Archives for September 2015

దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?

 

గతాన్ని చదువుకుని, దానితో వర్తమానాన్ని పోల్చుకుంటూ గతానికీ వర్తమానానికీ మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి సిద్ధాంతరీత్యా తెలిసిఉండడం ఒక ఎత్తు. ఆ సంబంధాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న ఘటనలనూ దృశ్యాలనూ పరిణామాలనూ ప్రతిక్షణమూ అనుభవిస్తూ గతవర్తమానాల అవిభాజ్యతను గుర్తించడం మరొక ఎత్తు. వర్తమానం ఒక సూచన చేస్తుంటే, గతంలో అటువంటి సూచనే ఉండిందని గుర్తింపు కూడ రాకపోవడం మరొక ఎత్తు. తెలుగు సమాజం నిరంతర గతంలో జీవిస్తున్నదనీ, మార్పు అనుకుంటున్నదేదీ రూపంలో మార్పే తప్ప సారంలో మార్పు కాదనీ చూపడానికి ఎన్నో ఆధారాలుండగా, పాత అవ్యవస్థే రంగు మార్చుకుని కొనసాగుతుండగా, కనీసం ఆ అవ్యవస్థ మీద గతం ప్రకటించిన ఆగ్రహాన్ని ఇవాళ గుర్తు చేసుకోవడానికి కూడ శక్తి లేకుండా ఉన్నదనీ చూడడం ఆసక్తికరం కన్న ఎక్కువగా విచారకరం.

సమాజం నిలువనీటి గుంట అయిందనీ, దీన్ని ధిక్కరించాలనీ, ఛీత్కరించాలనీ తెలుగునాట కోపోద్రిక్త యువతరపు అసంతృప్తికీ, ఆగ్రహానికీ ప్రతిఫలనంగా దిగంబరకవులు (నగ్నముని – మానేపల్లి హృషీ కేశవరావు, నిఖిలేశ్వర్ – కె యాదవరెడ్డి, జ్వాలాముఖి – ఆకారం వీరవెల్లి రాఘవాచార్యులు, చెరబండరాజు – బద్దం భాస్కర రెడ్డి, భైరవయ్య – మన్మోహన్ సహాయ్, మహాస్వప్న – కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు) పొలికేక వేసి ఈ మే 6 కు సరిగ్గా యాబై సంవత్సరాలు నిండాయి. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (1944-1982), జ్వాలాముఖి (1938-2008) మరణించారు. నగ్నముని (1939), నిఖిలేశ్వర్ (?), భైరవయ్య (1942), మహాస్వప్న (1940?) ఇంకా మనమధ్యనే ఉన్నారు. తెలుగు సమాజ సాహిత్యాల్లో దిగంబర కవుల ప్రాధాన్యత గురించి ఆలోచనాపరుల్లో తగినంత స్పృహ ఉంది. అయినా అర్ధ శతాబ్ది నిండిన సందర్భంగా ఉత్సవమో, జ్ఞాపకమో, గుర్తింపో ఎక్కడా జరిగినట్టు లేదు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ రచనలు కూడ పెద్దగా వచ్చినట్టు లేదు.

దిగంబర కవుల ఆవిర్భావం జరిగి యాబై ఏళ్లయిందని మనం ఇవాళ గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, మొత్తంగా దిగంబర కవులు తెలుగు సమాజం మీదా, సాహిత్యం మీద వేసిన ప్రభావం అపారమైనది. దాన్ని చారిత్రక సందర్భంగానైనా మననం చేసుకోకతప్పదు. వాళ్లు వేసిన ప్రశ్నలూ, వాళ్ల విశ్లేషణలూ కొన్ని ఇవాళ్టికీ సంబద్ధతను కోల్పోలేదు సరిగదా బహుశా మరింత ఎక్కువ సంబద్ధంగా ఉన్నాయెమోననిపిస్తున్నది.

‘ఇతి శాసనమ్’ అనే శీర్షికతో “దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ రుతువు (సరిగ్గా క్రీ.శ. 1965 మే) న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్ లో ప్రప్రథమంగా తాము దిగంబరకవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్తరక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో పట్టుకోడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ” అనే ప్రకటనతో దిగంబర కవులు తమ మొదటి సంపుటాన్ని వెలువరించారు. ఆ సంపుటాన్ని మే 6 అర్ధరాత్రి (దిగంబర కవులు జీరో అవర్ అన్నారు) హైదరాబాద్ ఆబిడ్స్ చౌరస్తాలో నాంపల్లి పాండు అనే రిక్షావాలా ఆవిష్కరించారు.

మంటలు మాట్లాడినట్టు రాసిన ‘దిగంబరశకంలోకి’ అనే ముందుమాట అర్ధశతాబ్ది తర్వాత చదువుతుంటే ఒకటి రెండు చోట్ల మినహా ఇవాళ్టి గురించి రాసినట్టే ఉంటుంది.

“కీర్తి, డబ్బు, యినప బూట్ల క్రిందపడి నలిగి కొనవూపిరితో గిలగిలా కొట్టుకుంటున్న మీ అసలు స్వరూపాన్ని ఎన్నడైనా, ఒక్కనాడైనా చూసుకున్నారా?

మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు – నటన జీవితం. అధికార జీవితం. డబ్బు జీవితం, గౌరవ జీవితం. వాటికోసం పడిచచ్చి వాటికోసం ఏదయినా సరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కుమాలిన జీవితం.

ఏం, ఈ ముసుగు లేకపొతేనేం? స్వేచ్ఛగా అసలు స్వరూపంతో బతకడానికి యత్నిస్తేనేం?” అని యాబై ఏళ్ల కింద వాళ్లు చేసిన నిర్ధారణలు, వేసిన ప్రశ్నలు ఇవాళ్టికీ ప్రతిధ్వనిస్తున్నాయి.

మొదటి సంపుటం తర్వాత ఏడాదిన్నరకు దిగంబర కవుల రెండో సంపుటం వెలువడింది. మొదటి సంపుటం లోనే తాము రాసే ప్రక్రియను వచన కవిత అనే పేరుతో పిలవడం తమకు ఇష్టం లేదని, దానికి దిక్ అనే కొత్త పేరు పెడుతున్నామనీ ప్రకటించిన దిగంబర కవులు రెండో సంపుటానికి ‘దిక్ లు 30’ అనే శీర్షిక పెట్టారు. “దిగంబర శకం నిఖిలేశ్వర నామ సంవత్సరం మదిర రుతువు (సరిగ్గా క్రీ.శ. 1966 డిసెంబర్) లో ఇంకా భయం భయంగా బానిసత్వంగా దుర్భరంగా హేయంగా ఛండాలంగా ఉన్న ఆంధ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితా ప్రచురణ సమర్పిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటాన్ని విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో డిసెంబర్ 18 జీరో అవర్ లో జంగాల చిట్టి అనే హోటల్ క్లీనర్ ఆవిష్కరించారు.

ఆ తర్వాత ఇరవై నెలలకు, “నేటి ‘కుష్ఠు వ్యవస్థ’ పై దిగంబర కవులు సంపుటి 3” వెలువడింది. “ప్రజల అవిద్యని అజ్ఞానాన్ని అశక్తతని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాల వాళ్లు నేడు ప్రజలపై రుద్దుతున్న ‘కుష్ఠు వ్యవస్థ’ ని ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన దిక్ లను జ్వాలా నామ సంవత్సరం అశ్రు రుతువు (సరిగ్గా క్రీ.శ. 1968 సెప్టెంబర్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటిని “ఈ ‘కుష్ఠు వ్యవస్థ’ ఫలితంగా బిచ్చగత్తెగా మారి దుర్భరంగా బతుకుతున్న ఎడమనూరి యశోద (వయస్సు 20 సం.) విశాఖపట్నం, లక్ష్మీ టాకీస్ సెంటర్ లో 14.9.68 రాత్రి 12 గంటలకి” ఆవిష్కరించింది అని దిగంబర కవుల మూడో సంపుటిలో అతికించిన చిన్న వివరణ చెపుతుండగా, సాహిత్య చరిత్రకారులు కొందరు ఆమెను “వేశ్య” అని ప్రస్తావించారు.

digambara kavulu-3a

దిగంబర కవులు తమ కవిత్వం ద్వారా మాత్రమే కాక, పేర్లు, ప్రకటనలు, ఆవిష్కరణలు, ఆవిష్కరణ సమయాల ద్వారా కూడ సంచలనం సృష్టించారు. సమాజంలో, సాహిత్యలోకంలో దిగ్భ్రాంతిని కలిగించారు. సమకాలీన యువతరంలోని అశాంతినీ, అసంతృప్తినీ తమ కోపోద్రిక్త, ధర్మాగ్రహ అభివ్యక్తిలో ప్రతిఫలించి, యువతరం నుంచి అశేష ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. వలస పాలన ముగిసి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ నాయకత్వం ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఒక తరం జీవితకాలం గడుస్తున్నప్పటికీ వలసవ్యతిరేక ప్రజా ఉద్యమ ఆకాంక్షలలో ఏ ఒక్కటీ ఫలించకపోవడం ఒకవైపు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951), ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల పరాజయం (1955), సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో కాంగ్రెస్ లో నికిటా కృశ్చెవ్ శాంతియుత పరివర్తనా సిద్ధాంతంతో వర్గపోరాటానికి ప్రకటించిన సెలవు (1956), ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన ఇరవై ఏడు నెలల ముచ్చట అయి రద్దయిపోవడం (1957-59) వంటి పరిణామాలు మరొకవైపు సమాజాన్ని నిర్లిప్తతలోకీ, స్తబ్దతలోకీ నెట్టాయి. అలా నిరాశలో నిరుత్సాహంలో కూరుకుపోతున్న యువతరంలో, ప్రగతిశీల శక్తులలో, పోరాట స్ఫూర్తిని కొనసాగించాలనుకున్న శక్తులలో దిగంబరకవుల పెనుకేకలు ఆనందాన్ని నింపాయి. అటువంటి శక్తులన్నీ నిరభ్యంతరంగానో, కొన్ని అభ్యంతరాలతోనో దిగంబరకవులను ఆహ్వానించాయి. మరొకవైపు దిగంబరకవుల కవిత్వం, ప్రకటనలు వ్యవస్థా సమర్థకులకూ సాహిత్య పీఠాధిపతులకూ మర్యాదస్తులైన సాహిత్యకారులకూ సమానంగా ఆగ్రహం కూడ కలిగించాయి.

దిగంబరకవులు తన ప్రశంస, సిఫారసు, విమర్శ, నింద అవసరమైన స్థితిలో లేరనీ, వాళ్ల కవిత్వాన్ని తాను ఇంగ్లిషులోకి అనువదించి ధైర్యం ఉన్న ప్రచురణకర్త ఉంటే ప్రచురించదలచానని శ్రీశ్రీ రాశారు. పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యాక దిగంబర కవులను విమర్శించేవారికి శ్రీశ్రీయే చాల చోట్ల జవాబు చెప్పారు. “అభ్యుదయ కవిత్వం ఆంధ్రదేశంలో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి. కొత్త మంటలు రగులుతున్నాయి. అభ్యుదయ కవిత్వం ఇప్పుడు వెస్టెడ్ ఇంటరెస్ట్ కాకూడదు. ఇవాళ రాస్తున్నవాళ్లు దిగంబరకవులు, తిరుగబడు కవులు, సంఘర్షణ కవులు. చేతనైతే వాళ్లకి చేయూతనివ్వండి, లేకపోతే నోరు ముయ్యండి” అని శ్రీశ్రీ రాశారు. “దిగంబర కవులు ఈ ద్వేషాన్ని ప్రజలలో పుట్టించడం అవసరం” అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. “నెగెటివ్ గానే సంఘాన్ని విమర్శిస్తూ ఉండిన దిగంబర కవులు పాఠకలోకానికి విద్యుచ్ఛికిత్స చేయడంలో కృతార్థులయ్యారు. గండ్రగొడ్డళ్లలా అవినీతిమీద విరుచుకుపడ్డారు. వాళ్ల కోపం ఉన్మాదానికి గల తీవ్రతను సంతరించుకొంది” అని కె వి రమణారెడ్డి అన్నారు. “కూచిమంచి జగ్గకవి తిట్టు కవిత్వం చదివినప్పుడు కవికి కోపం వచ్చిందని పాఠకుడికి తెలుస్తుంది. దిగంబర కవిత్వం చదివినప్పుడు పాఠకుడికి కోపం వస్తుంది” అని వెల్చేరు నారాయణ రావు అన్నారు. “సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్దత, సమకాలీన జీవితంలో కొట్టవచ్చినట్టు కనిపించే అక్రమాలు, అన్యాయాలు, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిలో నుండి పుట్టిన విపరీత ధోరణిగల ఉద్యమం దిగంబర కవితోద్యమం” అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

మరొకవైపు, “దిగంబర కవితోద్యమం తాటాకు మంట. ఎలా వచ్చిందో అలా పోతుంది” అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. దిగంబర కవులను చాల తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమసుందర్ వారి మొదటి సంపుటం ఆవిష్కరణ రోజే పిఠాపురం నుంచి ఉత్తరం రాస్తూ “…ఆవిష్కరణోత్సవం కవితా బహిష్కరణోత్సవంగా శ్రాద్ధయోగంగా జరుగుతుందని ఆశిస్తాను. ఈ ఆరుగురు కవులూ ఈ రాత్రి జీరో అవర్సు నుంచి ప్రారంభించి దిగంబరులుగానే సమాజంలో మసులుతారని కూడా నేనూహిస్తున్నాను… మీకు నా బట్ట విప్పిన అభినందనలు” అని రాశారు.  “మంత్రిని పిలవడం స్నాబరీ లేక స్లేవరీ. రిక్షావాణ్ని పిలవడం ఒక పోజు లేకపోతే ఓ రకమైన ఆత్మవంచన” అని తిలక్ అన్నారు. “దిగంబరకవులకు ఏ కోశానా భావుకత్వం లేదు. కవిత్వం రాయడం బొత్తిగా చేతకాదు. వచనం రాయడం, గేయం రాయడం చేతకాని వాళ్లందరూ వచనగేయం రాసినట్టే వీళ్లు వచనగేయం రాసినారు. కాని లిటరరీ లంపెన్ ప్రొలిటేరియట్ గనక వాళ్లు వచనగేయం అనకుండా ‘దిక్ లు’ అన్నారు. ఈ లిటరరీ అండర్ వరల్డ్ సాహిత్య రౌడీలు కనిపించినవాళ్లనందరినీ బూతులు తిట్టినారు. సమాజంలో పీడకులను వంచకులను మాత్రమే కాదు వాళ్లు తిట్టింది. సకల రాజకీయ పార్టీలను తిట్టి పీడిత జన కార్మిక జన పక్షపాతం వహించే పార్టీలను కూడా తిట్టినారు. గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నీచమైన కుసంస్కారపు రచన మనకెప్పుడూ రాలేదు” అని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు. “సమాజం ఎంత చెడిపోయినా దిగంబరకవులది కవిత్వం అనుకునేంత చెడిపోయిందా” అని కూడ రారా ప్రశ్నించారు.

అటు పూర్తిగా ప్రశంసో, ఇటు పూర్తిగా తృణీకారమో కాక మధ్యే మార్గంగా గుణాన్నీ దోషాన్నీ చూసినవాళ్లు కూడ ఉన్నారు.

digambara kavulu-3

ఈ చర్చోపచర్చలన్నీ ఎలా ఉన్నప్పటికీ దిగంబర కవులు తెలుగు సమాజానికీ, సాహిత్యనికీ ఇవ్వదలచిన షాక్ ట్రీట్ మెంట్ పని చేసింది. లేదా, తెలుగు సమాజ సాహిత్యాలు అప్పటికి ఒక షాక్ ట్రీట్ మెంట్ అవసరమైన దుర్భర అనారోగ్యంతో ఉండి దిగంబరకవుల ఆవిర్భావానికి కారణమయ్యాయి.

దిగంబర కవుల సంచలనాన్నీ, కవిత్వాన్నీ అర్ధశతాబ్ది తర్వాత నిర్మమంగా పరిశీలిస్తే వాటిలో వస్తుగతంగానూ, వాటి ఫలితాల రీత్యానూ గణనీయమైన సానుకూలాంశాలు కనబడతాయి. సాహిత్య సంప్రదాయం నుంచి చూసినప్పుడు భాషా ప్రయోగం, తీవ్రత వంటి అంశాలు, స్త్రీలను అవమానించే సాంప్రదాయిక పురుషాహంకార పదప్రయోగాలు ప్రతికూలాంశాలుగా కనబడినా అవి సాధించదలచిన, సాధించిన ప్రయోజనం దృష్ట్యా, ఆ కాలపు అవగాహన పరిమితుల దృష్ట్యా అభ్యంతరకరమైనవి కావనీ, అర్థం చేసుకోవలసినవనీ అనిపిస్తుంది.

కొనసాగుతున్న అన్ని విలువలనూ ప్రశ్నించడం అనేది దిగంబర కవుల ప్రధానాంశం. నిజంగా వలస పాలన అనంతరం ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశంలోనూ మార్పు లేకపోవడం, వలస పాలనా కాలపు దుస్థితి మరింత పెరుగుతూ ఉండడం అన్ని విలువల్నీ ప్రశ్నించే ఆగ్రహావేశాల్ని ప్రేరేపించకపోతే ఆశ్చర్యపోవాలి గాని ప్రేరేపించినందుకు కాదు. ఆ ఆగ్రహం నుంచే దిగంబర కవులు ఆచ్ఛాదనలన్నిటినీ తొలగించాలనుకున్నారు. తమ పేర్లు మార్చుకున్నారు. ఆశ్చర్యం కలిగించే, కొట్టవచ్చినట్టు కనిపించే పేర్లు పెట్టుకున్నారు. కాలమానాన్ని, కాలానికి అప్పటిదాకా సమాజం ఇచ్చిన పేర్లను మార్చదలచారు. తమ పేర్ల మీదనే సంవత్సరాలను, ఆశ, తపన, అశ్రు, మదిర, విరహ, విషాద రుతువులను, స్నేహ, విశృంఖల, క్రాంతి, సృజన, వికాస, అనంత వారాలను సృష్టించారు. ఏ వస్తువు చెపుతున్నారనేదానితో సంబంధం లేకుండా వచన కవిత ఒక ఉద్యమంగా మారి, వచన కవితను ప్రచారం చేయడానికి ఒక సంస్థ ఏర్పడిన వాతావరణంలో తమ రచనాప్రక్రియను వచనకవిత అనే పేరుతో పిలవడానికి నిరాకరించారు. దిక్ అనే కొత్త పేరు పెట్టారు. అప్పటిదాకా సాగుతున్న పూలదండల, శాలువాల, సన్మానాల, పరస్పర ప్రశంసల, వందిమాగధ భజనల పుస్తకావిష్కరణల సంప్రదాయాన్ని తిరస్కరించదలచారు. ఆవిష్కరించిన మూడు సంపుటాలనూ మూడు ప్రధాన పట్టణాలలో జీరో అవర్ లో, రిక్షావాలాతో, హోటల్ క్లీనర్ తో, బిచ్చగత్తె (వేశ్య) తో ఆవిష్కరింపజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవస్థ మీద తమ తిరస్కారాన్ని, కసిని, ధిక్కారాన్ని అనేక రూపాలలో, అనేక వ్యక్తీకరణలలో ప్రకటించదలచారు. బుద్ధిజీవులను తనలోకి లాగేసుకుంటున్న, కొనేస్తున్న, మౌనంలోకి నెడుతున్న వ్యవస్థను చీల్చి చెండాడదలచారు. కొనసాగుతున్న విలువలను, యథాస్థితిని ధిక్కరించదలచారు. ఆ పనులను మూడు సంపుటాల కవిత్వంతోనూ, రాష్టవ్యాప్తంగా కవితా పఠనం తోనూ, ఉపన్యాసం తోనూ విజయవంతంగా నిర్వహించారు.

నిజానికి దిగంబరకవుల ఆవిర్భావానికి దారి తీసిన సామాజిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాన్నీ, వాళ్ల కృషినీ, దాని పర్యవసానాలనూ తెలుగు సమాజం ఇంకా పూర్తిగా విశ్లేషించలేదనీ, విశ్లేషించినంత మేరకైనా సంలీనం చేసుకోలేదనీ అనిపిస్తుంది. ఒకరకంగా యథాస్థితిమీద తీవ్ర విమర్శతో, కోపావేశాలతో సర్వ విధ్వంసకవాదులుగా, నిహిలిస్టులుగా మొదలైన దిగంబరకవులు రెండో సంపుటం నాటికి విధ్వంసం ఒక్కటే సరిపోదనీ, ప్రత్యామ్నాయ నిర్మాణ ఆలోచనలు కావాలనీ అవగాహనకు వచ్చారు. మూడో సంపుటం నాటికి ఆ అవగాహన ఇంకా స్పష్టతను సంతరించుకుంది. మూడు సంపుటాలనూ కలిపి మార్చ్ 1971లో ఎమెస్కో ప్రచురించిన సమగ్ర సంకలనంలోని కవితలను వరుసగా చదివితే వాళ్ల అవగాహనలలో క్రమానుగత పరిణామం, కొందరి కవితలలో గుణాత్మక పరిణామం కూడ కనబడుతుంది. బహుశా ఏ చరిత్ర వాళ్ల ఆవిర్భావానికీ, కవిత్వానికీ, సంచలనానికీ కారణమయిందో, ఆ చరిత్ర గమనమే వాళ్ల గురించి చర్చను కూడ పక్కన పెట్టే స్థితి కల్పించినట్టుంది.

దిగంబర కవులు విశాఖపట్నంలో 1968 సెప్టెంబర్ లో తమ మూడో సంపుటం ఆవిష్కరించారు. అప్పటికే శ్రీకాకుళ విప్లవోద్యమం నక్సల్బరీ పంథాలోకి మళ్లింది. విశాఖపట్నానికి ఆ వేడి తగులుతున్నది. ఆ సంపుటంలోని చెరబండరాజు ‘వందేమాతరం’ గాని, ‘యాభై కోట్ల మంటలు’ కవితలో “యాబై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి” అనే పాదాలు గాని ఆ పోరాట వాతావరణానికి స్పష్టాస్పష్ట ప్రతిఫలనాలే. ఆ విశాఖపట్నంలోనే మరొక ఏడాది తర్వాత, 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు జరిగింది. మామూలుగా సన్మానాలను వ్యతిరేకించేవాళ్లు గనుక దిగంబరకవులు దానికి వెళతామని అనలేదు. కాని అంతకుముందు కటక్ లో జరిగిన సభకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లు విశాఖపట్నంలో ఆగి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ‘రచయితలారా మీరెటువైపు’ అని ఎలుగెత్తిన సవాల్ కు ఆ ఇద్దరూ సానుకూలమైన జవాబు ఇచ్చారు. అప్పటికే భైరవయ్య, మహాస్వప్నలు మిగిలిన నలుగురితో విభేదిస్తున్నారు గనుక వాళ్లిద్దరూ విడిగా ఉండిపోయినా నలుగురు దిగంబరకవులూ 1970 జూలై 4 ఉదయాన ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో భాగమయ్యారు. నాలుగు సంవత్సరాల తర్వాత జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విరసం నుంచి బైటికి వచ్చి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య స్థాపించారు. నగ్నముని 1979లో విరసం నుంచి వైదొలిగారు. చెరబండరాజు 1982 జూలై 2న బ్రెయిన్ ట్యూమర్ తో మరణించేదాకా విరసంలో కొనసాగారు. భైరవయ్య, మహాస్వప్న కూడ దిగంబర కవిత్వ సంప్రదాయాన్ని కొనసాగించలేదు. వ్యవస్థ మీద అంత ధిక్కారాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించిన దిగంబర కవులలో కొందరు తాము విమర్శించిన, ఈసడించుకున్న సన్మానాల, రాజీల, శాలువాల, పరస్పర ప్రశంసల, మొహమాటాల సంస్కృతికి కూడ లొంగిపోయారు.

కాని వ్యక్తులుగా వాళ్లు ఏమైనప్పటికీ, వాళ్లు ప్రారంభించిన, వాళ్లు స్థిరపరచిన వ్యవస్థా ధిక్కార ధోరణులకు, న్యాయమైన ఆగ్రహానికి, కోపోద్రిక్త అభివ్యక్తికి ఎప్పటికీ కాలం చెల్లదు. ఆ గతం ఎప్పటికీ వర్తమానమే. ఆగతానికి కూడ మార్గదర్శకమే. మరీ ముఖ్యంగా దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ ఒకసారి మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, మళ్లీ ఒకసారి సాహిత్యలోకంలోకి సాహిత్యేతర కృతిభర్తలు ప్రవేశిస్తున్నప్పుడు దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం. మనమింకా వాళ్లను మరిచిపోయేంతగా మారలేదు.

  • ఎన్ వేణుగోపాల్

నామాలు

 

 

chaitanya(“సారంగ” ద్వారా తొలిసారిగా కథకురాలిగా పరిచయమైన పింగళి చైతన్య కథల సంపుటి “మనసులో వెన్నెల” వచ్చే  వారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కథని ప్రచురిస్తున్నాం. చైతన్య కథల సంపుటిలో  ఎనిమిది కథలున్నాయి, 96 పేజీలు. ప్రతులు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవయుగ , వెల: యాభై రూపాయలు. చైతన్య ఈ-చిరునామా: chaithanyapingali@gmail.com)

 

~

శైలుకి కంగారుగా ఉంది. బట్టలకి, దుప్పట్లకి మరకలు అయిపోతాయేమో  అని.

మరకలు అయితే, మామగారు లేవకముందే.. తెల్లారే లేచి, వాటిని ఉతుక్కొని, ఆఫీసుకి వెళ్ళాలి. లేటవటం దేవుడెరుగు.. ముందు ఆ దుప్పట్లు ఉతుక్కునే ఓపిక శైలుకి లేదు.

అసలు రేపు ఉతుక్కోవటం  వేరే విషయం.. ఇప్పుడు ప్యాడ్ మార్చుకోపోతే .. చచ్చిపొయేలా ఉంది. బయట ఉండే బాత్రూంకి వెళ్ళాలంటే.. ఇబ్బంది. అది పక్కనుండే బ్యాచిలర్స్  వాడతారు. అందుకే.. వాడేసిన ప్యాడ్ ని  ఆ బాత్రూంలో వదిలేస్తే  బాగోదు. రోడ్డు  మీదకెళ్ళి, చెత్త కుప్పలో పారేయాల్సిందే! టైమేమో ఒంటిగంట దాటుతోంది. రాత్రి తొమ్మిది ఐతేనే, ఆ వీధిలో ఎవరూ కనిపించరు. అలాంటిది, ఈ టైంకి ప్యాడ్ పారేయటానికి.. వీధి చివరిదాక వెళ్ళటానికి భయం వేసింది శైలుకి.

‘సుధీ.. లేవా.. ప్లీజ్.. తోడు రావా..’ అని బతిమాలింది. సుధి అంటే.. ఆమె భర్త సుధీర్ గుప్త. అతను ఆ వేళ ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి పన్నెండు అయింది.

సుధీర్ కళ్ళు తెరవట్లేదు. ‘నా వల్ల కాదే… ప్లీజ్.. వదిలేయ్’ అని పడుకున్నాడు. కొంచెం  బతిమాలిందా.. అరిచేస్తాడు అని భయంతో శైలు పక్క మీద నుండి జరిగి, ఉట్టి నేల మీద దిండు వేసుకుని పడుకుంది.

నేల చల్లదనానికి నిద్రపట్టట్లేదు శైలుకి. అమ్మా, నాన్న.. గుర్తొచ్చారు. ఏడుపు తన్నుకొచ్చింది. కాని.. ముక్కు ఎగబీల్చిన చప్పుడు వినిపించిందా.. సుధీర్ నిద్ర లేస్తాడు. ‘ఎప్పుడు ఏడుపేనా? ఏమయిందే ఇప్పుడు?’ అని విసుక్కుంటాడు. గదిలో పడుకున్న శైలు అత్తగారు, మామగార్లకి ఆ అరుపులు వినిపించాయా బయటకి  వచ్చి, శైలునే తిడతారు. ‘వాడిని ప్రశాంతంగా పడుకోనీయవా?. అయినా.. నడింట్లొ ఏడుపు ఏంటమ్మా?.. దరిద్రం. ఉన్న దరిద్రం చాలదా?’ అని దెప్పిపొడుస్తారు.

ఎన్నిసార్లు జరిగింది ఇదే  సీను. అందుకే.. దుఃఖాన్ని  బలవంతంగా ఆపుకుంది శైలు. కాని ప్యాడ్ చిరాకు పెడుతోంది. చర్మం మంట పుడుతోంది. ఇక తప్పదని.. లేచి, ఆ పోర్షన్ బయట ఉండే బాత్రూంకి వెళ్ళింది. పాత ప్యాడ్ ని పేపెర్లో చుట్టి.. నెమ్మదిగా గేటు తీసి.. ఓసారి రోడ్డుని ఆ చివరి నుండి ఈ చివరి దాకా చూసింది. ఎవరు లేరు. ‘ఏమన్నా అయితే నాన్నకి ఫొను చేయాలీ’ అనుకుని సెల్లో నాన్న నంబరు ఓపెన్ చేసి, డైల్ బటన్ మీద వేలు రెడీగా పెట్టుకుని.. నెమ్మదిగా నడుచుకుంటూ.. వీధి చివర చెత్తకుప్ప దాకా వెళ్ళి , అది పారేసి.. గబగబా వెనక్కి పరిగెత్తుకు  వచ్చేసింది. ఇంటి మెయిన్ గేట్ వేసి, చెప్పులు విడిచినా.. శైలుకి దడ తగ్గలేదు. గేట్ వేస్తున్నప్పుడు తన చేతి మీద ఉన్న నామాలు కనిపించాయి శైలుకిరెండు భుజాల మీదా ఉన్న నామాల్ని రెండు చేతులతో తడుముకోగానే.. ఏడుపు  ఆగలేదు శైలుకి.

ప్రహరీకి వారగా ఉండే బాత్రూంలోకి వెళ్ళి, ట్యాప్ ఫుల్ల్ గా తిప్పి.. నీళ్ళ శబ్దంలో ఏడుపు వినిపించదు అని రూఢి అవ్వగానే.. నోటికి చేయి అడ్డుగా పెట్టుకొని.. చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది.

fbఇంట్లోకి  వెళ్ళటం కంటే ఆ బాత్రూంలో ఉండటమే నయం అనిపిస్తోంది. వాళ్ళది సింగిల్ బెడ్రూం ఇల్లు. లోపల గదిలో అత్తయ్య, మామగార్లు పడుకుంటారు. కొత్తగా పెళ్ళి అయినాసరే.. శైలు, సుధీర్ హాల్లోనే పడుకునేవారు. ‘నోరు తెరిచి, సిగ్గు వదిలి, గదిలో మేము పడుకుంటాం అని ఏం అడుగుతాం’ అని సుధీర్ అంటాడు. ‘ఈ మంచం హాల్లో వేస్తె నడిచేదానికి చోటు ఉండదు. నేనేమో నేల మీద పడుకోలేను’ అని అత్తగారు అంటుంది. పగలు అయితే, ఆ బెడ్రూం లో ఉండే అట్టాచెడ్ బాత్రూంలొనే స్నానం చేస్తుంది శైలు. కాని మధ్య రాత్రే ఇబ్బంది. ఎప్పుడైనా బాత్రూంకి వెళ్ళాలంటే, వాళ్ళ  గదిలోకి వెళ్ళలేక, బయట ఉన్న బాత్రూం వాడుతుంది. కాని నెలసరి టైం లో మాత్రం చచ్చే చావు. ఆ అత్తగారు శైలుని ఇంట్లోకి రానివ్వదు. దానితో పక్కింటి బ్యాచిలర్స్ వాడే బాత్రూంలోనే స్నానం చెసేది శైలు. ఆ బాత్రూం పరమ అసహ్యంగా ఉండేది. పైగా, వాళ్ళున్నప్పుడు వెళ్ళాలంటే ఇబ్బంది. సుధీర్ నుండి చిన్న సాయం కూడా ఆశించలేను అని శైలుకి చాలా కాలం క్రితమే అర్ధమైయింది.

ఆమె నెల జీతం ఇరవై వేలు. ‘నా జీతం మీకే ఇస్తున్నా కదా.. డబుల్ బెడ్రూం ఇంట్లోకి మారదాం’ అంటే మామగారు ఒప్పుకోరు. ‘నీ మొగుడికి అప్పులు చేసి చదివించాం.. అవన్నీ తీరేదాక ఎటూ  కదిలేది లేదు. అయినా, నువ్వొచ్చావని ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు వదిలి వెళ్ళిపొతామా?’ అని సీరియస్ అవుతాడు.

దాదాపు మూడు నెలలుగా ఇవే గొడవలు. కాని.. ఈసారి  ఇబ్బంది మరీ ఎక్కువైపొయింది. అందుకే, ఏడుపు ఆపుకొలేక బాత్రూం లోకి వెళ్ళి, నల్లా తిప్పి, ఆ శబ్దాన్ని ఆసరాగా చేసుకొని ఏడుస్తోంది.

ఎవరో  బయట నుండి తలుపు తీయబోయినట్టు అర్ధమై, చేతులు సబ్బుతో కడుక్కుని, సెల్ తీసుకుని, బాత్రూం నుండి బయటకి వచ్చింది శైలు. పక్కింటి కుర్రాడు బయట నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే గబగబా ఇంట్లొకి వెళ్ళి, తలుపేసుకుంది.

సుధీర్ పక్కనే పడుకుంది. ప్యాడ్ మార్చుకున్నా రిలీఫ్ రాలేదు. రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన టెన్షన్ తగ్గలేదు. ఏది ఏమైనా, రేపు ఇల్లు మారకపొతే, నేను ఇక్కడ ఉండను అని చెప్పేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది.

పొద్దున్నే లేచాక, అత్తయ్య వేసిన గిన్నెలు కడిగి ఇస్తే, ఆమె వాటి మీద నీళ్ళు చల్లి, లోపలికి తీసుకెళ్ళింది. ఈ అయిదు రోజులు, శైలుకి ఇల్లు ఊడ్చే పని ఉండదు. లేకపొతే రోజు ఇల్లు ఊడ్చి, తడి బట్ట పెట్టి తుడిచి, అంట్లు తోమాలి. వంట పని, బట్టలు ఉతికే పని అత్తయ్య చేసుకుంటుంది. వంట అయిపొగానే బాక్స్ తీసుకుని వెళ్ళిపొతారు శైలు, సుధీర్. మామగారు ఏం పని చేయరు. అత్తగారు మాత్రం ఓ ఫ్యాన్సీ షాపు నడుపుతుంటుంది.

అత్తగారు షాపుకి బయలుదేరకముందే.. ఇంటి విషయం తేలిపొవలనిపించింది శైలుకి. ‘నా వల్ల కావట్లేదు సుధీ.. మనం డబుల్ బెడ్రూం ఇంటికి మారిపొదాం..’ అన్నది గట్టిగా అత్తమామలకి వినిపించేట్టుగా.

శైలు మాటలు విని అత్తయ్య పెద్ద గొంతు పెట్టుకుని, ‘చూడమ్మ.. సద్దుకుపోవాలి. ఎన్నేళ్ళుగా నేను సద్దుకుపొతున్నా.. పుట్టింట్లో సాగినట్టూ సాగవు..’ అన్నది వ్యంగ్యంగా.

‘నా వల్ల కాదత్తయ్యా.. ఈ ఇల్లు మారటం మీకిష్టం లేకపొతే, మీరు ఇక్కడే ఉండండి. మేమిద్దరం వేరేగా ఉంటాం..’ అని తెగేసి చెప్పేసింది శైలు.

అంతే. ఇక సుధీర్ తల్లి ఏడుపు అందుకుంది. ‘కులం కాని కులం.. కడజాతి పిల్లని తెచ్చి.. కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక.. తెచ్చుకుని నడింట్లొ పెట్టుకుంటే.. ఈరోజు నా కొడుకుని నాక్కాకుండా చేయటానికి ప్లాన్లు వేస్తోంది… ఊరికే అంటారా కనకపు సింహాసనమున అని..’ అంటూ శొకండాలు మొదలుపెట్టింది.

అమ్మ ఏడ్చేసరికి.. సుధీర్ కి కోపం బాగా పెరిగిపోయింది. ‘ఎన్నిసార్లు చెప్పాను.. వేరే ఇల్లు సంగతి మర్చిపొమ్మని.. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కావలనుకుంటే.. మీ నాన్నని ఒకటి కొనిపెట్టమను.. అప్పుడు మారదాం’ అన్నాడు.

Kadha-Saranga-2-300x268

శైలుకి చాలా చిరాకు వచ్చింది. పెళ్ళికి సుధీర్ అమ్మానాన్నలు ఒప్పుకోకపొతే.. ‘ఆ పిల్ల కూడా హిందు మతమే. కులందేముంది.. కూటికొస్తదా? గుడ్డకొస్తదా? ఆ పిల్ల అసలే ఎస్.సి., తెలివిగలది. రేపోమాపో గవర్నమెంటు ఉద్యోగం వస్తుందీ’ అని మధ్యవర్తులు సుధీర్ అమ్మానాన్నల్ని ఒప్పించటానికి ప్రయత్నించారు. కాని అవేం ఆమె చెవులకి ఎక్కలేదు. శైలు వాళ్ళ నాన్న పెళ్ళికి ముందే సుధీర్ చదువు తాలుకా అప్పు తీరుస్తానని, అయిదు లక్షల బంగారం ఇస్తానని, అయిదు లక్షల విలువ ఫర్నిచర్ కొంటానని, మరో అయిదు లక్షల క్యాష్ ఇస్తానని మాటిచ్చాడు. ఎలాగూ, తను చూసిన సంబంధం చేసినా, కట్నం అదీ, ఇదీ ఇవ్వలి కదా అని అయన ఆలొచన.

కాని సుధీర్ వాళ్ళ అమ్మకి అర్ధమైందల్లా ఒకటే. బాగనే సౌండ్ పార్టి అని, పైగా రోడ్ల డిపార్ ట్మెంట్ లో          ఉద్యోగం అని, బాగా సంపాదించి ఉంటాడు అని. ఏది దాచినా కూతురుకి, అల్లుడికి ఇవ్వడా అనిపించి.. పెళ్ళికి సరే అన్నది. కాని రెండు కండిషన్లు పెట్టింది. మొదటిది – తాము పూజించే స్వామి వారు ఆశీర్వదిస్తేనే పెళ్ళీ అని. రెండోది – పెళ్ళి మీరే చేయండి, మా చుట్టాలు మమ్మల్ని వెలేస్తారు. అదే పెళ్ళి మీరే చెసేసుకుని వస్తే, స్వామి వారి ఆశీర్వాదం కూడా ఉంది, తప్పు చేసాడని కొడుకుని వదిలేసుకుంటామా అని ఏదో ఒకటి సద్దిచెప్పుకుంటాము అన్నది ఆ మహాతల్లి.

కూతురు కోసం అన్నిటికి ఒప్పుకున్నాడు శైలు నాన్న. పెళ్ళీ, రిసెప్షను ఏడు లక్షలు పెట్టి ఘనంగా చేసి, పెళ్ళి టైంలో ఇస్తామని మాటిచ్చిన డబ్బుతో సహా కూతుర్ని అత్తగారింట్లో దింపాడు.

అన్ని తీసుకుని ఇప్పుడు.. మళ్ళి కొత్తగా డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కొనిమ్మంటే.. ఆయనెక్కడనుండి తీసుకురాగలడు? సిగ్గు ఎగ్గు లేకుండా అడుగుతున్న సుధీర్ ని చూస్తే అసహ్యం వేసింది శైలుకి.

‘మా నాన్న ఎందుకివ్వాలి? ఇచ్చినదేమన్నా తక్కువా? నా కోసం ఆయన అన్నిటికి అడ్జస్ట్ అయ్యి, ఈ పెళ్ళి చేశాడు. ఇంకా ఎంతని చేస్తాడు?’ అని ఏడుస్తూ అడిగింది సుధీర్ని.

సుధీర్ అస్సలు చలించలేదు. ‘కూతురు ఇలా హాల్లో పడుకుంటే.. అయనకేం బాధ లేకపోతే.. ఓకె.. నాకేంటి?’ అన్నాడు.

శైలుకి చీదరగా ఉంది. ‘కొడుకు హాల్లో పడుకుంటే.. మీ అమ్మానాన్నలకేమి బాధగా అనిపించటం లేదా? కోడలు పక్కింటి కుర్రాళ్ళ బాత్రూం వాడుతుంటే.. ఏం సిగ్గనిపించదా? పిరియడ్స్ వస్తే చచ్చిపొతున్నాను.. భర్తవి కదా.. నీకేం  బాధ్యత లేదా?’ అని గట్టి గట్టీగా ఏడుస్తూ అడిగింది.

ఆ ఏడుపులు పక్కింటి వాళ్ళకి , పైనింటి వాళ్ళకి వినిపించాయి. ఏదో గొడవ జరుగుతోందని అందరూ సుధీర్ వాళ్ళ గుమ్మం దగ్గరకి వచ్చి నిలబడ్డారు.

వాళ్ళని చూసేసరికి సుధీర్ కి కోపం వచ్చింది. ‘ఎవడికే బాధ్యత తెలీదు..’ అని శైలుని వంగదీసి, వీపు మీద పిడి గుద్దులు గుద్దాడు.

శైలు అత్తగారు.. ‘ఆగరా.. ఆగరా..’ అంటూ మధ్యలోకి వెళ్ళింది. కాని ఆమెని వెనక్కి నెట్టి, శైలు జుట్టు పట్టుకుని గోడకేసి తోశాడు.

బయట నిలబడిన వాళ్ళు అలాగే చూస్తున్నారు. శైలుని కొట్టడమూ మొదటిసారి కాదు. వాళ్ళు చూడటమూ మొదటిసారి కాదు.

కాని ఈసారి శైలుకి మొండితనం వచ్చేసింది. ఎంత కొడుతున్నా.. ఆ గొడకి ఆనుకుని అలాగే నిలబడింది. ‘వేరే ఇంట్లోకి మారదామా? వద్దా? మా నాన్న మాత్రం కొనివ్వడు. ఏదో ఒకటి తెల్చి చెప్పు..’ అని విసురుగా అడిగింది.

fb

సుధీర్ మళ్ళీ కొట్టాడు. శైలు మళ్ళీ అదే మాట అన్నది. అప్పుడు శైలు మామగారు మధ్యలో వచ్చి.. ‘వద్దురా అంటే దీన్నే చేసుకుంటాను అని పట్టు పట్టావు.. నువ్వు ఎంత చావబాదినా.. అదేం చలించదు.. మామూలు ఒళ్ళా అది? గొడ్డు మాంసం  తిని తిని, చర్మం మందం అయిపోయింది..’ అన్నాడు.

శైలుకి ఉక్రోషం తన్నుకొచ్చింది. శైలు ప్రేమ విషయం ఇంట్లో తెల్సినప్పుడు, ఆమె తండ్రి సుధీర్ తో మాట్లడటం మానేయమన్నాడు. భయపెట్టాడు. కొట్టాడు కూడా. అయినా, సుధీర్ ని మర్చిపోలేను అన్నది. దానితో ఆయన మాట్లడటం మానేశాడు. నాన్న మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపొతోంది.. అలా అని సుధీర్ని మర్చిపోలేకపోయింది. ఏం చేయాలో తెలీక, ఓ రోజు మణికట్టు దగ్గర చేతిని కొసేసుకుంది శైలు. అది చూసి భరించలేక, శైలు వాళ్ళ అమ్మ, నాన్న సుధీర్ ని ఓసారి ఇంటికి తీసుకురమ్మన్నారు.

సుధీర్ వచ్చాడు కూడా. ‘మనవి వేరే వేరే కులాలు బాబు.. రేపు ఏమన్నా గొడవలు అయితే..’ అని తన భయాన్ని సుధీర్ తో  చెప్పుకున్నాడు.

‘నాకు క్యాస్ట్ ఫీలింగేం ఉండదు అంకుల్. నేను అలా ఎప్పుడు ఆలోచించను. అమ్మావాళ్ళకి కొంచెం ఆచారాలు ఎక్కువ. వాళ్ళు ఒప్పుకోకపొవచ్చు. వాళ్ళు శైలుని కాదంటే.. నేను ఇంట్లో నుండి వచ్చేస్తాను. క్యాస్ట్ గురించి ఆలోచించకండి అంకుల్’ అని భరోసా ఇచ్చాడు.

‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొటం వేరు.. కులం పట్ల స్పృహ, అవగాహన ఉండటం వేరు. కులం ఎంత  క్యాన్సరో అర్ధం చేసుకున్న వాళ్ళు కులాంతర వివాహం చేసుకోటం వేరు.. నీకు..’ అని ఇంకా చెప్పబోతుంటే.. శైలు వాళ్ళ అమ్మ ఆయన మాటని కట్ చేస్తూ.. ‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొతే అంతకంటే ఏం కావాలి.. చూడు బాబు.. ఇంట్లో నుండి వచ్చెయమని.. మేము చెప్పటం లేదు. వాళ్ళని ఒప్పించటానికే ప్రయత్నించు.. ‘ అని చెప్పింది.

అప్పుడు జరిగిన మాటల్లోనే స్వామివారు ఆశీర్వదిస్తే మాకేం ఇబ్బంది లేదని సుధీర్ తల్లి చెప్పింది. పెళ్ళికి ముందు శైలుని ఆ స్వామివారి దగ్గరకి తీసుకెళ్ళింది. ఆయన రెండు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధుడు. స్వయానా ముఖ్యమంత్రులే ఆయన్ని హెలికాఫ్టర్లు ఎక్కించుకుని తిరుగుతారు. వాళ్ళేంటి.. ఈ దేశ ప్రధాని కూడా ఆయన కాళ్ళ మీద పడతాడు. తిరుపతి దేవస్థానాల్లో ఆయనది పెద్ద హోదా కూడా. అంతటి ప్రఖ్యాత స్వామివారికి శైలును చూపించినప్పుడు .. ఆయన దీవించాడు. ‘హరికి ఇష్టులైన వారంతా హరిజనులే.. ఈ అమ్మాయ్ కి నామాలు వేయండి..’ అని చెప్పాడు. శైలు చాలా సంతోషపడింది, ఆయన ఆశీర్వాదం పొందినందుకు.

శైలుకి నామాలంటే ఏంటో తెలీదు. సుధీర్ కూడా వేయించుకుంటాడేమో అనుకుంది. కాని.. సుధీర్ తల్లి.. ‘వాడికొద్దమ్మా.. మాంసం అదీ తింటాడు కదా.. నేనే వేయించుకున్నాను కాని.. సుధీర్ వాళ్ళ నాన్నగారు వేయించుకోలేదు. మగవాళ్ళు ఏం నిష్ఠగా ఉంటారు చెప్పు..’ అన్నది.

‘అంటే, నాన్వేజ్ తినకూడన్నమాట’ అనుకుంది శైలు. నామాలు వేయించుకోటానికి లైన్లో నిలబడింది.

శంఖు, చక్రాలు అచ్చులున్న రెండు ఇనప కడ్డీలని.. ఎర్రగా కాల్చి, ఒకేసారి రెండు భుజాల మీదా.. ముద్రలు వేస్తారు. అదే నామాలు వేయటం అంటే. పక్కవాళ్ళకి వేస్తుంటే చూస్తేనే.. శైలుకి భయం వేసింది. కాని.. పెళ్ళికి ఒప్పుకున్నారు.. అది చాలు అనిపించింది. శైలు వంతు రాగానే.. కళ్ళు మూసేసుకుని.. ‘సుధీర్’ అని గట్టిగా అరిచింది. వాళ్ళు ఠక్కున అచ్చులు వేసేశారు. శైలు అరుపుకి ఆమె అత్తగారే ఆశ్చర్యపోయింది. ‘ఎంత ప్రేమ అమ్మా..’ అని జాలిపడింది కూడా. ‘పెళ్ళికి సరే అన్నట్టేనా, పెళ్ళి జరిగితే నేను షిరిడి వస్తాను అని మొక్కుకున్నాను..’ అని వేడికి కమిలిపోయి, నీరులా పట్టిన చర్మాన్ని ఊదుకుంటూ అడిగింది శైలు. ‘వైష్ణవం తీసుకునావమ్మా ఇప్పుడు.. హరి, హరి అవతారాలు తప్ప వేరే వారిని పూజించకూడదు.. షిరిడికి వద్దు..’ అని చెప్పింది సుధీర్ తల్లి. శైలు ఏం మాట్లాడలేదు. అత్తగారు ఇచ్చిన స్పిరిట్ ని చేతుల మీద అద్దుకుంటూ.. ఏడ్చింది. చేతులు కాలినందుకో.. భవిష్యత్తు లీలగా అర్ధమయ్యో..

నామాలు వేయించుకున్న దగ్గర నుండి, నిజంగానే  నాన్వేజ్ తినటం మానేసింది. కనీసం గుడ్డు కూడా తినలేదు. కాని పుట్టుకతో శాఖాహారి అయిన సుధీర్ మాత్రం హోటెల్లోనో.. శైలు వాళ్ళంటికి వచ్చినప్పుడో.. హాయిగా మాంసం, చేపలు తినేవాడు. తిండి దగ్గర కూడా రాజిపడి.. బతుకుతుంటే.. ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా బతుకీడుస్తుంటే.. గొడ్డు మాంసం తిని తిని.. ఒళ్ళు మందం అయిపోయిందని మామగారు తిట్టారు.

ఆ రోజున క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పిన సుధీర్.. ఆ మాట అంటుంటే.. కనీసం ‘ఆగండి నాన్నా’ అని కూడా అనలేదు!

అసలే నెలసరి వచ్చి, విసుగ్గా, నీరసంగా ఉంది. పైగా దెబ్బల ధాటికి.. సూటిపోటి మాటలకి అలసిపొయింది శైలు. మళ్ళి కొట్టటానికి వస్తున్న సుధీర్ని వెనక్కి తోసి, బైక్ కీస్ తీసుకొని గుమ్మం దాటుతోంది.

‘ఎక్కడికే..?’ అంటూ సుధీర్ వెనకే వచ్చాడు.

‘ఇఫ్లూ లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది.. అక్కడికి..’ అని బండి స్టార్ట్ చేసి, వెళ్ళిపొయింది.

*

!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఒక్కోసారి శీర్షిక ఇలా కూడా పెట్టవచ్చా అని తెలుస్తుంది.
అవును మరి.
ఈ చిత్రం మహిమ అది.

ఛాయా చిత్రలేఖనంలో ఎన్ని విశేషాలో మరి.
అనుభవించిన వారికెరుకే!
ఎంత అందమైన జ్ఞాపకాలో ఎవరికి వారికి తెలుసే!

ఒక కుండను చేస్తూ ఉండగా అది అందంగా మన ముందే విశ్వంలా ఆవిష్కారమవడం ఒక అందం. ఆశ్చర్యం.
కానీ, మనుషులు?

మనుషులూ అంతే.
ఎంత చిత్రంగా ఆవిష్కారం అవుతారో!

విస్మయం.

విభ్రమ.
దిగ్భ్రమ.
సంభ్రమ.

రచనగా చెబితే నోరువెళ్లబెట్టుకున్న విధానం.

పరిపరి.
వివిధ.

 

నిజం.

మనుషులను చూడటం ఒక అందమైన అనుభవం.

తీయడం ఇంకా అద్భుతం.

ఒక విస్మయానికి గురైనప్పుడు అంతే విస్మయంతో ఆ ఛాయను పదిలంగా ఆస్వాదించడం.
సందేహస్పదంగా తేరపార చూస్తున్నప్పుడు ఆ పరికింపు..
దాన్ని అంతే సందేహంతో పరికిస్తూ వెనక్కి వెనక్కి తప్పుకోవడం.

అంతా ఒక లీల.

Sebastiao Salgado అన్న ప్రసిద్ధ ఛాయా చిత్రకారుడు ఒకసారి చెబుతాడు. తాను ఒక జంతువును ఒక ఫొటో చేస్తున్నప్పుడు తానూ ఒక జంతువే అయిన ఆ క్షణం గురించి ఎంతో విస్మయానికి లోనై వివరించాడు. తానొక జంతువును- అదీ ఒక పేద్ద తాబేలును (Giant tortoise)  చూసి ఆశ్చర్యపోయాడట. ఆ ఆశ్చర్యంతో దాన్ని చిత్రం చేస్తూ ఉండగా ఆ తాబేలు తనని చూసి ఆశ్చర్యపోయిందట, ఈ జీవి ఎవరా అని!

అప్పుడు ఆశ్చర్యపోయాడట.
అంతదాకా తాను మనిషిగా ఒక భ్రాంతిలో ఉన్నాడట.
అవతలి జంతువు దృష్టిలో తాను మనిషి కాదని తెలిసి విస్మయానికి లోనయ్యాడట.
తనకి మనిషిగా ఏ ఉనికీ లేదని గ్రహించిన క్షణమది!
ఫొటోగ్రాఫర్ గా బతికిన క్షణాలవి.

కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవికి వెళ్లి తాను ‘Genesis’ అన్న ఒక దృశ్య ఛాయా చరిత్ర కావ్యాన్ని రచించినప్పటి అనుభూతి అది. ఆ సందర్భంగా గాలపాగోస్ ద్వీపాలలో తనకి కలిగిన జ్ఞానం అది.

ఇక మోకరిల్లినాడట.
ఆ జీవి స్థాయికి తగ్గి వంగి, దాని కనులతో తన కనులు సమానమయ్యేలా వొంగి – చిత్రం తీశాడట.

అది నేను గ్రహించిన క్షణాన ఒళ్లు గగుర్పొడిచింది. తర్వాత ఈ పాపను ఫొటోగా చేస్తుండగా సరిగ్గా అలాంటి లేదా అంతకు మించిన భావోద్వేగానికే గురయ్యాను. ‘ఒక ఆశ్చర్యార్థకాన్ని చిత్రిస్తున్న క్షణం ఇదీ’ అని నా జీవితంలో తొలిసారిగా ఆశ్చర్యపోయిన క్షణం అది.

ఇంకో క్షణమైతే ఆశ్చర్యం అదృశ్యమయ్యేదే!
తాను లేస్తోంది.
ఒక లిప్త ఆలస్యం చేస్తే ఆ ఆశ్చర్యం నాలో మాత్రమే మిగిలేది.
ఇప్పుడు మాత్రం నేను మీతో పంచుకోగలుగుతున్నాను.

అదృష్టం.

ఎరుక.
అయితే, ఆ పాప దృష్టిలో ఆ ఆశ్చర్యం ఎక్కడిది?
నేనెవరో అనా? లేక నేను ఫొటోగ్రాఫర్ని అనా? లేక తానేదో పనిలో ఉండగా, కింది నుంచి లేస్తూ ఉండగా చూశాననా? లేక ఒక అపరిచితుడిననా? లేక ఆ చిరుతకు తన ప్రమేయం లేకుండా తన ఆవరణలోకి ఒక జంతువు రావడం ఏమిటా? అన్న విస్మయా?

SEBASTIO SALGADO PORTRAIT

sebastio salgado's tartoise

sebastio salgado’s tartoise

ఏమో!
కానైతే నాకు సెబాస్టియో సాల్గాడో గుర్తొచ్చాడు.
‘ఒక జంతువును చేస్తున్నప్పుడు జంతువే కా’ అన్న మాటలు గుర్తొచ్చాయి.
తలొగ్గు. తలొంచు. నిరుత్తురవడం.నిమిత్తం.
!
నిజం
ఈ బాలికను చూస్తున్నప్పుడు బాలుడినే అయ్యాను.
ఆమెలా చిన్నగై వొంగి ఆ ఆశ్చర్యంలో లీనమౌతూ ఉన్నాను.కానీ అప్పటికే లేచిందామె.
దిగుతుండగా లేస్తూనే ఉందామె.అయినా కాస్తంత ఆశ్చర్యాన్నయినా పట్టుకున్నట్టున్నాను.
థాంక్యూ సర్.

మీ పాఠాన్ని చదివినందుకు.
అనుభవంలోకి వచ్చినందుకు.

ఇలా ఒక ఆశ్చర్యార్థకం.
ఒక మాస్టర్ ఫొటోగ్రాఫర్ కి ఏకలవ్యుడి బొటనవేలులా ఈ చిత్రం.

!
థాంక్యూ సర్, విత్ లవ్.

~

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి…

 

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarప్రతిభావంతులైన గొప్పవాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. వొక్కోసారి  వారిపై  భక్తి భావమూ  పెంచుకొంటాం. ఆరాధిస్తాం. అభిమానిస్తాం. మనకే  తెలియకుండా  కొన్ని విషయాల్లో వారిని అనుకరిస్తాం. వాళ్ళ మాటల్నీ, చేతల్నీ ప్రమాణికంగా తీసుకుని మన జీవితంలోని కొన్ని సమయాలకి అన్వయించుకుంటాం. వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. వాళ్ళకి  సంభందించిన  ప్రతిదీ మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక్కోసారి  “ఈ గొప్ప మనిషి వివిధ సందర్భాల్లో ఎలా ఉంటాడు? నిద్రపోయి లేచినప్పుడు కూడా ఇంతే ఠీవితో ఉంటాడా? ఇరవైనాలుగు  గంటలూ ఈ వేషధారణలోనే ఉంటాడా?” అని ఊహల్లోకి జారిపోతాం. అలానే “ఈ పెద్ద మనిషి చిన్నతనంలో ఎలా ఉండేవాడూ ? అందరి పిల్లల్లాగే అల్లరి చేస్తుండేవాడా?” ఇలా మన మనసుకు తోచినట్టు పరిపరి విధాలుగా ఆలోచనల్లోకి వెళ్ళి అవి ఊహకి  అందక తిరిగొచ్చేస్తాం.

తెలివితేటలలోనూ, బల చాతుర్యాలలోనూ, మాయలలోనూ కీర్తికథలకు నాయకుడైన శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు అతని సతీమణులు. వాళ్ళకి  ”మనం ఆరాధించే ఈ కృష్ణుడు ఒక్క  రోజులోనే  ఇంత పెద్దవాడైపోయాడా? పుట్టటమే నాలుగు చేతులతోనే పుట్టాడా? అప్పుడే శంఖుచక్రాలు ధరించి వున్నాడా?” అనే  సందేహం వచ్చింది.   వారికి కలిగిన ఆ సందేహాన్ని కీర్తనగా రాశాడు అన్నమయ్య. వాస్తవానికి  ఈ ఆశ్చర్యం అన్నమయ్యదే.

ఈ కీర్తనని గోపికలో లేదా  శ్రీ కృష్ణుని సతీమణులో పాడుతున్నట్టు మనం  అనుకోవచ్చు.

 

AUDIO Link 1 :: గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ స్వరపరిచి పాడినది

AUDIO Link 2 :: ఎస్.జానకి గళం

AUDIO Link 3 

 

పల్లవి

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమిఁ

గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు

 

చరణం 1

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు

అట్టె కిరీటము నాభరణాలు ధరించి

యెట్టె నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు

 

చరణం 2

వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను

యిచ్చగించి వినుచున్నాఁడీ కృష్ణుఁడు

ముచ్చటాడి దేవకితోడ ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు

 

చరణం 3

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదిగో తా బిడ్డఁడాయనీ కృష్ణుఁడు

అదన శ్రీవేంకటేషుఁడై యలమేల్మంగఁగూడి

యెదుటనే నిలుచున్నాఁడీ కృష్ణుఁడు

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 14 కీర్తన : 453

 

తాత్పర్యం (Explanation) :

సతులారా, గమనించండి ఈ రోజు శ్రావణ బహుళాష్టమి. నేడే ఆయన జన్మదినం. ఎన్నెన్నో కథల్లో నాయకుడైన ఈ కృష్ణుడు జన్మించినది ఇలాంటొక రోజున అర్థరాత్రిపూటే!

ఈ మోహనమూర్తికి పుట్టినప్పుడే నాలుగు చేతులు, చేత శంఖుచక్రాలు ఉండేవా?  అలా సాధ్యమా? కిరీటమూ, ఆభరణాలూ తొడుక్కున్న పసికందు చూడటానికి ఎలా ఉండేవాడో! ఈ కృష్ణుడేనా నాడు బాలుడిగా ఉన్నది? అని ఆశ్చర్యపోతున్నారు.

భవుడు, బ్రాహ్మాది దేవతలందరూ ఈయన వాకిట చేరి నిత్యం నుతించుతుంటే విని ఆస్వాదించే ఈ కృష్ణుడేనా నాడు చెరసాలలో పసిబాలుడిగా దేవకితో ముచ్చట్లాడింది? వసుదేవుడు ఆశ్చర్యపోయినది ఈ బాలుడి మహిమలుగనేనా?

సంతానం కొరత తీరుస్తూ యశోద-నందగోపుల ఇంట జన్మించిన పసిపాపడుగా చేరినాడు ఈ కృష్ణుడు. అలమేలుమంగను చేపట్టి వేంగటగిరిపైన దేవుడిగా వెలసినవాడుకూడా ఈ కృష్ణుడే!

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

బహుళాష్టమి = పౌర్ణమి తరువత వచ్చే ఎనిమిదవ తిథి

చతుర్భుజాలు = నాలుగు భుజములు/చేతులు
ఎట్ట = ఎలా

నుతించు = స్తోత్రముచేయు

ముంచి = అతిశయించి, ఆశ్చర్యమునొంది

హెచ్చిన = అత్యధికమైన,  మితిమీరిన

కొదదీర = కొరతతీరేట్టు

అదన = ఇప్పుడిలా (ఈ అదన పదాన్ని అన్నమయ్య కీర్తనలో తరచుగా చివరి చరణంలో వాడారు. ముఖ్యంగా శ్రీవేంకటేశుడన్న పదానికి ముందుగా)

 

* * *

ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

 

అసలు కళ్ళతో చూడగలమా? లేక గుప్పిళ్ళతో అందుకోగలమా??

మనల్ని మనం తనువుగా త్యజించడమా? లేక మనలోని మనల్ని స్పృశించగలగడమా??

ఎలా, ఎక్కడ చేజిక్కించుకోవడం ఆత్మని!?

ఆలోచలన్నీ ఆవిరైపోయి ఖాళీ మట్టికుండలా మనసు మిగిలినప్పుడు.. అప్పుడు అవగతమవుతుందా ఆత్మ అనే పదార్ధం!?

అలా కాకుంటే,

సముద్ర తుఫానులో చిక్కుకున్నట్టు ఆధ్యాత్మిక సందేహాలలో మునిగి, విసిగి, అలసి, దిక్కుతోచని దాహంతో చేష్టలుడిగినప్పుడు, దారి తప్పినప్పుడు మనపైకి వంగి కురిసే వానజల్లేనా ఆత్మంటే!?

నా మట్టుకు నాకు,

ప్రపంచం సాయంత్రాన్ని సిగలో ముడుచుకునే వేళల్లో.. పూలు గుచ్చుకుంటూనో లేక తల వంచుకుని ఒక కవిత రాసుకుంటూనో.. నాలోంచి నన్ను కొద్దిగా పక్కన బెట్టేసుకునే క్షణాల్లో… ఆ కాస్త నేను అరణ్యాలూ, అనంతాకాశాలూ చుట్టివచ్చేసే పయనాల్లో… అభావంతో ఆనందం మమేకమైనప్పుడు… జననమూ, మరణమూ మధ్యలో నేను అనబడే ఒక సంరంభం సంభవిస్తుందని అర్ధమైనప్పుడు… అప్పుడే అనుకుంటా, నాకు ఆత్మ అనేదేదో ఉందనిపిస్తుంది!

gulzar

 

ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?
సజీవంగా కదిలి మెదిలే పాల తరకల తెల్లదనపు పొగమంచులో చిక్కుకుని
శ్వాస తీసుకునే ఈ పొగమంచుని ఎప్పుడైనా స్పర్శించావా?

పోనీ, పడవ ప్రయాణంలో ఒక సెలయేటి మీద రాత్రి పరుచుకుంటూ
ఆపైన నీటి అలల తాకిడితో చప్పట్లు మోగిస్తున్నప్పుడు
వెక్కిళ్ళు పెడుతున్న గాలి ఉఛ్ఛారణ ఎప్పుడైనా విన్నావా?

వెన్నెల రాత్రి పొగమంచులో జాబిలిని అందుకోవడానికి
బోల్డన్ని నీడలు పరుగులు పెడుతున్నప్పుడు
నువ్వు తీరాన ఉన్న చర్చి గోడలని ఆనుకుని
నీ పొట్టలోనించి వస్తున్న ప్రతిధ్వనులని అనుభవించావా?

ఈ శరీరం, వందసార్లు కాలినా కానీ అదే మట్టిముద్ద
ఆత్మ ఒక్కసారి జ్వలిస్తే చాలు అది మేలిమి బంగారమే!
ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?

 

మూలం:

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

Jaagate jeete hu e doodhiya kohre se lipatkar
Saans lete hu e is kohare ko mahsoos kiya hai?

Ya shikaare mein kisi jheel pe jab raat basar
aur paani ke chapaakoon pe baaja karti hon taliyaan
subkiyaan leeti hawaoon ke kabhi bain sune hain?

Chodhaveen raat ke barfaab se ek chaand ko jab
dher se saaye pakarne ke liye bhaagate hain,
tum ne saahil pe khare girje ki deewar se lagkar
Apni gahnaati hui kokh ko mahsoos kiya hai?

jism sau baar jale tab bhi wahi mitte ka dhela
rooh ek bar jalegi to woh kundan hogi

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

*

Painting: Satya Sufi

రక్తంతో వెల్ల వేసుకుంటున్న గోడలు !!!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

There is no exaggeration in saying that the entire destination of the country depends upon its intellectual class. If the intellectual class is honest and independent, it can be trusted to take the initiative and give a proper lead when a crisis arises. It is true that the intellect by itself is no virtue. It is only a means and the use of a means depends upon the ends which an intellectual person pursues. – DR. B R AMBEDKAR

కన్నడ శైవ భక్తి ఉద్యమం కు ఆద్యుడు బసవేశ్వరుడు.  బ్రాహ్మణిక పెత్తందారీ తనానికి తిరుగుబాటు ఉద్యమంగా మొదలయ్యింది. స్వంత ఆస్తి లేని సంస్కృతి కలిగిన ‘ జంగమ ‘ సాధు వ్యవస్థకు బసవేశ్వరుడు  నాంది పలికాడు.  దేవలయాలను, బ్రాహ్మణ పెత్తనాన్ని నిరసించాడు. స్త్రీ, కుల అంతరాలు లేకుండా శివుడి లింగాన్ని ధరించవచ్చు అనే సంస్కృతిని  బసవేశ్వరుడు   ప్రచారం చేసాడు. ( ఆ తర్వాత శైవ భక్తి ఉద్యమం నీరు గారి,  లింగాయతులు కుల వ్యవస్థ లో ఇమిడిపోయారు.  అది వేరుగా చర్చించవలసిన విషయం )  ఈ సంస్కృతికి ప్రాతిపదికగా ఉన్న ‘ వచన సాహిత్యం ‘  పై చేసిన పరిశొధనకు  కేంద్ర సాహిత్య అకాడమీ ‘ అవార్డ్ అందుకున్న మేధావి మల్లేశప్ప కాల్బర్గి.  విగ్రహ పూజను వ్యతిరేకించడమే కాక, బసవేశ్వరుడి అనుచర కులమైన లింగాయతుల అస్తిత్వానికి సంబంధించిన కొన్ని వివాదస్పదమైన ప్రశ్నలు లేవనెత్తాడు.  2014 లో ,   Anti-Superstition Bill   ను సమర్థిస్తూ ‘ హిందూ విగ్రహ రాళ్ళ  మీద ఒంటేలు పోస్తే శాపం తగలదు ‘ అన్న ఙానపీఠ అవార్డ్ గ్రహీత అనంత  మూర్తి రాతలను సమర్థిస్తూ ఉపన్యాసం ఇవ్వడం హిందూ ఛాందస వాదులకు కంటగింపు అవ్వడం, ఫలితంగా అతి హేయంగా హత్య కావించబడ్డం జరిగింది. ఈ చిన్న ఉపోద్ఘాతం , మనకందరికీ తెలిసిన వార్తాంశాలే. కలబర్గి  హత్య మరో సారి లేవనెత్తిన ప్రశ్నలు – ఉద్యమ కారుల మీదనే కాక బ్రాహ్మణియ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించే ఆలోచనల కలిగిన మేధో వర్గం పై కూడా ఇటువంటి నిష్కారుణ్యమైన చర్యలు ఎందుకు ?  ప్రగతివాద అలోచనా విధానం బ్రాహ్మణియ వ్యవస్థపై ఎందుకంత చెంప పెట్టుగా ఉంటుంది ? ఈ అసహనం ఎందుకంత భరించలేనంతగా ఉండాలి ?

మన విద్యా వ్యవస్థ  –   Unity in diversity  కలిగున్న దేశం అని చిన్నప్పట్నుంచీ మనకు నేర్పించింది. ఇది వాస్తవం లో   ‘ Geographical unity ‘   గానే మిగిలి పోయింది తప్ప సాంస్కృతిక సహనం లేకుండా ,   Freedom of Speech  , ప్రాథమిక హక్కు స్థాయిని కోల్పోయి, కేవలం   selective right  స్థాయికి దిగజార్చబడ్డది.  మన దేశం లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు – ప్రపంచం మొత్తం మీద ఏ దేశం లోనూ ఉండవు. సామాజిక అభివృద్ధి అంటే – ప్రతి వరుసలో ఉన్న సంస్కృతిక సముదాయం కు సంబందించిన అభివృద్ధి అన్నది ఇంకా మన ఆర్థిక వ్యవస్థలో   sink   అవ్వలేదు. మన ఆర్థిక పురోగతికి – ‘ మెజారిటేరియనిజం ‘  అన్నది ప్రధాన ప్రగతి వ్యతిరేక సంస్కృతి. ఈ ‘ మెజారిటేరియనిజం  కు ప్రధాన ఉనాది ‘ బ్రాహ్మణ హిందూ ఛాందస వాదం ‘.  మన దేశం లొ కుల వ్యవస్థ ఏర్పాటు లోనే – అసహన ప్రాతిపదిక ఉంది. అధికార వర్గం లో ఉన్న అగ్ర కుల వ్యవస్థ ,  తమ ‘ సాంస్కృతిక సైద్ధాంతికత ‘ ను అణువణువునా కాపాడుకునే క్రమం లో డెవెలప్ చేసుకున్న ‘ అసహనం ‘ ఇది.

నిజానికి ‘ అసహనం ‘ అన్న అంశం ప్రజాస్వామిక దృక్పథం లో ‘  sense of belongingness  ” ను తెలియ జేస్తుంది. అయితే ఇదే ‘  sense of belongingness  ‘ అధికార దాహం రుచి చూసినప్పుడు   perversion  వస్తుంది .

ఆర్థిక వ్యవస్థ ఏర్పడే క్రమం లో సంస్కృతి ఏర్పడుతుంది. అదే సంస్కృతి క్రమేనా, అధికార వర్గ రాజకీయాలను బట్టి,  ఆర్థిక వ్యవస్థ ప్రగతిని నిరోధించే స్థాయికెల్తుంది. ముఖ్యంగా   equitable development   గురించి మాట్లాడినప్పుడు ఈ అధికార సంస్కృతి విరుద్ధ స్వభావాన్ని పులుముకుంటుంది.

మన ప్రజల్లో ఎంత విభిన్నత ఉన్నా, ఒక ‘  commonality  ‘ ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఈ దేశం లో ఒకే చోట బతుకుతున్నాం. ఐతే వ్యవస్థలో   Commonality   ని గౌరవించాలంటే ‘ స్వేఛ్చ ‘ ఉండాలి. ఆ స్వేచ్చ హక్కు దారునికి కలుగజేసే స్వయంప్రతిపత్తి వలన  సృజనాత్మకత బలపడుతుంది. సృజనాత్మకతకున్న గుణం ఏంటంటే – అది  constant change   కోరుకుంటుంది. బండరాయిగా మిగిలిపోయిన మతానికి  ఋఇగిదిత్య్  అన్న లక్షణం దాని విలువల వ్యవస్థను గట్టిగా కాపాడే క్రమం లో ఏర్పడుతుంది. ఇది ‘ సృజనాత్మక ‘ ఆలోచనను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అందుకే మతాలను ఉద్ధరిస్తూ ముందుకు వచ్చిన ‘ భక్తి ఉద్యమాలు ‘ సృజనాత్మకతను సహించలేక వీగిపోయి చివరికి తిరిగి    establish   అయిన మతం లోనే భిన్న రూపాన్ని సంతరించుకుని మిగిలిపోవడం చారిత్రకంగా మనం గమనిస్తున్నాము. పాఠకుల అవగాహన కొరకు క్లుప్తంగా , చిన్న స్కిమాటిక్ రూపం లో కింద ఇవ్వడం జరిగింది.

Commonality ===> స్వేచ్చ ====>హక్కులు===> స్వయంప్రతిపత్తి ===> సృజనాత్మకత ===>  change

ఐతే – ఇంత తీవ్ర స్థాయి అసహనం మన దేశం లో ఎందుకుంది ? ఈ ‘ అసహనం ‘ మత వాద దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఇస్లామిక దేశాల్లో, కేథలిక్ ఆర్థోడక్సీ ఉన్న దేశాల్లో చూస్తున్నాము. ఆ మతాల బూచిని చూపి ఇక్కడ ‘ హిందూ బ్రాహ్మణ వాదులు ‘ మన దేశం లో మనమేదో చాలా ఉదారంగా ఉన్నట్టు పోజు పెడుతుంటారు. ఈ దేశం లో మనకున్న స్వాతంత్ర్యం –   negotiate   చేసుకుని సంపాదించుకున్నది అన్న విషయం ప్రతి అగ్రకుల మనువాది, హిందూ ఛాందస వాది చాలా సౌకర్యంగా మర్చి పోతారు.   Two nations theory   ప్రతిపాదించాక, బ్రిటిష్ ను వెళ్ళగొట్టాడం  లో మాకు ఉపయోగపడండి , మనమందరం లౌకిక రాజ్యం ఏర్పరుచుకుందాం అన్న కాంగ్రెస్ , గాంధీ సమావేశ ప్రకటనలు ఎవరికీ గుర్తు రావు. ‘ కమ్యూనల్ అవార్డ్ ‘ ప్రకటించాక, అంబేద్కర్ ప్రతిపాదించిన అద్భుతమైన  separate electorates  ప్రతిపాదనను కు ప్రత్యమ్నాయంగా  తో   negotiate   చేసి,   Poloitical reservations   కు కుదించారని  మర్చిపోయి – ముస్లిములు , దళితులు మా భిక్ష ద్వారానే ఇక్కడ బతుకుతున్నారు అన్న విషయాన్ని ప్రాచుర్యం చేస్తారు. అప్పట్లో విసిగి వేసారిన అంబేద్కర్ ఈ మోస పూరితమైన , వెన్ను పోటు పొడవగలిగిన బ్రాహ్మణీయాన్ని నిరసించి ‘ అసలు మాకు ప్రత్యేక గ్రామాలు ఇవ్వండి. మమ్మల్ని మీరు లోపలికి తీసుకుని మమ్మల్ని ఉద్దరిస్తున్న పోజు మీకెందుకు ? ‘ అన్న ప్రతి పాదన కూడా చేసాడు.

ఉద్యమం చేస్తున్న ఉద్యమ కారునికి కి   aggression   ఉంటుంది. ఆలోచనలను ప్రభావితం చేయదల్చుకున్న మేధావికి   intelluctual conviction   ఉంటుంది. ఈ బ్రాహ్మణియ అసహనత   aggression   ను  intelluctual  conviction    ను ఒకే స్థాయిలో పోల్చి చూడ్డం లో ఉన్న మర్మం మనం జాగర్తగా గమనించాలి.

హిందూ వ్యవస్థ చాలా పురాతన వ్యవస్థ. ఈ వ్యవస్థ మొదట్లో కొంత పురోగతి స్వభావాన్ని కలిగి ఉండడం కూడా పొడిగించబడిన దీని మనుగడకు ఒక చిన్న కారణం అవ్వచ్చు. అయితే చాలా బలహీనమైన మనువాద భావ జాలం పైన స్థిర పడి, ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా – అదే షేప్ ను నిలుపదల్చుకుంది  ( ఎన్ని వ్యాయామాలు చేసినా లేని కండలు రావిక , వట్టి వాపులు మిగలడం తప్ప ) . ఇంత పురాతన హిందూ వ్యవస్థ గోడలు బీటలు వారుతున్నాయి. ఈ సందర్భం లో – దీని అస్తిత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తేనే  ఈ గోడకు ఇంకా నెర్రలు పాకుతాయి.  ( సాధారణంగానే ప్రతి మత వ్యవస్థకు ఈ లక్షణం ఉంటుంది. అయితే పూర్తిగా premitive society stage  నుండి బతుకుతున్న,  హిందుత్వం ఔట్ డేట్ అయిపోయిన మతం కావడంతో కొన్ని పిరికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. హిట్లర్ సమయం లో , ఈ దాడి ఇంకో అడుగు ముందుకేసి – నాజీ  సంస్కృతిని  నిలబెట్టుకోవడానికి గోబెల్స్ ను నియమించింది. నాకు తెలిసి – ఇదో మోసపూరితమైన సంస్కృతిక వ్యవహారమైనా హిట్లర్ ఆ మేరకు బూటకమైనా సరే, ఒక ప్రజాస్వామిక రూపాన్ని,  దాన్ని బలాన్ని ఆ మేరకు నమ్మాడు. మన ఖర్మ ఏంటంటే – ఇక్కడ అదే మత ఛాందస వాదం, పచ్చి నెత్తురు తాగడం ద్వారానే మార్పు కొనాలనుకుంటుంది ).

మోదీ వచ్చాక ,   political participation of varied culutures   అన్న విషయమే పక్క దారి పట్టి, ప్రధాన విద్యా, ప్రణాళికా సంస్థల్లో ‘ అసహన సిద్ధాంతాన్ని ‘ ప్రతిపాదించే  థర్డ్ క్లాస్ మేధావులనే ఎన్నుకుని మరీ నియమించడం జరుగుతుంది. కాల్బర్గి లాంటి మేధావులను హత మార్చడం జరుగుతుంది.

నిజానికి ‘ వైరుధ్య ఆలోచన ల ‘ సమూహం మనలో సృజనాత్మకతను వృద్ధి చేస్తాయి. భిన్న కోణాల్లో మనుష్యులను వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో తెలియ జేస్తాయి. నిజానికి, మనిషికి రాజకీయ వ్యవస్థ అవసరం కాదు సౌకర్యం. భిన్న అవసరాలు, భిన్న దృక్పథాలు ఉన్న కోట్ల మనుష్యులు – కలిసి సుఖంగా బతకాలనుకున్నప్పుడు , అందరూ ఒక  క్రమం లో ముందుకెళ్ళడానికి , రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. మనింట్లో , మనం సంపాయించి వంట చేసుకోడానికి – రాజకీయ వ్యవస్థ ఎందుకు ? మన భర్తలతో , పెళ్ళాలతో కాపురం చేయడానికి రాజకీయ వ్యవస్థ ఎందుకు ? ప్రతి వ్యక్తి ఒక భిన్నమైన  entity  .  ఈ సృష్టిలో ఉన్న గొప్ప తనమే ఇది. ” విభిన్నత ” ఈ సృష్టి ప్రసాదించిన వరం.

మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలంటే – మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, ఒక డీసెంట్ జీవనాన్ని సాగించాలంటే  – ఆర్థికావకాశాలు  సమానంగా సృష్టించుకోవడం అవసరం. ఇంత వరకు అధికార వాసన చూడని సరి కొత్త శ్రేణులను , ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం ముఖ్యము. కేవలం ఒకే  గాటికి కట్టినట్టు ప్రయాణించే , ఆర్థిక వ్యవస్థ మనకు   genocides   మాత్రమే మిగులుస్తుంది. ఇందులో భాగంగా – కాల్బర్గి  లాంటి మేధావులు ప్రాణలు వదలాల్సి వస్తుంది. తస్లీమా నస్రీన్ లాంటి మహిళా మేధావులు – దేశం వదిలి బతకాల్సి ఉంటుంది. పెరుమాల్ మురుగన్ లాంటి రచయితలు కలం వదిలేయాల్సి వస్తుంది. సాయిబాబా లాంటి ప్రొఫెసర్లు  physically challenged  అయినా జైళ్ళల్లో మగ్గాల్సి వస్తుంది.  విప్లవ రచయితలు, కళాకారులు  కుట్ర కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అరిస్టాటిల్ అంటాడు ‘  man is a political animal  ‘  అని. మనిషి తన సౌకర్యం కోసం రాజకీయ వ్యవస్థ ను ఎంతగా కాంక్షిస్తున్నాడో, ఎంతగా మమేకమై బతుకుతున్నాడో  తెలపడానికి ఈ మాట అన్నా , అదే రాజకీయ వ్యవస్థలో జంతువులు చేరాక – ఇక సమాజం లో మనుష్యులకు తావేది ?

 

(  PS:  ఈ వ్యాసం లో చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు వాడాల్సి వచ్చింది. ఇందుకు తగిన తెలుగు పదాలు లేవని భావించబట్టే ఇలా వాడడం జరిగింది. లేదంటే సంస్కృత పదాలు వాడడం వలన కన్ ఫ్యూ జన్  పెరుగుతుంది తప్ప లాభం ఉండడం లేదు.   పాఠకులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.)

 

 ప్రయాణం ఆగింది

మేడి చైతన్య 

 

scan0033నా ఏడుపు నాకే వినిపించనంతంగా డపుక్కుల మోత. నిశబ్దంగా నడుస్తున్నట్లున్న గుంపులోని గుసగుసలన్నీ తనలో కలిపేసుకుంటున్న టపాసుల శబ్దం. దింపుడు కళ్ళెం ఆత్రంగా మొఖం వైపు చూశా ఏమైనా కదలిక ఉందోనని! మూడుసార్లు గుండ్రంగా తిరిగేటపుడు అడుగడుక్కీ దూరం అనంతంగా పెరుగుతున్నట్టుంది. చెవి దగ్గరకెళ్ళి తడి ఆరిన పెదాలను గట్టిగా కూడబలుక్కున్నా.

నా… న్నా!…..

 

***

చద్దన్నం తినడం, తెల్లారుతుండగానే సైకిల్మీద పొలానికెళ్ళడం, తెల్లటి మేఘాల్లా మెరిసిపోతున్న పత్తి గుబ్బలను అక్కతో పోటి పడి తీయడం, కొద్దిసేపటికే రెండు మూడు చెట్లను పందిరిలా అల్లి ఆకులోంచి వస్తున్న నీరెండను తప్పించుకోవాలనుకోవడం, పచ్చడితో సల్లబువ్వ తాగడం, సాయంత్రమయ్యేసరికి ముందు వెనుక బస్తాలేసి నాన్న నడిపిస్తుంటే సైకిల్ సీటు పైనే కూర్చోని నడిచొస్తున్న అక్కని చూసి వెక్కిరించడం, పొద్దుగూకినాకే నీళ్ళుపోసుకోవడం, తెచ్చిన పత్తిమీదే పడుకోవడం…. చిన్నప్పటి నాజీవితం.

ఇద్దరూ వళ్ళు హూనం చేసుకోని పత్తిమీద వచ్చిన డబ్బుతో వరిపొలమొకటి కొన్నారు. అరెకరం నుండి ఎకరన్నర ఆసామిగా నాన్న కూలి నుంచీ రైతుగా తన అస్తిత్వాన్ని రూపాంతరీకరణ చేసుకున్నాడు! అమ్మ కూలికెల్తానన్నా ‘రైతు భార్య వేరే వాళ్ళ పొలంలో పనిచేయొచ్చా?’ అనంటే ఉన్న పొలంలోనే పని చేసేది. రెడ్డిగారి పొలం కౌలుకి తీసుకుందామని నాన్నంటే, పెట్టుబడికి అమ్మ చెవికమ్మలను తాకత్తు పెట్టమని ఇచ్చింది.

***

గాలి వీచినప్పుడల్లా బరువుతో తల నేలకి గిరాటేసి వెర్రిగా నృత్యం చేస్తున్నాయి వరికంకులు! వరిపొట్టు ముదరటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు! వరికోతకు అప్పుడే కొడవళ్ళు చేయించి, ఏళ్ళుగా వెలుతురు చూడని వరిగుమ్మిని బూజుదులిపింది అమ్మ. ఎన్నో రోజుల తర్వాత నాన్న కంటినిండా నిద్ర పోయాడు.

పొద్దున్నేకాలు బయటపెట్టానో లేదో కర్రిమబ్బొకటి మింగేయడానికొచ్చినట్లు వచ్చింది. చూట్టూ ముసురు కమ్ముకుంది. చలనం లేకుండా నిల్చున్న నన్ను చూసి నాన్న లోపలనుంచి వచ్చాడు.

“ఏమైందబ్బాయ్?” అని అడుగుతూ నా భుజంపై వేసిన ఆయన చేయి మీద రుపాయిబిళ్ళంత వాన చినుకొకటి పడింది. తలెత్తిన మరుక్షణమే ఎడతెరపి లేకుండా వస్తున్న వాననీ, నోట మాట రాక నిస్సహాయంగా చూస్తున్న నాన్న చూపుల్నీ చూసి బిత్తరకపోయాను.

“వామ్మో! వర్షపు చాయలు మరో నెల రోజుల వరకు కనిపించవని చెప్పాడు కదే ఆ వార్తలు చెప్పేవాడూ!!?” అని నుదురుమీద చేతులేసుకోని కొట్టుకుంటా అమ్మ ఏడుస్తోంది.

అక్క మౌనంగా పైకప్పు కన్నాల్లోంచి పడుతున్న వాన చుక్కలకి ఇల్లంతా మట్టి రొచ్చు కాకుండా కూరసట్టెలు, చెంబులు పెడుతుంది.

నాన్న వడి వడిగా గోనెపట్టా కొప్పెర వేసుకోని బయటకెళ్ళిపోయాడు.

“మీ నాన్న ఉలుకు పలుకు లేకుండా కుర్చున్నాడు వెళ్ళి తీసుకురారా చిన్నోడా” అని చుట్టింటి తాత చెప్పేసరికి పొలం దగ్గరకెళ్ళా. వరంతా నేలరాలింది. మడి మధ్యలో కూర్చోని వాన నీటిలో తేలియాడుతున్న వరికంకులను ఏరుతున్నాడు నాన్న. రెక్కపట్టి లేపితే నా భుజం మీద పడి బావురుమన్నాడు. చేతికందొచ్చిన కొడుకు కళ్ళముందే చనిపోతే ఎలా ఉంటుందో నాన్న కన్నీళ్ళలో కనిపించింది. స్పృహ లేనట్లున్న నాన్నని కష్టం మీద నడిపించుకుంటా ఇంటికి తీసుకొచ్చాను.

 

***

‘ప్రభుత్వం నష్టపోయిన పంటలకు డబ్బులిస్తుందని, పంచాయితి ఆఫీసుకి రేపు పాసుపుస్తకాలు తీసుకురావాలని’ దండోరా వేయించాడు సర్పంచ్. రెడ్దిగారి జీతగాడొచ్చి ఇంటికి రమ్మంటున్నాడంటే ఇద్దరం వెళ్ళాం. ‘రెండెకరాల కౌలు డబ్బులెప్పుడిస్తావ’ని అడిగాడు రెడ్డి నాన్నని.

‘పంటంతా పోయింది, ఇంట్లో జరుగుబాటుకే కష్టంగా ఉంద’నేసరికి పడక కుర్చీలోంచి లేచి లోపలకెళ్ళి ఓ వంద రూపాయిలు తెచ్చి నాన్న చేతిలో పెట్టి మళ్ళీ లోపలకెళ్ళాడు. ‘ఏందబ్బా ఇంత దాతృత్వం!?’ అనుకుంటుండగానే గుమస్తా మా దగ్గరకొచ్చి “రేపు ప్రభుత్వం వాళ్ళు అడిగినపుడు కౌలుపొలం లెక్కలోకి చెప్పొద్దన్నాడు రెడ్డి. కౌలుకట్టలేకపోయినోడు కట్టలేనట్లే ఉండాలని చెప్పమన్నాడు” అన్నాడు.

నిల్చున్న నేల బద్దలవుతున్నట్టుంది. ఆ డబ్బులొస్తే ఇంట్లోకి జరుగుబాటు అన్నా అవుద్దనుకున్న మాకు ఏడుపు తన్నుకొస్తుంటే సన్నగా వెకిలి నవ్వొకటి నవ్వుతూ రెడ్డి బయటకొచ్చాడు. 5 సం.లకు కౌలు కుదుర్చుకున్న ఒప్పందపత్రం చించేశాడు.

నవ్వంతా మీసాల చాటున దాచిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన పంటనష్టాన్ని “విషణ్ణవదనంతో” అందుకున్నాడు రెడ్డి.

 

***

అమ్మ మంగళసూత్రాలు మా కడుపుల్ని ఆదుకున్నాయి.

ఈ ఏడాదంత వర్షపు జాడ లేదు. నేల నోరు తెరిచి ఆత్రంగా నీటి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పొలాలకని పక్క రాష్ట్రం నుండి తెచ్చిన నీళ్ళను ఎగువకాల్వలోకి వదులుతామని ప్రభుత్వం వార్తల్లో చెప్పిందంట. ఆ నీళ్ళ కోసం మేము కూడా నేలతల్లి లాగా ఆత్రంగా చూస్తున్నాం.

సందేళే ఒక ముద్ద తిని, నాన్న నేను పొలానికి బయల్దేరాం. “చిన్నోడా! ఈ ఏడు ఎలాగైనా అక్కను ఒక మంచి ఇంటికి పంపిస్తే నా బరువు తీరిపోతుందిరా! అమ్మ సూత్రాలు కమ్మలు తెచ్చివ్వలేనేమో గాని ఒక రెండు చీరలన్నా కొనాలి. నన్ను చేసుకున్న పాపానికి ఏరోజూ నోరెత్తి నాకిదికావాలి అడిగిన పాపాన పోలేదు.

నీళ్ళొస్తాయనీ పంట పండుతుందనే ఆనందంలో కడుపునిండా తినడానికే లేదన్న సంగతి మర్చిపోయాడు. నీళ్ళు వచ్చేలోగా ఒక కునుకేద్దామని రగ్గు తీసి పక్కేసాం. నాకు ఒళ్ళు తెలియనంత నిద్ర కమ్మేసింది.

గాలి వీస్తున్న దిశలో ఏటవాలుగా వడ్లు తూర్పారపడుత్తున్నారు. మానికలతో కొలచి బస్తాల్లో పోసి వాటిని దబ్బనంతో కుడుతున్నారు. గడ్డంతా తీసి వామేస్తున్నారు. చీకటి పడుతుండగా పోల్చుకోలేని

ఆకారమొకటి మా దగ్గరకొచ్చింది. పనిచేస్తున్న వారంతా, ఆ ఆకారం చెప్పిందే తడవుగా

బస్తాలని ఎడ్ల బండ్లోకి మోసుకెళుతున్నారు. నాన్న ధాన్యం ఇవ్వనని అరుస్తున్నాడు. అలా అంటున్న నాన్న రెక్కలు మడిచి వెనక్కి పట్టుకున్నారు. ‘మా నాన్నని విడవండి – మా నాన్నని విడవండి’ అని అరుస్తూ పరిగెత్తుతూ బోర్లా పడ్డాను. నుదురు రాయికి కొట్టుకుని ముఖం అంతా రక్తం.

“చిన్నోడా! నీళ్ళొస్తన్నాయ్” అని అమ్మపెట్టిన కేకకు ఉలిక్కిపడి లేచేసరికి, నీళ్ళ శబ్దం కాలవలో.

వచ్చిన కలని తల్చుకుంటున్నకొద్దీ భయంగా ఉంది. ఆందోళనగా నాన్నవైపు చూశాను. కాలవకి గండిపెట్టి పొలాన్ని తడుపుకోవడానికి అమ్మనాన్న వంగి సాళ్ళని గట్టి చేసుకుంటున్నారు.

క్షణక్షణానికి దగ్గరవుతున్న నీళ్ళ శబ్దానికి నాన్న ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.

శబ్దం తప్ప నీళ్ళు రావేందీ!? ఏదో స్పురణకి వచ్చినవాడిలా దిగ్గున లేచాడు. నేను కూడా కాలవ మీదకి పరిగెత్తి నాన్నతో నడిచాను. ముందుకెళ్ళి చూస్తే, రెడ్డి జీతగాడు కాలవకి అడ్డకట్టు వేసి రెడ్డి పొలమును తడుపుతున్నాడు.

‘నీళ్ళు మీరే మళ్ళిస్తుంటే మా పొలాలెలా తడవాలి?’ అని అడుగుతుంటే పొగ వదులుకుంటూ రెడ్డి మెల్లగా వచ్చాడు.

“నోటి కాడ కూడు లాక్కెళ్ళడడం మీకు ధర్మం కాదు బాబయ్యా, ప్రాణాలన్నీ పంటమీదే పెట్టుకున్నాం, మీరు దయతలస్తే మా భూమి కూడా తడుపుకుంటాం” అని నాన్న అంటుంటే ఏమి విననట్టు చూస్తా నిలబడ్డాడు.

“మా పొలం తడవనియ్ ముందు తర్వాత చూద్దాం” అని “ఒరే మన పొలమంతా తడిసేదాకా చుక్క కూడా కిందకొదలొద్దు” అని ఇంకొక చుట్ట వెలిగించాడు.

“నీవు దౌర్జ్యనంగా దోచుకుతింటుంటే, నీ కాళ్ళ కింద బానిసల్లాగా బతికేటోళ్ళెవ్వరు లేరు” అని

అడ్డకట్టు కొట్టడానికి ముందుకెళ్ళా. జీతగాడు ముళ్ళుగర్ర తీస్కోని నా మీద కొస్తుంటే చేతికి దొరికిన

రాయితీసుకోని వేశా. వాడి తల పగిలింది. ముందుకి అడుగేసేలోపు కర్రొకటి నావీపు మీదా బలంగా

పడింది. వెనక్కి తిరిగి చూద్దామనుకునేసరికి తలమీద ఇంకో దెబ్బ. నీరంతా ఎరుపెక్కి రెడ్డి పొలంవైపే పారుతున్నాయి. స్పృహ తప్పింది.

లేచి చూసేసరికి అక్క దిగాలుగా ‘రెడ్డిని కొట్టినందుకు పోలీసులు నాన్నను తీసుకెళ్ళారం’ది ఏడుస్తా. అమ్మేమో రెడ్డి కాళ్ళ మీద పడైనా నాన్నను విడిపించుకొని రావడానికి వెళ్ళిందట. మూడు రోజులవుతున్నా నాన్న ఇంటికి రాలేదు.

ఈ మూడు రోజులూ నీళ్ళు రెడ్డి పొలాన్ని తడుపుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు పంటలన్నింటికీ నీళ్ళందించినందువల్ల కాలువ మూసేస్తున్నామని చెప్పారు.

కాలువ నీళ్ళు ఆగిపోయిన తెల్లారే నాన్న ఇంటికొచ్చాడు.

 

***

కడుపులు నింపుకోవడానికి జనం కూలీలుగా వలసలు వెళుతున్నారు. చాలా ఇళ్ళు మనుషుల్లేక శిధిలాలుగా మారిపోతున్నాయి.

నాన్న వచ్చే ఏడు పెట్టుబడి కోసం ఎవరెవరినో అప్పు అడుగుతున్నాడు. అప్పులొద్దు మనం కూడా కూలీకి వెళ్దామంటే “రైతనేవాడు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా మట్టిని నమ్ముతూనే ఉండాలిరా, నా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకూ నా పొలంలోనే రైతుగానే పని చేస్తానురా, నా పొలాన్నే నమ్ముకుంటా, అది నన్ను అన్యాయం చేయదు” అన్నాడు.

‘ఆ పొలమే తాకట్టులో ఉంది. ఇంకదేం సాయం చేసిద్దయ్యో’ అని అమ్మ అంటానే ఉంది. నాన్న విననట్లుగా అప్పు కోసం తిరుగుతానే ఉన్నాడు.

రోజులు గడుస్తున్నాయి. అక్కకు మంచి సంబంధం వచ్చింది. అక్క వాళ్ళకి నచ్చింది. వారం రోజుల్లో పెళ్ళి. ఎంత మంది చుట్టో అప్పు కోసం తిరుగుతున్నాడు నాన్న. ఈసారి అప్పు పొలం పెట్టుబడి కోసం కాదు. కట్నం డబ్బుల కోసం.

నాన్న ఇంటికి రాగానే ఆయన ముఖం వైపు కాకుండా చేతులవైపే చూస్తున్నాం ఇంట్లో అందరం. ఉత్తచేతులే.

అప్పుడే పొలం మీద తీసుకున్న అప్పు పది రోజుల్లో తీర్చాలని, లేకపొతే పొలం జప్తు చేస్తామని బ్యాంకు నోటీసు వచ్చింది.

దారులన్ని ఒకొక్కటే మూసుకుపోతున్నాయనిపించింది. “భూమికూడా పోతే ,ఇంకెలాగురా మనం బతికేది? బతుకంతా ఇంకొకరికి ఊడిగం చేయాల్సిందేనా?” అని పిల్లాడిలా నాన్న రాత్రి నా మంచం పక్కన కూర్చోని తల మీద చేతులేసుకోని ఏడ్చాడు.

ఆయన కళ్ళలో నిస్సహాయత కన్నా తప్పు చేస్తున్నాననే భావన ఎక్కువగా కనిపించింది. గడ్డికని తెల్లారెళ్ళిన నాన్న ఎంతకూ రాకపోయేసరికి పొలం వైపు వెళ్ళాను. చెట్టుకి సుఖ దుఃఖాల నడుమ ఉరితాడుతో నాన్న ఉయ్యాలూగుతున్నాడు.

రైతుగానే చనిపోతానన్న నాన్న మాటాలు గుర్తొచ్చాయి. కష్టాలన్నీ తీరిపోయి తేలికవుతానని అనుకున్నడేమో కాని ఇప్పుడే నాన్న బరువుగా అనిపించాడు. కిందకి దించలేక చుట్టింటి తాతదగ్గరకెళ్తే ‘ఇంకెవరికీ చెప్పొద్దనీ, ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్సు డబ్బు రాకపోగా, ఊళ్ళో వాళ్ళందరూ హేళనగా చూస్తార’ని చెప్పాడు.

దు:ఖాన్ని తాత భుజం మీద పడి కాస్త దించుకున్నాను. ఇద్దరం కలిసి నాన్నని చెట్టు నుంచి దించాం. ఎవరూ చూడకుండా నాన్నని భుజాలపై మోసుకెళ్ళి పాకలో పడుకోబెట్టి ఏమీ తెలియనట్టుగా తాతతో బయటకెళ్ళిపోయాను.

అబద్ధపు అస్తిత్వపు చుట్టూ బతికిన నాన్న అబద్ధంగానే చనిపోయాడు. సమాజం రైతు చుట్టూ అల్లిన ఒక విషవలయంలో నాన్న చిక్కుకున్నాడు. రైతనే ఉనికి కంటే జీవితం గొప్పదని తెలుసుకోలేకపొయాడు. రైతనే అస్తిత్వం కోసం ప్రాణలనే విడిచాడు.

నువ్వు చనిపోలేదు నాన్నా! ఆత్మహత్య చేయబడ్డావు! అని గట్టిగా అరవాలనిపించింది కాని పొలం మీదున్న అప్పు నా నోటిని మూసేసింది.

 

***

రోడ్డు మీద గతుకులు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించట్లేదు. నాతో పాటు చాల మంది కూలీలుగా

తెల్లారిగట్టే వెళ్ళి, నడిరేతిరికి ఇదే బస్సులో వస్తున్నారు. ఎవరైనా ‘నీవెవర’ని అడిగితే ఎండిపొయిన ఎకరన్నర ఆసామినని చెప్పుకోవాలా లేక పలుగు, పార పట్టి మురుక్కాల్వలు తవ్వే రోజువారీ కూలి అని చెప్పాలా అనే సంకట స్థితిలో నేను లేను. నిస్పృహ లోంచి వెలుగు పంచే చిన్న చిరునవ్వొక్కటే నా దగ్గర సమాధానంగా మిగుల్చుకున్నాను కనుక.

చీరకన్నా చిరుగులెక్కువున్న గుడ్డపీలికలనే అమ్మ మళ్ళీ మళ్ళీ కుడుతోంది కూలికెళ్ళే

సమయమైందని. యవ్వనమంతా గుప్పెడన్ని గింజలు సంపాదించడానికే సరిపోయిందని పాకలో అక్క వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుంది – చూడలేక ఆకాశం నల్లముసుగు కప్పుకుంటోంది.

*****

 

 

 

మాస్టర్ కీ!

 

 సురేష్ కుమార్ దిగుమర్తి

 

ఓయీ రాజు!

రాజ్యం పోయిందని రాజసం పోయిందా

రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్

ఆ క్షణాలు పోతే పోనీయ్.. ఆ లక్షణాలేమయ్యోయ్!!

 

నిలబడి చూసేది కాదు కదా ఆట

అయినా ఆడకుండా చూస్తూనే ఉంటావేం

ఎంతకాలం ఈ కాలం చెల్లిన క్రీడలు

చేసే పనిలో వైవిధ్యానికే విలువ

విలువ లేని వివిధ పనులకు కాదు

ఎంతకాలం సాగుతుందీ ’రణం’

వాడ వాడలా నీకోసం నిలబడి

చూపిస్తున్న రాజ్యాంగం కనబడలేదా

అన్నింటికీ సమాధానం అందులోనే

రండి… రాజ్యాంగం గోల్ కొడదాం!!

 

రాజులా గౌరవించమన్నాడు పురుషోత్తముడు

రాజ్యాన్నే ఇచ్చేసాడు  అలెగ్జాండర్

రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్!!

 

వర్గీకరణ అడిగేడిది మనం

రణంగా మార్చేది వాడు

హక్కులడిగితే నాలుక కోస్తాడట

పెద్దాయన పుస్తకం మన దగ్గర లేదని

వాడి ధీమా

ఇప్పుడు

చెదలతోనూ, చెట్లతోనూ, మట్టితోనూ కాదు

మన యుద్దం

మను ధర్మాన్ని తోసి

మన ధర్మాన్ని రాసిన ఆ పుస్తకంతో

రండి… రాజ్యాంగం గోల్ కొడదాం!!

 

గతం ఘనమైనదైనపుడు

భవిష్యత్తూ మనదే

వర్తమానం సంధికాలం

కోల్పోడానికి ఏమీ లేని వాడికి

గెలవడానికీ ఏమీ ఉండదు

యుద్దమే… అవసరమైనపుడు

వ్యర్ధమైన మాటలెందుకు

రండి… రాజ్యాంగం గోల్ కొడదాం!!

 

గాయాల చిట్టాలో

విజయాల పద్దులో

తేల్చుకునే సమయమిది

ముందుగా నడిచిన అడుగులు

స్పూర్తిగా నిలిచిన దిక్కులు

భవిష్యత్తును తాకిన అనుభవాలు

మనల్ని పిలుస్తున్నాయి

 

ఓయీ రాజు!

రాజ్యం పోయిందని రాజసం పోయిందా

రాజసం లేని నీకు రాజ్యమెక్కడొస్తుందోయ్

ఆ క్షణాలు పోతే పోనీయ్.. ఆ లక్షణాలేమయ్యోయ్

రండి… రాజ్యాంగం గోల్ కొడదాం!!

*

 

suresh digumarti

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 15

 

                               [Anne Of Green Gables By L.M.Montgomery ]

 ” ఆహ్ ! ఎంత బావుందీ రోజు !!!  ”  గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అంది ఆన్ – ” ఇలాంటిరోజున ‘ జీవించి ఉండటం ‘ ఎంతో మంచి విషయం… ఇప్పటికింకా  పుట్టనివాళ్ళని తల్చుకుంటే జాలేస్తుంటుంది…వాళ్ళకీ మంచి రోజులు వస్తుంటాయిలేగాని – ‘ ఈ ‘ రోజయితే రాదుగదా ! బడికి వెళ్ళేదారి ఇంత అందంగా ఉండటం ఇంకా బావుంది ”

” ఆ.అవునులే. రోడ్ మీద వెళ్ళటం కంటే ఇలా బాగానే వుంది, అక్కడైతే వేడీ దుమ్మూ ” – డయానా అంది , ఆమెకిలాంటివి పెద్దగా పట్టవు. బుట్టలో తెచ్చుకుంటున్న మూడు రాస్ప్ బెర్రీ కేకులని పరీక్షిస్తూ క్లాస్ లో ఉన్న పదిమంది అమ్మాయిలకీ అవి ఎలా పంచాలో, ఒక్కొక్కళ్ళకీ ఎన్ని ముక్కలు వస్తాయో లెక్కవేసుకుంటోంది ఆమె.  బళ్ళో ఆడపిల్లలందరూ తెచ్చినవన్నీ పోగేసి పంచుకుతినటమే ఆనవాయితీ. ఆన్ , తనూ మటుకే ఆ కేకులు తినేస్తే డయానాకి అందరూ ‘ పిసినారిపిల్ల ‘ అని పేరుపెట్టే అవకాశం బలంగా ఉంది…కాని ఉన్నవేమో మూడే- మనసొప్పటం లేదు.

వాళ్ళు వెళుతూ ఉన్నదారి నిజంగానే అందంగా ఉంటుంది. అలా డయానా తో కలిసి నడవటం ఆన్ కి కలల సాకారం వంటిది- దాన్ని అంతకన్న బాగా ఊహించుకోవటానికేమీ లేదనేంతగా. గ్రీన్ గేబుల్స్ పళ్ళతోట కి దిగువన ‘ ప్రేమపథం ‘ మొదలవుతుంది. దూరంగా కనిపించే అడవిలోపలివరకూ వెళుతుంది. రోజూ ఆవులు  మేతకి వెళ్ళేది అటువైపునుంచే . గ్రీన్ గేబుల్స్ కి వచ్చిన నెలరోజుల లోపే ఆ దారికి ప్రేమపథం అని ఆన్ పేరు పెట్టేసింది.

” అంటే అక్కడెవరో ‘ ప్రేమికులు ‘ నడుస్తారని కాదూ” – ఆన్ మెరిల్లాకి వివరించింది – ” డయానా నేనూ ఒక బ్రహ్మాండమైన పుస్తకం చదువుతున్నాం…అందులో  ప్రేమపథం అని ఒక చక్క- టి దారి ఉంటుంది .  అందుకని మాకూ ఒకటి ఉండాలనుకున్నాం. ఎంత బావుందో  కదూ ?  అక్కడికి  ఎవ్వరూ రారు – హాయి గా పైకే ఆలోచించుకుంటూ పోవచ్చు – ఎవరూ నన్ను పిచ్చిమొహం అనరు …అందుకు నాకిష్టం. ”

రోజూ  పొద్దున ఆన్ ఒక్కతీ బయల్దేరి వాగు వరకూ వెళుతుంది. అక్కడ డయానా వచ్చి కలుసుకుంటుంది. ఇద్దరూ మేపుల్ చెట్ల వంపు కిందినుంచి నడుస్తారు. ఆన్ అంటుంది – ” మేపుల్ చెట్లు ఎంత కలుపుగోలుగా ఉంటాయో..ఎప్పుడూ మనకి ఏమిటో చెబుతున్నట్లే ఉంటుంది వాటి ఆకులు కదుల్తుంటే ”. వంతెన దగ్గర ప్రేమపథాన్ని వదిలి బారీల పొలం వెనకనుంచి వెళ్ళి , విల్లో మియర్ దాటి వయొలెట్ లోయమీదుగా వెళ్ళాలి . మిస్టర్ ఆండ్రూ బెల్ వాళ్ళ చిట్టడివి కి ఆనుకున్న   ఆకుపచ్చటి పల్లపు ప్రాంత మే  వయొలెట్ లోయ . ” ఇప్పుడు అక్కడ వయొలెట్ లు లేవులే అనుకో ” ఆన్ మెరిల్లా కి చెప్పింది – ” వసంతకాలం వచ్చినప్పుడు లక్షల కొద్దీ పూస్తాయట- డయానా చెప్పింది.

అన్నేసి పూలు అలా .. నీకు   కళ్ళముందు కనిపించట్లేదూ మెరిల్లా – నాకైతే , ఊహించుకుంటే సంతోషం తో ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. మంచి చోట్లకి  మంచి పేర్లు పెట్టటం లో  నన్ను మించినవాళ్ళని చూడలేదని డయానా అంది తెలుసా ? ఏదో ఒకదానిలో గొప్పగా ఉండటం బావుంటుంది. ‘ బర్చ్ దారి ‘ కి మటుకు డయానా యే పేరు పెట్టింది. తను పెడతానని సరదా పడింది, అందుకని పెట్టనిచ్చాను. నేనైతే ఇంకా కవితాత్మకంగా పెట్టి ఉండేదాన్ని ..కాని ప్రపంచం మొత్తం మీద చక్కటి ప్రదేశాల్లో బర్చ్ దారి ఒకటి  …”

ఆ మాట నిజమే. ఆన్ మాత్రమే కాకుండా ఆ దారివెంట నడిచిన ఇంకొందరూ అలాగే  అనుకున్నారు.  ఆ సన్నటి మెలికల బాట మిస్టర్ బెల్ చిట్టడివిలోంచి కొండ మీదికి ఎక్కుతుంది.  ఆకుపచ్చని తెరల్లోంచి వడకట్టబడే సూర్యకాంతి మరకతాలు కరిగి ప్రవహిస్తున్నట్లుంటుంది. దారి పొడుగునా లేతవయసు బర్చ్ చెట్లు,  వాటి నాజూకైన కొమ్మలు.  మధ్యలో  ఫెర్న్  మొక్కలు, నక్షత్రపు పూలూ , లోయలిల్లీ పూలూ .  ఎర్రటి అడవి బెర్రీ లు విరగకాసి ఉంటాయి. అక్కడంతా  ఘాటైన సువాసన ,  ఆహ్లాదంగా .  పక్షుల పాటలూ  చెట్లమీద గలగలా నవ్వే అడివిగాలులు. శబ్దం లేకుండా నడిస్తే అడపాదడపా అటూ ఇటూ పరుగు తీసే కుందేళ్ళుకూడా కనిపిస్తుంటాయి. ఆన్, డయానా ల విషయం లో సహజంగానే అది ఎప్పుడో గాని జరగదు- వాళ్ళు మాటలు ఆపితే కదా !  కొండ దిగాక ఆ దారి పెద్ద వీధిలో కలుస్తుంది- ఇక అక్కడికి బడి దగ్గరే- స్ప్రూస్ గుట్ట ఎక్కి దిగితే చాలు.

అవోన్లియా బడి పొడుగ్గా, కిందికి వాలుతుండే పై  కప్పుతో    , శుభ్రంగా సున్నం వేసి ఉంటుంది.  పెద్ద పెద్ద కిటికీలు. తరగతి గదుల్లో దిట్టమైన పాతకాలపు సొరుగుల బల్లలు. ఆ చెక్క ల మీద మూడు తరాల పిల్లల పేర్లు చెదురుమదురుగా చెక్కబడి ఉంటాయి… అక్కడా అక్కడా వాళ్ళు గీసివెళ్ళిన పువ్వులూ లతలూ మొదలైన కళాకృతులు కూడా. బడి వెనకాలే చిన్న సెలయేరు వెళుతుంటుంది, దాని ఒడ్డున ఫర్ చెట్ల గుబుర్లు. సీసాల్లో తెచ్చుకున్న పాలు అక్కడే పెట్టుకుంటారు పిల్లలు, చల్లగా తియ్యగా ఉంటాయని.

ఆన్ ని మొదటిరోజు బడికి పంపుతూ మెరిల్లా లోలోపల ఆదుర్దా పడింది. ఈ  విడ్డూరపు శాల్తీ  తక్కిన పిల్లలతో కలుస్తుందా ? అసలు పాఠాలు జరిగేప్పుడు నోరు మూసుకుని ఉండగలదా ??

మెరిల్లా భయపడినంత ఘోరంగా లేనట్లుంది పరిస్థితి. ఆన్ ఆ సాయంత్రం మహా ఉత్సాహంగా ఇంటికొచ్చింది.

anne15-1

” ఈ బడికి వెళదామనే అనుకుంటున్నాను. అంటే టీచర్ పెద్ద నచ్చలేదులే. అస్తమానం మీసాలు మెలితిప్పుకుంటూ , ప్రిస్సీ ఆండ్రూస్ వైపు చూస్తూ ఉంటారు ఆయన. ప్రిస్సీ పెద్ద అమ్మాయి, తనకి పదహారేళ్ళట. వచ్చే ఏడు చార్లొట్ టౌన్ లో క్వీన్స్ అకాడమీ లో చేరేందుకు  ప్రవేశపరీక్ష రాస్తుందట, దానికోసం చదువుతోంది. తన జుట్టు భలే నల్లగా మెరుస్తూ ఉంటుంది..తనేమో తెల్ల..గా , చక్కగా ఉంటుంది. టిల్లీ  బౌల్టర్ అందీ, టీచర్  ప్రిస్సీ అంటే పడిచచ్చిపోతారని. ప్రిస్సీ అందరికంటే వెనకాల ,  పొడుగుబల్ల మీద కూర్చుంటుంది., తనకి పాఠం వివరిస్తానని  టీచర్ కూడా అక్కడే  కూర్చుంటారు. ప్రిస్సీ పలకమీద ఆయనేదో రాస్తే చదివి, ప్రిస్సీ మొహం బీట్ రూట్ లా ఎర్ర..గా అయిపోయిందట. కిసుక్కున నవ్విందట  కూడా.  రూబీ గిల్స్ చెప్పింది నాకు – అది పాఠాలకి సంబంధించిందైతే అస్సలు కాదని ”

” ఆన్ షిర్లే ! ” కోపంగా అడ్డుకుంది మెరిల్లా. ” టీచర్ గురించి ఇలాగేనా మాట్లాడేది ? నీకు తెలీనివేవో  ఆయన కి తెలుసా లేదా ? చెబుతారు  – నీ పని నేర్చుకోవటం మాత్రమే, ఆయన మంచిచెడ్డలు చర్చించటం కాదు. ఇలాంటి పిచ్చి కబుర్లు ఇంకెప్పుడూ చెప్పకు నాకు , గుర్తుంచుకో. ఇంతకీ ఎలావెలగబెట్టావు  బళ్ళో ? ”

” బుద్ధిగానే ఉన్నాగా ” – వక్కాణించింది ఆన్.  ” అంత కష్టంగా ఏమీ లేదులే. డయానా పక్కనే కూర్చున్నాను , ఇంకో పక్కనేమో కిటికీ ఉంది, అందులోంచి ప్రకాశమాన సరోవరం కనిపిస్తుంటుంది. ఆడుకుందుకు అంతమంది అమ్మాయిలు దొరకటం ఎంతో బావుంది. అయినా డయానా తర్వాతే ఎవరైనా, డయానా అంటే నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళందరికంటే నేను వెనకబడి ఉన్నాను- అందరూ అయిదో వాచకం చదువుతుంటే నేనింకా నాలుగోదాన్లోనే ఉన్నాను. కాని నాకున్నంత ఊహాశక్తి వాళ్ళెవరికీ లేదు, అర్థమైపోయింది నాకు. మిస్టర్ ఫిలిప్స్ నా స్పెల్లింగ్ చాలా ఘోరంగా ఉందన్నారు. నా తప్పులన్నిటినీ అడ్డంగా  కొట్టేసి , ఆ  పలకని ఎత్తి పట్టుకుని అందరికీ చూపించారు.  బాధేసింది నాకు –  కొత్తగా వచ్చాను కదా, ఇంకొంచెం మర్యాదగా ఉంటే ఏం పోతుంది ? రూబీ గిల్లిస్ నాకొక ఆపిల్ పండు ఇచ్చింది. సోఫియా స్లోన్ ఒక గులాబి రంగు కార్డ్ ఇచ్చింది – దాని మీద ‘ నేను మీ ఇంటికి రావచ్చా ? ‘ అని ఉంది. రేపు వెనక్కి పట్టుకుపోయి ఇచ్చెయ్యాలి తనకి. టిల్లీ బౌల్టర్ తన పూసల ఉంగరం నన్ను పెట్టుకోనిచ్చింది మధ్యాహ్నమంతా .  మనింట్లో పిన్ కుషన్ కి గుచ్చి విడి పూసలున్నాయి కదా, వాటిని తీసుకోవద్దా ..నేనూ ఉంగరం తయారు చేసుకుంటాను ? ఇంకానేమో మెరిల్లా – జేన్ ఆండ్రూస్ నాతో అందీ…మిన్నీ మెక్ ఫెర్సన్ చెప్పిందట తనకి – ప్రిస్సీ ఆండ్రూస్ నా ముక్కు బావుందని సారా గిల్లిస్ తో అంటుంటే విన్నానని. నా మొహం లో దేన్నైనా ఎవరైనా మెచ్చుకోవటం ఇదే మొదలు…ఏమిటో కంగారుగా ఉంది నాకు. నా ముక్కు నిజంగానే బావుంటుందా – నిజం చెప్పవా మెరిల్లా ? ”

” దానికేం..బాగానే ఉంది ” మెరిల్లా అంది. లోపల్లోపల అనుకుంది, నిజంగానే ఆన్ ముక్కు చక్కగా ఉంటుందని – అయితే ఆమాట ఆన్ తో చెప్పదల్చుకోలేదు.

ఇదంతా జరిగి మూడు వారాలైంది. ఇంతవరకూ అంతా సవ్యంగా, సాఫీగా జరిగిపోయింది. అది  సెప్టెంబర్ నెల… పెళపెళలాడే ఉదయం . ఆన్, డయానా – బర్చ్ దారిలో ఉల్లాసంగా , గబగబా వెళుతున్నారు.

” ఇవాళ గిల్బర్ట్ బ్లైత్ బడికొస్తాడనుకుంటాను  ”  – డయానా అంది . ” ఈ వేసంకాలమంతా న్యూ బర్న్స్ విక్ కి వాళ్ళ అత్తా వాళ్ళింటికి వెళ్ళి ఉన్నాడులే . శనివారం రాత్రే వచ్చాడట.  చాలా బావుంటాడు తెలుసా…ఆడపిల్లల్ని తె-గ ఏడిపిస్తాడు – ప్రాణాలు పోతుంటాయనుకో ”

డయానా చెప్పే తీరు చూస్తే ఆ  ‘ ప్రాణాలు పోతుండటం ‘  బాగానే ఉండే ట్లుంది.

anne15-2

” గిల్బర్ట్ బ్లైత్ ? ” ఆన్ అడిగింది – ” జూలియా బెల్స్ తో కలిపి అతని పేరు గోడ మీద రాశారు కదూ , అతనేనా ? ”

” ఆ. జూలియా అంటే అతనికేం ఇష్టం లేదన్నాడటలే – ఆమె మొహం మీది freckles  చూసి ఎక్కాలు నేర్చుకోవచ్చన్నాడట ”

” freckles గురించి నా దగ్గర  అనద్దు దయచేసి  ” – ” నా మొహానే ఇన్ని ఉండగా వాటి గురించి మాట్లాడటం ఏమీ  బావుండదు. ఇలా అబ్బాయీ అమ్మాయిల పేర్లు గోడల మీద రాయటమంతా తిక్క వ్యవహారం. నా పేరెవరైనా రాస్తే అప్పుడు చెబుతా- ఆ… రాస్తారని కాదులే ”

ఆన్ నిట్టూర్చింది. అలా రాయించుకోవాలని ఆమెకి లేకపోయినా , రాసే అవకాశమే ఉండకపోవటం అవమానకరంగా తోచింది.

” నా మొహం !  ” డయానా అంది . ఆమె నల్ల నల్లని కళ్ళూ మెరిసిపోయే జుట్టూ అవోన్లియా అబ్బాయిల గుండెలని రెప రెపలాడిస్తూ ఉంటాయి. దరిమిలా ఆరేడు సార్లు ఆమె పేరు గోడల మీదికి ఎక్కే ఉంది. ” అంతా ఉట్టుట్టినే.. ఏం ఉండదు వాటిలో. నీ పేరు ఎప్పుడూ ఎక్కదనేమీ అనుకోకు – చార్లెస్ స్లోన్ కి నువ్వంటే ఇష్టంలాగా ఉంది. నువ్వు చాలా తెలివైనదానివని వాళ్ళ అమ్మతో చెప్పాడట- అ- మ్మ- తో- నే, ఏకంగా ! ! అందంగా ఉన్నావనటం  కన్న అది మెరుగైన విషయం కదా ? ”

” కాదు- అస్సలు కాదు ” ఆన్ నిరాకరించింది – ఆమె అణువు అణువునా ఆడపిల్ల. ” రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకొమ్మంటే అందాన్నే ఎంచుకుంటాను నేను. చార్లెస్ స్లోన్ ఏమీ బావుండడు – మిడిగుడ్లవాళ్ళు అసలు నచ్చరు నాకు. చార్లెస్ పేరూ నాదీ గోడ మీద ఎక్కితే ఏ మాత్రం భరించలేను నేను . క్లాస్ లో ఫస్ట్ రావటం బాగానే ఉంటుందనుకో … ”

” ఇప్పుడు గిల్బర్ట్ వస్తాడుగా , నీకు పోటీగా ! చాలా తెలివిగలవాడు – వాళ్ళ నాన్న ఆరోగ్యం బావుండక మూడేళ్ళపాటు వేరే ఊళ్ళో ఉండి , అక్కడ బడి సరిగా లేక , వెనకబడ్డాడు గానీ అసలు నీ క్లాస్ లో ఉండాల్సినవాడు కాదు , చార్లొట్ టౌన్ కి వెళ్ళి చదువుతుండేవాడు ఈపాటికి.. ఇకమీదట నువ్వు ఫస్ట్ రావటం అంత సులువేమీ కాదు  ”

” మంచిదే ” ఆన్ వెంటనే అంది . ” నా క్లాస్ లో అందరూ బొట్టికాయలే, వాళ్ళలో ఫస్ట్ రావటం ఏం గొప్ప ! బాగా చదువుతారనుకునే పిల్లలకి  కూడా ఏమీ రావు సరిగ్గా. నిన్న నేను ebullition  అనే పదం చెబితే ఒక్కళ్ళకీ స్పెల్లింగ్ తెలీలేదు ”

మధ్యమధ్యలో కొన్ని పాఠాలకి అందరూ కలుస్తుండేవారు. అప్పుడు ,  ప్రిస్సీ ఆండ్రూస్ లాటిన్ పాఠాన్ని మిస్టర్ ఫిలిప్స్ పర్యవేక్షిస్తూ ఉండగా డయానా ఆన్ కి రహస్యంగా చెప్పింది – ” అడుగో, చూడు – ఆ చివర్నుంచీ రెండోవాడే గిల్బర్ట్. బావున్నాడు కదూ ? ”

ఆన్ చూసింది. చాలాసేపే చూసే అవకాశం దొరికింది – తన ముందర వరసలో కూర్చుని ఉన్న రూబీ గిల్లిస్ జడని కుర్చీకి తగిలించి కదలకుండా పిన్ పెట్టే   ప్రయత్నంలో గిల్బర్ట్ శ్రద్ధగా నిమగ్నుడై ఉన్నాడు.. అది ఫలించింది.  రూబీ మాస్టారికి లెక్క చూపించబోతూ గబుక్కున లేచింది…కెవ్వుమంది- తన జడ మొదలంటా ఊడొచ్చిందనే అనుకుంది పాపం. అందరూ రూబీ వైపు చూశారు. మిస్టర్ ఫిలిప్స్ ఎంతలా ఉరిమి చూశాడంటే  రూబీ కి హడలు పుట్టి గోలు గోలున ఏడవటం మొదలెట్టింది. గుట్టు చప్పుడు కాకుండా పిన్ తీసి దాచిపెట్టి, గిల్బర్ట్ ఏమీ ఎరగనట్లు చరిత్ర పాఠం చదువుకుంటున్నాడు. ఆన్ తనవైపే చూస్తూ ఉండటం అప్పటికి గమనించి నాలుక బయటపెట్టి  వెక్కిరించాడు.

” గిల్బర్ట్ నిజంగానే బావున్నాడు ” ఆన్ ఒప్పుకుంది డయానా దగ్గర. ” కాకపోతే ధైర్యం మరీ ఎక్కువలాగుంది – ముక్కూమొహం తెలియని అమ్మాయిలని చూసి   అలా ఎవరైనా వెక్కిరిస్తారా ? ”

అయితే ఆ రోజు మధ్యాహ్నానికిగాని అసలు కథ మొదలవలేదు.

                                                               [ ఇంకా ఉంది ]

తెలుగుసేత: మైథిలీ అబ్బరాజు

Insta photo editor1439479795873 (1)

 

 

 

 

 

 

వివాహం జరిగింది…విషాదం మిగిలింది

స్లీమన్ కథ-8

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!

[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]

అతనికి సొంత గుర్రపు బండి ఉంది. సువిశాలమైన అతని నివాసం, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ అత్యుత్తమ వీధిలో ఉంది. అందులో రెండు డ్రాయింగ్ రూములు, ఏడు పడగ్గదులు, అయిదు ఇతర గదులు, ఓ పెద్ద వంటగది, గుర్రపుశాల, ఓ పెద్ద నేలమాళిగ, గుర్రపు బండి ఉంచడానికి ఒక గ్యారేజి…! అత్యంత శ్రేష్ఠమైన అన్ని రకాల మద్యాలూ ఆ నేలమాళిగలో అందుబాటులో ఉంటాయి. ఎంతో ఖరీదు చేసే మూడు జాతిగుర్రాలు ఆ గ్యారేజిలో సిద్ధంగా ఉంటాయి.

అతను కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఓ పెద్ద సంపదను కొల్లగొట్టుకొచ్చాడన్న ప్రచారం నగరమంతటా మోతెక్కిపోయింది. దాంతో, సాహసికుడైన ఈ వ్యాపారవేత్తనుంచి ఆహ్వానం అందుకోడానికి రాచకుటుంబీకులు, వ్యాపార ప్రముఖులు తహతహలాడారు.  అతనిలో డాబుకూ, దర్పానికీ లోటులేదు. ఉన్నతవర్గాలలో కలసిపోవడానికి అవసరమైన నాజూకు పద్ధతులను అప్పటికే అలవరచుకున్నాడు. ఒక్కోసారి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. ఒకే ఒక్క అతిథి గదిని అలంకరించడానికి ఓసారి వెయ్యి రూబుళ్ళు వెచ్చించాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ మొత్తంలో అతనంత అదృష్టవంతుడు, అంత స్నేహయోగ్యుడు ఇంకొకరు లేరని అందరూ అనుకుంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడు కాదగిన వాళ్ళ జాబితాలో అతని పేరు కూడా ఉంది!

ఇదంతా పైకి కనిపించే మనిషి గురించి. కానీ లోపలి మనిషి వేరు. ఇద్దరి మధ్యా పోలిక లేదు. అతని లోపల జ్వాలలు రేగుతున్నాయి. తీరని లైంగికేచ్ఛ అతనికి పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అమరింది కానీ, ఇల్లాలు, పిల్లల కోసం తపిస్తున్నాడు. గతంలో ఓసారి ఎకతెరీనా లిషిన్ ముందు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అప్పటికే తను సంపన్న వర్తకులలో ఒకడు. కానీ లిషిన్ ఇష్టపడలేదు. అయినా అతనిలో ఆశ చావలేదు.

Ikaterina Lishin

సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చిన మరునాడే ఆమె ఇంటికి వెళ్ళాడు.  ఆ తర్వాత కూడా కొన్ని వారాలపాటు తరచు ఆమెను కలసుకుంటూనే వచ్చాడు. రాను రాను ఆమెను తను గాఢంగా ప్రేమిస్తున్నట్టు అనిపించింది. తన జీవితాంతం ఆమెను ప్రేమిస్తూనే ఉండాలని కూడా అనుకున్నాడు. మంచితనం, దయ, నిరాడంబరత, ఏం చెప్పినా శ్రద్ధగా వినే తత్వం సహా తను కోరుకునే సుగుణాలు అన్నీ ఆమెలో అతనికి కనిపించాయి. తన ఇంట్లో ఉన్నా, వర్తకప్రముఖుల ఇళ్ళల్లో విందు వినోదాలలో పాల్గొంటున్నా ఆమె ఒకే తీరుగా నిండుకుండలా ఉంటుందనుకున్నాడు. అతనామెను అమితంగా ఆరాధించాడు. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తానని వాగ్దానం చేశాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకుంది!

ఆ క్షణంనుంచీ అతను భూమికి ఆమడ ఎత్తున ఊరేగాడు. 1852 అక్టోబర్ 12- పెళ్లిరోజున ఇంటికి ఇలా ఉత్తరం రాశాడు:

ఈరోజు ఎకతెరీనా లిషిన్ అనే ఒక రష్యన్ యువతికి భర్తనయ్యే సంతోషం నాకు దక్కింది. శారీరకంగా, మానసికంగా కూడా నా భార్య ఓ పరిపూర్ణస్త్రీ. మంచితనం, నిరాడంబరత, తెలివి, వివేకం మూర్తీభవించినది. ఆమెపై నా ప్రేమ, గౌరవాలు రోజు రోజుకీ ఇనుమడిస్తున్నాయి. ఈ సంతోషభరితమైన వివాహాన్ని పురస్కరించుకుని జీవితాంతం సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

అయితే, తన వివాహం గురించిన ఇంత అందమైన ఊహా ఇసుకగూడు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. “ఈ పెళ్లి పూర్తిగా ఒక తప్పుడు నిర్ణయం. నాకిప్పుడు పిచ్చెక్కేలా ఉం”దని…ఆ తర్వాత కొన్ని వారాలకే తోబుట్టువులకు ఉత్తరం రాశాడు. కొంతమందిలో కోరికల మంట మృదువుగా, కనిపించీ కనిపించని జ్వాలలా ఉంటుందనీ, కానీ నాలోని తీరని కోరికల మంట దావాగ్నిలా మారి నన్నే దహించివేస్తోందనీ ఆవేదన చెందాడు.

భార్యనుంచి అనురాగపు వెచ్చదనాన్ని ఆశించాడు. కానీ ఆమె దేనికీ లొంగని జడపదార్థం అయింది.  అంతమంది రష్యన్ యువతుల నుంచి తను ఏరికోరి వరించిన ఈ యువతి; స్త్రీ సహజమైన ఎలాంటి సున్నితత్వమూ, స్పందనా లేని పరమ గయ్యాళి అతనికి అర్థమైంది. అతనితో పడకను పంచుకోవడానికి ఆమె నిరాకరించింది. మాటి మాటికీ అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూవచ్చింది. ఆమె కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందనీ, తను చస్తే ఆస్తిని ఎగరేసుకుపోవడానికి చూస్తోందనే భావన అతనిలో బలపడిపోయింది.

మిన్నా మెయింక్ తో అతని ప్రేమ, పెళ్ళికి దారితీయలేదు. ఎకతెరీనా లిషిన్ తో పెళ్లి, ప్రేమకు దారితీయలేదు. మొత్తానికి ప్రేమా, పెళ్లీ…రెండూ అతనికి కలసి రాలేదు!

ఈ పెళ్లి అతనికి ఎంతటి ఆఘాతం అయిందంటే; సలహాను, ఓదార్పునూ కోరుకుంటూ తోబుట్టువులతోపాటు మిత్రులకు కూడా వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. అయితే ఎవరి నుంచీ ఎలాంటి ఓదార్పూ దొరకలేదు. “నువ్వన్నట్టు ఎకతెరీనాకు నీ మీద ప్రేమ లేదనే అనుకుందాం. అయినాసరే నిన్ను పెళ్లాడిన మేరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందన్న వాస్తవాన్ని నువ్వు మరచిపోకూడదు” అని ఏమ్ స్టడామ్ నుంచి ఒక మిత్రుడు రాశాడు. “బహుశా ఆమె మరీ అంత చెడ్డది కాకపోవచ్చు, నీ పిసినారితనం చూసి భయపడి ఉంటుంది, ఆమె పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆమె నీపై ప్రేమాభిమానాలు చూపవచ్చు”అని  సలహా ఇచ్చాడు. తోబుట్టువుల నుంచి వచ్చిన స్పందన కూడా ఇదే ధోరణిలో ఉంది. “నువ్వో పెద్ద జడపదార్థానివి కనుకే నీ భార్య అలా అయుంటుంది, కాస్త మనిషిలా ప్రవర్తించడం నేర్చుకొ, నువ్వు ఒకరికి ప్రేమ ఇస్తేనే ప్రేమ పొందగలుగుతా”వని హితవు చెప్పారు.

అయితే, మనిషిగా జీవించడం ఎలాగో నేర్పే స్కూలు ఏదీ అతనికి దొరకలేదు!

దాంతో చేసేది లేక పూర్తిగా తన వ్యాపారప్రపంచంలో కూరుకుపోయాడు. ఆ ప్రపంచానికి తనే యజమాని. అక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా రాణించాలో అతనికే బాగా తెలుసు, ఎవరూ నేర్పనక్కర్లేదు.

స్వభావరీత్యానే అతనిలో ఓ జూదగాడు ఉన్నాడు. రష్యాకు తిరిగొచ్చాక తన సంపదనంతటినీ నీలిమందు వ్యాపారం మీద పెట్టేసాడు. మార్కెట్ ను తనే నియంత్రించే స్థాయికి వెళ్ళాడు. పెళ్ళైన కొన్ని వారాలకే మాస్కోలో తన కార్యాలయ శాఖను తెరిచి దాని నిర్వహణ బాధ్యతను మిత్రుడు అలెగ్జీ మద్వీవ్ కు అప్పగించాడు. ఇప్పటికీ రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లడం చాలా అరుదైపోయింది. ఎప్పుడూ ధుమధుమలాడుతూ పెడసరపు మాటలతో నొప్పించే భార్యకు ఎదుట పడడానికి జంకి, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ముఖ్యకార్యాలయంలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. మధ్య మధ్య దేశదిమ్మరిలా రష్యా చుట్టివస్తున్నాడు.

మనసుకింత ఆనందాన్నీ, విశ్రాంతినీ కలిగించే ఇతరేతర ఆసక్తులేవీ అతనికి లేకుండా పోయాయి. చిన్నప్పటినుంచీ తను అభిమానిస్తూ వచ్చిన హోమర్ కూ; గ్రీకు, రోమన్ పురాతన చరిత్రకూ కూడా దూరమైపోయాడు. ఇప్పుడతనికి పూర్తిగా వ్యాపారమే మత్తుమందూ, వ్యసనమూ  అయిపోయింది. క్రోన్ స్టట్ షిప్పింగ్ జర్నల్  ప్రతులను తండ్రికి పంపడంలో మాత్రం ఆనందం పొందేవాడు. అందులో; వచ్చి పోయే సరకు రవాణా నౌకల పేర్లు; ఆ సరకు యజమానులు, దానిని అందుకోబోయే వాళ్ళ పేర్లు ఉంటాయి. వాటన్నింట్లోనూ హెచ్. స్లీమన్ & కోకు నీలిమందు తీసుకువెడుతున్న నౌకల జాబితాయే పెద్దది. 1853లో ఆ కంపెనీకి పదమూడు నౌకల్లో నీలిమందు రవాణా జరిగినట్టు, ఆ కంపెనీ నుంచి మూడు నౌకలు బయటికి వెళ్ళినట్టు అప్పటి నివేదిక చెబుతోంది.

అయితే ఇది పాక్షిక సమాచారం మాత్రమే. ఇంకా వేలాది వాహనాల్లో కోనిగ్స్ బర్గ్ నుంచీ, మేమల్ నుంచీ అతని కంపెనీకి సరకు రవాణా అవుతుండేది. తన వ్యాపార పరిమాణం ఇప్పుడు నెలకు పది లక్షల సిల్వర్ రూబుళ్లనీ, అంతూపొంతూ లేకుండా అది ఇంకా పెరుగుతూనే ఉందనీ, డబ్బు సంచుల మీద డబ్బు సంచులు, బంగారం మీద బంగారం వచ్చిపడుతున్నాయనీ తండ్రికి ఉత్తరం రాశాడు. అయినాసరే, జీవితంలో తను కోరుకున్న సంతోషం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని సంగతినీ బయటపెట్టుకున్నాడు.

వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడపాలన్న పాత కల ఇప్పుడు కొత్తగా తిరగబెడుతోంది. అయితే ఒక తేడా: మెక్లం బర్గ్ కు బదులు అమెరికా వెళ్ళిపోయి, అక్కడో వ్యవసాయకభూమిని కొనుక్కుని అక్కడే ఉండిపోవాలని  ఇప్పుడు అనుకుంటున్నాడు. “పల్లె జీవితాన్నే నేను ఎక్కువ ఆనందించగలననిపిస్తోంది. వ్యవసాయంలోనూ, దానిని అభివృద్ధి చేసుకోడంలోనూ చేతినిండా పని ఉంటుందనే నేను నమ్ముతున్నాను” అని అమెరికాలోని ఓ మిత్రుడికి రాశాడు.

నిజానికి ఒక వ్యవసాయదారునిలో ఉండవలసిన లక్షణాలేవీ అతనిలో లేవు. ముఖ్యంగా విత్తు నాటి అది పంట అయ్యేవరకూ ఓపికగా ఎదురుచూడడం అతనివల్ల కాదు. ఉరుకులూ పరుగుల జీవితం అతనిది. ఊపిరి సలపనంత వేగంగా నిరంతరం పని చేస్తూ ఉండవలసిందే. రోజులో ఏ కొన్ని క్షణాలైనా వ్యాపార సంబంధమైన పనిలో గడపకపోతే అతనికి వల్లమాలిన కోపం వస్తుంది. వ్యవసాయం గురించిన ఊహల్లో మరోసారి మునిగి తేలుతున్న ఈ రోజుల్లోనే తండ్రికి ఉత్తరం రాస్తూ, “ఇక వ్యాపారం కట్టిపెట్టి ప్రశాంత జీవితం గడపమని మంచి ఉద్దేశంతోనే నువ్వు సలహా ఇచ్చావు కానీ, దానిని నేను పాటించలేను. క్షణం తీరిక లేని కార్యకలాపాల్లో కూరుకుపోవడానికి నేను అలవాటు పడిపోయాను. ఎలాంటి అనుకూల పరిస్థితుల్లోనైనా సరే, కాస్సేపు స్తబ్ధంగా గడిపితే పిచ్చాసుపత్రిలో చేరాల్సివస్తుంది” అన్నాడు.

అప్పటికే అతను ఒక్కొక్కసారి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగులు, పనివాళ్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆగ్రహంతో ఊగిపోతూ కేకలు లంకించుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఏజంట్లు తన ఆదేశాలను వెంటనే అమలు చేయనప్పుడు వాళ్ళకు రాసే ఉత్తరాల్లో కూడా ఓ రాక్షసుడిలా విరుచుకుపడుతున్నాడు.

అమెరికాకు పారిపోవాలన్న ఊహ అతన్ని వెంటాడుతూ వచ్చింది పెళ్ళైన ప్రారంభ సంవత్సరాలలో! అయితే, 19వ శతాబ్ది మధ్యకాలంలో రష్యాలో ఉంటూ అమెరికా కలలు కనడమంటే విధ్వంసాన్ని కొని తెచ్చుకోవడమే. ప్లేటో (క్రీ.పూ. 428-348)సృష్టించిన ఊహాద్వీపం ‘అట్లాంటిస్’లానే అప్పటికింకా అమెరికా చాలామంది దృష్టిలో ఒక పౌరాణిక ఊహా ప్రదేశమే. అక్కడి జనం సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉంటారు. కోపమూ, క్రౌర్యమూ నిండిన అధికారవర్గపు నిఘా చూపుల కింద నిరంతరం జీవించే దుస్థితి వారికి ఉండదు. దోస్తోయెస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలో స్విద్రిగైలోవ్ అనే పాత్ర అమెరికా వెళ్లాలని ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ శీతాకాలం రోజున అతను ఓ పెద్ద అధికార భవనం దగ్గర తచ్చాడుతూ ఉంటాడు. ఆ భవనం కాపలాదారుకూ, అతనికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

schliemann

కాపలాదారు: ఇక్కడ నీకేం పని?

స్విద్రిగైలోవ్: అవును, నాకిక్కడ పనేం లేదు.

కాపలాదారు: అయితే ఎందుకొచ్చావ్?

స్విద్రిగైలోవ్: వెళ్లిపోతున్నాను.

కాపలాదారు: ఎక్కడికి?

స్విద్రిగైలోవ్: అమెరికాకు.

కాపలాదారు:  అబ్బో, అమెరికాకే!?

స్విద్రిగైలోవ్ రివాల్వర్ తీస్తాడు. కాపలాదారు నిర్ఘాంతపోతాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, నువ్విక్కడ ఇలాంటి పని చేయకూడదు. ఏం, వేళాకోళంగా ఉందా?

స్విద్రిగైలోవ్: నేను చేస్తున్నది మంచిపనే.

కాపలాదారు: కాదు, కచ్చితంగా కాదు.

స్విద్రిగైలోవ్: ఇందువల్ల ఎవరికీ ఎలాంటి అపకారం లేదు. ఇదీ మిగతా చోట్ల లాంటిదే. వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నిస్తే, అతను అమెరికా వెడుతున్నాడని చెప్పు.

స్విద్రిగైలోవ్ రివాల్వర్ ను తన కణతలకు గురిపెట్టుకున్నాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, ఆ పని చేయద్దు. ఇది నిజంగానే తగిన చోటు కాదు.

స్విద్రిగైలోవ్ ట్రిగ్గర్ నొక్కాడు.

రష్యన్ సాహిత్యం మీద కానీ, అక్కడి తాత్విక వాతావరణంలో సంభవిస్తున్న కల్లోలం మీద కానీ స్లీమన్ ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కాకపోతే రష్యన్ భావోద్రేకాలలో అనివార్యంగా అతనూ పాలుపంచుకుంటున్నాడు. రష్యన్లలానే అతను కూడా అమెరికా తరహా స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. కాలిఫోర్నియాలో కొన్ని మాసాలపాటు దానిని చవి చూశాడు కూడా. అదే సమయంలో రష్యన్లలానే అమెరికా జీవన విధానాలను కొన్నింటిని ఏవగించుకుంటున్నాడు. అమెరికా గురించిన కలల్ని తన ఉత్తరాలలో అతను యధాలాపంగా ప్రస్తావిస్తూ రావడం వెనుక వివాహ వైఫల్యం తాలూకు విషాదం ఉంది.

ఇప్పుడైతే వ్యాపారం ఒక్కటే అతన్ని పట్టుకుని నడిపిస్తోంది. ఆందోళనతో అప్పుడప్పుడు ఉన్మాదం అంచులు తాకుతూ, భార్యను ద్వేషిస్తూ, ఏజంట్లతో గొడవ పడుతూనే; తన ఆవర్జాల(లెడ్జర్లు)ను ముందేసుకుని కూర్చోడంలో భద్రతను, ఓదార్పును పొందుతున్నాడు. సంపద పెరుగుతున్న కొద్దీ, అతనికి దాని అవసరం తగ్గిపోతోంది. అయినప్పటికీ, అతనికి ఉనికీ, ఊపిరీ అన్నీ వ్యాపారమే అయింది. అదే అతని ధ్రువతార. అతని చూపు పడిన ప్రతిదీ లాభంగా మారాల్సిందే. చాలా అరుదైన తీరిక సమయాల్లో మాత్రం తండ్రికి, తోబుట్టువులకు ఉత్తరాలు రాస్తూ, వాటిలో నీతులూ, నిత్యసత్యాలూ బోధిస్తూ, అన్నింట్లోనూ మితంగా జీవించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉపశమనం పొందేవాడు. అతని ఉత్తరాల్లో తప్పనిసరిగా పుల్ల విరుపు ధోరణి ఉండేది. అయినాసరే, అతను పంపే స్వల్ప మొత్తాలకు వాళ్ళు ప్రతిసారీ కృతజ్ఞతలు చెప్పేవారు. ఓసారి తండ్రికి ఇలా ఉత్తరం రాశాడు:

నీ ఖాతాలో 500 టేలర్లు జమ చేయమని ఈరోజే పోస్ట్ లో ఉత్తర్వులు పంపించాను. హైన్ రిచ్ స్లీమన్ తండ్రిగా నీ హోదాకు తగినట్టు డేంజింగ్ లోని నీ కొత్త నివాసంలో అన్ని హంగులూ సమకూర్చుకోడానికి వినియోగిస్తావన్న అత్యంత ఆశాభావంతో ఈ మొత్తం పంపుతున్నాను.

ఈ డబ్బును పంపడంలో నా ఉద్దేశం, నీ ఇంట్లో చక్కని పరిశుభ్రతను పాటిస్తూ, భవిష్యత్తులో ఒక యోగ్యుడైన సేవకుణ్ణీ, యోగ్యురాలైన సేవకురాలినీ నువ్వు నియమించుకునితీరాలనే. నీ పళ్లేలూ, పాత్రలూ, కప్పులూ, కత్తులూ, ఫోర్కులూ అన్నీ శుభ్రంగా, మెరిసిపోతూ ఉండాలనీ; ఇంటి నేలను వారానికి మూడుసార్లు శుభ్రంగా కడిగిస్తావనీ, ఇప్పటి నీ వయోభారానికి తగినట్టుగా టేబుల్ మీదే భోజనం చేస్తూ ఉంటావనీ ఆశిస్తున్నాను.

కోట్లకు పడగెత్తిన అతని ఆదాయంతో పోల్చితే తండ్రికి పంపిన ఈ 500 టేలర్లు చిల్ల పెంకులతో సమానం. అదలా ఉంచితే, ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టకుండా తన వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా అతను విస్తరిస్తున్నాడు. జార్ కొత్త శిక్షాస్మృతిని జారీ చేయబోతున్నట్టు అతనికి తెలిసింది. దాని ముద్రణకు తప్పనిసరిగా మంచి నాణ్యమైన కాగితం వాడతారనీ, వేలాది ప్రతులు అచ్చువేస్తారనీ అతనికి వెంటనే స్ఫురించింది. దాంతో అందుబాటులో ఉన్న నాణ్యమైన కాగితాన్ని కొనేసి ప్రభుత్వానికి అమ్మజూపాడు. ప్రభుత్వం అతని ప్రతిపాదనను అంగీకరించింది.

అయితే, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యమూ కుప్పకూలి, అతన్ని మళ్ళీ బికారిగా మార్చగల భయోద్విగ్నక్షణాలూ త్వరలోనే ఎదురయ్యాయి…

                                                                                                                         (సశేషం)

 

 

 

 

 

గమనమే గమ్యం -13

 

 

olga‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల, నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అలవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే – కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి? ’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

IMG (2)

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే – నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

విశాలాక్షికి ఎవరో గట్టిగా నెత్తిమీద కొట్టినట్లయింది.

‘‘నీ మీద నీకు గౌరవం లేదు. ఎవరో నిన్ను గొప్పదానివనాలా ?’’ అన్న తల్లి మాటలు  అలజడి రేపాయి.

‘‘నిజమేనా? అసలు  సమస్య అదేనా? లోపం తనలోనే ఉందా?’’ విశాలాక్షికి బుర్రంతా గందరగోళమైంది. ఎంత ఆలోచించినా సమస్య తెగలేదు.

‘చిన్నతనం నుంచీ తను పడ్డ అవమానాలు తనకు తెలుసు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుడు కూత కూస్తూనే ఉంటారు. అవి పట్టించుకుని బాధ పడకుండా తను బతికెయ్యాలా? అది తనను తాను గౌరవించుకోవటమవుతుందా? తల్లి అలాగే బతుకుతోందా? ఏనాడూ ఆమె తన వృత్తి గురించి చిన్నతనంగా అనుకోలేదు. గౌరవం లేదని బాధపడలేదు. తనకెక్కడినుంచి ఒచ్చిందీ బాధ. అమ్మలాగా నిబ్బరంగా జీవితంతో తలపడలేకపోతున్నదెందుకు? అమ్మకీ తనకీ తేడా ఉండాలని ఎందుకనుకుంటోంది. అమ్మ తనను తాను గౌరవించుకుంటే తాను నలుగురి గౌరవం కోసం చూస్తోందా? అమ్మ తన జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించి దానితో తలపడుతోంది. తను అంగీకరించకుండా దీనంతటినుంచి బైటపడాలని పోట్లాటకు దిగుతోంది జీవితంలో. తనకు ఎక్కడినుంచి వచ్చింది ఈ అసంతృప్తి?.

కానీ తన ఆలోచనలే సరైనవి. అందరూ గౌరవించాలనుకోవటంలో తప్పేముంది?

తన కులమంటే గౌరవం లేదు తనకు. ఎలా వస్తుంది? ఆ వృత్తి మంచిది కాదు. తనకిష్టం లేదు. ఆ వృత్తి మంచిదని అమ్మెలా అనుకుంటోందో తనకర్థం కాదు. అమ్మకి అసలు ఆ వృత్తి మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు. అది తమ కులవృత్తి. అంతే`

‘‘మంచీలేదు. చెడ్డాలేదు అంటుంది.’’

విశాలాక్షికి తల పగిలి పోతుంది. అతి ప్రయత్నం మీద ఆలోచనల్ని అణిచివేసి మండుతున్న కళ్ళను మూసుకుంది. కళ్ళనుంచి కన్నీళ్ళు కారి కాస్త చల్లబరిచాయి. ఎప్పటికో కాలే కడుపుతో, మండే గుండెతో నిద్రపోయింది విశాలాక్షి.

***

IMG (2)శారద ఎంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటవుతుండగా సన్నగా, బలహీనంగా కనపడుతున్న యువకుడు వచ్చి శారద ఇంటి తలుపు తట్టాడు. శారదే తలుపు తీసింది. అతను శారద చేతిలో చిన్న కాగితం ముక్క పెట్టి ‘‘రేపు సాయంత్రం ఆరుగంటలకు పరశువాకంలో ఈ చిరునామాకి రావాలి. కాగితం చించెయ్యండి’’.

ఆ యువకుడు ఆవేశంగా ఉన్నాడు. దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఆయాస పడుతున్నాడు. ఒళ్ళంతా చెమటు.

శారద సందేహంగా ‘‘మీ పేరు –ఇంత రాత్రి వచ్చారూ – ఏం జరుగుతుంది అక్కడ ? నేనెందుకు?’’ అంటూ సరిగా అడగలేనట్లు ముక్కలు  ముక్కలుగా ప్రశ్నలు  వేసింది.

‘‘అదంతా అక్కడకు వచ్చాక తెలుస్తుంది. ఇది చాలా రహస్య సమావేశం. ఎవరితోనూ చెప్పకండి. ఆ కాగితం చించెయ్యండి. జాగ్రత్త. మీరు రావటం ఎవరైనా గమనించి మీ వెనుక వస్తున్నారనుకుంటే మధ్యలో దారి మార్చి మీ స్నేహితుల ఇంటికి వెళ్ళిపొండి. పరిసరాలు  గమనిస్తూ రండి’’.

శారదకిప్పుడు ఏ సందేహమూ లేదు. అతన్ని చూసి చిరునవ్వుతో  ‘‘మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి రండి’’ అని తలుపు వేసేసింది.

మర్నాడు పగంతా కాలేజీలో ఆస్పత్రిలో ఎలా గడిచిందో శారదకు తెలియదు.

సాయంత్రం సన్నని ఖద్దరు చీర కట్టుకుని తయారై తల్లి దగ్గరకు వెళ్ళింది.

సుబ్బమ్మ శారద ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ‘‘ఎక్కడికెళ్తున్నావు, ఈ వేళప్పుడేమిటి? వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది’’ ఇలాంటి ప్రశ్నలు అడగదు. కూతురి మీద విపరీతమైన నమ్మకం. పిచ్చి ప్రేమ. తన కూతురి వంటి వాళ్ళు ఇంకొకరుండబోరని అనుకుంటుంది.

శారద ఈ రోజు తల్లితో వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తన కోసం ఎదురు చూడకుండా నిద్రపొమ్మనీ చెప్పింది.

‘‘అలాగే – ఇవాళ ఏదో మీటింగున్నట్టుంది. రేపు నాకు ఆ విశేషాలన్నీ చెప్పాలి’’ అంది కూతురితో.

‘‘నే చెప్పక పోయినా నేను ఎక్కడికి ఏ పనిమీద వెళ్తున్నానో నీకెలా తెలుస్తుందమ్మా’’ అనడిగింది శారద.

‘‘నీ ముఖం చూస్తేనే నాకంతా తెలుస్తుందే చిట్టితల్లీ. నా ప్రాణాన్నీ నీ మీదే కదా. నా ప్రాణం సంగతి నాకు తెలియకుండా  ఎట్లా ఉంటుంది?’’.

మొదటిసారి శారదకు తల్లి ప్రేమను చూస్తే భయమేసింది. తానేవేవో పనులు  చెయ్యాలనుకుంటోంది. అమ్మ వాటన్నిటినీ ఆమోదించి తనతో వస్తుందా? రాకపోతే అమ్మకోసం తను ఆగగలదా? ఆగకపోతే అమ్మ ఏమవుతుంది? రెండు నిమిషాల పాటు ఆ ఆలోచన కంగారు పెడితే అలాగే ఆగి, తర్వాత ఈ పిచ్చి ఆలోచనతో ఇప్పుడే ఆగేలా ఉన్నానని నవ్వుకుంటూ బైటికి నడిచింది.

పరశువాకం శారదకు బాగానే తెలుసు. వడిమేలు కోసం వెళ్ళేది. కానీ ఈ చిరునామా అంత తేలికగా దొరకలేదు. ఆ ప్రాంతపు మురికి వాడు తెలుసు గానీ ఇది మరీ లోపలికి ఉంది.

ఆ పరిసరాలు ఎప్పుడూ శారద మనసుని కుంగదీస్తాయి.

వాటిని, అక్కడి మనుషులనూ అంతా పరిశుభ్రంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయగలిగితే?

కమ్యూనిజంలో అది సాధ్యం. కమ్యూనిస్టులే అలా చేయగలుగుతారు అనుకుంటు గుర్తు వెతుకుతూ, సందులు తిరుగుతూ ఆ ఇల్లు చేరుకుంది. ఆ గది కాస్త విశాలంగానే ఉంది. పాతికమంది దాకా ఉన్నారు. శారద తప్ప అందరూ మగవాళ్ళే. ఆశ్చర్యంగా సుదర్శనం, మూర్తీ ఇద్దరూ లేరు. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు తప్ప శారదకు తెలిసిన వాళ్ళు లేరు.

అందరూ శారదను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. వడిమేలు శారద దగ్గరకు వచ్చి పక్కన కూచుని ఒక వ్యక్తిని చూపించి ‘‘సోవియట్‌ రష్యా నుంచి వచ్చిన కామ్రేడ్‌ అతనే’’ అన్నాడు.

అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది.’’ ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్‌ హైదరాలి ఖాన్‌. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో -ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుపార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడిమేలు క్లుప్తంగా ఆయన పరిచయం చేశాడు.

‘‘ఈరోజు నా పేరు శంకరం’’ అంటూ అమీర్‌ హైదరాలి ఖాన్‌ చాలాసేపు మాట్లాడాడు. ముఖ్యంగా వర్గ సిద్ధాంతం గురించీ, వర్గాలనూ, వర్గ ప్రయోజనానూ కాపాడే రాజ్యం గురించి మార్క్సు, ఏంగెల్స్‌, లెనిన్‌లు  ఏం చెప్పారో దాని సారాంశాన్ని చెప్పాడు. శారద ఆయన చెప్పిన వాక్యాలన్నీ శిలా శాసనంలా మనసులో చెక్కుకుంది. పార్టీ నిర్మాణం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి, రహస్యంగా కార్యక్రమాలు నడపాల్సిన తీరు గురించీ ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు.

‘‘మనం కాంగ్రెస్‌లోనే ఉండాలి. కాంగ్రెస్‌లోని అతివాదులతో, సోషలిస్టు భావాలున్న వాళ్ళతో కలిసి పని చెయ్యాలి. ఆ పని చేస్తూనే ప్రజలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింప చేయాలి. ఈ పని పరమ రహస్యంగా జరగాలి. భావాలు ప్రజలోకి తీసికెళ్ళాలి గానీ మనం వీలైనంతవరకూ రహస్యంగానే ఉండాలి’’ అంటూ కొన్ని సూచనలు చేశాడాయన. ఆయన కోసం అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడితే చంపుతారనే భయం ఉంది.

శారదకు ఎంతో బాధ్యత వచ్చి మీదపడినట్లయింది.

కమ్యూనిస్టు సాహిత్యం – మార్క్సు, ఎంగెల్స్‌, లెనిన్‌ రచనలను సంపాదించి చదవటం అత్యవసరమని – అవి చదివి చర్చించుకోవాలని అనుకున్నారు. త్వరలో భగత్‌సింగ్‌ని ఉరితీసి సంవత్సరం అవుతుందనీ, ఆ రోజు ఏదో ఒక పని చేసి ప్రజలలో సంచనం తెచ్చి, భగత్‌సింగ్‌ ఆశయాలను వారి హృదయాకు హత్తుకునేలా చేయాలని అన్నారు వడిమేలు, అమీర్‌.

‘‘దానికింకా నాలుగు నెలల సమయముందిగా’’ అన్నది శారద.

‘‘మనం రహస్యంగా పని చెయ్యాలి గనుక అది తక్కువ సమయమే. మనం బహిరంగంగా సభలు పెట్టి మాట్లాడలేం. కానీ మన ఆలోచనలను, మన భిన్న స్వరం ప్రజకు వినిపించాలి. అది తేలిక కాదు.’’

‘‘ఒక పత్రిక భగత్‌సింగ్‌ ఆశయాలు వివరిస్తూ తెద్దాం’’ శారద వడిమేలుతో అంది.

‘‘ఇక్కడ అచ్చేస్తే పోలీసుకు తెలుస్తుంది. పత్రిక అమ్ముతుంటే వారిని పోలీసులు పట్టుకోవచ్చు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం’’ హైదర్‌ఖాన్‌ మాటతో అందరూ అంగీకరించారు.

రాత్రి తొమ్మిది గంటలవుతుండగా సమావేశం ముగిసిందన్నారు. ఒక్కొక్కరుగా పది పదిహేను నిమిషాల వ్యవధానంలో బైటికి వెళ్ళాలనుకున్నారు. శారదను ముందుగా పంపించారు.

శారద ఇంటికి వచ్చేసరికి పది గంటలయింది.

‘‘ఇంకా ఆలస్యమవుతుందనుకున్నా. త్వరగానే వచ్చావే. ఏం మీటింగమ్మా’’ అప్పుడే పడుకోబోతున్న సుబ్బమ్మ లేచి వచ్చింది.

‘‘తల్లితో కూడా చెప్పకూడని రహస్య సమావేశం’’ మనసులో అనుకుంది శారద.

‘‘ఏదో విద్యార్థుల మీటింగ్‌లేమ్మా. ఉద్యమమంతా చల్లారింది గదా. మళ్ళీ వేడెక్కాంటే ఏం చెయ్యాలా అని మాట్లాడుకున్నాం’’.

‘‘ఆ గాంధీ గారు ఏం చెయ్యమంటే అది చేస్తారు. దానికి మీ ఆలోచనేమిటి? మీరు చెప్పింది ఆయన ఒప్పుకుని చేస్తాడా?’’

‘‘ఆయనకి ఎన్నో పనులమ్మా. ఇక్కడ మనం ఒక్కొక్కరం ఏం చెయ్యాలో పిలిచి చెప్తారా? పెద్ద ఉద్యమమైతే ఆయన అందరికీ పిలుపిస్తాడు. మళ్ళీ పెద్ద సత్యాగ్రహం చేసే లోపల మనం ఊరికే కూర్చోలేం కదా’’.

‘‘ఊరికే ఎక్కడ కూర్చుంటున్నారు. దుర్గ కాకినాడలో సమావేశాలు జరిపి అరెస్టయిందిగా ` మధుర జైల్లో ఉందిట. ఆ మీనాక్షి అమ్మవారే కాపాడాలి.’’

‘‘శారదకు దుర్గను తల్చుకుంటే బాధనిపించింది. సత్యాగ్రహపు రోజుల్లో అందరితో కలిసి జైలుకెళ్ళటం వేరు. ఇప్పుడు తనొక్కతే వెళ్ళటం వేరు. అప్పుడు జైలంతా సత్యాగ్రహం స్నేహితులు. ఇప్పుడు ఒంటరిగా మామూలు దొంగలతో, ఖూనీ కోర్లతో – ఎలా ఉందో ? దుర్గకు తను కమ్యూనిస్టునని తెలిస్తే ఏమంటుందో ? కానీ చెప్పకూడదు. అన్నపూర్ణకూ చెప్పకూడదు. మూర్తికి మటుకు చెప్పాలి. చెప్పటమేంటి మూర్తిని పార్టీలో చేర్పించాలి. ఎందుకు? తనకెందుకు మూర్తి విషయం? తనకు కాకపోతే మరెవరికి? మూర్తి మంచి స్నేహితుడు. స్నేహితుల గురించి ఆలోచించటం తప్పెలా అవుతుంది? అసలీ తప్పు అనే ఆలోచనే తన మనసులోకి రాకూడదు. ఒక మనిషి మీద ప్రేమ, స్నేహం కలిగి మనసులో ఆనందం కలుగుతుంటే అది తప్పవటమేమిటి?’

భోజనం ముగించి తల్లి హెచ్చరికతో నిద్ర నటిస్తూ రాత్రంతా మేలుకుని ఉంది.

కమ్యూనిస్టు పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమైన పని, విద్యార్థులకు, కార్మికులకు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు వివరించటమే. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటిల్లో మాట్లాడుతూ, చదువుతూ, చర్చిస్తూ –

ఇంకోవైపు కాంగ్రెస్‌ సోషలిస్టుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొన్నింటిలో పాల్గొనటం, ఆ మీటింగు ఏర్పాటు చేయటం.

కమ్యూనిస్టుపార్టీ సమావేశాలు అతి రహస్యంగా నిర్వహించాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎంత రహస్యంగా నిర్వహించాలనేది నిర్ణయించటానికే ఎక్కువ సమయం పట్టేది. పత్రిక తీసుకురావటం మరింత కష్టంగా ఉండేది. అన్ని కష్టాలు పడుతూనే భగత్‌సింగ్‌ వర్థంతికి కరపత్రాలు ముద్రించారు. ఆ కరపత్రాలు చేతులో పట్టుకుని భగత్‌సింగ్‌ తనే అయినట్లు గర్వపడుతూ స్టేషన్‌లో, బీచిలో పంచింది శారద. ఆ కరపత్రం ఎలాంటిది? సలసలా రక్తాన్ని మరిగించే కరపత్రం. బ్రిటీష్‌ పాలాకుల  మీద ద్వేషాన్ని బుసబుస పొంగించే కరపత్రం. భగత్‌సింగ్‌ జీవించి ఉంటే తప్పక కమ్యూనిస్టు అయ్యేవాడు అనుకుంది శారద.

ఒకవైపు పరీక్షలు  తరుముకు వస్తున్నాయి. ఆఖరి సంవత్సరపు పరీక్షలు. ఈ పరిక్షయిన తర్వాత తండ్రి కోరిక ప్రకారం ఇంగ్లాండ్‌ వెళ్ళాలి. అది గుర్తొస్తే శారదకు నీరసం ఒస్తోంది.

పార్టీ పనులు, జాతీయోద్యమం, ఇక్కడి స్నేహితులు , తల్లి – అంతటినీ, అందరినీ ఒదిలి ఇంగ్లండ్‌ వెళ్ళాలంటే అసలు  మనసొప్పటం లేదు.

కానీ తండ్రి కోరిక. తన చిన్నతనంలో తండ్రితో రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ అదే చెప్పింది. చివరి రోజుల్లో దగ్గరై తాతయ్యా అనిపించుకున్న వీరేశలింగం పంతులు గారూ అదే చెప్పారు.

ఏం చెయ్యాలి? పరీక్షలు, అప్రెంటిస్‌షిప్‌ అయ్యేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది – అప్పుడు ఆలోచించొచ్చులే అని పక్కకు పెట్టేసింది. దేనినైనా మనసులో పెట్టుకుని కుమలటం శారద తత్త్వం కాదు. నిర్ణయం తీసుకుందా అందులో మనసు నిమగ్నం చేస్తుంది.

IMG (2)

కానీ ఇంగ్లండ్‌ ప్రయాణం అంత తేలికైంది కాదు. కేవలం నిర్ణయంతో జరిగేదీ కాదు. డబ్బుతో కూడిన పని. శారదకు తన కుటుంబపు ఆర్థిక స్థితి గురించి అంతగా తెలియదు. సుబ్బమ్మ, తన అన్నదమ్ములతో రామారావుగారి వైపు బంధువులతో కలిసి ఆ విషయాలు చూస్తోంది.  పొలాల మీద వచ్చే ఆదాయం తగ్గిపోతోందని, ఆర్థిక కాటకం వల్ల  రైతులు చాలా దరిద్రంలో ఉన్నారనీ, అప్పు చెయ్యక తప్పటం లేదనీ అపుడపుడు మేనమామ తల్లితో చెబుతుండటం వినేది. ఆర్థిక కాటకం గురించి శారద సంఘపు సమావేశాల్లో చర్చించేది కూడా –  విద్యార్థి మిత్రులందరూ దాని బారిన పడినవారే – ఊళ్ళనుంచి తల్లిదండ్రులు డబ్బు పంపలేకపోతున్నారు. ఉద్యోగాలు దొరకటం లేదు. అంతకు ముందు మూడు పూటలా తినే వాళ్ళు ఇపుడు రెండు పూటలే తింటున్నారు. ఒక్కోసారి సగం తిండితో సరిపెట్టుకుంటున్నారు.

శారద డబ్బు విషయాలు తల్లితో మాట్లాడబోతే ఆమె ఊరుకునేది కాదు.

‘‘అవన్నీ మేం చూసుకుంటాంగా -నువ్వు చదువుకో. నీ చదువు పూర్తయితే తర్వాత అన్నీ నువ్వే చూసుకుందువుగాని’’ అనేది.

శారద అంతటితో ఆ సంగతి వదిలేసేది.

ఇంటినిండా ఎప్పుడూ బంధువు, స్నేహితులు ఉంటూనే ఉంటారు. ఖర్చుకి మితిలేదు. తండ్రి ఉన్నప్పటి దర్జా లేదు గానీ ఇది తక్కువైంది అనుకోటానికీ లేదు. శారద చేతిలో డబ్బు నిలవదని సుబ్బమ్మగారి అభిప్రాయం. ఎవరైనా అవసరం అంటే చాలు అది తీర్చేదాకా శారద అల్లాడిపోయేది. సుబ్బమ్మగారికి అది కొంచెం కష్టంగా ఉండేది. శారద తనకంటూ పెట్టుకునే ఖర్చేమీ ఉండదు. నూలు చీరొ, ఖద్దరు చీరొ కడుతుంది. నగలేమీ పెట్టుకోదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలూ, గాంధీగారి ప్రభావమూ ఆమెను మరింత నిరాడంబరంగా తీర్చిదిద్దాయి. కానీ తన చుట్టూ  ఉన్నవారి అవసరాలు చూడటం, అవి తీర్చటం తన బాధ్యత అనుకుంటుంది. ఈ స్వభావం ఆమెకు తండ్రి నుంచి వచ్చిందని సుబ్బమ్మ అంటుంది.

‘‘ఈ కాటకం ఇప్పట్లో పోయేలా లేదు. ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం జరిగే పనేనా’’ అందిసుబ్బమ్మ.

‘‘జరక్కపోతే మరీ మంచిది మానేద్దాం’’ అంది శారద ఉత్సాహంగా.

‘‘ఎంత కష్టమైనా పడాల్సిందే. ఇంగ్లండ్‌ వెళ్ళాల్సిందే. నేను బతుకుతున్నదే అందుకు’’ అంది సుబ్బమ్మ.

‘‘డబ్బు లేకుండా ఎలాగమ్మా’’

‘‘డబ్బు ఎలాగోలా పుట్టిస్తాను. నేను చూసుకుంటాను. ఇవాళ్టి నుంచీ నువ్వు అనవసరపు ఖర్చు తగ్గించు. నే చెప్పినట్టు విను’’ కాస్త గట్టిగా అంది.

‘‘అనవసరపు ఖర్చు నేనేం పెడుతున్నానమ్మా’’ తల్లి నుంచి ఎన్నడూ చిన్నమాట అనిపించుకోవటం అలవాటులేని శారదకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

‘‘నిన్ను ఎవరైనా అవసరంలో ఉన్నామని అడగటమే పాపం కదా – ఇవ్వకుండా ఊరుకుంటావా? అది కాస్త తగ్గించు, అంటున్నా. అంతకంటే ఏమీ లేదు’’.

‘‘ఎవరైనా పది రూపాయలు కావాని అడిగితే నేను ఇంగ్లండ్‌ వెళ్ళాలి. అంచేత ఇవ్వలేను అనమంటావా?’’ దు:ఖాన్ని మింగేసి నవ్వబోయింది శారద.

‘‘నువ్వేమంటావో నాకనవసరం – ఆ ఖర్చుకు నన్నింక డబ్బు అడక్కు.’’ శారద కోపంగా అక్కడినుంచి వెళ్ళింది గానీ తల్లి మాటల్లో అబద్ధం లేదు. చాలా ఖర్చు తగ్గిస్తే గానీ ప్రయాణం కుదరదు.

శారదతో పాటు చదువుతున్న సరళను, మార్తాను మిషనరీ వాళ్ళే పంపుతున్నారు.

శారద పరీక్షలు  పూర్తయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా ఇళ్ళకు వెళ్ళారు. శారద తన పనుల్లో తానుంటూనే, కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యం చదవటం, ఇంగ్లండ్‌ వెళ్ళటానికి కావసిన ఏర్పాట్లు చేసుకోవటంతో తీరిక లేకుండా ఉంది.

*

కొత్త కోతులు కావలెను!

 

కృష్ణ చైతన్య అల్లం

 

Krishna Chaitanya Allamఒక గదిలో ఐదు కోతులు, ఒక నిచ్చెన ఉంచబడ్డయ్. స్వతహాగా ఉండే కుతూహలం అనే జీన్ ఒక కోతిని నిచ్చెన ఎక్కించింది. నిచ్చెన దాటితే గది నుండి బయట పడే మార్గం కనిపిస్తుంది. కోతి నిచ్చెన పూర్తిగ ఎక్కే లోపల మిగతా నాలుగు కోతుల మీద అతి చల్లని నీళ్ళు పడినయ్. కాసేపటి తర్వాత ఇంకో కోతి నిచ్చెన ఎక్కింది. మిగిలిన నాలుగు కోతుల మీద మళ్ళీ చల్లని నీళ్ళు పడ్డయ్. ఏ కోతి మీదికి ఎక్కినా మిగిలిన కోతులకు ఈ శిక్ష పడుతూ ఉంది.

ఈ సారి ఏదైనా కోతి పైకి ఎక్కడానికి ప్రయత్నించినపుడల్లా మిగిలిన నాలుగు కోతులు కల్సి నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నించిన కోతిని పట్టుకుని చితక్కోట్టినయ్. ఆ ఐదు కోతులకూ తెలుసు నిచ్చెన ఎక్కితే ఎం అయితదో. మొత్తానికి ఐదు కోతుల్లో ఒక్కటి కూడా నిచ్చెన ఎక్కే సాహసం చేయలేదింక. కొన్ని రోజులకు చల్లని నీళ్ళు మీద పోసే కార్యక్రమం ఆపివేయ బడ్డది. అయినా కూడా ఏ కోతీ నిచ్చెన దగ్గరికి పోయే సాహసం చేయలేదు.

ఈ సారి ఆ అయిదు కోతుల్లో ఒక కోతిని మార్చిన్లు. నాలుగు పాత కోతులు, ఒక కొత్త కోతి. కొత్త కోతి నిచ్చెన దగ్గరికి పోగానే మిగతా కోతులు అన్ని కలిసి కొత్త కోతిని చితక్కోట్టినయ్. కొత్త కోతి మళ్ళీ నిచ్చెన దగ్గరికి పోలేదు. చల్లటి నీళ్ళు లేవు, కానీ నిచ్చెన ఎక్కితే ఏమవుతుందో, నిచ్చేనకీ మిగతా కోతులకీ ఉన్న సంబంధం దానికి ఎప్పటికీ అర్ధం కాదు. ఈ సారి ఇంకో కోతి మార్చబడింది. మళ్ళీ అదే తతంగం పునరావృతమైంది.

చివరికి ఒక్కొక్కటిగా అన్ని కోతులూ మార్చబడినయ్. అయిదు కోతుల్లో ఏ ఒక్క కోతీ నిచ్చెన ఎక్కలేదు, ఇంకోదాన్ని ఎక్కనివ్వలేదు, నీళ్ళు లేవు, నిచ్చెన ఎక్కితే ఏమవుతుందో ఏ కోతికీ అవగాహన లేదు, తెలుసుకునే సాహసం ఏ కోతీ చేయలేదు.

అయిదు కోతులు, ఒక నిచ్చెనతో ఆ గదిలో వాటి ప్రకృతి సహజమైన Sense of wonder కోల్పోయి బయట పడే మార్గం తెలవక బందీలుగానే మిగిలిపోయినయ్.

స్వభావాలని, మనస్తత్వాన్ని అర్ధం చేస్కునే దిశగా కొందరు పరిశోధనవేత్తలు చేసిన ప్రయోగం ఇది.

ఎందుకు, ఏమిటి అన్న  ప్రశ్నలు ఎక్కడ మాయం అయినై? ప్రశ్నించడం ఎక్కడ ఆగిపోయింది? సమాజం కనీస బాధ్యతలని విస్మరించే స్థితికి చేరుకున్నదంటే ఎవరు కారణం? గ్రీక్ తత్వవేత్త “యూరిపైడ్స్” ప్రతీదాన్ని ప్రశ్నించమన్నడు. ఉన్నదాన్ని ఉన్నదున్నట్ట్టు ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు.

నాగరికత సమాజంలో ఒకటిగా బతకమని చెప్పింది కానీ, ప్రశ్నించడం ఆపమని చెప్పలేదు. ప్రశ్నలు కొత్త అనుభవాలని నేర్పిస్తాయి. కొత్తవి నేర్చుకున్నపుడు మరి కొన్ని కొత్తలు ఉద్భవిస్తాయి. పరిణామ క్రమంలో కొత్త జన్యువులని కలుపుతూ పోతాయి.

మొదటి రెండు కోతులకీ కలిగింది అనుభవం. నిచ్చెన ఎక్కవద్దని నేర్చుకున్నై. మిగతా మూడు కోతులు సమాజం. చూసి, విని, నేర్చుకుని పర్యవసానం తెలుసుకుని బాధ్యతాయుతమైన సమాజం పాత్రని పోషించినై. సమాజం మేలు కోసం కొత్త కోతిని సమాజ క్షేమం కోసం వారించినయ్. కొత్త కోతికి అనుభవం నేర్పించిన పాఠం ఎమీ లేదు. భయం వల్ల ఏర్పడిన నమ్మకం తప్ప. చివరికి మిగిలిన అన్ని కోతులూ నమ్మకం, భయాలతో బందీలుగ మిగిలిపోయినయ్. పరిస్థితులు మారిపోయినయ్. తరాలు మారిపోయినై. చల్లని నీళ్ళు లేవు. రోగాలకు మందులు కనిపెట్ట బడినై. కాలం మారింది. భయాలు, నమ్మకాలూ మాత్రం అట్లనే మిగిలిపోయినయ్.  కొత్త ప్రశ్నల్ని మింగుతూనే ఉన్నై. నమ్మకాలు, కోతులు కోతులుగానే ఉన్నయ్. ప్రశించాల్సిన సమూహాలన్నీ నమ్మకం వెనుక బందీలుగానే ఉన్నవి. భయంతో నిచ్చెన ఎక్కిన కోతుల్ని కొడుతూనే ఉన్నయ్. ప్రశ్నించిన గొంతులను హతమారుస్తూనే ఉన్నై.

*

 

అర్చకుల ఆందోళన…ఏ ధైర్యంతో?!

 

జి ఎస్‌ రామ్మోహన్‌   

 

rammohan

అర్చకుల్లో కొందరు పేదలున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నదేవాలయాల్లో, శివాలయాల్లో. నిజమే. అయితే దానికి పరిష్కారమేంటి?అర్చక సంఘాలు, ట్రెజరీనుంచి జీతాలివ్వాలా? ఇవాళ వారికి వస్తున్న జీతాలు కానీ జీతాలు ఇస్తున్న పద్ధతి కానీ సక్రమంగా లేవని వాదిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే నెలనెలా ట్రెజరీ నుంచి మెరుగైన జీతాలిచ్చే ఏర్పాటు కావాలని కోరుతున్నారు.

సమాజానికి అవసరమైన ఉత్తత్తిలో పాలు పంచుకుంటున్న రైతులు, చేనేత కార్మికులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉత్పత్తి చేస్తున్నవారే మాకు ట్రెజరీ నుంచి జీతాలివ్వాలని ఇంతవరకూ కోరలేదు. ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలి? గ్రామీణ సమాజపు అవశేషాలైన కమ్మరి, కుమ్మరి వంటి అనేక కులవృత్తులవాళ్లు ఆ సంకెళ్లనుంచి బయటపడి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. కూడు బెట్టని వృత్తిని పట్టుకుని వేలాడలేదు. సంఖ్య ఎక్కువవడం వల్ల కులవృత్తులకు సంబంధించి చేనేతలోనే ఎక్కువ సంక్షోభం కనిపిస్తుంది. వారెవరూ తమకు ట్రెజరీ బెంచ్‌నుంచి జీతాలిస్తే బాగుండుననుకోలేదు. డిమాండూ చేయలేదు.

ఆలయాల ఆదాయం నుంచి ప్రస్తుతం వేతనాలుగా అందరికీ సర్దుతున్నారు. అది పూజారులకు గౌరవమైన స్థాయిలో అందడం లేదు. అది నిజమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలనడం న్యాయమైన డిమాండ్‌ అవుతుందా! సమాజానికి అవసరమైన ఉత్పత్తి చేసేవాళ్లు, శ్రమజీవులు ఎన్నడూ ట్రెజరీ జీతాలు అడగలేదు. పూజార్లు ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఈ ధైర్యం ఇంకా మన మెదళ్లలో పాతుకుపోయిన కుల గౌరవాల నుంచి వస్తున్నది. ఆ డిమాండ్‌ విచిత్రమైనదిగా కనిపించకపోవడంలో మనలో పాతుకుపోయిన బానిస లక్షణం దాగుంది. మనిషిని ఆచరణనుంచి కాకుండా పుట్టిన కులం నుంచి కుటుంబం నుంచి చూసే ధోరణి బానిస ధోరణి.

మన కళ్ల ముందే రైతులు, చేనేత కార్మికులు ఉసురు తీసుకుంటూ ఉండగానే ఎలాంటి ఉత్పత్తి చేయని కులవృత్తి వాళ్లు వీధినపడి మాకు జీతాలేవీ అంటే ఆ రైతులకు, చేనేత కార్మికుల్లో కూడా చాలామందికి పాపం అయ్యవార్లు కూడా రోడ్డుమీదకొచ్చారు అనిపిస్తుంది. ఈ పాపం అనిపించడంలో ఆర్థిక స్థితి, పేదరికం మాత్రమే పనిచేస్తే ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. సాటి పేదవారి పట్ల ఎవరు కన్సర్న్‌ చూపించినా మంచిదే.

కానీ ఇక్కడ కులం పనిచేస్తుంది. అంతటివాళ్లు కూడా, అందర్నీ ఆశీర్వదించాల్సిన వారు కూడా వీధిన పడ్డారే అని మనలో తెలీని సానుభూతిని కలిగిస్తుంది. తలపై పెట్టాల్సిన చేయి మన చేయి కంటే కింద ఉంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. అసుర చక్రవర్తి కాబట్టి బలి “ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట-మీదై నాకరంబు మేల్గాదె…” అని భక్తి పూర్వకంగానైనా అనగలిగాడు. కానీ ఏదో ఒక కులంలో పుట్టి ఆ భావాలను ఏదో రూపంలో మోస్తున్న సామాన్యులు భూసురుల చేయి కిందయితే తట్టుకోలేరు. పేదపూజార్లకు దానమిచ్చి భోజనం పెట్టి పాదాభివందనం చేసే సంస్కృతి ఇంకా ఉంది.

ఏ పేదకైనా అటువంటి ట్రీట్మెంట్‌ ఇవ్వగలిగితే వారి దొడ్డమనసుకు నమోవాక్కములు చెప్పవచ్చును. అలా ఉండదు. ఇక్కడ కనిపించే గౌరవం వెనుక ఉన్నది కులం. పేదరికం కాదు. శ్రమ అంతకన్నా కాదు. అలాగే ఉపాధి కూలీ కన్నా తక్కువ వేతనం లభిస్తుంది అని అదేదో తక్కువ పని అన్నట్టు అర్చక సంఘాల మద్దతుదారులు రాస్తున్నారు. ఉపాధి కూలీ సమాజానికి అవసరమైన పని. పౌరోహిత్యం కన్నా తక్కువేమీ కాదు. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన ధార్మిక ఉత్పత్తిగా చూడాలి అని రైటిస్ట్‌ మేధావులు అనొచ్చు. అది భౌతిక వాస్తవాకతకు లొంగదు కానీ వాదనకోసం తీసుకుందాం. అపుడేం చేయాలి?

 

ప్రస్తుతం ఆధ్యాత్మికత, అర్చకత్వం అలౌకిక కోటాలో ఉన్నాయి. వాటిని లౌకిక పరిధిలోకి తేవాలి. మెరుగైన ప్రభుత్వ వేతనాలు కావాలంటే కుల ప్రాతిపదికను పక్కనబెట్టి ఆ పనిని ప్రజాస్వామిక ప్రక్రియలోకి తేవాలి. వైదికులకే పరిమితం చేయకుండా దానికేవో పరీక్షలు పెట్టి అర్హతలు నిర్ణయించాలి. అన్ని కులాల వారూ, మతాల వారూ ఆ పనిని చేపట్టగలిగే విధంగా మార్పులు చేయాలి. రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ట్రెజరీ జీతాలు కోరుతున్న వారు దీనికి సిద్ధమైతే చర్చించొచ్చు.
”అర్చకుడు వైదిక విభాగానికి చెందినవాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందినవాడు కానీ పూజల గురించి ఏమీ తెలియని ఈవో అర్చకుడికి బాస్‌. దేవుడినే నమ్మని, దైవభక్తిలేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు” అని ఈసడింపుగా రాస్తున్నారు. అందులో ఉన్న ధ్వని ఏమిటి? ఏమి చెప్పదల్చుకున్నారు?

25KMPSRHI-W005__HY_2524109f

ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని అర్హతలు, పరీక్షలు, ఇంటర్యూలు అనే పద్ధతేదో ఉంటుంది. మనకిష్టమున్నా లేకున్నా అది ప్రజాస్వామికమైన ప్రక్రియ. ఎన్ని లోపాలు, అవకతవకలున్నా ఆ పద్ధతినైతే తప్పు పట్టలేము కదా! ఆ ఉద్యోగాలు కూడా బ్రాహ్మణులకే కట్టబెట్టండి అని అడగదల్చుకున్నారా! బ్రాహ్మడిపైన ఇంకొకరు బాస్‌ ఏంటి అది అనూచానపు సహజన్యాయానికి విరుద్ధం అని చెప్పదల్చుకున్నారా! అది నేరుగానే అడగొచ్చు. ఇతర కులాలను మతాలను విశ్వాసాలను పరోక్షరీతిలో కించపర్చనక్కర్లేదు. పూజార్లను చూసి ఆలయంలో వారు చేసే అలంకరణ చూసి ఆలయానికి వస్తారు కానీ అధికారులను చూసి వస్తారా అని రాస్తున్నారు, చెపుతున్నారు. దేవుడి మీద భక్తితో వస్తారేమో అనుకుంటున్నారు చాలామంది. ఇదన్నమాట అసలు విషయం! ఇక్కడా అలంకరణే ప్రధానమన్నమాట!
”కెసిఆర్‌ పరమ భక్తుడు. బ్రాహ్మణ పక్షపాతిగా కనిపిస్తారు. …అయినా అర్చకులు మాత్రం బ్రాహ్మణులు బజారును పడవలసి వస్తున్నది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని చెవివొగ్గి వింటే రాజాధిరాజా..రాజమార్తాండా..ధర్మం నాలుగు వర్ణాలా సాగే మీ పాలనలోనూ బ్రాహ్మణులకు ఇబ్బంది కలగడమేమిటయ్యా అని వినిపిస్తుంది. వీరికి రాజుపై ఉన్న నమ్మకం సరైనదే. కెసిఆర్‌ వ్యవహార శైలి రాజుకంటే తక్కువేమీ కాదు. ఆయన రాజులకు రాజు. నవాబులకు నవాబు. మంచీ చెడూ గురించిన చర్చ కాదు. పాలకుడి పద్దతి గురించి. అది ప్రజాస్వామికమైన పద్ధతి అని ఎక్కడా అనిపించదు. చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన తెలివైన వాడు, చదువుకున్నవాడు కావచ్చేమో కానీ పాలన అనేది రాజకీయ నాయకుడి తెలివితేటలకు సంబంధించిన విషయం కాదు.

ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్య స్వభావానికి సంబంధించిన విషయం. ఇతరులకు భయం కల్పించినా, అభయమిచ్చినా, చేతికి ఎముక లేనట్టు వరాలు ప్రకటించినా అన్నీ పాలకుడి వైయక్తిక ఆసక్తులకే ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తున్నది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం అనిపించవు. వైష్ణవ సంప్రదాయంలో మావోయిజాన్ని ఎజెండాగా ప్రకటించుకున్న పాలకుడాయె! ఉద్యమ సందర్భంగా ఎంచుకున్న పద్దతుల వల్ల ఆ గందరగోళం నుంచి బయటపడలేకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో పురోగామి సమాజపు వెన్నెముక కూసింత వంగిపోయి ఉన్నది. తమకు నేరుగా చురుకు తగిలితే తప్ప ఇతరత్రా స్పందించే లక్షణం తక్కువ కనిపిస్తున్నది. అది రాజరికపు వాసన ఎదురులేని రీతిలో బలపడడానికి తావిస్తున్నది. రాజును ప్రసన్నం చేసుకుంటే చాలు అనే భావన అన్ని శిబిరాల్లో నెలకొంది.

అందువల్లే బ్రాహ్మణ పక్షపాతి అయిన రాజు పాలనలో ఈ తిప్పలేల అనే వాదన తెరపైకి తేగలగుతున్నారు. ఆ వాదనను పెద్ద స్థాయిలో చేస్తున్నారు. అర్చకులైనా మరెవరైనా నిజంగా బతుకు పోరాటమే చేస్తుంటే శ్రమను గౌరవించే వారెవరైనా వారివైపు నిలవాల్సిందే. అయితే వారు చేస్తున్న శ్రమ, దాని స్వభావం కచ్చితంగా చర్చకు వస్తుంది. బతుకుపోరాటానికి అవసరమైన భాష శ్రమ భాష. మేమీ శ్రమ చేస్తున్నాం, మాకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు అన్నది సరైన భాష అవుతుంది. మేము ఫలానా వాళ్లం కాబట్టి మాకు సరైన ప్రతిఫలం దక్కాలంటే సరైన భాష అవదు. కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మేం వైదికులం కాబట్టి మాకు మెరుగైన జీతాలివ్వాలి అంటే ప్రజాస్వామికం అనిపించుకోదు.

*

 

 

 

 

జయహో మాతా!

 

కొరతబోయిన జానకి

 

పరమ పూజనీయ మహామహోపాధ్యాయ శ్రీశ్రీశ్రీ ప్రతివాది భయంకర సాధ్వీమణి ఆశ్రమమూ, అశేష కోటి భక్తజన సందోహమూ గగ్గోలుగా ఉన్నాయి. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. కేకలతో అరుపులతో నినాదాలతో హోరెత్తుతున్నాయి.

“జయహో మాతా” నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

“పేడ విసిరే హక్కు మాతాజీది మాత్రమే” అనే శంఖారావాలు దిక్కులు పిక్కటిల్ల జేస్తున్నాయి.

ఆశ్రమం ఆశ్రమమంతా రణగొణధ్వనులలో మునిగి ఉంది.

ఆశ్రమమంటే ఆశ్రమం అని కాదు. ఆ ఆశ్రమంలోకి అతి కొద్దిమంది ఆంతరంగికులకు మాత్రమే ప్రవేశం గనుక లోకమంతా ఆశ్రమమే. భక్తశిఖామణుల మనసులన్నీ ఆశ్రమాలే. ప్రతి భక్త శిఖామణీ మాతా స్వరూపమే.

భక్తకోటి అంటే నిజంగా భక్తకోటి అని కూడ కాదు. అది నిజంగా భక్త డజనో భక్త ద్విడజన్లో అని కొందరు అంటారు గాని ఒక్కొక్కరిదీ లక్ష గళార్చన. పామర భాషలో చెప్పాలంటే నోరు పెద్దది.

మాతాజీ పూర్వజన్మ సత్కర్మల ప్రభావపు మత్తు ఇంకా వదలని వాళ్లూ, ఆ సత్కర్మలకు ఇంకా ధన్యవాదాలు చెప్పాలనే వాళ్లూ కొందరు.

మాతాజీ పస్తుత జన్మలో చేస్తున్న పనులలో కొన్ని తమకు గిట్టనివాళ్లకు ఎక్కుపెట్టినవి గనుక శత్రువుకు శత్రువు మిత్రులు సూత్రాన్ని పాటించే అవకాశవాద భజనపరులు కొందరు.

మాతాజీ చెప్పేదీ అవతలివాళ్లు చెప్పేదీ అక్షరం కూడ తెలియకపోయినా లక్ష గళార్చనలో గొంతు కలిపితే సరిపోతుంది గదా అని పెదాలు కదిపే గాలివాటాలు కొందరు.

అంతా కలిసి తలలు వందా, నోళ్లు కోటీ కలిపి భక్తకోటి అనవచ్చు.

మాతాజీకి అసలు నరవాసన గిట్టదు. అందువల్లనే మాతాజీ నాలుగు దశాబ్దాలలో నాలుగు ఆశ్రమాలు మార్చారు.

ప్రతిసారీ, పాపం, నరవాసన లేనిచోట ఆమె ఆశ్రమం నిర్మించుకోవడం, త్వరలోనే అక్కడ చుట్టూ ఇళ్లూ మనుషులూ నిండిపోయి, ఆ నరవాసన గిట్టక ఆమె మరొక చోటికి ఆశ్రమాన్ని తరలించడం.

ఈసారి మాత్రం ఇక మరొకవైపు ఇళ్లు రావనే నమ్మకంతో ఒక సరస్సు తీరాన ఆమె ఆశ్రమం నిర్మించుకున్నారు. కాని అప్పటి మహారాజు ఆ సరస్సు తీరాన్ని దేశదేశాల వ్యాపారస్తులకు పంపిణీ చేయడం మొదలెట్టాడు. ఒకటే నరవాసన.

పాపం, మాతాజీ ఇబ్బందులు ఎవరర్థం చేసుకుంటారు?

అప్పటికే నాలుగు ఆశ్రమాలు మార్చిన అలసటతో, ‘పోనీలే, ఇక ఇది భరిద్దాంలే’ అని ఆమె తనకు తాను నచ్చజెప్పుకున్నారు.

కాని ఆశ్రమంలోపలికి మాత్రం అత్యంత సన్నిహిత భక్తులకు మాత్రమే ప్రవేశార్హత ఉంది. ఇతరులకు లేదు.

మాతాజీ పూర్వజన్మలో అద్భుత కళానైపుణ్యాన్ని వరంగా పొంది వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ పూర్వజన్మ వాసనలు ఎంత గాఢమైనవంటే, గాఢ గంధకికామ్లం లాగ అవి ఈ జన్మకు కూడ సాగి వచ్చాయి. భూమ్యాకర్షణ శక్తిలాగ వలయాన్ని సృష్టించాయి. నరవాసన గిట్టని మాతాజీకి, నరసమాజ భక్తకోటి ఏర్పడింది.

ఇక ఈ జన్మలోనూ ఆమె భక్తజనకోటి పెరగడానికి కలిసివచ్చిన కారణాలున్నాయి.

ఆమె ఒక పేడ ముద్దల విసురుడు యంత్రాన్నీ, ఒక కొలతల కార్యశాలనూ, ఒక అబ్రకదబ్ర రసాయన కర్మాగారాన్నీ ఏర్పాటు చేశారు. అవి ఆమెకు భక్తకోటిని సమకూర్చడంలో మహత్తర దోహదం చేశాయి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. పేడముద్దల యంత్రం అసాధారణమైన కృషి. ఆ పేడముద్దలు దశదిశలా విసరడంతో మాతాజీ ప్రతిష్ఠ దశదిశలా మార్మోగిపోయింది.

అయితే పేడముద్దలు విసరడంలో మాతాజీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని గిట్టనివాళ్లు అంటారనుకోండి.

మాతాజీ పేడముద్దల్ని ప్రతిసారీ ఉడతల మీదా, కుందేళ్ల మీదా, లేళ్ల మీదా విసిరారు గాని పొరపాటున కూడ క్రూరమృగాల మీదా, పులుల మీదా, తోడేళ్ల మీదా, నక్కల మీదా విసరలేదు. మనుషుల మీద, మనుషుల్ని ప్రేమించేవాళ్ల మీద విసిరారు గాని మనుషుల్ని చంపేవాళ్ల మీద, తినేవాళ్ల మీద ఎప్పుడూ ఎంతమాత్రమూ విసరలేదు. చనిపోయిన మంచి మనుషుల మీద విసిరారు గాని బతికి ఉన్న దుర్మార్గుల జోలికి వెళ్లలేదు.

మాతాజీ పేడముద్దల విసురుడుకు ఒక పద్ధతి ఉంది. తాము స్థాపించిన కొలతల వ్యవస్థ ప్రకారం ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అని ధ్రువీకరణ పత్రం వచ్చిన వాళ్ల మీద మాత్రమే ఆమె పేడముద్దలు విసురుతారు. మనుషుల్ని తినేవాళ్లను కొలిచే ప్రయత్నమే ఎప్పుడూ చేయలేదు గనుక వాళ్లకు ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అనే నిర్ధారణ వచ్చే అవకాశమే లేదు.

తమకు ఎర కాదగిన చిన్నా చితకా జంతువుల మీద, తమను ప్రశ్నించే వాళ్ల మీద పేడముద్దలు విసిరితే మరీ మంచిది, తాము చంపదలచిన కుక్కకు పిచ్చి కుక్క అని పేరు పెట్టే మహత్తర బాధ్యత మాతాజీ తీసుకున్నారు గదా అని క్రూర మృగాలు సంతోషించాయి. మనుషుల్ని తినేవాళ్లు మహదానందపడ్డారు.

ఈ పేడముద్దలు విసిరే కార్యక్రమం మాతాజీకి కొందరు అభిమానులను సంపాదించిపెట్టింది.

ప్రతి మనిషికీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది గదా. చాలామందికి ఆ అసంతృప్తికి కారణాలూ తెలియవు. ఆ అసంతృప్తి ఎలా పోతుందో తెలియదు. ఆ నిస్పృహాహావరణంలో ఏమి చేయాలో తోచక వాళ్లు దారిపక్క నిలబడి గారడీవాడు ముంగిసతో పామును ఎప్పుడు కొరికిస్తాడా అని ఎదురుచూస్తుంటారు. వీథిలో ఒకరి మీద ఒకరు విసురుకునే తిట్లను ఆసక్తిగా వింటూ కాలక్షేపం చేస్తారు. మనిషిలోని ఈ బలహీనతను మాతాజీ కనిపెట్టారు.

కొందరిని ఎంచుకుని పేడముద్దలు విసురుతూ ఉంటే మనుషులలోని ఈ హింసాకాలక్షేప ప్రవృత్తిని ఆకర్షించగలనని మాతాజీ గుర్తించారు. ఆ పేడముద్దలు బలహీనుల మీద విసిరితే మరింత చప్పట్లు పడతాయి. ప్రజల అభిమానాన్ని చూరగొని కొందరిలోనైనా అసూయ పుట్టించిన వారి మీద విసిరితే కూడ చప్పట్లు పడతాయి.

ఎప్పుడో ఒకసారి మాతాజీ పేడముద్దలు నిజంగానే తప్పులు చేసినవారి మీద కూడ పడేవి. అయినా తప్పులు చేయని మానవమాత్రులు ఉంటారా? అది చూపించి ఆమె పరమపావన న్యాయమూర్తి అని, తప్పులు చేసినవారి మీదనే ఆమె పేడముద్దలు విసురుతారని భక్తజనం పారవశ్యగీతాల హోరెత్తించేది. ఆ ఘోషలో అనుమానాలూ ప్రశ్నలూ మణగిపోయేవి.

తనకు గతజన్మలో అందిన కళానైపుణ్య వరం ఈ జన్మలో శాపవశాన రద్దయి పోయింది గనుక అంతమంది భక్తులను మళ్లీ కూడగట్టుకోవాలంటే పేడముద్దలు విసరడమే ఏకైక మార్గమని మాతాజీ కనిపెట్టారు.

మాతాజీ స్థాపించిన కొలతల వ్యవస్థ అయితే కనీవినీ ఎరగనిది. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఈ స్థాయిలో లేనిది. మాతాజీ దగ్గర ఒక కొలబద్ద ఉండేది. అది ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల, మూడు లైన్ల, ఎనిమిది థౌ ల పొడవు కొలబద్ద. (క్షమించాలి, ఈ కొలతలు నాకూ ఇప్పుడే తెలిశాయి. లైన్ అంటే అంగుళంలో పన్నెండో వంతు, థౌ అంటే అంగుళంలో వెయ్యోవంతు!)

ఈ కొలబద్ద సరిగ్గా మాతాజీ పొడవు అని, ప్రపంచానికి తానే ప్రమాణం అనే ప్రగాఢ విశ్వాసంతో ఆమె అది తయారు చేశారని గిట్టనివాళ్లంటారు గాని నిజంగా మాతాజీ పొడవు ఎంతో మానవమాత్రులం మనం గ్రహించగలమా?

కళానైపుణ్యం ఉండిన పూర్వజన్మలో మాతాజీ అన్ని రకాల మనుషులనూ మనుషుల మధ్య సంబంధాలనూ చాల బాగా చెప్పేవారు. ఆ కళానైపుణ్యానికి కన్నీళ్లు పెట్టుకుని ఆమె అభిమానులైపోయి, ఇప్పటికీ ఆ అభిమానం వదలని వాళ్లెంతో మంది ఉన్నారు.

ఈ జన్మలో మాత్రం మాతాజీకి మనుషులూ మనుషుల మధ్య సంబంధాలూ అనేవి కంటగింపైపోయాయి. మనుషులందరూ ఒక్కటే అని ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. మనిషి అంటే నిర్వచనం మారిపోయింది. తన కొలబద్దకు సరిగ్గా సరిపోతేనే మనిషి. అంతే. ప్రతి ఒక్కరినీ మాతాజీ ఆ కొలబద్దతో కొలిచేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల, ఏడు థౌల పొడవున్నావా, ఒక్క థౌ కొలత తగ్గింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల  తొమ్మిది థౌల పొడవున్నావా, కొలత మారింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు.

ఇది మనుషుల పొడవుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనుకునేరు, ఇంకా చాల కొలతలున్నాయి. చుట్టుకొలత, జుట్టుకొలత, కట్టు కొలత, చొక్కా రంగు, ఆలోచనలు, కనుముక్కు తీరు, కులం, ప్రాంతం, స్త్రీలైతే మాతాజీ కట్టుకున్న పట్టుచీర లాంటి పట్టుచీరే కట్టుకున్నారా లేదా, మాతాజీ మడమల మీద చీర ఎక్కడిదాకా ఉందో వాళ్లకూ అక్కడిదాకే ఉందా లేదా, యువతులైతే చున్నీ నిండుగా కప్పుకున్నారా లేదా, చేతుల్లేని రవికలు తొడుక్కున్నారా చేతులున్న రవికలు తొడుక్కున్నారా…ఇలా ఎన్నెన్నో. కాదేదీ కొలతకనర్హం.

ఒకసారి ఒక బాటసారి తన ఐదు సంవత్సరాల మనుమరాలితో ఆమె ఆశ్రమం ముందునుంచి పోతున్నాడు.

పాపం, ఆ చిన్నారి పాప గలగల మాట్లాడుతూ చెంగుచెంగున ఎగురుతూ ఆశ్రమం ఆవరణలో పూలమొక్కలు చూసి లోపలికి ఒక్క ఎగురు ఎగిరింది.

“ఏయ్ ఆగక్కడ. ఎవరు నువ్వు? ఆ భుజాలు కనిపించే గౌను ఏమిటి? ఎంత అప్రదిష్ట. శరీరభాగాలు ప్రదర్శిస్తూ ఆ గంతులేమిటి? భుజాలు కనిపించని నిండు జాకెట్టు పరికిణీ వేసుకోవాలి గాని ఆ చేతుల్లేని గౌనేమిటి? మోకాళ్ల కిందంతా కనబడడం ఏమిటి? నిండు జడ వేసుకోవాలి గాని ఆ కురచజుట్టు ఏమిటి? కొలత తగ్గింది, ఫో కొరత వేయాల్సిందే” అని గర్జన వినబడింది.

అలా ఆమె కొలతకు తగ్గి కొరతకు గురైన వాళ్లు ఎందరెందరో. ఎన్ని రకాల వాళ్లో.

అలా కొందరిమీద పేడముద్ద విసిరీ, కొందరిని కొరత వేసీ మాతాజీ మరే వ్యాపకమూ లేక నిస్పృహలో ఉన్నవారెందరికో నిరతాన్నదానం వంటి నిరంతర హాస్య కాలక్షేపదానం కలిగించి వారందరినీ భక్తులుగా మార్చుకున్నారు.

ఈ రెండు కార్యక్రమాలతో పాటు మాతాజీ ప్రారంభించిన మూడో కార్యక్రమం మరింతగా ఆమెకు అభిమానులను సంపాదించి పెట్టింది.

పూర్వజన్మలో ఆమె కళానైపుణ్యం చూసి ఇంత ప్రతిభావంతురాలు మన అభిప్రాయాలు చెపితే మనకెంత గొప్ప, మనకెంత ఆదరణ దొరుకుతుంది అని పావన నవజీవన సమాజం అనే అభిప్రాయాలు గల భవిష్య సాహితి సంస్థవారు తమ కాగితాలూ కరపత్రాలూ పుస్తకాలూ మాతాజీకి సమర్పించుకున్నారు.

మాతాజీ అవన్నీ గంభీరంగా చదివారు. వాటిలో ఉన్నది మాతాజీకి ఎంత అర్థమయిందో తెలియదు గాని ఆమె పునర్జన్మ ఎత్తారు. కొత్త అవతారంలో పాత కళానైపుణ్యం మిగలలేదు. ఇంగువవాసన మాత్రం మిగిలిపోయింది.

మాతాజీ కొత్త పుస్తకాలను తనకు తోచినట్టుగా అర్థం చేసుకుని తనకు అర్థమైనవి మాత్రమే పావన నవజీవన సమాజం పరమ గురువుల ఆదేశాలని చెప్పడం ప్రారంభించారు.

భవిష్యత్ సాహితి వంటి సంస్థలకు పావన నవజీవన సమాజ ఆశయాలే తెలియవని, అసలు తనకు తప్ప మరెవరికీ అవి తెలియవని చెప్పడం ప్రారంభించారు. ఆ ఆశయాలు అమలు చేయడానికి వీథుల్లోకి రావాలనీ పోరాటాలు జరపాలనీ కొందరు అంటారు గాని అదంతా అనవసరం అని మాతాజీ ఉపదేశించారు. గుహలో కూచుని పరమ గురువుల పాఠాలు, వాటికి మాతాజీ భాష్యాలు అధ్యయనం చేస్తే చాలునని కొత్త సిద్ధాంతం తయారు చేశారు.

ఈలోగా వయసు పెరిగిపోవడం వల్లనో, జన్మ మారినందువల్లనో, పాత కళానైపుణ్యం పోయినందువల్లనో కారణం తెలియదు గాని మాతాజీకి పైత్యరసం ప్రకోపించింది. దానికి దివ్యౌషధం ఒక్క మాదీఫల రసాయనం మాత్రమేనని మాతాజీ భక్తుడైన వైద్య శిఖామణి సలహా ఇచ్చాడు. ఒక్క చెమ్చాడు మాదీఫల రసాయనంతో పైత్య ప్రకోపం ఇట్టే మాయమైపోయింది.

దానితో పావన నవజీవన సమాజ సాధనకు తాను తయారు చేసిన కొత్త సిద్ధాంతాన్ని ఇలా సర్వరోగ నివారిణిగా మార్చి అందరిచేతా చప్పరింపజేస్తే బాగుంటుందని మాతాజీ సంకల్పించారు.

అలా మాతాజీ సృష్టిగా అబ్రకదబ్ర రసాయనం తయారయింది.

సమాజ మార్పు కొరకు ఏదో దివ్యౌషధం కావాలని చాలామందిలో ఉన్న కోరిక వల్ల అబ్రకదబ్ర రసాయనానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ అబ్రకదబ్రకూ పావన నవజీవన సమాజపు పరమగురువుల పాఠాలకూ సంబంధం ఉందా లేదా తరచిచూసే ఓపిక లేని వారూ, పోరాటాల్లో పాల్గొని పులుల నోటా, తోడేళ్ల నోటా పడనక్కర లేకుండానే తమవి కూడా పావన నవజీవన సమాజపు ఆదర్శాలేనన్నట్టు నటించవచ్చునని గ్రహించినవారూ మాతాజీ భక్తులైపోయారు.

అట్టి విధంబుగా, మాతాజీ పూర్వజన్మ వాసనల కళానైపుణ్య ప్రభావంలో కొందరు, ప్రస్తుత జన్మలో పేడముద్దలకు అంటిస్తున్న హాస్యరస గుళికల వల్ల ఆత్మశాంతీ వినోదమూ పొంది కొందరు, కొలతల కొరతలతో అంచితానంద శాంత సామ్రాజ్యం చేరి కొందరు, సమాజ పరివర్తనా ఔషధ అబ్రకదర్బ రసాయనం గురించి అమాయకత్వం వల్ల కొందరు, మాతాజీ భక్తకోటి పెరిగిపోయింది.

పాపం, ఆశ్రమం నుంచి కాలు బైట పెట్టగూడదనే ముని శాపం వల్ల మాతాజీ ఎన్నడూ సూర్యుణ్ని కూడ సరిగా చూసి ఎరగరు. భక్తులు ఆశ్రమానికి రావడానికీ వీల్లేదు, మాతాజీ ఆశ్రమం వదలడానికీ వీల్లేదు. అయినా మాతాజీ మాహాత్మ్యం ఎంత అరివీర భయంకరమైనదంటే ఆమెను ఒక్కసారి కూడ చూడనివాళ్లెందరికో ఆమె ఆరాధ్యదేవత అయిపోయారు.

ఆమె మీద ఈగవాలితే (అది వాళ్లెట్లాగూ చూడలేరు గాని), ఈగ వాలిందని తెలిస్తే వెంటనే చతురంగబలాల అక్షోహిణులు రంగంలోకి దిగిపోతాయి. ‘ఈగ మీదనే అంత యుద్ద సన్నాహాలు జరిగినప్పుడు, అమ్మో మనమెంత’ అని మామూలు మానవులు నిర్లిప్త మౌన ముద్రాంకితులైపోయారు. ఆ అప్రతిహత వాతావరణంలో జయహో మాతా భీషణ నినాదాలు ఎల్లవేళలా ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంటాయి.

అంతటి ఘనకీర్తి గల పరమ పూజనీయ మాతాజీ భక్త శిఖామణులలో ప్రస్తుత ఆందోళనకు, హఠాత్తు గగ్గోలుకు ఒక కారణం ఉంది.

దారిన వెళ్లే దానయ్య ఒకరు కాలికి పేడ ముద్ద తగిలిందే అని తీసి పక్కకు విసిరాడట. ఆ పేడముద్ద ఆశ్రమం నుంచి బైటపడినదేనట. దానికి మాతాజీ అంటించిన హాస్యరస గుళికలు కూడా అట్లాగే ఉన్నాయట.

స్వయంగా మాతాజీ తయారుచేసిన రంగరించిన ఆ హాస్యరస గుళికల పేడముద్ద నేరుగా మళ్లీ మాతాజీ తలకు తగిలిందట. విలువిద్యా నిపుణులు విసిరిన బాణం తిరిగివచ్చి వారి అమ్ములపొది లోనే పడినట్టు, ఈ పేడముద్ద ఇటువంటి పేడముద్దలు అసంఖ్యాకంగా వెలువరించిన బుర్రకే తగిలిందట. (మహా ప్రజ్ఞావంతమైన మాతాజీ మేధను బుర్ర అంటారా అని భక్తులు నన్ను కోప్పడవచ్చు గాక, కాని సరిగ్గా తగిలింది అక్కడే గనుక, నన్ను క్షమించాలి).

ఎంతటి అపచారం. ఎంత ఘోరం. ఎంతటి దారుణం. ఎంత అన్యాయం. ఎంత అక్రమం. ఎంత… ఎంత…ఎంత…

ఎవరి మీదనైనా పేడ విసిరే ఏకైక సమస్త గుత్తాధికారం మాతాజీకి మాత్రమే గాని దానయ్యకు ఉండవచ్చునా? భోషాణాలకొద్దీ పేడకుప్పలు సమకూర్చుకుని అందరిమీదా విసిరే మహత్తర వరప్రసాదిని హక్కును మరొకరు కొల్లగొట్టడం ఎంత అన్యాయం?

అసలు ఆ పేడముద్దను చేతితో తాకే అర్హతా యోగ్యతా మరొకరికి ఉన్నాయా?

పోనీ, తాకారే అనుకో, మహాప్రసాదం అని కళ్లకు అద్దుకోవలసింది, పక్కకు విసిరిపారేస్తారా?

పారేశారే అనుకో, అది ఆశ్రమం వైపు గురిచూసి విసురుతారా?

విసురుతారే అనుకో, ఆ సమయంలో మాతాజీ అక్కడ నిలబడి ఉంటారనీ, ఆ పేడముద్ద ఆమె మీద పడుతుందనీ స్పృహ లేకుండా ఉంటారా?

ఎంతటి అపచారం!

ఇదివరకు మాతాజీ వేల పేడముద్దలు విసరలేదా, ఈ ఒక్కదానికి ఏమొచ్చె అని అడిగే గడుగ్గాయిలూ ఉంటారా?

ఎంతటి దుర్మార్గం!

దానయ్య అపచారానికి మద్దతు కూడానా, సమర్థన కూడానా, ప్రచారం కూడానా…?

లోకం ఎంత చెడిపోయింది!

లోకానికి అబ్రకదబ్ర అవసరం ఎంతగా ఉంది!

వాడు నన్ను తిరిగి కొట్టినప్పుడు కదా కథ మొదలయింది. దాని ముందు కొట్టింది నువ్వే కదా అని తప్పుడు తర్కం తీస్తారా? ఏమి బేహద్బీ?

అపచారం అపచారం అనే నినాదాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. దానయ్యను మాత్రమే కాదు, ‘ఆ దానయ్య ఏం చేశాడబ్బా, దారిలో కాలికి పేడముద్ద తగిలితే పక్కకు విసరగూడదా’ అన్నవారినీ, ‘ఆశ్రమమే పేడముద్దల కర్మాగారం కదా, ఎంతోమంది ఆ పేడముద్దల బారిన పడ్డారు గదా, అప్పుడు లేని అపచారం ఇప్పుడొచ్చిందా’ అన్నవారినీ నరికి పోగులు పెట్టవలసిందే అని భజన బృందం ఆందోళన ప్రారంభించింది.

*

ఆ బ్రెడ్డుకు మరీ ఇంత బటరేంది సారూ !

 

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

సోమవారం పొదున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రెడ్ కు బటర్ రాసుకుంటూ ‘ వివిధ ‘ పేజీలు తిప్పాను. ‘ ఇదేం ఆనందం సారూ ! ‘ అని రాసిన ఆర్టికల్ లో నా ఆర్టికల్ ప్రస్తావిస్తూ ఒక రంగనాయకమ్మ అభిమాని రాసిన వ్యాసం చదివాక, ముచ్చటేసింది. బ్రెడ్ నోట్లో పెట్టుకుని నముల్తూ ఉంటే, చదువుతూ బటర్ ఎక్కువ రాసానేమో, వెగటనిపించి పక్కన పెట్టి, ఇంకో బ్రెడ్ మీద ‘ జాం’ రాసుకుని తినేసాను. ఇక ఈ వ్యాసానికి ప్రత్యుత్తరం రాయాలనిపించి ఇదుగో –

‘ వసంత కన్నాభిరాన్ గారు వ్యక్తిగతంగా రంగ నాయకమ్మను విమర్శిస్తూ రాసిన కవిత గురించి మొదట మాట్లాడాలి, ఆ అప్రోచ్ తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ‘ అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తుంది ఈ వ్యాసం లో. వ్యక్తి ప్రతిపాదించిన విషయాన్ని వదిలి వ్యక్తిగత విమర్శ చేయడం అన్నది తప్పుడు నడక అనే వాదన గురించి ఈ సాహితీ లోకం లో ఇప్పుడు మాట్లాడ్డం పదో తరగతి కుర్రోడు రెండో ఎక్కం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి – ఈ రెండో ఎక్కం వ్యవహారం మాట్లాడే ముందు – 2010 సంగతి మాట ఒకటి చూద్దాం. ఆజాద్, హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ జరిగాక, అంత్య క్రియల సందర్భంగా వర వర రావు గారు చదివిన మెసేజ్ ను విమర్శిస్తూ రంగ నాయకమ్మ ఆంధ్ర జ్యోతి లో ‘ ఒకే కలం….’ అనే వ్యాసం లో ఇలా రాసింది

” మరి, నిషేధిత పార్టీ తో ఎంతో దగ్గిర సంబంధం లో ఉన్నట్టు ఆధారాలతో సహా కనబడుతోన్నా, వర వర రావు గారి మీద పోలీసుల దృష్టి పడలేదంటే , ఆ వింతకి ఏదో ప్రత్యేక కారణం ఉండి ఉండదా ? “. వాళ్ళ సంస్థ నిర్మాణం లో భాగం కాకుండా దూకుడుగా ‘ వర వర రావు కోవర్ట్ ‘ అనే విషయాన్ని సజెస్ట్ చేస్తూ రాయడం , ఇది వ్యక్తిగత విమర్శగా రంగ నాయకమ్మ అభిమానులకెందుకు తట్ట లేదు ? ఇది కేవలం వ్యక్తి గత విమర్శ అని సర్దుకు పోవడానికి కూడా కుదరని ఘాతుకమైన విమర్శ !! అంతే కాదు – ఈ స్థాయిలో విమర్శించబడ్డ వ్యక్తి రాసిన వ్యాసం పరిశీలనకు ఎలా తగిందో కూడా ఎవరికీ క్లూ లేదు.

ఒక సిప్ టీ తాగేసా. చక్కర సరిగ్గా సరిపోయింది.

ఈ ఆర్టికల్ రాసిన అభిమానిలో ఒక అమాయకత్వం ఉంది. మార్క్సిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ – మధ్య తరగతిని ఎలా కన్ ఫ్యూజ్  చేయొచ్చో తెలియజేయాలి.

‘ మార్క్స్ తో  పాటు  అంబేద్కర్ కూడా  కావాలి ‘ అని విప్లవ సంస్థలు కూడా గ్రహించి ఒకడుగు ముందుకెళ్ళి, దళిత దృక్పథం తో సంస్థలను స్థాపించడం, దళిత పోరాటాలకు వెనుదన్నుగా నిలవడం జరుగుతున్న పరిస్థితి వచ్చాక మధ్యలో కలగ జేసుకుని , ‘ అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి ‘ అనడం లో కుట్ర తేట తెల్లంగా కనిపిస్తుంది. దీనికో భీభత్సమైన సైద్ధాంతిక  చర్చ  ఏముంది ? అంబేద్కర్ సాధించిన వృద్ధి ‘ వ్యక్తి కి సంబంధించిన ది మాత్రమే . వ్యవస్థకు సంబంధించింది కాదు ‘ అనే  బోలు వాదన – ఎన్నో ఏళ్ళుగా కొరవడిన దళిత ఉద్యమాలను వాటి మహోన్నత కుల నిర్మూలన ఆశయాన్ని కించ పరచడం లో భాగం ఎందుకవ్వదో తెలుసుకోలేని పరిస్థితిలో రంగనాయకమ్మ అభిమానం చేరుకుంది. దీనికి గొప్ప సైద్ధాంతిక చర్చ అవసరం లేదు అన్న విషయాన్ని ఇంకా గమనించుకోలేని సాధారణ ఆలోచన కూడా ఈ అభిమానం లో ఒక లేమి.

టి మరో సిప్ చేసా. చిక్కగా ఉంది.

ఇక రంగనాయకమ్మ ప్రజలను, అభిమానులను – చైతన్య వంతం చేసిన విధానం గురించి కృతఙతతో ఉండడం అనే కారణం తో ఆమె తప్పు రాసినా  అర్థం చేసుకోవాలనే ఒక లిబరల్ దృక్పథం  ను ప్రగాఢంగా వాంఛించడం. నిజమే ! రంగ నాయకమ్మ మార్క్సిజం కు సమబంధించి మంచి ‘ గైడ్స్ ‘ రాసింది. అది ఎంత మంచో పక్కన పెడితే – అదే లాజిక్ తీసుకుంటే – ఈ దేశం లో ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని, ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ చదివి పైకొస్తున్న ప్రజలు ఇంక ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించరాదు. ఎందుకంటే విద్య ప్రభుత్వ పుణ్యమే కాబట్టి.

ఇక ఆమె చెప్తున్నదే మార్క్సిజమా అన్నది మౌళికమైన ప్రశ్న ! ఆమె చెప్తున్న మార్క్సిజం ఆమె వర్షన్ మాత్రమే. గతి తార్కిక భౌతిక వాదాన్ని వదిలేసి , ఆదనపు విలువ సిద్ధాంతాన్ని మాత్రమే లెక్కలేసి  వివరించడం పూర్తి మార్క్సిజం కాదు. అది నిజం మార్క్సిజం కాదు. దీనికి తోడు   – మార్క్సిజం ను అన్వయించాలసిన సమస్యలకు  ‘ బూర్జువా ‘ టేగ్ తగిలించేస్తే , అది మార్క్సిస్టు  విశ్లేషణ కాదు.

నాకు మార్క్స్ అంటే ఇష్టం, అంబేద్కర్ అంటే ఇష్టం, చలసాని ప్రసాద్ అంటే ఇష్టం –  కానీ రంగనాయకమ్మ చెప్పిందాని లో గూఢం అర్థం చేసుకోను అంటే – ఇదేదో పప్పులో వెల్లుల్లి వేస్తే ఇష్టం, పోపు పెడ్తే ఇష్టం అన్నట్టు మాత్రమే ఉంటుంది.

‘ బూర్జువా డెమొక్రసీ ‘ పరిధికి మించి అంబేద్కర్ ఆలోచనలు ఉపయోగ పడ్తాయా ‘ అనే ప్రశ్న ఈ వ్యాసం లో ఎక్కడో తగుల్తుంది. ఈ బూర్జువా పదం ఇదేదో దండకం అయిపోయిందన్నది ఇక్కడ స్పష్టం. దళితులు సమానత్వాన్ని కోరుకోవడం – ఒక ప్రజాస్వామిక డిమాండ్.  సమానత్వం వచ్చాక , ఎటువంటి విప్లవం తీసుకోవాలో అప్పుడు అది ‘ బూర్జువా సమస్య ‘ అవుతుందో కాదో తేల్చొచ్చు. ఇదే పేరుతో దళితులకు సమానత్వం సాధించడం సెకండరీ అని చిత్రీకరించిన బ్రాహ్మణిక కుట్రలు ఈ రోజో రేపో బౌన్స్ అవ్వక మానవు.

టి కప్పు జాగర్తగా పట్టుకుని సిప్ చేసా. వేడిగా ఉంది టీ.

ఈ వ్యాసం లో చాలా విచిత్రంగా – రంగ నాయకమ్మ రాసిన  పుంఖాను పుంఖాలైన వ్యాసాలకు బలవంతంగా ఒక సింపతీ తీసుకురావాలనుకోవడం. అదే సమర్థనీయం ఐతే – కుట్ర కేసులకు వ్యక్తి గత జీవితాలను ఒడ్డిన వి ర సం కు ఎంత సిపతీ కావాలి అన్న ఆలోచన రంగనాయకమ్మ అభిమానులకు ఎందుకు తట్టదో తెలుసుకోలేనంత ‘ దూరా ‘ భిమానం ‘ అయ్యింది. మళ్ళీ అదో ప్రశ్న – ‘  ఏం ఈ పుస్తకాలు  మార్క్సిస్ట్ – లెనినిస్ట్ పార్టీలు తీసుకు రావచ్చుగా ‘  అని ? …  ఏం ఎందుకు తీసుకు రావాలి ? – ఒరిజినల్ మార్క్స్ పుస్తకాలు చదవడానికి,  చదివే వాళ్ళకు బద్దకమైతే – అది భగ భగ మండి పోతున్న ‘ విప్లవ సమస్యా ‘ ?  అలా పుస్తకాలు తీసుకు వస్తేనే సిన్సియారిటీ నా ? ఇది విప్లవోద్యమమా లేపోతే ‘ పబ్లికేషన్స్ ఉద్యమమా ‘ ? ఇలా పుస్తకాలు ప్రచురించే బెంచ్ మార్క్ ఏంటో ఎన్ని టీ కప్పులు ఖాళీ చేసినా తెలీదు.

ఇంకో సిప్ కొట్టా. నాలుక పై వేడిగా టీ దిగుతుంది.

అలాగే – శ్రీ శ్రీ విషయం లో వర వర రావు గారి వ్యాసం శీర్షిక భాగం లో ” ఎటువంటి రాజకీయ , సాంస్కృతిక సందర్భం లోనైనా శ్రీ శ్రీని ముందు బెట్టి రచయితలను కలుపుకు  రావచ్చనేది చలసాని అవగాహన ” అని ఉంటే అందులో ‘ వీర పూజ ‘ ప్రస్తావన ఎక్కడిది ? ఆయన్ని తల మీద పెట్టుకుని ఊరేగినట్టు ఏముంది ? ఇదే శ్రీ శ్రీ,  విరసం నుండి  బహిష్కరించబడ్డప్పుడు మరి ‘ వీర ద్వేషం ‘  కనిపించలేకుండ పోవడం తమాషా. శ్రీ శ్రీ వి రసం లో చేరకున్నా విరసం ఏర్ప్డడేది . అదో చారిత్రక సందర్భం. శ్రీ శ్రీ , మోటార్ సైకిల్ కు పెట్రోల్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలనుకున్న ఫస్ట్ కిక్కు మాత్రమే. వెంటనే ఇచ్చే రెండో కిక్కుకు మోటార్ సైకిల్ చచ్చినట్టు కదిలేది. అలాగని మొదటి కిక్కు వృథా చేసుకోకూడాదనుకునే  ‘ ఎంథూసియాజం ‘ మాత్రమే చలసాని ప్రసాద్ గారికి ఉంది  అన్న సాధారణ విషయాన్ని కూడా ఇంత విడమరిచి చెప్పాల్సి వస్తుందేంటో ?!  శ్రీ శ్రీ ని వెంటనే కార్ ఎక్కించకుండా – ఒక రెండు నెలలు ‘ మార్క్స్ ‘ టెస్ట్ పెట్టి తీరుబడిగా ఆహ్వానించి ఉంటే సరిపోయి ఉండేదా ?  పైగా వి ర సం ఏర్పడాలంటే – మొదట ప్రణాళిక రాసుకోవాలట, తర్వాత కార్య వర్గం నిర్మించాలంట –  ఆ తర్వాతే వి ర సం ఏర్పాడలట ! మార్క్సిస్టు ‘ రూలు బుక్కు ‘ ఒకటి తయారు చేయాలిక. ఎప్పుడెలా ప్రవర్తించాలి అని. రంగ నాయకమ్మ అభిమానులు గ్రహించాల్సింది ఏంటంటే – దోపిడీ, అణచివేత కు రూల్స్ లేవు,  మార్క్సిస్ట్ ఫిలాసఫీ రిజిడ్ ఫిలాసఫీ కాదు.  మార్క్సిజం మీద గైడ్స్ రాసి రంగ నాయకమ్మ ఇప్పుడు ‘ విప్లవ రూల్ బుక్కులు ‘ రాస్తుంది.

టీ అయిపోవచ్చింది. దాని ఘాటైన వాసన మనస్సును ఉత్తేజ పరుస్తుంది.

రంగ నాయకమ్మ కలం కు,  పోటు ఇవ్వడం తెలీదు. ఆ పోటుకు అభిమానులనుకున్నట్టు బాధితులెవరూ లేరు. నిజానికి ఇదంతా రంగ నాయకమ్మకు దళిత వాదులు, ప్రజాస్వామిక కాముకులు ఇచ్చే పోటు. అసలు కలం పోటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే విరసం తో మమేకమైన చెరబండ రాజును చదవాలి. అంతే కాని ఇన్ని సంవత్సరాలు  ఎప్పుడో పాతిన ‘ వృక్షాలను ‘ ‘ మొక్కలను ‘ అమ్ముకుంటూ బతకడం కాదు.

చివరి సిప్ చేసేసా. ఈ రోజు ఏంటో టీ మస్త్ కిక్ ఇచ్చింది ! లేచి బటర్ ఎక్కువ రాసేసుకున్న బ్రెడ్ ను డస్ట్ బిన్ లో పారేసి వచ్చేసా.

 

(PS : This write up absolutely aims to dispassionately convince the masqueraded arguments in the name of Marxism and this comes with an earnest request to all readers to consider the essence of the article with an objective view and feel free to reach the writer in his inbox for any queries at pvvkumar@yahoo.co.uk or on Facebook )

 

 

 

 

 

 

 

 

 

 

ఖదీర్ బాబు కొత్త సంభాషణ

సురేష్ వంగూరి 
 suresh vanguriఖదీర్ బాబు  ‘మెట్రో కథలుచదివినవాళ్ళకి అనివార్యంగా రెండు విషయాలు అర్ధమవుతాయి.
1. మెట్రో బతుకుల్లోని helplessness 2. మెట్రో వ్యవస్థలోని ugliness.
ఒకసారి మెట్రో చట్రంలో చిక్కుకున్నాక, వేరే ప్రత్యామ్నాయం లేక బలవంతంగా బతకటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతను మనకు అవగతం చేసే ప్రయత్నమే ఖదీర్ బాబుమెట్రో కథలు.
* * *
భార్యాభర్తల మధ్య ‘డిస్టెన్స్’ పెరగటానికి నగరంలో ఒక ప్రాంతానికీ మరో ప్రాంతానికీ మధ్య ఉండే డిస్టెన్స్ కూడా ఒకబలమైన కారణం.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల, తప్పని సరై, కొన్ని వదిలించుకోవాల్సి వస్తుంది. అది ఇష్టంగా పెంచుకున్న,మనసుకు పెనవేసుకుపోయిన గారాల కుక్కసుకీఅయినా సరే. గిల్టీ ఫీలింగ్ జీవితకాలం వెంటాడినా సరే,తప్పదు. భర్త స్పర్శకు నోచుకోని భార్యలకు, మసాజ్ గురించి ఏమీ తెలీనిదీదీ అవసరం చాలా ఉంది. భార్యాభర్తల మధ్య యాంత్రికతనూ దాని పర్యవసానాల్నీ సెల్ఫీ’ కథ హెచ్చరిస్తుంది.  మహానగరంలో బైటికొస్తే ఆడవాళ్ళ టాయిలెట్సమస్య ఎంత హృదయవిదారకమోషీకథ కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఒక మహిళా ఉద్యోగి దైనందిన జీవితంలోనిసంఘర్షణల్ని, వాటితో పాటు పేరుకుపోతున్న అసంతృప్తినీనిద్రా సమయం‘, ‘రొటీన్కథల్లో చెబితే, ఇరుకుఅపార్ట్మెంట్లోఅమ్మమ్మపరిస్థితి ఎంత దుర్భరమో చూపిస్తాడు.
ఖదీర్ బాబు మెత్తగా, ఆర్ద్రతగా కథ చెబుతూనే, మధ్యలో అక్కడక్కడ మనసుని మెలిపెట్టే వాక్యాలు సంధిస్తాడు.కథకు అవి ప్రాణం. పాఠకునికి అవి పాఠం. మచ్చుకు కొన్ని వాక్యాలు చూడండి
జీవితంలో మాత్రం కష్టమైనా ఉన్నందుకు ఆమెకు అపుడప్పుడు సంతోషంగా ఉంటుంది (అమ్మమ్మ).
దప్పిక ప్రాణం తీస్తుందని ఎవరు చెప్పాలిఎలా చెప్పాలి? (దీదీ).
ఇక్కడికొచ్చాక భర్తే కాపాడాలి అనే భయం దాదాపు పోయింది (రొటీన్).
అయినా నిన్ను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా? (సెల్ఫీ).
వేళ్ళు మాత్రమే పని చేస్తూ మిగిలిన శరీరమంతా పారలైజ్ అయ్యే వ్యవస్థ ఏదో మనల్ని బిగిస్తోంది (ప్రొఫైల్ పిక్చర్).
* * *
సెల్ఫీషీడిస్టెన్స్… ఈ మూడూ నా దృష్టిలో అచ్చమైన ‘మెట్రో కథలు.’
మెట్రో వ్యవస్థ వికృత రూపాన్ని దగ్గరగా చూసాడు కనుకే ఖదీర్ బాబు తన కథల్లో దాన్ని బట్టబయలు చేస్తున్నాడు. వ్యక్తుల్ని చూసి జాలిపడమనీ, వ్యవస్థ విషయం జాగ్రత్తపడమనీ చెబుతున్నాడు.
*

బహుజన బంధమే “అలాయి బలాయి”!

ఖాజా

1

తన కవిత్వంతో తెలుగు సాహిత్యంలో బలమైన ముద్రవేసిన స్కైబాబ, కథకుడిగా అట్టడుగు వర్గాల జీవితాన్ని  శక్తివంతంగా వినిపిస్తున్నాడు.  ఇప్పటికే అధూరే పేరిట తన కథల సంపుటి ప్రచురించి కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల వెతలను ఆవిష్కరించాడు. ఇప్పుడు అలాయి బలాయి పేరుతొ బహుజన కథలు ప్రచురిస్తున్నాడు. బీసీ, ఎస్ సీలను కలిపి చెప్పడానికి స్కైబాబ ‘బహుజనుల’నే మాటను ఉపయోగించాడు. అలాయి బలాయి అంటే హృదయానికి హృదయాన్ని చేర్చి హత్తుకొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే ముస్లిం సాంప్రదాయం. స్కై బాబ ఈ కథా సంపుటి ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు… ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు.

భారతీయ గ్రామీణ సమాజాన్ని తరచి చూస్తె  ప్రతి గ్రామం భారత దేశపు మినియేచర్ లా కనిపిస్తుంది..  వూరి పాలనను, సంపదను అనుభవిస్తూ పెత్తనం చెలాయించే అగ్రకుల వర్గం ఒక పక్క, వూరి విసర్జితాలని నెత్తిమీద మోస్తూ, వూరికి వూడిగం చేస్తూ, నిచ్చెన మెట్ల వ్యవస్థకి మరింత కింద, వూరి జనానికి మరింత దూరంగా, అంటరానితనంలో, పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్న దళిత సమాజం ఊరికి దూరంగా మరొక పక్క! ఈ రెండిటి మధ్య అటు అగ్రకుల సమాజాన్ని అందుకోలేక, ఇటు తన కన్నా కింద వున్న దళిత సమాజాన్ని హత్తుకోలేక నడుమన ఊగిసలాడుతూ BC సమూహం. హిందూత్వం హీనంగా చూసి, ఎదగనీయకుండా తోక్కేసిన  దళిత, బిసి కులాల సమాహారమే బహుజన సమాజం.

ఇది మన గ్రామీణ సామాజిక చిత్రం. ఈ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం  కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. మురుగై పోయిన పైన ప్రవాహం మళ్ళీ కుదురుకొని తేటగా మారడానికి చాలా కాలం పడుతుంది.  అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గ్రామీణ సమాజపు లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం మనం ఇప్పుడు స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు.

*

skyఈ సంపుటి లోని పదకొండు కథల్లో సోయి కథ ఒకటి.. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఈ కథలో సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి పర్స్పెక్టివ్ నుంచి కథ నడుస్తుంది. శేకర్ రెడ్డి ని స్కై బాబ బహుజన గుంపులోనుంచి తప్పి పోయిన వాడిగా చూసాడు. నిజానికి ఈ దేశంలో రెడ్డి, చౌదరి వంటి కొన్ని శూద్ర కులాలు పాలక వర్గ స్థాయికి ఎదిగి నిజంగానే తమను తాము శూద్రత్వం నుంచి తప్పించేసుకున్నాయి. మంచిదే! ఆర్థికంగా, పాలన పరంగా  శాశించె స్థాయికి చేరుకున్నాయి. సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి భద్ర జీవితంలోకి వెళ్ళిపోయాడు. గ్రామీణ జీవితంలోని ఆర్ధిక, సామాజిక సంఘర్షణ నుండి కొంత మేరకు బయట పడ్డాడు.   ఈ కథలో యాదగిరి గ్రామీణ బహుజన సమాజానికి ప్రతినిధి. ఎదుగూ బొదుగూ లేని జీవితం. భద్రత, భరోసా లేని ఉపాధి తో కష్టంగా సాగే బతుకు. తాగుడు కారణంగా విచ్చిన్నమవుతున్న కుటుంబాలు. సాధారణ గ్రామీణ బహుజనుల జీవితం ఈ కథలో అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది.

ఐతే సాధారణ  సమాజం కన్నా భిన్నంగా  తర్వాత తరాల పట్ల ఒక బాధ్యత గా యాదగిరి కొడుకు చైతన్యవంతుల ప్రతినిధిగా నిలబడటం ద్వారా భవిష్యత్తులో అయినా బహుజన సమాజం చైతన్యవంతమై స్వయం గుర్తింపు సాధిస్తుందని ఆశను రచయిత ప్రకటించాడు.

‘జమ్మి’, ‘అంటు’ కథలు రెండూ కూడా మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే అని చెప్పిన కథలు. దళిత కులాల మధ్య వున్న అసంబద్ధ అనైక్యతను ‘జమ్మి’ కథ ప్రతిబింబించింది. ‘అంటు’ కథ ముస్లిం సమాజానికి దళిత సమాజానికి మధ్య వున్న ఘర్షణను ఎత్తి చూపింది. కుల నిర్మూలన జరగాలంటే  కులాంతర వివాహాలు జరగాలన్నది అంబేద్కర్ ఆలోచన. కానీ ఏ కులం అందుకు సిద్ధపడి లేదు. గ్రామీణ సమాజంలో వున్న పిలుపుల్లోని బంధం ఏ అవసరానికైనా ఉపయోగ పడవచ్చేమో గాని సామాజిక మార్పుకు, ఉపయోగపడవు.  మొత్తానికి  అన్ని బంధాల్లో కుల, మత  బంధాలే  అత్యంత  బలమైనవి అని చెప్పె కథలు ఇవి.

‘జవాబ్’, ‘అంటు’ కథలు ముస్లిం సమాజానికి బహుజన సమాజానికి వున్న  ఘర్షణను ప్రతిబింబించిన కథలు. జవాబ్ కథ గుజరాత్ లో ముస్లిముల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యం తో రాసిన కథ. ఇందులో సైదులు పాత్ర బీసీ పాత్ర. ఈ సైదులు చేసిన ఒక పనికి వూరు ఊరంతా కలిసి పంచాయితీ పెడుతుంది.   అప్పుడు సైదులు తన లోపలి దుఖాన్ని మనిషిగా తన ఘర్షణని వ్యక్తీకరిస్తాడు. కొందరు స్నేహితులతో   కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన సైదులు పంచాయితీలో అక్కడి ముస్లిముల స్థితి గురించి  ఆవేదన చెందుతాడు

*

గ్రామీణ బహుజన సమాజంతో ముస్లిం సమాజానికున్న బంధాన్ని, ఇబ్బందినీ కూడా చెప్పిన ఈ కథలలో అంతర్లీనంగా వున్న ముస్లిం ఆవేదన బహుజన సమాజానికి అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. స్కై బాబ ప్రచురిస్తున్న ఈ 11 కథలు, బహుజన సమాజానికి మైనారిటీ సమాజానికీ మధ్య ఒక చర్చకు తావిచ్చే సందర్భానికి అవకాశం కల్పిస్తాయని అనుకుంటున్నాను. ఈ కథల్లోని అన్ని అంశాలు సుదీర్ఘ చర్చనీయాలే అయినా నేను కొన్ని కథల్ని మాత్రమె ఉదాహరించాను. ఈ ముందు మాటను స్కై బాబ కథల రివ్యూ లాగా కాక, ఈ కథల సందర్భం చుట్టూ వున్న సామాజిక చారిత్రిక తాత్విక పరిణామాల పరిశీలన కోసం కొన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చాను. ఇంకా ఈ కథల నేపథ్యంగానే చర్చించాల్సిన అంశాలు చాలా వున్నాయి. బహుశా ఈ పుస్తకం బయటికి వచ్చాక ఉద్యమ, పరిశోధక మిత్రులు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్చకు సందర్భాన్నిచ్చిన మిత్రుడు స్కైబాబ కు అభినందనలు.

*

 

కల్బుర్గి తల నవ్వింది..

 

-సత్యమూర్తి

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కల్బుర్గిని దేవదూతలు బలవంతంగా స్వర్గం వాకిట్లోకి తోసేశారు. ఆ వృద్ధుడు బలాన్నంతా కూడదీసుకుని మళ్లీ బయటకి రావడానికి ప్రయత్నించాడు. కానీ అడుగు ముందుకు పడ్డం లేదు. దేవదూతలు పగలబడి నవ్వారు.

‘అయ్యా, తమది వృథా ప్రయత్నం! ఒకసారి స్వర్గంలోకి వచ్చాక బయటికెళ్లడం అసాధ్యం. మీకు స్వర్గసుఖాల రుచి తెలియదు కనుక పారిపోవాలనుకుంటున్నారు. ఈ సాయంత్రానికి మీ మనసు మారిపోతుంది. ఆనక ఇక్కన్నుంచి వెళ్లగొట్టినా వెళ్లరు’ అని అన్నారు.

కల్బుర్గిని లక్ష యోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ ఉన్న స్వర్ణమందిరంలోకి తీసుకెళ్లి మేనకకు అప్పజెప్పి వెళ్లిపోయారు.

మేనక వగలు పోతూ కల్బుర్గి ముందు నిలబడి కొంటెగా చూసింది. అతడు ముక్కు మూసుకున్నాడు. అప్సరస వద్ద నుంచి చెమటకంపు గుప్పుమని కొడుతోంది. ఆమె కాసేపటి క్రితమే విశ్వామిత్రుడి గాఢపరిష్వంగంలో నలిగింది. విషయం గ్రహించి చప్పున పక్కనే ఉన్న పన్నీరు బుడ్డి తీసుకుని ఒంటిపై చల్లుకుంది. గాల్లోంచి పౌడరు రప్పించి ముఖానికి దట్టంగా పూసుకుంది. చెలికత్తెలు వీణలు సవరించారు. మేనక ‘మదనా మనసాయెరా..’ అని కీచు గొంతుతో పాట ఎత్తుకుని నర్తనం మొదలెట్టింది.

కల్బుర్గి చెవులు మూసుకున్నాడు. మేనక కంగారు పడిపోయింది. ఇలాగైతే పని కాదని, ఆటాపాటా ఆపి పాత అతన్ని గట్టిగా వాటేసుకుంది. కల్బుర్గి ఆమెను విసురుగా తోసేశాడు.

‘ఏమి చిత్రం? ఏమి చిత్రం? ఒక అల్పమానవ ముదుసలి నా బిగికౌగిలిని నిరాకరించుటయా?’ విస్మయంగా అందామె.

‘ఏవమ్మో, మాటలు జాగ్రత్త! అల్పుడూ గిల్పుడూ అంటే ఊరుకునేది లేదు. ముందు నన్నిక్కన్నుంచి పంపేయండి. హాయిగా మేఘాల్లో, పాలపుంతల్లో తిరుగుతూ ఉంటే మీ వెధవలు ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు’ అన్నాడు కల్బుర్గి.

మేనక బుగ్గ నొక్కుకుని, మోహనంగా నవ్వింది.

‘భలే చిత్రంగా మాట్లాడుతున్నారే! నేను పుట్టి కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు అయ్యింది. మీలాంటి వింత మనిషిని ఎన్నడూ చూళ్లేదు..’

‘కాకి లెక్కలు చెప్పమాక. నువ్వు మేనకవూ కాదు. ఇది స్వర్గమూ కాదు. అవన్నీ పుక్కిటి పురాణాలు. ఆ మాట అన్నందుకేగా నన్ను తుపాకీతో కాల్చి చంపేసింది. ఇక్కడ.. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఏదో పౌరాణిక సినిమా సెట్టింగులా ఉంది..’

మేనకకు అతను చెప్పింది బొత్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అగత్యమూ లేదు కనుక దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఆమె కల్బుర్గిని మళ్లీ వాటేసుకుని పెదవులను ముడేయబోయింది.

కల్బుర్గి ఈసారి మరింత విసురుగా తోసి ఆమె చెంప చెళ్లుమనిపించాడు.

‘ఎందుకలా మీదమీదపడిపోతున్నావ్? కోట్ల కోట్ల కోట్ల ఏళ్లుగా ఎంతమంది దగ్గర పడుకున్నావో ఏమో. ఎయిడ్సూ గట్రా సుఖరోగాలు తగిలుంటాయి. నాకు అంటించమాక.. దూరంగా ఉండు.. మీద పడితే మర్యాద దక్కదు సుమీ..’ అన్నాడు.

అప్సరస నిశ్చేష్టురాలైపోయింది.

‘మానవాధమా, నన్నే కొడతావా? వెంటనే శిలావిగ్రహమైపో!’ అని శపించింది.

కల్బుర్గి విరగబడి నవ్వాడు. అతడు రాయీ కాలేదు, రప్పా కాలేదు.

మేనక విస్తుబోయింది. మళ్లీ శపించింది.

కల్బుర్గి నిక్షేపంగా నవ్వుతూనే ఉన్నాడు.

మేనక కోపంతో చరచరా దేవేంద్రుడి వద్దకు వెళ్లింది. విషయం చెప్పి ముక్కు చీదింది. చీదింది కాసింత ఇంద్రుడిపైనా పడింది. సురపతి దానితోపాటు మూతికంటిన సురను కూడా తుడుచుకుంటూ నవ్వాడు.

‘భామినీ, కలత వలదు! అతడు హేతువాది. అందుకే నీ శాపం పనిచేయలేదు. దయ్యాలు భయపడేవాళ్లనే కదా భయపెడతాయి.. ఆ ముసలాణ్ని అలాగే వదిలేసి ఈసారి వశిష్టుడి పడగ్గదికి వెళ్లు.. ఎప్పుడూ రాజర్షితోనే పడుకుంటున్నావని వశిష్టుడు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు…’ అన్నాడు.

***

కల్బుర్గికి స్వర్గంలో ఏమీ తోచడం లేదు. కొంపదీసి ఇదంతా కల కాదు కదా అనుకుని నాలుగైదుసార్లు గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. నొప్పి అనిపించలేదు. అయితే తను చనిపోయినట్టా? అనుమానం తీరక కల్పవృక్షం వద్దకెళ్లి ఒక కొమ్మ తెంపుకుని అరిచేతిపైనా, వీపుపైనా గట్టిగా కొట్టుకొట్టున్నాడు. నొప్పి పుట్టలేదు. రెండు రోజులుగా తనకు ఆకలేయనీ సంగతి కూడా గుర్తొచ్చి తను నిజంగా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాడు. కానీ అది స్వర్గమని నమ్మలేకపోతున్నాడు. స్వర్గమైతే చచ్చిపోయిన మహానుభావులందరూ ఇక్కడే ఉండాలిగా, వాళ్లెవరూ కనిపించలేదే అని అనుమానమొచ్చింది.

ఇంతలో ఓ దేవదూత తలపై పెద్ద మధుభాండంతో అటుగా పోతూ కనిపించాడు. కల్బుర్గి అతని వద్దకెళ్లాడు.

‘ఇదుగో అబ్బాయ్. ఇది స్వర్గమేనంటావా? అయితే  మీ దేవేంద్రుడెక్కడోయ్?’ అని అడిగాడు.

దేవదూత విస్తుబోయాడు.

‘ఇది స్వర్గమేనండి. అయినా మీకా అనుమానం ఎందుకొచ్చింది?’ ఎదురు ప్రశ్న వేశాడు.

‘బతుకంతా ప్రతీదాన్నీ ప్రశ్నించి ప్రశ్నించి అలా అలవాటైందిలే. సరేగాని, తలపైన ఏమిటోయ్ తీసుకెళ్తున్నావ్? మాంచి వాసన వస్తోంది..’

‘ఇదా? మేలురకం మద్యం. దేవేంద్రుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఆయనగారింట్లో నిండుకుందని చెబితే పట్టుకెళ్తున్నా..’

‘సరేకానీ, నాక్కాస్త పోయవూ! ఆకలిదప్పుల్లేక నోరంతా అదోలా అయిపోయింది..’

‘అమ్మబాబోయ్. ఈ మధువా? మీకా? కుదర్దండి. ఇది దేవాధిదేవుడైన ఇంద్రులవారిది.. ఆయనే తాగాలి’

‘బోడి ఇంద్రుడు లేవోయ్. మా పక్క ఆయన్ని తార్పుడుగాడు అని గౌరవిస్తాం లెద్దూ.. అయినా మీ దేవతలకు ఆకలిదాహాలు ఉండవు కదా. మరి అల్పమానవుల మాదిరి ఈ సారాయిపై అంత కక్కుర్తి ఏమిటోయ్? అచ్చోసిన ఆంబోతుల మాదిరి రంభామేనకలపై ఆ పశువాంఛలేమిటోయ్?’

దేవదూతకు మాట పెగల్లేదు. కల్బుర్గి దేవదూత తలపై ఉన్న భాండాన్ని కాస్త వంచి కడుపారా మద్యం తాగాడు. మనసు కుదుట పడింది.

దేవదూత ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు.

కల్బుర్గి అతన్ని గట్టిగా గిచ్చాడు. దేవదూత కెవ్వుమన్నాడు. అల్పమానవుడు ఊరుకోలేదు. దేవదూతను కితకితలు పెట్టాడు. భాండం జారిపడి రోదసిలోకి వెళ్లిపోయింది.

దేవదూత కల్బుర్గికి దండం పెట్టి తనను వదిలేయమన్నాడు. ఏదో మంత్రం వేసి భాండాన్ని మళ్లీ పైకి రప్పించి తలపై పెట్టుకున్నాడు. కల్బుర్గి మళ్లీ  భాండాన్ని వంచబోయాడు.

‘బాబ్బాబూ, మీ పుణ్యముంటుంది! దాన్ని ముట్టుకోకండి. కావాలంటే వేరొక మద్యం తెస్తా. ఇంద్రుల వారి మద్యాన్ని ఎంగిలి చేశారంటే నా మెడకాయపై తలకాయ ఉండదు’

‘అంతగా వణికిపోతున్నావ్, నువ్వేం దేవుడివోయ్? మెడపైన తలకాయ పోతే మళ్లీ అతుక్కుంటుంది కదా, వినాయకుడి తలకాయలాగా. ఆ మందు తాగకపోతే మాత్రం నేను మళ్లీ చావడం ఖాయం..’ అంటూ కల్బుర్గి భాండాన్ని వంచి గుటకలేశాడు.

‘చచ్చిన పుణ్యాత్ములందరూ ఇక్కడికొస్తారంటారు కదా. మరి, మా వీరశైవ బసవన్న ఎక్కడున్నాడోయ్? ’ అని మత్తుగా అడిగాడు.

దేవదూత దివ్యదృష్టితో పరికించి చూశాడు.

‘ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు. అదుగో ఆ మలుపు దాటితే శివాలయం వస్తుంది. అక్కడ అరుగుమీద కూర్చుని వచనాలు వల్లెవేస్తున్నాడు’ అని చెప్పి గబగబా వెళ్లిపోయాడు దేవకింకరుడు.

కల్బుర్గి కాస్త తూలుతూ బసవడి దగ్గరకు వెళ్లాడు.

బసవడు అరుగుపైన శివలింగం పెట్టుకుని అరమోడ్పులతో శివశివా అంటూ ఊగిపోతున్నాడు.

‘అయ్యా..’ పిలిచాడు కల్బుర్గి.

బసవడు పలకలేదు. కల్బుర్గి మళ్లీ పిలిచాడు. వీరశైవుడు పలకలేదు. కల్బుర్గికి మండుకొచ్చి భక్తునికి తొడపాశం పెట్టాడు. బసవడు కెవ్వుమన్నాడు.

‘అయ్యా, నా పేరు మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి. మీ కన్నడం వాడినే.  కొంతమంది వీరభక్తాగ్రేసులు ఇంటికొచ్చి మరీ కాల్చేసిన పుణ్యం ఫలితంగా ఇక్కడికొచ్చాను.. ఆ పుణ్యంలో మీకూ వాటా ఉందిలెండి..’ అన్నాడు వెటకారంగా.

బసవడు తికమకపడ్డాడు.

‘నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు.. వివరించి చెప్పు’

‘చెబుతా, చెబుతా. ముందు ఆ బారెడు కత్తిని ఒడిలోంచి తీసి పక్కన పెట్టండి. సంఘసంస్కారం కోసం అంతగా తపనపడ్డ మీకు చచ్చాకా ఈ కత్తీగట్రా ఎందుకండీ? కొంపదీసి ఇక్కడా వీరశైవం ప్రచారం చేస్తున్నారా, ఏమిటీ?’

బసవడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

‘నా ముచ్చట తర్వాత. ముందు నీ సంగతీ, నీ హత్య వల్ల నాకు దక్కిన పుణ్యం సంగతీ చెప్పు’

‘అయ్యా, నేను మీ భక్తివచనాలపై లోతైన పరిశోధన చేశాను. మీలాగే మూఢనమ్మకాలపై అలుపెరగకుండా పోరాడాను. ఓ విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశాను. ఇరవైకి పైగా పుస్తకాలు, నాలుగొందలకుపైగా వ్యాసాలు రాశాను.. మీ కుటుంబం గురించి, విగ్రహాల పూజ గురించి కొన్ని ప్రశ్నలు లేవదీసినందుకు నన్ను చంపేశారు..’

‘చిత్రంగా ఉందే! నేను కలగన్న మూఢవిశ్వాసాల్లేని కన్నడసీమ ఇంకా సాకారం కాలేదా? ఇంతకూ నాపైన నీ విమర్శలేంటో?’

‘ఏవో కొన్ని ప్రతిపాదనల్లెండి. మీ రెండో భార్య నీలాంబికతో మీ కాపురం వొట్టి అమలిన శృంగారం అని అన్నాను. దానికి వచనాల్లోంచి రుజువులు చూపాను. మీ మేనల్లుడు చెన్నబసవడు మీ చెల్లెలు నాగలాంబికకు, మాదిగవాడైన దోహర కక్కయ్యకు పుట్టి ఉండొచ్చని, పండితులు ఆ సంగతి దాచారని అన్నాను.. దానికీ కొన్ని ఆధారాలు చూపాను..’

బసవడి ముఖం కందిపోయింది. కోపాన్ని బలవంతంగా అణచుకున్నాడు.

‘ఇంకా..’

‘ఇంకా అలాంటివేవో కొన్ని. మీరు జంధ్యం వద్దన్నారు కానీ, మెడలో మాత్రం ఇష్టలింగాన్ని ఎందుకేసుకోమన్నారు అని ప్రశ్నించా. విగ్రహారాధన కూడదని వాదించాను. జనం పాలూపెరుగూ లేక మాడిపోతోంటే రాతిబొమ్మలకు పంచామృతాభిషేకాలు ఎందుకన్నా.. జనం కట్టుగుడ్డలు లేకుండా వణికిపోతోంటే స్పర్శలేని దండగమారి బొమ్మలకు పట్టుగుడ్డలెందుకని ప్రశ్నించా. ఇవన్నీ నా చావుకు తెచ్చాయి..’

బసవడికి కోపంతో పాటు ఆసక్తీ తన్నుకొస్తున్నాయి.

‘కల్బుర్గీ! ఇష్టలింగధారణలో తప్పేముందోయ్.. ఆలయాల్లో డంబాచారాలకు విరుగుడుగా ఆ పద్ధతి తెచ్చాను.. పొదుపుకు పొదుపూ, భక్తికి భక్తీ. శివుడెప్పుడూ మెడలోనే ఉంటాడు..’

‘మీకు తప్పుగా అనిపించలేదు. నాకనిపించింది. విగ్రహారాధన కూడదని నా వాదన. అది గుళ్లో ఉన్నా, మెడలో ఉన్నా శుద్ధ దండగ. మీరు జంధ్యం దండగన్నారు. నేను లింగం దండగన్నాను..’

‘అది కాదోయ్.. ఏకాగ్రత కోసం లింగాన్ని వేసుకోమన్నా.. ’

‘నాకు కాఫీ, సిగరెట్టు తాగితే ఏకాగ్రత. కానీ నేను వాటిని మెడకు కట్టుకుని ఊరేగను..’

‘సరే ఇంకా ఏమని వాదించావు..’

‘ఇలాంటివేనని చెబుతున్నాగా..’

‘ఓసోస్.. ఈ మాటలకే చంపేశారా? ఇలాంటి వాదవివాదాల కోసమే కదా అనుభవ మంటపం పేరుతో జాతిమతవర్ణలింగ వివక్షల్లేకుండాల అందరూ వచ్చి చర్చించుకోవడానికి భవనం కట్టించాను..’

’ఆ భవనం ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయింది. తమకు నచ్చని వాదాన్ని వినిపించేవాళ్లను కాలగర్భంలో కలిపేయడమే నేటి వాదం. దానికోసం సరికొత్త అనుభవ మంటపాలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి..’

‘ప్చ్. ఇదేం బాగాలేదోయ్ కల్బుర్గి..’

కల్బుర్గి బసవడు ఆరాధిస్తున్న శివలింగం కేసి చూశాడు. పీకలదాక మధువు తాగడంతో కడుపుకింద ఒత్తిడి పెరిగింది.

‘మరో సంగతి చెప్పడం మర్చిపోయానండి. నన్ను ఖూనీ చేయడానికి మరో కారణం కూడా ఉందండోయ్..’

బసవడు చెవులు రిక్కించాడు.

‘అనంతమూర్తి అని నా స్నేహితుడొకడుండేవాడు. గత ఏడాదే పోయాడు. నా మాదిరే వాదించేవాడు. నా మాదిరే విగ్రహాలంటే పడదు. అతడు బాల్యంలో ఓ మంచి పని చేశాడు. విగ్రహాలకు మహిమ ఉందో లేదో తేల్చడానికి విగ్రహాలపై ఉచ్చ పోశాడు. అవి శపిస్తాయేమోనని చూశాడు. అవి ఏమీ చేయకపోవడంతో మనోడికి మరింత ధైర్యం వచ్చేసింది. ఆ సంగతి ధైర్యంగా ఓ పుస్తకంలో రాశాడు. నేను ఓ చర్చలో ఆ విషయం చెప్పాను. కాషాయమూకలకు అది నచ్చలేదు. అప్పటికే నాపైన కత్తులు నూరుతున్నారు కదా. సఫా చేసేశారు..’

బసవడు ‘శివశివా’ అని చెవులు మూసుకున్నాడు.

కల్బుర్గికి కడుపుకింద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. బుర్రలో బలమైన సరదా కూడా మెలిపెడుతోంది.

‘వీరశైవరత్నమా.. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట..’

‘చెప్పు..’

‘ఇది స్వర్గం కదా. ఇక్కడికొచ్చినవారికి చావు ఉండదు కదా.. అనంతమూర్తి చేసిన పరీక్షను నేను బతికున్నప్పుడు ఎన్నడూ చేయలేకపోయానండి. ఇప్పడు జరూరుగా చేయాలనిపిస్తోందండి. మీరు  కాస్త అరుగు దిగితే ఈ శివలింగంపై ఆ పని కానిచ్చేస్తాను..’

కల్బుర్గి మాట పూర్తికాకుండానే బసవడు ఖడ్గంతో ఒక్కవేటున అతని తల నరికేశాడు.

శివలింగం పట్టపానంపై పడిన కల్బుర్గి తల విరగబడి నవ్వుతోంది.

కల్బుర్గి పొట్టకింద నుంచి సన్నని ధార రాతి విగ్రహాన్ని తడుపుతోంది.

 

 

(మతోన్మాదులు చంపేసిన కల్బుర్గికి క్షమాపణతో నివాళిగా..)

చంపడమే ఒక సందేశం!

 

 

–  రమణ యడవల్లి

 

ramana yadavalliఈ లోకమందు చావులు నానావిధములు. ప్రపంచంలోని పలుదేశాల్లో పలువురు తిండి లేకో, దోమలు కుట్టో హీనంగా చనిపోతుంటారు. కొన్నిదేశాల్లో రాజకీయ అస్థిరత, యుద్ధవాతావరణం కారణంగా పెళ్ళిభోజనం చేస్తుంటేనో, క్రికెట్ ఆడుకుంటుంటేనో నెత్తిన బాంబు పడి ఘోరంగా చనిపోతుంటారు. ఇంకొన్ని దేశాల్లో మెజారిటీలకి వ్యతిరేకమైన ఆలోచనా విధానం కలిగున్న కారణంగా హత్య కావింపబడి చనిపోతారు. 

నరేంద్ర దభోల్కర్, గోబింద్ పన్సరె, మల్లేశప్ప కల్బుర్గి.. వరసపెట్టి నేల కొరుగుతున్నారు. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి.

సౌదీ అరేబియాలో మతాన్ని ప్రశ్నించడం తీవ్రమైన నేరం. శిక్ష కూడా అత్యంత పాశవికంగా అమలవుతుంది. ఇదంతా వారు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. కనుక సౌదీ అరేబియా ప్రభుత్వం ఎటువంటి మొహమాటాలు లేకుండా దర్జాగా, ప్రశాంతంగా, పబ్లిగ్గా తన శిక్షల్ని అమలు చేసేస్తుంది. సౌదీకి అమెరికా మంచి దొస్త్. దోస్తానాలో దోస్త్‌లు ఎప్పుడూ కరెక్టే. అందుకే అమెరికా సౌదీ అరేబియా క్రూరమైన శిక్షల్ని పట్టించుకోదు!

సౌదీ అరేబియా శిక్షలు అనాగరికమైనవనీ, ప్రజాస్వామ్యంలో అటువంటి కఠినత్వానికి తావు లేదని కొందరు విజ్ఞులు భావిస్తారు. అయ్యా! ప్రజాస్వామ్య దేశాల్లో కూడా విపరీతమైన భౌతిక హింస, భౌతికంగా నిర్మూలించే శిక్షలు అమలవుతూనే వుంటాయి. కాకపొతే అవి అనధికారంగా అమలవుతాయి. ఎందుకంటే – ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న ఈ దేశాలకి కూసింత సిగ్గూ, బోల్డంత మొహమాటం!

మతాన్ని ప్రశ్నించిన వారిని చంపడం ఎప్పుడూ కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరుగుతుంది, కాకతాళీయం అనేది అస్సలు వుండదు. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు బ్లాగర్లని వేదికి వెదికి వేటాడి మరీ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితీ ఇంతే. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రశ్నించినవారూ ఖర్చైపొయ్యారు! ఇక క్రిష్టియన్ మతం హత్యాకాండకి శతాబ్దాల చరిత్రే వుంది. ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.

దక్షిణ ఆసియా దేశాల్లో మెజారిటీకి వ్యతిరేకంగా డిఫరెంట్ అభిప్రాయాల్ని కలిగున్నవారిని గాడ్‌ఫాదర్ సినిమా టైపులో పద్ధతిగా ఎలిమినేట్ చేస్తుండడం అత్యంత దారుణం. ఇటువంటి హత్యలు అరుదుగా జరిగే సంఘటనలేనని, వీటికి స్టేట్‌తో సంబంధం లేదని కొందరు వాదించవచ్చు. కానీ – ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం. ఈ హత్యలు జరిగిన దాని కన్నా ఆ తరవాత దర్యాప్తు సంస్థలు చూపించే నిర్లిప్తతని పరిశీలించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవల్సిందిగా నా విజ్ఞప్తి.

ఇంకో విషయం – ఈ హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ‘మతాన్ని కించపరిచే ఎవరికైనా ఇదే శిక్ష’ అంటూ హత్యకి సపోర్ట్ చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న వ్యాఖ్యలు వెన్నులో వణుకు తెప్పిస్తున్నయ్! దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!

మరీ హత్యల వల్ల ప్రయోజనం?

సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!

*