కొత్త శాటర్న్ స్వపుత్ర భక్షణ

 

                                                           -సత్యమూర్తి

జరిగిన కథ:  దేవతల రాజైన శాటర్న్ తన తండ్రి కేలస్ ను గద్దె దింపి తను సింహాసనమెక్కుతాడు. శాటర్న్ ను కూడా అతని కొడుకుల్లో ఒకడు పదవీచ్యుతుణ్ని చేస్తాడని భవిష్యవాణి చెబుతుంది. దీన్ని అడ్డుకోవడానికి శాటర్న్ తన భార్య ఓపిస్ కు పిల్లలు పుట్టీపుట్టగానే వాళ్లను కొరికి చంపితినేస్తాడు. అలా ఐదుగురు పిల్లల్ని తినేస్తాడు. ఆరో కాన్పులో జూపిటర్ పుడతాడు. ఓపిస్ ఆ పిల్లాణ్ని క్రీట్ ద్వీపంలో దాచేసి, ఓ గుడ్డలో రాయిని పెట్టి అదే బిడ్డ అని శాటర్న్ కు ఇస్తుంది. శాటర్న్ నిజమనుకుని తినేస్తాడు. జూపిటర్ క్రీట్ ద్వీపంలో పెరిగి పెద్దయి తన తండ్రిమీద దండెత్తి తను రాజు అవుతాడు. అలా భవిష్యవాణి నిజమవుతుంది.. ఇక చదవండి..

పదవి కోల్పోయిన శాటర్న్ అధికారం కోసం అలమటిస్తూ కన్నుమూశాడు. దైవ నిర్ణయం ప్రకారం భూలోకంలోని ఒక రాజ్యంలో మానవుడిగా పుట్టాడు. ఆ రాజ్యం పేరుకే రాజ్యం కాని, రాజు లేడు. పెత్తనమంతా పక్క రాజ్యపు రాజుదే. మానవుడిగా అవతరించిన శాటర్న్ కు గత జన్మ వాసనలు ఇంకా పోలేదు. శక్తిసామర్థ్యాలు పిసరంత కూడా తగ్గలేదు. వాటికి వాచాలత కూడా తోడైంది. ఈ కొత్త శాటర్న్ కు  అధికార దాహం కూడా గత జన్మలోకంటే మరింత ఎక్కువైంది. అధికారం దక్కితే ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాడు.

గత జన్మలో కొడుకు వల్ల అధికారం పోయింది కనుక ఈ జన్మలో అసలు పిల్లల్నే కనొద్దని నిర్ణయించుకున్నాడు. అధికారం కోసం పావులు కదిపాడు. పక్క రాజు పెత్తనాన్ని సహించొద్దని తన రాజ్య జనానికి చెప్పి తిరుగుబాటు లేవదీశాడు. పక్క రాజు పెత్తనం పోతే జనంలోని అట్టడుగు వర్గపు ఒక మనిషిని రాజును చేస్తానని నమ్మబలికాడు. జనం నమ్మి పక్క రాజ్యపు రాజుపై తిరగబడి పెత్తనం వదిలించుకున్నారు. కొత్త శాటర్న్ తన హామీని తుంగలో తొక్కి తనే రాజయ్యాడు. తనే జనాన్ని పీడించడం మొదలెట్టాడు. రాజ్యం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడింది. జనం బాధలు ఎక్కువయ్యాయి. కొత్త శాటర్న్ అధికారం అనుభవిస్తూ మత్తుపానీయాలు గ్రోలుతూ సుఖించసాగాడు.

కొత్త రాజు పాలన గిట్టని జనం తిరుగుబాటు చేశారు. కొత్త శాటర్న్ సైన్యాన్ని వాళ్లపై ఉసిగొల్పాడు. ఆయుధ బలం చాలని తిరుగుబాటుదారులు అడవులకెళ్లి యుద్ధసన్నాహాలు ప్రారంభించారు.

కొత్త శాటర్న్ ఓ మిట్టమధ్యాహ్నం మద్యం మత్తులో జోగుతుండగా భవిష్యవాణి వినిపించింది. ‘గత జన్మలో మాదిరే ఈ జన్మలోనూ నువ్వు నీ పుత్రుల చేతిలోనే చస్తావు’ అని భవిష్యవాణి పలికింది. అసలు తనకు పిల్లలే లేరు కదా అని అడగబోతుండగా భవిష్యవాణి అంతర్ధానమైంది.

కొత్త శాటర్న్ తొలుత భయపడిపోయాడు. తనకు సంతానం లేదు కనుక భవిష్యవాణి నిజం కాబోదనుకుని కాస్త కుదుటపడ్డాడు. కానీ గత జన్మవాసనలు భయపెట్టాయి. పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్లు బుర్రలు చించుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. ‘ప్రభూ! మీకు పుత్రులు లేకపోవచ్చు కాని, జనమంతా మీ పుత్రసమానులే కదా. బహుశా వాళ్ల చేతుల్లో మీరు చస్తారు కాబోలు’ అని చెప్పారు. కొత్త శాటర్న్ కంగు తిన్నాడు. మామూలు జనంతో తనకు ప్రమాదం లేదని, ఉన్న ముప్పల్లా  తిరుగుబాటు చేసి అడవులకెళ్లిన జనంతోనే అని నిర్ధారించుకున్నాడు. సైన్యాన్ని రెట్టింపు చేసి.. తిరుగుబాటుదారులను చంపాలని అడవులకు పంపాడు. కానీ జంకు మాత్రం ఇంకా పోలేదు.

గత జన్మ వాసనలు వెంటాడుతూనే ఉన్నాయి మరి. ఈసారి ఎవరి చేతిలోనూ మోసపోకూడదనుకున్నాడు. తానే స్వయంగా అడవులకెళ్లాడు. సైన్యం సాయంతో అడవులను జల్లెడ పడుతూ తిరుగుబాటుదారులను పట్టుకున్నాడు. ఒక్కొక్కరిని మెడకొరికి, రక్తం జుర్రుకుని, భుజాలు కొరికి, మొండాలు కొరికి, కాళ్లు కొరికి.. సంపూర్ణంగా తినడం మొదలెట్టాడు. భవిష్యవాణి పుత్రుల చేతిలో చస్తావని చెప్పిందే తప్ప కచ్చితంగా ఎవరిచేతిలో, ఎన్నోవాడి చేతిలో చస్తావని చెప్పకపోవడంతో కొత్త శాటర్న్ తన రాజ్యంలోని అడవులన్నింటినీ గాలిస్తూ నరమాంసభక్షణ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నాయి కాని, అడవులు తరగడం లేదు. తిరుగుబాటుదారులూ తరగడం లేదు.. (సశేషం)

(వరంగల్ జిల్లా మెట్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా. శాటర్న్ కథ రోమన్, గ్రీకు పురాణాల్లోనిది)

*

 

 

 

 

మీ మాటలు

  1. Powerful counter on fake encounter. Everyone who concern about humanity should protest this crime.

  2. apt story for the current governments.

  3. చందు తులసి says:

    చాలా బాగా రాశారండి.

  4. సత్యమూర్తి says:

    Thanks for Arun, Venkat and Tulasi.

మీ మాటలు

*