Archives for September 2015

ఫియర్‌లెస్

-అరుణ్‌సాగర్
 ~
arunఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. ఇది సినిమా కాదు. సంభాషణల రచయిత రాసే రొటీను మాటా కాదు. ఎందుకో భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే. అక్కడ గాఢ కల్బూరిక్ ఆమ్‌లవాయుగోళాలైనా ఇక్కడ ద్రోహముద్రలు వేసే తూటాలైనా. భయమైతున్నది ప్రభూ మాట్లాడాలంటే, నడవాలంటే, తల ఎత్తాలంటే, నినదించాలంటే. వాగర్ధాం వివ సంతృప్తం, వాగార్ధ ప్రతిపత్తయే. ప్రతిపత్తి. అభివ్యక్తి. భిన్నాభిప్రాయమిప్పుడు ప్రమాదసంకేతం. సర్వము నీవే ప్రభూ. సర్వాధికారము నీదే. వాక్కు. మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది ఇపుడేమున్నది. చెట్టుకు వేలాడే శవాలు తప్ప నినదించు శరీరమొక్కటైనను ఎక్కడ మొలకెత్తును. ఎక్కడ మేల్కాంచును. బాంచెనని కాల్మొక్కెటోళ్లము. వేడుకొనగలము. నినుజేరి నీ దివ్యసముఖమున కష్టమూ సుఖమూ చెప్పుకుని విప్పుకుని. వినరా దొరా కనీసము. దేవా నిను ప్రార్ధించనీ, ఒక ప్లకార్డు, ఒక విన్నపము, కేవల అభిప్రాయమైనను. ఒక్క గుంజుడు గుంజి, డిసియం వ్యాన్‌లో విసిరేసి, గోషామహల్ స్టేషన్ కాంపౌండ్‌వాల్‌లో పడేస్తే….భక్తా! నిన్నేరా తుకారాం. మైడియర్ రెబల్‌స్టార్. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకున్నావా. లక్కీ ఫెలో యు ఆర్! మా దేవుడిని నిందాస్తోత్రమైననూ చేయలేని పిరికిపందలము మేము. కలికాలము. ప్రభూ, భయమైతున్నది ప్రభూ. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకుని ఈ మూకలను `కానిండుమని ఆనతినిస్తివా`. నిటారుగా నడవాలన్నా గొంతు విప్పాలన్నా పాటలు పాడాలన్నా భయమైతున్నది. ఈ చిరుగు చొక్కాలకు ఒక నిరసన బ్యాడ్జ్ తగిలించుకుని నలుగురం పోగయి ఒక్క బక్క కర్రకు గుడ్డజెండా కట్టుకుని చౌరస్తాలో నిలబడాలంటే భయమైతున్నది. ఎంత భయమైతున్నదంటే మేమంటే మాకే భయమైతున్నది. భయపడి భయపడి చచ్చిపోతమేమోనన్నంత భయమైపోతున్నది. భయాన్ని జయించలేక శునకమరణము పాలగుదుమేమోనని భయమైతున్నది. గుండెల్లో దాచిపెట్టుకున్న జెండాలు జఠరికలూ కర్ణికలను పేల్చి పైకి లేచి ఆకాశాన్ని మట్టుపెడతయేమోనని భయము నిలువెల్లా వణికిస్తున్నది. గొంతులు పోయి, వెన్నులు విరిగి, మెదళ్లు బూజుపట్టి కాలానికి కలానికి కాగితానికి తెలియకుండా మరుగైపోయే బోడిబతుకు బస్టాండగునేమోనని భయకంపితమవుతున్నది. కానీ ప్రభూ, కొన్ని భయములు జయించని ఎడల మరణమునూ జయించలేమేమోననే శంక కూడా పీడిస్తున్నది. ఇక అందుకే ఆ పరమేశ్వరుని ప్రార్ధించుచున్నాము. లార్డ్ శివా అండ్ మదర్ పార్వతి, హూ ఆర్ ఇన్‌సెపరబుల్ యాజ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ టూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్. మాకు వాక్కు నిమ్ము. ఉక్కుముక్కల వంటి వాక్యముల నిమ్ము. వాగర్ధం వివ సంతృప్తం! నీ భయం కంటే మా భయం పెద్దదయితున్నది ప్రభూ. నోరు పడిపోతే, కాలూచేయి పడిపోయి పక్షవాతమొస్తే. పగోడికి కూడా వద్దు. ఆయినెవరో అన్నడు కదా ‘నీ అభిప్రాయంతోని నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కాపాడడానికి నేను ప్రాణాన్నయినా ఒదులుకుంటా’నని! నీవంటే భయమైతుల్లే ప్రభూ. ఒక్కసారి ఆలోచించుకుంటే మా బలహీనత చూసే మాకు మిక్కిలి భయమైతున్నది. ఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. వాక్యాలకూ వాక్యాలకూ మధ్య `ఎంటర్` కొట్టకపోయినంత మాత్రాన అది కవిత్వం కాకపోదురొరేయ్. భయం ఈజ్ నాట్ ఎటర్నల్. మాకు తెలుసు యు ఆర్ స్టేట్. యూ డోంట్ టాలరేట్. ఇక్కడ విషయమేమంటే: వియ్ ఆర్ పీపుల్. వియ్ ద పీపుల్. మైండిట్ మాణిక్యం!
*
Painting: Akbar

నివేదన

mandira

-శ్రీకాంత్

అవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు – దారుల్లో వీధుల్లో ఎవరూ మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను వీధి మలుపు తిరగగానే, చేతులకీ నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు. నడుస్తూ నడుస్తూ తల ఎత్తితే, ఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి ఊస్తూ మూడు గుండీలు విప్పిన అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా ‘ఇస్కీ బెహెన్కి చోత్’, ‘మాధర్చోత్’ అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో గణగణగణమనే గంటలతో నుదుటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతనిని భయభ్రాంతుడని చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు.

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకుని, భార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా –

“వచ్చావా నాయనా – త్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు”

***

Painting: Mandira Bhaduri

చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు! 

 

స్లీమన్ కథ-11

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పర్వతాలు, ఎడారి మీదుగా మెలికలు తిరుగుతూ 14వందలమైళ్ళ దూరం వ్యాపించిన చైనా గోడ గురించి స్లీమన్ కు చిన్నప్పటినుంచీ తెలుసు. తను అక్కడికి వెళ్ళినట్టు, ఆ గోడ ఎక్కినట్టు కలలుగనేవాడు. అంతకంటే విశేషంగా, అతి పురాతనకాలంలో ఈ భూమ్మీద గొప్ప సృజనాత్మక నైపుణ్యాలు కలిగిన ఓ అద్భుతమైన జాతి ఉండేదనీ, అది అంతర్ధానమైపోయిందనీ, చైనా గోడ దగ్గరికి వెడితే ఆ జాతికి సంబంధించిన రహస్యాలను పట్టుకోవచ్చుననీ అనుకునేవాడు.

పెకింగ్ ను సందర్శించిన మరునాడే నౌకరును వెంటబెట్టుకుని మంచూరియా సరిహద్దుల్లో, చైనా గోడకు సమీపంలో ఉన్న కౌ-పా-కౌ కు బయలుదేరాడు. రెండు రోజుల తర్వాత అక్కడికి చేరాడు. అతనిలో ఉల్లాసం, ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. ఎండ బాగా కాస్తోంది. తలకు అరబ్ తలపాగ చుట్టుకున్నాడు. దారి పొడవునా ఉన్న గ్రామాల వాళ్ళు అతనివైపు వింతగా చూశారు. ఆయన చైనా గోడ చూడడానికే ఏకంగా యూరప్ నుంచి వచ్చాడని నౌకరు చెప్పినప్పుడు అతనేదో తమాషా చేస్తున్నాడనుకుని అంతా నవ్వేశారు. ఆ సరిహద్దు గ్రామాలవాళ్లు స్లీమన్ కు ఎంతో నచ్చారు. అమాయకత్వం, ఔదార్యం మూర్తీభవించిన ఈ జనాలు పెకింగ్ లో తను చూసిన క్షీణజాతికన్నా భిన్నంగా ఉన్నారనుకున్నాడు.

ఎండ మొహం మీద పడి చురుక్కుమనిపిస్తోంది. పైగా ప్రయాణంతో అలసిపోయాడు. అయినాసరే, గోడ దగ్గరికి చేరుకోగానే ఎండ తీవ్రతా, అలసటా అన్నీ మరచిపోయాడు. అప్పటికప్పుడు దానిని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. గోడ దిగువున ఉన్న గుట్ట ఎగుడు దిగుడుగా, పైకి పొడుచుకొచ్చిన రాళ్ళతో అడుగు తీసి అడుగు పెట్టలేనట్టుగా ఉంది. ఎవరైనా సహాయకులు తోడు వస్తారేమోనని వాకబు చేశాడు. చివరికి నౌకరుతో సహా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరిగానే ఎక్కడానికి సిద్ధమై అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు.

తనతో ఒక కొలతబద్దను తీసుకెళ్లాడు. గోడకు ఉపయోగించిన ఇటుకల పరిమాణాన్ని కొలిచాడు. అవి 67 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల ఎత్తు, 17 సెంటీమీటర్ల మందం ఉన్నాయి. ఆ తర్వాత గోడ ఎత్తు కొలిచాడు. అది కొన్ని చోట్ల 20 అడుగులు, కొన్నిచోట్ల 30 అడుగుల ఎత్తుంది. కాపలా బురుజుల మధ్యదూరం 300 అడుగులుంది. ఆ ఇటుకలు కచ్చితంగా క్రీ.పూ 200 నాటి హన్ రాచరిక కాలానికి చెందినవనుకున్నాడు. కానీ నిజానికవి క్రీ.శ. 1400 నాటి మింగ్ రాచరిక కాలానికి చెందినవి. ఆ ఎత్తైన గోడ మీంచి కింద దూరదూరాలకు వ్యాపించిన కొండలు, గుట్టలు చూస్తూ అతను పట్టలేని తమకంతో మైమరచిపోయాడు.

ఆ ఎత్తునుంచి ప్రపంచం చాలా చిన్నదిగానూ, ఓ నీడలానూ కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతసేపు చూసినా అతనికి తనివితీరలేదు. సాయంత్రంవరకూ ఆ గోడమీదే ఉండిపోయాడు. మధ్యాసియానుంచి విరుచుకుపడుతున్న ఆటవికపు దాడులనుంచి ఆ గోడను కాపాడడానికి చేసిన వీరోచిత పోరాటాల గురించి తను చదివినవన్నీ గుర్తుచేసుకున్నాడు. జావాలో, సియేరా నెవాడాలో ఎత్తైన ప్రదేశాలనుంచి తను కిందికి చూసినప్పుడు కనిపించిన అద్భుత దృశ్యాలను నెమరేసుకున్నాడు.

sliiman

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

తన ప్రయాణానుభవాలను అతను వెంటనే కాకుండా కొన్నిరోజుల తర్వాత డైరీలో పొందుపరిచాడు. ఒకప్పుడు చైనాకు రక్షణ కుడ్యంగా ఉండి ఇప్పుడు శిథిలమవుతున్న ఈ అద్భుతనిర్మాణం తనను ఆకట్టుకున్నంతగా ప్రపంచంలో మరేదీ ఆకట్టుకోలేదన్నాడు. జావా అగ్నిపర్వతాలను, హిమాలయాలను, సియేరా నెవాడా శిఖరాలను, దక్షిణ అమెరికాలోని కార్డిల్లేరా పీఠభూమిని అధిరోహించానని చెబుతూ తన పర్వతారోహణ నైపుణ్యాలను అతిశయోక్తులతో చాటుకున్నా; చైనా గోడ మీంచి కిందికి చూసినప్పుడు తను పొందానని చెప్పిన భావోద్వేగాలు మాత్రం నిజం.

చైనా గోడ తను చిన్నప్పటినుంచీ ఊహించుకుంటున్నదానికంటే కూడా వందరెట్లు వైభవోపేతంగా ఉందనీ, తనను ఆశ్చర్యచకితం చేసిందనీ, మతిపోగొట్టిందనీ, తనలో గొప్ప ఆరాధనాభావాన్నీ, ఉత్తేజాన్నీ నింపిందని రాశాడు. ఎత్తైన పర్వతశిఖరాలతో పోటీపడుతున్న బురుజులతో ఈ బ్రహ్మాండమైన గోడను చూస్తున్నకొద్దీ జలప్రళయానికి ముందునాటి ఓ మహోన్నతజాతి ఏదో దీనిని నిర్మించినట్టు తోస్తూ వచ్చిందనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

క్రీ.పూ. 220 ప్రాంతాలలో దీనిని నిర్మించినట్టు నాకు తెలుసు. అయినాసరే, మామూలు మనుషులు దీనిని నిర్మించారంటే నాకు నమ్మశక్యం కావడంలేదు. అంత పెద్ద పెద్ద బండరాళ్లను, భారీ గ్రానైట్ శిలలను, అన్నన్ని ఇటుకలను అక్కడికి ఎలా రవాణా చేశారో, వాటిని అంత పైకి ఎలా తరలించారో అంతుబట్టలేదు. గోడ దిగువనే ఉన్న లోయలో ఆ ఇటుకల్ని కాల్చి ఉంటారని అనిపించింది. ఉత్తరం వైపునుంచి వచ్చిపడుతున్న శత్రువులను నిలవరించడానికి ఉద్దేశించిన ఇంత పెద్ద నిర్మాణం చేయాలంటే హెర్క్యులస్ కు ఉన్నంత శక్తి కావాలి.

ఈరోజున ఇంత ఘనమైన నిర్మాణమూ నిర్లక్ష్యానికి గురై పాడుబడినట్టు ఉంది. సైనికులకు బదులు బురుజుల్లో పావురాలు ప్రశాంతంగా గూడు కట్టుకుంటున్నాయి. వసంతాగమనాన్ని సంకేతిస్తున్న పసుపు, ఊదారంగు పువ్వుల మధ్య తొండలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడీ కట్టడం భూమ్మీంచి ఎప్పుడో నిష్క్రమించిన ఒక యుగం తాలూకు అంత్యక్రియల చిహ్నమా అన్నట్టు మిగిలిపోయింది.

ఇప్పటినుంచీ తన డైరీని అతను చాలా జాగ్రత్తగా రాశాడు. ముందే ప్రచురణకు ఉద్దేశించాడా అన్నట్టుగా చక్కని మాటలు, వాక్యాలు పొదుగుతూ వర్ణనాత్మకశైలిలో రాసుకుంటూ వెళ్ళాడు. ఇవే రోజుల్లో మిత్రులకు రాసిన ఉత్తరాల్లో కూడా రచయిత కావాలన్న తన ఆకాంక్షను నొక్కి చెప్పేవాడు. కావలసినంత సంపాదించుకున్న తర్వాత రచయితగా గడపడాలన్నదే మొదటినుంచీ తన జీవితాశయమనీ; రష్యాను విడిచిపెట్టి యూరప్ లో ఎక్కడో ఒకచోట స్థిరపడి సహరచయితలతో పరిచయాలు పెంచుకుంటూ రచనకే అంకితమైపోవాలనుకుంటున్నాననీ, నా దృష్టిలో ఇంతకన్నా గొప్ప వ్యాసంగమేదీలేదనీ రాసేవాడు. ఈ తూర్పు దేశాల యాత్రానుభవాలను పొందుపరుస్తూ తన నలభై మూడో ఏట వెలువరించిన మొదటి పుస్తకం తొలి పుటల్లోనే తన భావిజీవితంలో ప్రాధాన్యం వహించబోయే ఇతివృత్తమేమిటో సూచించాడు. అవి—కూలుతున్న శిథిలాలు, బ్రహ్మాండమైన పురాతనపు రాతి కట్టడాలు, సమాధైపోయిన ఉత్సవపూరిత గతం…

ఓసారి చైనా గోడను చూసి, దానిమీద నిలబడిన తర్వాత  ఇక ఆ దేశం మీద అతనికి ఆసక్తి తగ్గింది. మిగతా యాత్రావిశేషాలను క్లుప్తంగా, యధాలాపంగా రాసుకుంటూ వెళ్ళాడు. చైనా మహిళల విలక్షణమైన నడక మీద మాత్రం కాస్త ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. వాళ్ళ పాదాలను దగ్గరగా చూశాననీ, గెంతుతున్నట్టు వాళ్ళు ఎలా నడుస్తారో కచ్చితంగా చెప్పగలిగిన యూరోపియన్ రచయితలెవరూ తనకు కనిపించలేదనీ రాశాడు. ఆ తర్వాత, మూడు కాలివేళ్ళను అరికాళ్ళలోకి ఎలా చొప్పిస్తారో, ఆ విలక్షణమైన నడకను ఎలా సాధిస్తారో వివరించాడు. చైనీయుల నాటకాల గురించి కూడా రాశాడు. నటులు ధరించే బరువైన జలతారుదుస్తులు, ముసుగులు, వారి హావభావాలు, పురుషపాత్రధారులు పెద్ద గొంతుతో మాట్లాడడం-అన్నీ అతనికి విచిత్రంగానే అనిపించాయి.

అక్కడినుంచి జపాన్ వెళ్ళాడు. ఆ దేశం అతన్ని మత్తులో ముంచెత్తింది. ఎంతో ఆహ్లాదభరితంగానూ, ఓ నిగూఢప్రదేశంగానూ, నమ్మశక్యం కాని ఓ దేవకన్యల కథలానూ అనిపించింది. తరచు వర్షం పడుతున్నా, రాబర్ట్ థామస్ లాంటి స్నేహపాత్రుడైన దుబాషీ వెంట లేకపోయినా  అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఉల్లాసంగా గడిపాడు. అక్కడి కబుకీ నాటకాలకు వెళ్ళాడు. బహిరంగస్నానశాలలను సందర్శించాడు. జపాన్ మహిళలు ధరించే సిల్కు కిమోనాలను, వాళ్ళ స్నేహశీలతను చూసి ఆనందించాడు. అక్కడి విదేశీ రాయబారులతోనూ స్నేహంగా మెలిగాడు. స్నానశాలకు వెళ్లినప్పుడు అతని వాచీ ఛైనుకున్న ఎర్రని పగడం కుతూహలం కలిగించడంతో దానిని చూడడానికి అక్కడి యువతులు చుట్టూ మూగడం, వాళ్ళ చొరవా అతన్ని ముగ్ధుణ్ణిచేశాయి. తను దిగిన చిన్న చిన్న సత్రాలు, అక్కడి సిబ్బంది మాటి మాటికీ వంగి అభివాదం చేయడం, ఎక్కడికి వెళ్ళినా సభ్యత, గౌరవం వెల్లివిరిసే వాతావరణం అతనికి ఎంతగానో నచ్చాయి. తన జపాన్ అనుభవాలను చాలా తీరుబడిగానూ, అక్కడ గడిపిన ప్రతిక్షణాన్నీ నెమరేసుకుంటూనూ ఒకవిధమైన మైకంతో రాశాడు. అతని పుస్తకంలో ఆ భాగాలే అత్యుత్తమంగా నిలిచాయి.

అదృష్టవశాత్తూ జపాన్ మికాదో[చక్రవర్తి]కి, షొగున్[సైనిక గవర్నర్: చక్రవర్తే నియమించినా 1192-1867 మధ్యకాలంలో సైనిక గవర్నర్లే పూర్తి అధికారాన్ని చలాయిస్తూ వచ్చారు. సైనిక గవర్నర్ కీ, చక్రవర్తికీ మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి]కూ మధ్య స్వల్పకాలిక శాంతి నెలకొనే అరుదైన రోజుల్లో స్లీమన్ జపాన్ ను సందర్శించాడు. అప్పటికి పన్నెండేళ్ళ క్రితమే అమెరికా నౌకాదళాధికారి కమొడోర్ పెరీ(1794-1858) ఎడో(Yedo)అఖాతం మీదుగా జపాన్ చేరుకుని తన డిమాండ్ల పత్రాన్ని చక్రవర్తికి ఇవ్వబోయినప్పుడు, అక్కడ ఇద్దరు చక్రవర్తులున్న సంగతి తెలిసి తెల్లబోయాడు. స్లీమన్ అక్కడికి వెళ్లడానికి ముందు సంవత్సరమే చోషును పాలించే దైమ్యో(సామంతరాజు) విదేశీ నౌకలపై అదే పనిగా కాల్పులు జరిపించినందుకు ప్రతీకారంగా బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా, డచ్ నౌకాబలగాలు షిమొనోసెకీ(ఒక జపాన్ నగరం)పై పెద్దయెత్తున దాడిచేశాయి.

అయితే, సమకాలీనచరిత్రపై స్లీమన్ కు ఆసక్తి లేదు. జపాన్ అతని కళ్ళముందు ఉత్సవభరితంగా ఆవిష్కృతమైంది.  చరిత్రప్రసిద్ధమైన తోకైదో రాజమార్గం మీదుగా వర్ణరంజితంగా సాగిన షొగున్ ఊరేగింపును చూసి మైమరచిపోయాడు. దాని అద్భుతత్వానే కాక, ఆటవికత్వాన్ని కూడా కళ్ళకు కట్టిస్తూ ఎంతో జాగ్రత్తగా చిత్రించుకుంటూ వచ్చాడు.

 ఆ ఊరేగింపు ముందుభాగంలో వెదురు కర్రల మీద పెద్ద పెద్ద సామాను మోస్తూ కూలీలు నడిచారు. వారి వెనకాల తెలుపు, నీలం, నలుపు రంగు దుస్తులు ధరించి, విల్లమ్ములు తదితర ఆయుధాలు పట్టుకున్న సైనికులు నడిచారు. వారి వెనక వాళ్ళ అధికారులు అధికార లాంఛనాలతో పసుపు, నీలం, లేదా తెలుపు కోట్లు ధరించి గుర్రం మీద వచ్చారు. వారి వెనకాల సామాన్లు మోస్తూ మళ్ళీ కొందరు కూలీలు, వారి వెనకాల గుర్రం మీద తెలుపు దుస్తులతో మరింత పెద్ద అధికారులు; వారి వెనకాల బల్లేలు ధరించిన సైనికులు, శతఘ్ని, పదాతి దళాలు; వారి వెనక కూలీలు, వారి వెనక గుర్రాల మీద మరింత పెద్ద హోదా ఉన్న వారు; వారి వెనక మళ్ళీ సైనికులు, వారి వెనక నాలుగు అలంకృత అశ్వాలు, వాటి వెనక అశ్వపాలకులు వచ్చారు.

చివరగా ఓ అందమైన గోధుమరంగు గుర్రం మీద షొగున్ వచ్చాడు. అతనికి ఇరవయ్యేళ్లు ఉంటాయి. చక్కని ముఖం. రంగు కొంచెం నలుపు. బంగారు జలతారు పని చేసిన తెల్లని అంగరఖా ధరించాడు. మెరుగుపెట్టిన టోపీ పెట్టుకున్నాడు. అతని బెల్టుకు రెండు కృపాణాలు వేలాడుతున్నాయి. అతనికి అటూ ఇటూ ఇరవైమంది ప్రముఖులు తెల్లని అంగరఖాలు ధరించి గుర్రాల మీద వచ్చారు.

ఆ ఊరేగింపు స్లీమన్ మనసుకు ఎంతగా హత్తుకుపోయిందంటే, మరునాడు ఆ ప్రదేశాన్ని చూడడానికి గుర్రం మీద వెళ్ళాడు. ముందురోజు తను నిలబడ్డ చోటుకు దగ్గరలోనే, దుమ్ముధూళితో నిండిన రోడ్డు మీద పూర్తిగా ఛిద్రమైపోయిన మూడు మృతదేహాలను చూసి విస్తుపోయాడు.  రైతులో, సైనికులో గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అవి చిన్నాభిన్నమైపోయి ఉన్నాయి. ఎవరో, ఏమిటో అర్థం కాక ఆ భీకరదృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ కాసేపు ఉండిపోయాడు. అదే చోట రెండువేలమంది సైనికులతో, సేవకులతో మిరుమిట్లు గొలిపేలా సాగిన షొగున్ ఊరేగింపును తను కళ్ళారా చూశాడు. కానీ ఆ ఊరేగింపు ఈ మూడు మృతదేహాలను తొక్కుకుంటూ సాగినట్టు తనకు తెలియనే తెలియలేదు!

అప్పటికే అస్వస్థుడిగా ఉండి ఓ ఏడాదిలో మరణించబోతున్న బక్కపలచని షొగున్ ఆదేశాల మీదే ఆ ముగ్గురినీ నరికి చంపారా?! మృతదేహాలను అక్కడే ఎందుకు వదిలేశారు? వాటిని తొక్కుకుంటూ ఎందుకు వెళ్లారు? కుతూహలం చంపుకోలేక యొకొహామాకు తిరిగొచ్చి దీని గురించి జాగ్రత్తగా ఆరా తీశాడు. చివరికి అతనికి అందిన సమాచారం ఏమిటంటే, షొగున్ ఊరేగింపుగా వెడుతున్నప్పుడు పొరపాటున కూడా ఎవరూ రోడ్డుకు అడ్డంగా వెళ్లకూడదు. మామూలుగా అయితే ముందుగా హెచ్చరిక సిబ్బందిని పంపించి ఊరేగింపుకు ఎవరూ అడ్డు రాకుండా చూస్తారు. కానీ ఆరోజు ఎలా జరిగిందో కానీ పొరపాటున ఓ రైతు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. అప్పుడు ఒక అధికారి చూసి, అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమని తన సైనికుల్లో ఒకరిని ఆదేశించాడు. ఆ సైనికుడు అందుకు తిరస్కరించాడు. అప్పుడా అధికారి పెద్ద కరవాలం తీసి మొదట సైనికుణ్ణీ, తర్వాత రైతునీ నరికి చంపేశాడు. సరిగ్గా అదే క్షణంలో గుర్రంమీద అక్కడికి వచ్చిన అతని కంటే పై అధికారి ఇది చూసి ఇతనికి మతిచలించిందేమో అనుకుని అప్పటికప్పుడు అతన్ని చంపేశాడు. అలా ఆ రోడ్డు మీద పడున్న మృతదేహాలలో ఒకటి రైతుది, ఒకటి సైనికుడిది, ఇంకొకటి సైనికాధికారిదీ అన్నమాట!

యొకొహామా నుంచి ఎడో నగరానికి వెళ్ళాడు. అక్కడి పెద్ద పెద్ద కోట బురుజుల్ని, ప్రాసాదాలను, కిక్కిరిసిన రోడ్లను చూసి ముగ్ధుడయ్యాడు. సెప్టెంబర్ ప్రారంభానికల్లా జపాన్ మొహంమొత్తింది. తన యాత్రానుభవాలను వెంటనే కాగితం మీద పెట్టాలని కూడా అనుకున్నాడు. దాంతో ‘ది క్వీన్ ఆఫ్ ది ఏవాన్’ అనే ఓ చిన్న ఇంగ్లీష్ నౌక ఎక్కి పసిఫిక్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాడు. కావలసినంత సమయం చిక్కడంతో చైనా-జపాన్ యాత్రా విశేషాలను రాయడం ప్రారంభించాడు. అది 220 పేజీల పుస్తకం అయింది. రెండేళ్ల తర్వాత దానిని La chine et le Japon au temps present అనే శీర్షికతో పారిస్ లో ముద్రింపజేశాడు. ఈ తొలి పుస్తకం అతనిలో సంతృప్తిని, గర్వాన్ని నింపింది.

జపాన్ నుంచి బయలుదేరిన కొన్ని రోజుల తర్వాత, తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వ్యతిరేక దిశలో సరిగ్గా భూమి అంతానికి చేరుకున్నా ననుకున్నాడు. కానీ అతని ఊహ తప్పు. కనీసం ఓడ కెప్టెన్ ను అడిగి ఉంటే ఆ సంగతి చెప్పేవాడు.

ఇప్పటికీ ఇల్లూ వాకిలీ పట్టని ఈ దేశదిమ్మరి కొన్ని రోజులు మాత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండి, తర్వాత ఓడలో నికరాగువాకు బయలుదేరాడు. మరోసారి పనామా మీదుగా వెళ్ళడం ఇష్టంలేక నికరాగువాను దాటి హవానా వెళ్ళాడు. అక్కడ కొంత ఆస్తిని కొన్నాడు. కొన్ని వారాలు అక్కడ గడిపిన తర్వాత మెక్సికో వెళ్ళాడు. ఆ నగరంలో ప్రతిదీ అతనికి నిరుత్సాహమే కలిగించింది. చివరికి 1866 వసంతంలో పారిస్ చేరుకున్నాడు. అక్కడ సైనే, కెతీడ్రా ఆఫ్ నోట్రె డేమ్ కు దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు, తన నలభై నాలుగో ఏట, తనేం కాదలచుకున్నాడో స్పష్టత వచ్చినట్టు అనిపించింది. విద్యార్థిగా మారి సర్బాన్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతూ భాషాశాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నాడు. విరామ సమయంలో తన చైనా, జపాన్ యాత్రావిశేషాలను ప్రచురించాలనుకున్నాడు.

మూడు విడతలుగా అపారమైన సంపదను మూటగట్టి, ప్రపంచంలోని సగం దేశాలను చుట్టి, ఏమాత్రం అనుకూలించని భార్యతో ముగ్గురు పిల్లల్ని కని, పదమూడు భాషలు నేర్చి, ఓ పెద్ద గ్రంథాలయాన్ని సమకూర్చుకున్న ఈ పెద్దమనిషికి తన జీవితాన్ని ఎటు తీసుకెళ్ళాలో ఇప్పటికీ తెలియడం లేదు.

కాకపోతే, క్రమంగా అతని అడుగులు ట్రాయ్ వైపు పడుతున్నాయి…

(సశేషం)

 

 

 

కోరిన కొండ మింద వాన

 

 

Namini_Subramanyam_Naiduతిరప్తికి వుత్తరాన తిరమల కొండ. కపిల తీర్తం చుట్టుపక్కల యిండ్లొచ్చేసి యిరైయ్యేండ్లయిపాయ. యింక ఆ తట్టు పెరిగే పన్లా. తిరప్తికి తూరూగా వుండే కరకంబాడి గానీ, రేణిగుంట గానీ తిరప్తిలో కలిసిపాయ. తిరప్తికి పరంటగా యూనోర్సిటీలను దాటుకోని పుదిపట్లేమి, చెర్లోపల్లేమి, ముక్కోటేమి, చెంద్రగిరి దాకా లేఔట్లు పడిపాయ. యింక పెరగబొయ్యేదంతా తిరప్తికి దచ్చినంగా వుండే ఆర్‌సీ రోడ్డే. యిప్పుటికే మజ్జిక్కాలవ దాటి బైపాసు దాకా అపార్టుమెంట్లే వొచ్చేసినాయి. యింత దేనికి? కూచంద్రపేటకీ రామాపరానికీ నడి మద్దెన గుట్ట కింద పది పదైదెకరాల్లో విల్లాలు కట్టేదానికి రోడ్లేస్తా వుండారు, తుడా అప్రూవల్‌ తీస్కోని. తిరప్తిని కార్పొరేషను గూడా చేసేసినారు. మిట్టూరు, గంగిరెడ్డిపల్లి, నడవలూరు, నెన్నూరు గూడా తుడా కిందికి తెచ్చేసి కార్పొరేషన్‌లో కలిపీబోతారు.

యివన్నీ తెలవని ఆడమనిసేం గాదు జమునా. అందుకే అదరకుండా, పదరకుండా నిమ్మళంగా వుండాది. చిక్కి బిక్కిరించే కంటే యెనకాలనుండి యెక్కిరించేదే మేలు. అప్పుడే పన్లు జరుపుకోవచ్చు. నెత్తిన పెట్టుకోని మోస్తా వుండినట్టు కనిపించినామో దెబ్బ పడిపోతాది. యిప్పుడు చూడండేమి! బైరాగి పట్టెడలో యిల్లు కట్టాలనుకో. ముందు జాగా తియ్యాలి గదా. అంకణం రెండు లచ్చిలు బెట్టి అరవై అంకణాలు కొనాలంటే – బైరాగి పట్టెడలో వొక బిట్టొచ్చి అరవై అంకణాలు – కోటీ ఇరై లచ్చిలు బెట్టా. అంత డబ్బు పోసి జాగా కొన్నాక చుట్టూరా పదంకణాలైనా వొదిలి వొక టెంకాయ చెట్టు నాటుకునే దానికుండాదా! మొత్తం కట్టెయ్యాల. వొక డూప్లెక్సు యిల్లే కట్టాలంటే యీనంలో యీనం అదొక కోటి! పాలు పొంగించి యిండ్లల్లో చేరే నాటికి రెండు కోట్లా యిరై లచ్చిలు ! యిదే రెండు కోట్లా యిరై లచ్చిలు మిట్టూరు దాకా వొచ్చి నడవలూరు రోడ్డుకు అంకణానికి నలపై వేలు ఆడ పారేసి మున్నూరంకణాలు కొనుక్కుంటే! యాబై లచ్చిల్తో బెమ్మాళంగా వొకిల్లు గట్టుకోని చుట్టూరా టెంకాయ చెట్లూ, మాడి చెట్లూ, సపోటా చెట్లూ పెట్టుకుంటే! చూసేదానికి దిష్టికుండ పెట్టాల్సిందే. వొక పది లచ్చులు మనవి గాదనుకోని యిన్నోవా కారు కొనుక్కుంటే వుండే మతింపు! యింతా జేసి అర్దరేత్రి పూట గూడా తిరప్తి నుంచి పది నిమిసాలల్లో వనం మాదిరిగా వుండే యింట్లోకొచ్చి పడిపోవచ్చు.

ఈ తెలివితోనే యిప్పుడు తిరప్తోళ్లు వూళ్ల మిందికి దిగబడి పోతుండారు. మ్మరీ, రోడ్డు పక్క జాగాకు తనకలాడి పోతుండారు. తిరప్తిలో బైరాగి పట్టెడ నుంచి అది పొగులు పూటే గానీలే, కపిల తీర్తం పోవాలంటే ఆటో పిలగోడికి నూరియ్యాల. షేరాటోలెక్కితే మూడు మారి ముప్పై యియ్యాల. అదే మిట్టూరుకు రావాలంటే అన్నమయ్య సర్కిలు కాడ నిలబడి పది రూపాయలు యిచ్చి షేరాటో ఎక్కేస్తే గీత గీసినట్టు వొచ్చీయొచ్చు. బస్సయినా, బండయినా, కారయినా, షేరాటో అయినా పది నిమిసాలే. చెట్టూ జేమా నడిమద్దిన సుకంగా బతికిపోవచ్చు గదా. తిరప్తోళ్లకు చేటడు తెలివుంటే వూళ్లల్లో వోళ్లకు గంపడుంటాది గాబట్టే రోడ్డు పక్క జానడు జాగా యిచ్చే వోళ్లు లేరు. జమునా మాత్రం నెలకు ముందర యిచ్చేదానికి సిద్దపడిపొయ్‌ మిట్టూళ్లో వొక బ్రోకరు పనిజేసే వోడుంటే వోడికి చెప్పింది. ఆ బ్రోకరు యిరైనాళ్ల ముందర వొక పార్టీని గూడా పట్టకొచ్చి, ‘‘గన్‌పార్టీ జమునమ్మా. సింగిల్‌ సిట్టింగులో సెటిల్‌ జేసేస్తా.’’ అనేసి వొక డాక్టరును తొడుకోనొచ్చినాడు.

ఆల్రడీ బ్రోకరు ఆ డాక్టరుకు జాగాను గూడా చూపించేసినాడంట. జమూనాకు నడవలూరు రోడ్లో – ఆ రోడ్లో అప్లాయిగుంట మింద పుత్తూరు దాకా బస్సులు గూడా పోతుంటాయి – ముక్కుపుల్ల మాదిరిగా మూడు గుంటల కయ్యుండాది. సెంట్ల లెక్కన యిరై సెంట్లు, అంకణాల్లెక్కన యిన్నూటా నలపై అంకణాలు. దాన్ని, లడ్డుకమ్మ మాదిరిగా వుండే ఆ జాగాని అమ్మేదానికి కూచ్చునింది జమునా. వొచ్చిన ఆ పార్టీతో, నోరు తెరిచిందే తెరిచినట్టుగా, ‘‘అంకణం నలపై వేలు సార్‌. బేరాలు జేసే పనయితే యాపై వేలు. మీకు నీస్తే కుచ్చోండి, నీసక పోతే పోతా వుండండి, అన్ని మంచి నీళ్లు తాగేసి.’’ అని నెట్టుగా మాట్లాడింది. మ్మరి, అటుమంటి వొస్తవను చేతల్లో పెట్టుకోనుండాది జమునా. బ్రోకరు గూడా ఆ వూళ్లో మనిసే గాబట్టీ, జమునా సంగతి బాగా తెలుసు గాబట్టీ, ‘‘పార్టీని పట్టకొచ్చేంత వొరకే నా పని. నేనేమీ మార్జిను బెట్టుకోలేదే! నీ దగ్గిర వొక రేటుకు మాట్లాడుకోని అగ్రిమెంటు జేస్కోని యింగొకరికి అమ్మడం లేదు గదా. మీరూ మీరూ మాట్లాడుకోండి. నాకొక టూ పర్సెంటు యిచ్చీయండి.’’ అని మాత్రమే మాట్లాడి గమ్మనుండి పొయ్‌నాడు. దీనికి జమునా, ‘‘పర్సెంట్లు గిర్సెంట్లు నా దగ్గిర జాంతానై. కొనే వాళ్ల తావన నువ్వేమి తీసుకుంటావో, ఆయనేమిస్తాడో దాంతో నాకు సమందం లా. రామచంద్రాపరం నుంచి నెన్నూరు దాకా నలపై అంకణాలిచ్చే వోళ్లుంటే వోళ్ల దగ్గిరికే తొడుకోని పో. నేను బంగారట్టా జాగాను దారబోసుకుంటా నీకు పర్సెంటేజీలియ్యలేను. అంత్య నిస్టూరం కన్నా ఆది నిస్టూరం మేలు . పైగా నువ్వు వుండూరోడివి’’ అని గూడా అనేసింది. ఈ మాటకు, ‘‘నాకొక పర్సెంటన్నా యియ్యమ్మా’’ అని గానీ అన్లేక పొయ్‌నాడు బ్రోకరు.

మొదట్లోనే ఆ వొచ్చిన డాక్టరుకు ‘యిదయ్యే పని గాదులే’ అని అనిపించి నప్పటికీ, ఆయనకుండే తెలివిని బట్టి, ‘‘ఏందమ్మా నువ్వు చెప్పేది? ఈ వూళ్లో పొయ్‌ అంకణం నలపై వేలా! యిప్పుడు రా, తిరప్తికి. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీలో తుడా ఫైనల్‌ అప్రూవల్‌ అయ్యిందీ, లేఔట్లో నాలుగైదిండ్లూ రెండు అపార్టుమెంట్లూ గూడా పడిన చోటున్నే నీకు అంకణం నలపై వేలకిప్పిస్తా. విచిత్రంగా వుండాదే నువ్వు చెప్పేది. అంకణం నలపై వేలంటే ఎకరా నాలుగు కోట్లా అప్పుటికి?’’ అనేసి ముక్కున వేలేసుకున్నాడు. దీనిగ్గూడా, ‘‘డాక్టర్‌ సార్‌. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకి మీరు అన్నమయ్య సర్కిల్‌ నుంచి పోవాలంటే ఎన్నిసార్లు స్టీరింగు తిప్పాల్నో ఆలోచించు. అది గూడా తొమ్మిది కిలోమీటర్లకు తక్కవేం వుండదు. మొన్న వొడమాలపేటకు పోతా పోతా ఆ లేఔట్‌ గూడా చూసినా. వొట్టి చవుడు నేల. నా నేల అట్టాంటిది గాదు. ఇంగొక పాయింటేమంటే స్కేలు మింద చీమ వొచ్చినట్టు వొచ్చీయొచ్చు నా ప్లాటు కాడికి. నువ్వు రామచంద్రాపరం దాకా నేరుగా వొచ్చి లెఫ్ట్‌కు వొక్క టర్నిచ్చుకుంటే బస్సు రూట్‌ మింద నా ప్లాటు చేరుకుంటావు. ఇది మెయిన్‌ రోడ్డు. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకీ నా దానికీ నక్కకీ నాగలోకానికీ వున్నంత వారా వుండాది. అన్ని మాటలేల? లేచి పోవచ్చు.’’ అని మాటకు మాటేసింది. దీనికి రెండూ రెండు చేతల్తో మూస్కోలేక డాక్టరుకు గూడా చిన్నంగా రోషం మొదలై, ‘‘నీతో కొంచేపు మాట్లాడితే నువ్వు నీ జాగాను స్కొయర్‌ ఫీట్‌ యింత అని చెప్పేటట్టుండావు. రియల్‌ ఎస్టేటోళ్లు యాడబోవాల తల్లీ! వూరికే బేరం చేసి పోదామని రాలేదు. నిజంగానే కొనుక్కోవాలనీ, చక్కగా వొక యిల్లేసుకోవాలనీ, ప్రశాంతత కోసరం యింత దూరం వొచ్చినాను. నువ్వు తెగే రేటు చెప్పు. తెంచేద్దాం.’’ అనేసి ఆ రోషాన్ని కాసింత పక్కన పెట్టేసి అణిగినాడు. నిజానికి ముప్పైయ్యేలకు తెంచేద్దామని పై మాటగా నలబై అనింది జమునా.

Kadha-Saranga-2-300x268

నలబై అయితే కోటికి నాలుగు లచ్చిలు తక్కవవతాది. యీన పక్షం ముప్పెయ్యేసుకుంటే డెబ్బయి రెండు లచ్చిలొస్తాది. కానీ, ‘‘నలపైకి పైసా తగ్గను. బొటువుగా రూపాయి యిచ్చియ్‌. రూపాయంటే కోటి.’’ అనే బిగుసుకునింది. డాక్టరు పకపకా నవ్వి, ‘‘బేరానికి కుచ్చుంటే నాలుగు లచ్చిలు ఎక్కువ జేసినావన్నమాట. అసలు రోడ్డు ఎక్స్ టెండవతాదని గూడా అంటుండారు. నూరడుగుల రోడ్డు చెయ్యాలని ప్లానులో వుండాది. రోడ్డుకు పొయ్యే జాగాను పట్టుకోని నువ్వు అంకణం నలబై చెప్తుంటే ఎట్ల తల్లీ! మంచీ చెడ్డా చూసి చెప్పు’’ అనేసి అన్నాడు. ఈ మాటను పట్టుకోని జమూనా యింకా బలం తెచ్చుకోని, ‘‘యిప్పుడొచ్చినారు మీ అంతట మీరై దోవలోకి. నేనూ మీ దోవలోకే వొస్తానుండండి. యిప్పుటికే అది అరై అడుగుల రోడ్డు. నా ప్లాటు వుండేది ఉత్తర మొకం. వాస్తుకెంత మంచిది. కొలత చూసినావా! డెబ్బయి రెండుకి నూటిరవై. లెక్కాచారంగా ఇన్నూటా నలపై అంకణాలు. ఆ పక్కా యీ పక్కా రోడ్డుకెంత పోబోతాది! మహా అయితే యిరై అడుగులు పోతాది నాది. అదీ నూరడుగుల రోడ్డయితే! ఆడ అవబొయ్యేది ఎయిటీ ఫీటే. ప్లానులో వుండేది గూడా ఎయిటీ ఫీటే. రోడ్డుకు పదడుగులు పొయ్‌నా నీకు రోడ్డు పెద్దదయ్యింది గదా. రోడ్డు ఎంత పెద్దదైదే అంత రేటు. నూరడుగుల రోడ్డయితే నాది అంకణం లచ్చయాపై యేలు. ఇప్పుడు కరకంబాడి రోడ్డుకు మెయిన్‌ రోడ్డు రేటు రెండు లచ్చిలు. ఆ రేటే యీడా వొస్తాది. దేనికంటే రేడీస్టేషను నుంచి యాడ కరకంబాడి, యాడ మిట్టూరు! ఆడనే అంత రేటు పలకతా వుంటే`’’ అని వొక్క గుక్కలో మాట్లాడేసి, ఫైనల్‌గా, ‘‘మీరు లేచి పదండి చెప్తా, నా జాగా నాదిగా వుండనీండి, మీ డబ్బు మీదిగా వుండనీండి. పొగులు మాటలు పనికి చేటు, రేత్రి మాటలు నిద్రకు చేటు. డాక్టరుకు చెప్పాల్నా?’’ అని నవ్వేసింది. ‘‘మీరు మొగోడిగా పుట్టుంటే రాజ్యమేలే సుందురమ్మా!’’ అని నెంబరిచ్చీ, నెంబరు తీస్కోనీ ఆ పొద్దు పొయ్‌నోడు, యీ పొద్దు పది నిమిసాల ముందర ఏమిటికి కాల్‌ చేసినట్టు! యిప్పుడు గూడా ఆ మాట మిందనే వుండాది జమునా. ‘‘వొక రూపాయి తెచ్చిచ్చి ఫెన్సింగు రాళ్లు నాటుకో,రిజిస్టరు చేస్కోని. అదీ అగ్రిమెంటు గిగ్రిమెంటు ఏం లా. స్పాట్‌ పేమెంటు’’ అని రెండో మాట మాట్లాడకుండా ఫోను పెట్టేసింది.

యింత కటీనంగా వుండబట్టే ఆ జాగాను యిన్నేండ్లుగా కంటికి రెప్ప మాదిర్తో కాపాడుకుంటా వొస్తుండాది జమునా. యింట్లో ముఠాలెదవలు యిద్దురుంటే యిద్దురికీ చెప్పింది, యీ మాదిర్తో డాక్టరు ఫోను చేసినాడూ అనేసి. దీనికి ఆ మొగుడైనోడూ, కొడుకైనోడూ ఏమని అన్నారో తెలుసునా: ‘‘ముప్పై వేలకు అమ్మి పారెయ్యక నువ్వు నలబైలోనే వుంటే ఎట్ట? పార్టీ నిలబడొద్దా?’’అనేసి అన్నారు. అసలికి, మొగోళ్లంతా యింతే. ఏ మొగోడికైనా అమ్మెయ్యాలంటే ఎంత కుశాలగా వుంటాదో! రైతు యీ మాత్రమన్నా అర్దమో నిర్దమో కయ్యాగామ చేతిలో పెట్టుకోనుండారంటే ఆడోళ్లే కారిణం. అమ్మి పారేసి జరగాల్సిన పనులు చూడాలంట. పదైదేండ్లకు ముందర వూళ్లో ఒక బిడ్డి పెండ్లి చెయ్యాలనేసి వొకాయన ఎకరా లచ్చా యాపైయ్యేలకు తిరప్తిలో కండక్టరు పన్జేసే వోడికి అమ్మేసినాడు, మెయిను రోడ్డుకి. యిప్పుడు ఎకరా ఎంతనేసి! ఆ కుటుంబరానికీ పొద్దు పిచ్చిపట్టి పొయ్యుండాది. నాలుగెకరాలు వుడ్డగా వొక చోట దొరకడమే లేదు, తిరప్తోళ్లు లేఔట్‌ యెయ్యాలంటే! లేఔట్‌ యేసేదానికి బయపడి చస్తుండారు, పార్కుకు జాగా వొదిలి, నలపై అడుగుల రోడ్లేసి తుడా అప్రూవల్‌ చెయ్యాలంటే – పెద్ద పెద్ద యాపారస్తుళ్లు గూడా. ఎకరా రెండు కోట్లు బెట్టి నాలుగెకరాలు కొని, తుడాలో లంచాలిచ్చి, రోడ్లకు పోను, పార్కుకు పోను ఎకరాకు ఏడొందంకణాలు మిగల్తాది. పెట్టుబడి పెట్టాల. దానికి నాలుగున్నర రూపాయ లొడ్డీలు గిట్టుబాటు కావాల. అంకణం యాపై వేలు పెట్టినా గిట్టుబాటు కాక మూస్కోనుండారు. యీ జాగా అట్లగాదే! యీ రోజుకీరోజున యిల్లు కట్టుకోవచ్చు. పైగా ఉత్తర మొకం. దచ్చినం పక్కగా వొక అరై అంకణాల్లో బెమ్మాళంగా మహడీ కట్టుకోని ముందంతా కాళీ జాగా వొదిలేస్తే వాస్తు అదిరి పోతింది. ఎవురబ్బా యీ తోటలో యిల్లు కట్టుకోనుండేది అనేసి కార్లల్లో పొయ్యేవోళ్లు గూడా దిగి చూస్తారు. దచ్చినాన యిల్లు. ఉత్తరాన కాళీ జాగాలో తోట. వాస్తుకెంత మంచిది! పదేండ్ల కింద అయిదు లచ్చిలు కట్నమిచ్చి వొక టీచరు సమందాన్ని తెచ్చి కూతురికి పెండ్లి జేసిందే గాని అప్పుడు గూడా కయ్య అమ్మలా. యిప్పుడు గూడా పది లచ్చిలు అప్పుండినా బయపడడం లా జమునా. అప్పుకు బయపడి ఆ పొద్దు యీ జాగా అమ్మేసుంటే-? యీ పొద్దు నోట్లో యేలేస్కోని గమ్మనుండుండాల. యిది గాక యింగొక ఎకరా వుండాది జమునా వాళ్లకు. అది బాగా లోపలికి. ఎప్పుడో రోడ్డు పక్కంతా లేఔట్లొచ్చినాక దానికీ గిరాకీ వొస్తాది. ఆ ఎకరా చాలు, మొగ పిల్లోడికి. యిప్పుడీ జాగా అమ్మతా వుండేది గూడా దేనికంటే – యీ మొగ పిల్లోడి కోసరమనే! ఏం చేసేది! చదువు తక్కవ కొడుకుని కని పడరాని పాట్లు పడతుండాది జమునా. చెప్పుకుంటే బైసాట్లు. ఇంక సమ్మచ్చరం పెడితే ముప్పైలో పడిపోతాడు కొడుకు. నాలుగేండ్లుగా పెండ్లి చెయ్యాలని పోరకలాడతా వుండాది. పిల్లనిచ్చేవోళ్లు లేరు. యాడ బట్టినా ఆడ పిలకాయలు చదువుకునేసుండారు. వీడేమో పది ఫయిలు. మళ్లా మళ్లా కట్టి రాసినాడు. పాసు గాలా. యింగ వొదిలేసింది. వుజ్జోగాలు జేసే మొగ పిలకాయకే ఆడ పిలకాయలు దొరక్క అల్లాడతా వుండారు. పది ఫయిలైన ఆడబిడ్డిని తెచ్చుకుందామన్నా వోళ్లు గూడా యియ్యాటం లా. ‘‘మీ కొడుక్కి వుజ్జోగం వుండాదా?’’ అనడగతా వుండారు. యింక ఎవుర్ని అడిగినా ఆ ఆడ పిలకాయలు డిగ్రీ దాకా చదివేసే వుండారు. పీలేరు టవునయి పాయ. ఆ చుట్టు పక్కల ఆడ పిలకాయలు యీ కాన్వెంట్ల మింద పడి చదివేసే వుండారు. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, పెనుమూరు అన్ని వూళ్లూ టవున్లయి పొయ్యేసరికి ఆ చుట్టుపక్క వూళ్లల్లో ఆడ పిలకాయలు టవున్లకొచ్చేసి చదివేసుండారు. పైగా, ఎంత పది ఫయిలైన ఆడబిడ్డి అయినా గూడా ఎకరా కయ్య వుండనే వుంటాది. మొన్నటికి మొన్న మనుసు చంపుకోని పెనుమూరు దగ్గిర వొక సమందం వుంటే పొయ్యేసొచ్చింది. ఆ బిడ్డి కంట్లో గూడా పడలా. వీడి మాదిరగానే పది గూడా ఫయిలయ్యింది. ఆ బిడ్డి పేరుతో ఎకరా వుండాదంట. అదీ నీలుగు. పెనుమూరును వాళ్లు జెప్పేది ‘సెకండ్‌ బాంబే’ అంట. ఆడ గూడా రేట్లే. ‘మా బిడ్డికి యాపై లచ్చిలు సొత్తిస్తుండాం గదా. వుజ్జోగస్తుడికైతేనే యిస్తాం.’ అని తేల్చేసే సరికి చెవులు జాడించుకుంటా వొచ్చేసింది. సొంత అందమ్ముడి కూతుర్ని అడిగితే, ‘‘నీకిది న్యాయమే గాదు. నా కూతురు ఎంబిఏ చదివి పూనేలో నెలకు ముప్పై వేల జీతం తీస్తా వుంటే అడిగే దానికి నీకు నోరెట్టా వొచ్చింది!’’ అనేసి చెల్లెలి మొకాన మసి పూసినాడు ఆ అందమ్ముడు. ఆ రోజే గడప దిగేసి, ‘‘చదువు తక్కవ కొడుకును కన్నానని ఎగతాళి జేస్తుండావు. చదువు లేకపోతే మాత్రం నీ కూతుర్నడిగే దానికి నాకు సొంతం లేదా? తనా మనా అని ఎంచినావా నువ్వు? ఎంసిఏ చదివిన బిడ్డిని నా కొడుక్కి సమ్మచ్చరం తిరిగేకంతా తెచ్చి తగలగట్టక పోతే అప్పుడడుగు. ప్రభాస్‌ మాదిరిగా వుంటాడు నా కొడుకు! వోడికేం తక్కవ!’’ అని సవాలేసేసి వొచ్చింది.

కౌసల్య అని తిరప్తిలో వొకామెకు పెండ్లి సమందాలు చూసే పనే. ఆమెకు గూడా కొడుక్కత చెప్తే ఆమె నవ్వింది చూడండీ. జమునాకైతే తలగిల్లి మొలేసినట్లయ్యింది. ‘వుజ్జోగం లేని మొగ పిలకాయల ప్రొఫైళ్లే నేను తీసుకోనకా!’ అని వొక్క మాటలో తేల్చేసింది. అందుకే పంతానికి పొయ్‌ వొక ప్లానేస్కోని, ఆ ప్లాను ప్రకారం పొయ్‌ కొడుకుని ఒక దోవలోకి తెచ్చి మళ్ల మాట్లాడదామని వుండాది ఆ కౌసల్యతో. ప్లాను ప్రకారం పోవాలనే అగో, యిప్పుడీ జాగాను అమ్మాలని చూస్తుండాది జమునా. డాక్టరు ఫోను నంబరు యిచ్చేసి పోయినా, జమునా అయితే చెయ్యనే లా. అయినా, యీ పొద్దే చేసినాడు గదా. డాక్టరుకు తుత్తర పట్టకపోతే అప్పుడడగండి. దేనికంటే అంత వందనంగా డాక్టరింగొక ప్లాటును చూళ్లేడు. యీ వూళ్లో బ్రోకరూ చూపించ లేడు. డాక్టరు ఏమిగా అనుకుంటా వుండాడో వొక మాటగా అడిగి చూద్దామని బ్రోకరుతో మాట వరసకు గూడా ఫోనుజేసి మాట్లాళ్లేదు. జమునాకు కనిపించేటట్టుగా రోజుకు పది తూర్లు ఆ బ్రోకరు తిరుగులాడతా వుండినా బెట్టుకు పోయి పలకరించను గూడా లేదు. ‘ఈ పొద్దు యీ మాదిరిగా డాక్టరు ఫోను చేసినాడు’ అని వొక మాటగా అడగదామా వొద్దా అని సెల్లు చేతిలో బెట్టుకోని కొంచేపు కొట్టుకులాడింది. ఎగీదిలోనే బ్రోకరు యిల్లు. అయినా యింటికి పోకుండా మిస్సుడు కాలిచ్చి చూసింది. నిమిసంలో తిరిగి చేసినాడు బ్రోకరు ఫోను. వాడి ఆత్రం చూసినారా! జమునా ఎట్టాంటిది? ‘ఏమబ్బా ఫోను చేస్తివి?’ అనడిగింది. ‘నీ మిస్సుడు కాల్‌ చూసి చేసినాన’నేసి బ్రోకరన్నాడు. ‘నీ నంబరు ఫీడ్డయ్యుండాది గదా. నేను వొంట జేస్తా సెల్లును అట్టా యిట్టా పెడతా, పడతా వుంటే నీ నంబరు నొక్కుకునుంటాది. నేనెప్పుడూ ఎవురికే గాని మిస్సుడు కాలియ్యను. మాట్లాడితే బిల్లు పడిపోతాదనే యీనపు బుద్ది నాకు లేదబ్బా!’ అనేసి టకిక్కున ఫోను పెట్టేసి నవ్వుకొనింది జమునా. మూడో నిమిసంలో యింటికొచ్చేసినాడు బ్రోకరు. ఇంగా నవ్వుకొనింది. ‘‘జమునమ్మా. అంకణం నలబై చెప్పిందానివి యింగొక నాలుగు లచ్చిలెగేసి కోటి జేసేసి – అక్కణ్ణే కుచ్చుంటే నువ్వు అనుకున్న పన్లు జరగవు. నువ్వు ఓకే జేస్తే ముప్పైకి సింగిల్‌ సెటిల్మెంటులో అవగొట్టేస్తా. స్పాట్టే. నానుడెవ్వారం లేదు. డాక్టరు దగ్గిర్నే టూ పర్సంటు తీస్కుంటా. నువ్వేమీ గూడా యివ్వొద్దులే చెప్పు జమునమ్మా!’’ అని డైరెక్టరుగా పాయింటులో కొచ్చేసినాడు. అడుక్కునే కొందికి ముడుక్కో గూడదని చెప్పి, ‘‘నాది మాటంటే మాటే మునసామీ! అంకణం ముప్పై అయిదు వేలు, స్పాటూ అయితేనే డాక్టర్‌కి ఫోన్‌ చెయ్‌. లేదంటే నా గడప దిగి పూడువు’’ అనేసింది జమునా. బ్రోకరు మునస్వామి మళ్ల వొక్కడుగు తాంచారం చెయ్యకుండా డాక్టరుకు ఫోను చేసేసినాడు. కాలుగెంటలో జమునా యింట్లో డాక్టరు తేలినాడు. ‘యిద్దురూ ముందే మాట్లాడుకున్నారా ఎట్ట? రామచంద్రాపురం కాడ డాక్టర్ను పెట్టేసి వొచ్చినాడా బ్రోకరు’ అని గూడా యోచన జేసి, ‘‘ఏం డాక్టర్‌ సార్‌. మీకు డాక్టరు పనికంటే యీ యాపారమే ఎక్కువగా వుండాదే!’’ అనింది. లోపల్లోపల – యింత తొందర పడి రాకుండా వుండాల్సిందే – అని అనుకున్నాడో ఏం నాశినమో గానీ, నవ్వతా గమ్మనుండి పొయ్‌నాడు డాక్టరు, ‘నాకు పల్లెటూళ్లంటే యిష్టిం’ అనేసి. ‘ఈ రోజు తెగితే తెగినట్టు. లేకుంటే నేను టవున్లోనే చూసుకుంటా’ అని గూడా అన్నాడు. జమునా గూడా లెక్కగా, ‘‘డాక్టర్‌ సార్‌, నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా. మునస్వామీ, నువ్వు అడ్డం రాబాక. డాక్టర్‌ సార్‌, మీరు మాట్లాడాలంటే మాట్లాడండి. నేను అడ్డం రాను. యిందాకా మునస్వామితో చెప్పినట్టే మీతో గూడా చెప్తుండా. నా రేటు ముప్పై అయిదు వేలు. యిప్పుడు చెప్పండి, ఎవురు మాట్లాడాల్నో!’’ అని తుంచినట్టు మాట్లాడింది. ‘‘సొత్తు నీదమ్మా. నువ్వే మాట్లాడు.’’ అన్నాడు డాక్టరు. దీనికి చెప్పాల్సినవన్నీ చెప్పేసింది జమునా. ‘‘నేనీ పొద్దు పోగొట్టుకుంటా వుండా. మీరు సంపాదించుకుంటా వుండారు. ఎవురు గానీ చెడిపోగూడదు. మీకు అరగెంట టయిమిస్తా వుండా. యీ మిట్టూర్లోకి పొయ్‌ చూడండి – అంకణం ఇరై రెండు వేలు లేకుంటే అప్పుడొచ్చి అడగండి. మొన్న వూళ్లో డైవోరుగా పనిజేసేటాయన ఒక ఎకరా వుంటే గీతలు గీసి జాగాలేసినాడు. ముందర పదైదడుగుల రోడ్డు. ఇరై రెండు వేలకు కొనుక్కున్నారు, వూళ్లో వోళ్లు గూడా. నాది మెయిన్‌ రోడ్డు. ముప్పై అయిదు వేలే చెప్తుండా. యింక నేను నోరే తెరవను.’’ అనేసి అనింది. దీనికి బ్రోకర్‌ మునస్వామి గూడా, ‘‘సార్‌ మా జమునమ్మది మాటంటే మాటే. నసుగుడు ఎవ్వారాలు ఆమె దగ్గిర కుదరవు. మొకాన్నే మాట్లాడతాది.’’. – ఆమె వాటం చూసి డాక్టరు గూడా వొకటికి పది మాటలు మాట్లాడాలనుకోలేదు. నోరంతా తెరిచి వొకే మాటన్నాడు, ‘టోకనెంతిమ్మంటావు’ అనేసి. టోకను గీకను కుదరదనేసింది. ‘‘మీరు నెల గావాలంటే టయిం తీసుకోండి. డబ్బిక్కడ తెచ్చి పెట్టండి వొకే తూరి. నేనొచ్చి రాసిస్తా. జాగా నా పేరు మిందనే వుండాది. మీకు నమ్మకం లేకపోతే మా యింటాయనా, నా కొడుకూ, నా కూతురూ గూడా వొచ్చి సంతకాలు పెడతారు’’ అని కడ మాటగా చెప్పేసింది.

namini newడాక్టరూ, బ్రోకరు మునస్వామీ యీదిలోకి పొయ్‌ సిగరెట్లు తాగేసి, ‘‘ఏ పొద్దు అనుకొనింది ఆ పొద్దు అయిపోవాల. నీ మింద నమ్మకం లేక గాదమ్మా, నిన్ను నేను మెచ్చినా. నీ అంత నీతిమంతురాలు మాట మింద నిలబడే మనిసీ నాకు కనబళ్లేదనుకుంటుండా. నేను కర్నూలు మెడికల్‌ కాలేజీలో చదివినాను మెడిసిను. కానీ నేను వేస్టు. ఎంత వేస్టునంటే మొన్నటికి మొన్న మా నాయిన సాంవత్సరీకం జరిగినప్పుడు నేనెంత బాద పడినానో చెప్పలేను. మా నాయిన చచ్చిపోతే ఎక్కడ పూడ్చినామో తెలుసునా! అన్నపూర్ణమ్మ గుడి వుందే అక్కడుండే స్మశానంలో. మా నాయినను వేసిన గుంత మింద కుక్కలు తిరగలాడతా వుంటే ఏడుపొచ్చేసింది. నేనూ నా భార్యా యిద్దరం డాక్టర్లమే. గవర్నమెంటిచ్చిన జీతాల మీద బతికిన వాళ్లమే. మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యేటట్టుగా చదివించుకున్నాం గానీ పరుగులెత్తి సంపాయించు కోలేక పోయినాం. యిప్పుడు మా అమ్మకు ఎనబై అయిదు నడుస్తుండాయి. ఒక మంచి చెట్టూచేమా నడమ మా అమ్మ చచ్చి పోంగానే – అక్కడ పూడ్చి పెట్టి దినామూ దండం పెట్టుకోవాలనే నేను నీ జాగాను చూసినా. నాకు నచ్చింది. నువ్వు చెప్పిన మాటల్ని నేను వినకపోతే నేను చెడిపోతాననిపించింది. మా అమ్మను గూడా ఆ నీచమైన చోటే పూడ్చాల్సొస్తాది. నువ్వు దయదలిచి ఆ జాగా యిస్తే అక్కడే యిల్లు కట్టుకోని, మా అమ్మ చని పోంగానే అక్కడ్నే వొక మూల పూడ్చిపెట్టి చిన్న సమాది కట్టుకోవాలనేది నా కోరిక. యీ పొద్దే రిజిస్టే్రషను పెట్టుకుందాము. నా భార్య అమౌంట్‌ తీస్కోని బయల్దేరింది గూడా’’ అనేసి కండ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేసినాడు డాక్టరు.

ఒక మంచి మనిసికి జాగా యిచ్చిందుకు చానా సంతోసపడింది జమునా. జాగా యిచ్చినందుకు ఎనబై నాలుగు లచ్చలివ్వడమే గాక యిరవై వేలు బెట్టి వుంగరాన్ని గూడా తీసిచ్చినాడు, పాపం. అంతే, ఇంక జమునా వేసుకున్న ప్లాను ప్రకారం పోయింది. ముందు పది లచ్చల రూపాయల అప్పు తీర్చుకొనింది. మిగిలిన దాంట్లో నలపై అయిదు లచ్చిలు బెట్టి త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాటు తీసుకొని గృహ ప్రవేశం కూడా కానిచ్చేసింది. ఇరై లచ్చలు బెట్టి కేశవాయన గుంటలో సూపర్‌మార్కెట్‌ పెట్టించింది కొడుక్కి. అయిదు లచ్చలు బేంకీలో కట్టుకొనింది. అప్పుడిచ్చింది పెండ్లి సమందాలు జూసే కౌసల్య చేతికి కొడుకు ప్రొఫైల్‌, యిచ్చి, ‘‘చూడు కౌసల్యా. నా కొడుకు తిరప్తిలో త్రిబుల్‌ బెడ్‌ రూంలో కాపరం పెట్నాడు. సూపర్‌ మార్కెట్టు పెట్టి బిజినెస్‌ చేస్తుండాడు. వూళ్లో ఎకరా బూముండాది. ఏమి తక్కవ చెప్పు? బిటెక్కు చదివుంటే వొక బీదరాలినయినా చేసుకుంటాడు. ఆ బిడ్డి చదివుంటే చాలు. నా చదువు తక్కవ కొడుక్కి మంచి చదువు చదివుండే వొక పిల్లను చూసి పుణ్యం గట్టుకోనాయమ్మా!’’ అనే అనింది. పద్దినాల్లో కౌసల్య నుంచి, ‘‘జమునక్కా నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దారనీ అంతా ఫైనల్‌ అయినాక చెబ్దామనీ యీ రోజు చెప్తుండా. నువ్వు కోరిన కొండ మింద వాన కురిసింది పో. అమ్మాయి పుత్తూరు వెంకటపెరుమాళ్లులో ఇంజనీరింగు చేసింది మెకానికల్‌. అమర్రాజాలో యిరై అయిదు వేల జీతం తీస్తుండాది. అమెరికా సమందాలొచ్చినా బిడ్డ కండ్ల ముందరుండాలన్జెప్పేసి యియ్యలా,ఫస్టు ఫస్టు నేను మన పిలగాడి సమందం చెప్తే, ‘నువ్వు నోర్ముయ్యి, పది ఫయిలైనోడికి మేమేటికిస్తాము? మా అమ్మాయి వొప్పందం చదువుకోనుండాల, వుజ్జోగం జెయ్యాల’ అని యీడెగిరి ఆడ దూకినారు. నేనుండుకోని, ‘బలే చెప్పినార్లే. మా పిలగోడికేమి? త్రిబుల్‌ బెడ్రూమ్‌ – అదీ సొంతం, దాంట్లో కాపరం వుంటా, సూపర్‌ మార్కెట్‌ పెట్టుకోని బ్రమ్మాండంగా బిజినెస్సు చేస్తుండాడు. పిలగోడు ప్రభాస్‌ మాదిర్తో వుంటాడు. వుజ్జోగం జేస్తే వొచ్చేది జీతమే. అట్ట కేశవాయనగుంటకు బొయ్‌ చూసేసి రాబోండి, సూపర్‌ మార్కెట్టు ఎట్ట జరగతాదో’ అనేసి కన్వీనియన్స్‌ చేసినా. ఆ అమ్మాయి తండ్రి గూడా సూపర్‌ మార్కెట్‌ చూసి ఫలానా ఫలానా అని చెప్పకుండా పిలగోడితో మాట్లాడి దినానికి ముప్పైయ్యేలకు మించి జరగతా వుండాదని తెలుసుకున్నాడు. నాకు తెలవకుండానే వాళ్ల పిల్లను గూడా తీసక పొయ్‌ పిలగోణ్ణి చూపించినారు. ‘అబ్బాయి సూపర్‌గుండాడని’ అమ్మాయి గూడా గ్రీన్‌ సిగ్నలు యిచ్చేసింది. కడాకు నీకు చెప్పకనే ఆ పిల్ల తల్లీదండ్రీ పిలగోడితో మాట్లాడేసినారు గూడా. ‘మీరు పిల్లనిస్తే పైసా కట్నమొద్దు’ అని పిలగోడు గూడా చెప్పేసినాడు. ఇంగేమి? పండగ జేస్కో. పేరు బలాలు గూడా బాగొచ్చినాయంట. నువ్వు ‘వోకే’ అంటే పద్దినాల్లో మూర్తం. నేను అమ్మాయి గల్లోళ్ల దగ్గిర్నే పదివేలు తీసుకుంటాలే. నువ్వేమీ యియ్యొద్దు. నా మాట అపద్దమైతే నీ కొడుకు సెల్లుకు ఫోను చెయ్‌, గెంటసేపు బిజీ రాకపోతే అప్పుడడుగు. పిలగోడు అమర్రాజా పిల్లతో వో అని మాట్లాడతా వుంటాడు. మొన్నెప్పుడో అపార్ట్‌మెంటుగ్గూడా వొచ్చి పొయ్యిందంట. ఇంగ నీదీ, నీ మొగుడిదే ఆలీసం. నీ కొడుకే నాకు ఫోను జేసి నీకు చెయ్యమన్నాడు. ఫోనులో చాల్నా? మిట్టూరొచ్చి పొమ్మంటావా? చదువు తక్కవ కొడుక్కి వుజ్జోగస్తురాల్ని తెచ్చినా నువ్వు కన్వీనియన్స్‌ కాకపోతే అది నీ కరమ్మ. ఏ సంగతీ రేత్రికి ఫోను చేసి చెప్పు’’ అని ఫోను పెట్టేసింది.

రేత్రి దాకా దేనికి, అప్పుటికప్పుడే ఫోను చేసింది జమునా – డబుల్‌ రైట్‌గా కన్వీనియన్స్‌ అయినాము అని చెప్పేదానికి!

 

*****

చిత్రం: భవాని ఫణి 

 

కొత్త అస్తిత్వాల వాయిస్ చైతన్య కథలు!

 

-కత్తి మహేష్ 

దృక్కోణాలు వాదాలుగా మారి, వాదాలు అస్తిత్వాలుగా ఎదిగి, అస్తిత్వవాదాలు దృక్పధాలుగా స్థిరపడుతున్నాయని కొందరు, డిఫ్యూజ్ అయ్యాయని మరికొందరు అనుకుంటున్న తరుణంలో, తెలుగు కథలో కొన్ని కొత్త గొంతుకలు వినిపిస్తున్నాయి. సామాజిక స్పృహ. అస్తిత్వాల చైతన్యం. ఉద్యమాల స్ఫూర్తితో పాటూ జీవితాన్ని నిశితంగా తరచిచూసే దృష్టితోపాటూ భావుకత తాలూకు ‘టింజ్ ‘ ని కోల్పోకుండా వాక్యాలతో అనుభవాలని, ఆలోచనలని, భావాలనీ కథలుగా విస్తరించి వినిపించే వాయిస్ చైతన్య పింగళిది.

“మనసులో వెన్నెల” తన మొదటి కథా సంకలనం. ఏడు కథల సమాహారం. తనమాటల్లోనే చెప్పాలంటే, ‘ఇంధ్రధనస్సులోని ఏడు రంగుల్లా’ ఏడు కథలు. అన్నీ స్త్రీల కథలే. ఒకటి స్త్రీ మనసుకలిగిన థర్డ్ జెండర్ కథ. ఆధునిక పట్టణాలనుంచీ, అధోలోకాల జీవితాలవరకూ. పల్లెల్లో రైతు కుటుంబాల కష్టాలనుంచీ కన్నతల్లి హృదయంవరకూ ఒక విస్తృతమైన రేంజ్ కలిగిన సంకలనం ఇది.

మార్పుకోసం ఉద్యమాలో, విప్లవాలో అవసరం లేదు. ఒక చిన్న నిరసన చర్య చాలు. సాంత్వన కలిగించే మాట చాలు. మద్దత్తు తెలిపే సూచన చాలు. నమ్మకం కలిగించే శరీర భాష చాలని చెప్పే కథ “ఆశ”. ఒక చిన్న నాటి ఙ్జాపకం రేకెత్తించిన ఆలోచనలు. అప్పట్లో అవగాహన లేక చెయ్యలేకపోయిన పనిని, అలాంటి మరో పరిస్థితికి స్పందించడం ద్వారా పరిహారంగా చెయ్యడం ఈ కథలోని మూలం. రిగ్రెట్ నుంచీ రిడమ్షన్ వరకూ జరిగే ఒక పర్సనల్ ఎమోషనల్ జర్నీకన్నా విప్లవం మరొకటి అవసరం లేదు. ముఖ్యంగా ముగింపువాక్యంలోని హోప్…ఈ కథకి ప్రాణవాయువు.

ఒక ఆత్మహత్య చేసుకున్న రైతు వితంతువు తన పిల్లల భవిష్యత్తుకోసం తీసుకునే నిర్ణయం కథ “గౌరవం”. రైతే రాజ్యానికి వెన్నెముక. అన్నదాత రైతన్న. రైతే రాజు లాంటి రొమాంటిసిజం వెనకున్న హార్డ్ కోర్ నిజాన్ని ఎత్తిచూపే కథ ఇది. కొడుకు రైతు కాకూడదనుకుని మనసారా కోరుకుని ప్రార్థించే రైతు ఒక నిజం. రైతు గొప్పతనం గురించి గ్లోరిఫైడ్ మాటలు చెబుతూ, రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా పట్టించుకోని సమాజంలో మనం భాగమవడమూ ఒక పచ్చి నిజం. ఈ నిజాల్ని అంతే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా చెబుతూనే ఒక షాకింగ్ ముగింపుతో మన చెంప చెళ్ళుమనిపించే కథ ఇది. కొసమెరుపుగా ఒక సెటైర్ చురుక్కుమనేలా తగిలించే కథ ఇది.

mahesh

కేవలం ఉదయిస్తున్న సూర్యుడిని చూడటానికి పొద్దున్నే లేచే భావుకత. మగ తోడు లేకున్నా జీవితంలో స్థిరత్వాన్ని నింపుకున్న వ్యక్తిత్వం. బలహీనమైనవాళ్ళకి ఇన్సెక్యూరిటీని, పరిచయమున్నవాళ్ళకు స్ఫూర్తిని కలిగించే జీవితం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి రేర్ స్త్రీ కథ “తనదే ఆకాశం ” ఈ సంకలనంలో ఇది నా ఫేవరెట్ కథ. ఫెమినిజం మీద అపోహలని థియరిటికల్ సమాధానంతో కాకుండా ఆచరణయోగ్యమైన చిట్కాగా మలిచిన తీరు ఈ కథలో ‘టేక్ హోం మెసేజ్’ లా అనిపిస్తుంది. ప్రేమ- ఆరాధనల్ని, ముద్దు లాంటి భౌతిక ప్రేమ చర్యల్ని సెక్సువల్ కోణం నుంచి మాత్రమే చూసేవాళ్ళకి మరో పార్శ్వాన్ని సేం సెక్స్ అభిమానపు ఎక్స్ ప్రెషన్ గా క్యాజువల్ గా రాయడం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.

మతం మారినా కులం వీడని సమాజంలో, ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగున్నామని చెప్పుకునేవాళ్ళ రిగ్రెసివ్ మనస్తత్వాల కథ “నామాలు”.  ఒక దళిత స్త్రీ, శ్రీవైష్ణవ సాంప్రదాయం ఉన్న ఇంట్లో అనుభవించే వివక్ష, హింస ఈ కథ నేపధ్యం. ఒక స్త్రీగా, ఒక దళిత స్త్రీగా రెండురకాలుగానూ వివక్ష అనుభవించడం కథ విసృతిని పెంచగలిగిందిగానీ, ఘాఢతని కుదించిందనిపిస్తుంది. ఇంతవరకూ తెలుగు కథలో రాని ఒక కోణం, ఒక నేపధ్యం ఆవిష్కరించడం ఈ కథను ఇంపార్టెంట్ కథగా మిగులుస్తుంది.

పని ఒత్తిడి – కుటుంబ భారం రెండూ వర్కింగ్ ఉమన్ చేసే క్రిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ కి రెండువైపులు. అలాంటి ఒక లేడీ లెక్కల టీచర్ సమస్యని, అందరికీ అర్థమయ్యేలా లెక్కల పజిల్స్ తో చెప్పే ప్రిన్సిపల్ కథ “జీవితపు లెక్కలు”. కథలోని పాత్రల్లాగే ఎటువెళుతోందో తెలీకుండా కథ మొదలైనా, చివరికి విషయం అర్థమయ్యి మనమూ ఎంపతీ చూపించడంతో కథ ఉద్దేశం నెరవేరుతుంది. కానీ, చాలా వరకు నీతి కథల్లొ చేసే ‘లాస్ట్ పేరా లెక్చర్” ఈ కథలోనూ కనిపించి కథ కాస్త చిన్నబుచ్చుతుంది.

chaitanya1

మెరిటల్ రేప్ మన సమాజంలో ఎంత సాధారణమో చెబుతూనే, ఎంత సీరియస్ విషయమో తెలియజెప్పే కథ “ఏమో”. అందమైన అనుభూతి, ఇష్తంలేని ‘పని ‘ గా, అసహ్యమైన అనుభవంగా ఎలా మారుతుందో సజెస్ట్ చేస్తూ, సమాధానం లేని ప్రశ్నగా వదిలేసి, మన ముందు పెద్ద ప్రశ్నని లేవనెత్తే కథ ఇది. శైలి, శిల్పం పరంగా కథలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, లేవనెత్తిన అంశం కారణంగా ఈ కథ గుర్తుండిపోతుంది.

మగ శరీరంలో ట్రాప్ అయిన ఒక స్త్రీ మనస్కుడి కథ “నేనూ ఆడదాన్నే”. విటుల కోసం వెయిట్ చేస్తున్న ఒక హిజ్రా వేశ్య దగ్గర మొదలైన కథ, ఒక లైఫ్ స్కెచ్ ని ఆవిష్కరిస్తుంది. ఎందరో థర్డ్ జెండర్ జీవితాల్ని, వాళ్ళ విఫల ప్రేమల్ని, అర్థవంతంగా కాకుండా ఆగిపోతున్న జీవితాల్ని గుర్తుతెస్తుంది. ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ గా రికార్డ్ చేస్తుంది. అందుకే ఈ కథ ముఖ్యం.

“పచ్చగోళీ” కథ ఒక మాతృహృదయపు ప్రేమ, ఆతృత, ఆదరణ, నిరాదరణ కథ. నిరాదరణకు గురైనా నిరంతరం ప్రేమించే తల్లి కథ. బిడ్డల సుఖం కోసం, తన దుఖాన్ని దిగమింగుకునే సహజమైన బాధకథ. కథ చదివాక మనసు బరువెక్కక మానదు.

కథా రచయిత్రిగా ఇవన్నీ దాదాపు మొదటి ప్రయత్నాలే కాబట్టి క్రాఫ్ట్ పరమైన సమస్యలు. అప్పుడప్పుడూ ఫోకస్ కోల్పోయే కథనరీతులు. శైలి పరంగా ఇంకా రాని పరిణితి. శిల్పంపరంగా ఉన్న లోటుపాట్లూ భూతద్దంతో చూస్తే చాలా కనిపించినా, కథల్లోని విషయవస్తువుల బలం, ఎప్పుడూ వినని, ఎక్స్ ప్లోర్ చెయ్యని కోణాల ఆవిష్కరణ ఈ కథల్ని నోటిస్ చేసేలా చేస్తాయి. కొన్నింటిని చర్చించేలా, మరికొన్నింటిని పదిలంగా జ్ఞాపకం ఉంచుకునేలా చేస్తాయి.

ఇలాంటి డైవర్సిఫైడ్ గొంతుక అవసరం. ఇలాంటి కథలు అవసరం.

*

 

కుంభమేళాలో రహస్యోద్యమం

సృష్టాది శాంతి

-నామాడి శ్రీ‌ధ‌ర్‌

వ‌రిచేను మ‌ధ్య‌న ఒక్క‌డినీ
ఓ హ‌రిత వృక్షాన్న‌య్యాను
పువ్వుల‌కి బదులుగా నేను
నిలువెల్లా మిణుగురుల్ని తాల్చాను

ప‌సుపు రంగు త‌ళుకుతో
ఒకింత ఆరుతో ప్ర‌కాశించే
కుసుమ‌ద‌ళాల‌కి ప్రాణం పోశాను

చుక్క‌ల కాంతిఛ‌త్ర‌మ‌ల్లే
ఈ చెలికాడు చేత‌ప‌ట్టిన‌
జాజ్వ‌ల్య‌మాన‌మైన నీడ‌ప‌ట్టుకి
ఆ జీబు రాతిరిలోంచి నువ్వు
న‌వ్వుతో చేరువ‌గా ప్ర‌వేశించావు

చీకటి చినుకు ఒక్క‌టి కూడ‌
నీ మీద‌న కుర‌వ‌నివ్వ‌క కాచిన‌
చిటారు కొమ్మ‌ల గుబురుప్రేమ వేపు
అవే చిరంత‌న అమాయ‌క క‌ళ్ల‌తో
అప్ప‌టిక‌ప్పుడు ఏదో సృష్టాది శాంతి
మ‌న‌సుకి అందుతున్న‌ట్టుగా చూశావు

*

వోల్టేర్ హృదయ ప్రతిబింబం.. కాండీడ్

KONICA MINOLTA DIGITAL CAMERA

 

‘ఒక మనిషిని అతడు చెప్పే సమాధానాలను బట్టి కాకుండా అతడు వేసే ప్రశ్నలను బట్టి అంచనా కట్టు’ అని అంటాడు ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్(1694-1778). ప్రశ్న లేనిదే ప్రగతి లేదని అతని ప్రగాఢ విశ్వాసం. అందుకే అతడు ప్రతిదాన్నీ ప్రశ్నించాడు. మనిషిని, మతాన్ని, దేవుణ్ని, దెయ్యాన్ని, రాజును, రాజ్యాన్ని, యుద్ధాన్ని, న్యాయస్థానాన్ని.. దేన్నీ వదల్లేదు. ప్రతిదాన్నీ హేతువనే గీటురాయిపై రుద్ది మంచిచెడ్డలను విచారించాడు. మంచిని తలకెత్తుకున్నాడు. చెడ్డను నరికి పోగులు పెట్టాడు.

ప్రశ్నే ప్రాణంగా బతికిన వోల్టేర్ తన విశ్వాసాలపై ఎక్కడా రాజీపడలేదు. జైలుకు వెళ్లాడు, ప్రవాసానికి వెళ్లాడు. కానీ ప్రశ్నదీపాన్ని ఎన్నడూ కొడిగట్టించలేదు.  ‘నీ మాటతో నేను ఏకీభవించను. కానీ ఆ మాట చెప్పేందుకు నీకున్న హక్కు కోసం కడవరకు పోరాడతా ’నంటూ భావప్రకటన స్వేచ్ఛ కోసం వోల్టేర్ తాత్విక యుద్ధయంత్రంలా పనిచేశాడు. నిజానికి ఈ మాటలు అతడు ముక్కస్య ముక్కస్య అనకపోయినా.. అభిప్రాయాల కారణంగా నీ పొరుగువాడిని తగలబెట్టొద్దు అని అన్నాడన్నది మాత్రం నిజం.

 

తన భావవిప్లవంతో యూరప్ సమాజాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ ఉర్రూతలూగించిన వోల్టేర్ మనసుకు అతని సుప్రసిద్ధ వ్యంగ్య నవలిక ‘కాండీడ్’(1759) అద్దం పడుతుంది. మనిషి మేధను, శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేసే కర్మసిద్ధాంతం లాంటి నిరర్థక ఆశావాదాన్ని(Leibniz’s Optimism) వోల్టేర్ ఈ రచనతో చావుదెబ్బ తీశాడు. స్వేచ్ఛ కోసం అతడు పడ్డ తపనతోపాటు మతాల అసహనం, ఆధిపత్యం, హింస, ఆత్మలోకంలో దివాలా, కపటత్వం, దోపిడీ, పీడనలపై అతడు లేవదీసిన తిరుగుబాటు అన్నీ ఇందులో హాస్యబీభత్సంగా దర్శనమిస్తాయి. కత్తికంటే పదునైన వెటకారం నవలిక సాంతం అంతస్సూత్రంలా సాగుతూ మానవజాతి నానా అవలక్షణాలపై అడుగడుగునా ఉమ్మేస్తూ పోతుంది. అందుకే అచ్చయిన ఏడాదే ఫ్రెంచి పాలకులు నిషేధం వేటు వేశారు. 20వ శతాబ్ది తొలి దశకాల్లోనూ అమెరికా వంటి ఘన ప్రజాస్వామిక దేశాల్లో సైతం దీనిపై నిషేధం అమలైందంటే ఇది ఎంత ‘ప్రమాదకర’మో అర్థం చేసుకోవచ్చు. కాండీడ్ ను 20వ శతాబ్ది ఘోరాలకు, అసంబద్ధతకు అతికినట్టు అన్వయిస్తూ 1960లో వచ్చిన ఫ్రెంచి సినిమా ‘Candide ou l’optimisme au XXe siècle’ ఆ నవలికకు ఇప్పటికీ ఉన్న ప్రాంగికతకు నిదర్శనం. ‘వోల్టేర్ కాండీడ్ తో తన అన్ని రచనల సారాంశాన్ని మనముందుంచాడు.. అతడు నిజంగానే హాస్యమాడుతున్నాడా? లేదు.. ఆక్రోశిస్తున్నాడు.. ’ అని అంటాడు ఫ్రెంచి రచయిత ఫ్లాబర్.

వోల్టేర్ కాండీడ్ లో దునుమాడిన వికృతం, అన్యాయం, అసత్యం, అసంబద్ధత, కక్ష, కార్పణ్యం ఇప్పటికీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతా మన మంచికేనన్న భ్రమలను పాలకులతోపాటు ‘మేధావులూ’ మరింత పెంచుతున్నారు. హేతువును, ప్రశ్నించే గొంతుకలను ఉత్తరిస్తున్నారు. ఇప్పకికే భ్రష్టుపట్టిపోయిన మతం, చరిత్ర, రాజకీయాలు, కళలు, సాహిత్యం.. వంటి అనేకానేక ఆవరణలను ’కన్నుగానని వస్తుతత్వం’తో మరింత కలుషితం చేస్తున్నారు.

తలకిందులుగా వేలాడుతున్న సమాజాన్ని సవ్యంగా నిలబెట్టేందుకు వర్తమానానికి ఒక వోల్టేర్ కాదు లక్ష మంది వోల్టేర్లు కావాలి. ఒక కాండీడ్ కాదు లక్ష కాండీడ్ లు కావాలి. ఇది అత్యాశే కావచ్చు కానీ అవసరమైన అత్యాశ. దానికి ఊపిరులూదడానికి కాండీడ్ ను ఒకసారి తిరగేద్దాం వచ్చేవారం నుంచి సారంగలో..

*

దారులు వేద్దాం….

-కేక్యూబ్ వర్మ 
ఇప్పుడు మూసుకుపోతున్న దారులను
తెరచే పని చేయాలి
ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ
గోడలు కడుతున్నాడు వాడు
ఇప్పుడు నదీ ద్వారాలను స్వేచ్చగా
తెరచుకోనివ్వాలి
ఒక్కో పర్వతాన్నీ పిండి చేస్తూ వాడు
గుండెల్ని తవ్వి ఎత్తుకు పోతున్నాడు
పర్వత పాదాలతో పాటు శిఖరాన్ని
నిబ్బరంగా ఎదగనివ్వాలి
నిటారుగా దారు వృక్షాలతో కలకలలాడుతున్న
పచ్చని అడవిని నరుక్కుపోతున్నాడు వాడు
నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
అందుకునేలా పాతుకోనివ్వాలి
సాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
అలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు
గర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
తీరందాకా చేరనివ్వాలి
నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు
నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి.
*

అప్పుడు మరణం …

Painting: Akbar

Painting: Akbar

-భాను కిరణ్ కేశరాజు 
జీవించడం
నేను నా అనుభూతులూ, నా స్పందనలూ, నా అనుభవాలూ
ఆరాటాలు , పోరాటాలూ, ప్రేమలూ, ద్వేషాలూ, సుఖాలూ, దుఖాలూ సమస్త జ్ఞాపకాలూ !
ఇదేగా జీవితం…జీవించడం-
మరణం
మనకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం
శాశ్వతమని మనం తలపోసే వాటికి దూరంగా
రెప్పపాటులో  ఎక్కడికో తెలియని లోకాల్లోకి పయనం-
చేతనలో…..అచేతనలో
మరణమన్న  భయాన్ని ముక్కలు  చేస్తే
లోలోన….
అచేతన జారీ చేస్తున్న ఆజ్ఞలను
పక్కకి నెట్టేసి
బ్రతుకు భయం..చావు భయం
ఈ ఆరాటాలూ, పోరాటాలూ, సంఘర్షణలూ
అన్నీ మాయమయ్యి
అన్నీ శాశ్వతంగా కొనసాగాలనే ఆలోచన ఆపి వేసిన మనస్సు
ఖాళీ కుండలా
జీవించటం, మరణించటం ఒక్కటయినా  ఆ అనుభూతి
అద్బుతమయిన ఆ క్షణం
అజేయమయినది నా ఉనికి లోకి వచ్చిన ఆ క్షణం
అప్పుడు మరణం
ఒక అద్బుతమయిన ఘడియ !
ప్రాణంతో ఉండటమంత  శక్తివంతమయినది!!

*

అడోనిస్ ద్విపదులు

 

ఆదియందు పదం కాదు వుండింది; ప్రవాసం అని హఠం చేస్తున్న అరబ్ కవి అడోనిస్. సిరియన్ దేశస్థుడూ, పారిస్ నివాసి.  ‘నేను రాస్తున్న భాషే నన్ను ప్రవాసిని చేసింది’ అనే అడోనిస్ దైనందిన పౌర నరకంలో కన్నా అనుదిన ప్రవాస నరకంలో స్వాంతన పొందుతున్నాడు. మాతృత్వం, పితృత్వం, భాషా కూడా ఈతనికి ప్రవాసం మిగిల్చిన తోబుట్టువులే.

ప్రశ్నను పరిచితం చేసే మరో శేషప్రశ్నే కవనం అని ప్రగాఢంగా నమ్మే ఈ అరబ్ గేయకర్త పరోక్షం, ప్రవాసం కలిపి అస్తిత్వాన్ని రూపకల్పన చేస్తాయని నమ్ముతాడు. తన కవిత్వం నాందీ ప్రస్తావన లేని నిరింతర శుభ్ర నాందీ వచనమ్ గానే భావిస్తూ కవనకదనం సాగిస్తూ వున్నాడు. 1930లో పుట్టిన అద్ హో నీస్ (అదీ ఇతని పేరు ఉచ్చారణ) మన దేశ  స్వాతంత్ర్య వత్సరాన, 1947లో, తన తొలి కవితను అచ్చులో చూసి మురిసాడు. తక్కిన సమాచారమంతా గూగుల్ చేస్తే ఇతనికి ఎందుకు 1988 నుంచీ నోబుల్ సాహిత్య పురస్కారం రాకుండా నిలిచిపోయిందో అవగతమవుతుంది కొంత వరకు.

 
##

ప్రవాసం

చెట్టుల్లా
నదుల్లా
పేదల్లాగే
సూర్యుడి తయారీని
నేనూ
*
ప్రవాసం ఎలా కల్పించాడో
అడగండి సూరీడినే
*
అక్షరమక్షరంగా
ప్రవాసం
రహదారుల్లో
వెదజల్లేసింది నన్ను
*
ప్రవాస భాషలు
కావు
సూర్యుడి భాషలు
*
అందుకే నేను ద్రిమ్మరిని
ప్రవాసం  నా అస్తిత్వం
##

వనంలో

నను
వదిలేయండి
వొంటరిగా
*
పక్షులు వాలనీయ్
రాళ్ళపై రాళ్ళు పేర్చుకోనీ
వొంటరిగా వదిలేయండి
నన్ను
*
వృక్షాల ఊరేంగిపుల నడిమ
నే నడిచే వేళ
వీధుల కనురెప్పలు తెరిపిస్తాను
శాఖల ఛాయల్లో
పరాయి ప్రభాతాలు నాకు గురుతు
పగలు నా రహస్యాలకు బిరడా బిగించనీ
నను మాత్రం
వొదిలేయండి
వొకింత
వొంటరిగా
వొక కాంతి
ఎన్నడూ నను నా గూటికి
చేరవేస్తూనే వుంది
వొక గొంతుక
పలుకుతూనే వుంది.

తర్జుమా: అనంతు 

*

చలో అమెరికా

 

 

Prajna-1“రెండు సార్లు వెళ్లొచ్చాము. చాలు శైలూ, నాకు బోర్ అక్కడ. కావాలంటే నువ్వు వెళ్ళిరా” కుమార్ పేపర్ తిరగేస్తూ గట్టిగా అని ‘చాకిరీ చెయ్యాలి వెళ్ళి, ఎవడు చేస్తాడు’ తనలో తనే గొణుక్కున్నాడు.

“పాపం పిల్లలు అడిగారండీ, వెళ్లొద్దాము. రెండే నెలలు” శైలజ అంది.

“ఎందుకు? పాచి పనులకా? నేను రాను బాబోయి. ఈ సారి నన్ను ఫోర్స్ చెయ్యద్దు శైలజ. నేను అక్కడ బ్రతకలేను. నిన్ను వెళ్లమంటున్నా కదా” అని అప్పుడే ఇంటికి వచ్చిన చెల్లెలిని పలకరించి సిగరెట్ తాగటానికి బయటకి వెళ్లిపోయాడు.

“ఏంటి వదినా, అన్నయ్య కోపంలో ఉన్నట్టున్నాడు? ఏం జరిగింది?” గాయత్రి పచ్చడి గిన్నె టేబుల్ మీద పెడుతూ అడిగింది.

“ఆకాష్ వాళ్ళు రమ్మన్నారు శాన్ ఫ్రాన్సిస్కో కి. ఈయన అక్కర్లేదు అంటున్నారు. రెండు సార్లకే అమెరికా అంటే మోజు పోయింది ఈయనకి” శైలజ వాపోయింది. కానీ కుమార్ నో అన్నందుకు ఆమెకి కూడా నిశ్చింతగా ఉంది.

“అదేంటి వదినా, ఒక్కగానొక్క కొడుకు, అమెరికా లో ఉంటున్నాడు. వాడి దగ్గరకి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు ట అన్నయ్య? ఇప్పుడు అయితే మా అల్లుడు వాళ్ళు ఇక్కడికొచ్చేశారు గాని, వాళ్ళు ‘న్యూ జెర్సీ’ లో ఉన్నప్పుడు మేము ఆరు సార్లు మాత్రమే వెళ్ళొచ్చాము అంతే! కాని మా వారికి మాత్రం రెండు సార్లకే బోర్ కొట్టేసింది. మగవాళ్ళకి తోచదు అక్కడ. నేను రేపు మళ్ళీ వచ్చి సర్ది చెప్తానులే అన్నయ్య కి” అని గాయత్రి హామీ ఇచ్చి వెళ్లిపోయింది.

రాత్రి భోజనం చేశాక,  టి‌వి చూస్తున్న కుమార్ దగ్గరకొచ్చి “కుమార్ గారూ” అని నవ్వింది శైలజ.

“మళ్ళీ మొదలెట్టకు. నాది ఫైనల్ డెసిషన్…” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, శైలజ “నాకు కూడా వెళ్లాలని లేదండి” అని మెల్లిగా చెప్పింది.

“అదేంటి? నువ్వు హుషారుగా వెళ్దాము అంటున్నావు అని అనుకున్నానే నేను! కాదా? ఏమైంది?” కుమార్ టి‌వి ఆపేసి, భార్య వైపు చూస్తూ అడిగాడు.

“నాక్కూడా బోర్ అక్కడ. ఇక్కడే మన పనులు చేసుకుంటూ హాపీ గా ఉందాము. ఇకపై మన దగ్గరకే అప్పుడప్పుడు పిల్లలు వస్తారు” అని చెప్పేసి, లోపలకెళ్లి పడుకుంది.

ఈ హటాత్ పరిమాణానికి ఎలా స్పందించాలో తెలియక కుమార్ మళ్ళీ టి‌వి పెట్టుకొని చూశాడు.

పడుకున్నమాటే కానీ, నిద్ర పట్టడంలేదు. పొద్దున గాయత్రి మాటలు గుర్తు తెచ్చుకుంది. అమెరికా కి వెళ్ళడం ‘ఆరు సార్లు’ అన్నది ‘మాత్రమే’ నా అని ఆశ్చర్యపోయింది శైలజ. ఒకప్పుడు తాను కూడా ఇలాగే అమెరికా అమెరికా అని ఎగురుకుంటూ వెళ్లింది. మొదటి సారి బానే ఉంటుంది. అది కూడా బయటకి వెళ్తేనే. తర్వాత నుండి ఇంట్లోనే పడుంటూ ఎక్కడలేని డిప్రెషన్, కోపం, చిరాకులు మన వశమవుతాయి. అలా ఆలోచిస్తుండగా శైలజ తొలి అమెరికా ప్రయాణం, ఆ విషయాలు గుర్తుతెచ్చుకోవటం మొదలుపెట్టింది.

 

మూడేళ్ళ క్రితం, శాన్ ఫ్రాన్సిస్కో

“ఫ్లైట్ లాండ్ అయింది, లేవండి లేవండి బయలుదేరుదాము”, అంటూ అరుస్తూ కాబిన్ బాగేజ్ తీస్తూ శైలజ అంటోంది.

“ఇదేమి ఎర్ర బస్సు కాదు. ఆపిన వెంటనే రై రై మంటూ దిగిపోవడానికి. ఇప్పటిదాకా ఫ్లైట్ లో ఇది బాగుంది, అది బాగుంది అన్నావు. ఇప్పుడేమో ఎప్పుడు దిగిపోదామ అన్నట్టున్నావు. మరీ చిన్నపిల్లలగా చేస్తున్నావు శైలూ, అందరూ మనల్నే చూస్తున్నారు” చుట్టూరా చూస్తూ ఇబ్బందిపడుతూ కుమార్ అన్నాడు.

“ఎయిర్ బస్ అయినా, ఎర్ర బస్ అయినా ఒకటే నాకు. త్వరగా దిగండీ, ఆకాష్ వాళ్ళు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు” అంటూ హాండ్ బాగ్ ని భుజం మీద సర్దుకుంటూ శైలజ అంటోంది.

శైలజ ని కుర్చీలోకి లాగి, “ఆగుతావా, ఎందుకంత ఖంగారు, మెల్లిగా” అన్నాడు కుమార్.

ఇలా వీళ్ళ గిల్లికజ్జాలతో ఫ్లైట్ దిగటం, ఎయిర్ పోర్ట్ లో బాగేజ్ పికప్ జరిగి, మొత్తానికి అర్రైవల్స్ బయటకొచ్చారు. అక్కడ రోడ్ పక్కన కార్ ఆపి, షార్ట్స్ లో నించుని ఉన్న ఆకాష్ ని చూసి బాగ్ వదిలేసి శైలజ పరిగెత్తబోయింది. ఈ లోగా వేగంగా ఒక కార్ రావడం, శైలజ ని కుమార్ వెనక్కి లాగటం, కార్ వెళ్లిపోవడం అన్నీ ఒక క్షణంలో జరిగిపోయాయి. కొంచముండుంటే ఆ కార్ కింద పడుండేది శైలజ.

“వెధవ ఖంగారు నువ్వును” అని కుమార్ గట్టిగా అరిచాడు.

వాళ్ళ దగ్గరకొచ్చి, ఇద్దరినీ హగ్ చేసుకొని, “వాడేవాడో ఈ లేన్ లో తప్పుగా వచ్చాడు నాన్నా! అమ్మది తప్పు కాదు” ఆకాష్ అన్నాడు.

“చూసారా, అమెరికా నన్ను ఏమి చేయదు” అంటూ గొప్పగా చెప్పి, కొడుకుని ముద్దాడి, “ఏవిట్రా ఈ నిక్కర్, చక్కగా పాంట్ వేసుకొచ్చుగా” అని శైలజ అడిగింది.

“నిక్కరూ, లాగూ కాదమ్మా! షార్ట్స్ ఇవి. సమ్మర్ లో ఇవి కాకపోతే ఏం వేసుకుంటాము మరి, పద పద” అని అన్నాడు.

కార్ లో లగేజ్ సర్ది, కుమార్ ని ముందర కూర్చోమని చెప్పి, ఇంటికి బయలుదేరారు.

“ఇక్కడ సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి నాన్నా, లేదంటే కాప్స్ ఆపి టికెట్ ఇస్తారు”

“కాప్స్ అంటే?” బయట ఎత్తైన కట్టడాలు, భవనాలు చూసి మురిసిపోతూ శైలజ అడిగింది.

“పోలీసులు శైలూ, అందుకే ఆ సీరియళ్ళు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇంగ్లిష్ సినిమాలు చూడమనేది” కుమార్ అన్నాడు.

ఒక ఇరవై నిముషాల ప్రయాణం అయ్యాక ఇల్లు చేరుకున్నారు.

“ఒరేయి ఫొటోల్లో పెద్దగా ఉంది ఇల్లు, ఇప్పుడేంట్రా చిన్నగా కనిపిస్తోంది” అడిగింది శైలజ.

“అమ్మా, ఫోటోలో మొత్తం బిల్డింగ్ చూసావు. మనది ఒక అపార్ట్మెంట్ అంతే. రెండేళ్లలో పెద్ద ఇంట్లోకి మూవ్ అవుతాము” అంటూ లగేజ్ ని ఇంట్లోకి తీసుకొచ్చాడు.

“రండి అత్తయ్యా , రండి మావయ్యా… ఎలా ఉన్నారు ? ఎలా జరిగింది జర్నీ ?” అని వచ్చి ప్రియ ఆప్యాయంగా అడిగింది.

“బాగా జరిగిందమ్మా” అని కుమార్ అన్నాడు.

“యా. సూపర్. నాకు అమెరికా బాగా నచ్చేసింది. నువ్వు బాగున్నావా ప్రియా?” అనుకుంటూ వచ్చి కోడలిని హగ్ చేసుకుంది.

“కొంచం ఓవర్ గా లేదు? వచ్చి గంట కూడా అవ్వలేదు, అప్పుడే ఎలా నచ్చేసింది ఊరు?” కుమార్ విస్తుపోతూ అడిగాడు.

“మీరు ఊరుకోండి. నాకు నచ్చేసింది అంతే. ప్రియా పద, ఆకలి వేస్తోంది. ఏం వండావు?” అనుకుంటూ లోపలికి వెళ్లింది శైలజ.

“ఆకాష్, మీ అమ్మ తో జాగ్రత్తగా ఉండరా, ఇక్కడే ఉండిపోతా అంటుందేమో రేపే” అని వెటకారంగా కుమార్ అన్నాడు.

“ఏంటి నాన్న మీరు కూడా”

“నిజంగా రా. అమెరికా ప్రయాణం అనగానే చూడు ఎన్ని చూడిధార్ లు కొనుక్కుందో. ఇండియా లో వేసుకొమంటే ఛీ, థూ అనేది. ఇక్కడకి అనగానే వేసుకొచ్చేసింది”

“ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటారా నాన్నా, పదండి ఫ్రెష్ అవండి”

—-

ఆ రోజంతా ఇంట్లోనే గడిపారు. టి‌వి లో తెలుగు ఛానెల్స్ రావట్లేదు అని శైలజ తెగ ఫీల్ అవడంతో, మరునాడే ఆ ఏర్పాట్లు చేశాడు ఆకాష్.

“ఆ బాటిల్స్ ఏంట్రా ఫ్రీడ్జ్ మీద?” శైలజ ఆశ్చర్యంగా అడిగింది.

“విస్కీ, వోడ్కా అమ్మా” అని వాళ్ళ నాన్న వైపు తిరిగి ‘అమ్మ లేనపుడు తాగేసేయ్’ అన్నట్టు కన్నుకొట్టాడు.

“అన్నీ మందేనా? అన్నున్నాయి ఏంటి? ఏంట్రా తాగుబోతువి అయిపోయావా? ప్రియా ఏంటిది” అని ఖంగారుగా అడిగింది.

“లేదు అత్తయ్యా. నెలకి ఒక సారి అంతే, అది కూడా పార్టీ ఉంటేనే. డోంట్ వర్రీ” అని ప్రియ హామీ ఇచ్చింది.

పడుకునే ముందు, కుమార్ తో శైలజ “యేవండి, మీరు స్నానం చేశారా ఇందాక?” అని అడిగింది.

“యా చేశాను. ఏమి?”

“నేను సరిగ్గా చేయలేదు”

“అంటే?” కన్ఫ్యూషన్ లో అడిగాడు కుమార్.

“ఆ టబ్ లో నాకు చేయడం రాలేదు. ఏది తిప్పితే వేడి నీళ్లొస్తాయో తెలియలేదు. చల్లనీళ్ళతో కానిచ్చేశాను. పైగా ఆ టబ్ లో ఇరుకుగా ఉండింది”

“ఓహో మనం అగ్రహారం బాచ్ కదా. అందుకే అమెరికా అనగానే లగెత్తుకొని వచ్చేయటం కాదు. కొంచం రీసెర్చి చేయాలి. అయినా, ఇది నీ కొడుకు ఇల్లే కదా? ఒక కేక వేసి అడిగుండొచ్చు కదా?”

“ఏమో నండి. నాకు మొహమాటం. రేపు చూపిద్దురు”

“అలాగలాగే పడుకో. రేపు పొద్దునే లేచి గుడికి వెళ్ళాలి”

—-

మరునాడు ఆదివారం. ఉదయం వాళ్ళిద్దరినీ దగ్గరిలో ఉన్న గుడికి తీసుకువెళ్లాడు ఆకాష్. అన్ని దేవుడి విగ్రహాలు వరుసగా ఒక రూమ్ లో ఉన్నాయి.

“ఇది గుడెవిట్రా నా మొహం, ముక్కోటి దేవతలనీ ఒకే చోట ఉంచేస్తే గుడి అంటారా?” ఆశ్చర్యపోతూ అడిగింది శైలజ.

“ఇక్కడ గుళ్ళు ఇలాగే ఉంటాయమ్మ”

“ సైలెంట్ గా దణ్ణం పెట్టుకో శైలజ” అని కుమార్ కసురుకున్నాడు.

గుడి నుండి కార్లో బయలుదేరి, “ఇప్పుడు మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనే చోటకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది ప్లేస్, అక్కడకి ప్రియ డైరెక్ట్ గా వచ్చేస్తుంది” అని ఆకాష్ చెప్పాడు.

 

గోల్డెన్ గేట్ పార్క్ లో కాసేపు తిరిగేశాక లంచ్ కి అక్కడ దగ్గరలో ఉన్న పిజ్జా పాలస్ కి వెళ్లారు.

“ఏది పడితే అది ఆర్డర్ చేయకు అమ్మా. ప్రియ నీకు ఏది వెజిటేరియనో చెబుతుంది. చూసి తీసుకో. నేను, నాన్నా ఇప్పుడే వస్తాము” అని ఆకాష్ చెప్పేసి వెళ్లిపోయాడు.

“అత్తయ్య, ఇక్కడ చీజ్ పిజ్జా మాత్రమే ఉంది వెజిటేరియన్ లో. తెచ్చేయనా?” ప్రియ మెను చూస్తూ అడిగింది.

“అలాగే కానీ, వీడు సిగరెట్లు మానలేదా? ఎక్కడికి వెళ్లారు ఇద్దరూ?” శైలజ విసుగ్గా అడిగింది.

“అదేమీ లేదు అత్తయ్యా, అలా రెస్ట్ రూమ్ కి వెళ్లారు అంతే” ప్రియ కవర్ చేసింది.

 

శైలజ చుట్టూరా చూస్తోంది, స్వదేశీలు ఎవరైనా కనిపిస్తే ఇంకా ఎగా దిగా చూస్తోంది.

“ఎంటమ్మా అలా ఊరిదానిలాగా చూస్తున్నావు ? అలా చూడకూడదు” అని లో గొంతుకతో తిడుతున్నాడు ఆకాష్, అప్పుడే అక్కడకి వచ్చి.

“ఇదెక్కడి చోద్యం రా ? నా కళ్ళు నా ఇష్టం” అని గట్టిగా అరిస్తే, తెలుగు వాళ్ళయ్యుంటారు పక్కవారు, వాళ్ళు శైలజ వైపు వింతగా చూశారు.

“చూడు ఎలా చూస్తున్నారో అందరూ మన వైపు, ప్లీజ్ అమ్మా కొంచం జాగ్రత్తగా ఉండు” అని ఆకాష్ కోప్పడ్డాడు.

ఆ మాటల్ని అంతగా పట్టించుకోలేదు శైలజ. పిజ్జా రాగానే మొదటి ముక్క నోట్లో పడగానే బయటకి ఉమ్మేసి ఛీ అని అంది.

“ఏమైంది అత్తయ్యా?” ప్రియ అడిగింది.

“ఏంటిది, ఇంత చీజ్ ని ఎలా తింటారు ! నాకు నచ్చలేదు. నాకు వేరే ఏదైనా కావాలి” అని పిజ్జా ఉన్న ప్లేట్ ని పక్కకి తోసేస్తూ శైలజ చెప్పింది.

మిగితా ముగ్గురికి ఏం చెయ్యాలో అర్ధంకాలేదు. ఆకాష్ చెప్పగా, అందరూ పిజ్జా ని పడేసి కొంచం దూరంలో ఉన్న ఇండియన్ రెస్టారంట్ కి వెళ్లారు.

“ఏవిట్రా ఇది? మసాలా దోస కాదు ఇంకేదో ఇది” దోస చింపి తింటూ శైలజ ఆకాష్ తో అంటోంది.

ప్రియ, ఆకాష్ లు సైలెంట్ గా తినేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండియన్ రెస్టారంట్ కి వచ్చి చాలా కాలం అయింది.

“శైలూ, ప్రతిదానికి వంకలు పెట్టకు. ఇది ఇండియా కాదు కదా, ఇక్కడి వంటలు బాగుంటాయేమో ఎవరికి తెలుసు? ఇదైనా దొరికింది తినటానికి సంతోషించు” అని కుమార్ అన్నాడు.

“అమ్మా, నాన్నా మీరు అంత గట్టి, గట్టిగా మాట్లాడకండి. ఇక్కడ అది పద్ధతి కాదు. ప్లీజ్” అని ఆకాష్ అన్నాడు.

“ఏవిట్రా నువ్వు పద్ధతుల గురించి మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు ఏమయ్యాయి ఏంటి ఇవి?” అని కుమార్ అనగానే అందరూ నవ్వేశారు.

అందరూ తినేశాక “నాకు ఇయ్యి అమ్మా , నీ ప్లేట్ పడేస్తాను నేను” అని ఆకాష్ అన్నాడు.

“మనం పడేయటం ఏంటి? సర్వర్ వచ్చి క్లీన్ చేయడా?”

“లేదు. మనమే చేయాలి”

“ఎంత బాగుందో అమెరికా, అన్నీ మనమే చేసుకోవాలి” అని శైలజ అనగానే, ఆకాష్ తనలో తనే నవ్వుకున్నాడు.

 

మరునాడు సండే అవ్వడంతో అందరూ ఆలస్యంగా లేచారు. శైలజ తీసుకు వచ్చిన కొత్తవకాయ అండ్ అన్నం తో డైరెక్ట్ గా లంచ్ కానిచ్చేశారు. సాయంకాలం ఆకాష్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. కాసేపు కాలక్షేపం చేసేసి ఇంటికొచ్చారు.

“అమ్మా, నాన్నా – మీరు ఉంటున్న మూడు వారాల ప్లాన్ చెప్తాను వినండి. నేను, ప్రియ లాస్ట్ వారం లీవ్ పెట్టాము.  రేపటినుండి మీరు ఇక్కడ సిటి టూర్ కి వెళ్తారు. ముందుగా ప్లాన్ చేసినట్లుగానే సెకండ్ వీక్ హారిక వాళ్ళ ఊరు న్యూ జెర్సీ వెళ్ళండి, అక్కడ సిటి టూర్. లాస్ట్ వారం మాతో గడపండి. ఏం కావాలన్నా కొనుక్కోండి, నా క్రెడిట్ కార్డ్ తీసుకువెళ్ళండి”

“కార్డ్ ఏమి అక్కర్లేదు లే. ప్లాన్ మాత్రం బాగుంది రా. మేము ఎంజాయ్ చేస్తాములే” కుమార్ నవ్వుతూ చెప్పాడు.

ప్లాన్ ప్రకారమే మొదటి రెండు వారాలు శాన్ ఫ్రాన్సిస్కో లో నూ, హారిక, అంటే గాయత్రి కూతురు, ఉండే న్యూ జెర్సీ లోనూ గడిచిపోయాయి. అంటే పొద్దునే లేవటం, తినేసి బస్ ఎక్కటం, సిటి టూర్ బస్ వాడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడకి వెళ్ళడం, ఆ ప్రదేశాలు చూడటం, ఇంటికి రావటం, కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పటం, పడుకోవటం. ఇది రెండు వారాలు జరిగిన తంతు. శైలజ కి బయట తిండి నచ్చక రోజు ఇంట్లోనుండి డబ్బా పట్టుకెళ్ళేది. ఒక్క ఫుడ్ విషయంలో తప్పితే మిగితావి అన్నీ ఎంజాయ్ చేసింది శైలజ. అసలే పల్లెటూరి వాతావరణం లో పుట్టి పెరిగింది. అమెరికా అంటే మోజు. కుమార్ మాత్రం పెద్దగా ఎగ్జైట్ అయ్యేవాడు కాడు. ఎప్పటిలాగానే బాలన్సెడ్ గా ఉండేవాడు. ఇద్దరూ న్యూ జెర్సీ నుండి తిరిగివచ్చేశారు, ఆఖరి వారం రానే వచ్చింది.

 

“ఆకాష్, నేను కొన్ని కొన్నూక్కోవాలి. లిస్ట్ ఇస్తాను” అంటూ ఒక పెద్ద పేపర్ తీసి ఇచ్చింది శైలజ.

“అత్తయ్యా ఎలాగో మనం షాపింగ్ కి వెళ్తున్నాము. మీరు ఇండియా కి పట్టుకెళ్ళాల్సినవి ఇవాళే కొనుక్కోండి” ప్రియ చెప్పులు వేసుకుంటూ చెప్పింది.

“అవును. ప్రియ కి ఎక్కడ చీప్ గా ఉంటాయో తెలుసు అమ్మా. మీ ఊరి బాచ్ కి అవి ఇస్తే చాలు” లిస్ట్ తిరిగిచ్చేస్తూ అన్నాడు ఆకాష్.

“ఏంట్రా ఆ మాటలు? మా వాళ్ళకి నేనేం చీప్ వి తీసుకెళ్లను. మంచి ప్లేస్ కి తీసుకెళ్లమ్మా ప్రియా” అంటూ హాండ్ బాగ్ లో ఆ లిస్ట్ ని పెట్టేసుకుంది.

“ఇలాగే నా డబ్బులు అన్నీ ఖర్చుపెట్టేసేయ్” అని షూస్ వేసుకుంటూ అన్నాడు కుమార్.

“మీ తండ్రి కొడుకులు ఒకటే” అని మూతి తిప్పుకుంటూ చిరుకోపంతో శైలజ అంది.

“నేను ఉన్నాను కదా అత్తయ్యా మీతో. అన్నీ కొనుక్కోండి మంచివే” ప్రియ చెప్పడంతో శైలజ నవ్వింది.

 

వాల్ మార్ట్ కి వెళ్లారు. ‘ఎంత చవకో’ అని అంటూ ఆ రేట్స్ చూసి మురిసిపోయి, ఏది పడితే అది దొరికింది దొరికినట్లుగా షాపింగ్ కార్ట్ లో వేసేస్తోంది శైలజ. అయిదు వందల డాలర్లు బిల్లు చేసింది. ఆకాష్ ఏమి అనలేక చుప్ చాప్ బిల్లు కట్టేశాడు.

వారమంతా ఆకాష్, ప్రియలతో వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి, సినిమాలకి, మాల్స్ కి వెళ్ళి, ఎంతో ఎంజాయ్ చేశారు శైలజ, కుమార్ లు. రేపు ఇండియా ప్రయాణం అనగా ఇవాళ ఇంట్లో ఒక గెట్-టుగెదర్ ఏర్పాటు చేశారు ఇంట్లో. ఫ్యామిలి ఫ్రెండ్స్ , కలీగ్స్ ని పిలిచారు. ప్రియ, శైలజలు కలిపి ఎన్నో వంటలు చేశారు.

“అమ్మా, నాన్నా – ఇదిగో వీడే చరణ్, నాకు మంచి దోస్త్ ఇక్కడ” అని ఆకాష్ పరిచయం చేశాడు.

“బాగున్నావా బాబు, తాగటానికి ఏం తీసుకుంటావు?” అని శైలజ అడిగింది.

“ఏమి వద్దండి”

“బీర్ ఆర్ కోక్?” కుమార్ అడిగాడు.

“ఆహ వద్దండి, థాంక్స్”

“పోనీ కాఫీ, టీ?”

“అలవాటు లేవండి”

“మరి ఏం కావాలి బాబు?” శైలజ అడిగింది.

“హార్లిక్స్” అని చరణ్ అనగానే, చేతుల్లో విస్కీ గ్లాస్ పట్టుకొని ఉన్న కుమార్, ఆకాష్ ల  వైపు ‘చూసి నేర్చుకోండి’ అనే చూపు చూసింది శైలజ.

మెల్లిగా అందరూ తినడం మొదలుపెట్టారు. ప్రియ అమెరికన్ కలీగ్ కేటీ కి ఒక పాప ఉంది. ఇంకా నెలల పిల్ల. చంటిపిల్ల ముద్దుగా ఉంది కదా అని శైలజ ముద్దాడింది. అంతే, కేటీ కెవ్వున అరిచి, ఒక పేపర్ టవల్ తీసుకొచ్చి, చంటి పిల్ల బుగ్గని రుద్ది రుద్ది తుడిచింది. శైలజ కి ఏం అర్ధంకాలేదు, కాస్త భయపడింది కూడా ఆ అరుపుకి. కేటీ కి సారీ చెప్పింది ప్రియ. కేటీ సర్దుకొని ఇంక వెళ్లొస్తాను అని వెళ్లిపోయింది. మిగితా వాళ్ళు కూడా మెల్లిగా వెళ్ళడం మొదలుపెట్టారు. అందరూ వెళ్లిపోయాక ప్రియ ని శైలజ అడిగింది.

“ఏమైంది ప్రియా? నేనేదో అంటరానిదానిని అయినట్టు ఎందుకలా అరిచింది ఆవిడ?”

“ఇక్కడ పిల్లలకి అల్లెర్జీస్ ఈజీ గా వచ్చేస్తాయి అత్తయ్యా. పైగా ఇక్కడ అలా వేరే వాళ్ళ పిల్లల్ని ముద్దు చేయకూడదు, వాళ్ళు ఏడుస్తారు”

“ఎక్కడైనా పిల్లలు ఏడుస్తారుగా, అందులో ఏంటి విడ్డూరం?” శైలజ ముక్కున వేలేసుకొని అడిగింది.

“అంటే ఇక్కడ కాప్స్ ని పిలుస్తారు వెంటనే” ఆకాష్ చెప్పాడు.

“ఈ కాప్స్ ఏంట్రా ప్రతిదానికి, ఏవిటో వింత అమెరికా. అయినా నాకు బాగా నచ్చింది” అని అనేసి లోపలికెళ్లి పెట్టె ఆఖరి సారి సర్దేసి, మూసేసింది.

అలా వారి మొదటి అమెరికా ప్రయాణం పూర్తయింది.

 

మళ్ళీ రెండేళ్ళు అయ్యాక, లాస్ట్ ఇయర్ రెండో సారి ఆకాష్ ఇల్లు కొనుకున్నప్పుడు ఒక నెల కోసం వెళ్లారు. కానీ రెండవసారి ట్రిప్ చాలా బోరింగ్ గా జరిగింది. మొదటి వారం అంతా గృహప్రవేశం తో గడిచిపోయింది. చాలా పెద్ద ఇల్లు, అంతా సందడిగా జరిగిపోయింది.  ఆ వీకెండ్ సినిమాకి వెళ్లొచ్చారు.

 

ఇంటికి తిరిగివస్తూ, ఆకాష్ “అమ్మా, నాన్నా మళ్ళీ మనం వచ్చే శనివారం బయటకి వెళ్దాము. వీకెండ్ మాత్రమే కుదుర్తుంది ఈ వారంలో ప్రియ కి, నాక్కూడా బయటకి రావటానికి. ఒక అయిదు రోజులు మాత్రమే. మీరు ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని అన్నాడు.

కుమార్, శైలజలు అయిదు రోజులే కదా అని అనుకున్నారు ముందు. కానీ అసలు సంగతి రోజులు గడుస్తున్న కొద్దీ అర్ధమయింది.  పొద్దునే పిల్లలిద్దరూ పని కి వెళ్లిపోవడం మళ్ళీ రాత్రేప్పుడో తిరిగిరావడం. కుమార్, శైలజలు అప్పుడప్పుడు అలా వీధిలో వాకింగ్ చేసి వచ్చేవారు. లేదంటే ఇంట్లోనే ఉండేవారు. శైలజ అప్పుడప్పుడు బట్టలు మడత పెట్టడం అలాంటి చిన్న పనులు చేసేది. ఇంక వంట గురించి చెప్పక్కర్లేదు, వంట అంతా తానే చేసేది.  అమ్మ చేతి కమ్మని వంట తిని లావు ఎక్కిపోతున్నాడు అని ప్రియ ఆకాష్ ని ఏడిపించింది. మళ్ళీ వీకెండ్ రానే వచ్చింది. ఎక్వేరియమ్ కి బయలుదేరారు అందరూ.

“హమ్మయ్య ఇంటి నుండి బయటకొచ్చాము” అని కుమార్ ఊపిరి పీల్చుకున్నాడు. కూపస్తమండూకం అయిపోయాడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు కుమార్.

“వాల్ మార్ట్ కి వెళ్దామా” అని శైలజ అడిగింది. ఇండియా నుండి వచ్చినప్పటి నుండి వంటింటికే పరిమితం అయిపోయింది. ఎన్నో కొనుక్కోవాలని ఆశతో ఉంది.

“అమ్మా ! క్రిందటి సారి అయితే ఫస్ట్ టైమ్ కదా, అందుకే ఏమి అనలేదు.  ఈ సారి ఖర్చులు ఎక్కువ వద్దమ్మా. నీకు, నాన్న కి మాత్రమే కొనుక్కోండి. ఊర్లో వాళ్ళందరికీ కొనద్దు” అని ఆకాష్ అనగానే శైలజ మొహం చిన్నది చేసుకుంది.

అది గమనించిన కుమార్ టాపిక్ మార్చటానికి “పదండి ఎక్వేరియమ్ చూడాలి నేను” అని అన్నాడు.

అలా ఆ రోజు కాస్త బయట తిరిగి ఇంటికొచ్చారు.

“మానవాడు కొంచం పిసినారి అయ్యాడు” అని శైలజ అంటే “పొదుపు గా ఉన్నాడు అంతే” అని కుమార్ సర్దిచెప్పాడు.

 

ఇంకొక వీకెండ్ అయిపోయింది. మళ్ళీ ఒక అయిదురోజులు ఇంట్లోనే ఉన్నారు శైలజ, కుమార్ లు. కుమార్ టి‌వి చూడటం, శైలజ పుస్తకం చదువుకుంటూ ఉండేది. రోజు ఆదే పని చేయాలన్నా బొరే కదా. లంకంత కొంపలో ఇద్దరూ బిక్కుబిక్కు మని ఉండేవారు.

 

శుక్రవారం రాత్రి ఆకాష్ “నాన్నా, ఈ ఇంట్లో లాన్ ఉంది కదా, నువ్వు గార్డెనింగ్ చెయ్యి. టైమ్ పాస్ అవుతుంది” అన్నాడు.  ఆదే రోజు రాత్రి, ప్రియ అలసిపోయిందని ఆకాష్ వంట చేద్దామనుకున్నాడు. కానీ శైలజ ఉండటంతో, “అమ్మా ఇవాళ బయట తిందామా, ప్రియ వంట చేయలేదు అంట” అన్నాడు “నువ్వే వంట చెయ్యి” అని డైరెక్ట్ గా చెప్పలేక.

శనివారం రాత్రి ఆకాష్, ప్రియలు ఒక పార్టీ కెళ్ళి వచ్చారు. ఆ రోజు అలసిపోవడం వల్ల, సండే అంతా ఇంట్లోనే. ఈ విధంగా ఆ వీకెండ్ కుమార్, శైలజలకు ఇంట్లోనే. కుమార్ కాస్త ఇబ్బంది పడ్డాడు. శైలజ చేత ‘పాటియో’ శుభ్రం చేయించడం,  వంట చేయించడం, గిన్నెలు తోమించడం, ఇల్లు దులపటం, గార్డెనింగ్- ఇవన్నీ కుమార్, శైలజల సహనాన్ని పరీక్షించాయి.

 

“ఇండియా లో ఉంటే మనం బండిలోనో, కాలినడకనో, ఆటొ లోనో బయటకి పోయేవాళ్లం. ఇప్పుడు చూడు, వీళ్ళు తీసుకు వెళ్తే కానీ పోలేము. పైగా వాళ్ళు అలసిపోయుంటారు, బయటకి వెళ్దామని అడగటానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ గార్డెనింగ్, ఇంట్లో వాషింగ్ మెషిన్, ఆ డిష్ వాషర్ మనకి అలవాటు లేవు. నాకైతే మనం ఇక్కడకి పనులు చేయటానికే వచ్చామన్న భావం పెరిగిపోతోంది రోజురోజుకి. ఈ వయసులో మనకి ఇది అవసరమా? చాలు ఇంక. వెళ్లిపోదాం” అన్నాడు కుమార్.

“వాడు ఫీల్ అవుతాడండి” అంది శైలజ. కానీ నిజానికి తనకి కూడా ఇక్కడ నచ్చడంలేదు ఇంట్లో ఉండటం. అసలే కొత్త ఇల్లు, చుట్టుపక్కలా ఇళ్లు చాలా తక్కువ.

“లేదు శైలూ. వాడికి మనం చెప్పేసి వెళ్లిపోదాం” అని ఖరాఖండిగా కుమార్ చెప్పాడు.

మరునాడు ఉదయం.

“ఆకాష్..నేను, అమ్మ ఇండియా కి బయలుదేరుతామురా. మాకు ఇక్కడ కొంచం బోర్ గా ఉంటోంది” కుమార్ పాయింట్ కి వచ్చేశాడు.

“అదేంటి సడన్ గా?”

“మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యేది ఇంకోటి”

“అంటే ? నేను కానీ ప్రియ కానీ ఏమైనా తప్పుగా అన్నామా?”

“అలాంటిదేమీ లేదు. మేము ఇద్దరం అమెరికా అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. కానీ కలలు వేరు నిజాలు వేరు. మేము రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కష్టపడుతున్నాము. నిజం చెప్పాలంటే అక్కడ మన ఇంటి పనోడు చేసే పనులు మేం ఇక్కడ చేస్తున్నాము”

“అదేంటి నాన్నా, మన ఇంటి పనులు మనం కాకపోతే ఎవరు చేసుకుంటారు?”

“అక్కడ పనులు చేసుకొని అలా బయటకి వెళ్లొచ్చు ఒకళ్ల మీద ఆధారపడకుండా. ఇక్కడ అలా కుదరదు.  ఈ ప్రపంచంలో మేము ఇమడలేము రా”

“అయితే అందరి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారా? మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంతో మంది ఇక్కడ ఆరు నెలల పాటు ఉంటారు”

“వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. మాకు ఇక్కడ నచ్చలేదు. మా మానాన మమ్మల్ని వదిలేయి”

“అలాగే నాన్నా, మీ ఇష్టం” ఇంక ఏమీ వాదనలు చేయకుండా ఓకే అనేశాడు ఆకాష్.

 

ఏంటి శైలూ నిద్ర పట్టట్లేదా అన్న కుమార్ మాటలతో వర్తమానం లోకి వచ్చింది శైలజ.

“అవునండి”

“అమెరికా ఎందుకు వద్దంటున్నావు?”

“అక్కడ బోర్. ఫస్ట్ ట్రిప్ లో అన్నీ ప్లేసెస్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసి, ఆ తరువాత నుండి కష్టాలు మొదలు.  ఒకప్పుడు నేను ఆహా ఓహో అనుకున్నవన్నీ ఇప్పుడు నాకు నచ్చడంలేదు. అన్నీ పనులు మనమే చేసుకోవాలి. పిల్లలు బిజీ ఉంటారు, మనల్ని బయట తిప్పలేక, ఇంట్లో కూర్చోబెట్టలేక సతమతమవుతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా మనకి? మనల్ని చూడాలనిపిస్తే వాళ్ళే వస్తారు. నాకు నిద్ర వస్తోంది. గుడ్ నైట్” అని ఏదో బరువు వదిలిపోయినట్లు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.

 

—-

మరునాడు ఉదయం ఆకాష్ శైలజ సెల్ కి కాల్ చేశాడు.

“అమ్మా, నాన్న ఉన్నారా పక్కన?” ఆకాష్ ఉత్సాహంగా అరుస్తున్నాడు.

“ఉన్నారు ఉన్నారు ఎంటా అరుపు….. ఇస్తున్నా…. ఆగు”

“ఇయ్యకర్లేదు. స్పీకర్ ఆన్ చేయండి”

“స్పీకర్ ఆన్, చెప్పరా” అన్నాడు కుమార్.

“ప్రియ ప్రెగ్నంట్ యాహూ” అని ఆకాష్ అరిచాడు.

ఆకాష్ కి కంగ్రాట్స్ చెప్పేసి, ప్రియ కి జాగ్రత్తలు చెప్పి. శైలజ, కుమార్ లు ఒకళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మూడవ సారి అమెరికా ప్రయాణం తధ్యం.

 

********************************************************************

కాపాడి, రక్షించిన ఓ సీతాకోక చిలుకా…విను!

Kandukuri Ramesh
-కందుకూరి రమేష్ బాబు 
కొన్ని చిత్రాలు చూస్తే ఏముందిలే అనిపిస్తుంది.
కానీ, తీసినప్పటి సందర్భం షేర్ చేసుకుంటే మంచిదనిపిస్తుంది.
గొప్ప క్షణాలను పట్టుకోలేక పోవడానికి కారణమూ తెలిసి వస్తుందనిపిస్తోంది.
ఉదాహరణకు ఈ సీతాకోకచిలుక.
మీరు చాలా సార్లు చూసే ఉంటారు.
రోడ్డు మీద ఒక రాయి వుంటే కాలితో పక్కకు తన్నేసే మనుషులను.
లేదా ఒక గాజు ముల్లు కనిపిస్తే జాగ్రత్తగా తీసి పక్కకు వేసే మనుషులను.
గాజు పెంకు కావచ్చు, ఎంతో ఓపికగా దూరంగా తీసుకెళ్లి పడవేసే మనుషులను.
ఇట్లా ఒకటి లేదా మరొకటి లేదంటే ఇంకొకటి.
కానీ, కాంక్రీట్ జంగల్ అని పిలుచుకునే భాగ్యనగరంలో ఓ మనిషి సీతాకోక చిలుక పట్ల ఇంతే స్థాయి స్పందన చూపుతాడని ఎవరమైనా ఊహిస్తామా? నేనైతే ఊహించలేదు. అదే నా దురదృష్టం.
+++
అది శ్రీనగర్ కాలనీ. ఎవరినో కలవడానికి వెళ్లి ఒక ఇరానీ చాయ హోటల్ బయట వేచి వున్నప్పుడు జరిగిందా సంఘటన.
అలా ఒక్కడ్నే నిలుచుండి, ఎదురు చూపుల్లో నిమగ్నమై ఉండగా ఓ నడీడు మనిషి సీతాకోక చిలుక రెక్కల్ని రెండు వేళ్లతో అత్యంత జాగ్రత్తగా పట్టుకుని రోడ్డు దాటుతూ ఉన్నాడు. ముందు అతడి చేతిలో ఉన్నదేమిటో అర్థం కాలేదు. కానీ, ఏదో పట్టుకుని అతడు చాలా జాగ్రత్తగా వెళుతున్నట్టయితే అర్థమైంది. దగ్గరకు వెళ్లి చూస్తే, అతడితో పాటు నడవాల్సి వచ్చింది. నడుస్తుంటే ఆ మనిషి రోడ్డు దాటి ఫుట్ పాత్ దాకా వెళ్లి ఆ చిలుకను అక్కడ నేలమీదికి వదిలి వెళ్లేదాకా నా చూపు, నడకా సాగింది.
అతడలా ఆ సీతాకోకచిలుకతో ముందుకు వెళుతూ ఉంటే ఫొటో తీయాలన్న జ్ఞానం నశించింది.
ఆశ్చర్యంతో కూడిన సందేహాస్పదం. దానికి సమాధానం అన్నట్టు, ‘కదలక మెదలక రోడ్డుమీద ఉన్న దాన్ని చూశానని, మెత్తటి ఈ రోడ్లపై ఏ టైరో వెళితే నేలను కరుచుకుని అది ఎక్కడ ప్రాణం విడుస్తుందో కదా అని దాన్ని ఇక్కడ వదిలి’నట్లు ఆయన చెప్పాడు.
అప్పటికే ఆయన దాన్ని కింద వుంచాడు.
ఒక మూలన. ఏదో గేటు ఉంది. దాని పక్కన, మనుషుల పాదాలు పడని స్థలంలో వుంచాడు.
వొంగి కళ్లతో దాన్ని చూశాను.
అది నిశ్శబ్దంగా ఉంది.
కెమెరాతో ఒకటి, రెండు బొమ్మలు చేశాను.
చేశాక ఆయన కోసం చూస్తే అప్పుటికే ఆయన జనసందోహంలో అదృశ్యమయ్యాడు.
ఆయన రెక్కల్ని అలా జాగ్రత్తగా పట్టుకుని రోడ్డుమీదికి వస్తుంటే అప్పుడే తీసి వుండాల్సింది అనిపించింది ఒక క్షణం.
కానీ, ఎలా సాధ్యం?
అయినా…చప్పున ఆ మనిషి ఏం చేస్తున్నాడో తెలిస్తే కదా తీసేవాడిని.
కానీ, చాలా అరుదుగా జరిగే పనులను పసిగట్టాలంటే, వాటిని ఛాయల్లో భద్రపరచాలంటే మనకు ఇలాంటి అనుభవాలు ఉండాలి కదా!
ఇక ముందు మనిషి చేతులను చూస్తే, అవి సీతాకోక చిలుకను రక్షించిన చేతులని తెలిసింది కదా! ఇక చేస్తాను చూడండి…
లేదంటే సీతాకోకచిలుకను చూస్తే, అది మనిషిని స్పందింపజేసిన విధానం చూశాను గదా! ఇక తప్పక చేస్తాను.
రెంటినీ మరింత బాగా చేస్తాననే అనుకుంటున్నాను.
దృశ్యాదృశ్యాలను రెంటినీ మరింత సన్నిహితంగా చూపిస్తాననే అనుకుంటున్నాను.
చూడాలి.
*

గమనమే గమ్యం-16

 

19BG_VOLGA_1336248eరెండేళ్ళు గడచిపోయాయంటే నమ్మబుద్ధి కావటం లేదు. శారద వచ్చేస్తుందని మూర్తి మనసు గంతులేస్తుంది. సుబ్బమ్మ హడావుడికి అంతులేదు. విశాల  ఎమ్మే పాసవగానే ప్రభుత్వోద్యోగం దొరికింది. ముత్తులక్ష్మీరెడ్డి సహాయం చేసింది. దుర్గాబాయి మెట్రిక్‌ పాసై బెనారెస్‌లో చదువుతానని వెళ్ళింది.

శారద వచ్చిన రోజు బంధువులు , స్నేహితులతో ఇల్లు  కిటకిట లాడిపోయింది. మూర్తికి పదినిమిషాలు  శారదతో ఏకాంతంగా మాట్లాడటమే కుదరలేదు. శారదకు ప్రయాణపు బడలిక అని చెప్పే వ్యవధానం కూడా ఎవరూ ఇవ్వలేదు. దగ్గర బంధువులు  సుబ్బమ్మ దగ్గర శారద పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. 1935 వ సంవత్సరంలో 29 ఏళ్ళ వయసున్న స్త్రీ పెళ్ళి కాకుండా ఉండటం సాధారణ విషయం కాదు.

‘ఇపుడు ఇంగ్లండ్‌ వెళ్ళొచ్చిన వాళ్ళను చూడాలి శారదకు. మాటలు  కాదు’’ అన్నారు కొందరు బంధువులు .

‘‘ఇప్పుడు పెళ్ళేమిటి? ఎవరు చేసుకుంటారు. ఇక్కడుండగానే చాలా వ్యవహారాలు  నడిపిందట. ఇంగ్లండ్‌లో ఏం చేసిందో ఎవరికి తెలుసు’’ అని మూతులు  విరిచారు దూరపు బంధువులు .

ఇన్ని మాటల  మధ్యలోంచి శారదకు బాబాయి వరసయ్యే ఒక కార్యదక్షుడు సంబంధం గురించి మాట్లాడాడు.

‘‘ఇంగ్లండ్‌ వెళ్లొచ్చిన డాక్టరే ఉన్నాడు. నాకు తెలిసినవాళ్ళే. మన వాళ్ళే. మీరు సరేనంటే అబ్బాయిని తీసుకొస్తాను. ఇక్కడే ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్రాక్టీసు చేస్తే ఇక చెప్పేదేముంది?’’ అన్న ఆయన మాటతో అందరూ నిశ్శబ్దమయ్యారు.

సుబ్బమ్మకూ, దగ్గరి బంధువులకూ ఈ మాటలు  తోసిపుచ్చేందుకేమీ కనిపించలేదు.

‘‘శారదాంబతో మాట్లాడి వారం రోజుల్లో కబురు చేస్తాను’’ అంది సుబ్బమ్మ.

రెండు మూడు రోజులో ఇంట్లో హడావుడి తగ్గి తల్లీ కూతుళ్ళు కాస్త తెరిపిన పడ్డారు.

కానీ పది రోజులయినా శారదతో ఈ విషయం మాట్లాడే సమయం దొరకలేదు.

బంధువులంతా ఎటు వాళ్ళటు వెళ్ళాక ఒకరోజు రాత్రి శారద గదిలోకి వచ్చింది సుబ్బమ్మ. శారద చదువుకుంటూ ఉంది.

‘‘ఇంకా ఏం చదువమ్మా ?  పొద్దు బోయింది’’ అంటూ పక్కమీద కూచుంది.

‘‘నా సంగతి సరేగాని నువ్వెందుకింత సేపు మేలుకున్నావు. ఒంట్లో బాగుందా?’’ అంటూ తల్లి నుదుటి మీద చేయి వేసి చూసింది.

‘‘ఏం లేదు ` ఏంటి చెప్పు’’ అంది.

‘‘నీ పెళ్ళి విషయం తల్లీ. చదువు పూర్తయింది. ఇంక జరగవసిది పెళ్ళే గదా. అది కూడా అయితే నా బాధ్యత తీరుతుంది. మీ రామనాధం బాబాయి చెప్పిన సంబంధం బాగానే ఉంది. ఆ అబ్బాయిని చూస్తావా?’’

శారదకు ఈ విషయం తేల్చెయ్యానిపించింది. తేల్చి చెప్పకపోతే తల్లి ఈ విషయం గురించి మధన పడుతూనే ఉంటుంది. అది అనవసరం. కష్టంగా ఉన్నా ఒకసారి సత్యం తెలిస్తే అదే క్రమంగా మనసులో ఇంకి స్థిరపడుతుంది. ఆ తరవాత అశాంతి, అలజడి తగ్గిపోతాయి.

‘‘అమ్మా. నేను చెప్పే విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంది గదా.’’

సుబ్బమ్మ నవ్వి ‘‘ఏం అడుగుతున్నావే ?  చెప్పు’’ అంది.

తను ఎవరినో ప్రేమించినట్టుగా శారద చెబుతుందని ఆమె ఊహించింది. అతను డాక్టర్‌ కాకపోయినా ఫరవాలేదు. కులమేదైనా ఫరవాలేదు. శారద ఇష్టపడే మనిషి అంతంత మాత్రంగా ఉండడు. ఒక్కక్షణంలో ఆమె మనసులోకి వచ్చారు. వారంతా తరచూ ఇంటికి వచ్చే యువకులే.

‘‘అమ్మా, నేనసు పెళ్ళి చేసుకోను’’. శారద గొంతులో గంభీరత్వం వింటే సుబ్బమ్మకు సమస్య పెద్దదనిపించింది.

‘‘ఎందుకు అలా అంటావమ్మా ?  జీవితంలో అన్నీ చూడాలి. పెళ్ళి, పిల్లలూ  ఇదంతా లేకుండా ఎందుకు? ఒక్క చదువేనా పరమార్థం. పెళ్ళంటే ఎందుకిష్టంలేదు’’ శారద ఆమెకి డాక్టర్‌గా కాక చిన్నపిల్లలా  కనిపించింది.

‘‘ఇష్టంలేకపోవటం కాదమ్మా. నేను పెళ్ళాడదల్చుకున్న మనిషికి ఇదివరకే పెళ్ళయిపోయింది.’’

సుబ్బమ్మ నిర్ఘాంతపోయింది. ఆమెకు వెంటనే మూర్తి గుర్తొచ్చాడు.

‘‘ఎవరూ? మూర్తా?’’

‘‘నీకూ తెలిసే ఉంటుంది. మా యిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పెళ్ళి మాత్రం కుదరదు’’.

సుబ్బమ్మకు గుండె నీరయింది. ఎంతో తెలివైన శారద ఇంత పెద్ద చిక్కులో ఎలా పడిరది? దీనికి పరిష్కారం ఏమిటి?

‘‘జీవితమంతా పెళ్ళి లేకుండా గడుపుతావా? ఎంత కష్టం’’ దు:ఖం తన్నుకొచ్చింది.

‘‘కష్టమేం కాదమ్మా. ఒకళ్ళని ఇష్టపడుతూ ఇంకొకళ్ళని పెళ్ళాడటమే కష్టం’’.

‘‘మూర్తి ఏమంటాడు?’’

‘‘నేనేమంటే అదే అంటాడు. అంతకన్నా ఏమనగలడు’’ నిరుత్సాహంగా నవ్వింది.

olga title

సుబ్బమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇది తలకు మించిన సమస్య అనిపించింది. శారదతప్ప దీనినెవరూ పరిష్కరించలేరనిపించింది.

‘‘అమ్మా. ఇక మాటిమాటికీ పెళ్ళి గురించి అడగొద్దు. నాకు నా పనులు  ఊపిరాడకుండా ఉంటాయి. పెళ్ళి, పిల్లలు  వీటన్నిటి గురించీ ఆలోచించే తీరిక లేనన్ని పనులు  పెట్టుకుంటున్నాను. నేను సంతోషంగానే ఉంటానమ్మా. నా గురించి దిగులు  పెట్టుకోకు’’.

సుబ్బమ్మ మెల్లిగా అక్కడినుంచి లేచి ఆమె గదిలోకి వెళ్ళింది.

కూతురు పెళ్ళి లేకుండా ఉంటుందంటే తల్లి మనసు ఒకంతట దానిని జీర్ణించుకోలేకపోతోంది.

సుబ్బమ్మకు అత్త నరసమ్మ గుర్తొచ్చింది.

పదో ఏటనే శారదకు పెళ్ళి చెయ్యమని పంతంపట్టి, ఆ పంతం నెగ్గదని తెలిసి ప్రాణానికి ప్రాణమైన కొడుకుని వదిలి కాశీకి వెళ్ళిన అత్తగారు గుర్తొచ్చింది. మళ్ళీ ఇటు రాకుండా అక్కడే కన్ను మూసిందావిడ.

ఆమెతో చెప్పుకుని భారం దించుకోవాలనిపించింది.

‘అత్తయ్యా. మన శారద పెళ్ళి చేసుకోదట. దానికి పెళ్ళి మీద కోర్కె లేక కాదు. దానికి కావసినవాడిని పొందలేక!’.

నిజానికి సుబ్బమ్మ భరించలేనిది కూడా అదే. కూతురు ఏం కావాలన్నా సమకూర్చటమే ఆమెకు తెలుసు. ప్రతిది సాధిస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయే శారదే ఆమెకు తెలుసు. ఎక్కడా ఏ లోటూ ఎరుగని శారదే ఆమెకు తెలుసు. ఏ పనైనా సాధించనిదే నిద్రపోని శారదే తెలుసు.

ఆగిపోయిన శారద, కోరిక తీరదని చిన్నబోయిన శారద, ఓడిపోయిన శారద ఆమెకు తెలియదు.

‘‘పెళ్ళి ఇష్టం లేక కాదు. అది ఇష్టపడినవాడు దానికి దక్కడు’’ ఈ వాస్తవం సుబ్బమ్మకు మింగుడు పడటం లేదు.

భర్తలేని లోటు ఎన్నడూ లేనంతగా మీదకు విరుచుకుపడిరది.

‘ఎవరితో చెప్పుకోవాలి? కూతురు తనతో చెప్పుకుంది. తను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఆ రాత్రంతా సుబ్బమ్మకు కలత నిద్రయింది. ఏవో కలలు. కలలో అత్తగారు నరసమ్మ కనిపించింది.

ఆమె చిన్ని శారద తల  నిమురుతూ ‘పెళ్ళయితే ఏమైందే? నిన్నూ చేసుకుంటాడు. నువ్వంటే ఇష్టమున్న వాడు పెళ్ళెందుకు చేసుకోడు? చేసుకో. పెళ్ళి చేసుకో’’ అంటున్నది.

సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. అత్తగారుంటే ఈ పెళ్ళి జరిపించేదేమో ఆమెకు పెళ్ళయినవాడనే పట్టింపు ఉండేది కాదా?

ఈ ఆలోచనతో సుబ్బమ్మకు కూతురి మీద జాలి పొంగుకొచ్చింది.

‘పోనీ –  రెండో పెళ్ళివాడని అంటారు. అంటే అంటారు. శారదను ఇంత దూరం ఇంత స్వేచ్చగా ఒదిలినందుకే ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ శారదను రోజూ చూస్తున్న తనకు ఎంత ఆనందంగా ఉంది? పిల్ల  హాయిగా గలగలా నవ్వుతూ, ఎప్పుడూ పదిమందిలో మెప్పు పొందుతూ నాయకురాలిలా వెలిగిపోతుంటే గర్వంగా అనిపిస్తుందేగాని లోకుల  మాటలు ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా మూర్తీ శారదా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే, ఇష్టమైనవాడితో శారద సుఖపడితే ఎవరేమనుకుంటే ఏమిటి?

రెండు రోజులు  పాటు ఆమె మనసులో ఈ ఆలోచనలు  కల్లోలం  రేపాయి. ఎంత ఆలోచించినా శారద మూర్తిని పెళ్ళాడితేనే బాగుంటుందనిపించింది. ఒక రోజు కాదు పది రోజులు  మధనపడి శారదతో ఆ మాటే చెప్పింది సుబ్బమ్మ.

తల్లి ఎలా ఆ నిర్ణయానికి వచ్చి ఉంటుందో ఒక్క క్షణంలో అర్థమైంది శారదకు. కూతురి సుఖం కోసం తనకు వ్యతిరేకమైన ఆలోచనని అనుకూలం  చేసుకోటానికి తల్లి తనలో తను ఎంత సంఘర్షణ పడి ఉంటుందో అర్థమై శారద తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉధృతం తగ్గాక ‘‘అమ్మా ` దీనిని గురించి ఆలోచించటం మానెయ్యి. నా మీద నమ్మకం  ఉంచు’’. అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

తల్లిని పట్టించుకోవద్దన్నది గానీ మద్రాసు పట్టణంలో తన స్నేహితులు , తోటి కామ్రేడ్స్‌ అందరూ ఇదే ఆలోచిస్తున్నారని శారదకు క్రమంగా తెలిసి వచ్చింది.

***

ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్‌ – బ్రాడ్లీ థీసీస్‌ గురించి తీవ్రమైన చర్చలు  జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్‌ కేంద్ర కమిటి సమావేశానికి హాజరై దత్‌ – బ్రాడ్లీ థీసిస్‌ని వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ని కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ ధీసిస్‌ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టు మీద బ్రిటీష్‌ ప్రభుత్వం నిర్భంధం రోజురోజుకీ పెరుగుతోంది. ఏ పనైనా రహస్యంగా చేయాలి. శక్తి సామర్ద్యాలతో, ఆదర్శావేశాలతో రగులుతున్న యువతరానికి రహస్యంగా చేసే పని చాలటం లేదు. ఇంకేదో చెయ్యాలని రగిలిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రజలలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల  మీద వ్యతిరేకతను పెంచటం. ఆ పని కాంగ్రెస్‌ పార్టీ సరిగా చేయటం లేదని కమ్యూనిస్టుల  అభిప్రాయం. ఐతే కాంగ్రెస్‌లో కొందరు ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. పైగా కమ్యూనిస్టుల్లా రహస్యంగాకాక బహిరంగంగా చేస్తున్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులు  కూడా కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ పేరుతోనే తామనుకున్న పని బహిరంగంగా చేయవచ్చు. జాతీయ భావాలను మరింత వేగంగా ప్రజలలోకి తీసికెళ్ళవచ్చు. రైతుల సంఘాలనూ యువజన సంఘాలను కాంగ్రెస్‌ పార్టీ కింద నిర్మించటం తేలిక. ఆ పని చేస్తూ ఆ సంఘాలలో కమ్యూనిస్టు భావాలు  వ్యాపింపచేయాలి. ఆ భావాల  పట్ల అంకితభావం చూపినవారికి కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం ఇవ్వొచ్చు. అప్పుడు అందరి శక్తియుక్తులు  వందశాతం ఉపయోగపడతాయి.

ఇది స్థూలంగా దత్‌ – బ్రాడ్లీ థీసిస్‌ సారాంశం. ఇంకా దేశ రాజకీయ ఆర్థిక వ్యవహారాల గురించి ఎంతో సమాచారం, విశ్లేషణ ఉన్నా కార్యక్రమానికి సంబంధించి ఈ పని ముఖ్యమైనది. శారద దీనికి తోటి కామ్రేడ్స్‌ ఆమోదం సంపాదించటంలో చురుకుగా పనిచేసింది. ఫలితంగా కమ్యూనిస్టులమనుకున్నవారంతా మళ్ళీ కాంగ్రెస్‌లో సభ్యులయ్యారు. ఆంధ్రప్రాంతంలో ఎక్కడికక్కడ రైతుల సమస్య మీద యువతీ యువకులను సమీకరిస్తున్నారు.

శారద ప్రాక్టీసు మొదలుపెట్టడం గురించి కూడా పార్టీ చర్చించింది. మద్రాసులో కంటే బెజవాడలో ప్రాక్టీసు పెడితే బాగుంటుందని యూత్‌ లీగ్‌ అభిప్రాయపడిరది.

ఇక్కడ చైతన్యమవుతున్న యువతీయువకులను శారద బాగా నడిపించగలుగుతుంది. డాక్టర్‌గా కూడా శారద అవసరం మద్రాసులో కంటే బెజవాడలో ఎక్కువ ఉంది అని వారి వాదన. ఆ వాదనలో నిజముంది గానీ దాని వెనక వేరే కారణం కూడా ఉంది. అది శారదకు తెలియదు.

శారద బెజవాడ వెళితే మూర్తికి దూరమైతే వారిద్దరిలో మార్పు రావొచ్చని యూత్‌ లీగ్‌ అనుకుంది. శారద గురించి నలుగురూ నాలుగు రకాుగా అనుకోవటం గురించి సుబ్బమ్మకు బాధ లేదు గానీ పార్టీకి చాలా బాధగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు  అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి గానీ వేలెత్తి చూపించుకోకూడదు అని వారి భావన. మద్రాసులోని రాజకీయ వర్గాలలో శారద, మూర్తి ప్రేమ రకరకాలుగా ప్రచారమవుతూ ఉంది. దానిని ఆపటానికి, పార్టీని ఆంధ్రప్రాంతంలో వృద్ధి చేయటానికీ  శారద బెజవాడలో ప్రాక్టీసు పెట్టటమే మంచిదని అందరూ భావించారు. అందరూ ఏకగ్రీవంగా ఆ మాట చెప్పినపుడు శారద తోసిపుచ్చలేకపోయింది.

డాక్టర్‌ వృత్తికీ, కమ్యూనిస్టు పార్టీకీ జీవితం అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. మూర్తి కొన్ని వందల  మైళ్ళ దూరంలో ఉండటం వల్ల  తమ ప్రేమ పోతుందని ఆమె అనుకోలేదు. ఇంగ్లండ్‌లో ఉన్న రెండేళ్ళలో వారి ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు.

శారద ఉత్సాహంగా తల్లితో బెజవాడ మకాం మార్చాలని చెప్పింది. మద్రాసు ఒదిలి వెళ్ళటం సుబ్బమ్మగారికంత ఇష్టంగాలేదు.

‘ఇది పెద్ద పట్టణం. ఇక్కడ ఇంకొకరి గురించి పట్టించుకోవటం తక్కువ. ఆ బెజవాడలో శారద ఇమడగలదా? శారద మాట, నవ్వూ, నడక అన్నిటికీ వంకపెడతారు. శారదను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు’. ఇదీ సుబ్బమ్మ సందేహం. ఆ సందేహాలన్నీ చెబితే శారద నవ్వేసింది.

‘‘అమ్మా ఆ వాతావరణాన్నంతా మార్చి ఇరుకు వీధులను విశాలం చేయానే నేను బెజవాడ వెళ్దామనుకుంటున్నా. నాలాటి వాళ్ళను వందమందినైనా తయారు చెయ్యాలిగదమ్మా. అక్కడ మన పార్టీవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అవసరం ఉంది. నా గురించి భయపడకు. నన్నే సముద్రంలో పడేసినా హాయిగా ఈదుకుంటూ బైటపడతా ` ’’

‘‘సముద్రం గురించి భయం లేదు శారదా ` మురుక్కాలవ గురించే ` ’’

‘‘మురుక్కాలవలను  బాగు చేసుకోవాలమ్మా. లేకపోతే ప్రజల  ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టరుగా ప్రజారోగ్యం నా బాధ్యత. బెజవాడ వెళ్ళాలమ్మా’’ శారద బెజవాడ వెళ్ళటం గురించి గట్టిగానే అనుకుంటోందని సుబ్బమ్మ ప్రయాణపు ఏర్పాట్లలో పడిరది.

మరో నెలలో శారద బెజవాడ ప్రయాణం ఉందనగా విశాల  తన పెళ్ళి శుభలేఖలు  తీసుకుని వచ్చింది. విశాల  ముఖంలో అంత ఆనందం, తెరిపిదనం శారద ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఎవరి మీదో ఫిర్యాదు చెయ్యబోతున్నట్లుండే విశాల  ముఖంలో ఏదో శాంతి ఆవరించినట్టుంది. ఎప్పుడూ తన జీవితం గురించిన అసంతృప్తితో అనంగీకారంతో బతికేది విశాల . ఆమె ఇలా సంతోషంగా ఉందంటే అదంతా పెళ్ళి మహత్యమేనా అని సూటిగా అడిగేసింది శారద. విశాల  సిగ్గుపడుతూ, నవ్వుతూ పెళ్ళి వివరాలు  చెప్పింది. గోపాల శాస్త్రి ప్రభుత్వోద్యోగమే. బ్రాహ్మణుడు. విశాల ను ప్రేమించాననీ పెళ్ళాడతాననీ తనంత తాను వచ్చి అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. గోపాల శాస్త్రే ఒప్పించాడు. ఐతే వాళ్ళు ఒక షరతు పెట్టారు. విశాల ను గోపాలం  వాళ్ళ మేనమామ దత్తత తీసుకుంటాడు. వాళ్ళే విశాల  తల్లిదండ్రుగా వివాహం జరిపిస్తారు. విశాల  తన తల్లితో సంబంధాలు  పూర్తిగా ఒదిలేసుకోవాలి. విశాల  చెప్తూంటేనే శారదకు కోపం వచ్చింది.

‘‘దీనికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత దారుణం. వాళ్ళకెంత ధైర్యం’’ శారద ఆవేశపడుతుంటే విశాల  ఆశ్చర్యపోయింది.

‘‘నీకెందుకే అంత కోపం? ` నా కులం , మా అమ్మ కులవృత్తిలో ఉండటం, నాటకాలు  వేయటం నాకే ఇష్టం లేదు. వాళ్ళెలా సహిస్తారు? ఎలా ఒప్పుకుంటారు. వాళ్ళడిగినదానిలో తప్పేముంది? నేను ఎమ్మేలో చేరిన దగ్గరనుంచి మా అమ్మ నుంచి దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడు నేను కొత్తగా మా అమ్మకు దూరమయ్యానని అనటానికేమీ లేదు. బాధపడటానికంతకంటే ఏమీ లేదు’’.

‘‘మీ అమ్మ నిన్నెంత ప్రేమగా పెంచిందే. చదివించింది. నీ సాధింపులన్నీ భరించింది. కాల్చుకు కు తిన్నావు గదే ఆమెను. ఆమెను ఒదిలెయ్యటం అన్యాయం. ముసలితనంలో ఆమెకు దిక్కెవరే ` ’’ కోటేశ్వరిని తల్చుకుంటే శారదకు దు:ఖం వచ్చింది.

img443

‘‘ఉందిగా – ఆ రాజ్యం ` మా పిన్ని కూతురు ` మా పిన్ని, ఆమె కూతురు మా అమ్మని అతుక్కుపోయారు. రాజ్యాన్ని నాటకాల్లోకి దించారు. ఇప్పుడు మా అమ్మకు నాకంటే రాజ్యమే ఎక్కువ. మా అమ్మకు బతకటం తెలుసులే’’ అంది విశాల  గొంతు ఇంత చేసి.

‘‘నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీ అమ్మగారిని కూడా తీసుకురా’’ విశాల ఉత్సాహం చూస్తే శారదకు ఏవగింపు పుట్టుకొచ్చింది.

‘నే రాను నీ పెళ్ళికి’ అని తెగేసి చెప్పాలనిపించింది.

తల్లిని గౌరవంగా చూడనవసరం లేదని, దూరంగా ఉంచాలని విశాలకు ఏ చదువు నేర్పించింది? ఈమెకు ఏ సంస్కారం అబ్బింది? ఇదేం ఆధునికత? సంస్కర్తలు  నేర్పించిన సంస్కారం ఫలితమా? తన కులాన్ని ద్వేషించే సంస్కారం, తల్లిని ఒదులు కునే తత్త్వం ఎలా అబ్బాయి విశాలకు ?

శారద మనసులో ఎన్నో ప్రశ్నలు . అన్య మనస్కంగానే విశాలను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. సుబ్బమ్మ విశాల  నోరు తీపి చేసింది. విశాల  పెళ్ళికి వెళ్ళకూడదనుకుంది శారద.

రెండురోజుల  తర్వాత ట్రిప్లికేను మీదుగా వస్తుంటే శారదకు కోటేశ్వరిని చూడానిపించింది.

అక్కడికి వాళ్ళిల్లు  దగ్గరే. కూతురు చేస్తున్న పనితో ఆమె ఏమైందో అనుకుంటూ వెళ్ళింది.

కోటేశ్వరిని చూడగానే అర్థమైంది, విశాల  ఆమెను ఎంత దెబ్బ కొట్టిందో.

‘‘తెలిసిందామ్మా ? మన విశాల  పెళ్ళి చేసుకుంటోంది’’ అంది కళ్ళనీళ్ళతో. కూతురి పెళ్ళి వార్తను కన్నీళ్ళతో చెప్పాల్సిన పరిస్థితికి సిగ్గుపడుతూ, వెంటనే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంది.

‘‘తెలిసిందమ్మా. తను చేసిన పని నాకేం నచ్చలేదు. వాళ్ళు కూడా తల్లితో సంబంధం ఉండకూడదనటం…’’

‘‘వాళ్ళంటారమ్మా ` వాళ్ళు పెద్దకులం  వాళ్ళు’’

‘‘కానీ గౌరవం, గౌరవం అని ఏడుస్తుంటే విశాల  బుద్ధేమయింది? తనను  వాళ్ళు అవమానిస్తున్నారని దానికి అర్థం కావొద్దూ’’.

‘‘అయ్యో రాత ` మొదట్నించీ దానికీ నాకూ అదేగా తగాదా. పోన్లేమ్మా అది సుఖంగా ఉంటే అంతే చాలు . ఇప్పుడు మాత్రం నాతో ఉంటుందా పెడతందా? మూడునేల్లకోసారి ముఖం చూపించేది. ఇక అదీ ఉండదు. దేవుడు నాకింకో బిడ్డ నిచ్చాడమ్మా. మా రాజ్యం నేనంటే ప్రాణాలు  ఇడుస్తుంది. అమ్మాయ్‌ –  రాజ్యం’’ అని పిల వగానే వచ్చింది పదహారేళ్ళు నిండిన రాజ్యం.

శారద నివ్వెరపోయి కన్నార్పకుండా కాసేపు చూసి తేరుకుంది. రాజ్యం ఎదురుగా ఉంటే ఆ పిల్ల  మీద నుంచి కళ్ళు తిప్పుకోవటం కష్టం. ఇంతింత కళ్ళు. పచ్చని, పల్చని శరీరం. మంచి ఎత్తు. బంగారు బొమ్మ అంటే ఇలా ఉంటుందనిపించింది.

శారద అతికష్టం మీద ఆ పిల్ల  మీద నుంచి చూపు మరల్చుకుని కోటేశ్వరిని చూస్తూ.

‘‘చదివిస్తున్నావా అమ్మా’’ అని అడిగింది.

‘‘ఐదు వరకూ చదివిందమ్మా. ఇప్పుడు ఒక పంతులు  గారొచ్చి తెలుగు వాక్యాలు  చదివిస్తున్నారు. సంగీతం కూడా నేర్చుకుంటోంది’’.

‘‘ఇంగ్లీషు కూడా నేర్చుకో’’ అంది శారద మళ్ళీ రాజ్యం మాయలో పడుతూ.

‘‘నేర్పిస్తానమ్మా, ముందు ఆ పద్యాలు , పాటలు  వస్తే నాటకాల్లో రాణిస్తది. ఆ తర్వాత ఇంగ్లీషు, లెక్కలూ  చెప్పిస్తే లోకంలో నెగ్గుకొస్తది. విశాల  లాగా దీన్ని కాలేజీ చదువుకు పంపించే ఉద్దేశం మటుకు లేదు’’ అంది కోటేశ్వరి కచ్చితంగా.

శారదకు ఫల హారం పెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.

‘‘విశాల  పెళ్ళికి వెళ్ళాలని లేదమ్మా. నేను వెళ్ళను’’ అంది శారద.

‘‘అయ్యో. అట్టా చెయ్యమాకమ్మా. నీ మీదే ఆశపెట్టుకున్నాను. ఈ పిల్లకు బొత్తిగా ఎవరూ లేరు, ఏ అండా లేదు అనుకుంటే వాళ్ళు దానిని మరీ లోకువ చేస్తారమ్మా. నువ్వు, మీ అమ్మా, ఇంకా నీ స్నేహితులు  గొప్పవాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళమ్మా. అత్తగారింట్లో దానికి గౌరవం ఉండాలిగా’’ కోటేశ్వరి తెలివికి శారద ఆశ్చర్యపోయింది. తనను వెలివేసిన కూతురి క్షేమం గురించి ముందు చూపుతో ఆలోచించే ఆ తల్లికి నమస్కారం చేసి, పెళ్ళికి వెళ్తానని వాగ్దానం చేసి ఇంటికి వచ్చింది. ఏదన్నా ఒక పని మంచిదనుకుంటే అది పూర్తిగా చేసేంతవరకూ శారదకు నిద్రపట్టదు.

తనతోపాటు కొందరు కాంగ్రెస్‌ పెద్దల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంది. విశాలకు కాంగ్రెస్‌ పెద్దలు  బాగా దగ్గరివాళ్ళనే అభిప్రాయం కలిగించాలనుకుంది. ఒక్కొక్కరి ఇంటికీ వెళ్ళి వాళ్ళకు సమస్య వివరించి చెప్పి ఒక్క గంట సేపు తన స్నేహితురాలి పెళ్ళికి రమ్మని అడిగింది. శారద అడిగిన తీరుకి అందరూ ఒప్పుకున్నారు.

పెళ్ళిలో విశాల  తరపున వచ్చి నిలబడిన వాళ్ళని చూసి విశాలే విస్తుపోయింది. విశాల మామగారి బంధువులంతా తలకిందుయ్యారు. వాళ్ళు మిగిలిన పనులు  పక్కన బెట్టి కాంగ్రెస్‌ పెద్దలకు, అందునా బ్రాహ్మణ పెద్దలకు ఉపచారాలు చేస్తూ  ఉండిపోయారు.

విశాల  పక్కన ఎవరూ లేని సమయం చూసి శారదకు కృతజ్ఞతలు  చెప్పింది. తనమీద శారదకున్న ప్రేమ మర్చిపోలేనంది.

‘‘పిచ్చిదానా. ఈ ఆలోచన నా బుర్రలో పుట్టలేదు. నేనసలు  నీ పెళ్ళికి రావొద్దనుకున్నాను. మీ అమ్మ చెప్పింది ఇట్లా చేస్తే అత్త గారింట్లో నీ గౌరవం పెరుగుతుందని చెప్పింది. మీ అమ్మ బతిమాలి నా చేత ఈపని చేయించింది.’’

విశాల  ముఖం పాలిపోయింది.

‘విశాలా మీ అమ్మకు నువ్వు లేవు గానీ నీకు మీ అమ్మ ఉంది. అది మర్చిపోకు. ఎప్పుడైనా అవసరమైత మీ అమ్మ దగ్గరకు సందేహం లేకుండా వెళ్ళు.’

శారద మాటలకు విశాల  ముఖం మాడిపోయింది.

ఇంతలో ఎవరో వచ్చి పెళ్ళి కూతురు కావాలంటూ తీసుకుపోయారు. శారద పెళ్ళింట్లో భోజనం చేయకుండా వెళ్దామనుకుంది గానీ సుబ్బమ్మ అలా కుదరదంది. అక్కడ ఆవిడ దూరపు బంధువులెవరో కన్పించారు కూడా.

సాయంత్రం ఇదంతా మూర్తితో చెప్పి నవ్వుకుని సేద దీరింది శారద.

***

అదే ప్రేమ!

 

-ఎండ్లూరి మానస

manasa endluri‘ఇది తీయని వెన్నెల రేయి…మది వెన్నెల కన్నా హాయి…నీ ఊహల జాబిలి రేఖలు మురిపించెను ప్రేమ లేఖలు…’

నేనూ అర్జున్, ఒకే ఇయర్ ఫోన్స్ లో ఏ వెయ్యో సారో వింటున్నాం ఈ పాట! మా తోట ఊయలలో…నా ఒళ్ళో అర్జున్!అతని గుండెల మీద నా చేతిని తన చేత్తో పెనవేసుకున్నాడు. తను కళ్ళు మూసుకుని పాటని ఆశ్వాదిస్తున్నాడు..నేను అర్జున్ స్పర్శలో కరిగిపోతున్నాను…ఊయలకి అల్లుకున్న సన్నజాజులు నా చెక్కిలిని ముద్దాడుతున్నాయి. ఈ రేయి…ఈ సన్నజాజులు పెట్టే గిలిగింతలు…ఈ ఊయల…ఈ పాట…నా అర్జున్!అబ్బ! ఎంత అదృష్టం! ఈ రాత్రి ఇంకా ఉండాలి.సూర్యుడు కాస్త మెల్లగా ఉదయిస్తే ఎంత బావుణ్ణు!ప్చ్!

అర్జున్ ని ఈ పాట ఎన్ని సార్లు పాడమన్నా నా కోసం పాడడు.ఇప్పుడైనా అడగాలి! చల్లగాలికి మల్లె రేకలు సీతాకోకచిలుక రెక్కల్లా రెపరెపలాడుతున్నాయి..కాస్తంత దూరంగా మరువం సువాసన వాతావరణాన్ని ఇంకాస్త మత్తెక్కిస్తోంది..వెన్నెల కాంతిలో అర్జున్ ముఖం మరింత మెరిసిపోతోంది!కోటేరు ముక్కు..చిన్ని నుదురు..అందమైన పెదవులు..వాటిపై తన మగసిరి చూపించే మీసం…అసలు అర్జున్ అందమంతా ఆ మీసంలోనే ఉంది!

మెల్లగా ఒంగి పెదాల చివరన ముత్యమంత ముద్దు పెట్టాను తన మీసానికి తగిలీ తగలకుండా!చిత్రం!!అర్జున్ లెగలేదే?!నిద్రలోకి జారుకున్నాడా ఏంటి?!అరె!పాట పాడమని అడుగుదామనుకున్నాను కదా!మీసం చివర నుంచి తన చెంపను స్ప్రుసిస్తూ చెవి వెనుక మృదువైన ఒక ముద్దు!కిందకి జారుతూ మెడ మీద ఒక ముద్దు!నా కోసం కట్టిన గుడిని పదిలపరిచిన తన గుండెకి ఒక చిన్న ముద్దు!నా ప్రేమనంతా కలబోసి తన అరచేతిలో ఒక సున్నితమైన ముద్దు!నా ప్రేమను అంగీకరించినందుకు నుదుటి మీద మరో ముద్దు! మూతలు పడ్డ కనురెప్పల మీద లేలేత ముద్దు!

అర్జున్ కి ఇంకా మెలకువ రావడం లేదే?నా తాకిడిలో జీవం లేదా?లేక ఆట పట్టిస్తున్నాడా?!

“అర్జున్!అర్జున్!” పిలుస్తున్నా లేవడం లేదే! ఇక లాభం లేదు!గట్టిగా తట్టాల్సిందే!

“అర్జున్ లే!” గట్టిగా ఊపుతూ కిందపద్దను!!

“డార్లింగ్!”

‘నడి రాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు…’

ఇయర్ ఫోన్స్ లో పాట…మంచం కింద నడ్డి విరిగి నేను!!

“ఛ!ఇదంతా కలా!?ఆఖర్లో ‘డార్లింగ్’ అని అర్జున్ నన్ను పిలిచినట్టు కూడా అనిపించిందే! దెబ్బకి మత్తు వదిలిపోయింది” అనుకుంటూ పైకి లేచాను.

ఫోన్ లో పాట ఆపేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి నీళ్ళు గొంతులో పోస్కోబోయి ఒళ్ళంతా తడుపుకున్నాను! స్వయక్రుతాపరాధానికి

తిట్టుకుంటూ తడంతా తుడుచుకుని వచ్చి బట్టలు మార్చుకుని ఈ సారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచినీళ్ళు తాగి మళ్ళీ మంచమెక్కాను.కళ్ళు మూసుకోగానే అర్జున్!ఎందుకు ఈ అబ్బాయి ఇలా నన్ను చిత్రవధ చేస్తున్నాడు!మనసులో మాట చెప్తే ఎలా తీసుకుంటాడో!ఏమనుకుంటాడో!ఆఫీస్ లో తన కంటే సీనియర్ ని!పైగా టీం లీడర్ ని!!చులకనై పోతానేమో అని ఒక బాధ!ఒక వేళ తనకీ నా లాంటి ఉద్దేశమే ఉంటే?!

అర్జున్ ఆఫీస్ లో చేరి పదకుండు నెలలవుతుంది.అంటే దాదాపు ఏడాది కాలంగా నా ప్రేమను నా లోనే దాచుకొని మధన పడుతున్నాను!రేపు ఎలాగోలా చెప్పేస్తాను!అసలే అందగాడు అందులోనూ మంచివాడు!ఇంకెవరైనా ఎగరేసుకుపోతారు! నిద్రపోదామని కళ్ళు మూశాను.కొంటెగా కన్ను గీటుతూ అర్జున్!చప్పున లేచి కూర్చుని సెల్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్ పిన్ కొట్టి అర్జున్ కి తెలియకుండా తీసిన తన ఫొటోస్ చూసుకున్నాను.

“ఎంత ముద్దుగా ఉన్నావు రా!కల్లో కూడా అచ్చం ఇలాగే ఉన్నావే!” నా పిచ్చి చేష్టలకి నేనే నవ్వుకుని ఫోన్ ఆఫ్ చేసి అర్జున్ తలపులతోనే నిద్రపోయాను.

రోజు పొద్దున్నే నిద్రలేచి తయారయి ఆఫీసుకి వెళ్ళడమంటే మహా విసుగ్గా ఉండేది అర్జున్ రాకముందు. కానీ ఇప్పుడు? పొద్దెప్పుడెక్కుతుందా అని, అప్పుడే అస్తమిస్తున్నవా అని సూర్యున్ని రోజుకి రెండు సార్లు తిట్టుకోవాల్సి వస్తుంది! ఆఫీసు టైం అయిపోతుంది అంటే నేను పడే బాధ స్కూల్ పిల్లలు కూడా పడరేమో!

***           ***             ***

ఆఫీసు పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి దిగుతూనే ఎదురయ్యాడు అర్జున్!వంగపండు రంగు చొక్కా, గోధుమ రంగు పాంటు…ఆ ఐదడుగుల పదంగుళాల ఎత్తూ…ఆ అందం ఆ మీసం…కొత్తావకాయ పచ్చడి లా ఊరించేస్తున్నాడు! అప్రయత్నంగా పలకరించేశాను!

“హాయ్ అర్జున్!వాట్సప్?”

“హాయ్ టీ యల్!కళ్ళెర్రగా ఉన్నాయండి!నిద్రపోలేదా సరిగ్గా?

‘నీ విరహాగ్నిలో నిద్రెక్కడ పడుతుంది?’ లోపల అనుకుని

“హా!లైట్ గా” అన్నాను పైకి

“ఓ ఐ సీ!ప్లీజ్ టేక్ కేర్ అఫ్ యువర్సెల్ఫ్”

“ష్యూర్” నా వలపులు పైకి కనబడకుండా జాగ్రత్త పడుతూ అన్నాను

“హేయ్!నైస్ గ్లాసెస్!ఎక్కడ తీస్కున్నారు?” అడిగాడు నా కొత్త కళ్ళజోడు చూస్తూ

“నచ్చాయా?ఉంచేసుకోండి!” అనేసాను మనసులోని మాట

“అరెరే!వద్దండి.నేనూ ఇలాంటి వాటి కోసమే వెతుకుతున్నాను.అందుకే అడిగాను.అయినా  మీవి పెట్టుకోడం బాగోదు!”

“ప్లీజ్!తీసుకోండి. మొహమాట పడొద్దు!నా గిఫ్ట్ అనుకోండి అర్జున్” బలవంతంగా అతని చేతిలో పెట్టేశాను.

“అదేంటండీ!అసలే నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. టీం లీడర్ అయ్యుండి నా పనంతా మీరే చేసేస్తారు. పైగా ఇదొకటి!” చాలా సిగ్గుపడుతూ అన్నాడు. ఎంత ముద్దొచ్చేశాడో!

“నిన్న మీకు ‘బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అండి.నిన్నే చెప్దామనుకున్నా కానీ అందరూ మీ చుట్టే ఉండడం వల్ల చెప్పలేకపోయా!సారీ!రెండేళ్ళ

నుంచీ ఆ అవార్డు మీకే వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా! మీ టీం మెంబెర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది!”

అర్జున్ కళ్ళు మెరిసిపోతున్నాయి!తన మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. తన చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.

“సరె సరే!ఎక్కువ పొగిడేయకండి!థ్యాంక్ యు!మళ్ళీ కలుద్దాం!”

షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనసు సిద్ధంగా ఉంది కానీ ధైర్యం సరిపోలేదు!

‘ఏమనుకుంటాడో?’ అనే ఒక్క ప్రశ్న అన్నిటికీ అడ్డం పడుతోంది ముందుకి సాగనివ్వక!

***           ***             ***

మరుసటి రోజు కేఫటేరియాలో బాదంపాలు తాగుతూ కనిపించాడు అర్జున్. నా మనసంతా నిర్లిప్తంగా ఉంది. అర్జున్ని చూస్తుంటే నా మీద నాకే జాలి!సానుభూతి!చెప్పాలనుకున్న మాటలన్నీ పెదవి వెనుకే ఆగిపోతున్నాయి. ఈ జన్మకి చెప్పగలనా?చెప్పడానికి భయం కాదు!మొహమాటం లేదు!సంకోచం మాత్రమే.తరువాత జరిగేది ఊహకి అందడం లేదు!ఔనంటే నా అంత సంతోషించేవారు లేరు.కాదంటే?అదొక ఘోర అవమానం! కళ్ళల్లో నీళ్ళు రానివ్వకుండా ప్రయత్నిస్తున్నాను.

“మీ పెర్ ఫ్యూమ్ చాలా బావుంది టీ యల్!” చక్కటి చిరునవ్వుతో అన్నాడు అర్జున్.

“ఎందుకు విచిత్రంగా టీ యల్ అని పిలుస్తారు? అందరిలా పేరు పెట్టి ‘నువ్వూ’ అని మాట్లాడొచ్చుగా!నేనూ ఎవరితో ఇంత ఫార్మల్ గా మాట్లాడను. మీతోనే!”

“అంటే ఈ ‘గార్లు’, ‘బూర్లు’ మనిద్దరికే ప్రత్యేకం అన్నమాట!మంచిదేకదండీ!ఇందాక నేను మీకొక కంప్లిమెంట్ ఇచ్చాను!బదులు చెప్పనే లేదు!”

‘నాకు తెలుసు నీకిష్టమైన బ్రాండ్ అని!అందుకే కొనుకున్నాను’ మనసులో అనుకుని

“థ్యాంక్ యు!మీకు నచ్చినందుకు” ఏ ఆర్భాటం లేకుండా అన్నాను అర్జున్ తో

“మీకు ఏం ఆర్డర్ చెయ్యమంటారు?

“టీ”

“ఓ గుడ్.నేనైతే అస్సలు టీ కాఫీ తాగను టీ యల్” అంటూ లేచి వెళ్ళాడు.

ఏంటి?టీ కాఫీ తాగడా?అన్నీ తెలుసుకున్నాను కానీ ఈ విషయం తెలీదే నాకు!ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అంత సులువా?!ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒకరి పట్ల ఒకరికి సరిగ్గా అవగాహన ఉండదు!నేనెంత!అర్జున్ తో మాట్లాడడానికి ఇదే అనువైన సమయం!అడిగేస్తాను!నేనంటే ఇష్టమో లేదో!

అర్జున్ టీ తీసుకువస్తున్నాడు.బ్లూ జీన్స్,బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ లో అదిరిపోయాడు ఇవ్వాళ!టీ తెచ్చి ఎంతసేపైనా తాగలేదు నేను.

“అదేంటి ఇంకా టీ తాగలేదు మీరు?” కప్పు లోకి తొంగి చూస్తూ అడిగాడు అర్జున్

“మీకిష్టo లేదుగా!” తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాను

“అదేంటి?నాకిష్టం లేకపోతే ఏం?” తటపటాయించాడు

“హహ్హహ!టీ బాలేదు అందుకే”

“అయ్యో!పోనీ కాఫీ తీసుకురానా?

“వద్దు బాదం పాలు ట్రై చేద్దామనుకుంటున్నా!”

“తెస్తాను టీ యల్!ఒక్క నిమిషం” లేవబోయాడు

“ఎందుకు?మీ చేతిలో ఉందిగా బాదంపాల టిన్!” ఎంత ఆపుకున్నా ముఖం లో సిగ్గు తొణికిసలాడుతూనే ఉంది నాకు.

“అదీ…అంటే నేను కొంచెం తాగాను.మీకు వేరేది తెస్తాను!”

“పర్లేదు!మీరు తాగాక ఆఖరిలో జస్ట్ టేస్ట్ చేస్తానంతే!”

అతడి ముఖంలో మార్పులు!కానీ స్పష్టత లేదు!!

***           ***             ***

“హ్యాపీ బర్త్ డే అర్జున్!”

“థ్యాంక్ యు టీ యల్.నాకు తెలుసు మొదటి కాల్ మీరే చేస్తారని!”

“అదెలా?”

“అదంతే!ఎలాగూ సండే కాబట్టి మీకో చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నాను.మీరు తప్పకుండా రావాలి!”

“అదేం వద్దు కానీ, మీ బర్త్ డే మా ఇంట్లోనే చేసుకోవచ్చు!మీరే రండి!పదకుండు గంటల కల్లా!”

“ఇంట్లో అంటే…మీ పేరెంట్స్ ఉంటారు కదా?పర్వాలేదా…?”

“ఏంటి మీకు తెలీదా?వాళ్ళు అమెరికాలో మా అక్క దగ్గర ఉంటున్నారు.ఇంట్లో నేను మాత్రమే ఉంటాను.వచ్చేయండి!బై”

ధైర్యం చేసి అర్జున్ ని పిలిచేశాను!అతనికి ఇష్టమైన కేక్ ఆర్డర్ చేశాను. ఇల్లంతా డెకరేట్ చేశాను. తనకి నచ్చే వంటలన్నీ స్వయంగా చేశాను.అన్నీ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళిన ఐదు నిమిషాలకి బెల్ మోగుతోంది!అయ్యో! అర్జున్ వచ్చేశాడే!ఇలాగే టవల్ లో వెళ్లి దర్శనమిస్తే?చిలిపిగా నవ్వుకుని క్షణాల్లో రెడీ అయి తలుపు తీశాను.

తలారా స్నానం,కొత్త బట్టలు,కొత్త సెంట్,కొత్త వాచ్…సరికొత్త అర్జున్!లోపలికి వస్తూనే డెకరేషన్ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

“ఎందుకు ఇదంతా?”గోముగా అన్నాడు అర్జున్

“ముందు ఇది కట్ చేయండి!” చాకు అందిస్తూ అన్నాను

“నాకు చాక్లెట్ కేక్ ఇష్టమని మీకెలా తెలుసు?” ప్రేమగా అడిగినట్టు అనిపించింది

“ఇంకా చాలా తెలుసు!” ఓరనవ్వు తో సమాధానమిచ్చాను

అర్జున్ కేక్ కట్ చేశాడు.ఆ తర్వాత కట్ చేసిన కేక్ నాకు తినిపిస్తాడనే తలపే నాకు ఊపిరాడకుండా చేస్తుంది!అతని ముని  వేళ్ళు నా పెదాలకి, మునిపంటికి తగిలాయి!గుండె ఝల్లుమంది!!చిరు చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా.అరచేతులు సన్నగా వణుకుతున్నాయి.తనకివ్వాల్సిన కానుక నా గుప్పిట్లో ఊపిరాడక అవస్థ పడుతోంది!అర్జున్ ఎదురుగా నిలబడి ఒక్కొక్క వేలూ తెరిచి కానుక చూపించాను.అతడి కళ్ళు చెమర్చాయి!అమితాశ్చర్యంగా దాన్ని అందుకున్నాడు.

“నాకా?” ఉవ్వెత్తున ఎగిసే ఆనందం నిండిన కళ్ళతో అడిగాడు అర్జున్.

అవునన్నట్లు తలూపాను.

“మీరే పెట్టండి”

ఆ బంగారపుటుంగరం మా బంగారు భవిష్యత్తుకి పునాది అని నా ఆలోచన. కానీ ఆ మాట బయటకు చెప్తేగా తనకీ తెలిసేది!అర్జున్ చేతుల్లోంచి ఉంగరం తీసుకుని తన కుడి చేతి ఉంగరపు వేలికి తొడిగాను. నా చేతులు చల్లగా, తడిగా…వణికిపోతున్నాయి!అర్జున్ చేతికి చాలా అందంగా ఉందా ఉంగరం. నాకు మాటలు రావడం కష్టంగా ఉంది.

“భోం చేద్దాం పదండి” అన్నాను. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.

డైనింగ్ టేబుల్ మీద పన్నీర్ కోఫ్తా,మటన్ ఫ్రై,చికెన్ బిర్యానీ,డబల్ కా మీఠా,అన్నం, పప్పు, గోంగూర పచ్చడి,ములక్కాడ జీడిపప్పు కూరలు చూసి అవాక్కయాడు!

“ఏంటండీ ఇవన్ని ఎవరితో చేయించారు?”

“ఎవరు చేస్తారు?నేనే” దొంగ కోపంతో అన్నాను.

“మీరా టీ యల్!నా కోసం మీరు చేశారా?నాకిష్టమైనవన్నీ నాకు తెలియకుండా కనుక్కుని ఇంత సర్ప్రైస్ ఇచ్చారు!నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇది!మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. బహుశా బ్యాచిలర్ గా ఇదే నా ఆఖరి పుట్టినరోజు అనుకుంటా!”

కళ్ళకింద భూమి కంపించినట్టైంది నాకు! పెళ్ళా??అంటే అర్జున్ కి నా మీద ప్రత్యేకాభిమానం లేదనమాట! ఇంత తేలిగ్గా చెప్పేశాడేంటి?ఎంత దిగమింగడానికి ప్రయత్నించినా దుఃఖం,బాధ బొట్టు బొట్టుగా కళ్ళ వెంబడి కారుతూనే ఉన్నాయి…నా ఆవేదన దాచుకోడంలో విఫలమై అర్జున్ ముందు కన్నీటి పర్యంతమయ్యాను.అర్జున్ ఆందోళన పడుతున్నాడు.

“అరెరే!ఇప్పుడేమైందని?కళ్ళు తుడుచుకోండి ప్లీజ్!” తన జేబులోంచి రుమాలు తీసి నా కళ్ళు తుడవబోయాడు.

“ఏం లేదు సారీ!ఏదో గుర్తొచ్చి…సడన్ గా…అలా ఇమోషనల్ అయ్యాను.ఏం అనుకోకండి” ఏడుస్తూనే చెప్పాను.

అర్జున్ తన చేతుల్లోకి నా ముఖాన్ని తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను నమ్మలేని ప్రశ్న సూటిగా అడిగాడు!

“ఇంత పెద్ద అబద్ధం చెప్పినా నా మీదున్న ప్రేమని వ్యక్తపరచారా?”

నేను విన్నది నిజమేనా?కల కాదు కదా?వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అర్జున్ నోరు తెరిచి నన్ను అడిగాడా?!నిర్ధారించుకోడానికి మళ్ళీ చెప్పమని అడిగాను.

“మీరు విన్నది నిజమే!నేనంటే మీకిష్టం లేదూ?”

“అదీ…” నీళ్ళు నమిలాను

“నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం!కానీ పైకి చెప్పాలంటే సిగ్గు!మీరేమనుకుంటారోనని భయం!ఈ రోజు ఎలాగైనా చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా!చెప్పేశా!అయినా మీ మనసులో ఏముందో తెలీదే!”

అర్జున్ ఆ మాటలు చెప్తున్నంత సేపూ నా గుండె వేగం పెరిగిపోయింది.నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.నా కల,నా ఆశ, నా అర్జున్…నిజమైన వేళ అది!

“నాకూ మీరంటే చాలా ఇష్టం!పిచ్చి!!” నిర్భయంగా చెప్పేశాను.

“ఈ మాట కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంటూ నాకు తెలియకుండానే నన్ను కౌగలించుకున్నాడు!అలాగే బెడ్ రూమ్ లోకి తీస్కెళ్ళాను.కౌగిలి బిగుసుకుంది.వచ్చీరాని ధైర్యం కూడగట్టుకుని తన బుగ్గ మీద నా మొదటి ముద్దు పెట్టాను!

‘అర్జున్…”

“మ్!చెప్పండి”

“ఇంకా అండి ఏంటి?పేరు పెట్టి పిలిచి మనస్పూర్తిగా ఏదైనా చెప్పొచ్చుగా!”

“గోపాల్…ఐ లవ్ యూ!”

“ఐ లవ్ యూ టూ అర్జున్!”

*

 

 

 

 

 

 

 

 

 

పుష్కర పోస్టుమార్టం 

                

   –బమ్మిడి జగదీశ్వరరావు

 మా యింట్లో అందరూ

పుణ్యాత్ములే!

మేం పుష్కర స్నానాలు చేసాం!

           ***

పాపాల్ని గోదాట్లో

వదిలేసాం!

పాపం చేపలు యేమవుతాయో ఏమో?

          ***

పిండాలు పెట్టేశాం!

పెద్దలకీ

నదికీ

         ***

ఓకే.. లైట్స్ ఆన్..

స్టార్ట్.. కెమేరా.. యాక్షన్..

కట్ చేస్తే- యిరవయ్యేడుగురు!

***

కొందరు మనుషులకీ

కొన్ని యిల్లకీ

శవాలే తీర్థ ప్రసాదాలు!

        ***

మూడే మునకలు

మూడే నిముషాలు

అయినా యింట్లో యీకోలీ సంగీత కచేరీలు!

        ***

గోదారి నీళ్ళు

పరమపదసో’పానం’

సేవిస్తే వైకుంఠవాసం!

        ***

పుణ్యం ప్రజలకి

ప్రచారం ప్రభుత్వానికి

స్వచ్ఛ భారత్ గోదావరికి!

        ***

గోదావరి పొర్లి పొర్లి యేడుస్తోంది!

ఉన్నప్పుడు ఊసే లేదు!

చచ్చాక పిండ ప్రదానం!

***

పాప ప్రక్షాళనకీ నదీ ప్రక్షాళనకీ

                           యెన్ని పుష్కరాలు పడుతుందో?

             ప్రభుత్వ ప్రక్షాలనకి!

***

గౌతమ మహామునికి కూడా తెలీదు

మాయ గోవు మర్మం!

 గోదావరి జలాల పంపకం!

***

త్రయంబకం బంగాళాఖాతాల మధ్య

ప్రవహించేది గోదావరి కాదు!

జన జీవిత రహదారి!

****

                                                          ప్రజలవద్దకు పాలన!

ప్రజలవద్దకు పుష్కరం!

                         గోదావరి జలమిప్పుడు ‘గాడ్ జల్’!

                                    ***

      తాగేనీళ్ళు సరే, తల మీద నీళ్ళూ

                           బాటిల్ పాతిక!

     పోస్టాఫీసులో ప్రవహిస్తోంది గోదావరి!

                    ***

అందరూ సమానులే

దేవునికీ ప్రజాస్వామ్యానికీ!

మంత్రులూ విఐపీలూ కొద్దిగా యెక్కువ సమానం!

                  ***

                  అటు ఆరొందల కోట్లు

            యిటు పదహారొందల కోట్లు

ఆనకట్టల కన్న స్నాన ఘట్టాలే మిన్న!

        ***

కృత్య దేవతల్నితిన్నదో లేదో

అకృత్యమైపోయింది ఆథ్యాత్మికం

నదిని మింగిన మనుషులొచ్చారు!

***

గాయపడ్డ గోదారి

క్రిష్ణమ్మతో పలికింది

యిక నీవంతే జాగ్రత్త సుమీ అని!*

ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

ఆకాశం లో అర్ధ భాగం ను తెంపుకుని వచ్చి కొడవంటి కుటుంబ రావు గారి  జీవితం లో అర్ధ భాగం పంచుకున్నది వరూధిని అమ్మ. తొంభై ఒక్క ఏడు దాటినా – ఏ మాత్రం సడలని నిబ్బరం, ఏ మాత్రం వీగిపోని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంకా వికసిస్తున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ చూస్తే – ఆమె పెరిగిన సిద్ధాంతాల వాతావరణ ప్రభావం అంత గట్టిగా ఉంటుందేమో అనిపిస్తుంది.

వ్యక్తిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తైతే – ఒక సామాజిక జీవిగా ఇంకా చేతనం కలిగి ఉండడం అంత సులభ తరం కాదు.

పెదనాన్న స్త్రీ వాది చలం, నవలా రచయిత కొమ్మూరి సాంబశివ రావు తమ్ముడు,  తురగ జానకి రాణి, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అందరూ చుట్టూ దగ్గరి బంధువులు. కూతురు కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత. కొడుకు, రోహిణీ ప్రసాద్,  భారత దేశం లో పేరెన్నిక గన్న న్యూక్లియర్ శాస్త్ర వేత్త కావడమే కాక, ప్రజల భాషలో సైన్స్ ను వివరించాలనుకునే ‘ స్టిఫెన్ హాకింగ్ ‘ లాంటి వాడు అంతే అతిశయోక్తి కాదు. ఇంత మంది మధ్యలో 90 ఏళ్ళ నుండి పెరిగాక , ఆమెకు వయో భారం వలన వచ్చే మానసిక దైన్యం దాదాపుగా కనిపించదు.

రోహిణీ ప్రసాద్,    BAARC    లో సైంటిస్టుగా ఎన్నో పేటెంట్లు సాధించడానికి కారకుడు. వ్యక్తిగా తన సైన్స్ విజ్ఞానాన్ని పదిలపరుస్తూ ఎన్నో సైన్స్ పుస్తకాలు – వీక్షణం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , ప్రజా సాహితీ సంస్థల సహాయం తో ముందు తీసుకు రాగలిగాడు. విశ్వ రహస్యాన్ని ఎంత సింపుల్ గా ప్రముఖ శాస్త్ర వేత్త స్టిఫెన్ హాకింగ్ పాఠకుల ముందు ఉంచాడో – అలా తెలుగులో అటువంటి ప్రయత్నం ఆ స్థాయిలో చేయగలిగింది రోహిణి ప్రసాద్ గారే. నేను, అతడు ఒకే వెబ్ మేగజైన్ కు ఆర్టికల్స్ రాసేవాళ్ళం. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే స్థాయి లేకుండా – అదే ‘ ఇంటలక్చువల్ మోతాదులో ‘ సైన్స్ ఆర్టికల్ రాసి ఇచ్చేవాడు. తన ఆరోగ్యం పాడవుతుంటే – తనే రీసర్చ్ చేసి వ్యాధి, దానికి చికిత్స గురించి పరిశొధించి డాక్టర్లకు అడ్వైజ్ చేసేవాడు. ఆయన్ డాక్టర్ రోహిణీ ప్రసాద్ అంటే – నిజంగానే డాక్టర్ ఏమో అని వైద్యులు నమ్మేసేంత అమాయకానికి వారిని గురి చేసాడు. సైంటిస్టుగా నిజాయితీ కలిగిన ‘ సైంటిఫిక్ టెంపర్ ‘ కలిగిన వ్యక్తి. సంగీతం లో విద్వాంసుడు.

స్వంతంగా ఎన్నో స్వరాలను సురచించిన వాడు కావడం తో ఆయన రిటైర్ అయ్యాక, ఎవరో సాయి బాబా భక్తులు , సాయి బాబా కోసం స్వరాలు సమకూర్చమంటే – చప్పున ముగించి ఇచ్చేసాడు. వరూధిని అమ్మ ‘ ఏంటీ ? నీకు సాయి బాబా అంటే నమ్మకమా ? ‘ అంటే ‘ కాదు వాళ్ళిచ్చే డబ్బు మీద నమ్మకం ‘ అన్నాడు.  చాలా మంది హేతువాదులు, కుల నిర్మూలనా వాదులు – ఈ సందర్భాన్ని తప్పు పట్టొచ్చు. వాళ్లందరూ కూడా ‘ డబ్బు మీద నమ్మకం లేని వాళ్ళైతే ‘ బాగుణ్ణు. విప్లవ సాహిత్యం లో ఉన్న వాళ్ళ పై జరిగే విపరీతమైన దాడి ఏంటంటే – వాళ్ళు సౌకర్యమైన జీవితాలు గడుపుతున్నారని. నిజానికి కొడవటిగంటి కుటుంబ రావు , రోహిణీ ప్రసాద్ లు సంపాదన మాత్రమే లక్ష్యం పెట్టుకుని ఉంటే – వారు సంపాదించింది చాలా తక్కువే. ఒక ఊహాత్మక ఆదర్శం లో – ప్రగతి వాదులను ఇరికించి ‘   impractical expectations     ‘ పెట్టుకోవడం  ఒక రకమైన ‘   totalitarianism    ‘ అవుతుంది తప్ప ఇందులో గొప్పగా ప్రశంసించ  దగ్గ విషయం ఏమీ లేదు. ఒక మనిషి సాధించిన దేమిటో వదిలేసి, సాధించనిది ఏమిటో ఆలోచించడం మధ్య తరగతి    frustration     లో భాగం తప్ప మరేమీ కాదు.

కలాం లాంటి సైంటిస్ట్ – సైన్స్ నే కాదు, అత్యున్నత రాష్ట్రపతి పదవి స్థానం యొక్క ఆత్మ గౌరవాన్నే వదిలేసాడు. అది పక్కా  ‘  careerism ‘.  ప్రతి విప్లవ కళా కారుడి కుటుంబాన్ని ‘   full time revolutionary   ‘  జీవితం నడపాలని ఆశించడం లో తప్పు లేదు గాని , అలాగే ఉండాలనే ‘ ఆంక్షల జీవితాన్ని ‘ డిజైన్ చేయడం సరి అయిన దృక్పథం కాదు. శ్రీ శ్రీ – సినిమా రచనలు చేసాడు అని విమర్శిస్తే  మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ? సినిమాలు అసలు ఉండవద్దనా , సినిమాలు ఉన్నా పర్లేదు శ్రీ శ్రీ మాత్రం రచనలు చేయవద్దనా ? ఈ రకమైన విమర్శ మనలో ప్రతి ఒక్కరు అసలు ఎటువంటి సినిమాలూ ఉండకూడదు , మనం ( మన లాంటి మధ్య తరగతి ప్రజలు )  కూడా ఎటువంటి ‘ బాహుబలి సినిమాలకు ‘ టెంప్ట్ కాకూడదు అనుకున్నప్పుడు సద్విమర్ష అవుతుంది. ఈ డిబేట్ – పక్కన పెడితే – రోహిణీ ప్రసాద్ గారు ఖచ్చితంగా  ‘ సైంటిఫిక్ టెంపర్మెంట్ ‘ కలిగిన నిజాయితీ శాస్త్రవేత్తగానే జీవితాంతం ఉన్నాడు.

వరూధిని అమ్మ , కొకు గారి రచనల ప్రచురణార్థం , ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించలేదు. అదే శ్రీ శ్రీ రచనల విషయం లో ఏం జరిగిందో చాలా మందికి తెలుసు.

మన పరిస్థితులు మన    conviction    ను ఛాలెంజ్ చేయొచ్చు కాని దిగజారకుండా నిలబడ్డం లో గొప్ప తనం ఉంది.

కుటుంబ రావు గారికి వరూధిని అమ్మకు – వయసులో చాలా వ్యత్యాసం. కుటుంబ రావు గారు , వరూధిని అమ్మ వాళ్ళ నాన్న అప్పట్లో నడిపే తెలుగు సినిమా పత్రికకు రివ్యూలు రాసే వాళ్ళు.  శ్రీ శ్రీ, ఆరుద్ర, మొక్క పాటి నరసింహ శాస్త్రి – వాళ్ళ కుటుంబ మిత్రులుగా మెదిలే రోజులు. కొ కు గారు, తనకున్న ఆర్థిక పరమైన కారణాల వల్ల , చదువు పూర్తి చేయలేక – బోంబే లో ఎయిర్ ఇండియా టికెటింగ్ క్లర్క్గా పని చేస్తున్న రోజుల్లో, వరూధిని అమ్మ వాళ్ళ నాన్న గారు, కొ కు గారు తమ అమ్మాయికి సరి అయిన జీవన సహచరుడవుతాడని ప్రతిపాదించాక – ఇద్దరి సమ్మతం తో ఏ తంతూ లేకుండా వివాహం జరిగింది.

కొకు గారు దినమంతా రచనల్లో తల మునకలైతే – ఇళ్ళు మేనేజ్ మెంట్ అంతా వరూధిని గారిదే. కోపం తో అందరికీ వడ్డించి ‘ మీ వంట మనిషి భోజనానికి పిలుస్తుంది..రండి  ‘ అంటే ‘ నేను వంట మనిషితోనే  కలిసే భోజనం చేస్తాను ‘ అంటు మనసు తేలిక చేయగలిగే వారు కొకు గారు.

వరూధిని అమ్మ ” ఈ రోజుల్లో డబ్బు పిచ్చిలో పడి మనుష్యులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గి పోయింది ”  అంటారు. చిన్న జ్వరం వచ్చినా తనను వదిలి వెళ్ళని కొకు గారు గురించి తెలుసుకుంటే  – విప్లవ సాహిత్యం లో ఉండే కఠినత్వం , మనుష్యుల విషయం దగ్గర ఎంత సున్నితంగా మారిపోతుందో తెలుస్తుంది.

ఇది ఆయన జీవితాన్ని ‘ గ్లోరిఫై ‘ చేయడం కాదు కాని, కుటుంబం  లో ప్రజాస్వామ్యం ఉండాలనే పేరుతో ‘ యాంత్రికత ‘ ను ప్రవేశ పెడుతున్న ఎంతో మంది ప్రగతి వాదులు ఆలోచించుకోవాల్సిన విషయం.

వరూధిని అమ్మ ‘ ఏంటి ? ఎవరాయన చాగంటి అట ? స్నానం ఎలా చేయాలో చెప్తాడేంటి ? ‘ అని పుష్కర స్నానాలను సున్నితంగా అపహాస్యం చేసినా,  ‘ వీళ్ళు పాపాలు చేయొద్దని చెప్పాలి గాని, స్నానం చేస్తే పాపాలు పోతాయంటారేంటి వెధవలు ?! ‘ అని  విసుక్కున్నా – అ    momentary reaction   ఆమె కుటుంబం నమ్ముకుంటూ వచ్చిన విలువల ప్రతిబింబమే.

చలం , వాళ్ళ అక్క ఇంటి కెల్తే ‘ మాల మాదిగల ఇంట్లో తిరిగొచ్చాడని ‘ వరండాలోనే విస్తరి వేసేది. వరూధిని అమ్మ – ఇది ప్రత్యక్షంగా చూసింది.  ప్రజాస్వామిక వాదుల జీవితాలు ఆకాశం నుండి రాలి పడవు. వీళ్ళు నలుగురి మధ్య ఉండి జీవనం నడుపుతూ ఒక ‘ ప్రజల గొంతు ‘ వినిపించాలి. అందుకు కుటుంబం ప్రతిబంధకం అవుతుంది, కుటుంబం లో వ్యక్తుల   aspirations   కూడా ప్రతిబంధకం అవుతుంది. వీరి చుట్టూ ‘  utopian world  ‘ ను విమర్శకులు కట్టి,  positivity     ని తక్కువ చేస్తూ చూడ్డం లో సరి అయిన ప్రమాణం లేదు.

ఒక సారి కొకు గారి మీద , మా రంగ నాయకమ్మ గారు యథావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాసారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగ నాయకమ్మ తో కుటుంబ మితృత్వం  ఉన్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. ఆ వ్యాసం రాసాక – చాలా రోజుల వరకు , రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుండి వరూధిని అమ్మకు ఫోన్ లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుండి ఫోన్ వచ్చింది.

వరూధిని అమ్మ ఫోన్ లో యథాలాపంగానే పలకరించాక, ఉండబట్టలేక రంగ నాయకమ్మ ” మీకు చూపు సరిగ్గానే ఉందా ? ”  అని ఆడిగింది.

వరూధిని గారు ” ఆ ..పర్లేదు …పత్రికలు చదువ గలుగుతున్నాను ”  అని సమాధానం ఇచ్చింది ఆమె ఎందుకు వాకబు చేస్తుందో తెలిసి.

” మరి నే కుటుంబ రావు గారి గురించి వ్యాసం రాసాను చదవలేదా ? ” అని ప్రశ్నించింది.

వరూధిని అమ్మ ఏ మాత్రం హావ భావాలు లేకుండా ” ఆయన పబ్లిక్  పర్సనాలిటి. ఎందరో ఆయన్ను విమర్శిస్తుంటారు. పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను ? ” అన్నది.

అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్  ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం. ప్రజల గురించి రాసిన రచనల మీద – ఇక రాసిన వ్యక్తికి ఏం హక్కు ఉంటుంది ?  అదొ ప్రజల ఆస్తిగా మిగిలాక ,  రచయితగా ఆ వ్యక్తి ఏం చేయాలి ఇక ? వ్యక్తులను, రచనలను వేరు చేసి తమపై వస్తున్న విమర్శ ను స్వీకరించాలని ఈ రోజుల్లో ఎంత మంది ప్రగతి వాద రచయితలు తెలుసుకున్నారు ? తమ రచనకు ఎటువంటి విమర్శ రాకుండా, పూర్తి స్థాయిలో , ఫుల్ టైం బేసిస్ మీద – లాబీయింగ్ – చేస్తున్న రచయితలను మనమెంత మందిని చూడ్డం లేదు ?!

ఇదే విషయమై – వరూధిని అమ్మను తట్టి చూస్తే అంటుంది ” ఈ రోజుల్లో రచయితలకు వ్యక్తిగత ప్రతిష్ట యావ ఎక్కువయ్యింది. ఒకరి భుజాల మీద ఇంకొకరు శాలువాలు కప్పుకుందామనుకుంటారు. ఇదంతా ఒక రొచ్చు లా అయ్యింది ” అంటారు. తనను – కొకు గారి గురించి ఏవన్నా చెప్పమని టీ వీ ఛానల్స్, పత్రికల వాళ్ళు ఎగబడి ఆహ్వానిస్తున్నప్పుడు తను వాళ్ళతో అన్న మాట – ” కుటుంబ రావు గారి రచనలు నేనెంత చదివానో మీరూ అంతే చదివారు. ఇక వ్యక్తిగతమైన విషయాలు , మీతో  నేను పంచుకోవాలనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది – అది నా పర్సనల్ వ్యవహారం. పది మందికి చెప్పుకుని పేరు తెచ్చుకునే వ్యవహారం కాదు ” అని.

‘ అమ్మా ! మీరు ఇంత మంది సాహితీ వేత్తల మధ్య పెరిగారు . మీరెందుకు రచనలు చేయలేదు ? ‘ అని ప్రశ్నిస్తే వరూధిని అమ్మ ” కుటుంబ రావు గారు రాసిన సాహిత్యం చదివి విమర్శించాల్సింది మొదట నేనే కదా ? నేను బాగో లేదన్న కథను ఆయన వెంటనే పారేసే వారు. మార్పులు కూడా చేసే ప్రయత్నం చేసే వాళ్ళు కారు. ” అంటారు.

పేరు ప్రతిష్టల  గొడవలో కొట్టుకు పోతున్న ఈ తరం ప్రగతి వాద రచయితలు –   identity crisis    అన్నది లేకుండా బతకడం ఒక ఆచరణే కాదు, మనం నమ్ముకున్న కొన్ని సామాజిక విశ్వాసాలపై ఉన్న     confidence  , మన రచనల్లో అంతర్లీనంగా మనం ప్రకటించిన ఆత్మ విశ్వాసం  అన్న విషయం తెలుసుకోవాలి.

ఈ రోజుకూ రాజకీయ వార్తలను శ్రద్ధగా చదవడం , అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ఆమెకు షరా మామూలుగానే ఉంది. ” అలా కాదు..చంద్ర బాబు, వేరే దేశాలకెళ్ళి, మన దేశం లో వ్యాపారం చేయమని అడుగుతున్నాడేంటి ? మరి మన వ్యాపారస్తులు ఏమైపోతారు ? ” అమాయకంగా అడిగినట్టు ఉంటుంది కాని, ఈ దేశం లో పాతుకుపోతున్న సామ్రాజ్య వాద వ్య్వస్థ పై ఇంకా ఆ ఆక్రోషం ఉంది ఆమెలో. ” మనం సింగ పూర్ లా మారడం ఏంటి ? మనం మన దేశం లా ఉండాలి కాని ” అంటుంది. ” విప్లవం రావ డానికి ఇంకా చాలా కాలం పడుతుందనుకోండి. అంత వరకు వీటిని ఇలానే భరించాలి మనం ‘ అని లీలగా  నిరాశ  పడుతుంది.

కుటుంబ రావు గారు ఎప్పుడూ అవసరానికి మించిన ధనం ఉండ రాదు అని నమ్మే వారు. ఆయనకు నచ్చేది    classical music  .  కచేరీ ఎక్కడ జరిగినా ఫేమిలీ మొత్తం వెళ్ళే వాళ్ళు. అందుకేనేమో రోహిణీ ప్రసాద్ గారికి కు చిన్నప్పటి నుండి సంగీతాభిమానం. నిజానికి కొ కు గారికి ఫేమిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. కూరగాయలైనా, ఇంట్లో ఏవన్నా కొనాలన్నా అంతా వరూధిని అమ్మనే చూసుకునేది.  ఆయన సమయం మొత్తం రచనల్లోనే గడిచిపోయింది. చంద మామ ను అందంగా తీర్చి దిద్దడం లో కుటుంబ రావు గారి పాత్ర ఎనలేనిదనే చెప్పుకోవాలి.

చలసాని గారి లాంటి ఆప్త మితృలను కొల్పోతుంటే – వరూధిని అమ్మ కళ్ళల్లో పటుత్వం సడలదు గాని, బాధ ఒక గీతలా గీసినట్టు ఉంటుంది.

ఎప్పుడన్నా వృద్ధాప్యం వలన మనసు బలహీనమైనప్పుడు , వరూధిని అమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే – ఆమె ఆప్తులు ‘ నీవు మర్రి చెట్టు నీడలో పెరిగావు. నీవు ఇలా కన్నీళ్ళు పెట్ట రాదు  ‘ అని తనను  ఓదార్చుతారని చెప్తుంది.  నేను ఆమెలో బలహీనతను చూడ్డం ఇష్టం లేకనో, ఆమెలో బలం ఎలాగన్నా అలాగే కొన సాగాలనే   దురాశ వల్లనో  ” అంతే కదమ్మా ? ” అనబోతాను కాని ” అందరూ మామూలు మనుష్యులే. అందులో విలక్షణత ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికీ సాధ్య పడదు  కదా !  ” అని సర్దుకుంటాను.

*

         గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 16

 

Anne Of Green Gables By L.M.Montgomery

ప్రిస్సీ ఆండ్రూస్ కి ఆల్జీబ్రా పాఠం బోధపరుస్తూ మిస్టర్ ఫిలిప్స్  క్లాస్ వెనక ఒక మూల కూర్చుండిపోయాడు. తక్కిన పిల్లలు ఇష్టారాజ్యం గా పచ్చి ఆపిల్ పళ్ళు తింటూ కాలక్షేపం చేసుకుంటున్నారు – ఇంకా, పలకల మీద పిచ్చి గీతలూ బొమ్మలూ  గీసుకుంటున్నారు ,  అతి రహస్యంగా చెవులుకొరుక్కుంటున్నారు.  ఆన్ ని ఆకర్షించాలని గిల్బర్ట్ బ్లైత్ యథాశక్తి ప్రయత్నిస్తున్నాడు గాని , ఆన్ కి ఆ ధ్యాసే  లేదు. తను ఎక్కడుందో కూడా మర్చిపోయినట్లుగా , అరచేతుల్లో గడ్డం ఆనించుకుని  కిటికీ లోంచి ప్రకాశమాన సరోవరాన్ని చూస్తోంది. ఆ నీలిరంగు నీటిమీద తన సొంత స్వప్నలోకాల్లో తేలిపోతోంది.

గిల్బర్ట్ కి ఇలా తననే ఆడపిల్లయినా పట్టించుకోకపోవటం కొత్త , ఏ మాత్రం రుచించలేదు. అందరూ తనని గమనించే తీరాలి… ఎవరికీ లేని పెద్దకళ్ళున్న ఆ సూదిగడ్డం అమ్మాయైనా సరే.

దగ్గరికి వచ్చేసి , ఆన్ పొడుగాటి జడని  అందరికీ ప్రదర్శిస్తున్నట్లు  పట్టుకుని…అందరికీ వినబడేలాగా, ఆన్ కి గుచ్చుకుపోయేలాగా , గొణిగాడు – ” ఎర్ర కారెట్ , ఎర్ర కారెట్  ”

వినిపించింది..తన ఊహాసౌధాలు కూలిపోతూండగా ఆన్ దిగ్గున లేచి నిలుచుంది.  కళ్ళలో మండుతూన్న క్రోధం, నిరసన …కన్నీళ్ళు కూడా భగ్గుమంటున్నాయి.

” నికృష్టుడా  ! ఎంత ధైర్యం నీకు !!! ”

థాట్ ! థాట్ !!   తన పలకని గిల్బర్ట్ తలకేసి బలంగా మోదింది ..అది ముక్కలైంది , తల కాదు – పలక.

అవోన్లియా బళ్ళో ఇలాంటి దృశ్యాలని తనివితీరా ఆస్వాదించే అలవాటు.  ఇది మహా రసవత్తరంగానూ  ఉంది ..అంచేత అందరూ సంభ్రమాశ్చర్యానందాలతో – ” ఓ….” అని అరిచారు. డయానా ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది. ఉత్తుత్తినే ఏడ్చేస్తుండే  రూబీ గిల్లిస్ బావురుమంది . కీచురాళ్ళకి దారాలు కట్టి కవాతు చేయిస్తున్న టామీ స్లోన్ దారాలు వదిలేసి నోరు తెరుచుకు ఉండిపోయాడు … వాటి దారిన అవి పోయాయి.

మిస్టర్ ఫిలిప్స్ అప్పటికి స్పృహలోకి వచ్చి గబ గబా అక్కడికి చేరి ఆన్ జబ్బ పట్టుకు నిలదీశాడు – ” ఏమిటిదంతా, ఆన్ షిర్లే ? ”

ఆన్ జవాబు చెప్పలేదు . తను ‘ ఎర్ర కారట్ ” అని పిలవబడ్డానని అందరి ముందూ చెప్పుకోవటం ఆమెకి  అసాధ్యమైనపని.

గిల్బర్ట్ దృఢంగా ఒప్పేసుకున్నాడు – ” తప్పు నాదే మిస్టర్ ఫిలిప్స్. నేనే ఏడిపించాను ఆమెని ”

మిస్టర్ ఫిలిప్స్ మీద ఆ మాటలేమీ పనిచేయలేదు.

MythiliScaled

” నా విద్యార్థులలో ఒకరికి ఇంత కోపమూ కసీ ఉండటం చూస్తే నాకు సిగ్గుగా ఉంది ” అని నొచ్చుకున్నాడు… అక్కడికి తను పాఠాలు చెప్పటం వల్లనే మానవ సహజమైన అన్ని దుర్గుణాలూ బలహీనతలూ  నశించిపోతాయన్నట్లుగా .   ” ఆన్, వెళ్ళి ఈ మధ్యాహ్నమంతా స్టేజ్ మీద నిలబడే ఉండు నువ్వు ” – తీర్మానించాడు.

తనని బెత్తం దెబ్బలు కొడితేనే ఆన్ కి నయం గా ఉండేది – ఈ శిక్ష కొరడా దెబ్బల్లాగా ఉంది . కాని మారుమాట్లాడకుండా వెళ్ళి దాన్ని పాటించింది. మొహం పాలిపోయి ఉంది, ఏ భావమూ కనిపించటం లేదు. మిస్టర్ ఫిలిప్స్ చాక్ పీస్ తో బోర్డ్ మీద పెద్దక్షరాలతో రాశాడు – ” ఆన్ షిర్లే కి కోపం ఎక్కువ. ఆమె నిగ్రహాన్ని సాధన చేయాల్సిఉంది ”

ఆ వాక్యాల కిందనే ఆన్ ఆ మధ్యాహ్నమంతా నిలుచుని ఉంది. ఏడవలేదు, తల దించుకోలేదు. రగులుతున్న ఆగ్రహం ఆమెకి అవమానాన్ని భరించే శక్తిని ఇచ్చింది. డయానా సానుభూతి చూపులనీ, నిరసన గా చార్లెస్ స్లోన్ తల ఆడించటాన్నీ, జోసీ పై  ద్వేషపు నవ్వులనీ ఆమె ఒకేలా ఎదుర్కొంది. గిల్బర్ట్ ` అతనివైపుకి చూడనేలేదు !!! జన్మలో అతని మొహం చూడదుగాక చూడదు !!!!

బడి వదిలేశాక ఆన్ తన ఎర్ర జుట్టు తలని ధీమాగా పైకెత్తుకుని బయటికి నడిచింది.  గిల్బర్ట్ వరండా లో ఆమెని  ఆపే ప్రయత్నం చేశాడు.

” ఆన్, క్షమించు నన్ను ,  నీ జుట్టుని వేళాకోళం చేసినందుకు . చాలా తప్పు అది , నిజం చెబుతున్నాను…మనసులో పెట్టుకోకు నువ్వు ”- వీలైనంత  నిజాయితీగా అన్నాడు.

విననట్లే , తిరస్కారంగా – అతన్ని దాటుకుని వెళ్ళిపోయింది ఆన్.  డయానా  వారించబోయింది – ” ఆన్…ఉండు ..” – సగం మెచ్చుకోలు, సగం అయిష్టం కలిగాయి ఆమెకి ఆన్ ధోరణి చూస్తే. తనే అయితే ఎప్పటికీ గిల్బర్ట్ ని అలా నిర్లక్ష్యం చేయనేలేదు.

” గిల్బర్ట్ బ్లైత్ ని ఎప్పటికీ క్షమించేదిలేదు ” ఆన్ తిరుగులేనట్లు చెప్పింది – ” నా హృదయం లో శూలాలు దిగిపోయాయి’’   డయానా కి ఆ మాటలు పెద్దగా  బుర్రకెక్కలేదు గాని , పరిస్థితి అర్థమైంది.

” నీ జుట్టు గురించి ఏడిపించాడని బాధపడద్దు ఆన్ ” ..ఓదార్చింది. ” అందరు అమ్మాయిలనీ అలాగే ఏదో ఒకటి అంటూనే ఉంటాడు కదా . నా జుట్టు ఇంత నల్లగా ఉంటుందని ఏడిపించాడు తెలుసా..నన్ను కనీసం పన్నెండుసార్లు ‘ నల్ల కాకి ‘ అని ఉంటాడు. ఇంతవరకూ ఎవ్వరికీ క్షమాపణ చెప్పుకోవటం నేను చూడనేలేదు ”

” కాకి అనిపించుకోవటానికీ కారట్ అనిపించుకోవటానికీ చాలా తేడా ఉంది ” ఆన్ నిర్వేదం గా చెప్పింది…” గిల్బర్ట్ బ్లైత్ నన్ను అతి తీవ్రంగా గాయపరచాడు డయానా ”

తర్వాత ఇంకేమీ సంభవించకపోతే ఆ గొడవ అంతటితో సమసిపోయి ఉండేదే. కాని ఒకసారి మొదలయాక ఇలాంటివి ఆగవు.

మధాహ్నాలప్పుడు  అవొన్లియా బడి పిల్లలు గుట్ట మీది స్ప్రూస్ చెట్ల తోపులో చెట్టు బంకని గిల్లుకుంటూ గంతులేస్తుంటారు.[ దాన్ని చ్యూయింగ్ గం లాగా నములుతారు ]  ఆ తోపు  మిస్టర్ బెల్ ది, అతని పచ్చిక బీడుకి ఆనుకుని ఉంటుంది. మిస్టర్ ఫిలిప్స్ ఎబెన్ రైట్ వాళ్ళింట్లో అద్దెకి ఉంటాడు. ఆ బీడు లోంచి చూస్తే అక్కడినుంచీ మిస్టర్ ఫిలిప్స్ బయల్దేరాడో లేదో పిల్లలకి కనిపిస్తుంది, టీచర్ కనిపిస్తూనే పరుగు లంకించుకుంటారు. శాయశక్తులా పరుగెత్తినా రెండు మూడు నిమిషాల ఆలస్యం అవుతూనే ఉంటుంది, పిల్లలు రొప్పుతూ రోజుతూ వచ్చేసరికి.

ఆ మర్నాడు మిస్టర్ ఫిలిప్స్ కి ‘ సంస్కరణల  ‘ మీద ధ్యాస మళ్ళింది [ అప్పుడప్పుడూ అలా తేడా చేస్తుంటుంది అతనికి ] . తను వచ్చేసరికి విద్యార్థులంతా ఎవరి చోట్లలో వాళ్ళు కూర్చుని ఉండాలని ఆశించాడు ఆ రోజు, ఎవరు ఆలస్యంగా వచ్చినా వాళ్ళకి దండన తప్పదు.

ఆవాళ అందరు అబ్బాయిలూ కొందరు అమ్మాయిలూ యథాప్రకారం స్ప్రూస్ తోపులోకి వెళ్ళారు. కాస్తంటే కాస్త .. బంక దొరకగానే వెనక్కి వచ్చేయాలనే వాళ్ళ ఉద్దేశం. అయితే అలా కుదిరింది కాదు.. ‘ నములు బంక మైకం ‘ వాళ్ళని కమ్మేసింది. చెట్టు మీదినుంచి ‘ వచ్చేస్తున్నాడు ‘ అని జిమ్మీ గ్లోవర్ కేక పెట్టే దాకా  అక్కడే ఉండిపోయారు.

ఆడపిల్లలు నేల మీదే ఉన్నారు గనక తక్షణం పరుగు పెట్టి ఒక్క అర క్షణం ముందుగా క్లాస్ లోకి చేరగలిగారు. మగపిల్లలు చెట్లు దిగి కాళ్ళకి పనిచెప్పేసరికి ఆలస్యం అవనే అయింది. ఆ తోపుకి ఆ చివరన  ఆన్ కూడా ఉంది..నములు బంక కోసం కాదు… తన ‘ సొంత స్వప్న లోకాల్లో ‘  విహరించుకుంటూ. జుట్టులో రైస్ లిల్లీ పూలు గుచ్చుకుని,  కూనిరాగాలు తీసుకుంటూ ఆ నీడల లోకం లో తననొక వనదేవత లాగా ఊహించుకుంటూ తిరుగుతోంది.  ప్రమాదపు హెచ్చరిక ఆమెకీ వినిపించింది .  వేగంగా పరుగెత్త టం వచ్చు కాని ,  ఎంత చేసీ మగపిల్లల గుంపుతో కలిసి మటుకే అక్కడ అడుగుపెట్టటం వీలయింది. అప్పటికి మిస్టర్ ఫిలిప్స్ క్లాస్ లోపలికి వెళ్ళిపోయి టోపీని గోడ మీది మేకుకి తగిలిస్తున్నాడు.

anne 16-3

మిస్టర్ ఫిలిప్స్ లో  సంస్కరణాభిలాష  ఆపాటికి బాగా ఉపశమించి ఉంది..పన్నెండు మంది అబ్బాయిలని ఒకేసారి శిక్షించి హడావిడి చేసే ఓపిక బొత్తిగా లేదు…కాని తన మాట వృధా పోకూడదు గనుక ఎవరో ఒకరి మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించాలి. ఆయాసపడుతూ తన సీట్లో కూలబడుతున్న ఆన్ మీద  అతని దృష్టి ఆగింది. ఆన్ చెవి పక్కనుంచి  ఇంకా ఒక రైస్ లిల్లీల గుత్తి వేలాడుతూనే ఉంది , అది  క్లాస్ రూం తో బొత్తిగా పొసగని అవతారం  గనుక మిస్టర్ ఫిలిప్స్ విజృంభించాడు.

” ఆన్ షిర్లే ! నీకు అబ్బాయిలతో కలిసి తిరగటం బాగా నచ్చుతుంది లా ఉంది, నీ ఇష్టాన్ని ఈ మధ్యాహ్నం గౌరవించదలచుకున్నాను. ఆ పూల గుత్తి తీసి పడేసి వెళ్ళి గిల్బర్ట్ బ్లైత్ పక్కన కూర్చోమ్మా , పద  ”

తక్కిన అబ్బాయిలు కిసుక్కుమన్నారు. డయానా ఆందోళనగా  ఆన్ జుట్టులోంచి పూలగుత్తి లాగేసి ఆమె చెయ్యిగట్టిగా పట్టుకుంది  . ఆన్ గుడ్లప్పగించి టీచర్ వైపు చూస్తుండిపోయింది.

” నేను చెప్పింది వినబడిందా, ఆన్ ? ” కటువుగా అడిగాడు మిస్టర్ ఫిలిప్స్.

” వినబడిందండీ. కాని మీరు నిజంగానే అంటున్నారా అని… ” ..మెల్లగా అడిగింది.

” నిజంగానే , ఏ- మీ సందేహం అక్కర్లేదు. చెప్పినట్లు చెయ్యి ” ..పిల్లలందరికీ, ముఖ్యంగా ఆన్ కి – అసహ్యం పుట్టించే వ్యంగ్యం మిస్టర్ ఫిలిప్స్ గొంతు లో ఉట్టిపడుతోంది.

జారుడు మెట్లలో ఆఖరిది ఇది ఆన్ ప్రాణానికి . పదమూడు మందీ చేసిన తప్పుకి తననొక్కదాన్నే శిక్షిస్తుండటం ఘోరం, ఆ శిక్ష లో ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటం ఇంకా ఘోరం, ఆ అబ్బాయి గిల్బర్ట్ బ్లైత్ అవటం మహా ఘోరం. ఇది అతి దుర్భరం, భరించే ప్రయత్నం కూడా చేయలేనని ఆన్ కి అర్థమైంది. పట్టలేననంత ఆగ్రహం తో, అవమానం తో నిలువెల్లా వణికిపోయింది.

గిల్బర్ట్ నీ ఆన్ నీ చూసి తక్కిన పిల్లల  గుసగుసలూ మోచేత్తో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని నవ్వుకోవటాలూ కాసేపు సాగాయి. ఆన్ తలెత్తకుండా తదేకంగా నేలచూపులు చూస్తోంది..గిల్బర్ట్ తన భవితవ్యమంతా వాటిమీదే ఆధారపడిఉన్నంత దీక్షగా భిన్నాల లెక్కలు చేసుకుంటున్నాడు ..త్వరలోనే పిల్లల దృష్టి వాళ్ళ మీదినుంచి మళ్ళిపోయింది. మిస్టర్ ఫిలిప్స్ , క్లాస్ కి వచ్చేముందర ‘ ప్రిస్కిల్లా కోసం  ‘ అనే పద్యమాలికను తయారు చేసుకోవటం   మొదలుపెట్టి ఉన్నాడు – వాటిలో  ఒకచోట ఎంతకీ ప్రాసకుదర టం లేదు , దాన్ని  సాధించటం లో నిమగ్నుడై  ,అతనూ  ఆన్ ని పట్టించుకోవటం మానేశాడు.  అది అదనుగా గిల్బర్ట్ ఒక గులాబి రంగు పిప్పరమెంట్ ని సంచిలోంచి బయటికి తీసి ఆన్ మోచేయి కి లోపలి వైపున డెస్క్ మీద పెట్టాడు. అది హృదయాకారం లో ఉంది, దాని మీద బంగారు రంగు అక్షరాలతో ‘ నువ్వు మంచిదానివి ‘ అని రాసి ఉంది. ఆన్ అటూ ఇటూ చూసి, దాన్ని తీసుకుని  కింద పడేసి బూట్ కాలితో కసిదీరా పొడిపొడి చేసేసింది.  గిల్బర్ట్ వైపుకి తల తిప్పి చూడనే లేదు.

బడి అయిపోయాక ఆన్ తన డెస్క్ దగ్గరికి నిటారుగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడి తన వస్తువులన్నీ..పలకా, పుస్తకాలూ, బలపాలూ పెన్సిళ్ళూ  అన్నిటినీ ఒకచోట పేర్చింది. తీసుకుని బయల్దేరింది.

సగం దూరం వెళ్ళాక, ” ఇవన్నీ ఇంటికెందుకు పట్టుకు పోతున్నావు ఆన్ ? ” డయానా భయం భయంగా అడిగింది, అప్పటివరకూ ఆ మాట అడిగేందుకు ధైర్యం చాలలేదు ఆమెకి.

” నేనిక బడికి రాదలచుకోవటం లేదు ” – ఆన్ గంభీరంగా జవాబు ఇచ్చింది. డయానా వెర్రి మొహం వేసుకుని చూస్తుండిపోయింది.

” దానికి మెరిల్లా ఒప్పుకుంటుందా ఏమిటి ?  ” –  డయానా ఆశ.

” ఒప్పుకు తీరాలి. మళ్ళీ బడికి వెళ్ళి ఆ మనిషి మొహం చూసేది లేదు , అంతే ”

”ఆన్…అయ్యో ” డయానాకి ఏడుపొచ్చేస్తోంది. ” నువ్వు ఆ మాట నిజంగా అనట్లేదు, నాకు తెలుసు. నువ్వు రాకపోతే ఎలా..ఆ మిస్టర్ ఫిలిప్స్ దరిద్రుడు నన్ను ఆ దిక్కుమాలిన పిల్ల గెర్టీ పై పక్కన కూర్చోబెడతాడు…నువ్వు లేకపోతే నాకెలా తోస్తుంది ..”

” నీకోసం ఏమైనా చేస్తాను డయానా..నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఇమ్మన్నా సరే. ఇది మాత్రం అడగద్దు నన్ను, నా ఆత్మ దగ్ధమైపోతుంది ”

” మరి ఇదంతా ఉంది కదా ” – డయానా బెల్లించబోయింది. ” మనం వాగు పక్కన కొత్త బొమ్మరిల్లు కట్టుకుందామనుకున్నాం కదా ?  వచ్చేవారం నాట్యగోష్ఠి పెట్టుకుందామనుకున్నాం కదా ? నువ్వెప్పుడూ నాట్యానికి వెళ్ళనేలేదని చెప్పావు…జేన్ ఆండ్రూస్  మనకి నాట్యం చేసుకుంటూ పాడేందుకు కొత్త పాట నేర్పిస్తానంది కదా  ?? ఆలిస్ ఆండ్రూస్ బొమ్మల పుస్తకం పట్టుకొస్తానంది కదా ?? వాగు పక్కనే కూర్చుని ఒక్కొక్క అధ్యాయమూ పైకి చదువుకుందామనుకున్నాం కదా …నీకు పైకి చదవటమంటే ఎంతో ఇష్టం కదా ఆన్..నువ్వు లేకపోతే ఇదంతా ఎలా ?? రావూ ? ”

ఆన్ వీసమెత్తు కూడా చలించలేదు. ఆమె దృఢంగా నిశ్చయించేసుకుంది- మళ్ళీ బళ్ళోకి వెళ్ళదు, మిస్టర్ ఫిలిప్స్ మొహం చూడదు – అంతే . ఇంటికి వెళ్ళి మెరిల్లా దగ్గర ఈ విషయం ప్రకటించింది.

” ఏడిశావులే . నీ మొహం ” మెరిల్లా కొట్టిపడేసింది.

” కాదూ కాదు !”  – ఆన్ రోషంగా చూసింది – ” నీకు అర్థం కావట్లేదా మెరిల్లా ? నాకు అవ- మా- నం – జరిగింది ”

” అవమానమా నీ తలకాయా. రేపు మామూలుగా బడికి వెళ్ళు ”

” లేదు మెరిల్లా. నా వల్ల కాదు. ఇంట్లోనే చదువుకుంటాను. నీకు అన్ని పనులూ చేసిపెడతాను, నువ్వు చెప్పినట్లే నోరు మూసుకుని ఉంటాను , ఎలా చెబితే అలా వింటాను. బడికి మాత్రం వెళ్ళను ”

అప్పటికి   ఈ బుజ్జిదాని మొండితనం మెరిల్లా బుర్రకెక్కింది. ” ఇది నిజంగానే అంటోంది. ఒక్కొక్కసారి ఎంత మొండికెయ్యగలదో నాకు గాక ఎవరికి తెలుసు !! మిస్టర్ ఫిలిప్స్ దే తప్పని నాకూ అనిపిస్తోంది. అయినా ఆ మాట పైకి అనకూడదు కదా . మిసెస్ రాచెల్ ని వెళ్ళి అడిగితే సరి. ఈపాటికి ఆవిడకి అంతా తెలిసిపోయే ఉంటుంది ” . ఇంకేమీ రెట్టించలేదు ఆన్ ని.

మెరిల్లా వెళ్ళేసరికి మిసెస్ రాచెల్ ఎప్పటి ఉత్సాహం తో బొంత కుట్టుకుంటోంది.

” నేనెందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది ” మెరిల్లా కొంచెం సిగ్గుపడుతూ అంది.

మిసెస్ రాచెల్ తల ఊపింది , చెప్పమన్నట్లుగా.

”అదే..బళ్ళో ఆన్ గొడవ. ఇక ససేమిరా బడికి వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. పిల్ల చూస్తే బొత్తిగా డీలా పడిపోయినట్లుంది. అసలు వెళ్ళటం మొదలెట్టినప్పటుంచీ ఇలాంటి అల్లరేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. దీని స్వభావానికి ఇంతవరకూ అంతా సాఫీగా వెళ్ళటమే ఆశ్చర్యం. నాకేమీ పాలుపోవటం లేదు. ఏం చెయ్యమంటావో చెప్పు ”

” నన్ను అడుగుతున్నావు గనుక ..” – మిసెస్ రాచెల్ మొదలెట్టింది . ఆవిడకి సలహా అడగబడటమంటే ఎంతో ప్రీతి అని తెలిసిన సంగతే. ” నేనైతే కొన్ని రోజులు ఆన్ మాటే వింటాను.   ఆన్ కోపానికి  మిస్టర్ ఫిలిప్స్ నిన్న దాన్ని దండించటం సరైనదే. ఇవాళ మటుకు తప్పు పూర్తిగా అతనిదే. పదముగ్గురు ఒకే తప్పు చేస్తే దీనికొక్కదానికే  ఎలా శిక్ష వేస్తాడు ? పైగా ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటమా..అదేమీ మర్యాద గా లేదు. ఇందాకే టిలీ బట్లర్ బళ్ళోంచి ఇంటికి వెళుతూ నాకు అంతా చెప్పుకొచ్చింది. అదీ దాని తోటి ఆడపిల్లలూ అందరూ ఆన్ వైపే మాట్లాడుతున్నారట. మిస్టర్ ఫిలిప్స్ మీద అందరికీ మండిపోతోందట. ఆన్ కి బళ్ళో ఇంత పలుకుబడి ఉంటుందనుకోలేదు నేను, ఆశ్చర్యం వేసింది సుమా ”

” అయితే నిజంగానే బడికి పంపకుండా ఉంచెయ్యమంటావా ? ” – మెరిల్లా నమ్మలేక పోయింది.

” ఆ. అవును..అది వెళ్తాననేవరకూ. నేననుకోవటం ,  ఒక వారం రోజులు గడిస్తే అదే చల్లబడుతుంది. ఇప్పుడు బలవంతంగా పంపితే మంచి కన్నా చెడే ఎక్కువ. నా ఉద్దేశం లో ఇలాంటివాటి గురించి ఎంత తక్కువ హడావిడి జరిగితే అంత నయం. బళ్ళోకి వెళ్ళనంత మాత్రాన ఆన్ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు- ఆ మిస్టర్ ఫిలిప్స్  పాఠాలు అంత గొప్పగా ఏం ఉండవు లే . అతను చిన్నపిల్లలని అసలు పట్టించుకోకుండా క్వీన్స్ అకాడెమీ లో చేరబోయే పెద్ద పిల్లలకే మొత్తం సమయం కేటాయిస్తుంటాడట. ఇక క్రమశిక్షణ అంటావా..అతని పద్ధతులని ఆ మాటతో పిలవనేకూడదు. ట్రస్టీ లలో ఒకరు వాళ్ళమామయ్యకాబట్టిగాని , లేదంటే ఈ ఏడాది అతని  ఉద్యోగం ఊడేదే   ! ఏమిటో..ఈ ఊళ్ళో చదువు సంధ్యలు –  ఇక మీదట  ఎలా తెల్లారుతాయో  ఏమో   !!! ”

మిసెస్ రాచెల్ మాట ని మెరిల్లా అక్షరాలా పాటించింది. బడికి వెళ్ళటమన్న మాటే ఇంట్లో వినిపించలేదు. ఆన్ ఇంట్లో పనులకి సాయం చేసింది, శ్రద్ధగా పాఠాలు చదువుకుంది , సాయంకాలాలు డయానాతో ఆడుకుంది. ఏ దారివెంట వెళుతుంటేనో, ఆదివారం చర్చ్ లోనో గిల్బర్ట్ బ్లైత్ ఎదురైతే ఆమె మొహం ద్వేషం తో నిండిపోయేది. గిల్బర్ట్ ఆమె చేత క్షమించబడాలని ఎంత ప్రయత్నిస్తే ఆన్ అంత గా బిగుసుకుపోయేది. వాళ్ళిద్దరి మధ్యనా శాంతి నెలకొల్పాలనే డయానా ప్రయత్నాలు ఎంతమాత్రమూ ఫలించలేదు. గిల్బర్ట్ ని ఆన్ తన జీవితాంతమూ అసహ్యించుకుంటూనే ఉండేలా ఉంది.

గిల్బర్ట్ మీద ఎంత ద్వేషమో డయానా మీద అంత ప్రేమ ఆన్ కి..అది రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆన్ హృదయం లో ప్రేమా ద్వేషమూ రెండూ అతి తీవ్రంగానే ఉంటుంటాయి, మధ్యే మార్గం ఆమెకి చేతనవదు.

ఒక రోజున మెరిల్లా బుట్టలో ఆపిల్ పళ్ళు నింపుకుని తోటలోంచి వస్తోంది. తూర్పు కిటికీ లోంచి సందెవెలుగు ని చూస్తూ ఆన్ కుమిలి కుమిలి ఏడుస్తోంది.

” ఎందుకెందుకు..ఏమైంది ? ”

” ఓ..మెరిల్లా. డయానా అంటే నాకు చాలా చాలా ఇష్టం. తను నాతో  లేకుండా ఉండలేను. పెద్దయాక తనకి పెళ్ళైపోతుంది కదా, భర్త తో వెళ్ళిపోతుంది కదా ..అది తలచుకుని ఏడుస్తున్నాను. భ-ర్త- అట…వాణ్ణి తలుచుకుంటేనే అసహ్యమేస్తోంది. అదంతా కనిపిస్తోంది నాకు మెరిల్లా…డయానా మంచులాగా తెల్లగా ఉన్న మెత్తటి పెళ్ళి గౌన్ లో ఎంత అద్భుతంగా ఉందో ! నేను తోడు పెళ్ళికూతురిని…నా గౌనూ బావుంది, దానికి బుట్ట చేతులు కూడా ఉన్నాయి. గుండె పగిలిపోతున్నా అణుచుకుంటూ చిరునవ్వుతో తిరుగుతున్నాను.  ఇదిగో..డయానా వెళ్ళిపోతోంది…వీడ్కోలు చెప్పాలి…” – ఒక్కసారిగా   గొల్లు మంది ఆన్.

మెరిల్లా చటుక్కున అటువైపుకి తిరిగిపోయింది, మొహం కనిపించకుండా. కాని లాభం లేకపోయింది- దగ్గరగా ఉన్న కుర్చీలో కూలబడి పొట్ట చెక్కలైపోయేలా నవ్వింది…నవ్వుతూనే ఉంది , ఆవైపు వెళుతూన్న మాథ్యూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు..మెరిల్లా ఇంతగా విరగబడినవ్వి ఎన్నేళ్ళైపోయింది !!!

” ఆన్ షిర్లే ! ” – నవ్వులోంచి మాట పెగిలాక అంది ఇలా –  ” ఏం చోద్యమే నీది  !!! లేని బాధలు అరువు తెచ్చుకు మరీ ఏడుస్తుంటావు సరే ,  అంత అలవిగాని బాధలే తెచ్చిపెట్టుకోవాలా.. కాస్త మోతాదైనవి ఊహించుకోరాదా , నీ ఊహా శక్తి మండిపోను ! ”

 

– [ ఇంకా ఉంది ]

జలియన్ వాలా బాగ్ లో చంపేసుకుందాం..

 

-సత్యమూర్తి

 

వరంగల్ జిల్లాలో జరిగిన శ్రుతి ఎన్ కౌంటర్ పై ‘ఆ పిల్ల..’ పేరుతో రమాసుందరి గారు రాసిన భావోద్వేగ కవితపై కొందరి వ్యాఖ్యలు చూశాక కొన్ని అభిప్రాయాలు పంచుకోవాలనిపించింది. వ్యాఖ్యల్లో చెప్పాల్సిందంతా  వివరంగా చెప్పలేం కనుక విడిగా రాయాలనిపించింది.

శ్రుతి వంటి అమాయక పిల్లలకు మాయమాటలు చెప్పి సాయుధ పోరాటంలోకి పంపి ప్రాణాలు తీయిస్తున్నారని కొందరు కొందరిని పేర్లు ప్రస్తావించకుండా తిట్టారు. యువత ఏదైనా సాధించాలనుకుంటే అడవులకు వెళ్లకుండా, వీధుల్లోకి వచ్చి పోరాడాలని నిరాయుధ ఉద్యమ పిలుపు ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంపై వ్యతిరేకతను ఛిద్రమైన శ్రుతి శవం సాయంతో ముసుగులేకుండా వ్యక్తీకరించుకున్నారు. చరిత్ర సంఘర్షించేటప్పడు నిజానికి ఇలాంటి స్పష్టమైన అభిప్రాయాలే రావాలి.

ఎవరు ఎలా పోరాడాలన్నది ఒకరు చెబితే తేల్చుకోవాల్సిన విషయం కాదు. పోరాట రూపం ఎంపికలో వ్యక్తిగత చైతన్యమే కాకుండా సామూహిక చైతన్యం కూడా పనిచేస్తుంది. విప్లవోద్యమంలో పీడితులు, తాడితులు మాత్రమే పోరాడరని,  సమాజంలో మార్పును ఆశించే వాళ్లు కూడా పోరాడతారని చరిత్ర చెబుతోంది.  శ్రుతి దీనికి తాజా నెత్తుటి ఉదాహరణ. శ్రుతి ఎంచుకున్న మార్గం మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించుకునే ముందు ఆమెను కిరాతకంగా చంపడం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్నా వేసుకోవాలి. దీనికి వచ్చే జవాబును బట్టే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆమెకు ఆ పోరాటాన్ని మించినదేదో సాయుధపోరాటంలో ఉందనిపించి అటువైపు వెళ్లింది. తెలంగాణ కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా ప్రోత్సహించారు కూడా.  బహుశా ఆమె తెలంగాణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బలిదానం చేసుకుని ఉండుంటే కూడా అభ్యంతరం చెప్పకుండా ఆమె త్యాగంపై కవితలూ, పాటలూ రాసేవాళ్లు. ఇప్పుడు ఆమెను కిరాతంగా చంపేసిన ప్రభుత్వం ఆమె తెలంగాణ కోసం చట్టబద్ధంగా ప్రాణం తీసుకుని ఉంటే ఆమె కుటుంబానికి లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఆమె అడవులకెళ్లి  చచ్చిపోవడమే! ప్రాణాన్ని బట్టి కాకుండా చచ్చిన ప్రాంతాన్ని బట్టి చావుకు విలువ!

శ్రుతి విద్యావంతురాలు కనుక అడవులకెళ్లకుండా ఏ  గ్రూప్-1 పోస్టో కొట్టి, ప్రజల బాగు కోసం ప్రజాస్వామికంగా పోరాడి ఉంటే, సమాజానికి కూడా మేలు చేసే అవకాశముండేదని ‘అడవుల’ వ్యతిరేకులు అంటున్నారు. శ్రుతి పోలీసు అయ్యి నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేసి వ్యవస్థను భద్రంగా కాపాడుతూ ఉండుంటే వీళ్లకు మరింత సంతోషంగా ఉండేది కాబోలు!

ప్రభుత్వాలు, రాజ్యాంగాలు నిర్దేశించిన రూపాల్లోనే ఉద్యమిస్తూ ఉండుంటే శ్రుతి మన కళ్లముందరే తిరుగుతూ ఉండేది. కానీ ఆమెకు ఈ చక్కని మనుగడ కిటుకు తెలియదు. శ్రుతి ఆలోచనలేమిటో మనకు తెలియదు కాని, ఆమె మమేకమైన ఉద్యమం ఆలోచనలు ఆమెవి కూడా కనుక ఆమె ఎందుకు అడవులకు వెళ్లిందో వాటిద్వారా తెలుసుకోవచ్చు. దేశ స్వాతంత్ర్య పోరాటం ఎంత బలహీనంగా, అడ్డగోలుగా సాగినా, దానితోపాటు,  ‘కలసి వచ్చిన‘ రెండో ప్రపంచం యుద్ధం వంటివాటితో తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టి, నల్లదొరలను గద్దె ఎక్కించాం. నల్లదొరలు మన నెత్తికెక్కి తెల్లదొరలను మించిపోయారు. తెల్లదొరల పాలనలో కనిపించని నల్లకుబేరులు ఇప్పుడు ఊరికి పదిమంది, వీధికొకరు  పుట్టుకొచ్చారు. స్వతంత్ర భారతంలో  ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరే ఒకే ఒక చట్టవిరుద్ధ ఉద్యమం కూడా నక్సల్స్ రూపంలో అవతరించింది. నల్లదొరలను గద్దెదింపి సమసమాజ స్థాపనకోసం పోరాడుతోంది. దాని పోరాట రూపంపై అభ్యంతరాలు ఉండడం తప్పేమీ కాదు. కాని బ్రిటిష్ వాళ్ల పాలనలో కూడా లేనంత ఘోరంగా, కిరాతకంగా ఉద్యమకారులను చంపడం మటుకు కచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఖండించకపోవడం, ఖండించక్కర్లేదని అనడం అమానుషం, అనాగరికం, అవకాశవాదం. ఆ చావుకు చచ్చిన వాళ్లదే బాధ్యత అని తెలివిగా మాట్లాడ్డం పోలీసుల భాష మాట్లాడ్డమే.

శ్రుతి చట్టబద్ధ హత్యను సమర్థిస్తున్న వాళ్లు అల్లూరి, భగత్సింగ్, కొమురం భీంల హత్యలను కూడా సమర్థించినట్లే అవుతుంది. ఎందుకంటే వాళ్లు కూడా శ్రుతి మాదిరే ‘చెప్పుడు మాటలు’ విని  ప్రభుత్వ ఆమోదిత రూపాల్లో పోరాడకుండా, అడవులూ, ఆయుధాల బాటలూ ఎంచుకుని అనవసరంగా చచ్చారు కనుక. ‘వాళ్లు పరాయి ప్రభుత్వాన్ని కూలదోయడానికి అలాంటి మార్గం ఎంచుకోవచ్చు. కానీ మనం చెమటోడ్చి ఓటేసి ఏర్పాటుచేసుకున్న మన ప్రభుత్వాలను కూలదోయడానికి మటుకు ఆ మార్గాన్ని కాకుండా బహిరంగ, ప్రజాస్వామ్య పోరాటాలు చేయాలి’ అని అని సెలవిస్తారా? అలా అయితే, అసలు ఆ పోరాటాలే అక్కర్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎటూ  ఐదేళ్లకు ఒకసారి మారిపోయి, కూలిపోయి.. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరింత బలం పుంజుకుని వచ్చే ప్రభుత్వాలను అనవసరంగా పనులు మానుకుని, వీధుల్లోకి వెళ్లి, గొంతులు చించుకుని కూలగొట్టడమెందుకు? లేదు లేదు, ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఉద్యమించి తీరాల్సిందే అని అంటారా? అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలని ‘చెప్పుడు మాటలు’ వినే జనానికి పిలుపిస్తూ కవితలు, వ్యాసాలు రాసి, సభలు పెడితే సరిపోతుంది. ఆ పార్టీలు ప్రగతి వ్యతిరేకం అనుకుంటే సీపీఐకో, సీపీఎంకో ఓటేయమనాలి. వాటికేయడం దండగ, అవి అధికారంలోకి రావు, వచ్చినా అవి కూడా బెంగాల్ లో మాదిరి జనాన్ని పీడిస్తాయి అని అంటారా? అయితే ఎంచక్కా ఏ ప్రభుత్వమూ రావడానికి వీల్లేని ‘నోటా’ ఉండనే ఉంది. వాళ్లకు, వీళ్లకు ఓటేయాలని ఇచ్చే పిలుపులు, సభలు కూడా ఉద్యమాలకిందికే వస్తాయి అని వాదిస్తారా? అయితే అవీ అక్కర్లేదు. పార్టీలు ఆ ఉద్యమాలను దాదాపు డెబ్బై ఏళ్లుగా కన్నులపండుగగా కదం తొక్కిస్తూ నిర్వహిస్తున్నాయి కనుక..

శ్రుతి హత్యపై కవితలు, పాటలు రాయొద్దంటే అల్లూరి, భగత్సింగులపైనా, ప్రజాస్వామికబద్ధంగా హత్యకు గురయ్యే హక్కుల కార్యకర్తలపైనా రాయొద్దు. ఇలాంటి కవితల వల్లే అడవులకు వెళ్తున్నారని అడవుల వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు కాని, నిజానికి వాళ్లది శుద్ధ అనసరమైన ఆందోళన. ‘మాకొద్దీ తెల్లదొరతనమూ..’, ‘పదండి ముందుకు, పదండి తోసుకు.. ’, ‘నీ త్యాగం ఉన్నతమైనది..’ వంటి పాటలు, కవితలు మనసును కదిలించి, ఆవేశం తెప్పిస్తాయంతే. నిజానికి వాటికి ఉద్యమబాట పట్టించే శక్తే ఉంటే బ్రిటిష్ వాడు 1910లలోనే మనకు స్వాతంత్ర్యం ఇచ్చిపోయుండేవాడు. 1940లలోనే ఇప్టా కళారూపాలతో ఒక్క నెత్తురుబొట్టూ చిందకుండానే దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వచ్చుండేది. 1970లలో నక్సలైట్ల రాజ్యం వచ్చుండేది.

కనుక ఈ కవితలు, పాటలు మీరనుకున్నంత ప్రమాదకరమేమీ కావు. నిశ్చింతగా ఉండండి. సందర్భం కనుక మరో మాట.. ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ దుస్థితిని గుండెకరిగేలా, తెలంగాణ కోసం రోడ్లపైకొచ్చేలా చేసిన ప్రసంగాలు విని, రాసిన కవితలు, పాటలు పాడి.. తమ చావుతో అయినా తెలంగాణ వస్తుందేమోనని బలిదానాలు చేసుకున్నారు కొందరు ‘చెప్పుడు మాటలు’ వినే యువకులు. పాపం.. ఆ అమాయకులు ఆ పాటలు వినకపోయుంటే ప్రత్యేక, సుభిక్ష తెలంగాణాలో నిక్షేపంగా బతికుండేవాళ్లు. వాళ్ల చావులకు ఆ పాటలు రాసిన కవులు, పాడిన గాయకులు ఇప్పుడు బాధ్యత వహించాలి..! అడవులకు పంపేవాళ్లతోపాటు వీళ్లనూ బోనెక్కించాలి..!

సందర్భం కనుక మరోమాట.. అడవుల్లో చనిపోయిన ఎంటెక్ శ్రుతిపై మనం కవితలు రాస్తాం, ఆమెను అడవులకు తీసుకెళ్లి చంపించేశారని వలపోస్తాం కాని, అడవుల్లో శ్రుతిలాగే చచ్చిపోతున్నగిరిజన యువతుల గురించి, పల్లెటూరి రైతుకూలీల గురించి రాయడానికి మన కలాలు కదలవు, మన గొంతులు పెగలవు. కలాల సంగతి పక్కన బెడితే.. అలాంటి వాళ్లు అడవుల్లో చచ్చినా ఫర్లేదు, శ్రుతి లాంటి వాళ్లు మాత్రం చావకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారా జాలిగుండెల అడవుల వ్యతిరేకులు?

ప్రజాస్వామిక పోరాటాలు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించనంతవరకు ప్రమాదకరమేమీ కాదు. కానీ శ్రుతికి వాటిపై నమ్మకం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమెకు తెలంగాణ వచ్చాక కూడా అసంతృప్తి పోలేదు. తన కలలు కల్లలయ్యాయని భావించింది. అందుకే మరో మార్గం ఎంచుకుంది. ఆమె అడవులకెళ్లిందని తప్పుబడుతున్న మనం ఆమె అలా వెళ్లకుండా ఉండడానికి, మన మధ్యే ఉండి పోరాడడానికి ఆమెకు బహిరంగ ప్రజాస్వామ్య ఉద్యమాలపై గట్టి నమ్మకం కలిగించామా? రెండు రెండు నాలుగు అంటే జైళ్లు నోళ్లు తెరవడం కాదు.. కేసులు, హత్యల దాకా వెళ్లే మన ఘన ప్రజాస్వామ్యంలో చేస్తున్న రాజ్యాంగబద్ధ ఉద్యమాలు విజయం సాధించి తీరతాయని ఆమెకు గట్టి విశ్వాసం కలిగించామా? కలిగించడానికి ఏమన్నా చేశామా?

1969 నాటి ప్రత్యేక తెలంగాణ పోరులో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన 369 మంది, 1975నాటి ఎమర్జెన్సీలో జైళ్లలో చిత్రహింసలకు గురై కన్నుమూసి స్నేహలతారెడ్డి వంటి వాళ్ల నుంచి మొదలుకుని.. నిన్నమొన్నటి బషీర్ బాగ్ కాల్పుల్లో(2000) చచ్చిపోయిన ముగ్గురు, ఖమ్మం ముదిగొండ కాల్పుల్లో(2007) చనిపోయిన ఏడుగురు, సోంపేట కాల్పుల్లో(2010) చచ్చిపోయిన నలుగురు.. ఇంకా అనేకచోట్ల ప్రభుత్వం చట్టబద్ధంగా పొట్టనబెట్టుకున్న వాళ్లందరూ  ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడారు. వీళ్లలో ఎవరూ ఆయుధాలు పట్టుకోలేదు. వీళ్లెవరూ అడవుల్లో వాగు ఒడ్డున శ్రుతిలా నీళ్లు తాగుతూ.. ఢిల్లీ, హైదరాబాద్ లలోని ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించి వాళ్లు కాదు. కానీ.. శాంతిభద్రతలకు ‘భంగం’ కలిగించిన వీళ్లు, ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టయి, జైళ్లలో ఉండాల్సిన వీళ్లు కూడా శ్రుతి మాదిరే రాజ్యాంగబద్ధంగా ఎన్ కౌంటర్ అయ్యారు. శ్రుతి ‘కాస్త తెలివైన’ పిల్ల కనుక అలా ఉత్తిపుణ్యానికి చావకుండా తన చావుపై కన్నీటి, గుండెతడి కవిత్వం, పాటలు రాయించుకోవడానికి అడవులకు వెళ్లింది!! ఆమెకు బషీర్ బాగ్, సోంపేట వంటి ప్రజాస్వామిక, చట్టబద్ధ, ప్రభుత్వామోదిత, ‘గెలుపు గ్యారంటీ’ ఉద్యమాలపై నమ్మకం కలిగించని మనం మాత్రం అడవులంటే జడుసుకుంటూ, మిగిలిన వాళ్లను జడిపిస్తూ బతుకుతున్నాం..

మనకు మన రాజ్యాంగాలు, చట్టాలు, ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు నిర్దేశించిన బాటలోనే ఒక్క అంగుళం, అటూ ఇటు కదలకుండా మనవైన ప్రెంచి, రష్యన్, చైనా మహా విప్లవాలు రావాలి. 1857లు, 1942 క్విట్ ఇండియాలు, 1946-51 తెలంగాణ రైతు పోరాటాలు.. చరిత్రను కుదిపిన అనేకానేక విప్లవాలు, పోరాటాలు అన్నీ ఒక్క నెత్తురు బొట్టు కూడా నేలరాలకుండా కొనసాగాలి. అన్యాయం, అక్రమాలపై మన నోళ్లు నిరంతరం నినదిస్తూనే ఉండాలి, మన పిడికిళ్లు బిగుస్తూనే ఉండాలి. అయితే అందుకు శక్తినిచ్చేందుకు మన చిన్ని బొజ్జలకు నిరంతరం శ్రీరామరక్ష కూడా కావాలి. దీనికి మరీ అంత తప్పనిసరైతే మన బిడ్డలు ప్రజాస్వామిక జలియన్ వాలా బాగ్ లలో చస్తే చావొచ్చు కానీ అడవులకెళ్లి మాత్రం చావకూడదు..!

*

 

 

 

 

బదిలీ !

-కోగంటి విజయ్ 

 

kogantiమే 28. ఈ రోజు తో ఈ కాలేజీ కి వచ్చి ఐదేళ్ళు నిండుతాయి.యీ సారి బదిలీ ఇంకొక వూరికి. అవును ప్రతి మూడేళ్ళకూ లేక ఐదేళ్ళకూ ప్రభుత్వోద్యోగులకు యిది మామూలే. ప్రతిసారి  క్రొత్త వూరు,క్రొత్త ప్రదేశం కొత్త యిల్లు, క్రొత్త మనుషులు – సహోద్యోగులు -విద్యార్ధులు -ఒకింత బాధగా, క్రొత్తగా,వుత్సాహంగా గమ్మత్తుగా వుండే వృత్తి.  వున్నన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు -వినీ విన్నట్లుగా నొప్పించక,నొచ్చుకోక, ముళ్ళమీద గుడ్డ తీసినట్లుగా జాగ్రత్తగా గడుపుతూ వూళ్ళు మారి ఇదిగో ఇక్కడ ఐదేళ్ళు గడచిపోయాయి.

‘ఏం సారూ! ఇక్కడి నుంచీవెళ్తున్నారటగదా!’ ఎదురు బడ్డ పరిచయస్తులు  అడుగుతూ పరామర్శిస్తున్నారు.

‘అవును ఎల్లుండి పొద్దున బయలుదేరతాం!’

ఈ వూరు వచ్చినప్పట్నుంచీ ఎప్పటిలాగే కాలేజీ-ఇల్లు మహా అయితే కూరగాయల మార్కెట్టుకు, సినిమాహాలుకూ, ఇద్దరు ముగ్గురు స్నేహితులనేవారి ఇండ్లకు తప్ప మరింకెక్కడికి వెళ్ళింది లేదు.  మార్నింగ్ వాక్కు, శ్రీమతి తీసుకెళ్ళమన్నప్పుడు సాయంత్రం గుళ్ళకు వెళ్ళడం తప్ప మరే ఏరియా తెలియదు.పుస్తకాలు-క్లాసులు–విద్యార్ధులు తప్ప మరే రాజకీయాలు తెలియదు.

కానీ కళాశాలల్లోనూ రాజకీయాలు వుంటాయనే సంగతి ఈ వూరికొచ్చాక బాగా అర్ధమైంది. ఇంతింత జీతాలు గడిస్తూ వందకూ, ఏభైకూ కకుర్తి పడే వాళ్ళను చూస్తే ఏవగింపు కలిగేది. జ్ఞాన సముపార్జనచేసి విద్యార్ధులను మంచి దారిలో పెట్టాల్సిన   అధ్యాపకులేనా  ఇలా చిల్లర వడ్డీ వ్యాపారాలూ, రియల్ ఎస్టేట్ దందాలు, చిట్ కంపెనీలు నడిపేది అనిపించేది. తక్కువ జీతంతో జీవితాలు నెట్టుకొచ్చే కాంట్రాక్ట్ వాళ్ళకు రావల్సిన అవకాశాలకూ అర్రులు చాచటం బాధ అనిపించేది.

రేపయినా రిలీవింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలి- ప్రతీదానిలోనూ పైసలాసించే ప్రిన్సిపాల్ శివరామయ్య కు నామీద చెప్పలేనంత కోపం. పి.జి పిల్లలకు చెప్పిన పాఠాల తాలూకూ డబ్బులో సగం మింగి కూడా ఎందుకో కొర్రుగా వుంటాడు.  నికుంభాసురుడు లాంటి కాయం – శరీరాన్ని మించిన తల,   మిడిగుడ్లు , బాలెన్స్ లేని కాళ్ళతో బాన పొట్ట తో నడక. మానసికంగా కూడా ఇలాటి లక్షణాలే.

రెండ్రోజుల్నుంచీ  ఇపుడూ, అపుడూ అంటూ తిప్పుతున్నాడు.  వెళ్ళిన వేళకు వుండడు. పడి గాపులు కాయిస్తాడు.  డిపార్ట్ మెంట్ లో వంశీధర్ కు మాత్రమే నేనంటే ప్రేమ వాత్సల్యం.  ఎన్నోసార్లు ఆదుకున్నాడు.

ఇన్ని సంవత్సరాలు ఇట్టే కాలం గడచిపోయింది.  కనీసం రేపైనా వీడ్కోలు  పార్టీ పెడతారేమో? నన్ను పొగడాల్సిన అవసరం లేదుగానీ నేను వచ్చిం తర్వాత పిల్లలో వచ్చిన ఆసక్తి, మార్పు గురించి మాటాడతారేమో అనే ఆశ! నా పిచ్చిగానీ ఇలాంటివి జరగవు-ఆశించడం నాదే తప్పు కదా! అయినావారు పొగడాలని పని చేస్తానా? చేశానా! ఇలా ఆలోచిస్తూనే రిలీవింగ్ కోసం ప్రిన్సిపాల్ రూంకు వెళ్ళాను. రాలేదు.ఓ సారి కాలేజి అంతా కలయ తిరిగాను. నా క్లాసులన్నీ చూసి వచ్చాను.డిపార్ట్ మెంటు  ఎదురుగా వున్న పున్నాగ చెట్టును తాకి, కాసేపు చెట్టు క్రింద నిలబడి వచ్చాను.  ఎన్నోసార్లు నన్నీ చెట్టు ఆశ్చర్య పరిచింది. ఉత్సాహ పరిచింది.

సమ్మర్ వెకేషన్ కావడంతో నా కిష్టమైన వ్యక్తులు, నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞత  చెప్పుకోడానికి, నా సబ్జెక్టులో  ఆసక్తిగా చదివి నా చుట్టూ తిరిగి నన్ను ప్రేమించిన విద్యార్ధుల కు శుభాభినందనలు తెలిపే అవకాశమన్నా వుండదేమో? ప్యూన్ సమ్మయ్య వచ్చి ‘ప్రిన్సిపాల్ గారు వూర్లో లేరంట! రేపు ప్రొద్దున తీసుకు వెళ్ళమన్నారు’ అని చెప్పాడు. ‘సారు! నేనొచ్చి మీకు చెప్తాను. రాకండి సార్ బాధ వేస్తోందీ.’ అన్నాడు.

chinnakatha

ఇక్కడికొచ్చాక అన్ని సెక్షన్ లలోనూ ఒక్కో విద్యార్ధి నన్ను ప్రత్యేకంగా కదిలించారు. దగ్గరయ్యారు. వారిలోకొందరికి తండ్రి లేడు. కొందరికి పూట గడవని స్థితి. కొందరు కూలీ చేసుకొని చదివిస్తున్నారు. ఫైనలియర్ లింగమూర్తి చాలా అల్లరిగా తిరిగేవాడు.  నా క్లాసులగురించి విని వచ్చి కూర్చుని గోల చేయాలని చూసాడు.  ఒకసారి చేయి కూడా చేసుకున్నాను.  కానీ క్రమంలొ ప్రేమతో దగ్గరయ్యాడు. నా ప్రతీ గ్రామర్ క్లాస్ కు వెతుక్కొని వచ్చి కూర్చునేవాడు. డిగ్రి పూర్తి అయ్యాకా కూడా  సలహాలకై తిరిగేవాడు. వారికి  ఫీజులు కట్టి అవసరమైన సలహాలిచ్చేవాడిని.   గంగాధర్, వెంకటాద్రి, సంపత్, చందూ  ఇలా అందరూ ఇంతే. కాలేజీ తర్వాత వారికి కమ్యునికేషన్  స్కిల్స్ చెప్పేవాడిని. చదివించి, రాయించి నాకు చేతనయిన సాయం చేసేవాడిని.  నా తోనే భోజనం చేసేవారు. నాతో తిరగడానికి ఇష్ట పడేవారు.  వాళ్ళకు జీవితం గురించి, కష్ట పడాల్సిన అవసరం గురించి, సమయపాలన గురించీ, ఎన్నో కధలు, విషయాలు చెప్పేవాడిని.  ప్రస్తుత సమాజం పట్ల మనుషులుగా మనం చేయాల్సిన వాటిని వారిచేత మాట్లాడిస్తూ, సలహాలు చెప్పేవాడిని. వారితో గురుశిష్య సంబంధం తో పాటు స్నేహ బంధం ఎక్కువగా వుండేది.

రేపు పొద్దున్నే లారి వస్తుంది.  అటు సామాను సర్దుకోవాలి.  ఇటు రిలీవింగ్ తీసుకోవాలి.వంశీధర్ కూడా వూళ్ళో లేడు. రాత్రికిగాని రాడు.  పైగా వాళ్ళమ్మాయి పెళ్ళి సంబంధం తో బిజీగా వున్నాడు.  ఎవరితోనూ ముఖ పరిచయాలే  కానీ సాన్నిహిత్యం లేదు.  లెక్చెరర్  గా మంచి పేరుండి ప్రయోజనం ఏముంది? అవసరానికి మనకది సాయపడాలిగదా!  ఇలా ఆలోచిస్తూ మళ్ళా ఇల్లు చేరాను.  ఇల్లంతా సర్ది, అట్ట పెట్టెలు, గుడ్డల మూటలు, వీటికి తోడు ఎండ గాడ్పు.

ప్రక్కనే ఉన్న ఊళ్ళో ఇంకో మంచి మిత్రుడున్నాడు. మధ్యాహ్నం బయలు దేరి కలిసి సాయంత్రానికి ఇల్లు చేరి ‘ ప్యూన్ సమ్మయ్య వచ్చాడా!’ అని అడిగా. ‘రాలే’దని చెప్పింది. ‘లారీ డ్రైవర్ ఫోన్ చేసాడు.  రేపు వుదయాన్నే వస్తాడుట.’

పదింటికల్లా బయలుదేరాలి.  మా బావమరిది తో ప్రొద్దున్నే శ్రీమతిని,పాపను పంపి నేను లారీ తో వెళ్ళాలనే ఆలోచన. కానీ రిలీవింగ్ తీసుకోవాలి. ఆలస్యమవుతుందేమో! తొమ్మిది గంటల టైము లో వంశీధర్ ఫోన్, ‘ప్రిన్సిపాల్ వచ్చాడు-వెళ్ళికలుద్దాం ‘ అని.  ఇద్దరం బండిమీద వెళ్ళాము.

అపుడే తాగి బయటకు వచ్చినట్లు వున్నాడు  “ఏం ఇంగ్లీష్ సారూ!అర్ధమైందా! కొంచెం లౌక్యం గా బతకాలి.  మా అమ్మాయి పరీక్ష్లలు రాస్తోంది,  కొంచెం చూసీ చూడనట్లు పొమ్మన్నా. విన్నవా! లేదు. నువ్వు డ్యూటీ చేసిన పేపర్ లో ఫెయిల్. నీ జీపియఫ్ లోనును వెంటనే శాంక్షన్ చేసా!  ఏమైనా కృతజ్ఞత చూపావా! లేదే! పీజీ క్లాసులు తీసుకున్నందుకు వచ్చిన డబ్బులో ‘సారూ, ఇదుంచండీ’ అని వినయంగా వున్నావా! లేదే. నీకు నా మీద ప్రేమ లేనపుడు నేను మాత్రం నీకు ఠంచను గా ఎందుకివ్వాలి. చెప్పూ’ అన్నాడు.  నా బాధ్యత నెరవేర్చడం తప్పా? నా ముఖం లో రంగులు మారడం చూసి వంశీధర్ నా చెయ్యి పట్టుకున్నాడు. ‘సారుకు కొచెం లోకజ్ఞానం తక్కువలెండి.మనసులో పెట్కోకండి! అన్నాడు.

‘అదే చెప్పేది-కీట్సు, శేక్సు పియరూ కాదు, ఇది తెలవాల!’ అని ‘టైపు చేసి తెచ్చారా’ అడిగాడు. పాకెట్ లో నుంచి టైప్ చేసిన ఆర్డర్ తీసి ముందు పెట్టాను. సంతకం బరికాడు.’థాంక్స్’ అని చెప్పా-‘సర్లే – వెళ్ళిరా’ అన్నాడు ఏమాత్రం కర్టసీ లేకుండా. ‘కాలేజి కి వెళ్ళి  స్టాంపు వేయించుకో నా దగ్గర లేదు’ అని లోపలకు వెళ్ళిపోయాడు.ప్రభుత్వం ఇతన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా సత్కరించింది!

బయట కొచ్చేసరికి సమ్మయ్య   స్టాంపు పాడుతో కనిపించాడు. ‘నాకు తెలుసు సారూ-ఇట్టా అయితుందని’-అన్నాడు. థాంక్స్ చెప్పి  కృతజ్ఞత గా ఏభైనోటు జేబు లో పెట్టపోయాను. ‘వద్దు సారూ! మా యిద్దరి పిల్లల ఫీజులు మీరే కట్టారు, మీ దయ వల్ల డిగ్రీ అయిపోయింది.’ అని నమస్తే పెట్టాడు.  ‘కనీసం ఇతనికి ఉన్న కృతజ్ఞత  కూడా శివరామయ్య కి లేద’నిపించింది.

వంశిధర్ కు థాంక్స్ చెప్పి ఇల్లు చేరేసరికి 10.30 అయింది.  ‘పిల్లలొచ్చి వెళ్ళారా’ అని అడిగాను. బదులుగా ‘రాలేదు’ అంటూ’రిలీవింగ్ పని అయిందా!’ అంటూ శ్రీమతి  ‘మీరు కూడా మొండికిపోక పోతే వాడి ముఖాన అడిగినది పడేసి వుంటే ఏం పోయింది?’ అంటూ నసిగింది.  ‘సర్లే ! పొద్దున్నే బయలు దేరాలి’ అంటూ గదిలో మూటల మధ్యన సర్దుకొని పడుకున్నాము.

ప్రొద్దున్నే 6 గంటలకు మా వాళ్ళు బయలుదేరుతుండగా కిషన్, లింగమూర్తి,గంగాధర్, వెంకటేష్, సంపత్, చందూ అందరూ సైకిళ్ళ మీద దిగారు. వారిని చూడగానే చాలా సంతోషమేసింది.  వాళ్ళను కలుస్తానో లేదో అనే దిగులు. చుట్టూరా మూగారు. మనసు ఒక్కసారిగా తేలికపడింది. నిన్నటి కాంపిటీటివ్ పరీక్ష ఎలా వ్రాశారో అడిగాను. వాళ్ళ కళ్ళలో స్పష్టమైన బాధ.   వాళ్ళతో వున్న అనుబంధం, సాన్నిహిత్యం ఒక్కసారిగా నన్ను చుట్టుకున్నాయి.  అందరి కళ్ళలో కన్నీటి తెర.  అభిమానం.  కిషన్  ఒక దేవుడి బొమ్మ, లింగమూర్తి బిస్కెట్ ప్యాకెట్, గంగాధర్ ఒక కప్ కేకు,  చందూ చాక్లెట్స్ ఇలా అందరూ నా చేతిలో, పాప చేతిలో వుంచారు.  ఇవన్ని కాదు వాళ్ళని చూడడం, వాళ్ళ ప్రేమని పొందుటం  కన్న నాకు ఏ  ఫేర్వెల్ ఎక్కువ కాదని పించింది.  లారీ లో సామాను సర్ది బయలుదేరాము.సంపత్ కూడా నా పక్కనే లారీలో.  మిగిలిన వాళ్ళు సైకిళ్ళ మీద అనుసరించారు. చేయి వూపి వెనక్కి వెళ్ళమని చెప్పాను. వాళ్ళని చూస్తే ఒకింత గర్వం, ఇంకొక వైపు దూరమవుతున్నారని బాధ.

ప్రతీసారీ ఇలాంటి విద్యార్ధులే టీచర్లకు  ఆశలు నింపుతుంటారు.  క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు. లారీ బయలుదేరింది. కిటికీ లోంచీ బయటకు చూసి మరోసారి చేయి వూపాను. చల్లని గాలీ తగులుతోంది.కానీ మనసంతా ముసురు పట్టేస్తున్నట్లుంది.

***

 

ధనం లేని విటుడు

 

చింతామణి .. వేశ్య

శ్రీహరి .. ఆమె తల్లి

 

శ్రీహరి: నేను చెప్పే మాట చెవికి ఎక్కించుకోవేమిటి?

చింతా: ఏమాట?

శ్రీహరి: ఈ భవానీశంకరం గాణ్ణిక రావొద్దని చెప్పమన్నానా?

చింతా: అతనిదగ్గర అంత సొమ్ము లాగేసి వెంటనే పొమ్మని చెప్పలేకపోతున్నానమ్మా. అతను వచ్చిన నెలలోనే మాన్యాలు అమ్మించేశాను. నగలకని, బట్టలకని ఇల్లు అమ్మించేశాను. రోజువారీ ఖర్చులకని, హోటళ్ళకని చెప్పి పెళ్ళాం నగలు కర్పూరం చేయించాను. అన్ని వగలు చూపించి ఇప్పుడింతలోకే పొమ్మని ఎట్లా చెప్పేదమ్మా! అతను ఉస్సూరుమంటే అతని దగ్గర తీసుకున్న సొమ్ము మనకు దక్కుతుందా?

శ్రీహరి: ఇదిగో, ఈ శ్రీరంగనీతులే నిన్ను చెడగొడుతున్నాయి. నీకున్న అందచందాలకి, చదువుకి, తెలివితేటలకి ఈ ఒక్క లోటు లేకపోతే కోట్లు సంపాదించేదానివి. డబ్బున్నంతకాలం విటుణ్ణి కోరి నెత్తినెక్కించుకోవాలి. డబ్బు అయిపోగానే కుక్కను కొట్టినట్టు బయటికి కొట్టాలి.

చింతా: అమ్మా, నీకాలంలో నువ్వట్లాగే చేశావా?

శ్రీహరి: అనుమానమా? పరమ లోభి దగ్గర కూడా వందలు వేలు గుంజాను. పులివంటి వాళ్ళను కూడా కుక్కల్లాగా మార్చేసి వాకిట్లో కట్టేశాను. కోటీశ్వరుడైనా మన గుమ్మంలో కాలు పెట్టాడంటే పకీరుని చేసి వదిలాను. ఎంత పెద్ద ఆచారవంతుడి చేతనైనా ఎంగిలి తినిపించాను. డబ్బున్నంత వరకు ఎంత ప్రేమ కురిపించినా, వట్టి పోయిన వెంటనే మన్మధుడినైనా సరే, మెడ బట్టి బయటికి గెంటేశాను.

చింతా: నేను మాత్రం తీసిపోయిందేముంది? సరేగానమ్మా! నేను పెద్దయ్యేసరికి మన కొంపలో పెద్దమ్మ చిందేస్తోంది. సంపాదించినదంతా ఏం చేశావే?

శ్రీహరి: అదేనమ్మా నావల్ల జరిగిన పొరపాటు. ఒకసారి ఒక విటుడి దగ్గర డబ్బు లాగడం కోసం వాడికి తాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. వాడితో పాటు నేను కూడా తాగకపోతే ఒప్పు కొనేవాడు కాదు. వాడు వదిలాడు కానీ, తాగుడు వదల్లేదు. చివరకి సంపాదించిందంతా తాగుడికి ధార పొయ్యాలిసొచ్చింది.

చింతా: వయసులో ఎంత సంపాదించినా ముసలితనమొచ్చేసరికి కూడుగుడ్డలుండవని మన కులానికి శాపముందట. నిజమేనా?

శ్రీహరి: నిజమేగానీ, ఆ శాపమిప్పుడు అమల్లో లేదు. పూర్వం విటులు వయసుమళ్ళిన వేశ్యల్ని వాడిన పువ్వుల్ని చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు ఊరగాయ పెంకును చీకినట్టు చివరి దాకా వదలట్లేదు. అందువల్ల ఆ శాపానికి బలం తగ్గిపోయింది. అదిసరేగానీ, ఈ భవానీశంకరం గాడేమయ్యాడు?

చింతా: ఎవర్నో అప్పడిగాడట. వాళ్లీపూట తప్పకుండా ఇస్తామన్నారని వెళ్ళాడు.

శ్రీహరి: ఈ నగరంలో ఇంకా వీడికి అప్పిచ్చే వాడెవ్వడు? వట్టిది, నేన్నమ్మను. సెనగలు తిని చెయ్యి కడుక్కున్నట్టు ఇక వీణ్ణి సాతాళించి పంపెయ్యాల్సిందే! అయినా ఒక్కడితో ఇన్ని రోజులు సరస మేంటమ్మా? రోజుకొకడిని దివాలా తీయించి మరుసటి రోజు వేరే వాడికి అదే స్థానం యిచ్చి, నిన్నే ప్రేమిస్తున్నానని మరొకడికి చెప్పి ఇంకొకడికి వల పన్నగలిగిందే నెరజాణ. అలాంటి దానికే కులంలో కీర్తి. అంతేకాదు, వేశ్యకి వయసే ప్రాణం. వయసుముదిరి అందం తగ్గితే పీనుగును జూసినట్టు చూస్తారు. వయసుండగానే రెండు చేతులా సంపాదించుకోవాలి.

చింతా: ఈ చదువంతా నాకు చిన్నప్పుడే నూరి పోశావు గదమ్మా, ఇప్పుడు మళ్ళీ పారాయణ మొద లేశావెందుకు?

శ్రీహరి: ఎందుకంటే, నువ్వొట్టి వెర్రిబాగుల్దానివి కాబట్టి. నాకడుపున పుట్టినా నా గుణం ఒక్కటీ నీకు రాలేదు కాబట్టి. అందుకే నేను చచ్చేదాకా నీకోసం ఇట్లా రోజూ పాకులాడక తప్పదు. నా మాట విని వీడికింతటితో బుర్ర గోకుడు పెట్టి సాగనంపు. లేదా, నాకొదిలి పెట్టి నా తడాఖా చూడు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.

చింతా: అమ్మా, నీశక్తి నాకు తెలియదా! నీకంత శ్రమ వద్దులే, నిదానంగా నేనే చెప్పి మాన్పిస్తాను.

*

 

ఉత్కంఠగా చదివించే “భైరవ వాక”

?

-కొల్లూరి సోమశంకర్ 

 

~

కొల్లూరి సోమశంకర్

ఓ సుప్రసిద్ధ ఆలయం, దాని చరిత్ర, అక్కడి ఆచార సంప్రదాయాలను కథలో భాగంగా చెబుతూ ఆ ఆలయాన్ని దోచుకోవాలనుకునే ముఠా ప్రయత్నాలను, తమని తాము పేల్చేసుకుని భయంకరమైన ఉత్పాతం సృష్టించాలన్న తీవ్రవాద శక్తుల కుట్రలనూ వెల్లడిస్తూ, పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే నవల “భైరవ వాక“.

ప్రసిద్ధ రచయిత ఇందూ రమణ వ్రాసిన ఈ నవల తొలుత 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది.

ఆరుగురు సభ్యులున్న ఓ ముఠా ముంబయిలో సమావేశమై పథక రచన చేస్తుండగా కథ ప్రారంభమవుతుంది. తమ రహస్యం వినిందనే అనుమానంతో పనిమనిషిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో ముఠా సభ్యులు ఎంత క్రూరులో పాఠకులకు అర్థమవుతుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠా సభ్యులు తమకి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి విడిపోతారు. కథ ఆంధ్ర రాష్ట్రానికి మారుతుంది.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందనపురి, భైరవ వాక క్షేత్రాలను దర్శించడానికి పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా ఎందరో భక్తులు వస్తూంటారు. పాత్రో అనే మధ్యతరగతి కుటుంబీకుడు తన ముసలి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, పనిమనిషితోనూ చందనపురికి రైల్లో బయల్దేరుతాడు. ఓ తెలుగు మిత్రుడి సలహాతో విశాఖపట్నం వరకు వెళ్ళకుండా చందనపురి స్టేషన్‍లో దిగుతాడు. ఉత్సవదినాలు కావడంతో ఆ ప్రదేశమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూంటూంది. ఏం చేయాలో తోచదు పాత్రోకి.

ఆ సమయంలో పాత్రోని ఒరియాలో పలకరిస్తాడు పాండే అనే వ్యక్తి. పరాయి ప్రాంతంలో సొంత భాషలో మాట్లాడిన పాండేని చూడడంతో కాస్త ధైర్యం వస్తుంది పాత్రోకి.  తానొక గైడ్‌నని, క్షేత్ర దర్శనం చేయిస్తానని, వాళ్ళకి తోచినంత డబ్బు ఇవ్వమని బ్రతిమాలుకుంటాడు పాండే. అయిష్టంగానే అంగీకరిస్తాడు పాత్రో.

ఇక్కడ ప్రముఖ క్షేత్రాలలో యాత్రికులు పడే అవస్థలను ప్రస్తావిస్తారు రచయిత. బస్ టికెట్ల నుంచి, బస, ఆహారం, స్నానాలు, పూజలు, అమ్మకాలు, పూజాదికాలు వరకూ… దివ్యక్షేత్రాలలో అడుగడుగునా జరిగే మోసాలు, దోపీడీల గురించి కథాక్రమంలో వివరిస్తారు.

పాండే కన్ను ఈ కుటుంబంలోని ఆడవాళ్ళపై పడుతుంది. పాత్రో భార్య శశికళని, పనిమనిషి అరుంధతిని ఏకకాలంలో కామిస్తాడు. అరుంధతి కూడా పాండే పట్ల ఆకర్షితురాలవుతుంది. అతడిని రెచ్చగొడుతుంది. చందనపురి చేరాకా అక్కడి వ్యాపారులు, అధికారుల వల్ల అడుగడుగునా ఇబ్బందులని ఎదుర్కుంటుంది పాండే కుటుంబం.

కర్రపుల్లలు, బియ్యం, కూరలు కొనుక్కొచ్చి, నానా తంటాలు పడి అన్నం వండుకుంటారు పాత్రో వాళ్ళు. ఆకుల్లో వడ్డించుకుని తినబోతున్న సమయానికి ఓ పిచ్చిది వచ్చి అన్నాన్ని చెల్లాచెదురు చేసేసి వాళ్ళ ఆకుల్లోంచి గబగబా నాలుగు ముద్దలు తినేసి పారిపోతుంది. ఆ కుటుంబం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి తేరుకున్న పాత్రో తన వాళ్ళందరిని దగ్గరలోని హోటల్‍కి తీసుకువెడతాడు. పాచిపోయిన అన్నం పెట్టి, ప్లేటుకి యాభై రూపాయలు వసూలు చేస్తాడా హోటల్ యజమాని. ఇదేమని ప్రశ్నిస్తే పాత్రోని అవహేళన చేస్తాడు.

పిచ్చి యువతి పాండేకి ఎదురుపడడంతో కథలో మరో ఘట్టానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. ఆ యువతి నిజానికి పిచ్చిది కాదనీ, అలా నటిస్తోందని, ఆమె పేరు మోనిషా అని తెలుస్తుంది. పాండే కూడా గైడ్ కాదని, మోనిషాతో కలసి ఆ క్షేత్రంలో తిష్ట వేసి చోరికి మార్గం సుగమం చేయడమే అతని పనని తెలుస్తుంది. ఈ క్రమంలో అరుంధతితో మరింత సన్నిహితమవుతాడు పాండే. పాత్రో కుటుంబం నుంచి ఆమెని దూరం చేయాలని ఆలోచిస్తాడు.

మందిరం దోచుకోవాలనుకునే సమయం ఆసన్నమవుతూంటుంది. ముఠాలోని మిగతా సభ్యులంతా చందనపురి, భైరవ వాక చేరుకుంటారు. భక్తుల్లా నటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారంగా ఆలయంలోకి ప్రవేశించాలనేది వారి పథకం.

?

ఇదే సమయంలో పాత్రో కుటుంబం కూడా భైరవ వాక చేరుతుంది. తాను లోపలికి రాకూడదని చెప్పి అరుంధతి ఆలయం బయటే ఆగిపోతుంది. అది చూసి ఆమెకి తోడుగా పాండే కూడా బయటే ఆగిపోతాడు. గుడిలోకి వెళ్ళాకా పాత్రో అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోతాడు. నిర్వాహకులను ఏమీ అనలేక, నిస్సహాయంగా ఉండిపోతాడు. అరుంధతితో పాటు గుబురుగా ఉన్న పొదల చాటుకి చేరుతాడు పాండే. తమ కోరిక తీర్చుకోబోతుండగా వినబడిన మాటలు, కనబడిన దృశ్యం పాండేని నివ్వెరపరుస్తాయి. ఇద్దరు తీవ్రవాదులు పొదలమాటున నక్కి తమ రూపాలు మార్చుకుని నడుములకి బెల్ట్ బాంబులు ధరించి భక్తుల వేషాలలో మందిరం వైపు కదులుతారు. ఒకడు భైరవ వాక ఆలయం వైపు వెడితే, రెండో వాడు చందనపురిలో విధ్వంసం సృష్టించడానికి బయల్దేరుతాడు.

విపరీతమైన రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందనీ, దాంతో పోలీసులు, అధికారుల బెడద తీవ్రమవుతుందని భావించిన పాండే ఆ తీవ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన తీవ్రవాది కొంచెం దూరం పరిగెట్టి తనని తాను పేల్చేసుకుంటాడు. ఆ ప్రాంతమంతా రణభూమిగా మారిపోతుంది. తీవ్రవాది చేతిలో ఉన్న సంచీని చేజిక్కించుకుని అరుంధతితో సహా పారిపోతాడు పాండే. ఆ సంచీని తెలివిగా పోలీసులకు అందేలా చేస్తాడు.

ఈ లోపు మరో తీవ్రవాది చందనపురి చేసి దర్శనం క్యూలో కలసిపోతాడు. పాత్రో కుటుంబం, అరుంధతి, పాండే, మోనీషా, ముఠాలోని ఇతర సభ్యులు అందరూ దర్శనం క్యూలో చేరతారు. జనాలు విపరీతంగా ఉండండంతో క్యూ అసలు కదలదు. లభించిన ఆధారాలతో చురుకుగా వ్యవహరించిన పోలీసులు రెండో తీవ్రవాది క్యూలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. అతడిని పట్టుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఓ దశలో భక్తులందరికీ మత్తు కలిపిన ప్రసాదం పంచాలని ఆలోచిస్తారు. ఈలోపు పాండే ఓ ఉపాయం పన్ని తీవ్రవాది దొరికిపోయేలా చేస్తాడు. పాత్రో కుటుంబం, ముఠా సభ్యులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. పాత్రో కుటుంబం బయటకి వస్తుంది గాని ముఠా సభ్యులు ఆలయం ప్రాంగణం లోపలే దాగి ఉంటారు.

చీకటి పడి ఆలయం మూసేసి పూజారులు అధికారులు వెళ్ళిపోయాకా, చోరికి పాల్పడతారు. ఆఖరినగ తీసుకోబోతుంటే అలారం మ్రోగుతుంది. పోలీసులు చుట్టుముట్టే లోపు దొంగలందరూ తప్పించుకుంటారు.

ఇంటికి వెడదామని బయల్దేరిన పాత్రో తన సూట్ కేసులు, ఇతర వస్తువులని పోగొట్టుకుంటాడు. చేతిలో పైసా కూడా లేకుండా తమ ఊరు వెళ్ళడం కోసం చందాలు అడుగుతూ పాండేకి కనబడతాడు. తన దగ్గర ఉన్న దేవుడి నగలలోంచి ఓ నగని ఇచ్చి అది అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఊరు వెళ్ళమంటాడు. కాని ఆ నగని అమ్మే ప్రయత్నంలో పోలీసులు పాత్రోని అనుమానించి, దోపిడీలో అతనికి భాగం ఉందని అరెస్టు చేస్తారు. విశాఖపట్నంలో అరుంధతితో లాడ్జిలో ఉన్న పాండే టీవీ ద్వారా ఈ విషయం తెలుసుకుంటాడు. తనని ఎంతగానో ఆదరించిన పాత్రో కుటుంబానికి ఇలా జరిగినందుకు ఎంతగానో బాధపడుతుంది అరుంధతి. తన వల్ల ఓ కుటుంబం అపాయంలో చిక్కుకోడం భరించలేకపోతాడు పాండే.

నిజమైన ప్రేమ పాషాణ హృదయాన్ని సైతం కరిగిస్తుందనే నానుడిని నిజం చేస్తూ, పాండేలో పరివర్తన కలుగుతుంది. అప్రూవర్‌గా మారి, పోలీసులకు సహకరించి ముఠాని, సొత్తుని పట్టిస్తాడు. పాత్రో కుటుంబాన్ని రక్షిస్తాడు.

నవలలోని ప్రథాన సంఘటన పాఠకులకి ముందుగానే తెలిసిపోయినా, కథని చివరిదాకా చదివించడంలో కృతకృత్యులయ్యారు రచయిత. ఓ క్రైమ్, సస్పెన్స్ నవలలో ఉండాల్సిన బిగి, ఒడుపు అన్నీ ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయి. పాఠకులను ఏకబిగిన చదివించి, వారి మనసులను రంజింపజేస్తుందీ నవల. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2012లో “శ్రీ లోగిశ ప్రచురణలు” వారు ప్రచురించారు. 224 పేజీలున్న ఈ నవల వెల రూ.150/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.


 

ప్రచురణకర్తల చిరునామా:

శ్రీ లోగిశ ప్రచురణలు, డోర్ నెంబరు 7-50, శ్రీ సాయి నిలయం, బంగారమ్మ గుడి దగ్గర, సింహాచలం, విశాఖపట్నం 530028

 

పల్లెని మింగిన పెట్టుబడి ..

 

 palle

(శ్రీ ఆదిభట్ల విద్యాసాగర్ గారి “పల్లెను మింగిన పెట్టుబడి, గ్రామీణ ఆర్థికం-ఒక పరిశీలన” మీద డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సెప్టెంబర్ 13, 2012న జరిపిన చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, భూపతిరాజు ఉష, కట్టా మూర్తి, కట్టా విజయ, చేకూరి విజయసారధి, నర్రా వెంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, ఆరి సీతారామయ్య, పిన్నమనేని శ్రీనివాస్, సుధ రాజు, Ch. పుష్పావతి, కాజ జనార్ధనరావు.

చర్చలో ముఖ్యాంశాలను సమీక్షించిన సభ్యుడు: ఆరి సీతారామయ్య)

*

ఒకప్పుడు గ్రామాలు బాగా ఉండేవనీ, అక్కడి ప్రజలు ప్రేమాభిమానాలతో, పరస్పర సహకారంతో జీవించేవాళ్ళనీ, ఈ మధ్య గ్రామాలు పూర్తిగా మారిపోయాయనీ , అప్పటి ఆప్యాయతలూ, ఆత్మీయతలూ ఇప్పుడు లేవనీ, అప్పటి జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిందనీ తెలుగు ప్రజానీకంలో చాలామంది అభిప్రాయం. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆదిభట్ల విద్యాసాగర్ శ్రీకాకుళం జిల్లాలోని చాలా గ్రామాల్లో చేసిన ప్రత్యక్ష పరిశోధన, విషయసేకరణ ఫలితమే ఈ పుస్తకం. ఈ 400 వందల పేజీల పుస్తకంలో ఆయన బ్రిటీష్ పరిపాలనా కాలం నుంచి 2011 వరకు గ్రామాల ఆర్థిక పరిస్థితిలో క్రమంగా వచ్చిన మార్పుల గురించి సాక్షాధారంగా రాశాడు. నిజానికి శ్రీకాకుళం పల్లెల్లో వచ్చిన మార్పులు ఈ పరిశోధనకు కేంద్రబిందువు అయినా, ఇవి ఆంధ్ర అంతటా, భారత దేశం అంతటా జరిగిన మార్పులే.

భూమిని సొంత ఆస్తిగా పరిగణించడం బ్రిటీష్ వారి పాలనలో మొదలయిందని రాశాడు రచయిత. శిస్తు వసూలు చెయ్యటం సులభంగా ఉండటానికి, జమీందారీ విధానాన్నీ, కొన్నిచోట్ల రైత్వారీ (ఇనాందారీ) విధానాన్నీ ప్రవేశపెట్టారు పాలకులు. స్వతంత్రం వచ్చిన తర్వాత భూమికోసం జరిగిన ఉద్యమాల కారణంగా జమీందారీ ఇనాందారీలు అంతరించి భూమి పెద్ద పెద్ద రైతుల చేతుల్లోకి వచ్చింది. గత 50-60 సంవత్సరాల్లో కుటుంబ సభ్యులమధ్య ఆస్తుల పంపకం వలనా, భూసంస్కరణల వలనా, పెద్ద కమతాలు చాలా వరకు పోయి చిన్న కమతాలు ఏర్పడ్డాయి. శ్రీకాకుళంజిల్లాలో 2005 నాటికి 5 ఎకరాలకంటే తక్కువ భూమి ఉన్న రైతుల శాతం 82. భూమిలో 66% వీరి అధీనంలో ఉంది.

వ్యవసాయంచేసి ధనవంతులైన వారు అరుదు. కొన్ని చోట్ల చిన్న కమతాల్లో వ్యవసాయం చెయ్యటం వల్ల వచ్చే ఆదాయం బతకటానికి కూడా సరిపోదు. ఎక్కువ ఆదాయం వస్తుందనే భ్రమతో అప్పుచేసి పెట్టుబడి అధికంగా ఉండే పంటలు వేసి ఉన్న పొలం కూడా పోగొట్టుకున్న సన్నకారు రైతుల కథ అన్ని ప్రాంతల్లోనూ తెలిసినదే.

ఈ మధ్య తమ భూమిని అమ్మేసో, కౌలుకు ఇచ్చో, పనికోసం జీవనోపాధికోసం పట్టణానికి పోతున్నాడు సన్నకారు రైతు. వ్యాపార పంటలు అధికం కావటం వల్ల పెద్ద రైతులు కూడా తక్కువ కూలిఖర్చుతో చెయ్యగల వ్యవసాయాలు చేస్తున్నారు. క్రమంగా పల్లెటూరి భూమి పెట్టుబడిపెట్టగల వ్యాపారస్తుల చేతుల్లోకో, వలస వస్తున్న రైతుల చేతుల్లోకో పోతుంది. కొత్త వ్యాపారాలు పెడతామని వస్తున్న కంపెనీలకు ప్రభుత్వం వందల వేల ఎకరాల పల్లెభూములను చవుకగా (రైతుకు పరిహారంగా తక్కువ ఇచ్చి) సేకరించి ఇచ్చేస్తుంది.

సాంప్రదాయ వ్యవసాయం తగ్గిపోవటం వల్లా, వ్యవసాయం మీద సన్నకారు రైతు బతకలేకపోవటం వల్లా, వ్యవసాయ రంగంలో పల్లె జీవనంలో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్లా, ఒకప్పటి కులవృత్తులు అంతరించాయి. వ్యవసాయానికి సంబంధించిన కులవృత్తులు చేసుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు బతుకుతెరువు కోసం, మరో జీవన విధానాన్ని వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు.

పెట్టుబడుల ప్రభావంతో వచ్చిన పెను మార్పులు వ్యవసాయరంగంలోనే కాదు, ఆదివాసుల, దళితుల, మత్శకారుల, చేనేత కార్మికుల జీవితాల్లో కూడా వచ్చాయి. వీరిలో కూడా చాలామంది బతుకుతెరువుకోసం పట్టణాలకు వలస వెళుతున్నారు.

మా సభ్యుల అభిప్రాయంలో వ్యవసాయానికి సంబంధించిన ఇన్ని అంశాల గురించి (పంటల క్రమం, పశువుల వాడుక, నీటి పారుదల, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, మార్కెట్) ఇంత విస్తృతంగా విషయసేకరణ జరిపి ప్రచురించిన పుస్తకం ఇదివరకు మేము చదవలేదు. గ్రామ జీవితం ధ్వంసం అయిందని అందరూ చెప్పుకుంటున్నా  దానికి కారణాలు ఇంత లోతుగా అధ్యయనం చేసినవారు అరుదేనని మా అభిప్రాయం.

 

పెట్టుబడికులవృత్తులు

పెట్టుబడి వలన మంచి జరిగిందా చెడు జరిగిందా? “పల్లెను మింగిన పెట్టుబడి” ఈ పుస్తకం శీర్షిక కాబట్టి పెట్టుబడి వల్ల చెడే జరిగింది అని రచయిత అభిప్రాయం. పెట్టుబడులు తీసుకువచ్చిన మార్పుల వలన ఒకనాటి పల్లె వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాని ఉత్పత్తి పెరిగింది. అసమానతలూ పెరిగాయి. ఒకప్పుడు పలెల్లో ఉన్న పేదరికం ఇప్పుడు పట్టణాలలో కనిపిస్తుంది.

కానీ వ్యవసాయంతో సంబంధం ఉన్న కులవృత్తులవారు   వ్యవసాయం యాంత్రికం కావటంతో మరో జీవనోపాధి వెతుక్కోక తప్పలేదు. అయినా కులవృత్తులు పోవటం మంచిదయిందంటాడు రచయిత. “వ్యవసాయం అనేది ఒక వృత్తిగా స్వతంత్ర వృత్తి కాదు. అది నిలబడటానికి అనేక వృత్తుల సహకారం అవసరం. నిజానికి మనిషి శరీరంలో గుండె వ్యవసాయం అనుకుంటే మిగతా అన్నిభాగాలను మిగతా వృత్తులతో పోల్చవచ్చు. కానీ వ్యవసాయమే వృత్తిగా ఎదిగిన రైతాంగవిభాగాలు మిగతా వృత్తుల ప్రజానీకంపై నిరంతరాయంగా దోపిడి సాగించారు. వాళ్ళ మిగులు విలువను కాజేసి గ్రామీణ ధనిక రైతాంగంగా రూపొందారు. దీనితో వాళ్ళకు మిగతా అన్ని వృత్తుల ప్రజానీకమూ ‘నీచంగానూ’ వాళ్ళ వృత్తులు వ్యవసాయంకంటే నీచ వృత్తులుగానూ కనబడ్డాయి.” ఇదీ రచయిత అభిప్రాయం.

పెట్టుబడి తెచ్చిన మార్పుల వలన “గ్రామీణ వృత్తులు చేసుకునే ప్రజానీకమూ, వ్యవసాయ కూలీలయిన దళితులూ తమ శ్రమను ఎంతోకొంత స్వేచ్చతో అమ్ముకోగలిగే ప్రాంతాలకు తరలివెళ్ళారు.”

“ఇంతవరకూ వారి శ్రమపై ఎదిగిన వ్యవసాయ వృత్తి ఈ దెబ్బతో ఒడుదుడుకులకు గురైంది. దాన్నే వ్యవసాయ రంగం సంక్షోభం అంటూ వృత్తుల్ని కాపాడాలనీ, తిరిగి గ్రామాలను కళకళలాడేలా చేయాలనీ రాజకీయ, సాంఘిక ‘ఉద్యమకారులు’ నినదిస్తున్నారు. ఆ మేరకు మన ‘ప్రజారచయితలు’ పోయిన స్వర్ణయుగంగురించి తెగవిలపిస్తున్నారు.” (పేజీ 31)

వెటకారం పక్కనబెట్టి, నిజానిజాలు పరిశీలిస్తే వ్యవసాయదారులు కొన్ని వృత్తులను నీచ వృత్తులుగా చూసింది వాస్తవమే,  కానీ అన్ని వృత్తుల ప్రజానీకాన్నీ నీచంగా చూశారన్నది నిజం కాదు. ఉదాహరణకు  మాకు తెలిసిన గ్రామాల్లో నాగళ్ళు తయారు చేసే వడ్రంగిని, కుండలు తయారు చేసే కుమ్మరిని, నీచ వృత్తులు చేసే వారిగా పరిగణించేవారు కాదు.  నీచ వృత్తులు చేసే వారిగా చూసిన వారిని పల్లెల్లో వ్యవసాయదారులే కాదు, ఇతర వృత్తుల్లో ఉన్న పట్టణవాసులు కూడా అదే విధంగా చూశారు, చూస్తున్నారు. అంటే అది వ్యవసాయానికి సంబంధించిన వివక్ష కాదు, భారత సమాజానికి సంబంధించిన వివక్ష.

ఇంకొక విషయం- పెద్ద రైతు ఇతర కులాలవారి అదనపు విలువను కాజేసి ధనికుడయ్యాడని రచయిత అభిప్రాయం. అందువల్ల  ఈ పల్లె  వ్యవస్థ  విధ్వంసం అయినందుకు  సంతోషం  వ్యక్తపరుస్తున్నాడు. కానీ పెద్దరైతేకాదు, సన్నకారు రైతుకు కూడా  పల్లెల్లో కులవృత్తులు చేస్తున్న అందరి సహకారం అవసరమే. నిజానికి భూమిలో ఎక్కువభాగం సేద్యం చేస్తున్నది సన్నకారు రైతులే. అంటే పల్లె సంస్కృతి మీద ఆధారపడు తున్నవారిలో ఎక్కువమంది సన్నకారు రైతులే. సన్న కారు రైతులు కులవృత్తులవారి అదనపు విలువను కాజేసి బతికారా? లేదా? పెద్దరైతు చేస్తే తప్పుగాని చిన్నరైతు చేస్తే తప్పులేదా?

పల్లెటూళ్ళూ, కులవృత్తులూ ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలయింది. పెద్ద రైతులు ఏర్పడింది బ్రిటీష్ పాలన కాలంలోనే (ఈ పుస్తకం ప్రకారం). అంతకుముందు అందరూ కౌలుదార్లే. కులవృత్తులు  ఎలా  ఏర్పడ్డాయి?  వ్యవసాయానికీ కులవృత్తులకూ  సంబంధం  ఎలా  మొదలయిందీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో లేవు.

పుస్తకంలో  చెయ్యవలసిన మార్పులు

 

కాపీ  ఎడిటర్లు  లేకపోవటం వలన  తప్పులు లేకుండా తెలుగు పుస్తకాలు రావు అని సరిపెట్టుకోవటం మాకు అలవాటయింది. కాని ఈ పుస్తకంలో మామూలుకంటే పదిరెట్లు ఎక్కువ తప్పులున్నట్లుంది. అయినా ఇది అందరూ చదవ వలసిన పుస్తకం అని మా ఏకగ్రీవ అభిప్రాయం. ఈ పుస్తకాన్ని సవరించి మరోసారి ప్రచురిస్తారనే ఆశతో ఇందులో చెయ్యవలసిన మార్పుల గురించి ప్రస్తావిస్తాను.

  1. తెలుగులో పుస్తకం రాస్తూ, గణాంకాల పట్టికలు అన్నీ (77) ఆంగ్లంలో ప్రచురించారు. అవికూడా తెలుగులో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువమంది పాఠకులకు అందుబాట్లో ఉండేవి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్ప్రెడ్‌షీట్స్‌ తెలుగులో రాసే అవకాశం ఉందికాబట్టి అది కష్టమైన పనికూడా కాదు.
  2. ఏదో ఒక విషయం గురించి చర్చించేటప్పుడు దాని ఆధారాలు ఫలానా పట్టికలో ఉన్నాయి అని చెప్తాడు రచయిత. కాని ఆ పట్టికలో అవి ఉండవు. ఉదాహరణకు 1971 లో శ్రీకాకుళం జనాభా 22.24 లక్షలు అని (పేజీ 25), ఇది మొదటి పట్టికలో ఉందంటాడు రచయిత. కాని ఆ సంఖ్య ఆ పట్టికలో లేదు.

ఈ పుస్తకంలో ముఖ్యమైన పట్టికలు చాలా  ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భూయాజమాన్యం గురించిన వివరాలున్న పట్టిక (పట్టిక  4) వాటిలో ఒకటి. “పట్టిక 4లో 1977 నుంచి 2005 వరకూ వచ్చిన మార్పులను చూడవచ్చు” అని  రచయిత చెప్పినా, 1977 నాటి వివరాలు ఆ పట్టికలో లేవు.

  1. కొన్నిచోట్ల వాచకంలో చెప్పినదానికీ పట్టికలో ఉన్న దానికీ పొంతనలేదు. పట్టిక 65 ఆంధ్రప్రదేష్‌లో దళితుల అక్షరాశ్యత గురించి అని ఉంది. వాచకంలో ఈ పట్టిక శ్రీకాకుళం జిల్లాలో దళితుల అక్షరాశ్యత గురించి అని తెలుస్తుంది.

ఇలాంటి తప్పులు ఈ పుస్తకంలో కొల్లలు.

  1. గణాంకాలు పట్టికలలో ఉన్నాయి కాబట్టి వాటిమీద వ్యాఖ్యానం వాచకంలో ఉంటే చాలు. అవే సంఖ్యలను మళ్ళా ప్రస్తావించనవసరం లేదు. అలా చెయ్యకుండా ఉన్నట్లయితే ఈ 400 పేజీల పుస్తకం 300-350 పేజీల్లో వచ్చేది, చదవటానికి సులభంగా కూడా ఉండేది.
  2. అనవసరమైన పట్టికలు చాలా ఉన్నాయి. అవి అవసరం లేవని ఎందుకనుకుంటున్నామంటే పట్టీకల్లో ఉన్న సంఖ్యలమీద ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి. రచయిత ఈ వివరాలు సేకరించాడు కాబట్టి పుస్తకంలో పెట్టాడేమో అనిపిస్తుంది.
  3. పుస్తకం అంతటిలో భూమికొలతకు ఒకే పరిమాణం వాడితే అర్థంచేసుకోవటం సులభంగా ఉండేది. ఇప్పుడు కొన్ని చోట్ల హెక్టేర్లు కొన్ని చోట్ల ఎకరాలు వాడారు.
  4. మిగతా కొలతలకు కూడా పరిమాణాలలో మార్పులు చెయ్యకుండా ఉన్నట్లయితే పాఠకులకేకాదు, రచయితకు కూడా కొంత గందరగోళం తప్పేది. ఉదాహరణకు, “గరిష్టంగా 720 మిలియన్‌ కేజీల దారం మాత్రమే ఎగుమతి చేయాలనే నిబంధన మూలంగా ఎగుమతులు 72 కోట్ల కేజీలయింది.” (పేజీ 377). 72 కోట్లు అంటే 720 మిలియన్లేకదా.
  5. ఒక సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలుండాలో, అసలు ఉండాలో అక్కరలేదో,  జాగ్రత్తగా ఆలోచించాలి. ఉదాహరణకు 28వ పట్టిక చూస్తే 1969-70 నాటికి నూతుల నుంచి  నీళ్ళు  పట్టి వ్యవసాయం చేసిన  భూమి  11793.24 ఎకరాలు  అని  ఉంది.  అదే  పట్టికలో  1975-76 లో  4996 అని  మాత్రమే  ఉంది.  అంటే  4996.00 అనా?  లేక  ఆ  సంవత్సరం అంత  జాగ్రత్తగా  లెక్కపెట్టలేదు  కాబట్టి  దశాంశ  బిందువు  వాడలేదనా?

ఒకే పట్టికలో కొన్ని సంఖ్యలకు దశాంశబిందువు తర్వాత రెండు స్థానాలూ, కొన్నిటికి ఒకే స్థానం, కొన్నిటికి అసలు లేకపోవటం అంటే అర్థం ఏంటీ?   ఈ పరిస్థితి ఒక్క 28వ  పట్టికలోనే కాదు, ఈ పుస్తకంలో ఉన్న దాదాపు అన్ని పట్టికలకూ వర్తిస్తుంది. గణాంకాలను  ఇంత  విస్తృతంగా  వాడదలచిన  వారెవరైనా ముందుగా  significant figures అంటే  ఏంటో  అధ్యయనం చెయ్యాలి.  లేదా గణాంకశాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

  1. “బోదెపు రాజారావు అనే రైతు కౌలు కోసం ఐదు ఎకరాల భూమిని తీసుకున్నారు.” (పేజీ 89). ఐదెకరాల భూమిని ఆయన కౌలు కోసం తీసుకోలేదు. ఏదో పంట  వేసుకుందామని  కౌలుకు తీసుకున్నాడు.

ఈ బోదెపు రాజారావు గురించి రాస్తూ మొదటి వాక్యంలో “తీసుకున్నారు” అన్న రచయిత రెండో వాక్యంలో “బాకీపడ్డారు” అనీ, మూడో వాక్యంలో “వలస వెళ్ళాడు” అనీ రాశాడు.

  1. నీటి పారుదల గురించి రాస్తూ టూబ్‌వెల్స్, బోర్‌వెల్స్ కింద జరిగిన వ్యవసాయం వివరాలు 196-197 పేజీల్లో రాశాడు రచయిత. కానీ ఈ టూబ్‌వెల్స్‌కీ బోర్‌వెల్స్‌కీ తేడా ఎంటో ఎక్కడా ప్రస్తావించలేదు.
  2. “వరి పంటకు ఒక సంవత్సరానికి (ఒకసారి పండిస్తే) 107 మంది కూలీలు అవసరం అవుతారు” (పేజీ 142). ఎంత పొలంలో? ఒక ఎకరంలోనా? హెక్టేర్‌లోనా? రోజూ 107 మంది అవసరమా? 107 పనిరోజుల అవసరమా?

ఈ ఒక్క చోటే కాదు. 59 వ పేజీలో 80 సెంట్ల పొలంలో చెరకుపంట పండించటానికి 311 మంది కూలీలు అవసరం అవుతారు అని రాశాడు రచయిత. 311 కూలీలా?  కూలిరోజులా? గంటలా?

  1. ఈ వాక్యం చూడండి: “అంటే ఈ దశాబ్దంలోనే దేశంలో ప్రతీ 4గురు రైతులలో ఒక రైతును మించి పొలాన్ని వీడాడని అర్ధమవుతుంది.” ఇది ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులోకి దించిన వాక్యం. దీని భావం: That means more than one farmer in four have left the land in this decade. తెలుగులోకంటే ఇంగ్లీషులో సులభంగా లేదూ?

ఇలాంటిదే మరో వాక్యం: “దేశవాళీ విత్తన ఉత్పత్తి, దేశవాళీ ప్రభుత్వ పరిశోధనల స్థానంలో దేశవాళీ కంపెనీలవైపు, విదేశీ కంపెనీలవైపు భారతీయ రైతు విత్తనం కోసం చూడాల్సివచ్చింది.” (పేజీ  209)

ఇంకొకటి: “గ్రామీణ రైతాంగాన్ని మార్కెట్ యార్డులను ఎందుకు ఉపయోగించుకోరూ?” (పేజీ 238)

ఇలాంటి కృతకమైన వాక్యాలు ఈ పుస్తకంలో కొల్లలు.

  1. ఇక అర్ధ, అర్థ ల గురించి. ఇది రెండు వేర్వేరు  అనర్థాల మేలు  కలయిక.  మొదటిది, semi- అన్న ఉపసర్గాన్ని  (ప్రీఫిక్స్)  “అర్ధ”  అని ఎవడో మహానుభావుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఆ తర్వాత మన ఖర్మకొద్దీ అర్థకీ అర్ధకీ తేడా తెలిసిన తెలుగువాళ్ళు కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఇక చూడండి దీని ప్రభావం.

అర్థబానిస (పేజీ 336)

అర్థశతాబ్దం (పేజీ 361)

అర్ధశాస్త్రవేత్తలు (పేజీ 150)

ఆర్ధిక వ్యవస్థ (పేజీ 150)

ఈ మాటలు చూస్తుంటే తెలుగు భాషకు పట్టిన గతికి ఏడుపు రావటం లేదూ?

  1. “ఒక చారెడు నేలకోసం బందీ అయిపోయి తమ దేశాన్ని ఇతర దేశస్థులు దండయాత్రలు చేసి ఆక్రమించుకుంటున్నా పట్టని స్థితిలో భూమికి బందీ అయి భారత రైతు కొనసాగిన స్థితి వుందని సెల్యూకస్ తన పుస్తకంలో వివరించారని అంబేద్కర్ ఉల్లేఖించాడు.” (పేజీ 74)

అంటే  సెల్యూకస్  పుస్తకాన్ని  అంబేద్కర్  చదివి,  దానిమీద  వ్యాఖ్యానిస్తే,  దాన్ని  రచయిత  చదివి  మనకు  చెప్తున్నాడన్న  మాట.  సెల్యూకస్ పుస్తకానికిగానీ, అంబేద్కర్ ఉల్లేఖనానికిగానీ మూలాలు రచయిత మనకు చెప్పలేదు. ఇదంతా ఎందుకు విడ్డూరంగా ఉందంటే, భూమిమీద వ్యక్తుల యాజమాన్యం బ్రిటీష్ పాలన  కాలంలో మొదలయిందని చెప్పిన  రచయిత అలాంటిది సెల్యూకస్ కాలంలోనే ఉందని చెప్తున్నట్లులేదూ? ఏది నిజం?

ఇలా  తప్పుల పట్టిక రాసుకుంటూ  పోతే  చాలా పొడుగవుతుంది.  అయినా గత  యాభై  సంవత్సరాల్లో  మన  గ్రామాల్లో  వచ్చిన  ఆర్థిక  మార్పుల గణాంకాలు  వివరంగా  తెలుసుకోదలచిన  వారికి  ఈ పుస్తకం చాలా  ఉపయోగకరం అని మానమ్మకం.

 

పల్లెను మింగిన పెట్టుబడి

గామీణ ఆర్థికం – ఒక పరిశీలన

ఎస్. ఎ. విద్యాసాగర్‌

పీకాక్ బుక్స్, హైదరాబాద్

 

భారత్ ను చూసి భయపడ్డాడు…చైనాలో నరకం చూశాడు!

స్లీమన్ కథ-10

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.

మొదట స్వీడన్, డెన్మార్క్ లకు వెళ్ళాడు. వ్యాపార అవసరాలకోసం అప్పటికే అతను స్వీడిష్, డేనిష్ భాషల్ని నేర్చుకున్నాడు. ఈ దేశాల్లో తను అదనంగా నేర్చుకోవాల్సిందేమీ కనిపించలేదు. ఆ వెంటనే జర్మనీ వెళ్ళి తండ్రినోసారి చూసి ఇటలీ వెళ్ళాడు. అక్కడినుంచి గ్రీస్ వెళ్లాలనుకున్నాడు కానీ, అంతలో మనసు మార్చుకుని ఈజిప్టుకు దారితీశాడు. అక్కడ ఓ సాధారణ యాత్రికునిలా నైలు నదిపై దహబియాలో సెకండ్ కాటరాక్ట్ వరకూ ప్రయాణిస్తూ అరబ్బీ నేర్చుకున్నాడు. కైరో నుంచి వర్తకుల గుంపుతో కలసి జెరూసలెం వెళ్ళాడు. ఆ నగరం అతని కేమంత ఆసక్తిని కలిగించలేదు. స్మిర్నా, కిక్లాడెస్ దీవుల మీదుగా ఎథెన్స్ కు చేరుకున్నాడు.

[దహబియా: నైలునదిపై నడిపే ఒక రకం బోటు] [సెకండ్ కాటరాక్ట్: నదుల్లో ఎత్తైన గుట్టలు, రాళ్ళమీంచి నీళ్ళు వేగంగా కిందికి పడదాన్ని కాటరాక్ట్ అంటారు. నైలు నదిలో ఆశ్వాన్ నుంచి ఖార్టూమ్ వరకూ అలాంటి కాటరాక్టులు ఆరు ఉన్నాయి.]

ఎథెన్స్ లో ఒక మంచి హోటల్ లో దిగాడు. కొండ ఎక్కి పురాతనగిరిదుర్గా[ఎక్రోపోలిస్]న్ని చూశాడు. ఈ సందర్శన అతనికి పూర్తి సంతృప్తినిచ్చింది. ఎథెన్స్ ఎలా ఉంటుందని తను ఊహించుకున్నాడో సరిగ్గా అలాగే ఉందనుకున్నాడు. వెలుగులు విరజిమ్ముతున్న ఆ నగరం తనలోని నైరాశ్యపు చీకట్లను తరిమికొట్టిన అనుభూతి అతనికి కలిగింది. థియోక్లిటస్ విమ్పోస్ ఇచ్చిన పరిచయలేఖల సాయంతో కొంతమంది గ్రీకు పండితులను కలసుకున్నాడు. అతని గ్రీకు ఉచ్చారణ ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేనట్టు ఉందని వాళ్ళు అభినందించారు. ట్రాయ్ వీరుడు ఓడిసస్ నివసించిన ఇథకా దీవిలో కొన్ని మాసాలు గడపాలని అనుకుంటున్నాననీ, దానిపై ఓ పుస్తకం రాసే ఉద్దేశం కూడా ఉందనీ అతను చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి భుజం తట్టారు. మరికొందరు పండితులకు పరిచయలేఖలు ఇచ్చారు.

తీరా అతను ఆ దీవికి బయలుదేరి వెళ్లబోతుండగా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తంతి వచ్చింది. 1857 ఆర్థికసంక్షోభంలో దివాళా తీసిన ఓ వర్తకుడు అతనిపై  హై కోర్టులో దావా వేసినట్టు అందులో ఉంది. నిజానికి ఆ వర్తకుడే స్లీమన్ కు కొంత మొత్తం బాకీపడ్డాడు. దానిని చెల్లించే బదులు స్లీమనే తనను మోసగించాడంటూ ఎదురు అభియోగం తెచ్చాడు. దావాను కొంతకాలం వాయిదా వేయచ్చునా అని అడుగుతూ స్లీమన్ తంతి పంపించాడు. కోర్టు వీల్లేదని చెప్పింది. దాంతో అతను హుటాహుటిన సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. ఆ రావడం రావడం అయిదేళ్లపాటు మళ్ళీ అక్కడినుంచి కదలలేకపోయాడు.

దావాలో అతనే గెలిచాడు. కానీ ఇతర ఆసక్తులకు మళ్ళీ దూరమయ్యాడు. యధాప్రకారం వ్యాపారంలో పీకల్లోతున కూరుకుపోయాడు. అదే అసహనం, చిటపటలు, ఏజెంట్లను దుమ్మెత్తిపోస్తూ ఉత్తరాలు…అయినాసరే ఏజెంట్లు అతన్ని సహించేవారు. కారణం-ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద దిగుమతి వ్యాపారుల్లో అతనొకడు. చెల్లింపులు సక్రమంగా జరిపేవాడు. పైగా అతనిప్పుడు వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తున్నాడు. ఇంతవరకూ ఆలివ్ నూనె, నీలిమందు వ్యాపారానికే ప్రధానంగా పరిమితమయ్యాడు. ఇప్పుడు కాటన్, తేయాకు వ్యాపారంలోకి కూడా పెద్ద ఎత్తున అడుగుపెట్టాడు.

1861లో అతను కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. వ్యాపారం బహుముఖాలుగా వృద్ధి చెందింది. ఆ ఏడాదే మూడో సంతానం కలిగింది. ఈసారి కూడా ఆడపిల్లే. వ్యాపారవృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి నడేజ్దా అని పేరు పెట్టారు. ‘ఆశ’ అని ఆ మాటకు అర్థం. 1862-63లో పోలండ్ లో తిరుగుబాట్లు సంభవించి ఆ దేశంతో రష్యా వాణిజ్యాన్ని దెబ్బతీసినా, విచిత్రంగా స్లీమన్ వ్యాపారం మాత్రం అనూహ్యస్థాయిని అందుకుని అతనికి మూడో భాగ్యాన్ని మూటగట్టింది. కాలిఫోర్నియా బంగారం భూముల నుంచి, క్రిమియా యుద్ధం నుంచి గడించిన మొత్తాల కన్నా ఇది చాలా పెద్దది. ఒక్క నీలిమందులోనే పెట్టుబడి మీద 6 శాతం వడ్డీ గిట్టి, 15 లక్షల పౌండ్ల వార్షికలాభం సమకూడింది. తనింక ఎట్టి పరిస్థితుల్లోనూ దివాళా తీయబోనన్న భరోసా అతనికి చిక్కింది.

గృహజీవితం మాత్రం ఎప్పటిలా అశాంతిని రేపుతూనే ఉంది. ఇద్దరి మధ్యా ఎడతెగని కీచులాటలు. వాళ్ళ కలహ కాపురంలో ఇప్పుడు కొత్తగా పిల్లల పెంపకం, చదువు వచ్చి చేరాయి. సెర్గీ లో మంచి చురుకుదనం, తెలివీ ఉట్టిపడుతూ చదువులో బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రికి ఎంతో ఇష్టుడూ అయ్యాడు. పిల్లల పెంపకం, చదువే స్లీమన్ కు ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం విరమించడమే కాదు, ఏకంగా రష్యానుంచే పూర్తిగా మకాం ఎత్తేసి జర్మనీ వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. భార్యతో విభేదాలు, పంతాలు కూడా అందుకు ప్రేరణ అయ్యాయి.

డ్రెస్డెన్[తూర్పు జర్మనీ నగరం]లో స్థిరపడే ఉద్దేశంతో అక్కడో ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల్ని తీసుకుని వెంటనే డ్రెస్డెన్ కు రమ్మని భార్యకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె ససేమిరా రానంది. ‘నీతో దాంపత్యం నెరపాలన్న కోరిక నాకెంతమాత్రం లేదు, నువ్వు ఎవత్తెనైనా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లే’దని తెగేసి చెప్పింది. దాంతో అతను బెదిరింపులు ప్రారంభించాడు. తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి పోలీసుల సాయంతో పిల్లల్ని బలవంతంగా తీసుకుపోతాననీ, వాళ్ళను డ్రెస్డెన్ లో ఉంచి జర్మన్ చదువు చదివిస్తాననీ హెచ్చరించాడు. ఓ ఉన్నతాధికారికి కూడా భార్యపై ఫిర్యాదు చేశాడు. కానీ అతని గోడు ఎవరూ వినిపించుకోలేదు. ఏ ఒక్కరి నుంచీ సానుభూతి దక్కలేదు. వట్టి నిరంకుశుడివనీ, తిరుగుబోతువనీ భార్య దుర్భాషలాడింది.

అతను దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. అంతలో స్టెఫన్ సొలొవీఫ్ అనే వ్యక్తినుంచి అతనికి రావలసిన ఓ భారీ మొత్తం అందింది. అది చేతిలో పడగానే రష్యానుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారాన్ని అమ్మేశాడు. కొంత మొత్తాన్ని భార్య పేరున, పిల్లల పేరున పెట్టాడు. తీరా అవన్నీ అయిన తర్వాత అతనికి ఏం చేయాలో తోచలేదు. అయిదేళ్ళ క్రితం ఆగిపోయిన సంచారాన్ని పునఃప్రారంభించడం తప్ప మరో దారేదీ అతనికి కనిపించలేదు. దానికీ ఓ ప్రణాళికంటూ ఏమీలేదు. యాత్రానుభవాలను గ్రంథస్థం చేస్తూ తనో రచయితగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే తన రచనలమీద అతని కేమంత గొప్ప అభిప్రాయంలేదు. తనవన్నీ పైపై రాతలే తప్ప లోతున్నవి కావనీ, అవి పునాదుల్లేని ఇంటిలా కుప్పకూలిపోతాయనీ ఓ సందర్భంలో రాసుకున్నాడు.

1864 ఏప్రిల్ లో ట్యూనిస్(ట్యునీసియా రాజధాని)లో ఉన్నాడు. కార్తేజ్ శిథిలాలను నోరు వెళ్లబెట్టుకుని చూశాడు. ఆ తర్వాత మరోసారి ఈజిప్టును సందర్శించాడు. అక్కడినుంచి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ అతని భాషానైపుణ్యాలేవీ పనిచేయలేదు. ఉర్దూ కానీ, ఇతర భారతీయభాషలు కానీ అతనికి ఆసక్తి కలిగించలేదు. సిలోన్, మద్రాస్, కలకత్తా, బెనారెస్, ఆగ్రా, లక్నో, ఢిల్లీ చూశాడు. హిమాలయ పాదాలదగ్గరికి వెళ్ళాడు. భారత్ లోని విపరీతమైన వేడి, రణగొణధ్వనులు అతన్ని భయభ్రాంతం చేశాయి. సింగపూర్ మాత్రం ఉల్లాసం కలిగించింది. చైనా వెడుతూ మధ్యలో ఆగిన జావా కూడా అతనిలో ఆనందం నింపింది. చైనా యాత్ర సుదీర్ఘంగానూ, తీరుబడిగానూ సాగింది. ఆ దేశం మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కనీసం అక్కడ గొప్ప పండితులు, విద్వత్తును గౌరవించేవారూ ఉంటారని తలపోశాడు.

కానీ చైనా పర్యటన అతనికి నరకం చూపించింది. అక్కడి తిండి, వసతి, దుమ్మూధూళీ, దృశ్యాలు వాసనలు- ప్రతిదీ అతని సహనాన్ని పరీక్షించాయి. చిన్నపాటి రెండు చక్రాల బళ్ళలో ప్రయాణం మరింత కంపరం కలిగించింది. చైనాలో తను కలసుకున్న ఒకే ఒక వ్యక్తిపై మాత్రం డైరీలో ప్రశంసలు కురిపించాడు. అతను చైనాలో స్థిరపడిన ఒక ఆంగ్లేయుడు. పేరు, రాబర్ట్ థామస్. అతను క్రైస్తవప్రచారకుడిగా ఉండేవాడు. తర్వాత మతం మీద నమ్మకం పోయి, చీఫూలోని కస్టమ్స్ హౌస్ దగ్గర దుబాషీగా ఉంటున్నాడు. స్లీమన్ అతన్ని ఇష్టపడడానికి కారణం, తనలానే అతనికీ చాలా భాషలు తెలుసు. రష్యన్, స్వీడిష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలడు. ఇంకా విశేషం ఏమిటంటే, స్లీమన్ నేర్చుకున్న పద్ధతిలోనే ఇతను కూడా ముందుగా మాటల్ని, వాక్యాల్ని రాసుకుంటూ వాటినుంచి కథలు అల్లుతూ ఈ భాషల్ని నేర్చుకున్నాడు. “వినమ్రత, తెలివీ మూర్తీభవించిన ఈ వ్యక్తి” కాస్త సంపాదన వైపు కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత రాణించేవాడని స్లీమన్ రాసుకున్నాడు.

రెండు చక్రాల బండి మీద నానా అవస్థలు పడుతూ 1865 ఏప్రిల్ 30న తీసితిన్ నుంచి రాజధాని పెకింగ్ చేరుకున్నాడు. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ ఏవగించుకున్నాడు. బండిలో లోపల కూర్చోడానీకీ, నిలబడడానికీ కూడా వీలు కాక ఎక్కువ సేపు బండి మొగ దగ్గర రాట మీద కూర్చునే ప్రయాణం చేశాడు. సాయంత్రానికి పెకింగ్ చేరుకున్నాడు. అప్పటికి అతనిలో సహనమూ పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆ నగరం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాతిగోడల్ని చూసి ముగ్ధుడయ్యాడు కానీ, లోపలికి వెళ్ళగానే మాత్రం భయపడిపోయాడు. హోటళ్లు లేవు. ఓ బౌద్ధ మఠంలో గది దొరికింది. కిరాయి 12 ఫ్రాంకులన్నారు. గీచి గీచి బేరమాడితే 6 ఫ్రాంకులకు తగ్గించారు. ఆ గదిని చూడగానే నీరుగారిపోయాడు. ఇటుకలతో పేర్చిన పడక. సన్యాసులు నీళ్ళు చల్లడంతో నేల అక్కడక్కడ బురద బురదగా ఉంది. చిన్న చిన్న టేబుళ్లు, స్టూళ్లు. గోడలమీద పెద్ద పెద్ద రాతపత్రాలు వేలాడుతున్నాయి. వాటి మీద చైనా భాషలో కన్ఫ్యూషియస్ సూక్తులు రాసి ఉన్నాయి. ఒక బౌద్ధమఠంలో వాటిని ప్రదర్శించడం అతనికి వింతగా అనిపించింది.

భోజనం కోసం వాకబు చేశాడు. ఈ సమయంలో భోజనం దొరకదని సన్యాసులు చెప్పారు. ఆకలితో, అలసటతో నిద్రలోకి జారిపోయాడు. పొద్దుటే అయిదు గంటలకు నౌకరు వచ్చి లేపాడు. ఓ గిన్నెలో చద్దివాసన కొడుతున్న అన్నం, గ్రీన్ టీ తీసుకొచ్చాడు. వాటిని చూడగానే అతను బిత్తరపోయాడు. దానికితోడు అది ఉప్పులేని చప్పిడి కూడు. టీలో పాలూ, చక్కెరా లేవు. ఇక్కడ పాలూ, చక్కెరా దొరకవని నౌకరు చెప్పాడు.  అతని చేత ఉప్పు తెప్పించుకున్నాడు. చోప్ స్టిక్స్ తో తినడం చేతకాక, వేళ్ళతోనే తీసుకుని తిన్నాడు. కత్తులు, ఫోర్కులే కాదు సరికదా; పాలూ, చక్కెరా కూడా లేకుండా వీళ్ళు ఎలా బతికేస్తున్నారనుకుని ఆశ్చర్యపోయాడు. వట్టి అడవిజనాలనుకున్నాడు.

నౌకర్ని పంపించి గుర్రాలు తెప్పించాడు. రోజంతా నగరంలో తిరుగుతూ గడిపాడు. ఎక్కడబడితే అక్కడ ముష్టివాళ్లు, చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించారు. మరణశిక్షలు అమలు చేసే ఓ బహిరంగప్రదేశంలో తెగిపడిన శిరస్సులను చూసి భయవిహ్వలుడైపోయాడు. అర్థంపర్థంలేని అంత్యక్రియల తంతు చూసి విస్తుపోయాడు. కొన్ని దేవాలయాలను దర్శించాడు. వెలిసిపోయి పెచ్చులూడుతున్న దేవుళ్ళ వర్ణచిత్రాలు చూసి పూజార్లను తిట్టుకున్నాడు. దేవుళ్ళకు తొడిగిన పట్టు గౌన్లు చీలికలు పేలికలై దారప్పోగుల్లా వేలాడుతున్నాయి. అట్ట కిటికీలు కూడా ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన తీగలు ఆలయం మొత్తాన్నే తినేస్తున్నట్టు అనిపించింది.

మధ్యలో వర్షం పడి వీథులన్నీ బురద బురద అయిపోయాయి. అతనెక్కిన గుర్రానికి అడుగు తీసి అడుగువేయడం కష్టమైపోయింది. దాంతో అతనిలో కోపం నసాళానికి అంటింది.

అప్పటికి చైనా యువ సామ్రాజ్ఞి త్సూ షీ సింహాసనం మీద ఉంది. యాంగ్సీ లోయలో తైపింగ్ తిరుగుబాటు సాగుతోంది. మొత్తం దేశమే విస్తృతమైన మార్పుల దిశగా పయనిస్తోంది. కానీ స్లీమన్ డైరీ రాతల్లో ఆ ఊసు కొంచెమైనా లేదు. అతను పెకింగ్ లో గడిపింది, చూసింది ఒక్కరోజు. ఆ ఒక్క రోజు సందర్శనతోనే ఆ నగరం గురించి అనేక తొందరపాటు నిర్ణయాలు చేసేశాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ కాగితాలు నింపేశాడు.

ఉదాహరణకు, అతనికా నగరంలో అక్కడక్కడ తెల్ల గ్రానైటుతో నిర్మించిన పేవ్ మెంట్ల తాలూకు శిథిలాలు, ప్రతిచోటా పురాతనకాలపు మురుగు కాల్వల శిథిలాలు, స్తంభాలపై వెలిసిపోయి తునకలు తునకలైన కళాకృతులూ, మట్టిలో సగం కూరుకుపోయిన విగ్రహాలు కనిపించాయి. ఈ నగరంలో అనేకచోట్ల బ్రహ్మాండమైన గ్రానైట్ వంతెనలున్నాయనీ, వాటిలో సగం శిథిలావస్థలో ఉన్నాయనీ ; ఈ శిథిలాలను బట్టి చూస్తే ఒకప్పుడు ఈ నగరంలో రకరకాల నైపుణ్యాలు కలిగిన గొప్ప నాగరికులు ఉండేవారని తెలుస్తుందనీ, ఇప్పుడీ నగరవైభవం అన్ని విధాలా క్షీణించిపోయి, అనాగరికులతో నిండిపోయిందన్నాడు. చప్టా చేసిన పరిశుభ్రమైన వీథులతో, అద్భుత ప్రాసాదాలతో, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థతో విలసిల్లిన ఈ నగరం ఇప్పుడు మురికి ఓడే చవకబారు ఇళ్లతో తనే ఓ పెద్ద మురుగుకాల్వగా మారిపోయిందన్నాడు. మొత్తానికి నగరం మొత్తం భూమిలో సమాధై తవ్వకాలకు ఎదురుచూస్తున్నట్టు అతనికి కనిపించింది. అన్నింటినీ మించి శిథిలాలపై అతని కున్న మక్కువా, ఆసక్తీ ఈ రూపంలో బయటపడింది.

వాస్తవం ఏమిటంటే పెకింగ్ లో అప్పటికేనాడూ చప్టా చేసిన వీథులు, రాతితో నిర్మించిన మురుగునీటి కాల్వలు, గ్రానైట్ వంతెనలు లేనేలేవు.  చైనా గురించి, చైనీయుల అలవాట్ల గురించి ముందుగా తెలుసుకుని వాటిని సక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అతని రాతలో ఇలాంటి పొరపాట్లు దొర్లేవి కావు. ఆ సహనం లోపించడమే అతనిలో సమస్య.  మెరిసిపోయే ప్రాసాదాలు కూడా అతనికి శిథిలాలుగా కనిపించడానికి కారణం, చుట్టూ ఉన్న చెట్ల ఆకులు వాటిని కప్పేయడం. బాహ్యపరిసరాలను సాదాసీదాగా ఉంచుకుని, లోపల అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడం చైనీయుల అలవాటు. తను నగరంలో తిరిగినప్పటి వాతావరణం, తన అలసట, విసుగు కూడా తన పరిశీలనను ప్రభావితం చేస్తాయని అతనికి తట్టలేదు. తగిన అధ్యయనం, శిక్షణ లోపించడంతో అపోహలను, తప్పుడు అభిప్రాయాలనే నిజమని నమ్మి కాగితం మీద పెట్టడం ఇలాంటి విడ్డూరపు చిత్రణకు దారితీసింది.

ఆ తర్వాత అతను ప్రపంచ వింతలలో ఒకటైన చైనా గోడను సందర్శించాడు. అక్కడో చిన్న దొంగతనానికి కూడా పాల్పడ్డాడు…

(సశేషం)

 

ఆ పిల్ల …

Spring Explosive

-రమాసుందరి 

 

ఈ పిల్ల నాకు గుర్తుంది

అపుడెపుడో పచ్చని ఆకులు సన్నని జల్లుతో జోడు కట్టినపుడు

నేరేడు పండ్ల చెట్టు కింద నుండి పుస్తకాలు

గుండెకు హత్తుకొని తలవంచుకొని నడిచి వస్తూ ఉండేది.

ఆ పిల్ల నాకు ఏయూ అవుట్ గేటు కాడ

గద్దరు పాడుతుంటే బొంగురు గొంతుతో కోరస్ యిస్తూ కనబడేది

ఏడాదికోసారి శ్రీకాకుళం బొడ్డపాడులో

స్థూపం దగ్గర వంటరిగా కూర్చొని ఉండేది.

తరువాత యూనివర్సిటీ గోడల్లో

జేగురురంగులో వంకర టింకరగా యింకి పోయి కనిపించింది

సుల్తాన్ బజార్ గల్లీలో మారుమూల షాపులో

న్యూస్ ప్రింట్ కాగితంలో పెళుసు బారి స్థిరపడింది.

ఇటీవల చానా రోజులుగా ఆ పిల్ల కనబడలేదు.

మళ్ళీ చూశానా పిల్లని మొన్నా మధ్య

నెమలి ఈకలంత మెత్తదనంతో స్పర్శిస్తుంది చిన్నిపాపలను

మందపు అద్దాలతో తీక్షణంగా చూస్తోంది ఎవరి వైపో

ఆదర్శమో, ఆచరణో, ఆయుధమో ఏవో ఆ పిల్ల భుజం మీద వేలాడుతున్నాయి

చెట్లు కమ్ముకొన్న ఆకాశం కింద

చల్లని దారుల్లో

ఆ పిల్ల నాలో నుండి సాగిపోవడం చూశాను

వద్దు వద్దని నా గొంతు పెగలక ముందే

తిరిగి వచ్చి నా దగ్గరే కూర్చొని అడవి కబుర్లు చెప్పింది

యిత్తులు వేసి వచ్చిందంట కొలిమిని ఊదీ వచ్చిందంట

పంటలు పండే కాలం తొందరలోనే ఉందన్నది.

ప్రేమగా ఆమెను తాకబోతే

చెయ్యి పెగిలి ఉంది

కాలు కమిలి ఉంది

ఇదిగో చూడని

మర్మాంగాన్ని తెరిచి చూయించింది

గుత్త సంపదదారుడు కార్చిన సొంగ

పొంగి పొరులుతుంది అక్కడ

వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి

వెక్కిరింతగా నవ్వింది

నిన్ను చూసి నువ్వు ఏడ్చుకొంటావెందుకని ప్రశ్న వేసింది

వేలు బెట్టి గుండెకు ఆనించి

నా కళ్లలోకి చిరునవ్వుతో చూస్తూ

నువ్వు యింకా బతికే ఉన్నావని చెబుతూ

మాయమయి పోయింది.

*

రమాసుందరి

రమాసుందరి

 

 

 

 

 

 

 

 

 

ఇంటికి వెళ్లే మనుషులు

 

 

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఫుట్ పాత్ మీది నుంచి ఇంటిముఖం పడుతున్న ఇద్దరు స్త్రీలను చూడండి.
అతి సాధారణమైన చిత్రమే ఇది. సామాన్యమైన నడకే వారిది.

కింద, ఆ కాలిబాట కింద జనమంతా ట్రాఫిక్ గా… వెహికిల్స్ తో రద్దీగా మారిన ఆ రోడ్డుపై…ఇరుకిరుగ్గా ఇబ్బంది పడుతూ వెళుతుంటే వీరు మాత్రం కాస్త నయం అనిపిస్తుంది. నిదానంగా ప్రధానంగా వెళుతున్నారూ అనిపిస్తుంది.

నడక మరి.
కాలిబాట మీది నడక చిత్రణ ఇది.
అంతే కాదనుకొండి.

వారలా ముదురు వర్ణాలతో నిండైన ఆశలతో, బయటకు కానరాని అంతరంగాలతో వెళుతుంటే బహిరంగంగా వారేమిటో తెలియడం కష్టమే గానీ, గమనిస్తే…ఒకామె తన చేత ధరించిన ఆ బుగ్లలు చూడండి. ఆమె తల్లి అని దృశ్యం చెప్పకనే చెబుతోంది.

+++

నగరంలో కూలీనాలీ చేసుకునే వాళ్లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఎందరెందరో…
కానీ, యునిఫాం తీసేశాక మాత్రం వాళ్లు మనుషులుగా కానరావడం గుర్తిస్తాం.
ఆ మనుషులు అత్యంత యధాలాపంగా కానవచ్చినా కొంచెం గమనింపుతో చూస్తే మటుకు ఆకాశంలో అకస్మాత్తుగా పొడిచే హరివిల్లు మాదిరి వారు అనేక వర్ణాలతో కానవచ్చి అదృశ్యమైతారు. అనుబంధాల సింగిడిగా మెరిసి మాయమైతారు.

ఆఫీసులో ఉన్నప్పుడు వారు కేవలం పనిలో నిమగ్నమై ఉంటారు.
మనకు వారు పని మనుషులుగానే కనిపించి ఏ విశేషమూ ద్యోతకం కాదు.
కానీ, సాయంత్రం ఆరు అయిందా? వారు తల్లులవుతారు. భార్యలవుతారు. అక్కలవుతారు, చెల్లెండ్లవుతారు.

వారి నడకలో కూడా వారేమిటో తెలుస్తుంది.
వారు ఇంటికి వెళుతూ తీస్కెళ్లే వాటితోనూ తామేమిటో తెలిసి వస్తుంది.

ఈ చిత్రం అదే.

బంజారాహిల్స్ నుంచి వాళ్లు తిరిగి వెళుతుంటే, చేతిలో సంచి, ఆ సంచితో పాటు ఒకామె చేతిలో మూడు బెలూన్స్…దారి మధ్యలో ఆమె తన బిడ్డకోసం వాటిని కొనుక్కుని నడుస్తున్నదంటే ఉదయం నుంచి ఆ తల్లి మనసు ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రం అందుకే. ఆ మగువల్లో ఒకరిని తల్లిగా ఆవిష్కరించే ప్రయత్నమే.

మరొకామె చేతిలో నెమలీక ఉన్నది.
అది ఈ చిత్రంలో కనబడటం లేదుగానీ, మరొక చిత్రంలో స్పష్టం.
తాను ఒక నెమలి పింఛం రేకును చేత ధరించి నడుస్తూ ఉన్నది.

ఇట్లా ఇద్దరు.
ఆ  ఇద్దరూ ఏవో చిన్నగా సంభాషిస్తూ ఒక గాలి అల మాదిరిగా వెళుతుంటే చూడగలిగితే మనల్ని చుట్టేస్తారు.
చుట్టేసిన క్షణాన వారిని ఇలా చిత్రంగా నిలపాలనిపించింది.
తీస్తే ఇది. తర్వాత మరొకామె నెమలీకతో కానవచ్చింది.
అది వేరే దృశ్యం.

కానీ, పట్టించుకోకపోతే ఏదీ చిత్రం కాదు.
అసలు మనకేమీ తెలియదు.

వారలా రోజూ వెళతారు కాబోలు.
కానీ మనకేం తెలుసు, ఎవరు తల్లో మరెవరు భార్యో మనకేం తెలుసు?
ఒక చిత్రంగా వారిని నమోదు చేసుకుంటే ఆ చిత్రణ నుంచి వారిని కనిపెట్టడం కాస్త సులువు.

వారిద్దరూ అలా నిదానంగా మాటల వంతెన మీంచి పదం పదం దాటుకుంటూ వెళుతుంటే, అదొక ముచ్చట అని, ఇంటికి చేరేలోపు నడిచే ఒక ఆత్మీయ సంభాషణా చేతన అనీ, చూడగలిగితే ఆ ఇద్దరూ తమవైన ప్రపంచాలతో ఒక తల్లిగానో ఒక జవరాలిగానో తమ తమ స్థలాలకు చేరుతున్నారనీ తెలుస్తుంది.

సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు మనల్ని కూడా ఎవరైనా బంధిస్తే బాగుండు.
లేకపోతే కేవలం పనిమనుషులుగా కూడా మనల్ని ఎవరూ గుర్తించరే!
అందరం యజమానులమే అనుకుని, మనుషులుగా మనం జనారణ్యంలో కాటగలిసి పోతాం.

ఏమంటారు?

*

కోటిగాడు మద్రాస్ వెళ్ళాడు!

 

ఒకడున్నాడు..

వాడి పేరు కోటి సూర్యకిరణతేజం..

తెలిసిన వాళ్ళు వాడిని ‘ కోటి ‘ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు ఏమీ పిలవకుండా వెళ్ళిపోతుంటారు. గత సంవత్సరంగా వాళ్ళ నాన్న మాత్రం వాడిని పిలిచి తిడుతున్నాడు..తిట్టడానికే పిలుస్తున్నాడు.

మన కోటి గాడు పుట్టి బుధ్ధి రానప్పటినుండి తిరుపతి లోనే ఉన్నాడు. డిగ్రీ పూర్తి చేసి సంవత్సరం అయ్యింది.

తిరుపతి లో కూర్చుని హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నుంచి ఎవరైన పిలిచి ఉద్యోగాలు ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నాడు. ఇంతవరకు ఒక్క కంపెనీ నుంచి కూడాపిలుపు రాలేదు. అందుకే..ఇప్పటికైన ఒక resume తయారు చేసి అప్లై చేద్దామని నిర్ణయించుకున్నాడు. కోటి వాళ్ళ నాన్న కూడా నిర్ణయించుకున్నాడు – వీడిని మద్రాసుతోలెయ్యాలని..

కోటి గాడు మద్రాసు బస్సెక్కే వారం రోజుల ముందు – వాళ్ళింట్లో –

కోటి, కోటి వాళ్ళ నాన్న, వాళ్ళ బావ హాలులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కోటి వాళ్ళ అమ్మ, తమ్ముడు కూర్చోకుండా, మాట్లాడకుండా ఉన్నారు.

“నేను ఏ మద్రాసు వెళ్ళను నాన్న…ఇక్కడే ఉండి వెతుక్కుంటా”…మొదలెట్టాడు కోటి.

“ఇక్కడుండి వెతుక్కోవటానికి అదేమైనా తలలో తెల్ల వెంట్రుక అనుకున్నావా?? ఉద్యోగం..అయినా డిగ్రీ లో నువ్వు వెలగబెట్టిన 45% మార్కులకు మన రాష్ట్రపతి తిరుపతికి అంబాసెడర్ కారు పంపించి నిన్ను భారతదేశానికి కలెక్టరు చేస్తాడనుకున్నావా? సంవత్సరమైంది నీ చదువు పూర్తయ్యి..ఒక్క ఇంటర్వ్యు కు పిలుపు రాలేదు, ఆ 45%మారలేదు..” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఇంటర్వ్యు, కక్కు వస్తే ఆగవు నాన్న…కాస్త ఓపిక పట్టాలి” అన్నాడు కోటిగాడు సోఫా మీదకు జారబడుతూ..

“పడతాను రా….కాని …నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే నీ మార్కులు ఏ 43% కో, 42% కో మారే ప్రమాదం ఉంది…” అన్నాడు వాళ్ళ నాన్న..జారబడిన కోటీగాడిని చొక్కాపట్టుకుని పైకి లేపుతూ..

ఇండియా, పాకిస్తాన్ గొడవ తీర్చటానికి మధ్యలో అడుగుపెట్టిన అమెరికా లాగ వీళ్ళిద్దరి మధ్యలోకి కోటి వాళ్ళ బావ దూరి…

“రేయ్ కోటి…నా మాట విని మద్రాసు బయలుదేరు..అక్కడ వంశి వాళ్ళ రూములో దిగిపో. నీకు ఉద్యోగం వచ్చేవరకు అద్దె కట్టనవసరం లేదు…నీకు ఉద్యోగం వచ్చేంతవరకుకరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టనవసరం లేదు….నీకు ఉద్యోగం వచ్చేంతవరకు అసలు ఉద్యోగమే చెయ్యనవసరం లేదు” అన్నాడు.

ఆ చివరి వాక్యం కోటీ గాడిలో నూతనోత్సాహం నింపింది.

మళ్ళీ వాళ్ళ బావే మాట్లాడాడు –

“మీరు కూడా కాస్త ఓపిక పట్టాలి మావయ్యా..ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉద్యోగాలు దొరకటం అంత సులభం కాదు..కంపెనీలు లే ఆఫ్ లు ఎక్కువ చేస్తున్నాయి”అన్నాడు..

సబ్ టైటిల్స్ లేని ఫ్రెంచ్ సినిమా చూస్తున్నట్టు ఏమీ అర్థం కాని ఎక్స్ప్రెషన్ పెట్టాడు కోటి.

విషయం పసిగట్టిన వాళ్ళ నాన్న – “ఎప్పుడన్నా న్యూస్ పేపర్ చదివితే కదరా ఆ మాటలు అర్థం కావటానికి” అన్నాడు.

“నేను రోజూ చదువుతాను పేపర్” అన్నాడు కోటిగాడు… ‘ న్యూస్ ‘ అన్న మాట వాడితే అనవసరమైన రిస్కని.

వెంటనే టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి సోఫా కింద పెట్టి – “సరే అయితే….ఈ రోజు పేపర్ లోని ముఖ్యాంశాలు చెప్పు” అన్నాడు కోటివాళ్ళ నాన్న.

“నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, టాకీ పార్టు పూర్తిచేసుకున్న ‘మనసు-మనసున్నర-రెండు మనసులు ‘ చిత్రం, ‘ఇక నుంచి నా డబ్బింగు నేనే చెప్పుకుంటాను ‘ అనిబెదిరించిన హీరో”…అని ఇంకా కొన్ని ఆణిముత్యాల్లాంటి వార్తలు ప్రజలకు అందించేలోపు కోటి గాడిని వాళ్ళ నాన్న అడ్డుకుని –

“ఆపు….ఇవిరా వీడు రోజూ చదివే వార్తలు..ఇక వీడికి ఉద్యోగం వచ్చినట్టే” అన్నాడు తల పట్టుకుంటూ…

ఇక విషయం తన చేతిలోకి తీసుకోకపోతే వీళ్ళ నాన్న ఏమి చేస్తాడో అని భయమేసి, “నువ్వు ఉండు మావయ్య…నేను మాట్లాడతాను వీడితో..” అని కోటి గాడి వైపు తిరిగి –

“రేయ్ కోటి…ఒక్కసారి మీ నాన్నను చూడు” అన్నాడు..

కోటి గాడు వాళ్ళ నాన్న వైపు తీక్షణంగా చూసి  – “నాన్న తల మీద ఈగ కూర్చునుంది బావా…దాన్ని నువ్వు చంపుతావా, నన్ను చంపమంటావా?” అన్నాడు…

“నోర్ముయ్…నేనన్నది ఆయన పడుతున్న వేదన చూడమని…ఆయన అన్న మాటల్లో తప్పేముంది చెప్పు. పోనీ నీకు సాఫ్టువేరు కంపెనీ లో ఉద్యోగం చెయ్యటం ఇష్టంలేకపోతే వెరే ఏమి చెయ్యలనుకుంటున్నవో చెప్పు…..అసలు డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నావు?” అడిగాడు కోటి వాళ్ళ బావ.

“మూటలు మోసుకుని బతుకుతా” – కోటి గాడి సమాధానం..

“అయితే అసలు సమస్యే లేదు..ఈ మధ్య సాఫ్టువేరు కంపెనీలన్నీ ఇంచుమించు ఇలాంటి పనులే చేయిస్తున్నాయి. నీవు కోరుకున్న పని చెయ్యొచ్చు……వెరేకష్టాలేమయినా ఉంటే ఇప్పుడే చెప్పు ” అన్నాడు వాళ్ళ బావ..

“నేను డబ్బు సంపాదించటం మొదలు పెడితే టాక్సులు కట్టాలంటగా..”

“అవును….నువ్వు సంపాదించిన దానిలో మూడో వంతు కట్టాలి…నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే – సంవత్సరానికి నాలుగు నెలలు నీవు ప్రభుత్వం కోసం పని చేయాలి.. ”

“ఓహ్….అయితే ఆ నాలుగు నెలలు నేను శెలవు పెట్టేస్తా”

“సరే…అలాగే కానీ”

“ఇంకో విషయం – నేను ఇంటర్వ్యువ్ కు ప్రిపేర్ అవ్వటానికి ఒక అపార్టుమెంటు అద్దెకు తీసుకుంటాను “…అన్నాడు కోటి.

అంతసేపు తలమీద చెయ్యి పెట్టుకున్న వాళ్ళ నాన్న లేచి నిలబడి…చేతులు కట్టుకుని –

“అలాగే సార్…కరుణానిధి తో ఇల్లు ఖాళీ చేయిస్తాను…అక్కడ ఉందురుగాని..” అన్నాడు…

వాళ్ళ నాన్న ఏదో తేడాగా మాట్లాడుతున్నాడని అర్థమై…ఏమీ మాట్లాడలేదు కోటిగాడు.

“నోరు మూసుకుని బావ ఫ్రెండ్స్ రూములో ఉండు…వాళ్ళ రూముకు దగ్గరలో ఒక ఆంధ్రా మెస్సు ఉందట…మూడు పూటలా అక్కడే మింగు. జలుబు చేస్తేతుమ్ము..జ్వరమొస్తే చారన్నం తిను. నెలాఖరుకు నీ ఫూడ్ బిల్స్, మెడికల్ బిల్స్ నాకు submit చేస్తే reimburse చేస్తా..” అని తన తీర్పు వినిపించాడు గ్రామ ప్రజలకు.

అంతే ఇక ఎవ్వరూ నోరెత్తలేదు..

కోటి గాడు మద్రాసు వెళ్ళటానికి సిధ్ధమయ్యాడు. వాళ్ళమ్మ వాడి బట్టలు సర్దటం మొదలెట్టింది. వాళ్ళ తమ్ముడు వాడి ప్యాంట్లు ఆల్టర్ చేయించుకోవటం మొదలు పెట్టాడు…

భూమి తన చుట్టూ తను తిరిగింది… కోటిగాడు మద్రాసు బయలుదేరే రోజొచ్చింది!

కోటిని బస్టాండుకు తీసుకెళ్ళటానికి వాళ్ళ బావొచ్చాడు. కోటిగాడికి వాళ్ళ నాన్న డబ్బులిస్తూ “త్వరగా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకో…నీకు ఈ ఏడాది పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నా ” అన్నాడు..

“చూడు నాన్నా..’త్వరగా ఉద్యోగం తెచ్చుకో’ అని చెప్పటం ఉల్లిపాయలు తరగటం లాంటిది..నీ లాంటోడు ఎవడైనా చెయ్యగలడు..ఎవడికి తోచినట్టు వాడు చెయ్యగలడు. కానీ ఉద్యోగం తెచ్చుకోవటం మాంచి గొత్తొంకాయ కూర చేయటం లాంటిది. దానికి నాలాంటి చేయితిరిగిన వాడు కావాలి..” గత వారం రోజులుగా వాళ్ళ నాన్న తో అనాలనుకున్నమాటలు అనేసాడు కోటిగాడు…

ఈ స్పీచ్ కు కోటి వాళ్ళమ్మ, తమ్ముడు చప్పట్లు కొట్టారు..

“చూడరా..వీడి అర్థం పర్థం లేని స్పీచ్ కు ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాడు చెప్పిన ఉదాహరణలు చూడు…ఉల్లిపాయలు, వంకాయలు. మద్రాసు వెళ్ళినా ఏ కూరగాయలకొట్లోనో trainee గా చేరతాడు” అన్నాడు కోటి వాళ్ళ నాన్న – తన స్పీచ్ కు ఏకైక ప్రేక్షకుడయిన కోటి వాళ్ళ బావతో..

బయలుదేరేముందు వాళ్ళమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు కోటిగాడు…”ఉద్యోగం రాగానే ఫోను చెయ్యి నాన్నా” అంది వాళ్ళమ్మ. అయితే ఇప్పట్లో ఫోను చేసే అవసరం రాదని అర్థమైపోయింది కోటిగాడికి.

తమ్ముడి వైపు తిరిగి…వాడి తల నిమురుతూ “బాగ చదువుకోరా…నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది ” అన్నాడు..

“నీ ఆశీర్వాదమే కాదు రా…నీ నీలం టీ షర్టు, లెదర్ బెల్టు కూడా ఎప్పుడూ నాతోనే ఉంటాయి..” అన్నాడు కోటి తమ్ముడు..

ఇంట్లో అందరికీ టాటా చెప్పాక బస్టాండుకు బయలుదేరాడు కోటిగాడు…..మద్రాసుకు….ఒక కొత్త ప్రపంచానికి…ఒక కొత్త జీవితానికి…లోపల ఎటువంటి జంతువులున్నయో తెలియని అడవికి…

***

ఈ  మనిషి ఇలా…

nitish

నితీష్ కుమార్ – “ఇదిగో..ఎవరైనా కాస్త కాఫీ తెప్పించి ఆ దేవేగౌడా నోట్లో పోయండయ్యా. ఇక్కడికి వచ్చేముందు చెబుతున్నా వినకుండా పెరుగన్నం తిని, స్వీట్ లస్సీ తాగొచ్చాడు. అందరూ మెక్సికన్ వేవ్ చేసి మన మూకుమ్మడి పవర్ ప్రదర్శిద్దామని ప్రెస్ వాళ్ళని పిలిస్తే..ఈ మనిషి ఇలా గురక పెడితే ఎలా? మెక్సికన్ వేవ్ కుదిరేలా లేదు కాని..ఆ ఇద్దరినీ ఇటొచ్చేయమనండి..మన నలుగురం హైటు ప్రకారం కూర్చుని “జై హింద్” అని ముగించేద్దాం.

*

బిత్తిరి సత్తీ,  సిమ్మాద్దిరీ

 

 

 

    ల.లి.త.

ల.లి.త.

సత్తీ… ఓ బిత్తిరి సత్తీ…   గిది చెప్పు. గిట్ల టీవీవార్తలల్ల ఊరి ముచ్చట్లు వెట్టాలని ఆలోసన ఎవురు జేశిన్రు? అదీ ఇంత అందమైన బాసల! తెల్సులే. మల్లన్న గదా! ఆయన మొదులు వెట్టిండు. ఆయనా, రాములమ్మా రచ్చ రేపిన్రు. గిప్పుడేమో నువ్వూ, మీ సాఫిత్రక్కా, మంగోలి మా అందరికీ  ఇంటి మనుసుల్లెక్కయిన్రు.  రాత్రి తొమ్మిదిన్నర కొట్టంగనే దినామూ  టీవీ తాన కొచ్చేస్తం. ఇగ శురూ ఐతది మీ ముగ్గురి తమాస. వార్తలు ఎవురైనా ఇంత సోపతితోని ఎన్నడైన జెప్పిన్రా?

ఎన్నడో దూరదర్శన్ తప్ప మరొకటి లేని కాలంల.. ఆఁ … వాల్లెవురబ్బా? కోమల్ జీ బీ సింగ్, రీనీ జోసఫ్, షమ్మీ నారంగ్… వాల్లందరూ ఎంత మంచిగ సదివెటోల్లు వార్తలు! ఏ బాసల వార్తలు జెప్తే ఆ బాసని నిండుగ, తియ్యగ పంచదార సెవుల బోసినట్టు పల్కెటోల్లు!  గిప్పుడా? ఇంగ్లిసోల్ల లెక్క సూట్లు, బూట్లేసుకొని మంచిగ తెల్గుల సుత మాట్లాడలేనోల్లంతా వార్తలు సెప్పనీకొస్తున్రు.  థూ, తెల్గుల గా ఇంగిలీసు మాటలు కల్పి పాయసంల ఉప్పు వోసినట్టు చేస్తున్రు. ఇగ పోరలకు బాసేమి నేర్వనొస్తది?  యాడ జూడు “రేటెంత? సెవెంటీ రుపీస్. టైమెంత? సిక్స్ ఫార్టీ ఫైవ్. సండే కలుస్తవా? రాలేను. మండే సూస్త” అనవట్టిన్రు అందురూ.  డిల్లీల సుత గీ బాస ఉండది. “సత్తావన్ రుపై, పచత్తర్ రుపై” అనుకుంటా మంచిగ ఆల్ల బాసల లెక్కలు సెప్పుకుంటరు వాల్లంతా. మన్ని పిసోని లెక్క జూస్తా అరవ్వోడు వాని బాసల్నే అన్నీ అర్సుకుంటడు.  బెంగాలోడు మా టాగోరో అనుకుంటా ఆయన్ని మించినోడు లేడనుకుంటా  డప్పుగొట్కుంటా తిర్గుతడు.

బాసను గిట్ల సావనూకుతున్రని తెలుగు టీవీల వార్తలు సూసుడే బందు జేసినం మా అసుంటి పాత మనుసులం. గింతలో మీరచ్చిన్రు.  మా బాస, మా తిండి, మా సంబురాలంటూ మన తెలంగాన ఉద్యమంల మీ అసుమంటోల్లు కూడా దిగిన్రు. నాయం, అన్నాయం, అన్నదమ్ములు ఇడిపోటం.. ఈ పెద్ద పెద్ద రాజకీయాల ముచ్చట్లకేమొచ్చెగానీ,  గింత బంగారం బాసను టీవీలల్ల ఎంత మంచిగ లెబట్టిన్రు!

మంచి మంచి సామెతలు కల్పి సెప్తరబ్బా నువ్వూ మీ సాఫిత్రక్కా వార్తలల్ల! దినాం వీల్లేమి ముచ్చట్లు జెప్తరో అని ఎదురు చూస్తం. నువు బిత్తిరోని లెక్క యాక్సన్ జేస్కుంటా నవ్విపిస్తవ్ గని, నీ మాటలల్ల షానా నిజముంటది సత్తీ!  అన్ని టీవీలూ పార్టీ  పెద్దోల్ల టీవీలే అని మందికి తెల్సిన ముచ్చటే గదా! అందుకే మీరు కేసీయార్ దొరను పొగుడ్తున్నా,  మోడీ దొరకు, సెంద్రాలు సార్ కు కాల్తున్న కట్టెతోని వాతలు వెడ్తున్నా ఏమనుకోములే సత్తీ! తీన్మార్ వార్తలల్ల మీ బాసకే ముందుగాల  మేం మొక్కేది.

ఇట్లంటే సత్తి గుస్సా అయితడేమో! లేదులే, నువు చెప్పేటియి గూడ శానామంది టీవీలల్ల వొర్రే ఇసయాలకంటే మంచిగుంటయి సత్తీ. ఒగసారి ఎండ మండుతుంటే సిన్న టెంటునీడల కుసోని, ఎండలల్ల తిరిగెటోల్లు ఎంత కష్టవడాలోనని నువు యాష్టబోతుంటే సిన్న సిన్నోల్లు, అవీ యివీ అమ్ముకునేటోల్ల బాదలు యాదికచ్చి కండ్లకెల్లి నీల్లచ్చినయ్. టీవీలోల్లు ఎండ ఎట్ల సంపుతున్నదో సెప్పనీకి సిటీలల్ల పంకాలు తిరక్కపోవుడు, ఇండ్లలో కోడి పెట్టల్లెక్క కుసున్న మన్సులు అసోబుసో మనుడే సూపిస్తరు. మల్ల గవుర్న్మెంటు కరెంటు ఇస్తలేదని నిష్టురవడ్తరు. రైతులగ్గూడ ఇయ్యనీకుంట జేసి, ఉన్న తక్వ కరెంటును ఎక్వగా నూక్కపోతున్న పెద్ద పెద్ద సీరెల షాపులోల్లు, మాల్స్ పెద్ద మన్సుల్ని మీ టీవీలోల్లు ఒక్క మాట సుత అనరేం?

సీప్ లిక్కర్ని కేసీయార్ తెస్తున్నడని శాన నెత్తినొప్పొచ్చింది నీకు. ఊకుంటవా మరి! బిత్తిరి ఏసంతో సురక పెట్టుడే నీ తీరైపాయె. ఇగ సార సీసాలు వట్కోని ఒకటే ఎగురుడు. మంది ఆరోగ్యం కోసమే గిదంతా అని పద్మారావు సారు మాటలు యాది జేస్తూ, ఇంకా సిటీలల్ల ఎక్కువ మందు షాపులేంది, జిల్లాల పొంటి  అంత తక్కువేందని యాగీ జేసినవ్. మంచు లచ్మక్క, తాగి బండి నడిపెటోల్లకు పోలీస్ ఠానాల కూసొబెట్టి బుద్దులు జెప్తదని విని, తాగి బైక్ ను నడిపిస్తివే రోడ్డు మీద! అందర్నీ సారా తాగమని పద్మారావు సారూ, తాగి బండి నడపొద్దని నాయిని సారూ, తాగుబోతులకు మంచి ముచ్చట్లు జెప్తనని మంచు లచ్మీ తీన్మార్ ఆటలు ఆడుతుంటే బైక్ మీద నీ ఆటలూ, ముచ్చట్లూ నువ్ శురూ జేసినవ్….  మస్తు నవ్విపిచ్చినవ్ లే సత్తీ.  పక్కపొంటి యీ సావిత్రి పిల్ల ‘అన్నీ మంచికే’ అనవట్టుడు. సచ్చ బారత్ అంటా సీపుర్లు బట్టి పోటువలు దిగెటోల్లను మంచిగ బనాయించినవ్. వాల్లందరి కంటే సీపురుతో ఊడ్సి పంజేసిన నువ్వే కరెష్టయిన  బ్రాండు అంబాసిలండర్ వని చెప్పుకున్నవ్. సెత్త గుట్టలతాన నీ సెల్ఫీల కత జూశినంక గీ సేల్ఫీష్ ల పిసోల్లకు, ప్యాసను పోరగాన్లకు ఏమైనా గ్యానమొస్తదంటవా సత్తీ!  వానలు బగ్గ పడాలని లీడల్ర లెక్క యాగం జేస్తివి. గింత సుతారంగ వాతలు వెట్టుడు యాడకెల్లి  నేర్సిన్రమ్మా మీరంతా?

ఇంగిలీసును తెలుగు లెక్క మార్సి నవ్విపిచ్చుడు పాత కతే గానీ, నువ్ అది జేసి మంచిగనే నవ్విపిస్తవ్ తియ్. ఎల్నినో ని ఎల్లినూనె, గూగుల్ ను గుల్గుల్, విటమిన్లను ఈతముల్లు, ఎక్స్ క్లుసివ్ ని హెచ్చుకూలీ, హెరిటేజ్ ని ఎర్రి స్టేజీ … గిది నీ అందాల బాస. “సూస్కుందమిక” అనుకుంటా సిన్న పొల్లగాని లెక్క లాజిక్కులు మంచిగ తీస్తవ్! అయన్నీ జంగు పట్టిన మా దిమాగ్ లను తోముతా ఉంటయ్.

మీ సాఫిత్రక్క, మంగోలి కట్టే బట్టలు సూస్తనే సంతోశమైతది సత్తీ.  బుగ్గ సేతుల జాకిట్టేస్కోని, నూలుసీరెలు గట్టి, సన్న గొంతుతోని సక్కదనాల సాఫిత్రక్క వార్తలు జెప్తుంటే షాన మంచిగనిపిస్తది. మీ ముగ్గుర్లో  గా సక్కనిసుక్క మంగోలికి సురుకెక్కువ.  గా పిల్లకు ఐదరాబాదు మాటలు, ఇంగిలీసు మంచిగస్తయ్.  నీ లొడాసు అంగీలైతే బాగున్నయ్ గాని, వార్తలు సదివేటప్పుడు ఆ కోట్ ఏంది సత్తీ? మంచిగ పంచె, అంగీ కట్టు…  ఓహో, నీ బిత్తిరి మాటలకు ఆ యేషం నడుస్తదో లేదో అని గా కోటు తగిలించినావ్? మీ అన్న మల్లన్న ఎంత మంచిగ పంచె గట్టి, తలపాగ జుట్టి, సేత కర్ర బట్టి అచ్చెటోడు! గా యేషంల ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకుల తానికి పొయ్యి, తీరొక్క ముచ్చట్లు, వాతలు బెట్టెటోడు. పొన్నాల లక్ష్మయ్యతోని, ఇంకా లీడల్ర తోని మల్లన్న పెట్టిన ముచ్చట్లు ఏమన్న ఉన్నయా? పెద్ద మన్సి  కాని పెద్దమన్సి మన మల్లన్న, దమ్మున్నోడు. ఇంకొక మాట గూడ ఉన్నదిలే. గాయన తెలంగాన ఉద్యమం జోర్ల  వీ సిక్స్ తీన్మారని మొదులు వెట్టిండు. ఉద్యమం వేడిగుండే. అప్పుడాయన ఏ ముచ్చట ఏ తీర్గ సెప్పినా నడ్సింది. మల్లన్న తెల్వి మల్లెపువ్వు లెక్క ఆసన గొట్టింది. ఇప్పుడు నీకు అలాంటి శాన్సు లేదులే సత్తీ. అందుకే బిత్తిరి యేశాలేసి నవ్విపిస్తా కొన్నైనా నిజాలు సెప్పనీకి సూస్తున్నవ్. కోదండరాం సార్ తో ఎంత గౌరవంగ మాట్లాడిండు మల్లన్న!  గా పెద్ద సార్ను ఓ సారి అర్సుకోవా నువ్వు సత్తీ.  ఇప్పుడాయన ఏం చేస్తుండో ఎట్లున్నడో!

ఊరోనివి నువ్వు. అందుకే నీకు రైతులంటే అంత  పాయిరం.  వాన మొగిల్లు అయిదరాబాద్ కెందుకు, ఊర్లపొంటి పోకుండానని మొత్తుకుంటివి. రైతులు జీవి దీస్కుంటాంటే అర్సుకోని సర్కారును ఏమీ అనకుండా, సిటీల కూలీలై బత్కుతున్న బక్క రైతులకు నువ్వే దైర్నమియ్యనీకి సూస్తివి. ఇసుమంటి న్యూస్ రిపోర్టింగ్ నీతోనే మొదులయింది తమ్మీ. నీది కొద్దిగా ‘ఆల్ ఈజ్ వెల్’ సెంటిమెంటులెక్క గొడ్తది తమ్మీ ఒక్కొక్కసారి. త్రీ ఇడియట్స్ సిన్మ జూసినవా? బిత్తిరిగా ముచ్చట్లు వెడ్తానే మల్లన్నలెక్క రాజకీయాలోల్ల సెవుల్నుండి రక్తం దియ్యాలే. కష్టమంటవా? కావచ్చులే!

ఎన్డీటీవీ, టైమ్స్ నౌ  … గిసుమంటి ఇంగ్లీసు సానెల్లన్నీ ఏదో ఓ పార్టీకీ మతానికీ అంబానీకీ అదానీకీ కాల్మొక్తా బత్కుతయ్ తమ్మీ. నీకు తెల్వని కత గాదు. ఎన్డీటీవీ ఇంగ్లీసు సానెల్ ముచ్చటకేమి గానీ, ఆల హిందీ సానెల్ల ‘రవీష్ కీ రిపోర్ట్’ అని ఓ ప్రోగ్రాం వస్తది సూడు. సుట్టూ ఎన్నెన్ని అన్యాలాలు జర్గుతున్నయో అయన్నీ మనకు సూపెట్టుడే గా రవీష్ సార్ పని. ఆయ్న పనికి అడ్డు వెట్టకుంట వొదిలేసిన్రు ఎన్డీటీవీ హిందీ సానెలోల్లు. ఈ మాయలోకంల ఆయనకెట్లనో దొర్కింది మంచిగ నిజాలు సెప్పే మోక. నువ్ కూడ సానెలోల్లను మస్కగొట్టి సెప్పెయ్ నిజాలు.

మీరు తెలంగాన సంస్కృతి అని గర్వంగ చెప్తరు గదా! తెలంగాన సంస్కృతి, మాట, ముచ్చటే మీ ప్రోగ్రామ్ కు పానం కదా!  గీ సంస్కృతిల సిన్మా సెత్తను ఎందుకు గుసాయిస్తున్నవ్ తమ్మీ అప్పుడప్పుడు?  యాక్సను మంచిగ జేస్తురు గదా మీరంతా సినేమాలల్ల గుసాయిస్తరేమోనని బుగులు వెడ్తది.  ఆంద్రల సుత సెక్కబజన్లు, హరి కతలు, బుర్రకతలు, నాట్ల పాటలు, తోలుబొమ్మలు… ఎన్నో ఉండేయి. అయన్నీ ఇడ్సిపెట్టి జనం సిన్మాలెంట పడిన్రు. ఇంత మంచిగ బత్కమ్మ సంబురాలు, బోనాలు జేస్కోని, ఒగ్గుకతలు మంచిగ  సెప్పుకుంటా, పాటే పానమైన తెలంగానోల్లకు గీ సిన్మాల సీడ ఏంది సత్తీ? సిటీల లోకంతీరు ఎట్లున్నా, తీన్మార్ వార్తలల్ల తెలంగానా ఊర్లెంట తిర్గి పెద్దమన్సులు, రైతులు, సిన్న పిల్లల కతలు సూపిస్తున్నరు మీరు!  సిన్నిబిడ్డ యశ్వంత్ వొగ్గుకతను ఎంత మంచిగ సెప్తున్నడో సూపించింది గదా సాఫిత్రక్క.  గట్లనే పండుగలు, సంబురాలు, పాటలు రిపోర్ట్ సెయ్యుండ్రి.  పరబాసు, రాం చరణ్, తమన్నాలను ఇడ్సిపెట్టురి. సాఫిత్రక్క కట్టే సీర్లకూ సిన్మలోల్ల ష్టైలు ముచ్చట్లకూ కుదరది. గా మతిలేని ఫేషను షోల ముచ్చట్లు మనకెందుకు తమ్మీ? మంచిగ బొమ్మలేసే తెలంగాన తమ్ముల్లను సూపియుండ్రి. ఏ గోండు గూడెంతాననో మెట్ల కిన్నెర తీగలు బిగించే పెద్ద మన్సిని సూపెట్టురి. సాలోల్లను అర్సుకో తమ్మీ.

ఓ సాఫిత్రక్కా, మంగోలి, బిత్తిరి సత్తీ… మీకూ, మీ ఎనకున్న టీం.. అందరికీ శనార్తులు. మీ తీన్మార్ వార్తలు  సల్లగుండాలె.

***

ఇన్నావా సిమ్మాద్దిరీ, ఆలంత గొప్పగ ఆల బాసలో సెప్పుకుంతన్నారు వార్తల్ని. మనకాడేటుంది అలగ?  మన సంగతులు సేప్పీ వోలు ఎవులూ నేరు. టీవీల మన్ని సేరదీసీవోడూ నేడు. ఆల్లాల్ల నూసులు, గొప్పలు ఆలే సెప్పుకుంతారు. మనకేదేనా ఆపదొస్తే, వరదొస్తే మనూర్లకొచ్చి ఇంటర్వీలు సేత్తారు మన్ని. అంతే. మన రోజువారీ మాటా, పాటా, ఇకటాలూ ఎవులిగ్గావాలి?

మన సెంద్రబాబుని, జగన్ రెడ్డినీ  ఆలు సెంద్రాలుసారు, జగనాలుసారు అని పిల్సి ఎంత బాగా ఇకటాలాడతారు సూడుమీ. అసలుకి మన సెంద్రబాబే మన యేసాన్నీ బాసనీ పట్టిచ్చుకోట్లేదని నాకు వనుమానం వర్లచ్చిమీ! అందర్నీ గొప్పోల్లు సేత్తా, ఊర్ని సింగపూరు సేత్తా అంటాడా బావు. మనూరు సింగపూరు ఐపోతే ఆకిరికి మనం ఆ సింగపూరోల్ల  బాస నేర్సుకోవాలో ఏటో! అసలికే ఆ బావు,  సెరిత్రలు సదవొద్దు, అందరూ వింజినీర్లు ఐపోయి డబ్బు కూడబెట్టీయాలంతాడు. డబ్బులు సెట్లకి రాల్తాయేటి? అయినా ఒక్క డబ్బుంటేనే సరిపోద్దా మణిసికి? నాకూ ఆ బిత్తిరిసత్తిలాగే టీవీలో కెలిపోయి మన కవుర్లు సెప్పీయాలని శానా యిదిగా ఉంది వర్లచ్చిమీ! మన కుర్రోల్లు కూడా టీవీల్లో మన బాసే మాటాడితే మనకెంత బాగుంటాది? గానీ ఆలు యిప్పటికే సినేమాల బాస నేరిసీనారు. ఎలగో ఏటో! పల్లెటూరోల్లని ఎర్రబస్సుగాల్లని ఇకటాలాడ్డం కాదు. మనకాడా ఎన్నో ఇసయాలు నేరుసుకోవొచ్చని సిటీలు పట్టీసినోల్లకి ఏనాటికి బోద పడాల? మనకీ తీన్మారోల్ల లాగే ఒక్కరగంట టీవీలో సోటిత్తే  ష్టాపు నెగ్గొట్టీవాఁ ? ఆ సేత్తోటే రాయల్సీమోల్లకీ, ఇంకా మన రకరకాల యాసల బాసలకీ ఒక్కొక్క అరగంట శాన.

ఎంతాశ సిమ్మాద్దిరీ నీకు?

ఓ టీవీలోల్లూ, ఎవులైనా ఆలకిత్తన్నారా?

*

 

 

 

 

 

 

గమనమే గమ్యం-15

olga title

Volga-1చూస్తూ చూస్తూ ఉండగానే శారద ఇంగ్లండ్‌ ప్రయాణం దగ్గర పడింది. విశాలకు ఎమ్‌.ఏ లో సీటు దొరికింది. విశాల ఇక ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదు. హాస్టలు వసతులు  సరిగా లేవు. ఐనా ఇంటినుంచి బైట పడింది. ఇంట్లో నుంచి విశాల వెళ్తున్న రోజు కోటేశ్వరి ఏడుపుకు అంతులేదు. విశాల తల్లిని ఓదార్చే ప్రయత్నం కొంతసేపు చేసి లాభంలేదని తనకవసరమైన సామాను తీసుకుని వెళ్ళిపోయింది. పద్నాలుగేళ్ల రాజ్యం కోటేశ్వరిని ఓదార్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది . ‘‘ఇక నుంచీ ఇదే నా కూతురు. అది నా కడుపున పుట్టింది గానీ మనసున పుట్టలేదు’’ అనుకుని రాజ్యాన్ని దగ్గరకు తీసింది కోటేశ్వరి.

రెండేళ్ళు శారదను చూడలేననుకుంటే మూర్తికి ఊపిరాడనట్లుగా ఉంది. శారదకు ప్రయాణపు హడావుడి ఎంతున్నా మనసులో ఓ మూల శూన్యంగా అనిపిస్తుంది. అమ్మ, మూర్తి వీళ్ళిద్దరినీ ఒదిలి ఉండటం తననుకున్నంత తేలిక కాదని తెలుస్తూనే ఉంది.

అందరికంటే సుబ్బమ్మ సంతోషంగా ఉంది. కూతురిని ఇంగ్లండు పంపించాలని రామారావు కన్న కలలు ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ కలల్లో ఆమెకూ భాగముంది. భారం ఆమె మీద వేసి తన కల నెరవేరుతుందనే పూర్తి నమ్మకంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆ నమ్మకాన్ని వమ్ముకానీయకుండా ఇన్నాళ్ళూ సుబ్బమ్మ కూతురి బాధ్యత తీసుకుంది. శారద ఇంగ్లండ్‌ వెళ్ళి ఆ డిగ్రీ తీసుకువచ్చేస్తే భర్తకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధీమాతో బతకొచ్చునని ఆమె ఆశ. శారద పెళ్ళి గురించి ఆలోచించే పని సుబ్బమ్మ ఏనాడూ తన నెత్తిన పెట్టుకోలేదు. శారద మేనమామలు  శారద మెడిసిన్‌లో చేరగానే సంబంధాలు  చూడబోయారు. శారద తన వివాహం తానే చేసుకుంటానని, ఎవరి జోక్యాన్ని సహించనని గట్టిగా చెప్పింది. సుబ్బమ్మ ఆనాటి నుంచీ శారద పెళ్ళి గురించి నిశ్చింతగా ఉంది. కూతురి మీద ఆమెకు కేవలం ప్రేమ మాత్రమే కాదు –  గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి. కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా మంచిదని అనుకుంటుంది. ‘‘అమ్మా. అందరూ నన్ను ఆధునిక స్త్రీ అంటారు. నువ్వు ఆధునిక అమ్మవమ్మా’’ అనేది శారదాంబ. ‘‘అదంతా నాకేం తెలియదు. శారదకు తల్లిని అంతే’’ అనేది సుబ్బమ్మ.

శారద ప్రయాణం దగ్గర పడుతుండగా బంధువులందరూ వచ్చి శారదను అభినందించి వెళ్ళారు. మరో నాలుగు రోజుల్లో ప్రయాణమనగా పార్టీ సమావేశం కూడా జరిగింది. శారద ఇంగ్లండ్‌లో పార్టీ వారిని కలుసుకుని చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నారు. సమావేశం పూర్తయ్యాక శారదను ఇంటి దాకా దింపే బాధ్యత మూర్తి తీసుకున్నాడు.

‘‘ఒక రోజంతా మనం కలిసి గడపాలి శారదా. రేపు నాతో రాగలవా?’’ మూర్తి సాహసం చేస్తున్నాననుకున్నాడు.

‘‘రాగలను’’ అంది శారద స్థిరంగా.

‘‘ఎక్కడికని అడగవేం’’.

‘‘నువ్వెక్కడికి తీసికెళ్తే అక్కడికి’’ మూర్తి భుజం మీద స్నేహంగా చేయి వేసింది శారద.

 

‘‘రేపు ఉదయం పదిగంటలకు వస్తాను. సిద్ధంగా ఉండు. మళ్ళీ ఎల్లుండి పది గంటలకు మీ ఇంట్లో ఉంటావు’’.

‘‘అలాగే’’ మధురంగా నవ్వింది శారద.

రెండేళ్ళ ఎడబాటు ఒక రోజంతా కలిసి ఉండటంతో తీర్చుకోవాలని చూడటం గురించి వాళ్ళిద్దరికీ సందేహం లేదు.

మర్నాడు శారదను తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు మూర్తి. ఆ స్నేహితుడు కుటుంబంతో సహా స్వగ్రామం వెళ్ళాడు.

అంత ఏకాంతంలో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవాలని అనిపించలేదు. ఒకరి ఎదుట ఒకరు మౌనంగా కూర్చున్నారు. కొన్ని గంటలు అలా గడిచాక మూర్తి అడిగాడు.

‘‘ఏం చేద్దాం శారదా?’’

‘‘ఏ విషయం’’ తెలిసీ అడిగింది.

‘‘మన ప్రేమ గురించి’’

‘‘చెయ్యటానికేముంది? ప్రేమ ఉంది గదా – దానిని కాపాడుకుందాం’’

‘‘పెళ్ళి ’’

‘‘ఎలా కుదురుతుంది మూర్తీ ?  నేను చాలా ఆలోచించాను. నీకు పెళ్ళి అయింది కాబట్టి నిన్ను ప్రేమించకూడదని అనుకోవటం, ప్రేమించకుండా ఉండటం నా వల్ల కాలేదు. అసలు  ఆ ఊహే నాకు రాలేదు. స్నేహితుల్లా ఉందాం. పెళ్ళి చేసుకోవాలని ఏముంది? ఈ మూడు నాలుగేళ్ళ నుంచీ ఉన్నట్టే ఇకముందూ ఉందాం’’.

‘‘నువ్వు పెళ్ళి చేసుకోవా?’’

‘‘చేసుకోమంటావా?’’

‘‘నేను పెళ్ళాడి సంసార జీవితం గడుపుతూ నిన్ను ఒద్దని ఎలా అంటాను?’’

‘‘లేదు మూర్తీ – నేను నీ జీవితంలోకి రాకముందే నీకు పెళ్ళయింది. దానికి నీ బాధ్యత లేదు. కానీ నా మనసు నిండా నిన్ను పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళాడటం నా వల్ల కాదు. పెళ్ళంటే చిన్నతనంలో ఒకందుకు భయపడ్డాను. చదువు ఆగిపోతుందని. ఇప్పుడూ భయపడుతున్నాను. ప్రేమ లేని పెళ్ళి చేసుకోటానికి. ఇంక ఆ విషయం మర్చిపోదాం. చెయ్యటానికి ఎన్నో పనులున్నాయి. ఇంతింత బాధ్యతలు  నెత్తిన వేసుకుని, డాక్టర్‌ వృత్తిలో ఉండి పెళ్ళి చేసుకోవటం కంటే ఇలా ఉండిపోవటం మంచిదని నాకెప్పుడూ అనిపిస్తుంది.’’ చాలా స్పష్టంగా, బలంగా చెప్పింది శారద.

‘‘కానీ – కానీ – ఒంటరిగా’’ మూర్తి గొంతులో ఏదో దీనత్వం.

‘‘నేను ఒంటరినా? కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిని నేను ఒంటరినేమిటి? అంతర్జాతీయ వ్యక్తులం మనం.’’

‘‘ఆ అర్థంలో కాదు’’

‘‘ఏ అర్థంలోనూ నేను ఒంటరిని కాదు. నాకు నువ్వున్నావు. లేవా?’’ శారద అడిగిన తీరు మూర్తి గుండె గొంతులోకి వచ్చింది.

‘‘నా శారదా’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అలా చాలాసేపు  ఉండిపోయారు.

‘‘ఇంతకు మించి దగ్గర కాలేం కదా’’ జీరబోయిన గొంతుతో అడిగాడు మూర్తి.

‘‘కాలేం అనే నిస్సహాయత ఎందుకు? కాకూడదు అనే నియమం ఎందుకు? ఇంతకుమించి దగ్గర కావాలనే మహోధృతమైన కోర్కె మనలో పుట్టుకొచ్చిన నాడు ఇద్దరం ఒకరిలో ఒకరం ఐక్యమవుతామేమో. ఇపుడు ఆ కోర్కెకు అంత బలం ఉన్నట్టు కనిపించటం లేదు. మన రక్తంలో ఉన్న సంప్రదాయాలలో, నీతులలో, కొత్తగా అలవరుచుకుంటున్న భావాలో –  ఏవో మనల్ని ఇంతకన్నా దగ్గర కానివ్వటం లేదు. ఆ అడ్డు మనం కావాలని ఏర్పరచుకున్నది కాదు. దానంతటది వచ్చింది. దానంతటది తొలగిపోవాలి. మన జీవితకాలంలో తొలిగిపోతుందో లేదో చూద్దాం’’.

ఇద్దరి మనసుూ భారమవుతూ, తేలిక పడుతూ గంటలు గడిచిపోతున్నాయి.

‘‘ఇంగ్లండ్‌లో మంచి మనిషి తటస్థపడి నీకు ప్రేమ కలిగితే నిరాకరించకు’’ ప్రాధేయపడినట్టు చెప్పాడు.

‘‘అలాగే’’ నవ్వింది శారద.

‘‘నవ్వటం కాదు. నిజంగా అలా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’.

‘‘నేనూ నిజంగానే అంటున్నాను. ప్రేమ ఎదురైతే నిరాకరించనివ్వదు. నీ ప్రేమ చూడు –  నన్ను ఎలా నీ దగ్గరకు తెచ్చిందో’’.

‘‘నా ప్రేమలో విడ్డూరం లేదు శారదా. నాకూ –  లోకానికి కూడా! ఎంతోమంది పురుషులు  పెళ్ళాడి, ఆ తర్వాత ప్రేమ దొరికి, ఆ ప్రేమనూ పొంది లోకంలో గౌరవంగా బతుకుతున్నారు. కానీ ఆడవాళ్ళలా కాదు. మన సంబంధాల్ని లోకం గౌరవించదు. నిన్ను చిన్నచూపు చూస్తుంది. అది నేను భరించలేను.’’

‘‘లోకానికి విలువ  ఇచ్చి కాదు మూర్తీ నేనిలా నీకు దూరంగా ఉంటున్నది. మగవాడు ఇద్దరిని ప్రేమించగలిగినపుడు – అది సహజమైనపుడు, విడ్డూరం కానపుడు స్త్రీ ఒకరికంటే ఎక్కువమందిని ప్రేమించగలదేమో –  ప్రేమించగలుగుతుంది -మా విశాల తల్లి కోటేశ్వరి చూడు. ఆమె చాలామందితో జీవితం పంచుకుంది. ఇష్టంగానే పంచుకుంది. ఆ వృత్తిలో ఉన్న స్త్రీలు  ఒకరి కంటే ఎక్కువ మందిని ప్రేమిస్తున్నారు ` మిగిలిన స్త్రీలు  రకరకా విధి నిషేధాలతో మనసు కట్టేసుకుంటున్నారేమో ?”

‘‘మన ప్రేమను అలా పోల్చకు శారదా’’

‘‘పోల్చటం కాదు. స్త్రీ పురుష స్వభావాల్లో తేడాలు రకరకా కారణా వల్ల వచ్చాయి తప్ప పుట్టుక వల్ల  కాదనిపిస్తుది. ఇంతకూ నాకు ఇంకో ప్రేమ ఎదురైతే ముందు నీకు చెప్తాను. సరేనా?’’

పేలవంగా నవ్వాడు.

‘‘నిన్ను పోగొట్టుకోవాలని లేదు శారదా’’.

‘‘నేనెక్కడికీ పోను. నిన్ను ఒదిలి నేనూ ఉండలేను. రెండేళ్ళు – ఎంతలో గడిచిపోతాయి  ? దిగులుపడకురా’’ బుజ్జగించింది.

పగలు  రాత్రయింది. రాత్రి కరుగుతూ ఉంది వాళ్ళ మాటల్లో. రాజకీయాలూ , సాహిత్యం, సంగీతం ఏవేవో మాటలు దొర్లుతునే ఉన్నాయి. నవ్వులు  రాలుతూనే  ఉన్నాయి. కన్నీళ్ళు జారుతూనే ఉన్నాయి.

‘‘అరే –  మర్చిపోయాను’’ అంటూ పక్కనున్న సంచీలోంచి ఒక కెమెరా తీశాడు మూర్తి.

‘‘ఈ రోజు నీ ఫోటో ఒకటి తీసుకుని దాచుకోవాలనుకున్నాను’’

శారద నవ్వుతూ చూస్తోంది. మూర్తి ప్రత్యేకమైన దీపాలు  వెలిగించి  చైతన్యాన్ని, ప్రేమను, స్నేహాన్ని ఒలికిస్తున్న శారద ముఖాన్ని ఫోటోలో భద్రపరిచాడు.

‘‘రోజూ చూస్తావా ఆ ఫోటో’’

‘‘పూజ చేస్తా’’

‘‘కమ్యూనిస్టు పార్టీ నుంచి పంపిచేస్తారేమో –  పూజలూ  అవీ చేస్తే’’

‘‘పిచ్చిదానా –  దేవుళ్ళని పూజచేస్తే పంపించేస్తారేమో ` మనుషుల్ని- గొప్ప మనుషుల్ని పూజిస్తే ఎందుకు బహిష్కరిస్తారు?’’

‘‘నేనేం గొప్ప మూర్తీ `-  నాలాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారు.’’

‘లేదు శారదా – నీలాంటి వాళ్ళు లేరు ` పోనీ కోటి కొకరు ఉంటారేమో. నువ్వు స్త్రీవే కాదు –  మనిషివి `- నీ తెలివి, చురుకు, మానవత్వం, స్నేహ గుణం, కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివి అట్లా పులకరించి పోయిన మొదటి తెలుగు యువతివి నువ్వేనేమో – ప్రపంచాన్ని అంతా ఆలింగనం చేసుకోగల ఆధునిక యువతివి నువ్వేనేమో –  పోనీ ` నాకింకొకరు తెలియదు. సంగీతం, సాహిత్యం, విజ్ఞానం, సాహసం, త్యాగం –  శారదా ` నువ్వు అపురూపం’’.

శారద మూర్తి నోరు మూసి ‘‘నాకున్న అవకాశాలుంటే లక్షల మంది శారదలు  తయారవుతారు. అతి చెయ్యకు’’ అంది చిరుకోపంతో.

‘‘నీకున్న అవకాశాలు  లక్షమందికి లేవు గానీ, కొందరికి ఉన్నాయి. వాళ్ళు హాయిగా భర్త నీడన బతుకుతున్నారు. నువ్వు స్వేచ్ఛాగామివి. స్వేచ్ఛను ప్రేమించే, స్వేచ్ఛ కోసం తపన పడే నీ స్వభావమే నీ ప్రత్యేకత –  దాన్ని దేశం కోసం, ప్రపంచం కోసం ఉపయోగించాలనే బాధ్యతే నీ ప్రత్యేకత’’.

‘‘ఇంక ఆపు. నీకు స్త్రీల గురించి తెలిసిందెంతా? స్వేచ్ఛ కోసం స్త్రీలు చేసే పోరాటాలు నువ్వు ఊహించలేవు. బహుశ ఎవరూ ఊహించలేరు –  ఆఖరికి చలంగారు కూడా’’

‘‘సరే నువ్వు ఏ ప్రత్యేకతా లేని మామూలు  స్త్రీవి –  ఐనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను – సరేనా’’ కోపంగా అన్నాడు మూర్తి.

శారద గలగలా నవ్వింది.

మాటలతో, నవ్వులతో కాలం ఆగదు. తెల్లవారింది. మూర్తి శారదను ఇంటివరకూ అనుసరించి వెళ్ళి వీడ్కోులు చెప్పాడు.

***

శారద వెళ్ళిపోయింది. మూర్తికి అన్ని విధాలుగా కాలం స్థంభించినట్లయింది. పార్టీ పనులు సాగుతున్నాయి. జాతీయోద్యమంలో ఒక రకమైన స్థబ్దత. ఎన్నిక గురించిన చర్చలు . హడావుడి. ప్రపంచ పరిస్థితులే ఉద్రిక్తంగా ఉన్నాయి. జర్మనీలో హిట్లర్‌ చర్యతో రెండవ ప్రపంచ యుద్ధం తప్పదని రాజనీతిజ్ఞులు  అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యంలో ప్రజల  జీవితాలు  తల్లకిందులవుతున్నాయి. శారద ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న ఇంగ్లండ్‌ గురించి మూర్తికి ఉత్తరాలు  రాస్తోంది. శారద ఉత్సాహం ఆమె ఉత్తరాల్లో కనబడుతూనే ఉంది. చదువు, పార్టీ పనులు , చిన్న ఉద్యోగాలు , ఇంగ్లండ్‌ కార్మికులతో వారి జీవితాలతో పరిచయం చేసుకోవటం, యూనియన్‌ నాయకులను కలవటం ` ఒక్కక్షణం తీరిక లేకుండా బతుకుతోంది శారద.

***

కంచికి వెళ్ళని కథలు…ఎప్పుడొస్తాయి?!

 

 చంద్ర కన్నెగంటి

 

chandraప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి –  వస్తువులో కొత్తదనం అరుదనీ, దాదాపు అన్ని కథనరీతులూ కొన్ని మూసలకే పరిమితమనీ. ఇందుకు ఎక్కువ శాతం రచయితలూ, సంపాదకులూ, విమర్శకులూ, పాఠకులూ అలవాటు పడిపోయారు కూడా. పడటమే కాక అదే ధోరణి అవిచ్ఛిన్నంగా సాగడానికి దోహదపడుతున్నారు. అందుకు కారణాలు వెతకడమూ, వాటి వెనక ఆలోచనలు సరయినవేనా అని పరిశీలించడమూ ఇక్కడ నా ముఖ్యోద్దేశాలు.

ప్రాచీనకాలంనుంచీ ధర్మాన్నీ, నీతినీ బోధించే కథల వారసత్వం మనది. మరోవైపు బలమైన మౌఖిక సంప్రదాయం కూడా ఉంది. అందువల్ల ఆ కథలు బిగ్గరగా, స్పష్టంగా ఉంటాయి. సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలూ తలెత్తనీయవు. సందేహాలకు తావునీయకుండా ఆ కథలోని ధర్మాన్నీ, నీతినీ చివరికి నొక్కి చెప్పేవి. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. కథ చదవగానే పాఠకుడు ‘అయితే ఏమిటి?’, ‘ఇందలి నీతి యేమి?’ అనే వెతుక్కుంటాడు. ‘రాకుమారిని పెళ్ళి చేసుకుని రాజ్యాన్ని అనేక యేళ్ళు సుభిక్షంగా పరిపాలించాడు ‘ వంటి కచ్చితమైన ముగింపులు లేని అస్పష్టతలు అంగీకరించలేడు.

రచయితలూ అదే ఒరవడిలో సాగుతున్నారు. రచయిత కర్తవ్యం సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించడమేనని ముందే నిర్ణయించబడింది. అభినందించవలసిన భావనే. అయితే ఆ భారాన్ని ఆనందంగా తలకూ, భుజాలకూ ఎత్తుకోవడంతోటే తన చుట్టుపక్కలవారి కన్నా తాను నైతికంగా, ధార్మికంగా, బౌద్ధికంగా ఒక మెట్టు పైన ఉన్న భావన కూడా రచయితలో బలపడుతుంది. తాను పూనుకోకపోతే లోకం సరయిన బాటలో నడవదన్న నిశ్చయానికి వచ్చేస్తాడు. పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి –  కనిపిస్తారు. దానికోసమై రచయిత పలు అవతారాలు ఎత్తవలసివస్తుంది. ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు. ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. ఎంత నిజాయితీగా, నమ్మకంతో చేసినా తనకు అలివికాని పని నెత్తిన వేసుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం.

సమాజాన్ని పీడించే సమస్యలు అనేకం. కథ అనే సుత్తి చేతిలోకి తీసుకున్నాక ఆ మేకుల కోసమే వెదుకులాట.  కొత్తవేమీ దొరకవు. వాటిని వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టడంతో ఆగిపోకుండా పరిష్కారాలూ సూచించాలంటే అందుకు క్షేత్రస్థాయిలో కృషి చేసే వాళ్ళూ, ఆయా శాస్త్రాల్లో నిపుణులూ అయి ఉండాలన్న గమనింపు ఉండదు. ఇవన్నీ తన ఆక్రోశాన్ని వెళ్లబోసుకుని తృప్తి పడడానికి తప్ప ఉపయోగపడవు. ఒక రకంగా తన అపరాధభావన కడిగేసుకుని, మనిషిగా తన బాధ్యత తీరిపోయిందనుకుని మరేదీ చేయవలసిన అవసరం లేదని నచ్చచెప్పుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు తోటి ప్రయాణికులు ‘ఎంత దారుణమమ్మా!’ అంటే ‘లోకం పాడయిపోయందమ్మా!’ అని వాపోవడం కంటే ఇందులో పెద్ద తేడా ఏదీ ఉండదు.

పోనీ, ఆ కథలు విలువయిన, నేర్చుకోవలసిన జీవిత పాఠాలే చెపుతున్నాయనుకుందాం. కాల్పనిక సాహిత్యం చదవడం వల్ల మనుషుల్లో సానుభూతీ, ఎదుటివారి స్థితిగతులను అర్థం చేసుకునే స్థాయీ పెరుగుతాయనే పరిశోధనలు తేలుస్తున్నాయి. అయితే అది తాత్కాలికం కాదనీ, ఆ ఆలోచన క్రియారూపం దాలుస్తుందనీ చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు ముందే ఎక్కువ మోతాదులో స్పందించేవారే పుస్తకాలు చదివి ఆనందిస్తారనే విషయాన్నీ కొట్టిపారేయలేం. కథలూ, పుస్తకాలూ మనల్ని ఉన్నతులుగా చేస్తాయనీ, ఉదాత్తంగా మారుస్తాయనీ గుడ్డిగా నమ్మడమే కానీ స్పష్టమైన ఆధారాలు చూపలేం.

అటు ధర్మ సంస్థాపనో, ఇటు సమసమాజమో తన రాతల ద్వారా సిద్ధిస్తుందనుకోవడం ఒక భ్రమ. ఎంతగా నమ్మినప్పటికీ, అదెంత సరి అయిన ఆలోచన అయినా, ఎంతగా అభిలషించినా అది నిజం కాదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి – ‘ఈ కథలూ పుస్తకాలూ చదవకపోతే మరోలా ప్రవర్తించి ఉండేవాడిని ‘, ‘నా నిర్ణయం వేరేలా ఉండేది ‘ అనుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ‘నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు ‘ అని ఎప్పుడయినా అనుకున్నారా? వ్యక్తిగతంగా ఎంత ఎదిగారు అన్నది కాక సమాజం దృష్టిలో మెరుగయిన వ్యక్తిగా మారారనిపించిందా? సమాజ సేవ చేస్తున్న వాళ్లంతా పుస్తకాలు చదివి చేయడం లేదు. హిట్లర్ తెగ చదివేవాడనీ, అతని గ్రంథాలయంలో పదహారు వేల పై చిలుకు పుస్తకాలుండేయనీ తెలుస్తూంది. పాఠకుల సంగతి అటుంచి తమ రాతలు రచయితలనయినా మారుస్తున్నాయనిపించదు. అందుకు ఇంటర్నెట్ సాహితీవేదికలపై చర్చల ధోరణినే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. (కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు.)

పోనీ, ఆ కథలు నిజంగానే పాఠకుల్లో మార్పు సాధిస్తాయనే అనుకుందాం. తొమ్మిది కోట్ల తెలుగువారిలో ఇవి చదివే వారి సంఖ్య కొన్ని వేలకు మించదు. ఆ చదివేవారిలో అది చదివేప్పటికే ఆ కథ ఉద్దేశించిన చైతన్యం కలగి ఉండని వారెంతమంది? ఒక్క మనసునో, ఒక్క జీవితాన్నో మార్చినా చాలదా అనుకోవచ్చు కానీ, అప్పుడీ రచనావ్యాసంగమంతా చాలా అసమర్థమైనదనీ, ఇంతకంటే ఫలప్రదమయిన దారులు ఉన్నాయనీ గ్రహించవలసి ఉంటుంది.

ఈ మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగున పడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే  మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.

పాఠకులంతా ఒకే స్థాయిలో ఉండరు. వారి పఠనావసరాలు ఒకేలా ఉండవు. ఎవరూ ఒకేలాంటి సాహిత్యం పదేపదే చదవరు. వైవిధ్యం కావాలి. రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.

(హ్యూస్టన్ లో గత ఏడాది అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ జరిపిన అమెరికా కథ స్వర్ణోత్సవాలు & 9 అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చదివిన ప్రసంగ సారానికి కొన్ని చేర్పులతో)

*