లోపల సరస్సులున్న మనిషి

 

కె. శ్రీనివాస్‌

 

దేవతలకు ముప్పయ్యేళ్ల దగ్గరే వయసు ఆగిపోతుందట.  త్రిపురనేని శ్రీనివాస్‌ రాక్షసుడే అయినా ముప్పయిమూడేళ్ల వయసు దగ్గర ఆగిపోయాడు. ఆ తరువాత కాలం పందొమ్మిదేళ్ల ముసలిదైపోయింది. అతనూ అతని జ్ఞాపకమూ అతని స్ఫురణా మిసమిసలాడే యవ్వనంతోనే నిలిచిపోయాయి. శ్రీనివాస్‌ కవిత్వం కూడా.  ఇప్పుడు మరోసారి  కొత్తగా త్రిశ్రీ అక్షరాలను తడుముతుంటే,  మొదట తెలుస్తున్నది ఆ యవ్వనమే. అదేదో భౌతికమయినది కాదు , జలజలలాడిపోయే, జివజివలాడిపోయే, కువకువలాడిపోయే, కళకళలాడిపోయే కవిత్వయవ్వనం.

త్రిశ్రీని తెలుగు సాహిత్యం సాగనంపలేదు. అతని ఉనికికి ముగింపు చెప్పలేదు. ఒక దిగ్భ్రాంతిలో, ఒక దుఃఖంలో కలవరపడింది. అతన్నే ఒక నినాదంగా పలవరించింది.  హో అంటూ అతని కవిత్వాన్ని ఉచ్చాటన చేసింది. కార్యకర్తృత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అంతే తప్ప, హఠాత్తుగా నిష్క్రమించిన కవిని తూకం వేసి చరిత్ర అరలో బిగించలేదు. అతని జ్ఞాపకానికి పటం కట్టలేదు.  అతను చేసిన పనుల అర్థమేమిటో, సారమేమిటో అవగతం చేసుకోలేదు. కొనసాగింపూ జరగలేదు. ఆ అర్థంలో కూడా అతను యవ్వనంలోనే నిలిచిపోయాడు.

కవులందరికీ, సుడిగాలి జీవితం జీవించిన సామాజికులందరికీ ముగింపు-కొనసాగింపు తప్పనిసరి తతంగమేమీ కాదు. నిజానికి అట్లా జరగడం ఇష్టంలేదన్నట్టు  త్రిశ్రీయే  సంచరించాడు. ఒకరి వెనుక నడవటం చేత కాక, ఏ యిల్లూ లేక,  ఒక్క దేహం చాలని గుండెతో – సాంప్రదాయిక సాహిత్య అంత్యక్రియలను తానే నిషేధించుకున్నాడు.. అర్థం కానిదంతా అనర్థమేననుకుని,  ఎడంగానడిచినవారంతా పెడవారేననుకునే రెడీమేడ్‌ తరాజులు మాత్రమే అర్జెంటుగా  త్రిశ్రీ ఒడ్డూపొడువూ లెక్కలు కట్టారు. అతని చేతనాస్తిత్వపు నానార్థాలను చరిత్రచలనంలో తప్ప పట్టుకోలేమని  ప్రేమికులు నిస్సహాయులయ్యారు

ఆరాధన ఎక్కువై, అంచనా వేయలేమనుకుంటాము కానీ, ఎంతటి చలచ్చంచల దీప్త లేఖినులైనా వ్యాఖ్యలకు, విశ్లేషణలకు అతీతమైనవి కావు. కాకపోతే, మేధ గవాక్షాలను ఓరగానైనా తెరచి ఉంచుకోవడం అవసరం. కొత్తగాలులకు వేసట పడకుండా, అంతిమ నిర్ధారణలకు ఆత్రపడకుండాకాసింత సహనం అవసరం. ఇప్పుడు త్రిశ్రీని అర్థం చేసుకోవాలంటే, అతని వాచకాలకు పందొమ్మిదేళ్ల చరిత్రను జోడించాలి. అతని అనంతరం తెలుగు సమాజం సమకూర్చుకున్న అనుభవాల, జ్ఞానాల నేపథ్యంలో అతనిని చూడాలి. ఏ అక్షరానికైనా అర్థం, అపార్థం చారిత్రకమే.

ఎనభైల మధ్యలో కవిగా మొదలైన త్రిశ్రీ, విప్లవకవిత్వానికి కొత్త డిక్షన్‌నీ, మిలిటెంట్‌ వ్యక్తీకరణనీ, మొత్తం మీద నూత్న యవ్వనాన్నీ ఇవ్వాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతను ఒక్కడే కాడు, ఒంటరీ కాదు. కానీ, కాలం అప్పటికే కొత్త ఉద్యమాలను కడుపుతోవున్నది. అసంకల్పితంగానో సంకల్పపూర్వకంగానో త్రిశ్రీ కవిత్వం కొత్తపలుకులు పలికింది. తన కవిత్వంలోని వేగాన్నీ చెళ్లుమనిపించే కొరడాకొసలనీ కాక, ఆగామి ఉద్యమాల ప్రాతిపదికల ప్రకటనలను లోకం అధికంగా పట్టించుకున్నది. కవి రాసింది కాక, పాఠకసమాజం అర్థం చేసుకున్నదే కవిత్వార్థం అవుతుంది, కాలస్వభావంతో వెలిగిందే పతాకశీర్షిక అవుతుంది. ‘నీడ వెనుక ఆలోచన కదలాడదు’- ఏ నీడ? ఎవరి నీడ? సంతకం ఒకేలా చేయలేకపోవడం ఏమిటి? పునరుక్తుల మీద, ప్రతిధ్వనుల మీద అతనికి ఎందుకంత వ్యతిరేకత? అది సవ్యంగానే అర్థం అయిందా?

త్రిపురనేని విప్లవోద్యమాన్ని ఆరాధించాడు. మరో రకంగా చెప్పాలంటే విప్లవోద్యమంలో ఉండే నిర్భీతిని, విస్ఫోట గుణాన్ని, ఉద్వేగానికి ఆచరణకు ఉండే అతి సాన్నిహిత్యాన్ని అతను ప్రేమించాడు. రహస్యాన్ని, ధిక్కారాన్ని, ఆత్మత్యాగాన్నీ ప్రేమించాడు. ఉద్యమానికి తనను తాను పర్యాయం చేసుకుని మాట్లాడాడు.  అదే సమయంలో అతను అనుచరత్వాన్ని, విధేయతను ఈసడించుకున్నాడు. నంగితనాన్ని, సానుభూతుల్ని ఏవగించుకున్నాడు. కవిత్వంలో కూడా రహస్యోద్యమంలో ఉండే గుణాలన్నీ ఉండాలనుకున్నాడు. తనదికాని అనుభవాలను, తాము మనస్ఫూర్తిగా నమ్మని అంశాలను ఆపాదించుకునే సహానుభూతులను అయిష్టపడ్డాడు. వ్యవస్థను వ్యతిరేకించడం అంటే వ్యవస్థీకరణను వ్యతిరేకించడం కూడా అనుకున్నాడు. కుటుంబాన్ని పెళ్లినే కాదు,  ప్రేమల వెనుక పొంచి ఉన్న వ్యవస్థలనూ వెక్కిరించాడు. ఏకకాలంలో ఒకర్నే ప్రేమించలేనని, తనసూర్యోదయానికి ఒక్క ఆకాశం సరిపోదని బాహుళ్యవాదాన్ని సమస్త జీవనరంగాలకూ అన్వయించాడు. తనకు అనుచరులూ విధేయులూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. స్నేహాల్లో ప్రజాస్వామ్యాన్ని ఆచరించాడు.

వ్యక్తివాద అరాచకవాద విషసాంస్కృతికవాద వ్యక్తిగా కొందరికి  కనిపించిన త్రిపురనేని శ్రీనివాస్‌, ఉద్యమాలను వ్యతిరేకించలేదు. సాహిత్యంలో రాజకీయాంశాలను, సామాజికాంశాలను వ్యక్తం కావడాన్ని కాదనలేదు, పైగా ప్రోత్సహించాడు. ప్రచురణకర్తగా తను వేసిన పుస్తకాలలో సగం ఉద్యమాలకవిత్వం అయితే, తక్కిన సగం వ్యక్తులుగా సామాజికుల కవిత్వం. గొంతు బలపడి స్థిరపడిన ఉద్యమానికి (గురిచూసి పాడేపాట)తొలిసంకలనాన్ని, వర్తమానంలో విస్తరిస్తున్న మరో అస్తిత్వ కవిత్వ ఉద్యమం చిక్కపడుతున్న దశలో (చిక్కనవుతున్న పాట) మహాసంకలనాన్ని, ఇంకొక బాధిత అస్తిత్వ వాదం తొలికేక పెట్టినప్పుడే పుస్తకాన్ని (పుట్టుమచ్చ) ప్రచురించడం- సాహిత్య, కార్యకర్తగా శ్రీనివాస్‌ ఉద్యమవ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. అనుయాయిత్వాన్ని, పునురుక్తిత్వాన్ని అతను ఉద్యమతత్వానికి పర్యాయపదంగా వాడలేదు. ఉద్యమావరణాల్లో వ్యాపిస్తున్న అవాంఛనీయతలకే సంకేతించాడు.  విరసం నుంచి వెళ్లిపోవలసివచ్చి, రహస్యోద్యమం పుస్తకం బయటకు వచ్చి, తనపై విప్లవవ్యతిరేక ముద్ర విస్తరిస్తున్న సమయంలో కూడా అతను విప్లవకవిత్వం రాశాడు. ఆవేశమూ గాఢతా మమేకతా కలగలసిన విప్లవకవిత్వం ఎట్లా ఉండాలని తాను అనుకుంటాడో అట్లాగే అతను ఆ కవిత్వం రాశాడు.  అతనేమిటో అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతే, తప్పు అతనిది కాదు.

పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా, కార్యకర్తగా, కవిగా, వ్యక్తిగా త్రిపురనేని శ్రీనివాస్‌ చాలా పనులు చేసినా, వాటన్నిటిలోనూ ఏకసూత్రతతో కూడిన వైవిధ్యం ఉన్నది, మరి వైరుధ్యాలు కూడా ఉన్నాయా? ఇందుకు సమాధానం వెదికేముందు, స్వేచ్ఛకు ఎవరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? రాజకీయ విశ్వాసాలకు, మానవవిలువలకు మధ్యనుండే ఎడం ఎంత ? – వంటి ప్రశ్నలనేకం వస్తాయి. మరొకరి అనుభవాన్ని ఎవరూ పలవరించవలసిన పనిలేదని, నిషేధించిన అక్షరం మీదనే తనకెప్పుడూ మోజు అని- త్రిశ్రీ చెప్పినప్పుడు అవి సమకాలపు ప్రయోజనం కోసం అర్థవ్యాకోచం చెందాయా? ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సమాజంలో పరిణతి పెరిగిందా? లేక- మరింతగా విలువల వ్యవస్థీకరణలోకి  కూరుకుపోయిందా?

శ్రీనివాస్‌ సాహిత్య జీవితాచరణ నుంచి తెలుగు సాహిత్యం, ముఖ్యంగా పురోగామి సాహిత్యం ఎంతో ప్రయోజనం పొందింది. పాతికేళ్ల వెనుకకు వెళ్లి చూసినప్పుడు, ఆ కాలపు మలుపులో శ్రీనివాస్‌ కీలకమయిన కర్తవ్యాలు నిర్వహించాడు. ఏకైక నాయకపాత్రలో ఉన్న విప్లవసాహిత్యం స్థానాన్ని బహుళ సాహిత్యవాదాలు పంచుకునే పరిణామానికి అతను ఫెసిలిటేటర్‌గా ఉన్నాడు. వేయి పూవులుగా వికిసించగల తెలుగు కవిత్వానికి అతను తోటమాలిగా వ్యవహరించాడు. కవిత్వం నాణ్యత పెరగడానికి, నిర్భయమైన ప్రశ్నలు వెల్లువెత్తడానికి అతను సహాయపడ్డాడు. వ్యక్తివాదులుగా, అనుభూతివాదులుగా, అస్పష్ట-సంక్లిష్ట వ్యక్తీకరణవాదులుగా పేరుపడ్డ అనేకమంది ఒంటరి సామాజికులను కవిత్వపాఠకులందరి ముందుకు తెచ్చాడు. వారి నుంచి నేర్చుకోవలసింది నేర్చుకోవలసిందేనని తాను స్వయంగా అజంతా ప్రభావంలో పడి మరీ చెప్పాడు.

ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్టే, త్రిశ్రీ కూడా ‘కవిత్వం కావాలి కవిత్వం’ రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో ‘ అతడు అక్షరానికి మాతృదేశం’ పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్‌ కవిత్వంలో ముఖ్యమైన, కీలకమయిన పద్యాలే. వాటిలో ఆవేశం, స్వాభిమానం, ఒకింత అహంకారం- అతని ప్రకటనలను కవిత్వంగా మలిచాయి.  కానీ, అతనికి అవి మాత్రమే చాలా ఇష్టమైనవని చెప్పలేము. ‘ద్వీపవతి’ కవితను అతను ఎంత ఇష్టపడి రాసుకున్నాడో, రాసి ఇష్టపడ్డాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అజంతా గుప్పుమంటున్నా ‘నిశ్శబ్దం సాకారమై పరిమళిస్తుంది’ పోయెంను ఎంత ప్రేమించాడో కూడా నాకు తెలుసు. కవిత్వం అతని దృష్టిలో ‘అక్షరఖచిత భాష’. పొదగడం తప్ప అతను పూసగుచ్చలేడు, పోగుపెట్టలేడు.  ద్రాక్షవిత్తనాన్ని తపస్వి ముత్యపు శిల్పంగా పోల్చిన గాఢత కానీ, పుస్తకం తనను తిరగేయాలని,  కవిత్వం తనను రాయాలని, ఎండలు వానలకు తడిశాయని- చేసిన అనేక విలోమ ఊహలు కానీ ‘రహస్యోద్యమం’ లో అడుగుడుగునా మనలను ఆశ్చర్యపరుస్తాయి. ‘రహస్యోద్యమం’ పుస్తకంగా వచ్చినప్పుడు- ఫెటీల్మన్న చప్పుడు. దేనినో అధిగమించినట్టు, బకాయిపడ్డ నిట్టూర్పుకు విముక్తి లభించినట్టు. కవిత్వానికి అంతకుమించి సార్థకత ఏముంటుంది?

త్రిశ్రీ వెళ్లిపోయాక కూడా కాలం కదులుతూనే ఉన్నది. లోకం మారుతూనే ఉన్నది. అతను ముందే చెప్పిన మాటలు అనేకం తరువాత మన నిఘంటువుల్లోకి చేరిపోయాయి. కవిత్వం కావడమే కవిత్వానికి మొదటి షరతు అని అందరం ఇప్పుడు ఒప్పుకుంటూనే ఉన్నాము. మానవవిలువల ప్రజాస్వామ్యీకరణ జరగడం సంఘవిప్లవంలో భాగమని, సంఘవిప్లవానికి అవసరమనీ గుర్తిస్తూనే ఉన్నాము. స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు తెలుగుసాహిత్యంలో అవిభాజ్య, అనివార్య పరిణామాలని చరిత్రపుస్తకాలలో చేర్చుకున్నాము. టిబెట్‌ విషయంలో చైనా చేసింది తప్పని శ్రీనివాస్‌ రాసినప్పుడు అభ్యంతరపెట్టిన విప్లవసాహిత్యోద్యమం ఇప్పుడు భిన్నాభిప్రాయానికి చోటు ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. మరి త్రిశ్రీ అప్పుడు ఎందుకు అపార్థమయ్యాడు? ఎందుకు అతని ‘జాము లోయల్లో నిదురించని’ యవ్వనాన్ని చూసి కొందరు భయపడ్డారు? అతను కూడా ఒక  సామూహిక ఏకవచనమని ఎందుకు గుర్తించలేకపోయారు?

త్రిపురనేని శ్రీనివాస్‌ రహస్యోద్యమ కవితలకు రహస్తాంత్రికుడు ‘మో’ ఇంగ్లీషు అనువాదాలను కలిపి వేస్తున్న పుస్తకం ఇది. పాఠకులుగా ఒకరికొకరు ఇష్టులే కానీ, కవులుగా ఇద్దరి కోవలు వేరు.  సకల మార్గాల తెలుగు కవులను అనువదించిన ‘మో’కు త్రిశ్రీ కఠినుడేమీ కాదు కానీ, ఎందుకో, కొన్ని పద్యాలు హడావుడిగా అనువదితమయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్వేచ్ఛ ఎక్కువ తీసుకోవడం పరవాలేదు.  మూలకవి భావానికి మరీ ఎడంగా ఉన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి. శ్రీనివాస్‌ ఉన్నప్పుడే ‘మో’ ఈ అనువాదాలు చేశారట.  ఆ తరువాత అయినా ‘మో’ ఒకసారి సరిచూసి ఉంటే కొన్ని పొరపాట్లు లేకుండా  ఉండేవి.

“రహస్యోద్యమం”  తాజా ప్రచురణకు ముందుమాట

ఆగస్టు 10, 2015

 

మీ మాటలు

  1. Aranya Krishna says:

    త్రిశ్రీ తో పరోక్ష పరిచయమే తప్ప నాకసలు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ తనగురించి తెలుసు. “కవిత్వం కావాలి కవిత్వం” అంటూ ఏ మాత్రం పరిచయం లేని వారికి చాలా దగ్గర కాగలిగాడు. తనదైన వ్యక్తిత్వంతో ఒక పొయట్ సెలెబ్రటీ గా దూసుకొచ్చాడు. కవిత్వాన్ని గుండెకి సంబంధించిన సెలెబ్రేషన్ గా అనేక మంది ఫీల్ అయ్యేలా చేయగలిగాడు. అప్పటికే ప్రగతిశీలకంగా వున్న ఆధునిక తెలుగు కవిత్వానికి ఈస్తటిక్స్ మరింత అద్దటానికి ప్రయత్నించాడు. వార్ధక్యమే ఎదగటమైతే త్రిశ్రీ ఎదగటం ఆగిపోయినవాడు. అతని కవిత్వం లాగే అతని రూపు కూడా తెలుగు కవిత్వం మీద “హో” అంటూ నిత్య యవ్వనంతో శోభిల్లుతూనే వుంటుంది. “వ్యవస్థను వ్యతిరేకించడం అంటే వ్యవస్థీకరణను వ్యతిరేకించడం కూడా అనుకున్నాడు.” ఎంత గొప్ప మాట. ఎడం చెయ్యి తీసి పుర్ర చెయ్యి పెట్టినట్లు సంప్రదాయ వివాహం బదులు వేదిక వివాహాలు, “శుక్లాంభరధరం…” బదులు జెండావందన పాటలు ఇవన్నీ నిచ్చెనమెట్ల అనుచరత్వాన్ని ప్రోత్సహించే వ్యవస్థీకరణలే. చాలా మంచి రైటప్ ఇచ్చినందుకు కె.శ్రీనివాస్ కి ధన్యవాదాలు.

  2. buchi reddy gangula says:

    శ్రీనివాస్ గారు
    EXCELLENT.ARTICLE..SIR..
    1—వారి బుక్స్ ఎక్కడ దొరుకుతాయో దయతో e.mail.. చేయగలరని మనవి —-
    hanamkonda.@aol.com..
    2–వారు ఎలా చనిపోయారో జస్ట్ తెల్సుకోవాలని ఉంది

    దయతో
    బుచ్చి రెడ్డి గంగుల

  3. p Sambasivarao says:

    If u know about srinivas’ death u read koumudi web( old )magazine Commercial and sex writer malladi wrote one article in his essays on his friends and known persons. Then u can get the flavour of his life style, habits , aspirations along with his poetry flavour etc.. Ok?

    • buchi reddy gangula says:

      రావు గారు

      దయతో కాల్ చేయండి సర్ —వీలుంటే

      ———————-బుచ్చి రెడ్డి గంగుల
      9495108590–cell

  4. కె.కె. రామయ్య says:

    ” పాతికేళ్ల వెనుకకు వెళ్లి చూసినప్పుడు, ఆ కాలపు మలుపులో కీలకమయిన కర్తవ్యాలు నిర్వహించిన త్రిపురనేని శ్రీనివాస్‌ (త్రి శ్రీ ) వల్ల పురోగామి తెలుగు సాహిత్యం ఎంతో ప్రయోజనం పొందింది.

    ఉద్యమానికి తనను తాను పర్యాయం చేసుకుని మాట్లాడాడు.  అదే సమయంలో అతను అనుచరత్వాన్ని, విధేయతను ఈసడించుకున్నాడు. తనపై విప్లవవ్యతిరేక ముద్ర విస్తరిస్తున్న సమయంలో కూడా త్రిశ్రీ విప్లవకవిత్వం ( రహస్యోద్యమం ) రాశాడు

    పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా, కార్యకర్తగా, కవిగా, వ్యక్తిగా త్రిపురనేని శ్రీనివాస్‌ చేసిన పనుల అర్థమేమిటో, సారమేమిటో తెలుగు సాహిత్యం అవగతం చేసుకోలేదు. ”

    కె. శ్రీనివాస్ గారు ఎంత గొప్పగా చెప్పారు.

    ( ఫొటోలో ఉన్నవాళ్ల పేర్లు సరైన క్రమంలో ఇవ్వలేదనిపిస్తున్నది. 1996, ఆగస్టు 17 హైదరాబాదు లోని లోయర్ టాంక్ బండ్ వద్ద మోటర్ బైక్ రోడ్డు ప్రమాదంలో త్రి శ్రీ మరణించారనుకుంటా. త్రి శ్రీ రచనలు, తను ప్రచురించిన మైల్ స్టోన్ బుక్స్ ను ఓ ఉద్యమ స్పూర్తితో అందరికీ అందుబాటు లోకి తీసుకు రావాల్సిన భాద్యతను పెద్దలు స్వీకరిస్తారని ఆశిద్దాం )

మీ మాటలు

*