ఎన్నేండ్ల ఏకాంతం?

 

 

హెచ్చార్కె 

 

చూస్తూ చూస్తుండగానే

ఆకాశం పద్యమైపోతుంది

రౌద్రమో అలాంటి మరేదో రసం

ఓజో గుణం, టప టప వడగళ్ల పాకం

జగమంతా బీభత్సం

పద్యాలంటే ఏమిటి?

పగలడమే కదా మనస్సులో తమస్సు

 

పొద్దు మీద అకుపచ్చ గీతలు

గీతల మధ్య రెక్కలున్న పాటలు

కళ్ల నుంచి జలజల చినుకులు

ఒక్కో చినుకులో వెతుక్కోడాలు

దొరకక జాలిగా చెయి జార్చడాలు

పద్యాలంటే ఏమిటి

కరగడమే కదా మనస్సు లోని రాళ్లు

 

 

వానా! వానా!!

ఎప్పుటి నుంచి కురుస్తున్నావే

మా కొండవార[i] ‘మాకొండో’[ii] లో

నే పుట్టక ముందెప్పడో మొదలై

నా కథ చెప్పేసి వెళిపోతున్నా వదలక

కురుస్తున్న వానా!

గగనపు గానా భజానా!

వయారాల గాలి నాట్యాల దానా!

ఇంకెన్నాళ్లే? వందేళ్లేనా?

ఈ తడి తడి ఏకాంతానికి?

 

ఎందుకిన్ని మెరుపులు

ఎందుకిన్ని వురుములు

అన్నీ నా కోసం ఐనట్లు?

 

ఎందుకిన్ని వురుకులు,

ఎందుకిన్ని విసురులు

నా ముందూ తరువాతా

నువ్వు వుంటావుగా?!

 

*

[i] కొండవార: మా సొంతూరు ‘గని’, ‘గుమ్మడి కొండ’ అనే కొండ అంచుల్లో వుంటుంది.

[ii] మాకొండో (‘Macondo’): గేబ్రెయెల్ గార్షియా మార్క్వెజ్ ‘వన్ హండ్రెడ్ ఇయర్స్  అఫ్ సాలిట్యూడ్’ లోని (ఆయన) వూరు.

Macondo 2 (1)

 

మీ మాటలు

  1. హెచ్చార్కే గారూ! కవిత్వ ప్రతీకలను అర్థం చేసుకోవడంలో నాది కొంచెం వెనకబాటే.. కానీ మీ రచన అలా లేదు; చదువుతుంటే హాయిగా అనిపించింది.

  2. బలే ఉంది. ఎప్పుడూ వర్షం కవితో ఏదో మాట్లాడుతున్నట్టే కవితలు చదివినట్టు గుర్తు. కాని కవి వర్షం తో మాట్లాడుతున్నట్టు సాగే ఈ కవిత- వర్షం పై కవి ఎంత ఆధారపడ్డాడో – వర్షం కుడా కవి పై అంతే ఆధారపడుతుంది అనే ఆలోచన కల్పించింది. చాల బాగుంది.

  3. Virinchi virivinti says:

    ఆకాశాన్ని మనసు లాగా, వర్షాన్ని మనసులోంచి దూకే ఎమోషన్స్ లాగా చాలా సింబాలిక్ గా చెప్పారు. మనసులో భావాలు పద్యాల్లా రాలాయి. తాత్కాలిక మెరుపులు ఉరుములు ఉరుకులు పరుగులు ఏంటి అని మనసును మనసుతోనే అడిగినట్టుంది. అవును మన ముందూ వెనుకా మనసే కదా ఉండేది. అద్భుతమైన కవిత హెచ్చార్కే గారూ. మీ మార్కుకి భిన్నంగా అనిపించింది.

  4. Jayashree Naidu says:

    మనసులోనే గగనపు గానా బజానా చాలా బాగుంది హెచ్చార్కె గారు

మీ మాటలు

*