Archives for October 2016

మనసు గీసిన బొమ్మలు ఈ సినిమాలు!

                     

                               siva1

                               

“ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖ చిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి నొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యత నిద్దాం. ప్రేమిద్దాం!గౌరవిద్దాం”-అని అంటారు ముస్తఫా కమాల్ అటాటర్క్.

చలన చిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు-ఎక్కువ దృశ్యాలు. కినిమా అంటే పురోగమనమని అర్ధం. దాని సమానార్ధకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లి విరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే  జీవితాంతం మనసులో ముద్ర పడి పోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాల పాటు న  వ్విన దృశ్యం. ఒకసారి చూసిన వారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షలమంది పుస్తకాలు చదివితే  ఎన్నో కోట్ల మంది  సినిమాలు చూస్తారు.ఏది సాధించాలన్నా ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మనదేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు.కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి.కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసివస్తాయి.ఎవరు చెప్పినా నమ్మం కనుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన అమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తులనుంచి,వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి,ప్రశ్నించి, ప్రతి ఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ  చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది.  ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు,కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చెయ్యడానికి తమ జీవిత కాలమంతా శ్రమించి,పోరాడి,రహస్యంగా పని చేసి,చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో విమర్శలతో చీల్చిచెండాడాడు.

రష్యాలో మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని “మాంటేజ్” కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్ ఐసెన్ స్టీన్,వుడోవ్ కిన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు.  ఫుడోవికిన్ గోర్కీ “మదర్”ని చలన చిత్రంగా నిర్మిస్తే, ఐజెన్ స్టీన్   “స్ట్రైక్” లాంటి చిత్రాలను “మాంటేజ్” విధానంలో రూపొందించారు.

లాటిన్ అమెరికా సినిమా రచయితలు. “ప్రతీకారమో, ప్రాణ త్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై “విప్లవానికి ప్రేలుడు పదార్ధాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జర్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకుని 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్, మార్గరెట్ వాన్ ట్రోటా, డొరిస్ డెర్రీ, హెల్కే సాండర్స్ వంటివారు ఉత్తమ ప్రపంచ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్టు సినిమా బైసికిల్ తీఫ్. సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనపడని అసలు దొంగ ఫాసిజం అని తేల్చి చెప్తుంది.1948 లో వచ్చిన సినిమా మన సత్యజిత్ రే కి ప్రేరణ నిచ్చిపథేర్ పాంచాలివాస్తవమైన అద్భుత సృష్టికి  కారణమైంది.

మన దేశం విషయాని కొస్తే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, భూపేన్ హజారికా, శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్, శ్యాం బెనెగల్, గౌతం ఘోష్ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఇక మన తెలుగు విషయాని కొస్తే “జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది”అని  కె.వి.ఆర్. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50,60 దశకాల్లో వచ్చాయి. “సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో దగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది” అన్నారు సినిమారంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌర వంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత అంటే 2013 లో వచ్చి నన్ను అమితంగా దుఖపెట్టి, కదిలించి,  కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన  రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ఒసామా”(Osama)

ఇది ఆఫ్గనిస్తాన్ చిత్రం. దర్శకుడు బర్మెక్. 1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్,నెదర్లాండ్స్,జపాన్,ఐర్లాండ్,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది.ఈ సినిమా ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కల గలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు,మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

siva2

 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనా లుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది.తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు.వారిని ఎవరూ చూడ కూడదనుకుంటారు. ఎందుకంటే  మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశన మవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం.పనిహక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి.యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకుని,అనాధలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్  మండేలా సూక్తి తో  సినిమా   మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా  నీలి రంగు బుర్ఖాలు  ధరించిన   మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.

“మేము వితంతువులం”.

“మాకు పని కావాలి”

“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

 

చావుకి తెగించి  మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన  దృశ్యం. తర్వాత  సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ-మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ  రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ  అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటి కొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా,బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీ తో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి,అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు.బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది.నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది.అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది.తండ్రి స్నేహితుణ్ణి బతి మాలి అబ్బాయికి చిన్న టీదుకాణంలో పనికి కుదుర్చుకుంటారు.అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసినఎస్పాండీఅనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనేఒసామా అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు.నాకు తెలుసు.అతను అబ్బాయే, పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

 siva3

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతక నివ్వ దల్చుకోలేదు. గ్రామంలోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే రజస్వల కూడా అయినందువల్ల  ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ, ఒక విదేశీ వనితతో  పాటు ఆమెను జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ  మరణ శిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. పదమూడేళ్ళ  పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతని కిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు.  ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు  పెట్టే హింస  చిన్నారిని  బాధిస్తూనే  ఉంటుందని  చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా  ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత  “సిద్దిక్ బర్మెక్. ఆయనే దర్శకులు, ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు.

మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి  అమానుష భౌతిక, మానసిక హింసలు  జీవితకాలమంతా  ఆఫ్గనిస్తాన్ లో  అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా  ఉందీ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో బర్మెక్ చూపించారు.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒక పరిమళం, ఒక ఊపిరి వెచ్చదనం!

swamyనేల మీద పాదాలు ప్రతిరోజూ నడవనక్కర్లేదు. ఆ నేల నీదైతే చాలు. ఆ నేల నీ పాదాలకోసం ఎదురు చూస్తుంటుంది. నేలకూ పాదాలకూ ఒక విడదీయరాని అనుబంధం ఉన్నది. నీవెక్కడుంటేనేం? అది నీ గుండెలో ఉంటుంది. ఆ నేల తడి కోసం ఎదురు చూస్తుంటుంది. వాన చినుకుకోసం తపించుకుపోతుంది.

నారాయణ స్వామి మనసులో ఒక బీటలు వారిన నేల ఉన్నది. ఆ పగుళ్ల గాయాల మధ్య అతడు నిత్యం ఆక్రందిస్తున్నాడు. ఆ నేలలో నెత్తురు ఇంకిపోయిఉంది. ఆ నేలలో చెట్లు మ్రోడులయ్యాయి. పండుటాకులు ఎన్నడో రాలిపోయాయి. ఆ నేల వైపు మేఘాలు లేని ఆకాశం దీనంగా చూస్తుంటుంది. పక్షులు రెపరెపా కొట్టుకుంటూ ఎక్కడికో పయనమైపోతుంటాయి.

నేలపై పచ్చికబయళ్లు ఏర్పడేటప్పుడు? ఆ పచ్చిక బయళ్లను మంచు బిందువులు ఆలింగనం చేసుకునేది ఎప్పుడు? ఆ మంచుబిందువులను నీ పాదాలు స్ప­ృశించేటప్పుడు? ఆకాశంలో మేఘాలు దట్టమయ్యేదెప్పుడు? అవి దట్టంగా క్ర మ్మి, వాటి గుండెలు బ్రద్దలై అహోరాత్రాలు వర్షించినప్పుడే నేల గుండె శాంతిస్తుంది. నేల పరిమళం నిన్ను ఆవహిస్తుంది.

‘వానొస్తద?’  ఒక అద్భుతమైన ప్రతీకాత్మకమైన కవిత్వం. వాన రావాలన్న కోరిక అందులో ప్రగాఢంగా ఉంది. కాని వాన రావడం లేదన్న బాధ అంతకంటే లోతుగా ఉన్నది. వాన రావడం సహజమైన ప్రక్రియ. అది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. కనుక ఎప్పుడో ఒకప్పుడు వాన వచ్చి తీరుతుందన్న ఆశాభావం కూడా ఈ కవిత్వంలో ఉన్నది. మన దూప తీర్చేందుకు మనమే జడివాన కావాలన్న ఆశాభావం ఇది.

‘వానొస్తద?’  అన్నది ఒక విమర్శనాత్మకమైన కవిత్వం. వాన యాంత్రికంగా రాదు. వానకోసం ప్రయత్నించే వాళ్లంతా ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. వానొస్తందని నమ్మిన వాళ్లు, వానకోసం సంఘర్షించిన వాళ్లు నేల పగుళ్ల మధ్య సమాధి అయ్యారు. ఎందరి నెత్తురో నేలను తడిపింది కాని వాన నీరు రాలేదు. వాన కోసం ఎదురు చూసే కళ్లు లోతుకుపోయాయి కాని బావుల లోతుల్లో ఊటైనా రాలేదు. కాగితపు పడవలు సిద్దంగా ఉన్నాయి. చిన్న నీటి ప్రవాహం వస్తుందోమో తేలుతూ పసిపిల్లల కళ్లలో ఆనందం చూసేందుకు..

‘వానొస్తద?’  అన్నది ఒక విషాద కవిత్వం. ఒక ఆత్మహత్యకూ, ఒక హత్యకూ అంకితమైన కవిత్వం. కన్నీళ్లతో నేలను తడపాలనే ప్రయత్నించిన కవిత్వం. హత్యలూ, ఆత్మహత్యల మ«ధ్య కాలాన్ని బంధించిన కవిత్వం. అది ఉదయం, సాయంత్రాల మధ్య రెపరెపలాడిన కాలం. విగ్రహాలు పడగొట్టిన వాడు లేడు. వాడు లేడన్న వార్తను జీర్ణించుకోలేని కవిత్వం. ఉరి తాడుకు కలలు ఊగుతూనే ఉంటాయి. ఒకరొక్కరే వెళ్లిపోతున్నారు నిశ్శబ్దంగా బయటకు రాన్ని శోకాన్ని, పుట్టెడు దుఃఖాన్నీ మన గొంతుల్లో మిగిలించి.. ఎంతమందిని ఊరుపేరు లేక మంట్ల గలిపిండ్రు? బిడ్డలారా, మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి.. ఎందర్ని పోగొట్టుకున్నం, ఎన్ని సార్లు కాటగలిసినం.. ఎన్ని కన్నీళ్లు మూటగట్టుకున్నం..

krishnudu

‘వానొస్తద?’  ఒక ఏకాకి వాస్తవ కవిత్వం. కవి ఎప్పటినుంచో ఒంటరి. నిద్రకు వెలిఅయ్యాడు ఒకడు. దినాల్లో కాళ్లీడ్చాడు మరొకడు. గ దిలోపలి చీకటిలో ఒకడు, చీకటిక్షణాల అగాధాల్లో, ఎండిన ఆకుల్లాంటి నదీ తీరాల్లో మరొకడు. వీడిది దొరికినదాన్నే ప్రతిసారీ పోగొట్టుకుంటున్న ప్రయాణం. ఇంతమందీ ఉండి నిర్జనమైన కూడళ్లలో ఒంటరిగా ఆరిపోయిన కొవ్వొత్తుల మధ్య వాడే. సమూహమే ఒంటరైనప్పుడు ఒంటరే సమూహమైన కల ఎక్కడ? జవాబివ్వండి నిరంతర నినాద, అనంత సుదీర్ఘ విప్లవ ఆకాంక్షావాదులారా? స్వాప్నికులారా?

‘వానొస్తద?’  ఒక తప్త హృదయ కవిత్వం. ఎన్ని శతాబ్దాలైంది మనిషిని కౌగలించుకోక? ఎంతకూ కనబడని మొగులు. ఎవరైనా ఇంత మట్టి వాసన చూపిస్తారా? గడ్డకట్టిన సుదీర్ఘ అపరిచయం. కందరీగలా కుట్టే కనికరంలేని ఒంటరి చిన్నతనం. ఒక నిశ్శబ్దాన్ని గుసగుసగా నైనా వినాలన్న తాపత్రయం.

‘వానొస్తద?’ ఒక స్వాప్నిక కవిత్వం. తొలి పొద్దు కర స్పర్శకు రెక్కల్ని విచ్చుకున్న కొత్త రాగాల పాటల్ని ఆలపిస్తుంది.

‘వానొస్తద?’  పుస్తకం పేరులోనే కాదు. పుస్తకం నిండా ప్రశ్నల కవిత్వం. ఎన్ని ప్రశ్నలో.. ఎక్కడైనా ఉన్నామా? అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహాల్లో చిక్కుకుపోయామా?. ఎట్ల వొస్తవో? ఏ వెలివాడల్లో వెతకాలి నిన్ను? దారేది అవుతలికి? దొరుకుతద? దొరకని దానికోసమా వెదుకులాట? మళ్ల వస్తవ? బాపూ.. నీ యాది..తొవ్వ తెలుసా? ఎట్టపోతవు ఒక్కనివే. ఈ పట్టపగటి చీకటి పూట? ఆడుకున్న బస్తీ.. చెయ్యి పట్టుకున్న తంగెడుపూలు ఏవీ? వాళ్లెవరో? కాలం కళేబరం ఊరేగింపులో పూలయి గీసుకపోతరు..

వాన బయట కురవడం లేదు. నారాయణ స్వామి మనసులో కురుస్తున్నది. చప్పడు బయటకు వినిపిస్తున్నా, వాన మాత్రం లోపల కురుస్తున్నదని నారాయణ స్వామికి తెలిసిపోయిందని కెఎస్ ఒక్క మాటలో చెప్పాడు.

‘వానొస్తద?’ ఒక పసివాడి కవిత్వం. చిన్నప్పుడు తాగిన పాల తీపినీ, ఆడుకున్న బొమ్మల్నీ, పాత అర్ర వెనుక ఒంటరితనపు దోస్తుల్నీ అన్వేషించే కవిత్వం. ప్రేమ రాహిత్యాన్ని సహించలేని మనస్తత్వం. ప్రేమకాకపోయినా కనీసం ద్వేషాన్నైనా తడి వెచ్చగా తొలకరించమని తపించే కవిత్వం. గమ్యం కనపడని ప్రతిసారీ పుస్తకాల్లో దాచుకున్న బంతిపూల రెక్కల్ని తడిమి చూసుకున్న కవిత్వం.

ఈ పసివాడిని మనం హత్తుకుందాం.. అతడు అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని దూరం చేద్దాం.ఎందుకంటే ఆతడు మనకు దూరంలో లేడు. దూరంగా ఉన్నాననుకుంటున్నాడు. కాని అతడిదీ మనదీ ఒకటే బాధ.. ఇది సామూహిక బాధ. ఇది సామూహిక కవిత్వం.  ‘వానొస్తద?’ మన సంభాషణ, మన సందర్భం. మన కాలం. మన రోదన. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పడనీ..

నారాయణ స్వామి వచ్చాడు.. ‘వానొస్తద?’ మనకు ఇచ్చాడు. నీ రాకని నీ పరిమళం చెప్పనీ.. నీ సమక్షాన్ని నీ ఊపిరి వెచ్చదనం తెలుపనీ. నువ్వులేని తనాన్ని నీ మౌనం పలకనీ.. ‘వానొస్తద?’ ఒక పరిమళం. ఒక ఊపిరి వెచ్చదనం. ఒక మౌనం.

(నారాయణ స్వామి కవిత్వం ‘వానొస్తద?’ సమక్షంలో ) 

వెచ్చని ఊపిరి!

swati

సంధి కుదరని అస్తిత్వంతో భావం పలకని విశ్రాంతికి అలవాటుపడిన వ్యక్తిగా తన పరిచయాన్ని వినిపిస్తారు స్వాతి బండ్లమూడి. కాలనాళికలో తానొక రంగులొలికిన చిత్రంగా దార్శనికత. ‘ దినచర్యలో స్పృశించిన పల్లవులు పొదువుకున్నచోట మిగిలిపోతాయి.’ఎంత చక్కని అభివ్యక్తి!కళ్లతోకాక మనసుతో చదవాల్సిన కవితలివి.ప్రతిపదము అక్షర ఆర్తిని వినిపిస్తుంది. మనసులోని మమత శ్రావ్యమైన వేణునాదమై వినిపించినపుడు  వెచ్చని ఊపిరి మనసును ఆవిరై కమ్ముకుంటుంది.దైవాన్ని మనోచక్షువులతో కాంచిన మురళీగానం వినిపించిన కవిత ‘ ఊపిరిపాటకు చూపేది’.

మనసున దాగున్న వేదన గుర్రపుడెక్కలా పరచుకుని సలుపుతుంటే కదంతొక్కిన పదాలు  మిగిల్చిన ఆనవాళ్లను పద్యాలరొదగా వర్ణించడం అద్భుతం.పాటలు పసిపాపలై కాళ్లకు పెనవేసుకున్నాయని ఒక్క అక్షరమైనా తాకని ఖాళీ కాగితాలన్నీ జాలిగా ఎగిరి రెక్కలార్చి నీ గుండెలపై వాలిపోయాయనీ ..అంటారు.భావుకత నిండిన పదనర్తనమంటే ఇదే! ‘ అరచేతిలో కొవ్వొత్తి వెలిగించుకుంటే తప్ప ఓర్చుకోలేనంత దుఃఖం ఉందని నమ్మలేరంటారు.’

‘గుండె చిల్లు పెట్టుకుని ఇద్దరిని చెరొక దరిని విసిరేసి మునిగిన పడవ అతుకేసుకుని మరో ప్రయాణం మొదలెట్టినా కథ ముగిసేది మాత్రం అవ్యక్తంకాని బాధతోనే ’ అని చెప్పే భావలాహిరి మనల్ని పట్టి ఊపుతుంది.

‘పెద్దయ్యాక తల్చుకుని బాగుందనుకోవడానికి బాగుంటుందికదా చిన్నతనం?’ బాల్యపు అమాయకత్వం,విసుగు తెప్పించేలా అన్నిటికీ ఆధారపడటం ఎప్పటికీ గుర్తుంటుందంటారు.

‘ఎప్పుడైనా ఒకరోజు-అలమరలో పాత పుస్తకాలు దులిపి ఎవరికో చూపిస్తూ, ఎందుకో!ఈ మధ్య కుడివైపు కూడా బాగా ఎక్కువగా…అని కూలబడ్డప్పుడు-పలకరించొద్దు.కవిత్వం గొంతుకి అడ్డుపడొచ్చు.’ఈ వాక్యాలు చదవగానే ఆనందమో,దుఃఖమో తెలియని భావమేదో పొటమరించి ఆ వాక్యాలకడనే మోకరిల్లాలనిపిస్తుంది.

భావుకత పరిణితి పరిపుష్టమై ప్రతి అక్షరాన్ని అల్లుకుని వాక్యనిర్మాణాన్ని మెట్టు మెట్టుగా ఉన్నతీకరిస్తూ పాఠకులను ఆలోచనలతో చుట్టిపడేస్తారు.ఆకుపచ్చ దుప్పటి మట్టివేర్లతో మనమీద పరచుకుందన్నా,పచ్చికపై రాలే పూలశబ్దాల కింద అదమరచామన్నా కవయిత్రి పసిపాపై ఆడుకుంటూ వెదజల్లిన అక్షరాలను జారిపోకుండా ఒడిసిపట్టుకుంటాం.

భావప్రకటనలో వెలువడే ప్రకంపనలు,వ్యక్తీకరణలో అసాధరణ పదమాధుర్యం,దృష్టికోణంలో విభిన్నపార్శ్వాలు!ఇంత భావచైతన్యానికి కరదీపిక సమాజమే కదా!సంఘర్షణ,సంక్షోభం,సంతోషం సమాలోచనవైపు అడుగిడమంటాయి.మనసులో భావజ్వాలలు ప్రజ్వరిల్లినప్పుడు పదవిస్ఫోటనం భళ్లుమంటుంది.స్వాతికుమారి బండ్లమూడిగారి నివాసం చల్లని చలివేంద్రం మదనపల్లియైనా ఆమె కవితలు నింపిన ఆవిరి చలికాలంలో వెచ్చనిదుప్పటి అందించే వెచ్చదనమే!

*

పేర్ల తో శ్రామిక అస్తిత్వం!

 

Painting: Rafi Haque

Painting: Rafi Haque

పేర్ల వెనుక నిమ్న కులాలుగా పరిగణించబడే వాళ్ళు తమ కులానికి సంబంధించిన శ్రమ పేరును తగిలించుకోవడం – ఐలయ్య సజెషన్. ఇదో చారిత్రక నిర్ణయంగా ప్రకటించాడు ఐలయ్య. ఐలయ్యను ఇంటర్వ్యూ చేసి ఇంగ్లీష్ వెబ్ మేగజైన్ లో ప్రచురించాక ఇదే విషయం మాట్లాడుతూ అన్నాడు ” బాపనోళ్ళకు …చెప్పుకోడానికి ఏ శ్రమ కూడా లేదు. మనం శ్రమ చేయడానికి వెనుకంజ వేయలేదు. శూద్ర కులాలకు వృత్తి ఒకటుంది. అది మన మీద రుద్దబడింది. అయితే మనం చెప్ప్పాల్సింది ” సోమరి పోతులు మీరు. మా ఆత్మ గౌరవాన్ని చంపినా ఏదో ఒక శ్రమ మేము చేసి ఈ సమాజన్ని ఇన్ని యుగాలు పోషించాము. మీరు మా మీద పడి తిన్నాము అని చెప్పుకోడానికి సిగ్గు పడాలి. ” అని నా కులం కనుక్కుని , దానికి సంబంధించిన శ్రమ ను సజెస్ట్ చేసి …  రైటింగ్స్ అన్నిటిలో అదే ప్రచురించుకోమని సూచన ఇచ్చారు.

ఈ స్టాండ్ నేను కంప్లీట్ గా కన్విన్స్ అయిన అంశం కాదు కాబట్టి నేను అనుసరించలేదు. అలా అని నాకు ఎటువంటి కంప్లెయింట్ కూడా లేదు ఐలయ్య గారి సూచన లో.
బ్రాహ్మణిజం మన మీద బలవంతంగా రుద్దిన శ్రమ లు నీచమైనవే కావచ్చు. కాని సమాజానికి ప్రాడక్టివ్ గా ఉపయోగపడిన శ్రమలే. ఆ శ్రమ చేసినందుకు మాకు గర్వం లేదు. కాని శ్రమ నే చేయని సోంభేరుల మీద మాకో ఉన్నతత్వం ఉన్నదనే ఒక ఆలోచన మాలో ఉంది. మాపై రుద్దిన శ్రమలను మేము గ్లోరిఫై చేసుకోము గాని…….బలవంతంగా పూసిన అస్తిత్వాన్ని తిరిగి వాళ్ళ మీదనే ఉపయోగించడానికి వెనుకంజ వేయము. ” నీవు మాదిగోడు ” అంటే మొహం వాల్చేసే వాళ్ళము. అది బ్రాహ్మణుడికి కొండంత బలమిచ్చేది. ” అహె నీవు చెప్పెదేంటి…నేను మాదిగోన్నే…ఏంటంట …నీ ఫీలింగ్ ఇప్పుడు చెప్పు ” అని తల విదిల్చినప్పుడు, ఇందులో అవమాన కరమైన అంశం ఏదో బ్రాహ్మణులే వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించబడింది.

నిజం చెప్పాలంటే కింద కులాలు, పై కులాలను అనుకరించడం Sanskritisation లో భాగమే. అయితే అదో ధికార స్వరం తో చేస్తున్నదిగా మాత్రమే మనం చూడాలి కాని ఆ నిమ్న స్థాయి హోదాను అంగీకరిస్తున్నట్టు అస్తిత్వ రాజకీయాలు ( Politics of assertion ) ఎప్పుడు చెప్పవు. ఇది అర్థం చేసుకుంటే కన్ ఫ్యూజన్ ఉండదు. అంబేద్కర్ assertion గురించి ఇలా చెప్తాడు ” The assertion by the individual of his own opinions and beliefs, his own independence and interest as over against group standards, group authority and group interests is the beginning of all reforms. ” గ్రూప్…అంటే ఇక్కడ బ్రాహ్మణీయ సమాజం లో ” మా అస్తిత్వమిది … అయితే ఏంటంట ? ” అని ఎలుగెత్తి గద్దించే స్వరాలు ఆ బ్రాహ్మణీయ సమాజం లోని అభిప్రాయాలను, నమ్మకాలను, ప్రామాణికాలను, అథారిటీని ప్రశ్నిస్తాయి అని అర్థం .

 

ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ ఏమంటాడో గమనించండి ” But whether the reform will continue depends upon what scope the group affords for such individual assertion ” అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ? – ఎంత మేరకు ఈ Assertion ను గ్రూప్ tolerate చేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న ప్రజాస్వామికత దాన్ని బట్టి తెలుస్తుంది అని అంబేద్కర్ క్లియర్ గా ఒక్ ప్రమాణాని నిర్వచించి చెప్పాడు.

ఇంకా చూడండి ” On the other hand, if the group is intolerant and does not bother about the means it adopts to stifle such individuals they will perish and reform will die out ” అంటే మన assertion వలన కలిగే అసహనమే , మనపై పీడనను పెంచాలనే వాళ్ళ ఆలోచననే సంస్కరణను చంపేస్తుంది.
అంటే మొత్తంగా మన assertion వలన కలిగే అసహనం వారి దుర్మార్గాన్ని పచ్చిగా బయట పెడుతుంది. వారిని expose చేయిస్తుంది. ఇది జాగర్తగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా కుల వివక్ష చూపించే రోజులు తగ్గినా కేపిటలిజం ప్రబలినాక implicit casteism పెరిగింది. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పక్కన కూర్చుంటారు . మరి నేను ఎక్కే 200 సీట్ల విమానం లో దళితులు ఒకరు ఇద్దరు కూడా సరిగ్గా ఉండరెందుకు ? మనం ఈ విషయాన్ని గొంత్తెతి అరిస్తే కుల పిచ్చి అవుతుందా ? లేక assertion అవుతుందా ? మనం దళిత మహా సభ అని పెట్టుకుంటే – దళితులుగా ఉన్నందుకు మనం బ్రాహ్మణులకు ఎంతో ఋణ పడి ఉన్నామని అర్థం వస్తుందా ? బహుజన పార్టీ అంటే – బహుజనులుగా ఉన్నందుకు మనకు ఖుషీగా ఉందని అర్థమ ? ఇది చాప కింద నీరు లాంటి కుత కుత ను …ఉపరితలానికి తెస్తుంది. పాలను పాలుగా …నీళ్ళను నీళ్ళుగా విడగొడుతుంది.
సింపుల్ గా చూస్తే రిజర్వేషన్ గురించి కూడా ఇదే వాదనే కదా వినిపించేది. రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు , మనం కులం గురించి మన అస్తిత్వం గురించి చెప్పుకుంటున్నాము కదా ? ” నీవే కేస్ట్ ” అని అడిగితే ” నేనెందుకు మాలనౌతాను…మీరు అన్నంత మాత్రాన అయిపోతానేంటి ” అనం కదా ? Caste-wise representation (identity ) perpetuates caste అని అన్నప్పుడు సౌత్ బరో కమిటీ ముందు అంబేద్కర్ ఇచ్చినా వాంగ్మూలం ఏంటి ? it ( representation through individual caste identity ) does not perpetuate but it dissolves అని . నేను సఫాయికార్ కార్మిక సంఘం లో ఉన్నప్పుడు …నేను adopt చేసుకున్న నా శ్రమ అస్తిత్వాన్ని, నా పేరుకు తగిలిస్తే అందులో సిగ్గు పడాల్సింది ఏముంది ? ఒక సఫాయి కారుడిగా నేను నా హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, సంఘం లో నా అస్తిత్వం అదే కదా ? అవును నేను సఫాయి కారుడినే…అయితే ఏంటంట…నన్ను ముట్టుకోవా…మైల పడవా ? అప్పటికి నేను అలా చెప్పుకోకపోతే నన్ను ఈ బ్రాహ్మణిజం తల మీద పెట్టుకుని చూస్తున్నట్టు ! ఒక మాటలో చెప్పాలంటే.

 

ఈ దేశం గొప్ప ప్రజాస్వామిక దేశంగా చలామణీ కావాలని అంతర్జాతీయ స్థాయిలో అనుకుంటుంది. ఈ అస్తిత్వ రాజకీయాలు ఈ దేశాన్ని తెగ ఇరుకున పెట్టేసే స్వభావం కలిగి ఉంటాయి. బ్రాహ్మిణిజం యొక్క గొప్ప గుండె ఎంతో ప్రశ్నిస్తాయి. ” The emancipation of the mind and soul is a necessary preliminary for the political expansion of the people ” పెద్దాయన బాబ సాహెబ్ కు ఉన్న క్లారిటీ చాలా అరుదుగా ప్రపంచ స్థాయిలో మేధావులకు ఉంటుంది. Political expansion కావాలి మనకు. అందు కోసం మనల్ని చూసి మనమే, మన శ్రమను చూసి మనమే సిగ్గు పడ్డం ఆగాలి ( అంటే గర్వించాలి అని దాని అర్థం కాదు ) . ” మాదిగ ” ” మాల ” అని ఒక్కాణిస్తూ ఎంత మంది ముందుకు రాగలరో ఈ సమాజం యొక్క ప్రజాస్వామికతకు సవాల్. ఈ దేశం ” అబ్బే , మా దేశం లో కులం ఏమీ లేదండి. ఎక్కడొ అక్కడక్కడ తప్ప….” అని అంటుంటే ఇదో నిరసన లా ఉంటుంది.

అయితే ఇది సరిపోతుందా ? బ్రాహ్మిణిజం ఎన్నో ఎత్తులు ఎత్తుగడలు నేర్చింది. మీరు అలా కులం పేరు తగిలించుకుంటానే , వచ్చి హత్తుకుంటుంది ” నా గొప్ప తనాన్ని ప్రూవ్ చేసుకోడానికి, నాకు మరీ ఇబ్బంది లేని ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్య వాదాలు ” అంటూ. ఈ assertion ద్వారా బ్రాహ్మిణిజానికి కొంత సాంస్కృతిక ఇబ్బంది కలుగుతుంది కాని…ఇవి Socio-econoimc demographies లో మార్పు తెచ్చే ప్రక్రియలు కావు. పైగా ఈ cultural assertion విజయానికి ముఖ్యమైన precondition – వాల్యూం ఉండాలి. Dalit assertion is not great in volumes despite middle class educated individuals have been spreading the importance of assertion. అది పరిమితి. వీలైతే ఈ వాల్యూం మనం పెంచగలగాలి. లేదంటే ఇంకా ఉన్నతమైన భావ జాలం వేపన్నా నడిపించాలి. మనమెటువంటి గొప్ప ఉద్యమం చేయకుండా ఉన్నప్పుడు కనీసం ఇదన్న చేయాలి కదా ?
ప్రతి సమాజం లో ఏవో ఒక తార తమ్యాలు ఉంటాయి. ఎక్కువగా అవి అన్నీ Open nature కలిగి ఉంటాయి. అంటే – ఎవరన్నా సంపాయించుకోవచ్చు, హోదా సంపాయించొచ్చు. మన కుల వ్యవస్థ closed nature కలిగి ఉంటుంది. ఇందులో gradual promotions కూడా ఉండవు. Caste is an enclosure of class అని అంబేద్కర్ అన్నాడు. అంటే మన socio-economic demographies ముందే ఫిక్స్ అయిపోయాయి. అది close . అందులో ఒక గుంపుగా బయటకు రాలేరు (వ్యక్తులుగా రావచ్చు ) . ఒక గుంపుగా వేరే గుంపులో చేరలేరు. assertion ఈ సంస్కృతిని ఈ స్వభావాన్ని ప్రశ్నించినా , అది గుణాత్మక మార్పు తేగలిగే శక్తి దానికి లేదు. ఐలయ్య సిద్ధాంతం ఎదగనిది అక్కడే.

 

Self-sufficient economy గా ఉన్నప్పుడు శ్రమలు మాత్రమే ఉన్నాయి కులాలు లేవని ఒక అంచనా. ఆ తర్వాత economy expand కావడం తో క్రమేణా ఆర్యులు వారి స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా వర్ణ వ్యస్థను ఏర్పరిచారు అదే క్రమేణ కుల వ్యవస్థగా అంచెలంచెలుగా ఎదిగింది అని ఒక వర్షన్. ( Source : Cultural Past by Romila Thapar ) కాబట్టి కులం , శ్రమకు మధ్య న ఉండే Timing గురించి నేను ఇదమిద్దంగా వాదించలేను. అలాగే వ్యభిచారం, అడుక్కోవడం కులానికి సంబంధించిన శ్రమలుగా ఉండాలనే Sanction లేదు. అవి శ్రమ విభజన కిందకు రావు కూడాను. ఆర్థిక లేమి తనం వలన నిమ్న కులాలు గ్రా డ్యువల్ గా అడాప్ట్ చేసుకున్న means of living మాత్రమే. అలాంటి వాళ్ళు ఎటువంటి కులపు శ్రమ తగిలించుకోవాలి అంటే – వారికి శ్రమ allotment లేదు కాబట్టే వారు ఆ శ్రమలు ఎంచుకున్నారు. scavenging లాంటి శ్రమలు చండాల ప్రజలు చేయాలనేది sanction . అలాంటి వృత్తులు తెగించి ఎవరన్నా పేరు చివర తగిలించుకుంటే , వారి కరేజ్ , నిబ్బరం మెచ్చుకోదగ్గ assertion. కాని , పైన చెప్పినట్టుగా ‘ అది సరే, ఆ తర్వాత ఏంటి ? ‘ అనే ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది.
ఉన పోరాటం అస్తిత్వ పోరాటమే కాదు. హక్కుల పోరాటమే కాదు. అది ఇప్పుడు సాంఘిక ఆర్థిక మార్పు కోసం స్థాయిలో ఎదిగిన ఉద్యమం. ఇలాంటి పోరాటాలు కావాలి మనకు. ఇలాంటి సంస్కృతి మనం అలవర్చుకోవాలి. అందుకోసం మనకు assertion politics ను అర్థ చేసుకుంటూనే socio – economic space కోసం ideology ని రూపొందించుకోవాలి.
–          

 

( ఏదైనా స్పష్టత కోసం గాని, మరింత సమాచారం కోసం గాని రచయిత మెయిల్  ID pvvkumar@yahoo.co.uk  గాని  facebook ID ‘ P V Vijay Kumar ‘  పై గాని కాంటాక్ట్  చేయవచ్చు )

 

మార్పుని ఆహ్వానించాలి: జానకీ బాల

janaki1

ప్రతి నెలా లేఖినీ  మహిళా చైతన్య సాహితీ, సాంస్కృతిక సంస్థ  జరుపుకునే ముఖాముఖి సమావేశంలో భాగంగా లేఖిని సభ్యులు  అక్టోబర్ రెండున  సమావేశమయ్యారు. ఆ రోజు కలిశాను   ఇంద్రగంటి జానకీ బాలగారిని!

జానకీ బాల  ‘కనిపించే గతం’ నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం అందుకున్నారు.

మొదటగా మీ బాల్యం,గురించి చెప్పండి

1945  డిసెంబర్ నాలుగున  రాజమండ్రి లో పుట్టాను.  కానీ  ఆ తరువాత  బాల్యం అంతా  తణుకులో   గడిపాను. నా పుట్టిన రోజున  ఇద్దరు మహా గాయకులైన ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ పుట్టారని  చాలా గొప్పగా అనిపిస్తుంది.

సమాజం లో ఒక ఉన్నత వర్గం లో పుట్టినప్పటికి చాల దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. మా అమ్మగారు సూరి లక్ష్మినరసమాంబ గారు  రచయిత్రి కూడా . ఆ నాటి  పరిస్థితిల  దృష్ట్యా  ఆవిడ  తన రచనలను కొన్ని ప్రచురించినప్పటికీ  తరువాత అజ్ఞాతంగానే ఉండిపోయారు  ఆవిడ నాకు తల్లిగానే కాకుండా సంగీతం నేర్పిన గురువు గారు కూడా, నా స్కూల్ ఫీజులు కట్టిన గుఱ్ఱాల శకుంతల గారిని  ఈ సందర్భంగా  నన్ను చదువుకోమని ప్రోత్సహించి,  స్మరించుకోవాలి. సాయం చేసే చేతులకు కులమతాలు అడ్డు రావు.  ఆ తరువాత  నేను ఆమె ఋణం తీర్చేసాను.అది వేరే సంగతి.

మీ మీద ప్రభావం చూపించన రచయితలు

ఒక్కరని చెప్పలేను  ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,బుచ్చిబాబు గారు, మల్లాది వారే కాదు ఇంకా ఎందరో ఉన్నారు,అలాగే  రంగనాయకమ్మ గారి రచనలు  నాకు అత్యంత  ఇష్టమైనవి నచ్చినవి.

మీరు కవయిత్రి కదా? దానికి ప్రేరణ ఎవరు?

స్కూల్ లో ఉన్నప్పుడే  చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. నాకు కవిత్వం మీద ఇష్టం కలగటానికి గల కారణం  ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. వారు స్కూల్ లో జరిగే పోటీలకి జడ్జీగా వచ్చేవారు.  ఆయన అప్పటికే గొప్ప కవి,కానీ ఒక విధమైన  అమాయకత్వంతో నేను రాసిన  కవితలు చదవండి అంటూ ఆయనకి చూపించేదాన్ని. ఆయన  నా కవితలు చదివి ఎంతో ప్రోత్సహించేవారు. భవిష్యత్తులో చక్కటి కవయిత్రివి అవుతావని అనేవారు.

మీ మొట్ట మొదటి కధ ఎప్పుడు రాసారు ఆ వివరాలు తెలపండి

అంటే జగతి పత్రికలో ఓ  రెండు స్కెచ్ లు రాసాను.  ఆ తరువాత 1970 లో మనిషికి మరో మలుపు  అనే కధ  ఆంధ్రపత్రికకి రాసాను.ఆ కధ ప్రచురించబడినప్పుడు ఏదో సాధించినట్లు ఆనందపడిపోయాను. ఈ నలబై ఏళ్ళ కాలం లో దాదాపుగా 130 కధలు రాసాను. మొదటి కధా సంకలనం 1980 లో వేసాను. మొత్తం ఆరు సంకలనాలు వచ్చాయి. అవన్నీ కలిపి జానకీబాల కధలుగా 2013 లో ఒక బృహత్’సంకలనంగా వచ్చింది.

మీరు విలక్షణ మైన కొన్ని  రచనలు చేసారు  దాని గురించిన వివరాలు పంచుకుంటారా?

‘కొమ్మాకొమ్మా కోకిలమ్మా’ అని సినీ నేపధ్య గాయనీమణుల అంతరంగాలను ఆవిష్కరించే దిశగా  ఒక్కో గాయనిమణిని  కలిసి వాళ్ళ అనుభవాలను  అక్షరబద్ధం చేశాను. నా అదృష్టం కొంత మంది  ప్రఖ్యాత గాయనీ మణులను కలిసే అవకాశం  అస్మిత ఫౌండర్  వోల్గా ద్వారా కలిగింది. ముఖ్యంగా, పి.శాంతకుమారి, పి.భానుమతి. పి.లీల, జిక్కిలని  కలవడం  వారి అనుభవాలను వారి ముఖతాః  వినడం జరిగింది.  అలాగే  రావు బాలసరస్వతి, సుశీల,జానకి  గార్లను  కలిసి  వారి అనుభవాలను  కూడా రాసాను.

ఇక్కడ ఇంకో  విషయం నేను పాటలు పాడుతానని తెలిసి  మా తణుకులో ఉండే పి సుశీల వదినగారు రాయసం రాజ్యలక్ష్మి గారి ద్వారా  రెండేళ్లు సుశీలగారి దగ్గర మద్రాసులో ఉన్నాను. అప్పటికింకా నేను చాలా చిన్నదాన్ని.  యశస్విని :సినీ నటి,గాయనీ పి.భానుమతి గారి బయోగ్రఫీ, మార్గదర్శి  దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర, సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి కూడా పుస్తకాలు రాసాను.

janaki2

మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీ వివాహం ఆ వివరాలు చెప్పండి.

తప్పకుండా! తణుకు లో శ్రీకాంతశర్మగారి అన్నగారు ఉండేవారు. వారు మాకు దూరపు బందువులే. ఆ కారణంగా వారు వచ్చిపోతూఉండేవారు. వారి తో పాటు శ్రీకాంతశర్మగారు కూడా వచ్చేవారు. అప్పట్లో పుస్తకాలు చదవడం, వాటిని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉండేది. శ్రీకాంతశర్మగారు మనం పెళ్లి చేసుకుందామా అన్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.

మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి కిరణ్మయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, అబ్బాయి మోహన్ కృష్ణ అచ్చమైన తెలుగుదనానికి అద్దంపట్టే  చిత్రాలు తీస్తున్నాడు.

మీ కధా రచనలకు ప్రేరణ?

ఇంట్లో ఎక్కువ సాహిత్య వాతావరణం ఉండటం వల్ల రాయగలిగే అవకాశం లబించింది. పెళ్లి  తరువాత ఆర్టీసీలో  ఉద్యోగినిగా అకౌంట్స్ డిపార్టుమెంటులో అంకెలతో సావాసం చేస్తూ  అక్షరాలతో రచనలు చేసేదాన్ని, ఆంధ్రజ్యోతి లో శ్రీకాంత్ శర్మగారు ఉద్యోగం విజయవాడలో  జీవితం ఆరంభం. శ్రీకాంత్ శర్మగారు నా కధలు చదివి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు.

ఎక్కువగా ఎవరినీ ప్రశంసించని నండూరి  రామ్మోహన్ రావు గారు నువ్వు కధలు బాగా రాస్తావమ్మా! అనడం, అలాగే వాకాటి పాండురంగారావు గారు లాంటి మహానుభావులు నా కధని మెచ్చుకోవడం నిజంగా ఆనందంగా, సంతోషంగా  అనిపించింది.

మీ నవలల గురించి?

పన్నెండు నవలలు రాసాను. కాకపోతే నాకు  వీక్లీ సీరియల్ రచయిత్రిగా నాకు పేరు రాలేదు. అందుకు బాధ లేదు. నా నవలలు అన్ని కూడా డైలీ సేరియల్స్ గా వచ్చేవి.

చివరగా మీ మాటలు?

రచనలు చేసేటప్పుడు, ప్రాక్టికల్ ప్రొబ్లెంస్ ని గురించి  రచనలు రావాలి. ఆదర్శాలు,మానవత్వం,నీతులు లాంటివి  వట్టి  పేలవమైన పదాలే

అదే విధంగా పూజలు, వ్రతాలూనోముల పట్ల ఆసక్తి లేదు, దేవుడంటే కనిపించని ఒక శక్తి నడిపిస్తోందని నమ్ముతాను.

కొన్ని సార్లు మనలని మనం మార్చుకుంటూ, అంటే ముందు ఒక విధంగా ఉన్న కొన్ని అనుభవాల దృష్ట్యా  మార్పు తప్పనిసరి అవుతుంది. అప్పుడు అలా అన్నావు? ఇప్పుడు ఇలా మారిపోయా వేమిటీ? అనే వారు గమనించవలసిన విషయం, కొన్ని అనుభవాలు జీవితపు దిశను మార్చేస్తాయి కాబట్టి వాటి తో పాటు సాగి పోవలసినదే!

మంచి రచన, చెడ్డ రచన అనేవి లేవు. అది మనం  రిసీవ్ చేస్కోవడంలో ఉంది.

అన్నింటికంటే చాల ముఖ్యమైన విషయం పుస్తకపఠనం అనేది అన్ని వయసుల వారికీ మంచిది. అందుమూలంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది.

ఒక లలిత గీతం పాడి  ముగిస్తాను

“రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో..చల్లినారమ్మా… వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా   మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ… వెన్నెల పరచినారమ్మా..!! కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల  రాసి రాసులుగా…రాసి రాసులుగా…
ఎవరో…పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా”

అంటూ మధురమైన గొంతు తో అతి మధురంగా పాడిన కృష్ణశాస్త్రి గీతం  పట్ట పగలే వెన్నెల జల్లులు కురిపించింది

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మంచు బిందువుల మాల కట్టనా!?

seetaram1

దృశ్యాన్ని  బంధించడం  అంటే ఒక ఊహని బంధించడమే!

ఆ ఊహ కొన్ని సార్లు  నైరూప్యంగా  కూడా ఉండచ్చు, దాని రూపం యేమిటో  అంతుపట్టకపోవచ్చు!

జీవితం ఎంత అందమైందో దృశ్యం అంత  అందమైంది. కనిపించే  ప్రతి  రూపంలోనూ ఒక అందమేదో గూడు కట్టుకొని వుంటుంది.

అలాంటి  అందాన్ని ఇక్కడ  కెమెరా కవి  దండమూడి  సీతారాం పట్టుకున్నాడు.

మరి..

అదే  అందాన్ని మీరు అక్షరాల్లో  పట్టుకోగలరా?!

ప్రయత్నించండి!

ఈ దృశ్యం  మీకెలా అనిపిస్తోందో  ఆ అనుభూతిని  కవితగానో, ఇంకో భావనారూపంగానో తర్జుమా  చేసి, ఇక్కడ రాయండి!

*

 

 

ఎంతకాలం పరిగెడతావ్ ?

unnamed

 

ఒక  మాట:

chuckChuck Palahniuk 1996 లో రాసిన పుస్తకం Fight Club నుంచి ప్రేరణ పొంది David Fincher అదే పేరు తో 1999 లొ సినిమా తీసాడు. ఇందులో పాత్రలు Tyler Durden (Brad Pitt), Narrator (Edward Norton), జీవితం మీద అసహ్యం తో ఉన్నవారి కోసంఒక recreational fight club ని మొదలుపెడతారు. క్లబ్ వారితో కలసి Project Mayhemపేరుతో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీద అట్టాక్  ప్లాన్ చేస్తారు. విజయం సాధించినతరువాత Tyler Durden ఎవరికీ  కనపడడు.    

 

‘Fight Club’ లో

తగిలిన నా దెబ్బలు మానిపోతున్నాయి. Project Mayhem పూర్తయ్యింది.

Tyler Durden ఏమయ్యాడు? ఎక్కడున్నాడు?

_____________________________________________________________________________________________

నీ కుట్ర  బయటపడింది.   అందకుండా  పారిపో , పరిగెత్తు !

వాళ్ళకి నచ్చేది నువ్వు  చెప్పకపోతే కోపం. వాళ్ళకి తెలియనిది నీకు తెలిస్తే ఈర్ష్య. నువ్వు అనుకునేదే నిజం అంటే ‘ ఎవరికి , ఎప్పుడు, ఎలా’ అని ప్రశ్నలు. పోనీ నీ గదిలో నువ్వు ఉండిపోదామంటే సన్నని గోడ లోంచి వినపడే శబ్దాలు, అశాంతి. అలా కాదు,  వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటే , వెనకే వస్తారు, అరిస్తే నవ్వుతారు , ఏడిస్తే దగ్గరకు చేరతారు. నువ్వు వారిని నమ్మే సమయానికి – నీ నిగ్గు తేల్చి సమాజానికి నువ్వో కలుపు మొక్కవని నిరూపించే బాధ్యతని కిరోసిన్ లాగా వాళ్ళ మీద పోసుకుని నిన్ను అగ్గిపుల్ల అడుగుతారు. లేదు, ఇవ్వనంటే వారి కడుపుమంట తో నీకు నిప్పు పెడతారు. ప్రాణమున్న నీ ఉద్దేశాలు ఒక్కొకటీ కాలిపోతుంటే చలి కాచుకుంటారు. సిగరెట్ వెలిగించుకుంటారు. నీ తప్పులకి శిక్షలు గరుడపురాణం లో వెతికి చంకలు గుద్దుకుంటారు.

” మా మీద వాలండి ,  వీలుగా  ఉంటుంది ” , ” ఇలా రండి కూర్చోండి ఎందుకు నిలబడతారు ” అని ఆశలు పెడతారు. నువ్వు వంగక పోతే, నిద్ర పోనివ్వరు, నీ స్థిమితం చెడగొట్టే సంఘాలు ఏర్పరచి సమావేశాలు జరుపుతారు. నీకు వచ్చే ప్రశ్నల్లో, కలల్లో జొరబడి వాటి నిజమైన జవాబులు ఈదలేని మహాసముద్రం లో విసిరేస్తారు. వారికి తట్టే జవాబులని నీ మొహాన విసిరేస్తారు. పొంతన కుదరక నువ్వు తికమక పడుతుంటే ఆశ్చర్యపడతారు.  తప్పులని నువ్వు కేకలు పెడితే జాలిపడతారు. పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు.

నీ పక్క నించునేది ఎవరు ?  నువ్వు చెప్పేది వినేదెవరు ?  నువ్వు చచ్చేప్పుడు తప్ప     వినే తీరిక   ఉండదు జనానికి. స్వార్థాసక్తి. పోయేవాడు ఏం చెప్పి పోతాడో అనే జిహ్వచాపల్యం. నిన్ను వదలరు. రోజూ వచ్చి, దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తారు.    నీ కథ ని అందరికీ చెప్పి , వచ్చే సానుభూతి  నీకు చేరకుండా మధ్యలో దారిదోపిడీ చేసి గాని సుఖించరు. నువ్వు మాట్లాడే మాటలకి ఇచ్చే విలువని నువ్వు బతికున్నావా చస్తూ ఉన్నావా అన్న స్థితి మీద తూచుతుంటారు. అదే వారు నీకిచ్చే గౌరవం. నీ దౌర్భాగ్యం .

అన్నిటినీ తప్పించుకుంటూ, అధిగమించి , పునర్జన్మించావ్. సమాధానాల కవచకుండలాలతో. ఇప్పుడు వీళ్ళంటే భయం లేదు. అసహ్యాన్ని కప్పిపుచ్చి అవసరాన్ని పైకి తేల్చావ్. వాస్తవాల ప్రచారానికి, లోకాల కల్యాణానికి. ఒక్కో ఏరూ దాటాక అబద్ధపు తెప్పలని నిర్భయంగా తగలేశావ్. గానుగెడ్లను విడిపించావ్. కొరడాలతో కొడుతున్నవారిమీదకే వాటి కసి తీరా వదిలేశావ్. హేతువు కోసం కరిగిపొమ్మన్నావ్ , చచ్చిపొమ్మన్నావ్, సమాధులు కట్టించావ్, స్తవాలు పాడించావ్. చచ్చిపోయిన దేవుడి స్థానం నీదేనని అనుకున్నావ్.  ఒక్కసారే విశ్వమంతటికీ మరమ్మత్తు ప్రారంభించావ్. యజ్ఞాన్ని సంకల్పించావ్. నీ జ్ఞానపు ముడులు  విప్పి  చండ మారుతాలు తెచ్చి ఖాండవాగ్ని సృష్టించావ్. నక్కి ఉన్న చుంచెలుకల కలుగులలో కాగడాలు విసిరేశావ్.

ఎలుకలు చచ్చి బయట పడ్డాయ్. ప్లేగు రేగింది. వాన కురిసింది.  నిజాన్ని వెంటాడే మత్తు జనానికి దిగిపోయింది. పాత సుఖం వైపు మనసు మళ్ళిపోయింది. ఆత్మత్యాగాలకి అర్థాలు వెతుకుతున్నారు. వారు కూర్చున్న కొమ్మలని నరికింది నువ్వేనని తేల్చుకున్నారు.  వారి అరచేతులని బలవంతం గా తలలమీద పెట్టబోయావని  నిర్ధారించారు. మరపు నీచుల నైజం. అవిగో, నిజాల్లాగా పొర్లుతున్న అబద్ధాలు విను. నీకు నిప్పు పెట్టే కొరువులు బయల్దేరాయి చూడు. చూసి సగం చచ్చిపో.

గుర్తు చెయ్యటానికి ప్రయత్నించకు, బోధపడదు వాళ్ళకి. చెయ్యని తప్పు ఒప్పుకుని ఆగకు , నీ మోకాళ్ళు విరిచి ఈడ్చుకుపోతారు. వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు మళ్ళీ అజ్ఞానిగా జన్మ ఎత్తాలి. ఉన్న జ్ఞానం తో బతికిపోగలవు .   దొరక్కుండా పారిపో.  నీ కొత్త నిజాల  గుడిసెలు ఎవరికి   ?  ఒక్కొక్కరికీ ఒక్కొక్క అబద్ధపు మేడ ఉంది.

వారి సుఖం కోరిన నిర్దాక్షిణ్యం నీది. నిన్ను కూడా చంపుకునే హంతకుడివి నువ్వు . ఉన్మాదివి, ఎవరూ లేని ఏకాకివి.

ఎంతకాలం పరిగెడతావ్ ?   అలిసిపో. ఆగిపో. దొరికిపో. చచ్చిపో.  ఆ నీచత్వం లో  కలిసిపో . వర్ధిల్లు.

*

సరళ నిర్వచనం కోసం అన్వేషణ!

 

book-cover-oka-sarala-nirvachanam

గరిమెళ్ల నారాయణ గారు వృత్తి రీత్యా శాస్త్రవేత్త. తన తొలి కవితా సంపుటి ‘-273˚C నుండి ఒక సరళ నిర్వచనం’ లో ఈ కవి సృజించిన కవితలు చదివితే, సంక్లిష్ట సమాజంలో మానవ మనస్తత్వాన్ని నిశితంగా గమనిస్తూ ఆదర్శప్రాయమైన జీవితానికొక సరళ నిర్వచనాన్నిచ్చిన సాహసిగా ఇతను కనిపిస్తాడు. ఇతని శాస్త్రీయ దృక్పథం ఇతనిలోని కవిని ప్రేరేపించిందనీ, తద్వారా ఒక కొత్త అభివ్యక్తిని ఇతను సొంతం చేసుకునేందుకు తోడ్పడిందనీ పుస్తకం చదువుతుంటే మనకు అర్ధమవుతుంది. కవితలన్నిటిలో అంతర్లీనమైన సానుకూల దృక్పథం, ఆశావాదం, తోటి మనిషి పట్ల అమితమైన అభిమానం, మన చుట్టూ ఉన్న కుళ్ళుని మనమే శుభ్రపరచుకోవాలన్న ఆరాటం,  స్నేహశీలత, అనుబంధాలపట్ల మక్కువ కమనీయంగా కనిపిస్తాయి.

‘పర్వతుడా! నీపాదాలకునమస్కారం’ కవితలో మల్లి మస్తాన్  బాబుని  స్మృతిస్తూ

తెలియని పాఠాలేవో చెప్పి పర్వతాలని పాదాక్రాంతం చేసుకున్నావో,

లేక అవి మాత్రమే సొంతం చేసుకున్న ప్రకృతి సహజత్వానికే ప్రణమిల్లావోగాని

అనడంలో ప్రకృతీ, పురుషుడూ ఒకరినొకరు పాదాక్రాంతం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రణమిల్లుతూ పరస్పరం గౌరవించుకునే సహజీవన సౌందర్యం కనిపించి‘ వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాట గుర్తొస్తుంది.

పర్వతశిఖరాలమీదజెండాలైనిలబడిననీపాదాలకుశిరసువంచినమస్కరిస్తున్నానుఅంటూ- శిఖరాల మీద నిలబడిన పాదాలనే, పర్వతారోహకుడు తానధిరోహించిన శిఖరం మీద పాతే జెండాలుగా వర్ణించడం కవి సాధించిన అందమైన అభివ్యక్తికి అద్దం పడుతుంది.

 

నిజానికి రెక్కల విలువ తెలిసిన వారు ఇతరుల బహుమతులేవీ ఆశించరు

ఎగిరేపుడు మాత్రం ఎవరైనా తన రెక్కల టపటపల కనుగుణంగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తే బాగుండు ననుకుంటారు

‘రెక్కలనే బహుమతిగా ఇవ్వు’ అనే కవితలో పొందుపరచిన ఈ వాక్యాలు ఒక నిత్య సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. కేవలం చిన్న చిన్న ప్రోత్సాహక వాక్యాలు అందించగల శక్తిని గుర్తుచేస్తాయి.

 

‘రెక్కలుకట్టేవాడు’ కవితలో గుబురుగా పెరిగిన వృక్షాలు భూమికి వర్షాన్ని బహుమతిగా రప్పించుకుంటాయని చెప్పి  ‘ఎగరడమంటే చెట్టులా పైకెగసి, చినుకులా భూమిని ముద్దాడటమేఅంటారు.

చినుకు భూమిని ముద్దాడాలంటే చెట్టు ఎలా పైకెదగాలో చెప్పే సూచన కనిపించి మనసుపులకిస్తుంది. ఇందులో చెట్లు నరికేస్తూ వర్షాభావానికి కారణం తెలుసుకోలేని మనిషికి ఒకసున్నితమైన మందలింపు వినిపిస్తుంది.

పసిపాపల బాల్యచేష్టలని వర్ణిస్తూ ఆ ఆనందాలని,  అపురూపాలని చేతులు చాచి పట్టుకోమని చెప్పే కవితలో‘ అలా పట్టుకున్నాక మీ వయసు విరిగి బాల్యంలో పడకపోతే నన్ను నిలదీసి అడగండి‘ అంటారు!

 

‘ముద్దుల బాధ్యత ఒక రక్షణ కవచం’ లో ‘ట్రోపో, స్ట్రాటో, అయానో ఆవరణాల దుప్పట్లు కప్పుకున్న మురిపాల పాపాయిగా భూమిని వర్ణించడం ఒకకొత్తప్రయోగం.

అమ్మ అనగానే అహర్నిశలూ మన బాగోగులు చూస్తూ, ప్రేమని పంచే వ్యక్తి మన ఊహ లో సాక్షాత్కరిస్తుంది. ఆమె కి అమితమైన బాధ్యత అంటగట్టి, మన బాధ్యతని సులువుగా మరచిపోతాం.  కన్నబిడ్డ విషయంలో మాత్రం అలా అనుకోం. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో ఎంతో శ్రధ్ధ వహిస్తాం!

భూమిని తల్లిగా కాకుండా, మురిపాల పాపాయిగా వర్ణించే ఈ కవితలో ఆమె సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే ఒక హెచ్చరిక వినిపిస్తుంది! ఇది మానవాళికి చాలా ఆవశ్యకమైన హెచ్చరిక.

 

అబల, ఆ(యుధ) బల కావాలని ఆకాంక్షిస్తూ

ఆమె ఒక తుపాకి అయ్యుంటే ఎంత బాగుండేది?…

ఎక్కుపెట్టిన బాణమో, మొనదేలిన బల్లెమో, వళ్లంతా ముళ్లు నింపుకుని ఆత్మరక్షణలో ఆరితేరిన జంతువో అయ్యుంటే ఎంత బాగుండేది?’  అంటారు.

అలా అంటూనే అనవసరమైన ఆయుధీకరణని తుపాకీ ఎప్పుడూ తుపాకీయేప్రతి సమస్యకూ పరిష్కారాన్నిపేలడంలోనే కనుక్కోవాలనుకుంటుందిఅంటూ నిరసిస్తారు.

 

ఎక్కడచూడు .. రెండే..! ఒక పై చెయ్యి ..ఒక కింద చెయ్యి.. పై చెయ్యెపుడూ హుకుం జారీ చేస్తా నంటుందికిందది బానిసలా పడుండి కింద కిందనే అణిగి మణిగి ఉండాలంటుందిఅంటూ, తానెపుడూ చేతులు రెండూ కలిసి కరచాలనమయ్యే చోటుకి ప్రయాణం కడతా’ నంటూ ఒక అపురూపమైన భావాన్ని కవితగా రూపొందించారు.

 

అమ్మ తెల్లవారడాన్ని బలవంతంగా ఆవులించి నిద్రలేపుతుంది అమ్మకి ఇంత కంటే సరళ నిర్వచన మేముంది?

 

అబ్సల్యూట్జీరో (-273˚C) డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పదార్ధాలన్నీ లోపరహితస్థితిలో ఉంటాయన్న వాస్తవాన్ని కవిత్వీకరిస్తూ‘ ఒక్కసారి స్థితిలోకి పోయివచ్చేద్దాంస్వచ్చంగానవ్యనాగరికతనుమొదలెడదాం’ అంటారు.

ఆహ్లాదకరాలు, భాగ్యురాలు లాంటి పదప్రయోగాలనూ, అక్కడక్కడ దొర్లిన అచ్చుతప్పుల్నీ పరిహరిస్తే ఈ నవ యువకవి తొలిపుస్తకం మనిషిని పునరుజ్జీవింపజేసే స్వప్నాలని ఆవిష్కరించి సేదతీరుస్తుంది; ‘ఊహించడానికి ఖర్చేం కాదులేఅని ఊరడిస్తుంది.

వాసిరెడ్డిపబ్లికేషన్స్ (ph.9000528717) లో ప్రింట్పుస్తకంగానూ ,www.kinige.com లో డిజిటల్ ప్రతిగా  లభిస్తున్న ఈపుస్తకం వెల రు. 60.

*

యివే లేకుంటే …

vandana1వందన టేటే రాంచి, ఝార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ కవయిత్రి. రాజస్థాన్ విద్యాపీఠ్ లో తన విద్యను పూర్తిచేసి యే.కే.పంకజ్ ను వివాహమాడి ఆధార్ ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించి ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఝార్ఖండ్ ఆదివాసీల భాష,సాహిత్యం,సంస్కృతులను ప్రతిబింబించే ‘అఖాడా’ అనే పత్రికకు సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వందన టేటే వ్యక్తిగా చాలా ప్రశాంతంగా కనిపించినా ఆమె కవితలు మాత్రం చదివేకొద్ది మనలో నిద్రపోతున్న అలజడులను సృష్టించి మేల్కొల్పుతాయి. యిలాటి అనుభవం కోసం యీమె రచించిన స  ‘కోన్జోగా’ అనే కవితా సంకలనం చదివి తీరాల్సిందే. కొండలతో, నదులతో,పాటలతో తయారైన వో ఆదివాసీ స్త్రీ కి అంకితమిచ్చింది యీ కవయిత్రి. స్త్రీ మారిన తన యింటిపేరనే బరువును మొండిగా,నిర్భయంగా మోస్తున్నదని అవేదన చెందుతుంది. తన పూర్వీకుల త్యాగాలను కీర్తిస్తూ,తన వారి అస్తిత్వ సంక్షోభాలను కవిత్వంగా వినిపిస్తూ వారిలో నమ్మకాన్ని, యేకత్వాన్ని సాధించడాన్ని నిరంతరం కృషి చేస్తున్న కవయిత్రి సామాజిక కార్యకర్త కూడాను.

vandana

సీతాకోకచిలుక
——————–

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు వున్నవి
అందంగా కనిపించేందుకో లేక
యెగిరేందుకో కాదని
రెక్కలు దీని అస్తిత్వంలో భాగం అని
యివే లేకుంటే దానికి వునికే లేదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
మనసును ఆకర్షించేందుకో లేక
వాటి రంగులను నిర్వచించేందుకో కాదని
రంగులు దాని జీవితపు అంగాలు అని
యివే లేకుంటే దానికి యెలాంటి గుర్తింపూ వుండదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
ప్రియుణ్ణి వాటికింద పొదివించుకునేందుకు కాదని
కేవలం పిల్లలను పోషించేందుకు కాదని
దీని రెక్కలు ప్రకృతి శ్వాసలని
యివే లేకుంటే
యీ భూమి జీవించడం కష్టం అని…

*

సుషుమ్న

Art: Satya Sufi

Art: Satya Sufi

      

హాల్ లో  దివాన్ మీద కొత్త దుప్పటి.   టీపాయ్ మీద చక్కగా మడత పెట్టిన ఈరోజు దినపత్రిక.  ఇంకా చదవలేదు.  చాలా సార్లు అలానే ఉంచేస్తాను. చదవను.  కుదరదు.  కుదుర్చుకోను.  ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు పెట్టి టీపాయ్ మీద అందంగా అమర్చి చూసుకున్నాను.  బావున్నాయి.  కర్టెన్లు కూడా కొత్తవి.  లేత పసుపు రంగు మీద పచ్చ పచ్చని పూలతో అవి కూడా బావున్నాయి.   కర్టెన్ల వెనక కిటికీలు మూసి వున్నాయి.  వీధి గది కూడా మూసే వుంది.   సేఫ్టీ కోసం అన్ని వైపులా మూసే ఉంచాను!

ఇంతలోకి కాలింగ్ బెల్ ఒకటే మోత.  తలుపు రంద్రం లోంచి చూసేప్పటికి   ఎవరో అపరిచిత వృద్ధుడు. మొత్తంగా  తెల్ల బడిన జుత్తు.    మేని చామన ఛాయ.  దయగా ప్రేమగా కనబడుతున్న కళ్ళు. ముఖం బిగువుగా వుంది.  వయసు అంచనా కష్టం!  తక్కువలో తక్కువ ఎనభై ఉండొచ్చు .  తలుపు తీశాను.

“ఎవరూ?”ప్రశ్నార్ధకంగా అడిగాను.

“ఆనందాన్ని”చిరునవ్వు నవ్వాడు.  ఏ ఆనందం?  ఎటువైపు బంధువు?  పోనీ ఎవరేనా పాఠకుడా?  ప్రశ్నార్ధకంగా చూశాను.

“గుర్తుకు రావడం లేదా?”

“లోపలి రానిస్తే గుర్తుచేస్తాను”మళ్ళీ అతనే అన్నాడు.

“రండి”పక్కకి జరిగి దారి ఇచ్చాను.  వృద్దుడు.  చూసి భయపడాల్సిండీ, అనుమానించాల్సిందీ కనబళ్ళేదు.

చనువుగా లోపలి వచ్చేశాడు.   సోఫాలో కూలబడబోతూ చుట్టూ చూశాడు.  కొద్దిగా మొహం చిట్లించాడు.  గబా గబా కర్టెన్లన్నీ పక్కకి లాగాడు.  కిటికీలన్నీ తెరిచాడు.  బొత్తిగా మొహమాటం లేనివాడల్లె వుంది!  ఏదో సొంతింట్లో తిరిగినట్టు  అటూ  ఇటూ  తిరిగాడు.  పుస్తకాల షెల్ఫ్ చూశాడు.   తెల్ల బోయి  అతని వంక చూస్తూ కాసేపు వుండిపోయాను.

“మంచి నీళ్ళు తీసుకుంటారా?” దూకుడుకి అడ్డు కట్ట వేసి ఒక చోట కూర్చో పెడదామని అడిగాను.

“వద్దు.  నీతో కొంచం పని వుండి వచ్చాను”

 

“పనా?!  ఏం పని?”

“కథ రాసి పెట్టాలి”

“కథా?  ఏం కథ?  ఎందుకూ? మీరెవరు?”ఏదైనా చిన్న పత్రిక నడిపే వాడా?  లేదా ఏదైనా సినిమా మనిషా?  సినిమా మనిషైతే  నా దగ్గరకు రాడే!

“ఒక కథ చెబుతాను.  కథ కాదు, నా  తెలిసినదేదో అనుకో.  దాన్ని నువ్వు రాయాలి”

“మీకు తెలిసిందే ఐతే  మీరే రాసుకోవచ్చుగా?”

“నువ్వు నా కన్నా బాగా రాయగలవు.  రచయిత్రివి కదా”

“ఐతే?”

“నన్ను నేను మౌఖికంగా వ్యక్త పరచగలను కానీ సరిగా రాయలేను.  అందుకే నీ సహాయం కావాలి”

“సరే చెప్పండి”ఇలాంటివి నాకసలు ఇష్టం వుండదు.  కానీ పాపం ముసలాయన.  తాపత్రయం కొద్దీ  వచ్చి ఉంటాడు.  రాయడం రాయక పోవడం తరవాతి సంగతి కదా.  చెప్పే నాలుగు ముక్కలు చేవినేసుకుంటే పోయేదేముంది.

సోఫా లోంచి లేచాడు.  తత్తర బిత్తరగా గదిలో తిరిగాడు.  దినపత్రిక చేతిలోకి  తీసుకున్నాడు.  వణుకుతూ పేజీలు  తిప్పాడు.

“ఇది చాలా ఎర్రబడి పోయింది.  పాపం.  రక్తం బైటికి కారి గడ్డ కట్టింది చూసావా?  మురిగి భరించలేని వాసన వేస్తోంది.  దీన్ని బైట పారేయోచ్చుగా”

“ఏమంటున్నారు?!”
“మనిషికీ మనిషికీ యుద్ధం ఎందుకు జరుగుతోందో నీకు తెలుసా?  ఆసలు యుద్ధం జరగాల్సింది బాహ్య క్షేత్రం మీద కాదు.  మనిషిలోపలనే.  యుద్ధం మొదలయ్యేది లోపలనే.  అంతం కావలసిందీ లోపలనే.  ఇప్పుడంతా సిస్టమ్ లీకేజ్.  చాలా ప్రమాదం.   తిరగబడి పోతోంది.  అదంతా ఎందుకలా జరిగిపోతుందో  తెలుసా?యుద్ద్ధాలూ, పోరాటాలూ, వీటి గురించి  ఆలోచిస్తావా  ఎప్పుడైనా?  మాట్లాడతావా ఎప్పుడైనా?  లేకపోతే ఒక ప్రేమ కథ, ఒక దయ్యం కథ, ఒక ముసలి మనిషి కథతో సరిపెట్టేస్తావా?”నా పక్కనే కూలబడి రెట్టించి  అడిగాడు.

కొంచెం కోపం వచ్చింది.  చిరాకు కూడా.

“నువ్వు ఏది రాసినా పర్లేదు.  కొద్దిగా కామన్ సెన్స్.  కానీ ఈ మురుగు వాసన గురించి రాయకపోతే చాలా నష్టం.  ఇది అంటువ్యాధి.  నీ ఇల్లంతటికీ అంటుకుంటుంది.”

లేచి వేరే కుర్చీలో కూర్చోబోయాను.  రెక్క పట్టుకుని ఆపాడు.

“నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక తోట.  నల్లని రేగడి మట్టి.  పుచ్చిపోయిన విత్తనం  వేసినా మొలకెత్తేది.  అంత చక్కని మట్టి.  మట్టిలో మధ్యలో ఒక రాతి బొమ్మ వుండేది.  బీజాన్ని చల్లుతున్న రైతు బొమ్మ.  ఎంత బాగుండేదనుకున్నావ్!  రోజూ  చూసే వాణ్ణి.  ఆ విగ్రహపు ముక్కు రంధ్రాలు చాలా పెద్దగా ఉండేవి.  నాకు ఆశ్చర్యం కలిగించేవి”

కథ చెబుతానని సోది చెబుతున్నాడు.  మనసులో విసుక్కున్నాను.

“నాకు నుదురు మీద రెండు పుట్టు మచ్చలున్నాయి.  ఒకటి కుడి పక్క,  నెల వంకని పోలి ఉంటుంది.  ఇంకొకటి ఎడమ పక్క, సూర్యుడి చిహ్నంలా వుంటుంది”జుట్టు వెనక్కి లాగి రెండు పుట్టుమచ్చలు చూబించాడు.  నిజంగానే రెండుపక్కలా రెండు మచ్చలేవో వున్నాయి.  కానీ, మధ్యలో ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఏంటి!  విసుగు చిరాకుగా రూపు దిద్దుకోడం మొదలైంది.

 

“పదేళ్ళ పిల్లాడిగా వున్నప్ప్పుడు నాకు ప్రతి రోజు ఓ కల వచ్చేది.  ఆ అడవి మనిషి విగ్రహం పక్కన  నేను; ఆకాశంలో ఓ పక్క సూర్యుడు; ఇంకో పక్క చంద్రుడు.  ఇంతలో  రెండు జంతువులు విగ్రహం లోంచి బైటికొచ్చేవి.  ఆ జంతువులు మొదట  చిన్నగా ఉండేవి.  చూస్తుండగా పెద్దగా మారేవి.  ఒకటి కుందేలు,  ఇంకోటి గుర్రం.  కుందేలు వెండి రంగులో, గుఱ్ఱం బంగారు రంగులో ప్రకాశించేవి.   బైటికి వస్తూనే వేగంగా పరుగు మొదలు పెట్టేవి.  గుర్రాన్ని తాకాలని పరిగెత్తేవాడిని.  దొరికేది కాదు.  కనీసం కుందేలుని పట్టుకోవాలని ప్రయత్నించే వాడిని.  అదీ దొరికేది కాదు. పరిగెట్టేవి.  కుందేలు చంద్రుడిలోకి దూకేది.  గుర్రం సూర్యుడి మీదికి  దూకేది ”

మాయలేడి లాగా మాయా జంతువులు!  అయినా కలలో మాయా జంతువులూ, మనుషులూ, దయ్యాలూ, భూతాలూ ఇవ్వన్నీ అందరికీ కనబడుతుంటాయి.  పనిగట్టుకుని వాటి గురించి చెప్పుకోడం ఎందుకు!

“పూల తోటలో  సూర్యుడు ఉదయించే వేళ ఎర్రటి తూనీగ కనబడేది.  నాకొక్కడికే.  సాయంకాలం చంద్రుడు వచ్చే సమయానికి తెల్లటి సీతాకోక చిలక కనబడేది.  అదీ నాకొక్కడికే.   నీకు సీతా కోక చిలక ఇష్టమా లేక తూనీగా ఇష్టమా?”

తిక్క వాగుడికి తోడు  ఏదిష్టం అని  వెధవ క్విజ్ !  నేనేం చెప్పలేదు.

“ఈ రహస్యం నీకు తెలుసా?”

“ఏ రహస్యం?”

“జన్మ రహస్యం.  నా రహస్యం, నీ రహస్యం.   ఒక సాయంకాలం సూర్యుడు ఒక పక్క అస్తమిస్తూ వుండంగానే ఇంకో పక్క ఆకాశంలో చంద్రుడు కనిపించాడు.  ఆ సాయంకాలం విగ్రహం ముక్కు రంద్రాల్లోంచి రెండు ధగ ధగ లాడే కుంకుడు గింజంత వజ్రాలు బైట పడ్డాయి.  ఆ వజ్రాల్లో ఒకటి నీలి రంగుది.  ఇంకోటి నారింజ రంగుది”

“కుంకుడు గింజంత వజ్రాలా!” ఇతని పూర్వీకులు బాగా ధన వంతులై ఉండుంటారు.  అందుకే వజ్రాలని దాచి పెట్టారు!

“చూసావా ఎప్పుడైనా అటువంటి  వజ్రాల్ని”

“చూళ్ళేదు”

“కావాలా?”

ఆశ్చర్యం స్థానంలోఅనుమానం.  కావాలని చెప్పలేదు, వద్దని చెప్పలేదు.

“ఆ వజ్రాల్లో ఎర్రదానిని ఎడం చేతిలోకి తీసుకున్నాను.  నీలం దానిని కుడిచేతిలోకి తీసుకున్నాను.  అప్పుడేమైఁదో తెలుసా?  నా శరీరంలో ఎడమ సగభాగం చల్లగా అయిపోయింది.  కుడి భాగం వేడెక్కిపోయింది.  ఇలా ఎక్కడైనా జరగుతుందని నీకు ఇంతకూ ముందు తెలుసా? నువ్వు నేను చెప్పేది నమ్ముతున్నావా? నమ్మట్లేదా?”నా ముఖం వంక చూసి అతని మాటల్ని నేను అనుమాన పడుతున్నానని కనిబెట్టేశాడు. నమ్మినా నమ్మక పోయినా తను చెప్పేది చెప్పేదే అన్నట్టు ముందుకు వెళ్ళాడు.

“ఆ వజ్ర్రాల్ని చేతిలోకి తీసుకుంటూనే నేను ఉన్నట్టుంది అనంతం లోకి వ్యాపించాను.  రెప్ప మూసి తెరిచేలోగా నేను అంతరిక్షంలో వున్నాను.  అక్కడో ప్రాణ పుంజం వుంది.  దాని కిరణాలు అన్నివైపులా వ్యాపించి వున్నాయి”ఉత్తేజంగా చెబుతున్నాడు.

“ఔనా?!”

“నాకు అసలు విషయం  తెలిసిపోయింది”గొంతు తగ్గించి చెప్పాడు.

“ఏంటదీ?!”

“ఆ ప్రాణ  పుంజం ఎంతవరకూ చొచ్చుకుని పోతుందో అంతవరకూ  ప్రాణ శక్తి మనుగడ.  ఉపసంహరిస్తే నిర్జీవం.  అసలుకి మొదటి మనిషి లోపటి ధాతువులు ఒక్కటే.  కానీ కారణం  లేకండా రెండు భాగాలైపోయాడు.  ఇద్దరు మనుషులుగా మారిపోయాడు.  ఆ ఇద్దరూ  రెండు  కేలండర్లు తయారు చేసుకున్నారు.  ఒకరు సూర్యుడి గమనం లెక్కేశాడు, ఒకరు చంద్రుడి గమనం లెక్కేశాడు”

“ఐతే ఏంటి?!”

“ఇంతమాత్రానికే ఇద్దరూ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు.  మళ్ళీ ఈ ఒక్కో కేలండర్ వాళ్ళూ తమలో తాము తెగలుగా విడిపోయారు.   గొడవ పడుతూనే వున్నారు.  ఎప్పటినుంచి అనుకున్నావు?  నీకసలు ఊహకే అందని కాలం నుంచీ.  మరీ పాత విషయం కదా. అందుకే ఎవరూ గుర్తించుకోలేక పోయారు”

“కేలండర్ల గురించే గొడవలా?”

“గొడవలే కాదు.  పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి.  జరుగుతున్నాయి. జరగబోతున్నాయి”

“కేలండర్ గురించి ఎవరైనా ఎందుకు గొడవ పడతారు?  మీరు చెప్పేది మరీ అర్ధం లేకుండా వుంది”

“నువ్విలాగే అంటావని ఊహించాను.  సరే ఐతే నువ్వు చెప్పు, ఎందుకు యుద్ధాలు జరుగుతాయో?”

“యుద్ధాలు ఎక్కువ భాగం  ఆర్ధిక కారణాల వల్ల జరుగుతాయి.  బైటికి కనబడని బలమైన డ్రైవ్స్ వల్ల జనాలు ఒకరి నొకరు చంపుకుంటారు.  నాకు తెలుసు, యుద్ధాలు అతి తెలివిగలవాడి పన్నాగంతో ప్రారంభం అవుతాయి.  చాలా మటుకు వాడికే లాభిస్తాయి”నిజానికి పిచ్చోడితో నేను ఇన్నేసి మాటలు మాట్టాడకూడదు.  కానీ,  ఎందుకో నాక్కూడా తెలుసులేవో అని చెప్పాలని పించింది.

“నేను చెప్పిన దానికీ, నువ్వు చెప్పిన దానికీ తేడా లేనే లేదు.  కేలండర్లు వేరు కావడం గురించే నువ్వు కూడా చెబుతుంట!  మనిద్దరి భావనా ఒకటే.  చూడు, అన్నం అందరికీ కావాలి.  కానీ కొంచమే వుంది.  సరిపోదు.  సరిపోవాలంటే ఇంకా చాలా పండించాలి.  పండించడానికి చోటు కావాలి.  వేరుకి నీళ్ళు కావాలి.  మొక్కకి వెలుతురు కావాలి.  ఇవ్వన్నీ ఒక్కచోటనే దొరకవు మరి.  దొరకప్పోతే ఎవడైనా  ఏం చెయ్యగలడు?”

Kadha-Saranga-2-300x268

ఖర్మ కాబోతే తలా తోకా లేని ఇతని వాగుడేంటి.  పొద్దున్నే అనుకోకుండా ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కు పోవడమేంటి!.   ఈ పిచ్చాడు ఇలా వాగీ వాగీ ఉన్నట్టుండి జేబులోంచి కత్తి తీసి దాడిచేస్తే , మీద పడి కరిచేస్తే.  దేవుడా ఇప్పుడు ఏమిటి చెయ్యడం.  ఇటువంటి ఇబ్బందులు వస్తాయనే సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రే తెచ్చి పెట్టాను.  సమయానికి అది ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదు.

“నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నట్టు లేదు” నా భావనలు కనిబెట్టినట్టుగా చిన్నగా నవ్వాడు.  ముందుకు జరిగాడు.  కుడి చేతి గుప్పిడి మూసి వుంది.  తెరిచి చూబించాడు.  నిజంగానే మెరుస్తున్న రెండు రంగు రాళ్ళు వున్నాయి చేతిలో.   నా రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు.  నాకు ఖంగారు పుట్టింది.  చేతుల్ని వెనక్కి లాక్కోవాలని చూసాను, గట్టిగా పుట్టుకుని వున్నాడు.  నా వల్ల కాలేదు.    ఏదో కనికట్టు చేస్తున్నాడు.

“మనం ఇంతకూ ముందు కలవక పోయినా నువ్వు నన్ను ఇప్పటికే గుర్తు పట్టి వుండాలి”

“అయ్యో, నిజంగా మీరెవరో నాకు తెలీదు.  నేను గుర్తు పట్టలేదు.  దయచేసి మీరు ఇంక బైటికి వెళ్ళండి”ఎలాగో ఈ నాలుగు ముక్కలూ మాట్టాడగలిగాను.

“గుర్తు పట్టలేదా?  నేను పురుషుడిని కదా.  ఎందుకు గుర్తు పట్టలేదు?” దబాయించాడు..

వీడమ్మా భడవా. ముసిలాడు సామాన్యుడుకాదు.  ఇది మామూలు పిచ్చి కాదు.  ఈ పురుషుడి బారినుండి ఇప్ప్పుదేలా బైట పడాలి.  సమయానికి ఇంటి పురుషుడు బైటికి వెళ్ళాడు.

“మన మధ్య కూడా లెక్క లేనన్ని వైరుధ్యాలు.  కానీ, నిజానికి మనమిద్దరం కూడా ఏకాంశులం.  జ్ఞాపకం వుందీ?”

“నాకేం జ్ఞాపకం లేదు.  ముందు మీరు ఇంట్లోంచి బైటికి వెళ్ళండి ” హిస్టీరిక్ గా అరిచాను.  తల విదిలించాడు.

“చూస్తున్నవన్నీ ఒకే ధాతువుల నుండి వేరు పడ్డ శరీరాలు.   ఆ లెక్కన  నేను నీకు సోదరుణ్ణి.  సరేలే, ఈ పిలుపులు అన్నీ సబ్ కాన్సియస్ మైండ్ చేసే మేజిక్కులు.  నాకూ తెలుసు.  కానీ నేనేమంటానంటే, అర్ధం చేసుకో.  ఎలాగోలా.  బీజంలో ప్రాణం వుండాలి.  అది మెత్తటి సారవంతమైన క్షేత్రంలో వుండాలి.  అప్పుడే మొలకెత్తుతుంది.  శరీరాలు బిగుసుకు పోతే అవి స్కలనానికి పనికిరావు.  నేను చెప్పింది రాయి.  నువ్వు రాయక పోతే నేను మళ్ళీ వస్తాను”లేచి వడి వడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు.  నేను ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్లి గబాల్న తలుపేసేశాను.

“రాయకపోతే మళ్ళీ వస్తాను.  తీశావా పెన్నూ పేపరూ, ఇంకా లేదా?”తలుపు బైట నుంచీ కేకలు వేశాడు.  నాన్న చిన్నప్పుడు హోమ వర్క్ చేశావా లేదా అని అరిచినట్టుగా వుంది.  భయపడ్డాను.  నాన్నకి భయపడినట్టే.  దడ దడ లాడతా నాలుగు తెల్ల కాగితాలు తీసుకుని వంకర టింకరగా ఏదోలా రాసేశాను.  చమటలు కారి పోతున్నాయి.  కాగితం తడిసి పోయింది.    ఎలాగోలా రాసేశాను.  హడావిడిగా రాయటాన పెన్ను ఒత్తిడి కలిగించి కుడిచేతి వేళ్ళు ఎర్రగా తేలాయి.

నాలుగు రంగులు మిగిల్చే కవిత

painting: Mandira Bhaduri

painting: Mandira Bhaduri

ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.

మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.

ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.

కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.

పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.

హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*

వర్ణ చిత్రం

-మానస చామర్తి

~
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని తొందరపడతాయి
వేళ్ళు. వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు ఊదారంగు సముద్రం,
పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ
వెనుకొక లోకం గీతలుగా మెదులుతూ
చెదురుతున్న చిత్రం పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది
కుంచె జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

వింత వర్ణాల “పులి ముగ్గు”

puli3

విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల మహా చమత్కారి అయిన ఆయన కొడుకు పావని శాస్త్రి

రీ టెల్లింగ్ చేస్తే అదెలా ఉంటుంది? అందునా ఇది తెలుగులో మొట్ట మొదటి రీటోల్డ్ నవల అని పావని శాస్త్రే స్వయంగా చెప్పారు. అదలా ఉంచితే ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల

ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో  ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు!

విశ్వనాథ సత్యనారాయణ “పురాణ గ్రంథ వైరి మాల” అనే గ్రంథ సంపుటిని 16 సంపుటాలు వెలువరిద్దామని సంకల్పించి, 12 సంపుటాలతోనే ముగించారు. అవి

భగవంతుని మీద పగ,

నాస్తిక ధూమము,

ధూమ రేఖ,

నందో రాజా భవిష్యతి,

చంద్రగుప్తుని స్వప్నము,

అశ్వమేథము,

అమృత వల్లి,

పులి మ్రుగ్గు,

నాగసేనుడు,

హెలీనా,

వేదవతి,

నివేదిత.

వీటిలో   “పులి మ్రుగ్గు” ని పావని శాస్త్రి “పులి ముగ్గు” గా అతి సరళమైన (అందులోనూ ఆయన బహు చమత్కారి, హాస్య ప్రియుడూనూ) తెలుగులో తిరగరాశారు.

నవల ప్రారంభిస్తూ  “పొద్దు నడిమింటికి వచ్చినది” అని విశ్వనాథ రాస్తే, పావని శాస్త్రి “బారలు చాచి దూకుతున్న పెద్ద పులి లాగా సూర్యుడు నడి నెత్తికొచ్చాడు” అంటాడు. ఎండతో మండి పడుతున్న సూర్యుడిని కథలో అడుగడుగునా ఎదురు పడే పులి రో రిలేట్ చేసి, కథకూ పులికీ సంబంధం ఉందని ముందే ఉత్సుకత రేకెత్తిస్తాడు రచయిత. అలాటి చమత్కారంతో మొదలైన నవల కథాంశం కూడా ఆసక్తి కరమే!

కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి  పోయిన మనిషి  .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ

ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి  అలసిన  ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్తారు. తెల్లవారు జామున వాళ్ళెదురు చూస్తున్న పులి రానే వస్తుంది. తుప్పల్లో దాచిన కొయ్య తెప్పను తీసి, దాన్ని తోసుకుంటూ నీళ్ళలో ప్రయాణం ప్రారంభిస్తుంది.శ్రీముఖుడు (ఇతన్ని నవల్లో సిముఖ శాతకర్ణి గా సంబోధిస్తాడు రచయిత) అలా మైళ్ళ కొలదీ నీళ్ళలో తెప్ప నడుపుకుంటూ పోతున్న పులిని నిశ్శబ్దంగా ఈదుతూ అనుసరిస్తాడు. చివరికి తెల్లవారాక పులి ఆ తెప్పను ఒడ్డున వదిలి సమీపంలోని గుహ లోకి పోతుంది. దాని వెనకాలే వెళ్ళిన సిముఖ శాతకర్ణికి అక్కడ పులి కనిపించదు కానీ నేల మీద తీర్చి దిద్ది ఉన్న వింత రంగు రంగుల ముగ్గులో పడుకుని ఉన్న ఒక మనిషి కనిపించి “ఎవర్నువ్వు? ఎందుకొచ్చా”వని ప్రశ్నిస్తాడు.

“మనిషి కాళ్ళున్న పులిని చూశాను, దాని కోసమే వచ్చాను”

“ఇక్కడే పులీ , గిలీ లేదు లేదు, చుశావు గా, నేనే ఉన్నాను, వెళ్ళొచ్చు”

“లేదు, ఆ పులి ఈ గుహలోకే వచ్చింది, నేను చూశాను”

ఇలా కొంత సేపు వాదన జరిగాక ఆ పులి వ్యక్తి శ్రీముఖుడి చరిత్ర గురించి మొత్తం చెప్పడం తో, శ్రీముఖుడు అతడిని చిన్నపుడే నగర బహిష్కరణకు గురై వెళ్ళి పోయిన తన గురువు జయద్రధుడి గా గుర్తిస్తాడు. అతడే పులిగా మారే విద్యను అభ్యసించి దాన్ని సాధించాడని గ్రహిస్తాడు. కానీ ఎందుకు? ఎందుకు పులిగా మారడం? ఎవరికి ప్రయోజనం ? ఏమిటీ వింత పని?

***

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

ఆంధ్రుల రాజధాని ధాన్య కటకం! రాజుకెంతమంది కొడుకులున్నా పెద్దవాడే రాజవుతాడు. మిగతావాళ్లంతా రాజ పుత్రులు. తర్వాత దాయాదులు, తాతా సహోదరులు (తాతలు అన్నదమ్ములు), జ్ఞాతులు.. చివరికి ఎవరికి వారే! అలా తరతరాలుగా జ్ఞాతులైన అనేక రాజ కుటుంబాల వాళ్లు ధాన్యకటకంలో అనేక కుటుంబాల వాళ్ళున్నారు.

కథా కాలం నాటికి చంద్ర శేఖర శాతకర్ణి ఆంధ్ర రాజు. అతని తాతా సహోదరుడు గోముఖ శాతకర్ణి (అంటే గోముఖ శాతకర్ణి తాత, చంద్ర శేఖర శాతకర్ణి తాతా అన్నదమ్ములు). గోముఖ శాతకర్ణికి ఒక్కడే కొడుకు శ్రీముఖ శాతకర్ణి. చంద్ర శేఖర శాతకర్ణి కి పిల్లలు లేరు. వేటకెళ్ళిన చంద్ర శేఖర శాతకర్ణికి జయద్రధుడు మొదటి సారి అడవిలో కలుస్తాడు. ఇద్దరి మధ్యా కత్తియుద్ధం జరుగుతుంది.  రాజు ఓడాడు.జయద్రధుడి షరతు, తాను రాజ్యానికి వచ్చి రాజ్యంలోని రాజ కుటుంబాల పిల్లలందరికీ ఖడ్గవిద్య నేర్పిస్తాననీ,అందుకు రాజు ఒప్పుకోవాలనీ! పలు విధాలుగా ఆలోచించినా దాని వల్ల ప్రమాదమేమీ కనపడదు రాజుకు. తనేదైనా తప్పు చేస్తే రాజ్య బహిష్కరణ చెయ్యొచ్చని జయద్రధుడే రాజుకి సూచిస్తాడు.

తాను ప్రయోగించిన రహస్య విద్యకు కూడా తిరుగుడు ప్రయోగించిన జయద్రధుడు గొప్ప ఖడ్గ విద్యా పారంగతుడు కాబట్టి వాడు తన రాజ్యానికి వచ్చినా నష్టం లేదని, రాజ కుమారులందరికీ విద్య నేర్పవచ్చని రాజ్యానికి తీసుకొస్తాడు చంద్ర శేఖర శాతకర్ణి

రాజ యువకులందరికీ విద్య నేర్పిన జయద్రధుడికి శ్రీముఖ శాతకర్ణి ప్రియ శిష్యుడయ్యాడు. అతడిలో ఉన్న అహంకారాన్ని, కొంత నాస్తిక దృక్పథాన్నీ జయద్రధుడు పెంచి పోషించాడు. దాంతో శ్రీముఖుడు మరింత అహంకారిగా తయారై, రాజుని లెక్క చేయకుండా తిరగడం మొదలు పెట్టాడు.వాడి నిర్లక్ష్య ధోరణి ని రాజు సహిస్తూ వచ్చాడు చాలా రోజులు!

ఆ రాజ్యంలోనే నీలాంబర శాతకర్ణి అనే రాజ కుటుంబీకుడున్నాడు. అతనికి జయద్రధి అనే కూతురుంది. ఆమె కూడా జయద్రధుడి వద్ద ఖడ్గ విద్య నేర్చుకుంది. జయద్రధుడు ఆమెతో ప్రేమాయణం నడిపి ఆమె గర్భానికి కారణమవుతాడు. ఆమెను వివాహం చేసుకోమని ఆమె తండ్రి కోరితే జయద్రధుడు తిరస్కరిస్తాడు, తాను తాపసినే తప్ప సంసారిని కాలేనని చెబుతాడు!

గురువు అండతో రెచ్చి పోతున్న శ్రీముఖుడిని అణచడానికి చంద్ర శేఖర శాతకర్ణికి ఒక అవకాశం దొరింది. అతడు జయద్రధుడు చేసిన తప్పుకు దేశ బహిష్కరణ విధించాడు. ఆ కారణంగా విప్లవాన్ని లేవదీసిన శ్రీముఖుడికి కూడా దేశ బహిష్కరణ విధించి ఇద్దరి పీడా ఒకటే సారి వదుల్చుకున్నాడు.

శ్రీముఖుడు వెళ్ళి మగధ సైన్యంలో చేరి సేనాధిపతి అయి, సుశర్మ రాజయ్యాక తనే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. రాజంటే విపరీతమైన భక్తి.

ఇలా ఉండగా, ధాన్యకటకంలోని ఉత్తమ రాజ కుటుంబీకుల్లో ఒకడైన గంగాధర శాతకర్ణి కి శ్రీముఖుడి కార్యకలాపాల పట్ల ఆందోళన కలుగుతుంది. అతడికి జయద్రధుడంటే ఏ మాత్రం గౌరవమూ లెక్కా జమా లేదు! వాడొక క్షుద్ర విద్యోపాసకుడని, మంత్రాలతో ఖడ్గ విద్యను అనుసంధానం చేసే క్షుద్రుడని భావిస్తాడు. శ్రీముఖుడు మగధ కు మంత్రయ్యాక అతడికి ఆందోళన పెరుగుతుంది.

సుశర్మ సర్వ భారత చక్రవర్తి. సుశర్మ  తర్వాత శ్రీముఖుడు రాజైతే , కేవలం రాజై వూరుకుంటాడా? తప్పక ధాన్యకటకం మీద దాడి చేసి తమ కుటుంబాలన్నిటి మీదా పగ సాధిస్తాడు. కాబట్టి వాడిని ఎదుర్కోవాలంటే సుశర్మ దగ్గర తమ మనిషి ఎవరైనా ఉండాలి” అని ఆలోచించి, తన ఏకైక కుమార్తె, అందాల బొమ్మ పద్మ రాణిని సుశర్మ వద్దకు పంపిస్తాడు. సుశర్మ చూస్తే బ్రాహ్మణ రాజు, తాము క్షత్రియులు! అందుకే వివాహం పేరు ఎత్తకపోయినా “వివాహం జరగాలనే” ఆకాంక్ష తోనే పద్మ రాణిని, సకల సంభారాలతో, వివాహానికి కావలసిన వస్తువులతో సుశర్మ దగ్గరికి పంపుతాడు.

సుశర్మ, పద్మ రాణి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతారు

పద్మ రాణి అతనికి ప్రియురాలై పోయింది. వివాహం కాలేదు. కానీ వారిద్దరీ ఆ తేడాయే లేదు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు

శ్రీముఖుడు పద్మ రాణిని గుర్తించినా పెద్ద ప్రమాద కారిగా భావించడు. సుశర్మ అంటే అతనికి ఎనలేని గౌరవం. అతనికి ద్రోహం తలపెట్టే ఆలోచన ఏ కోశానా లేదు!

పద్మరాణి వచ్చాక సుశర్మ రాజ్య పరిపాలన మొత్తం శ్రీ ముఖుడికి వదిలి రాణితో గడపటమే లోకంగా ఉన్నాడు

ఇవన్నీ పరిశీలించిన జయద్రధుడు చక్రం తిప్పదల్చాడు. అతడి ప్రకృతి విచిత్రమైంది. అతడు, అతడి పూర్వీకులు వేద మత విరోధులు. దాని కోసమే వాళ్ళు ఖడ్గ విద్యా సాధన కూడా చేస్తారు ప్రస్తుత ఆంధ్ర పాలకులు బౌద్ధులు.వాళ్లకి వేదాల మీద అంత గౌరవమేమీ లేదు. వాళ్లని సర్వ భారత చక్రవర్తులు  గా ప్రతిష్టిస్తే దేశన్ని మొత్తాన్ని వేద విరోధంగా తయారు చేయొచ్చు!

అతడి ఆలోచన ఇదీ!

కానీ అందుకు చంద్ర శేఖర శాతకర్ణి పనికి రాడు. అందుకే తాను ఖడ్గవిద్యతో పాటు నాస్తిక భావనలని శ్రీముఖుడి లో నాటి పెంచాడు. ఎలాగూ వాడు ఈనాటికి మగధ రాజ్యానికి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి వాడిని రాజును చెయ్యాలి . వాడు రాజు కావాలంటే సుశర్మను చంపాలి.

చంపాలనుకుంటే ఏదో ఒక రకంగా చంపవచ్చు జయద్రధుడు. కానీ అతగాడి ప్రవృత్తి విచిత్రమైంది కదా! అందుకే ఎత్తు వేసి పద్మరాణిని చూసే నెపంతో మగధకు వచ్చాడు.

రాణి ద్వారా రాజుని కలిశాడు. రాజుతో చెప్తాడు”నా శిష్యుడు శ్రీముఖుడిని మంత్రిగా చేసి ఆదరించావు కాబట్టి నీకు రహస్యమైన తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు! నేను తీరుస్తాను” అని

రాజు అంతకంటే మూర్ఖుడు. “నాకు ఎంతమంది భార్యలూ, ప్రియురాళ్ళూ, పరిచారికలూ ఉన్నా, ఎంతమంది కొత్తగా వస్తున్నా, ఈ స్త్రీ వాంఛ తీరడం లేదు. అసలు ఈ శృంగారం విషయంలో విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. నా సహచరి జంతువై, నేను మనిషిగానే ఉండి ఆమెతో కూడితే ఎలా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆశగా ఉంది. నా పద్మ రాణిని పులిగా మార్చి నన్ను మనిషిగానే ఉంచండి. ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడాలని ఉంది” అని అభ్యర్థిస్తాడు

నిజానికి జయద్రధుడు వాంఛిస్తున్నదీ ఇదే! వెంటనే ఒప్పుకుని, బలిమఠం (తన గుహ ఉన్న అడవి) అడవిలో ఒక పెద్ద భవనం నిర్మించమని, దీనికి సంబంధించిన సాధన మొత్తం అక్కడే జరగాలనీ, రాజ్యం శ్రీముఖుడికి అప్పగించి రమ్మనీ రాజునీ, పద్మ రాణినీ కోరతాడు. పద్మరాణి మొదట భయపడుతుంది. “నేను పులిగా మారాక జ్ఞానం లేక  రాజుని, చంపితే?” అనడుగుతుంది.” చంపవు, నీకు మనిషిని అనే జ్ఞానం ఉంటుంది. అది లేక పోతే తిరిగి మనిషిగా ఎలా మారగలవు?” అని ఒప్పిస్తాడు జయద్రధుడు.

రాజు తల్చుకుంటే దేనికైనా కొదవా? భవనం సిద్ధం! పరిచారికలతో సహా రాజు రాణి అక్కడికి పయనం

puli2

ఈ లోపు కథలో మరో పాత్ర పరిచయం అవుతుంది. జయద్రధుడి వల్ల నీలాంబర శాతకర్ణి కుమార్తె జయద్రధికి పుట్టిన కొడుకు. తమ ఇద్దరి పేర్లు గుర్తుగా వాడికి కూడా  జయద్రధుడనే పేరు పెట్టింది తల్లి. పద్ధెనిమిదేళ్ళ ఆ యువకుడు తండ్రి గురించి తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచీ ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. అతడొక మార్మికుడు, సిద్ధుడు, ఖడ్గవిద్యలో తిరుగు లేదు అంతకంటే ఏమీ తెలీదు, అని చెప్పిన వారే అంతా! తల్లేమీ చెప్పదు. తాతగారి వద్ద నేర్చిన శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసిస్తూ, స్వచ్చంగా పెరుగుతాడు. తండ్రి జాడ కనుక్కోవాలని ఎవరికీ చెప్పకుండా బయలు దేరి చూచాయ గా విన్న సమాచారాన్ని బట్టి ఫలానా అడవుల్లో వెదకాలని బయలు దేరతాడు. అనుకోకుండా వాడికి తోహారు జతపడతాడు. ఇద్దరూ కల్సి తండ్రి జాడ వెదకాలని నిశ్చయించుకుంటారు. ఎందుకంటే శ్రీముఖ శాతకర్ణికి జయద్రధుడే పులి అని తెలిశాక తోహారుతో ఇదీ విషయం అని చెప్పడు. కాబట్టి తోహారు చిన్న జయద్రధుడితో కల్సి పెద్ద జయద్రధుడిని వెదకడానికి బయలు దేరతాడు.

ఈ లోపు వాళ్ళిద్దరికీ అడవిలో నిర్మితమైన భవనం, అందులో ఏదో మార్మికంగా జరుగుతున్న సంగతీ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే ఎవరో సిద్ధుడు వచ్చి వెళ్తున్న సంగతి తప్ప ఇంకేమీ తెలీదు. పద్మరాణి పుట్టింటి చెలికత్తె చంద్ర రేఖ చిన్న జయద్రధుడిని గుర్తించి “ఆ తండ్రే ఏదో మాయ చేసి రాజును చంపాలని చూస్తున్నాడేమో అని భయంగా ఉంటే, ఈ కొడుకు కూడా వచ్చాడే! ఇదేదో వినాశనానికే దారి తీస్తుంది లా ఉంది” అని పద్మరాణి తో చెబుతుంది.

అసలు ఈ పులిగా మారి శృంగారం నెరపడం పద్మరాణికి సుతరామూ ఇష్టం లేక పోయినా రాజు మీద ప్రేమతో అంగీకరించిదాయె! ఏదైనా  కీడు జరుగుతుందేమో అని లోలోపల భయపడుతూనే ఉంటుంది. కానీ కొడుకు తండ్రి వంటి వాడి కాదనీ, మంచివాడనీ గ్రహించిన మీదట చంద్ర రేఖ ఎలాగైనా రాజునీ రాణినీ ఈ మాయోపాయం నుంచి రక్షించడానికి వాడి సాయం కోరుతుంది.

తోహారు తో కలిసి చిన్న జయద్రధుడు తటాకం వద్ద మాటు వేసి , పులిగా మారి తెప్ప ఎక్కి పోతున్న తండ్రి ని అనుసరించి పోయి అతన్ని కలుసుకుంటాడు. పెద్ద జయద్రధుడు కొడుకుని చూసి ఏమీ స్పందించడు. పైగా కొంత శక్తి తగ్గినట్టు, సూటిగా చూస్తూ మాట్లాడక, మాట తప్పించి డొంక తిరుగుడు గా మాట్లాడతాడు. ఎంతటివారినైనా మాటలతో తలొగ్గేలా చేసే అతడు కొడుకుతో మాత్రం వాదన పెట్టుకోడు. కొంత లొంగుబాటు స్వభావంతో ప్రవర్తిస్తాడు. అదంతా తన కృష్ణ మంత్ర జప ఫలితమేనని భావిస్తాడు చిన్న జయద్రధుడు.

చివరికి ఆ రోజు రానే వస్తుంది. దీపాలు ఆర్పేసిన ఆ భవనంలోకి ఆ క్షుద్ర కార్యం జరగకుండా అడ్డుకోడానికి చిన్న జయద్రధుడు అత్యంత శక్తివంతమైన గ్రాహక శక్తితో ప్రవేశిస్తాడు. చంద్ర రేఖ చెప్పిన ప్రకారం రాజు, రాణి,తన తండ్రి ఏ యే గదుల్లో ఉన్నారో ఆయా గదుల్లోకి ప్రవేశించి అటకమీద చేరి గమనిస్తాడు. రాణి గదిలో రాణి వివస్త్రగా మారి జయద్రధుడు వేసిన పులిముగ్గులో పడుకుని పులిగా మారి మారి రాజు గదిలో ప్రవేశిస్తుంది. అక్కడ రాజు ఉండడు. కానీ, జయద్రధుడు మాత్రం ఆమె తిరిగి తన గదిలోకి వెళ్ళే మార్గం లేకుండా మధ్య తలుపు మూసేసి, ఆమె గదిలో వేసి ఉన్న పులిముగ్గుని చెరిపేస్తాడు. అంటే ఆమె తిరిగి మనిషిగా మారలేకుండా! నిర్ఘాంత పోయిన రాణి చాలా సేపు అటూ ఇటూ తిరిగి, నిర్ణీత సమయం మించి పోవడం తో  ఏమీ చేయలేక పులి రూపంలోనే శాశ్వతంగా అడవిలోకి పారిపోతుంది కిటికీ లోంచి దూకి. రాజ్య బహిష్కరణ విధించిన శాతకర్ణులమీద పగతో తనను నిత్య వ్యాఘ్రంగా మార్చాడనీ, నాస్తికుడైన శ్రీముఖుడికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి సుశర్మను చంపబోతున్నాడనీ తెలిసినా, గ్రహించినా ఏమీ చేయలేని నిస్సహాయ.. పైగా జంతువు గా ఉంది తానప్పుడు. గత్యంతరం లేని స్థితిలో అడవిలోకి వెళ్ళి పోతుంది.

జరిగింది చూసిన చిన్న జయద్రధుడికి తండ్రి పథకం అర్థమవుతుంది. వాడు తన తండ్రి గదిలోకి వెళ్ళి అక్కడ వేసి ఉన్న పులిముగ్గుని చెరిపి వేస్తాడు. పెద్ద జయద్రధుడు రాజ సంహారం రం తర్వాత తిరిగి వచ్చి, జరిగింది గ్రహించి నిర్విణ్ణుడవుతాడు. తాను పద్మ రాణిని నిత్య వ్యాఘ్రంగా మారిస్తే , తనను ఇంకెవడో నిత్య వ్యాఘ్రంగా ఉంచేశాడని అర్థమవుతుంది.

అంతటి కఠినుడూ, మాయలమారీ తన దుస్థితి తల్చుని దుఃఖంతో గర్జిస్తాడు. సమయం మించి పోతే తానికి ఎప్పటికీ పులిగా ఉండిపోవలసిందే పద్మరాణి లాగే! మతి పోయి కోపంతో గర్జిస్తున్న తండ్రిని చూసి చిన్న జయద్రధుడికి మెరుపు లా ఒక ఆలోచన వస్తుంది. తోహారు తో పాటు ఆపకుండా తటాకం వైపు పరుగు తీస్తాడు. అతడు చేయదల్చుకున్న పనొక్కటే అతడి తండ్రిని నిత్య వ్యాఘ్రంగా ఉంచెయ్యడానికి మార్గం దొరికించుకోడమే! అతను తోహారుతో కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తాడో ఊహించి చూడండి. సమాధానం తెలుస్తుంది. పద్మరాణి ఏమైంది? జయద్రధుడికి ఎదురు పడిందా? పడితే ఏమి జరిగి ఉండొచ్చు?

ఇంతకీ చిన్న జయద్రధుడు చేసిందేమిటి? ఇవన్నీ ఊహించి చూడండి!  ఈ నవల ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. మహా అయితే విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. నాకు అక్కడే దొరికింది.

పావని శాస్త్రి విషయానికొస్తే, ఆయన సహజంగానే హాస్య ప్రియుడు, చమత్కారంగానూ రాస్తారూ కనుక, గ్రాంథికంలోని నవలను అతి సరళమైన తెలుగులోకి అద్భుతంగా మార్చారు .

జయద్రధుడి పాత్ర మొదట మొదట్లో నిజంగా గొప్ప వాడా, లేక దుష్టుడా వీడు అన్న ధోరణి లో కొంత తికమక పెట్టేలా నడుస్తుంది. వాడి ఆహార్యం, వ్యవహారం మొత్తం పులితో పోలిక తో సాగుతుంది. అడవిలో రాజు కి ఎదురు పడినపుడు ఎంతో దర్పంతో లెక్క లేనట్టు ప్రవర్తిస్తాడు. “ఏమోయ్, నేను చంద్ర శేఖర శాతకర్ణిని,ఇటొక పులి వచ్చింది చూశావా?” అని అడిగితే “ఆంధ్ర క్షమా మండల భర్త అయినా, సర్వ భారత చక్రవర్తి అయినా, వాడి బాబైనా తన రాజధానిలో ఉన్నపుడు, సైన్యమూ పరివారమూ వెంట ఉన్నపుడే రాజు, నట్టడవిలో ఏకాకిగా ఉన్నపుడు ఒట్టి మనిషే! రాజువి కదాని ఈ క్షణం లో పంచ భ్యక్ష్య పరమాన్నాలు తినగలవా? వృధాగా ఏమోయ్ గీమోయ్ అని నీ బోడి రాచఠీవి ప్రదర్శించకు” అని దులిపేస్తాడు.

ఆ తర్వాత అదే రాజు “మీ రాజ్యానికి వచ్చి మా రాజకుమారులందరికీ విద్య నేర్పాలన్న కోరిక మీకెందుకు కల్గింది?” అనడిగితే “మీ(ఆంధ్రులు) జాతి వివక్ష లేని జాతి! దేని వెంటబడితే దాని వెంటబడి పోయే జాతి. సృష్టిలోని సర్వ వివేకమూ,సర్వ అవివేకమూ కూడా మీ జాతిలోనే ఉంది” అంటాడు ఎటూ తేల్చకుండా

నవల ప్రారంభం నుంచీ, చివరి వరకూ ప్రతి సూక్ష్మనైన అంశాన్నీ రచయిత ఎంత వివరంగా విశ్లేషించుకుంటూ పోతాడంటే, కథను విజువలైజ్ చేసుకోకుండా చదవలేం!నవల మొదట్లో శ్రీముఖుడూ, తోహారూ కల్సి నది దాటే సన్నివేశం, చివర్లో పులి ముగ్గు వేసి పద్మ రాణిని పులిగా మార్చేటపుడు చిన్న జయద్రధుడు దాన్ని భంగ పరిచే పతాక సన్నివేశమూ ఇందుకు రెండు ఉదాహరణలు.

భవనం డిజైన్ ఎలా ఉంది, ఆ కటిక చీకట్లో జయద్రధుడు ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలా వెళ్ళాడన్నదీ అంగుళం కూడా వదలకుండా వర్ణిస్తూ ఆ చీకటిలోనే వాడితో పాటు మనమూ శ్రమించి ఆ దృశ్యాన్ని మొత్తం గాంచేలా చేస్తాడు రచయిత.

జయద్రధుడు పులిగా మారే విద్యను అభ్యసించాడని తెలుసుకున్న శ్రీముఖుడు అంతకు మించి వివరాలు తీసుకోడు. తను సుశర్మను వధించి రాజునయ్యే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పేస్తాడు జయద్రధుడికి!అయితే జయద్రధుడు తన రాజ్యానికి వచ్చి రాజుతో పద్మరాణి తో మంతనాలు జరుపుతున్నా, అడవిలో సౌధం నిర్మించి ప్రయోగాలు జరుగుతున్నా శ్రీముఖుడేమయ్యాడో ఆచూకీ ఉండదు. రాజ్య పరిపాలన చూస్తున్నాడనుకోవాలి!

అందుకు సాక్ష్యంగా రచయిత ముందుగానే శ్రీముఖుడి ప్రకృతి గురించి కొంత వివరిస్తారు కూడా! మరెవరి కోసమో వడ్డించిన విస్తరి మీద శ్రీముఖుడికి ఆశ లేదు. దాని కోసం ఇక మరెవరూ రారు, అది తనదే అన్న భరోసా కలిగితే తప్ప దానికేసి చూడనైనా చూడడు అని!

puli1నవల ముగిశాక చివరి మాట గా పావని శాస్త్రి (దీనికి ఆయన “పులి ముగ్గింపు” అని పేరు పెట్టారు) పులిగా మారే విద్య అనేది ఒకప్పుడు నిజంగానే జరిగిందనడానికి  ప్రచారం లో ఉన్న ఒక కథని కూడా చెప్తారు. ఒంగోలు ప్రాంతంలో పెద్ద ఆరకట్ల, చిన్న ఆరకట్ల అనే రెండు గ్రామాల్లో దాదాపు మూడొందల యేళ్ల క్రితం పులిగా మారే విద్య తెలిసిన కుటుంబాలుడేవట. అలాటి కుటుంబాల్లో ఒకాయన కూతురు పురిటికి వచ్చింది. బిడ్డ పుట్టాక తిరిగి భర్తతో అత్తారింటికి వెళ్లే సమయంలో బండి అడవి దారిన పోతుండగా భర్త అడిగాడు “మీ ఇంట్లో పులిగా మారే విద్య తెలుసటగా ? నీకూ తెలుసేంటి?” అని! ఆమె  నోరు జారి “తెలుసు” అన్నది

ఇంకేముంది? ఎలా మారతారో చూపించమని పీకల మీద కూచున్నాడు! ఎంత చెప్పినా వినక ఏం చెప్పినా వినక మారి చూపించక పోతే చస్తానని బెదిరించాడు. పులిగా మారాక నాకు మనిషిననే జ్ఞానం ఉండదన్నా వినిపించుకోలేదు.  విధి లేక  కొంచెం విభూది మంత్రించి ఇచ్చి, పిల్లాడితో చెట్టెక్కి కూచోమనీ, కాసేపయ్యాక విభూది తన మీద చల్లమని చెప్పి పొదల్లోకి వెళ్ళి పులిగా మారి గర్జిస్తూ బయటకు వచ్చింది. ఆయన ఎన్నడూ పులిని గానీ, పులి చేసే హడావుడి గానీ చూసిన వాడు కాదు. హడలి పోయి విభూది సంగతి మర్చిపోవడమే కాక పిల్లాడిని జారవిడిచాడు. పులి కాస్తా పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పారి పోయింది.

కొంత సేపయ్యాక చెట్టు దిగి ఏడ్చుకుంటూ మామగారింటికి పోయి ఈ విషయం చెప్పగా మావగారు ,”ఎంత పని చేశావు రా మూర్ఖుడా? పులిగా మారాక ఆహారం స్వీకరిస్తే ఇహ మళ్ళీ మనిషిగా మారే అవకాశం లేదు” అంటూనే అడవికి వచ్చి ఎంత వెదికినా కూతురు పులి కనిపించలేదు. చేసేది లేక అల్లుడిని కూడా పులిగా మార్చి అడవికి పంపాడట. ఇంటికి వచ్చి కూతురి కథ చెప్పి ఇక పైన ఆ విద్య  తాలూకు మంత్రోపదేశం ఎక్కడా ఎవరూ ఎవరికీ  చేయ  కూడదని ఆంక్ష విధించి మరణించాడు. ఈ కథ ఆధారంగానే విశ్వనాథ  పులి ముగ్గు వేశారని పావని శాస్త్రి చెప్తారు. అంతే కాదు, తెలుగులో తొలి “హ్యూమన్ మెంటమార్ఫసిస్ ” నవల ఇదేననీ, తొలి రీటోల్డ్ నవల కూడా ఇదేననీ అంటారు. 1960 లో విశ్వనాథ రాసిన పులి మ్రుగ్గుని పావని శాస్త్రి 1985,86 లో పల్లకి వార పత్రిక కోసం సీరియల్ గా అందించారు.

మనిషి వాస్తవంలో పులిగా మారగలడా లేదా అనేది సత్యం కాక పోయినా, పులుల కంటే  కౄర ప్రవృత్తి గల మనుషుల్ని నిత్యం వార్తల్లో దర్శిస్తూనే ఉన్నాం. జాన పద నవలగా పులి ముగ్గుని హాయిగా ఆస్వాదించవచ్చు

ఇంతకీ, చిన్న జయద్రధుడు, తోహారు కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తారో, పెద్ద జయద్రధుడు, పద్మ రాణి ఏమయ్యారో ఊహించారా?

ఊహిస్తే సరే, లేదంటే ఈ నవల PDF చేసి పంచక తప్పేట్టు లేదు!

*

 

 

 

 

 

 

‘మాష్టారూ.. పేకేసుకుందామా..?’

images

గౌరవ పూజ్యులైన మాస్టారికి..

నమస్కారాలతో-

బావున్నారా?, గురుపూజోత్సవం రోజు గుర్తుకు వచ్చారు. నేను గురువునైనా నా గురువు మీరు కదా? మీతో ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడేకన్నా నాలుగు ముక్కలు వుత్తరంగా రాద్దామని యెందుకో అనిపించింది. ఇదిగో అదిగో అని మన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ వెళ్ళిపోయి ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ వచ్చేసింది.

మాస్టారూ.. మీరంటే చిన్నప్పటి నుండి నాకు చాలా యిష్టం. ఎంత యిష్టం అంటే పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు. మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు. అప్పటికీ నేను మిమ్మల్ని అడిగాను.. ‘ఆ రోజుల్లో- మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట చదివిన పాఠాలకన్నా యెక్కువ గుర్తుంది. ఈ రోజుల్లో- మా రోజుల్లో ‘బతకడానికి బడిపంతులు’ అని అంటున్నారు!

ఔను.. ఇప్పుడు బతకడానికి బడిపంతులు. జీతాలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళున్నారు. పిల్లలతో పాటు మనమూ యింటికి వచ్చేయొచ్చు. పిల్లలతో పాటు మనకూ సెలవులు వుంటాయి. స్ట్రెస్ లేదు. స్ట్రెయిన్ లేదు. ప్రెజర్ లేదు. బ్లడ్ ప్రెజర్ లేదు. పాఠం చెప్పామా.. మన పని అయిపోయిందా.. అంతే. చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది. అదంతే. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఆపనీ ఈపనీ అని అడ్డమైన పనులూ అప్పజెప్పినా మిగతా ప్రభుత్వ వుద్యోగులతో పోలిస్తే మనమే నయం. మిగతా ప్రభుత్వ శాఖల్లో వుద్యోగులు వుద్యోగుల్లా లేరు. పార్టీ కార్యకర్తల్లా వున్నారు. జెండాలూ చొక్కాలూ వొక్కటే తక్కువ. అలా వుండకపోతే వుద్యోగం చెయ్యలేరు. చెయ్యనివ్వరు. ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అంతే. ఇప్పుడు యింకాస్తా యెక్కువయ్యింది. మన పనిగంటల్లో మనం పనిచేసి రావడానికి లేదు. సాయంత్రం అయిదు తరువాతే అధికారులు వస్తారు. పగలంతా పని వొదిలి, అప్పుడు విధులు చేపడతారు. పని గంటలు దాటాకే వుద్యోగులకి పనికి ఆహార పథకం ప్రారంభమవుతుంది. కింది నుండి పైదాకా ఆమ్యామ్యాలే. పెరసంటేజీలే. కంచం లేని యిల్లు వుండొచ్చు. లంచం లేని ఆఫీసు లేదు. అయ్యయ్యో అనుకోకుండా అసహ్యించుకోకుండా ‘అయ్యో.. మనకి వాళ్ళలా రెండు చేతులా రాబడి లేదే’ అని వాపోయే వుపాధ్యాయులే మాలో యెక్కువ. డిగ్రీలూ పీజీలూ పీహేచ్దీలూ చేసి చాలక- బియ్యీడీ యెంట్రెన్సులూ రాసి- ర్యాంకుల కోసం కోచింగులకూ వెళ్ళి- చచ్చే చెడీ ర్యాంకులూ తెచ్చుకొని- శిక్షణ పూర్తిచేసి- పాసయినా కాదని లేదని మళ్ళీ టెట్ లూ రాసి- దాని కోసం మళ్ళీ కోచింగులకూ వెళ్ళి మార్కులు స్కోరూ చేసి- మళ్ళీ డియ్యస్సీ నోటిఫికేషన్ కోసం చూసి- కోచింగ్ సెంటర్లో చేరి- పరీక్ష రాసి- నెగ్గితే అప్పుడు వుద్యోగం. ఈ వుద్యోగంలో చేరినాక ఆ అలసట తీరేలా రిలాక్స్ అయిపోవడమే. జీవితాంతమూ రిలాక్స్ అయిపోవడమే!

ఉపాధ్యాయ వృత్తి గొప్పది కావచ్చు. కాని వుద్యోగంలో చేరినాక – వుద్యోగంగా గొప్పది అనుకొనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వుపాధ్యాయ వుద్యోగంలో చేరినవాళ్ళు సబ్జెక్ట్ చేతిలో వుంటుంది.. గ్రిప్ వుంటుంది.. అన్నంతవరకే వుండి, ఆపైన పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు గాలికి వదిలి, ‘కాంపిటేటీవ్ కు ప్రేపేరవడం’లో ములిగి, గ్రూప్సో సివిల్సో సాధిస్తామన్న నమ్మకంలో తేలి, తాము అవకాశం లేకనో ఆపద్ధర్మంగానో అందులో వున్నాం తప్పితే, తమ స్థాయి యిది కాదని ప్రెస్టేజ్ ఫీలవడం.. ఆఫీలింగు అందరికీ చూపించడం ద్వారా యెక్కడో వుండాల్సిన వాళ్ళం యిక్కడ యిలా యీసురోమంటూ యేడవాల్సి వొస్తున్నందుకు దేవుణ్ణి నిందించడమో.. పూజలు చెయ్యడమో.. మొక్కులు మొక్కడమో.. యింతే. కాదంటే ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో.. అంతే!

ఒక్క జీతం మీద బతకడం కష్టం. నాతం కూడా వుండాలి. నాతం లేదని నాతోటివాళ్ళు నానా బాధా పడిపోతున్నారు. నానా గడ్డీ కరుస్తున్నారు. ఇప్పుడు మన వుపాధ్యాయుల్లో చాలా వరకు రియలెస్టేట్ బ్రోకర్లే.. తప్పితే డైలీ కట్టుబడి వ్యాపారం చేసేవాళ్ళే.. ఈ బ్రోకర్లకి యే సైటు యెక్కడవుందో తెలిసినట్టుగా యే పాఠం యెక్కడవుందో తెలీదు. ఈ ఫైనాన్షియర్లకి వడ్డీ లెక్కలు తప్ప మరే లెక్కలూ రావు. మొత్తానికి యేదో వొక వ్యాపారం.. యేదో వొక వ్యవహారం.. యేదీ లేకపోతే ప్రవేటు కాన్సెప్ట్ కార్పోరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లల్ని పోటాపోటీగా చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థిని చేర్పించినందుకు అయిదు నుండి పది వేలు ఆదాయం. అక్కడున్న విద్యాసంస్థలను బట్టి.. యేరియాని బట్టి.. ఆ ధరలు అటూ యిటూ అవుతాయి.. అంతే. గవర్నమెంటు కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు అయితే రిజైన్ చేస్తే భద్రత వుండదు గనుక సెలవు పెట్టి ప్రవేటు కాలేజీలలో పనికి కుదిరిపోతున్నారు. ఎన్నడూ లేనిది శ్రద్ధగా నోట్సులు కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం కంటే ప్రవేటు వాడు యెక్కువ యేమీ యివ్వడు. కాని అసలు కంటే కొసరు మీదే యావ. ఇక్కడ చూస్తే సెలవు పెట్టిన కాలేజీకి కొత్త లెక్చరర్లు రారు. పాఠాలు జరగవు. ఆశించిన ఫలితాలు రావు. కాలేజీలు నడవవు. గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్ లో చదువులు బాగోవు అని మాట. ఉన్న క్యారక్టర్ని చెరిచేస్తున్నారు. చేరిపేస్తున్నారు. అధికార్లూ అంతే. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అర్హత లేనివి కావు. ఆదాయ మార్గాలు. అంతే. ఇక, మాటకారితనమూ చనువూ చతురతా వున్నవాళ్ళు యివికాక యల్ఐసి యితరత్రా యిన్సూరెన్సు యేజెంట్లుగా.. అది కూడా పెళ్ళాల పేర్లతో.. తెగ కష్టబడుతున్నారు. చాలా కష్టపడి యీ దశకు వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు.

‘ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం యివ్వాలి’ అని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠాలు చెప్పే మాస్టార్లు తమ పిల్లల్ని మాత్రం తాము పనిచేసే పాఠశాలల్లో చేర్పించరు. తమ పాఠశాల వున్నా చోట కూడా కనీసం వుండరు. ఒకసారి వుద్యోగంలో చేరామా? యిక అంతే. వేసినప్పుడు వేప చెట్టు. తీసినప్పుడు రావి చెట్టు. మన ఈక కూడా యెవడూ తెంపలేడు. అదీ ధీమా. అదీ భీమా. కాదన గలమా? లేదనగలమా?

చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. నేనో బడ్డీ పెట్టుకుంటా.. నేనో దుకాణం తెరచుకుంటా.. అంటే నాకు డబ్బు కట్టు.. నీవు నీ వ్యాపారం చేసుకో అని సెన్సు లేకుండా లైసెన్సులు యిస్తోంది. నచ్చినంత ఫీజు వసూల్ చేయడమే. ఏటికి యేడూ ఫీజుల నియంత్రణ మీద టీవీల్లో చర్చలు. ఎప్పటిలాగే. ఫీజుల నియంత్రణ పోరాట కమిటీలు యేర్పడ్డాయని అంటే పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. కోర్టులు తాఖీదులు యిస్తాయి. కాని యేమి లాభం? ప్రభుత్వమూ అధికారులూ వెచ్చగా ముడ్డి కింద వేసుకు కూర్చుంటున్నారు. చూస్తే స్కూళ్ళకు గ్రౌండ్స్ కూడా లేవు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. చాలక యిన్స్టిట్యూషన్స్ మీద సెల్ టవర్లు. అద్దెలు వస్తాయి కదా? అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!

మాస్టారూ.. నేను మిమ్మల్ని చూసి చెడిపోయాను. అనవసరంగా మాస్టారునయ్యాను. మాస్టారూ.. మా మాస్టారులు యెలా వున్నారో తెలుసా? పాఠం వదిలి యెప్పుడూ యింక్రిమెంట్ల గురించే మాటలు. మీకాలంలో వుపాధ్యాయులు వుద్యమాలు నడిపారు. జనాన్ని నడిపించారు. మీది వొక చరిత్ర. మాది హీన చరిత్ర. దీన చరిత్ర. మాస్టారూ.. మీకు యిక్కడ వొక మాట చెప్పాలి. నిజాయితీగా ప్రభుత్వ పాఠశాల నడిపితే మా వూరి చుట్టూ వున్న మూడు నాలుగు ప్రవేటు స్కూళ్ళు మూతబడ్డాయి. అందుకు బహుమతిగా ప్రవేటు పెద్దల యిన్ఫ్లియన్సుతో నన్ను ట్రాన్స్ ఫర్ చేసారు.

మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము.  అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని, ‘గురూ.. ఆ లం– డబ్బులు తీసుకుంది, రాలేదు..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!

పోనీ ప్రవేటు విద్యాసంస్థల్లో మనకి మర్యాద వుందా అంటే అదీ లేదు. అక్కడ స్టూడెంటు కంటే మనం హీనం. డబ్బులు కట్టేవాడు కస్టమర్. మనం సర్వీసు మాత్రమే యిచ్చే సర్వెంట్స్.. అంతే!

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః అన్నారు. పిల్లలకు రాత నేర్పించే గురువే వారి తలరాతని కూడా మార్చెయ్యగలడని నమ్మాను. కాని మన గురువుల తలరాత అంతకన్నా ముందే చెరిపేసి కొత్తగా రాస్తే కాని యేదీ రాయడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. కానీ రాయడం కన్నా చెరపడం కష్టంనిపిస్తోంది.

యిట్లు

మీ

శిష్య గురువు

అండర్ ఎచీవర్

Painting: Mandira Bhaduri

Painting: Mandira Bhaduri

కత్తి దూయాలంటే ఎవరి మీద బాలికే,
పీక కోసుకోవడానికో చెవిలో గులిమి లాగడానికో మినహ ఇహ చిలుం పట్టిన చురకత్తులు ఎత్తేదెవరిమీద జనాభ్ . ఇంటెలెక్ట్చ్యువల్ కాంపిటీషన్ మిస్ అవ్వడంకంటే పెద్ద విషాదం ఇంకేమి ఉండబోదు జీవితంలో అని తెలిసిందే కదా సుమతీ, అయిననూ బతుకు రాతల విషపాత్ర పంచుకొనే సోక్రటీస్ జాడెక్కడాంటూ ఎన్నాళ్ళీ ఎదురుచూపులు  .ఎవరికి వాళ్ళు కంఫర్ట్ జోన్ గేంలో బిజీ అయ్యాక అసలు ఆటెవరితో నీకు బేలా??

నీకు నువ్వే పోటి సాటి మేటి. నిన్నటికంటే ఈ రోజు ఇంకొంచం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఆర్టిస్ట్ ఆదిమ లక్షణం అంటాడో పెద్దాయన(అదేలే నాలో నీడగాడు ) సో సోలో లైఫే సో బెటరు జిందగీలో సింగిల్ సోల్ దో సుకూన్ , పరంతూ సింగిల్ హ్యాండ్ చప్పట్ల మజా లేదే? ఏడుస్తున్నారనో ,ఎలుగెత్తుతున్నారనో రేసుల్లోంచి రహస్యంగా జారిపోయాక ఎక్కడో ఒక మెరుపు రేఖ తళుక్కుమంటూ
మెరుస్తుంది .అదుగోరా, ఆశాకిరణమది అందుకోమంటూ ఎగబాకుతూ ఉంటామా సరిగ్గా సాహసం గొంతుదాటి ప్రళయధ్యనులు వినిపించే సెకనుకి మెరుపెందుకో ఆకాశాన్ని కప్పుకొని టాటా ..వీడుకోలు.. గుడ్ బై ఇంక సెలవు అంటుంది. వెనక తెగిన వీణల హతాశ్షురాగాల మోత ఓ రొద మోయలేని మరో వ్యధ . పిమ్మట కొంతకాలం  నీలగిరుల్లో దూకిన అత్మని వెంటబెట్టుకొని అస్త్రసన్యాసమనబడు అశృవుకటి చిందించి, అయినను పోయిరావలె అక్షరపురమునకు అంతం కాదిది ఆరంభమనుచు మండుగుండెల మాటున దాచిన చెమ్మలు ఇగిరిన మేరకు నానా తంటములు పడి అదిగో అల్లదిగో పదభందము అంటూ అల్లంత దూరాన అల్లనల్లని అడుగుల్లో ఎదురొస్తున్న కావ్య కన్నీయడి ఎదపై వాలి సొద పెట్టిన సైతమూ శోకము శమించదు . ఈ దాహమూ తీరదు .రైటర్స్ బ్లాక్ కాదు భయ్య బ్లాక్డ్ రైటర్స్ అసోసియేషన్ గిల్డు ఇక్కడ , గిల్టు పూతల నడుమ గిలగిలలాడుతూ గిరాటేసి కొట్టిన ప్రతిసారి లేచి నిలబడుతూ ,సెల్ఫ్ గోల్లో జారిపడినపుడంతా  నడ్డి విరగొట్టుకొని  అక్కటా ఒక్కటా రెండా,మూడు ముక్కలాటలో పరమపదసోపానం యూ ఆర్ డెడ్ యాస్ యే రైటర్ నాట్ బై వర్చ్యూ బట్ బై షీర్ చాయిస్ మైండ్ ఇట్ రాస్కెలా .అయినను సావిరహే తవదీనా రాధా , విరహదాహమంత వేదన లేదోయి వేమన,వాట్ డూ యూ సే ?? చెప్పడానికేముంది లోకహిథార్ధం బట్టలిప్పి బరిబాత్తల నిలబడ్డ క్షణానే తెలియలేదా సన్యాసం అచ్చంగా సాగరం అంత టెంప్టింగనీ వేమనోరు గోచిపాతల చిరుగులు కుట్టుకుంటూ గుర్రుమనుట ఖాయం

గోచో పాచో,గోనెసంచుల్లో ఎమోషన్లు ఎత్తుకోవడం మొదలెట్టాక .జిందగీకా రిసెట్ బటన్ కహా రే సాలో ? మాంత్రికుడి ప్రాణము ఏడుసముద్రముల కావల గూటిలో బుజ్జి గువ్వ గుండెలో ఉండును , చిలకమ్మ గుండె నెమురుకున్నప్పుడల్లా ఇక్కడ ప్రాణము విలవిలాడుతూ కళ్ళెంట జలజలారాలును అదియే విధి వైపరీత్యము నాయకా. చిలక నువ్వే చిరంజీవి నువ్వేయన్న సత్యము మరిచిన మనోవ్యాధికి మందెక్కడ . అయినను మంత్రం నేర్చిన మాయల ఫకీరునకు ప్రేమోచ్చినపుడు అంజలీదేవియగుట వొళ్ళుమండినప్పుడు కుక్కయగుట బీటింగ్ అవసరాలు తగ్గినప్పుడు చిలకలగుట స్త్రీ వేషధారికి తప్పని తగలాటము కదా.హతోస్మీ అయినా జోకులు కాకపోతే ఆడోళ్ళకి క్యారెక్టరేమిటి బాసు? పాత్రోచితముగా డైరెట్రు అనబడు సిస్టం నడిపే నావికుడు ,మగవాడు అందునా వాడి తమోగుణాన్ని ఆడువారి రజోగుణంగా మార్చి చూపగల సో కాల్డ్ వెన్నులెస్ మెన్ను, నవ్వమన్నప్పుడు నవ్వి ,ఏడవమన్నప్పుడు ఏడ్చి ,విప్పమన్నప్పుడు ఆ నాలుగు పీలికలు విప్పి కుప్పబోసి సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అని గానా సహితముగా కామతాపపు వేడి ప్రజ్వరిల్లిన క్షణాన మన్మధుడు పూనిన రతీదేవివోలే మాడి మసై అగ్నిప్రవేశం అంకమున మిగిలిన బూడిద అగ్రజుడి సిమ్హాసన సోపానము జేయవలె కదా . ఇందులో మళ్ళీ స్పెషల్ అట్రాక్షన్ ఐటెం సాంగ్ క్రింద స్త్రీ యనగా తమన్నా వలే పొట్టిగా గట్టిగా మీగడతరకవలే యున్న హస్తమాలికలు పూచెండ్ల పరిమళము (అవే అవే , యూ గాట్చా బేబీ ) నొసగుతూ తగిలీ తగలకుండా అందీ అందకుండా ముద్దడవలెనే తప్ప శూర్పణకలు ఎంటర్ ది డ్రాగన్ అవతార్ కట్టి మీదడి ముద్దడిగిన “స్త్రీ”డ్రామచంద్రుడు బొత్తిగా విథ్ ప్యూర్ హార్ట్ అస్సయించుకొనును కదా డార్లింగ్ .అబ్బెబ్బే నీకు బొత్తిగా ఫెర్మోనుల మోనింగ్ తాలుక ఈస్తటిక్ సెన్సులేదమ్మీ శూర్పణక్కాయ్, పొరపాటిది తడబాటిది గుంజిళ్ళే తీసెయ్యవే .మీన్ వైల్ మీ వలెనే  మిమ్ములని మించి వుమన్ వాంటిట్ నీడిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫక్కింగ్ మూడ్స్ టూ ( కి కి కి ) అని వాడికెవడు జెప్పవలే . చెప్పినందుకేగా కోసేయ్ ముక్కు, చెవితో పాటు మదపుటాలోచన సహితము .మాటే మంత్రమూ మనసే స్థబ్ధమూ లోల్ .

రంగుపొంగుల ఈస్టమనుకలరులో కామకేళి గాంచిన చదువరీ ఇంతకీ ఎక్కడుంటిమి అస్త్రసన్యాసమనబడు ఆరునొక్క రాగమున కదా . ఇపుడు మరలా సన్యాసమనబడు డ్రామాపై  అంత అనురక్తి ఎందుకో అంటే భీష్ముడి హథ శిఖండి చావుకొచ్చింది భయ్యా :(  పీటర్లు వారిననుకరించే రిపీటర్లు మినహ కాంపిటీటర్లు యుద్ధభూమి ఖాళీ చేసాక కత్తెత్తడమెందుకు పీక్కోసుకోవడానికో,చెవులో గులిమి తీసుకోవడానికో తక్క మరెందుకని బోర్ డోర్ కొట్టి మరీ అరుస్తుంది జహపనా, జిందగీ అబ్ తో బతా, అప్నా పథా అంటూ .స్టేటస్ మేసేజి “ఫీలింగ్ హథవిధీ మళ్ళీనా “.

వాయిడ్ ఏమిటిరా వాయిస్ లేకుండా ఇంత విశాలంగా వ్యాపిస్తుంది

*

ఆఖరి మజిలీ

Art: Rafi Haque

Art: Rafi Haque

అస్తమించేవేళ ప్రచండ భానుడైనా,
శీతల కిరణాలు ప్రసరించినట్లు
అనంత విశ్వాన్నీ ఆక్రమించిన అహం
మరెన్నో ఆత్మ గాయాలు చేసిన అహం
ఎందరిపై పిడికిలి బిగించినా
ఎంత ఎత్తుకు ఎదిగినా నీ అస్తిత్వం……..
నిష్క్రమించేవేళ ఆరడుగుల నేలలోనో
గుప్పెడు బూడిదై ఓ చిట్టి పిడికిలిలోనో
నిను ద్వేషించే, ప్రేమించే మనసుల్లో
రూపం లేని జ్ఞాపకంగానో
మాటల్లోనో, మౌనంగా కారే
కన్నీటి చుక్కల్లోనో కరిగిపోతుంది.
ఎంత దూరం నడిచినా పోటీ బ్రతుకులో
ఎంత ఎత్తుఎగిరినా ఆశలూ, ఆశయాలూ
ఉరమకుండా పిడుగు రాలినట్లు
మృత్యువు నిను కబళించినపుడు
అలవకున్నా కనుపాపలు మూసుకోవాల్సిందే
శిఖరం తాకకున్నా, నేల రాలాల్సిందే
నువు చూసే ప్రపంచంలోంచి
నిన్ను చూసే ప్రపంచంలోకి జారాల్సిందే
ఎన్ని నిండు చందమామలుంటేనేం నీ జీవితాకాశంలో
నీకు చివరకు మిగిలేది అమావాస్యే
బ్రతుకు పగలున ఎంత వెలిగినా,
అసలు వెలుగే చూడకున్నా
తిరిగి కరగాల్సింది తిమిరంలోకే
ప్రాణం పోసుకున్నపుడూ, పోయినప్పుడూ చీకటే
సగం జీవితమూ గడిచేది చీకట్లోనే
వెలుగుందని, వెలుగుతున్నాననుకున్నపుడూ అజ్ఞానపు చీకటే
సన్నని వెలుగు రేఖనైనా, ఆకాశంలో తారనైనా మెరిపించేది చీకటే
మెలకువలో ముట్టని మట్టి తనలో నినుకలుపుకున్నపుడు
గర్వపడిన సత్కారాలేవీ అక్కరకు రావు
దూరం పెట్టిన ధూళి పూలే అక్కున చేర్చుకునేది
పయనమెప్పుడూ తిమిరంలోంచి తిమిరంలోకే
కాలం ఈదరినుంచీ ఆదరికి చేర్చే వంతెనే
ప్రవాహంలోకి జారిపడ్డాకా చినుకుకు
వేరుపడి దారి నిర్ణయించుకునే కోర్కె తీరదు
అందుకే ప్రేమించాల్సింది వెలుగుల్నికాదు
నీకు నీ నీడని కూడా మిగల్చని చీకటిని
వెలుగుకి మెరుగులు దిద్దే అంధకారాన్ని
నువు మునిగిన భవసాగరాల్ని మధించి
తీసిన జీవనామృత భాండాన్నీ
ఒక్క క్షణంలో అర్ధరహిత వ్యర్ధ ప్రయాస చేసే
ఆఖరి మజిలీలోని ఆఖరి క్షణమిచ్చే జ్ఞానోదయాన్ని.

ఆ ఆఖ‌రి మ‌నుషుల కోసం… ఆర్తిగా..!

akshara2

‘‘క‌ళ బ‌త‌కాలంటే…ముందు క‌ళాకారుడు బ‌త‌కాలి’’అంటాడు అక్ష‌ర‌కుమార్‌. త‌న‌ది మూడు ప‌దుల వ‌య‌సు. క‌ల్లోలిత క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పుట్టిన ఈ కుర్రాడు సినిమా ఇండస్ర్టీలో ప్ర‌స్తుతం త‌న సామర్ధ్యాన్ని, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌రీక్షించుకుంటున్నాడు. క‌ళ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌న్న త‌ప‌న ఉన్నోడు తాను. అంతేకాదు నిత్యం సాహిత్యం చుట్టూ వైఫైలా తిరిగే అక్ష‌ర‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమా స్ర్కిప్ట్‌లు రాయడం హాబీలు. వీట‌న్నింటికీ తోడు అంత‌రిస్తున్న క‌ళారూపాల‌ను చూసి, ఆవేద‌న చెందుతుంటాడు. అట్లా ప్ర‌స్తుతం కాకిపడిగెల వారి మీద ఏకంగా ఓ ఫిచ‌ర్ ఫిల్మంత డాక్యుమెంట‌రీనీ తీశాడు. అదే కాకి ప‌డిగెల క‌థ‌.

డాక్యుమెంట్ చేయ‌డం వ‌ల్ల ఎప్పుడూ రెండు ప్ర‌యోజ‌నాలుంటాయి. అవి ఒక‌టి వ‌ర్త‌మాన స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న మ‌రో ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా ఆలోచ‌న రేకిత్తించ‌డం. మ‌రొక‌టి భ‌విష్య‌త్ త‌రాల‌కు ఒక క‌ళారూపం యొక్క గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌డం ప్ర‌స్తుతం గ్లోబ‌లైజేష‌న్ రెండ‌వ ద‌శ‌లో ఉన్నవాళ్ల‌కు ఇవేవి ప‌ట్ట‌ని సంద‌ర్భం ఇది. ఈ స‌మ‌యంలో ఓ కుర్రాడు వేల యేండ్ల చ‌రిత్ర క‌లిగిన  ఓ క‌ళారూపాన్ని బ‌తికించుకోవాల‌నే త‌ప‌న‌తో చేసిన ప‌నే ఈ డాక్యుమెంటరీ.

ముదిరాజుల మిరాశి కులం కాకిప‌డిగెల‌. వీరి జ‌నాభా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో నామ మాత్రంగా ఉంది. వీరికి వార‌స‌త్వంగా వ‌స్తున్న క‌ళారూపంతోనే వీరి బ‌తుకు గ‌డుస్తోంది. ప‌ట‌మేసి పాండ‌వుల క‌థ చెప్పే సంప్ర‌దాయం వీరిది. చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉన్న ఈ కుల‌స్తుల కుటుంబాలు ఒక‌టి వ‌రంగ‌ల్లో ఉంటే మ‌రొక‌టి సిద్ధిపేట ప‌రిస‌ర గ్రామాల్లో ఉంది. వంద‌ల యేండ్లుగా కాకిప‌డిగెలు క‌థ చెప్పుకుంటూ బ‌తుకీడుస్తున్నారు. ఇలాంటి వారి ప‌ట్ల అక్ష‌ర‌కు ఎడ‌తెగ‌ని మ‌మ‌కారం. వారి క‌ళ ప‌ట్ల గౌర‌వం ఉంది. వారి చ‌రిత్ర‌ను బ‌తికించాల‌నే తండ్లాట ఉంది. ఆ తండ్లాట‌లోనుండే ఈ డాక్యుమెంట‌రీ రూపొందింది. ఎవ‌డికి ఎవ‌డూ కాని  లోకంలో, ఓ అంత‌రిస్తున్న క‌ళ గురించి,క‌ళాకారుల గురించి ఈ యువ ద‌ర్శ‌కుడు మ‌ధ‌నప‌డుతున్నాడు. క‌ళాకారుల క‌ళ‌నే కాదు, ఆ క‌ళ వెనక  దాగిన క‌న్నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు. అందుకే జాగ్ర‌త్త‌గా వారి గ‌తాన్ని వ‌ర్త‌మానాన్ని రికార్డు చేస్తున్నాడు.

akshara1

పురాణాలు అంతిమంగా బ్రాహ్మ‌ణిజం చుట్టే తిరుగుతాయి. అవి హిందు దేవ‌త‌ల‌ను కొలిచే ముగింపునే క‌లిగి ఉంటాయి. ఈ పుర‌ణాల మీద ఆధార‌ప‌డి  సృష్టించ‌బ‌డిన క‌ళారూపాలు కూడా ఆ మూస‌లోనే కొన‌సాగుతుంటాయి. అంతమాత్రం చేత వాటినే న‌మ్ముకున్న క‌ళాకారులు అంత‌రించాల‌ని కోరుకోవ‌డం తిరోగ‌మ‌న‌మే అవుతుంది. హిందు కుల వ్య‌వ‌స్థ ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులాన్ని సృష్టించింది. ఈ సంస్కృతి ఆయా కులాల చ‌రిత్ర‌ను గానం చేసే ప్ర‌స్థానంతో మొద‌లై ఉంటుంది. మాదిగ‌ల‌ను కీర్తిస్తూ చిందు,డ‌క్క‌లి, బైండ్ల కులాలు ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో క‌థ‌లు చెబుతుంటాయి. మాదిగ‌లు ఇచ్చే త్యాగం మీదే వీరి జీవితాలు గ‌డుస్తుంటాయి. అలా ముదిరాజు కుల చ‌రిత్ర‌ను గానం చేస్తూ ప‌టం మీద పురాగాథ‌ల్ని పాడే కుల‌మే కాకిప‌డిగెల కులం. ఈ క‌ళాకారులు మిగిలిన ఆశ్రిత కులాల క‌ళాకారుల వ‌లెనె అంప‌శ‌య్య మీద జీవ‌నం సాగిస్తున్నారు.

కాకి ప‌డిగెల సంప‌త్‌! ఈ పేరు ఈ డాక్యుమెంట‌రీ చూసే వ‌ర‌కు నాకైతే తెలియ‌దు. ప్ర‌స్తుతం క‌ళా రంగంలో ఉద్ధండులైన పండితుల‌కు కూడా ఈ పేరు కొత్తే. కాకిప‌డిగెల సంప‌త్ క‌థ చెబితే ప‌ల్లె తెల్ల‌వార్లు మేల్కొని చూడాల్సిందే. క‌థ‌ను త‌న మాట‌ల‌తో ప్ర‌వ‌హింప జేసేవాడు సంప‌త్‌. తాను పురాగాథ‌ల్ని గానం చేస్తుంటే ఒక మ‌హా వాగ్గేయ‌కారుడు మ‌న కండ్ల ముందుకొస్తాడు. అడుగులు క‌దుపుతూ డోల‌క్ ద‌రువుల‌కు, హార్మోనియం రాగాల‌కు గాలిలో తెలియాడుతూ చేసే సంప‌త్ ప్ర‌ద‌ర్శ‌న ఎవ్వ‌రినైనా మంత్ర ముగ్ధుల్ని చేసేది. అందుకే ఢిల్లీ వ‌ర‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌రంప‌ర కొన‌సాగింది. ఆశ్రిత కులాల క‌ళాకారులు ఎంత గొప్ప ప్ర‌తిభ క‌లిగినా వారికి ద‌క్కేది ఏమీ  ఉండ‌దు. అకాల మ‌ర‌ణాల పాల‌వ్వ‌డ‌మే ఈ వ్య‌వ‌స్థ వారికిస్తున్న బ‌హుమ‌తి. అలా అనారోగ్యంతో సంప‌త్ నేలరాలాడు. ద‌శాబ్దాలుగా కాకిప‌డిగెల క‌ళారూపానికి జీవితాన్ని అంకితం చేస్తే, త‌న భార్యా బిడ్డ‌ల‌కు తాను సంపాదించింది ఏమీ లేదు. మ‌ళ్లీ అదే పూరి గుడిసె, అవే డోల‌క్ తాళాలు. తండ్రి అందించిన క‌ళారూపాన్ని త‌మ ఆస్తిగా భావించారు సంప‌త్ ఇద్ద‌రు కొడుకులు. ఇప్పుడు వారు మ‌ళ్లీ కాకిప‌డిగెల క‌థ చెబుతూ త‌మ తండ్రికి మ‌న‌సులోనే నివాళులు అర్పిస్తున్నారు. గ్లోబ‌లైజేష‌న్ వ‌చ్చి త‌మ పొట్ట‌కొట్టినా తాము ఆక‌లితో అల్లాడిపోతున్నా త‌మ క‌థ ఆగొద్ద‌నేదే వారి భావ‌న‌. అందుకే అన్నీ మ‌రిచిపోయి ఆట‌లోనే శిగ‌మూగుతున్నారు. ఇదీ విషాదం. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకే అక్ష‌ర కుమార్ అంకిత‌మ‌య్యాడు.

ఈ యువ‌ద‌ర్శ‌కుని ప్ర‌తిభ ఇందులో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. డాక్యుమెంట‌రీలు అన‌గానే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఏదో ఇంట‌ర్ ప్రిటేష‌న్ వ‌స్తుంటుంది. దాన్ని నిర్మిస్తున్న‌వారి ఆబ్జెక్టివ్స్ వారికుంటాయి. కాని, అక్ష‌ర ఈ రొటీన్ వ‌ర్క్ మాడ‌ల్‌ని బ్రేక్ చేశాడు. వారి లైఫ్ స్టైల్, వారి స్ర్ట‌గుల్, వారి లెగ‌సీ, వారి ట్రాజెడీ అన్నీ వారితోనే చెప్పించాడు. ఉన్న‌ది ఉన్న‌ట్లు క‌ళ్ల ముందుంచి, ప్రేక్ష‌కుణ్ణే ఆలోచించ‌మంటాడు. ఇక సినిమా ఇండ‌స్ర్టీ అనుభ‌వాల‌ను కూడా రంగ‌రించాడు అక్ష‌ర‌. డాక్యుమెంట‌రీని ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా మ‌లిచేందుకు శ‌త‌థా ప్ర‌య‌త్నించాడు. ఒక దృశ్య‌కావ్యం మ‌న మ‌న‌సుల్ని ఆక‌ట్టుకోవాలంటే అందులో హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌ని ప‌లికించాలి. ఇదే అక్ష‌ర ఉద్దేశం కూడా. అందుకే క‌ళ‌ను న‌మ్ముకున్న ఈ ఆఖ‌రి మ‌నుషుల అంత‌రంగాన్ని ఆవిష్క‌రించేట‌పుడు కూడా ఎమోష‌న్స్‌ని వ‌దిలిపెట్ట‌లేదు. ఆక‌లితో అల‌మ‌టిస్తూనే వారి పండించే హాస్యాన్ని కూడా తెర‌కెక్కించాలంటే ద‌మ్ముండాలి. ఆ ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు అక్ష‌ర‌. అందుకే వారి దుఃఖాన్ని ప‌ట్టుకున్నంత సుల‌భంగా వారి ధైర్యాన్ని ఏటికి ఎదురీదేత‌నాన్ని కూడా ప‌ట్టుకున్నాడు.

కులం స‌ర్టిఫికెట్లు జారీచేయ‌డానికి అర్హ‌త క‌లిగిన  6432 కులాల జాబితాలో పేరు లేని కులం ఈ కాకిప‌డిగెల‌. దీంతో వీరికి విద్యా ఉద్యోగం అనేవి ద‌రిచేర‌నివిగానే మిగిలిపోతున్నాయి. కాళ్లావేళ్లా ప‌డితే వీరికి బీసీ-డీ స‌ర్టిఫికెట్ ఇచ్చి చేతులు దుల‌పుకుంటున్న‌ది స‌ర్కార్‌. ఈ విషాదానికి తెర‌ప‌డాల‌న్న‌దే ఈ డాక్యుమెంట‌రీ ఉద్దేశం. తెలంగాణ నూత‌న రాష్ర్టంలో కోల్పోయిన చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మాణం చేసుకుంటున్న ద‌శ ఇది. ఈ స‌మ‌యంలో ఈ జాన‌ప‌ద క‌ళాకారుల‌పైన వారి క‌ళారూపాల‌పైన అక్ష‌ర కుమార్‌కు ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రామాల‌కు వెళ్లిన‌పుడు ఏ క‌ళారూపాన్ని లెక్క‌చేయ‌ని యువ‌త‌, ప‌ట్నానికొస్తే శిల్పారామంలో మాత్రం ఎగ‌బ‌డి డ‌బ్బులు పెట్టి మ‌రీ జాన‌ప‌ద క‌ళారూపాల‌తో, క‌ళాకారుల‌తో సెల్పీలు దిగే వైవిధ్యం నేడున్న‌ది. ఇలాంటి జ‌మానాకు దూరంగా నిజాయితీతో జాన‌ప‌ద క‌ళారూపాల‌ను బ‌తికించాల‌నే ల‌క్ష్యంతో అక్ష‌ర కుమార్ చేసిన ఈ ప్ర‌యత్నం వృథాపోదు. రేప‌టి త‌రాల‌కు కాకిపడిగెల జీవితం దృశ్య రూపంలో అందుతుంది. ఇలాంటి ప‌నిని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, చేసిన అక్ష‌ర కుమార్‌కు అభినంద‌న‌లు. అక్ష‌ర‌కుమార్ సంక‌ల్పానికి అండ‌దండ‌గా నిలిచిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు, జాతీయ అవార్డు గ్ర‌హీత మామిడి హ‌రికృష్ణ అభినంద‌నీయులు. తెలంగాణ‌లో ఉన్న డెభ్భైవేల మంది జాన‌ప‌ద క‌ళాకారుల్ని త‌న కుటుంబ స‌భ్యులుగా భావించే మామిడి హ‌రికృష్ణ‌గారి ఔదార్యం గొప్ప‌ది. అక్ష‌ర అండ్ టీం శ్ర‌మ‌కోర్చి నిర్మించిన ఈ దృశ్య‌రూప కావ్యం ఈ నెల 4వ తేది సాయంకాలం ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది.

ఆఖ‌రి మ‌నుషుల కోసం అల్లాడిన ఆర్తి ఇది

క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళారూపానికి క‌న్నీటి భాష్యం

కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం

గ్లోబ‌ల్ ప‌డ‌గ గాయాల‌ను మాన్పేందుకు.. అక్ష‌ర హృద‌య ఔష‌ధం

రండి అంద‌రం క‌లిసి వీక్షిద్ధాం..

ఆత్మీయ క‌ర‌చాల‌నాల‌తో అభినందిద్ధాం…  

*