గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు!

స్లీమన్ కథ-9

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.

స్లీమన్ అక్టోబర్ 3న కోనిగ్స్ బర్గ్ చేరుకుని ఎప్పటిలా గ్రీన్ గేట్ సమీపంలోని ఓ హోటల్ లో దిగాడు. ఉదయం లేవగానే కిటికీలోంచి బయటికి చూశాడు. ఆ హోటల్ ద్వారగోపురం మీద బంగారు అక్షరాల్లో రాసి ఉన్న జర్మన్ పంక్తులపై అతని దృష్టి పడింది.

Vultus fortunae variatur imagine lunae:

Crescit, decresit, constans persistere nescit.

 

The face of fortune varies as the image of the moon

Waxes and wanes, and knows not how to remain constant.

(ఐశ్వర్యపు ముఖం చంద్రబింబంలానే మారిపోతూ ఉంటుంది

పెరగడం, తరగడం తప్ప దానికి స్థిరత్వం తెలియదు.)

ఈ పంక్తులు అతను ఎరిగున్నవే. అప్పుడప్పుడు తండ్రి దగ్గర ఉటంకించేవాడు. తండ్రి కూడా తరచు ఇవే మాటలు కొడుక్కి అప్పగించేవాడు. కానీ ఈసారి మాత్రం ఈ మాటలు ఆశ్చర్యకరమైన ఉధృతితో స్లీమన్ ను తాకాయి.  వాటిలో ఓ హెచ్చరిక ధ్వనిస్తున్నట్టు అనిపించింది.  కచ్చితంగా ఏదో దారుణం జరగబోతోందనుకున్నాడు. వెంటనే టిల్సిట్ కు, అక్కడినుంచి మేమల్ కు బయలుదేరివెళ్ళాడు. ముందురోజు రాత్రి మేమల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి అనేక ప్రాంతాలు బూడిదైనట్టు అతనికి మార్గమధ్యంలో తెలిసింది. అతను వెళ్ళేటప్పటికి ఆ నగరమంతా ఇంకా పొగ పరచుకునే ఉంది. తగలబడిన గిడ్డంగులు సెగలు చిమ్ముతూనే ఉన్నాయి.

‘అయిపోయింది… అంతా అయిపోయింది…వందలాది నీలిమందు పెట్టెలు దగ్ధమైపోయాయి… సర్వనాశనమైపోయాను’ అనుకున్నాడు స్లీమన్. అతనికి పిచ్చిపట్టినట్టు అయిపోయింది. వెంటనే తన  ఏజెంట్ దగ్గరకు పరుగెత్తాడు. అతను ఏమీ మాట్లాడకుండా పొగలు కక్కుతున్నవైపు చేయి చూపించాడు.

స్లీమన్ బుర్ర కాసేపు మొద్దుబారిపోయింది. వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు పరి పరి విధాలుగా పోయాయి. తను పూర్తిగా దివాళా తీశానని నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాల్సిందే ననుకున్నాడు. ఇలా అడుగంటిన ప్రతిసారీ తిరిగి పైకి లేవగలిగానని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. కాస్త రుణసాయం చేయమని కోరుతూ తను ష్రోడర్స్ కు ఉత్తరం రాస్తాడు…ఇంటిని, ఎస్టేట్లను అమ్మేస్తాడు…ఇకమీదట కూడుకు, గుడ్డకు సరిపోయేంత అతి తక్కువ ఖర్చుతో ఎలాగో బతికేస్తాడు…!

ఇప్పుడిక్కడ ఉండి చేసేదేమీలేదు, వెంటనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్ళిపోయి పరిస్థితిని చక్కదిద్దుకోమని మనసు తొందరపెట్టింది. సరిగ్గా అతను తిరుగుప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో వెనక నుంచి ఎవరో భుజం తట్టారు. వెనుదిరిగి చూశాడు. మేమల్ లో స్లీమన్స్ కు ఏజంట్ గా ఉన్న మేయర్ & కోలో హెడ్ క్లెర్క్ నని అతను పరిచయం చేసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా, నీలిమందు పెట్టెల్లో ఏ ఒక్కటీ నష్టపోలేదనీ, అన్నీ భద్రంగా ఉన్నాయన్న శుభవార్తను చెవిన వేశాడు. అదెలా జరిగిందంటే, నీలిమందుతో నౌకలు మేమల్ చేరిన సమయానికి అక్కడి గిడ్డంగులన్నీ వేరే సరకుతో నిండిపోయి ఉన్నాయి. దాంతో వాటికి కొంత దూరంలో అప్పటికప్పుడు చెక్కతో కొన్ని గిడ్డంగులను ఏర్పాటు చేసి సరకును వాటిలో ఉంచారు. అదృష్టవశాత్తూ మంటలు ఈ తాత్కాలిక గిడ్డంగులదాకా వ్యాపించలేదు!

ఇది వినగానే ముంచెత్తిన సంతోషంతో స్లీమన్ ఉక్కిరి బిక్కిరైపోయాడు. కొన్ని నిమిషాలపాటు నోటి వెంట మాటరాలేదు. ఏదో అదృశ్యశక్తి మరోసారి విధ్వంసం అంచుల నుంచి తనను వెనక్కి లాగిందని అనుకున్నాడు. పట్టలేని ఆనందం అతన్ని పసిపిల్లాణ్ణి చేసింది.

ఇప్పుడు హడావుడిగా సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మేమల్ లోనే మకాం పెట్టి తన సరకు అమ్మకాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఎడాపెడా లాభం చేసుకున్నాడు. ఒక్కోసారి తనకే నమ్మశక్యం కానంత మొత్తాలకు బేరాలు కుదుర్చుకున్నాడు. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని లాభాలు గుంజుకోడానికి అతను కొంచెమైనా సందేహించలేదు. నీలిమందు, ఇతర అద్దకాలు కాక; తుపాకీమందుకు, తూటాల తయారీకీ వాడే సూరేకారం, గంధకం, సీసం వగైరాలను కూడా అమ్మి భారీగా సొమ్ముచేసుకున్నాడు.  ఇంతకుముందు కాలిఫోర్నియా బంగారు భూములనుంచి అదృష్టాన్ని మూటగడితే ఇప్పుడు క్రిమియా యుద్ధం నుంచి మూటగట్టాడు. 1855 చివరినాటికి అతని సంపద విలువ 10 లక్షల డాలర్లకు చేరింది.

***

ఇతర విషయాల్లో కూడా అతనికి అదృష్టం  కలిసొచ్చింది. ముఖ్యంగా, సంసారజీవితంలోని సంతోషాన్ని ఇప్పుడే మొదటిసారి చవిచూస్తున్నాడు. ఎందుకోగానీ ఎకతెరీనా అతని మీద ఇష్టం చూపించడం ప్రారంభించింది. ఆ ఏడాదే  కొడుకు పుట్టాడు. పేరు, సెర్గీ. కొన్ని మాసాలపాటు భార్యపట్ల కృతజ్ఞతాభావం అతనిలో పొంగిపొర్లింది. జార్ వేసవి విడిది అయిన పీటర్ హాఫ్ కు దగ్గరలో ఒక ఎస్టేట్ తోపాటు భార్యకు నగానట్రా కొనిపెట్టాడు. కొన్నిరోజులు విశ్రాంతిగా గడపడానికి ఫ్రాన్స్ తీసుకెడతానని మాట ఇచ్చాడు.

ఇవే రోజుల్లో అతను పోలిష్, స్వీడిష్ భాషలు నేర్చుకున్నాడు. అంతకు మించిన విశేషం ఇంకొకటుంది. క్రిమియా యుద్ధం అందించిన రెండో భాగ్యానికీ, పుత్రలాభానికీ అదనంగా అతనికి మరో మహత్తరమైన కానుక అందింది. అది, గ్రీకు భాష!

ఫస్టెన్ బర్గ్ లో తను పచారీకొట్టులో పనిచేస్తున్నప్పుడు ఒక తాగుబోతు నోట హోమర్ పంక్తులు విన్నప్పటినుంచీ అతనికి గ్రీకు భాషపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఎప్పటికైనా ఆ భాష నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాడు. నాయ్ స్ట్రీలిజ్ లోని జిమ్నాజియంలో సరిగ్గా గ్రీకు క్లాసులోకి అడుగుపెట్టబోతున్నప్పుడే తన చదువుకు విఘ్నం కలగడం అతని మనసులో ఒక వెలితిగా ఉండిపోయింది. అయితే ఈ మధ్యలో పది భాషలు నేర్చుకున్నాడు కానీ; తను అమితంగా ప్రేమించే గ్రీకులోకి తలదూర్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ భాష తనను పూర్తిగా మంత్రించి వశం చేసుకుంటుందని భయపడ్డాడు.

ఇన్నేళ్లలో హోమర్ కు, గ్రీకు హీరోలకు సంబంధించి అనేక భాషల్లో వచ్చిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు కానీ, కావాలనే గ్రీకు పుస్తకాల జోలికి వెళ్లలేదు. వెడితే ఆ భాషలోని హోమర్ రచనలన్నింటినీ కంఠతా పెట్టేవరకూ తను ఇంకే పనీ చేయలేననుకుని వెనకాడాడు. ఇప్పుడా ఖరీదైన వ్యాసంగంలోకి దిగడానికి తగిన తాహతు తనకు వచ్చిందనుకున్నాడు. అయినాసరే, తన వ్యాపారబాధ్యతల్లోకి గ్రీకు మరీ చొరబడకుండా జాగ్రత్త తీసుకుంటూనూ వచ్చాడు.

వారంలో ఆరు రోజులు ఆఫీసుకు అంకితమవుతూనే, ఆదివారాలు మాత్రం రోజంతా ఇంట్లో తన చదువు గదిలో తలుపులేసుకుని అధ్యయనంలో గడిపేవాడు. అప్పుడప్పుడు అధ్యాపకుని పక్కన పెట్టుకునేవాడు. అలా ఆరు ఆదివారాల్లో ప్రాచీన గ్రీకుభాషలో పొడవైన, సంక్లిష్టమైన వాక్యాలు రాయగలిగిన స్థితికి వచ్చాడు. ఆ వెంటనే ఆధునిక గ్రీకులో రాయడమూ నేర్చుకున్నాడు. అతనిలోంచి ఆ భాష ఊటలా ఉబికిరావడం ప్రారంభించింది. ఆ భాష సౌందర్యానికీ, అందులోని స్పష్టతకూ పరవశించిపోయాడు. అంతవరకూ తను ఊహించినదానికంటే కూడా ఉజ్వలంగానూ, అద్భుతంగానూ ఆ భాష తోస్తూవచ్చింది. ఆనందం పట్టలేక, నాయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి, హోమర్ మాట్లాడిన ఆ పురాతన భాషలో ఓ పెద్ద ఉత్తరం రాశాడు. అందులో అప్పటివరకూ సాగిన తన జీవితగమనాన్ని వివరించాడు. తీవ్రనైరాశ్యంలో కూరుకుపోయిన చీకటి క్షణాలలో కూడా గ్రీకుభాషలోని పవిత్ర షట్పదులు(షట్పది: ఆరు పాదాలు కలిగిన ‘హెక్సామీటర్’), సోఫొక్లీస్(క్రీ.పూ. 497-406: గ్రీకు సంగీత, నాటకకర్త) సంగీతం తనను “ఉత్తేజశిఖరాలకు ఎత్తేసా”యన్నాడు. “ఆ భాషతో నేను మత్తెక్కిపోయా” ననీ, ఒక భాష ఇంత ఉదాత్తంగా ఉండగలదా అనిపించి ఆశ్చర్యచకితుణ్ణయిపోయాననీ రాశాడు. “ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రం గ్రీసుకు గొప్ప భవిష్యత్తు ఉన్నట్టు అనిపిస్తోంది. శాంటా సోఫియాపై గ్రీకు జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, మూడు శతాబ్దాల టర్కీ ఆధిపత్యం తర్వాత కూడా గ్రీకులు తమ జాతీయభాషను పదిలంగా కాపాడుకుంటూ ఉండడం” అన్నాడు.

ఎప్పటిలానే అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకపోయాయి. సోఫొక్లీస్ మూలంతో తృప్తిపడకుండా దానిని ఆధునిక గ్రీకులోకి అనువదించితీరాలనుకున్నాడు. ప్లేటో(క్రీ.పూ. 4వ శతాబ్ది: గ్రీకు తత్వవేత్త, గణితశాస్త్రజ్ఞుడు) రాసిన ప్రతి రచననూ, డెమొస్తనీస్(క్రీ.పూ. 384-322: గ్రీకు రాజనీతిజ్ఞుడు, వక్త) చేసిన ప్రతి ప్రసంగాన్నీ తప్పనిసరిగా చదవాలనుకున్నాడు. గ్రీకు పదాల జాబితాలతో, వాక్యాలతో, ఆ భాషలో తనతో తనే జరిపే సంభాషణలతో, సుదీర్ఘమైన స్వగతాలతో నోటుబుక్కులు నింపేశాడు. ప్రసిద్ధమైన నిజ్నీ నొవ్ గ్రాడ్ తిరునాళ్ళకు వెళ్లినప్పుడు, తను బస చేసిన సత్రంలో రాత్రంతా కూర్చుని ఆ తిరునాళ్ళు తనలో రేపిన భావపరంపరను ప్రాచీన గ్రీకులో వర్ణించుకుంటూ వెళ్ళాడు.

ఆ తర్వాత ఆ భాషలో ఆత్మభారాన్ని దింపుకోవడమూ ప్రారంభించాడు. ఉద్రేకం, కర్కశత్వం, డబ్బు యావతో సహా– తన లోపాల జాబితాను తనే రాసుకున్నాడు. మెక్లంబర్గ్ కో, అమెరికాకో; చివరికి డబ్బూదస్కంతో పనిలేకుండా పండ్లు తిని బతికే ఆదివాసులు నివసించే భూమధ్యరేఖా ప్రాంతాలకో పారిపోవాలన్న తన విచిత్రమైన కోరిక గురించి కూడా రాసుకున్నాడు. గొప్ప శ్రావ్యత, సౌందర్యం నిండిన గ్రీకును దేవతల భాషగా అతను జీవితాంతం నమ్మాడు. ఆ భాష అతనికి ఎలా సర్వస్వం అయిందంటే; దానితో గడిపే ఆదివారాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాడు. సూట్ కేసులో గ్రీకు పుస్తకాలు నింపుకుని తిరునాళ్ళ వెంట తిరునాళ్ళను చుట్టబెడుతూ భార్యకు దూరంగా సంచారం జరిపే క్షణాలకోసమే జీవించేవాడు.

రెండేళ్లపాటు అతను రాసుకున్న గ్రీకు నోట్సు 35 నోటు బుక్కులకు విస్తరించింది. తన అత్యంత రహస్య ఆలోచనలను కూడా వాటిలో రాసుకున్నాడు. తన అంతరంగంలోని చీకటి కోణాలను బయటపెట్టుకున్నాడు. తనమీద తనే వ్యాఖ్యలు చేసుకున్నాడు. “నాకు తెలుసు, నేనో అల్పబుద్ధిని, పిసినారిని. ఈ డబ్బుపిచ్చి నుంచి, లోభత్వం నుంచి నేను బయటపడాలి. యుద్ధకాలమంతా డబ్బు గురించి తప్ప నేనింకొకటి ఆలోచించలేదు” అని ఒకచోట రాసుకున్నాడు. తనపై తనే అసహ్యాన్ని కుమ్మరించుకున్నాడు. బయటిశక్తులు మాత్రమే తననీ రంధినుంచి బయపడవేయగలవని అనుకున్నాడు. పైకి నైతిక కాఠిన్యాన్ని ప్రదర్శించే తనలో గుప్తంగా స్త్రీచాపల్యం ఎలా ఉందో; తిరునాళ్ళలో అందరు వర్తకుల్లానే తను కూడా తప్పతాగి ఆడవాళ్ళ గురించి అశ్లీల సంభాషణల్లో వాళ్ళతో ఎలా పోటీ పడేవాడో వెల్లడించుకున్నాడు.

రాను రాను అతను ప్రపంచాన్ని గ్రీకు కళ్ళతో చూడడం ప్రారంభించాడు. కాన్ స్టాంటినోపుల్(టర్కీ లోని నేటి ఇస్తాంబుల్) పై తమకే హక్కు ఉందన్న గ్రీకుల వాదనను అతను గట్టిగా సమర్ధించేవాడు. రష్యన్లు కూడా ఆ నగరంపై హక్కును చాటుకునేవారు కనుక స్లీమన్ వైఖరి వాళ్ళకు నచ్చేది కాదు. తన ఉద్యోగుల్లో ఒక్కరైనా గ్రీకుజాతీయుడు ఉండాలని అతను కోరుకున్నాడు. రష్యన్ మాట్లాడగల గ్రీకుజాతీయుని కోసం కొన్ని మాసాలపాటు వెతికాడు. ఒక్కరూ దొరకలేదు. చివరికి ఒక ట్యూటర్ ను పట్టుకున్నాడు. అతని పేరు థియోక్లిటస్ విమ్పోస్. సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువుకున్న విమ్పోస్,  గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో ప్రీస్టుగా ఉన్నాడు. మంచి స్నేహపాత్రుడు. ఏథెన్స్ యాసలో స్వచ్ఛమైన గ్రీకు మాట్లాడగలడు.

నేరుగా స్లీమన్ చదువు గదిలోకి వెళ్ళి పుస్తకాలను తిరగేసే చొరవ ఉన్న అతి కొద్దిమందిలో అతనూ ఒకడు. స్లీమన్ ఆదివారాల్లో ఇచ్చే సాయం విందులకు విమ్పోస్ తోపాటు మరికొందరు పండితులు హాజరయ్యేవారు. అలా వాళ్లమధ్య గడుపుతున్నకొద్దీ ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికో పారిపోవాలన్న కోరిక స్లీమన్ లో అడుగంటుతూవచ్చింది. ఎంతైనా తనొక యూరోపియన్ ననీ, సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని వదిలేసి  శేషజీవితాన్ని పండితునిగా గడపాలనీ ఇప్పుడు అనుకుంటున్నాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి పూర్తిగా నిష్క్రమించి జర్మనీలోని ఓ పెద్ద యూనివర్సిటీలో చేరి చదువుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశాడు. అయితే ఏ ఒక్క విద్యార్హత కానీ, శిక్షణ కానీ లేని తనను చేర్చుకుంటారా అన్న సందేహం కలిగి ఆ ఆలోచనను పక్కన పెట్టేశాడు. ఓ వ్యవసాయక్షేత్రాన్ని కొనుక్కుని శాస్త్రవిజ్ఞాన ఆసక్తులకు అంకితమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన మళ్ళీ బుర్రను తొలవడం ప్రారంభించింది. రైన్ నది వెంబడే ఓ వ్యవసాయక్షేత్రం కోసం గాలిస్తున్నానని 1856 జూలైలో ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. అయితే ఆ ఉత్తరం రాయడానికి కొన్ని వారాలముందు మరో మిత్రుడికి ఉత్తరం రాస్తూ; తను ప్రపంచాన్ని చూసింది తక్కువనీ, మొత్తం ప్రపంచమంతా చుట్టిరావాలనుకుంటున్నాననీ, ఒక రచయితగా రాణించగలనేమో ఆలోచిస్తున్నాననీ రాశాడు.

వ్యాపారాన్ని ఇక కట్టిపెట్టాలని 1857లో గట్టిగానే అనుకున్నాడు. అయితే సరిగ్గా అప్పుడే యూరప్ ఆర్థికసంక్షోభంలో చిక్కుకుంది. దాంతో అతను వ్యాపారాన్ని పొడిగించకతప్పలేదు. ఎన్నో విదేశీ కంపెనీలు దివాళా తీసాయి. లండన్, పారిస్, హాంబర్గ్, ఏమ్ స్టడామ్ ల నుంచి తనకు రావలసిన బకాయిలు 30 లక్షల టేలర్ల మేరకు పేరుకుపోయాయి.  ఉన్నదంతా పెట్టుబడి పెట్టిన తను ఈ దెబ్బతో చితికిపోయానని అనుకున్నాడు. అంకెలు తారుమారుచేసీ, పెద్ద పెద్ద ప్రమాదాలకు ఎదురొడ్డీ; ముఖ్యమా, కాదా అని చూడకుండా వ్యాపారం తాలూకు ప్రతి కోణాన్నీ స్వయంగా పర్యవేక్షించీ వ్యాపారం మూలపడకుండా చూసుకోగలిగాడు.

1858 ప్రారంభానికి గండం గట్టెక్కి స్థిమితపడ్డాడు. ఇక ఇప్పుడు గ్రీస్ ను సందర్శించే సమయం వచ్చిందనుకున్నాడు.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

మీ మాటలు

  1. భాస్కరం గారూ,
    ముప్పైయేళ్ళకే స్లీమస్ ముప్పైమంది జీవితాన్ని అనుభవించాడంటే తప్పు కాదేమొ! ఒకటి చదివి, వెనకటి నుండీ స్లీమస్ కథ అన్నిభాగాలూ నిర్విరామంగా చదివేశా! మీ శైలి సులభంగా ఎక్కడా పాశ్చ్యాత్య కథ చదువుతున్నట్టుగా వుండకుండా వుత్కంఠతో చదివిస్తుంది.

    సంపాదకులకు మనవి:
    నాలాగా నెలకో, రెణ్ణెల్లకో ఓసారి వచ్చి భాస్కరం గారి కథలన్నీ ఒక క్రమంలో చదవాలంటే అలాంటి అమరిక లేదు. రచయిత tag మీద శీర్శికలని చూసి ప్రచురిత తారీఖును బట్టి ఎన్నుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా వుంటే చూడగలరు.

    • ప్రసాద్ గారూ,

      రచయిత పేరు కాకుండా, ఇది శీర్షిక కాబట్టి, శీర్షిక నొక్కగానే మీకు అన్నీ ఒక చోటనే కనిపిస్తాయి ఇలా…

      http://saarangabooks.com/retired/category/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%AE%E0%B0%A8%E0%B0%82/

      • ఇది కొంచం నయమే. నేనాశిస్తున్నది శీర్శిక లంకె మీదకి వెళ్ళకుండానే “previous”, “next” లాటి లంకెల ద్వారా ఒక కథనం నుండి తర్వాతి కథనానికి వెళ్ళడం కుదురుతుందేమొనని.

    • భాస్కరం కల్లూరి says:

      చాలా థాంక్స్ ప్రసాద్ గారూ…స్లీమన్ కథ మిమ్మల్ని ఏకబిగిన చదివించిందన్నాక హమ్మయ్య అనుకున్నాను.

  2. భాస్కరం గారూ,
    ఉత్సుకత ఆపుకోలేక వికిలో ఈయన గురించి చదివాను. మీరు అతన్ని పాజిటివ్ షేడ్‌లో చూపిస్తే వికి తనని నెగటివ్ షేడ్‌లో చూపించింది.

    https://en.wikipedia.org/wiki/Heinrich_Schliemann

  3. భాస్కరం కల్లూరి says:

    స్లీమన్ లో నెగెటివ్ షేడ్స్ తప్పనిసరిగా ఉన్నాయి ప్రసాద్ గారూ… ఇంతవరకూ రాసిందాల్లో కూడా మీరు చూసే ఉంటారు. ముందు ముందు కూడా చూస్తారు. దాంతోపాటు ఎన్నో అరుదైన అంశాల సమ్మేళనం అతను. అందుకే అతన్ని ‘అదో టైపు’ అన్నాను(స్లీమన్ కథ: అతను పట్టినదంతా బంగారం). నేను అతని జీవితకథను ఎత్తుకోడానికి కారణం అదే.

మీ మాటలు

*