ఇంకేమీ ల్యే ….. రివేరా సంతకం!

riveraa

 

మనుషుల్ని దూరం చేయడం ఈ యుగ లక్షణం. ఒకర్నొకరు కలవకుండా, మాట్లాడకుండా, ఆలింగనం చేసుకోకుండా,  ఒకరి కండ్లలో తడి మరొకరు అనుభూతి చెందకుండా చేయడం ఈ కాలం లక్షణం. ఒకర్నుండి ఒకర్ని యెప్పటికప్పుడు ఖాళీ చేస్తుండడం, చేయిస్తుండడం ఈ నాటి క్రూరత్వం. ఒకప్పుడు ఇల్లు ఖాళీ చేసేటోళ్లం. తర్వాత ఊర్లు ఖాళీ చేసినం. ఆ తర్వాత దేశాల్ని ఖాళీ చేసినం. ఇప్పుడింక మనుషుల్నే ఖాళీ చేయాల్సివస్తున్నది. మనుషుల్ని అలవోకగా,  యేమీ పట్టనట్టుగా వదిలేసి,  ఖాళీ చేసి,  గొరగొరా మనల్ని మనం ఈడ్చుకుపోవల్సి వస్తున్నది. మనుషులు మనల్ని భౌతికంగా వదిలి పోవుడు ,  సుదూరమై పోవుడు  అందనంత దూరంలో ఉండుడు  చివరికి ఈ లోకంలోంచే నిష్క్రమించుడు  మనకు రోజూవారీ చర్యై పోయింది. తీరా వదిలిపోయినంక కానీ తెలుస్త  లేదు ఆ నొప్పి – తీరా దూరమైనంక కానీ ఆ గాయాలు సలపడం లేదు – ఇంక మళ్ల కలవరు,  ఇంక మళ్ల చూడలేము , మళ్ళెప్పుడూ కరస్పర్శ ఐనా వీలుకాదు అని తెలిసినంక  కానీ వెచ్చని నెత్తుటి తడి అంటదు.

అనాదిగా కవులు,  కలయికల గురించీ, వియోగాల గురించీ,  విరహాల గురించీ పాడుతూనే ఉన్నరు. కలయికల తియ్యదనం గురించి పాడినట్లుగా,  వియోగపు చేదునూ మధురంగానే పాడుతున్నరు. ఐతే అన్ని కాలాల్లో కలయికలు వియోగాలు విరహాలు ఒకటికావు. మనుషులందరికీ కూడా కలవడాలూ విడిపోవడాలూ వేరు వేరుగానే అనుభూతిలోకి వస్తయి. ప్రేమికులకు ఒక రకంగా, స్నేహితులకు ఒక రకంగా, సన్నిహితులకు ఆప్తులకు మరో రకంగా అవి గోచరిస్తయి, అనుభూతినిస్తయి. అన్నింటికంటే సామూహిక కార్యాచరణలో ఉన్నవారికి, ప్రజాఉద్యమాల్లో ఉన్నవారికి కలయికలు అపురూపాలు – వియోగాలు అత్యంత విషాదాలు. వియోగం వేరొకచోటికి బదిలీల వల్ల కావచ్చు, బలవంతంగా పరిస్థితుల వల్ల విడిపోవడం కావచ్చు చివరికి దుర్మార్గపు వ్యవస్థ బలికోరే బలవన్మరణాలవల్ల కావచ్చు. యేది యేమైనా యీ వ్యవస్థ చేస్తున్నది మనుషుల్నుండి మనుషుల్ని ఖాళీ చెయ్యడమే – ఖాళీ చేసి దూరంగా సుదూరంగా అందరానంత దూరంగా,  మళ్ళెప్పుడూ కలవనంత దూరంగా విసిరెయ్యడమే – ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగల్చడమే.

ఇక ఇప్పుడు కవులు ఖాళీ చెయ్యడం గురించి పాడతరు. ఖాళీ ఐన చోట మిగిలిన శూన్యం గురించి పాడతరు. ఖాళీ చేసేటప్పుడు గొరగొరా ఈడ్చుకుపోయిన మనుషుల చప్పుడు గురించి పాడతరు. ఐతే ఖాళీ గురించి పాడడమంటే, ఖాళీ గురించి చెప్పడమంటే  ఉన్నప్పటి ఉనికి  గురించి చెప్పడమే కదా – ఉన్నప్పటి అనుభూతుల్నీ అనుభవాల్నీ ఆకాశాల్నీ నేల చెలిమల్నీ తడమడమే కదా!

ఇంక ఈ లోకంనుండే ఖాళీ చేసి పోయినవాళ్ల గురించి పాడెటప్పుడు యెంత విషాదం గడ్డకట్టుకు పోతుందో చెప్పడం యెవరికి సాధ్యం?   అందరానంత దూరాల్లో ఉండీ కలవలేకపోవడం  అర్థం చేసుకోవచ్చేమో – పక్క పక్కనే ఉండి ఒకర్నుండి ఒకరు ఖాళీ ఐన పరిస్థితి మరీ దారుణం కదా – మరి దాన్ని పాడడం యింకెంత విషాదం?

 

“వాళ్లు స‌జీవంగా ఉంటారు

మ‌న‌తో క‌ల‌వ‌రు

మ‌న‌ల్ని స‌జీవంగా ఉంచుతారు

అయినా, మ‌న‌తో ఉండ‌రు.”

అని మొదలవుతుంది రివేరా కవిత ‘ఇంక ల్యే… ‘ .

సజీవంగా ఉండీ, మనల్ని సజీవంగా ఉంచీ మనతో కలవని వారూ మనతో ఉండని వారి గురించి, వారు వదిలిన ఖాళీ గురించి పాడుతున్నడు కవి. వెంటనే ..

“కిత్నేబీ క‌హో… వాళ్లంతే

వాట్ మేబీ వుయ్ ఆర్‌.. వాళ్లంతే.”

అంటూ హింగ్లీషు లోనూ తెలుగులోనూ లయబద్దంగా చలిస్తడు.

“ పొయ్యి మీద కూర్చోబెట్టేసి

పొద్దున్నే చాయ్ కాసేస్తారు

చెవి మెలిపెట్టేసి రాగం తీయిస్తారు

పుట‌ల్లో చొర‌బ‌డి ప‌క్కున న‌వ్వేస్తారు

మ‌న జేబులు దోసేసి

దొంగ‌ల్లా బోనులో నిల‌బెట్టేస్తారు.”

కొంగ్రొత్త వ్యక్తీకరణతో , వాళ్ళేమి చేసినరో చెప్తున్నడు కవి. వాళ్ళు మనకెంత సన్నిహితులో, మనకెంత యేమి నేర్పించినరో యెట్లా నేర్పించినరో చెప్పి ముక్తాయింపుగ మన జేబులే దోసి మనల్నే దొంగల్ని  చేసిన వైనం చెప్తడు ఒకింత చమత్కారంగా – వాళ్ళు మన జేబుల్ని దోచింది మన పైసలు కాదని మనకి వేరేగా  చెప్పనవసరం లేదు కవి.

హాత్ మిలే, బాత్ ఖిలే.. వాళ్లంతే

సాత్ చ‌లే, రాత్ హిలే.. వాళ్లంతే.

మళ్ళీ లయబద్దమైన హింగ్లీషు. ఐతే యేదో చమత్కారం కోసం వాడడం లేదా సంగీతం కోసం లయకోసం మాత్రమే కాదు – మిలే ఖిలే చలే హిలే చాలా లోతైన పదాలు – మిలే చలే మనుషులకు వర్తిస్తే ఖిలే హిలే ప్రకృతి కి సంబంధించినవి. ఐతే మనుషులకీ  వికసించడం కదిలిపోవడం వణికిపోవడం సహజమే కదా – అందుకే కవి అమాయకంగా సంగీతం కోసం లయకోసం వాడినట్టున్నా , కొంచెం గడుసుతనం కూడ ప్రదర్శించిండు.

 

“ సూరీడికి అర‌చేతులు అడ్డుపెట్టి

మ‌న క‌న్నుల‌కు కాపు కాసిందెవ‌రో..

ఆ క‌న్నుల‌ను వొళ్లోకి తీసుకొని

ఊపిందెవ‌రో, ఊకోబెట్టిందెవ‌రో..

క‌న్నులు మూసినా, తెరిచినా

దృశ్యాన్నంతా దురాక్రమించిందెవ‌రో..”

 

‘అరచేతికి అడ్డుపెట్టీ సూర్యకాంతినాపలేరు’   అన్న నినాద ఉద్యమ సంప్రదాయం నుండి వచ్చిన కవే రివేరా – ఐతే ఆ స్ఫూర్తి యెంతమాత్రమూ పోకుండానే, మనకు బాగా తెలిసిన భావాన్ని మనకు అపరిచితం చేస్తున్నడు. యెండవేడిమి నుండి లేలేత కనుపాపలని కాపాడినరు, వొళ్ళోకి తీసుకోని ఊపినరు ఊకోబెట్టీనరు – మనల్ని పసిపాపలుగానూ,  పసిపాపలు చేసీ పెంచి పెద్ద చేసిన వాళ్ళ గురించి చెప్తూ కవి,  మన కళ్ళ లో దృశ్యాల్ని దురాక్రమించుకున్నరు అని ఒక విరోధాభాస ప్రయోగిస్తున్నడు. ఇది మంచి దురాక్రమణ అని వేరే చెప్పాలా కవి?

“ తిరిగే లోకంలో తిక‌మ‌క‌ప‌డిన‌ప్పుడ‌ల్లా

తిమ్మిరి తీసి తిన్నగా దారికి తెచ్చిందెవ‌రో..

మ‌నిద్దరినీ అంబాడే అడుగులు చేసిందెవ‌రో..”

మొదటి రెండు వాక్యాల్లో మనకి నడక నేర్పినరు అని చెప్పడానికి కవి వాడిన పదాలను వాటి సొగసునూ అనుప్రాసనూ గమనించండి. యెక్కడా తేలిపోకుండా, కవిత్వమవుతూనే అద్భుతంగా పదాలను కూర్చినడు కవి.

“ఎంత వెతుకూ… దొర‌క‌రు

ఎంత పిలువూ.. ప‌ల‌క‌రు

నీడ‌ల‌ను మ‌న‌కి మిగిల్చి

నిజ దేహాల‌తో ఎంచ‌క్కా లేచిపోతారంతా..”

ఇక్కడ ఇక కవితలో మొదటి రెండు చరణాల  తర్వాత ప్రయోగించిన హింగ్లీషు ప్రయోగం కాకుండా తన మాతృభాష లోనే శోకిస్తున్నడు కవి. నీడలను మనకు మిగిల్చి వెళ్ళిపోయే వారిని ‘యెంచక్కా లేచిపోతారంతా’ అనడం లో అట్లా హాయిగా వెళ్ళిపోయినరనే అర్థం స్ఫురించినా వెతికా దొరకని,  పిలిచినా పలకని, ఖాళీలు మిగిల్చి,  పుట్టెడు  శోకాన్నీ మిగిల్చి,  పూడ్చలేని ఖాళీలు మిగిల్చి , వెళ్ళిపోయారనే దుఃఖ భారమూ ఉన్నది. మనకు తేలిక అనిపించే పదాలతో మనం యెంతో బరువును అనుభూతి చెందేటట్టు చేయడం కవి గొప్పదనమిక్కడ.

“ ఇంకేమి ల్యే… గుర‌..గుర‌.. గ‌ర‌..గ‌ర‌.. బ‌ర‌..బ‌ర‌లే..”

అని ముగిస్తడు కవితను.  ఇది సందర్భం తెలవక పోతే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించే అవకాశం ఉన్నది. సాధారణంగా మనమేదేనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు,  చివరి సారి లోపలికి పోయి,  అంతా కలియ చూసి చివరి సందూక నో సూట్కేసునో గొరగొరా బరబరా ఈడ్చుకొచ్చి ‘ఇంకేమీ ల్యే.. ‘  అని అలసటతోనూ, నిస్పృహతోనూ, అన్నీ వదిలి వెళ్తున్నం కదా అనే దుఃఖంతోనూ అంటాం కదా – అ దీ కవి తన ముగింపు వాక్యంగా యెంచుకొన్నడు. నిజానికి ఇది కవితకు ప్రారంభవాక్యం . కవి ఇంకా చెప్పదల్చుకున్నదానికీ, చెప్పకుండా మనల్ని ఊహించుకోవడానికి వదిలేసిన దానికీ ప్రారంభ వాక్యాలు. నిజానికి ముందు చెప్పిందంతా ఒక ఉపోద్ఘాతం మాత్రమే – ఇక్కడ్నుండీ కవిత మొదలవుతుంది. అది మనమే ఊహించుకోవాలె  రాసుకోవాలె.  ఇట్లాంటి అనేక సందర్భాల్లో మనలో మిగిలిన ఖాళీలను చెప్పకుండా , అవి మన ఊహలకే వదిలేసి,  జీవితంలోని ఒక ప్రాక్టికల్ సందర్భానికి కవితాశక్తి ని తెచ్చి,  మనకియ్యడం  కవి అసమాన ప్రతిభకు నిదర్శనం.

రివేరా విరసం లో చాలా చురుకైన సభ్యుడు. చాలా రోజుల్నుంచి కవిత్వం రాస్తున్నడు. చాలా మంచి కవిత్వం రాస్తున్నడు. విరసం వాళ్ళు రాసేది కవిత్వమేనా అని పెదవి విరిచే వాళ్లకు కనబడకపోయి వుండొచ్చు కానీ ఇప్పటికే కవిత్వసంపుటాల్ని ప్రచురించి కవిత్వాన్ని ప్రేమించే వారందరికీ చిరపరిచితుడు. లబ్దప్రతిష్టుడు. కొత్తగా కొంగ్రొత్త వ్యక్తీకరణలతో రాస్తున్నడు. ఒకసారి చదవగానే మర్చి పోయే కవితలు కావతనివి. కనీసం రెండు మూడు సార్లు చదవాలి మనలో ఇంకడానికి  – మనమూ తనతో అంతే గాఢతతో అనుభూతించడానికి.    ఒక సారి ఇంకిపోతే ఇంకెప్పుడూ మనలోంచి ఆరిపోడు రివేరా. విస్తృతంగా ప్రపంచకవులను చదువుతున్నడని ఆయన కవితలను చదివితే అర్థమవుతున్నది.

యెక్కడా తన నిబద్దతనూ నిజాయితీనీ,  సమాజం పట్ల బాధ్యతనూ యెంత మాత్రం సడలకుండా కవిత్వాన్ని తనదైన సంతకంతో  రాస్తున్న అత్యాదునిక కవి రివేరా.

*

 

 

 

మీ మాటలు

  1. సాయి.గోరంట్ల says:

    ఇంకేమి ల్యే..

    ఖాళీ ధెహల్ని ఈడ్చుకు పోతారు..

    ఆంటే నిజం
    నిక్కమైన కవి భాష…

    Wonderful narration sir…

  2. D. Subrahmanyam says:

    ఎప్పటిలాగే నారాయణస్వామి గారు తనదయిన విశిష్ట శైలిలో పరిచయం చేసిన ఈ కవిత దాని రచయిత రివెరా గురించి మంచి వివరాలు ఉన్నాయి. అభినందనలు నారాయణస్వామి గారూ.

    వారు ఈ విశ్లేషణలో వదిన ఈ మాటలు నన్ను ప్రత్యేకంగా ఆలోచించేలా చేసాయి. “అన్నింటికంటే సామూహిక కార్యాచరణలో ఉన్నవారికి, ప్రజాఉద్యమాల్లో ఉన్నవారికి కలయికలు అపురూపాలు – వియోగాలు అత్యంత విషాదాలు. వియోగం వేరొకచోటికి బదిలీల వల్ల కావచ్చు, బలవంతంగా పరిస్థితుల వల్ల విడిపోవడం కావచ్చు చివరికి దుర్మార్గపు వ్యవస్థ బలికోరే బలవన్మరణాలవల్ల కావచ్చు. యేది యేమైనా యీ వ్యవస్థ చేస్తున్నది మనుషుల్నుండి మనుషుల్ని ఖాళీ చెయ్యడమే – ఖాళీ చేసి దూరంగా సుదూరంగా అందరానంత దూరంగా, మళ్ళెప్పుడూ కలవనంత దూరంగా విసిరెయ్యడమే – ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగల్చడమే.”

    అలాగే రివెరా గారి కవితలో ఈ మాటలు ఎంత నిజమో , ఈ మధ్య జరిగిన దౌర్జన్య దృష్ట్యా చాలా ముఖ్య మయినవి.

    “వాళ్లు స‌జీవంగా ఉంటారు
    మ‌న‌తో క‌ల‌వ‌రు
    మ‌న‌ల్ని స‌జీవంగా ఉంచుతారు
    అయినా, మ‌న‌తో ఉండ‌రు.”
    అని మొదలవుతుంది రివేరా కవిత ‘ఇంక ల్యే…

  3. రాఘవ says:

    ఇక్కడ కవిత్వముంది..రివెరా రాసిన అక్షరాల్లోనూ..వాటిని పరిచయం చేసిన గుండె చప్పుడు లోనూ..-

మీ మాటలు

*