వేరుపురుగు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

 

“ఈలోకంలో ఎంత మంచోడైనా, ఎంత ఎదవైనా కూడ, అప్పుడప్పుడు నోరు మూసుకొని ఏమీ చేతకాని వాడిలాగ కూచోటం తప్పదు. యీ సినీ ఫీల్డ్ లో మరీ తప్పదు”  సుదీర్ఘంగా ఓ పెద్దగుక్క లాగించాక స్థిమితంగా అన్నాడు సీమనాయుడు. సీమనాయుడు అంటే కోనసీమ నాయుడు కాదు, రాయలసీమ నాయుడు. తేడా ఏమంటే యీ నాయుడు రాయలసీమ నాయుడైనా మాట్లాడేది కృష్ణా గుంటూరు జిల్లాల భాషే.  అదేమంటే, అతను పెరిగింది అక్కడే! డిగ్రీ దాకా చదివాడు గానీ, డిగ్రీ పూర్తి చెయ్యలేదు.  సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ‘బాయ్’ గా చేరి, సొంత డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టి తరవాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ‘లాభం’ వచ్చే సినిమాలే తీశాడు.  సొంతంగా కొన్ని, పార్ట్‌నర్‌షిప్ తో కొన్ని.

“అదేం?” అని అడిగాడు దాలినాయుడు.

దాలినాయుడుది శ్రీకాకుళం.  నిఖార్సైన మనిషి. మందు కూడా నిఖార్సైనదే తాగుతాడు, తాగిస్తాడు. సినిమాలంటే పిచ్చి. పేకాటంటే ప్రాణమే! బాగా వున్నవాడు గనక ఇస్త్రీ మడత ఏనాడు నలగలేదు.

“ఏం అంటే ఏం జెబుతాం?”  సిగరెట్టు వెలిగించాడు సీమనాయుడు.

“ఆస్కా.. అంటే ఆంధ్రా సోషల్ & కల్చరల్ అసోషియేషన్ . పేరుకి ఆస్కా అయినా అందరూ ఆంధ్రా  క్లబ్ అనే అంటారు, విజయ రాఘవ రోడ్, ఆంధ్రా క్లబ్ టి. నగర్ అంటే తెలీనోడు మద్రాసులోనే వుండడు. అక్కడ ఎలక్షన్లు జరిగితే జాతీయ ఎన్నికల్లానే జరుగుతాయి.

నేను మెంబర్ని కాదు, మెంబర్ని అయ్యేంత స్తోమత  నాకు లేదు. ఒక వేళ మెంబర్ షిప్పు ఇచ్చినా నేను చెయ్యగల పనేమీ లేదు. ఆ ‘వెజ్ ‘ ఫుడ్డు సూపర్ గా వుంటుంది. నాన్ వెజ్ సంగతి నాకు తెలీదు. చిట్టిగారెలు తినాలంటే అక్కడే తినాలి.  పుల్కాలు కూడా సూపర్ గా వుంటాయి. అప్పుడప్పుడు మిత్రులతో కలిసి అక్కడకి వెళ్తుంటాను.  ఆ మిత్రులు మెంబర్స్ గనక, ఓ గంటో,  రెండు గంటలో సరదాగా గడిపి వస్తుంటాను.

 

“మీరేంటి? ఒక గ్లాసుతోటే జన్మంతా గడిపేస్తారా?” చనువుగా అన్నాడు తిరగలినాయుడు. తిరగలినాయుడుది చిత్తూరు. ఇంతకు ముందు కూడా అతని గురించి చెప్పాను.

అటు నెల్లూరు ఇటు చిత్తూరు, ఆ పక్క హోసూరు వరకు తిరగలినాయుడి ఆవకాయ ‘సామగ్రి ‘ కి మంచి పేరుంది. ఫుల్ డిమాండ్. నన్ను క్లబుకి లాక్కొచ్చింది తిరగలినాయుడే.

“వింటున్నాగా… వింటూ.. వింటూ…” నవ్వేశాడు తిరగలినాయుడు.

“రచయితలుగా ఆ మాత్రం జాగ్రత్త వుండాల్లెండి” నవ్వాడు సీమనాయుడు.

“సరే అసలు సంగతి చెప్పనీవయ్యా ప్రొడ్యూసర్ నాయుడు” ఓ గ్లాసు ఎత్తి గటగటా తాగేసి అన్నాడు దాలినాయుడు.

“కుమార్ రాజాగాడి గురించే చెప్పేది. ఆడు ‘వేరు పురుగ ‘ ని మీకు తెల్సు.. నాకూ తెల్సు. కానీ తెలీంది ఆ వెర్రి అఖిలకి. అందుకే ఆడికి ‘చోటు ‘ ఇచ్చింది. బతుక్కే ‘చేటు ‘ తెచ్చుకుంది” మరో పెగ్గు తెప్పించుకుంటూ అన్నాడు సీమనాయుడు.

“అఖిల అంటే వదిన వేషాలు వేసేదీ. ఆవిడేనా? చాలా మంచిదనీ, ఎవరికీ లొంగదని విన్నానే?” ఆశ్చర్యంగా అన్నాడు దాలినాయుడు.

దాలినాయుడికి ‘ఆ పిచ్చి ‘ కాస్త జాస్తి.  సినిమాదైతే చాలు… మహదానందంగా ఖర్చు పెడతాడు.

“విన్న మాటే కాదు… ఉన్న మాటే! నేను తీసిన మూడు సినిమాల్లో అక్క, వదిన వేషాలు వేసినా ఏనాడు ‘లూజ్’ గా ప్రవర్తించలా. నిజం చెబితే నేను కాస్త ‘ఉబలాట’ పడ్డ మాట వాస్తవం. ఉహూ…ఎన్ని ఆశలు చూపినా నవ్వేసి,” మీరు పెద్దవారు, వృక్షం వంటివారు! మేము ఆ కొమ్మల మీద బతికే పిచ్చుకలం… మీరు చల్లగా వుండాలి” అని నా నోరు కట్టేసేది. నిట్టూర్చాడు సీమనాయుడు.

“మరి ఆ కుమార్ రాజాగాడికి ఎలా పడింది?” వెలిగించబోయే సిగరెట్టుని పక్కన పెట్టి అన్నాడు దాలినాయుడు.

“ఖర్మ ‘ అని దాన్నే అంటారు. ఎట్టా పరిచయం అయ్యాడో నాకు తెలీదు. గానీ పరిచయం అయ్యాడు. కేరాఫ్ అడ్రస్ లేని వాడికి అఖిల వుండే ఇల్లే కేరాఫ్ అయ్యింది. అఖిల కూతుర్ని యీడు బాగా పేంపర్ చేశాడని విన్నాను. తండ్రెవరో తెలీని పిల్లాయే. కుమార్ రాజుగాడు ‘నేనే నీ డాడీలాంటోడ్ని” అనేసరికి ఆ పిల్ల మురిసిపోయుండాలి. కూతుర్ని మంచి చేసుకొని అక్కడి నుంచి తల్లిని పట్టాడు. వయస్సులో కూడా యీడు ఐదారేళ్ళు  అఖిల కంటే పెద్దోడేగా. వెర్రి మొహంది నమ్మి మంచలోనే కాదు మంచం మీద కూడా చోటిచ్చింది. ఆ తరువాత వాడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూడమని పాపం అందరు ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని ప్రాధేయపడింది” విస్కీలో సోడా పోయిస్తూ అన్నాడు సీమనాయుడు.

“నిన్ను కూడా అడిగిందా?” ఉత్సాహంగా అన్నాడు దాలినాయుడు.

“బావా.. ఆకలి రుచి, నిద్ర సుఖమూ ఎరగనట్టే యీ ప్రేమ కూడా ఉచ్ఛనీచాలు ఎరగదురా! ఎవరి సంగతో ఎందుకూ, నేనూ లం… కొడుకునే. అందుకే అఖిల మానానికీ, కుమార్ రాజాగాడి సినిమా ఛాన్స్ కి ముడి పెట్టాను.” గటగటా తాగేసి అన్నాడు.

“ఏమందీ?” మహా కుతూహలంగా ముందుకు వంగి అన్నాడు దాలినాయుడు.

“ఏటి తిరగలి బావా? నీకేం నచ్చలేదా?” తిరగలినాయుడ్ని అడిగాడు దాలినాయుడు.

సినిమా వాళ్ళకో దురద వుంటుంది. ఏం చెప్పినా కాస్త సస్పెన్స్ జోడించి, స్క్రీన్ ప్లే తో చెబుతారు, ఎదుటి వారు గనక ఉత్సాహం చూపించకపోతే, క్షణంలో జావగారిపోతారు. సీమనాయుడేమీ దానికి ఎక్సెప్షన్  కాదు.

“ఎందుకు నచ్చదు? సీమ బావా.. నేనూ మనిషినే! మామూలుగా వున్నప్పటి సంగతి ఎలా వున్నా మందు కొట్టినప్పుడు మహా ఇంట్రష్టు పుట్టుకొస్తుంది… సినిమా కబుర్లంటే! అయితే నేను ఫీల్డ్ సంగతి తెలిసినోడ్ని కనక కథ ఏ ‘కంచి ‘ కి చేరుతుందో చెప్పేగల్ను. అయినా, అఖిల సంగతి నాకు ఇంతకు ముందు తెలీదు. కనక నువ్వు జబర్దస్త్ గా కథ చెప్పేయచ్చు” సిగరెట్టు వెలిగించి అన్నాడు తిరగలి నాయుడు. నాకు తెలిసినంతవరకు అఖిల సంగతి తిరగలినాయుడికి తెలీకుండా వుండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరివీ కొడంబాకం డైరెక్టర్స్ కాలనీ పక్కనున్న సందులో ఎదురుబదురు ఇళ్ళే!

“కథ ఏముందిలే!  పదేళ్ల పిల్ల వున్న ముఫ్పైయేళ్ళ అఖిల ముఫ్పై ఆరేళ్ళ కుమార్ రాజుగాడికి పడింది. మనిషి కొద్దోగొప్పో అందగాడు. దానికి మించి చదూకున్నాడు. ఒకటి మాత్రం నిజం బావా.. అఖిలలాంటి ఆడది దొరికినోడిదే నిజమైన అదృష్టం అంటే!” నిట్టూర్చాడు సీమనాయుడు.

‘ఎట్టా?” మరో పెగ్గు చప్పరించి అన్నాడు దాలినాయుడు.

మనిషి లోపల ఖచ్చితంగా మరో మనిషి వుంటాడు ఆ లోపలి మనిషే అసలైన మనిషి. అఖిల లోపలుండే అఖిల మామూల్ది కాదు. బావా… ఒక్కసారి  ఆ మనిషిలోని మనిషిని చూశాను. అప్పటి నుంచీ మరే మనిషి నా కంటికి ఆనలేదు. నిజం చెప్పొద్దు… నా అంత నికృష్టపు నా కొడుకు ఇంకోడు వుండడు. కానీ బావ అక్కడ మాత్రం నా తల ఎత్తలేను” ఫటాల్న గ్లాసెత్తి మొత్తం లాగించేశాడు సీమనాయుడు.

దాలినాయుడు తిరగలినాయుడు వంక చూశాడు. తిరగలినాయుడు చిన్నగా నవ్వి”బావా! మన బావ మందు మీద వుండి మాటలు కక్కుతున్నాడనుకోకు. సీమనాయుడు ఎంత తాగినా చీమతలంతైనా మాట దొర్లడు  “ అన్నాడు. సీమనాయుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే పార్టీ ముగిసింది. ఒక్కోసారి అంతే! ఎమోషనల్ గా రెచ్చిపోయిన గుండె అగ్నిపర్వతాలు పగిలి నిజం ‘లావా ‘లా ప్రవహించక ముందే ఏ జ్ఞాపకమో ఆ పర్వతాన్ని చల్లబరిచి అది పగలకుండా ఆపుతుంది. మరి ఏ జ్ఞాపకము సీమనాయుడ్ని ఆపిందో అతనికే తెలియాలి.

**********************

 

ఏ పరిశ్రమలోనైనా కొన్ని కామన్ గానే వుంటాయి. అఖిల మీద ఏ ముద్ర పడక ముందు అందరూ గౌరవాన్ని చూపేవారు. సీమనాయుడులాంటి వాళ్ళు ‘బేరాలు’ పెట్టినా అవి బయటకు రావు. ఒక్కసారి ఓ ఆడది ఒకరికి ‘పడింది ‘ అని తెలిస్తే మాత్రం ప్రతీవాడు ఓ ‘పులై ‘ పోతాడు. వలవెయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ప్రొడక్షన్ కంపెనీల సంగతి వేరు కాదు. ‘పై వాళ్ళ’ కి తెలిసీ తెలీకుండా ‘పైరవీలు ‘ సాగించేవాళ్ళు సాగిస్తూనే వుంటారు.

కొందరికి నగలు ఆభరణాలైతే కొందరికి నవ్వే ఆభరణం. అఖిలకి నవ్వే కాదు నమ్రత కూడా అభరణమే.

“అయ్యా.. మీరన్నది నిజమే నా మనసుకి విలువిచ్చి ఆయనతో జతయ్యాను. ఈ జన్మాంతం మరో జోలికి పోను. మీరు అవకాశం ఇస్తే మహాసంతోషం. లేకపోతే ఎలాగోలా బతకకపోను.” అని వినమ్రంగా చెప్పేది. దాంతో చాలా మంది ఆవిడ మానాన ఆవిడ్ని వొదిలేసిన మాట వాస్తవం.

“అదేంటి గురూగారూ, అదేం ఆడదండీ? ఆ కుమార్ రాజా గాడి కోసం రోజూ ఓ క్వార్టరు రమ్ము తెప్పిస్తుందిట. పెన్నులూ, కాయితాలే కాక సిగరెట్టు పాకెట్లు కూడా తెప్పిస్తుందిట. ఏమైనా చెప్పండి… ఆ నా కొడుకు పెట్టి పుట్టాడు.” ఇదీ ప్రొజక్షన్ రమణ నాతో అన్నమాట.

నాకు కొంచం ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవమే కానీ నిర్ఘాంతపోలేదు. కారణం నాకు కొంత తెలుసు. కొంతమందికి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఆ ఇచ్చాక కూడా ఏనాడు ‘అవాళ నేను నీకు అది ఇచ్చాను.. నువ్వు నాకేం ఇచ్చావు? ‘ అని ఏనాడు సాధించరు.

శ్రీశ్రీ బహుశా ఆలాంటి వారి కోసమే ‘తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ” అన్న పాట రాసి ఉండాలి. అఖిల కూడా అలాంటి మనిషే అని నాకు ఎప్పుడూ అనిపించేది.

చామనఛాయ, అద్భుతమైన, గుండెలోంచి వచ్చే నవ్వు, ఏ మాత్రం కల్మషం లేని చూపు.. మితమైన మాట… ఏ మగాడికైనా స్త్రీలో ఇంతకు మించిన లక్షణాలు ఇంకేం కోరుకోడానికి వుంటాయి?

తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన పార్టీలు కొన్ని వుంటాయి. వెళ్ళకపోవడం వల్ల తలనొప్పిలు తప్పనిసరి. వెళ్ళడం వలన ఉపయోగాలు ఏమీ వుండవు కానీ, మానవ స్వభావాలు మాత్రం బాగా తెలుస్తాయి.  ‘పాత్ర ‘ ల్ని మలిచేందుకు అవి గొప్పగా ఉపయోగపడతాయి.

ఓ ‘హీరో ‘ గారే ఛాలెంజ్ చేశాడు. ఆ అఖిలని బెడ్ మీదకు తెచ్చి చూపిస్తానని. (కథకి ఈ విషయంతో పని లేదు. అయినా ఎందుకు ఓ వాక్యం వ్రాయాల్సి వచ్చిందంటే, ఆశకి అంతస్థులతో పని లేదని చెప్పడానికి). ఓ డైరెక్టరూ సెకండ్ హీరోయిన్  ఛాన్స్ ఇస్తానని కబురెట్టాడుట. కానీ, సెకండ్ హీరోయిన్ కారెక్టర్ కోసం  ‘ తన కారెక్టర్ ‘ వదులుకోవాలిట.

“అయ్యా.. మీరు హీరోయిన్ గా అవకాశమిచ్చినా నాకొద్దు. నా వయసు, నా స్టక్చర్ దానికి పనికి రాదు. చిన్న వేషం చాలు… అదీ నా కారెక్టర్ ని నిలబెట్టేది.” అన్నదిట. నాతో చెప్పింది రమణే.

 

*********************

 

రమణ ఒక వార్త తెచ్చాడు, కుమార్రాజు కథని ఫలానా ‘టాప్ ‘ డైరెక్టర్ ఓ.కె. చేశాడనీ, ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడనీ. అన్నట్టు చెప్పలేదు కదూ, రమణ ఉండేది మా వీధిలోనే. రమణ, మూర్తి, అనంతరాజ్ ఓ రూం తీసుకొని వుంటున్నారు. ఆ బిల్డింగు లోనే ‘భీశెట్టి లక్ష్మణ రావు” గారు వుంటున్నారు. స్ట్రీట్ పేరు ‘చారీ స్ట్రీట్ ‘.

సంవత్సరం తిరకుండానే కుమార్రాజు పెద్ద రైటర్ అయ్యాడు. ఓ సినిమాలో అతనిది కథ అయితే నాది పాటలు. కానీ మేం కలిసే అవకాశం రాలేదు.

అఖిల జీవితంలో మార్పేదీ లేదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు గనక కుమార్రాజు టి.నగర్ లోనే ఆనందన్ స్ట్రీట్ కి మారాడు అని తెలిసింది. మా వీధి వెనకాల మూడో స్ట్రీట్ అది.

కాలం గడచిపోతోంది. నేను యమా బిజీ. మా అన్నగారి అబ్బాయిని వెస్ట్ మాంబళం  రాజా హాస్పటల్లో చేర్పించాల్సి వచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడే కుమార్ రాజు కూడా ఎడ్మిట్ అయ్యి ఉన్నాడు. మా వాడికి నూట ఐదు జ్వరం అయితే అతనికి నూట నాలుగు. జ్వరమే కాదు వాంతులు మోషన్లు కూడా.

నిజమైన ‘సేవ ‘ ఎలా వుంటుందో అఖిలని చూస్తే తెలిసింది. ఆమె చెయ్యని సేవ లేదు. వాంతులు ఎత్తిపోసింది. మిగతా విషయాలు చెప్పక్కర్లేదు.

అయిదు రోజుల తరవాత మా వాడు డిశ్చార్జ్ అయ్యాడు గానీ, కుమార్ రాజు పన్నెండు రోజులు ఆస్పత్రి లోనే వున్నాడుట. అఖిల చేసిన సేవ చూశాక ఆమె అంటే నాకు అమితమైన గౌరవం పెరిగింది.

 

***********

 

మూడేళ్ళ తరవాత సడన్ న్యూస్. కుమార్ రాజుకీ మాజీ నటి మల్లికా నాయర్ కి పెళ్ళయిందని.  నాకు షాక్. ఎన్ని కోట్లైన సంపాయించొచ్చు. కానీ అఖిల లాంటి స్త్రీ ప్రేమ దొరకడం దుర్లభం. అయినా ఇది చిత్ర సీమ. చిత్రాలకి కొదవేముంటుంది? ఇప్పుడతను పేరెన్నిక వున్న రైటరు. జనాలకి కావల్సింది సక్సెస్… కారెక్టర్ కాదు.

సాలిగ్రామంలో ‘ఇల్లు ‘ కొన్నాడని కూడా  తెలిసింది. అంతే కాదూ ఆ ఇంటి గృహప్రవేశానికి నేనూ కూడా వెళ్లాల్సి వచ్చింది. కారణం మేమిద్దరం నాలుగు సినిమాలకి రాస్తున్నాం. పరిచయం మాత్రం మామధ్య అంతంత మాత్రమే. కుమార్ రాజు సంస్కారం లేనివాడు కాదు. మంచీ మర్యాద తెలిసిన వాడే. అఖిలని అతను దూరం పెట్టాడనే ఓ అకారణ కోపం నాలో నాకే తెలియకుండా వుండి, అతనితో పరిచయం పెంచుకోవడానికి అడ్డుపడిందని మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను.

మల్లికా నాయర్ తెలుగులో కూడా ఓ పది సినిమాలు యాక్ట్ చేసింది. కొన్నిటికి నేను పాటలు కూడా రాశాను. మనిషి జోవియల్ గానే వుంటుంది. లోపలి స్వభావం మాత్రం నాకు తెలియదు.

 

*******************

 

అఖిల కూతురు అపర్ణకి ఇప్పుడు పదహారేళ్ళు.

“దాలి బావా.. అఖిల కూతుర్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నా… కో ప్రొడ్యూసర్ గా వస్తావా?” నా ముందే దాలినాయుడితో అన్నాడు సీమనాయుడు.

మధ్యలో చాలా సార్లు కలిశాం గానీ మళ్ళీ అఖిల ప్రసక్తి రాలేదు. మాతో బాటు తిరగలి నాయుడు కూడా వున్నాడు.

“ఒప్పుకుంటుందా?” అడిగాడు దాలినాయుడు.

“దేని గురించి ఒప్పుకోవాలి బావా?” నవ్వి అన్నాడు తిరగలినాయుడు.

“ఆశ చావదు బావా! అప్పుడెప్పుడో ఆవిడ కారెక్టర్ గురించి విన్నప్పటి నుంచీ ‘ఆ కోరిక ‘ అలాగే వుండిపోయింది.” సిగరెట్టు వెలిగించి అన్నాడు దాలినాయుడు.

” ఆ విషయంలో అయితే చచ్చినా ఒప్పుకోదు. అంతేగాదు, అసలు కూతుర్ని సినిమాల్లోకి రానివ్వదని నా నమ్మకం.” ఖచ్చితంగా అన్నాడు శివరామ్ . శివరామ్ డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసరు. బాగా కలిసొచ్చి, ‘ఖరీదైన ‘ వాళ్లతో తిరుగుతున్నాడు.

“ట్రయల్ ఏమైనా వేశావేంటి? “ పకపకా నవ్వి అన్నాడు సీమనాయుడు.

“అడక్కండి. ఆ పిల్లని విక్టరీ వాళ్ళ సినిమాకి అడిగాను. అందులో నాది పావలా వాటా కదా! పిల్లతో మాట్లాడక ముందే తల్లి ‘నో ‘ అంది. ఇంకేం రానిస్తుందీ?”త్రిబుల్ ఫైవ్ వెలిగించి అన్నాడు శివరాం. తెల్లబట్టలూ, తెల్ల షూసూ, త్రిబుల్ ఫై పాకెట్లు, ఎనిమిది వేళ్లకీ వుంగరాలు, మెళ్ళో చైనూ, చేతికి బ్రాస్లెట్టూ.. ఇవన్నీ ప్రొడ్యూసర్ అలంకారాలు. గది మొత్తం పరిమళించే ‘సెంటు ‘ కూడా తప్పనిసరి.

“ఆవిడ కూతుర్ని హీరోయిన్ చెయ్యాలంటే మన అవసరం ఏముంటుందీ? కుమార్ రాజు గారే ( గాడే కాదు నోట్) టాప్ ప్రొడ్యూసర్లకి చెప్పి ఇంట్రడ్యూస్ చెయ్యగలరు.” యాష్ ట్రే లో సిగరెట్టుని గుచ్చుతూ అన్నాడు తిరగల్నాయుడు.

“ఆ మాటా నిజమే.” నిర్లిప్తంగా మరో పెగ్గు పోసిన బేరర్ కి సోడా ఎంత పొయ్యాలో సైగ చేస్తూ అన్నాడు . స్టాఫ్ మారడం వల్ల కొలతలు తేడా వస్తున్నాయ్. పాతవాళ్లకి తెలుసు… ఎవరు ఏ డ్రింక్ లో సోడా కలుపుతారో వాటర్ కలుపుతారో.

 

*******************

 

“మార్పులు మొదలవ్వాలే గానీ, మహాస్పీడుగా జరిగిపోతై. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది. ఆ ‘మార్పు ‘ చాలా సహజంగా జరిగే అవకాశాలున్నా, అత్యంత నాటకీయంగా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. జోడించడం కష్టం. విడదీయడం క్షణం. సదరు నాయకులకి నష్టం ఏమాత్రమూ వుండదు. వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఎస్టేట్లకి వొచ్చిన ముప్పేమీ వుండదు. దెబ్బ తినేది మాత్రం సాంకేతిక నిపుణులు, చిన్నచిన్న నటులు, నటీమణులు, ఎక్ స్టాలు, ఇతర కార్మికులు.

మద్రాసులో తెలుగువాడి విలువ నిట్ట నిలువునా పడిపోయింది. తమిళ వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మనవాళ్ళు తమిళ వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు కానీ, వాళ్ళు మాత్రం మనవాడికి అరచి చచ్చినా ఛాన్స్ ఇవ్వరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవర్ల దగ్గర నుంచి, లైట్ బాయిస్ దగ్గర నుంచీ, ప్రొడక్షన్ బాయిస్ దాకా తరలిపోయారు. కుమార్ రాజు ముందుగానే ‘ఇల్లు ‘ కొని మరీ హైదరాబాద్ తరలిపోయాడు. అఖిలకీ తప్పలేదు. ‘సంగీతం ‘ కొంతకాలం  చెన్నై లోనే ‘చిరునామాని ‘ నిలుపుకొన్నా, అదీ వెళ్ళిపోక తప్పలేదు. నేను మాత్రం వెళ్ళలేదు. కారణాలు రెండు… ఒకటి.. పాలిటిక్స్.. నాకు పడవు. రెండు.. ‘రాత ‘ ని నమ్ముకొన్నవాడ్ని గనక.

****************

‘ఆస్కా ‘ లో ఉత్సవాలు జరుగుతున్నై. ఏకబిగిని మూడురోజులు. కుమార్ రాజు కూడా వి.ఐ.పి. గా వచ్చి వెళ్ళాడు. స్టేజ్ మీద మేము కలిసినా పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకలేదు.

గత ఐదేళ్ళలో చాలా చాలా చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళాను… పాటలు వ్రాయడానికి.  వాళ్ళ దృష్టిలో మేము ‘చెన్నై ‘ వాళ్ళం. ‘లోకల్ ‘ కాదు గనక దూరం పెట్టచ్చు. అదో చిత్రం. గోడకు ఇవతల ‘ఈశాన్యం ‘ అయితే గోడకు అవతల ‘ఆగ్నేయం ‘ అయినట్టు, పరిశ్రమ చీలిపోగానే అన్నీ చీలిపోతాయి. అంతకు ముందున్న నాయకులందరూ తూఫానుకి ఎండిన తాటాకులు ఎగిరినట్టు ఎగిరిపోయారు. నిజం చెబితే ఏ స్వార్ధం కోసం పరిశ్రమని విడదీశారో ఆ స్వార్ధం ఫలించలేదు. అంతా కొత్తే. కొత్త గ్రూపులు, కొత్త నినాదాలు, కొత్త మొహాలు, మళ్ళీ మరో మలుపు. తెలంగాణా ఉద్యమం. మరోసారి చిత్ర పరీశ్రమ మానసికంగా చీలిపోయిందన్న మాట వాస్తవం. తెల్ల ఏనుగులాంటి పరిశ్రమకి మసి మరకలు అంటాయి. ఏమో, ‘మార్పు’ లో ఇదీ ఓ సహజ ప్రక్రియేమో !

పెద్దపెద్ద ప్రొడక్షన్ కంపనీలు సినిమాలు తీయడం మానేశాయి. కారణం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితులకి అలవాటు పడలేకపోవడమే. అంతకుముందు సినిమా ఓ కళాత్మక వ్యాపారం. ఇప్పుడు కేవలం వ్యాపారం మాత్రమే అన్నంతగా మారింది.

ఓ డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ‘R ‘ హోటల్లో మమ్మల్ని అంటే, నన్ను, డైరెక్టర్ని, హీరోహీరోయిన్లనీ ప్రొడ్యూసర్ దించాడు.

రూం  రెంటు రోజుకి 26 వేలు. పొద్దున్న దిగాం. మద్యాహ్నం భోజనానికి డైనింగ్ హాల్ కి వెళ్ళాను. ఓ మూల కుమార్ రాజు ఒంటరిగా కనపడ్డాడు. దూరం నుంచే నన్ను చూసి చెయ్యి ఊపితే, మర్యాద కోసం అతని దగ్గరకెళ్ళాను. ఫుల్ మందులో వున్నాడు.

“సార్.. డ్రింక్?” అన్నాడు

“నో సార్.. కేవలం నైట్స్ లోనే తీసుకుంటాను. అదీ మా ఇంటిలోనే” మర్యాదగా తిరస్కరించా. డే టైం తాగను. పార్టీలకి వెళ్ళను. డ్రింక్ అన్నది ఓ చిన్న సంతోషం కోసమని ఏయిర్ ఫోర్స్ లో వున్నప్పుడే నాకు తెలుసు. అందుకే ఏనాడు ‘హద్దు ‘ దాటను.

“ఓ.కె.. ఓ.కె.. మీరు లక్కీ సార్. మద్రాసులోనే వుండిపోయారు. యూ.. నో.. అది నిజంగా స్వర్గం… రియల్ హెవెన్” ఏదో పోగొట్టుకున్న వాడిలా అన్నాడు.

“కాసేపు నాతో కూర్చోగలరా?” అఫ్ కోర్స్ మీకు ఇష్టమైతేనే” అన్నాడు.

“అలాగే” అని కూర్చున్నా.

“మాష్టారు.. పోగొట్టుకునేదాకా పొందినదాని విలువ తెలీదు సార్, ఇది నిజం” రెండు చేతుల మధ్యా తలను ఇరికించుకొని అన్నాడు.

‘ఎందుకు” అని నేను అడగలా.

“స్వర్గం నా చేతిలో నుంచి జారిపోయినప్పుడు తెలీలా… పేరు మత్తులో, పైసల మత్తులో మునిగిపోయా. సార్, యీ క్షణం యీ క్షణంలో మొత్తం ప్రపంచాన్ని నాకు రాసి ఇచ్చినా నాకు అక్కర్లేదు సార్. నా దగ్గర వున్న వన్నీ కూడా వదిలేస్తా. కానీ… పోగొట్టుకున్నది దొరుకుతుందా? యీ జన్మకు దొరకదు. దొరకదు సార్ దొరకదు” కళ్ళ వెంట నీరు కారుతుండగా తలని టేబుల్ మీద వాల్చి అన్నాడు.

నాకో విషయం అర్ధమయ్యింది. అతనికిప్పుడు  ఎవరో ఒకరు మాట్లాడటానికి కావాలి.  ఆ వ్యక్తిని నేనే కావక్కర్లా. ఓ కుక్క పిల్ల అయినా సరే. అతను మాట్లాడుతుంటే వినడానికి చాలు.

నిజం చెబితే అతను ఎవరూ వినాలని కూడా మాట్లాడటంలా. తన మాటలన్నీ తానే వినడానికి మాట్లాడుతున్నాడు. తన మనస్సుని తానే తెలుసుకోడానికి చేసే ప్రయత్నం అది. ఏంటన్ చెకోవ్ వ్రాసిన ‘గ్రీఫ్ ( GRIEF ) కథ గుర్తుకొచ్చింది. ఎంత ధైన్యం. మనిషికి మనిషి తోడు ఏదో ఓ క్షణంలో తప్పదు. అయితే ఆ ‘ క్షణం లో ‘ ఎవరేనా తోడు దొరకడమే అదృష్టం. ఆ అదృష్టం  ఎన్నో వెల మందికి లభించదని నాకు తెలుసు. లభిస్తే ‘ ఆత్మహత్యలు ‘ ఎందుకుంటాయి?

 

***********************

 

“అఖిల చచ్చిపోయింది. ఆ విషయం నిన్ననే అతనికి తెలిసింది. అప్పటి నుంచీ యీ హోటల్లోనే గది తీసుకొని వున్నాడు. తెగతాగి పడుకోవడం.. లేచి మళ్ళీ తాగడం” జాలిగా అన్నాడు రమణ. రమణ కొత్తలోనే హైద్రాబాద్ కి మారాడు.

“నిజమా? ఎలా చనిపోయింది?” షాక్ తిని అన్నాను.

“నిజమే.. కుమార్ రాజుని  ‘వేరుపురుగు ‘ అని అందరూ అంటారు. తల్లి వేరుని కొరికేసే పురుగుని వేరుపురుగు అని అంటారు. అఖిల జీవితమనే తల్లివేరుని  కొరికేసి ఆ వృక్షం కూలిపోడానికి కారణమయ్యాడని అందరూ అంటారు. మనమూ అనుకునే వాళ్ళము. కానీ కాదండీ. కుమార్ రాజుకి అవకాశాలు రాగానే అఖిలే అతనికి స్వేచ్ఛనిచ్చింది. అతను మల్లిక వ్యామోహంలో పడ్డాడని తెలిసి కూడా అతన్ని పెళ్ళి చేసుకోమనే చెప్పింది కానీ అడ్డురాలేదండి. చివరి వరకు అఖిల పవిత్రంగానే వుంది. ఆఖరికి ఆమెకి కాన్సర్ వచ్చినా కుమార్ రాజుకి తెలియనివ్వలేదు. నేను చెబుతానన్నా వద్దని వొట్టు వేయించుకుంది. గురూజీ, అఖిల లాంటి వాళ్ళు కోటికి ఒక్కరు కూడా పుడతారంటే అనుమానమే. ఏనాడు అతన్ని నిందించలేదు సరికదా ఎవరేన్నా అతన్ని నిందిస్తే సహించేది కాదు.” కళ్ళల్లో కన్నీరు ఉబుకుతుండగా అన్నాడు రమణ.

“మరి పాప?” బాధగా అన్నాను నేను. అఖిల నవ్వు అమరం.

 

“అపర్ణ మంచి బిడ్డ. ప్రస్తుతానికి నేనే ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశాలు కల్పిస్తున్నా. సార్… ఏ జన్మలో పాపం చేశానో నాకు పిల్లలు లేరు. మూడుసార్లు అబార్షన్లు అయ్యి నా భార్య గర్భసంచీ తీసేశారు. అఖిలని నేను అక్కగానే భావించాను. చెన్నైలో ఆమె గొప్పతనం తెలీలేదు. ఇప్పుడు అపర్ణ మాతో బాటే మా ఇంట్లోనే వుంటోంది… నా బిడ్డే!” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమణ.

మంచితనం ఇంకా బ్రతికే వుంది. కానీ ఒక్కటే విచారం… అఖిలది ఓ అన్ టోల్డ్ స్టోరీ. ఇంకా అన్ టోల్డ్ స్టోరీనే. ఎందుకంటే ఆమె  జీవితంలో నాకు తెలిసింది అణువంతే!

 

*

 

మీ మాటలు

  1. తహిరో says:

    భువన చంద్ర గారూ, బాగున్నారా ?
    చదివాను సార్. మీ చిత్ర పరిశ్రమలో నిత్యం ఆహుతయ్యే “అఖిల ” లు ఇంకెందరు ఉన్నారో !
    మీ “అన్ టోల్డ్ స్టోరీ ” లన్నీ జీవిత ప్రతీకలే.
    ధన్యవాదాలు.

    • BHUVANACHANDRA says:

      తహిరో సాబ్ మీ స్పందనకి ధన్యవాదాలు దీపావళి శుభాకాంక్షలు ,,,,

  2. Very touching one. Thank you .

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు సుశీల గారూ దీపావళి శుభాకాంక్షల తో భువనచంద్ర

  3. ప్రసాద్ చరసాల says:

    ఓ ఆడది తనకు తానుగా బతకటమంటే మన పవిత్ర పుణ్యభూమిలోనూ ఎంత కష్టం!
    గుండె చమర్చింది.

    • BHUVANACHANDRA says:

      చిత్రం అదే ప్రసాద్ చరసాల గారూ …కానీ తప్పదుగా …….

  4. కె.కె. రామయ్య says:

    మంచితనానికి, మనిషితనానికి ప్రతీకలుగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిన తంగఛ్చి నల్లమణి సుమీ నుండి అఖిల వరకూ ఎందరెందరినో పరిచయం చేస్తున్న ప్రియమైన శ్రీ భువన చంద్ర గారు! ఇన్నాళ్లూ మీరంటే ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అని, మంచి సినీగీతాలు రాసిన వారని మాత్రమే అభిమానించిన నేను… ” పాలిటిక్స్ అంటే పడక .. ‘రాత ‘ ని నమ్ముకొని మద్రాసు లోనే ఉండిపోయానన్న” మీ మాటలకి మరింత మురిసిపోతున్నా.

    ఓ మిట్టమజ్జానం టి. నగర్, విజయ రాఘవ రోడ్ లోని ఆంధ్రా సోషల్ & కల్చరల్ అసోషియేషన్ లోపలికెళ్ళి మల్లీశ్వరి సినిమా బి.యెన్. రెడ్డి గారి తైలవర్ణ చిత్రాన్ని చూసి వచ్చిన దుందుడుకుతనం నాది ( నేలక్లాసు ప్రేక్షకులు ఇట్టాటి వాటిల్లోకి అట్టా జొరబడగూడదబ్బా అని మడిసిలోని మడిసి లాంటోడు వద్దని వారిస్తున్నా వినకుండా ).

    మద్రాసు స్వర్గం అవునో కాదో చెప్పలేను కానీ అక్కడి గల్లీ గల్లీ కాలం నాటి తెలుగు సాహితి సినీ ప్రముఖలను జ్ఞాపకానికి తెస్తూ నన్ను ఆశ్చర్యానందాలకు గురిచేస్తాయి ( కొ.కు. నాయన, శ్రీ శ్రీ, బాపు రమణ అంటూ పెద్ద దండకవే చదవగలను ).

    ధన్యవాదాలు భువన చంద్ర గారు.

    • BHUVANACHANDRA says:

      కె.కె. రామయ్య ….. మీ స్పందన నిజంగా ఓ మలయా మారుతాన్ని నాకు కానుకగా ఇచ్చింది ..మద్రాసు నిజంగా నాడు స్వర్గమే ! ఇప్పుడూ చెన్నై తన తెలుగుతనాన్ని కొంత చాటుకుంటోంది గానీ , సాహితీ మహా వ్రుక్షాలెన్నో కనుమరుగై పోయాయి . ఒకానొకప్పుడు దక్షిణ భారత చలనచిత్రపరిశ్రమను శాసించిన మహాను భావులెందరో హైదరాబాద్ కు తరలిపోయి ఇక్కడ ఓ మహాసూన్యాన్ని సృష్టించారు..కొంతమందిమి మాత్రం సాక్షులుగా మిగిలి ఉన్నాము …ఒకప్పుడు అద్భుతంగా ”’వెలిగిన”” స్టూడియో లన్నీ ఇప్పుడు గొడౌన్ లుగా దర్శన మిస్తున్నాయి ….ఇంకేం చెప్పనూ !!….నాటి నటీనటుల ,సాంకేతిక నిపుణుల , నిర్మాతల,దర్శకుల ,గాయనీ గాయకుల ,సంగీత దర్శకుల ఇళ్ళు కూడా ఇప్పుడు అపార్ట్ మెంట్స్ అయిపోయాయి ….తలుచుకుంటే గుండె నీరై పోతోంది …ఏమైనా ,,,మీకు నా వందనాలు .

  5. BHUVANACHANDRA says:

    రఫీ హక్ గారూ …మంచి పెయింటింగ్ వేసి ఇచ్చినందుకు మీకూ అఫ్సర్ గారికీ ధన్యవాదాలు

  6. Sadlapalle Chidambarareddy says:

    తెల్లని పరదా మీద రంగుల బొమ్మల పువ్వుల్ని చూసి ఆనందించడానికి ఎగబడేదే లోకమంతా అక్కడి పూతీగల్ని కొరికే పురుగుల్ని గురించి చక్కగా చెప్పారు భువనచంద్ర గారు. మీకు ధన్యవాదాలు.

    • BHUVANACHANDRA says:

      Sadlapalle చిదంబరరెడ్డి గారూ ధన్యవాదాలు ….. దీపావళి శుభాకాంక్షలు

  7. భువనచంద్రగారు.
    ఐక్యతలేని తెలుగువాడు మరెవరితో కాదు తనతో తానె కలిసి ఉండలేదన్నది నిర్ద్వందంగా తెలంగాణానుండి దూరమై మరోసారి రుజువుచేసాడు
    మద్రాసునుండి విడివడి నాడు,తెలంగాణాతో విడివడి నేడు పాడుచేసుకున్నదాన్లో సినీ పరిశ్రమ అందులోని చిన్న కళాకారులు
    ముందువరసలో ఉన్నారు
    కళ కి వేరుకుంపట్లు పెట్టి మల్లి అదే చరిత్ర పునరావృత్తం చేస్తున్నాం.
    ఆడతనాన్ని వాడుకోచూడడం ఇల్లు కట్టే మేస్త్రీ ఆడకూలీని ఆ డుకుంటున్నట్లు వాడుకోడం నుంచి బోర్డు రూమ్ స్థాయి ఆడవారి వాడబడే వరకు ఉంది సినిమారంగానికి పరిమితం కాలేదు
    మనసుకు హత్తుకునేట్లు రచించారు మీ వేరుపురుగు.
    కృతజ్ఞలతో
    జీ బీ శాస్త్రి

    • BHUVANACHANDRA says:

      శాస్త్రి గారూ ధన్యవాదాలండీ ….మీ చక్కని స్పందనకి ….

మీ మాటలు

*