ఎంతటి వెర్రివాడవు!

       
– మమత కొడిదెల                                   

 

ఎక్కడిదిరా అంత ఆశ నీకు…
మేమంతా…

 

గాలి తెమ్మెరలో మెత్తగా ఊగే పసుపుపచ్చ పూల కాడల్లో
గగనాన తేలిపోతూ క్షణక్షణానికి విచ్చిపోతున్న తడి కలల్లో
చెట్టు చిటారుకొమ్మన పసి ఆకునొకదాన్ని హత్తుకున్న నీటిబిందువుల్లో
పిచ్చుక నల్లరెక్కలమీది ఏడురంగుల మెరుపుల్లో
చిక్కుకున్న ప్రణయగాథల్ని విప్పుకుంటున్న వాళ్లం

 

నకిలీ దర్పాలకు ధగధగలనద్దే రంగు రాళ్లల్లో

తాజా ఎర్ర గులాబీ గుత్తుల మధ్య నలిగిన రేకుల్లో
ఆకాశమంత పరిచిన పందిళ్లలో
ఇద్దరం ఒకటయ్యామని ప్రపంచం వీపున చరిచి మరీ చెప్పుకుంటున్న వాళ్లం

 

మంచుకొండల్ని కరిగించి ఉప్పొంగించిన సముద్రాల్లో
నదీనదాల్నీ మరిగించి పండించిన నిలువెత్తు ఇసుక తిన్నెల్లో
మూలనకా గోడనకా అందంగా నిండిన ఇరుకు బతుకుల్లో
మా దేవుళ్ల రక్షణకు వీరతిలకం దిద్దుకుంటున్నవాళ్లం

 

చేతులెత్తేసిన నీ బిత్తర చూపుల్లోని మురికి కన్నీళ్లలో
అందాన్ని వెతుక్కుంటున్న వాళ్లం

 

గుండె ఘోషను వంటినిండా నింపుకుని అలల్లో అలవై
ఉబ్బిపోయిన నిన్ను పద్యాన్ని చేసుకుంటున్నవాళ్లం

 

ఆకలిదప్పులను మరిపించి
బాంబుల వర్షం దాటి
కత్తిమొనకు నీ నాన్నను అర్పించి
సముద్రాన్నే జయించబోయావు
నిన్నందుకుంటామని ఆశ పడ్డావు కదూ

 

ఆవలితీరాన మేం కాక ఇంకెవరుంటారని చెప్పిందిరా నాన్నా, నీ వెర్రితల్లి?

(అయిలన్ కుర్దీ లాంటి పసిపిల్లలకు, దుఃఖంతో…)

 

మీ మాటలు

  1. మరిన్ని దుఃఖాశ్రువుల్ని బయటకు తోడింది మీ కవిత.

  2. విలాసాగరం రవీందర్ says:

    Touching పోయెమ్

  3. మమత గారు, మళ్లీ కళ్లనీళ్లు పెట్టించారు.
    మీ కవితలాంటిదే ఓ వీడియో..

  4. నకిలీ దర్పాలకు ధగధగలనద్దే రంగురాళ్లలో – అన్న పంక్తీ ఆ తర్వాత మూడు పంక్తులూ గ్రేట్.
    గుండె తడి ఉన్న కవిత, కంట తడి పెట్టించే కవిత.

  5. తిలక్ బొమ్మరాజు says:

    ఆర్ద్రత నిండిన కవిత.ప్రతీ వాక్యం గొప్పగా వుంది.మీరు రాసే కవిత్వమెప్పుడు యిలా అద్భుతంగానే వుంటుంది.కవితలా కంటే గూడా పై వాక్యాలు స్పందించిన మీ హృదయానికి నిదర్శనం మమత.

  6. Sadlapalle Chidambara Reddy says:

    మా దేవుళ్ళ రక్షణకు వీర తిలకం దిద్దుకొంటున్న వాళ్ళం……ఈ మాట చాలు మనిషిని మేల్కొల్ప దానికి .

  7. akbar mohammad says:

    పోయెమ్ బావుంది ….

  8. వనజ తాతినేని says:

    కంట తడి పెట్టించింది మమత గారు . చాలా బాగా వ్రాసారు .

  9. ప్రసాద్ గారు, రవీందర్ గారు, మోహన్ గారు, ఎలనాగ గారు, తిలక్, చిదంబర రెడ్డిగారు, వనజ గారు: మీ గుండె తడిని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అక్బర్ గారు, కవిత మీ పెయింటింగ్ ఒకటే.

    In Solidarity!

మీ మాటలు

*