ఉత్కంఠగా చదివించే “భైరవ వాక”

?

-కొల్లూరి సోమశంకర్ 

 

~

కొల్లూరి సోమశంకర్

ఓ సుప్రసిద్ధ ఆలయం, దాని చరిత్ర, అక్కడి ఆచార సంప్రదాయాలను కథలో భాగంగా చెబుతూ ఆ ఆలయాన్ని దోచుకోవాలనుకునే ముఠా ప్రయత్నాలను, తమని తాము పేల్చేసుకుని భయంకరమైన ఉత్పాతం సృష్టించాలన్న తీవ్రవాద శక్తుల కుట్రలనూ వెల్లడిస్తూ, పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే నవల “భైరవ వాక“.

ప్రసిద్ధ రచయిత ఇందూ రమణ వ్రాసిన ఈ నవల తొలుత 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది.

ఆరుగురు సభ్యులున్న ఓ ముఠా ముంబయిలో సమావేశమై పథక రచన చేస్తుండగా కథ ప్రారంభమవుతుంది. తమ రహస్యం వినిందనే అనుమానంతో పనిమనిషిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో ముఠా సభ్యులు ఎంత క్రూరులో పాఠకులకు అర్థమవుతుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠా సభ్యులు తమకి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి విడిపోతారు. కథ ఆంధ్ర రాష్ట్రానికి మారుతుంది.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందనపురి, భైరవ వాక క్షేత్రాలను దర్శించడానికి పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా ఎందరో భక్తులు వస్తూంటారు. పాత్రో అనే మధ్యతరగతి కుటుంబీకుడు తన ముసలి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, పనిమనిషితోనూ చందనపురికి రైల్లో బయల్దేరుతాడు. ఓ తెలుగు మిత్రుడి సలహాతో విశాఖపట్నం వరకు వెళ్ళకుండా చందనపురి స్టేషన్‍లో దిగుతాడు. ఉత్సవదినాలు కావడంతో ఆ ప్రదేశమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూంటూంది. ఏం చేయాలో తోచదు పాత్రోకి.

ఆ సమయంలో పాత్రోని ఒరియాలో పలకరిస్తాడు పాండే అనే వ్యక్తి. పరాయి ప్రాంతంలో సొంత భాషలో మాట్లాడిన పాండేని చూడడంతో కాస్త ధైర్యం వస్తుంది పాత్రోకి.  తానొక గైడ్‌నని, క్షేత్ర దర్శనం చేయిస్తానని, వాళ్ళకి తోచినంత డబ్బు ఇవ్వమని బ్రతిమాలుకుంటాడు పాండే. అయిష్టంగానే అంగీకరిస్తాడు పాత్రో.

ఇక్కడ ప్రముఖ క్షేత్రాలలో యాత్రికులు పడే అవస్థలను ప్రస్తావిస్తారు రచయిత. బస్ టికెట్ల నుంచి, బస, ఆహారం, స్నానాలు, పూజలు, అమ్మకాలు, పూజాదికాలు వరకూ… దివ్యక్షేత్రాలలో అడుగడుగునా జరిగే మోసాలు, దోపీడీల గురించి కథాక్రమంలో వివరిస్తారు.

పాండే కన్ను ఈ కుటుంబంలోని ఆడవాళ్ళపై పడుతుంది. పాత్రో భార్య శశికళని, పనిమనిషి అరుంధతిని ఏకకాలంలో కామిస్తాడు. అరుంధతి కూడా పాండే పట్ల ఆకర్షితురాలవుతుంది. అతడిని రెచ్చగొడుతుంది. చందనపురి చేరాకా అక్కడి వ్యాపారులు, అధికారుల వల్ల అడుగడుగునా ఇబ్బందులని ఎదుర్కుంటుంది పాండే కుటుంబం.

కర్రపుల్లలు, బియ్యం, కూరలు కొనుక్కొచ్చి, నానా తంటాలు పడి అన్నం వండుకుంటారు పాత్రో వాళ్ళు. ఆకుల్లో వడ్డించుకుని తినబోతున్న సమయానికి ఓ పిచ్చిది వచ్చి అన్నాన్ని చెల్లాచెదురు చేసేసి వాళ్ళ ఆకుల్లోంచి గబగబా నాలుగు ముద్దలు తినేసి పారిపోతుంది. ఆ కుటుంబం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి తేరుకున్న పాత్రో తన వాళ్ళందరిని దగ్గరలోని హోటల్‍కి తీసుకువెడతాడు. పాచిపోయిన అన్నం పెట్టి, ప్లేటుకి యాభై రూపాయలు వసూలు చేస్తాడా హోటల్ యజమాని. ఇదేమని ప్రశ్నిస్తే పాత్రోని అవహేళన చేస్తాడు.

పిచ్చి యువతి పాండేకి ఎదురుపడడంతో కథలో మరో ఘట్టానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. ఆ యువతి నిజానికి పిచ్చిది కాదనీ, అలా నటిస్తోందని, ఆమె పేరు మోనిషా అని తెలుస్తుంది. పాండే కూడా గైడ్ కాదని, మోనిషాతో కలసి ఆ క్షేత్రంలో తిష్ట వేసి చోరికి మార్గం సుగమం చేయడమే అతని పనని తెలుస్తుంది. ఈ క్రమంలో అరుంధతితో మరింత సన్నిహితమవుతాడు పాండే. పాత్రో కుటుంబం నుంచి ఆమెని దూరం చేయాలని ఆలోచిస్తాడు.

మందిరం దోచుకోవాలనుకునే సమయం ఆసన్నమవుతూంటుంది. ముఠాలోని మిగతా సభ్యులంతా చందనపురి, భైరవ వాక చేరుకుంటారు. భక్తుల్లా నటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారంగా ఆలయంలోకి ప్రవేశించాలనేది వారి పథకం.

?

ఇదే సమయంలో పాత్రో కుటుంబం కూడా భైరవ వాక చేరుతుంది. తాను లోపలికి రాకూడదని చెప్పి అరుంధతి ఆలయం బయటే ఆగిపోతుంది. అది చూసి ఆమెకి తోడుగా పాండే కూడా బయటే ఆగిపోతాడు. గుడిలోకి వెళ్ళాకా పాత్రో అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోతాడు. నిర్వాహకులను ఏమీ అనలేక, నిస్సహాయంగా ఉండిపోతాడు. అరుంధతితో పాటు గుబురుగా ఉన్న పొదల చాటుకి చేరుతాడు పాండే. తమ కోరిక తీర్చుకోబోతుండగా వినబడిన మాటలు, కనబడిన దృశ్యం పాండేని నివ్వెరపరుస్తాయి. ఇద్దరు తీవ్రవాదులు పొదలమాటున నక్కి తమ రూపాలు మార్చుకుని నడుములకి బెల్ట్ బాంబులు ధరించి భక్తుల వేషాలలో మందిరం వైపు కదులుతారు. ఒకడు భైరవ వాక ఆలయం వైపు వెడితే, రెండో వాడు చందనపురిలో విధ్వంసం సృష్టించడానికి బయల్దేరుతాడు.

విపరీతమైన రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందనీ, దాంతో పోలీసులు, అధికారుల బెడద తీవ్రమవుతుందని భావించిన పాండే ఆ తీవ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన తీవ్రవాది కొంచెం దూరం పరిగెట్టి తనని తాను పేల్చేసుకుంటాడు. ఆ ప్రాంతమంతా రణభూమిగా మారిపోతుంది. తీవ్రవాది చేతిలో ఉన్న సంచీని చేజిక్కించుకుని అరుంధతితో సహా పారిపోతాడు పాండే. ఆ సంచీని తెలివిగా పోలీసులకు అందేలా చేస్తాడు.

ఈ లోపు మరో తీవ్రవాది చందనపురి చేసి దర్శనం క్యూలో కలసిపోతాడు. పాత్రో కుటుంబం, అరుంధతి, పాండే, మోనీషా, ముఠాలోని ఇతర సభ్యులు అందరూ దర్శనం క్యూలో చేరతారు. జనాలు విపరీతంగా ఉండండంతో క్యూ అసలు కదలదు. లభించిన ఆధారాలతో చురుకుగా వ్యవహరించిన పోలీసులు రెండో తీవ్రవాది క్యూలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. అతడిని పట్టుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఓ దశలో భక్తులందరికీ మత్తు కలిపిన ప్రసాదం పంచాలని ఆలోచిస్తారు. ఈలోపు పాండే ఓ ఉపాయం పన్ని తీవ్రవాది దొరికిపోయేలా చేస్తాడు. పాత్రో కుటుంబం, ముఠా సభ్యులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. పాత్రో కుటుంబం బయటకి వస్తుంది గాని ముఠా సభ్యులు ఆలయం ప్రాంగణం లోపలే దాగి ఉంటారు.

చీకటి పడి ఆలయం మూసేసి పూజారులు అధికారులు వెళ్ళిపోయాకా, చోరికి పాల్పడతారు. ఆఖరినగ తీసుకోబోతుంటే అలారం మ్రోగుతుంది. పోలీసులు చుట్టుముట్టే లోపు దొంగలందరూ తప్పించుకుంటారు.

ఇంటికి వెడదామని బయల్దేరిన పాత్రో తన సూట్ కేసులు, ఇతర వస్తువులని పోగొట్టుకుంటాడు. చేతిలో పైసా కూడా లేకుండా తమ ఊరు వెళ్ళడం కోసం చందాలు అడుగుతూ పాండేకి కనబడతాడు. తన దగ్గర ఉన్న దేవుడి నగలలోంచి ఓ నగని ఇచ్చి అది అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఊరు వెళ్ళమంటాడు. కాని ఆ నగని అమ్మే ప్రయత్నంలో పోలీసులు పాత్రోని అనుమానించి, దోపిడీలో అతనికి భాగం ఉందని అరెస్టు చేస్తారు. విశాఖపట్నంలో అరుంధతితో లాడ్జిలో ఉన్న పాండే టీవీ ద్వారా ఈ విషయం తెలుసుకుంటాడు. తనని ఎంతగానో ఆదరించిన పాత్రో కుటుంబానికి ఇలా జరిగినందుకు ఎంతగానో బాధపడుతుంది అరుంధతి. తన వల్ల ఓ కుటుంబం అపాయంలో చిక్కుకోడం భరించలేకపోతాడు పాండే.

నిజమైన ప్రేమ పాషాణ హృదయాన్ని సైతం కరిగిస్తుందనే నానుడిని నిజం చేస్తూ, పాండేలో పరివర్తన కలుగుతుంది. అప్రూవర్‌గా మారి, పోలీసులకు సహకరించి ముఠాని, సొత్తుని పట్టిస్తాడు. పాత్రో కుటుంబాన్ని రక్షిస్తాడు.

నవలలోని ప్రథాన సంఘటన పాఠకులకి ముందుగానే తెలిసిపోయినా, కథని చివరిదాకా చదివించడంలో కృతకృత్యులయ్యారు రచయిత. ఓ క్రైమ్, సస్పెన్స్ నవలలో ఉండాల్సిన బిగి, ఒడుపు అన్నీ ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయి. పాఠకులను ఏకబిగిన చదివించి, వారి మనసులను రంజింపజేస్తుందీ నవల. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2012లో “శ్రీ లోగిశ ప్రచురణలు” వారు ప్రచురించారు. 224 పేజీలున్న ఈ నవల వెల రూ.150/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.


 

ప్రచురణకర్తల చిరునామా:

శ్రీ లోగిశ ప్రచురణలు, డోర్ నెంబరు 7-50, శ్రీ సాయి నిలయం, బంగారమ్మ గుడి దగ్గర, సింహాచలం, విశాఖపట్నం 530028

 

మీ మాటలు

*