Archives for August 2015

రాత్ & దిన్

Painting: Julia Victor

Painting: Julia Victor

మధు పెమ్మరాజు

madhu_pic“ఇంత అర్ధరాత్రి ఏం చేస్తున్నావు” అని అడిగాడు.
“బస్సు కోసం ఎదురుచూస్తున్నాను” అని ఇబ్బందిగా చెప్పింది.
“నీ అర్ధరాత్రి పచార్లు వారం నుండి చూస్తున్నాను, నిజం చెప్పు” అని సుతిమెత్తగా రెట్టించాడు
వదిలేలా లేడని “రోజూ బస్టాప్ నుండి యూనివర్సిటీని చూస్తుంటాను” అని చెప్పింది.
“యూనివర్సిటీని చూస్తుంటావా… ?” ఆశ్చర్యంగా అడిగాడు
ఎదురుగా ఫ్లాష్ లైట్లు చుట్టుముట్టిన భవనాలని చూపిస్తూ “ఎవరో గొప్ప ఆర్కిటెక్ట్ విశాలమైన ఆలోచనలకి, అందమైన ఊహలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు, సింప్లీ గ్రేట్! ”
“ఇంత అర్ధరాత్రి..ఒంటరిగా….భవనాలని చూస్తున్నావా?” అని అడిగాడు
“అవును….”
“ఎందుకు?”
“నాకు ఆర్కిటెక్చరంటే చాలా ఇష్టం”
“ఎందుకు మంచి ఉద్యోగం వస్తుందనా?”
“అది మాత్రమే కాదు”
“మరి.. ?”
“అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలని డిజైన్ చెయ్యాలని, ప్రపంచం చుట్టి రావాలని… ..ఇలా ఎన్నో ఆశలు..”
“వినడానికి బానే ఉంది కానీ పగటి పూట రావచ్చు కదా?”
“ఒకప్పుడు అలాగే చేసేదాన్ని..”
“మరిప్పుడు….?”
“వెలుగంటే భయం”

student-art-abstract-buildings-h
“నీ మాటలు భలే వింతగా ఉన్నాయి, తెల్లారితే యూనివర్సిటీ ప్రాంగణం విద్యార్థులతో కళ, కళలాడుతుంది, అప్పుడు రా..”
“మీరు ఏ కాలానికి చెందినవారో తెలియదు……“
“ఎందుకు?”
“పగటి పూట వికృతాలు ముసుగు ధరించి తిరుగుతాయి”
“ఈ చీకటి కంటేనా?”
“చీకటి అమాయకమైనది, నలుపు తప్ప వేరే రంగు తెలియదు. తేటగా కనిపించే పగటి నిండా రంగు, రంగుల కపటాలు”
“నువ్వు టీవీ వార్తలు బాగా చూస్తావనుకుంటా?” నవ్వుతూ అన్నాడు.
“చూసే అవకాశం రాలేదు”
“నీ వయసుకింత అపనమ్మకం పనికిరాదు, యూనివర్సిటీలో చేరితే అంతా మంచే జరుగుతుంది”
“అంత నిక్కచ్చిగా ఎలా చెబుతున్నారు?”
“చూడు…అక్కడ బాగా చదివే వారికి తప్ప సీట్ రాదు. అంటే మంచి విద్యార్థులు, మంచి అధ్యాపకులు ఉంటారు”
“మంచి అంటే మనుషులనేగా మీ అర్ధం?”
“అవును అంతా మంచివాళ్ళే… అప్పుడిలా అర్ధరాత్రి, అపరాత్రి నిరీక్షణ అక్కర్లేదు ” అన్నాడు.
బాగ్లోంచి ఒక న్యూస్ పేపర్ తీసి అతనికిచ్చింది, వీధి దీపపు వెలుతురిలో దగ్గరకి తీసుకుని చదివాడు
“ఓ వెరీ గుడ్… మంచి రాంక్ తెచ్చుకున్నావు, మరింకేం.. తప్పక సీట్ వస్తుంది” అన్నాడు.
రెండో పేపర్ అతనికిచ్చి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఎటు చూడాలో తెలీక…

తడుముకుంటూ ‘విద్యార్థిని ఆత్మహత్య’ అనే వార్త చదివాడు, తర్వాత చీకటిలోకి చూసాడు.

*****

ఆయన మరణం అకారణం కాదు

బి. నర్సన్
నిజమే… అలిశెట్టి ప్రభాకర్
39 ఏళ్లు బతకడానికే ఈ భూమ్మీదికచ్చాడు
మిట్ట మధ్యాహ్నపు వయసు నాటికే
ఆరోగ్యం చెదిరింది
ఆస్తి కరిగింది
కలం మాత్రం నిప్పులు చెరిగింది
మతం పులి, దాని ఆకలి
తీర్చాల్సివచ్చినప్పుడల్లా నువ్వో నేనో ఖతం అన్నొడు
పాలేర్లు ఉరిమిచూస్తే
దొర బతుకంతా పల్లెర్లే అన్నోడు
తను వెళ్లిపోకపోయినా
ఇన్ని మాటలు పడ్డ లోకం బతకనిచ్చెదా
ఇల్లు వాకిలి, ఆలుబిడ్డల్ని
మందూ మాకును
కవిత్వం పారవశ్యంలో
కసపిసా తొక్కేసినోడు
పచ్చి కుండలా పగిలిపొయాడు
*
‘కుట్టిన యెర్రతేలు మంటలాంటిది ఆకలి
కడుపులో పేగుల్ని కడుబాధాకరంగా
దున్నే నాగలి ఆకలి” ఇలా
సైనైడ్ రుచి చూసినవాడికి బతికే చాన్సేది
అక్షరం ఆచరణ ఒక్కటైనప్పుడు
లాఠీ రుచి చూడకా తప్పలేదు
మకాం మార్చాడు గాని, బెదిరి
మనసు మార్చుకోలేదు
పత్రికా పారితోషికంతో పూట గడవకున్నా
కలర్ సినిమా గ్లామర్ నా కాలిధూళితో సరి
అన్నోడికి కాలఙానం తెలుస్తుందా
పుట్టిన గడ్డనుంచి ఇక్కడికి రావడమే పొరపాటైందని
సాలెగూడులో విలవిలా తన్నుకున్నవాడు
తనువు చాలించక తప్పదు కదా
ఒయాసిస్సునిచ్చి ఎడారిలా మారిన జీవితం
దీన్ని విషాదమందామా.. విముక్తి అందామా..
                           (అలిశెట్టి ప్రభాకర్ సమగ్ర కవితా సంపుటి మలి ముద్రణ విడుదలైన సందర్భంగా)
narsan

మనసు ఊసులన్నీ మనసు భాషలోనే…

 

మనిషి ఎంత కష్టపడి ఉంటాడో కదా…

తన ఉచ్ఛారణకి అక్షరాలు చిత్రీకరించి.. పదాలు సృష్టించీ… వాక్యాలు నిర్మించీ.. ఒక భాషగా మలచడానికి!

ఏం లాభం! నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి అది ఏమాత్రం సహకరించడంలేదు.

అంత కష్టమూ శుద్ధ వృధా కదూ!?

‘అయినా మాట్లాడిన ప్రతిసారీ నా ఇష్టాన్ని నీకు ఇలా మాటల్లో చెప్పాలా.. నీకు మాత్రం తెలీదూ?’ అని ఊరుకుందామనిపిస్తుందా.

ఉహూ.. ఎంత ఆపుకుంటే అంత గాఢంగా, మధురంగా చెప్పాలనిపిస్తుంది.

చాలాసార్లు ఎంతో మురిపెంగా నీకు వినిపించే ఆ రెండు మూడు పదాలు కూడా అలాంటప్పుడు నిస్సారంగా, ఒక తప్పని మొనాటనీలా అనిపించేసి చాలా చిరాకుతెప్పించేస్తాయి.

అసలు ఈ గుండె భాషని ఇలా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నదున్నట్టుగా.. మొత్తంగా నీ గుండెకి చేరేసే ఉపాయమేమీ లేదంటావా!?
ఆ ఆపిల్ వాడు, ఐప్యాడ్లూ, ఐపాడ్లూ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ‘ఐఫీల్యూ’ మీద కొంచెం దృష్టి పెట్టొచ్చు కదా!?

gulzar

కవిత

కవిత ఒకటి మనసునే పట్టుకు వేళ్ళాడుతోంది,

ఆ వాక్యాలన్నీ పెదవుల్నే అంటిపెట్టుకున్నాయి,

ఎగురుతున్నాయి అటూ ఇటూ సీతాకోకచిలుకల్లా

పదాలు కాగితం పైన మాత్రం కుదురుకోకుండా!

ఎప్పట్నించీ కూర్చున్నానో, బంగారం

తెల్ల కాగితం మీద నీ పేరు రాసుకుని..

ఒక్క నీ పేరు మాత్రం పూర్తయింది..

అవునూ, ఇంతకన్నా మంచి కవిత్వం ఏముంటుందేమిటీ!?

*****

ఒక పురాతన ఋతువేదో తిరిగొచ్చింది
తోడుగా జ్ఞాపకాల తూరుపునీ తెచ్చుకుంది.
ఇలా అరుదుగా జరుగుతుంది,
తన సమక్షంలోనే విరహమూ వేధిస్తుంటుంది!!

*****

నా నిశ్శబ్దం నడిచేది
నీ సుదీర్ఘ మౌనంగుండానే!
అదేమంటుందో వింటాను….
నా గురించేవో కూడా చెప్పుకుంటూ!!

మూలం:
Nazm uljhi hui hai seene mein
misare atke hue hain hothon par
udate phirte hain titaliyon ki tarah
lafz kaagaz pe baithate hi nahin
kab se baithaa hun main jaanam
saade kaagaz pe likh ke naam tera

bas tera naam hi mukammal hai
is se behtar bhi nazm kyaa hogi

*****

Ek Puraana Mausam Lauta, Yaad Bhari Purvayi Bhi
Aisa To Kam Hi Hotha Hai, Wo Bhi Ho Tanhaayee Bhi

*****

Khamoshi Ka Haasil Bhi Ik Lambi Si Kamoshi Hai
Unki Baath Suni Bhi Humne, Apni Baat Sunayi Bhi.

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -13

 

       [ Anne Of Green Gables By L.M.Montgoemry ]

                                   [ గత సంచిక తరువాయి ]

  ఆగస్ట్ నెల మధ్యాహ్నం. బంతిపువ్వు రంగు ఎండలో పరిసరాలన్నీ జోగుతున్నాయి. బయటికి ఒకసారీ గడియారం వైపు ఒకసారీ చూసి మెరిల్లా అనుకుంది – ” ఆన్ ఈ పాటికి వచ్చేసి కుట్టు పని మొదలెట్టుకోవద్దూ ? డయానా తో ఆడుకుంటూ అసలే అరగంట ఆలస్యం గా వచ్చింది..సరాసరి లోపలికి రాకుండా ఆ కట్టెల మోపుల  మీద కూర్చుని మాథ్యూ తో కబుర్లు మొదలెట్టింది ! ఏముంటాయో అన్నేసి మాటలు..గంటలు గంటలు దొర్లిపోతూ…ఆ మాథ్యూ అంతకన్నా –  అది ఏం చెప్పినా చెవులు దోరబెట్టుకు వింటుంటాడు. దాని కబుర్లు ఎంత పిచ్చిగా ఉంటే అంత సంతోషపడిపోతాడేమిటో…

‘’   ఏయ్ ఆన్ షిర్లే !! వినిపిస్తోందా ? రా ఇక్కడికి ” – పడమటి కిటికీ మీద టపటపా కొట్టింది. ఆన్ వచ్చింది…ఉత్సాహానికి కందిపోయిన బుగ్గలేసుకుని, తళతళ మనే కళ్ళతో  గంతులేసుకుంటూ  – జడలు ఊడిపోయిన జుట్టు ఆమె వెనకాల ఎగురుకుంటూ లోపలికి  వచ్చింది.

” ఓ మెరిల్లా…తెలుసా…వచ్చే ఆదివారమటా, పిక్ నిక్ అట…!!!! ప్రకాశమాన సరోవరం పక్క..నే – మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ పొలం లేదూ..అక్కడంట. మిసెస్ బెల్ల్ , మిసెస్ రాచెల్ కలిసి ఐస్ క్రీ మ్   తయారు చేసి తెస్తారట …ఐస్ క్రీ మ్ …!!!!! నేను వెళ్ళొద్దా ?? ”

మెరిల్లా ఏం తొణకలేదు – ” ఒకసారి గడియారం చూడు తల్లీ, ఎంతైందీ ? నేను ఎన్నింటికి రమ్మన్నాను నిన్ను ? ఆ.. ? ”

” రెండింటికి. పిక్ నిక్ ఉండటం ఎంత…బావుందో కదా …ఎప్పట్నుంచో కలలు కంటున్నాను దాని    గురించి….మం..చిదానివి కదూ మెరిల్లా..పంపించవా నన్ను ? ”

” సరిగ్గా రెండు గంటలకి రమ్మన్నాను నిన్ను- ఇప్పుడు రెండూ ముప్పావు అయింది ..నా మాటెందుకు వినలేదో చెప్పు ముందు ”

” వద్దామనే అనుకున్నాను మెరిల్లా , డయానా వాళ్ళ తోటలో కొత్త పువ్వులు పూశాయి గదా అని  చూస్తుంటే ఆలస్యమైపోయింది.  తర్వాతేమో మాథ్యూ కి పిక్ నిక్ గురించి చెప్పాను ఇప్పటిదాకా …నేను వెళ్ళద్దా చెప్పు , దయచేసి…”

” నీ ఉబలాటాలు కొంచెం తగ్గించుకుంటే సంతోషిస్తాను ..రెండు గంటలూ అంటే రెండు గంటలే అని అర్థం , అరగంట తర్వాత అని కాదు. పిక్ నిక్ – ఆ , వెళ్ళచ్చులే, ఆదివారం బడికి ప్రతివారమూ వెళతావుగా , దీనికి వెళ్ళకపోతే బావుండదు ”

MythiliScaled

” అది కాదు మెరిల్లా.. డయానా చెప్పిందీ , ప్రతి వాళ్ళూ ఒక్కొక్క బుట్టతో తినుబండారాలు తీసుకెళ్ళాలట – నాకు వంట చేయటం రాదుగా మరి… బుట్ట చేతులు లేకుండా బడికైనా వెళ్ళచ్చుగానీ తినేవేమీ  లేకుండా పిక్ నిక్ కి వెళితే ఏమీ బావుండదేమో కదా , ఇందాకట్నుంచీ ఇదే ఆలోచిస్తూ ఉన్నాను ”

” అంత కంగారేం పడక్కర్లేదులే. బిస్కెట్ లూ  కేక్ లూ బేక్ చేసి ఇస్తాను –  బుట్టనిండుగా పట్టుకుపోదువుగాని ”

” మెరిల్లా..మెరిల్లా…ఎంత మంచిదానివి ! ఎంత గొప్పదానివి !! నన్నెంత బాగా చూస్తున్నావు !!!!! ”  చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆన్.  మెరిల్లా ని చిన్న పిల్లెవరైనా ముద్దు పెట్టుకోవటం ఆమె జీవితం లో అదే మొదటిసారి – ఆనందం పొంగుకువస్తున్నా పైకి తేలకుండా బింకం గా –

” ఆ..చాలు చాలు…పిచ్చి హడావిడి చెయ్యకు. చెప్పింది చెప్పినట్లు చేస్తే అంతే చాలు .  నీకు వంట నేర్పుదామనే నా ప్రయత్నం ..ఏదీ , నీ బుద్ధికి కుదురు ఉంటే కదా ? పొయ్యి మీద ఏదో పెట్టినప్పుడే నీకు ఎక్కడెక్కడి ఊహలూ ఆలోచనలూనాయె…సరేలే, ఆ బొంత కుట్టే పని వదిలేసి పోయావుగా ఇందాక, పూర్తి చేసెయ్యి ఇప్పుడు ”

” ఇలా  అతుకులు పెట్టి కుట్టటం నాకేం నచ్చలేదు ” – ఆన్ నసపెట్టుకుంటూ పనిమొదలెట్టింది. ” కొన్ని రకాల కుట్టుపనులు  బాగానే ఉంటాయి గాని  ఇందులో ఊహించుకుందుకు ఏ..మీ ఉండదు..ఒక గుడ్డ ముక్క ని ఇంకొకదానికి అతికించి కుట్లు వేయటం తప్ప ! అయినా పర్వాలేదులే , ఇంకెక్కడో ఉండి రోజంతా ఆడుకోవటం కంటే గ్రీన్ గేబుల్స్ లో ఉండి బొంత కుట్టటమే నయం. అయినా..డయానా తో ఆడుకునేప్పుడు కాలం ఎంత గబ గబా  గడిచిపోతుందో ..ఇప్పుడసలు కదలదేం ??? అక్కడ ఎంత బాగా గడిచిందో తెలుసా మెరిల్లా ? ఊహించటం నాకు బాగా వచ్చు, అదే చేస్తూ ఉంటాను – తక్కినవన్నీ డయానా బ్రహ్మాండంగా చేసేస్తుంది.మన చోటుకీ డయానా వాళ్ళదానికీ మధ్యలో , వాగు పక్కన చిన్ని , సన్నటి చోటుంది చూడు , మిస్టర్ విలియం బెల్ వాళ్ళది – అక్కడొక మూల బర్చ్ చెట్లు గుండ్రం…గా పెరిగాయి. మేమిద్దరం అక్కడ బొమ్మరిల్లు కట్టాం… దానిపేరు ‘ తీరిక గూడు ‘ ..బావుందా ? నేనే పెట్టాలే అది…రాత్రంతా మేలు కుని..సరిగ్గా నిద్రపోబోయే ముందర తట్టింది .   నువ్వొకసారి వచ్చి చూడు మెరిల్లా.. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, వాటి మీద మెత్త..గా నాచు కూడా ఉంది, అవి మా కుర్చీలు. చెట్టునుంచీ చెట్టుకి అడ్డంగా కొమ్మలున్నాయి , వాటి మీద మా గిన్నెలూ అవీ పెట్టుకుంటామన్నమాట. అన్నీ కొంచెం పగిలిపోయిన గిన్నెలే ననుకో, బాగున్నట్లు ఊహించుకోవటం ఏం కష్టం చెప్పు ? ఒక పింగాణీ పళ్ళెం మీదయితే తెలుపూ ఎరుపూ తీగలు …ఎంతో అందంగా ఉంది అది. ఇంకో గాజు గిన్నె కూడా ఉంది మాకు  ..అది అచ్చం గంధర్వులది లాగా ఉంటుంది…కలల్లో మటుకే కనిపించేలాగా.   దాని మీద చిట్టి చిట్టి ఇంద్రధనుస్సులు…అంటే పిల్లవి అన్నమాట, ఇంకా పెద్దవి అవలేదు. వాళ్ళింట్లో వేలాడే గాజు దీపం ఉండేదట –  దాన్లోంచి ఊడిపడిందని డయానా వాళ్ళ అమ్మ చెప్పారు… కాని ఎవరో గంధర్వకన్యలు వెన్నెట్లో నాట్యం చేసుకుంటూ మర్చిపోయారనుకుంటున్నాం మేము ..ఇలాగే బావుంది కదా ?

anne13-2

అక్కడ వేసుకుందుకు మాథ్యూ మాకొక చిన్న బల్ల తయారుచేసి ఇస్తానన్నాడు. అక్కడొక కొలనుంది కదా, దానికి విల్లోమియర్ అని పేరు పెట్టాను. డయానా నాకొక పుస్తకం ఇచ్చిందిలే, అందులో దొరికింది ఆ పేరు. భలే పుస్తకం అది మెరిల్లా, అందులో అమ్మాయిని ఏకంగా అయిదుగురు ప్రేమిస్తారు..నాకైతే ఒక్కళ్ళు చాలనుకో…మరి నీకు ? ఆ అమ్మాయి గొ..ప్ప సౌందర్య రాశి అట,  ఊరూరికే మూర్ఛ పోతూ కూడా ఉంటుంది. నేనిప్పటి వరకూ ఒక్కసారి కూడా  మూర్ఛ పోలేదు , పోగలితే ఎంచక్కానో ఉంటుంది ..కదా మెరిల్లా ? నేను సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యం గా ఉన్నాను ..అందుకని మూర్ఛపోననుకుంటా. అయినా నేను లావవుతున్నట్లున్నాను ఈ మధ్య..కదా ? పొద్దుటే లేవగానే నా మోచేతులు బొద్దుగా అయి సొట్టలు పడుతున్నాయేమోనని చూసుకుంటుంటాను. డయానా , మోచేతుల దాకా చేతులున్న గౌన్ లు కుట్టించుకుంటోందట, ఒకటి ఆదివారం పిక్ నిక్ కి వేసుకొస్తుందట…పిక్ నిక్ బుధవారమే అయితే బావుండేది… ఒకవేళ ఏమైనా జరిగి ,  నేను వెళ్ళలేకపోతే నా ఆశాభంగాన్ని భరించలేను మెరిల్లా ! ఆ తర్వాత జీవించి ఉంటానేమో గాని నాకు అది ఆజన్మ శోకం అవుతుంది…ఆ తర్వాత ఇంకో వంద పిక్ నిక్ లకి వెళ్ళినా సరే , ఆ బాధ తగ్గదు ! పిక్ నిక్ లో ప్రకాశమాన సరోవరం లో పడవల మీద వెళతామట..చెప్పారు..ఐస్ క్రీమ్  తింటూ అట. నేనింతవరకూ తినలేదు..డయానా అది ఎలా ఉంటుందో వివరించబోయింది , కాని ఊహ కి కూడా అందని సంగతుల్లో ఐస్ క్రీమ్   ఒకటి అనిపించింది… ‘’

anne13-3

ఎట్టకేలకి , అప్పటికి ఆన్ ఉపన్యాసం ముగిశాక –  మెరిల్లా అంది – ” ఆపకుండా పదినిమిషాలు మాట్లాడావు , లెక్కపెట్టాను నేను. అంతే సేపు నోరు మూసుకుని ఉండగలవా..చూద్దాం ? ”

” ఎదురుచూస్తూ ఉండటమే సగం సంతోషం కదా మెరిల్లా…ఆ తర్వాత అనుకున్నట్లు జరగకపోయినా కూడా, అనుకుంటూ ఉండటం ఎంత సరదాగా ఉంటుందో ! మిసెస్ రాచెల్ అన్నారు  – ‘ ఏమియును ఆశించనివారు ధన్యులు , వారు ఆశాభంగమును పొందరు ‘ .  కానీ  , ఏమీ ఆశించకుండా ఉండటం కంటే ఆశాభంగాన్ని పొందటం చాలా చాలా నయమనిపిస్తుంది ”

 

అమెథిస్ట్ జాతి రాళ్ళు  తాపడం చేసిన పిన్ ఒకటి మెరిల్లా దగ్గర ఉంది. ప్రతి ఆదివారమూ చర్చ్ కి వెళ్ళేప్పుడు మెరిల్లా దాన్ని తన గౌన్ కి పెట్టుకుంటుంది. దాన్ని మర్చిపోయి వెళ్ళటం బైబిల్ ని మర్చిపోయి వెళ్ళటం లాగా ఉంటుంది ఆమెకి. నౌకల్లో పనిచేస్తూ ఉండే బాబాయి ఒకరు మెరిల్లాకి దాన్ని బహూకరించారట. పాతకాలపుదిగా, పూల గుత్తి  ఆకారం లో  ఉంటుంది –  మధ్యని పెద్ద అమెథిస్ట్ కింద మెరిల్లా వాళ్ళ అమ్మ జుట్టుని కొంచెం అమర్చారు [ పాశ్చాత్యులలో గతించిన ఆప్తుల జ్ఞాపకం గా అలా ఉంచుకుంటారు ] , చుట్టూ చిన్న చిన్న రాళ్ళు మిలమిలమంటూ ఉంటాయి. మెరిల్లా కి వాటి విలువా నాణ్యమూ పెద్దగా తెలియవుగానీ తన మట్టి రంగు గౌన్ మీద వాటి ఊదా రంగు మెరుపు అందంగా ఉందనుకుంటుంది.

దాన్ని ఆన్ మొట్టమొదట చూసినప్పుడు సంతోషం తో తలమునకలైంది.

” ఎంత అద్భుతంగా ఉంది మెరిల్లా ! ఇలాంటిది పెట్టుకుని ఉంటే చర్చ్ లో ప్రార్థనలమీద ధ్యాస ఉంటుందో లేదో నాకైతే తెలీదుగాని..గొప్పగా ఉంది ఇది. వజ్రాలు ఇలా ఉంటాయేమో అనుకుంటుండేదాన్ని. చాలా రోజుల కిందట  వజ్రాలు  చూశాను. చూడకముందంతా ఊహించునేదాన్ని ఎలా ఉంటాయోనని –  ఇలా గాఢమైన ఊదా రంగులో మెరిసిపోతాయనుకునేదాన్ని … చివరికి ఒకావిడ ఉంగరం లో ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూశాను…ఆశాభంగం తో ఏడుపు వచ్చింది నాకు. చాలా అందంగానే ఉన్నాయనుకో , కాని  – ‘ అలా ‘  ఉంటాయని అనుకోలేదు . ఒక్కసారి చేత్తో పట్టుకు చూడద్దా  మెరిల్లా ? పుణ్యం చేసుకున్న  వయొలెట్ పువ్వుల ఆత్మలే అమెథిస్ట్ లు అవుతాయేమో , కదా ? ”

 

                                                                      [ ఇంకా ఉంది ]

 

చెత్తకుప్ప

 

సొదుం శ్రీకాంత్

 

పర్వాలేదు ఇటివ్వండి
అది చెత్తైనా, మెత్తటి పసి బుగ్గైనా
నీకక్కర లేదని అనిపిస్తే
అది ఏదైనా సరే
ఇటు విసిరిపారేయండి
జిత్తులెరగని దాన్ని,
కుయ్యుక్తులు నేర్వని దాన్ని,
నెత్తురు రుచి మరగని నికార్సైన ‘మనిషి’తనాన్ని
నాకిదేం కొత్తకాదులెండి!
మౌనంగా నెత్తిన పెట్టుకమోస్తాను
ఇటిచ్చేయండి.

ఇల్లు ఇరుకయ్యిందని చెప్పి
కసురుకుంటూ మొన్నో కవొచ్చాడు
కాసేపు తటపటాయించి
బరువెక్కిన హృదయంతో
తను విసిరేసిన కాగితాల్ని
ఒరిసి పట్టుకుని తెరచి చూస్తే
ఆకలి తీర్చని అక్షరాలపై
అదోరకం తిరుగుబాటని
ఆ కరుకు కవితల్ని
చదివాకే నాకర్థమయ్యింది.

రకరకాల చెత్త
పార్టీల చెత్త, పత్రికల చెత్త
టీవీల చెత్త, మూవీ ల చెత్త
కార్పొరేట్ కంపెనీల చెత్త,
వేర్పాటువాద అధికార కుతర్కాల చెత్త
ఎన్నికల చెత్త అన్నిటికంటే మన్నికైన చెత్త!
రాగద్వేషాలను వదిలి
రంగుల్ని, హంగుల్ని విడిచి
జాతుల్ని, తలరాతల్ని తుడిచి
కొత్తపాతల సుత్తి లేకుండా
అన్నింటినీ అక్కడే కలబోసి
ఏ కుల, వర్గం తేడా లేకుండా
కలివిడిగా పెంచడమే నా కళ!

అన్నీ వస్తుంటాయ్
‘వస్తువీకరణ’ చెత్త విస్తుపోయేలా చేస్తే
పుస్తకాలలోని చెత్త చిర్రెత్తి పోయేలా చేస్తుంది
అమ్మనాన్నల పిలుపుకోసం పలవరించే ఆ అనాధ బిడ్డల్ని చూసినా
పలకరించే దిక్కులేక కలవరించే ఆ పండుటాకుల్ని తాకినా
ఆకలితో అలమటించే అన్నార్తుల అనంత ఘోషను విన్నా
కడుపు నింపలేక ఈ కసాయి వ్యవస్థ పై
అసహ్యం, అసహనం పెల్లుబుకుతుంది.
ఆ ఆయుధాల చెత్తకు, అణుబాంబుల చెత్తకు
ఆ పుష్కరాల చెత్తకు, రాబందు కంపెనీల రాయితీల చెత్తకు
అంతంత ‘ప్రజాసొమ్ము’ తగిలేసే చిత్తశుద్ది లేని
ఈ చెత్త నాయకులా దేశంలోని చెత్తను ఊడ్చేసి
జిలుగుల ‘వెలుగుల భారత్’ ని కలగంటున్నది?

ఇదేమిటిది….కొత్తగా….!
చీపుర్లు పట్టి ఫోటోలకు ఫోజిచ్చే
సరికొత్త దగా స్కీం ‘స్వచ్ఛ భారత్’!
ఆ ఉన్న అరకొరక స్వేచ్ఛను కూడా
మట్టగా ఊడ్చేసే గాడ్సేల నరహంతక చెత్త పుత్రులారా
నన్నిలా బతకనివ్వరా…?
ఆయ్యా…ఓ హిట్లర్ కా పుత్రా!
చెత్త చట్టాలను పుట్టించే ఓ పెద్ద కార్పొరేట్ కొట్టును
పార్లమెంటులో పెట్టుకుని
రోడ్ల పై పరకలు పట్టుకుని
చెట్ల మీద, పుట్టల మీదా, పిట్టల మీదా
పడి ఏడ్చి ఊడ్చడమేమిటి ?
పట్టాలు తప్పిన స్వ’రాజ్యం’
గుత్తాధిపత్యం సరసన చెట్టాపట్టాలేసుకొని
దేశాన్ని చేత్తకుప్పగా మార్చడానికి,
పన్నిన సరికొత్త కుట్ర కాదా
ఈ ‘స్వచ్ఛ భారత్’ నినాదచెత్త?

స్వేచ్చ అంటే అమ్మకపు, కొనకపు మారకంగా మార్చుకుని
అవసరాన్ని సరికొత్త బానిసత్వ వనరుగా తీర్చుకుని
బల్ల నిండా, గుల్ల నిండా, మెదళ్ల నిండా, మనిషి నిండా
పట్టుకుంటే కంపుకొట్టే మార్కెట్ సరుకుల చెత్తని నిలువెత్తున తగిలించుకుని
ఆనక, నన్ను చూసి ముక్కు మూసుకుని
పుణ్యాత్ములమని తెగ ఫోజులు కొట్టే
మీ అజ్ఞాన చెత్తకు
‘నాగరిత’ పేరు తగిలించుకుని మురిసిపోయే
మీ మూర్ఖత్వపు చెత్తకు
ఆకలిమంటల అంతరంగం పట్టని
మీ అమానవీయ చెత్తకు
ఏ మురికిభాష పేరుబెట్టాలో వెదుకుతున్నా!
ఈ భూమిని పెంట కుప్పగా మార్చే
మీ విద్వంసకర అభివృద్ధి విధానచెత్తపై
ఒక్క ఉమ్మేయడమే కాదు-ఓ మహోత్తమ చెత్త ప్రభో
నా చెత్తనంతా నీ నెత్తిన కుమ్మరించి
నా పేరు పెరికి నీ తీరుకు అతికించి
పిడికిలి బిగించి తిరుగుబాటును ప్రకటించి
ఓ కొత్త దారిని కలగంటున్న
సరికొత్త చెత్తకుప్పను నేను!

***

sodum

జయహో జైపూర్!

 

సత్యం మందపాటి

 

satyam mandapati మేము మూడేళ్ళ క్రితం భారతదేశం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశంతో పాటూ ఢిల్లీ, అమృత్సర్, వాఘా, జైపూర్, ఆగ్రా వెళ్లామని చెప్పాను.  ఢిల్లీ, అమృత్సర్, వాఘాల గురించి ఇదే శీర్షికలో మా యాత్రా విశేషాలు వ్రాశాను కూడాను. ఈసారి జైపూర్ గురించి మా అనుభవాలు చెబుతాను.

ఢిల్లీ నించీ ట్రైన్ తీసుకుని జైపూర్ వెళ్లి అక్కడ ఒక మంచి హోటల్లో దిగాం.

జైపూరులో చూడవలసినవి చాల వున్నాయి. వాటిల్లో మాకు బాగా ఇష్టమైనవి, చూడాలనుకుని చూసినవి ఏమిటో చెబుతాను.

ముందుగా జైపూర్ చరిత్ర, అక్కడి మహారాజులు చరిత్రా కొంత చెబుతాను. తర్వాత మా విహార యాత్రా విశేషాల గురించి మాట్లాడుకుందాం.

నాకు మొదటినించీ భారతదేశ చరిత్రా, మిగతా దేశాల చరిత్రా, ఆయా దేశాల సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) గురించి చదవటం, తెలుసుకోవటం సరదా అని ఇంతకుముందే చెప్పాను. కాకపొతే ఆ చరిత్ర వ్రాసినవారి బట్టి రకరకాలుగా వుంటుంది. ఉదాహరణకి భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి పాకిస్తాన్ చరిత్రకారులు వ్రాసిన దానికీ, మనవాళ్ళు వ్రాసినదానికీ ఎంతో తేడా వుంటుంది. అందుకని, ఒక పుస్తకంతో సరిపెట్టుకోకుండా, కొంచెం లోతుగా చదవటం అవసరం.

ఆ నేపధ్యంలోనే జైపూర్ మహారాజుల గురించీ చదివాను. ఇప్పుడు జైపూర్ వెళ్లేముందు, కొంచెం ఎక్కువగానే చదివి, ఈ మహారాజులు ఎలాటివారో, వారి నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను.

అలా చదివిన తర్వాత తెలుసుకునే నిజాలు చాల ఆశ్చర్యంగా కూడా వుంటాయి. ఉదాహరణకి అలెక్జాండర్ ది గ్రేట్.. గ్రేట్ కానే కాదు. ఎంతోమంది చేత చావుదెబ్బలు తిన్న యుద్ధ పిపాసి. కొలంబస్ ఒక సముద్రపు దొంగ. అతను అమెరికాని కనుక్కోక ముందే, అమెరికా లక్షణంగా మా ఇంటి ముందరా, వెనకా వుండనే వుంది. సుబ్బారావుగారింటికి బయల్దేరి, అప్పారావుగారింటికి వెళ్లి, అదే సుబ్బారావుగారి ఇల్లు అనుకున్న వెర్రి మాలోకం. ఇండియా వెళ్లి, అక్కడి నించీ సిల్కు, బంగారం, రత్నాలు, మిరియాలు తెస్తానని స్పానిష్ మహారాణిని వూరించి, ఆవిడ దగ్గర ప్రయాణ ఖర్చులు కొట్టేసి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టకుండా పడమటి దేశాలకు వచ్చిన, దిక్కూ దివాణం తెలియని మనిషి. మొదటిసారి బహామా ద్వీపాలకి వచ్చి అదే ఇండియా అన్నాడు. రెండోసారి వెనిజువేలా వచ్చి అదే ఇండియా అన్నాడు. మూడోసారి మధ్య అమెరికా వచ్చి అదే ఇండియా అన్నాడు. వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. అందుకే ఇక్కడ ఆ రోజుల నించీ వున్న ప్రజలని ఇండియన్స్ అంటారు. కొలంబస్ మాత్రం అమెరికాని ‘కనుక్కున్న’ గొప్పవాడిగా మా అమెరికా చరిత్ర చెబుతుంది. సంవత్సరంలో ఒక రోజు కొలంబస్ డే అనే పేరుతో సెలవు కూడావుంది. అలాగే అక్బర్ జీవితం.  అక్బర్ భారతదేశాన్ని ఉద్ధరించటానికి రాలేదు. మొగలాయీల దోపిడీలో పెద్ద భాగస్వామి. వారి సామ్రాజ్య విస్తరణకి, ఎంతో కృషి చేసి భారతదేశంలో కొంత భాగాన్ని, తన కాళ్ళ క్రింద పెట్టుకున్న పెద్దమనిషి. జోదాని పెళ్లి చేసుకున్నది, హిందూమతానికి దగ్గరయి, తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటానికి. ఈనాటి మన సినిమాల్లో చూపిస్తున్నట్టు, పరమత సహనంతో కాదు. అలాగే సంస్కృత భూయిష్టమైన హిందీ భాషలో, ఎన్నో పర్షియన్ మాటలు తీసుకువచ్చి, సంస్కృతాన్ని లేకుండా చేసిన భాషా ప్రియుడు. ఇప్పుడు ఇండియాలో రోడ్డు మీద మాట్లాడే జనవారీ హిందీలో, మీకు వినపడేవి ఎన్నో పర్షియన్ పదాలే. మహాభారత్, రామాయణ్ లాటి సీరియల్స్ చూస్తేనే మనకి హిందీలో సంస్కృతం మళ్ళీ వినిపిస్తుంది.

అలాటి అక్బర్ మహారాజు ఏం చేశాడో చూద్దాం.

రాజపుత్ మహారాజు మాన్ సింగ్ (మొదటి మాన్ సింగ్) గురించి మొదలుపెడదాం. అతను అంబర్ రాజ్యానికి రాజు. మొగలాయీలకి తొత్తుగా మారి, వాళ్ళ కాళ్ళు వత్తటం మొదలుపెట్టాడు. దానితో అక్బర్ సంతోషించి అతన్ని తన సభలో నవరత్నాలలో ఒకడిగా గుర్తించాడు. అంతేకాదు, అంతటి రాజుగారినీ కాళ్ళ క్రింద తొక్కిపెట్టి, తనకి సైనికాధికారిగా చేసుకున్నాడు. మాన్ సింగుకి జోధాబాయి అత్త అవుతుంది.

మాన్ సింగుని, రాణా ప్రతాప్ సింగ్ దగ్గరకి రాయబారం పంపించి ఆ రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని చూశాడు అక్బర్. ‘నేను యుద్ధం చేసి చావటానికయినా సిద్ధమే కానీ, నా భారతదేశాన్ని ఆక్రమించి, విస్తరించాలనుకుంటున్న ఈ మొగలాయీలకి తొత్తుగా మాత్రం మారను’ అన్నాడు ప్రతాప్ సింగ్.

అలాగే చివరి శ్వాస వదిలేవరకూ, పోరాడి యుద్దంలో చనిపోయాడు రాణా ప్రతాప్ సింగ్. అందులో ప్రధాన పాత్ర వహించింది మాన్ సింగ్.

మాన్ సింగ్ తర్వాత, జగత్ సింగ్, మహా సింగ్, జై సింగ్ 1, తర్వాత కొంత కాలానికి జైసింగ్ 2.. ఇలాటి రాజపుత్ తొత్తుల కాలచక్రం ఇక్కడ తిరుగుతుంటే, అక్కడ అక్బర్ తర్వాత షాజహాన్, ఔరంగజేబ్.. అలా నడిచింది మొగలాయీల దురాక్రమణ.

మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఏడుసార్లు మొగలాయీల మీదకు దండయాత్రకు వచ్చినా, తమ బలగాల సహాయం మొగలాయీలకి పూర్తిగా ఇచ్చి, శివాజీని ఏడుసార్లూ ఓడించిన ఘనత కూడా ఈ తొత్తు రాజులదే!

ఈనాటి జైపూర్ రెండవ జైసింగ్ (సవాయ్ జై సింగ్) 1727లో స్థాపించాడని అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో వుంది. ప్రస్తుత జనాభా ఆరున్నర లక్షలు. దీనికి పింక్ సిటీ అనే పేరు కూడా వుంది.

లెక్ఖలు, నక్షత్ర శాస్త్రం, జ్యోతిష్యం మీద సరదా, నమ్మకం వున్న జైసింగ్, బెంగాల్ నించీ విద్యాధర్ భట్టాచార్య అనే వాస్తుశిల్పిని పిలిపించి, ఈనాడు మనం చూస్తున్న ఎన్నో రాజకోటలని, భవనాల్ని నిర్మించాడు. ఇక మిగతా చరిత్ర వెండి తెరమీద, బుల్లి తెరమీద కాకుండా, మంచి పుస్తకాల్లో చదువుకోండి.

ఇహ ఈనాటి జైపూర్ గురించి చూద్దాం.

ఇక్కడ చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నేను ఇంజనీరుని కనుక, జంతర్ మంతర్. ఇక్కడ ఎన్నో నక్షత్ర శాస్త్ర ప్రాతిపదిక ఆధారంగా కట్టిన యంత్రాలు వున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క విషయాన్ని చూపిస్తుంది. ఒకటి సమయాన్ని చూపిస్తే, ఇంకొకటి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చూపిస్తుంది. ఇంకొకటి రకరాల గ్రహాలు మనం చూస్తున్న ఆ సమయంలో ఎక్కడెక్కడ వున్నాయో చూపిస్తుంది. ఇలా ఎన్నో వున్నాయి. వాటిల్లో అన్నిటిలోకి స్పష్టంగా కనపడేలా నుంచునేది, 90 అడుగుల ఎత్తుగల సామ్రాట్ యంత్ర అనే సూర్య గ్రహ సూచిక. ఇక్కడ ఇంకా చక్ర యంత్ర, దక్షిణ భిట్టి యంత్ర, రామ యంత్ర, దిశ యంత్ర, ధ్రువ దర్శక్ యంత్ర, రాశి వలయ యంత్ర, కపాల యంత్ర….  ఇలా ఎన్నో వున్నాయి.

 

jantar1

 

తర్వాత చూడతగ్గది సిటీ పాలస్. అంతా గులాబీ రంగుతో కట్టబడినది. ఇదే కాదు, ఈ పాలస్ బయట వున్న రోడ్లూ, భవనాలూ, షాపులూ అన్నీ గులాబీ రంగువే. రాజుగారు ఎంత ధనికులో చూపించేదే ఈ పాలస్. ఎంతో పెద్ద భవనాలూ, చుట్టుతా సరోవరాలు, ఉద్యాన వనాలూ. అద్దాలు పొదిగిన నెమలి ద్వారం. ఒక పక్క రాజస్థానీ అలంకారాలు, ఇంకో పక్క మొగలాయీల అలంకారాలు. ఇక్కడే మ్యూసియం, చిత్రకళా క్షేత్రం కూడా వున్నాయి.

 

నాకు అన్నిటిలోకి బాగా నచ్చింది హవా మహల్. 1799లో కట్టిన ఈ భవనం, రాణీవాసపు స్త్రీలు బయట వారికి కనిపించకుండా, అక్కడ కూర్చుని షాపులూ, రోడ్ల మీద వెళ్ళేవారిని చూడటానికి కట్టారుట. అది వేడి ప్రదేశం కనుక, గాలి చక్కగా వేచే విధంగా ఎన్నో కిటికీలు కట్టి, దానికా పేరు పెట్టారు. క్రింది ఫోటో చూడండి.

అంబర్ కోట, పాలస్ కూడా చాల బాగుంటుంది. అక్కడే గుర్రాల మీద, ఒంటెల మీద సవారీ కూడా చేయవచ్చు.

 

fort1

అలాగే ఇంకా జైఘర్ కోట, నహర్ ఘర్ కోట, కోతుల గుడి (ఈ కోతుల గుడిలో వున్న సరోవరం దగ్గర కొన్ని వేల కోతులు వుంటాయిట), జల్ మహల్, రాంబాగ్ పాలస్…  ఇలా ఎన్నో వున్నాయి.

ఓపిగ్గా చూడాలే కానీ, రాజుగారు తలుచుకుంటే.. భవనాలకీ, కట్టడాలకీ కొదువా?

౦                 ౦                 ౦

మదాలస

 

శ్రీధరుడు:  కొత్త విటుడు

మదాలస: ఒక వేశ్య

 

శ్రీధ:    మదాలసా, మనకాపక్క ఇంట్లో మంగళవాద్యాలు, ఈపక్క ఇంట్లో శోకాలూ, శాపనార్ధాలూ వినిపిస్తున్నాయి. ఏమిటి సంగతి?

మదా: ముందు ఏ యింటి ముచ్చట చెప్పమంటారు?

శ్రీధ:    చెడ్డ కబురు ముందు చెప్పు. తర్వాత మంగళకరమైన విషయం మరింత శోభిస్తుంది.

మదా: ఐతే వినండి. మనకాపక్క ఇంట్లో ఉండే కామసాని వొట్టి మోసగత్తె, ఆశబోతూను. దాని కూతురు పుష్పసాని చక్కని చుక్క. పుష్పసానిని ఉంచిన విటుడు దానినొదిలి ఒక్క రాత్రి కూడా ఉండలేడు.

శ్రీధ:    నిన్నొదిలి నేనుండలేనట్లు.

మదా: మన్మథుడి దయ ఎప్పటికీ అట్లాగే ఉండాలి. సరే, కథలోకి వస్తే, రాత్రి ఒక తమిళ బ్రాహ్మడు సుఖం కోరి కామసాని ఇంటి తలుపు తట్టాడట. అతడు బాగా ధనవంతుడట. వేశ్య చక్కని దైతే కోరినంత రోవట్టు (శుల్కం) చెల్లిస్తానన్నాడట. కామసానికి ఆశ పుట్టింది. పుష్పసానిని ఎరగా చూపి అతని దగ్గర బాగా ధనం గుంజిందట. తీరా పక్కలోకి పంపాల్సి వచ్చేసరికి గదిలో దీపం లేకుండా చేసి ఇంట్లోని పనిమనిషిని అతని శయ్యకు తార్చిందట.

శ్రీధ:    ఎంత మోసం?

మదా: ఔను! పొద్దున్నే జరిగిన మోసాన్ని గ్రహించి ఆ పరదేశి తలవరులకు ఫిర్యాదు చేశాడట. వాళ్ళు కామసానిని పిలిపిస్తే వెళ్ళి నానా రభసా చేసిందట. నా కూతురు సాక్షాత్తూ ప్రతాపరుద్ర మహారాజు వచ్చినా లక్ష్యం చెయ్యదు, ఈ తమిళ బ్రాహ్మడికా కొంగు పరిచేది అని వీరంగం వేసిందట. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు తలలు పట్టుకు కూర్చుంటే ఆ సమయానికి అక్కడే ఉన్న గోవింద మంచనశర్మ గారు తీర్పు చేశారట.

శ్రీధ:    ఆయనెవరు?

మదా: ఆయన కాసల్నాటి శాఖీయులు. పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తిని వేశ్యావాటికలో ధార బోస్తున్న మహానుభావులు. జారధర్మములు చక్కగా అనుష్టించిన విట శ్రేష్ఠుడు.

శ్రీధ:    ఓహో…. ఏమి తీర్పు చేశారాయన?

మదా: వేశ్యల తల్లులు చేసే ఇలాంటి నేరాలకు నాలుగు రకాల శిక్షలు చెప్పారాయన. ముక్కు దూలం దాకా తెగ్గోయడమొకటి, పళ్ళు మొత్తం రాలగొట్టడమొకటి, గూబలదాకా చెవులు రెండూ కోయడమొకటి, నున్నగా తల గొరిగించడమొకటి.

శ్రీధ:    ఈ ముసల్దానికి ఏమి శిక్ష వేశారు?

మదా: తలగొరిగించి వదిలేశారు. ముక్కో చెవులో కోస్తే తీరిపోయేది.

శ్రీధ:    పోన్లే పాపం.

మదా: పాపం తలచకూడదు దాన్ని. దొంగముండ. కులం పరువు తీసింది.

శ్రీధ:    సరి సరి. మరి ఇటువైపు శుభకార్యం మాటేమిటి?

మదా: కామమంజరి కూతురు మదనరేఖకు ఈ రోజు ముకురవీక్షా మహోత్సవం జరుగుతోంది.

శ్రీధ:    ఇలాంటి ఉత్సవం గురించి నేనెప్పుడూ వినలేదు. ఏమిటది?

మదా: ఇది వేశ్యాకులం మాత్రమే జరుపుకొనే ఉత్సవం. ఈడేరిన పిల్లకు అద్దం చూపి ‘మన్మధవేధ దీక్ష’ ఇస్తారు. అద్దం మా సానివారికి శ్రీ మహాలక్ష్మితో సమానం. ఈ తంతు జరగనిదే ఆ పిల్లకు విటుడితో కలిసే అధికారం ఉండదు.

శ్రీధ:    ఓహో! సోమయాజులు ఆరణి సంగ్రహించిన తర్వాతే యజ్ఞం చేస్తారు. అలాగే మీరు అద్దం చూసిన తర్వాతే వృత్తిలోకి ప్రారంభిస్తారన్నమాట. ఇంతకూ ఈ తంతు ఎలా నిర్వహిస్తారు?

మదా: ఒక మంచి రోజు చూసి ముకుర వీక్షణానికి ముహూర్తం నిర్ణయిస్తారు. బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు. పిల్ల తండ్రిని రావించి పిల్లకు చెవిలో మంత్రం చెప్పిస్తారు. తండ్రి తన తొడపై పిల్లను కూర్చోబెట్టుకొని అద్దం చూపుతాడు. పిల్లకు దీవెనలతో పాటు కానుక లిస్తాడు. దాంతో క్రతువు ముగుస్తుంది. ఇక కొత్త సాని కోసం ఎదురు చూసే విటుల పంట పండుతుంది.

శ్రీధ:    బాగుంది. ఇంతకూ మదనరేఖ పేరుకు తగ్గదేనా?

మదా: కొత్త రుచుల పైకి మనసు పోతున్నట్టుంది.

శ్రీధ:    అబ్బే అదేం లేదు. ఊరికే కుతూహలం కొద్దీ అడిగాను. అంతలోకే అలకా? అన్నట్టు బంగారు గొలుసు కావాలన్నావు కదూ! సాయంత్రం విపణివీథికి వెళ్ళొద్దాం. సిద్ధంగా ఉండు.

*

గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం!

 

TV-99 ఛానెల్ ’99-అడ్డా’ కార్యక్రమం కోసం ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ సాటి కథకుడు అనిల్ ఎస్. రాయల్ తో జరిపిన చర్చాగోష్టి పూర్తి పాఠం. ఈ ఇంటర్వ్యూ ప్రచురించటానికి ‘సారంగ’ని అనుమతించిన వేంపల్లె షరీఫ్ కు ధన్యవాదాలు.

జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలి. మరి సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఏం కావాలి? మాత్రం బోర్ కొట్టకుండా సైన్స్ ఫిక్షన్లో సస్పెన్స్ నింపి రాయటం అనిల్ ఎస్. రాయల్కి వెన్నతో పెట్టిన విద్య.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? మీరు ఆ తరహా కథలే రాయటానికి కారణమేంటి?

అనిల్: సైన్స్ ఫిక్షన్ అంటే – తేలికపాటి మాటల్లో చెప్పాలంటే – శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, దానికి కాస్త కల్పన జోడించి రాసే కథ.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ రాయటానికి, ఇతర కథలు రాయటానికి తేడా చెప్పండి.

అనిల్: ఇందాక మీరన్నారు – జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలని. సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఆలోచన కావాలి; ఒక ఐడియా కావాలి. ఎక్కువగా ఆలోచన – ‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన.

షరీఫ్: ఆ ఐడియాకి ఒక లాజిక్ కూడా కావాలా?

అనిల్: కచ్చితంగా కావాలి. ఆ ఐడియాకి ఒక శాస్త్రీయమైన పునాది కూడా కావాలి. అభూత కల్పనలు చేసి ఏదేదో రాసేసి అది సైన్స్ ఫిక్షన్ అనలేం.

షరీఫ్: మీ నేపధ్యం ఏమిటి? ఈ పునాదులు ఎక్కడినుండొచ్చాయి? అసలు సైన్స్ ఫిక్షనే ఎందుకు రాస్తున్నారు?

అనిల్: కంప్యూటర్ సైన్స్‌లో బాచిలర్స్, గణితంలో ఎం.ఫిల్; మొత్తమ్మీద సైన్స్ నేపధ్యం బాగా ఉంది. చరిత్ర అంటే కూడా చాలా ఆసక్తి. నాకు బాగా తెలిసినవి ఇవి. పెద్దగా జీవితం తెలీదు. అందువల్ల కథలు రాయాలనుకున్నప్పుడు సహజంగానే సైన్స్ ఫిక్షన్ ఎంచుకున్నాను.

షరీఫ్: తెలుగులో ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని గమనించినట్లైతే – అస్తిత్వ వాదాలొచ్చేశాయి. అలాగే, తాత్విక దృష్టితో తార్కికమైన అంశాలు తీసుకుని విరివిగా కథలు రాయటం కనిపిస్తూంది. వాటి ప్రభావం లేకుండా నాకంటూ ఓ ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలి, సైన్స్ ఫిక్షన్ అనే దారిలో ప్రయాణం చేయాలి అని ఎందుకనిపించింది?

అనిల్: నా మొదటి కథ ‘నాగరికథ’ రాసినప్పుడు ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలనేమీ అనుకోలేదు. అప్పట్లో ఇలా ఈ సైన్స్ ఫిక్షన్ జెండా పట్టుకుని పరుగెత్తాలనే ఆలోచనే లేదు. ఆ మొదటి కథ రాయటమే అనుకోకుండా జరిగింది. నాకు వర్తమాన కథల్లో వెరైటీ కనబడలేదు. ఇప్పుడు మీరన్నారు కదా – తాత్వికం అంటూ. లిటరరీ ఫిక్షన్ అంటారు దాన్ని. మనస్తత్వాల విశ్లేషణ గూర్చిన కథలు, ఎక్కువగా. అవి తప్పని కాదు. అవి కావాలి. వాటిని గొప్పగా రాసేవాళ్లు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అవి మరీ ఎక్కువైపోయాయి. వీటిలో భావోద్వేగాలకే పెద్దపీట. క్రైమ్, హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, హిస్టారిక్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ …. ఇటువంటివి – అంటే ప్లాట్ డ్రివెన్ కథలు – దాదాపు కనుమరుగైపోయాయి. నాకివి చదవాలని కోరిక. కానీ అవెక్కడా కనబడటం లేదు. నా స్నేహితులతో ఈ ‘బాధ’ వెళ్లబోసుకునేవాడిని (నవ్వు). వాళ్లు “ఎవర్నో అనేబదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా,” అన్నారు. నేను రాయగలుగుతానో లేదో తెలీదు. ఐనా, “సరే రాద్దాం పద,” అనుకుని, “ఏం రాయాలి,” అని ఆలోచిస్తే, నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్స్ సైన్స్, చరిత్ర – అవి రెండూ కలిపేసి రాసేద్దాం అనిపించింది. అలా ‘నాగరికథ’ రాశాను. ఆ విధంగా మొదలైంది నా ప్రయాణం.

షరీఫ్: మీరు టైమ్ ట్రావెల్ నేపధ్యంలో ఎక్కువ కథలు రాశారు. టైమ్ ట్రావెల్ లేని వాటిలో కూడా ఏదో ఓ రూపంలో కాలం ప్రస్తావన వస్తూంటుంది. కాలంతో ఆ యుద్ధం ఎందుకు మీకు?

అనిల్: అదొక సరదా. కాలంలో వెనక్కి వెళ్లటం సాధ్యమైతే ఎలా ఉంటుందనే ఊహ అద్భుతంగా ఉంటుంది. అది సాధ్యమో కాదో అవతల పెట్టండి. అలా జరిగితే చాలా పారడాక్సెస్ పుట్టుకొస్తాయి. తిరకాసులన్న మాట. ఈ తిరకాసుల్లో చాలా రకాలున్నాయి. వీటిని వాడుకుని కథ రాయటం అనేది నాకో సరదా. అంతే.

షరీఫ్: ఒకవేళ మీకే ఓ టైమ్ మెషీన్ లభించి, మీరు మళ్లీ బాల్యంలోకి వెళ్లగలిగితే ‘ఇలా చెయ్యాలి’ అనే ఆలోచనలేమన్నా ఉన్నాయా? లేదా ఓ యాభై సంవత్సరాలు ముందుకి – భవిష్యత్తులోకి – వెళ్లగలితే ఏం చెయ్యాలి అనుకుంటారు?

అనిల్: అలాంటి ఆలోచనెప్పుడూ చెయ్యలేదు. టైమ్ ట్రావెల్ అనేది నిజంగా జరిగేది కాదని నాకు తెలుసు (నవ్వు). నేనెప్పుడూ వర్తమానంలో బ్రతుకుతాను. జీవితం విషయంలో నాకు పెద్దగా ప్లానింగ్ అంటూ లేదు. కథా రచయితనవటం కూడా కాకతాళీయంగానే జరిగింది. ‘నాగరికథ’ రాసినప్పుడు భవిష్యత్తులో మరికొన్ని కథలు రాస్తాననుకోలేదు. ఏదో పంతానికి పోయి ఆ ఒక్కటి రాశాను. ఆ తర్వాత ఇక చాలు అనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత చూస్తే మరి కొన్ని కథలున్నాయి నా ఖాతాలో. ఏదో ఆశించటం, దాన్ని సాధించలేదనో, అది దక్కలేదనో బాధ పడటం ఇవన్నీ ఉండవు నాకు. అలాగని నేనేమీ జీవితాన్ని ఆషామాషీగా తీసుకోను. ప్రస్తుతం చేసే పని మీద ఎనలేని శ్రద్ధ పెడతాను – ఫలితంతో సంబంధం లేకుండా. అలా చేస్తే కొన్నిసార్లు అపజయాలు పలకరించినా, ఎక్కువగా విజయమే లభిస్తుందని నమ్ముతాను.

షరీఫ్: అంటే, మీరో ప్రాక్టికల్ మనిషి అంటారు. మరి కథలు మాత్రం ఎందుకలా రాస్తున్నారు? సాధ్యం కాని విషయాలని జనాలకు చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటి?

అనిల్: చెప్పాను కదా, అదో సరదా. అయితే, అవన్నీ సాధ్యం కాని అంశాల చుట్టూతానే తిరగవు. టైమ్ ట్రావెల్ అనేది నా కథల్లో ఓ చిన్న అంశం మాత్రమే. అసలు కథ వేరే ఉంటుంది వాటన్నిట్లోనూ. నా ‘రీబూట్’ కథే ఉంది. అందులోనూ టైమ్ ట్రావెల్ ప్రస్తావనుంటుంది. అయితే దానిపై పెద్ద చర్చేమీ ఉండదు. ఈ తిరకాసులూ అవీ ఉండవు. తోకచుక్కలో, గ్రహ శకలాలో వచ్చి గుద్దుకుంటే భూమండలం నాశనమైపోతుందకుంటారు సాధారణంగా. కానీ అసలు ప్రమాదం ఈ భూమ్మీదనే పొంచి ఉంది. అదేంటనేది ఆ కథలో నేను చెప్పిన విషయం. దానికి టైమ్ ట్రావెల్ అనేది కొంచెం వాడుకున్నాను. అంతే తప్ప అందులో టైమ్ ట్రావెల్ అనేది అసలు విషయం కాదు.

anil2

షరీఫ్: కథకి ఓ ప్రయోజనం ఉండాలి అంటారు. మరి సైన్స్ ఫిక్షన్ కథలకి ఎటువంటి ప్రయోజనం ఉంది?

అనిల్: అస్తిత్వవాదాలు తీసుకున్నామనుకోండి. అవి కొన్ని వర్గాలకి పరిమితమవుతాయి. వద్దన్నా వివాదాలు, కొట్లాటలు, ఒకర్నొకరు చీల్చి చెండాడుకోవటాలు …. ఇవన్నీ వచ్చిపడతాయి. సైన్స్ ఫిక్షన్‌తో ఆ సమస్య లేదు. చదివిన వాళ్లు చదువుతారు, లేనివాళ్లు లేదు. అంతేతప్ప అనవసరమైన కొట్లాటలుండవు. అదో ప్రయోజనం (నవ్వు).

షరీఫ్: మీరు రాస్తున్న కథల్లో సామాజిక ప్రయోజనం ఏ మేరకు ఉందని భావిస్తున్నారు?

అనిల్: నా కథల్లో నేను అణగారిన వర్గాల గురించో, మరో వర్గం గురించో మాట్లాడను. అంత మాత్రాన వాటివల్ల సామాజిక ప్రయోజనం లేదనకూడదు. ఉదాహరణకి, ‘నాగరికథ’ చదివి ఓ పిల్లవాడు “ఓహ్. ఇలా కూడా చేయొచ్చా! ఇలా కూడా ఆలోచించొచ్చా!” అనుకోవచ్చు. డార్క్ మ్యాటర్, సింగ్యులారిటీ, సూపర్‌నోవా, క్వాంటం మెకానిక్స్ …. ఇలాంటివన్నీ కథ పరిధిలో వివరిస్తుంటాను నేను. నిన్నటిదాకా ఫిజిక్స్ చాలా బోరింగ్‌గా ఉందనుకున్న పిల్లలు ఇది చదివాక చాలా ఆసక్తికరంగా ఉందనుకోవచ్చు. “ఇదేదో ఆసక్తికరంగా ఉంది. దీని గురించి మరికొంత నేర్చుకుందాం,” అనుకోవచ్చు. సైన్స్ మీద వాళ్లకి ఆసక్తి పెరగొచ్చు. అది కూడా సామాజిక ప్రయోజనమే. నిజానికి, సమాజానికి లిటరరీ ఫిక్షన్ కన్నా సైన్స్ ఫిక్షన్ వల్ల కలిగే ప్రయోజనమే ఎక్కువని నేను భావిస్తాను. ఇవి ఏ ఒక్క వర్గానికో పరిమితమైన కథలు కావు. ప్రపంచం ముందుకు పోవటానికి ప్రధాన కారణం సాంకేతిక ప్రగతి. ఉద్యమాల ద్వారా కన్నా కూడా సాంకేతిక పురోభివృద్ధి ద్వారానే ఎక్కువ సమానత్వం సిద్ధిస్తుంది. మన సమాజంలో ఒకప్పుడు అణచివేయబడ్డ స్త్రీలు ఈ నాడు చాలా రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారంటే దానిక్కారణం సాంకేతికాభివృద్ధి వల్ల పుట్టుకొచ్చిన అపారమైన అవకాశాలే. ఆ విషయంలో స్త్రీవాద ఉద్యమాలు, ఇతర చోదక శక్తుల పాత్ర లేదని కాదు కానీ, అది పరిమితం. ఇది ఇతర వర్గాలకీ వర్తిస్తుంది. అంత ముఖ్యమైన సాంకేతిక పురోగతికి బీజాలు సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఉన్నాయి. ఇంటర్‌నెట్, శాటిలైట్లు, సెల్ ఫోనులు, క్రెడిట్ కార్డులు, అవయవ మార్పిడి, అణు శక్తి – ఇవన్నీ సైన్స్ ఫిక్షన్లో పురుడుపోసుకున్న ఆలోచనలే. వాటి ప్రమేయం, ప్రభావం లేని ప్రపంచాన్ని ఓసారి ఊహించుకోండి, సైన్స్ ఫిక్షన్ ప్రయోజనమేంటో అర్ధమవుతుంది.

షరీఫ్: మీ కథల ప్రేరణతో ఎవరైనా ఓ సైంటిస్ట్‌గా మారాలని కానీ, ఓ వస్తువు కనిపెట్టాలని కానీ అనుకున్న సందర్భం ఉందా? ఎవరైనా అలా ఇన్‌స్పైర్ అయినట్లు తెలుసా?

అనిల్: నేను అంత గొప్ప కథలు రాశానని అనుకోను. సైన్స్ ఫిక్షన్ రచయితల్లో మహామహులున్నారు. వాళ్ల స్థాయి కథలు నేను రాయలేదింకా.

షరీఫ్: ఎన్ని కథలు రాశారు ఇప్పటిదాకా?

అనిల్: పది కథలు. వాటిలో ఒకటి అనువాద కథ. మిగతా తొమ్మిది నా సొంతవి. వాటిలో ఎనిమిది సైన్స్ ఫిక్షన్. మిగిలిన ఒక్కటీ సైన్స్ ఫిక్షన్ కాదు.

షరీఫ్: ఇందాక ‘వివాదాలు, కొట్లాటలు’ అన్నారు. వివాదాలకి చోటిచ్చేవన్నీ తక్కువ స్థాయి రచనలు, తక్కినవన్నీ గొప్పవి అంటారా?

అనిల్: అలా ఏం లేదు. ఓ కథ గొప్పదా కాదా అనేది అందులో ఉన్న సరుకుని బట్టి నిర్ధారించబడుతుంది కానీ, దాని చుట్టూ జరిగే గొడవలని బట్టి కాదు. ఇందాక నేనన్నట్లు, సైన్స్ ఫిక్షన్ కథలు చదివితే చదువుతారు లేకుంటే లేదు. అంతే తప్ప వాటి గురించి వివాదాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇది నా మనస్తత్వానికి సరిపడే విషయం. ప్రశాంతంగా నా కథలేవో నేను రాసుకోవచ్చు, మిగతా గొడవల్లో ఇరుక్కోకుండా. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు, ఆ ‘వివాదాలు, కొట్లాటలు’ వ్యాఖ్య వెనక.

షరీఫ్: ఒకవేళ సైన్స్ ఫిక్షన్ కి ఆ పరిస్థితొస్తే, మీరు ఆ తరహా కథలు రాయటం మానేస్తారా?

అనిల్: అందాకా వస్తే చూద్దాం. వస్తుందని మాత్రం నేను అనుకోను.

షరీఫ్: అసలు ఏ కథకైనా ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? వివాదాలు ఎందుకు మొదలవుతాయి?

అనిల్: సమీక్షకులు, విమర్శకులు తమ కథలపై వ్యక్తం చేసే అభిప్రాయాలు రచయితలకి నచ్చకపోవటం దగ్గర గొడవ మొదలవుతుంది. రచయిత సంయమనం వహిస్తే అది వెంటనే సద్దుమణుగుతుంది. లేకుంటే పెద్దదవుతుంది. ఎక్కువగా రెండోదే జరుగుతుంది.

షరీఫ్: మీ దృష్టిలో కథని సమీక్షించటానికి, విమర్శించటానికి తేడా ఏమిటి?

అనిల్: సమీక్ష అంటే కథని పాఠకులకి పరిచయం చేసే సాధనం. సమీక్షకుడు కథని మరీ లోతుగా విశ్లేషించడు. అది విమర్శకుడి పని. అంతే తేడా. సమీక్ష అనేది ఓ రకంగా సేల్స్ పిచ్. విమర్శ అంటే కథని అధ్యయనం చేయటం. అయితే ఈ మధ్య ఈ రెండింటి మధ్య తేడా చెరిగిపోతూంది. రెండూ కలగలిసిపోతున్నాయి.

షరీఫ్: నేటి విమర్శకులపై మీ అభిప్రాయం?

అనిల్: విమర్శకులు స్వేఛ్చగా తమ పని చేసే పరిస్థితి ప్రస్తుతం ఉందనిపించటం లేదు. ఈ మధ్యనో ధోరణి గమనించాను. కొన్ని వర్గాలని ఉద్దేశించి రాసే కథలు బాగోలేవన్నవారిపై విరుచుకుపడటం జరుగుతోంది. ఓ స్త్రీవాద కథ బాగోలేదంటే అతన్ని పురుషాహంకారి అనటం, మరో వాద కథ బాగోలేదంటే ఆ వాదానికి వ్యతిరేకిగా ముద్రవేయటం జరుగుతోంది. విమర్శ అనేది కథలో ఉన్న సరుకుని బట్టి కాకుండా రచయిత నేపధ్యాన్ని బట్టి చేయాల్సొస్తున్న విచిత్ర పరిస్థితినీ గమనించాను. కుత్సితంగా విమర్శలు చేసేవాళ్లు ఉండరని కాదు. కథలో అసలు విషయం వదిలేసి దాని చుట్టూ ఉన్న విషయాలు పట్టుకొచ్చి విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్లని పట్టించుకోనవసరం లేదు. నేను చెప్పేది నిజమైన విమర్శకుల గురించి. వాళ్ల చేతులు కట్టేయబడి ఉన్నాయి ప్రస్తుతం. లిటరరీ ఫిక్షన్, ముఖ్యంగా అస్తిత్వవాద కథలకి సంబంధించిన సమస్య ఇది. సైన్స్ ఫిక్షన్‌కి అదృష్టవశాత్తూ ఈ పరిస్థితి లేదు. అక్కడ వచ్చే కథలు వేళ్ల మీద లెక్కించేన్ని మాత్రం కావటం వల్లనో, ఆ రకం కథలపై సాధికారికమైన విమర్శలు చేయగలిగేవారు దాదాపు లేకపోవటం వల్లనో, అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది (నవ్వు).

షరీఫ్: ‘నాగరికథ’ చదివాక ఓ వ్యక్తి ఫోన్ చేసి “ఇది నిజంగా జరిగేది కాదు. ఇది గొప్ప కథేంటి?” అన్నాడని చెప్పారు. మీ దృష్టిలో గొప్ప కథ అంటే ఏమిటి?

అనిల్: నాకెవరూ ఫోన్ చేసి అలా చెప్పలేదు (నవ్వు). కానీ ఆ మాట విన్నాను. గొప్ప కథ ఏది అంటే …. నా దృష్టిలో చదివించగలిగేది ఏదైనా మంచి కథే, గొప్ప కథే. దాని వల్ల కలిగే సామాజిక ప్రయోజనాలూ అవీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. కథనేది ముందుగా ఆసాంతం ఆసక్తిగా చదివించగలగాలి. ఆ పని చెయ్యలేని కథలో ఎంత గొప్ప సందేశం ఉన్నప్పటికీ అదో గొప్ప కథని నేననుకోను.

షరీఫ్: ‘గొప్ప కథ’ రాయటం ఎలా?

అనిల్: గొప్ప కథలు రాయటానికి గైడ్ బుక్ అంటూ ఏమీ లేదు. ఏ కళారూపానికీ లేదు. గొప్పగా పెయింటింగ్స్ వేయటం ఎలా, గొప్పగా నాట్యం చెయ్యటం ఎలా – ఇలాంటివి ఎవరూ నేర్పలేరు. కాకపోతే ప్రతిదానికీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి కథని శ్రద్ధగా చెక్కాలి. ఏ art form తీసుకున్నా, అదొక craft కూడా. కొందరు ఈ మాట ఒప్పుకోకపోవచ్చు. కళ అంటే కళే. అది క్రాఫ్ట్ కాదు అంటారు వాళ్లు. చెక్కుడూ అదీ ఉంటే ఆర్ట్ కానే కాదు అంటారు. నా దృష్టిలో అవన్నీ fine touches. అవి కూడా ఉండాలి. సానబట్టటం అన్నమాట. సానబట్టటాలు ఉండకూడదు అనే వారిని నేనేమీ అనను, అది వాళ్లిష్టం. నా వరకూ ఓ మంచి కథ గొప్ప కథగా రూపొందాలంటే దాన్ని సాన పట్టాల్సిందే. నిర్మాణ కౌశలం చూపించాల్సిందే. గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం.

షరీఫ్: మీరు ‘కథాయణం’ పేరుతో ఫేస్‌బుక్‌లో పలు వ్యాసాలు రాశారు. పట్టుమని పది కథలైనా రాయని అనిల్ ఎస్. రాయల్ ఏం అర్హత ఉందని కథాయణాలు రాస్తున్నాడు అన్న వ్యాఖ్యలు వచ్చాయి. వాటిపై మీ స్పందన?

అనిల్: అలా అడిగిన వారికి ఏం అర్హత ఉందో, నాకూ అదే అర్హత ఉంది. కథంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వాళ్లకి కోపమొచ్చి ఉంటుంది, “ఇతనెవరు ఇలాంటివి రాసేదానికి” అని. తప్పేమీ లేదు. ఆ ఇష్టంతోనే నేను కూడా అవి రాశాను.

షరీఫ్: ‘కథాయణం’లో మీరు “నేను ముందుగా కథకి ముగింపు రాస్తాను. తర్వాత మిగతా కథ రాస్తాను,” అన్నారు. ఏమిటా టెక్నిక్?

అనిల్: నేను రాసే కథలకి ముగింపు చాలా కీలకం. నా కథలకే కాదు, అసలు ఏ కథకైనా – అది లిటరరీ లేదా genre తరహా ఫిక్షన్ ఏదైనా కానీడి – ముగింపే ముఖ్యం. మిగిలినదంతా పాఠకుడిని ఆ ముగింపువైపుకి తీసుకెళ్లటానికి రచయిత పడే ప్రయాస. ముగింపు అంత కీలకం కాబట్టి, అసలు కథలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది ముగింపులోనే ఉంది కాబట్టి, నేను ముందుగా ముగింపు గురించే ఆలోచిస్తాను. ముందుగా అదే రాస్తాను. కథని ‘అట్నుండి’ నరుక్కొస్తానన్న మాట (నవ్వు).

షరీఫ్: ఒక సందర్భంలో మీ కథని ఎవరో సమీక్షిస్తూ ముగింపు బయటపెడితే మీరు కాస్త ఇబ్బంది పడ్డారు. “సమీక్షకుడు ఎప్పుడూ ముగింపు చెప్పకూడదు” అనే వ్యాఖ్య చేశారు. ముగింపు చెబితే కథ చచ్చిపోతుందా?

అనిల్: కొన్ని కథలు కచ్చితంగా చచ్చిపోతాయి. నా కథలు అన్నీ చచ్చిపోతాయి. నేనిందాక అన్నాను కదా. నా కథలకి ముగింపెంత కీలకమంటే, నేను ముగింపుతోనే కథ రాయటం మొదలు పెట్టి వెనక్కు డెవలప్ చేసుకుంటూ వెళతానని. అంత ముఖ్యమైనది నాకు ముగింపు. అది తెలిసిపోయాక ఇక కథ చదవాలన్న ఆసక్తి ఏముంటుంది? ఇది కామన్ సెన్స్.

షరీఫ్: అంటే, మీ కథల్ని ఒకసారి చదివి ముగింపు తెలుసుకున్నాక మరోసారి చదవలేరు అంటారా?

అనిల్: తెలుగులో ఏడాదికి పదిహేనొందల కథల దాకా వెలువడుతున్నాయి. వాటిలో మంచి కథలు చాలా ఉంటాయి. అవన్నీ ఒక్క సారి చదివే సమయం ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏ కథనైనా మళ్లీ మళ్లీ చదివే తీరుబడి ఎక్కువమందికి ఉంటుందని నేననుకోను. ఏ కొద్దిమందికో అంత తీరిక  ఉండొచ్చు. నేను రాసేది ఆ కొద్దిమంది కోసం మాత్రమే కాదు. రిపీట్ రీడర్‌షిప్ నాకు ముఖ్యం కాదు. నా కథని ఒకే ఒకసారి చదివినా, ఆ కాసేపూ పాఠకుడికి అద్భుతమైన అనుభూతినివ్వాలి. ముగింపు ముందే తెలిసిపోతే నా కథని ఆ ఒక్కసారీ చదవరు. అందుకే సమీక్షకులు ముగింపు బయటపెట్టేయటం పట్ల నా అభ్యంతరం.

షరీఫ్: అనిల్ ఎస్. రాయల్ కథల్ని, “ముగింపు తెలిసిపోతే చచ్చిపోయే కథలు” అనుకోవచ్చా?

అనిల్: అనుకోవచ్చు. ఏం ఫరవాలేదు. నేనేమీ అనుకోను (నవ్వు).

షరీఫ్: మీరు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా తెలుగు కథకి, ఇక్కడి తెలుగు కథకి తేడా ఏమన్నా గమనించారా? గమనిస్తే, అదేమిటి?

అనిల్: ఇతివృత్తాలు, నాణ్యత పరంగా ఇక్కడి కథలే బాగున్నాయనిపిస్తుంది. అమెరికా తెలుగు కథల్లో చాలావరకూ మొనాటనీ కనిపిస్తుంది. నేనక్కడ పదహారేళ్ల నుండి ఉంటున్నాను. నా తరం ఎన్నారై జీవితాల పరిధి చాలా చిన్నది. ఎక్కువగా మనలో మనమే. ఇతర సంస్కృతులతో కలవటం చాలా తక్కువ. మొదటి తరం ఎన్నారైలు ఈ విషయంలో చాలా మెరుగు. అప్పట్లో వాళ్లు అక్కడొకరూ ఇక్కడొకరూ విసిరేసినట్లు ఉండటం వల్ల కావచ్చు, వాళ్లకి చుట్టూ ఉన్న అమెరికన్ సమాజంతో కలవక తప్పని పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు మనవాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటం వల్ల వాళ్లుండే ప్రాంతాలు మినీ విజయవాడ, మినీ హైదరాబాద్ …. ఇలా తయారయ్యాయి. వాళ్లంతా చుట్టూ గిరిగీసుకుని ఆ పరిధిలోనే ఉంటున్నారు.  అమెరికన్ సమాజాన్నుండి ఐసొలేటెడ్ బ్రతుకులు. చుట్టూ ఉన్న పరిస్థితులపై, సమాజంపై superficial knowledge మాత్రమే తప్ప పెద్దగా అవగాహన లేదు. దాంతో ఎక్కువమంది ఎన్నారై రచయితల ఇతివృత్తాల్లో ప్రవాసం మొదట్లో కలిగే కల్చర్ షాక్, ఇళ్లలో జరిగే రోజువారీ సంఘటనలు, భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలు, ఇలాంటివే తప్ప పెద్ద లోతు కనిపించటం లేదు. అక్కడినుండి అరుదుగా మాత్రమే మంచికథలొస్తున్నాయి.

షరీఫ్: ఈ మధ్య తానా సభలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. మీరు అమెరికాలో ఉంటూ కూడా వాటికి వెళ్లకపోవటానికి కారణమేంటి?

అనిల్: నేను తానా సభలకి కానీ, వేరే సభలకి కానీ ఎప్పుడూ వెళ్లలేదు. నాకు ఎటువంటి అసోసియేషన్స్‌లోనూ సభ్యత్వం లేదు.

షరీఫ్: ఎందుకని?

అనిల్: ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఏదన్నా ఆసక్తికరమైన కార్యక్రమం జరిగితే ఎప్పుడన్నా టికెట్ కొనుక్కుని వెళతాను. అంతే తప్ప మెంబర్‌షిప్స్ లాంటివేమీ లేవు. ఎందులోనైనా సభ్యత్వం ఉంటే చాలా కమిట్‌మెంట్ అవసరం పడుతుంది. వాళ్లకి ప్రతివారం ఏదో ఓ కార్యక్రమం ఉంటుంది. అవి చాలా hectic గా ఉండే పనులు. వారాంతాల్లో వాటితో చాలా హడావిడిగా ఉంటుంది. నాకంత తీరిక ఉండదు. నాకు దొరికే ఖాళీ సమయాన్ని నా కుటుంబంతో గడపటానికే ఇష్టపడతాను.

షరీఫ్: మీ కుటుంబం గురించి చెప్పండి.

అనిల్: నేను పుట్టింది గుంటూరు జిల్లా మాచర్ల. (పిడికిలి బిగించి) పల్నాడు …. బ్రహ్మనాయుడు (నవ్వు). మా తల్లిదండ్రులు నరసరావు పేట ప్రాంతం నుండొచ్చి మాచర్లలో స్థిరపడ్డారు. నా స్వస్థలం అదే కానీ నేను చదువుకున్నదంతా బయట. రెంటచింతల, విజయవాడ, మద్రాసు …. ఇలాంటిచోట్ల చదివాను. మా ఊరితో పెద్దగా అనుబంధం లేదు. పెద్దగా స్నేహితులూ లేరక్కడ. మద్రాస్ లయోలా కాలేజ్‌లో ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికా వెళ్లిపోయాను. నా ఉద్యోగ జీవితం అమెరికాలోనే మొదలైంది. అదే అసలైన జీవితం కూడా. నా భార్య పేరు చైతన్య. మాకో పాప, పేరు మనస్వి. హ్యాపీ ఫామిలీ.

షరీఫ్: సాహిత్య నేపధ్యం ఎక్కడా తగల్లేదు, మీరు చెప్పినదాంట్లో.

అనిల్: అవును. మా ఇళ్లలో కళాకారులెవరూ లేరు. కళాపోషకులు మాత్రం ఉండేవారు. మేనమామలు, ముఖ్యంగా. వాళ్ల పోషణకి ఆస్తులు అర్పణమైపోయాయి (నవ్వు). మా అమ్మకీ కళల్లో ఆసక్తి ఉంది, స్వయంగా ప్రవేశం లేకపోయినా. శాస్త్రీయ సంగీతం, నృత్యం, వగైరా. తన చిన్నతనంలో మా తాతగారింట్లో ఘోషా పద్ధతుండేది. ఇళ్లలో ఆడవారిని బయటికి పంపేవారు కాదు. అలా ఆమె చదువు ఏడో తరగతితోనే ఆగిపోయింది. కానీ ఆమెకి చదవటమ్మీద ఆసక్తి పోలేదు. కనిపించినవన్నీ విపరీతంగా చదివింది. ఆ ఆసక్తే నాకూ వచ్చింది. ఇక మా నాన్నకి చరిత్ర మీద చాలా ఆసక్తి. చరిత్రలో ఎప్పుడేం జరిగిందో తేదీలతో సహా ఆయనకి గుర్తుండేంది. హిస్టరీ మీద ఆసక్తనేది నాకు ఆయన దగ్గరనుండొచ్చింది.

షరీఫ్: తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావటం లేదు కాబట్టి, వాటిలో కూడా వేలు పెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? (నవ్వు)

అనిల్: (నవ్వు) సినిమాలు తీసే ఆలోచన నాకేమీ లేదు.

షరీఫ్: పోనీ కథలందిస్తారా, అలాంటి వాటికి?

అనిల్: ఎవరడుగుతారు నన్ను? అడిగితే ఇస్తాను, పోయేదేముంది (నవ్వు).  సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయాలంటే తెలుగు నిర్మాతలకి భయమనుకుంటా. అప్పుడెప్పుడో నా ఫేవరెట్ టైమ్ ట్రావెల్ కథాంశంతో ‘ఆదిత్య 369’ వచ్చింది. ఆ తర్వాత మరేవన్నా వచ్చాయో లేదో తెలీదు. బహుశా సైన్స్ ఫిక్షన్ అంటే పెద్ద పెద్ద యుద్ధాలూ అవీ ఉంటాయి, భారీగా ఖర్చవుతుందనేమో మరి. నిజానికి సైన్స్ ఫిక్షన్ కథలకి అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న బడ్జెట్‌లోనూ తీయొచ్చు. కథని బట్టి ఉంటుంది కదా.

షరీఫ్: మీ కథల్లో మీకు ‘నచ్చనిది’ ఏదన్నా ఉందా? ఉంటే, ఏమిటా కథ?

అనిల్: నేనింత వరకూ రాసింది తొమ్మిది కథలే – అనువాద కథ కాక. అవన్నీ నచ్చినవే. నచ్చకపోతే అచ్చుకి పంపను. నేను ఆరేళ్ల నుండి రాస్తున్నాను. ఆరేళ్లలో తొమ్మిదే రాశానంటే, నాకు బాగా నచ్చితేనే అవి బయటికి వెళతాయి. లేకపోతే యాభై కథలు అచ్చేసి ఉండేవాడినిప్పటికి.

షరీఫ్: మీ కథల పుస్తకం ఎప్పుడొస్తుంది?

అనిల్: ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలో విడుదలవుతుంది.

షరీఫ్: ఏం పేరు పెట్టబోతున్నారు? ఎన్ని పేజీలుంటుంది?

అనిల్: పేరు …. ఇంకా ఏమీ అనుకోలేదు. బహుశా నా తొలి కథ ‘నాగరికథ’ పేరే పెడతానేమో పుస్తకానికి. ఇక పేజీలు – పది కథలు కదా, సుమారుగా నూట నలభై ఉండొచ్చు.

[ ఇంటర్వ్యూ రికార్డ్ చేసేనాటికి ఇంకా సన్నాహకాల్లోనే ఉన్న అనిల్ ఎస్. రాయల్ కథల పుస్తకం నాగరికథఆగస్ట్ 5 విడుదల.  దానితో పాటే ఔత్సాహిక రచయితల కోసం అనిల్ రాసిన వ్యాసపరంపర కథాయణంకూడా పుస్తకరూపం తీసుకుంది ]

nagarikatha

kathayanam

షరీఫ్: ఓ సూటి ప్రశ్న. మీరు తక్కువ కథలే రాసినా, ఎక్కువ పేరు రావటానికి కారణం ఏమనుకుంటున్నారు?

అనిల్: ఎక్కువ పేరొచ్చిందనేది మీరు చెబితే కానీ తెలియలేదు. ఎక్కువ పేరుందో, ఎంత పేరుందో, అసలుందో లేదో నేను పట్టించుకోను. నా ధ్యాస కథ రాయటమ్మీదనే. నేను సాహితీ సమావేశాలకి, సభలకీ వాటికీ కూడా వెళ్లను. అందువల్ల నా గురించి ఎవరేం అనుకుంటున్నారనేది నాకు తెలియదు.

షరీఫ్: మీరు కథలు రాయటం మొదలు పెట్టటానికి ముందు బ్లాగుల్లో రాసేవారు. మీరు కథలు రాయటం మొదలు పెట్టాక వచ్చిన స్పందన అంతకు ముందు ఎందుకు రాలేదు, కథలకి మాత్రమే ఈ స్పందన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు?

అనిల్: బ్లాగులు రాసిన కాలంలోనూ స్పందన ఉంది. కాకపోతే వాటి పరిధి చిన్నది. అవి చదివేవాళ్లు తక్కువ. అదీ కాక నేనవి ‘అబ్రకదబ్ర’ అనే మారుపేరుతో రాసేవాడిని. అది నేనే అని చాలామందికి తెలియదు. ఇక, నా కథలు …. అవి విభిన్నంగా ఉండటం వల్ల నచ్చాయని అనుకుంటున్నాను.

షరీఫ్: మీ కథలు వివిధ సంకలనాల్లో రావటం వల్ల వాటికి పేరొచ్చిందని అనుకుంటున్నారా?

అనిల్: సంకలనాల్లో వచ్చే కథలన్నీ గొప్పవని కాదు. వాటిలో రానివన్నీ గొప్పవి కాదనీ కాదు. నేను ఆరేళ్లలో తొమ్మిదికథలు రాస్తే, 2013లో ఒక్క ఏడాదే ఐదు రాశాను. వాటిలో నాకు బాగా నచ్చింది ‘శిక్ష’. అది సైన్స్ ఫిక్షన్ కాదు. ఆ తర్వాత నచ్చింది ‘ప్రళయం’ (ఇది సారంగలో వచ్చింది). ‘రీబూట్’ అనే కథ ఆ ఏడాదిలో నాకు బాగా నచ్చిన నా కథల్లో మూడవ స్థానంలో ఉంది. కానీ ఆ కథ కథాసాహితి వారి సంకలనంలో వచ్చింది. సంకలనకర్తలకి వాళ్ల స్టాండర్డ్స్, కొలతలు ఏవో ఉంటాయి కదా. వాటి ప్రకారం చూస్తే వాళ్లకి ‘రీబూట్’ ఎక్కువ నచ్చిందేమో. సంకలనాలకి ఎంపిక కాకపోయినా ‘ప్రళయం’, ‘శిక్ష’ కూడా పేరు తెచ్చుకున్నవే కదా. కాబట్టి సంకలనాల్లో రావటం అనేదొక అదనపు గౌరవమే తప్ప, కథలో సరుకున్నప్పుడు సంకలనాల ఊతం లేకుండానే గుర్తింపు వస్తుందని నా నమ్మకం.

 

షరీఫ్: మీకు సైన్స్ ఫిక్షన్ కథలంటే చాలా ఇష్టం అన్నారు. మరి సైన్స్ ఫిక్షన్ కాని ‘శిక్ష’ ఎందుకు మీర్రాసిన వాటిలో మీ ఫేవరెట్ అయింది?

అనిల్: నాకెప్పట్నుండో నా సహజశైలిలో ఓ కథ రాయాలనుండేది. పదాలతో ఆడుకోవటం, వెటకరించటం, వాక్యాల్లో వ్యంగ్యం గుప్పించి రాయటం నాకిష్టం. కానీ నేను రాసే సైన్స్ ఫిక్షన్ కథలకి వాటి అవసరం లేకపోయింది. ఇవి చాలావరకూ సీరియస్ టోన్‌తో నడిచే కథలు. వీటికోసం నేను నా సహజ శైలికి చాలా దూరం జరిగి రాయాల్సొస్తుంది. అందువల్ల ఈ సైన్స్ గోల పక్కనబెట్టి ‘శిక్ష’ రాశాను. ఇందులో నేను చెలరేగిపోవచ్చు (నవ్వు). నా ఇష్టమొచ్చినట్లు రాసుకోవచ్చు. చెప్పుకోదగ్గ ప్లాట్ లేకుండా కేవలం కథనంతోనే పాఠకుల్ని ఆకట్టుకున్న కథ ‘శిక్ష’. అందుకే అది నాకు బాగా నచ్చింది.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ నవలేమన్నా రాసే ఆలోచనుందా?

అనిల్: సైన్స్ ఫిక్షన్ నవల అనే కాదు, ఏ నవలైనా ఇప్పుడు చదివేవాళ్లు ఎక్కువగా ఉన్నారని నేననుకోను. టెక్నాలజీ కారణంగా పాఠకుల అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోయింది. గంటలో పదిసార్లు ఎస్సెమ్మెస్ మెసేజెస్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ సందేశాలు, లేదా ఫోన్ కాల్స్, ఇ-మెయిల్స్ ఇలాంటివొస్తుంటాయి. వీటన్నింటి మధ్యలో కథలు చదవటం కూడా కష్టమైపోతుంది. అలాంటిది నాలుగొందల పేజీల నవల చదవటం ఇంకా కష్టం. అందువల్ల కష్టపడి నవల రాసీ ఉపయోగం లేదు. నాకా పని చేసే ఆలోచనా లేదు.

షరీఫ్: ఒక కథ రాసేముందు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

అనిల్: ఇందాకన్నట్లు, నేను ముందుగా ముగింపు గురించి ఆలోచిస్తాను. ముగింపులో ఓ బ్రహ్మాండమైన, పాఠకుల బుర్ర తిరిగే రివిలేషన్ కావాలి. అటువంటిది తట్టిన తర్వాత, ఆ రివిలేషన్ జరగాలంటే ఎటువంటి సంఘటనల సమాహారం ఉండాలనేది చూస్తాను. వాటినో క్రమంలో పేర్చిన తర్వాత పాత్రల గురించి ఆలోచిస్తాను. ఇలా చేయటం వల్ల నాకో అడ్వాంటేజ్ ఉంది. నా కథకి తగ్గట్లు పాత్రల్ని మలచుకోవచ్చిక్కడ. అలా కాకుండా ముందుగానే పాత్రని సృష్టించి దానికో వ్యక్తిత్వం ఇచ్చేస్తే అది దాని చిత్తమొచ్చినట్లు ప్రవర్తించటం మొదలెడుతుంది. ఎటో పరిగెడుతుంది. దాన్ని మళ్లీ కథలోకి లాక్కురావటానికి నానా తిప్పలు పడాలి. అదే నా పద్ధతిలో ఐతే – ఇక్కడ ముగింపేమిటో ముందుగానే తెలుసు, దానికి దారి తీసే సంఘటనలూ తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగానే పాత్రలకి ఓ వ్యక్తిత్వాన్నిస్తాను. నేననుకున్న ముగింపుకి చేరాలంటే ఆయా పాత్రలు ఎలా ప్రవర్తించాలో, ఒకదానితో మరొకటి ఎలా సంఘర్షించాలో నిర్దేశిస్తాను. నా పాత్రలు నేను ఆడించినట్లే ఆడతాయి. ఆ విధంగా కథ మొత్తం నా కంట్రోల్‌లో ఉంటుంది. అలా ప్లాట్ డెవలప్ చేశాక కథకి ఒక రూపం – ఔట్‌లైన్ – వచ్చేస్తుంది. ఇక మిగిలింది దీనికి సంభాషణలూ అవీ చేర్చి కథ రాయటమే.

షరీఫ్: మీరు చాలా ఏళ్ల కిందటే తెలుగు ప్రాంతాన్ని వదిలేశారు. అమెరికాలో ఎక్కడో ఉంటున్నారు. కానీ మీ వచనం ఎటువంటి గందరగోళం, పునరుక్తులు లేకుండా, చిన్న చిన్న వాక్యాలతో హాయిగా ఉంటుంది. అంత అందంగా భాష అలవడటానికి మీరు చేసిన సాధన ఏమిటి?

అనిల్: నేను రాసే ప్రతి అక్షరాన్నీ తరచి చూసుకోవటమే. అంతకన్నా పెద్ద సాధన ఏమీ లేదు. నాదంతా వార్తాపత్రికలు, కథలు, నవలలు ఇలాంటివి చదివి నేర్చుకున్న తెలుగే తప్ప నేను ప్రబంధాలూ గట్రా చదవలేదు. నాకు భాషపై ఆ స్థాయి పట్టు కూడా లేదు. అది లేనప్పుడు భీకరమైన భాషలో ఏదో రాయబోవటం అనవసరం. చేతగాని పని చేసినట్లుంటుందది. అందువల్ల నాకొచ్చిన భాషలోనే రాసుకొస్తాను. ఆంగ్ల పదాల వాడకం విషయంలో మడికట్టుకు కూర్చోకపోయినా, వీలైనంత వరకూ తెలుగులోనే రాయటానికి ప్రయత్నిస్తాను. రాసినదాంట్లో తప్పులు లేకుండా జాగ్రత్త పడతాను. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాను. అంతే. కాకపోతే ఒకటి. లియొనార్డో డావించీ చెప్పినట్లు, simplicity is the ultimate sophistication. అత్యంత సాధారణంగా కనిపించటమే ఉత్కృష్టతకి పరాకాష్ట. ఇది స్టీవ్ జాబ్స్ నమ్మిన సిద్ధాంతం. నేనూ దాన్ని నమ్ముతాను. ఎంత క్లిష్టతరమైన కథాంశాన్నైనా తేలికపాటి భాషలో రాయటానికి ప్రయత్నిస్తాను. అనవసరమైన మార్మికత, నిగూఢార్ధాలు చొప్పించటం నాకిష్టం ఉండదు. బహుశా ఈ కారణం వల్లనే – సింపుల్‌గా కనిపించటం వల్లనే నా వాక్యాలకి మీరనే అందం చేకూరి ఉంటుంది.

Youtube link for the above interview

 

 

 

 

 

 

స్వేచ్ఛగా మాట్లాడుకునే జాగా కోసం….!

 

నారాయణ స్వామి వెంకట యోగి 

 

అన్ని సార్లూ నువ్వు
నేను మాట్లాడిందే మాట్లాడనక్కరలేదు.
అన్ని సార్లూ సరిగ్గా  నేనూ
నువ్వనుకున్నట్టుగానే చెప్పాల్సిన పనీ లేదు.

నువ్వు వూహించినట్టే ,
నిన్ను మెప్పించేట్టుగానే
నేనుంటేనే నీ వాణ్ణనీ,
లేకుంటే నీ పగవాడిననీ నిర్దారించకు.

అడుగులో అడుగు వేయడం,
మాటలు ప్రతిధ్వనించడం
అచ్చం ఒక్క లాగానే ఆలోచించడం
అయితే దానికి ఇద్దరం, ఇందరం  యెందుకు?

నువ్వు చెప్పేది నాకు నచ్చక పోయినా,
నేను మాట్లాడేది నువ్వు అసహ్యించుకున్నా
మనిద్దరం ఒకర్నొకరిని వినడం ముఖ్యం.
పరస్పరం గౌరవంగా విభేదించగలగడం ముఖ్యం.
అన్నింటికన్నా,
యింతమందిమి ఒప్పుకోవడానికో విభేదించడానికో,
నిలబడి స్వేచ్చగా మాట్లాడుకునేటందుకు
వుక్కిరి బిక్కిరి చేసే యిరుకుసందుల అంతర్జాలంలో
యింత జాగా ని కాపాడుకోవడం
మరింత ముఖ్యం.

 

యిటీవల జరిగిన కొన్ని సంఘటనలు,  వాటి మీద కొందరు చెప్పిన అభిప్రాయాలు, అభిప్రాయాల మీద జరిగిన వేడి వాడి చర్చలు,చర్చల్లో విసురుకున్న రాళ్ళూ రప్పలూ, దూసుకున్న కత్తులూ బాణాలూ, వాటన్నింటికీ ఈ యిరుకైన సువిశాల అంతర్జాలం లో మనందరికీ ఒనగూరిన ఈ జాగా –  చాలా అమూల్యమైనది.

సాధారణంగా మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మనం స్పందిస్తాం. కవులు కవిత్వం తోనో ,కథకులు కథల్తోనో , వ్యాస రచయితలు వ్యాసాలతోనో,  యెవరికి చేతనైన విధంగా వారి చైతన్యాన్ని వ్యక్తీకరిస్తారు. స్పందించడం ముఖ్యం. సకాలంలో స్పందించడం ముఖ్యం. యెట్లా స్పందించామన్నదీ ముఖ్యం. మన వ్యక్తీకరణలు మౌలికంగా ఉన్నాయా లేదా, శక్తి వంతంగా  ఉన్నాయా లేదా మన రచన సత్తా యెంత, దాని ప్రభావమెంత అనేది తెలివైన పాఠకులు వారి వారి అభిరుచులమేరకు, అభిప్రాయాల మేరకు నిర్ణయిస్తారు. బేరీజు వేస్తారు.

అందరికీ అన్నీ నచ్చాలనీ యెక్కడా లేదు. అట్లే అభిప్రాయాలు కూడా. ఒకరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో అందరూ పూర్తిగా ఏకీభవించాలనీ లేదు – నిజానికి అభిప్రాయలతో విభేదించకపోతే, చర్చించక పోతే, ఘర్షించకపోతే (యిక్కడ ఘర్షించడం అంటే భౌతికంగా దాడులు చేయడమని కాదు) కొత్త అభిప్రాయాలు జనించవు, ఉన్నవి వృద్ధి చెందవు. భావాలూ, అభిప్రాయాలూ శిలా శాసనాలు కావు, కాకూడదు. ప్రజాస్వామ్యబద్దంగా చర్చించబడాలి. సహనమూ సంయమనమూ కోల్పోకుండా చర్చ జరగాలి. ఇతరులను నొప్పించేలా , యిబ్బంది పెట్టేలా మాటలు తూలకుండా, తమకు నచ్చని వారిని  అవమానించకుండా, అగౌరవపర్చకుండా , తూలనాడకుండా విషయం మీద కేంద్రీకరించి చర్చ కొనసాగిస్తే అది కొత్త అభిప్రాయాలూ, భావాలూ జన్మించడానికీ , వృద్ధి చెందడానికీ ఉపయోగపడతుంది. అట్లే మనం అంగీకరించని అభిప్రాయలతో గౌరవంగా విభేదించడానికీ అంగీకరించవచ్చు.
చర్చలో దుందుడుకుతనం ప్రదర్శిస్తూ , తమ వాదనే గెలవాలనే యేకైక లక్ష్యం తో వీరావేశంతో యితరులమీద బండరాళ్ళు వేస్తూ వితండవాదన చెయ్యడం వలన యెవరికీ,  ముఖ్యంగా విషయానికి ఒరిగిందేమీ ఉండదు. అట్లాంటి వితండ వాదన వల్ల, అప్రజాస్వామ్య చర్చల వల్ల మన మధ్య  మనస్పర్థలూ , వైమనస్యాలూ యేర్పడి అవి బురద జల్లుకునేదాకా పోయే ప్రమాదముంది. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్న వారి మధ్య సహనం కోల్పోతున్న వాతావరణం కనబడుతున్నది.

తమకు నచ్చని అభిప్రాయాల పట్ల ప్రజాస్వామికంగా స్పందించి చర్చించాల్సింది పోయి దూషణలూ , అవమానించడాలూ, బెదిరింపులూ, దాడులూ చెయ్యడం దారుణమైన విషయం. దూషిస్తేనో, అవమానిస్తేనో, బెదిరిస్తేనో, దాడి చేస్తేనో అభిప్రాయాలు మార్చుకుంటారని, తమకు అనుకూలంగా వత్తాసు పలుకుతారనీ, లేదూ భయపడి పూర్తిగా మాట్లాడ్డం మానేస్తారని అనుకోవడం అమాయకత్వమూ, పైపెచ్చు  వెర్రి తనమూ కూడా! తెలుగు నేలమీద విస్తారంగా జరిగిన అనేకానేక ప్రజాస్వామ్య ఉద్యమాల భావజాల వారసత్వమూ, ప్రేరణా పుణికిపుచ్చుకున్నవారు అట్లా బెదిరిపోయి నోరు మూసుకుంటారనుకోవడం మూర్ఖత్వం.

అయితే ఈ అప్రజాస్వామిక సంస్కృతి ఇవాళ యెల్లెడలా వ్యాపించి బలపడడానికి ఒక నేపథ్యమున్నది. ప్రజాస్వ్యామ్య వాదులపైనా ,ప్రగతిశీల భావజాలం మీదా ఈ దాడులు – రాజ్యం చేసేవీ కావచ్చు, రాజ్యేతర శక్తులు చేసేవీ కావచ్చు –  గత అయిదేళ్ల కాలంగా యెక్కువైతున్నవి (అంటే అంతకు ముందు లేవని కాదు). ఇతరుల అభిప్రాయాలని సహనంతో, ప్రజాస్వామ్య దృక్పథం తో స్వీకరించి , చర్చించడానికి సిద్దంగా లేని అప్రజాస్వామ్య నియంతృత్వ శక్తులు ప్రపంచవ్యాప్తంగా బలపడినవి. ఈ శక్తులు తమకి నచ్చని అభిప్రాయాలని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నవి.

దాడి చేసి నోరు మూయించాలనే నిర్ణయించుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా  గ్లోబలైజేషన్ విఫలమై తనను,  తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి శాయశక్తులా అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న సందర్బంలో, దానికి  ఆలంబనగా నిలబడుతూ , దాని అండతో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి   ప్రయత్నిస్తున్న నియో కన్జ ర్వేటివ్ (నూతన సంప్రదాయవాద)  శక్తులివి. ఇవి ప్రపంచవ్యాప్తంగానూ,  తమ తమ దేశాల్లోనూ, గ్లోబలైజేషన్ కొనసాగిస్తున్న నిరాఘాట దోపిడీ పీడనలకు తమ శాయశక్తులా వత్తాసు పలుకుతూనే, అండదండలిస్తూనే, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల ముసుగులో  తమ అప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలుచేస్తున్నాయి.

ప్రజాస్వామిక చర్చలు జరగకుండా అణచివేస్తూ,ప్రశ్నించే గొంతులని నోరు నొక్కుతూ, యెల్లెడలా ప్రకటిత అప్రకటిత , రాజ్య , రాజ్యేతర నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఈ నూతన సంప్రదాయ శక్తులు యేకీకరణమౌతున్నాయి. చర్చలు జరిగే జాగాలన్నింటినీ బలవంతంగా ఆక్రమించుకుని,  అయితే తమకనుకూలంగా మార్చుకోవాలనో లేదా శాశ్వతంగా మూసెయ్యాలనో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే ఈ బెదిరింపులూ దాడులూ అవమానాలూ. చాలా మందికి ఇవి కొత్తకాకపోవచ్చు కానీ, ఇవి వేస్తున్న యెత్తుగడలూ, వస్తున్న మార్గాలూ, అవలంబిస్తున్న పద్దతులూ (కొన్ని సార్లు మనకు తెలీకుండా చాప కింద నీళ్ళలా , రకరకాల ముసుగులు వేసుకుని ) మరింత నవీనంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు .

యిటువంటి పరిస్ఠితుల్లో ప్రజాస్వామిక చర్చా వాతావరణాన్నీ, అభిప్రాయాల ఘర్షణనూ, అందరం కూడి ఒక చోట చర్చించుకునే జాగాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. వినడానికి ఒక పునరుక్తి (cliché ) లాగా ఉండొచ్చేమో కానీ,  ఇది ప్రజాస్వామ్యవాదులందరి భాద్యతా తక్షణ కర్తవ్యమూనూ. సహనమూ, యితరుల అభిప్రాయల పట్ల గౌరవమూ  కోల్పోకుండా, సంయమనంతో  వస్తుగతంగా (objective) చర్చ చేయడం యివాళ్ల యెంతో అవసరం. అట్లాంటి చర్చల్లోంచి యెదిగే అభిప్రాయాలే, భావజాలమే అప్రజాస్వామిక తిరోగమన శక్తులకు సరైన సమాధానం చెప్తాయి.

*

swamy1