నాకి రోగం తగుల్కోనె !!

 

-సడ్లపల్లె చిదంబర రెడ్డి 

 

     అపుడు నేను నాలుగో క్లాసో అయిదులోనో సదువుతా వుంటి.
     ఒగదినం మేం పిల్లోల్లంతా కల్సి కల్లాల్లో “ప్యాకాట” అడ్తావుంటిమి. ప్యాకాటంటే ఏమంటే.. పుల్లలు వాడి పారేసిన అగ్గి పెట్టెల్ని నిలివునా రెండు బాగాలు సేస్తే రెండు ప్యాకులు. సిగరెట్టు పెట్టెల్ని గూడా అట్లే సేస్తా వుంటిమి. అయితే సిగరెట్టు ప్యాకులు శానా అపురూపము!!  ఎవరన్నా పట్నానికి పోయినపుడు ఏరుకోనొస్తే ఈరో కింద లెక్క!! వానికి శనక్కాయలు, బెల్లపుంటలు,ఏపిన ఉలవ బ్యాళ్లు ఇచ్చి జత సేసుకొంటా వుంటిమి. రెండు అగ్గిపెట్టి ప్యాకీలు ఒగ  సిగరెట్టు ప్యాకీకి సమానము.
     ఆ ప్యాకిల్ని ఆడే పిల్లోళ్ల తావ వుండేవాట్ని బట్టి రెండు, మూడు, నాలుగు… కలిపి ఒగదాని మిందొగిటి దొంతులుగా పేర్సి, పడిపోకుండా కాసింత మన్ను పోసి, వాటి సుట్టూ గుండ్రముగా గీత గీస్తా వుంటిమి. వాటికి పదయిదు ఇరవై అడుగుల దూరంలో గురుతుపెట్టి, ఆట్నుంచి గెత్తాలు(చేత్తో విసరడానికి అనువుగా ఉండే చెక్క రాయి) ఇసర్తావుంటిమి. ఆటగాళ్లు అందరూ ప్యాకల తాకి ఇసరినంక, వాటికి అందరికంటె దూరముగా ఎవర్ది పడితే వాడు మొదట ప్యాకులు  గెల్సుకోవచ్చు. యట్లంటే…..
     గెత్తా పడిన తావ కుడికాలుంచి యడమ కాలు యనక్కి సాపి, కుడి కాలు కింద నుంచి చేత్తో గెత్తాని ప్యాకల మిందికి ఇసరల్ల. గెత్తా తగిలి గీసిన గీత దాటి బయటపడినవన్నీ  వాడే గెల్సినట్లు లెక్క.
     ఆ ఆట అర్దం అయ్యిందో లేదో యనక నుంచి మా యన్న(నాయిన)వొచ్చి బర్ర కట్టెతో ఒగటి అంటిచ్చె. జుట్టు పట్టుకోని ఇంటికి ఈడ్సుకు పాయ. అంత సేపటికి మా యమ్మ అటకడు నీళ్లు పొయ్యిమింద కాగబెట్టి, ఇంటి ముందర మగోళ్లు పోసుకోనే బండ తావ పెట్టిండె. నాయిన కొట్టిన ఏట్లకి ఏడుస్తా వుండే నన్ని మా యమ్మ అట్లనే బండ మింద కుదేసి అంగీ ఇప్పి బుడుకూ బుడుకున నాలుగు సెంబులు నీళ్లు కుమ్మరించె. పచ్చి సీకాయి యేసి తలంతా రుద్దె. సీకాయి కండ్లల్లో పడి మంటకెత్తుకోనె.
    ఈడ పచ్చి సీకాయంటే ?? ఇనండి…. మా యమ్మ పుట్నిల్లు కర్నాటకము-కోలార్ జిల్లా– లోని పెన్నా నది గట్లో వుండే కల్యాకన పల్లి(కలినాయకన హళ్లి)(అప్పుడు దాన్ని మైసూర్ స్టేట్ అనేవారు) ఆ కాలంలో పెన్నా జీవనది!! ఆ ఏటి గట్లో సీకాయ పొదలు దండిగా వుండె. అవి పెరగల్లంటే ఇరవై నాలుగ్గంటలూ నీళ్లు పారతా వుండల్ల. ఆ సీకాయి పొదలు పిందిలు ఏసినప్పట్నుంచి మా యవ్వ (అమ్మమ్మ) పచ్చివే తెస్తావుండె. పండి ఎండినంక మా ఊర్లో కావాల్సినోళ్లకందరికీ మూటలు మూటలు ఇస్తావుండె.
    నీళ్లు పోసుకోనేది అయితూనే నా శరీరమంతా దద్దులు పొంగిండివి!! కండ్లు కాల్సిన సింత నిప్పుల మాదిరీ యర్రగా అయ్యిండివి. మంటకి తట్టుకో లేక నేను గట్టిగా ఏడ్సబడ్తి. అపుడు మాయమ్మ “పచ్చి సీకాయి ఒంటికి పట్టక అట్లయ్యిది. రవ్వంత సేపటికి తగ్గి పోతుంది.” అని సెప్పి గుడవలో వుండే బెల్లపుంట ఇచ్చి ఒదార్సబట్టె. అయినా దద్దర్లు తగ్గలేదు!!
   అంత సేపటికి మా యవ్వ (నాన్నమ్మ) నా దగ్గిరికొచ్చి “అయ్యో బాశాలీ నీళ్లు పోసేటవుడు కుమ్మరి పులుగో, జర్రో కర్సినట్లుంది. అందుకే ఇట్లయ్యింది.బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాపిచ్చుకురా పో ” అని మా యమ్మని పురమాఇంచె.
   అపుడు నన్ని యండ్లో నిలబెట్టి తలకాయి ఆరబెట్టి,సెక్క దూబానితో పద్ద పెద్దగా దూబి ఒగ అంగీ తొడిగె. అది రెట్ల మింద సినిగింటే బాగలేదని ఏడిస్తి. దాన్ని ఇప్పదీసి సూదీదారంతో నాలుగు కుట్లేసి ఒగ సెంబు తీసుకోని నన్ని బెస్తోళ్ల ఇంటికి పిల్సుకు పాయ.
     బెస్తోళ్ల ఇల్లుండేది ఊరి మద్యలో. నేనూ మా యమ్మా పోతూనే బెస్త ఈసూరమ్మ “ఏమి ఆదెమ్మక్కా పిల్లోన్ని పిల్సుకొస్తివి? ఏమయ్యిది??” అని అడిగె.
     “అయ్యో సూడమ్మా! ఇంటి ముందర నీళ్లు పోసేతవుడు దీని రావిడి అణగా ఏడిదో పులగ పయ్యి మింద(ఒంటి మీద) పారాడి నట్లుంది. మాగిన సింత తొడల(తొనల) మాదిరీ దద్దు లొచ్చిండివి అపుట్నుంచి ఈయప్ప ఏడుపు సూసేగ్గాదు ” అనె.
    అపుడు ఆయమ్మ నా అంగీ ఇప్పి “అవును కదక్కా పిల్లోడు గాబట్టి ఓర్సుకో నుండాడు. మనట్లా వాళ్లయితే యా బాయిలోనో పడ్తావుంటిమి.” అని సెప్పె. అంతవొరుకూ ఊరికే వున్న నేను గట్టిగా ఏడ్సబడ్తి. “ఊరుకోరా అప్పయ్యా! గడియలో తగ్గి పోతుంది అని ఓదార్సి ఇంట్లోకి పొయ్యి గలాసు నిండా నీళ్లు యెచ్చి నన్ని తాగమనె.
    నేను లోటాడు నీళ్లు గొటగొట్న తాగేస్తి. ఇంగ రవ్వన్ని నీళ్లు ఆ యమ్మ పుడిసిలి నిండా తీసుకోని నా ఒల్లంతా తుడిసె. సల్లగా వుండే ఆ నీళ్లు తగుల్తూనే నాకు సగిచ్చినట్లాయ. కాసంత సేపటికి దద్దులన్నీ తగ్గి పాయ.
    ఇంటికి పొయినంక మా యమ్మ తో అడిగితి” అమా మనమూ బెస్తోళ్లూ ఒగే బాయి నీళ్లు తాగుతాము గదా!! అట్లాది మనింట్లో తాగితే తగ్గని రోగము వాళ్లింట్లో తాగితే యట్ల తగ్గుతుంది?? అని అడిగితి.
     దానికి మా యమ్మ”వాళ్ల సెయ్యి వాసి(హస్త వాసి) అట్లాది.యంత పెద్ద రోగమైనా వాల్ల ఇంటి గడపతాకి పోతూనే దిగి పోవాల్సిందే. బెస్త పెద్దప్పయ్య అని ఆ ఇంటి యజమానిపేరు. యంత మొండి రోగమైనా ఆయప్ప నయం జేస్తావుండె. సుట్టూ పక్కల ఇరవై ఆమడ్లనుండి ఆయప్పని ఎదుక్కోని వొస్తావుండ్రి. ఆయప్ప పేరూ క్యాతులు సూసి ఓర్సని జనాలు ఏడిదో సెడుపు సేస్తే ఈ నడమే సచ్చి పాయ.
     ఎవరి కతలో యాల!! అయిదారేండ్లకి ముందర నాకి ఒగ దినం ఇపరీతమైన జరం. మీ నాయిన సూస్తే సైకోలేసుకోని దేశాలంటీ పొయ్యిండాడు. రాగి సేను కోతకొచ్చింది. కూలోల్లంతా తట్లుతీసుకోని యల్బార్తా వుండారు. వాళ్ల జతలో ల్యాకుంటే ఎన్ను యాడిది ఆడ పరిగిలు ఏరుకొనే వాళ్లకి ఇడ్సిపెదతారు. రాగి తాళు జానెడు కొయ్య ఇడిసి కోస్తారు. బంగారట్లా తాళు అద్దువాన్నమయి పోతుంది” అని అనుకోని, బెస్తోళ్ల ఇంటికి పోతి. నేను పొయ్యే తప్పటికి బెస్త పెద్దప్పయ్య పొయ్యి ముందర కూకోని సలి కాపుకొంటా వుండాడు. నన్ని సూసి” ఏమే ఆదెక్కా! ఇంతపొద్దున్నే ఒస్తివి?” అనె.
    ” మామా!! సేని తాకి కూలోళ్లు పొయ్యిండారు. నీ కొడుకు ఊర్లో లేడు. నాకి రాతిరి నుంచి ఒగటే సలీ జరము ఏడిదన్న ఒగ మాత్ర ఈ మామా” అని అంటి.
     “థూ నీ యక్క సలీ జరానిగ్గూడా మందులు మాకులూ కావల్నా?? కోమటి లచ్చుమయ్య అంగట్లో రెండు బొట్లిచ్చి కాపీ పుడి కొనుక్కొని డికాషను సేసుకోని తాగుపో అదే పోతుంది.” అనె.
     ” నాదగ్గర బొట్టూ లేదు. గుడ్డి కాసుగూడా లేదు. యావిదన్నా ఒగ మాత్ర ఇయ్యి మామా” అంటి  .
   అపుడు తలకాయి గీరుకోని, అక్కడిక్కడ సూసి, తుబుక్కున పొయ్యిలోని బూడిద మిందకి ఎంగిలి ఉమిసి మూడు వుంటలు మాదిరీ సేసి “మూడు పూట్లా మూడు ఏసుకో పో” అని మంత్రించి ఇచ్చె.
    అపిటికే రెండు బార్ల పొద్దెక్కింది ఆయప్పిచ్చింది బూడిదో, గుంత సేని మన్నో అనుకో లేదు. తూరుపుకు తిరిగి దేవునికి మొక్కోని ఒగ మాత్ర మింగి కక్కుల కొళ్లి, ఈత తట్టి తీసుకోని పడేదీ లేసేదీ తెలీకుండా సేని దావ పడ్తి. అంత సేపటికి కూలోళ్లు గనిమింద నిలబడి ముణాలు పట్టిండారు. నేను గూడా ఒగ మునం అందుకొంటి సేని కోతలయ్యే పొద్దుకి నా సలెక్కడ పాయనో, జర్రమెక్కడ పాయనో నాకే తెలీదు.
      ఇంగొగ సారి…… అది యండ కాలము. పగలంతా మిరప సెట్లు తవ్వకాలు సేసి ఇంటికి యల్ల బార్తి. సురుకు తీసుకోనె. కాళ్లు మడిసేకి(ఒంటేలుకు) పోతే ఒగటే మంట. అట్లా పొద్దులో పెద్దప్పయ్య ఎదురొచ్చె. నా బాద సెప్పుకోని ఏడిదన్నా మందియ్యి మామా అని అడిగితి.
     అదే టయానికి ఉప్పరోళ్లు ఎనుంపోతులు మేపుకోని, ఊర్లోనికి తోలుకోని ఒస్తావుండ్రి. అవి ఏటి కెచ్చుల్లోనా కానుగ తోపుల్లోనా పచ్చి మ్యాత బాగా మేసి నట్లుండివి వర్సగా ప్యాడ దుస్స బట్టె!!(పేడ వేయ సాగాయి) దాన్ని సూసిన మామ “ఇంత మాత్రానికే మందూ మశానమూ యాలసే! ఆ ప్యాడ కొంగులోకి ఏసుకోని బాగా పిండి రసం తాగు టక్కున తగ్గిపోతుంది” అనె.
     అట్లే సేస్తి…. కడుపులో ఎవరో సెయ్యి పెట్టి తీసేసి నట్ల సురుకు తగ్గి పాయ.” అని ఆయప్ప సెయ్యి వాసి గురించి సెప్పె.(ఇదే పేడ వైద్యాన్ని మా అమ్మ 1980 ఆ ప్రాంతంలో కూడా మా మాట  వినకుండా ఆచరించేది!!)
    పయ్యంతా దద్దర్లొచ్చే రోగం ఆ పొద్దు తగ్గి పాయ కానీ తిరగ యపుడు నీళ్లు పోసుకొన్నా అట్లే అయితా వుండె. నేను బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాగి వొస్తానే ఉంటి. రొన్నాళ్లకి దగ్గూ పడిశం తగుల్కోనె.
     ఒగ దినం మాయమ్మ నాయినతో ” ఏమండ్రా! పిల్లోడు రాతిరి పూట నిద్దరేపోడు. కయ్ కయ్ అని దగ్గీ దగ్గీ సచ్చి సున్నమయితా ఉండాడు. అస్పత్రికన్నా పిల్సుకు పో” అనె.
    అఫుడు మా నాయిన” ఈడు పుట్టిండేది ఆసుపత్తిరిలో. పాలు సాలక సక్కెర నీళ్లు పోసి శీతల శరీరమయ్యింది. దాంజతకి ఈడు బయ్యుమూ దిగులూ ల్యాకుండా కుక్క నేరేడికాయలూ, సొండి సెరుకులూ(లేత చెరుకు) తిని తలమీదకి తెచ్చుకోని వుండాడు. రొన్నాళ్లు పిల్లోల్ల జతలో తిరగ నియ్యకుండా పత్యం సేసి పెట్టు అదే తగ్గి పోతుంది ” అనె.
     ఒగదినం ఇసుకూలుకు పోతి పిల్లోల్ల జతలో కూకోని దగ్గేకి మొదలు పెడ్తి. దగ్గి దగ్గి తిన్న సంగటి అంతా వాంతి సేసుకొంటి. అయివారు ఇంటికి పంపిచ్చె. ఆ పొద్దు మా నాయిన ఊర్లో వుండ్లేదు. అయిదారుదినాలకి ఒచ్చె. ఒస్తూనే మా యమ్మ కొట్లాట మొదలు పెట్టె .
    “పిల్లోనికి బాగలేదు. మేపుకొచ్చే వాళ్లు లేక ఎనుములు పాలు తక్కువిస్తా వుండివి. పెద్ద పిళ్లోళ్లు సేన్లకి నీళ్లు సరిగ్గా కట్టక అవి ఎండుకు పోతా వుండివి. అంగిడిలో అప్పు శానా అయ్యింది. కాపీ పుడి గూడా పుట్టందుము లేదు. ఈ సంసారము ఏగేకి నాకి శాతగాదు. బాయన్నా సెరువన్నా సూసుకొంటాను” అని ఏడ్సబట్టె.
    అపుడు నాయిన నన్ని దగ్గరికి తీసుకోని కండ్ల మిందకి పడిండే యంటికిలు యనిక్కి తీసి నులక దారముతో జుట్టు కట్టి” ఈ పొద్దు బాగనే ఉండాడు కదా!? ఊరకే ఇల్లెగిరి పొయ్యేటట్ల యాల అరుస్తావు??” అనె.
    ” మూడు దినాలకి ముందర సూడాల్సింటివి పిల్లోని అవస్తలు.నిన్నా, ఈ పొద్దూ మాత్రమే అట్ల వుశారుగా ఉండాడు. తిరగ యపుడు కొప్పెత్తు తాడో ఏమో పెద్దాసుపత్రికన్నా పిల్సుకపో” అనె.
    నాయిన ఏమీ మాట్లాడలేదు. స్నానం సేసి బట్లు మార్సుకోని నాగ్గూడా వుదికిన అంగీ తొడిగి ఇందూపుర గవుర్మెంటాసుపత్రిక్కి పిల్సుకు పాయ.
    అదే నేను తొలి సారి ఆస్పత్రికి పొయ్యింది. శానా పెద్దగా వుంది. దూరం దూరంగా ఆడొగిటి ఈడొగిటి రూములు మాదిరీ కట్టిండారు. వాటి మద్యాలో పెద్ద పెద్ద యాప మాన్లు పెరిగిండివి. ఒగ డాకుట్రు నన్ని పరీచ్చలు సేసి పిల్లోడు బాగనే వుండాడే అని అను మానం పడుతూనే ఇంగొగు డాట్టరు దగ్గిరికి పొమ్మనె. ఆయప్ప పోటోలు(ఎక్స్రేలు) తీసే రూము తావ యాప మాని కింద సెక్క కుర్సీమింద కూకోని వుండె. నన్ని పరీచ్చలు సేసి “బాగనే వుండాడుగదా పెద్దాయనా??” అనె. అపుడు మా నాయిన….
    “సారూ ఇపుడు మీరు బాగుంది అంటారు. మాడాలు(మేఘాలు)మూసు కొంటేనో, తేమలో తిరిగితేనో తిరగబెడుతుంది. తగ్గీ తగ్గీ ఊపిరి తిప్పుకొనేకి శాతగాక ప్రాణం పొయ్యేవాని మాదిరీ తనుకు లాడతాడు. రాతిరి పూట గొంతులో గొర గొర అని పిల్లి కూతల మాదిరీ శబ్దమొస్తుంది. రాతిరి పొద్దు నిద్దరే పోడు. బొక్క బార్లా తల కిందకేసి పిర్రలు పైకెత్తుకోని గస పోసు కొంటాడు. పడిశం పట్టి బట్నేల్లావు సీమిడి ముక్కులో కార్తావుంటుంది.” అని సెప్ప బట్టె.
    అపుడు డాక్టురు ఒగాయప్పని కేకలేసి పిల్సి బకీటునిండుకా నీళ్లు తెమ్మనె. తెస్తూనే నేలమింద సల్ల మనె. సల్లి బురదయినంక నన్ని దానిమింద బిరబిరా నడసమనె. నేను ఆయప్ప సెప్పినట్లే సేస్తి. అపుడు డాకుట్రు మా నాయన్ని పిల్సి “సూడప్పా పెద్దాయనా! తేమలో తిరిగితే పడిశం పడుతుంది దగ్గొస్తుంది అంటివి. ఇపుడు సూడు అర్దగంట నుంచి తిరుగుతా వుండాదు ఏమీ కాలేదు. బాగుండాడు కదా!!” అనె.
     మా నాయిన గుటకలు మింగుతా ఏమీ మాట్లాడ లేదు.
      అపుదు దగ్గిర దగ్గిర నాకు 9-10 ఏండ్లు ఉంటుంది. తేమలో తిరిగేది అంటే ఇది కాదని తెలుస్తానే ఉంది!! అట్లాది ఇంత సదువు సదివిన డాక్టరు నా కొడుక్కి అర్తం కాలేదంటే ఏమనుకో వల్లో ఆ బగవంతునికే తెలియల్ల??  (ఇప్పుడు నా వయస్సు 64. సం. నిత్య రోగిని ఎన్ని మందులు తిన్నానో నాకే తెలియదు. అయినా ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రం వెళ్ల లేదంటే నమ్మండి)
    అపుడు ఒగ రూము తాకి పొమ్మన్రి. ఆడ నాపేరు రాసుకోని సీటీ రాసిచ్చిరి. దాన్ని తీసుకోని ఇంగొగ రూముతాకి పోతే, తెల్ల బట్లేసుకోనుండే నర్సమ్మ “ఖాలీ సీసా కొనుక్కురాపో మందే సిస్తాను” అనె.
    ఆసుపత్రికి ముందరే సన్నవి,పెద్దవి వర్సగా పెట్టి ఎవరో సీసాయిలు అమ్ముతావుండ్రి. అణా(ఆరు పైసలు) ఇచ్చి సన్న సీసాయిని తెస్తిమి. నర్సమ్మ దాన్నిండా ఎర్రగా వుండే మందు నించి, సన్న గొట్టమట్లా దాంట్లో  రవ్వంత పోసి ఆడే తాగమనె. దాని వాసనకి వాంతికొచ్చినట్లాయ. అయినా కండ్లు మూసుకోని గుటుక్కున మింగేస్తి. తియ్య తియ్యగా సారాయి వాసన మాదిరీ వుండె. దాన్ని దినానికి మూడు పూట్లా తగమన్రి.
    ఆపొద్దుట్నుంచి దిన్నమూ పొద్దున్నే కుడి పక్కలోనే లేయల్ల. ఎవరి మొకమూ సూడకుండా దేవిని పటాలు మాత్రమే సూడల్ల. ఇటికి పొడితో పండ్లు తోముకోని ముకము కడుక్కోని సూరే బగవంతునుకి మొక్కుకోవల్ల. పణమింద అడ్డం ఈబూతి దిద్దుకోని “స్వామీ రామా నారాయణా పరమాత్మా పరంధామా నన్ని బాగా కాపాడప్పా!! నా రోగం నయం సేయప్పా ” అని దేవుని పటాలకి మొక్కుకోవల్ల అని  నాయిన నాకి అలవాటు సేశె.
   ఇట్ల మొదలైన రోగము నన్ని ఎట్ల సంపుకు తినిందో సెప్పాల్సింది శానా వుంది. అవసరమయినవుడు సెప్పుతా…
*

మీ మాటలు

  1. మీరు చెప్పిన పేకాటనే మేము పేకల స్థానంలో మామిడి ముట్టెలు కుప్పగా పోసి ఆడేవాళ్ళం.

    అయితే ఆ రోగంతో ఇంకా అవస్థ పడుతూనే వున్నారా? అయ్యో!

    • Sadlapalle Chidambara Reddy says:

      లేదు సోదరా అనుభవ పాఠాలతో ఆ అలర్జీ జబ్బును పోరాటం చేసి నా దారికి తెచ్చుకొన్నా. దానివల్ల, వైద్యుల నిర్లక్ష్యాలవల్ల, ఎంతగా సతమత మయ్యానో ముందు ముందు రాస్తా. మీ స్పందనకు నమస్కారాలు .

  2. jayakoteswara Rao Kandala says:

    Manamu Mana Chinnanati Jnapakalu Yantha Madhuramoo (Remember My Sweet Memories) Aa Rojulu Raavugaa Mithramaa

    • Sadlapalle Chidambara Reddy says:

      మన జ్ఞాపకాలే కాకుండా మన గత సమాజాన్ని ఈ తరానికి చెప్పడం , భాషలోని యాసలనూ పరిచయం చేయడం మంచిది కదా సోదరా!

మీ మాటలు

*