Archives for September 2015

చుక్కల తాకిన చేతులు

 

 

Krishna Chaitanya Allamఉండాలా వద్దా అన్నట్టు పరధ్యానంలో ఏదో ఆలోచిస్తూ ‘లేక్ ఎలిజబెత్’ మీద పాలి పోయి ఉన్నడు సూర్యుడు. అస్తమించే సూర్యుని మనోభావాలను అంచనా వేసుకుంటూ ఈవినింగ్ వాక్ చేస్తున్నడు యాదగిరి. అక్కడక్కడ కొన్ని సీగల్స్ లేక్ దగ్గర్ల ఎగుర్తున్నయ్. జనాలు తమకు వీలుగా ఇండ్లనుండి పార్కుకు వస్తున్నరు. దూరంగ ఎక్కన్నో పోలీస్ కారు సైరన్ వినిపిస్తున్నది. క్రికెట్స్ కీకిరి కీకిరి చప్పుడు చేస్తున్నయ్. ప్రోటీన్ షేక్స్ చేత పట్టుకుని పిజ్జాలు కరగ దీస్తున్నరు కొందరు జాగర్స్. ఇవేమీ పట్టించుకోని కొన్ని పిచ్చి చెట్లు జాగింగ్ పాత్ కి అటూ ఇటూ మొలిచి కేర్లెస్ గ ఊగుతూ రెక్లెస్ గా వాటికవే మాట్లాడుకుంటున్నయ్.

పేరుకైతె అది పార్క్ కని అందుల స్మశానం లాంటి భయంకరమైన నిశ్శబ్దం ఎదో దాక్కుని ఉన్నట్టు అనిపిస్తది యాదగిరికి. ఆ ఫీలింగ్ సంతృప్తి ఇస్తదని కాదు కానీ అందులో ప్రశాంతతను వెతుక్కోవడం ఇష్టం తనకు. వాస్తవానికి పార్కంత పిల్లలూ పెద్దలతో సందడి సందడిగ కనిపిస్తుంటదికనీ ఆ దృశ్యాలు యాదగిరి కండ్లదాకా మాత్రమే పోగలవు, వాటిని దాటి మెదడులోకి చేరి మనసులోకి దూరాలంటే అంత ఈసీ కాదు. అతను మనసు చుట్టూ ఒక ఫైర్ వాల్ కట్టుకున్నడు. దాన్ని దాటి లోపలికి పోయే విషయాలు సంఘటనలు చాలా తక్కువ. ఎవరి కోసం కుడ అంత సునాయాసంగ తన మనశ్శాంతిని వృధా చెయ్యడు యాదగిరి.

పెళ్ళయి ఇరవై ఐదు వసంతాలు ఆ రోజుతోని. పొద్దున డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవ మతికస్తున్నది. ఇవాళ పెల్లిరోజని గుర్తున్నది కని ఏదో చేస్కోవాలన్న ఆసక్తి గాని పట్టింపు గానీ లేదు. మర్చిపోయిండని కమలకి కోపం వచ్చింది. పోద్దట్నుంది ఎదో నస పెడుతనే ఉన్నది. పార్క్ దగ్గర మనశ్శాంతి వెతుక్కుందామని ఇటు వచ్చిండు. నిర్భేధ్యమైన తన గుండె గోడలలో ఆ పట్టింపుల ప్రమేయాలు పాత్రలు ఎంత చిన్నవని ఆలోచిస్తున్నడు. కొత్తగా మొదలయిన సంబంధం కాదు, అలవాటయిందే కానీ ఈ రోజు ఎదో కొత్త అసహనం, కొత్త వెలితి.

ఆరు కావస్తున్నది. కోందరుపిల్లలు జారుడు బండలమీద జారుతున్నరు, ఇంకొందరు ఉయ్యాల ఊగుతున్నరు. అవి దొరకని వాళ్లు పక్కకు నిల్చోని తమవంతుకోసం చూస్తున్నరు. ఇద్దరు పిల్లలు తనకు. రాముడు వాషింగ్టన్ లో ‘లా’ చదువుతున్నడు. లక్ష్మణుడు న్యూయార్క్ ల గిటారు గోకుతుంటడు. ఏదైతే ఏమి డబ్బుల కోసం దగ్గరికి రాకుంటే చాలు అనుకుంటడు. ఇవాల అమ్మా నానల హ్యాపీ మ్యారేజ్ డే అని వాళ్లకి గుర్తులేదు. ఫోన్ చెయ్యలేదు. పిల్లలని గుర్తు తెచ్చుకొని పొద్దున కమల కళ్ళలో నీళ్ళు తిరుగుడు గమనించిండు కని కమలని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతయని తెలిసినవాడు. నిజాన్ని ఒప్పుకొని నిజంతో కలిసిపొయి బతకగలిగిన వాడు.

ఆ అపారమైన స్వీయ కేంద్రీకృత పరధ్యానపు ప్రశాంతతలో, ఆ స్మశాన నిశ్శబ్ద విశేషాన్ని తన వైరాగ్యంతో కలిపి నడుస్తుండగా నిశ్శబ్దాన్ని పటాపంచెలు చేస్తూ ఒక గొంతు- “హాయ్ అంకుల్…” అని పిలిచింది. చూస్తే ఉయ్యాల దగ్గర గీత, ఆమె బిడ్డ సోనీ కనిపించారు. తమ స్ట్రీట్ లోనే ఉంటరు వాళ్లు కూడ. కమ్యూనిటీ ఈవెంట్స్ లో గీత, సోనీ తరచుగా కనిపిస్తుంటారు. గీత సింగిల్ మదర్. స్వతంత్ర భావాలు కలిగిన పిల్ల. ముప్పై ముప్పైరెండేండ్లు ఉండొచ్చు. సంసారం సరిగ సాగక విడాకులు తీసుకొని ఉండచ్చు. అంతే, అంతకు మించి ఎక్కువ  తను అడగలే. ఆమె చెప్పలే. వివరాలు తనకవసరం లేదు. ఇన్నేళ్ళ అమెరికా జీవితం స్పందన లేని గంభీరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసింది కావచ్చు. వాళ్ళు చూడకుంటే తల తిప్పుకుని పొయేవాడె. తరచుగా మొహాలు చూస్కునే వాళ్ళం.. తప్పదని దగ్గరకు పోయిండు..

“హలో అంకుల్, హౌ ఆర్ యు?” గీత గ్రీట్ చేసింది

“హాయ్ గీతా”

“మమ్మీ ఐ వానా ప్లే విత్ గిరి అంకుల్.. ” ఈ మనిషిలో ఎం చూసిందో ఏమో గానీ గిరి అంకుల్తో ఆడుకునుడంటే అంటే ఇష్టం పిల్లదానికి.

“ఓకే సోనీ గో అండ్ ప్లే” అని సోనీ భుజమ్మీద చెయ్యి తీస్తూ “షీ లవ్స్ యు అంకుల్ ” అంది గీత.

“యా ఐ నో..” పైకి నవ్విండు కని ఎంత సేపుండాల్నో ఏందో అని లోపల్లోపలనే విసుక్కున్నడు.

“అంకుల్ కెన్ యు హెల్ప్ మీ అవుట్ హియర్?” ఊగి ఊగి బోర్ కొట్టి వెల్లిపోయిండు తెల్ల పిల్లడు. సోనీ నంబర్ వచ్చింది. ఉయ్యాల ఊపమని అడుగుతున్నది.

సరే అని ఉయ్యాల ఊపుతున్నడు.

“సోనీ, ఐ విల్ బి బాక్ ఇన్ ఫ్యు మినట్స్ ఒకే?”

“ఓకే మామి.”

“ఐ యాం గోన గో యూస్ ద రెస్ట్ రూమ్ అంకుల్. ఐ విల్ బి బాక్ ఇన్ అ బిట్” గీత సోనిని యాదగిరికి వదిలేసి పోయింది.

“స్యుర్, నో ప్రాబ్లెం.”

యాదగిరి ఉయ్యాల ఊపుతున్నాడు. సోనీ తలను వెనక్కి వాల్చి, కాళ్లను ముందుకు చాపి ఉయ్యాల ఊగుతూ,  ఆకాశాన్ని చూస్తూ “అయాం ఫ్లయింగ్ అంకుల్.. సీ.. అయాం ఫ్లయింగ్” అని సంబరంగా అరుస్తోంది.

యాదగిరికి ఆ మాటలు వినపడలే, పిల్ల సంబరం కనపళ్ళే. గీత పోతున్న దిక్కే చూస్తూ ఎదో ఆలోచిస్తున్నడు. ‘ఎట్ల ఉంటది ఈ పిల్ల ఒక్కతే? ఈ మహా నగరంలో ఒంటరితనం బయం అనిపించదా? ఏం పిల్లలో ఏమో. సర్దుకుపోయే గుణమే ఉండది వీళ్ళకు. ఎంతైనా అందరూ మన లాగా చంచల మనస్తత్వంతో ఉండరు కద. అసలు మనుషులందరూ తనలాగానే ఎవరి పని వాళ్ళు చూస్కొని ఎవరి గోలలో వాళ్ళుంటే బాగుంటది కదా.’

తను ఉయ్యాల ఊపుతున్నడు స్పీడ్ గా. ఇంకొంచం స్పీడ్ గా. స్పీడ్… ఇంకా.. ఇంకా.. ఇంకా.. ఊపుతనే ఉన్నడు. పిల్లదానికి కళ్ళు తిరిగినయేమో పాపం.

“స్టాప్ ఇట్ అంకుల్ ఐ యాం డిజీ” అన్నది సోని.

జీవిత సత్యాలన్నీ అదే టైం ల ఆలోచిస్తున్నడు యాదగిరి. ఆ మాలోకపు ప్రపంచంలో పిల్లదాని మాటలు ఎక్కడనో కొట్టుకు పోయినై. మాటలు చెవుల నుండి మెదడు దాక పోలే. ఆ స్పీడ్ కు సోని కింద పడ్డది. అట్లనే చూస్తున్నడు కని కనీసం లేపే ప్రయత్నం కుడ చేయలే. మాలోకం మనిషి కదా లోకంలకు రావడానికి కొంచెం టైం పడతది.

పిల్లదానికి పట్టలేని కోపం వచ్చింది. ఇంగ్లీష్లో ఎడా పెడా తిడుతుంది. డోనట్లు, కాండీలు అది ఇది అని పొద్దంత పది రకాలుగ షుగర్ తింటూ ఉంటరు వాళ్ళు. అత్యుత్సాహం, అతి ఆనందం, అతి ఆవేశం, అతి కోపం ఉంటై వాళ్లకు. బుడంకాయ అంత పిల్లది చెట్టంత మనిషిని పట్టుకుని అందరి ముందర నానా మాటలంటుంటే యాదగిరికి అవమానం అనిపించింది. సోనీకి ఎం మాట్లాడాలో, ఎం మాట్లాడ వద్దో మర్యాద నేర్పుతున్నడు.

అపుడే వచ్చిన గీత బిక్క మొహం వేసుకున్న కూతుర్ని, కూతురికి మర్యాద నేర్పుతున్న యాదగిరిని చూసింది. అమ్మని చూడంగనే కూతురు ఏడుపు మొదలు పెట్టింది.

“ఆర్ యు హర్ట్ సోనీ” కూతుర్ని దగ్గరకు తీస్కోని ముద్దు పెట్టి బుదరకిస్తున్నది గీత.

“అదేందంకుల్  పిల్లలు అన్నంక అల్లరి చేస్తరు, మరీ అంత కోపమైతే ఎట్ల?”

“సారీ గీతా.. ఐ డిడ్ నాట్ మీన్ దట్.. ఎదో ఆలోచిస్తూ.. ఐ వాస్ లాస్ట్ ఫర్ అ బిట్ దేర్ అండ్ లాస్ట్ మై కంట్రోల్”

“బట్ షి ఈస్ లర్నింగ్ బాడ్ వర్డ్స్, యు షుడ్ వాచ్ ఆన్ దట్” మళ్ళీ తనే స్కూల్ టీచర్ కి కంప్లైంటు ఇచ్చే పిల్లాడి లాగా చెప్పిండు.

“డిడ్ యు సే బాడ్ వర్డ్స్ టు గిరి అంకుల్? సే సారి టు గిరి అంకుల్”

“సారి అంకుల్”

“ఐ యాం సారీ టూ సోనీ. ఇట్ వాస్ మై ఫాల్ట్” అంతకు మించి కంఫర్ట్ ఎట్లా చేయాలనో తెలవదు తనకు.

“లెట్స్ గో ఫర్ ఐస్ క్రీం సోనీ, వాట్ డు యు సే?” ఇంకో షుగర్ వేరియంట్ ఆఫర్ చేసిండు.

“నో . ఐ వాన ప్లేయ్ ట్రెజర్ హంట్. లెట్స్ ప్లే ట్రెజర్ హంట్.”

Kadha-Saranga-2-300x268

“వి విల్ ప్లేయ్ టుమారో ఓకే సోనీ?” యాదగిరి నచ్చ చెప్పిండు.

“నో ఐ వాన ప్లేయ్ ఇట్ నౌ. మామి అండ్ మీ ప్లేయ్ ఇట్ హియర్ ఎట్ ద లేక్ ఎవరీ డే” పిల్లది ఎదో చెపుతుంది.

“ఇట్స్ వెరీ లేట్ సోనీ, వి విల్ ప్లేయ్ టుమారో, ఒకే” వాళ్ళ మమ్మీ చెప్పంగనే ఒకే అన్నది పిల్లది.

మన దగ్గర ఐతే ఒక్కటి వేసేవాళ్ళు. ఇక్కడ ఎంత బతిమాలి, నచ్చ చెప్పి ఒప్పిస్తరో పిల్లల్ని. పిల్లల ఎమోషన్స్ కూడా గుర్తించి వాటికి విలువిస్తారో, లేదంటే ఇక్కడి రూల్స్ కి భయపడో తెలవదు కానీ, పిల్లలు మాట విన్నపుడు ముచ్చటగా ఉంటది. గీత అంటే ఎంత ప్రేమో పిల్లదానికి గీత ఎంత చెప్తే అంత దానికి. తన పిల్లల బాధ్యత దాదాపుగ కమలే చూసుకునేది. ఎంత ఒపికనో కమలకు అని మళ్ళీ ఆలోచనలో పడ్డడు యాదగిరి.

“సోనీ గో ప్లేయ్ విత్ కెన్ని.” గీత చెప్పంగానే సోనీ తెల్ల పిల్లడితో ఆడుకోడానికి పోయింది.

“ఆర్ యు ఓకే అంకుల్? యు సీమ్ వెరీ ఆఫ్ టుడే” గీత అడిగింది.

“ఎం లేదు గీతా. ఇంట్లో ఏవో గొడవలు. రోజు ఉండేవే, ఇవాళ పెళ్లి రోజు. నేను పండగలు చేస్కునే మనిషిని కాను. ఉంటాయ్ లె ఇంకా అవీ ఇవీ…”

“ఆంటీ కోసం అయినా కనీసం చిన్నగ చేస్కోవచ్చు కదా. ప్రతీ సారీ అన్నీ మనకు నచ్చినంటే ఉండాలంటే ఉండవు కద.”

“ఇంకో పెళ్లి చేస్కొని ఇరవయ్ ఏళ్ళ తరవాత చెప్పు ఇదే మాట”.. ఎక్కువ మాట్లాడానా అనుకున్నాడు.

“ఇప్పట్లో ఇంకో పెళ్లి ఆలోచన అయితే లేదంకుల్. బయట పని, ఇంట్లో పని, సోని. ప్రస్తుతానికి ఇదే జీవితం.” నవ్వుకుంటనే చెప్పింది.

గీత మోహంలో వీసమెత్తు నిర్వేదం లేదు. ప్రతీ రోజూ తమని తాము సంతోషంగా ఉంచుకునుడు ఎంత పెద్ద పని. ఎంత కష్టమైన పని.

“సోనీ నీ దగ్గరే ఉంటదా?”

“యా అంకుల్ హాల్ఫ్ వీక్ నాదగ్గర, హాల్ఫ్ వీక్ ఆయన దగ్గర.. వీకెండ్స్ వీలుని బట్టి ఎవరో ఒకరం…

“ఓహ్.. ఓకే”

“బాగుంది నీ పని, పెళ్లి చేస్కొని కలిసుండి పెద్దగా నేను సాధించింది కూడా ఎమీ లేదు, ఇద్దరు కొడుకుల్ని కనుడు తప్ప” నిర్వేదానికి ప్రతినిధిలాగ చెప్పిండు యాదగిరి.

“అట్ల ఎందుకు అంకుల్, ఏ కాంప్లికేషన్స్ లేకుండా సాఫీ గ జీవితం నడవడం కుడ చాలా అదృష్టం. అందరికీ దొరకదు. ఓల్డ్ స్కూల్ మారేజీ, సొంతగా బతికే కొడుకులు, పెద్దగా బాధ్యతలు లేని ఉల్లాసమైన జీవితం. ఎంత మంది మిమ్మల్ని చూసి జెలస్ అయితరో” నవ్వుకుంటనే చెప్తుంది.

“అవునా, ఐతే మనం ప్లేసులు మార్చుకుందాం. కమలని నువ్వు చూస్కో, సోనీ ని నాకిచ్చేయ్. ఏమంటవ్?”

గీత చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నది. టాపిక్ చేంజ్ చేయాలని అర్ధం అయింది యాదగిరికి.

“అవునూ, రోజూ ట్రెషర్ హంట్ ఆడతరు అన్నది సోనీ. ఎం ట్రెషర్ హంట్ ఆడతారు. ఎక్కడ?”

“ఇక్కడనే ఆడతం అంకుల్.”

“ఎం ట్రెషర్ వెతుకుతరు.”

“రోజూ ఎదో చాక్లెట్ తీస్క వచ్చి దాచి పెడత, సోనీకి ఈసిగా దొరికేటట్టు.”

“మరి నువ్వేం హంట్ చేస్తావ్?”

గీత వెంటనే బదులియ్యలేదు.  ముఖ కవళికల్లో చిన్న తేడా స్పష్టంగా కనపడుతుంది. కిందికి చూస్తూ బీరిపోయింది. ఎదో ఉంది తన లోపల అనిపించింది.

“చాలా ఏళ్ళుగా హంట్ చేస్తున్న అంకుల్ దొరుకుతలేదు, ఎప్పుడో ఎక్కడో పోయింది. ఇక్కన్నే ఉన్నట్టు అనిపిస్తుంది” గీత గొంతుల ఇప్పటి దాక కనిపించిన నవ్వు లేదు. తల పైకెత్తకుండానే బదులిచ్చింది.

ఎదో ఆలోచనలో ఉంది.

“సారీ.. ఎం అనుకోవద్దు. ఏదైనా అడగరానిది అడిగితె.” యాదగిరికి ఎట్ల రియాక్ట్ కావాలనో అర్ధం కాలే.

“అయ్యో అదేం లేదంకుల్. చెప్పడానికి నాకేం ప్రాబ్లెం లేదు. మీకు వినే ఓపిక, తీరిక ఉంటె చెప్తా.” గీత మొహంలో మళ్ళీ చిన్న నవ్వు ప్రత్యక్షమయింది.

ఇప్పుడు ఉన్నపళంగ ఇంటికెళ్ళి చేసేదేం లేదు కదా అని  “సరే చెప్పు గీత, ఎం వెతుకుతున్నవ్” అన్నడు యాదగిరి.

అతను చెరువునే చూస్తూ ఆమె చెప్పేది వింటున్నడు..  గీత కూడా చెరువునే చూస్తుంది..

గీత ఎప్పటిదో స్వగతం ఎదో చెప్పడం మొదలు పెట్టింది.

***

“మా ఊరి పేరు రాగుల పల్లె. మా ఊరికి చివర చిన్న చెరువు ఉండేది. రాగుల చెరువు అనేవాళ్ళు. దాని పక్కన్నే ఏళ్ళనాటి గుడి ఒకటి ఉండేది. చెరువు చుట్టూ అనేకరకాల చెట్లు. పెద్ద పెద్ద వేపచెట్లూ, నాలుగైదు కొబ్బరి చెట్లూ, గట్టున గుడి చుట్టూ రకరకాల పూల చెట్లూ బంతిపూలూ, మందారాలూ, పారిజాతం చెట్టూ, పేద్ద బొడ్డుమల్లె చెట్లూ. రెండు జామ చెట్లూ, ఒక దానిమ్మ చెట్టు. రేగు చెట్లు, సీతాఫలాలూ.. ఎవ్వెవో చెట్లూ గుడి చుట్టూ చెరువు గట్టూ చుట్టూ అనేకం ఉండేవి. చెరువు నిండా కలువ పూలు.. గట్టు మీద నుంచి రాలిన పూలు, వేప పూతా, చెరువుల కలువలు అన్నీ కలిపి నీళ్ళ మీద చుక్కలు పరిచినట్టు అనిపించేది వాటిని చూస్తుంటే.” గీత బాల్యపు స్మృతిలో లీనమై చెపుతూ ఉంది.

“ఇంకా గుడి వెనక ఒక పెద్ద రావి చెట్టు ఉండేది.”

“ఆ చెట్టు మీద దయ్యం ఉండేది అంతే కదా?” అంతా తెలుసనే తన తత్త్వం ప్రదర్శించిండు యాదగిరి.

“హహహ.. దయ్యం లేదు ఎం లేదు. చెట్టు ఊరికేనే ఉండేది అంతే. మంచి చెట్టు” గీత నవ్వుకుంట చెప్పింది.

“ఓ సరే సరే కంటిన్యూ చెయ్.”

“ఊర్లో ముగ్గురు పిల్లలు. అంటే ముగ్గురే పిల్లలని కాదు. ఈ కథకు సంబంధం ఉన్న ఒక ముగ్గురు పిల్లలు అన్నమాట.  మేమే ఆ ముగ్గురం.  నేను, శంకర్, ఇంకా మా సయ్యద్. సయ్యద్ మా ఇంటి పక్కన ఉంటుండే. నాకంటే రెండేళ్ళు చిన్న. అక్కా అక్కా అనుకుంటు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేవాడు. శంకర్ మా ముగ్గురిలో పెద్ద. మాకు దూరపు చుట్టం. వరసకు నాకు బావ. మేం ముగ్గురం ఒక టీం. కలిసి ఆడుకునే వాళ్ళం..”

“బడి అయిపోగానే చెట్టు దగ్గర తెలేవాళ్ళం ముగ్గురం. రావి చెట్టు కొమ్మొకటి గుడి మీది దాకా పాకి ఉండేది. ఆ కొమ్మ మీదినుండీ ముగ్గురం ఆ చెట్టెక్కి చెరువునూ చూస్తూ ఏవో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం .. చీకటైతె  పాములు తిరుగుతాయ్ అని ఒంటరిగా గుడి దగ్గరికి పోవద్దని చెప్పేవాళ్ళు.  సాయంత్రం అయేసరికి ఆ కొంత నిర్మానుష్యంగా ఉండేది. కానీ మాకు అలవాటైన పరిసరాలు కాబట్టి భయం ఉండక పోయేది..”

“చెట్టెక్కడం మాకు నిత్య కృత్యం.  ఆ కొమ్మ మీద నుండి చూస్తె సూర్యాస్తమయం ఒక వర్ణనాతీతమైన దృశ్యం. వర్షం పడ్డప్పుడు ఐతే ఒక్కొక్క చినుకూ నీళ్ళని తాకుతున్నపుడు చిందర వందరగా ఏర్పడే చిన్న చిన్న అలల సమాహారం తేలుతున్న పూలతో కలిసి ఆటలాడుకున్నట్టు, తడిసిన పూలన్నీ చుక్కలై నవ్వుతున్నట్టు. వర్షపు సాయంత్రాలనెన్నో మూటలు కట్టుకున్న గురుతులు..”

ఒక రోజు రాత్రి ఇదే దాదాపు ఇదే టైముకు చెట్టు కొమ్మ మీద ముగ్గురం కూచొని చెరువులో నక్షత్రాల మిణుకుల్ని చూస్తూ ముచ్చట పెడుతున్నం.”

“రాగుల చెరువు అని ఎందుకు అంటార్రా దీన్ని?” సయ్యద్ అడిగిండు శంకర్ ని. వయసులో పెద్దయినా కలిసి పెరుగుడు తోటి శంకర్ని రా అనే చనువు, నన్ను రావే, పోవే అనే చనువు ఉంది వాడికి. ఉందంటే వాడే తీస్కున్నడు.

“ఏం లేదురా, అప్పట్ల గుడికి వచ్చినోల్లంతా ఈ చెరువుల పైసలు వేసేటోళ్ళు. ఇందుల పైసలేసి  మొక్కుకుంటె మంచి అయితదని అప్పట్ల నమ్ముతుండె.”.. శంకర్ అన్నడు..

“పైసలేస్తె పైసల చెర్వనాలెగని రాగుల చెరువనెందుకంటర్రా?”

“అంటే, ఆప్పట్ల అన్ని రాగి పైసలే ఉంటుండె కదరా అందుకే..”

“దగ్గర పైసలు లేనపుడు దగ్గర ఏ రాగి వస్తువు ఉన్నా చెరువులో వేసి మొక్కుకునేవాల్లట.. రాగి చెంబులూ పళ్ళాలు గ్లాసులు” నేన్ చెప్పిన..

“మరి రాగి పైసలు లేని కాలంల బంగారం, వెండి పైసలు ఉండేటివి కద. అవి కూడా అందులేసి ఉంటారంటవారా?” అని సయ్యద్ అడగంగనే వీడిప్పుడు ఎదో మొదలు పెడతడు అని చిన్న కంగారు మొదలయింది నాకు.

“ఏమోరా ఉండొచ్చు. ఉండక పోవచ్చు. ఎవరికి తెలుసు.” శంకర్ అన్నడు.

“రాగియి వేస్తెనే మంచిగైతదన్నప్పుడు ఇంక బంగారం వెండియేస్తే ఇంకెంత మంచి గావాలె చెప్పు? ఎవడో ఒకడు నా లాంటోడు ఏశే ఉంటర్రా బంగారాలు కూడా.. “

“వేస్తె వేసి ఉండొచ్చు కానీ ఇంక ఇప్పటిదాక ఉంటయారా అవన్నీ! ఏం ఉండయీ.. ఒకవేళ ఉన్నాగానీ అప్పుడెపుడో వేసినయి కాబట్టి ఈపాటికి ఎప్పుడో లోపటికి మట్టిలకు పొయ్యి ఉంటాయ్. భూమి మధ్యల దాంక కూడ పోవచ్చు” నేను చెప్పిన.

“ఏదన్నా ఒక్క బంగారు బిళ్ళ దొరకదంటావానే” సయ్యద్ అడిగిండు.

వాళ్ళ అబ్బా కుట్టు మిషన్ కుడతడు. పేద కుటుంబం. ఊళ్ళో ఎంత మంది రోజూ బట్టలు కుట్టిస్తరు. వాడి ఆశ వెనుక ఏముందో మాకు అర్తమైతుంది. కానీ వానితోని ఇంక ఆ టాపిక్ సగదీస్తే వాడేం చేస్తడో మాకు తెల్సు కాబట్టి ఇంక ఆ టాపిక్ అక్కడికి కట్ చేసి-

“ఇప్పటికే బాగా పొద్దు పోయింది కని ఇంటికి పోదాం పద..” అని తొందర పెట్టిన.

ముగ్గురం ఇంటికి నడుస్తున్నం కాని వాని మనసంతా బంగారు బిల్లల మీదనే ఉందని మా ఇద్దరికి తెలుస్తోంది.

***

కొన్ని రోజులకు అంతా మర్చిపోయినం. బడి, గుడి, ఆటలు, పాటలు. ఎన్నో డిస్ట్రాక్షన్స్ కదా పిల్లలకు..

ఒక రోజు తుఫాను లాంటి వాన. రెండు మూడు రోజులు ఆపకుండ కురుస్తనే ఉన్నది. ఊరు ఊరంతా చెరువయ్యి, బురదయ్యింది. మాకు బడి బందయ్యింది. వర్షం పడ్డపుడు చెరువు చేపలతోని, గట్టు కప్ప పిల్లలతోని నిండిపోతది. ఎక్కన్నించి వస్తయో ఏమో, ఆకాశం నుండి పడుతయనుకునేది మేమైతె!

“అక్కా అక్కా .. ” పొద్దున్నే సయ్యద్ తలుపు కొడుతున్నడు.

“చెరువు దగ్గరికి పోయి చేపలు పట్టుకుందాం పా” గాలం తో సహా ప్రత్యక్షమయిండు వాడు.

“బయట మొత్తం బురద బురద ఉన్నది రా, నేను రాను. కావాల్నంటె రేపు పోదాం..”

“సరే నువ్వుండు. నేను, శంకర్ పోయ్యోస్తం”. అని నేను వద్దని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెల్లిపోయిండు శంకర్ దగ్గరికి.

మళ్ల సాయంత్రం ఆరింటికి ఇద్దరుకలిసి ఇంటికి వచ్చిన్లు. చేతుల్లో చాపలు లెవ్వు!

“గీతా, తొందరగా రావే, బయటకు పోదాం” సయ్యద్ అన్నడు. వాని మొకం వెలిగిపోతున్నది.

“ఎక్కడికి రా?”

“చెప్తగని ముందు చెప్పులేస్కోని రా..”

“అమ్మా ఇప్పుడే సయ్యద్ వాళ్ళింటికి పోయ్యస్తనే”, అమ్మకు చెప్పి బయటికి పోయిన వాల్లతోని.

“నాకు అర్ధమయింది వాళ్ళు చెరువు దగ్గరికే తీస్కపోతున్నరని.

“నీకోటి చూపిస్త అక్క, ఎవ్వరికి చెప్పద్దు. సరేనా?”.. సయ్యద్ కి ఆత్రుత ఎక్కువ.

“సరే రా ఎవ్వరికి చెప్ప, చూపెట్టు..”

“ఒట్టు?”

“ఒట్టు!”

“సరే చేట్టేక్కుదాం పద.. చెట్టు మీదనే ఉన్నది.”

“ముగ్గురం చెట్టెక్కి ఎప్పుడు కూచునే కొమ్మ మీద కూచున్నం..”

“అరేయ్ నువ్వు తీస్కరార.”. శంకర్ సయ్యద్ ని ఎదో తీస్కోని రమ్మన్నడు.

వాడు చెట్టు మీదికి ఎక్కిండు. అక్కడొక చిన్న తొర్ర చెట్టుకి. అందుల నుండి ఎదో వస్తువు తీస్కున్నడు. నాకు కనపడకుండా వెనకకు పెట్టుకొని తీస్క వచ్చిండు వాడు.

“అక్కా నువ్ కండ్లు మూస్కోవే”

“ఊ..” నేను కండ్లు మూసుకున్న..

“చెయ్ పట్టు..”

“ఊ..”

ఎదో బరువైన వస్తువు చేతుల పెట్టిండు వాడు.

కళ్ళు తెరిచి చూస్తె, అది ఒక కత్తి. చూస్తె చాన పాతదాని లాగ ఉన్నది.

“ఎక్కడిది రా ఇది?”

“పొద్దున చేపలు పట్టడానికి పోదామంటె శంకర్ కూడ రానన్నడు, అందుకే నేనొక్కన్నే వచ్చిన. ఒక్క చేప కూడా పల్లేదు. ఇంటికి పోదాం అనుకునే లోపల గాలానికి ఇది తలిగింది.” అన్నడు కత్తిని చూస్తూ. వాని మొకం ఇంకా వెలుగుతనే ఉన్నది.

“బంగారమే అంటావానే ఇది?” శంకర్ అడిగిండు.

“ఏమ్మో రా? ఇత్తడి కూడ ఇట్లనే ఉంటది కద?” అన్నా నేను. సయ్యద్ గాడి మొహం వాడి పోయింది.

“బంగారం కుడా కావచ్చు” చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకున్న. మళ్ళి వెలిగిపోయింది వాడి మొహం.

“ఇంకా అందులో ఏమేం ఉన్నాయో కదరా?” శంకర్ అడిగాడు.

“ఏముంటే ఎందుకు. అది చాలా లోతు. ఇది దొరికింది కదా చాలు.”. నేనన్నా.

“సరేరా మీ అబ్బాకు చూపించు. ఆయనకు ఎమన్నా తెల్సేమో..” శంకర్ అన్నడు.

“ఇప్పుడద్దుగని. రంజాన్ ఉంది కదా వచ్చే నెల అప్పుడు చూపిస్త.”

“ఇది బంగారం ఐతే ఎం చేస్తావ్ రా..” అడిగిన నేను.

“ఒక పేద్ద విమానం కొనుక్కుంట. ఇంకా మా అబ్బాకు మంచి కుట్టు మిషన్ కొనిస్త. ఒక పెద్ద బంగాళా కట్టిస్త. అప్పుడు మీరే మా ఇంటికి వస్తరు. మా అమ్మికి..  ” వాడు చెపుతూనే ఉన్నడు చీకటి పడే దాకా.

రాత్రైంది అంతలోనే. కొంచెం చీకటి పడ్డప్పుడు గుడి మీద నుండి చూస్తె చెరువులో చుక్కలు తేలేవి. చెరువు చుక్కలని ఒదిమి పట్టుకునేది. చందమామని, కలువల్ని ఒక్క దగ్గర చేర్చి వెన్నెల రాత్రులని పిల్లలకు కానుకలిచ్చేది. ఒక పువ్వు రాలినపుడు నీల్లలో చిన్న రిపుల్. పూల రంగులన్నీ రాత్రికి మాయమై హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ సీనరీ ఒకటి ప్రత్యక్షమయ్యేది. ఆ వెలుగు జిలుగుల దృశ్యం ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో కనిపిస్తది. సయ్యద్ ని చూస్తుంటే నాకూ ఆనందంగా ఉండే. ఎదో మాట్లాడుతూ చాలా సేపు అక్కన్నే ఉన్నం. కాలం కాసేపు అక్కన్నే ఆగినట్టు ఉండే. శంకర్ మాత్రం ఎందుకో మౌనం గా ఉండే చాల సేపు.

బడి అయిపొంగనే రోజూ గుడికి వెళ్ళేవాళ్ళం. వాడు రోజుకొక్క సారైనా ఆ కత్తిని చూస్కోకపోతే వానికి మనసున పట్టేది కాదు.

కొన్ని రోజుల తరవాత, అలవాటు ప్రకారం సయ్యద్ కత్తికోసం మీదికెక్కిండు, నేనూ శంకర్ కొమ్మ మీద కూర్చున్నాం. చెరువు ప్రశాంతంగ కనిపిస్తుంది. నాకు చెరువులో ఎదో మెరిసినట్టు అనిపించింది. అంతలోనే మాయమైంది. ఇంతలో,

“అక్కా..” గట్టిగా అరిచిండు వాడు.

“ఏమైందిరా?” ఇద్దరం కంగారు పడ్డాం.

“కత్తి లేదు.”

“చూడురా అక్కడే ఏడనో ఉంటది.”

krishna

“మొత్తం చూసిన అక్కా ఏడ లేదు..!” వాని గొంతులో సన్నటి ఏడుపు.

“ఏదైనా కోతో, ఉడతో ఎత్తుక పోయి ఉంటుందేమో.. ఈన్నే ఏన్నో పారేసి ఉంటది. చెట్టు చుట్టూ పక్కల వెతుకుదాం పా” శంకర్ అన్నడు.

రాత్రయే వరకూ వెతుకుతనే ఉన్నాం. కని అది దొరకలేదు.

సయ్యద్ మొహం వాడి పోయింది. కదిలిస్తే ఏడిచేటట్టు ఉన్నాడు వాడు.

“అక్కా, అది జారి మళ్ల చెరువుల పడ్దదేమోనే, నేను చెరువుల దూకి వెతుకుత. ” ఉన్నట్టుండి డిసైడ్ అయిపొయిండు సయ్యద్.

” వద్దు రా ..  డేంజర్ అది ..చానా లోతుంటది.”

“దొరుకుతది గావచ్చు అక్కా”

“నా మాట విను, అంత పెద్ద చెరువులో ఎక్కడని వెతుకుతావ్”

“లేదక్కా, ఆ కత్తి కాకుంటే ఇంకో కత్తి .. లేదంటే ఇంకో వస్తువు ఏదైనా దొరకవచ్చు. బంగారు బిల్లలేమన్న దొరకవచ్చు.” వాడు వినిపించుకునే పరిస్తితిలో లేడు.

నేనేదో చెప్పే లోపే “పోనియ్యవే వాణ్ని, వాడు వినడు. అయినా వాడు ఈత బాగానే కొడతాడు కదా. ఇంక దేనికి భయం..” శంకర్ వానికి వంత పాడిండు.

మొత్తానికి సయ్యద్ చెరువుల దూకిండు. మేం అరవై లెక్కపెట్టేలోపు వాడు ఇంకా లోపలనే ఉంటె శంకర్ లోపలకు దూకి సయ్యద్ ని తీసుకు రావాలని ఒప్పందం.

వాడు పైకి తేలలేదు. 45, 46, 47.. నా గుండె వేయి ముక్కలయ్యేలా కొట్టుకుంటుంది.

53, 54, 55 అరికాళ్ళు, అర చేతులు చెమటలు పట్టినయ్.

58, వాడు రాలేదు..

  1. శంకర్ దబెల్లుమని రాగేర్లో దూకిండు.

***

కెన్ని తో ఆడుకోవడం అయిపొయింది సోనికి. చాల సేపట్నుండి అడుగుతుంది ఇంటికి పోదామని.

“మామీ ఐ గాట యూస్ రెస్ట్ రూమ్.”

“ఓకే సోనీ”

“ఇప్పటికే బాగా లేట్ అయింది అంకుల్. సోనీ మళ్ళి అల్లరి చేస్తుంది. దానికి ఇంత తినిపించి పడుకోకబెట్టకపోతే నాకు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. మళ్లీ కలిసినపుడు మిగిలింది చెప్తాను. సగమే చెప్పినందుకు ఎం అనుకోకండి.” సోనీ ని తీసుకొని వెళ్ళిపోయింది గీత.

“సరే గీతా.” అన్నడు  తప్ప ఇంకేం చేయలేకపోయిండు.

“ఆంటి కోసం ఏదన్న తీస్కపోవడం మర్చి పోకండి.” ఎదో గుర్తొచ్చినట్టు వెనకకు తిరిగి చెప్పింది. చీకట్లో మాయమయ్యారిద్దరూ.

అప్పటి దాక తనతో ఉన్ననిర్వేదం, అసహనం ఎక్కడో మాయమయినయ్. అతని మనసులో నిశ్శబ్దం బద్దలయ్యి సయ్యద్ కి ఏమైంది? శంకర్ కి ఏమైంది? కత్తి ఎవరు తీస్కున్నరు? ఇంతకు అది బంగారమేనా? తరవాత ఏమైంది? ఒకదాని తరవాత ఒకటి ఎన్నో ప్రశ్నలు. కమల మీద చిరాకు, కోపం పోయింది. ఇప్పుడు గీత మీద కోపం కలుగుతుంది. ఎవరూ చేరలేని తన గుండె గోడలను పగల గొట్టి తన మనశ్శాంతి మీద ఎవరో బురద కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంది. రేపు ఉంది కదా అని ధైర్యం చెప్పుకొని కార్ దిక్కు నడిసిండు యాదగిరి. కమల కోసం ఏదైనా తీస్కపోదాం. షి డిసర్వ్స్ సంథింగ్ అనుకున్నడు.

***

“హాప్పీ ఆనివర్సరీ కమలా.” చిన్న గిఫ్ట్ బాక్స్ కమల చేతిల పెట్టిండు యాదగిరి.

“ఏంటిది ఇది గిరి?” యాదగిరి మీద కోపం ఉన్న విషయం కూడా మర్చిపోయింది కమల.

బాక్స్ ఓపెన్ చేసింది కమల. చిన్న నక్షత్రం ఆకారంలో పెండెంట్, కమల కళ్ళూ ఒకే సారి మెరిసినై.

“ఐ షుడ్ నాట్ హావ్ యెల్డ్ ఎట్ యు, ఐ యాం సారీ” యాదగిరి కమల కళ్ళలోకి చూస్తూ .. తడుముకోకుండా చెప్పిండు.

“దట్స్ ఒకే, ఐయాం సారీ టూ గిరి.”

కమల కోపంలో కూడా తనకిష్టమైన వంటలు అన్ని చేసి తన కోసం చూస్తూ కూచున్నది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసిన్లు. పిల్లల గురించి మాట్లాడుకున్నరు. తమ పెళ్లైన మొదటి రోజులగురించీ. అమెరికాకు రావడం గురించీ. ఎప్పటివో జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నరు.

కమల మీద అప్పట్లో ఎంత ప్రేమ ఉండేది. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఎన్ని చూస్కుంది తను. పిల్లల చదువులు, ఇల్లు కొనడం తన ఒక్కని సంపాదనతో అయ్యేదా? ఎంత గ్రాంటెడ్ గా తీస్కుని ఉంటా తన్ని, అనుకున్నాడు. కమల మీద గౌరవం, అభిమానం కలిగినయ్ యాదగిరికి చాలా రోజుల తరవాత.

తృప్తిగా తిన్నర్రిద్దరూ. వాకింగ్ చేద్దాం అని బయటకు వచ్చారు. ఇంటి ముందర పెద్ద చెట్టు. అప్పటిదాకా మరిచిపోయిన సగం కథ మళ్ళీ గుర్తుకు వచ్చింది. అప్రమేయంగ ఆకాశం దిక్కు చూసిండు. ఒక్కటంటే ఒక్క చుక్క కూడా కనపళ్ళేదు. లైట్ పొల్యూషన్ అనుకున్నడు మనసులో. నడుస్తూ నడుస్తూ గీత ఇంటి దాకా పోయారు. ఇంట్లో లైట్లు కూడా వెలగడం లేదు. ఎక్కడికి పోయిందో పిల్ల అనుకున్నడు.

ఇంటికి వచ్చినంక యాదగిరి మెల్లగా బెడ్ మీద ఒరిగిండు. ఆ సగం కథ కలవర పెడుతనే ఉన్నది.

కళ్లుమూసుకుంటే అదే నక్షత్రాల చెరువు….. ఊరవతల ఒంటరి చెరువు, చెరువు మీద పరిచిన చుక్కల తివాచి, వెన్నెల పోత పోసుకున్న రాత్రి ని చూస్తున్న దృష్యమొకటి మనసుల మెదులుతుంది.

ఆ ఆలోచనలతోనే మెల్లగా నిద్రలోకి జారుకున్నడు యాదగిరి.

తెల్లారింది..

నిద్ర అయితే పోయిండు కానీ, రాత్రంతా ఏవేవో కలలు. బంగారం దొరికినట్టు, చెరువుల దునికినట్టు, మళ్ళీ బడికి పోయినట్ట్టు.. ఆ కథలో తనను తాను ఊహించుకుంటూ..

ఆఫీస్ పని పూర్తి చేస్కొని సాయంత్రం ఫ్రెష్ అయి మళ్లా లేక్ దగ్గరికి పోయిండు. గీత ఇంకా రాలేదు. వేరే పిల్లలెవరో ఆడుకుంటున్నరు. అదే సూర్యుడు, అదే పార్క్, అదే లేక్. ఒక్కో క్షణం భారంగా ముందుకు కదులుతున్నది. నాలుగు సార్లు టైం చూస్కున్నాకాలం ముందుకు కదులుతలేదు. గీత మీద, కాలమ్మీద అసహనం పెరుగుతున్నది.

ఒక చిన్న రాయి తీస్కోని లేక్ ల విసిరిండు. బుడుంగ్ అని మునిగి పోయింది. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని లేక్ దిక్కే బీరిపోయి చూస్తున్నడు. కాసేపటికి ఎదో వెలుగుతుంది లేక్ ల అనిపించింది. అంతలోనే మాయమైంది. కరెంటు చేపలు ఉండవచ్చు ఇందుల అనుకున్నడు. సిక్స్ తర్టీ. గీత రాలేదు. వాళ్లింటికే పోయి మిగిలిన కథ చెప్పమంటే పద్దతిగ ఉండదని తమాయించుకున్నడు. చేసేది లేక రేపు చూద్దాంలెమ్మని నిరాశతో ఇంటికి పోయిండు.

మూడో రోజు.. ఆరాటం ఉంది కానీ మరీ మొన్నటంత కాదు.. ఆఫీస్ కు పొయ్యి తన పని తను చూస్కున్నడు. సాయంత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోని లేక్ దగ్గరికి పోయిండు. అదే సూర్యుడు, అదే లేక్, అదే పార్క్. నాలుగు సార్లు పార్క్ మొత్తం నడిచిండు. మళ్ళీ అదే పిల్లల ఏరియా దగ్గర ఆగి ఓ రాయి తీస్కోని లేక్ ల విసిరిండు. బుడుంగ్ అన్నది. ఏడున్నర అయింది. గీత రాలేదు. మళ్ళీ నీటిలో ఎదో చిన్నగా మెరిసి మాయమైంది.

నాలుగోరోజు.. ఆరాటం చాలా వరకు లేదు.. వాక్.. బుడుంగ్.. ఏడున్నర.. ఎదో మెరుస్తూ.. గీత రాలేదు.

ఐదో రోజూ.. గీత రాలేదు.

కొన్ని నెలలు గడిచినై. కథ గురించి మర్చిపోయిండు. మళ్లీ ఎప్పుడూ గీత కనిపించలేదు తనకు. ఏమైందీ, ఎటువెళ్లిందీ తెలుసుకోవాలన్న ఆరాటం పోయింది. ఎపుడైనా లేక్ దగ్గరికి పోతాడు. అప్పుడప్పుడు నీటిలో ఎదో చిన్నగా మెరుస్తూ కనిపిస్తది. సాయంత్రంతో తనకు ఒక చిన్న అనుబంధం. అంతే.

***

కొన్నేళ్ళు గడిచిపోయినై. లేక్ దగ్గరికి పోయే అలవాటు పోయింది. యాదగిరి రిటైర్మెంట్ తీస్కున్నాడు. రాముడు ప్రాక్టీసు మొదలు పెట్టిండు. నచ్చిన పిల్లను వాడే చూస్కోని పెళ్లి కూడ చేస్కున్నడు మొన్నీమధ్యనే. లక్ష్మణుడు ఇంకా గిటారు గోకుతున్నడు. నచ్చింది నమ్మి చేస్తున్నడు కాబట్టీ ఎప్పటికైనా స్థిరపడతడు అనే నమ్మకం ఉన్నది.

కమల మామూలే. వయసు మీద పడ్డంక ఇద్దరి మధ్యన ఎదో తెల్వని ఒప్పందం దానంతట అదే ఏర్పడ్డది. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు లేవు. ఒక రకమైన స్థిమితం ఏర్పడ్డది. వంట అయినంక పిలుస్తుంది. తన బంధువుల గురించి ఎప్పుడైనా ఏదైనా ముచ్చట చెప్తుంది. విని ఊరుకుంటడు. ఎక్కువ మాట్లాడడు. ఎందుకని ఆమె కూడా అడగదు. ఒక్కళ్ళ మీద ఒకల్లకు పెద్దగ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక్కో సారి యాదగిరి ప్రవర్తన ఆమెకి అర్ధం అయ్యేది కాదు. ఆమె ఎదో చెప్పాలని అనుకుని కూడా ఎమీ చెప్పకుండా ఉండిపోతది. ఏమైంది ఎందుకట్ల చూస్తున్నవ్ అని కూడా అడగడు యాదగిరి. తనలో తానె ముసి ముసి నవ్వులు నవ్వుతది కమల. ఏమైందే అంటే చెప్పదు. పిచ్చి మాలోకం అనుకుంటాడు. ప్రశాంతత లాంటి స్తబ్దత ఒకటి ఏర్పడ్డది. అప్పట్లో చిరాకు జీవితం చిరాగ్గా ఉన్నా నిరంతర చలన శీలమై ఉండేది జీవితం. ఒపికుంది. తీరికుంది. వ్యాపకాల్లేవు. వార్తలు చదివే అలవాటు లేదు. ఎవరినైనా కలవాలన్న ఉత్సాహం గానీ, ఎందులోనో ఎంగేజ్ అవాలన్న ఆసక్తి గానీ లేవు. ఎదో అసంతృప్తి మాత్రం పట్టి పీడించేది.

ఒకప్పుడు రోజూ లేక్ దగ్గరికి పోయే వ్యాపకం ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. తీరిక లేకున్నా తీరిక చేస్కొని లేక్ దగ్గర గడిపే గంటన్నర జీవితంలో గుర్తించలేని తృప్తి ఎదో ఉండేది. అనుకున్నదే మొదలు కార్ తీస్కోని లేక్ దగ్గరికి పోయిండు..

లేక్ కొంత మెరుగు స్థితి లో కనిపిస్తుంది ఇపుడు. పిచ్చి మొక్కల్ని పీకి అందంగా చేసిన్లు. ఫెన్సింగ్ కి కొత్త రంగులు కనపడుతున్నయ్. పిల్లలాడుకునే ఏరియాలో కొన్ని కొత్త ఆట వస్తువులు వచ్చి పడ్డయ్. దూరంగా ఎవరో బార్బెక్యూ చేస్తున్నరు. చికెన్ వాసన వస్తున్నది. చాలా రోజులయింది వచ్చి కొంత జీవం కనిపిస్తున్నది ఇప్పుడు అనుకున్నడు. తన రెగ్యులర్ ప్లేస్ కి పోయిండు. ఆ బెంచ్ మీద కూచున్నడు. ఒక రాయి తీస్కోని.. బుడుంగ్..

ఇంతలో దూరంగా ఒక పాప. ఓ పదేల్లుంటాయేమో, తన దిక్కే నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడో చూసినట్టుంది. ఎవరిదో చేయి పట్టుకుని నడుస్తుంది.. వాళ్ళ నాన కావచ్చు. పాప దగ్గరికి వచ్చింది..

“అంకుల్ డిడ్ యు రికగ్నైస్ మీ? ఇట్స్ మీ సోనీ.”

“ఓహ్ సోనీ.. ఇట్స్ యు.. వావ్.. యు ఆర్ సో బిగ్ నౌ.. ఐ కెన్ బేర్లీ  రికగ్నైజ్ యూ.”

“డాడ్, దిస్ ఈస్ గిరి అంకుల్.. మామిస్ ఫ్రెండ్..”

“హాయ్.. శంకర్..  నైస్ టు మీట్ యు..” సోనీ తో ఉన్నతను శంకర్ గా పరిచయం చేస్కున్నడు.

శంకర్ పేరు చెప్పంగనే ఒక్కసారి ఉలిక్కిపడ్డడు యాదగిరి.

“శంకర్ అంటే.. గీత చిన్నప్పటి ఫ్రెండు శంకరేనా?”

“యస్ యస్.. నేనే ఆ శంకర్ ని. ఫ్రెండ్ కం ఎక్స్ హస్బండ్. గీత నా పరిచయం చేసిందా ఆల్రెడీ..”

శంకర్ ని మిగిలిన కథ అడగాల్నా వద్దా అని ఆలోచించే టైం లేదు. డైరెక్టుగా  “ఆ రోజు” గురించే మాటలు మొదలుపెట్టిండు యాదగిరి-

“మీరేం అనుకోకపోతే ఐ వాంట్ టు నో వాట్ హాప్పెండ్ దట్ డే”

“ విచ్ డే?”

“అదే మీరు చెరువులో దునికినపుడు.”

శంకర్ కొద్దిగా కంగారు పడ్డడు.

“గీత ఆ విషయం ఎవరికీ చెప్పదనుకున్న. ఎనీ వేస్ అదెప్పుడో జరిగింది. తెల్సుకుని ఎం చేస్తరు.”

“ప్లీస్ చెప్పండి, నాకు తెలుస్కోవాల్నని ఉంది.”

“ఆ విషయాలు మీ దగ్గర చెప్పిందంటే యు మస్ట్ బి ఎ క్లోజ్ ఫ్రెండ్.  వి విల్ మీట్ ఓవర్ అ డ్రింక్. లెట్స్ మీట్ఎట్ లక్కి స్టార్ టునైట్ ఎరౌండ్ ఎయిట్.”

“స్యూర్”

***

 

ఎనిమిదిన్నర అవుతుంది. శంకర్ రెండు డ్రింక్స్ తరవాత,

“నాకు ఎక్కడ మొదలు పెట్టాలో కుడ అర్ధం అయితలేదు. నేనేం చెప్పినా మీరు నమ్ముతరనే నమ్మకం లేదు.

“అదేంలేదు శంకర్, యూ ప్లీస్ క్యారీ ఆన్ 60 లెక్కపెట్టేలోపు సయ్యద్ పైకి రావాలె. రాలేదు. ఆ తరవాత మీరు చెరువుల దూకిన్లు. ఆ తరవాత ఏమైంది?” డైరెక్టు గా కథలోకి తీస్కపోతే చెప్పడం మొదలు పెడతడని యాదగిరి కథలోకి తీస్కపోయిండు శంకర్ని.

శంకర్ చెప్పుడు మొదలు పెట్టిండు.

“మేము ముగ్గురం ఒక టీం. ఎక్కడికి పోయినా కలిసే పోతుండే.. ఏ ఆటాడినా కలిసే ఆడుతుండే..

నాకు సయ్యద్ అంటే బాగ ఇష్టం, వాడెప్పుడు అన్నా అన్నా అంటూ నా తోటే తిరిగే వాడు. సయ్యద్ కి ఆ కత్తి దొరికినపుడు నేను హాప్పీగ ఫీల్ అయిన. ఆ రోజు చాలా సేపు మాట్లాడుకున్నాం చెట్టు మీద కూచొని. ఎందుకో గీత ఎక్కువగా మాట్లాడలేదు.”

“కత్తి పోయినపుడు సయ్యద్ చెరువులో దూకుదామని అని మొండిగా సిద్ధం అయిండు. నేను వద్దు అన్నా గానీ “ఏం కాదు, వాడికి ఈత బాగనే వచ్చు కదా” అని గీతే ఒప్పించింది. నాక్కూడ ఈత వచ్చు కాబట్టి అరవై లెక్క పెట్టె లోపు వాడు పైకి రాకపోతే లోపలకు దూకి వాణ్ని తీసుకు రావాలని అని అనుకున్నం..”

గీత వర్షన్, శంకర్ వర్షన్ కొంత వేరేగా ఉంది. ఒకటే సంఘటన ఇద్దరి నోళ్ళలో మరోకల్లని వేరేగా చిత్రీకరిస్తుంది. శంకర్ ఇంకా చెప్తున్నాడు.

“అరవై అయిపోయినై. నేను క్షణం లేట్ చేయకుండా చెరువులో దునికిన. చెత్త మొక్కలు, పేరుకు పోయిన చెత్తా లోపల చాలా ఉంది. చిమ్మని చీకటి. కొద్దిగా గట్టిగా చేతికి ఏది తగిలినా అది సయ్యద్ ఏమో అని తడిమి చూస్కుంటున్న. ఊపిరి ఆడని దాకా వెతికిన. గాలి పీల్చుకుందామని ఒక్క సెకన్ పైకి వచ్చి మళ్ళీ లోపలికి పోయిన. పైన గీత కనిపించలేదు. అవన్నీ పట్టించుకునేంత టైం లేదు. మళ్ళీ లోపలికి పోయిన. ఇంతలో లోపల చిన్నగా ఎదో వెలుగుతూ కనిపించింది.”

చెవులు పెద్దవి చేస్కొని వింటున్నడు యాదగిరి. శంకర్ చెప్తున్నాడు..

“ప్రకాశవంతమైన వెలుగు. స్పష్టమైన ఆకారం లేదు. కేవలం వెలుగు. అది ఎంత ప్రకాశవంతమంటే చుక్కేదో తెగిపడి ఆ నీళ్ళలో రాలినట్టు ఉంది. ఖచ్చితంగా సయ్యద్ దాని వెంట పోయి ఉంటాడని అనిపించింది. చెయ్ ముందుకు చాచి వెలుగుని వెతుక్కుంటూ లోపలికి పోతూ ఉన్న. ఎంత దూరం పోయిన్నో తెలవదు. ఎంత లోపల ఉన్నానో, మళ్ళీ పైకి ఎట్లా రావాలనో తెలవదు. ఆ వెలుగు రవ్వని అందుకునే దూరం దాకా వచ్చినట్టనిపించింది. నా చుట్టూ వెలుగు. వెలుగులో నేను. గాల్లో ఎగిరిపోతున్నట్టుగా..మబ్బుల్లో తేలిపోతున్నట్టుగ.. ఏమైందో తెలవదు. స్పృహ కోల్పోయిన్నో లేదో తెలవదు. కళ్ళు తెరిచి చూసే సరికి చెరువు ఒడ్డుకు ఉన్నా.

గీత నేను కళ్ళు తెరిచేసరికి ఊపిరి పీల్చుకుంది. మా ఇద్దరి పరిస్థితి అయోమయం.

“సయ్యద్ ఎడిరా?” గీత కంగారుగా అడిగింది.

“ఏమో నాకు కనిపించలేదు.. వెలుగు.. సయ్యద్… “ ఎం చెప్పిన్నో గుర్తు లేదు.

గీత నిర్ఘాంతపోయి ఎమీ అర్ధం కానట్టు నా దిక్కే చూస్తుంది.

నాకు అక్కడ ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. గీత రియాక్షన్స్ అంతకన్నా అర్ధం కాలేదు. నన్నే ఎందుకట్ల కన్నార్పకుండ చూస్తుందో అర్ధం కాలేదు.”

“ఎందుకు.. ఏమైంది.. సయ్యద్ ఏమయ్యాడు?” యాదగిరికి ఆత్రుత ఎక్కువయింది

శంకర్ చెప్తున్నాడు..

“అప్పటికి నీళ్లలో దూకి అరగంట దాటిందట, మాకు చేతనయింది ఏమీ లేదు. అప్పటిదప్పుడు ఊళ్లోకి పొయ్యి చెప్పినం ఈ విషయాన్ని.

కాసేపట్లో ఊరు ఊరంతా చెరువు దగ్గర. వారం రోజులు ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని మరీ వెతికారు. సయ్యద్ గానీ, బాడీ కాని దొరకలేదు. మధ్యలో వెలుగు కనిపించిందా అని నేను అడిగినా, ఎవరూ పట్టించుకోలేదు.

ఏడుపులు కన్నీళ్ళ మధ్య ఆ ఘట్టం ముగిసేవరకు చాలా నెలలు గడిచినై. వాడు గుర్తుకు రాని రోజు ఉండేది కాదు.

నేనూ గీతా చెరువు దగ్గరకు పోవడం మానేసినం.”

“ఇక అప్పటినుంచి గీత ప్రవర్తన మాత్రం మారిపోయింది. సయ్యద్ పోయాడని తను ఒక్క సారి కూడా బాధపల్లేదు. అప్పుడప్పుడు వింతగా నా దిక్కే కన్నార్పకుండా చూసేది. ఎందుకలా చూస్తున్నవ్ అని అడిగితె సమాధానం ఉండక పోయేది. ఆ తరవాత ఎందుకో గానీ గీత నాకు బాగా దగ్గరయింది. నేనే తన లోకం అన్నంత దగ్గరయ్యింది. మెల్ల మెల్లగా నేను కూడా గీతకు బాగా దగ్గరయిన. కలిసే పై చదువులు చదువుకున్నాం. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేస్కున్నం.  గీతంటే ఇష్టమే, ప్రేమే కాని గీతకు నేనే లోకం. మాటల్లో చెప్పలేని ఎదో బంధం ఉండేది ఇద్దర్లో. అదేంటో గీతకు తెలుసనే నమ్మకం ఉండేది నాకు. ఆ బంధానికి అర్ధం నాకెప్పుడూ అర్ధం కాలేదు.”

“పెళ్లి చేస్కున్న కొన్ని రోజులకి ఉద్యోగ రిత్యా ఇండియా వదిలి రావాల్సి వచ్చింది. సోనీ పుట్టింది. గీత ఉద్యోగం మానేసింది. సోనీ ని చూస్కోవడం, రోజూ ఈ లేక్ కి రావడం, ఇవే గీత వ్యాపకాలుగా మారిపోయినయి.  కొన్ని ఇయర్స్ బాగానే ఉంది. ఉన్నట్టుండి ఏమైందో కానీ గీతలో ఎదో మార్పు. కన్నార్పకుండా నన్నే చూసే అవే చూపులు తిరిగి గీతలో కనిపిస్తున్నయ్. ఏమైందంటే చెప్పదు. ఒక రోజు సడ్డెన్ గా విడాకులు కావాలన్నది. నాకు నోట మాట రాలేదు. పెద్ద గొడవ చేసింది. కారణం చెప్పలేదు. చెప్పి చెప్పి విసిగిపోయి చివరికి డైవోర్స్ పేపర్స్ సైన్ చేసిన.”

“ఐ యాం సారీ. గీత ఎక్కడుంది ఇపుడు. ఎందుకు డైవోర్స్ అడిగింది.” యాదగిరికి అంతా అయోమయంగా ఉంది.

శంకర్ మళ్ళీ చెప్పుడు మొదలు పెట్టిండు..

“ఒక రోజు రాత్రి ఇంటికి వచ్చింది సోనీ ని తీస్కోని…

“ఇది నా టర్న్ అయినా సోనీ ని కొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుతావా శంకర్?” గీత అడిగింది.

“ఎందుకు ఏమైంది..” అడిగిన నేను..

“చెప్తాను. కానీ నువ్వు నమ్మవు.” గీత సమాధానం.

“నిన్ను కాకపోతే ఎవర్ని నమ్ముతా నేను?.” నేను అన్న.

“ఆ రోజు నువ్వు చెరువులో దునికినప్పుడు చాలాసేపటిదాకా బయటకు రాలేదు. నాకు బాగా భయమైంది. నడుము లోతు నీళ్ళ దాకా వచ్చి చూసిన. నీళ్ళలో ఎదో మెరుస్తుంది. ఎదో జరిగింది. సడ్డెన్ గా ఎక్కన్నుంచో  వచ్చి నువ్వు నా చెయ్యి పట్టుకున్నవ్. తొందర తొందరగా నిన్ను పైకి తీస్కొచ్చిన. ఊపిరి ఆడుతుంది. సయ్యద్ ఏమయ్యాడో తెలవదు. నీ పరిస్తితి అర్ధం కాలేదు. నాకు గాబరాగ ఉండే. కాసేపటికి నువ్వు కళ్ళు తెరిచినవ్.

“శంకర్, ఏమైందిరా..”

“అక్కా”

“శంకర్ ఏమైందిరా నీకు.. నన్ను అక్కా అంటవెందుకు..”

“నేను సయ్యద్ ని అక్కా, శంకర్ అంటవేంది” అన్నవ్ నువ్వు.

నాకేం అర్ధం కాలేదు. కాసేపట్లోనే “గీతా సయ్యద్ ఏడి” అని అడిగావ్. నాకేం జరుగుతోందో అర్థంకాలేదు. నీ దిక్కే చూస్తూ ఉండిపోయిన.

ఆ తరవాత చాలా రోజులు నా దగ్గర ఒక సారి సయ్యద్ గా ఒక సారి శంకర్ గా మాట్లాడేవాడివి. నాకేం అర్ధం కాలేదు. నేను ఎప్పుడు సయ్యద్ గా మాట్లాడుతనో, ఎప్పుడు శంకర్ గా మాట్లాడతనో నాకే తెలవదట. అట్లా చిన్నపుడు చాలా సంవత్సరాలు చేసిన అని చెప్పింది. పై చదువులకు ఊరొదిలి వచ్చినంక మెల్లగా సయ్యద్ లాగా మాట్లాడుడు తగ్గింది అని చెప్పింది. తన ఒక్క దానితోనే సయ్యద్ లాగా మాట్లాడతా అని చెప్పింది.

ఆ అలవాటు పోయింది. చదువు, ఉద్యోగం, పెళ్లి, అమెరికా అన్ని వరుసగా జరిగిపోయినయ్.

కొన్నేళ్ళకు సోనీ పుట్టింది. పిల్లల పార్కు ఉందని రోజూ సోనీని తీస్కుని ఇక్కడకు వచ్చేది. లేక్ కి రావడం మొదలు పెట్టిన తరవాత మళ్ళీ నాలో సయ్యద్ కనిపించిండని చెప్పింది. ఒక రోజు “అక్కా..” అని పిలిచిన అట. రోజు రోజుకూ శంకర్ కన్నా సయ్యద్ గానే పిలిచేవాడిని అన్నది. తన వల్లనే నేను ఇన్ సేన్ గా అవుతున్నా అని మొదటి నుండి తనకు గిల్టీ ఉండేది అన్నది. భర్తగా, తమ్ముడిగా. తను భరించలేని స్థితి కి చేరుకుందో ఏమో మేమిద్దరం దూరం ఉంటేనే ఇద్దరికీ మంచిదని అనుకుని డైవోర్స్ తప్పని సరి అయింది అన్నది.  గీత చెప్పింది ఎంత వరకు నిజమో నాకు తెలవదు. అసలు నిజమో కాదో తెలవదు. కానీ ఆ రోజు సోనీ ని నా దగ్గర వదిలేసిన తరవాత మళ్ళీ గీత కనపడలేదు. “

“ఓహ్… గీత ఏమయింది. ఎక్కడికి పోయింది?”

“నో ఐడియా అంకుల్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచిన. లాభం లేదు. వాళ్ళు కూడా వెతికి వెతికి చేతులు ఎత్తేసిన్లు”

“ఓ మై గాడ్ . సారీ టు హియర్ దట్.. తను ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందనుకుంటున్నంకని ఇలా జరిగిందని మాకు తెలీదు.. అయాం రియలీ సారీ.”

“దట్స్ ఓకే. లోకంలో సమాధానాల్లేని ప్రశ్నలు ఎన్నో ఉంటయ్. మీరివన్ని ఆలోచించి మైండ్ పాడు చేస్కోకండి. కలుద్దాం మరి.”

ఇద్దరు బై చెప్పుకుని ఎవరిదారిన వాళ్లు..

ఇంటికి డ్రైవ్ చేస్తున్నడు యాదగిరి.. మనసులో ఎన్నో ప్రశ్నలు. “గీత అబద్దం చెప్పిందా? శంకర్ చెప్పింది అబద్దమా? ఇద్దరి కథల్లో ఎందుకింత తేడా? వీల్లిదర్లో ఎవరో ఒకరు కత్తిని దొబ్బేసి తరవాత జరిగిన సంఘటనల పర్యవసానం ఎదుర్కొనడానికి అబద్దాలు సృష్టించిన్లా? కొంపదీసి శంకర్ గీతని, సయ్యద్ ని చంపిండా? లేక గీత సయ్యద్ ని ఏమైనా చేసి, శంకర్ తో నాటకాలు ఆడిందా.”

అప్పటి దాకా విన్న కథలో నిజాన్వేషణలో ఉన్నాడు యాదగిరి.. కార్ లేక్ దగ్గరి దాకా వచ్చింది.. “లేకుంటే చెరువులో చుక్కలేంది. మనిషిలో మనుషులేంది.” అనుకుంటుండగానే, లేక్ లో ఎదో మెరుస్తూ కనిపించింది. ఎదో సందేహం. గుండె శరవేగంతో కొట్టుకుంటుంది. అరికాళ్ళు, అర చేతులు చెమటలు పడుతున్నయ్. కమలని కలవాలి. కమలని కలవాలి. “కమలని కలవాలి” లోపల అనుకునేది మంత్రంలాగా బయటికే జపిస్తున్నాడు గిరి అంకుల్. దారి పొడుగూతా అవే రెండు మాటలు.. “కమలని కలవాలి”

ఇంటి ముందరే కార్ ఆపి డోర్ కూడా వెయ్యకుండా ఇంటి లోపలకు పోయిండు.

“కమలా.. నేను ఎప్పుడన్నా నిన్ను ‘ఆంటీ’ అని పిలిచిన్నా”?

“ఎన్నో సార్లు.. ముద్దుగా పిలుస్తున్నారు అనుకున్న.. ఏమైంది గిరి?”

******

 

మనుషుల్ని ప్రేమించడమెలాగో!

కంచెలూ, గోడలూ, కందకాలూ మనుషుల మధ్య బలవంతపు రేఖల్లానే ఉండిపోతాయి. ఏ సమాచారమైనా అందజేయడానికి ఈ ఎలక్ట్రానిక్ యుగంలో క్షణం పట్టదు.
కానీ, ఒక మనిషి ఇంకొక మనిషిని కలవాలంటేనే యేళ్ళు గడిచిపోతాయి.
ఆధునికత పెరుగుతున్న కొద్దీ భావోద్వేగాలు కూడా పెరుగుతున్నాయి. సరిహద్దు రేఖకి అటువైపు అంటేనే శత్రుపక్షమే, ఎదురుపడేది సమరానికే వంటి అల్పత్వమో, ఉన్మాదమో రాజ్యమేలుతున్నంతకాలం సరిహద్దు దాటాలనుకునే ఎన్నో కలలు అక్కడి ముళ్ళకంచెలకే చిక్కుకుపోయి వేళ్ళాడుతున్నాయి. భద్రతాదళాలు, పకడ్బందీ తనిఖీలలో ఎన్నోసార్లు మానవత్వం దొంగలించబడుతుంది. మాటలు భాషని కోల్పోతాయి!
మనుషులకి ఎవరు నేర్పగలరో, మనుషుల్ని ప్రేమించడమెలాగో!? ఎవరు చక్కగా వివరించగలరో ఆశల సమానత్వం గురించి!?
gulzar

తలుపు చప్పుడు:

తెల్లవారుఝామునే ఒక కల తలుపు తడితే తెరిచి చూశాను

సరిహద్దుకి అటువైపు నించి కొంతమంది అతిధులు వచ్చారు

ఎక్కడో చూసినట్లే ఉన్నారు అందరూ
ముఖాలన్నీ బాగా తెలిసినవాళ్ళవి లానే ఉన్నాయి
కాళ్ళూ చేతులూ కడిగి,
పెరట్లో విశ్రాంతిగా కూర్చోబెట్టి,

తందూర్ లో మొక్కజొన్న రొట్టెలు కొన్ని వేడివేడిగా చేశాము

మా అతిధులేమో గుడ్డసంచిలో

పోయినేడాది పంటతో చేసిన బెల్లం తెచ్చారు

కళ్ళు తెరుచుకున్నాక చూస్తే ఇంట్లో ఎవరూ లేరు
చేత్తో తాకితే మాత్రం తందూర్ ఇంకా వెచ్చగానే ఉంది

అదేకాక, పెదాల మీద తీయని బెల్లపు రుచి ఇప్పటికీ అతుక్కునే ఉంది

బహుశా కల అనుకుంటా! తప్పకుండా కలే అయి ఉంటుంది!!

సరిహద్దు దగ్గర రాత్రి, కాల్పులు జరిగాయని తెలిసింది
సరిహద్దు దగ్గర రాత్రి, కొన్ని కలలు హత్య చేయబడ్డాయని తెలిసింది!
మూలం:
Dastak

Subah subah ik khwab ki dastak par darwaza khola, dekha
Sarhad ke us paar se kuchh mehmaan aaye hain

Aankhon se maanoos the saarey
Chehre saarey sune sunaaye
Paanv dhoye, Haath dhulaye
Aangan mein aasan lagwaaye…
Aur tandoor pe makki ke kuchh mote mote rot pakaye

Potli mein mehmaan mere
Pichhale saalon ki faslon ka gud laaye the

Aankh khuli to dekha ghar mein koi nahin tha
Haath lagakar dekha to tandoor abhi tak bujha nahin tha
Aur hothon pe meethe gud ka zaayka ab tak chipak raha tha

Khwab tha shayad! Khwab hi hoga! !

Sarhad par kal raat, suna hai, chali thi goli
Sarhad par kal raat, suna hai kuchh khwaabon ka khoon hua hai

———————–

Painting: Satya Sufi

ముసుగు తెలుపు

-ఎం.ఎస్. నాయుడు 

ఎదురు చూస్తాను
చూడాలనుకునే ఎదురు చూపు ఎక్కడ

*
తీరం తలుపుల మధ్య నలిగిపోయాను
శ్వాసించని నక్షత్రంతో

మలుపు తెలియని అక్షరమే
ఓ దేహం

నీ నేత్రం నాది
నాది కాని నేత్రం నాలో

తెలుపు ముసుగు
ఆత్మాక్షర దహనం

అందిన అక్షరాల ఆకారం
అంధ మౌన మోసం

నగ్న శాంతి
నమ్మకం లేకే విశ్రాంతి

తప్పుకు తిరుగు

*

naidu

ఎంతటి వెర్రివాడవు!

       
– మమత కొడిదెల                                   

 

ఎక్కడిదిరా అంత ఆశ నీకు…
మేమంతా…

 

గాలి తెమ్మెరలో మెత్తగా ఊగే పసుపుపచ్చ పూల కాడల్లో
గగనాన తేలిపోతూ క్షణక్షణానికి విచ్చిపోతున్న తడి కలల్లో
చెట్టు చిటారుకొమ్మన పసి ఆకునొకదాన్ని హత్తుకున్న నీటిబిందువుల్లో
పిచ్చుక నల్లరెక్కలమీది ఏడురంగుల మెరుపుల్లో
చిక్కుకున్న ప్రణయగాథల్ని విప్పుకుంటున్న వాళ్లం

 

నకిలీ దర్పాలకు ధగధగలనద్దే రంగు రాళ్లల్లో

తాజా ఎర్ర గులాబీ గుత్తుల మధ్య నలిగిన రేకుల్లో
ఆకాశమంత పరిచిన పందిళ్లలో
ఇద్దరం ఒకటయ్యామని ప్రపంచం వీపున చరిచి మరీ చెప్పుకుంటున్న వాళ్లం

 

మంచుకొండల్ని కరిగించి ఉప్పొంగించిన సముద్రాల్లో
నదీనదాల్నీ మరిగించి పండించిన నిలువెత్తు ఇసుక తిన్నెల్లో
మూలనకా గోడనకా అందంగా నిండిన ఇరుకు బతుకుల్లో
మా దేవుళ్ల రక్షణకు వీరతిలకం దిద్దుకుంటున్నవాళ్లం

 

చేతులెత్తేసిన నీ బిత్తర చూపుల్లోని మురికి కన్నీళ్లలో
అందాన్ని వెతుక్కుంటున్న వాళ్లం

 

గుండె ఘోషను వంటినిండా నింపుకుని అలల్లో అలవై
ఉబ్బిపోయిన నిన్ను పద్యాన్ని చేసుకుంటున్నవాళ్లం

 

ఆకలిదప్పులను మరిపించి
బాంబుల వర్షం దాటి
కత్తిమొనకు నీ నాన్నను అర్పించి
సముద్రాన్నే జయించబోయావు
నిన్నందుకుంటామని ఆశ పడ్డావు కదూ

 

ఆవలితీరాన మేం కాక ఇంకెవరుంటారని చెప్పిందిరా నాన్నా, నీ వెర్రితల్లి?

(అయిలన్ కుర్దీ లాంటి పసిపిల్లలకు, దుఃఖంతో…)

 

రాజ హంస

 

 

                    –  మైథిలి అబ్బరాజు 

 

Mythili1

ఉద్యాన   నగరం లో మే నెల సాయంకాలం సౌమ్యంగానే ఉంది  . ఆ కాస్త కాస్త వేడిని చల్లబరచుకుందుకు మెల్లి మెల్లిగా ఒక్కొక్కరూ అక్కడికి- వేడుక కోసం కంటే వాడుకయిన ఇష్టంతో.

ఆమె ఎప్పట్లాగే తన మూలలో…ఎక్కువ వెలుతురు రాని చోట. రోజూ తాగేదే , రోజూ తిరగేసేదే  , చూసీ చూడని చూపే.

ఆవాళ మటుకు అతను వచ్చాడు ఆమె ఎదటికి , మరెక్కడా ఖాళీ లేక.  ‘ ఫలూడా ‘  కోసం .  దొరికే కొద్ది చోట్లలో అది ఒకటి అని కొత్తగా వచ్చిన అతనికి చెప్పారెవరో.  హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు ..  ఎన్నెన్ని మాక్ టెయిల్స్ వచ్చినా అతనికి అది మాత్రమే  ఇష్టం.   తర్వాత గమనిస్తే  ఆమె ముందున్నదీ అదే.  తలెత్తింది.

కనీకనిపించని పూలతో తేలిక రంగు నూలు చీర. ఒద్దికగా పిన్ చేసి కట్టుకుంది. పూర్తి తెల్లగా వదిలేసిన బాబ్డ్ జుట్టు. పండిపోయిన నుదురు.. అగాధసరోవరాల  కళ్ళు .. ఏటి ఒడ్డున ఇసక మీది నొక్కుల తో   ఉలిపిరి కాగితపు చర్మం . లావణ్యం పోయిందిగాని సౌందర్యం ఇంకా ఉంది. కొంచెం నవ్వింది. గుర్తు పట్టాడు… కాస్త ఆశ్చర్యం…ఇలా స్ఫురించదు అతనికి.

పలకరించింది –  ” నా పేరు రాజహంస ”

” మీరు నాకు తెలుసు…రాస్తారుగా ?   ” – ఆమె చిన్నప్పటి ఫోటో చూసి ప్రేమించానని చెప్పలేదు అతను..ఊహూ.అప్పుడే కాదు.

” కొత్తగా వచ్చారా ? ”

” అవును…పది రోజులైంది .  చెన్నై లో ఆర్నెల్లుండి…”

” ఎప్పుడయిపోయింది చదువు ? ”

తన కుర్రతనాన్ని  వెక్కిరిస్తోందనిపించింది.

” కిందటేడు ”

కాసేపు స్మాల్ టాక్.

లేస్తూ – ” ఈ వీకెండ్ కి మా ఇంటికి వస్తారా ? మాట్లాడుకుందాం ”

ఆమెకేమి తెలుసు అతని గురించి ?  ఇద్దరికీ ఒకేలా అనిపించేవేముంటాయని….?

” సరే ” .

చిరునామా అందింది.

*                   *                       *               *               *

ఇంచుమించు గా సవ్వడి  లేని వీధి . ఒక అంచు న – రోజాపువ్వుల  సముద్రాలు పొంగే ప్రాంగణం. సంజ చీకట్ల మధ్యన మేఘమాలిక వంటి ఇల్లు.

తాకగలిగినవీ తాకలేనివీ  కలిసిపోయిన   పురాతనమైన శీతలత్వమేదో చుట్టుకుంది అతన్ని. ఒణికాడు. దీపాలు వెలి గించి న   పిలుపు.

చాలా పెద్ద లైబ్రరీ, ఆనుకుని ఉన్న స్టడీ. గోడల మీద నీటి రంగుల్లో కొండలూఅడవులూ  . మొజార్ట్  ..  మైసూరు చందనపు సువాసన.

కలలోకో, స్మృతిలోకో- నడిచి వచ్చిన అతను ఉండిపోయాడు.

Kadha-Saranga-2-300x268

అయిదారేళ్ళ కిందట , అనుకోకుండా –  గూగుల్ ఇమేజెస్ లో ఆమె ఫోటో నిలబెట్టేసింది అతన్ని. సెపియా లో ఆరుబయట తీసినది. స్టూడియో లో సాధించగల వెలుగు నీడలు లేకుండానే ఆమె స్పష్టంగా అక్కడ ఉంది –  పెదవుల్లో పువ్వులతనం , బుగ్గల నునుపు మీద ఆడుకుంటూ ఉన్న జుట్టు ,  కళ్ళలోంచి దూకుతున్న వెలుతురు .   పెద్ద రెసొల్యూషన్ ఉన్నదాన్ని వెతికి కాయితం మీద ముద్రించుకున్నాడు. స్నేహితులు ఏడిపించేవాళ్ళు- ఇప్పుడామె వయసు తెలుసా అని. నవ్వేసి ఊరుకునేవాడు.

ఆ తర్వాత ఆమె రాసినవి తెచ్చుకుని  చదవబోయాడు… లోపలికి ఎక్కలేదు – వివరాలు తెలిశాయంతే . ఇంగ్లీష్ లో రాసిన రెండో తరం భారతీయులలో ఆమెకి మంచి చోటు ఉంది. చదువు డూన్ స్కూల్ లో, ఉస్మానియాలో,  తర్వాత ఆక్స్ ఫర్డ్ లో. ఇంగ్లీష్ లో పి హెచ్ డి చేసీ ఉద్యోగం చేయలేదు..ఇష్టమైనవాటి గురించి, ఇష్టమొచ్చినట్లుగానే రాసింది. తల్లి ఫ్రెంచ్ నాట్యకారిణి , తండ్రి తెలుగు శాస్త్రవేత్త – అవివాహిత అని ఉంది వ్యక్తిగత వివరాలలో.

అతని వంటి , అతనితోటి  టెక్ విద్యార్థులకి  ఆమె జాన్రె చాలా దూరం .

ముద్దు గా ఇంటికి తెచ్చుకుందిగాని ఏమడగాలో ఇతన్ని ?

” ఏమి చదువుతూ ఉంటారు ? ”

సిగ్గు పడ్డాడు. అంత వెసులుబాటు ఎక్కడుందని ? ఎవరు నేర్పారని  ? సాహిత్యం చదవటమనేది ఇంకా గర్వించుకోవలసినదే గనుక అందరి లాగే చేతన్ భగత్ ని చదువుకున్నాడు.

అదే చెప్పాడు.

ఆమెచదివిందో , తెలుసుకుందో మరి  –  ఎక్కువగానే నవ్వింది. అతని ఉక్రోషానికి క్షమాపణ చెప్పుకుంటూ

” ఏమనుకోకండి, సాహిత్యమంటే అది కాదేమో అని… ”

” మరి ఏది ? ”

ఆమెకి ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మాటలకోసం తడుముకోనక్కర్లేకపోయింది. మంత్రనగరి ద్వారాలు ఒక్కొకటే తెరుచుకున్నాయి.

ఇంకొన్ని, మరికొన్ని – వారాంతాలు . సాహిత్యం లోంచీ ఒకానొక సాంగత్యం లోంచీ వచ్చే నిండైన   ఆకర్షణ.

rajahamsayuri pysar

” రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి పుస్తకాలని ముందే చదివెయ్యకూడదు…ఆ నిరాశ కబళించేస్తుంది. మొదటి యుద్ధం ముందు నుంచి వెనక్కి వెళ్ళి తిరిగి రావాలి  ”

ఆ రోజు దట్టంగా మబ్బు. హోరుగాలి .

వుదరింగ్ హైట్స్ లోంచి చదువుతోంది .

” అతను ప్రశాంతమైన ఆనందంలో విశ్రమించుదామని అడిగాడు…నేను తళతళమనే  వైభవం లో నృత్యం చేయాలనుకున్నాను. అతని స్వర్గం లో జీవం ఉండదని నేను- నా ఉత్సవం లో తల తిరుగుతుందని అతను. అతనిదైన చోట నాకు నిద్ర వస్తుందని నేను – నేను అడిగే చోట ఊపిరి ఆడదని అతను ”[1]

ఆగిపోయింది.

” నన్నెందుకు కాదన్నావు ? నీ గుండెని నువ్వెందుకు మోసగించుకున్నావు ??  ” అతను ఆగ్రహం తో అరిచాడు. [2]

” ఏమిటి ? ఏమన్నావు ?? ”

అతనికేమీ తోచలేదు.

” ఏమో. ఎందుకు అన్నాను అలా ? ఎక్కడివి ఆ మాటలు ? మీకు తెలుసా ?”

” ఈ నవలలోవే ”

” ఎలా..ఇదెలా సాధ్యం…నాకా పేరే తెలీదే ” – అతనికి నిజంగానే తల తిరిగింది.

కాసేపాగి పిలిచింది – ” మౌళీ  ! ”

‘ అతని పేరు కాదు . కాని బదులు పలకబోయాడు  . ” అది నా పేరు కాదే ? ”

” ఇప్పుడు కాదేమో ”

” ఎవర్ని నేను ? ”

” నాకు తెలిసింది  నువ్వు అవునో కాదో … తెలీదు . ఏమో ‘’

లేచి అద్దం లో చూసుకున్నాడు..    ” ఈ మొహం నాదేనా ? ” అయోమయపు నవ్వొచ్చింది అతనికి. బుగ్గలు సొట్టలు పడ్డాయి. ఆ పోలికల వెనక ఉన్నదాన్నేదో ఆమె చూసుకుంది.

” నువ్వే ” – అనుకుంది.  ” ఆలోచించు ” అని మాత్రం అంది.

ఆ తర్వాత ఆ వారమంతా  ప్రయత్నించాడు . ఊహించినట్లుగా, ఆశపడినట్లుగా – ఒక్కసారిగా స్పష్టమయిపోలేదు  . చెదిరిన సన్నని గాజుధూళి  – వేయి రంగుల్లో  , …  వెతికేకొద్దీ కమ్ముకునే వక్రీభవనం.

ఫోన్ చేశాడు, ఆన్సరింగ్   మోడ్  లోకి వెళ్ళింది. వారం మధ్యలో వెళ్ళి చూశాడు- ఇంటికి తాళం వేసి ఉంది.

ఆఖరికి, ఆ శుక్రవారం సాయంత్రం , ఎప్పట్లాగా – అతన్ని లోపలికి ఆహ్వానించింది. ఆమె మొహం లోంచి దేహం లోంచి నడకలోంచి నవ్వులోంచి – వార్ధ క్యం  నీహారికలాగా జారిపోతోంది అతనికి.

” ఎవరు నువ్వు ? ” అడిగాడు.

” 1924 లో పుట్టాను ..ఆశ్చర్యం లేదుగా నీకు ? ” లేదు. అతనికి తెలుసు.

” చంద్రమౌళి నాకు హైదరాబాద్ లో పరిచయం. నేను కోఠీ వుమెన్స్ కాలేజ్ లో. అతను ఉస్మానియాలో- లిటరేచర్ .   ఇద్దరం మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. . రోజూ మధ్యాహ్నాలు కాలేజ్ పక్కని ఐస్ పార్లర్ లో ఫలూడా , సాయంత్రాలు ఇరానీ కెఫె లలో టీ , బోలెడంత కవిత్వం  .  చల్లని, వెచ్చని   అందమైన కాలం అది.

చదువైపోతూ ఉండగా  వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళాడు.   నిజానికి నన్ను ఒప్పుకోకూడదు  , కాని కొడుకు కోసం రాజీ పడ్డారు – నేను మా అమ్మ లాగా కాకుండా నాన్నలాగే ఉన్నాను…అందుకు కూడా.   షరతులు పెట్టారు – నా తల్లి ఫ్రెంచ్ ఆవిడ అని ఎక్కడా ఎవరికీ తెలియకూడదు , నా తల్లిదండ్రులతో ఏ సంబంధాలూ పెట్టుకోకూడదు ,  ఆ పల్లెటూళ్ళో ఉండిపోవాలి….

అక్కడి ఆస్తులూ వ్యవహారాలూ వదిలేసి అతను ఇంకెక్కడికీ వెళ్ళే వీలే లేదు. .. వాళ్ళనీ ఏమీ అనలేం, పరువూ ప్రతిష్ఠా ఇంకేవో. మా అమ్మా నాన్నా నన్ను స్వేచ్ఛగా పెంచారు , ఎక్కడా సర్దుకొనే అవసరమే రానీకుండా.  నన్ను మొత్తం పోగొట్టుకుని అక్కడ ఉండిపోవటం చావుతో సమానమనిపించింది- తిరస్కరించాను.అతనికి ఆ అఘాతం తట్టుకోలేనిది అయింది. ఎంత బ్రతిమాలినా నేను లొంగలేదు. అబద్ధాలతో మా జీవితం మొదలు కాకూడదనుకున్నాను.

కొన్నాళ్ళు ఆగితే ఎవరి మనసులు ఎలా మారేవో…కాని అతను అజాద్ హింద్ ఫౌజ్ లో చేరాడు…కోపమో తెగింపో దేశం మీద భక్తో- తెలీదు. 1945 లో బర్మాలో వాళ్ళు ఓడిపోయారు , అతను బతకలేదు.

అప్పుడు తెలిసింది  – అతను నాకు ఎంత అవసరమో. లేచి నిలుచునేందుకు కూడా శక్తి చాలదనిపించింది. అలాగ రెండు మూడేళ్ళు. గాయం నుంచి రక్తం కారటం తగ్గింది. అమ్మా నాన్నల మొహాలు కనిపించాయి…. బ్రతికాను. తర్వాత ఆక్స్ ఫర్డ్ తీసుకుపోయారు.  మంచి ప్రొఫెసర్ దొరికారు…చదువుకున్నాను. చాలా రోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి- అతన్ని ఇంకెవరెవరిలోనో వెతికే ప్రయత్నం – కుదరలేదు…రాయటం మొదలు పెట్టాను . ఇన్నిఏళ్ళు గడిచాయి , ఎందుకు ఉన్నానో ..

నిన్ను  చూశాను .  తెలిసిపోయింది.

ఇంతకాలం ఎక్కడున్నావో ..వీరస్వర్గం లోనా ? ”

” అయి ఉండచ్చు ”  బుద్ధిగా ఒప్పుకున్నాడు అతను. ” ఏమీ గుర్తు రావటం లేదు … ప్రేమిస్తున్నానని తప్ప   ” – నిస్సహాయ మందహాసం .

” చాలులే. నేనంటే కొనసాగుతున్నాను…నువ్వు కొత్తగా మొదలయ్యావు కదా ” ఆమె కూడా నవ్వింది.

” ఇప్పుడేమిటి ఇక ? ”

” ఏముంటుంది…ఏ దేవతలో నన్ను క్షమించి కరుణించి ఇచ్చిన ఈ కొద్ది రోజులూ నావి , అంతే ”

కాదనిపించింది అతనికి .

” నా వయసు తొంభై ఒకటి . ఇంకెన్నాళ్ళుంటాను…  పెళ్ళి చేసుకో , చక్కటి  అమ్మాయిని చూసి. నాలాగా తొంభై ఏళ్ళు మాత్రం బతకద్దు…నన్ను అన్నాళ్ళు అక్కడ ఉంచుతారో లేదో… మళ్ళీ ఫలూడా తాగుతూ కలుసుకునేప్పుడు నాకు ఇరవై ,  నీకు డెబ్భై అయితే ఎలా మరి ? ‘’ .. వేళాకోళాన్ని   తెచ్చిపెట్టుకుంది …‘’  ఒకసారి అవకాశాన్ని పాడుచేసుకున్నాను…వచ్చేసారికి అంతా..సరిగ్గా..అవుతుందని ..” – మరొక కాలానికి ప్రవహిస్తూన్న మాటలు.

వ్యవధి ఎంత –  ఈ  ఉరవడి లో , స్వరానికీ స్వరానికీ మధ్య , మరణానికీ జన్మకీ మధ్య ?? పట్టు జారిపోతున్నప్పటి ఆక్రందన ఎవరికి పడుతుంది , ఒకర్నొకరు పారేసుకున్నాక ???

అతన్ని ఉన్మాదం ఆవేశించింది ఆ క్షణం – ” నువ్వు పోతే నేనూ వెంటనే పోవచ్చుగా…ఎంత సేపు అది, చేతిలో పని ”

” అలా వీలవదు అబ్బాయీ…దానికింకా పెద్ద శిక్షలుంటాయి ”

” రెండు హంసలు జన్మానికి ఒకేసారి జంట అవుతాయట కదా ” అతనికి తట్టింది.

” అవునులే  .. ఇవాళ మాత్రం నీది . నిన్నా రేపూ మనవి… అందాకా…ఆగచ్చు    ”

మూడో రోజున ఆమె కథ ముగిసింది.

ఆమెని సాగనంపి వచ్చిన  అతనిది  కూడా,  సహజంగానే.

*                *                    *                     *

 

  1. “He wanted all to lie in an ecstasy of peace; I wanted all to sparkle and dance in a glorious jubilee. I said his heaven would be only half alive; and he said mine would be drunk: I said I should fall asleep in his; and he said he could not breathe in mine.”
  2. ‘’ Why did you despise me  ?  Why did you betray your own heart, Cathy?’

 

[  Ray Bradbury కథ   ‘ The Swan ‘ (కొంత ) ఆధారంగా — జననాంతర సౌహృదాలను అంగీకరించిన పాశ్చాత్య రచయితలలో  Ray Bradbury  ప్రముఖులు. James Long రాసిన Ferney నవల కథా అటువంటిదే. ]

 

 

 

 

 

మూసిన కనురెప్పల్లో…

 
– జయశ్రీ నాయుడు
కొన్ని ప్రవాహాల్లో తడుస్తుంటాం
కొన్ని వెచ్చదనాలై కరిగిపోతాం
అడవిలా అగమ్యగోచరమైన కాలం లో
గాలివాటుగా పెనవేసుకున్న అడవి మల్లెలం
వెచ్చదనంలా ప్రవహిస్తూ
ఊపిరి పలకరింపులైనప్పుడల్లా
కాలం అనుభూతుల గలగలల్ని
కొన్ని హృదయపు శృతుల్లో బంధించుకుంటుంది
చిగుళ్ళు కనిపించని పరిచయాల మొక్కల్లో
పూయని పూల సొగసులు దాచుకున్న మనసు మోహంలా
ఏరుకొచ్చిన క్షణాల్ని పోగేసుకుని
ఆనందాల్ని అత్తరులా
మూసిన కనురెప్పల్లో అద్దుకుంటాము!
పరిమళాలే పాటలౌతూ
గడియల్లా ఘడియలో పెనవేసుకుంటాయి
అడుగుల జాడలు మిగలని దారిలా జీవితం వున్నా
నడకలో తోడుకూడిన గుండె చప్పుళ్ళు చాలవూ
శ్వాసగా ఆశని నింపుకుంటూ
ఎన్నో అక్షరాలుగా కలల్లో గుబాళించేందుకు!
*
jayasri

నిశ్శబ్ద కల్లోలం

 

   –  ఎలనాగ

 

మాట్లాడుకోకపోవడంలో ఉన్న సుఖం మాట్లాడుకున్నాక అర్థమై మాటలను దూరంగా నెట్టేస్తావది సరే కాని encapsulated దుఃఖంలో చిక్కుకుపోయి పొందే ఏకాంత నరకయాతనల పీడనం నుండి నీకు విముక్తి దొరికేదెలా? పరస్పర బంధాల దారాలను పటపటా తెంపేసుకుని పాతాళ ఉపరితలం మీద ముక్కలవ్వాలనే కోరికకు బందీ అయినవాడా! పుట్టుకురావాలి నువ్వు కొత్తగా, ఊపిరాడనితనం లోంచి స్వచ్ఛమైన గాలులు నిండిన బయటి లోకంలోకి. బోనుకు బానిస అయ్యాక ఇక వేరే దేనికీ అతుక్కోలేని హృదయమే మిగులుదల. తెలుసుకున్నాననుకుంటావు గొలుసుల్ని తెంచుకోలేనితనం లోని హాయిని, మనుషుల్ని కలుసుకోలేనితనం లోని మాధుర్యాన్ని. ఆజన్మాంత దుఃఖతాండవానికి రంగస్థలమైన హృదయవేదిక మీద అదేపనిగా తలను బాదుకోవటం ఆపి చీకట్ల తెరలను చీల్చుకుని రా బయటికి.

***

elanaga

తరగతిగది హత్య

-అరణ్య కృష్ణ
కొమ్మలకు ఊగాల్సిన ఈ పూలేంటి
ఇలా ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి?
 
మనలో చెట్టుతనం చచ్చిపోయిందిలే
****
 
పుస్తకాల బరువు మోయలేకో
ఊపిరి తీసుకోనివ్వకుండా వెంటాడే గడియారాన్ని తప్పించుకోలేకో
ప్రేమగా హత్తుకోవాల్సిన అమ్మనాన్నల ఆకాంక్షల కర్కశత్వాన్ని తట్టుకోలేకో
రక్తం జుర్రుకునే రాగింగ్ కి తలవంచలేకో   
దేహాల్ని కళేబరాలు చేసుకున్నారా చిట్టితల్లులూ?
 
తోటల్లేవ్ పాటల్లేవ్ అనుభూతుల పక్షుల్లేవ్
 
చదువొక పిశాచమై రక్తనాళాల్ని పేల్చేస్తుంటే
పుస్తకాలు భూతాలై గుండెకింది చెమ్మనంతా పీల్చేస్తుంటే
ఎదిగే మొక్కలాంటి జీవితం అస్తిపంజరమైపోతున్టే
నీళ్ళు పోయాల్సిన తోటమాలులందరూ
ద్రోహంతో వేళ్ళ మొదళ్ళలో విషం కుమ్మరిస్తుంటే
బతుకుమీద తేళ్ళు కొండేలతో పొడుస్తున్నట్లుంటుంది
****
 
చదువు వ్యాపారంలో
కొనుగోలుదారులే అమ్మకపు సరుకులు
బాల్య యవ్వనాలు తూకానికి అమ్ముడుపోతాయ్
ఇక్కడ పిల్లలందరూ పుట్టుకతోనే ఖైదీలు 
పసిపిల్లల వీపుల మీద
అక్షరాలు లాఠీచార్జీలై గద్దిస్తుంటాయి
స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళన్నె జైళ్ళే
టీచర్లు హెడ్మాస్టర్లు వార్డెన్లందరూ పోలీసులే
బార్బ్ డ్ వైర్ ఫెన్సింగ్ తో ఎత్తైన గోడల మధ్య
చదువెంత క్రూరమైందో హెచ్చరించే ఆల్సేషియన్ల పహారాలో
దివారాత్రాలు భయం నిర్బంధం
క్లాసు నుండి క్లాసుకి అస్తిమిత యాంత్రిక పరుగులు
వికసించే వయసుల సంక్లిష్ట మనోనేత్రం మీద భీతావహ దృశ్యాల ముద్ర
పల్లానికి పరవళ్ళు తొక్కే హార్మోన్ల అలజడిలో ఉద్రేక నైరాశ్యల వెల్లువ
 
శతృదేశం కాన్సంట్రేషన్ క్యాంపుల్లో
యుద్ధఖైదీలు మాతృదేశం మీద బెంగపడ్డట్లు
అర్ధరాత్రి అమ్మ గుర్తుకొస్తే నాన్న తలంపుకొస్తే
ఉలిక్కిపడి లేస్తే
చుట్టూ నిద్రలోనే పాఠాలు వల్లెవేస్తూ పలవరించే
సాటి పాక్షిక అనాధలు
 
పశువుల కొట్టంలో కట్టేసిన దూడకైనా
పక్కనే పాలుతాపే పొదుగుల్నిండిన తల్లులుంటాయి
మరిక్కడ ఏ సన్నని ఇనుపమంచం
అమ్మ కౌగిళ్ళను మంజూరు చేయగలదు?
పోలీసు లాఠీల్లా పంతుళ్ళ బెత్తాలు భయపెట్టినప్పుడు
ఏ వసారాల గోడలు నాన్న భుజాల్లా కాపు కాయగలవు?
నెలకొకసారి అమ్మానాన్న మునివేళ్ళ ములాఖత్ ల కోసం ఎదురుచూపు
వాళ్ళొస్తారు
ఎదురు చూసిన భుజం మీద తలవాల్చితే బండరాళ్ళ స్పర్శ!
****
 
నిఘంటువుల్లో కొత్తపదాన్ని చేర్చండి
ఎన్ కౌంటర్, లాకప్ డెత్ తో పాటు  
తరగతిగది హత్యని!
*
aranya

నా హీరో కోసం…

Naa hero ..

-కత్తి మహేష్

mahesh“హేయ్ విక్టర్ ! మెయిల్ చెక్ చేశావా?” అంటూ పక్క క్యూబికల్ నుంచీ మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ ఎగ్జయిటింగ్ గా అరిచినంత పని చేశాడు. మళ్ళీ ఒక్కసారి అటూ ఇటూ చూసి, తనవైపు చూస్తున్న చూపుల్ని పట్టించుకోనట్టు దర్జాగా నా దగ్గరకొచ్చి, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు…రెట్టిస్తూ.
“లేదే” అన్నాను క్యాజువల్గా. “ఎనీ థింగ్ స్పెషల్?” అంటూ పనిచేస్తున్న విండో క్లోజ్ చేసి మెయిల్ ఓపన్ చేశా. హెచ్.ఆర్ నుంచీ ఏదో అర్జంట్ అని మార్క్ చేసిన మెయిల్. వాస్ వైపు కొంచెం ఖంగారుగా చూసేసరికీ, భుజం మీద క్యాజువల్ గా చెయ్యేసి నవ్వుతూ, “నథింగ్ టు వర్రీ…జస్ట్ చెక్” అన్నాడు.

ఓపన్ చేస్తే, ఎదో ఈవెంట్ ఇన్విటేషన్. సినిమా విత్ టీం. కాదు కాదు, ఎంటైర్ ఆఫీస్.
“హౌ ఎగ్జయిటింగ్ కదా !” అన్నాడు పొంగిపోతూ.
“సినిమానా!” అన్నాను, పొంగివస్తున్న చికాకుని కనిపించనీకుండా.
“అలాంటి ఇలాంటి సినిమా కాదు బాస్. బాహుబలి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. టికెట్లు దొరక్క జనాలు కొట్టుకు ఛస్తున్నారు. మనకేమో కార్పొరేట్ బుకింగ్. ‘ఎస్’ అని మెయిల్ కొట్టెయ్. ఆరువందల రూపాయలకి అందరూ కొట్టేసుకుంటున్న కొత్త సినిమా టికెట్ తోపాటూ పాప్ కార్న్, కూల్ డ్రింక్ కాంప్లిమెంటరీ.” అని లొడలొడా ఒక రన్నింగ్ కామెంట్రీ చెప్పేసాడు.
అతని ఎక్సయిట్మెంటు చూస్తూ పక్కనున్న క్యుబికల్స్ లోవాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ, మెయిల్ పంపడంలో బిజీ అయిపోయారు. కీబోర్డ్ టకటకలు తప్ప మరేమీ వినిపించడం లేదు.
మిస్టర్ వాస్ నావైపు, నా కంప్యూటర్ స్క్రీన్ వైపు, నా కీబోర్డ్ వైపు మార్చిమార్చి అంతే క్యూరియస్గా చూస్తున్నాడు.

“నేను తెలుగు సినిమాలు చూడను వాస్ గారూ” అన్నాను మెల్లగా.
నేను ఎంత మెల్లగా అన్నా, నాకే పెద్దగా వినిపించింది. అప్పటివరకూ టక్కుటక్కు మన్న కీబోర్డులు ఒక్కసారిగా ఆగిపోవడం నాకు క్లియర్గా తెలుస్తోంది.
“వాట్!!!” హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటులా గుండెపట్టుకుంటూ వాస్ అంటుంటే, కొన్ని తలల క్యూరియస్గా క్యూబికల్స్ నుంచీ తాబేటి తలల్లా బయటికి వచ్చాయ్.
“ఇది తెలుగు సినిమా కాదండీ! ఇండియన్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా. అని నేను చెప్పడం కాదు. కరణ్ జొహర్ చెప్పాడు. అర్థమయ్యిందా?” అని కొంచెం సీరియస్ టోన్లో అన్నాడు వాస్.
“ఫరవాలేదు వాస్ గారూ. తెలుగులోనే సినిమా ఉంటుందిగా, తెలుగువాళ్ళే తీశారుగా. వద్దులెండి.” అని పొలైట్ గా అనేసి నా పని నేను చూసుకోవడానికి అటుతిరిగాను.
“స్ట్రేంజ్ మ్యాన్ యార్ ! బాహుబలికి రమ్మంటే, తెలుగు సినిమానే చూడనంటున్నాడు. వాటె పిటీ.” అనుకుంటూ వాస్ తన క్యాబిన్ వైపు నడుస్తూ గొణుక్కోవడం నాకు తెలుస్తూనే ఉంది. వెనకనుంచీ కొన్ని జతలకళ్ళు నా వీపుకి గుచ్చుకోవడం అనుభవంలోకి వస్తూనే ఉంది.

దాదాపు ఇరవై  సంవత్సరాలయ్యింది తెలుగు సినిమా చూసి.
ఒకప్పుడు…సినిమా అంటే పిచ్చి.

***

సినిమా అంటే ఒక పండగ.
వారంవారం వచ్చే పండగ.
ఇల్లంతా సినిమా పోస్టర్లే.
ఇల్లంటే ఇల్లుకాదు. షెడ్ లాంటిది. ఆస్ బెస్టాస్ రేకులతో కట్టిన చిన్న ఇల్లు.
అమ్మ. నేను. ఇళ్ళలో పాచిపని చేస్తే వచ్చే అంతో ఇంతతో సంసారం, నాచదువులూ.
పోస్టర్ పడిన రోజే తడిఆరని పోస్టర్లని జాగ్రత్తగా చించితీసుకొచ్చి ఇల్లంతా అంటిస్తే, ఏమీ అనకుండా నవ్వేది అమ్మ. రాత్రి నిద్రపట్టనప్పుడు కప్పువైపు చూస్తూ, కనిపించే చిరంజీవినీ, బాలకృష్ణనీ చూసి డిషుండిష్షుం అంటుంటే మెత్తగా కసురుకునేదీ అమ్మే. రాంజేంద్ర ప్రసాద్ పోస్టర్ చూసి ఫక్కున నాక్కూడా తెలీకుండా నేను ఏదో తెరమీది జ్ఞాపకాన్ని తెరలుతెరలుగా గుర్తుతెచ్చుకుని నవ్వితే, పిచ్చోడ్ని చూసినట్టు చూసేదీ అమ్మే.
అమ్మే నాకు లోకం.
సినిమా నాకు ప్రాణం.

***

ఏ సినిమా రిలీజ్ అయినా, రిలీజ్ రోజు హడావిడి మొత్తంనాదే.
ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమా అంటే ఏటమాంసం తెగే పెద్దపండగతో సమానం.
సిటీ నుంచీ వచ్చే కటౌట్, రిలీజ్ రోజు ముందరే థియేటర్ ముందు నిలబెడుతుంటే, నా జతోళ్ళతో కలిసి డప్పు కొట్టించేది నేనే. రాత్రంతా మేలుకుని రంగుకాయితాల సరాలు కట్టించేది నేనే. వారంరోజులు ఎండబెట్టిన టపాకాయలకి కావిలి నేనే. ఎగరెయ్యడానికి న్యూస్ పేర్లు చించి బస్తాల్లో నింపేదీ నేనే. జనాల్ని తోసుకుని టికెట్ తెచ్చేది నేనే.

షర్ట్ చిరిగినా, చెయ్యి ఒరుసుకుపోయి రక్తం కారినా, అప్పుడప్పుడూ పోలీసుల లాఠీలు వీపు విమానం మోత మోగినా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలోని ఆనందమే ఆనందం.

ఈలలూ గోలలూ థియేటర్ మారుమ్రోగిస్తుంటే. కర్పూర హారతులు హీరోలకు నీరాజనాలందిస్తుంటే. ఐదు,పది,పావలా బిళ్ళలూ ఉత్సాహంగా గాల్లో ఎగురుతుంటే. అప్పుడు సరిగ్గా తెరపై కనిపించని హీరోకూడా సూపర్ మ్యాన్ లాగే ఉండేవాడు. వినిపించని డైలాగ్ కూడా విజిల్ వేసే రేంజ్ లో అనిపించేలా ఉండేది. సినిమా చూడ్డంకాదు. అలా సినిమా చూడ్డమే, అసలైన సినిమా చూడటం.

సినిమా చూసేంత డబ్బుండేది కాదు.
మా క్లాసు లో ఉండే మిగతావాళ్లకి డబ్బుండేది.
సినిమా అంటే అభిమానమూ ఉండేది. కొందరు హీరోలంటే ప్రత్యేకమైన అభిమానమూ ఉండేది.
కొన్ని గ్రూపులు కొన్ని సినిమాలకే పొయ్యేవి. కానీ నేను మాత్రం అందరికీ కావాలి.నాకు అన్ని సినిమాలూ కావాలి. తెర మీద బొమ్మ పడితే చాలు, అన్ని కష్టాలూ తీరిపోయి, కొత్తలోకాలకు కనపడేవి.

***

ఒక రోజు ఉదయమే స్కూలు పిట్టగోడ మీద మీటింగ్ జరిగింది.
ఒకరి సినిమాకు మరొకరు పోని రెండు గ్రూపులూ కలిసి నన్ను పిలిపించాయి.
“చెప్పరా…నీకు చిరంజీవి ఇష్టమా ! బాలకృష్ణ ఇష్టమా?” అంటూ సూటిగా పాయింట్ కి వచ్చేశాడు. కొంచెం లావుగా, పొడవుగా ఉన్న ఒక కుర్రాడు. చాలా సార్లు, రంగుకాయితాలకూ, గమ్ముకూ డబ్బులిస్తుంటే చూసాను అతన్ని. అప్పుడప్పుడూ నోట్లిచ్చి చిల్లర తెమ్మనేదీ అతనే.
“ఇద్దరూ ఇష్టమే అన్నా..వాళ్లతో పాటూ రాజేంద్ర ప్రసాద్ కూడా” అంటూ నసిగాను.
పెద్దగా నవ్వుతూ, ఆ మాట అడిగినోడు వాళ్ళ గ్రూప్ వైపుకి తిరిగి, “రాజేంద్ర ప్రసాద్ ని కలుపుతాడేందిరా వీడూ ! ” అంటూ పెద్దగా నవ్వి, నావైపు తిరిగి, “ఇష్యూ అది కాదు. బాలకృష్ణనా…చిరంజీవా!” రెట్టించి తను.
“ఇద్దరూ ఇష్టమే” అని బింకంగా నేను.

chinnakatha
“నీకిట్లా చెప్తే అర్థం కాదుగానీ, చూడూ…బాలకృష్ణ మావోడు. చిరంజీవి వాళ్ళోడు. ఈరోజు నువ్వు ఎవరి వైపు వెళ్తే వాళ్ళ సినిమాకే పనిచెయ్యాల. వాళ్ల సినిమానే చూడాల. అర్థమయ్యిందా.” అంటూ గోడ మీద కూర్చున్న మరో గ్రూపుకేసి చూశాడు. ‘అంతేకదా!’ అన్నట్టు అక్కడి తలలు ఊగాయి.
నాకు ఏమీ అర్థంకాక, మౌనంగా చూస్తూ ఉండిపోయాను.
నన్ను దగ్గరగా లాక్కుని, తీక్షణంగా చూస్తూ… “చెప్పు. చిరంజీవా…బాలకృష్ణనా!”
“అందరి సినిమా కావాలన్నా” అన్నాను బలహీనంగా.
ఇంతలో ఆ గ్రూప్ నుంచీ ఒకరు ఒక్క గెంతుతో నాదగ్గరకొచ్చి, “ఏయ్, డిసైడ్ చేసుకోమంటే పోజుకొడతావేందిబే? అయినా, చిరంజీవి, బాలకృష్ణా ఇద్దరూ మీవోళ్ళు కాదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొమ్మంటే పొగరారా నీకు!” అని చిరాగ్గా నన్ను చూసి, అప్పటి వరకూ నన్ను బెదిరించిన కుర్రాడితో, “చూడు సాగర్. వీడు మీవోడూ కాదు. మావోడూ కాదు. ఇద్దరికీ పనికొస్తాడు అంతే. వీడు కాకపోతే ఇంకొకడు. వదిలెయ్.” అని మొత్తం గ్రూప్ ని అక్కడ్నించీ తీసుకెళ్ళిపోయాడు.

సాగర్ నావైపు తీక్షణంగా చూస్తూ, “ఇంకెప్పుడైనా థియేటర్ దగ్గర కనిపించావో…” అంటూ నన్ను కిందకి తోసేసి గ్రూప్ వైపు వెళ్ళి పిట్టగోడ మీద కూచున్నాడు. నేను ఒంటరిగా ఇటువైపు మిగిలాను. నేల మీద నుంచీ లేస్తూ, మట్టిని విదుల్చుకుంటూ, వాళ్లవోళ్ళేమిటీ, వీళ్ళవోళ్ళేమిటో నాకు అర్థంకాక గుండెల మీద చెయ్యిపెడితే, సిలువ తగిలింది. వాళ్ళూ వీళ్ళూ మాట్లాడింది కులమని అప్పుడే అర్థమయ్యింది.

గుండెల్లో భగ్గుమన్న బాధ. ఆడుతున్న సినిమా మధ్యలో కార్బన్ సెగ ఎక్కువై, రీలు కాలిపోతున్న వాసన. తెరమీది మంటలు తెరనే కాల్చేస్తున్నట్టు భ్రమ. కలలో వచ్చినట్టు, ఇంటికొచ్చేసా. చుట్టూ ఉన్న పోస్టర్లలోని గన్నులు, నామీదే ఎక్కుపెట్టినట్టు ఫీలింగ్. ఒంటికాలి మీద ఎగిరిన హీరో, నా మీదకే దూకుతున్నట్టు భయం. వెక్కిరిస్తున్నట్టు. వెర్రిగా చూస్తున్నట్టు. కళ్ళు మసకబారి, పోస్టర్లోని ఫోజులన్నీ కెలికేసినట్టు భయంకరంగా…చాలా భయంకరంగా.

భయం. ఉన్మాదం. కోపం. ఉక్రోషం. ఒక్కో పోస్టర్నీ బలంగా లాగేస్తుంటే, అప్పటిదాకా ఆస్ బెస్టస్ రేకులమీద కనిపించకుండా ఉన్న ఎన్నో బొక్కలు ప్రత్యక్షం అవుతున్నాయి. వెయ్యి ముక్కలుగా చించేస్తుంటే, మనసు వంద ముక్కలుగా విడిపోయింది.

పడిపోయాను. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి స్పృహ లేకుండా నిద్రపోయాను. లేచేసరికీ మూడవుతోంది. కాళ్ళీడ్చుకుంటూ, ఇల్లూడ్చేశాను. సినిమా ఆనవళ్ళు లేకుండా తుడిచేశాను. ఏంచెయ్యాలో తోచక మళ్ళీ ఊర్లోకి వచ్చాను.

***

సుజాతా టాకీసులో, ఏదో సినిమా ఆడుతోంది.
డబ్బింగ్ సినిమా. సగం సినిమా అయిపోయిందేమో. పెద్దపెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయి.
జేబులో పావలా ఉంది. గేటు దగ్గర సౌదులన్న బీడీ తాగుతున్నాడు.
చేతిలో పావలా పెట్టి నవ్వితే, చల్లగా గేటు తీశాడు. మెల్లగా లోపలికి నేను.
తెర మీద హీరో అర్జున్ కనిపిస్తున్నాడు. సూట్ కేస్ తీసుకుని రైల్వేస్టేషన్ దగ్గరికి హడావిడిగా వస్తున్నాడు. వెనకాలే హీరోయిన్. రోజా సినిమాలో చేసిన అమ్మాయి. హఠాత్తుగా పాట మొదలయ్యింది. విచిత్రమైన బీటు. ఒక చిన్నపిల్లాడెవడో బుల్లిబుల్లి అడుగులు వేస్తూ, కాస్తపాడేసరికీ మైకేల్ జాక్సన్ లాంటి గొంతేసుకుని, ఒకతను గెంతుతూ తెరమీద ప్రత్యక్షం అయ్యాడు. అతని మెడలో సిలువ, చెవిపోగులకున్న సిలువా నా కళ్లను జిగేలుమనిపించాయి.
ఏదో ఆలోచన వచ్చింది. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూశాను. ఎవరూ లేరు.
ముందున్న సీట్లోవాళ్ళని బలంగా తడుతూ అడిగాను, “ఎవరతను?”
“ప్రభుదేవా” అని సమాధానం.
“ప్రభు…దేవా పేరు. మెడలో సిలువ. చిరంజీవి-బాలకృష్ణకన్నా మంచి డ్యాన్సర్. నా హీరో…మావాళ్ల హీరో” అనుకుంటూ, స్పీడుగా బయటొచ్చి, డిస్ల్పేలో ఉన్న ఒక ఫోటో కార్డ్ రహస్యంగా దొంగిలించి, సైదులికి తెలీకుండా గేటు దాటి రయ్యిమని స్కూల్ దగ్గరికి వచ్చాను.

పిట్టగోడ దగ్గర తన గ్యాంగ్ తో సాగర్ ఇంకా కూర్చునే ఉన్నాడు. గర్వంగా అడుగులేసుకుంటూ వెళ్ళాను. “ఏమిటన్నట్టు” చిరాగ్గా ముఖం పెట్టాడు.
చేతిలో ఉన్న ప్రభుదేవా ఫోటో కార్డ్ దగ్గరగా పెట్టి “ఇదిగో మా హీరో..ప్రభుదేవా” అన్నాను.
ఫోటోనీ నన్నూ మార్చిమార్చి చూస్తూ, కసిగా నవ్వి, “పేరు ప్రభుదేవానే, డ్యాన్స్ మాస్టర్ సుందరం కొడుకు. బహుశా బ్రాహ్మలై ఉంటారు. మీ వాళ్ళు కాదు.” అని నలిపి నా ముఖాన కొట్టాడు.

ఆ తరువాత నాకు ఏమీ వినిపించలేదు. అప్పటి నుంచీ నాకు తెలుగు సినిమా కూడా కనిపించలేదు.

****
టైం ఐదయ్యింది.
కంప్యూటర్ క్లోజ్ చేసి బయటకొస్తుంటే, క్యాంటిన్ దగ్గర మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ కనిపించాడు. కళ్ళు కలవగానే ఏదో సైగ చేస్తూ ఆగిపోయి, బై అన్నట్టు చెయ్యి ఊపాడు. వెళుతుంటే, నాకు వినిపిస్తూనే ఉంది, పక్కనున్న వాళ్లతో “హి ఈజ్ నాట్ కమింగ్ టు బాహుబలి యార్…హౌ సాడ్ ! హి ఈజ్ మిస్సింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్” అనడం.
కిందకొచ్చేసరికీ, రిసెప్షనిస్ట్ “సర్… మార్నింగ్ పేపర్ అడిగారు కదసర్. ఇదిగోండి.” అంటూ పొద్దున అడిగిన పేపర్ ఇప్పుడిచ్చింది. చేతిలో పట్టుకుని కార్ ఎక్కాను. పక్క సీట్లో పేపర్ పడేసి, కార్ స్టార్ట్ చేసేసరికీ, న్యుస్ పేపర్ పేజీలు విడిపడ్డాయి.
ఒక న్యూస్ ఐటం ఆకర్షించింది.
“బాహుబలి రిలీజ్ సందర్భంగా భీమవరంలో రాజుల సందండి – పర్మిషన్ కి పోలీసుల నిరాకరణ”
బాధగా అనిపించింది.
సినిమాని సినిమాగా చూశాను ఒకప్పుడు.
ఇప్పుడు కులంగా తప్ప మరేరకంగానూ చూడలేకపోతున్నాను.
మాకులపోడు కూడా టాప్ హీరో అయితేతప్ప తెలుగు సినిమా చూడకూడదనుకున్నాను.
నా హీరో కోసం…ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను.
తప్పు నాదా ! సినిమాదా! ! లేక, ఇలా సినిమాని కులంగా మార్చేసిన కులాలదా !!!
ఒక లాంగ్ డ్రైవ్ తప్పదనిపించింది.
కార్ ని ముందుకు పోనించాను.

*

మట్టి పరిమళం ఎగజిమ్మిన కధలు

 

 

రమాసుందరి

రమాసుందరి

కొంతమంది వ్యక్తులు ఉంటారు. స్వాప్నిక సుషుప్త అవస్థలో మనకు అత్యంత చేరువగా ఉంటారు. స్నేహంగా స్పర్శిస్తారు. ప్రేమగా సంభాషిస్తారు. అమితంగా స్పందిస్తారు. మన ప్రాచీన స్మృతిలో పోగొట్టుకొన్నదాన్నేదో గుర్తు చేస్తారు. చెయ్యి పట్టుకొని అందమైన తోటల్లోకి, అద్భుతమైన సమాజంలోకి మనల్ని విహంగ విహారం చేయిస్తారు.  అలాంటి వ్యక్తులు కధలలో పాత్రలుగా మారితే నిజ జీవితంలో మనసు మారుమూలల్లోకి వెళ్ళి పేరుకొని పోయిన అశుచిని శుద్ధి చేస్తారు. ఆ పాత్రలే ఒక సైన్యంగా మారి మనిషిలో దాగున్నశత్రువును హతమారుస్తాయి. అలాంటి  పాత్రలు ఉన్న కధలు మనిషి పరిమళంతో, స్వచ్ఛమైన స్నేహ పరిమళంతో, కులరహిత సమాజ పరిమళంతో, కల్తీలేని ప్రేమ పరిమళంతో, నికార్సైన అనుబంధాల పరిమళంతో, బలమైన జ్ఞాపకాల పరిమళంతో, అడవి పరిమళంతో, త్యాగాల పరిమళంతో, సహజీవన సౌందర్య పరిమళంతో, సమసమాజాన్ని స్వప్నించిన  యువతీ యువకుల ఆశల పరిమళంతో .. యిన్ని పరిమళాలు కలగలిసిన  ‘జాజి పూల పరిమళం’తో మనసంతా సుగంధం చేసి సంతోష పెడతాయి.

‘జాజిపూల పరిమళం’ పుస్తకం (కధలు) ఎందుకు చదవాలి అంటే నేను చాలా కారణాలు చెబుతాను. అవన్నీ నా యిష్టానికి, తత్వానికి సంబంధించినవి. వాటితో సంబంధం లేకుండా  ‘కధను ఎంత సులభంగా చెప్పవచ్చో’, ‘సంభాషణలు ఎంత సహజంగా రాయవచ్చో’, ‘కధనాన్ని ఎంత నిరలంకారంగా నడిపించవచ్చో’ ఈ కధల ద్వారా  నేర్చుకోవచ్చు. వీటన్నిటిని మించి పుస్తకం ద్వారా అబ్బే సంస్కారం ఒకటి ఉంటుంది. దాన్ని ఈ కధల ద్వారా పుష్కలంగా అందుకోవచ్చు. సమాజాన్ని అపోసన పట్టిన వ్యక్తుల నుండి జిజ్ఞాస గలిగిన వ్యక్తులు అందుకొనే ఎరుక  అద్భుతమైన ఆహ్లాదాన్నిఇస్తుంది. మనసు తెరిచి మంచిని ఆహ్వానించే వాళ్ళు ఆ ఆహ్లాదాన్ని అమితంగా పొందవచ్చు. దాదాపు నలభై కధలు ఉన్న ఈ పుస్తకంలో కొన్ని కధలు పురుషాధిక్యత, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక కుటుంబిక దొంతరలలో స్త్రీలపై జరిగే అణచివేతలను  మైక్రో లెవెల్ లో చర్చించాయి. అయితే ఈ పుస్తకంలో సగం కధల్లోని కధా వాతావరణం పాఠకులకు కొత్తగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా కొత్తవే. మనుషుల మధ్య సంబంధాలకూ, అనుబంధాలకూ, త్యాగాలకూ, సంతోషాలకూ కొత్త అర్ధం ఈ కధలు తెలియచేస్తాయి. ఈ కధల్లో ప్రధాన పాత్రలు స్త్రీలే. చైతన్యవంతులైన స్త్రీలు సమాజాన్ని అర్ధం చేసుకొనే క్రమాన్ని అద్భుతంగా రాశారు షహీదా.

కులం మనిషి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ‘దేవుడే అందర్నీ చేశాడు కాబట్టి మనుషులందరూ సమానమే’ అనే ప్రాధమిక భావన నుండి ‘కులం తోటివారి నుండి మనల్నివేరు చేస్తుంది’ అనే స్పృహ పిల్లలకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పరిణితి చెందినట్లు. అగ్రకుల లాభ ఫలాలు అనుభవం అయ్యే పిల్లల్లో కూడా కులం లేని జీవితంలో ఉన్న మాధుర్యం, సహజత్వం అనుభవం అయ్యాక యిక దాన్ని ప్రతిఘటించటం అనివార్య చర్య అవుతుంది. ఆ ప్రతిఘటన ఒక్కోసారి నిరసనగా  ‘మీరు! మేము??’ కధలో శ్రీవిద్య లాగా బాత్రూమ్ లో నీళ్ళు పారబోయటం దగ్గర కనిపిస్తుంది.  ఇంకోసారి ‘విభజన రేఖలు’ కధలో శిరీషలాగా తనకు కూడా వీరన్నలాగే ఆకులోనే అన్నం పెట్టమని భీష్మించిన ధిక్కారంగా మారుతుంది. కులం గురించి ఇంకా గాఢంగా చర్చించిన కధ ‘ఒకటీ, ఒకటీ ఎప్పుడూ రెండేనా?’  సమాజపు కట్టుబాట్లను ఎదిరించిన ‘సక్సెస్ ఫుల్ దళిత యువకుడు’, ‘ప్రోగ్రెసివ్ అగ్రకుల యువతు’ ల మధ్య చివురించిన ప్రేమ వారిద్దరికి సంబంధించినదైనా పెళ్లి మాత్రం సమాజానికి సంబంధించిందనే అవగాహన ఈ కధ నేర్పుతుంది. ‘చదువుకొని పైకి వచ్చిన దళిత యువకులను అగ్రవర్ణ యువతులు ఎగరేసుకొని పోతే మా దళిత ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా’ అనే ప్రశ్నకు చలించి పోయిన మౌనికకు ‘కులాంతర వివాహాలు చేసుకొని కుటుంబానికి పరిమితం అయితే యిలాంటి ప్రశ్నలే వస్తాయి. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు కృషి చేస్తేనే ఆ వివాహానికి నిజమైన అర్ధం ఉంటుంది.’ అని అంతర్లీనంగా కధ యిచ్చిన జవాబు ఎంత సముచితమైనది! ఈ జవాబు విప్లవోద్యమంలో కలిసి పని చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకొంటున్న అనేకమంది యువతీ యువకులకు చక్కటి వివాహ సందేశం. గుంపుగా కలిసి తిరిగే చిన్న చేపలు అన్నీ కలిసి ఒక పెద్ద చేపను స్ఫురింప చేస్తాయనే అనే అర్ధవంతమైన ప్రతీకతో కధ ముగుస్తుంది.

ఈ పుస్తకంలో చక్కటి ప్రేమ కధలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమలు రూపం, డబ్బు, హోదా, కెరీర్ లాంటి కృతకపు విలువలను మోసే వ్యక్తులను కాకుండ వస్త్ర, అలంకార రహితమైన వ్యక్తి నికార్సైన ఆత్మలను ప్రేమిస్తాయి. వ్యక్తులతో అనుసంధానమైన సామాజిక బాధ్యతలను ప్రేమిస్తాయి. వ్యక్తి ప్రేమ నుండి సామాజిక ప్రేమకు అవి ప్రవహిస్తాయి. అందుకు సంబంధించిన షరతులకు తలవొగ్గక పోతే ఆ ప్రేమను తిరస్కరిస్తాయి. కొంకణీ  వెళ్ళే రైలులో తారసపడిన ఒకప్పటి ప్రియురాలు ‘సుజీ’ చిక్కిపోయి, కళ్ళు గుంటలు పడి, వెంట్రుకలు నెరిసి పోయి ఉన్నా ఆలోచనలలో యవ్వనంగానే ఉంది. ఆరెంజ్డ్ మారేజ్ చేసుకొన్న ఆమె ఒకప్పటి ప్రియుడు మందుల కంపెనీలో పని చేస్తుంటే ఆమె ఒక మతోన్మాద వ్యతిరేక సంస్థలో పూర్తి కాలం పని చేస్తుంది. ఇద్దరూ గతాన్ని వడబోసుకొంటారు. ఈ కధలో బాబ్రీ మసీదు కూడా ఒక పాత్రే. ప్రేమికులను విడదీసిన దుష్ట పాత్ర. ఆ దుష్టత్వం పరోక్షంగా వాళ్ళిద్దరినీ విడదీసింది. ‘నేను లేక పొతే తను ఉండలేదనే అనుకొన్నాను అన్నాళ్ళూ …. కానీ నాలాంటి బలహీనుడికే తన అవసరం ఎక్కువుందని అర్ధం కావడానికి ఎంత కాలం పట్టిందో … తనదేముంది తన విలువలతో బతికేస్తుంది …’ అనుకొంటాడతను. ‘పైకి ఎంత అభ్యుదయంగా ఉన్నా నీలో తొంగి చూసిన ఆ హిందుత్వవాదిని ఆ రోజు చూసి తట్టుకోలేకపోయాను… నిన్నే కాదు ఎవర్నీ, దేన్నీ సగం సగం ప్రేమించడం రాలేదురా, ఇప్పటికీ అంతే …’ చెప్పుకొంటుందామె. అయితే ఆమె ప్రేమద్వారా పొందిన ఉన్నత సంస్కారం అతనిలో నిగూఢంగా దాగి ఉంది. గుజరాత్ అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డను తెచ్చి సాక్కుంటాడు. ఆ విషయం అప్పటికే తెలుసుకొన్న సుజీ అతని ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళింటికి అతిధిగా వెళ్లడానికి ఒప్పుకోవటంతో కధ ముగుస్తుంది.

అలాంటిదే ఇంకో కధ  ‘విప్లవంలో ఓ ప్రేమ కధ’. ‘అతను నక్సలైట్లలో కలుస్తాడు నాకు తెలుసు. బతుకు పాడు చేసుకోకు’ ఎస్సై హితబోధ. ‘అతనలా ఉంటాడనే నేను యిష్టపడింది. అందుకోసం వదిలేయమంటాడేంటి?’ ఆమె విస్మయం. ఆమె విశ్వాసం ఆమె ప్రేమ మీద మాత్రమే కాదు. అతని ప్రిన్సిపుల్స్ మీదా, జీవితం పట్ల అతనికి గల దృక్పధం మీద, అన్యాయాన్ని ఎదిరించి దేనికైనా సిద్దపడే అతని స్వభావం మీద. ఇతరుల కోసం త్యాగం చేసే తత్వం, నిస్వార్ధం లేకుండా అతను లేడు. అతని పై శ్యామల ప్రేమా ఉండదు. విప్లవానికి వారిద్దరూ ఉండరు. ప్రేమ అనే మాటను ధైర్యంగా ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది శ్యామల. ఆ నమ్మకంతోనే అడివికి వచ్చి అమరురాలు అవుతుంది.

మదర్ థెరేసా మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకొనే వాళ్ళకీ, మదర్ థెరేసాల అవసరమే లేని సమాజం రావాలని కోరుకొనేవాళ్ళకు ఉన్న తేడా ఎంత? సమాజాన్ని యిలాగే ఉంచి ఉద్ధరిద్దామని అనుకొనేవాళ్ళకూ, దాన్ని సమూలంగా మార్చివేయాలని కోరుకొనే వాళ్ళకూ ఉన్నంత తేడా. బడుల్లో సోషల్ వర్క్ క్లాసుల గురించి క్రిటికల్ గా రాసిన కధ ‘సోషల్ వర్కూ – సోషలిజమూ’. ఇంచుమించు ఇలాంటి సందేశాన్నే మోసుకు వచ్చిన కధ ‘జ్ఞాపిక’.  ‘లోపలి’ నుండి వచ్చిన ఒక మహిళా రోగి నర్మద బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడు శంకర్. కొద్దిగా కోలుకొన్నాక ఆసుపత్రి నుండి యింటికి తీసుకొని వెళతాడు. ఆమెతో సాహిత్యం, సినిమాల గురించిన అభిప్రాయాలు పంచుకొంటాడు. కలిసి వండుకొని కబుర్లు చెప్పుకొంటారు. ఆమె ప్రేమ కవిత్వాన్ని బిడియంగా చదువుతుంటే విని ఆస్వాదిస్తాడు. కొనే ప్రతి వస్తువు దగ్గర ఆమె ‘ప్రజల డబ్బు’ అంటూ జాగ్రత్త పడుతుంటే అబ్బురపడతాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఒక గొప్ప అనుభవంగా, పాఠంగా దోసిలి పడతాడు. ఆమె ‘లోపలికి’  వెళ్ళి పోయే రోజు దగ్గర పడుతుంది. దిగులుగా అలిగి కూర్చోంటాడు. ఎన్ని రోజులుగానో అతనిని వేధిస్తున్న ప్రశ్నకు జవాబు చెప్పటానికి ఆమె సంసిద్ధం అవుతుంది ఆమె అప్పుడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె దాచుకొన్న భరిణా, అందులో వంద రూపాయల నోటూ ఎవరి జ్ఞాపికలు? ప్రేమించి ఆమెతో అడవి దాకా అడుగులు వేసిన ఆమె భర్తవనే అనుకొంటాడు. కానీ ఆమె వెళుతూ చెప్పిన చివరి పాఠం అన్నిటి కంటే అమూల్యమైనది. డబ్బే లేని సమాజం రావాలని కోరుకొనే వాళ్ళు డబ్బు దాచుకోనవసం లేదు. ఆ నోటు ‘తీసుకోవటమే తప్ప యివ్వటం చేతకాని’ ఆమె చిన్నప్పటి పనిమనిషి యిచ్చినది. పార్టీ తనలాంటి పేద ప్రజల విముక్తి  కోసం పనిచేస్తుందనే నమ్మకంతో పంపిన పార్టీ చందా అది. అలాంటి లక్షలాది విప్లవాభిమానుల ఆశలనూ, కోరికలనూ మనసులో మోసుకొని నర్మద ‘లోపలికి’ వెళ్ళి పోతుంది.

పార్టీలు, ప్రజా సంఘాలు ఎలా నడవాలి? ఎవరి కోసమైతే పని చేస్తున్నామో ఆ  పేద ప్రజల మీదే ఆర్ధికంగా ఆధారపడితే వాళ్ళు ఏమి యివ్వగలరు? అసలు వాళ్ళను ఎలా అడగగలం? ఇలాంటి సందేహాలు విప్లవోద్యమంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో వస్తాయి. ఆ సందేహాలకు చెంప చెళ్లుమనే సమాధానం ‘అర్ధ శేరు ధాన్యం’ కధ చెబుతుంది. సంఘం కోసం బియ్యం, డబ్బులు అడుగుతూ పేద దళిత వాడకు వెళతారు. ఎవరికి తోచింది వాళ్ళు కాదనకుండా యిస్తారు. దరిద్రం, అనారోగ్యం, పోషహాకార లోపం పిల్లల్లో, మహిళల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చివరి ఇంట్లో భర్త వలస పోయి ఉంటాడు. భార్య జ్వరం వచ్చిన కొడుకుకు గుడ్డ కూడా కప్పలేని దారిద్యంతో ఉంటుంది. ఆమెను మంచి నీళ్ళు మాత్రం అడిగి పోయించుకొని తాగి తిరిగి రాబోతారు. ‘అందరిండ్లలో అడిగిన్రు .. మమ్మల్నడుగుత  లేరన్నా?’ ఆమె ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ‘సగం శేరు దంచిస్తా’ అని వాళ్ళను కూసోబెట్టి అక్క వేస్తున్న ఒక్కొక్క పోటు వాళ్ళ సందేహాలను పటాపంచలు చేస్తుంది. ఎంత ఆర్ధ్రమైన కనువిప్పు! పేద వాడల్లో విరాళాలు వసూలు చేయటం అంటే వాళ్ళతో బంధాన్ని గట్టి పరుచుకోవటమే కదా.

రహస్యోద్యమాన్ని వెన్నుతో కాచిన వాళ్ళు విప్లవ సానుభూతిపరులు. కుటుంబాలకు కుటుంబాలు, తరాలకు తరాలు ఉద్యమాలకు  నిండు హృదయంతో సహాయ సహకారాలు అందించటం వలనే అవి మనగలిగాయి. ఏళ్ళ క్రితం అందించిన ఆయుధాలను భద్రంగా దాచి ఇవ్వాల్సిన వాళ్ళకు యివ్వాల్సిన పద్దతిలో అందచేయటం చేయటంలో పార్టీకి గుర్తు చేసిన కర్తవ్యం ‘మళ్ళీ మొదలు పెట్టమని’. ఆ సమూహాలు ఎన్ని రోజులు పార్టీకి భౌతికంగా దూరంగా వున్నా మానసికంగా అక్కడే ఉంటాయి. ఆ కార్మికవర్గ మనస్తత్వాన్ని కళ్ళకద్దుకొని ఆ కర్తవ్యాన్ని తలకెత్తుకోవాలనే చెప్పే కధ ‘మొదలు’.

ఎన్ని కధలు! ఎంత జీవితం! ఎంత ఘర్షణ! ఎన్ని పోరాటాలు! ఎన్ని మథనాలు! ఎన్ని సందేశాలు! ఇవన్నీ ఎంత సహజంగా రాయగలిగారు షహీద! నీటిలో చేపలాగే ప్రజలలో మమేకమైన వారికే కదా ఇంత బతుకు తెలిసేది! ప్రజల ఆకాంక్ష, వాంఛ, భాష, నడక, నడత తెలిసిన వాళ్ళు మాత్రమే కదా ఇంత బాగా వ్యక్తీకరించగలిగేది!

*

ఉపాయశాలి

 

 

మధురవాణి: ఒక వేశ్య

రామప్పంతులు: విటుడు

 

రామ:   నేనే చిన్నతనంలో యింగిలీషు చదివి వుంటే జడ్జీల యదట ఫెళఫెల లాడించుదును. నాకు వాక్స్థానమందు బృహస్పతి వున్నాడు. అందుచాతనే యింగిలీషు రాకపోయినా నాప్రభ యిలా వెలుగుతూంది.

మధు:  మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.

రామ:   నేనా శునకాన్ని?

మధు:  హాస్యానికన్న మాటల్లా నిజవనుకుంటారేవి?

రామ:   హాస్యానికా అన్నావు?

మధు:  మరి మీతో హాస్యవాడకపోతే, వూరందరితోటి హాస్యవాడమన్నారా యేవిటి?

రామ:   అందరితో హాస్యవాడితే యరగవా?

మధు:  అంచేతనే కుక్కన్నా, పందన్నా మిమ్మల్నే అనాలి గాని, మరొకర్ని అనకూడదే! మిమ్మల్ని యేవనడానికైనా నాకు హక్కు వుంది. యిక మీ మాటకారితనం నాతో చెప్పేదేవిటి? మీ మాటలకు భ్రమసే కదా మీ మాయలలో పడ్డాను.

రామ:   నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా?

మధు:  మీ అందానికి మేము తెనుగువాళ్ళము చాలమో!? యింగిలీషంటే జ్ఞాపకవొచ్చింది. గిరీశం గారు మాట్లాడితే దొరలు మాట్లాడినట్టు వుంటుందిట.

రామ:   అటా, ఇటా! నీకేం తెలుసును, వాడు వట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలు గానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు.

మధు:  అదేమో మీకే తెలియాలి. గాని, గిరీశంగారు లుబ్దావధాన్లుగారి తమ్ములటా? చెప్పారు కాదు?

రామ:   నీమనసు వాడి మీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు? కాకపోతే నీకెందుకు?

మధు:  మతిలేనిమాటా, సుతిలేనిపాటా అని!

రామ:   నాకా మతిలేదంటావు?

మధు:  మీకు మతిలేకపోవడవేం, నాకే!

రామ:   యెంచేత?

మధు:  నుదుట్ను వ్రాయడం చేత.

రామ:   యేవని రాశుంది?

మధు:  విచారం వ్రాసి వుంది.

రామ:   యెందుకు విచారం?

మధు:  గిరీశం గారు లుబ్దావధాన్లు గారి తమ్ములైతే, పెళ్ళికి వస్తారు; పెళ్ళికి వస్తే, యేదైనా చిలిపిజట్టీ పెట్టి, మీమీద చేయిజేసుకుంటారేమో అని విచారం.

రామ:   అవును, బాగా జ్ఞాపకం చేశావు. గాని, డబ్బు ఖర్చైపోతుందని అవుధాన్లు బంధువుల నెవళ్ళనీ పిలవడు.

మధు:  గిరీశం గారు పిలవకపోయినా వస్తారు.

రామ:   నువ్వు గాని రమ్మన్నావా యేమిటి?

మధు:  మీకంటే నీతి లేదు గాని, నాకు లేదా?

రామ:   మరి వాడొస్తాడని నీకెలా తెలిసింది?

మధు:  పెళ్ళికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్ళింట పెళ్లి సప్లై అంతా ఆయనే చేస్తున్నారట. అంచేత రాకతీరదని తలుస్తాను.

రామ:   వాడు రావడమే తటస్థిస్తే యేవిటి సాధనం?

మధు:  ఆడదాన్ని నన్నా అడుగుతారు?

రామ:   ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారం అంటే చెప్పు. యెత్తుకి యెత్తు యింద్రజాలంలా యెత్తుతాను. చెయిముట్టు సరసవంటే మాత్రం నాకు కరచరణాలు ఆడవు.

మధు:  పెళ్లి నాలుగురోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి.

రామ:   మామంచి ఆలోచన చెప్పావు.

మధు:  గాని, నాకొక భయం కలుగుతూంది. నిశిరాత్రివేళ పైగొళ్ళెం బిగించి, కొంపకి అగ్గి పెడతాడేమో

రామ:   చచ్చావే! వాడు కొంపలు ముట్టించే కొరివి, ఔను. మరి యేవి గతి?

మధు:  గతి చూపిస్తే యేవిటి మెప్పు?

రామ:   ‘నువ్వు సాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి అంటాను.

మధు:  (ముక్కుమీద వేలుంచి) అలాంటి మాట అనకూడదు. తప్పు!

రామ:   మంచి సలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను.

మధు:  డబ్బడగలేదే! మెప్పడిగాను. నేను నాప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో వుపకారం?

రామ:   మెచ్చి యిస్తానన్నా తప్పేనా!

మధు:  తప్పుకాదో? వేశ్య కాగానే దయాదాక్షిణ్యాలు ఉండవో!?

రామ:   తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు.

మధు:  పెళ్లివంటలకి పూటకూళ్ళమ్మని కుదర్చండి. ఆమెని చూస్తే గిరీశం గారు పుంజాలు తెంపుకుని పరుగెడతారు.

రామ:   చబాష్! యేమి విలవైన సలహా చెప్పావు! యేదీ చిన్న ముద్దు (ముద్దు పెట్టుకొనును)

*

నాకి రోగం తగుల్కోనె !!

 

-సడ్లపల్లె చిదంబర రెడ్డి 

 

     అపుడు నేను నాలుగో క్లాసో అయిదులోనో సదువుతా వుంటి.
     ఒగదినం మేం పిల్లోల్లంతా కల్సి కల్లాల్లో “ప్యాకాట” అడ్తావుంటిమి. ప్యాకాటంటే ఏమంటే.. పుల్లలు వాడి పారేసిన అగ్గి పెట్టెల్ని నిలివునా రెండు బాగాలు సేస్తే రెండు ప్యాకులు. సిగరెట్టు పెట్టెల్ని గూడా అట్లే సేస్తా వుంటిమి. అయితే సిగరెట్టు ప్యాకులు శానా అపురూపము!!  ఎవరన్నా పట్నానికి పోయినపుడు ఏరుకోనొస్తే ఈరో కింద లెక్క!! వానికి శనక్కాయలు, బెల్లపుంటలు,ఏపిన ఉలవ బ్యాళ్లు ఇచ్చి జత సేసుకొంటా వుంటిమి. రెండు అగ్గిపెట్టి ప్యాకీలు ఒగ  సిగరెట్టు ప్యాకీకి సమానము.
     ఆ ప్యాకిల్ని ఆడే పిల్లోళ్ల తావ వుండేవాట్ని బట్టి రెండు, మూడు, నాలుగు… కలిపి ఒగదాని మిందొగిటి దొంతులుగా పేర్సి, పడిపోకుండా కాసింత మన్ను పోసి, వాటి సుట్టూ గుండ్రముగా గీత గీస్తా వుంటిమి. వాటికి పదయిదు ఇరవై అడుగుల దూరంలో గురుతుపెట్టి, ఆట్నుంచి గెత్తాలు(చేత్తో విసరడానికి అనువుగా ఉండే చెక్క రాయి) ఇసర్తావుంటిమి. ఆటగాళ్లు అందరూ ప్యాకల తాకి ఇసరినంక, వాటికి అందరికంటె దూరముగా ఎవర్ది పడితే వాడు మొదట ప్యాకులు  గెల్సుకోవచ్చు. యట్లంటే…..
     గెత్తా పడిన తావ కుడికాలుంచి యడమ కాలు యనక్కి సాపి, కుడి కాలు కింద నుంచి చేత్తో గెత్తాని ప్యాకల మిందికి ఇసరల్ల. గెత్తా తగిలి గీసిన గీత దాటి బయటపడినవన్నీ  వాడే గెల్సినట్లు లెక్క.
     ఆ ఆట అర్దం అయ్యిందో లేదో యనక నుంచి మా యన్న(నాయిన)వొచ్చి బర్ర కట్టెతో ఒగటి అంటిచ్చె. జుట్టు పట్టుకోని ఇంటికి ఈడ్సుకు పాయ. అంత సేపటికి మా యమ్మ అటకడు నీళ్లు పొయ్యిమింద కాగబెట్టి, ఇంటి ముందర మగోళ్లు పోసుకోనే బండ తావ పెట్టిండె. నాయిన కొట్టిన ఏట్లకి ఏడుస్తా వుండే నన్ని మా యమ్మ అట్లనే బండ మింద కుదేసి అంగీ ఇప్పి బుడుకూ బుడుకున నాలుగు సెంబులు నీళ్లు కుమ్మరించె. పచ్చి సీకాయి యేసి తలంతా రుద్దె. సీకాయి కండ్లల్లో పడి మంటకెత్తుకోనె.
    ఈడ పచ్చి సీకాయంటే ?? ఇనండి…. మా యమ్మ పుట్నిల్లు కర్నాటకము-కోలార్ జిల్లా– లోని పెన్నా నది గట్లో వుండే కల్యాకన పల్లి(కలినాయకన హళ్లి)(అప్పుడు దాన్ని మైసూర్ స్టేట్ అనేవారు) ఆ కాలంలో పెన్నా జీవనది!! ఆ ఏటి గట్లో సీకాయ పొదలు దండిగా వుండె. అవి పెరగల్లంటే ఇరవై నాలుగ్గంటలూ నీళ్లు పారతా వుండల్ల. ఆ సీకాయి పొదలు పిందిలు ఏసినప్పట్నుంచి మా యవ్వ (అమ్మమ్మ) పచ్చివే తెస్తావుండె. పండి ఎండినంక మా ఊర్లో కావాల్సినోళ్లకందరికీ మూటలు మూటలు ఇస్తావుండె.
    నీళ్లు పోసుకోనేది అయితూనే నా శరీరమంతా దద్దులు పొంగిండివి!! కండ్లు కాల్సిన సింత నిప్పుల మాదిరీ యర్రగా అయ్యిండివి. మంటకి తట్టుకో లేక నేను గట్టిగా ఏడ్సబడ్తి. అపుడు మాయమ్మ “పచ్చి సీకాయి ఒంటికి పట్టక అట్లయ్యిది. రవ్వంత సేపటికి తగ్గి పోతుంది.” అని సెప్పి గుడవలో వుండే బెల్లపుంట ఇచ్చి ఒదార్సబట్టె. అయినా దద్దర్లు తగ్గలేదు!!
   అంత సేపటికి మా యవ్వ (నాన్నమ్మ) నా దగ్గిరికొచ్చి “అయ్యో బాశాలీ నీళ్లు పోసేటవుడు కుమ్మరి పులుగో, జర్రో కర్సినట్లుంది. అందుకే ఇట్లయ్యింది.బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాపిచ్చుకురా పో ” అని మా యమ్మని పురమాఇంచె.
   అపుడు నన్ని యండ్లో నిలబెట్టి తలకాయి ఆరబెట్టి,సెక్క దూబానితో పద్ద పెద్దగా దూబి ఒగ అంగీ తొడిగె. అది రెట్ల మింద సినిగింటే బాగలేదని ఏడిస్తి. దాన్ని ఇప్పదీసి సూదీదారంతో నాలుగు కుట్లేసి ఒగ సెంబు తీసుకోని నన్ని బెస్తోళ్ల ఇంటికి పిల్సుకు పాయ.
     బెస్తోళ్ల ఇల్లుండేది ఊరి మద్యలో. నేనూ మా యమ్మా పోతూనే బెస్త ఈసూరమ్మ “ఏమి ఆదెమ్మక్కా పిల్లోన్ని పిల్సుకొస్తివి? ఏమయ్యిది??” అని అడిగె.
     “అయ్యో సూడమ్మా! ఇంటి ముందర నీళ్లు పోసేతవుడు దీని రావిడి అణగా ఏడిదో పులగ పయ్యి మింద(ఒంటి మీద) పారాడి నట్లుంది. మాగిన సింత తొడల(తొనల) మాదిరీ దద్దు లొచ్చిండివి అపుట్నుంచి ఈయప్ప ఏడుపు సూసేగ్గాదు ” అనె.
    అపుడు ఆయమ్మ నా అంగీ ఇప్పి “అవును కదక్కా పిల్లోడు గాబట్టి ఓర్సుకో నుండాడు. మనట్లా వాళ్లయితే యా బాయిలోనో పడ్తావుంటిమి.” అని సెప్పె. అంతవొరుకూ ఊరికే వున్న నేను గట్టిగా ఏడ్సబడ్తి. “ఊరుకోరా అప్పయ్యా! గడియలో తగ్గి పోతుంది అని ఓదార్సి ఇంట్లోకి పొయ్యి గలాసు నిండా నీళ్లు యెచ్చి నన్ని తాగమనె.
    నేను లోటాడు నీళ్లు గొటగొట్న తాగేస్తి. ఇంగ రవ్వన్ని నీళ్లు ఆ యమ్మ పుడిసిలి నిండా తీసుకోని నా ఒల్లంతా తుడిసె. సల్లగా వుండే ఆ నీళ్లు తగుల్తూనే నాకు సగిచ్చినట్లాయ. కాసంత సేపటికి దద్దులన్నీ తగ్గి పాయ.
    ఇంటికి పొయినంక మా యమ్మ తో అడిగితి” అమా మనమూ బెస్తోళ్లూ ఒగే బాయి నీళ్లు తాగుతాము గదా!! అట్లాది మనింట్లో తాగితే తగ్గని రోగము వాళ్లింట్లో తాగితే యట్ల తగ్గుతుంది?? అని అడిగితి.
     దానికి మా యమ్మ”వాళ్ల సెయ్యి వాసి(హస్త వాసి) అట్లాది.యంత పెద్ద రోగమైనా వాల్ల ఇంటి గడపతాకి పోతూనే దిగి పోవాల్సిందే. బెస్త పెద్దప్పయ్య అని ఆ ఇంటి యజమానిపేరు. యంత మొండి రోగమైనా ఆయప్ప నయం జేస్తావుండె. సుట్టూ పక్కల ఇరవై ఆమడ్లనుండి ఆయప్పని ఎదుక్కోని వొస్తావుండ్రి. ఆయప్ప పేరూ క్యాతులు సూసి ఓర్సని జనాలు ఏడిదో సెడుపు సేస్తే ఈ నడమే సచ్చి పాయ.
     ఎవరి కతలో యాల!! అయిదారేండ్లకి ముందర నాకి ఒగ దినం ఇపరీతమైన జరం. మీ నాయిన సూస్తే సైకోలేసుకోని దేశాలంటీ పొయ్యిండాడు. రాగి సేను కోతకొచ్చింది. కూలోల్లంతా తట్లుతీసుకోని యల్బార్తా వుండారు. వాళ్ల జతలో ల్యాకుంటే ఎన్ను యాడిది ఆడ పరిగిలు ఏరుకొనే వాళ్లకి ఇడ్సిపెదతారు. రాగి తాళు జానెడు కొయ్య ఇడిసి కోస్తారు. బంగారట్లా తాళు అద్దువాన్నమయి పోతుంది” అని అనుకోని, బెస్తోళ్ల ఇంటికి పోతి. నేను పొయ్యే తప్పటికి బెస్త పెద్దప్పయ్య పొయ్యి ముందర కూకోని సలి కాపుకొంటా వుండాడు. నన్ని సూసి” ఏమే ఆదెక్కా! ఇంతపొద్దున్నే ఒస్తివి?” అనె.
    ” మామా!! సేని తాకి కూలోళ్లు పొయ్యిండారు. నీ కొడుకు ఊర్లో లేడు. నాకి రాతిరి నుంచి ఒగటే సలీ జరము ఏడిదన్న ఒగ మాత్ర ఈ మామా” అని అంటి.
     “థూ నీ యక్క సలీ జరానిగ్గూడా మందులు మాకులూ కావల్నా?? కోమటి లచ్చుమయ్య అంగట్లో రెండు బొట్లిచ్చి కాపీ పుడి కొనుక్కొని డికాషను సేసుకోని తాగుపో అదే పోతుంది.” అనె.
     ” నాదగ్గర బొట్టూ లేదు. గుడ్డి కాసుగూడా లేదు. యావిదన్నా ఒగ మాత్ర ఇయ్యి మామా” అంటి  .
   అపుడు తలకాయి గీరుకోని, అక్కడిక్కడ సూసి, తుబుక్కున పొయ్యిలోని బూడిద మిందకి ఎంగిలి ఉమిసి మూడు వుంటలు మాదిరీ సేసి “మూడు పూట్లా మూడు ఏసుకో పో” అని మంత్రించి ఇచ్చె.
    అపిటికే రెండు బార్ల పొద్దెక్కింది ఆయప్పిచ్చింది బూడిదో, గుంత సేని మన్నో అనుకో లేదు. తూరుపుకు తిరిగి దేవునికి మొక్కోని ఒగ మాత్ర మింగి కక్కుల కొళ్లి, ఈత తట్టి తీసుకోని పడేదీ లేసేదీ తెలీకుండా సేని దావ పడ్తి. అంత సేపటికి కూలోళ్లు గనిమింద నిలబడి ముణాలు పట్టిండారు. నేను గూడా ఒగ మునం అందుకొంటి సేని కోతలయ్యే పొద్దుకి నా సలెక్కడ పాయనో, జర్రమెక్కడ పాయనో నాకే తెలీదు.
      ఇంగొగ సారి…… అది యండ కాలము. పగలంతా మిరప సెట్లు తవ్వకాలు సేసి ఇంటికి యల్ల బార్తి. సురుకు తీసుకోనె. కాళ్లు మడిసేకి(ఒంటేలుకు) పోతే ఒగటే మంట. అట్లా పొద్దులో పెద్దప్పయ్య ఎదురొచ్చె. నా బాద సెప్పుకోని ఏడిదన్నా మందియ్యి మామా అని అడిగితి.
     అదే టయానికి ఉప్పరోళ్లు ఎనుంపోతులు మేపుకోని, ఊర్లోనికి తోలుకోని ఒస్తావుండ్రి. అవి ఏటి కెచ్చుల్లోనా కానుగ తోపుల్లోనా పచ్చి మ్యాత బాగా మేసి నట్లుండివి వర్సగా ప్యాడ దుస్స బట్టె!!(పేడ వేయ సాగాయి) దాన్ని సూసిన మామ “ఇంత మాత్రానికే మందూ మశానమూ యాలసే! ఆ ప్యాడ కొంగులోకి ఏసుకోని బాగా పిండి రసం తాగు టక్కున తగ్గిపోతుంది” అనె.
     అట్లే సేస్తి…. కడుపులో ఎవరో సెయ్యి పెట్టి తీసేసి నట్ల సురుకు తగ్గి పాయ.” అని ఆయప్ప సెయ్యి వాసి గురించి సెప్పె.(ఇదే పేడ వైద్యాన్ని మా అమ్మ 1980 ఆ ప్రాంతంలో కూడా మా మాట  వినకుండా ఆచరించేది!!)
    పయ్యంతా దద్దర్లొచ్చే రోగం ఆ పొద్దు తగ్గి పాయ కానీ తిరగ యపుడు నీళ్లు పోసుకొన్నా అట్లే అయితా వుండె. నేను బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాగి వొస్తానే ఉంటి. రొన్నాళ్లకి దగ్గూ పడిశం తగుల్కోనె.
     ఒగ దినం మాయమ్మ నాయినతో ” ఏమండ్రా! పిల్లోడు రాతిరి పూట నిద్దరేపోడు. కయ్ కయ్ అని దగ్గీ దగ్గీ సచ్చి సున్నమయితా ఉండాడు. అస్పత్రికన్నా పిల్సుకు పో” అనె.
    అఫుడు మా నాయిన” ఈడు పుట్టిండేది ఆసుపత్తిరిలో. పాలు సాలక సక్కెర నీళ్లు పోసి శీతల శరీరమయ్యింది. దాంజతకి ఈడు బయ్యుమూ దిగులూ ల్యాకుండా కుక్క నేరేడికాయలూ, సొండి సెరుకులూ(లేత చెరుకు) తిని తలమీదకి తెచ్చుకోని వుండాడు. రొన్నాళ్లు పిల్లోల్ల జతలో తిరగ నియ్యకుండా పత్యం సేసి పెట్టు అదే తగ్గి పోతుంది ” అనె.
     ఒగదినం ఇసుకూలుకు పోతి పిల్లోల్ల జతలో కూకోని దగ్గేకి మొదలు పెడ్తి. దగ్గి దగ్గి తిన్న సంగటి అంతా వాంతి సేసుకొంటి. అయివారు ఇంటికి పంపిచ్చె. ఆ పొద్దు మా నాయిన ఊర్లో వుండ్లేదు. అయిదారుదినాలకి ఒచ్చె. ఒస్తూనే మా యమ్మ కొట్లాట మొదలు పెట్టె .
    “పిల్లోనికి బాగలేదు. మేపుకొచ్చే వాళ్లు లేక ఎనుములు పాలు తక్కువిస్తా వుండివి. పెద్ద పిళ్లోళ్లు సేన్లకి నీళ్లు సరిగ్గా కట్టక అవి ఎండుకు పోతా వుండివి. అంగిడిలో అప్పు శానా అయ్యింది. కాపీ పుడి గూడా పుట్టందుము లేదు. ఈ సంసారము ఏగేకి నాకి శాతగాదు. బాయన్నా సెరువన్నా సూసుకొంటాను” అని ఏడ్సబట్టె.
    అపుడు నాయిన నన్ని దగ్గరికి తీసుకోని కండ్ల మిందకి పడిండే యంటికిలు యనిక్కి తీసి నులక దారముతో జుట్టు కట్టి” ఈ పొద్దు బాగనే ఉండాడు కదా!? ఊరకే ఇల్లెగిరి పొయ్యేటట్ల యాల అరుస్తావు??” అనె.
    ” మూడు దినాలకి ముందర సూడాల్సింటివి పిల్లోని అవస్తలు.నిన్నా, ఈ పొద్దూ మాత్రమే అట్ల వుశారుగా ఉండాడు. తిరగ యపుడు కొప్పెత్తు తాడో ఏమో పెద్దాసుపత్రికన్నా పిల్సుకపో” అనె.
    నాయిన ఏమీ మాట్లాడలేదు. స్నానం సేసి బట్లు మార్సుకోని నాగ్గూడా వుదికిన అంగీ తొడిగి ఇందూపుర గవుర్మెంటాసుపత్రిక్కి పిల్సుకు పాయ.
    అదే నేను తొలి సారి ఆస్పత్రికి పొయ్యింది. శానా పెద్దగా వుంది. దూరం దూరంగా ఆడొగిటి ఈడొగిటి రూములు మాదిరీ కట్టిండారు. వాటి మద్యాలో పెద్ద పెద్ద యాప మాన్లు పెరిగిండివి. ఒగ డాకుట్రు నన్ని పరీచ్చలు సేసి పిల్లోడు బాగనే వుండాడే అని అను మానం పడుతూనే ఇంగొగు డాట్టరు దగ్గిరికి పొమ్మనె. ఆయప్ప పోటోలు(ఎక్స్రేలు) తీసే రూము తావ యాప మాని కింద సెక్క కుర్సీమింద కూకోని వుండె. నన్ని పరీచ్చలు సేసి “బాగనే వుండాడుగదా పెద్దాయనా??” అనె. అపుడు మా నాయిన….
    “సారూ ఇపుడు మీరు బాగుంది అంటారు. మాడాలు(మేఘాలు)మూసు కొంటేనో, తేమలో తిరిగితేనో తిరగబెడుతుంది. తగ్గీ తగ్గీ ఊపిరి తిప్పుకొనేకి శాతగాక ప్రాణం పొయ్యేవాని మాదిరీ తనుకు లాడతాడు. రాతిరి పూట గొంతులో గొర గొర అని పిల్లి కూతల మాదిరీ శబ్దమొస్తుంది. రాతిరి పొద్దు నిద్దరే పోడు. బొక్క బార్లా తల కిందకేసి పిర్రలు పైకెత్తుకోని గస పోసు కొంటాడు. పడిశం పట్టి బట్నేల్లావు సీమిడి ముక్కులో కార్తావుంటుంది.” అని సెప్ప బట్టె.
    అపుడు డాక్టురు ఒగాయప్పని కేకలేసి పిల్సి బకీటునిండుకా నీళ్లు తెమ్మనె. తెస్తూనే నేలమింద సల్ల మనె. సల్లి బురదయినంక నన్ని దానిమింద బిరబిరా నడసమనె. నేను ఆయప్ప సెప్పినట్లే సేస్తి. అపుడు డాకుట్రు మా నాయన్ని పిల్సి “సూడప్పా పెద్దాయనా! తేమలో తిరిగితే పడిశం పడుతుంది దగ్గొస్తుంది అంటివి. ఇపుడు సూడు అర్దగంట నుంచి తిరుగుతా వుండాదు ఏమీ కాలేదు. బాగుండాడు కదా!!” అనె.
     మా నాయిన గుటకలు మింగుతా ఏమీ మాట్లాడ లేదు.
      అపుదు దగ్గిర దగ్గిర నాకు 9-10 ఏండ్లు ఉంటుంది. తేమలో తిరిగేది అంటే ఇది కాదని తెలుస్తానే ఉంది!! అట్లాది ఇంత సదువు సదివిన డాక్టరు నా కొడుక్కి అర్తం కాలేదంటే ఏమనుకో వల్లో ఆ బగవంతునికే తెలియల్ల??  (ఇప్పుడు నా వయస్సు 64. సం. నిత్య రోగిని ఎన్ని మందులు తిన్నానో నాకే తెలియదు. అయినా ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రం వెళ్ల లేదంటే నమ్మండి)
    అపుడు ఒగ రూము తాకి పొమ్మన్రి. ఆడ నాపేరు రాసుకోని సీటీ రాసిచ్చిరి. దాన్ని తీసుకోని ఇంగొగ రూముతాకి పోతే, తెల్ల బట్లేసుకోనుండే నర్సమ్మ “ఖాలీ సీసా కొనుక్కురాపో మందే సిస్తాను” అనె.
    ఆసుపత్రికి ముందరే సన్నవి,పెద్దవి వర్సగా పెట్టి ఎవరో సీసాయిలు అమ్ముతావుండ్రి. అణా(ఆరు పైసలు) ఇచ్చి సన్న సీసాయిని తెస్తిమి. నర్సమ్మ దాన్నిండా ఎర్రగా వుండే మందు నించి, సన్న గొట్టమట్లా దాంట్లో  రవ్వంత పోసి ఆడే తాగమనె. దాని వాసనకి వాంతికొచ్చినట్లాయ. అయినా కండ్లు మూసుకోని గుటుక్కున మింగేస్తి. తియ్య తియ్యగా సారాయి వాసన మాదిరీ వుండె. దాన్ని దినానికి మూడు పూట్లా తగమన్రి.
    ఆపొద్దుట్నుంచి దిన్నమూ పొద్దున్నే కుడి పక్కలోనే లేయల్ల. ఎవరి మొకమూ సూడకుండా దేవిని పటాలు మాత్రమే సూడల్ల. ఇటికి పొడితో పండ్లు తోముకోని ముకము కడుక్కోని సూరే బగవంతునుకి మొక్కుకోవల్ల. పణమింద అడ్డం ఈబూతి దిద్దుకోని “స్వామీ రామా నారాయణా పరమాత్మా పరంధామా నన్ని బాగా కాపాడప్పా!! నా రోగం నయం సేయప్పా ” అని దేవుని పటాలకి మొక్కుకోవల్ల అని  నాయిన నాకి అలవాటు సేశె.
   ఇట్ల మొదలైన రోగము నన్ని ఎట్ల సంపుకు తినిందో సెప్పాల్సింది శానా వుంది. అవసరమయినవుడు సెప్పుతా…
*

కొత్త శాటర్న్ స్వపుత్ర భక్షణ

 

                                                           -సత్యమూర్తి

జరిగిన కథ:  దేవతల రాజైన శాటర్న్ తన తండ్రి కేలస్ ను గద్దె దింపి తను సింహాసనమెక్కుతాడు. శాటర్న్ ను కూడా అతని కొడుకుల్లో ఒకడు పదవీచ్యుతుణ్ని చేస్తాడని భవిష్యవాణి చెబుతుంది. దీన్ని అడ్డుకోవడానికి శాటర్న్ తన భార్య ఓపిస్ కు పిల్లలు పుట్టీపుట్టగానే వాళ్లను కొరికి చంపితినేస్తాడు. అలా ఐదుగురు పిల్లల్ని తినేస్తాడు. ఆరో కాన్పులో జూపిటర్ పుడతాడు. ఓపిస్ ఆ పిల్లాణ్ని క్రీట్ ద్వీపంలో దాచేసి, ఓ గుడ్డలో రాయిని పెట్టి అదే బిడ్డ అని శాటర్న్ కు ఇస్తుంది. శాటర్న్ నిజమనుకుని తినేస్తాడు. జూపిటర్ క్రీట్ ద్వీపంలో పెరిగి పెద్దయి తన తండ్రిమీద దండెత్తి తను రాజు అవుతాడు. అలా భవిష్యవాణి నిజమవుతుంది.. ఇక చదవండి..

పదవి కోల్పోయిన శాటర్న్ అధికారం కోసం అలమటిస్తూ కన్నుమూశాడు. దైవ నిర్ణయం ప్రకారం భూలోకంలోని ఒక రాజ్యంలో మానవుడిగా పుట్టాడు. ఆ రాజ్యం పేరుకే రాజ్యం కాని, రాజు లేడు. పెత్తనమంతా పక్క రాజ్యపు రాజుదే. మానవుడిగా అవతరించిన శాటర్న్ కు గత జన్మ వాసనలు ఇంకా పోలేదు. శక్తిసామర్థ్యాలు పిసరంత కూడా తగ్గలేదు. వాటికి వాచాలత కూడా తోడైంది. ఈ కొత్త శాటర్న్ కు  అధికార దాహం కూడా గత జన్మలోకంటే మరింత ఎక్కువైంది. అధికారం దక్కితే ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాడు.

గత జన్మలో కొడుకు వల్ల అధికారం పోయింది కనుక ఈ జన్మలో అసలు పిల్లల్నే కనొద్దని నిర్ణయించుకున్నాడు. అధికారం కోసం పావులు కదిపాడు. పక్క రాజు పెత్తనాన్ని సహించొద్దని తన రాజ్య జనానికి చెప్పి తిరుగుబాటు లేవదీశాడు. పక్క రాజు పెత్తనం పోతే జనంలోని అట్టడుగు వర్గపు ఒక మనిషిని రాజును చేస్తానని నమ్మబలికాడు. జనం నమ్మి పక్క రాజ్యపు రాజుపై తిరగబడి పెత్తనం వదిలించుకున్నారు. కొత్త శాటర్న్ తన హామీని తుంగలో తొక్కి తనే రాజయ్యాడు. తనే జనాన్ని పీడించడం మొదలెట్టాడు. రాజ్యం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడింది. జనం బాధలు ఎక్కువయ్యాయి. కొత్త శాటర్న్ అధికారం అనుభవిస్తూ మత్తుపానీయాలు గ్రోలుతూ సుఖించసాగాడు.

కొత్త రాజు పాలన గిట్టని జనం తిరుగుబాటు చేశారు. కొత్త శాటర్న్ సైన్యాన్ని వాళ్లపై ఉసిగొల్పాడు. ఆయుధ బలం చాలని తిరుగుబాటుదారులు అడవులకెళ్లి యుద్ధసన్నాహాలు ప్రారంభించారు.

కొత్త శాటర్న్ ఓ మిట్టమధ్యాహ్నం మద్యం మత్తులో జోగుతుండగా భవిష్యవాణి వినిపించింది. ‘గత జన్మలో మాదిరే ఈ జన్మలోనూ నువ్వు నీ పుత్రుల చేతిలోనే చస్తావు’ అని భవిష్యవాణి పలికింది. అసలు తనకు పిల్లలే లేరు కదా అని అడగబోతుండగా భవిష్యవాణి అంతర్ధానమైంది.

కొత్త శాటర్న్ తొలుత భయపడిపోయాడు. తనకు సంతానం లేదు కనుక భవిష్యవాణి నిజం కాబోదనుకుని కాస్త కుదుటపడ్డాడు. కానీ గత జన్మవాసనలు భయపెట్టాయి. పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్లు బుర్రలు చించుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. ‘ప్రభూ! మీకు పుత్రులు లేకపోవచ్చు కాని, జనమంతా మీ పుత్రసమానులే కదా. బహుశా వాళ్ల చేతుల్లో మీరు చస్తారు కాబోలు’ అని చెప్పారు. కొత్త శాటర్న్ కంగు తిన్నాడు. మామూలు జనంతో తనకు ప్రమాదం లేదని, ఉన్న ముప్పల్లా  తిరుగుబాటు చేసి అడవులకెళ్లిన జనంతోనే అని నిర్ధారించుకున్నాడు. సైన్యాన్ని రెట్టింపు చేసి.. తిరుగుబాటుదారులను చంపాలని అడవులకు పంపాడు. కానీ జంకు మాత్రం ఇంకా పోలేదు.

గత జన్మ వాసనలు వెంటాడుతూనే ఉన్నాయి మరి. ఈసారి ఎవరి చేతిలోనూ మోసపోకూడదనుకున్నాడు. తానే స్వయంగా అడవులకెళ్లాడు. సైన్యం సాయంతో అడవులను జల్లెడ పడుతూ తిరుగుబాటుదారులను పట్టుకున్నాడు. ఒక్కొక్కరిని మెడకొరికి, రక్తం జుర్రుకుని, భుజాలు కొరికి, మొండాలు కొరికి, కాళ్లు కొరికి.. సంపూర్ణంగా తినడం మొదలెట్టాడు. భవిష్యవాణి పుత్రుల చేతిలో చస్తావని చెప్పిందే తప్ప కచ్చితంగా ఎవరిచేతిలో, ఎన్నోవాడి చేతిలో చస్తావని చెప్పకపోవడంతో కొత్త శాటర్న్ తన రాజ్యంలోని అడవులన్నింటినీ గాలిస్తూ నరమాంసభక్షణ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నాయి కాని, అడవులు తరగడం లేదు. తిరుగుబాటుదారులూ తరగడం లేదు.. (సశేషం)

(వరంగల్ జిల్లా మెట్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా. శాటర్న్ కథ రోమన్, గ్రీకు పురాణాల్లోనిది)

*

 

 

 

 

గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు!

స్లీమన్ కథ-9

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.

స్లీమన్ అక్టోబర్ 3న కోనిగ్స్ బర్గ్ చేరుకుని ఎప్పటిలా గ్రీన్ గేట్ సమీపంలోని ఓ హోటల్ లో దిగాడు. ఉదయం లేవగానే కిటికీలోంచి బయటికి చూశాడు. ఆ హోటల్ ద్వారగోపురం మీద బంగారు అక్షరాల్లో రాసి ఉన్న జర్మన్ పంక్తులపై అతని దృష్టి పడింది.

Vultus fortunae variatur imagine lunae:

Crescit, decresit, constans persistere nescit.

 

The face of fortune varies as the image of the moon

Waxes and wanes, and knows not how to remain constant.

(ఐశ్వర్యపు ముఖం చంద్రబింబంలానే మారిపోతూ ఉంటుంది

పెరగడం, తరగడం తప్ప దానికి స్థిరత్వం తెలియదు.)

ఈ పంక్తులు అతను ఎరిగున్నవే. అప్పుడప్పుడు తండ్రి దగ్గర ఉటంకించేవాడు. తండ్రి కూడా తరచు ఇవే మాటలు కొడుక్కి అప్పగించేవాడు. కానీ ఈసారి మాత్రం ఈ మాటలు ఆశ్చర్యకరమైన ఉధృతితో స్లీమన్ ను తాకాయి.  వాటిలో ఓ హెచ్చరిక ధ్వనిస్తున్నట్టు అనిపించింది.  కచ్చితంగా ఏదో దారుణం జరగబోతోందనుకున్నాడు. వెంటనే టిల్సిట్ కు, అక్కడినుంచి మేమల్ కు బయలుదేరివెళ్ళాడు. ముందురోజు రాత్రి మేమల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి అనేక ప్రాంతాలు బూడిదైనట్టు అతనికి మార్గమధ్యంలో తెలిసింది. అతను వెళ్ళేటప్పటికి ఆ నగరమంతా ఇంకా పొగ పరచుకునే ఉంది. తగలబడిన గిడ్డంగులు సెగలు చిమ్ముతూనే ఉన్నాయి.

‘అయిపోయింది… అంతా అయిపోయింది…వందలాది నీలిమందు పెట్టెలు దగ్ధమైపోయాయి… సర్వనాశనమైపోయాను’ అనుకున్నాడు స్లీమన్. అతనికి పిచ్చిపట్టినట్టు అయిపోయింది. వెంటనే తన  ఏజెంట్ దగ్గరకు పరుగెత్తాడు. అతను ఏమీ మాట్లాడకుండా పొగలు కక్కుతున్నవైపు చేయి చూపించాడు.

స్లీమన్ బుర్ర కాసేపు మొద్దుబారిపోయింది. వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు పరి పరి విధాలుగా పోయాయి. తను పూర్తిగా దివాళా తీశానని నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాల్సిందే ననుకున్నాడు. ఇలా అడుగంటిన ప్రతిసారీ తిరిగి పైకి లేవగలిగానని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. కాస్త రుణసాయం చేయమని కోరుతూ తను ష్రోడర్స్ కు ఉత్తరం రాస్తాడు…ఇంటిని, ఎస్టేట్లను అమ్మేస్తాడు…ఇకమీదట కూడుకు, గుడ్డకు సరిపోయేంత అతి తక్కువ ఖర్చుతో ఎలాగో బతికేస్తాడు…!

ఇప్పుడిక్కడ ఉండి చేసేదేమీలేదు, వెంటనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్ళిపోయి పరిస్థితిని చక్కదిద్దుకోమని మనసు తొందరపెట్టింది. సరిగ్గా అతను తిరుగుప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో వెనక నుంచి ఎవరో భుజం తట్టారు. వెనుదిరిగి చూశాడు. మేమల్ లో స్లీమన్స్ కు ఏజంట్ గా ఉన్న మేయర్ & కోలో హెడ్ క్లెర్క్ నని అతను పరిచయం చేసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా, నీలిమందు పెట్టెల్లో ఏ ఒక్కటీ నష్టపోలేదనీ, అన్నీ భద్రంగా ఉన్నాయన్న శుభవార్తను చెవిన వేశాడు. అదెలా జరిగిందంటే, నీలిమందుతో నౌకలు మేమల్ చేరిన సమయానికి అక్కడి గిడ్డంగులన్నీ వేరే సరకుతో నిండిపోయి ఉన్నాయి. దాంతో వాటికి కొంత దూరంలో అప్పటికప్పుడు చెక్కతో కొన్ని గిడ్డంగులను ఏర్పాటు చేసి సరకును వాటిలో ఉంచారు. అదృష్టవశాత్తూ మంటలు ఈ తాత్కాలిక గిడ్డంగులదాకా వ్యాపించలేదు!

ఇది వినగానే ముంచెత్తిన సంతోషంతో స్లీమన్ ఉక్కిరి బిక్కిరైపోయాడు. కొన్ని నిమిషాలపాటు నోటి వెంట మాటరాలేదు. ఏదో అదృశ్యశక్తి మరోసారి విధ్వంసం అంచుల నుంచి తనను వెనక్కి లాగిందని అనుకున్నాడు. పట్టలేని ఆనందం అతన్ని పసిపిల్లాణ్ణి చేసింది.

ఇప్పుడు హడావుడిగా సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మేమల్ లోనే మకాం పెట్టి తన సరకు అమ్మకాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఎడాపెడా లాభం చేసుకున్నాడు. ఒక్కోసారి తనకే నమ్మశక్యం కానంత మొత్తాలకు బేరాలు కుదుర్చుకున్నాడు. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని లాభాలు గుంజుకోడానికి అతను కొంచెమైనా సందేహించలేదు. నీలిమందు, ఇతర అద్దకాలు కాక; తుపాకీమందుకు, తూటాల తయారీకీ వాడే సూరేకారం, గంధకం, సీసం వగైరాలను కూడా అమ్మి భారీగా సొమ్ముచేసుకున్నాడు.  ఇంతకుముందు కాలిఫోర్నియా బంగారు భూములనుంచి అదృష్టాన్ని మూటగడితే ఇప్పుడు క్రిమియా యుద్ధం నుంచి మూటగట్టాడు. 1855 చివరినాటికి అతని సంపద విలువ 10 లక్షల డాలర్లకు చేరింది.

***

ఇతర విషయాల్లో కూడా అతనికి అదృష్టం  కలిసొచ్చింది. ముఖ్యంగా, సంసారజీవితంలోని సంతోషాన్ని ఇప్పుడే మొదటిసారి చవిచూస్తున్నాడు. ఎందుకోగానీ ఎకతెరీనా అతని మీద ఇష్టం చూపించడం ప్రారంభించింది. ఆ ఏడాదే  కొడుకు పుట్టాడు. పేరు, సెర్గీ. కొన్ని మాసాలపాటు భార్యపట్ల కృతజ్ఞతాభావం అతనిలో పొంగిపొర్లింది. జార్ వేసవి విడిది అయిన పీటర్ హాఫ్ కు దగ్గరలో ఒక ఎస్టేట్ తోపాటు భార్యకు నగానట్రా కొనిపెట్టాడు. కొన్నిరోజులు విశ్రాంతిగా గడపడానికి ఫ్రాన్స్ తీసుకెడతానని మాట ఇచ్చాడు.

ఇవే రోజుల్లో అతను పోలిష్, స్వీడిష్ భాషలు నేర్చుకున్నాడు. అంతకు మించిన విశేషం ఇంకొకటుంది. క్రిమియా యుద్ధం అందించిన రెండో భాగ్యానికీ, పుత్రలాభానికీ అదనంగా అతనికి మరో మహత్తరమైన కానుక అందింది. అది, గ్రీకు భాష!

ఫస్టెన్ బర్గ్ లో తను పచారీకొట్టులో పనిచేస్తున్నప్పుడు ఒక తాగుబోతు నోట హోమర్ పంక్తులు విన్నప్పటినుంచీ అతనికి గ్రీకు భాషపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఎప్పటికైనా ఆ భాష నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాడు. నాయ్ స్ట్రీలిజ్ లోని జిమ్నాజియంలో సరిగ్గా గ్రీకు క్లాసులోకి అడుగుపెట్టబోతున్నప్పుడే తన చదువుకు విఘ్నం కలగడం అతని మనసులో ఒక వెలితిగా ఉండిపోయింది. అయితే ఈ మధ్యలో పది భాషలు నేర్చుకున్నాడు కానీ; తను అమితంగా ప్రేమించే గ్రీకులోకి తలదూర్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ భాష తనను పూర్తిగా మంత్రించి వశం చేసుకుంటుందని భయపడ్డాడు.

ఇన్నేళ్లలో హోమర్ కు, గ్రీకు హీరోలకు సంబంధించి అనేక భాషల్లో వచ్చిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు కానీ, కావాలనే గ్రీకు పుస్తకాల జోలికి వెళ్లలేదు. వెడితే ఆ భాషలోని హోమర్ రచనలన్నింటినీ కంఠతా పెట్టేవరకూ తను ఇంకే పనీ చేయలేననుకుని వెనకాడాడు. ఇప్పుడా ఖరీదైన వ్యాసంగంలోకి దిగడానికి తగిన తాహతు తనకు వచ్చిందనుకున్నాడు. అయినాసరే, తన వ్యాపారబాధ్యతల్లోకి గ్రీకు మరీ చొరబడకుండా జాగ్రత్త తీసుకుంటూనూ వచ్చాడు.

వారంలో ఆరు రోజులు ఆఫీసుకు అంకితమవుతూనే, ఆదివారాలు మాత్రం రోజంతా ఇంట్లో తన చదువు గదిలో తలుపులేసుకుని అధ్యయనంలో గడిపేవాడు. అప్పుడప్పుడు అధ్యాపకుని పక్కన పెట్టుకునేవాడు. అలా ఆరు ఆదివారాల్లో ప్రాచీన గ్రీకుభాషలో పొడవైన, సంక్లిష్టమైన వాక్యాలు రాయగలిగిన స్థితికి వచ్చాడు. ఆ వెంటనే ఆధునిక గ్రీకులో రాయడమూ నేర్చుకున్నాడు. అతనిలోంచి ఆ భాష ఊటలా ఉబికిరావడం ప్రారంభించింది. ఆ భాష సౌందర్యానికీ, అందులోని స్పష్టతకూ పరవశించిపోయాడు. అంతవరకూ తను ఊహించినదానికంటే కూడా ఉజ్వలంగానూ, అద్భుతంగానూ ఆ భాష తోస్తూవచ్చింది. ఆనందం పట్టలేక, నాయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి, హోమర్ మాట్లాడిన ఆ పురాతన భాషలో ఓ పెద్ద ఉత్తరం రాశాడు. అందులో అప్పటివరకూ సాగిన తన జీవితగమనాన్ని వివరించాడు. తీవ్రనైరాశ్యంలో కూరుకుపోయిన చీకటి క్షణాలలో కూడా గ్రీకుభాషలోని పవిత్ర షట్పదులు(షట్పది: ఆరు పాదాలు కలిగిన ‘హెక్సామీటర్’), సోఫొక్లీస్(క్రీ.పూ. 497-406: గ్రీకు సంగీత, నాటకకర్త) సంగీతం తనను “ఉత్తేజశిఖరాలకు ఎత్తేసా”యన్నాడు. “ఆ భాషతో నేను మత్తెక్కిపోయా” ననీ, ఒక భాష ఇంత ఉదాత్తంగా ఉండగలదా అనిపించి ఆశ్చర్యచకితుణ్ణయిపోయాననీ రాశాడు. “ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రం గ్రీసుకు గొప్ప భవిష్యత్తు ఉన్నట్టు అనిపిస్తోంది. శాంటా సోఫియాపై గ్రీకు జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, మూడు శతాబ్దాల టర్కీ ఆధిపత్యం తర్వాత కూడా గ్రీకులు తమ జాతీయభాషను పదిలంగా కాపాడుకుంటూ ఉండడం” అన్నాడు.

ఎప్పటిలానే అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకపోయాయి. సోఫొక్లీస్ మూలంతో తృప్తిపడకుండా దానిని ఆధునిక గ్రీకులోకి అనువదించితీరాలనుకున్నాడు. ప్లేటో(క్రీ.పూ. 4వ శతాబ్ది: గ్రీకు తత్వవేత్త, గణితశాస్త్రజ్ఞుడు) రాసిన ప్రతి రచననూ, డెమొస్తనీస్(క్రీ.పూ. 384-322: గ్రీకు రాజనీతిజ్ఞుడు, వక్త) చేసిన ప్రతి ప్రసంగాన్నీ తప్పనిసరిగా చదవాలనుకున్నాడు. గ్రీకు పదాల జాబితాలతో, వాక్యాలతో, ఆ భాషలో తనతో తనే జరిపే సంభాషణలతో, సుదీర్ఘమైన స్వగతాలతో నోటుబుక్కులు నింపేశాడు. ప్రసిద్ధమైన నిజ్నీ నొవ్ గ్రాడ్ తిరునాళ్ళకు వెళ్లినప్పుడు, తను బస చేసిన సత్రంలో రాత్రంతా కూర్చుని ఆ తిరునాళ్ళు తనలో రేపిన భావపరంపరను ప్రాచీన గ్రీకులో వర్ణించుకుంటూ వెళ్ళాడు.

ఆ తర్వాత ఆ భాషలో ఆత్మభారాన్ని దింపుకోవడమూ ప్రారంభించాడు. ఉద్రేకం, కర్కశత్వం, డబ్బు యావతో సహా– తన లోపాల జాబితాను తనే రాసుకున్నాడు. మెక్లంబర్గ్ కో, అమెరికాకో; చివరికి డబ్బూదస్కంతో పనిలేకుండా పండ్లు తిని బతికే ఆదివాసులు నివసించే భూమధ్యరేఖా ప్రాంతాలకో పారిపోవాలన్న తన విచిత్రమైన కోరిక గురించి కూడా రాసుకున్నాడు. గొప్ప శ్రావ్యత, సౌందర్యం నిండిన గ్రీకును దేవతల భాషగా అతను జీవితాంతం నమ్మాడు. ఆ భాష అతనికి ఎలా సర్వస్వం అయిందంటే; దానితో గడిపే ఆదివారాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాడు. సూట్ కేసులో గ్రీకు పుస్తకాలు నింపుకుని తిరునాళ్ళ వెంట తిరునాళ్ళను చుట్టబెడుతూ భార్యకు దూరంగా సంచారం జరిపే క్షణాలకోసమే జీవించేవాడు.

రెండేళ్లపాటు అతను రాసుకున్న గ్రీకు నోట్సు 35 నోటు బుక్కులకు విస్తరించింది. తన అత్యంత రహస్య ఆలోచనలను కూడా వాటిలో రాసుకున్నాడు. తన అంతరంగంలోని చీకటి కోణాలను బయటపెట్టుకున్నాడు. తనమీద తనే వ్యాఖ్యలు చేసుకున్నాడు. “నాకు తెలుసు, నేనో అల్పబుద్ధిని, పిసినారిని. ఈ డబ్బుపిచ్చి నుంచి, లోభత్వం నుంచి నేను బయటపడాలి. యుద్ధకాలమంతా డబ్బు గురించి తప్ప నేనింకొకటి ఆలోచించలేదు” అని ఒకచోట రాసుకున్నాడు. తనపై తనే అసహ్యాన్ని కుమ్మరించుకున్నాడు. బయటిశక్తులు మాత్రమే తననీ రంధినుంచి బయపడవేయగలవని అనుకున్నాడు. పైకి నైతిక కాఠిన్యాన్ని ప్రదర్శించే తనలో గుప్తంగా స్త్రీచాపల్యం ఎలా ఉందో; తిరునాళ్ళలో అందరు వర్తకుల్లానే తను కూడా తప్పతాగి ఆడవాళ్ళ గురించి అశ్లీల సంభాషణల్లో వాళ్ళతో ఎలా పోటీ పడేవాడో వెల్లడించుకున్నాడు.

రాను రాను అతను ప్రపంచాన్ని గ్రీకు కళ్ళతో చూడడం ప్రారంభించాడు. కాన్ స్టాంటినోపుల్(టర్కీ లోని నేటి ఇస్తాంబుల్) పై తమకే హక్కు ఉందన్న గ్రీకుల వాదనను అతను గట్టిగా సమర్ధించేవాడు. రష్యన్లు కూడా ఆ నగరంపై హక్కును చాటుకునేవారు కనుక స్లీమన్ వైఖరి వాళ్ళకు నచ్చేది కాదు. తన ఉద్యోగుల్లో ఒక్కరైనా గ్రీకుజాతీయుడు ఉండాలని అతను కోరుకున్నాడు. రష్యన్ మాట్లాడగల గ్రీకుజాతీయుని కోసం కొన్ని మాసాలపాటు వెతికాడు. ఒక్కరూ దొరకలేదు. చివరికి ఒక ట్యూటర్ ను పట్టుకున్నాడు. అతని పేరు థియోక్లిటస్ విమ్పోస్. సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువుకున్న విమ్పోస్,  గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో ప్రీస్టుగా ఉన్నాడు. మంచి స్నేహపాత్రుడు. ఏథెన్స్ యాసలో స్వచ్ఛమైన గ్రీకు మాట్లాడగలడు.

నేరుగా స్లీమన్ చదువు గదిలోకి వెళ్ళి పుస్తకాలను తిరగేసే చొరవ ఉన్న అతి కొద్దిమందిలో అతనూ ఒకడు. స్లీమన్ ఆదివారాల్లో ఇచ్చే సాయం విందులకు విమ్పోస్ తోపాటు మరికొందరు పండితులు హాజరయ్యేవారు. అలా వాళ్లమధ్య గడుపుతున్నకొద్దీ ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికో పారిపోవాలన్న కోరిక స్లీమన్ లో అడుగంటుతూవచ్చింది. ఎంతైనా తనొక యూరోపియన్ ననీ, సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని వదిలేసి  శేషజీవితాన్ని పండితునిగా గడపాలనీ ఇప్పుడు అనుకుంటున్నాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి పూర్తిగా నిష్క్రమించి జర్మనీలోని ఓ పెద్ద యూనివర్సిటీలో చేరి చదువుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశాడు. అయితే ఏ ఒక్క విద్యార్హత కానీ, శిక్షణ కానీ లేని తనను చేర్చుకుంటారా అన్న సందేహం కలిగి ఆ ఆలోచనను పక్కన పెట్టేశాడు. ఓ వ్యవసాయక్షేత్రాన్ని కొనుక్కుని శాస్త్రవిజ్ఞాన ఆసక్తులకు అంకితమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన మళ్ళీ బుర్రను తొలవడం ప్రారంభించింది. రైన్ నది వెంబడే ఓ వ్యవసాయక్షేత్రం కోసం గాలిస్తున్నానని 1856 జూలైలో ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. అయితే ఆ ఉత్తరం రాయడానికి కొన్ని వారాలముందు మరో మిత్రుడికి ఉత్తరం రాస్తూ; తను ప్రపంచాన్ని చూసింది తక్కువనీ, మొత్తం ప్రపంచమంతా చుట్టిరావాలనుకుంటున్నాననీ, ఒక రచయితగా రాణించగలనేమో ఆలోచిస్తున్నాననీ రాశాడు.

వ్యాపారాన్ని ఇక కట్టిపెట్టాలని 1857లో గట్టిగానే అనుకున్నాడు. అయితే సరిగ్గా అప్పుడే యూరప్ ఆర్థికసంక్షోభంలో చిక్కుకుంది. దాంతో అతను వ్యాపారాన్ని పొడిగించకతప్పలేదు. ఎన్నో విదేశీ కంపెనీలు దివాళా తీసాయి. లండన్, పారిస్, హాంబర్గ్, ఏమ్ స్టడామ్ ల నుంచి తనకు రావలసిన బకాయిలు 30 లక్షల టేలర్ల మేరకు పేరుకుపోయాయి.  ఉన్నదంతా పెట్టుబడి పెట్టిన తను ఈ దెబ్బతో చితికిపోయానని అనుకున్నాడు. అంకెలు తారుమారుచేసీ, పెద్ద పెద్ద ప్రమాదాలకు ఎదురొడ్డీ; ముఖ్యమా, కాదా అని చూడకుండా వ్యాపారం తాలూకు ప్రతి కోణాన్నీ స్వయంగా పర్యవేక్షించీ వ్యాపారం మూలపడకుండా చూసుకోగలిగాడు.

1858 ప్రారంభానికి గండం గట్టెక్కి స్థిమితపడ్డాడు. ఇక ఇప్పుడు గ్రీస్ ను సందర్శించే సమయం వచ్చిందనుకున్నాడు.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

వీక్లీ రౌండప్

 

– Apple కంపెనీ వాళ్ళు iPhone 6, 6S ఫోన్లు విడుదల చేసారు. ఫోన్ల డబ్బాల మీద వాటి ధరలు చూసి నిమిత్త మాత్రులంతా తప్పుకున్నారు. తాజ్ మహల్ కట్టటానికి పోగు చేసుకున్న డబ్బుతో షాజహాన్ ఆ ఫోను కొని, హౌసింగు లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడట.
– శ్రీలంక తో జరిగిన టెస్టు మ్యాచు లో దురుసుగా ప్రవర్తించినందుకు ఇషాంత్ శర్మ పై ఒక మ్యాచ్ బ్యాన్ విధించారట. పాపం ఇషాంత్ శర్మ అలా ప్రవర్తించటానికి కారణం మాత్రం ఎవ్వరూ అడగలేదు. As per reliable sources, (reliable sources = నా కల్పితం), శుక్రవారమని తలంటు పోసుకున్న ఇషాంత్ శర్మకి, జుట్టు చిక్కులు తీసి, జడ వేయటానికి జనం దొరకలేదు. ఆ కోపం తో లంకా దహనం చేసాడు..CCTV కెమేరాలకు దొరికిపోయాడు.
ishant
– బీహార్ లో ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి నాలుగు దశల్లో ఎలెక్ట్రానిక్ వోటింగు మెషీన్లు ఎవ్వరూ దొంగలించకుండా డిల్లీలో దాచేసి, చివరి దశలో గబగబా వోటింగు నిర్వహిస్తారు.
* *
హైదరాబాదు లో ట్రఫిక్ సిగ్నళ్ళు వినాయక చవితి నాడు ఆకాశం లో ఉన్న చంద్రుడి లాంటివి. పొరబాటున కూడా ఎవ్వరూ తలెత్తి చూడరు. కళ్ళు మూసుకుని బండి తోలి హడావిడిగా ఇల్లు చేరుకోవటమే గోల్.
**
మొన్నీమధ్య ప్రశాంతంగా, డిగ్నిఫైడ్ గా జరిగిన మన రాజ్యసభ వర్షాకాల సమావేశాల చిత్రం
monsoon sessions
*

అబ్సలీట్ రియాలిటీ

 

satyaprasadచాలా సాధారణమైన ప్రశ్న అడిగింది. – “మీరేం అమ్ముతారు?” అని

నిజం చెప్పాలంటే చాలా అమాయకంగా వుందా ప్రశ్న.

పెళ్ళి చూపులులో భాగంగా, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారేమో అంటూ మమ్మల్ని ఏకాంతంగా ఇంటి మేడ పైన వదిలేశారు. చల్లగాలి. చొరవ చెయ్యాలా వద్దా అన్న చిన్న బెదురు. ఎదురుగా అరుదుగా కనిపించే అందం. అదీ ఆకుపచ్చని చీరలో. ఏం మాట్లాడాలా అని తటపటాయిస్తున్న క్షణాలు.

సరిగ్గా అప్పుడే ఆమె అడిగిన ప్రశ్న. “మీరేం అమ్ముతారు?” అని.

“నేను టీవీ ఛానెల్ లో పని చేస్తాను. అమ్మడం ఏమీ వుండదు” అన్నాను నేను.

“టీవీలో చేస్తారని చెప్పారులెండి. అక్కడ మీరేం అమ్ముతారు అనే అడుగుతున్నాను.” అంది. అమాయకత్వమా అజ్ఞానమా? అనుకున్నాను.

“మీరు టీవీలో చూస్తుంటారే… “మధ్యాహ్నం మహిళ”, “కొడితే కోటి రూపాయలు” ఈ షోలకి నేనే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్” అన్నాను

“నేను టీవీ చూడను”

అరుణ చెప్పిన ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. “టీవీ చూడకపోవటమేమిటి? గేమ్ షోలు సరే… సీరియల్స్?”

“ఊహు”

“సినిమాలు? స్పోర్ట్స్? న్యూస్?”

“అసలు టీవీ ముఖమే చూడను మహాప్రభూ. మా ఇంట్లో అందరూ చూస్తారు” అన్నది. ఇంకేం చెప్పాలి?

“మీ నాన్నగార్ని, మీ అన్నయ్యలను చూసి నేను కూడా సేల్స్ ఉద్యోగం అనుకుంటున్నారా? నా ఉద్యోగం అలా కాదు” అన్నాను.

అరుణ నవ్వింది. నెమ్మదిగా నడుస్తూ మేడ మీదకు పాకిన కాగడామల్లెల తీగ నుంచి ఒక సన్నటి మొగ్గని తుంచి గాఢంగా వాసన చూసింది. ఆ తరువాత నా వైపు చూసి “కాదా?” అంది.

“కానేకాదు. నాది క్రియేటివ్ జాబ్” అన్నాను నేను. నా వైపు ఓ అర సెకను నిశ్చలంగా చూసింది. పిల్ల తెమ్మరలాంటి చూపు. ఆ చూపులో మెల్లెపూల సువాసనలు. కానీ ఆమె మాటల్లో…

“నా దృష్టిలో వుద్యోగాలన్నీ అమ్మకాలే. మీరు కూడా ఏదో అమ్ముతుంటారు. అదేంటో మీకే తెలియటంలేదు.” అంది చిరునవ్వు చెరగకుండా. పెళ్ళి చూపులు అయిపోయాక అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం అంటే కుటుంబం గురించో, అభిరుచుల గురించో, ఆర్థిక విషయాల గురించో మాట్లాడుకుంటారని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. ఇక్కడ వ్యవహారం ఏదో తేడాగా వున్నట్లు అనిపించింది.

“మీకు అలా ఎందుకు అనిపిస్తోందో కానీ, అన్నీ వుద్యోగాలు సేల్స్ వుద్యోగాలు కావండీ…” అన్నాను ఆమె కళ్ళలోకే చూస్తూ. సిగ్గో, నా చూపులో వున్న చొరవో తెలియదు కానీ, ఆమె కళ్ళతోనే నవ్వేసి, పిట్టగోడ పట్టుకోని కొంచెం ముందుకు వంగుతూ మాట్లాడింది.

“ఏం కాదు. ఇప్పటి ప్రపంచంలో ప్రతి ఉద్యోగం ఏదో ఒకటి అమ్మడానికే కల్పించబడింది. ప్రతి ఉద్యోగీ నేరుగా అమ్మకపోవచ్చు, కానీ ఏదో రకంగా అమ్మకానికే దోహదం చేస్తారు. ఒకోసారి ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళేమి అమ్ముతున్నారో” అంది.

“మరి స్కూల్ టీచర్ వున్నాడనుకోండి. ఆయనేం అమ్ముతున్నట్లు?”

Kadha-Saranga-2-300x268

“టీచర్లలో రకాలు వున్నాయి లెండి… ఒక రకం ర్యాంకులు, ఐఐటీ సీట్లు తద్వారా రాబోయే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు… ఇంకో రకం ఉన్నారు పాపం వీళ్ళు జ్ఞానాన్ని, మన మీద మనకి నమ్మకాన్ని, జీవితం గురించి భరోసాని అమ్మాలనుకుంటారు. పాపం వాళ్ళ సరుకు అమ్ముడుపోదు…” కిసుక్కున నవ్వింది.

“చిత్రంగా మాట్లాడుతున్నారే… మరి గుళ్ళో పూజారి?”

“అమ్మో, ఆయన లిస్ట్ చాలా పెద్దది… భయం, భక్తి, ఆశ, దురాశ, స్వర్గం, నరకం…”

“సరే… సరే… మొత్తం మీద నేను చేసేది కూడా సేల్స్ ఉద్యోగమే అంటారు? పైగా నేను అమ్ముతున్నదేంటో నాకే తెలియదంటారు? అంతేనా” అన్నాను కాస్త తీవ్రంగా.

“అవును… మీరు అమ్మేదేంటో మీకు తెలియదు కాబట్టి… ఒక పందెం” కావాలనే అక్కడ ఆపింది. నేను అలాగే చుస్తూ వున్నాను. “ఏం. లేదు. మీరు అమ్మే ప్రాడక్ట్ ఏమిటో తెలుసుకోని నాకు చెప్పాలి… మన పెళ్ళి లోగా” అంటూ చీర కుచ్చిళ్ళని పైకి పట్టుకోని పరుగు లాంటి నడకతో మెట్లు దిగేసింది. మేడ పైన నేనూ, కాగడామల్లెతీగ మిగిలాము.

***

“ఏరా ఏమంటావ్?” అన్నాడు నాన్న కారు ఊరు దాటిన తరువాత.

ఆ అమ్మాయి మాటలు మళ్ళీ గుర్తుకువచ్చాయి. “మన పెళ్ళి లోగా…” అన్నదంటే ఆ అమ్మాయికి నచ్చినట్లే..! చెప్పకుండానే చెప్పేసింది! గడుసుదనం!!

“ఏరా? సమాధానం చెప్పవే?” నాన్న మళ్ళీ అడిగాడు.

“ఇంకేంటి చెప్పేది… అన్నయ్య అప్పుడే ఆ అమ్మాయితో డ్యూయెట్లు ఊహించుకుంటున్నాడు..” అంది చెల్లెలు శ్వేత.

“నాకు ఓకే నాన్నా… కాకపోతే కొంత టైం కావాలి” అన్నాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన వున్నాను కాబట్టి వెనక కూర్చున్నవాళ్ళ  ముఖాల్లో భావాలు తెలియట్లేదు. నా ముఖంలో వున్న భావాలు కూడా వాళ్ళకు కనపడవు కాబట్టి నా ఆలోచనలు వాళ్ళకు అర్థం కావు. “కోడితే కోటి రూపాయలు” గేమ్ షోలో కోటి రూపాయల ప్రశ్న దగ్గర ఆగిపోయిన అభ్యర్థిలా వుంది నా పరిస్థితి.

“ఇంకా టైం ఎందుకురా? నచ్చితే వచ్చే నెల్లోనే చేసేద్దామని వాళ్ళ నాన్నే చెప్పాడు” అమ్మ తన ఆతృతని బయటపెట్టింది.

“అది కాదులే అమ్మా… ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. పెళ్ళిలోగా సమాధానం చెప్పాలి” అన్నాను నేను.

“పెళ్ళిలోగా చెప్పాలా? లేక సమాధానం చెప్తేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నదా మా వదిన” అంది శ్వేత ఉత్సాహంగా.

శ్వేత మాటల్లో కూడా నిజముందేమో అనిపించింది నాకు. ఇది ప్రశ్నా? లేకపోతే పరీక్షా?

“వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ అమ్ముతాడు, పెద్దన్నయ్య కార్ షోరూమ్ లో కార్లు అమ్ముతాడు, చిన్నన్నయ్య సరే సరి బట్టల షాపు కదా… అలాగే నా ఉద్యోగంలో కూడా నేను ఏదో అమ్ముతానట. అదేంటో కనుక్కోని చెప్పమంది” అన్నాను నేను.

“టీవీ ఛానల్లో అమ్మేదేముంటుంది?” ఆశ్చర్యపోయాడు నాన్న. నాన్నకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశంలేదు. దూరదర్శన్ కాలం నాటి మనిషి, అంతే ఆలోచించగలడని నాకూ తెలుసు.

“ఏముందిరా అన్నయ్యా! టీవీ ఛానల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. నువ్వు ప్రోగ్రాములు ప్రొడ్యూస్ చేస్తావు కదా… అదే నీ ప్రాడక్ట్… అదే అమ్ముతున్నావు.” అంది శ్వేత చాలా సులభైన పరిష్కారం కనుక్కున్నట్లు.

నిజమే కదా? ప్రేక్షకులే నా కస్టమర్స్ అనుకుంటే, వాళ్ళని అలరించే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చెయ్యడమే కదా నా పని. అంటే నా షోలో కంటెంటంటే కదా నేను అమ్మేది. అంతే! ఫోన్ చేశాను.

“ఇంత త్వరగా ఫోన్ చేస్తారని అనుకోలేదు” అంది అరుణ. ఆమె గొంతు వినగానే ఏదో మధురభావన.

“కనుక్కున్నాను” అన్నాను క్లుప్తంగా.

“ఏమిటి?” అందామె.

“అదే నేను అమ్మేది.”

“చెప్పండి మరి”

“ఎంటర్టైన్మెంట్!” చెప్పాను.

“ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నారా? ఎవరికీ?”

“ప్రేక్షకులకి”

“అంటే ప్రేక్షకులే మీ కస్టమర్స్ అన్నమాట”

“అంతే కదా?” నా వెనకే కూర్చున్న శ్వేత ఉత్సాహంగా ముందుకు వంగి నా భుజం మీద తట్టింది.

“మరి కస్టమర్స్ అంటే మీరు అమ్మే వస్తువునో, సేవలనో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా? మరి మీ ప్రేక్షకుడు కూడా ఇస్తున్నాడా?”

“ఇస్తున్నాడు కదా? కేబుల్ టీవీ ఆపరేటర్ కి…”

“అది కేబుల్ కనెక్షన్ ఇచ్చినందుకు, సర్వీస్ చేస్తున్నందుకు. అయినా ఆ డబ్బులు టీవీ ఛానల్ దాకా రావు కదా?”

“అవును నిజమే”

“తొందరపడకూడదు… నెమ్మదిగా ఆలోచించి, పది మందిని అడిగి సమాధానం చెప్పాలి.. ఏం?” అంటూ పెట్టేసింది. చివర్లో నవ్విందా? నవ్వలేదా? నేనే అట్లా అనుకున్నానా? ఏమైనా ఆ అమ్మాయి నవ్వు మనోహరంగా వుంటుంది వినడానికి కూడా.

శ్వేత పిలుపుతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను. “ఏమనింది వదిన?” మళ్ళీ అడిగింది.

“కాదటమ్మా… అమ్మకం అంటే ఒక కస్టమర్ వుండాలి, అతను డబ్బులు ఇచ్చి మన దగ్గర్నుంచి ఏదైనా తీసుకోవాలి. అదీ ట్రాన్జాక్షన్ (transaction)… లావాదేవి. అలా జరిగితేనే అమ్మకం జరిగినట్లు.”

“అలా అని వదిన చెప్పిందా?” అడిగింది. నేను తలాడించాను. “అయితే కరెక్టే అయివుంటుంది” నవ్వేసింది.

***

“అయితే నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకి కాదన్నమాట… స్వయంవరం” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“ఏంట్రా? నువ్వేదో హెల్ప్ చేస్తావని అడిగితే నా మీదే జోక్ చేస్తున్నావా?” అన్నాను నేను ఉక్రోషంగా. ఇరానీ చాయ్ ఘుమఘుమల మధ్య వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది. మాతో ఛానల్ లోనే పనిచేసే వంశీ, శివరావ్ కూడా వున్నారు.

“అయినా కొశ్చన్ ఇంటరస్టింగా వుంది బ్రో” అన్నాడు శివరావ్

“నేనొకటి చెప్పనా?” అన్నాడు వంశీ. విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పడం న్యూస్ రీడర్ గా వాడికి కొట్టినపిండి. తరువాత వాక్యం కోసం అందరూ ఎదురుచూశారు. “ఇవన్నీమార్కెటింగ్ కి సంబంధించిన విషయాలు. మన ఇస్మాయిల్ ని అడిగితే చెప్పేస్తాడు” అన్నాడు. ఒకేసారి నా కళ్ళు పెద్దవి చేసి, చిరునవ్వు నవ్వుతూ నిటారుగా కూర్చున్నాను. అరుణతో పెళ్ళికి రెండు క్యూబికల్స్ దూరమే వున్నట్లు ఒక చిత్రమైన ఫీలింగ్. ఇస్మాయిల్ క్యాబిన్ లోకి వెళ్ళాను.

“కన్ఫూజ్ చెయ్యకు భాయ్. మనం ప్రేక్షకులకు అమ్మేదేంటి? ఎమోషన్స్… ఎంటర్టైన్మెంట్… ఆనందం, బాధ, టెన్షన్, కోపం, అసహ్యం, జుగుప్స…” చెప్పాడు

“అవన్నీ ఎక్కడున్నాయి ఇస్మాయిల్?”

“మన సీరియల్స్ లో, క్రైమ్ కథల్లో…. న్యూస్ పోగ్రామ్స్ లో ఎలాగూ తప్పదు” అన్నాడు నవ్వుతూ.

“కానీ ప్రేక్షకులు మన కస్టమర్స్ కాదంటోందే మా ఆవిడ” అన్నాను. ఆవిడ అన్న పదం నోరు జారింది కానీ అందులోనూ ఒక థ్రిల్ అనిపించింది. ఇస్మాయిల్ వెంటనే పట్టేశాడు.

“అరేయ్ భాయ్… అప్పుడే ఆవిడనేస్తున్నావే… కంగ్రాట్స్” అన్నాడు. ఆ తరువాత కాస్సేపు ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. “మనకి ఆదాయాన్ని ఇచ్చేవాడు కస్టమర్ అయితే, ప్రేక్షకుడు మనకి ఏ రూపంలోనూ డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి ప్రేక్షకుడు మన కస్టమర్ కాదు. అంటే ప్రేక్షకుడే కస్టమర్ అన్న భ్రమలో మనం వున్నాం. భలే పాయింట్ కదూ?” అన్నాడు.

“అయితే మన ఛానల్ కి డబ్బులు ఇచ్చేది ఎవరు?” అడిగాను ఆతృతగా. ఇస్మాయిల్ నవ్వాడు.

“అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఏజన్సీలు, కంపెనీలు…” మార్కెటింగ్ అనుభవమంతా కనపడింది అతని మాటల్లో. సమాధానం దొరికింది.

వెంటనే నా కాబిన్ లోకి వచ్చాను. మొబైల్ చేతిలోకి తీసుకోని ఫేవరెట్స్ లో మొదట వున్న అరుణకి ఫోన్ చేశాను.

“అపూర్వ ప్రశ్నల అరుణాదేవీ… తెలిసిపోయింది”

“అయితే చెప్పేయ్యండి రాకుమారా..” అంది నవ్వేస్తూ.

“మా కస్టమర్ ప్రేక్షకుడు కాదు, కార్పొరేట్ సంస్థలు, యాడ్ ఏజన్సీలు…” అన్నాను ఆవేశంగా.

“నాకు తెలుసు మీరు కనిపెడతారని. కానీ, నేను అడిగింది మీరు అమ్మేదేంటి అని కదా. మీరు ఎవరికి అమ్ముతున్నారో చెప్పారు” అంది అరుణ కాస్త వ్యంగం ధ్వనిస్తున్న గొంతుతో.

“వాళ్ళకి అమ్మేదేముంది… అడ్వర్టైజ్మెంట్ స్లాట్… అదే కదా వాళ్ళకు కావాల్సింది…” అన్నాను

“ఇంకేముంది… గెలిచినట్లే… కాకపోతే అడ్వర్టైజ్మెంట్ స్లాట్ అమ్మడానికి మీ ప్రోగ్రామ్ లకి సంబంధం ఏమిటి? రోజు రెండు గంటలో, మూడు గంటలో అడ్వర్టైజ్మెంట్లే ఒక కార్యక్రమంలా వేయచ్చు కదా?” అంది. ఆమెకు కావాల్సిన సమాధానం ఇంకా రాలేదని అర్థం అయ్యింది. ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రశ్నలతో సమాధానం రాబట్టాలని చూస్తున్నట్లుంది.

“చెప్పండి… సాయంత్రం ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కి ఒక రేటు, మధ్యాహ్నం కార్యక్రమానికి ఒక రేటు ఎందుకుంటుంది?” మళ్ళీ అడిగింది.

“అది చూసే జనాన్ని బట్టి మారుతుంది. దాన్నే టీఆర్పీ అంటారు. ఎక్కువమంది చూసే టైమ్ ఎక్కువ విలువైంది. తక్కువ ప్రేక్షకులు చూసే టైమ్ లో అడ్వర్టైజ్మెంట్ అంటే తక్కువ రేటుకే…” ఆగిపోయాను నేను. ఏదో కొత్త విషయం తెలుస్తున్నట్లు అనిపించింది. అవతల వైపు నవ్వు.

“కాబట్టి ఇప్పుడు చెప్పండి. మీరు మీ ఉద్యోగంలో ఏం అమ్ముడానికి సహాయపడుతున్నారు?” అడిగింది చివరగా.

“ఐబాల్స్… ప్రేక్షకుల సమయం. మంచి ప్రోగ్రామ్ చెయ్యడం ద్వారా, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా చేసి, అలా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసి మరీ ఆ సమయాన్ని అడ్వటైజర్లకు అమ్ముతున్నాము.” అన్నాను ఆలోచనతో పాటే మాట్లాడుతూ.

“అంతేనా, టమాటాలు గ్రేడింగ్ చేసినట్లు ప్రేక్షకుల సమయాన్ని గ్రేడింగ్ చేసి దానికి టీఆర్పీ అని పేరు పెట్టి, ప్రైమ్ టైమ్, స్లాక్ టైమ్ అని విభజించి అమ్ముతున్నారు…”

“అవును నిజమే…”

“ఇప్పుడు అర్థం అయ్యిందా నేను ఎందుకు టీవీ చూడనో… నాకు ప్రోగ్రామ్ అనే ఎరవేసి నా సమయాన్ని దొంగిలించి గ్రేడ్ చేసి అమ్ముకునేవాళ్ళకు సహకరించడం నాకు ఇష్టం లేదు. పైగా అలా మోసపోడానికి నేనే కేబుల్ చార్జెస్ రూపంలో ఎదురు డబ్బులు ఇవ్వాలి…”

నేను చాలాసేపు సమాధానం చెప్పలేదు. నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఈ కోణంలో చూడటం కొత్తగా వుంది. ఇప్పటిదాకా నాది క్రియేటివ్ జాబ్ అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నారని అర్థం అవటం అప్పుడే మొదలైంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?”

“ఉద్యోగం చెయ్యక తప్పదు కదా… ఇప్పట్లో వదిలెయ్యలేనేమో…”

“వదిలెయ్యమని నేను చెప్పలేదే… కాకపోతే మీ చేత ఏం పని చేయిస్తున్నారో తెలుసుకోని వుండాలి కదా?”

“అవును. అన్నట్లు ఒకటి మాత్రం చెయ్యగలను. మనింట్లో టీవీ వుండదు…”

“అయ్యో టీవీ లేకపోతే ఎలా? టీవీ వుండాలి… కేబుల్ అఖర్లేదు. అప్పుడప్పుడు మనిద్దరికీ నచ్చిన సినిమాలు డీవీడీ వేసుకోని చూడటానికి, మన పెళ్ళి వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి…” అంటూనే నవ్వేసింది అరుణ. నేనూ ఆమెతో శ్రుతి కలిపాను. ఛానల్ ఆఫీస్ లో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. వాళ్ళా అరుపుల్లో, నా నవ్వు ఎవరికీ వినపడట్లేదు.

***

 

కాకి ఎగిరిపోయినాక…

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఏది తొలుత, ఏది పిదప అర్థం కాదు.
చూసేది దగ్గరగా కానవస్తుంది. చూడనిది లీలగా ద్యోతకమవుతుంది.
కానీ, చూసే చూపే అంతిమం. ప్రాధాన్యం.

కళ్లున్నవారంతా చూపున్న వారు కాదనే ఇది.
చూపున్న వారంతా సూక్ష్మగ్రాహులూ కారనే ఇది.

ఉన్నది చూడటమే తప్పా కొత్తగా ఆవిష్కరించడం అన్నది లేదు.
డిస్కవర్ అన్న మాట ఆవిష్కరణ.

అయితే సంక్షిష్టంగా ఉన్నది లేదు.
సరళం అయినదీ లేదు.

నిజానికి పైన కాకి ఉన్నది.
అది వాలినప్పుడు తీసిన కంచె ఫొటో ఇది.

నిజానికి అది ఎగిరిపోయింది.
దాంతో కెమెరా కిందకు వాలింది.

లెన్స్ ముందు వెనకాలి దాన్ని చూసింది.
ఇది అవుట్ ఫోకస్ అయింది.

తర్వాత దీన్ని ఫోకస్ చేస్తే వెనకాలవన్నీ అవుట్ అయినవి.
కానీ, ఎది దృశ్యం మరేది అదృశ్యం అంటే, కాకి అంటాను నేను.

అది ఎగిరిపోయినాక చూస్తే, చేస్తే ఇది కనుక.
తీశాక చూస్తే అపార్చర్ మోడ్ కనుక ముందున్నది స్పష్టం.
వెనుకున్నది అస్పష్టం.

నార్మల్ టేక్ అయితే వేరు.
చెబుతున్నదేమిటంటే – అంతిమంగా తొలుత ఉన్నది లేదని!

ఇవేవీ లేకుండా, చదవకుండా -లేదంటే చదివిందంతా వొదిలేసి
బొమ్మనే చూడండి.

నగరం మధ్యన ఉరి పోసుకున్నది మాత్రం నిజం.
అది రైతాంగ ఆత్మహత్యా? కొడుకుకు ఎయిడ్సా?
ఏదో ఒకటి.

ఒక తాడు పెనుగులాడుతున్నది.
అది సత్యం.

ఎగిరిపోయిన కాకి

అది చిత్రం.

(picture captured at lower tank bund)
*

 ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తిద్దామా?

 

-భాస్కరం కల్లూరి

కల్లూరి భాస్కరం

చావు అనేది అంతిమం.  ఆ తర్వాత ఏమీ ఉండదు. సహజీవనం, సామరస్యం, సంభాషణ లోపించినప్పుడు ఏర్పడే ఒక శూన్యంలో మనిషి సాటి మనిషి ప్రాణం తీయడం జరుగుతుంది. ఆ దశలో అతన్ని మనిషి అనడానికి వీల్లేదు. పశువు అని కూడా అనకూడదు. అంటే పశువును అవమానించడం అవుతుంది. ఎందుకంటే పశువుకు ఆలోచించే శక్తీ, సంభాషించే శక్తీ ఉండవు. ఆ రెండూ ఉన్న మనిషి ఇంకో మనిషిని చంపినప్పుడు అతనికి ఇంకో పేరు సృష్టించుకోవలసిందే.

కల్బుర్గి హత్యను ఖండించడం ‘మనిషి’ అనిపించుకోడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో కల్బుర్గి సమర్థకులే కాదు, వ్యతిరేకులు కూడా వస్తారు. చావు ఇంకో చావును మాత్రమే పుట్టిస్తుంది. చావులోంచి బతుకు పుట్టదు. ఈరోజు కల్బుర్గి హత్య జరిగితే, రేపు కల్బుర్గి భావజాలాన్ని వ్యతిరేకించేవారి హత్య జరగచ్చు. ఈ హత్యల గొలుసుకట్టు ప్రయాణంలో మనిషి పూర్తిగా గల్లంతైపోతాడు. మనిషి అనిపించుకోవడానికి ఇంకో షరతు ఏమిటంటే, కల్బుర్గి హత్యను ఖండించినట్టే, రేపు కల్బుర్గి వ్యతిరేకుల హత్యను కూడా అంతే గట్టిగా ఖండించాలి.

ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని సృష్టించే శక్తి మనిషికి ఎలా లేదో, ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని చంపే శక్తి కూడా ఉండకూడదు. అన్ని మతాలూ అదే చెబుతాయి. కానీ మతం పేరుతోనే చంపడం– మనిషితనానికి మనిషి ఎంత దూరమయ్యాడో తెలిపే కొండగుర్తు(అనేకానేక సందర్భాలలో సామూహిక హత్యలు జరుగుతుంటాయి. వాటిలో కొన్నింటిపై ‘దేశభక్తి’ ముద్ర కూడా ఉంటూ ఉంటుంది. చంపడం అన్నప్పుడు నేను వీటన్నింటినీ ఉద్దేశించడం లేదు. ఈ  రకమైన సామూహిక హత్యాకాండ నుంచి  మానవాళి ఎప్పటికైనా బయటపడుతుందో లేదో తెలియదు. ఈ లోపల నివారించగలిగిన హత్యల గురించే నేను మాట్లాడుతున్నది).

కల్బుర్గి హత్యపై ఆయన సమర్థకులు, వ్యతిరేకుల స్పందనలు రెండింటిలోనూ ఒకే విధమైన ఆవేశం కనిపిస్తోంది. అది ఎంత సహజమే అయినా, ఇది ఆలోచనకు కూడా సందర్భం. కల్బుర్గి సమర్థకులకు, వ్యతిరేకులకూ కూడా! కల్బుర్గి దైవదూషణకు, విగ్రహాలపట్ల దారుణ అపచారభావనకు పాల్పడ్డారని, మా మనోభావాలు గాయపడ్డాయని ఆయన వ్యతిరేకుల ఆరోపణ. కల్బుర్గి హత్యను ఖండించడంలో ఆయన సమర్థకులు, ఆయన వ్యతిరేకుల మనోభావాలను మరింత గాయపరచడానికి పూనుకున్నారు. దాంతో కల్బుర్గి వ్యతిరేకులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కల్బుర్గి హత్యను సమర్థించేవరకూ వెళ్లారు. ఇద్దరూ చెరో చిటారు కొమ్మా ఎక్కి కూర్చున్నారు. చావు అనే అంతిమం చర్చనీయం కావాల్సింది పోయి, కల్బుర్గి చేసింది తప్పా ఒప్పా అన్నది చర్చనీయంగా మారింది. కారణం, రెండువైపులా ఆవేశం, ఆవేశం…ఆలోచన లోపించిన వీరావేశం!

అసలెందుకిలా జరుగుతోంది, ఎందుకిలా జరగాలి, దీని చరిత్ర ఏమిటి, ఈ చరిత్రను ఇప్పుడైనా మార్చలేమా అని రెండు వర్గాలూ ఆలోచించుకోవలసిన సందర్భం ఇది. అంటే రెండు వర్గాలలోనూ, వర్గాల మధ్యా అంతర్విమర్శా, సంభాషణా జరగాలన్నమాట.

రెండు శత్రుదేశాల సంబంధాలతో దీనిని పోల్చిచూసినప్పుడు మనకేమైనా మార్గం కనిపిస్తుందా?!

ఉదాహరణకు భారత, పాకిస్తాన్ లనే తీసుకుందాం. రెండింటి మధ్యా నిరంతర సమరవాతావరణం ఉంటూనే ఉంది. అదే సమయంలో శాంతి అవసరాన్నీ, అందుకు రెండు వైపులా జరగవలసిన కృషినీ నొక్కి చెప్పడమూ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి రెంటి మధ్యా ఎలాంటి సంభాషణా జరగడానికి వీలులేదనే వైఖరిని తీసుకోవడం, ఒక్కోసారి దానిని పూర్తిగానో, పాక్షికంగానో సడలించి సంభాషణ జరగాలనే వైఖరి తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇందులో మళ్ళీ ఎన్నో తేడాలు. ఎలాంటి పరిస్థితులలో నైనా సంభాషణ ఆగకూడదనేవారూ, పాకిస్తాన్ పూర్తిగా దారికి వస్తే తప్ప సంభాషణ జరగడానికి వీల్లేదనేవారూ, పరిస్థితులు ఎలా ఉన్నాసరే, శత్రుత్వపు మంటను నిర్విరామంగా రాజేసేవారూ-రెండు వైపులా ఉన్నారు. ఇన్నేళ్లలో కాల్పుల విరమణ సంధి ఉల్లంఘనలు పదేపదే జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు పాకిస్తాన్ తో సంభాషణ జరగడానికి వీల్లేదని శాసిస్తూ వచ్చినవారే, అధికారంలోకి వచ్చాక సంభాషణ అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంటారు. అంటే, అధికారంలో లేనప్పుడు గుర్తించని బాధ్యతను అధికారంలోకి వచ్చాక గుర్తిస్తున్నారన్నమాట. ఇక్కడ ‘బాధ్యత’ అనే మాటను దృష్టిలో ఉంచుకోవాలి.

దాంతోపాటు, భారత-పాకిస్తాన్ సంబంధాల సమరస్వభావం అలా ఉండగా, దండలో దారంలో ‘సంభాషణ’ కూడా చర్చలోకి వస్తుండడాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

ఇదే అంశం తీవ్రతా భేదంతో భారత-చైనా సంబంధాలకూ వర్తిస్తుంది. 1986 వరకూ చాలాకాలంపాటు రెండు దేశాల మధ్యా సంభాషణ కానీ, రాకపోకలు కానీ లేని పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అసలు వివాదమైన సరిహద్దు వివాదాన్ని పక్కన ఉంచుతూ, సంభాషణకూ, రాకపోకలకూ తెరతీయడం; వాణిజ్యం తదితర రంగాలలో సంబంధాలను పునరుద్ధరించుకోవడం సంభవించింది.

కల్బుర్గి హత్య దగ్గరికి మళ్ళీ వద్దాం. రెండు దేశాల మధ్య ఘర్షణలానే, రెండు భావజాలాల మధ్య ఘర్షణను ఈ హత్య సంకేతిస్తోంది. పైగా భారత-పాకిస్తాన్, భారత-చైనాల శత్రుత్వం కన్నా ఇది అతి పురాతనం. ఎంత పురాతనమో స్థూలంగా చెప్పాలంటే, రామాయణమంత పురాతనం. అందులో రాముడు పరలోకాన్ని, విశ్వాసాన్ని నొక్కిచెప్పే ఋషుల భావజాలానికి ప్రతినిధి అయితే, జాబాలి దానికి భిన్నమైన భావజాలానికి ప్రతినిధి. వారిద్దరి మధ్యా ఒక సందర్భంలో వాదోపవాదాలు జరుగుతాయి. అలాగే మహాభారతంలో కురుక్షేత్రయుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తుంటాడు. అప్పుడు చార్వాకుడు అతన్ని అడ్డుకుని ఇంతటి యుద్ధానికీ, రక్తపాతానికీ, విధ్వంసానికీ కారణం నువ్వే నంటూ తూలనాడతాడు. అప్పుడు ధర్మరాజు వెంట ఉన్న బ్రాహ్మణులు అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత కూడా రెండు భావజాలాల మధ్య శత్రుత్వపు పాయ చరిత్రపొడవునా కొనసాగుతూనే ఉంది.  బుద్ధుడు, వేమన లాంటివారు ఈ ఘర్షణకు ప్రాతినిధ్యం వహిస్తూనేవచ్చారు. అంబేడ్కర్, కల్బుర్గి, పనాసే, ధబోల్కర్, యూ. ఆర్, అనంతమూర్తి లాంటివారు వీరికి ఆధునికమైన కొనసాగింపులు మాత్రమే.

రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పైన చెప్పిన రెండు రకాల భావజాలాల మధ్య శతృత్వాన్ని పోల్చడంలో నాకైతే ఎలాంటి అనౌచిత్యం కనిపించడంలేదు. ఒకటి బాహ్యశక్తులతో ఘర్షణ. ఇంకొకటి అంతర్గత శక్తుల మధ్య ఘర్షణ. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, బాహ్యశక్తులతో ఘర్షణలో శాంతి, సామరస్యం, సంభాషణల అవసరాన్ని గుర్తించి నొక్కి చెబుతున్నప్పుడు; అంతర్గత శక్తుల మధ్య భావజాలాల ఘర్షణలో ఎందుకు నొక్కి చెప్పడం లేదు, ఎందుకు నొక్కి చెప్పకూడదు?! అంతర్గత శాంతి, సామరస్యాలు కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువే ముఖ్యం కదా? బాహ్యశక్తులను కలసికట్టుగా ఎదుర్కోడానికైనా అది అవసరమే కదా?!

రెండు దేశాల మధ్య సమర వాతావరణం నిరంతరాయంగా కొనసాగడం మంచిది కాదు కనుక, శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి సంభాషణను ఆశ్రయించడంలో అధికారంలో ఉన్నవారు ‘బాధ్యతా’ స్పృహతో వ్యవహరిస్తున్నారన్నమాట. మరి రెండు అంతర్గత భావజాలాల ఘర్షణ ఇలా హింసకు, రక్తపాతానికి దారితీస్తున్నప్పుడు ఆ బాధ్యత ఏమైపోయింది; ఆ ఘర్షణను నివారించి శాంతి, సామరస్యాలకు కృషి చేయవలసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దానికి ‘పౌరసమాజం’ అన్నది ఒకానొక జవాబు అనుకుంటే, పౌరసమాజం తన బాధ్యతను విస్మరించిందనుకోవాలా?!

పైగా మనం భిన్న భావజాలల శాంతియుత, సామరస్యపూర్వక సహజీవనానికి అవకాశమిచ్చే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకు వీలైన రాజ్యాంగాన్ని 65 ఏళ్లుగా అమలుచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం దేశాన్ని ఒక నూతన సందర్భంలోకి తీసుకెళ్లింది. ఆ సందర్భాన్ని మనం గుర్తిస్తున్నామా? భిన్న భావజాలాల ఘర్షణలో ఏ వైఖరి తీసుకోవాలి, ఆ రెంటి మధ్యా ఎలాంటి సర్దుబాటు చేసుకోవాలనే విషయంలో రాజ్యాంగమే బ్లూ ప్రింటు ఇస్తోంది. ఏ చర్చకైనా రాజ్యాంగం ఉనికే ప్రాతిపదిక కావాలి.  స్వీయబాధ్యతను గుర్తించే ఏ పౌరసమాజమైనా రాజ్యాంగం ఉనికిని పదే పదే గుర్తుచేస్తూ భిన్న భావజాలాల శాంతియుత సహజీవనాన్ని నొక్కి చెబుతూనే ఉండాలి. రాజ్యాంగం నిర్వహించేది మధ్యవర్తి పాత్ర.

రెండు దేశాలు తమ ఇరుగు పొరుగును తమకు కావలసిన పద్ధతిలో సృష్టించుకోలేవనీ, సామరస్యంతో సహజీవనం చేయక తప్పదనీ మనకు తెలుసు. ఇదే సూత్రం అంతర్గత భావజాలాలకూ వర్తిస్తుంది. నాస్తికులూ-ఆస్తికులూ, హేతువాదులూ, విశ్వాసవాదులూ…ఇలా భిన్న భిన్న భావజాలాల వాళ్ళు సొంత ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా సహజీవనం చేయకతప్పదు. కనుక దేశాల మధ్య లానే వీళ్ళ మధ్య సంభాషణ, సర్దుబాటు ఉండాలి. ఆ అవగాహన సరళి రేఖామాత్రంగా ఇలా ఉండచ్చు :

  1. ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ విమర్శించే, వ్యతిరేకించే ప్రజాస్వామిక హక్కు నాస్తికులకు, హేతువాదులకూ ఉంది. తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. అలాగని ఆస్తికుల మనోభావాలను గాయపరచే హక్కు; ఆస్తికులు పూజించే దేవుళ్ళను దూషించే హక్కు వారికి లేదు. చట్టం, రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్లో మతస్వేచ్ఛలానే; భావజాలస్వేచ్ఛను కూడా అన్ని పక్షాలూ గుర్తించాలి.
  2. తమ ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ ఉద్ఘాటించుకుని ప్రచారం చేసుకునే హక్కు, నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ విమర్శించే హక్కు ఆస్తికులకు ఉంది. అలాగని నాస్తికులను, హేతువాదులను దూషించి, దేశద్రోహులుగా చిత్రించే హక్కు; వారిపై భౌతిక దాడులకు దిగి హతమార్చే హక్కు వారికి లేదు. ఆస్తికులు అధికసంఖ్యాకులు కూడా కనుక ఈ విషయంలో వారిపై మరింత బాధ్యత ఉంటుంది. ఈ భౌతికసంఖ్యాధిక్యం నుంచి వారు అదనపు ప్రయోజనం పొందడానికి చూడకూడదు.
  3. నాస్తిక, ఆస్తిక ఉద్యమాలు రెండూ చిరకాలంగా పట్టువిడుపులు లేని ఆత్యంతిక వైఖరి(extreme)నే తీసుకుంటూ వచ్చాయి. పరస్పర శత్రుత్వానికి పదును పెడుతూనే వచ్చాయి. ఈ మార్గంలో ఏ ఉద్యమమూ ఫలితం సాధించలేకపోయింది. నాస్తికత్వం ఆస్తికత్వాన్నీ, ఆస్తికత్వం నాస్తికత్వాన్నీ కొంచెమైనా తుడిచిపెట్టలేకపోయాయి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాయో అప్పుడు చరిత్ర పొడవునా తమ మధ్య జరుగుతున్నది ఒక విఫలపోరాటమన్న సంగతి అర్థమవుతుంది. విఫల పోరాటాన్ని కొనసాగించడంలో అర్థం, ఔచిత్యం లేని సంగతి బోధపడుతుంది. ఆ గుర్తింపు సంభవించినప్పుడు రెండూ ఒక సరికొత్త ఉమ్మడి ప్రాతిపదికపై సహజీవనం చేయడానికి సాధ్యమవుతుంది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి వాణిజ్యం తదితర ఉమ్మడి ప్రయోజనాలపై భారత-చైనాలు సంబంధాలను పునరుద్ధరించుకున్న ఉదాహరణను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. అలాగే ఉమ్మడి కార్యక్రమం పై పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదాహరణను కూడా.
  4. ఆస్తిక, నాస్తికవాదుల మధ్య సర్దుబాటు సరళి ఇలా ఉండచ్చు: అ)నాస్తికులు ఆస్తిక స్వేచ్ఛను అగౌరవపరచకూడదు. ఆస్తికుల మనోభావాలను నొప్పించకూడదు. అదే సమయంలో ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై దేశ ఇతరేతర ప్రయోజనాలకు వారిని కలసిరమ్మని ప్రతిపాదించవచ్చు. రాజ్యాంగం పేర్కొన్న సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేయడం వాటిలో ఒకటి. అలాగే కొన్ని విపరీత స్వభావం కలిగిన విశ్వాసాలకు అడ్డుకట్ట వేయమనీ, విశ్వాసరంగాన్ని తగిన మేరకు సంస్కరించవలసిందనీ కోరవచ్చు. విశ్వాసం ముసుగులో జరుగుతున్న రకరకాల వ్యాపారాలను, మోసాలను నియంత్రించమని అడగచ్చు. మతాన్ని, దేవుణ్ణి వీలైనంత వరకు ప్రైవేట్ కు పరిమితం చేసి పబ్లిక్ జాగాను సామాజిక కార్యకలాపాలకు, అవసరాలకు విడిచిపెట్టమని అడగవచ్చు. మతాన్నీ, విశ్వాసాన్నీ రాజకీయంగా వాడుకోజూసే శక్తులను దూరంగా ఉంచమని కోరవచ్చు. ఆ) ఆస్తిక, విశ్వాసరంగం చాలాకాలంగా అంతర్గత సంస్కరణలకు దూరంగా ఉందన్న సంగతిని ఆస్తికవాదులూ గుర్తించాలి. గతంలో వివిధ కాలాలలో ఈ రంగంలో జరుగుతూ వచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఎందుకు లోపించాయో ఆస్తికవాదులూ, ఆధ్యాత్మికమతనాయకులూ, పౌరాణికులూ ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాజం పట్ల తమ బాధ్యతను వారు గుర్తించాలి. నాస్తికత్వం సహా భిన్న భిన్న భావజాలాలు వైవిధ్యవంతమైన, సృజన శీలి అయిన సామాజిక స్వభావానికి అద్దం పడతాయనీ, ప్రజాస్వామ్యం ఉనికిని చాటి చెబుతాయనీ గ్రహించాలి. అంతిమంగా నాస్తికులూ, ఆస్తికులూ కూడా అభిప్రాయభేదాలను నాగరిక పద్ధతుల్లో, ప్రజాస్వామిక పరిమితుల్లో వ్యక్తం చేసుకోవాలి.

అన్నింటి కన్నా ముందస్తు షరతు; భిన్న భావజాల శిబిరాల మధ్య ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తించడం. దానికి తెర తీయడం. సంభాషణ అంటూ మొదలయ్యాక అది ఎలాంటి ఫలితాలవైపు పయనిస్తుందన్నది తర్వాతి ప్రశ్న.

ఈ వ్యాసంలోని అనేక అంశాలతో  ఏకీభావం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నా ఉండచ్చు. కానీ ఈ రెండు శత్రుశిబిరాల మధ్య సంభాషణ అవసరమన్న అభిప్రాయంతో బహుశా ఎవరూ విభేదించరు. ఆ అవసరాన్ని గుర్తించడమే కల్బుర్గి వంటివారికి తగిన నివాళి అవుతుంది.

*

 

 

 

ఎగిరిపోతే బావుండని …!

తనపై కాసేపు సేదతీరి, తిరిగి దిగంతాలవైపు తరలిపోయే మేఘంలా మారాలని కొండ శిఖరాలూ..
తనని అణువణువునా తడిమి తడిపివేసే చినుకులల్లే చిందులువేయాలని ఆకుపచ్చ లోయలూ..
గలగలమని కబుర్లు చెప్తూనే తమని దాటి పరుగులు తీసే ప్రవాహంలా మారాలని సెలయేటి గులకరాళ్ళూ
బెంగగా నిస్సహాయంగా ఏ చీకటి రాత్రిళ్ళలోనో కంపించే ఉంటాయి!
ఈ కొండలూ, లోయలూ, చెట్లూ ఏళ్ళకి ఏళ్ళ తరబడి ఓరిమితో నిశ్చలంగా నిలబడి రాలే పువ్వులకీ, వాలే పక్షులకీ ఆశ్రయమిచ్చినా..
ఎదగని, ఒదగని అస్తిత్వం గుర్తొచ్చినప్పుడల్లా తమని చుట్టుముట్టి, స్పృశించే గాలుల్లోకి హఠాత్తుగా ఒరిగిపోయి,
ఎగిరిపోతే బావుండని కొట్టుకులాడిపోయే క్షణాలు కొన్ని తప్పక ఉండే ఉంటాయి!
gulzar
పచ్చపూల చెట్టు:

 

వెనకాల కిటికీ తెరిచినప్పుడల్లా కనపడుతుండేది
అక్కడొక పచ్చపూల చెట్టు.. కాస్తంత దూరంగా, ఒంటరిగా నిలబడి
కొమ్మలన్నీ రెక్కల్లా చాపుకుని
అచ్చు ఒక పక్షి లానే!

ఊరిస్తుండేవి ఆ చెట్టుని రోజూ పక్షులన్నీ వచ్చి
తాము చేసొచ్చిన సుదూరాల ప్రయాణాల గురించి వినిపించీ,
తమ రెక్కల విన్యాసాలన్నీ అల్లరల్లరిగా గిరికీలు కొడుతూ ప్రదర్శించీ!
మేఘాల్లోకి రివ్వున దూసుకెళ్ళి చెప్తుంటాయి, చల్లగాలిలోని మహత్యమేమిటో!

రాత్రి తుఫాను గాలి సాయంతో బహుశా
తానూ ఎగరాలని ఆశపడిందో ఏమిటో
రోడ్డుకి అడ్డంగా, బోర్లా పడి ఉంది!!

 

మూలం:
Amaltas

Kidkii pichavaade kii khulthii to najar aataa thaa
Vah amalataas kaa ped, jaraa door akelaa-saa khadaa thaa
Shakhen pankhon ki tarah khole huye,

Ek parinde ki tarah!

Vargalaate the use roj parinde aakar
Jab sunaate the parvaaj ke kisse usko,
Aur dikhaate the use ud ke, kalaabaajiyaan khaa ke!

Badaliyaan choon ke bataate the, maje tandii hawaa ke!

Aandhii kaa haath pakaD kar shaayad,
Usne kal udne kii koshish kii thii
Aundhen munh beech sadak jaake giraa hain!!

—————–

ప్రేమతో “సహ చరణం” — జగద్ధాత్రి కవిత్వం

 

బొల్లోజు బాబా

 

సమకాలీన సాహిత్యంలో ఉత్తరాంధ్రనుంచి బలంగా వినిపించే గొంతు జగద్ధాత్రి గారిది. కథలు, వ్యాసాలు, అనువాదాలు, కవిత్వం, సభానిర్వహణ – ప్రక్రియ ఏదైనా తనదైన శైలి, ముద్ర ఆమె రెండు దశాబ్దాల సాహిత్యసేవ ద్వారా ఏర్పరచుకొన్నారు.

జగద్ధాత్రి గారు ఇటీవల వెలువరించిన కవిత్వ సంకలనం పేరు “సహచరణం”. “కవిత్వంలో కవి తనను తాను బయిల్పరచుకొంటాడు” అంటారు.  ఈ సంకలనంలోని కవితలన్నింటిలో, ప్రేమ, ఆప్యాయతలు, ఆరాధన, ఆత్మవిశ్వాసం, ప్రకృతిసౌందర్యం పట్ల ఆశ్చర్యం, సామాజిక అంశాలపట్ల సహానుభూతి వంటి అనేక జీవనస్పందనలు కన్పిస్తాయి.  ఇవన్నీ మానవవిలువలు.  మానవుల ఉత్తమజీవనానికి సహాయపడే విలువలు. ఇవి ఈ కవయిత్రిని గొప్ప ప్రేమమయిగా నిరూపిస్తాయి. ఈ కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా నిలబెట్టాయి.

 

ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం

తీసుకొన్న సాయింత్రం

నిర్భీతిగా, నిశ్చలంగా

సంధ్య కెంజాయలోకలిసి

నీరవ నిశీథిలోనికి

ఒక వెలుగు రేఖ కోసం పయనించిన

సాయింత్రం…..!!!

        —   పై వాక్యాలు “పయనం” అనే కవితలోనివి.  జీవితంలో నిస్సహాయ స్థితి ఆవరించాకా, ఆశలన్నీ ఆవిరవగా, మొండి ధైర్యంతో ఒక వెలుగు రేఖకోసం ఒక వ్యక్తి పయనం సాగించటం ఈ కవితకు వస్తువు.  నాకొచ్చిన కష్టమిదీ, నేను తీసుకొన్న నిర్ణయమిదీ అని కవయిత్రి ఎక్కడా చెప్పదు.    అయినప్పటికీ చదువరి, కవయిత్రి దుఃఖంతోను, ధైర్యంతోనూ మమేకమవుతాడు.  మనస్థితిని అక్షరాలద్వారా అందచేసి అదేస్థాయిలో భావతీవ్రతను కలిగించటం అనేది ఉత్తమ కవితా లక్షణం.

 

ఒంటరితనం మనిషికి చాలా అవసరం

మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడూ

ఎవరికి వారు చేసుకునే అంతరీక్షణ

 — (వరం) ఈ కవితలో ఒంటరితనం మనల్ని మనకు దర్శింపచేసే సాధనంగా, అంతరంగపు అద్దంలో విశదంగా చూసుకొనే వరంగా అభివర్ణించటం ఒక నూతన అభివ్యక్తి.

 

తనవారి కళ్ళలో తానో జ్ఞాపకంగా మెదిలే

ఈ అశ్రువుల ముత్యాలు ప్రేమకు మానవత్వానికి

సార్వకాలిక ప్రతీకలు

మానవునికి సృష్టి ఒసగిన అపురూప అమూల్య

కానుకలు …. కన్నీళ్ళు..

(ఇవీ).  అపూర్వమైన ఆలోచనతో కూడిన వాక్యాలు ఇవి. కన్నీళ్లని చెలులుగా, స్మృతుల చినుకులుగా, ముత్యాలుగా, సృష్టి ఒసగిన కానుకలుగా వర్ణించటం గొప్ప ఊహ.  ఎంతో రమ్యంగా సాగే కవిత ఇది.

 

రంగురంగుల కాగితాలతో

నన్ను ప్రియంగా అందంగా చేసావు

నాకో అస్తిత్వాన్నిచ్చావు

నీ ఆశలతోక తగిలించి గాలిలోనికి వదిలావు.   (పతంగ్) ……

Jagathi

కారణాలేమైనా తల్లిపై ప్రేమను వ్యక్తీకరిస్తూ వచ్చినంత సాహిత్యం తండ్రి పై రాలేదు. ఇప్పుడిప్పుడే ఈ లోటు భర్తీ అవుతున్నది.  పతంగ్ అనే కవితలో ఈ కవయిత్రి తన తండ్రి తనను ఒక గాలిపటాన్ని చేసి ఎగరేసారంటూ, ఆ గాలిపటం తుఫానుగాలులకు జీవితపుచెట్టుకు చిక్కుకోగా, ఆ తండ్రి ప్రేమను ఏ విధంగా స్పూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు నడుస్తున్నదీ– అంటూ సాగే ఈ కవిత కథనాత్మక శైలిలో ఒక కూతురు తన తండ్రిని ఏ విధంగా దర్శించిందో అక్షరీకరిస్తుంది.  ఈ కోవలో వచ్చిన కవితల్లో ఇది వినూత్నంగా నిలుస్తుంది.

 

అప్పుడే క్షణంలోనే

అంతరాంతరాల్లో

భావ బీజావాపన జరిగే

దివ్య క్షణం లోనే అదాటుగా

అతను నా దేహాన్ని ఆక్రమించుకొన్నాడు

వారించానా….

తగవును వరించానన్న మాటే

అందుకే నిశ్శబ్దంగా

నాలోకి నేను జారుకొన్నా—- (అంతర్యానం).

అంటూ మొదలయ్యే ఈ కవితా వస్తువు చాలా సాహసోపేతమైనది.  సంగమ సమయంలో, వాంఛలేకుండా శరీరాన్ని అప్పగించిన ఒక స్త్రీ ఆలోచనా తరంగాలు ఏవిధంగా సాగాయి అనేదే కవితా వస్తువు.  ఇలాంటి కవితకు ఎత్తుగడ, నడక, ముగింపు ఉత్తమంగా లేకపోతే  ఔచిత్యభంగం ఏర్పడి రసవిభ్రంశం కలుగుతుంది.   చదువరిని కవితలోకి సరసరా లాక్కొనే సరళమైన ఎత్తుగడ, బిగిసడలని నడకా, ఉదాత్తమైన ముగింపు ద్వారా కవయిత్రి తన ప్రతిభ అనన్యమని నిరూపించుకొన్నారు.

 

కలయిక అనే మరో కవిత

దేహాన్ని అర్పించడమంటే

మనసిచ్చినంత సులువుకాదు

మనసుముడి విప్పినంత తేలికగా

రవికె ముడి విప్పలేము ……

అంటూ చాలా బలమైన అభివ్యక్తితో సాగుతుంది.   అటువంటి వ్యక్తీకరణ స్త్రీవాద కవిత్వంలో ఇంతవరకూ కనిపించని ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ, కొత్తవెలుగుని ప్రసరింపచేస్తుంది.

 

“వాసన” అనే కవితలో ఈ కవయిత్రి భావనా పటిమ శిఖరాల్ని చేరుకొని ఒక గొప్ప మొజాయిక్ చిత్రాన్ని మనకళ్లముందు నిలుపుతుంది.

కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి

కొన్ని ఆకలి వాసన వేస్తాయి

కొన్ని పురుషదేహాలు

వాంఛా సుగంధం వెదచల్లుతాయి

మరికొన్ని ఉన్మత్తతను పెంచుతాయి

 

ఆటవిడుపు అనే కవితలో-  గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ,  ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు,  ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ కవయిత్రి అంటారు. సమకాలీన సమస్యలను భిన్న ఇజాలు ఎలా దర్శించినా, ఈ కవిత హ్యూమనిజం దృక్కోణాన్ని వ్యక్తీకరిస్తుంది.

 

ఈ కవితాసంపుటిలోని అనేక కవితలలో ప్రకృతి సౌందర్యం చక్కని అలంకారాలతో, శోభాయమానంగా కన్పిస్తుంది. అందమైన పదచిత్రాలను మనకళ్లముందు నిలుపుతుంది.

సాయింకాలపు గాలికి

అప్పుడే నీళ్ళోసుకున్న మల్లెతీగ

ఈడేరిన మొగ్గలతో నెమ్మదిగా

అటూ ఇటూ కాకుండా ఊగుతోన్నట్లు(సాలోచనగా)

 

మరో కవితలో

ఒక్కో చెట్టూ కొన్నివెల ఎర్ర జండాల సమూహంలా

ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అన్నట్టు

వేనవేలుగా ఏకమై ఒక్కో చెట్టును రుధిర తేజస్సుతో నింపుతాయి

తురాయిలంటారట వాటిని (పూల సైనికులు)

51 కవితలు కలిగిన “సహచరణం” జగద్ధాత్రి గారి మొదటి కవిత్వసంపుటి.  ఈ కవితలలో కనిపించే పదునైన అభివ్యక్తి, లౌకిక చింతన, ప్రేమ, మైత్రి, ప్రకృతి పట్ల తాదాత్మ్యత వంటి వివిధ భావనలు మంచి పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారు ఈ పుస్తకానికి వ్రాసిన ఆత్మీయవాక్యాలలో అన్నట్లు “She is not a frozen Feminist”.           జీవితంలోని అన్ని పార్శ్వాలకు తలుపులు తెరిచి, లోలోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాలలోకి వొంపిన గొప్ప “ప్రేమమయి”.  అందుకనే ఈ కవితలలో లోకంపట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయి.

పుస్తకం లభించు చోటు

చినుకు పబ్లికేషన్స్, విజయవాడ

ఫోన్: 984832208

నేను నీకు తెలుసు

 

 

శ్రీరామోజు హరగోపాల్ 

 

మర్చిపోయినట్టుగా గాలి పలకరించదు

గుర్తే లేనట్టు చెట్టు పూలు కురవదు

ప్రాణహితలా ప్రవహించిన కన్నీళ్ళు కూడా మర్చిపోయాయి

మేఘరాగాలు మాలలై గొంతునిండిన పాటలకే ఎరిక లేనన్నవి

 

దినదినం రాలిపోతున్న ఎండపుప్పొడులు

రాత్రయినా నైట్క్వీన్ పరిమళాలు దూరంగా పారిపోతున్నాయి

దిగులుచుట్టుకుని నిద్రించే కలల రంగులపుస్తకం దొరకదు

వానను భుజం మార్చుకుని మోసే రుతువులు వుట్టిగనె మాట్లాడవు

 

ఏమైనట్టు ఈ తురాయిపువ్వుల బాట తప్పిపోయిందా

ఆవిరులైన ఆశల్ని బోర్లించిన మూకుడులా ఆకాశం ఒడిసిపట్టుకుంటదా

నేను నిల్చున్న చోటే పిడుగు చోటడిగింది

రవ్వలు,రవ్వలుగా గువ్వపిట్టలు పొద్దుటిగూడు నుండి

 

ఎంత కలవరం మనసంతా

వొలికిపోయిన సిరా గీసినట్టున్నది బొమ్మ

మౌనంగా అక్షరాలు

ఏమైంది నీకు, నన్నిలా వొదిలిపొయ్యావు

నేనే కరిగి నీకు పారదర్శకధ్వనినై కప్పుకున్నాను

 

కాలాన్ని కాలుతీసి కడగా పెట్టమన్న

ఒక్క డై ఆటకన్నా నువ్వొస్తవని తెలుసు

 

(డై అంటే ఒక్కసారి అని తెలంగాణా పిల్లలాటలో వాడకం)

*

haragopal

 

 

గమనమే గమ్యం-14

 

 

olgaదుర్గాబాయి మధుర జైలు  నుంచి విడుదలై కాకినాడ వచ్చిందనీ, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదనీ కాకినాడ నుంచి అన్నపూర్ణ ఉత్తరం రాసింది. శారదకు ఇంగ్లండ్‌ వెళ్ళేముందు ఒకసారి దుర్గాబాయిను చూసి రావాలనిపించింది. పైగా కృష్ణా గోదావరీ జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు భావాలతో యువతీ యువకులు పనిచేస్తున్నారు. అక్కడివాళ్ళను కలిసివస్తే ఉత్సాహం పెరుగుతోంది. తల్లిని అడిగితే రాలేనంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి విశాలాక్షిని కలిసి వద్దామనుకుంది.

శారద వెళ్ళేసరికి విశాలాక్షి చాలా ఆందోళనతో ఉంది. ఈసారైనా యూనివర్సిటీలో ఎకనామిక్సు శాఖలో సీటు దొరుకుతుందా లేదా అనే దిగులు  పెట్టుకుంది. పైగా కోటేశ్వరి నాటకం కంపెనీ కోసం ఇంకెవరినో ఇంట్లో చేర్చింది. అతన్ని చూస్తుంటే విశాలాక్షి కి   కంపరంగా ఉంది. పాపం అతను విశాలాక్షి  జోలికి రావటం లేదు గానీ విశాలాక్షి  అతని ఉనికిని భరించలేకపోతోంది. అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందనే కోపం, దు:ఖంతో ఉడికిపోతోంది. దానికి తోడు ఇన్నాళ్ళూ ఎక్కడుందో తెలియని ఒకావిడ పిన్నంటూ ఇంట్లో దిగింది. ఆమెకు పద్నాలుగేళ్ళ కూతురు. వాళ్ళిద్దర్నీ తల్లి ఆప్యాయంగా చూసుకుంటుంటే విశాలాక్షి కి  ఒళ్ళు మండిపోతోంది.

‘‘ఇన్నాళ్ళూ ఏమయ్యారమ్మా వీళ్ళూ. నాకెప్పుడూ చెప్పనన్నా లేదు నాకో పిన్ని ఉందని’’ అనడిగింది తల్లిని.

‘‘నా పిన్నమ్మ కూతురమ్మా. మేమూ చిన్నతనంలో చూసుకోటమే. రాజమండ్రిలో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు కూతురిని పైకి తేవాలని పట్నం వచ్చింది. నాలుగైదు నెలల్లో ఏదో ఒకదారి చూసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళతో మరీ అంటీ ముట్టనట్టు ఉంటావెందుకు’’ అని కూతురిని సముదాయించబోయింది కోటేశ్వరి. విశాలాక్షి కి  ఆ పిల్ల ను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లుండేది.

‘‘పద్నాుగేళ్ళ పిల్ల.  బళ్ళోకి వెళ్ళి చదువుకునే వయసు. ఎప్పుడూ అద్దం ముందు చేరి సింగారం. ఆ బట్టలు , ఆ తల దువ్వుకోవటం. నాకు చూస్తుంటే చీదరగా ఉంది. ఇల్లు ఒదిలి ఎటన్నా పోదామని ఉంది’’.

విశాలాక్షి  ఈ చిరాకులో ఉండగానే శారద వచ్చింది. విశాలాక్షి  చాటంత ముఖం చేసుకుని.

‘‘నువ్వెంత మంచిదానివి శారదా “ ఇన్నిసార్లు మా ఇంటికి వస్తావు. నేను మీ ఇంటికి రావటం లేదని పట్టించుకోవు’’ అని ఆహ్వానించింది.

‘‘దాన్లో ఏముందోయ్‌ – ఎవరింటికి ఎవరొస్తే ఏంటోయ్‌’’ అని గలగలా నవ్వింది శారద.

‘‘మా ఇంటికి రావటానికి చాలామంది సందేహిస్తారు. వచ్చేవాళ్ళను చూస్తే నాకు చిరాకు’’ అంటూ తన మానసిక పరిస్థితంతా శారదతో చెప్పుకుంది విశాలాక్షి. .

‘‘పోనీ ఒక పని చెయ్యి. నేను దుర్గను చూడటానికి కాకినాడ వెళ్తున్నాను. నువ్వూ నాతో రా. మార్పుగా ఉంటుంది. మనం తిరిగి వచ్చేసరికి నీ సీటు సంగతి కూడా తేలుతుంది’’.

విశాలక్షి కి  కూడా ఆ మాట నచ్చింది. కానీ వెంటనే ఓ సందేహమూ వచ్చింది.

‘‘శారదా –  మనం వెళ్ళే చోట్ల నన్నూ నిన్నూ ఒకేలా చూస్తారా? నిన్నో చోటా నన్నో చోటా భోజనం చెయ్యమంటారా?’’

‘‘అలాంటి చోటికి నేను వెళ్ళనే తల్లి. దుర్గ దగ్గరికే వెళ్దాం. దుర్గ సంగతి నీకెంత తెలుసో నాకు తెలియదు. చిన్నతనంలోనే నువ్వే ఇష్టపడని మీ ఇళ్ళకు వచ్చి గాంధీ పురాణం చెప్తానని, గాంధీ గారి గురించి చెప్పేది. మనకంటే చిన్నదే గాని ఎన్నో విషయాల్లో మనల్ని దాటి ముందుకెళ్ళింది’’.

‘‘నాకా రాజకీయాలు  పడవు తల్లీ’’.

‘‘అనారోగ్యంతో ఉన్న దుర్గను పలకరించడానికి రాజకీయాలక్కర్లేదు గానీ నువ్వు రావాలి. వస్తున్నావు. అంతే’’ తొందర చేసింది.

‘‘మా అమ్మతో చెప్పాలిగా’’

‘‘మీ అమ్మగారితో నే మాట్లాడుతాలే’’ అంటూ శారద లోపలికి వెళ్లింది. శారదంటే కోటేశ్వరికి ఎంతో ఇష్టం. మనసులో ఉన్నదంతా వెళ్ళబోసుకోటానికి ముఖ్యంగా కూతురి గురించి చెప్పుకోటానికి ఆమెకు శారద కంటే ఎవరూ దొరకరు. శారదను చూడగానే కూతురి ఆగడా గురించి మొత్తుకుంది.

‘‘విశాలాక్షి  మనసు వేరుగా ఆలోచిస్తోందమ్మా. కాలేజీలో చేరితే అన్నీ కుదిరిపోతాయి. ఈ లోపల ఒక నెలరోజు నాతోపాటు కాకినాడ తీసుకుపోదామనుకుంటున్నా. మీరు ఒప్పుకుంటే ` ’’

‘‘అయ్యో – నేనెందుకు ఒప్పుకోను. నువ్వడగటం నేను కాదనటమా? బంగారంలా తీసుకుపో. నీకున్న బుద్ధి దానికుంటే ఎంత బాగుండేది. నువ్వెంత గొప్పింటి బిడ్డవు. మీ నాయనమ్మెంత నిష్టాపరురాలు. మీ నాన్నెంత పండితుడు. ఆ ఇంటి పిల్లవు మా ఇంటికొచ్చి నా చేతి వంట తింటున్నావు. దానికింత కంటే ఏం గౌరవం కావాలి? ఎప్పుడూ ఏదో కుములుతుంటుంది. దాని కుముడు చూడలేకుండా ఉన్నాను. తీసుకుపోమ్మా. నెలరోజు నేనూ సుఖపడతాను.’’ అంది.

శారద నవ్వి ‘‘విశాలాక్షి కి  చదువైపోయి పెద్ద ఉద్యోగం వస్తే తనూ మీరు కూడా సుఖపడతారు’’ అంది.

‘‘ఉద్యోగాల్లో నామ్మా సుఖం, శాంతి ఉండేది. మనసులో ఉండాలి. దాని మనసు మంచిది కాదు’’ అంది కోటేశ్వరి.

‘‘అట్లా కాదులే అమ్మా – మంచిదే , నే చెప్తాగా’’ అంటూ విశాలాక్షి  దగ్గరికి వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంది.

ఇక కృష్ణా, గోదావరి జిల్లాల్లో పార్టీ సభ్యులను కలుసుకుంటానని పార్టీ అనుమతి కోసం అడిగింది. పార్టీ సభ్యులకు కబుర్లు వెళ్ళాయి. అందరికీ అనుకూలమైన రోజేదో తెలుస్తుంది. శారదకది మహా ఉత్సాహంగా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాపకింద నీరులా, నీళ్ళల్లో చేపలా పాకుతోంది. గ్రామాలకు గ్రామాలు  జమీందారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక భావాలతో చైతన్యమవుతున్నాయి. వితంతు వివాహాలు  చేయటం, వయోజన విద్య వంటి కార్యక్రమాలతో ప్రజలోకి చొచ్చుకుపోతూ తమ ప్రత్యేకత చూపుతున్నారు. కాంగ్రెస్‌ సోషలిస్టుగా చలామణి అవుతున్నా అంతర్గతంగా వాళ్ళలో కమ్యూనిస్టు భావాలే జ్వలిస్తున్నాయి. గుంటూరులో ఏర్పడిన కమ్మ హాస్టలు  ఇలాంటి  భావాలున్న యువకులకు కేంద్రమైంది.

ముదునూరు, వీరుపాడు లాంటి గ్రామాలలో మహిళలు  కూడా ఇళ్ళు దాటి ముందుకు వస్తున్నారు.

olga title

అదంతా చూసి రావాలని శారదకు ఉంది. పార్టీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఓ వారం రోజుల ఎదురుచూపు తర్వాత పార్టీ శారద ఆ ప్రాంత కమ్యూనిస్టులను కలుసుకునేందుకు అంగీకరించటం లేదనే అనంగీకార పత్రం అందుకుంది. అన్ని ప్రాంతాలలో పోలీసు నిఘా చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు శారద వెళ్తే సమావేశాలు  ఏర్పాటు చెయ్యగలరనే నమ్మకం లేదు అని రాశారు. శారద ఉత్సాహం సగం చల్లారిపోయింది.

దుర్గ దగ్గర పదిరోజులుండి వస్తే చాలని విశాలతో కలిసి పది రోజులు  గడపటం కూడా మంచిదని అనుకుని సమాధానపడిరది.

కాకినాడలో రైలు  దిగి దుర్గాబాయమ్మ గారిల్లు  అంటే చెప్పలేని వారెవరూ ఉండరు. తేలిగ్గా దుర్గ ఇంటికి చేరారు. దుర్గను చూసి శారద భయపడిరది. ముఖంలో ఆ కళ, వర్చస్సు ఎటు పోయాయో ని;లువెల్లా నీరసంతో ఉంది. సన్నగా, నల్లగా, బహీనంగా ఉంది. శారదను చూసి దుర్గ చాలా సంతోషించింది.

దుర్గవాళ్ళమ్మా, తమ్ముడూ కూడా వీళ్ళకు చాలా మర్యాద చేశారు. విశాల చదువు సంగతి శారద చెప్పగానే దుర్గ ముఖంలో కాంతి వచ్చింది. విశాల  చేతులు  రెండూ గట్టిగా పట్టుకుని ‘‘తప్పకుండా చదువు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానకు’’ అంది.

‘‘ఈ సంవత్సరమన్నా సీటువస్తే’’ అని నిరుత్సాహంగా అంటున్న విశాల నోరు మూసి

‘‘ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. నేను ముత్తులక్ష్మీరెడ్డికి ఉత్తరం రాసిస్తాను. ఇక నీకు సీటు ఇప్పించటం ఆవిడ బాధ్యత. అవసరమైతే ప్రకాశం గారికి, కాశీనాథుని గారికి కూడా ఉత్తరాలు రాసిస్తాను. వాళ్ళూ సాయం చేస్తారు. నీకు సీటు తప్పకుండా వస్తుంది’’. ‘‘ఔను’’ అంది శారద.

‘‘విశాలా –  ముత్తులక్ష్మీరెడ్డి నీకు తప్పకుండా సాయం చేస్తుంది. మీ కులం వాళ్ళు ఆ వృత్తి వదలాలని ఆమె చాలా కృషి చేస్తోంది’’ అంది దుర్గ.

విశాలకు కొత్త ఆశ కలిగింది.

ఆ సాయంత్రం దుర్గని వీణ వాయించమని అడిగింది శారద.

దుర్గ వీణ వాయిస్తుంటే, శారద పాడుతుంటే త్యాగరాజకృతులకు విశాల అభినయం చేసింది.

చాలా రోజుల తర్వాత దుర్గ ఉత్సాహంగా ఉందని తల్లి సంతోషించింది.

‘‘ఈ వీణ నన్ను జైల్లో కాపాడిరది. నాకు పిచ్చెక్కకుండా చేసింది. సంగీతానికున్న శక్తి మరింక దేనికీ లేదు’’ అంది దుర్గ.

‘‘జైల్లోకి వీణ తీసుకెళ్ళారా’’ అంది విశాల ఆశ్చర్యంగా.

‘‘తీసుకెళ్ళలేదు. జైల్లో ఒంటరితనం, భయంకరమైన వాతావరణం భరించలేకపోయా. పిచ్చెక్కుతుందేమో అనిపించింది.ఆ స్థితిలో జైలు  సూపర్నెంటుని ఒక వీణ ఇప్పించమని అడిగా. నన్ను చూసి జాలిపడ్డాడేమో ,  తెప్పించి ఇచ్చాడు. వీణ వాయిస్తుంటే మళ్ళీ మనిషినయ్యాను నెమ్మదిగా. అబ్బా –  ఆ రోజులు   ఆ మనుషులు  ’’

‘‘అదంతా మర్చిపోవాలమ్మా ` ఆ జ్ఞాపకాలు  నీ ఆరోగ్యానికి మంచివికావు. అమ్మా శారదా –  మీ ముగ్గురూ కలిసి ఇంకో కీర్తన పాడండి. దుర్గ వీణ వాయిస్తూ పాడుతుంది’’ అంది అమ్మ.

ముగ్గురూ ఏం పాడదామంటే ఏం పాడదామనుకున్నారు.

ముగ్గురికీ నచ్చిన, వచ్చిన కీర్తన ‘సంగీత జ్ఞానము భక్తి వినా’ హాయిగా గొంతెత్తి పాడుతుంటే, ముగ్గురి గొంతుల  మధ్యనుంచీ వీణ మధురంగా పలుకుతుంటే వాతావరణమంతా ఆనందమయమైంది.

దుర్గ అప్పటికే బెనారెస్‌ మెట్రిక్‌ పరీక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంది.

నాస్తిక భావాలు  ప్రచారం చేస్తూ, కాకినాడ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న గోరా గారింటికి వెళ్ళి ట్యూషన్‌ చెప్పించుకుంటోంది. శారద తనున్న నాలుగు రోజులూ  దుర్గకు సైన్సు పాఠాలు చెప్పింది. విశాల ఇంగ్లీషు గ్రామరు చెప్పింది.

ముగ్గురూ కలిసి గోరా గారింటికి వెళ్ళారు.

ఆ ఇంటి వాతావరణం విశాలను ఆశ్చర్యపరిచింది. శారదా వాళ్ళ ఇల్లు   కుల మత బేధాలకతీతంగా నడుస్తున్నా ఇంట్లోకి రాగానే అది బ్రాహ్మణుల  ఇల్లని తెలుస్తుంది.  సుబ్బమ్మగారు దేవత విగ్రహాలు, పటాలు  ఇంట్లో అలంకరణగా పెడుతుంది. పెద్ద ఇల్లు .

గోరా గారి ఇల్లు ఒక పాక. విశాలమైన ఆవరణ ఉంది. దాని నిండా రకరకాల మొక్కలు . చెట్లు, పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. పాకలో ఒకవైపు గోరాగారి ఇల్లు  ఏ మత చిహ్నాలు  లేకుండా ఉంది. పక్కనే ఉన్న గదిలో గోరాగారి తల్లిదండ్రుల పూజగది ఉంది. సరస్వతి గోరాగారి భార్య. ఆమె నాస్తికురాలు. అయినా అత్తమామల పూజకు కావసిన ఏర్పాట్లు చేసేది.

శారదా, సరస్వతి క్షణాల్లో స్నేహితులయ్యి ఎన్నాళ్ళబట్టో ఎరిగున్న వాళ్లలా కబుర్లు చెప్పుకున్నారు.

గోరా గారితో శారద నాస్తికవాదం గురించి చిన్న వాదన చేసింది. ప్రజలు  ఈ భావాలకు భయపడతారని శారద, ప్రజలలో అనవసర భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వటమే గదా మనం చెయ్యాల్సింది అని గోరాగారూ `

విశాలకిదంతా కొత్త ప్రపంచం. తన ఇంటి వాతావరణానికి ఇక్కడి ఈ ఇళ్ళకూ పోలికే లేదనుకుంది. ఐనా విశాల ఇక్కడ కూడా కలవలేకపోయింది. వీళ్ళు కూడా తనవాళ్ళు కాదనిపించింది. వాళ్ళు శారదను చూసినట్టే విశాలనూ చూస్తున్నారు. కానీ విశాలకు ఎక్కడో ఏదో తేడా ఉందనే అనిపిస్తోంది. ఆ ఆదర్శాలు  విశాలకు ఎక్కటం లేదు. వాళ్ళ మాటల్లో విశాల లీనం కావటం లేదు.

విశాల మనసులో మద్రాసు వెళ్ళగానే తను కలవబోయే ముత్తులక్ష్మీరెడ్డి, ఆమె తనకు ఇప్పించబోయే సీటూ తప్ప మరింకే ఆలోచనా నిలవటం లేదు. శారద మాత్రం కాకినాడ వచ్చి మంచిపని చేశాననుకుంది. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ గురించి దుర్గతో మాట్లాడదామనుకుంది గానీ ఆమెతో రాజకీయాలు  మాట్లాడవద్దని దుర్గ తమ్ముడు నారాయణరావు హెచ్చరించాడు. చూస్తుండగానే పదిరోజులు  గడిచాయి. దుర్గ బలవంతం మీద మరో ఐదు రోజులు ఉన్నారు. తిరిగి ప్రయాణమవుతుంటే దుర్గ తను ఒడికిన నూలుతో నేసిన చీరొ చెరొకటీ ఇచ్చింది.

‘‘జీవితాంతం ఇది దాచుకుంటా దుర్గ. ఎంతో అమ్యూల్యం నాకిది’’ అంది శారద ఆ చీరెను గుండెకు హత్తుకుంటూ.

ముగ్గురూ కలిసి మళ్ళీ త్యాగరాజ కీర్తన అందుకున్నారు. దుర్గ మధురంగా వీణ వాయించింది.

విశాల, శారద తిరిగి వచ్చీ రాగానే శారద తన పలుకుబడి ఉపయోగించి ముత్తులక్ష్మీరెడ్డిని కలిసే ఏర్పాటు చేసింది.

విశాల ఆమెతో తన పరిస్థితీ, తన కోరికా ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. దుర్గాబాయి రాసిన ఉత్తరం ఇస్తే లక్ష్మీరెడ్డి నవ్వి ‘‘నీ మాటలన్నీ విన్నాక ఇంక ఎవరి సిఫారసూ అక్కర్లేదు. దుర్గాబాయి అంటే నాకెంతో గౌరవం. నిజమే. ఇప్పుడు నువ్వంటే ఎంతో ప్రేమ కలిగింది నాకు. నువ్వు ఏమ్‌.ఏ లో చేరటానికి కావసిన ఏర్పాట్లు చేసుకో –  శారదా. నువ్వు ఇంగ్లండ్‌ వెళ్తావా? మంచి పని –  నాకూ ఇంగ్లండ్‌ రావాని ఉంది.’’

ముగ్గురూ ఎన్నో విషయాలు  మాట్లాడుతూంటే రెండు గంటల  కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యాస్నేహం కుదిరింది.

శారద మనసు ఎపుడెపుడు మూర్తిని చూద్దామా అని తహతహలాడుతోంది. ఆమె రాగానే ఆమె వచ్చినట్లు మూర్తికి కబురుపంపింది. రెండు రోజులు  గడిచినా మూర్తి రాలేదని దిగాలు  పడిరది. మళ్ళీ ఒక మనిషి కోసం ఇంత బలహీనమవుతున్నానేమిటని తనను తాను హెచ్చరించుకుంది.

మూడో రోజు మూర్తి వచ్చాడు.

‘‘మూడు రోజుకు తీరిందా’’ అంది నిష్టూరంగా.

‘‘పదిహేను రోజులు ఒక్కడినే ఒదిలి వెళ్తే నేనేమయ్యానో నీకు తెలియాలిగా’’.

‘‘బాగా తెలిసింది’’ నవ్వేసింది శారద.

గలగలా కాకినాడ కబుర్లన్నీ చెప్పింది. గోరాగారి గురించీ, వాళ్ళింటి గురించీ చెప్తూ ‘‘ఆయన వృక్షశాస్త్రంలో భలే పరిశోధన చేస్తున్నారు తెలుసా? ఒక వింత సంగతి చెప్తా విను. బొప్పాయి చెట్లలో ఆడచెట్లూ, మగచెట్లూ ఉంటాయి. తెలుసుగా?’’

‘‘బొప్పాయి చెట్లలో ఏంటి? సృష్టిలో ప్రతి ప్రాణిలో ఉంటాయి ఆడ, మగ. లేకపోతే సృష్టి సాగేదెట్లా.’’

‘‘అబ్బా ` నీకు లా తెలుసుగానీ వృక్షశాస్త్రం తెలియదు. బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లకి ఆడ, మగ పూలు పూస్తాయి. మగపూలు రాలి ఆడపూలు కాయవుతాయి. కొన్ని చెట్లు మగ చెట్లుగానే ఉంటాయి. మగపూలే పూస్తాయి. అవి రాలిపోతాయి. కాయలు కాయవు. కొన్ని ఆడ చెట్లుగా ఉంటాయి. ఆ చెట్టు పూలన్నీ కాయలు కాస్తాయి. గోరాగారు మగచెట్టుని కూడా ఆడచెట్టుగా మార్చాలని పరిశోధన చేస్తున్నారు’’.

మూర్తి తల పట్టుకుని ‘‘మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చనంతవరకూ ఎవరేం చేసుకున్నా నాకభ్యంతరం లేదు’’ అన్నాడు.

‘‘ఆడవాళ్ళను మగవాళ్ళుగా మారిస్తే’’

‘‘అది నువ్వు చెప్పాలి. నాకు నేను మగవాడిగా ఉంటే చాలు. మారాలని లేదు’’.

‘‘నాకేమనిపిస్తుందో చెప్పనా?’’ ముద్దుగా అడిగింది శారద.

‘‘చెప్పు’’ అన్నాడు ఆమెని రెప్పవాల్చకుండా చూస్తూ.

‘‘బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లలాగా ప్రతి మనిషిలో ఆడ, మగ ఇద్దరూ ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అని వేరుగా ఉండనవసరం లేదు. రెండు క్షలణాూ ఉన్న మనుషులుండాలి. అప్పుడు ఈ తేడాలుండవు. ఎన్నో సమస్యలు పోతాయి’’.

‘‘కొత్త సమస్యలు  చాలా వస్తాయి’’ శారద నెత్తి మీద మొట్టికాయవేశాడు.

‘‘ఏమొస్తాయి’’ అమాయకంగా అడిగింది శారద.

‘‘సెక్సు –  సెక్సు ఎట్లా?’’

‘‘ఏముంది? సింపుల్‌. ఉదాహరణకు నీలో ఆడక్షణాలు  ఉద్రేకించినపుడు మగక్షణాలు  ఉద్రేకించిన మనిషి వైపు ఆకర్షించబడతావు. సెక్సు సాధ్యమవుతుంది. నీలో అపుడు అండం విడుదయితే అవతలి నుంచి వీర్యకణాలు  చేరతాయి. రెండూ కలిసి ఎవరి శరీరంలో స్థిరపడితే వారి గర్భంలో బిడ్డ పెరుగుతుంది’’.

‘‘శారదా –  ప్లీజ్‌ ` ఆపు. నువ్వు డాక్టర్‌వి. నిజమే గాని నువ్వు చెప్పేది వింటే నాకు కడుపులో వికారంగా ఉంది. ఇంక ఆపు. లేకపోతే నన్ను వెళ్ళిపొమ్మని సూటిగా చెప్పెయ్‌’’.

శారద గలగలా నవ్వి ‘‘నీతో తప్ప ఇలాంటి విచిత్రపు ఆలోచనలను ఇంకెవరితోనూ చెప్పలేను. అదేంటో –  సరేగానీ నువ్వూ దీని గురించి ఆలోచించవా.’’

‘‘చచ్చినా ఆలోచించను. మగాడు మగాడిలా, ఆడది ఆడదిలా ఉండాలి. వాళ్ళు ప్రేమించుకోవాలి. పెళ్ళాడాలి. ఇప్పటిలా పిల్లల్ని కనాలి. అదే సృష్టిధర్మం. నాకదే ఇష్టం’’.

‘‘సృష్టి ధర్మాలను కమ్యూనిజం మార్చదా? మార్పు ఇష్టం లేకపోతే కమ్యూనిస్టువి కాలేవు’’.

‘కమ్యూనిస్టు కోరేది ఇలాంటి మార్పు కాదు. ప్లీజ్‌ ఆ గోరా గారికో నమస్కారం. నీకో నమస్కారం. ఇంకేదన్నా చెప్పు. దుర్గాబాయి గురించి ఇంకా చెప్పు.’’

‘‘ఆమె చాలా నలిగింది. శారీరకంగా, మానసికంగా. చదువుకుంటోంది. కోలుకుంటుందిలే’’.

‘‘ఆమె జైల్లో గడిపిన దుర్భర జీవితాన్ని ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ తన ప్రతిష్ట పెంచుకుంటోంది’’.

‘‘పెంచుకోని. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టతో పాటు అందులో సోషలిస్టు ప్రతిష్టా పెరుగుతుంది.’’

‘‘దుర్గాబాయి సోషలిస్టు కాదుగా’’

‘‘ఏమో కావచ్చు. మన ఆశయాలు  ఆమెకు నచ్చుతాయి’’.

‘‘ఆమె ఎన్నటికీ కమ్యూనిస్టు కాదు’’.

‘‘కాకపోవచ్చు. కమ్యూనిస్టు కాకుండా మంచి మనుషులు  ఉండకూడదా?’’

‘‘ఉండొచ్చుగానీ – వాళ్ళ మంచితనం ఎవరికీ ఉపయోగపడదు’’.

‘‘ఇపుడు గాంధీ మొదలైన వాళ్ళ మంచితనం వల్ల ఏ ఉపయోగం లేదా?’’

‘‘ఉంది. కొంతవరకే.’’

‘‘ఆ – కొంత, కొంత,  కొంత కలిసి సంపూర్ణమవుతుంది. కొంత లేకుండా సంపూర్ణం లేదు. కాబట్టి కొంత కూడా పూర్ణమే. అందుకే మనవాళ్ళు పూర్ణమిదం పూర్ణమదం అన్నారు.’’

‘‘బాబోయ్‌ –  ఇవాళ నువ్వన్నీ తాత్విక చర్చలు  చేస్తున్నావు. నేను వెళ్ళొస్తా.’’

మూర్తిని ఆపింది శారద. రాత్రి పొద్దుబోయే దాకా చర్చలతో గడిపి భారంగా విడిపోయారిద్దరూ.

***

 

 

 

9/11, నా నైల్ కటర్!

 

సుధా శ్రీనాథ్ 

 

sudhaమా ఊరి వైపు కొన్ని సముదాయాల్లో ఏడూ పదకొండనే expression ఎక్కువగా వాడుకలో ఉంది. కర్నాటక సరిహద్దుల్లో ఉన్నాం కాబట్టి ఇది అక్కడ్నుంచి అనువాదమై వచ్చిందనుకొంటా. నిరుపయుక్తం లేక సర్వనాశనమనే అర్థంతో దీన్ని వాడుతారు.

పాండవుల ఏడు అక్షౌహిణుల సైన్యం మరియు కౌరవుల పదకొండు అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పూర్తిగా నాశనమై పోయాయి; దానికి తోడు కురు వంశంలోని తమ బంధువర్గమంతా చంపబడిందని యుద్ధంలో గెల్చిన పాండవులకు ఏ విధమైన సంతోషమూ కల్గలేదనేది సూచిస్తూ మొదలయ్యిందట ఈ వాడుక. ఈ ఏడూ పదకొండనే వాడుక తెలుగువాళ్ళందరికీ తెలుసో, తెలీదో నాకు తెలీదు. అయితే నైన్ ఇలెవన్ లేక నైన్ ఒన్ ఒన్ అన్నామా తక్షణమే దాని అర్థం అమేరికాలో ఉన్న తెలుగువాళ్ళకే కాదు, అమేరికాలో ఉన్న ప్రతియొక్కరికీ తెలుసు. ఎందుకంటే అది అమేరికన్ ఎమర్జెన్సి హెల్ప్ లైన్. ఏదే విధమైన కష్టాలకి, ఏ సమయాల్లోనైనా కానీ మనం ఫోన్‌లో 911 నొక్కి, వారికి తెలిపామంటే మనకి సహాయం ఆఘమేఘాల మీద వచ్చేస్తుంది. అమేరికాలోని ఈ సహాయవాణి వ్యవస్థ మరియు సమయానికి సూక్త సహాయం అందించే వారి చాకచక్యతల ట్రైనింగ్ ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేదని నా అనేక విదేశీ స్నేహితులు చెప్పగా తెల్సింది.

2001 తర్వాత 911 (నైన్ ఇలెవన్) అంటే ఇంకో అర్థం కూడా మొదలయ్యింది. ఇప్పుడు నైన్ ఇలెవన్ అన్నామా తక్షణమే అమేరికన్స్ అందరికీ గుర్తొచ్చేది సెప్టెంబర్ పదకొండు, 2001. అమేరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నట్టి, ప్రపంచంలో అప్పటికి అత్యధిక ఎత్తున్న కట్టడాలైన world trade centerకి చేరిన రెండు టవర్స్ నేలగూలిన దినమది. అది భూకంపంవల్ల గానీ లేక కట్టడానికి చవక సామగ్రి వాడినందువల్ల గానీ లేక చవక పనితనం వల్ల గానీ కాలేదు. కొందరు ఉగ్రవాదులు/దుష్కర్ములు అమేరికా దేశపు విమానాలనే అపహరించి వాటినే ఆత్మహత్యాబాంబులుగా వాడి ఆ రెండు బృహత్ కట్టడాలను ధ్వంసం చేశారారోజు.  ఆ కరాళ కృత్యం వేలకొద్దీ అమాయకులను బలి తీసుకొని వట్టి అమేరికా దేశవాసుల్నొక్కటే కాదు మొత్తం ప్రపంచాన్నే భయ భీతులై వణికేట్టు చేసింది. మొత్తం నాలుగు నగరాల్లో ఒకే సారి విమానాలనుపయోగించి ఇట్లాంటి దాడులు చేసిన రోజది. తక్షణమే అమేరికా రక్షణ కార్యాలయం భద్రతాస్థాయిని పెంచి, ప్రజాభద్రతను ఒక పెద్ద సవాలుగా తీసుకొని, అప్రమత్తంగా ఉండి దేశప్రజల భద్రతకు ముప్పు రాకుండా కాపాడేందుకని నిర్విరామంగా కృషి చేసింది. మేమప్పుడు అమేరికా దేశపు టెక్సస్‌లో ఉన్న డాలస్ నగరంలో నివసించే వాళ్ళం.

నేను ప్రతి సాయంత్రం మా పాపను ఇంటి ప్రక్కనే ఉన్న వాగు దగ్గర కానీ లేక పోతే swimming pool వైపుకు కానీ ఆటాడేందుకు తీసుకెళ్ళేదాన్ని. మా ఇల్లు DFW airport నుంచి సుమారు పది మైళ్ళ దూరంలో ఉండింది. మా ఇంటి చుట్టుపక్కల నిలబడితే ఆకాశం నుండి రన్‍వేకు దిగేటటువంటి విమానాలు మరియు రన్‍వే నుండి ఆకాశానికెగిరే విమానాలు కూడా చక్కగా కనిపించేవి. డాలస్ ప్రపంచంలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. రోజుకు సుమారు ఏడు వేలు విమానాల రాకపోకలను నిర్వహించే సామర్థ్యంతో సకల ఆధునిక సౌకర్యాలతో కూడిన సమర్పకమైన వ్యవస్థ ఉన్నట్టి విమానాశ్రయమది. వీటిలో నాగరికుల స్వదేశీప్రయాణానికని అంటే అమేరికాలోని అన్ని ముఖ్య పట్టణాలకు వెళ్ళి వచ్చే విమానాలు కొన్నయితే, అంతర్రాష్ట్రీయ దూరాలు క్రమించే విమానాలు మరి కొన్ని. వీటితో పాటు సరుకుల్ని రవాణా చేసే విమానాలూ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు ఏ సమయంలోనైన ఆకాశానికి ఎగిరే విమానాలు మరియు ఆకాశం నుండి దిగే విమానాలు కనపడ్డం సర్వసాధారణం.  నేను పాపకు కూడికలు, తీసివేతలు నేర్పేందుకు కొన్ని సార్లు చుట్టూ ఉన్న పువ్వులు, మొగ్గులూ వాడితే కొన్ని సార్లు ఆకాశంలో ఏరుతూ, దిగుతూ ఉన్న విమానాలను కూడా వాడేదాన్ని. పాపకు విమానాలతో లెక్కలు చేయడం భలే ముచ్చటగా ఉండేది.

అయితే ఆ రోజు సాయంత్రం ఆకాశంలో ఒక్క విమానమూ కనపడ లేదు. అక్కడొక్కటే కాదు, పూర్తి అమేరికా దేశపు ఆకాశంలోనే ఎక్కడా విమానాలుండలేదు. ఎందుకంటే ప్రజల సురక్షతా అంగంగా ఆ రోజు అమేరికా దేశపు ఆకాశ వీధుల్లో ఎగురుతున్న అన్నీ విమానాలూ భూస్పర్షం చేయాలని అమేరికా ప్రభుత్వం ఆదేశించింది. విమానాల కోసం ఆకాశంలో వెదుకుతున్న మా పాపకు దాని గురించి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తోచలేదు. తన ప్రశ్నలకు బదులివ్వడం కష్టమై చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో కారణం చెప్పి త్వరగా ఇంటికి తీసుకొచ్చేశాను.

ఆ రోజు జరిగిన ఘటనను ఒక హెచ్చరికా గంటగా భావించి అమేరికన్ ప్రభుత్వం దేశపు భద్రతా వ్యవస్థల్లో చాలా మార్పులు, చేర్పులూ చేసింది. దేశ ప్రజల సురక్షత కోసమనే ఒక కొత్త ప్రభుత్వ శాఖను అస్తిత్వానికి తెచ్చి, సార్వజనిక ప్రదేశాల్లో అనేక కొత్త విధానాల ద్వారా రకరకాల తనిఖీలు ప్రవేశ పెట్టి మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని చోట్లయితే విదేశీయుల్లాగ కనబడే అందర్నీ అనుమానాస్పదంగా చూడటం, వారి పట్ల మళ్ళీ విపరీతంగా తనిఖీ చేయడం కూడా జరిగింది.

అన్యాయాన్నీ, అక్రమాల్నీ, అత్యాచారాల్నీ అరికట్టడానికి ఐకమత్యం అత్యవసరమన్న విషయం ఆ సమయంలో అమేరికన్స్ నిరూపించారు. ప్రభుత్వమిచ్చిన అన్ని ఆదేశాలనూ అక్షరాలా పాటించాలనే పట్టుదల మేం చూసిన ప్రతియొక్కరిలోనూ ఉట్టిపడుతూండేది. దేశప్రేమంటే ఇలా ఉండాలి అనిపించేది. చిన్న పిల్లల మనసుల్లో ఈ వార్తల వల్ల భయం గూడు కట్టుకోకూడదని ప్రథమ మహిళగా ఉన్న శ్రీమతి లారా బుష్ ఎలెమెంటరి స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా ఒక లేఖ పంపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని, ఈ సమయంలో ఏ విధమైన భయము, సంశయాలు మనసులో ఉంచుకోకుండా ఒకరికొకరు స్నేహ సౌహార్దతలతో ఉంటూ, మంచి మనుషులుగా మెలగాలని మరియు మనసులో ఏ ఆతంకాలూ వద్దని రాసిన ఆ ఉత్తరం పాప స్కూల్‌నుంచి తెచ్చింది. అది చదివి పరమాశ్చర్యమయ్యింది. అతి సున్నితమైన పిల్లల మనసుకు, వారి భావాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను చూసి ఏదో ఒక పవిత్ర కార్యాన్ని ప్రత్యక్షంగా చూసిన కృతార్థ సాక్షీ భావన మాదయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఊరన్నాక పెంట కుప్ప ఉండే ఉంటుందన్నట్టు తప్పుడు అభిప్రాయాల మూలంగా ఒకటి రెండు విద్వేషకారి ఘటనలు అక్కడక్కడ జరిగాయి, అయితే మంచికి పోల్చితే అవి చాలా తక్కువ.

ఆ ఉగ్రవాదుల దుష్కృత్యం వల్ల ఎచ్చెత్తుకొన్న ప్రభుత్వం నాగరికుల సురక్షత కోసం నాగరిక మరియు వాణిజ్య విమానయానంలోనైతే నాటకీయ మార్పులను తెచ్చింది. ప్రయాణికులను మరియు వారి చేతిసంచులను లోహపు యంత్రాల ద్వారా చూసిన తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా కూడా తనిఖీ చేసి ఆయుధంగా వాడేందుకు సాధ్యం కావచ్చనుకొనే అన్ని వస్తువులనూ అడ్డుకొంది. ఈ తనిఖీలు రోజు రోజుకూ ఎక్కువవుతూనే పోయాయి. విమానంలోని కాక్‍పిట్ సురక్షత కోసం ప్రత్యేక భద్రతావ్యవస్థల్ని చేకూర్చారు. ప్రయాణికుల చలనవలనాల్ని గమనించి పరీక్షించేందుకని సరికొత్త తంత్రజ్ఞానంతో ఉన్న యంత్రాలు, వ్యక్తిగత పరీక్షలు, ఎక్కువ నియమాలూ కూడా వచ్చి అదనంగా రెండు గంటల సమయం వీటికని కేటాయించాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో విమానయానమంటేనే భయము, చిరాకూ ఎక్కువయ్యాయి.

జాకెట్, శూస్ విప్పి X-ray detector ద్వారా తనిఖీ చేయడం కూడా మొదలయ్యింది. పదునుగా ఉన్న చాకు, కత్తెరలాంటివి విమానం లోనికి తీసుకెళ్ళేందుకు నిషేధింపబడ్డాయి. ఏయే రీతిన ఉగ్రవాదులు దుష్కృత్యాలకు తలపెట్టొచ్చని వివిధ కోణాల్నుంచి ఆలోచించి అటువంటి వాటిని అడ్డుకొనేందుకు ఆయారీతుల్లో సురక్షతాక్రమాల్ని అన్ని ప్రదేశాల్లోనూ జారీ చేశారు. విమానంలో ప్రయాణికుల ద్రవ్య పదార్థాల నిషేధమూ ఆ పట్టికలో చేరింది. అనుమానం వస్తే భద్రతాధికార్లు ప్రయాణికులను రెండ్రెండు సార్లు తనిఖీ చేయడం కూడా జరుగుతూండేది. ఇవన్నీ ఒక్కో సారి ఆక్రోశం కల్గ జేసి, వివాదాలు సృష్టించి, గొడవలైన ప్రసంగాలు కూడా జరిగాయి. అయితే ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి మన మంచికే అనే వాదమే ఆఖరుకు గెలిచేది. సురక్షత జీవితంలో ఒక ప్రముఖమైన అంగం.  అది లేక పోతే జీవితంలో శాంతి సమాధానాలుండవు. అందుకే, ఇరు రాజకీయ పక్షాలు ఒక్కుమ్మడిగా ఏకీభవించి దేశభద్రతనే మూల మంత్రంగా భావించి ఆ దిశకు సమాన భాగస్వాములై కృషి చేశాయి.  రోజుకొక కొత్త తనిఖీ విధానం జారీ అయి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కూడా ఆఫీసర్లకు తాము చేపట్టిన వృత్తి పరంగా ఉన్న నిబద్ధత అభినందనార్హం. మొత్తానికి అందరూ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలను పాటించడం వల్ల మళ్ళీ అట్లాంటి అహితకర ఘటనలు దేశంలో జరగకుండేట్టు చూసుకొని ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడింది.

ఇంతగా పీఠిక ఎందుకు వేశానంటే నాదైన ఒక చిన్ని విశేషానుభవాన్ని మీతో పంచుకోవాలని. మేం ప్రతి సంవత్సరం ఏప్రిల్ – మే నెలల్లో భారత దేశానికి ప్రయాణం పెట్టుకొనే వాళ్ళం. అప్పుడిక్కడ పిల్లలకు బడి సెలవు కాబట్టి మా పాప కజిన్స్‌తో బాగా ఆటాడేందుకు అవకాశం దొరికేది. ఆ సంవత్సరమూ ఎప్పటిలా మేం సెలవులకని ఊరికి బయలుదేరాం. విమానాశ్రయంలో ప్రయాణికుల సురక్షత కోసం నేపథ్యంలో ఎన్నో రకాల కొత్త ప్రకటనలు చేస్తున్నారు. యథా ప్రకారం మా సూట్‍కేసులను ఎక్స్ రే కళ్ళతో చూసిన తర్వాత వాటిని తెరచి కూలంకుశంగా పరీక్షా దృష్టితో తనిఖీ చేశారు.

 తర్వాత మా హ్యాండ్‌బ్యాగుల్ని X-ray detector మూలకంగా పంపినప్పుడు మా ఆయన శేవింగ్ సెట్నుంచి కత్తెర తీసి, దాన్ని విమానంలోకి తీసుకెళ్ళేట్టులేదన్నారు. నా బ్యాగ్లో కూడా ఏదో పదునైన వస్తువు ఉందని వెదికి తుదకు బయటికి తీశారు ఒక చిన్ని నైల్‍కటర్ని. దాంట్లో ఒక చిన్ని చాకు ఉన్నందువల్ల విమానంలోనికి నైల్‍కటర్ తీసుకెళ్ళేందుకు అనుమతి లేదని అక్కడి భద్రతాధికారి నాకు తెలిపారు. అది మా నాన్నగారు నాకు చిన్నప్పుడు కొనిపెట్టిన ఒక చిన్ని నైల్‍కటర్. అది బాగా పదునుగా ఉండి, గోర్లను చాలా బాగా కత్తరించేది. అందుకని దాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొనొచ్చాను. అది నా బ్యాగ్‌లో కూర్చొని నా జతలో నేను వెళ్ళిన పాఠశాలకు, కాలేజికి కూడా వచ్చింది.  నేను మానసగంగోత్రిలో చదివినప్పుడు మరియు టాటా ఇన్‍స్టిట్యూట్‍లో చదివేటప్పుడు కూడా నాతోనే ఉండింది.

నేను ఎక్కడికెళ్తే నాతో అక్కడికొచ్చి సహాయపడిన నా నేస్తమది. అందుకే నాతో అమేరికాకొచ్చింది, ఇప్పుడు కూడా నాతో ఉంది నా జీవన సంగాతిలాగ. దాంట్లో ఉన్న చిన్ని చాకు నాకు ఎన్నో చోట్ల యాపిల్ మరియు జామ పండ్లు తరిగేందుక్కూడా ఉపయోగపడింది. అది నాతో ఎన్నో విమానయానాలు కూడా చేసింది. మొత్తానికి అది నాకు అచ్చుమెచ్చైన నైల్‍కటర్. అది నాతో ఉన్న సుమారు ఇరవై ఏళ్ళలో నా స్నేహితులెందరో కూడా దాన్ని వాడి మెచ్చుకొన్నారు. ఆఖరుకు నా ఈ నేస్తానికి విదాయం చెప్పాల్సిన సమయమొచ్చిందని బాధయ్యింది. మా ఆయనేమో తన కత్తెరని అక్కడే పడేశారు. వేరే దారి లేక, నా నైల్‍కటర్ని కూడా అక్కడే పడేయాలి కదాని దాన్ని ఆ భద్రతాధికారి నుండి తీసుకొని నా పిడికిట్లో ఉంచుకొని ఒక క్షణం భావుకురాలినై కళ్ళు మూసుకొని మనసులోనే దానికి వీడ్కోలు చెప్పి మళ్ళీ అతనికిచ్చేశాను.

అతి సామాన్యమైన చిన్ని నైల్‌కటర్ అని అతననుకొన్నాడేమోనని అసలు విషయం అతనితో చెప్పాను. మా కళ్ళ ముందే ఇలాంటి నిషేధింప బడ్డ లోహపు వస్తువులను ఒక ప్రత్యేకమైన చెత్త బుట్టలో వేయడం చూశాను. అందులోని స్టీల్ వస్తువులన్నీ మిరమిర మెరుస్తున్నాయి. మా ఆయన కొత్త కత్తెర కూడా అందులోనే వేయబడింది. ఆ బుట్టలో చిన్ని చిన్ని నైల్‌కటర్స్, ప్లక్కర్స్, కత్తెరలు ఉండటం చూసి దీనిక్కూడా అదే గతి పడుతుందనుకొన్నాను. ప్రయాణికుల రక్షణ కోసం అన్ని నియమాల్ని పాటించేలా చూడటం మా కర్తవ్యం కాబట్టి మీ మనసుకు నొప్పి కల్గిస్తున్న మమ్మల్ని క్షమించండంటూ ‘సారీ’ చెప్పాడతను. అమేరికన్లకు మనకంటే మంచి మాటకారితనముందని నా అభిప్రాయం. వారి శిక్షణ పద్ధతులు చిన్నప్పుడే అందరికీ మంచి సంవహనా కౌశల్యాన్ని సహజంగా పెంపొందేట్టు చేస్తాయని మా పాప స్కూల్లో ఉన్నప్పుడు గమనించాను. ఎన్నో సన్నివేశాల్లో వారి మాటలు ఇష్టమైనప్పుడు నాకు సుమతి శతకంలోని పద్యం

ఎప్పటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి అన్యుల మనముల్

నొప్పించక తా నొవ్వక

తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు సుమతీ|

గుర్తొచ్చేది. ఇప్పుడు కూడా అతను నాకు ఎంత చక్కగా చెప్పారంటే ఇట్లాంటి సందర్భంలో ఒక చిన్ని నైల్‍కటర్ కోసం నేనంతగా బాధపడకూడదని నన్ను నేనే సమాధానపరచుకొన్నాను.

మేమెక్కాల్సిన విమానానికని ఉన్న ద్వారం వద్ద సెక్యూరిటి లౌంజ్‌లోకెళ్ళి కూర్చొని సుమారు అర్ధ గంట సమయం అయ్యుంటుంది. నా నైల్‍కటర్ తీసుకొన్న సెక్యూరిటి ఆఫీసర్ పరుగులతో వచ్చి నా చేయి లాగి అరచేతిలో ఏదో పెట్టారు. అతడి కళ్ళలో ఆనందం! అతని ముఖంపై ఏదో సాధించానన్న సంతోషం! అతడు నా చేతిలో ఉంచింది నా నైల్‍కటర్ ఉన్న ఒక చిన్ని పాలిథిన్ బ్యాగ్!

“We do respect your feelings for your family, M’am. I explained to my boss that this was a gift from your dad which you have treasured for 2 decades. He allowed me to remove the knife from this and return it to you.” అన్నారు. నేనడక్కపోయినా నా చిన్ని నైల్‍కటర్ మళ్ళీ నాకు దక్కేలా చేసిన ఆ ఆఫీసర్ మానవీయతకు అంజలీహస్తంతో థ్యాంక్స్ చెప్పాను. “namaste M’am! Have a nice trip home! ” నవ్వుతూ వెళ్ళిపోయాడతను. జరిగింది జీర్ణించుకోవడానికి నాకు కొన్ని నిమిషాలు పట్టింది.

నాకూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్‌కూ ఏ విధమైన పరిచయమూ లేదు. రోజూ అతను చూస్తున్న వందలాది భారతీయ ప్రయాణికుల్లో నేనూ ఒక సామాన్య ప్రయాణికురాలినంతే. ప్రతి చిన్న విషయాన్నీ సూక్ష్మాతిసూక్షంగా గమనించి సందేహించే ఈ పరిస్థితుల్లో అతను నా చిన్ని నైల్‌కటర్ కోసం అదనంగా శ్రమ పడటం ఆశ్చర్యాన్నిచ్చింది. తన బాస్‌తో అనుమతి కోసం ప్రయత్నించి, ఒప్పించి, దాంట్లో ఉన్న చాకును తీయించి, దాన్ని నాకు తెచ్చిచ్చేలా చేసిన ఆ ప్రేరణా శక్తి అతనికి ఎక్కడ్నుంచి వచ్చిందా అని ఆలోచించాను. బహుశః అతను తల్లిదండ్రులపై ప్రేమాదరాలు కల్గియున్న వ్యక్తియై ఉండాలి. లేదా, అతని మనస్సులో మన దేశంపైనున్న గౌరవం అతనితో ఈ పని చేయించి ఉండాలి. కారణం ఏదైనా, నా భారతీయతపై అభిమానమున్న నాకు ఆ రోజు కొమ్ములొచ్చేదొక్కటే తక్కువ.

దాదాపు ఒక శతాబ్ధం మునుపు సెప్టెంబర్ పదకొండవ తేదీన శికాగో నగరంలో భారతీయ మౌల్యాలను ప్రపంచానికే ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానందుడి వివేక వాణి నా చెవుల్లో మారుమ్రోగి, ప్రేక్షకుల కరతాడన ధ్వనులు నా చుట్టూ ప్రతిధ్వనించాయి. స్వామి వివేకానందుడే కళ్ళముందు మెదిలినట్టయ్యింది. ఆ మహా చేతనానికి చేతులెత్తి దండం పెట్టాను. దేశభాషలు వేరైనా, వేషభూషణాలు వేరైనా కౌటుంబిక మౌల్యాల పట్ల మనుషుల భావనలొక్కటే అనిపించినా నా భారతీయత పట్ల గర్వ పడ్డాను. నేను మళ్ళీ ఎన్నో సార్లు అదే airport మూలంగా ప్రయాణం చేశాను. అతను మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు; అంత పెద్ద airportలో ఒక సారి చూసిన వాళ్ళనే మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా చూసే అవకాశం తక్కువే. ఇది జరిగి పద్నాలుగేళ్ళయినా ఆ రోజు, ఆ అనుభవం నా మనస్సులో అచ్చొత్తినట్టు నిల్చి పోయింది.

మా నాన్నగారిప్పుడు లేక పోయినా ఆ నైల్‍కటర్ నాతో ఉంది. అందులో ఇప్పుడు చాకుది ఒక చిన్ని తునక ఉందంతే. అంటే దాంట్లో ఉన్న చాకుని కట్ చేసి నాకిచ్చారన్న మాట. చాకు లేకపోయినా, నైల్‌కటర్ మాత్రం తన సేవలను యథాప్రకారం కొనసాగిస్తోంది. మా మాటల్లో దానికిప్పుడు వివేకానంద నైల్‌కటర్ అని నామకరణం కూడా అయ్యింది.

*

 

 

దేవుళ్లకు జడ్జీల శఠగోపం

 

-సత్యమూర్తి

చాలా మందికి ప్రశ్నలు గిట్టవు. అవి కొత్తవీ, ఘాటువీ అయితే అసలు గిట్టవు. ప్రశ్నలేవైనా అవి స్వీకరించేవాళ్లను బట్టి ఆలోచనో, ఆగ్రహమో పుట్టిస్తాయి. తోలు మందంగా ఉన్నవాళ్లకు ఏవీ పుట్టవనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే వాళ్ల గురించి. కాస్త బుద్ధీజ్ఞానమూ ఉంటాయని, మంచీ చెడూ తెలుస్తాయని అని అనుకునే జడ్జీల గురించి. అయినా, రోజూ కోర్టుల్లో కక్షిదారులకు శరపరంపరగా ప్రశ్నలు వేసే జడ్జీలకు నా బోటి సామాన్యుడు వేసే ఈ ప్రశ్నలు వినబడతాయా? అని.

జడ్జీలు కోర్టుల్లో పెద్దోళ్లయితే కావచ్చు కానీ బయటి మాత్రం వాళ్లు కూడా మనందరిలాంటి వాళ్లే. అందరి మాదిరే తిరుగుతుంటారు. ఉరిశిక్షల వంటి పేద్ద కఠినశిక్షలు వేసే పేద్ద జడ్జీలైతే వై ప్లస్, జెడ్ ప్లస్ గట్రా సెక్యూరిటీతో తిరుగుతుంటారు. తిరిగే హక్కు అందరికీ ఉంది. ఎక్కడైనా తిరగొచ్చు. కానీ వాళ్ల తిరుగుళ్ల వల్ల సామాన్య జనానికి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ల మనసులు గాయపడకూడదు. జనం కట్టిన పన్నులతో ఉబ్బిన సర్కారు ఖజానాకు చిల్లు పడకూడదు. కానీ ఇప్పడు జడ్జీల తిరుగుళ్ల వల్ల ఇవన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

జడ్జీలు గుళ్లకు వెళ్లారన్న వార్తలు కొన్నేళ్లుగా మన ఘనత వహించిన తెలుగు దినపత్రికల్లో విపరీతంగా వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫొటోలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ పాఠకులకు ‘కనువిందు’ చేస్తున్నాయి. జడ్జీలు గతంలోనూ గుళ్లకు వెళ్లేవాళ్లు. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు చాలా అరుదుగా వచ్చేవి. ఏ పత్రికలకైనా వాళ్లపై ప్రత్యేక గౌరవాభిమానాలు ఉంటే లోపలి పేజీల్లో ఏ మూలో సింగిల్ కాలమ్ లో పడేసేవి. కానీ ఇప్పుడు పత్రికలు ‘అభివృద్ధి’ చెందాయి కనుక ఈ వార్తలూ అభివృద్ధి చెందాయి. ఫలానా జస్టిస్ శర్మ, ఫలానా జస్టిస్ రెడ్డి, ఫలానా జస్టిస్ చౌదరి కుటుంబసమేతంగా(కుక్కలుంటే వాటితోనూ) ఫలానా ఆలయానికి వెళ్లి ఫలానా దేవుణ్ని, దేవతను దర్శించుకుని తరించారని(తరింపజేశారని!) భక్తిప్రపత్తి పదాలు దట్టంగా రంగరించిన వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు మొదటి పేజీల్లోనూ వస్తున్నాయి. పేద్ద జడ్జీలైతే చాలాసార్లు పేజీల్లో పైన, బుల్లి జడ్జీలైతే మధ్యలోనో, అడుగునో వస్తున్నాయి. ఎక్కడో ఒకచోట రాకుండా మాత్రం పోవడం లేదు. ఇదంతా మెయిన్ పేజీల సంగతి. జిల్లా పేజీల సంగతి మీరే ఊహించుకోండి! ఈ వార్తలు తెలుగు పత్రికలకే ప్రత్యేకం. దేశంలోని మరే ఇతర భాషా పత్రికల్లోనూ ఇంత వెల్లువలా రావడం లేదు. పాశ్చాత్య దేశాల పత్రికల్లో అసలు రావడం లేదు. వాళ్ల వెనుకబాటుతనంతో మన పురోగతిని పోల్చుకుని బోర విరుచుకుని తిరగొచ్చు.

అసలు.. ఫలానా జడ్జీ ఫలానా గుడికి వెళ్లాడన్న విషయం వార్త అవుతుందా? అవుతుందని పత్రికలు చెబుతున్నాయి కనుక ఒప్పేసుకోవాలి. మరి ఆ జడ్జీ కూరగాయల కొట్టుకో, బట్టలకొట్టుకో, బస్టాండ్ లో మరుగుదొడ్డికో పోతే వార్త ఎందుకవదు? అక్కడ దేవుడు లేడు కనుక అవదా? లేకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక అవదా? ఈ వార్తల వెనకున్న హిందూమతాధిపత్యం గురించి కూడా చెప్పుకోకపోతే విషయం పూర్తి కాదు. పత్రికల్లో గుళ్ల జడ్జీల వార్తలే వస్తాయి కాని, మసీదులకెళ్లే ముస్లిం జడ్జీల వార్తలు, చర్చీలకు వెళ్లే క్రైస్తవ జడ్జీల వార్తలు మచ్చుకు కూడా కనబడవు( మళ్లీ మంత్రులు, సినిమా తారలు గుళ్లకు వెళ్లినా, మసీదులకు, చర్చిలకు వెళ్లినా వార్తలే! సినీ తారలు వ్యభిచారం చేస్తూ పట్టబడితే పండగే పండగ). ఆ రకంగా మన పత్రికలు లౌకికవిలువలను బొంద పెట్టడంలో తమవంతు పాత్రను బహు చక్కగా పోషిస్తున్నాయి. తెలుగునాట డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతున్న భక్తిని కళ్లు బద్దలయ్యేట్లు పారిస్తున్నాయి.

దేవుళ్లను, పత్రికలను, పాఠకులను తరింపజేసే ‘జడ్జీల గుళ్ల సందర్శన’ వార్తలు మీడియా విప్లవంలో భాగం అనుకోవడం అమాయకత్వం. ఈ వార్తల వెనుక.. మేధావుల మాటల్లో చెప్పాలంటే రాజకీయార్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. ప్రతిఫలాపేక్ష వీటి అసలు ఉద్దేశం. పది, పదిహేనేళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పడు ఏపీ, తెలంగాణలో పచ్చ, గులాబీ, ఎరుపు, మువ్వన్నెల నానా రంగుల  పార్టీల నాయకులపై బోలెడు అవినీతి కేసులు నమోదయ్యాయి, అవుతున్నాయి. వీళ్లలో కొందరు ఢిల్లీ లెవెల్ నాయకులైతే, కొందరు హైదరాబాద్ లెవల్, గల్లీ లెవల్ లీడర్లు. వీళ్లలో చాలామందికి సొంత పత్రికలు, కొందరికి బాకా పత్రికలు, కొందరికి అవసరార్థం ఆదుకునే పత్రికలు ఉన్నాయి. వీళ్లు తరచూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు గుళ్ల చుట్టు తిరిగినట్లు. గుళ్ల జడ్జీల ముందు వినయంగా నుంచుని వాళ్ల ప్రశ్నలకు భక్తిప్రపత్తులతో జవాబులు చెబుతుంటారు. కోర్టుల్లో ఇండియన్ పంక్చువాలిటీ మరింత ఎక్కువ కనుక విచారణ ఏళ్లూపూళ్లూ సాగుతుంది. జడ్జీల ముఖారవిందాల సందర్శన భాగ్యాలూ పెరుగుతుంటాయి. బెయిళ్లు రావాలన్నా, తీర్పులు తమకు అనుకూలంగా రావాలన్నా జడ్జీలను న్యాయమార్గంలోనో, అన్యాయమార్గంలోనో ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం తలెత్తుతూ ఉంటుంది. ఆ క్రమంలో న్యాయమార్గంలో.. సదరు ఘనత వహించిన న్యాయమూర్తులుంగార్ల భక్తిపారాయణతను అశేష ప్రజానీకానికి వెల్లడి చేసి, వాళ్ల అజ్ఞానాన్ని తమ జ్ఞానఖడ్గాలతో  సంహరించడానికి సదరు నిందితుల తరఫు పత్రికలు కంకణం కట్టుకుని జడ్జీల గుళ్ల ఫొటోలను, వార్తలను సప్తవర్ణాల్లో అచ్చోసి వదలుతుంటాయి. సదరు ఘనత వహించిన వాళ్లు వాటిని చూసి ఆనందకందోళిత మనస్కులై ‘నాకిది, నీకది’ న్యాయం ప్రకారం తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ జడ్జీలు అలా ఉంటారని కాదు. దేనికైనా మినహాయింపులు ఉండి తీరతాయి.

జడ్జీలు వాళ్ల మానాన వాళ్లు గుళ్లకు పోతుంటే పత్రికలు, టీవీ చానళ్లే హంగామా చేస్తున్నాయనే వాదనొకటి ఉంది. ఇది పచ్చి బూటకం. సాధారణ జనానికి మల్లే విలేకర్లకు, ఫొటోగ్రాఫర్లకు కూడా రాజకీయ నాయకుల, సినీ తారల(టీవీ సీరియల్ల పుణ్యమా అని టీవీ తారల) ముఖాలే బాగా పరిచయం. దేశానికంతా, లేకపోతే ఒక రాష్ట్రానికంతా తెలిసిన జడ్జీ ముఖం ఒక్కటీ లేదు. మరి ఈ అనామక(అముఖ!) జడ్జీలు తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకే కాక, మూరుమూల గ్రామాల్లోని అంకాళమ్మ, నూకాలమ్మ గుళ్లకు వెళ్లినా ఈ విలేకర్లకు, మీడియా ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తోంది? అప్పటికప్పుడు కలాలు ఎలా చెలరేగిపోతున్నాయి? కెమెరాలు ఎలా క్లిక్కుంటున్నాయి? వీళ్లకు ఆ జడ్జీల రాక గురించి ముందస్తుగా ఏ కర్ణపిశాచాలు చెబుతున్నాయి? హైదరాబాద్ లో అయితే పెద్ద జడ్జీలను తరచూ చూసే విలేకర్లు ఉంటారని సరిపెట్టుకోవచ్చు. మరి ఆ జడ్జీలు మారుమూల గుళ్లకు వెళ్లినప్పడూ చాటంత వార్తలు, ఫొటోలు ఎలా వస్తున్నాయి? సులభంగానే ఊహించుకోవచ్చు. జడ్జీలు గుళ్లకు తమ పోకడ గురించి స్వయంగానో, అనుయాయుల ద్వారానో మీడియా చెవిన వేస్తున్నారు. అహాన్ని కొబ్బరికాయలా పగల గొట్టుకోవడానికి దేవుడి వద్దకు వెళ్లే ఆ న్యాయమూర్తులు ఇళ్ల నుంచి బయల్దేరే ముందు ‘మేమొస్తున్నామహో..’ అంటూ టాంటాం వేయుంచుకుని మరీ వెళ్తున్నారు. గుళ్లకు వెళ్లాకయినా అహన్ని చంపుకుంటున్నారా అంటే అదీ లేదు. వీళ్లకు పూజరులు పట్టుగుడ్డలతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలుకుతారు. అప్పడు ఒక ఫొటో. ధ్వజస్తంభం దగ్గర మరో ఫొటో. గర్భగుడి ముందర మరో ఫొటో. తర్వాత దైవ దర్శనం(అప్పడూ దేవుడితో కలసి ఫొటో తీయుంచుకోవాలనే ఉంటుంది కాని, పాపం మరీ మొహమాటం). తర్వాత శఠగోపం పెట్టించుకుంటూ ఒక ఫొటో. ఆనక బయటకొచ్చి గాలిగోపురం ముందు కుటుంబసభ్యులతో మరో ఫొటో. అందరూ నిలబడి ఒకటి ఫోటో, నడుస్తూ స్లో మోషన్ లో మరో ఫొటో. మొహమాటానికైనా వద్దన్న పాపాన పోరు. అలా ఛాయాచిత్రగ్రాహకులు ఒకపక్క జడ్జీల ఫొటోలను తీస్తూ తరిస్తూ ఉంటే.. మరోపక్క సర్వాలంకారభూషితులైన దేవుళ్లు, దేవతలు తమవైపు కన్నెత్తి చూసే కెమెరా లేక బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఈ తతంగం మధ్యలో సాధారణ భక్తులను క్యూలలో పడేసి చిత్రవధ చేయడం.

అయితే ఈ గుళ్ల జడ్జీల వార్తల వల్ల జనానికి వచ్చిన నష్టమేంటి? ఒట్టి అక్కసు కాకపోతే అని కొందరనుకోవచ్చు. ఈ వార్తల వల్ల చాలా నష్టాలున్నాయి.

మొదటి నష్టం… పత్రికలను డబ్బులిచ్చికొనే పాఠకులకు వార్తలకు బదులు ఆ అవార్తలను, కువార్తలను చదవాల్సిన ఖర్మ పట్టడం.

రెండో నష్టం… ఆ వార్తలు పత్రికల్లో స్థలాన్ని కబ్జా చేయడంతో పాఠకులకు(ప్రజలకు) కచ్చితంగా తెలియాల్సిన  సంక్షేమ పథకాలు, తుపాను హెచ్చరికలు, రైళ్ల, బస్సుల రద్దు వంటి ప్రధానమైన వార్తలకు చోటు దక్కకపోవడం. దక్కినా అవి అరకొరగా, ఏ మూలో సర్దుకోవాల్సి రావడం. ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, కొండెక్కుతున్న నిత్యావరసరాల ధరలు వంటి వార్తలకు కూడా ఇదే గతి పట్టడం. ఈ జడ్జీల వార్తలు క్రైమ్ వార్తల్లాంటివే. ఎలాగంటే.. క్రైమ్ వార్తలను సవివరంగా అచ్చేస్తున్న పత్రికలు జడ్జీల వార్తలనూ అలాగే అచ్చేస్తున్నాయి కనుక. గుడి గురించి, భక్తి గుర్తించి, ఆలయ సందర్శన భాగ్యం(దేవుడికి భాగ్యం!) గురించి సదరు జడ్జి వాక్రుచ్చిన మాటలు పొల్లుపోకుండా వస్తున్నాయి కనుక.

మూడో నష్టం… పత్రికలను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి వీలుగా ప్రభుత్వం వాటికి ఇస్తున్న సబ్సిడీల లక్ష్యం దెబ్బతినడం. పత్రికలు వాడే కాగితం(న్యూస్ ప్రింట్)పై కోట్లలో సర్కారు సబ్సిడీలు ఇస్తోంది. న్యూస్ ప్రింట్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకునేదే. ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యానికీ గండి. పోస్టల్ చార్జిల్లోనూ, ఇతరత్రా వ్యవహారాల్లోనూ సబ్సిడీలు ఉన్నాయి. ఈ సబ్సిడీలు ప్రభుత్వ పెద్దల కష్టార్జితంలోంచి కాక, గుళ్ల హుండీల్లోంచి కాక,  జనం కట్టే పన్నుల్లోంచి ఇస్తుండడం వల్ల అంతిమంగా ప్రజలకే తిరుపతి గుండు కొట్టడం. గుళ్ల బాపతు వార్తలు, రాజకీయ నాయకును కీర్తించే వార్తలు, జనం మధ్య చిచ్చు రేపే విద్వేష వార్తలతో, అబద్ధాలతో పత్రికలు సబ్సిడీల ఉద్దేశానికి గండికొడుతున్నాయి కాబట్టి వాటికి ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వొద్దనే డిమాండ్ ఒకటి చాలా కాలం నుంచి వినిపిస్తోంది.

నాలుగో నష్టం… ఈ ప్రతిఫలాపేక్ష వార్తల వల్ల న్యాయవ్యవస్థ కొంతైనా ప్రభావితమై నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోవడం, లేకపోతే తాత్కాలిక ఉపశమనాలు పొందడం. ఫలితంగా వాళ్ల నేరాల వల్ల దెబ్బతిన్న జనానికి న్యాయం జరక్కపోవడం. సందర్భం వేరు కావొచ్చు కానీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసులో సినీ నిర్మాతల వినతిపై కోర్టు అతనికి బెయిలిచ్చింది. అతడు విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేస్తున్నాడు. అతని సినిమాలు విడుదలై కోట్లు సంపాదిస్తున్నాయి. అతడు వీరోచితంగా కారుతో గుద్ది చంపేసిన మనిషి కుటుంబం, గాయపడిన వాళ్లు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు, ఆకలితో మాడి చస్తున్నారు. సంజయ్ దత్ పెరోళ్లపైన పెరోళ్లపై ఇంటికీ జైలుకూ తేడా లేకుండా గడిపేస్తున్నాడు. జడ్జీలకు అన్ని సంగతులూ తెలుసు. కానీ ప్రముఖుల ప్రయోజనాలపైనే వాళ్లకు శ్రద్ధ. తమను కూడా ప్రముఖులుగా ప్రజలకు పరిచయడం చేసే గురుతర బాధ్యత తలదాల్చిన పత్రికలపై మాత్రం శ్రద్ధ ఉండదా?

***

ayalan kurdi

మొన్నామధ్య  పత్రికల్లో.. మన తెలుగు పత్రికల్లో కూడా గుండెలు మెలిపెట్టే ఫొటో ఒకటి వచ్చింది. సిరియా నుంచి యూరప్ కు వలస వెళ్తూ పడవ మునిగి చనిపోయిన సిరియా బాలుడు అయలాన్ కుర్దీ ఫొటో అది. సముద్రపుటొడ్డున విగతజీవిగా పడున్న ఆ మూడేళ్ల బాలుడి ఫొటో ప్రపంచ దేశాల మనసు కరిగించి, కన్నీరు పెట్టిస్తోంది. శరణార్థులకు ఆశ్రయమిస్తామని యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. ఫొటో జర్నలిజం శక్తికి ఆ చిత్రం తాజా ఉదాహరణ. టర్కీ మహిళా ఫొటోగ్రాఫర్ నీలూఫర్ దెమిర్ ఆ ఫొటో తీసింది.

మన తెలుగు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా తలచుకుంటే అలాంటి ఫొటోలు ఎన్నో తీయగలరు. నగరాల్లో చితికిపోతున్న బాలకార్మికులు, అప్పులతో, కరువుతో పొలాల్లోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంటున్న బక్క రైతులు, నానా చోట్ల దోపిడీపీడనలకు గురవుతున్న శ్రమజీవులు.. అనాథలు, అభాగ్యులు.. ఎంతమంది లేరు! నీలూఫర్ దెమిర్ కళ్లతో చూడాలే గాని మన చుట్టూ లక్షలాది అయలాన్లు కనిపిస్తారు! కానీ మన కెమెరా కళ్లు గుళ్ల జడ్జీలవైపు నుంచి చూపు తిప్పనంత కాలం వాళ్లు మనకు కనిపించరు. మన చెవులను కర్ణపిశాచాలు కొరుకుతున్నంత కాలం ఆ అభాగ్యుల ఆర్తనాదాలూ వినిపించవు…

*

 

 మాయ

buddhiనిమీద బయటికెళ్లిన మాణిక్యరావు ఇంటికొచ్చాడు. ముందింట్లో నవనీత కనిపించకపోయేసరికి, నేరుగా వంటింట్లోకెళ్లాడు. ఆమె దొడ్లో బాట్టలు ఆరేస్తా కనిపించింది. బావి అరుగుమీదకెళ్లి నిల్చుని బక్కెట్‌లోని నీళ్లను కాళ్లమీద
కుమ్మరించుకున్నాడు.
“రేపు గుంటూరుకెళ్తున్నానే” అన్నాడు.
“అయితే కొనాలనే నిర్ణయించుకున్నావన్న మాట” అంది నవనీత, బట్టలకు క్లిప్పులు పెడతా.
“ఇప్పుడు కొనకపోతే, ఇంకెప్పుడూ అక్కడ కొనలేమే. ఇప్పుడే సెంటు లక్ష చెబుతున్నారంటే, ఇంకో ఏడు పోతే ఎంతవుద్దో. ఇప్పుడు కొంటే రెండేళ్లలో నాలుగైదింతలు రేటు పెరగడం గ్యారంటీ.”
“మనం ఉంటున్న ఈ చోటే సెంటు లక్షుంటే ఎక్కడో ఊరికి దూరంగా, ఇళ్లంటూ లేని చోట కూడా లక్షా? అంతెందుకుంటుంది?”
“మనం ఉంటున్న ఏరియాకీ, రాజధాని అమరావతి ఏరియాకీ లంకె పెడతావేందే. ఇక్కడ సెంటు స్థలం లక్ష కావడానికి ఎంత కాలం పట్టిందో నీకు తెలీదా. ఇప్పుడందరి చూపూ అమరావతి ఏరియా మీదే ఉంది. దాని చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దాకా ఎక్కడ స్థలం కొన్నా బంగారం కిందే లెక్క. ఆ చదువులయ్య చూడు. తెలివంటే ఆడిదే. రాష్ట్రం రెండుగా యిడిపోవడానికి ఏడాది ముందుగాల్నే గుంటూరు కాడ ఏకంగా అరెకరం స్థలం కొనేశాడు. ఇంకా రెండేళ్లు కాలేదు. అప్పుడే నాలుగింతలు రేటు పలుకుతోందంట. ఒక్క దెబ్బకు కోట్లు వెనకేసుకోబోతున్నాడు. మనమూ ఉన్నాం ఎందుకూ? ప్రతిదానికీ జంకే. తెగించి ఏం చేద్దామన్నా పడనియ్యవు కదా” అన్నాడు కాస్త విసురుగా.
వేటపాలెం ప్రాంతంలోని షావుకార్ల (మాస్టర్ వీవర్ల)లో మాణిక్యరావు ఒకడు. అతని చేతికింద నూటయాభై మగ్గాల దాకా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది షావుకార్లు నష్టాలపాలై వేరే వ్యాపారాల్లోకి దిగారు. కొంతమందైతే తామే నేతగాళ్లుగా మారిపోయారు. మాణిక్యరావు ఒకేరకం బట్టని కాకుండా నాలుగైదు రకాల బట్టలు నేయిస్తూ కొద్దో గొప్పో సంపాదించాడు. మాణిక్యరావు మాదిరిగానే చదువులయ్యా మాస్టర్ వీవరే. కాకపోతే అతను ఒక్క మగ్గాల్నే నమ్ముకోలేదు. బట్టల వ్యాపారం మీదొచ్చిన డబ్బుతో మొదట్లో ఏడాదికి మూడు పంటలు పండే పొలాలు కొన్నాడు. తర్వాత వాటిని అమ్మేసి రెండెకరాల మామిడితోట కొన్నాడు. నాలుగేళ్లయ్యాక ఆ రెండెకరాల తోటని నాలుగెకరాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెని చూశాక రాష్ట్రం రెండుగా విడిపోతుందనే నమ్మకం బలపడి గుంటూరు కాడ స్థలం కొన్నాడు. అతడి నమ్మకం నిజమై ఇప్పుడది నాలుగింతల విలువకు చేరుకుంది. అతడి మాదిరిగా తను ఆస్తులు పెంచుకోలేకపోతున్నందుకు మాణిక్యరావులో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. చదువులయ్యకు వాళ్లావిడ సపోర్ట్ బాగా ఉండబట్టే తెగువతో ముందుకెళ్లిపోతున్నాడని అప్పుడప్పుడూ నవనీతని ఎత్తిపొడుస్తుంటాడు.
“ఇప్పుడు మనకేం తక్కువయ్యిందయ్యా. యాపారం బాగానే సాగుతా, హాయిగా గడిచిపోతోంది కదా. తిండికి కరువా, బట్టకి కరువా? మంచి మేడ కట్టుకున్నాం కదా. ఇద్దరు పిల్లల్నీ మంచి స్కూల్లో చదివించుకుంటున్నాం. కంటిమీద సుఖంగా కునుకుపడితే చాలు. లేనిపోని ఆశలతో తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకంటా?” అంది ముందింట్లోకొచ్చి.
“నీకు చెప్పాను చూడూ.. నాదీ బుద్ధి తక్కువ. దేనికీ పడనియ్యవు కదా. ఎప్పుడూ ఇట్టాగే ఉండిపోతామంటావేం. మనిషన్నాక ఆశుండాలే. ఆశుంటేనే ఎదుగుతాం. ఈ యేటపాలెం ఏరియాలో మాణిక్యరావు అనేవాడు డబ్బున్నోడిగా, పెద్దమనిషిగా పేరు తెచ్చుకోవడం నీకిష్టం లేదా?” అంటా, అక్కడ బల్లమీద తను పెట్టిన సంచీని తెరిచాడు. దాంట్లోని శ్రద్ధగా మడతలు పెట్టిన ఆయిల్ పేపర్‌ను తీశాడు. అది మల్లెపువ్వంత తెల్లగా, పాదరసం అంత నున్నగా మెరుస్తోంది.
“మందెట్టా మైకాన్నిస్తుందో ఆశ కూడా అంతేనయ్యా. ఆ మైకంలో పడితే ఎవరేం చెప్పినా తలకెక్కదు” అంటా నెత్తికొట్టుకుంది నవనీత.
“నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికీ, బళ్లో చదువుకోడానికీ పనికొస్తాయే కానీ జీవితానికి పనికిరావే మొద్దూ” అంటా మెరుపుల కాయితం మడతలు విప్పి, బల్లమీద పరిచాడు.
దానిమీద రంగురంగుల గీతలతో డబ్బాలు కొట్టున్నాయి. ఆ గీతలు, ఆ డబ్బాలు గజిబిజిగా కనిపించాయి నవనీతకు.
“ఇది ఆ స్థలానికి చెందిన లేఔటే. రాజధాని వొస్తున్న ఏరియాకి దగ్గరలో అమరావతి రోడ్ పక్కనే ఉంది ఈ సైటు. ఇక్కడ సెంటు లక్షకి దొరకడమంటే చాలా అదృష్టమనీ, ఆ రేటుకి ఆ చుట్టుపక్కల ఎక్కడా స్థలం దొరకట్లేదనీ గణపతి చెప్పాడు. ఈ అవకాశం వొదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు కదా. నిజానికి ఆ స్థలాన్ని చూడకుండానే కొనేయొచ్చు. కానీ చూశాకే తీసుకుంటానని చెప్పా తెలుసా” అన్నాడు, తనకు తెలివితేటలు ఎక్కువనే సంగతి ఆమె గ్రహించాలన్నట్లు.
“భూమితో యాపారం చేసే మనిషి అట్టా చెప్పకుండా ఇంకెట్టా చెబుతాడంటా. తన భూమి అమ్ముడుపోడానికి ఎన్ని కబుర్లైనా చెబుతాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. మెట్టని మాగాణని చెబుతాడు. పల్లాన్ని మెరకంటాడు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా అతను రాజకీయాల్లో తిరిగే మనిషి. అధికారం అండదండలున్నోడు” అంది నవనీత నచ్చచెబుతున్న ధోరణితో.
దాంతో కాస్త మెత్తబడ్డాడు మాణిక్యరావు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. లేఔట్ కాయితాన్ని మడతలు పెడతా, కాస్త చిన్నగా “అందుకేగా రేపు గుంటూరు పోతోందీ. సైటు చూశాకే, నచ్చితేనే తీసుకుందాంలేవే” అన్నాడు.
కారులో కూర్చున్నాక “ఈ సైటుకు మీరన్నట్లు వాల్యూ పెరుగుతుందంటారా?” అడిగాడు మాణిక్యరావు.
“అసలా అనుమానం ఎందుకొచ్చింది మాణిక్యం. అది కొంటే బంగారం కొన్నట్లే. లేకపోతే నేనెందుకక్కడ ఆ సైట్‌కొని ప్లాట్లేస్తాను? ఏడాది తిరిగేసరికల్లా ఒకటికి రెండు రెట్లు రేటు పెరక్కపోతే అప్పుడడుగు” అన్నాడు గట్టి నమ్మకాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ గణపతి.
ఇటీవలి కాలంలోనే ఆ ఏరియాలో భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఇంకా ఎట్లా పెరుగుతున్నాయో వర్ణించి వర్ణించి చెప్పాడు. ఉదాహరణగా హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో ఒకప్పుడు కాణీకి కొరగావనుకున్న భూములు చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని ప్రకటించగానే ఎట్లా మారిపోయాయో, అక్కడ భూములున్న పేదోళ్లంతా రాత్రికి రాత్రే ఎట్లా కోటీశ్వరులైపోయారే చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు మాణిక్యరావు. నిజానికి ఆ సంగతి అతనికెప్పుడో తెలుసు. కానీ గణపతి చెప్పే విధానంతో, తనూ కోట్లకు పడగలెత్తినట్లేనని ఊహించేసుకున్నాడు. ఆ ఊహ అతన్ని ఉద్వేగభరితుణ్ణి చేసింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అమరావతి ఏరియా అలాగే కాబోతున్నదనీ, దానికి తిరుగులేదనీ గణపతి చెప్పడంతో, మాణిక్యరావులో హుషారు ఎక్కువైంది. నవనీతవన్నీ ఉత్త భయాలు, అనుమానాలుగా తోచాయి.
“ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయా మాణిక్యం. మన సైట్లో నీళ్లకు కరువనేదే లేదు. పుష్కలంగా ఉంటాయి. మన సైట్‌కు దగ్గర్లోనే కృష్ణా నీళ్లు పారుతున్నాయి. భూమిలో చాలా తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. నిజం చెప్పాలంటే చుట్టుపక్కలున్న అన్ని సైట్ల కంటే మనదే విలువైన సైట్. కొన్న ఏడాదికే అమ్మకానికి పెట్టి చూడు. ఎంతలేదన్నా రూపాయికి ఐదు రూపాయల వొడ్డీ వొస్తుంది” అన్నాడు గణపతి.
ఇంక మాణిక్యరావు ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. ఓ గంటన్నరలో సైట్ కాడికి వెళ్లిపోయారు. అమరావతి రోడ్డుకు బాగా దగ్గర్లోనే ఉందది. గణపతి చెప్పినట్లు అల్లంత దూరంలోనే కృష్ణ ప్రవహిస్తూ కనిపించింది.
గణపతి ఓసారి లేఔట్ తీసి, ఖాళీగా ఉన్న ప్లాట్లేవో చూపించాడు. ఈశాన్య మూల ప్లాట్ మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒకటే ఉంది. దానికి మంచి డిమాండ్ ఉందనీ, ఈ రోజు సాయంత్రమే ఒకతను దానికి అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడనీ, అది వొదిలేసి మిగతా వాటిలో దేన్నయినా తీసుకొమ్మనీ చెప్పాడు గణపతి. దాంతో ఆ ఈశాన్య మూల బిట్ తనకే దక్కాలని తీర్మానించేసుకున్నాడు మాణిక్యరావు.
“సాయంత్రం కాదు, నేనిప్పుడే బయానా (అడ్వాన్స్) ఇస్తున్నా. ఆ బిట్ నా పేరే రాయండి” అని జేబులోంచి డబ్బులు తీసి, పదివేలు గణపతి చేతిలో పెట్టాడు.
“మాణిక్యం.. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావోయ్. చాలా కాలం నుంచి తెలిసిన మనిషివి కాబట్టి కాదనలేకపోతున్నా. సాయంకాలం వొచ్చే అతనికి ఏం చెప్పాలో, ఏమో. సర్లే.. నా తిప్పలేవో నేను పడతాలే. మొత్తానికి సూపర్ ప్లాట్ కొట్టేశావ్” అన్నాడు మెచ్చుకోలుగా.
అప్పుడే, ఆ నిమిషమే ఆ ఇరవై సెంట్ల స్థలం తనదై పోయినట్లు తబ్బిబ్బయిపోయాడు మాణిక్యరావు. ఆ స్థలంపై ఒక్కసారిగా ఆరాధనా భావం పెల్లుబికింది. ఆ ప్లాటుకు హద్దులుగా వేసిన రాళ్లను తనివితీరా చూసుకున్నాడు. ఓ రాయిని చేత్తో నిమిరాడు కూడా. విపరీతమైన ఉద్వేగం మనసుని ఊపేస్తుంటే కిందికి వొంగి, అక్కడి మట్టిని గుప్పిట్లోకి తీసుకున్నాడు. వొదల్లేక వొదల్లేక కొద్దికొద్దిగా మట్టిని వొదిలి, చేతులు దులుపుకున్నాడు. పిట్ట ఈక ఎంత తేలిగ్గా ఉంటుందో, మాణిక్యరావు గుండె అంత తేలికైపోయినంది. అతడి చేష్టల్ని ఆశ్చర్యపడతా చూశాడు గణపతి. అతని పెదాల మీదికి ఓ విధమైన నవ్వు విచ్చుకుంది.
ఇరవై లక్షల రూపాయలతో ఆ ఇరవై సెంట్ల ఈశాన్య మూల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు మాణిక్యరావు. రిజిస్ట్రేషన్ కాయితాలు కూడా అతడి చేతికొచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం దాని విలువ సెంటుకు ఐదువేలుగానే రాశారు. గవర్నమెంటోళ్ల రేటు అట్లాగే ఉంటుందనీ, రేటు ఎక్కువ రాస్తే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సొస్తుందనీ గణపతి చెప్పాడు. మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి తలాడించాడు మాణిక్యరావు. డబ్బు కట్టడానికి ఐదు లక్షలు తగ్గితే మూడు రూపాయల వడ్డీకి రెండు లక్షలు చదువులయ్య కాడే అప్పు తీసుకున్నాడు. నవనీత నగలు తాకట్టుపెట్టి బ్యాంకులో మూడు లక్షలు గోల్డ్ లోను తీసుకున్నాడు. మనసులో బితుకుబితుకుమంటున్నా అతని ఉత్సాహం చూసి, అతను చేసింది మంచి పనేనేమో, అనవసరంగా అనుమానిస్తున్నానేమోనని సమాధానపడింది నవనీత. ఇరవై లక్షలు పెట్టికొన్న ఆ ఈశాన్య మూల స్థలాన్ని చూసి రావాలనే ఆరాటం మొదలైంది ఆమెలో.
“రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది. ఇంకెప్పుడు చూపిస్తావ్ మన స్థలాన్ని?” అడిగేసింది ఉండబట్టలేక.
“కొనే ముందు దాకా ఎందుకు కొనడమంటూ గోలచేశావ్. కొన్నాక ఎప్పుడు చూపిస్తావని గోలపెడ్తున్నావ్. మీ ఆడాళ్లంతా ఇంతేనే” అని గర్వంగా నవ్వాడు మాణిక్యరావు.
“మేం గోలపెట్టినా మీ మగాళ్లు ఆగుతారా? చెయ్యాలనుకుంది చెయ్యక మానతారా?” అని తనూ నవ్వింది నవనీత.
3
పిల్లలకు సెలవు రోజు చూసుకుని ఆదివారం కారు మాట్లాడుకుని స్థలం చూసేందుకు బయల్దేరారు. ఆ ముందు రోజు రాత్రి పెద్ద వాన పడింది. ఆదివారం కూడా ఉంటుందేమో, వెళ్లడానికి కుదరదేమో అనుకుంది నవనీత. అయితే పొద్దున్నే వాన తెరిపియ్యడంతో స్థిమితపడింది ఆమె మనసు.
కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కనే కాదు, రోడ్ల మీదే కాల్వలు  కనిపిస్తున్నాయ్. దాంతో కారు కాస్త నెమ్మదిగా వెళ్లింది. ఈసారి ప్రయాణం రెండు గంటలు పట్టింది. అయితే తను కొన్న ప్లాటు ఎక్కడుందో గుర్తుపట్టలేక పోయాడు మాణిక్యరావు. అతడికి అంతా అయోమయంగా ఉంది. తను కరెక్టుగానే వొచ్చాడే.
“ఈ ఏరియానేనా సార్? ఇక్కడంతా నీళ్లే కనిపిస్తున్నాయ్ కదండీ” అన్నాడు కారు డ్రైవర్.
“ఇదే ప్లేసయ్యా. నేనెందుకు మర్చిపోతాను?” అన్నాడు బలహీనమైన గొంతుతో, మాణిక్యరావు.
అతడు ప్లాటు కొన్న సైటులో ఒక్క అంగుళం భూమి కనిపించట్లేదు. ఆ ఏరియా అంతా పెద్ద చెరువులా తయారైంది. హద్దు రాళ్లు కూడా నీళ్లలో మునిగిపోయినట్లున్నాయి. నవనీత మొహం వొంక చూడాలంటే భయమేసింది మాణిక్యరావుకు.
“మన సైటేది నాన్నా?” ఉన్నట్లుండి అడిగాడు పదో క్లాస్ చదువుతున్న కొడుకు.
కొడుక్కి సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు మాణిక్యరావు. రోడ్డుకి రెండోవైపు పొలంలో కొంతమంది పనిచేస్తూ కనిపించారు. వాళ్లల్లో ఒకర్ని పిలుచుకు రమ్మని డ్రైవర్ని పంపాడు.
“ఏంటమ్మా. ఎక్కడ మన సైట్?” – ఈసారి తల్లిని అడిగాడు కొడుకు.
“ఆగు నాన్నా. నాన్న చూపిస్తాడుగా” అని నవనీత చెప్తుంటే, ఏడో క్లాస్ చదువుతున్న కూతురు “నాన్న కొన్న సైట్ ఈ నీళ్లల్లో ఉన్నట్టుందన్నయ్యా. అవును కదా అమ్మా” అంది, ‘చూడు నేనెట్లా కనిపెట్టేశానో’ అన్నట్లు.
మాణిక్యరావు మొహంలో నెత్తురు చుక్క లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆశ ఉన్నచోట అజ్ఞానం ఉంటుందని ఎవరో పెద్దమనిషి అననే అన్నాడు. ఒకడి ఆశని ఇంకొకడు క్యాష్ చేసుకోవడం తన ఎరుకలోనే ఎన్నిసార్లు చూళ్లేదు. ఇప్పుడు తన ఆశని గణపతి క్యాష్ చేసుకున్నాడా?
ఒకతన్ని వెంటబెట్టుకు వొచ్చాడు డ్రైవర్.
“ఏమయ్యా.. ఈ చోటు గురించి నీకు బాగా తెలుసా?” అడిగాడు మాణిక్యరావు.
“ఎందుకు తెలీదు బాబూ. నేను పుట్టి పెరిగిందీ, ఉంటందీ ఇక్కడే. ఈడ ప్రెతి అంగుళం నాకు తెలుసు.”
“ఓ.. అవునా.. రెణ్ణెల కింద ఈడ స్థలం కొన్నాను. ఇప్పుడు చూస్తే మొత్తం నీళ్లే అవుపిస్తున్నాయ్?”
“చెరువులో స్థలం కొంటే నీళ్లు కాకుండా ఇంకేం అవుపిస్తాయ్ నాయనా. ఇదంతా చెరువు. ఈ మజ్జ చాలా కాలం వానల్లేక ఎండిపోయింది. నిన్నా, మొన్నా కురిసిన పెద్దవానతో నిండిపోయింది. నీకు తెలీక ఈడ స్థలం కొన్నట్లున్నావ్. ఆ మాయగాళ్లు కారుచౌకగా కొని, నీలాంటోళ్లకు ఎకువ రేట్లకు అమ్మి టోపీ పెడతన్నారు. ఇప్పుడైతే ఈడ సెంటు పది, పదిహేనేల కంటే ఎక్కువ లేదు. మీకు చాలా ఎక్కువ రేటుకి అమ్ముంటారే. అయినా కొనేప్పుడు అన్నీ ఇచారించుకోవాలి కద బాబూ.”
అతని వొంక నమ్మలేనట్లు చూశాడు మాణిక్యరావు. తన తెలివితేటల మీద అతడికి చాలా నమ్మకం. నెమ్మదిగా నిజం తెలిసొచ్చింది. ఓ కన్ను మూసి, ఆకాశం వొంక ఐమూలగా చూశాడు. తర్వాత చెరువు వొంకా, ఆ రైతు వొంకా, తన భార్యాబిడ్డల వొంకా బిత్తరబిత్తరగా చూశాడు.
అక్కడ అతను కొన్న స్థలం ఉంది. కానీ దాన్నిప్పుడు తన భార్యాబిడ్డలకు చూపించలేని చిత్రమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ల సంగతి అట్లా పెట్టినా, తన స్థలమేదో ఇప్పుడు తనకే తెలీడం లేదు. తన స్థలం నీళ్ల కింద ఉంది!
ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్టుని పెదాల మధ్య పెట్టుకొని, ప్యాకెట్టుని మళ్లీ జేబులో పెట్టేసుకున్నాడు. లైటర్ తీసి, సిగరెట్ వెలిగించాడు. మామూలుగా అతను పిల్లల ముందు  సిగరెట్లు కాల్చడు. కానీ ఇప్పుడు కాల్చకుండా ఉండలేకపోయాడు. అతడి స్థితి అర్థమై నవనీత పిల్లలను తీసుకుని కాస్త అవతలకు వెళ్లింది. తను ఎంత సునాయాసంగా మోసపోయాడో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మాణిక్యరావుకు. తానే కాదు, అక్కడ ప్లాట్లు కొన్నోళ్లంతా మోసపోయారు. నోటెంట మాట రానంతగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.
మనసు రగిలిపోతుంటే గణపతికి ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నట్లు సౌండ్ వొస్తోంది. మళ్లీ మళ్లీ చేశాడు. అదే సౌండ్. మౌనంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. అతణ్ణలా చూసిన నవనీతకు భయమేసింది. స్థలం చూడాలని అక్కడకు ఎంత ఉత్సాహంతో వొచ్చిందో, అదంతా తుస్సుమంటూ చల్లారిపోయింది. తమ స్థలం నీళ్లకింద ఉందనే విషయం, అదంతా చెరువు ప్రాంతమనే విషయం తెలిశాక ఆమెలో కోపం కట్టలు తెంచుకున్న మాట నిజం. ఆ క్షణంలో భర్తని ఇష్టమొచ్చినట్లు దులిపేద్దామని కూడా అనుకుంది. కానీ అక్కడ కారు డ్రైవర్‌తో పాటు, ఇంకో మనిషీ ఉంటంతో నోరు నొక్కేసుకుంది. కానీ వాళ్లు తమని చూసి నవ్వుతున్నట్లు అనిపించి, అక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇంకోవైపు భర్త మొహం చూస్తే, అతడు పిచ్చిచూపులు చూస్తున్నాడు. అలాంటప్పుడు అతణ్ణి కదిలించడం ఏం బావుంటుంది. కారులో ఉన్నంతసేపూ భార్యాభర్తలిద్దరూ మౌనంగానే ఉండిపోయారు.
ఇంటికొచ్చాక గణపతికి మరోసారి ఫోన్ చేశాడు మాణిక్యరావు. ఫోన్ రింగవుతోంది కానీ, ఎత్తట్లేదు. బైక్‌మీద అతనింటికి వెళ్లాడు. ఆఫీసులోనే ఉన్నాడని ఇంట్లోవాళ్లు చెప్పారు. అక్కడకు వెళ్లే సమయానికి చీకటి పడుతోంది. ఆవేశంతో ఊగిపోతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. తన రూంలో కుర్చీలో హాయిగా వెనక్కి చేరగిలబడి ఉన్నాడు గణపతి. కాళ్లను బార్లా చాపి, కిటికీ మీద ఆన్చి ఉంచాడు. కళ్లు మూసుకుని, విలాసంగా డన్‌హిల్ సిగరెట్ పీలుస్తున్నాడు. మొహంలో తన్మయత్వం కనిపిస్తోంది. తలకు హెడ్‌సెట్ పెట్టుకొని, సెల్‌ఫోన్‌లో హుషారైన పాటలు వింటున్నాడు.
గణపతిని ఆ స్థితిలో చూసేసరికి మాణిక్యరావులోని ఆవేశం పదింతలైంది.
“గణపతిగారూ” అని అరిచాననుకున్నాడు. గణపతిలో చలనం లేదు. సిగరెట్ పొగ పీలుస్తూ, తల ఊపుతూ అదే తన్మయత్వంలో ఉన్నాడు.
“ఏవండీ గణపతిగారూ” అని ఈసారి బల్లమీద గట్టిగా చరిచాడు మాణిక్యరావు.
వైబ్రేషన్స్‌కి కళ్లు తెరిచాడు గణపతి.
“ఓ.. మాణిక్యం, నువ్వా. రారా. కూర్చో” అంటూ హెడ్‌సెట్ తీశాడు.
“నేను కూర్చోడానికి రాలేదండీ.”
“ఏంటి విషయం? ఏమైంది? మొహం అట్లా ఉందేంటి?”
“విషయం చాలానే ఉంది. ఇందాకట్నించీ ఫోన్ చేస్తున్నాను. మీరు తియ్యట్లేదు. ఇవాళ సైట్ చూసొచ్చాం.”
“సంతోషం. చూసొచ్చాం అంటున్నావ్. ఎవరెవరు వెళ్లారేం?”
“మా ఫ్యామిలీ అంతా వెళ్లాం. కానీ అక్కడ నా ప్లాటే కాదు, అసలు మీ సైటే అవుపించట్లేదు.”
“సైట్ కనిపించకపోవడమేంటి? సైట్ యేడకి పోద్ది. ఏం మాట్లాడతన్నావ్ మాణిక్యం?”
“సైటేతే ఉంది కానీ నీళ్లకింద ఉందండీ. అదంతా చెరువంట కదా. నిన్నపడిన వానకే అది మునిగిపోయింది. కనీసం హద్దు రాళ్లు కూడా అవుపించట్లేదు. అంత పల్లంలో ఉన్న స్థలాన్ని, సెంటు ఇరవై యేలు కూడా చెయ్యనిదాన్ని, మాయమాటలు చెప్పి, లక్ష రూపాయల కాడికి అమ్మారు. రాజధాని ఏరియా కదా, రేటు పెరుగుతుందనే నమ్మకంతో యెనకా ముందూ ఆలోచించకుండా, మా ఆవిడ వొద్దంటున్నా మూర్ఖంగా కొన్నా. నాకా ప్లాటొద్దు, గీటొద్దు. దయచేసి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి” అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసి గణపతి చేతికియ్యబోయాడు.
“అది కుదరదు మాణిక్యం” అంటా సిగరెట్‌ని యాష్‌ట్రేలో పెట్టి నలిపాడు గణపతి.
“అట్లా అయితే, ఆ పల్లంలో మట్టినింపి, మెరక చెయ్యండి. ఆ సైట్లో నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చెయ్యండి” అన్నాడు మాణిక్యరావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా.
“అది నా పని కాదు మాణిక్యం, నీదే.”
“అయితే నేను నా జీవితంలోనే ఘోరమైన తప్పు చేశానన్న మాట.”
“ఎందుకట్లా ఇదైపోతావ్. నేనట్లా అనుకోవట్లేదు. మట్టి తోలుకొని, రోడ్ లెవల్‌కి పైన ఉండేట్లు చూసుకున్నావంటే దాని గిరాకీ ఎక్కడికీ పోదు.”
“దానికి మట్టి తోలాలంటే ఎంతవుద్దో నీకు తెలీదా. పైగా నేనొక్కణ్ణే తోలితే సరిపోద్దా. అందరూ తోలాలి కదా. ఇంతన్యాయం చేస్తావా? నువ్వసలు మనిషి పుడక పుట్టావా?”
“అది నా తప్పు కాదు.”
“అవునయ్యా, తప్పు నాదే. నిన్ను నమ్మడం నా తప్పే. నువ్వు మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోవడం నా తప్పే. నీయంత పెద్ద రాస్కెల్‌గాణ్ణి ఇంతదాకా నీ జీవితంలో చూళ్లేదు. ఇంతదాకా నేను సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చేశావ్ కదరా.”
“ఇదిగో మాణిక్యం, మర్యాద.. మర్యాద. మాటలు తిన్నగా రానీయ్. నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదిక్కడ. నువ్వేం చేస్కుంటావో చేస్కో. రిజిస్ట్రేషన్ ఐపోయాక ఆ సైట్‌తో నాకేం సంబంధం లేదు. అది నీదే. దాన్నేం చేస్కుంటావో నీ ఇష్టం. ముందిక్కణ్ణించి కదులు. లేదంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది.”
“పోలీసులకు కంప్లయింటిస్తావా? ఎందుకియ్యవూ. ఇది మీ రాజ్యం కదా. అధికారం మీ చేతుల్లోనే ఉందయ్యే. ఏమైనా చేస్తారు. అందుకేగా ఈ ఏరియానంతా దోచుకు తింటన్నారు. అయినా ఇప్పుడు నన్నేడికి పొమ్మంటావ్ గణపతీ.”
“ఏట్లోకి పో. నువ్వెక్కడికిపోతే నాకేంటి. ఈ తెలివి సైట్ కొనేప్పుడే ఉండాల్సింది. అయినా చూసుకునే కదా కొన్నావ్” అన్నాడు వెటకారం నిండిన గొంతుతో, గణపతి.
“నేను ఏట్లోకి పోతే నీకు సంబరంగా ఉంటుందేమిట్రా.. నానా కష్టాలు పడతా మగ్గాల్ని నమ్ముకుని నేను సంపాదించుకున్నదంతా మాయతో, మోసంతో అన్యాయంగా దోచుకున్నావ్. అందుకని నేను ఏట్లోకి దూకాలా? నువ్వు చేసిన పనికి ఏదో నాటికి నువ్వే ఏట్లో పడే రోజొస్తుంది. మనిషి మాంసం అమ్ముకుని బతికేవాళ్లు ఏదో రోజు కుక్కచావు చావక తప్పదు. గుర్తుంచుకో. నేనెళ్తాను. ఏట్లోకి కాదురోయ్. నీమీద కేసెయ్యడానికి వెళ్తాను” అన్నాడు మాణిక్యరావు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని సంచిలో పెట్టుకుంటా.
గణపతి నవ్వాడు. “అంతకంటే నువ్వేం చెయ్యగలవ్ మాణిక్యం. శుభ్రంగా వేసుకో. మళ్లీ దాంట్లో ఓడిపోయి, లాయర్ ఖర్చులయ్యాయని నా మీదపడి ఏడిస్తే లాభం ఉండదు.”
4
ఇప్పటికీ మాణిక్యరావు స్థలం నీళ్లకింద భద్రంగా చెరువులో ఉంది. ఆ స్థలం కోసం నిండా మునిగిన మాణిక్యరావు ఇంకో రెండు లక్షల రూపాయల అప్పుకోసం తిరుగుతున్నాడు. కోర్టు కేసుల కోసం కాదు. తనవద్ద నేసే నేతగాళ్లకు కూలీ (మజూరీ) డబ్బులివ్వాలి. వాళ్లకు నూలు, పట్టు సమకూర్చాలంటే, వాటిని కొనాలి. దానికోసం డబ్బు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే అప్పుకోసం తిరుగుతున్నాడు. ఈ అనుభవంతో అతను జీవితంలో మళ్లా ఎక్కడైనా స్థలాలు కొనకుండా ఉన్నాడా, లేదా? ఏమో.. కానీ భవిష్యత్తులో నవనీత మాటలకు విలువివ్వాలని మాత్రం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
——————- x ———————-

పరోపకారార్ధం

 

 

మధురవాణి: ఒక వేశ్య

కరటకశాస్త్రి: ఆమె పూర్వ విటుడు

కరటకశాస్త్రి శిష్యుడు

మధు:  (వీణ వాయించుచుండును) విద్య వంటి వస్తువ లేదు, నిజమే – ఒక్కటి తప్ప – అదేవిటి? విత్తం. డబ్బుతేని విద్య దారిద్ర్య హేతువ. ఈ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు. గనక యీ వీణ యిటు పెడదాం. (తలుపు తట్టిన శబ్దం) యవరు మీరు? బంధువులా?

కరటక: ఆపద కడ్డం బడ్డ వారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావు గాని, మీరు మాకు బంధువులు కాగల్రు.

మధు:  నాస్తులా?

కరటక: నాస్తం కట్టడానికే వచ్చాం.

మధు:  దేంతో కడతారు?

కరటక: నాస్తం కట్టడానికల్లా వున్నది వక్కటే గదా టంకం! బంగారం.

మధు:  మా పంతులు గారికి మీరు నాస్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపుతీసి కరటకశాస్త్రిని గుర్తుపట్టి ముక్కుమీద వేలుంచుకొని) చిత్రం!

కరటక: యేవిటి చిత్రం?

మధు:  యీ వేషం!

కరటక: ఉదర నిమిత్తం బహుకృత వేషం; యిది దేవుడిచ్చిన వేషవేను.

మధు:  నాదగ్గరేనా మర్మం? యీ పిల్లెవరో?

కరటక: నాకుమార్త.

మధు:  నాటకవల్లా చెడి పొగటి వేషాల్లోకి దిగిందా? పెట్టిపుట్టారు గదా యేల యీ అవస్థ?

కరటక: నీదయ వల్ల దేవుడిచ్చిన స్థితికేం లోపం రాలేదు. నిన్ను చూదావని వచ్చాను.

మధు:  యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత కాదు?

కరటక: నీలాంటి మనిషి మళ్ళీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీదగ్గరకి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీకలక్టరుగారి కుమారరత్నం గారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరవాత, నేను గానీ నీయింటికి వస్తే పీక వుత్తరించేస్తాడేమో అనే భయం చాత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మామధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుణ్ణి సదా ప్రార్ధిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?

మధు:  డిప్టీ కలక్టరు గారి కుమారరత్నం గార్ని, తండ్రి, చదువు పేరు పెట్టి చన్నపట్ణం తగిలిన రెండునెల్ల దాకా ఆయన నాస్తుడు గిరీశం గారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ తరువాత మొన్నటిదాకా గిరీశం గారు నన్నుంచారు గాని, డబ్బుకి యటాముటీగా వుండేది. డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నాయింటికి రావడం మానేశాడు. సంజీవరావు గారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావని యీ వూరొచ్చాను. (చిరునవ్వుతో) సరేగాని, యీ యిల్లాలు మాపంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్ట బయలౌతుంది.

కరటక: యిల్లాలనేస్తున్నావేం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లిచేయడానికే, నీ దగ్గిరికి తీసుకొచ్చాను.

మధు:  ఐతే యవరికి పెళ్లి చెయ్డం? నాకా యేవిటి? అలాగైతే సైయే. మొగవేషం వేసుకొని, పెళ్ళి పీటల మీద కూర్చుంటాను. మరి నాపెళ్ళాన్ని నాకిచ్చేసి మీతోవని మీరు వెళ్ళండి. (శిష్యుడి చెయిపట్టి లాగును) తరవాత పెళ్లి చేసుకుంటాను. అందాకా ముద్దియ్యి. (ముద్దెట్టుకొనును)

కరటక: నేరని పిల్లని చెడగొడుతున్నావు?

మధు:  నాలాంటివాళ్ళకి నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరీ శిష్యుడు? యీ కన్నెపిల్ల నోరు కొంచం చుట్టవాసన కొడుతూంది.

కరటక: అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరచు మాయవౌతూంటాయి. మధురవాణీ, దేవుణ్నాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టి వచ్చాను; మళ్ళీ అతడొచ్చేలోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు.

మధు:  మీకొచ్చిన చిక్కేవిటి? నేం చెయ్యగలిగిన సహాయవేవిటి?

కరటక: చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ వూళ్ళో లుబ్దావుధాన్లని ఓ ముసలాడున్నాడు; వాడికి మా మేనగోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది. యేం వుపాయం చాస్తావో, దాని ప్రాణం కాపాడాలి.

మధు:  యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్దావధాన్లు చంకలు గుద్దుకుని చేసు కుంటాడు. అతని దాకా యెందుకు, నేనే కొనుక్కుంటాను.

కరటక: చూపితే అందుకుపోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవిటి?

మధు:  యిదివరకి నిర్ణయవైన సంబంధం యేమ్మిష పెట్టి తప్పించడం?

కరటక: నీ బుద్ధి కసాధ్యం వుందా, డబ్బు కసాధ్యం వుందా!

మధు:  బుద్ధికి అంతా అసాధ్యవే గాని, డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు. యీ పెళ్ళిలో మా పంతులుకో పదిరాళ్ళు దొరుకుతాయనుకుంటున్నాడే!?

కరటక: నాసంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను.

మధు:  సరేగాని, చివరికి యేవి మూడుతుందో ఆలోచించారా?

కరటక: మధ్య నీకొచ్చిన పర్వా యేవిటి, నాకొచ్చిన పర్వా యేవిటి? యీకత్తెర మీసం, కత్తెర గెడ్డం కడిగేసుకుని నాతోవని నే వెళతాను. యీ కోక నీదగ్గిర పారేసి మాశిష్యుడు వెళతాడు. ఆ తర వాత యిదేవిటమ్మా యీ చిత్రవని నువ్వూ నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్సు చేసి యీ మంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి.

మధు:  మాపంతులు వక్కడివల్లా యీపని కానేరదు.

కరటక: మరి యింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు.

మధు:  మాపంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుధాన్లు కూతురు మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్దకాసులు యిస్తానని చెప్పండి. ఆపైన సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యీ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెర వెనకనుంచి సమయోచితంగా హంగు చాస్తాను.

కరటక: నీమాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నావిధి.

మధు: ఆమాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చాస్తాను గాని, దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?

*

ముస్లిం జీవితంపై నవల రాయాలని వుంది: ఖదీర్

 

 

కృష్ణ మోహన్ బాబు 

 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 

“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”

అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.

“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు “ఛాయా” కే ఇస్తాను.  వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు” అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.

“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, “చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని.  నాకూ అలా కథలు రాయాలనిపించేది.  10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు.  ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.

ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి ‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా.  నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు అందరూ అక్కడ వుండేవారు.  ‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు.  పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.

khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని తీర్మానించుకున్నాను.  అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు.   ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు.  నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు.  వారం వారం రాయాలి.  రాశాను. ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు.  హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల నుంచి చాలా నేర్చుకున్నాను.

కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  అతడు, ఆమె అని కూడా వుండవు.  అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు.  ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’  నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి.  రాస్తాను” అంటూ ముగించాడు.

ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ, ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

*

ఉల్లిపాయసం 

 

                             -బమ్మిడి జగదీశ్వరరావు    

bajaraమా యింటి మీద ఒక్కసారిగా ఇన్ కమ్ టాక్స్ దాడులు! మా బంధు మిత్రుల యిళ్ళమీద కూడా దాడులు జరుగుతున్నాయేమో తెలీదు! నేనెప్పుడు కుబేరుల్లో కలిసిపోయానో నాకే తెలీదు! చూస్తూ వుండగానే మీడియా లైవ్ యిచ్చేస్తోంది! మా ఆవిడ లైవ్ లో తనని తాను టీవిలో చూసుకొని తెగ మురిసిపోతోంది! ‘ముందే చెపితే యెoచక్కా ముస్తాబయ్యేదాన్ని కదా?’ అని తెగ ఫీలైపోయి నా వంక నిష్టూరంగా చూస్తోంది! ఆగక, ‘నీ సంగతి తరువాత చూస్తా’నన్నట్టు కనుగుడ్లు యెగరేస్తోంది! చాలక, ఫేషన్ పెరేడ్ జరుగుతున్నట్టు పైటకొంగు నేల మీద ఈడుస్తూ పని వున్నా లేకున్నా అటూ యిటూ తిరుగుతోంది! ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు లాగి పారేసిన చీరల్ని యేరుకొని యెoచక్కా మాటి మాటికి మార్చుకు వస్తోంది.. వెళ్తోంది.. కొంగు అటూ యిటూ తిప్పుతోంది! ఇటు కాలు అటుపక్కకేసి.. అటు కాలు యిటుపక్కకేసి.. తన పాదాలకి కాదు, భూమికే పుండయి పోయినట్టు అడుగులు వేస్తూ- వయ్యారాల హొయలు ఒలికిస్తూ నడుస్తూ ఆగి- అంతలోనే తల అటు తిప్పి యిటు తిప్పి చూసి- మళ్ళీ కదిలి వచ్చిన దారినే పోతోంది.

రెప్ప ఆర్పకుండా నేను మా ఆవిడ్నే చూస్తున్నాను! “మీ ఆవిడే కదా?” అడిగాడో అధికారి. అనుమానంగా చూసాను! “..తరువాత తీరికగా చూసుకుందురు” అని నవ్వాడు. తనతో రమ్మన్నట్టు తలవంచి సైగ చేసాడు. వెంట వెళ్లాను. అడిగిన అన్ని తాళాలు యిచ్చాను. తెరిచి చూపించాను. మీరెళ్ళి రిలాక్స్ కండి అన్నారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అన్నారు. బుద్దిగా నేలమీద మటం దిద్ది పోగేసిన పేపర్లూ ఫైళ్ళూ తిరగేసుకుంటున్నారు. అప్పుడే బడిలోంచి వచ్చిన పిల్లలిద్దర్నీ చేరదీసిన మాఆవిడ “చూడండి అంకుళ్ళు యెంత బుద్దిగా చదువుకుంటున్నారో..” ఆదర్శంగా చూపించింది. ఎప్పుడూ హోంవర్క్ చెయ్యడానికి యేడు చెరువుల నీళ్ళు తాగించే మా పిల్లలు తోటి క్లాసు పిల్లలతో పోటీ పడినట్టు అధికార్ల పక్కన కూర్చొని హోంవర్క్ లు చేసేసారు!

మా ఆవిడ ముఖంలో ఆనందం. “అమ్మా ఈ అంకుల్స్ ని రోజూ మన ఇంటికి రమ్మని చెప్పమ్మా..” యిద్దరు పిల్లలు యేకమై అడుగుతుoటే అధికారులు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకన్నా యెక్కువ అయోమయం నా ముఖంలోనే! నన్ను పట్టించుకోకుండా “వస్తారులే..” వొప్పించేయడానికి అన్నట్టు అధికారుల్ని చూసి నవ్వుతూ అంది. “రాకపోతే మీ నాన్న రప్పిస్తారులే..” భలే నమ్మకంగా బడాయిగా అంది మా ఆవిడ.

ఇంతలో యిరుగూ పొరుగూ చేరారు. అంతా సంతలా వుంది. మా ఆవిడ అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి “మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారొదినా.. పిన్నీ మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారు.. అత్తా..” అని చాలా సంబరంగా అరిచిమరీ చెప్పింది.  అదో స్టేటస్ సింబల్ గా గర్వంగా తల తిప్పుకుంటూ యెగరేసుకుంటూ వచ్చింది. ఫ్రెండ్సుకూ పేరంటాళ్ళకూ ఫోన్లు కూడా చేసేసింది. టీవీలో చూడమని చెప్పేసింది. మధ్యలో యెందుకని యెవరో అడిగితే ‘సస్పెన్సు’ అని ఆట కూడా పట్టిస్తోంది. మరెవరితోనో ఏయే ఛానెళ్ళలో వస్తోందో అడిగి, రాని యేదో ఛానెల్ వాళ్ళ న్యూస్ కవరేజి బాగోదని, అసలు వాళ్లకి రేటింగ్ కూడా లేదని కసిదీరా రిపోర్ట్ యిచ్చేసింది.

“అమ్మా.. అమ్మమ్మా తాతయ్యా వాళ్ళకి చేప్పేవా?” పిల్లలు గుర్తు చేసారు. అందుకు ‘నా బంగారు కొండలు’ అని మెచ్చు కుంది. బంగారు కొండలయితే యెక్కడ యిన్ కమ్ టాక్స్ వాళ్ళు వదలకుండా పట్టుకుంటారోనని కలవరపడిపోయాను. నా బాధలో నేనుండగా మా ఆవిడ వెంటనే వాళ్ళ అమ్మానాయినలకు ఫోన్ చేసి చెప్పింది. అన్నా వదినలకు తను ఫోన్ చేసింది చాలక మళ్ళీ ఫోన్ చేసి చెప్పమంది. ఎవర్నీ మిస్సవవద్దంది. ఫోన్లో మాట్లాడుతూ “కనపడరుగాని దొంగ..” అని నా వంక ఓరగా మెచ్చుకోలు కళ్ళతో చూసింది. “ఇదిగో పక్కనే వున్నారు” అంటూ ఫోన్ నాకు అందించింది.

అవతల అత్తగారూ మాంగారూ స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. “మా యింటా వంటా లేదు అల్లుడుగారూ..” ఆ మాటకు తిడుతున్నారని గతుక్కుమన్నాను. “..మన మొత్తం బంధు మిత్రుల అన్ని ఫేమిలీలలో మీరే ఫస్ట్.. ఫస్ట్ అఫ్ ది ఫస్ట్..” మామగారి మాటకు అత్తగారు అడ్డు తగులుతూ “ముష్టి ముప్పైయ్యారించీల ప్లాస్మా టీవీ మన మొత్తం కుటుంబాలలో అందర్లోకీ మేమే మొదాట కొన్నామని మా చెల్లెలు వచ్చినప్పుడల్లా అందరిదగ్గరా టముకేసుకొని తెగ గొప్పలు చెపుతోంది కదా?, మా అల్లుడుగారి యింటిమీదే యిన్కం టేక్సోల్లు మొదాటపడ్డారని యిప్పుడు మనమూ చెప్పుకుందాము!..” మా అత్తగారు గొప్పలకు పోతున్నారు. అంతకుమించి పట్టుదలకు పోతున్నారు. “ ఏమైనా బాబూ.. మీరింత ప్రయోజకులైనందుకు నాకు యెంతో గర్వంగావుంది..” మామగారి మాట పూర్తి కాలేదు. “రేపు అన్ని పేపర్లలో వస్తుంది కదండీ..” మామగారిని మటల మధ్యలో అత్తగారు అడుగుతున్నారు.

నా బుర్ర గిర్రున బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది. మా ఆవిడ నా చేతిలోని ఫోన్ లాక్కుంది. “నాన్నా.. తెలుసుకదా? మా ఆయనకి గొప్పలు చెప్పుకోవడం అస్సలు యిష్టం వుండదు.. గొప్పలు చెప్పుకుంటే యీ మనిషితో మనకెందుకిన్ని తిప్పలు?” అని మూతి మూడొంకర్లు తిప్పింది. “మన గొప్పలు మనమే కదా చెప్పుకుంటున్నాం.. వూరోల్ల గొప్పలు చెప్పుకోవడం లేదు కదా!?,  అయినా మనకి మనం చెప్పుకుంటే తక్కువయిపోతామా? మన గొప్పలు మనం చెప్పుకోనిదే లోకం దానికది గుర్తిస్తుందా?” నన్నే అడిగిందో వాళ్ళ నాన్నతో అందో అర్థం కాలేదు. “సరి సరే వుంటాను, చాలా ఫోన్లు వస్తుంటాయి.. అవతల వాళ్లకి యేంగేజ్.. ఆ..” మా ఆవిడ ఫోన్ కట్ చేసింది. టీవీ పెట్టింది.

టీవీలో నన్ను చూసి “హే.. నాన్న..” పిల్లలు అరిచారు. చూస్తే- చూపించిందే చూపిస్తున్నారు. చూసిందానికి మాఆవిడ కామెంటరీ కూడా తోడయింది. “అదిగో అటు టాటా యిటు బిర్లా- మధ్యలో..” మా ఆవిడ చెప్పకముందే “మధ్యలో లైలా” అన్నారు పిల్లలు. “తప్పమ్మా నాన్నగారిని అలా అనొచ్చా?” నా గౌరవానికి భంగం కలిగినట్టు నోటిమీద వేలు వేయించింది. ఛానెల్ మార్చిందే కానీ కామెంటరీ ఆపలేదు. “అటు ముఖేష్ అంబానీ యిటు అనిల్ అంబానీ మధ్యలో..” పిల్లలు మాఆవిడకి అవకాశం యివ్వలేదు. “మధ్యలో మన నాన్న..” అన్నారు నోటిమీద వేలు తియ్యకుండానే. మాఆవిడ పిల్లలు ప్రయోజకులైనట్టు గర్వంగా చూసింది. రిమోట్ నొక్కింది. కామెంటరీ ఆగింది. అనుమానంగా చూసింది. అర్థం చేసుకున్న అధికారి వొకరు నివృత్తి చేసేలోగా మధ్యలో “ఆర్ నారాయణమూర్తి నాకెందుకు తెలీదూ..” అంది. “ఆర్ నారాయణమూర్తి కాడమ్మా.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఆపక్క లక్ష్మీమిట్టల్..” అధికారి సరిదిద్దేలోపల “మధ్యలో మన నాన్న..” కోరస్ పాడారు పిల్లలు.

అలా ప్రముఖుల మధ్యలో నన్ను చేర్చి పెట్టడమేకాదు, నన్నో ‘పెద్ద చేప’గా ‘తిమింగలం’గా టీవీ ఛానెల్స్ వాళ్ళు తమ తమ క్రియేటివిటీని చూపిస్తూవున్నారు. “మమ్మీ.. డాడీ పేద్ద చేపా? తిమింగాలమా?” పిల్లల డౌట్లు పిల్లలవి. “మొదట బుల్లి చేప.. తరువాత బిగ్ చేప.. తరువాత తిమింగలం.. తరువాత బకాసురుడు..” మాఆవిడ ఆన్సర్లు మాఆవిడవి. “డాడీ.. డాడీ నువ్వెప్పుడు బకాసురిడివి అవుతావ్?” పిల్లలు నన్నడిగారు. “మీనాన్నకి అంత సీన్ లేదు..” మాఆవిడ నిరసన స్వరం. యేo అన్నట్టుగా చూసారు పిల్లలు. “బకాసురులవ్వాలంటే.. రాజకీయాల్లోనయినా వుండాల.. రాజకీయాలయినా నడపాల..” నన్నో వేస్టుగాణ్ణి చూసింది మాఆవిడ.

చూసి- యిటు పిల్లల డౌట్లు తీరుస్తూ.. అటు లైవ్ ల్లో.. ఫోనుల్లో.. వచ్చీ పోయే వాళ్ళతో.. వీధిలో వాళ్ళతో.. ఫ్రెండ్స్ తో.. పేరంటాళ్ళతో మాఆవిడ అవధానం చేస్తూ “లైవ్ యివ్వడం లేదా?” మా ఆవిడ వుస్సురుమంది. “టీలూ కాపీలూ తాగారు.. టిపిన్లు పెడితే తిన్నారు.. చిన్న కునుకు తీస్తన్నారు.. లెగిసి సూటింగులు చేస్తారులేమ్మా..” సర్ది చెపుతోంది పనిమనిషి. ఓపిక పట్టలేక ఛానెళ్ళు మార్చుతోంది మా ఆవిడ!

“అమ్మా.. యిన్కం టేక్షోల్లు పడ్డారుకదా.. యిప్పుడయినా నా జీతం పెంచడమ్మా..” పనిమనిషి వొద్దికను మించి వుషారుగా అడిగింది. మా ఆవిడ నన్ను అడక్కుండానే సరేననేసింది.

టీవీలో- “ఊ!.. తాలింపు యెయ్యడానికి దాకే లేదు, యిల్లంతా యిత్తడి పెనాలని!.. వుల్లిపాయల రేటు తగ్గించడాకే లేదు, యీలు పత్తేకంగా ఓదా పట్టుకోస్తారంటే నమ్మీయాలా?” మూతి మూడొంకర్లు తిప్పి వెళ్లిపోయింది చిక్కోల్ ముసల్ది. ‘ప్రత్యేక హోదా సంగతీ రాజధాని సంగతీ  తరువాత ఆలోచించ వచ్చని, ముందు వుల్లి ధరలు తగ్గించాలని సామాన్య జనం కోరుకుంటున్నార’ని న్యూస్ యాంకర్ చెపుతున్నాడు.

యాంకర్ గొంతు నొక్కినట్టుగా రిమోట్ నొక్కింది మా ఆవిడ. న్యూస్ రూమ్ డిస్కషన్ నడుస్తోంది. అందరూ వొక్కసారే యెవరి వాదనని వారు బలంగా వినిపించి యెవరికీ యేమీ అర్థం కాకుండా చక్కగా మాట్లాడడంతో కాసేపటికిగాని అర్థం కాలేదు. ప్రతి రైతూ విధిగా తనకున్న భూమిలో పావొంతు వుల్లి పండించాలని ఆదర్శ రైతు వొకరంటే, వుల్లిని పౌడర్ చేసి పేస్టు చేసి దాచుకొని నిలవా పెట్టుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ యిప్పటికే సూచించారని అధికార పార్టీ సభ్యుడు గుర్తు చేసాడు. ఉల్లిని అధికార పార్టీ వాళ్ళూ వాళ్ళని సపోర్ట్ చేసే బడా వ్యాపారులు బాగానే నిలవా చేసారని ప్రతిపక్ష సభ్యుడు దుమ్మెత్తి పోసాడు.  ఉల్లి దొంగల్ని గజదొంగలుగా పరిగణించాలని జర్నలిస్టు మేథావి సూచిస్తే, అసలు వుల్లి లేకుండా వంట చేయడం మీద పరిశోధనలు జరగాలని సామాజిక మేథావుల సంఘం కన్వీనర్ అభిప్రాయపడ్డారు!

“రామాయణంలో ఈ పిడకల వేటేమిటో?..” నాలో నేను అనుకున్నాననుకున్ననేగాని పైకి అనేసాను. మాఆవిడ దగ్గర అన్నిటికీ ఆన్సర్ వున్నట్టే దీనికీ వుంది. “రామాయణంలో పిడకలవేట వుంది.. లంకా ప్రవేశం చేయడానికి సముద్రంలో  వానర సైన్యం వారధి నిర్మించింది. అప్పుడు సముద్రంలో వేసిన రాళ్ళన్నీ పిడకలగా తెలిపోయాయట.. వారదికోసం చేసిన రాళ్ళ వేటే రామాయణంలో పిడకలవేటగా ప్రసిద్దికెక్కింది..” మాఆవిడ వివరణకి నేనూ పిల్లలూ మాత్రమే కాదు ఇన్కమ్ టాక్స్ అధికారులూ నోళ్ళు వెళ్ళబెట్టారు!

‘ఉల్లిపాయలకూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకూ ఏమిటి సంబంధం?’ నా ఆలోచనలను అలవాటుగా స్కాన్ చేసిన మాఆవిడ “చెట్టు మీది కాయకీ సముద్రంలో వుప్పుకీ వున్న సంబంధమే!” అంటూ చెవిలో గుసగుసగా చెప్పి ముసిముసిగా నవ్వింది.

మా రొమాంటిక్ సీన్ ని అధికారులు ఆరాధనగానూ అనుమానంగానూ చూసారు.

మళ్ళీ రిమోట్ నొక్కింది. సెన్సెక్స్ స్థానంలో ‘ఆనియనెక్ష్’ యిస్తున్నారు. షేర్స్ లో తరగడం పెరగడం వుంది. కాని వుల్లికి సంబంధించిన ‘ఆనియనెక్ష్’లో పెరగడమే తప్ప తరగడం లేదు.  సెన్సెక్స్ పడిపోయినప్పుడు వచ్చిన గుండెపోట్లు కంటే  ‘ఆనియనెక్ష్’ పెరిగి పోయినప్పుడు వచ్చిన గుండెపోట్లే యెక్కువ!

ఛానెల్ మారింది. దృశ్యం మారింది. మా పిన్నీ కూతురు పద్మ. “పద్దూ వదిన వచ్చింది” సంబరంగా అంది మాఆవిడ. యింటి మీద యిన్కం టాక్స్ వాళ్ళు పడితే ‘బంధువులతో కూడా మాట్లాడిస్తారా?’ అవాక్కయాను. అందుకు కాదని కొన్ని క్షణాల్లో అర్థమయ్యింది. పద్దూ మొగుడూ లైవ్ లోకి వచ్చేసాడు. ‘యెంతో ప్రేమగా వుండే వాళ్ళు వీళ్ళకేమొచ్చింది?’ జుట్టు పీక్కున్నాను.

“..దుర్మార్గం కాకపొతే యేమిటండీ యిదీ.. అదనపు కట్నం అడిగితే.. మగనాకొడుకులు అంతా యింతే పోన్లే అని సరిపెట్టుకున్నాం, అత్తింటి వారు వుల్లి.. వుల్లిపాయలు అడిగితే పెట్టాలా అండీ.. అది సాధ్యమయ్యే పనేనా అండీ.. గొంతెమ్మ కోరికలు కోరితే యెట్లా అండీ..” మాపద్దూ రెచ్చిపోతోంది. “అదికాదండీ వుల్లిపాయలు నిండా వేసుకొని ఆమ్లెట్ తిని యెన్నాళ్ళయిందో తెలుసా అండీ.. యేమండీ ఆమ్లెట్ కాదండీ, వుల్లిగారెలు తనకీ యిష్టమేనండీ.. తను తింటుందనే అడిగాను..” కళ్ళ నీళ్ళ పెట్టేసుకున్నాడు మాబావ. ఎందుకో నా కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. ఉల్లివల్ల కుటుంబాలు కూలిపోవడమే కాదు, ప్రేమలు యెలా పగలుగా మారుతున్నాయో.. విడాకులకు దారితీస్తున్నాయో న్యూస్ యాంకర్ చెప్పింది. సాక్ష్యంగా మరికొన్ని బైట్స్..

“మా ఆయన యెప్పుడూ నన్నొక మాట అనేవారు కాదు, వుల్లి పాయలు దుబారాగా వాడి సంసారాన్ని నాశనం చేసానని అన్నప్పుడు యింక అతనితో యెంత మాత్రమూ వుండకూడదనుకున్నాను.. డైవోర్స్ తీసుకొని పుట్టింటికి వచ్చేసాను..” కళ్ళు  వొత్తుకుంది ఓ ఆడ పడుచు.

“.. అరే.. నేనేమన్నా బాహుబలి టిక్కెట్లు అడిగానా? లేదే, రూబీ నక్లెస్ అడిగానా? లేదే, ఆధార్ కార్డు పట్టుకొని రైతు బజార్లో యిచ్చే సబ్సిడీ వుల్లి తెమ్మన్నాను, క్యూ అంటాడు, ఎర్రగడ్డ రైతుబజార్ క్యూ ఎల్బీనగర్ దాక వుందంటాడు.. ఎల్బీనగర్ కాదండీ విజయవాడ వరకూ.. విశాఖపట్నం వరకూ క్యూ వుంటుంది.. వుంటే మాత్రం ఫ్యామిలీ అంటే బాధ్యత లేదా? ఆ మాత్రం చెయ్యలేవా? అడిగాను. సంసారమే చెయ్యలేనన్నాడు.. దట్సాల్.. వుయ్ క్లోస్డ్ అవర్ రిలేషన్ షిప్..” డోoట్ బాదర్డ్ అన్నట్టు చెప్పింది ఓ పడుచుపిల్ల.

ఇంతలో నా సెల్లు ఘోల్లుమంది. హలో అన్నాను. పోలో మన్నాడు మిత్రుడు. నువ్వింత నమ్మక ద్రోహివి అనుకోలేదన్నాడు. ఔనౌను అన్నాను. మరి అధికారుల కళ్ళూ చెవులూ నన్నే చూస్తున్నాయి. నవ్వాను. ఏడ్చినట్టుంది అన్నాడు. ఔనౌను అన్నాను. ‘పిల్ల పెళ్ళికి కాస్త సాయం చెయ్యరా, అదీ అప్పుగా అంటే లేదన్నావ్’ అన్నాడు. ఔనౌను అన్నాను. ‘మరి నీ యింటి మీద యిన్కమ్ టేక్సోళ్ళు యెలా పడ్డార్రా?’ అన్నాడు. ఔనౌను అలవాటుగా అనేసి, నాలుక్కరుచుకొని తెలీదన్నాను. “ఇన్నాళ్ళూ డబ్బులు లేవని చాలడం లేదని తెగ దొంగేడుపులు యేడ్చేవా.. యిప్పుడు నిజంగా యేడు.. తధాస్తు దేవతలు వుంటార్రా..” తిట్టి తాటించి మరీ ఫోన్ పెట్టేసాడు.

“ఏంటండీ సుబ్బారావన్నయేనా?, చెప్పలేదని తెగ ఫీల్లవుతున్నారా? అవరూ.. యింటి మీద యిన్కం టేక్సోల్లు పడ్డారని యిప్పుడన్నా ఫ్రెండ్స్ కి మెసేజులు పెట్టండి.. మెయిల్లు చెయ్యండి.. మా ఫ్రెండ్ యింత గొప్పవాడయ్యాడని వాళ్ళూ పదిమందికి గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళకీ గౌరవం.. మనకీ గౌరవం.. నేనయితే నా ఫేస్ బుక్ లో మన ‘స్టేటస్’ పెట్టేసా..” టీవీ వదిలి కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కూ టక్కూ లాడిస్తూ వుంది.

పిల్లల చేతికి రిమోట్ దొరికింది. ఛానెల్స్ ఛేoజ్ చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ దగ్గర ఆగారు. కొత్త సినిమా పాట కాదు. పాతది. మూగనోము లోది.

“ఉల్లివి నీవే.. తల్లివి నీవే.. చల్లగ కరుణించే దైవము నీవే..” పాటకు మా పిల్లలిద్దరూ “ఉల్లివి నీవే.. తల్లివి నీవే..” అంటూ తెరమీది పిల్లలతో కలిసి కోరస్ యిస్తున్నారు.

“ఏవండీ..” పిలుపు విని మా ఆవిడ పక్కన చేరాను. ఫేస్ బుక్ లో తను బుక్కయింది చాలక నన్నూ లాగింది. “.. మీరు వుల్లిపాయలకు వెళ్ళేటప్పుడు.. పోలీస్ స్టేషన్ లో మీ యిన్ఫర్మేషన్ యిచ్చి వెళ్ళండి.. మార్గం మధ్యలో యెవరితో మాట్లాడకండి.. వీలయితే కిందింటి కుర్రాడు సైదుల్ని మీతో తోడు తీసుకువెళ్ళండి.. చైన్ స్నాచర్స్ లాగే ఆనియన్ స్నాచర్స్ తయారయ్యారు జాగ్రత్త.. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు మనీ డ్రా చేసేటప్పుడు యెన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వుల్లిపాయలకి వెళ్ళినప్పుడు- కొని తీసుకోస్తున్నప్పుడు అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి..” చదువుతూ చెప్తోంది. మా ఆవిడ మాటకు గంగిరెద్దులా తలాడించాను. అలా తలాడిస్తే నేనెంతో ముద్దోచ్చేస్తానట!?

ముద్దుముద్దుగా మాఆవిడ “ఉల్లిని కోస్తే కళ్ళు మంట! ఉల్లిని కొంటె గుండె మంట! ఉల్లి ఉంటేనే వంట! ఉల్లి లేకుంటే తంటా! ఎలావుందంటా?” చెప్తే మురిసి? “నువ్వే నా కవితంట” అన్నాను!

ఇన్కమ్ టాక్స్ అధికారులు రిపోర్టులు తయారు చేసి పని పూర్తయినట్టు లేచి నిల్చున్నారు. నాతో కొన్ని సంతకాలు కూడా తీసుకున్నారు. “థాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్..” అధికారి మాటకి “వెల్ కం.. మోస్ట్లీ వెల్ కం..” మాఆవిడ మగపెళ్లివారితో అన్నట్టు యెంతో ప్లీజింగ్ గా ప్లెజర్ గా అంది.

వెళ్ళిపోతున్న అధికారుల వెంట పడి “సార్.. యిప్పుడు యేమవుతుంది?” నా భయం కొద్దీ నేనడిగాను. “మొదటిసారి కదా.. అందుకని..” మాఆవిడ నవ్వింది. నవ్వి “యిన్కం టేక్సు రెయిడ్స్ జరిగినోల్లంతా అలా కోర్ట్ కు వెళ్లి యిలా వచ్చేస్తున్నారు.. సొసైటీ అన్నాక పెద్దవాళ్ళన్నాక పెద్ద సమస్యలు వస్తాయి.. పోతాయి.. కామన్..” చెప్తూ వుంటే మాఆవిడ నాకు ధైర్యం చెపుతోందో అధికార్లని అధైర్యపరుస్తోందో అర్థం కాలేదు!

“సార్.. యింతకీ మా యింటి మీదే మీరు యెందుకు పడ్డారు?” అని నా ప్రశ్న నాకే సబబుగా తోచక “ మీరంటే మీ  యిన్కం టేక్సోల్లు యెందుకు పడ్డారు సార్?” దీనాతిదీనంగా హీనాతిహీనంగా అడిగాను.

నా ముఖం చూసి నిజం చెప్పకుండా వుండలేక పోయారు.

“టెన్ డేస్ బాక్ మీరు ఆనియన్ దోస ఆర్డర్ చేసి తిన్నారు.. గుర్తుందా?” అడిగి, అదే కారణమన్నట్టు ఒక్క క్షణం చూసి, ఆగిన అధికారి సిబ్బందితో ముందుకు అడుగెయ్యబోయాడు.

సరిగ్గా అప్పుడే మాఆవిడ “యేవండీ మీకిష్టమని ముద్దపప్పుచేసాను,  పపూ టమాటా కూడా వండాను, రండి వేడిగా తిందురు..” నన్ను పిలిచింది.

ముందుకు వెళ్ళబోతున్న యిన్కమ్ టాక్స్ వాళ్ళు ఆగి వెనక్కి చూసారు!

*

తప్పదు రా తమ్ముడూ..

 

“హలో…రేయ్ అన్నయ్యా..నేను ఈ ఉద్యోగం చేయలేను. వదిలేస్తాను..”

“సంతోషం..”

“నిజంగా వదిలేస్తాను రా..వెళ్ళి మా యముడితో చెప్పేస్తాను..”

“రేయ్..రేయ్..ఆగు. ఇదేదో “బరువు తగ్గుతాను, ఉదయం త్వరగా లేస్తాను” అని నువ్వు వారానికొకసారి చెప్పే జోక్ అనుకుని అలా అన్నాను.ఇంతకీ ఏమైంది?”

“ఇక్కడ ఆఫీసులో ఉన్నవాళ్ళంతా సిటీ లో పుట్టి పెరిగిన వాళ్ళు రా..నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు..”

“నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు..”

“వాళ్ళు మాట్లాడే విషయాలేవీ నాకు తెలీదు. క్రికెట్ గురించో, తెలుగు సినిమాల గురించో అయితే నేను విజృంభించేవాడిని. అవి వాళ్ళుమాట్లాడిచావరు. నేను రిజైన్ చేసేస్తాను..”

“క్రికెట్, తెలుగు సినిమాల గురించి మాట్లాడే వయసు దాటేసావు రా నువ్వు. ఇక రాజకీయాలు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి.ఇంకొన్నేళ్ళయ్యాక షుగర్, థైరాయిడ్ కి మారిపోవాలి. ఆ తరువాత ఏది మాట్లాడటానికైనా రెడీ గా ఉన్నా..మాటలు వినే మనిషి దొరకడు. సరేలే..ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఇద్దరం డిప్రెషన్ లోకి వెళ్తాం. కాబట్టీ…పిల్ల చేష్టలు మాని, పెద్దవాళ్ళు చర్చించుకునే కష్టాలేమైనా ఉంటే చెప్పు..”

“నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఈ ఊళ్ళో లేరు..”

“ఇదేమైనా పదవ క్లాసు తరువాత ఇంటర్మీడీయేట్ చేరడమనుకున్నావా..ఫ్రెండ్స్ అందరూ కూడబలుక్కుని ఒకే కాలేజ్ లో చేరటానికి? ఇందాకచెప్పాను గా…పిల్ల చేష్టలు ఇక కుదరవు..”

“నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు రా. మిగతా సమయాల్లో మాట్లాడరు కాని, భోంచేసేటప్పుడు మాత్రం బలవంతంగా లాక్కెళ్తారు. క్యాంటీన్ కి వెళ్ళాక..అక్కడ అన్నీ పంచుకుని తినాలంటారు. ఈ రోజు నాకు బాగా ఆకలిగా ఉంటే ఫుల్ మీల్స్ తీసుకున్నాను. నాతో పాటు వచ్చిన మిగతా ఏడుగురు ఏడు రకాలు ఆర్డర్ చేసారు. మొత్తానికి నేను ఏమి తిన్నానో తెలుసా? ఒక ముద్ద పప్పు అన్నం, ఒక పీడ్జా ముక్క, నాలుగుఫ్రెంచ్ ఫ్రైస్, రెండు స్పూన్ లు సూప్, అర అంగుళం నూడుల్ తీగ, దోస తో పాటు ఇచ్చే పల్చని పచ్చడి. ఇప్పుడు చెప్పరా..ఇంకా నన్ను ఉద్యోగం చేయమంటావా?”

“ఇలాంటివి ఏ ఉద్యోగానికెళ్ళినా ఉంటాయి రా. పోనీ ఇది మానేసి ఏం చేద్దామని నీ ఆలోచన?”

cartoon

“పొలం దున్నుకుని బతుకుతా..”

“పొలమా? ఏ పొలం?”

“అదే…పొలం కొని..దున్నుకుంటాను..”

“ఆ పొలం కొనే డబ్బే మన దగ్గర ఉండుంటే..నీ కన్నా ముందు నేనే ఉద్యోగానికి రాజీనామా చేసేవాడిని రా నాయనా..కాబట్టీ..పొలం కొనే డబ్బుపోగయ్యాక..ఆ డబ్బు తో ఇల్లు కొని, మళ్ళీ పొలం కొనటానికి డబ్బు పొగయ్యేదాకా ఉద్యోగం చెయ్…అర్థమయ్యిందా?”

“అయితే అప్పటిదాకా ఈ నరకం అనుభవించాల్సిందే నా?”

“కొన్ని కిటుకులు చెబుతాను..రోజూ పాటించు. మంచి ఇంగ్లీషు సినిమాల పేర్లు చెబుతాను..వాటి గురించి వికిపీడియా లో చదువుకుని కొన్నిపాయింట్లు రాసుకో. చేతన్ భగత్ పుస్తకాలు, ఆ నాగుపాముల పుస్తకాల పేరేంటి గుర్తు రావట్లేదు…అవీ..కొని..వాటి వెనకాల అట్ట మీద ఉన్న నవలసారాంశం చదువు. ఆఫీసుకెళ్ళి గంటకొకసారి నువ్వు బట్టీ పట్టిన సినిమాల పేర్లు చెప్పు..ఆ పుస్తకాలు చదివారా అని అడుగు..నాకు తెలిసి మీ టీంలో వాళ్ళెవరూ ఈ టాపిక్ లు దాటి వెళ్ళరు.”

“ఈ ఉద్యోగం లో కొనసాగాలంటే ఇంత నటించాలా? దీని బదులు నేను యాక్టర్ అయితే నెల తిరిగేలోపు నేషనల్ అవార్డు కొట్టేస్తాను..”

“తప్పదు రా తమ్ముడూ..నేను చెప్పిన మార్గం లో వెళ్ళిపో. కొద్ది రోజుల తరువాత నీకే అర్థమైపోతుంది..మనల్ని మనం మోసం చేసుకుని బ్రతకటం ఎంత సులభమో..విజయోస్తు!”

***

IMG_20150831_205034_1

ఇందాక ఇందిరా పార్కు పక్కనున్న కేఫ్ లో చాయ్ తాగుతూ ఉంటే..రోడ్డుకి అటువైపు ఒక పెద్దాయన గోడకున్న పోస్టర్ చూసి కోపంగా “ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించే వాడే లేడా?” అని అరుస్తూ కనబడ్డాడు. విషయం కనుక్కుందామని అటు వెళ్ళాను. గోడకున్న పోస్టర్ చూసాను. “కుంకుమ భాగ్య – మధ్యతరగతి మగువ మనోభావం” అని రాసుంది. కొత్త డబ్బింగు సీరియల్ అనుకుంటా. ఆ టైటిల్ కి, ఆ క్యాప్షన్ కి అర్థమేంటని ఆ పెద్దాయన ఆవేదన కాబోలు. ఆ పోస్టర్ మళ్ళీ చూసాను. రానున్న 300 ఎపిసోడ్ల కథ అర్థమైపోయింది. ఆయన్ని ఓదార్చటానికి కూడా ప్రయత్నించలేదు. మరో ఇద్దరు వచ్చారు. అందరూ కలిసి ఆ పోస్టర్ చించే లోపు ఫొటో తీసాను. ఇప్పుడు మనం ప్రపంచ యుధ్ధం ఫొటోలు చూసి ఆ సమయంలో జనం అనుభవించిన బాధ గురించి మాట్లాడుకున్నట్టు..ఒక యాభై సంవత్సరాల తరువాత నేను తీసిన ఈ ఫొటోను గురించి చర్చించుకుంటారు.

***

facts-about-mosquito-bites-the-truth-and-myths

“ఆరుబయట..పున్నమి చంద్రుడు..చల్ల గాలి..ఆహా..” అని జీవితాన్ని రొమాంటిసైజ్ చేద్దామనుకుంటుండగా..చేతికి చిక్కకుండా చెవి దగ్గర చేరి “గుయ్య్” అని నస పెడుతున్న దోమ..”ఇంట్లో మస్కిటో రిపెలెంట్ లేదు..దోమల వల్ల రాత్రి నిద్ర పట్టకపోతే ఉదయం ఆలస్యంగా లేస్తావు..ట్రాఫిక్ లో ఇరుక్కుపోతావు..” అని గుర్తు చేసి జుగుప్త్స కలిగించే రియాలిటీ లోకి లాగేసింది.

(మళ్ళీ వచ్చే  గురువారం…)

బిహైండ్ ద సీన్!

 

 అరుణ్ సాగర్

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి ఒంటరిదేమీ కాదులే!

 

మిణుగురు చుక్కలున్నాయి

అర్ధచంద్రుడున్నాడు

కొమ్మలు ఎండిన చెట్టు ఒకటి

ముడుచుకు పడుకున్న కుక్క ఒకటి

పోయే ప్రాణంలా

వెలిగీఆరే ట్యూబులైటు ఒకటి

 

అరే భై

ఈ రాత్రి ఒంటరిదేమీ కాదని చెప్తున్నానా లేదా?

 

రోడ్డుమీద మట్టి ఉంది

మూలమీద చెత్తకుండీ ఉంది

పగిలిపోయిన బిర్యానీ ప్యాకెట్ ఒకటి

ఏరుకుంటున్న రాగ్ పిక్కర్ ఒకతె

 

రాత్రులు-చీకటి రాత్రులు

తెల్లారని రాత్రులు-దహించే రాత్రులు

సోడియం దీపాల వెలుతురులో

ముసుగేసిన నల్లని వీధులు

కళ్లలో నిప్పురవ్వలు రాలినట్టు

ఎటుచూసినా

మండుతున్న నిశీధి కొసలు

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి వలే నువ్వు కూడా ఒంటరివేమీ కాదులే!

 

కళ్లలో మరణించని దృశ్యం

గొంతులో ఇరుక్కుపోయిన వాక్యం

రక్షణవలయాన్ని ఛేదించిన జ్ఞాపకం

ఇన్ ద ఎండ్

నీ బిక్షాపాత్రలో మిగిలిన సత్యం

 

దీనెబ్బా! ఇంటికెళ్తే నిద్దర్రాదు కదరా!

 

-ఆజ్యం

:ఎక్కడో ఎవడో యఫ్ఎమ్ పెట్టాడు!

“తేరే దునియా…సె హోకే మజ్ బూర్ చలా,

మై బహుత్ దూర్…బహుత్ దూర్…

బహుత్ దూ….ర్ చలా”

 

హుహ్!

మిత్రమా, మై ఫెలో మేల్!

మియ్యర్ర్ మేల్!

-తిరస్కృతుడా, బహిష్కృతుడా!

 

ముందుగా:

నేనొక నైరూప్య వర్ణచిత్రం గీస్తాను

ఆపైన:

నీకు దాన్ని ఎలా చూడాలో నేర్పిస్తాను

జూమ్ ఇస్కో దేఖో!

నీ కంటి అద్దాలు కూడా మారుస్తాను

 

వయ్?

ఎందుకంటే, బికాజ్!

నాడీమండలం ఒక నిత్యాగ్నిగుండం

ఓల్డ్ ఫ్లేమ్ ఈజ్ యాన్ ఆరని జ్వాల!

 

నువ్వేమీ ఫీలవకు

ఈ రాత్రి వలే నువ్వు కూడా ఒంటరివేమీ కాదులే!

*

arun sagar