గైనేరా? గడ్డికుప్పా?

 bokeh-1505960_1920

 

ఒరే కొడుకా..

ఏడుకొండలూ.. యెలాగున్నావురా అయ్యా..

ఊరూ యేరూ వొక్కలాటివే. ఒడుపు తెలిసి బతకాల. బతుకు దాటాల. లేదంటే ములిగి చావాల. ఉన్నదే వూరు. పెట్టిందే కన్నతల్లి. నోరు మంచిదయితే వూరు మంచిదవుతాది. నీకసలే మా సెడ్డ నోటి తీట. ఈటిసిరితే యెనక్కి తీసుకోగలం గాని మాటిసిరితే యెనక్కి తీసుకోగలమా? కాలాలు చూస్తే బాగోలేవు!

ఎద్దు ముడ్డి పొడిసి యేదుం పిండి అంబలి తాగినోడు మీయయ్య. మీ అయ్యకేం తెలుసును? అని అనుకోకు. ఇదమూ తెలీదు.. పదమూ తెలీదు అని అనుకోకు. మాయమ్మ పేరు దాక.. మీ యమ్మ పేరు డోకి అనుకోకు. లోకం నన్నెరక్క పోవచ్చు. లోకాన్ని నానెరుగుదును. కనబడుతున్న దానికి గట్టిక్కి యేల సూడాల కొడుకా..!?

రాజుల కాలం పోయింది.. రాజులు సరి.. రాజ్జాలు సరి.. మంత్రులు వొచ్చినారు. మనమే జనమే అదికారంలోకి వొచ్చినామని అనుకున్నాం. జీ హుజూర్.. అని యికన వుండక్కర్లేదనీ అనుకున్నాం. కాలు మొక్కక్కర్లేదనీ- కళ్ళు దించక్కర్లేదనీ అనుకున్నాం. ఎవుడికి ఆడే రాజనకున్నాం. ఎవుడికి ఆడే బంట్రోతనుకున్నాం. ఎవుడు యెవుడికీ లొంగక్కర్లేదనుకున్నాం. ఎవుడు యెవుడికీ వంగక్కర్లేదనుకున్నాం. ఎవుడి బతుకు ఆడు బతకీయొచ్చనుకున్నాం. గాని యిదీ అదే. అంతా కనికట్టు. కాదంటే వొట్టు. మన సూపు మారింది.. మన రూపు మారింది.. గానొరే అసలు మారాల్సింది మారలే. ఇప్పుడు మంత్రులందరూ రాజులే. ఆల రాజ్జిమే నడస్తంది. ఆల కత్తులు తుపాకులయినాయి. ఆల మొల నుండి పక్కోడి మొలకి మారినాయి. ఇప్పుడు ఆల కత్తులు ఆలు పట్టుకోరు. పట్టుకోడానికి పదిమందుంటారు. వందమందుంటారు. ఆల గుర్రాలూ యేనుగులూ- కార్లూ యెలీకాప్టర్లయినాయి. ఆల సైన్యం- పోలీసు, మిలటరీ బలగాలయినాయి. తప్పితే ఆల యంత్రాంగమూ మారలేదు. ఆల మంత్రాంగమూ మారలేదు. మన రాతా మారలేదు. లోకం తిత్తవా మారలేదు.

మన బంట్రోతు బుర్ర మీద కుచ్చీల టోపీ మారలేదు. పై మీద పయ్యాడ బెల్టూ మారలేదు. బిళ్ళా మారలేదు. అంతెందుకు తెల్లోడి దగ్గిర కాలు నేలకు తన్ని.. చెయ్యి నుదిటికి తిరగేసి అతికించి కొట్టిన సెల్యూటూ మారలేదు. వేసుకున్న ఖాకీ బట్టా మారలేదు. పట్టుకున్న లాటీ మారలేదు. పోలీసు తీరూ మారలేదు. ఆడి క్రాపు మారలేదు. కాసిన మన యీపు మారలేదు. మారలేదంతే మారలేదు.

ఆ మాటకొస్తే అప్పుడు కలకటేరు యిప్పుడూ కలకటేరుగున్నాడు. అప్పుడు కప్పమే లాక్కుండోలు. యిప్పుడు పంట మీద కప్పమే కాదు, పంటే కాదు, పంటేసిన బూమి కూడా లాక్కుంతన్నారు. తన్ని మరీ. కేసులు పెట్టి మరీ. కాల్చిచంపి పడీసి మరీ. ఆ అబివుద్ది జోలికి పోను గాని కొడుకా.. యేటీ మారలేదు. కేసులంటే యాదికొచ్చింది.. దర్మల్ పవరు ప్లాంటు కేసులల్ల కోర్టుల చుట్టూ తిరిగినాను గదా.. జడ్జీ గారని తెలీక పెద్దలాయరనుకోని ఆయమ్మగారికి అనుకోకండా మొదట్ల యెదురైపోన్ను. దండవెట్టినాను. దేవుడ్ని చూసినట్టుగా చూసినాను. ఎన్నడూ చూడని దేవుడు యెదురొస్తే యెలాగ చూస్తామో అలాగ చూసినాను. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాను. అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగూడదని నాకు తెల్దు. దెస్టా.. అని మనోలు నా తల కిందకి వంచీసి గబుక్కున వుపద్రవం ముంచుకొచ్చినట్టు అందరూ వొక్కపాలి యెనక్కి లాగినారు. తెలక పులికి ఆహారం అయిపోతానన్నంత యిదిగా గబుక్కున ముందు నుండి యెనక్కి లాగినారు. యెంత పని చేసినావని మనోలు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టిపోసినారు. నానేటి చేసినానో నాకు తెల్లేదు. నాను యెర్రి మొకం యెట్టుకు చూస్తే చెప్పినారు. ఎన్నడు గాని.. యెప్పుడు గాని.. యేటి.. తెలిసిగాని.. తెలియక గాని.. జడ్జీలకి యెదురెళ్ళ రాదు. ఒకేళ పొరపాట్న యెదురయిపోతే.. దండమెట్టి పక్కకి తప్పుకొని తోవ యివ్వడం గవురవము కాదట?! ఎనక్కి అలాగే నాలుగడుగులు యేసి- అప్పుడు దండమెట్టి- పక్కకి జాగర్తగ- తలవొంచి తప్పుకోవాలట. పొరపాట్న కూడా యెనక్కి తిరిగి పోగూడదు. యెన్నూ యీపూ నడ్డీ ముడ్డీ సూపగూడదు! అలాగని యే రాజ్జాంగంలో వుందని నువ్వు అనొచ్చు. అన్నీ రాజ్జాంగంలోనే రాసుండవు. కొన్ని రూల్సు సెక్సన్లూ పాలో కావాలంతే! ఇలాటివి యెవుడూ చెప్పడు. ఏ పుస్తకాల్లంట వుండవు. గాని తెలుసుకొవాల. తెలుసుకొని మసలు కోవాల. మంచిగ బతుక్కోవాల.

అన్నట్టు చెప్పడం మరసిపోనాను. కలకటేరు ఆపీసుకు ఆమద్దిన యెల్లినాను గదా? అతగాడూ యెనకటి రాజుగోరే. తలమీద కిరీటమొకటే తక్కువ. ముందలే రాజావారి దర్శనానికి మా పేర్లు రాసుకున్నారు. తెల్లారగట్ల యెల్లి దండమెట్టి కూకున్నాం. ఎయిటు సెయ్యండి.. ఎయిటు సెయ్యండి.. అన్నారు ఆపీసర్లు. ఎయిటేటి నైనూ టెన్నూ కూడా అయిపోయింది. పొద్దుటి నుండి అతగోడు వస్తాడు.. యెల్తాడు.. వస్తాడు.. ఆడి పేసీల వున్నాగాని ఆడు మన పేసు సూడ్డు. ఆడు లార్డు కజ్జిన్ లాగ.. మనమేమో గుమ్మంలో వున్న గజ్జి బేపిలాగ.. ఆడు మనొంక సూడ్డానికి కూడా యిష్ట పడ్డు. పెర్మిషను యిస్తే గాని పెదవి యిప్పగూడదు.. అని ముందలే తాకీదు యిచ్చినారు ఆపీసోలు. సచ్చినట్టు నోరు కుట్టుకున్నాం. మూగోల్లాగ వుండిపోనాం. శిలా పతిమల్లాగ వుండిపోనాం. పొద్దోయిందాక. రేపు రా.. మాపు రా.. అని గాని అన్లే. సారూ పులుసూ యెల్లి పోనాడని ఆయెనక చెప్పినారు. చెస్.. ఈ కుక్కల కొడుకు తోటి మనకేటని రైతులందరం యెనక్కి యెలిపోచ్చినాం. నీకొకటి తెలుసునా.. కలకటేరుకే కాదు, యూనివరిసిటీల ఈసీలకీ, మన యిరిగేషను యింజినీరుకీ గొడుగు పడతారు. ఎండా వానా యేటి లేనప్పుడూ పడతారు. దేవుళ్ళకి తల యెనకాల సెక్రం వున్నట్టుగా యీలకి గొడుగుండాల. అదేట్రా అంటే మన యెలమ యెంకడు ‘దటీజ్ వోదా’ అంటాడు. ఇంక రాష్ట్రానికి వోదా వొస్తే యేటవుతాదో యేటో?

సర్లే గాని మన కానిస్టేబులు కనకారావు లేడా? మన యెనక సెగిడీదిల వుంటాడు. ఇంజనీరింగు సదివినాడు గుంటడు. ఐయ్యేయస్ ఐపీయస్సు ఐపోతాననుకున్నాడు. ఆపరీచ్చా ఈపరిచ్చా రాసినోడే. తెలివైనోడే. గాని అడుగు సిల్లి. అసల బొక్క. కూతురు కూటికి యేడిస్తే అవ్వ రంకుమొగుడికి యేడిసిందని అలయ్య గోల. పూట పూటకీ పూట గడవక కష్టంగ వుంటే యెప్పుడో ఆపీసరయ్యి మేం సచ్చినతర్వాత మా సమాదిమీద యీడు గేదిని కడతాడు.. అని రోజూ యింట్ల యేలాలూ గుడిసిలే. ఇంక యేలని పోలీసు పరీచ్చలు రాసి కానిస్టేబులు అయిపోండు. పోనీ అని లాఠీ వూపుకొని సక్కగా వుండొచ్చును కదా.. వుండలే.. ఈడికి ఐయ్యేయస్ ఐపీయస్సు పిచ్చ వుంది కదా? ఆ ఐపీయస్సు బాసుని సూడాలని మాటాడాలని మన బాసేకదా అని యెల్లబోనాడు. ‘వుద్యోగం సెయ్యాలని లేదా లం.. కొడకా’ అని ఆడి తోటోలూ పైయ్యోలూ తిట్టినారట. ఐపీయస్సు ఆపీసర్లతోటి కానిస్టేబుళ్ళు కలవడానికి లేదట. మాట్లాడడానికి లేదట. అసలు యెదురు పడడానికే లేదట. అంత హీనము మరి అని అనుకుంటే కాదు. అదే వోదా. ఆవోదా యెక్కడిది? రాజుల కాలం నాటిది కాదా? ఆలు రాజులు కారా?

చెప్పినాను కానా? ఏటీ మారలేదు. ఎనకటికి బుగత యింటి ముందు చెప్పులు తీసి చేత్తో పట్టుకు నడిసోలమా? అచ్చం అలగే. కావాలంతే కొన్ని ఆపీసులకి యెల్లి నీకళ్ళ తోటి సూడు. అందల పని చేసినోలే, చెప్పులు యిప్పి అయ్యవారి గదిలోకి అడుగు పెడతారు, దేవుడిగారి గర్బ గుడిలోకి అడుగు పెట్టినట్టు. మెడకాయ మీద తలకాయ యేలాడేసుకొని భక్తి మీద యెల్లి దండమెడతారు. మన ముందున్నోళ్ళని చూసి మనమూ జనమూ పాలో కావాలంతే! అడిగిన అన్నిటికీ ఆనసరు వుంది గదా అని చెప్పీగూడదు. మూగోలి లెక్క వుండాల. తల వూపాల గాని అడ్డంగా వూపగూడదు. అన్నిటికీ యస్సే అనాల. వోయస్ అనీసి వుత్సాహపడగూడదు. టెంపరి అనుకుంటారు. ఒళ్ళు బలుపు అనుకుంటారు. కొవ్వి పోనాడని కూడా అనుకుంటారు. అనుకోడానికి అడ్డేటి?

అసలు అనుకున్నా అనుకోకపోయినా ఆదోరంనాడు చేసిన ‘తిర్నాద సాముల కత’లాగ యిదాయికం పాటించాల. ఇవీ యిది యిదానాలని కార్తీక పురాణం పుస్తకంల రాసినట్టు వరసాగ రాసుండదు. గాని అచ్చరం ముక్క రానోడికి కూడా అంతా తెలుస్తాది. అర్దమవుతాది. టీవీలల్ల సూడ్లేదా? మన సినిమావోలు పతొక్కలూ పాదాలకి మొక్కీవోలే. అయిటయిటికీ వొంగి దండాలు పెట్టీవోలే. నడుము నొప్పులు రావో యేటో? అన్నిటికీ డూపులు పెడతారు, అదయినా వొరిజినలుగా సెయ్యనీరా అంటాడు మన సిమాచలం దద్ద. ఆడు అప్పుడ్లో సినిమాల్లో చేసీవోడని కతలు చెపుతాడుగదా. మోకమాటంగా వంగీ వంగక మద్దిల వుంటే- వొద్దు.. వొద్దనీసి మెడమీద సెయ్యపెట్టితే.. మనం లేపుతున్నాడు గావాల అనుకుంటాం. కాదట. పాదాలకు టచ్చు చెయ్యమని మెడమీద సెయ్యి తియ్యకుండా కిందకి వొంచుతారట కొందరు పెద్దలు. రాజుల కాళ్ళమీద.. జెమిందారుల కాళ్ళ మీద.. దేహీ అని పడినట్టు పడాల. అర్థమయ్యింది గదూ..?

రాజులెందుకు సరిపోతార్రా.. రాచరికాలు యెందుకు సరిపోతాయిరా కొడుకా.. మనవూరి కతే తీస్కో. గ్రామ పెసిరెంటు ఆపీసుల మీటింగు పెడితే యెల్లాల. తప్పకుండా యెల్లాల. గాని ఆపీసు యివతలే నిలబడాల. అదీ యిలువ. మరి మన డోక్రా మహిళా సర్పంచులయినా అంతే. ఆలు యింట్ల మీటింగు పెడితే మనం ఆడోళ్ళు యీదిల నిలబడాల. అదీ యిలువ. రెస్పెక్టు యివ్వకపోతే రేపు మన మొకం యెవ్వడూ సూడ్డు. తెలిసిందా? వాటమూ గీటమూ లేని వూరే యింత వయ్యారంగా వుంటే- పట్నమూ.. నగరమూ.. మరెంత వంపులతోటి వయ్యారాలతోటి వుంటాదోనని నా బయ్యిం.

సిటీలల్ల అలగేటి వుండదు. వొకడికి లచ్చిం లేదు.. సల్దికి బత్తిం లేదు.. అన్నట్టుగ బతికీయొచ్చు అని అంటావు. నీకా యీక తెంపితే కడేదో మొదులేదో తెల్దు. పేంటూ సర్టూ యేసీగాన సరికాదు. రంగుల కళ్ళ జోడు పెట్టీగాన సరికాదు. సరిగ్గ సూడు.. టీవీలల్ల సూడ్డం లేదనుకోకు. మినిస్టర్లూ మంత్రులూ వస్తే.. ‘రాజుగారు వొస్తన్నారహో..’ అని దండోరా యేయించినట్టు ‘పోయ్.. పోయ్’ మని అరుపులూ ఆరన్లూ. ‘అడ్డు తప్పుకోండహో..’ అని పోలీసులు దారి క్లియారు చెయ్యడాలు. ట్రాపిక్కు ఆపీడాలు. ఆపదైనా సాపదైనా ఆడికి ముందల దారిచ్చీయాల. నువ్వు ఆగాల. నీ సావు నువ్వు సావాల. రాజుగారు యెల్లీదాక సావయినా రేవయినా అంతే. ఆ తరవాతే బతికి సావాల. బట్ట కట్టి సావాల. రాజుగారికి పత్తింగుంటాది. మనకే మాడి పోతాది. మసయిపోతాది. నువ్వా దర్జా చూసి చెప్పు. ఇప్పుడుకీ మనం రాజులకాలం వున్నామా? లేదా? అది ముందు చెప్పు.

నాయనా! మన వూర్లంట యే మాటన్నా సెల్లుతాది. ఆడేటి ‘గైనేరా? గడ్డికుప్పా?’ అని గైనేరుని తిట్టీసినా దీవించీసినా ఆతు ముక్క కింద తీసీసినా చెల్లుతాది. ‘గైనేరుకు గడ్డు- మేస్త్రీకి మెడ్డు’ అనీసినా ఆడిపోసుకున్నా చెల్లుతాది. ఓట్లు తప్ప మన పాట్లు తెలీని అవుకు గాళ్ళని ఆడి యమ్మా యక్కా యాలి చేసి నానా తిట్లు తిట్టీసినా చెల్లుతాది. ఏలిన నంజి కొడుకుల్ని యెన్నన్నా చెల్లుతాది. ఆల ఆడోలు యేటి చేస్తారు గాని మద్దిన? యింకో తోవ లేదు. తెన్నులేదు. అమ్మనాబూతులు తినని వొక్క నాకొడుకుని చూపించు. రాజకీయాల్లోకి వొచ్చినప్పుడే ఆలూ అన్నిటికీ సిద్దమైపోయి వొస్తారు. సిగ్గూ యెగ్గూ వొదిలేసి వొస్తారు సన్నాసులు! మనము తిడతన్నామని పదవుల్లో వున్న యెదవలకి తెలీదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం సీకటయి పోద్దా?

ఒరే.. చివరాకరుగా నే చెప్పేది యిను. కుట్టినోలుకి కుడిపక్క వుండకూడదు. ఏడిసినోలుకి యెడమపక్క వుండకూడదు. అదికారంలో వున్నోలుకి ఆపక్కా యీపక్కా యేపక్కా వుండకూడదు. నువ్వసలే ‘గుర్రమ్మీదున్నోడు గుడ్డిగాడు.. యేనుగుమీదున్నోడు ఆతుగాడు’ అనే రకం. కానొరే.. అది కుదర్దు. మొన్నటికి మొన్న చూసినావు కావా? అయిదరాబాదులే.. సర్దారు వల్లబాయి పటేలు పోలీసు ట్రైనింగు కేంపులే.. అడీసినల్లు డీజీపీ యిందుకుమారు బూషణు అని రాజస్తాను నుండి వొచ్చినాడు. మన గవర్నరుని అడిగినాడు.. యేటని? మీ రాజబవనం నుండి సమాచారం అడిగిన ఆర్టీఐ కార్యకర్తలని మాపియా అని యెందుకు అన్నారు.. అని. రాజుని ప్రశ్నిస్తే సైన్యాదిపతికైనా తల తెగిపోద్ది. ఆ పోలీసు బాసుని టక్కున ట్రైనింగు ఆపీసి మరీ యెనక్కి పంపించీసినారు గదేటి? అతగాడు గొంతు కోసుకొని పేనాలు తీసుకోబోతే జైపూరు యిమానంల తొస్సి యెనక్కి పంపించీసినారు. ఇదంతా నాకెలాగ తెలుసును అనుకోకు. పేపర్ల వొస్తే మన ఈసుగాడు చదివి యినిపించినాడు. నువ్వు పేపర్ల యెడ్డింగులు చదివీసి.. సినిమా బొమ్మలు చూసీసి.. కిర్కెట్టు పరుగులు లెక్కట్టుకున్నంత కాలం నీకిలాటివి కనబడవు. ఆ పేపరోలు కూడా అదొక వార్త కాదన్నట్టుగ యేసినారు. కానొరే.. యెందులో నుండయినా మనం తెలుసుకోవల్సింది.. నేర్సుకోవల్సింది వొకటుంటాది.. అర్ధమయింది కదా.. కోవిల కెళ్ళి పిత్తకుండా వుంటే దూపమేసినంత పలితము. మనకాడ వాగినట్టు యెక్కడ పడితే అక్కడ యేది పడితే అది వాగీకు. నోరు మనదే. కాని వూరు మనది కాదు కదా?!

యిప్పుడుకే చేట బారతం రాసినాను.. వుంతాన్రా అయ్యా.. జాకర్త!

యిట్లు

మీయయ్య

అప్పలకొండ

మీ మాటలు

  1. దేవరకొండ says:

    “నేడు రాజులంతా మంత్రూలైతే మెచ్చుకున్నాడోయ్, కొందరు మంత్రులు.. మారాజులైతే నొచ్చుకున్నాడోయ్..డోయ్..డోయ్..” అని అప్పటి అందాలరాముడు లో ఆరుద్ర గారు ఆనాడే అన్నారు! ఆ నిత్యసత్యాన్ని ఈనాడు విప్పి చెప్పారు బజరా! ఒకడు (వాడు రాజు గానీ వాడి బాబు గానీ) మానసికంగా బానిస అయితేనే తన తోటి మనిషిని బానిసగా చూడగలడు. అయితే పాలకుల పెద్దరికాన్ని ఎలా ప్రత్యేకించాలి? ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసి! బలిసిన వాళ్ళ బారినుండి బక్కవాళ్ళను రక్షించడాన్ని బట్టి! అయితే అల్ప బుద్ధులూ, నీచులూ అధికారంలోనూ, అధికారులుగానూ ఉన్నప్పుడు వాస్తవానికి ఆదర్శాల ముసుగులో అధికార చలాయింపే నిరాఘాటంగా సాగిపోతుంది. అలాంటి వ్యవస్థలో అతి సామాన్యుడు తనను తాను ఎలా కాపాడుకొనే ప్రయత్నం చేయాలో చెప్పే ఈ వ్యంగ్య రచన వ్యవస్థలోని విషాదాన్ని బాగానే ధ్వనించిందని నా అభిప్రాయం. ‘అధికారికి ముందూ గాడిదకు వెనుకా నడవకూడదని’ సామెత అందరికీ తెలిసిందే! ఉన్నతాధికారుల ‘దర్శనం’ చేసే ముందు బయట చెప్పులు విప్పి లోనికి వెళ్లే ఆచారం తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నేటికీ ఉందని విన్నాను! అది నిజమేనన్నమాట! ఛ!

మీ మాటలు

*