

అయితే, పశువుల మందల్ని బేరీజు వేస్తున్నప్పుడు, అయిలిల్ మందలో ఉన్న ఒక ఎద్దు మీద మీవే దృష్టిపడింది. దాన్ని చూడగానే ఆమె మొహం వెలవెల పోయింది. అది భారీగానూ, మంచి దర్పంగానూ ఉంది. దాని కొమ్ములు తెల్లగా ఉన్నాయి. మీవే మందలో దానితో పోల్చదగిన ఎద్దు ఒక్కటి కూడా లేదు. నిజానికి అది లేగగా ఉన్నప్పుడు మీవే మందలోనే ఉండేది. కానీ ఆడదాని మందలో ఉండడానికి నామోషీపడి అయిలిల్ మందలోకి ఫిరాయించింది.

మొగుడి ఆస్తీ, తన ఆస్తీ సమానం కావన్న సంగతి దానితో అర్థమై మీవేకు తల కొట్టేసినట్టు అయింది. అలాంటి ఎద్దు తన మందలో లేనప్పుడు తన ఆస్తి గులకరాయి పాటి కూడా చేయదనుకుంది.

వెంటనే మాక్ రాత్ అనే తన వార్తాహరుణ్ణి పిలిపించింది. ఐర్లాండ్ లోని ఏ ప్రాంతంలో నైనా అలాంటి తెల్ల కొమ్ముల ఎద్దు  ఉందా అని అడిగింది.

“ఎందుకు లేదు? దానికి రెట్టింపు పరిమాణంలో, అంతకంటే ఠీవిగా ఉండే ఎద్దు, కూలీ అనే ప్రాంతంలో డైరే అనే అతని దగ్గర ఉంది” అని అతను అన్నాడు.

“అయితే వెంటనే బయలుదేరి వెళ్ళు. తన ఎద్దును ఒక ఏడాదిపాటు నాకు ఎరువు ఇస్తాడేమో అడుగు. ఏడాది తర్వాత అతనికి వడ్డీ కింద ఆ ఎద్దుతోపాటు యాభై ఆవుల్ని కూడా ఇస్తాను. ఒకవేళ అంత అమూల్యమైన వస్తువును కొద్దికాలమైనా బయటకు పంపడం అశుభం అని అతనున్న చోట ఎవరైనా అభ్యంతరం పెడితే, ఎద్దుతో సహా అతనే ఇక్కడికి రావచ్చు. అతనికి అక్కడ ఎంత జమీ ఉందో అంత జమీ ఇక్కడే ఇచ్చి, ఇక్కడే స్థిరపడేలా చేస్తాను. దానికి అదనంగా ఇరవయ్యొక్కమంది బానిస కన్యల విలువచేసే రథం ఇస్తాను. అంతేకాదు, నా కటిభాగం(upper thighs)తో అతన్ని స్నేహం చేసుకోనిస్తాను” అని మీవే అంది.

మాక్ రాత్ వెళ్ళి డైరేను కలిశాడు. మీవే చెప్పినవన్నీ చెప్పాడు. డైరే ఎగిరి గంతేశాడు. అయితే, ఒక ఆడదానికి భయపడి ఎద్దును ఇవ్వడానికి ఒప్పుకున్నావంటూ డైరేను అతని సాటివాళ్లు నిందించారు. దాంతో పౌరుషానికి పోయిన డైరే, ఎద్దును ఇవ్వడానికి తిరస్కరించాడు.

అప్పుడు మీవే సైన్యంతో వెళ్ళి అతని మీద దాడి చేసి ఎద్దును ఎత్తుకు వచ్చింది.

***

ఈ కథకుగల పురాచారిత్రక నేపథ్యం గురించీ, ఇతర విశేషాల గురించీ తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

పాండవులు ‘కౌరవులు’ ఎందుకు కారు?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయి, తపతితో కాపురం చేయడం; అక్కడ అతని రాజ్యంలో అనావృష్టి ఏర్పడడం, అప్పుడు వశిష్టుడు వచ్చి దంపతులు ఇద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లడం, దాంతో అనావృష్టి దోషం తొలగి పోవడం గురించి చెప్పి, చివరిగా…

‘అంత సంవరణునకుం దపతికిం దాపత్యుండై కురువంశకరుడు కురుండు పుట్టె, నది మొదలుగా మీరు దాపత్యుల రయితిరి’ అని గంధర్వుడు చెప్పాడు.

ఈ చివరి వాక్యంలో కథకుని గొంతు, గంధర్వుని గొంతు విడివిడిగా మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి చూడండి…అంతే కాదు, ఉభయులూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్నారని కూడా ఈ వాక్యం చెబుతోంది. సంవరణునికీ తపతికీ ‘తాపత్యుడు’గా కురుడు పుట్టాడని చెప్పడం గంధర్వుని ప్రయోజనం అయితే, ఆ వెంటనే ‘కురువంశకరుడు’ పుట్టాడని చెప్పడం కథకుని ప్రయోజనం. మీరు తాపత్యవంశీకులు అంటూ మొదట శృతి చేసింది గంధర్వుడే కనుక, తపతీ సంవరణులకు కురుడు పుట్టినప్పటినుంచీ మీరు తాపత్యవంశీకులు అయ్యారన్న మాటతో అతనే కథనానికి ముగింపు చెపుతున్నాడు.

మొత్తం మీద ఈ ఘట్టం కథకుడికీ, ఆదివాసీ గంధర్వుడికీ మధ్య సయోధ్య, సర్దుబాటు ఎలా ఏర్పడ్డాయో, ఇద్దరూ ఎలా ‘రాజీ’ పడ్డారో కూడా చెబుతోంది. ఇలా రాజీ పడడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వివిధ తెగలు, వాటికి గల వేర్వేరు ప్రయోజనాలు, వేర్వేరు విశ్వాసాలు, వేర్వేరు ఆరాధనా పద్ధతుల మధ్య సంఘర్షణ జరగడం, చివరికి రాజీపడడం భారతదేశ పురాచరిత్ర, చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. భౌగోళిక స్థితీ, విస్తారమైన వనరుల అందుబాటు మొదలైన కారణాల వల్ల భారతదేశానికి స్వభావ సిద్ధంగా సంక్రమించిన గుణం అది.  కోశాంబీ చేసిన విలువైన ప్రతిపాదనలలో ఇది ఒకటి.

వ్యక్తుల ముఖతా వ్యక్తమవుతున్న ఈ రాజీని వారు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలకు ఆపాదించి చూడండి…మీరు తాపత్యవంశీకులు అని పాండవులకు నొక్కి చెబుతున్న గంధర్వుడు మాతృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, కురువంశకరుడుగా కురుడు పుట్టాడని చెబుతున్న కథకుడు పితృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మానవజీవన ప్రస్థానంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లడం ఒక గొప్ప మలుపు అనుకుంటే, ఆ పరివర్తన క్రమంలో ఒక దశలో ఉభయవ్యవస్థలూ రాజీ పడడం, అంటే రెండు రకాల గుర్తింపులనూ ఆమోదించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదే జరిగిందనడానికి, మన దగ్గరే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి కూడా.

బహుశా తపతీ-సంవరణుల కథ ఆ దశకు చెందినదే!!!

అందులోకి మరింత లోతుగా వెళ్లబోయే ముందు, మరో ముఖ్యమైన అంశం గురించి చెప్పుకుని, కిందటి వ్యాసం చివరిలో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వెడదాం.

మీరు తాపత్యవంశీకులని గంధర్వుడు పాండవులకు అంత గుచ్చి గుచ్చి ఎందుకు చెబుతున్నాడు? తపతి తమ ఆదివాసుల ఆడబడచు కనుక, ఆవిధంగా మనకు చుట్టరికం ఉందని చెప్పడం ఒక ఉద్దేశం. ఆ చుట్టరికం కారణంగానే అర్జునునికి చాక్షుసి అనే విద్యనూ, పాండవులందరికీ గుర్రాలనూ ఇవ్వజూపాడు.  చాలా కాలానికి కలసుకున్న గణబంధువులు ఒకరి కొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకునే గణసంప్రదాయాన్ని కూడా అది వ్యక్తీకరిస్తూ ఉండచ్చు. అంతకు మించి, మీరు తాపత్యవంశీకులు, అంటే తపతి పరంపరకు చెందినవారే తప్ప కురుని పరంపరకు చెందినవారు కారని నొక్కి మరీ చెప్పే ఒకవిధమైన పట్టుదల గంధర్వుడి మాటల్లో ధ్వనిస్తోంది.

Arjuna_and_His_Charioteer_Krishna_Confront_Karna

కురువంశీకులుగా పాండవులు కూడా కౌరవులే అవుతారు. కానీ, కౌరవులుగా దుర్యోధనుడు, అతని సోదరులు మాత్రమే గుర్తింపు పొందుతున్నారు. పాండవులకు ఆ గుర్తింపు లేదని చెప్పడానికి గంధర్వుడు మీరు తాపత్యవంశీకులని ప్రత్యేకించి చెబుతున్నాడా?!

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది. నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా. అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో. ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే. ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు. ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి. పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది.  నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా.  అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో.  ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే.

ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు.

ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి.

పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

చూసారా, విషయం ఎన్ని లోతుల్లోకి వెళ్లిపోతోందో! అనుకోకుండా కీ ఇచ్చి విడిచిపెట్టిన కారు బొమ్మలా నా ‘కీబోర్డు’ మీద ఈ విషయాలు వాటంతట అవే పరుగు పెడుతున్నాయి. ఈ పరుగుకు అర్జెంటుగా కళ్ళెం వేయాల్సిందే. సమస్యేమిటంటే, ఇంత గంభీరమైన విషయంలోకి పూర్తిగా తలదూర్చడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను. అయితే, చాపల్యం అలాంటిది….ఎలాగూ మునిగాను కనుక, ఈ చర్చనుంచి పక్కకు తప్పుకునే ముందు చివరిగా ఒక్క ఆసక్తికరమైన పరిశీలనను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

అదేమిటంటే, పైతృకమైన ఆస్తికి అర్హత ప్రశ్నార్థకం అయినది పాండవులు ఒక్కరి విషయంలోనేనా?… కాదు, అదే వంశంలో, వారికి సమకాలికంగానే మరొకరు ఉన్నారు…ఆయన భీష్ముడు!

అవును, భీష్ముడే. పాండవులు కౌంతేయు లైనట్టే భీష్ముడు గాంగేయుడు. అంటే, గంగ కుమారుడు. పాండవులలానే అతడు కూడా భరతవీరుడే, అందుకు అభ్యంతరం లేదు. భరతవంశస్థు డనేది ఒక విశాలమైన గుర్తింపు. కౌరవులనేది అలా కాదు. అది, ఒక నిర్దిష్టమైన గుర్తింపుగా కనిపిస్తుంది.  కనుక కౌంతేయులైన పాండవులలానే, గాంగేయుడైన  భీష్ముడు కూడా ‘కౌరవుడు’ కాడనే అనుకోవాలి. నేను ఆ దృష్టితో మహాభారతాన్ని పరిశీలించలేదు కనుక, భీష్ముని కానీ, పాండవులను కానీ కౌరవ్యులుగా ఎక్కడైనా పేర్కొన్నారా, పేర్కొని ఉంటే ఎన్నిసార్లు పేర్కొన్నారనేది చెప్పలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఆదిపర్వంలోని కొన్ని పేజీలను తిరగేస్తే భీష్ముని చాలాసార్లు గాంగేయుడిగానూ, ఒక్కసారి మాత్రం ‘పౌరవ్యుడి’గానూ పేర్కొనడం కనిపించింది…

చూడబోతే, ఈ గుర్తింపుల వ్యవహారం అంత సాదా సీదాగా తేలేలా కనిపించడం లేదు. ఇందులో చాలా మతలబులే ఉన్నాయనిపిస్తోంది.

ఇంతకీ కురుడు వంశకర్తగా కౌరవులు అనే పేరు ఏర్పడినతర్వాత ఎన్ని తరాలు గడిచాయో చూద్దామని లెక్క వేశాను. కురుడి నుంచి పాండవుల దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది తరాలు మాత్రమే గడిచాయి. ఈ మధ్యలో వంశకర్తలు ఎవరూ లేరు. మహాభారతం పాండవులనే ఒక వంశంగా చెబుతోంది. అంటే కురుని తర్వాత పాండురాజే వంశకర్త అయ్యాడన్నమాట.  ఆ వంశంలో ప్రసిద్ధుడైన చివరి రాజు జనమేజయునికి కథ చెబుతున్న కథకుడు, జనమేజయుని  వరకూ సుదీర్ఘవంశక్రమాన్ని వివరించిన తర్వాత చివరిగా ఆ మొత్తం వంశాలను అయిదుగా వర్గీకరిస్తున్నాడు.

అవి: 1. ఐలులు 2. పౌరవులు 3. భరతులు 4. కౌరవులు 5. పాండవులు.

అసలు ఈ వంశక్రమాన్ని వివరించడం లోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని మరో సందర్భానికి వాయిదా వేస్తాను. పాండవులు, కౌరవుల కాలానికి వచ్చేసరికి, వారికి తొమ్మిది తరాల వెనకటివాడైన కురుని పేరిట ఏర్పడిన ‘కౌరవు’లనే వంశనామమే చలామణిలో ఉంది. అదే అధికారిక వంశనామం కూడా. బహుశా అదే అప్పటికి నిష్కళంకమైన వంశ నామం కూడా. ఎందుకంటే, కురునితో మొదలు పెట్టి ప్రతీపుని వరకూ…అనగా ఏడు తరాలపాటు ఆ వంశంలోని రాజుల వైవాహిక సంబంధాలలో ‘విలక్షణత’ ఏమీ లేదు. మాతృస్వామ్య/పితృస్వామ్య కోణంలో చెప్పుకోవాలంటే అవి పితృస్వామిక సంబంధాలే కాక, బహుశా సజాతి సంబంధాలు. ఆవిధంగా కురువంశం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటిది.

కానీ ప్రతీపుని కొడుకు శంతనుని దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడింది. శంతనుడు గంగా తీరానికి వేటకు వెళ్లినప్పుడు గంగ అందమైన స్త్రీ రూపంలో అతనికి కనిపించింది. ఆమె పట్ల అతను ఆకర్షితుడై తనను చేపట్టవలసిందని ప్రతిపాదించాడు. అందుకామె షరతులు పెట్టింది. అతనివల్ల తనకు కలిగిన సంతానాన్ని తను ఏం చేసినా అతను అడ్డు చెప్పకూడదు! అడ్డు చెప్పిన తక్షణం తను అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఆమె అందానికి బందీ అయిపోయిన శంతనుడు ఒప్పుకున్నాడు. ఆమె తనకు కలిగిన ఒక్కొక్క సంతానాన్నే గంగపాలు చేస్తూ వచ్చింది. కష్టమనిపించినా షరతుకు కట్టుబడి శంతనుడు అడ్డు చెప్పలేకపోయాడు. ఏడుగురు కొడుకుల్ని అలా చేసిన తర్వాత, ఎనిమిదో కొడుకు విషయంలో ఊరుకోలేక పోయాడు. అడ్డు చెప్పాడు.  ఆ కొడుకును శంతనునికి అప్పగించేసి షరతు ప్రకారం గంగ అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతడే భీష్ముడు… గాంగేయుడు!

ఈ కథ పూర్తి వివరాలలోకి నేనిప్పుడు వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, గంగా తీరంలో నీకు ఒక స్త్రీ కనిపిస్తుందనీ, ఆమె కులగోత్రాలు ఏమిటని అడగకుండా ఆమెను పెళ్లి చేసుకోమనీ తండ్రి ప్రతీపుడే శంతనునికి చెప్పడం. కుల గోత్రాలు అడగవద్దు అనడంలో ఆమెది సందేహాస్పద నేపథ్యం అన్న సంగతిని కథకుడే అమాయకంగా బయట పెడుతున్నాడు.  మళ్ళీ, తండ్రే ఆమెను చేసుకోమన్నాడని చెప్పడం ద్వారా దానిని పెద్దలు కుదిర్చిన సంబంధంగా, ఇంకా చెప్పాలంటే పితృస్వామిక వివాహంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దానినలా ఉంచితే, గంగా-శంతనుల వివాహం, తపతీ-సంవరణుల వివాహం లాంటిదే. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే అది కూడా మాతృస్వామిక వివాహం.

కనుక, గాంగేయుడైన భీష్ముడు కౌంతేయులైన పాండవుల్లానే కౌరవుడు కాదు, కావడానికి వీల్లేదు. ఆ విధంగా అతను సింహాసనానికీ అర్హుడు కాదు. అతని సింహాసన త్యాగానికీ, తన వారసులు కూడా సింహాసనానికి పోటీదారులు కాకూడదనే ఉద్దేశంతో అతను పెళ్లి కూడా మానేయడానికీ కథకుడు ఎలాంటి కారణాలైనా చెప్పవచ్చు గాక… కురువంశ స్వచ్ఛతను, పితృస్వామిక విలువలను కాపాడాలంటే అతనిని సింహాసనానికీ, పెళ్లికీ కూడా దూరంగా ఉంచవలసిందే. ఎన్ని కట్టుదిట్టాలు చేసినా భీష్ముడు మాట తప్పుతాడనే భయం ఉండచ్చు కనుక, అతణ్ణి ఈ లోకానికే దూరం చేయడం మరింత మెరుగైన పరిష్కారం. కానీ అక్కడికి వచ్చేసరికి తండ్రి శంతనుడు చక్రం అడ్డేశాడు. అతనికి ‘స్వచ్ఛంద మరణం’ అనే వరం ఇచ్చాడు. స్వచ్చంద మరణం అంటే, నీ మరణం నీ చేతుల్లోనే ఉంటుంది తప్ప, ఇంకొకరు నీ ప్రాణం తీయరని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే నీకు సహజ మరణమే కలుగుతుందని శంతనుడు అభయమిచ్చాడన్న మాట.

గంగా తీరంలో గంగ కనబడినట్టే, శంతనునికి యమునా తీరంలో దాసరాజు కూతురు సత్యవతి కనిపించింది. ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. సత్యవతి అప్పటికే పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే కొడుకుని కంది. కనుక ఆమె మాతృస్వామ్యానికి చెందినది. అయితే, సత్యవతి గంగలా తానుగా శంతనునితో పెళ్ళికి షరతు పెట్టలేదు. ఆమె తండ్రి షరతు పెట్టాడు. అంటే ఆమె తెగ పితృస్వామ్యంలోకి మళ్లే సంధి దశలోనూ ఉందన్న మాట. ఆ షరతు కూడా, సత్యవతికి కలిగే కొడుకులే నీ అధికారానికి వారసులు కావాలని మాత్రమే.

ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే, గంగ శంతనుని ఇంటికి, అంటే హస్తినాపురానికి వచ్చి అతనితో కాపురం చేసినట్టు కథకుడు ఎక్కడా చెప్పలేదు. కానీ సత్యవతి హస్తినాపురం వచ్చి శంతనునితో కాపురం చేసింది. ఆమె వల్ల శంతనునికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కొంతకాలానికి శంతనుడు మరణించాడు.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది. భీష్ముడు ఒప్పుకోలేదు. ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే. విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట. వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది.  భీష్ముడు ఒప్పుకోలేదు.  ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే.  విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట.

వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

ఇప్పుడు మనం మళ్ళీ పాండవులు కౌరవులు ఎందుకు కారనే ప్రశ్న దగ్గరకు వస్తున్నాం. ధృతరాష్ట్రుడు అంధుడైతేనేం, ఇద్దరిలో పెద్దవాడుగా కురువంశ స్వచ్ఛతను, పితృస్వామికతను పునరుద్ధరించగల ఆశాకిరణంగా కనిపించాడు. పితృస్వామిక విలువలకు ప్రాతినిధ్యం వహించే సుబలుని కూతురు గాంధారిని ఇచ్చి అతనికి పెళ్లి చేశారు. ఆ విధంగా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతా, తద్వారా సింహాసనంపై హక్కును స్థాపించుకునే అవకాశమూ ధృతరాష్ట్రుడికి లభించాయి. పితృస్వామిక వివాహ ఫలితంగా అతనికి కలిగిన దుర్యోధనాదులకు కూడా ‘కౌరవులు’ అనిపించుకునే అర్హతా, దాంతోపాటే అధికారమూ సహజంగానే సంక్రమించాయి.

మాతృస్వామ్య నేపథ్యం ఉన్న కుంతిని పెళ్లాడడం ద్వారా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతను మొదట కోల్పోయింది పాండురాజు. ఆ తర్వాత తల్లి కుంతి ఆదేశంతో ద్రౌపదిని అయిదుగురూ పెళ్లి చేసుకుని మాతృస్వామ్య సంప్రదాయాన్ని పాటించడం ద్వారా పాండవులూ ఆ అర్హతను కోల్పోయారు. దాంతో, ‘కౌరవు’డిగానే కాక, పితృస్వామ్య ప్రతినిధిగా రాజ్యం మీద నాదే హక్కు అని దుర్యోధనుడు అన్నాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం కౌరవులన్న గుర్తింపుకు, పితృస్వామిక విలువలకు మధ్య జరిగిన పెనుగులాట. ఆ పెనుగులాటలో చివరికి పాండవులే గెలిచారు. అయినా సరే, వారికి ‘కౌరవు’ లన్న గుర్తింపు లభించే అవకాశం లేదు. కనుక పాండురాజునే వంశకర్తను చేసి పాండవులన్న గుర్తింపుకే వారు పరిమితమయ్యారు.

ఇక్కడే ఇంకో విశేషం కూడా చెప్పుకోవాలి. కురుని పేరుతోనే ఉన్న కురుక్షేత్రంలోనే యుద్ధం జరగడం, ఆ యుద్ధాన్ని ధర్మయుద్ధంగా, ఆ క్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా చెప్పడం; అది కురువంశం మీదా,తద్వారా అధికారం మీదా హక్కును స్థాపించుకోడానికి జరిగిన యుద్ధమన్న సంగతిని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయా?

విశేషమేమిటంటే, దుర్యోధనుడు యుద్ధంలో ఓడినా అతడు ప్రాతినిధ్యం వహించే పితృస్వామ్యం గెలిచింది.  ఎందుకంటే, అది అప్పటికి పురోగామి వ్యవస్థ. పాండవులు కూడా పితృస్వామ్యం వైపు క్రమంగా మళ్ళారు…

***

ఎన్నో లోతైన, గంభీరమైన విషయాలను ఈ చిన్న వ్యాసంలో చెప్పి వాటికి అన్యాయం చేసేనేమో నన్న అసంతృప్తి నన్ను బాధిస్తోంది. ఇవన్నీ చాలా విపులంగా చెప్పుకోవలసిన విషయాలు. ఎన్నో మౌలికమైన విషయాలలోకి నేను పూర్తిగా వెళ్లలేకపోయాను.  వాటినలా ఉంచితే, సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలో తపతి దగ్గరే ఎందుకు ఉండిపోయాడన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అందులోకి వెళ్లబోయే ముందు, పైన ‘Mother Right’ అనే ప్రస్తావన చేశాను కనుక, కాస్త రిలీఫ్ కోసం Mother Right గురించిన ఆసక్తికరమైన ఓ పురాతన ఐరిష్ కథ గురించి చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

ఒకే కథలో ధ్వనిస్తున్న రెండు గొంతులు

king samvarna

తపతి-సంవరణుల కథను మరీ లోతుగా అక్కర్లేదు, పై పైనే పరిశీలించండి…కొన్ని సందేహాలు కలుగుతాయి.

ఉదాహరణకు, తపతి కనుమరుగయ్యాక సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు, మంత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఉపచారాలు చేశాడు, సంవరణుడు అక్కడే ఉండిపోడానికి నిశ్చయించుకుని మంత్రిని, పరివారాన్ని పంపేశాడు. ఆ తర్వాత వశిష్టుని తలచుకున్నాడు.

సాధారణబుద్ధితో చూద్దాం. నిజానికి  సంవరణుడు వశిష్టుని తలచుకో నవసరమే లేదు. మంత్రితో వశిష్టునికి కబురు పెడితే చాలు. వాస్తవంగా అదే చేసి ఉంటాడు. కానీ కథకుడు ఇక్కడ సంవరణునికో, లేదా వశిష్టునికో, లేదా ఇద్దరికీనో ఒక మహిమను, మాంత్రికతను ఆపాదిస్తున్నాడు. అలా ఆపాదించడం అతనికి ఇష్టం!

కాకపోతే, ఆ ఆపాదించడం కూడా, అది  ‘ఆపాదన’ అనే సంగతి తెలిసిపోయేలా చేస్తున్నాడు.  ఆ తర్వాత వశిష్టుడు పన్నెండు రోజులకు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పడం ద్వారా కూడా అది ఆపాదన అనే సంగతి తెలిసిపోతూ ఉండచ్చు.

వశిష్టుడు వచ్చాడనీ, సంవరణుడు తపతి మీద మనసు పడిన సంగతిని యోగదృష్టితో తెలుసుకున్నాడనీ కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ యోగదృష్టి అవసరమా? ఎందుకంటే, తను తపతి మీద మనసుపడి ఆమెను పెళ్లాడదలచుకున్నాడు కనుక, అది జరిగేలా చూడడం కోసమే కదా వశిష్టునికి సంవరణుడు కబురుచేసింది? వశిష్టునికి ఆ విషయం తన నోటితోనే చెప్పి ఉండాలి కదా? వశిష్టుడు యోగదృష్టితో చూసి మరీ ఆ విషయం తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఏముందంటే, అలా చెప్పడం కథకునికి ఇష్టం!

ఆ తర్వాత చూడండి…వశిష్టుడు అప్పటికప్పుడు బయలుదేరి సూర్యమండలానికి వెళ్ళాడు. సంవరణుడు తలచుకోగానే పన్నెండు రోజులకు అతని దగ్గరకు వశిష్టుడు వెళ్లాడని చెప్పిన కథకుడు, ఆయన సూర్యమండలానికి ఎన్ని రోజుల్లో వెళ్లాడో, ఎలా వెళ్లాడో చెప్పలేదు. కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం, నిమిషానికి మూడువందల అరవైనాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పాడు. వెళ్ళేటప్పుడు అవసరం లేకపోయిన సూర్యరథం, వచ్చేటప్పుడు ఎందుకు అవసరమైందనే ప్రశ్న ఇక్కడ రావడం సహజమే. వశిష్టుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా, వచ్చేటప్పుడు మాత్రం సూర్యుడు అతని మీద గౌరవంతోనే కాక, తన హోదాకు తగినట్టుగా తన రథమిచ్చి కూతురితోపాటు పంపించాడా? లేక, వెళ్ళేటప్పుడు వశిష్టుడు తన మంత్రశక్తితో వెళ్ళినా, వచ్చేటప్పుడు తపతి కూడా తన వెంట కూడా ఉంది కనుక, ఆమెకు ఆ మంత్రశక్తి లేదు కనుక సూర్యరథంలో తిరిగి వచ్చాడా? అదే అయితే, సూర్యుని కూతురికి మంత్రశక్తి లేదని ఎలా అనుకోవాలి? లేక, పెళ్లి కూతురు కనుక ఆమెను రథంలో పంపించాలని సూర్యుడు అనుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం లేదు. అసలిలాంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా సింపుల్ గా చెప్పుకుంటే, వశిష్టుడు నిముషానికి మూడువందల అరవై నాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తిరిగి వచ్చాడని చెప్పడం…కథకునికి ఇష్టం!

కథకునికి ఇష్టం అన్నానా? చిన్న సవరణ. కథ వింటున్న శ్రోతలకూ అదే ఇష్టం. కథకుడు-శ్రోత ఇక్కడ ఒకరికొకరు పూర్తిగా అనురూపులు. అంటే ఒకరికొకరు అతికినట్టు సరిపోయేవారు. క్లుప్తంగా చెప్పాలంటే, తను తపతి మీద మనసుపడ్డాడని సంవరణుడు తన నోటితో వశిష్టుడంతటి వాడికి  చెబితే అది శ్రోతకు నచ్చదు. ఉప్పు కారం లేని వంటకంలా చప్పగా ఉంటుంది. కనుక వశిష్టుడు ఆ విషయాన్ని యోగదృష్టితో తెలుసుకున్నాడని చెబితేనే రంజుగా ఉంటుంది.

ఎలాగంటే…మహాభారతంలో అగస్త్యుడి కథ ఉంది. అగస్త్యుడు పరిసరాల పరిజ్ఞానం బాగా ఉన్నవాడు. దారీ తెన్నూ కనిపించని దుర్గమారణ్యాలు, ఆ అరణ్యాలలో ప్రమాదకరులైన తెగ జనాలు ఉండే ఆరోజుల్లో, అది చాలా విలువైన పరిజ్ఞానం. అగస్త్యుడు బహుశా వింధ్య దాటి దక్షిణాపథానికి వెళ్లడానికి అనువైన దారి కనిపెట్టిన ప్రథముడూ, లేదా ప్రముఖుడూ అయుంటాడు. అదే వింధ్యగర్వభంగం కథగా పురాణాలకు ఎక్కి ఉంటుంది. అగస్త్యుని పరిసరజ్ఞానాన్ని ధ్రువీకరించే మరో కథ కూడా ఉంది. అదేమిటంటే…కాలకేయులనే రాక్షసులు పగలు ‘సముద్రగర్భం’లో దాగి ఉంటూ రాత్రిపూట మున్యాశ్రమాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. వాళ్ళ బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. అగస్త్యుని ప్రార్థించమని బ్రహ్మ చెప్పాడు. వారు అలాగే చేశారు. అప్పుడు దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు వగైరాలను అగస్త్యుడు వెంటబెట్టుకుని వెళ్ళి కాలకేయులుండే చోటు చూపించాడు. అప్పుడు దేవతలు వాళ్లపై దాడి చేసినప్పుడు కొందరు చనిపోగా కొందరు పారిపోయారు.

కథకుడు ఈ కథ చెబుతున్నాడనుకోండి.  కథ మాంచి పట్టు మీద ఉన్నప్పుడు, ‘అగస్త్యుడు కాలకేయులు ఉండే చోటు దేవతలకు చూపించా’డని మాత్రమే చెబితే శ్రోతలకు నచ్చదు. అందులో ఒక అద్భుతత్వం, ఒక వైచిత్రి, ఒక మహిమ ఉండాలి. అందులోనూ ఎవరి గురించి చెబుతున్నాడు? అగస్త్యుడంతటి వాడి గురించి! కనుక అందులో పైన చెప్పినవి తప్పనిసరిగా ఉండవలసిందే. అందుకే ‘అగస్త్యుడు ఏకంగా సముద్రజలాలనే తాగేశాడనీ, దాంతో కాలకేయులు బయటపడ్డారనీ’ కథకుడు చెబుతాడు. అప్పుడు శ్రోతలు ‘ఆహా’ అంటారు.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు.

శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి.  ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు. శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి. ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

 

ఇప్పుడు మాంత్రిక శైలి దగ్గరికి మరోసారి వద్దాం. బక్కపలచని హీరోచేత దుక్కల్లా ఉన్న పదిమంది రౌడీలను ఒంటి చేత్తో చితకబాదించడం మన సాధారణ లాజిక్కుకు విరుద్ధమని సినీ దర్శకుడికి తెలుసు. అయితే, అలా తీసినప్పుడే సినిమా హాలు ఈలలతో దద్దరిల్లిపోతుందనీ తెలుసు. ఆవిధంగా సినిమా తీసేవాడికీ, ప్రేక్షకులకీ మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అదే కెమిస్ట్రీ పురాణకథకునికీ, శ్రోతకీ మధ్య కూడా ఉంటుంది. అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు కోరుకునే సినిమా రూపం ముందు లాజిక్కులేవీ పని చేయవని సినిమా వాళ్ళకు ఎలా తెలుసో, అత్యధిక సంఖ్యాకులైన శ్రోతలు కోరుకునే పురాణ కథారూపం ముందు లాజిక్కులేవీ పనిచేయవని నాటి కథకునికీ బహుశా అలాగే తెలుసు. చెప్పొచ్చేది ఏమిటంటే, సినిమాకు ఒక నిర్ణీత శైలీ, రూపమూ ఎలా ఉంటాయో అలాగే పురాణ కథకూ ఉంటాయి. రెండింటిలోనూ ఒక మాంత్రిక శైలి సమానంగా ఉంటుంది.

ఒక మాంత్రిక శైలి రెడీమేడ్ గా ఎప్పుడైతే ఉందో, దానిని అనేక ఇతరవిధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, వాస్తవాన్ని కప్పి పుచ్చడానికీ, లేదా ఒక అసత్యాన్ని చలామణిలో ఉంచడానికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఒక నాయకునికి లేని సుగుణాలను ఆపాదించి ఆకాశానికి ఎత్తవచ్చు. ఇంకో నాయకునికి లేని లోపాలు ఆపాదించి పాతాళానికి పడదొక్కవచ్చు. రాజకీయనాయకులనే చూడండి, ఎన్నికలముందు ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరించే మంత్రదండం తమ వద్ద ఉందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక తమ దగ్గర మంత్రదండం ఏమీ లేదని చేతులెత్తేస్తారు.

ప్రస్తుత తపతి-సంవరణుల కథలో కథకుడు రెడీమేడ్ గా ఉన్న మాంత్రికశైలినే యాంత్రికంగా వాడుకుని ఉండచ్చు. లేదా తపతి పెళ్లాడబోయేది, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని తండ్రి సంవరణుని కనుక, తపతి ఆదివాసీ గుర్తింపును మరుగుపుచ్చడానికి వాడుకుని ఉండచ్చు. లేదా వశిష్టుని మహిమను చాటడానికి వాడుకొని ఉండచ్చు. లేదా, తపతిని సూర్యుడి కూతురు అనడంలో సూర్యుడు అన్నది గణసంకేతం అని తెలియక సూర్యదేవుడి కూతురని చెప్పి ఉండచ్చు. ఒకవేళ తెలిసినా, పైన చెప్పినట్టు దానిని మరుగుపుచ్చడం అతని ఉద్దేశం కావచ్చు. అంతకంటే ముఖ్యంగా అతడు మాతృస్వామ్య సూచకమైన కథను పితృస్వామ్యానికి మార్చే కీలకమైన ప్రయత్నం చేస్తూ ఉండచ్చు.

ఇక్కడినుంచి మనం మానవ మహేతిహాసంలోని ఒక నిర్ణయాత్మకమైన మలుపులోకి అడుగుపెట్టబోతున్నాం. ఒకవేళ ఆ మలుపులో ఇంకా ముందుకువెళ్ళిపోతే, మళ్ళీ వెనక్కి రావడానికి ఎన్ని వ్యాసాల వ్యవధి పడుతుందో ఈ క్షణాన నా ఊహకు అందడం లేదు. పూర్తిస్థాయిలో అందులోకి వెడతానన్న హామీ కూడా ఇవ్వలేకపోతున్నాను. ముందుకు వెళ్ళడం గురించి కాసేపు మరచిపోయి ప్రస్తుతం ఆ మలుపు దగ్గరే ఉండిపోయి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

***

తపతి-సంవరణుల కథను జాగ్రత్తగా చెవి యొగ్గి వినండి…అందులో మీకు ఒక గొంతు కాదు, రెండు గొంతులు వినిపిస్తూ ఉంటాయి.  ఆ రెండు గొంతులూ పక్క పక్కనే వినిపిస్తూ ఉంటాయి. ఆ గొంతుల్లో ఒక గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా ఉంది. ఎలాగంటే, ఒక గొంతు ఇంకో గొంతును ప్రతిఘటించడంలేదు. నొక్కేయడానికి చూడడం లేదు. దేని మానాన అది తన కథను చెప్పుకుంటూ పోతోంది,

ఆ రెండు గొంతుల్లో ఒకటి కథకుడిది…ఇంకొకటి గంధర్వుడిది…

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు! ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’ అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో  భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు!

ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’  అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ  కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ఇంకాస్త వివరంగా చూద్దాం. అర్జునునితో నువ్వు తాపత్యవంశీకుడివి అనడం ద్వారా గంధర్వుడు తన వెర్షన్ కు ముందే శృతి చేశాడు. అసలు కథను మాత్రం కథకుడు తన వెర్షన్ తో మొదలుపెట్టాడు. అది: సూర్యుని ఉద్దేశించి సంవరణుడు తపస్సు చేయడం,  సూర్యుడు అతనిని మెచ్చి తన కూతురైన తపతిని అతనికే ఇవ్వాలని నిర్ణయించుకోవడం…ఇలా చెప్పడం ద్వారా కథకుడు అసలు కథకు పురుషస్వామ్యం అనే చట్రాన్ని ముందే తయారు చేసిపెట్టుకున్నాడు.

ఆ తర్వాత గంధర్వుడు తన వెర్షన్ ప్రారంభించాడు. ఆ ప్రారంభించడం కూడా కథకుని చట్రాన్ని తోసి రాజనేలా. ఈ వెర్షన్ ప్రకారం సంవరణుడు వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి ఒంటరిగా కనిపించింది. ఆమె అలా ఒంటరిగా కనిపించిందంటే, వర్ణసమాజంలో లేదా మైదాన ప్రాంతాలలో నివసించే స్త్రీ మీద ఉండే నిర్బంధాలు ఏవీ ఆమె మీద లేవు. సంవరణుడు ఆమెపై మనసుపడ్డాడు. ఆమె కూడా అతని మీద మనసు పడింది. అదే ఒక ఆదివాసీ యువకుడైతే అతన్ని చేపట్టడానికి తపతికి ఎవరి అనుమతీ, ఎటువంటి అభ్యంతరాలూ ఉండనవసరం లేదు. కానీ సంవరణుడు సాయుధుడైన క్షత్రియుడు. ఆదివాసుల అస్తిత్వానికి అతడో పెద్ద ప్రమాదం. కనుక ఈ సంబంధానికి తపతి తండ్రి కాదుకదా, తపతి తెగ మొత్తం అంగీకరించే అవకాశం లేదు. తెగ మనిషిగా తపతి కూడా వెంటనే అవుననే అవకాశమూ లేదు. కనుక మధ్యవర్తి అవసరం.

ఆవిధంగా వశిష్టుని ప్రవేశం… గంధర్వుని వెర్షన్ ప్రకారం కూడా ఇక్కడ మధ్యవర్తిగా వశిష్టుని ప్రవేశం అవసరమే. ఆపైన ఒక మునిగానూ, బ్రాహ్మణునిగానూ వశిష్టుడు ఆదివాసుల మనసుకు ఎలాగూ దగ్గరివాడే. కనుక మునుల గురించి, వారితో తమ సంబంధాల గురించి చెప్పడం గంధర్వుడికి ఇష్టమే. పాండవుల వెంట పురోహితుడు లేని సంగతి గంధర్వుడు మొదటే ఎత్తి చూపాడు కనుక, పురోహితుడి అవసరం ఎలాంటిదో చెప్పడమూ అతనికి అవసరమే. అదే సమయంలో, మీరు తాపత్యవంశీకులని నొక్కి చెప్పడం బహుశా అంతకంటే ఎక్కువ ఇష్టమూ, అవసరమూ కూడా  కావచ్చు. ఎందుకంటే, కథకుడు పురుష స్వామ్యంవైపు కథ నడిపిస్తాడు కనుక తను యథాశక్తి మాతృస్వామ్యం వైపు నడిపించక తప్పదు.  అదీగాక, వశిష్టునికి కూడా మాతృస్వామ్యంతో సంబంధం ఉందనేది ఇక్కడ అదనపు సమాచారం. దానిలోకి ఇప్పుడు మనం వెళ్లద్దు.

కథకుడికీ వశిష్టుని ప్రవేశం అంగీకారమే. అయితే మధ్యవర్తిగా కాకపోవచ్చు. ఒక బ్రాహ్మణునిగానూ, మునిగానూ వశిష్టుని మహిమను చెప్పడం కథకునికి ఇష్టం. అలాగే, క్షత్రియునివైపునుంచి కథ చెప్పడం కూడా అతనికి ఇష్టమే. సంవరణుడు సూర్యునికోసం తపస్సు చేశాడని చెప్పడం, భూమండలంలో అంతటి వీరుడు లేడని చెప్పడం, సంవరణుడు తలచుకోగా వశిష్టుడు వచ్చాడని చెప్పడం అందులో భాగమే కావచ్చు. కథకుడు ఆ తర్వాత వశిష్టుడికి మహిమలు ఆపాదించుకుంటూ వెళ్ళాడు. గంధర్వుడికి అభ్యంతరం లేదు. కథకుడు తన వెర్షన్ ఎలా చెప్పుకుంటూ పోయినా, ‘తాపత్యవంశీకుడివి’ అంటూ తను చేసిన శృతికి అనుగుణంగా తపతి వైపునుంచి చెప్పడమే గంధర్వుడికి కావలసింది.

తపతి-సంవరణుల పెళ్లి గాంధర్వ విధానంలో కాక, పెద్దల అనుమతితో, పురోహితునిద్వారా మాత్రమే జరగడం కథకునికి ఇష్టం కనుక అలాగే జరిపించాడు. తపతి వైపునుంచి చెప్పే అవకాశాన్ని తనకు ఇచ్చాడు కనుకా, ఆ అవకాశాన్ని తను వినియోగించుకున్నాడు కనుకా, ఇక కథకుడు తన కథను ఎలాగైనా చెప్పుకోనివ్వండి…గంధర్వుడికి అభ్యంతరం లేదు. అయితే, చివరగా ఎదురయ్యే ఒక చిక్కు ప్రశ్న ఏమిటంటే, సంవరణుడు రాజుగా నిర్వర్తించవలసిన కార్యాలు, ధర్మాలు విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలు అనుభవిస్తూ అడవిలో (అత్తవారి ఇంట) ఉండిపోయాడనీ, దాంతో రాజ్యంలో అనావృష్టి ఏర్పడిందనీ కథకుడు చెబుతున్నాడు. ఇంతవరకు సంవరణునికి అనుకూలంగా జరుగుతున్న కథనంలో ఇక్కడికి వచ్చేసరికి అతనిపై ఒకింత నిష్ఠురం ధ్వనిస్తున్నట్టు లేదూ? ఒకింత ఏమిటి, ఎక్కువే ధ్వనిస్తున్నట్టుంది. సంవరణుడు రాచకార్యాలను, ధర్మాలను విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలలో మునిగి తేలుతూ ఉండడం, అక్కడ రాజ్యంలో కరవు కాటకాలు ఏర్పడడం సంవరణుడి వైపునుంచి జరిగిన సామాన్యమైన నేరమేమీ కాదు. అప్పుడు వశిష్టుడు అనావృష్టిని నివారణకు క్రతువులు జరిపి సంవరణుని దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరినీ రాజధానికి తీసుకెళ్ళాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది.

ఆ తర్వాతే, ఆ దంపతులకు కురుడు పుట్టాడు!

ఇంతకీ పన్నెండేళ్ళు సంవరణుడు అడవిలోనే ఎందుకు ఉండిపోయాడు? వారికి పన్నెండేళ్ళ వరకూ ఎందుకు సంతానం కలగలేదు? ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుంది?

సంతృప్తికరమైన సమాధానాలు వస్తాయా, రావా అనేది వేరే విషయం; కానీ ఇవి న్యాయమైన ప్రశ్నలు కావంటారా?

మిగతా విషయాలు వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)–కల్లూరి భాస్కరం 

 

గంధర్వుడి బడాయి- అర్జునుడి డైలమా!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

నువ్వు తాపత్య వంశీకుడివి’ అని అర్జునుడితో అనడంలో గంధర్వుని బడాయి చూసారా…?

‘ఆ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు’ అన్న అతిశయం అందులో ఉండచ్చు, ఆశ్చర్యంలేదు. ఆ సందర్భంలో గంధర్వుడు తనకు తెలిసిన విషయాల గురించి బడాయికి పోవడం సహజమే కాదు, అవసరం కూడాను. ఎందుకంటే, తను అర్జునుని చేతిలో ఓడిపోయాడు. కనుక తను ఏదైనా విషయంలో అతని మీద పై చేయిని చాటుకోవాలి. అప్పటికే అతనా ప్రయత్నం మొదలుపెట్టాడు కూడా. నా దగ్గర మహిమలున్నాయనడం, మీకు గుర్రాలు ఇస్తాననడం, క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలని చెప్పడంలో, ఆ సంగతి మీకు తెలియదన్న ఆక్షేపణను ధ్వనించడం అందులో భాగాలే.

ఒకవిధంగా దానికి కొనసాగింపే, ‘నువ్వు తాపత్యవంశీకుడివి, తెలుసా?’ అనడం.

మొత్తానికి ఈ గంధర్వుడు అనుకున్నంత అమాయకుడేమీకాదు, గడుసువాడే! అర్జునుడి జిజ్ఞాసను గురి చూసి కొట్టాడు. తను తాపత్య వంశీకుడు ఎలా అవుతాడో తెలుసుకునేవరకూ గంధర్వుడి వలలోంచి అర్జునుడు బయట పడలేడు. అంటే, తనను బంధించి కొప్పు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి ధర్మరాజు ముందు పడేసిన అర్జునుని, తన మాట లనే ‘సమ్మోహనాస్త్రం’తో గంధర్వుడు కట్టిపడేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడన్నమాట. మొత్తానికి ఇప్పుడు గంధర్వుడు గురువు, అర్జునుడు శిష్యుడూ అయ్యారు.

గంధర్వుడు ఊరికే గురువు కాలేదు. పాండవులకు కొన్ని విషయాలు తెలియవని అతను ముందే కనిపెట్టేశాడు.  క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలన్న తొలిపాఠం చెప్పిన తర్వాత మరికొన్ని పాఠాలు చెప్పవలసిన అవసరమూ అతనికి కనిపించింది. ముఖ్యంగా ఆదివాసులకు, బ్రాహ్మణులకు ఉన్న దగ్గరి సంబంధాల గురించి చెప్పాలనుకున్నాడు. నువ్వు తాపత్యవంశీకుడివి అనడం దానికి శృతి.

గంధర్వుడు ‘నువ్వు తాపత్య వంశీకుడివి’ అనడంలో ఇంకోటి కూడా ఉంది. దాని గురించి చెప్పుకునే ముందు అతను చెప్పిన కథలోకి వెడదాం.

***

పాండవుల తరానికి అనేక తరాల వెనకటి కథ ఇది…

తపతి సూర్యుని కూతురు. సావిత్రికి తోడబుట్టినది. మంచి గుణవంతురాలు. ఆమె యవ్వనవతి అయింది. ఈమెకు తగిన వరుడు ఎవరా అని సూర్యుడు ఆలోచనలో పడ్డాడు.

అలా ఉండగా భరతకులానికి చెందినవాడు, అజామీఢుని కొడుకు అయిన సంవరణుడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. అతను సూర్యుడికి నచ్చాడు. నేను ఆకాశంలో అధిక తేజస్సుతో ఎలా వెలుగుతున్నానో, అలాగే ఇతను కూడా ఈ జగతిలో ప్రసిద్ధుడిగా వెలిగిపోతున్నాడు, తపతిని ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని సూర్యుడు నిశ్చయించుకున్నాడు.

ఒకరోజున సంవరణుడు వేటకు వెళ్ళాడు. అడవిలో చాలాసేపు తిరిగిన తర్వాత అతని గుర్రానికి విపరీతమైన దాహం వేసింది. ముందుకు వెళ్లడానికి మొరాయించింది. అప్పుడు సంవరణుడు  ఒక్కడే కాలినడకన ఆ పర్వతవనంలో నడుచుకుంటూ వెళ్ళాడు.

ఒకచోట అతనికి ఒక సుందరి కనిపించింది. ఆమె బంగారు వన్నెలో ఉంది. ఆమె వల్ల, ఆమెకు దగ్గరగా ఉన్న చెట్లు, లతలూ కూడా బంగారువన్నెలోకి మారిపోతున్నాయి. ఆమెను చూడగానే సంవరణుడు రెప్ప వేయడం మరచిపోయాడు. త్రిభువన లక్ష్మి ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఎందుకుందో అనుకున్నాడు. ఇంతకీ ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్ధకన్యో తెలియడం లేదనుకున్నాడు. ప్రశస్తమైన అన్ని లక్షణాలూ కలిగిన ఆకృతీ, అంతులేని కాంతీ కలిగిన ఈమె కచ్చితంగా దివ్యకన్యే అయుంటుందని కూడా అనుకున్నాడు. అంతలోనే, ఇంద్రకన్యలకు కూడా ఇంతటి రూప విలాస సంపద ఉంటుందా అన్న సందేహం అతనికి కలిగింది. మొత్తానికి ఇంతటి అందగత్తెను మాత్రం తనెప్పుడూ చూడలేదన్న నిశ్చయానికి వచ్చాడు.

Back-To-Godhead-Mahabharat

ఆవిధంగా ఆమె సౌందర్యం అనే అమృతాన్ని చూపులతోనే తాగేస్తూ రెప్ప వేయడం మరచిపోయిన తర్వాత, కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, ‘నువ్వెవరివి, క్రూరమృగాలు తిరిగే ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. ఆమె అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మేఘాల మధ్య మెరుపుతీగలా మాయమైపోయింది.

ఆమె మాయమవడాన్ని సంవరణుడు తట్టుకోలేకపోయాడు. సిగ్గు వదిలేసి నేలమీద పడి ఏడవడం ప్రారంభించాడు. ఆమె మనసు కరిగింది. అదీగాక, మంచి యవ్వనంలో మన్మథుణ్ణి తలదన్నేలా ఉన్న అతన్ని చూడగానే ఆమె మనసులోనూ అలజడి మొదలైంది. మళ్ళీ అతని ముందుకు వచ్చి, ఎందుకిలా వివశుడివవుతున్నావని తీయని గొంతుతో అడిగింది.

‘ఈ భూమండలంలో ప్రతాపంలోనూ, బలదర్పాలలోనూ నన్ను మించినవాడు ఉన్నట్టు నేను వినలేదు. ఇంతవరకు నేను ఎవరికీ భయపడి ఎరగను. అలాంటిది ఇప్పుడు నేను భయంతో కంపిస్తున్నాను. నిన్ను అడ్డు పెట్టుకుని మన్మథుడు తన బాణాలతో నన్ను కొట్టి చంపకుండా నువ్వే నన్ను కాపాడాలి’ అని సంవరణుడు అన్నాడు. ఆ తర్వాత, ‘గాంధర్వవిధానంలో నన్ను పెళ్లి చేసుకో’ అని ప్రతిపాదించాడు.

అప్పుడామె, తను సూర్యుని కూతురుననీ, సావిత్రికి సోదరిననీ, తన పేరు తపతి అనీ చెప్పింది. నన్ను నువ్వు ఇష్టపడితే మా తండ్రిని అడుగు, ఆయనను ప్రార్థించు, అప్పుడు నన్ను నీకు ఇస్తాడు, ఆడపిల్లలకు స్వాతంత్ర్యం ఉండదని నీకు మాత్రం తెలియదా-అంది. అని, తను సూర్యమండలానికి వెళ్లిపోయింది.

ఆమె కనుమరుగయ్యేసరికి సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన మంత్రి అతన్ని చూసి శీతలోపచారాలు చేసిన తర్వాత తెలివిలోకి వచ్చాడు. మంత్రినీ, పరివారాన్నీ పంపేసి తను అక్కడే ఉండిపోయి సూర్యుని ఆరాధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత తన పురోహితుడైన వశిష్టుని తలచుకున్నాడు.

తలచుకున్న పన్నెండు రోజులకు వశిష్టుడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు. వ్రతాలతోనూ, ఉపవాసాలతోనూ కృశించిన సంవరణుని చూశాడు. అతను తపతిపై మనసు పడ్డాడని యోగదృష్టితో తెలుసుకున్నాడు. వెంటనే అనేక యోజనాలు ప్రయాణం చేసి సూర్యుని దగ్గరకు వెళ్ళి వేదమంత్రాలతో ఆయనను స్తుతించాడు. సూర్యుడు వశిష్టుని సముచితంగా గౌరవించి, ‘ఏం పనిమీద వచ్చా’రని అడిగాడు. ‘నీ కూతురైన తపతికి పౌరవకుల శ్రేష్ఠుడైన సంవరణుడు అన్ని విధాలా తగిన వరుడు. కూతురుని కన్న ఫలం దక్కేది తగిన వరుడికి ఇచ్చినప్పుడే కదా. కనుక నీ కూతురుని సంవరణుడికి ఇయ్యి’ అన్నాడు. సూర్యుడు అంగీకరించి తపతిని వశిష్టునితో సంవరణుడి దగ్గరకు పంపించాడు.

ఒక నిమిషంలో మూడువందల అరవై నాలుగు యోజనాలు ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుడి దగ్గరకి వచ్చి విధివిధానంగా ఇద్దరికీ వివాహం చేయించాడు.

కనుక, మంచి పురోహితులను పొందిన రాజులు తాము కోరుకున్న అన్ని శుభాలనూ పొందగలుగుతారు. అలా తపతిని మహోత్సవంతో పెళ్లాడిన సంవరణుడు రాచకార్యాలనన్నింటినీ విడిచిపెట్టేసి తపతితో ఇష్టసుఖాలు అనుభవిస్తూ పన్నెండేళ్ళపాటు ఆ పర్వత, అరణ్యాలలోనే ఉండిపోయాడు. దాంతో భూమండలమంతటా అనావృష్టి ఏర్పడింది. వశిష్టుడు వర్షాలు పడడానికి అవసరమైన వైదిక విధులు అన్నీ నిర్వర్తించి సంవరణుడి దగ్గరకు వచ్చి, ఆ దంపతులిద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది. కొంత కాలానికి ఆ దంపతులకు ‘తాపత్యుడు’(తండ్రివైపు నుంచి కాకుండా తల్లి తపతి వైపునుంచి చెప్పినప్పుడు ఆ సంతానం తాపత్యుడు అవుతాడు) గా కురువంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుంచి మీరు తాపత్యులయ్యారు….

***

అర్జునుడు విన్నాడు.

‘మా వంశానికి చెందిన పూర్వరాజులకు పురోహితుడైన వశిష్టుని మహత్యం గురించి ఇంకా వినాలని ఉంది’ అన్నాడు.

ఆదివాసులైన తమ మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ఋషుల గురించి అడిగితే గంధర్వుడు చెప్పకుండా ఎలా ఉంటాడు? అర్జునుడు అడగడమే తరవాయి, ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా వశిష్టుని చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. మనం మాత్రం తపతీ-సంవరణుల కథ దగ్గరే ఆగిపోదాం.

***

ఈ కథను మలచడంలో కథకుడు కొన్ని ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమిచ్చే ఖాళీలు విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది.  ఒక్కొక్కటే చూద్దాం.

ప్రారంభంలోనే చూడండి…సంవరణుడు సూర్యుని ఉద్దేశించి తపస్సు చేశాడు. సూర్యుడు కూడా అతన్ని మెచ్చాడు. తన కూతురు తపతికి ఇతనే తగిన వరుడనీ, ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తాననీ నిర్ణయానికి కూడా వచ్చాడు. అలాంటప్పుడు, సంవరణుడు వేటకు వెళ్ళడం, ఆ పర్వత అరణ్య ప్రాంతంలో తపతిని చూడడం, ఆమెను మోహించడం, గాంధర్వ విధానంలో తనను పెళ్లాడమని అడగడం, నా తండ్రిని అడగమని ఆమె చెప్పడం…అన్నింటికంటే ముఖ్యంగా, సూర్యుడే తన కూతురిని సంవరణునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నతర్వాత కూడా వశిష్టుడు మధ్యవర్తిత్వం వహించడం…ఇవన్నీఅవసరమా?

సంవరణునికి తన కూతురుని ఇవ్వాలని సూర్యుడు ముందే నిర్ణయించుకున్నాడని చెప్పడం వల్ల తలెత్తిన ప్రశ్నఇది. ఆ మాట అనకపోతే సమస్యే లేదు. ఎందుకు అన్నట్టు? బహుశా కొన్ని సమర్థనలు ఇలా ఉండచ్చు:

1. సూర్యుడు కూతురిని సంవరణుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా, ప్రతిపాదన సంవరణుని వైపునుంచే రావడం విధాయకం కావచ్చు. 2. రాజులు గాంధర్వ విధానంలో పెళ్లాడడం తప్పు కాదు. అంతకు ముందు గాంధర్వ విధానంలో రాజులు పెళ్లి చేసుకున్న ఉదంతాలను మహాభారత కథకుడే చెప్పాడు కూడా. ఉదాహరణకు, శకుంతలా-దుష్యంతుల వివాహం. కానీ ఆ తర్వాత గాంధర్వ వివాహం మీద వ్యతిరేకత ఏర్పడినట్టు ఈ కథ సూచిస్తోందా? సంవరణుడు గాంధర్వ విధానాన్ని ప్రతిపాదించడం, దాంతో తపతి స్త్రీలకు స్వాతంత్ర్యం లేదంటూ, తన తండ్రిని అడగమని చెప్పడం, అప్పుడు సంవరణుడు వశిష్టునికి కబురు చేయడం, వశిష్టుడు సూర్యుని వద్దకు మధ్యవర్తిగా వెళ్ళడం…పెద్దల అనుమతితోనే పెళ్లి జరగాలని నొక్కి చెబుతూ ఉండచ్చు. 3. గాంధర్వం తప్పా, ఒప్పా అనేది కాకుండా; వివాహం అనేది పురోహితుని ద్వారా విధివిధానంగా జరగాలని చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. 4. లేదా, సాక్షాత్తూ దేవుడైన సూర్యుడే సంవరణుని వరునిగా ఎన్నుకున్నాడనీ, ఆ తర్వాత వశిష్టుని జోక్యం నిమిత్తమాత్రమేననీ చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. ఎందుకలా అంటే, కథకుడు పాండవుల వైపునుంచి కథ చెబుతున్నాడు. వారి వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అది ఒక బ్రాహ్మణుని జోక్యం వల్ల జరిగిన వివాహఫలితమని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. ప్రత్యేకించి బ్రాహ్మణునికి ఘనతను ఆపాదించడంపై అతనికి వ్యతిరేకత ఉండకపోయినా, ఇక్కడ బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధం కూడా ఉంది. బ్రాహ్మణునికి ఘనత కట్టబెడితే, అందులోకి ఆదివాసీ కూడా వస్తాడు. అది కథకుడికి ఇష్టం లేదు. కనుక వశిష్టుని జోక్యాన్ని నిమిత్తమాత్రం చేయడం అతని ఉద్దేశం కావచ్చు.

అసలు తపతిని దేవుడైన సూర్యపుత్రిక అనడంలోనే ఆమె ఆదివాసీ సంబంధాన్ని కథకుడు దాచిపెడుతున్నాడా? అదీ సంభవమే. ఆమె పర్వత, అరణ్యమధ్యంలో ఒంటరిగా కనిపించిందంటే, ఆమె పర్వతపుత్రిక లేదా అరణ్యపుత్రిక అన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు జరిగింది ఇదీ: సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. అయితే, సంవరణుడు క్షత్రియుడు. క్షత్రియులకూ, ఆదివాసులకూ సహజవైరం. కనుక, తపతి తండ్రి ఆ సంబంధానికి ఇష్టపడే అవకాశం లేదు. తండ్రి వరకూ ఎందుకు, తపతి కూడా ఆ సంబంధానికి సందేహించి ఉండచ్చు. వారిద్దరికీ అంగీకారమైనా, వారి తెగకు చెందిన పెద్దలు దానిని ఆమోదించే అవకాశం లేదు. తెగలలో వివాహం అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, సమష్టి నిర్ణయం.  ఇక్కడ ఇది ‘రాజకీయ’ నిర్ణయం కూడా. మరి వీరిద్దరికీ వివాహం జరగడం ఎలా?

అందుకే బ్రాహ్మణుని జోక్యం. గాంధర్వానికి తపతి నిరాకరించి వెళ్లిపోవడంతోనే సంవరణుడు సూర్యుని ఆరాధించడం ప్రారంభించి, వశిష్టుని తలచుకున్నాడని కథకుడు చెప్పనే చెప్పాడు. సూర్యుని ఆరాధించాడని కథకుడు చెప్పడం, తపతిని దేవుడైన సూర్యుని కుమార్తెగా చెప్పడానికి యాంత్రికమైన కొనసాగింపు మాత్రమే. అయితే, సూర్యుని ఆరాధించడం వల్ల సంవరణుని పని జరగదు. వశిష్టునివల్లనే జరుగుతుంది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణునిగా వశిష్టుడు క్షత్రియులకు ఎంత కావలసినవాడో, ఆదివాసులకూ అంతే కావలసినవాడు. వశిష్టుడు మధ్యవర్తిగా లేదా హామీగా ఉంటే సంవరణునికి తపతిని ఇవ్వడానికి ఆదివాసులకు అభ్యంతరం లేదు. ఆయన మీద వారికి అంతటి గురి. అలాగే, వశిష్టుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. నేరుగా తపతి తండ్రిని కలిశాడు. సంవరణుడు యోగ్యుడు, అతనికి నీ కూతుర్ని ఇయ్యి అని చెప్పాడు. తండ్రి మారు మాట్లాడకుండా అప్పటికప్పుడు కూతురిని అతనితో పంపేశాడు. వశిష్టుడు తపతికి, సంవరణుడికీ పెళ్లి జరిపించాడు.

గమనించారో లేదో…కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. తనే పెళ్లి జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు. పెళ్లి జరిపించుకోవలసిన బాధ్యత వరుడివైపు వారిదే. గాంధారీ-ధృతరాష్ట్రుల విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధారి తండ్రి సుబలుడు తన కూతురిని ధృతరాష్ట్రునికి ఇచ్చానని మాత్రమే అన్నాడు. సోదరుడు శకుని వెంట ఆమెను హస్తినాపురం పంపించాడు. అక్కడ భీష్ముడు మొదలైన వరుడి వైపువారే పెళ్లి జరిపించారు.

రాను రాను గాంధర్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందనడానికి మరికొన్ని ఉదాహరణలూ ఆ తర్వాత కనిపిస్తాయి. బహుశా శకుంతలా-దుష్యంతుల అనుభవం అందుకు కారణం కావచ్చు. పాండవులకు మూడు తరాల వెనకటివాడైన శంతనునే తీసుకోండి. అతనోసారి గంగాతీరంలో విహరిస్తుండగా గంగ స్త్రీ రూపంలో కనిపించింది. ఆమెను శంతనుడు మోహించాడు. ఆమె షరతులు పెట్టింది. వాళ్ళ మధ్య వివాహబంధం ఏర్పడింది. సరే, ఆ కథను మరింత వివరంగా పరిశీలించే అవకాశం ముందు ముందు రావచ్చు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, నీకు గంగ కనిపిస్తుందనీ, ఆమెను కులగోత్రాలు అడగకుండా పెళ్లి చేసుకోమనీ శంతనుడికి అతని తండ్రి ప్రతీపుడు ముందే చెప్పాడు. కనుక, ఆ సంబంధం పెద్దలు ఆమోదించినదే నని చెప్పడం కథకుడి ఉద్దేశం కావచ్చు.

వివాహ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి కనుక వాటిని వాయిదా వేసి ప్రస్తుత కథకు వస్తే…

తపతిని సూర్యపుత్రిక అనడం, నా ఉద్దేశంలో గణస్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు. తపతి తెగకు సూర్యుడు చిహ్నం కావచ్చు. తెగ సభ్యులను తెగ చిహ్నంతోనే సూచించడం ఆనాడు పరిపాటి. ఉదాహరణకు, ఒక గోత్రానికి చెందినవారినందరినీ ఆ గోత్రంతోనే చెప్పడం మన పురాణ, ఇతిహాసాలు అన్నిటా ఉంది. కశ్యప గోత్రీకులందరినీ కశ్యపులనే అంటారు. అందుకే పురాణకథల్లో అనేకమంది కశ్యపులు కనిపిస్తూ ఉంటారు. వారు వేర్వేరు వ్యక్తులు అని తెలియనివారు, వారికి సంబంధించిన ఉదంతాలను అన్నింటినీ ఒకే కశ్యపుడికి ఆపాదిస్తూ ఉంటారు. ఈవిధంగా చూసినప్పుడు తపతి తండ్రి సూర్య చిహ్నం కలిగిన తెగకు చెందినవాడుగా సూర్యుడే అవుతాడు. సూర్యుడు అనడం వెనుక ఉన్న తెగ లక్షణం, కథ కూర్చే నాటికి మరుగుపడి ఉండచ్చు. లేదా, కథకుడికి ఆ సంగతి తెలిసినా, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అతడికి ఆదివాసీ సంబంధం ఉందని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. దేవుడైన సూర్యుని కూతురికి పుట్టినవాడుగా అతనికి ఘనతను ఆపాదించాలని అనుకొని ఉండచ్చు. మరొకటి జరగడానికీ అవకాశముంది. అది, ఆనాటి కథనరీతిలో అనివార్యంగా ప్రతిఫలించే మాంత్రిక వాస్తవికత. ప్రతిపరిణామంలోనూ మాంత్రికతను, మహిమను చూడడం ఆనాటి జీవనశైలిలో భాగం. కథ కూర్చే నాటికి అది మరుగుపడి, దాని తీరుతెన్నులపై కథకునికి తగినంత అవగాహన లేకపోయినా,  ఆ మాంత్రిక శైలే కథనంలో యాంత్రికంగా చోటుచేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను ఇదే వ్యాసంలో ఇటాలిక్స్ లోనూ, బొల్డ్ లోనూ సూచించాను. వాటితోపాటు మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

మనం చూడని మరో ఆదివాసీ కోణం!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

బ్రాహ్మణుల మధ్య ఉంటూ, బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్న అర్జునుడనే ఒక మైదాన ప్రాంత వాసికి-

క్షత్రియులు బ్రాహ్మణునీ, అగ్నిహోత్రాన్నీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని…ఒక ఆదివాసీ గంధర్వుడు బోధించడం!!!

తమాషాగా లేదూ?!

ఇందులోని మర్మం ఏమిటా అని ఆలోచించిన కొద్దీ నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఒక కీలకమైన ప్రశ్ననూ ముందుకు తెస్తోంది. అంతే కుతూహలం కలిగిస్తున్నది ఏమిటంటే, ఈ తమాషాకు సంప్రదాయపండితులు ఎలాంటి భాష్యం చెబుతారని. బహుశా ఒక సమర్థన ఇలా ఉండచ్చు: పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అందులోనూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. తమ ఉదరపోషణకే భిక్షాటన మీద ఆధారపడుతున్నారు. కనుక ఇంకొక బ్రాహ్మణుని పోషణను వాళ్ళు తలకెత్తుకోవడం కష్టం. అదీగాక, వాళ్ళే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కనుక పురోహితుని రూపంలో ఇంకో బ్రాహ్మణుని వెంట బెట్టుకోవలసిన అవసరమూ లేదు…

గంధర్వుడి సమస్య గంధర్వుడిది. బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ వెంట లేరు కనుక వారు క్షత్రియులన్న సంగతి అతనికి తెలిసే అవకాశం లేదు. పైగా వాళ్ళు బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్నారు. కాకపోతే తెలిసిన బ్రాహ్మణులు కారు, కొత్తగా కనిపిస్తున్నారు. ఏమైనా బ్రాహ్మణులే కనుక, భయపెట్టి దూరంగా తరిమేయడానికి ప్రయత్నించాడు. అర్జునుడు ధిక్కరించి యుద్ధానికి దిగిన తర్వాతా, అతని చేతిలో తను ఓడిపోయిన తర్వాతే వాళ్ళు పాండవులన్న సంగతి అతనికి తెలిసింది.

ఆ తర్వాత అర్జునుడి ప్రశ్న చూడండి…’మేము పరమ ధార్మికులము, పరమ బ్రహ్మణ్యులము కదా, మొదట్లో మమ్మల్ని అదిలించి ఎందుకు మాట్లాడావూ’ అని! ‘ఎందుకంటే, మీ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక’ అని గంధర్వుని జవాబు!

అర్జునుడి ప్రశ్న దగ్గరనుంచీ సాగిన సంభాషణ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి…తమ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక గంధర్వుడు తమను పాండవులుగా గుర్తించలేకపోయాడనే సంగతి అర్జునుడికి ఆపాటికే తెలిసి ఉండాలి. కానీ అతని ప్రశ్నను గమనిస్తే, అతనికి ఆ విషయం…అంటే, క్షత్రియుడి వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ ఎప్పుడూ ఉండాలన్న విషయం … తెలియదని అర్థమైపోతోంది. ఆపైన గంధర్వుడు క్షత్రియుని వెంట పురోహితుడు ఎప్పుడూ ఎందుకు ఉండాలో వివరించిన తీరులో కూడా అర్జునుని తెలియని తనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఒక క్షత్రియుడికి తప్పనిసరిగా తెలియవలసిన ఒక సంప్రదాయం, లేదా ఆనవాయితీ అర్జునుడికే కాక పాండవులందరికీ అప్పటికి తెలియకపోవడం అనేది దేనిని సూచిస్తుంది?! కొంపదీసి వారిది అనుమానాస్పద నేపథ్యం అన్న సంగతినా? అటువంటి వాదనలూ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే,  అది ప్రస్తుతాంశం కాదు కనుకా, నేనింకా దానిపై సాధికార పరిశీలన చేయలేదు కనుకా ఒక సందేహార్థకంగానే దానిని ఇంతటితో వదిలేస్తాను.

ఇంతవరకూ పరిమితమై చూసినప్పుడు ఇంకో సమర్థనకూ అవకాశం ఉందని అనిపించవచ్చు. అదేమిటంటే, క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియకేం, తెలుసు. కానీ తాము ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అవసరం లేదని వాళ్ళు అనుకుని ఉండచ్చు. గంధర్వుడికి ఆ సంగతి అంత వివరంగా తెలియదు కనుక, ఆ లోపాన్ని ఎత్తి చూపి ఉండచ్చు. లేదు, మేము ఫలానా కారణం వల్ల బ్రాహ్మణుని, అగ్నిహోత్రాన్ని వెంట ఉంచుకోలేదని ముక్కూ మొహం తెలియని ఓ ఆదివాసీ గంధర్వుడికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

అయితే, ఇంకొంచెం ముందుకు వెడితే, ఈ సమర్థన కూడా పేలపిండిలా ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే, తమకు ఒక మంచి పురోహితుని సూచించమని అర్జునుడే గంధర్వుని అడుగుతాడు. గంధర్వుడు సూచిస్తాడు కూడా. కనుక క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియదనే అనంతర కథాక్రమం కూడా వెల్లడిస్తోంది.

గమనించండి, పాండవులకు ఇదొక్కటే కాదు, మరో విషయం కూడా తెలియదు. అది, తాము ‘తాపత్య వంశీకుల’మన్న సంగతి! ‘మేము కౌంతేయులం కదా, తాపత్య వంశీకుల మెలా అయ్యా’ మని అర్జునుడు గంధర్వుని అడగనే అడిగాడు.

ఎలా అయ్యారో చెప్పుకునే ముందు గంధర్వుడి తీరు గురించి, అతని మాటల్లో దొర్లిన ఇతర విశేషాల గురించి చెప్పుకుందాం.

***

Back-To-Godhead-Mahabharat

అర్జునుడు గంధర్వుని కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  ధర్మరాజు ముందు పడేసిన దృశ్యాన్ని ఓ సారి ఊహించుకోండి: బహుశా అతనికో పెద్ద కొప్పు ఉండి ఉంటుంది. ఆడవాళ్ళతో కలసి అర్థరాత్రి అతను జలక్రీడలాడడానికి వచ్చాడు కనుక అతను మంచి విలాసపురుషుడన్న మాట. పైగా ఆ అడవంతా తనదన్న ధీమా అతనిది. ఇక్కడ ఎప్పుడెలా విహరిస్తేనేం? అందుకే, ఊహించని విధంగా పాండవుల రూపంలో పరపురుషుల ఉనికి కనిపించేసరికి అతనికి వల్లమాలిన కోపం వచ్చింది.

గంధర్వుని మాటల్ని చూడండి: వాటిలో లోతుకన్నా డాంబికమే ఎక్కువ. కింద పడ్డా పై చేయి నాదే నన్నట్టుంటాయి. అర్థరాత్రి వేళ, సంధ్యాసమయాల్లో మేము ఎంతటి వాళ్లనైనా ఒడించేస్తామని అతను చాలా దర్పంగా చెప్పినా, బహుశా అందులో కొంత వాస్తవం ఉండచ్చు. తీరా అర్జునుడు తనను ధిక్కరించి యుద్ధానికి సిద్ధమవడం, చిటికెలో తన రథాన్ని దగ్ధం చేయడం, తన కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేయడం, భార్య పతిభిక్ష పెట్టమని ప్రార్థించడం అతనికి  ఊహించని ఉత్పాతాలు.  అయితే, ఈ ‘షాక్’ అతని మనసులో పూర్తిగా ఇంకినట్టు కనిపించదు. కారణం, అతని మనసుకు దానిని ఇంకించుకునే శక్తి లేదు కనుక. అతని బుద్ధి కన్నా మాటే చురుగ్గా ఉంది. వెంటనే అట్టు తిరగేశాడు. నీ చేతుల్లో ఓడి పోయిన తర్వాత, ఈ అంగారపర్ణత్వం ఇంకా నాకెందుకు, మరీ అంత సిగ్గులేని వాణ్ణా, నేను పేరు మార్చుకుంటా నన్నాడు. ఆ అనడంలో కూడా చూడండి, నా రథం దగ్ధమైనా, నా దగ్గర చాలా మాయలున్నాయి, అనేక రత్న విచిత్రితమైన రథాన్ని పొంది ఇకనుంచి చిత్రరథుడి నవుతానని గర్వంగా ప్రకటించుకున్నాడు.

ఆ వెంటనే గమనించండి, నీ పరాక్రమాన్ని ‘మెచ్చాను’, నీతో స్నేహం చేయాలని ఉందన్నాడు. అంతేకాదు, నా దగ్గర చాక్షుషి అనే విద్య ఉంది, ఆ విద్యతో మూడులోకాల్లో ఏం జరుగుతోందో చూడచ్చు, అయితే, అది అందరికీ పని చేయదు, నువ్వు తాపత్య వంశీకుడివి కనుక నీకు పనిచేస్తుంది అన్నాడు. మూడు లోకాలనూ చూడగలిగిన విద్య తన దగ్గర ఉన్నా, అర్జునుణ్ణి గుర్తించలేక ఓటమిని ఎందుకు కొని తెచ్చుకున్నాడో తెలియదు. పైగా, ఈ విద్యను తీసుకునేటప్పుడు ఆరుమాసాలపాటు ఒక వ్రతం పాటించాలని షరతు పెట్టాడు. మందుల వాళ్ళు, స్వాములు, పూజారుల బాణీని ఈ మాటల్లో మీరు పోల్చుకోవచ్చు. అంటే, వారి మూలాలు కాలగర్భంలో ఇంత లోతున ఉన్నాయన్నమాట.

మొత్తంమీద ఈ ఘటనలో అతణ్ణి ఆకర్షించింది బహుశా ఒకే ఒకటి, అది ఆగ్నేయాస్త్రం! తన దగ్గర ఎన్నో మాయలున్నాయంటున్న అతనికి అదే ఓ పెద్ద మాయగా కనిపించినట్టుంది, నీ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే మీకు గుర్రాలు ఇస్తానని బేరం పెట్టాడు.

మొత్తానికి అతని వ్యవహారం అంతా చిన్నపిల్లల తంతులా ఉంది…

అసలు సంగతేమిటంటే; ఎంతో లోతు, గాంభీర్యం, భిన్నమైన జీవన శైలి ఉన్న మైదానవాసి ముందు ఈ అడవిమనిషి తేలిపోతున్నాడు. అతనికి ఈ అనుభవం ఓ సాంస్కృతిక అఘాతం(cultural shock) అయిందేమో తెలియదు. ఒక ధోరణిలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అతను ఆ అడవిలో చెట్టులో పుట్టలో పిట్టలో ఒక సహజ భాగంగా అమరిపోయి తనదైన ప్రపంచంలో గడిపేవాడు. అతనిప్పుడు ఈ మైదానవాసుల ముందు ఒకవిధమైన న్యూనతతో బయటపడిపోతున్నాడు. తన వ్యక్తిత్వం జారిపోతున్నా లేని బింకం తెచ్చుకుని కూడదీసుకునే ప్రయత్నం-లేదా విఫలయత్నం- అతని మాటల్లో బొమ్మ కడుతూ ఉండచ్చు. ఈ ఘట్టంలో అతనెంత కళవళ పడ్డాడో, తనకు తెలియకుండానే ఎంత మథన పడ్డాడో అనిపిస్తుంది.

ఈ గంధర్వుడి రూపంలో మహాభారత కథకుడు మన ముందు అచ్చమైన ఒక ఆదివాసీని ప్రదర్శిస్తున్నాడు. ఈ కోణం నుంచి ఈ ఘట్టాన్ని ఎవరైనా ఇంతవరకు వ్యాఖ్యానించారో లేదో నాకు తెలియదు. గంధర్వులే కాక, సిద్ధులు, సాధ్యులు, యక్షులు వగైరా పేర్లతో మరి కొందరు కూడా కనిపిస్తూ ఉంటారు. ఏవో మహిమలూ, మాయలూ ఆపాదించి చెప్పే వీళ్ళందరూ కూడా అడవుల్ని ఆశ్రయించుకుని జీవించే ఆదివాసీ గణాలే కావచ్చు. వీరిలో కనిపించే మహిమ, మంత్రం, మాయ అనేవి ఇంకొకరిని మోసగించడానికే ఉద్దేశించినవి కాకపోవచ్చు. అవి వీరి జీవన తాత్వికతలో విడదీయలేని భాగాలు. వీరి జీవితాలను మాంత్రిక వాస్తవికత(magical realism) నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది. (అడవిలో) ఒక చెట్టు చిగురించడం, ఒక పూవు వికసించడం ఎలా స్వాభావికాలో వీరిలో మాయలూ, మంత్రాలూ, మహిమలూ అంతే స్వాభావికాలు. మాంత్రిక వాస్తవికతను అత్యద్భుతంగా చర్చించిన జార్జ్ థాంప్సన్ ను ఇక్కడికి తీసుకురావాలనిపిస్తోంది కానీ ప్రస్తుతానికి వాయిదా వేస్తాను.

ధర్మరాజు విడిచిపెట్టమని చెప్పిన తర్వాత గంధర్వుని తీసుకెళ్లి అర్జునుడు ‘మంద’లో విడిచిపెట్టాడని కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ ‘మంద’ అనడంలో ఆదివాసుల పట్ల మైదానవాసులలో ఉండే న్యూనతాభావం వ్యక్తమవుతోందేమో తెలియదు. ఇక్కడ మంద అనే మాటను సొంత జనం, లేదా గుంపు అనే సామాన్యార్థంలోనే కథకుడు వాడినా వాడి ఉండచ్చు. పదప్రయోగ సరళిని మరింత వివరంగా పరిశీలిస్తే తప్ప ఏ అర్థంలో వాడారన్నది నిర్ధారణగా చెప్పలేం.

ఇంకో తమాషా చూశారోలేదో….గంధర్వుడు తన దగ్గర ఉన్న గుర్రాలు ఎలాంటివో చెబుతూ, ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం వృత్రాసురుని శిరస్సు మీద పడి పది ముక్కలైందనీ, ఆ ముక్కల్లోనే కొన్ని వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియునికి ఆయుధమూ, వైశ్యుడికి నాగలి(వ్యవసాయం మొదట్లో వైశ్యుల వృత్తి), శూద్రుడికి సేవ అయ్యాయంటూ అర్జునుడికి నాలుగు వర్ణాల వ్యవస్థ గురించి కూడా బోధిస్తున్నాడు! ఇందులో తమాషా ఏమిటంటారా…ఈ జాబితాలో తను…అంటే ఆదివాసీ లేడు! ఎందుకు లేడంటే, ఆదివాసీలు ఆదివాసులుగా ఉన్నంత కాలం వర్ణ, లేదా కుల, మతవ్యవస్థల కిందికి రారు. బ్రాహ్మణులు, క్షత్రియులూ కూడా ఆదివాసులతో సంబంధాలు కలుపుకోవడానికి అదీ ఒక వెసులుబాటు అయింది. కథకుని గదసుదనం ఏమిటంటే, నాలుగువర్ణాల వ్యవస్థ కిందికి రాని ఒక ఆదివాసీతో ఆ వ్యవస్థ గురించిన చిలుక పలుకులు పలికిస్తున్నాడు. వర్ణవ్యవస్థకు సాధికారత కల్పించడంలో అది భాగమని తెలిసిపోతూనే ఉంది.  కుల, మతాల పరిధిలోకి రాని ఆదివాసీలను నాలుగువర్ణాల వ్యవస్థలోకి (కాకపోతే వాటికి మరో వర్ణం అదనంగా చేర్చి) తీసుకొచ్చే ప్రయత్నం చరిత్ర పొడవునా జరుగుతూనే రాగా; వారిని మతాల పరిధిలోకి పోటీ పడి మరీ తీసుకొచ్చే నేటి ప్రయత్నాలకు మనం ప్రత్యక్షసాక్షులమే. సరే, అది వేరే కథ.

గంధర్వుడు ఇంకోటి అన్నాడు చూడండి…గర్వం అణగిపోయేలా యుద్ధంలో ఓడిపోయినవాడు కూడా వెనకటి పేరే ఉంచుకుంటే ‘సత్సభ’ల్లో అతన్ని మెచ్చుకుంటారా అన్నాడు. ఇక్కడ అతను రెండు సూచనలు చేస్తున్నాడు: మొదటిది, సత్సభలు;  రెండోది, యుద్ధంలో ఓడిపోయినవాడు పేరు మార్చుకోవడం. సత్సభలంటే పండితసభలో, మరో సభలో కావు. గణం అంతా సమావేశమై ప్రజాస్వామిక విధానంలో నిర్ణయాలు తీసుకునే సభలు.

యుద్ధంలో ఓడిపోయాను కనుక పేరు మార్చుకుంటాననడం మరింత ఆసక్తికర వివరం. గణవ్యవస్థకు చెందిన ఒక ఆనవాయితీనే గంధర్వుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ఇప్పటికీ చూడండి…‘నేను ఫలానా పని చేయకపోతే, లేదా ఫలానా వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోతే పేరు మార్చుకుంటాను, లేదా ఫలానా పేరువాణ్ణే కాదు’ అనే తరహాలో  శపథాలు చేసేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే, ఈ మాటల మూలాలు ఒకనాటి గణవ్యవస్థలో ఉన్నాయన్నమాట. ఇంతకంటే విశేషం ఏమిటంటే, గణదశలో ఉన్నప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆనవాయితీ ఉండడం.  గణవ్యవస్థలో పేర్లకు గల ప్రాధాన్యం గురించీ, ప్రత్యేకించి ‘యుద్ధంలో ఓడిపోయినప్పుడే’ నని అనకపోయినా   కొన్ని సందర్భాలలో పేరు మార్చుకోవడం గురించీ లూయీ హెన్రీ మోర్గాన్ తన ‘పురాతన సమాజం’ (Ancient Society) అనే రచనలో చర్చించారు. అమెరికన్ ఇండియన్ తెగల గురించిన సందర్భంలో ఆయన ఈ చర్చ చేయడం మరింత ఆసక్తికరం.

మనం పేరులో ఏముందనుకుంటాం కానీ, గణసమాజం అస్తిత్వం అంతా పేరులోనే ఉంది. ఎందుకంటే, ఆటవికులలోనూ, అనాగరికులలోనూ కుటుంబాలకు పేర్లు లేవు. వ్యక్తుల పేర్లను బట్టే వారి గణం ఏదో తెలుస్తుంది. కనుక గణం తను ఉపయోగించే పేర్లను ముందే ప్రకటించుకుంటుంది. అంటే, ఆ పేర్లను ఇంకో గణం ఉపయోగించకూడదన్న మాట.  ఆవిధంగా, భూమి హక్కు, నీటి హక్కు వగైరాలు ఎలాగో ఆ పేర్లు కూడా గణానికి ఒక హక్కుగా, ఆస్తిగా సంక్రమిస్తాయి.

బిడ్డ పుట్టాక తల్లి మొదట గణంలో వాడుక లేని పేరును దగ్గరి బంధువుల ఆమోదంతో ఎన్నుకుంటుంది. అయితే, వివిధ గణాలు సభ్యులుగా ఉన్న తెగ సమితి సమావేశమై ఆ పేరును ధ్రువీకరించిన తర్వాతే వాస్తవంగా బిడ్డకు నామకరణం జరిగినట్టు లెక్క. ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతని పేరును అతని పెద్ద కొడుకు అనుమతిస్తే తప్ప అతను జీవించి ఉండగా ఇంకొకరు ఉపయోగించకూడదు. పెద్ద కొడుకు తండ్రి పేరును వేరే గణంలోని మిత్రుడికి ఎరువు ఇవ్వవచ్చు. అయితే ఆ వ్యక్తి చనిపోతే ఆ పేరు మళ్ళీ ఈ గణానికి వచ్చేస్తుంది. తనకు నచ్చిన వేరే గణంలోని పేరును తల్లి బిడ్డకు పెట్టే ఆనవాయితీ కూడా కొన్ని గణాలలో ఉంది. అప్పుడు ఆ బిడ్డ, ఆ పేరుమీద హక్కు ఉన్న గణానికి చెందుతుంది.

పేర్లలో కూడా రెండు తరగతులు ఉంటాయి: చిన్నప్పుడు పెట్టేవి, పెద్దయ్యాక పెట్టేవి. ఈ పేరు మార్పుకు కూడా పెద్ద తతంగం ఉంటుంది. పదహారు, లేక పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చాక గణ నాయకుడే కొత్త పేరు పెడతాడు. ఆ తర్వాత తెగ సమితి సమావేశంలో ఆ పేరు ప్రకటిస్తారు. పేరు మార్పుతోనే ఆ కుర్రవాడికి పెద్దరికం వస్తుంది. అతనికి పెద్దవాళ్ళ బాధ్యతలను నిర్వర్తించే అర్హత లభిస్తుంది. మన ప్రస్తుతాంశానికి సంబంధించి ముఖ్య వివరం ఏమిటంటే, ఒక వ్యక్తి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపించినప్పుడు కూడా పేరు మార్చుకోవచ్చు. దీనినిబట్టి యుద్ధంలో ఓడిపోయినప్పుడు కూడా పేరు మార్చుకోవడం అనే ఆనవాయితీ ఉండడంలో ఆశ్చర్యంలేదు. గంధర్వుడు చేసింది అదే. అలాగే, కొత్త హోదాను అందుకున్నప్పుడూ,  పెద్ద జబ్బు చేసినప్పుడూ, వృద్ధాప్యంలోనూ కూడా పేరు మార్చుకునే ఆనవాయితీ గణవ్యవస్థలో ఉంది. అయితే, ఎప్పుడు పేరు మార్చుకోవాలన్నా అది గణంలోని స్త్రీలు, నాయకుల ఇష్టంతోనే జరగాలి తప్ప వ్యక్తిగత ఇష్టంతో కాదు.

ఇప్పటికీ మనదేశంలో కొన్ని కులాలలో ఉన్న ఉపనయన సంస్కారంలోనూ, దత్తత స్వీకారం వంటి ఇతర తంతులలోనూ ఒకనాటి ప్రపంచవ్యాప్త గణసమాజ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఉపనయనం అనేది ఇప్పుడు మనదేశంలో కొన్ని కులాలలోనే కనిపిస్తున్నా, గణదశలో అది అందరికీ ఉండేదన్న సంగతిని ప్రత్యేకించి గమనించాలి.

***

ప్రస్తుతానికి వస్తే…

కౌంతేయులమైన తాము తాపత్యవంశీకులము ఎలా అయ్యామన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా గంధర్వుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు. దాని గురించి తర్వాత….

 

 

 

 

 

 

అడవుల్లోకి వెళ్లడానికి బ్రాహ్మణుడే ‘పర్మిట్’

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

దారపు ఉండను వేలాడుతున్న అనేక కొసల్లో దేనిని పట్టుకోవాలన్న సమస్య మళ్ళీ వచ్చింది!

ఇంతకుముందు వ్యాసాలలో,  ముఖ్యంగా గత నాలుగు వ్యాసాలలో కొన్ని ప్రస్తావనలు చేశాను. కొన్ని పేర్లు ఉటంకించాను. కొన్ని పరిణామాల గురించి, ఘటనల గురించి చెప్పాను. వీటిలో దేనినైనా  పట్టుకోవచ్చు. అయితే, సమస్యే అది… దేనిని పట్టుకోవాలి?!

ఉదాహరణకు, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడం గురించి చెప్పాను. ఆ కొసను పట్టుకుని నిరభ్యంతరంగా  ముందుకు వెళ్లచ్చు. అదే సమయంలో, పురాచరిత్ర, చరిత్ర అనేవి వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తాయో చెప్పాను. దానిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది.

అలాగే, దీర్ఘచరాయణుడు, వస్సకారుల గురించి చెప్పాను.  ఇలాంటివారే మనకు తెలిసిన వ్యక్తులు కొందరు ఉన్నారు… చాణక్యుడు, రాక్షసమంత్రి; చరిత్ర కాలంలో యుగంధరుడు, తిమ్మరసు తదితరులు. దీర్ఘచరాయణుడు, వస్సకారుడు వీళ్ళకు మాతృక(proto-type)లుగా మీకు కనిపించి ఉండాలి. కానీ మనకు చాణక్యుడు తదితరుల గురించి మాత్రమే తెలుసు. వాళ్ళకు మాతృకలు ఉన్న సంగతి తెలియదు.  కనుక పట్టుకోదగిన కొస ఇక్కడ కూడా ఏదో ఉంది.

చాణక్యుడు, ముఖ్యంగా అతని అర్థశాస్త్రం, చాణక్యుని శిష్యునిగా చెప్పుకునే మౌర్య చంద్రగుప్తుడి మనవడు అశోకుని గురించి మాట్లాడుకునేటప్పుడు మన చరిత్ర విస్మృతికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు ఉన్నాయి. ఆ కొసను కూడా పట్టుకోవచ్చు. అసలు అర్థశాస్త్రం గురించే చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అదీ ఒక మంచి కోసే.

క్రీ.పూ. 6వ శతాబ్దం; మనదేశంలోనే కాక, దాదాపు ప్రపంచవ్యాప్తంగా మత,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో పోలికలు గల  మార్పులు సంభవించిన కాలంగా చెబుతారు. అది కూడా పట్టుకోదగిన కోసే.

ఇక, చాణక్యుడు తదితరులకు దీర్ఘచరాయణుడు, వస్సకారులు మాతృకలు అయినప్పుడు, దీర్ఘచరాయణుని అలా ఉంచినా, వస్సకారునికి మాతృక లెవరన్న మరో ఆసక్తికరమైన ప్రశ్నను మీ ముందుకు తేవాలని ఉంది. అది కూడా ముఖ్యమైన కొసే. పురాచరిత్ర, చరిత్ర వర్తమానంలోకి ప్రవహించడం అనే కొసతో దగ్గరి సంబంధం ఉన్న కొస కూడా అది.

ఇక ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి రాక తప్పదు… ఈ చివరి కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

***

విచిత్రం ఏమంటే, చాణక్యుడు మొదలైనవారి మాతృక ఎవరో మనకు అంతగా తెలియకపోవచ్చు కానీ, వస్సకారుడి మాతృక ఎవరో గుర్తించడం చాలా తేలిక. కాకపోతే, మనం పౌరాణిక కాలానికి వెళ్ళాలి. మన పురాణ, ఇతిహాసాల నిండా వారు కనిపిస్తారు. మనకు చరిత్ర కన్నా పురాణాలే బాగా తెలుసుననీ, మన దృష్టిలో పురాణాలే చరిత్ర అనీ అనడానికి ఇది కూడా బహుశా ఒక నిదర్శనం.

ఇక్కడ ఇంకో విశేషాన్ని కూడా చెప్పాలి. పురాణ, ఇతిహాసకాలం పురాచరిత్రలోకీ, చరిత్రలోకీ అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న సందర్భాలలో ఇదొకటి అన్నప్పుడు; నేటి 21 వ శతాబ్దాన్ని కూడా అందులో చేర్చి మరీ చెబుతున్న సంగతిని మీరు ప్రత్యేకించి గమనించాలి. ఈ కోణం మొత్తం నా వ్యాస పరంపరకు జోడించే అతి ముఖ్యమైన ‘అదనపు విలువ’ల్లో ఒకటి!

స్థూలంగా చెబితే, పురాణ, ఇతిహాసాలలో కనిపించే మునులే వస్సకారునికి మాతృకలు. వాళ్లందరికీ ప్రతినిధిగానూ, వాళ్ళలో ప్రముఖునిగానూ వశిష్టుని చెప్పుకున్నా; అగస్త్యుడు, జరత్కారువు మొదలైన మునులు చాలామంది ఉన్నారు. మునులు అరణ్యాలలో ఆశ్రమాలు కట్టుకుని ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ అడవుల్లో ఆదివాసీ తెగలు ఉంటాయని తెలుసు. అంటే, మునులు ఆదివాసీ తెగల మధ్య జీవించగలరన్నమాట. అంటే, వాళ్ళు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలరన్న మాట… అదీ సంగతి!

వస్సకారుడు చేసింది అదే. అయితే, వస్సకారుడు ఒక రాజకీయ కుట్రను అమలు చేయడానికి తెగల మధ్యకు వెళ్ళాడు. కనుక అడవుల్లో ఉండే మునులందరూ వస్సకారునికి మాతృకలని నేను అనడం లేదు. కొందరు మునులు వేరే ప్రయోజనాలకోసం కూడా అడవుల్లో ఉంటూ ఉండచ్చు. కానీ, మునులు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలగడమే చూడండి…అది రెండంచుల కత్తి. ఒక అంచును రాజకీయ అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు.

ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే, అడవుల్లోకీ, ఆదివాసీ తెగల మధ్యకీ వెళ్లడానికి ‘పర్మిట్’, లేదా ‘లైసెన్స్’ ఒక్క మునులకే ఉంది. ఈ రోజుల్లో మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ, ఆరోజుల్లో ఆ పర్మిట్ లేదా లైసెన్స్ చాలా విలువైనది. మునులు, లేదా బ్రాహ్మణుల విలువను, ప్రతిపత్తిని పెంచిన వాటిలో ఇది కూడా ఒకటి కావచ్చు. బ్రాహ్మణులకే ఈ పర్మిట్ ఎందుకు ఉందో ఊహించడం కష్టం కాదు. వాళ్ళు నిరాయుధులు! వాళ్ళ నోట మంత్రమే కాదు, ఎదుటివారిని మంత్రించే మాట కూడా ఉంది. వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న సాయుధ క్షత్రియులతో ఆదివాసులది సహజవైరం. కనుక క్షత్రియులు నేరుగా అడవిలోకి ప్రవేశించే అవకాశం లేదు. క్షేమం  కాదు. ఆవిధంగా అడవుల్లోకి క్షత్రియుల ప్రవేశానికి బ్రాహ్మణుడు టార్చ్ లైట్ లేదా లైసెన్స్ అయ్యాడన్న మాట. బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత మరింత గట్టిపడదానికి  బహుశా అదే ప్రారంభమూ కావచ్చు.

బ్రాహ్మణులు అడవుల్లోకీ, ఆదివాసుల మధ్యకూ  వెళ్లడం మాత్రమేనా…? కాదు, వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. కొందరైనా వాళ్ళలో కలసిపోయారు, లేదా వాళ్ళను తమలో కలుపుకున్నారు.  బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యతనే కాక, బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధాలను వెల్లడించే ఉదంతాలు పురాణ, ఇతిహాసాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. రాజు-పురోహితుల సంబంధం ఎలాంటిదో జనమేజయుడు-సోమశ్రవసుల(సోమశ్రవసుడి తల్లి నాగజాతీయురాలు, తండ్రి బ్రాహ్మణుడు. ఆవిధంగా అది  కూడా బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధమే) ఉదంతంతోనూ, బ్రాహ్మణ-ఆదివాసీ వివాహ సంబంధాలను జరత్కారుడు-జరత్కారువుల ఉదంతంతోనూ నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. కనుక ఇప్పుడు వాటిలోకి వెళ్లకుండా ఒక ఉదంతానికి పరిమితమవుతాను. అది, క్షత్రియుల అటవీ ప్రవేశానికి బ్రాహ్మణుడు ‘పర్మిట్’ అన్న సంగతిని చాలా స్పష్టంగా, ఆశ్చర్యకరంగా వెల్లడించే అపురూపమైన ఉదంతం.

***

VanaParva

మహాభారతం, ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో ఉన్న ఆ ఉదంతంలో చెప్పుకోదగిన విశేషాలు చాలా ఉన్నాయి కనుక దానిని కొంత వివరంగా ఇవ్వదలచుకున్నాను:

పాండవులు తొలి విడత అరణ్యవాసం చేస్తున్నారు. అప్పటికి వారికింకా వివాహం కాలేదు. ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ, యాయవారం చేసుకుంటూ తల్లి కుంతితోపాటు ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటున్నారు. ఓ రోజున ఓ బ్రాహ్మణ బాటసారి అటుగా వెడుతూ పాండవులు ఉన్న ఇంట్లో విశ్రాంతి తీసుకోడానికి ఆగాడు. అతడు పాంచాలరాజు ద్రుపదుని రాజధాని కాంపిల్య నుంచి వస్తున్నాడు. అతనికి పాండవులున్న ఇంటి యజమాని ఆతిథ్యమిచ్చాడు. పాండవులు కూడా మర్యాదలు చేశారు. ఆపైన-

‘మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏయే దేశాలు బాగుంటాయి, ఏయే రాజులు ఉత్తములు?’  అని పాండవులు అతన్ని అడిగారు.

‘ద్రుపదుని దేశంతో సాటి వచ్చే దేశమే లేదు. ద్రుపదుని కంటే ఉత్తముడైన రాజే లేడు’ అంటూ అతను ద్రుపదుని చరిత్ర చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపదికి స్వయంవరం ప్రకటించిన సంగతిని చెప్పాడు.

పాండవులకు ఆ స్వయంవరానికి వెళ్లాలని అనిపించింది. కొడుకుల మనసు తెలుసుకున్న కుంతి, ‘ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోయాం. ఇలా ఎంతకాలం ఉన్నా ఏమిటి ఉపయోగం? అదీగాక పరుల ఇంట్లో ఎంతకాలమని ఉంటాం? దక్షిణ పాంచాలం మంచి వాసయోగ్యమనీ, పాంచాల రాజు ధార్మికుడనీ విన్నాం కనుక అక్కడికే వెడదాం. అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే భోజనం పెడతారట కూడా’ అంది.

ఆరుగురూ బయలుదేరారు. పెద్ద పెద్ద సరస్సులు, మహోగ్రమైన పర్వతాలు, కీకారణ్యాల గుండా వారు నిరంతరం నడక సాగించారు. మధ్యలో ఒకచోట వారికి వేదవ్యాసుడు కనిపించి, ‘ద్రుపదపురం వెళ్ళండి, మీకు మేలు జరుగుతుం’దని చెప్పి ఆశీర్వదించాడు.

రాత్రనక, పగలనక అలా నడుస్తూ వెళ్ళి ఆ ఆరుగురూ ఒకనాటి అర్థరాత్రి సమయానికి గంగానదిలోని సోమశ్రవతీర్థానికి చేరుకున్నారు. వారికి అందులో స్నానం చేయాలనిపించింది. దారిచూపడానికీ, రక్షణ కోసమూ ఒక కొరివి చేతిలో పట్టుకుని అర్జునుడు ముందు నడుస్తుండగా అతని వెనకే మిగిలిన వారు నదిని సమీపించారు. సరిగ్గా అప్పుడే ఒక గంధర్వుడు తన ఆడవాళ్ళతో కలసి జలక్రీడలాడడానికి అక్కడికి వచ్చి ఉన్నాడు. పాండవుల అడుగుల చప్పుడు విని వారి వైపు చూశాడు. అతనికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే విల్లు తీసుకుని పెద్దగా నారీధ్వని చేశాడు.

‘అర్థరాత్రీ, సంధ్యలూ- భూత, యక్ష, దానవ, గంధర్వులు సంచరించే సమయాలు. ఈ సమయాలలో మనుషులిక్కడ  తిరగడానికి భయపడతారు. ఇలాంటి వేళల్లో ఎంతటి బలవంతులైనా, రాజులైనా సరే మేము ఓడించేస్తాం. దగ్గరికి రావద్దు, దూరం తొలగండి. నేను అంగారపర్ణుడనే గంధర్వుణ్ణి. కుబేరుడికి మిత్రుణ్ణి. ఈ ప్రదేశంలో నేను ఎప్పుడూ విహరిస్తూ ఉంటాను. నన్నే ఎరగరా మీరు? ఈ అడవీ, గంగాతీరమూ అంగారపర్ణాలుగా జగత్ ప్రసిద్ధాలు. మనుషులు ఇక్కడికి రావడానికి భయపడతారు’ అన్నాడు.

అప్పుడు అర్జునుడు, ‘చేతకాని మనుషులైతే అర్థరాత్రి, సంధ్యాకాలాల్లో తిరగడానికి భయపడచ్చు. కానీ మేము ఎప్పుడైనా, ఎక్కడైనా తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే, మేము చాలా శక్తిమంతులం. ఈ అడవులు, ఏరులు నీ సొంతమా? ఈ భూమి మీద ఉన్న జనులందరూ సేవించుకోదగిన ఈ పుణ్య భాగీరథి నీదేమిటి? మేము ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చాం. నువ్వు వద్దంటే మానే వాళ్ళం కాదు. నీ మాటలకు మేమెందుకు భయపడతాం?’ అంటూ ముందుకు నడిచాడు.

అప్పుడు అంగారపర్ణుడు అతని మీద వాడి బాణాలు ప్రయోగించాడు. కోపించిన అర్జునుడు అవి తనకు తగలకుండా కాచుకుంటూ తన చేతి కొరివితోనే వాటిని చెదరగొట్టాడు. ‘ఈపాటి భయపెట్టడాలూ, మాయాలూ అస్త్రవిదులమైన మమ్మల్ని ఏంచేస్తా’యంటూ అతనిమీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం అప్పటికప్పుడు అంగారపర్ణుని రథాన్ని దగ్ధం చేసేసింది. తను కూడా దగ్ధమైపోతానన్న భయంతో అంగారపర్ణుడు కిందికి దూకేసాడు. అప్పుడు అర్జునుడు అతని కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేసాడు. దాంతో అతని భార్య కుంభీనస అనే ఆమె పెడబొబ్బలు పెడుతూ తనకు పతిదానం చేయమని వారిని ప్రార్ధించింది. ధర్మరాజు జాలిపడి, ఓటమి చెందిన ఈ హీనుణ్ణి  విడిచిపెట్టమని అర్జునుడికి చెప్పాడు. ‘కురుకులేశ్వరుడైన ధర్మరాజు నిన్ను విడిచిపెట్టమన్నాడు. ఇక భయపడకు’ అంటూ అర్జునుడు అతనితో అని, తీసుకెళ్లి అతని ‘మంద’లో విడిచిపెట్టాడు.

ఆ తర్వాత అంగారపర్ణుడికీ, అర్జునుడికీ మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అంగారపర్ణుడు: నీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ అంగారపర్ణత్వం నాకెందుకు? ఇంకా దీనిని ధరించడానికి నేను మరీ అంతా సిగ్గుమాలిన వాణ్ణా? గర్వం అణిగిపోయేలా యుద్ధంలో ఓడిన తర్వాత కూడా వెనకటి పేరు చెప్పుకుని గర్వించేవాణ్ణి హాస్యాస్పదుడిగా చూస్తారు తప్ప సత్సభల్లో ఎవరైనా మెచ్చుకుంటారా? నీ ఆగ్నేయాస్త్రం వల్ల నా రథం దగ్ధమైనా, నా గంధర్వమాయతో అనేక రత్నాలతో అలంకృతమైన విచిత్ర రథాన్ని పొంది ఇక నుంచి చిత్రరథుడనే పేరుతెచ్చుకుంటాను.

అదలా ఉంచి, నీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నేను తపస్సు చేసి చాక్షుసి అనే విద్యను పొందాను. ఈ విద్యతో మూడు లోకాల్లోనూ ఏం జరుగుతోందో చూడచ్చు. ఈ విద్య వల్లే మేము మనుషులకంటే గొప్పవాళ్ళమై, దేవతల శాసనం కిందికి కూడా రాకుండా ఉండగలుగుతున్నాం. అయితే, ఈ విద్య దుర్మార్గుల పరమైతే ఫలించదు. నువ్వు తాపత్య వంశ వర్ధనుడివి, మహాపురుషుడివి కనుక నీకు ఫలిస్తుంది. ఈ దివ్యవిద్యను నీకు ఇస్తాను, తీసుకో. అయితే దీనిని స్వీకరించేటప్పుడు షణ్మాసవ్రతం చేయాలి. ఆపైన, నీ ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఇస్తే, మీ అయిదుగురికీ నూరేసి చొప్పున మహాజవసత్త్వాలు కలిగిన గంధర్వ హయాలు ఇస్తాను.

ఈ గుర్రాలు ఇంకా ఎలాంటివో చెబుతాను, విను. పూర్వం వృత్రాసురునిపై ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. అది వజ్రంలా కఠినమైన వృత్రుని శిరస్సు మీద పడి, పతన వేగం వల్ల పది ముక్కలైంది. ఆ ముక్కలే వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియుడికి ఆయుధమూ, విట్(విశ్-వైశ్యుడు)కు నాగలి, శూద్రులకు సేవ, వాహనాలలో వేగమూ అయ్యాయి. అటువంటి వేగం కలిగిన వాటిలోనూ సాటి లేని గుర్రాలు అయ్యాయి.

అర్జునుడు: ఎంత మిత్రుడైనా సరే, ఇంకొకరినుంచి విద్యను, వేదాన్ని, విత్తాన్ని తీసుకోను. అంతగా నీకు ఇష్టమైతే, నా ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని, నీ గుర్రాలు ఇయ్యి. ఇకనుంచి నీతో గాఢస్నేహం చేస్తాను. అది సరే కానీ, పరమ ధార్మికులం, పరమ బ్రహ్మణ్యులమైన మమ్మల్ని మొదట్లో అదిలించి ఎందుకు మాట్లాడావు?

అంగారపర్ణుడు: త్రిలోకాలలోనూ చెప్పుకునే మీ నిర్మలగుణాల గురించి నారదుడు మొదలైన మునీశ్వరులు, సిద్ధసాధ్య గణాల ద్వారా ఎప్పుడూ వింటూనే ఉంటాను. భూభార దురంధరులు, గుణోదారులు, ధీరులు, భరతవంశోత్తములు అయిన పాండవుల గురించి తెలియనివారు ఎవరు? అయినా సరే, పరుషవాక్యాలు ఎందుకు పలికానంటావా? మీరు అగ్నిహోత్రంతోనూ, బ్రాహ్మణునితోనూ లేరు కనుక-

ఎంత వివేకం ఉన్నవాడికైనా ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మదమెక్కుతుంది. ధర్మం తప్పుతాడు. మంచీ చెడూ విచక్షణ కోల్పోతాడు. నేను కూడా ఎంత వివేకినైనా సరే, ఆడవాళ్ళ మధ్యలో అలా మాట్లాడాను. అందులో ఆశ్చర్యం ఏముంది? మన్మథుణ్ణి గెలవడం ఎవరి తరం?

బ్రాహ్మణులను ముందు పెట్టుకునే పుణ్యాత్ములైన రాజులను ధిక్కరించడానికి దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు, గంధర్వులు కూడా చాలరు. వేదవేదాంగవేత్త, జపహోమ యజ్ఞ తత్పరుడు, సత్యవచనుడు, సదాచారుడు అయిన బ్రాహ్మణుని పురోహితుని చేసుకున్న రాజు ఈ భూమండలం మొత్తాన్ని ఏలగలగడమే కాదు, పుణ్యలోకాలు కూడా పొందుతాడు. బ్రాహ్మణుడు వెంట లేకుండా స్వశక్తితో రాజ్యం సంపాదించడం ఏ రాజుకు సాధ్యం? మీరు యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల వరప్రభావంతో పాండురాజుకు, కుంతికి పుట్టినవాళ్లు; ధర్మం తెలిసినవారు, భారద్వాజ శిష్యులు, సమస్త లోకాల మేలు కోరేవారు. కనుక మీరు పురోహితుడు లేకుండా ఉండకూడదు.

నువ్వు బ్రహ్మచర్యవ్రతంలో ఉన్నావు కనుక మన్మధావేశంతో ఉన్న నన్ను ఓడించగలిగావు. అదే బ్రాహ్మణునితో ఉన్న రాజైతే, భోగలాలసుడైనప్పటికీ అన్ని యుద్ధాలూ గెలుస్తాడు. కనుక మీ గుణోన్నతికి తగిన ధర్మతత్వజ్ఞుని, పవిత్రుని పురోహితునిగా చేసుకోండి.

అప్పుడు అంగారపర్ణుని అర్జునుడు అడిగాడు… ‘మేము కౌంతేయులం కదా, మమ్మల్ని తాపత్యులని ఎందుకు అన్నా’వని.

అప్పుడు అంగారపర్ణుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు…

***

అంతకంటే ముందు, అర్జున-అంగారపర్ణ సంభాషణలో దొర్లిన అనేక విశేషాలను స్పృశిస్తూ ఆ ఉపాఖ్యానంలోకి  వెడదాం.  అది వచ్చే వారం…

 

 

 

వీరుడు మరణించడు!

‘Re-invention of the wheel’ అని ఇంగ్లీషులో ఒక నుడికారం ఉంది. చక్రాన్ని మళ్ళీ మళ్ళీ కనిపెట్టడం అని కాబోలు దీని అర్థం. ఈ విశాల భూప్రపంచంలో అటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకానొక దాన్ని ఇంతకు ముందు ఎప్పుడో ఎవరో కనిపెట్టారని తెలియని వారు, తమే కనిపెట్టామని అనుకునే ప్రమాదం ఉంటుంది. ఒక దాన్ని అనేక మంది ఏకకాలంలో కనిపెట్టినా, ఆ సంగతి తెలియనప్పుడు ఎవరికివారు మేమే కనిపెట్టామని అనుకోవడమూ జరుగుతూ ఉంటుంది. అలా అనుకోడంలో అజ్ఞానం ఉన్న మాట నిజమే. ఇంకోవైపు నుంచి చూడండి…అందులో జ్ఞానం కూడా ఉంది.

ఎందుకంటే, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతివ్యక్తీ ఈ ప్రపంచాన్ని తన కళ్ళతో చూస్తూ, తన బుద్ధితో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వివిధ వయోదశల మీదుగా అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అప్పటికే ఆ వయోదశను దాటినవారికీ, అతనికీ పోలిక ఉండదు. అతను ప్రతి పరిణామాన్నీ, ప్రతి అనుభవాన్నీ కొత్తగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఉదాహరణకు, తొలి యవ్వనంలో, అందులోనూ వసంత కాలంలో ప్రతి ఒకరి మనసులోనూ కలిగే మధురమైన అలజడినే తీసుకోండి. అది అతనికే(లేదా ఆమెకే) సొంతం. అది మొదట్లో అర్థం కాని ఓ ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాగే, నడివేసవిలో మలయమారుతం తాకినప్పుడూ, ఆ అనుభవం అలాంటి అర్థం కాని ఆహ్లాదంగానే ఉంటుంది. ఇలా ప్రపంచమూ, ప్రకృతీ కూడా ప్రతి తరంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూ, మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆవిష్కృతమవుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్నిసార్లూ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. దానినే మనం ‘జీవించడం’ అంటాం.
దీనినే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే… ‘ఎవరి అనుభవమూ, ఎవరి అనుభూతీ వారిది కాన!’

అయితే, ఇదే సమయంలో చూడండి, సార్వత్రిక జ్ఞానమూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, లేదా పరిణామం చెందుతూ ఉంటుంది. దానినే నేను ‘అదనపు విలువ’ను జోడించడం అంటాను. ప్రతి తరమూ, ప్రతి కాలంలోనూ జ్ఞానానికి అదనపు విలువను జోడించుకుంటూ వెడుతుంది. లేదా వెళ్ళాలి.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఈ వ్యాస పరంపరలో అక్కడక్కడ ‘re-invention of the wheel’ తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే, ‘అదనపు విలువ’ను జోడించడమూ బహుశా మీకు కనిపిస్తుంది. దేనికైనా సరే, అదనపు విలువను జోడించే అవకాశం లేనప్పుడు దేని గురించీ నేను రాయలేను. రాయవలసిన అవసరం కనిపించదు. అటువంటప్పుడు నా కలం(లేదా కీ బోర్డ్) గట్టిగా మొరాయిస్తుంది. అయితే, ఇంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి అదనపు విలువ అనుకున్నది కూడా అదనపు విలువ కాకపోవచ్చు. అజ్ఞానం నా కలం కన్నా మొండిది.
అప్పుడిక, ‘ఎవరి అనుభవమూ, ఎవరి అనుభూతీ వారిది కాన…!’

***

ఈ వివరణ నేపథ్యంతో కోసల-మగధ ‘సినిమా కథ’ చూద్దాం.

ఇందులో కథనమే నాది కానీ, కథ కోశాంబీదే. మల్లబంధులకు పెట్టిన పరీక్షా, పుష్కరిణిలో స్నానం చేయాలన్న మల్లిక కోరికను అతను తీర్చడం రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా సే గంగ’ నుంచి తీసుకున్నవి.

olga se ganga

ఇంతకీ సినిమా కథ అన్నాక ఒక హీరో ఉండాలి కదా?! ఈ కథలో హీరో ఎవరు? ఇది నాకు ముందుగా ఎదురైన ప్రశ్న. నాకు వదలిపెడితే; పసనేది, మల్లబంధుల, అజాతశత్రు, విదూదభుడు, దీర్ఘచరాయణుడు…వీరిలో ఎవరైనా హీరో కావచ్చునంటాను. వీళ్లలో ఏ ఒక్కరి కోణం నుంచైనా ఈ కథ చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే, నా ఉద్దేశంలో ఈ కథలో వీళ్ళెవరూ హీరోలు కారు, కోసల అదృశ్యమై మగధ ఏకైక సామ్రాజ్యంగా అవతరించడం అనే చారిత్రక పరిణామం; అంటే చరిత్ర, హీరో! లేదా విలన్! విలన్ ప్రధానంగా సినిమా ఎందుకు ఉండకూడదు? అయితే, చరిత్ర హీరోగా (లేదా విలన్ గా) తీసిన సినిమా చూడడానికి మన ప్రేక్షకులు అలవాటు పడకపోవడం ఒక సమస్య. పోనీ నేనే చరిత్రను హీరోను చేసి సినిమా తీద్దామంటే ఓ వందకోట్లు(హాలీవుడ్ స్థాయిలో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబోలు) నష్టపోవడానికి నా దగ్గర ఓ వెయ్యికోట్లు లేవు.

కనుక అర్జెంటుగా, ప్రేక్షకులు తేలిగ్గా కనెక్ట్ అయ్యే హీరోను సృష్టించాలి. అతనిలో హీరోయిజంతోపాటు అతను ఒక ఉన్నత లక్ష్యంకోసం పోరాడేవాడు అయుండాలి. నాకు మల్లబంధుల కనిపించాడు. అలాగని కోశాంబీ చెప్పిన చారిత్రక వివరాన్ని పక్కన పెట్టడం నాకు ఇష్టంలేదు. అది, మల్లబంధులను పసనేది చంపించడం. హీరో మధ్యలోనే చనిపోతే ఇక సినిమా ఎలా?! దాంతో మల్లబంధులను పసనేది చంపించిన సంగతిని దాచిపెట్టాను. అతను అదృశ్యమయ్యాడని మాత్రమే చెప్పాను. అతనికి అచ్చంగా తనలానే ఉన్న ఒక కొడుకు ఉన్నాడని చెప్పాను కనుక, కథ ప్రకారం మల్లబంధుల అదృశ్యమైనా ప్రేక్షకులకు అతను కనిపిస్తూనే ఉంటాడు. ఆవిధంగా హీరో ‘బతికే’ ఉంటాడు, అది చాలు.

కథలో నేను చేసిన ప్రధానమైన మార్పు ఇదొక్కటే. కాకపోతే, పసనేది, వాసభ ఖత్తియ, దీర్ఘచరాయణుల పాత్రలకు రూపురేఖలు ఇవ్వడంలో అక్కడక్కడ స్వతంత్రించి ఉంటాను. అయితే, అందులో కూడా చారిత్రక వివరాల హద్దుల్లోనే ఉండడానికి ప్రయత్నించాను. ఉదాహరణకు వాసభ ఖత్తియనే తీసుకోండి, ఆమెను ఉత్తమురాలిగా చెబుతున్నప్పుడు నాగజాతీయుల ఆడబడుచు అని గుర్తుచేశాను. బుద్ధుడికి నాగజాతీయులపై విశేష గౌరవాభిమానాలు ఉండేవని కూడా అన్నాను. అది చారిత్రక వాస్తవమే. బుద్ధుడికి నాగజాతీయుల మీద ఎంత అభిమానమంటే, తను శాక్యుడైనా ముందు జన్మలో తనో ఉత్తమ నాగుడినని ఆయన చెప్పుకుంటాడు.

bimbisara bimbisara
ప్రధానమైన మార్పు దగ్గరికి మరోసారి వెడితే, అది సినిమా కోసం చేసిన మార్పే కానీ, కేవలం ‘సినిమా కోసమే’ చేసిన మార్పు కాదు. అందులో కూడా చరిత్ర, బహుశా పురాచరిత్ర ఉన్నాయి. అవి ప్రపంచవ్యాప్తం కూడా. నిజానికి చరిత్రకానీ, పురాచరిత్రకానీ ఉన్నచోటే ఉండిపోవు, అవి వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని మనం తేలిగ్గా గుర్తించం. లేదా గుర్తించడానికి నిరాకరిస్తాం. వర్తమానంలోకి ప్రవహించే చరిత్రను, పురాచరిత్రను పక్కకు తోసేస్తూ వర్తమానం చుట్టూ ఎత్తైన ఆనకట్ట కట్టుకుని మనం బతికేసే తీరు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అసలు చరిత్రే లేనివాళ్ళంగా, ఉన్నా దానితో మనకెలాంటి సంబంధం లేనివాళ్లంగా, ఇరవయ్యొకటో శతాబ్దంలోనే పుట్టిన ఓ ‘స్వయంభూ’ జాతిగా నటిస్తూ మనం ఎలా బతికేయగలమో నాకు ఎప్పుడూ అర్థం కాదు. ఇదే మాట నేను ఇదివరకూ అన్నట్టున్నాను. ఆశ్చర్యం ఎన్నిసార్లైనా అనిపిస్తుంది.

వెనకటి సమాజాలు తమ పరిధుల్లో, తమకున్న పరిమిత వనరులలో తమదైన ఒక జీవన నుడికారం(idiom)తో జీవించాయని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరంగా, ప్రపంచమంతటా అన్ని సమాజాలూ దాదాపు ఒకే జీవన నుడికారాన్ని పంచుకున్నాయని కూడా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛతో సహా వేటినైతే మనం ఆధునిక విలువలని అనుకుంటున్నామో, లేదా భ్రమపడుతున్నామో అవన్నీ వెనకటి సమాజాలు కూడా అనుభవించాయి. అనుభవించడం కాదు, ఒక హక్కుగా డిమాండ్ చేసి సాధించుకున్నాయి. పీడితులు స్వేచ్ఛగా తమ భావవ్యక్తీకరణ చేసుకోడానికి పీడకులు సైతం ఒక రోజునూ, కొంత జాగానూ అనుమతించడం కనిపిస్తుంది. అసలాలోచిస్తే, స్వేచ్ఛే మానవ ప్రకృతి అనడానికి చరిత్ర పొడవునా సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఈ సందర్భంలో రాంభట్ల కృష్ణమూర్తిగారు ‘జనకథ’లో రాసిన మాటలు గుర్తొస్తున్నాయి…

‘మా స్వగ్రామం విశాఖజిల్లాలో చోడవరానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న కుగ్రామం. పేరు పెదపూడి అగ్రహారం….డానికి సర్వాధికారి మా తాత…ఆ గ్రామంలో మాది కాక, మరో ఐదు బ్రాహ్మణ ఇళ్ళున్నాయి…గ్రామంలో ఎక్కువమంది గొల్లలు. కాపుల కుటుంబాలు అయిదారు ఉండవచ్చు. గ్రామం నడుమను రెండు బాగా పెరిగిన రావి చెట్లు, రామస్వామి కోవెల…గవిరమ్మ సంబరాలలో రామస్వామి కోవెల ముందు వాలకాలు కడతారు. వాలకం అంటే జీవితం అని అర్థం. అమ్మవారి సంబరాల్లో కట్టే వాలకాలు గ్రామీణుల హాస్యానుకరణలు. ఈ శతాబ్దారంభంలో అమెరికాలో ప్రచారం అయిన వాడెవిల్లె నాటకాలలాంటివి ఈ వాలకాలు. బర్బర మహాదశ(ఫ్రాక్ చరిత్రకు మోర్గన్ కట్టిన రెండు మహాదశలలో రెండోది బర్బర దశ. మొదటిది శావేజి దశ) నాటినుంచీ అంకురారోపణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేవి వాలకాలు…’

ఇందులో చెప్పకపోయినా ముఖాముఖీ మాట్లాడుకున్నప్పుడు వాలకాలగురించి మరికొన్ని ముచ్చట్లు ఆయన చెబుతుండేవారు. ఓ సారి ఆయన తాత గారి దగ్గర పనిచేసే పాలేరే వాలకం కట్టి హాస్యమూ, వ్యంగ్యమూ జోడిస్తూ తన యజమానిని కడిగిపారేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. మొత్తానికి, ‘వాలకం’ అనేది ఒక అభినయరూపంగా మరుగున పడి ఒక అస్తవ్యస్త ఆకారాన్ని సూచించే మాటగా నేడు మిగిలింది.
ఇప్పుడీ వెలుగులో, వాడెవిల్లె(vaudeville) గురించి Webster Dictionary ఏమంటుందో చూడండి:

(Vaudeville) ‘A kind of song of a lively character, frequently embodying a satire on some person or event, sung to a familiar air in couplets with a refrain; a street song; a topical song. American entertainment, popular from 1870.

మొత్తానికి మన వాలకానికైనా, వాళ్ళ వాడెవిల్లె కైనా వేళ్ళు పురా చరిత్రలో, రాంభట్లగారు చెప్పినట్టు బర్బర దశలోనే ఉండి ఉండచ్చు.

చెప్పొచ్చేదేమిటంటే, బహుశా పురాచరిత్ర కాలంలో ఉండి, చరిత్ర కాలంలోనూ, ఇటీవలివరకూ కొనసాగిన ఇలాంటి ఒక జీవన నుడికారాన్ని ఆధారం చేసుకునే కోసల-మగధ కథలో పైన చెప్పిన ప్రధానమైన మార్పు చేశాను. అది: ‘వీరుడు మరణించడు’ అనే విశ్వాసం, లేదా భావన.

అవును, వీరుడు మరణించడు! వీరుడే కాదు, సమాజానికి ఏదో ఒక హితం చేసిన వ్యక్తి, లేదా ఏదో ఒక విధంగా సమాజం నుంచి ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వ్యక్తి-మరణించినట్టు కచ్చితమైన ఆధారం ఉంటే తప్ప ఎప్పటికీ మరణించడు. ముఖ్యంగా ఆ వ్యక్తి సజీవంగా ఉండి అదృశ్యమైపోయినప్పుడు జనస్మృతిలో అసలు మరణించే అవకాశమే లేదు. ఈ భావన కేవలం అభిమాన సూచకమైన సెంటిమెంట్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇంకో అడుగు ముందుకు వేసి, ఇలాంటి వారిని సజీవులుగా ప్రచారంలో ఉంచడం వెనుక సామాన్యప్రజానీకం అనుసరించే ఒక కచ్చితమైన వ్యూహం కూడా ఉందని నేను అంటాను. ఆయా చారిత్రక ఘట్టాలలో దుర్భరమైన హింసను, పీడనను, జీవన సంక్షోభాన్ని ఎదుర్కొనే సమాజాలు ఒక ‘మెసయ్యా’ కోసం పరితపిస్తాయి. లేనప్పుడు ఒక మెసయ్యాను సృష్టించుకుంటాయి. అవి ఆ విధంగా తమ చుట్టూ ఒక ఊహాత్మక రక్షణ కవచాన్ని నిర్మించుకుంటాయి. ఒక్కోసారి అత్యంత బలవత్తర శక్తులకు వ్యతిరేకంగా సామాన్యప్రజానీకం ఎంతో తెలివిగా ప్రయోగించే ఒక వ్యూహాత్మక ఆయుధమే ‘వీరుడు మరణించడు’ అనే భావన.

 

మన పురాణాలు ఏడుగురిని చిరంజీవులుగా చెబుతాయి. ఒక పట్టిక ప్రకారం ఆ ఏడుగురు వీరు: అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు. ఇంకో పట్టికలో మార్కండేయుడు కూడా చేరతాడు. ఇంకా ఏవైనా పట్టికలు ఉన్నాయేమో తెలియదు. చిరంజీవులుగా చెప్పడంలో వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండచ్చు. అశ్వత్థామ గురించి ఇవే వ్యాసాలలో ఒకచోట చెప్పాను. భారతయుద్ధంలో పాల్గొన్న కౌరవవీరులలో ప్రాణాలతో మిగిలిన ప్రముఖులు ముగ్గురే: అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ. మొదటి ఇద్దరూ చిరంజీవుల పట్టికలో చేరారు. మూడో వ్యక్తి ఎందుకు చేరలేదో తెలియదు. అశ్వత్థామ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వీరుడు కూడా. అలాగే, తన అన్నలతో సహా రాక్షసవీరులందరూ మరణించినా ప్రాణాలతో మిగిలింది విభీషణుడే. ఇక బలి కూడా అదృశ్యుడైపోయినట్టు చెప్పే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. ఆ వివరాలలోకి మరెప్పుడైనా వెడదాం. ఆయా కాలాలలో పురాణ, ఇతిహాసాలను బోధించే ప్రతి ఒకరూ వ్యాసులే అనుకుంటే(ఇంద్రుడిలా వ్యాసుడు ఒక వ్యక్తి కాదు, పదవి అని గుర్తిస్తే) వ్యాసుడు చిరంజీవే. అలాగే, హనుమంతుడికీ, పరశురాముడికీ కూడా చిరంజీవుల జాబితాలో చేరడానికి ప్రత్యేక కారణాలు ఉండే ఉంటాయి.

jai-somnath

కె. ఎం. మున్షీ రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ‘జై సోమ్ నాథ్’. అందులో గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకోడానికి భారీ సైన్యంతో బయలుదేరతాడు. అతి క్లిష్టమైన రాజస్తాన్ ఎడారి మీదుగా అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో ఒక దుర్గానికి అధిపతి అయిన మోఘా రాణా అనే వీరునికి ఈ విషయం తెలుస్తుంది. అతడు గజనీ మహమ్మద్ ను అడ్డుకోడానికి ప్రయత్నించి అమరుడవుతాడు. అప్పుడు గజనీ మహమ్మద్ ను అడ్డుకునే బాధ్యతను అతని కొడుకు తీసుకుంటాడు. తండ్రి మోఘా రాణా ‘భూతం’గా తను మారి, తండ్రి ఉనికిని చాటుతూ జనంలో ధైర్యాన్ని నింపుతాడు. మరోపక్క, గజనీ మహమ్మద్ ను ముప్పుతిప్పలు పెడతాడు.

the journeyer

ఇటలీ వ్యాపారి, యాత్రికుడు మార్కోపోలో(క్రీ.శ. 1254-1324) ఆత్మకథ ఇతివృత్తంగా ‘The Journeyer’ పేరుతో Gary Jennings పెద్ద నవల రాశారు. మార్కోపోలోను తీసుకుని అతని తండ్రి, పినతండ్రి ఇటలీ నుంచి చైనాకు వెడుతుంటారు. అది క్రూసేడ్ల(మతయుద్ధాలు) కాలం. మధ్యప్రాచ్య దేశాల మీదుగా వెడుతూ ఓ చోట వాళ్ళు ఓ సత్రంలో బస చేస్తారు. సత్రం యజమానికీ, వారికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

సత్రం యజమాని: రాత్రిపూట తగిన రక్షణ లేకుండా బయట తిరగద్దు. ఇది దారి తప్పిన దుండగులు తిరిగే ప్రాంతం.
మార్కోపోలో: ఎవరా దుండగులు?
సత్రం యజమాని: కొండ మీద ఉండే ఓ పెద్దాయన తరపున పని చేసే హంతకులు.
మాఫియో పోలో(మార్కోపోలో పినతండ్రి): ఏం కొండ? ఈ ప్రాంతమంతా బల్లపరుపుగా ఉంటేను…
సత్రం యజమాని: ఏమో… ఆయనను ‘కొండ మీద ఉండే పెద్దాయన’ అనే అంటారు. ఆయన పేరు షేక్ ఉల్-జిబల్. నిజంగా ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు.ఆయన నివసించే దుర్గం కొండ మీద నిజంగా ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు.
నికోలో పోలో(మార్కోపోలో తండ్రి): అతనా? అతనిప్పుడు జీవించి లేడు. పదిహేనేళ్ళ క్రితం మంగోలులు అతన్ని చంపేసి పీడ వదిలించుకున్నారు.
సత్రం యజమాని: నిజమే…అలాగని నిజమూ కాదు. మీరు చెప్పిన పెద్దాయన వేరు. ఆ స్థానంలో ఇంకో ‘పెద్దాయన’ ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు…మీకు తెలుసో, తెలియదో?
నికోలో పోలో: ఓహో! ఆ సంగతి నాకు తెలియదు.
సత్రం యజమాని: అదే మరి… ఆ ‘పెద్దాయన’ ఆదేశాలను దారి తప్పిన దుండగులు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. ఆ దుండగుల్లో కూడా కొంతమంది ఇప్పటికే వృద్ధులైపోయి ఉంటారు. అయినా సరే…
కొండ మీద ఉండే పెద్దాయన పేరు చెప్పి దుండగులు చేసేది ఏమిటంటే, వర్తకుల మీద పడి వారిని చంపి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం. దీనికో కొసమెరుపు ఉంది. పోలోలు ముగ్గురూ నిద్రపోతుండగా ఈ సత్రం యజమానే దుండగుడుగా మారి వారిని దోచుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో వీరి చేతిలో అతనే మరణిస్తాడు.

 

ఈ ఉదంతం, పైన చెప్పిన వీరులు, ఇతరుల ఉదంతానికి భిన్నంగా ఉన్న మాట నిజమే. కానీ గమనించండి, ఫార్ములా మాత్రం ఒకటే…ఒక అదృశ్యవ్యక్తిని, లేదా అసలు లేనే లేని వ్యక్తిని నిరంతరం ప్రచారంలో ఉంచడం! నేడు మనకు తెలిసిన ప్రచారసాధనాలు లేనికాలంలో జనం ఇలాంటి ఒక మౌఖిక ప్రచార సాధనాన్ని సృష్టించుకున్న ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయని నేను నమ్ముతున్నాను. దానిని నేను ఆ కాలపు జీవన నుడికారం అంటాను. పురాచరిత్ర, చరిత్ర మీదుగా వర్తమానంలోకి ప్రవహించే ఇలాంటి జీవన నుడికారాన్ని మేళవించడమే ఈ కథకు నేను జోడించే ఒకానొక అదనపు విలువ.

***

ఇటీవలి కాలానికి చెంది మనకు బాగా తెలిసిన రెండు ఉదాహరణలే చూడండి. ఒకరు, అల్లూరి సీతారామరాజు, రెండోవారు, సుభాస్ చంద్ర బోస్. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైనికుల చేతిలో మరణించిన సంగతిని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారని మనకు తెలుసు. తూర్పు గోదావరి జిల్లా బెండపూడికి చెందిన ఒక సాధువు, లేదా పాపికొండల్లోని పేరంటపల్లిలో జీవించిన బాలానంద స్వామి(ఈయన గురించి ఇవే వ్యాసాలలో ఒక చోట రాశాను) అల్లూరి సీతారామరాజే కావచ్చునన్న ప్రచారమూ జరిగేది. అలాగే సుభాస్ చంద్ర బోస్ విమానప్రమాదంలో మరణించలేదని గట్టిగా నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు.
ఎందుకంటే, వీరుడు ఎప్పటికీ మరణించడు!

నది మింగేసిన కోసల

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

పసనేది రోజు రోజుకీ రాజ్యం పట్ల నిరాసక్తు డవుతున్నాడు. నిర్లిప్తు డవుతున్నాడు. బౌద్ధ సన్యాసులతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. మిగతా సమయాన్ని తన ఏకాంత మందిరంలో, తనలో తాను గడుపుతున్నాడు.

అతని మీద బుద్ధుని ప్రభావమే కాక, బుద్ధుని ప్రభావం ఉన్న వాసభ ఖత్తియ ప్రభావం కూడా పడుతోంది.  ఆమె దాసి కూతురనీ, తనను మోసగించి ఆమెను కట్టబెట్టారనే కోపం అతని మనసులో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. ఆమె సౌశీల్యం, వ్యక్తిత్వం ఆమె వైపు అతన్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. ఆమె కేవలం శరీర సుఖాన్నీ, కొడుకునీ ఇచ్చిన అర్థాంగిగా అతనికి కనిపించడం లేదు. తనను సేద తీర్చే చలవపందిరిలా, కంటి వెలుగులా, ఆత్మబంధువులా కనిపిస్తోంది. ఆమె నాగ జాతీయుల ఆడబడుచు. బుద్ధుడికి నాగజాతీయులపై విశేష గౌరవాభిమానాలు ఎందుకున్నాయో ఆమెను చూస్తే పసనేదికి అర్థమవుతోంది.

ఇంతటి ఉత్తమురాలి రక్తం పంచుకున్న కొడుకు అంత కర్కోటకుడు ఎలా అయ్యాడో  నని ఒక్కోసారి పసనేదికి  ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆ వెంటనే అతనికే సమాధానం స్ఫురిస్తూ ఉంటుంది. అతను తన రక్తం కూడా పంచుకుని పుట్టాడు. తనలోని కర్కోటకాంశ అతనికి సంక్రమించడంలో ఆశ్చర్యం ఏముంది?

ఈ ఊహ రాగానే పసనేదికి తన గుండెను ఏదో కర్కశహస్తం మెలి తిప్పేసినట్టు అయిపోతుంది. విషాదంతో, పశ్చాత్తాపంతో అతని తల పాతాళం లోకి దిగబడిపోతున్నట్టు అనిపిస్తుంది…

రాజ్యవ్యవహారాలను విదూదభుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తండ్రి పేరుకు మాత్రమే రాజు. అతను కూర్చునే సింహాసనం, అరుదైన సందర్భాలలో తప్ప మిగిలిన సమయాలలో ఖాళీగానే ఉంటోంది.  విదూదభుడు రాజుగా తండ్రి ఉనికిని దాదాపు గుర్తించడం మానేశాడు.

పసనేదిపై పిడుగుపాటులాంటి మరో పరిణామం. వాసభ ఖత్తియ అనారోగ్యంతో మంచం పట్టింది. కొన్ని రోజులే నని రాజవైద్యులు చెప్పేశారు. ఇప్పుడు పసనేది భార్య పక్కనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

ఓ రోజు, తన కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.  ‘ఏమిటి నీ చివరి కోరిక?’ అని అడిగాడు. ఆమె భర్తవైపు జాలిగా, ప్రేమగా, తృప్తిగా చూసింది. అంతలోనే ఆమె ముఖం విషణ్ణమై పోయింది. ‘గౌతముని చూడాలని ఉంది…’ అంటూ భర్తవైపు చూసింది. ఆ కళ్ళల్లో క్షణకాలంపాటు ఆశ తళుక్కుమంది. అంతలోనే అది అత్యాశ అని తనకే అనిపించింది.  ఉబికి వచ్చే కన్నీళ్లను భర్త కంట పడకుండా దాచుకునే ప్రయత్నంలో చివాలున ముఖం పక్కకు తిప్పేసుకుంది.

పసనేది  ఉలికిపడి తన చేతిలో ఉన్న ఆమె చేతిని అప్రయత్నంగా వదిలేశాడు. భార్య కోరిక తీర్చలేని తన అశక్తత అతని ముందు భూతంలా కనిపించింది.  తనలో రాజునన్న అహం లేశమాత్రం మిగిలినా, దానిని ఇనప చేతులతో అణచిపారేసింది.  ఈమెను గౌతముడి దగ్గరకు ఎలా తీసుకువెళ్లడం?! ఎక్కడున్నాడు గౌతముడు? శ్రావస్తికి పదిరోజుల ప్రయాణదూరంలో ఉన్నట్టు నిన్ననే తెలిసింది. భగవంతుడు కరుణించి ఈమె ఆయుర్దాయాన్ని పదిరోజులు పొడిగిస్తాడనే అనుకున్నా, ఈమె ప్రయాణం చేసే స్థితిలో ఉందా?! ఎంత ఉన్నా ప్రకృతీ, కాలాల ముందు మనిషి ఎంత అల్పుడో అతనికి ఆక్షణంలో అర్థమయింది.

‘తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. నీ కళ్ళు నావిగా చేసుకుని నేను వెళ్ళి గౌతముని దర్శిస్తాను’ అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు అతని గొంతు దుఃఖంతో పూడిపోయింది.

ఆ రోజు రాత్రే వాసభ ఖత్తియ కన్నుమూసింది. పసనేది ఏకాంతాన్ని భర్తీ చేసే చివరి బంధం తెగిపోయింది. అతనిప్పుడు పూర్తిగా ఏకాకి అయిపోయాడు.

***

తెగలలో అస్తిత్వ సంక్షోభం తారస్థాయికి చేరింది…

అదే సమయంలో ఒక ప్రచారమూ పుంజుకోవడం ప్రారంభమైంది…  ఒక మహావీరుడు వస్తున్నాడు, తమను ఆదుకోబోతున్నాడు, తమలో వెనకటి ఆత్మగౌరవాన్నీ, ప్రాణాలకు తెగించి పోరాడే పటిమనూ మళ్ళీ రంగరించబోతున్నాడు, తెగలకు పునర్జన్మ ప్రసాదించబోతున్నాడు!

మొదట్లో తెగల గుండెల్లో సుడులు తిరుగుతున్న ఆశలూ, ఆకాంక్షలే ఆ ప్రచార రూపంలో వ్యక్తమైనా, త్వరలోనే అది నిజమనిపించే ఆనవాళ్లూ కనిపించసాగాయి. కోసల, మగధ సైనికుల దౌర్జన్యానికి ప్రతిఘటన ఎదురవుతోంది. హఠాత్తుగా ఒక ముసుగు దళం ప్రత్యక్షమై సైనికులతో తలపడి తరిమి కొడుతోంది. మరోవైపు తెగలలోని యువకులను సంఘటితం చేసి ప్రతిఘటనకు సిద్ధం చేసే పనీ రహస్యంగా జరుగుతోంది. తెగలలో క్రమంగా ఒక నూతనోత్సాహం, ఆత్మ విశ్వాసం అడుగుపెడుతున్నాయి. అంతకంటే, ఆశ్చర్యంగా ‘మల్లబంధుల మన మధ్యకు వచ్చాడు, మేము అతన్ని చూశా’మనే వదంతి కూడా వ్యాపిస్తూ వచ్చింది.

***

King_Pasenadi_of_Kosala

పసనేదిని దీర్ఘచరాయణుడు ఈ మధ్య తరచు కలవడం లేదు. కలవాల్సిన అవసరం కూడా రావడం లేదు. దీర్ఘచరాయణుడు తనను రోజూ కలసుకోవాలనీ, తనతో రాజ్యవ్యవహారాలు చర్చించాలనే ఇచ్ఛ పసనేదిలో కూడా కనిపించడం లేదు. విదూదభుడు అన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. దానిని పసనేది నూటికి నూరుపాళ్లూ ఆమోదించినట్టే కనిపిస్తున్నాడు.

వాసభ ఖత్తియ మరణించినప్పుడూ, ఆమె అంత్యక్రియలప్పుడూ దీర్ఘచరాయణుడు పసనేదిని చూశాడు. అది జరిగి కూడా నెలరోజులు దాటింది. ఇప్పుడు హఠాత్తుగా పసనేది తనకు కబురు చేసేసరికి ఎందుకు అయుంటుందా అనుకుంటూ వెళ్ళి కలిశాడు. పసనేది ముక్తసరిగా విషయం చెప్పాడు. తనెంతకాలం బతుకుతాడో తెలియదు. గౌతముని దర్శించుకోవాలని ఉంది. వాసభ ఖత్తియకు కూడా మాట ఇచ్చాడు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయాలి!

దీర్ఘచరాయణుడు విన్నాడు. అతని హృదయంలో ఒక ఆనంద ఝరి ఒక్కసారి నిశ్శబ్దంగా ఉవ్వెత్తున ఎగసి పడింది. ఏవేవో ఆలోచనలు అంతే వడిగా అతన్ని ముసురుకున్నాయి. అంతలోనే, తన మనోసంచలనం ముఖంలో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు.

‘రాజ్యం నీ చేతుల్లో పెడుతున్నాను, విదూదభుడు ఎలాంటి సాహసమూ చేయకుండా చూడు’ అని పసనేది చెప్పలేదు. చెప్పకపోవడంలోనే చెప్పడం ఉందేమో తెలియదు. సరే నని చెప్పి దీర్ఘచరాయణుడు సెలవు తీసుకున్నాడు.

***

ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ, కొండంత భారంనుంచి బయటపడినప్పుడు కలిగే ఒకవిధమైన ఉల్లాసాన్ని పొందుతూ  దీర్ఘచరాయణుడు తన నివాసానికి వెళ్ళాడు…

తన ఆనందాన్ని దగ్గరివాళ్లతో పంచుకుందామనుకున్నా అతనికి ఆ అవకాశం లేదు. అతను పెళ్లి చేసుకోలేదు. మేనమామ కొడుకు మల్ల విక్రముడు కూడా దగ్గర లేడు. అతను తండ్రికి తగ్గ వీరుడే. కానీ ఎందుకో పసనేది అతనిని రాజ్యానికి వాడుకోవాలనుకోలేదు. విదూదభుడికి అప్పగించాలనీ అనుకోలేదు. అలాగని అతని మీద ఆదరభావం లేకా కాదు. అతన్ని సొంత కొడుకులానే చూశాడు. దాంతోపాటు స్వేచ్ఛా ఇచ్చేశాడు. కోసల, మగధలకు వ్యతిరేకంగా తెగలను సంఘటితం చేసే లక్ష్యంతో  మల్లవిక్రముడు అజ్ఞాతజీవితంలోకి వెళ్లిపోయాడు. తన తండ్రి మల్లబంధుల ఉనికిని ప్రచారంలో ఉంచింది అతనే.

తన నివాసంలో అడుగుపెట్టిన దీర్ఘచరాయణుడు ఆ క్షణంలో పరిచారకులకు వింతగా, కొత్తగా కనిపించాడు. అతని ముఖంలో ఎన్నడూ చూడని ప్రసన్నత, ఉల్లాసం కనిపిస్తున్నాయి. అతని ప్రవర్తన వాళ్ళకు ఎప్పుడూ అంతుబట్టనిదే. బయట నలుగురిలో ఉన్నప్పుడు అంత శాంతుడు, అంత సౌమ్యుడు, అంత మృదుభాషి ఇంకొకరు లేరు అన్నట్టు ఉంటాడు. ఎప్పుడూ నవ్వుముఖంతో ఉంటాడు. రాజ్యక్షేమానికే అంకితమైనట్టు ఉంటాడు. ఇంతకుముందు పసనేదికైనా, ఇప్పుడు విదూదభుడికైనా అతని మీద ఎనలేని గురి.

కానీ, ఏకాంతంగా ఉన్నప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తాడు. దగ్గరకు వెళ్లడానికీ, పలకరించడానికే తాము భయపడిపోతూ ఉంటారు. బాహ్య, అంతర్ ప్రవర్తనలో తనలో వచ్చే మార్పు అతనికీ తెలుసు. ఒక్కోసారి అది తనకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి తను గంభీరుడైపోతాడు. దీర్ఘాలోచనలో పడిపోతాడు. కసి, కార్పణ్యం, కోపంతో కళ్ళు జేవురిస్తాయి. అయితే, తనలో ఈ వైరుధ్యం ఎప్పుడు ప్రవేశించిందో, ఎందుకు ప్రవేశించిందో అతనికి తెలుసు…

అది, మేనమామ మల్లబంధుల ‘అదృశ్యం’ అయినప్పటినుంచీ!

చాలా ఏళ్ళు గడచిపోయాయి. అప్పటినుంచీ తన గుండెల్లో  రహస్యంగా అగ్నిగుండాన్ని మోస్తున్నాడు. మేనమామ గుర్తొచ్చినప్పుడల్లా అతని రక్తం మరిగిపోతుంది. పగ, ప్రతీకారేచ్చ వేయి నాల్కలతో బుస కొడతాయి. అవి పసనేది మీద…మొత్తం కోసల రాజ్యం మీద…

మేనమామ అదృశ్యం కాలేదు! పసనేది అతన్ని గుట్టు చప్పుడు కాకుండా చంపించాడు. మల్లిక మరణంతో జీవితం మీద విరక్తి చెంది ఏ అడవులో పట్టి పోయాడని తనే ప్రచారం చేయించాడు. అత్త మరణం మేనమామను కుంగదీసిన మాట నిజమే. కానీ కొడుకును, తనను చూసుకుని ఆయన ఓదార్పు పొందుతున్నాడు. అటువంటి మనిషి తమ ఇద్దరినీ ఒంటరివాళ్లను చేసి హఠాత్తుగా అదృశ్యమయ్యాడనడం అప్పుడే తనకు నమ్మశక్యంగా అనిపించలేదు.  అతన్ని పసనేది చంపించిన విషయం కొన్ని మాసాలకే తెలిసింది. ఆ కుట్రలో పాల్గొన్న మనిషే తనకు స్వయంగా ఈ విషయం చెప్పాడు. అతను మల్ల తెగతో బంధుత్వం ఉన్నవాడు. అదీగాక ఒక వీరుని అన్యాయంగా కుట్ర చేసి చంపామన్న పశ్చాత్తాపం అతన్ని ఆ తర్వాత దహిస్తూ వచ్చింది. ఓ రోజున తనను కలసి, ఎవరికీ చెప్పనని తన చేత ఒట్టు వేయించుకుని ఈ సంగతి చెప్పాడు.

***

పసనేది ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. అతనికి అత్యంత విశ్వాసపాత్రులు, అతనికోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే సిబ్బంది అతనితో బయలుదేరారు. వారిలో ఒక వృద్ధ పరిచారిక కూడా ఉంది.

పసనేది గౌతముని దర్శించుకున్నాడు. ఆయన సన్నిధిలో వారం రోజులు గడిపాడు. ఎన్నడూ లేనంత శాంతి అతన్ని ఆవరించింది. అన్ని బంధాలూ పుటుక్కున తెగిపోయినట్టు అనిపించి, మనసు దూదిపింజలా అయిపోయింది.  తన అస్తిత్వం మొత్తాన్ని ఇప్పుడు ఇద్దరే ఆక్రమించుకున్నారు. గౌతముడు, తన దివంగత అర్థాంగి వాసభ ఖత్తియ! తన అస్తిత్వం ఇలా కుదించుకుపోవడంలోనే అతనికి పూర్ణత్వం అనుభూతమవుతోంది. ఇప్పుడు ఎలాంటి విచారమూ లేదు.

తిరుగు ప్రయాణమై కొంత దూరం వచ్చాక పిడుగుపాటు లాంటి వార్త…గౌతముడు సిద్ధిపొందాడు!

మరోవైపు కోసలనుంచి మరో సంచలన వార్త…విదూదభుడు తనే రాజునని ప్రకటించి సింహాసనాన్ని అధిష్టించాడు! అది తండ్రి సమ్మతితోనే జరిగినట్టు కూడా ప్రకటించాడు. అందుకు సాక్ష్యంగా దీర్ఘచరాయణుడు తన దగ్గర ఉన్న రాజముద్రను అతనికి అందించాడు.

పసనేదిలో ఆ వార్త ఎలాంటి విపరీత సంచలనమూ కలిగించలేదు. పైగా తృప్తి కలిగించింది. రాజ్యబంధం కూడా తెగిపోయింది అనుకున్నాడు. అంతకంటే ఎక్కువ తృప్తిని కలిగించినది, దీర్ఘచరాయణుడు రాజముద్రను విదూదభుడికి అందించడం! తన మేనమామ మల్లబంధులను తను చంపించిన సంగతి అతనికి తెలిసి ఉంటుంది. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుని ఉంటాడు. మంచి పని చేశాడు. అయితే, తను చేసిన పాపానికి అది చిన్న పరిహారం మాత్రమే.

ప్రయాణమధ్యంలో ఉన్న పసనేది తక్షణ కర్తవ్యం గురించి యోచించాడు. తనిప్పుడు శ్రావస్తికి వెళ్ళి ఏంచేయాలి? వెడితే తనను కొడుకు బతకనివ్వడు. అయినా తనకు ప్రాణభయం లేదు. ఆ బంధం కూడా ఎంతో కాలం ఉండదు. తన ఈడువాడే అయిన గౌతముడు కన్నుమూశాడు. తనూ ఏ క్షణంలోనైనా రాలిపోవచ్చు. ఆ రాలిపోవడం ఎక్కడైతేనేం?  శ్రావస్తికి వెళ్ళి కొడుక్కి పితృహత్యాపాపం కూడా కట్టబెట్టడం దేనికి?

తన వెంట ఉన్న సిబ్బందిని చూశాడు. వాళ్ళు తనకు ఎంతో విశ్వాసపాత్రంగా ఉంటూ వచ్చినవాళ్లు. పిల్లా, పాపా,  చూడవలసిన జీవితం ఎంతో ఉన్నవాళ్ళు. వాళ్ళకు తను అంతిమ న్యాయం చేయాలి. వాళ్లను శ్రావస్తికి పంపేయాలి.

తన నిర్ణయాన్ని వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు వ్యతిరేకించారు. ఇది నా ఆదేశం అనేసరికి తలవంచారు. వృద్ధ పరిచారిక మాత్రం ససేమిరా అంది. చావైనా, బతుకైనా మీతోనే నని భీష్మించింది.

సిబ్బంది కంటతడితో సెలవు తీసుకున్నారు. పసనేది, పరిచారికా మిగిలారు.  ఇప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి గౌతముడి దగ్గరకు వెడదామన్నా గౌతముడు లేడు.  అంతలో, మగధరాజధాని రాజగృహ తమున్నచోటికి రెండు రోజుల ప్రయాణ దూరమన్న సంగతి గుర్తొచ్చింది. అక్కడ తన తోబుట్టువు ఉంది. చూసి ఎంతకాలమైందో! కడసారి ఆమెను ఒకసారి చూడచ్చు. అలాగే, అజాతశత్రుకు గౌతముని సందేశాన్నీ అందించవచ్చు.

***

పసనేది, పరిచారిక రాజగృహ చేరుకునేసరికి అర్థరాత్రి దాటింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. పసనేది మరీనూ. తీరా వెళ్ళేసరికి మూసి వేసిన కోట తలుపులు వారిని వెక్కిరించాయి. తెల్లారే వరకూ చలిలో చీకటిలో ఆకలి దాహాలతో గడపక తప్పదు. కానీ అప్పటికే పసనేదిలో సత్తువ క్షీణించిపోయింది. అలసట అతని మీద ప్రభావం చూపుతోంది. దగ్గు, ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అతని తలను తన ఒడిలో పెట్టుకుని వృద్ధపరిచారిక చేసిన ఉపచారం వల్ల ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఆమె ఒడిలోనే పసనేది తుది శ్వాస విడిచాడు.

పొద్దుటే కోట తలుపులు తెరచిన భటులకు పసనేది మృతదేహామూ, పక్కనే రోదిస్తున్న పరిచారికా కనిపించారు. పరిచారిక వల్ల అతను అజాతశత్రుకు మేనమామ అని తెలుసుకున్న భటులలో కొందరు హుటాహుటిన వెళ్ళి ఆ విషయం అతనికి చెప్పారు. మిగిలినవాళ్లు పసనేది మృతదేహాన్ని కోట లోపలికి చేర్చారు. అజాతశత్రు, తల్లి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.

అజాతశత్రు రాజలాంఛనాలతో పసనేదికి అంత్యక్రియలు జరిపించాడు.

***

కొన్ని మాసాలు గడిచాయి.

విదూదభుడికి పట్టపగ్గాలు లేవు. రాజ్యవిస్తరణ యత్నంలో పడ్డాడు. దీర్ఘచరాయణుడు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. అందులో అతని ప్రణాళిక అతనికి ఉంది. పసనేదిని తప్పించడం ద్వారా అతని పగ సగమే తీరింది. కోసల రాజ్యాన్ని పూర్తిగా తుడిచిపెడితేనే తన పగ పూర్తిగా చల్లారుతుంది.

విదూదభుడు దండయాత్రకు బయలుదేరాడు. రాప్తీ నదీతీరంలో దండు విడిసింది. అర్థరాత్రి అతనూ, సైన్యమూ తమ గుడారాలలో గాఢనిద్రలో ఉన్నారు. ఆ నదికి తరచు మెరపు వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఆ సంగతి దీర్ఘచరాయణుడికి తెలుసు. విదూదభుడికి తెలియదు. దీర్ఘచరాయణుడు ఆ విషయం అతనికి చెప్పలేదు. ఆ రోజు మెరుపు వరద సంభవించి గుడారాలను ముంచెత్తింది. జరుగుతున్నది ఏమిటో తెలుసుకునేలోపలే విదూదభుని, సైన్యాన్ని నది మింగేసింది.

నిజానికి నది మొత్తం కోసలరాజ్యాన్నే తుడిచిపెట్టింది. మల్లబంధులను చంపినందుకూ, శాక్యులను ఊచకోత కోసినందుకూ ప్రకృతి విధించిన శిక్షగా దానిని చెప్పుకున్నారు.  రాజూ, సైన్యమూ కూడా లేని కోసలను అజాతశత్రు అవలీలగా ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా కోసల చరిత్రలోనే అదృశ్యమైపోయింది…

ఇప్పటినుంచీ కోసల-మగధ పేర్లలో ఒక్క మగధ పేరే వినిపించబోతోంది. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించబోతోంది. అటు గాంధారం నుంచి ఇటు దక్షిణభారతం వరకూ తన ఛత్రచ్చాయలోకి తెచ్చుకోబోతోంది. భారతదేశాన్ని చరిత్రకాలంలో ప్రతిష్టించబోతోంది. నందులు, చంద్రగుప్తుడు, అలెగ్జాండర్, మౌర్యసామ్రాజ్యం, అశోకుడు వగైరా పేర్లు మరిన్ని ఆనవాళ్లతో భారతీయులకు పరిచయం కాబోతున్నాయి. ఒకప్పుడు మగధకు సమవుజ్జీ అనిపించుకున్న కోసల చరిత్ర వాకిటిలోకి రాకుండానే, చరిత్రపూర్వగర్భంలోనే కన్నుమూసింది. రామాయణ రాజ్యాంగానే జన పరిచితిలో మిగిలింది.

తెగలు ఆ తర్వాతా మిగిలాయి. మగధ పాలకులకు చికాకు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. కాకపోతే అవి తమ గతవైభవానికి వెలిసిపోయిన నీడలు మాత్రమే. వాటి పోరాట పటిమ అజ్ఞాత పోరాటాలకు, గెరిల్లా యుద్ధాలకూ పరిమితమైంది.

దీర్ఘచరాయణుడు ఏం సాధించాడన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అతను వ్యక్తిగత పగ, ప్రతీకారాలను మాత్రమే తీర్చుకోగలిగాడు. తెగలను ఏ విధంగానూ ఉద్ధరించలేకపోయాడు. ఒక సర్వంసహాధిపత్యశక్తికి పరోక్షంగా దారి ఇచ్చాడు. మల్లవిక్రముడూ అంతే. కాకపోతే, వేలు, లక్షల సంఖ్యలో తన గెరిల్లా వారసులను ఇచ్చాడు. అతని వారసుల పోరాటం నేటికీ నడుస్తున్న చరిత్ర.

                                                  (అయిపోయింది)

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

అజాతశత్రువు- తండ్రి పాలిట మృత్యువు !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 

 

 

 

ఏళ్ళు గడుస్తున్నాయి…

మల్లబంధుల కొడుక్కి ఇప్పుడు అయిదేళ్లు. పసనేది కొడుక్కి కూడా. అతనిపేరు విదూదభుడు.

దీర్ఘచరాయణుడు పదిహేనేళ్ళ వాడయ్యాడు.

మల్లిక జ్ఞాపకంగా మిగిలిన కొడుకూ, పసనేది స్నేహమూ, మేనల్లుడి అభివృద్ధీ మల్లబంధులకు ఒకింత ఓదార్పు అయ్యాయి.

అయితే మల్లబంధుల-పసనేదిల స్నేహగీతంలో ఎక్కడో ఏవో అపశ్రుతులు చొరబడుతున్నట్టున్నాయి.

అవెలాంటివో చెప్పుకునే ముందు మనం ఒకసారి మగధకు వెడదాం.

           ***

మగధను పాలిస్తున్న బింబిసారుడికి ఒక కొడుకు. పేరు, అజాతశత్రు. అతనికిప్పుడు ఇరవయ్యేళ్లు. అజాతశత్రు కొంతకాలంగా అసహనంగా ఉంటున్నాడు. తండ్రి మీద కోపం ముంచుకొస్తోంది. కోపం ద్వేషంగా మారుతోంది.

‘నీ తండ్రికి నీ తాత పదిహేనేళ్ళకే సింహాసనం అప్పగించి తప్పుకున్నాడు. నీకు ఇరవయ్యేళ్లు వచ్చాయి. అయిదేళ్లు ఆలస్యమైపోయింది’ అని వస్సకారుడు తన చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు. వస్సకారుడు తన ఈడువాడే. బ్రాహ్మణుడు. మంచి తెలివితేటలు ఉన్నవాడు.

అతనంటున్నదీ నిజమే. తన మేనమామ పసనేదికి కూడా ఆయన తండ్రి పదిహేనేళ్ళకే రాజ్యం అప్పగించాడు. అదీగాక, తమ రాజ్యం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. అక్కడ  మేనమామ మాత్రం తన రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. తన తండ్రి బింబిసారుడు నిమ్మకు నీరెత్తినట్టు కాలం దొర్లిస్తున్నాడు.

ఈ పరిస్థితిని ఊహించుకుంటే తనకి ఆగ్రహమే కాక ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఎందుకంటే, రాజ్యవిస్తరణ అవకాశాలు తన మేనమామకి కంటే తమకే ఎక్కువ ఉన్నాయి. తమ అధీనంలో కావలసినంత లోహ సంపద ఉంది. వస్సకారుడు తనతో రోజూ ఇదే చర్చ. నీ తండ్రి వల్ల ఏమీ కాదు, ఆయన అడ్డు తొలగించుకో, నువ్వు చేతుల్లోకి తీసుకో అని చెబుతున్నాడు. నువ్వు చేయవలసింది చాలా ఉంది, లిచ్ఛవులు, మల్లులు కొరకాని కొయ్యలుగా ఉన్నారు, వారిని దారికి తెచ్చుకోనిదే, రాజ్యవిస్తరణ మాట దేవుడెరుగు, ఉన్న రాజ్యం కూడా ఊడిపోతుందని చెబుతున్నాడు. అతడు చెప్పాడని కాదు కానీ తనకూ అలానే అనిపిస్తోంది.  ఇలాగే ఊరుకుంటే, ఎంత మేనమామ అయితే మాత్రం… అతడు రేపు మగధ మీద పడడని ఎలా చెప్పగలం?!

ఆలోచించిన కొద్దీ ఏదో ఒకటి చేసి తీరవలసిందే నన్న తొందర అజాతశత్రులో పెరిగిపోతోంది. ఏం చేయాలో కూడా కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే, అందుకు మనసు రాయి చేసుకోవాలి…

చేసుకున్నాడు. వస్సకారుని సాయంతో అంతఃపురకుట్ర అమలు జరిగిపోయింది. తండ్రిని చెరలో పెట్టాడు. అంతమాత్రాన సరిపోదు. ఆయన ప్రాణాలతో ఉన్నంతకాలం తన అధికారానికి సవాలే. కనుక ఆయనకు తిండి పెట్టకుండా మాడ్చమని ఆదేశించాడు. ఆకలి మృత్యువుగా మారి కొన్నాళ్ళకు బింబిసారుని కాటేసింది.

      ***

bimbisara=buddha

మేనల్లుడి ఘాతుకం గురించి పసనేదికి తెలిసింది. ఆగ్రహమూ, బాధతోపాటు రకరకాల ఆలోచనలు అతన్ని ముసురుకున్నాయి. బింబిసారుడు తనకు బావా, మిత్రుడూ కూడా. అతని మరణం పసనేదిని నొప్పించింది. మేనల్లుడు రాజ్యదాహంతో తండ్రినే చెరపట్టి, ఆకలిచావుకు అప్పగించినప్పుడు, తనను మాత్రం ఎందుకు విడిచిపెడతాడు? అదీగాక తన కొడుకు విదూదభుడికి కూడా పదేళ్ళు దాటుతున్నాయి. రేపు అతడు కూడా అజాతశత్రును ఆదర్శంగా తీసుకుంటే?! కొడుకు విషయంలో తను ముందే జాగ్రత్తపడాలి. అంతకన్నా ముందు తను మేనల్లుడి నుంచి ఎదురుకాగల ముప్పును కాచుకోవాలి!

పసనేదిలోని ఈ రాజకీయచింతనతో, బావ మరణం కలిగించిన భావోద్వేగాలూ పోటీ పడుతున్నాయి. తను సోదరికి అరణంగా కాశీ దగ్గరలోని ఓ గ్రామాన్ని ఇచ్చాడు. మేనల్లుడు ఇంత చేశాక ఆ గ్రామాన్ని మగధకు విడిచిపెట్టడంలో అర్థం లేదు. దానిని తిరిగి తను స్వాధీనం చేసుకోవాలి. అది గ్రామమైనా చాలా కీలక స్థానంలో ఉంది. ఆ గ్రామం మీంచే కాశీ రేవుకు వెళ్ళాలి. వర్తక వాణిజ్య అవసరాల రీత్యా మగధరాజు దానిని వదలుకోవడం కష్టం. కనుక ఆ వైపునుంచి తీవ్ర ప్రతిఘటనే వస్తుంది. అయినా ఎదుర్కోవలసిందే. తను ఊరుకున్నా అజాతశత్రు ఊరుకోడు. రాజ్యాన్ని స్థిరపరచుకున్నాక తప్పకుండా కోసల మీద పడతాడు. ఎలాగూ ఘర్షణ తప్పనప్పుడు తనే తొలి దెబ్బ తీస్తే?!

అయితే, ఈ క్లిష్ట సమయంలో ఒక లోపం అతని ముందు జడలు విరబోసుకుని కుంగదీస్తోంది. అది, మల్లబంధుల సాయం పొందే అవకాశం లేకపోవడం!

     ***

మల్లిక మరణంతో మల్లబంధుల సగం చచ్చిపోయాడు. దానికితోడు అతనికీ, పసనేదికీ మధ్య దూరమూ పెరుగుతోంది. అందుకు ఇద్దరి వైపునుంచీ కారణాలు ఉన్నాయి.  ఇంకేముంది, మల్లబంధుల ఉనికినీ, పసనేది అతనికి ఇస్తున్న ప్రాధాన్యాన్నీ సహించలేకపోతున్న మిగిలిన వాళ్ళు ఆ కారణాల చిరుమంటకు మరింత నేయి అందించి పెద్దది చేయడం    ప్రారంభించారు. మల్లబంధుల గురించి ఏమనుకుంటున్నావో, అతడు పక్కలో పాము, నీ రాజ్యాన్ని కబళించడానికి చూస్తున్నాడని వాళ్ళు మొదట పసనేదితో అన్నప్పుడు అతను తీసిపారేశాడు. కానీ అదే పనిగా వారు నూరిపోస్తూ ఉండడంతో అనుమాన బీజం నాటుకుని క్రమంగా మొక్కగా ఎదుగడం ప్రారంభించింది. తనపట్ల మల్లబంధుల ప్రవర్తన కూడా అందుకు దోహదం చేసింది. మల్లబంధుల గతంలోలా తనతో మనసు విప్పి మాట్లాడడం లేదు. ముభావంగా, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

అది నిజమే. రాను రాను పసనేది ప్రవర్తనలో కూడా మల్లబంధులకు ఏదో తేడా కనిపించడమే అందుకు కారణం. తనను ఇక్కడికి తీసుకు వచ్చే ముందు తెగల స్వాతంత్ర్యాన్ని హరించే ఏ పనీ చేయనని పసనేది మాట ఇచ్చాడు. కానీ అతని ఆలోచనాసరళినీ, జరుపుతున్న కొన్ని సన్నాహాలనూ గమనిస్తున్న కొద్దీ అతడు మాట తప్పుతాడా అన్న అనుమానం బలపడుతోంది.

మొత్తానికి మల్లబంధుల అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. మల్లిక మరణంతో ఇన్నేళ్లలోనూ మామూలు మనిషి కాలేకపోయిన మల్లబంధుల, జీవితం మీద పూర్తిగా విరక్తి చెంది ఏ అడవులో పట్టి పోయాడని అందరూ అనుకున్నారు.

దీర్ఘచరాయణుడు, మల్లబంధుల కొడుకు మల్ల విక్రముడు ఒకరికొకరు మిగిలారు. మల్ల విక్రముడు అచ్చంగా తండ్రికి ప్రతిరూపం. పసనేది వారిద్దరినీ చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్నాడు. దీర్ఘచరాయణునిలోని మెరుపును అతను ఎప్పుడో గమనించాడు. అతడి సేవలు రాజ్యానికి అవసరం అనుకుంటున్నాడు. అతనిని మంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పసనేదిలో అంకురించింది.

              ***

పసనేది తన సోదరికి ఇచ్చిన అరణపు గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోసల-మగధల మధ్య యుద్ధాలకు ఆ చర్య నాంది పలికింది. రెండు యుద్ధాలు జరిగాయి. ఆ రెండు యుద్ధాలలోనూ గెలుపు అజాతశత్రుదే అయింది. దాంతో మేనమామను జయించడం సులువే నన్న భరోసా అజాతశత్రుకు చిక్కింది. కనుక ఇప్పుడే కోసలను స్వాధీనం చేసుకోవలసిన తొందరేమీ లేదు.

ఈ లోపల అంతకంటె ముఖ్యమైన సవాలును ఎదుర్కోవాలి. అది లిచ్ఛవుల రూపంలో ఎదురవుతున్న సవాలు. వస్సకారుడు కూడా అదే చెబుతున్నాడు. అయితే లిచ్ఛవులు మొండి ఘటాలు. తేలిగ్గా లొంగరు. వాళ్ళలో ఒక్కొక్కడు ఒక్కొక్క వీరుడు. ఒకరి ప్రాణం తీయడం, తమ ప్రాణం బలిపెట్టడం… రెండూ వారికి ఒక్కలాంటివే. యుద్దం వాళ్ళకు వినోదక్రీడ. పైగా వాళ్ళు మల్లులతో కలసి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు.

మరో కారణం చేత కూడా, వెంటనే లిచ్ఛవుల పని పట్టవలసిన అవసరం అజాతశత్రుకి కనిపించింది. అది వర్తకుల ఫిర్యాదు. నదీమార్గంలో సరకు రవాణా చేసే వర్తకులు ఇప్పటికే మగధకు ఒకసారి సుంకం చెల్లిస్తున్నారు. మరోవైపు లిచ్ఛవులూ ముక్కుపిండి వారి నుంచి సుంకం వసూలు చేయడం ప్రారంభించారు. ఈ సుంకాల చెల్లింపు తమకు తలకు మించిన భారమవుతోందంటూ వర్తకులు అజాతశత్రుకు మొరపెట్టుకున్నారు. లిచ్ఛవుల అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో అజాతశత్రు తొలి చర్యకు ఉపక్రమించాడు. నదికి దారితీసే మార్గంలో ఒకచోట కోట కట్టించాడు. అక్కడే శోణానది గంగతో కలుస్తుంది. ఆ ప్రదేశమే పాటలీపుత్రం(నేటి పాట్నా)పేరుతో మగధకు భవిష్యరాజధాని కాబోతోంది.

లిచ్ఛవులు కానీ మల్లులు కానీ అంతా తేలిగ్గా లొంగరన్న మాట నిజమే. అయితే ఒక వేరుపురుగు అప్పటికే ఆ తెగలను లోపలినుంచి తొలచడం ప్రారంభించింది. అది వ్యక్తిగత ఆస్తి వ్యామోహం. అది తెగ కట్టుబాటును, సమష్టి స్వభావాన్ని క్రమంగా సడలింపజేస్తోంది. వస్సకారుడు దీనిని కనిపెట్టాడు. నీ కత్తికి ఎక్కువ పనిపెట్టకుండా నేను అటువైపునుంచి నరుక్కు వస్తాను, నాకు విడిచిపెట్టు అని అజాతశత్రుతో అన్నాడు.

వస్సకారుడు లిచ్ఛవీ జనంలోకి వెళ్లాడు. మగధరాజు తనను అవమానించి తన్ని తగలేశాడని వారికి నమ్మబలికాడు. వాళ్ళ సానుభూతినీ, విశ్వాసాన్నీ పొందాడు. క్రమంగా తెగముఖ్యుల్లో ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి, వాళ్ళ ఐకమత్యాన్ని చెరచడం ప్రారంభించాడు. తెగల సభ(అసెంబ్లీ) పనిచేయడం ఆగిపోయింది. లిచ్ఛవుల అనైక్యత అజాతశత్రుకు రాచబాట పరిచింది. అతడు అవలీలగా వైశాలిని ఆక్రమించుకున్నాడు. మల్ల సమాఖ్యలను కూడా ఒక పద్ధతిగా ధ్వంసం చేసే పని అదే సమయంలో మొదలైంది. అయితే, మల్ల కేంద్రాలు పావ, కుశినార మాత్రం అంత తేలిగ్గా పట్టుబడలేదు.

     ***

విదూదభుడికి, మల్లవిక్రముడికి ఇరవయ్యేళ్లు దాటాయి. ముప్పయ్యేళ్లు దాటిన దీర్ఘచరాయణుడు మంత్రాంగంలో పసనేదికి కలసివస్తున్నాడు. మేనల్లుడు అజాతశత్రు తన తండ్రిని చెరబట్టి, తిండి పెట్టకుండా మాడ్చి చంపిన సంగతి అప్పటినుంచీ పసనేది ఆలోచనల్లో అలంగం తిరుగుతూనే ఉంది. నీ కొడుకు విషయంలో జాగ్రత్త పడమని చెబుతూనే ఉంది. దీర్ఘచరాయణుడితో ఆలోచించిన మీదట ఏం చేయాలో స్పష్టత వచ్చింది. విదూదభుని సేనానిగా నియమించాడు. అప్పటినుంచీ అతనికి విదూదభ సేనాపతి అనే పేరు వచ్చింది.

విదూదభుని సేనానిగా నియమించినా పసనేది  కొడుకును ఓ కంట కనిపెట్టుకునే ఉంటున్నాడు. ఎందుకంటే, అతని ప్రవర్తన తను కోరుకున్నట్టు లేదు. తన అనుమానాలను తొలగించేబదులు పెంచుతోంది. అతనిలో తన లక్షణాలకన్నా ఎక్కువగా అజాతశత్రు పోలికలు కనిపిస్తున్నాయి. పగ, ప్రతీకారధోరణి, రాజ్యదాహం, విచక్షణా రాహిత్యం, దుడుకుతనం, తెగలపట్ల చిన్నచూపు, ద్వేషం వ్యక్తమవుతున్నాయి. చిన్నప్పటినుంచీ పరిచయం వల్ల కూడా కావచ్చు, దీర్ఘచరాయణుడితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే, తను దీర్ఘచరాయణుని అనుమానించడానికి ఎలాంటి కారణమూ లేదు. తనపట్ల అతని ప్రవర్తనలో ఎలాంటి అవిధేయత కానీ, కుటిలబుద్ధి కానీ కనిపించడం లేదు. ఏదేమైనా నిరంతరం అప్రమత్తంగా ఉండడం మినహా తను చేయగలిగింది ఏమీలేదు.

ప్రత్యేకించి విదూదభుడి చర్య ఒకటి పసనేది మనసులో విపరీతమైన చేదు నింపింది. అందులో తమ ఇద్దరి మధ్యా ఉన్న ఒక తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. అది: విదూదభుడు శాక్యుల మీద పడి కనిపించినవారినల్లా నరికి పోగులు పెట్టడం!

అదెలా జరిగిందంటే…

శాక్యులు ఎంత దాచిపెట్టే ప్రయత్నం చేసినా పసనేది పట్ల వారు చేసిన మోసం బయటపడింది. అతని భార్య వాసభ ఖత్తియ మహానామశాక్యుడి క్షత్రియ భార్య వల్ల కలిగిన సంతానం కాదనీ, దాసి కూతురనీ ఆ నోటా ఆ నోటా పసనేది వరకూ చేరింది.

పసనేదికి కోపం వచ్చిన మాట నిజమే. కానీ అదే సమయంలో గత జల సేతుబంధనం వల్ల ప్రయోజనమేమిటన్న వివేకమూ కలిగింది. పాతికేళ్లుగా కాపురం చేస్తున్న వాసభ ఖత్తియపై తనిప్పుడు కత్తి కట్టడం అన్నది ఊహించడానికే అతనికి అసాధ్యంగా అనిపించింది. క్షమించడంలో ఉన్న ఉదాత్తత అతనికీ మధ్య కొత్తగా అనుభవంలోకి వస్తోంది. బుద్ధుడు అతన్ని ప్రభావితం చేస్తున్నాడు.

కానీ విదూదభుడు క్షమించలేకపోయాడు. అసలే అతనిలో తెగల పట్ల అలవిమాలిన ద్వేషం. శాక్యుల మోసం ఆ ద్వేషానికి మరింత ఆజ్యం అందించి ప్రతీకారేచ్ఛకు పురిగొల్పింది. అతని కరవాలం మీదుగా శాక్యుల రక్తం ధారలు కట్టింది. అతని తొలి వేటు తల్లి పుట్టింటి వారి మీదే పడింది.

       ***

ఇటు కోసల…అటు మగధ…

ఇటు విదూదభుడు…అటు అజాతశత్రు…

రెండువైపులనుంచీ తెగల మెడపై కత్తి వేలాడుతోంది. మరోవైపు, అనైక్యత, వ్యక్తిగత ఆస్తి దాహం, ప్రలోభాలకు లొంగే మనస్తత్వం, ఇతర బలహీనతలు తెగలలోని సంఘీభావాన్ని లోపలినుంచి తినేస్తున్నాయి. శతాబ్దాలుగా అనుభవిస్తున్న స్వతంత్ర జీవితం కళ్ళముందే కర్పూరంలా హరించుకుపోతోంది. తెగలలోని ప్రతి సభ్యునిలోనూ అస్తిత్వ భయాలు తారస్థాయికి చేరాయి. కోసల, మగధల హింసకు ప్రతిహింస పరిష్కారంగా కనిపించడంలేదు. తెగలలోని ప్రతియుద్ధ పాటవం ఆశ్చర్యకరంగా అడుగంటిపోతోంది. ప్రాణాలను మంచినీటి ప్రాయంగా త్యజించే ఆ శౌర్యసాహసాలు ఏమైపోయాయో తెలియడం లేదు.

లిచ్ఛవీ మహావీరుని నోటా, శాక్య గౌతముని నోటా అహింసా మంత్రం అదే పనిగా ధ్వనిస్తోంది. ఎంతోమంది కత్తినీ, కార్పణ్యాన్నీ పక్కన పెట్టి ఆ ఇద్దరి మార్గంలోకి మళ్లిపోతున్నారు.

కానీ ఈ పరివ్రాజక జీవితంతో సమాధానపడలేకపోతున్న తెగ సభ్యుల గుండెల్లో తమ మధ్య ఒక మహావీరుని అవతరణకోసం ఒక ఆక్రోశం, ఒక ఆకాంక్ష, ఒక ఆర్తనాదం మిన్నంటుతున్నాయి.

మల్లబంధుల ప్రతి రోజూ ప్రతి క్షణం గుర్తుకొస్తున్నాడు. మల్ల తెగలోనే కాదు, మిగిలిన తెగలలో కూడా ఈసరికి మల్లబంధుల తెగల స్వాతంత్ర్యానికీ, పౌరుషప్రతాపాలకూ ప్రతీకగా మారిపోయాడు. మల్లబంధుల ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు, తమను ఆదుకుంటాడన్న ఆశ తెగల జీవనాకాశం అంతటా మిణుకు మిణుకు మంటోంది.

       ***

మల్ల విక్రముడు ముమ్మూర్తులా తండ్రికి ప్రతిబింబమే…రూపంలోనే కాదు విక్రమంలో కూడా…

అతను మరో మల్లబంధుల కాగలడా?!

        ***

మిగతా కథ తర్వాత…

 

 – కల్లూరి భాస్కరం

 

చరిత్ర మిగిల్చిన మల్లబంధుల జ్ఞాపకాలు !

Prasenajit_of_Kosala_Pays_a_visit_to_buddha

కోసలను ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు. పసనేది అనే దేశినామానికి ప్రసేనజిత్తు సంస్కృతీకరణ. కోసలను పాలించిన పూర్వరాజులందరూ ఇక్ష్వాకు వంశీకులు.  కనుక తనను కూడా ఇక్ష్వాకు వంశీకునిగా పసనేది చెప్పుకునేవాడు. కానీ నిజానికి అతడు ఆదివాసుల్లోనూ ఓ కింది తెగకు చెందినవాడు. దానిని ‘మాతంగ’కులంగా చెబుతారు. అదే ఇప్పుడు ‘మాంగ్’ అని పిలిచే ఓ ‘అస్పృశ్య’కులం. అతని భార్యపేరు మల్లిక. ఆమె ఒక తోటమాలి కూతురు.

తనను పసనేది ఇక్ష్వాకు వంశీకునిగా చెప్పుకున్నా బ్రాహ్మణులు అతనికి ఆ గుర్తింపును ఇవ్వలేదు. అతనిని వ్రాత్య క్షత్రియుడనీ, క్షత్రబంధుడని మాత్రమే అన్నారు. ఇవి నిమ్నలేదా న్యూనార్థకాలు. అధికారస్థానంలో, లేదా సైనికవృత్తిలో ఉన్నప్పటికీ వైదిక ఆచారాల పరిధిలోకి రానివారినీ, వాటిని పాటించనివారినీ వ్రాత్య క్షత్రియులనీ, క్షత్రబంధులనీ అనేవారు. ఇటువంటివారు అధికారం చేజిక్కుంచుకున్నప్పుడు సాంప్రదాయిక క్షత్రియుడన్న గుర్తింపుకు, బ్రాహ్మణుల గుర్తింపుకు పాకులాడేవారు. యజ్ఞయాగాలు చేసేవారు. బ్రాహ్మణులకు గ్రామాలు దానం చేసేవారు. క్షత్రియులుగా తమకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న తెగతో వివాహసంబంధం పెట్టుకోవాలని అనుకునేవారు.

పసనేది కూడా అలాగే అనుకుంటున్నాడు…

అదే కాలంలో మగధను బింబిసారుడు పాలిస్తున్నాడు. అతను కూడా పసనేది లానే నిమ్నకులస్తుడు. పురాణాలు అతనిని శిశునాగవంశీకుడన్నాయి. నాగ శబ్దం వైదిక పదం కావడానికి అవకాశం లేదు. అది ఆదివాసీ తెగ సంబంధాన్ని సూచిస్తుంది. లేదా బింబిసారుడు నాగజాతి ఆచారాలను పాటించేవాడని సూచిస్తుంది. మగధ రాజధాని రాజ్ గిర్ లో బుద్ధుడి కాలానికి ముందునుంచీ నాగజాతీయుల ఆరాధనకు, ఆచారాలకు అంకితమైన గుడి ఒకటి ఉండేది. శిశునాగవంశీకులను బ్రాహ్మణులు క్షత్రబంధులుగానే గుర్తించారు. బింబిసారునికి ప్రత్యేకంగా ‘సేనీయ’ అనే బిరుదు కూడా ఉంది. ఏ తెగతోనూ సంబంధం లేని శాశ్వత సైన్యాన్ని కల్పించుకున్న తొలిరాజు అతడేనని ఆ బిరుదు సూచిస్తుంది.

పసనేది, బింబిసారుడు మంచి మిత్రులు. పసనేది సోదరిని బింబిసారుడికి ఇవ్వడం ద్వారా వారి మధ్య బంధుత్వం కూడా ఏర్పడింది. పసనేది పుట్టింటి అరణంగా కాశీ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని సోదరికి ఇచ్చాడు.

   ***

732px-Ancient_india

ఇప్పుడు మల్ల తెగ దగ్గరికి వెడదాం. ఆ తెగలో అందరికంటే యుద్ధవిద్యలలో ఆరితేరిన యువకుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు మల్లబంధుల. అతని ప్రేయసి పేరు కూడా మల్లికే. ఆమెకు కూడా యుద్ధవిద్యలలో శిక్షణ ఉంది. మల్లబంధుల ఎంతటి వీరుడో అంతటి సున్నితహృదయుడు. అతను తన తెగ స్వాతంత్ర్య పరిరక్షణకు అంకితమైన వ్యక్తి కూడా. తెగ పరిధిలో జీవించే మల్లబంధులకీ, తెగ పరిధిని దాటిపోయిన పసనేదికీ మధ్య స్నేహం ఉంది. వారిద్దరూ ఒకచోటే యుద్ధవిద్యలు అభ్యసించారు.

అలా ఉండగా, మల్ల తెగ నాయకుడు తను నాయకత్వం నుంచి తప్పుకుని ఒక యువకుడికి నాయకత్వం అప్పగించాలనుకున్నాడు. అతని దృష్టిలో మల్లబంధుల ఉన్నాడు. తెగను సమావేశపరిచాడు. తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే, అధిక సంఖ్యాకుల ఆమోదం ఉంటేనే మల్లబంధుల నాయకుడు అవుతాడని కూడా అన్నాడు. అప్పటికప్పుడు ఎన్నికకు ఏర్పాటు జరిగింది. అధికసంఖ్యాకులు మల్లబంధులవైపు మొగ్గు చూపారు.

అయితే, కొంతమంది మాత్రం ఒక అభ్యంతరం లేవదీశారు. మల్లబంధుల నిస్సందేహంగా వీరుడు, నాయకత్వానికి అర్హుడే; కానీ అతని శక్తిని పరీక్షించకుండా నాయకత్వం అప్పగించడం సమంజసం కాదన్నారు. తెగ నాయకుడు ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు ఒక పరీక్షను నిర్ణయించారు. ఏడు కొయ్యదుంగలను వరసగా పాతతారు. ఆ ఏడింటినీ మల్లబంధుల ఒక్క వేటుతో నరకాలి!

పరీక్షను మరుసటి వారానికి వాయిదా వేసి తెగ నాయకుడు సమావేశం చాలించాడు.

మరుసటి వారం మళ్ళీ సమావేశమయ్యారు. ఏడు కొయ్యదుంగలు వరసగా పాతబడి ఉన్నాయి. అంతా ఉత్కంఠతో ఊపిరి బిగపెట్టుకుని  మల్లబంధులనే చూస్తున్నారు. వారిలో అతని ప్రేయసి మల్లిక కూడా ఉంది. చాలామంది చూపుల్లో మల్లబంధుల పట్ల అభిమానం, ఆరాధన ఉట్టిపడుతున్నాయి. కొంతమంది చూపుల్లో ఈర్ష్య, తృణీకారభావమూ వ్యక్తమవుతున్నాయి. తెగనాయకుడు పరీక్షా ప్రారంభాన్ని సంకేతించాడు. మల్లబంధుల లేచి నిలబడ్డాడు. అతని చేతిలో మెరుస్తున్న కరవాలం. ఏడు కొయ్యదుంగలను సమీపించాడు. మెరుపు వేగంతో అతని కరవాలం అయిదు దుంగల్ని అడ్డంగా నరికింది. విచిత్రం, రెండు దుంగలు అలాగే ఉండిపోయాయి. మల్లబంధులను నిలువునా వెక్కిరించాయి. సిగ్గు, అవమానాలతో అతని తల వాలిపోయింది. ముచ్చెమటలు పట్టాయి. స్థాణువులా నిలబడిపోయాడు.

జనం లోంచి మోసం, మోసం అన్న కేకలు వినిపించాయి. తెగ నాయకుడు కూడా మోసం జరిగిన సంగతిని గ్రహించాడు. కొద్ది సేపు సభ నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండిపోయింది.

అవును, మోసం జరిగింది. మల్లబంధుల కూడా ఆ సంగతి గ్రహించాడు. ఒక దుంగ దగ్గర, బహుశా ఆరో దుంగ దగ్గర తన ఖద్గానికి ఏదో కఠినంగా తగిలింది. ఖణేలుమన్న శబ్దం కూడా వినిపించింది. ఆ శబ్దం జనంలో కూడా చాలామందికి వినిపించే ఉంటుంది. ఎవరో ఆరో దుంగలో ఓ ఇనప కడ్డీని చొప్పించారు! ఎవరు వారు…?

తనంటే పడనివారు ఉన్నారని మల్లబంధులకు తెలుసు. కానీ వాళ్ళు ఇంతటి అన్యాయానికి ఒడిగడతారని అతడు అనుకోలేదు. ఇది అతనికి సరికొత్త గ్రహింపు. తెగజనంలో అసూయా, ద్వేషాలు బుసకొడుతున్నాయి. అవి తెగ ఐక్యతను విచ్ఛిన్నం చేసే స్థాయికి పెరుగుతున్నాయా? తెగ వినాశనానికే దారి తీయించేలా ఉన్నాయా? మల్లబంధులను ఇప్పుడు బాధిస్తున్నది తన ఓటమి కాదు, తెగజనంలో పెరుగుతున్న ఈర్ష్యాద్వేషాలు!

మల్లబంధుల ఇలా ఆలోచనలలతో సతమతమవుతుండగానే, తెగనాయకుడు లేచి జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మోసం జరిగిందని ప్రకటిస్తున్నాడు. విచారణ జరుపుతామని అంటున్నాడు. మరోసారి పరీక్ష ఏర్పాటు అవుతుందని చెబుతున్నాడు…

మల్లబంధులకు ఈ చివరి మాటలే వినిపించాయి. మరోసారి పరీక్షను ఏర్పాటు చేస్తారని అతనికి తెలుసు. కానీ అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు. తెగ విచ్ఛిత్తికి దారి తీసే ఈర్ష్యాద్వేషాలకు తను లక్ష్యం కాకూడదు. తను అడ్డు తొలగితేనైనా తెగ ఐక్యత నిలబడవచ్చు. ఇప్పుడు తను చేయవలసింది అదే!

ఆరోజు రాత్రి మల్లబంధుల, మల్లిక ఏకాంతస్థలంలో కలసుకున్నారు. మల్లబంధుల తన ఆలోచన చెప్పాడు. తెగను విడిచి పెట్టి రేపు ఉదయమే నా ప్రయాణం అన్నాడు. నువ్వు నాతో వచ్చేదీ లేనిదీ నువ్వే ఆలోచించుకో అన్నాడు. నా చివరి ఊపిరివరకూ నీతోనే అని మల్లిక చెప్పింది.

మరునాటి ఉదయమే మల్లబంధుల, మల్లిక గమ్యం తెలియని ప్రవాస జీవితానికి సిద్ధమై తెగ కేంద్రాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. వీరుడైన మల్లబంధుల జ్ఞాపకాలే తెగవారికి మిగిలాయి.

    ***

పసనేదికి రాజ్యముంది. రాజ్యభోగాలు అనుభవించడానికి తగిన వయసు ఉంది. కానీ లేనిది ఒకటే…అది, సుక్షత్రియుడన్న గుర్తింపు. తను నిమ్నకులస్థుడన్న చింత అతని హృదయాన్ని ముల్లులా బాధిస్తోంది. తనను ఉద్దేశించి బ్రాహ్మణులు వ్రాత్య క్షత్రియుడనీ, క్షత్రబంధుడనీ అనడం అతని చెవులకు శూలంలా తగులుతోంది. వారి మెప్పుకోసం ఏం చేసినా ఆ మరక పోవడం లేదు.

తన పుట్టుకను ఇప్పుడు దిద్దుకోలేడు. కనీసం ఓ క్షత్రియకన్యను పెళ్ళాడితేనైనా తన హోదా పెరుగుతుందా? తన వారసుడికైనా తగిన గుర్తింపు దొరుకుతుందా?….

అతని ఆలోచనలు శాక్య తెగవైపు మళ్ళాయి. శాక్యులను కూడా వ్రాత్యక్షత్రియులనే అన్నారు. కాకపోతే తమ కంటే వారి స్థాయి చాలా ఎక్కువ. వారు కూడా తమను ఇక్ష్వాకు వంశీకులుగానే చెప్పుకుంటారు. అయితే, వారిప్పుడు తన అధికారం కింద ఉన్నారు. వారి జీవన్మరణాలు పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నాయి. శాక్య గౌతముడు తన ఈడువాడే. అతని వల్ల శాక్య తెగ ప్రసిద్ధినే కాదు, విశేషమైన గౌరవ మర్యాదలనూ పొందుతోంది. శాక్య ప్రముఖుడైన మహానామశాక్యుడికి యుక్తవయసు వచ్చిన ఆడపిల్ల ఉందని తను విన్నాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగితే?!

మహానామ శాక్యుడు తన ప్రతిపాదనను కాదనే సాహసం చేయలేడని అతనికి తెలుసు. ఆలోచించిన కొద్దీ ఇదే ఉత్తమమని అతనికి తోస్తూవచ్చింది. ఓ రోజున మహానామశాక్యుడికి కబురు పంపించాడు.

పసనేది ప్రతిపాదన విన్న మహానామశాక్యునికి తలకొట్టేసినట్లయింది. నోట మాట రాలేదు. ఒప్పుకుంటే అవమానం. ఒప్పుకోకపోతే ప్రాణ గండం. తనొక్కడికే కాదు, మొత్తం తెగకు! అతని మౌనాన్నే అంగీకారంగా తీసుకుని వచ్చినవాళ్లు వెళ్ళిపోయారు. పసనేది కోరికను కాదనే ధైర్యం శాక్యులకు లేదని వారికి తెలుసు.

మహానామశాక్యుడు ఈ సంగతి మిగిలిన తెగపెద్దలకు చెప్పాడు. వాళ్ళు కూడా నిశ్చేష్టులయ్యారు. పసనేదికి పోయే కాలం వచ్చింది, శాక్యుల ఆడబడుచును తనకిమ్మని అడుగుతాడా అని ఆవేశపడ్డారు. అయితే, అంతలోనే వెనక్కి తగ్గారు. ఆవేశపడినందువల్ల ప్రయోజనం లేదని వారికి తెలుసు. పసనేది తలచుకుంటే, చీమల బారును నలిపేసినట్టు శాక్య తెగను నలిపేయగలడు. కనుక అతని ఆదేశానికి తలవంచుతూనే పరువు నిలుపుకునే ఉపాయం చూడాలి! ఆ ఉపాయం ఏమిటి?!

అప్పటికే మహానాముడికి ఒక ఆలోచన తట్టింది. అతనికి క్షత్రియ భార్యవల్ల కలిగిన కూతురే కాక, ఆదివాసీ తెగకు చెందిన నాగముండ అనే దాసికి పుట్టిన కూతురు కూడా ఉంది. ఆమె కూడా మంచి అందగత్తె. పేరు, వాసభ ఖత్తియ. ఆమెనే క్షత్రియకన్యగా చెప్పి పసనేదికి ఇచ్చి పెళ్లిచేస్తే?! పసనేదికి ఈ సంగతి తెలియడం అసంభవం. ఈ రహస్యం తెగలోనే ఉండిపోవాలి. ఇది ఏ ఒకరిద్దరికోసమో కాదు, మొత్తం తెగ క్షేమం కోసం. మహానాముడు తన ఆలోచనను తెగ పెద్దల చెవిన వేశాడు. వారికి కూడా ఇదే మెరుగైన ఉపాయం అనిపించింది. ఆమోదముద్రవేశారు.

పసనేది, వాసభ ఖత్తియల పెళ్లి జరిగిపోయింది.

***

పసనేది రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని విస్తరించుకునే ప్రయత్నంలో పడ్డాడు. మిత్రుడు మల్లబంధుల తెగను విడిచిపెట్టి ఎక్కడో ప్రవాసజీవితం గడుపుతున్నట్టు అతనికి తెలిసింది. మల్లబంధుల మహావీరుడని అతనికి తెలుసు. అదీగాక తమ ఇద్దరి మధ్యా రాజకీయాలకు అతీతమైన స్నేహమూ, పరస్పర అభిమానమూ ఉన్నాయి. అతను ఇలా వ్యర్థజీవితం గడపవలసివచ్చినందుకు పసనేది నిజంగానే బాధపడ్డాడు. అతనిని తనవద్దకు రప్పించుకుని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని అతనికి అనిపించింది. తను విస్తరణ ప్రయత్నంలో ఉన్నాడు కనుక అందులో స్వార్థం కూడా ఉంటే ఉండచ్చు. కానీ, అతనిపట్ల స్నేహస్పందన కూడా అంతే ఉంది.

వేగుల వల్ల ఎట్టకేలకు మల్లబంధుల ఉనికి కనిపెట్టాడు. అతనిని కలసుకోడానికి స్వయంగా తనే వెళ్ళాడు. పసనేది తనకు బాల్యం నుంచీ మిత్రుడు. తమవి భిన్న సామాజిక నేపథ్యాలే అయినా వాటికి అతీతమైన నిర్మల స్నేహభావన  పసనేదిపై మల్లబంధులకూ సమానంగా ఉంది. అయితే, పసనేది ప్రతిపాదనపై అతడు ఎంతో ఆలోచించుకోవలసివచ్చింది. ఇద్దరూ రెండురోజులపాటు చర్చించుకున్నారు. పసనేది తెగల స్వతంత్ర జీవనాన్ని కాలరాయకూడదు, తమ మల్ల తెగ జోలికి రాకూడదు…ఇవీ మల్లబంధుల పెట్టిన షరతులు. తెగలపై కత్తి కట్టే ఆలోచన అప్పటికి పసనేదికి లేదు. మరీ ప్రమాదకరంగా ఉన్న ఆటవికులు, ఆయుధోపజీవుల అడ్డు తొలగించుకోవడమే అతని తక్షణ లక్ష్యం.

ప్రేయసి మల్లికను వెంటబెట్టుకుని పసనేది వెంట మల్లబంధుల కోసల రాజధాని శ్రావస్తి చేరుకున్నాడు. పసనేది అతనిని సేనానిగా నియమించాడు.

    ***

పసనేది రాజ్యాన్ని బలోపేతం చేసుకుని, విస్తరించుకునే పరిమిత ప్రయత్నాలకు మల్లబంధుల సాయపడ్డాడు. ఇప్పుడు అతని మేనల్లుడు పదేళ్ళవాడు దీర్ఘచరాయణుడు కూడా అతని దగ్గర ఉంటున్నాడు. అతనిది పాదరసం లాంటి బుద్ధి. మేనల్లుడి మేధాశక్తికి మల్లబంధులే విస్తుపోతున్నాడు. యుద్ధవిద్యలతోపాటు ఇతరవిద్యలనూ ఆ అబ్బాయి నేర్చుకునే ఏర్పాటు చేశాడు. దీర్ఘచరాయణుడు పసనేది దృష్టిలో కూడా పడ్డాడు.

అలా ఉండగా అక్కడ వాసభ ఖత్తియ, ఇక్కడ మల్లికా కూడా గర్భవతులు అయ్యారు.

గర్భవతికి ఏవో ఇష్టాలు ఉంటాయనీ, వాటిని తీర్చాలనీ అంటారు కనుక నీకు ఏం కావాలో కోరుకో అని మల్లికతో మల్లబంధుల అన్నాడు. మల్లిక ఒక విచిత్రమైన కోరిక కోరింది.

సుదూరంగా ఒక పుష్కరిణి ఉంది. ఉత్తమ క్షత్రియులు తప్ప ఇంకెవరూ అందులో స్నానం చేయడానికి వీలులేదు. దానికి ఎల్లవేళలా విచ్చుకత్తుల కాపలా ఉంటుంది. ఆ పుష్కరిణిలో తను స్నానం చేయాలి! ఇదీ మల్లిక కోరిక.

అదెంత, అని మల్లబంధుల ఆమెను తీసుకుని రథంలో బయలుదేరాడు. అది పది రోజుల ప్రయాణదూరం. పుష్కరిణి ఇంకా దూరంగా ఉండగానే ఆ మార్గంలో కాపలా ఉన్న సైనికులు మల్లబంధులను అడ్డగించారు. పెద్ద యుద్ధం జరిగింది. మల్లబంధుల అవలీలగా వారిని జయించి ముందుకు సాగాడు. మల్లిక పుష్కరిణిలో స్నానం చేసింది.

కొన్ని రోజుల తేడాలో వాసభ ఖత్తియ, మల్లిక కొడుకుల్ని ప్రసవించారు. అయితే, మల్లిక ప్రసవసమయంలో కన్ను మూసింది.

మల్లిక మరణం మల్లబంధునిలో మహాశూన్యాన్ని నింపింది. వారి మధ్య ఉన్నది హృదయసంబంధం ఒక్కటే కాదు, తెగకు దూరమైన ఆ ఇద్దరూ ఒకరి ఒంటరితనాన్ని ఇంకొకరు భర్తీ చేసుకున్నారు. ఒకరి  జీవితానికి ఒకరు  ఆశాదీపమయ్యారు.

మల్లిక తను ఆరిపోతూ  మల్లబంధుల ఆశాదీపాన్ని కూడా ఆర్పేసింది…

      ***

మిగతా కథ తర్వాత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

కోసల, మగధ…ఓ సినిమా కథ!

ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే,  అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి    ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా చూశాను. అయితే, నిరాశే మిగిలింది. ఆ యుద్ధాన్ని ఒకటి రెండు దృశ్యాలతోనే  తేల్చేశారు. గడ్డంతో ఉన్న పురురాజు ఏనుగు మీద యుద్ధానికి వస్తున్నట్టు మాత్రం చూపించారు.

అలెగ్జాండర్-పురురాజుల యుద్ధాన్ని అలా తేల్చివేయడం కూడా ఒక కోణంలో అర్థం చేసుకోదగినదే. అలెగ్జాండర్ ప్రధానంగా కథ చెబుతున్న ఒక పాశ్చాత్యుడికి భారతీయచారిత్రక వివరాలపై మరీ అంత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశానికి సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచించే అనేక పాశ్చాత్యరచనల్లో కూడా భారతీయకోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం నేను గమనించాను. భారతీయులు రాసినప్పుడే భారతీయకోణం ఎక్కువ ప్రస్ఫుటం అవుతుందన్నమాట.

సరే, ఈ తేడాను అలా ఉంచుదాం. నేను అలెగ్జాండర్ సినిమాను ఎత్తుకోడానికి వేరే కారణముంది. మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనకు మాత్రం చరిత్ర కిటికీ తెరచుకున్నది అలెగ్జాండర్ తోనే. అలెగ్జాండర్ ప్రధానంగా కాకపోయినా ఆ పాత్రతో కొన్ని చారిత్రక సినిమాలు మనవాళ్లు తీశారు. అవి చరిత్రకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది వేరే విషయం. అలాగే, బుద్ధుడి కథతో తీసిన కొన్నింటిని వదిలేస్తే, నేను గమనించినంతవరకు మన చారిత్రక సినిమా మగధను, చాణక్యుని, చంద్రగుప్తుని, అశోకుని దాటి ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పని విజ్ఞులెవరైనా సోదాహరణంగా చెబితే సవరించుకోడానికి సిద్ధమే. కనీసం, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి పూర్వరంగంలో ఏం జరిగిందో చెప్పే సినిమాలు మాత్రం రాలేదు. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ముందు కోసల అనే రాజ్యంతో పోటీ పడిన సంగతిని చెప్పే సినిమా రాలేదు.

నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ. అయినాసరే, మగధ ఒక మహాసామ్రాజ్యం కావడానికి పూర్వరంగంలో సినిమాకు పనికొచ్చే కథ ఒకటి ఉందని నాకు అనిపించింది. పైగా నా సొమ్మేం పోయింది, అది హాలీవుడ్ స్థాయిలో భారీవ్యయంతో తీయదగిన సినిమా అని కూడా అనిపించింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో, అందులో ఎలాంటి దినుసులు ఉండాలో నాకు తెలియవన్న సంగతిని ఒప్పుకుంటూనే ఆ కథను ఒక సినిమా కథగా మలచే ప్రయత్నం చేశాను.  మరేం లేదు, నేను కూడా సినిమా కథ రాశానోచ్ అని నాకు నేను చెప్పుకోడానికే తప్ప ఎవరో సినిమా తీస్తారని కాదు. ఆ కథంతా విన్న తర్వాత మీకూ అది సినిమాకు తగిన కథే ననిపించితీరాలని నేను అనను. ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే, అది నిజంగా అద్భుతమే.

తప్పనిసరి అనిపించిన ఈ కాస్త ఉపోద్ఘాతంతో కథలోకి వెడతాను…

***

BattleofIssus333BC-mosaic-detail1

అంతకంటే ముందు, కథకు ఒక నేపథ్యం ఉండాలి కనుక, కొశాంబీ వెలుగులో అప్పటి ప్రాంతాలు-జనాల అమరిక గురించి చెప్పుకుందాం.

అది క్రీ.పూ. 6వ శతాబ్ది. శాక్య తెగకు చెందిన బుద్ధుడు అప్పటికి జన్మించాడు. శాక్యులు హిమాలయ పాదాలవద్ద, భారత్-నేపాల్ సరిహద్దులలో, నేటి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ, గోరఖ్ పూర్ జిల్లాలలో భాగంగా ఉన్న ప్రాంతంలో జీవించారు. అప్పట్లో నేపాల్ నుంచి గంగానది దిగువున చంపారన్ (నేటి బీహార్) జిల్లావరకు; అక్కడినుంచి నదిని దాటి ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతం వరకు ఉత్తరాపథ వర్తకమార్గం విస్తరించి ఉండేది. ఏకచ్ఛత్రాధికారం కోసం చివరి పెనుగులాట జరగబోతున్న ఈ కాలానికి పదహారు జనపదాలలోనూ ఎంతోకొంత ప్రాముఖ్యం నిలుపుకున్నవి నాలుగు మాత్రమే. వాటిలో ఒకటి లిచ్ఛవీ లేదా వజ్జీ తెగ. రెండోది, మల్లుల తెగ. ఈ రెండూ అప్పటికి అత్యంత శక్తిమంతమైన తెగల సమాఖ్యలు. ఈ తెగలవారు సర్వస్వతంత్రులు. ఏకవ్యక్తి పాలనకు తల ఒగ్గేవారు కాదు. ఒక సమితి (అసెంబ్లీ) ద్వారా తమ వ్యవహారాలను నడుపుకునేవారు. నిరంతరం సైనిక శిక్షణలో ఉండేవారు. ఇవి సైనిక గణరాజ్యాలు. న్యాయ, సమానత్వాలకు ప్రాధాన్యమిచ్చే తెగల రాజ్యాంగాన్ని వీరు అనుసరించేవారు. అయితే, వీరిలోనూ తెగల స్వభావం అప్పటికే శిథిలమవడం ప్రారంభించింది. వీరు వ్యవసాయజనాలను(వీరిలో అందరూ తెగ సభ్యులు కారు) సేవకులుగా చేసుకుని వారిపై ఆధిపత్యం చెలాయించేవారు. వ్యక్తిగత ఆస్తి అడుగుపెట్టడంతో సమాఖ్యలు చీలిపోవడమూ అప్పటికే మొదలైంది.

లిచ్ఛవుల ప్రధాన పట్టణం, వారి సమావేశస్థలం వైశాలి (నేటి బస్రా). మల్లుల ముఖ్య కేంద్రాలు పావ, కుశినార అనే చిన్న పట్టణాలు. ఈ రెండు తెగల సమాఖ్యలూ ఎప్పుడనుకుంటే అప్పుడు భారీ సైన్యాన్ని మోహరించగలిగిన స్థితిలో ఉండేవి. యుద్ధోత్సాహం వీరిలో ఉరకలెత్తుతూ ఉండేది. ఇతర భూభాగాలను ఆక్రమించుకోవడం లేదా స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం ఈ రెండు హద్దుల మధ్యే వీరి జీవనం. ఈ రెండు తెగల వాళ్ళు పైన చెప్పిన ఉత్తరాపథ వర్తకమార్గంలో కొంతభాగాన్ని దిగ్బంధం చేశారు.

వీరికి వాయవ్యంగా కోసల ఉంది. దక్షిణ, ఆగ్నేయాలుగా మగధ ఉంది. అంతవరకూ ఇవి కూడా మిగిలిన పదహారు జనపదాల మాదిరిగా తెగల జీవితంలో ఉన్నవే. కోసలులు, మాగధులు అనే తెగల పేర్లే ఆ తర్వాత వీరి ప్రాంతాల పేర్లు అయ్యాయి. ‘మాగధ’ అనే మాటకు మొదట్లో స్తోత్రపాఠకుడు లేదా కవి (వందిమాగధస్తోత్రాలు అనే మాట నేటికీ ప్రయోగంలో ఉంది); వర్తకుడు అనే అర్థాలు ఉండేవి. అంటే ఇవి ఒకే తెగలో జరిగిన వృత్తి విభజనను సూచిస్తాయి. కోసల, మగధలు రెండూ మన కథాకాలానికి తెగలస్వభావాన్ని కోల్పోయి ఏకవ్యక్తి పాలన కిందికి వచ్చాయి.

కోసల, మగధలు రెండింటిలోనూ కోసల పాతది. అంతేకాదు, క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రారంభం నాటికి అదే శక్తిమంతం కూడా. మన కథాకాలానికి కోసల రాజధాని శావత్తి(శ్రావస్తి) అయినా, అంతకుముందు ముఖ్యనగరం, శ్రావస్తికి దక్షిణంగా ఉన్న సాకేత. అదే అయోధ్య, రాముడి జన్మస్థానం. ‘అయోధ్య’ అనే మాటకు భేదించలేనిది అని అర్థం. అక్కడికి వెళ్లాలంటే ఓ దుర్గమారణ్యాన్ని దాటాలి. అందుకే అయోధ్యకు ఆ పేరు వచ్చిందేమో తెలియదు. ఆ దుర్గమారణ్యంలోంచి రాముడు వనవాసానికి బయలుదేరాడు. బహుశా ఈ వనవాస మార్గమే దక్షిణాపథ వర్తకమార్గాన్ని అభివృద్ధి చేసింది, లేదా ఆ వైపు విస్తరించింది. ఆధునిక కాలంలో దక్కన్ అనే పేరు దానినుంచే వచ్చింది. క్రీ.పూ. 6వ శతాబ్దిలోని ఉత్తరాపథ, దక్షిణాపథ వర్తకమార్గాలు రెండూ కలిసే కూడలిలో శ్రావస్తి ఉంది. దాంతోపాటు, కోసల అనేక యుద్ధాల తర్వాత కాశీని చేజిక్కించుకోవడంతో గంగపై కూడా దానికి ఆధిపత్యం లభించింది. అప్పటినుంచీ ఆ రాజ్యాన్ని కాశీ-కోసల అని చెప్పుకోవడం మొదలైంది. కాశీ నదీ రేవు పట్టణం. అప్పటికే సాహసవంతులైన నావికులు కాశీనుంచి సముద్రానికీ చేరుకుంటున్నారు. ఒక్కోసారి డెల్టా దాటి వర్తకం సాగిస్తున్నారు. మొదట్లో ఉప్పు నిలకడగా లాభాలు తెచ్చిపెట్టిన వ్యాపారవస్తువు. కాశీలో నూలు, పట్టువస్త్రాలు, ఇతర వస్తుతయారీదారులు అప్పటికే ప్రసిద్ధి చెందారు. కాషాయవస్త్రం కాశీనుంచే వచ్చింది. బౌద్ధుల వస్త్రాలకు రంగు నిచ్చింది కాషాయమే. ఇప్పటికీ ఈ రంగు వస్త్రాలకు కాశీ ప్రసిద్ధమే.

నదికి అవతల ఉన్న మగధ, వర్తకుల రాకపోకలకు ఏమాత్రం పనికిరాని చోట ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడితో బాట ఆగిపోయి ఓ కీకారణ్యంలోకి అదృశ్యమైపోతుంది. అయితే, వర్తకమార్గం కంటే ముఖ్యమైన విలువైన లోహసంపద మగధ అధీనంలో ఉంది. అప్పటి మగధ రాజధాని రాజగృహం(రాజ్ గిర్). అది, గంగకు దక్షిణంగా విసిరేసినట్టు ఒంటరిగా ఉన్న ఓ పురాతన ఆర్య జనావాసం. అక్కడ రాజధానిని ఏర్పరచుకోడానికి ఒక కారణం ఉంది. రాజ్ గిర్ కు ఉత్తరంగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ధార్వార్ గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడ చేయిపెట్టినా ఇనుము దొరుకుతుంది. తవ్వి తీయాల్సిన అవసరమే లేదు. పలకలు పలకలుగా రాతికి అతుక్కుని ఉన్న ముడి ఇనుమును వేరుచేసి, నిప్పుల్లో కాల్చి, శుద్ధి చేసి అప్పటికప్పుడు పాత్రలను, పరికరాలను తయారుచేసుకోవచ్చు. రాజ్ గిర్ కు అదనపు సౌలభ్యం, చుట్టూ ఉన్న కొండలు. అవి పెట్టని కోటల్లా రాజధానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఆవికాక, వాటిలోపల పాతిక మైళ్ళకు విస్తరించిన వెలుపలి ప్రాకారం ఉంది. దానికి కూడా లోపల మరో ప్రాకారం ఉంది. ఇలా రాజ్ గిర్ మూడంచెల రక్షణలో ఉండేది. లోపల పశువుల్ని మేపుకోడానికి కావలసినంత పచ్చిక. దానికితోడు పరిసరాలలో వేడి నీటి బుగ్గలూ, చల్ల నీటి బుగ్గలూ రెండూ ఉండేవి. దాంతో నీటి సరఫరా పుష్కలం. ఇలాంటి అనుకూల పరిస్థితులు అన్నీ శత్రువును ఎంతకాలమైనా నిలవరించగలిగిన వెసులుబాటును మగధ రాజులకు కల్పించాయి. విశేషమేమిటంటే, మగధ అజేయస్థితిని చాటే ఉదంతాలు మహాభారతంలోనే ఉండడం! దాని గురించి మరెప్పుడైనా…

మగధకు ఆగ్నేయంగా గయ ఉంది. అది, మగధుల  తొలి వలస. గయ దాటితే అంతా మహారణ్యం. అయితే, గయకు ఆగ్నేయంగా ఉన్న కొండల్లోనూ ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్నాయి. భారతదేశంలోనే భారీ నిక్షేపాలు అవి. గుండె దిటవు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ అరణ్యంలోకి వెళ్ళి వాటిని వెలికితీసేవారు. వర్తకులు వాటిని మధ్య గంగా ప్రాంతానికి తెచ్చి అమ్మేవారు. ఆ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటి కాదు కనుక ఈ లోహాల వెలికితీత, విక్రయాలే ప్రధానవ్యాపకం అయ్యాయి.  అయితే, మగధరాజులు ఒక పద్ధతిగా అరణ్యాలను నరకి, నాగలి వ్యవసాయం కిందికి తేవడానికి క్రమంగా ఈ లోహసంపద ఉపయోగపడింది.

పదహారు జనపదాలలో అన్నీ జనాభా రీత్యా చెప్పుకోదగినవి కావు. ఎక్కువ భాగం అరణ్యమయం. ఆ అరణ్యాలలో పలచ పలచగా ఆటవిక తెగలు ఉన్నాయి. వాళ్ళు అప్పటికింకా రాతి గొడ్డళ్లే వాడుతున్నారు. కాకపోతే బళ్ళ మీద సరకుతో వెళ్ళే వర్తకులకు (బిడారు)లకు ప్రమాదకరంగా మారుతున్నారు. రెండు ప్రధాన వర్తక మార్గాలకు దగ్గరలో ఉన్న జనపదాల మధ్య కూడా అంతులేనంత అరణ్యం వ్యాపించి వాటి మధ్య దూరాన్ని పెంచింది. కనుక అడవిగుండా వెళ్లాలంటే వర్తకులకు ఎంతో జాగ్రత్త, బందోబస్తు అవసరం.

కొన్ని జనపదాల పేర్లు మిగిలాయి కానీ వాటి తెగలు అంతరిస్తున్నాయి. ఉదాహరణకు మిథిల ఒక నగరం పేరూ, జనపదం పేరూ నని కోశాంబీ అంటారు. మిథిల రామాయణప్రసిద్ధంకూడా. సీత మిథిలను పాలించిన జనకుని కూతురు, అందుకే మైథిలి అయింది. మిథిల తెగ క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికి అంతరించింది. నేరుగా ఇక్ష్వాకు వంశానికి చెందిన మిథిల ఆఖరి రాజు పేరు సుమిత్రుడు. బుద్ధుడు పుట్టినప్పుడే అతడు చనిపోయాడు. మిథిలతోపాటు చెప్పుకునే పేరు విదేహ. సీతకు వైదేహి అనే పేరు కూడా ఉంది. విదేహ మిథిలలో కలసిపోయింది. మిథిల, విదేహలు రెండూ ఆ తర్వాత కోసలలో కలిశాయి. క్రమంగా వర్తకులకు వైదేహికులనే పేరు కూడా వచ్చింది. బహుశా విదేహ తెగకు చెందినవాళ్లు కూడా వర్తకం చేపట్టడంతో వర్తకులకు ఆ పేరు వచ్చి ఉండచ్చని కోశాంబీ అంటారు. బిడారులు ఆ రోజుల్లో అటు తక్షశిలనుంచి ఇటు మగధ చివరి వరకు ప్రయాణించేవారు. వాళ్ళలో మరింత సాహసవంతులు దక్షిణాపథ మార్గంలోనూ వెళ్ళేవారు. మిథిల, విదేహలు కోసలలో కలసిపోయినట్టే; చంపానగరం(నేటి బీహార్ లోని భాగల్ పూర్)రాజధానిగా ఉన్న అంగ, మగధలో కలసిపోయింది. అప్పటికది ఓ సాధారణ గ్రామంగా మారిపోయింది. మగధరాజు బింబిసారుడు దానిని ఒక ఋత్విక్కుకు దానమిచ్చాడు.

ఈ కాలానికి వచ్చేసరికి ఒక తెగమనిషి కన్నా వర్తకుడు ప్రధానుడిగా మారాడు. ప్రత్యేకంగా ఒక తెగకో, జనపదానికొ చెందని ఈ వర్తకులే ఒక తెగగా అవతరించారు.  నాణేల ముద్రణ, వాడకం మొదలయ్యాయి. వస్తూత్పత్తి బాగా పెరిగిందనడానికి ఇది సూచన.  నాణేల బరువులో సింధు సంస్కృతి నాటి ప్రమాణాలనే పాటించడం విశేషం. అనేక గ్రామాలలో, ముఖ్యంగా కాశీ చుట్టుపక్కల బుట్టలు అల్లేవారు, కుండలు చేసేవారు, కమ్మరులు, నేతపనిచేసేవారు వగైరాలు స్థిరపడ్డారు. ఈ చేతివృత్తుల వాళ్ళు సాధారణంగా ఒకే తెగకు చెందిన రక్తసబంధీకులు. శ్రేణుల పేరుతో వీరు తెగ స్వభావం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకునేవారు. ఇది వారి వెనకటి తెగ లేదా గణజీవిత వారసత్వం. శ్రేణుల దగ్గర చెప్పుకోదగిన సంపద ఉంటుంది. అయితే, అది ఉమ్మడి సంపదే తప్ప వ్యక్తిగత సంపద కాదు.  వీరి ఉత్పత్తుల నన్నింటినీ దగ్గరలోని ఒక్క పట్నంలోనే అమ్ముకునే అవకాశం లేదు. ఎందుకంటే, క్రీ.పూ. 7,6 శతాబ్దాలనాటికి కూడా నగరాలు పెద్దసైజు గ్రామాలుగానే ఉన్నాయి. కనుక ఉత్పత్తులు దూర దూర ప్రాంతాలకు రవాణా చేసేవారు. గంధపు చెక్కకు మంచి డిమాండ్ ఉండేది. సబ్బులు లేవు కనుక స్నానం చేసేటప్పుడు గంధంతో నలుగు పెట్టుకునేవారు. ఉష్ణ వాతావరణంలో గంధం నిత్యావసరమే కానీ, విలాస వస్తువు కాదు. ఉత్పత్తులను తీసుకుని ఒకేసారి అయిదువందలకు పైగా ఎడ్ల వేగన్లు బారులు కట్టి ప్రయాణించేవి.  బళ్ళకు, మధ్యలో కడ్డీలు ఉన్న చక్రాలు, ముడిచర్మపు టైర్లు ఉండేవి.

అటవీ ప్రాంతాలలో తెగ ముఖ్యుని ద్వారా వ్యాపారం జరిగేది. అతడే వర్తకుడికి కావలసిన మిగులును సేకరించేవాడు. ఆ క్రమంలో తెగ ముఖ్యుని దగ్గర వ్యక్తిగత ఆస్తి పోగుబడుతూ వచ్చింది. ఈ నూతన ఆస్తి ద్వారా మిగిలిన తెగసభ్యులనుంచి స్వతంత్రించే సౌలభ్యం కూడా అతనికి దక్కింది. ఆవిధంగా కూడా గణసమాజం పట్టు సడలిపోవడం ప్రారంభించింది. గుర్రం విలువైన వ్యాపార వస్తువులలో ఒకటయింది. అంతవరకూ రథానికి పూన్చుతూ వచ్చిన గుర్రాన్ని ఇప్పుడు అధిరోహిస్తున్నారు. ఏనుగు అంతకంటే విలువైనది. అయితే, అది రాచరిక, సైనిక వినియోగానికే తప్ప వ్యాపార వస్తువు కాదు. ఆనాటికి సమాజం, కులవిభజన కరడుగట్టిన, నిస్సహాయ, నిర్లిప్త గ్రామీణ వ్యవస్థకు ఇంకా చాలా దూరంగానే ఉంది. అలాంటి వ్యవస్థ ఏర్పడడానికి ఇంకో పన్నెండు వందల సంవత్సరాలు గడవాలి.

వ్యాపార వస్తువుల తరలింపు నిర్నిరోధంగా సాగడానికి, తగిన అధికార కేంద్రమూ, దానికింద ఒక శక్తిమంతమైన, సుశిక్షితమైన వృత్తి సైన్యమూ అవసరమయ్యాయి. అది శాశ్వతప్రాతిపదికపై పనిచేసేది అయుండాలి. అందులోకి జరిపే నియామకాలకు, దాని సైనిక చర్యలకు తెగల విశేషాధికారాలు, చట్టాలు, విధేయతలూ అడ్డురాకూడదు. అది తెగలను దాటి విస్తృత సమాజాన్ని లక్ష్యం చేసుకోవాలి. ఆ సమాజం తెగల ప్రత్యేక  జీవనవిధానాన్ని, హక్కులను గుర్తించదు.  గణముఖ్యుడు యుద్ధాలకు అవసరమైనప్పుడు మాత్రమే సమీకరించే వెనకటి తెగల సైన్యం లాంటిది కాదు ఇది. ఎంతో జాగ్రత్తగా శిక్షణ ఇస్తూ, నిరంతరం యుద్ధసన్నద్ధతలో ఉంచుతూ, జీతం చెల్లిస్తూ, వ్యూహాత్మక ప్రాంతాలలో ఉంచుతూ ప్రభుత్వం ఖర్చుతో పోషించవలసిన సైన్యం. ఇవన్నీ సాధ్యం కావాలంటే పన్నులు వసూలు చేయకతప్పదు. అయితే, గణసమాఖ్యలు ఇందుకు సాధారణంగా ఒప్పుకోవు. జీతాలు ఇస్తూ శాశ్వతప్రాతిపదికపై పోషించే ఇలాంటి సైన్యాన్ని లిచ్ఛవీలు, మల్లులు ఎన్నడూ ఎరగరు. విస్తృత సమాజంలో భాగం కాకుండా దేనికవిగా ఉన్న వివిధ తెగల రూపంలోని అడ్డుగోడలను కూలగొట్టడం పైన చెప్పిన సైనిక బలం కలిగి, ప్రజలపై సంపూర్ణ అధికారాలను చేజిక్కించుకున్న నిరంకుశరాచరికానికే సాధ్యమవుతుంది.

***

క్రీ. పూ. 6వ శతాబ్దిలో కోసల, మగధరాజులకు ఇందుకు అవసరమైన సాధనాలు అన్నీ సమకూడాయి!

ఇక్కడినుంచి అసలు కథలోకి వెడతాం. అది వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

మహాభారతం నుంచి మగధకు…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)నా ఎదురుగా ఇప్పుడు ఓ పెద్ద దారపు ఉండ ఉంది. దానికి విచిత్రంగా ఒకటి కాదు; నాలుగైదు కొసలు వేలాడుతున్నాయి. ఏ కొసను పట్టుకుని లాగినా మొత్తం ఉండ కదులుతుంది. ఏ కొసను పట్టుకోవాలనేది ఈ క్షణాన నా ముందున్న ప్రశ్న. దీనినే కృత్యాద్యవస్థ అంటారు కాబోలు. ఈ వ్యాసపరంపర సందర్భంలో ఈ అవస్థ నాకు తరచు ఎదురవుతోంది. అయినా చేయగలిగింది లేదు.

మొదటి కొస, మనకు పురాణ కథగా, myth గా కనిపించే కథకూ, చరిత్రకూ మధ్య విభజనరేఖను చెరిపేసి; ఆశ్చర్యకరంగా ఆ కథను చరిత్రలోకి ప్రవహింపజేసేది.  రెండో కొస, ఆ ప్రవాహంలో భాగంగా జరుగుతున్న గణవిచ్ఛిత్తి గురించీ, గణాలు జనాలుగా మారడం గురించీ చెప్పేది. మూడో కొస, గణరాజ్యాల స్థానంలో మనం ఇప్పుడు చెప్పుకునే రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడడం గురించి చెప్పేది. నాలుగో కొస, అధికారం- పై వర్ణాల చేతుల్లోంచి కింది వర్ణాల చేతుల్లోకి మారడం గురించి చెప్పేది. అయిదో కొస, వ్యవసాయ విస్తరణ గురించి చెప్పేది…

kosambiకొశాంబీ రచించిన AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో, THE RISE OF MAGADHA అనే ఆరవ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది:

ఆర్యులు పట్టణ సంబంధమైన పురాతన సింధునాగరికతను తుడిచిపెట్టడానికి ఏ వ్యవస్థ అయితే సాయపడిందో, అదే వ్యవస్థ వారు తూర్పువైపు అరణ్యాలలోకి చొచ్చుకు వెళ్లడానికీ సాయపడింది. రెండు ప్రధాన వర్ణాలతో తిరిగి కూర్చిన నూతన సమాజం వారికి శూద్రుడనే శ్రామికశక్తిని ఇచ్చింది. అదే కనుక లేకపోతే, పచ్చిక భూముల కోసమైనా, వ్యవసాయం కోసమైనా అరణ్యాలను ఛేదించడం లాభసాటి అయుండేది కాదు. అగ్రవర్ణాలలో వర్ణ-వర్గ రూపంలో జరిగిన ఆ తదుపరి విభజన; గ్రీకు, రోమన్ బానిస సమాజాలలో మాదిరిగా బలప్రయోగమూ, నిఘా అవసరం లేకుండానే మిగులు ఉత్పత్తిని పెంచింది. క్రీ. పూ. 7వ శతాబ్ది నాటికి భారతదేశంలో జనావాసాలు భిన్న భిన్న తెగలకు, భిన్న భిన్న అభివృద్ధి దశలకు చెందిన జనాభాతో,  పంజాబ్ నుంచి బీహార్ వరకు మిట్ట పల్లాల భూఖండం మీదుగా విస్తరించాయి. అంత వైవిధ్యంలోనూ, తగినంత వర్తకానికీ, సాంస్కృతిక సంబంధాలకూ సరిపోయినంత ఉమ్మడి భాషా, ఉమ్మడి సంప్రదాయమూ ఏర్పడ్డాయి. కాకపోతే, తొలి జనావాసాల ఏర్పాటుకు సాయపడిన గణ సమాజ సంబంధాలు ఈ దశకు వచ్చేసరికి సంకెళ్లుగా మారిపోయాయి. సమాజం మరింత అభివృద్ధి దశకు చేరాలంటే ఈ సంకెళ్ళను తెగ్గొట్టడం అవసరం. ఈ నూతన నమూనా సమాజం దిశగా అవసరమైన అడుగులు ఉజ్జాయింపుగా క్రీ. పూ. 520(బింబిసారుడు అంగను జయించడం)-360(మహాపద్మనందుడు ఆర్యగణాలను తుడిచిపెట్టడం)ల మధ్య పడ్డాయి. ఈ గమనంలో మరింత కీలకమైన అడుగు మగధ(బీహార్)లో పడింది…

kosambi book

కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, క్రీ. పూ. 3000కు చెంది, వెయ్యేళ్ళపాటు కొనసాగిన సింధునాగరికతను అలా ఉంచితే;  పై పేరా దాదాపు పదమూడు వందల సంవత్సరాల చరిత్రను చుట్టబెడుతోంది. ఎలాగంటే, క్రీ. పూ. 1750లో భారతదేశంపై ఆర్యుల తొలి ఆక్రమణ జరిగింది. (అది, మెసపొటేమియా(ప్రాచీన ఇరాక్)లో హమ్మురాబి పాలన సాగుతున్న కాలం కూడా. హమ్మురాబి మన మనుస్మృతి లాంటి స్మృతిని అప్పుడే తయారుచేసి శిలపై చెక్కించాడు)  క్రీ.పూ. 1500 ప్రధాన ఋగ్వేదకాలం. మరో విడత ఆర్యుల రాక క్రీ. పూ. 1100లో జరిగింది. క్రీ. పూ. 800 నాటికి యజుర్వేదం పూర్తి కాగా, క్రీ.పూ. 600లో శతపథబ్రాహ్మణం అవతరించింది. క్రీ.పూ. 7వ శతాబ్దంలో కోసల, మగధలలో వెండి నాణేలు వాడుతున్నారు. బుద్ధుడు, కోసలరాజు ప్రసేనజిత్తు(పసనేది) క్రీ. పూ. 468లో, తమ 80వ ఏట మరణించారు. మగధలో క్రీ.పూ. 540లో బింబిసారుని పాలన, క్రీ.పూ. 492లో అతని కుమారుడు అజాతశత్రు పాలన, క్రీ.పూ. 350కి కొంత ముందు మహాపద్మనందుడి పాలన మొదలయ్యాయి. ఆ తర్వాత క్రీ.పూ. 327లో అలెగ్జాండర్ దాడి…

మరి మహాభారత, రామాయణాల కాలం ఎప్పుడనే ప్రశ్న వస్తుంది. వీటి గురించి వేర్వేరు లెక్కల మీదే కాక, విశ్వాసం మీద కూడా ఆధారపడిన కాలనిర్ణయాలు చాలా కనిపిస్తాయి. శ్రీ రామ్ సాఠె అనే పండితుడు రామాయణ కాలం గురించి రాస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కాగా, ఇంతకుముందు అనేక మన్వంతరాలు గడిచాయనీ; ప్రతిమన్వంతరంలోనూ నాలుగు యుగాలు వస్తుంటాయనీ, రామాయణం జరిగింది వేరొక మన్వంతరంలోని త్రేతాయుగంలోననీ అంటూ రామాయణ కథను లక్షల సంవత్సరాల వెనక్కి జరిపిన సంగతి ఎప్పుడో చదివిన గుర్తు.

మహాభారతకాలం మీద కూడా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మరీ మన్వంతరాలలోకి వెళ్లకుండా మన సాధారణ బుద్ధికి అందేమేరకు చూస్తే, కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, మహాభారతం జరిగి ఉంటే అది క్రీ.పూ. 1000లో జరిగింది. అలాగే, భాతం ముందా, రామాయణం ముందా అనే ప్రశ్న కూడా వస్తుంది.  రాముడు కోసలకు చెందిన కౌసల్య కొడుకు కనుక; వాయవ్య, పశ్చిమాలనుంచి తూర్పు దిశగా, హస్తినాపురం మీదుగా వలసలు జరిగాయనుకుంటే, కోసల తూర్పున చాలా చివర ఉంది కనుక మహాభారతం తర్వాతే రామాయణం అనిపిస్తుంది.

ఇంకో కోణం నుంచి చూసినా మహాభారతం తర్వాతే రామాయణం అనే అభిప్రాయం కలుగుతుంది. అది; చంద్ర, సూర్యవంశ రాజులకు సంబంధించిన కోణం. మహాభారత రాజులు చాలావరకూ చంద్రవంశీయులు. రాముడు సూర్యవంశీకుడైన ఇక్ష్వాకు రాజు.  జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన Occidental Mythology లో ఈ చంద్ర, సూర్యవంశాలకు సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఉంది. అది ప్రత్యేకంగా, చాలా వివరంగా చెప్పుకోవలసిన అంశం కనుక వాయిదా వేయక తప్పదు.

పైన చెప్పుకున్న తేదీల ప్రకారం, అంతవరకు అజ్ఞాతగా ఉన్న పౌరాణిక భారతదేశంపై క్రీ.పూ. 7వ శతాబ్ది నుంఛీ చరిత్ర వెలుగులు ప్రసరించడం ప్రారంభమైనదనుకుంటే; చరిత్రకూ, పురాణానికీ మధ్య మూడు వందల సంవత్సరాల అంతరం ఉందన్న మాట. అలాగే, బుద్ధుడికీ, మహాభారతానికీ మధ్య అయిదువందల సంవత్సరాల పై చిలుకు తేడా ఉంది. ఒకింత చారిత్రక రాజులుగా పరిచయమవుతున్న బింబిసారునికీ, అతని కొడుకు అజాతశత్రునికీ, మహాభారతానికీ మధ్య ఆరు వందల సంవత్సరాలకు పైగా ఎడముంది.

పురాణకాలాన్నీ, చరిత్రకాలాన్నీ మనం ఎంత  వేర్వేరు విషయాలుగా చూస్తామంటే; వాటి మధ్య ఎటువంటి అతుకునూ ఊహించలేనంత! అసలు అలాంటి ఆలోచనే రానంత! ఒక వేళ  వచ్చినా వాటి మధ్య అంతరం మానవకాలమానానికి అందనంతగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పురాణానికీ, చరిత్రకీ మధ్య కాలపు సరిహద్దు ఇలా కొన్ని వందల ఏళ్ళకు కుదించుకుపోవడం ఎంత అద్భుతం!  పురాణకథ చరిత్రలోకి నేరుగా ప్రవహించడమంటే, పౌరాణిక సమాజ అవశేషాలు, అసంపూర్ణ అజెండాలు, అపరిష్కృత సమస్యలూ కూడా చరిత్రలోకి నేరుగా ప్రవహించడమే. కాలాల మధ్య హద్దులు ఎలా ఊహారేఖలు అవుతాయో, అలాగే సమాజాల మధ్య హద్దులు కూడా.

magadha

పౌరాణిక సమాజం చరిత్రలోకి ఎలా ప్రవహించిందో ఇప్పటికే అనేక వ్యాసాలలో చెప్పాను. ఇకముందు కూడా చెప్పబోతున్నాను. పైన ఉదహరించిన కోశాంబీ వాక్యాలలో అందుకు సంబంధించిన సూచనలు అనేకం ఉన్నాయి. అవి ఒక పెద్ద దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలు లాంటి వాక్యాలు. అవి తూర్పు దిశగా సాగిన వలసల గురించి చెబుతున్నాయి.  వ్యవసాయవిస్తరణకు అందివచ్చిన శ్రామికశక్తి గురించి చెబుతున్నాయి. వర్ణవిభజన గురించి చెబుతున్నాయి. వ్యవసాయవిస్తరణకు అడ్డుపడుతున్న గణసమాజం గురించీ, గణ సమాజపు సంకెళ్ళను తెగ్గొట్టవలసిన అవసరం ఏర్పడడం గురించీ చెబుతున్నాయి. అందులో భాగంగా రాజ్యాల పుట్టుక గురించి చెబుతున్నాయి. పురాణ కాలాన్ని మనకు తెలియకుండానే చరిత్రకాలానికి తీసుకొస్తున్నాయి. చెప్పొచ్చేదేమిటంటే, వీటి అన్నిటి మూలాలు మహాభారతంలో ఉన్నాయి. అందుకే నేను మహాభారతాన్ని చరిత్రగా చదువుకుంటాను.

దారపు ఉండను వేలాడుతున్న అయిదు కొసలలో దేనిని పట్టుకోవాలన్న విచికిత్సనుంచి ఇక నేను బయటపడక తప్పదు. వ్యవసాయ విస్తరణ అనే కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

మనిషి చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలనుంచి నేటివరకూ, ఏకైకం కాకపోయినా ఏకైక ప్రాధాన్యంగల నిర్విరామచర్య ఏదైనా ఉందంటే, అది వ్యవసాయం. వ్యవసాయం మనిషి విశ్వాసాలకు విస్తృతినిచ్చింది. మనిషికి మతాలనిచ్చింది,  జనాభాను ఇచ్చింది, రాజ్యాలనిచ్చింది. కలలూ, కన్నీళ్లూ కూడా ఇచ్చింది. ప్రపంచమంతటికీ ఒకే విధమైన వ్యవసాయసంస్కృతిని ఇచ్చింది. మనిషిని హింసావాదిని చేసిందీ, అహింసావాదిని చేసిందీ కూడా వ్యవసాయమే. బతుకు తెరువు సాధనంగా పచ్చని తరువుపై వేటు వేసే గొడ్డలినీ చేతికిచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ అస్తిత్వంలో ఎన్ని లక్షలు, కోట్ల ఎకరాల అరణ్యాలు దగ్ధమయ్యాయో, ఏమేరకు ఊచకోతకు గురయ్యాయో, ఎన్ని జీవితాలు శిథిలమయ్యాయో. ఎంతటి రక్తం ప్రవహించిందో, ఎందరు స్థానభ్రంశం చెందారో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కల్లోలాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని విప్లవాలు కాలగర్భంలో నిశ్శబ్దంగా కరిగిపోయాయో ఊహకు అందదు. ప్రపంచ వ్యవసాయచరిత్ర మొత్తాన్నే రాసుకుంటూ వెడితే ,దానికదే, వెలుగు, చీకట్లు నిండిన మానవమహేతిహాసంగా మారిపోతుంది.

మానవజీవన ప్రస్థానంలో అప్పటికీ, ఇప్పటికీ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యవసాయం గురించి పై అయిదారు వాక్యాలలో సమర్థంగా, సమగ్రంగా చెప్పలేకపోయానని నాకు తెలుసు. అదలా ఉంచి, ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పుకుంటే,  తూర్పు దిశగా వలసలు సాగుతూ వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అంతవరకూ గోపతిగా ఉన్న రాజు కాస్తా భూపతిగా మారుతున్న వైనం మనకు మహాభారతంలోనే అక్కడక్కడ స్పష్టంగానూ, బీజప్రాయంగానూ కూడా కనిపిస్తుంది. అలాగే, వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న క్షత్రియుల కత్తికి తలవంచి ఆదివాసీ తెగలు నలుదిక్కులకూ చెదిరిపోతున్న వైనాన్నీ అది చెబుతుంది.  వ్యవసాయ సంస్కృతులు అంతటా జరిగినట్టే, వ్యవసాయబలిమి అందించిన నూతనోత్సాహంతో భారతదేశంలోనూ గణనిర్బంధాలనుంచి బయటపడి సరికొత్త ‘నరుడు’ ఆవిర్భవించిన సంగతినీ చెబుతుంది. ఇంకా విశేషంగా రాజ్యాధికారం పైనుంచి కిందికి చేతులు మారుతున్న విషయాన్నీ చెబుతుంది. మహాభారతంలోని ఈ అంశాలే చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ మరింత నిర్ణయాత్మక రూపం ధరిస్తూ వచ్చాయి. విచిత్రం ఏమిటంటే, నేటి కాలానికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం. అందుకే, ఇప్పటికీ మనం మహాభారత సమాజంలోనే ఉన్నామని నేను అంటాను.

చరిత్ర కాలంలో, లేదా చరిత్రకు కొద్ది సమీపకాలంలో మొట్ట మొదటగా రెండు రాజ్యాలు  మహాభారతం తాలూకు అసంపూర్ణ అజెండాను ముందుకు తీసుకువెళ్ళాయి. అవి: కోసల, మగధరాజ్యాలు!

గణసమాజపు శృంఖలాలనుంచి బయటపడి నూతన సమాజం దిశగా కీలకమైన అడుగుపడింది మగధలో నని పైనచెప్పుకున్నాం. మగధతో కోసలను కూడా కలిపి చెప్పుకోవాలి.   క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికి గంగా నదీ లోయ చరిత్రకు కేంద్రబిందువుగా మారిపోయిందని కొశాంబీ అంటారు.  అప్పటికి పశ్చిమ పంజాబ్; నాడు కాంభోజ, గాంధారలుగా పిలవబడిన ప్రాంతాలు కలిగిన నేటి అఫ్ఘానిస్తాన్ పర్షియన్ చక్రవర్తి డరియస్ ఏలుబడిలోకి వెళ్ళాయి.  మిగిలిన పంజాబ్ వేదకాలపు స్థితిలోనే ఉంది. కాకపోతే, పురులు వంటి కొన్ని తెగలు ఆ ప్రాంతంలో విస్తరించి అలెగ్జాండర్ వచ్చేనాటికి రాజ్యాలు ఏర్పరచుకున్నాయి.  పశ్చిమ పంజాబ్ లోని యోధులు మాత్రం డరియస్ , గ్జెరెక్సెస్ ల సైన్యంలో భాగమై గ్రీకులతో జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. పర్షియన్ సామ్రాజ్యం, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మగధ రాజ్యం అనే రెండు ఆర్థిక శక్తుల మధ్య అప్పటికి పెద్ద భూమార్గ వర్తక కేంద్రంగా తక్షశిల ఉంది. మిగిలిన నగరాలు పెద్ద గ్రామాలుగా చెప్పదగిన తెగల ముఖ్యకేంద్రాలు మాత్రమే. వీటికి పరిమాణంలోనూ, ప్రణాళికలోనూ మొహెంజదారో-హరప్పాలతో ఎలాంటి పోలికా లేదు. ఈ కాలానికి వచ్చేసరికి సింధులోయ జనం మెరుగైన ఆయుధబలాన్ని సంపాదించుకున్నారు. నాగలి వ్యవసాయం, పశుపోషణ; వాటికి అనుబంధంగా వర్తకంతో బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరచుకుంటున్నారు. అప్పటికి దక్షిణభారతం గురించి పెద్దగా తెలియదు. అలాగే, పంజాబ్ ప్రాంతం గురించి కూడా. ఎక్కువగా తెలిసింది గంగా లోయలోని పరిణామాల గురించే. ఈ ప్రాంతంలోనే త్వరలో మౌర్యులు తొలి మహాసామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు!

క్రీ.పూ. 600 నాటి గంగా లోయలో భిన్న భిన్న సామాజిక వర్గాల వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. వీరు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నారు. బెంగాల్ అప్పటికి కీకారణ్యమయం. నేటి బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఇప్పటికీ అక్కడక్కడ, ఆర్యులతో ఎలాంటి సంపర్కమూ లేని, ఆర్యభాష మాట్లాడని తెగలజనం ఉంటున్నారు. వీరికి పైన అభివృద్ధి చెందిన తెగల జనం ఉన్నారు. వీరు ఆర్యులతో ఘర్షణ పడుతున్నారు. ఒకింత ఉన్నతస్థాయికి చెందిన ఈ అనార్య తెగలను నాగజాతీయులుగా గుర్తిస్తున్నారు. ఈ రెండు రకాల తెగల జనమూ వ్యవసాయ జనావాసాలు ఏర్పడని ప్రాంతాలలో చెల్లా చెదురుగా జీవిస్తున్నారు. నాగుల కంటే ఉన్నత స్థాయికి చెందిన ఆర్య తెగలవారు నదీ తీరాల వెంబడి, వర్తక మార్గాలలోనూ స్థిరపడ్డారు. వీరంతా ఏదో ఒక ఆర్యభాష మాట్లాడుతున్నారు. చాలామంది కులాల కింద, తరగతుల కింద చీలిపోయి ఉన్నారు. వీళ్లలోనూ మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు: ఉన్నతస్థాయికి చెందినవారు, నిమ్నస్థాయికి చెందినవారు. నిమ్నస్థాయికి చెందినవారు బ్రాహ్మణఆచారాలు, కర్మకాండకు దూరంగా ఉన్నారు. ఆర్య తెగల వాళ్ళు గణరాజ్యాలుగా ఏర్పడి, శూద్రుని నుంచి సేవలు పొందుతున్నారు. తెగలు, వ్యక్తుల పేర్లను బట్టి, వీరు అంతవరకు అనార్యులుగా ఉండి ఇటీవలే ఆర్యత్వం పొందారా అన్నది స్పష్టంగా తెలియదు. వీరి ప్రస్తావన వేదాలలోగానీ, బ్రాహ్మణాలలో గానీ లేకపోవడం ఈ ఊహకు కారణం. కొంతమంది మాత్రం కొత్తగా ఆర్యభాషకు, వ్యవసాయానికి మళ్లినట్టు కనిపిస్తుంది. వీరు వైదిక క్రతువులను పాటించేవారు కూడా కాదు. మిగిలిన బ్రాహ్మణీయ తెగలవారు నాలుగువర్ణాలుగా, ఉన్నత, నిమ్న తరగతులుగా చీలిపోయిన కారణంగా తెగలస్వభావాన్ని కోల్పోతున్నారు. ఈ తెగల ముఖ్యులు సంపూర్ణ అధికారాన్ని చెలాయిస్తూ బలప్రయోగానికి పూనుకుంటున్నారు. వర్తకం తమను ముడివేస్తున్నా, వివిధ సమూహాలు పరస్పర ఘర్షణలలో మునిగితేలుతున్నాయి. ఆర్య రాజ్యాలమధ్య కూడా ఎడతెగని యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే, బలప్రయోగంతో ఒక సమూహం ఇంకో సమూహాన్ని లొంగదీసుకోవడం ఈ వైరుధ్యాలను పరిష్కరించే అవకాశం లేదు.  ఎందుకంటే, దాస్యాన్ని ఒక లాభసాటి వ్యవస్థగా మార్చడానికి తగినంత మిగులు కానీ, వస్తూత్పత్తి కానీ అప్పటికి లేదు. భౌగోళిక పరిస్థితి కూడా అందుకు అవకాశం ఇవ్వదు. అసలే దుర్గమ దేశం. దూర దూరంగా విసిరేసినట్టు ఉన్న జనావాసాలు. ఆయా తెగలవాళ్లు ఆధిపత్యశక్తుల కత్తి వేటును తప్పించుకుని వెనక్కు వెళ్లడానికి, నాగలి వ్యవసాయాన్ని విస్తరించడానికి  కావలసినంత జాగా. గ్రీస్, ఇటలీలలో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ వినియోగపడే భూమి పరిమితం.

క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికే పదహారు జనపదాల(షోడశ జనపదాలు) ప్రస్తావనలు కనిపిస్తాయి. వాటిలో రెండు అప్పటికి ఇంకా స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉన్న సైనిక గణరాజ్యాలు. అవి, మల్లులు, లిచ్ఛవులు లేదా వజ్జీలకు చెందినవి. ఇప్పుడు మనం క్రమంగా కోసల, మగధల దగ్గరికి వస్తున్నాం…

ఈ చారిత్రక వివరాల ప్రస్తావన చరిత్రపాఠం లా కనిపించి విసుగు పుట్టించవచ్చు. అయితే, ఇందులో మహాభారత సమాజానికీ, చారిత్రక సమాజానికీ మధ్యనున్న లింకును పోల్చుకుంటూ వెళ్లారనుకోండి…అప్పుడు బహుశా ఈ వివరాలు మీకు విసుగు పుట్టించకపోవచ్చు…

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

చరిత్ర చట్రంలో యయాతి కథ

yayati1

యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన, యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం

(శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం)

ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో చూడండి… యజ్ఞం, దానం, జనరంజకపాలన, యుద్ధంలానే ‘దస్యు హింస’ కూడా రాజు(లేదా యజమాని) నిర్వర్తించవలసిన ధర్మాలలో ఒకటి అంటున్నాడు. దస్యులు-దాసులు అనే రెండు మాటలకు ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుందని రాంభట్ల(జనకథ) అంటారు. దస్యులు ఆలమందలను, వాటిని కాచుకునే మనుషులను అపహరించేవారనీ; మందలను, మనుషులనూ కూడా వ్యవసాయదారులకు అమ్మేసేవారనీ, అలా కొనుక్కున్న మనుషులను దాసులు అనేవారనీ ఆయన వివరణ. వ్యవసాయం పనులకు మంద-మంది ఎప్పుడూ అవసరమే.  ఆవిధంగా వ్యవసాయం పనులకు సహకరించే పశువుకూ, మనిషికీ పోలిక కుదిరింది. అందుకే పని చేసిన తర్వాత  వారికి ‘కూలి’ రూపంలో ఇచ్చే తిండికీ  పోలిక కుదిరింది. దాని పేరు: గ్రాసం. గ్రాసం అంటే గడ్డి, లేదా తృణసంబంధమైన ఆహారం. విశేషమేమిటంటే, ‘గ్రాసం’ అనే మాట నిన్నమొన్నటి వరకు ‘జీతం’ అనే అర్థంలో వాడుకలో ఉంది.

దస్యు-దాస శబ్దాలకు మళ్ళీ వస్తే, వైదిక పద సూచి(Vedic Index) ప్రకారం వీటిని పర్యాయపదాలుగా వాడడమూ ఒకటి, రెండు చోట్ల కనిపిస్తుంది. ఆర్యులకు భిన్నమైన ఆచారవ్యవహారాలు, ఆరాధనాపద్ధతులు, వేషభాషలు, రంగు వగైరాలు కలిగిన దస్యులు లేదా దాసులను ఆర్యులు శత్రువులుగా చూడడం సహజమే. వీళ్ళ మధ్య ఘర్షణలు జరగడమూ సహజమే. కొనుక్కున్న దాసులే కాక, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు కూడా దాసులే అవుతారు కనుక ఆవిధంగా దస్యులు కూడా దాసులే. అలాగే, దాసుల్లో పుట్టించిన దాసులు, అంటే గర్భ దాసులు ఉండేవారని కూడా చెప్పుకున్నాం. దాసులు ఎవరైనా సరే దండనకు అర్హులే. భీష్ముడు దస్యుహింస అనడంలో ఆ సూచన కూడా  ఉండచ్చు.

ఎందుకంటే, దాసులు ఒక్కోసారి ఠలాయిస్తారు. పని చేయడంలో ఒళ్ళు దాచుకుంటారు. పారిపోడానికి ప్రయత్నిస్తారు. లేదా జట్టుకట్టి యజమానిపై తిరుగుబాటు చేసే ప్రమాదమూ ఉంది. అలా తిరుగుబాటు చేసిన ఉదాహరణలనూ కొన్నింటిని ‘వేదభూమి’లో రాంభట్ల ఇచ్చారు. కనుక దాసులను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఏదో ఒక కారణాన్ని కల్పించుకుని మధ్య మధ్య దేహశుద్ధి చేస్తూ ఉండాలి. ఎప్పుడూ భయభక్తులలో ఉంచాలి.  ఓ పాత సినిమాలో ఓ స్కూలు మాస్టరు తప్పు చేసిన  కుర్రాడికే కాకుండా, పనిలో పనిగా మిగతా కుర్రాళ్ళకు కూడా నాలుగు తగిలిస్తాడు. మొదటి కుర్రాడు తప్పు చేసినందుకు, మిగతా కుర్రాళ్ళు తప్పు చేయకుండా ఉండేందుకు అన్నమాట.  గ్రీకు, రోమన్; ఇటీవలి అమెరికన్ బానిసవ్యవస్థలలో బానిసల దండన ఎలా ఉండేదో చూస్తే, భీష్ముడన్న ‘దస్యు హింసా’ రూపం కొంత ఊహకు అందచ్చు.  అయితే, దేశాకాలాలను బట్టి వాటి తీవ్రతలో తేడాలు ఉంటే ఉండచ్చు. ‘రూట్స్’ నవలలో కుంటా కింటే పారిపోవడానికి రెండు, మూడుసార్లు విఫలయత్నం చేస్తాడనీ, చివరికి అతని యజమాని అతని పాదం ఒకదానిని సగానికి నరికించేస్తాడనీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

వ్యవసాయానికి మంది అవసరం చరిత్రపూర్వకాలం నుంచి, చరిత్రకాలం మీదుగా ఆధునిక కాలం వరకూ నిరంతరం ఉంటూనే ఉంది. వ్యవసాయవిస్తరణను భారీ ఎత్తున చేపట్టిన మౌర్య రాజు అశోకుడు అందుకోసం జనాలను తరలించి కొత్త కొత్త జనావాసా(settlements) లను ఏర్పాటు చేయడం, ఆ జనాలు తమున్న జనావాసం నుంచి పారిపోయే వీలు లేకుండా తగిన బందోబస్తు చేయడం గురించి కోశాంబీ విపులంగా రాశారు. అంతే విపులంగా చెప్పుకోవలసిన ఆ ఘట్టంలోకి ఇప్పుడు వెళ్లలేము కనుక ప్రస్తుతానికి వద్దాం.

వర్ణవ్యవస్థకు చెందిన శిక్షాస్మృతిలోని ఒక అంశాన్నే ఇక్కడ భీష్ముడు బోధిస్తున్నాడు. ఈ బోధ ఇంకా చాలా చోట్ల కనిపిస్తుంది. వర్ణవ్యవస్థలో శిక్షాస్మృతి కూడా వర్ణాల హెచ్చుతగ్గులను బట్టే ఉంటుంది. ఎలాగంటే,  పై రెండు వర్ణాలకూ శిక్ష ఉండదు. ఉన్నా సరళంగా ఉంటుంది. కానీ,  మూడో వర్ణాన్ని అణచిపెట్టి ఉంచాలి, ఇక నాలుగోవర్ణంవారిని కొట్టినా, చంపినా తప్పులేదు.  మహాభారతం మేరకు ఐదో వర్ణం ప్రస్తావన దాదాపు కనిపించదనే చెప్పవచ్చు. మూడో వర్ణం అంటే వైశ్యులు. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు, ‘ప్రసిద్ధులైన రాజులందరూ అతనికి భయపడి వైశ్యులలా దాసోహమై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధనరాశులను తెచ్చి కప్పంగా చెల్లించారనీ, దాంతో ధర్మరాజుకు రాజత్వం సిద్ధించిందనీ’ శకునితో దుర్యోధనుడు అంటాడు.

ఇది నాలుగువర్ణాల వ్యవస్థ స్థిరపడిన లేదా,  స్థిరపడుతున్న దశకు చెందిన ముచ్చట. అప్పటినుంచీ దాస-దాసీల గురించిన ప్రస్తావన చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువమంది దాస-దాసీలు ఉండడం, సత్కారరూపంలోనో, కప్పంగానో దాస-దాసీలను ఇవ్వడం, కూతురికి పుట్టింటి అరణంగా దాస-దాసీలను ఇచ్చి పంపడం- ఇలా అనేక విధాలుగా దాస-దాసీలు ఒక హోదా చిహ్నంగా మారడం కనిపిస్తుంది.  ధర్మరాజు జూదంలో ఒడ్డబోయే తన సంపద జాబితా చెబుతూ అందులో వేలాదిమంది దాస-దాసీలను కూడా కలుపుతాడు.  ఈ దాస-దాసీ వ్యవస్థకు అవకాశమిచ్చిన గృహ ఆర్థికత (household economy), దానికి జతగా వర్ణవ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాయో రొమీలా థాపర్ From Lineage to State లో చర్చించారు.

అదలా ఉంచితే, మనం చెప్పుకుంటున్న యయాతి కథ అంతకంటే పురాతనం. ఎంత పురాతనం అంటే, అది దాస-దాసీ వ్యవస్థకు ప్రారంభకాలం కావచ్చు.

అసుర, దాస శబ్దాలు మొదట్లో జాతి, లేదా తెగ వాచకాలే తప్ప నిందార్ధకాలు కావని చెప్పుకున్నాం. అసురులు వ్యవసాయనిపుణులనీ; దాసుల్లో కూడా సంపన్నులు, బలవంతులు ఉండేవారనీ అనుకున్నాం. ఈ సందర్భంలోనే ‘శూద్ర’ అనే మాట గురించి కూడా చెప్పుకోవాలి. రొమీలా థాపర్ ప్రకారం దాస, శూద్ర అనే శబ్దాలు గణవాచకాలు. వారు స్వతంత్ర జీవులు, కృష్ణవర్ణులు, అంటే నల్లని వాళ్ళు. ఋగ్వేదం ప్రకారం మొదట్లో ఉన్నవి రెండు వర్ణాలే. అవి: ఆర్యవర్ణం, దాసవర్ణం. ఈ దాసులు, శూద్రులలో కొందరు పేదలైతే కావచ్చు కానీ, మొదట్లో వారు సేవకవృత్తిలో లేరు.  వీరు, ఆర్యులు పక్క పక్కనే ఉండేవారు. పైగా ప్రారంభంలో దాస్యానికి పేదరికమే కారణం తప్ప వర్ణం కాదు. ఆవిధంగా దాసులు, శూద్రుల్లోని పేదల లానే ఆర్యుల్లోని పేదలు కూడా దాస్యం లోకి జారిపోయేవారు. ఆ తర్వాత సొమ్ము చెల్లించో, మరో విధంగానో దాస్యం నుంచి బయటపడే వెసులుబాటు ఉండేది. అందుకే భారతదేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ ఎప్పుడూ లేదని చరిత్రకారులు అంటారు. మరి వర్ణవ్యవస్థ సంగతేమిటనే ప్రశ్న వస్తుంది. వర్ణవ్యవస్థలో హెచ్చుతగ్గుల తేడాలకు పుట్టుకే కొలమానం తప్ప, ఆర్థికతారతమ్యాలు కావు. అది ఒకరకంగా సామాజిక బానిసత్వ రూపం. ఈ వర్ణవ్యవస్థకు మెసపొటేమియాలోని ఒకనాటి బానిసరూపంతో పోలిక ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాన్ని ప్రస్తుతానికి అలా ఉంచుదాం .

‘శూద్ర’ శబ్దానికి వస్తే, ఆ మాట సంస్కృత పదం కాదనీ, ఇతర ఆర్యభాషలకు చెందిన పదం కూడా కాదనీ, సుమేరు పదమనీ రాంభట్ల ‘జనకథ’లో అంటారు. ఆ మాటకు రక్షకుడు అని అర్థంచెప్పారు. రక్షకుడు అనగానే మనకు రాక్షస శబ్దం గుర్తొస్తుంది. సుమేరుల జలప్రళయగాథలో నాయకుని పేరు ‘జీవశూద్ర’. సుమేరులు వ్యవసాయదారులు కనుక ‘జీవశూద్ర’ పంటపండించేవాడు, లేదా పంటకు రక్షణగా ఉండేవాడు అన్నమాట. అసురులు, అంటే రాక్షసులు కూడా వ్యవసాయదారులే నని చెప్పుకున్నాం. ఈ శూద్ర లేదా రక్షక శబ్దంలాంటిదే తెలుగులో ‘కాపు’ అనే మాట. ‘కాపు’ అనే మాటకు పంట రక్షకుడు, జనరక్షకుడు అనే అర్థాలు ఉన్నాయి.

ఈ వివరణకు పూర్వరంగంలో వేద ఋషులు వ్యవసాయానికి మళ్లడం గురించి చాలా విషయాలను రాంభట్ల గారు చర్చించారు కానీ ఇప్పుడు అందులోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, వ్యవసాయప్రాధాన్యాన్ని గుర్తించిన ఆర్యులలోని భరతగణంవారు వ్యవసాయవిస్తరణలో అసురుల సహకారం తీసుకున్నారు. అందుకే, అసుర భావనను వ్యక్తం చేసే నారాయణ, నాసదీయ, ‘క’బ్రహ్మ సూక్తాలు ఋగ్వేదం ప్రథమమండలంలోకి ప్రవేశించాయని రాంభట్ల అంటారు. ఆయన ప్రకారం, నారాయణసూక్తం సుమేరుల సృష్టిగాథే. చాలాకాలం తర్వాత ఈ కథనే బైబిలు కొన్ని మార్పులతో స్వీకరించింది. ‘శూద్ర’ పదం ఈ నారాయణ సూక్తంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు.  ఇక నాసదీయసూక్తంలోని తొలి వాక్యం అసురసృష్టిగాథ ‘ఎనూమాఎలిక్ష’కు అనువాదం. ‘క’బ్రహ్మసూక్తం ఈజిప్టు భావనకు సంస్కృత రూపం. సుమేరుకు చెందిన సుక్కూరులోని పురోహితుని ‘బరు’ అంటారు. ఈ ‘బరు’యే ‘బరురాంగిరస’ పేరుతో మంత్రద్రష్టగా వేదంలోకి ఎక్కాడు. ఈ పేరులోని ‘అంగిరస’ అనే పదం కూడా సుమేరుకు చెందినదే. సుమేరులు తమ దేశాన్ని ‘ఎంగి’ అనీ, తమ జనాన్ని ‘ఎంగిర్లు’ అనీ అనేవారు.

నారాయణసూక్తమూ-దానికి గల ‘శూద్ర’, సుమేరు సంబంధాల గురించి చెప్పుకుంటూ వెడితే, ఈ గొలుసుకట్టు ఎక్కడిదాకా పోతుందో తెలియదు. మహాభారత కథను వ్యవసాయ విస్తరణ కోణం నుంచి పరిశీలిస్తూ, ‘నర-నారాయణ రహస్యం’ పేరుతో నేను ఇప్పటికే ఒక పెద్ద వ్యాసం(అముద్రితం) రాశాను. దాని గురించి ఈ వ్యాసపరంపరలో చెప్పుకునే సందర్భం ఎప్పటికి వస్తుందో చెప్పలేను.

ఇంతకీ దాస శబ్దం (అలాగే శూద్ర శబ్దం కూడా) నిందార్థకం ఎందుకైంది, ఎప్పుడైంది అనే ప్రశ్నలకు పరిస్థితుల సంబంధమైన సాక్ష్యాలపై ఆధారపడి జవాబు చెప్పుకోవలసిందే తప్ప, కచ్చితమైన స్థలకాలాలను గుర్తించడం కష్టం.  దాస (అలాగే శూద్ర) శబ్దానికీ, అసుర శబ్దానికీ కొంత తేడా ఉంది. దాస శబ్దానికి నిందార్థంతోపాటు న్యూనార్థం కూడా ఉంది. ‘దాస’ అనే, గణ లేదా తెగ వాచకం దాసులనే న్యూనార్థాన్ని తెచ్చుకునే క్రమంలో యయాతి-శర్మిష్టల సంబంధాన్ని ఎక్కడ ఇమడ్చవచ్చు?!

పురావస్తు ఆధారంగా రొమీలా థాపర్ చేసిన పరిశీలన ప్రకారం ఒక భౌగోళిక సన్నివేశం ఇలా ఉంటుంది:

యయాతి-శర్మిష్టల చివరి కొడుకు పూరుడి సంతతి మొదట్లో సరస్వతీ నదీతీరంలో పచ్చిక భూముల వెంబడి జీవించారని ఋగ్వేదం చెబుతోంది. అయితే ఆ తర్వాత ఎంతకాలానికో తెలియదు కానీ, ఒక కీలక పరిణామం జరిగింది. ఉత్తర రాజస్తాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతంలోని నదుల గమనంలో మార్పులు సంభవించాయి. ఉత్తర రాజస్తాన్ లో వాతావరణం మారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రీ.వె. 2000 ద్వితీయార్థంలో ఈ మార్పులు సంభవించాయని అంచనా. సట్లెజ్ నదీ గమనం తరచు మారిపోయేదనడానికి వేదానంతర సాహిత్యం ఆ నదిని ‘శతద్రు’, అంటే వంద కాలువలు కలిగినదిగా పేర్కొనడం ఒక నిదర్శనం. ఇక, అనేక సరస్సులు కలిగినది అనే అర్థం ఇచ్చే సరస్వతీ నది సిర్సా అనే చోట ఎడారిలో అదృశ్యమైంది. యమునా నదీ గమనంలో వచ్చిన మార్పులు సరస్వతీ, సింధు, గంగా ప్రాంతంలోని ఇతర నదుల జలాలను ఆకర్షించాయనే వాదం ఉంది. ఈ విధమైన పర్యావరణ అనిశ్చితికితోడు, చిత్రిత మృణ్మయ సంస్కృతికి చెందిన వైదికార్యుల నివసించే ప్రాంతాల పరిమాణమూ పెరిగింది. అంటే, వారి జనాభా పెరిగిందన్న మాట. దాంతో వారు కొత్త వ్యవసాయక్షేత్రాలను, పచ్చిక భూములను వెతుక్కుంటూ పశ్చిమ గంగా లోయవైపు కదిలారు. అయితే, పురులలో ఒక శాఖ, బహుశా ప్రధాన శాఖ పంజాబ్ చుట్టుపక్కలే ఉండిపోగా, ఉప శాఖలు పశ్చిమ గంగా లోయ వైపు పయనించాయి. భరతులు వారికి తోడయ్యారు. ఈ పురు-భరత సమాఖ్య నుంచే కురులు అవతరించారు. ఇంకోవైపు, మరో అయిదు తెగలు కలసిపోయి పాంచాలురుగా ఆవిర్భవించారు. ఈ కురు-పాంచాల ప్రాంతమే మధ్యదేశంగా, ఆర్యావర్తంగా ముందు ముందు గుర్తింపు పొందబోతోంది. జనాభా పెరగడం, దాంతో కొత్త జనావాసాలను ఏర్పాటు చేయవలసి రావడం, కొన్ని యుద్ధ విజయాలు, ఓడిపోయిన వారి లొంగుబాటు మొదలైనవి తెగల ఏకీకరణకు, పునర్వ్యవస్థీకరణకు దారి తీయించి ఉండచ్చు.

పురులు, భరతులు పశ్చిమ గంగా లోయలోకి వలస వెళ్లడానికి ముందు మరో ముఖ్య పరిణామం జరిగింది. అది, దశరాజయుద్ధం. ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించుకున్న ఈ యుద్ధం గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, సుదాస్ నాయకత్వంలోని భరతులతో పది తెగల వారు పోరాడారు. వారిలో యదులు, లేదా యక్సులు, తుర్వసులు, ద్రుహ్యులు, అనులు ఉన్నారు. వీరు యయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి నిరాకరించి శాపగ్రస్తులైన అతని నలుగురు పెద్ద కొడుకులు, లేదా వారి సంతతి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నదీ గమనంలో వచ్చిన మార్పుల వల్ల పురులు నేటి హర్యానావైపు, గంగా-యమునా ఎగువ ప్రాంతానికి  వలసపోయినప్పుడే యదులు(మిగిలినవారి సమాచారం లేదు) సౌరాష్ట్ర, మధురల వైపు వెళ్లారని ఒక సూచన. వైదిక సాహిత్యంలో ‘పంచజను’ల ప్రస్తావన తరచు వస్తుంది. ఈ పంచజనులు ఎవరు, యయాతి కొడుకుల సంతతా  అనేది తెలియదు. యయాతి పెద్దకొడుకును కాదని చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టడం పశుపాలన స్థానంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిన సంగతిని సూచిస్తూ ఉండచ్చని అనుకున్నాం. భరతులలానే పురులు వ్యవసాయదారులు.

పురులలో కొందరు, భరతులు గంగా-యమునా మధ్యప్రాంతానికి వెడుతున్న కొద్దీ వ్యవసాయ ప్రాధాన్యం కూడా పెరుగుతూ, మరిన్ని నైపుణ్యాలు కలిగిన వ్యవసాయకార్యక్రమాలు పుంజుకున్నట్టు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ జనావాసాలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అయితే ఆ పరివర్తన మందగతిలో సాగింది. వెనకటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, ఇప్పుడు పురులు, భరతుల దగ్గర గుర్రమనే కొత్త జంతువు ఉంది. వీరు క్రీ.వె. 1000 తొలి శతకాల నాటికే ఆయుధాలకు పరిమితమై ఇనుము వాడుతున్నారు. సింధు-గంగా మధ్యప్రాంతంలో హరప్పా మలిదశకు చెందిన జనాలు ఉన్నట్టే; వీరు పశ్చిమ గంగా లోయలోకి వెళ్ళేనాటికి అక్కడ కూడా ముందునుంచీ ఉంటున్న కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి, రాగి సాధనాల సంస్కృతికి చెందినవారు ఉన్నారు. వీరివి చిన్న చిన్న జనావాసాలు. వీరిలో వ్యవసాయదారులు కూడా ఉన్నారు.

పై వలసక్రమమూ, తేదీలూ యయాతి కథను అతిపూర్వానికి తీసుకువెడుతున్నాయి. అది, ఆర్యగణాలలో పశుపాలన ప్రాధాన్యం వ్యవసాయ ప్రాధాన్యానికి మళ్ళుతున్న సంధి దశ కావచ్చు. వారు భారతదేశంలోకి అడుగుపెట్టే నాటికి ఇక్కడ కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారు ఉన్నారనీ, వారు మలి హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయదారులు కావచ్చుననీ చెప్పుకున్నాం. వాళ్ళలో దాసులు, అసురులు ఉన్నారు. ఆర్యులు వ్యవసాయదారులను శత్రువులుగా చూసి అసురులుగా పేర్కొనేవారు కనుక దాసులను కూడా అసురులనే అనేవారు కాబోలు. అయితే, పశుపాలన-వ్యవసాయాల సంధి దశలో ఒకటి జరగడానికి అవకాశముంది. అది, ఉభయ వృత్తుల మధ్య ఒక మాదిరి సహజీవనం. ఎలాగంటే, వ్యవసాయదారులు పంట కోసుకున్న తర్వాత పొలాలలో పశువులను మేపుకోనివ్వడమో, పశుగ్రాసం సమకూర్చడమో చేయవచ్చు. అందుకు ప్రతిఫలంగా ఆర్యగణాలు వ్యవసాయదారులకు రక్షణ కల్పించవచ్చు. అదీగాక, స్థిరజీవితానికి అలవాటుపడిన వ్యవసాయదారులు సాగుకు అనుకూలమైన భూముల్ని విడిచిపెట్టి వెళ్లడానికి సాధారణంగా ఇష్టపడరు. ఇతరుల ఆధిపత్యాన్ని అంగీకరించి అయినా భూముల్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తారు. కనుక నాటి సింధు-గంగా ప్రాంతంలో ఆ సంధి దశలో ఉభయవృత్తిదారుల మధ్య సహజీవనం సాధ్యమై ఉండవచ్చు. అందుకు ఋగ్వేదంలో సాక్ష్యాలు ఉన్నాయని రొమీలా థాపర్ అంటారు. ఉదాహరణకు, ఋగ్వేదం చివరి మండలాలలో నాగలి వ్యవసాయం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అంతేగాక, కొన్ని వ్యవసాయపరికరాల పేర్లు ఆర్యేతర భాషలకు చెందినవిగా ధ్వనిస్తాయి. ‘లాంగల’ అనే మాట అలాంటిదే. వైదిక సంస్కృతంలో మూల ద్రావిడ, ఆష్ట్రో-ఏషియాటిక్  పదజాలం ప్రవేశించడానికి మూలం ఈ కాలంలోనే ఉండవచ్చు. అయితే, ఆర్యగణాలు వ్యవసాయప్రాధాన్యం వైపు మళ్ళుతున్న కొద్దీ ఈ సహజీవన సంబంధాలు శత్రుసంబంధాలుగా మారడానికి అవకాశముంది.

యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినదా, శత్రుపూరిత దశకు చెందినదా అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. రెండింటికీ అవకాశముంది. శర్మిష్ట తండ్రి వృషపర్వుడు కాషాయవర్ణ మృణ్మయపాత్రల సంస్కృతికి, దాస తెగకు  చెందిన అనార్య వ్యవసాయదారుడు కావచ్చు. వ్యవసాయదారుడు కనుక అతనిని అసురునిగా పేర్కొని ఉండచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్టను యయాతి సహజగతిలోనే వరించాడు. ఆర్యులకు అప్పటికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపులేదు. వాస్తవంగా ఆ కథ కూర్చేనాటికి దాస శబ్దం న్యూనార్థం తెచ్చుకుంది కనుక కథకుడు శర్మిష్టకు దాస్యం ఆపాదించి దాసిగా కథను మలచి ఉండవచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం శత్రుపూరిత దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్ట దాసిగా మారిపోయి ఉండచ్చు. ఆమె కంటే ముందు వృషపర్వుడే దాసుడుగా మారిపోయి ఉండాలి…

యయాతి కథా పరిశీలనలో ప్రస్తుతానికి ఇవే చివరి వాక్యాలు. అయితే, ఇంత పరిశీలనా చేసి ఏం తేల్చినట్టు అనే ప్రశ్న పాఠకులకు కలగచ్చు. ఏమీ తేల్చలేకపోవడమే మన పురాణ, ఇతిహాసకథలలో ఉన్న బ్యూటీ. నా మటుకు నాకు పురాణ ఇతిహాసకథలలో చారిత్రకతను అన్వేషించడమే గొప్ప ఉత్తేజకర వ్యాసంగం. ఈ అన్వేషణలో నేను పొందిన మజాను పాఠకులలో ఏ కొందరు పొందినా నా ప్రయత్నం సఫలమైనట్టే.

 – కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 –