పల్లెని మింగిన పెట్టుబడి ..

 

 palle

(శ్రీ ఆదిభట్ల విద్యాసాగర్ గారి “పల్లెను మింగిన పెట్టుబడి, గ్రామీణ ఆర్థికం-ఒక పరిశీలన” మీద డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సెప్టెంబర్ 13, 2012న జరిపిన చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, భూపతిరాజు ఉష, కట్టా మూర్తి, కట్టా విజయ, చేకూరి విజయసారధి, నర్రా వెంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, ఆరి సీతారామయ్య, పిన్నమనేని శ్రీనివాస్, సుధ రాజు, Ch. పుష్పావతి, కాజ జనార్ధనరావు.

చర్చలో ముఖ్యాంశాలను సమీక్షించిన సభ్యుడు: ఆరి సీతారామయ్య)

*

ఒకప్పుడు గ్రామాలు బాగా ఉండేవనీ, అక్కడి ప్రజలు ప్రేమాభిమానాలతో, పరస్పర సహకారంతో జీవించేవాళ్ళనీ, ఈ మధ్య గ్రామాలు పూర్తిగా మారిపోయాయనీ , అప్పటి ఆప్యాయతలూ, ఆత్మీయతలూ ఇప్పుడు లేవనీ, అప్పటి జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిందనీ తెలుగు ప్రజానీకంలో చాలామంది అభిప్రాయం. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆదిభట్ల విద్యాసాగర్ శ్రీకాకుళం జిల్లాలోని చాలా గ్రామాల్లో చేసిన ప్రత్యక్ష పరిశోధన, విషయసేకరణ ఫలితమే ఈ పుస్తకం. ఈ 400 వందల పేజీల పుస్తకంలో ఆయన బ్రిటీష్ పరిపాలనా కాలం నుంచి 2011 వరకు గ్రామాల ఆర్థిక పరిస్థితిలో క్రమంగా వచ్చిన మార్పుల గురించి సాక్షాధారంగా రాశాడు. నిజానికి శ్రీకాకుళం పల్లెల్లో వచ్చిన మార్పులు ఈ పరిశోధనకు కేంద్రబిందువు అయినా, ఇవి ఆంధ్ర అంతటా, భారత దేశం అంతటా జరిగిన మార్పులే.

భూమిని సొంత ఆస్తిగా పరిగణించడం బ్రిటీష్ వారి పాలనలో మొదలయిందని రాశాడు రచయిత. శిస్తు వసూలు చెయ్యటం సులభంగా ఉండటానికి, జమీందారీ విధానాన్నీ, కొన్నిచోట్ల రైత్వారీ (ఇనాందారీ) విధానాన్నీ ప్రవేశపెట్టారు పాలకులు. స్వతంత్రం వచ్చిన తర్వాత భూమికోసం జరిగిన ఉద్యమాల కారణంగా జమీందారీ ఇనాందారీలు అంతరించి భూమి పెద్ద పెద్ద రైతుల చేతుల్లోకి వచ్చింది. గత 50-60 సంవత్సరాల్లో కుటుంబ సభ్యులమధ్య ఆస్తుల పంపకం వలనా, భూసంస్కరణల వలనా, పెద్ద కమతాలు చాలా వరకు పోయి చిన్న కమతాలు ఏర్పడ్డాయి. శ్రీకాకుళంజిల్లాలో 2005 నాటికి 5 ఎకరాలకంటే తక్కువ భూమి ఉన్న రైతుల శాతం 82. భూమిలో 66% వీరి అధీనంలో ఉంది.

వ్యవసాయంచేసి ధనవంతులైన వారు అరుదు. కొన్ని చోట్ల చిన్న కమతాల్లో వ్యవసాయం చెయ్యటం వల్ల వచ్చే ఆదాయం బతకటానికి కూడా సరిపోదు. ఎక్కువ ఆదాయం వస్తుందనే భ్రమతో అప్పుచేసి పెట్టుబడి అధికంగా ఉండే పంటలు వేసి ఉన్న పొలం కూడా పోగొట్టుకున్న సన్నకారు రైతుల కథ అన్ని ప్రాంతల్లోనూ తెలిసినదే.

ఈ మధ్య తమ భూమిని అమ్మేసో, కౌలుకు ఇచ్చో, పనికోసం జీవనోపాధికోసం పట్టణానికి పోతున్నాడు సన్నకారు రైతు. వ్యాపార పంటలు అధికం కావటం వల్ల పెద్ద రైతులు కూడా తక్కువ కూలిఖర్చుతో చెయ్యగల వ్యవసాయాలు చేస్తున్నారు. క్రమంగా పల్లెటూరి భూమి పెట్టుబడిపెట్టగల వ్యాపారస్తుల చేతుల్లోకో, వలస వస్తున్న రైతుల చేతుల్లోకో పోతుంది. కొత్త వ్యాపారాలు పెడతామని వస్తున్న కంపెనీలకు ప్రభుత్వం వందల వేల ఎకరాల పల్లెభూములను చవుకగా (రైతుకు పరిహారంగా తక్కువ ఇచ్చి) సేకరించి ఇచ్చేస్తుంది.

సాంప్రదాయ వ్యవసాయం తగ్గిపోవటం వల్లా, వ్యవసాయం మీద సన్నకారు రైతు బతకలేకపోవటం వల్లా, వ్యవసాయ రంగంలో పల్లె జీవనంలో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్లా, ఒకప్పటి కులవృత్తులు అంతరించాయి. వ్యవసాయానికి సంబంధించిన కులవృత్తులు చేసుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు బతుకుతెరువు కోసం, మరో జీవన విధానాన్ని వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు.

పెట్టుబడుల ప్రభావంతో వచ్చిన పెను మార్పులు వ్యవసాయరంగంలోనే కాదు, ఆదివాసుల, దళితుల, మత్శకారుల, చేనేత కార్మికుల జీవితాల్లో కూడా వచ్చాయి. వీరిలో కూడా చాలామంది బతుకుతెరువుకోసం పట్టణాలకు వలస వెళుతున్నారు.

మా సభ్యుల అభిప్రాయంలో వ్యవసాయానికి సంబంధించిన ఇన్ని అంశాల గురించి (పంటల క్రమం, పశువుల వాడుక, నీటి పారుదల, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, మార్కెట్) ఇంత విస్తృతంగా విషయసేకరణ జరిపి ప్రచురించిన పుస్తకం ఇదివరకు మేము చదవలేదు. గ్రామ జీవితం ధ్వంసం అయిందని అందరూ చెప్పుకుంటున్నా  దానికి కారణాలు ఇంత లోతుగా అధ్యయనం చేసినవారు అరుదేనని మా అభిప్రాయం.

 

పెట్టుబడికులవృత్తులు

పెట్టుబడి వలన మంచి జరిగిందా చెడు జరిగిందా? “పల్లెను మింగిన పెట్టుబడి” ఈ పుస్తకం శీర్షిక కాబట్టి పెట్టుబడి వల్ల చెడే జరిగింది అని రచయిత అభిప్రాయం. పెట్టుబడులు తీసుకువచ్చిన మార్పుల వలన ఒకనాటి పల్లె వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాని ఉత్పత్తి పెరిగింది. అసమానతలూ పెరిగాయి. ఒకప్పుడు పలెల్లో ఉన్న పేదరికం ఇప్పుడు పట్టణాలలో కనిపిస్తుంది.

కానీ వ్యవసాయంతో సంబంధం ఉన్న కులవృత్తులవారు   వ్యవసాయం యాంత్రికం కావటంతో మరో జీవనోపాధి వెతుక్కోక తప్పలేదు. అయినా కులవృత్తులు పోవటం మంచిదయిందంటాడు రచయిత. “వ్యవసాయం అనేది ఒక వృత్తిగా స్వతంత్ర వృత్తి కాదు. అది నిలబడటానికి అనేక వృత్తుల సహకారం అవసరం. నిజానికి మనిషి శరీరంలో గుండె వ్యవసాయం అనుకుంటే మిగతా అన్నిభాగాలను మిగతా వృత్తులతో పోల్చవచ్చు. కానీ వ్యవసాయమే వృత్తిగా ఎదిగిన రైతాంగవిభాగాలు మిగతా వృత్తుల ప్రజానీకంపై నిరంతరాయంగా దోపిడి సాగించారు. వాళ్ళ మిగులు విలువను కాజేసి గ్రామీణ ధనిక రైతాంగంగా రూపొందారు. దీనితో వాళ్ళకు మిగతా అన్ని వృత్తుల ప్రజానీకమూ ‘నీచంగానూ’ వాళ్ళ వృత్తులు వ్యవసాయంకంటే నీచ వృత్తులుగానూ కనబడ్డాయి.” ఇదీ రచయిత అభిప్రాయం.

పెట్టుబడి తెచ్చిన మార్పుల వలన “గ్రామీణ వృత్తులు చేసుకునే ప్రజానీకమూ, వ్యవసాయ కూలీలయిన దళితులూ తమ శ్రమను ఎంతోకొంత స్వేచ్చతో అమ్ముకోగలిగే ప్రాంతాలకు తరలివెళ్ళారు.”

“ఇంతవరకూ వారి శ్రమపై ఎదిగిన వ్యవసాయ వృత్తి ఈ దెబ్బతో ఒడుదుడుకులకు గురైంది. దాన్నే వ్యవసాయ రంగం సంక్షోభం అంటూ వృత్తుల్ని కాపాడాలనీ, తిరిగి గ్రామాలను కళకళలాడేలా చేయాలనీ రాజకీయ, సాంఘిక ‘ఉద్యమకారులు’ నినదిస్తున్నారు. ఆ మేరకు మన ‘ప్రజారచయితలు’ పోయిన స్వర్ణయుగంగురించి తెగవిలపిస్తున్నారు.” (పేజీ 31)

వెటకారం పక్కనబెట్టి, నిజానిజాలు పరిశీలిస్తే వ్యవసాయదారులు కొన్ని వృత్తులను నీచ వృత్తులుగా చూసింది వాస్తవమే,  కానీ అన్ని వృత్తుల ప్రజానీకాన్నీ నీచంగా చూశారన్నది నిజం కాదు. ఉదాహరణకు  మాకు తెలిసిన గ్రామాల్లో నాగళ్ళు తయారు చేసే వడ్రంగిని, కుండలు తయారు చేసే కుమ్మరిని, నీచ వృత్తులు చేసే వారిగా పరిగణించేవారు కాదు.  నీచ వృత్తులు చేసే వారిగా చూసిన వారిని పల్లెల్లో వ్యవసాయదారులే కాదు, ఇతర వృత్తుల్లో ఉన్న పట్టణవాసులు కూడా అదే విధంగా చూశారు, చూస్తున్నారు. అంటే అది వ్యవసాయానికి సంబంధించిన వివక్ష కాదు, భారత సమాజానికి సంబంధించిన వివక్ష.

ఇంకొక విషయం- పెద్ద రైతు ఇతర కులాలవారి అదనపు విలువను కాజేసి ధనికుడయ్యాడని రచయిత అభిప్రాయం. అందువల్ల  ఈ పల్లె  వ్యవస్థ  విధ్వంసం అయినందుకు  సంతోషం  వ్యక్తపరుస్తున్నాడు. కానీ పెద్దరైతేకాదు, సన్నకారు రైతుకు కూడా  పల్లెల్లో కులవృత్తులు చేస్తున్న అందరి సహకారం అవసరమే. నిజానికి భూమిలో ఎక్కువభాగం సేద్యం చేస్తున్నది సన్నకారు రైతులే. అంటే పల్లె సంస్కృతి మీద ఆధారపడు తున్నవారిలో ఎక్కువమంది సన్నకారు రైతులే. సన్న కారు రైతులు కులవృత్తులవారి అదనపు విలువను కాజేసి బతికారా? లేదా? పెద్దరైతు చేస్తే తప్పుగాని చిన్నరైతు చేస్తే తప్పులేదా?

పల్లెటూళ్ళూ, కులవృత్తులూ ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలయింది. పెద్ద రైతులు ఏర్పడింది బ్రిటీష్ పాలన కాలంలోనే (ఈ పుస్తకం ప్రకారం). అంతకుముందు అందరూ కౌలుదార్లే. కులవృత్తులు  ఎలా  ఏర్పడ్డాయి?  వ్యవసాయానికీ కులవృత్తులకూ  సంబంధం  ఎలా  మొదలయిందీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో లేవు.

పుస్తకంలో  చెయ్యవలసిన మార్పులు

 

కాపీ  ఎడిటర్లు  లేకపోవటం వలన  తప్పులు లేకుండా తెలుగు పుస్తకాలు రావు అని సరిపెట్టుకోవటం మాకు అలవాటయింది. కాని ఈ పుస్తకంలో మామూలుకంటే పదిరెట్లు ఎక్కువ తప్పులున్నట్లుంది. అయినా ఇది అందరూ చదవ వలసిన పుస్తకం అని మా ఏకగ్రీవ అభిప్రాయం. ఈ పుస్తకాన్ని సవరించి మరోసారి ప్రచురిస్తారనే ఆశతో ఇందులో చెయ్యవలసిన మార్పుల గురించి ప్రస్తావిస్తాను.

  1. తెలుగులో పుస్తకం రాస్తూ, గణాంకాల పట్టికలు అన్నీ (77) ఆంగ్లంలో ప్రచురించారు. అవికూడా తెలుగులో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువమంది పాఠకులకు అందుబాట్లో ఉండేవి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్ప్రెడ్‌షీట్స్‌ తెలుగులో రాసే అవకాశం ఉందికాబట్టి అది కష్టమైన పనికూడా కాదు.
  2. ఏదో ఒక విషయం గురించి చర్చించేటప్పుడు దాని ఆధారాలు ఫలానా పట్టికలో ఉన్నాయి అని చెప్తాడు రచయిత. కాని ఆ పట్టికలో అవి ఉండవు. ఉదాహరణకు 1971 లో శ్రీకాకుళం జనాభా 22.24 లక్షలు అని (పేజీ 25), ఇది మొదటి పట్టికలో ఉందంటాడు రచయిత. కాని ఆ సంఖ్య ఆ పట్టికలో లేదు.

ఈ పుస్తకంలో ముఖ్యమైన పట్టికలు చాలా  ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భూయాజమాన్యం గురించిన వివరాలున్న పట్టిక (పట్టిక  4) వాటిలో ఒకటి. “పట్టిక 4లో 1977 నుంచి 2005 వరకూ వచ్చిన మార్పులను చూడవచ్చు” అని  రచయిత చెప్పినా, 1977 నాటి వివరాలు ఆ పట్టికలో లేవు.

  1. కొన్నిచోట్ల వాచకంలో చెప్పినదానికీ పట్టికలో ఉన్న దానికీ పొంతనలేదు. పట్టిక 65 ఆంధ్రప్రదేష్‌లో దళితుల అక్షరాశ్యత గురించి అని ఉంది. వాచకంలో ఈ పట్టిక శ్రీకాకుళం జిల్లాలో దళితుల అక్షరాశ్యత గురించి అని తెలుస్తుంది.

ఇలాంటి తప్పులు ఈ పుస్తకంలో కొల్లలు.

  1. గణాంకాలు పట్టికలలో ఉన్నాయి కాబట్టి వాటిమీద వ్యాఖ్యానం వాచకంలో ఉంటే చాలు. అవే సంఖ్యలను మళ్ళా ప్రస్తావించనవసరం లేదు. అలా చెయ్యకుండా ఉన్నట్లయితే ఈ 400 పేజీల పుస్తకం 300-350 పేజీల్లో వచ్చేది, చదవటానికి సులభంగా కూడా ఉండేది.
  2. అనవసరమైన పట్టికలు చాలా ఉన్నాయి. అవి అవసరం లేవని ఎందుకనుకుంటున్నామంటే పట్టీకల్లో ఉన్న సంఖ్యలమీద ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి. రచయిత ఈ వివరాలు సేకరించాడు కాబట్టి పుస్తకంలో పెట్టాడేమో అనిపిస్తుంది.
  3. పుస్తకం అంతటిలో భూమికొలతకు ఒకే పరిమాణం వాడితే అర్థంచేసుకోవటం సులభంగా ఉండేది. ఇప్పుడు కొన్ని చోట్ల హెక్టేర్లు కొన్ని చోట్ల ఎకరాలు వాడారు.
  4. మిగతా కొలతలకు కూడా పరిమాణాలలో మార్పులు చెయ్యకుండా ఉన్నట్లయితే పాఠకులకేకాదు, రచయితకు కూడా కొంత గందరగోళం తప్పేది. ఉదాహరణకు, “గరిష్టంగా 720 మిలియన్‌ కేజీల దారం మాత్రమే ఎగుమతి చేయాలనే నిబంధన మూలంగా ఎగుమతులు 72 కోట్ల కేజీలయింది.” (పేజీ 377). 72 కోట్లు అంటే 720 మిలియన్లేకదా.
  5. ఒక సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలుండాలో, అసలు ఉండాలో అక్కరలేదో,  జాగ్రత్తగా ఆలోచించాలి. ఉదాహరణకు 28వ పట్టిక చూస్తే 1969-70 నాటికి నూతుల నుంచి  నీళ్ళు  పట్టి వ్యవసాయం చేసిన  భూమి  11793.24 ఎకరాలు  అని  ఉంది.  అదే  పట్టికలో  1975-76 లో  4996 అని  మాత్రమే  ఉంది.  అంటే  4996.00 అనా?  లేక  ఆ  సంవత్సరం అంత  జాగ్రత్తగా  లెక్కపెట్టలేదు  కాబట్టి  దశాంశ  బిందువు  వాడలేదనా?

ఒకే పట్టికలో కొన్ని సంఖ్యలకు దశాంశబిందువు తర్వాత రెండు స్థానాలూ, కొన్నిటికి ఒకే స్థానం, కొన్నిటికి అసలు లేకపోవటం అంటే అర్థం ఏంటీ?   ఈ పరిస్థితి ఒక్క 28వ  పట్టికలోనే కాదు, ఈ పుస్తకంలో ఉన్న దాదాపు అన్ని పట్టికలకూ వర్తిస్తుంది. గణాంకాలను  ఇంత  విస్తృతంగా  వాడదలచిన  వారెవరైనా ముందుగా  significant figures అంటే  ఏంటో  అధ్యయనం చెయ్యాలి.  లేదా గణాంకశాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

  1. “బోదెపు రాజారావు అనే రైతు కౌలు కోసం ఐదు ఎకరాల భూమిని తీసుకున్నారు.” (పేజీ 89). ఐదెకరాల భూమిని ఆయన కౌలు కోసం తీసుకోలేదు. ఏదో పంట  వేసుకుందామని  కౌలుకు తీసుకున్నాడు.

ఈ బోదెపు రాజారావు గురించి రాస్తూ మొదటి వాక్యంలో “తీసుకున్నారు” అన్న రచయిత రెండో వాక్యంలో “బాకీపడ్డారు” అనీ, మూడో వాక్యంలో “వలస వెళ్ళాడు” అనీ రాశాడు.

  1. నీటి పారుదల గురించి రాస్తూ టూబ్‌వెల్స్, బోర్‌వెల్స్ కింద జరిగిన వ్యవసాయం వివరాలు 196-197 పేజీల్లో రాశాడు రచయిత. కానీ ఈ టూబ్‌వెల్స్‌కీ బోర్‌వెల్స్‌కీ తేడా ఎంటో ఎక్కడా ప్రస్తావించలేదు.
  2. “వరి పంటకు ఒక సంవత్సరానికి (ఒకసారి పండిస్తే) 107 మంది కూలీలు అవసరం అవుతారు” (పేజీ 142). ఎంత పొలంలో? ఒక ఎకరంలోనా? హెక్టేర్‌లోనా? రోజూ 107 మంది అవసరమా? 107 పనిరోజుల అవసరమా?

ఈ ఒక్క చోటే కాదు. 59 వ పేజీలో 80 సెంట్ల పొలంలో చెరకుపంట పండించటానికి 311 మంది కూలీలు అవసరం అవుతారు అని రాశాడు రచయిత. 311 కూలీలా?  కూలిరోజులా? గంటలా?

  1. ఈ వాక్యం చూడండి: “అంటే ఈ దశాబ్దంలోనే దేశంలో ప్రతీ 4గురు రైతులలో ఒక రైతును మించి పొలాన్ని వీడాడని అర్ధమవుతుంది.” ఇది ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులోకి దించిన వాక్యం. దీని భావం: That means more than one farmer in four have left the land in this decade. తెలుగులోకంటే ఇంగ్లీషులో సులభంగా లేదూ?

ఇలాంటిదే మరో వాక్యం: “దేశవాళీ విత్తన ఉత్పత్తి, దేశవాళీ ప్రభుత్వ పరిశోధనల స్థానంలో దేశవాళీ కంపెనీలవైపు, విదేశీ కంపెనీలవైపు భారతీయ రైతు విత్తనం కోసం చూడాల్సివచ్చింది.” (పేజీ  209)

ఇంకొకటి: “గ్రామీణ రైతాంగాన్ని మార్కెట్ యార్డులను ఎందుకు ఉపయోగించుకోరూ?” (పేజీ 238)

ఇలాంటి కృతకమైన వాక్యాలు ఈ పుస్తకంలో కొల్లలు.

  1. ఇక అర్ధ, అర్థ ల గురించి. ఇది రెండు వేర్వేరు  అనర్థాల మేలు  కలయిక.  మొదటిది, semi- అన్న ఉపసర్గాన్ని  (ప్రీఫిక్స్)  “అర్ధ”  అని ఎవడో మహానుభావుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఆ తర్వాత మన ఖర్మకొద్దీ అర్థకీ అర్ధకీ తేడా తెలిసిన తెలుగువాళ్ళు కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఇక చూడండి దీని ప్రభావం.

అర్థబానిస (పేజీ 336)

అర్థశతాబ్దం (పేజీ 361)

అర్ధశాస్త్రవేత్తలు (పేజీ 150)

ఆర్ధిక వ్యవస్థ (పేజీ 150)

ఈ మాటలు చూస్తుంటే తెలుగు భాషకు పట్టిన గతికి ఏడుపు రావటం లేదూ?

  1. “ఒక చారెడు నేలకోసం బందీ అయిపోయి తమ దేశాన్ని ఇతర దేశస్థులు దండయాత్రలు చేసి ఆక్రమించుకుంటున్నా పట్టని స్థితిలో భూమికి బందీ అయి భారత రైతు కొనసాగిన స్థితి వుందని సెల్యూకస్ తన పుస్తకంలో వివరించారని అంబేద్కర్ ఉల్లేఖించాడు.” (పేజీ 74)

అంటే  సెల్యూకస్  పుస్తకాన్ని  అంబేద్కర్  చదివి,  దానిమీద  వ్యాఖ్యానిస్తే,  దాన్ని  రచయిత  చదివి  మనకు  చెప్తున్నాడన్న  మాట.  సెల్యూకస్ పుస్తకానికిగానీ, అంబేద్కర్ ఉల్లేఖనానికిగానీ మూలాలు రచయిత మనకు చెప్పలేదు. ఇదంతా ఎందుకు విడ్డూరంగా ఉందంటే, భూమిమీద వ్యక్తుల యాజమాన్యం బ్రిటీష్ పాలన  కాలంలో మొదలయిందని చెప్పిన  రచయిత అలాంటిది సెల్యూకస్ కాలంలోనే ఉందని చెప్తున్నట్లులేదూ? ఏది నిజం?

ఇలా  తప్పుల పట్టిక రాసుకుంటూ  పోతే  చాలా పొడుగవుతుంది.  అయినా గత  యాభై  సంవత్సరాల్లో  మన  గ్రామాల్లో  వచ్చిన  ఆర్థిక  మార్పుల గణాంకాలు  వివరంగా  తెలుసుకోదలచిన  వారికి  ఈ పుస్తకం చాలా  ఉపయోగకరం అని మానమ్మకం.

 

పల్లెను మింగిన పెట్టుబడి

గామీణ ఆర్థికం – ఒక పరిశీలన

ఎస్. ఎ. విద్యాసాగర్‌

పీకాక్ బుక్స్, హైదరాబాద్

 

మీ మాటలు

  1. Srinivas Dumpati says:

    కులస్థులు లకు స్రమదోపిడికి ప్రత్యక్ష సంభందం ఉనత్లె. కొన్ని కులవ్రుతులకు నీచత్వాన్ని ఆపాదించడం ద్వార స్రమాదోపిడ్కి గురిఅయ్యైఈ కావున నిచకులం కానీ ఎకులమైన శ్రమదోపిడి చేసినట్లే.

  2. K. Venugopal says:

    Manchi parisheelana

  3. అజిత్ కుమార్ says:

    పరిపాలన చేసేవారు పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల వెనుకటినుండి అమలులో ఉన్న పద్ధతులు మారుతూ ఉండడం వల్ల పల్లెవాసుల జీవన విధానం సంక్షోభంలో పడింది . దానికి పెట్టుబడి వల్ల పల్లెజీవిన చిత్రం మారిందని పరిశోధకులు ముందే ఊహించుకోవడం వల్ల జరిగిన గందరగోళంగా అర్ధం చేసుకోవాలి.
    పరిశోధకులు అలా ఎందుకని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు?
    ఈ పరిశోధన ఎవరు చేయించారు ?
    చివరికి తప్పును ఎవరిమీదకు నెట్టారు?
    దానివల్ల ఎవరు రక్షించబడ్డారు?
    అని ఆలోచించాలి.

    • ఆరి సీతారామయ్య says:

      “పెట్టుబడి వల్ల పల్లెజీవిన చిత్రం మారిందని పరిశోధకులు ముందే ఊహించుకోవడం వల్ల జరిగిన గందరగోళంగా అర్ధం చేసుకోవాలి.”

      విద్యాసాగార్ గారు ముందే ఊహించుకుని తర్వాత పరిశోధన చేశారనటానికి ఈ పుస్తకంలో ఎలాంటి ఆధారాలూ లేవు. చాలా విషయసేకరణ చేసిన తర్వాతే ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆయన అభిప్రాయాలతో విభేదించవచ్చుగాని, ఆలోచనల్లో గందరగోళం ఉన్నట్లు కనిపించదు.

      “ఈ పరిశోధన ఎవరు చేయించారు ?”

      ఎవ్వరూ చేయించలేదు. ఆయనే వ్యయప్రయాసలతో మొదలుపెట్టాడు. దాదాపు ఐదు సంవత్సరాలపాటు చేసిన ఈ పనికి ఇద్దరు మిత్రులు సహకారం అందించారని రాశాడు.

      “చివరికి తప్పును ఎవరిమీదకు నెట్టారు?”
      మాకు అర్థమయినంతవరకూ గ్రామాల ప్రస్తుత పరిస్థితికి కారణం పెట్టుబడీ, ప్రభుత్వ నిర్ణయాలలో ముందుచూపు లేకపోవటం అనిపిస్తుంది.

  4. buchi reddy gangula says:

    పాలకులు — ఊళ్ళ ను —పట్టించుకోవడ 0 లే దు — జై జవాన్ – జై కిసాన్ //// బూసంస్కరణలు

    అన్ని నినాదాలే —- నాడు — నేడు — బూపంపకాలు అయింది ఎప్పుడు ???దొరల పాలన లో

    ఆర్థిక వత్యాసాలు తొలిగి పోతాయి అనుకోవడం —-ఉత్త మాటలు

    ఆకలిచావులు — ఆత్మహత్యలు —-యిలాగే కొనసాగుతాయి — మారింది ఎక్కడ ??ఎన్నడు ??

    బాబు గారే తెలుగు భాష ను పట్టించుకోవడం లే దు — జయలలిత గారి కి లేఖ రాస్తా ???

    నేటి వార్త ???
    ———————————–బుచ్చి రెడ్డి గంగుల ————————–

  5. g.venkatakrishna says:

    సీతారామయ్య సార్, పల్లెను మింగిన పెట్టుబడి పై , మీ పరిశీలనా , మీ అసెస్మెంట్ చాల చాలా కరెక్ట్ . ఇంకా విలువైనది కుడా ……

మీ మాటలు

*