ఒక బందీ కథ!

 

-అరుణ గోగులమండ

~

 

ఆమె..
అద్దాలమేడలాంటి అందమైన లోగిలిలో
నగిషీ పట్టిన బొమ్మల్లో ఓ అందమైన బొమ్మగా
ఆమె కదులుతుంటుంది.
యెత్తైన గోడల ఆవల-
కట్టుదిట్టమైన భధ్రత మధ్యన
ఖరీదైన ఖైదీలా
ధిలాసాగా బ్రతుకుతుంటుంది.
తులసికోట పూజలూ లెక్కలేనన్ని వ్రతాలూ
దీపారాధనలూ, మడీ తడీ ఆచారాల్లో
తన ఉనికిపట్టు మర్చిపోయి,
మసిబారిన దీపపు సెమ్మెలా,
అఖండజ్యోతిలోని ఆరిపోని వత్తిలా
నిరంతరంగా కాలుతూ
రెపరెపలాడుతూ బ్రతుకీడ్చుతుంటుంది.
సాంప్రదాయపు పంజరంలో
పంచదార చిలకలా-
ప్లాస్టిక్ నవ్వుల్నియెండినపెదవులపైపూసి
నిప్పులుకడిగే వంశాల అసలు కధల్ని మరుగుచేసే
నివురుగా మిగులుతుంది.

 

ఊరిచివర విసిరేసిన
చీకటిగుడిసెల సముదాయంలో
మట్టిలో మకిలిలో
పేడకళ్ళెత్తుతూ కట్టెలు చీలుస్తూ
తాగుబోతు మొగుడి దాష్టీకానికి బలైన
ఆమె వెన్నుపూస.వాతలుతేలిన ఒళ్ళు
చేవలేని యెముకలపై వేలాడుతున్న చర్మం.
అంటరాని వాడలో..అగ్రకులపు అహంకారంతోయేకమై
తమ పురుషాహంకారం సైతం..
వెలివేసిన ఆడతనం ఆమెరూపం.
చీత్కారాలు మింగుతూ
బలత్కారాల శిలువల్ని
ఇంటాబయటా నిర్వేదంగామోస్తూ,
నాట్లలో కోతల్లో
తమ బ్రతుకుల్నే పాతేసుకుని
మొలకెత్తడం మరచిన నిర్జీవపు విత్తనంలాంటి ఆమె
తరతరాల బహురూపపీడనా పర్వాల
మూర్తీభవించిన నగ్నత్వం.

తానుండే ఇంటిలాగా
తమ ఉనికినిసైతం ఎత్తు గోడల ఆవల మూస్తూ
మూడుసార్లు బొంకితే ఓడిపోయే కాపురాల్ని,
తుమ్మకుండానే ఊడిపోయే భరోసాలేని జీవనాల్ని
బురఖాల మాటున దాచి..
లిప్ స్టిక్ రంగుల చాటున పెదవుల నిర్వేదాన్నీ
నల్లని సుర్మాలకింద ఉబికొచ్చే కన్నీటినీ
అదిమిపట్టి బ్రతుకుతూ..
మతమౌఢ్యపు తంత్రాలకు బలైన
పాతకాలపు యంత్రం ఆమె.

అందమైన శరీరాలనే అద్దింటి బ్రతుకుల్ని..
యేడాదికోసారి కనిపించిన భర్తల యాంత్రిక కాపురాల
గురుతుల పెంపకంలో ఖర్చుచేస్తూ
రోజుకైదుసార్లు పిలిచినా
బదులివ్వని దేవుడికి నిష్టగా మొరపెడుతూ..
నల్లటిపరదాల మాటున
మతం మత్తు ఇరికించిన
ఊపిరాడని దేహంతో
చాందసవాదపు చీకటికి అనాదిగా బందీ ఆమె.

తమదనే బ్రతుకేలేని అతివల బ్రతుకు చిత్రపు నలిగిన నకలూ
గెలుపెరుగని తరతరాల శ్రమజీవీ
నిలువెత్తు పురుషాహంకారం నిర్మించిన
నిచ్చెనమెట్ల సమాజంలో కొట్టేయబడ్డ మొదటి మెట్టూ
హక్కుల లెక్కల్లో అట్టడుగుకు నెట్టేయబడి,
కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
అసమాన ప్రతిభాశాలి

మె.

*

 

మీ మాటలు

  1. lasya priya says:

    కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
    కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
    నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
    అసమాన ప్రతిభాశాలి

    మె…..అద్భుతం అక్కా

  2. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో

  3. chandolu chandrasekhar says:

    అరుణ గారు , నిచ్చెన మెట్ల సమాజం లో కొట్టేయబడ్డ మెదటి మెట్టు . ఆమెని రెండో తరగతి శ్రేణి గ ,హక్కుల లెక్కలో అట్టడుగు స్తాయి , ఆమె ఎ మతమైన కుటుంబ వ్యవస్త లో దోచుకో బడుతున్న స్త్రీ .చాల బావుంది

    • Aruna.Gogulamandaa says:

      తాంక్యూ చంద్ర శేఖర్ గారూ..మీ కామెంట్ లేట్ గా చూసాను..సారీ..ఐ రెస్పాన్డెడ్ లేట్,టూ..

  4. THIRUPALU says:

    కవిత చాలా బాగుంది. అయితే మొదటి భాగంలో స్త్రీ ఈనాటి సమాజాన్ని ప్రతిబింబంచలేదు. ఆమె ఫ్యూడల్ సమాజానికి ప్రతిబింబం. ఆస్తితి ఇప్పుడు కొంత మారింది

  5. Aruna.Gogulamanda says:

    థాంక్యూ తిరుపాలు గారూ..స్పందించిన అందరికీ థ్యాంక్స్.పురుషాధిక్య భావజాలం అంతర్లీనంగా సమాజంలో ప్రతీ విషయంలోనూ భాగమైన స్థితిలో స్త్రీ ఎక్కడున్నా బాధితురాలే అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను.కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు.కానీ గ్రేడెడ్ ఇనీక్వాలిటీ తప్ప. ఈ సమాజంలోని స్త్రీలు ఫర్వాలేదు అని చెప్పగలిగిన స్థితిలో ఇంకా తక్కువ శాతం స్త్రీలేఉన్నారని నా భావన. సౌకర్యాలు కలిగిఉండడం అస్థిత్వం పొందారనడానికి ప్రతీకకాదని నా అభిప్రాయం.చదివిన, స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

  6. balasudhakarmouli says:

    కవిత బాగుంది అరుణ గారూ…

మీ మాటలు

*