Archives for August 2015

గమనమే గమ్యం-12

 

olgaకాలం నెమ్మదిగా నడుస్తోందనిపించింది శారదకు. దేశం కూడా నెమ్మదించింది. అక్కడక్కడా ప్రదర్శనలూ , జండా ఎగరెయ్యటాలు  తప్ప పెద్దగా జరుగుతున్నదేమీ లేదు.

అన్నపూర్ణ, దుర్గ జైలు నుంచి విడుదలయ్యారు. అన్నపూర్ణ గుంటూరు చేరింది. దుర్గ కాకినాడ చేరింది. రామక్రిష్ణ జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు మొదలుపెట్టాడు. సత్యాగ్రహం మీద ఆశలు  పెట్టుకున్న వారందరూ నిరాశలో పడ్డారు. అన్నపూర్ణ కూతుర్ని కన్నది. స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది.

సుదర్శనం, మూర్తీ, శారదా తరచు కలుస్తున్నారు.

మూర్తి తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు. శారద మీద అదే చనువు అదే అధికారం. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద.

ఏదో బలహీనత తనలోనూ ఉందా అనుకుంటోంది.

కానీ శారద తనను కలుసుకోకుండా దూరంగా ఉంచుతోందని మూర్తికి అర్థమైంది. ఇంటికి వెళితే ఆహ్వానిస్తూ నవ్వుతుంది గానీ ఆ నవ్వులో జీవం ఉండదు. యాంత్రికంగా నవ్వుతున్నట్లు తెలుస్తూనే ఉంది. మిగిలిన యువకులందరూ మామూలుగానే ఉంటున్నారు  గానీ రామక్రిష్ణయ్య ముభావంగా ఉంటున్నాడు. మూర్తికి ఈ మార్పు ఎందువల్ల  వచ్చిందో అర్థమయింది. దాని గురించి శారదతో మాట్లాడటం తన బాధ్యత అనుకున్నాడు. కానీ శారదతో ఏకాంతం దొరకటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు శారదనంటిపెట్టుకుని ఉంటున్నారు .

ఒక ఆదివారం నాడు శారద తమ ఇంట అందరికీ విందు చేయబోతున్నానని  ప్రకటించింది. కారణం అందరికీ తెలిసిందే. రామక్రిష్ణయ్య మద్రాసు ఒదిలి బెంగుళూరు వెళ్తున్నాడు. అక్కడ ఇంటర్‌ పూర్తి చెయ్యాలని సంకల్పం . రామక్రిష్ణయ్య , శారద మధ్య అనుబంధం అందిరికీ తెలుసు. అక్కా అని అతను పిలిచే  పిలుపు లో  రక్తసంబంధాన్ని మించిన సోదర భావం పలుకుతుందేది . ‘రా మూ’ ‘రా మయ్యా’ అంటూ శారద తన అభిమానాన్ని కురిపించేది. ఇద్దరూ కలిసి చదివే పుస్తకాలు , చేసే  చర్చలు , వాదోపవాదాలు  వారిని మరింత దగ్గర చేస్తాయి. రామక్రిష్ణయ్య ఒకోసారి  చాల నిరుత్సాహ పడేవాడు. ఈ దేశం ఎప్పటికి స్వతంత్రమయ్యేను? ఏది మార్గం? నేనేం చెయ్యాలి? రైతు, కూలీలు , పేదరికం, అంటరానితనం   –  ఒక్కసారి వీటన్నిటితో తలపడటం ఎట్లా? అసలు  గమ్యమేమిటి? స్వతంత్ర సాధనేనా  ? ఈ ప్రశ్నలను మధించి, మధించి, విసిగి వేసారి పోయేవాడు.

‘‘ఇక నా వల్ల కాదక్కా’’ అంటూ శారద దగ్గరకు వచ్చేవాడు. శారదకు నిరుత్సాహం  అంటే తెలియదు. సమస్యలు  వచ్చిన కొద్దీ సముద్రంలో తరంగాలు  వస్తుంటే చూసినంత ఆనందం. రామక్రిష్ణయ్య ఏది గమ్యం అని తల పట్టుకుంటే `

‘‘ప్రతి అడుగూ గమ్యమే. అమ్మయ్యా గమ్యం చేరామని కూర్చుందామని ఆశపడుతున్నావా  ? లేదు. నువ్వు చేరిన తర్వాత చూస్తె  ముందు మరో గొప్ప ఆశయం కనపడుతుంది. ఆయాసం తీర్చుకునే వ్యవధి కూడా ఇవ్వదు. వెంటనే అటువైపు అడుగు వేస్తాం మనం. వెయ్యకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంది? నడుస్తూనే ఉంటాం జీవితం చాలదు. తరువాత వాళ్ళు  అందుకుంటారు – ఆ నడక అలా సాగుతూనే ఉంటుంది’’.

ఒకోసారి రామక్రిష్ణయ్య  శారద మాటల్ని కాదనేవాడు.

‘‘గమ్యం ఉండాలి. లేకపోతే నడవటానికి  ప్రేరణ  ఎలా వస్తుంది?’’

‘‘గమ్యం స్థిరం కాదని చెప్తున్నాను గానీ అసలు లేదనటం లేదు. మనం ఒకచోట గమ్యం సాధించామని ఆగకూడదని అంటున్నాను. ఆగామా – ఇక నిలవనీటి చందమే –  నాలుగు దిక్కులూ  ప్రవహించాలి మనం’’.

రామక్రిష్ణయ్య ముఖంలో వెలుగు కనిపించేంత వరకూ శారద మాట్లాడుతూనే ఉండేది.

రామక్రిష్ణయ్య బెంగుళూరు వెళ్తున్నాడంటే శారదకు బెంగగా ఉంది. దానిని పోగొట్టుకోటానికి ఈ విందు ఏర్పాటు చేసింది. అందరితో పాటు మూర్తికీ పిలుపు చేరింది.

రామక్రిష్ణయ్య కు  భోజనంలో కూడా ఆడంబరం గిట్టదు. అందువల్ల  సుబ్బమ్మ ప్రత్యేకం ఏమీ వండలేదు. కానీ ఆమె ఏం వండిన , వడ్డించిన , అది అమృతం తో  సమానమే ఆ యువకులకి.

పదిమంది స్నేహ బృందం  వెళ్ళి రామక్రిష్ణయ్య ను రైలెక్కించింది. రైలు  కదిలిపోతుంటే శారద ముఖంలో ఒక మబ్బుతెరలా దిగులు  వచ్చి వచ్చినంత త్వరగానూ వెళ్ళిపోయింది.

‘‘మన రామయ్య మరింత జ్ఞానం సంపాదించుకొస్తాడు. పదండి  పోదాం’’ అంటూ వెనుదిరిగింది.

స్నేహితులు  ఎవరి నెలవుకు వాళ్ళు వెళ్తామని తలోదారీ పట్టారు. శారద ట్రాము కోసం చూస్తూ నిలబడి  ఉంది. పది గజాలు  నడిచిన మూర్తి మళ్ళీ వెనక్కు వచ్చి శారద పక్కన నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూసింది శారద.

‘‘మనం కొంచెం మాట్లాడుకోవాలి. నా వైపు నుంచి నేను చెప్పుకోవల్సింది ఉంది’’.

‘‘నువ్వేం చెప్తావో నాకు  తెలుసు మూర్తీ’’

‘‘తెలిసినది మాత్రమే సర్వం అని నువ్వు కూడా అనుకుంటే ఎట్లా?’’

‘‘సర్వం అనుకోవటం లేదు. ఈ విషయంలో మరింత తెలుసుకోవాలని  మాత్రం అనుకోవటం లేదు.’’ అంది శారద నిర్లిప్తంగా.

‘‘కానీ చెప్పవసిన బాధ్యత  నాకుంది. చెప్పనంతవరకూ నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. దయ చేసి ఒక్క గంట ` ’’ శారద మూర్తి ముఖంలోకి చూసింది. అక్కడ బాధ, నిజాయితీ తప్ప మరేమీ కనిపించలేదు.

olga title‘‘సరే – బీచ్‌కి పోదాం పద’’

మైలాపూర్‌ బీచ్‌లో సముద్రానికి కాస్త దూరంగా కూర్చున్నారిద్దరూ. సముద్రపు హోరు వాళ్ళ మనసుల్లో రేగుతున్న హోరు ముందు చిన్నదయింది. మూర్తి మాటల్ని పోగొట్టుకున్నట్టు ఆ సముద్రపు ఒడ్డున వాటిని వెతుకుతున్నట్టు చూస్తున్నాడు.

‘‘మూర్తీ – నీకు పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది. అదే నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయమని కూడా నాకు తెలుసు’’. శారదే మూర్తిని ఇబ్బంది నుంచి బైట పడేసింది.

‘‘కానీ శారదా – ఆ ఉదయం ఈ సముద్రపొడ్డున నిన్ను నేను చూసినపుడు నాకు పెళ్ళయిందనే విషయం నాకు గుర్తు లేదు. ఆ తరువాత  ఇంటికి వెళ్ళి ఆమెనూ, నా కొడుకూనూ చూసినా  కూడా నాకు పెళ్ళయిందన్న  విషయం నాకు గుర్తు లేదు. మర్నాడు , ఆ తరువాత  చాలా రోజులు  గుర్తురాలేదు. నేనొక ఉన్మాద  అవస్థలో పడిపోయాను. చివరికి తెలివొచ్చింది. నా  భార్య ఒక  రాత్రి గుర్తు చేసింది. నేను బిగ్గరగా ఏడ్చాను. ఆమె భయపడింది . ఆ దు:ఖం తగ్గాక ఆలోచించాను. నాకు పెళ్ళయితే ఏమైంది. నేను పెళ్ళి చేసుకున్న స్త్రీతో  ప్రేమలో పడలేదు. నాకు ఊహ తెలియక ముందే, స్త్రీ అంటే ఏమిటో,  ప్రేమంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలియకముందే  నా మీద ఆ బాధ్యత పడింది . బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నాను . ఇప్పుడు నాకు   ప్రేమ  ఎదురైంది.  ప్రేమకూ పెళ్ళికి మధ్య సంబంధం ఎలాంటిదో, ఎంత వాంఛనీయమో, అవాంఛనీయమో ఆలోచిస్తుంటే మతిపోతోంది. రెండేళ్ళ క్రితం చలం  గారి శశిరేఖ నవల  చదివి ‘‘ ప్రేమ ఉంటే ఇంక పెళ్ళెందుకూ’’ అన్న శశిరేఖ మాటను పిచ్చి మాటలుగా కొట్టేశాను. అర్థం కాలేదు నాకవి. ఇవాళ నాకు  అర్థమవుతున్నాయి –  ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు.  ప్రేమ ఉంటే పెళ్ళితో అవసరం లేదు. ఇది నాకు తెలిసొచ్చింది గానీ సంఘంలో పెళ్ళికున్న విలువ  ప్రేమకు లేదు. ఇప్పుడు నేను నిన్ను  ప్రేమిస్తున్నాను  అని చెబితే ఆ మాటకు నువ్వు విలువ  ఇవ్వవు’’.

‘‘ఇస్తాను’’ గంభీరంగా అన్న శారద మాటకు ఆశ్చర్యపోయి చూశాడు మూర్తి. సముద్రం స్తంభించినట్లనిపించింది ఒక్క క్షణం.

‘‘మూర్తీ. మనం ఎప్పుడూ మనసు విప్పి ఒకరి మీద ఒకరికున్న  ప్రేమను చెప్పుకోలేదు.  ప్రేమ కలిగిన మాట వాస్తవం. దానిని నిరాకరించి ఆత్మవంచన చేసుకోవటం ఎందుకు? నీకు పెళ్ళయిందని తెలిసి నేను తల్లడిల్లిపోయిన మాటా వాస్తవమే. నీలాగే నేనూ  ప్రేమ, పెళ్ళి, వీటి పరస్పర సంబంధం, స్త్రీ పురుష సంబంధాలూ  మారుతూ వచ్చిన తీరూ, వీటి గురించి ఆలోచిస్తున్నాను. చదువుతున్నాను. సమాధానాలు  దొరుకుతున్నట్లే ఉంటున్నాయి గానీ ఆచరించే మానసిక స్తిమితం రావటం లేదు. నా ప్రేమ  నిజమై నీది విలువలేనిదవుతుందా? కానీ విలువ  వల్ల ఉన్న పరిస్థితి మారదు. మనం స్నేహితుల్లా ఉందాం.  ప్రేమ బంధం, భార్యాభర్తల  బంధం, పెళ్ళి తంతు వీటి గురించి మర్చిపోదాం. అక్కడ నీ జీవితం నిర్ణయమైపోయింది అంతే. అది మారదు. మార్చాలనుకోకు’’.

శారద మాటకు ఏం సమాధానం చెప్పాలో మూర్తికి తెలియదు.. ‘‘థాంక్స్‌ శారదా ` నన్ను స్నేహితుడుగా అంగీకరించావు. అది చాలు .  నన్ను దూరం చేస్తావేమో, అని భయపడ్డాను’’.

‘‘ఎందుకు దూరం చేస్తాను మూర్తీ. నువ్వేం నేరం చేశావని? నన్ను  ప్రేమించడం నేరం అనుకోమంటావా ? మరి నేనూ నిన్ను  ప్రేమించాను. నా ప్రేమ  నేరం కాకుండా నీ  ప్రేమ నేరమవుతుందా? కేవలం నీకు పెళ్ళయినందువల్ల  అది నేరమవుతుందా? –  పెళ్ళి ఒక సామాజిక బంధం. వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఒకటుందిగా –  ఆ రెండింటికీ యుద్ధం జరుగుతుంది ఈ కాలంలో. బహుశా అన్ని కాలాల్లోనూ జరుగుతుందేమో మనకిప్పుడు తెలిసి వచ్చింది. మనం ఆ యుద్ధ రంగంలో ఉన్నాం . యుద్ధం చెయ్యాలని లేదు. ఉంది.  ప్రేమ అనే ఆయుధం ఉంది. చూద్దాం. ఆ ఆయుధానికి పదును పెట్టాల్సిన అవసరం వస్తుందేమో.’’

శారద మాటను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు మూర్తి. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇద్దరికీ అక్కడనించి కదలాలని లేదు. సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. తమ అంతరంగాలను చూసుకుంటున్నట్టే ఉంది. విరుచుకుపడే అలలు. అగాధమైన లోతు. అవతలి తీరం కనపడనంత దూరం. వెన్నెల తరకు, చీకటి నీడలు. అంతులేని సౌందర్యం. భయం గొలిపే  అద్భుతం.

లోకంతో పనిలేనట్టు, లోకమేమైనా  తనకేం పట్టనట్టూ ముందుకు విరుచుకు పడుతూ, భళ్ళున బద్దలై వెనక్కు తోసుకు పోతూ ఆ సముద్రం. ఆ సముద్రం తామే అన్నంత వివశంగా వాళ్ళిద్దరూ.

***

చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు  తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు  కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ. సందిగ్ధత.

ఈ నిరాశనుంచి, సందిగ్దత నుంచీ బైటపడటానికి శారదకు ఈ మధ్య వడిమేలు ఆలంబన అయ్యాడు.

వడిమేలు  నడిపే పత్రిక శారద తప్పనిసరిగా చదివేది. ఒకసారి సుదర్శనం తెచ్చిచ్చాడు. అంతే. శారద వడిమేలు  పత్రిక అచ్చయ్యే చోటికి వెతుక్కుంటూ వెళ్ళింది.

మద్రాసు నగరంలో ఇటువంటి ప్రదేశాలు  కూడా ఉన్నాయా అని సంపన్నులు  ఆశ్చర్యపడే మురికివాడలోని ఒక గది ముందు ఆగింది.

తలుపు ఓరగా తీసే ఉంది.

‘‘లోపలికి రావచ్చాండీ’’ అని కాస్త గట్టిగానే తమిళంలో అడిగింది. లోపల్నించి సన్నగా నల్లగా ఉన్న ఒకాయన లేచి బైటికి వచ్చాడు. ఎవరన్నట్టు చూశాడు శారద వంక.

‘‘నా పేరు శారద. డాక్టర్‌ కోర్సు చదువుతున్నాను. చాలా మంచి పత్రిక నడుపుతున్నారు. మిమ్మల్ని చూడాలని వచ్చాను’’.

ఆయన ముఖంలో ఆ ప్రశంసకు ఎలాంటి సంతోషమూ కనపడలేదు. సరిగదా కనుబొమ్మలు ముడివేసి.

‘‘పత్రిక చదవండి. నన్ను చూడటం ఎందుకు?’’ అన్నాడు.

‘మీ పత్రికకు సహాయం చెయ్యానుకుంటున్నా’’ పర్సు తీసి మూడు పదులు వడిమేకు ఇచ్చింది.

ఇప్పుడాయన ముఖంలో ముడి కాస్త వీడింది.

‘‘పత్రిక అమ్మి పెడితే ఇంకా పెద్ద సహాయం అవుతుంది’’.

‘‘తప్పకుండా అమ్ముతాను. కాపీలుంటే ఇప్పుడే ఇవ్వండి’’.

వడిమేలు  ప్రసన్నుడై ‘‘లోపలికి రామ్మా’’ అని తను నడిచాడు. లోపలికి వెళ్ళింది శారద. ఆఫీసు, ఇల్లు, ప్రెస్సు అన్నీ ఆ చిన్న గదిలోనే. పది కాపీలు  తీసి ఇచ్చాడు.

‘‘నాది బ్రాహ్మణ కులం. కానీ మీరు రాసే బ్రాహ్మణ వ్యతిరేక వ్యాసాలు బాగా నచ్చుతాయి. బ్రాహ్మణ తత్త్వం పోతేగాని దేశం బాగుపడదు’’. వడిమేలు నవ్వాడు. శారద తలమీద చేయిపెట్టి దువ్వాడు.

‘‘కమ్యూనిజం వస్తేగాని దేశం బాగుపడదు’’ అన్నాడు.

శారద ఉలిక్కిపడిరది. ఈ బలహీనుడైన వ్యక్తి కమ్యూనిస్టా?

ఆశ్చర్యంగా అడిగింది ‘‘మీరు కమ్యూనిస్టా?’’

‘‘ఏమో నాకు సరిగా తెలియదు. కానీ కమ్యూనిస్టునని చెప్పుకోవాలని ఉంది. దానికేం చెయ్యాలో తెలియదు’’.

‘‘ఏముంది? చెప్పుకోవటమే. ఈ రోజునుంచీ నేనూ కమ్యూనిస్టునని చెప్పుకుంటాను. ఇద్దరు కమ్యూనిస్టులుంటే మంచిదే గదా?’’ వడిమేలు మనసారా నవ్వాడు.

‘‘నీలాంటివాళ్ళే ఈ దేశానికి కావాలమ్మా’’ అన్నాడు.

శారద కాసేపు అక్కడ కూచుని వచ్చేసింది. ఆరోజు నుంచీ అప్పుడప్పుడూ వడిమేలుని చూడటానికి వెళ్ళేది. వట్టి చేతుల్తో ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఏదో ఒకటి తినటానికి తీసుకెళ్ళేది. ఇద్దరూ కలిసి అవి తింటూ బ్రాహ్మణులను, వారి ఆచారాలనూ, బ్రిటీష్‌వాళ్ళను, వాళ్ళ దోపిడినీ తిట్టుకుంటూ కూచునేవారు. వడిమేలు పనిలో తను చేయగలిగిన చిన్న సాయమైనా చేసేది.

వడివేలంటే ఎంతో గౌరవం శారదకు. ఆ పేదరికంలో, ఆబలహీనతతో, అతి తక్కువ వనరులతో ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో చూస్తే తనెంతెంత పనులు చెయ్యాలో గదా అనుకునేది.

ఎలాంటి మనుషున్నారు దేశంలో `

తను వడిమేలుని కలిసిన సంగతి సుదర్శనంతో, మూర్తితో చెప్పింది.

‘‘అక్కడికెందుకెళ్ళావు. పోలీసులు చూస్తే ప్రమాదం’’ అన్నారు ఇద్దరూ కూడబుక్కున్నట్టు.

‘‘పోనీలే, ఒక్క ప్రమాదకరమైన పనైనా చేశానని తృప్తి పడనీయండి’’ అని నవ్వేసింది శారద.

మూర్తి గురించి అతని సమక్షంలో శారదకు ఏ ఆలోచనలూ  రావు. మిగిలిన స్నేహితులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏ రాత్రి పూటో ఒంటరిగాఉన్నపుడు మూర్తి గురించిన ఆలోచనలు చుట్టు ముట్టి అలజడి చేస్తుంటాయి. నియంత్రించబోతే శరీరం, మనసూ కూడా సహకరించవు.

ఏదో పనిమీద పరశువాకం వెళ్ళిన శారదకు వడిమేలుని చూడానిపించింది. చాలారోజులే అయింది అతనిని కలిసి. ఆలోచన వస్తే ఇక శారద ఒక్క క్షణం తటపటాయించదు. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ట్రాము దిగి సందుగొందులు తిరుగుతూ ఉత్సాహంగా వడిమేలు  గదిలోకి వెళ్ళింది.

ఆయన హడావుడిగా ఏదో పని చేసుకుంటున్నాడు. శారదను చూడగానే ఒక్కసారి ఆగి ముఖంనిండా నవ్వాడు. కూర్చోమని కూడా అనకుండా పత్రిక కాపీ కట్టను శారద చేతిలో పెట్టి.

‘‘ఇంక ఈ పేరుతో పత్రిక రాదు. ఇదే చివరిది’’ అన్నాడు.

శారద ఆందోళనగా ‘‘ఏమైంది. పోలీసులు వచ్చారా?’’ అని అడిగింది.

‘‘పోలీసులు కాదు. కమ్యూనిస్టులే వచ్చారు’’ అన్నాడు వడిమేలు.

‘‘కమ్యూనిస్టులా? మనిద్దరం కాక కమ్యూనిస్టులింకా ఉన్నారా?’’ తేలిగ్గా నవ్వుతూ అడిగింది శారద.

‘‘ఉన్నారు. మనలాంటి వాళ్ళు కాదు. నిజం కమ్యూనిస్టు. ఒకతను రష్యా నుంచి వచ్చాడు. త్వరలో మనలాంటి వాళ్ళందరం అతనితో కలిసికూర్చోని మాట్లాడదాం. కమ్యూనిస్టు పార్టీ పెడదాం. మేం కమ్యూనిస్టులమని చెప్పుకుందాం’’ వడిమేలు  ఆపకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.

శారదకు శరీరం మీద పులకలు  వచ్చాయి.

‘రష్యా నుంచి కమ్యూనిస్టు వచ్చాడు. తను కమ్యూనిస్టు . కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు ’ ఏదో తన్మయత్వంలో పడి తేరుకుంటూ ‘‘నాకంతా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగింది?’’

‘‘నాకిప్పుడు సమయం లేదు. త్వరలో సమావేశం జరుగుతుంది. అంతా తెలుస్తుంది’’.

వడిమేలు  పని తెమిలేలా లేదు. శారదను పట్టించుకునే తీరిక లేకుండా కాగితాలతో కుస్తీ పడుతున్నాడు.

శారదకు అక్కడినుంచి కదలకతప్పలేదు.

ఇంటికి వెళ్ళానిపించలేదు ఇదంతా ` ఈ ఉద్వేగానుభూతినంతా వెంటనే ఎవరితోనైనా పంచుకోకపోతే ఊపిరాడేలా లేదు. పొంగుతున్న ఉత్సాహం ఎవరితోనైనా చెప్పందే నిలవనిచ్చేలా లేదు.

మూర్తి తప్ప ఎవరూ దీనిని, తను అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. మూర్తిని చూడాలి. ఈ సమయంలో మూర్తి ఎక్కడుంటాడు. ఇంటి దగ్గరకు వెళ్ళిచూస్తే ` ఏమవుతుంది? ఏమీ కాదు.

శారద చకచకా ముందుకి నడిచి ట్రాము ఎక్కేసింది.

ట్రాము దిగి నాలుగు ఫర్లాంగులు  నడిస్తే గాని మూర్తి ఇల్లు  రాదు.

మూర్తి ఇల్లు తలుపు  తడుతుంటే గుండె దడదడలాడిరది.

మూర్తే వచ్చి తలుపు  తీశాడు. శారదను చూసి కంగారు పడ్డాడు.

‘ఏమైంది? ఎందుకొచ్చావ్‌?’’ హడావుడిగా అడిగాడు.

‘‘రాకూడదా?’’ నవ్వింది శారద.

శారద నవ్వుచూసి స్థిమితపడి ‘‘ఎందుకు రాకూడదు? ఇంతకు ముందెప్పుడూ రాలేదుగా’’ అని లోపలికి తీసికెళ్ళాడు.

ఇల్లంతా  నిశ్శబ్ధంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు.

‘‘ఎవరూ లేరా?’’

‘‘లేరు. బంధువులింట్లో పెళ్ళయితే వెళ్ళారు. నాకు ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళటం విసుగు. ఇంటికి కాపలా ఉండిపోయాను. ఉన్నందుకు చూశావా ఎంత అదృష్టం కలిసొచ్చిందో’’.

శారద గలగలా నవ్వింది.

‘‘శారదా ` నువ్వు నవ్వుతుంటే ప్రాణాలు ఇచ్చెయ్యాలనిపిస్తుంది’’

‘‘మూర్తీ ` మనిద్దరం ప్రాణాలు అర్పించాల్సిన గొప్ప విషయం ఒకటుంది’’

‘‘ఏమిటది’’ ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.

‘‘కమ్యూనిజం. మూర్తీ ,  నేను కమ్యూనిస్టుని. నువ్వూ కమ్యూనిస్టువే. కదూ ` ’’శారద ఆనందంగా కళ్ళనీళ్ళతో అడిగింది. మూర్తి ఆశ్చర్యానికంతు లేదు.

‘‘శారదా ,కమ్యూనిస్టేమిటి ? ఇంత ఆనందంగా ఉన్నావు. ఏం జరిగింది?’’.

olga title

‘‘కమ్యూనిజం అంటే నీకు తెలియదా? దేశంలో ఆకలి, దరిద్రం, బీదా గొప్ప తేడాలు  లేకుండా చేసేస్తుంది. అందరూ సమానులే . స్వంత ఆస్తి ఉండదు. అందరూ ఒళ్ళు వొంచి పని చేస్తారు. కావలసినంత తింటారు. చదువుకుంటారు. దేనికీ లోటుండని స్వర్గం. ఆ స్వర్గాన్ని నిర్మించేవాళ్ళు కమ్యూనిస్టులు’’

‘ఇదంతా నీకెలా తెలుసు?’

‘‘ఈ మధ్యే కమ్యూనిస్టు మానిఫెస్టో చదివాను. మూర్తీ! అది చదువుతుంటే నా రక్తం ఎలా ఉప్పొంగిందనుకున్నావు. ఎలా పోటెత్తిందనుకున్నావు. శరీరమంతా తేలిపోయింది. నరాలన్నీ మీటటానికి సిద్ధంగా ఉన్న వీణ తీగల్లా అయిపోయాయి. జలపాత స్నానానుభూతి. గొప్ప సౌందర్యం నా కళ్ళముందు. దానికి రూపం లేదు. రూపం లేని సౌందర్యం, సవ్వడి లేని సంగీతం, బ్రహ్మానందమంటారే అదేదో నాకు అనుభవంలోకి వచ్చినట్లయింది. ఇప్పటికీ కమ్యూనిజాన్ని తల్చుకున్నంత మాత్రాన ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నా తొలి వలపులా ఉంది. నేను కమ్యూనిస్టుని. నేనూ కమ్యూనిజం వేరు కాదు. ఒకటే . అద్వైతం ఇదే కదూ ` ’’ .

‘‘శారదా, ఉండు. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఇవాళేమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు. అది చెప్పు’’.

శారద మెల్లిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్టుగా చెప్పింది.

‘‘ఇవాళ వడిమేలుగారి దగ్గరికెళ్ళాను. ఆయన కూడా కమ్యూనిస్టే తెలుసా? ఇవాళ ఆయనే చెప్పాడు. రష్యానుంచి కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు వచ్చాడట . మద్రాసులో మనలాంటి వాళ్ళందరం కలుస్తాం. పార్టీని నిర్మిస్తాం. మూర్తీ !మనం , మనం కమ్యూనిస్టు పార్టీని నిర్మిస్తాం. ఇది అద్భుతంగా లేదూ?’’

మూర్తి చేతులు పట్టుకు ఊపేసింది శారద.

‘‘పరమాద్భుతంగా ఉంది. శారద ! నేనూ సుదర్శనం కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం. నువ్వు గాంధీ భక్తురాలివి గదా కమ్యూనిస్టువి కావేమో అనుకున్నా . ’’

‘‘మూర్తీ! ఇవాళ నా మనసులో ఇంకే సందేహాలు  లేవు. నేను కమ్యూనిస్టుని ` ఐఆమ్‌ ఏ కమ్యూనిస్టు’’.

సంతోషం ఆపుకోలేక గలగలా నవ్వింది శారద.

‘‘నేనూ ` నేను కూడా’’ శారదను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

శారదకాక్షణంలో ఏ సంశయాూ, సందేహాలూ  లేవు.

‘‘మూర్తీ! ఎంత గొప్పగా ఉందీ భావన’’.

కమ్యూనిస్టు కావటమంటే ఏమిటో తెలుసా? ఒక గొప్ప సత్యాన్ని  తెలుసుకోవటం ` జ్ఞానాన్ని సంపాదించటం — బుద్ధునిలా.

మొట్టమొదటి వాక్యమే సూర్యోదయంలా అద్భుతంగా ఉంది. ఏమంటున్నారో విను! ‘ఇంతవరకూ నడచిన సమాజపు చరిత్ర అంత వర్గ పోరాటాల  చరిత్రే’. ‘‘మూర్తీ –  అంతా  తేటతెల్లమైపోవటం లేదూ? ప్రపంచమంతటినీ పట్టి చూసినట్టు లేదూ? ఆ వాక్యం చదివినప్పుడు నా ఎదుట ఒక మహా విశ్వరూప సందర్శనం జరిగినట్లు అనిపించింది.

నిజంగా — ఈ సమాజపు నగ్న స్వరూపం కూడా చూశాను కమ్యూనిస్టు ప్రణాళికలో బూర్జువ వర్గం మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీలు  తప్ప ఇక ఏ సంబంధాన్నీ మిగలనివ్వలేదు. ఇంకా మార్క్స్‌ రాస్తాడిలా –అది మనిషి విలువను రూపాయల్లోకి మార్చేసిందనీ, వైద్యులనూ, న్యాయవాడులనూ , కవులనూ, శాస్త్రవేత్తలనూ అది తనకింద కూలికి పనిచే సేవకులు గా  మార్చేసిందనీ — ఎలాంటి మాటలివి ?  ఎంత అచ్చమైన, స్వచ్ఛమైన, సత్యమైన మాటలివి. అబ్బా మూర్తీ! ఈ బ్రిటీష్‌ సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో నా  కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ ఆర్థిక సంక్షోభం, ఈ దరిద్రం, ఈ పీడన అంత బ్రిటీష్‌ సామ్రాజ్యం తన నెత్తిమీదకు తానూ  తెచ్చుకున్నదే – ఇదుగో నే చెప్తా విను’’ ` శారద గలగలా నవ్వింది.

నవ్వుతూ  నవ్వుతూ చెప్తోంది. పొంగుతున్న సంతోషంతో మాటలు  ఆగుతూ ఆగుతూ వస్తున్నాయి.

‘‘ఈ బూర్జువా సమాజం తన మంత్ర శక్తితో  సృష్టించిన భూతాలను  తాను  అదుపు చేసుకోలేక వాటి చేతిలో మంత్రగాడిలా చస్తుంది’’ ఆ నవ్వులో కసి కోపం కలగలిసి ఉన్నాయి. ‘‘మూర్తీ – మనిద్దరం చదువుదాం. మళ్ళీమళ్ళీ చదువుదాం. అర్థం చేసుకోవాలి  ఇంకా – ఇవాళ రామకృష్ణ ఎంత గుర్తొస్తన్నాడో. మేం చాల  పుస్తకాలు కలిసే  చదివాం. ‘ఆడవాళ్ళను సమాజం ఎప్పుడూ సమిష్టి ఆస్తిగా ఉంచిందన్నారు’ కమ్యూనిష్టు మేనిఫెస్టోలో. ఆ చరిత్రంతా తెలుసుకోవాలి.

మూర్తీ — చివరిగా పరమాద్భుతమైన మహాసత్యం చెప్పారు. అది చదువుతూ నేనేమయ్యానో నాకే తెలియదు. అదో విశ్వ రహస్యాన్ని కనుగొన్న, చూసిన గొప్ప అనుభవం. ‘కార్మికులు  పోగొట్టుకునేదేమీ లేదు. తమ సంకెళ్ళు తప్ప –  వారికి గెలవ వలసిన ప్రపంచం ఉంది.’’ ప్రపంచమంత ఒకటే – మనదే మూర్తీ –  మనదే – ఎలా ఉంది?

‘‘శారదా. నేను ఎన్నడూ అనుకోలేదు నా  కింత అదృష్టం పడుతుందని. నీ కలలు  నాతో ఇంత ఆత్మీయంగా, నువ్వే నేనన్నట్టు పంచుకుంటావని’’ శారదను మరింతగా హత్తుకున్నాడు.

శారద అతన్నించి విడిబడి నవ్వింది.

‘‘అదంతా తర్వాత ` మూర్తీ ` మనం నిజంగా మార్చేస్తాం కదూ దేశాన్ని. దించేస్తాం కదూ స్వర్గాన్ని’’.

‘‘తప్పకుండా. కానీ అదంత తేలిక కాదు’’.

‘‘తేలికో. కష్టమో. ప్రాణాలు  పోతాయో. ఏమవుతుందో. కానీ ఇవాళ నాకు ఆకాశాన్నందుకున్నట్టు ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిని కావలించుకున్నట్టుగా ఉంది. ఎంత తొందరగా ఆ సమావేశం జరుగుతుందా అని చూస్తున్నా’’.

శారద ముఖం వేయి సూర్యుల  కాంతితో జ్వలిస్తోంది. మూర్తికి ఒక క్షణం భయం వేసింది ఆ ప్రకాశ తీవ్రతను చూసి.

శారదే ఆపకుండా మాట్లాడింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి.

శారద గొంతులోంచి జలపాతంలా దూకుతున్న ఆ మాట జడిలో తడిసి ముద్దయిపోయిన మూర్తికి ప్రపంచంలో ఈ క్షణం తప్ప మరింక ఏదీ వాస్తవం కాదనిపించింది.

ఇద్దరూ ఆదర్శ లోకాలలో విహరించటంలోని అత్యున్నత ఆనందాన్ని మనసారా అనుభవించారు.

రాత్రి పొద్దుబోయాక శారదను ఇంటి దగ్గర దించి వస్తున్న మూర్తికి తన పక్కన శారద ఉన్నట్టే ఉంది. ఇంట్లో మంచం మీద పడుకున్న శారదకు తన పక్కన మూర్తి ఉన్నట్లే అనిపించింది. ప్రపంచం మీద, ప్రపంచంలోని దీనులు , పేదల  మీద ప్రేమఒకరి హృదయంలోంచి ఇంకొకరి హృదయంలోకి ప్రవహించిన క్షణాల  బలం  ఎలాంటిదో ఇద్దరికీ అనుభవమైంది. ఆ బలం  వారిద్దరి స్నేహానికీ అంతులేని శక్తినిచ్చింది.

***

‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

olga title‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల , నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే ` కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు  వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే –  నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు  నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే ? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

*

ఇసుక మేడలు      

Madhuఊరు టౌనుగా ఉన్నపుడు నిలకడగా నేలపై ఉండేది. కార్పోరేషన్గా మారగానే ఆకాశంలోకి పాకిపోయి ఊరి  స్వరూపాన్ని, నాగోజీ నుదిటి రాతలని మార్చేసింది. ఈ రోజు అయనకి ఘన సన్మానం.

ఆఫీసు కిటికీలోంచి సగం మొలచిన కట్టడాన్ని, రాసులుగా పోసున్న ఇసుకని చూస్తూ “అప్పిగా  ఏర్పాట్లేలా ఉన్నాయి” అని అడిగాడు నాగోజీ. “బెమ్మాండమండి, ఇందాక ఈర్రాజు ఫోన్సేసి ఊరంతా మీ పేరే అన్నాడండి…” మెలికలు తిరుగుతూ చెప్పాడు పీఏ అప్పారావు.

“ఎన్నేపారాలున్నా, మన పరపతి రోగంలా పాకిపోయినా… సమ్మానాల దారి ఏర్రా” అని ముక్తాయించాడు నాగోజీ.

“బాగా సెప్పారు” అని శ్రమ పడకుండా అన్నాడు పీఏ. గదిలోకొచ్చిన అసలు విషయం గుర్తొచ్చి “ఇసుక్కాంట్రాటర్… ఓ అరగంట నుంచి ఎయిటింగండి” అని చెప్పాడు

“ఆడవసరమా, మనవసరమా? కూర్చోనియ్యి….” అని విసురుగా చెప్పి ఏసీకెదురుగా కూర్చున్నాడు. గాలాడక్కాదు నాగోజీకి ఉత్సాహంతో ఊపిరి ఆడట్లేదు, పీఏకి విషయం అర్థమయి గది నుండి నిష్క్రమించాడు.

ఇంకో రెండు గంటల్లో స్టేజిపై సిల్క్ పంచె, లాల్చీ వేసుకుని ఉత్సవ విగ్రహంలా కూర్చుంటాడు, అసలే పసుప్పచ్చ శరీరమెమో ఫోకస్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. అర నిముషానికోసారి ఏడుకొండలు ఫోటో తీస్తాడు. వీర్రాజు శాలువాతో సత్కరిస్తాడు. సమితి కార్యవర్గం మూకుమ్మడిగా మీదపడి ‘జన బంధు’ బిరుదు ప్రధానం చేస్తుంది. ఇక పొగడ్తల పోటీలు  కాగానే మొహమాటం నటిస్తూ ‘పెజాసేవ నా బాద్యెత, కితం జన్మ సుకుతం’ అని ముగిస్తాడు.

భవిష్యత్తు దృశ్య రూపంలో కవ్విస్తుంటే ఆదుర్దాగా మురిసిపోయాడు.

ఓ పావుగంటకి బండ గొంతుతో “అన్నారం ఎల్లాలటండి” అంటూ పీఏ లోపలకి అడుగెట్టగానే దృశ్యం నొచ్చుకుని అదృశ్యమయ్యింది.

నాగోజీకి మాట్లాడే మూడ్ లేకపోయినా కాంట్రాక్టర్తో ఒప్పందం తప్పదు కాబట్టి “సరే ఎదవని రమ్మను” అని పెళుసుగా  అన్నాడు. ఓ నిముషానికి ఇసుక కాంట్రాక్టర్ అన్నవరం తప్పు చేసినవాడిలా నిలబడ్డాడు.

“ఏరా! అంతడావిడేంటి? ఓ ఇద్దర్ని బయపెట్టి, నాలుక్కాలవలు తవ్వేసరికి పెద్ద మనిషైపోయావా?” అని హుంకరించాడు.

“అది కాదండి, కొంతూరెల్లాలి సీకటటుద్దని ”

“కొత్త యెమ్ఆర్వో ని లొంగెయ్యాలా.. యెమ్.ఎల్.ఏని సాచిపెట్టి కొట్టాలా? నువ్వంటే సీకటి బయపడాలి గానీ…నీకు బయమెంటేహే?… ” అని వెటకారంగా నవ్వాడు.

“అయ్ బాబోయ్! అదేవీ లేదండి… ఓ రెండ్రూపాయలు ఎనకేసుకుంటే గిట్టనెధవలు ఇలేకరికి కబురెట్టి యాగీ సేసారండి”

Kadha-Saranga-2-300x268

“ఈ మద్యన ఇసక్కోసం కలెట్టర్ని కప్పెట్టెసారని సదివాను… అలాంటి.. ”

“లేదండి.. మనకెందుకండి పాపపు డబ్బు, నాయంగా సంపాయించుకుంటే నిలుద్దండి”

“మరే… ఆ ఇసయం నువ్వూ, నేను..చాగంటోరి పక్కన కూర్చుని జనాలకి సెప్పాలి” అని గది దద్దరిల్లేలా నవ్వాడు.

“మీకు మహా ఎటకారమండి…” అని గొంతు కలిపాడు అన్నవరం.

“అవునొరేయ్ మీ ఓడు పంపా, నువ్వు తాండవని కొబ్బరి చిప్పలా కోరేత్తునారంట” అని ఆరాగా అడిగాడు.

“లేదండి పట్టా ఉన్న మేరకే తవ్వేవండి”

“ఇనాలె గానీ రోజంతా సొల్లు సెపుతావు… ఒచ్చిన ఇసయం సెప్పు”

“… అంటే ముప్పై కాడికి సేసుకుందారండి”

“ఇరవై”

“ఇంకో మాట సెప్పండి”

“తేరగా దొరికిందానికి పదిచ్చినా దండగే”

“అంత మాట అనేయ్యకండి, పై నుంచి కింద్దాకా ఇచ్చుకుంటూ రావాలి”

“సూర్రావు ఇరవై రెండన్నాడు”

“గిట్టదండి, పాటకి పాతిక, లోడు దింపడానికి మూడండి..రెండు కూడా మిగల్దు”

“నేనీ రోజు పుట్టలేదు….. తత్తి కబుర్లు సెప్పకు”

sarange.isuka meda

“మీ దగ్గర దాపరికం ఎందుకండి.. సూర్రావుది తొర్ర ఇసకండి, అంతా మట్టి.. తాండవ ఇనుమండి…మహా గట్టిసక”

“దగ్గరుండి పండించావా?”

“నిజమండి… పరాసికాలు కాదు”

“సరే నీ మాట అట్టుకుని సిమెంట్ ఆపిచ్చేత్తాను…  ఇసక, ఇటుక కలిపి ఇల్లు కట్టేయ్యచ్చు”

“అంటే… మన ఇల్లల్లో ఇసకెక్కువని టాకండి” అని గురి చూసి కొట్టాడు అన్నవరం.

ఆ మాటకి ఖంగు తిని నాగోజీ కాస్త వెనక్కి తగ్గాడు “ఏ ఎదవన్నాడు, కాల్లు సేతులు ఇరిసెయ్యగలను…అపాట్మెంట్టు కనికలా కట్టించాను… రాయిలాంటి ఇల్లు” ఉద్వేగంగా అన్నాడు నాగోజీ. .

“నేనూ పాడెదవలకి అదే సెప్పానండి” అని లోపల నవ్వుకున్నాడు.

లొసుగులు మనసు విప్పి చెప్పుకునేసరికి ఇద్దరికీ గౌరవం పుట్టుకొచ్చింది.

“ఈర్రాజు ఫోనండి.. హాల్ దగ్గరున్నాడు” అని పీఏ పిలవగానే బయటకి వెళ్ళాడు నాగోజీ.

రహస్యం మాట్లాడాలంటే వాళ్ళు పెట్టుకున్న కోడ్ పదం ‘ఫోను’. ముందే చేసిన లెక్కలు పీఏతో మరోసారి సరి చూసుకున్నాడు నాగోజీ. ఈ ప్రకారం బేరం కుదిరితే ఖర్చు పదహారుకు మించదని పక్కాగా తేల్చుకుని లోపలకి వచ్చాడు.

అన్నవరాన్ని కిటికేలోంచి బయటకి చూపిస్తూ “ఈ పక్కది కాకుండా మనవి మూడు కొత్తవొత్తాయి, అన్నింటికి నువ్వే ఇసుక తోలుకో, డబ్బు బదులు అపాట్మెంట్ రాసిత్తాను.. ఏమంటావ్” అన్నాడు నాగోజీ.

“అన్నారం…ఎటు చూసినా నీకే లాబం..ఉంచుకో…అమ్ముకో.. నీ ఇట్టం” అని యజమానిని సమర్ధించాడు పీఏ.

అన్నవరం ఊహించని ఒడంబడికకి కాస్త ఆశ్చర్యం, బోలెడు అనుమానం వేసింది.

“మావోడికి ఓ మాట సెప్తానండి” అని ఫోన్ తీసి బయటకెళ్ళాడు, కాసేపటకి లోపలకి వచ్చి “అంటే… మావోడు ఓ సారి సూసి రమ్మనాడండి” అని అన్నాడు.

“యాపారం నీ దగ్గర, మీఓడి  దగ్గర నేర్సుకోవాలి… ” మెచ్చుకోలుగా చురక పెట్టాడు నాగోజీ

పీఏ తొందరపడుతూ “తర్వాత సూపిద్దారండి… ఇంకో గంటలో సమ్మానం” అన్నాడు.

“పర్లేదేహే దార్లోనే కదా…” అని నిదానం నటించాడు నాగోజీ.

కారు అపార్ట్ మెంట్ దగ్గర ఆగగానే గోడపై సన్మానం తాలూకు పోస్టర్ కనపడింది. నాగోజీ దాని వంక గర్వంగా  చూసుకుంటూ కారు దిగాడు. కూలివాళ్ళు ఆ రోజు పనులు ముగించుకుని సామాన్లు సర్దుకుంటున్నారు, పీఏకి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు గుర్తొచ్చి ‘ఓ నివషంలో వచ్చేత్తాను” అని మేస్త్రీ దగ్గరికి పరిగెత్తాడు, మిగతా ఇద్దరు ముందుకెళ్ళారు.

వాచీ చూసుకుంటూ అన్నవరాన్ని అమ్ముడవ్వని నాలుగో అంతస్థు అపార్ట్మెంట్కి తీసుకొచ్చాడు నాగోజీ. గదులు, కిటికీలు, ఆకాశాన్ని చూపించి ‘ఏమంటావ్?” అనడిగాడు

ఓ రెండు గంటల తర్వాత…

హాల్ కిట, కిటలాడుతోంది. ఏసీ సరిగ్గా పనిచేయక జనాలు పేపర్లు విసురుకుంటూ, విసుక్కుంటూ స్టేజీ కేసి చూస్తున్నారు. ఓ గంట ఆలస్యంగా జనవాహిని కార్యదర్శి శ్రీ వీర్రాజు స్టేజీ పైకొచ్చి “మన నగరానికి గర్వకారణం…జనబంధు శ్రీ నాగోజీ గారు… ఈ రోజు అపార్ట్ మెంట్ కూలి మృతి చెందారు. వారి కుటుంబానికి జనవాహిని తీవ్ర సంతాపం తెలియజేస్తోంది…… ” అని ముగించాడు.
*****

బరువు???

 

 

Mamata K.

మమత కొడిదెల 

 

కాళ్ళకు చక్రాలు తొడుక్కున్నట్లు బాల్కనీలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది ప్రీతి. ఆమె నడక చూసి చెప్పొచ్చు తన మనఃస్థితి ఎలా వుందో.

బాల్కనీలో ఒక పక్కగా పేము కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తోంది కరుణ. అరగంట ఓర్చుకుని అంది, “అబ్బబ్బా, ఇక చాల్లే. నీ నడక చూస్తుంటే నాకు తల తిరుగుతోంది. కూర్చో ఇక. లేకపోతే ఒక దగ్గర నిలబడి నీ ఇష్టం వచ్చినంత కోప్పడుకో.”

“అంత కష్టంగా వుంటే నావైపు చిద్విలాసంగా చూస్తూ కూర్చోక ఆ పుస్తకం చదువుకోరాదూ.” గయ్యిమంది ప్రీతి.

“అనుకుంటూనే వున్నా. అత్త మీద కోపం దుత్త మీద పడుతుందని.”నవ్వింది కరుణ, “సరే, ఇంకో ఐదు నిమిషాలు అలాగే నడుస్తుండు. మాంచి మసాలా టీ పట్టుకొస్తా.”

**

ప్రీతి, కరుణ జిగ్రీ దోస్తులు. చదువుకోవడానికి అమెరికా వచ్చిన కొద్దిరోజుల్లోనే పరిచయమయ్యి, భావాలు, మనస్తత్వాలు కలవడం వల్ల ప్రాణ స్నేహితులైపొయ్యారు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే తన ఆఫీసులోనే పరిచయమైన రాహుల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కరుణ. పెళ్లయిన కొత్తజంటను డిస్టర్బ్ చెయ్యొద్దనుకుని కాస్త దూరం జరిగింది ప్రీతి. ప్రీతి వేరే స్టేట్ లో ఉద్యోగం చూసుకోడంతో వారిమధ్య రాకపోకలు కూడా బాగా తగ్గిపొయ్యాయి. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు.

పెళ్లయిన ఏడాదికే కుటుంబ సమస్యలు మొదలై వాటిని స్నేహితురాలికి పంచకూడదనుకుని ఇంకా దూరం జరిగింది కరుణ. కరుణకు పాప పుట్టిన తరువాత  కుటుంబ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి వాటి ప్రభావం పాప మీద పడడం ఇష్టం లేక ఏడాది క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది.

కరుణ విడాకులు తీసుకున్న రెండో నెలలో ప్రీతి నుంచి హఠాత్తుగా ఫోన్. కరుణ వున్న ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ప్రీతికి తన విడాకుల విషయం అప్పుడు చెప్పింది కరుణ. అంత పెద్ద సంగతి తనకు చెప్పలేదన్నదానికంటే స్నేహితురాలు తనలోకి తాను ఎంతలా ముడుచుకుపొయ్యిందో గ్రహించి ఎక్కువ బాధ పడ్డది ప్రీతి. తొందర్లోనే కరుణ వుంటున్న ఇంటి దగ్గరలోనే అపార్ట్మెంట్ కొనుక్కుంది.

తనకు సరైన జోడీ దొరకక ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రీతి.

కరుణ కాస్త కుదుట పడేదాకా తోడు వుందామని, పాప కాస్త పెద్దదయ్యేదాకా సహాయం చేద్దామని వచ్చారు ఆమె తల్లిదండ్రులు. ఆఫీసు పని తరువాత, పాప పనులు పూర్తయిన తరువాత రెండుమూడు రోజులకొకసారి ప్రీతి దగ్గర గడుపుతుంటుంది కరుణ.

 

**

ఈరోజు ప్రీతిలో ఎప్పుడో గాని బయటకు రాని అసహనాన్ని గమనించింది కరుణ. టీ చేస్తూ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది.

కరుణ అందించిన కప్పు అందుకుని, కమ్మని మసాలా టీ వాసన చూస్తూ ”మ్… టీ బాగానే చేసినట్టున్నావోయ్.” అని మెచ్చుకుంది ప్రీతి.

“షుక్రియా, షుక్రియా! వంట గదిలోకి వెళ్లి చాలా రోజులవుతోంది. టీ ఎలా పెట్టాలో గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.”  చిర్నవ్వుతో అంది కరుణ.

“నువ్వు చాలా లక్కీ… అమ్మనాన్న నీతోనే వుండగలుగుతున్నారు.”

“నేను, పాప ఇద్దరం లక్కీనే. వాళ్లు వచ్చినప్పట్నుండి పాపతో ఎక్కువసేపు గడపగలుగుతున్నాను.”

కాసేపు ఏవేవో మాట్లాడుకున్న తరువాత అడిగింది కరుణ, “ఇంతకీ నీ కోపానికి కారణమేంటే తిరుగేశ్వరీ?”

“ఏంటో ఈ మనుషులు. ఎప్పుడు మార్పొస్తుందో వీళ్ళలో.” అంటూ కుర్చీలోంచి లేవబోయింది ప్రీతి.

“అమ్మో, మళ్ళీ నడవబోతున్నావా?”

కరుణ జోక్ పట్టించుకోకుండా చప్టా దగ్గరికి వెళ్లి నిల్చుంది ప్రీతి, “చాలా చిరాగ్గా వుంది కరుణా.”

Kadha-Saranga-2-300x268

“ఓహ్. ఇక అడ్డు రాను. ఏమయిందో చెప్పురా.”

“ఒక పెళ్లి సంబంధం వచ్చిందని డిటైల్స్ చెప్పాడు నాన్న. అతను డివోర్సీ కానీ ఎలాంటి బాధ్యతలూ, బరువులూ లేవని చెప్పారట. అతను అమెరికాలోనే వుంటున్నాడని, ఒకసారి కలవమని ఒకటే గొడవ. అతనితో మాట్లాడినప్పుడు చాలా లిబరల్ మైండెడ్ గా  అనిపించాడట. అతను నా మనస్తత్వానికి సరిపోతాడని అమ్మ కూడా అంది.”

“రెండో పెళ్లి సంబంధమని కోపమా?” తన స్నేహితురాలిని ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు కరుణ.

నవ్వింది ప్రీతి, “నా గురించి నీకు బాగా తెలుసని గప్పాలు కొడుతుంటావు. ఈ విషయంలో నేను ఎట్టా ఆలోచిస్తానో నీకు తెలీదా?”

కరుణ కూడా నవ్వింది, “మరీ, నీ చిరాకుకి కారణమేమిటమ్మా? నువ్వు వద్దన్నా సంబంధాలు చూస్తున్నారనా? నువ్వు పెళ్లి చేసుకోకూడదనేం అనుకోలేదు కదా. నీకిష్టమైన వాళ్ళేవరన్నా వుంటే చెప్పమన్నారు కదా అమ్మ నాన్న. ఏదో సంబంధం వచ్చిందని చెప్పారు. ఒకసారి కలిసి …”

“అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. బరువు, బాధ్యతల్లేవు అంటే ఏంటి?” గొంతు పెంచి కరుణ మాటకు అడ్డొచ్చింది ప్రీతి.

“అమ్మా నాన్నల్లేని ఒంటరివాడేమో. మనోవర్తిలాంటి బాధ్యతల్లేవేమో. అప్పులేం లేవేమో.”

“ఎందుకో నాన్న ఆ మాట చెప్పినప్పుడు అంత సింపుల్గా అనిపించలేదు. ఆ పదాలు నచ్చలేదు నాకు.”

“అతను వివరించిన పరిస్థితులను నాన్న ఇలా కొద్ది మాటల్లో కుదించి నీకు చెప్పి వుండొచ్చు కదా. నీకు వేరే

ఆలోచన వుంటే నీ ఇష్టం. కానీ కేవలం ఆ పదాల ఆధారంతో ఒక నిర్ణయానికి రావొద్దు. ఒకసారి మాట్లాడి చూడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?”

“హ్మ్, ఇంకొంచెం ఆలోచిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే వుండరాదూ?”

“నాకు బాగా పని వున్నప్పుడు పాప అమ్మ దగ్గర పడుకుంటుంది కానీ మధ్య రాత్రి లేచి ఏడిస్తే అమ్మ పట్టుకోలేదు. పాప లేకుండా నాక్కూడా సరిగ్గా నిద్ర రాదు. ఇంకో రెండేళ్ళు పోనీ, అప్పటికీ నీకు పెళ్లి కాకపోతే బయటెక్కడికైనా ఒక రోడ్ ట్రిప్ వేసుకుందాం.. జస్ట్ మనిద్దరమే.”

“అప్పట్లోగా నీ పెళ్ళయిపోతే?” కన్ను గీటి అంది ప్రీతి.

కరుణ ఏమీ మాట్లాడకుండా టీ కప్పు పక్కన పెట్టి చిరునవ్వుతో ప్రీతి వైపు చూసింది. ఆ నవ్వులోని అంతర్యం ప్రీతికి తెలుసు.

“ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నా నీకు. ఇక నేను అనుకున్నది చెప్పాల్సిందే. అటువైపు కాస్త ఆలోచించు కరుణ. ఒక పెళ్లి వీగిపోయిందని సన్యాసిలా బతకక్కర్లేదు.”

“సన్యాసమా? హన్నన్నా! ఎన్ని కోరికలో పాపకూ, నాకూ. అన్నీ తీర్చేసుకుంటాం కూడా. ఇప్పుడు మాకు బోల్డంత ప్రేమ కావాలి. మేమిచ్చె బోల్డంత ప్రేమను తీసుకునే వాళ్లు కావాలి. అందులో నో కాంప్రోమైజ్, నో అడ్జస్ట్ మెంట్స్. మా చిన్ని ప్రపంచాన్ని తన ప్రపంచం అనుకునే వ్యక్తి నాకు తారసపడలేదింతవరకూ. అలాంటి వాడు తారసపడినప్పుడు పో, పోవోయ్ అని అనను సరేనా.” నవ్వుతూ అన్నది కరుణ.

“అవునూ, ఈ మధ్య ఒకరోజు అంకుల్ నాతో మాట్లాడుతూ బంధువెవరో సంబంధం తెచ్చారని అన్నారు. ఏమన్నా తెలిసిందా దాని గురించి?”

నవ్వింది కరుణ,”నాకు ఇంకా వివరాలు తెలీవు. అహంకారంతో డివోర్స్ తీసుకున్నానని, సర్దుకుపోవాల్సిందని ఆన్నారట ఒక దగ్గరి బంధువు నాన్నతో. ఎన్ని మాటలు పడి, నలుగురి మధ్య ఎంత ఒంటరితనం అనుభవించి, ఎంత క్షోభపడి ఈ నిర్ణయం తీసుకున్నానో వాళ్ళకేం తెలుసు? ఇంకొకరెవరో డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్నారట. అలా ఆలోచించేవాళ్లకు ఎలాంటి సంబంధాలు తెలుస్తాయంటావూ?”

“ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో?” కరుణ మాటను ఆమెకే అప్పగించింది ప్రీతి.

“ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే ఎవరూ లేరు. నా సంగతి ఒదిలెయ్” హ్యాండ్ బ్యాగ్ అందుకుని బయటకు నడుస్తూ అంది కరుణ, “ సరే అమ్మాయ్, నేనిక నా చిట్టితల్లి దగ్గరికి వెళ్లాలి. అతనితో మాట్లాడిన తరువాత నాకు కాల్ చెయ్యి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. నువ్వసలే వాగుడుకాయవు.”

“సరే, మాతాశ్రీ! గుడ్ నైట్!” నవ్వుతూ కరుణను సాగనంపింది ప్రీతి.

***

 

painting: Mandira Bhaduri

నాలుగు రోజుల తరువాత సాయంత్రం కరుణకు ఫోన్ చేసింది ప్రీతి అర్జంటుగా రమ్మని.

కరుణ వెళ్ళేసరికి వాడిన మొఖంతో, ఆఫీసుకు వేసుకెళ్లిన బట్టల్లోనే ఉంది ప్రీతి.

కరుణను తలుపు దగ్గరే పట్టుకుని, “అతన్ని కలిశాను. నేను చెప్పాను కదా తన మాటలు నచ్చలేదని. ఛ, అతన్ని కలవకపోయుంటే బాగుండేది.” కోపంగా గబగబా అంది ప్రీతి.

“ఆగాగు. ఎవరతను, ఎవరిని కలిసావు? ఏం మాట్లాడుతున్నావు? ఆఫీసులో ఏమైనా ..”

“ఆఫీసులో గొడవ కాదు తల్లీ. ప్రపంచమే భయంకరంగా వుంది.”

“ఒకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్…” ప్రీతిని కుర్చీలో కూర్చోబెడుతూ అంది కరుణ, “ఇప్పుడు మెల్లగా చెప్పు.”

“పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా. అతను ఆఫీస్ పని వుండి కాలిఫోర్నియా నుంచి న్యూ జెర్సీ వచ్చాడట. పొద్దున్నే కాల్ చేసి అడిగాడు కలవడానికి వీలవుతుందా అని. మాల్ లో కలిసాం. చాలా సేపు బాగానే గడిచింది. మొదట్లో వుమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు. తరువాత చెప్పాడు, మొదటి పెళ్లి పెద్దవాళ్ళు చేసిన బలవంతపు పెళ్లి అట. ఆ అమ్మాయి చాలా సాంప్రదాయకంగా వుంటుందట. ఆమె పేరు బాగోలేదని రమ్య అని పేరు మార్చాడట. ఇతనే దేవుడని ఫీల్ అయ్యేదట.  సొంత వ్యక్తిత్వం లేని మూర్ఖురాలని అన్నాడు. ఒక పాప పుట్టిన తరువాత ఆమె మరీ పిచ్చిదయ్యిందని, భరించలేక విడాకులిచ్చేశానని చెప్పాడు. ఇది జరిగి ఆర్నెళ్ళవుతోందట. వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని, వాళ్ళతో తనకెలాంటి కాంటాక్ట్ లేదని నాకు భరోసా ఇవ్వబొయ్యాడు. డివోర్సీనే కానీ బరువూ బాధ్యతల్లేవు అని పళ్ళికిలిస్తూ అన్నాడు.”

“అంత లిబరల్ వ్యూస్ ఉన్నవాడు, పెళ్ళికి ముందు ఆ అమ్మాయితో మాట్లాడలేదా అతను?”

“ఆ, ఆ … మాట్లాడాడట. పెళ్లి తరువాత మార్చుకోవచ్చనుకున్నాడట.” పళ్ళు కొరుకుతూ అంది ప్రీతి.

కరుణ ముఖం ఎర్రబడింది, “రాహుల్ తల్లిదండ్రులు నాగురించి సరిగ్గా ఇట్టాగే అనుకున్నారు.  నా గురించి, నా కలల గురించి విడమరచి చెప్పిన తరువాతే రాహుల్ నన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి తరువాత అవన్నీ మార్చుకోవచ్చని వాళ్లు అనుకున్నారట. అదీ ఇప్పుడు రాహుల్ ఉవాచ. వాళ్లు మాతోనే వుండే వాళ్లు కదా, మెల్లగా రాహుల్ కూడా వాళ్లలాగే తయరయ్యాడు. మారాడో అంతకు ముందు నుంచీ అంతేనో. నేను కూడా మారాను,. అన్నేళ్లు ఆ బురదలోనే పడి వుండేంతగా నన్ను నేను మర్చిపొయ్యాను. జీతం తెచ్చే పనిమనిషిలా …” కోపంతో గొంతు వణికి మాట్లాడలేకపొయ్యింది కరుణ.

ప్రీతి కరుణను కౌగిలించుకుని అన్నది, “ఎంత బాధ పడ్డావురా. అదంతా అయిపొయ్యింది. ఇప్పుడు చూడు, నువ్వక్కడ లేవు. నీ పాప కూడా లేదు ఆ బురదలో. అక్కడే దిగబడకుండా ధైర్యంగా బయటపడ్డావు. నువ్వు నా స్నేహితురాలివని చెప్పుకోవడానికే గర్వంగా వుంది.”

కరుణ కాస్త తెప్పరిల్లి అడిగింది, “ఇంతకీ, రమ్యకు కనీసం సరైన అధారమైనా కల్పించాడా ఇతను?”

“ఆ అమ్మాయి తన కిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేశాడట. దానితో తన బాధ్యతలు తీరిపొయ్యాయట. ఆమే పాపను కూడా తీసుకెళ్లినందుకు తనకు పాప బరువులేం లేవట … గొప్పగా చెప్పాడు.”

“వీర లిబరల్, కట్నం కూడా తీసుకున్నాడా?” నోరెళ్ళబెట్టింది కరుణ.

“అదే అడిగితే, ఓ వెర్రి నవ్వు విసిరాడు. పెద్దవాళ్ళు తనకు తెలీకుండా జరుపుకున్నారట ఆ తంతులన్నీ.”

“హ్మ్ … ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్. కానీ ఇట్లాంటి విషయాల్లో గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఆదర్వైజ్..”

“నన్ను బాధ పెట్టింది అది కూడా కాదు కరుణా. ఆ బరువు బాధ్యతా అనే పదాలు ఇతను చాలా తేలికగా ఉపయోగించాడు. మరో పెళ్లి కూడా అలోచించలేనంత వెనకబడ్డ మనస్తత్వమండీ వాళ్ళది అని అన్నాడు.  ఆ అమ్మాయి గురించి అంతా తెలిసే చేసుకున్నాడు. పెళ్ళికీ పాప పుట్టడానికీ చాలానే గ్యాప్ వుంది. పాప పుట్టిన తరువాత వెలిగింది వీడికి ఆమె బ్యాక్వర్డ్ అని. ఇప్పుడు ఆ పాపను బరువు అంటున్నాడు, ఆ బరువు తనకిక లేదంటున్నాడు. ఆమెకు ఏమైనా అయితే, ఏమీ కాకపోయినా సరిగా చూసుకోలేకపోతే ఆ పాప జీవితం ఎలా వుంటుంది? పాప పెద్దయి ఇలాంటి ప్రబుద్దుడి చేతిలో పడితే, అదొక విషియస్ సర్కిలే కదా. అతను చేసింది తప్పని చెప్పాను. వెంటనే వాళ్ళెక్కడున్నారో కనుక్కొని పాపను బరువుగా కాదు బాధ్యతగా తీసుకొమ్మని చెప్పాను. నేనలా మాట్లాడేసరికి వేరే పనుందంటూ పారిపొయ్యాడు.”

గుండె బరువెక్కి ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా కూర్చున్నారు.

నుదురు నొక్కుకుంటున్న ప్రీతిని చూసి, “సర్లే, నువ్వు ఫ్రెష్ అవుపో. నేను టీ పెడతాను” అంటూ కిచెన్ లోకి దారి తీసింది కరుణ.

“థ్యాంక్స్ అమ్మాయి. టీ బాగా పెట్టు. తల పేలిపోతోంది.” అంటూ బాత్రూంలోకి వెళ్లింది ప్రీతి.

ప్రీతి వచ్చేలోపు టీ తయారు చేసి కప్పుల్లో పోసి, బాల్కనీలో చైర్లు వేసింది కరుణ.

టీ కప్పు ప్రీతి చేతికి ఇస్తూ అంది కరుణ, “ఇప్పుడు నా టర్న్, నా కథ చెప్పడానికి.”

“అహ్హా! ఎనీథింగ్ ఇంటరెస్టింగ్?” కన్ను గీటి అడిగింది ప్రీతి.

“ఇంటరెస్టింగే. ఒకతను ఈ-మెయిల్ చేశాడు. నాన్న మొన్న చెప్పాడు కాదా? అతను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్క కండీషన్ అట.” పంటి బిగువున నవ్వు దాస్తూ అంది కరుణ.

“ఓహ్. ఒక్కటేనా? ఏమిటో అది.”

“ఊహించు చూద్దాం.”

“కట్నం కావాలన్నాడా?” కన్నెర్ర జేస్తూ అంది ప్రీతి.

“అహహ, పని చేస్తున్నాను కదా అందుకని కట్నం అక్కర్లేదట. చాలా క్లారిటీతో ఉన్నాడు.”

“వాడి క్లారిటీ తగలెయ్య!”

“దానికే తిట్లదండకం మొదలెట్టావూ…”

“ఓహ్, మరింకేంటో చెప్పు త్వరగా.”

నిట్టూర్పు విడిచి చెప్పింది కరుణ, “పాప నాదగ్గర వుండకూడదట. పాపను పాప నాన్నకు పూర్తిగా ఇచ్చెయ్యాలట. లేకపోతే మా అమ్మనాన్నలకో, అదీ లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చెయ్యాలట. పాపను అమ్మానాన్నలు పెంచితే నేను డబ్బు సర్దుతానా అని ఒక ప్రశ్న కూడా యాడ్ చేశాడు.”

“….” దిగ్బ్రాంతితో చూస్తుండిపొయ్యింది ప్రీతి.

“ఎగ్జాక్ట్లీ. నా మైండ్ బ్లాంక్ అయింది ఆ ఈ-మెయిల్ చదివినప్పుడు. “పిల్లలంటే ప్రాణంలేని వస్తువులు కాదు. పిల్లలను ప్రేమించి చూడండి ఎంత ఆనందంగా వుంటుందో మీకే తెలుస్తుంది. మీరు చాలా ఎదగాల్సి వుంది.”

అని రిప్లై ఇచ్చాను. కానీ….పిల్లలను బరువు అనుకునే ట్రెండ్ నడుస్తున్నట్లుంది. మొన్నామధ్య ఒక అమెరికన్ తెలుగు పత్రిక చూశాను. అందులోని క్లాసిఫైడ్ చూస్తే ఒక డివోర్సీ అమ్మాయి ప్రొఫైల్ లో ‘డివోర్సీ విత్ నొ ఇన్ కంబ్రెన్స్’ అని వుంది.”

“అబ్బా కరుణా, ఏమిటీ మనుషులు? ప్రకృతి చేసిన పెద్ద తప్పు ఇదే. శక్తివంతమైన మెదడుని తను సృష్టించిన ప్రాణులన్నింటిలో అతి హీనమైన ప్రాణికి ప్రసాదించింది. ఎంత మార్పు రావాలి మనుషుల్లో.”

కాసేపు మౌనంగా కూర్చున్న తరువాత, తల విదిల్చి కంప్యూటర్ ఓపెన్ చేసింది ప్రీతి, “రా కరుణ. ఓ రెండు ఈ-మెయిల్స్ చేద్దాం. ఒకటి నా స్నేహితురాలు రాధకు. తను ఒక  మహిళా సంస్థలో లాయరుగా పని చేస్తోంది. రమ్య గురించి చెప్పి, డైవోర్స్ కేసు తిరగదోడి ఆమెకు మనోవర్తి ఇప్పించొచ్చేమో చూడాలి. అలాగే, ఆమె పాపకు కూడా చైల్డ్ సపోర్ట్ వచ్చేట్టు చూడమని చెప్పాలి. ఇంకో ఈ-మెయిల్ మా నాన్నకు. తనకున్న ఫ్రెండ్ సర్కిల్నంతా ఉపయోగించి రమ్య ఎక్కడుందో కనుక్కోమని చెప్పాలి. కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. మనకు తెలీనివెన్నో జరిగిపోతుంటాయి, కనీసం మన ఎరికలోకి వచ్చిన వాటినైనా పట్టించుకోవాలి కదా?”

ప్రీతిని  కౌగిలించుకుని, “నువ్వు భలే పిల్లవి ప్రీతి.” అని అరిచింది కరుణ. “ఎంత దిగులుగా వచ్చాను నీ దగ్గరికి. ఇంతేనా మనుషులు అనుకుంటూ, నా పాప గురించి, తన లాంటి పాపాయి గురించి దిగులు పడుతూ వచ్చాను…. ”

*

ఒలంపిక్ విహార యాత్ర

 

 

Prajna-1“జోరుగా హుషారుగా షికారు పోదామా, హాయి హాయిగా తీయ తీయగా” అంటూ పృథ్వీ పాడుతున్నాడు.

“ఎంటా పాత పాట? కొత్తది ఏమైనా పాడు” చిరాకుపడుతూ వియోన అంది.

“ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు పెద్దలు”

“పెద్దలకేం పనిలేదు. ఊరికే ఏదొకటి చెప్తూ ఉంటారు”

“ఎందుకంత చిరాకుగా ఉన్నావు?”

వియోన, పృథ్వీ నవ దంపతులు. లాంగ్ వీకెండ్ వచ్చిందని ఒలంపిక్ నేషనల్ పార్క్ ట్రిప్ ప్లాన్ చేసుకొని, కార్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగా ట్రాఫిక్ ఉండటంతో వియోన కి విసుగ్గా ఉంది. అదీ సంగతి.

“ఏంటి ఈ ట్రాఫిక్? బ్రేక్ మీద కాలు పెట్టి పెట్టి నాకు వేళ్ళు నొప్పిగా ఉన్నాయి. పైగా ఈ ఎండ ఒకటి. రాత్రి బయల్దేరుండాల్సింది మనం” వియోన మొహం తూడ్చుకుంటూ అంటోంది.

“బాగుంది, సమ్మర్ అన్నాక ఎండ కాకపోతే మంచు పడుతూ ఉంటుందా ఏంటి? నేనే నడుపుతా అని ఎక్సైట్ అయ్యవుగా, నడుపు మరి” పృథ్వీ ఇంకా ఎడిపిస్తున్నాడు.

“అసలు అమెరికా లో సమ్మర్ ఇలా మండిపోతుందనుకోలేదు. ఎప్పుడు చల్లగా ఉంటుందనుకున్నాను” వియోన అసలు భావం బయటపెట్టింది.

“ఏడిసినట్టుంది. ఎప్పుడూ చల్లగా ఉండటానికి ఇది అలాస్కా కాదు, అంటార్క్టికా అంతకంటే కాదు” పృథ్వీ అద్దంలో మొహం చూస్కుంటూ, జుట్టు సర్దుకుంటూ చెప్పాడు.

“అన్నట్లు మన నెక్స్ట్ ట్రిప్ అదే” వియోన కార్ ముందరకి మెల్లగా పోనిస్తూ అంది.

“ఏంటి అంటార్క్టికా నా?” పృథ్వీ షాక్ అయ్యాడు.

“కాదు అలాస్కా”

“చాలా కొరికాలు ఉన్నాయే నీకు, చూద్దాంలే తర్వాత. ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. పోనీ పోనీ”

నాలుగు మైళ్ళు దాటాక రోడ్డు ఖాళీగా కనిపించింది. ఇద్దరూ హమ్మయ్య అనుకున్నారు. కొంచం దూరం ముందరకి వెళ్ళిన తరువాత గాస్ స్టేషన్ లో ఆగారు. కావల్సిన వస్తువులు- అంటే చిప్స్, కోక్ లాంటి చిరు తిళ్ళు కొనుక్కుని, ప్రయాణం కంటిన్యూ చేస్తూ ఇంటర్ స్టేట్ -5 సౌత్ రోడ్డు ఎక్కారు. డ్రైవింగ్ పృథ్వీ చేస్తున్నాడు. వియోన “సాగర సంగమం” పాటలు ప్లే చేస్తోంది కార్ ఆడియో ప్లేయర్ లో.

“పాత పాటలు పాడకూడదు కాని వినచ్చా?” పృథ్వీ సటైర్ వేశాడు.

“అబ్బా, ఇది ఇళయరాజా పాట. పాతది అయినా బాగుంటుంది. అయినా ఇందాక ఏదో చిరాకులో అన్నానులే. ఇంకోటి తెలుసా, ఇలాంటి ట్రిప్స్ లో మ్యూజిక్ వింటూ వెళ్ళడం కూడా ఒక మంచి అనుభూతి” వియోన ఎంతో ఫీలింగ్ తో చెప్పింది.

“గోంగూర కట్టలే. నీకు ఇష్టమైతే సరి”

ఇలా వాళ్ళిద్దరి గిల్లికజ్జాలు మూడు గంటలు సాగాయి. గూగుల్ మాప్ ని ఫాలో అవుతూ, US-101 నార్త్ రోడ్ ఎక్కి, లాస్ట్ లో US-101 వెస్ట్ తీసుకొని, సాయంత్రం ఆరు గంటలకి “స్క్విమ్”(Sequim) చేరుకున్నారు.

“నాకు ఆకలి వేస్తోంది. ముందర తినేసి అప్పుడు హోటల్ కి వెళ్దాము ప్లీజ్” వియోన దీనంగా అడిగింది.

“హి హి సరే, దగ్గర్లోనే ‘బర్గర్ కింగ్’ ఉంది వెళ్దాము”, బర్గర్ కింగ్ వైపు కార్ తిప్పుతూ పృథ్వీ అన్నాడు.

“మాయదారి బర్గర్లు ఇక్కడ కూడానా, వేరే ఏమైనా తిందాము. ఒలంపిక్ లో ఏంటి స్పెషల్ ?”

“రేపు, ఎల్లుండి ఎలాగో అవే తినాలి. పైగా రెప్పోద్దునే లేచి బయల్దేరాలి, సో కొంచం లైట్ గా తినాలి” అంటూ బర్గర్ కింగ్ దగ్గర కార్ ఆపాడు.

“అన్నీ నువ్వే చెప్పింక, నేనెందుకు” అని అలుగుతూ వియోన కార్ దిగి, బర్గర్ కింగ్ లోపలకి వెళ్లిపోయింది.

“దేవుడా, ఈ ఆడవాళ్ళని ఎలా అర్ధంచేసుకోవాలి” అని అనుకుంటూ, కార్ పార్క్ చేసి బర్గర్ కింగ్ లోకి పృథ్వీ వెళ్ళాడు.

వియోన అలక ఎంతో సేపు లేదు. బర్గర్ చూడగానే అలక పోయి, ఆకలి గుర్తొచ్చింది. ఇద్దరు తినేసి, బయటకొచ్చేసరికి దాదాపు ఏడు గంటలు అవుతోంది. వాళ్ళు ఉండవలసిన చోటు అడ్రెస్ ని జి‌పి‌ఎస్ లో పెట్టి, కార్ స్టార్ట్ చేశాడు. వియోన ప్రకృతి అందాలని చూస్తూ ఆనందిస్తోంది. సమ్మర్ అవ్వటంతో సాయంత్రం ఏడు గంటలు దాటినా ఇంకా వెలుగు, ఎండ ఉన్నాయి. కారవాన్ గా మార్చిన ఒక పాత వాన్ ని చూసి, పృథ్వీ కార్ ఆపి, తన ఫోన్ తీసుకొని ఆ కారవాన్ ఓనర్ కి కాల్ చేసి మాట్లాడాడు.

“దిగు” పృథ్వీ అన్నాడు.

“ఏంటిక్కడా? ఈ గడ్డిలోనా?” వియోన ఆశ్చర్యంగా అడిగింది.

“యా, ఇదే మన కారవాన్. ఇపుడు అదే కన్ఫర్మ్ చేసుకున్నది.  ఇక్కడే మనం రెండు రోజులు ఉండేది” పృథ్వీ ఎంతో కాజుయల్ గా చెప్పాడు.

వియోన చుట్టూ చూసింది. కొంచం పొలాల గాను, కొంచం ఫార్మ్ గాను ఉంది. కారవాన్ లు మూడు నాలుగు ఉన్నాయి చుట్టూరా. ఎంతో అందంగా ఉంది ప్రదేశం.

“చాలా బాగుంది పృథ్వీ ఈ ప్లేస్” చాలా థ్రిల్ అవుతూ వియోన చెప్పింది.

“నాకు తెలుసు నీకు నచ్చుతుందని. లోపల కి వెళ్దాం పద” అని సామాను ట్రంక్ లో నుండి తీస్తూ అన్నాడు.

పృథ్వీ కి సహాయం చేయకుండా వియోన పరిగెత్తుకుంటూ కారవాన్ లోపలకి వెళ్లింది. గట్టిగా అరిచింది. ఆ అరుపుకి భయపడి పృథ్వీ వెంటనే లోపలకి పరిగెత్తాడు.

“ఏంటి, ఏమైంది వియూ?”

“వావ్ . ఎంత బాగుందో చూడు ఇల్లంతా! ‘పడమటి సంధ్యారాగం’ సినిమా చూసినప్పటినుండి ఇలాంటి ఒక కారవాన్ లో కానీ, ఒక ట్రెయిలర్ లో కానీ ఉండాలనేది నా కోరిక. ఇప్పటికి తీరింది. ఐ యామ్ సో హాపీ” అనుకుంటూ పృథ్వీ ని హగ్ చేసుకుంది.

వియోన కి ఒక మొట్టికాయ ఇచ్చి, “ నీ యెంకమా! గట్టిగా అరిచేసరికి యే పామో, తేలో చూసావేమో అనుకుని భయపడ్డాను. గ్లాడ్ యు లైక్ ఇట్” అని తాను కూడా వియోన ని హగ్ చేసుకున్నాడు.

సామాను అంతా లోపలకి తెచ్చుకొని, ఇల్లంతా ఒకసారి ఎక్స్ప్లోరర్ చేశారు. ఈ ఆధునిక ప్రపంచానికి దూరంగా, ఎటువంటి టి‌వి, కంప్యూటర్ వగైరా లేకుండా ఎంతో ప్రశాంతమయిన వాతావరణంలో ఉండటం ఇద్దరికీ ముచ్చట వేసింది. ఈ లోగా ఓనర్ రావడంతో వారితో కబుర్లు చెప్పారు.

“వైఫై లేదోయి ఇక్కడా” పృథ్వీ ఫోన్ చెక్ చేస్తూ అన్నాడు.

“అవును, ఇందాక ఆవిడ చెప్పింది కదా. అయినా బోర్ కొడితే చదువుకోవటానికి పుస్తకాలున్నాయి. ఆడుకోవటానికి కార్డ్స్, స్క్రాబ్బుల్ లాంటి గేమ్స్ ఉన్నాయి. ఫ్రీడ్జ్ లో పాలున్నాయి. కాఫీ, చక్కర ఉన్నాయి. వండుకోవటానికి సదుపాయాలు, సరుకులు ఉన్నాయి. ఇవేం లేకపోయినా బయట అందమయిన ప్రకృతి ఉంది. ఇంకేం కావాలి పృథ్వీ ఈ జీవితనికి?” వియోన ఎంతో భావోద్వేగంతో, కవితారూపంలో చెప్పింది.

“మా ఆవిడ కి ఇవాళ కవితలు ఎక్కువైపోయాయి. లాభంలేదు వంటికి కాఫీ పడాల్సిందే ఇప్పుడు” అని పృథ్వీ అనగా, ఇద్దరూ నవ్వుకుంటూ, వేడి వేడి కాఫి పెట్టుకుని తాగి పెందరాడే పడుకున్నారు.

—————————————

olympicmountains_pic

మరుసటి రోజు పొద్దునే ఆరింటికి లేచి, గబగబా తయారు అయిపోయి ఇద్దరు కార్ లో బయలుదేరారు. అరటిపండు, ‘స్టార్ బక్స్’ లో కాఫీ ఆ రోజున బ్రేక్ ఫాస్ట్. అలా కార్ నడుపుకుంటూ, దారి పొడువునా పసిఫిక్ సముద్రాన్ని చూసుకుంటూ, ‘పోర్ట్ ఏంజలీస్’ దాటుకుంటూ ఒలింపిక్ పార్క్ చేరుకున్నారు. ఎంతో ఎండగా ఉంటుందని అంచనా వేసుకొని, తేలికపాటి బట్టలు వేసుకున్నారు. కాని ఒలంపిక్ పార్క్ కి చేరాకే అసలు సంగతి తెలిసింది. మబ్బుగా ఉండి, సన్నగా చినుకులు పడుతూ, వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉంది.

“ఛలో ట్రెకింగ్” వియోన ఉత్సాహంగా అంటోంది.

“ట్రెకింగ్ కాదు హైకింగ్ అనాలి. అమెరికా నేల మీద అడుగుపెట్టి ఎన్ని నెలలు అయినా ఇంకా ఇక్కడి టర్మ్స్ అలవాటు అవలేదు నీకు” పృథ్వీ చిలిపిగా అన్నాడు.

“పోనిలే నేను ఊరు దానినే. అన్ సివిలైజ్డ్ అనుకో” కెమెరా మెడలో వేసుకొని అంది.

“తల్లీ మళ్ళీ అలక పానుపు ఎక్కకు, పద వెళ్దాము” అంటూ కార్ లాక్ చేసి, అక్కడ హైకింగ్ ట్రైల్ వైపు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు.

మధ్యలో ఫోటోలు దిగుతూ, అటు వైపు నుండి వస్తున్న వాళ్ళని పలకరిస్తూ, మధ్యలో ఆయాసం వచ్చినప్పుడు కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొంటూ- అలా దాదాపు మూడు మైళ్ళు నడిచేసరికి చిన్నగా సముద్రపు నీటి శబ్దం వినిపించసాగింది. చుట్టూరా అడవిప్రాంతంలా ఉంది. కానీ జనసంచారం ఉండటంతో పెద్దగా భయం వేయదు. అప్పటిదాకా అలసిపోయి ఉన్న పృథ్వీ, వియోనలు ఆ నీటి శబ్దం వినేసరికి ఎలాగో అలా శక్తి తెచ్చుకుని కొంచం స్పీడ్ పెంచారు. అక్కడ చెక్కతో చేసిన మెట్లు కనిపించాయి. మెట్ల అవతల ఏమి కనిపించట్లేదు కానీ, అక్కడి నుండే సముద్రం వినిపిస్తోంది.

ముందుగా వియోన ఆ మెట్లు ఎక్కి, తనకి కనిపించిన దృశ్యాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోయింది. పృథ్వీ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. మాప్ లో చూస్తే యూ.‌ఎస్‌.ఏ.  లో ‘మోస్ట్ నార్త్ వెస్ట్ పాయింట్’ (NW పాయింట్) అనమాట అది. దానినే ‘నీయా బే’ అంటారు. ఎంతో సుందరమయిన ప్రదేశం.  పైన ఆకాశం తెలుపు, నీలం కలిపిన రంగులో; కింద సముద్రం కూడా ఇంచుమించుగా ఆదే రంగులో..మధ్యలో ఇంకేమీ లేదు అన్నట్లుగా ఎంతో నిర్మలంగా ఉంది ఆ దృశ్యం. వరుణుడు కూడా వీళ్లతో పాటు ఎంజాయ్ చేస్తునట్లు చినుకుల అక్షింతలు జల్లుతున్నాడు. సముద్రంలో నీళ్ళ చప్పుడు తప్ప అక్కడ ఏమీ వినపడట్లేదు. ఆ ప్రశాంతతని ఆస్వాదిస్తూ, ఇద్దరూ  ప్రకృతి పరవశంలో ఉన్నారు.

ఒక ఇరవై నిమిషాలు గడిచాక, “హే, ఫోటో తీస్తాను అక్కడ నించో” అని పృథ్వీ గొంతు విని, వియోన ఈ లోకంలోకి వచ్చింది. ఒక ఇరవై ఫోటోలు తీసుకొని, అక్కడ నుండి తిరుగు హైకింగ్ చేసి, కార్ దగ్గరకొచ్చారు.  కార్ లో కూర్చొని, మంచి నీళ్ళు తాగుతున్నప్పుడు మొదలయ్యాయి కాళ్ళ నొప్పులు. అప్పటికే టైమ్ పన్నెండు దాటింది. అందుకే ఎక్కువ సేపు అక్కడే ఉండకుండా, వెంటనే స్టార్ట్ అయ్యారు. ఇద్దరికీ ఆకలి కూడా మొదలయ్యింది. ఒక అరగంట ప్రయాణం చేశాక, అక్కడ ఫేమస్ అని ఎవరో చెప్తే ఒక చిన్న పిజ్జా ప్లేస్ లో పిజ్జా తినేసి, మెల్లిగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ కారవాన్ కి నాలుగింటికి చేరుకున్నారు. ఒక గంట రెస్ట్ అయ్యాక, కారవాన్ బయట ఉన్న మొక్కల్ని, పంటలని చూడటానికి వెళ్లారు. ఆ ఫార్మ్ ఓనర్ ఆ వేళ అక్కడ ‘గ్రీన్ హౌస్’ లో ఏదో పని చేస్తూ కనిపించగా, కాసేపు అతనితో మాట్లాడారు. వ్యవసాయం చేయటం కోసం అతను ఉన్న ఉద్యోగాన్ని వదిలేయటం పృథ్వీ, వియోనలను ఆశ్చర్యచకితం చేసింది.  సాయంత్రం ఏడింటికి ‘థాయి’ రెస్త్రాంట్ కి వెళ్ళి ఫుల్లు గా తినేసి, కారవాన్ కి వచ్చి, కాసేపు స్క్రాబుల్ ఆడుకొని పడుకున్నారు.

నెక్స్ట్ డే కూడా పొద్దునే లేచి, కారవాన్ లోనే ‘గ్రనోలా’ పెరుగుతో తినేసి, US 101 నార్త్ పైన,  మౌంట్ ఏంజలీస్ రోడ్ మీదుగా పయనమయ్యారు. వెళ్తున్న దారిలో చాలా పొగమంచు ఉండటంతో ఎంతో జాగ్రత్తగా, కార్ ని మెల్లిగా నడుపుకుంటూ ముందరకి వెళ్లవలసి వచ్చింది. రోడ్ కి ఇరువైపులా పచ్చని చెట్లు, రోడ్ మీద పందిరి లాగా అనిపించాయి. ఆ పొగ మంచు లోనుండి, చెట్లని చూస్తూ, లీలగా ఇళయరాజా పాటలు వింటూ, సౌకర్యవంతమైన AUDI కార్ లో వెళ్ళడం – ఆహా ఆ అనుభూతి మాటలలో వర్ణించలేనిది. అలా ఒక గంట ప్రయాణం చేశాక ‘హరికేన్ రిడ్జ్’ చేరుకున్నారు. ముందరి రోజులాగా చల్లగా కాకుండా, వేడిగానే ఉంది వాతావరణ పరిస్థితి.

హరికేన్ రిడ్జ్ – అక్కడ వరుసగా మంచు కొండలు ఉంటాయి. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు. ఆ మంచు కొండలని చూస్తూ ఉంటే , ఎండా, వేడి తెలియట్లేదు.

“అద్భుతం” వియోన అంది.

“బ్రహ్మాండం” అంటూ పృథ్వీ ఫోటోలు తీశాడు.

“ఏంటి పృథ్వీ, నేచర్ ని చూస్తుంటే ఏదో ఆనందం లోలోపల? అంత పవర్ఫుల్ ఆ ప్రకృతి? చూడు గూస్ బంప్స్” అంటూ తన చేతులని పృథ్వీ కి చూపించింది.

“ఒకటి. ప్రకృతిని మించిన పవర్ఫుల్ థింగ్ ఏమి లేదు. రెండోది. నీ ఫీలింగ్ కరెక్ట్ కానీ, అది మైండ్ లో వచ్చినది కాదు. తీవ్రంగా వీచే ఈ గాలులకి ఈ హరికేన్ రిడ్జ్ చాలా ఫేమస్. అందుకే నీకు తెలియకుండానే నువ్వు గాలి ధాటికి వణుకుతున్నావు”

అలా మాట్లాడుకుంటూ ముందుకి వెళ్ళి, కాసేపు హైకింగ్ చేసొచ్చారు. ముందర రోజు కూడా ఫిజికల్ గా స్ట్రెయిన్ అవ్వడంతో ఇంక చాలు అనుకోని, ఆ మంచు కొండల అందాలని వీక్షిస్తూ కారవాన్ కి తిరిగొచ్చారు. సామాను కారులో సర్దేసుకొని, కారవాన్ తాళాలు తిరిగి ఇచ్చేసి,  మధ్యానం సమయానికి సొంత ఊరుకి తిరిగి బయలుదేరారు.

“చాలా థాంక్స్ పృథ్వీ” వియోన మనస్ఫూర్తిగా చెప్పింది.

“ఎందుకు?”

“నేను ఈ రెండు రోజులు చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు లేకపోతే నేను ఈ ప్లేసస్ చూసి ఉండేదనిని కాదు కదా”

“కానీ నా థాంక్స్ మాత్రం గూగుల్ కి. గూగుల్ మాప్స్ లేకపోతే నేను కూడా ఈ సుందరమయిన ప్రదేశాలని చూడగలిగే వాడిని కాదు. జేయ్ గూగుల్” అని డ్రమటిక్ గా పృథ్వీ అరిచాడు.

“గూగుల్ జిందాబాద్” వియోన కూడా గొంతు కలిపింది.

***

 

 

కొన్నిమాటలంతే …

 

 

అనిల్ డ్యాని  

Anil dani

 

 

మంచు కురిసినప్పుడు

కొంతగడ్డి పూలమీద

కొంత సాలె గూడు తీగల మీద పరుచుకుంటుంది

కొన్నిమాటలూ అంతే నేమో

 

ఈ కాఫీ బాగుంది అని చెప్పేలోపే

కాలి పట్టీల  శబ్దం వంటగది గుమ్మంలోకి

విసవిసా వెళ్ళిపోతుంది

భద్రంగానే ఉంది కదా కాఫీ కప్పు

అయినా ఏంటి గుండెలో ఏదో భళ్ళున పగిలిన శబ్దం

 

స్పర్శ లేకపోయినా

మాటలు భలేగా గుచ్చుకుని పోతాయి

ఇటుక ఇటుక  మధ్యలో మౌనాన్ని

నింపి  నిర్మించాక

నాలుగు గోడల మధ్యన  జీవిత ఖైదు

ఒకానొక అలవాటుగా మారిపోతుంది

 

అవును నీవొక నక్షత్రానివే

నీకై నీవు వెలుగులు నింపాలి

ఎక్కడిదో నీదికాని కాంతిని

పూసుకుని వెలిగి పోవాలి

కాదనలేనంత వైశాల్యం నీకున్నా

వెలిగినంత సేపు వెలిగి

నీ గుమ్మం ముందే కదా   రాలి పోవాలి

 

పోగేసుకున్నంతకాలం

రాయో , రప్పో  పక్కనే ఉంటాయి

వాటితో పాటుగా మాటలూనూ

ఆయుధాలుగా పనికొచ్చేవన్నీ

వదిలి పెట్టి మాటలనే

వాడుతూ పోతే చివరకి మిగిలేది

రాళ్ళు , రప్పలు ,మాటలు చేసిన మౌన గాయాలు

*

నేలపాటగాడు

 

 

బాల సుధాకర్ మౌళి

బాల సుధాకర్

 

ఒక
భైరాగి
ఏళ్ల తరబడి అవిరామంగా
గొంతెత్తి లోకాన్ని గానం చేస్తున్న
గాయకుడు
దేశదిమ్మరి
ఇంటికొచ్చాడు

ఎప్పుడో – చిన్నప్పుడు
వూళ్లో కనిపించాడు
మళ్లీ
ఈ వూళ్లోకొచ్చాడు
వస్తూనే
ఇల్లు తెలుసుకుని
యింటిలోపలికొచ్చాడు
పాత మల్లెపువ్వు నవ్వు నవ్వుతూనే
సంచిలోని కంజిర తీసి
రెండు పాటలు వినిపించాడు
వొకటి : నేల
రెండూ : నేలే
నేలపాటగాడు – నేల పాటలే పాడాడు
అతని యవ్వనం నుంచి
పుట్టలా పెరుగుతూ వొచ్చిన
నేల మీది ప్రేమ
దేశం మీద ప్రేమయి కూర్చుంది
దేశం మూల మూలా
వొట్టి కాళ్లతో తిరిగాడు

అతను
వెళ్లిపోయిన కాలాన్ని
వర్తమానం మొదల్లోంచి తవ్వి తీసి
చేతిలో నగ్నంగా పరిచాడు
వొట్టిపోతున్న వర్తమానాన్ని
భవిష్యత్ చంద్రవంకలోంచి చూపి
వూహల వంతెనలేవో అల్లాడు
రేపేమిటో
నువ్వే తేల్చుకొమ్మన్నాడు

నేలని అణువణువూ ఔపాసన పట్టి
నేల మీద నిటారుగా తిరిగినవాడు
నక్షత్రాల అమ్ములపొదిని తట్టి
తిరిగి నేలని ముద్దాడినవాడు
సగం కాలిన కలని వో చేత్తో
సగం విరిగిన రెక్కని వో చేత్తో
మోసుకుతిరుగుతున్నాడు

నేలిప్పుడు
అతని చేతుల్లో లేదు
అతని కాళ్ల కింద లేదు
అతని గొంతులోనూ లేదు

నేల పాటగాడు
పాడిన రెండు పాటలూ
గుండె నెరియల్లోంచి
కళ్ల సముద్రాల్లోకి
యింకుతున్నాయి

పాటగాడు
భైరాగి
ఇంకా ఇంటిలోనే ఉన్నాడు
ఈ రాత్రికి ఉండిపోతాడు

అతను నిద్రించిన చోట
ఈ వూరు మట్టిలోంచి
వొక  తూర్పుకిరణమైనా పొడుస్తుందా –

తెల్లారెప్పుడవుతుందో… !

( మా ఊరి నేలపాటగాడు ‘విశ్వనాథం’ కి… )

జగదల్ పూర్ జైల్ సెల్ అనే నేను…!

కోగంటి  విజయ్ 
~
koganti
నా కనుల ముందట  యీ వుదయ, అస్తమయాలు రెండూ రక్త వర్షాలే!
రెండూ మదించిన కామపు వాసనలే!
కాంక్రీటుగోడల, ఇనుప తలుపులతో నిలచి వున్నా
నా ముందు తిరుగాడే యీ
అధికార మృగాలకు,
రోజూ శిథిల మయే హృదయాలకు,
నేనో క్షుభిత సాక్షిని!
ఎంక్వైరీ పేరున
నిరంతరంగా నా ముందు జరిగే
నిత్య స్త్రీ దోపిడీకి,
కర్కశత్వపు అడుగుల క్రింద,
పొగరు బట్టిన లాఠీల చివరన, జరిగే
క్రౌర్యపు శీల విధ్వంసానికి
క్షణక్షణం దహనమయే
నిస్సహాయపు అబలత్వానికి
నేనో  సిగ్గు విడిచిన సాక్షిని!
కరుణను మరచిన
మృగత్వపు దురదకు
మాంసపు ముద్దల్లా మారి
ఎండిన కన్నీటి చారలతో
దగ్ధమయే
వేదనా యోనులకు,
నేనో గుండె పగిలిన సాక్షిని!
అమాయకుల ఆక్రందనలకు,
ఆక్రమింపబడిన దేహాలను
పొర్లించుకున్న నెత్తుటి మరకల నేలలకు,
నేనో కాంక్రీటు సాక్షిని!
దిక్కులు పగిలేలా అరిచే
భయవిహ్వల గాత్రాలకు,
వేడుకోళ్ళకు,
నిస్సహాయపు తిట్లకు,
క్రూర వికటాట్ట హాసాలకు,
నేనో చెవులు చిల్లులు పడిన బధిర సాక్షిని!
అమాయకపు అడవి జింకలను వలవేసి
కబళించే
అన్యాయ వ్యవస్థా పరిరక్షక భటుల
పశు వాంఛలకు,
నేనో నిర్జీవచ్ఛవ సాక్షిని!
కళ్ళకే కాక మిగిలిన వాటికీ గంతలు కట్టుకు
వేచిచూసే ధృతరాష్ట్ర
తీర్పులకు,
నేనో అంథ సాక్షిని.
(నిర్దోషిగా యేడేళ్ళ పాటు క్రూరంగా హింసింపబడి వెలుగు చూసిన ఆదివాసీ ధీర హిద్మీ నరక యాతనలు చదివి చలించి వేదనతో-)

Birdman: A Thing is a Thing. Not what is said of the Thing!

 

ల.లి.త.

 

 

lalitha parnandi“సృష్టించాలి…  సాధించాలి…  నిజాయితీగా సృష్టించి సాధించాలి…  అక్కర్లేదు. పాత కీర్తి మళ్ళీ వద్దు… కొత్తగా చెందాలి. తనకి తాను చెందాలి..  ఎందరికో చెందాలి..  గుర్తుండాలి.”

ఇది ఓ కళాకారుడి వేదన.  

‘బర్డ్ మాన్’ అనే సినిమా సీరీస్ మూడిట్లో నటించి బాగా పేరు తెచ్చుకున్న రోజుల్లోనే అతడు తన హాలీవుడ్ కెరీర్ ను విడిచిపెట్టేస్తాడు.  ఓ ఇరవై ఏళ్లయిన తర్వాత మళ్ళీ నటుడుగా నాటక ప్రయోక్తగా న్యూయార్క్  బ్రాడ్వే నాటకశాలలో కొత్త అవతారం ఎత్తటానికి ప్రయత్నిస్తాడు.  ఇప్పుడు రకరకాల కళారూపాల పోకడలన్నీ క్లైమేట్ చేంజ్ తో గ్లేసియర్లు కరుగుతున్నంత జోరుగా అంతర్జాల మహా సాగరంలోకి ప్రవహిస్తూ అస్తిత్వాలను ముంచేస్తున్నాయని తెలిసీ ఇలా సాహసం చెయ్యటం అంటే … అతను ఎంత పెద్ద రాయిగా ఘనీభవించి కాలు నిలదొక్కుకోవాలో! 

“కళ గురించి కాదు నీ బాధ. మళ్ళీ నిన్ను అందరూ పట్టించుకోవాలి.  బ్లాగర్లనీ ట్విట్టర్ నీ అసహ్యించుకుంటావ్. ఫేస్బుక్ పేజ్ లేదు నీకు. అంటే నువ్విక లేనట్టే.  అసలు నువ్వు చచ్చేంత భయపడుతున్నది నీ గొడవ ఎవరికీ అక్కర్లేదనే… మాలాగే.  మేం కూడా అంతే ..” అంటుంది అతని కూతురు.

“నువ్వు ‘బర్డ్ మాన్’ లాంటి చెత్త సినిమాలతో ఎంత చేటు చేశావ్!  ‘అన్నీ తమకోసమే’ అనుకుంటూ స్వార్థంతో బతికే పిల్లల్ని తయారు చేశారు మీలాంటివాళ్ళు.  చెడగొట్టేశారు. అసలైన ‘కళ’ అంటే ఏమిటో వాళ్లకి నేర్పలేదు.  వాళ్ళు దానికోసం కనీసం ప్రయత్నించే స్థాయిలో కూడా లేరు. నీ నాటకానికి చెత్త సమీక్ష రాసి నిన్ను నాశనం చేస్తాను” అంటుంది ఓ ఆర్ట్ క్రిటిక్.

“Popularity is the slutty little cousin of Prestige.  కళనీ సంస్కృతినీ ఊచకోత కోసేస్తున్న మీ హాలీవుడ్ స్నేహితుల దగ్గరకు తిరిగి వెళ్ళిపో. నీకు గొప్ప నాటకాలు ఎందుకు” – అంటూ సాంస్కృతిక ఆధిక్యతను ప్రదర్శిస్తూ తన పాపులారిటీని కింద పడేసి కసాపిసా తొక్కేద్దామని చూసే సహనటుడు. అందులోనూ అతనొక పేరున్న బ్రాడ్వే నటుడు కూడా.

అన్నిటినీ మించి..

వీళ్ళందరి గొడవతో మనసు ఏ కొంచెం చెదురుతున్నా “మళ్ళీ ‘బర్డ్ మాన్’ అయిపో.  పాత వైభవం తెచ్చుకుందాం. అరవయ్యేళ్ళ వయసంటే ఈ రోజుల్లో కొత్త ఇరవైలు. మొహానికి సర్జరీలతో కొత్త కళ తెచ్చుకో.” అంటూ సతాయించే తన ‘బర్డ్ మాన్’ అస్తిత్వం.

ఇలా గురి చూసి గుండెను చీల్చేసే మనుషుల మధ్యలో ఎంత బాధో వేదనో అతనికి తన అభివ్యక్తిని వెదుక్కోవటంలో ! భార్యతో కూతురితో తెగిపోయిన బంధాల దారాలు పోగేసుకుని మళ్ళీ పేనుకోవటంలో !

***

2014 కి ఆస్కార్ ఉత్తమ చిత్రం “బర్డ్ మాన్”.  ఈ Black Comedyని తీసినాయన Alejandro Inarritu.  మెక్సికన్ దర్శకుడు.

కథకొస్తే, ఒకప్పుడు ‘బర్డ్ మాన్’ సినిమాల హీరోగా ప్రఖ్యాతుడైన రిగ్గన్ థామ్సన్ (Bat Man సిరీస్ లో వేసిన Michael Keaton)  ఇప్పుడు నడివయసు కొసన ఉన్నాడు. భార్యతో విడిపోయాడు. కూతురు మత్తుమందుల అలవాటు వదిలించుకోవటానికి రిహాబ్ సెంటర్ కు వెళ్లి వచ్చింది. ఇప్పుడు అతన్ని హీరోగా గుర్తించి ఆరాధిస్తున్నవాళ్ళెవరూ లేరు. ‘బర్డ్ మాన్’ నీడ మాత్రం అతన్ని మళ్ళీ పాత వైభవం కోసం ప్రయత్నించమని వేధిస్తూ ఉంటుంది. అతని చిన్నప్పుడు స్కూల్ నాటకంలో నటించాడట. అది చూసిన రచయిత రేమండ్ కార్వర్ అతని నటనను మెచ్చుకుంటూ చిన్న టిష్యూ పేపర్ మీద రాసి సంతకం చేసిచ్చాడట. ఆ పేపర్ ను అపురూపంగా దాచుకుని మంచి నటుడు కావాలన్న కోరికను మనసులో పెట్టుకుంటాడు. తర్వాత కామిక్ స్ట్రిప్ హీరో బర్డ్ మాన్ గా హాలీవుడ్ నటుడయి, మంచి దశలో ఉండగా సినిమాను విడిచిపెట్టేస్తాడు.   ఇరవై ఏళ్ల విరామం తర్వాత తనకు చిన్నతనంలో స్ఫూర్తినిచ్చిన కార్వర్ రాసిన ఓ కథను  నాటకంగా న్యూయార్క్  బ్రాడ్వే థియేటర్లో వేయాలన్న కోరికతో నాటక రంగంలోకి దిగుతాడు. తన హాలీవుడ్ పాపులారిటీని, డబ్బునీ, ఇంటినీ అన్నీ తాకట్టు పెట్టి, ఓ 800 మంది ప్రేక్షకులు స్టేజ్ మీద చూడబోయే తన magnum opus సృష్టి కోసం తపిస్తాడు. నెమ్మదిగా చివరకు తన ఆత్మతోనూ, తనలోని కళాకారుడితోనూ, భార్యా బిడ్డతోనూ, తన అభివ్యక్తితోనూ సమన్వయాన్ని సాధించి శాంతంగా నవ్వుకుంటాడు ‘బర్డ్ మాన్’ అనబడే రిగ్గన్.

Photo 2

పైకి చిన్నగానే కనబడే చాలా పెద్ద అస్తిత్వ సమస్యలు అతనివి. తను ఒకప్పటి సెలబ్రిటీ. బర్డ్ మాన్ 4 అని వో సినిమా తీస్తే మళ్ళీ ఒకప్పటి పేరుని తిరిగి సంపాదించ గలిగే అవకాశం ఉన్న రోజులు ఇవి. అయినా ఆ గర్వాన్నంతా అణుచుకుని ఆర్టిస్ట్ గా నాటకంలోకి కొత్తగా అడుగుపెడతాడు. పాపులర్ సినిమాను అసహ్యించుకునే సాంస్కృతిక నియంతలు ఉన్న నాటక రంగం అది.  అక్కడ చౌకబారు పాపులారిటీ ఉన్న హాలీవుడ్ నటుడు,  నాటక దర్శకుడిగా నటుడిగా మెప్పు పొందటం అంటే పరుగులు తీస్తున్న కుర్రాళ్ళ బృందంతో కలిసి ముసలాడి ఎవరెస్ట్ ట్రెకింగే.

***

‘బర్డ్ మాన్’  వేదన ‘సాగర సంగమం’ లోనూ కనిపిస్తుంది. ఇష్టమైన నాట్యంలో తనను తాను వ్యక్తీకరించుకోవటానికి ‘సాగర సంగమం’లో అతని పేదరికం అడ్డవుతుంది. అలా అతని పతనం భౌతికమైన సమస్య దగ్గరే మొదలౌతుంది. విఫలమైన కళాకారుడి  చిక్కని వేదనను కె. విశ్వనాధ్ ‘సాగర సంగమం’ లో గాఢంగా చూపిస్తాడు.  పాపులర్ సినిమాకు అవసరమని కొంతా, తన సొంతమే అయిన మరికొంతా sentimentality ని కలిపి విశ్వనాధ్ తీసిన మంచి ఇతివృత్తం  ‘సాగర సంగమం. ‘కళాకారుడి వేదన’ అనే విషయం వరకే ఈ రెండు సినిమాల పోలిక. ‘బర్డ్ మాన్’ సంక్లిష్టమైన రోజుల్లో తీసిన సంక్లిష్టమైన సినిమా.

చాలా ఎక్కువ సూక్ష్మదృష్టీ, అసాధారణమైన తెలివీ ఉన్నవాళ్ళు మామూలు మనుషులతో అంటుకుని బతకటానికి ఎక్కువ కష్టపడతారు. అడుగడుగునా ఎదురయ్యే అతి మామూలుతనాన్ని అర్థం చేసుకోలేరు. తమతో సమానంగా సంభాషించేవాళ్ళు ఎక్కువమంది కనపడరు. మనుషులతో సంబంధాల్లో వాళ్ళకో అపసవ్యత వచ్చి చేరుతుంది. దాన్ని తొలగించుకోలేక ఇబ్బంది పడతారు.  ఆ బాధను జయించి, తమలో పుట్టే కొత్త కొత్త ఆలోచనలను మిగతా సమాజానికి అందించగలిగే వాళ్ళవల్లే సమాజంలో మార్పులు వస్తాయి.  అది చెయ్యలేని వాళ్లలో మేధాశక్తి ఒంటరి మంచుపర్వతమై, తెలివే శాపమై వాళ్ళు పిచ్చివాళ్ళయే ప్రమాదం కూడా ఉంటుంది. ‘తెలివెక్కువై పిచ్చోడై పోయాడ’ని  కామెంట్ సంపాదించుకునే అభాగ్యులు ఈ రకం. అతి మామూలుతనం మధ్య బతికే ఇలాటి పిచ్చిమేధావి ప్రయాణాన్ని ప్రముఖ మళయాళ దర్శకుడు అదూర్ గోపాలక్రిష్ణన్ తన ‘అనంతరం’ అనే సినిమాలో చూపిస్తాడు.

‘అనంతరం’ లో ఒక మేధావి తన తెలివిని సమాజంతో సమన్వయం చెయ్యలేకా, ‘సాగర సంగమం’ లో కళాకారుడు తన   కళాచాతుర్యాన్ని చేర్చాల్సిన స్థాయికి  చేర్చలేకా విఫలమైతే, ‘బర్డ్ మాన్’ ది వీళ్ళకి సరిగ్గా వ్యతిరేకమైన యాతన. మొదటి రెండు సినిమాల్లో  తెలివైనవాడు తన ఆధిక్యతనుండి న్యూనతవైపు జారిపోతే, ‘బర్డ్ మాన్’ న్యూనత నుంచీ బయలుదేరి  నెమ్మదిగా జీవితాన్నీ కళనూ గెలుస్తాడు. (అమితాబ్ బచ్చన్ నటన సూపర్ స్టార్ అనబడే స్థాయి నుండి బయలుదేరి ‘పీకూ’ సినిమాలో చక్కగా పరిణతి చెందినట్టు). ఈ ప్రక్రియలో కళాకారులకుండే రోంత పిచ్చితనమూ రిగ్గన్ను ఆవహించి, పిస్టల్ లో గుళ్ళు నింపి, నాటకం చివర్లో నిజంగానే తన్ను తాను కాల్చుకుంటాడు. అది చూసి, విజయం సాధించిన అతని నాటకం గురించి ఓ కళావిమర్శకురాలు ‘The unexpected virtue of ignorance’  అని న్యూయార్క్ టైమ్స్ లో రాసి పారేస్తుంది.  పొరపాటున  అతడు గుళ్ళున్న పిస్టల్ తో కాల్చుకున్నాడు కాబట్టి అతని అదృష్టం కొద్దీ ‘సూపర్ రియలిజం’ అనో  కొత్త ప్రక్రియ పుట్టిందని రాస్తూ అతని ప్రయోగంతో అమెరికన్ నాటకానికి కొత్త రక్తం ఎక్కిందని చెప్తుంది.

ఎవరేమనుకున్నా చివరకు రిగ్గన్ మానసిక స్థితే వేరు. రిగ్గన్ గదిలో “A thing is a thing. Not what is said of the thing” అని రాసి వుంటుంది. నాటక ప్రదర్శన తరువాత అతను తానేమిటో తెలుసుకుంటాడు. ఎవరు ఏమనుకుంటున్నారన్నది అతనికి ఇక అనవసరం.

***

‘బర్డ్ మాన్’ లో పొరలు చాలానే ఉన్నాయి. రిగ్గన్ నాటక బృందంలో ఉన్న లెస్లీ, లారా, మైక్ … ఈ ముగ్గురూ కూడా నటులే కాబట్టి ఆవేశాలు ఎక్కువే. అహంకారంతో రిగ్గన్ను తీసి పారేస్తూ, సహజ నటన అంటూ స్టేజ్ మీదే తాగుడూ శృంగారం కూడా నిజంగా చేసెయ్యాలని చూసే మైక్ లో వేరే సున్నితమైన మనిషి కూడా ఉంటాడు. ఆ మనిషి రిగ్గన్ కూతురు సామ్ ముందు బయట పడతాడు. రిహాబ్ సెంటర్ నుండి వచ్చిన సామ్ నాటకంలో తండ్రికి కావలసినవి చూసుకుంటూ సాయపడుతూ ఉంటుంది. అభద్రతా భావం నిండుగా ఆవరించిన సామ్, సోషల్ మీడియా కలిగించే అభద్రతతో పాటు దాని శక్తి ఇంకెంత గట్టిదో నొక్కి చెప్తూ ఉంటుంది.  తక్కువసేపే కనిపించినా ‘టైమ్స్’ పత్రిక ఆర్ట్ సెక్షన్ విమర్శకురాలు రివ్యూలతో కళాకారులని కత్తిరించటమో సైజు పెంచటమో చేస్తూ పోయే ఆర్ట్ క్రిటిక్ లకి గొప్ప ప్రతినిధి. ఈమెను అసలు మర్చిపోలేం.

Photo 3

మొత్తం అంతా కళను శోధించే మనుషుల కథ కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు తాజాగా కొత్తగా ఉన్నాయి. ఆ హాస్యం, పంచ్ కొన్నిసంభాషణలను మళ్ళీ వినమంటాయి. గాబ్రియేల్  మార్క్వెజ్ పుట్టిన సెంట్రల్ అమెరికా నుంచే వచ్చిన ఈ చిత్ర దర్శకుడు Alejandro Inarritu,  సాహిత్య సౌరభాలను సినిమాలో వెదజల్లాడు. మరీ ఎక్కువ తికమక పెట్టని మోతాదులో మాజిక్ రియలిజాన్ని ఉపయోగించాడు. ఇన్ని చేసి “ప్రపంచమే ఒక నాటక రంగం” అన్న షేక్స్పియర్ ని వదిలేస్తే ఎలా? మేక్బెత్ నూ కాస్త వాడాడు.

సినిమా కథా కాలం 3 రోజులు.  మొత్తం ఆ థియేటర్ ఉన్న భవనంలోనే వీళ్ళంతా ఉండటం, మొదటి రెండు రోజులూ ప్రివ్యూ షోలు గా నాటకం వేయటం, అందులోనే అన్ని రభసలూ జరిగిపోతాయి. మూడవ రోజు అసలు నాటకం. అంతే.  ఆ భవనం కాకుండా రిగ్గన్, మైక్ ఒక బార్ లోకి వెళ్తారు. బ్రాడ్వే వీధిలో ఓసారి. ఇంతే స్థల పరిధిలో  నాటకానికి సంబంధించిన ఇతివృత్తం ఉన్న సినిమాను నాటకరూపం లోనే తీశాడు Inarri tu. ఇంకా “బర్డ్ మాన్” సినిమాటోగ్రఫీ కి కూడా ఆస్కార్ వచ్చింది. Inarritu  ప్రణాళిక  ప్రకారం డైరెక్టర్ అఫ్ సినిమాటోగ్రఫీ EImmanuel  Lubezski   (ట్రీ అఫ్ లైఫ్, గ్రావిటీ లకు పని చేశాడు) ‘బర్డ్ మాన్’  సినిమా మొత్తాన్ని ఒకే షాట్ లో తీసినంత భ్రమ కలిగించాడు. ఎడిటర్ కు బొత్తిగా పనిలేని సినిమా ఇది. అసలు పనంతా స్క్రిప్ట్ రైటర్స్ Inarritu మరో ఇద్దరిదీ. (వీళ్ళు ముగ్గురికీ కూడా రాక తప్పని ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ ఆస్కార్ వచ్చేసింది).  శంకర్ మహదేవన్ బ్రెత్లెస్ పాటలో ఎక్కడ ఊపిరి పీల్చుకున్నాడో వెదుక్కున్నట్టు, Lubezski  షాట్  ఎక్కడ ఆగి, ఎక్కడ మళ్ళీ మొదలయిందో వెదికి వెదికి పట్టుకోవాల్సిందే. సినిమా విద్యార్థులకు మంచి అభ్యాసం.  ఒకే కామెరా అలా అందరి భావోద్వేగాల మీదా చిన్న పొడవైన కారిడార్లలో, గదుల్లో, స్టేజ్ మీదా అలా దగ్గరగా, దూరంగా, నిశితంగా, పరికిస్తూ వెళ్తూ ఉంటుందంతే. చూస్తున్న మనమూ అలాగే తిరుగుతూ తరవాత ఏమిటాని కుతూహలంగా చూస్తుంటాం.  నటుల ఉద్వేగాలతో  Inarritu బాలే చేయిస్తే దానికి తగ్గట్టు కామెరాతో బాలే చేయించాడు Lubezski.  కొద్దిపాటి జాజ్ ధ్వనులే సంగీతం.

ఆర్ట్ హౌస్ సినిమాకూ పాపులర్ సినిమాకూ తేడాలు చెరిపేయగల్గుతున్నారు Inarritu లాంటివాళ్ళు. నిజానికి ఈ కథా వస్తువును సుఖంగా సెంటిమెంటల్ స్థాయికో లేక తక్కువమంది మాత్రమే అందుకోగలిగే ఉన్నత స్థాయి ఉద్వేగానికో తీసుకువెళ్ళటం సులువు. రిగ్గన్ అసహాయత  మనకి కొంచెం జాలి కలిగిస్తూ ఉండగానే … అవతలివాడికి దొరికిపోతూ, ఓడిపోతున్నట్టు మొహం పెట్టి అతను అలిసిపోగానే … సినిమాలో సరిగ్గా ఆ క్షణాల్లోనే మందకొడితనమో sentimentalityనో వచ్చేస్తాయి సోమరిపోతు దర్శకుడైతే. Inarritu అలా జరగనివ్వడు. రిగ్గన్ వెంటనే తన ఆత్మనంతా కూడదీసుకుని ఎదుర్కొంటాడు పరిస్థితిని. లేకపోతే దర్శకుడే ఆదుకుని పాపం అతని చీప్ పాపులారిటీకి కూడా చిన్న విలువ కలిగిస్తాడు. ఒకోసారి చెత్తెస్ట్ జనరంజకత్వాన్నీ గొప్ప తత్వదర్శనపు కబుర్లనీ పక్కపక్కనే కూర్చోబెట్టి రిగ్గన్ను ఆటపట్టిస్తాడు. ప్రస్తుతం మన అంతర్జాల దర్శనం ఇదే కదా!

రిగ్గన్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.

Journalist 1 :    As you are probably aware, Barthes said.. “The cultural work done by gods and epics

is now being done by laundry detergent commercials and comic strip characters..

 

Riggan :             Ablosutely,  like you said.. Barthes said… ‘Birdman’,  like Icarus..

Journalist 2 :     Ok hang on, who is this Barthes guy.. Which ‘Birdman’ was he in?

Journo 1      :      Roland Barthes, was a French philosopher and if you knew anything about the

history of..

 

Journo 2      :      Now, is it true you have been injecting yourself with semen from baby pigs?

Riggan :             I’m sorry, What?

Journo 2      :     As a method of facial rejuvenation..

Riggan :             Where did you read it?

Journo 2       :     It was tweeted by @prostatewhispers.

Riggan :             That’s not true.

Journo 2        :    Ok, I’ll write you are denying it.

***

తను జీవించిన కాలాన్ని ఇంత బాగా ఒడిసిపట్టి సినిమాలోకి చరిత్రీకరించటం అంత తేలికైన పని కాదు.

Me Saludar Senor Inarritu ! 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మళ్ళీ మళ్ళీ అదే దారిలో…

 

 

ప్రపంచానికి సంబంధించి సమయం మాత్రం నిరంతరం కదిలెళ్ళిపోతూ ఉంటుంది. మనమే సంవత్సరాల తరబడీ ఒకేచోట ఆగిపోతాం! మరచిపోయో, అనుకోకుండానో కాదు.. కావాలనే ఒకే దారి గుండా పదే పదే వెళ్తుంటాం. 

ఏదో ఒక రోజు అధాటుగా తల ఎత్తగానే ఎదురుగా తను చూస్తుంటుందని, మనల్ని చూసిన సంతోషంతో ఎప్పట్లానే ఒక్కసారి రెప్పలార్పి, నవ్వుతో పలకరిస్తుందని… సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత, తడి పెదవుల గుండా వచ్చే ఆ నాలుగైదు మాటల కోసం ఎటూ వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ అదే దారిలో వెళ్తుంటాం!

ఒకటే ఆశ… ఆ దారిలో ఉన్న ఎర్రపూల చెట్టుకీ, గోపి రంగు డాబా ఇంటి అరుగులకీ, వీధి పేరున్న బోర్డుకీ, ఇంకా ఈ కవితలో చెప్పినట్టు దీపం స్థంభానికీ తన రాకపోకల సమయాలు, క్షేమ సమాచారాలు ఖచ్చితంగా తెలిసే ఉంటాయని! వేల నిరీక్షణల తర్వాత అయినా  కాస్తంత దయ తలచి అవి తన గురించి చెప్పేస్తాయనే ఆశ!!

ఇది అతి మామూలుగా చెప్పబడిన కవిత… కానీ, ఆఖరి లైన్ పూర్తి చేస్తూనే హఠాత్తుగా ఒక ముల్లు కాలిలో చివుక్కున దిగబడిన బాధ… ఆపైన కాస్త నిస్సత్తువ… ఒక సుదీర్ఘ నిట్టూర్పు.. అన్నీ కలిపి మనల్ని కూడా మనం వదిలేసిన, వదిలేయాలనుకున్న దారుల్లోకి లాక్కెళ్తాయి!

gulzar

 

అదే వీధి

 

 

 

నా వ్యాపారపు పనుల మీద

అప్పుడప్పుడూ తన ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ వీధి గుండా వెళ్తుంటాను

 

ఆ కనీకనిపించనట్టుండే వీధి,

ఇంకా అక్కడ మలుపులో ఆవులిస్తున్నట్టుండే

ఒక పాత దీప స్తంభం,

దాని కిందనే ఒక రాత్రంతా తన కోసం ఎదురుచూసీ చూసీ

తన ఊరిని వదిలి వచ్చేశాను!

 

చాలా వెలవెలబోతున్న కాంతి ఊతాన్ని ఆనుకుని,

ఆ దీపస్థంభం ఇంకా అక్కడే ఉంది!

అదొక పిచ్చితనమే, కానీ నేను ఆ స్థంభం దగ్గరికి వెళ్ళి,

ఆ వీధిలో వాళ్ళ చూపుల్నించి తప్పించుకుంటూ

అడిగాను, ఇవ్వాళ కూడా, ఏమంటే..

 

‘తను నే వెళ్ళిపోయాక కానీ రాలేదు కదా!?

చెప్పు, వచ్చిందా తను?’

 

 

మూలం:

 

Main rozgaar ke silsile mein,

kabhi kabhi uske shaher jata hoon to guzarta hu us gali se

 

Wo neem-tariq si gali,

Aur usi ke nukkad pe uundhtaa-saa

purana sa ik roshanii ka khambha,

usii ke niiche tamam shab intezaar karke,

main chod aaya tha shaher uska!

 

Bahut hi khastha-sii roshni ko teke,

wo khambha aaj bhi wahi khada hai!

fatuur hai yah, magar main khambhe ke paas jaa kar,

nazar bachaake mohalle walon kii,

puuch letaa hoon aaj bhi ye –

wo mere jaane k bad bhii, aayi to nahi thi?

wo aayi thi kyaa?

 

painting: Satya Sufi

పనామా అడవుల్లో…పద్నాలుగు రోజుల నరకంలో…

 

స్లీమన్ కథ-7

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సెక్రామెంటో అతనికి నచ్చింది కానీ, అక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోవడంలేదు. భవిష్యత్తు గురించిన సందిగ్ధంలో గడుపుతూనే, తనఖా మీద  తక్కువ కాలపరిమితికి చిన్న చిన్న మొత్తాలను అప్పుగా ఇవ్వడం ప్రారంభించాడు.  తూర్పు దేశాలను చుట్టొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.  కొన్ని బలహీనక్షణాలలో అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరి పసిఫిక్ మీదుగా చైనా, భారత్, ఈజిప్టులకు వెళ్ళి; అక్కడినుంచి ఇటలీ మీదుగా రైల్లో జర్మనీ వెళ్లిపోదామా అనిపించింది.  క్రమంగా అలాంటి ఊహల నుంచీ, కొత్త చోటు కలిగించిన ఉత్సుకతనుంచీ బయటపడ్డాడు. సెక్రామెంటోలోనే ఉండి భారీ అదృష్టాన్ని మూటగట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు..

ఏప్రిల్, మే మాసాలు రెండూ అందుకు సంబంధించిన ప్రాథమిక ఆలోచనలతోనూ, సన్నాహాలతోనూ గడిచిపోయాయి. జూన్ కల్లా బంగారం రజను కొనుగోలుదారుగా అవతారమెత్తి, సెక్రామెంటోలో జే అండ్ ఫ్రంట్ స్ట్రీట్స్ లో ముఖ్యకార్యాలయాన్ని తెరిచాడు.

అదే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి మెస్సర్స్ రోత్స్ చైల్డ్ ఏజంట్లతో, ఇతర వర్తకులతో సమావేశాలు జరిపాడు. ఓ రోజు పగలంతా ఇలాంటి సమావేశాలతో గడిపింతర్వాత హోటల్ గదికి వచ్చి విశ్రమించాడు. అంతలో ఉన్నట్టుండి నగరమంతా అగ్నిజ్వాలలు భగ్గుమన్నాయి. హోటల్ మంటల మధ్య చిక్కుకుంది. గంటల మోతకు మేలుకుని హడావుడిగా దుస్తులు వేసుకుని రోడ్డు మీదికి పరుగెత్తాడు.  ఓ వైపునుంచి గాలి వీస్తూ మంటల్ని ఎగదోస్తోంది. చుట్టూ ఉన్న ఇళ్ళు తన కళ్ల ముందే ఆహుతవడం చూశాడు. అక్కడినుంచి టెలిగ్రాఫ్ హిల్ కు పరుగెత్తాడు. “ ఆ అగ్నితుపాను హోరు, తుపాకీమందు పేలుళ్ళు, రాతిగోడలు బద్దలై కుప్పకూలుతున్న చప్పుళ్ళు, జనం ఆర్తనాదాలు, అంత పెద్ద నగరమూ తగలబడిపోతున్న ఆ దృశ్యమూ…ఓ మహావిలయాన్ని కళ్ళకు కట్టించా”యని మరునాడు డైరీలో రాసుకున్నాడు.

విదేశీ విద్రోహులెవరో ఆ చిచ్చు పెట్టారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో విదేశీయుల్ని, ముఖ్యంగా ఫ్రెంచివారిని శాన్ ఫ్రాన్సిస్కో జనం నరికి పోగులు పెట్టారని… అదేదో మామూలు విషయమన్నట్టు స్లీమన్ రాశాడు. ఓ పక్క మంటలు ఆరకుండానే, బూడిదకుప్పలు సెగలు కక్కుతుండగానే అమెరికన్లు ఏమీ జరగనట్టు నిర్లిప్తంగా నగర పునర్నిర్మాణంలో మునిగిపోవడం చూసి విస్తుపోయాడు. రాత్రంతా టెలిగ్రాఫ్ హిల్ మీదే గడిపి మరునాడు పొద్దుటే సెక్రామెంటోకు వెళ్లిపోయాడు.

అగ్నిప్రమాదానికి భయపడి, సెక్రామెంటోలో రాతితో, ఇనుముతో కట్టిన ఒకే ఒక భవంతికి తన కార్యాలయాన్ని మార్చుకున్నాడు. దొంగల భయంతో ఓ పెద్ద ఇనప్పెట్టెను కొనుక్కున్నాడు. ఉదయం ఆరునుంచి రాత్రి పదివరకూ దాని పక్కనే మఠం వేసుకుని కూర్చునేవాడు. ఇద్దరు గుమస్తాలను కుదుర్చుకున్నాడు; ఒకరు స్పానిష్, ఇంకొకరు అమెరికన్. ఆ రోజుల్లో బంగారు రజను వేటలో ప్రపంచం నలుమూలలనుంచీ జనం కాలిఫోర్నియాకు బారులుతీరేవారు. ఆవిధంగా ఒకే రోజున తనకు తెలిసిన ఎనిమిది భాషల్లోనూ మాట్లాడే అవకాశం స్లీమన్ కు లభిస్తూ ఉండేది. అప్పటికీ అతనికి రాని భాషలవాళ్ళూ ఎదురయ్యేవారు. శాండ్ విచ్ దీవుల్లోని స్థానికులు మాట్లాడే ‘కెనకా’ భాష వాటిల్లో ఒకటి. ఆ దీవి జనం సెక్రామెంటోకు ఎలా వచ్చారన్నది ఓ పెద్ద మిస్టరీ.

తనకు తీరిక దొరికిన అరుదైన క్షణాలలో అతను కాలిఫోర్నియా ఇండియన్లను పరిశీలిస్తూ ఉండేవాడు. “ఈ రాగి రంగు జనం చిన్నగా, పొట్టిగా, మురికి ఒడుతూ, సిఫిలిస్ తో తీసుకుంటూ మట్టికుప్పల మీద పాకే చీమల బారులా” అతనికి కనిపించారు.

శాక్ర మెంటో 1850

శాక్ర మెంటో 1850

అతను కలలుగన్న భాగ్యరాశి కొన్ని మాసాల్లోనే చేతికి అందింది. ఏకంగా 180 పౌండ్ల బరువైన బంగారం అతని ద్వారా చేతులు మారిన రోజులున్నాయి. రోజు రోజుకీ అతని సంపద ఎలా పెరిగిపోతూ వచ్చిందంటే, దాన్ని చూసి అతను భయపడ్డం ప్రారంభించాడు. గుమస్తాలూ, అతనూ ఎప్పుడూ కోల్ట్ రివాల్వర్ చేతిలో పట్టుకునే ఉండేవారు. తమ్ముడిలానే తను కూడా టైఫాయిడ్ వచ్చి చనిపోతానేమోనని అప్పుడప్పుడు అనిపించేది. అయితే ఆఫీసులో తన డెస్క్ దగ్గర గడిపే అన్ని గంటల సేపూ అతనిలో ఎలాంటి భయచిహ్నాలూ కనిపించేవి కావు.

అక్టోబర్ లో నిజంగానే పడకేసాడు. అదేపనిగా వాంతులు, సంధి ప్రేలాపనలు. ఒంటి మీద పసుపు మచ్చలు వచ్చాయి. డాక్టర్ క్వినైన్, కాలమెల్ ఇచ్చాడు. ఆరోజుల్లో యెల్లో ఫీవర్ కు ఇచ్చే మందులు అవే. అలాంటి సమయాల్లో గుమస్తాలే వ్యాపార వ్యవహారాలు చూస్తూ తనివితీరా కొల్లగొట్టేవారు. ఏ కొంచెమో కోలుకుని అతను తిరిగి డెస్క్ దగ్గరికి రాగానే సంపద గురించిన భయాలు మళ్ళీ పట్టుకునేవి. ఓ పెద్ద ఐశ్వర్యానికి వలేయడంలో ఉండే కష్టాలు, ఒంటరితనం ఎలాంటివో వర్ణిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు:

ఈ వారమంతా చచ్చే చావు అయింది. ఓ నల్లజాతి బానిస కూడా నేను పడ్డంత కష్టం పడడు. అయితే, బంగారం మూటల్ని, నగదును పక్కన పెట్టుకుని రాత్రిపూట ఒంటరిగా నిద్రించడంలో ఉండే ప్రమాదం ముందు శారీరకంగా పడే ఎంత కష్టమైనా దిగదుడుపే. నిండా తూటాలు నింపిన పిస్టల్స్ ను రెండు చేతుల్లో పట్టుకుని రాత్రంతా విపరీతమైన భయాందోళనలతో గడుపుతున్నాను. చీమ చిటుక్కుమన్నా వణికిపోతున్నాను. రోజూ ఒక్క పూటే, సాయంత్రం 6.30కు తినగలుగుతున్నాను. మిగతా కాలకృత్యాలను పూర్తిగా పక్కన పెట్టేయక తప్పడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కష్టం పగవాడికి కూడా వద్దు.

అస్వస్థత అతన్ని విడవకుండా వెంటాడుతోంది. కోలుకున్నాడనుకునే లోపల మళ్ళీ జ్వరం పట్టుకుంటోంది. అనారోగ్యం అతని సత్తువను పూర్తిగా తోడేసింది. స్వస్థత కోసం 1852 జనవరిలో శాంటక్లారా వ్యాలీకి వెళ్ళాడు. “నీ తమ్ముడి శరీరధర్మం, నీదీ ఒకటే. అతనిలానే నువ్వూ మరణించే ప్రమాదముం”దన్న డాక్టర్ హెచ్చరిక అతన్ని మరింత కుంగదీసింది.

అయినా అంతలోనే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. తన జవసత్త్వాలెలాంటివో అతనికి తెలుసు. ఓ పెద్ద అదృష్టాన్ని మూటగట్టుకునితీరాలన్న దృఢసంకల్పమే అతనిలో తిరిగి ఎక్కడలేని శక్తినీ నింపింది. ఫిబ్రవరి ప్రారంభానికల్లా వచ్చి సెక్రామెంటోలోని తన కార్యాలయంలో వాలిపోయాడు. ఉదయం 5 గం.లకల్లా లేవడం, డెస్క్ దగ్గర కూర్చోవడం, బంగారం రజను తూచడం, బ్యాంకు డ్రాఫ్టులు రాయడం, ఎనిమిది భాషల్లో మాట్లాడడం…అన్నీ షరా మామూలే.

వ్యాపారలావాదేవీలప్పుడు అతను మహా బిర్రుగా ఉండేవాడు. మొహంలో చిన్న నవ్వు మొలక కూడా ఉండేది కాదు. అంతా పద్ధతిగానూ, తూచినట్టూ వ్యవహరించేవాడు. విచిత్రమైన కీచుగొంతుతో మాట్లాడేవాడు. సంపదకు సంబంధించిన అన్ని రహస్యాలనూ ఛేదించడానికి కంకణం కట్టుకున్న ఓ శాస్త్రవేత్తలానూ, ఏవో గొప్ప ప్రయోజనం కోసం దానిని పోగేయడానికి పూనుకున్నవాడిలానూ కనిపించేవాడు. అయితే ఎలాంటి  ప్రయోజనం కోసం అన్నది అతనికే తెలియదు.

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

తనను ఓ అమెరికన్ గానే పిలుచుకునేవాడు. “మన బంగారం భూములు”, “మన శ్మశానవాటిక” అని అంటుండేవాడు.  అమెరికాలోనే స్థిరపడి భావిజీవితాన్ని ఇక్కడే గడిపేయాలని ఒక్కోసారి అనిపించేది. అంతలోనే, జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడుపుతున్నట్టు కలలు కనేవాడు.  రష్యా అయితే ఇప్పుడతని ఆలోచనల్లోంచి పూర్తిగా తప్పుకుంది. బంగారం మూటల పక్కన కూర్చుని తనకే తెలియని ఒక నిస్పృహలో, తనతో తనే విరోధిస్తూ గడుపుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం అతనిలో ఎలాంటి సందిగ్ధతా లేదు: తను ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోనైనా చేజిక్కించుకోవాలి, లేదా ఇక్కడే చావనైనా చావాలి!

మార్చి చివరినాటికి దాదాపు రెండోదే నిజమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఒంటి మీద పసుపుమచ్చలు వచ్చాయి. “నేనింక ఏమాత్రం వ్యాపార వ్యవహారాలు చూసుకోలేనని మీకు అనిపించినా వెంటనే నన్నో దుప్పట్లో చుట్టబెట్టి స్టీమర్ మీద శాన్ ఫ్రాన్సిస్కో పంపించేయం”డని గుమస్తాలకు చెప్పాడు.

అయితే, ఏదో అద్భుతం జరిగినట్టుగా కోలుకున్నాడు. అంతకుముందే అతను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రకారం, కోలుకున్న వెంటనే నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని రోత్స్ చైల్డ్ బ్యాంకుకు వెళ్ళాడు. తన ఆస్తుల బదిలీకీ, వ్యాపారం కట్టిపెట్టడానికీ ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్వాలేదు, తను డబ్బు సంచుల్ని బాగానే పోగేసాననుకుని సంతృప్తి చెందాడు. కొంతమంది కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఇంతకంటే భారీగానే సొమ్ము చేసుకుని ఉండచ్చు. కానీ తనంత వేగంగానూ, అతి తక్కువ రిస్కుతోనూ ఎవరూ సంపాదించి ఉండరు. కేవలం తొమ్మిది నెలల్లో తను సంపాదించిన మొత్తం 4 లక్షల డాలర్లు! ఇది ఎవరి కళ్ళకైనా మిరుమిట్లు గొలిపే మొత్తమే కానీ తనకు కాదు, తన శక్తియుక్తులకు ఇది ఏమాత్రం తులతూగదనుకున్నాడు.

అమెరికన్లను అతను ఇప్పటికీ మెచ్చుకుంటున్నాడు. కాకపోతే, వాళ్ళు మరీ మొరటువాళ్ళనీ, మంచీ మర్యాదా లేనివాళ్ళనీ ఇప్పుడతనికి అనిపిస్తోంది. ఇక్కడి ఆడవాళ్ళు బొత్తిగా ఆకర్షణ లేనివాళ్లని ముందే అనుకున్నాడు. విచిత్రంగా ఇప్పుడతనికి రష్యావైపు మళ్ళీ గాలి మళ్ళుతోంది. తన భావిజీవితాన్ని ఇంకెక్కడా కాదు, రష్యన్ల మధ్యే గడిపేస్తానన్న నిర్ణయానికి కూడా మరోసారి వచ్చేశాడు. ఎంతైనా రష్యన్లు మర్యాదస్తులనీ, వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడివాళ్లలా కాకుండా తనకు నచ్చే విధంగా బాధ్యతగా, ఒబ్బిడిగా ఉంటారనీ అనుకున్నాడు. ఇప్పుడు తను ఓ పెద్ద ఐశ్వర్యాన్ని వెంటబెట్టుకుని వెడుతున్నాడు కనుక మాస్కోలోనో, సెయింట్ పీటర్స్ బర్గ్ లోనో మరింత హుందాగా, వైభవంగా జీవించవచ్చు కూడా.

అందుకు తగ్గట్టే ఈసారి రష్యాకు మంచి పటాటోపంగా వెళ్లాలనుకున్నాడు. 600 డాలర్లు చెల్లించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పనామా వెళ్ళే స్టీమర్లో అన్ని హంగులూ ఉండే ఓ ప్రైవేట్ క్యాబిన్ ను బుక్ చేసుకున్నాడు. పనామా జలసంధిని దాటి, న్యూయార్క్ వెళ్ళే ఓడ అందుకుని, అక్కడినుంచి తీరుబడిగా రష్యా వెళ్లాలని అతని ఆలోచన.

అయితే, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన వారం రోజుల తర్వాత, టొవాంటెపెక్ గల్ఫ్ దగ్గర ఓడ తుపానులో చిక్కుకుంది. దాదాపు మునిగిపోయేంత పనైంది. ఆ గండం గడిచి పనామా నగరంలో అడుగుపెడితే మరో గండం ఎదురైంది. దొంగలు అతని సామాను కాజేయబోయారు. ఒకచేతిలో కోల్ట్ రివాల్వర్, మరో చేతిలో పొడవాటి బాకు పట్టుకుని స్లీమన్ రెప్పవాల్చకుండా కాపలా కాయాల్సివచ్చింది. అప్పటికి పనామా రైలురోడ్డు నిర్మాణం కొన్ని మైళ్ళ మేరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత కంచరగాడిదల మీద ప్రయాణం చేయాల్సిందే.

అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోనైనా దాడి చేస్తారన్న భయం…

చివరికి మ్యాపు సాయం కూడా లేని స్థితిలో ఆ అడవిదారి వెంట జీవచ్చవాల్లాంటి తమ దేహాలను తోసుకుంటూ వెళ్లారు. వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. దుర్భరమైన ఆ చలివాన వాళ్ళ మూలుగుల్ని కడంటా పీల్చిపారేసింది.  గమ్యస్థానమైన కోలన్ కు చేరతామన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఒకళ్లతో ఒకళ్ళు రేచుకుక్కల్లా కాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. కొంతమంది జిగట విరేచనాలతో, మరికొందరు యెల్లో ఫీవర్ తో మధ్యలోనే కన్నుమూశారు. వాళ్ళ మృతదేహాలను అడవి జంతువుల భక్షణకు వదిలేసి మిగతావాళ్లు ముందుకు వెళ్లారు. సముద్రంలో మునిగిపోయినవాళ్ళు దాని అట్టడుగుకి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో తిరిగినట్టుగా పద్నాలుగు రోజులపాటు సాగిన ప్రయాణభీభత్సం అది!

స్లీమన్ పరిస్థితి మరీ ఘోరం. అతను కనీసం కునుకు తీయడానికి కూడా లేదు. బాకూ, రివాల్వరూ పుచ్చుకుని తన సామానుకు కాపలా కాయక తప్పదు. అందులో బంగారం కడ్డీలు, రోత్స్ చైల్డ్ బ్యాంకు మీద తీసుకున్న డ్రాఫ్టులు, యూరప్ అంతటా ఉన్న వర్తకప్రముఖులకు ఉద్దేశించిన పరిచయలేఖలు ఉన్నాయి.

అతను తన భావోద్వేగాలను ఉన్నవున్నట్టు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. వాటిలో ఇదొకటి. ఒళ్ళు జలదరింపజేసే ఈ అనుభవం గురించి ఒక చిన్న పేరాలో ఇలా రాసుకొచ్చాడు:

మృత్యువు మాకెంత మాలిమి అయిపోయిందంటే, దాన్ని చూసి అసలు భయపడ్డమే మానేశాం. పైగా దాన్ని ఇష్టపడడం ప్రారంభించాం. మా కళ్ళముందే కొంతమంది కళ్ళు తేలేస్తూ మృత్యుముఖంలోకి వెళ్లిపోతుంటే మాలో మేము నవ్వుకుంటూ వినోదించాం. ఒకరిపై ఒకరం ఘాతుకాలకు పాల్పడ్డాం. అవెంత దారుణమైనవంటే, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే భయంతో నిలువునా గడ్డకట్టిపోతాను.

అవి ఎలాంటి ఘాతుకాలు, వాటిలో తను స్వయంగా పాల్గొన్నాడా అన్నది అతను ఏనాడూ వెల్లడించలేదు. మానభంగం, హత్య, నరమాంసభక్షణ…ఇలా ఊహించవలసిందే కానీ అవేమిటో తెలియదు. తదుపరి సంవత్సరాలలో తన జీవితం గురించి ఎప్పుడు రాసినా అమెరికాలో తను గడిపిన కాలాన్ని త్వర త్వరగా దాటేసేవాడు. పనామా జలసంధిపై తను చేసిన ప్రయాణం గురించైతే మళ్ళీ ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు. ఆ పద్నాలుగు రోజుల భయానక అనుభవాన్ని మరచిపోవడానికే ప్రయత్నించాడు.

కాకపోతే ఆ తర్వాత అతను మరింత నిర్దాక్షిణ్యంగానూ, ఇతరుల పట్లే కాక తన పట్ల తనే మరింత కరకుగానూ     మారినట్టు కనిపిస్తుంది. నీది బొత్తిగా తడిలేని రాతిగుండె అనీ, ఎంతసేపూ స్వార్థమే తప్ప ప్రపంచం ఏమైపోతున్నా నీకు పట్టదనీ ముందునుంచీ తోబుట్టువులు నిష్టురమాడేవారు. ఇప్పుడు మరింత బండరాయిగానూ, కర్కశంగానూ మారాడు. డబ్బు పిచ్చి కూడా వెనకటి కంటే ముదిరిపోయింది.  రాను రాను అతను తన ఊహల లోతుల్లో నిద్రిస్తున్న గ్రీకు వీరుల్లా మారుతూ వచ్చాడు.  మెలికలు తిరుగుతూ మృత్యుముఖంలోకి వెడుతున్న వాళ్ళను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటూ వినోదిస్తూ గడిపినవాళ్లే. అతనిలానే సంపద వేటలో ఆటవికత అంచులు దాటినవాళ్ళే.

మొత్తానికి అతను యూరప్ కు తిరుగుముఖం పట్టాడు. కాలి గాయానికి కట్టు కట్టించుకునేంత సేపే            న్యూయార్క్ లో  ఆగాడు. లండన్ లో దిగి  గాయానికి కాల్పుల చికిత్స చేయించుకున్నాడు. మెక్లంబర్గ్ లో కొన్ని వారాలు ఆగి పాత పరిచయాలను పునరుద్ధరించుకున్నాడు. తన ధనబలాన్ని ఆడంబరంగా ప్రదర్శించుకున్నాడు. తండ్రికి, చిన్నాన్నకు, తోబుట్టువులకు ఖరీదైన కానుకలు ఇచ్చాడు. తీరా మెక్లంబర్గ్ వచ్చాక, వ్యవసాయదారుడిగా స్థిరపడాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పేశాడు. రష్యాకు వెళ్లిపోవాలనీ, అక్కడో పెద్ద భవంతిని, లేదా కనీసం ఓ పెద్ద అపార్ట్ మెంట్ ను కొనుక్కోవాలనీ; మంచి కుటుంబం నుంచి వచ్చిన ఓ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనీ, బహుశా కొంత కాలానికి తను రష్యన్ ప్రభువర్గంలో చేరే స్థాయికి ఎదుగుతాననీ అనుకుంటున్నాడు.

తన వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. భావిజీవితం బంగారు బాటపై సాగిపోగలిగినంత సంపదను ఇప్పటికే గడించుకున్నాడు. తనిప్పుడు ఎవరికీ, దేనికీ తలవంచాల్సిన అవసరం లేదు. స్లై మీద సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెడుతూ, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడనుకున్నాడు. తను ఫస్టెన్ బర్గ్, ఏమ్ స్టడామ్ లలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజుల్లో; పుస్తకాలు, మద్యం, మగువ, పనివాళ్లు, ఇళ్లతో సహా పగటికలలు అనుకున్నవన్నీ ఇప్పుడు  చిటికెనవేలు ఆడిస్తే చాలు, రెట్టింపు లెక్కలో తన ముందు వాలిపోతాయనుకున్నాడు.

కానీ, గడిచిన పదిహేడేళ్ళ జీవితంలో డబ్బు తనకేనాడూ సుఖాన్నీ, సంతోషాన్నీ ఇవ్వలేదన్న సంగతిని అతను గమనించుకోలేకపోయాడు.

త్వరలోనే అతని జీవితకథలో కొత్తపుటలు చేరబోతున్నాయి.  ఎట్టకేలకు అతను ఒక ఇంటివాడు కాబోతున్నాడు….!

  (సశేషం)

 

ఒకరకంగా మనవే రాజుగారి వస్త్రాలు …

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

దుస్తులు మార్చుకోవడం.

నిజానికి మన ప్రపంచం ఒకటి.
మరో ప్రపంచం ఒకటి.

రెండు ప్రపంచాలుంటాయి.

సాధారణంగా మన ప్రపంచంలోని అనుభవం నుంచి వేరే ప్రపంచం అనుభవాలను బేరీజు వేసుకుంటూ ఉంటాం.
కానీ, మరో ప్రపంచం తీరుతెన్నులు మనకు అందవు.

జాలిచూపులు, సానుభూతి వచనాలు, విచార పడటాలు మామూలే.
కానీ, అవతలి వాళ్లకు మన భావాలు తెలియవు, చాలాసార్లు.

వాళ్ల ఉనికి మనం ఫీలవుతాం.
మరి మన ఉనికిని వాళ్లు ఫీలవుతారా?

ఆశ్చర్యంగా వుంటుంది.
మన జీవన ప్రవాహాన్ని ఒరుసుకుంటూ వాళ్లుంటారనుకుంటాం.
కానీ, వాళ్లు మనల్ని పట్టించుకునేది చాలా తక్కువ అంటే ఆశ్చర్యంగా వుంటుందిగానీ నిజం.

ఒక రకంగా ‘వాళ్లను మనం పట్టించుకోనట్టే’ అంటే విచారపడొద్దు సుమా.
నిజం.

దుస్తులు మార్చుకోవడమే చూడండి.
ఈ చిత్రంలోనూ అదే ఉన్నది.

ఇటు మనం…అటు మనం..
మధ్యలో వాళ్లు.

ఆమె చీర కట్టుకుంటున్నప్పుడు మాత్రం ఒకే చిత్రంలో భిన్న ప్రపంచాలను కంపోజ్ చేయగలిగాను.
చూస్తూ ఉంటే గానీ తెలియదు, ఎవరి ప్రపంచం వారిదని!

మీకు బాగా తెలిసిన ప్రపంచంలోకి వస్తే, అది రహస్యం. ప్రైవసీతో కూడింది.
అవును మరి. ఉదాహరణకు మన ఇంట్లో వాళ్లు బట్టలు మార్చుకోవడం పూర్తిగా వేరు.
అమ్మ. అక్క. భార్య.
ముఖ్యంగా స్త్రీలకు సంబంధించే చూద్దాం…

మన వాళ్లు చాటుగానే దుస్తులు మార్చుకుంటారు.
బాత్రూం నుంచి బయటకు వచ్చి గదిలోకి వెళ్లేప్పుడు ఓ క్షణం మన కంట పడతారు. చూస్తాం.
చూడం కూడా.
చూస్తే, బహుశా అది మన అర్ధాంగి అయితే చూస్తాం.

వారు చీర కట్టుకునేటప్పుడు చూస్తాం.
ఎంతో ఒడుపుగా ఆ చీర ఒక కట్టుగా మారేంత వరకూ చూస్తాం.
వారు చింగులు సర్దుకుంటే సహకరిస్తాం కూడా.
జాకెట్టు హుక్స్ పెట్టమంటే పెడతాం.

జడ వేసుకున్నాక జడపిన్ను మధ్యలో ఉన్నదీ లేనిదీ అడిగితే చెబుతాం.
ఇట్లా కొన్ని అలవాట్లుంటాయి. కొంత సన్నిహిత దృశ్య ప్రపంచం వుంటుంది.

కానీ, మరో ప్రపంచం వుంటుంది.
అది మనకు దృశ్యాదృశ్యమే.

+++

ఒకవేళ కాదు నిజమే.

వాళ్లు బతికేది వీధిలో అనుకోండి. వాళ్ల స్నానాదులు మనకు తెలియవు.
వాళ్లు జుట్టు ఆరబెట్టుకోవడమూ తెలియదు.
లంగా జాకెట్టు ఎలా వదులుతారో, మరో జత ఎలా వేసుకుంటారో తెలియదు.
పంటి బిగువన చీరను పట్టుకుని జాకెట్టు వేసుకుంటారా? ఏమో!
తర్వాత చీరను ఎలా చుట్టుకుంటారో అసలు వారి కట్టెలాంటిదో?
ఎన్ని గజాల చీరను ఎంత సేపట్లో ధరిస్తారో ఏమో!
మీరేమైనా చూశారా?

ఎంత చప్పున ఆ పని కానిస్తారో లేదా ఎంత నిదానంగా వారలా పబ్లిక్ గా దుస్తులు మార్చుకుంటారో తెలుసా? వీధుల్లో బిక్షగాళ్లు లేదా వీధుల్లో ఒక కళను ప్రదర్శించి పొట్ట పోసుకునే వారు లేదా సంచార తోగలు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఒక ఆచ్ఛాదన వుంచుకుని ఆ దుస్తులను మార్చుకుంటారా? లేక ఎటువంటి తెరలు లేకుండా త్వరత్వరగా బట్టలు మార్చుకుంటారా?

గమనిస్తే గానీ తెలియని దృశ్య ప్రపంచంలో మనదొక ప్రపంచం వారిదొక ప్రపంచం.

మనం సిగ్గిల్లినట్టే వారూ సిగ్గుపడతారా? మనలాగే వాళ్లు సున్నితంగా ఉంటారా?
లేక మనమే మోటుగా ఉంటున్నామా?
తెలియనే తెలియని మనది కాని మరో ప్రపంచం.

+++

అసలు కట్టు బొట్టు అన్నది ఎవరికైనా ఒక సంస్కృతి.
కానీ, ఇది మన ప్రపంచం భావనా లేక వారిది కూడానా?

అసలు ఫుట్ పాత్ పై జీవించే వారికి కట్టు – బొట్టు, వేషం – భాషా, తిండీ- తిప్పలూ, ముచ్చట్లూ- అచ్చట్లూ – అన్నీనూ ఒక దృశ్యాదృశ్యం. వారిని చూడటమే మనకు తెలుసు గానీ అసలు చూపు అంతానూ ‘ఔట్ సైడర్’ గానే అని నమ్ముతారా? అందుకే అనడం మరో ప్రపంచం అని! మనది వేరూ … వారిది వేరూ అని!

అసలుకి అంతానూ కూడా వాళ్ల ప్రపంచంలోకి మనం వెళ్లడం అసమంజసం.
అర్థం కాదు కూడానూ.
అసలు మన ప్రపంచంలోకి వాళ్లు రావడం ఈ చిత్రం.
అందుకే ఒక చూపు సారించినట్టు విచిత్రంగా వుంటుందీ చిత్రం.

+++

బజారులో వెళుతూ మనం వాళ్లను ఎలాగైత చిల్లరగాళ్లు గానో, బిక్షగాళ్లనో లేదా దొమ్మరివాళ్లనో అనుకుంటూ తప్పుకుని పోతామో…అలాగే వాళ్లు ఏ కార్యకలాపాల్లో ఉన్నాకూడానూ మనకు సెన్సిటివ్ గా అనిపించదు. అనిపించినా ‘పాపం’ అని భావిస్తాం. ‘అయ్యో పాపం’ అనే అంటాం. కొన్నిసార్లు తలదాచుకోవడానికి నీడలేని ఇలాంటి వాళ్లను చూసి సానుభూతితో మన హృదయాలు కరిగిపోతాయి. ద్రవిస్తాయి. ‘సమాజం ఎప్పుడు మారుతుందో’ అని లోలోపల అనుకుంటూ వాళ్లనుంచి తప్పుకుంటాం.

కానీ, చిత్రం ఏమిటంటే లేదా దృశ్యం ఏమిటంటే వాళ్లు నిజంగా అద్భుతమైన మనుషులు. మనల్ని చూసి, ‘వీరెప్పుడు మారుతారో’ అని ఎన్నడూ అనుకోరు. గోడలు లేని ప్రపంచంలో జీవించే ఆ మనుషులు తమ స్వేచ్ఛ గురించి మనకు లెక్చర్లు దంచరు. లేదా మన భద్ర జీవితం పట్ల కించత్తు కూడా అసూయ పడరు. అసహ్యమూ వుండదు. మాటల్తో ఎద్దేవా చేయరు. ఎన్నడు కూడానూ మనల్ని వాళ్ల జాలి చూపులతో వేధించరు కూడా. నిందాపూర్వకంగా అస్సలు మాట్లాడరు. నిశితమైన వాడి వేడి విమర్శలూ అస్సలు చేయరు. సిద్ధాంత రాద్ధాంతాలతో కూడానూ సతాయించరు. జస్ట్ వాళ్లలా జీవిస్తారు. మన ‘చిన్న ప్రపంచం’ పట్ల వారికి చిన్నచూపేమీ వుండకుండా బతుకుతారు.

చిన్నచూపు లేకపోగా,  వారు మన ఉనికితో నిమిత్తం లేకుండా ఉన్నచోటే ఉంటారు. అక్కడే రిలాక్స్ అవుతారు. పిల్లా జెల్లా అంతా కూడా ఒకే గదిలో జీవించినట్లు మరో ప్రపంచంలో వాళ్లలా అన్ని కార్యకలాపాలతో ఒక ఓపెన్ హౌజ్ లో జీవిస్తూ ఉంటారు. విశ్వం వాళ్ల ఇల్లు అన్నట్టు మన ప్రపంచం అందులో ఒక చిన్న అరలా వాళ్లలా సంకోచించకుండా జీవితం గడుపుతారు. పేండ్లు చూసుకుంటారు. దుస్తులూ మార్చుకుంటారు. పని ఉంటే ఆ పనిలోకి మారిపోతారు.

చిత్రమేమిటంటే, వాళ్ల ఏకాంత లోకాలను, ప్రేమమయ సాన్నిహిత్య క్షణాలను అవలోకించాలంటే, అనుభవించాలంటే మనం సరిపోం. నిజం. మరో ప్రపంచం ఒకటి మన మధ్య ఉన్నంత మాత్రాన దాన్ని మనం అస్సలు దర్శించలేం.

జీవితాలంతే. అన్నీ అర్థం కావు. అనుభూతి చెందలేం.

 

అందుకే మనం రోడ్డుమీది మనుషులం. ఇంటికి చేర్చే రోడ్డు ఉన్న మనుషులం.

‘రోడ్డున పడ్డ జీవితాలు’ అని మనం అనుకునేవి ‘నిలబడ్డ జీవితాలు’.
కష్టసుఖాలతో రాటుదేలి నిమిత్తంగా నిర్లజ్జగా, నిర్భయంగా మన మధ్యే తెరుచుకునే దుస్తులవి.ఒకరకంగా మనవే రాజుగారి వస్త్రాలు. కనబడవు. వాళ్లకెన్నడూ కానరావు.
బహుశా వాళ్లెప్పుడూ చూడరనుకుంటాను. అక్కర్లేదు కూడానూ.

~
( చిత్రం తీసింది, ముషీరాబాద్ చౌరస్తా, హైదరాబాద్ లో)

 మరణానికి చిరునామా ఈ ‘డెత్ నోట్’    

 

భవాని ఫణి 

 

bhavaniphaniఅనుకోకుండా మీకో పుస్తకం దొరికిందనుకోండి . అందులో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారని కూడా తెలిసిందనుకోండి . అప్పుడు  మీరేం చేస్తారు?  ఏం చెయ్యాలన్న ఆలోచన మాట అటుంచి అసలు అటువంటి పుస్తకం ఒకటుంటుందన్నఊహ కూడా మనకి రావడం కష్టం కదూ! అటువంటి ఒక విచిత్రమైన ఆలోచనకి దృశ్య రూపమే ‘డెత్ నోట్’

ఒటాకూ (Otaku ) అన్న పదం ఎప్పుడైనా విన్నారా ? పోనీ ‘మాంగా’ అన్న పదం? యానిమే అన్న పదం మాత్రం ఖచ్చితంగా విని ఉంటారు . ఇంట్లో ఓ మాదిరి వయసున్న  పిల్లలుంటే ఈ పదాలు వినడం సర్వ సాధారణం  . మరీ చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా డోరేమన్, నోబితాల కబుర్లు  వినిపిస్తూనే ఉంటాయి కూడా .

జపాన్ లో ప్రచురితమయ్యే కామిక్స్ ని ‘మాంగా’ అని పిలుస్తారనీ,  అలాగే అక్కడ నిర్మించబడే యానిమేటెడ్ చిత్రాలని ‘యానిమే’ అంటారనీ  చాలా మందికి తెలిసే ఉంటుంది . ఎక్కువగా ఆదరణ పొందిన మాంగాలు, యానిమేలుగా  కూడా నిర్మితమవుతాయి . ఈ యానిమేలలో చాలా ప్రక్రియలు (జెనెరె )ఉన్నాయి. అన్ని వయసుల  వారికోసం మాంగాలు వ్రాయబడతాయి . యానిమేలు నిర్మింపబడతాయి  .

వాటిలో ముఖ్యంగా యుక్త వయసులో అడుగు పెట్టిన , పెట్టబోతున్న  పిల్లల కోసం వ్రాసినవీ, తీసినవీ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దబడతాయి . అటువంటి ఒక యానిమే గురించే ఇప్పుడు  చెప్పబోతున్నది . దాని పేరు “డెత్ నోట్ “. ఇది ముందు ‘మాంగా’ గా  ప్రచురింపబడింది .   Tsugumi Ohba అనే ఆయన ఈ మాంగా రాసారు . తర్వాత ఇది యానిమేగా కూడా రూపొందించబడి , మంచి ప్రాచుర్యం పొందింది . దీనిలో కొన్ని హింసాత్మకమైన అంశాలున్నాయన్న విషయాన్ని కొంచెం పక్కన పెడితే , ఇంత శక్తివంతమైన, మేధతో కూడిన మైండ్ గేమ్స్ నీ, ఎత్తుల్నీ, పైఎత్తుల్నీ మరెక్కడా చూడలేమంటే అతిశయోక్తి  కాదు . 37 ఎపిసోడ్ లున్న ఈ యానిమే సిరీస్, జపాన్ లోని నిప్పాన్ టీవీలో 2006 లో ప్రసారమైంది .

విజ్ఞానాన్నీ ,తెలివితేటల్నీ మంచికోసం వాడితే ఎంత ఉపయోగకరమో , చెడుకి ఉపయోగిస్తే అంత ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే  . డెత్ నోట్ ఇతివృత్తం అదే .

death note book

లైట్ యాగామీ అనే పదేహేడేళ్ల అబ్బాయి చాలా తెలివైనవాడు. వయసుకి మించిన పరిపక్వత కారణంగా అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది . అదే సమయంలో షినిగామీ (మరణ దేవత) ల లోకం నుండి జారి పడిన ఒక పుస్తకం లైట్ కి దొరుకుంతుంది. ఆ పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారు . ఒకే పేరు ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉండటం వల్ల, ఆ వ్యక్తి ముఖాన్ని  చూసిన తర్వాత అది గుర్తు తెచ్చుకుని పేరు రాస్తేనే అతని మరణం సంభవిస్తుంది . షినిగామీలు ప్రపంచంలోని అందరి మరణాన్నీ నిర్దేశించలేరు . కానీ డెత్ నోట్ ని ఉపయోగించి కొందరి మరణాన్ని ముందుకు జరపడం ద్వారా తమ ఆయుష్షుని పొడిగించుకోగలరు . అటువంటి ఒక పుస్తకాన్ని సరదా కోసం ఒక షినిగామీ భూలోకంలో పడేస్తాడు . అదే లైట్ యాగామీకి దొరుకుతుంది . నిరాసక్తమైన జీవితాన్ని గడుపుతున్న లైట్ , ఆ పుస్తకం నిజంగా శక్తి కలదని తెలుసుకుని ఉత్తేజాన్ని పొందుతాడు . ఆ పుస్తకాన్ని ఉపయోగించి దేశంలో నేరస్తులందరినీ  చంపి , తద్వారా నేర వ్యవస్థని సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు .

టీవీలో కనిపించే నేరగాళ్ల  పేర్లతో ఒక జాబితా సిద్ధం చేసుకుని వాళ్లందరినీ చంపేస్తూ ఉంటాడు . అతని తండ్రి పోలీస్ అధికారి కావడం వల్ల అతనికి  నేరగాళ్లకి చెందిన మరింత సమాచారం లభిస్తూ ఉంటుంది . ఇలా ఎక్కువ రోజులు గడవకుండానే  ఏదో జరుగుతోందని ఇంటర్ పోల్ కి అనుమానం  కలగడంతో,   “ఎల్(L)” అనే ఒక అత్యంత ప్రతిభావంతుడైన  డిటెక్టివ్ ని రంగంలోకి దింపుతుంది . లైట్ మాత్రం , అభిమానులతో ‘కీరా’ అనే మారు పేరుతో పిలవబడుతూ  విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందుతాడు .

లైట్ యాగామీనే ‘కీరా’ అన్న అనుమానం డిటెక్టివ్ ‘ఎల్’ కి మొదట్లోనే కలుగుతుంది . అతన్ని పక్కదోవ పట్టించడం  కోసం  ఇన్వెస్టిగేషన్ లో సహాయపడుతున్నట్టుగా నటిస్తాడు లైట్.

“ఎల్ ” పూర్తి  పేరు తెలియకపోవడం వల్ల అతడ్నిమాత్రం  ఏమీ చెయ్యలేకపోతాడు .ఆ సమయంలో లైట్ , ఎల్ లు ఉపయోగించే తెలివైన యుక్తులు , కుయుక్తులూ, పరస్పరం చేసుకునే మానసికమైన దాడులూ , ప్రతి దాడులూ చాలా మేధోవంతంగా  రచించబడి,రెప్ప వెయ్యనివ్వనంత ఉత్కంఠని రేకెత్తిస్తాయి.

డెత్ నోట్ అసలు యజమాని అయిన, ర్యూక్ అనే పేరుగల షినిగామీ  కూడా లైట్ దగ్గరకి వచ్చి అతని దగ్గరే ఉంటూ ఉంటాడు .  ఆ షినిగామీ,  లైట్ కి తప్ప వేరే వాళ్లకి కనిపించడు . ఇంతలో కీరా వీరాభిమాని అయిన ప్రఖ్యాత మోడల్ మీసా అనే అమ్మాయికి మరో డెత్ నోట్ దొరుకుంతుంది .

లైట్ నే కీరా అని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వస్తుంది . ఆ అమ్మాయికి తన మీదున్న అభిమానాన్ని అవకాశంగా తీసుకుని , ఆమెని కూడా కీలుబోమ్మని చేసి ఆడిస్తూ , తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు లైట్ . డెత్ నోట్ లో ఉన్న వివిధ రకాల నియమాలని తనకి అనుకూలంగా మార్చుకుని  తప్పించుకు తిరుగుతూ,  నేరగాళ్ల హత్యలు కొనసాగిస్తూనే ఉంటాడు . ఆఖరికి ప్రపంచాన్ని ఉద్దరించాలన్న అతని కోరిక, స్వీయ ఆరాధనగా మారి, అమాయకులని  సైతం చంపడంతో పాటుగా స్వంత తండ్రినీ , చెల్లెలినీ కూడా అంతం చెయ్యడానికి  వెనుకాడనంత క్రూరత్వంగా రూపాంతరం చెందుతుంది . ఎన్నో మలుపుల తర్వాత , చివరగా లైట్  మరణంతో కథ ముగుస్తుంది .

ఎటువంటి డిటెక్టివ్ కథ అయినా దీని ముందు దిగదుడుపే అనిపించేంత బిగువుగా అల్లబడిన కథే ఈ డెత్ నోట్ పాపులారిటీకి కారణం . ఇద్దరు మేధావుల మధ్య జరిగే ఈ దోబూచులాట ఊహించలేనన్ని మలుపులతో నిండి  ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది . అన్ని పాత్రల స్వభావం , చిత్రీకరణ వాటి వాటి పరిధులలో ఎటువంటి లోటు పాట్లూ లేకుండా ,అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి . అంతే కాక  డెత్ నోట్ నియమాలు విచిత్రంగా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి . సంగీతం కూడా ఈ యానిమేకి గొప్ప బలం .

death note ryuk yagami light l 1280x800 wallpaper_www.wallpaperhi.com_55

మచ్చుకి కొన్ని డెత్ నోట్ నియమాలు 

  1. ఈ పుస్తకం లో పేరు రాయబడిన వ్యక్తి చనిపోతాడు
  2. చంపాలనుకునే వ్యక్తి ముఖాన్ని మనసులో ఊహించుకుని పేరు రాస్తేగానీ మరణంaug27 సంభవించదు .
  3. పేరు రాసిన నలభై సెకండ్ల లోపు , మరణానికి కారణం కూడా రాయాలి .
  4. మరణానికి కారణంకనుక పేర్కొనకపోతే, అదిహార్ట్ అటాక్ గా  తీసుకోబడుతుంది .
  5. డెత్ నోట్ కలిగి ఉన్నమనిషి, ఆ డెత్ నోట్ అసలు యజమాని అయిన షినిగామీకి చెందుతాడు .
  6. డెత్ నోట్ కలిగి ఉన్న మనిషి లేదా తాకినమాత్రమే ఆషినిగామీని చూడగలుగుతాడు . వినగలుగుతాడు
  7. డెత్ నోట్ ని వేరే మనిషికి పూర్తిగా ఇచ్చివేయడం గానీ , కొన్ని రోజుల పాటు ఇవ్వడం గానీ చెయ్యవచ్చు .
  8. ఒక వ్యక్తి డెత్ నోట్ నివేరే వాళ్లకి ఇచ్చి వేస్తే , దానికి సంబంధించిన విషయాలన్నీ మరచిపోతాడు .

………………………..

ఇటువంటి నియమాలు వంద పైనే ఉంటాయి . అవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ చూడచ్చు .

http://deathnote-club.deviantart.com/art/All-Deathnote-Rules-116939019

 

 

ఇంతకీ “ఒటాకూ” అంటే చెప్పనేలేదు కదూ ,  ఏదైనా ఒక వ్యాపకానికి దాసోహం అయిన వ్యక్తిని జపనీస్ లో “ఒటాకూ” అని పిలుస్తారు . ముఖ్యంగా యానిమేలు చూడటానికి  అలవాటు పడిన వారికోసం ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు . ఒకసారి ఒటాకూగా మారి , వాటికి ఎడిక్ట్ అయితే  పిల్లలైనా పెద్దలైనా బయట పడటం కొంచెం కష్టమే .

అయినా సరే చూడాలనుకునేవారి కోసం డెత్ నోట్ మొదటి ఎపిసోడ్ లింక్ ఇదిగో

http://kissanime.com/Anime/Death-Note/Episode-001-Rebirth?id=93417

 

వెంగలిమణులు నీ వేలిగోర బోలునా?

 

అవినేని  భాస్కర్ 

Avineni Bhaskarప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ ప్రేమను పొందడానికో, లేదు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికో పుట్టుంటుంది!

స్త్రీలు అలంకార ప్రియులు. ఎంత అందంగా ఉన్నా ఆభరణాలతో అలంకరించుకుంటారు. తమ అందాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు గమనించాలనీ, పొగడాలనీ అనుకుంటారు.

మామూలుగా మనం “అమ్మాయి అందంగా ఉంది” అని చెప్పడానికి “అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది” అనంటాం. మన భారతీయ సంస్కృతిలో మహాలక్ష్మి ముఖ్యమైన దేవతే కాదు, అందానికి మారుపేరుకూడా. అటువంటి మహాలక్ష్మికైనా ఇంకా అందంగా కనిపించాలనే తపన పడుతుంది. ఆభరణాలతో అలంకరించుకుంటుంది. ఇది గమనించిన ఆమె చెలికత్తెలు “సహజంగా అందగత్తెవు! ఎందుకు నీకు ఈ పై మెరుగులు?” అని ప్రశ్నిస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

ఈ సందర్భానికి అన్నమయ్య రాసిన కీర్తనిది.

AUDIO : గందము పూసేవేలే కమ్మని మేన
పాడినవారు : సుశీల, వాణిజయరాం
స్వరపరచినవారు : గుంతి నాగేశ్వర నాయుడు

 

పల్లవి

గందము పూసేవేలే కమ్మని మేన యీ –

గందము నీ మేనితావికంటె నెక్కుడా

 

చరణం 1

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని

అద్దము నీ మోముకంటే నపురూపమా

ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –

గద్దరి కన్నులకంటె కమలము ఘనమా

 

చరణం 2

బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా

బంగారు  నీ దనుకాంతి ప్రతివచ్చీనా

ఉంగరాలేఁటికినే వొడొకపువేళ్ళ

వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా

 

చరణం 3

సవర మేఁటికినే జడియు నీ నెరులకు

సవరము నీ కొప్పుసరి వచ్చీనా

యివలఁ జవులు నీకునేలే వెంకటపతి –

సవరని కెమ్మోవి చవికంటేనా

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 5 కీర్తన : 2

annamayya

 

తాత్పర్యం (Explanation) :

ఓ పడతీ, ఒంటికి చందనం పూసుకుంటున్నావెందుకు? నీ మేనిలో సగజంగా ఉన్న సుగంధంకంటే ఈ గందపు వాసన ఏం గొప్పదనీ?

అద్దంలో ఏముందని పదేపదే చూసుకుంటున్నావు? అద్దంకంటే అపురూపమైనది నీ ముఖం. కళ్ళకి తామర పువ్వులొత్తుకుంటున్నావు. నేర్పెరిగిన నీ కన్నులతో పోలిస్తే తామరపువ్వులు ఏ కొసకీ సరిపోవు. అలాంటి వాటిని అద్దుకుంటే నీ కళ్ళల్లోని చల్లదనం తామరపువ్వులకి వెళ్తుందిగానీ? తామపువ్వులొత్తుకోవడం వల్ల కళ్ళకేం చల్లదనం వస్తుంది?

ఒంటిపైన బంగారు నగలను తొడుక్కుంటున్నావు. నిగనిగలాడే నీ ఒంటి కాంతికంటే ఈ నగల నిగనిగ దేనికి పనికొస్తుందనీ? సన్నగా, పొడవుగా, నాజూగ్గా ఉన్న నీ వేళ్ళకి ఉంగరాలవి అవసరమా? వేళ్ళ చివర్లో తెల్లగా మెరిసే నీ గోళ్ళకి సాటిరావు ఆ లేహపు ఉంగరాలు.

జుట్టు పలుచగా, పొట్టిగా ఉంటే సవరం కావాలేమోగానీ, పొడవుగా, ఒత్తుగా మెరిసే నీ జుట్టుకి సవరమెందుకు? అలికుంతలివి! సవరం చుట్టుకుంటే సహజమైన నీ కొప్పకి సరితూగుతుందా?వేంకటపతి ప్రేయసివి. అతని ఎర్రటి పెదవుల రుచి ఎరిగినదానివి! ఆ కెమ్మోవి రుచి ముందు ఇహలోకంలో ఏవీ రుచించవు.

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

గందము = చందనం (గంధము), సువాసన

ఏల, ఏలే = ఎందుకు, ఎందుకే

కమ్మని = తీయని పరిమళం

మేని = ఒళ్ళు

తావి = సువాసన

ఎక్కుడా = గొప్పదా, మేలైనదా

 

ఒద్దిక = పోలిక

గద్దరి = గడుసరి స్త్రీ, నేర్పరి

గద్దరికన్నులు = నేర్పెరిగిన కన్నులు

 

పడతి = స్త్రీ

మెయి = ఒళ్ళు, తనువు

ప్రతివచ్చీనా = సరితూగేనా

ఒడికపువేళ్ళు = సన్నగా పొడవుగా ఉండే నాజూకైన వేళ్ళు

వెంగలిమణులు = లోహములతో తయారు చేయబడిన నగలు

బోలునా = పోలిక ఉంటుందా?

 

జడియు = ఎక్కువయిన (పొడవైన అని అన్వయించుకోవచ్చు), ప్రసిద్ధమైన

నెరులు = కురులు, జుట్టు

ఈవల = ఇహలోకము, మామూలు, ఇక్కడ

చవులు = రుచులు

సవరని = అందమైన, చక్కని

కెమ్మోవి = ఎర్రని పెదవులు

చవి = రుచి, అనుభవం

 

విశ్లేషణ (Analysis) :

గందము అన్న పదం చదవగానే ఇదేదో అచ్చుతప్పేమో అనుకోనవసరం లేదు. గందము సరియే! సులువైన భాషలో, జానపద శైలీలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో సంస్కృత పదాలను అక్షరాలలో ఇలా ఒత్తులు తీసేసి వాడటబడటం తరచుగా కానవచ్చు. అలాగే ఆయన, కీర్తనలకు మేలైన నుడి అని దేన్నీ ఎన్నుకోలేదు. తాను తెలుసుకున్న పరతత్వాన్నీ, జీవితసారాన్నీ సమాజంలో అన్ని వర్గాల వారికీ అందించాలన్న రీతిలో కీర్తనలు రాశాడు. ప్రపంచంలోని ప్రతిదీ పరబ్రహ్మ రూపంగానే భావించాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది లేదన్నమయ్య దృష్టిలో.

అందుకే తాను చెప్పాలనుకున్న భావాన్ని పలు రకాల భాషల్లో చెప్పాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాలు. కొన్నేమో గ్రాంధికమైన తెలుగు. కొన్నేమో పూర్తి సంస్కృతం. మరికొన్నిట్లోనేమో అన్నిట్నీ కలిపి రాయడం. అన్నమయ్య కీర్తనల్ని ఏ కోణంలో చూసినా ఆయన సర్వసమతా దృష్టి అగుపిస్తుంది. భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్టు చెప్తారు. అంటే ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక కాదు. చంధోబద్ధమైనవీ రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ప్రాధాన్యమిచ్చాడు.

యేల(ఎందుకు), యాడ(ఎక్కడ), ఏంది(ఏమిటి) వంటి పదాలు నేడు చిన్నచూపుకి లోనయ్యాయి! నిజానికి అవి ఎంత అందమైన తెలుగుపదాలో!

అత్తర్, సెంట్లు రాసుకోవడం, బ్యూటీ సలూన్ లలో చేసే ఫేస్‌ప్యాక్, బాడీప్యాక్ లు, కళ్ళకింద డార్క్ సర్కిల్స్ కి కీరకాయల ట్రీట్మెంట్ వంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవని అన్నమయ్య కీర్తనలద్వారా తెలుసుకోవచ్చు. కళ్ళకి నేడు కీరకాయ ముక్కలు, నాడు తామర పువ్వులు! అంతే. ఇవి ఎప్పుడూ ఉన్నవే కాబోలు.

*

 

అమ్మ … 

 

 మాగ్జిమ్  గోర్కీ

అనువాదం: నౌడూరి మూర్తి 

 

“ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే.”

 

అప్పటికి చాలా వారాలబట్టి సైనికులతో ఆ నగరం చుట్టుముట్టబడి ఉంది. రాత్రిపూట నెగళ్ళు లేస్తున్నాయి, చీకటిలో గోడలవైపు కొన్ని వేల జతల ఎర్రబడిన తీక్షణమైన కళ్ళు చూస్తున్నాయి. ఆ చలినెగళ్ళతీరు అశుభాన్నిసూచిస్తూ, ఆ నగరప్రజలని హెచ్చరిస్తున్నట్టుంది. అవి రేకెత్తించే ఆలోచనలూ భయంకరంగా ఉన్నాయి.

నగరప్రాకారపు గోడలనుండి పరికిస్తే, శత్రువు నగరం మీద తన ఉచ్చును రోజు రోజుకీ గట్టిగా బిగిస్తున్నాడని అర్థమైపోతుంది.  ఆ మంటల చుట్టూ నల్లని నీడలు అటూ ఇటూ కదలాడడం తెలుస్తుంది; బాగా మేపిన అశ్వాల శకిలింపులతో పాటు, ఆయుధాల మోతలూ, గెలుపుమీద ధీమా ఉన్న సైనికుల వికటాట్టహాసాలూ, ఆనందంతో పాడేపాటలూ వినిపిస్తాయి.  శత్రువుల పాటలూ, నవ్వులూ వినడం కంటే బాధాకరమైనది ఏముంటుంది?

నగరానికి నీరు సరఫరా చేసే ఏటిని శత్రువు శవాలతో నింపేసేడు; నగరానికి చుట్టూ ఉన్న ద్రాక్షతోటలని తగలబెట్టేడు; పంటలని ధ్వంసం చేసేసేడు; చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నరికేయడంతో నగరం నాలుగువైపులనుండీ బోసిపోయి దాడిచెయ్యడానికి అనువుగా మారిపోయింది; దానితో ప్రతిరోజూ నగరంపై శత్రువు ఫిరంగులతో తుపాకులతో గుళ్ళు కురిపిస్తూనే ఉన్నాడు.

యుద్ధంలో అలిసి, అర్థాకలితో మాడుతున్న సైనికులు ఇరుకైన నగరపు వీధుల్లోంచి వెళుతున్నారు.  ఇంటి కిటికీలలోంచి గాయపడ్డవారి మూలుగులూ, అపస్మారకంలో ఉన్న వ్యక్తుల సంధిప్రేలాపనలు, స్త్రీల ప్రార్థనలూ, పిల్లల ఏడుపులూ వినవస్తున్నాయి. ప్రతివారూ లోగొంతులో, నెమ్మదిగా మాటాడుకుంటున్నారు… మధ్యమధ్యలో, శత్రువు మళ్ళీ నగరం మీద గుళ్ళ వర్షం కురించడం లేదుగదా అని చెవులు రిక్కించి వినడానికి, మాట్లాడుతున్న వారిని ఆపమని సంజ్ఞచేస్తూ.

వాళ్లు ఇళ్ళల్లో దీపాలు వెలిగించడానికి భయపడుతున్నారు; నగరాన్ని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఆ పొగమంచులో, నదికి అడుగున అటూ ఇటూ తిరిగే చేపలా ఒక స్త్రీ ఊరల్లా కలయతిరుగుతోంది… ఆపాదమస్తకం ఒక నల్లని  ముసుగు కప్పుకుని.

ఆమెను గుర్తించిన కొందరు ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు

“ఆమేనా?”

“అవును. ఆమే.”

అంటూ తమ తలలు పక్కకి తిప్పుకుని, ఆమెదారిలో తప్పుకుందికి అయితే దొరికిన దగ్గరగుమ్మం ఎక్కిపోవడమో, లేకుంటే మౌనంగా ఆమెని దాటుకుంటూ వడివడిగా  వెళ్ళిపోవడమో చేస్తున్నారు. రాత్రి పహారాకాస్తున్న దళం నాయకుడు ఆమెని తీవ్రంగా మందలించేడు: “చూడు మరియమ్మా! కొంచెం జాగ్రత్తగా తిరుగు! వాళ్లు నిన్ను కాల్చిపారెయ్యగలరు. అప్పుడు ఎవడాపని చేసేడో పట్టించుకునే నాథుడుకూడా  ఉండడు.”

ఆమె నిటారుగా నిలబడి చూస్తోంది. పహరాకాసే వాళ్లు ఆమెకు కష్టం కలిగించడం ఇష్టలేకో, లేక సందేహిస్తూనో పక్కనుండి తప్పుకున్నారు. ఆమె చుట్టూ సాయుధులు నడుచుకుంటూ వెళ్ళేరు, ఆమె ఒక శవమైనట్టూ, వాళ్ళు ఆ శవాన్ని మోసుకెళుతున్నట్టూ. అయినా ఆమె చీకటిలో తచ్చాడడం మానలేదు. ఆ నగరానికి పట్టిన దురదృష్టంలా … ఒంటరిగా, మౌనంగా, నెమ్మదిగా, నల్లని ముసుగు కప్పుకుని ఒక్కొక్క వీధీ తిరుగుతోంది. ఆమెను అనుసరిస్తున్న శోకంలా… మూలుగులూ, ఎక్కిళ్ళూ, ప్రార్థనలూ, ఇక గెలవలేమని నిరాశచేసుకున్న సైనికుల సంభాషణలూ… ఆమెను వదలలేదు.

Akkadi-MeghamFeatured-300x146

ఆమె ఒక తల్లీ, ఆ నగర పౌరురాలు కూడా . ఆమె ఆలోచనలన్నీ ఆమె కొడుకు చుట్టూ, ఆమె పుట్టిన ఆ నగరం చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె కొడుకు చాలా అందమైన హుషారైన కుర్రాడే గాని, హృదయంలేని వాడు. ఆ నగరాన్ని నాశనం చేస్తున్న సైన్యానికి నాయకుడుగా ఉన్నాడు. మొన్నమొన్నటిదాకా తనకొడుకుని తలుచుకుని తన జన్మభూమికి ఆమె అందించిన కానుకగా; తను పెరగడమేగాక, తనకొడుకుని కనిపెంచిన ఆ నగరసంక్షేమానికి ఆమె సృష్టించిన ఒక ప్రయోజనకర వస్తువుగా చాలా గర్వంగా భావించేది. ఆ ప్రాచీన నగరపు ప్రతి రాయితోనూ ఆమెకు విడరాని అనుబంధం ఉంది; ఎందుకంటే ఆ నగరపు గోడలూ, ప్రతి ఇల్లూ ఆ రాళ్లతో ఆమె పూర్వీకులు కట్టినవే. ఆ మట్టిలో ఆమె వంశీకుల అస్థికలు నిక్షిప్తమై ఉన్నాయి; అక్కడి కథలతో, చరిత్రతో ఆశలతో, గీతాలతో ఆమె అనుబంధం విదదీయరానిది. అటువంటి హృదయం ఇప్పుడు అంత అమితంగా ప్రేమించిన ఆ కొడుకుని పోగొట్టుకుని రెండు ముక్కలైపోయింది. నగరం పట్ల ఆమెకున్న ప్రేమా, కొడుకుపట్ల ఆమెకున్న ప్రేమా త్రాసులో వేసి ఎవరో తూచుతున్నట్టు ఉంది ఆమె స్థితి. ఇప్పుడు ఆమె మనసు ఎటుమొగ్గుతోందో చెప్పడం కష్టం.

ఈ మానసిక స్థితిలో ఆమె రాత్రిపూట వీధులు తిరిగేది; గుర్తుపట్టలేని చాలా మంది ఆమెను చూసి వాళ్ళకి అతి సమీపంగా సంచరిస్తున్న మృత్యుదేవత ఆకారమేమోనని జడుసుకుంటే, ఆమెను గుర్తుపట్టగలిగినవాళ్ళు ఆ దేశద్రోహి తల్లిని తప్పించుకుందికి ఆమె మార్గంనుండి తప్పుకునే వాళ్ళు.

ఒక సారి, ఆ నగరపు సరిహద్దు గోడకి సమీపంగా జనసంచారం లేని ఒక మారుమూలన ఆమెకు మరొక స్త్రీ తారసపడింది.  ఆమె తన ముందున్న శవం దగ్గర మోకాళ్ళపై కూచుని ఆకాశంకేసిచూస్తూ ప్రార్థిస్తోంది. ప్రాకారపు గోడమీద పహారా కాస్తున్న సైనికులు మంద్రస్వరంలో మాటాడుకుంటున్నారు. వాళ్ళ చేతిలోని తుపాకులు ముందుకి చొచ్చుకువచ్చిన రాళ్ళు తగలగానే, చప్పుడు చేస్తున్నాయి.

ఆ దేశద్రోహి తల్లి ఆ స్త్రీని అడిగింది:

“నీ భర్తా?”

“కాదు.”

“అన్నదమ్ముడా?”

“కొడుకు. నా భర్త పదమూడురోజులక్రిందటే చంపబడ్డాడు. ఇవాళ వీడు.”

మృతుని తల్లి చేతులు పైకెత్తి వినయంగా ఇలా అంది:

“మేరీ అన్నీ చూస్తుంటుంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమెకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.”

“ఎందుకు?” అని అడిగింది మరియమ్మ. దానికి ఆమె,

“ఇప్పుడు వీడు గౌరవప్రదంగా, దేశంకోసం పోరాడుతూ మరణించేడు కాబట్టి నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పగలను: వీడు నన్ను కొన్నిసార్లు చాలా ఆందోళనకు గురిచేసేవాడు; నిర్లక్ష్యంగా తిరుగుతూ, సుఖాలవేటలో ఉండేవాడు; ఆ కారణంగానే, శత్రువులకు నాయకత్వం వహిస్తూ, దేశానికీ, ప్రజలకీ ద్రోహం చేసిన మరియమ్మ కొడుకులా, వీడుకూడా ఎక్కడ ద్రోహం చేస్తాడోనని భయపడే దాన్ని. వాడూ, వాడిని కన్న ఆ తల్లీ నాశనం అయిపోవాలి!”

gorky

చేతుల్లో ముఖం దాచుకుని మరియమ్మ అక్కడనుండి పరిగెత్తింది.

మరుచటిరోజు నగర రక్షకులదగ్గరకి వెళ్లి ఇలా అంది:

“నా కొడుకు మీ శత్రువుగనుక నన్ను చంపనన్నా చంపండి లేదా నగరద్వారమైనా తెరవండి నేను వాడి దగ్గరకిపోడానికి వీలుగా.”

వాళ్ళు సమాధానంగా,

“మీరు ఈ నగర పౌరులు. మీకు ఈ నగరమే ప్రాణప్రదమైనది.  మీ కొడుకు మాకు ఎంత శత్రువో మీకూ అంతే,” అన్నారు.

“నేను అతని తల్లిని. అతనంటే నాకు ప్రేమ. అతను ఇలా తయారవడానికి నేనే బాధ్యురాలిని అని అనుకుంటున్నాను.”

అపుడు వాళ్లందరూ ఈ విషయమై ఏమి చెయ్యాలో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేరు .

“మీ కొడుకు చేసిన పొరపాటుకి మిమ్మల్ని చంపడం భావ్యం కాదు.  మీరూ ఇటువంటి పాపాన్ని చెయ్యమని మీ కుమారుడికి సలహా ఇస్తారని మేము భావించలేము. అది మీకు ఎంత బాధాకరమో మేము గ్రహించగలము. ఆ రాక్షసుడు మిమ్మల్ని మరిచిపోయేడని మేము భావిస్తున్నాము.  అదే మీకు పెద్ద శిక్ష, మీరు దానికి అర్హులనుకుంటే.  మా దృష్టిలో అది చావుకన్నా భయంకరమైనది. ”

“అవును, అది చాలా బాధాకరం. ”

వాళ్ళు నగర వాకిలి తెరిచి ఆమెని బయటకి పోనిచ్చారు.

ఆమె కుమారుడివల్ల రక్తసిక్తమైన ఆమె జన్మభూమిని విడిచిపెడుతూ … విడిచిపెడుతూ … ఆమె వెళ్లడాన్ని వాళ్లు చాలసేపు గోడని ఆనుకుని గమనించేరు. ఆ బురదలో ఆమె మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ, నగరరక్షణలో ప్రాణాలర్పించిన వారి దేహాలదగ్గర వినమ్రంగా తలవాల్చుతూ, త్రోవలో పడి ఉన్న మారణాయుధాలని కోపంగా కాలితో విసరికొడుతూ వెళ్లడం గమనించేరు. ఎందుకంటే, తల్లులెప్పుడూ వినాశకరమైన వస్తువుల్ని ద్వేషిస్తారు; ప్రాణాల్ని నిలిపే వస్తువులపట్లే వారికి మక్కువ.

తన ముసుగుక్రింద ఏదో ద్రవాన్నీ తీసుకెళుతున్నట్టూ, అదెక్కడ ఒలికిపోతుందో అని భయపడుతున్నట్టూ ఉన్నాయి ఆమె అడుగులు.  అలా  అలా వెళుతున్న కొద్దీ… ఆమె రూపం చిన్నదయిపోతున్న కొద్దీ… నగర వాకిలినుండి గమనిస్తున్న వాళ్లకి ఆమె పట్ల అంతకు ముందున్న నిర్వేదము, విచారమూ తగ్గినట్టనిపించింది.

ఆమె సగందూరం గడిచిన తర్వాత ఆగి, తన పైనున్న ముసుగు వెనక్కి తొలగించి, నగరాన్ని ఒక సారి వెనక్కితిరిగి చూడడం వాళ్ళు గమనించారు. దూరంగా శత్రుశిబిరాలలోని వాళ్ళుకూడా మరుభూమినుండి ఆమె ఒంటరిగా రావడం గమనించారు. ఆమెలా నల్లని ముసుగులు ధరించిన ఆకారాలు ఆమెని సమీపించాయి.  ఆమె ఎవరో, ఎక్కడికి వెళుతోందో కనుక్కున్నాయి.

 

“మీ నాయకుడు నా కుమారుడు,” అందామె. ముసుగులలోని వ్యక్తులెవ్వరూ ఆమె మాటలని సందేహించలేదు. వారి నాయకుడి తెలివితేటలూ, ధైర్యసాహసాలు కొనియాడుతూ ఆమె ప్రక్కగా నడిచేరు. ఆమె ముఖంలో ఎక్కడా ఆశ్చర్యం పొడచూపకుండా గర్వంగా తలెత్తుకుని నడిచింది. ఆమె కొడుకంటే అలాగే ఉండాలి మరి!

పుట్టకముందు తొమ్మిది నెలల ముందునుండే పరిచయమున్న వ్యక్తి ఎదురుగా నిలబడింది. మునుపెన్నడూ ఆమె తన మనసులోని భావాలని అతనికి వ్యక్తపరచి ఉండలేదు. ఆమె ఎదురుగా అతను మెత్తని పట్టు వస్త్రాలు కట్టుకుని, రత్నాలు పొదిగిన కత్తి ధరించి నిలబడ్డాడు. ఆమె తన కలల్లో అతన్ని ఎలా రూపు కట్టుకుందో, ఏది ఎలా ఉండాలో అది అలా ఉంటూ… పేరూ, ప్రఖ్యాతీ, సంపదతో సాక్షాత్కరించాడు ఆమె కళ్ళకి.

“అమ్మా!” అంటూ ఆమె చేతులు ముద్దాడాడతను. ” నువ్వు నా దగ్గరకి వచ్చేవు అంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావన్న మాట. రేపే ఆ పాపిష్టి నగరాన్ని వశపరచుకుంటాను.”

“నువ్వు అక్కడే పుట్టావు.”

అతని విజయాలు తలకెత్తిన మత్తులో, మరింత కీర్తి సంపాదించాలన్న కాంక్షతో, యవ్వనసిద్ధమైన అహంకారంతో మాటాడేడు.

“నేను ఈ ప్రపంచంలో పుట్టేను… ఈ ప్రపంచం కోసం, దాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి పుట్టేను. నీ కారణంగా ఈ నగరాన్ని ఇన్నాళ్ళూ ఉపేక్షించేను. నేను అనుకున్నంత తొందరగా యశస్సు సంపాదించడానికి అడ్డంగా కాలిలో ముల్లులా ఉంది ఇన్నాళ్ళూ. నేడో రేపో నా దారికి అడ్డంగా మొండిగా ఎదిరిస్తూ నిలబడిన వారిని హతమారుస్తాను.”

“అక్కడి ప్రతి రాయీకీ నువ్వూ, నీ బాల్యమూ గుర్తే.”

‘రాళ్లకేముంది, అవి మూగవి. అవి నాగురించి మాటాడలేకపోతే పర్వతాలనే నాగురించి మాటాడేలా చేస్తాను. నాకు కావలసింది అదే.”

“మరి మనుషుల సంగతో?” ఆమె అడిగింది.

“ఆహా! అమ్మా వాళ్ల నెందుకు మరిచిపోతాను. వాళ్ళు నాకు అవసరం కూడా. ప్రజల జ్ఞాపకాలలోనే గదా వీరులు చిరంజీవులుగా మిగిలేది.”

దానికి సమాధానంగా, ఆమె

“ఎవడు ప్రాణాన్ని సృజిస్తాడో, మృత్యువుని ద్వేషించి దాన్ని జయించగలడో వాడూ నిజమైన వీరుడంటే!”

“కాదు,” అన్నాడతను ఆమె మాటలని ఖండిస్తూ, “నగరాల్ని నిర్మించినవాడికి ఎంత కీర్తి ఉంటుందో, వాటిని నిర్మూలించినవాడికికూడా అంత కీర్తి దక్కుతుంది. ఉదాహరణకి  ‘ఈనియస్’, ‘రోమ్యులస్’ రోము నగరాన్ని నిర్మించోరో లేదో నాకు తెలియదు గాని, దానిని నాశనం చేసినది ‘అలారిక్’ అని మాత్రం తెలుసును.”

“ఆ పేరు అన్ని పేరులకన్నా చిరంజీవిగా మిగిలిపోయింది.”

ఈ రీతిగా వాళ్ళ సంభాషణ సూర్యాస్తమయం దాకా కొనసాగింది.  రానురాను అతని వ్యర్థ ప్రలాపాలని ఆమె అడ్దుకోవడం తగ్గడంతో పాటు, అంతవరకు గర్వంతో విరుచుకున్న ఆమె గుండె రానురాను కుదించుకుపో సాగింది.

తల్లి ప్రాణాన్నివ్వడమే కాదు, ప్రాణాన్ని నిలబెడుతుంది; ఆమె సన్నిధిలో వినాశము గురించి మాటాడడమంటే, ఆమెకు ప్రాణం గురించి ఉన్న అవగాహనని త్రోసిపుచ్చడమే. అది తెలియక, ఆమె కొడుకు  ప్రాణం గురించి ఆమె చెబుతున్న అన్ని విషయాలనీ పక్కన బెడుతున్నాడు.

painting: Satya Srinivas

painting: Satya Srinivas

ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే. కానీ, నిర్దాక్షిణ్యమైన కీర్తికాంక్ష మెరుపులకు కళ్లు గప్పుకుపోయి, మనసు చచ్చిపోవడంతో కొడుకు ఆ విషయాన్ని గ్రహించలేకున్నాడు.

ఏ తల్లి ‘ప్రాణానికి’ ప్రాణంపోసి పెంచుతుందో, ఆ తల్లే ఆ ప్రాణాన్ని పరిరక్షించే విషయం వచ్చేసరికి జంతువులా ఎంత నిర్దాక్షిణ్యంగా, ఉపాయశీలిగా ఉండగలదో అతను ఎరుగడు.

వినివిని, శక్తి సన్నగిల్లి, తల వంచుకుని ఆమె అలా కూలబడిపోయింది. సుసంపన్నమై, తెరచి ఉన్న నాయకుడి గుడారం ముఖద్వారంనుండి… తన నగరాన్నిచూస్తోంది… తన తొలిసంతానం … కొడుకు … కడుపులోపడినపుడు తను అనుభవించిన పులకింతలూ, పురిట్లో తను పడ్డ బాధలూ అన్నీ గుర్తుచేసుకుంది; ఇపుడు వాడికి ఆ ఊరిని నాశనం చేయడమే ఏకైక ధ్యేయం.

సూర్యుడు తన రక్తారుణిమ కిరణాలతో నగరాన్నీ, అక్కడి గోడల్నీ ముంచెత్తుతున్నాడు. కిటికీలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయా అన్నట్టు మెరుస్తున్నాయి. నగరం నగరమంతా గాయపడ్దట్టూ, దాని వందల గాయాల్లోంచి రక్తం స్రవిస్తున్నట్టూ అనిపిస్తోంది. కాలం కరిగిపోయింది. నగరం శవంలా నల్లబారింది.  శోకచిహ్నంగా వెలిగించే కొవ్వొత్తులా నక్షత్రాలు ఆకసంలో వెలిగాయి.

శత్రువు దృష్టిని ఎక్కడ ఆకర్షిస్తాయోనన్న భయంతో నగరంలోని ప్రజలు దీపాలు వెలిగించకుండా చీకటిలో ఉండడం తన మనోనేత్రంతో దర్శించింది. నగరంలోని వీధులన్నీ శవాలనుండి వెలువడే దుర్గంధంతోనూ, మృత్యువుకి ఎదురుచూస్తున్న ప్రజల గుసగుసలతోనూ నిండిపోయాయి. అన్నిట్లోనూ ఆమెకి తనే కనిపించింది. ఆమెకు అక్కడపుట్టిన ప్రతివస్తువూ, పరిచయమున్న ప్రతివస్తువూ ఎదురుగా నిలబడి ఆమె నిర్ణయానికై ఎదురుచూస్తున్నట్టు అనిపించింది; తన కొడుకు ఒక్కడికేగాక, ఆమె తను పుట్టిన నగరంలోని ప్రజలందరికీ తల్లిని అని అనిపించింది.

ఎత్తైన కొండశిఖరాలనుండి  మేఘాలు లోయలోకి దిగిపోయాయి, రెక్కలున్న వార్తాహరుల్లా  నగరమంతా కమ్ముకున్నాయి.

“బహుశా ఈ రాత్రికి దాడి చెయ్యవచ్చు,” అన్నాడు ఆమె కొడుకు. “రాత్రి అంతా చీకటిగా అనుకూలంగా ఉంటే. కళ్ళల్లో సూర్యుడు పడినా, ఆయుధాల మిలమిలలు కంట్లోపడినా శత్రువుని చంపడం కష్టం. చాలా దెబ్బలు వృధా అయిపోతాయి,” అన్నాడు తన కత్తిని మరొకసారి  పరీక్షగా చూసుకుంటూ.

“నాన్నా ఇలా రా,” అంది తల్లి: “రా, నా గుండెమీద కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా, దయాళువుగా ఉండేవాడివో, అందరూ నిన్నెంత ప్రేమించేవారో  ఒక్కసారి గుర్తుచేసుకో.”

ఆతను ఆమె మాటని మన్నించాడు. ఆమెపై వాలి, కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు:

“నాకు నవ్వన్నా, కీర్తిప్రతిష్టలన్నా ఇష్టం, ఎందుకంటే నువ్వు నన్ను కనిపెంచేవు కాబట్టి.

“మరి స్త్రీలో?”, అతని మొహం మీద  మొహం వాల్చి అడిగింది.

“చాలా మంది ఉన్నారు జీవితంలో.  కాని త్వరలోనే వాళ్ల పట్ల విముఖత వచ్చేస్తుంది, తియ్యనివన్నీ త్వరలో వెగటుపుట్టించినట్లు.”

“నీకు నీ వంశాన్ని ఉద్ధరించాలని లేదా?”

“ఎందుకూ? ఎవడో ఒకడు వాళ్ళని చంపడానికా?  నాలాంటి వాడెవడో వాళ్ళని హతమారుస్తాడు.  అది నన్ను దుఃఖంలో ముంచుతుంది. అప్పటికి తప్పకుండా నేను ముసలివాణ్ణై, శక్తి సన్నగిలి ప్రతీకారం తీర్చుకోలేని స్థితిలో ఉంటాను.”

ఆమె నిట్టూరుస్తూ, “నువ్వు చాలా అందగాడివి. కానీ, మెరుపులా అనపత్యుడివి.”

అతను నవ్వుతూ అన్నాడు: “నిజం. నేను మెరుపులాంటి వాడిని.”

అతను చిన్నపిల్లవాడిలాగే ఆమె గుండెమీద నిద్రపోయాడు.

ఆమె అతని ముఖంపై తనపైనున్న నల్లని వస్త్రాన్ని కప్పి గుండెలో కత్తితోపొడిచింది.  ఒక్క సారి అతను వణికి, వెంటనే ప్రాణాలు విడిచాడు, ఎందుకంటే తల్లిగా ఆమెకు తన కొడుకు గుండె ఎక్కడ చప్పుడు చేస్తోందో బాగా తెలుసు.  శవాన్ని తన కాళ్ళమీదనుండి ఆశ్చర్యంలో మునిగిన కాపలాదారుల కాళ్లమీదకి త్రోసి, తన నగరం వైపు వేలు చూపిస్తూ ఆమె ఇలా అంది:

“ఒక పౌరురాలిగా నా జన్మభూమికి నేను చెయ్యగలిగినదంతా చేశాను; కాని తల్లిగా నేను నా కొడుకుతోపాటే ఉంటాను. నాదిపుడు పిల్లలని కనే వయసు కాదు. నా జీవితం ఎవరికీ పనికిరాదు కూడా,” అని అంటూ, తనకొడుకు రక్తం … తనరక్తం.. వేడి ఇంకా చల్లారని అదే కత్తిని తన గుండెల్లోకి దించుకుంది. నిస్సందేహంగా అది గుండెలోనుండి దూసుకుపోయి ఉండాలి.  హృదయం వేదనకు గురయినప్పుడు దాన్ని తప్పిపోకుండా గురిచూడడం సులభం!

.(Courtesy: Phoenix, Vol 3 July-Aug 1915 No 2-3  pp 45 – 51)

గిలిగింతలు పెట్టి నవ్వులు పూయించే నవల “ప్రేమలేఖ”

 

 

SomaSankar2014

కొల్లూరి సోమశంకర్

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తొలి నవల “ప్రేమలేఖ”. ఎందరో రచయిత్రులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినా, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రభావం విలక్షణమైనది. సాంఘిక ఇతివృత్తాలతో కొన్ని రచనలు చేసినా, హాస్యకథలు ఆవిడ ప్రత్యేకత. సున్నితమైన హాస్యంతో, కథన నైపుణ్యంతో రచనలు చేయడం పొత్తూరి విజయలక్ష్మి గారి శైలి. తొలుతగా 1982 అక్టోబర్ నెల చతుర మాసపత్రికలో ప్రచురితమైన ఈ నవల “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి మూలం.

***

కథానాయకుడు ఆనందరావు అమాయకుడు, అందగాడు. బి.ఇ. పాసయి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాదులో ఏదో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు. ఆనందరావుకి తండ్రి పరంధామయ్య పెళ్ళి సంబంధాలు చూస్తూంటాడు. త్వరగా పెళ్ళి చేసుకోమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తు ఉంటాడు. పరంధామయ్యది అదో రకం స్వభావం. తాటాకుమంటల్లా ఎప్పుడూ చిటపటలాడిపోతుంటాడు. తండ్రి అంటే మా చెడ్డ భయం ఆనందరావుకి. ఒక్క ఆనందరావుకేం ఖర్మ, అతని అన్నయ్య భాస్కరరావుకి, అక్క కామేశ్వరికి, వదిన అన్నపూర్ణకి, బావ సూర్యానికి, అమ్మ మాణిక్యంబకీ కూడా భయమే.

ఈ నేపథ్యంలో ఓ నడి వేసవి రోజున మిట్టమధ్యాహ్నం లంచ్ చేయడానికి తన కాబిన్‍లోంచి బయటకి వస్తాడు ఆనందరావు. అతని సెక్రటరి మార్గరెట్ అతనికొచ్చిన పర్సనల్ లెటర్స్ అందిస్తుంది. ఏసి హోటల్లో కూర్చుని ఒక్కో ఉత్తరం చదువుతూంటాడు. మొదట తండ్రి ఉత్తరం, తరువాత అక్క ఉత్తరం చదువుతాడు. మూడోదే.. అసలైనది… “ప్రియా” అనే సంబోధనతో మొదలవుతుంది. ఉలిక్కిపడతాడు. తనకేనా సంశయపడతాడు. ఆ ప్రేమలేఖ చదివి తన్మయుడవుతాడు. పరవశుడవుతాడు. ఇక అక్కడ్నించి, ఆ ఉత్తరం వ్రాసిన సోనీ ఎవరో తెలుసుకోడానికి నానా పాట్లు పడతూంటాడు.

ఇక కథానాయకి స్వర్ణలతకి పెద్దగా చదువబ్బదు. తండ్రి బలవంతంమీద ఏదో చదువుతున్నానని అనిపించుకుంటుంది. తనకి పెళ్ళీడు వచ్చేసిందని, తండ్రి గ్రహించకుండా ఇంకా చదువు చదువు అని పోరుతున్నాడని ఆమె అభిప్రాయం. ఆమె తండ్రి తిలక్‌కి కూతుర్లిద్దరినీ బాగా చదివించాలని ఆశ. పెద్ద కూతురు హేమలత బిఎ పూర్తి చేయగానే మధుసూదనం ఆమెని ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు.  సరే పెద్ద కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందికదా, చిన్న కూతురినైనా గొప్ప విద్యావంతురాలిని చేయాలని ఆయన తపన. కానీ స్వర్ణ కేమో చదువుకన్నా పెళ్ళి మీదే ధ్యాస ఎక్కువవుతుంది. చివరికి అనుకున్నదే అవుతుంది. బిఎస్సీ తప్పుతుంది, ఇక స్వర్ణకి పెళ్ళి చేసేయడమే మంచిదనే నిర్ణయానికొస్తాడు తండ్రి.

Premalekha back cover

సోనీని మనసులో ఉంచుకుని ఆనందరావు, ఆడపిల్లలు మగపిల్లలకి ఏ మాత్రం తీసిపోరనే భావంతో స్వర్ణలత తమకొచ్చిన సంబంధాలను తిరగగొడుతుంటారు. చివరికి ఆనందరావుకి పిచ్చి అని, స్వర్ణకి పొగరు అని ముద్ర పడిపోతుంది. ఆనందరావుకి వచ్చే సంబంధాల క్వాలిటీ ఏ 1 నుంచి సి 3కి పడిపోతుంది. స్వర్ణ గురించి పుకార్లు వ్యాపించిపోతాయి.

అదృష్టవశాత్తు, రెండు కుటుంబాల పెళ్ళిళ్ళ పేరయ్యలు బంధువులు కావడంతో, ఆనందరావు కుటుంబానికి, స్వర్ణలత కుటుంబం గురించి చెప్పి పెళ్ళి చూపులకి వప్పిస్తారు.

ఇక ఇక్కడ్నించి కథ వేగం పుంజుకుంటుంది. అపార్థాలు, అలకలు, అనుమానాలు, సందేహా నివృత్తులు… అన్నీ జరిగిపోయి కథ సుఖాంతం అవుతుంది.

 

***

కథ చాలా వరకు సంభాషణల రూపంలో నడవడం వల్ల హాస్యం జొప్పించడం తేలికైంది. కథనంలో సన్నివేశాన్ని హాస్యభరితంగా సృజించడం కన్నా, పాత్రల మధ్య సంభాషణలని హాస్యంతో నింపితే ఆ సంఘటన పాఠకుల మనస్సులను సులువుగా తాకుతుంది. నవలలోని ఒక్కో పాత్రకి ఒక్కో లక్షణం. వాటన్నింటిని మేళవిస్తూ, కుటుంబ సభ్యుల్లో అంతర్లీనంగా ఉండే ఆపేక్షలు, అనుబంధాలను వెల్లడిస్తుందీ నవల.

సినిమాగా వచ్చిన నవల కాబట్టి నవలనీ, సినిమాని పోల్చుకోకుండా ఉండలేరు. సినిమాలో “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..” పాటకి ఏ మాత్రం తీసిపోదు నవలలోని ప్రేమలేఖ.  ఆ పాట విని పెళ్ళి కాని వారు ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతారు. నవలలోని ప్రేమలేఖని చదివినా కూడా అదే ఎఫెక్ట్. పెళ్ళయిన వాళ్ళు తమ తొలినాళ్ళని గుర్తు చేసుకుంటారు.

సినిమాలోని సంభాషణలు, సన్నివేశాలు కూడా చాలా వరకు నవలలోవే కావడం వల్ల దర్శకుని సృష్టిగా భావించినవి.. నిజానికి మూల రచయిత్రి సృజన అని తెలుసుకుని విస్తుపోతారు పాఠకులు.

***

హాయిగా నవ్విస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల “ప్రేమలేఖ”. 142 పేజీల ఈ నవలని శ్రీ రిషిక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. రూ. 80/- వెల గల ఈ పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ పబ్లిషర్స్, కాచీగుడా, హైదరాబాద్. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

 

గూడు మార్చే ప్రయత్నం

 

మధురవాణి: ఒక వేశ్య

రామప్పంతులు: ఆమె విటుడు

మధు: యీ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవులన్నీ తాకట్టు పడి వున్నాయిట; మరి ఋణం కూడా పుట్టదట. వాళ్ళకీ వీళ్ళకీ జుట్లు ముడేసి జీవనం జేస్తూన్నాడు. యీ వూరు వేగం సవరించి చెయ్ చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి. ‘తెలియక మోసపోతినే, తెలియక…’ (పాడుచుండగా రామప్పంతులు ప్రవేశం)

రామ: యేవిటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిటి, పాడూ.

మధు: తరవాత ముక్కకేవుంది? మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.

రామ: అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్నయప్రకారం రెందొందలూ పట్నంలో యిచ్చాను. నెలజీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేవుంది?

మధు: యేం చిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్రధానవైనట్టు మీమనసుకి పొడగడుతూంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక. మీభూవులు రుణాక్రాంతవైనాయని అప్పట్లో నాకు తెలుసుంటే మీదగ్గిర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోకపోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ఠ. మాయింటి సంప్రదాయం యిది పంతులుగారూ; అంతేగానీ లోకంలో సాన్ల మచ్చని వూహించకండి.

రామ: భూములు తణఖా అన్నమాట శుద్ధఅబద్ధం యవరన్నారో గాని; నేను మహరాజులా వున్నాను.

మధు: నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూవాకలీ వదలి మానం ప్రాణం మీ పాలుచేసి నమ్మి మీవెంట వచ్చాను. నన్ను మాత్రం మోసం చెయ్యకండీ; మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది.

రామ: నేను మోసం చేసే మనిషినేనా?

మధు: అలాగయితే లుబ్దావుధాన్లు గారికి పెళ్ళెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీకోసవే యీ యెత్తంతాను.

రామ: ఆహా హా హా …. యిదా అనుమానం? కొంచెం గడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాణ్ణంటావా యేవిటి?

మధు: చట్లకి చావనలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగా, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్.

రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్! యేదీ ముద్దు. (ముద్దుపెట్టుకోబోవును)

మధు: వేళాపాళా లేదా? లుబ్దావుధాన్లు పెళ్లి తప్పించేస్తే గాని నేను ముద్దుబెట్టుకోనివ్వను.

రామ: అంతా సిద్ధవైంతరవాత, నాశక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దుబెట్టుకొనును)

మధు: సత్తువుందనా మోటతనం?

రామ: నాసత్తువిప్పుడేం జూశావ్? చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిందగ్గర్నుంచీ డీలా అయిపోయినాను.

మధు: యిదా డీలా? నాచెయి చూడండీ ఎలా కందిపోయిందో … అన్నా మోటతనం.

రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కనబడుతూంది.

మధు: యీ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.

రామ: యీ పెళ్ళిలో నీకు మేజువాణీ నిర్నయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయల సొమ్ము దొరుకుతుంది, మరి వూరుకో!

మధు: యేం చిత్రవైన మనుషులు పంతులుగారూ! (తమలపాకు చుట్టతో కొట్టి) మేజువాణీ బుద్ధిలో వుంచుకొని యీ పెళ్లి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ? యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే, నే యంత బతిమాలుకున్నా యీ పెళ్లి తప్పించక పోవడవేవి? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే నే నమ్ముతానా?

రామ: ఆ మాట్నిజవే గాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణ కోసవే చాస్తాననుకున్నావా యేవిటి? ఆ ముసలాణ్ణి కాపాడదావనే, యీ పెళ్లి తలపెట్టాను.

మధు: ‘చిత్రం, చిత్రం, మహాచిత్రం’ అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు!

రామ: ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా!

మధు: పొగటిపూట కథలేవిటి! ముందు యీ చిత్రకథేవిటో సెలవియ్యండి.

రామ: అది చెప్పేది కాదు, చెప్పను.

మధు: చప్పకపోతే వొప్పను.

రామ: వొప్పకేం జేస్తావు?

మధు: యేం జేస్తానా? యీ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవిది.

రామ: నేఁ దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం గీస్త్రం వకపక్కనుంచి మోటసరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని, అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేంలేదు. లుబ్దావధాన్లు వెధవ కూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు. పెళ్ళయితే దాని ఆట కడుతుంది.

మధు: మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ!? మీరు కంటబడ్డ తరవాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది?

రామ: అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను.

మధు: యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్లి మానిపించెయ్యండి.

రామ: యీ పెళ్ళిలో మేజువాణీ పెట్టి పదిరాళ్ళిప్పిస్తాను. మాటాడకూరుకో!

మధు: (ముక్కుమీద వేలేసుకొని) లుబ్దావధాన్లు యదట నేను మేజువాణీ…. ఆ!?

రామ: పేరు వాడు గాని, సభలో పెద్దన్నేనే కదూ?

*

కాలమయి పోయిన “కళల” పంటలు!!

 

సడ్లపల్లె చిదంబర రెడ్డి 
     నేను ముందే సెప్పితిగదా– మా కాపుదనము గుంపు, కమసలోళ్లు ఒచ్చి ఊరు కట్టుకోని వుండేదని!! అది యపుడు ఒచ్చిండారో తెలీదుగానీ 1850 ఇరుమైల్లో (దాదాపు) ఒగ పెద్ద ఇల్లు కట్టుకో నుండారు. అది యంత పెద్దదంటే తూరుపు బెంగులూరు రోడ్డు నుంచి పడమర ఊరిలోని కంకర రోడ్డు దంకా నూరు అడుగుల పొడవు, ఉత్తరం నుంచి దచ్చిణానికి 250 అడుగులు ఎడెలుపుతో నాలుగు బాగాలుగా ఒగే పునాది మింద కట్టిండారు. నాలుగు ఇండ్లకీ తూరుపు పడమరల దిక్కులకి వాకిళ్లు. విడివిడిగా వున్నాకుడా ఉత్తరం దచ్చిణంగా అన్ని ఇండ్లనూ కలిపే వాకిళ్లు. వాటికే వేరేగా సేద బాయి.
     అన్ని ఇండ్ల లోనూ బంగారు పనికి, ఎండి పనికి, ఇనప సామాన్లు సేసేకి,ఇగ్రహాలు సెక్కేకి వేరే వేరే రూములు. పడమర పక్క కవురుసాల్లు. ఇంత పెద్ద ఇంటిని ఆకాలంలో ఆరు నెల్లకే కట్టిరంట!!
     ఆ సుట్టూ పక్కల ఇరవై ముప్పై పల్లిల్లో పెద్ద పేరు తెచ్చుకొన్న ఆశార్లంట వాళ్లు. రైతుల కంతా అప్పులిచ్చేదే కాకుండా  వాళ్ల యగిసాయానికి(వ్యవసాయానికి) కావల్సిన ఇనుము సామాన్లు, ఎద్దుల బండ్లు ఇతరాలన్నీ తయారు సేసి ఇస్తావుండ్రంట. ఇంగ బంగారు, ఎండి సొమ్ములు సేసేకి వాళ్లకి మించినోళ్లు లేరంట!!
     అందుకే ఆ సుట్టూ పక్కల ఊర్ల జనాలు యాబై ఎద్దుల బండ్లు కట్టుకోని, బాగా బలిసి సేగు బారిండే పనస, మామిడి, నేరిడి,పత్తి(మేడి), ఊడుగ,యాప, ఇప్పి… ఇట్లా మాన్లన్నీ నరుక్కోనొచ్చి కట్టి పొయ్యిరంట. పెద్ద పెద్ద దూలాల మింద శక్క పలకలు పర్సి కట్టిన మొదతి మాడీ అదేనంట. మేము ఆ ఇల్లు కొన్నంక ఒగసారి ఇంగులీసోళ్లు టూరొచ్చి– ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లో దంకా వరుస కంబాల్తో కనిపించే ఇంటిని ఇసిత్రంగా సూసి పోటో తీసుక పోయిండ్రి!!
     మా ఊర్లో మొదట సదువు నేర్సింది కూడా ఆశార్లేనంట!! ఊరికి ఉత్తరం దిక్కు ఇరవై యకరాల దంకా దచ్చినం పక్క బసనపల్లికి ఆనుకొని ఇరవై యకరాల దంకా బూములు వాళ్లవే. ఆ తావ బాయిలు పండ్ల తోటలూ వుంటా వుండె. ఆంజనేయుని గుడి కట్టిచ్చి మొదట పూజారి తనంగూడా వాళ్లే సేస్తా వుండిరంట!!(దీనికి సంబంధించి వెంకట్రామా చారి చెప్పిన కథనాల్లో వివరించ గలను).
    ఆశార్ల నాలుగిండ్లలో ఒగ బాగానికి హక్కుదారు నీకంఠాశారి. మా ఊరి కూలి బడికి ఆయప్పే అయ్యవారంట.(కూలిబడి=డబ్బులు, ధాన్యం తీసుకొని చదువులు చెప్పే వీధి బడి) 1930 నుంచి గవుర్నమెంటు ఇసుకూలు వొచ్చే ఒరుకూ (1955) ఆయప్పే తన సొంత ఇంట్లో సదువులు నేర్పిచ్చిండాడు. ఆ ఇంటిని 1960 లో మాకి ఆయప్ప అమ్మేసి పట్నానికి ఎల్లిపాయ.
     ఈది బడి నడిసే తపుడు 1930 ఆ సగాల్లో దాని ముందర ఒగ కంప సెట్టు నాటిండాడు. అది సూసేకి జాలి మాను(నల్ల తుమ్మ) మాదిరీ వుండే దానికి అందరూ దాన్ని సీమ జాలి (సర్కారు తుమ్మ)మాను అని పిలుస్తా వుండ్రి.
     మేము ఇల్లు కొని రిపేరీ సేస్తా వుంటే ముండ్ల సెట్టు ఇండ్ల ముందర వుండకూడదు, దాన్ని నరికేయమని శానా మంది మా నాయనికి సెప్పిరి. అయితే అది అపుటుకే పెద్దగా పెరిగింది. ఎనుములు కట్టేసేకి నీడగా ఉంటుందని మా నాయన దాని కిందపక్క వుండే సన్నాబన్నా కొమ్ములు కత్తిరించి ఇడిసి పెట్టె. బెంగలూరు రోడ్డుకు పక్కలోనే వుండే ఆ సెట్టు, ఆకాశానికి తీగల మాదిరీ పెరుగుకొంటా గుత్తులు గుత్తులు కాయలు కాయబట్టె. సుట్టూ పక్కల వూర్ల జనాలు వాళ్ల సేన్ల సుట్టూ కల్ల(కంచె) మాదిరీ పెంచు కొనేకి తిరునాల్లకు ఒచ్చినట్ల ఒచ్చి కోసుకు పోబట్రి!!
     కరువు వొచ్చి మేము ఊరిడిసి కర్నాటకాకు వలసపొయ్యి,12 ఏండ్లకు తిరిగొచ్చి, ఇంగొగు ఊర్లో సేద్యం సేసి ఆడ కూడా ఓడిపోతిమి!! వానలు ఏటిచ్చి మా ఊరిపక్క పల్లెలన్నీ ఏరు పురుగు కొరికేసిన మల్లె తీగల మాదిరీ ఎండి దుంప నాశన మైనా… ఈ సీమ జాలి సెట్టు మాత్రం వాడబట్ట లేదు!! ఇపుడు యా పొలం బీడు నేల్లో సూసినా సీమతుమ్మ మాన్లే సిట్టడివి మాదిరీ అల్లుకు పోయిండివి. రాత్రీ పగలూ కష్ట జీవులు ఆ సెట్లని నరికి లారీల్లో తమిల దేశానికి తోలినా తరుగుతా వుండ్లేదు.
    బూమికానా కనిపించే మొదల్లు నరికేసినా, లోపలుండే కూటేర్లు మాత్రం రాచ్చాసి గడ్డల మాదిరీ ఊరి పొయ్యిండివి. ఇపుడు ప్రొక్లెయినర్లు తెచ్చి ఊడబెరికి కాల్సి బొగ్గులు సేసి పాత ఇనుము కరిగిస్తావుండే కార్కానాలకి అమ్ముతావుండారు.
    మా ఇంటి ముందర మాన్లోని కొమ్మలను ఆర్నెల్లకొగసారి నరుకుతా వుంటిమి.వంత సేసేకి గ్యాసు ఒచ్చినంక ఇడిసిపెడితిమి. సింతమాను మాదిరీ పెద్దగా పెరిగిన ఆసెట్లో నల్ల సీడ(పేను బంక) పడిండె. అవు సుట్టూ పక్కల ఇండ్లల్లో పడి గలీజు అయితా వుందని పంచాయితీ పెడితే 2005 కు యనకా ముందు దాన్ని నరికేస్తిమి.(దాని వేళ్లు ఇంకా భూమిలోనే ఉన్నాయి.సీమ ప్రాంతం సర్కారు తుమ్మకు అదే ఆది వృక్షమని చెప్పడాన్ని ఎవరైనా శాస్త్రీయంగా పరీక్షించవచ్చు).
     ఈ సీమ జాలి నుంచి ప్రయోజనం ఏమంటే ఇక్కడ వానల్లేక బూముల్లో పంటలు లేక పోయినా యాడజూసినా పచ్చగా కనిపిస్తాయి.బీదా సాదా వంట సెరక్కు దేవుని సెట్టు మాదిరీ ఎంత నరికినా సిగరిస్తానే వుంటుంది!!
     ఒగనాడు పది అడుగులకు మించి పెరిగిన సెరుకు తోట బూముల్లో తుమ్మ మాన్లు ముండ్లతీగల్తో సీమలు దూరని సిట్టడవి, కాకులు దూరని కారడవి మాదిరీ పెరిగిండివి.(01.08.2015 నాడు పొలాల్లో తీసిన ఫోటో జతపరుస్తున్నాను.ఈ రోజుదాకా ఇక్కడ ఈ వర్షాకాలంలో ఒక పదును వాన కూడా పడలేదు!!).
     ఇంగ కమసల ఆశార్ల కతకొస్తాము!!
IMG_0010
     మేము కొన్న దానికి ఉత్తం పక్క ఒగటి, దచ్చినం పక్క రెండు ఇండ్లూ వాళ్లవే.
     పొద్దున్నే లేస్తూనే వాళ్ల ఇండ్ల ముందర జనాలంతా పరస మాదిరీ సేరుతావుండ్రి. కొత్తగా ఇనప సామాన్లు సేయించేకి, పాతవి సరిసేసేకి రైతులు ఒగరి మింద ఒగరు పడతావుండ్రి. యంత మంది ఆశార్లు సుత్తి, సమ్మెట, శాణము, పట్టుకారాల్తో పనులు సేసినా నాలుగయిదు కొలిమిలు పెట్టి పెద్ద పెద్ద తిత్తుల్తో ఊదినా, బండ్ల కొద్దీ బొగ్గులు కాల్సినా పనులు తెముల్తా వుండ్లేదు!!
     వాళ్ల ఇండ్లలో లో కణజాలు(భూములోపల పాత్రలుగా కట్టినవి) పై కణజాలు(భూతలానికి పైన కట్టినవి) ఉండేవి.యాభై పల్లాల(బస్తాల) గింజలు పట్టేవి.(పాడుబడిన మాయింట్లో ఇప్పటికీ కణజం వుంది.అయితె అక్కడికి వెళ్లడానికి కుదరలేదు) పంట కోతలయినంక రైతులిచ్చే గింజల్తో ఆ కణజాలన్నీ నిండిపోతా వున్నెంట!!
     ఇంగ వాళ్లు సేస్తా వున్న ఎండి, బంగారు సొమ్ములు, పంచలోహ ఇగ్రహాలు యంత సుందరముగా,యన్ని కండ్లున్నా సూసేకి తనివి తీర్తా వుండ్లేదు.నేను రోగంతో తగ్గుకొంటా, తుమ్ముకొంటా ఇంట్లో పండుకొంటే వాళ్లు సుత్తితో ఏసే దెబ్బల్ని బట్టే అది ఎండిదో, బంగారుదో,ఇనుముదో, ఇత్తడిదో తెలుస్తావుండె!!
     పెండ్లిండ్ల కాలంలో రైతులే కాకుండా ఇందూపురం లోని షరాబోల్లంతా ఈల్లతోనే రకరకాల సొమ్ములు సేయిస్తా వుండ్రి. ఆసొమ్ములు సేసేది.బంగారు తునకని కమ్మచ్చులో దూరిచ్చి సన్న దారం మాదిరీ తయారు సేసేదీ అన్నీ సుస్తావుంటి.వాళ్ల ఇంట్లో ఒగ మూగాయప్పుండె.ఆయప్పకి మాట్లు వొస్తావుండ్లేదు. పెదవులు కదిలిచ్చి సేతుల్తో సైగలు సేస్తే అర్తం సేసుకొంటా వుండె. పొద్దస్తమ్మనమూ ఆయప్పకి సొమ్ములు సేసే పనే.
     ముసలాయప్ప పేరు యంగటరామాశారి. ఆయప్ప పని ఇగ్రహాలు సేసేది. మా దెండిండ్లకీ ఒగే కవురుసాలి. బెంగులూరు, మైసూరు,బళ్లారి నుంచి ఇగ్రహాలు సేసేకి ఆయప్పకే ఇస్తావుండ్రి. ఇగ్రహాలు యట్ల సేస్తావున్నంటే… కావల్సిన ఆకారముతో మొదట బొమ్మ తయారు సేస్తావుండె. దాని మింద బంక మన్ను(నెర్రెలు చీలనిది) నున్నగా నూరింది పల్సగా బల్లి పర్ర మాదిరీ ఆరేకొద్దీ పూస్తావుండె. బొమ్మ కిందబాగం పీటందగ్గర సన్న రంద్రం ఇడుస్తావుండె. ఆరకంగా అంగులం మందం పూసినంక దాన్ని కుంపట్లో పెట్టి యచ్చగా సేస్తే మైనమంతా కారిపోతావుండె. లోపల ఇగ్రహం ఆకారం మిగుల్తావుండె. దాన్ని ఇసకలో పెట్టి పీతం కింద ఇడిసిన రంద్రంలో పంచ లోహాలు కరిగించి పోస్తావుండె.
     అట్ల పోత పోసినంక రకరకాల పోగర్లతో సెక్కి లచ్చిమి, శివుడు,సీతారామ లచ్చుమనులు,కాళికాదేవి, ఆంజనేయుడు…ఇట్లావన్నీ సేస్తావుండె. ఆ బొమ్మలు నిజంగా నడిసొచ్చే దేవాను దేవతల మాదిరీ ఉంటావుండె. వాటి జతకి ఆయప్ప శార్దూలం పద్యాల్తో శతకాలూ, జాతకాలూ రాస్తావుండె. బొలే కతలు సెప్పుతా వుండె. అవనీ ఈడ సెప్పేకి కుదరదుకానీ ….ఒగటి సిత్తూరు తీరుపు–
     ముందు కాలంలో సూద్రోల్లు బాయిలో నీల్లు సేదినంక బాపనోళ్లు–ఆ తాడును,బాయి అరుగునూ,గిలకనీ కడిగి సుద్ది సేసి నీళ్లు తోడుతా వుండ్రంట. ఒగదినం కమసల ఆశార్లు నీల్లు సేదినంక బాపనోళ్లు అట్లే సేసిరంట. అపుడు ఆశారు తాము శూద్దరోల్లు కాదని బాపనోళ్లతో సమానమని సిత్తూరు కోరుట్లో వ్యాజ్యం ఏసిరంట.అవుడు కోరుట్లో ఆశార్లు గూడా బాపనోల్లతో సమానమే అని తీరుపు వొచ్చినంట.
     ఒగసారి ఒగ రైతు కొత్తగా కొడవలి సేపిచ్చేకి ఒస్తే పెద్ద ఆశారి ఇంట్లో ఉండ్లేదంట. పిల్ల ఆశారే కొడవలి తయారు సేసిచ్చినంట. అది మొద్దోని ముక్కు గూడా తెగుతావుండ్లేదంట.
     ఒగనాడు పెద్ద ఆశారి సొరకాయని మోసుకోని సేని తావ నుంచి ఇంటికొస్తావున్నంట. దావలో రైతు ఎదురుపడి “స్వామీ ఆయుదము మీ సేతిలో అయితేనే సరుక్కున తెగుతుంది.మీ పనితనానికి ఎదురే వుండెల్లేదు.  మీ పిల్లోనికి ఏమీ శాతగాదు. ఆయప్ప సేసిన కొడవల్తో కోసీ కోసీ సేతులు బొబ్బలు పాయకానీ గడ్డి తెగలేదు” అన్నెంట.
     అపుడు ఆశారి కొడవలి సేతికి తీసుకోని సేని గట్టుమిందపెట్టి సొరకాయతో రెండు దెబ్బలు ఏసి “ఇంక బాగ తెగుతుంది పో”– అన్నెంట. తిరగ దినం కొడవలి బాగా తెగుతా వుందనిసెప్పి రైతు గంపడు రాగులు తెచ్చి పాతర్లో పోసినంట!!
     ఈ ఆశారికి అవతలింట్లో లచ్చిమీ నారాయనాశారి. ఆయప్ప యంత ఇద్యా వంతుడంటే ఒగ మనిషిని ఎదురుగా కూకోపెడితే పొల్లు పోకుండా అట్లే బొమ్మ గీస్తావుండె.
    ఒగ సారి(1970 ఆ ప్రాంతం)నాకు బాగా గురుతు ఒగ ఆసామి వివేకానందుని ఫోటో తీసుకోని బొంబాయినుంచి కారులో ఒచ్చిండె. పెద్దది అయిదారు కేజీలది బంగారు రేకు ఇచ్చింటే బొమ్మలో వున్నట్లే దాన్ని ఉబ్బెత్తుగా సెక్కి తయారు సేసిండె. దాన్ని సూసేని ఇందూపురంలోని షావుకార్లంతా జటకాల్లోవొచ్చిండ్రి.
     వాళ్ల సేతుల్లో కళమ్మ తల్లి కాళ్లు కదిపి నడుస్తావుండె. వాళ్ళు రేకు మింద గీత గీస్తే అది సూర్యుని కిరనాల మాదిరీ మెరుస్తావుండె. సుత్తితో కొట్టి శాణంతో సెక్కిన ఏడిదయినా నిండయిన ఇగ్రహం గానో, ఇంపుదీరి పంటలు పండిచ్చే పని ముట్టుగానో తయారవుతా వుండె. వాళ్లంటే ఊరందరికీ గవురవమే!!  అట్లాది…….
     1975-80 కాలానికి పెద్ద ఆశార్లంతా కాలమయి పాయిరి. వాళ్ల వారసు దార్లకెవరికీ కళలు కాదుగానీ నాలుగు అచ్చరం ముక్కలుగూడా అబ్బలేదు!!అంతా కూలీ నాలీ సేసి బతుకులు ఈడుస్తా వుండారు. సివరి ఆశారి దాసప్ప(65సం.) ఒగడు మాత్రం వారానికి ఒగసారి కొలిమి అంటిచ్చి సావుకోసరం బతుకు ఈడుస్తా వుండాడు.
*****
    1960-65 కాలం తీసుకొంటే మా ఊరి జనాబా ఏడెనిమి నూర్లు వుంటుంది. అపుడు సదువు నేర్సింది( కేవలం చదవడం, రాయడం) మా నాయన ఇంకో ముగ్గురు నలుగురు మాత్రమే!! అయినా కళలకు కొదువే వుండ్లేదు!!
    పొద్దున్నే కపిల పాట్లు, సేన్లలో నాట్ల పాట్లు, తవ్వకాలవి, గానిగిండ్ల యాళ పాట్లు యా తావ సూసినా ఇనిపిస్తా వుండె. ఉప్పర అనుమంతప్ప అని ఒగాయప్ప వుండె. ఆయప్ప కత మొదలు పెడితే నెల దినాలు నిలపకుండా సెప్పుతా వున్నెంట!! అందుకే ఆయప్పని కతల అనుమంతప్ప అని పిలుస్తా వుండ్రి.
     ఇంగ ఇండ్లలో ఆడోల్లు ఇసర పాటలు, దంపుడు పాటలు, నలుగు పాటలు, యాగటి మనిషిని కూకోబట్టి పాడే పాట్లు, పెండ్లిపాట్లు, ఊయాల పాట్లు యన్ని రాగాల్తోనో ఇనిపిస్తా వుండె.
     ఇంగ పండగ లొస్తే యా సందులో సూసినా కోలాట పాట్లే!! నిక్కారు కట్టేది నేర్సిన ప్రతి మొగోడూ ఎగురుకొంటా కుణుసుకొంట కోలాట ఏస్తావుండె. అట్లా పాట్లన్నీ నేర్సు కోవల్లని, సిన్నప్పుటినుంచి నాకి శానా ఇదిగా వుండె. వలస బతుకులు, అనారోగ్యము, ఉద్యోగమూ సేసుకొంటా  పుట్టినూరికి దూరమయ్యి, 1990 లో రవ్వంత దగ్గరికొస్తి. పాటల కోసర ఎదికితే ఒగటీ కనిపించలేదు ఇనిపించలేదు!! అంతలోనే—–
IMG_0012
      అందరూ అచ్చిరాలు నేర్సల్ల, దేశాన్ని వుద్దారకం సేయల్ల అని వుద్యమము ఒస్తే నేను దాంట్లో కూరుకు పోతి. అపుడు పల్లి జనాలకి కోలాట పాటల్తో సదువు సెప్పిస్తే బాగుంటుంది అనుకోని కాలికి బలపం గట్టుకోని ఇల్లయిన ఇల్లూ తిరిగితే ఒగ కురుబాయపా రవ్వన్ని సెప్పె. అదిగూడా పూరా పాట్లు కాకుండా మొదటి శరణాలు మాత్రం అర్తం కాకుండా మారిపొయ్యిండివి!! రాగాలు మాత్రం మిగిలిండివి!! అవస్తలు పడి “లచ్చిమి పెండ్లి” అనే కోలాట పాటల కత తయారు సేస్తి. కోలాట ఏపిచ్చుకోని ఎర్రోని మాదిరీ ఊరూరు తిరగలాడితి!! అది తెలిసి ఆకాశవాణి అనంతపురము వాళ్లు మా గుంపును ఎదుక్కొచ్చి రికార్డు సేసుకుపొయ్యి శానా సార్లు ఇనిపిచ్చిరి!!
      ఒగ పాట సదవండి……
ఉంగరమా  ముద్దుటుంగరమా  మా రాము సేతిలో  బంగారమా….(ప్రజల నోట దొరికిన అవ శేషం)
తిరగ రాసింది..అక్షరమా ముద్దుటక్షరమా మా నోటి మాటలా ఆకారమా!!
                 నిన్ను మొదటెవరు పలికిరే అక్షరమా!!
                 నీకు పేరెవరు పెట్టిరే అక్షరమా!!
                 మా బతుకులో వెలుగైన అక్షరమా………!!
       ఇప్పుడు మా ఊరిసుట్టూ పది పదకొండు కాలనీలు (టీచర్స్ కాలనీ, వీవరుసు కాలనీ, ఆటో నగర్, డ్రయివర్స్ కాలనీ,ఎస్టేటు, యస్.సి. కాలనీ, పోస్టల్ కాలనీ, హవుసింగు బోర్డు, హవుసింగు బోర్డు కాలనీ, యన్. టి ఆర్. కాలనీ…..మొ.) జనాబా సూస్తే పది పదకొండు వేలు దాటింది. దగ్గరదగ్గర అంతా సదువులు నేర్సిన వాళ్ళే!!
      అయితే ఒగ మనిషికి గూడా పాటలు పాడేది రాదు. కతలు సెప్పేది అసలుకే తెలీదు. వానలు యగేసుకోనె. పెన్నేరు ఎండి పాయ. ఎండిన ఏటి ఇసకని బెంగలూరు సిటీకి రాజకీయమాయప్పగారు దొంగగా తోలి కోటాదీశులయిపాయిరి. పంటలు పచ్చదనాలతో కల్సి సహజముగా జనాల నోర్లల్లో పుట్టిన పాటలు, ఆటలు, నాటకాలు, కతలు కనిపించకుండా కాటికి సేరి పాయ.
    నికాల్సుగా, నిజాయితీగా, నిరాడంబరముగా, అమాయికముగా– అడవిలోని తంగేడు పూలంత అచ్చముగా బతికిన జనాలని పాడు సదువులు, యాపారం సినీమాలు,ఇండుల్లో దూరిన కట్ల పాములట్లా కేబులు వయిర్లూ, రాజకీయమోళ్ల మాయదారి ఎత్తులు నాశన సేశె.
     జీవితమంటే మరిసి నాటకాలాడేది, ఊరుమ్మడి బతుకులు మర్సి కులాల కోటలు కట్టేది, కష్టం సేసి తినేది మర్సి మాసకారి మాటల్తో దోసుకోని తినేది బాగ నేర్సిరి.
       ఇపుడు తినేది సినీమాలు.తాగేది సినీమాలు. పాడేది సినీమాలు. నడిసేది సినీమాలు. మాట్లాడేది సినీమాలు. రాజకీయాలు సినీమాలు. అన్నీ క్రుతకాలు  కుత్సితాలు నేల ఇడిసిన సాములు.
అసలు మనిషి మాయమై పాయ! ఆ మనిషితో పాటు కళల పంటలు కూడా కాలమయి పాయ!!
*

గమనమే గమ్యం-11

 

olga

ఆసుపత్రిలో ఆ రోజు విపరీతంగా పని మీద పడింది శారదకు. సరళ అనారోగ్యంతో నాలుగు  రోజులుగా రావటం లేదు. ఆడవాళ్ళ వార్డులో డ్యూటీ శారద మీద పడింది. ఉదయం ఆరు గంటలకే వెళ్ళిన శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. చాలా అలసటతో వెంటనే స్నానం చేసి నిద్రపోవాలనుకుంటూ వచ్చిన శారదను వాకిట్లోనే ఆపింది సుబ్బమ్మ.

‘‘అమ్మాయ్‌ , ఇంతాలస్యమా? ఎవరొచ్చారో చూడు. పొద్దున్నించీ మేమిద్దరం నీకోసం చూస్తున్నాము’’.

తల్లి ముఖంలో ఉత్సాహం చూస్తుంటే ఎవరో ముఖ్యులే అనిపించింది. బంధువు కాకూడదు భగవంతుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది.

పుస్తకం చదువుకుంటూ కూచున్న విశాలాక్షి శారదను చూసి నవ్వింది.

శారద విశాలాక్షిని గుర్తుపట్టలేదు.

‘‘నేను శారదా. విశాలాక్షిని. అన్నపూర్ణా, నువ్వు `నేను’’ శారద ఒక్క గంతులో విశాలాక్షి దగ్గరకొచ్చి భుజాలు  పట్టుకుని ఊపేసింది.

‘‘విశాలా, ఎన్నేళ్ళకు కనపడ్డావు. అన్నపూర్ణ కూడా ఈ మధ్య నిన్ను చూడలేదంది. ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావు. నాకు ఉత్తరాలన్నా రాయొచ్చుగదా ` ’’

‘‘ఉండు శారదా, కాస్త ఊపిరి తీసుకో. అన్నీ చెప్తాను’’

ఇద్దరూ చిన్నపిల్లల్లా  కారణం లేకుండా నవ్వుకున్నారు.

శారద స్నానం చేశాక సుబ్బమ్మ ఇద్దరికీ విందు భోజనం పెట్టింది.

ఇద్దరూ శారద గదిలో మంచం మీద చేరారు.

‘‘గుంటూరు ఒదల్లేదు అమ్మ. ఆమెతో పాటే నేనూ.  బాబుగారు పోయాక అన్నీ అమ్ముకుని గుంటూరు చేరాం కదా ` ఆ తర్వాత మన ఊరు వెళ్ళలేదు నేను. గుంటూరులో ఎన్నో జరిగాయి .తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతాలే . నా చదువు మాత్రం ఆగకుండా చూసుకున్నా. అమ్మ నాటకాల్లో వేషాలు  వేయటంమొదలుపెట్టి చివరకు తనే ఒక నాటకం కంపెనీ పెట్టింది. బి.ఏ. పూర్తి చేసి కూర్చున్నాను. రెండేళ్ళు ఊరికే గడిచిపోయాయి. మద్రాసులో చదవాలని నా కోరిక. అమ్మని అక్కడ నాటకం కంపెనీ మూసి ఇక్కడ తెరవాలని ఒప్పించే సరికి బ్రహ్మ ప్రళయం అయింది. ఎలాగైతేనేం వచ్చాం. ఎడ్మిషన్లకు ఇంకా చాలా టైముందిగా. ఈ లోపల కాస్త స్థిరపడాలి. నాటకాల్లో వేషాలు  వేయటం తప్పదు ` ’’

శారద ఆశ్చర్యంగా వింటోంది. విశాల నటిస్తుందా?

‘‘ఏం చదవానుకుంటున్నావు?’’

‘‘ఎమ్‌.ఏ.  ఎకనామిక్సు’’.

‘‘ఎకనామిక్సా? ఎందుకు?’’

‘‘ఎందుకేమిటి? నాకిష్టం. పైగా రేపు దేశానికి స్వతంత్రం వస్తే దేశాన్ని ఆర్థికంగా ఎలా నడిపించాలో ఎకనామిక్సు చదివితేనే తెలుస్తుంది.’’

‘‘ఓ! ఆర్థిక శాస్త్రవేత్తవవుతావన్నమాట’’

‘‘నువ్వు డాక్టర్‌వి కావటంలా’’

‘‘పాపం అన్నపూర్ణ చదువే ’’ జాలిగా అంది శారద.

‘‘పాపం అని జాలిపడనక్కర్లేదు. అది రాజకీయాల్లో దిగిందిగా. దేశానికి స్వతంత్రం వస్తే ఏ మంత్రో అవుతుంది. మనిద్దరం దాని దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాలి’’.

ఇద్దరూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని నవ్వుకున్నారు.

‘‘ఇప్పుడేం నాటకం వేస్తున్నారు?’

‘‘ఏముంది? శాకుంతలం’’.

‘‘నువ్వు శకుంతవా?’’

‘‘ఊ,  నా పాట వింటావా?’’

అభినయిస్తూ పాడింది  విశాలాక్షి . ముగ్ధురాలయి చూసింది శారద.

‘‘నువ్వు ఆర్థికశాస్త్రం చదవొద్దు ఏమొద్దు. హాయిగా నాటకాలు వేసుకో. జనం నీరాజనాలు పడతారు’’.

‘‘వెంటపడతారే తల్లీ. మగాళ్ళున్నారే. ఛీ, ఛీ . ఒదలరు. కానుకంటారు. షికారుకి రమ్మంటారు’’.

‘‘అంతమంది వెంటపడుతుంటే బాగానే ఉంటుందేమో’’.

‘‘తన్నబుద్ధేస్తుంది ఒక్కొక్కడిని’’

‘‘ఒక్కడన్నా నచ్చలేదా?’’

‘‘ఛీ! మగాడా? నచ్చటమా? వాళ్ళ వెకిలి వేషాలు చూస్తే నిప్పెట్టబుద్ధవుతుంది.’’

‘‘నీతోపాటు వేషాలు వేసే నటులలో ` దుష్యంతుడెవరు?’’

‘‘యాక్‌. బీడి కంపు’’

ఇద్దరూ పొట్టు చేత్తో పట్టుకుని నవ్వీ నవ్వీ ఆయాసపడ్డారు.

‘‘మీ అమ్మ వాళ్ళందరితో కంపెనీ నడుపుతోంది. నువ్వు వాళ్ళని అసహ్యించుకుంటున్నావ్‌.’’

‘‘మా అమ్మని చూస్తే నాకు కాస్త కోపంగానే ఉంటుందే. మంచిదే సమర్థురాలే . కానీ  ఏం చెప్పాలి? బాబు గారంటే అమ్మకి చాలా ప్రేమ. ఆయన పోయాక గుంటూర్లో గోవిందయ్య అనే ఆయన అమ్మకు దగ్గరయ్యాడు. మంచిగానే ఉండేవాడు. అండగా ఉంటాడ్లే అనేది అమ్మ. నాలుగేళ్ళకు ఏమయిందో మళ్ళీ రాలేదు. కనపడకుండా పోయాడు. ఇక తనకు తనే అండ అని నాటకం కంపెనీ పెట్టింది అమ్మ. ఇక చుట్టూ ఎంత మంది చేరారో. నన్ను నేను వాళ్ళందర్నించీ రక్షించుకోవాల్సి వచ్చింది. అమ్మకు తనను తాను రక్షించుకోటానికి ఒకటే సూత్రం తెలుసు. రంగనాధరావు అనే ప్లీడర్‌ని దగ్గరకు రానిచ్చింది. ఆయనగారి మనిషి అంటే ఇక ఎవరూ పిచ్చి వేషాలెయ్యరు అంది. నిజంగానే ఆయన మా జీవితంలోకి వచ్చాక నాకు కాస్త తెరిపి వచ్చింది. బి.ఏ చదువు పూర్తయింది. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మ వయసయిపోయింది. నన్ను ఎవరి అండనైనా పెట్టాలని అమ్మ ఆలోచన. నాకు అక్కడే అమ్మను చూస్తే మండిపోతుంది. ఎమ్మే చదివి ఉద్యోగంలో స్థిరపడాని నా ఆలోచన. ఇద్దరం పోట్లాడుకుంటాం.

మా అమ్మ చాలా సమర్థురాలు. తెలివైంది. కానీ నేనావిడలా బతకను.’’ విశాలాక్షి ఆపకుండా చెప్పుకుపోతుంది. శారద తనకింతవరకూ తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు విశాలాక్షిని చూస్తోంది.‘‘నువ్వు మగపిల్లలతో  కలిసి చదువుతున్నావు. ఎవరినైనా ప్రేమించావా? ’’ అడిగింది విశాలాక్షి.

‘‘లేదు’’ అని నవ్వేసింది శారద.

‘‘ఇంత అందమైన నిన్ను ఎవరూ ఇష్టపడలేదా?’’

‘‘ఇష్టం, ప్రేమ, స్నేహం వీటి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నా’’

‘‘ఆలోచించు మరి. పెళ్ళి వయసు దాటిపోతోంది. ఇప్పటికే ఆలస్యమైంది.’’

‘‘పెళ్ళా? నేను పెళ్లి చేసుకోను.’’

olga title

విశాలాక్షి నవ్వేసింది. ‘‘అందరు ఆడపిల్లలు  అనేమాటే నువ్వూ అన్నావు. ఐనా నువ్వెందుకు పెళ్ళి చేసుకోవు? నేను పెళ్ళి చేసుకోనన్నానంటే దానికో అర్థముంది’’.

‘‘ఏంటో ఆ అర్థం?’’

‘‘నన్ను ఏ మగవాడూ గౌరవంతో, ప్రేమతో పెళ్ళాడడు కాబట్టి. నా కులం, మా అమ్మ, ఈ నాటకాలు, వీటన్నిటినీ చూసి నన్ను ఎవరైనా గౌరవిస్తారా? నా అందం చూసి వస్తారనుకో. వాళ్ళు నాకక్కర్లేదు. నా పెళ్ళి అసాధ్యం’’.

‘‘అంత అసాధ్యం కాదులే. లోకం మారుతోంది. నాకు డాక్టర్‌గా నా వృత్తి, దేశ స్వాతంత్రం ఇవి తప్ప పెళ్ళీ, పిల్లలూ ఒద్దనుకుంటున్నా’’.

‘‘ఓ! అన్నపూర్ణ పిచ్చి నీకూ ఉందా?’’

‘‘పిచ్చేమిటే? నీకు స్వతంత్రం ఒద్దా?’’

‘‘కావాలే .చాలా చాలా స్వతంత్రాలు కావాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ స్వతంత్రం కావాలంటున్నవాళ్ళు నన్ను మనిషిగా చూడాలి. నన్ను ఆడదానిగా చూసి వెంటబడే మనుషుల నుంచి స్వేచ్ఛ కావాలి. నా కులం నుంచి నా వృత్తి నుంచి బైటపడి బతికే స్వతంత్రం కావాలి. గౌరవప్రదమైన ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకునే స్వతంత్రం కావాలి. నా బతుకు నన్ను బతకనిచ్చే స్వతంత్రం కావాలి’’.

‘‘దేశం స్వతంత్రమైతే అవన్నీ నీకు వస్తాయి’’.

‘‘నువ్వు పిచ్చిదానివా? నన్ను పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఏమీరావు. నా బతుకు మారాలంటే స్వతంత్రం చాలదే ` ఇంకా చాలా కావాలి. అవేంటో నాకు తెలియదు’’.

‘‘ఏమిటో తెలియనిదేదో రావాలంటే ముందు స్వతంత్రం రావాలి. జాతికి గౌరవం లేనిది నీకెలా వస్తుంది?’’

‘‘తోటి మనిషిని గౌరవించలేని జాతికి స్వతంత్రం ఎలా వస్తుంది? ఆ స్వతంత్రంతో ఎవరికైనా ఏం జరుగుతుంది?’’

‘‘నువ్వు మరీ నిరాశావాదిలా మాట్లాడుతున్నావు?’’

‘‘నా అంత ఆశావాది ఇంకొకరు లేరు. నా స్థానంలో నువ్వుంటే కూడా నాలా ఆశతో బతికే దానివా అనేది నాకు అనుమానమే. నేనింత హీనస్థితిలో కూడా కలలు కంటున్నా. ఎమ్మేపాసవుతా. ఇంకా పరీక్షలు రాస్తా. పెద్ద అధికారి నవుతా .  నా హోదా చూసి అందరూ నన్ను గౌరవిస్తారు. నేను రాగానే లేచినిలబడతారు. నా వెనక చెప్పుకుంటారేమో ఈమె తల్లి ఫలానా .ఈవిడా నాటకాల్లో వేషాలు  వేసేదట. కానీ నా ముందు నోరెత్తలేరుగా. అలాంటి అధికారం సంపాదిస్తా. ఆ ఆశతో బతుకుతున్నా’’

శారద విశాలాక్షి చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యానిస్తున్నట్లు గట్టిగా తట్టింది.

‘‘నీ ఆశ నెరవేరుతుంది. నే చెప్తున్నాగా’’

వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు.

***

 

లోపల సరస్సులున్న మనిషి

 

కె. శ్రీనివాస్‌

 

దేవతలకు ముప్పయ్యేళ్ల దగ్గరే వయసు ఆగిపోతుందట.  త్రిపురనేని శ్రీనివాస్‌ రాక్షసుడే అయినా ముప్పయిమూడేళ్ల వయసు దగ్గర ఆగిపోయాడు. ఆ తరువాత కాలం పందొమ్మిదేళ్ల ముసలిదైపోయింది. అతనూ అతని జ్ఞాపకమూ అతని స్ఫురణా మిసమిసలాడే యవ్వనంతోనే నిలిచిపోయాయి. శ్రీనివాస్‌ కవిత్వం కూడా.  ఇప్పుడు మరోసారి  కొత్తగా త్రిశ్రీ అక్షరాలను తడుముతుంటే,  మొదట తెలుస్తున్నది ఆ యవ్వనమే. అదేదో భౌతికమయినది కాదు , జలజలలాడిపోయే, జివజివలాడిపోయే, కువకువలాడిపోయే, కళకళలాడిపోయే కవిత్వయవ్వనం.

త్రిశ్రీని తెలుగు సాహిత్యం సాగనంపలేదు. అతని ఉనికికి ముగింపు చెప్పలేదు. ఒక దిగ్భ్రాంతిలో, ఒక దుఃఖంలో కలవరపడింది. అతన్నే ఒక నినాదంగా పలవరించింది.  హో అంటూ అతని కవిత్వాన్ని ఉచ్చాటన చేసింది. కార్యకర్తృత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అంతే తప్ప, హఠాత్తుగా నిష్క్రమించిన కవిని తూకం వేసి చరిత్ర అరలో బిగించలేదు. అతని జ్ఞాపకానికి పటం కట్టలేదు.  అతను చేసిన పనుల అర్థమేమిటో, సారమేమిటో అవగతం చేసుకోలేదు. కొనసాగింపూ జరగలేదు. ఆ అర్థంలో కూడా అతను యవ్వనంలోనే నిలిచిపోయాడు.

కవులందరికీ, సుడిగాలి జీవితం జీవించిన సామాజికులందరికీ ముగింపు-కొనసాగింపు తప్పనిసరి తతంగమేమీ కాదు. నిజానికి అట్లా జరగడం ఇష్టంలేదన్నట్టు  త్రిశ్రీయే  సంచరించాడు. ఒకరి వెనుక నడవటం చేత కాక, ఏ యిల్లూ లేక,  ఒక్క దేహం చాలని గుండెతో – సాంప్రదాయిక సాహిత్య అంత్యక్రియలను తానే నిషేధించుకున్నాడు.. అర్థం కానిదంతా అనర్థమేననుకుని,  ఎడంగానడిచినవారంతా పెడవారేననుకునే రెడీమేడ్‌ తరాజులు మాత్రమే అర్జెంటుగా  త్రిశ్రీ ఒడ్డూపొడువూ లెక్కలు కట్టారు. అతని చేతనాస్తిత్వపు నానార్థాలను చరిత్రచలనంలో తప్ప పట్టుకోలేమని  ప్రేమికులు నిస్సహాయులయ్యారు

ఆరాధన ఎక్కువై, అంచనా వేయలేమనుకుంటాము కానీ, ఎంతటి చలచ్చంచల దీప్త లేఖినులైనా వ్యాఖ్యలకు, విశ్లేషణలకు అతీతమైనవి కావు. కాకపోతే, మేధ గవాక్షాలను ఓరగానైనా తెరచి ఉంచుకోవడం అవసరం. కొత్తగాలులకు వేసట పడకుండా, అంతిమ నిర్ధారణలకు ఆత్రపడకుండాకాసింత సహనం అవసరం. ఇప్పుడు త్రిశ్రీని అర్థం చేసుకోవాలంటే, అతని వాచకాలకు పందొమ్మిదేళ్ల చరిత్రను జోడించాలి. అతని అనంతరం తెలుగు సమాజం సమకూర్చుకున్న అనుభవాల, జ్ఞానాల నేపథ్యంలో అతనిని చూడాలి. ఏ అక్షరానికైనా అర్థం, అపార్థం చారిత్రకమే.

ఎనభైల మధ్యలో కవిగా మొదలైన త్రిశ్రీ, విప్లవకవిత్వానికి కొత్త డిక్షన్‌నీ, మిలిటెంట్‌ వ్యక్తీకరణనీ, మొత్తం మీద నూత్న యవ్వనాన్నీ ఇవ్వాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతను ఒక్కడే కాడు, ఒంటరీ కాదు. కానీ, కాలం అప్పటికే కొత్త ఉద్యమాలను కడుపుతోవున్నది. అసంకల్పితంగానో సంకల్పపూర్వకంగానో త్రిశ్రీ కవిత్వం కొత్తపలుకులు పలికింది. తన కవిత్వంలోని వేగాన్నీ చెళ్లుమనిపించే కొరడాకొసలనీ కాక, ఆగామి ఉద్యమాల ప్రాతిపదికల ప్రకటనలను లోకం అధికంగా పట్టించుకున్నది. కవి రాసింది కాక, పాఠకసమాజం అర్థం చేసుకున్నదే కవిత్వార్థం అవుతుంది, కాలస్వభావంతో వెలిగిందే పతాకశీర్షిక అవుతుంది. ‘నీడ వెనుక ఆలోచన కదలాడదు’- ఏ నీడ? ఎవరి నీడ? సంతకం ఒకేలా చేయలేకపోవడం ఏమిటి? పునరుక్తుల మీద, ప్రతిధ్వనుల మీద అతనికి ఎందుకంత వ్యతిరేకత? అది సవ్యంగానే అర్థం అయిందా?

త్రిపురనేని విప్లవోద్యమాన్ని ఆరాధించాడు. మరో రకంగా చెప్పాలంటే విప్లవోద్యమంలో ఉండే నిర్భీతిని, విస్ఫోట గుణాన్ని, ఉద్వేగానికి ఆచరణకు ఉండే అతి సాన్నిహిత్యాన్ని అతను ప్రేమించాడు. రహస్యాన్ని, ధిక్కారాన్ని, ఆత్మత్యాగాన్నీ ప్రేమించాడు. ఉద్యమానికి తనను తాను పర్యాయం చేసుకుని మాట్లాడాడు.  అదే సమయంలో అతను అనుచరత్వాన్ని, విధేయతను ఈసడించుకున్నాడు. నంగితనాన్ని, సానుభూతుల్ని ఏవగించుకున్నాడు. కవిత్వంలో కూడా రహస్యోద్యమంలో ఉండే గుణాలన్నీ ఉండాలనుకున్నాడు. తనదికాని అనుభవాలను, తాము మనస్ఫూర్తిగా నమ్మని అంశాలను ఆపాదించుకునే సహానుభూతులను అయిష్టపడ్డాడు. వ్యవస్థను వ్యతిరేకించడం అంటే వ్యవస్థీకరణను వ్యతిరేకించడం కూడా అనుకున్నాడు. కుటుంబాన్ని పెళ్లినే కాదు,  ప్రేమల వెనుక పొంచి ఉన్న వ్యవస్థలనూ వెక్కిరించాడు. ఏకకాలంలో ఒకర్నే ప్రేమించలేనని, తనసూర్యోదయానికి ఒక్క ఆకాశం సరిపోదని బాహుళ్యవాదాన్ని సమస్త జీవనరంగాలకూ అన్వయించాడు. తనకు అనుచరులూ విధేయులూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. స్నేహాల్లో ప్రజాస్వామ్యాన్ని ఆచరించాడు.

వ్యక్తివాద అరాచకవాద విషసాంస్కృతికవాద వ్యక్తిగా కొందరికి  కనిపించిన త్రిపురనేని శ్రీనివాస్‌, ఉద్యమాలను వ్యతిరేకించలేదు. సాహిత్యంలో రాజకీయాంశాలను, సామాజికాంశాలను వ్యక్తం కావడాన్ని కాదనలేదు, పైగా ప్రోత్సహించాడు. ప్రచురణకర్తగా తను వేసిన పుస్తకాలలో సగం ఉద్యమాలకవిత్వం అయితే, తక్కిన సగం వ్యక్తులుగా సామాజికుల కవిత్వం. గొంతు బలపడి స్థిరపడిన ఉద్యమానికి (గురిచూసి పాడేపాట)తొలిసంకలనాన్ని, వర్తమానంలో విస్తరిస్తున్న మరో అస్తిత్వ కవిత్వ ఉద్యమం చిక్కపడుతున్న దశలో (చిక్కనవుతున్న పాట) మహాసంకలనాన్ని, ఇంకొక బాధిత అస్తిత్వ వాదం తొలికేక పెట్టినప్పుడే పుస్తకాన్ని (పుట్టుమచ్చ) ప్రచురించడం- సాహిత్య, కార్యకర్తగా శ్రీనివాస్‌ ఉద్యమవ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. అనుయాయిత్వాన్ని, పునురుక్తిత్వాన్ని అతను ఉద్యమతత్వానికి పర్యాయపదంగా వాడలేదు. ఉద్యమావరణాల్లో వ్యాపిస్తున్న అవాంఛనీయతలకే సంకేతించాడు.  విరసం నుంచి వెళ్లిపోవలసివచ్చి, రహస్యోద్యమం పుస్తకం బయటకు వచ్చి, తనపై విప్లవవ్యతిరేక ముద్ర విస్తరిస్తున్న సమయంలో కూడా అతను విప్లవకవిత్వం రాశాడు. ఆవేశమూ గాఢతా మమేకతా కలగలసిన విప్లవకవిత్వం ఎట్లా ఉండాలని తాను అనుకుంటాడో అట్లాగే అతను ఆ కవిత్వం రాశాడు.  అతనేమిటో అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతే, తప్పు అతనిది కాదు.

పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా, కార్యకర్తగా, కవిగా, వ్యక్తిగా త్రిపురనేని శ్రీనివాస్‌ చాలా పనులు చేసినా, వాటన్నిటిలోనూ ఏకసూత్రతతో కూడిన వైవిధ్యం ఉన్నది, మరి వైరుధ్యాలు కూడా ఉన్నాయా? ఇందుకు సమాధానం వెదికేముందు, స్వేచ్ఛకు ఎవరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? రాజకీయ విశ్వాసాలకు, మానవవిలువలకు మధ్యనుండే ఎడం ఎంత ? – వంటి ప్రశ్నలనేకం వస్తాయి. మరొకరి అనుభవాన్ని ఎవరూ పలవరించవలసిన పనిలేదని, నిషేధించిన అక్షరం మీదనే తనకెప్పుడూ మోజు అని- త్రిశ్రీ చెప్పినప్పుడు అవి సమకాలపు ప్రయోజనం కోసం అర్థవ్యాకోచం చెందాయా? ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సమాజంలో పరిణతి పెరిగిందా? లేక- మరింతగా విలువల వ్యవస్థీకరణలోకి  కూరుకుపోయిందా?

శ్రీనివాస్‌ సాహిత్య జీవితాచరణ నుంచి తెలుగు సాహిత్యం, ముఖ్యంగా పురోగామి సాహిత్యం ఎంతో ప్రయోజనం పొందింది. పాతికేళ్ల వెనుకకు వెళ్లి చూసినప్పుడు, ఆ కాలపు మలుపులో శ్రీనివాస్‌ కీలకమయిన కర్తవ్యాలు నిర్వహించాడు. ఏకైక నాయకపాత్రలో ఉన్న విప్లవసాహిత్యం స్థానాన్ని బహుళ సాహిత్యవాదాలు పంచుకునే పరిణామానికి అతను ఫెసిలిటేటర్‌గా ఉన్నాడు. వేయి పూవులుగా వికిసించగల తెలుగు కవిత్వానికి అతను తోటమాలిగా వ్యవహరించాడు. కవిత్వం నాణ్యత పెరగడానికి, నిర్భయమైన ప్రశ్నలు వెల్లువెత్తడానికి అతను సహాయపడ్డాడు. వ్యక్తివాదులుగా, అనుభూతివాదులుగా, అస్పష్ట-సంక్లిష్ట వ్యక్తీకరణవాదులుగా పేరుపడ్డ అనేకమంది ఒంటరి సామాజికులను కవిత్వపాఠకులందరి ముందుకు తెచ్చాడు. వారి నుంచి నేర్చుకోవలసింది నేర్చుకోవలసిందేనని తాను స్వయంగా అజంతా ప్రభావంలో పడి మరీ చెప్పాడు.

ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్టే, త్రిశ్రీ కూడా ‘కవిత్వం కావాలి కవిత్వం’ రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో ‘ అతడు అక్షరానికి మాతృదేశం’ పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్‌ కవిత్వంలో ముఖ్యమైన, కీలకమయిన పద్యాలే. వాటిలో ఆవేశం, స్వాభిమానం, ఒకింత అహంకారం- అతని ప్రకటనలను కవిత్వంగా మలిచాయి.  కానీ, అతనికి అవి మాత్రమే చాలా ఇష్టమైనవని చెప్పలేము. ‘ద్వీపవతి’ కవితను అతను ఎంత ఇష్టపడి రాసుకున్నాడో, రాసి ఇష్టపడ్డాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అజంతా గుప్పుమంటున్నా ‘నిశ్శబ్దం సాకారమై పరిమళిస్తుంది’ పోయెంను ఎంత ప్రేమించాడో కూడా నాకు తెలుసు. కవిత్వం అతని దృష్టిలో ‘అక్షరఖచిత భాష’. పొదగడం తప్ప అతను పూసగుచ్చలేడు, పోగుపెట్టలేడు.  ద్రాక్షవిత్తనాన్ని తపస్వి ముత్యపు శిల్పంగా పోల్చిన గాఢత కానీ, పుస్తకం తనను తిరగేయాలని,  కవిత్వం తనను రాయాలని, ఎండలు వానలకు తడిశాయని- చేసిన అనేక విలోమ ఊహలు కానీ ‘రహస్యోద్యమం’ లో అడుగుడుగునా మనలను ఆశ్చర్యపరుస్తాయి. ‘రహస్యోద్యమం’ పుస్తకంగా వచ్చినప్పుడు- ఫెటీల్మన్న చప్పుడు. దేనినో అధిగమించినట్టు, బకాయిపడ్డ నిట్టూర్పుకు విముక్తి లభించినట్టు. కవిత్వానికి అంతకుమించి సార్థకత ఏముంటుంది?

త్రిశ్రీ వెళ్లిపోయాక కూడా కాలం కదులుతూనే ఉన్నది. లోకం మారుతూనే ఉన్నది. అతను ముందే చెప్పిన మాటలు అనేకం తరువాత మన నిఘంటువుల్లోకి చేరిపోయాయి. కవిత్వం కావడమే కవిత్వానికి మొదటి షరతు అని అందరం ఇప్పుడు ఒప్పుకుంటూనే ఉన్నాము. మానవవిలువల ప్రజాస్వామ్యీకరణ జరగడం సంఘవిప్లవంలో భాగమని, సంఘవిప్లవానికి అవసరమనీ గుర్తిస్తూనే ఉన్నాము. స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు తెలుగుసాహిత్యంలో అవిభాజ్య, అనివార్య పరిణామాలని చరిత్రపుస్తకాలలో చేర్చుకున్నాము. టిబెట్‌ విషయంలో చైనా చేసింది తప్పని శ్రీనివాస్‌ రాసినప్పుడు అభ్యంతరపెట్టిన విప్లవసాహిత్యోద్యమం ఇప్పుడు భిన్నాభిప్రాయానికి చోటు ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. మరి త్రిశ్రీ అప్పుడు ఎందుకు అపార్థమయ్యాడు? ఎందుకు అతని ‘జాము లోయల్లో నిదురించని’ యవ్వనాన్ని చూసి కొందరు భయపడ్డారు? అతను కూడా ఒక  సామూహిక ఏకవచనమని ఎందుకు గుర్తించలేకపోయారు?

త్రిపురనేని శ్రీనివాస్‌ రహస్యోద్యమ కవితలకు రహస్తాంత్రికుడు ‘మో’ ఇంగ్లీషు అనువాదాలను కలిపి వేస్తున్న పుస్తకం ఇది. పాఠకులుగా ఒకరికొకరు ఇష్టులే కానీ, కవులుగా ఇద్దరి కోవలు వేరు.  సకల మార్గాల తెలుగు కవులను అనువదించిన ‘మో’కు త్రిశ్రీ కఠినుడేమీ కాదు కానీ, ఎందుకో, కొన్ని పద్యాలు హడావుడిగా అనువదితమయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్వేచ్ఛ ఎక్కువ తీసుకోవడం పరవాలేదు.  మూలకవి భావానికి మరీ ఎడంగా ఉన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి. శ్రీనివాస్‌ ఉన్నప్పుడే ‘మో’ ఈ అనువాదాలు చేశారట.  ఆ తరువాత అయినా ‘మో’ ఒకసారి సరిచూసి ఉంటే కొన్ని పొరపాట్లు లేకుండా  ఉండేవి.

“రహస్యోద్యమం”  తాజా ప్రచురణకు ముందుమాట

ఆగస్టు 10, 2015

 

వెయ్యి క్షణాల మౌనమే వ్యాఖ్యానం..

 

 కందుకూరి రమేష్ బాబు
Kandukuri Rameshసారంగ మిత్రులకు తెలుసు, ఈ వారం నాది ‘ఏక చిత్ర ప్రదర్శన’ జరుగుతోంది అని!
చిత్రం ముందు ఆగి చూడమని చిన్నగానే పెద్ద ప్రయత్నం.
వీలైనన్ని క్షణాలు గంటలు గా మారుతున్నాయి అక్కడ.
హ్యాపీ.

కాని ఇక్కడా ఒక చిత్రమే.
దాదాపు వంద వారాగాలుగా.
ఐతే మాటలు ఎక్కువే.

కాని ఈ  చిత్రం బాధ.
ఒక వేడి. శీతలం  కూడా.

మృత్యు శీతలం.
ఇందు మూలంగా మౌనం శరణ్యం.

ఉన్నదే. ‘ఒక్క చిత్రం వేయి అక్షరాలకు పెట్టు’ అన్న మాట ఉన్నదే.
నా షో కు కూడా అదే  మకుటంగా పెట్టుకున్నాను.
కాని ఇక్కడ, ఈ చిత్రానికి మటుకు అక్షరాలు కూడా అనవసరం.
మౌనం. వేయి క్షణాల మౌనం కావాలి.

ఈ సారి అదృశ్యం జీవితం.
దృశ్యం మరణం మరి.

డెత్ అఫ్ లైఫ్.

చూడండి.
కొద్ది కొద్దిగా తేలియాడుతూ…
మునిగిపోతూ…

అంతిమ దృశ్యం ఇలా ఉంటుందా?
చిక్కగా ..అందంగా…

ఏమో?

*

కోతిస్వామ్యంలో విపక్షం

 

 

సత్యమూర్తి

కోతుల రాజ్యం చట్టసభ అరుపులతో, కేకలతో దద్దరిల్లుతోంది. అధికార, విపక్ష కోతులు సభాధ్యక్ష స్థానం ముందుకు దూసుకొచ్చి గొడవ చేస్తున్నాయి.

‘‘మన రాజ్యం సొమ్మును దోచుకెళ్లిన ఆ నల్లకొండముచ్చును గంపెడు బాదం పప్పులు తీసుకుని కట్లువిప్పి వదిలేసిన మంత్రి బొట్టమ్మ రాజీనామా చెయ్యాలి.. రాజీనామా చెయ్యాలి..’’ విపక్ష కోతులు గట్టిగా అరిచాయి.

బొట్టమ్మకు కోపం మండుకొచ్చింది. తోకను నిలువునా నిక్కబొడుచుకుని, కోరలు బయటపెట్టి గుర్రుమంది.

‘‘మీ పీకల్ని కసుక్కున కొరికేస్తా. ఆ కొండముచ్చు పెళ్లాం చావుబతుకుల్లో ఉందంటే సాటి కోతిజాతిదే కదా అని జాలిపడి దాన్ని వదిలేశా. అది పెళ్లాం దగ్గరికిపోకుండా ముండదగ్గరికి పోతుందని నాకేం తెలుసు? నేను బాదం పప్పులూ తీసుకోలేదు, గీదం పప్పులూ తీసుకోలేదు. మేం తిన్న గంపెడు పప్పులూ నేనూ, నా మొగుడూ, కూతురూ సొయంగా చెట్టెక్కి తెంపుకుని పగలగొట్టుకుని తిన్నవి. ఆ పిప్పి చూసి తెగ కుళ్లుకుంటున్నారు. నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి.. బస్తీమే సవాల్..’’ అని కసిరింది.

‘‘నువ్వు గంపెడు బాదం పప్పులు తీసుకునే వదిలేశావు. ఈ దేశంలోని కోతులకు రెండు బాదం గింజలు దొరకడమే గగనంగా ఉంటే నీకు గంపెడు ఎలా వచ్చాయ్? గడ్డి కరిచానని, తప్పు ఒప్పేసుకుని, రాజీనామా చెయ్!’’ విపక్ష కోతులకు పెద్ద అయిన బోడెమ్మ అరిచింది. అసలే ఎర్రగా ఉన్న దాని ముఖం కోపంతో మరింత ఎరుపెక్కింది. బోడెమ్మకు దాని బిడ్డ గట్టిగా వంత పలికింది. ‘‘బాదం పప్పులు మింగిన బొట్టమ్మ గద్దె దిగాలి. పెద్దమంత్రి బవిరిగడ్డం వెంటనే ఇక్కడికొచ్చి జవాబు చెప్పాలి!’’ అని గొంతు పగిలేలా అరిచింది.

విపక్ష కోతులు చప్పట్లు చరిచాయి.

బొట్టమ్మ తోక మరింత ఉబ్బింది.

‘‘ఒసే బోడీ.. నోరు మూసుకోవే! నువ్వూ, నీ మొగుడూ ఆనాడు చిప్పెడు దోసగింజలు పుచ్చుకుని ఒకటి కాదు, రెండు దొంగముండా తెల్లకొండముచ్చులను వదిలేయలేదా? ఒరే బోడెమ్మ కొడుకా! నోటికొచ్చినట్టు వాగమాక. ఇంటికెళ్లి నీ వంశ చరిత్ర చదువుకో!’’

మూడువందల అధికార కోతులు కిచకిచ నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొట్టాయి. సభ భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది.

విపక్ష కోతులు కూడా వెనక్కి తగ్గలేదు. అన్నీ కలిపి నలబయ్యే ఉన్నా కోరలు బయటపెట్టి సత్తువకొద్దీ భీకరంగా గుర్రుమన్నాయి.

అధికార కోతులు కాస్త భయపడ్డాయి. వెంటనే తేరుకుని, ‘‘విపక్షం కోతిస్వామ్యాన్ని హత్య చేస్తోంది’’ అని నినదించాయి.

సభాధ్యక్ష కోతి చిద్విలాసంగా నవ్వింది. అధికార అరుపులు దానికి కర్ణపేయంగా అనిపించాయి.

‘‘అవును, విపక్షం కోతిస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది, పూడ్చేస్తోంది, కాల్చేస్తోంది. విపక్ష కోతులకు రేపట్నుంచి ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వను’’ అంటూ సభను వాయిదా వేసింది.

***

Painting: Slade Smiley

Painting: Slade Smiley

అధికారపక్ష కోతులన్నీ పసనచెట్టు కొమ్మలమీద సమావేశమయ్యాయి.

‘‘సభ ఇట్లా సాగితే కష్టం. విపక్ష కోతులు చెప్పేదే నిజమని దేశం నమ్మే ప్రమాదముంది. అందుకే ఎదురుదాడి చేయండి. బోడెమ్మపై, బోడెమ్మ కొడుకుపై నానా నిందలూ వెయ్యండి. కోతిస్వామ్యాన్ని మనం కాదు, అవే హత్య చేస్తున్నాయని చాటింపు వెయ్యించండి..’’ పెద్ద మంత్రి బవిరిగడ్డం ఆదేశించింది.

భేటీ ముగిసింది. బవిరిగడ్డం చెట్లకొమ్మలు పట్టుకుని నాలుగు యోగాసనాలు వేసింది. ఆయాసం తీర్చుకుని దోనెడు తేనెతాగి బ్రేవ్ మని త్రేన్చింది. చచ్చిన మిణుగురుపురుగులను తన పేరులా అతికించిన పట్టు చొక్కా వేసుకుని, నీటిగుంటలో తనను తాను చూసుకుంటూ తెగమురిసిపోయింది. ఇంతలో రాజ్యపెద్ద తెల్లగడ్డం నుంచి పిలుపు వచ్చింది.

***

‘‘నాయనా, బవిరిగడ్డమూ! పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సుమీ. అసలు నువ్వు రావేమోనని కాస్త భయపడ్డాను. సభలో అధికార కోతులు తమ గొంతు నొక్కేస్తున్నాయని విపక్ష కోతులు నాకు తాటాకు ఫిర్యాదు చేశాయి. సభాధ్యక్ష కోతి తీరు నాకేం నచ్చలేదు. అది మీ పక్షమే కావొచ్చు, కానీ మనకొక సభానీతి, న్యాయమూ ఉంది. ఎంతైనా మనది కోతిస్వామ్యం. కొన్ని కనీస విలువలూ, సంప్రదాయాలూ పాటించాలి. కనీసం పాటిస్తున్నట్టు నటించనైనా నటించాలి. విపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఒక్క విపక్షాన్నే కాదు గొంతుక ఉన్నవాళ్లందరినీ మాట్లాడనివ్వాలి.. గొంతుకలేనివాళ్ల మూగగొంతుకలనూ వినాలి..’’ తెల్లగడ్డం పండిన జామపండును కొరుకుతూ అంది.

బవిరి గడ్డం చిరాగ్గా చూసింది.

‘‘నువ్వెప్పుడూ ఇంతే. ఎప్పుడూ ఆ పాతకాలం సొల్లు కబుర్లే చెబుతావు. ఈ దేశంలోని అశేషవానరానీకం మమ్మల్ని ఎన్నుకున్నది మా మాటలు వినడానికే కానీ విపక్షం మాటలు వినడానికి కాదు. నీకు తల పండిపోయింది కానీ, బుర్ర పండలేదు..’’

తెల్లగడ్డం నొచ్చుకుంది. అయినా పట్టించుకోకుండా తన ధర్మాన్ని పాటించింది.

‘‘బవిరిగడ్డమూ! నా మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అయినాసరే, నిష్కర్షగానే మాట్లాడదలచుకున్నా. నీకు దేశస్థాయి రాజకీయాల్లో అనుభవం తక్కువ కనుక ఇలా అవివేకంగా మాట్లాడుతున్నావు. ఈ సువిశాల వానరరాజ్యంలో నువ్వు ఇదివరకు ఓ  మండలానికే పెద్దమంత్రిగా పనిచేశావు. దేశానికి ఎట్లా పెద్దమంత్రివయ్యావో నీ అంతరాత్మకు తెలుసు, నువ్వాడిన అబద్ధాలకు తెలుసు, నీ మండలంలో పారిన చిన్నకోతుల నెత్తురుకు తెలుసు. నీ చేతులకింకా ఆ నెత్తుటి మరకలు పోలేదు. పోనీ, ఇప్పుడైనా మారావా, అంటే అదీ లేదు. ఇప్పుడూ అవే మాటలూ, అవే చేతలూ! కోతిస్వామ్యం అంటే ఆటవికస్వామ్యం కాదు నాయనా. ఎదుటి కోతి చెప్పింది వినడం, జవాబివ్వగలితే ఇవ్వడమే కోతిస్వామ్యం. ఆ కోతి మాటను ఖండించు. కానీ ముందు దాని మాటను సాంతం విను. నువ్వు అధికారంలో ఉన్నావు కనుక నీకు మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకేగా మరుగుదొడ్డి కాన్నుంచి అంతర్జాతీయ మహాసభ వరకు ఎక్కడ అవకాశం దొరికినా నోట్లో బారెడు బాకా పెట్టుకుని కోతుల కర్ణభేరీలను బద్దలుగొడుతున్నావు. మరుగుదొడ్డి నుంచి మంత్రతంత్రాల వరకు దేనిపైనైనా ఏకధాటిగా వదురుతున్నావు. సభలే కాకుండా నెలకోసారి గొట్టం పట్టుకుని మనసులో మాటంటూ ఉన్నదీ లేనిదీ చెప్పి మాయ చేస్తున్నావు.

ఇన్ని అవకాశాలూ నీకు కోతిస్వామ్యమే కదా ఇచ్చింది. విపక్షమూ, విపక్ష గొంతుకా లేని కోతిస్వామ్యం ఉండదు నాయనా. ఉన్నా నేతిబీరకాయే. అందుకే నువ్వు మన కోతిస్వామ్యపు మౌలిక విలువల గురించి బాగా తెలుసుకోవాలి. చూస్తూంటే నీకు అందులో ఓనమాలు కూడా తెలియనట్టుందే..’’

తెల్లగడ్డం ఆయాసంతో విరామం తీసుకుంది.

బవిరిగడ్డం ముఖం కందగడ్డగా మారిపోయింది.

‘‘విపక్షం, విపక్షం..! అసలు అధికార పక్షం లేకపోతే విపక్షమెక్కడ?’’  అని అరిచింది.

‘‘నేనూ ఆ మాటే ఇంకోలా అడుగుతున్నా. విపక్షం లేకపోతే అధికార పక్షమెక్కడ?’’

‘‘నువ్వెన్నయినా చెప్పు. అధికారంలో ఉన్నవాళ్ల మాటే చెల్లుబాటు కావాలి. అంతే..’’

‘‘మూర్ఖంగా మాట్లాడక. అధికారం శాశ్వతం కాదు. మీ పక్షం ఇదివరకు విపక్షమన్న సంగతి మర్చిపోకు. నీ పదవీ కాలం పూర్తయ్యాక, ఎన్నికల్లో ఓడితే నువ్వూ విపక్షంలోనే కూర్చుంటావు. అప్పుడూ ఇలాగే మాట్లాడతావా? విపక్షం ఉన్నది అధికార పక్షాన్ని విమర్శించడానికి కాక వత్తాసు పలకడానికా? పూర్వం నీలాగే.. అధికారంలో ఉన్నవాడి మాటకు ఎదురులేదని విర్రవీగి పతనమైన రాజుకోతి కథ చెబుతాను విను.. ’’

బవిరిగడ్డానికి ఈ మాటలు విసుగనిపించినా, రాజులన్నా, రాజుల కథలన్నా ఇష్టం కనుక చెవులు రిక్కించింది.

‘‘పూర్వం ఒక రాజుకోతి ఉండేది. అది నపుంసక కోతి కావడం వల్ల తనకు దక్కని రతిసౌఖ్యం మిగతా కోతులకు దక్కొద్దని రాజ్యంలో రతి కార్యాన్ని నిషేధించింది. దానికి నిర్బంధ బ్రహ్మచర్య చట్టం అని దొంగపేరు పెట్టింది. అది రాజరిక వ్యవస్థే అయినా భిన్నాభిప్రాయాలు వినడంలో తప్పేమీలేదని రాజుకోతి ఆస్థానంలో తీర్మానం తెచ్చి చర్చ పెట్టింది. ఆస్థాన కవి క్రియాశక్తీ, పెద్దమంత్రీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాయి. శృంగారాన్ని నిషేధిస్తే జీవితంలో రుచిపోతుందని వాదించింది కవికోతి. రతికార్యంలో రుచేమీ లేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుకోతి కవి మాటను తోసిపుచ్చింది. మన్మథకార్యంపై నిషేధం ప్రకృతి విరుద్ధమని వాదించింది పెద్దమంత్రి. ప్రకృతి శక్తులను జయించడమే కోతి లక్షణమంటూ ఆ అభ్యంతరాన్నీ తోసిపుచ్చింది రాజుకోతి. తీర్మానం నెగ్గింది. రతి నిషేధం అమల్లోకి వచ్చింది. పెళ్లి వ్యవస్థ రద్దయింది. పెళ్లయిన కోతులు విడాకులు తీసుకోవాలని తాఖీదులు జారీ అయ్యాయి. శాసనాన్ని అమలు చెయ్యడానికి బోలెడు కోతులు కావాల్సి వచ్చింది. నిరుద్యోగం తగ్గింది. రాజుకోతికి మరో చక్కని ఆలోచనా వచ్చింది. ఆడామగా కోతులను విడదీయడానికి దేశం మధ్యన ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇరవై అడుగుల గోడకట్టించి తూర్పువైపున ఆడకోతులను, పడమటివైపున మగ కోతులను ఉంచింది. అయితే ఈ చట్టం వల్ల వచ్చే తరానికి కోతులే ఉండవని పెద్దమంత్రి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చిక్కు సమస్యేనని తోచింది రాజుకోతికి. రతిపై నిషేధం, ప్రజావృద్ధి అనే భిన్న కోణాలను సమన్వయం చేయడంపై బుర్ర చించుకుంది. రాజ్యంలో మంచిప్రవర్తన గల మగకోతులను ఎంపిక చేసి, అవి నెలకు రెండు మూడుసార్లు తూర్పు వైపుకు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. నిర్బంధ బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్ఛంద వ్యభిచారం. అయితే మళ్లీ ఒక సమస్య వచ్చిపడింది. తన తదనంతరం రాజ్యాన్ని ఎవరు పాలించాలీ అని. తనకు వారసులు లేరు, ఉండరు కనుక పక్కరాజ్యం దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం దొరికింది. పడమటి కొండల్లోని ఓ యోగికోతికి మహత్యాలున్నాయని తెలుసుకుని అంతఃపురానికి తీసుకొచ్చింది రాజుకోతి. యోగికి అక్కడ పరిచర్యలు జరిగాయి. యోగి మహిమతో రాజుకోతి తండ్రి వితంతువుల్లోని అందమైన కోతి గర్భం దాల్చింది. పదినెలలు తిరిగే సరికి రాజుకు పండంటి తమ్ముడు కోతి పుట్టింది. సమస్య తీరింది. అయితే తూర్పువైపున్న ఆడకోతులూ పిల్లల్ని కనేయసాగాయి. రాజుకోతి ఆశ్చర్యపోయింది. మగకోతి సంపర్కం లేకపోయినా తన పిన్నమ్మకు పిల్ల పుట్టింది కనుక తతిమ్మా ఆడకోతులు పిల్లలను కనడానికీ ఆ యోగి మహిమే కారణమని నమ్మింది. రాజ్యపాలన సుఖంగా సాగుతుండగా రెండేళ్ల తర్వాత పక్క రాజ్య సైన్యం దండెత్తి వచ్చింది. దాన్ని ఆస్థాన కవి క్రియాశక్తే తీసుకొచ్చింది. పక్క రాజ్య సైన్యాధిపతికోతి రాజుకోతిని గద్దె దింపి తమ్ముడు కోతిని ఎక్కించి తానే పాలించసాగింది. సదరు సైన్యాధిపతికీ ఈ సంతాన వ్యవహారంపై అనుమానమొచ్చింది. యోగికోతి చలవే కాబోలనుకుంది. అయితే అడ్డుగోడ కింద అటునుంచి ఆడకోతులూ, ఇటు నుంచి మగకోతులూ తవ్విన సొరంగాలు ఉన్నాయన్న సంగతి తర్వాత బయటపడింది. అయినా ఆడామగా కోతులు అవి తాము తవ్వలేదని, పందికొక్కుల పని అయ్యుంటుందని అన్నాయి…’’

తెల్లగడ్డం కోతి కథ పూర్తిచేసింది.

బవిరిగడ్డం ముఖం మాడిపోయింది.

‘‘అందుకే నాయనా, ఇంతలా నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నాను. కోతిస్వామ్యానికి విపక్షం రతికార్యమంత అవసరమైనది, సహజమైనది. అది లేకపోతే చర్చ ఉండదు. సంభాషణా ఉండదు. భవిష్యత్తూ ఉండదు. ఆటవికత్వం రాజ్యమేలుతుంది. మనం కోతులం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. మాట్లాడే శక్తి ఇచ్చాడు. మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, అరచుకుందాం, గుర్రుమందాం. ఆ కోతులు నీ తప్పులను ఎండగట్టనీ. నువ్వూ వాటి తప్పులను ఎండగట్టు. అంతే కానీ వాటి గొంతు నొక్కేయకుమీ, కోతిస్వామ్యానికి కళంకం తేకుమీ.. నీ పుణ్యం ఉంటుంది..’’

 

(ఈ కథలోని నపుంసక రాజుకోతి కథ శ్రీశ్రీ రాసిన ‘మొహబ్బత్ ఖాన్’కు కొన్ని మార్పులతో సంక్షిప్తం)

ఎన్నేండ్ల ఏకాంతం?

 

 

హెచ్చార్కె 

 

చూస్తూ చూస్తుండగానే

ఆకాశం పద్యమైపోతుంది

రౌద్రమో అలాంటి మరేదో రసం

ఓజో గుణం, టప టప వడగళ్ల పాకం

జగమంతా బీభత్సం

పద్యాలంటే ఏమిటి?

పగలడమే కదా మనస్సులో తమస్సు

 

పొద్దు మీద అకుపచ్చ గీతలు

గీతల మధ్య రెక్కలున్న పాటలు

కళ్ల నుంచి జలజల చినుకులు

ఒక్కో చినుకులో వెతుక్కోడాలు

దొరకక జాలిగా చెయి జార్చడాలు

పద్యాలంటే ఏమిటి

కరగడమే కదా మనస్సు లోని రాళ్లు

 

 

వానా! వానా!!

ఎప్పుటి నుంచి కురుస్తున్నావే

మా కొండవార[i] ‘మాకొండో’[ii] లో

నే పుట్టక ముందెప్పడో మొదలై

నా కథ చెప్పేసి వెళిపోతున్నా వదలక

కురుస్తున్న వానా!

గగనపు గానా భజానా!

వయారాల గాలి నాట్యాల దానా!

ఇంకెన్నాళ్లే? వందేళ్లేనా?

ఈ తడి తడి ఏకాంతానికి?

 

ఎందుకిన్ని మెరుపులు

ఎందుకిన్ని వురుములు

అన్నీ నా కోసం ఐనట్లు?

 

ఎందుకిన్ని వురుకులు,

ఎందుకిన్ని విసురులు

నా ముందూ తరువాతా

నువ్వు వుంటావుగా?!

 

*

[i] కొండవార: మా సొంతూరు ‘గని’, ‘గుమ్మడి కొండ’ అనే కొండ అంచుల్లో వుంటుంది.

[ii] మాకొండో (‘Macondo’): గేబ్రెయెల్ గార్షియా మార్క్వెజ్ ‘వన్ హండ్రెడ్ ఇయర్స్  అఫ్ సాలిట్యూడ్’ లోని (ఆయన) వూరు.

Macondo 2 (1)

 

సినిమా “కేవలం” సినిమా కాదు!

 

కత్తి మహేష్ 

 

“పాప్యులర్ సినిమా మనకు ఒక కల. సమాజం, ప్రజలు తమలో అంతర్గతంగా ఉన్న కోరికలను, ఆశలను వెండితెరమీద చూసుకుని ఆనందించే సాధనం. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కొన్ని చూస్తుంటే, మనం కంటున్న కలలు ఇంత దారుణమా అనిపించకమానదు” అన్నారు ప్రముఖ బాలీవుడ్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్.

“సినిమాను సినిమాగానే చూడాలి” అనే చాలా మంది నినాదం ఈ కలల సినిమా గురించే. కలని కలలాగే చూడండి, నిజానితో పోల్చుకుని బాధపడటమో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమో వృధా అనేది వీళ్ళ భావన కావొచ్చు. నిజంగా కలలని పట్టించుకోకూడదా ! మరి కలల రాకుమారుళ్ళని ఆరాధించడం ఎందుకు? కలలో వచ్చే రాకుమార్తెల కోసం గుళ్ళూగోపురాలూ కట్టేంత అభిమానం ఎందుకు? ఈ కలల లెక్కల్ని, గొప్పతనాల్ని, కష్టాన్నీ జాతి గౌరవానికీ లంకె పెట్టడం ఎందుకూ? అని అడిగితే మాత్రం ఈ కలల బేహారుల దగ్గర సమాధానం ఉండదు.

నిజంగా సినిమా ఒక చీకటిగదిలో సామూహికంగా కనే కలగా మాత్రమే తీసిపారేయదగ్గదైతే, ఎప్పుడో  అది తన ప్రాముఖ్యతని కోల్పోయేది. ఇంతటి స్థానాన్ని సంపాదించేదే కాదు. ముఖ్యంగా ఒక సినిమా నటుడిని నాయకుడిని చేసిన సమాజం, మరో సినిమా నటుడు నేతగా మారితే ఆశగా చూసిన సమాజం, ఇంకో నటుడు కేవలం ప్రశ్నించడానికి వచ్చాననే సరికీ సపోర్టు చేసిన పార్టీకి పట్టంకట్టిన సమాజంలో సినిమా కేవలం కలమాత్రమే, దానికీ సమాజానికీ అస్సలు సంబంధం లేదు అంటే ఎట్లా ఒప్పుకునేది?  బాహుబలి సినిమా తెలుగు జాతికి గర్వకారణమనే నోటితోనే, అందులోని సెక్సిస్ట్ దృక్కోణాన్ని తెగనాడితే దానికి సమాధానంగా సినిమాని సినిమాగా చూడమని జవాబు వస్తే ఎట్లా ఊరుకునేది? శంకరాభరణం సినిమా గురించి ప్రవచనాలు చెప్పుకుంటున్న తరుణంలో, అదొక భ్రాహ్మణికల్ ఆధిపత్య భావజాలానికి చిహ్నమని చెబితే భరించలేని పరిస్థితి ఎందుకొస్తోందో ఆలోచించాల్సిందే !

 

అందుకే సినిమా ఎవరికి సినిమా మాత్రమే అనే ప్రశ్న అత్యవసరం. సినిమాని కేవలం సినిమాగా మాత్రమే చూడండి అనే భావజాలం వెనకున్న కుట్రలు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం.

అంతకన్నా ముందు, సినిమా కల మాత్రమే కాకపోతే మరేమిటి? కేవలం కల అయినంత మాత్రానా అది అర్థరహితమా? అనేవాటికి సమాధానాలు తెలుసుకోవాలి. ” “It (cinema) doesn’t give you what you desire – it tells you how to desire.”” అంటాడు ప్రముఖ తత్వవేత్త స్లావో జిజాక్. అంటే సినిమా కేవలం మనం కనే కల కాదు. మనం ఎలాంటి కలలు కనాలో చెప్పే వాహిక. మరి ఈ కలలు ఎలా ఉండాలో ఎవరు నిర్ధారిస్తున్నారు? వాళ్ళకి నేపధ్యం ఉందా? అజెండా ఉండకుండా ఉంటుందా? అన్నదగ్గర అసలు సమస్య మొదలౌతుంది. అందుకోసం కొంత చరిత్ర తెలుసుకోవడం అవసరం.

Sankarabharanam

సినిమా అనేది అన్ని కళల సమాహారమే అయినా, వీటన్నిటినీ సమీకరించడానికి కావలసిన ముఖ్య సాధనం డబ్బు. సినిమా పుట్టినదగ్గరనుంచీ ఇప్పటివరకూ అదనపు సంపత్తి (ఎక్సెస్ క్యాపిటల్) ఉన్న వర్గం పోషించిన కాస్టీ కళ సినిమా. మూకీ నుంచీ టాకీ వచ్చిన మొదట్లో అప్పటికే పాప్యులర్ అయిన పద్యనాటకాలని సినిమాలుగా మలిచినా, ఎప్పుడైతే సాంఘికాలు తెరకెక్కడం మొదలయ్యాయో అప్పటి నుంచీ రాజకీయాలూ సినిమాలో భాగం అవ్వడం సహజమయ్యింది. సంఘం గురించి, సమాజం గురించి కథ చెప్పాలంటే కొన్ని నిజాల్ని చెప్పాలి, సమస్యల్ని విప్పాలి, పరిస్థితుల్ని విష్లేషించి కథాంశాలుగా మలచాలి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ సామాజిక రాజకియ స్ఫ్రుహలేకపోతే అర్థవంతమైన సినిమా తయరయ్యేది కాదు, జనరంజకం అయ్యేదీ కాదు. నెహ్రూ మార్క్ దేశభక్తి నుంచీ, ప్రజానాట్య మండలి మార్కు విప్లవాల వరకూ అన్నీ సినిమా సబ్జెక్ట్లే అయ్యాయి. అప్పట్లో సినిమాని సినిమాగా మాత్రమే చూడండి అనే నినాదం కనిపించదు.

సామాజిక స్పృహ అనే వేరే ఆయుధం అప్పట్లో చాలా పాప్యులర్. సినిమాకి సామజిక బాధ్యత ఉంది అంటూనే విజయవంతంగా వాళ్ల వాళ్ల అజెండాల్ని అమలు పర్చుకున్న సమయం అది. అందుకే క్యాపిటలిస్ట్ రామోజీరావు “ప్రతిఘటన” తీసినా జై అన్నాం, పక్కా బిజినెస్ మ్యాన్ రామానాయుడు “ముందడుగు” అన్నా, మంచి సినిమా అనుకున్నాం. అభ్యుదయం పేరుతో హైదవం మార్కు కులాంతర వివాహం ‘సప్తపది ‘ ని కళ్ళకద్దుకున్నాం.  ఏది సేలబుల్లో అది తీశారు అనడం కన్నా, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి సినిమాలు వచ్చాయని నమ్మాము. అందులో కొంత వరకూ నిజం ఉంది కూడా. మరీ బాహాటంగా కుల అజెండాలు, రాజకీయ ప్రాధాన్యతలు లేని కాలం అది. ఒకవేళ ఉన్నా, సామజిక బాధ్యత అనే వెసులు బాటు ధోరణి కొంత ఉండటం గుడ్డిలో మెల్ల.

లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్,గ్లోబలైజేషన్ మొదలయ్యాక వినోదం అందించే రంగాలైన సినిమాలలో, టీవీల్లో మార్కెట్ భావజాల వ్యాప్తికి తగ్గ అన్ని హంగులూ కల్పించారు. నిర్థిష్టమైన విలువలు లేవంటూనే కంజ్యూమరిజాన్ని పెంపొందించే విలువల్ని రంగరించడం మొదలెట్టారు. డబ్బు, అధికారం, ఆధునిక లైఫ్ స్టైల్ మాత్రమే పరమావధి అవ్వాలంటే చూపించే కలలు మారాలి. ఏ కలలు కనాలో నేర్పే సాధనాల నైపుణ్యం పెరగాలి. జాతీయ స్థాయిలో, ముఖ్యంగా హిందీ సినిమాలో జరిగిన గణనీయమైన మార్పు చూసుకుంటే ఎంత పద్దతిగా ఎన్నారై కలలు, అర్బన్ కథలుగా మారాయో అర్థమైపోతుంది. కానీ సామాజిక స్పృహ, రాజకీయ పరిఙ్జానం, దైనందిక సమాజంలో అస్తిత్వాల ప్రమేయం బలంగా ఉన్న స్థానిక ప్రాంతీయ సినిమాలలో కేవలం కలల్లో మార్పు వస్తే సరిపోదు, కలల్ని ప్రశ్నించలేనంతగా మభ్యపెట్టాలి.

ప్రపంచీకరణ తొంభై దశకంలో మొదలైనా అది స్థిరపడి, కలల్ని శాసించే రంగంలో వేళ్ళూను కోవడానికి పది సంవత్సరాలు పట్టిందనే అనుకోవాలి. కొంత అయోమయ స్థితి, ఏ కథలు చెప్పాలో అర్థంకాని స్థితి నుంచీ భాషా ఫర్మాట్, ఢీ-రెడీ ఫార్మేట్, ఎస్కేపిస్టు ప్రేమకథల ఫార్మేట్ అనే మూడు అత్యుత్తమ భ్రమల మూసల్ని ఆలంబనగా చేసుకుని కొత్త అజెండాని ‘తెర మీదకి ‘ తెచ్చారు.

 

బాషా నుంచీ బాహుబలి వరకూ మనకు చెప్పే సూపర్ హీరో కథ ఒకటే. సామాన్యుల్లో సామాన్యుడిగా బ్రతికే ఒక గొప్పోడు రాజు అని తెలియడం. ఆ రాజు నేపధ్యంలో ఎంత గొప్పగా తన ప్రజల్ని చూసుకునేవాడో చూపించి, చివరికి విలన్ను జయించి మళ్ళీ రాజవడం. చాలా వరకూ విలన్లు కూడా దాయాదులో, బందువులో లేక వైరి వర్గం ఫ్యాక్షన్ వాళ్ళో ఉంటారు. అత్యంత మామూలుగా కనిపించే ఈ కథలో మార్కెట్ ఎకానమీని శాసించే కుట్ర ఏముంది అనేది ఎవరూ ప్రశ్నించని విషయం. అదే ఈ ఫార్ములా సక్సెస్. ‘రెడ్డి ‘, ‘నాయుడు ‘, ‘చౌదరి ‘ అంటూ నాయకులకి పేర్లు పెట్టినా మనం కలనే చూస్తాంగానీ, ఆ కలల ఔచిత్యాన్ని ప్రశ్నించం. అధికార కులాలే నాయకులు, మిగతావాళ్ళు బానిసలు అనే రీడింగ్ ఎక్కడ ఈ సినిమాల్ని అర్థం చేసుకోవడంలో వాడేస్తారో అనే ఖంగారులో ఒక కొత్త నినాదం పుట్టీంది. అదే…”సినిమాని సినిమాగా చూడండి” అని.

Bahubali-Posters-Prabhas-Bahubali-Posters

ఢీ-రెఢీ ఫార్ములాది మరో తీరు. సోకాల్డ్ దుర్మార్గులైన జోకర్ విలన్లను, తన (అతి)తెలివితేటలతో ముప్పతిప్పలూ పెట్టి మోసం చేసి, దొరక్కుండా తప్పించుకుని గెలిచే ఘరానా మోసగాడు హీరో. కుర్ర విలన్ ఏ హీరోయిన్ను సిన్సియర్గా మోహిస్తాడో, అదే హీరోయిన్ను హీరో బలవంతంగా ప్రేమిస్తాడు. ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు అనే విషయం నటులు నిర్దేశిస్తారేగానీ పాత్రలు, వాటి ఔచిత్యాలూ కాదు. హీరో రాం స్థానంలో విలన్ సోనూ సూద్ ని, సోనూ సూద్ స్థానంలో రాం ని వేసి చూసుకోండి. అప్పుడు మీరు విలన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. హీరోని అంతకంత ద్వేషిస్తారు. మరి దీని ప్రభావం సమాజం మీద, జనాల ఆలోచనల మీదా లేవంటారా?!? రేవంత్ రెడ్డి తొడకొట్టి జైలుకెళ్ళినా, ఘన స్వాగతంతో మనం జైలు బయట స్వాగతిస్తున్నామంటే ఎంతగా హీరో అయిన విలన్ కి అలవాటుపడిపోయామో తెలియడం లేదా ! అందుకే, మనం సినిమాని సినిమాగా చూడాలి. కదా !

ఇక ప్రేమ కథలు. స్త్రీ స్వేచ్చ పెరుగుతున్న సమాజంలో, అమ్మాయిలు దొరకని అబ్బాయిల ఇన్సెక్యూరిటీలను, డీవియంట్ ప్రవర్తనను హీరోయిజంగా చూపితే దానికుండే కరెన్సీ ఎక్కువ. ఎందుకంటే, మెజారిటీ అబ్బాయిలు ఆ బ్రాకెట్లోనే ఉంటారు కాబట్టి. థియేటర్లలో సామూహికంగా కుతి తీర్చుకోవడానికో, వాయొలెన్సును, స్టాకింగుని, టీజింగుని పాఠాలుగా నేర్చుకుని ప్రేమించకపోతే అమ్మాయిల మీద యాసిడ్లు పొయ్యడానికో సినిమాల్ని సినిమాలుగా చూడాలి.

ఇలా ఒక్కో సామాజిక వర్గాన్ని తనదైన మత్తులో జోగేలా చేస్తూ, తమ మార్కెట్ అజెండాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెల్తున్న  సినిమాని సినిమాగా ఎలా చూడాలి? ఎందుకు చూడాలి?
సినిమా ఒక కళ, దానికొక సామాజిక బాధ్యత ఉంది అనేది ఒక పద్దతి ప్రకారం బూతు అయిపోయిన చోట, నిజమే సినిమాని సినిమాగా మాత్రమే చూడాలి.
మరి వీళ్ళే సినిమాని కళామతల్లి అంటారెందుకు. కళామతల్లి అంటే కళల తల్లి కాదు. కళలలో ‘మతల్లి” అంటే ఉత్కృష్టమైనది అని. అంటే అత్యంత గొప్ప కళ అని. ఈ భ్రమలెందుకు మళ్ళీ !

సామాజిక ప్రయోజనత్వాన్ని, బాధ్యతని, అస్తిత్వ ప్రకటనల భాగస్వామ్యాన్నీ ఎంత పకడ్బందీగా సినిమాలో లేకుండా చేసి అధికారానికీ, మార్కెట్ కూ కొమ్ముకాస్తున్నాయో అంతే పకడ్బందీగా “తూచ్ సినిమా ఈజ్ ఓన్లీ సిమా ఎహే ” అనే నినాదాన్నీ బలపరుస్తున్నాయి. సినిమాని సీరియస్గా తీసుకుని ప్రశ్నంచడం మొదలుపెడితే జనాలని కలలు అనే భ్రమల్లో ముంచి ఉంచడం కష్టం. తమ అజెండాల్ని కొనసాగించడం కష్టం. కొందరు కాన్షియస్గా, మరికొందరు సబ్-కాన్షియస్గా ఈ కుట్రలో భాగమైపోతూ, ఎలా ఉన్నా సినిమాకు జై కొడతాం, సినిమా అవలక్షణాలను కూడా నెత్తికెత్తుకుని ఊరేగతాం అని పూనకం పూనుతుంటే, వాళ్లని ఒక్క చెపదెబ్బ కొట్టి “ఇంతగా ఫీలైపోతున్నావంటే సినిమాని సినిమాలాగా మీరూ చూడటం లేదురా బాబూ!” అని చెప్పాలనిపిస్తుంది. తేడా అంతా మనలో ఎవరికీ సినిమా సినిమా మాత్రమే కాదు అని తెలుసుకోకపోవడం వల్ల వస్తోంది.

సినిమా సినిమా మాత్రమే కాదు. అదొక అవిభాజ్య సామాజిక కళ అని నమ్మి దాన్ని సీరియస్గా తీసుకోకపోతే మన సామాజిక పతనానికి అది బలమైన సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది.

*

రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ….

ఒకలాంటి ప్రశాంతమైన అలసటా, విరామపు రాత్రీ కలిసి వస్తే..
ఆలోచలన్నీ వదిలించేసుకోవడానికని తల విదిలించుకున్నప్పుడే, సరిగ్గా అప్పుడే, మరుగున పడ్డ జ్ఞాపకాలేవో పలకరిస్తే.. ముఖ్యంగా అవి ఒకప్పటి అపురూపాలైతే!?
అన్నిటినీ ముందేసుకుని..
సగానికి వంగిపోయిన నెమలీకలూ.. చిట్లిన సముద్రపు గవ్వలూ.. ఎండిన గులాబి రేకులూ… ఇంకు వెలిసి రాలి పోతున్న అక్షరాలూ…
అన్నిటినీ తడిమి, తరచి తరచి చూసుకుంటూ
సర్వం మరిచి, రెండు అలల మధ్య నిశ్శబ్దాన్ని చేజిక్కించుకున్నట్టు .. దాటిపోయిన వెన్నెల గాలిని అతి జాగ్రత్తగా ఇంకొక్కసారి ఒడిసిపట్టుకుని..
మనల్ని మనం తాకే ప్రయత్నం చేసుకోడానికి, కొన్ని రాత్రిళ్ళు సహాయం చేస్తాయి..
రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ…. మొదటి వెలుగు కిరణంతోటే మళ్ళీ మరణించడానికీ చాలా రాత్రిళ్ళు సహకరిస్తాయి!
gulzar

రాత్రంతా

రాత్రంతా చల్లగాలి వీస్తూనే ఉంది
రాత్రంతా నెగడు రగిలిస్తూనే ఉన్నాము
నేను గతం తాలూకు ఎండిపోతున్న కొన్ని కొమ్మల్ని నరికేశాను
నువ్వు కూడా గడిచిపోయిన క్షణాల ఆకుల్ని విరిచేశావు
ఆపైన నేనేమో నా జేబులోంచి జీవం లేని కవితలన్నిటినీ తీశేశాను
ఇహ నువ్వు కూడా చేతుల్లోంచి వెలిసిపోయిన ఉత్తరాలని తెరిచావు
నా ఈ కళ్ళతో కొన్ని తీగల్ని తుంఛేశాను
చేతుల్లోంచి ఇంకొన్ని పాతబడ్డ గీతల్ని పారేశాను
నువ్వేమో కనురెప్పల తడి పొడినంతా వదిలేశావు
రాత్రంతా మన శరీరాలపై పెరుగుతూ మనకి దొరికినవన్నీ
నరికి మండుతున్న నెగడులోకి విసిరేశాము
రాత్రంతా మన ఊపిరి ప్రతీ జ్వాలలో శ్వాస నింపింది
రెండు శరీరాల ఇంధనాన్ని మండిస్తూనే ఉంది
రాత్రంతా ఒక మరణిస్తున్న బంధం వేడిలో చలి కాచుకుంటూనే ఉన్నాము.
satya

మూలం:

Raat bhar sard hawa chalti rahi
raat bhar hamne alaav taapa

maine maazi se kai khushk see shaakhien kaati
tumne bhi gujre hue lamhon ke patte tode
meine jebon se nikali sabhi sukhi nazmein
tumne bhi haathon se murjhaaye hue khat khole
apnee in aankhon se meine kai maanze tode
aur haathon se kai baasi lakeeren phenki
tumne palkon pe nami sookh gayee thee, so gira di
raat bhar jo bhi mila ugte badan par humko
kaat ke daal diya jalte alaawon main use

Raat bhar phoonkon se har lau ko jagaye rakha
aur do jismon ke indhan ko jalaye rakha
raat bhar bujhte hue rishte ko taapa humne…

————————-

Painting: Satya Sufi

రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ !!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

రాబర్ట్ నాగేంద్ర పొద్దున్నే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ కు దిగాడు.

 

బలవంతంగా నిద్ర లేచి వాడిని పిక్ అప్ చేసుకుని బైక్ మీద రూం కు తీసుకొచ్చాను. దారిలో అడిగాను ” ఏంట్రా కబుర్లు ” అని. వాడు గడ్డం గీక్కోవడం నాకు బైకు అద్దం లో కనిపించింది. ” ఆ స్టుపిడ్ గడ్డం తీసేయొచ్చు కదా ? ” విసుక్కున్నాను. వాడు కిసుక్కుమని ” బిన్ లేడెన్ కు అసలు షేవ్ చేసుకుందామని జీవితం లో ఒక్క సారన్నా టెంప్ట్ అయి ఉంటాడంటావా ? ” అన్నాడు.  ” ఆ… టెంప్ట్ అయి ఉంటాడు ” ఒక క్షణం పాజ్ ఇచ్చి ” ఎప్పుడు అని మాత్రం నీవడగవని నాకు తెలుసు ” అన్నా.

” యు ఆర్ గ్రోయింగ్ అప్ మై బోయ్ ” అని భుజం తట్టాడు నాటకీయంగా.

రూం చేరుకునేంత వరకు ఇద్దరి మొహాల్లో నవ్వు బిగబట్టుకుని ఉన్నాము.

ఇంటికొచ్చి రిఫ్రెష్ అయిపోయి, టిఫిన్ పానాదులయ్యాక కాఫీ చేతులో పెట్టి మళ్ళీ అడిగా ” ఏంట్రా కబుర్లు ” అని. హైదరాబాదుకు ట్రెయిన్ పట్టుకునే ముందు ఆప్పుడెప్పుడో వాడితో మాట్లాడిన ” యూరిన్ పాలిటిక్స్ ” తర్వాత ఇదే మళ్ళీ వాడితో కన్ ఫ్రంటేషన్ కుదిరిన ఛాన్స్.

” చూడ్రా భై …మోడి దుబయ్ లో ‘ కేవలం మాటల ద్వారానే ఏ సమస్య అయినా సాధించుకోవచ్చు ‘ అని అంగానే అక్కడ పొట్టేగాండ్లు విజిల్స్ ఎందిరా నాయ్నా ! అదేమన్నా ఈయన పేటెంట్ పెట్టి కనుక్కున్న ఒక ఫార్ములా నా  లేపోతే అమితాబ్ బచ్చన్ షోలే డైలాగ్ ఆ ? ” అని సిగరెట్ వెలిగించాడు.

” భక్తులు రా…భక్తులు….అంతే ”

” అవున్ రా భై …వీళ్ళకన్నా రంగ నాయకమ్మ భక్తులే బెటర్ ”

వాడి సెటైర్ కు నవ్వేసాను కాని – ” ఒరేయ్ ! రంగనాయకమ్మ లో తప్పులుండొచ్చు కాని మరీ మోడీ తో కంపేర్ చేయడం బాలేదు రా ” నేను కూడా కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అయ్యి నొచ్చుకున్నా.

” అబ్బో ! నీవు ఆమె పూజ ఎప్పుడు మొదలు పెట్టావురా బాబాయ్…” అని ట్రే కోసం సీరియస్ గా కలియ తిరిగి కూర్చున్న కుర్చీ పక్కనే యేష్ విదిలించాడు. ఆ చుట్టూ తిరిగి చూడ్డం కూడా ఓ బహానా వాడికి. అలా చూస్తే నేనే పరిగెత్తుకెళ్ళి ఎక్కడున్నా హడావిడిగా ట్రే పట్టుకొచ్చి వాడి పక్కన పెడ్తానని వాడి అంచనా .

మళ్ళీ దమ్ము తీసి అన్నాడు –

” విప్లవ రచయితల సంఘం, ఎలాంటి కుట్రలతో, ఎలాంటి అబద్దాలతో, ఎంత నిజాయితీ హీనంగా, ఎంత విప్లవ వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆ పాత చరిత్రని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాలు ఎక్కడన్నా విన్నట్టుందా ” అప్పజెప్పినట్టు చెప్పి అడిగాడు.

” ఐ నో యు ఆర్ రెఫెరింగ్ హర్ ఆర్టికల్ ఆన్ విరసం ”

” కదా ! కుట్ర కేసులు పెట్టించుకుని తిరుగుతున్న విరసాన్ని కుట్ర పూరితం అనేసింది. రంగనాయకమ్మను నేను ఆడ మోడీ అంటే నీకు వచ్చిందా ? ”

” వి ర సం పేద్ద ….. వీర సాహిత్య సంస్థా మరి ? ”

” అది వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు వీరులైతే . మనకెందుకు కాని ” అని రావు గోపాల్ రావు స్టైల్ లో గొంతు మార్చి అన్నాడు ” మడ్డరు జేసినోడు దొంగ కొడుకు, ముడ్డి మీద ఏసుకునే డాయర్ ఎత్తుకెల్లినోడు దొంగ కొడుకైతే , ఈ పెపంచకం లో పెతోడు సమానంగా దొంగ కొడుకులే రా సెగట్రీ   ”

” ఐ అబ్జెక్ట్ మై డియర్ బట్ట తల బిన్ లేడెన్…..నీవు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. ఆమెను మోదీ తోనూ , ఆమె పాఠకులను మూర్ఖ మోదీ భక్తులతోనూ పోల్చడం దారుణం ”

” ఒరేయ్ తప్పుల్లో డిగ్రీలు లేవనేది  ఆమె పాటించే సూత్రమే. అందుకే విరసానికి, వీ ఎచ్ పీ కీ తేడా లేకుండా తిడుతుంది ”

” మరి విరసం తప్పులు లేని సమాజం కోసం కృషి చేస్తున్నప్పుడు తప్పుడు దారులు ఎలా తొక్కుతుందిరా ? రంగ నాయకమ్మ తిట్టడం లో ఘాటు ఎక్కువయ్యింది కాని , సారాంశం లో తప్పు లేదు కదా ? ” కాఫీ సిప్ చేస్తూ అడిగాను.

” బామ్మర్దీ ! వాస్తవాలు , ప్రజలకు వీర రసం తాగించే విరసం చెప్పేంత వరకు ఆగు. అది ఆమె విరసం ను తిట్టడం అని నీవనుకుంటున్నావా ? నా బాబే ! అది జస్ట్ ‘ సెల్ఫ్ లవ్ ‘ ”

అనేసాడు వీడు. అనాల్సిన మాట గబుక్కున అనేసాడు.

* * *

వీడు చిన్నప్పట్నుండి అనాథ జీవితమే. ఆల్ మోస్ట్ మా ఇంట్లోనే పెరిగాడు. వాడికి మనుష్యులంటే ప్రేమ.

కాలేజిలో ఎంతో శ్రద్ధగా ” రామాయణ విషవృక్షం “ చదువుతుంటే వచ్చి అల్లరిగా లాగేసేవాడు. ఏమంటే ఇందులో ‘ మార్క్సిజం తక్కువ. మనాయకం ఎక్కువ అనే వాడు ‘. ఈ మధ్య ‘ తత్వ శాస్త్రం- ఒక చిన్న పరిచయం ‘  అనే బుక్కు కొన్నానని వాడికి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్తే అడిగాడు ” ముందు మాటలో మొదటి వాక్యం చదువు అన్నాడు ”

” ‘ తత్వ శాస్త్రం పట్ల నాకెప్పుడూ ఆసక్తి రాలేదు ‘ అని ఉంది ఏం ? ” అడిగా.

అందుకు వాడన్నాడు ” పుస్తకం గురించి వ్రాయమంటే ఈమె మనసులో ఏమనుకుందో, ఆ మనసు లోపల  లోపల ఉన్న మనసులో ఇంకేమనుకుందో, ఆమెలో వస్తున్న ఎమోషనల్ చేంజ్ కు ఆ విక్రం గైడు లాంటి పుస్తకానికి ఏవన్నా సంబంధం ఉందిరా ?  చదువు…చదువురా…రేయ్ చదువు…..ముందు మాట తోటే నీకు దిమ్మ తిరిగిపోద్ది. అందులో ‘ నేను పెన్సిల్ తో రాసుకున్నాను, మళ్ళి రుద్ది చెరిపేసాను, మళ్ళి రాసాను, మళ్ళీ చెరిపేసాను ‘ లాంటి దిక్కుమాలిన  డీటైలింగ్ చూసాక భారతం లో భారతుడిలా పిచ్చోడైపోయి ఆమెనే అనుకుని ఆమె చెప్పులకు పూజ చేస్తావు ”

” భారతం కాదు …రామాయణం….” టక్కున అన్నా

” ఇదే మరి రంగ నాయకమ్మ భక్తి తెలివి అంటే. అంత ముఖ్యమైన విషయం వదిలేసి…ఎక్కడో దొర్లిన టైపో లాంటి తప్పును పట్టుకుని ఊగులాడ్డం ”

* * * *

వాడు తాగేసి కప్పు కింద పెడుతూ , కాఫీ అడుగున మిగిలిపోయిన చక్కర వేలుతో తీస్తూ నాకుతూ అన్నాడు ” ఆమె ఒకరిని తిట్టినా…ఆమె ఒకరిని పొగిడినా…అంటే ఆమె మార్క్సు, ఏంగెల్స్ &  కో ను తప్ప ఎవరినీ పొరపాట్న కూడా మెచ్చుకోదనుకో….వాటెవర్….అది ఆమె మీద ప్రేమను ఆమె అలా వ్యక్త పరుచుకుంటుంది అంతే –  I mean its pure platonic self-love  ”

నా మొహాన్ని చూసి చప్పరిస్తూ అన్నాడు ” నీ బోటి వాళ్ళు చూసి ‘ ఆహ ఏమి సద్విమర్శ , ఓహో ఏమి మొహమాటం లేని విమర్శ ‘ అంటారన్న మాట ”

నేను కుర్చీలో ఇబ్బందిగా సర్దుకున్నాను.

నాలో కనిపించని ఇబ్బందిని గమనించి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి అన్నాడు.

” మచా ! నీకో పిట్ట కథ చెప్తాను ఉండు. జాగర్తగా విను. ఒక నిర్భాగ్యుడెవడో  కొండ మీద నుండి కాలు జారో, ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ…. అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు . ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది..సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ” అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది. ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో  జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం  ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు. నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పరిస్థితిని కూడా విస్మరించాడు. దీనికి ప్రధాన మూలం ఎక్కడుందంటే అతని బుర్ర లోనే ఉంది. అది పగిలే దాక ఆయన్ని రక్షించడం వృథా ! ”

నన్ను అనునయంగా నిమురుతూ అన్నాడు ” విమర్శించడం గొప్ప కదురా ! భూలోకం పైన కాళ్ళు వదిలేసి ….అందరు పరలోక రాజ్యం లో బతుకుతున్నట్టు…అప్పుడు ఎవడన్నా గట్టిగా దగ్గినా తుమ్మినా తప్పౌతుంది….అలా విమర్శిస్తే ఏమౌతుంది ?  That clearly explains one has blurred vision of priorities of society. ఇప్పుడు నాకు ఒక ఘోరమైన కేన్సర్ ఒకటి  వచ్చిందనుకో. హడవిడిగా ఒక టెబ్లెట్ వేసుకున్నాను. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసీ వేసుకున్నాను. లేపొతే నొప్పి భరించ లేకపోతున్నాననుకో.తర్వాత  వ్యాధి తగ్గించిన విషయం వదిలేసి – ఆ టెబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి విమర్శిస్తే ఎలా ఉంటుంది ?    ”

సిగరెట్ పీక ఆర్పి కిటికి లోంచి చాకచక్యంగా విసిరి, నా కుర్చీ హేండ్ రెస్ట్ మీద వాడు రెస్ట్ తీసుకుంటూ ”  This is nothing but perversion for idealistic attitude.  నేను నీతో బెట్ వేస్తా. ఇటువంటి  Attitude  ఉన్న వాళ్ళ మీద నా అంచనా. …. అఫ్ కోర్స్ ఆ బెట్ డబ్బులు నీ జేబులో నుండే నా దగ్గరకొచ్చి మళ్ళీ నీ జేబులోకి పోతాయనుకో . ఎవరన్నా ఒక్కరంటే ఒక్కరు ….. barring her husband  …..సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ” నేను రంగ నాయకమ్మ ఫ్రెండ్ ” అని గర్వంగా ఒక్కరు డిక్లేర్ చేయ కలిగినా లేదా ఈమె తడపాయించే ఒక్క శ్రామికుడు లేదా ఒక్క దళితుడు….ఇదో గొడవ …దళితుడంటే ‘ ఎవరూ ‘ అని దీర్ఘం తీసేస్తుందిప్పుడు ‘ నోర్ముయ్ అందరూ పేదోళ్ళే అని అరిచేస్తుంది ‘….సరే ఏదైతేనేం…ఒక్కరన్నా …ఒక్కరంటే ఒక్కరు….వచ్చి ఈమె వలన సాంఘిక న్యాయం మాకు కలిగింది అంటే ……. again I am telling you , I will pay you one thousand rupees signed by Raghuram rajan and will shave my lovely beard off… ” అన్నాడు.

నేను ఒక్క ఉదుటున లేచి నవ్వుతా వాడిని  వంగో బెట్టి రెండు గుద్దులేస్తూ పక పకా మని నవ్వాను.

వాడి కాలర్ పట్టుకుని ” ఒరేయ్ ! నీకు మాత్రం సెల్ఫ్ లవ్ తక్కువా ” అన్నా.

” సరెలేరా …. పెతోడికి కొద్దో గొప్పో ఉంటుంది. చూశావా…రంగ నాయకమ్మ వాసనలు ఎలా తగిలాయో నీకు….ప్రతి మనిషికి అంతో ఇంతో ఉండే ఇసుమంత సెల్ఫ్ లవ్ ను…ఆమెకుండే  Obsessed self-love   ను ఒకటేలా చూస్తున్నావ్ !  ” అని మొహానికి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు నే కొడతానేమో  అన్నట్టు.

కాలర్ వదిలేసి నేను గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఉన్న దివాన్ మీద జారగిల పడ్డాను.

” ఓకే రా…. I agree with you for now  కాని ఆ ఇంకో పెద్దామె చటుక్కున ఈమెను పర్స్ నల్ అటాక్ చేస్తూ కవిత వ్రాయడం మాత్రం తప్పురా. ఈ విషయం లో నీవేం చెప్పినా నే తలూపను ” అనేసి గట్టిగా నా చెవుల చుట్టు చేతులు పెట్టి తల పట్టుకున్నాను.

వాడు నా చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ”  Self-love never generates logical thinking in other person. In fact, it obstructs the logical thinking and diverts the targeted audience’  attention to the person talking about the subject but not on the subject, per se. And so Mrs. Ranganayakamma runs the risk of taking the brunt personally. ”  నా చెవులపై చేతులు  పక్కకు లాగి  ” And this goes on as long as Ranganayakamma loves Ranganayakamma but nothing else !!! ”  అని గట్టిగా గుయ్ మంటూ అరిచాడు వెధవ .

*

విస్మృతి

సుధా కిరణ్

 

జ్ఞాపకాలకీ, విస్మృతికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన సముద్రమొకటి

తలపుల కెరటాలు తరలిపోగా దిగులు దీపస్తంభంలా నిలిచిన కడపటి తీరమొకటి..

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

మనుషులు, ముఖాలు, పేర్లు, మాటలు

జ్ఞాపకాలతో తెగని పెనుగులాట

చిరునవ్వులు, కన్నీళ్లు, గాయాలు, ఘటనలు

గుర్తుకురాని తనంతో ఎడతెగని యుద్ధం

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు నీడలకై వెదుకులాట

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై శూన్యాకాశంలో అన్వేషణ

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి ఋతువులు లేని కాలమొకటి

కాలం కాటేసిన తలపుల వాకిలిలో తలుపులు మూసుకుపోయిన మలిసంధ్య జీవితమొకటి…

 

(ఓవెన్ డార్నెల్ కవిత ‘యాన్ అల్జీమర్స్ రిక్వెస్ట్’ కి కృతజ్ఞతలతో..)

*

Sudha Kiran_Photo

“చేత” కాదు..”కాలు” కాదు!

 

సుధా శ్రీనాథ్ 

sudha “నాన్న ఈ రోజు గుడికి కాలి నడకన వస్తారంట.  Even though the weather is so very good to take a long walk, మళ్ళీ అంత దూరం నడిచేందుకు నాకు మనసు లేదు; మన చేత కాదు కూడా. మనమిద్దరం కార్లో వెళ్దాం. క్లాస్‍కు లేట్ కాకూడదు. ఇవ్వాళ మీకు భగవద్గీత స్పర్ధలున్నాయి కదూ.” మనసులోని మాటను పాపతో చెప్పాను.

అమేరికాకు వచ్చిన తర్వాత మేం నడవడమే తగ్గి పోయింది. స్కూల్ కాలేజీలకెళ్ళాలన్నా కారెక్కాలి. కొత్తిమేర కూర తీసుకు రావాలన్నా కారెక్కాలి. ఏం కొనాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా కారెక్కాలి. నడుచుకొనెళ్ళి కలవాలంటే దగ్గర్లో ఎవ్వరూ లేరు, నడుచుకొనెళ్ళి చేసుకొచ్చే పనులయితే అస్సల్లేవు. అందుకని ఒక ఆదివారం రోజు DFW Hindu temple కు కాలి నడకనే వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు శ్రీనాథ్ గారు. తెల్లవార్నే లేచి, త్వరగా తయారై, తిండి తిని ముందుగానే బయలుదేరారు పది గంటలకు మొదలయ్యే క్లాస్‌కని. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నా కూడా ఇదే మొదటి సారి ఆయనిలా కాలి నడకన బయలుదేరడం. అప్పుడు మేం అర్వింగ్‍లోని Las Colinas లో ఉన్నాం. ఇంటి నుంచి గుడికి సుమారు పది మైళ్ళ దూరం. మేమిద్దరం కార్లో వేళ్ళేటప్పుడు దారి పొడుగునా నాన్న కోసం వెదుకుతూనే వచ్చింది పాప. MacArthur రోడ్డు ప్రక్కన ఆయన కనపడగానే తనకు ఎనలేని సంతోషం. “అమ్మా! మనం కూడా నాన్న జతలో ఇక్కడ్నుంచి నడుద్దామా?” నాన్నని చూస్తున్నట్టే చటుక్కున దూసుకొచ్చింది ప్రశ్న వెనక సీట్లో కూర్చొన్న పాపనుంచి. అమేరికాలో పిల్లల సురక్షతా దృష్టితో పన్నెండేళ్ళ వయసు లేక 135 cms ఎత్తు వచ్చేంత వరకు పిల్లలు కార్లో ముందు సీట్లో కూర్చొని ప్రయాణించేట్టు లేదు. సురక్షతా నియమాల్ని అందరూ పాటిస్తారు. నియమాల్ని ఉల్లంఘిస్తే పెనాల్టీస్ చాలా ఎక్కువ.

“నా చేత కాదు పాపడూ అంత దూరం నడిచేందుకు. అదీగాక కారిక్కడెక్కడో పార్క్ చేసి వేళ్తే మళ్ళీ ఇక్కడిదాకా నడిచి రావాలి, లేక పోతే ఎవరి కార్లోనైనా ఇక్కడి వరకూ రావాలి. ఎందుకవన్నీ లేని పోని కష్టాలు.” తనని disappoint చేసినా పర్వాలేదని అద్దంలో తనని చూస్తూ నిజం చెప్పాను. పాపలో సహకరించే గుణం చాలా ఉండింది. ఒక క్షణం తన కళ్ళలో నిరాశ కనపడి మాయమైంది.

“నడిచేది కాళ్ళతో కదూ అమ్మా? నువ్వెందుకు ‘చేత కాదు’ చేతకాదని అంటావు? ‘నా కాళ్ళక్కాదు’ అని అంటే తప్పా?” మొదలయ్యాయి బేతాళ ప్రశ్నలు.

“అవునమ్ములూ. నువ్వన్న మాట నిజమే. అయితే నాకు సాధ్యం కాదు అనే అర్థంతో మేమలా వాడుతాం. నా వల్ల కాదని కూడా అంటారనుకో. కొన్ని expressions వాడుక వల్ల dictionary meaning కంటే పూర్తిగా వేరే అర్థాన్నిస్తాయి. అది రోజూ తెలుగు మాట్లాడటం వల్ల రాను రాను నీకే తెలుస్తుంది. ఇది can’t అనే అర్థంతో వాడుతాం.”

ఆహా! అందుకే కాబోలు ఏదైనా తినేందుకెక్కువనిపిస్తే కూడా నా చేతకాదంటారు కదూ అని ఇంకో ఉదాహరణమిచ్చింది తనే.

ఆ రోజు భగవద్గీత శ్లోకాల స్పర్ధలో క్లాస్‌లోని పిల్లలందరూ పాల్గొన్నారు. పిల్లలు భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేసుకొని స్పష్టమైన ఉచ్ఛారణతో పలకడం విని, ఆ రోజు జడ్జిగా వచ్చిన చిన్మయానికేతన్ స్వామీజీ పరమానందంతో ప్రశంసించారు. తక్కువ సమయంలో ఇరవై శ్లోకాల్ని కంఠస్థం చేయడం పిల్లల ఆసక్తి మరియు ఏకాగ్రతలను తెలుపుతుందన్నారు. ఏకాగ్రత లేనివారికి ఇంత బాగా నేర్చుకోవడం చేతకాదని టీచర్ చెప్పగా విని పాప నా వైపు చూసింది. ఇక్కడ కూడా ‘చేతకాదు’ అనే వాడారనే అర్థం ఆ చిలిపి కళ్ళలో.

తర్వాత భోజనాలప్పుడొచ్చింది ఇంకో ప్రశ్న. ఇంగ్లిష్‌లో ‘నంచుకుని’ అనేందుకేమనాలి అని. అది పూర్తిగా భారతీయ పదమని దాన్ని అనువాదం చేయడం నా చేత కాదని నవ్వాను. పెరుగన్నానికి గోంగూర లేక ఆవకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలా నంచుకోవడం తనకిష్టమనే విషయం తన అమేరికన్ స్నేహితులకు చెప్పాలని పాప ఆరాటం. ‘Pickles add special taste to yogurt rice. I like it.’ అని అనాలంతే. మనం రోజూ వాడే కొన్ని తెలుగు పదాలను ఇంగ్లిష్‌లోకి మార్చేందుకు సాధ్యం కాదన్న మాట అనింది పాప. అవును. ఏ భాషే కానీ ఆ భాషను వాడే ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేలాగుంటుంది. మన వాడుకలను సూచించే పదాలు మన భాషలో ఉంటాయంతే. మనలా రొట్టెకు కూర నంచుకోవడం మరియు పెరుగన్నానికి ఆవగాయ నంచుకొని తినడంలాంటి పద్ధతులు బహుశః వేరెక్కడా ఉన్నట్టు లేవు. విదేశీ భాషల్లో దాన్ని సూచించే పదం లేనప్పుడు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అమేరికాలో ఉన్నందువల్ల పిల్లలు తెలుగు వినడం తక్కువ, మాట్లాడటం ఇంకా తక్కువ. మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు వాళ్ళకు అడుగడుగునా అడ్డంకుల్లా చిన్ని చిన్ని సంశయాలు తలెత్తుతూనే ఉంటాయి. అవి ప్రశ్నలై బయటికొస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సరియైన బదులిచ్చేందుకు మనం మన వంతు ప్రయత్నం చేయలేదంటే వారి ఆసక్తికది వెనుకబాటు. వాళ్ళెక్కువగా వినే భాష English కాబట్టి తెలుగు పదాల్ని, వాక్యాల్ని ఇంగ్లిష్ పదాలతో, వాక్యాలతో పోల్చి చూసి, ఎక్కడెక్కడ పొందిక లేదనిపిస్తుందో అక్కడ కుతూహలంతో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఆ ప్రశ్నలకు వాళ్ళకర్థమయ్యేటట్టు బదులిచ్చే తెలివి కానీ, ఓపిక గానీ నాకుండలేదు. అయితే పిల్లలకు మన భాష నేర్పేందుకని క్లాస్ మొదలయ్యాక తొలి దశలోనే వాళ్ళ సంశయాలను పరిహరించాలనే ఉద్దేశంతో అవి రెండింటినీ ప్రజ్ఞాపూర్వకంగా కొద్ది కొద్దిగా నేర్చుకోవాల్సి వచ్చింది.

buduguపిల్లలు మనూర్లో పెరిగితే అవంతట అవే తెలిసే పదాలు, వాడుకలూ కూడా ఇక్కడ తగినంత పరిశ్రమ వేసి నేర్చుకోవాలి. బహుశః అమేరికాంధ్ర తల్లిదండ్రులందరూ దీన్ని గమనించి ఉంటారు. అమేరికాంధ్రుల పిల్లల ప్రశ్నల styleఏ వేరేనని చెప్పక్కర్లేదు. ఈ పిల్లలు గమనించినంత సూక్ష్మాతిసూక్ష్మాలు ఆ వయసులో నేను గమనించలేదనేది నూటికి నూరు పాళ్ళు సత్యం. ఒక్కోసారి వీళ్ళ ముందు మనం చాలా మొరటనిపిస్తుంది కూడా. To tell you the truth, it added a new interesting dimension to my thinking. అన్ని అనుభవాలకూ అక్షర రూపమిచ్చేందుకు నా చేత కాదు. అయితే పిల్లల ప్రశ్నల నా అనుభవాల చిన్ని అవలోకనం ఇక్కడుంది. వీటిలో కొన్నైనా అమేరికాంధ్రులందరికి తమ పిల్లలకు తెలుగు నేర్పేటప్పుడు స్వంత అనుభవానికి వచ్చి వుంటాయి.

ఏవేవో ప్రశ్నలకు బదులిచ్చే ఓపిక లేనప్పుడొక సారి మా పాపతో ప్రశ్నలతో విసిగించద్దు పొమ్మంటే “పొమ్మని అనొద్దమ్మా.” అని ఏడ్చింది. తనొక్కతే ఎక్కడికో వెళ్ళి పోవాలేమోననుకొని భయపడిందేమో. దగ్గరకి తీసుకొని “ఎక్కడికీ వెళ్ళాల్సిన పని లేదు పాపడూ. నాకిప్పుడు వేరే పనులున్నాయి. నీ ప్రశ్నలతో విసిగించకు అని అంతే. It just means don’t bother me right now.” అని వివరించి ఓదార్చాల్సి వచ్చింది. తనకప్పుడింకా మూడేళ్ళ వయస్సు. అమ్మానాన్నలు తప్ప వేరే బంధువర్గాన్నే చూడకుండా అందర్నుంచి దూరంగా పెరిగేటప్పుడు పిల్లల మనసులో కూడా ఒంటరితనం ఆవరిస్తుందేమో. పిల్లలు చాలా సున్నిత మనస్కులై భావుకులవుతారేమోనని అనిపించింది. ఏవేవో తప్పుగా ఊహించుకొని బాధపడతారని కూడా అనిపించింది.

“నువ్వెప్పుడూ అంతే. ఎక్కడ చదివిన పుస్తకాలు అక్కడే వదిలేస్తావు. వాటిని shelfలో ఉంచడం మర్చి పోతావు.” అని కోప్పడినప్పుడు “ఎప్పుడూ కాదమ్మా. Sometimes I forget, sorry!” అని మొహం చిన్నబుచ్చుకొన్న పాపను చూసి “ఎప్పుడూ అంటే always అని dictionary meaning ఉన్నా కూడా మేం వాడేది most of the times అనే అర్థంతో. మాకు ఓపికల్లేనప్పుడు అది sometimes  అనే అర్థం కూడా ఇస్తుంది.” వివరించి చెప్పాను. అయితే ఎందుకిలా చిన్ని విషయాలను మళ్ళీ నకారాత్మకంగా పెద్దవి చేస్తున్నానా అని అనిపించింది.  నేను మాట్లాడే తీరు మార్చుకోవాలని కూడా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ఇట్లాంటి సందర్భంలో ‘ఎప్పుడూ’ అని వాడరు. సందర్భోచితమైన ‘చాలా సార్లు’ అని అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలే కానీ గోరంతను కొండంత చేయడమెందుకా అని కూడా అనిపించింది.

ఎవరిదో అసహనీయమైన వైఖరి వల్ల బాధ పడి “వాళ్ళంతే. మారే రకం కాదులే. కుక్క తోక ఎన్నటికీ వంకరే.” అన్న నాన్న మాటలు విని “నాన్నా! That is too strong a statement. They might change for the better later sometime.” అనింది పాప. నాలుగైదేళ్ళ వయసులో, విషయాలేమీ తెలీక పోయినా పెద్ద ఆరిందాలా మాట్లాడిందనిపించినా కూడా, అవును కదా మనమింత కఠినంగా ఎవరి గురించి ఆలోచించినా తప్పనుకొన్నానే గానీ ఆయన మాటల్ని పాప ముందు సమర్థించుకోవాలని అస్సలనిపించలేదు. అందుకే అన్నారు ‘పాపలు మంచికి రూపాలు’ అని. పిల్లల మనసులో మానవీయత, ప్రామాణికత మున్నగు విలువలు నూటికి నూరు పాళ్ళు అర్థవంతగా వెలసి ఉంటాయి. వారి స్వచ్ఛ భావాలను కాపాడగల్గితే ఎంత బాగుణ్ణనిపించింది. ఒక్కోసారి మనకు తెల్సిన జీవన మౌల్యాలే చిన్ని పాపల మాటలై వారి నోటి నుంచి వచ్చి మమ్మల్ని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి.

ఈ తరం పిల్లలు మన ప్రతి మాటనూ గమనిస్తూ ఉంటారు. భాష నేర్చుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉన్న పిల్లలు మనం ఒకటి తెలిపితే చాలు, పది నేర్చుకోంటారనేది అతిశయోక్తి కాదు. మన తప్పులు మనం తిద్దుకొంటూ సాగితే అవి వాళ్ళ తప్పులై కొనసాగే అవకాశముండదు.

buduguమా స్నేహితుడింట్లో వాళ్ళబ్బాయి కిరణ్ “మా నాన్నగారు పేర్లు గుర్తురానప్పుడు తన పేరు అదేదో ఉంది లేక వాళ్ళ ఊరి పేరు అదేదో ఉంది అంటారు. ఏదో ఉంటుందనేది అందరికీ తెల్సు కదా. వారి పేరు గుర్తు రావడం లేదనో లేక మర్చి పోయిందనో ఒప్పుకోవచ్చుగా” అంటూ నవ్వాడు. ఎందుకంటే ఇంగ్లిష్‌లోనైతే గుర్తురాని సందర్భంలో నేరుగా గుర్తులేదని చెప్పడమే వాడుక. చెప్పే తీరు ఒక్కో భాషలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుందంతే కానీ తప్పర్థం చేసుకోకూడదని వివరించి చెప్పారు కోవెల్లోని తెలుగు క్లాస్ టీచర్.

కిరణ్ చాలా మాటకారి. అందర్నీ ఆకట్టుకొనే శక్తి తన ముద్దు మాటలకుంది. తనకేదైనా అర్థం కానప్పుడు చిరునవ్వులతో ప్రశ్నిస్తాడు. “మేం హైదరాబాద్‌కెళ్ళినప్పుడు దారిలో ఒకర్ని directions అడిగితే ముందుకెళ్ళి leftక్కొట్టి rightక్కొట్టాలన్నారు. ఇక్కడ కొట్టడం అనెందుకొచ్చింది?” కిరణ్ ప్రశ్నకు పెద్దాయన బదులిచ్చారు. బహుశః ఎద్దుల బండిని కావల్సిన దిక్కుకు మరల్చాలంటే ఎద్దులకు కొరడాతో ఓ చిన్ని దెబ్బ కొట్టేవారు. అందువల్ల కొట్టడం అంటే బండి నడపడమనే అర్థంలో వాడుకలో వచ్చియుంటుంది. ఇప్పుడు మోటార్ వాహనాలక్కూడా అదే పదం వాడటం కొనసాగిందన్నారు.

మెట్లు దిగేటప్పుడు జారి పడి తన కాలికి మూగదెబ్బ తగిలిందన్నారు పెద్దావిడొకరు. అంటే కంటికి కనపడేలాంటి గాయం కాదు కాబట్టి దాన్ని మూగదెబ్బ అంటామన్నారు. పిల్లలకు ఒకటే నవ్వు. దెబ్బవల్ల కల్గిన గాయం కనపడలేదని దాన్ని గుడ్డి దెబ్బనాలా లేక గాయం నోరు విప్పలేదని మూగ దెబ్బనాలా అనే వాదాలతో సాగాయి మాటలు. మొత్తానికి పిల్లల మనసుల్లో మన భాషపై మూగప్రేమ మొదలై తెలుగుదనం వైపు ఆసక్తి వస్తూందనడానికి ఇది నిలువుటద్దమన్నారు టీచర్.

తెలుగుగడ్డ నుంచి దూరంగా ఉన్నందువల్ల భాష పట్ల పిల్లల మనసులో చెలరేగే గందరగోళాల్ని నివారించేందుకు పెద్దల ప్రతిభా పాటవాల సహాయం అత్యవసరమనే సత్యం ప్రతి నిత్యమూ కళ్ళ ముందుకొస్తూనే ఉంటుంది. అంతే కాదు, మన భాషాసంస్కృతిని, సంగీత సాహిత్యాలనీ ముందు తరాలకు అందించాలంటే మనం చెప్పే విధానాల్లో, మన ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు తెలుగు చదివి, విని ఆనందించేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ పెద్దాయన చేసిన ఉపదేశం గుర్తొచ్చింది.

“జీవితమున్నదే మన నవ్వులు, ప్రీతి, తపన, ప్రామాణికత, మానవీయత, మన సంస్కృతి, మన కలలు, ఆశయాలు అన్నీ మన వాళ్ళతో పంచుకోవడానికి మరియు దానివల్ల ఆహ్లాదకరమైన సుదీర్ఘ సంబంధాలను పెంచుకోవడానికి. స్వస్థ కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు. అందుకే ప్రవాస భారతీయులు కూడా తమ భాషని, భాషాప్రేమని తమ పిల్లలతో పంచుకొని పెంచుకోవడానికని ఆరాటపడతారు. తమ భావనల్ని, కలల్ని తమ పిల్లలకు తెలిపే ప్రయత్నాల్లో భాష నేర్పడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏ విషయం గురించి కానీ ఆలోచించి, అనుభవించి తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి ఉపయోగపడే అమూల్య సాధనమే భాష. అమ్మ భాష మన జీవితంతో ముడిపడియున్న ఒక విడదీయరాని భాగం.”

ఈ నెలాఖర్లో మన తెలుగు దినోత్సవం వస్తూంది. తెలుగు భాష మనది; నిండుగ వెలుగు భాష మనది అని మళ్ళీ మళ్ళీ పాడే సమయమిది. సమస్త తెలుగు బాంధవులకు తెలుగు దినోత్సవపు శుభాకాంక్షలు!

*

అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం…

 

స్లీమన్ కథ-6

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తమ్ముడు మరణించిన వార్త స్లీమన్ కు చేరింది 1850 ఆగస్టులో…

ఆ ఏడాది మిగతా రోజుల్ని తన వ్యాపార పర్యవేక్షణలోనూ, ఏం చేయాలో తోచని అనిశ్చితస్థితిలోనూ గడిపేశాడు. తమ్ముడి మరణం అతన్ని చలింపజేసింది. మృత్యువు గురించిన ఊహ భయపెట్టింది. దుఃఖభారం తన మీద హఠాత్తుగా పడినట్టుగా కుటుంబ సభ్యుల మీద పడకూడదనుకుని ఒక విచిత్రమైన ఉత్తరం రాశాడు. తమ్ముడు చనిపోయినట్టు తనకు కల వచ్చిందనీ, ఈ ఇరవయ్యేళ్లలో ఎప్పుడూ ఏడవని తను ఆ కలను తలచుకుని మూడు రోజులపాటు దుఃఖించాననీ అందులో రాశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అసలు విషయం రాస్తూ, తమ్ముడు ఓ పెద్ద ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతిని కూడా తెలియజేశాడు.

ఏడాది చివరిలో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తమ్ముడి ఆస్తిని సంరక్షించవలసిన బాధ్యత తనకు ఉంది. దాంతోపాటు అతని అడుగుజాడల్లో నడుస్తూ తను కూడా కాలిఫోర్నియా బంగారు భూముల దగ్గరకు వెళ్ళి అతని డబ్బుతోనే వ్యాపారం చేసి సెయింట్ పీటర్స్ బర్గ్ లో కన్నా వేగంగా కోట్లు సంపాదించచ్చు. అంతకన్నా ముందు తమ్ముడికి తగిన సమాధిని నిర్మించాలి. తనింక అమెరికాలోనే స్థిరపడిపోతాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో తనను కట్టి పడేసేవేమీ లేవు. కాకపోతే ఎకతెరీనా లిషిన్ ను తను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆమెను తను పెళ్లి చేసుకుంటే మళ్ళీ రష్యా రావలసి ఉంటుంది. ఆమె పెళ్ళికి ఇష్టపడాలన్నా తను అమెరికా వెళ్ళి ఆమె కళ్ళకు జిగేలుమనిపించేటంత ఐశ్వర్యాన్ని గడించవలసిందే.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే జీవితాంతం పాతుకు పోవాలని ఇంతకుముందు అనుకున్నాడు. ఇప్పుడది పొరపాటు నిర్ణయం అనుకుంటున్నాడు. మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనీ, ఆగిన చోట ఆగకుండా మరోసారి సంచారజీవిగా మారాలనీ తలపోస్తున్నాడు.

1850 డిసెంబర్ 10న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన వర్తక మిత్రులకు చివరి విందు ఇచ్చి ఆ నగరానికి వీడ్కోలు చెప్పాడు. నేవా నది గడ్డకట్టి ఉంది. సెయింట్ ఇసాక్ స్క్వేర్ మీదుగా మంచు గాలులు వీస్తున్నాయి. మిత్రులు అతన్ని సాగనంపడానికి పోస్టాఫీస్ దాకా వచ్చారు. అక్కడినుంచే జర్మనీకి దూరప్రయాణం చేసే స్లై బళ్ళు బయలుదేరతాయి. అక్కడి వింటర్ ప్యాలెస్, నౌకాదళ భవనం, అశ్వాన్ని అధిష్టించి ఉన్న పీటర్ ది గ్రేట్ విగ్రహం పక్కగా వెడుతూ అదే చివరిసారి అన్నట్టు వాటికి శాల్యూట్ చేశాడు.

ప్రయాణంలో ఎప్పటిలానే డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ రాతలు చాలావరకూ టైమ్ టేబుల్ కు పొడిగింపే. వాటిలో రైళ్ల రాకపోకల వేళలు, ప్రయాణంలో తగిలిన రైల్వే స్టేషన్ల పేర్లు, తను బస చేసిన హోటల్ వివరాలు, ఆరో అంతస్తులో తను దిగిన గదికి చెల్లించిన కిరాయి, బ్యాంక్ లో తను మారకం చేసిన మొత్తం, తన అనుమతితో కలసుకున్న వర్తకుల పేర్లు వగైరాలు ఉంటాయి.

1850 డిసెంబర్ 15న డైరీలో ఇలా రాసుకున్నాడు:

ఉదయం 7గం. లకు ఎల్బింగ్ లో బ్రేక్ ఫాస్ట్ చేశాం. 11గం.లకు మేరియన్ బర్గ్ దాటాం. సాయంత్రం 4గం.లకు ఓ పెద్ద తేలుడు వంతెన మీంచి విష్టులా మీదుగా డిషావ్ చేరుకున్నాం. డిసెంబర్ 18న మధ్యాహ్నానికి ఓడెన్ బర్గ్ చేరాం. అక్కడ డిన్నర్ చాలా అధ్వాన్నంగా ఉంది. 1గం.కు రైల్లో బయలుదేరి సాయంత్రం 5.30గం.లకు స్టార్ గాడ్ మీదుగా స్టెటిన్ చేరాం. అక్కడినుంచి మళ్ళీ 6.30గం. లకు రైల్లో బయలుదేరి రాత్రి 9.30గం.లకు బెర్లిన్ చేరాం.

అదృష్టవశాత్తూ అతని డైరీ రచన ప్రతిసారీ ఇలాగే లేదు. తన అమెరికా ప్రయాణం డైరీని అతను ఇంగ్లీష్ లో రాశాడు.   అందులోని కొన్ని భాగాలు అతని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా మిగిలిపోతాయి. ప్రచురణకూ, ఇంకొకళ్ళు చదవడానికీ ఉద్దేశించకపోయినా వాటినతను ఎంతో శ్రద్ధగా రాశాడు. కొన్నిచోట్ల కథనంలో గొప్ప నిజాయితీ, నిర్మొహమాటం ఉట్టిపడుతూ అతని అనుభవప్రపంచంలోకి మనల్ని ఇట్టే తీసుకుపోతాయి.

డైరీ తెరవగానే, ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోడానికి అంగలార్చుతూ బయలుదేరిన అసలుసిసలు వ్యాపారవేత్తగానే అతను కనిపిస్తాడు. తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోగల తన వ్యాపారపు మెళవకుల గురించిన డాంబికత; గురి తప్పని తన అంచనాల గురించిన ఆత్మవిశ్వాసమూ ఆ రాతల్లో వ్యక్తమవుతాయి. కానీ ముందుకు వెడుతున్నకొద్దీ అతన్ని మొదలంటా వణికింపజేసిన మానవ అనుభవాల పచ్చిదనం కనిపిస్తుంది. తుపాను, గాలివాన, అస్వస్థత అతనిలోని అతిశయపు గాలి తీసేసి అణిగి ఉండేలా చేశాయి. భయభీభత్సాల ముఖాన్ని అతి దగ్గరగా చూసి అతను  మామూలు మనిషయ్యాడు.

అతని డైరీ తొలి పుటల్ని తిరగేసేవారెవరూ, కాన్ రాడ్ రాసిన Heart of Darkness తో పోల్చదగిన ఒక మానవీయ అనుభవపత్రాన్ని ముందు ముందు చదవబోతున్నామని అనుకోలేరు

పనామా జలసంధిలో చాగరెస్ నది

పనామా జలసంధిలో చాగరెస్ నది

స్లీమన్ ఏమ్ స్టడామ్ చేరుకుని బి. హెచ్. ష్రోడర్ &కో ను సందర్శించాడు. అమెరికాలోని ఏజెన్సీలకు, బ్యాంకులకు పరిచయలేఖలు తీసుకున్నాడు. అక్కడినుంచి బయలుదేరి డిసెంబర్ 23న లండన్ చేరుకున్నాడు. “బ్లాక్ ఫ్రయర్స్ బ్రిడ్జి” దగ్గర, “రాయల్ హోటల్” లో బస చేశాడు.  తను సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తెచ్చుకున్న బిల్లులను నగదుగా మార్చుకున్నాడు. తన దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు అమ్మేశాడు. మధ్యాహ్నం క్రిస్టల్ ప్యాలెస్ ను దర్శించి ఆనందించాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతికి అది కూడా ఒక తిరుగులేని ఉదాహరణగా కనిపించింది.

క్రిష్టమస్ రోజున వెస్ట్ మినిస్టర్ యాబేలో చర్చి సేవల్లో పాల్గొన్నాడు. అదే రోజున ప్రముఖ విషాదాంత నాటక నటుడు మెక్రాడే రంగస్థలంనుంచి విరమించుకునే ముందు నటించిన చివరి నాటకాన్ని చూశానని డైరీలో రాసుకున్నాడు. నిజానికి మెక్రాడే క్రిష్టమస్ రోజంతా పూర్తిగా తన కుటుంబంతో గడిపాడు తప్ప ముఖానికి రంగు వేసుకోలేదు. అతను చివరిసారి నటించింది అప్పటికి రెండు నెలల తర్వాత! 1851 ఫిబ్రవరి 26న ప్రిన్స్ థియేటర్ లో జరిగిన ఆ బ్రహ్మాండమైన ప్రదర్శనను తిలకించినవారిలో డికెన్స్, బుల్వర్-లిటన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. స్లీమన్ మరెవరి నాటకమో చూసి మెక్రాడేదిగా పొరబడి ఉంటాడు.

క్రిష్టమస్ మరునాడే రైల్లో లివర్ పూల్ చేరుకుని తను ఎప్పుడూ దిగే అతి పెద్ద హోటల్ అడెల్ఫీలో బసచేశాడు. 35 పౌండ్లు చెల్లించి న్యూయార్క్ ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రి వరకూ లివర్ పూల్ లో అక్కడా అక్కడా తిరిగాడు.

ss atlantic (1)

ఎస్.ఎస్. అట్లాంటిక్

3వేల టన్నుల బరువైన ఎస్.ఎస్. అట్లాంటిక్ ఆ మరునాడే న్యూయార్క్ కు బయలుదేరింది. ఆ రోజుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే ఓడల్లో అదొకటి. బయలుదేరిన ఎనిమిది రోజులకు తుపానులో చిక్కుకుంది. ఓ పెద్ద అల ముందుచక్రాన్ని ధ్వంసం చేసి ప్రధాన స్తంభాన్ని విరిచేసింది. అలలు ఓడను తలోవైపుకీ విసిరేయడం ప్రారంభించాయి. ఇంజన్లు రెండూ పనిచేయడం మానేశాయి. అప్పటికి ఓడ లివర్ పూల్ నుంచి 1,800 మైళ్ళు ప్రయాణించి, న్యూయార్క్ కు 1,400 మైళ్ళ దూరంలో దాదాపు అట్లాంటిక్ నడి మధ్యలో ఉంది.

ఉధృతంగా వీస్తున్న పడమటి గాలిని ఆసరా చేసుకుని సముద్రానికి అడ్డంగా ప్రయాణించి అమెరికా తీరానికి చేరుకోవచ్చుననుకుని కెప్టెన్ ప్రధాన తెరచాపల్ని ఎగరేశాడు. “తెరచాపలు జేబురుమాళ్లను తలపించాయి” అని స్లీమన్ డైరీలో రాసుకున్నాడు. తుపాను గాలులకు అభిముఖంగా ప్రయాణించాలన్న కెప్టెన్ ఆలోచనను ప్రయాణీకులంతా వ్యతిరేకించారు. ఇంగ్లండ్ కు తిరిగి వెళ్ళడం మంచిదన్నారు. పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. చివరికి ప్రయాణీకుల ఒత్తిడికి తలవొగ్గి కెప్టెన్ ఓడను వెనక్కి తిప్పాడు.

సముద్రపు గాలి పడక స్లీమన్ అంతవరకూ అస్వస్థతతో ఉన్నాడు. తుపాను కలిగించిన ఉద్రిక్తత పుణ్యమా అని ఆ  అస్వస్థత మంత్రించినట్టు మాయమైపోయింది. పైగా అంతవరకూ లేనంత ఉల్లాసాన్ని తను పుంజుకోవడం గమనించి స్లీమన్ ఆశ్చర్యపోయాడు. ఘనత వహించిన ఆ ఓడ చీలికలు పీలికలైన తెరచాపలతో ఇంటిముఖం పడుతుంటే వింతగా చూస్తూ ఉండిపోయాడు.

పదహారు రోజుల తర్వాత క్వీన్స్ టౌన్ లో ఓడకు లంగరేశారు. స్లీమన్ వెంటనే బయలుదేరి డబ్లిన్ మీదుగా లివర్ పూల్ కు తిరిగి వచ్చాడు. అంతలో ఏమ్ స్టడామ్ లో ఓ ముఖ్యమైన వ్యాపారలావాదేవీకి తను అత్యవసరంగా హాజరు కావాలన్న కబురు అందింది. హడావుడిగా అక్కడికి వెళ్ళి ఫిబ్రవరి 1 కల్లా మళ్ళీ లివర్ పూల్ వచ్చి న్యూయార్క్ ప్రయాణానికి తిరిగి సిద్ధమైపోయాడు.

ఈసారి అతను ఎస్.ఎస్. ఆఫ్రికాలో ప్రయాణం చేశాడు. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయింది. అతనికి న్యూయార్క్ నచ్చింది. యూరోపియన్ రాజధానులతో పోల్చదగింది కాకపోయినా, “సొగసైన భారీ భవంతులతో ఓ పద్ధతిగా, చూడముచ్చటగా, శుభ్రంగా నిర్మించిన నగరం” అనుకున్నాడు. న్యూయార్క్ లోని ఆడవాళ్ళలో మాత్రం మెచ్చుకోదగింది ఏమీ అతనికి కనిపించలేదు. “16-18 ఏళ్ల వయసులో ఎంత అందంగా, కుదిమట్టంగా ఉంటారో, 22 ఏళ్ళు వచ్చేసరికి అంత వయసుమీరినవాళ్లలా, నలిగిపోయినట్టు కనిపిస్తారు” అని డైరీలో రాసుకున్నాడు. వినోదాలకు, పనికిమాలిన విషయాలకు వాళ్ళు వెంపర్లాడతారని కూడా అతనికి అనిపించింది.

అక్కడి రైలురోడ్లు కూడా అతనికి నచ్చలేదు. రైల్లో ఫిలడెల్ఫియాకు వెళ్లొచ్చిన తర్వాత, “అమెరికాలో రైలురోడ్లు కేవలం డబ్బు చేసుకోడానికే నిర్మించారు. ప్రయాణీకులకు అవసరమైన సదుపాయాలపై కనీసమైన దృష్టి కూడా పెట్టలేదు” అని రాశాడు. అలా అన్నవాడే ఆ తర్వాతి కాలంలో అమెరికా రైలు రోడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాడు.

వాషింగ్టన్ వెళ్ళి అధ్యక్షుడు ఫిల్ మోర్ ను కలసుకున్నాడు. “ఈ అందమైన పడమటి దేశాన్ని చూడడానికీ, దీనిని పాలించే మహనీయుల్ని పరిచయం చేసుకోడానికీ వచ్చా”నని అధ్యక్షుడితో చెప్పినట్టు రాశాడు. ఆ వెంటనే వైట్ హౌస్ లో జరిగిన ‘స్వయిరీ’(soiree: సాధారణంగా ఒక ప్రైవేట్ గృహంలో జరిగే సాయం విందు. దీనికి నిర్దిష్టమైన దుస్తులతో హాజరవుతారు)లో పాల్గొని, పనామా జలసంధి(Isthamus of Panama)కి దారితీసే ఓడ ఎక్కాడు. ఆ రోజుల్లో సుదూర పశ్చిమానికి వెళ్లడానికి అదొక్కటే దారి. అప్పటికింకా పనామా రైలురోడ్డు లేదు. జలసంధికి చేరుకున్నాక కంచర గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ ప్రాంతంలో యెల్లో ఫీవర్ లాంటి మన్య జ్వరాల బెడద ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల అడవుల్లో బందిపోట్ల సమస్యా ఉండేది.

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:

పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.

అద్భుతం అలా ఉంచి, వాళ్ళ సోమరితనాన్నీ, వాళ్ళనూ చూసి అతను భయపడ్డాడు. దారి పొడవునా ఇండియన్ల చేతుల్లో హతులైన బాటసారుల ఎముకల పోగులు కనిపించాయి. పనామా చేరాడు కానీ ఆ నగరం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. అక్కడి స్పానిష్ జనం కూడా అతనికి “సోమరిపోతుల్లానూ; న్యూయార్క్ లోని ఆడవాళ్ళలానే  వినోదాలకు, పనికిమాలిన ఆసక్తులకు పాకులాడేవాళ్లుగానూ, పెద్దగా శీలసంపద లేనివాళ్ళుగానూ” కనిపించారు. ఇలా చూసీ చూడగానే మనుషుల మీద తొందరపాటు తీర్పులు ఇవ్వబోయాడే కానీ, ఉష్ణమండల ప్రాంతాలలో జనజీవితం చాలావరకూ ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందనీ, వారి ఆకాంక్షలకు అదే హద్దులు గీస్తుందన్న సంగతి అతనికి తట్టలేదు.

పనామాలో అతనికి ఏదీ నచ్చకపోయినా, విచిత్రంగా ఒకవిధమైన సంతృప్తినీ చెందాడు. ప్రయాణం దాదాపు ముగిసి, కాలిఫోర్నియా బంగారం చేతికి అందబోయే అవకాశం అతనిలో ఉత్సాహం నింపింది. అక్కడికి వెళ్ళే ఓడకు ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఉంది కనుక ఈలోపల పనామా పాతనగరం చూద్దామని వెళ్ళాడు. మోర్గాన్, అతని సముద్రపు దొంగల ముఠా ధ్వంసం చేయడంతో సగం నగరం పాడుబడి ఓ పెద్ద అడవిలా తయారైంది.

అంకెర్షాగన్ విడిచిపెట్టాక అతను శిథిలాలను చూడడం ఇదే మొదటిసారి. ఆ దృశ్యం అతనికి పెద్దగా ఉత్తేజం కలిగించలేదు కానీ, ఆ పురాతనపు గోడల్లో చెట్ల వేళ్ళు ఎలా పాతుకున్నాయా అనుకుంటూ వింతగా వాటినే చూస్తూ ఉండిపోయాడు. పనామా పాతనగరం సందర్శనను పురావస్తు అన్వేషణలో అతని తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. తన వెంట వచ్చిన గైడ్ ఓ మొద్దావతారమనీ, ఆ శిథిలాల గురించి అతనికేమీ తెలియదనీ, సమయం వృథా అవడం తప్ప ఈ ప్రయాణంతో ఒరిగిందేమీ లేదనీ రాసుకున్నాడు.

1851 మార్చి 15న ఎస్.ఎస్. ఓరెగన్ మీద కాలిఫోర్నియాకు బయలుదేరాడు. ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ అసహ్యించుకున్నాడు. భోజనం పరమ రోతగా ఉందంటూ పళ్ళు నూరాడు. ఎంతసేపూ ఉప్పులో ఊరేసిన పందిమాంసం, గొడ్డు మాంసం తప్ప; ఐసుకానీ, తాజా మాంసంకానీ లేదు. సముద్రస్నానాన్ని మాత్రం చాలా ఇష్టపడ్డాడు. అయితే ఓడలోని పనివాళ్లు అందుకు సహకరించకపోవడం అతనికి విచిత్రంగా అనిపించింది.

వారం రోజుల తర్వాత ఓడ అకపుల్కో చేరింది. స్పానిష్ జనంపై అతనిలో ఏర్పడిన అవిశ్వాసం ఇప్పుడు మెక్సికన్లవైపు మళ్ళింది. వాళ్ళు వట్టి అబద్ధాలకోరులు, అజ్ఞానులు, పొగరుబోతులు అనుకున్నాడు. అకపుల్కో “ఓ ఆఫ్రికా గ్రామం”లా కిక్కిరిసిన గుడిసెల గుంపులా ఉందన్నాడు. పసుపురంగు సముద్రపు కలుపుతో నిండిన అఖాతం చుట్టూ కొన్ని చెక్కఇళ్ళు మాత్రమే ఉన్న కుగ్రామంగా శాన్ డియేగోను తీసిపారేశాడు. ఆ నేలను, తోటి ప్రయాణీకులను ఏవగించుకుంటూ, ఖగోళ గ్రంథాలు చదువుతూ, రాత్రిపూట గంటల తరబడి నక్షత్రాలను పరిశీలిస్తూ గడిపాడు. అతనిలో అసహనం ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే, ఓడ గోల్డెన్ గేట్ (శాన్ ఫ్రాన్సిస్కోను మెరీన్ కౌంటీతో కలిపే జలమార్గాన్ని గోల్డెన్ గేట్ అంటారు. 1933లో అక్కడ గోల్డెన్ గేట్ వంతెన నిర్మించారు)కు చేరడం ఏ కొంచెం ఆలస్యమైనా భగ్గున పేలిపోయి ఉండేవాడు.

శాన్ ఫ్రానిస్కోను చూసి మాత్రం చాలా సంతోషించాడు. అయినా సమయం వృథా చేయడానికి లేదనుకుంటూ తమ్ముడి సమాధిని చూడడానికి వెంటనే సెక్రామెంటోకు దారితీశాడు. అప్పటికి సెక్రామెంటో ఇంకా బాల్యదశలోనే ఉంది. చెక్క గోడలతో నిర్మించిన ఇళ్లతో ఈ విచిత్రమైన పట్టణం, పొరుగునే ఉన్న బంగారు భూముల పుణ్యమా అని ఉనికిలోకి వచ్చింది. మొదటిసారి సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టినప్పుడు తనలోంచి ఆశ్చర్యకరమైన ఉధృతితో తోసుకొచ్చిన అనుభూతి లాంటిదే ఈ పట్టణంలో అడుగుపెట్టగానే అతనికి కలిగింది.  ఈ పట్టణ జనాభా కన్నా, ఇక్కడి శ్మశానంలోని సమాధులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అతను గమనించాడు.

తమ్ముడి సమాధిని చూశాడు. అక్కడ ఎలాంటి స్మారకచిహ్నాలూ లేవు. “ఒక చక్కని పాలరాతి సమాధి”ని నిర్మించమని చెప్పి ఓ శవవాహకుడికి 15 పౌండ్లు ఇచ్చాడు. తమ్ముడు విడిచి వెళ్ళిన సంపద గురించి వాకబు చేశాడు. అతని భాగస్వామి దాన్ని పుచ్చుకుని పారిపోయాడని అక్కడి వాళ్ళు చెప్పారు. పోలీసుల సాయంతో అతన్ని పట్టుకోవచ్చేమో నని కొంత భోగట్టా చేశాడు. చివరికి అదో వృథా ప్రయాస అన్న నిర్ణయానికి వచ్చి విరమించాడు. అలా తమ్ముడు సంపాదించానని చెప్పిన ముల్లె కాస్తా గాలిలో కలిసిపోయింది.

స్లీమన్ కు సెక్రామెంటో మామూలుగా నచ్చడం కాదు, మత్తెక్కించింది. కొత్తచోట ప్రతిసారీ చేసినట్టే చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ ఎలాంటి అవకాశాలుంటాయో పరిశీలించాడు. సటర్ విలాను, యుబా నది దగ్గరి బంగారు భూముల్ని, నెవాడా నగరాన్నీ దర్శించాడు. నెవాడా “చీదర పుట్టించే చిన్నపాటి ప్రదేశం”గా అతనికి కనిపించింది. ప్రయాణాల్లో తనలా బహుభాషా పరిచయం ఉన్నవాళ్లను గాలించి పట్టుకునే అలవాటు కూడా అతనికుంది. సొనోమా వ్యాలీలో అలాంటి వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రొఫెసర్ రీగర్. అతనికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, డచ్చి భాషలు తెలుసు. ఒక భాషనుంచి ఇంకో భాషలోకి అవలీలగా లంఘించే ఆ అపరిచితునితో అర్థరాత్రి వరకూ కబుర్లాడుతూ స్లీమన్ ఆనందించాడు.

కొన్ని రోజులు అనిశ్చితంగా గడిపిన తర్వాత, బంగారం రజను(gold dust)కొనే వ్యాపారిగా అవతారమెత్తాడు. ఆ వ్యవహారంలోనే జూన్ లో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు. అగ్నిప్రమాదాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ నగరంలో అతను ఉన్నప్పుడే ఓ పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది…

                                                                                                                     (సశేషం)

 

 

 

 

 

 

 

సగం ఆకాశంపై ఇంకో సంతకం!

 

 

  (ఆగస్టు 23 మెర్సీ మార్గరెట్ తొలి కవిత్వ సంపుటి “మాటల మడుగు” ఆవిష్కరణ సందర్భంగా)

 

నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు

కొత్త నేలా, కొత్త ఆకాశమూ దొరకడం లేదు

సర్లే, కొత్త నేలా కొత్త ఆకాశమూ దొరికాయి కదా అనుకుంటే

కొత్త మానవుడి ఆచూకీ దొరకడం లేదు ఎక్కడా!

-చాలా కాలం కిందట యేదో ఆడియో క్యాసెట్ లో విన్న కైఫీ ఆజ్మీ ఘజల్ గుర్తొస్తోంది, ఇవాళ మెర్సీ కవిత్వం రెండో సారి చదవడం పూర్తి చేసాక! ఆ వెంటనే, రెండు ప్రశ్నలు నా ఆలోచనల నిండా అలముకున్నాయి.

కవిత్వం రాయడం అనే ప్రక్రియ కవికి ఎందుకు అంతగా అవసరం? నాలుగు కవిత్వ వాక్యాల తరవాత ఆ కవి ప్రపంచం గానీ, అది  చదివిన చదువరి ప్రపంచం గానీ కొంచెమైనా మారుతాయా? ఈ రెండు ప్రశ్నలు అడగడం తేలిక; వాటి సమాధానాలు అంత తేలిక కాదు.

కాని, కవిత్వాన్ని తన సంభాషణకి సాధనంగా ప్రకటించుకున్నాక, ఆ కవి ప్రపంచం చాలా మారిపోతుంది. తన అనుభవాన్నీ, చెప్పాలనుకున్న విషయాన్ని ఆవిష్కరించడంలో ఆ కవి వెతుక్కునే దారులు అప్పటిదాకా మనకి అపరిచితంగా వున్నా, కొద్దిసేపట్లో అవి పరిచితమై, వొక ఆత్మీయమైన బంధం కవికీ, చదువరికీ మధ్య మొలకలెత్తుతుంది.

అంటే, వొక ఆత్మీయ నేస్తం లేని లోటుని ఆ కవిత్వం నెమ్మదిగా భర్తీ చేయడం మొదలెడుతుంది. అలాంటప్పుడు ఆ కవి ఎవరు, అతను/ ఆమె భౌతిక ఉనికి ఏమిటీ అన్న ప్రశ్నలు అర్థరహితంగా కనిపిస్తాయి. వాక్యాలతో మొదలైన ఆ బంధం జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలలో కూడా ఆ వాక్యాల ఆసరా వెతుక్కునేట్టు చేస్తుంది.

అలాంటప్పుడు, చాలా సంక్లిష్టంగా అనిపించే జీవన ప్రహేళికలో వొక నేలా, ఆకాశమే కాదు, కొత్త మానవత్వపు చిరునామా కూడా దొరికినట్టే! అలాంటి అనుబంధాన్ని అల్లుకునే కవిత్వపు వంతెన – మెర్సీ మార్గరెట్ కవిత్వం.

1

సాధారణ స్త్రీవాద కవిత్వం దాదాపూ తగ్గుముఖం పట్టి, దళిత, ముస్లిం, తెలంగాణా  స్త్రీవాదాల నిర్దిష్టత (local –specific feminism) ముందుకొస్తున్న దశలో మెర్సీ కవిత్వం మనం చదువుతున్నాం. అలాగే, భావప్రకటనకి సంబంధించి వ్యక్తిగత ధోరణి యింకో రూపం ఎత్తుతున్న దశలో కూడా మనం వున్నాం. ప్రపంచీకరణ తరవాతి extreme individualism తెలిసో తెలియకో ప్రతి కవిలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. ఇది క్రమంగా  సామాజిక నిరాకరణగా మారిపోతోందా అన్న సంశయమూ వొక్కోసారి వస్తోంది. ఆ సంశయాలని తుడిచేస్తూ, ఈ రెండీటినీ బ్యాలెన్స్ చేసే స్వరాల్లో మెర్సీ వొకటి.

mercy

మెర్సీని కవిత్వ లోకంలో బలంగా పరిచయం చేసిన కవిత “ప్రశ్నలగది.” ఈ కవితలో మెర్సీ అన్వేషణకి ఎన్ని రూపాలున్నాయో అవన్నీ అద్దంలో ప్రతిఫలించినట్టు కనిపిస్తాయి. వొకే వొక కవితలో కవి వ్యక్తిత్వాన్ని చూపించాలనుకోవడం దురాశే కాని, ఎందుకో నాకు నమ్మకం- అలా చెయ్యచ్చు అని! కవి ఏదో వొక కవితలో తన మొత్తం ప్రాణం పొదుగుతాడు; తన ప్రయాణానికి ఆ కవిత తెలియకుండానే benchmark అవుతుంది. అది ఎలా అన్నది అర్థం కావాలంటే “ప్రశ్నలగది” కవిత మొత్తం ఇక్కడ quote చేయాలి.

అప్పుడప్పుడు

ఆ గదిలోకెళ్ళడం అవసరం

అంటూ వొక అనివార్యత(inevitability)ని మన ముందు సృష్టించి అప్పుడు కవితలోకి తీసుకెళ్తుంది మెర్సీ. ఇది మంచి శిల్పం అయితే, అక్కడితోనే ఈ కవిత ఆగిపోదు.  ఇందులో మెర్సీ నిబద్ధతని చెప్పే వాక్యాలు చాలా వున్నాయి. ప్రశ్నల గదిలోకి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న వెనక మెర్సీ చూపించిన rationalization  ఈ కవితకి మూల బిందువు.

కవి వ్యక్తిత్వాన్ని- అది సొంతమైనా, కవిత్వమైనా- ఆమె వెతుకులాటతో మాత్రమే సరిగా measure చేయగలమని అనుకుంటాను. అన్నట్టూ, వెతుకులాట అంటే మళ్ళీ ఇప్పటికీ ఇస్మాయిల్ గారి కవితే గుర్తొస్తుంది.

నింగి దేనికోసం
వంగి వెతుక్కుంటుంది?
నేల దేనికోసం
నీలంగా సాగుతుంది?
కాసార మెవరికోసం
కన్నార్పక చూస్తుంది?
ఆకలి దప్పులు లేని గాలి
వాకిళ్ళనెందుకు తెరుస్తుంది?
బొడ్డులో కన్ను తాపుకుని
బావి ఏమి గాలిస్తుంది?
ఒక్క చోటనే చెట్టు నిత్య
మెక్కడికి ప్రయాణిస్తుంది?

ఇస్మాయిల్ గారు ఈ కవితలో చెప్పిన భిన్న స్తితులకు కవి గానీ, కవిత్వ సృజన గానీ  ఏ మాత్రం భిన్నం కాదు. ఇందుకవితని లో ఇస్మాయిల్ గారు అడుగుతూ వెళ్ళిన ప్రశ్నలకి ఈ కాలంలో ఈ క్షణంలో నేను మెర్సీ “ప్రశ్నల గది” కవితని వొక సమాధానంగా చూస్తున్నా.

అన్ని సమాధానాలూ  దొరుకుతాయన్న హామీ లేదు జీవితంలోనూ, కవిత్వంలోనూ!

వెతుకులాట ఎక్కడో వొక చోట ఆగిపోతుందన్న హామీ అంతకంటే లేదు. అయితే, కవిత్వం వొక హామీ ఇస్తుంది. జీవితంతో ఉద్వేగ బంధాన్నిస్తుంది. ఎడరతెరపి లేకుండా ప్రశ్నించే సహనాన్నిస్తుంది. ఈ  మూడింటి కోసమే మనం కవిత్వాన్ని ఇంతగా ప్రేమిస్తాం. నమ్ముకుంటాం. చాలా కవితల్లో మెర్సీ కవిత్వ పుట్టుక గురించీ, నడక గురించీ ఆలోచించడం కనిపిస్తుంది. కవిత్వాన్ని  వొక savior గా నమ్మినప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఇన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఇలాంటి నాకు బాగా నచ్చిన సందర్భం- “కవులు-కాగితం” అనే కవిత. చాలా తేలికగా వుండే కవిత ఇది. కాని, బరువైన ఆలోచనని దాచుకున్న కవిత.

అవును,

కవులు కాగితాలపై కలుస్తారు

సగం దూరం ప్రయాణించిన తరువాత

బాటసారుల్లా కొందరు

 

నదుల్లా వెంటాడుతూ, మనతో

మన ఆలోచనల్లో

ఇంకొందరు

కవిత్వాన్ని గురించి ప్రతి కవీ తనదైన వూహ చేయకుండా ఉండడు. ఆ ఊహని చదువరి కోణం నించి చేయడం ఈ కవితలో విశేషం. కవీ, చదువరీ వొకే దారిలో వెళ్తూ కూడా రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతారు. అంటే రెండు  వాక్యం చదువుతూ కూడా భిన్నమైన వూహల్లో తమని తాము నిలబెట్టుకుంటారు. ఆ రెండు వూహలూ నిజమే. వాటిని ఇద్దరూ సమానంగా value చేయగలిగినప్పుడే కవిత ఇద్దరి మనసుల్లోనూ బతుకుతుంది, లేదా నిలిచి వుంటుంది. కొన్ని సార్లు అంతకు ముందు అనుకున్న వాటిని కొట్టివేసే సహనమూ వున్నప్పుడే ఇది అర్థవంతమైన ప్రయాణం అవుతుంది.

మెర్సీ అంటుంది:

పునర్లిఖించుకోవాలి

నన్ను నేను

పాత మాటలకు నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసి

ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి

పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి…

ఇదంతా ఆ  అర్థవంతమైన ప్రయాణంలో భాగమే. ఈ ప్రయాణానికి అర్థం వుంది అనుకున్న తరవాత మెర్సీ యెన్ని కవిత్వ దూరాలు వెళ్లిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.

 

2

వెతుకులాటే కవిత్వం ఉనికి అనుకుంటే, వెతికి సాధించేది కాదు, వెతుక్కుంటూ వుండడమే కవిత్వం.

ఈ కవితా సంపుటి చదువుతున్నప్పుడు మెర్సీ ఎన్ని వ్యక్తిగత, సామూహిక అనుభవాలు తన కవిత్వంలో రికార్డు చేసిందో చూస్తే, కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె తన ఏకాంతపు గాఢమైన అనుభూతిని ఎంత చెప్పిందో, సామూహికంగా తన అస్తిత్వాన్ని అంతే వివరంగా చెప్పుకుంటూ వెళ్ళింది.

వొక కవితలో తనే చెప్పుకున్నట్టు:

తడిమే ప్రతి చూపులో

వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి

కాల్చుకోవడం అనేది ఇక్కడ తపనకి పరాకాష్ట. స్త్రీవాదం ఎక్కడో వొక చోట ఆగిపోవాలని ఎదురుచూస్తున్న వాళ్లకి నిరాశా, వొక షాక్ ఇచ్చేట్టుగా మెర్సీ తనలోని స్త్రీచైతన్యంతో రాసిన కవితలు ఇందులో చాలా వున్నాయి. Feminine sensibility,  gendered identity అనేవి సిద్ధాంతపు గోడలు దాటి అనుదిన జీవితంలోంచి నేరుగా కవిత్వంలోకి ప్రవేశిస్తే ఎలా వుంటుందో చెప్పే ఉదాహరణలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. “విత్తనపు వీర్యం ఆడా? మగా?” లాంటి కవితలు వొకానొక ఉదాహరణ మాత్రమే.

సామూహక అస్తిత్వం అనేది గట్టిగా వినిపించే ప్రతి వర్తమాన సందర్భాన్నీ మెర్సీ కవిత్వం చేసింది. “అమానత్ స్వరం” కవిత చూడండి –ఈ కవిత కొంత వాచ్యం అయిన మాట నిజమే కాని, ఇందులో వినిపిస్తున్న ఘోష మన గుండెల్ని పిండేస్తుంది.

ఇప్పుడు

కన్నీరు కార్చి అయ్యో అనకండి

మా అక్కో చెల్లో తల్లో కాదని

తప్పుకుపోకండి

తల్లిదండ్రులారా,

వీలయితే మీ కొడుకులను స్త్రీలను గౌరవించడం

నేర్పండని

ఎలుగెత్తి ఏడుస్తూ ఘోషిస్తుంది

అమానత్ స్వరం!

ఇందులో కవిత్వం ఏముందన్న ప్రశ్నకి ముందే ఈ వాక్యాలలోని విసురూ, ఆవేశం మనల్ని చుట్టుముడ్తాయి. దీన్ని ఇంగ్లీషులో అయితే attitudinal poetry అనవచ్చేమో! కేవలం వొక attitude చెప్పడం వరకే ఆ కవిత పని. ఇవి మెర్సీ మామూలుగా రాసే కవితలకి భిన్నంగా వుంటాయి. మామూలుగా మెర్సీ కవిత్వంలో వుండే సాంద్రతా, imaginary coherence, symbolic integrity వంటివి వీటిలో కనిపించవు. “కాల్చుకోవాలి” అన్న క్రియని మెర్సీ ఇంతకు ముందు వొక కవితలో వాడింది. అలాంటి అత్మదహన ప్రక్రియ ఈ attitudinal poetry లో కనిపిస్తుంది. తనలోని వొక ఆవేశాన్ని తక్షణమే చెప్పాలన్న తపన నిలవనీయనప్పుడు కవి అసలు తన లోపల సాగుతున్న అంతర్యుద్ధాన్ని యింకా విడమరచి చెప్పలేని వూపిరాడనివ్వని స్థితిలో రాసిన కవితలు ఇవి.

3

కవిత్వంలో ఇది మెర్సీ తొలి అడుగు.

కాని, ఇందులో చాలా కవితలు ఆమె ఆలోచనా పరిపక్వతనీ, కవిత్వ శిల్ప పరిణతినీ చెప్తాయి. కొన్ని కవితలు తొందరలో రాసినట్టనిపించి కొంచెం అసంతృప్తి కలిగిస్తాయి కూడా – బలమైన కవితలు ఎక్కువ వుండడం వల్ల అలాంటి బలహీనమైన కవితలు తేలికగా మన మనః ఫలకమ్మీంచి జారిపోతాయి.

వస్తుపరంగా మెర్సీ ఇంకా విస్తృతిని సాధించవచ్చు అనిపిస్తుంది. తెలుగుసాహిత్యంలో క్రైస్తవ జీవన అస్తిత్వం అంతగా ప్రతిబింబించిన దాఖాలాలు లేవు. ఈ దిశగా కవిత్వంలో విల్సన్ సుధాకర్, కథల్లో వినోదిని చేస్తున్నలాంటి కృషికి తగినంత కొనసాగింపు లేకపోవడం పెద్ద లోపం. మెర్సీ కొన్ని కవితల్లో ఆ ప్రయత్నం చేసింది కాని అది ఇంకా బలపడాల్సిన అవసరం వుంది. తనదైన జీవితం నించి తెచ్చే ఏ అనుభవమైనా – అది కొంత వాచ్యం అనిపించినా కూడా- ఇప్పుడు చాలా అవసరం.

మెర్సీ మలి అడుగు అటు వేపు పడాలని కోరుకుంటున్నా.

-అఫ్సర్

ఆగస్టు 17, 2014.

 

 

 

 

 

మిరకిల్

 

 

అల్లం వంశీ  

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

ఆ లోపట..వెలుతురు కూడా అచ్చం చీకటిలెక్కనే కనపడ్తాంది..

ఎందుకంటే,అన్ని బార్లల్ల ఉన్నట్టే ఈడకూడా “తక్కువ వెలుతురు,ఎక్కువ చీకటి” అన్న ప్రాథమిక సూత్రం అమల్లఉన్నది.. అట్లా డిమ్ము లైటుకింద తాగుతె మస్తు “ఎక్కుతదనేది” తాగేటోళ్ల నమ్మకమైతే, ఆ లోవెలుతురుల వాళ్లు ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతరనేది అమ్మేటోళ్ల అనుభవం..

బారంటె మళ్ల వట్టి బారు కాదది, జనతా బారు.. “ఎవరుపడితె వాళ్ళు, ఏడపడితె ఆడ కూసోని.. తాగ బుద్ధైంది తాగుకుంటా, తిన బుద్ధైంది తినుకుంటా.. ఎక్కేటోనికి ఎక్కనిస్తూ,  కక్కేటోన్ని కక్కనిస్తూ… కోపమస్తె కొట్టుకుంటా, దుఃఖమస్తె చీదుకుంటా.. ఒర్రేటోన్ని ఒర్రనిస్తూ, బొర్రేటోన్ని బొర్రనిస్తూ..ఇట్లా.. ఒక మనిషిని మొత్తానికి మొత్తంగా నూటికి నూరుపాళ్లు వానికి నచ్చినట్టువాన్ని ఉండనిచ్చే గ‘మ్మత్తైన’చోటు..”

ఆ వాతావరణమంతా చల్లచల్లటి ఆల్కహాలు వాసనలు, వేడివేడి సిగరెట్ పొగలు.. గల గల గ్లాసులూ, కర కర ముక్కలూ.. డొక్కు డొక్కు బల్లలూ,  ముక్క ముక్క మనుషులూ..మత్తు మత్తు చూపులూ, ముద్ద ముద్ద మాటలు…

వీటన్నీటి మధ్యల.. తాగేటోల్లు తాగుతనే ఉన్నరు, వాగేటోల్లు వాగుతనే ఉన్నరు..

 

******

వెనక నుంచి ఆరో టేబుల్ మీద, చేతిల బీరు గ్లాసుతోని ఉన్న మనిషే కార్తిక్, ఎర్ర టీషర్ట్ తొడుక్కోని ఉన్నడు చూశిన్లా? అగో ఆయినే.. అతనికి ఎదురుంగ సిమెంట్ కలర్ టీషర్ట్ ఏస్కొని కూచున్నాయినె వినయ్.. అదే, ఆ గ్లాసులకు నిమ్మళంగ బీరువంపుతున్నడు చూడూ.. ఆ పిలగాడు.. ఇంతకుముందు లోపటికచ్చింది వీళ్లిద్దరే..

నువ్ బీర్ మస్తు పోస్తవ్రా భై,అస్సల్ నురుగు రాకుండ.. కార్తిక్ అన్నడు..

అరే.. నీకెక్కిందిరా…

అరే మామా..  నిజంగనేరా… నిజ్జంగ నిజం చెప్తానా, ఆ వెయిటర్ సుత నీ అంత పర్ఫెక్ట్ పొయ్యడెర్కేనా?

సాల్తియ్ గనీ ఈడికి ఆపేద్దామా, ఇంకో రెండు చెప్పాల్నా??

ఏంది అప్పుడేనా?? ఇయ్యాల నీన్ మస్త్ తాగుదామని ఫిక్స్ అయిన్రా భై… ఇప్పుడప్పుడే నువ్ చాల్ అనే మాటనకు..

సరే ఐతె ఇంకో రెండు చెప్తానమరి…

అరే… అంత ఏగిరం దేనికిరా? ఇదైతే ఒడ్వనియ్యరాదు. ఇప్పుడే చెప్తే మళ్ల చేదెక్కుతయ్.. బొచ్చెడ్ టైమున్నది, నువ్వైతె పుర్సత్ గ కూసోని  తాగు..

సరేపటు కానియ్…

ఇద్దరు గ్లాసుల్లేపి చెరి రెండుబుక్కలు తాగిన్లు.

ముంగటున్న చికెన్ పకోడి నోట్లేసుకుంటూ కార్తిక్ అన్నడు- అరేయ్.. మామా… నువ్వే చెప్రా… మా అయ్యదో చిన్న చికెన్ సెంటరూ.. మీ అయ్యదేమో సింగరేణిల బాయిపని.. అంతేనాకాదా?

ఔ.. అంతేగారా..

ఆ.. అని ఇంకో బుక్క తాగుకుంట.. “మీ అయ్య రోజుకు ఎన్మిది గంటలు పనిజేస్తె నెలకు యాభైవేలు జీతమస్తది.. మా అయ్య చీకటి తోని లేచింది మొదలు మళ్ల చీకటి వడేదాంక చికెన్ కొట్టుకుంట కూసున్నా నెలకు ఇరువై వేలు మిగుల్తె మస్తెక్కువ..  అంతేనా కాదా?”

గంతేగని..ఇప్పుడు వాళ్ల ముచ్చటెందుకు మతికచ్చిందిరా నీకు?

ఉట్టిగనేకనీ..ఇది చెప్పు.. మీకు సింగరేణోల్లు డబుల్ బెడ్రూం క్వాటరిచ్చిన్లు… మాది మాత్రం మూడు రూముల కిరాయి కొంప.. అంతేనా గాదా??

ఇప్పుడు అయన్నెందుకురా.. వేరే ఇంకేమన్న మాట్లాడరాదు..

అరే? మాట్లాడంగ మధ్యల రాకురా నువ్వు.. నేన్ చెప్పేది మొత్తమిను…

తాగితె కార్తిక్ ఎవరి మాట వినడని వినయ్ కి ఎరికే కాబట్టి సప్పుడు చెయ్యకుంట కూచున్నడు..

ఆ.. చెప్రా… మీకో రెండెకరాల జాగున్నది కదా ఊళ్ళె?

మ్మ్… పత్తి వెట్టిన్లట ఈ యేడు..

ఆ చేనుకు అందాదకు రేటెంతుంటదిరా?

ఎకురం పది చిల్లరుంటది కావచ్చురా… నిరుడు బోరేపిచ్చినం కదా, నీళ్ల సౌలతున్నది కావట్టిఈయేడు ఇంకో లక్ష పెరిగినట్టేఅనుకోవాలె!

ఇద్దరికీ ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మందు ఎక్కుతాంది.. మాటలు ముద్ద ముద్దగ వస్తున్నయి..

Kadha-Saranga-2-300x268

“రైట్.. రైట్… గంతే ఉంటదిగనీ..”

అని చికెన్ ముక్క నములుకుంట- మా అయ్య కూడ, ఇల్లు కట్టనీకి ఏన్నన్న ఓ రెండు గుంటల జాగా దొర్కుతె కొందామని చూశిండుకనీ, ముప్పై లక్షలకు తక్కువలేదు మామ మన కాడ..

ఔరా.. తెలంగాణచ్చినంకమనకెళ్లి రేట్లు మస్తు పెరిగినయ్.. ఐనాసుత ఏదైతె అదైంది ఏన్నో ఓకాడ కొనిపారెయ్యున్లిరా ఇప్పుడే, పోను పోను ఇంకింత పిరమైతయ్..

ఏంది కొని పారేశుడా??అయిపైసలాలేకుంటే పెంకాసులా?? గా పైసలే ఉంటే గియన్ని తిప్పలెందుకుపడ్దుము..మంచిగ ఈపాటికి ఇల్లే కడ్తుండేగారా! మా అయ్య కాడ ఓ పదిహేనిర్వై ఉన్నట్టున్నయ్గంతే.. వాస్తవానికిఅయిసుత చెల్లె పెండ్లికోసం పక్కకు పెట్టినయ్…

మ్మ్..

గ్లాసులు, సీసలు ఖాళీ అవుడుతోని వినయ్ వెయిటర్ ను పిలిచి ఇంకో రెండు బీర్లూ చెప్పిండు…

అరే.. నువ్వియాల ఫష్టు సాలరీ ఎత్తినవని సంబురంగ దావతిస్తాంటే, నేనిట్ల మాట్లాడ్తానా అని తప్పుగ అనుకోక్రా భైప్లీజ్..

నీయయ్యా, నేనెందుకట్లనుకుంటరా??  ఎవని ప్రాబ్లంస్ వానికుంటయ్…

యా… థ్యాంక్స్ రా మామా, నా బాధ నీకు సమజైంది… లవ్యూ రా మామా.. అంటుండoగ, వెయిటర్ ఇంకో రెండు తీస్కచ్చి ఇద్దరి గ్లాసులు నింపిపొయిండు.. ఇద్దరు మళ్ల చెరో బుక్క తాగినంక కార్తిక్-

మామా..మనిద్దరం సిక్స్త్  క్లాస్ కాంచి జబ్బకు జబ్బ దోస్తులం గారా??

మ్మ్…

“మ్మ్” కాదు..మంచిగ చెప్పు…

మ్మ్ అంటే ఔననేరాహౌలే..

అట్ల కాదుబే, నువ్ మంచిగ నోరు తెరిచి నోటితోని చెప్పాలె..

ఔ..ను.. మనం చెడ్డీలకాంచి జాన్ జిగిరీ జబ్బల్ జబ్బల దోస్తాం.. ఐతేందిరా ఇప్పుడూ..

విను విను…ఓకే…. మనిద్దరిది ఒకటే బడా కాదా??

యా.. ఇద్దరిది సేంటు సేం ఒకటే బడి.. ఒకటే క్లాసు.. ఒకటే బేంచూ..

చలో, మరి ఇంటర్, డిగ్రీ??

అన్ని సేం సేమే బే..ఒక్కదాన్నే ఎన్ని సార్లడుగుతవ్రా?

వాళ్ల కండ్లల్ల మత్తు ఇప్పుడు స్పష్టంగా కనిపడ్తాంది.. మాటల్లో ముద్దతనం ఉండనే ఉన్నది..

అరే.. మొత్తం ఇన్రా…మరి మనిద్దరిల సదువుల ఎవడ్రా టాపరు??

నువ్వే మామా.. మన చిన్నప్పటికాంచి మొత్తం అన్నీట్ల నువ్వేగారా టాపరువు..

ఆ.. మళ్ల పీజీ ఎంట్రన్స్ ల నా ర్యాంకెంత మతికున్నదారా నీకు??

ఎందుకు మతికిలేద్రా.. నీది డెబ్బై ఎన్మిది, నాది రెండొందల నాలుగు..

కదా?? అంత మంచి ర్యాంకచ్చిసుత నాకెన్ల సీటచ్చింది, నీకెన్ల సీటచ్చిందిరా??

నాది ఓయూ క్యాంపస్.. నీది అదేదో ప్రైవేట్ కాలేజ్ మామా నాకు దాని పే..రూ.. అదేదో సెయింట్ లూనిజో..లూయిసో.. లారిసో…ఏందో ఉండెగారా? మతికస్తలేదు!!

పోనియ్ అదిడ్శిపెట్టుగనీ.. అంత నప్పతట్ల కాలేజిల సదివిసుత నేన్ పీజిల యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టిన్నాలేదా?

అరే మామా నేన్ ఆల్రడీ మస్తుసార్ల చెప్పినా, మళ్ళిప్పుడు చెప్తున్నా..ఎప్పుడన్నగానీ, ఏడనన్నగానీసదువుల నిన్నుకొట్టినోడేలేడ్రా భై.. నువ్ తోపురా నిజంగా..

“కదా??కనిఇయ్యాల నేన్రోడ్డుమీద బేవార్సూ, నువ్వు మాత్రంసెంట్రల్ ఎక్సైస్ డిపార్టుమెంటుల ఇన్స్పెక్టరూ…”

“దాంట్లె ఏముందిరా.. ఐపేంది ఇడ్శిపెట్టి, నెక్స్ట్ ఇయర్ ఇంకింత సీరియస్ గ సదువురా భై, వట్టిగనే పోస్టు కొడ్తవ్ నువ్వు.. నీ ట్యాలెంటుకు అసలది విషయమే కాదు..”

అచ్చా??? నీ ఏజ్ ఎంతరా ఇప్పుడు?

ముప్పై? ఐతే??

మరి నాకెంతరా?

మనిద్దరి ఏజ్ సేమేగాబే.. నాక్ ముప్పై ఐతె నీకు ముప్పయే…

కదా?? మరి ముడ్డికింద ముప్పయ్యేండ్లున్నా నన్ను ఎక్సాం రాయనిచ్చుటానికి వాడేమన్న నా బామ్మర్దా??

అర్రెర్రే..!! కరెక్టే మామా, సారీరా….నాకా ముచ్చటే యాదికిలేదు..

ఎందుకుంటదిరా? మీకు రిజర్వేషన్ ఉన్నది, ఈసారి కాకపోతె ఇంకోసారి.. రాకుంటె మళ్ళోసారి… ఇంక ఐదారేండ్లుకాదు, నువ్ ముసలోనివయ్యేదాంక రాసుకోవచ్చు..ఫీజు కట్టేదున్నదా, చదివి కొట్టేదున్నదా?? ఉట్టిగ క్వాలిఫై ఐతె జాబు… ఇంకనా గురించెందుకు యాదికెందుకుంటదిరా..! అస్సల్ ఉండది..

అరే.. అట్లంటవేందిరా.. నేనేమన్న కావాల్నని అన్ననా? లైట్ తీస్కోరా భై.. అని చివరి చికెన్ ముక్క నోట్లెవెట్టుకున్నడు వినయ్..

“ఏంది లైట్ తీస్కోవాల్నా?ఎందుకు తీస్కోవాల్రా లైటు? ఆ?? చెప్పు ఎందుకు తీస్కోవాలె??  మొన్నటి ఆ ఎక్సాం ల   నాకు టూ ఫార్టీ ఔటాఫ్ థ్రీ హండ్రెడ్ వస్తే నీకెన్నచ్చినయ్రా? ఆ?? చెప్పు ఎన్నచ్చినయ్?? టూ నాట్ సెవన్… ఔనా కాదా?? రెండొందల ఏడచ్చిన నిన్నేమో పిలిచిమరీ ఉద్యోగమిచ్చిన్లు, నీకంటె ముప్పై మూడు మార్కులెక్కువచ్చిన నన్ను మాత్రం పిలిచినోడులేడు, అడిగినోడులేడు.. ఇయ్యాల నువ్ నెలకు నలభై వేలు సంపాయిస్తుంటె, నేన్ మాత్రం బేవార్స్ గానిలెక్క రోడ్లువట్టుకోని తిర్గవడ్తి.. ఎందుక్ తీస్కోవాల్రా లైటూ?? ఛత్..” అని ఎత్తిన గ్లాసు దించకుండ గటగట గ్లాసుడు బీరును ఒక్కబుక్కల తాగి.. ఇంకో రెండు బీర్లకూ, చికెన్ లెగ్ పీసులకూఆర్డరిచ్చిండు కార్తిక్..

వినయ్ ఏం మాట్లాడకుంట తన బీరు లాస్ట్ సిప్పు తాగుతున్నడు..

పోని మళ్లోసారి రాద్దామంటె కూడ “మాకు” ఏజ్ లిమిట్ అని కాలవడే.. ఛత్.. నీ… రిజర్వేషన్లకున్న పారేత్తు..  అసలీ రిజర్వేషన్లను #@Y%*#%………

ఛీ..నాకు జాబ్ అస్తె నువ్ మంచిగ ఖుషీగ ఫీల్ ఐతవ్ అనుకున్నగని గిట్ల మాట్లాడ్తవ్ అనుకోలేర భై.. ఛీఛీ.. నేన్ పోతున్నా.. అనుకుంట వినయ్ లేవబోయిండు..

కార్తిక్ అతన్ని ఆపి కూచోబెడుతూ- అరే ఆగుబే.. నేన్ చెప్పేది మొత్తం ఇను.. దా కూసో..అన్నీటికి ఫీల్ ఐతవేందిరా నువ్వు…! అసల్ నీ మీద నాకు కోపమెందుకుంటది చెప్పురా?మనిద్దరం చెడ్డీల కాంచి దోస్తులం, నీకు జాబ్ అచ్చినందుకు దునియల ఫష్ట్ ఖుషీ అయింది ఎవడన్న ఉన్నడా అంటె అది నీనే మామా.. నిజ్జంగ చెప్తున్నా.. నీక్ జాబ్ అచ్చినందుకు నేన్ పిచ్చ ఖుష్ రా.. నాకేం నీమీద జెలస్ లేద్రా భై..

మరి ఇంతక్ ముందు మాట్లాడిందంత ఏందిరా?? ఖుషీ అయినోడు అట్ల మాట్లాడ్తడా??

అరేయ్.. మామా.. నా బాధ నీకు సమజ్ కాలేరా…

ఇంతలనే వెయిటర్ బీర్లూ, లెగ్ పీసులు తెచ్చి టేబుల్ మీద పెట్టి పొయిండు..

MIRACLE1వీళ్లు,ఎవరి బీరు వాళ్లు నోటితోని తెరుచుకున్నరు కని గ్లాసుల్ల పోశింది మాత్రం కార్తికే.. అందుకే మీద కొద్దికొద్దిగ నురుగు కనపడ్తాంది..ఇద్దరు మళ్ల చెరొక బుక్కతాగినంక, వినయ్ కు లెగ్ పీస్ అందిచ్చుకుంట కార్తిక్- “అరేయ్.. మామా.. నేనెందుకు రంది వడ్తున్ననో నీక్ సమజ్ కాలేరా.. నా పొజిషన్ల ఉంటె తెలుస్తదిరా ఆ బాధేంటిదో… అంత కష్టపడిచదివీ, మంచి మార్కులు కొట్టినాసుతా జాబ్ రాకపాయే! పోనీ మళ్ల రాసి చూద్దామంటె ఏజు లేదాయే… మనం సదివిన తొక్కల ఎమ్మెస్సీకి ప్రైవేట్ ల టీచర్ జాబ్ తప్ప ఇంకో జాబేముంటరా?? వాడిచ్చే మూడు నాలుగు వేలకు అటా జాబు చెయ్యలేనూ, ఇటు గవర్నమెంటు జాబు కొడ్తామంటె అదేమో ఒకమానంగ వచ్చి కాలవడదు..  నీక్ తెల్వద్రా భై నా పొజిషన్..  నీకు సమజవుడు కూడ కష్టమే..  అరే,నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు,నేనా జాబ్ కోసం ఎంత కష్టపడ్డనోనీకెర్కలేదారా??

నిజమేరాకష్టపడ్డవ్..నేన్గిన కాదన్ననా?కని దానికి నేనేo చేస్త చెప్పు? నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి లక్కుల జాబచ్చిందీ.. నీకు లేదు కాబట్టి రాలేదు.. దానికి ఎవలేం చేస్తర్రా?? కిస్మత్.. గంతే…

కిస్మతేందిరా కిస్మతు? కష్టపడ్డోనికి నౌకరియ్యాలెగని కిస్మతున్నోనికి ఇచ్చుడేందిరా? మళ్ళ నిన్ను అంటున్నా అనుకునేవ్రో!! నేన్ మన సిస్టం ను తప్పు వడ్తున్నా..

ఎమ్మోరా భై.. నాకు జాబస్తె  నువ్ గింత ఘోరంగ రియాక్ట్ అయితవని నేనైతె ఎన్నడు అనుకోలే…

అగో మళ్లగదే మాట? నేన్ నిన్నంటలేను మామా.. ఈ మొత్తం సిస్టమ్ను అంటానా.. నన్ను బకరాగాన్ని చేసి బలి పశువును జేస్తె నాక్ కోపం రావొద్దా చెప్పు??  అసల్ దునియా మొత్తమ్మీద ఏన్నన్న ఉన్నదారా ఇట్ల? సదివినోడు సంక నాకి పోవాల్నట, సదువురానోడు మాత్రం సర్కార్ నౌకర్లు చెయ్యాల్నట! నీ య్.. ఇదేం లెక్కరా భై?? అని గ్లాసులేపి రెండు బుక్కల్లో మొత్తం బీరు తాగి, ఇంకింత ఆవేశంగ మాట్లాడుతున్నడు కార్తిక్..

పొద్దున లేశిందిగుత్తా రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటరు కని, అన్ల “అందరు సమానం” అని రాశున్న మాటను ఒక్కడు పట్టించుకోడేందిరా భైనాకర్థంగాదు? “మాకు” సమాధులు తొవ్వుకుంట, మీకు కోటలు కట్టిచ్చుడేనారా సమానమంటే?ఇదేక్కడి సామ్యవాదం, సౌభ్రాతృత్వం భై నాక్ తెల్వక అడుగుతా..?చత్..మీకు మాకంటె ఎక్కువ ఆస్థులున్నయ్, మీ అయ్యకు సర్కార్ నౌకరున్నది, క్వార్టర్స్ ఉన్నయ్, ఇన్సురెన్సులూ, అలవెన్సులూ, సబ్సిడీలూ, హెల్తుకార్డులూ, పెన్షన్లు తొక్కా తొండం సవాలక్షున్నయ్.. అయినా నీకు రిజర్వేషన్ ఉంటది, నువ్వెన్నిసార్లైనా పరిక్ష రాయచ్చూ, తక్కువ మార్కులచ్చినా జాబ్ కొట్టచ్చూ.. మాకో గజం జాగ లేదు, అయ్యకు పర్మినెంటు నౌకరిలేదు, రోగమచ్చినా రొప్పచ్చినామంచి దావఖానకుపోను దిక్కులేదు, అసల్ బతుక్కే భరోసా లేదుర భై.. అసొంటిది మాకు రిజర్వేషన్ ఉండదు,  టాప్ మార్కులచ్చినా జాబురాదూ,పోనీమళ్లోసారి రాద్దామంటె ఏజు చాన్సుండదు!ఏం న్యాయమ్రా భై ఇదీ??  మస్తు బాధైతున్నది మామా నాకు…  అరేయ్.. మళ్ల చెప్తున్నా నేన్ నిన్నంటలేను భై, మన సిస్టం ను అంటున్నా.. సిస్టం మొత్తం ఖరాబైపేందిరా ఏడికాడికి..

వినయ్ఏం మాట్లాడకుంట, చేతిలో ఉన్న చికెన్ బొక్కను ఖాళీ గ్లాసుకు కొట్టుకుంటూ కార్తిక్ చెప్పేది వింటున్నడంతే..

ఇంకో బుక్కెడు బీరు తాగినంక కార్తిక్ గొంతు ఇంకోరకంగ మారింది.. “అసల్ నన్నడుగుతె ఆ రాజ్యాంగంల రిజర్వేషన్ ఆర్టికిల్సు మొత్తం మలిపేశి, మళ్ల కొత్తగ రాపియ్యాల్రా భై… ఒకనికి రిజర్వేషన్ మీద మంచి సర్కార్ జాబ్ అస్తె ఇంక వానికి పుట్టేటోళ్లకు రిజర్వేషన్ ఇయ్యద్దు మళ్ల… కొత్తగ మంచిగ,ఈసారి కరెక్టుగమళ్లఅందరికి కొత్త “ఇన్ కం సర్టిఫికెట్” లు ఇప్పిచ్చి ఎవడైతె న్యాయంగ గరీబోడుంటడో వాడే కులపోడైనా సరే వానికి రిజర్వేషన్ పెట్టాలె.. బలిశినోడుంటె వాడే కులపోడైనాసరే రిజర్వేషన్ పీకిపారెయ్యాలె…”ఇంక ఇసొంటియే మంచి మంచి పాయింట్లుఆలోచించి అన్ల కలపాలెఅంతేగనివాళ్ళేందిరా భై, గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఆడఏమున్నదో ఏంలేదో చూడకుంట, ముందు వెనక ఏం ఆలోచించకుంట పదేండ్లకోసారి పొడిగించుకుంట పోతనే ఉన్నరు! ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి ఇప్పటికే నలభై తొమ్మిదిన్నర శాతం రిజర్వేషన్లున్నయ్.. అంటె దాదాపు సగం.. పోనీ మిగిలిన యాభైల ఏమన్న కాంపిటిషన్ తక్కువుంటదా అంటె అన్ల మళ్ల వీళ్లందరితోని పోటీయేనాయే! అరేయ్ నువ్వే చెప్పురా అప్పుడు రాజ్యాంగం రాశిన కాలం నాటికీ, ఇయ్యాల్టికీ మీ బతుకుల్లో కొద్దిగసుత మార్పు రాలేదారా?? మొత్తం కాకపోయిన ఎంతోకొంత, ఓ చారాన మందమన్న మీ పరిస్తితి మంచిగ్గాలేదా చెప్పు?? నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు మామా…

ఆ? ఐతే??

ఐతే ఏందిరా..  సిచువేషన్ ఓ చారాన మందం మంచిగైందీ అన్నపుడు రిజర్వేషన్లల్ల ఓ చారన మందం కట్ చెయ్యాల్నా వద్దా? చెప్పు నువ్వే.. యేడాదికొక్క శాతం తీసుకుంటపేనా, మొత్తం తీసెయ్యడానికి యాభైయ్యేండ్లు పడ్తదిగారా భై??  ఒకటేసారి మొత్తం తీశేత్తా అంటె అలవాటుపడ్డ పానం ఊకుంటదా? లొల్లి లొల్లి చెయ్యరారా.. అందుకే ఇప్పటికెళ్లే యేడాదికొక్క పర్సెంటన్న కోసుకుంట పోతె, ఇంకో యాభై యేండ్లవరకన్న సిచువేషన్ జర సెట్ ఐతది.. అంతేగని ఆ పని చెయ్యకుంట ఓట్లకోసం ఎవనికి వాడు యేటికేటికి దొరికినంత పెంచుకుంట పోతున్నరుతప్ప, నా అసొంటోళ్ల బతుకు నాశనమైపోతాందని అసల్ ఒక్కడన్న ఆలోచిస్తున్నడార భై? చత్..నా రందంత అదే మామా…

అని చెప్తున్నంతల..కార్తిక్ సెల్ రింగ్ అయింది..మాటలాపి తను కాల్ లిఫ్ట్ చేసిండు..అవతలి వైపు మాట్లాడుతున్నది కార్తిక్ వాళ్ల చెల్లె కీర్తి.

ఆ హలో.. కిట్టూ?? చెప్పురా..

ఆ అన్నా. ఎక్కడున్నావ్??

నేను వినయ్ గానితోని బయటికచ్చిన్రా.. నాకు లేటయితదిగని మీరు తిని పడుకోన్లి..

సరేగనీ.. ఆ మంచిరాల సంబంధమోళ్లు సాయింత్రం నానకు ఫోన్ చేసి,ఫోటోస్ నీ మెయిల్ కి పంపినమని చెప్పిన్లట.. వచ్చినయా అని అడుగమంటున్నడు నాన..

ఔనా?? ఎమ్మోనే మరి నేన్ సూళ్లేదు… నా ఫోన్ల నెట్ బ్యాలెన్స్ అయిపేందిగనిరాంగ రాంగ ఏయించుకోనస్తా, రేప్పొద్దున చూద్దాంతీ.. నానకు చెప్పు..

మర్శిపోకు మరి..

నాక్ మా మతికుంటదిగని, నువ్వైతెఆ తాళం చెయ్యి పూలకుండీ కింద పెట్టుడు మర్శిపోకు..

ఓకే.. ఓకే..

ఓకే అనుడుగాదు.. పేనసారి ఇట్లనేఅని నువ్ మర్శిపొయిపంటె, నేన్ గేటు దూకంగనే నాన లేశిండు.. అందుకె మళ్ల మళ్ల చెప్తున్నా, గేటుకు తాళమేశినంక తాళం చెయ్యి మంచిగ చెయ్యికి అందేటట్టుఆపూలకుండీకింద పెట్టు.. సరేనా??

అబా సరేఅన్నా.. పెడ్తా అంటున్నకదా!నువ్వైతె నెట్ బ్యాలెన్స్ వేయించుకోనిరా.. అని కాల్ కట్ చేసిందామె..

కార్తిక్ ఫోన్ పక్కవెట్టి మళ్ల గ్లాస్ పట్టుకున్నడు..

ఏందటరా? జల్ది రమ్మంటున్నదా?? వినయ్ అడిగిండు..

రమ్మనుడు కాద్రా.. అదేదో సంబంధం గురించి… వాళ్లు పిలగాని ఫోటోల్ నా మెయిల్ కు పంపిన్లట, వచ్చినయా అని అడగటానికి చేసింది…

అచ్చా.. ఓకే ఓకే…

మాదాన్ల ఆడపిల్లలున్నోళ్లకు కష్టమ్రా భై నిజంగ… ప్రైవేట్ నౌకర్ చేసేటోనిక్కుడ కం సే కం ఇర్వై లక్షలియ్యలె.. ఇగ గవర్నమెంటోడంటె యాభైకి తక్కువడగడు, మళ్ళ బండీ, బట్టలూ, బోళ్లూ.. బొచ్చెడుంటయ్రా అయ్యా!! ఇయన్నివోను మళ్ళ పెండ్లిఫంక్షను ఖర్చు అలగ్.. పెద్ద పరేషాన్ పట్టుకున్నదిరా మాకైతె! ఆ జాగను అమ్మైనా సరేగని, మంచి సంబంధం దొర్కుతె చేశేద్దామనుకుంటున్నమ్రా ఈ యేడు..

అచ్చాచ్చా.. ఓకే ఓకే… అనుకుంటనే వినయ్ గ్లాస్ బీరును ఒక్క బుక్కలో తాగి, మిగిలిన చికెన్ బొక్కను కంకుకుంట అన్నడు-

అరే.. మామా..  నేన్ ఒకటడుగుత చెప్రా..

ఏందిరా?

ఇట్లంటున్నా అని నువ్వేం అనుకోవద్దు మరి?

అనుకోనుచెప్పుబే..

మామా.. మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కంటె జర రిచ్చేగారా??

జరంతేందిబే?? జమీన్ ఆస్మాన్ ఫరఖ్….         ఇంకో బీర్ చెప్పాల్నారా?

నాకిప్పటికే ఎక్కువైoది..నీగ్గావాల్నంటె చెప్పుకో..

నాక్కూడ మస్తైందిగని, ఇంకొక్కటి చెప్తావన్ బై టూ తాగిపోదాం ఓకేనా?

సరే చెప్పు…

వెయిటర్ ని పిలిచి ఇంకో బీర్ ఆర్డర్ ఇచ్చిండు కార్తిక్…

అయిపేందా?? ఇoగ నేనడిగిందానికి చెప్పు.. నా నౌకరి మంచిదేనా కాదా?

అరే మంచిందేందిరా? కిరాక్ నౌకర్ర భై నీది.. సెంట్రల్ ఎక్సైస్ ఇన్స్పెక్టర్ అంటేందిరా?? ఫుల్లు పైసల్.. స్టాటింగ్ స్టాటింగే నలభైవేల్ జీతం, ఏ వన్  క్వాటర్సూ, అలవెన్సులు, ఇన్సురెన్సులు…  కథా కార్ఖానా…. సెంట్రల్ గౌట్ జాబంటె మాటలార? లొల్లంటె లొల్లి నౌకర్రా భై నీది..

అదే అదే… సరేమరి నేను చూపుకు ఎట్లుంటర? ఐ మీన్ మంచిగ అందంగ ఉంటనా అని?

ఔ నీ హైట్ ఎంతో ఉండేరా? సిక్సా, సిక్స్ వన్నా?

సిక్స్ వన్..

ఆ..! సిక్స్ వన్ హైటున్నోడు అసల్ మన కాలేజిలనే ఎవ్వడులేకుండెగారా? డిగ్రీల మన క్లాసోల్లందరు గా సుమలత ఎంబడివడ్తుంటె, ఆమె మాత్రం నీకు ప్రపోస్ చేశేగార అప్పట్ల? వట్టిగ ఇడ్శిపెట్టుకున్నవ్గని ఆమెను చేస్కుంటే మస్తుంటుండె భై ఇప్పుడు..

లైట్ గనీ.. అంటె మొత్తానికి నేన్ మంచిగనే ఉంటా అంటవ్!

నీకేందిరా భై… పిచ్చ స్మార్ట్ నువ్..

కదా?? ఐతె.. మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తరా మామా? నాకు కీర్తి అంటె మస్తిష్టం..

కార్తిక్ కి ఒక్క క్షణం వినయ్ ఏమంటున్నడో సమజ్ కాలేదు..

నాకు నయా పైసా కట్నం వద్దు మామా, మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తే చాలు, మొత్తం పెళ్లి ఖర్చులుకూడ మేమే పెట్టుకుంటం..

అరేయ్?? ఏం మాట్లాడ్తున్నవ్ బే?? దిమాగ్గిన ఖరాబైందా??

లేద్ నిజంగనే అంటున్నరా, నాకు మీ చెల్లంటె నిజంగ మస్తిష్టం మామా.. దునియాల ఏ మొగడు చూస్కోనంత మంచిగ చూస్కుంటరా మీ చెల్లెను, ప్లీస్.. అని వినయ్ మాట పూర్తికాక ముందే.. కార్తిక్-

అరేయ్.. అసల్ ఏం మాట్లాడుతున్నవ్ సమజైతుందారానీకు?? మందెక్కువై మెదడు ఖరాబైనట్టున్నది.. చల్.. మస్త్ ఎక్కువైంది ఇంక పోదాం పా..

ఏ.. ఆగురా.. కూసో కూసో… మొత్తం ఇనుబే.. ప్లీస్… అని కార్తిక్ ను బలవంతంగ మళ్ల కూచోబెట్టి- అట్లంటవేందిరా?నాకేం తక్కువ చెప్పు.. మంచి నౌకరున్నదీ.. ఆస్థి పాస్థులున్నయీ… మంచిగ అందంగుంటా.. నాకేం తక్కువరా భై?  పైకెళ్లి నాకు నయా పైసా కట్నం కూడ వద్దంటున్నగారా?? ఇంకేం గావాల్రా మీకు?? మీ చెల్లెను కూడ మంచిగ చూస్కుంటా అని చెప్తున్న గదామామా.. ప్లీస్ రా..

తలకాయ్ తిరుగుతాందారా?? వద్దన్నకొద్ది మళ్ళ అదే మాట మాట్లాడుతున్నవ్.. నువ్వస్తెరా లేకుంటెలేదు నేన్ పోతున్నా.. అని లేవబోతుంటె వినయ్ మళ్ల అతన్ని కూచోబెట్టి-

అరేయ్.. నేనేం తాగి మాట్లాడ్తలేను.. నిజంగ సీరియస్ గనే అంటున్న.. నాకు మీ చెల్లెలంటె చాన ఇష్టమ్రా, నాకు జాబ్ వచ్చేదాక అడగొద్దనే ఇన్ని రోజులు అడగలేదు బట్ ఇయ్యాల జాబ్ వచ్చిందికాబట్టే ధైర్యంగ అడుగుతున్నరా… ప్లీస్ మామ మస్తు మంచిగ చూస్కుంటర, వేరే సంబంధాలు చూడకండీ.. నేన్ చేస్కుంటరా మీ చెల్లెను..

అరేయ్.. లాష్ట్ అండ్ ఫైనల్ చెప్తానా..ఇంక ఈ టాపిక్ ఇక్కడికి ఇడ్శిపెట్టు…కార్తిక్ బలవంతoగ కోపాన్ని ఆపుకుంట అన్నడు..

నేన్ మంచోన్ని కాదారా?చిన్నప్పట్నుంచినన్ను చూస్తనేఉన్నవ్ గారా.. నలుగురికి మంచే చేస్తగని ఎప్పుడన్న ఎవనికన్న చెడుపు చేషిన్నారా నేను? నాగురించి ఎర్క లేదారా నీకు?

నువ్ మంచోనివిగావట్టే ఇంతసేప్ నీతోని మాట్లాడ్తున్నా అదే ఇంకోడింకోడైతె ఈపాటికి వాని గూబ గుయ్యిమంటుండే..

అరేయ్.. ప్లీస్.. అర్తంచేస్కోరా భై..

నువ్ మంచోనివని నాకెర్కే కని అయన్ని కాని ముచ్చట్లు.. వట్టిగ నువ్ డిస్టర్బ్ గాకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు..ఇప్పటికే మస్తైంది, ఇంక ఆపు..

అరేయ్ మంచోన్నే ఐతె మరి ఒప్పుకోడానికేందిరా?నువ్వుకూడా నన్ను అర్థం చేస్కోపోతె ఎట్లరా..

వెయిటర్ బీర్ తెచ్చి రెండు గ్లాసుల్లో చెరి సగం పోశి వెళ్ళిపోయిండుగని వాళ్లిద్దరు ఆ గ్లాసుల్ని ముట్టలే..

MIRACLE1

ఒక నిమిషం గట్టిగ ఊపిరి తీస్కోని కార్తికే ఓపిగ్గ చెప్పుడు వెట్టిండు- అరేవినయ్..  నువ్ మంచోనివే.. నీకు మంచి ఉద్యోగం, ఆస్థిపాస్తులు.. మొత్తం అన్ని ఉన్నయ్.. పైకెళ్ళి  మీ ఇంట్లోల్లు కూడ కట్నానికి ఆశపడే మనుషులు కాదు.. ఆ ముచ్చట కూడ నాకెర్కే..  ఇంక సాఫ్ సీదా చెప్పల్నంటే, మేం సొంతంగ వెతికినాసుత ఇంతమంచి సంబంధం మా చెల్లెకు దొర్కదు గావచ్చు… కనీ… కని మా చెల్లెను నీకిచ్చి చేశుడన్నది  కాని ముచ్చట… అర్థం చేస్కో.. సరేనా?? అంతే ఇంక.. ఈ టాపిక్ ఇక్కడికి విడిచిపెట్టు.. ఆయింత తాగు.. పోదాం..

అరేయ్.. అన్నితీర్ల మంచి సంబంధం అని నువ్వే అంటున్నవ్గారా?? మరి ఒప్పుకోడానికేంది చెప్పు? ముందుగాల నీకిష్టమా కాదా చెప్పు? నీకు ఓకే అంటే అటేంక మీ ఇంట్లోళ్లను మనిద్దరం కలిశి ఒప్పియ్యొచ్చు..

అద్దన్న పాటే ఊకె పాడక్రా.. నేనూ, మా చెల్లె ఇద్దరం ఒప్పుకున్నా మా అమ్మనానలుఒప్పుకోరు.. ప్లీజ్… దయచేసి ఇంకా ముచ్చట విడిశిపెట్ర భై..

అట్లకాదు నువ్ చెప్పు.. నీకిష్టమేనా?

కార్తిక్ నిశ్శబ్దంగ తన గ్లాస్ ను చేతులకు తీసుకోని మెల్ల మెల్లగ తాగుతున్నడే తప్పితే ఓ రెండు నిమిషాలు అసలేం మాట్లాడలే.. సగం గ్లాసు ఖాళీ అయినంక-

నాకిష్టమే రా.. ఇప్పుడే చెప్పినకదా మా అంతట మేం సొంతంగ వెతికినా కూడ నీ అంత మంచోన్ని మా చెల్లెకు తేలమని.. ఆ మాట వాస్తవం..ఎందుకంటె నిజంగ నా లైఫ్ ల నీ అంత పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నోన్ని  నేనిప్పటిదాంక చూల్లే…

ఎవడో ముక్కు మొఖం తెల్వనోనికి మా చెల్లెనిచ్చి పెండ్లి చేశుడుకంటే, చిన్నప్పటికెళ్ళి మాతోనే కలిశిపెరిగినోనివి, అన్నితీర్ల మంచోనివీ.. నీకిచ్చి చేస్తెనే మా చెల్లె మంచిగుంటదని నాక్కూడ అనిపిస్తుందిరా.. కని…

వినయ్ మొఖంలో చిన్న వెలుగు..

కని? కని ఏంది చెప్పురా..

అరేయ్.. నేన్ ఫ్రాంక్ గ ఒకటిచెప్తరా.. నువ్ ఫీల్ ఐతె మాత్రంనేన్ చేశేదేం లేదుముందే చెప్తున్న..

నేనేం ఫీల్ గానుచెప్పురా..

మా నానమ్మ ఎర్కేగదా.. చిన్నప్పుడు నువ్ మా ఇంటికచ్చినప్పుడు ఆమేం చేశేదో నీకెరికేనా??

ఎమ్మోరా?ఏం చేశేది?..

మంచి నీళ్లిచ్చినా, చాయ్ ఇచ్చినానీకు సెపరేట్ గఓ బుగ్గెండి గ్లాసుల పోశిస్తుండే మతికున్నదా..

ఆ.. ఆ.. కరెక్టే రా.. ఎప్పుడన్నెప్పుడన్న మీ అమ్మ స్టీల్ గ్లాసుల పోశిచ్చినాసుత తిడ్తుంటే..

ఆ.. అదే.. మా నానమ్మ ఒక్క నీకనే కాదు… మా ఇంటికి “తక్కువోళ్ళు” ఎవ్వరచ్చినా ఆ బుగ్గెండి గ్లాసులనే పోశిస్తది.. ఇంక మేం చిన్నప్పుడు లొల్లి వెట్టుకునేది కాబట్టి ఆయింత నిన్నొక్కన్ని ఇంట్లకు రానిచ్చేదిగని వేరేటోల్లైతెఅసల్ ఇంటి గలమ లోపటికి రానియ్యకపొయ్యేది..

అంటే??

అంటేందిరాఅంటే?? మాకన్న “తక్కువోళ్లను” అసల్ మా ఇంటి గడుపకూడ దాటనియ్యకపొయ్యేది అంటున్న.. నువ్వచ్చి పొయినంక కూడ మా నానమ్మ నువ్ కూసున్న జాగల నీళ్లుపోశి కడిగేది ఎర్కేనా?? అగో అంత ఉంటది వాళ్లకు “ఎక్కువ తక్కువా” అని..

కావచ్చురా, కని ఇప్పుడు మీ నానమ్మ లేదుకదా…. మరింకేంది ప్రాబ్లం?

మొత్తం విన్రా.. మా అమ్మా నానాలు, మా నానమ్మంత ఘోరంగ నీతోని ఎప్పుడు ప్రవర్తించకపోవచ్చు… వాళ్లు నిన్నెప్పుడు తక్కువ చేసి చూడకుండ మాతోని సమానంగనే నిన్నుకూడ కలుపుకపోవచ్చూ.. కని అంత మాత్రాన ఇప్పుడు నువ్ మా చెల్లెను చేస్కుంటా అనంగనే వాళ్లు ఒప్పుకుంటరు అనుకోకు..

మా పెద్దనానోళ్ల కొడుకు రఘన్న కూడా చిన్నప్పటినుంచి మా ఇంట్లనే పెరిగిండు నీకెర్కే కదా?? ఆయినె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్కున్నందుకే మా నాన ఇప్పటికి మూడేండ్ల నుండి ఆయినెతోని మాట బంజేషిండు.. ఇంటిగ్గాదుకదా దుకాణం కాడికిసుత రానిస్తలేడు..అసొంటోడు సొంత బిడ్డను నీకిచ్చి పెడ్లి చెయ్యమంటె చేస్తడా చెప్పూ?? అందుకే చెప్తాన, అయన్ని కాని ముచ్చట్లురా భై.. వుట్టిగ కలల్ కనకు..

కదా?? మరి మాకు రిజర్వేషన్ ఉండుట్ల తప్పేమున్నదిరా??

ఏందిరా?? పిస్స గిన లేశిందా? అసల్ నేన్ చెప్పిందానికీ, నువ్వనేదానికీ ఏమన్న సంబంధం ఉన్నదా??

ఉన్నది.. ఉన్నది కాబట్టే అంటున్న..

ఒక్క అరగంట ముంగట నువ్వేం మాట్లాడినవో నీకు మతికున్నదా? మాకన్నున్నయ్ అయినా రిజర్వేషన్ దేనికీ అదీ ఇదని అడిగినవ్ కదా?? అగో,దానికి జవాబు చానా స్పష్టంగా సూటిగ నీ నోటితోనినువ్వే చెప్పినవ్ చూడు..

కార్తిక్కి విషయం మెల్లమెల్లగ అర్తమైతుంది..

నీకు తెల్సింది మీ నాన్నమ్మ ఒక్కలే.. కని అసొంటి నానమ్మల అనుభవాలు నాకు కోకొల్లలు.. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యేండ్లకెళ్లి ఆ “తక్కువ”నూ, వాళ్లు చూసే “చిన్న”చూపును భరించుకుంటస్తున్నమ్రా మేమూ.. నీకు తెల్సింది రెండు గిలాసల పద్దతొక్కటే.. కాని మేం పడ్డ అవమానాలు కొన్ని వందల రకాలు..ఇంతకన్నా వేల రెట్లకుట్రలను, వివక్షలను ఎదుర్కోని ఎదుర్కోని ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మనుషుల్లెక గుర్తించబడ్తున్నంరా మేము..

అంటే? మా తాత ముత్తాతలు చేసిన తప్పులకు ఇప్పుడు మేం శిక్ష అనుభవించాల్నారా?

మీ మూడు తరాల చూపుల్లో తేడాను ఇప్పుడు నువ్వే చెప్పినవ్ గారా?మీ నానమ్మ కాలంలో మేం మీకంటె “తక్కువ” వాళ్లం.. మీ నానతరంలో మేం కేవలం మీకుమనుషులుగా “సమాంతరం” అంతేకనీ మీలో కలవడానికి వీలులేదు.. కని ఇప్పుడు మనదగ్గరికొచ్చేసరికి మనిద్దరం సమానం..అదేరాభై రిజర్వేషన్ లు మా బతుకుల్లో తెచ్చిన తేడా…అవే లేకపొయ్యుంటే?? ఊహించుడు కూడ కష్టంమామా..!!అది శిక్ష అని నువ్వనుకుంటున్నవ్.. కని అది మాకు రక్ష అని మేం అనుకుంటున్నం…ఇది నీకు సమజయ్యేటట్టు చెప్పాల్ననే మీ చెల్లెను పెండ్లి చేస్కుంటా అని మజాక్ చేసిన్రా.. తప్పుగ అనుకోక్రా భై.. సారీ మామా..

కార్తిక్ కి అసల్ ఏం మాట్లాడాల్నో తెలుస్తలేదు… అంత “క్లియ్యర్ ఈక్వేషన్” విన్నంకఇంకేం మాట్లాడ్తడు..!

ఒక రెండు నిమిషాలకు పరిస్తితి కొద్దిగ సల్లవడ్దది..

అంటే? నువ్ మా చెల్లెను నిజంగ ఇష్టపడలేదారా?

లేదు మామా, నీకు చెల్లైతె నాకు చెల్లే గారా..

సాలె గా.. ఎంత షాక్ ఇచ్చినవ్రా నాకు..

మరిలేకపోతె ఏందిరా నువ్వు.. ఇగ చూస్తున్న అగ చూస్తున్న, ఒక మానంగ రిజర్వేషన్లను తిడ్తనే ఉన్నవ్.. అందుకే..

అరే నిజమే భై.. కని నువ్వే చెప్పురా.. మా నానమ్మ కాలానికీ ఇప్పటికీ మార్పులేదా?? వాళ్లు అసల్ ఇంట్లకు రానియ్యకపొయ్యేది.. మా నాన వాళ్లు ఇంట్లకు రానిస్తరూ కలవనిస్తరు అన్నిచేస్తరుకని పెండ్లంటె మాత్రం ఒప్పుకోరు.. కని నేన్నిన్నెప్పుడన్న చిన్నచూపు చూశిన్నారా భై? ఇప్పుడే పెండ్లికిసూత ఓకే అంటినిగారా?? నిన్ను సమానంగ అనుకోందే ఆ మాటంటనారా? మరింకిందెకురా నీకు రిజర్వేషన్?

అందరు నీలెక్క ఆలోచిస్తె మంచిగునే ఉండురా భై.. ఆలోచించరు కాబట్టే వాటికింకా వ్యాలిడిటీ పెంచుతున్నరు.. నిజంగ ఇంకో పది ఇర్వై ఏండ్లల్ల నీలెక్కనే మన తరం అందరు “ఆ సమాంతరాన్ని సమానం చేశిపారేశిన్లంటె” మనస్పూర్తిగ నా రిజర్వేషన్ నేనే తీపిస్తసరేనా? ఐ మీన్ నా పిల్లలకు, రిజర్వేషన్ తీపిస్త..

అంటె వాళ్లుకూడ అప్పుడు జెనెరల్ ఇగ? మెరిట్ ల కొట్టాల్సిందేఅంటవ్..

మరి అంతేగా మామా.. అని ఇద్దరు ఆ మిగిలిన బీర్ చీర్స్ కొట్టుకోని తాగేశిన్లు..

ఇంకోటి చెప్దామా? చాలా?? వినయ్ అడిగిండు

సాల్ రా భై, మస్తైంది.. బిల్లు తెమ్మనిగ పోదాం..

అరేయ్ మరి ఫుడ్డూ?? ఒక చికెన్ బిర్యాని చెప్పల్నా.. చెరిసగం తిందాం?

వద్దూ.. బయట తిందాం…

వినయ్ బిల్లుకట్టి, టిప్ ఇచ్చి వచ్చిండు.. ఇద్దరు సొలుగుకుంట బయటకు నడుస్తున్నరు..

అరే మామా చెల్లె గురించి అట్లన్నందుకు సారీరా..

అరే లైట్ బే.. నేనే సారీ మామా అట్ల మాట్లాడినందుకు, నువ్ ఫష్ట్ సాలరీ ఎత్తి సంబురంగ నాక్ దావతిస్తుంటేనేనే నీ మూడ్ పాడ్ చేశినా.. సారీరాభై..

అరే లైట్ బే…చోడ్ దే.. ఔన్రా, మన స్టేట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డట్టున్నదిగారా అప్లై చేష్నవా? దానికి జెనెరలే ముప్పై ఐదేండ్లున్నట్టున్నదిగా..

ఆ చేష్న మామా, సదూతున్న..

ఆ.. మంచిగ సదూరా నీకుట్టిగనే అస్తదది.. కావాల్నంటె కోచిన జాయిన్ గా మామా.. ఫీజ్ నేన్ కడ్త..

ఏ.. ఎందుక్ బే.. వద్దద్దు.. ఇప్పటికే నాకొరకు యాభై అర్వై వేలు పెట్టినవ్..  ఇంక సాల్ మామా.. లైట్..

అరేయ్? అయన్నెందుకు లెక్కలు వెడ్తున్నవ్రా.. నేనెమన్న మందికి వెడ్తున్ననా.. నీకేకదా.. ఇగో ఈ ఏటీయం కార్డ్ తీస్కపో.. కోచింగ్ కు ఎంతైతదో కనుక్కోని మంచి దాంట్ల జెయిన్ గా… సరేనా.. పాస్ వర్డ్ ఎరికేగా.. అనుకుంట కార్డును కార్తిక్ జేబుల పెట్టిండు వినయ్..

లవ్ యూ రా మామా..

అరేయ్.. నీకు మందెక్కువైందిబే..

కదా?? అయినా సరే బైక్ నేనే నడుపుతా..

సరే సరేగని తొవ్వల ఏన్నన్న ఆపి నెట్ బ్యాలెన్స్ ఏయించుకో.. చెల్లె చెప్పిందికదా..

ఆ రైటే మామా నేనసల్ మర్శేపేన..

కార్తిక్ బైక్ స్టార్ట్ చేసిండు.. వినయ్,కార్తిక్ వీపునే “మెత్త”లెక్క చేసుకోనిబైక్ మీదనే పడుకున్నడు.. చీకటి వెలుగుల రోడ్లను దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు పొయ్యీ పొయ్యీ బైక్ ఒకదగ్గర ఆగింది..

కార్తిక్, వినయ్ని లేపుతున్నడు..

అరే లేరా.. లే.. నువ్ లోపటికి నడు, నేన్ రీచార్జ్ చేయించుకొస్తా అని వినయ్ ని అక్కడ దించి కార్తిక్ పక్క షాపుదిక్కుకు  నడిశిండు..

“ఏంది అప్పుడే అచ్చిందా” అని కండ్లు నులుముకుంట వినయ్ ఒక్క రెండడుగులు బిర్యాని సెంటర్ దిక్కు వేశిండోలేదో సడన్ గ ఎవరో పట్టి ఆపినట్టు ఠక్కున ఆగిపొయిండు..ఎదురుంగ ఎర్రని రంగుల పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న ఒక బోర్డు కనపడ్తాంది..

అప్పుడే కొత్తగ అక్షరాలు చదవడం నేర్చుకున్నోడు చదివినట్లుచదువుతున్నడు వినయ్ ఆ బోర్డును- “ముబారక్…క..ళ్యా..ణి… బి..ర్యా..నీ… సెంటర్..”

తను చూస్తున్నది నిజమో కాదోనని అవే అక్షరాలను ఒకటికి రెండు సార్లు చదివిండు.. కనిఎన్నిసార్లు సదివినా అవి మారలేదు.. తను చూస్తున్నది నిజ్జంగ నిజమే..అవి అవే అక్షరాలు..

క…..ళ్యా….ణీ…. బి…..ర్యా……నీ…

ఇంతల కార్తిక్ రీచార్జ్ చేయించుకోనివచ్చి, నోరెళ్లబెట్టి నిలుచున్న వినయ్ జబ్బ మీద చెయ్యేసిండు.. వినయ్ ఆశ్చర్యంతోని అట్లనే గుడ్లు పెద్దవిచేసి చూస్తూ-

ఏందిరా?? ఈడికి పట్కచ్చినవ్?? మందెక్కువైమజాక్ చేస్తున్నవా?లేకుంటె నిజంగనే దిమాగ్ఖరాబైందా??”

సమాంతరాన్ని సమానం చెయ్యాలెగా మామా..చలో పారా.. ఇయ్యాల్టికెళ్ళి నేన్ సుత నీ తిండి తింటా..

ఇన్నిరోజులు తాను గొడ్డు మాంసం తింటా అంటెనే తీవ్రంగ అసహ్యించుకునే కార్తిక్, ఇప్పుడు తనంతట తానుగా  తింటా అనేసరికి వినయ్ కి అస్సల్ ఏం అనాల్నో తెలుస్తలేదు…కాని ఆ అద్భుత క్షణంలో, అప్పటిదాకా జీవితంలో ఎన్నడు తన నోటి నుంచి రాని మాటలు వాటంతట అవి అప్రయత్నంగనే బయటికొచ్చినయ్..

లవ్ యూ మామా..వినయ్ అన్నడు..

లవ్ యూ టూ రా భై…..

ఇప్పుడా రెండు మొఖాల్లోనూ చిన్న చిరునవ్వూ.. పెద్ద సంతృప్తీ..

ఆ కళ్లకిప్పుడు చీకటి కూడా వెలుగులెక్క కనపడుతోంది…

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

 

*

allam-vamsi