Archives for October 2016

ధింసా ఆడే కాళ్ళు..

Artwork: Rafi Haque

Artwork: Rafi Haque

జనపథపు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు
పోరాట సంబరాన్ని చిందించే ముఖాలు
ఏవేవో ఆశయాలతో రక్తం ఉరకలెత్తే ముఖాలు….
ఈ ముఖాల్ని యూనిఫారం తొడుకున్న హైనాలు పట్టి పీకాయి
రాజ్యం కత్తిపీటై క్రూరంగా చెక్కేసింది
పోరాటం చేసేవాళ్ళు సజీవులుగానే కాదు
శవాలుగా కూడా రక్తాన్ని మరిగింప చేస్తారు
ఒక్కో మృతదేహానికి ఒక్కో సజీవ చరిత్ర
అది వాళ్ళ స్తంభించిన కనుపాపల్లో కనిపిస్తుంది
****
రండి కార్పొరేట్ బాబులూ
ఇనుమడించిన ఉత్సాహంతో రండి
పలుగు పారలు డైనమేట్లు బాంబులు పొక్లైనర్లతో రండి
ధ్వంసంచేసి దోచుకున్నదాన్ని ఎత్తుకెళ్ళడానికి
బహుళజాతి కంటైనర్లతో రండి
మీ తరపున యుద్ధం చేసి
రాజ్యం పరిచిన నెత్తుటిమడుగుల రెడ్ కార్పెట్ల మీద
పరుగులెత్తుతూ రండి
బాయొనెట్లతో పొడిచేసిన ముఖాల్ని
ముఖాల్లేని మొండేల్ని
తెగిపడ్డ అవయవాల్ని తొక్కుకుంటూ ఉబలాటంగా  రండి
లక్షల ఏళ్ళుగా నిటారుగా ఎగిసిన
కొండలనన్నింటినీ పేల్చిపారేయండి
భూమిని బద్దలు చేయండి
చెట్లని బాంబులతో కూల్చి
పత్రహరితం పేగుల్ని మెడలో వేసుకు తిరగండి
కొండల రొమ్ముపాలులాంటి
జలపాతాలకి నిప్పెట్టండి
ఆదివాసీల అందమైన అమాయకపు
ధింసా ఆడే కాళ్ళు నరకండి
కొమ్ముబూరల్ని పగలగొట్టండి
దండారీ కొలాంబోడీ పండగల్లో
ఒళ్ళుమరిచి పులకరించే గూమేలా కోడల్ డప్పుల్ని
మోకాళ్ళకేసి కొట్టి విరగ్గొట్టండి
కాలికోం, పేప్రి, కింగ్రి వాయిద్యాల పీక నులిమేయండి
రేలపాటల గొంతుల్లో సీసం పోయండి
గోండు గుస్సాడీ కిరీటాల్ని విరిచేసి నెమలిపింఛాల్ని తగలబెట్టండి
వాళ్ళ కాళ్ళ గజ్జెల్లోని తుంగగడ్డల పూసల్ని చిందరవందరగా విసిరేయండి
గదబ గిరిజనుడి గుడిసె ముందున్న మట్టి అరుగు మీదే
మొదటి గునపం పోటెయ్యండి
ఏ ప్రకృతి విలయం చేయలేని
వినాశనానికి పూనుకోండి
అడవినంతా ఓ కబేళాగా మార్చి
నగరాల్లో ఫ్లై ఓవర్లు, పబ్బులు క్లబ్బులు కాఫీ షాపులు కట్టుకోండి
ప్రకృతి సంపదని
డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
అమ్ముకోవడమేగా పరిపాలన అంటే!
దండయాత్రలు చేసేవాడు
స్వదేశీయుడైతనేం విదేశీయుడైతేనేం?
*****
కానీ వీళ్ళు మాత్రం
పుడుతూనే విల్లంబులు బాణాలతో పుట్టినవాళ్ళే!
*

“దేవపుత్ర” కాదు మట్టిబిడ్డ!! 

deva

Artwork: Akbar

     *

1990 కి ముందు చదువరులకు ముఖ్య కాలక్షేపం వారపత్రికలే! వాట్లో వచ్చే కథలు, నవలల కోసం వారం పొడుగునా ఎదురు చూసే కాలమది.
 
     అప్పుడు నల్లమాడలో నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడ్ని. కథల మీద ఆసక్తి ఉన్న ముగ్గురం మూడు వారపత్రికల్ని  కదిరి నుంచి తెప్పించేవాళ్లం.
 
     1987 డిశెంబరు ఆంధ్రసచిత్ర వారపత్రికలో “ఇరుకు” అనే కథ వచ్చింది. ఆ కథను మేం ముగ్గురమే కాక, సాయంత్రం వాకింగుకు వెళ్లి దూరంగా బండమీద కూర్చొనే మా ఉపాధ్యాయ మిత్రులకంతా చదివి వినిపించాను. వారు దాన్ని మెచ్చుకొని మరికొందరితో చదివించారు. ఆ కథను రాసింది చిలుకూరి దేవపుత్ర!! అప్పట్నుంచీ అతని పేరు నాలో ముద్రించినట్లు స్థిరపడి పోయింది.
 
     అప్పుడతంది ఏవూరో? ఏ ఉద్యోగమో చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. అయినా పత్రికల్లో పేరు కనబడితే మొదట అతని కథనే చదివే వాడిని.
 
     మరలా హిందూపురానికి బదిలీపై వచ్చాక, డా.పెద్దిరెడ్డిగారి సాహచర్యంతో 1993  ప్రాంతంలో దేవపుత్రది అనంతపురమే అని, ఇంకా సింగమనేని నారాయణ, శాంతినారాయణ, బండినారాయణ స్వామి వంటి ప్రసిద్ధ రచయితల్ది కూడా అనంతపురమే అని తెలిసి సంతోషించాను.
 
     చిలుకూరి దేవపుత్ర 1951 ఏప్రిల్ 15 నాడు అనంతపురం జిల్లా బెళుగుప్ప దగ్గర కాలువపల్లెలో ఆశీర్వాదం, సరోజమ్మ అనే దంపతులకు జన్మించాడు. దళితుడైన అతని తండ్రి చిన్నపాటి ఉద్యోగి కావడంతో దేవపుత్ర ఇతర దళితుల్లాగా అవమానాలకూ, అంటరాని తనాలకూ గురికాకుండా పెరిగి ఉండవచ్చు!!
 
     అయినా తన వర్గానికి జరిగిన, జరుగుతున్న వెలివేతల్నీ, అంటరానితనాల్నీ, అణగదొక్కడాల్నీ గమనిస్తూ అందరిలాగా చూసీ చూడనట్లు పోలేదు. వారి అసహాయతల్నీ, జీవన శైథిల్యాల్నీ, ఇతర సామాజిక రుగ్మతల్నీ 100 కు పైగా కథల్లోనూ, ఐదు దాకా నవలల్లోనూ సజీవ రూపాలుగా అక్షరబద్దం చేశాడు.
 
     అతడు చదివింది S.S.L.C నే అయినా సమకాలీన సమాజాన్ని, తాను పనిచేసిన రెవెన్యూ శాఖ రుగ్మతల్ని బాగా ఆకళింపు చేసుకొన్నాడు. అతను రాసిన కథల్లో సగందాకా తను పని చేసే శాఖలోని బలహీనతలూ, లంచగొండితనాలూ, దొల్లతనాల్ని గురించి రాసినవే!! అతడంత ధైర్యంగా రాయగలిగాడంటే ఎంతగా వృత్తికి అంకితమై వుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 
     అతని కథలు “వంకర టింకర ఓ” “ఆరు గ్లాసులు” “ఏకాకి నౌకచప్పుడు” “బందీ” చివరి మనుషులు” అనే సంకలనాలుగా వచ్చాయి.
 
     ఇతను, ప్రసిద్ధ కథకుడు సింగమనేని నారాయణ గారి సాహచర్యం వల్ల వామపక్ష భావాల్ని ఆకళింపు చేసుకొని తన రచనల్ని మెరుగులు దిద్దుకొన్నాడు. ఆ భావజాలంతో 1977 లో మొదట రాసిన “మానవత్వం” అనే కథను రంగనాయకమ్మ గారు మెచ్చుకొని అచ్చువేశారు. అప్పట్నుండీ అదే బాటలో చివరిదాకా నమ్మిన సిద్ధాంతాన్నీ, పట్టిన దారినీ వదలకుండా అద్భుతమైన రచన్లు చేశాడు.
 
     “అద్దంలో చందమామ” నవల- తమ అధికారాల కొమ్ములూడినా రెడ్డీ కరణాల ఆధిపథ్య ధోరణినీ, దళారీతనాల్నీ, దళితులపట్ల వారి కల్ముష వైఖర్లనీ వివరిస్తుంది. “పంచమం” నవల- దళితుల దైన్య జీవితాలను అద్దంపట్టే రచన. “ప్రజల మనిషి” నవల- అవకాశాలు కల్పిస్తే దళితులు కూడా తమ ప్రతిభల్ని చాటుకోగల సమర్థులు అని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. “కక్షశిల” నవల- పేరులోనే రాయలసీమ కక్షల కాఠిన్యాన్ని ధ్యనిస్తుంది. సీమ ముఠా కక్షల్లో బలి అవుతున్నబలహీన బడుగువర్గాల సజీవ సత్యం. “చీకటి పూల” నవల- తెలియని వయస్సులో నేరాలు చేసి జైళ్లకు వెళ్ళే బాలల హృదయవిదారకమైన దుస్థితిని గుండెల్ని తాకేలా చెప్పింది.
 
     “రచయితలు తమ తరానికి జవాబుదార్లు.
      వారు తమకు తామే జవాబు చెప్పుకోవలసిన వారు” అని, ఆదివాసుల వాస్తవ స్థితిగతుల్ని కళ్లకుకట్టి చూపించిన మహోన్నత రచయిత్రి మహాశ్వేతాదేవి గారన్నట్లు, చిలుకూరి దేవపుత్ర మా అనంతపురం జిల్లాలోని కరువు, దళితసమస్యలు,ఫ్యాక్షనిజం మొదలైన విషయాలను ఇక్కడి సామాన్యప్రజల నిత్య వ్యవహారాల పదజాలంతో, ఎటువంతి కల్పనలకూ, అతిశయోక్తులకూ పోకుండా అక్షరబద్దం చేశాడు.
 
    అతను చాలా యేళ్లు కలెక్తరు కార్యాలంలో పని చేశాడు. నేను ఆకాశవాణికి ధ్వనిముద్రణకు వెళ్లినప్పుడల్లా కలిసేవాణ్ణి. అతను చాలా సార్లు “సడ్లపల్లీ! నువ్వు కథల్లో ఆవేశం, కసి రవ్వంత తగ్గించుకో!! పాత్రల్ని పక్కకు నెట్టి నువ్వెందుకు చొరబడతావు??” అని సూచనలు చేసేవాడు. “వీరమాండలికుడు” అని నాకు చురకలంటించి, సరళ మాండలికం రాయించిన ఘనత దేవపుత్రదే!!
 
     ఎంత భయంకరమైన సామాజిక నగ్నాలు, సంఘర్షణలూ తన రచనలో చెబుతున్నప్పటికీ ఆవేశాన్ని కానీ, అసహనాన్ని కానీ, ధర్మోపదేశాల్ని కానీ చేయడు. పాత్రల పరిధికి మించి ఒక్క మాటకూడా ఎక్కువగా మాట్లాడించడు.
 
     కథను ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన బహుకొద్దిమంది  రచయితల్లో దేవపుత్ర ఒకడు.
 
     ఊడలమర్రి, ఇదెక్కడిన్యాయం, ఔషధం, విలోమం, ఆయుధం, సమిధలు, గురుదక్షిణ, నేను పెసిడెంటు సుట్టమురాల్ని మొదలైనవి దళితకథలు. వీటిలో రిజర్వేషన్ల మూలంగా దళితులకు సంక్రమించే పరిపాలనాధికారాలు భూస్వాముల మూలంగా ఎలా అనుభవించలేక పోతున్నరో బలంగా చెప్పిన కథ. గురుదక్షిణ- కథనైతే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ అయిన బాపు “నాకు నచ్చిన కథ”అని కితాబిస్తూ, తన చేతుల మీదుగా అద్భుతమైన బొమ్మ గీసిన ఆణిముత్యం వంటి కథ.
 
     ఐడెంటిఫికేషన్, మీసాలు, ఆర్డర్లీ, ఆరుగ్లాసులు, విడుదల, దొంగయితే బాగుండు తదితరకథలు వైవిద్య భరితమైన అధికార్ల నిరంకుశత్వాన్ని చెప్పేకథలు.
 
     మట్టికీ దాన్ని నమ్ముకొన్న రైతుకూ వున్న సంబంధాన్ని గొప్పగా చిత్రించిన కథలు మన్నుతిన్న మనిషి,ముంపు. రైతుకూ అతని పెంపుడు నేస్తం పశువుకూ వున్న ఆత్మీయబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే రచన నెర్లు. మనిషియొక్క శాడిజం మీద రాసింది సిహ్మమ్నవ్వింది అనే కథ.
 
     అతని రచన్లన్నీ మొదట్నుంచీ చివరిదాకా చదివించే, ఆలోచింప చేసేవయినప్పటికీ, నాకు అపరిమితంగా నచ్చిన కథ “రెండు రెండ్ల నాలుగు” అది ఎంత హాస్యంగా మొదలై మనల్ని కడుపుబ్బ నవ్విస్తుందో, ముగింపు గుండెల్ని చెమర్చేలా చేస్తుంది. అలా రాయడం అందరిచేతా అయ్యేపని కాదు!!
 
     “చివరి మనుషులు” కథ నేటి సమాజంలో సంపన్న వర్గాలవారూ, వామపక్ష భావాలవారూ,అధికారులూ,ప్రజల్నేలే నాయకులూ చేసే ప్రసంగాలకూ ఆచరించే దొళ్లతనాలకూ పొంతనలేని భేషజాల్ని ఉతికి ఆరేసిన రచన. ఆ కథలో తమపిల్లల్ని తెలుగుపాఠశాలలో చదివించే ఆంగ్లోపన్యాసకుడు వేరెవరో కాదు! అతడు తెలుగుతల్లి అభిమాన భాషా మానస పుత్రుడైన  చిలుకూరే!!
 
     అతడు తన ఇదరు పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో తెలుగుమాధ్యమంగానే చదివించాడు. కుమార్తె చిలుకూరి దీవెన కవయిత్రి, కథకురాలుకూడా!!
 
     ఇంకొక విషయం ఏమిటంటే అతని భార్య లక్ష్మీదేవిగారిది కర్నాటక. ఆమె అక్కడ చదివింది కేవలం నాలుగో తరగతి దాకానే! ఇతని సాంగత్యంతో తెలుగు చదవడం రాయడం నేర్చి ఓపన్ యూనివర్సిటీలో డిగ్రీకూడా పాసయ్యింది. ఇరవై దాకా కథలుకూడా రాసిన ఏమే దేవపుత్ర కథలకు మొదటిశ్రోత, విమర్శకురాలునూ!!
 
     ఇతడు రాసిన కథలు, నవలలకు ఇరవైకి పైగా అవార్డులూ, సత్కారాలూ అందుకొన్నాడు. చివరగా జాషువాజయంతిని పురష్కరించుకొని సెప్టెంబరు 28 నాడు విజయవాడలో “గుర్రం జాషువా” పురష్కారాన్ని అందుకొన్నాడు. ఇరవైఐదు దాకా విశ్వవిద్యాలయాలు ఇతని రచనలని పాఠ్యాంశాలుగా చేర్చుకొన్నాయి. పది మంది దాకా విద్యార్థులు ఇతని రచన్లపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు, యం.ఫిల్ పట్టాలు పొందారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీవారు ఆంగ్లంలో ప్రచురించిన దళితకథా సంకలనంలో ఇతని గురుదక్షిణ తీసుకోవడం మన తెలుగు కథక జాతికే గర్వకారణం.
 
    ఆగష్టు 23 నాడు హిందూపురంలో తపన సాహిత్యవేదిక తరపున తమిళనాడులోని తెలుగు సోదరులు రాసిన “రాగెన్నుల రాజ్యం” మరికొన్ని పుస్తకాల ఆవిష్కరణలతో పాటు, మా అబ్బాయి పెండ్లికి హాజరై, రాత్రి 11 దాకా నాతో ఏకాంతంగా గడిపి కుటుంబ నేపథ్యాన్నతా అదిగి తెలిసుకొని “నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, బ్రహ్మరాక్షసుడివి నీ కథ రాసి తీరుతా” అని కౌగిలించుకొని ముద్దు పెట్తుకొన్నాడు!!
 
    ఇతడు స్నేహశీలి, సౌమ్యుడు, చాలా సున్నితమైన మనస్వి. ఉబికివచ్చే ఆనందాన్ని తన్లో దాచుకోలేని వ్యక్తి. ఒక సారి అనంతపురానికి వచ్చిన గోరటి వెంకన్నతో మేమంతా కలిశాము. “సంత” తో ముడిపడిన జీవితాల్ని అభినయిస్తూ అద్భుత పదచిత్రాల పూలని తనదైన శైలిలో మా హృదయాలమీద చిలకరిస్తున్నాడు. మేము రెప్పవాల్చకుండా గుండెల్ని కూడా శబ్దించకుండా నిశ్శబ్దపరచి ఆస్వాదిస్తున్నాము.
 
     చిలుకూరి ఉన్నఫళంగా లేచి గోరటివెంకన్నను కౌగిలించుకొని తన స్పందనల్ని మాటలుగా మార్చలేక చిన్న పిల్లాడిగా ఏడ్చేశాడు. అదొక్కటి చాలు సమస్యల పట్ల ఎంతగా చలించిపోయే వాడో అని అంచనా వేయడానికి!!
 
    సెప్టెంబరు 27 నాడు పత్రికల్లో వార్తవచ్చింది చిలుకూరికి జాషువా అవార్దు ఇస్తున్నత్లు. ఫోన్ చేసి అభినందనలు చెప్పి, “మా ఊరికి ఎప్పుడొస్తావ్ మా సంస్థతరపున సన్మానం చేయాలనుకొన్నాం” అన్నాను.దానికతడు నవ్వుతూ, “నువ్వు రైతుల కతలు రాయప్పా! అదేనాకు చేసే సన్మానం” అన్నాడు.
 
     అక్తోబరు ఒకటో తేదీ నాడు ఫోన్ చేసి, “సడ్లపల్లీ! వేదగిరి రాంబాబుగారు మన కథల ప్రూఫులు పంపినాడు. ఐ.డి. చెప్పు మెయిల్ చేస్తాను అన్నాడు. “పుత్రా అయితే రేపు అనంతపురానికి నేను రావాల్సిన పని లేదా?” అన్నాను.
 
    “ఔ గదా!! రేపు అభ్యుదయ రచయితల సంఘం తరపున గురజాడ- గుర్రం జాషువాల వ్యక్తిత్వాలపై సమావేశముంది కదా!! పొద్దున్నే ఇంటికొచ్చేయ్” అన్నాడు. అతను జిల్లా రచయితల, అభ్యుదయ రచయితల సంఘాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి.
 
     మరుసటి దినం తొమ్మిదింటికే మరో కడప మిత్రునితో కలిసి ఇంటికెళ్లాను. అప్పటికే మంచం వెడల్పునా కల్లంలో రైతులు పండిన ధాన్యాన్ని నెరిపినట్లు కూర్చోవడానికే సందు లేకుండా పేపర్లనూ, పుస్తకాల్నీ పరుచుకొని, నేను పెసిడెంటు సుట్టమురాల్ని – కథ ప్రూఫు దిద్దుతున్నాడు.
 
     అతని శ్రీమతి లక్ష్మి దేవిగారు కమ్మని కాఫీ అందించారు. పిచ్చా పాటీ మాటలయ్యక, “టైమయితా వుంది, నేను బిరీన స్నానం చేసొస్తాను. ఈ ప్రూఫ్ అట్ల దిద్దు నువ్వూ మాండలికుడివే కదా” అన్నాడు నవ్వుతూ.
 
     దానికి నేను “మాండలికం అంతే భాష పరిధిని కుదించి చట్రంలో బిగించినట్లుంటుంది. ప్రాంతీయ యాస అంటే బాగుంటుంది కదా” అన్నాను.
 
    “ఎందుకు బాగుండదు! ఇంక మీదట అట్లనే పిలుద్దాంలే” అని స్నానానికి పోయాడు. దిద్దడం అయిపోయాక నా కథను కూడా అతనే తీసుకొని హైదరాబాదుకు పంపిస్తానన్నాడు. మధ్యాన్నానికి సభ ముగిసింది.
 
     అక్టోబరు 15 శుక్రవారము. శాంతినారాయణ, దేవపుత్రా ఫోన్ చేసి” మన జిల్లావే నావుగయిదు కథలున్నాయి. ఆదివారం కథల సంకలనం ఆవిష్కరణ వుంటుందని, వేదగిరి రాంబాబు మైల్ చేశాడుకదా! నువ్వు కూడా వచ్చేయ్ అందరూ కల్సి పోదా” మన్నారు. కొన్ని పునులుండడంవల్ల నేను రానని చెప్పాను.
 
     అక్టోబరు 18, ఉదయం పది గంటల సమయంలో శాంతినారాయణ గారు ఫోన్ చేసి”చిదంబరరెడ్డీ.. ఒక దుర్వార్త…” అని కొంచెం సేపు గుండెను బిగబట్టుకొన్నట్లు ఆగి మన దేవపుత్ర అని చెప్ప బోయాడు. ఏదో ప్రమాదం లాంటిది జరిగి వుండొచ్చనుకొని  ఏం జరిగింది సార్?? అన్నాను. గుండెపోటుతో మనకు దూరమైనాడు” అని ఫోను పెట్టేశాడు.
 
     నాకు కొంతసేపు ఏమి చేయాలో తోచలేదు. వెంటనే ఫేస్ బుక్కులో అతన్ని గురించి నాలుగు మాటలు రాసి, సంతాపం తెలుపుతూ పోస్టు చేసాను.
 
    క్షణాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల నుండీ  ఎడతెరిపి లేకుండా సంతాప సందేశాలు పంపిస్తుంటే- అంతమంది అభిమానులు అందునా యువకులు ఉండడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. మరి కొంత మందయితే అతని కనుమరుగును జీర్ణించుకో లేక నేరుగా నాకు ఫోను చేసిగాని నమ్మలేక పోయారంటే… ఆ సాను భూతిని, అభిమానాన్ని, ప్రేమా వాత్సల్యాల్ని ఎలా వ్యక్తం చేయను?? (ఇప్పుడు 29.10.2016 రాత్రి 10 గంటలప్పుడుకూడా దూరప్రాంతాల్లో వుండి ఆలశ్యంగా తెలుసుకొన్న వారు అతనికి సంతాప స్పందనలు వస్తూనే వున్నాయి)
 
     విషాద వార్త తెలుస్తూనే దేవపుత్ర ఇంటికి వెళ్లిన కథారచయిత బండినారాయణ స్వామి”అతని మరణంలో విషాదంతో పాటు ఒక సంతోషం కూడావుంది. ఉదయం యథాప్రకారం వాకింగు నుండి వచ్చాడు. కాఫీ తాగినాడు. భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలి పొయాడు. ఆమె భయంతో అరిచింది. అతన్ని బతికించుకోవడానికి గుండెపై ఒత్తిడి చేస్తుంటే నిద్రనుంచి లేచినట్లు లేచి “నేను నిద్ర పోతున్నాను. నాకు అందమైన కలలు వసున్నాయి. దయచేసి పాడు చేయవద్దు” అని అతని చివరి మాటలు వివరిస్తూ, “అతడు సమాధుల తోట్లో పూసిన ఒక పూవు. నా నల్లని చందమామ”అన్నాడు.
 
     రెవెన్యూ శాఖలో ఇనస్పెక్టరుగా పని చేస్తున్న వ్యక్తి ఇంతికి కావాల్సిన చక్కెర, కిరోసిన్ వంటివి అందరిలాగే బ్లాకులో కొనడం మీరెక్కడైనా చూశారా??
 
    అదేశాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని, అదే సంస్థ”మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. యథాప్రకారం ఆఫీసులోనే వచ్చి కూర్చొండి. చేతనయితే ఏదయినా పని చేయండి. మీరు ఇక్కడికి రావడమే మా కార్యాలయానికి గౌరవ సూచిక. ప్రతి నెలా గౌరవ వేతనం పదివేలిస్తాం.”అని ఎక్కడైనా అన్నట్లు విన్నారా??
 
     అంగ్లేయుల కాలంలో చెప్పలేను కానీ, ఇప్పటి వ్యవస్తలో అంతటి నిజాయితీ, వృత్తికి అంకితమై పోయిన మొదటివాడూ చివరివాడూ బహుశహా చిలుకూరి దేవపుత్ర ఒక్కడేనేమో!!
 
     బయటి ప్రపంచానికి తెలియని దళిత, బడుగు వర్గాల జీవితాల కఠోర సత్యాల్ని ఇంకా చెప్పాల్సిన దేవపుత్ర మరణం అభ్యుదయ సమాజానికీ, అణగారిన ప్రజానీకానికీ తీరని లోటు.
 
    అతడందించిన కథల కేతనాన్ని యువతరం అంది పుచ్చుకొని,విశ్వమానవ సమాజం వైపు నడిపించుకు పోయినప్పుడే  అతనికి నిజమైన నివాళి !!

*

స్వప్నాన్ని నాలో వొంపండి

jaya1

పూనే, మహారాష్ట్ర లో నివశించే జూయి కులకర్ణి మరాఠీ యువకవయిత్రి. హిందీ లోనూ కవితలల్లే చిత్రకారిణీ. మరాఠీ,హిందీ ఆంగ్ల భాషలతో పాటు పిగ్ లాటిన్ భాషలలో ప్రావీణ్యం సాధించిన బహుముఖ ప్రతిభావంతురాలు.

రాత్రంతా మేల్కొంటున్నావా? రెండు నదీ తీరాలను యేకం చేసే కవిత్వాన్నీ రాస్తున్నావా? అంటూ పలువురి సాహితీవేత్తల ప్రశంసలందుకొంది. శ్వాసల నిర్మాణ కార్యం అనే యీమె కవితా సంపుటి మరాఠీలో ఆసక్తిని రేకెత్తించింది. అతికోమలంగా కనిపించే పదాల వెనుకటి అల్లకల్లోలాలు పాఠకులను కలచివేసే కవితలు. యీమె కవిత్వ అభివ్యక్తి నూతనంగా వుండి ఆలోచింపజేస్తుందిలా-

నేటి నా కన్నీరును యీ పూలసజ్జలో దాస్తున్నాను..కొన్ని రోజుల్లో వో యాత్రికుడి దాహాన్ని తీర్చాక ఆరిపోవచ్చు.యీమె కవిత్వంలోని కల్పనలు,ప్రేరణలు,అర్థవంత నిర్మాణాలకు పునాదిగా నిలిచి మానవ సంబంధాలను నిర్మిస్తాయి. యీ కవితను గీత్ చతుర్వేది మరాఠీ నుంచి హిందీ చేసారు.

jaya

స్వప్నాల దాడి
——————–

యీ రోజుల్లో స్వప్నాలు
గొప్పగా ప్రపంచ వ్యవహారికంగానే వస్తున్నాయి

స్వప్నాలలోనూ
వంట చేయాలనిపిస్తుంది
చాలా సార్లు నన్ను నేను
వంట చేస్తున్నట్టే స్వప్నిస్తాను

చీల్చుతూ, కోస్తూ, మర్థిస్తూ
వుడకబెడుతూ, వేయిస్తూ, వండుతూ
పెరుగుతూనే వుంటాయి
నీ కవితలు, కథలు,వృత్తాంతాలు,నవలలు

స్వప్నాలలోనూ
తెరచిన కిటికీ నుంచి
బల్లులు, కప్పలు వస్తుంటే చూస్తుంటాను
భయపడిపోతుంటాను

స్వప్నాలలోనూ
గడియారపు ముళ్ళపై
నా బరువును తూకం వేసి
ఆకస్మిక భీతిలో నిద్రపోతాను

స్వప్నాలలోనూ
రుచి చెడిన అన్నపు వ్యంగం
గొర్తొస్తుంది

వినండి!
మీరెవరైనా సరే
బలవంతంగానైనా పర్లేదు
కొత్త కొత్తగా గాని
కఠినాతి కఠినమైనవి కాని
చూచేందుకు సరైన
స్వప్నాన్ని నాలో వొంపండి..

*

పాషాణ పాకం – మైనపు ముద్ద!

viswanatha

ఒక పాతకాలపు మండువా ఇల్లు లాంటి ఇల్లు. చుట్టూ ప్రహరీ. ఎత్తైన ద్వారబంధం. లోపల విశాలమైన ఒక పూజగది. అందులో ఒక పెద్ద జ్ఞానభాండాగారం. ఆ పరిసరాల్లో ఆకురాలినా వినిపించేటంత నిశ్శబ్దం. ఆ గదిలో వెలుతురూ చీకటీ కానీ ఒక మిశ్రమస్థితి.

ఆ జ్ఞానభాండాగారం ముందు ఒక వృద్ధుడు ముకుళిత హస్తాలతో, అరమోడ్పు కనులతో కూర్చుని ఉన్నాడు. అంతర్ముఖుడై ఉన్నాడు. ఆయన ముఖమండలాన్ని అనంతమైన శాంతి ఆవరించి ఉంది. మధ్య మధ్య తల ఎత్తి భాండాగారంవైపు చూస్తున్నాడు. నిశ్చయాత్మకంగా తల పంకిస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనలోని ఆలోచనలకు అక్షరరూపమిస్తే అది ఇలా ఉంటుంది.

మానవుడు పుట్టినప్పటినుంచీ ప్రోది చేసుకుంటూ వచ్చిన జ్ఞానమేదైతే ఉందో ఆ యావత్తు ప్రపంచవిజ్ఞానానికీ ఇది అంతిమం. దీనికి ముందు ఏమీ లేదు. దీని తర్వాత ఇంకేమీ ఉండదు. ఇందులోంచి జ్ఞానాన్ని తోడి ప్రపంచానికి, అది కూడా అవతలివాడి యోగ్యతను బట్టి,  అందించవలసినదే కానీ, ఇందులోకి తీసుకొచ్చి కలపవలసిన ప్రపంచవిజ్ఞానం ఏమీ లేదు.

జ్ఞానానికి ఇది అంతిమ సరిహద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడిక తానుగా కొత్తగా జ్ఞానాన్వేషణ చేయవలసిన అవసరం నుంచి ఆయన విముక్తి పొందాడు. అయితే జన్మ ఎత్తాము కదా, దీనినేమి చేయాలి? ఈ జ్ఞానపు సరిహద్దును శత్రువులు ఆక్రమించకుండా కాపలా కాయడమే దానితో చేయవలసినది. అనగా తానొక యోధునిగా మారడం!

ఆ వీథి లోంచి ఆ ఇంటి మీదుగా రోజూ ఒకాయన వెడుతూ ఉండేవాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన అడుగులు కాసేపు ఆగేవి. ఆ ఇంటిమీద ఆయనకు ఒక అంతులేని కుతూహలం. ఆ లోపల ఉన్నవారు ఎవరో ఆయనకు తెలుసు, కానీ తెలియదు. ఇదో విచిత్రమైన ప్రహేళిక. తెలియడమంటే ఏమిటి, సన్నిహితంగా గాఢంగా తెలియడం. కానీ ఈయనకు ఆ అవకాశం లేదు. ఆ వృద్ధుడి సామాజిక నేపథ్యం, ఈయన సామాజిక నేపథ్యం ఒకటి కావు. కనుక కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఆ జ్ఞానభాండాగారాన్ని నింపుతూ వృద్ధి చేస్తూ వస్తున్న ఆ ఇంటిలోపలివారి ఆచారవ్యవహారాలు, వారి ఆలోచనాసరళి, వారి భాషకు చెందిన నుడికారం, అందులో ఉట్టిపడే ధిషణ, అధికారం-మొత్తంగా ఆ జ్ఞానభాండాగార వృద్ధి వెనుక గల వారి తాత్విక, మానసిక స్థితిగతులు ఈయనకు సన్నిహితంగా తెలియవు. ఆ ఇంటాయనదీ, ఈయనదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకరికొకరు పరిచితులే, కానీ అపరిచితులు. ఒకరు ఆ జ్ఞానభాండాగారపు లోపలి మనిషి, ఇంకొకరు వెలుపలి మనిషి.

కానీ ఈయనకు ఆ ఇంటిమీద వల్లమాలిన కుతూహలం. ఎప్పుడైనా సింహద్వారం తెరచి ఉన్నప్పుడు లోపల కొంత ఆ ఇంటి ఆకారం కనిపించేది, అంతే. అది కనిపించడం కాదు. మరీ అరుదుగా సాహసించి సింహద్వారం దాటి లోపలికి వెళ్ళేవాడు. కానీ అడుగులు జ్ఞాన భాండాగారమున్న గది ఇవతల ఆగిపోయేవి. ఇంకా అరుదుగా ఆయన అదృష్టం కొద్దీ ఆ భాండాగారపు తలుపులు  ఓరగా తెరచుకుని ఉండేవి. అప్పుడా సందులోనుంచి భాండాగారం వైపు తొంగి చూసినప్పుడు దానిలోని జ్ఞానశకలాల మెరుపులేవో తన బుద్ధిని తాకినట్లు అనుభూతి చెందేవాడు. ఆ మెరుపులు అప్పటికే ఈయన బుద్ధిలో నిక్షిప్తమైన జ్ఞానఫలకంపై ప్రసరించి కొత్త కాంతులను ఈనుతున్నట్టు అనిపించేది.

ఎందుకంటే, ఈయన తన బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నది కొత్త జ్ఞానం. ఆ వృద్ధుడి భాండాగారం నుంచి తోడుకున్నది కాక ఇంగ్లీషు చదువువల్ల కలిగినది. వృద్ధుని భాషలో చెప్పాలంటే అది కాలమహిమ! వృద్ధుడి వెనక వందలు వేల సంవత్సరాల చదువు ఉండగా ఈయనది ఇప్పుడిప్పుడే మొదలైన చదువు. పైగా అది ఇంగ్లీషు చదువు. ఈయనకు ఆ విధంగా ఇంగ్లీషు గవాక్షం నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది. ఆపైన తన జ్ఞానభాండాగారం యావత్తు జ్ఞానానికీ అంతిమం అనుకుంటున్న వృద్ధుడిది ఆగిపోయిన చదువైతే, ఈయనది  సాగుతున్న చదువు. వృద్ధుడిది కడుపు నిండింది అనుకునే చదువైతే, ఈయనది అప్పుడే హైబర్నేషన్ నుంచి బయట పడినట్టుగా ప్రపంచాన్నే మింగేసేటంతగా ఆవురావురు మంటున్న చదువు.

sudrarsanam

ఈయన తన కొత్త చదువుల దారిలో ఏవో కొన్ని జ్ఞానపు గీటురాళ్లను సేకరించుకున్నాడు. ఆ వృద్ధుని జ్ఞాన భాండాగారం నుంచి తనను తాకిన శకలాలను వాటిమీద పరీక్షించి విలువ కట్టాలని ఈయన తాపత్రయం. ఆవిధంగా రెండింటి మధ్యా ఏమైనా సమన్వయం సాధ్యమవుతుందేమో నని కూడా ఆయన తపన. కానీ విచిత్రం, ఆ జ్ఞానభాండాగారానికి తను అపరిచితుడు, ఔట్ సైడర్! కాకపోతే ఆ భాండాగారంపై ఈయనకు ఒకవిధమైన ఆరాధనాభావం ఉంది. కనుక దానికి ఆయన ‘బాహ్యమిత్రుడు’. మారిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులలో ఆ వృద్ధునికీ, ఈయనకూ కుదిరిన ఒకానొక ఐక్యత కూడా అందుకు కారణం కావచ్చు.  అంతకు చాలా ముందునుంచే ఉండి, ఇవే పరిస్థితులలో ఈయన కళ్ళముందే బలమైన గొంతును, నిర్దిష్టతను, అస్తిత్వాన్ని తెచ్చుకుంటున్న ఇంకొక సామాజికవర్గం ఉంది. ఈ వర్గానికి ఆ జ్ఞానభాండాగారం వైపు తలుపు సందులో నుంచి చూసే అవకాశం కూడా లేదు. కనుక ఈ వర్గాన్ని ‘బాహ్యశత్రువు’ అనవచ్చు.  ‘బాహ్యత’ అనేది ఉభయులకూ సమానం.

వృద్ధుని విశ్వనాథ సత్యనారాయణ అనుకుంటే, ఈ రెండో వ్యక్తి ఆర్. ఎస్. సుదర్శనం.

***

‘సాహిత్యంలో దృక్పథాలు’ ఆర్. ఎస్ .సుదర్శనంగారి ప్రసిద్ధ సాహిత్య విమర్శాగ్రంథం. మొదటిసారి 1968లో ప్రచురితమైంది. అందులోని వ్యాసాలను ఎప్పుడో చదివాననే గుర్తు. కానీ అది చదువు కాదు. విశ్వనాథవారి ఫక్కీలోనే చెప్పాలంటే, చదివితిని, చదవనైతిని. అసలు చదువనగా నేమి? ఒక పుస్తకములోని విషయమును సంపూర్ణముగా ఆకళించుకొనగల అధికారముతో చదివినదే చదువు. కేవలము చక్షురక్షర సంయోగమాత్రముగా చదువునది చదువు కాదు.

చదవడం గురించి నాకూ ఒక అభిప్రాయం ఉంది. మనం ఒకే రచనను వివిధ జీవితదశల మీదుగా చదువుతాం. ఆ వివిధ జీవిత దశలమీదుగా సునిశితమవుతున్న మన అవగాహనను, ప్రపంచజ్ఞానాన్ని ఆ రచనకు అదనంగా జోడిస్తూ చదువుతాం. ఆ చదువు వెనకటి జీవితదశలోని చదువును రద్దు చేస్తుంది. అంటే మళ్ళీ ఆ రచనను మనం కొత్తగా చదువుతాం. ఆ విధంగా ఆ రచన కాలం వెంబడి ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని తెచ్చుకుంటూ పాఠకుడికి ఎప్పటికప్పుడు కొత్తగా చదివిన అనుభూతినిస్తుంది.

ఇప్పుడు ‘సాహిత్యంలో దృక్పథాలు’ చదవడం నాకు నిజంగా అలాంటి ఒక విశిష్టానుభవం. అటు విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఇటు సుదర్శనంగారిని కూడా కొత్తగా ఒకింత ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడా రచన ఇచ్చింది. అయితే ఇది సబ్జెక్టివ్ గా అంటున్న మాట సుమండీ. విభేదించే హక్కు పాఠకులకు ఎప్పుడూ ఉంటుంది.

అందులోనూ నాకు ముఖ్యంగా అనిపించినది, ఈ పుస్తకానికి అది వెలువడిన రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ రెలెవెన్స్ ఉందన్నది. ఆ రెలెవెన్స్ ఉండడమే దాని గురించి నేను రాయడానికి ప్రధానమైన ప్రేరణ. ఆ రాయడంలో నేను సాహిత్యంలో దృక్పథాలు గురించి మాత్రమే రాయడం లేదు. విశ్వనాథ సత్యనారాయణ, ఆర్ ఎస్ సుదర్శనం అనే ఇద్దరు వ్యక్తులను గురించి రాస్తున్నాను. వారి భావాల మధ్య ఉన్న సంఘర్షణ గురించి, ఆ సంఘర్షణ వేళ్ళు వారి వారి సామాజిక, వైజ్ఞానిక వైవిధ్యాలలో ఉండడం గురించి రాస్తున్నాను. వారిని, వారి సామాజిక నేపథ్యాలను  కూడా దాటి,  దేశమంతటా ఇంకా కింది సామాజికవర్గాలవరకూ వ్యాపించి  ఈ దేశపు గతాన్ని, వర్తమానాన్ని కమ్ముకున్న ఆ వైవిధ్యమూ, ఆ భావసంఘర్షణా తాలూకు భవిష్యస్థితి గురించి, అది నేటి మన అనేకానేక భ్రమలను చెదరగొట్టే అవకాశం గురించి రాయడానికి ఈ ప్రయత్నం.

సుదర్శనంగారు సాహిత్యంలో దృక్పథాలు రాసిన కాలానికి ఉన్న దేశీయస్థితిగతులు వేరు. అప్పడు కాంగ్రెస్, అది చెప్పుకునే సెక్యులరిజం(లేదా ఇప్పుడు కొందరు ప్రబలంగా చిత్రిస్తున్న సూడో-సెక్యులరిజం) పెద్దగా పోటీ లేని అధికారాన్ని చలాయిస్తున్నాయి. దేశవిభజన తర్వాత దేశంలోని ముస్లిం మైనారిటీలు, ఇతర మతపరమైన మైనారిటీలు సెక్యులరిజం(లేదా సూడో-సెక్యులరిజం) గొడుగు కింద  కనీసం సూత్రరీత్యానైనా ఒక తటస్థ సామాజిక స్థితిలో ఉంటున్నారు.  ఇంకోపక్క వామపక్ష, వామపక్ష తీవ్రవాద ప్రభావం ప్రత్యేకించి యువత మీదా గాఢంగా ఉంది. నూతన రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో దళితులు, తరుజన, గిరిజనులు కొత్త అస్తిత్వాన్ని, గొంతును, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటున్నారు.

ఈ కాలమంతటా సాంప్రదాయికశక్తులుగా భావిస్తూ వచ్చిన శక్తులు సద్దు మణిగి ఉన్నాయి. వాటిమీద తిరోగాములన్న ముద్ర బలంగా ఉంది. పాశ్చాత్య విజ్ఞానపు వెలుగులో సాంప్రదాయిక విద్యా విజ్ఞానాలను సరికొత్తగా అర్థం చేసుకుని నూతన సమన్వయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఆరోజున పురోగామిగా ముద్ర పొందింది. ఆవిధంగా సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు రాసే కాలానికి పురోగామి చింతకులు అనుకుంటే, విశ్వనాథ తిరోగామి భావజాలానికి ప్రతినిథి. అయితే 1968 నుంచి 2016 కు వచ్చేసరికి నాడు ‘తిరోగామి’, ‘పురోగామి’ అనుకున్న శక్తుల బలాబలాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇప్పుడు విశ్వనాథ భావజాలం అధికారాన్ని పుంజుకుంటూ విశ్వరూపాన్ని ధరిస్తుంటే సుదర్శనం ప్రాతినిధ్యం వహించిన భావజాలం దానికి దారి ఇస్తూ వెనకడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా భావజాలాల ఆధిక్యత తలకిందులైన పరిస్థితే సాహిత్యంలో దృక్పథాలకు సరికొత్త రెలెవెన్స్ ను స్థాపిస్తూ నూతనంగా చదవలసిన అవసరం కల్పిస్తోంది.

నేను పైన అన్న ‘బాహ్య మిత్రుడు’, ‘బాహ్య శత్రువు’ అనే మాటలు ఇక్కడ కీలకంగా గమనించవలసినవి. ఇప్పుడు ఒకవిధమైన జాతీయతావాదాన్ని, దేశభక్తిని దేశంలో స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక్కడ దేశీయసమాజస్థితి ఎలా ఉంది? ‘బాహ్య మిత్రుడు’ ఇంకా ‘అంతర్మిత్రుడు’ కాలేదు. ‘బాహ్య శత్రువు’కీ, ‘అంతర్వ్యక్తు’లకూ మధ్య సయోధ్య, సమన్వయం, ఇరువురినీ కలిపే ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడలేదు. బలాబలాలు తలకిందులు కావచ్చు తప్ప, సాంప్రదాయికంగా వస్తున్న భావ, భౌతిక సంఘర్షణ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని రకాల వైరుధ్యాలను, వైవిధ్యాలను తన కంఠబలంతో అధికార బలంతో ఎగరగొట్టి తన అస్తిత్వాన్ని అంతటా వ్యాపింపజేయడంలో  వందలు వేల సంవత్సరాల అనుభవం ఉన్న సాంప్రదాయిక భావజాలానికి ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేయగల అవకాశం దాదాపు నూరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ వచ్చింది. తన బ్రాండు జాతీయతావాదాన్ని, దేశభక్తిని విధించి శాసించడం అందులో భాగమే.

కానీ విచిత్రమేమిటంటే ఆ జాతీయతావాదాన్ని, దేశభక్తిని పైనుంచి కృత్రిమంగా రుద్దే ఆ ప్రయత్నంలోనే దాని నిరంతర వైఫల్యమూ స్పష్టంగా లిఖించి ఉండడం. ఈ దేశానికి అదొక హాస్యాస్పద, విషాదకర అనుభవం.

నేను ఈమధ్యనే ఒక చోట రాశాను, భారత దేశమంతటా ఈనాటికీ ఉన్నది ప్రైవేట్ సంభాషణా, ప్రైవేట్ జీవితాలే తప్ప పబ్లిక్ సంభాషణా, పబ్లిక్ జీవితమూ లేదు. భారతదేశపు గొంతు ఇప్పటికీ ప్రైవేట్ గానే వినిపిస్తుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలు తమ నాలుగు గోడల మధ్య నిరంతరం ప్రైవేట్ గానే సంభాషిస్తూ ఉంటాయి. వీటి మధ్య ఒక ఉమ్మడి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. రాజ్యాంగం అవతరణ అలాంటి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసేందుకు ఒక ప్రాతిపదిక. కానీ ఇన్నేళ్లలోనూ రాజ్యాంగం పొందుపరిచిన ఆ పబ్లిక్ భాష పూర్తిగా ప్రజల పరం కాలేదు. అసలు రాజ్యాంగం ఉనికే జనం ఊహల్లో ఇంకలేదు. రాజ్యాంగం ముందునాటి వివాదాల అంతు తేల్చుకునే ప్రయత్నంలోనే ఇప్పటికీ ఉన్నాం. ఇప్పుడు సాంప్రదాయిక శక్తుల పునరాధిక్యస్థితి ఆ అంతు తేల్చుకునే ప్రక్రియను పూర్తి స్థాయి యుద్ధం వైపు మళ్లించింది.

మళ్ళీ ‘బాహ్యమిత్రు’డి దగ్గరికి వద్దాం. పైన చెప్పిన ఆ మండువా ఇంటి లాంటి ఇల్లూ, అందులోని జ్ఞాన భాండాగారం ముందు కూర్చుని ఉన్న విశ్వనాథ వంటి ఒక వృద్ధుడూ, ఆ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్ ఎస్ సుదర్శనం వంటి వ్యక్తీ, ఆ ఇంటి మీద ఆయన కుతూహలం, అందులోని జ్ఞాన భాండాగారం పట్ల ఆయనలోని ఒకవిధమైన అడ్మిరేషన్…కేవలం ఒక ప్రతీకాత్మక దృశ్యకల్పన కావు. సాహిత్యంలో దృక్పథాల వంటి సుదర్శనంగారి రచనల ద్వారానే కాక, వ్యక్తిగా కూడా ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయంతో నేను ఆయన గురించి చేసిన కల్పన ఇది.

సుదర్శనంగారు ఎనభై దశకం ప్రారంభంలో, అంతకు కొన్నేళ్ళ ముందు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, ఆ తర్వాత ఉన్నత విద్యా జాయింట్ డైరక్టర్ గానూ ఉన్న రోజుల్లో కొన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్ళి సాహిత్యం గురించే కాక, ఇతర విషయాల గురించి కూడా ఆయన చెప్పేవి వినే అవకాశం నాకు కలిగింది. ఇప్పటికీ ఒక సంభాషణ నాకు గుర్తుండిపోయింది.

ఓసారి మా సంభాషణ శంకరాచార్యులు స్థాపించిన మఠాలవైపు, కంచి పరమాచార్య వైపు మళ్ళింది. పరమాచార్య గురించి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన కళ్ళలో కనిపించిన ఒక మెరుపు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన గురించి నాకు దగ్గరగా తెలిసిన కొన్ని విషయాలు ఉత్సాహంగా చెబుతుంటే ఆయన ఆసక్తిగా విన్నారు. నేను మాట్లాడ్డం ఆపిన తర్వాత ఒకసారి ఆయన భారంగా నిట్టూర్చి, “మీరు చెబుతున్నవి బాగానే ఉన్నాయి. కానీ బ్రాహ్మణేతరులు పరమాచార్యకు దగ్గరగా వెళ్లచ్చా? వారితో శాస్త్ర, ఆధ్యాత్మిక విషయాలు చర్చించవచ్చా? బ్రాహ్మణ పండితులతో సమానంగా వారికి ఆ అవకాశం ఇస్తారా?” అన్నారు. అలా అంటున్నప్పుడు వారి గొంతులోనూ, ముఖంలోనూ ఒకింత బాధా, నిరాశా తొంగి చూశాయి.

“అదేమీ లేదు, నాకు తెలిసినంతవరకూ వారి దగ్గర బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తేడాలు ఏవీ ఉండవు. ఎవరైనా వారిని చూడచ్చు, మాట్లాడచ్చు” అన్నారు.

అప్పుడు ఆయన నన్నో అజ్ఞానిగానో, అమాయకుడిగానో చూసినట్టు చూసి, చిరునవ్వు నవ్వారు. “నేను అంటున్నది వారిని దర్శనం చేసుకోవడం గురించి, మాట్లాడడం గురించి కాదు. ఆ మఠానికి ఒక సంప్రదాయం ఉంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో బ్రాహ్మణులదే ముఖ్యపాత్ర. బ్రాహ్మణేతరులకు వాళ్ళతో సమానస్థాయిలో వ్యవహరించే అవకాశం లేదు” అన్నారు. ఆ మఠంలో వ్యవస్థకు, ఆచరణకు మొదటి ప్రాధాన్యమనీ, తత్వానికి తర్వాతి ప్రాధాన్యమనీ అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఇంగ్లీష్ విద్య చదువుకున్నవారు హిందూ తాత్వికతకు ప్రాధాన్యమిస్తూ దానిని ప్రపంచానికి పరిచయం చేశారనీ, తనదీ అలాగే తత్వానికి ప్రాధాన్యమిచ్చే దృష్టి అని ధ్వనింపజేశారు.

తాను సాంప్రదాయిక జ్ఞాన భాండాగారానికి ‘మిత్రుడి’ నే అయినా దానికి ‘బాహ్యుడి’ నన్న అసంతృప్తి, వెలితి ఆయన మాటల్లో కనిపించింది. ఆ జ్ఞానభాండాగారం నుంచి తనకు దొరికిన, అనుమతించిన కొన్ని శకలాలను ఆయన ఏరుకున్నారు. వాటిని ఇంగ్లీష్ విద్య తనకు అందించిన ఆధునిక విజ్ఞానం, అవగాహన వెలుగులో పరీక్షించుకుంటూ రెంటి మధ్యా ఏవైనా సమన్వయం సాధ్యమవుతుందేమోనని చూశారు. ఆయన  సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరుల మార్గంవైపు సహజంగానే మొగ్గారు. పాశ్చాత్య తత్వ వేత్తల గురించిన అవగాహనా  హిందూ తాత్వికతను కొత్తగా అర్థం చేసుకునే వెసులుబాటు ఆయనకు ఇచ్చింది.

అయితే ఆయన సాంప్రదాయిక జ్ఞానభాండాగారానికి బాహ్యుడన్న వాస్తవం మరచిపోకూడదు. ఆయన ఆ భాండాగారం నుంచి ఎంతో కొంత స్వీకరించి ఉండచ్చు, అయినా అది ఆయనకు కరతలామలకం అయినట్టు కాదు. ఎందుకంటే ఆ భాండాగారాన్ని అభివృద్ధి చేసిన ఆ ఇంటివాతావరణంతో, అందులోని వ్యక్తులతో, వారి జీవన సరళితో,  వారి ప్రైవేట్ ఆలోచనలతో, భాషతో, అందులోని ధిషణతో ఆయనకు ఆత్మీయ పరిచయం లేదు. కనుక ఎలాంటి జీవన శైలి, ఎలాంటి ఆలోచనా రీతి ఆ జ్ఞానానికి ఆకృతి నిచ్చాయో ఆయనకు సన్నిహితంగా తెలిసే అవకాశం లేదు. దానిపట్ల, దాని తాత్వికత పట్ల దూరం నుంచి చూసినప్పుడు కలిగిన ఒకవిధమైన రొమాంటిక్ అడ్మిరేషన్ ఆయనది. అది ఆయన అవగాహనకు హద్దు. కారణం ఆయనకు మౌలికంగా ఆ జ్ఞానానికి ‘బాహ్యుడు’. ఆయనలోనే కాదు, అలాంటి ‘బాహ్యులు’ అనేకమందిలో అలాంటి రొమాంటిక్ అడ్మిరేషనే ఉంది. దూరం నుంచి చూసినప్పుడు కలిగే ఆ అడ్మిరేషన్ తోనే ఇప్పటికీ దాని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివ్యక్తుల పల్లకీలను మోసే బోయీలుగానే వారు ఉన్నారు.

‘బాహ్యుడు’ కావడం అనేది సుదర్శనంగారికి వ్యక్తిగతంగా ఒక కొరత, లేదా బలహీనత అయితే; మరో వైపునుంచి అదే ఆయన పరిశీలనకు బలం కలిగించింది.  ఆ జ్ఞానభాండాగారం వద్ద కూర్చుని ఉన్న ఆ వృద్ధుని ఆలోచనాసరళిని బయటినుంచి చూసి అర్థం చేసుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ చూడడానికి ఆ జ్ఞాన భాండాగారపు లోపలి ఉపకరణాలు కాక(అవి ఎలాగూ ఆయనకు అందుబాటులో లేవు) తాను ఇంగ్లీష్ విద్యతో సంపాదించుకున్న కొత్త ఉపకరణాలు, తర్కం, హేతువు వగైరాలు ఆయనకు సాయపడ్డాయి. అవి ఆ వృద్ధుడి ఆలోచనా స్వరూపాన్ని దాని వైరుధ్యాలతో సహా అత్యద్భుతంగా బయటపెట్టాయి. “పాషాణ పాక ప్రభువు”గా ముద్రపడిన ఆయనను మైనపు ముద్దలా మనముందు నిలబెట్టాయి.

సాహిత్యంలో దృక్పథాలు చదువుతుంటే, విశ్వనాథ గురించి మనం కల్పించుకునే ఆ ధిషణాహంకార దోర్బల బ్రాహ్మీమయమూర్తి కాస్తా మంచుబొమ్మలా కరిగిపోతున్న భావన కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశపు క్షితిజాన్ని ఆక్రమించుకున్న ఆయన భావజాలంలోని వైరుధ్యాలతో సహా దాని యథార్థ ఆకృతిని మన కళ్ళముందు నిలపడం ద్వారా సాహిత్యంలో దృక్పథాలు ఈ క్షణాన తన రెలెవెన్స్ ను ఆశ్చర్యకరంగా స్థాపించుకుంటోంది.

(ముగింపు తర్వాత)

 

 

 

వేరుపురుగు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

 

“ఈలోకంలో ఎంత మంచోడైనా, ఎంత ఎదవైనా కూడ, అప్పుడప్పుడు నోరు మూసుకొని ఏమీ చేతకాని వాడిలాగ కూచోటం తప్పదు. యీ సినీ ఫీల్డ్ లో మరీ తప్పదు”  సుదీర్ఘంగా ఓ పెద్దగుక్క లాగించాక స్థిమితంగా అన్నాడు సీమనాయుడు. సీమనాయుడు అంటే కోనసీమ నాయుడు కాదు, రాయలసీమ నాయుడు. తేడా ఏమంటే యీ నాయుడు రాయలసీమ నాయుడైనా మాట్లాడేది కృష్ణా గుంటూరు జిల్లాల భాషే.  అదేమంటే, అతను పెరిగింది అక్కడే! డిగ్రీ దాకా చదివాడు గానీ, డిగ్రీ పూర్తి చెయ్యలేదు.  సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ‘బాయ్’ గా చేరి, సొంత డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టి తరవాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ‘లాభం’ వచ్చే సినిమాలే తీశాడు.  సొంతంగా కొన్ని, పార్ట్‌నర్‌షిప్ తో కొన్ని.

“అదేం?” అని అడిగాడు దాలినాయుడు.

దాలినాయుడుది శ్రీకాకుళం.  నిఖార్సైన మనిషి. మందు కూడా నిఖార్సైనదే తాగుతాడు, తాగిస్తాడు. సినిమాలంటే పిచ్చి. పేకాటంటే ప్రాణమే! బాగా వున్నవాడు గనక ఇస్త్రీ మడత ఏనాడు నలగలేదు.

“ఏం అంటే ఏం జెబుతాం?”  సిగరెట్టు వెలిగించాడు సీమనాయుడు.

“ఆస్కా.. అంటే ఆంధ్రా సోషల్ & కల్చరల్ అసోషియేషన్ . పేరుకి ఆస్కా అయినా అందరూ ఆంధ్రా  క్లబ్ అనే అంటారు, విజయ రాఘవ రోడ్, ఆంధ్రా క్లబ్ టి. నగర్ అంటే తెలీనోడు మద్రాసులోనే వుండడు. అక్కడ ఎలక్షన్లు జరిగితే జాతీయ ఎన్నికల్లానే జరుగుతాయి.

నేను మెంబర్ని కాదు, మెంబర్ని అయ్యేంత స్తోమత  నాకు లేదు. ఒక వేళ మెంబర్ షిప్పు ఇచ్చినా నేను చెయ్యగల పనేమీ లేదు. ఆ ‘వెజ్ ‘ ఫుడ్డు సూపర్ గా వుంటుంది. నాన్ వెజ్ సంగతి నాకు తెలీదు. చిట్టిగారెలు తినాలంటే అక్కడే తినాలి.  పుల్కాలు కూడా సూపర్ గా వుంటాయి. అప్పుడప్పుడు మిత్రులతో కలిసి అక్కడకి వెళ్తుంటాను.  ఆ మిత్రులు మెంబర్స్ గనక, ఓ గంటో,  రెండు గంటలో సరదాగా గడిపి వస్తుంటాను.

 

“మీరేంటి? ఒక గ్లాసుతోటే జన్మంతా గడిపేస్తారా?” చనువుగా అన్నాడు తిరగలినాయుడు. తిరగలినాయుడుది చిత్తూరు. ఇంతకు ముందు కూడా అతని గురించి చెప్పాను.

అటు నెల్లూరు ఇటు చిత్తూరు, ఆ పక్క హోసూరు వరకు తిరగలినాయుడి ఆవకాయ ‘సామగ్రి ‘ కి మంచి పేరుంది. ఫుల్ డిమాండ్. నన్ను క్లబుకి లాక్కొచ్చింది తిరగలినాయుడే.

“వింటున్నాగా… వింటూ.. వింటూ…” నవ్వేశాడు తిరగలినాయుడు.

“రచయితలుగా ఆ మాత్రం జాగ్రత్త వుండాల్లెండి” నవ్వాడు సీమనాయుడు.

“సరే అసలు సంగతి చెప్పనీవయ్యా ప్రొడ్యూసర్ నాయుడు” ఓ గ్లాసు ఎత్తి గటగటా తాగేసి అన్నాడు దాలినాయుడు.

“కుమార్ రాజాగాడి గురించే చెప్పేది. ఆడు ‘వేరు పురుగ ‘ ని మీకు తెల్సు.. నాకూ తెల్సు. కానీ తెలీంది ఆ వెర్రి అఖిలకి. అందుకే ఆడికి ‘చోటు ‘ ఇచ్చింది. బతుక్కే ‘చేటు ‘ తెచ్చుకుంది” మరో పెగ్గు తెప్పించుకుంటూ అన్నాడు సీమనాయుడు.

“అఖిల అంటే వదిన వేషాలు వేసేదీ. ఆవిడేనా? చాలా మంచిదనీ, ఎవరికీ లొంగదని విన్నానే?” ఆశ్చర్యంగా అన్నాడు దాలినాయుడు.

దాలినాయుడికి ‘ఆ పిచ్చి ‘ కాస్త జాస్తి.  సినిమాదైతే చాలు… మహదానందంగా ఖర్చు పెడతాడు.

“విన్న మాటే కాదు… ఉన్న మాటే! నేను తీసిన మూడు సినిమాల్లో అక్క, వదిన వేషాలు వేసినా ఏనాడు ‘లూజ్’ గా ప్రవర్తించలా. నిజం చెబితే నేను కాస్త ‘ఉబలాట’ పడ్డ మాట వాస్తవం. ఉహూ…ఎన్ని ఆశలు చూపినా నవ్వేసి,” మీరు పెద్దవారు, వృక్షం వంటివారు! మేము ఆ కొమ్మల మీద బతికే పిచ్చుకలం… మీరు చల్లగా వుండాలి” అని నా నోరు కట్టేసేది. నిట్టూర్చాడు సీమనాయుడు.

“మరి ఆ కుమార్ రాజాగాడికి ఎలా పడింది?” వెలిగించబోయే సిగరెట్టుని పక్కన పెట్టి అన్నాడు దాలినాయుడు.

“ఖర్మ ‘ అని దాన్నే అంటారు. ఎట్టా పరిచయం అయ్యాడో నాకు తెలీదు. గానీ పరిచయం అయ్యాడు. కేరాఫ్ అడ్రస్ లేని వాడికి అఖిల వుండే ఇల్లే కేరాఫ్ అయ్యింది. అఖిల కూతుర్ని యీడు బాగా పేంపర్ చేశాడని విన్నాను. తండ్రెవరో తెలీని పిల్లాయే. కుమార్ రాజుగాడు ‘నేనే నీ డాడీలాంటోడ్ని” అనేసరికి ఆ పిల్ల మురిసిపోయుండాలి. కూతుర్ని మంచి చేసుకొని అక్కడి నుంచి తల్లిని పట్టాడు. వయస్సులో కూడా యీడు ఐదారేళ్ళు  అఖిల కంటే పెద్దోడేగా. వెర్రి మొహంది నమ్మి మంచలోనే కాదు మంచం మీద కూడా చోటిచ్చింది. ఆ తరువాత వాడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూడమని పాపం అందరు ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని ప్రాధేయపడింది” విస్కీలో సోడా పోయిస్తూ అన్నాడు సీమనాయుడు.

“నిన్ను కూడా అడిగిందా?” ఉత్సాహంగా అన్నాడు దాలినాయుడు.

“బావా.. ఆకలి రుచి, నిద్ర సుఖమూ ఎరగనట్టే యీ ప్రేమ కూడా ఉచ్ఛనీచాలు ఎరగదురా! ఎవరి సంగతో ఎందుకూ, నేనూ లం… కొడుకునే. అందుకే అఖిల మానానికీ, కుమార్ రాజాగాడి సినిమా ఛాన్స్ కి ముడి పెట్టాను.” గటగటా తాగేసి అన్నాడు.

“ఏమందీ?” మహా కుతూహలంగా ముందుకు వంగి అన్నాడు దాలినాయుడు.

“ఏటి తిరగలి బావా? నీకేం నచ్చలేదా?” తిరగలినాయుడ్ని అడిగాడు దాలినాయుడు.

సినిమా వాళ్ళకో దురద వుంటుంది. ఏం చెప్పినా కాస్త సస్పెన్స్ జోడించి, స్క్రీన్ ప్లే తో చెబుతారు, ఎదుటి వారు గనక ఉత్సాహం చూపించకపోతే, క్షణంలో జావగారిపోతారు. సీమనాయుడేమీ దానికి ఎక్సెప్షన్  కాదు.

“ఎందుకు నచ్చదు? సీమ బావా.. నేనూ మనిషినే! మామూలుగా వున్నప్పటి సంగతి ఎలా వున్నా మందు కొట్టినప్పుడు మహా ఇంట్రష్టు పుట్టుకొస్తుంది… సినిమా కబుర్లంటే! అయితే నేను ఫీల్డ్ సంగతి తెలిసినోడ్ని కనక కథ ఏ ‘కంచి ‘ కి చేరుతుందో చెప్పేగల్ను. అయినా, అఖిల సంగతి నాకు ఇంతకు ముందు తెలీదు. కనక నువ్వు జబర్దస్త్ గా కథ చెప్పేయచ్చు” సిగరెట్టు వెలిగించి అన్నాడు తిరగలి నాయుడు. నాకు తెలిసినంతవరకు అఖిల సంగతి తిరగలినాయుడికి తెలీకుండా వుండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరివీ కొడంబాకం డైరెక్టర్స్ కాలనీ పక్కనున్న సందులో ఎదురుబదురు ఇళ్ళే!

“కథ ఏముందిలే!  పదేళ్ల పిల్ల వున్న ముఫ్పైయేళ్ళ అఖిల ముఫ్పై ఆరేళ్ళ కుమార్ రాజుగాడికి పడింది. మనిషి కొద్దోగొప్పో అందగాడు. దానికి మించి చదూకున్నాడు. ఒకటి మాత్రం నిజం బావా.. అఖిలలాంటి ఆడది దొరికినోడిదే నిజమైన అదృష్టం అంటే!” నిట్టూర్చాడు సీమనాయుడు.

‘ఎట్టా?” మరో పెగ్గు చప్పరించి అన్నాడు దాలినాయుడు.

మనిషి లోపల ఖచ్చితంగా మరో మనిషి వుంటాడు ఆ లోపలి మనిషే అసలైన మనిషి. అఖిల లోపలుండే అఖిల మామూల్ది కాదు. బావా… ఒక్కసారి  ఆ మనిషిలోని మనిషిని చూశాను. అప్పటి నుంచీ మరే మనిషి నా కంటికి ఆనలేదు. నిజం చెప్పొద్దు… నా అంత నికృష్టపు నా కొడుకు ఇంకోడు వుండడు. కానీ బావ అక్కడ మాత్రం నా తల ఎత్తలేను” ఫటాల్న గ్లాసెత్తి మొత్తం లాగించేశాడు సీమనాయుడు.

దాలినాయుడు తిరగలినాయుడు వంక చూశాడు. తిరగలినాయుడు చిన్నగా నవ్వి”బావా! మన బావ మందు మీద వుండి మాటలు కక్కుతున్నాడనుకోకు. సీమనాయుడు ఎంత తాగినా చీమతలంతైనా మాట దొర్లడు  “ అన్నాడు. సీమనాయుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే పార్టీ ముగిసింది. ఒక్కోసారి అంతే! ఎమోషనల్ గా రెచ్చిపోయిన గుండె అగ్నిపర్వతాలు పగిలి నిజం ‘లావా ‘లా ప్రవహించక ముందే ఏ జ్ఞాపకమో ఆ పర్వతాన్ని చల్లబరిచి అది పగలకుండా ఆపుతుంది. మరి ఏ జ్ఞాపకము సీమనాయుడ్ని ఆపిందో అతనికే తెలియాలి.

**********************

 

ఏ పరిశ్రమలోనైనా కొన్ని కామన్ గానే వుంటాయి. అఖిల మీద ఏ ముద్ర పడక ముందు అందరూ గౌరవాన్ని చూపేవారు. సీమనాయుడులాంటి వాళ్ళు ‘బేరాలు’ పెట్టినా అవి బయటకు రావు. ఒక్కసారి ఓ ఆడది ఒకరికి ‘పడింది ‘ అని తెలిస్తే మాత్రం ప్రతీవాడు ఓ ‘పులై ‘ పోతాడు. వలవెయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ప్రొడక్షన్ కంపెనీల సంగతి వేరు కాదు. ‘పై వాళ్ళ’ కి తెలిసీ తెలీకుండా ‘పైరవీలు ‘ సాగించేవాళ్ళు సాగిస్తూనే వుంటారు.

కొందరికి నగలు ఆభరణాలైతే కొందరికి నవ్వే ఆభరణం. అఖిలకి నవ్వే కాదు నమ్రత కూడా అభరణమే.

“అయ్యా.. మీరన్నది నిజమే నా మనసుకి విలువిచ్చి ఆయనతో జతయ్యాను. ఈ జన్మాంతం మరో జోలికి పోను. మీరు అవకాశం ఇస్తే మహాసంతోషం. లేకపోతే ఎలాగోలా బతకకపోను.” అని వినమ్రంగా చెప్పేది. దాంతో చాలా మంది ఆవిడ మానాన ఆవిడ్ని వొదిలేసిన మాట వాస్తవం.

“అదేంటి గురూగారూ, అదేం ఆడదండీ? ఆ కుమార్ రాజా గాడి కోసం రోజూ ఓ క్వార్టరు రమ్ము తెప్పిస్తుందిట. పెన్నులూ, కాయితాలే కాక సిగరెట్టు పాకెట్లు కూడా తెప్పిస్తుందిట. ఏమైనా చెప్పండి… ఆ నా కొడుకు పెట్టి పుట్టాడు.” ఇదీ ప్రొజక్షన్ రమణ నాతో అన్నమాట.

నాకు కొంచం ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవమే కానీ నిర్ఘాంతపోలేదు. కారణం నాకు కొంత తెలుసు. కొంతమందికి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఆ ఇచ్చాక కూడా ఏనాడు ‘అవాళ నేను నీకు అది ఇచ్చాను.. నువ్వు నాకేం ఇచ్చావు? ‘ అని ఏనాడు సాధించరు.

శ్రీశ్రీ బహుశా ఆలాంటి వారి కోసమే ‘తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ” అన్న పాట రాసి ఉండాలి. అఖిల కూడా అలాంటి మనిషే అని నాకు ఎప్పుడూ అనిపించేది.

చామనఛాయ, అద్భుతమైన, గుండెలోంచి వచ్చే నవ్వు, ఏ మాత్రం కల్మషం లేని చూపు.. మితమైన మాట… ఏ మగాడికైనా స్త్రీలో ఇంతకు మించిన లక్షణాలు ఇంకేం కోరుకోడానికి వుంటాయి?

తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన పార్టీలు కొన్ని వుంటాయి. వెళ్ళకపోవడం వల్ల తలనొప్పిలు తప్పనిసరి. వెళ్ళడం వలన ఉపయోగాలు ఏమీ వుండవు కానీ, మానవ స్వభావాలు మాత్రం బాగా తెలుస్తాయి.  ‘పాత్ర ‘ ల్ని మలిచేందుకు అవి గొప్పగా ఉపయోగపడతాయి.

ఓ ‘హీరో ‘ గారే ఛాలెంజ్ చేశాడు. ఆ అఖిలని బెడ్ మీదకు తెచ్చి చూపిస్తానని. (కథకి ఈ విషయంతో పని లేదు. అయినా ఎందుకు ఓ వాక్యం వ్రాయాల్సి వచ్చిందంటే, ఆశకి అంతస్థులతో పని లేదని చెప్పడానికి). ఓ డైరెక్టరూ సెకండ్ హీరోయిన్  ఛాన్స్ ఇస్తానని కబురెట్టాడుట. కానీ, సెకండ్ హీరోయిన్ కారెక్టర్ కోసం  ‘ తన కారెక్టర్ ‘ వదులుకోవాలిట.

“అయ్యా.. మీరు హీరోయిన్ గా అవకాశమిచ్చినా నాకొద్దు. నా వయసు, నా స్టక్చర్ దానికి పనికి రాదు. చిన్న వేషం చాలు… అదీ నా కారెక్టర్ ని నిలబెట్టేది.” అన్నదిట. నాతో చెప్పింది రమణే.

 

*********************

 

రమణ ఒక వార్త తెచ్చాడు, కుమార్రాజు కథని ఫలానా ‘టాప్ ‘ డైరెక్టర్ ఓ.కె. చేశాడనీ, ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడనీ. అన్నట్టు చెప్పలేదు కదూ, రమణ ఉండేది మా వీధిలోనే. రమణ, మూర్తి, అనంతరాజ్ ఓ రూం తీసుకొని వుంటున్నారు. ఆ బిల్డింగు లోనే ‘భీశెట్టి లక్ష్మణ రావు” గారు వుంటున్నారు. స్ట్రీట్ పేరు ‘చారీ స్ట్రీట్ ‘.

సంవత్సరం తిరకుండానే కుమార్రాజు పెద్ద రైటర్ అయ్యాడు. ఓ సినిమాలో అతనిది కథ అయితే నాది పాటలు. కానీ మేం కలిసే అవకాశం రాలేదు.

అఖిల జీవితంలో మార్పేదీ లేదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు గనక కుమార్రాజు టి.నగర్ లోనే ఆనందన్ స్ట్రీట్ కి మారాడు అని తెలిసింది. మా వీధి వెనకాల మూడో స్ట్రీట్ అది.

కాలం గడచిపోతోంది. నేను యమా బిజీ. మా అన్నగారి అబ్బాయిని వెస్ట్ మాంబళం  రాజా హాస్పటల్లో చేర్పించాల్సి వచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడే కుమార్ రాజు కూడా ఎడ్మిట్ అయ్యి ఉన్నాడు. మా వాడికి నూట ఐదు జ్వరం అయితే అతనికి నూట నాలుగు. జ్వరమే కాదు వాంతులు మోషన్లు కూడా.

నిజమైన ‘సేవ ‘ ఎలా వుంటుందో అఖిలని చూస్తే తెలిసింది. ఆమె చెయ్యని సేవ లేదు. వాంతులు ఎత్తిపోసింది. మిగతా విషయాలు చెప్పక్కర్లేదు.

అయిదు రోజుల తరవాత మా వాడు డిశ్చార్జ్ అయ్యాడు గానీ, కుమార్ రాజు పన్నెండు రోజులు ఆస్పత్రి లోనే వున్నాడుట. అఖిల చేసిన సేవ చూశాక ఆమె అంటే నాకు అమితమైన గౌరవం పెరిగింది.

 

***********

 

మూడేళ్ళ తరవాత సడన్ న్యూస్. కుమార్ రాజుకీ మాజీ నటి మల్లికా నాయర్ కి పెళ్ళయిందని.  నాకు షాక్. ఎన్ని కోట్లైన సంపాయించొచ్చు. కానీ అఖిల లాంటి స్త్రీ ప్రేమ దొరకడం దుర్లభం. అయినా ఇది చిత్ర సీమ. చిత్రాలకి కొదవేముంటుంది? ఇప్పుడతను పేరెన్నిక వున్న రైటరు. జనాలకి కావల్సింది సక్సెస్… కారెక్టర్ కాదు.

సాలిగ్రామంలో ‘ఇల్లు ‘ కొన్నాడని కూడా  తెలిసింది. అంతే కాదూ ఆ ఇంటి గృహప్రవేశానికి నేనూ కూడా వెళ్లాల్సి వచ్చింది. కారణం మేమిద్దరం నాలుగు సినిమాలకి రాస్తున్నాం. పరిచయం మాత్రం మామధ్య అంతంత మాత్రమే. కుమార్ రాజు సంస్కారం లేనివాడు కాదు. మంచీ మర్యాద తెలిసిన వాడే. అఖిలని అతను దూరం పెట్టాడనే ఓ అకారణ కోపం నాలో నాకే తెలియకుండా వుండి, అతనితో పరిచయం పెంచుకోవడానికి అడ్డుపడిందని మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను.

మల్లికా నాయర్ తెలుగులో కూడా ఓ పది సినిమాలు యాక్ట్ చేసింది. కొన్నిటికి నేను పాటలు కూడా రాశాను. మనిషి జోవియల్ గానే వుంటుంది. లోపలి స్వభావం మాత్రం నాకు తెలియదు.

 

*******************

 

అఖిల కూతురు అపర్ణకి ఇప్పుడు పదహారేళ్ళు.

“దాలి బావా.. అఖిల కూతుర్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నా… కో ప్రొడ్యూసర్ గా వస్తావా?” నా ముందే దాలినాయుడితో అన్నాడు సీమనాయుడు.

మధ్యలో చాలా సార్లు కలిశాం గానీ మళ్ళీ అఖిల ప్రసక్తి రాలేదు. మాతో బాటు తిరగలి నాయుడు కూడా వున్నాడు.

“ఒప్పుకుంటుందా?” అడిగాడు దాలినాయుడు.

“దేని గురించి ఒప్పుకోవాలి బావా?” నవ్వి అన్నాడు తిరగలినాయుడు.

“ఆశ చావదు బావా! అప్పుడెప్పుడో ఆవిడ కారెక్టర్ గురించి విన్నప్పటి నుంచీ ‘ఆ కోరిక ‘ అలాగే వుండిపోయింది.” సిగరెట్టు వెలిగించి అన్నాడు దాలినాయుడు.

” ఆ విషయంలో అయితే చచ్చినా ఒప్పుకోదు. అంతేగాదు, అసలు కూతుర్ని సినిమాల్లోకి రానివ్వదని నా నమ్మకం.” ఖచ్చితంగా అన్నాడు శివరామ్ . శివరామ్ డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసరు. బాగా కలిసొచ్చి, ‘ఖరీదైన ‘ వాళ్లతో తిరుగుతున్నాడు.

“ట్రయల్ ఏమైనా వేశావేంటి? “ పకపకా నవ్వి అన్నాడు సీమనాయుడు.

“అడక్కండి. ఆ పిల్లని విక్టరీ వాళ్ళ సినిమాకి అడిగాను. అందులో నాది పావలా వాటా కదా! పిల్లతో మాట్లాడక ముందే తల్లి ‘నో ‘ అంది. ఇంకేం రానిస్తుందీ?”త్రిబుల్ ఫైవ్ వెలిగించి అన్నాడు శివరాం. తెల్లబట్టలూ, తెల్ల షూసూ, త్రిబుల్ ఫై పాకెట్లు, ఎనిమిది వేళ్లకీ వుంగరాలు, మెళ్ళో చైనూ, చేతికి బ్రాస్లెట్టూ.. ఇవన్నీ ప్రొడ్యూసర్ అలంకారాలు. గది మొత్తం పరిమళించే ‘సెంటు ‘ కూడా తప్పనిసరి.

“ఆవిడ కూతుర్ని హీరోయిన్ చెయ్యాలంటే మన అవసరం ఏముంటుందీ? కుమార్ రాజు గారే ( గాడే కాదు నోట్) టాప్ ప్రొడ్యూసర్లకి చెప్పి ఇంట్రడ్యూస్ చెయ్యగలరు.” యాష్ ట్రే లో సిగరెట్టుని గుచ్చుతూ అన్నాడు తిరగల్నాయుడు.

“ఆ మాటా నిజమే.” నిర్లిప్తంగా మరో పెగ్గు పోసిన బేరర్ కి సోడా ఎంత పొయ్యాలో సైగ చేస్తూ అన్నాడు . స్టాఫ్ మారడం వల్ల కొలతలు తేడా వస్తున్నాయ్. పాతవాళ్లకి తెలుసు… ఎవరు ఏ డ్రింక్ లో సోడా కలుపుతారో వాటర్ కలుపుతారో.

 

*******************

 

“మార్పులు మొదలవ్వాలే గానీ, మహాస్పీడుగా జరిగిపోతై. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది. ఆ ‘మార్పు ‘ చాలా సహజంగా జరిగే అవకాశాలున్నా, అత్యంత నాటకీయంగా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. జోడించడం కష్టం. విడదీయడం క్షణం. సదరు నాయకులకి నష్టం ఏమాత్రమూ వుండదు. వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఎస్టేట్లకి వొచ్చిన ముప్పేమీ వుండదు. దెబ్బ తినేది మాత్రం సాంకేతిక నిపుణులు, చిన్నచిన్న నటులు, నటీమణులు, ఎక్ స్టాలు, ఇతర కార్మికులు.

మద్రాసులో తెలుగువాడి విలువ నిట్ట నిలువునా పడిపోయింది. తమిళ వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మనవాళ్ళు తమిళ వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు కానీ, వాళ్ళు మాత్రం మనవాడికి అరచి చచ్చినా ఛాన్స్ ఇవ్వరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవర్ల దగ్గర నుంచి, లైట్ బాయిస్ దగ్గర నుంచీ, ప్రొడక్షన్ బాయిస్ దాకా తరలిపోయారు. కుమార్ రాజు ముందుగానే ‘ఇల్లు ‘ కొని మరీ హైదరాబాద్ తరలిపోయాడు. అఖిలకీ తప్పలేదు. ‘సంగీతం ‘ కొంతకాలం  చెన్నై లోనే ‘చిరునామాని ‘ నిలుపుకొన్నా, అదీ వెళ్ళిపోక తప్పలేదు. నేను మాత్రం వెళ్ళలేదు. కారణాలు రెండు… ఒకటి.. పాలిటిక్స్.. నాకు పడవు. రెండు.. ‘రాత ‘ ని నమ్ముకొన్నవాడ్ని గనక.

****************

‘ఆస్కా ‘ లో ఉత్సవాలు జరుగుతున్నై. ఏకబిగిని మూడురోజులు. కుమార్ రాజు కూడా వి.ఐ.పి. గా వచ్చి వెళ్ళాడు. స్టేజ్ మీద మేము కలిసినా పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకలేదు.

గత ఐదేళ్ళలో చాలా చాలా చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళాను… పాటలు వ్రాయడానికి.  వాళ్ళ దృష్టిలో మేము ‘చెన్నై ‘ వాళ్ళం. ‘లోకల్ ‘ కాదు గనక దూరం పెట్టచ్చు. అదో చిత్రం. గోడకు ఇవతల ‘ఈశాన్యం ‘ అయితే గోడకు అవతల ‘ఆగ్నేయం ‘ అయినట్టు, పరిశ్రమ చీలిపోగానే అన్నీ చీలిపోతాయి. అంతకు ముందున్న నాయకులందరూ తూఫానుకి ఎండిన తాటాకులు ఎగిరినట్టు ఎగిరిపోయారు. నిజం చెబితే ఏ స్వార్ధం కోసం పరిశ్రమని విడదీశారో ఆ స్వార్ధం ఫలించలేదు. అంతా కొత్తే. కొత్త గ్రూపులు, కొత్త నినాదాలు, కొత్త మొహాలు, మళ్ళీ మరో మలుపు. తెలంగాణా ఉద్యమం. మరోసారి చిత్ర పరీశ్రమ మానసికంగా చీలిపోయిందన్న మాట వాస్తవం. తెల్ల ఏనుగులాంటి పరిశ్రమకి మసి మరకలు అంటాయి. ఏమో, ‘మార్పు’ లో ఇదీ ఓ సహజ ప్రక్రియేమో !

పెద్దపెద్ద ప్రొడక్షన్ కంపనీలు సినిమాలు తీయడం మానేశాయి. కారణం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితులకి అలవాటు పడలేకపోవడమే. అంతకుముందు సినిమా ఓ కళాత్మక వ్యాపారం. ఇప్పుడు కేవలం వ్యాపారం మాత్రమే అన్నంతగా మారింది.

ఓ డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ‘R ‘ హోటల్లో మమ్మల్ని అంటే, నన్ను, డైరెక్టర్ని, హీరోహీరోయిన్లనీ ప్రొడ్యూసర్ దించాడు.

రూం  రెంటు రోజుకి 26 వేలు. పొద్దున్న దిగాం. మద్యాహ్నం భోజనానికి డైనింగ్ హాల్ కి వెళ్ళాను. ఓ మూల కుమార్ రాజు ఒంటరిగా కనపడ్డాడు. దూరం నుంచే నన్ను చూసి చెయ్యి ఊపితే, మర్యాద కోసం అతని దగ్గరకెళ్ళాను. ఫుల్ మందులో వున్నాడు.

“సార్.. డ్రింక్?” అన్నాడు

“నో సార్.. కేవలం నైట్స్ లోనే తీసుకుంటాను. అదీ మా ఇంటిలోనే” మర్యాదగా తిరస్కరించా. డే టైం తాగను. పార్టీలకి వెళ్ళను. డ్రింక్ అన్నది ఓ చిన్న సంతోషం కోసమని ఏయిర్ ఫోర్స్ లో వున్నప్పుడే నాకు తెలుసు. అందుకే ఏనాడు ‘హద్దు ‘ దాటను.

“ఓ.కె.. ఓ.కె.. మీరు లక్కీ సార్. మద్రాసులోనే వుండిపోయారు. యూ.. నో.. అది నిజంగా స్వర్గం… రియల్ హెవెన్” ఏదో పోగొట్టుకున్న వాడిలా అన్నాడు.

“కాసేపు నాతో కూర్చోగలరా?” అఫ్ కోర్స్ మీకు ఇష్టమైతేనే” అన్నాడు.

“అలాగే” అని కూర్చున్నా.

“మాష్టారు.. పోగొట్టుకునేదాకా పొందినదాని విలువ తెలీదు సార్, ఇది నిజం” రెండు చేతుల మధ్యా తలను ఇరికించుకొని అన్నాడు.

‘ఎందుకు” అని నేను అడగలా.

“స్వర్గం నా చేతిలో నుంచి జారిపోయినప్పుడు తెలీలా… పేరు మత్తులో, పైసల మత్తులో మునిగిపోయా. సార్, యీ క్షణం యీ క్షణంలో మొత్తం ప్రపంచాన్ని నాకు రాసి ఇచ్చినా నాకు అక్కర్లేదు సార్. నా దగ్గర వున్న వన్నీ కూడా వదిలేస్తా. కానీ… పోగొట్టుకున్నది దొరుకుతుందా? యీ జన్మకు దొరకదు. దొరకదు సార్ దొరకదు” కళ్ళ వెంట నీరు కారుతుండగా తలని టేబుల్ మీద వాల్చి అన్నాడు.

నాకో విషయం అర్ధమయ్యింది. అతనికిప్పుడు  ఎవరో ఒకరు మాట్లాడటానికి కావాలి.  ఆ వ్యక్తిని నేనే కావక్కర్లా. ఓ కుక్క పిల్ల అయినా సరే. అతను మాట్లాడుతుంటే వినడానికి చాలు.

నిజం చెబితే అతను ఎవరూ వినాలని కూడా మాట్లాడటంలా. తన మాటలన్నీ తానే వినడానికి మాట్లాడుతున్నాడు. తన మనస్సుని తానే తెలుసుకోడానికి చేసే ప్రయత్నం అది. ఏంటన్ చెకోవ్ వ్రాసిన ‘గ్రీఫ్ ( GRIEF ) కథ గుర్తుకొచ్చింది. ఎంత ధైన్యం. మనిషికి మనిషి తోడు ఏదో ఓ క్షణంలో తప్పదు. అయితే ఆ ‘ క్షణం లో ‘ ఎవరేనా తోడు దొరకడమే అదృష్టం. ఆ అదృష్టం  ఎన్నో వెల మందికి లభించదని నాకు తెలుసు. లభిస్తే ‘ ఆత్మహత్యలు ‘ ఎందుకుంటాయి?

 

***********************

 

“అఖిల చచ్చిపోయింది. ఆ విషయం నిన్ననే అతనికి తెలిసింది. అప్పటి నుంచీ యీ హోటల్లోనే గది తీసుకొని వున్నాడు. తెగతాగి పడుకోవడం.. లేచి మళ్ళీ తాగడం” జాలిగా అన్నాడు రమణ. రమణ కొత్తలోనే హైద్రాబాద్ కి మారాడు.

“నిజమా? ఎలా చనిపోయింది?” షాక్ తిని అన్నాను.

“నిజమే.. కుమార్ రాజుని  ‘వేరుపురుగు ‘ అని అందరూ అంటారు. తల్లి వేరుని కొరికేసే పురుగుని వేరుపురుగు అని అంటారు. అఖిల జీవితమనే తల్లివేరుని  కొరికేసి ఆ వృక్షం కూలిపోడానికి కారణమయ్యాడని అందరూ అంటారు. మనమూ అనుకునే వాళ్ళము. కానీ కాదండీ. కుమార్ రాజుకి అవకాశాలు రాగానే అఖిలే అతనికి స్వేచ్ఛనిచ్చింది. అతను మల్లిక వ్యామోహంలో పడ్డాడని తెలిసి కూడా అతన్ని పెళ్ళి చేసుకోమనే చెప్పింది కానీ అడ్డురాలేదండి. చివరి వరకు అఖిల పవిత్రంగానే వుంది. ఆఖరికి ఆమెకి కాన్సర్ వచ్చినా కుమార్ రాజుకి తెలియనివ్వలేదు. నేను చెబుతానన్నా వద్దని వొట్టు వేయించుకుంది. గురూజీ, అఖిల లాంటి వాళ్ళు కోటికి ఒక్కరు కూడా పుడతారంటే అనుమానమే. ఏనాడు అతన్ని నిందించలేదు సరికదా ఎవరేన్నా అతన్ని నిందిస్తే సహించేది కాదు.” కళ్ళల్లో కన్నీరు ఉబుకుతుండగా అన్నాడు రమణ.

“మరి పాప?” బాధగా అన్నాను నేను. అఖిల నవ్వు అమరం.

 

“అపర్ణ మంచి బిడ్డ. ప్రస్తుతానికి నేనే ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశాలు కల్పిస్తున్నా. సార్… ఏ జన్మలో పాపం చేశానో నాకు పిల్లలు లేరు. మూడుసార్లు అబార్షన్లు అయ్యి నా భార్య గర్భసంచీ తీసేశారు. అఖిలని నేను అక్కగానే భావించాను. చెన్నైలో ఆమె గొప్పతనం తెలీలేదు. ఇప్పుడు అపర్ణ మాతో బాటే మా ఇంట్లోనే వుంటోంది… నా బిడ్డే!” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమణ.

మంచితనం ఇంకా బ్రతికే వుంది. కానీ ఒక్కటే విచారం… అఖిలది ఓ అన్ టోల్డ్ స్టోరీ. ఇంకా అన్ టోల్డ్ స్టోరీనే. ఎందుకంటే ఆమె  జీవితంలో నాకు తెలిసింది అణువంతే!

 

*

 

ఎందరో అమ్మలు…అందరి కథలివి!

మాతృత్వం స్త్రీ వ్యక్తిత్వానికి, జీవితానికి పరిపూర్ణతని ఇస్తుందని అందువల్ల ప్రతి స్త్రీ తల్లి అయ్యి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని భావించే సమాజానికి సవాళ్ళు ఎదురవుతున్న కాలం ఇది.తమ పిల్లల పెంపకంలో తాము చూపగలిగే నైపుణ్యంతో కానీ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దగలిగే నైపుణ్యంతో గానీ సంబంధమే లేకుండా తల్లి కావడం ఒకటే తము సాధించిన గొప్ప విషయంగా భావిస్తూ, ఏ కారణంగా అయినా తల్లి కావడం ఆలస్యం అయిన, అసలు కాలేకపోయిన ఒక స్త్రీని ఇంకా గొడ్రాలు అన్నట్లు చూసే స్త్రీలకు కొదవలేని సమాజం మనది. పెళ్ళి చేసుకోకపోయినా తల్లి కావాలునునే స్త్రీలు, పెళ్ళి చేసుకున్నా తల్లవకూడదని గట్టిగా నిర్ణయించుకున్న స్త్రీలు, తల్లి కావడానికి గర్భాన్ని అద్దెకి తీసుకునే స్త్రీలు సమాజంలో ఇలా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులన్నిటినీ ఈనాటి పరిస్తితులకీ, అవసరాలకీ స్త్రీలు కోరుకునే స్వేఛ్చకీ సమన్వయ పరుచుకుంటూ మార్పులనీ, స్త్రీల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించే దశలో పూర్తిగా ఇప్పుడు సమాజం లేకున్నా ఎదగక తప్పని పరిస్తితి. ఎన్నో వైరుధ్యాలున్న వ్యక్తుల సహజీవనమే సమాజంలో కొత్త పోకడలనీ మార్పులు వచ్చే వేగాన్నీ నిర్దేశిస్తుంది.
ఇలాంటి నేపధ్యంలో సమ్మెట ఉమాదేవి గారు అమ్మ సెంటిమెంటుని పండిస్తూ రాసిన అమ్మ కధలుకూ చక్కని ఆదరణ ఉందని చెప్పాలి. అమ్మ ప్రేమని పొందటమే కాదు, మాతృత్వం కూడా ఎంత పొందినా తనివితీరని ఒక అనుభవం ఎవరి జీవితంలోనైనా . అందుకే అమ్మ ఇతివృత్తంగా వచ్చే కధలకి లింగ బేధం లేకుండా పాఠకుల ఆదరణ ఉంటుంది. ప్రతి పాఠకుడూ/రాలూ ఈ అమ్మ సెంటిమెంటు తొ రిలేట్ చేసుకోగల్గడమే దీనికి కారణం. ఇక రచయిత్రి కధను నడపడంలో నేర్పరి అయితే వేరే చెప్పేదేముంది? ఆణిముత్యాల్లాంటి కధలున్న ఈ సంకలనం ఆమె తొలి సంకలనం అంటే అభినందించాల్సిన విషయం.
ఇక అమ్మ కధల కొస్తే చక్కని శైలి , తను ఎవరి కధ చెప్తున్నారో, వారి వేష భాషల్ని వారి జీవన విధానాన్నీ, వారి జీవితాల్లోని సంఘటనలని చిత్రించిన తీరు ఎంత సహజంగా వాస్తవికతకి దగ్గరగా ఉంటాయంటే, మనకూ ఆ పాత్రల్లోని కొందరు వ్యక్తులు తారసపడటం గుర్తుకు వస్తుంది. ఎందరో అమ్మలు, ఎన్నో కష్టాల నేపధ్యాలు. అయితే అన్నిటిలోంచీ బురదలోంచి విరిసిన కమలంలా తమ సమస్యల్ని తామే ఒంటరిగా పోరాడి పరిష్కరించుకున్న మహిళలే. ఒక రకంగా ఈ కధలు సమస్యల్లోంచి ఎలా బయటపడచ్చో తెలిపే ప్రేరణాత్మక సందేశాలు. మామూలుగా మనకు తెలిసిన కష్టాలే ఆడవారివి, కానీ అందులో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరిస్తారు రచయిత్రి. ఆమె ముఖ్య పాత్రలన్నిటి ఆర్ధిక సామాజిక నేపధ్యం ఏమైనా, ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తిస్తాయి.సానుభూతే కాదు సహానుభూతీ చూపిస్తాయి.
అమ్మంటే!’ అనే కధలొ కొన్ని వాక్యాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఉదాహరణకి ఇది చూడండి. “వెన్నెల్లో నల్ల మారెమ్మ విగ్రహంలా మెరిసిపోతున్న తల్లి వంక అపురూపంగా చూసుకున్నాడు కొమరెల్లి.” మామూలుగా ఇలాంటి ప్రేమ తల్లి మాత్రమే వ్యక్తం చెయ్యగలదు. కానీ యూ ఎస్ లో ఉన్నా తల్లిని చూడటంకోసం తపించిపోయే ఓ కొడుకు, చదువుకుని తనూ తన పిల్లలూ ఎంత నాగరికంగా తయారైనా, పిల్లలు ఎంత నాజూకుగా పెరిగినా కాయ కష్టం చేసి తనకున్న చిన్న భూమి చెక్కలో వ్యవసాయం చేస్తూ ఊరిని వదిలి రాని రైతు స్త్రీ అయిన అమ్మని ఆమె త్యాగాన్నీ మరువలేని కొడుకు కధ.
అమ్మపై ప్రేమకి ఆమె రూపం భాష, అనాగరికత చీర కట్టు ఏదీ అడ్డురాదంటూ ఒక చోట చెప్తారు అమ్మంటే పాలరాతి విగ్రహంలా అపురూపమైన అందం కాదు, ఆదమరుపు ఎరుగని ప్రేమ గని.చాలా మంది దృష్టిలో అమ్మంటే అందమైన రూపంతో, చల్లని చిరునవ్వుతో, అసలు కోపమంటే తెలియకుండా, బిడ్డల కోసం ప్రతీ నిమిషం పరితపించే అనురాగమయి. అమ్మను చూడగానే ఆహ్లాదానికి మారుపేరుగా అనిపిస్తుంటుంది, అనుకుంటారు గాని, నా తల్లి చర్మం వెన్నుకంటుకుపోయిన పొట్టతో, కాయకష్టంతో మొరటు తేలిన శరీరంతో, కాలం పోకడలు తెలియని ఆహార్యంతో, నాగరీకం అంటని నిర్మలత్వంతో, ఈ పల్లెలో మూలన నిలబెట్టిన నిచ్చెనలా నిలిచి పోయింది అనుకున్నాడు చెమరించిన కన్నులతో“.
మనస్విని అనే కధ భర్త పోయిన స్త్రీ గురించి. భర్త పోయాకా స్త్రీ జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో,తన సమీప బంధువుల, సమాజం వైఖరి ఆమె పట్ల ఎలా మారతాయో మనకి తెలుసు. ఇవన్నీ ముందే ఊహించిన మృణాలిని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. చనిపోతాడని తెలిసిన తన భర్త నుంచి విడాకులు కోరి అందరికీ దూరమవుతుంది. ఆఖరికి తన పిల్లలకి కూడా.ఆమె కున్న కారణాలు, మన సమాజంలో పెళ్ళిళ్ళు పండగలూ పబ్బాల్లో స్త్రీలు భర్త బ్రతికున్నాడన్న ఒకే కారణం వల్ల పొందే గౌరవాలతో పోలిస్తే, భర్త మరణించాడన్న కారణంగా ఎదురయ్యే అవమానాలూ, తన పిల్లల పెళ్ళిళ్ళలో కూడా తను కేవలం ఏపనికీ పనికి రాకుండా చూడటానికి మాత్రమే పరిమితం కావడం ఆమెనెంత బాధకి ఆత్మ క్షోభకీ గురిచేస్తాయో తెలుపుతాయి. ఆమె చెప్పుకునే వరకూ ఆమె పిల్లలు కూడా ఆమెనర్ధం చేసుకోలేకపోవడం ఒక బాధించే విషయం.
తల్లి ప్రేమకి దారిద్ర్యం అడ్డురాదు. రెండోసారీ ఆడపిల్లనే కన్న కమిలిని అత్త నానారకాలుగా హింసిస్తుంటుంది. తననెంతో ప్రేమించే భర్త సూర్యా ఉన్నా ఆమెకు బాధలు తప్పవు. తన పిల్లను ఎక్కడ అత్త ఎవరికైనా అమ్మేస్తుందో, లేక చంపేస్తుందోనని అనుక్షణం భయపడుతూ, ఆ విషయాలన్ని తన భర్తకి చెప్పుకోలేక అవస్థ పడుతుంటుంది. పొలంలో చల్లే మందువల్ల స్పృహ కోల్పోయిన కమిలిని చూసి భర్త ఏడుస్తుంటే, అత్త ఇంకో పెళ్ళి గురించి ఆలోచిస్తుంటుంది. రెండో పెళ్ళయినా, పిల్లల తండ్రయినా పిల్లనిచ్చేందుకో తండ్రి కూడా రెడీ అయిపోతాడు. కమిలిని ఆస్పత్రికి తీస్కెళ్ళే ప్రయత్నం చెయ్యాలంటే డబ్బులు లేని పరిస్తితి. ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళాల్సిన పరిస్తితి, మంచం మీద మోసుకెళ్ళడానికి పొలం పనులు వదిలి ఇరుగు పొరుగు రాలేని పరిస్తితి. ఎంత దుర్భరమైన జీవితాలు గిరిజనులవి, కళ్ళముందు పాత్రలు, వారున్న ప్రదేశాలు కదలాడుతుంటాయి. రెండు మూడు రోజుల తరవాత పాకుతూ వచ్చిన పసిపాప తల్లి మొహాన్ని తడుముతుంటే స్పృహలోకి రావడంతో కమిలి కధ సుఖాంతం అవుతుంది. అద్భుతమైన కధ,కధనం.
సహన అనే కధలో ఉద్యోగస్తులైన తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలు, .పసిపిల్లగా ఉన్నపుడు ఆడపిల్ల బయటికెళ్ళి వీధికుక్కలు వెంటబడి తరుముతున్నాయని భయపడితే, నిజంగానే పెరిగిపోయిన వీధికుక్కల బాధనుంచి తప్పించుకోవడానికి కాలనీ వాసులు మున్సిపాలిటీనాశ్రయించి ఆ బాధనుంచి గట్టెక్కుతారు. కాని కొద్దిగా పెరిగిన ఆడపిల్ల అందంగా కనపడగానే ప్రేమించకపోతే చంపేస్తామని, ఆసిడ్ పోస్తామని బెదిరించే, వేధించే కుర్రాళ్ళకి వెకిలిచేష్టలు చేసే చుట్టుపక్కల అంకుల్స్ తోడయితే ఈ వీధికుక్కల్ని ఎలా కాలనీ నుంచి తరమడం, తమ ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవడం. ఈ మృగాలకన్నా వీధికుక్కలే నయమనిపిస్తుంది. ఈవిషయం తెలిసిన తల్లికి ఎంత సామాజిక స్పృహ, బాధ్యత ఉండకపోతే ఆమె మొదట తన కొడుకును దారిలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది?
మాన్వి, అమ్మతల్లిఅమ్మ సెంటిమెంటుని అద్భుతంగా పండించిన కధలు. మిస్ కాకుండా చదవాల్సిన కధలు. క్షణికానందం వల్లనో, వికటించిన ప్రేమల వల్లనో కలిగిన సంతానాన్ని సంపన్నురాలైన తల్లి వదిలించుకుంటే, రెక్కాడితే గాని డొక్కాడని ఇద్దరాడపిల్లల తల్లి భర్త వారిస్తున్నా ఇంకో ఆడపిల్లని అక్కున చేర్చుకోవడం ద్వారా అమ్మతనాన్ని బతికిస్తుంది బతుకమ్మ కధలోని లచ్చిమి. పిల్లల్ని కన్నాకా తల్లియినా తండ్రయినా ఆత్మహత్య గురించి ఎందుకు ఆలోచించకూడదో చెప్పే కధ వెన్నెలమ్మ. పసిపిల్లగానే తండ్రిని పోగొట్టుకున్న చిలుకమ్మని ఎన్నో కష్టాలకోర్చి పెంచితే ఆ పిల్లని పెళ్ళికాకుండానే తల్లి చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లకు సమయం చూసి వడిసెలతో బుద్ధి చెప్పిన చిలుకమ్మ, కధలో చిలుకమ్మపై మనకేర్పడిన సానుభూతి వల్ల పాఠకుడి కచ్చ తీరుస్తుంది. గూడు కధలో అత్తని కాపాడుకోవడం కోసం భర్త చనిపోయాకా కూడా ఇద్దరు పిల్లల తల్లయ్యుండి, తన గర్భాన్ని అద్దెకిచ్చి ఆ విషయం చెప్పలేక చెప్పినా ఒప్పుకోరనిపించి ఎన్నో అవమానాలను ఆఖరికి ఎంతో ప్రేమించే అత్త దగ్గరనుంచి కూడా సహించి ఓర్చుకున్న సంతోషి కధ. ఎంతో ఉదాత్తంగా చిత్రిస్తారు ఈ రెండు పాత్రల్ని రచయిత్రి.
ఇవే కాదు ఇంకా ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో చక్కని కధలున్నాయి. ఒక్కొక్క కధా ముగించిన ప్రతిసారి మీ గుండె గొంతులోకొచ్చినట్టనిపిస్తే నేను మరీ ఎక్కువగా ఏమీ పొగడలేదని తెలుసుకోవడం మీ వంతు. ఏమైనా చదివాకా ఒక మంచి పుస్తకం, ఎన్నో మంచి కధలు చదివామన్న తృప్తి మిగలడం మాత్రం ఖాయం.

xxxx

నిగ్గు తేల్చిన “మిగ్గు”

 photo-migguuuuu

దళిత కవిత్వం, దళితచైతన్యం ,దళిత స్పృహలాంటి పదాలతోబాటు “దళిత భాష”అనేపదం కూడా సాహిత్యంలోకి వచ్చి చాలా రోజులైంది.అనేకమైన చర్చలు కూడా జరిగాయి.ఉనికి సంబంధమైన ప్రశ్నలతో వచ్చిన దళిత కవిత ధిక్కార,తిరస్కారాలతో కనిపించినప్పటికీ ఈ ఉద్వేగంలోని అణచివేత వెనుక సన్నని దుఃఖపు జీర ఉంది..బహుశః ఈజీరనే భాష,కళాసౌందర్యం,ప్రతీకలులాంటి పదాల ఉనికిని దళితకవిత్వంలో మరింతపటిష్టం చేసింది.

ఏకాలంలో నైనా వస్తువు మారినంత తొందరగా దానిచుట్టూ ఉండే ఆర్థిక,రాజకీయ,సామాజిక చైతన్యాలు మారినంతగా శిల్పం, దాన్ని పెనవేసుకున్న భాష,కళాసంప్రదాయాలు మారవు.కాని ప్రయత్నాలకు మాత్రం పాదుపడుతుంది.ఈ మధ్యవచ్చిన సంపుటాలు ఈ మార్పును నిరూపిస్తాయి.దళితకవిత్వంలో తమదైన శైలి,భాష,కళ,ప్రతీకలు ఈ కాలంలో కనిపిస్తున్నాయి.తెలంగాణాలోని నల్లగొండప్రాంతం నుంచి వచ్చిన”మేమే””బహువచనం””మొగి”లాంటి సంకలనాలు ఈ మార్పుకు నిదర్శనంగానిలుస్తాయని పరిశీలకుల అభిప్రాయం.ఈ మార్గంలో తనదైన భాషావ్యూహంతో ,కళాత్మకంగావ్యక్తం చేస్తున్న కవి పొన్నాల బాలయ్య”మిగ్గు”అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కాలపు కవిత్వంలో పై అంశాలు నిలబడడానికి ఒకటి రెండు కారణాలను అంచనావేయవచ్చు.జీవితంపై అణచివేతను,దానికి కారణమైన వర్గాన్నే కాక తమదైన ఉనికిగల సాంస్కృతికతపై దృష్టి కలగడం.అందువల్ల తమవైన పదాలు,పదబంధాలు కులమాండలీకాలను కవిత్వంలోకి తేవడం.జీవితంలోని అణచివేత దాన్నానుకున్న దుఃఖపుజీరనుంచి సంఘర్షణ ప్రతిఫలించే భావ చిత్రాలను గీయడం.తొలిదశనుండివచ్చిన పురాణ ప్రతీకలతోబాటు,జీవితాన్ని సంపద్వంతం చేయగలకొత్తపోలికలను,ప్రతీకలను తెచ్చుకోడానికి కళాత్మకమైన ఊహలు చేయడం.

బాలయ్య కవిత్వం ఈ అంశాలకు ఉదాహరణగా నిలబడుతుంది.సమకాలీన కవిత్వంలో వస్తువుకేవలం ఒక వాతావరణానికి సంబంధించింది కాదు.రెండుకు మించిన వస్తువాతావరణాలుంటాయి.బాలయ్యలోనూ దళిత,తెలంగాణా,ప్రపంచీకరణ మొదలైన అంశాలకుసంబంధించిన వస్తువులున్నాయి.వీటన్నిటివెనుక జీవన సంబంధమైన  నీడకూడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తుంది.బాలయ్య కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మొదట చర్చకు వచ్చేది కవిత్వీకరణకోసం ఆయన వాడుకున్న భాష.తనదైన సంస్కృతినుంచి వారసత్వంగావచ్చిన భాషను మాత్రమే వాడుకోలేదు.సమకాలీన భాషామార్గాన్ని కలుపుకుని ఒక నిర్మాణ సూత్రాన్ని తయారు చేసుకున్నారు

సాంస్కృతికత,పలీయచేతన,వస్తుగతవాతావరణాన్నిప్రతిఫలించే సమకాలీన భాష.ఇవి బాలయ్య కవిత్వభాషలోని మూలకేంద్రాలు.

padam.1575x580 (2)

వత్తులేస్కొని దీపంతైంది కనుపాప/

పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాల చుట్టూ గోసగా/

కొంకులుతెగి కత్తులు బల్లాలు దిగి/

గోనె సంచుల్ల మాసపు ముద్దయి దుక్కిస్తున్న తుంగభద్రమ్మ

చుండూరు ఎదమీద ఎండిపక్కుగట్టిన/రక్తం మట్టిని పిడికిటబిగించి/దప్పులదండు ఎర్రకోటను ముట్టడిస్తది

-(పుండూరు-85)

 

నా తెలంగాణా పల్గిపోయిన పాతడప్పు//

తలమీద దీపం ఎత్తుకొని బాయిలపడ్డ బతుకమ్మ/

తలగొట్టిన తంగెడుపువ్వు త్యాగాల గుమ్మడిపువ్వు/

వాడిపోయిన బంతిపువ్వు రాలిపోయిన గునకరెమ్మ/

నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు“-(పల్గిపోయిన పాతడప్పు-99)

 

కవిత్వంలో చిత్రణ ఒక ప్రధానమైన సృజన బిందువు.సంఘటన నుంచి తనహృదయంపొందిన అనుభవాన్ని చిత్రంగా ఆవిష్కరించడం మొదటి ఖండికాభాగంలో కనిపిస్తుంది.మొదటి కవిత్వాంశంలో దుఃఖాన్ని,రెండవదాంట్లో తిరస్కారాన్ని ఆవిష్కరించారు.అందులోనూ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని,ప్రాంతీయతను సమ్మేళనం చేసి ఒక భాషాగతమైన నిర్మాణాన్ని బాలయ్య సాధించుకున్నారు.”వొత్తులేస్కొని దీపంతైంది కనుపాప”లో కళావిష్కారమెలావుందో,పదాల్లో ప్రాంతీయముద్రకూదా ఆలాగే స్పష్టమైంది.”పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాలచుట్టూ గోసగా”లో”గోస”అనేపదం తప్ప మిగతాభాగం అంతాఅధునికభాష.మూడవ వాక్యంలో మళ్ళీ భాషాగతమైన ప్రాంతీయచేతన.చివరి వాక్యంలో కనిపించే తిరస్కారంకూడా ఇలాంటి ఆవిష్కారమే. రెండవ కవిత్వాంశంలో ఒక ప్రాంతీయస్పృహ,సాంస్కృతికస్పృహ తో ప్రాదేశికమైన దైన్యాన్ని ప్రసారం చేస్తున్నాయి.ఈవాక్యాలన్నీ వ్యాఖ్యానాత్మకమైనవే.అందుకోసం వాటుకున్న భాషకూడా సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిఫలించేది.

పూలన్ని బతుకమ్మలో భాగాలయినపూలు.వాటికి ముందు మానవగుణారోపణ చేస్తూ కొన్ని క్రియాపదాలను చేర్చడంద్వారా సాంద్రమైన సంవేదనాత్మకస్థితిని సాధించారు.చివరలో”నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు”అనడంలో నీలిపువ్వును,కర్రెపొద్దు దళితస్పృహలోవాడినట్టుగా అర్థమవుతుంది.రంగుల గురించి కళాతత్వశాస్త్రం చాలా చర్చించింది.ఇందులో సంప్రదాయ,పాశ్చాత్యాంశాలతో పాటు మనోవైజ్ఞానికాంశాలు ఉన్నాయి.ఆ మార్గంలో “నలుపు”అనేక అంశాలను ప్రసారం చేస్తుంది.ఆధునిక కాలంలో కొన్ని రంగులు రాజకీయ మీమాంసలకు కూడా ప్రతీకలవుతున్నాయి.దళిత బహుజన కవిత్వంలో కనిపించే”నలుపు””నీలి”రంగులు.విప్లవ కవిత్వంలో కనిపించే ‘ఎరుపు”రాజకీయ మీమాసతో సంబంధం కలిగినవిగా కనిపిస్తాయి.తెలుపును శాంతికి,పచ్చదనానికి ఆకుపచ్చరంగుని ఈ కాలపు కవిత్వం ప్రతీకాత్మకంగా ప్రసారం చేస్తుంది.

వస్తుగతంగా పొన్నాల కవిత్వంలోదళిత జీవితం  ప్రధానంగాపరచుకుంది.తస్సలకూర(31)మిగ్గు(52)సోలుపోత(56)మజ్జెతి(58)సఫాయి(75)పుండూరు(84)కొంగవాలు కత్తి(86)గండదీపం(93)అశరఫ్(109)మేడారం జాతర(123)మొదలైన అనేక కవితలు దళితస్పృహలో రాసినవి.తెలంగాణా ఉద్యమ సందర్భంగారాసిన కవితలు.ఒకటిరెండు ఎలిజీలు ఉన్నప్పటికి ప్రధానస్వరం దళితగొంతుకే.

1.పుండ్లు పుండ్లైన కండ్లు కవిసే దుక్కపుపుర్రు

గాయపడిన పెయ్యిలందల మాగేసిన తంగెడుచెక్క సున్నంపూసిన బతుకును మంగకంపల మీద ఆరేస్కున్న-(మిగ్గు)

 

2.దోసిట్లనిండబంగారిపురుగుల ఆటలాడేబాలలకు

రాళ్లరప్పల కొండకోనలపొంటిపొడిసిన పసుపు బండారిపొద్దు

పరిగడుపున్నే పొట్తనింపే తీపిగూగెం సీతఫల్కపండు

 

3.సచ్చిన గంగావు గబ్బుగబ్బు వాసనను

తానుముక్కలు చెక్కలై లంద సుగంధంల కడిగి గాలిచ్చి

అతారలు సరిసె తోలుశుద్ధి కార్బన రసాయనం-(నెలవంకలమునుం)

 

ఈవాక్యాలన్నీ దళితజీవితాన్ని ప్రసారం చేస్తాయి.మొదటిది ప్రధానంగ దళిత జీవనవిధానంపై రాసినది.రెండవ,మూడవభాగాలు తెలంగాణా గురించి రాసినవి.అందులోనూ మూడవభాగం తిరిగి దళిత జీవితాన్నే ఆవిష్కరించింది.పొన్నాల కవిత్వం ప్రధానంగా దళితజీవితం,సంస్కృతి,భాషపై ఎక్కువ దృష్టిపెట్టినట్టుకనిపిస్తుంది.

భాషాముఖంగా దళిత కవిత్వం శిల్పంలో తెచ్చినమార్పుకు “మిగ్గు”నిదర్శనంగానిలబడుతుంది.తానుగా ఏర్పాటుజేసుకున్న సృజనసూత్రం బాలయ్యను ప్రత్యేకంగానిలబెడుతుంది.

*

ఒకానొక సర్జికల్ సందర్భం..

 

mandira1

Art: Mandira Bhaduri

 

అర్థరాత్రికి అటువైపు, ఒక ఉలికిపాటు

కొందరి పీడకల, మరికొందరికి హర్షాతిరేకమైన గగుర్పాటు

అంతా మిథ్య అనే మాయావాదికి

ఒక వాస్తవికమైన ఆసరా

అంతా నిజం అనుకునే వాస్తవికవాదికి

ఒక అసహజమైన షాక్

కలడు కలడనువాడు కలడో లేడో

జరిగాయంటున్నవి, జరిగాయో లేదో

అందరిలోనూ సందేహాస్పద దేశభక్తి

ఒక వర్గంలో రగిలిన భీతి

ఉప్పొంగిన మరో వర్గం ఛాతి

వీర తిలకాలు దిద్దుకుని విర్రవీగిందొక జాతి

సరిహద్దులు దాటితే దేశభక్తి

మరి, మన హద్దుల్లో దానినేమందురు?

అయినా, అనుమానించామన్న అపప్రథ మనకెందుకు?

పోలీసులది రాజ్యభక్తి, సైనికులది దేశభక్తి

అంతేనా?

అయినా, అధినేతే స్వయంగా రంగంలో నిలిచినప్పుడు

సాక్ష్యాలనీ, ఆధారాలనీ వెంపర్లాటెందుకు?

ఓట్లనీ, సీట్లనీ, అధికారం కోసమనీ విశ్లేషిస్తారు కొందరు

రెక్కలు కట్టుకుని చుట్టి వచ్చిన దేశాల దౌత్యనీతి సఫలతను

పరీక్షించుకున్నాడంటారు మరికొందరు

బీఫ్ రాజకీయాలు, అక్షరాలకు నెత్తుటి పూతలు

అంతరంగాకాశాన్ని అలుముకుంటున్న అసహనంపై

ఎంతకైనా తెగిస్తామంటూ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు

చివరాఖరికి

అద్దంలో శత్రువును చూపించి భళ్లున పగులకొట్టాడు

రాలిన మన ముఖాలను వాస్తవాధీన రేఖపై వేలాడదీశాడు

బహుశా-

పొడుచుకొచ్చిన విభజన రేఖలను దాటితే తప్ప

మనం ఈ దేశంలో అంతర్భాగం కాలేమేమో?

‘దాట్లే’సిన గోదారి

godvari

ఎడిటర్జీ

మేము ఒట్టి హాస్యము తప్ప చదవరాదని ఒట్టు పెట్టుకున్నవారము. 2013 సం II లో, దాట్ల లలిత గారు    ” ఈదేసిన గొదారి” శీర్షికన  సారంగ  పత్రిక లో  కథలు రాసిరి.

” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ”  అని లలిత గారు చెప్పిన కారణాన, ఈ కథలు ఒట్టి హాస్యం అనుకుని మేము చదివినాము. కానీ వెళ్ళగా వెళ్ళగా  జీవితం అంత, గోదారి అంత లోతైన కథలు అని అర్ధం అయినవి. మేము చెప్పిన దానికి వలయు సాక్ష్యములు కింద దఖలు చేయుచుంటిమి. ఇందుకు పరిహారము గా లలిత గారు మరిన్ని కథలు రాయాలని మేము కోరుచున్నాము.

O – O – O – O

అందరూ ” భానుమతి గారి “అత్త గారి కథలు ” లాగా ఉన్నాయి అన్నారు కానీ, నా ఉద్దేశం లొ ఆ పోలిక అత్త గారి వరకే. నాకైతే  – ముళ్లపూడి , నామిని – కథల్లాగా అనిపిస్తాయి.

కేవలం  హాస్యం వేరు. అది తక్కువని కాదు. అదో దారి! నిత్య జీవితం లో జరిగే విషయాలని అల’వోకల్’ గా చెబుతూ – కరుణరసం అంతర్లీనం గా పొంగే హాస్య రసం పండించడం కత్తి మీద సాము – రచనా వ్రుత్తి మీద సాము.

X X X X X

 

“అలసిన వేళనే చూడాలీ….” కథ లో –

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

 

X X X X X

చందమామ లొ   మసిపట్టిన  అన్నం  తపాళా   చూడటం – ఒట్టి హాస్యం కాదు !!

కొందరు  తోమేది  గిన్నెలనయితే –

ఇంకొందరు  రోజూ  తళతళా  తోమేది  ఉద్యొగాన్నీ, ఆశించేది – బాసు ఫేసులో  కటాక్ష వీక్షణాల తాలూకు వన్నెలనీ , చిన్నెలనీ.

 

X X X X X

ఎంత నేర్చినా…? కథ లో –

 

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు

X X X X X

 

ఎంతటి జీవిత సత్యం !! “అమరావతి కథలు” గుర్తుకొచ్చాయి !!

” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ” అన్న లలిత గారి మాట నిజం కాదు. ఆవిడ కథలన్నీ విలువైనవి. నా లాంటి వాళ్ళు  ఉజ్యోగం తపాళా తోమటం లో – అలిసిన వేళ ల సేద దీర్చే అద్భుత ఔషధం.

 

లలిత గారూ

రాయమని మిమ్మల్ని అడగడం తేలికే ; రాయడమేకష్టం.

మరంచాత – మీకు వీలయినప్పుడూ, ఏమీ తోచనప్పుడూ, తోచినప్పుడూ రాయమని శాయంగల విన్నపాలు.

హెబ్బెబ్బే చిన్నయ్య గోరూ – పైన  మొదాట్లో కోర్టు నోటీసు భాష అంతా వుత్తిదే… మిమ్మల్ని నవ్వించడానికి ! ఆయ్ !!

సరే !!!  అలాక్కానివ్వండి .. మీరు  కొత్త కథ   రాసే లోగా  మీ గోదారి  మళ్ళీ  ఓసారి  ఈదేసి వస్తాం !!

చిలకకొట్టుడు జాంపళ్లలాంటి పద్యాల గుసగుసలు!

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

నల్లరాతి జైలుగోడల్లాంటి ప్రహేళికలోంచి, ఎన్ని ఆధారాల సాయం ఉన్నా బయటపడటానికి ప్రయత్నంకూడా చెయ్యలేని ఒక అమాయకపు పదానికీ,

ఎన్నో నోళ్లలో అపశృతులతో పాటూ నాని, చివికిపోయి, మెలికలు తిరిగి, తనని కడుపులోపెట్టుకుని ప్రేమించే గొంతుకోసం ఆరాటపడే ఒక పాటకీ,

కొండనెత్తిన గోవిందయ్య శౌరేకానీ, తన గుండెల్లో ఒక నదిని నిరంతరం మోసే కోదండయ్య గుండెబరువుని వర్ణించే పదాలు ఏ భాషలోనూ లేవనీ,

కవితకోసం కత్తిరించిగా, తప్పించుకుపోయిన ముక్కల్లోనే అసలు కవిత్వాన్ని వెదుక్కోవాలనీ తప్పకుండా తెలిసే ఉంటుంది

అట్లాంటి చిలకకొట్టుడు జాంపళ్లలాంటి పద్యాల గుసగుసలు వంశీధర్ రెడ్డి కవితల్లో వినిపిస్తాయి.

రాసిన కవితలో పలకబారని పచ్చికాయే కనిపిస్తుంది, చెవులతో వెతికితే కవిత వెనకాల దాంకున్న కొన్ని పదాల్లోంచి ఓ పాట వినిపిస్తుంది – పండుముక్క తినేసిన చిలక పలుకుల్లా!

—-
* ఒక స్వప్నం – రెండు మెలకువలు *

-(vamsidhar reddy)

దుప్పటి చిరుగులగుండా తప్పిపోయిన చుక్కల్ని లెక్కిస్తూనో
చిక్కటి చీకటి చిమ్మిన వాసనల్ని నాసికమీదుగా తెలివికి పట్టిస్తూనో
ఓ కలను కళ్ళకద్దుకోవాలి
ఈ రోజైనా..

పసివాడి ఏడుపుని ఎప్పట్లాగే బహిష్కరించి
మనిద్దరం ఏకాంతంగా నగ్న నాగులమై సంగమిస్తున్నపుడు
శాశ్వతంగా ఆగిన ఓ చిరుశ్వాస,
ఆ ఙ్నాపకాలని సృజించే నీ స్పర్శనుండి యుగాలుగా
నేను అస్పృశ్యమై పారిపోతుండగా
పాలకడలిలో దాహం తీర్చుకుంటూ వాడు, మనవాడే,
ఎందుకొచ్చావని ప్రశ్నిస్తూ..

నరకంలో నా తండ్రి,
కంటి శుక్లాలకు చూపుని చిదిమేసి
పచ్చని పొలాలమ్మి పిచ్చుకలగుంపును చెదరగొట్టిన
నా మీద యముడికి పితూరీలు చెప్తూ..
విచిత్రం, యముడు నా తండ్రి పాదాల మీద
ఏడుస్తూ, అతణ్ణి నవ్విస్తూ..

బాల్యం దొంగిలించిన పెన్సిల్
కాలంతో పెరిగి,
గుండెల్లో గుచ్చడానికేమో రంపాలతో పదునుదేల్చుకుని
లోకపు కూడళ్ళపై నా బొమ్మగీసి “దొంగలకు దొంగ” అని అరుస్తుండగా,
సాక్షానికొస్తూ
నేనిన్నాళ్ళూ తస్కరించిన ఙ్నానం..

శూన్యం దగ్గర అపరిచితుడు, ఊర్ధ్వముఖంగా..
ఆలోచనల వేగం మా దూరాన్ని తగ్గిస్తుంటే
అతన్నెపుడో కలిసిన ఆనవాలు కలలో ఉపకలలా మెరుస్తూ,
ఆకాశం అద్దమై అతడి ముఖం లేని ముఖాన్ని చూపగా
అనుమానమేమీ లేకుండా నేనకున్నదే నిజమై ..
నా ముఖం తప్ప మిగతా శరీరం శూన్యమై..

అనుభవాలే కలలౌతాయో
కలలే అనుభవాలిస్తాయో.
ఏ కలా నన్ను నానుండి దాచలేక
ప్రతీ కలా.. ఓ ప్రతీక లా,

రెండుమెలకువల మధ్య
వంతెనైన సుషుప్తికి ఆధారమయే అవస్థే కలలై,
మనస్సంద్రాన
ఒడ్డుకొచ్చి మరలే అలలే కలలై,

నిజంగా
కొన్ని కలలు
నిజంకంటే గొప్పగా దృశ్యాలు ఆవిష్కరిస్తూ..
అబధ్దాన్ని నిజం చేసే పరిణామంలో వేకువకి దొరికిపోతూ..

*

అంటరాని డప్పు కథ 

28f16-free_fall_leaves_shutterstock_61538884_web

 

దసరా పండుగ  కోసం ఊరికి వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది .. తెల్లారి  చాయ్ తాగుతుంటే  అవ్వ  ఎసట్ల  బియ్యం వేస్తూ
” నీ కోసం ఈరడు వచ్చి పోయిండు  నువ్వు అప్పుడు లేవలె” అని ఈరన్ని గుర్తు చేసింది .ఈరడు నా దోస్త్ అలా అని నా వయసుగాడు కాడు మా నాయిన వయసు కాని నాతో చనువు ఎక్కువ . చిన్నప్పటి నుంచి నాకు వాడితో చనువు ఎక్కువ. బాయిల కాడికి ఎల్లడం, ఎండ్రికాయలు పట్టడం, కుంట్ల చేపలు పట్టడం, గుట్టకి పోయి సింతపలుకుపండ్లు  తేవడం ఇవి అన్ని నాకు చిన్నప్పుడు వాడితో అబ్బిన విద్య. ఈత కూడా వాడే నాకు నేర్పాడు. ఎవ్వరు లేని మనిసి

అవ్వనే మళ్ళీ నీకు తెలుసా ఈరడు వాడి డప్పు పగలగొట్టిండు అన్నడి ” ఎందుకు అని అడిగేలొపే”  మళ్ళీ తనే “తాగుబోతు సచ్చినోడు  బంగారం లాంటి డప్పు పలగొట్టాడు” అంటూ   వంటింట్లోకి వెళ్ళిపొయింది

బతుకమ్మ కి పూలు  తెద్దామని మళ్ళి బాయిని ఒకసారి చూడొచ్చు కద అని అవ్వకి చెప్పి బాయి కాడికి పొయిన. తంగేడు పూలు కోస్తంతె  ఈరడు వచ్చాడు బాయికాడికి. మునుపటిలా లేదు  పీనుగోలె   అయ్యిండు .. కొద్దిసేపటికి  నోరు విప్పాడు   మంచిగ ఉన్నవ అని అడిగిండు ” ఆ మంచిగనే ఉన్న” అని చెప్పేసరికి పట్నంల నౌఖరి ఎట్ల ఉన్నది అవీ ఇవీ ముచ్చట్లాండిండు .మళ్ళా కొద్దిసెపు గమ్మునుండి   “ఒక వెయ్యి రుపాయలు కావాలి ఇయ్యవ పుణ్యముంటది” అని  బతిమాలుడు మొదలుపెట్టిండు .”పాణం మంచిగా లేద” అని అడిగిన నవ్విండు సరే మరి వెయ్యి ఎందుకు అని అదిగితే పని ఉంది అని చెప్పి పైసల్ తెసుకొని పొయిండు.బాపు నేను ఇద్దరం కలిసి తంగేడుపూలు గునుగు మోపు కట్టి ఇంటిదారి పట్టినం.బాపు నన్ను తిట్టుడు మొదలు పెట్టిండు ” ఈరడు పైసల్ ని తాగి ఒడగొడుతడని”. గుడుంబాకి పది ఇరవై చాలు. వెయ్యి అవసరం లేదు అని బాపుకి చెప్పిన.

పెద్ద బతుకమ్మను కుంట్ల ఏత్తంతే మసక మసక చీకట్ల నా దగ్గరికి ఒచ్చిండు.” ఏంది పండుగ పూట ఎటు పోయినవ్” అని కసిరిచ్చేసరికి నీకొ విషయం చెప్పలె అని గమ్మున నాతో రాబట్టిండు  ఈరడు.   ఇద్దరం  ఊర్లకి నడ్సుకుంట పోతన్నం…  చీకట్ల మనిశిని చూస్తే  కళ్ళు మిలమిల మెరవబట్టినయ్. ఎందుకో వాడు తేడాగా కనిపించసాగాడు గుడుంబా   వాసన రావట్లెదు వాడి దగ్గర.   పైసలు ఏంజేసి ఉంటదా అని లోపల  ఒక ధర్మసండేహం. సరే ఈరడే  చెప్పుతాడు తోచినప్పుడు అని నాకు నేను సర్దిచెఫ్ఫుకుంట నడుస్తున్న….  మామూలుగా  నడుస్తున్నప్పుడు కూనిరాగం తిసెటొడు కిక్కురుమనకుండ నా యెనుక రాబట్టిండు … “సుక్క ఎయ్యలేదా” అని అడిగిన  లేదు అన్నడు .. అనుకుంట చెప్పబట్టిండు ….. “నా దుర్గమ్మని  నా చేతులతో  బొంద పెట్టినప్పటినుంచి రోజు తాగిన దినాం ఇడువలే తాగకుండ ఉన్నది లేదు కని  ఇయ్యాల సుక్క ముట్టలే “అని ముసిముసి నవ్వులు  నవ్వుకుంట  బలంగా ఒక్కొ అడుగు వేస్తు నా వెనకే వస్తున్నాడు

వాడు,వాని యవ్వారం  బాగా తెల్సునాకు.మొండోడు. గుండెధైర్యం ఎక్కువ వాడికి .దుర్గమ్మ వాడి పెళ్ళాం.అయినోళ్ళని సొంత సేతులతో కప్పెట్టడం ఎవరికయినా భాధనే కద. అయినా వీడు అన్ని దాటుకొని వచ్చాడు. ఊరు దగ్గరయ్యింద్. ఏందొ చెప్పాలన్నవ్ అని గుర్తు చేసిన . నువ్వు ఇచ్చిన పైసలతో డప్పు కొన్న  అంటూ బీడీ ముట్టించాడు

“డప్పు ఎందుకు పగలగొట్టవ్ మళ్ళీ  ఎందుకు కొన్నవ్” కోపంగా అడగడం   మొదలుపెట్టిన   ఒహ్ అవ్వ చెప్పిందా అంటూ అవ్వే ముసి ముసి నవ్వులు

“ఈ డప్పు చెయ్యబట్టె నన్ను గుళ్ళోకి  రానిస్తలేరు” అంట …”డప్పు ఒక ఆశుధం” అన్నాడు పంతులు అందుకే డప్పు పగులగొట్టిన అని ఏడ్వబట్టిండు . “మరి మళ్ళీ ఎందుకు కొన్నవ్ “అని  సముదాయించడం మొదలుపెట్టిన .. “డప్పు కొట్టకుండ  ఉండలేను అలవాటు అయిన ప్రాణం  మా తాత నేర్పిన ఇద్య ఇది.  డప్పు లేకుంటే చెయ్యి పడిపొయినట్టయ్యింది. గుడి  నాకు  బువ్వ పెట్టలేదు కాని డప్పు బతుకు  ఇచ్చింది”   అనుకుంట ఊరు అవతలి  వాడకి వెళ్ళిపోయిండు.

జోరుగా తెళ్ళారి  దసరా పండక్కి పొద్దు పొద్దుగాళ్ళనే డప్పు కొట్టుడు మొదలుపెట్టిండు. చిన్నపిల్లలు వాడి చుట్టూ మూగి  ఎగురుతుంటే కొత్త పొద్దు వచ్చింది

డప్పు కి గుళ్ళోకి ప్రవేశం లేదు అంటే డప్పు ని పట్టుకున్న జాతులకు కూడా గుళ్ళోకి  ప్రవేశం లేదు అని అర్థం అంటే డప్పు వలన జాతిని వెలివేసార?? లేదు లేదు.. వెలివేసిన జాతికి చెందిన   కళారూపాలను వెలివేసారు . ఇక్కడ గుళ్ళొని దేవుడికి కూడ డప్పు అంటే నామోషి అందుకే ఈరడు మొదట తెలియని దేవుడి కన్నా తెలిసిన డప్పుని   విడిచి పెట్టలేదు  . దసరా పండక్కి   ఊరు మొత్తం   జమ్మి ఆకు కోసం ఎగబడుతున్నప్పుడు వాడు మాత్రం జమ్మి చెట్టు నుంచి పాండవులు   దించినట్టు ఆయుధాన్ని దించాడు ఇప్పుడు వాడి కళారూపమే వాడి ఆయుధం

*

“చందమామ ఇటు చూడరా”,

దేవదాసు చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా?’ అనే గీతం తెలియని తెలుగువారుండరనడం అతిశయోక్తి కానే కాదు. టాలీవుడ్ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఈ పాట తరతరాల శ్రోతలని అలరిస్తోంది.

అలాగే “చందమామ ఇటు చూడరా”, “కొండమీద కొక్కిరాయి” తదితరగీతాలు కూడా చాలా ప్రాచుర్యం పొందిన తెలుగుపాటల్లో కొన్ని. ఈ పాటలకు తన గాత్రాన్ని అందించినవారు అలనాటి మేటి గాయని కె. రాణి గారు. ఈ పాటలే కాక శ్రీలంక దేశపు జాతీయగీతం ఆలపించిన ఖ్యాతి కూడా ఈమెకి దక్కింది.

పాటల ప్రపంచం నుండి సెలవు తీసుకున్న తర్వాత మీడియా జిలుగులకు దూరంగా ప్రశాంతజీవనం గడుపుతున్న రాణిగారు ఈ మధ్యనే విశాఖపట్నంలో ‘సీతారామయ్య ట్రస్ట్” ద్వారా తనకు జరిగిన సన్మానం ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చారు. మిగిలిన తెలుగు గాయనీగాయకులందరిలాగానే ఈమె ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది.

అయితే సినీప్రపంచంలోని కొన్ని అంశాలు తన కుటుంబాన్ని ప్రభావితం చెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె కుమార్తెలు కవిత, విజయ గార్ల మాటల్లోనే చెప్పాలంటే నిర్మాత అయిన వారి తండ్రి, ఉయ్యాలలోనే పాడడం మొదలుపెట్టిన తల్లి సినీపరిశ్రమనుండి వారిని దూరంగానే పెంచారు. తండ్రిగారు అమరులయ్యాక తమ స్వస్థలానికి వచ్చిన కుటుంబం చాలాకాలం సినిమాకి సంబంధించిన వ్యక్తులకు దూరంగా నిరాడబరంగా బ్రతికింది.

పరిశ్రమలో పేరుకన్నా తన పిల్లల భవిష్యత్తునే ముఖ్యంగా పరిగణించి, ఎన్నో ప్రయాసలకోర్చి, వారిని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన తల్లి రాణిగారు.

అటువంటి రాణిగారితో సంభాషించే అఱుదైన అవకాశం సారంగ-మాలిక వెబ్ పత్రికలకు దక్కింది. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూ  వీడియో ప్రత్యేకంగా మీకోసం:

రోజూ కనిపించే సూరీడే!

seetaram

మనం రోజూ  చూసే  దృశ్యమే  దండమూడి  సీతారాం కూడా  చూస్తాడు. ఆ దృశ్యంలోకి  సీతారాం చూస్తున్నప్పుడు మాత్రం  అదొక   కథగా, కలగా మారిపోతుంది!

ఇక్కడ ఈ  దృశ్యంలో  ఎన్ని  కథలు  కూడా కలిపాడో  చూడండి.

మీ  ఊహకి  రెక్కలిచ్చి, కవిత్వంలోకో, అందమైన  మ్యూజింగ్స్ లోకో  ఎగిరిపొండి.

కొన్ని  వాక్యాలుగా  మారిపోండి.

రాయండి! ఏం అనిపిస్తే  అదే  రాయండి!

సిందూరపు సాయంత్రం 

 evening-walk
మళ్ళీ ఎన్నాళ్ళకి వచ్చింది ఇట్లాంటి  సాయంత్రం
నీరెండ కాంతిలోకి వానచినుకులు జారినప్పుడు
ఆకాశం ఒడిలోకి ఇంద్రధనస్సు ఒంగిన సాయంత్రం
కళ్ళకు కట్టిన గంతలు వీడినప్పుడు
చేతులారా ఓ కలను తాకిన సాయంత్రం
సూర్యుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, వెలుతురు విడిచిన సాయంత్రం
అప్పుడే మెరుపులద్దుకున్న చిన్న నక్షత్రం కోసం
చందమామ కొత్త కాంతితో ఉదయించిన సాయంత్రం
కలిసి వేసే మన నాలుగడుగుల కోసం
ఎప్పటినుంచో ఒడ్డును కనిపెట్టుకున్న ఈ పెద్ద ప్రవాహం
ఏది ముందో ఏది వెనకో తేల్చుకోలేక
మాటలన్నీ మౌనంలోకి ఒదిగిన సాయంత్రం
ఎవరి వెనుక ఎవరో, ఎవరికెవరు తోడో తెలియని చిన్న ప్రయాణం
కంటిచూపు వేసిన ప్రశ్నకు చిరునవ్వు చెప్పిన అందమైన సమాధానం
ఎవరికివారు విడివిడిగా నేర్చుకున్న మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ
గతమూ … భవిష్యత్తూ తగలని ఒక నిర్మల వర్తమానంలో
ఇప్పటికిప్పుడు ఈ క్షణాల్లో ఉండడం కంటే గొప్ప స్వేఛ్చ మరేదీ లేదనుకుంటూ…
వయసుమళ్ళిన నడకలు ఇక అలసిపోని సుదీర్ఘమైన సాయంత్రం… !!
గతకాలపు దిగుళ్ళకు రెక్కలొచ్చి గుండెను ఖాళీ చేసి ఎగిరిపోతున్న సాయంత్రం
మిగిలిన జీవితానికి మధురమైన మలుపై నిలిచిపోబోతున్న సాయంత్రం
ద్వితీయార్ధంలో సింధూరం దిద్దుకున్న శుభారంభపు సాయంత్రం, !!
ఎన్నాళ్ళకొచ్చింది ఇట్లాంటి  సాయంత్రం!
———————— రేఖా జ్యోతి

గైనేరా? గడ్డికుప్పా?

 bokeh-1505960_1920

 

ఒరే కొడుకా..

ఏడుకొండలూ.. యెలాగున్నావురా అయ్యా..

ఊరూ యేరూ వొక్కలాటివే. ఒడుపు తెలిసి బతకాల. బతుకు దాటాల. లేదంటే ములిగి చావాల. ఉన్నదే వూరు. పెట్టిందే కన్నతల్లి. నోరు మంచిదయితే వూరు మంచిదవుతాది. నీకసలే మా సెడ్డ నోటి తీట. ఈటిసిరితే యెనక్కి తీసుకోగలం గాని మాటిసిరితే యెనక్కి తీసుకోగలమా? కాలాలు చూస్తే బాగోలేవు!

ఎద్దు ముడ్డి పొడిసి యేదుం పిండి అంబలి తాగినోడు మీయయ్య. మీ అయ్యకేం తెలుసును? అని అనుకోకు. ఇదమూ తెలీదు.. పదమూ తెలీదు అని అనుకోకు. మాయమ్మ పేరు దాక.. మీ యమ్మ పేరు డోకి అనుకోకు. లోకం నన్నెరక్క పోవచ్చు. లోకాన్ని నానెరుగుదును. కనబడుతున్న దానికి గట్టిక్కి యేల సూడాల కొడుకా..!?

రాజుల కాలం పోయింది.. రాజులు సరి.. రాజ్జాలు సరి.. మంత్రులు వొచ్చినారు. మనమే జనమే అదికారంలోకి వొచ్చినామని అనుకున్నాం. జీ హుజూర్.. అని యికన వుండక్కర్లేదనీ అనుకున్నాం. కాలు మొక్కక్కర్లేదనీ- కళ్ళు దించక్కర్లేదనీ అనుకున్నాం. ఎవుడికి ఆడే రాజనకున్నాం. ఎవుడికి ఆడే బంట్రోతనుకున్నాం. ఎవుడు యెవుడికీ లొంగక్కర్లేదనుకున్నాం. ఎవుడు యెవుడికీ వంగక్కర్లేదనుకున్నాం. ఎవుడి బతుకు ఆడు బతకీయొచ్చనుకున్నాం. గాని యిదీ అదే. అంతా కనికట్టు. కాదంటే వొట్టు. మన సూపు మారింది.. మన రూపు మారింది.. గానొరే అసలు మారాల్సింది మారలే. ఇప్పుడు మంత్రులందరూ రాజులే. ఆల రాజ్జిమే నడస్తంది. ఆల కత్తులు తుపాకులయినాయి. ఆల మొల నుండి పక్కోడి మొలకి మారినాయి. ఇప్పుడు ఆల కత్తులు ఆలు పట్టుకోరు. పట్టుకోడానికి పదిమందుంటారు. వందమందుంటారు. ఆల గుర్రాలూ యేనుగులూ- కార్లూ యెలీకాప్టర్లయినాయి. ఆల సైన్యం- పోలీసు, మిలటరీ బలగాలయినాయి. తప్పితే ఆల యంత్రాంగమూ మారలేదు. ఆల మంత్రాంగమూ మారలేదు. మన రాతా మారలేదు. లోకం తిత్తవా మారలేదు.

మన బంట్రోతు బుర్ర మీద కుచ్చీల టోపీ మారలేదు. పై మీద పయ్యాడ బెల్టూ మారలేదు. బిళ్ళా మారలేదు. అంతెందుకు తెల్లోడి దగ్గిర కాలు నేలకు తన్ని.. చెయ్యి నుదిటికి తిరగేసి అతికించి కొట్టిన సెల్యూటూ మారలేదు. వేసుకున్న ఖాకీ బట్టా మారలేదు. పట్టుకున్న లాటీ మారలేదు. పోలీసు తీరూ మారలేదు. ఆడి క్రాపు మారలేదు. కాసిన మన యీపు మారలేదు. మారలేదంతే మారలేదు.

ఆ మాటకొస్తే అప్పుడు కలకటేరు యిప్పుడూ కలకటేరుగున్నాడు. అప్పుడు కప్పమే లాక్కుండోలు. యిప్పుడు పంట మీద కప్పమే కాదు, పంటే కాదు, పంటేసిన బూమి కూడా లాక్కుంతన్నారు. తన్ని మరీ. కేసులు పెట్టి మరీ. కాల్చిచంపి పడీసి మరీ. ఆ అబివుద్ది జోలికి పోను గాని కొడుకా.. యేటీ మారలేదు. కేసులంటే యాదికొచ్చింది.. దర్మల్ పవరు ప్లాంటు కేసులల్ల కోర్టుల చుట్టూ తిరిగినాను గదా.. జడ్జీ గారని తెలీక పెద్దలాయరనుకోని ఆయమ్మగారికి అనుకోకండా మొదట్ల యెదురైపోన్ను. దండవెట్టినాను. దేవుడ్ని చూసినట్టుగా చూసినాను. ఎన్నడూ చూడని దేవుడు యెదురొస్తే యెలాగ చూస్తామో అలాగ చూసినాను. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాను. అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగూడదని నాకు తెల్దు. దెస్టా.. అని మనోలు నా తల కిందకి వంచీసి గబుక్కున వుపద్రవం ముంచుకొచ్చినట్టు అందరూ వొక్కపాలి యెనక్కి లాగినారు. తెలక పులికి ఆహారం అయిపోతానన్నంత యిదిగా గబుక్కున ముందు నుండి యెనక్కి లాగినారు. యెంత పని చేసినావని మనోలు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టిపోసినారు. నానేటి చేసినానో నాకు తెల్లేదు. నాను యెర్రి మొకం యెట్టుకు చూస్తే చెప్పినారు. ఎన్నడు గాని.. యెప్పుడు గాని.. యేటి.. తెలిసిగాని.. తెలియక గాని.. జడ్జీలకి యెదురెళ్ళ రాదు. ఒకేళ పొరపాట్న యెదురయిపోతే.. దండమెట్టి పక్కకి తప్పుకొని తోవ యివ్వడం గవురవము కాదట?! ఎనక్కి అలాగే నాలుగడుగులు యేసి- అప్పుడు దండమెట్టి- పక్కకి జాగర్తగ- తలవొంచి తప్పుకోవాలట. పొరపాట్న కూడా యెనక్కి తిరిగి పోగూడదు. యెన్నూ యీపూ నడ్డీ ముడ్డీ సూపగూడదు! అలాగని యే రాజ్జాంగంలో వుందని నువ్వు అనొచ్చు. అన్నీ రాజ్జాంగంలోనే రాసుండవు. కొన్ని రూల్సు సెక్సన్లూ పాలో కావాలంతే! ఇలాటివి యెవుడూ చెప్పడు. ఏ పుస్తకాల్లంట వుండవు. గాని తెలుసుకొవాల. తెలుసుకొని మసలు కోవాల. మంచిగ బతుక్కోవాల.

అన్నట్టు చెప్పడం మరసిపోనాను. కలకటేరు ఆపీసుకు ఆమద్దిన యెల్లినాను గదా? అతగాడూ యెనకటి రాజుగోరే. తలమీద కిరీటమొకటే తక్కువ. ముందలే రాజావారి దర్శనానికి మా పేర్లు రాసుకున్నారు. తెల్లారగట్ల యెల్లి దండమెట్టి కూకున్నాం. ఎయిటు సెయ్యండి.. ఎయిటు సెయ్యండి.. అన్నారు ఆపీసర్లు. ఎయిటేటి నైనూ టెన్నూ కూడా అయిపోయింది. పొద్దుటి నుండి అతగోడు వస్తాడు.. యెల్తాడు.. వస్తాడు.. ఆడి పేసీల వున్నాగాని ఆడు మన పేసు సూడ్డు. ఆడు లార్డు కజ్జిన్ లాగ.. మనమేమో గుమ్మంలో వున్న గజ్జి బేపిలాగ.. ఆడు మనొంక సూడ్డానికి కూడా యిష్ట పడ్డు. పెర్మిషను యిస్తే గాని పెదవి యిప్పగూడదు.. అని ముందలే తాకీదు యిచ్చినారు ఆపీసోలు. సచ్చినట్టు నోరు కుట్టుకున్నాం. మూగోల్లాగ వుండిపోనాం. శిలా పతిమల్లాగ వుండిపోనాం. పొద్దోయిందాక. రేపు రా.. మాపు రా.. అని గాని అన్లే. సారూ పులుసూ యెల్లి పోనాడని ఆయెనక చెప్పినారు. చెస్.. ఈ కుక్కల కొడుకు తోటి మనకేటని రైతులందరం యెనక్కి యెలిపోచ్చినాం. నీకొకటి తెలుసునా.. కలకటేరుకే కాదు, యూనివరిసిటీల ఈసీలకీ, మన యిరిగేషను యింజినీరుకీ గొడుగు పడతారు. ఎండా వానా యేటి లేనప్పుడూ పడతారు. దేవుళ్ళకి తల యెనకాల సెక్రం వున్నట్టుగా యీలకి గొడుగుండాల. అదేట్రా అంటే మన యెలమ యెంకడు ‘దటీజ్ వోదా’ అంటాడు. ఇంక రాష్ట్రానికి వోదా వొస్తే యేటవుతాదో యేటో?

సర్లే గాని మన కానిస్టేబులు కనకారావు లేడా? మన యెనక సెగిడీదిల వుంటాడు. ఇంజనీరింగు సదివినాడు గుంటడు. ఐయ్యేయస్ ఐపీయస్సు ఐపోతాననుకున్నాడు. ఆపరీచ్చా ఈపరిచ్చా రాసినోడే. తెలివైనోడే. గాని అడుగు సిల్లి. అసల బొక్క. కూతురు కూటికి యేడిస్తే అవ్వ రంకుమొగుడికి యేడిసిందని అలయ్య గోల. పూట పూటకీ పూట గడవక కష్టంగ వుంటే యెప్పుడో ఆపీసరయ్యి మేం సచ్చినతర్వాత మా సమాదిమీద యీడు గేదిని కడతాడు.. అని రోజూ యింట్ల యేలాలూ గుడిసిలే. ఇంక యేలని పోలీసు పరీచ్చలు రాసి కానిస్టేబులు అయిపోండు. పోనీ అని లాఠీ వూపుకొని సక్కగా వుండొచ్చును కదా.. వుండలే.. ఈడికి ఐయ్యేయస్ ఐపీయస్సు పిచ్చ వుంది కదా? ఆ ఐపీయస్సు బాసుని సూడాలని మాటాడాలని మన బాసేకదా అని యెల్లబోనాడు. ‘వుద్యోగం సెయ్యాలని లేదా లం.. కొడకా’ అని ఆడి తోటోలూ పైయ్యోలూ తిట్టినారట. ఐపీయస్సు ఆపీసర్లతోటి కానిస్టేబుళ్ళు కలవడానికి లేదట. మాట్లాడడానికి లేదట. అసలు యెదురు పడడానికే లేదట. అంత హీనము మరి అని అనుకుంటే కాదు. అదే వోదా. ఆవోదా యెక్కడిది? రాజుల కాలం నాటిది కాదా? ఆలు రాజులు కారా?

చెప్పినాను కానా? ఏటీ మారలేదు. ఎనకటికి బుగత యింటి ముందు చెప్పులు తీసి చేత్తో పట్టుకు నడిసోలమా? అచ్చం అలగే. కావాలంతే కొన్ని ఆపీసులకి యెల్లి నీకళ్ళ తోటి సూడు. అందల పని చేసినోలే, చెప్పులు యిప్పి అయ్యవారి గదిలోకి అడుగు పెడతారు, దేవుడిగారి గర్బ గుడిలోకి అడుగు పెట్టినట్టు. మెడకాయ మీద తలకాయ యేలాడేసుకొని భక్తి మీద యెల్లి దండమెడతారు. మన ముందున్నోళ్ళని చూసి మనమూ జనమూ పాలో కావాలంతే! అడిగిన అన్నిటికీ ఆనసరు వుంది గదా అని చెప్పీగూడదు. మూగోలి లెక్క వుండాల. తల వూపాల గాని అడ్డంగా వూపగూడదు. అన్నిటికీ యస్సే అనాల. వోయస్ అనీసి వుత్సాహపడగూడదు. టెంపరి అనుకుంటారు. ఒళ్ళు బలుపు అనుకుంటారు. కొవ్వి పోనాడని కూడా అనుకుంటారు. అనుకోడానికి అడ్డేటి?

అసలు అనుకున్నా అనుకోకపోయినా ఆదోరంనాడు చేసిన ‘తిర్నాద సాముల కత’లాగ యిదాయికం పాటించాల. ఇవీ యిది యిదానాలని కార్తీక పురాణం పుస్తకంల రాసినట్టు వరసాగ రాసుండదు. గాని అచ్చరం ముక్క రానోడికి కూడా అంతా తెలుస్తాది. అర్దమవుతాది. టీవీలల్ల సూడ్లేదా? మన సినిమావోలు పతొక్కలూ పాదాలకి మొక్కీవోలే. అయిటయిటికీ వొంగి దండాలు పెట్టీవోలే. నడుము నొప్పులు రావో యేటో? అన్నిటికీ డూపులు పెడతారు, అదయినా వొరిజినలుగా సెయ్యనీరా అంటాడు మన సిమాచలం దద్ద. ఆడు అప్పుడ్లో సినిమాల్లో చేసీవోడని కతలు చెపుతాడుగదా. మోకమాటంగా వంగీ వంగక మద్దిల వుంటే- వొద్దు.. వొద్దనీసి మెడమీద సెయ్యపెట్టితే.. మనం లేపుతున్నాడు గావాల అనుకుంటాం. కాదట. పాదాలకు టచ్చు చెయ్యమని మెడమీద సెయ్యి తియ్యకుండా కిందకి వొంచుతారట కొందరు పెద్దలు. రాజుల కాళ్ళమీద.. జెమిందారుల కాళ్ళ మీద.. దేహీ అని పడినట్టు పడాల. అర్థమయ్యింది గదూ..?

రాజులెందుకు సరిపోతార్రా.. రాచరికాలు యెందుకు సరిపోతాయిరా కొడుకా.. మనవూరి కతే తీస్కో. గ్రామ పెసిరెంటు ఆపీసుల మీటింగు పెడితే యెల్లాల. తప్పకుండా యెల్లాల. గాని ఆపీసు యివతలే నిలబడాల. అదీ యిలువ. మరి మన డోక్రా మహిళా సర్పంచులయినా అంతే. ఆలు యింట్ల మీటింగు పెడితే మనం ఆడోళ్ళు యీదిల నిలబడాల. అదీ యిలువ. రెస్పెక్టు యివ్వకపోతే రేపు మన మొకం యెవ్వడూ సూడ్డు. తెలిసిందా? వాటమూ గీటమూ లేని వూరే యింత వయ్యారంగా వుంటే- పట్నమూ.. నగరమూ.. మరెంత వంపులతోటి వయ్యారాలతోటి వుంటాదోనని నా బయ్యిం.

సిటీలల్ల అలగేటి వుండదు. వొకడికి లచ్చిం లేదు.. సల్దికి బత్తిం లేదు.. అన్నట్టుగ బతికీయొచ్చు అని అంటావు. నీకా యీక తెంపితే కడేదో మొదులేదో తెల్దు. పేంటూ సర్టూ యేసీగాన సరికాదు. రంగుల కళ్ళ జోడు పెట్టీగాన సరికాదు. సరిగ్గ సూడు.. టీవీలల్ల సూడ్డం లేదనుకోకు. మినిస్టర్లూ మంత్రులూ వస్తే.. ‘రాజుగారు వొస్తన్నారహో..’ అని దండోరా యేయించినట్టు ‘పోయ్.. పోయ్’ మని అరుపులూ ఆరన్లూ. ‘అడ్డు తప్పుకోండహో..’ అని పోలీసులు దారి క్లియారు చెయ్యడాలు. ట్రాపిక్కు ఆపీడాలు. ఆపదైనా సాపదైనా ఆడికి ముందల దారిచ్చీయాల. నువ్వు ఆగాల. నీ సావు నువ్వు సావాల. రాజుగారు యెల్లీదాక సావయినా రేవయినా అంతే. ఆ తరవాతే బతికి సావాల. బట్ట కట్టి సావాల. రాజుగారికి పత్తింగుంటాది. మనకే మాడి పోతాది. మసయిపోతాది. నువ్వా దర్జా చూసి చెప్పు. ఇప్పుడుకీ మనం రాజులకాలం వున్నామా? లేదా? అది ముందు చెప్పు.

నాయనా! మన వూర్లంట యే మాటన్నా సెల్లుతాది. ఆడేటి ‘గైనేరా? గడ్డికుప్పా?’ అని గైనేరుని తిట్టీసినా దీవించీసినా ఆతు ముక్క కింద తీసీసినా చెల్లుతాది. ‘గైనేరుకు గడ్డు- మేస్త్రీకి మెడ్డు’ అనీసినా ఆడిపోసుకున్నా చెల్లుతాది. ఓట్లు తప్ప మన పాట్లు తెలీని అవుకు గాళ్ళని ఆడి యమ్మా యక్కా యాలి చేసి నానా తిట్లు తిట్టీసినా చెల్లుతాది. ఏలిన నంజి కొడుకుల్ని యెన్నన్నా చెల్లుతాది. ఆల ఆడోలు యేటి చేస్తారు గాని మద్దిన? యింకో తోవ లేదు. తెన్నులేదు. అమ్మనాబూతులు తినని వొక్క నాకొడుకుని చూపించు. రాజకీయాల్లోకి వొచ్చినప్పుడే ఆలూ అన్నిటికీ సిద్దమైపోయి వొస్తారు. సిగ్గూ యెగ్గూ వొదిలేసి వొస్తారు సన్నాసులు! మనము తిడతన్నామని పదవుల్లో వున్న యెదవలకి తెలీదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం సీకటయి పోద్దా?

ఒరే.. చివరాకరుగా నే చెప్పేది యిను. కుట్టినోలుకి కుడిపక్క వుండకూడదు. ఏడిసినోలుకి యెడమపక్క వుండకూడదు. అదికారంలో వున్నోలుకి ఆపక్కా యీపక్కా యేపక్కా వుండకూడదు. నువ్వసలే ‘గుర్రమ్మీదున్నోడు గుడ్డిగాడు.. యేనుగుమీదున్నోడు ఆతుగాడు’ అనే రకం. కానొరే.. అది కుదర్దు. మొన్నటికి మొన్న చూసినావు కావా? అయిదరాబాదులే.. సర్దారు వల్లబాయి పటేలు పోలీసు ట్రైనింగు కేంపులే.. అడీసినల్లు డీజీపీ యిందుకుమారు బూషణు అని రాజస్తాను నుండి వొచ్చినాడు. మన గవర్నరుని అడిగినాడు.. యేటని? మీ రాజబవనం నుండి సమాచారం అడిగిన ఆర్టీఐ కార్యకర్తలని మాపియా అని యెందుకు అన్నారు.. అని. రాజుని ప్రశ్నిస్తే సైన్యాదిపతికైనా తల తెగిపోద్ది. ఆ పోలీసు బాసుని టక్కున ట్రైనింగు ఆపీసి మరీ యెనక్కి పంపించీసినారు గదేటి? అతగాడు గొంతు కోసుకొని పేనాలు తీసుకోబోతే జైపూరు యిమానంల తొస్సి యెనక్కి పంపించీసినారు. ఇదంతా నాకెలాగ తెలుసును అనుకోకు. పేపర్ల వొస్తే మన ఈసుగాడు చదివి యినిపించినాడు. నువ్వు పేపర్ల యెడ్డింగులు చదివీసి.. సినిమా బొమ్మలు చూసీసి.. కిర్కెట్టు పరుగులు లెక్కట్టుకున్నంత కాలం నీకిలాటివి కనబడవు. ఆ పేపరోలు కూడా అదొక వార్త కాదన్నట్టుగ యేసినారు. కానొరే.. యెందులో నుండయినా మనం తెలుసుకోవల్సింది.. నేర్సుకోవల్సింది వొకటుంటాది.. అర్ధమయింది కదా.. కోవిల కెళ్ళి పిత్తకుండా వుంటే దూపమేసినంత పలితము. మనకాడ వాగినట్టు యెక్కడ పడితే అక్కడ యేది పడితే అది వాగీకు. నోరు మనదే. కాని వూరు మనది కాదు కదా?!

యిప్పుడుకే చేట బారతం రాసినాను.. వుంతాన్రా అయ్యా.. జాకర్త!

యిట్లు

మీయయ్య

అప్పలకొండ

మూడు మెలకువలు నీలోకి…

Artwork: Satya Sufi

Artwork: Satya Sufi

1

ప్రేమంటే పొదువుకునే హృదయమే కాదు

చీకటి భ్రమల్లో కృంగిపోతున్న జీవితానికో మేల్కొలుపని

ప్రతి కదలికలో తోడయ్యే నీ చూపు కదా చెప్పింది!

ఘనీభవించిన భయాలను ఒక్కొక్కటిగా సింహదంతిలా సాగనంపుతూ

నా చేతి వేళ్ళను నీవేళ్ళతో అనువుగా హత్తుకుంటుంటే

అప్పుడేగా తెలిసింది మన ప్రాణాలొకటేనని!

ఎగసే భావాలకు అర్థాలెరుగని నా పిచ్చిదనాన్ని

నిలువెత్తు నిలబడి నీలో కలిపేసుకుంటావే

అదిగో ఆ ఆప్యాయతే కదా నా కాలమెరుగని సుఖం!

ఎడబాటు వెలిగించే అభద్రతలో

నమ్మకాల నలుపు తెలుపుల నా వూగిసలాటచూసి  నువ్వు నవ్వేస్తుంటే

వూదారంగేదో నా కన్నుల్లో  నెమ్మదిగా నిండుకుంటోంది !

నీ మెడవొంపులో వొదిగే సమయం మంచుకరిగేంత

స్వల్పమే అయినా మరో కలయిక కోసం

నన్ను సజీవంగా ఉంచే సంజీవనే అదే కదా!!!

 

2

వేళ్ళ కొసల్లో జారుతున్న ముగ్గులా

జ్ఞాపకాల ధార …

ఆరోజు మాటలేవో కలిపానా

మనసునలాగే నిలిపేసుకున్నావ్ !

అందమో ఆనందమో మృదువుగా తాకుతుంటే

దాని కేంద్రమై విస్తరిస్తావ్ !

సన్నాయిలా నీ ఊపిరేదో నాలో వూదేసి

వొంట్లో గమకాలై  వొణికిస్తావ్ !

దూరాన్ని ముద్దాడుతూ పెదవిపైనే వుంటావ్

నాలో కలిసిపోయి మధురగానమై వేధిస్తావ్ !

 

చీకట్లో పరుగును బిగికౌగిలితో ఆపి

రెండు ప్రాణాల కలయికలో..ప్రియా! నీవు చేసిన అద్భుతం

హరివిల్లుగా  ప్రేమ సుగంధం …తెలుపు నలుపుల జీవితానికి రంగులద్దుతూ!

 

3

అల్లరి కళ్ళూ …కొంటె నవ్వులూ

ప్రాణవాయువుని ప్రసాదించే మెత్తటి పెదవులు

ప్రేమగా శిరసు నిమిరే నీ వేలి కొసలూ

బలంగా హత్తుకునే బాహువులూ

మనసు నింపేస్తుంటే

ఇక చేరాల్సిన తీరమేదో తెలిసిపోయింది

 

వేలయుగాలుగా ఆగని పరుగు నీ చేరికకేనని

తెలిసిన ఈ  క్షణం ఉనికిని మరిచి పెనవేసుకొనీ

ఏకత్వాన్ని అనుభవించనీ

ప్రేమతీవ్రతను  ప్రకటించే దేహబంధాలూ

నీ పెదవులు దాటి నను తాకే ప్రతి పదబంధమూ

ఒక్కో మృత కణానికీ మళ్ళీ  పురుడుపోస్తోంది ప్రియతమా!

*

త౦డ్రికి కొడుకు బహుమతి

Kadha-Saranga-2-300x268

 

నాకు యిష్టమైన పనితో సెలవురోజు మొదలు పెట్టడానికి, దాని క౦టే ము౦దు ఎన్నో పనులను పూర్తి చేసుకోవాల్సి వచ్చి౦ది. లేకపోతే ఏమిటి ! ప్రొద్దున్నే క౦పౌ౦డులో కూచోని పుస్తక౦ చదువుకు౦టూ కాఫీ తాగాలనే కోరిక తీర్చుకోవట౦ కోస౦ ఎ౦త సెటప్ చేసుకోవాల్సి వచ్చి౦దో ! మొదట కాఫీకి డికాషన్ పడేశాను.

గేటు ము౦దర వున్న సిమె౦ట్ ర్యా౦ప్ మీద కానుగ చెట్టు తనకు కాబట్టని ఆకులను దారాళ౦గా గుమ్మరి౦చేసి౦ది. యిక సపోటా చెట్టేమో నీ క౦టే నేను నాలుగు ఆకులు ఎక్కువే అని కానుగచెట్టుతో పోటి పెట్టుకొని తన శక్తిమేర క౦పౌ౦డులో ఆకులను రాల్చి౦ది. అయితే ఏ మాటకామట చెప్పుకోవాలి. ఆకులతో పాటు పక్షులు కొరికి వదిలేసిన నాలుగు సపోటా పళ్లను కూడా మాకోస౦ రాల్చి౦ది. యి౦త చెత్తను భరిస్తు౦డేది కూడా ఈ ప౦డ్ల కోసమే కదా ! ఈ ప౦డ్ల కోసమే కదా, మేము యి౦ట్లో లేనప్పుడు , పిల్లలు , కోతులు క౦పౌ౦డులో జొరబడి వీర విహార౦ చేసి పోతు౦డేది !

కొళాయి కి౦ద వున్న బక్కెట్టులో సపోటాలను కడిగి పక్కన పెట్టాను. ఎటూ కసువు వూడ్చేశాను యిక పనిమనిషి కోస౦ ఎదురు చూడట౦ దేనికని సిమె౦ట్ గచ్చుమీద నీళ్లు చల్లాను. నాలుగు నిలువు గీతలు , నాలుగు అడ్డగీతలు వేసి , నాలుగు మూలల్ని అర సున్నాలతో కలిపేటప్పటికి ముగ్గు గణిత శాస్త్ర గళ్ళ పజిల్ లాగా కనిపి౦చి౦ది.

మేమ౦టే భయ౦ లేదా అ౦టూ సూర్య కిరణాలు వాకిలి ము౦దువరకు వచ్చాయి. వాకిలి వెసి వు౦డట౦తో తమను లోపలికి వెళ్లనివ్వట౦ లేదని చిన్నబుచ్చుకు౦టున్నాయి.

‘ అయ్యో…! ఒక గ౦ట యిలానే అయిపోయి౦దే…! పుణ్యకాల౦ కాస్త పూర్తి అయ్యేట్టు౦ది…’ ఒక్క క్షణ౦ దిగులుగా అనిపి౦చి౦ది.

బెడ్ రూములోకి తొ౦గి చూశాను . మా ఆయన లేచి సైక్లి౦గ్ చేసుకు౦టున్నాడు.

వ౦టి౦ట్లోకి పరిగెత్తాను. కాఫీ మట్టుకు పాలు కాచి డికాషన్ కలిపాను.

” ఆహా…! వుదయాన్నే కుక్కర్ విజిల్స్ కు బదులు కాఫీ పరిమళాలు…” కాఫీ వాసనను అస్వాదిస్తూ వ౦టి౦ట్లోకి వచ్చాడు ఆయన.

” యి౦కే౦…పాచి నోటితో కాఫి తాగి…కాఫీ మీద కవిత రాయి…”

” అది అదే ….యిది యిదే…! లోపల ఫోర్సు వు౦టే కవిత దాన౦తట అదే తోసుకొని బయటకు వస్తు౦ది . కాఫీ తాగితేనే కవిత తయారు కాదు…అట్లా అని కాఫీ యివ్వకు౦డా వు౦డేవూ…” ఖాళీ కప్పు తెచ్చి , నాము౦దు పెట్టి కాఫీ పొయ్యమన్నట్టు దీన౦గా ముఖ౦ పెట్టాడు.

ప్రొద్దున్నే తీరుబాటుగా కాఫీ తాగడ౦ మాకు యిద్దరికి కుదరదు . యిదిగో యిలా సెలవు రోజు వరకు ఎదురు చూడాల్సి౦దే.

” తాగి కవిత అన్న రాసుకో , కథ అన్నాచదువుకో ! తర్వాత నువ్వు కాఫీ కలుపుకున్నప్పుడు నన్ను మరిచిపోవద్దు…”

కాఫీ గ్లాసుతో బయటకు నడిచాను.

తూర్పు వాకిలి కావట౦తో వుదయాన్నే ఎ౦డ హాల్ లోకి కూడా వస్తో౦ది. నా నీడ కి౦ద దేన్నీ ఎదగనివ్వను అని విర్ర వీగుతో౦ది సపోటా చెట్టు. నాకు మాత్ర౦ మినహాయి౦పు యిచ్చి౦ది. కుర్చీ తెచ్చుకొని కూచున్నాను.

టు కిల్ ఎ మాకి౦గ్ బర్డ్ నవల సగ౦లో వున్నాను. నవల చదువుతు౦టే ఆ దృశ్యాలు కళ్ల ము౦దు జరుగుతున్నట్టుగా అనిపి౦చి౦ది. ఆ పాత్రలు నా ఎదురుగా మాట్లాడుకు౦టున్నట్టు వు౦ది. త౦డ్రి , పిల్లల మధ్యన అల్లుకున్న చిక్కటి చక్కటి స౦బ౦ధాలను వూహి౦చుకు౦టు౦టే మనసుకు చాలా హాయిగా వు౦ది. విషయాలను పిల్లలకు అర్థమయ్యేట్టు చాలా ఓర్పుతో చెప్పే త౦డ్రి పాత్ర అటికస్ ది. పైగా లాయర్. అనుకోకు౦డానే అటికస్సును నా పరిచయస్థులలో వెతికే ప్రయత్న౦ చేశాను.  హానీ చెయ్యని పిల్లలను , తమ మానాన తమ పని చేసుకొని పోయే కొ౦తమ౦ది నల్లజాతి వాళ్ళను సమాజ౦ ఎలా వె౦టాడుతు౦దో అటికస్  పిల్లలకు చెప్తు౦టాడు. ” అటికస్ …” , “సర్…” , “ఫాదర్…” అ౦టూ పిల్లలు వాళ్ల నాన్నను పిలిచే తీరు నాకయితే మరీ మరీ నచ్చి౦ది. అవసర౦ అయినప్పుడు పిల్లలతో త౦డ్రిగా , గురువుగా , స్నేహితునిగా స౦భాషి౦చే అటికస్ పాత్రను హార్పర్ లీ తీర్చి దిద్దిన తీరు చాలా యి౦ప్రెసివ్ గా వు౦ది.

మెట్ల మీద అడుగుల శబ్ధ౦. అనుకోకు౦డానే తల పైకెత్తాను. పై పోర్షన్ అతను. భుజ౦ మీద ఖాళీ నీళ్ల క్యాన్ తో దిగుతున్నాడు. మెట్ల కి౦ద పెట్టిన సైకిల్ను బయటకు తీసి గేట్ బార్లా తెరిచి వెళ్లిపోయాడు. నన్ను గమని౦చాడో లేదో చెప్పట౦ కష్ట౦. మినరల్ ప్లా౦ట్ మా కాలనిలో పెట్టినప్పటి ను౦డి , నీళ్లు అక్కడి ను౦డి తెచ్చుకోవట౦ అనేది రోజూ అతని డ్యూటిలాగా వు౦ది. ఒక పేజీ చదివానో లేదో సైకిల్ మీద క్యాన్ పెట్టుకొని వచ్చేశాడు. క్యానును కి౦దకు ది౦చి , సైకిల్ కు స్టా౦డ్ వేశాక మళ్లీ వెనక్కు వచ్చి గేట్ మూశాడు. క్యానును భుజ౦ మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టు మీద రె౦డు కాళ్ళు మోపుతూ, మధ్యలో ఆగుతూ , బరువుగా మెట్లు ఎక్కుతున్నాడు. బక్కపల్చటి మనిషి.

” నాలుగేళ్ల సర్వీసు వు౦ది సార్ యి౦కా..” మొన్న ఆమధ్య మా ఆయనతో అ౦టు౦టే విన్నాను.

నీళ్ల క్యాన్ మోసుకొని మెట్లు ఎక్కుతున్నప్పుడ౦తా… శిక్ష లా౦టి ఈ పనిని ఈ మనిషి రోజూ ఎ౦దుకు చేస్తున్నాడు అనిపిస్తు౦ది. ఇ౦ట్లో ఎవ్వరూ లేకపోతే అది వేరే విషయ౦… ఈ బక్క పల్చటి మనిషిని చ౦కలో యిరికి౦చుకొని సునాయస౦గా పరిగెత్తగలిగె౦త బలిష్టమైన కొడుకున్నాడు. బక్క చిక్కిన ఆ ప్రాణిని చూస్తు౦టే ఆ కొడుకుకు ఏమనిపిస్తు౦దో ఏమో అర్థ౦ కావట౦ లేదు. ‘ అయ్యో…! నేను వు౦డగా మానాన్న నీళ్లు మోయట౦ ఏమిటి ‘ అని అనిపి౦చదా ? అనిపిస్తే ఈ మనిషికి నీళ్లు మోసే అవస్థ ఎ౦దుకు౦టు౦ది ? ఆ కొడుకుకు తెలియకపోతే ఈ త౦డ్రి చెప్పచ్చు కదా ! ” రేయ్…నీళ్లు తేవాల్సి౦ది నువ్వు…నేను కాదు ” అని కొడుకుకు చెప్పలేకపోవటమేమిటో ! ఇ౦తకు ఆ త౦డ్రి , కొడుకు గురి౦చి ఏ౦ ఆలోచిస్తున్నాడో ? మొత్తానికి చిత్రమైన త౦డ్రికొడుకులు…

తల విదిలి౦చి  పుస్తక౦ మీద దృష్టి పెట్టాను. కళ్ళు అక్షరాల వె౦ట పోతున్నాయి కాని బుర్రలోకి ఎక్కట౦ లేదు. నాలుగు వాక్యాలు కూడా చదవలేకపోయాను. రకరకాల ఆలోచనలు ఒకదాన్ని తోసి ఒకటి చుట్టుముడుతున్నాయి.

ఎదురుగా వున్నారు కాబట్టీ వీళ్ళను అ౦టున్నాను కాని , చాలా మటుకు కుటు౦బాలు యిట్లే వున్నాయి. పిల్లల్ను ఏపని సొ౦త౦గా చేసుకోనివ్వరు…చేయనివ్వరు…అన్నీ తామే చేయాలనుకు౦టారు…యిదిగో చివరకు పరిస్థితి యిలా వు౦టు౦ది. వాళ్లేమో ” అమ్మా నాన్న వున్నారులే వాళ్లే చూసుకు౦టారు ” అని నిమ్మకు నీరెత్తినట్లు వు౦టారు.  అనుకోకు౦డానే పెద్దగా నిట్టూర్చాను. చదువుకోకు౦డా ఈ ఆలోచనలు ఎ౦దుకు వస్తాయో ? బహుశా పుస్తక౦ ప్రభావ౦ అ౦టే యిదేనేమో!

నా ధ్యాసను పుస్తక౦ వైపు మళ్లి౦చాను.

 

* * * * * * *

ఆ పూటకు టిఫిన్ స౦గతి వదిలేసి నేరుగా రాగి స౦గటికి ఎసరు పెట్టి , ఎసట్లో కొన్ని బియ్య౦ పోశాను. సెలవు రోజుల్లో మాత్రమే మాకు రాగి స౦గటి చేసుకోడానికి వీలుపడేది. చెట్నీకి శెనక్కాయ విత్తనాలు వేయి౦చాను. యి౦కొక పక్క పల్చటి గొ౦గూర పప్పు వుడుకుతో౦ది. వ౦టి౦టిని తనకు అప్పచెప్పి స్నానానికి వెళ్లిపోయాను.

నేను స్నాన౦ చేసి వచ్చేటప్పటికి పప్పు ఎనిపి తిరగవాత పెట్టాడు. చెట్నీ మిక్సికి  వేసి పచ్చి ఎర్రగడ్డలు చెట్నీలో కలిపి పెట్టాడు. వుడికిన అన్న౦ ఎసట్లోకి రాగిపి౦డి పోసి వు౦డలు కట్టకు౦డా గెలికాను. పేరిన నెయ్యిని కరగబెట్టాను.

మా వ౦ట యి౦టి కిటికిని ఆనుకొని పైకి వెళ్లడానికి మెట్లు వున్నాయి. పైకి పోయేవాళ్ళు కి౦దికి దిగే వాళ్లు మా వ౦టి౦టి వాసనలను

పీల్చుకోవాల్సి౦దే… ఘాటు ఎక్కినప్పుడు తుమ్మటమో , దగ్గటమో కూడా జరుగుతు౦టు౦ది. మేము వ౦టి౦ట్లో వు౦టే మేము కనిపి౦చటమో లేకపోతే మా మాటలు వాళ్లకు వినిపి౦చడమో జరుగుతు౦ది.

పదిన్నర అయ్యి౦ది. యి౦కా పనమ్మాయి రాలేదు. మెట్ల మీద ఎవరో వడివడిగా ఎగురుతూ దిగుతున్న శబ్థ౦ వచ్చి౦ది. శబ్థ౦తో పాటు పర్ ఫ్యూమ్ పరిమళాలు కూడా మమ్మల్ని తాకాయి. కీ చెయిన్ తిప్పుతూ కి౦దికి దిగుతున్నాడు . ఆ పిల్లాడు బైక్ తియ్యట౦ , గేట్ మూయ్యట౦…బ౦డి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయేవరకు, మా ఆయన కిటికిలో ను౦డి చూస్తూనే వున్నాడు.

” పదిన్నరకు లేచేది…వాళ్లమ్మ చేసిపెట్టి౦డేది తినేది…సె౦ట్ కొట్టుకునేది…పదిన్నరకు బ౦డి ఎక్కి వూర్లో తిరగడాన్కి పోయేది…ఇది ఈ హీరో కథ…”

” మరి హీరో త౦డ్రిగారేమో ఆరి౦టికి లేచి నీళ్లు తెచ్చేది. మళ్లీ ఎనిమిది౦టిక౦తా సైకిల్ ఎక్కి ఆఫీసుకు పోయేది…సరిగ్గా సాయ౦కాల౦ అయిదుక౦తా యి౦టికి వచ్చేది…పని వు౦టే తప్ప కి౦దికి దిగే రక౦ కాదు ఆ త౦డ్రిగారు….”

” ఫ్రె౦డ్స్ సర్కిల్ లేక మా నాయన అట్ల యి౦ట్లో వు౦టాడు…నాకు అలా ఎలా వీలవుతు౦ది అనుకు౦టాడు వీడు. బయట చక్కర్లు కొట్టి రావడానికే కి౦దికి దిగుతాడనిపిస్తు౦ది నాకు. మధ్యాహ్న౦ భోజనానికి ఆఫీసు ను౦డి యి౦టికి వస్తాను కదా ! సరిగ్గా వాడు కూడా అదే టైమ్ కు యి౦టికి వస్తాడు. అట్ల పర్ఫెక్ట్ టైమి౦గ్స్ మెయిన్ టెయిన్ చేస్తాడు. యి౦క రావట౦ రావటమే టీ.వి ఆన్ చేస్తాడనుకు౦టా…కి౦దికి వినిపిస్తో౦టు౦ది…”

” కొడుకేమో నీ క౦ట్లో పడ్డాడు. త౦డ్రేమో వుదయాన్నే నాకు నీళ్ల క్యాన్ తో దర్శనమిస్తు౦టాడు….”

” ఈ హీరో లేచి రడి అయ్యి , సె౦ట్ రాసుకొని పోయేదాకా నీళ్లు రావద్దూ…? ” మాట్లాడుతూనే టేబుల్ తుడిచాడు.

పప్పు చెట్నీ గిన్నెలు టేబుల్ మీద పెట్టాడు.

చేతికి నెయ్యి రాసుకొని రాగి స౦గటి ముద్దలు కట్టసాగాను.

” ఈ మనిషికయినా కొడుకును పొద్దున్నే లేపి నీళ్లు తెమ్మని చెప్పచ్చు కదా ! రె౦డు రోజులు వాన్ని వ౦చితే మూడోరోజు వాడే లేచి తీసుకొస్తాడు… ఆ మాత్ర౦ కొడుకుకు నేర్పి౦చుకోకపోతే ఎట్లా ? ”

అటు వైపు ను౦డి సమాధాన౦ లేదు. నేను ఆశి౦చలేదు కూడా. ఆకలి ద౦చుతో౦ది . వేడి వేడి రాగి ముద్దలు ప్లేట్ల్ల్లల్లో పెట్టుకున్నాము. పనమ్మాయి భాగ౦ పక్కన పెట్టాను.

” చిన్న చిన్న విషయాల పట్ల కూడా జనాలకు స్పృహ లేకుండా అయిపోతోంది. ఎవరి బాధ్యతలు ఏమిటి? మనుషుల్ని మనుషులుగా చూడాలి అనే విషయాన్ని తెలుసుకోటానికి మనుషులకు ఒక జీవిత కాలం సరిపోవటం లేదు. చెప్పే తల్లిదండ్రులు అట్లే వున్నారు. నేర్పించే టిచర్లు అట్లే వున్నారు. యిక నేర్చుకోవాల్సిన పిల్లలు వేరేగా ఎలా వుంటారు?

” నువ్వు చదువుతున్నావే  హార్పర్ లీది టు కిల్ ఎ మాకి౦గ్ బర్డ్…  పైన వాళ్ల చేత ఈ పుస్తక౦ చదివిస్తే ఎలా వు౦టు౦ది…”

” అయ్యో ! అ౦తమటుకు అయితే యి౦కేమీ ? వాళ్లి౦ట్లో ఒక చిన్న కథల పుస్తక౦ కాదుకదా కనీస౦ న్యూస్ పేపర్ కూడా చూద్దామ౦టే కనిపి౦చదు…గూళ్ళల్లో వేసుకోడానికి కూడా పేపర్లు మనల్నే అడిగి తీసుకొని పోతు౦టు౦ది ఆవిడ….”

” గాలి వెలుతురు లేకు౦డా గుహలో బతికేస్తున్నారన్న మాట…”

” అలా అనుకుంటారా ఎవరైనా ? మాకు చాలా తెలుసు అనే అనుకుంటారు.”

“అంతేలే! వాట్స్ అప్ , ఫేస్ బుక్ లతో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు అనుకుంటున్నారు. అంత సేపు పుస్తకం ఎవరు చదువుతారు. యింటర్ నెట్ వుండగా పుస్తకాలు చదవటం ఎందుకు టైమ్ వేస్ట్ అంటుంటే…రోజుకు ఒక పేజీకూడా చదవరు. ఆ టైమ్ లో హాయిగా టీవి చూస్తే పోలా అనుకుంటారు…అయితే చెప్పే విషయాలు చెప్పే రీతిలో చెబితే ముఖ్యంగా వాళ్లకు టచ్ అయ్యే విషయాలను బాగా వింటారు.. కాలేజీలో చూస్తున్నాను కదా !”

 

* * * * * * *

 

సాయ౦కాల౦ నవల తీసుకొని బయటకు వచ్చేటప్పటికి బైక్ ను కడుగుతూ కనిపి౦చాడు మా పై పోర్షన్ హీరో. షార్ట్ నిక్కర్ , టీషర్ట్ వేసుకున్నాడు. చెవుల్లో యియర్ ఫొన్స్ వున్నాయి. నన్ను చూసి ” హాయ్ ఆ౦టి…!” నవ్వుతూ పలకరి౦చాడు. నవ్వి వూరుకున్నాను. చాలా శ్రద్ధగా బ౦డి తుడుచుకు౦టున్నాడు. ‘ డాడ్స్ గిఫ్టు ‘ తెల్లటి అక్షరాలు నల్లటి బ౦డి మీద మెరుస్తూ కనిపి౦చాయి. చూస్తూ నిల్చున్నాను. “డాడ్స్ గిఫ్టు ” మళ్లీ మళ్లీ మనసులో అనుకున్నాను. మెట్ల కి౦ద స్టా౦డ్ వేసిన సైకిల్ నిశ్చల౦గా కదలకు౦డా వు౦ది. బైక్ , సైకిల్ను మార్చి మార్చి చూశాను. వున్నట్టు౦డి సైకిల్ మీద ‘సన్స్ గిఫ్టు’ రాయేలనే చిత్రమైన కోరిక కలిగి౦ది. లేకు౦టే ఎవ్వరూ చూడనప్పుడు బైక్ మీద ‘త౦డ్రికి నీ బహుమతి ఏమిటి’ అన్న స్టిక్కర్ అతికిస్తేనో…! ఎట్ల వు౦టు౦ది.? ఏమనుకు౦టాడో…? కోప౦ వచ్చి చి౦చిపడేస్తాడా ? లేక ఎ౦దుకు రాశారు…ఎవరు రాశారు అని ఆలోచిస్తాడా ? ఏమో ఏమయినా జరగొచ్చు…ఎవ్వరు చెప్పగలరు ? అయినా రాత్రికి రాత్రి మనుషులు మారిపోతారా? అ౦త త్వరగా ఎవ్వరికయినా మై౦డ్ సెట్ మారిపోతు౦దా ? సరిగా ఆలోచిస్తే మారుతు౦దేమో ! సరైన ఆలోచన అని ఎలా తెలుస్తు౦ది చెప్తేనే కదా? మొత్తానికి ఈ పిల్లవాడు నన్ను పుస్తకం చదువుకోకుండా డిస్టర్బ్ చేశ్తున్నాడు.

పిలిచి నాలుగు మాటలు మాట్లాడి మెల్లిగా అసలు విషయ౦ కదుపుతే ఎలా వు౦టు౦ది ?  ” సైకిల్ మీద మీనాన్న నీళ్లు మూసుకొచ్చే బదులు బైక్ మీద నీళ్లు తేవట౦ సులభ౦ కదా ” నోటి చివర వరకు వచ్చాయి మాటలు. ” దీపక్ ” పిలవబోయి ఆగిపోయాను. చెప్తే వి౦టాడా? ” మీకె౦దుకు ఆ౦టీ మా విషయాలు అని అ౦టే ? తల ఎక్కడ పెట్టుకోవాలి ? పైకి అనకపోయినా మనసులో మాత్ర౦ తప్పక అనుకు౦టాడు…ఎ౦దుకొచ్చిన త౦టా! ఆ అబ్బాయికి చెప్పడానికి నా ఆర్హత ఏమిటి? అద౦తా వాళ్ళ అమ్మా, నాయన చూసుకోవాలి? యి౦తకు ఆ బక్క పల్చటి మనిషి అలోచన ఏమిటో ! కొడుక్కు చెప్పే  ఆలోచన వు౦దో లేదో ! అలా౦టి విషయాలు మాట్లాడుకు౦టారో లేదో ! టీ.వి శబ్థాల్లో ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తాయో లేదో…?

‘నా కొడుకు యిలా౦టి పనులు ఎలా చేయగలడు…? వాడికి ఎక్కడ వీలవుతు౦ది..? వాడు బాగా సెటిల్ అయ్యి మా కళ్ల ము౦దు తిరుగుతా౦టే చాల్లే ‘ అని అనుకు౦టు౦టాడేమో…! ఎ౦తకాల౦ పిల్లల్ని యిలా రెక్కల కి౦ద దాచుకోగలరు…?

” మన ఇ౦డియాలోలాగా కాదు ఆ౦టి జర్మనీలో… స్కూలి౦గ్ అయిపోతూనే పేరె౦ట్స్ పార్టీ యిస్తారు. యిక అప్పటి ను౦డి బయట హాస్టల్లో కాని వేరే ఏదన్నా రూమ్సులో కాని వు౦టారు .అయితే పేరె౦ట్స్ సపోర్ట్ చేస్తారు లె౦డి.  పేరే౦ట్స్ ఇన్వైట్ చేస్తే తప్ప వాళ్లు యి౦టికి రారు ఆ౦టీ…!” మొన్న ఆదివార౦ చ౦దూ యి౦టికి వచ్చినప్పుడు అన్న మాటలు మనసులో మెదులుతున్నాయి.

ఆ దేశాలల్లోనేమో అలా నడుస్తో౦ది… యిక్కడ యిలా నడుస్తో౦ది. పిల్లలు ఎ౦తసేపు తమ నీడలోనే వు౦డాలనుకు౦టారు…పిల్లలే కాదు పిల్లల పిల్లల్ని కూడా తామే మోయాలనుకు౦టారు…సొ౦త౦గా నడుస్తే ఏదో తమ పునాదులు కదిలిపోతున్నట్లు ఫీలవుతారు. వాళ్లు స్వత౦త్ర౦గా , ధైర్య౦గా వు౦టేనే కదా తల్లిత౦డ్రులు కూడా అ౦తో యి౦తో స్వేచ్చగా వు౦డగలిగేది. అప్పుడే తమక౦టు కాస్త స్పేస్ మిగుల్చుకోగలుగుతారు…తమ కళ్ళతో ప్రపంచాన్ని చూపించటం తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే చేయాలి. మన యిళ్లల్లో డెమోక్రటిక్ కల్చర్ ఎప్పుడు డెవలప్ అవుతు౦దో…?ఇ౦టికొక అటికస్ వు౦డాల…!అంతే ఓర్పుతో పిల్లలకు చెప్పే శక్తి కూడా తెచ్చుకోవాలి!

టప్పని పైను౦డి ఏదో పడి౦ది. సపోటా కాయ రాలి పడి౦ది. పండుబారాక ఎంత తీయగా వుంటుందో!

 

* * * * * * *

 

 

 

 

కొన్నిసార్లు నీడలు

mandira2

కొన్నిసార్లు నీడలు

మాట్లాడుతూ వుండడం

నేను చూశాను

కొన్ని యేటవాలుగానూ

మరికొన్నిసార్లు సగం వంగిపోయి

భావాలనల్లడం తెలుసు

 

నేను కూర్చున్నప్పుడో

పడుకున్నప్పుడో నా మీదగా

వెళ్ళిపోవడం గుర్తు

రెండు పెదాల చివర్లు

పగిలిపోయినప్పుడు అవి కలిసుండడం

చాలాసార్లే గమనించాను

 

యింటి నుండి బయటకెళ్ళేప్పుడు

అవి రోజూ నాతో రావడమూ

నాకు తెలుసు

సముద్రబింబాల్లా ప్రవహించడమూ

వుల్కాపాతాల్లా రాలిపోవడమూ

అరుదే

 

మాటల్లేనప్పుడు బీకర శబ్దాల్లో

అవే మాటాడడం

కొన్నివేల సంభాషణలు చేయడం

వాటికి అలవాటే

 

యిప్పుడెందుకో సరిగ్గా

స్పందించడం మానేశాయి

వాటిక్కూడా ఆత్మస్పర్శ

బానే తగిలినట్టుంది

వాటి రూపాలు యేర్పడ్డమే లేదు

నేను వుండడం తప్ప.

*

ఇంకేమీ ల్యే ….. రివేరా సంతకం!

riveraa

 

మనుషుల్ని దూరం చేయడం ఈ యుగ లక్షణం. ఒకర్నొకరు కలవకుండా, మాట్లాడకుండా, ఆలింగనం చేసుకోకుండా,  ఒకరి కండ్లలో తడి మరొకరు అనుభూతి చెందకుండా చేయడం ఈ కాలం లక్షణం. ఒకర్నుండి ఒకర్ని యెప్పటికప్పుడు ఖాళీ చేస్తుండడం, చేయిస్తుండడం ఈ నాటి క్రూరత్వం. ఒకప్పుడు ఇల్లు ఖాళీ చేసేటోళ్లం. తర్వాత ఊర్లు ఖాళీ చేసినం. ఆ తర్వాత దేశాల్ని ఖాళీ చేసినం. ఇప్పుడింక మనుషుల్నే ఖాళీ చేయాల్సివస్తున్నది. మనుషుల్ని అలవోకగా,  యేమీ పట్టనట్టుగా వదిలేసి,  ఖాళీ చేసి,  గొరగొరా మనల్ని మనం ఈడ్చుకుపోవల్సి వస్తున్నది. మనుషులు మనల్ని భౌతికంగా వదిలి పోవుడు ,  సుదూరమై పోవుడు  అందనంత దూరంలో ఉండుడు  చివరికి ఈ లోకంలోంచే నిష్క్రమించుడు  మనకు రోజూవారీ చర్యై పోయింది. తీరా వదిలిపోయినంక కానీ తెలుస్త  లేదు ఆ నొప్పి – తీరా దూరమైనంక కానీ ఆ గాయాలు సలపడం లేదు – ఇంక మళ్ల కలవరు,  ఇంక మళ్ల చూడలేము , మళ్ళెప్పుడూ కరస్పర్శ ఐనా వీలుకాదు అని తెలిసినంక  కానీ వెచ్చని నెత్తుటి తడి అంటదు.

అనాదిగా కవులు,  కలయికల గురించీ, వియోగాల గురించీ,  విరహాల గురించీ పాడుతూనే ఉన్నరు. కలయికల తియ్యదనం గురించి పాడినట్లుగా,  వియోగపు చేదునూ మధురంగానే పాడుతున్నరు. ఐతే అన్ని కాలాల్లో కలయికలు వియోగాలు విరహాలు ఒకటికావు. మనుషులందరికీ కూడా కలవడాలూ విడిపోవడాలూ వేరు వేరుగానే అనుభూతిలోకి వస్తయి. ప్రేమికులకు ఒక రకంగా, స్నేహితులకు ఒక రకంగా, సన్నిహితులకు ఆప్తులకు మరో రకంగా అవి గోచరిస్తయి, అనుభూతినిస్తయి. అన్నింటికంటే సామూహిక కార్యాచరణలో ఉన్నవారికి, ప్రజాఉద్యమాల్లో ఉన్నవారికి కలయికలు అపురూపాలు – వియోగాలు అత్యంత విషాదాలు. వియోగం వేరొకచోటికి బదిలీల వల్ల కావచ్చు, బలవంతంగా పరిస్థితుల వల్ల విడిపోవడం కావచ్చు చివరికి దుర్మార్గపు వ్యవస్థ బలికోరే బలవన్మరణాలవల్ల కావచ్చు. యేది యేమైనా యీ వ్యవస్థ చేస్తున్నది మనుషుల్నుండి మనుషుల్ని ఖాళీ చెయ్యడమే – ఖాళీ చేసి దూరంగా సుదూరంగా అందరానంత దూరంగా,  మళ్ళెప్పుడూ కలవనంత దూరంగా విసిరెయ్యడమే – ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగల్చడమే.

ఇక ఇప్పుడు కవులు ఖాళీ చెయ్యడం గురించి పాడతరు. ఖాళీ ఐన చోట మిగిలిన శూన్యం గురించి పాడతరు. ఖాళీ చేసేటప్పుడు గొరగొరా ఈడ్చుకుపోయిన మనుషుల చప్పుడు గురించి పాడతరు. ఐతే ఖాళీ గురించి పాడడమంటే, ఖాళీ గురించి చెప్పడమంటే  ఉన్నప్పటి ఉనికి  గురించి చెప్పడమే కదా – ఉన్నప్పటి అనుభూతుల్నీ అనుభవాల్నీ ఆకాశాల్నీ నేల చెలిమల్నీ తడమడమే కదా!

ఇంక ఈ లోకంనుండే ఖాళీ చేసి పోయినవాళ్ల గురించి పాడెటప్పుడు యెంత విషాదం గడ్డకట్టుకు పోతుందో చెప్పడం యెవరికి సాధ్యం?   అందరానంత దూరాల్లో ఉండీ కలవలేకపోవడం  అర్థం చేసుకోవచ్చేమో – పక్క పక్కనే ఉండి ఒకర్నుండి ఒకరు ఖాళీ ఐన పరిస్థితి మరీ దారుణం కదా – మరి దాన్ని పాడడం యింకెంత విషాదం?

 

“వాళ్లు స‌జీవంగా ఉంటారు

మ‌న‌తో క‌ల‌వ‌రు

మ‌న‌ల్ని స‌జీవంగా ఉంచుతారు

అయినా, మ‌న‌తో ఉండ‌రు.”

అని మొదలవుతుంది రివేరా కవిత ‘ఇంక ల్యే… ‘ .

సజీవంగా ఉండీ, మనల్ని సజీవంగా ఉంచీ మనతో కలవని వారూ మనతో ఉండని వారి గురించి, వారు వదిలిన ఖాళీ గురించి పాడుతున్నడు కవి. వెంటనే ..

“కిత్నేబీ క‌హో… వాళ్లంతే

వాట్ మేబీ వుయ్ ఆర్‌.. వాళ్లంతే.”

అంటూ హింగ్లీషు లోనూ తెలుగులోనూ లయబద్దంగా చలిస్తడు.

“ పొయ్యి మీద కూర్చోబెట్టేసి

పొద్దున్నే చాయ్ కాసేస్తారు

చెవి మెలిపెట్టేసి రాగం తీయిస్తారు

పుట‌ల్లో చొర‌బ‌డి ప‌క్కున న‌వ్వేస్తారు

మ‌న జేబులు దోసేసి

దొంగ‌ల్లా బోనులో నిల‌బెట్టేస్తారు.”

కొంగ్రొత్త వ్యక్తీకరణతో , వాళ్ళేమి చేసినరో చెప్తున్నడు కవి. వాళ్ళు మనకెంత సన్నిహితులో, మనకెంత యేమి నేర్పించినరో యెట్లా నేర్పించినరో చెప్పి ముక్తాయింపుగ మన జేబులే దోసి మనల్నే దొంగల్ని  చేసిన వైనం చెప్తడు ఒకింత చమత్కారంగా – వాళ్ళు మన జేబుల్ని దోచింది మన పైసలు కాదని మనకి వేరేగా  చెప్పనవసరం లేదు కవి.

హాత్ మిలే, బాత్ ఖిలే.. వాళ్లంతే

సాత్ చ‌లే, రాత్ హిలే.. వాళ్లంతే.

మళ్ళీ లయబద్దమైన హింగ్లీషు. ఐతే యేదో చమత్కారం కోసం వాడడం లేదా సంగీతం కోసం లయకోసం మాత్రమే కాదు – మిలే ఖిలే చలే హిలే చాలా లోతైన పదాలు – మిలే చలే మనుషులకు వర్తిస్తే ఖిలే హిలే ప్రకృతి కి సంబంధించినవి. ఐతే మనుషులకీ  వికసించడం కదిలిపోవడం వణికిపోవడం సహజమే కదా – అందుకే కవి అమాయకంగా సంగీతం కోసం లయకోసం వాడినట్టున్నా , కొంచెం గడుసుతనం కూడ ప్రదర్శించిండు.

 

“ సూరీడికి అర‌చేతులు అడ్డుపెట్టి

మ‌న క‌న్నుల‌కు కాపు కాసిందెవ‌రో..

ఆ క‌న్నుల‌ను వొళ్లోకి తీసుకొని

ఊపిందెవ‌రో, ఊకోబెట్టిందెవ‌రో..

క‌న్నులు మూసినా, తెరిచినా

దృశ్యాన్నంతా దురాక్రమించిందెవ‌రో..”

 

‘అరచేతికి అడ్డుపెట్టీ సూర్యకాంతినాపలేరు’   అన్న నినాద ఉద్యమ సంప్రదాయం నుండి వచ్చిన కవే రివేరా – ఐతే ఆ స్ఫూర్తి యెంతమాత్రమూ పోకుండానే, మనకు బాగా తెలిసిన భావాన్ని మనకు అపరిచితం చేస్తున్నడు. యెండవేడిమి నుండి లేలేత కనుపాపలని కాపాడినరు, వొళ్ళోకి తీసుకోని ఊపినరు ఊకోబెట్టీనరు – మనల్ని పసిపాపలుగానూ,  పసిపాపలు చేసీ పెంచి పెద్ద చేసిన వాళ్ళ గురించి చెప్తూ కవి,  మన కళ్ళ లో దృశ్యాల్ని దురాక్రమించుకున్నరు అని ఒక విరోధాభాస ప్రయోగిస్తున్నడు. ఇది మంచి దురాక్రమణ అని వేరే చెప్పాలా కవి?

“ తిరిగే లోకంలో తిక‌మ‌క‌ప‌డిన‌ప్పుడ‌ల్లా

తిమ్మిరి తీసి తిన్నగా దారికి తెచ్చిందెవ‌రో..

మ‌నిద్దరినీ అంబాడే అడుగులు చేసిందెవ‌రో..”

మొదటి రెండు వాక్యాల్లో మనకి నడక నేర్పినరు అని చెప్పడానికి కవి వాడిన పదాలను వాటి సొగసునూ అనుప్రాసనూ గమనించండి. యెక్కడా తేలిపోకుండా, కవిత్వమవుతూనే అద్భుతంగా పదాలను కూర్చినడు కవి.

“ఎంత వెతుకూ… దొర‌క‌రు

ఎంత పిలువూ.. ప‌ల‌క‌రు

నీడ‌ల‌ను మ‌న‌కి మిగిల్చి

నిజ దేహాల‌తో ఎంచ‌క్కా లేచిపోతారంతా..”

ఇక్కడ ఇక కవితలో మొదటి రెండు చరణాల  తర్వాత ప్రయోగించిన హింగ్లీషు ప్రయోగం కాకుండా తన మాతృభాష లోనే శోకిస్తున్నడు కవి. నీడలను మనకు మిగిల్చి వెళ్ళిపోయే వారిని ‘యెంచక్కా లేచిపోతారంతా’ అనడం లో అట్లా హాయిగా వెళ్ళిపోయినరనే అర్థం స్ఫురించినా వెతికా దొరకని,  పిలిచినా పలకని, ఖాళీలు మిగిల్చి,  పుట్టెడు  శోకాన్నీ మిగిల్చి,  పూడ్చలేని ఖాళీలు మిగిల్చి , వెళ్ళిపోయారనే దుఃఖ భారమూ ఉన్నది. మనకు తేలిక అనిపించే పదాలతో మనం యెంతో బరువును అనుభూతి చెందేటట్టు చేయడం కవి గొప్పదనమిక్కడ.

“ ఇంకేమి ల్యే… గుర‌..గుర‌.. గ‌ర‌..గ‌ర‌.. బ‌ర‌..బ‌ర‌లే..”

అని ముగిస్తడు కవితను.  ఇది సందర్భం తెలవక పోతే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించే అవకాశం ఉన్నది. సాధారణంగా మనమేదేనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు,  చివరి సారి లోపలికి పోయి,  అంతా కలియ చూసి చివరి సందూక నో సూట్కేసునో గొరగొరా బరబరా ఈడ్చుకొచ్చి ‘ఇంకేమీ ల్యే.. ‘  అని అలసటతోనూ, నిస్పృహతోనూ, అన్నీ వదిలి వెళ్తున్నం కదా అనే దుఃఖంతోనూ అంటాం కదా – అ దీ కవి తన ముగింపు వాక్యంగా యెంచుకొన్నడు. నిజానికి ఇది కవితకు ప్రారంభవాక్యం . కవి ఇంకా చెప్పదల్చుకున్నదానికీ, చెప్పకుండా మనల్ని ఊహించుకోవడానికి వదిలేసిన దానికీ ప్రారంభ వాక్యాలు. నిజానికి ముందు చెప్పిందంతా ఒక ఉపోద్ఘాతం మాత్రమే – ఇక్కడ్నుండీ కవిత మొదలవుతుంది. అది మనమే ఊహించుకోవాలె  రాసుకోవాలె.  ఇట్లాంటి అనేక సందర్భాల్లో మనలో మిగిలిన ఖాళీలను చెప్పకుండా , అవి మన ఊహలకే వదిలేసి,  జీవితంలోని ఒక ప్రాక్టికల్ సందర్భానికి కవితాశక్తి ని తెచ్చి,  మనకియ్యడం  కవి అసమాన ప్రతిభకు నిదర్శనం.

రివేరా విరసం లో చాలా చురుకైన సభ్యుడు. చాలా రోజుల్నుంచి కవిత్వం రాస్తున్నడు. చాలా మంచి కవిత్వం రాస్తున్నడు. విరసం వాళ్ళు రాసేది కవిత్వమేనా అని పెదవి విరిచే వాళ్లకు కనబడకపోయి వుండొచ్చు కానీ ఇప్పటికే కవిత్వసంపుటాల్ని ప్రచురించి కవిత్వాన్ని ప్రేమించే వారందరికీ చిరపరిచితుడు. లబ్దప్రతిష్టుడు. కొత్తగా కొంగ్రొత్త వ్యక్తీకరణలతో రాస్తున్నడు. ఒకసారి చదవగానే మర్చి పోయే కవితలు కావతనివి. కనీసం రెండు మూడు సార్లు చదవాలి మనలో ఇంకడానికి  – మనమూ తనతో అంతే గాఢతతో అనుభూతించడానికి.    ఒక సారి ఇంకిపోతే ఇంకెప్పుడూ మనలోంచి ఆరిపోడు రివేరా. విస్తృతంగా ప్రపంచకవులను చదువుతున్నడని ఆయన కవితలను చదివితే అర్థమవుతున్నది.

యెక్కడా తన నిబద్దతనూ నిజాయితీనీ,  సమాజం పట్ల బాధ్యతనూ యెంత మాత్రం సడలకుండా కవిత్వాన్ని తనదైన సంతకంతో  రాస్తున్న అత్యాదునిక కవి రివేరా.

*

 

 

 

కవిత్వం నాకెప్పుడూ మాయా వస్తువే!

prasada2

హిమాలయం ఎక్కుడుంది? అని

బడి బయట గాలిపటం ఎగరేసుకుంటున్న పిల్లాడిని అడిగాను

అదిగో అదే అని వాడు పై పైకి ఎగురుతూ పోతున్న

తన గాలిపటాన్ని చూపించాడు

హిమాలయం ఎక్కడుందో

 నాకు మొదటిసారి తెలిసిందని ఒప్పుకోనా మరి?

అని ప్రముఖ హిందీ కవి దిగ్గజం కేదార్ నాథ్ సింగ్ అంటాడో కవితలో. నిజమే మనకేం తెలుసు? బహుశా కవిత అంటే ఏమిటని ఎవరైనా పిల్లాడిని అడిగితేనే కాని తెలియదనుకుంటా నా మట్టుకు నాకు.

     అనాదిగా అదే సూర్యుడు అదే చంద్రుడు. అదే చీకటి అదే వెలుగు. అదే ఏరు అదే నీరు. అదే చెట్టు అదే నీడ. అదే పిట్ట అదే గాలి. అదే నింగి అదే నేల.  యుగాల పేగుల్లో ఊపిరి పోసుకుని  ఒకరిగా బయటకు రావడం. అనాది మానవ అనంత ఛాయా  ప్రవాహంలో కలిసి వెళ్లిపోవడం అంతా అదే.  రోజూ రాత్రి మరణం..ఉదయమే జననం. బతుకు నిండా పునరుక్తే. ఆలంకారికులు పునరుక్తిని దోషమన్నారు కాని దీన్ని అలంకారంగా మార్చుకోవడమే కవిత్వం అనుకుంటా.

        ఇది నా అయిదో కవితా సంకలనం. నాలుగో కవితా సంపుటి పూలండోయ్ పూలు వచ్చి రెండేళ్ళు దాటింది. ఈ రెండేళ్ళలో దేశంలోను, ప్రపంచంలోను, నాలోనూ చాలానే జరిగాయి. ఏది కవిత్వం..ఏది కాదు? అన్నది నాకెప్పుడూ ఒక పజిలే. నేను రాసేదంతా కవిత్వమేనా అన్నది కూడా ఎప్పుడూ నన్ను నా అక్షరాలే గిచ్చి గిచ్చి అడుగుతున్నట్టు అనుమానమే. అయితే కవులుగా మొనగాళ్ళు అనిపించుకున్న పెద్దల నుండి ఈ తరం యువకవుల వరకూ నా కవితల మీద వ్యక్తం చేసిన అపారమైన ఆత్మీయ రసస్పందన చూస్తే ఎక్కడో లోపల కించిత్తు తృప్తి కలుగుతుంది. అదే నా లోని ఆలోచనలను..స్పందనలను..భావాలను కవితలుగా మలిచే జీవధాతువుగా పనిచేస్తుంది.

           కవిత్వం దేని మీద రాయాలి అన్ని విషయంలో నాకెలాంటి ఊగిసలాటలi లేవు. ఎలాంటి నిషేధాలూ లేవు. అయితే కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరించకూడదన్నదే నా వాదన..నా నివేదన. ఈ పుస్తకం మొదటి, చివరి కవితలు ఆ బాధ్యతను గుర్తు చేసేవే. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య కవులు సందర్భాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇష్యూస్ వెంట రచయితలు కొట్టుకుపోతున్నారని కొందరు వింత వాదనలు చేస్తున్నారు. ఇది అనాదిగా వున్న విమర్శే. వాళ్ళన్నదే నిజమైతే కవులు రచయితలు సరైన మార్గంలోనే పయనిస్తున్నట్టు లెక్క. కాని వర్తమాన చరిత్రలో కొనసాగుతున్న దుర్మార్గపు పరిణామాలను కవులు కళాకారులు పట్టించుకోవలసినంతగా పట్టించుకోవటంలేదన్నదే నా కంప్లయింట్.

   సాధు జంతువులు జనం మీద విరుచుకుపడుతుంటే కవులే పులల వేషం కట్టి అసహాయుల పక్షాన పంజా విసరాల్సిన  తిరకాసు కాలమొకటి వచ్చింది. నిర్భయ భారతమంతా   అక్షరాల కొవ్వొత్తులు నాటాల్సిన సందర్బం ఏర్పడింది. అక్షర గర్భంలోనే ఆత్మహత్యకు పాల్పడే పెరుమాళ్ మురుగన్ ల చేతుల్లో భరోసా బాంబులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరాల్లో కల్బుర్గీలు..అడవుల్లో శ్రుతి రక్తధ్వానాలు.. బుల్ డోజర్లకు వేలాడు తున్న వేలాది నిర్వాసిత గ్రామసమూహాలు..ఎన్నెన్ని తరుముతున్నాయి? కత్తుల రెక్కలతో ఎగురుతున్న క్యాంపస్ లు కనిపించడం లేదా..?  చుక్కల ఆకాశంలోకి ఎగరిపోతున్న రోహిత్ లను కాపాడుకోవడానికి గుండెల్ని పెకలించుకుని అన్ని దిక్కులా కాపలా పెట్టాల్సిన అవరసంలో వున్నాం కదా..! ఒకపక్క శతాబ్దాల నుంచి తరిమేసి తరిమేసిన తిరిగి ఆ  ఇళ్ళల్లోకి.. అదే ఊళ్ళల్లోకి ఆజా..ఆజా వాపస్ అజా ఆజా అంటుంటే ఏది ఆహ్వానమో..ఏది ఆదేశమో..పిలిచేది చేతులో కత్తులో గుర్తెరిగిన కలాలు కావాల్సిన అనివార్య సందర్భాలు కావా ఇవి?  ఎలా? కవులు మరి ఈ అంశాలను కళ్ళెత్తి చూడకుండా ఎలా వుండగలరు?

      కాకపోతే ఆయా అంశాలను కవులు ఎంత కళాత్మకంగా కవిత్వీకరించారన్నదే ముఖ్యం. సామాజిక కళాంశాలను ఏకం చేసే నేర్పరితనం లేకపోతే ఎన్ని ఇష్యూస్ మీద ఎంత కవిత్వం పోగులు పెట్టినా వ్యర్థం. నేను 2016, ఫిబ్రవరి 2న ఆంధ్రజ్యోతిలో రాసిన కవిత ఎప్పుడైనా అన్నది రోహిత్ గురించే. కాని ఎక్కడా పేరు పెట్టలేదు. దాన్ని సరిగానే కన్వే చేశానని వచ్చిన స్పందన చూశాక అర్థమైంది. అరుణ్ సాగర్ మెసేజ్ (అట్టచివర వున్నది) దాన్ని చదివి పెట్టిందే. వాదన కోసం వాదనలాగా కవితో..కథో రాయకూడదన్నది నా అభిప్రాయం కూడా. ఆ అంశాన్ని కళాత్మకంగా పతాక స్థాయికి తీసుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో భాగంగా నేనేమంత పెద్దగా రాణించానా అంటే నాకేమీ అంత నమ్మకం కలగటం లేదు. కడ దాకా ఆ ప్రయత్నం ఒక తపస్సులా సాగుతూనే వుండాలి.  

                   కవిత్వం నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో ..ఏది తక్షణ ప్రాధాన్యమో..తత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో..ఎప్పుడూ గందరగోళమే. కొన్ని వాదనలతోనో ..కొన్ని విశ్వాసాలతోనో..కొందరు కొన్ని కవితల్ని విపరీతంగా ప్రేమిస్తారు. కొందరికి అవి చాలా సామాన్యంగా పేలవంగా కనిపిస్తాయి. వందల ఏళ్ళు   ముందుకుపోయి ఆలోచిస్తే  వర్తమానాన్ని రికార్డు చేయలేవు.. రిప్రజెంట్ చేయలేవు. ఈ కాలంలోనే  ఇరుక్కుపోతే విశ్వాంతరాళంలో ఏ గోళం పైనా నీ చూపుల నీడలు వాల లేవు. అందుకే కవిత్వం నాకో మాయ వంతెన. మాయ దీపం. మాయ రూపం . మాయ చూపు. మాయ నవ్వు. మాయ కౌగిలి. మాయ ఊయల.మాయ శవ పేటిక. ఈ మాయామేయ  చలచ్చల వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని కవిత్వానికి వస్తే నాకో చూపుంది. దానికెంత స్పష్టత వుందో చెప్పలేను కాని..చూడాల్సిందేదో చెప్పగలను. రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు అది నా జీవన వ్యాపకం కాబట్టి.

     నా అంతర్ముఖీనత్వం, వయసురీత్యా అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్త్విక ధోరణులు, శిల్పం మీద  మోజు నన్ను మరో వైపుకు నెడుతూనే వుంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే..పలకరింపులే..పలవరింతలే ఈ కవితలు.

                                               —————————

                                                                                       prasada1

డారియో ఫో – అతని నాటకరంగం

dario1[వ్యాసానికి చిన్న పరిచయం:

13 అక్టోబరు 2016 నాడు మరణించిన డారియో ఫో కు 1997లో నోబెల్ బహుమతి వచ్చింది.

ఆ సందర్భంగా కన్నడ రచయితా, నాటకకర్తా – ఎస్. బాబురావు – ఓ విపులమైన వ్యాసం వ్రాసి “మెయిన్‌స్ట్రీమ్” పత్రికలో 1998 జనవరిలో ప్రచురించారు.

డారియో ఫో నిష్క్రమించిన సందర్భంగా ఆ వ్యాసపు అనువాదం అందిస్తున్నాం]

*

ఈ ఏడాది సాహిత్యపు నోబెల్ బహుమతిని ఇటాలియన్ నాటక రచయితా, రంగస్థల కళాకారుడూ, రాజకీయ కార్యకర్త అయిన డారియో ఫో కు ప్రకటించడం ద్వారా స్వీడన్‌కు చెందిన నోబెల్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు చరిత్ర సృష్టించారనే అనాలి; ఇప్పటివరకూ సాహిత్యానికి ఇచ్చిన నోబెల్ బహుమతుల్లో ఇది అత్యంత వివాదాస్పదం మరి!

ఈ ప్రకటన పడమటి దేశాలలోని ‘ఉన్నత తరగతి’ సాహితీ వ్యవస్థలను ఒక కుదుపు కుదిపి వదిలిపెట్టింది. ఇది కలిగించిన అలజడిని అంచనా వెయ్యడానికి ఒక మార్గముంది: ఓ శుభోదయాన మన కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు  ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ‘నౌటంకీ’ నాటకకర్తకు ఎవార్డు ప్రకటిస్తే మన కాకలు తీరిన రచయితలంతా ఎలా స్పందిస్తారూ? – అదిగో ఆ బాపతు స్పందన వచ్చింది – పాశ్చాత్య దేశాల సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ‘డారియో ఫో కు నోబెల్ బహుమతి’ అన్న వార్త విని. సమకాలీన నాటకరంగపు తీరుతెన్నుల గురించి అంతగా పట్టించుకోని పెద్దమనుషులు అడిగినా అడిగి ఉంటారు – “అసలీ డారియో ఫో అనే మనిషి ఎవరూ?” అని! సాహిత్యానికి సంబంధించి ఎన్‌సైక్లోపీడియాలలోనో, చరిత్ర గాథలనో తిరగేసినా…  రచయితల జీవిత చరిత్రలూ, అకారాది క్రమ వివరాలు ఉన్న నిఘంటువులూ తిరగేసినా వాళ్ళకి డారియో ఫో గురించి వివరాలు తెలిసే అవకాశం అతి తక్కువ. ఒక వేళ కాస్తో కూస్తో వివరాలు ఉన్నా,  ‘అతనో హాస్య నాటక రచయిత, నాటకరంగపు జోకరు’ – అన్న అంటీ ముట్టని వివరం తప్పించి సమగ్రమైన సమాచారం దొరకదు. ఇంకెవరైనా మరికాస్త రాస్తే – అతనో షోమాన్, ఒక బఫూనూ అనవచ్చు. నిజమే. అతను షోమాన్, క్లౌన్ అన్న మాట నిజమే. కానీ అతని పరిచయానికి ఈ మాటలు చాలవు. మరింకెన్నో చెప్పుకోవాలి.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడం వల్ల నొచ్చుకొని, కోపం తెచ్చుకొన్న వ్యవస్థల్లో ఇటలీకి చెందిన ఘనత వహించిన ‘రోమన్ కాథలిక్ చర్చి’ ఒకటి. ఈ నిర్ణయం తమకెంతో విస్మయం కలిగించిందనీ, ఇది అత్యంత ఊహాతీతమైన నిర్ణయమనీ ఈ చర్చివారు ఇప్పటికే అంగీకరించి ప్రకటించి ఉన్నారు.

కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న – మరో ప్రపంచానికి చెందిన – రంగస్థల అభిమానులకు ఈ ప్రకటన ఆనందహేతువే. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist) లాంటి విజయవంతమైన తన ప్రముఖ నాటకాల ద్వారా డారియో ఫో ఇండియాలాంటి తృతీయ ప్రపంచపు దేశాలలో ఎనభైల నాటి నుంచీ బాగా పేరు నలిగిన మనిషే; కానీ ఈ అభిమానులు కూడా ‘ఇలాంటి అద్భుతం ఎలా జరిగిందా’ అని ఆశ్చర్యపడక మానరు.

ఇలాంటి విభిన్న విపరీత స్పందనలకు కారణం సుస్పష్టం. మనం ఆలోచించే బాణీలోంచీ, మనం అంగీకరించే పద్ధతిలోంచి చూస్తే డారియో ఫో ఒక రచయితా, నాటకకర్తా కానే కాదు. అమెరికాకు చెందిన ఆర్థర్ మిల్లర్, బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బాండ్, జర్మనీకి చెందిన పీటర్ హండ్కే ల లాంటి నాటక రచయిత గాదు. అసలు అన్నిటికీ మించి డారియో ఫో ముఖ్యంగా ఒక రాజకీయ కార్యకర్త. తను తన మిగతా పార్టీ సహచరుల కన్నా ‘అతి ఎక్కువ ఎరుపైన’ కమ్యూనిస్టు. ఆయన దృష్టిలో నాటకాలు రాయడమన్నది – ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాటకాలకు స్క్రిప్టు తయారు చెయ్యడమన్నది – ఒక గమ్యం కానేగాదు; ఓ గమ్యం చేరడానికి ఉన్న ఒకానొక మార్గం మాత్రమే. షేక్‌స్పియర్, మొలిరే (MOLIERE), బ్రెక్ట్ లాంటి అప్పటి, ఇప్పటి గొప్ప నాటక రచయితలందరి లాగానే డారియో ఫో కూడా రంగస్థలంతో అత్యంత సన్నిహిత ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి. తన నాటకాలలో ప్రముఖ భూమికలను పోషించిన మనిషి. అంతే గాకుండా ఆయన రంగస్థల కార్యకలాపమంతా అసలు సిసలు రాజకీయ కార్యకలాపమే. చుట్టూ అనుదినం జరిగే సంఘటనలూ, అసంఘటనలూ అతని నాటకాలకు ముడిపదార్థాలు. అవి అతనిపై కలిగించే ప్రభావమూ, ఒత్తిడుల ఫలితమే అతని నాటకాల స్క్రిప్టులు. ఆ స్క్రిప్టులని – ఆయా నాటకాల రిహార్సళ్ళలో, తన భార్య ఫ్రాంకా రమే (Franca Rame) సాహచర్యంలో మరింత నిర్దుష్టంగా రూపొందించి పదును పరుస్తాడు డారియో ఫో.

జీవితపు ప్రయోజనం, బతుకు పరమార్థం, మానవాళి గమ్యం – ఇలాంటి గంభీరమైన, ఘనమైన విషయాల గురించి గాఢంగా ఆలోచించే మేధావి రచయితల వర్గానికి చెందిన మనిషి కాడు డారియో ఫో. అతి వేగంగా క్షీణించి పోతోన్న మానవ సంబంధాల గురించీ, తన నుంచీ, తన పరిసారాల నుంచీ క్రమక్రమంగా దూరమైపోతున్న ఆధునిక మానవుని అసహాయత గురించీ డారియో ఫోకు పట్టదు. గతంలోకి శోధించుకుంటూ వెళ్ళి ఈనాటి సమస్యలకు అలనాటి చరిత్రలోనో, పురాణాలలోనూ సమాధానాలు వెతకడం కూడా ఫో కు చేతగాదు. రచయితగా ఆయన ధ్యేయం ఒక్కటే! సమాజంలోని కాపట్యాన్ని ఎండగట్టడం… ధనవంతులూ, మతాధికారులూ దొరతనంవారితో చేతులు గలిపి సామాన్య మానవుడ్ని ఎన్ని రకాలుగా హింసలకు గురి చేస్తున్నారో – ఆ తతంగాన్ని బయటపెట్టడం. తన రచనల ద్వారా, తన రంగస్థల కార్యకలాపాల ద్వారా ప్రపంచాని కాస్తో కూస్తో మార్చి దాన్ని మాములు మనుషులు మరికాస్త సుఖంగా బతకగల ప్రదేశంగా రూపొందించడమే ఫో అభిమతం. ‘ఇది జరగాలంటే మనకు మరికాస్త మంచి ప్రభుత్వం అవసరం… మంచి రాజకీయ వ్యవస్థ అవసరం… సాంఘిక వ్యవస్థ అవసరం’ అని డారియో ఫో అంటున్నట్టు అనిపిస్తుంది.

***

dario2డారియో ఫో 1926లో ఇటలీ దేశపు లంబార్డీ ప్రాంతంలో సాన్‌జియానో అన్న చోట పుట్టాడు. వాళ్ళ నాన్న రైల్వేలో స్టేషన్ మాస్టారు; తన తీరిక సమయాల్లో సరదాగా స్థానిక నాటకల్లో పాత్రలు పోషించేవాడు. బాగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని నాటకాల్లో వేషాలు వేయడం గమనించిన డారియో ఫోకు సహజంగానే నాటకరంగమంటే ఆసక్తీ, గాఢ అనురక్తీ కలిగాయి. 1950లో – తన ఇరవై నాలుగో ఏట – ఫో మిలన్ నగరం వచ్చి అక్కడే ఓ నాటక సమాజంలో చేరాడు. ఆ సమాజం వాళ్ళు తమ సంగీత రూపకాలకు వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసే పని అతనికి అప్పజెప్పారు. వాటి ఉద్దేశమల్లా ప్రేక్షకులను రంజింపజెయ్యడమే. అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి ఫ్రాంకా రమే అన్న సమమనస్కురాలితో పరిచయం అయింది. అది 1953లో పరిణయానికి దారితీసింది. ఫ్రాంకా రమే ఇటలీ దేశపు ‘గిల్లారీ’ అన్న సంచార నాటక ప్రదర్శకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. జానపద నాటక కళారీతుల బాగా తెలిసిన కుటుంబాలవి. అప్పటికప్పుడు ఆశువుగా నాటకాలు రూపొందించి ప్రదర్శించడంలో నిష్ణాతులు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళలో ఎక్కువగా చదువు ఉండకపోవడంతో వాళ్ళు తమ నాటకాలను రాత ప్రతుల మీద కన్నా తమ తమ (ఆశు) సృజనాత్మక శక్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. నటులంతా తమ తమ శక్తియుక్తులన్నీ నటనా ప్రావీణ్యాన్నీ జోడించి రంగస్థలం మీదనే అప్పటికప్పుడు ఓ నాటకాన్ని రూపొందించేవారు.

ఫ్రాంకా రమేతో పరిణయం ఫో కు ఓ వరంగా పరిణమించింది. నాటకరంగం సహజమూ, శక్తివంతమూ అవ్వాలంటే అది తన సంప్రదాయ రంగస్థల రీతులను అవగాహన చేసుకుని ఆ అవగాహన లోంచి పెరిగి పెద్ద అవడం అత్యవసరం అన్న విషయాన్ని ఫో అర్థం చేసుకొన్నాడు. తన భార్య ద్వారా జానపద రంగస్థల కళారీతుల్ని తెలుసుకొన్నాడు. మెళకువల్ని తెలుసుకొన్నాడు. ఆ  ఎరుక సాయంతో తన కళకు మెరుగులు దిద్దుకొన్నాడు.

సిద్ధాంతపరమైన భావ స్పష్టతకూ, తన రచనలు సాధికార రాజకీయ ప్రమాణాలు సంతరించుకోవడం కోసమూ – లెనిన్, మార్క్స్‌ల తర్వాత అంత గొప్ప వామపక్ష సిద్ధాంతవేత్త అని పేరు పడ్డ – గ్రామ్‌స్కీ అన్న ఇటాలియన్ సోషలిస్ట్ మేధావి రచనలను ఫో అధ్యయనం చేశాడు. ఐతిహాసిక సంప్రదాయాలలోనూ బ్రెక్ట్ ప్రతిపాదించిన ‘అన్యాక్రాంత ప్రభావం’ (Alienation effect) అన్న సూత్రంతోనూ పరిచయం ఏర్పరుచుకొన్నాడు. అలాగే మయకోవ్‍స్కీ నాటకాలనూ అధ్యయనం చేశాడు. వీటన్నిటి వల్ల డారియో ఫో లో గణనీయమైన పరిణామం సంభవించింది… ఒక కొత్త అభిజ్ఞత (Awareness) రూపుదిద్దుకుంది. ఆ మిలన్ నగరపు నాటక సమాజంలో పని చేయడం ద్వారా తన శక్తియుక్తుల్ని వృధా చేసుకుంటున్నానీ, మార్పుని నిరోధించే బూర్జువా వర్గపు ఆనందం కోసం సంగీత రూపకాల చెళుకులు రాయడం శుద్ధ పనికిమాలిన వ్యవహారమనీ గ్రహించాడు. 1968లో ఆ సమాజం నుంచి బయటపడి తన భార్యతోనూ, మరికొద్దిమంది కమ్యూనిస్టు మిత్రులతోనూ కలసి నువో సినా (Nuova Scena) అన్న మరో నాటక సమాజం స్థాపించాడు. అప్పటికే తను గ్రహించి, జీర్ణించుకొన్న అనేకానేక ప్రభావాల నేపథ్యంలో – అవసరమైతే ఆయా ప్రభావాలనూ, భావాలను మరి కాస్త మెరుగులు దిద్దుకుంటూ తన సాంఘిక, రాజకీయ, వ్యంగ్య నాటకాలకు రూపకల్పన చేశాడు. ‘మిస్ట్రియో బఫో’ (Mistero Buffo – 1969), ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist – 1970), ‘ఇవ్వలేమూ, ఇవ్వం కూడానూ’ (Can’t Pay, Won’t Pay – 1974) – ఆ నాటకాలలో కొన్ని.

ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క నాటకరంగాన్ని నిర్మించడమన్నది డారియో ఫో లక్ష్యం. తన నాటక ప్రదర్శనల కోసం రంగస్థలాలనూ, నాటకాల హాళ్ళను అద్దెకు తీసుకోవడం మానేసి, వాటిల్ని కార్మికుల క్లబ్బుల్లో, పారిశ్రామిక ఆవరణల్లో ప్రదర్శించడం మొదలెట్టాడు. క్రమక్రమంగా తన రంగస్థల కార్యకలాపాల్లో కార్మికులని భాగస్వాములుగా చెయ్యగలిగాడు. వారి సాంస్కృతిక స్పృహను ఆ రకంగా పెంపొందించగలిగాడు.

డారియో ఫో తన నాటకాలకు ఇతివృత్తాలను తన పరిసరాల లోంచీ, సమకాలీన సమాజంలోంచీ గ్రహిస్తాడు. పోలీసుల క్రూరత్వం, రాజ్యపాలనలో ‘చర్చి’ జోక్యం, స్త్రీవాదం, తీవ్రవాదం, అవకతవక ఆర్ధిక విధానాల వల్ల పెరుగుతోన్న ద్రవ్యోల్బణం – ఇవీ, ఇలాంటివీ ఆయన ఇతివృత్తాలు. ఈ నాటకాల సాయంతో ఆయన వ్యవస్థలోని కాపట్యాలను బహిరంగపరచి ఎగతాళి చేస్తాడు. మతాధికారులూ, ధనాధికారులూ చేతులు కలిపి జనాన్ని ఎలా దోచుకొంటున్నారో చూపిస్తాడు. ఆ చూపించడం కూడా మళ్ళీ కరవవచ్చే వ్యంగ్యంతోనూ, పొట్టచెక్కలయ్యే హాస్యంతోనూ కలగలిపి చూపిస్తాడు. దాంతో ప్రేక్షకులందర్నీ నవ్వించడమూ, అలరించడమూ మాత్రమే కాకుండా వాళ్ళతో ఆయా విషయాలను గురించి గాఢంగా ఆలోచింపజేస్తాడు, కార్యాచరణకు సిద్ధపడేలా చేస్తాడు.

కాలం చెల్లిన ఊహాజనితమైన విషయాలనెప్పుడూ తీసుకోడు డారియో ఫో. ప్రజా బాహుళ్యానికి చెందిన ఏదేనీ విషయంగానీ సంఘటనగానీ జరిగినప్పుడు – దాని వాడీ వేడీ ఇంకా తగ్గకముందే – ఆ నేపథ్యంలో ఓ నాటకానికి రూపకల్పన జేసి ప్రదర్శిస్తాడు ఫో. ఉదాహరణకు పినో ఫినెల్లీ ( Pino Pinelli) అనే ప్రముఖ కమ్యూనిస్టు కార్యకర్తను అరాచకవాది అన్న ఆరోపణల మీద పోలీసులు అరెస్టు చేసి ‘లాకప్పు డెత్తు’కు గురి చేసినప్పుడు ఫో వెంటనే స్పందించాడు. పోలీసులు ఆ కేసును అణచిపెట్టి, ఆత్మహత్యగా వక్రీకరించి, తమ తమ ఆత్మరక్షణా… పధకాల రూపకల్పనకు పాల్పడినప్పుడు – ఆయా వివరాలు క్షుణ్ణంగా తెలిసిన డారియో ఫో ఇంకా ఆ కేసు కోర్టు గదుల్లో ఉండగానే ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ అన్న నాటకాన్ని రూపొందించి విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన జరిగిన చాలా రోజుల తర్వాత కోర్టువారి తీర్పు వచ్చింది. ఫో తన నాటకంలో చూపించిన విషయం నిజమని ఆ తీర్పు నిర్ధారించింది. పినెల్లీ నిర్దోషి అనీ, పోలీసు జులుం వల్లనే మరణించాడనీ ధృవీకరించింది.

తన నాటకాల ప్రదర్శనలలో ఫో – ఆ ప్రదర్శన ముగిసిన తరువాత – నాటకం గురించి చర్చ నిర్వహిస్తాడు, ప్రేక్షకులందరినీ ఆ చర్చలో భాగస్వాములు చేస్తాడు. ఆ రకంగా ప్రతి ప్రదర్శనా ప్రజాప్రదర్శనగా పరిణమిస్తుంది.

***

dario3తమ నువో సినా సమాజాన్ని స్థాపించిన కొద్ది సంవత్సరాలకే ఫో, ఫ్రాంకా రమేలు ఆ నాటక సమాజ స్థాపనా ప్రయోగం విఫలమయిందన్న సంగతి గ్రహించారు.  ఆ సమాజంలో ఉన్నది తమ తోటి కమ్యూనిస్టులే అయినా వాళ్ళు అధికారగణంతో కుమ్ముక్కై నువో సినా ధ్యేయాలనూ, లక్ష్యాలనూ దెబ్బతీస్తున్నారని ఆ దంపతులు గ్రహించారు. నువో సినా నిర్వహణలో కమ్యూనిస్టు పార్టీ అధినేతల నిరంతర జోక్యం కూడా వీళ్ళకి దుస్సహమయింది. అలా విడివడి మరో నలుగురు అతి సన్నిహితులతో కలసి ‘ల కమ్యూన్’ (LA COMMUNE) అన్న మరో చిన్న సమాజాన్ని స్థాపించారు వారు. ఆ విడివడటం పుణ్యమా అని అన్నేళ్ళుగా శ్రమపడి సంపాదించిన సంపత్తిని – లారీ, వ్యాన్లూ, ఎలక్ట్రికల్ పరికరాలు – ఫో వదులుకోవలసి వచ్చింది.

తన భావాలూ నాటకాల పుణ్యమా అని ఓ రంగస్థల సమాజాన్ని స్థాపించి కొనసాగించడమన్నది ఫోకు ఒక ఒడిదొడుకు వ్యవహారంగా పరిణమించింది. శక్తివంతమైన శత్రువర్గం ఏర్పడిందతినికి – మతాధికారులు, ప్రభుత్వ గణం, కాపిటలిస్టులు – అతను ఎవరినయితె ఎండగడుతున్నాడో వాళ్ళంతా సహజంగానే అతని మీద ధ్వజమెత్తారు. అతడినీ అతడి నాటక సమాజాన్నీ సమూలంగా నాశనం చెయ్యాలని వాళ్లంతా కంకణం కట్టుకొని ప్రయత్నించారు. అతని రాతప్రతులు ముందస్తుగా గవర్నమెంటు వారి అనుమతి పొంది తీరాలన్నారు. ఆ అనుమతి పొందే ప్రక్రియలో విపరీతమైన మార్పులకూ, కోతలకూ గురి అయ్యేవి. అలా సెన్సారయిన నాటకాలను మళ్ళీ ఏ మార్పులు చేర్పులూ చెయ్యకుండా ప్రదర్శిస్తున్నారని నిర్ధారించడం కోసమూ, అప్పటికప్పుడు రంగస్థలం మీద ఆశువుగా చేర్పులు చెయ్యడాన్ని అరికట్టడం కోసమూ ప్రేక్షక సముదాయంలో ప్రతీసారీ ఓ పోలీసు అధికారి ఉంటూ ఉండేవాడు. అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు డారియో ఫో.

సంభాషణల సెన్సారు కత్తిరింపుల వల్ల కోల్పోయిన నాటక భాగాలను శరీరపు కదలికల ద్వారా, ముఖ కవళికల ద్వారా పూరించుకోడమూ నేర్చాడు. పెరోల్ మీద విడుదలయిన నేరస్థులు తమ తమ అనుదిన కదలికలను పోలీసులకు ముందస్తుగా విన్నవించుకోవలసిన రీతిలో డారియో ఫో కూడా తన నాటక సమాజం ఏ రోజు ఏ ఊర్లో ప్రదర్శన ఇవ్వబోతోందో – ఆ వివరాలు పోలీసులకు చెప్పి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురవుతామన్న భయం వల్ల థియేటర్ల యజమానులు తమ ప్రాంగణాలను డారియో ఫో కు అద్దెకివ్వమనేవాళ్ళు. మిస్ట్రియో బఫో లాంటి ‘చర్చి వ్యతిరేక’ నాటకాలను ప్రదర్శించినపుడు ఆయా బిషప్పులు ఆ నాటకాల పోస్టర్లను గోడల మీద నుంచి చించెయ్యమని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఇవన్నీగాక భౌతిక దాడీ, హింసా ఉండనే ఉంది. అరెస్టులూ, నిర్బంధాలూ, జైళ్ళూ, లాకప్పులూ – వీటికి అంతే లేదు. డారియో ఫో నలభైసార్లు అరెస్టుకు గురయ్యాడు. కొన్నిసార్లు హత్యాప్రయత్నాలకూ గురయ్యాడు. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’  నాటక ప్రదర్శనలో ఓసారి బాంబు పేలింది. మరోసారి ఫాసిస్టు ముఠాల వాళ్ళు ఫ్రాంకా రమేను కిడ్నాప్ చేసి నిర్బంధంలో ఉంచారు. మరొకరూ మరొకరూ అయితే ఇవన్నీ చూసి బెంబేలెత్తిపోయేవారేమో గానీ డారియో ఫో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎంతో నిబ్బరంతో ఎదుర్కున్నాడు. తన ఆదర్శాలకూ, రంగస్థల నమ్మకాలను సడలనివ్వకుండా నలభై సంవత్సరాల పాటు నిలచి ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ నోబెల్ బహుమతి అతని శత్రువుల్ని నిర్వీర్యం చేసి డారియో ఫో ను మరింత శక్తిమంతుడిని చేసే అవకాశం ఉంది.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది రంగస్థల ప్రపంచానికి అనేక విధాలుగా ముఖ్యమైన విషయం. సాహిత్య రంగంలో నాటక రచన అన్నది చిన్నచూపుకు గురవుతోంది; కవిత్వం, నవల లాంటి ప్రక్రియలకున్న గౌరవం నాటక రచనకు లేదు. గత అరవై ఏళ్ళుగా సాహిత్యానికి నోబెల్ బహుమతి అందుకొన్న వాళ్ళ పట్టికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 1936లో యుగెనీ ఓ నీల్, 1969లో శామ్యూల్ బెకెట్ – ఇప్పుడు డారియో ఫో. అంతే. అంతా కలసి ముగ్గురు. ఒక్కొక్కరికీ మధ్య దాదాపు ముప్ఫై ఏళ్ళ వ్యవధి.  బ్రెక్ట్ లాంటి లబ్దప్రతిష్ఠులు సైతం ఆ నోబెల్ ‘గౌరవాన్ని’ అందుకోలేకపోయారు; అది గౌరవమే అయిన పక్షంలో నాటకాలు రాయడం మరింత కష్టమయిన పని అవ్వడం వల్లనో లేదా ఆ నాటక రచన కళాప్రదర్శనకు ఉన్న మార్గాలు అతి పరిమితం అవ్వడం వల్లనేమో – అంకితభావంతో కథా కవిత సృష్టి చేసే వాళ్ళున్నంత విరివిగా నాటకకర్తలు ఎప్పుడూ లేరు మనకు. ఇప్పుడు ఇలా డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది నాటక రచన ప్రక్రియకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మనం ఆశించవచ్చు.

అలాగే డారియో ఫో బాణీ నాటకాలను ‘మోటు నాటకాలు’గా పరిగణించేవాళ్ళకూ కొదవేం లేదు. రాజకీయాలు, సాంఘిక ప్రయోజనాలు, వ్యంగ్యం, ఫార్సు, అసంబద్ధత, శ్రుతిమించిన హాస్యమూ కలగలసిన ఆయన నాటకాలను చాలామంది ఇప్పటిదాక ‘అశ్లీల’ (vulgar) నాటకాలని నిరసించారు. ఈ బహుమతి పుణ్యమా అని పరిస్థితులలో కొంత మార్పు రావచ్చు. వాటికి మరికాస్త ఆదరణా, ‘గౌరవం’ లభించవచ్చు. సాంఘిక సమస్యలను ఎత్తి చూపడానికీ, సామాజిక చైత్యన్యాన్ని కలిగించడానికీ నాటకరంగం ఒక ప్రముఖమైన మార్గం అన్న కనీస స్పృహ ప్రజల్లో రావచ్చు. సమస్యల గురించి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించడానికీ, ఆ ఆలోచనల సాయంతో సమాజంలో మార్పును తేవడానికీ రంగస్థలం ఒక శక్తివంతమైన ఆయుధం అన్న గుర్తింపు కలగవచ్చు.

మన దేశం విషయానికి వస్తే దీని ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. ఇటలీ లాగానే మన దేశంలో కూడా సాంఘిక సమస్యలు అనేకం. రాజకీయ సమస్యలకి కొదవు లేదు. ఇటలీలో ‘గిల్లారీ’ బాణీ జానపద నాటక కళారూపాలు ఉన్నట్టే మనకూ మన మన శక్తివంతమైన జానపద నాటక సంప్రదాయాలు ఉన్నాయి. నిజానికి మన ప్రతీ భాషకు తమ తమ విస్పష్ట జానపద నాటక సంప్రదాయాలున్నాయి. ఇటలీలానే మనకూ రాజకీయ నేపథ్యం గల, చైతన్యవంతమైన ‘రంగస్థలం’  ఉంది; అది ఇంకా బాల్యావస్థలోనే ఉందన్న సంగతి వేరే మాట. డారియో ఫో కు ఈ విశిష్ట పురస్కారం లభించడమన్న విషయం మనకూ మన రాజకీయ నేపథ్యపు రంగస్థల వ్యవస్థకూ; మన మన జానపద నాటక కళారీతులకూ ఒక నూతన స్ఫూర్తిని కలిగించగలగాలి.

మన రంగస్థలాన్ని మరింత చైతన్యవంతం చెయ్యాలి, శక్తివంతం చెయ్యాలి. అలా అని మనమంతా డారియో ఫో ను గుడ్డిగా అనుకరించాలనీ గాదు; అతని ధోరణీ, అతని బాణీ, అతని పద్ధతులూ పరిశీలించి వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని స్వీకరించాలి. అలాగే మన సాహితీవేత్తలు నాటక రచనను కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. డారియో ఫో రచన పద్ధతులను అధ్యయనం చెయ్యడం ద్వారా మన మన సామాజిక సమస్యల మీద విరివిగా నాటక రచన చేసి ఓ  ‘నాటకాల నిధి’ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ నిధి రూపకల్పన అన్నది రంగస్థలానికి ఎంతో అవసరం. దేశానికి ఇంకా అవసరం.

 

ఆంగ్లం: ఎస్. బాబూరావు

తెలుగు: దాసరి అమరేంద్ర

*

 

కాసింత రక్త స్పర్శ!

satya1

Art: Satya Sufi

1977 బొంబాయిలో జన్మించి భోపాల్ లో నివశిస్తున్న గీత్ చతుర్వేది గద్య పద్య రచనలను సమానంగా లిఖిస్తున్న కవి.  పదహారేళ్ళ పాత్రికేయ వృత్తి తరువాత తను అధిక సమయాన్ని రచనా వ్యాసంగానికే వెచ్చిస్తున్నారు. యితనిని యిండియన్ యెక్స్ప్రెస్ లాటి ప్రచురణ సంస్థలు ప్రసిధ్ది చెందిన 50 మంది హిందీ రచయితల్లో వొక్కడిగా పరిగణించాయి. యితని ఖాతాలో ఆరు రచనలు ప్రచురింపబడ్డాయి.

యితని కవితలు 14 దేశ విదేశీయ భాషల్లో అనువదింపబడ్డాయి. అనేక పురస్కారాలు సృజన,అనువాద రచనలకు యితన్ని వరించాయి. గీత్ చతుర్వేది 21వ శతాబ్దపు కవి. 2010లో తన మొదటి కవితా సంకలనం అలాప్ కా గిరహ్ ప్రచురింపబడితే రెండో కవితా సంకలనం న్యూనతం మైఁ ప్రచురణలో వుంది. గీత్ చతుర్వేది హిందీ కవిత్వంలో ప్రపంచ గుర్తింపును సాధిస్తున్న కవి.

వీరి కవితలు మారే కాలంతో పాటు యెదుగుతున్న సముచిత కవితలు. అందుకే వీరి కవిత్వం బరువైన  కవితలుగా మారుతున్నాయి. యితని కవితల్లోని ప్రతిబింబాలు, సంకేతాలు యాంత్రికతలో మనిషి హత్యల చల్లటి నెత్తురు యెగజిమ్ముతుంది.యితని కవితల్లో మనల్ని మనుషులుగా నిలిపి వుంచే మరో విశిష్ట సృజనాత్మక లక్షణం.

chatur

*

ఆనందపు గూఢచారులు
———————————–

వొక పసుపుపచ్చని కిటికి
తెరుచుకొంటోంది
పూరేకులు విప్పారుతున్నట్టుగా

వొక పంజరపు పక్షి
వూచల్ని కొరుకుతుంటుంది
తన పొలంలోని వరికంకుల్ని కొరికినట్టు

నా స్వప్నాలు కొన్ని
పొడిబారి పోయాయి యిప్పుడు
వాటితో నిప్పు గుండాన్ని
మండిస్తున్నాను యిప్పుడు

కొన్ని పచ్చగా వున్న నా కలలను
పోగేసుకొని
వో గొర్రె ఆకలిని నింపుతున్నాను

నా భాషలోని అతివృధ్ధ కవి
లైబ్రరీ నుంచి లావుపాటి పుస్తకాలు తెచ్చాడు
కూడలిలో కూర్చొని
బంగారు నాణేల్లాంటి పదాలను
పంచిపెడుతున్నాడు

నా పొరుగింటి ముసలావిడ
వొక యంత్రాన్ని ఆవిష్కరించింది
అందులో కన్నీటిని కుమ్మరిస్తే
తాగేందుకు నీరు
తినేందుకు వుప్పు వేరౌతాయి

వో అమ్మ తన బిడ్డలను
యెంత ప్రేమగా చూస్తుందో
ఆమె పాలధారతో
అనేక నదులు ప్రవహిస్తుంటాయి

నేల పైన చెల్లాచెదురైన
లోతైన నెత్తుటి యెరుపు రంగు
ప్రేమ యొక్క లేత గులాబి రంగులోకి
మారిపోతుంది….

*

ప్రకృతి ఒక క్యాన్వాస్!

seeta1

 

ప్రకృతిని మించిన కృతి  లేదు! కెమెరా లెన్స్ ఒకసారి  ప్రకృతితో ప్రేమలో పడ్డాక ఎన్ని వర్ణాలో  ఆ ప్రేమకి! ఆ  వర్ణాలన్నీ తెలిసినవాడు  దండమూడి సీతారాం!

ఈ దృశ్యాన్ని  మీ  అక్షరాల్లో బంధించండి.

కవితగానో, చిన్ని మనోభావంగానో ఆ దృశ్యానువాదం  చేయండి.

అక్షరాల్లో బతికిన మాట!

Velturu2

1

1980ల  చివరి రోజులు-

వొక శనివారం  సాయంత్రం పురాణం గారింటి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశం ముగిసింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో  నండూరి గారు నన్ను ఆపారు. “నువ్వు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంత చదివావ్?” అని అడిగారు. నిజానికి నేను అప్పటికి కొంత మాత్రమే చదివాను, నా  ప్రాణమంతా  ఇంగ్లీషు కవిత్వంలో  వుంది కాబట్టి! “కొంత కూడా చదవలేదు!” అన్నాను సిగ్గేమీ  పడకుండా! (సిగ్గేలా తెలుగు కవికి?!) “ఇవాళ్టి నించి రెండు నెలలు నీకు కృ.శా. క్రాష్  కోర్సు!” అని అప్పటికప్పుడు ఆయన వాళ్ళింటికి తీసుకువెళ్ళి, కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు అరువిచ్చారు. అప్పుడు తన  దగ్గిర వున్న గొప్ప  నిధిని కూడా నాకు చూపించారు. అవి కృష్ణశాస్త్రి గారు మాట పడిపోయాక చేసిన లిఖిత సంభాషణల చీటీలు! మాట పడిపోయినా ఆయన మాట్లాడడం మానుకోలేదు. చిన్ని చిన్ని కాయితాల మీద రాతపూర్వక సంభాషణలు చేసే వారు. నండూరి ఆ చీటీలన్నీ ఎంతో శ్రద్ధగా దాచి పెట్టుకున్నారు. “మాట- విలువ మనకి తెలీదు నోరు పనిచేస్తున్నంత కాలం! కాని, ఆ నోరు పడిపోయినప్పుడు ఎంత వేదన లోపల గూడు కట్టుకొని వుంటుందో కృ.శా. ని చూస్తూ ఎంత బాధపడే వాడినో! ఈ  కాలంలో మనకి నోరుంది కాని మాటల్లేవ్. మాట్లాడాలీ అన్న ఆయన తపన ముందు మూగతనం వోడిపోయింది!” అన్నారొక సారి నండూరి!

నేను పెన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నించి నెలరోజులుగా రోజూ చదువుతున్న కవి – తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! జీవితానికి ఎంత  దయలేదో ఎప్పుడూ అర్థం కాదు. పలికితే ముత్యాలు రాశిపోసినట్టుండే ఈ స్వీడిష్ మహాకవికి కూడా మన కృష్ణశాస్త్రిలాగానే మూగతనం వచ్చేసింది. ఇరవై ఏడేళ్ళ కిందట అంటే తనకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో విపరీతమైన ప్రయాణాలూ, వెళ్ళిన చోటల్లా అద్భుతమైన ప్రసంగాలూ చేస్తూ వచ్చిన తోమాస్ కి గుండెపోటు, పక్షవాతం వల్ల నోరు పడిపోయింది. కాని, జీవితం పట్ల ప్రేమా తపనా తోమాస్ ని బతికించింది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ  మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు!

 

2

తోమాస్ ని ఎందుకు ఇంతగా చదువుకుంటున్నానో నాకు ఇంతదాకా తెలియదు. బహుశా, కొందరు కవులు మనతో పాటే కొంత దూరం నడుస్తారు, మన భుజాల మీద చేతులేసి! ఆ చేతుల స్పర్శలోని భద్రభావమేదో ఆ కవిని మనకి దగ్గిరగా తీసుకొస్తుంది. ఈ కవి  ఈ క్షణంలో నా తోడు నిలవాలి అనిపిస్తుంది. అలాంటి భావనే కావచ్చు!

మాట పడిపోయాక తోమాస్ కూడా కృష్ణశాస్త్రి గారిలాగానే చిన్న చీటీల మీద రాతపూర్వక సంభాషణలు చేసేవాడు. ఆ చీటీల్ని కూడా ఎంత ప్రేమించాడో తోమాస్! అతనికి అవి తన టీనేజ్ లో కాలేజీ పాఠాల మధ్య లెక్చరర్ల కన్నుకప్పి,  స్నేహితులతో పంచుకున్న చీటీల్ని గుర్తుకు తెచ్చాయట! అందుకే వాటికి “Inspired Notes” అని పేరు పెట్టుకున్నాడు తోమాస్!

తోమాస్ తో నా ప్రయాణం ఆ Inspired Notes అనే కవిత్వ పుస్తకంతోనే మొదలయింది. తోమాస్ అంటున్నాడు:

“నా కవితలు సంగమ స్థలాలు. సాంప్రదాయ భాషా, దృష్టీ అంతగా పట్టించుకోని వివిధ వాస్తవాల మధ్య ఆకస్మిక చుట్టరికాలు కలపడం కవిత్వం చేసే పని. వొక లాండ్ స్కేప్ లోని చిన్నా పెద్దా వివరాలన్నీ కలుస్తాయి, భిన్న సంస్కృతులు, మనుషులూ కలుస్తారు. ప్రకృతీ యాంత్రికత కూడా సంగమిస్తాయి. చూడగానే ఇదొక సంఘర్షణ అనిపించేది ప్రతీదీ కవిత్వంలోకి వచ్చేసరికి స్నేహమైపోతుంది!”

కవిత్వం ఎందుకూ అనే ప్రశ్నకి అనేకమంది అనేక సమాధానాలు వెతుక్కున్నారు. దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం అనిపిస్తుంది నా మటుకు నాకు! మాటపోయిందని మూగతనంతో సమాధానపడలేదు అప్పటి కృష్ణశాస్త్రి, ఇప్పటి తోమాస్!

The organ stops playing and there is deathly silence in

The church but only for a few seconds- అనుకున్నాడు తోమాస్.

ఇంకో కవితలో అంటున్నాడు:

మాటల్ని నింపుకొచ్చిన వాళ్ళందరితోనూ

విసిగిపోయాను

కేవలం మాటలే కదా, భాషలేని మాటలు!

 మంచు కప్పిన ద్వీపానికి వెళ్లాను

అక్కడ  మాటలేమీ లేవు

కాని,

రాయని పేజీలెన్నో

నల్దిక్కులా పరచుకొని వున్నాయి.

ఆ మంచులోనే

అడివి జింకల అడుగుల్ని దాటుకుంటూ వెళ్లాను

అదంతా భాషే,

మాటల్లేని భాష!

tomas-transtrc3b6merw

 

3

స్టాక్ హోం లో 1931 ఏప్రిల్ పదిహేను పుట్టాడు తోమాస్. తల్లి స్కూల్ టీచర్. తండ్రి విడాకులు ఇవ్వడంతో తోమాస్ తల్లితోనే వుండిపోయాడు. స్టాక్ హోం యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్నాడు. కేవలం పదిహేడు కవితలతో 1954 లో మొదటి పుస్తకంతో మొదలయింది తోమాస్ అక్షరయానం. 2015లో చనిపోయే నాటికి పదిహేను కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి. 2011లో కవిత్వానికి నోబెల్ అందుకున్నాడు.

తోమాస్ పిల్లల జైల్లో సైకాలజిస్ట్ గా పనిచేసే వాడు. కవిత్వం అంటే తోమాస్ కి ఎంత ప్రేమ అంటే- వొక సారి న్యూయార్క్ లో కవిత్వం చదివాక ఇష్టాగోష్టి జరుగుతోంది. “మీ వృత్తి అంటే పిల్లల జైల్లో పని మీ కవిత్వం మీద ప్రభావం చూపించిందా?” అని అడిగారు. దానికి ఆయనేదో సమాధానం చెప్పాడు కాని, ఆ సమాధానాన్ని ముగిస్తూ “ కాని, ఆ ప్రశ్న – మీ కవిత్వం మీ వృత్తి మీద ఏమైనా ప్రభావం చూపించిందా” అని అడిగితే చాలా సంతోషించే వాణ్ని” అన్నాడు. కవిత్వం అనేది దానికదే వొక స్వతంత్ర భావంగా మిగలాలని తోమాస్ చివరిదాకా కోరుకున్నాడు.

నిజానికి తోమాస్ తనదైన కవిత్వ లోకంలోనే బతికాడు. ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా, కవిత్వమే అతని ఊపిరి. అతని ఆప్త మిత్రుడు, ప్రసిద్ధ అమెరికన్ కవి Robert Bly అన్నట్టు- “తోమాస్ కవితలు వొక రైల్వే స్టేషన్ లాంటివి. బహుదూరం నించి అక్కడికి రైళ్ళు వచ్చి, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయి. వొక రైలు కింద రష్యన్ మంచు కనిపించవచ్చు. ఇంకో రైలు చుట్టూరా  ఎక్కడివో పూల పరిమళాలు ఉండచ్చు. సుదూరం నించి పలకరించే వొక రహస్యమేదో అతని కవిత్వంలో వుంటుంది.”

 

4

నాకు చాలా నచ్చిన వొక కవితతో తోమాస్ నించి సెలవు తీసుకుంటాను ఇక-

 

వొక ఉత్తరానికి జవాబు

~

ఆ సొరుగు అట్టడుగున

వొక వుత్తరం-

ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందటిది.

వుద్విగ్నమైన ఉత్తరం

ఇప్పుడు తెరిచినా అది రొప్పుతూనే వుంటుంది.

 

యీ యింటికి అయిదు కిటికీలు

నాలుగు కిటికీల్లోంచి

పగలు మెరుస్తుంది ప్రశాంతంగా-

అయిదోది మటుకు

చీకటి ఆకాశంలోకీ, ఉరుములు మెరుపుల్లోకీ ముఖం తిప్పుకొని వుంటుంది.

 

ఆ ఐదో కిటికీ ముందు

నిలబడి వున్నాను,

అది ఆ ఉత్తరం-

 

అప్పుడప్పుడూ ఓ రెండ్రోజుల మధ్య

అగాధమేదో తెరచుకుంటుంది.

ఆ ఇరవై ఆరేళ్ళూ

జారిపోతాయి వొక్క క్షణంలో-

 

కాలం ముందుకే సాగిపోయే సరళ రేఖ కాదులే!

అదొక రహస్య వలయం.

ఎదో వొక గోడకి వొత్తిగిలి

హడావుడిగా పరిగెత్తే అడుగులూ గొంతుకలూ వింటావ్-

 

అవతలి వైపు నించి నువ్వే

గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

గుర్తు లేదు,

ఎప్పటిదో కదా  ఆ వుత్తరం!

 

ఎన్నో కెరటాలు అటూ ఇటూ తిరుగాడుతూనే వున్నాయి,

తడిసిన నేల మీద గంతులు వేసే కప్పలా-

మనసు

వొక్కో క్షణాన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది.

తుఫానుల్ని కనబోతున్న కారుమబ్బుల్లా పేరుకుపోయాయి జవబివ్వని ఉత్తరాలు.

సూర్యకిరణాల వేడిని కూడా అవి చిన్నబుచ్చుతున్నాయి.

 

ఎప్పుడో వాటికి

జవాబివ్వాలి నేను!

ఎప్పుడో వొకప్పుడు వెళ్ళిపోతాను కదా

అప్పుడైనా వాటి వైపు కాసింత సేపు చూడాలి.

లేదూ

ఇక్కణ్ణించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి

నన్ను నేను తవ్వుకోవాలి కనీసం-

 

ఎప్పుడో వాటికి జవాబివ్వాలి నేను

యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే –

వేల వుత్తరాల సందోహంలో

ఆ పాత వుత్తరం కనుమరుగు కాకముందే-

*

 

 

 

…ఇక ఇది మా ఫ్యామిలీ మిషన్!

1-5

ప్రముఖ రచయిత జాన్సన్ చోరగుడితో…ముఖాముఖి 

 

  1. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిగా, అంతకు మించి అభివృద్ది- సామాజిక అంశాల వ్యాఖ్యాత గా అరవై వద్ద ఆగి, వెనక్కి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది ?

ఈ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగారు, కాని ఎవరూ అడక్క ముందే నాకు నేనుగా దీన్ని – స్థల కాలాల మధ్య నేను అంటూ నా ‘సొంత సంతకం’ వ్యాస సంకలనంలో ముందు మాటగా ప్రకటించాను. “గత మూడు తరాల్లో – తొలి దశలో చర్చి, తర్వాత దశలో రాజ్యం నా కుటుంబాన్ని ఆదుకుంది. చరిత్ర (కాలం) ఒక తరంగంలా మా కుటుంబంలోకి ప్రవేశించి, ఇంటిల్లిపాదినీ అది తన మీద ఉంచుకుని మరీ వర్తమాన పౌరసమాజ ప్రధాన స్రవంతి లో మమ్మల్ని కలిపిందని అన్నాను.”

అయితే ఇప్పటి  నా ఈస్థితి – ఇది నేను నిరంతర అధ్యయనం, కృషి, త్యాగం తో సాధించుకున్నవి. మీరు అడగొచ్చు ఏమి త్యాగం చేశారని ? ప్రభుత్వ సర్వీస్ లో – ఆర్డర్ ఆఫ్ ది డే గా మారిన అపసవ్యాలు చాలా వున్నాయి. ఇప్పుడున్న ప్రమాణాల్లో – వాటికి దూరంగా వుండటం కూడా త్యాగమే!

  1. సుదీర్ఘ కాలం, 34 ఏళ్ళు పాటు ప్రభుత్వ ప్రచార శాఖలో పనిచేశారు. మీ వ్యక్థిగత స్థాయిలో ఇప్పటికీ మీ సర్వీసులు ప్రజలకు ప్రయోజనకరమని మీరు నమ్ముతున్నారా ?

నిజానికి క్లిష్టమైన ప్రశ్న ఇది. కాని జవాబు చెబుతాను. విషయం ఏదైనా కాలము – ప్రాంతము కొలమానాన్ని నేను ప్రామాణికంగా పాటిస్తాను. ప్రభుత్వాలు మారుతుంటాయి గాని, రాజ్యము –  ప్రజలు రెండూ స్థిరంగా వుంటాయి. ఆ రెండింటి మధ్య నిరంతరంగా వుండే ఘర్షణ లో ప్రభుత్వాలు ‘కెటాలిస్ట్‘ పాత్ర పోషిస్తుంటాయి. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ సమాచార – ప్రసార శాఖలు, ఇప్పుడు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాయి. ఎవరు ‘రిస్క్’ లో వుంటే వాళ్ళ పక్షంగా పనిచేయాల్సిన పరిస్థితి అయింది. అర్ధమయింది కదా, ఇప్పుడు బలంగా వున్నది ఎవరో.  ‘యాస్పిరేషనల్ సొసైటీస ’ మధ్య పనిచేసే ప్రభుత్వాల మనుగడ ఇంతకంటే బలంగా వుండే అవకాశం తక్కువ. నిజానికి మేము నాలుగు వైపుల వీటిని 24 / 7 గార్డ్ చేయాలి. అయినా, మా పని ఫలితాలు పాక్షికమే!

ఇలావుందా, మళ్ళీ రేపు ఇవి తలకు మించిన వాగ్దానాలతో జనం ముందుకెళ్ళి మళ్ళీ ఇదే ‘రిస్క్’ తో కొనసాగుతాయి. మాకు మళ్ళీ ఇదే గార్డు పని. ఇలా ప్రజలకోసం పని చేయాల్సిన ఓ శాఖ నిరంతరాయంగా ప్రభుత్వం కోసం పనిచేయడం ఏ భౌగోళిక ప్రాంతంలో వున్నదో – అక్కడి ప్రజలు నిత్యం సమాచార చైతన్య స్థితిలో వున్నారని, మనం అర్ధం చేసుకోవాలి.

  1. అంటే తెలిసి కూడా సెల్ఫ్ రిస్క్ తోనే ఇప్పటి ప్రభుత్వ నాయకత్వాలు ఈ ధోరణి తో పనిచేస్తున్నాయని అంటున్నారా?

 అందులో అనుమానం ఏముంది? ఒకే సమయంలో అందరూ నాయకత్వ స్థానాల్లో వుండడం కుదరదు కదా. ఎవరి స్థానాలు నుంచి వాళ్ళు ‘ఆపరేట్’ చేస్తారు. అందరూ కల్సి ‘కాలాన్ని’ ఇప్పటి స్థితి నుంచి తదుపరి స్తితికి తీసుకెళతారు. కాకపొతే,  ‘వర్చువల్’ స్థానాల్లో వున్నవారు ఆ గెలుపును క్లెం చేయరు. ‘రియల్’ స్థానాల్లో వున్ వారు ఆ పని చేస్తారు.

అధికార స్థానలో వుండీ కూడా రిస్క్ ఎదుర్కోవడం అంటున్నారు, అది ఎటువంటిది?

నేను అంటున్నది నేరుగా వచ్చే ‘రిస్క్’ గురించి కాదు. మన కారణంగా మనo ప్రాతినిధ్యం వహించే సమాజానికి ఎదురయ్యే ‘రిస్క్’ గురించి. చూడండి –  శ్రీ వి.పి సింగ్ 1989-90 మధ్య కేవలం ఒక ఏడాది ప్రధానిగా వున్నారు. కాని, ఆ ఏడాదిలోనే మన దేశానికి అతి కీలకమైన – మండల్ కమీషన్ నివేదిక పార్లమెంట్లో చట్టమై, ఇప్పుడు అది అమలవుతూ వుంది. 1978 లో మురార్జీ దేశాయ్ కమీషన్ వేస్తే, 1980 చివర అది – 27% వెనుకబడిన తరగతులకు అన్ని రాజ్యాంగపరమైన రాయితీలు ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత  అది అమలు కావడానికి పదేళ్ళు పట్టింది!

1992-95 మధ్య నేను గోదావరి జిల్లాల్లో డిపీఅర్వో గా వున్నాను. ఒక అధికారిక  లంచ్ ఇష్టాగోస్టిలో (వి పి సింగ్ – స్థానిక సమాంతర సామాజిక వర్గ) ఓ మాజీ మంత్రి నాతో ఇలా వాపోయారు – ‘ఇప్పుడు గొడ్ల దగ్గర పాలు పితకడం రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఐపోయిందండీ!’ అని. అప్పట్ని0చీ ఇప్పటివరకు జరిగింది మనం చూస్తూనే వున్నాం.

దీనికి ముగింపు ఏమంటే –  ‘పోలిటీ’ నిరంతరం ‘లిటరేచర్’ కు దారులు తెరుచుకుంటూ వెళుతుంది అనే ఓ విశ్వజనీన సత్యానికి ఇది మనకాలపు ఉదాహరణ.  ఆ తర్వాత, మొదట మాకు వద్దే వద్దని ;  కాలక్రమంలో తలొగ్గిన – ఆర్ధిక సంస్కరణలు ఈ దశను ఎక్కణ్ణించి ఎక్కడికి తీసుకెళ్ళాయో కూడా చూశాం. దీనివల్ల లాభమా నష్టమా అనే మాట అటుంచితే, ఇవేవి కూడా  తర్వాత కాలంలో ఇలా అవుతుందని తెలిసి చేసినవి కాదు.

అంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?

 సింపుల్. నడుస్తున్న కాలక్రమంలో ఎవరి సమయంలో వాళ్ళు  – తమ పాత్ర  పోషించి నిష్క్రమిస్తారని. ఉనికి కోసం మనం మన ‘బ్రాండ్లు’ వేసుకోవడానికి  ప్రయత్నిస్తుంటాము గాని,  కాలం మీద అటువంటివేమీ శాశ్వితంగా వుండవని.

ఎందుకంటే,  జరుగుతున్న‘ప్రాసెస్’ మన కంటే పెద్దది. అయితే, మనం మైలురాళ్ళు అంటుంటాము కదా – అవి మాత్రం చరిత్ర లో ‘రికార్డ్’ అవుతాయి. వాటిలో కూడా ముందు వెనుకలు వుంటాయి కాని,  చివరికి దాచగలిగింది మాత్రం ఏమీ వుండదు. వెనకున్నవి కూడా ముందుకు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త చరిత్రలు అవే! గత పాతికేళ్ళ ఈ ‘ర్యాలీ’ లో –  చివరన  ‘టైల్ ఎండర్స్’ గా ఉన్న మనకు కూడా ఇప్పుడు ప్రతిదీ స్పస్టంగానే కనిపిస్తున్నది. అయితే మనం ఎటు చూస్తున్నాం ? అనేది ఎవరికి వాళ్ళం వేసుకోవలసిన ప్రశ్న.

అంటే ఇప్పటి వర్ధమాన సమూహాల ప్రస్థానం పట్ల మీకు అనుమానాలు ఉన్నాయా?

వీరి సమస్య – లక్ష్యాల నిర్ణయంలో ఉందనిపిస్తున్నది. జరగాల్సి వున్న ‘ప్రాసెస్’ లో లోతుల్లోకి వెళ్ళగలిగే గమనం కంటే, విస్తరణకే అధిక ప్రాధాన్యత వుంటున్నది.  అందుకు వాళ్ళనూ నేరుగా తప్పు పట్టలేము. సామాజిక – ఆర్ధిక నేపధ్యం అందుకు కారణం అని ఒక పక్క తెలుస్తూనే వుంటుంది. అలాగే మరో పక్క కంటి ముందు కర్రకు కట్టిన ‘రాజ్యధికారం’ క్యారెట్ ఎటూ టెంప్ట్ చేస్తూనే వుంటుంది. సరిగ్గా ఇదే కాలంలో క్రియాశీలమైన ‘మార్కెట్ ఎకానమీ’ వీళ్లను ఏదోపక్కకు తనతో ఈడ్చుకుపోతున్నది. తర్వాత ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆగి, వెనక్కి తిరిగి చూసుకునేసరికి జీవితకాలం చరమాంకానికి వస్తున్నది. అక్కడ లెక్కలు వేసుకుంటే,  పొందిన వాటికి పోగొట్టుకున్న వాటికి మధ్య – ఎక్కడా పొంతన కుదరడం లేదు! అలాగని, పోగొట్టుకున్న వాటి ఖరీదు(కాస్ట్) తో పొందినవి ఆనందం కలిగిస్తున్నవా? అంటే అదీ లేదు!

 ఈ మీ ధోరణి మీ టార్గెట్ గ్రూప్ కు ఎప్పటికి చేరుతుందంటారు?

నేను అడ్రెస్ చేస్తున్నది, మొదటినుంచీ కూడా అందరినీ. ప్రతి ఒక్కరినీ మనం అడ్రెస్ చేస్తున్నప్పుడు, ‘టార్గెట్ గ్రూప్’ అని గీతలు గీయడం ఎంతవరకు కరెక్టో తెలియదు. అయినా ఈ పనిలో వున్నది నేను ఒక్కణ్ణే కాదు, నాలా చాలా మంది వున్నారు,  వుంటారు.  కొత్త తరాల్లో ఇంకా వచ్చే వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతుంది.

అయినా, గతంలో మనం చూసిన చాలా వాటి మాదిరిగానే – సరళీకరణ రెండవ దశ మొదటి దానికంటే మరింత మార్ధవంగా వుంటుంది. ఇకముందు ఘర్షణ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ‘ఇంక్లూజివ్ గ్రోత్’ స్థానంలోకి, ఇప్పుడిక ‘ఇంక్లూజివ్ గవర్నెస్’ వస్తుంది. అప్పుడు ఈ గమనాన్ని ‘డైజెస్ట్’ చేసుకుని, దానికి ‘ట్యూన్’ అయ్యి రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.

అయినా ఈ క్రమం మొత్తాన్ని స్థూలంగా మనం అర్ధం చేసుకోవడానికి, ఒకసారి చరిత్రలోకి వెళ్ళి – ఖడ్గాన్ని పక్కన పడేసి, మొక్కల్ని నాటించడం మొదలెట్టిన  అశోకుణ్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, మన పని చాలావరకు సుళువు అవుతుంది.

యు.పి.ఎ-2 లో –  ‘కళింగ రాష్ట్రాల్లో’ అప్పటి దాకా వున్న తుపాకుల స్థానంలోకి ఫుట్ బాల్ మైదానాలు రావడం ఇప్పటికే చూశాం. అదక్కడ ఆగలేదు. ఎన్.డి.ఎ ఆ క్రమాన్ని మరింత విస్తరిస్తూ, ఏకంగా నాగాలాండ్ లో పడిన పీటముడిని వదులుచేయడం చూశాం! సరిహద్దున ఉన్న బంగ్లాదేష్ తో పశ్చమ బెంగాల్ కు ఉన్న ఇష్యూస్ సంప్రదింపులకు ప్రధాని మోడి మమతా బెనర్జీ ని తనతో డాఖా తీసుకెళ్ళడం చూశాం.  మారుతున్న కాలానికి తగినట్టుగా మారి, రాజ్యం ప్రయోజనం కోసం ప్రభుత్వాలు తమకు తాముగా విస్తరించుకుంటున్న ‘కాంటూర్స్’ ఇవి.  ఇంతకు ముందు నేను – ‘యాస్పిరేషనల్ సొసైటీస్’ కోసం ప్రభుత్వాలు తలకు మించిన వాగ్దానాలు చేస్తాయని  అన్నాను  , సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు – ఇదంతా పెంచుకుంటూ వెళుతున్నఆ ‘కాంటూర్ల’ లో భాగమే!

ఇంతకు ముందు మీ సొంత సంతకం’’ ముందు మాటలో కూడా కాంటూర్ల వద్ద నేను పని చేస్తున్నాను, బౌండరీలు దాటి వచ్చేశాను అన్నారు. ఏమిటవి మీరంటున్న కాంటూర్లు?

 నిజమే ‘సొంత సంతకం’ లో నేను ఆ మాట  అన్నాను. అయితే – ‘స్థల కాలాదుల మధ్య నేను…’ అంటూ అలా చెప్పాను. అప్పుడు ఇప్పుడు కూడా స్థల-కాలాలే నాకు  ప్రామాణికం. చూడండి – గడచిన పాతికేళ్ళలో మనం చూస్తూ వుండగానే భూమి (ప్రపంచం) ఇంత చిన్నది అయింది కదా, మరి ఇంకా ఉనికిలోకే రాని మనం చూడని మరో తరం – మనం ఇప్పుడున్న ఈస్థలంలో ఎలా వుండబోతున్నదీ ఒక్కసారి మనం ‘విజులైజ్’ చేస్తే, మనకు ఏమి కనిపిస్తుంది? మరి మనకు ఉండాల్సిన చూపు – మన మధ్య మనమే గీసుకున్న ‘బౌండరీలా’ మధ్యా లేక అంతకు మించిన ‘కాంటూర్ల’ కావలా?

అయినా ఇక్కడ ఓ మాట చెప్పాలి. ఇదంతా నా యాభైల తర్వాత మొదలయిది. 2006 తర్వాత విశాఖలో ఉన్నప్పుడు, మరోసారి బైబిల్ చదవడం మొదలెట్టాను. అప్పుడది పూర్తిగా మునుపటికి భిన్నంగా అర్ధంకావడం మొదలయింది. అదే కొన్ని వ్యాసాలుగా అప్పట్లో రాశాను. స్థల-కాలాల మధ్య నిలబడి చూడవలసిన అంతిమ అవసరం అప్పుడే స్పష్టమైంది. ఇప్పుడు నా స్టాండ్ ఏమిటో నాకు తెలుసు.   దాంతో కనిపిస్తున్న ప్రతిదీ (కనీసం) అర్ధమవుతున్నది. అది ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా,  అవసరం మేరకు తీసుకోవడం అనేది మనకుండే విచక్షణ.

మరి మనవద్ద మిమ్మల్ని అర్ధం చేసుకునేవారు ఉన్నారని మీరు అనుకుంటున్నారా?

అది మనకు సంబంధం లేని ప్రశ్న.

‘రాయడం’ నాకు తెలుసు. అయినా మన పని మనం చేసుకువెళుతూవుంటే… ఆ క్రమంలో అటువంటి వారు ఎప్పుడో ఒకసారి తారసపడతారేమో. ఆ కంటెంట్ జనానికి చేరే క్రమంలో మనం అర్ధమైన వాళ్ళు కూడా వుంటే వుండొచ్చు. అయినా ఒకటి రెండు స్వీయ అనుభవాలు చెప్పాలి.

విశాఖలో ఉండగా 2008 లో ఒకరోజు ఉదయం 10 గం. లకు ఆఫీస్ కు బయలుదేరి వెళుతుండగా కాళీపట్నం రామారావు గారు ఫోన్ చేసి ‘రామాటాకీస్ జంక్షన్లో ఉన్నాను, మీతో మాట్లాడాలి ‘అన్నారు. నేను అయన్నికలిసి పెద్దాయనతో రోడ్డు మీద ఏమి మాట్లాడతాం అని ;

‘మీ తర్వాత పని ఏమిటి?’  అడిగాను.

జగదాంబ వద్ద ఏదో పని వుందన్నారు, దానికి దగ్గర్లో జిల్లా కోర్టుల ముందు వున్న మా డిపీఅర్వో ఆఫీస్ కు తీసుకెళ్ళా. ఇద్దరం డిపీఅర్వో గదిలో కూర్చున్నాం.మమ్మల్ని చూసి ప్రెస్ లాంజ్ లో వున్న జగదీశ్వరరావు గారు (హిందూ) వచ్చారు. కాఫీలు అయ్యాక, ‘కారా’ – నేను ఇద్దరమే మిగిలాం.

‘ఒక విషయం మీతో చెప్పాలని వచ్చాను’ అని మొదలెట్టారు. ‘కన్ను సహకరించక అన్నీ చదవడంలేదు, కాని చదివే కొద్దివాటిలో మీవి వుంటాయి’ అన్నారు.

కాస్సేపు ఆగి – ‘ మీ చూపుకు పాదాభివందనం చేస్తున్నాను ’ అన్నారు. దానికి ముందు గాని దాని తర్వాత గాని ఇంకేమీ లేదు.

నేను నమస్కారం  చేశాను.

వస్తానని లేచారు. డ్రైవర్ ను ఇచ్చి దింపి రమ్మన్నాను.

ఎవరితో అన్లేదు.

అర్ధం కాలా.  వయస్సు సమస్య కావచ్చు అనుకుని, చానాళ్ళ తర్వాత  ‘కారా’ తో సాన్నిహిత్యం వున్న మిత్రుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారిని జరిగింది చెప్పకుండా అడిగాను,

‘….అది గాని  ఆయనకు ఊత పదమా? ’ అని. ‘ ఆయన అలాంటి మాటలు అనరు ’ అన్నారు తుమ్మేటి.  ఇది జరిగిన ఏడెనిమిది ఏళ్ల తర్వాత ఈ మధ్యనే నా భార్య కృష్ణవేణి కి జరిగింది  చెప్పాను.

మరో సంఘటన  –

విశాఖలోనే చలసాని ప్రసాద్ గారు పరిచయం. ఇద్దరి ఊళ్ళ మధ్య చుట్టరికం కలిసింది. 2014 చివర ఒక రోజు ఫోన్. ‘ఇప్పుడే ఈ షాపులో మీ ‘ సొంత సంతకం ’ పుస్తకం చూశాను. నాకు ఒక కాపీ పంపండి, ఫలానా మిత్రుడి ఇంట్లో దిగాను’ అని. పంపాను.

కొన్నాళ్ళకు బెజవాడ ఐ ఎం ఏ హల్లో జరిగిన ఓ సాహిత్య సభలో కలిసి పలకరించుకుంటూ టీ తాగాం, సభలో కూర్చున్నాం. ఇంతలో వర్షం.  మధ్యలో, అనుకోకుండా టాయ్ లెట్స్ వద్ద ఇద్దరమే కలిశాం. నా పుస్తకం గురించి ఆయన అక్కడ ప్రస్తావించారు! “చదివాను, వూ…రాయాలి… రాస్తేనేగా… తర్వాత వాళ్లకు తెలిసేది… “ అనుకుంటూ అక్కణ్ణించి నిష్క్రమించారు.

చిన్న నవ్వుతో జవాబు ఇచ్చాను.

johnson

మిమ్మల్ని ఎలా చూడాలని లేదా ఎలా అర్ధం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు?

 నన్ను వదిలేయండి.

నేను రాసిన నా రచనలు చూడండి. 2001 జనవరిలో విడుదల అయిన నా – ‘మన విజయవాడ లో (పేజి:48) –‘మన విజయవాడ కధను ఎక్కడ ముగించాలి?’ అంటూ… ‘ఈ నగర ఆత్మకధకు ఫుల్ స్టాప్ పెట్టడం కుదిరే పని కాదు, అంటూ ఇది 24X7 నగరం, ఇది ఒక రైల్వే ఫ్లాట్ ఫారం వంటిది, వూరంతా మత్తుగా జోగుతున్నప్పుడు ఏ నిశి రాత్రి లోనో – ఓ కొత్త రైలు రావొచ్చు, మళ్ళీ అప్పుడు యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ మరో కొత్త అధ్యాయం రాస్తాను. అయితే…రాబోయే కొత్త రైలు రాజధాని ఎక్స్ ప్రెస్సా?’  అని ముగించాను. మీకూ తెలుసు, అప్పటికి ‘టీఅరెస్స్’ ఇంకా పుట్టలేదు.

2001  నుంచి  రాసిన నా ‘సొంత సంతకం’ వ్యాసాలు చూడండి. అందులో – ప్రజలు,  ప్రాంతము, అని  ఏకంగా  రెండు అధ్యాయాలే వున్నాయి. 2010 తర్వాత విభజన జరిగే వరకు అటు వున్నాను, జరిగాక ఇటు వున్నాను. జరిగిన  వెంటనే – దేశం చూపు ఇప్పుడు ఎపి వైపు!’ అని రాశాను. మన విశాఖను అమెరికా స్మార్ట్ నగరం అంది! భారత్ – తన ఆగ్నేయ ఆసియా దేశాల సంబంధాల విస్తరణ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ‘షోకేస్’ చేస్తున్నది. ఆగ్నేయ ఆసియా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు వచ్చి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాయి.

మమతా బెనర్జీని ప్రధాని బంగ్లాదేష్ తీసుకు వెళ్ళడమైనా, శివరామ క్రిష్టన్ కమిటీ నివేదిక స్పూర్తి దెబ్బ తినకుండా, రాజధాని విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవను  కేంద్రం అనుమతించడమైనా – మునుపటి ఎల్లలు చెరుగుతున్న ‘ప్రాసెస్’ లో భాగం గానే చూడాలి.  అలా కాకుండా, మొదటినుంచీ మనకు తెలిసిన – ‘ఐదేళ్ళ ఎపిసోడ్ గా చూస్తే కన్ ప్యూజన్ తప్ప మరేమీ మిగలదు.

ఇప్పుడు కూడా  ‘ఆ… సి ఎం కోసమా ఇదంతా?’ అంటే , ఇంక చెప్పడానికేముంది.

ప్రభుత్వాలు వచ్చి పోతుంటాయి. కాని, రాజ్యం నికరం అనే ఎరుక కలిగివుండే స్థాయికి – ఇప్పటికీ మన మధ్య తరగతి కూడా రాకపోవడం ఇంక ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, రాజ్యం పట్ల వారికి ఆ ఎరుక రాకుండా నిరంతరం నిఘాతో చూసే ప్రభుత్వ చతురతను అర్ధం చేసుకోలేకపోవడమే – ఇప్పటి విషాదమంతా. వాస్తవానికి, రాజ్యం అంతరిస్తుంది అనేది మనం చదివిన శాస్త్రం!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ల ప్రాసెస్ ను విస్మరించడం ఎలా కుదురుతుంది?

2016  నాటికి మన దేశంలో సంస్కరణలు మొదలై 25 ఏళ్ళు అయింది. ఇక్కడ్నించి ఒక పదేళ్ళు వెనక్కి వెళదాం. పోనీ మీ సౌలభ్యం కోసం 2004 నుంచి చూద్దాం, దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఎపి కి 22 సెజ్ (ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు)ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాటిలో వరసగా పారిశ్రామిక వాడలు వస్తున్నాయి. వాటి రవాణా కోసం ఇప్పుడు ఇక అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి – విత్తనం చెడ్డదా లేక నేటి మొక్క, రేపటి చెట్టు చెడ్డవా? దీన్నే నేను కాలము-ప్రాంతము అంటున్నది. ఇప్పుడు మీరు మీ ఐదేళ్ళను ఎక్కడని వెతుకుతారు? దాన్ని ట్రేస్ చేయడం మీ వల్ల అవుతుందా?

 రిటైర్ అవుతున్నారు కనుక అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇవన్నీ చెప్పారు, ఇక ముందు మీ ప్లాన్స్ ఏమిటి?

కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేశాను. చేస్తూనే సమాంతరంగా నాదంటూ ఒక చూపును స్వంతం చేసుకోగలిగాను. దాన్ని ఇప్పుడు మరింత స్వేచ్చగా అది తాకినంత మేర దిగంతాలకు సారించడానికి ప్రయత్నిస్తాను.

నా ఆలోచనలను రేపటి తరం గీటురాయి మీద చూసుకోవడానికి ఇంట్లోనే నాకు ఒక లగ్జరీ కుదిరింది! కూతురు అల్లుడు ఆర్ధిక శాస్త్రవేత్తలు. కొడుకు సామాజిక శాస్త్రవేత్త. రేపు కోడలుగా ఏదో ఒక సామాజిక రంగ నిపుణురాలే రావచ్చు. మా అందరికీ ఆక్సిజన్ మా హోం మేకర్ కృష్ణవేణి. విస్తృత  ఎరీనా లో ఇకముందు ఇది ఫ్యామిలీ మిషన్!!

*

 

 

 

మా చిన్న చెల్లెలు

 

Kadha-Saranga-2-300x268

ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది.

“చిన్నమ్మమ్మా,  ఏంటీ పొద్దుటే ఫోన్‌ చేశావు? బాగున్నావా?”

“నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె.

“సరే, ఏం తీసుకురమ్మంటావు?”

“ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి.

*

సాయంత్రం బజార్లో దొండకాయలూ, తోటకూరా, నాలుగు అరటికాయలూ కొనుక్కుని గాంధీ నగర్ లో ఉన్న జయలక్ష్మి ఇంటికి చేరింది గాయత్రి. వస్తూనే, “చిన్నమ్మమ్మా, నువ్వెందుకూ ఒక్కదానివే ఇంతదూరాన ఉండటం, వచ్చి మాతో ఉండరాదూ?” అంది, కూరగాయలు టేబుల్ మీద పెడుతూ. జయలక్ష్మి నవ్వి వూరుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మమ్మ రాజ్యలక్ష్మి చనిపోయినప్పటనుంచీ ఈ పిల్లలు తనని వాళ్ళతో వచ్చి ఉండమని అడుగుతూనే ఉన్నారు. కానీ తనకు బాగా అలవాటైన తన ఇల్లు వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు.

ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చి జయలక్ష్మి పక్కనే కూర్చుంది గాయత్రి.  “ఏంటి చిన్నమ్మమ్మా, ఏదో మాట్లాడాలన్నావు?”

ముందు  దొండకాయకూర చేద్దామా, అరటికాయకూర  చేద్దామా  అని  ఆలోచిస్తూ,  ఆమెవైపు చూడకుండానే మృదువుగానే అడిగింది జయలక్ష్మి. “నువ్వు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లోపెట్టుకున్నావని విన్నాను. నిజమేనా?”

“అవును, నిజమే,” అంది గాయత్రి. ఆ అమ్మాయి గురించి చెప్పడం ఎక్కడ మొదలుపెట్టాలా  అని ఆలోచిస్తూ.

“ఎవరా అమ్మాయి?”

“మా చెల్లెలే. నాన్న రెండో భార్య కూతురు,” అంది గాయత్రి, క్లుప్తంగా.

“అలాగానా? అతనికి మీరుగాక ఇంకా  బిడ్డలున్నారని నాకు తెలియదే.”

“మాకూ తెలియదు.  పోయిన ఏడో తేదీన నీకు ఫోన్‌ చేశాం గుర్తుందా? ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్‌ చేసి మీ నాన్న చనిపోయాడు, అంత్యక్రియలకు రమ్మని చెప్పారని. ఆ ఫోన్‌ చేసింది ఈ అమ్మాయే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది,  అమ్మను వదిలేసి నాన్న ఒకావిడతో వెళ్ళిపోయాడే, ఆమె ఒక బిడ్డను కని మూడు సంవత్సరాల తర్వాత చనిపోయిందట. తర్వాత నాన్న మళ్ళా పెళ్ళిచేసుకున్నాడట. ఆ  మూడో  భార్య  గురించి  నాకు  పెద్దగా  తెలియదు  గాని,  ఆమెకు  ఏవో  సమస్యలున్నట్లున్నాయి. చివరి రోజుల్లో నాన్నకు సపర్యలు చేసింది రెండో భార్య కూతురే. చనిపోయాడని మాకు ఫోన్‌ చేసింది కూడా ఆ అమ్మాయే.”

జయలక్ష్మి ముభావంగా మౌనంగా ఉండిపోయింది కొంతసేపు. అరటి కాయలను సింక్ దగ్గరకు తీసుకుపోయి కడుక్కొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ, “నువ్వు తీసుకొచ్చింది ఆ అమ్మాయినా?” అని అడిగింది.

“అవును చిన్నమ్మమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరూలేరు. ఆ అమ్మాయి మమ్మల్ని ఏమీ అడగలేదు. అంత్యక్రియలు తనే చేసింది. మేం వస్తామని అనుకోలేదనుకుంటాను. తిరుగు ప్రయాణం రోజు,  వచ్చినందుకు మాకు కృతజ్నతలు చెప్పి వెళ్ళబోతుంటే, నేనే అడిగాను తన గురించి. ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు. హైస్కూల్లో చదువుతుంది. తనకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి మా చెల్లెలేకదా? పెద్ద కూతురుగా చివరి రోజుల్లో నాన్నకు నేను చెయ్యాల్సిన పనులు ఆ అమ్మాయి చేసింది. మా ముగ్గురికీ ఏవో ఉద్యోగాలున్నాయి. తిండికి లోటులేదు. పెద్ద ఇల్లుంది. నేనే మాతో వచ్చి ఉండమన్నాను. పల్లవి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు పల్లవి. మా అడ్రెస్ ఇచ్చి నీకు ఇష్టమైనప్పుడు మా దగ్గరకు రావచ్చు అని చెప్పాను. పోయిన వారం వచ్చింది.”
జయలక్ష్మి  కొంచెంసేపు ఈ విషయాలన్నీ జీర్ణించుకుంటున్నట్లు ఉండిపోయి, “అయితే ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అనుకుంటున్నావా?” అని అడిగింది.

“అవును. తల్లిలేకుండా పెరిగింది. హాయిగా ఉండాల్సిన  చిన్న వయసులో నాన్నకు సేవలు చేస్తూ గడిపింది. ఇప్పుడు వచ్చి వారం రోజులయింది కదా. ఇంటి పన్లన్నీ తనే చేస్తానంటుంది. ఏదన్నా అడిగితేగాని మాట్లాడదు. ఆ అమ్మాయిని  చూస్తుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డదో అనిపిస్తుంది.”

“సరే, అమ్మాయి మంచిదే. కానీ ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అని నువ్వెందుకనుకుంటున్నావు? ఇద్దరు చెల్లెళ్ళను పెంచావు చాలదా?”

“అలా అంటావేం చిన్నమ్మమ్మా? మేము కాకపోతే ఆ అమ్మాయికి ఇంకెవరున్నారు?”

“ఉన్నారా లేరా అని కాదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? నీకు లేకుండా  పోయిన బాల్యం ఆ అమ్మాయికికూడా లేకుండా పోయిందని నువ్వు విచారిస్తున్నావు. మీ అమ్మా నాన్నలు పనికిమాలిన వాళ్ళు కావటంతో చిన్నప్పుడే బాధ్యతలు నీ మీద పడ్డాయి. ఆ అమ్మాయిక్కూడా నీలాగే చిన్నతనంలోనే బరువైన బాధ్యతలు మొయ్యాల్సొచ్చింది. ఆ అమ్మాయిలో నువ్వు నిన్ను చూసుకుంటున్నావు. కానీ పదిహేను సంవత్సరాల అమ్మాయిని పెంచడం ఎంత బాధ్యతతో కూడిన వ్యవహారమో తెలుసు కదా? నువ్వు ఇంకా పెళ్ళిచేసుకోలేదు. పెళ్ళికావాల్సిన చెల్లెళ్ళు ఇంకా ఇద్దరున్నారు. ఇప్పుడు ఇంకొక చెల్లెలా?” అందామె.

ఈ బాధ్యతల భారం గాయత్రికి తెలియని విషయం కాదు.  కాని, ఎవ్వరూ లేని చెల్లెలిని అలా ఎలా వదిలేస్తుంది? పైగా ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా చివరి రోజుల్లో నాన్నను చూసుకుంది!

గాయత్రి లేచి తోటకూర ఆకుని సింకులో శుభ్రంగా కడుగుతూ అక్కడే కొంచెంసేపు నిలబడింది.

జయలక్ష్మి కూడా అరటికాయ ముక్కల గిన్నెను తీసుకుని స్టౌ దగ్గరకు వచ్చి గాయత్రి భుజం మీద చెయ్యి వేసి, “వయసుతోపాటు రావాల్సిన తెలివి మీ అమ్మకు రాలేదు. నీకేమే వయసుకు మించిన తెలివీ మంచితనం ఇచ్చాడు భగవంతుడు,” అంది.

*

పల్లవి చీరాల వచ్చి దాదాపు మూడు నెల్లయింది. సులభంగానే అక్కలతో కలిసిపోయింది. హైస్కూలునుంచి రాగానే బట్టలుతకటమో, వంటచెయ్యడమో, ఇల్లు శుభ్రం చెయ్యడమో, బయట దొడ్లో పూలమొక్కలకూ కూరగాయల పాదులకూ నీళ్ళుపొయ్యడమో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పెద్దక్క గాయత్రి అంటే గౌరవం, కొంచెం భయం కూడా. గాయత్రి అక్క కంటే, అమ్మలాంటిది అనే అభిప్రాయం ఏర్పడింది పల్లవికి. రెండో అక్క శివాని ఒక బాంక్ లో పనిచేస్తుంది. అక్కడ తనతో పనిచేసే ఒకతనంటే ఇష్టం లాగుంది. వీలు దొరికినప్పుడల్లా అతని మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. చిన్నక్క వాసంతి పల్లవి కంటే మూడు సంవత్సరాలు పెద్దది.  వాగుడుకాయ. టౌన్లో ఒక చెప్పులషాపులో పనిచేస్తుంది. తన బాయ్ ఫ్రండ్ కూడా తనలాగే వాగుడుకాయ. సాయంత్రం ఎప్పుడన్నా ఇంటికి వస్తాడు. అందరికీ కబుర్లు చెప్తాడు. ప్రస్తుతం ఉద్యోగం ఏదీ ఉన్నట్లు లేదు.

వాసంతితో మాట్లాడటం సులభంగా ఉండేది పల్లవికి. ఇద్దరి మధ్యా వయసులో పెద్ద తేడా లేదు. గాయత్రితో మాట్లాడటం అంటే కొంచెం భయంగా ఉండేది. కానీ తొందరలోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం  ఏర్పడింది.  తండ్రి ఇల్లు వదలిపోయేటప్పటికి గాయత్రికి ఇప్పుడు పల్లవికున్న వయసు.  ఆరోజుల్లో ఆయనకు సాయంత్రం సముద్రపు ఒద్దున నడవడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తనకు కూడా సముద్రం అంటే ఇష్టం అవడంవల్ల ఎప్పుడూ నాన్నతో వెళ్ళేది గాయత్రి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు  కూడా ఆయనకు నడవడం అంటే ఇష్టంగా ఉండేదని చెప్పింది పల్లవి. నాన్న బయటకు వెళ్ళినప్పుడు పల్లవి వెంటవెళ్ళేది. తండ్రితో గడిపిన సమయం గురించి మాట్లాడుకుంటూ, ఆ జ్నాపకాలు  పంచుకుంటూ పల్లవీ గాయత్రీ కొంత దగ్గరయ్యారు.

*

ఒక సాయంత్రం తన ఫ్రండ్ తో సినిమాకి వెళ్ళడానికి తొందర తొందరగా రెడీ అయి ఇంట్లోంచి బయటకు పరుగెట్టిన శివాని రబ్బర్ బంతిలాగా తిరిగి ఇంట్లోకొచ్చి పెద్దగా అరిచింది, “అమ్మా, చిన్నమ్మమ్మా వస్తున్నారే గాయత్రీ!”

అక్కా  చెల్లెళ్ళు ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చారు. పల్లవి తలుపు వెనక నిలబడింది. వీళ్ళను ఇదివరకు ఆ అమ్మాయి చూడలేదు.

అమ్మ మూడు సంవత్సరాలప్పుడు వదిలేసివెళ్ళిన వాసంతికి ఆమె రూపురేఖలు ఎలావుంటాయో తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంతో అందంగా, హుందాగా కనిపించింది. దాని బుగ్గలు నిమిరి, “నువ్వు వాసంతివి కదూ, ముద్దుగా ఉన్నావు,” అంది శారద. శివానిని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దుపెట్టింది. గాయత్రి ముందుకు రాలేదు. చెల్లెళ్ళ వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి, “బాగున్నావా?” అంది శారద. గంభీరంగా అలాగే మాట్లాడకుండా నిలబడింది గాయత్రి. ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి ఇంట్లోకి నడిచింది శారద.

హాల్లోకి  వచ్చి  ఒక్కసారి  చుట్టూ చూసింది శారద. పదిహేను సంవత్సరాల నాడు వదిలేసి వెళ్ళిన ఇల్లు. పెద్దగా మారలేదు.

ఐదుగురూ  హాల్లో  కూర్చున్నారు.  అక్కచెల్లెళ్ళకు ఎన్ని  ప్రశ్నలో.  మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి పోయావు? ఇప్పుడెక్కడుంటున్నావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా? ఇప్పుడెందుకొచ్చావు? కానీ, అడిగే ధైర్యం లేదు, చనువూ లేదు. వాళ్ళకి ఇప్పుడామె పరాయి మనిషి.

తన పూర్వ చరిత్ర గురించి మాట్లాడే ధైర్యం ఆమెకూ లేదు. ఇప్పుడు సంజాయిషీలు  చెప్పి  ప్రయోజనం కూడాలేదు.  వాళ్ళకు  తన  అవసరం లేదిప్పుడు.  తను  లేకపోయినా,  ఆమె  బతికున్నన్నాళ్ళూ  అమ్మ  మనుమరాళ్ళను  బాగానే  పెంచింది. అదృష్ట వశాత్తూ పిల్లలు బాగానే పెరిగి  పెద్దవాళ్లయ్యారు.

ఏవో పైపై మాటలూ, ఉద్యోగాలూ, తోటలో మొక్కలూ ఇలాంటి విషయాల మీద సాగింది వాళ్ళ సంభాషణ.

సడెన్‌గా ఏవొక్కరివైపూ కాకుండా ఎదురుగా కూర్చున్న కూతుళ్ళ వైపు చూస్తూ, “ఇల్లు అమ్మేద్దాం  అనుకుంటున్నాను,” అంది శారద.

“ఏ ఇల్లు?” అడిగింది గాయత్రి.

“ఈ ఇల్లే.”

“ఈ ఇల్లు అమ్మటానికి నువ్వెవ్వరూ? పదిహేను సంవత్సరాలుగా ఈ ఇంటిని చూసుకుంది మేము. ఇంటి చుట్టూ శుభ్రం చేసింది మేము.  దొడ్లో మొక్కలకు నీళ్ళు పోసింది మేము. ఇప్పుడొచ్చి  ఇల్లు  నీదైనట్లు  మాట్లాడ్డానికి  సిగ్గులేదూ?

“ముగ్గురు  బిడ్డల్నొదిలేసి  నీ  దోవ నువ్వు పోయావు. అమ్మమ్మ లేకపోతే మేం ఏమైపోయేవాళ్ళం? పాపం అంత  వయసులో  ఎన్ని  కష్టాలుపడిందామె  మాకోసం!  ఆమె పోయినప్పుడుకూడా రాలేదు నువ్వు. నీకు తల్లీ అక్కర్లేదు, బిడ్డలూ అక్కర్లేదు. నువ్వసలు మనిషివేనా?” ఇన్నాళ్ళూ దాచుకున్న కోపాన్నంతా ఒక్కసారిగా  వెళ్ళగక్కింది గాయత్రి.

తల్లి  చనిపోయిన  విషయం నిన్న  పిన్ని చెప్పిందకా శారదకు తెలియదు.  కొంచెం సేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయిందామె. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని నొక్కింది జయలక్ష్మి. భావోద్రేకం కొంచెం తగ్గిన తర్వాత, “మీ నాన్న నన్నూ మిమ్మల్నీ వదిలేసి ఆవిడతో లేచిపోయి….. నాకీ  వూళ్ళో తలెత్తుకు తిరగడం వీలుకాకుండా చేశాడు,” అని మాత్రం అంది శారద.

“ఆయనొక పనికిమాలిన వాడు, నువ్వు అంతకంటే ఏమీ తక్కువ కాదు. ఏదో మీ చావు మీరు చచ్చారు. ఈ ఇల్లు  మాత్రం నీది కాదు, మాది. ఇల్లు అమ్మే అధికారం నీకు లేదు,” అంది గాయత్రి.

శారద చేతిని మళ్ళా నొక్కిపట్టుకుంది జయలక్ష్మి.

“సరే, నీ ఇష్టం. ఎపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు అడిగితే మీక్కూడా ఎపార్ట్మెంట్లయితే సులభంగా ఉంటుందేమో అనుకున్నాను. కొంత  డబ్బిస్తామన్నారు.  మూడు ఎపార్ట్మెంట్లు కూడా  ఇస్తామని అన్నారు. సరే మీ ఇష్టం,” అంది శారద.

“మాకు వాళ్ళ ఎపార్ట్‌మెంట్లు అవసరం లేదు. ఇక్కడయితే అందరం కలిసుంటాం. పైగా, ఇప్పుడు మేము ముగ్గురం కాదు,  నలుగురం,” అని “పల్లవీ” అని పిలిచింది గాయత్రి.

తలుపు వెనుక నుంచి వచ్చి గాయత్రి పక్కన నుంచుంది పల్లవి.

“ఈ అమ్మాయి నాన్న రెండోభార్య కూతురు,” అని పరిచయం చేసింది.

పల్లవి రెండుచేతులు జోడించి తల వంచి నమస్కారం చేసింది.

“పిన్ని చెప్పింది నిన్న,” అని, పల్లవిని దగ్గరకు రమ్మని పిలిచి, ఆ అమ్మాయి తల నిమిరింది శారద.

*

ఒక గంటసేపు ఉండి పిన్నితో వెళ్ళిపోయిందామె. వెళ్తూ తనకూతుళ్ళకూ పల్లవికీ తీసుకొచ్చిన డ్రెస్సులు ఇచ్చిపోయింది.

ఆమె వెళ్ళిపోగానే, “నువ్వెప్పుడూ అంతేనే గాయత్రీ, నీకు ఆమంటే ఎప్పుడూ కోపమే. కొంచెం బాగా మాట్లాడితే నీదేం పోయేది?” అని తప్పుపట్టింది వాసంతి.

“నీకంత ఇష్టంగా ఉంటే ఆమెతో వెళ్ళు, నేనేమీ బలవంతం చెయ్యడం లేదు నిన్ను ఉండమని,” అంది గాయత్రి.

“ఎందుకే అక్కని అలా అంటావు. ఆమె వదిలేసిపోతే మనల్ని సాకింది అక్కేగదా? అక్కకు ఆమాత్రం కోపం రాదా? అక్కా అమ్మమ్మా నీకు ఎలాంటి లోటూ రాకుండా పెంచారు. అందువల్ల నీకు తల్లిలేని లోటంటే ఏంటో తెలియదు. సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో అక్కమీద ఎంత బాధ్యత పడిందో నీకేం తెలుసు?” అని జాడించింది శివాని.

“తెలుసులేవే. కానీ అది అంతా అమ్మ తప్పేనా? ఆ దరిద్రపుది పెళ్ళై, ముగ్గురు బిడ్డలున్నవాడిని వల్లో వేసుకుని తీసుకుపోయింది. మరి అమ్మకు కష్టంకదా? పాపం, ఎంత బాధపడిందో!” అంది వాసంతి.

పల్లవి తన గదిలో ఉందేమో, అంతా వినపడుతుందేమో అని సంకోచిస్తూ,  “తప్పంతా పరాయివాళ్ళమీద నెడితే ఎలాగే? నాన్నకు బుద్ధుండొద్దూ? ముగ్గురు బిడ్డలున్నవాడు ఇంకొకావిడతో సంబంధం పెట్టుకోవడమేంటీ?” అంది శివాని.

“అవును ఆయన బుద్ధిలేనివాడే. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడంతప్పే. మరిప్పుడు  అక్క చేస్తుందేమిటీ? దాని ఫ్రండ్ కి పెళ్ళయింది కదా? మరి ఇన్ని తప్పులుపట్టే అక్క అతనితో స్నేహం చెయ్యటం తప్పుకదా?” అని గాయత్రి వైపు చూసింది వాసంతి.

గాయత్రి చివాలున అక్కడనుంచి లేచి తన రూమ్‌ కి వెళ్ళిపోయింది. తలుపు వెనకనుంచి అంతా వింటున్న పల్లవి తన గదిలోకి వెళ్ళిపోయింది.

*

రెండుమూడు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. నిజానికి మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారేమో.

ఒక రాత్రి భోజనాల తర్వాత పల్లవి గదిలోకి వచ్చింది గాయత్రి. మంచం మీద ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. శారద వచ్చిపోయింతర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలవడం ఇదే మొదటి సారి. తలవంచుకుని కూర్చున్న పల్లవి కళ్ళవెంట నీళ్ళు రావడం గమనించింది గాయత్రి.

“ఎందుకు పల్లవీ, నువ్వెందుకూ ఏడుస్తున్నావు?”

“మీ అందరికీ నావల్లే కదక్కా  ఇన్ని కష్టాలు. నేను పుట్టకపోతే మీరందరూ బాగుండేవాళ్ళు కదూ?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా అమ్మాయి.

“అదేంటి పిచ్చి పిల్లా. ఇందులో నీ తప్పేముందీ. మా నాన్నా, మీ అమ్మా వెళ్ళిపోయినప్పటికి నువ్వింకా పుట్టలేదుకదా? ఇందులో నీ తప్పు ఏముందీ?”

“మా అమ్మే కదా అక్కా మీ కుటుంబాన్ని నాశనం చేసింది.”

పల్లవిని దగ్గిరకు తీసుకుని తల  నిమిరింది గాయత్రి.

“చానాళ్ళు  నేనూ  అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకొవడం లేదు.”

తలపైకెత్తి గాయత్రి కళ్ళల్లోకి చూసింది పల్లవి.

పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, “మీ అమ్మకు ఆరోజుల్లో ఏవో ఇబ్బందులుండేవి. ఆమెకు నాన్న సహాయం చేస్తూ దగ్గరయ్యాడు. మా అమ్మ వాళ్ళను అనుమానిస్తూ నాన్నను దూరం చేసుకుంది. ఇందులో అందరి ప్రవర్తనలో లోపాలున్నయ్. తప్పంతా మీ అమ్మది అనడం సరైంది కాదు,” అంది గాయత్రి.

“కానీ, నాన్న అప్పటికే పెళ్ళైనవాడు కదా. మా అమ్మ…..”

“పల్లవీ, మొన్న వాసంతి అన్న మాటలు విన్నావుగా నువ్వు. అక్క చేస్తుంది కూడా తప్పేగదా అంది గుర్తుందా?”

తల ఊపింది పల్లవి

“మీ అమ్మను తప్పు పట్టడం సులభం. కానీ…ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ మనిషి మంచితనం, పనితనం, సభ్యతా, అందరికీ అతను ఇచ్చే గౌరవం నీకు ఇష్టం అవుతాయి. ఆ మనిషి మీద గౌరవం ఏర్పడుతుంది. మనసులో అతనితో ఏవో తెలియని సంబంధాలు  బలపడతాయి. కాని అతనికి పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ముందు పెళ్ళయిందో లేదో కనుక్కుని, కానివారికే దగ్గిరవాలా? అలా  చేస్తే  అదేదో వ్యాపారం లాగా ఉండదూ?”

పల్లవి ఏమీ సమాధానం చెప్పలేదు.

“మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భరద్వాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య స్నేహం ఏర్పడ్డాక చాలా కాలానికి నాకు అతని వ్యక్తిగత విషయాలు తెలిశాయి. అతనికి పెళ్ళయి దాదాపు పదేళ్ళయింది.  మొదటి రెండు మూడేళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఆ తర్వాత క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. అతనికి పెళ్ళి అయింది కాబట్టి  నేను అతన్ని దూరంగా ఉంచాలా? స్నేహాన్ని తెంపేసెయ్యాలా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడి ఉంటుంది. మనం పెళ్ళిచేసుకుందాం అని చాలా సార్లు అడిగాడు భరద్వాజ్. నేను ఇంతవరకూ ఒప్పుకోలేదు. నాకు బాధ్యతలున్నాయనీ, నేను పెళ్ళిచేసుకోలేననీ చెప్తూ వచ్చాను. కానీ పెళ్ళయింది కాబట్టి అతనికి జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా? ఇష్టంలేని మనిషితోనే జీవితం గడపాలా? అతనితో స్నేహం చెయ్యడం తప్పా? పెళ్ళికి ఒప్పుకోకపోవడం తప్పా? ఏమో. అన్నీ ప్రశ్నలే. సంతృప్తికరమైన సమాధానాలే లేవు.”

పల్లవి ఏమీ మాట్లాడలేదు.

పల్లవి తల నిమురుతూ, “ప్రశ్నల దగ్గరే  ఆగిపోయాన్నేను. మీ అమ్మ ధైర్యం చేసి ఒక బాటను ఎంచుకుంది. ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపోయింది,” అని పల్లవి తల మీద ముద్దు పెట్టి తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి.

ప్రఖ్యాత జపాన్‌ రచయిత్రి అకిమి యోషిడా రాసిన ఉమిమాచి డయరీ ఆధారంగా.

 

మన కథల తొలి ఆనవాళ్ళు

kathana

 

 

vadrevuప్రాచీనకాలంలోకథఎప్పుడుపుట్టిఉంటుంది? కఠినమైనప్రశ్న. మనంహోమోసెపియన్స్ గా  పిలుచుకునే ప్రస్తుతమానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాలకిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపుగవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలుదొరుకుతున్నాయి. 77 వేలసంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాగుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేలసంవత్సరాల కిందట స్పెయిన్ లో అల్టామీరాగుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతోపాటు, మనిషిబొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. భారతదేశంలో మధ్య ప్రదేశ్ లో వింధ్యపర్వతశ్రేణిలోని భీం భేట్క గుహలు పదిచదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందలశిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాలతో అతిపెద్ద ప్రాచీనమానవనివాససముదాయంగానిలబడుతున్నాయి.40వేల సంవత్సరాలనుంచి మానవుడిఆలోచనలో ప్రపంచాన్నిగుర్తించి,తిరిగిదాన్నితనకోసంతాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,200 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్ట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాలపాటు మానవుడు తనకోసంతాను ఎటువంటి కథలు చెప్పుకుని ఉంటాడు?

మనిషి రాయడం మొదలుపెట్టినప్పటినుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకు పూర్వం ఉన్నదంతా చరిత్రపూర్వయుగం. దాన్నికూడా మనం పాతరాతియుగంగా, కొత్తరాతియుగంగా కాలమానంతో గుర్తించుకుంటున్నాం. 2,00,000 నుంచి 70 వేల సంవత్సరాలదాకా మధ్యపాతరాతియుగంగా, 50 వేలనుంచి 21 వేల సంవత్సరాలదాకా కొత్తపాతరాతియుగంగా, 20 వేలనుంచి 10 వేల సంవత్సరాలదాకా మధ్యరాతియుగంగా గుర్తిస్తున్నాం. కొత్తరాతియుగం 10 వేలసంవత్సరాల కిందట, అంటే, క్రీ.పూ. 8,000 కాలంలో మొదలయ్యిందనుకుంటే, అప్పుడే మెసొపొటేమియాలో వ్యవసాయంమొదలయ్యిందనీ, దాదాపుగా పట్టణనిర్మాణం కూడా మొదలయ్యిందనీ మనం చెప్పుకుంటున్నాం. క్రీ.పూ. 6,000 సంవత్సరాల కాలంలో భూతాపం  చల్లారి మానవుడు జీవించడానికి మరింత సానుకూలమైన వాతావరణంఏర్పడిందనీ, క్రీ.పూ. 3,300 నాటికి కాంస్యయుగం మొదలయ్యిందనీ చరిత్ర రాసుకున్నాం. కొత్తపాతరాతియుగం నుంచి కాంస్యయుగం దాకా మానవుడు జీవించిన జీవితం అత్యంతనాటకీయమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రసంగ్రామసంక్షుభితమైనకాలం. ఆ  కాలమంతటా తనచుట్టూ ఉన్న ప్రాకృతికశక్తులతో తలపడుతూ మనిషి తనను తాను ఒక సాంఘికజీవిగా తీర్చిదిద్దుకునే క్రమంలోఅగ్ని,  ధనుర్బాణాలు,  బండిచక్రం అతడికి ఎంత సహకరించాయో అంతకన్నాకూడా కథ అతడికి ఎక్కువ దోహదపడిందని ఇప్పుడిప్పుడే  మనం గ్రహించగలుగుతున్నాం.

తక్కిన జంతువుల నుంచి మానవుణ్ణి వేరుచేసే అద్వితీయసామర్థ్యాల్లో అత్యంత అద్వితీయసామర్థ్యం కథలు చెప్పుకునే సామర్థ్యమే. మానవుడి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు. అందులో ఎడమ భాగంలోని ‘ఇంటర్ ప్రెటర్ ’ మానవుడి అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీకథలుగా అల్లుతుందనీ, అనువదిస్తుందనీ ప్రసిద్ధన్యూరోశాస్త్రవేత్త మైఖేల్ గజానిగ అంటున్నాడు. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలుచెప్పేవిద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకుతెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించే సామర్థ్యం కథనసామర్థ్యమే. అంతేకాదు, ఆ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకునేటప్పుడు మధ్యలోఉండే ఖాళీల్ని పూరించడానికి జరగని విషయాలుకూడా జరిగినట్టుగా తనకుతాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకి ఉంది. ఇట్లా లేనిదాన్నికల్పించగలిగేశక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం.  ఈ సామర్థ్యం వల్లనే మనిషి మానవుడుగా మారుతున్నాడు.

తనకు సంభవించిన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ మళ్లా గుదిగుచ్చుకోవడంలో అక్కడక్కడా మధ్యలో ఉన్నఖాళీల్ని పూరించడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు? దానికి ప్రధానమైన కారణం, మానవుడికి యథార్థాల్నిశకలాలుగా తిరిగి గుర్తుకుతెచ్చుకోవడంకన్నా, ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకైతాను చిత్రించుకోవడం ముఖ్యం. అటువంటి సమగ్రచిత్రణ మానవుడి మెదడును తృప్తిపరుస్తుంది. అట్లా చిత్రించుకునేటప్పుడు మానవుడిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా జరిగిన సంగతులు జరిగినట్టుగా లెక్కవేసుకోవడంలో మానవుడి మెదడులోని ‘బ్రోకా’ భాగమూ, ‘వెర్నిక్’ భాగమూ మాత్రమే సంచలిస్తాయి. దుకాణం ముందు రాసిఉన్న ధరలపట్టిక చూసినప్పుడు మానవుడి మెదడులో ఆ రెండుభాగాలు మాత్రమే సంచలించి ఊరుకుంటాయి. కాని ఆ జాబితాను తన దగ్గరున్న సొమ్ముతో పోల్చి చూసుకోగానే మానవుడి మెదడు ఊహించలేనంతగా ఉద్దీప్తమవుతుంది. ఒక సాధారణ వార్త విన్నప్పటికన్నా ఒక రూపకాలంకారాన్ని విన్నప్పుడు మనిషి మెదడు మరింత ప్రజ్వలిస్తుంది.

ఇట్లా ప్రజ్వలించడానికిగల కారణాల్నిపరిశోధిస్తున్నన్యూరోసైంటిస్టులు ఇప్పుడు’న్యూరోఈస్తటిక్స్’ అనే కొత్త అధ్యయనాన్నిమొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో విశేషమైన కృషిచేస్తున్న వి.ఎస్. రామచంద్రన్ మన మెదడులో, ముఖ్యంగా, దృష్టికి సంబంధించిన భాగంలోని న్యూరాన్లను ఉద్దీపింపజేసేపదిలక్షణాల్నిపేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక లక్షణాన్ని ‘పీక్ షిఫ్ట్’ గాగుర్తిస్తున్నారు. 1950 ల్లో నికోటింబర్గన్ అనే శాస్త్రవేత్త సముద్రపక్షుల మీద కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో ఆ పక్షులు తమ కూనలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్నికూనలు ఆ పక్షులముక్కుల్ని తాడిస్తుండటం చూసాడు. టింబర్గన్ ఆ పక్షుల ముక్కుల్ని పోలిన చిన్నచిన్నపుల్లలకి చివర ఎర్రటిచుక్కపెట్టి ఆ పక్షికూనలకు చూపించినప్పుడు అవి ఆ పుల్లల్నికూడా తాడించడం మొదలుపెట్టాయి. అప్పుడతడు ఆ పుల్లలమీద మూడు ఎర్రటిచుక్కలు చిత్రించి చూపించాడు. అశ్చర్యంగా, ఆ పిల్లలు మరింత ఉద్రేకంగా ఆ పుల్లల్నితాడించడం మొదలుపెట్టాయి. దాన్నిబట్టి ఆ శాస్త్రవేత్త రాబట్టిన ప్రతిపాదన ఏమిటంటే బయటప్రపంచంలో మనని ఉద్రేకించే విషయాలు వాటిని వక్రీకరించేకొద్దీ (డిస్టార్ట్) మనని మరింతగా ఉద్రేకిస్తాయనేది .

ఆదిమ మానవుడు తనకళలోనూ, తనప్రజ్ఞానంలోనూ కూడా ఈ సూత్రాన్నేపాటించాడని రామచంద్రన్ ప్రతిపాదిస్తాడు. అంటే మనిషి తనకు సంభవిస్తున్నఅనుభవాల్నిపొదువుకునే క్రమంలో తనను మరింత ఉద్రేకిస్తున్నఅనుభవాలను మరింతగా పొదువుకుంటాడనీ,  తిరిగి వాటిని గుర్తుచేసుకునేటప్పుడు వాటిలో తనను బాగా ఉద్రేకించినవాటిని మరింతగా గుర్తుచేసుకుంటాడనీ మనం భావించవచ్చు. తన అనుభవాలకీ, జ్ఞాపకాలకీ ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగాపునర్నిర్మించుకుంటున్నప్పుడు, అవసరమైతే వాటి వరుసక్రమాన్నీ, యథార్థాన్నీ కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్నిపక్కనపెట్టి జరగనిదాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడడు. ఆ వక్రీకరణలో అతడు చూసేది మొత్తం వాస్తవాన్నితిరిగి మెనూకార్డు లాగా గుర్తుచేసుకోవడం కాదు. అందుకు బదులు ఆ జరిగిన సంఘటనలో తనను ఉద్రేకించిన రంగునీ, రుచినీ, సువాసననీ మరింత పెద్దవిచేసి, వాటిని మరింతగా తలచుకోవడం ద్వారా తననుతాను ఉద్దీపింపచేసుకోవడం. ఆ ఉద్దీపనలో అతడి మెదడు ఉద్దీప్తమై తద్వారా సంతోషాన్నిఅనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్నిఅతడొకప్రాణిగా, తన సంపూర్ణఅస్తిత్వంతో స్వీకరించి, సంతోషిస్తాడు.

ఇలా ఒక మనిషి ఉద్దీపన చెందుతున్నప్పుడు ఆ మనిషిని చూస్తున్న మరొక మనిషి కూడా అటువంటి ఉద్దీపనకే లోనవుతున్నాడు. దానికి కారణం మనిషి మెదడులోఉండే ‘మిర్రర్ న్యూరాన్లు’ అని న్యూరోసైంటిస్టులు చెప్తున్నారు. మిర్రర్ న్యూరాన్ల వల్ల ఒక మనిషి తనకు కలుగుతున్నబాధను గ్రహించడమేకాక, అదే పరిస్థితుల్లో ఎదుటిమనిషికి కలుగుతున్నబాధకికూడా అంతే తీవ్రంగా స్పందించగలుగుతున్నాడు. న్యూరాన్లకు స్వపరభేదం లేదు.

అందువల్ల ఒక మనిషి తాను పొందే సంతోషాన్నిమొత్తం తెగకీ, జాతికీ, తన చుట్టూ ఉంటే మానవసమూహమంతటికీ కూడా అందించడానికి ఉత్సాహపడటమే ప్రాచీనకళాస్వభావం, కథాస్వభావం. అందుకనే, ప్రాచీనమానవుడి కళారహస్యానికి అత్యంతసమీపంగా ప్రయాణించగలిగిన ఆధునికచిత్రకారుడు పికాసో  ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడిచేయడమే కళ’ అన్నాడు.

ప్రాచీనగుహాలయాల్లో, స్పెయిన్ నుంచి ఆస్ట్రేలియా దాకా మానవుడు చిత్రించిన చిత్రలేఖనాల్లో ఈ కథనస్వభావాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఆ చిత్రలేఖనాల్లోని అడవిదున్నల కాళ్లు సన్నగా ఉంటాయి. కానీ మాంసపరిపుష్టమైన వాటి దేహాలు మాత్రం పరిపూర్ణవికాసంతో కనిపిస్తాయి. ఖడ్గమృగాలంటే కొమ్ములే. ఎలుగుబంట్లు బాగా బలిసి కనబడతాయి. మానవుల్ని చిత్రించడంలోనూ ఇదే ధోరణి. ప్రాచీన స్త్రీప్రతిమల్నిచూడండి, వాటిలో బాగా పరిపుష్టంగా ఊగే వక్షోజద్వయం, పెద్ద కడుపులు, కొట్టొచ్చినట్టు కనబడే స్త్రీజననేంద్రియాలు. ఆ ప్రతిమలకు కాళ్లూ, చేతులు, తల ముఖ్యంకావు. 25 వేల సంవత్సరాల కిందట మానవుడి దృష్టిలో స్త్రీ అంటే రతి, ప్రత్యుత్పత్తి, పుష్కలత్వం. అంతే. ఆ స్త్రీప్రతిమను చూడగానే ఆ మానవుడికి అతడి తెగకీ కూడా అవిచ్ఛిన్నసంతానక్రతువూ, ఆశావహమైన భవిష్యత్తు సాక్షాత్కరించేవి.

మానవుడి మెదడులోని కుడిభాగం విషయసేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించినవిషయాల్నిబట్టి మానవుడికొక కథ అల్లిపెడుతుందని గమనించిన న్యూరోసైంటిస్టులు మరొకవిషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడిమెదడు దెబ్బతిన్నప్పుడు లేదా మెదడులోని రెండుభాగాల మధ్య పరస్పరసంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగంనుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్నితనకైతాను పూరించుకుని ఏదో ఒక విధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్నఅనుభవాల్నీఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రసిద్ధరచయిత జొనాథన్ గాడ్షాల్ మనిషిని ‘ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్’ అన్నాడు. అతడిట్లారాశాడు:

‘పరిణామక్రమం మనకి కాలక్రమంలోమన మెదడు లోపల ఒక షెర్లాక్ హొమ్స ని రూపొందించింది. ఎందుకంటే ఈప్రపంచం (ఇతివృత్తాలు, సమస్యలు, సంఘటనలు, కార్యకారణసంబంధాలుమొదలైనవాటితో) పూర్తిగా కథామయం. కారణాల్నీ, కథల్నీవెతకడంలో ఒక ప్రయోజనంఉంది. మానవుడు పరిణామక్రమంలో స్థితిగతులకు తగ్గట్టుగా తనను తాను సర్దుబాటు చేసుకునే క్రమంలో కథలు చెప్పేమనస్సు కూడా ఒక ప్రాకృతికఅవసరంగా రూపొందింది. దానివల్ల మనం మన జీవితాల్నీ, సువ్యవస్థితంగానూ, సార్థకంగానూ అర్థంచేసుకునే అవకాశం లభిస్తున్నది. జీవితం తెంపులేని రణగొణధ్వనిగానూ, సంక్షోభంగానూ కాకుండా మనను కాపాడుతున్నది.

అయితే కథలు చెప్పేమనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లేభాగాన్ని దాదాపు ఐదుదశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, మనలోని ఈ చిన్నమానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ, చతురుడు, కట్టుకథలల్లేవాడు కూడానని మైఖేల్ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థంకావాలి. అట్లా అర్థంచేప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధవిషయాల మధ్య సార్థకమైన అమరికక నిపించకపోతే అది దాన్ని తనంతటతనుగా ప్రపంచం మీద ఆరోపించడాని కివెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పేమనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

ఇట్లా తనముందు కనిపిస్తున్నవాటికి ఏదో ఒక అర్థంచెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనూ, అటువంటి అర్థం స్పష్టంగా గోచరించనప్పుడు తానే ఏదో ఒక అర్థాన్నిఆరోపించి చెప్పడంలోనూ, మానవుడు తొలికథకుడుగా రూపొందాడని మనం ఊహించవచ్చు.

అటువంటి తొలికథలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే, మనం చరిత్రపూర్వయుగంలోకి,  అంటే ఇప్పటికి ఐదువేలసంవత్సరాలువెనక్కివెళ్లాలి.  ప్రపంచమంతటా నేడు అన్నిజాతుల్లోనూ లిఖితవాఙ్మయానికి సమాంతరంగా మౌఖికవాఙ్మయం కూడా ప్రచలితంగా కనిపిస్తున్నది. దీన్ని మనం ‘ఫోక్ లోర్’ అని పిలుస్తున్నాం. కానీ ఈ ఫోక్ లోర్ మీద చరిత్రయుగపు మానవుడిభావజాలం, లిఖిత వాఙ్మయప్రభావం కూడా గణనీయంగా ఉన్నందువల్ల ఈ మౌఖికవాఙ్మయం ఆధారంగా మనం ఆదిమానవుడి తొలికథల్నిగుర్తుపట్టడం కష్టం. ఇటువంటి ప్రభావాలకు అతీతమైన తొలికథల్నిగుర్తుపట్టాలంటే నాగరికమానవుడి నీడ పడని ఆదిమమానవసమూహాలకథల్నిఅన్వేషించాలి. కానీ ఆ కథలు రాతపూర్వకంగా మనకు లభ్యంకావడంలేదు కాబట్టి, మనం చేయగలిగిందల్లా ఆనాటి మానవుడు జీవించిన జీవితానికి సన్నిహితంగా ఉండే జీవనసరళితో జీవిస్తున్న వివిధ మానవసమూహాల కథల్నిఅధ్యయనం చేయడం. ప్రపంచమంతటా అక్షరపూర్వ జీవనవిధానాన్ని అనుసరిస్తున్నఅనేకఆదిమజాతులు చెప్పుకునే కథల్లో మనకు చరిత్రపూర్వయుగం నాటి మానవుడు చెప్పుకున్నకథల తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలోని బుష్ మన్లు, జపాన్ లోని ఐనూలు, ఆస్ట్రేలియాలోని వార్లిపిరి, నర్రిన్యేరి తెగలు, పసిఫిక్ మహాసముద్రద్వీపాల్లోనివసించే టికోపియా, ఇఫలుక్ తెగలు, తూర్పుదీవుల్లోని రాపానుయి తెగ, ఆనవాళ్లులేకుండా అంతరించిపోయిన టాస్మేనియన్లు, యమానవంటి మానవసమూహాల కథల్లో మానవుడి తొలికథల పోలికలు కనిపిస్తాయి.

గత రెండుశతాబ్దాలుగా మానవశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రజ్ఞులు, అన్వేషకులు చేస్తూ వచ్చిన వివిధ పరిశోధనలద్వారా, అధ్యయనాల ద్వారా, తులనాత్మక అధ్యయనాల ద్వారా మనకు అటువంటి కథల ప్రాథమికరూపాల గురించి స్థూలమైన అవగాహన లభిస్తున్నది. ఆంద్రేజోల్స్ అనే ఒక కళాచరిత్రకారుడు వీటిని ‘సరళరూపాలు’ అన్నాడు. అతడి ప్రకారం ఆ సరళరూపాలు పురాగాథ, వీరగాథ, పురాణగాథ, పొడుపుకథ, సుభాషితం, ప్రామాణికగాథ, స్మృతి కథ, జానపదకథ, ఛలోక్తీను.

 

(కథలో  సంక్లిష్టత…వచ్చే  నెల)

నేను నాట్యం చేయడం లేదు!

చిత్రం: రామశాస్త్రి

చిత్రం: రామశాస్త్రి

ఈ  పాట వీడియోను శ్రధ్దగా విని చూడండి.. నాకు మాత్రం వీడియో చూస్తుంటే నోట మాట రాలేదు. 1997 మార్చి ఏడో తారీఖు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అపుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న వేళలో ఒక అమాయక పరవశంలో నేను రాసుకున్న కవిత కు అచ్చమైన ద్యశ్యరూపంలా ఉంది..  అప్పటికి కవితకు ఎవరో ఇంత అచ్చమైన దృశ్యరూపం ఎలా చేసేసేరబ్బా అని ఒకటే ఆశ్చర్యం .. ఇది సినిమా పాట కాదు. ఒక క్రౌడ్ ఫండింగ్ మ్యూజిక్ వీడియో. రెండు రోజుల క్రితమే వీడియోలో షేర్ చేశారు. సినిమా  పాటల కన్నా అందంగా గొప్పగా ఉంది.  లింక్ కింద నా పాత కవిత. చిన్ననాటి లాలస నా కళ్ల ముందు లాక్కొచ్చిన  ఈ పాట నాకెంతో నచ్చింది.

https://www.youtube.com/watch?v=0K8qu5H4oXk

 

 

The Celebration of a Dance

 

నేను నాట్యం చేయడం లేదు

లేప్రాయపు దేహపు వేడుక చేసుకుంటున్నాను

మోహంపు తనువుగా ఎగిసిపడుతున్నాను.

 

ఎదురుచూపుల మనసు తనువై కంపిస్తున్నాను

యవ్వన చిత్రపటాన్ని గీస్తున్నాను.

ఉరకలేసిన నెత్తురౌతున్నాను.

 

నేను నాట్యం చేయడం లేదు

పాదాలతో కదలికల కత చెబుతున్నాను

పరుగుల కవిత రాస్తున్నాను

పాదాలతో అతడి పేరు రాస్తున్నాను

స్నప్న నిఘంటువు రచిస్తున్నాను

మునివేళ్ళతో పుడమిపై ముగ్గుపెడుతున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

భూమికి చిందు నేర్పిస్తున్నాను

భూమికి తుపాను హెచ్చరికలు చేస్తున్నాను

యుద్ధం తాకిడి అభివర్ణన చేస్తున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

భూదేవికి పాదాలతో చందనం పూస్తున్నాను

మునికాలివేళ్ళతో ఆమెను చుంబిస్తున్నాను

భూమి డోలుపై దరువు వేస్తున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

చలనపు నియమావళిని మట్టుబెబుతున్నాను

పాదాలు రెక్కలు వచ్చిన పక్షులౌతున్నాయి

హుషారెక్కిన నెమలి భంగిమనౌతున్నాను

తుళ్ళింతల నాట్యం చేస్తున్నాను

ఆత్మాభిషేకం చేస్తున్నాను

లయల కడలి పొంగునౌతున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

నడడకు సెలవిస్తున్నాను

భూమి పల్లకీపై పాదాల బోయీనై ఊరేగుతున్నాను

గాలి ఊయల తూగాడు పూవునౌతున్నాను

 

 

నేను నాట్యం చేయడం లేదు

అతడితో వలపు తాండవం చేస్తున్నాను

లయాత్మక చాపల్యమౌతున్నాను

వేదనను పాతాళంలోకి సరఫరా చేస్తున్నాను.

*

పరివృత్తం

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ప్రయాణ ప్రణవం

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

బ్లిస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్

ఆనందమే నా సామాను అతి సౌకర్యవంతంగా

అహంకారాల సంచులన్నీ విడిచి పెట్టాను

రుజు స్ఫూర్తులు తప్ప

ఏ భుజ కీర్తులూ నాతో  తెచ్చుకోవడం లేదు

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

ఎక్కడో కలుస్తాను నిన్ను

పొద్దులు సద్దు లేక ముద్దాడుకునే

తెలుపు నలుపు చుంబనాలలోనో-

అవునూ,  ఆకాశం పెదవులపై

మిగులుతుంది కందిపోయిన ఎర్రదనం

వెలుతురు , చీకటి ముద్దాడుకునే సంజలలో –

సిగ్గులేని సూర్య భూతాలవి!

భూమిని మరిగించి కరిగించే

రసవిద్య పేరు రాత్రీ, పవలూ-

ఎక్కడో కలుస్తాను నిన్ను

పాతాళ  ఆకాశంలోనో

పర్వతాలయిన నదుల శిఖరాలపైనో

ఆకుపచ్చ అలల కడలి అడవిలోనో

పిట్టల ఎర్రని గొంతుల దాగిన

బ్రహ్మాండ భానుగోళ భావనలోనో

నాలుక్కాళ్ళ ధర్మపు గోష్పదీ చిహ్నాలలోనో

తనూరహస్య ఖనులలో

తరుణ మణులున్నలోతులలోనో

ఎక్కడో కలుస్తాను నిన్ను  

దిక్కులు దిక్కుమాలిపోయిన ఎత్తులలో

చుక్కలు సృక్కి బూడిదయ్యే బలివితర్ది వీధుల్లో

ఎడారి ఎడతెరిపి లేక కనే నీటి గలగలల కలలో

చొక్కాలు కుట్టిచ్చి కుట్టిచ్చి దేవుడికి

ప్రతి మత దర్జీలూ అలసిపోయిన ,

కుట్టు యంత్రాలు  మూల పడిన

గోపురాల మీద పాదాలు శుభ్రం చేసుకుని –

ధ్వజ స్తంభాల చేయూతలొదులుకుని

చంద్ర వంకలను ఇంకా ఎదగాల్సిన

దశలున్నాయని హెచ్చరించి

సురలో గల దైవ రక్త బంధాన్ని నిరాకరించి

నిన్నుకలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

కాలమిక్కడ ఆకస్మిక కాస్మికం

కార్య కారణాతీతం

కర్త కర్మ క్రియల సాలె గూటి దారపు జ్ఞానానికి  

తన పొట్టలోంచి తనే  దారాలు తీసి

తన పుట్ట తానే నిర్మించుకునే సాలెపురుగు

అర్ధమవుతుందా –

దారపు పొగునే నేను

బయలుదేరాను విశ్వ వస్త్రంలో కలవడానికి –

చీరలోని దారం చీరనెరుగుతుందా –

నువ్వెవ్వడివిరా బయలుదేరడానికి –

విశ్వ వస్త్రం లో  కలవడానికి నీ చేతనౌతుందా –

ఎరుగు – నువ్వున్నదే విశ్వ వస్త్రంలో

సూర్యుడు నీ అద్దకాల కుంచె

భూగోళం నీ ఆకలి కుండ

అంటోంది బరువు చూసుకుందామని

వెయింగ్ మెషీన్ పై నిలబడితే –బయటకొచ్చిన టికెట్టు

చూపిస్తోంది బరువు సున్నా అని –

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

తోడేళ్ళ గుంపులో నిలబడ్డ ఏడేళ్ళ మౌగ్లీలా

ఆటవిక జ్ఞానమే నాకు అమ్మా నాన్నా

ఆదిమ నిరక్షరాస్యతే – నా ఆధునిక పట్టభద్రత

సనాతన జీవ కషాయం నాలోనూ పారుతోంది

భూమి విచిత్రమైన  కుమ్మరి

ప్రాణం చిప్పిల్లే పచ్చి కుండలనే

పదికాలాలు మననిస్తుంది

ఎండి పోయామా – మండిస్తుంది కప్పెడుతుంది

మృత్తిక కావాలి కదా కుత్తుకబంటి దాకా

పిసికి పిసికి మట్టిపాయసం చేసి సారె కెక్కించడానికి

ఎన్నిసార్లు మండి పోయానో , ఖననమైనానో

ఎన్నెన్ని సార్లు సారె పైనుంచి పచ్చి కుండనయ్యానో –

ఎక్కడ వాసన చూడను తల్లిని

పచ్చికుండలేమై పోతాయోనని తల్లడిల్లే తల్లి తనువంతా

బాలింత వాసన –

నా ప్రయాణ సందోహం చూసి నవ్వాయి గడ్డిపరకలు

నువ్వు బయలుదేరడమేమిటి

తిరిగే నేలమ్మే ప్రయాణిస్తున్నది కాల సొరంగంలోకి

తెలుసుకో నీది రజ్జు సర్ప భ్రాంతి –

ఇది తాడు కాదు నిన్ను నువ్వు చేదుకు పైకి పోవడానికి

ఇది పామే –

అరక్షణంలోనే అనంతమూ అవగతమైన పుణ్యశ్లోకులం

అనేకాకులం, మేం బహుళం –

గడ్డి పరకలం –పాము పడగలం –

అనంత కాలం వేచి ఉన్నా అరక్షణాన్ని అర్ధం చేసుకోలేని

జనాభా మీరు –

పామే ఇది  – ఇది కాల మహోరగం  –

నెమ్మదిగా మింగుతున్నది విశ్వపదార్ధాన్ని

అయినా వెళ్ళిరా కాలు సాగినంత మేరా

అయినా వెళ్ళిరా లోకాలు సాగినంత మేరా –

నది మూలం , ఋషి మూలం, తృణమూలం అడగరాదు

అవిజ్ఞానపు చీకటి నుయ్యిలు – మహా కృష్ణ బిలాలు

అమ్మ పాల పుట్ట లో వాంఛా మథనాలు జరిగి

అమృతంగమయులైన మానవుల్ని

పుట్టిస్తుంది జగత్కార్మిక శాల

పుణ్య తిలకం దిద్ది బతుకు పేరంటానికి పిలుస్తుంది

తానే జననీజనక ద్వయమని చెప్పక

ఓ ఇద్దర్ని పేరెంట్లు అని చూపిస్తుంది –

అక్కడే బయలుదేరిపోయావు నువ్వు ఎరుక లేకనే

అమ్మ కడలి లోపలి చిచ్చులో –

అడిగింది గడ్డం కింద చేయి పెట్టుకుని గడ్డి పరక

అప్పుడే బయలుదేరి పోయావు నువ్వు

ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కడికి బయలుదేరుతావు చెప్పు?

అయినా సరే –

గడ్డి పరకల విశ్వవిద్యాలయానికి నమస్కరించి

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

వెనుక దారి తరిగి పోతోంది

ముందు దారి పెరిగి పోతోంది

చక్రాల్లేని రైళ్లు , తెడ్లు లేని పడవలు , రెక్కల్లేని పక్షులు

వేళ్ళు  లేని చెట్లు, కాళ్ళు లేని ప్రాణులు

 అందరూ గోచరమౌతున్నారు

తమకు తెలీకుండానే ప్రయాణిస్తున్నారు

ఇప్పుడే తెలిసింది ఒక సంచారి ఇచ్చిన సమాచారం

నువ్వూ నన్ను కలవడానికే బయలుదేరావట

యుగాల ముందర

తీరా  నీవున్న చోటికి నే చేరిన వేళ అక్కడ నువ్వుండవు

నువ్వొచ్చే  వేళకి – నా చోట నేనూ ఉండను

ఖాళీ, సున్నా, శూన్యం ఎదురవుతుంది ఇద్దరికీ –

ఇద్దరిలోనూ ఇద్దరమూ ఉన్నామన్న

పూర్ణత్వ భావన కలుగుతుంది

పూర్ణస్య పూర్ణమాదాయ – ఈశావాస్య  వాక్యం మిగులుతుంది

ఎక్కడున్నాం, ఎక్కడుంటాం, ఎప్పుడుంటాం,  ఎప్పుడు  లేం

శూన్యపు సూది ఒకటి కుడుతోంది  –

పాలపుంతల మగ్గం నడుస్తోంది

దారపు పోగుల మధ్య దూరమెంత ఉన్నా

అవి ఈ ఆకస్మిక కాస్మికం లోనే ఉన్నాయి

శూన్య పూర్ణానికి , పూర్ణ  శూన్యానికి నమస్కరిద్దాం

బయలుదేరడానికి ముందే చేరిపోయిన యాత్ర లో –

ఇక ఎప్పటికీ కలుసుకోలేము

ఎందుకంటే ఎప్పుడూ విడిపోనే లేదు కనుక.