నాక్కాస్త సమయం పడుతుంది!

 

 

-రేఖా జ్యోతి 

~

నువ్వొచ్చిన వసంతంలో నుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి  జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !

నా కుడి భుజం మీద ఇంకా నీ తల ఆన్చినట్టే ఉంది
మెత్తని మల్లెలు ఒత్తు పెట్టుకొని నా మెడ ఒంపులో ఒత్తిగిలినట్టే ఉంది..
ఏమని కదలను ..?

ఈ కాస్త ఇప్పుడు లేదనుకోవడానికి ..
నాక్కాస్త సమయం పడుతుంది !

ఈ సెలయేటి ఒడ్డున నీతో ఆడి ఆడి…
నీ మువ్వల సంగీతానికి అలవాటుపడి
ఇప్పుడిక బోసిపోయిన ఈ ఇసుక తిన్నెల నిశ్శబ్దంలోకి ఒదిగిపోవడానికైనా సరే,
నాక్కాస్త సమయం పడుతుంది,

లోకాన్ని పోనీ ముందుకు
నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే !

బహుశా నాలాగే , నీకూ తెలీదేమో కదా
వెచ్చని అరచేతులతో వీడ్కోలు తీసుకొనేటప్పుడు
ఈ  ఆర్ద్ర  క్షణమొకటి మళ్ళీ రాదని,

‘ఎలా వదిలేసుకున్నాను అలా ..!’ అని

దీర్ఘంగా పశ్చాత్తాప పడడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది

తిరిగి తిరిగి చూస్తూ బేలకళ్ళతో  నువ్వెళ్ళిన
ఆ దారిలో నుంచి, నన్ను నేను వెనక్కి తెచ్చుకోవడానికి,

కనీసం ఈ స్తబ్ధత నుంచి
ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. !

వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో  తీసుకెళ్ళినపుడు
ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది .. !

కాచుకొని కాచుకొని
మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే

అలసిపోయి ఒక కన్నీటి చుక్కగా ఇక్కడ కురిసిపోవడానికైనా సరే ..

నాక్కాస్త సమయం పడుతుందేమో
ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !!

peepal-leaves-2013

యే…

 

 

కె. రామచంద్రా రెడ్డి 

~

 

ఉండలేక స్వప్నస్వర్గ కుహరంలోంచి
వో నరక నాలుక వూడిపడింది
వాలిన పొద్దు ముసురు గుబుర్లో

వోల్డ్ మాంక్ నిశాని సాక్షిగా

*   *    *

క్షవరం చేంచుకోని తలపులు

నిక్కబొడిచుకుని రెల్లు గడ్డి మూల
మూలిగే నక్కలా కాకుండా

లేలేక బొంగురుగా కూసే కాకిలా

నూతిలోంచి బరువు బాల్చీ లేచిన చప్పుడు

 

సంతర్పణలో సాంబారన్నం మెక్కుతుంటే
పురాతన పులకింత

పలకరించి

ఇంగితం లేకుండా

పలమారింది
*   *    *

ఎందుకు వూకే కూకుని తిరగేత నాలుక
అరిపాదం మయంగా దిగిన పల్లేరుగాయ

మాదిరి ఉప్పటి కంటి అద్దప్పొరపై

మాంత్రికప్పౌడరేసి తుడు

 

చీకటి బయలు పడనమ్మకు

నడి వేసవి పసి రోగానికి

గాడ్పు వీథిలోంచి తుడపం పెట్టినట్టు

శివం తొక్కు
    *     *     *

అన్నీ పెడసరడ్డంకులే

మాడుమాటల అట్టువాక్యాలు మెక్కి

వెక్కిళ్ళ వేవిళ్ళు నీకు

నువ్ కనే పేడి పదం

ఏ లోకానిది .


తుడపం – వేసవి లో నడి పొద్దున  పిల్లలకొచ్చిన రోగాలకై గ్రామదేవతకి చెల్లించుకునే మొక్కు(కోడి)

చావు వెల

 

-బాలసుధాకర్ మౌళి

~

 

వానకి
వొరిగిన చేలు లెక్కనే
తలవాల్చి
ప్రశాంతంగా నిద్రిస్తున్న
దేహమెవరిదో..
చావుని
పిలిచి మరీ
కౌగిలించుకున్న ఆ ధీశాలెవరో..
తల్లీ- బిడ్డలను
ఎవరి మానాన వాళ్లనొదిలేసి
వుత్తచేతులతో కదిలిపోడానికి
నమ్మకమెక్కడినుంచొచ్చిందో..
ఎవరో
ఏ ప్రాంతమో
ఏ కన్నీళ్ల కథానాయకుడో –

నెత్తురు
గంగవెర్రులెత్తుతుంది
రైతు
ఆత్మహత్య చేసుకున్నాడంటున్నావా
నిజమేనా
నమ్ముతావా
– రైతు కాదురా
తరాల శోకాన్నీ దిగుళ్లనీ కన్నీళ్లనీ
మోసి మోసి
బరువెక్కి – తేలికయి
ఆనందనేత్రాలతో
పారవశ్యం చెంది
అలసి అలసి – తిరిగి శక్తివంతమయి
నిలబడిన
నేలరా –
బువ్వపెట్టిన నేలరా
నేలరా
ఆత్మహత్య చేసుకుంది
కోటానుకోట్ల
కాంతిపుంజాల చేతులతో
నోటి ముందు ఇంత అన్నం ముద్దనుంచిన
తల్లినేలరా
నేలరా- ఆత్మహత్య చేసుకుంది

పాట పాడే నేల
ఆత్మహత్య చేసుకుంది
పాదం కదిపే నేల
ఆత్మహత్య చేసుకుంది
మనిషి మనిషంతా నేలగా మారి
నేలే మనిషై ఆత్మహత్య చేసుకుంది

నేల చుట్టూ
చేరి
పిచ్చిచూపులు చూస్తున్న
ఆ పసివాళ్ల సంగతో
పసివాళ్ల జీవితాలను ప్రాణంపెట్టి సాకాల్సిన
ఆ తల్లి సంగతో
పోనీ
డేగలా
నెత్తిన కూర్చున్న అప్పుసంగతైనా
చెప్పగలవా –
పోనీ
వాడు కట్టిన
‘చావు వెల’ సంగతి ?

*

ఎందుకు?

 

 

-విజయ జ్యోతి

~

 

క్షమించండి

ఇది తప్పొప్పుల పట్టిక కాదు

ఆరోపణల జాబితా అంతకన్నా కాదు

భంగపడిన విశ్వాసం

భగ్నమైన ఆశ్వాసం

వేరే కనులెందుకు అంటో

చూపులేకుండా చేశావేమని అడగబోవడం లేదు

వేరే రెక్కలెందుకంటూ

జటాయువుని చేశావెందుకని ప్రశ్నించబోవడం లేదు

ఒక నదిలో అనేక సార్లు స్నానం చేయొచ్చంటూ హెరాక్లిటస్‌ని ఎగతాళి చేసి

ఎడారిగా ఎందుకు మార్చావని  నిలదీయబోవడం లేదు

అలలపై విహరిద్దామని చెప్పి

కల్లోల కడలిలో ఎందుకు తోశావని సంజాయిషీ కోరబోవడం లేదు

ఆశకు ఆచరణకు మధ్య అంతరం తెలిసొచ్చాక

గుర్రానికి కళ్లేలు వేయాలనే దుగ్ధ మరెంత మాత్రం లేదు

అద్దం పగిలేది అబద్ధం తోనే అని గుర్తు చేయదల్చుకున్నా

సంజాయిషీ బంధానికి ఆఖరి మెట్టు అని అరిచి చెప్పదల్చుకున్నా

వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురా అని ఎవర్నీ అడగలేను

ఎందుకనే ప్రశ్నకు

ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందంటావా మిత్రమా!

*

మార్కెట్…..ఓ మహాసర్పం

 

 

-మొయిద శ్రీనివాస రావు
~

ఓ కవిమిత్రుడన్నాడు

మడిగట్టు నా సింహాసనమని

అవును నిజమే…మడిగట్టు నా సింహాసనమే

నేను రాజునే

పొలం నా రాజ్యమే

ఆరుగాలం సాగు సాగనప్పుడు

బారెడు భూమిలో

మూరడు పంట పండే కాలంలో

ఊరులోని మిగులు చేతులన్నీ

నాకు వ్యవ ‘సాయం’ చేసాయి

కుండ, బండ

బట్ట, బుట్ట

కత్తి, కత్తెర

తలో చెయ్యి వేసాయి

నా ముంగిట చేతులు చాచి

నన్ను మారాజును చేసాయి

పట్నంకు… పల్లెకు బంధం బలపడినాక

ఊరిలో మార్కెట్ మహాసర్పం బుసలుకొట్టింది

మిగులు చేతులను బయటికి పంపి

వలస చీమలగా మార్చేసింది

నా క్షేత్రంలో ఏమి పండాలో శాసించింది

‘మదుపు ‘ మోటరు పంపులోని నీరై

నిత్యం పొలంలోనికి పారింది

చివరకి….నా బతుకే ‘ఎరువు’ అయినాక

మూరడు నేలలో పండిన

బారెడు పంటను

చిరు ‘ధర ‘హాసంతో మింగేసింది

నన్ను మడిసెక్కకు బానిసను చేసింది

మహాసర్పపు ఆకలి కేకలకి

అరిచేతులను అరగదీసుకున్నాను

కడుపును కుదించుకున్నాను

మిగులు సమయాలలో నేతొడుక్కున్న

అదనపుచేతులను సైతం అర్పించుకున్నాను

మూరడు మడిసెక్క వ్యాపారక్షేత్రమైన చోట

మార్కెట్ మహాసర్పంతో యుద్దమంటే మాటలా!

కడవరకు బానిసగానైన బతకాలి!

లేదా మారాజుగానైనా చావాలి!!

చివరికి మిగిలిన మడిసెక్కను

అది మింగినాక

మహాసర్పాన్ని మట్టుపెట్టగల

పట్నపు శ్రమచీమల సైన్యంలోనైనా చేరాలి! !!

* * *

(karl kautsky పుస్తకం ‘on agraarian question’ చదివిన స్పూర్తితో)

వెన్నెల రాత్రి

 

   –  రెహానా

~
చీకటంతా ఒక్కచోటే పోగయ్యింది…
వెన్నెల రాత్రుల్లోని
ఆ వెలుగంతా ఎటు వెళ్లిందో…
ఒక దాని పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లిన
నా ఆశల సౌధాలన్నీ ఎక్కడ
కుప్పకూలిపోయాయో…

నేను వెదుకుతూనే ఉన్నాను
ఆ చీకట్లో…
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

నేను ఇష్టపడే రాత్రి- ఊసులాడే రాత్రి
నేను స్వప్నించే రాత్రి- శ్వాసించే రాత్రి
నేను నేనుగా జీవించే రాత్రి
దోసిలి నిండా తీసుకుని ముద్దాడే రాతిరి

గుమ్మానికి గుత్తులు గుత్తులుగా
వెళ్లాడే కబుర్ల జాజులు
ఎక్కడ రాలిపోయాయో

చీకట్లో వెతుకుతూనే ఉన్నాను.
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

*

కరువు కాలం

 

 

-ప్రసాదమూర్తి

~

 

ఒక బావురు కప్ప

మనిషిని చూసి బావురుమంది

గుక్కెడు నీళ్ళు దొరకడం లేదని కాదు

గుండెలో చుక్క నీరు కూడా నీకెందుకు కరువైందిరా అని

కప్ప చకచకా బెకబెకామంది

 

ఎంత కరువొచ్చి పడిందిరా బాబాయ్

కూటికీ నీటికీ మాత్రమేనా !

అంతా కరువేరా

మాటల్లో మాటకి కరువు

నవ్వుల్లో నవ్వుకి కరువు

స్పర్శల్లో స్పర్శకి

మనుషుల్లో మనిషికి కరువు
ఎంత కరువొచ్చి చచ్చిందిరా

ఏం కాలమొచ్చిందిరా అబ్బాయ్

ఒక పశువు మనిషిని తిట్టింది

మేం తినాల్సిన గడ్డి నువ్వు తింటున్నావ్

అందుకే మేత కరువై మేం కబేళాలకు పోతున్నామంటూ

పశువు ఖాళీ నోటితో నెమరేస్తూ కసురుకుంది
ఏం కరువు కాలంరా అబ్బిగా

మాయదారి కరువు..మహమ్మారి కరువు

చట్టసభల్లో చట్టానికి కరువు

న్యాయాలయాల్లో న్యాయానికి కరువు

నేతల్లో నీతికి..

పాలకుల్లో పాపభీతికీ కరువొచ్చి చచ్చిందే
రాళ్ళు బద్దలవుతున్నాయి

ఊళ్ళు దగ్ధమవుతున్నాయి

పొలాలు హలాల్ అవుతున్నాయి

జలాలు ఆకాశ ఫలాలవుతున్నాయి

కరువురా కరువు.. పైనా కిందా చుట్టూ అంతా

ఎంత కరువొచ్చి వాలిందిరా నాయనా

చెట్టు మనిషిని ఛీత్కరించుకుంది
ఉద్గారాలు ఊదుతున్నాడని కాదు

కడుపులో కాసింత పచ్చదనానికే

ఎందుకు కరువొచ్చి కొట్టుకుంటున్నావురా అని

నీడల చేతులతో చెట్టు మనిషి చెంప ఛెళ్ళుమనిపించింది

కరువే..కష్టకాలమే..కోరల చారల దెయ్యం కాలమే
ఆపమనండిరా వాళ్ళని ఆ చావులెక్కలు ఆపమనండి

లెక్కించాల్సింది ఆత్మహత్యలనో ఆకలి చావులనో కాదు

హంతకులను లెక్కపెట్టమని చెప్పండ్రా

గుర్తించాల్సింది కరువు పీడిత ప్రాంతాలను కాదు

వాటి మహారాజ పోషకులను పోల్చుకోమనండ్రా
పాడుకాలం..చేటుకాలం

కరువు కరువు కరువు కరువు కాలం..

పరవశం

 

-మమత కె.

 

గుక్కపట్టి  నువ్వు రాల్చిన పదాలకు దోసిలి పట్టి

మెరుగులు దిద్దుతూ అక్షరాలుగా విడగొట్టుకుంటాను

పదాలు, పల్లవై కోస్తాయని భయం

వాటి మధ్య పిడికెడు మట్టి కూరుతాను – నీవు నువ్వుగా నిలబడాలని సర్దిచెప్పబోతాను

నీకూ తెలుసు, అదంతా గడ్డిపువ్వుల మధ్యనుంచి తొంగిచూసే ఆమెను దాచిపెట్టాలనే

కంట్లో చిక్కుకున్న పదాలలోంచి ఆమె నవ్వుతుంది. దయగా.

ఆఖరికి

పద్యానికీ పద్యానికీ మధ్య ఖాళీలో నన్ను నిలబెట్టుకుంటాను. ఆమెనూ హత్తుకుంటాను.

అప్పుడు

కాసింత మట్టి మృదువుగా అంటుకుంటుంది నన్ను

నాన్న పిచ్చుక ఒకటి

నన్ను ముక్కున కరుచుకుని వెళ్లి గూడుకి అద్దుకుంటుంది

త్వరలోనే పిచ్చుక పాపాయిలు

అమ్మ పిచ్చుక తెచ్చిన బువ్వ తిని

వెచ్చగా నిద్రపోతారు

నన్ను ఆనుకుని

ఆనక

అమ్మలై నాన్నలై

సాగిపోతారు ఆకాశంలో

వాళ్ల రెక్కల్లో నన్ను ఇముడ్చుకుని

నేనే..ఓ పోయెం

 

 

 

-కొనకంచి
~

నా హ్రుదయంలో దాక్కున్న సూక్ష్మ హ్రుదయం
కొత్త రెక్కలొచ్చివెళ్ళిపోగానే
నేను..ఎండిపోయిన ఒంటరి చెట్టుమీద
విక్రుతంగా మిగిలిపోయిన
విషాదపు..నిస్సహాయపు..నిర్జీవపు
పక్షి గూడుగా మారిపోతాను.

రెండోసారి మళ్ళీ జన్మించిన నేను
ఆత్మోద్భవనంలో
నన్ను నేనే ప్రేమించుకుంటూ
నేను పుట్టిన ఏకాంతపు పక్షి గూటిని
కొత్తగా ప్రేమించుకుంటూ..
సరికొత్త కొత్త గుడ్డుగా మారిపోయాను

ఆ.. నన్ను కన్నతల్లి పక్షి
కవిత్వం…
గుడ్డు గా మారిన ఆ పిల్ల పక్షిని
ఆ..నేనే..ఓ పోయెం

2
ఇప్పుడిక మాటలుండవు.
ఇప్పుడిక చేష్టలుండవు
దూరాలు భారాలు కూలిపోయిన చోట
ద్రుశ్యాలు..కన్నెపిల్లల అందెల శబ్దాన్ని
కొత్త కొత్తగా ధ్వనిస్తాయి.

శబ్దాలు ఎక్కడెక్కడో వెన్నెలకుప్పలై
కొత్త కొత్తగా కనిపించని చీకట్లలో
మట్టి పూలై పూస్తాయి.

సరికొత్త స్వరాలు రాగాలు
కళ్ళముందు నదీమ తీరాల్లో
వలస పక్షులుగా మారి..
ఈకలని..కోర్కెలని ..ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టు
ప్రతి ఒక్కళ్ళదీ..ఎవరికి వాళ్ళు
ఏవరూ గుర్తించని ఎండమావుల్లో నీటికోసం వెదుకులాటే.

స్వర్గం నించి దిగివచ్చిన దేవతలు
వినువీధుల్లో వదిలి వెళ్ళిన పాదముద్రల జాడల్లో
పరిచిత..అపరిచితమయిన నువ్వు
ఇక ఎంతమాత్రమూ కనిపించవు.

సముద్రం మీద పరుగెత్తిన చేప అడుగు జాడల్లో
ఎడారుల్లో పరుగెత్తిన మనిషి అడుగు ముద్రల్లో
కలిసిపోయిన
నీ అడుగుజాడలు ఎక్కడా కనిపించవు.

నా లోంచి నన్ను..నాలోంచి నిన్ను
పోగొట్టుకున్నచోట బూడిద కుప్పగా మిగిలిన
ఆ నేనులో మిగిలిన నువ్వే
నా కవిత్వం.
ఆ మిగిలిన నేనే ఓ పోయెం.
3

శబ్దాన్ని..ద్రుశ్యంలా చూద్దామని
ద్రుశ్యాన్ని..శబ్దంలా విందామని
ఎంత ప్రయత్నించినా కూడా
చిన్నపాటి శబ్దం కూడా ఎక్కడా కనిపించదు.

నా చుట్టూ ఉన్న ప్రపంచం
కార్చిచ్చులో కాలిపోయాక..
మిగిలిపొయిన తాటాకుల వనంగా మారిపోయి ఉంటుంది.

అంతు తెలీని కాంతి సంవచ్చరాల కావలనించి
వినవస్తున్న స్వప్న గానమాధుర్యంలో మునిగిపోయి
నన్ను నేను..నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు
బతుకు ఓడ తెరచాపతో
సుడిగాలి చేసే జీవిత పోరాటంలో
ఆసలు జీవితం తనకు తానే కలలు కంటున్న
నకిలీ జీవితం గా మారిపోతుంది.
పాట పాటగా..తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి
కోరస్ గా మిగిలిపోతుంది
తన జీవితానికి అప్పుడే కొత్త అర్ధం తెలిసిన
సగం చిట్లిన గాలి బుడగ..
పూర్తిగా చిట్లిన గాలి బుడగను చూసి
“అయ్యో” అనిబాధపడటమే ఎవ్వరూ గుర్తించని
అసలు జీవిత విచిత్రం.

ఈ భూమ్మీద ఏదీ తనది కాదనుకుంటూనే
ఇక్కడున్నదంతా మనిషి..
నిర్లజ్జగా పోగేసుకుంటున్నప్పుడు
ఉద్యానవనాలుగా విరబూయాలనుకుంటున్న అక్షరాలన్నీ
గజిబిజిగా సాలెగూళ్ళల్లో చిక్కుకోని
అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోని
విరహ గీతాలుగానో.. విలాపగీతాలుగానో
మిగిలిపోవటమే అసలు కవిత్వం.
ఆ మిగిలిపోయిన నేనే ఓ కవిత్వం ..
ఆ నేనే ఓ పొయెం..
4

నిప్పు..ఎవరిదయితేనేం?నిప్పు ఎక్కడ..ఎవరు జ్వలింపజెస్తేనేం?
నిప్పుకు..కులం లేదు.
నిప్పుకు మతంలేదు.
అపరిమిత ..అపరిచిత హ్రుదయ విధ్వంసంలో
కాళ్ళకింద బద్దలవుతున్న అగ్నిగుండంలో
తనువుల్ని కాల్చిన మాంసపు ధూళిలో
దాచేస్తే దాగని.. సత్యం..
ఆర్పేస్తే ఆరని…నిజం..
కవిత్వం ఒక్కటే ..

అందుకే

వ్రుద్ధాప్యం లేని అక్షరాలకు యజమాని
కవి.. బ్రతికినంతకాలం చిరంజీవుడే ..
అతని కవిత్వానికి ఎప్పుడూ నిత్య యవ్వనమే
*

త్వరలో విడుదల అవుతున్న
“”నేనేమీ మాట్లాడను”” కవితా సంపుటిలోంచి

మొదటి శ్లోకం…

 

 

-హెచ్చార్కె 

~

 

  1. మాలో ఒకరు ఎప్పుడైనా విసిగిపోయి

ఆత్మహత్యించుకుని వార్త అవుతారు

మిగిలినోళ్లం మాత్రం మరణించమా?

అందరం చనిపోతాం

అకాలంగా సకాలంగా

అందాక ధిక్కరించి బతుకుతాం

బతికి వుండటమే మా నిరసన

మమ్మల్ని అసుంటా వుండమనే నిన్ను

ఆసుంటా వుండమనడం ద్వేషం కదూ?

మా స్త్రీలు మీ చెరబడినప్పుడు మా

నొప్పి నొప్పిగా వున్నంతవరకు సరే

అదొక ‘మా నిషాద….’ శోకం కూడా

శోకం ఏ మాత్రం క్రోధంగా మారినా

గల్లీ గల్లీ కి గాంధీ కర్రల రౌడీల్ రెడీ

 

  1. రుతువులు మారుతాయి

ఎండలు వానలవుతాయి

వానలు శీతగాలులవుతాయి

వెలుగును ప్రేమించి ఒక సారి

చీకటిని భరించే శక్తికై ఓ సారి

మమ్మల్ని మేం కూడదీసుకునే

ఆనందాలు మాకు పండుగలు

అవి మెలిపెట్టే మా దుఃఖాలకు

ఒక్క రోజు చిరు విరామాలు

మేము కూడా గొంతెత్తి మావైన

రెండు పద్యాల్ రెండు భక్ష్యాలు

అక్కడ కూడా మీరు తయారు

మేము మొక్కడానికి మీ పాదాలు

విని తరించడానికి మీ వీరగాథలు

 

  1. మేము దేన్ని ప్రేమించాలో

మేము దేన్ని ద్వేషించాలో

ఏం తినాలో ఏమి అనాలో

ఎవరి పేరిట పానకం పంచాలో

ఎవరి బొమ్మల్ని మంటల్లో వేసి

ఎలా కాల్చి చిందులేయాలో

వ్రత నియమాలు నువ్వు రాసి వుంటావు

దాన్ని కాదన్న వాడినెలాగైనా హతమార్చి

హత్య ఎంతటి పుణ్యకార్యమెంత

మహిమాన్వితమో వాడి పిల్లలకు

నప్పి వుంటావు. పూర్వస్మృతులు

వదలని మా దుఃఖ ధిక్కారాల స్వరాల్ని

వధించడానికి

నీ కర్మాగారంలో యుగానికొక జంటగా

రామలక్ష్మణులు తయారవుతుంటారు

 

 

 

  1. నేను ఎప్పుడూ మా నొప్పిని మరవని

మీ పంక్తిలో భక్ష్యం అడగని వాల్మీకిని

నన్ను దగ్దం చేసే మంటల్లో

కణం కణం దగ్ధమవుతూ

మంటల నాలుకలు సాచి

నా  వాళ్లకు చెప్పుకోవలసింది

చెప్పుకుంటూనే వుంటాను

చెప్పడం కోసం మంటలతో పాటు

మళ్లీ మళ్లీ మళ్లీ పుడుతుంటాను.

*

ప్రపంచం బతికున్నంత కాలం

 

-నందిని సిధారెడ్డి

~

 

పడి ఉండడానికి
కాసులా?
పెంకాసులా?

అక్షరాలవి.
ఎగసిపడే మంటలు,
విరిగిపడే ఆకాశాలు.

మూసుకొమ్మంటే మూసుకోవడానికి
లాలి పాపా?
లాప్ టాపా?

కవి ప్రపంచ జీవనాడి.
ప్రకృతి లెక్క పలుకుతనే ఉంటడు,
పరిమళిస్తనే ఉంటడు.
నువ్వేమిటి?
డబ్బులు పోసి
మాటలు పోగేసి
గెలిచిన పార్లమెంటు సీటువు

జీవితం పణం పెట్టి
హృదయాలు గెలిచిన
ప్రపంచసభ నేను.

కవిని కాల్చగలవు
కవిత్వాన్ని కాల్చగలవా?

అధికారముందనేనా?
చట్టం చేయగలవనేనా?

చూపు జిగేల్ మనిపించే
మెరుపును శాసించు!
పువ్వు పరిమళం మోసుకెళ్ళే గాలిని
ఆపు జరసేపు!!

కలం మూయించగలవా?
ఎందరు నియంతలను చూసిందీ కలం,
జమాన జమానాల అఖండజ్వాల కలం.
ఫత్వాలకు వెరవని
నిరంతర స్వరం కవి.

నువ్వెంత?

అధికారం ‌‌—— ఎన్నుకున్నంత కాలం,
అక్షరం    —— ప్రపంచం బతికున్నంత కాలం.

*

ఆ తర్వాత

 

-మహమూద్

~

ఎన్ని కాలాల తర్వాత
నువ్వోచ్చావ్

తోవ మరిచిన గాలి పరుగులా

రాకేం చేస్తావ్ లే
ఇక్కడ గాయపడిన మనో నెత్తుటి స్రవంతి
నీ పాదాల దాకా పాకే ఉంటుంది

ఈ ఊపిరి బుడ్డని ఊదింది నీవే కదా
నీ ఊపిర్లతో

నా కోసం నేను లేననీ
నువ్వు నడవడానికి పరుచుకున్న
మార్గాన్ననీ
నీకు తెలుసు కదా

నీ పాదముద్రల పంటతో పచ్చగా ఉన్న ఈ దారి
నువ్వెళ్ళాక కళావిహీనమైపోయింది

కవితలిక్కడ చిరుమొలకల్లా
పడిఉండేవి

ప్రేమ నిండిన ఊహల గాలిపటాలతో
అలలారే పుడమి కన్నులో
నీ ముద్దుల అచ్చరలు తళతళలాడేవి

మనల్ని మనం మరిచిపోయినపుడు
మీరు మీరని గుర్తుచేసే వాన చినుకులు గుర్తున్నాయా

నా చేతిలో నీ అరచేయి విడిచిన
నీ గుండెలయల కాగితపు పడవలు గుర్తున్నాయా

వర్షంలో నేను తడిచి నా తడి దేహంపై
నిలిచిన వానచినుకుల పడవల్లో వళ్ళంతా ప్రయాణించిన నీ చిలిపి చూపు గుర్తుందా

నీ పరదేశ ప్రయాణం నా ప్రాణంమ్మీదికొచ్చిందని
ప్రణమిల్లేలోగా పయనమైపోయావ్

ఈ వేదనకి నిరీక్షణ అని ఎవరు పేరు పెట్టారో
తెలియదు కాని
ఈ నిరీక్షణ కోసం ఎన్ని వేదనలు పడ్డానో నీకు
తెలుస్తుందా ఎప్పటికైన

ఇలా వాలు గులాబీ మీద భ్రమరంలా
ఎదపైన
కొన్ని గాయాల గజళ్ళు
ఇంకుతాయి నీ ఎదలోన

నా రాత్రి సుదీర్ఘమయినది..

sivalenka10

-శివలెంక రాజేశ్వరీ దేవి

~

 

‘‘రాత్రి చదివేందుకు అట్టేపెట్టాను

ఆ నోబెల్‌ప్రైజ్‌ పొందిన కవిని గురించి రాసిన సంగతి’’

అని నీకు చెప్పినపుడు

‘‘ఇదే కదా రాత్రి ఇంకా రాత్రి ఏమిటీ’’ అని కదా అడిగావు

పదిగంటల సమయంలో

 

నా రాత్రి సుదీర్ఘమయినది

ఇలా నా వెంటరా

నీకు తెలీని రాత్రిలోకి తీసుకువెళతాను

అర్ధరాత్రి దాటిన తర్వాత

ఒకసారి గదిలోంచి బయటికి వొచ్చి

అదేపనిగా ఆకాశాన్ని సంభ్రమంగా చూస్తానా

ఆ తర్వాత కొమ్మలు కొట్టేసినందుకు దిగులుపడుతున్న

ఆ రాత్రిపూలచెట్టుని పలకరించి స్పృశించి

మళ్ళీ చిగురిస్తావు, అపుడు నీ దేహమంతా నక్షత్రపుష్పాల

కాంతితో మళ్ళీ మెరుస్తుంటుంది చూడు అని సాంత్వనపరిచి

ఎవరో దయగా నాటిన

ఆ పారిజాతపరిమళాన్ని లోపలికి తీసుకుని

అంతేనా

 

నా రాత్రి సుదీర్ఘమయినది

నా హృదయం ఆ సమయంలోనే మెలకువతో వుంటుంది

ఆ సంగీత సమ్రాట్‌ స్వరలయలు

మదిలో మెరిసాయా ఇక చెప్పపని లేదు

మన ప్రేమ సత్య సౌందర్య సీమలో ప్రభవించి… ప్రభవించి…

కాల గాఢాగ్ని కీలలో తపియించి… తపియించి

దగ్ధ తరుకాండమగునో అని నిరాశగా

గోపారత్నం పాడుతూ సందేహాన్ని వ్యక్తం చేస్తుంటే

ముగ్ధ మధు భాండమగునో అని పాడగనే

ప్రాణాలు ఎటో వెళ్ళిపోతాయి

 

ఇక ఎందరో కళాకారుల గాన మాధుర్యంలో

రాత్రి వొరిగిపోతుంటుంది

చిత్తరంజన్‌ తలత్‌ బాలసరస్వతీదేవి పాటులు

నెమరువేసే రాత్రి

 

ఇక ఆమె

ఆమె అంటే కేవలం ఆమేనా

ఎన్నెన్నో పాత్రలను తన గళాన పలికించిన

ఒక కళావరణం

కళాత్మక కాంతి మెరుస్తున్న ఒక వలయం

ఊర్వశి పాత్రని తన స్వరంలో

అజరామరం చేసిన ప్రతిభాశాలిని

 

ఇక మరొకరూ

ఆమె మహానటి మాత్రమేనా

దయాస్వరూపిణి

వెన్నెలకాంతిని నింపుకున్న ఆ కళ్లు చివరికి వెలవెలపోయినా

నిజమైన కళాకారుల జీవితాలు

రాలని కన్నీటిబిందువులు అవటానికి

ఆమె ఆ పాత్రల్లో నటించిందా

జీవించిందా అనే సరిహద్దు లేవు

 

నా రాత్రి సుదీర్ఘమయినది

అంతర గంగా ప్రవాహాల్లో మునకలేస్తున్న రాత్రి

నన్ను అపనిందల పాలుచేసే రాత్రి

ఒక రొటీన్‌ అనేది లేకుండా చేసిన రాత్రి

అపహాస్యాలపాలుచేసిన రాత్రి

తమ తమ పాత్రలకు

రూపకల్పనన చేసిన రచయితల పాత్రలతో పాటు

నేనూ ఒక పాత్రనై వాళ్ళవెంట వెళ్ళే రాత్రి

శ్రీకాంత్‌ రాజ్యలక్ష్మి కమలలత సవిత కోమలి అమృతం

వెంటాడుతూ పలకరిస్తారు

అంతర్వేదిలోని వేదనను పాట ఆసరాగా తీసుకుని

కన్నీటితో స్వచ్ఛపరిచే కన్నీటిరాత్రి

కళాత్మక కలలరాత్రి

 

నా సుదీర్ఘ రాత్రి వల్ల నేను పగలు మెలకువగా వుండలేను

ఈ రాత్రిని ఇవాళ వెన్నెల వెలిగిస్తోంది

ఆ వెలుగులో నేను వెలిగి పగటిని చీకటిని చేసి

నేను వెలవెలపోతాను

 

నా రాత్రి సుదీర్ఘమయిన రాత్రి

జాగరణరాత్రి

స్నేహరాత్రి

స్నిగ్ధరాత్రి

స్వప్నాలు పూలలా రాలిపోయిన రాత్రికూడా

ధాత్రిపై దయగా వెన్నెల పాడుతోంది

ఇది వెన్నెల వేళైనా ఇది చల్లని రేయయినా

నిదుర రాదు కనుకు శాంతిలేదు మనసుకు

అందుకే రాత్రి కవితనీ

పగటిపూట వినిపించమని అడగకు నాన్నా

ఇష్టంలేని వాళ్ళు గబ్బిలం అన్నా

ఇష్టంవున్న వాళ్ళు రాత్రిపక్షి అన్నా

పెద్దగా తేడా ఏమీలేదు

నేనే నమూనాలోనూ లేను కనుక

అందుకే రాత్రిని పగలు చేస్తాను

పగటిని రాత్రి చేస్తాను

 

(12.10.2011 శరత్‌ పూర్ణిమ)

చెప్పొద్దులే..!

 

-సాంత్వన చీమలమర్రి

~

ఉహూ నువ్వయ్యుండవులే. ఎర్రటి సాయంకాలాల్ని చల్లార్చే ఆ పొడుగాటి నీడల్లో యేదీ నీది కాదని నచ్చజెప్పుకునే అవసరం పడట్లేదిప్పుడు.

చెవులు రిక్కించటమూ మానేశాను… కొమ్మలు రాసుకున్న అరక్షణం తర్వాత నీ ఇంకొక పాదం చేసే శబ్దం కోసం.

సెలయేరు మోగని చీకటికి అలవాటుపడి బూడిదరంగులో బాగానే ఉంది ఇప్పుడంతా. ఆ మలుపు చివర్నించి ఎగిరొస్తూ ఓ నారింజ జలతారు రెక్కల పక్షి ఎదురైతే అది నువ్వెందుకవుతావూ?

ఒక మాట చెప్పెయ్యనా? వయోలా తీగల్లోంచి వగరు తేనె తెచ్చి, నీ టీకప్పులో కలిపేసి, పొద్దుటికి పారబోస్తూనే ఉంటాను ఇంకా.

నీ పాటనొకదాన్ని సన్నగా చుట్టేసి, అప్పుడు వాడిపోయిన కొన్ని పూలతో కలిపి వాసన చూసుకోవటమూ మానలేకపోయా. ప్రశ్నలు గుచ్చి తెస్తే తెంపేశావుగా. యే పాటో గుర్తుందా అని ఎలా అడగటం?

అడవిలో దారి తప్పి ఎడారిలోకొచ్చి పడ్డాను. ఇపుడక్కడ యే ఋతువో చెప్పొద్దులే నాకు.

నా గాజుపూసలు మాత్రం మొక్కలయ్యాయో లేదో నీ రెక్కల్లో గాలినడిగి ఏం చెప్తుందో వినకుండానే వెళ్ళిపోతానిప్పటికి.

*

కవిత పూర్తికాలేదు

 

-సుపర్ణ మహి
~

 
చలిగాలేదో పేరు పెట్టి
మరీ పిలిచినట్లనిపించింది…
 

రాస్తున్న పుస్తకంలోంచి
తల వాగువైఫుకు తిప్పి చూసాను…
కొలనులో స్నానిస్తున్న చందమామ
అప్పటికే నావైపు చూస్తుండటం కనిపించింది…
 

ఏరోజున ఏం పోగొట్టుకున్నాయో
పగళ్ళంతా వొదిలేసి ఈ మిణుగురులు రోజూ రాత్రిలో వెతుకుతుంటాయి
 

పొద్దున్న కనిపించిన సీతాకోకచిలుక
ఇప్పుడెక్కడుందో,
ఉదయం సరిగా గమనించలేదు
ఇప్పుడు మళ్ళీ వొస్తే బావుండనిపిస్తుంది
 

దూరంగా ఎక్కడనుంచో విన్నపాటే,
అవును బాగా తెల్సిన పాటే,
 

కాసేపు కొలను దగ్గర్నుంచి నన్ను మాయంచేసింది
 

అదెంత చక్కని పాటో!
‘కాలం’ ఓ పేరు చెప్పని ప్రేయసి,
అనుభవం మిగల్చని అనుభూతి
 

ఆలోచిస్తుండగానే బాగా చీకటి ముసిరేసింది.
ప్చ్…
ఇవ్వాళ కూడా
 
కవిత పూర్తికాలేదు.*

నను చూడలేని దృశ్యాలేవో నాలో..

 

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
మండే దీపపు మెత్తని శబ్దంలో
సరసర పాకి పారిపోతున్న సన్నని చీకట్లో
వర్ణాలు వర్షించే రంగుల సవ్వడిలో
రెపరెపలాడే పచ్చని ఆకుల కదలికల్లో
సూర్యతాపం మండుతున్న
వర్ణ రహిత దారిలో …
గబ్బిలపు వింత చర్మపువాపు నేనై…

 

2.
మట్టి పాత్ర నింపుకున్న శూన్యంలో
యింపైన ఆత్మీయ అనుంగత్వంలో
చివరి వరకూ చూసీ తరచిన నృత్తంలో
లోహ నిర్వహణపు నిర్మాణంలో
ముందే ముదుసలౌతున్న గతిలో
జలచుక్కల మబ్బు కణాల
కణతులను తరుముకుంటూ…నేను

 

3.
కఠిన శీతల గోళమేదో
నన్ను కరిగించలేక
అనాత్మిక అంకెలా
ముంపుడు కంచెలలో
ఝంఝాటపు వుచ్చులలో
యే క్రిమియో లోలోనే
తొలిచేసే గుజ్జును …నేనై

 

4.
విసర్జించిన అమలిన జ్ఞానం
ముక్తించలేని సంతోష వదనం
నిర్మోహించే దుఃఖ పటాలాలు
స్వేదజలంలోని యెరుపు ఘాఢత
దహనమూ ఖననమూ కాలేనంత
నిగుడుతనమేదో శిల్పతోరణమై
నెత్తిన మోయలేనంత బరువును మోస్తూ..

 

5.
యిక్కడా…. యెప్పుడూ…
నీలో కురవని తారజువ్వలేవో
కురిపించే వెలుగుల లిపులను లిఖించలేక
పరుగెడుతూ పరుగెడుతూనే
గ్రహాంతరయానంలోకి యెగిరి
వలస వెళుతూ వుంటానూ   ..

*

యిదీ మొదలు …..

 

-నారాయణస్వామి వెంకట యోగి 

~

 

యెలా ఉంటమో,

యేమై పోతమో,  

ఊహించుకోని క్షణాలవి

యెక్కడికి వెళ్తమో

యెవరెక్కడుంటమో 

యేదీ  అస్పష్టంగానే
ఉన్న రోజులవి

పెనుగాలులమై వీచినమో,

జడివానలమై కురిసినమో,

నల్లమబ్బులమై విరిసినమో

కాలం కనికరించని క్షణాలెన్నిటినో

దోసిళ్ళలో పట్టుకుని 

యెదురీదినమో

 

ఇప్పుడంతా,  

భోరుమనే ఆనందమూ ,  

కేరింతల దుఃఖమూ

కలగలిసిన 
ఒక తలపోత.

యెందరిని పోగొట్టుకున్నం,

యెన్ని సార్లు కాటగలిసినం

యెన్ని కన్నీళ్ళు 

మూటగట్టుకున్నం

 

యెన్ని క్షణాలు
యెన్ని నిమిషాలు 

యెన్ని యేడాదులెన్ని యుగాలు

కనుపాపలమీద స్మృతులు 
పూల ముళ్లై,  

విరబూసిన అనుభవాలు 

కవిత్వాక్షరాలై,

చివరికి మనమిప్పుడు 

సముద్రపుటొడ్డున నత్తగుల్లలతో ఆడుకునే

చిన్న పిల్లలం.

 

కలిసి అనుకునే నడిచినం

కలిసిన ప్రతిసారీ
కొంగ్రొత్త  నడకలతో 

కూడబలుక్కునే ప్రయాణించినం.

నెత్తురోడుతూ  రాలిన పూల రెమ్మలను 

మృదువుగా స్పృశించి

చెంపల మీద యెండిన నీటిచారికలకు

హత్తుకున్నం.

కంకర రాళ్ళూ,  పల్లేర్లూ గుచ్చుకుని 

చిట్లిన పాదాలకు 

చిరునవ్వుల లేపనాలు పూసుకున్నం.

అలసిపోయిన ప్రతిసారీ

ఇదే మొదటాఖరి మెట్టు అనుకున్నం.

గమ్యం కనబడని ప్రతిసారీ

పుస్తకాల్లో దాచుకున్న 
బంతిపూల రిక్కల్ని 

తడిమి చూసుకున్నం.

చాలాదూరం వచ్చేసామా మనం?  

లేదూ నీకు,  నాకూ,  మనకూ 

ఇదేనా మొదటి అడుగు?

ఇప్పటికీఇన్నేళ్లకీ 

మనం కలిసే నడుస్తున్నాం కద

ఇదీ,  నిజమైన ప్రారంభం.

రా,
మరో సారి
సరికొత్తగా మొదలు పెడదమా

మన అలుపులేని 

ప్రాచీన ప్రయాణం

 

(సుధాకిరణ్ కి ఆత్మీయంగా)

What can a poem do?

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-లాలస

~

 

ఏదో నకలు లాంటి రాత్రి తన నక్షతాలతో మెప్పించనూ లేదు

కళ్లెదుటే ఉంటుంది

కానీ జీవితం గింగిరాలు తిరుగుతుంటుంది

ఎవరి నీడనైనా వారి నుంచి కత్తిరించే సాధనమెక్కడ

నిర్వేదాల. నిర్విరామాల, అలసటల ప్రతిబింబాల నడుమ

పగటితో మాత్రం ఏం లాభం

 

లేదా? సరే

 

ఒక విరహ వేదన పలుకుదామని గొంతు సవరించుకుంటుంటే పాట గబుక్కున పెదాల నుంచి అమాంతం కిందకు జారిపోయింది. ఏమనుకోవాలి ప్రియా.. ఇవాళ రాత్రి ఇక్కడ వాన కురిస్తే. ఒక్క వాన చుక్క నా కణంగా మారదూ? మధ్నాహ్నం దాటింది. ఆకాశంలో నీరెండను దాటి మళ్ళీ మరో తోటలోకి వాన ఒకటి నెమ్మదిగా బయలు దేరింది పెత్తనానికి. ఉత్తినేగా..  ఈ సారైనా వేనవేల సంవత్సరాల జ్ఞాపకాల జడివానై చుట్టుముట్టేస్తుందా లేదా?.

జీవితానికి ప్రేమలేఖ రాసిన సంబరం చేయడానికి మహా కవులున్నారా.. ఉత్తరంతో పంపేందుకు  తోటలో సరిపోయినన్ని పూలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే..

హృదయమొక పరాయి గడ్డ

అక్కడేమో

దీర్ఘరాత్రి పున్నమి చంద్రుడు రకరకాలుగా ఉంటాడు.

నగరానికి కనిపించని సిరివెన్నెల కనిపించని పర్వతాల మీద పడుతుందేమో.

ముభావ వెన్నెల చిగురు గాయం మీద

సొగసైన వెన్నెల పూల మీద

అధునాతన వెన్నెల ఆలోచనల మీద పడుతుందేమో

 

కానీ

తనకు తానే పరిచయం కాలేని పరాయి గడ్డ హృదయం మీద

పడేది వేదనల వెన్నలే

 

అపుడెలా ఉంటుందంటే

మధుర గళాలు మరణిస్తే నెమరువేసే జ్ఞాపకమైన సంగీతంలా.ఆ సంగీతం విగతజీవులైన గులాబీ పూవులే మృతుల కంఠమాలలుగా మారినట్లే ధ్వనిస్తుంది.  కళ తడారిపోయినపుడు ఆత్మలు మగత నిద్ర పోతాయి. పూలూ, వానలూ, కడలీ, గాలీ ఏమున్నా అవి పుడమి గీతాలను శ్వాసించలేవు.

 

మధ్యలో సగం చందమామలను వదిలేస్తూ తెల్లకాగితం మీద నడుస్తుంటుంది కవిత. దానిని నదిలోకి ఒలకబోసి గుర్తుంచుకుంటానని చెప్పాలి.

ps

లైఫ్ .. నీ టచ్ స్ర్కీన్ నా రింగ్ టోన్ హృదయం

Because i am writing you my dear  poem will you go to life to bring back LIFE?

*

శిశిరరేఖ

 

 

– ప్రసాద్  బోలిమేరు

~

ఓ పక్క
రాగాలు
పండుటాకుల్లా రాలి తేలుతుంటే
ప్రతికొమ్మా ఓ వాయులీనమే
వెర్రెక్కిన గాలికుంచెకు నేలనేలంతా
రాగక్షేత్రమే
 
మరోపక్క
వగరెక్కిన మోహం
పాటలపులకింతగా
రెమ్మరెమ్మా ఓ సింగారగానం
 
కాదా?
ఈ రుతువుల స్వరమేళనం
పురాతనగేయపునర్నవీకరణం
పులకరిస్తున్నప్రాణానుకరణం
పురిటినొప్పుల బృందగానం
 
ప్రతి సీతాకోకచిలుకా
నిలకడ లేని ఓ వన్నెల ఆలొచనే
రేపటివిత్తుని మోసుకెళ్తున్న
ఓ పరాగరేణువే
ప్రతి ఫలమూ ఓ పువ్వు ధ్యానమే

ప్రతి ఆరాటం
వీడుకోలు, ఆహ్వానాల సంయోగం
శిశిర పవనాల నీడ
వసంత కవనాల జాడ
చూలాలి బుగ్గ మీది

తీపి ఏడుపు చార.

నిన్నటి విషాదగానం గుర్తులేకుంటే
రేపటి నిషాద గీతాన్నెలా గుర్తుపట్టాలి?

*

మజిలి

 

 

– ఊర్మిళ

~

 

ఓ ముడుచుకున్న

మాగన్ను దావానలమా!

ఓ తిరగబడ్డ కాలమా!!

మరీచికా గగనమా

శూన్యం నిండిన విశ్వాంతరాళమా!

ఖండఖండాలుగా

స్రవించిన రుధిరమా!

వలయ వలయాలుగా

ఘనీభవించిన దేహమా!!

వెయ్యిన్నొక్క అలలుగా

ఎగసిన ఆశల శిఖరమా!

అగాథం అంచులో

వేలాడుతున్న జీవిత చక్రమా!

పిడచకట్టిన కుహరంలో

తిరగాడుతున్న దాహమా!

ఎండిన మొండి మానుపై

తెగిపడిన గాలిపటమా!

శ్మశాన సమాధులపై

లిఖించిన మోహగీతమా!

పేర్చిన చితిమంటలో

ఎగసిన మమతల మకరందమా!

సూర్యాస్తమయాల కౌగిలిలో

నలిగి నర్తించిన కాంతిపుంజమా!

పెనుగాలి తుపానులో

సుడులు తిరగాడిన విహంగమా!

కారుమబ్బుల కారడవిలో

నిటారుగా నిలిచిన తిమింగలమా!

మొగ్గ తొడిగిన మామిడి చెట్టుపై

ఊయలూగుతున్న నిశాచరమా!

ఒగ్గిపట్టిన దోసిలిలో

రాలిపడిన ధూళి లేపనమా!

గరకు తేలిన నేలపై

పరుగుపెడుతున్న పాదరసమా!

పూపుప్పొడిలా

రాలిపడిన నిశి నక్షత్ర సంయోజనమా!

పొద్దు తిరుగుడు పువ్వులో

పారాడిన పసరికమా!

విచ్చుకున్న ఉమ్మెత్త పొదిలో

విరబూసిన పచ్చగన్నేరు లాస్యమా!

 

ఏది నీ మజిలీ!

బాటసారి దారి పొడవునా…

గిరకలేని బావులే కదా..! *

*

 

సంభాషణలు

-అవ్వారి నాగరాజు
~
ఎవరమైనా ఎలా చెప్పగలం
తాత్విక ప్రశ్నల సుడుల నడుమ గింగిరాలు కొడుతూ
మూగిన పంథాల చిక్కుముడులలో ఉక్కిరిబిక్కిరిగా
కాలాకాలాల నడుమ గీతలు గీస్తూ చుట్టుకొలతలు తీస్తూ
అప్పుడప్పుడూ ఒక నిట్టూర్పునో మరింకో దాన్నో
జరగండహో జరగండని దారి చేసుకుంటూ
మనమూ ఉన్నామని చెప్పుకోవడానికి ఆదుర్దాపడుతూ
మన పనిలో మనం నిత్యం నిమగ్నమై ఉంటాం కదా
దేహాలని పగల చీల్చుకుంటూ
సందర్భాసందర్భాల నడుమ తమను తాము పేని
ఊపిరి కదలికలకు చలించే వో సంకేతంలాగా  కాకుంటే ఇంకేదో స్ఫురించని సుదూరపు ఊహలాగా
ఏదో వొక క్షణంలో
ఎవరొస్తారో తెలియదు కానీ
ఇదుగో ఇట్టాగే చప్పున చొచ్చుకొని వొచ్చేస్తారు
అలా వొచ్చేదాకా
చావు మన అర చేతుల మీద ఇగరని నెత్తుటిమరకలను అద్ది పోయేదాకా
వొక తెర చాటున నక్కిన మాయోపాయి వేసే
ఆట్టే తెలియని సహస్ర శిరచ్చేధ చింతామణి ప్రశ్నలలాంటివేవో ముఖాల మీద పెఠిల్లున చిట్లేదాకా
ముసిరిన సంభాషణలకు
అటూ ఇటూ తిప్పి చూసుకొనే దిగ్భ్రాంతీ దుఃఖమూ తప్ప
ఇదమిత్తంగా ఇదని చెప్పలేము కదా

జ్ఞానవృక్ష ఫలాలను కోసుకుందాం రండి!

 

 

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

~

 

ప్రకృతినీ-వినీలాకాశాన్నీ-వింత వింత నక్షత్రాల్నీ

వీక్షించిన బుద్ధి కుశలత ‘హోమో సేపియన్స్’ దే కదా!

విరోధాభాసమంతా  స్వర్గమూనరకాల భ్రమల తర్వాతే !

 

జ్ఞాన వృక్షపు నిషిద్ధ ఫలాల్ని తిన్నతర్వాత

లాటిన్మృతభాషలో పారడైజ్ పిట్టకథలు  తెలిసినట్లు

న్యూటన్గతి సిద్ధాంతపు కక్ష్య యంత్రగతిని జాగ్రత్తగా లెక్కించిన చోటే

ఆధునిక రోదసీ పథనిర్దేశానికి ఇస్రో తిరుపతి కొండలెక్కుతుంది…

 

శాస్త్రీయతను ధ్వనించే  శబ్దాలతో సైంటిస్టులే

సత్తాలేని సరుకుల లేబుళ్ళకు  సైన్స్ నామాలు పెడుతున్న దేశంలో

వేలెడంతలేని  ‘నోబెల్’ రామకృష్ణన్

ఏనుగంత  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను వింత సర్కస్ అనేశాక

ఆవిరైపోయిన తర్కం గురించి ఎవరితో మాట్లాడతాం !

 

‘కఫాలా’ కు ఆధునిక బానిసత్వం పేరుపెట్టి

భాషరాని శ్రామికులను-మనసు భాషరాని ఇసుక కోతుల మధ్యకు  తరిమినట్లు

భావ దాస్య ముష్కరంగా మార్చిన పుష్కరంలో

జ్ఞానస్నానం పొందాల్సిన తెలుగు జీవితాలు  ఉత్తపుణ్యాన నీటిపాలు..

బౌద్ధభూముల అమరావతిలో భూసూక్తం చదివిన చందాన

అశాస్త్రీయ పద్దతిలోమాయని లాగితే చిట్లిన గర్భకోశంపై ఏం మాట్లాడగలం!

 

‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ లా ఫోజులు కొడుతూ

సిలికాన్ మురిక్కాలువలా ప్రవహించే  కొత్త రాష్ట్రంలో

ప్రాంతీయ సామంత రాజొకడి  పిలుపుమేరకు

నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత  పోరాటం

బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం  పాలు..

ఆల్ ఈజ్ వెల్ ! ఆగ్నేయంలో మాత్రం అగ్ని ప్రమాదం..

 

‘అసహనం చెంప దెబ్బకు లక్ష నజరానా’  పొందినంత ఆనందంగా

తెలంగాణ జర్నలిస్టుల జాతరకెళ్ళిన  ప్రెస్ క్లబ్ స్కీటర్లు

సరళాదేశ సంధి జరిగి  ‘సరళమే ఆదేశంగా’ నిష్క్రమించడం విచిత్రం..

సత్యాన్ని ప్రశ్నించని శతాబ్దాల మహాయానంలో

అసత్యం పై ఇండియన్  ఫోరంల మీద  ఏంజెళ్ళలా నటించే

డక్కన్  మేధావుల  వ్యూహాత్మక మౌనం మరీ విచిత్రం..

 

రొట్టెనడిగితే రాయి నిచ్చిన తర్వాత

కట్టని గుళ్ళూమసీదులకు నజరానాల గానా బజానా తర్వాత

నిరసన సమూహాలకు ప్రకటించనున్నది భారీ అసహాయం..

నైరుతి రుతుపవనాల్నీ ఎల్ నినో ‘చేపమందు’లా వేసుకుందని తెలిసి

విత్తిన నేలే  తక్కువని సర్కారే  నట్టూవాంగం వాయించాక

విత్తినవాడి గుండె  పఠాన్ చెరువు కాకుండా ఉంటుందా!

బతికి బట్టకట్టిన రైతుకోసం ఖరీఫ్ పంట కత్తి దూసే ఉండదా!

ఖాళీ కడుపులతో  ఏం ఫిలాసఫీ మాట్లాడతాం !

 

దేశమనే కంద పద్యంలో

దోషమే కనబడని ఆషా వర్కర్లు  నిషిద్ధ గణం

దిశ తెలియని ఆధిపత్యం దిమ్మతిరిగే యాగాలకు ప్రాపకం!

ఆకలి ఆత్మల బుజ్జగింపుకు ఖుర్బానీలుగా- తాయెత్తులు కాశీ తాళ్ళుగా

మారే పేదల సంతలపై ఏ నిషేధాల లాజిక్కులు మాట్లాడతాం!

సంధి కుదరనప్పుడు తప్పదులా వుంది విసంధి  దోషం !

రాష్ట్ర ప్రాయోజిత చీకటిలో ఇప్పుడు తెలుగు జనం !!

 

( హేతువాద ఉద్యమంకోసం తీవ్రంగా కృషి చేసిన దళితనేత  కత్తి పద్మారావుగారికి)

-తుల్లిమల్లి  విల్సన్ సుధాకర్

09538053030

 

ఒక బందీ కథ!

 

-అరుణ గోగులమండ

~

 

ఆమె..
అద్దాలమేడలాంటి అందమైన లోగిలిలో
నగిషీ పట్టిన బొమ్మల్లో ఓ అందమైన బొమ్మగా
ఆమె కదులుతుంటుంది.
యెత్తైన గోడల ఆవల-
కట్టుదిట్టమైన భధ్రత మధ్యన
ఖరీదైన ఖైదీలా
ధిలాసాగా బ్రతుకుతుంటుంది.
తులసికోట పూజలూ లెక్కలేనన్ని వ్రతాలూ
దీపారాధనలూ, మడీ తడీ ఆచారాల్లో
తన ఉనికిపట్టు మర్చిపోయి,
మసిబారిన దీపపు సెమ్మెలా,
అఖండజ్యోతిలోని ఆరిపోని వత్తిలా
నిరంతరంగా కాలుతూ
రెపరెపలాడుతూ బ్రతుకీడ్చుతుంటుంది.
సాంప్రదాయపు పంజరంలో
పంచదార చిలకలా-
ప్లాస్టిక్ నవ్వుల్నియెండినపెదవులపైపూసి
నిప్పులుకడిగే వంశాల అసలు కధల్ని మరుగుచేసే
నివురుగా మిగులుతుంది.

 

ఊరిచివర విసిరేసిన
చీకటిగుడిసెల సముదాయంలో
మట్టిలో మకిలిలో
పేడకళ్ళెత్తుతూ కట్టెలు చీలుస్తూ
తాగుబోతు మొగుడి దాష్టీకానికి బలైన
ఆమె వెన్నుపూస.వాతలుతేలిన ఒళ్ళు
చేవలేని యెముకలపై వేలాడుతున్న చర్మం.
అంటరాని వాడలో..అగ్రకులపు అహంకారంతోయేకమై
తమ పురుషాహంకారం సైతం..
వెలివేసిన ఆడతనం ఆమెరూపం.
చీత్కారాలు మింగుతూ
బలత్కారాల శిలువల్ని
ఇంటాబయటా నిర్వేదంగామోస్తూ,
నాట్లలో కోతల్లో
తమ బ్రతుకుల్నే పాతేసుకుని
మొలకెత్తడం మరచిన నిర్జీవపు విత్తనంలాంటి ఆమె
తరతరాల బహురూపపీడనా పర్వాల
మూర్తీభవించిన నగ్నత్వం.

తానుండే ఇంటిలాగా
తమ ఉనికినిసైతం ఎత్తు గోడల ఆవల మూస్తూ
మూడుసార్లు బొంకితే ఓడిపోయే కాపురాల్ని,
తుమ్మకుండానే ఊడిపోయే భరోసాలేని జీవనాల్ని
బురఖాల మాటున దాచి..
లిప్ స్టిక్ రంగుల చాటున పెదవుల నిర్వేదాన్నీ
నల్లని సుర్మాలకింద ఉబికొచ్చే కన్నీటినీ
అదిమిపట్టి బ్రతుకుతూ..
మతమౌఢ్యపు తంత్రాలకు బలైన
పాతకాలపు యంత్రం ఆమె.

అందమైన శరీరాలనే అద్దింటి బ్రతుకుల్ని..
యేడాదికోసారి కనిపించిన భర్తల యాంత్రిక కాపురాల
గురుతుల పెంపకంలో ఖర్చుచేస్తూ
రోజుకైదుసార్లు పిలిచినా
బదులివ్వని దేవుడికి నిష్టగా మొరపెడుతూ..
నల్లటిపరదాల మాటున
మతం మత్తు ఇరికించిన
ఊపిరాడని దేహంతో
చాందసవాదపు చీకటికి అనాదిగా బందీ ఆమె.

తమదనే బ్రతుకేలేని అతివల బ్రతుకు చిత్రపు నలిగిన నకలూ
గెలుపెరుగని తరతరాల శ్రమజీవీ
నిలువెత్తు పురుషాహంకారం నిర్మించిన
నిచ్చెనమెట్ల సమాజంలో కొట్టేయబడ్డ మొదటి మెట్టూ
హక్కుల లెక్కల్లో అట్టడుగుకు నెట్టేయబడి,
కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
అసమాన ప్రతిభాశాలి

మె.

*

 

అపరిచయం

 

   -ఇంద్రప్రసాద్

~

 

రోజూ కనిపిస్తూనే వుంటాడు
మధ్యాహ్నం భోజనాల వేళ
వేణువూదుకొంటూ
ఎండలో నడుచుకొంటూ

మళ్లీ యింకో గంటపోయేక
తిరుగు ప్రయాణంలో
అరుగుమీద
పుస్తకం చదువుకొంటూన్న
నన్ను చూసి నవ్వుతాడు
పలకరింపుగా

పేరెప్పుడూ అడగలేదు
ఏం చేస్తాడు తెలుసుకోలేదు


ఆయన పేరూ తెలుసు
కవిత్వమూ తెలుసు
ఒక సారి కలుసుకొన్నాం
ఆప్యాయంగా పలకరించేడు
మళ్లీ మరో కవుల సభలోనే
కలిసేడు
పలకరించుకున్నాం

దూరాంతరవాసంలో
ఇప్పుడు పుస్తకం చాలా దూరం
కవులూ, సభలూ యింకా దూరం

నిన్ననే తెలిసింది
మరి కవి సమ్మేళనానికి
ఆయన రారని
మురళి యింక వినబడదని.

*

పగటి కలలు మనకెందుకు?

 

-నిర్గుణ్‌ ఇబ్రహీమ్‌

~

 

ఇప్పుడు కవిత్వం

ఒక గ్యాంబ్లర్‌ ఎక్స్‌పోజర్‌

 

గుండె అరల్లో జ్ఞాపకాలు చితుకుతున్నప్పుడో

కాలం బతుకుమీద కన్నెర్ర చేసినప్పుడో

కసాయితనం బతుకులమీద కత్తులు దూస్తున్నప్పుడో

పారే నెత్తుటి ఆవిర్లను కబళిస్తున్నప్పుడో

చెమ్మను తడుముకునే అక్షరాలు

సమూహ కదనాళికలో పురుడుపోసుకునే కావ్యం

ఎనకటెప్పుడో

మా తాత ముత్తాతల కాలాన

గుండెలమీద వాలి

గుర్తుల్ని వదిలి ఎగిరినపిట్ట

 

యీయేల అది

కూర్చుకుంటున్న ఒప్పందాలమీద

కూతపెట్టుతున్న పిట్ట

కాలం మీద రెక్కల్ని ఝళిపిస్తూ

ఆర్బాటాల హంగుల్లో

కృత్రిమ రాగాల్ని అల్లుతుంది

 

బతుకు దర్పణమయ్యేది కవిత్వమా?

బతుకుని మాయాదర్పణం చేసేది కవిత్వమా?

సందిగ్దం వీడి

గుండెలు ఆకాశమై కూయాలి!

 

కరెన్సీ కట్టల మాటున

మగ్గుతున్న అక్షరం

పచ్చనో్ట్ల కంపుకొడుతుంటే

రెక్కలొచ్చింది హైడ్రోజన్‌కే కదా అని విస్తరించనిద్దామా?

 

అదేమైనా ఆక్సిజనా?

ప్రాణాలకు పురుడు పోసేందుకు!

 

రూపాయినోట్లు అలుముకుంటున్న అక్షరాలను

కలల వీక్షణంలో విహరించనివ్వకండి!

చెదిరే నిద్రకు అదృశ్యమయ్యే

పగటి కలలు మనకెందుకు?

 

కవిత్వమంటే…

ప్లాస్టిక్‌ పూలగుత్తులు కాదు

 

కవిత్వమంటే…

విరబూసిన పూలపరిమళాలను

మనందరికి పంచే సమీరాలు!

 

కవిత్వమంటే….

శ్రామికుని చెమటలో పురుడుపోసుకున్న

అర్థాకలి పాట!

*

ప‌గిలిన దేహ‌పు ముక్క‌

 

 

శ్రీచ‌మ‌న్

~

ముఖం నిండా నీరింకిన‌
వాగులు వంక‌లు.
లాక్మే లుక్‌లోంచి
ఓ నిర్జీవ సౌంద‌ర్యం.

ముఖాల‌ ముక్క‌లు
అద్దానికి అతుక్కుపోయి
నెత్తురోడుతున్నాయి.
న‌రాల బంధం తెగినా
ఆశ అర్రులు చాస్తోంది.

విరిగిన గాజు ముక్క చివ‌ర‌
ప‌గిలిన  దేహ‌పు ముక్క‌
బొట్టుగా బొట్టుగా జారుతూ
కాన్వాస్‌పై ఓ విషాదచిత్రం

గ్రూపులు గ్రూపులుగా ర‌క్తం
అమ్మ‌కానికి, దానానికి.
నెత్తురులో కులాలు ఏబీసీడీ..
ఓ పాజిటివ్..మ‌రి ఓ నెగిటివ్ దృశ్యం

కొన్ని భ‌గ్నక‌ల‌ల
న‌గ్న‌రూపం
దృశ్యాఅదృశ్య గోచ‌రం
త్రీడీ యానిమేష‌న్ డైమెన్ష‌న్

*

కొన్నిసార్లు ఇలా కూడా..!

 

     – రాళ్ళబండి శశిశ్రీ

~

1.రాకపోకలన్నీ
పూర్తిగా అర్ధరహితమేమీ కాదు
ఆమోద తిరస్కారాలలో
అదుపుతప్పే గుండెలయ మాత్రమే
అర్ధరహితమైనది!

2.మోహంగా పరచుకున్న మోహనకి
నిరాశగా అలముకున్న శివరంజనికి
మధ్య ఒక్క గాంధార భేదం –
సంతోష దుఃఖాలను వేరుచేసే
చిన్నగీత మాత్రమేనా?!
అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్య
కదిలే భారమైన సంగీతం!

3.కొనగోటికి తగలని
కన్నీటిబొట్టు మహసముద్రంగా
వ్యాప్తి చెందకముందే
ఆలోచనలను ఆవిరిచేసేయ్యాలి
తడిగుండెకు ప్రవహించడమెక్కువ!

4.విస్ఫోటించిన అనుభూతుల సంలీనం
చెల్ల్లాచెదురైన గుండె శకలాల
మధ్య కూడా చిధ్రం కాని వ్యామోహాలు
సున్నితత్వానికి సమాధి కట్టడం సాధ్యం కాదేమో!?

5.అప్పుడప్పుడూ మనసుగదికి
తాళం వేయాల్సిందే
దృశ్యాలను మరుగుపరచందే
గాయాలకు మందు దొరకదు మరి!

*

శ్రీకాంత్ కవితలు మూడు…

 

-శ్రీకాంత్
~
 
1.
రాత్రికి ముందు కాలం
రాత్రికి ముందు కాలం:

లోపల, ఎవరో అప్పుడే వీడ్కోలు పలికి వెళ్ళిపోయిన నిశ్శబ్ధం.
ఖాళీతనం –
***
ఇంట్లో నేలపై పొర్లే, గాలికి కొట్టుకు వచ్చిన ఆకులు:పీల గొంతుతో –
ఒక అలజడి. దాహంతో పగిలిపోయిన మట్టి.
రోజూవారీ జీవనంతో పొక్కిపోయిన హృదయం –

బల్లపై వడలిన పూలపాత్ర. మార్చని దుప్పట్లు. బయట, ఇనుప
తీగపై ఆరి, ఒరుసుకుపోయిన దుస్తులు. ఇక
ఎవరో అద్దంలో చూసుకుంటూ నొసట తిలకం

దిద్దుకుంటున్నట్టు, నెమ్మదిగా వ్యాపించే చీకటి. రాళ్లు. ఇసిక –
గాజుభస్మాన్ని నింపాదిగా తాగుతున్నట్టు, ఒక
నొప్పి. తపన. ఒంటరిగా జారగిలబడే చేతులు –

ఇంటికి చేరే దారిలో, ఎవరిదో పాదం తగిలి పగిలి పోయిందీ మట్టికుండ.
ఇక
***
అల్లల్లాడే
పగిలిన పెదాలకు, ఒక్క నీటి చుక్కయినా దొరకక, పిగిలిపోతూ
ఈ రాత్రి

ఎలా గడవబోతుందో, నాకు ఖచ్చితంగా
తెలుసు.

 
2.

బొమ్మలు

విరిగిన బొమ్మలని అతక బెట్టుకుంటూ కూర్చున్నాడు
అతను –
***
బయట చీకటి. నింగిలో జ్వలిస్తో
చందమామ. దూరంగా ఎక్కడో చిన్నగా గలగలలాడుతూ

రావాకులు –

వేసవి రాత్రి. ఎండిన పచ్చిక.
నోరు ఆర్చుకుపోయి, నీటికై శ్వాసందక ఎగబీల్చె నెర్రెలిచ్చిన
మట్టి వాసన –

ఇక, లోపలేదో గూడు పిగిలి
బొమ్మలు రాలి, విరిగి కళ్ళు రెండూ రెండు పక్షులై పగిలిన

గుడ్ల చుట్టూ

రెక్కలు కొట్టుకుంటూ
ఎగిరితే, అడుగుతుంది తను అతనిని చోద్యంగా, దిగాలుగా
చూస్తో –

“ఎప్పటికి అతికేను ఇవి?”
***
అతికీ, మళ్ళీ ముక్కలుగా
చెల్లాచెదురయిన హృదయాన్ని తన అరచేతుల్లో జాగ్రత్తగా
ఉంచి

విరిగిన వాక్యాలనీ, అర్థాలనీ
అతి జాగ్రత్తగా జోడిస్తూ, అతక బెట్టుకుంటూ మారు మాట్లాడకుండా

అక్కడే కూర్చుని ఉన్నాడు
అతను –

3

రాతి పలకలు

నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసాడు అతను: లోపల
గ్రెనైట్ పలకలుగా మారిన
వాళ్ళ వైపు-
***
వేసవి రాత్రి. నేలపై పొర్లే ఎండిన పూల సవ్వడి. తీగలకి
వేలాడే గూడు ఇక ఒక వడలిన
నెలవంకై –

దాహం. లోపల, నీళ్ళు అడుగంటి శ్వాసకై కొట్టుకులాడే
బంగారు కాంతులీనే చేపపిల్లలేవో:
చిన్నగా నొప్పి –

సుదూరంగా ఎక్కడో అరణ్యాల మధ్య ఒక జలపాతం
బండలపై నుంచి చినుకులై చిట్లే
మెత్తటి స్మృతి –
***
నిస్సహాయంగా వాళ్ళ వైపు, పాలరాయిలాంటి తన వైపూ
చూసాడు అతను: ఆ రాళ్ల వైపు –
ఇక, ఇంటి వెనుకగా

ఇసుకలో ఉంచిన మట్టికుండ చుట్టూ చుట్టిన తెల్లటి గుడ్డ
తడి ఆరిపోయి, నెమ్మదిగా కుండను ఎప్పుడు
వీడిందో

ఎవరికీ తెలీలేదు.

మిడ్ నైట్ బ్లూస్

 

 

-బ్రెయిన్ డెడ్ 

~

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

అర్త్ధరాత్రి హౌరబ్రిడ్జ్కింద గుర్రం గజ్జెల్లా

మిడిల్ క్లాస్ ముషాయిరా

పరాకులు పలకరింపులు

జీవితాంతం ఒకరికొకరి ఏడ్పుల గుస్థాకీ

కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే

బుల్షిట్  ప్రేమ లేదంటారేమిటిరా

తూరుపు సింధూరపు ముఖారవిందాన

చెమటల ఉప్పులూరుతూ

నాన్ స్టిక్ ప్యాన్లో రిలేషన్షిప్ స్టిక్ చేసుకోవడానికి

తిరగబడుతున్న  హాఫ్ అండా ఫ్రై

వెలిగారుతున్న వైబ్రేటర్ మసకల్లో

గర్ల్ ఫ్రెండ్కో ముద్దు గ్లాస్ ఫ్రెండ్కో హద్దు పెడుతూ

జ్వరంతో బెంగటిల్లిన బేబీ డైపర్లో బ్రతుకర్ధం వెతుక్కుంటూ

ఎండిపోయిన ఎర్ర మిరపగాయ ముఖాన నిలబడిన

ఏకాకితనాన కానరాలేదా

ఏక్ చుట్కీ సింధూర్కి కీమత్ ఎంతో రమేష్బాబు

 

నిజమేన్రోయి !

సిగరెట్‌ తాగనోడు దున్నపోతై పుట్టున్‌

సిగరెట్బట్లు మారుతూ ఉంటాయి యాష్ ట్రేలలో

బట్లు మారుతూ ఉంటాయి బాంబే డైయింగ్ నేతల నునుపుల్లో

ఒకరికొకరు తోడై ఉండిన అదే స్వర్గపు పానుపుల్లో

పరంతూ ,గాలుల్లో కలుస్తున్న పొగలు

ఉక్కిరిబిక్కిరి చేసే సంభందాలంత స(అ)తీ సహజమేగా

మై డియర్ గిరీశం , మైండ్ యా  రిలేషన్షిప్ స్టేటస్ ఆల్వేస్ కాంప్లికేటెడేనోయి

 

సబ్జెక్టివిటీ కరువైన కథలు డామిట్!  అనేసి అడ్డం తిరిగినప్పుడు

ఆదర్శాల అబ్జేక్టివిటీ  వెతక్కువాయి ముదుర్రాయి

పళ్ళుడగొట్టుకున్న శతకోటి బోడిలింగాలలో నీదో

పగిలిన హృదయం మాత్రమే

ప్రేమెందుకు లేదరాభై

పడకింటి పవళింపు సేవలలో  అనుకోకుండానో ,

అనితరసాధ్యంగానో కారిన

ఆ నాలుగు చుక్కలు  ప్రేమకేగా లైఫోటి క్యారుమన్నది

ఓపెన్ మైండెడ్ బైయాస్డ్ జిందగీలలో చివరకిమిగిలేది అదే సుమీ

 

డార్న్

అటు తిరిగిపడుకోవడంలోను నిరాశేనా

అసహనపు ధర్మయుద్ధం చివరాకరు ఆయుధం కాబోలు

బయటెక్కడో ఎవడో ఫ్రస్త్రేటెడ్ సోల్ కోక్ టిన్ను లాగిపెట్టి తన్నిన శబ్దం

దునియా కా క్యా సునేగారే  భాయ్ జరా ఖుద్కా ధర్డ్ సునో

కోక కోసమో కొకైన్ కోసమో ఫటక్ ఫటక్ మని గుండెపగలగొట్టుకొని బయటికోస్తున్న ఎమోషన్నో క్షణం మోసిన తుది సెకండ్లో

జబ్ కోయి బాత్ బిగడ్జాయే జబ్ కోయి ముష్కిల్ పడ్జాయే

తుం దేనా సాత్ మేరా ఓ హం నవా !

 

ఒకేమారు ఇటు తిరిగి హత్తుకోవా ప్రియా

మరెప్పుడు మౌనాన్నే కాదు మరణాన్ని సైతం మన మధ్యకి రానివ్వనని మాటిస్తాను

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

నిశీ !! 23 /02/ 16

 

గాయం ఒక ట్యాగ్ లైన్..

– శ్రీకాంత్ కాంటేకర్

~

చినుకూ, చిగురాకూ
నీ పెదవులపై తడిసీ తడవని నీటిబొట్టూ

కాలిగజ్జె ఘల్లుమన్న..
జీవనశ్రుతీ.. లయతప్పి..
ఓ పూలరథోత్సవం.. పరిసరా!!
ఈ గుండె మీది నుంచి వెళ్లిపోయింది
సంతాపంగా చినుకు పూలు చల్లి..

లోపలంతా చీకటికూకటి నృత్యం
పగళ్లపై బృందావనీ సారంగి పరవళ్లగానం
నీ గుండె నా శరీరంలో

నిస్సహాయపు నీటిచినుకు
నీ కొనవేలిపై కొనకాలపు
కోటి ఊసుల ఊగిసలాటలో
నీ కొంగు చిక్కుముడిలో
నీ చూపు మెరుపు ఒంపులో

గాయం ఒక ట్యాగ్ లైన్
దేహం ఒక హెడ్ లైన్
ఎవరిని దాచుకున్నానో
గాయం, దేహం మధ్య
నేనొక మిడ్ లైన్

తడిలేక తపస్వించి
టప్పున రాలిపోయిందో చినుకు
చివరాఖరి చూపు నుంచి..
పరిసరా..!!
నేనెవరి బతుకులో తప్పిపోయిన క్షణాన్నో..
తలుచుకోని మాటనో..
రాయని నిశ్శబ్దాన్నో..
రాతి గుండెపై నక్షత్రాన్నో..

*