గమనమే గమ్యం-11

 

olga

ఆసుపత్రిలో ఆ రోజు విపరీతంగా పని మీద పడింది శారదకు. సరళ అనారోగ్యంతో నాలుగు  రోజులుగా రావటం లేదు. ఆడవాళ్ళ వార్డులో డ్యూటీ శారద మీద పడింది. ఉదయం ఆరు గంటలకే వెళ్ళిన శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. చాలా అలసటతో వెంటనే స్నానం చేసి నిద్రపోవాలనుకుంటూ వచ్చిన శారదను వాకిట్లోనే ఆపింది సుబ్బమ్మ.

‘‘అమ్మాయ్‌ , ఇంతాలస్యమా? ఎవరొచ్చారో చూడు. పొద్దున్నించీ మేమిద్దరం నీకోసం చూస్తున్నాము’’.

తల్లి ముఖంలో ఉత్సాహం చూస్తుంటే ఎవరో ముఖ్యులే అనిపించింది. బంధువు కాకూడదు భగవంతుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది.

పుస్తకం చదువుకుంటూ కూచున్న విశాలాక్షి శారదను చూసి నవ్వింది.

శారద విశాలాక్షిని గుర్తుపట్టలేదు.

‘‘నేను శారదా. విశాలాక్షిని. అన్నపూర్ణా, నువ్వు `నేను’’ శారద ఒక్క గంతులో విశాలాక్షి దగ్గరకొచ్చి భుజాలు  పట్టుకుని ఊపేసింది.

‘‘విశాలా, ఎన్నేళ్ళకు కనపడ్డావు. అన్నపూర్ణ కూడా ఈ మధ్య నిన్ను చూడలేదంది. ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావు. నాకు ఉత్తరాలన్నా రాయొచ్చుగదా ` ’’

‘‘ఉండు శారదా, కాస్త ఊపిరి తీసుకో. అన్నీ చెప్తాను’’

ఇద్దరూ చిన్నపిల్లల్లా  కారణం లేకుండా నవ్వుకున్నారు.

శారద స్నానం చేశాక సుబ్బమ్మ ఇద్దరికీ విందు భోజనం పెట్టింది.

ఇద్దరూ శారద గదిలో మంచం మీద చేరారు.

‘‘గుంటూరు ఒదల్లేదు అమ్మ. ఆమెతో పాటే నేనూ.  బాబుగారు పోయాక అన్నీ అమ్ముకుని గుంటూరు చేరాం కదా ` ఆ తర్వాత మన ఊరు వెళ్ళలేదు నేను. గుంటూరులో ఎన్నో జరిగాయి .తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతాలే . నా చదువు మాత్రం ఆగకుండా చూసుకున్నా. అమ్మ నాటకాల్లో వేషాలు  వేయటంమొదలుపెట్టి చివరకు తనే ఒక నాటకం కంపెనీ పెట్టింది. బి.ఏ. పూర్తి చేసి కూర్చున్నాను. రెండేళ్ళు ఊరికే గడిచిపోయాయి. మద్రాసులో చదవాలని నా కోరిక. అమ్మని అక్కడ నాటకం కంపెనీ మూసి ఇక్కడ తెరవాలని ఒప్పించే సరికి బ్రహ్మ ప్రళయం అయింది. ఎలాగైతేనేం వచ్చాం. ఎడ్మిషన్లకు ఇంకా చాలా టైముందిగా. ఈ లోపల కాస్త స్థిరపడాలి. నాటకాల్లో వేషాలు  వేయటం తప్పదు ` ’’

శారద ఆశ్చర్యంగా వింటోంది. విశాల నటిస్తుందా?

‘‘ఏం చదవానుకుంటున్నావు?’’

‘‘ఎమ్‌.ఏ.  ఎకనామిక్సు’’.

‘‘ఎకనామిక్సా? ఎందుకు?’’

‘‘ఎందుకేమిటి? నాకిష్టం. పైగా రేపు దేశానికి స్వతంత్రం వస్తే దేశాన్ని ఆర్థికంగా ఎలా నడిపించాలో ఎకనామిక్సు చదివితేనే తెలుస్తుంది.’’

‘‘ఓ! ఆర్థిక శాస్త్రవేత్తవవుతావన్నమాట’’

‘‘నువ్వు డాక్టర్‌వి కావటంలా’’

‘‘పాపం అన్నపూర్ణ చదువే ’’ జాలిగా అంది శారద.

‘‘పాపం అని జాలిపడనక్కర్లేదు. అది రాజకీయాల్లో దిగిందిగా. దేశానికి స్వతంత్రం వస్తే ఏ మంత్రో అవుతుంది. మనిద్దరం దాని దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాలి’’.

ఇద్దరూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని నవ్వుకున్నారు.

‘‘ఇప్పుడేం నాటకం వేస్తున్నారు?’

‘‘ఏముంది? శాకుంతలం’’.

‘‘నువ్వు శకుంతవా?’’

‘‘ఊ,  నా పాట వింటావా?’’

అభినయిస్తూ పాడింది  విశాలాక్షి . ముగ్ధురాలయి చూసింది శారద.

‘‘నువ్వు ఆర్థికశాస్త్రం చదవొద్దు ఏమొద్దు. హాయిగా నాటకాలు వేసుకో. జనం నీరాజనాలు పడతారు’’.

‘‘వెంటపడతారే తల్లీ. మగాళ్ళున్నారే. ఛీ, ఛీ . ఒదలరు. కానుకంటారు. షికారుకి రమ్మంటారు’’.

‘‘అంతమంది వెంటపడుతుంటే బాగానే ఉంటుందేమో’’.

‘‘తన్నబుద్ధేస్తుంది ఒక్కొక్కడిని’’

‘‘ఒక్కడన్నా నచ్చలేదా?’’

‘‘ఛీ! మగాడా? నచ్చటమా? వాళ్ళ వెకిలి వేషాలు చూస్తే నిప్పెట్టబుద్ధవుతుంది.’’

‘‘నీతోపాటు వేషాలు వేసే నటులలో ` దుష్యంతుడెవరు?’’

‘‘యాక్‌. బీడి కంపు’’

ఇద్దరూ పొట్టు చేత్తో పట్టుకుని నవ్వీ నవ్వీ ఆయాసపడ్డారు.

‘‘మీ అమ్మ వాళ్ళందరితో కంపెనీ నడుపుతోంది. నువ్వు వాళ్ళని అసహ్యించుకుంటున్నావ్‌.’’

‘‘మా అమ్మని చూస్తే నాకు కాస్త కోపంగానే ఉంటుందే. మంచిదే సమర్థురాలే . కానీ  ఏం చెప్పాలి? బాబు గారంటే అమ్మకి చాలా ప్రేమ. ఆయన పోయాక గుంటూర్లో గోవిందయ్య అనే ఆయన అమ్మకు దగ్గరయ్యాడు. మంచిగానే ఉండేవాడు. అండగా ఉంటాడ్లే అనేది అమ్మ. నాలుగేళ్ళకు ఏమయిందో మళ్ళీ రాలేదు. కనపడకుండా పోయాడు. ఇక తనకు తనే అండ అని నాటకం కంపెనీ పెట్టింది అమ్మ. ఇక చుట్టూ ఎంత మంది చేరారో. నన్ను నేను వాళ్ళందర్నించీ రక్షించుకోవాల్సి వచ్చింది. అమ్మకు తనను తాను రక్షించుకోటానికి ఒకటే సూత్రం తెలుసు. రంగనాధరావు అనే ప్లీడర్‌ని దగ్గరకు రానిచ్చింది. ఆయనగారి మనిషి అంటే ఇక ఎవరూ పిచ్చి వేషాలెయ్యరు అంది. నిజంగానే ఆయన మా జీవితంలోకి వచ్చాక నాకు కాస్త తెరిపి వచ్చింది. బి.ఏ చదువు పూర్తయింది. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మ వయసయిపోయింది. నన్ను ఎవరి అండనైనా పెట్టాలని అమ్మ ఆలోచన. నాకు అక్కడే అమ్మను చూస్తే మండిపోతుంది. ఎమ్మే చదివి ఉద్యోగంలో స్థిరపడాని నా ఆలోచన. ఇద్దరం పోట్లాడుకుంటాం.

మా అమ్మ చాలా సమర్థురాలు. తెలివైంది. కానీ నేనావిడలా బతకను.’’ విశాలాక్షి ఆపకుండా చెప్పుకుపోతుంది. శారద తనకింతవరకూ తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు విశాలాక్షిని చూస్తోంది.‘‘నువ్వు మగపిల్లలతో  కలిసి చదువుతున్నావు. ఎవరినైనా ప్రేమించావా? ’’ అడిగింది విశాలాక్షి.

‘‘లేదు’’ అని నవ్వేసింది శారద.

‘‘ఇంత అందమైన నిన్ను ఎవరూ ఇష్టపడలేదా?’’

‘‘ఇష్టం, ప్రేమ, స్నేహం వీటి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నా’’

‘‘ఆలోచించు మరి. పెళ్ళి వయసు దాటిపోతోంది. ఇప్పటికే ఆలస్యమైంది.’’

‘‘పెళ్ళా? నేను పెళ్లి చేసుకోను.’’

olga title

విశాలాక్షి నవ్వేసింది. ‘‘అందరు ఆడపిల్లలు  అనేమాటే నువ్వూ అన్నావు. ఐనా నువ్వెందుకు పెళ్ళి చేసుకోవు? నేను పెళ్ళి చేసుకోనన్నానంటే దానికో అర్థముంది’’.

‘‘ఏంటో ఆ అర్థం?’’

‘‘నన్ను ఏ మగవాడూ గౌరవంతో, ప్రేమతో పెళ్ళాడడు కాబట్టి. నా కులం, మా అమ్మ, ఈ నాటకాలు, వీటన్నిటినీ చూసి నన్ను ఎవరైనా గౌరవిస్తారా? నా అందం చూసి వస్తారనుకో. వాళ్ళు నాకక్కర్లేదు. నా పెళ్ళి అసాధ్యం’’.

‘‘అంత అసాధ్యం కాదులే. లోకం మారుతోంది. నాకు డాక్టర్‌గా నా వృత్తి, దేశ స్వాతంత్రం ఇవి తప్ప పెళ్ళీ, పిల్లలూ ఒద్దనుకుంటున్నా’’.

‘‘ఓ! అన్నపూర్ణ పిచ్చి నీకూ ఉందా?’’

‘‘పిచ్చేమిటే? నీకు స్వతంత్రం ఒద్దా?’’

‘‘కావాలే .చాలా చాలా స్వతంత్రాలు కావాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ స్వతంత్రం కావాలంటున్నవాళ్ళు నన్ను మనిషిగా చూడాలి. నన్ను ఆడదానిగా చూసి వెంటబడే మనుషుల నుంచి స్వేచ్ఛ కావాలి. నా కులం నుంచి నా వృత్తి నుంచి బైటపడి బతికే స్వతంత్రం కావాలి. గౌరవప్రదమైన ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకునే స్వతంత్రం కావాలి. నా బతుకు నన్ను బతకనిచ్చే స్వతంత్రం కావాలి’’.

‘‘దేశం స్వతంత్రమైతే అవన్నీ నీకు వస్తాయి’’.

‘‘నువ్వు పిచ్చిదానివా? నన్ను పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఏమీరావు. నా బతుకు మారాలంటే స్వతంత్రం చాలదే ` ఇంకా చాలా కావాలి. అవేంటో నాకు తెలియదు’’.

‘‘ఏమిటో తెలియనిదేదో రావాలంటే ముందు స్వతంత్రం రావాలి. జాతికి గౌరవం లేనిది నీకెలా వస్తుంది?’’

‘‘తోటి మనిషిని గౌరవించలేని జాతికి స్వతంత్రం ఎలా వస్తుంది? ఆ స్వతంత్రంతో ఎవరికైనా ఏం జరుగుతుంది?’’

‘‘నువ్వు మరీ నిరాశావాదిలా మాట్లాడుతున్నావు?’’

‘‘నా అంత ఆశావాది ఇంకొకరు లేరు. నా స్థానంలో నువ్వుంటే కూడా నాలా ఆశతో బతికే దానివా అనేది నాకు అనుమానమే. నేనింత హీనస్థితిలో కూడా కలలు కంటున్నా. ఎమ్మేపాసవుతా. ఇంకా పరీక్షలు రాస్తా. పెద్ద అధికారి నవుతా .  నా హోదా చూసి అందరూ నన్ను గౌరవిస్తారు. నేను రాగానే లేచినిలబడతారు. నా వెనక చెప్పుకుంటారేమో ఈమె తల్లి ఫలానా .ఈవిడా నాటకాల్లో వేషాలు  వేసేదట. కానీ నా ముందు నోరెత్తలేరుగా. అలాంటి అధికారం సంపాదిస్తా. ఆ ఆశతో బతుకుతున్నా’’

శారద విశాలాక్షి చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యానిస్తున్నట్లు గట్టిగా తట్టింది.

‘‘నీ ఆశ నెరవేరుతుంది. నే చెప్తున్నాగా’’

వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు.

***

 

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    ఆర్యా! వైద్యశాల పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగ ప్రచారంలోనికి వచ్చింది. రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగ అనుకరిస్తున్నరు. ఆసుపత్రి అసలైన తెలుగు పదమైనట్లు భావిస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రిస్టియన్ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసినయి. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, స్వచ్ఛమైన పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ‘వైద్య కళాశాల’ను వ్రాస్తున్నట్లే, ‘వైద్యశాల’ను వ్రాయాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, వికృత పదాన్ని వదలి, యధాతథంగ ‘హాస్పిటల్’ అని కూడ లిప్యంతరీకరణ చేయవచ్చు. ప్రజలు పలుక గలిగిన ‘హాస్పిటల్’ను మార్చవలసిన అవసరం లేదు. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన సరియైన పదాలు! ప్రజలు మీద రుద్దబడిన అవకర పదం ఆసుపత్రి ని పరిహరించాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండే విధంగ ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె.
    ~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ

  2. C N Prasanth says:

    ఏక్ష్చెల్లెన్త్…….

మీ మాటలు

*