పాషాణ పాకం – మైనపు ముద్ద!

viswanatha

ఒక పాతకాలపు మండువా ఇల్లు లాంటి ఇల్లు. చుట్టూ ప్రహరీ. ఎత్తైన ద్వారబంధం. లోపల విశాలమైన ఒక పూజగది. అందులో ఒక పెద్ద జ్ఞానభాండాగారం. ఆ పరిసరాల్లో ఆకురాలినా వినిపించేటంత నిశ్శబ్దం. ఆ గదిలో వెలుతురూ చీకటీ కానీ ఒక మిశ్రమస్థితి.

ఆ జ్ఞానభాండాగారం ముందు ఒక వృద్ధుడు ముకుళిత హస్తాలతో, అరమోడ్పు కనులతో కూర్చుని ఉన్నాడు. అంతర్ముఖుడై ఉన్నాడు. ఆయన ముఖమండలాన్ని అనంతమైన శాంతి ఆవరించి ఉంది. మధ్య మధ్య తల ఎత్తి భాండాగారంవైపు చూస్తున్నాడు. నిశ్చయాత్మకంగా తల పంకిస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనలోని ఆలోచనలకు అక్షరరూపమిస్తే అది ఇలా ఉంటుంది.

మానవుడు పుట్టినప్పటినుంచీ ప్రోది చేసుకుంటూ వచ్చిన జ్ఞానమేదైతే ఉందో ఆ యావత్తు ప్రపంచవిజ్ఞానానికీ ఇది అంతిమం. దీనికి ముందు ఏమీ లేదు. దీని తర్వాత ఇంకేమీ ఉండదు. ఇందులోంచి జ్ఞానాన్ని తోడి ప్రపంచానికి, అది కూడా అవతలివాడి యోగ్యతను బట్టి,  అందించవలసినదే కానీ, ఇందులోకి తీసుకొచ్చి కలపవలసిన ప్రపంచవిజ్ఞానం ఏమీ లేదు.

జ్ఞానానికి ఇది అంతిమ సరిహద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడిక తానుగా కొత్తగా జ్ఞానాన్వేషణ చేయవలసిన అవసరం నుంచి ఆయన విముక్తి పొందాడు. అయితే జన్మ ఎత్తాము కదా, దీనినేమి చేయాలి? ఈ జ్ఞానపు సరిహద్దును శత్రువులు ఆక్రమించకుండా కాపలా కాయడమే దానితో చేయవలసినది. అనగా తానొక యోధునిగా మారడం!

ఆ వీథి లోంచి ఆ ఇంటి మీదుగా రోజూ ఒకాయన వెడుతూ ఉండేవాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన అడుగులు కాసేపు ఆగేవి. ఆ ఇంటిమీద ఆయనకు ఒక అంతులేని కుతూహలం. ఆ లోపల ఉన్నవారు ఎవరో ఆయనకు తెలుసు, కానీ తెలియదు. ఇదో విచిత్రమైన ప్రహేళిక. తెలియడమంటే ఏమిటి, సన్నిహితంగా గాఢంగా తెలియడం. కానీ ఈయనకు ఆ అవకాశం లేదు. ఆ వృద్ధుడి సామాజిక నేపథ్యం, ఈయన సామాజిక నేపథ్యం ఒకటి కావు. కనుక కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఆ జ్ఞానభాండాగారాన్ని నింపుతూ వృద్ధి చేస్తూ వస్తున్న ఆ ఇంటిలోపలివారి ఆచారవ్యవహారాలు, వారి ఆలోచనాసరళి, వారి భాషకు చెందిన నుడికారం, అందులో ఉట్టిపడే ధిషణ, అధికారం-మొత్తంగా ఆ జ్ఞానభాండాగార వృద్ధి వెనుక గల వారి తాత్విక, మానసిక స్థితిగతులు ఈయనకు సన్నిహితంగా తెలియవు. ఆ ఇంటాయనదీ, ఈయనదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకరికొకరు పరిచితులే, కానీ అపరిచితులు. ఒకరు ఆ జ్ఞానభాండాగారపు లోపలి మనిషి, ఇంకొకరు వెలుపలి మనిషి.

కానీ ఈయనకు ఆ ఇంటిమీద వల్లమాలిన కుతూహలం. ఎప్పుడైనా సింహద్వారం తెరచి ఉన్నప్పుడు లోపల కొంత ఆ ఇంటి ఆకారం కనిపించేది, అంతే. అది కనిపించడం కాదు. మరీ అరుదుగా సాహసించి సింహద్వారం దాటి లోపలికి వెళ్ళేవాడు. కానీ అడుగులు జ్ఞాన భాండాగారమున్న గది ఇవతల ఆగిపోయేవి. ఇంకా అరుదుగా ఆయన అదృష్టం కొద్దీ ఆ భాండాగారపు తలుపులు  ఓరగా తెరచుకుని ఉండేవి. అప్పుడా సందులోనుంచి భాండాగారం వైపు తొంగి చూసినప్పుడు దానిలోని జ్ఞానశకలాల మెరుపులేవో తన బుద్ధిని తాకినట్లు అనుభూతి చెందేవాడు. ఆ మెరుపులు అప్పటికే ఈయన బుద్ధిలో నిక్షిప్తమైన జ్ఞానఫలకంపై ప్రసరించి కొత్త కాంతులను ఈనుతున్నట్టు అనిపించేది.

ఎందుకంటే, ఈయన తన బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నది కొత్త జ్ఞానం. ఆ వృద్ధుడి భాండాగారం నుంచి తోడుకున్నది కాక ఇంగ్లీషు చదువువల్ల కలిగినది. వృద్ధుని భాషలో చెప్పాలంటే అది కాలమహిమ! వృద్ధుడి వెనక వందలు వేల సంవత్సరాల చదువు ఉండగా ఈయనది ఇప్పుడిప్పుడే మొదలైన చదువు. పైగా అది ఇంగ్లీషు చదువు. ఈయనకు ఆ విధంగా ఇంగ్లీషు గవాక్షం నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది. ఆపైన తన జ్ఞానభాండాగారం యావత్తు జ్ఞానానికీ అంతిమం అనుకుంటున్న వృద్ధుడిది ఆగిపోయిన చదువైతే, ఈయనది  సాగుతున్న చదువు. వృద్ధుడిది కడుపు నిండింది అనుకునే చదువైతే, ఈయనది అప్పుడే హైబర్నేషన్ నుంచి బయట పడినట్టుగా ప్రపంచాన్నే మింగేసేటంతగా ఆవురావురు మంటున్న చదువు.

sudrarsanam

ఈయన తన కొత్త చదువుల దారిలో ఏవో కొన్ని జ్ఞానపు గీటురాళ్లను సేకరించుకున్నాడు. ఆ వృద్ధుని జ్ఞాన భాండాగారం నుంచి తనను తాకిన శకలాలను వాటిమీద పరీక్షించి విలువ కట్టాలని ఈయన తాపత్రయం. ఆవిధంగా రెండింటి మధ్యా ఏమైనా సమన్వయం సాధ్యమవుతుందేమో నని కూడా ఆయన తపన. కానీ విచిత్రం, ఆ జ్ఞానభాండాగారానికి తను అపరిచితుడు, ఔట్ సైడర్! కాకపోతే ఆ భాండాగారంపై ఈయనకు ఒకవిధమైన ఆరాధనాభావం ఉంది. కనుక దానికి ఆయన ‘బాహ్యమిత్రుడు’. మారిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులలో ఆ వృద్ధునికీ, ఈయనకూ కుదిరిన ఒకానొక ఐక్యత కూడా అందుకు కారణం కావచ్చు.  అంతకు చాలా ముందునుంచే ఉండి, ఇవే పరిస్థితులలో ఈయన కళ్ళముందే బలమైన గొంతును, నిర్దిష్టతను, అస్తిత్వాన్ని తెచ్చుకుంటున్న ఇంకొక సామాజికవర్గం ఉంది. ఈ వర్గానికి ఆ జ్ఞానభాండాగారం వైపు తలుపు సందులో నుంచి చూసే అవకాశం కూడా లేదు. కనుక ఈ వర్గాన్ని ‘బాహ్యశత్రువు’ అనవచ్చు.  ‘బాహ్యత’ అనేది ఉభయులకూ సమానం.

వృద్ధుని విశ్వనాథ సత్యనారాయణ అనుకుంటే, ఈ రెండో వ్యక్తి ఆర్. ఎస్. సుదర్శనం.

***

‘సాహిత్యంలో దృక్పథాలు’ ఆర్. ఎస్ .సుదర్శనంగారి ప్రసిద్ధ సాహిత్య విమర్శాగ్రంథం. మొదటిసారి 1968లో ప్రచురితమైంది. అందులోని వ్యాసాలను ఎప్పుడో చదివాననే గుర్తు. కానీ అది చదువు కాదు. విశ్వనాథవారి ఫక్కీలోనే చెప్పాలంటే, చదివితిని, చదవనైతిని. అసలు చదువనగా నేమి? ఒక పుస్తకములోని విషయమును సంపూర్ణముగా ఆకళించుకొనగల అధికారముతో చదివినదే చదువు. కేవలము చక్షురక్షర సంయోగమాత్రముగా చదువునది చదువు కాదు.

చదవడం గురించి నాకూ ఒక అభిప్రాయం ఉంది. మనం ఒకే రచనను వివిధ జీవితదశల మీదుగా చదువుతాం. ఆ వివిధ జీవిత దశలమీదుగా సునిశితమవుతున్న మన అవగాహనను, ప్రపంచజ్ఞానాన్ని ఆ రచనకు అదనంగా జోడిస్తూ చదువుతాం. ఆ చదువు వెనకటి జీవితదశలోని చదువును రద్దు చేస్తుంది. అంటే మళ్ళీ ఆ రచనను మనం కొత్తగా చదువుతాం. ఆ విధంగా ఆ రచన కాలం వెంబడి ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని తెచ్చుకుంటూ పాఠకుడికి ఎప్పటికప్పుడు కొత్తగా చదివిన అనుభూతినిస్తుంది.

ఇప్పుడు ‘సాహిత్యంలో దృక్పథాలు’ చదవడం నాకు నిజంగా అలాంటి ఒక విశిష్టానుభవం. అటు విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఇటు సుదర్శనంగారిని కూడా కొత్తగా ఒకింత ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడా రచన ఇచ్చింది. అయితే ఇది సబ్జెక్టివ్ గా అంటున్న మాట సుమండీ. విభేదించే హక్కు పాఠకులకు ఎప్పుడూ ఉంటుంది.

అందులోనూ నాకు ముఖ్యంగా అనిపించినది, ఈ పుస్తకానికి అది వెలువడిన రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ రెలెవెన్స్ ఉందన్నది. ఆ రెలెవెన్స్ ఉండడమే దాని గురించి నేను రాయడానికి ప్రధానమైన ప్రేరణ. ఆ రాయడంలో నేను సాహిత్యంలో దృక్పథాలు గురించి మాత్రమే రాయడం లేదు. విశ్వనాథ సత్యనారాయణ, ఆర్ ఎస్ సుదర్శనం అనే ఇద్దరు వ్యక్తులను గురించి రాస్తున్నాను. వారి భావాల మధ్య ఉన్న సంఘర్షణ గురించి, ఆ సంఘర్షణ వేళ్ళు వారి వారి సామాజిక, వైజ్ఞానిక వైవిధ్యాలలో ఉండడం గురించి రాస్తున్నాను. వారిని, వారి సామాజిక నేపథ్యాలను  కూడా దాటి,  దేశమంతటా ఇంకా కింది సామాజికవర్గాలవరకూ వ్యాపించి  ఈ దేశపు గతాన్ని, వర్తమానాన్ని కమ్ముకున్న ఆ వైవిధ్యమూ, ఆ భావసంఘర్షణా తాలూకు భవిష్యస్థితి గురించి, అది నేటి మన అనేకానేక భ్రమలను చెదరగొట్టే అవకాశం గురించి రాయడానికి ఈ ప్రయత్నం.

సుదర్శనంగారు సాహిత్యంలో దృక్పథాలు రాసిన కాలానికి ఉన్న దేశీయస్థితిగతులు వేరు. అప్పడు కాంగ్రెస్, అది చెప్పుకునే సెక్యులరిజం(లేదా ఇప్పుడు కొందరు ప్రబలంగా చిత్రిస్తున్న సూడో-సెక్యులరిజం) పెద్దగా పోటీ లేని అధికారాన్ని చలాయిస్తున్నాయి. దేశవిభజన తర్వాత దేశంలోని ముస్లిం మైనారిటీలు, ఇతర మతపరమైన మైనారిటీలు సెక్యులరిజం(లేదా సూడో-సెక్యులరిజం) గొడుగు కింద  కనీసం సూత్రరీత్యానైనా ఒక తటస్థ సామాజిక స్థితిలో ఉంటున్నారు.  ఇంకోపక్క వామపక్ష, వామపక్ష తీవ్రవాద ప్రభావం ప్రత్యేకించి యువత మీదా గాఢంగా ఉంది. నూతన రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో దళితులు, తరుజన, గిరిజనులు కొత్త అస్తిత్వాన్ని, గొంతును, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటున్నారు.

ఈ కాలమంతటా సాంప్రదాయికశక్తులుగా భావిస్తూ వచ్చిన శక్తులు సద్దు మణిగి ఉన్నాయి. వాటిమీద తిరోగాములన్న ముద్ర బలంగా ఉంది. పాశ్చాత్య విజ్ఞానపు వెలుగులో సాంప్రదాయిక విద్యా విజ్ఞానాలను సరికొత్తగా అర్థం చేసుకుని నూతన సమన్వయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఆరోజున పురోగామిగా ముద్ర పొందింది. ఆవిధంగా సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు రాసే కాలానికి పురోగామి చింతకులు అనుకుంటే, విశ్వనాథ తిరోగామి భావజాలానికి ప్రతినిథి. అయితే 1968 నుంచి 2016 కు వచ్చేసరికి నాడు ‘తిరోగామి’, ‘పురోగామి’ అనుకున్న శక్తుల బలాబలాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇప్పుడు విశ్వనాథ భావజాలం అధికారాన్ని పుంజుకుంటూ విశ్వరూపాన్ని ధరిస్తుంటే సుదర్శనం ప్రాతినిధ్యం వహించిన భావజాలం దానికి దారి ఇస్తూ వెనకడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా భావజాలాల ఆధిక్యత తలకిందులైన పరిస్థితే సాహిత్యంలో దృక్పథాలకు సరికొత్త రెలెవెన్స్ ను స్థాపిస్తూ నూతనంగా చదవలసిన అవసరం కల్పిస్తోంది.

నేను పైన అన్న ‘బాహ్య మిత్రుడు’, ‘బాహ్య శత్రువు’ అనే మాటలు ఇక్కడ కీలకంగా గమనించవలసినవి. ఇప్పుడు ఒకవిధమైన జాతీయతావాదాన్ని, దేశభక్తిని దేశంలో స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక్కడ దేశీయసమాజస్థితి ఎలా ఉంది? ‘బాహ్య మిత్రుడు’ ఇంకా ‘అంతర్మిత్రుడు’ కాలేదు. ‘బాహ్య శత్రువు’కీ, ‘అంతర్వ్యక్తు’లకూ మధ్య సయోధ్య, సమన్వయం, ఇరువురినీ కలిపే ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడలేదు. బలాబలాలు తలకిందులు కావచ్చు తప్ప, సాంప్రదాయికంగా వస్తున్న భావ, భౌతిక సంఘర్షణ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని రకాల వైరుధ్యాలను, వైవిధ్యాలను తన కంఠబలంతో అధికార బలంతో ఎగరగొట్టి తన అస్తిత్వాన్ని అంతటా వ్యాపింపజేయడంలో  వందలు వేల సంవత్సరాల అనుభవం ఉన్న సాంప్రదాయిక భావజాలానికి ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేయగల అవకాశం దాదాపు నూరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ వచ్చింది. తన బ్రాండు జాతీయతావాదాన్ని, దేశభక్తిని విధించి శాసించడం అందులో భాగమే.

కానీ విచిత్రమేమిటంటే ఆ జాతీయతావాదాన్ని, దేశభక్తిని పైనుంచి కృత్రిమంగా రుద్దే ఆ ప్రయత్నంలోనే దాని నిరంతర వైఫల్యమూ స్పష్టంగా లిఖించి ఉండడం. ఈ దేశానికి అదొక హాస్యాస్పద, విషాదకర అనుభవం.

నేను ఈమధ్యనే ఒక చోట రాశాను, భారత దేశమంతటా ఈనాటికీ ఉన్నది ప్రైవేట్ సంభాషణా, ప్రైవేట్ జీవితాలే తప్ప పబ్లిక్ సంభాషణా, పబ్లిక్ జీవితమూ లేదు. భారతదేశపు గొంతు ఇప్పటికీ ప్రైవేట్ గానే వినిపిస్తుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలు తమ నాలుగు గోడల మధ్య నిరంతరం ప్రైవేట్ గానే సంభాషిస్తూ ఉంటాయి. వీటి మధ్య ఒక ఉమ్మడి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. రాజ్యాంగం అవతరణ అలాంటి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసేందుకు ఒక ప్రాతిపదిక. కానీ ఇన్నేళ్లలోనూ రాజ్యాంగం పొందుపరిచిన ఆ పబ్లిక్ భాష పూర్తిగా ప్రజల పరం కాలేదు. అసలు రాజ్యాంగం ఉనికే జనం ఊహల్లో ఇంకలేదు. రాజ్యాంగం ముందునాటి వివాదాల అంతు తేల్చుకునే ప్రయత్నంలోనే ఇప్పటికీ ఉన్నాం. ఇప్పుడు సాంప్రదాయిక శక్తుల పునరాధిక్యస్థితి ఆ అంతు తేల్చుకునే ప్రక్రియను పూర్తి స్థాయి యుద్ధం వైపు మళ్లించింది.

మళ్ళీ ‘బాహ్యమిత్రు’డి దగ్గరికి వద్దాం. పైన చెప్పిన ఆ మండువా ఇంటి లాంటి ఇల్లూ, అందులోని జ్ఞాన భాండాగారం ముందు కూర్చుని ఉన్న విశ్వనాథ వంటి ఒక వృద్ధుడూ, ఆ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్ ఎస్ సుదర్శనం వంటి వ్యక్తీ, ఆ ఇంటి మీద ఆయన కుతూహలం, అందులోని జ్ఞాన భాండాగారం పట్ల ఆయనలోని ఒకవిధమైన అడ్మిరేషన్…కేవలం ఒక ప్రతీకాత్మక దృశ్యకల్పన కావు. సాహిత్యంలో దృక్పథాల వంటి సుదర్శనంగారి రచనల ద్వారానే కాక, వ్యక్తిగా కూడా ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయంతో నేను ఆయన గురించి చేసిన కల్పన ఇది.

సుదర్శనంగారు ఎనభై దశకం ప్రారంభంలో, అంతకు కొన్నేళ్ళ ముందు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, ఆ తర్వాత ఉన్నత విద్యా జాయింట్ డైరక్టర్ గానూ ఉన్న రోజుల్లో కొన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్ళి సాహిత్యం గురించే కాక, ఇతర విషయాల గురించి కూడా ఆయన చెప్పేవి వినే అవకాశం నాకు కలిగింది. ఇప్పటికీ ఒక సంభాషణ నాకు గుర్తుండిపోయింది.

ఓసారి మా సంభాషణ శంకరాచార్యులు స్థాపించిన మఠాలవైపు, కంచి పరమాచార్య వైపు మళ్ళింది. పరమాచార్య గురించి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన కళ్ళలో కనిపించిన ఒక మెరుపు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన గురించి నాకు దగ్గరగా తెలిసిన కొన్ని విషయాలు ఉత్సాహంగా చెబుతుంటే ఆయన ఆసక్తిగా విన్నారు. నేను మాట్లాడ్డం ఆపిన తర్వాత ఒకసారి ఆయన భారంగా నిట్టూర్చి, “మీరు చెబుతున్నవి బాగానే ఉన్నాయి. కానీ బ్రాహ్మణేతరులు పరమాచార్యకు దగ్గరగా వెళ్లచ్చా? వారితో శాస్త్ర, ఆధ్యాత్మిక విషయాలు చర్చించవచ్చా? బ్రాహ్మణ పండితులతో సమానంగా వారికి ఆ అవకాశం ఇస్తారా?” అన్నారు. అలా అంటున్నప్పుడు వారి గొంతులోనూ, ముఖంలోనూ ఒకింత బాధా, నిరాశా తొంగి చూశాయి.

“అదేమీ లేదు, నాకు తెలిసినంతవరకూ వారి దగ్గర బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తేడాలు ఏవీ ఉండవు. ఎవరైనా వారిని చూడచ్చు, మాట్లాడచ్చు” అన్నారు.

అప్పుడు ఆయన నన్నో అజ్ఞానిగానో, అమాయకుడిగానో చూసినట్టు చూసి, చిరునవ్వు నవ్వారు. “నేను అంటున్నది వారిని దర్శనం చేసుకోవడం గురించి, మాట్లాడడం గురించి కాదు. ఆ మఠానికి ఒక సంప్రదాయం ఉంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో బ్రాహ్మణులదే ముఖ్యపాత్ర. బ్రాహ్మణేతరులకు వాళ్ళతో సమానస్థాయిలో వ్యవహరించే అవకాశం లేదు” అన్నారు. ఆ మఠంలో వ్యవస్థకు, ఆచరణకు మొదటి ప్రాధాన్యమనీ, తత్వానికి తర్వాతి ప్రాధాన్యమనీ అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఇంగ్లీష్ విద్య చదువుకున్నవారు హిందూ తాత్వికతకు ప్రాధాన్యమిస్తూ దానిని ప్రపంచానికి పరిచయం చేశారనీ, తనదీ అలాగే తత్వానికి ప్రాధాన్యమిచ్చే దృష్టి అని ధ్వనింపజేశారు.

తాను సాంప్రదాయిక జ్ఞాన భాండాగారానికి ‘మిత్రుడి’ నే అయినా దానికి ‘బాహ్యుడి’ నన్న అసంతృప్తి, వెలితి ఆయన మాటల్లో కనిపించింది. ఆ జ్ఞానభాండాగారం నుంచి తనకు దొరికిన, అనుమతించిన కొన్ని శకలాలను ఆయన ఏరుకున్నారు. వాటిని ఇంగ్లీష్ విద్య తనకు అందించిన ఆధునిక విజ్ఞానం, అవగాహన వెలుగులో పరీక్షించుకుంటూ రెంటి మధ్యా ఏవైనా సమన్వయం సాధ్యమవుతుందేమోనని చూశారు. ఆయన  సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరుల మార్గంవైపు సహజంగానే మొగ్గారు. పాశ్చాత్య తత్వ వేత్తల గురించిన అవగాహనా  హిందూ తాత్వికతను కొత్తగా అర్థం చేసుకునే వెసులుబాటు ఆయనకు ఇచ్చింది.

అయితే ఆయన సాంప్రదాయిక జ్ఞానభాండాగారానికి బాహ్యుడన్న వాస్తవం మరచిపోకూడదు. ఆయన ఆ భాండాగారం నుంచి ఎంతో కొంత స్వీకరించి ఉండచ్చు, అయినా అది ఆయనకు కరతలామలకం అయినట్టు కాదు. ఎందుకంటే ఆ భాండాగారాన్ని అభివృద్ధి చేసిన ఆ ఇంటివాతావరణంతో, అందులోని వ్యక్తులతో, వారి జీవన సరళితో,  వారి ప్రైవేట్ ఆలోచనలతో, భాషతో, అందులోని ధిషణతో ఆయనకు ఆత్మీయ పరిచయం లేదు. కనుక ఎలాంటి జీవన శైలి, ఎలాంటి ఆలోచనా రీతి ఆ జ్ఞానానికి ఆకృతి నిచ్చాయో ఆయనకు సన్నిహితంగా తెలిసే అవకాశం లేదు. దానిపట్ల, దాని తాత్వికత పట్ల దూరం నుంచి చూసినప్పుడు కలిగిన ఒకవిధమైన రొమాంటిక్ అడ్మిరేషన్ ఆయనది. అది ఆయన అవగాహనకు హద్దు. కారణం ఆయనకు మౌలికంగా ఆ జ్ఞానానికి ‘బాహ్యుడు’. ఆయనలోనే కాదు, అలాంటి ‘బాహ్యులు’ అనేకమందిలో అలాంటి రొమాంటిక్ అడ్మిరేషనే ఉంది. దూరం నుంచి చూసినప్పుడు కలిగే ఆ అడ్మిరేషన్ తోనే ఇప్పటికీ దాని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివ్యక్తుల పల్లకీలను మోసే బోయీలుగానే వారు ఉన్నారు.

‘బాహ్యుడు’ కావడం అనేది సుదర్శనంగారికి వ్యక్తిగతంగా ఒక కొరత, లేదా బలహీనత అయితే; మరో వైపునుంచి అదే ఆయన పరిశీలనకు బలం కలిగించింది.  ఆ జ్ఞానభాండాగారం వద్ద కూర్చుని ఉన్న ఆ వృద్ధుని ఆలోచనాసరళిని బయటినుంచి చూసి అర్థం చేసుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ చూడడానికి ఆ జ్ఞాన భాండాగారపు లోపలి ఉపకరణాలు కాక(అవి ఎలాగూ ఆయనకు అందుబాటులో లేవు) తాను ఇంగ్లీష్ విద్యతో సంపాదించుకున్న కొత్త ఉపకరణాలు, తర్కం, హేతువు వగైరాలు ఆయనకు సాయపడ్డాయి. అవి ఆ వృద్ధుడి ఆలోచనా స్వరూపాన్ని దాని వైరుధ్యాలతో సహా అత్యద్భుతంగా బయటపెట్టాయి. “పాషాణ పాక ప్రభువు”గా ముద్రపడిన ఆయనను మైనపు ముద్దలా మనముందు నిలబెట్టాయి.

సాహిత్యంలో దృక్పథాలు చదువుతుంటే, విశ్వనాథ గురించి మనం కల్పించుకునే ఆ ధిషణాహంకార దోర్బల బ్రాహ్మీమయమూర్తి కాస్తా మంచుబొమ్మలా కరిగిపోతున్న భావన కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశపు క్షితిజాన్ని ఆక్రమించుకున్న ఆయన భావజాలంలోని వైరుధ్యాలతో సహా దాని యథార్థ ఆకృతిని మన కళ్ళముందు నిలపడం ద్వారా సాహిత్యంలో దృక్పథాలు ఈ క్షణాన తన రెలెవెన్స్ ను ఆశ్చర్యకరంగా స్థాపించుకుంటోంది.

(ముగింపు తర్వాత)

 

 

 

మీ మాటలు

  1. ఫ్రసాద్ చరసాల says:

    ” దానిపట్ల, దాని తాత్వికత పట్ల దూరం నుంచి చూసినప్పుడు కలిగిన ఒకవిధమైన రొమాంటిక్ అడ్మిరేషన్ ఆయనది. అది ఆయన అవగాహనకు హద్దు. కారణం ఆయనకు మౌలికంగా ఆ జ్ఞానానికి ‘బాహ్యుడు’. ఆయనలోనే కాదు, అలాంటి ‘బాహ్యులు’ అనేకమందిలో అలాంటి రొమాంటిక్ అడ్మిరేషనే ఉంది. దూరం నుంచి చూసినప్పుడు కలిగే ఆ అడ్మిరేషన్ తోనే ఇప్పటికీ దాని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివ్యక్తుల పల్లకీలను మోసే బోయీలుగానే వారు ఉన్నారు.”

    అద్భుతమైన సంక్షిప్తీకరణ!

    ఇలాంటి రొమాంటిక్ అడ్మిరేషన్ రేకెత్తించడంలో హిందూత్వ శక్తులు బలమైన విజయం సాధించాయి.

  2. మనుషుల పై భావజాలపర్యావరణ ల ప్రభావం ,సంఘర్షణల అద్భుత విశ్లేషణ .

    • కల్లూరి భాస్కరం says:

      విజయలక్ష్మి పండిట్ గారూ…ధన్యవాదాలు.

  3. Naresh Nunna says:

    While waiting for the next part of this important article that is opening new socio- cultural vista for the people, curious to understand the epistemology within caste- communal margins, I am, perhaps irrelevantly, referring to this incident that indicates to the customs of Kanchi Kamakoti Peetham. When I was with the Express group in Madras during early 1990s, I used to meet G K Moopanar, a veteran Congress man. The following was heard from his mouth:
    “During the course of emergency, Indira Gandhi was a victim of her own son’s highhandedness, abnormal behaviour of the people like Jagmohan Malhotra and hasty advice of PC Ray and ‘Young Turks’ in the Congress party Chandrasekhar, Krishnakanth, Mohan Dariya. Some kind of guilty feeling ushered her to meet Sri Chandrasekharendra Saraswati Mahaswamiji, is usually referred to as Paramacharya- the embodiment of enlightment, 68th Jagadguru of the Kanchi Kamakoti Peetham. Paramacharya was even reluctant to meet her. She tried to take the blessings of Paramacharya, through the good offices of R. Venkatraman. Since Paramacharya was reluctant to meet her, R Venktaraman prevailed over to get Mrs. Gandhi interview of Paramacharya.
    Paramacharya lashed many conditions, some were very humiliating too, to receive her. She accepted all of them and travelled to Madras, en route Kanchi to seek Paramacharya blessings.
    Paramacharya’s first condition was – she must come in white saree, draping her head up to forehead; she should not wear any ornaments; should not wear leather chapels (conventional attire of a Hindu widow). When she arrived in to meet him, there was a very big tub of water separating her from Swamy Paramacharya. She had to sit on the other side of the tub with her back to the Swamy and not to face to face.
    “You have ruined the purva punya (virtues of the past) of your families, accumulated through 7 generations once for all. At least now, try to rectify to retrieve it for the future generations,” Swamyji told her during that meeting. He asked her to make amends to all the misdeeds of Emergency, one after another.
    After returning Delhi, Mrs Gandhi set many leaders including Sanjeeva Reddy, Jayaprakash Narayan etc.”
    – Probably Sri R S Sudarsanam (బాహ్యుడు by caste- Indira Gandhi was ‘outsider’ by gender) was brooding on such ‘rigid’ traditions of Kanchi Kamakoti Peetham and Paramacharya.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ నరేష్ గారూ…మీరు ఉదహరించిన మూపనార్ కథనం గురించి నేను వినలేదు కానీ అలాంటిదే మరొకటి జరిగింది. దానికి మా నాన్నగారు ప్రత్యక్ష సాక్షి. ఇందిరాగాంధి పరమాచార్య దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో పరమాచార్య మౌనవ్రతంలో ఉన్నారనీ, మాట్లాడరనీ మఠం సిబ్బంది చెప్పారు. వారి సన్నిధిలో కాసేపు కూర్చుని వెడతానని ఇందిరాగాంధి అన్నారు. అప్పుడు మధ్యలో తడిక అడ్డం ఉన్న ఒక కుటీరంలో పరమాచార్య కూర్చుని ఉంటే, తడిక ఇవతల ఇందిరాగాంధి కూర్చున్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణా జరగలేదు. విచిత్రం ఏమిటంటే, మరునాడు పత్రికలు మాత్రం, పరమాచార్యతో ఇందిరాగాంధి దేశ సమస్యలను చర్చించారని రాశాయి. సకేశి అయిన వితంతువును చూడరాదన్న పట్టింపు పరమాచార్యకు ఉండేదన్న విషయం అందరికీ తెలిసినదే.

  4. కె.కె. రామయ్య says:

    కంచి కామకోటి పీఠ 68వ పరమాచార్య, జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు (కంచి మహాస్వామి వారు) ఎమర్జన్సీ నేర కళంకితురాలైన భారత మాజీ ప్రధాని ఇందిరకు ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి రాసిన నరేష్ నున్నా గారు, మహాస్వామి వారి తదనంతరం కంచి పీఠం ఎదుర్కున్న వడిదుడుకులను కూడా ప్రస్తావించి ఉంటె బాగుండేది.

    సాంప్రదాయిక జ్ఞాన భాండాగాగారం, దాని భావజాలంలోని వైరుధ్యాలతో సహా దాని యథార్థ ఆకృతి … ని అవగాహనకు తెస్తున్నకల్లూరి భాస్కరం గారికి ధన్యవాదాలు.

  5. కె.కె. రామయ్య says:

    ప్రియమైన శ్రీ కల్లూరి భాస్కరం గారు,

    అసందర్భమేమో అనే భయాన్ని ఆవలకు నెట్టి మీకు చెప్పాలనుకుంటున్నది …
    “నిమగ్న” సారస్వత వ్యాస సంపుటి పుస్తక రచయిత్రి డా. మైథిలి అబ్బరాజు గారు కూడా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని, వారి సాంప్రదాయిక జ్ఞానభాండాగారాన్ని అన్వేషించి, అనుభవైక్యం చేసుకుని తిరిగి మీ లాగే అద్భుత వ్యాస రూపంలో రాసిన వారు.

    • naresh nunna says:

      కల్లూరి వారినీ, అబ్బరాజు గారినీ కూడా (వారి వారి అక్షరాల ద్వారా) ఎరిగి ఉండటం వల్ల, కవిసామ్రాట్ విశ్వనాథ వారి విషయంలో మీ అభిప్రాయానికి కొంత చేర్పు చేయాలనిపిస్తోంది- రామయ్య గారు.
      మైథిలి గారి పరిశీలన ఉద్వేగ సంబంధి. స్వతహాగా వారిలో రసోద్రేకం అధికం కాబట్టి, విశ్వనాథ వారి పట్ల అలవిమాలిన ఆరాధన చూపిస్తారు. భగవంతుడికి భక్తుడు దాసోహమైనట్టు, ప్రశ్నలు లేని, సందేహాలకు తావులేని తాదాత్మ్యం ఆమెది. అంచేత విశ్వనాథ అక్షరం మైథిలి గారికి అనుభవం వంటిది, తరిచి చెప్పడానికి ఏమీ ఉండదు, ఒక వేళ ఉన్నా, చెప్పడానికి ప్రయత్నించి ఆ గాఢానుభవాన్ని పలచన చేయడం ఆమెకి ఇష్టం ఉండదు.
      ఇక పాతికేళ్లుగా నా ఆత్మబంధువు కల్లూరి భాస్కరం గారు: ఈ తరం వాళ్లకి ఎందరికి తెలుసో గానీ, కల్లూరి గారు కవి, కథకులు. పైన ప్రస్తావించిన ఉద్వేగాలూ, రసోద్రేకాలూ ఆయనలో ఏమీ తక్కువగా లేవు. కానీ, తన జ్ఞాన యజ్ఞానికి తన సృజననే హవిస్సు చేసిన అరుదైన యాజ్ఞుడు కల్లూరి. యాగఫలం – నిర్మమత్వం, స్థితప్రజ్ఞత. History, Anthropology, linguistics వంటి మానవీయ శాస్త్రాలు తెలిసిన సాహిత్యవేత్త కావడం వల్ల ఒక జ్ఞానభాండాగారపు లోపలి మనిషిని, వెలుపలి మనిషిని గుర్తించి, వ్యాఖ్యానించే పని చేయగలుగుతున్నారు. ఈ objective socio- cultural దృష్టి మైథిలి గారికి లేదు, రాదూనూ.

      • పవన్ సంతోష్ says:

        మైథిలి గారు స్పందించేలోగానే ఆవిడని ఉద్వేగ సంబంధి అని బ్రాండ్ చేసేయడం బావోలేదు. సామాజిక సాంస్కృతిక నేపథ్యాలను తరచి చూసి రాయగల మాత్రం దృక్పథం కూడా లేదని ముద్రవేయడం తగదు. ఆవిడ రచనలూ చదివాను, వ్యక్తిగతంగానూ తెలుసు. విశ్వనాథ నుంచి జేన్ ఆస్టిన్ వరకూ ఆవిడ చేసిన విమర్శలూ విశ్లేషణలూ తరచి చెప్పడానికి ఏమీ లేనివిగా, చరిత్ర సహా ఇతర social sciences వాసనలు బొత్తిగా లేని ఉద్వేగాపు జతులుగా కొట్టిపారేసేంత దుస్సాహసం తగదు. అంతకన్నా అవేమీ ఓ పాఠకుడిగా నాకావిడ రచనలో కనిపించలేదని ఒద్దికగా చెప్పినా బావుండేదేమో.

  6. కె.కె. రామయ్య says:

    దాంక్యూ నరేష్ నున్నా గారు కల్లూరి భాస్కరం గారిని మరింతగా పరిచయం చేసినందుకు.

    ” ఈ objective socio- cultural దృష్టి డా. మైథిలి అబ్బరాజు గారికి లేదు ”
    డా. మైథిలి గారి మున్ముందు సాహిత్యసేవలు ( మీరన్న socio- cultural objectivity తో కూడి ఉండాలని ఆశిస్తూ ) వారి మీద ఇంకా చాలా ఆశలు పెట్టుకుంటున్నాము.

  7. Mythili Abbaraju says:

    కల్లూరి భాస్కరం గారి వ్యాస పరంపర పైన మాట్లాడాలని అనుకోలేదు నిజానికి. తమకు రుచించినదాన్ని బలవంతంగా అయినా అందరి గొంతుల్లోనూ పోద్దామనే అమాయకపు తాపత్రయం రామయ్య గారిది. ఇక్కడ నేను స్పందించనక్కర్లేదు .
    కాని, ‘ ఆ- అవి ఉద్వేగం తో అనే మాటలు ‘ – అన్నది ఒక ముద్ర – దాన్ని చాలా సౌకర్యవంతం గా వేసేద్దామంటే కుదరదు నరేష్ గారూ – అలవి మాలినా ఆరాధనా ఒడలు తెలియని శివమూ నాకు లేవని మనవి చేయటం అవసరమనిపిస్తోంది. నా చదువు నాకు వాటిని నేర్పలేదు. పంచముల పట్లా వితంతువుల పట్లా విశ్వనాథ అభిప్రాయాలతో నేను ఏకీభవించను. ఆయన పట్ల నాకు ఉన్నది భక్తి కాదు, owning.
    సొంతవారిలో నాకు తప్పులు కనిపిస్తాయి, కాని వదిలేసుకోను. అందరికీ కనిపిస్తాయో లేదో , వదిలేసుకోగలరో లేదో నాకు తెలియదు. చలం గారంటే చాలా నాకు చాలా ప్రేమ- ఆయన లో తప్పులనిపించినవాటిని ఎవరో చెబితే ఒప్పుకున్నందుకు ఒక విలువైన స్నేహాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
    కన్యాశుల్కం నచ్చలేదని చెబితే ఫేస్ బుక్ లో దెబ్బలాటలకి వచ్చారు. బుచ్చిబాబు గారిని మెచ్చకపోతే మీకే నచ్చలేదు. శ్రీ శ్రీ గురించి ఇలాంటి వ్యాసాలనీ వ్యాఖ్యలనీ ఆశించే పరిస్థితి ఎప్పటికీ రాదు. నిష్పక్షపాతాలంటూ లేవు – ఒప్పుకోండి.
    మీ మొదటి వ్యాఖ్య ను చంద్రశేఖర సరస్వతి ప్రస్తావన ఉన్న మరొక వ్యాసం వద్ద ఉంచాల్సింది. ఇక్కడ ఇది కొంత అప్రస్తుతం అని తోచింది. ఆయన పోయి ఇరవై రెండేళ్ళయింది- అంతకు ముందు వితంతువులు ముండనం మానేసి పాతికేళ్ళయింది – వెనక్కి చూడండి. బొత్తిగా relevance లేని సంగతులని ఇప్పుడు తవ్వి తేల్చబోతున్నది ఏదో అందరికీ తెలుసు. విశ్వనాథ లో నాకు నచ్చనివి పరమాచార్య లో కూడా నచ్చవు, ఇంకా చెప్పాలంటే ఈయన మీద ప్రత్యేకమైన అభిమానం కూడా లేదు. ఇదే విషయమై ఒక యువ మిత్రుడితో వాదన జరగాల్సి వచ్చింది నాకు.
    చదివి రండి సర్ – అన్నిటినీ. ‘ అనేసుకోకండి ‘ . ఆయన అన్నది ఇంకొకాయనెవరికో నచ్చలేదుట …’ ట ట ‘ ల లోంచి బయటికి రండి. ఆరోపణలు చేయండి – న్యాయం గా చేయండి. ” అర్థరాత్రి మంగమ్మ తో ధర్మారావు కి ఏం పనో ? ” వంటివి కాదు. ఆడా మగా మధ్యని ఆ ఒక్కటే ఉంటుందనుకునే obsession లోంచి విడుదల కండి.
    లోపాలు లేని రచయితలు లేరు – వాటినే పదే పదే చెప్పే పరిస్థితి లో ఖచ్చితం గా ఆ రచయిత ని రక్షించుకోవాలనిపిస్తుంది. విశ్వనాథ కు నేను ఆ పని చేసి పెడుతున్నాను, బహిరంగం గా.
    ఆ మీరు పేర్కొన్న శాస్త్రాలన్నింటినీ ఒక తీర్థం పుచ్చుకున్నాక చదివితేనే రాణింపు – నాకెలా వీలు అవుతుంది చెప్పండి ?

  8. కె.కె. రామయ్య says:

    ” పాషాణ పాక ప్రభు ” అనే చిన్న మాటతో విశ్వనాథ వారిని చదవకుండా పక్కన పెట్టిన తరంలోని అజ్ఞాని నేను. తెలుగు వాక్యం నుడికారం, గొప్పదనం తెలియాలంటే విశ్వనాథ గారి నవలలు చదవాలి అని సాక్షి పత్రిక ఆర్టిస్ట్ అన్వర్ గారు అంటుంటారు. తమ అద్భుతమైన వ్యాసాల ద్వారా కల్లూరి భాస్కరం గారు, డా మైథిలి గార్లు, … పులి ముగ్గు నవల పరిచయం చెయ్యటం ద్వారా సుజాత గారు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి పట్ల నేటి తరంలో ఆసక్తిని కలిగించే మంచి పని చేస్తున్నారు. అందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు.

    ( డా. మైథిలి అబ్బరాజు గారు, socio- cultural objectivity మీకు లేదని అనటం నరేష్ నున్నా గారి ఉద్దేశం కాదనుకుంటా. ఆ దృష్టికోణం మరింత ప్రస్ఫుటంగా మీ రచనల్లో కనిపించాలని వారి ఆకాంక్ష అనుకుంటా. దయచేసి నొచ్చుకోవద్దు )

  9. naresh nunna says:

మీ మాటలు

*