Archives for December 2016

కలలే కదా!

seetaram2

 

చిత్రం: దండమూడి సీతారాం
పదాలు: ప్రసాద్ బొలిమేరు

 

~

అలలే కదా —

ఊపిరికి రుచేమిటనుకొంటాం ,

కానీ,

ఆశంత వుప్పగా వుంటుంది

బతుకులాగే-

 

కలలైనా అలలైనా

భళ్ళున వెలుతురులా

అద్దం ముక్కలై విరబూసేవేకదా !

 

కలలే కదా

బతికున్నామనడానికి సాక్ష్యాలు,

పోగేసుకోరాదూ ?

కలల మంత్రపుష్పాల్ని

అలల అనుభవాల్ని ….

*

seetaram2తిరిగి …తి రి గి…

 

-గండికోట వారిజ

~

ఎంత దూరం వురికినా

ఏ స్తంభాల చాటుకు పోయినా

తిరిగి …తి రి గి… పోవల్సిందే.

రోటికి కృష్ణుడి నడుముకు కట్టిన దారంలా

నీరు నురగై

నురగ నీరై

ఆ వృతంలో తిరగాల్సిందే.

తిరిగి..తి రి గి

వెనక్కి పోవల్సిందే అట్లా-

కరువుకార్తీక ఎండకు తాళలేక

దుబాయ్ కు పోయిన మరెమ్మ తిరిగి రాదే

పెద్ద సదువులు సదివి కూకోబెట్టి

వరెన్నం పెడతానని

పట్నం పోయిన ఆడకూతురు సజీవంగా రాదే

పాడిపోయి..పంటపోయి..

బీడయిపోయి యింటి ఆకలి తీర్చడానికి

రెడ్డికాడికి పోయిన రత్తాలు శీలంతో తిరిగి రాదే

.అట్లా…తిరిగి వస్తే అలలా..

సముద్రం ఎందుకు అంత పెట్టున ఏడుస్తుంది

పొర్లి పొర్లి…

అలరుల నడుగగ …

untitled

అనువాద కవిత, మూలము – వైరముత్తు

 

కొన్ని రోజులకు ముందు యూట్యూబ్‌లో పాటలను వింటున్నప్పుడు ఈ పాటను వినడము తటస్థించింది.  పాట నడక, అందులోని కవితకు నేను పరవశుడిని అయ్యాను. ఈ పాటను “ఓ కాదల్ కణ్మణి” (OK కణ్మణి లేక ఓ ప్రేమ కంటిపాప) అనే తమిళ చిత్రములో  ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకత్వములో గాయని చిత్రా పాడినారు.  కొన్ని అన్య స్వరములతో కూడిన బేహాగ్ రాగములోని యీ పాట చివర రహ్మాన్ గొంతుక కూడ వినబడుతుంది. గీత రచయిత వైరముత్తు. పాటను వినిన తత్క్షణమే తెలుగులో అదే మెట్టులో దానిని అనువాదము చేయాలని నాకనిపించింది. ఈ పాటకు, తమిళ మూలము, ఆంగ్లములో, తెలుగులో (అదే మెట్టులో పాటగా, పద్యరూపముగా) నా అనువాదములను మీ ఆనందముకోసము అందిస్తున్నాను. పాటను క్రింది లంకెలో వినగలరు –

மலர்கள் கேட்டேன் வனமே தந்தனை

தண்ணீர் கேட்டேன் அமிர்த்தம் தந்தனை

எதை நான் கேட்பின் உனையே தருவாய்

 

మలర్‌గళ్ కేట్టేన్ వనమే తందనై

తణ్ణీర్ కేట్టేన్ అమిర్దమ్ తందనై

ఎదై నాన్ కేట్పిన్ ఉనైయే తరువాయ్

 

అలరుల నడుగఁగ వని నొసఁగితివే

జలముల నడుగఁగ సుధ నొసగితివే

ఏమడిగినచో నిన్నొసఁగెదవో

 

When I wished for flowers,

I received from you the whole garden

When I wished for water,

I received from you the drink of immortality

What should I wish for,

so that you  give yourself to me?

 

காட்டில் தொலைந்தேன் வழியாய் வந்தனை

இருளில் தொலைந்தேன் ஒளியாய் வந்தனை

எதனில் தொலைந்தால் நீயே வருவாய்

 

కాట్టిల్ తొలైందేన్ వళియాయ్ వందనై

ఇరుళిల్ తొలైందేన్ ఒళియాయ్ వందనై

ఎదనిల్ తొలైందాల్ నీయే వరువాయ్

 

కానను దప్పితి బాటగ వచ్చితి

విరులున దప్పితి వెలుగుగ వచ్చితి

వెటు దప్పినచో నీవిట వత్తువొ

While I was lost in the woods,

I saw you as the path forward

While I was lost in the darkness,

I saw you as the illuminating light

Where should I get lost,

so that you reveal yourself before me?

 

பள்ளம் வீழ்ந்தேன் சிகரம் சேர்த்தனை

வெள்ளம் வீழ்ந்தேன் கரையில் சேர்த்தனை

எதநில் வீழ்ந்தால் உந்நிடம் சேர்பாய்

 

పళ్ళమ్ వీళ్‌న్దేన్ శిగరమ్ శేర్తనై

వెళ్ళమ్ వీళ్‌న్దేన్ కరైయిల్ శేర్తనై

ఎదనిల్ వీళ్న్దాల్ ఉన్నిడమ్ శేర్పాయ్

 

పల్లములోఁ బడ నగ మెక్కింతువు

వెల్లువలోఁ బడ దరిఁ జేర్పింతువు

ఎందుఁ బడినచో నిను జేరుటయో

 

When I fell into the pits,

you carried me to the summit

When I fell into the whirlpool,

you rescued me to the safety of the shore

Where should I fall,

so that you become one with me?

(తందనై, కరై మొదలైన పదాలను పలికేటప్పుడు తమిళములో ఐ-కారమును ఊది పలుకరు, అది అ-కారములా ధ్వనిస్తుంది. ఛందస్సులో కూడ వాటిని లఘువులుగా పరిగణిస్తారు.)

పద్యములుగా మూడు పంచమాత్రల సంగమవతీ వృత్తములో  స్వేచ్ఛానువాదము –

సంగమవతీ – భ/జ/న/స UIII UIII – IIIU
12 జగతి 2031

సూనమును నేనడుగ – సొబగుగాఁ
గాననము సూపితివి – కనులకున్
పానమున కంభువును – బసవఁగా
సోనలుగ నిచ్చితివి – సుధలనే

ఆవిపినమం దెఱుఁగ – కలయఁగాఁ
ద్రోవగను వచ్చితివి – తురితమై
పోవఁగను జీఁకటులఁ – బొగులుచున్
నీవు వెలుఁ గిచ్చితివి – నెనరుతో

పల్లమున నేనెటులొ – పడఁగ రం-
జిల్లగను జేర్చితివి – శిఖరమున్
వెల్లువల నేనెటులొ – ప్రిదిలి కం-
పిల్ల దరి చేర్చితివి – వెఱువకన్

ఇచ్చుటకు నేమడుగు – టికపయిన్
వచ్చుటకు నేమగుట – వసుధపై
ఇచ్చ నిను జేరఁ బడు – టెచటనో
ముచ్చటగ రమ్ము మది – ముదమిడన్

*

 

ఎందుకే నీకింత తొందరా?

art: satya sufi

art: satya sufi

~

‘you lie there
like an etherised poem
silencing the smile of our world
and shocking the throb of our hearts’…

కానీ అనుక్షణం మృత్యువును శాసిస్తూ
నిర్భయంగా వెలిగిన నీ పాట
ఇంకా జ్వలిస్తూనే వుంది.

గాయాల్నీ, గేయాల్నీ
అశృవునూ, ఆనందాన్నీ
ఒంటరితనం లోనే పొదువుకుంటూ
కలనేతగా కవితలైన నీ మాటలు
ఇంకా మలి పొద్దు మంచులా
తడుపుతూనే వున్నాయి.

పిండారీల దోపిడీ వ్యవస్థల గురించీ
పిచ్చుకల అంతర్ధానం గురించీ
కవితై పలకరించాల్సిన అవసరం గురించీ
నీవు చెప్పిన మాటలన్నీ
‘ప్రూఫ్రాక్’ పాటై నీ లోటును చూపే
గాయాలై పలకరిస్తూనే వున్నాయి.

అను నిత్యం
స్నేహమై ప్రేమగా పిలిచి
ఆప్యాయతను వర్షించిన నీ గొంతుక
కృష్ణశాస్త్రి పాటై
కురుస్తూనే వుంది.

మన బోదలేర్, మార్క్వెజ్, అఖ్మతొవా
వాస్కోపోపాలు
నీ తలపుల్ని తెప్పిస్తూనే వున్నారు.

మళ్ళీ రెండ్రోజుల్లో కలుస్తానని చెప్పి వెళ్ళిన నీ నవ్వు ,
మృత్యువును తర్జనితో నిలిపిన
నీ పరిహాసం,
‘మరణానంతరం సైతం కవితై శాసిస్తాన’న్న
నీ మాటలు,
వుల్కలై, వుత్పాతాలై, సముద్రాలై, సంఘర్షణలై
నీ ఆత్మీయ స్పర్శా సుమ స్వప్నాలై
నిశ్శబ్దంగా వినిపిస్తూనే వున్నై.

కానీ కల కన్న వడిగా
ఆ ‘బుగ్గ మీసాల పత్తేదారు’ తో
‘ఒకే’ జనన మరణాల మధ్య
కలవై కదిలిపోయిన నిజానివి కదా నీవు!
నీ జ్ఞాపకమెప్పటికీ
ఓ సర్రియలిస్ట్ కవిత!

రఘూ, వంటరి పాటవై
మరలి పోయిన
మితృడా, ప్రతి డిసెంబర్ పూలూ
నీ పాటలే ఆలపిస్తాయి.

(కవి, మితృడు గుడిహాళం రఘునాథం గుర్తుగా)

– విజయ్ కోగంటి

ఆద్యంతాలు లేని ‘ఆగమనం’

arrival1

ప్పట్లాగే ఈ సంవత్సరం(2016)  కూడా హాలీవుడ్ లో ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చేసింది. ‘టెడ్ చియాంగ్’ రాసిన ‘స్టోరీ అఫ్ యువర్ లైఫ్’ అనే కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఎరైవల్(Arrival)’ అనే పేరుగల ఈ సినిమా కథాంశం ఏలియన్ సంబంధితమైనది అయినప్పటికీ, ఈ దృశ్య ప్రవాహపు ప్రతీ కదలికా, మెలకువతో మెళకువగా చూస్తున్న జీవిత ఘట్టాల బిందు సమూహంలానే కనిపిస్తుంది.

ఒక ప్రాణాంతకవ్యాధి కారణంగా యుక్త వయసులోకి అడుగుపెడుతూనే మరణించిన కుమార్తెతో పాటుగా ఆశలనన్నిటినీ అంతం చేసుకున్నట్టుగా కనిపించే ‘లూయిస్’ కథతో సినిమా ఆరంభమవుతుంది. కానీ అప్పుడు కూడా ఆమె, తనకి ఆరంభాల మీదా అంతాల మీదా నమ్మకమనేది ఉందో లేదో చెప్పలేకపోతున్నానంటుంది. ఇంతకూ లూయిస్ ఒక  బహుభాషా ప్రవీణురాలు. అనేక భాషలపైన మంచి పట్టును కలిగి ఉన్న లూయిస్, యూనివర్సిటీలోని విద్యార్థులకి బోధన చేస్తుంటుంది. ఇంతలో అనుకోకుండా భూమి మీద ఏలియన్ షిప్ లు ల్యాండ్ అయ్యాయని తెలియడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతారు. అవి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు చోట్లకి వచ్చి ఆగుతాయి. .కానీ ఆ ఏలియన్స్ మనుషులకు హాని చేయడానికి రాలేదనీ, వారు తమతో మాట్లాడే  ప్రయత్నం చేస్తున్నారనీ భావించిన అమెరికన్ ఆర్మీ చీఫ్, వారి భాషను అర్థం చేసుకుని వివరించమని లూయిస్ ని కోరతాడు. ఆమెతో పాటుగా  ఫిజిసిస్ట్ అయిన అయాన్ అనే వ్యక్తిని కూడా ఆర్మీ ఈ పని నిమిత్తం నియమిస్తుంది. వారిద్దరూ కలిసి ఆ ఏలియన్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏలియన్ల భాష శబ్ద ప్రధానమైనది కాదనీ దృశ్యరూపమైనదనీ గ్రహించి, ఆమె ఆ భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు కొంచెం సమయం అవసరమవడంతో, ఆ లోపుగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయి.

ఏలియన్స్ భాషను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన, వారు యుద్ధానికి సిద్ధమై వచ్చినట్టుగా భావించి  చైనా ఆర్మీ జెనెరల్ షాంగ్, వారిపై యుద్ధానికి పిలుపునిస్తాడు. అతనికి మరికొన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతాయి. కానీ లూయిస్ కి మాత్రం ఏలియన్లు తమకి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారనే నమ్మకముంటుంది. ఈ మధ్యలో ఆమెకు, తన కుమార్తెకి చెందిన కలలూ, జ్ఞాపకాలూ ఏర్పడటం ఎక్కువైపోతుంటుంది. ఆ ఏలియన్స్ కీ, తన కుమార్తెకీ మధ్య గల సంబంధమేమిటో ఆమెకి అర్థం కాదు. చివరికి అసలు విషయాన్ని అర్థం చేసుకుని, ఏలియన్ల సందేశాన్ని ప్రపంచానికి చేరవేసి యుద్ధాన్ని ఆపడంలో ఆమె సఫలీకృతురాలవుతుంది. ఈ క్రమంలోనే ఆమెకి అనుకోని ఓ రహస్యం కూడా తెలుస్తుంది. ఆ రహస్యమేమిటో సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు మూడు. మొదటిది, కథని ముందుకూ వెనకకూ జరపడంలోనూ, మానవీయ కోణానికీ, సెన్సిబిలిటీకీ పెద్ద పీట వెయ్యడంలోనూ దర్శకుడు చూపిన ప్రతిభ, సినిమా విజయానికి మూల కారణమైతే, అందుకు తగ్గ దృశ్య రూపావిష్కరణ చేసిన సినిమాటోగ్రాఫర్ ‘బ్రాడ్ ఫోర్డ్ యంగ్’  కృషి కూడా అభినందనీయం. ముఖ్య పాత్రధారిణి లూయిస్ గా నటించిన ‘అమీ ఏడమ్స్’ నటన అత్యంత సహజసిద్ధంగా ఉండి మనసును కట్టి పడేస్తుంది. ఇక సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన జోహాన్ జోహన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక కీలకమైన ప్రాముఖ్యత కలిగిన ఏలియన్ల భాషను ‘మార్టిన్ బెర్ట్రాండ్’ అనే ఆర్టిస్ట్ డిజైన్ చేసిందట.

arrival2

‘సికారియో, ప్రిజనర్స్, ఇన్సెన్డైస్’ వంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు ‘డెనిస్ విలెనెవ్’ ఈ సినిమా ద్వారా తన సమర్థతని మరోసారి నిరూపించుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతని సినిమాలలో, నాటకీయత – సహజత్వం విడదీయలేనంతగా కలిసిపోయి ఉండటం గమనించవచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే, అసలు  సై.ఫి. సినిమాలంటేనే ముఖ్యంగా ఊహా ప్రధానమైనవి. అతికినట్టుగా అనిపించకుండా వాటిలో జీవాన్ని నింపాలంటే చాలా నేర్పు అవసరం. ఈ సినిమా ఇంత అద్భుతంగా అమరడానికి అటువంటి నేర్పే కారణమని చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప మలుపులూ, ‘ఇంటర్ స్టెల్లార్’ లా విపరీతమైన సైన్స్ పరిజ్ఞానమూ ఉపయోగించకుండానే ఒక పటిష్టమైన, ఆసక్తికరమైన సినిమాని తయారు చేయడం హర్షించదగిన విషయం.

లూయిస్ వ్యక్తిగత జీవితం, ఏలియన్స్ తో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉందన్న సందేహమే సినిమాను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె కుమార్తె ఏలియన్ నా? లేక చనిపోయి ఆ రూపంలో తిరిగి వస్తుందా? ఆమె మరణానికీ, ఏలియన్స్ కీ ఏమైనా సంబంధం ఉందా?…. వంటి సందేహాలు మన మనసుని ఎంగేజ్ చేసి దృష్టి మరల్చనివ్వకుండా చేస్తాయి. ఇక అయోమయానికి గురి చేయని కథనం కూడా సినిమాకు గొప్ప ఆకర్షణ.

సినిమాకి ప్రాణమైన అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ మాత్రం సగం దారి నించీ ఊహకు అందుతూ ఉంటుంది. తెలిసిపోయినా మళ్లీ తెలుసుకోవాలనిపించే వింత రహస్యమది. ముగింపులో మాత్రం సైన్స్ పరంగా కొద్దిపాటి క్లిష్టతరమైన అంశాలను జోడించినప్పటికీ, సై. ఫి. చిత్రం కనుక ఆ మాత్రం క్లిష్టత తప్పనిసరి. (ఇంతకు మించి వివరిస్తే, సినిమా చూడాలనుకునేవారికి స్పాయిలర్ అవుతుందన్న ఉద్దేశ్యంతో చెప్పడం లేదు). మొత్తానికి ఏదెలా ఉన్నా, కళ్లు తిప్పుకోనివ్వని విజువల్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఈ సినిమా అసంతృప్తిని మిగిల్చే అవకాశమైతే మాత్రం అణువంతైనా ఉండనే ఉండదు.  కాలాలూ, పరిస్థితులూ ఎంతగా మారినా, మన ఊహలనేస్థాయిలో విశ్వపు అంచుల వరకూ విహరించేందుకు పంపినా, విలువలనూ, మానవ సహజమైన ప్రేమాభిమానాలనూ పోగొట్టుకోనంతవరకూ మనం మనంగానే ఉంటామన్న నిజాన్ని ఈ సినిమాకి లభించిన ఘన విజయం నిరూపిస్తుంది.

 

***

ఆ మూడూ…

 

రెండు అధివాస్తవిక కవితలు

Art: Rajasekhar chandram

Art: Rajasekhar chandram

 

ఆంగ్లం: బెర్న్ట్ సార్మన్
 తెలుగు: ఎలనాగ

బ్యాంట్ సార్మన్ 1961 లో జర్మనీలో జన్మించి, 1969 లో అమెరికాకు వలస పోయాడు. అక్కడి లూసియానా విశ్వవిద్యాలయంలో 1993 లో ఇంగ్లిష్ ఎమ్మే, ఎమ్. ఎఫ్. ఎ. (సృజనాత్మక కవితా రచన) పట్టాలను పొందాడు. తర్వాత లూసియానాను వదిలి ఇలినాయ్, వెర్మాంట్ నగరాల్లోని కళాశాలల్లో ఉపాధ్యాయుడుగా పని చేశాడు. ఇప్పుడు కెంటకీ లోని హాప్కిన్స్ విల్ లో అధ్యాపకుడుగా ఉన్నాడు.

ఇతని రచనలలో కొన్ని: An Online Artefact, Nimrod, Amelia, Indefinite Space, Ink Node, Pegasus, Ship of Fools. 2013 లో Diesel Generator, 2014 లో Seven Notes of a Dead Man’s Song వెలువరించాడు.

***

 

                           ఘటన

దివేల చిన్నిప్రాణాలు ఆవిరిలోకి తీసుకురాబడిన ఆ ఉదయాన మా కంఠధ్వని పల్చని పొగమంచులా వ్యాపించింది. ప్రాణం లేని కాళ్లుచేతుల, మరణించిన వృక్షాల, ఇతర నిర్జీవ వస్తువుల ప్రేతాత్మల చేత చుట్టుముట్టబడి వున్నాం మేం. ఆస్పత్రికి వెళ్లొచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. అక్టోబర్ నర్సు అలా చెప్పింది మరి. మంద్రస్థాయిలో ఒక సన్నని బీప్ శబ్దం వినపడింది. తర్వాత అది ఆగిపోయింది. ఇదంతా చెప్పటమెందుకంటే, ఆకురాలే కాలం మధ్యలో వున్నాం మేము. చలికాలం త్వరలోనే రాబోతోంది.

                              రోచిర్యానం

వాక్యం మధ్యలో ఆమె ధోరణి మారింది. గాజుచషకపు కాడ అతిసన్నని ఎముకలా ఆమె చేతిలో పలపలమని విరగటాన్ని అతడు ముందే ఊహించాల్సింది, దర్శించాల్సింది. అదేవిధంగా మరో చేయి వికృతంగా బలంగా మొదటి చేయికి ప్రాసలాగా వచ్చి మూసుకోవటాన్ని ; ఇంకా ఆ ప్రాస ఒక రాయికి లోబడటాన్ని, ఆ రాయి ఇసుకగడియారంలో చూర్ణం చేయబడటాన్ని. ఇదంతా సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందే. రాబోయే కొన్ని క్షణాల్లోనే.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఫ్లెమింగోల దారిలో కవిత్వం!

fleming

ప్రపంచం ప్రేమను మరచిపోతున్న తరుణంలో ఒక సౌందర్య వంతమయిన  జీవితాన్ని ప్రేమించుకుంటూ వేల మైళ్ళ దూరాన్ని సునాయాసంగా ఈది తమకై  తాము ఒక నిర్మాణ కర్తలుగా నిలిపే ఈ పక్షుల ముందు మనిషి నిజంగా చాలా చిన్న వాడే .. కాలం ఒడ్డున నిలబడి కవి గొంతెత్తి మనిషిని పిలుస్తున్నట్లే  అన్పిస్తుంది నాకు .. తమ ఆరాటాన్ని మనిషి భాష లోకి అనువదించి లేకపోయినా ప్రాకృతిక భాషలో పరితపించి పోతున్నాయి. వాటి లోపలి స్వరాల్ని పసిగట్ట గలిగిన శక్తి  మనిషికి ఎప్పుడొస్తుందో అనేదే నా ప్రశ్న .. మన ఆశల్ని విప్పి పక్షుల ముందు  పరచే రోజు కాదు వాటి ఆశయాల్ని గుర్తించే రోజు రావాలన్నదే నా తాపత్రయం అంతా .. అందుకే ఒక పక్షి ప్రేమికుడిగా వాటితో పాటుగా చరిత్ర గమనంలో  నా  గొంతు కలాపాలన్నదే నా తపన . అందుకే పక్షుల గురించి పుస్తకం రాసాను. పక్షుల కవిత్వం ఆహ్వానిస్తున్నాను.  పక్షి పాటను ,పక్షి కవిత్వాన్ని గుండె కెత్తుకున్నాను . ఈ తంతు నడిచే దారిలో నిజానికి నేనే ఓ పక్షి లా మారిపోయాను.

ఒక సాయుధుడిగా ,ఒక నిర్మాణ కర్తగా  నిరంతరం ఒక విలక్షణ ,విన్నూత్న మయిన కార్యాలు చేయడమే విధిగా పెట్టుకుని సాకారం చేసుకుంటున్న కలల క్రమం లో 10 ఏళ్ళ క్రితం వృత్తి రీత్యా సుమారు ఏడేళ్ల పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో నివాసం వున్నప్పుడు మొదటి  సారి ఈ నేలపట్టు ,పులికాట్ క్రమం తప్పకుండా ప్రతి దసరా పండుగ నాటికి సైబీరియా లాంటి సుదూర ప్రాంతాలు నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చే ఫ్లెమింగో ,పెలికాన్ పక్షుల గురించి వినడం ,చూడడం జరిగింది. అప్పుడు అక్కడ కొచ్చే పక్షి శాస్త్రజ్ఞులను కలవడం,వాటి గురించి పలు ఆసక్తి కరమైన అంశాలు తెలుసుకునే అవకాశం దొరికింది.  జీవితం రంగులు కోల్పోయి నిస్సారం అవుతుంది ఈ అయస్కాంత వంతమైన ఆకర్షణ కలిగిన పక్షులు లేకపోతే అనే జవహర్ లాల్ నెహ్రు మాటలు గుర్తు కొచ్చాయి.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తా చివరలో విస్తారమైన పులికాట్ సరస్సు ,దొరవారి సత్రం మండలం లోని కుగ్రామం నేలపట్టు తరాలుగా పెలికాన్ ,ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి .. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాటిని పక్షుల రక్షిత కేంద్రముగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకి చేర్చి వాటిని అటవీ శాఖ తరఫున కాపు కాస్తుంది .. ఈ విదేశీ విహంగాలు విడిదికొచ్చి సంతాన ఉత్పత్తి చేసుకుని హాయిగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తుంటాయి . ప్రతి ఏడాది అక్టోబర్ నుండి సుమారు మార్చ్ వరకు ఇక్కడ ఇవి విడిది చేస్తాయి ..నీరు సమృద్ధిగా ఉన్నంత వరకు వుంటుంటాయి .

ఈ పర్యాటక కేంద్రానికి అంతర్జాతీయ పర్యాటక హోదా కల్పించాలనే సంకల్పంతో 2000 సంవత్సరం లో  సముద్రపు రామచిలుకగా అందమైన రంగులతో ఎత్తుగా నడిచే ఫ్లెమింగో పక్షి పేరుతో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి ఏటా పక్షుల పండుగ జరపాలని నిర్ణయించారు .. అప్పటి నుండి రెండు మూడు రోజుల పాటు సుళ్లూరుపేట ,నేలపట్టు ,అటకానితిప్ప, భీముని వారి పాలెం ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రదేశం గురించి ప్రచారం చేస్తూ తమిళనాడు ,కర్ణాటక ఇంకా ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ సీజన్లో వచ్చే పక్షుల ను దర్శించి అక్కడి మనోహర దృశ్యాల్ని మనస్సులో ముద్రించుకుని వెళ్లడం ఆనవాయితీగా చేసారు జిల్లా అధికారులు. క్రమేణా ప్రజల్లో స్పందన చూసి భారీగా పర్యాటకులు రావడం చూసిన ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర పండుగగా ప్రకటించి హోదా పెంచింది.

2005 లో ఈ పక్షుల పైన పరిశోధనాత్మక దీర్ఘ కావ్యం “ఫ్లెమింగో : ఈ వ్యాస రచయిత  రాసి ఇదే ఫ్లెమింగో పక్షుల పండుగలో అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర చేత ఆవిష్కరించి తొలి ప్రతి ఆరోజు సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్ కు అందించడం జరిగింది .. ఒక వైవిధ్యమైన వస్తువు ఎన్నుకోవడంలో నే కవి ఏభై శాతం విజయం సాధించాడు అని ప్రముఖ కవి ,తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ కితాబు అందుకున్న కవి గుండెల్లో ఫ్లెమింగో పక్షి చెదరని గూడు కట్టు కుంది .. ఆ కావ్యం విజయాల్ని సుమారు ఐదేళ్లు అనుభూతిస్తూన్న కవి అనేక భారతీయ ,ఇతర దేశ  భాషల్లోకి  ఈ దీర్ఘ కవిత్వం అనువాదం చేయడం ,పలు విశ్వ వేదికల మీద దాన్ని గురించి మాట్లాడుతుండడం వల్ల ఫ్లెమింగో నా జీవితంలో క్రమంగా ఒక భాగమై పోయింది.

unnamed

2015 లో ప్రభుత్వ పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రకటన వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం లో సాహిత్య వాసన కూడా జోడించాలని తపన పెరిగి ఫ్లెమింగో కవితోత్సవం అనే దక్షిణ భారత కవుల పండుగ పురుడు పోసుకుంది .. ఈ  నా ఆలోచన ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ కి మరియు కొత్తగా జిల్లాలో వెలసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వీ వీరయ్య గార్కి తెల్పి వారి ప్రోత్సాహం తో తెలుగు ,తమిళం ,కన్నడ ,మలయాళం ,తుళు ,ఆంగ్లం భాషలలో సుమారు 15 మంది ఆహ్వానిత కవుల్ని పిలచి వలస పక్షులు అంశంపై నెల్లూరు లో విశ్వవిద్యాలయం కాలేజీ ఆడిటోరియం లో మొదటి కవితా గానం విజయవంతం గా చేసిన సంతృప్తి మిగిలింది.

అలా మొదలైన ఫ్లెమింగో పోయెట్రీ ఫెస్టివల్ 2016 లో డిసెంబర్ ముందస్తుగానే రూపుదిద్దుకుని పక్షుల విడిదికి కూత వేటు దూరంలోనే వున్నా గోకుల్ కృష్ణ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో మళ్ళీ దక్షిణ భారత కవులను ఆహ్వానిస్తూ వలస పక్షులు అంశం మీదనే కవి సమ్మేళనం చేయడం ప్రభుత్వ పక్షుల పండుగ కళ పెంచేలా జరిగి కవితోత్సవం అలరించింది. ఈ కవితోత్సవం ముఖ్య అతిధులుగా మళ్ళీ  విశ్వవిద్యాలయం ఉప కులపతి వీరయ్య ,జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ లు హాజరై పక్షుల మీద పలు కోణాల్లో కవిత్వం వెలువరించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ,ఇక్కడకొస్తున్న పక్షుల మీద మరింత పరిశోధన జరగాలని  సూచించారు. ఈ కవిత్వ పండుగలో పాల్గొనేందుకు కవులు ఎంతో ఇష్టంగా వేదిక ప్రదేశం చేరుకున్నారు 24 వ తేదీ డిసెంబర్ ఉదయం తమిళం నుండి సుబ్బరామన్ ,మలయాళం కవులు శ్రీమతి పంకజం ,కుంబ్లేనిగాడు ఉన్నికృష్ణ, హిందీ కవులు డా ఇలియాజ్ ,డా రామలింగేశ్వర రావు ,ఇంగ్లీష్ కవి బెంగళూరు నుండి బి ఎల్ రావు ,సంస్కృత కవి అల్లు భాస్కర్ రెడ్డి , తెలుగు కవులు చిరంజీవి (కర్నూలు),గంగవరపు సునీత (త్రిపురాంతకం ),సరికొండ నరసింహ రాజు (నాగార్జున సాగర్),షైక్ ఖదీర్ షరీఫ్ (సోమశిల )ఈతకోట సుబ్బారావు ,పెరుగు సుజనా రామం ,వర్చస్వి , (నెల్లూరు ) శకుంతలాదేవి (శ్రీహరికోట) పాల్గొని వలస పక్షుల ను విభిన్న కోణాల్లో ఆలపించి ఆనందింప చేసారు.

*

నేరాల బతుక్కి ఎదురీత!

trevor-noah-suit

 

రోజు కూడా ఆఫీసునుండి ఇంటికి వెళ్ళడానికి కారెక్కగానే NPRలో టెర్రీ గ్రూస్ ఫ్రెష్ ఎయిర్ ప్రోగ్రాం వస్తోంది. ఆనాటి అతిధి Trevor Noah. అతని గురించి నాకు అంతకు ముందు ఏమీ తెలియదు. తన ఆత్మకథ “Born A Crime:: Stories From a South African Childhood” మీద ఆరోజు ఇంటర్వ్యూ! అదే రోజు ఆ పుస్తకాన్ని అమెజాన్‌లో కొనేయడము, అది వచ్చిన వెంటనే చదవడం మొదలెట్టడమూ.

ట్రెవర్ నోవ తల్లి నల్లజాతి నేటివ్, తండ్రి స్విస్-జర్మన్ తెల్లవాడు. చట్త ప్రకారం జాతుల మధ్య లైంగిక సంబందాలు నిషిద్దం. అలాంటి చట్టాల మధ్య పుట్టాడు గనుక “నేను నేరానికి పుట్టాను” అంటాడు ట్రెవర్. ఈ పుస్తకం ట్రెవర్ నోవా జీవితం అనేకంటే ఆయన తల్లి పాట్రిసియ జీవితం, వివక్ష అధికారికంగా అమలవుతున్న చోట ఓ బాధితురాలి జీవితం, పల్లె నుండి పట్నానికి తన్ను తాను నడిపించుకొన్న పల్లెటూరి పిల్ల జీవితం, పితృస్వామ్య అధిపత్య వ్యవస్థలో నలిగి దానికి ఎదురొడ్డి నిలిచిన పడతి జీవితం, తన కొడుకే సర్వస్వంగా పెంచిన ఒంటరి తల్లి జీవితం, జీసస్‌ను తన రక్షకుడిగా మనఃస్పూర్తిగా విశ్వసించిన ఓ క్రైస్తవరాలి జీవితం.

ఇవి పుస్తకం చదువుతుండగా నాకు కనిపించిన కొన్ని కోణాలు. బహుశా మీరు చదివితే మీకు మరిన్ని కోణాలు కనపడవచ్చు. రచన ఆద్యంతం ఒక ఆహ్లాదకరమైన శృతిలో వుండి చివరిదాకా మూయనీయదు. కన్నీళ్ళు తెప్పించే ఘటనలను కూడా నవ్విస్తూ చెపుతాడు ట్రెవర్. బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి..అదే సమయంలో పెదవులపై ఓ చిర్నవ్వుకూడా ప్రత్యక్షమవుతుంది మనకు.

ఉదాహరణకు డిల్లీ “నిర్భయ” దుర్ఘటనను గుర్తుకు తెచ్చే ఓ సంగతి ఇది. తనేమొ ఇంచుమించు ఆరేళ్ళప్పుడట. నెల్సన్ మండేలా జైలులోంచి విడుదయిలయిన రోజుల్లో..రోడ్లమీద తెగల మధ్య ఏవేవో గొడవలు, నిరసనలు. ప్రపంచం తల్లకిందులైనా తన తల్లి ఆదివారంనాడు చర్చికి వెళ్ళక మానదు. ఆరోజు కూడా చర్చికి బయలుదేరారు, ట్రెవర్ రానని ఎంత మొండికేసినా లాభం లేకపోయింది. తమ పాతకారును బయటకు తీద్దామంటే అది స్టార్ట్ అవకుండా మొండికేసింది. అప్పుడయినా ఆమె వెళ్ళకుండా మానేస్తుందేమొనని అతని ఆశ. ఉహు.. ఆమె కొంత దూరం నడిచి ఆ రూట్లో నడిచే ప్రైవేటు బస్సు (నల్లవాళ్ళున్న చోటకు ప్రభుత్వం నడిపే రెగ్యులేటెడ్ ప్రభుత్వ బస్సు సర్వీసులేవీ లేవట) పట్టుకొని వెళ్ళడానికి సిద్దమయింది. ఒకరు బస్సు నడిపే మార్గంలో మరొకరు ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అవి నడిపే రౌడీ గుంపుల్లో ఒప్పందం.

అయితే బస్సుకోసం వేచి చూసి, చూసి ఇక రాదేమొననుకొని వాళ్ళు ఓ కారు ఆగితే అందులో ఎక్కబోతుండగా బస్సు వచ్చింది. వీళ్ళను ఎక్కించుకుంటున్నందుకు ఆ బస్సు డ్రైవరు దిగివచ్చి ఈ కారు డ్రైవరును కొట్తడం మొదలెట్టాడు. వీళ్ళు వాడికి ఎలానో నచ్చజెప్పి కారు దిగి బస్సు ఎక్కారు. ఆ బస్సులో వీళ్ళు తప్ప మరెవరూ లేరు. చిన్న పిల్లలను వేసుకొని ఒంటరిగా ఓ ఆడది అపరిచితుల కారులో వెళ్లడం ఎంత ప్రమాదమో ఈ బస్సు డ్రైవరు ఆమెకు నీతులు చెప్పడం మొదలెట్టాడట. కానీ ఈమె మరొకరు తనమీద పెత్తనం చేయడం సహించనిది. “నీ పని నువ్వు చూసుకో” అని చెప్పేసరికి వాడికి కాలింది.

అందులోనూ ఆమె మాట్లాడిన భాషను బట్టి ఆమె చోసా(Xhosa) జాతి అని అతనికి తెలిసిపోయింది. ఆ డ్రైవరేమో జులు(Xulu) జాతివాడు. జులు జాతి ఆడవాళ్ళు ఎక్కువగా సంప్రదాయం పాటించి ఇంటి నాలుగ్గోడలు దాటని వాళ్ళు. ఈమె ఓ మగాడికి ఎదురు చెప్పడం, అందులోనూ ఓ తెల్లతోలు పిల్లవాన్ని కలిగి వుండటం..వాని అహాన్ని దెబ్బకొట్టింది. (నిర్భయ వుదంతం గుర్తుకు రావట్లేదా?) “మీ చోసా ఆడవాళ్లతో ఇదే సమస్య. మీరంతా ఎవడితో పడితే వారితో తిరిగేవాళ్ళు. ఈరాత్రి నీకు బుద్ది చెప్పందే వదలను.” అంటూ వాడు ఎక్కడా ఆపకుండా బస్సు వేగం పెంచాడు. ఇక ఈమెకు ఏమి జరగబోతుందో అర్థమయ్యింది. అక్కడక్కడా రోడ్డు దాటుతున్నపుడల్లా వేగం తగ్గడం గమనించి అలాంటి ఒకచొట నిద్రమత్తులో జోగుతున్న ట్రెవర్‌ను ద్వారం లోంచి తోసేసి, మరో చిన్న పిల్లాడితో తనూ దూకేసింది. దూకిన వెంటనే పరుగు లించుకొని, దగ్గరలోని ఇరవైనాలుగ్గంటలూ తెరిచివుండే పెట్రోలు బంకు చేరారు.

“ఎందుకలా? ఎందుకు మనం పరిగెత్తాం?”

“‘ఎందుకు పరిగెత్తాం?’ ఏంటి? వాళ్ళు మనలని చంపాలని చూశారు.”

“నాతో ఎప్పుడన్నావ్ అలా? బస్సులోంచి అలా తోసేశావ్?”

“సరే నీతో అనలేదే అనుకో, మరెందుకు బస్సులోంచి దూకేశావ్?”

“దూకానా!!నేను నిద్రపోతుంటేనూ.”

“అంటే.. వాళ్ళు చంపేయడానికి నిన్ను వదిలేసుండాల్సింది.”

అలా తల్లీ-కొడుకుల వాదించుకుంటూ పోలీసుల కోసం ఎదురు చూస్తున్నారు.

కొడుకుతో ఆమె అంది, “హమ్మయ్య! దేవుడి దయవల్ల క్షేమంగా వున్నాము.”

అప్పుడు తొమ్మిదేళ్ళ ట్రెవర్ అంటాడు, “లేదు మమ్మీ, ఇది దేవుడి దయ కాదు. దేవుడు మనలని ఇంట్లో వుంచడానికే కారు స్టార్ట్ అవకుండా చేశాడు. మనం బయటకు వెళ్ళేట్లు చేసింది ఖచ్చితంగా దయ్యమే!”

“లేదు లేదు ట్రెవర్. అది దయ్యం పని కాదు. అది దేవుడి పథకమే. మనం ఇక్కడ వుండాలని దేవుడనుకొంటే దానికి ఓ కారణం వుండే వుంటుంది…”

“చూడమ్మా, నాకు తెలుసు నీకు జీసస్ అంటే ఇష్టమని. ఆయనకు అంత ఇష్టమయితే మనల్ని మన ఇంటి దగ్గరే కలవమను. ఈ రాత్రి జరిగిందేమీ సరదా కాదు.”

trevor-with-mother

ఆమె నవ్వుతూ మోకాళ్ళూ, మోచేతులూ పగిలి దుమ్మూ, రక్తం కలిసిపోయిన కొడుకును దగ్గరగా తీసుకొంది. అంత బాధలోనూ ట్రెవర్‌కూ నవ్వు వచ్చింది.

ఇది కేవలం ఓ చిన్న నమూనా మాత్రమే. మరింత సాగదీయకుండా వుండటానికి నేను ప్రతివాక్యాన్ని రాయలేదు గానీ, పుస్తకంలో ఇది చదివుతున్నపుడు, వాళ్ళిద్దరితోపాటు నాకూ బాధతో కూడిన నవ్వు వచ్చింది.

తను చిన్నప్పుడు బయటవాళ్లకు కనపడకుండా తన అమ్మమ్మ ఇంటిలో పెరిగాడు. తెల్ల పోలీసులకు కనపడితే తన తల్లిని “తెల్లవాడితో బిడ్డను కన్నందుకు” అరెస్టుచేసి నాలుగేళ్ళవరకూ జైలుకు పంపగలరు. అది నల్లవాళ్ళకు మాత్రమే ప్రభుత్వం కట్టిన ఒక కాలనీ. వసతులు అంతంత మాత్రం. ఏడెనిమిది ఇళ్ళకు కలిసి ఒక పబ్లిక్ టాయిలెట్ వుండేది. ముడ్డి తుడుచుకోవడానికి పాత వార్తాపత్రికల కట్ట ఆ పక్కన వేలాడదీసివుండేది. ఆ క్రింద వున్న పెద్ద గోతిలోని పెంటమీద ఈగలు ఝామ్మంటూ తిరుగుతుండేవి. ఆ ఈగలన్నా, ఆ వాసన వేసే చోటన్నా ట్రెవర్‌కు తెగ భయం. ఓరోజు బయట వర్షం కురుస్తోంది. తన పొట్ట కుతకుతమంటూ టాయిలెట్టుకెళ్ళమని తొందరపెడుతోంది. ఇంట్లో తన గుడ్డి బామ్మ తప్ప ఎవరూ లేరు. అప్పుడు ట్రెవర్ ఏమి చేశాడో, ఆ తర్వాత దేవుడు-దయ్యాల నమ్మకాలతో తన తల్లి, అమ్మమ్మ ఏమి చేశారో తెలుసుకుంటే పడీ, పడీ నవ్వుతారు.

ట్రెవర్ అమ్మ తన ఇంట్లో రెండో పిల్ల. తనకు ఓ అక్క, ఓ తమ్ముడు. అందరు నల్లవాళ్ళ ఇళ్ళకు వలెనే తన తండ్రి దూరంగా ఎక్కడో ఎదో గనిలో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికివచ్చేవాడు. ఈమె చిన్నప్పట్నుంచి ఇంటికి కట్టుబడి వుండే రకం కాదు, అందుకనేమో బయటకు వెళ్ళి వస్తుండే నాన్న అంటే ఇష్టం. తన అమ్మానాన్నలు విడిపోతుంటే తన అక్కా, తమ్ముడిలా కాకుండా తను తండ్రితోవుంటానని మారాము చేసింది. కానీ తండ్రి తనను ఎక్కడ పెట్టగలడు. దూరంగా ఎక్కడో తెల్ల ప్రభుత్వం నల్లవాళ్ళకు కేటాయించిన రిజర్వు భూముల్లో సేద్యం చేసుకుంటూ వుండిన తన అక్కదగ్గర వదిలేసి వెళ్ళాడు. ఆ యింటిలో ఈమెలా ఇంకా పదిహేనుమంది పిల్లలు.

తెల్లవారింది మొదలు రోజంతా గొడ్డు చాకిరి. పొట్ట నిండని రోజుల్లో బురదమట్టిని నీళ్ళలో కలుపుకొని పొట్టనింపుకొన్న రోజులు. అంత అధ్వాన్నపురోజుల్లోనూ ఒక కాంతిరేఖ ఏమిటంటే ఆవూర్లో మిషనరీ స్కూలు వుండటం. అక్కడ ఈమె ఇంగ్లీషు నేర్చుకుంది. ఈమె తన అత్త చివరిరోజుల్లో వుండగా మళ్ళీ తన తల్లిని చేరింది. అక్కడ నేర్చుకొన్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో క్లర్కు కోర్సులు చేసి క్లర్కుగా పనిచేయటం మొదలు పెట్టింది. ఇదేమీ చిన్న విషయం కాదు.

ఓక చోట దక్షిణాఫ్రికా జాతుల గురించి చెబుతున్నపుడు మన దేశపు ఆర్య-ద్రావిడ జాతుల మధ్య కొన్నివేల ఏళ్లకిందట ఇదే జరిగివుంటుందా అని ఆలోచన వస్తుంది. మూడొందల ఏళ్లక్రితం ఇండియా వెళ్ళేదారిలో మజిలీగా ఆగారు డచ్చి వాళ్ళు ఇక్కడ. అక్కడ వున్న నేటివ్స్‌తో సంబంధాల వల్ల, వీళ్ళ పొలాల్లో పనిచేయడానికి తెచ్చుకొన్న వేర్వేరు డచ్ కాలనీలనుండి తెచ్చుకున్న జాతుల వల్ల ఒక మిశ్రమ జాతి ఏర్పడింది. అసలు నేటివ్స్ (Khosian) పూర్తిగా అంతరించిపోయి, ఈ మిశ్రమ జాతులే మిగిలాయి. ఈ మిశ్రమజాతిని “రంగుజాతి”(Colored)గా పిలిచారు.

ఈ మిశ్రమజాతిలో కొందరిలో ఆఫ్రికన్ నల్లజాతి లక్షణాలు వుండవచ్చు, యూరోపియన్ తెల్లజాతి లక్షణాలు వుండవచ్చు, ఇండియన్ లక్షణాలూ వుండవచ్చు. ఇద్దరి రంగుజాతి తల్లిదండ్రులకు వారిద్దరి రంగూకానీ పిల్లలు పుట్టడం అసాధారణమేమీ కాదు. ద్రావిడులు నల్లవారు, ఆర్యులు తెల్లవారు అనుకుంటే, ఇద్దరి నల్ల తల్లిదండ్రులకు తెల్ల రంగుతో బిడ్డ పుట్టడం మనకు ఆశ్చర్యం కాదుగా!

ఇందులో అంతా అమ్మ గురించే కాదు, బాలుడిగా ట్రెవర్ అనుభవాలు, చిన్న చిన్న దొంగతనాలు, యువకుడిగా వాలంటైన్స్ డే గురించిన అవమానాలు కూడా బాగా చదివిస్తాయి. ఒక యూదుల స్కూల్లో, “హిట్లర్” పేరున్న తన మిత్రుడితో వెళ్ళి డాన్సు చేయడం, అక్కడ జరిగిన రసాభాస. మ్యూజిక్ సిడీలను కాపీ చేసి సీడీలు అమ్మే వ్యాపారం, ఓ వారం రోజులు పోలీసు కస్టడీలో జీవితం ఇదంతా అతన్ని మాటల్లోనే చదవడం చాలా గమ్మత్తుగా వుంటుంది.

పితృస్వామ్య వ్యవస్థలో పోలీసులు ఎలా పనిచేస్తారో చూస్తే అది ప్రిటోరియా అయినా మన పిఠాపురం అయినా ఒకటే అని తేలుతుంది. తన తల్లిని తన సవతి తండ్రి కొడితే ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళుతుంది ఫిర్యాదు చేయడానికి. ఆ పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేయడం వింతనిపిస్తుంది. ఎంత గట్టిగా అడిగినా కేసు రిజిష్టర్ చేసుకోరు. చివరికి ఆ సవతి తండ్రి పోలీసు స్టేషనుకే వచ్చి పోలీసులకు అది చిన్న గొడవే అని సర్ది చెప్పి ఆమెను తీసుకెళిపోతాడు. అలాంటి కొన్ని ఘటనల తర్వాత అతను ఆమెను చంపడానికి తుపాకీతో కాలుస్తాడు కూడా!

trevor-grandmother

ఇలా వుంటుంది పోలీస్ స్టేషన్లో సంభాషణ.

ఇద్దరు చిన్న పిల్లలతో రాత్రిపూట కిలోమిటరు నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆమె అక్కడున్న ఇద్దరు పోలీసులతో..

“ఫిర్యాదు చేయడానికి వచ్చాను”

“దేనిమీద ఫిర్యదు చేయడానికి వచ్చావు?”

“నన్ను కొట్టిన ఓ మగాడి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను.”

“ఓకే.. ఓకే.. నిదానం, నిదానం. నిన్ను కొట్టిందెవరు?”

“నా భర్త”

“నీ భర్తా? నువ్వేం చేశావు? అతనికి కోపమొచ్చేటట్లా ఏమయినా చేశావా?”

“నేను… చేశానా? లేదు. అతను నన్ను కొట్టాడు. నేను అతనిమిద ఫిర్యాదుచేయడానికి వచ్చాను.”

“నో మాడమ్. ఎందుకు కేసు కేసంటావు? ఏం నిజంగానే కేసు పెడతావా? ఇంటికెళ్ళు, నీ భర్తతో మాట్లాడు. ఒకసారి కేసు పెట్టావంటే మళ్ళి వెనక్కు తీసుకోలేవు. అతనిమీద నేరగాడన్న ముద్ర పడుతుంది. అతని జీవితం మళ్ళీ ఇలా వుండదు. నీ భర్త జైలుకు వెళ్ళాలని నిజంగానే కోరుకుంటున్నావా?”

ఇలా ఆమె కేసు పెట్టమని పోరుతున్నంతలోనే ఆమె భర్త అక్కడికి చేరుకుంటాడు. అతని కళ్ళు ఇంకా మత్తులో వున్నట్లు తెలుస్తూనే వుంది. అయినా లోపలికి వచ్చి “హలో బాస్, మీకు తెలియదా ఆడవాళ్లతో వ్యవహారం? ఏదో కొద్దిగా కోపం వచ్చిందంతే!”

“తెలుసులేవోయ్! మాకు తెలుసు, అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ వుంటుంది. ఏం పట్టించుకోకు.”

అంతే, పోలీసులు కేసు రాసుకోలేదు. అతన్ని కనీసం మందలించలేదు. పితృస్వామ్యంలో భర్త కొడితే భార్య పడి వుండాలి. అది మామూలు విశయం. పోలీసులు దాన్ని మామూలు విశయంగా తీసుకోకుండా మరెలా తీసుకుంటారు?!

ఇలా ఈ పుస్తకం నిండా ఎన్నింటినో మనం చూడవచ్చు.

*

 

 

 

 

ఆ హేమంత ఋతు గానం వినిపిస్తోందా?!

konni sephalikalu

 

మార్గశీర్ష మాసం, అందులోంచి కొన్ని రోజులు గడవగానే పుట్టుకొచ్చిన ధనుర్మాసం. ఇప్పటికీ ఆకాశవాణి తెలుగు కేంద్రం వాళ్ళు గోదాదేవి పాశురాల రూపంలో శ్రీరంగనాధునికి చేసుకున్న విన్నపాలను ప్రతీ ఉదయం వినిపిస్తూనే ఉన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేట తెలుగు మాటల్లో.  ఈ ఉదయం కళ్ళు తెరిచే లోపే రేడియోలోంచి ఆ పాట  మంద్ర మధురంగా చెవులకేకాక శరీరమంతటికీ వినిపించింది.

“చీకాకు పడకు, చిడుముడి పడకూ ! నీ కరుణవినా నాకేమున్నది చెప్పూ” అంటూ మొదలయిన గీతం. కృష్ణుడి మీద ఎందుకు గోదకి అంత పిచ్చి ?! ఒక్క గోదాదేవి కేనా ?

హై స్కూల్ రోజుల్లోనే జయదేవుడు పరిచయమయ్యాడు “యాహి మాధవ, యాహీ కేశవా, మావద కైతవ వాదం” అంటూ అష్టపదుల రూపంలో.  కృష్ణుడు కితవుడే, మోసగాడే. ఓ మాధవా! మోసపు మాటలు లేదా దొంగ మాటలు చెప్పకు అంటుంది రాధ.  ఇలా దొంగమాటల మోసకారిని ప్రేమించి ఆ రాధ ఎందుకు ఎప్పుడూ ‘విరహం’ లోనే వేగుతుంది.  జయదేవుడి గీత గోవిందం నిండా ఈ ‘విరహం’ అన్న పదమే పలుమార్లు వినిపిస్తూ ఉంటుంది. కృష్ణుడితో  ఉన్నదంతా విరహమే. చెప్పిన సమయానికి రాడు, ఎన్నడూ.

“కధిత సమయేపి హరి అహహ న యయౌ వనం, మమ విఫలం ఇదం అమల రూపమపి  యౌవనం” అంటూ గోల పెడుతుంది.  చెప్పిన సమయానికి వనానికి రాలేదు. ఈ అమల సుందరమయిన రూపమూ, యవ్వనమూ కుడా విఫలమయిపోయాయి అని వాపోతుంది. “యదను గమనాయ నిశి  గహన మపి  శీలితుం, తేన మమ హృదయం ఇదం అసమశర కీలితం” అనీ గొడవ పెడుతుంది.  వస్తానని చెప్పిన ఆ సమయం ఏదీ-? అర్ధ రాత్రి.  ఎవడి కోసమయితే ఎంత కష్టమయినా చిమ్మ చీకట్లలో, (నిశి అన్న మాట వాడేడు కవి.)  వెతుక్కుంటూ పోయేనో వాడి వల్లే నా హృదయాన్ని ఇపుడు మన్మధుడు తూట్లు పొడుస్తున్నాడు.  అనీ ఘోష పెడుతుంది.  ఇలాంటి వాక్య నిర్మాణ ప్రయోగం జయ దేవుడి లాంటి సంస్కృత కవుల నించే  ఇప్పటి సినిమా రచయితల దాకా వచ్చింది (ఎవడు కొడితే… ) ఇలా ఇప్పుడు వేధించి, విరహించి, చంపే కృష్ణుడంటే రాధకు ఎందుకంత ఇష్టం ?!

అసలు జయదేవుడే రాధ.  మన గజల్ కవుల్లా జయదేవుడి ప్రతి అష్టపదిలోను చివర అతని పేరు రాసుకుంటాడు. “జయదేవ భణిత మిదం”, “జయదేవ కవి రాజ రాజే” అంటూ.  కాని గీతాలన్నింటా అతనే నిండిపోయాడు.  రాధ పలవరింతలూ, పులకింతలూ అతనివే. ‘యా రమితా వనమాలినా’ ఎవరైతే వనమాలితో ఆనందోన్మాదంలో ఉందో ఆమె సజల జలద సముదాయాలను చూసి  పూర్వంలా తపించడం లేదు అని రాస్తాడు.  “సజల జలద సముదయ రుచిరేణ దహతినసా మనసిజ విశిఖేన “  ఆ రాధ నల్ల మబ్బులు చూసి మన్మధ బాణాల చేత కాల్చబడడం లేదు . ‘న దహతి’  అన్న మాట తెలుగు చెయ్యడం కష్టం.  అతను చెంత ఉంటె ఇక ఏవీ బాధించ లేవు.  ప్రపంచమే తెలియదు.  ఎందుకు జయదేవుడికి మాత్రం ఇంత “లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరాల్లాంటి” పదాల అల్లికలతో ఇన్ని గేయాలు గుండెలోంచి ప్రవహించాయి.  ఆ ‘కందర్ప జ్వరమేదో’ అతనికీ రాధకు లాగే ఒళ్లెరగకుండా కాసింది.  అప్పటికీ ఇప్పటికీ కూడా జయదేవుడిని వింటే అలాంటి జ్వరాన్ని మనమూ ఎంతో కొంత అనుభవించక తప్పదు’ అయితే ఈ కృష్ణుడు నిజంగా దొంగ కృష్ణుడే.

tiru1

పాపం పోతనగారి రుక్మిణి కూడా ఇలాంటి ఎదురు చూపుల సందేహంలోనే పడింది. “ఘనుడా భూసురుడేగెనో”… “విని కృష్ణుండిది తప్పుగా తలచునో, విచ్చేయునో,…. నా భాగ్య మెట్లున్నదో అంటూ,” ఎందుకు వీళ్ళందరూ ఇతని కోసం ఇలా అలమటించేరు – ? అతనిలోని ఆ ఆకర్షణ ఏమిటి ? ఎందుకలా పిచ్చిగా ఆరాధించాలనిపిస్తుంది ?

ఆ అసలు కృష్ణుడు నాకు భారతంలో దొరికాడు.  నిగ్రహమూ ప్రేమా కలగలిసిన కృష్ణుడు అతను.  ఓపిక పట్టడం తెలిసిన వాడు. అదను కోసం ఎదురు చూడడంలో ఏమరుపాటు లేనివాడు.  అలాంటి కృష్ణుడిని తప్ప మరెవరిని ప్రేమిస్తాం అనిపించేలా,పై ప్రశ్నలకి జవాబులా.

అరణ్యవాసం తర్వాత అజ్ఞాత వాసం చివర, సంధికి వెళ్లబోయే ముందు కృష్ణుడు ఒక్కొక్కరి అభిప్రాయమూ అడుగుతాడు.  పాండవులు అయిదుగురూ చెప్పేక ద్రౌపది దగ్గరకొచ్చి ఆమెను అడగ్గానే ఆమె ఆ సమయం  కోసమే చూస్తున్నట్లు పులిలా గర్జిస్తుంది.  ఇంచుమించు అయిదుగురు భర్తల్నీ మాటలతో చీల్చి చెండాడుతుంది.  ఇక మాట్లాడి మాట్లాడి అలిసిపోయి తన అవమానం తల్చుకుని భోరుమని ఏడుస్తుంది.  అంత వరకు కృష్ణుడు పెదవి విప్పడు.  మౌనంగా వింటాడు.  చివరకు “ఎలుగు రాలు పడ నేడ్చిన యాజ్ఞసేనిన్ కృపాయత్త చిత్తుండయి నారాయణుండురార్చి” అని రాస్తారు తిక్కన గారు.  గొంతుకు ఆర్చుకుపోయేలా ఏడ్చేదాకా మాట్లాడకుండా, చెప్పినదంతా విని అప్పుడు మాట్లాడుతాడు.అలా ఆమె బాధ అంతా బయటకు పోవాలి . “మ్రుచ్చిర నేల ఏ గలుగ ముద్దియ” అని మొదలు పెడతాడు. ‘ఏ గలుగ’ అంటే ‘నేను ఉండగా’ అని.  ఇది చిన్నమాటగా కనిపిస్తున్న చాలా పెద్ద మాట.  ఓ అమాయకురాలా! నేను ఉండగా నువ్వు ఎందుకు ఇలా అలజడి చెందుతావు అని.  ప్రతి మనిషీ, ముఖ్యంగా స్త్రీలు ఇలా అనే వాళ్ళ కోసం తమకు తెలీకుండానే ఎదురు చూస్తారు.  అన్ని వేళలా అలాంటి తోడు ఉంటే  ఇంకేం కావాలి ? అలాంటి వాళ్ళని పిచ్చిగా ప్రేమించకుండా ఉండగలమా ?

ఊరికే అనడం కాదు.  తను ఆమె కోరుకున్న విధంగా సాధించబోయే కార్యం గురించి కూడా చెప్తాడు.  నువ్వు భయ పడినట్లుగా కౌరవులతో సంధి జరగదు.  యుద్దమే జరుగుతుంది.  ఈ ధర్మరాజే పంపగా వృకోదరుడు, వివ్వచ్చుడు (నిర్విరామంగా బాణాలు వేయగల అర్జనుడు) తోడురాగా శత్రునాశనం చేసి తిరిగి వస్తాను అలాంటి ‘నేను’ ఉండగా అని చెప్పిన కృష్ణుడు ద్రౌపదికి ఒక్క దానికే చెప్పలేదనిపిస్తుంది.  ఎవరు అతని ముందు తమ దుఃఖమంతా చెప్పుకుని ఏడ్చినా అదంతా శ్రద్ధగా విని ‘ఎందుకీ దుఖం నేనుండగా’ అని అంటూ ఉంటాడనిపిస్తుంది.టాగూర్ లా అతను మన కూడా ఉన్నాడని నమ్మగలగాలే గాని .

దీన్ని ముక్కు తిమ్మన పట్టుకున్నాడు.  పారిజాత పువ్వుకోసం సత్యభామ ఇలాగే ఏడుస్తుంది.  పువ్వు వల్ల  జరిగిన అవమానానికి కూడా. ఆ అవమాన భారం ఆమె గుండెల మీంచి దిగే దాకా ఆమె మాటలూ చేతలూ సహిస్తాడు ఆ మాయదారి కృష్ణుడు.  అంతా అయ్యాక ఆమె వడలిని మొహం మీద కొంగు కప్పుకుని కోకిల కంఠంతో ఏడ్చింది. అప్పుడు మాట్లాడేడు. “ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక ఇంత వంత నీ కేల లతాంత మాత్రమునకే గలుగ” అంటూ. ఏడ్చి ఏడ్చి మొహం వడిలిపోయింది. ఆభరణాలు లేవు. మాసిన చీర. కాని ఆమె నొక్కుల జుట్టు మాత్రం లలితమయిన ఇంద్ర నీల మణుల మెరుపుతో ఉందట.  అలాంటి అందమయిన కేశ రాశితో వెలుగుతున్నదానా ! నేనుండగా ఒక్క పువ్వు కోసం ఇంత వంత నీకెందుకు ? అని.  ఇక్కడ కూడా మళ్ళీ కృష్ణుడు అదే అన్నాడు ‘నేనుండగా’ అని . అదే భరోసా.  తిక్కన గారి కృష్ణుణ్ణి నంది తిమ్మన బాగా అర్ధం చేసుకున్నాడు.

ఇక్కడ కూడా ఊరికే ‘నేనుండగా ఇంత బాధ ఎందుకు ?” అనడం లేదు.  ఆ  బాధ ఎలా పోగొడతాడో చెప్తున్నాడు. “అనికిన్ బలసూదనుడెత్తి వచ్చినన్… ఇట తెచ్చెద నిచ్చెద పారిజాతమున్” “సాక్షాత్తు ఇంద్రుడే యుద్ధానికొస్తాడు.  ఎందుకంటే ఆ చెట్టు ‘నందనం’ అనే అతని తోట లోది.  అయినా ఇక్కడికి తెచ్చేస్తాను.  మన పెరట్లో ఎక్కడ నాటాలో ఆ చోటు చూసిపెట్టుకో” అంటాడు. చేస్తాడు కూడా.

అభిమానవంతులయిన ఆడవాళ్ళకు వస్తువులు కాదు కావలసినది.  తమ అవమానాల బాధల గాధలు ఓర్పుతో, శ్రద్ధగా వినే పురుషులు కావాలి.  అంతా విన్నాక నేనుండగా నీకెందుకీ బాధ అని ఎవరు చెప్తారో వారే ప్రియతములు.  అందుకే అలాంటి వారిని గురించి “సా విరహే తవ దీనా” అని జయదేవుడు రాస్తాడు.  ఆమె నీ విరహంలో ఉంది కృష్ణా,  అని ఎనిమిది చరణాల నిండా నిండి పోయేలా పాడతాడు. “వ్యాళ నిలయ మిళనేన గరళ మివ కలయతి మలయ సమీరం” అంటాడు.  మలయ పర్వతం మీద ఉన్న గంధపు చెట్లకి పాములు చుట్టుకుని ఉంటాయి.  వాటి గరళం ఆ గాలిలో కలిసినట్టుగా ఆమె మలయ సమీరానికి ఖేద పడుతోంది.  ఇదంతా నీ విరహం వల్లనే అని జయదేవుడు రాస్తే కృష్ణుడంటే ఏమిటో తెలియపోతే ఆమె వ్యధ గానీ, ఆ కవిత్వం గాని ఏం అర్ధమవుతాయి.

చాలా పై స్థాయి ఎగ్జిక్యుటివ్ లాగ కృష్ణుడు ‘సమయానికి తగు మాటలాడును, మాటలాడకుండును’అన్నట్టు ఉంటాడు.  పోలిక బావులేదు గానీ మన కళ్ళ ముందు ఉండే  ఉపమానం అదే కదా ?శిశుపాల వధ దగ్గర సరే  చివరి దాకా మాట్లాడడు.అది అందరికీ తెలిసిన కథే. అంతకు ముందే  ద్రౌపదీ స్వయంవరానికి బ్రాహ్మణ వేషాల్లో వచ్చిన పాండవులను చాలా ముందుగా గుర్తుపట్టినవాడు కృష్ణుడొక్కడే.  వీళ్ళు ఈ వేషాల్లో నివురు కప్పిన అగ్నికణాల్లా ఉన్నారనుకుంటాడు.  పక్కనే ఉన్న అన్న బలరాముడితో కూడా అనడు. కృష్ణుడు భగవదవతారం అన్న మాట పక్కన పెడదాం.  చనిపోయిన అయిదుగురు ఆప్తులు ఒక్కసారిగా బతికి ఉండి  కనిపిస్తే ఎవరితోనూ పైకి అనకుండా ఉండడం ఎంత కష్టం.  కానీ అది పైకి మాట్లాడే సందర్భం కాదు.  మాట్లాడితే రసాభాస అవుతుంది.  స్వయంవరం పూర్తయ్యాక అక్కడొక యుద్ధం జరిగే పరిస్థితిలో బలరాముణ్ణి ఆపడానికి అప్పుడు నోరు విప్పి చెప్తాడు.  ఒక్కసారిగా అంతా తెలిసి కూడా ఆ సందర్భంలో అలా మౌనంగా కూర్చున్న కృష్ణుడి నిగ్రహం చూస్తే, దాని వెనక ఉన్న పాండవుల మీది ప్రేమ చూస్తే మనకి కృష్ణుడు ఎంత ఆరాధ్యుడవుతాడు!!

tiru2

చివరి గా ఎస్ .ఎల్.భైరప్ప అనే ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత తన పర్వ నవల లో కృష్ణుడి విజయ రహస్యానికి చెందిన ఒక సంఘటన ను ఎంతో వివరంగా రాస్తాడు .అది చెప్పేది కాదు.చదివి తీరవలసిందే. జరాసంధుడి బాధలు పడలేక, వాడిని జయించ లేకా కృష్ణుడు యాదవులందరినీ తీసుకుని రాజ్యం వదిలి పారిపోతాడు .అంతమందిని రక్షించడం కోసం పారిపోవడం అవమానం అనుకోడు. ఎక్కడో సముద్ర తీరాన ద్వారకానగరం కట్టుకుని దాక్కుంటారు. హాయిగా ఉన్నారు గనక అందరూ పాత ఓటమి తాలూకు అవమానం మరచిపోయారు .కానీ కృష్ణుడు మరచిపోడు.ఓర్పు గా ఉండి అదను కోసం వేచి ఉంటాడు .తగిన సమయం రావడానికి చాలా కాలం పడుతుంది అప్పటిదాకా వ్యూహ రచన చెస్తూ ఉంటాడు .చివరకు జరాసంధుడి వధ మనకు తెలిసినదే . భైరప్ప గారు ఈ అధ్యాయమంతా సవివరంగంగా రాసి కృష్ణుణ్ణి ప్రేమించకుండా ఉండడం సాధ్యం కాదని తేల్చేసారు .

భాగవత కృష్ణుడు ప్రేమికుడు . జయదేవుడు ఆ కృష్ణుడి నే తెచ్చుకున్నాడు .”యది హరి స్మరణే సరసం మనో, యది విలాస కలాసు కుతూహలం ,మధుర కోమల కాంత పదావలీం ,శృణు తదా జయదేవ సరస్వతీం”.అని ముందే చెప్పుకున్నాడు.హరిస్మరణనీ ,విలాసకళనీ మధుర, కోమల, సుందర పదాలో కలిపి అందిస్తున్నాను . ఈ మధువు తాగండి అన్నాడు. ఇక భారత కృష్ణుడు బహుముఖీన చతురుడు,అసామాన్య మానవుడు

ఇతడే ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు .పన్నెండు నెలల లోనూ నేను ఈ మార్గశిరమాసాన్ని అన్నాడు.దీని తాత్వికార్ధం పెద్దలూ చెప్పాలి .నేను భావుకతార్ధం చెప్తాను .ఈ నెలలో వచ్చే చలికాలం మనుషులకు శరీర స్పృహను, తద్వారా త్వగింద్రియ స్పర్శను సున్నితం చేస్తుంది. అలా సన్నిహితం కూడా చేస్తుంది.ప్రేమికుడైన కృష్ణుడు ఈ నెలంతా వారిని ఆవహించి , విరహితం చెయ్యకుండా అత్యంత సన్నిహితమే చేస్తాడు .

ఇలా జయ దేవ కృష్ణుడు ,భారత కృష్ణుడు కలగలిసి చేసే హేమంత ఋతు గానం ప్రతీసారీ నిత్య నూతనమే,వినగలిగితే.

*

 

 

బాలీవుడ్ భాష మారిపోతోంది!

2016 చివరకొచ్చేసింది. ఈ సంవత్సరం వచ్చిన మూడు ముఖ్యమైన బాలీవుడ్ ఫిల్మ్స్ గురించి చెప్పుకుని తీరాలనిపిస్తోంది.  సినిమాభాషని సరికొత్తగా పలికించటంతోపాటు ఇప్పుడున్న సమస్యలగురించి మాట్లాడ్డం ఈ సినిమాల ప్రత్యేకత.

ఎవరిగురించైనా మంచినీళ్ళు తాగినంత సులువుగా తీర్పులు చెప్పెయ్యటం డిజిటల్ యుగంలో మామూలయిపోయింది.  మనిషన్నవాడికి తీర్పులు చెప్పటం మంచి కిక్ ఇచ్చే విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళూ,  మైనారిటీలూ, దళితుల విషయంలో చాలామంది తీర్పులుచెప్పే నిషాలోకి భలే తొందరగా జారిపోతుంటారు. ఆ నిషా sexist ఆలోచనలది కావచ్చు. నిజమైన మత్తుమందుల వెల్లువలో మనిషి జంతువైపోయే నిషా కావచ్చు. లేకపోతే మాకు తెలిసినదేదో అదే మనిషికుండాల్సిన sexual behaviour అని వాదించే మూర్ఖత్వపు నిషా కావచ్చు.

‘ఉడ్తా పంజాబ్’ లో జనం నోళ్ళలో తెగనలిగిన ‘చిట్టావే’ పాట చరణంలో ‘కుండీ నషేవాలీ ఖోల్ కె దేఖ్’ (నిషాతనపు గొళ్లెం తెరిచిచూడు) అంటాడు.  అలాంటి మూసుకుపోయి తుప్పు పట్టిన నిషాతనపు గొళ్ళేలు తెరిచి, మది తలుపుల్లోకి కొత్త వెలుతురు ప్రసరించాలని ప్రయత్నించిన సినిమాలివి మూడూ.

The issues of humanity and what is fair and good treatment of a fellow human being,  should not be based on a personal sense of right and wrong or judgment” –  Debbie Harry (American Rapper).

అలీగఢ్ యూనివర్సిటీలో పనిచేసిన మరాఠీ ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ జీవితకథే ‘అలీగఢ్’ సినిమా. ‘గే’ అయినందువల్ల ఆయన్ను శారీరకంగా మానసికంగా హింసించి కేంపస్ నుండి వెళ్ళగొట్టారు.  పదవీకాలం ఇంకో ఆర్నెల్లుఉందనగా కోర్ట్ తీర్పుతో ఉద్యోగాన్నీ, కేంపస్ క్వార్టర్స్ ని సాధించుకున్నాడాయన.  మర్నాడు ఉద్యోగంలో చేరతాడనగా ముందురోజే అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన దీపూ సెబాస్టియన్ అనే జర్నలిస్ట్ చెప్పిన వివరాలు ముఖ్య ఆధారంగా ఈ సినిమా తీశాడు హన్సల్ మెహతా.

ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ జూలై 2009లో తీర్పు చెప్పింది. కానీ 2013లో సుప్రీం కోర్ట్ ఆ తీర్పుని కొట్టేసి స్వలింగసంపర్కాన్ని నేరమని నిర్ణయించే సెక్షన్ 377 అమల్లోనే ఉంటుందని చెప్పింది. ఈ రెండుతీర్పుల మధ్య కాలంలో 2010 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ ఇంటిమీద దాడి జరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీన 2010 లో ఆయన అలహాబాద్ హైకోర్ట్ లో కేసు గెల్చాడు. ఏప్రిల్ 7వ తేదీ 2010 న తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉన్నాడు. అటాప్సీ రిపోర్ట్ లో విషప్రయోగం జరిగిందని వచ్చింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినా, సరైన ఆధారాలు ఇవ్వలేకపోవటంతో అది హత్య కేసుగా నిలవలేదు.

‘అలీగఢ్’ సినిమా ఒక లాంగ్ పోయెమ్.  ప్రొఫెసర్ సిరస్ తో ‘కవిత్వంలోని పదాలు నాకు అర్థం కావం’టాడు జర్నలిస్ట్ దీపూ. ‘పదాల్లో ఏముంది అర్థం? పదాల మధ్య వున్న నిశ్శబ్దంలో ఉంటుంది గానీ’ అంటాడు శబ్దాల మధ్య ఒదిగున్న నిశ్శబ్దంలాంటి సిరస్. అతనికి లతా మంగేష్కర్ పాటలంటే ప్రాణం. మరాఠీలో కవిత్వం రాసి అచ్చేసుకున్నవాడు.  ‘Gay’ అనే  మూడు అక్షరాలలో ఓ మనిషిని కుదించటం ఏమిటని మౌలికమైన ప్రశ్న వేస్తాడు.  తన పార్టనర్ ని చూస్తే తనలోని ప్రేమ తనను నిలవనీయదని చెప్పి, ఆ పరిస్థితిని వీలైనంత స్పష్టంగా చిన్నమాటలతో  దీపూ కి వివరించటానికి ప్రయత్నిస్తాడు.

alia-bhatt-udta-punjab-trans

కథలోకొస్తే, రాత్రివేళ సిరస్ ఒక రిక్షాఅతనితో కలిసుండగా ఇద్దరు మనుషులు అతని ఇంట్లోకి చొరబడి వాళ్ళిద్దరినీ వీడియో తీసి, రిక్షాఅతన్ని కొట్టి, ఇద్దరిమీదా విరుచుకుపడి తిట్లకి దిగుతారు.  సిరస్ భీతితో ముడుచుకున్న పావురాయిపిల్లలా అయిపోతాడు. తరువాత ‘గే’ అనే ఆరోపణమీద అతన్ని యూనివర్సిటీ సస్పెండ్ చేస్తుంది. సిరస్ నమ్మిన తోటి ప్రొఫెసర్ ఒకాయన అతన్ని ఓ పక్క అసహ్యించుకుంటూనే మరోపక్క సాయం చేస్తున్నట్టుగా, తను ‘గే’ అని ఒప్పుకుంటూ క్షమాపణ పత్రం రాయమని సిరస్ కు సలహా ఇస్తాడు. ఏమీ తోచని సిరస్ అలాగే రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కేంపస్ లో సిరస్ శీలపరీక్ష, అతని దిష్టిబొమ్మ తగలేయటం లాంటి పనులు జరుగుతాయి. అప్పట్నుంచీ తలుపులు వేసుకుని అతను దిగులుగా భయంగా ఇంట్లోనే ఉండిపోతాడు.  వారంరోజుల్లో అతను యూనివర్సిటీ క్వార్టర్ ను ఖాళీ చెయ్యాలని చెప్పి, ఇంటికి ఎలక్ట్రిసిటీ లేకుండా చేసేస్తారు. దీపూ తన పత్రికకోసం ఈ విషయాన్నంతా స్టోరీ చేయాలన్న తపనతో, చాలా సానుభూతితో కష్టపడి సిరస్ కి చేరువై, అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో హక్కుల సంఘాలవాళ్ళు సిరస్ కు ఆసరా ఇచ్చి అతనిచేత కోర్ట్ లో కేసు వేయిస్తారు. అలీగఢ్ విద్యాలయాన్ని ఎంతగానో ప్రేమించిన సిరస్ యూనివర్సిటీ క్వార్టర్ విడిచిపెట్టి వేరేయింటికి మారాల్సివస్తుంది.  అతని వ్యక్తిగత జీవితంలోకి దౌర్జన్యంగా చొరబడి వీడియోలు తీసే హక్కు ఆ వ్యక్తులకీ, ఆ వీడియోల ఆధారంగా సిరస్ ను శిక్షించే హక్కు యూనివర్సిటీకీ లేదని వాదించి కూడా ఆవిధంగా ఒప్పించలేక, చివరకు స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని precedent గా చూపించి కేసు గెలిపిస్తాడు లాయర్.

సిరస్ హక్కులంటూ పోట్లాటకు దిగలేని నెమ్మదస్తుడు.  లతామంగేష్కర్  పాటలూ కవిత్వమూ తప్ప ఇంకేం అక్కర్లేదు. కోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా అంతగా ఇష్టపడక ఇక తప్పని పరిస్థితిలో దానికి ఒప్పుకునేంత ఇంట్రావర్ట్.  తనగురించి కోర్ట్ లో వాదనలు జరుగుతుంటే అవన్నీ అర్థంకాక అలిసిపోయి చేతిలో పుస్తకం పట్టుకుని చిన్నకునుకు తీస్తుంటాడు.  అలీగడ్ లో మరాఠీ విభాగానికి హెడ్ గా ఉండటమంటే అక్కడ తను బయటివాడని అర్థం. అదేకాకుండా తనకు యూనివర్సిటీలో వున్న ప్రతిష్టను కూడా సహించలేని కొంతమంది ఇలా హింసకు దిగారని  దీపూ వొక్కడికే చెప్తాడు.

“అలీగడ్” ఒట్టి హక్కులూ పోరాటాల సినిమా కాదు. ఒంటరితనం.. వేధింపులకి గురై అలసిన ఒంటరితనం.. కొత్త ఇంట్లో చుట్టూ పరుచుకున్న సామాన్ల మధ్య దోమలు కొట్టుకుంటూ లతా పాటలూ, బయట హైవేమీదనుంచి పోతున్న లారీల చప్పుళ్ళమధ్య   ఇబ్బందిగా మసిలే ఒంటరితనం.. ‘గే’ అన్న ఒక్క తేలిక మాటతో తానెంతో ప్రేమించిన వాతావరణానికి క్రూరంగా దూరం చేస్తే గుక్కలు మింగే దుఃఖపు ఒంటరితనం ఈ సినిమా. ఇద్దరి ఏకాంతాన్ని వాళ్ళ అనుమతితో పని లేకుండా జొరబడి ధ్వంసంచేసి మనిషి విలువను నేలరాసి అవమానించటంలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపించటమే ఈ సినిమా..  ఎంతో ఆర్ద్రంగా తీశాడు హన్సల్ మెహతా.  సిరస్ గా వేసిన మనోజ్ బాజ్ పాయ్, దీపూ సెబాస్టియన్ గా వేసిన రాజ్ కుమార్ రావ్ సినిమానుండి కన్ను తిప్పుకోనివ్వకుండా చేశారు. మనోజ్ బాజ్ పాయ్ కి  2016 కి best actor గా జాతీయఅవార్డు ఏకగ్రీవంగా రావాలి మరి.

Loudness ఏ కొద్దిగానూ లేకుండా ఆర్ట్ ఆఫ్ సినిమాని పట్టుకుంది ‘అలీగఢ్’. ఏదో ఒక విషయాన్ని రుజువు చెయ్యటానికో, సమస్యను వివరించటానికో పరిష్కరించటానికో తీసినట్టుగా ఉండదు. సమస్య తీవ్రతనీ  వ్యక్తి ఆవేదననీ కలబోసి చెప్పిన తీరులో గొప్పగా తూకం కుదిరింది అలీగఢ్ లో.  మనోజ్ బాజ్ పాయ్ నటన, సినిమాటోగ్రాఫర్  సత్యారాయ్ నాగ్ పాల్ సినిమాకిచ్చిన melancholic tone, visuals సినిమాకున్న  పొయటిక్ పోకడకి బాగా అనుకూలించాయి.  వ్యాపారాన్ని పక్కనపెట్టి తీసిన సినిమా కావటం వల్ల డబ్బు కంటే ఎక్కువగా పేరూ ప్రశంసలూ వచ్చాయి.

***

లైంగిక వేధింపులని రకరకాలుగా సమర్ధించుకుంటున్న పురుషాధిక్యతకి చాచిపెట్టి లెంపకాయ కొట్టింది ‘పింక్’.  ఏ పరిచయస్తురాలైనా, స్నేహితురాలైనా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, నార్త్ ఈస్ట్ అమ్మాయయినా (వాళ్ళు సులువుగా దొరికేస్తారని చాలామంది మగవాళ్ళకి నమ్మకం), భార్య అయినా, అంటే అసలే స్త్రీ అయినాసరే నీ ప్రేమకీ కోరికకీ ‘వద్దు’ అని చెప్పిందంటే అది ఖచ్చితంగా ‘వద్దు’ అనే. ఇంకో వాదనకి అవకాశం లేదని సూత్రప్రాయంగా నిరూపించింది. నిర్భయ కేస్ తరువాత వచ్చిన నిరసనల్ని ఎదుర్కోలేక, పులి మేకమీద పడి తినేస్తే మేకదే తప్పన్నట్టుగా ఆడవాళ్ళ దుస్తులతీరు మీదా స్వాతంత్ర్యం మీదా ఏడ్చి, బాధితులనే నేరస్తులని చేసే దబాయింపుకి దిగారు కొంతమంది. ఏయే విషయాల్లో ఆడవాళ్ల ప్రవర్తన తప్పన్నారో ఆ పరిస్థితులన్నిటిలోనూ ఒక ముగ్గురు అమ్మాయిలని ఇరికించి, వాళ్ళమీద వచ్చిన లైంగికవేధింపులని ఇంకోమాట లేకుండా శిక్షించాల్సిన నేరాలుగా వాదించి ఒప్పించారు ‘పింక్’ సినిమాలో.

వాళ్ళు ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిలు. మెట్రోసిటీలో ఈతరం అమ్మాయిలు వేసుకునే బట్టలు వేసుకుంటారు.  ఫ్రెండ్స్ ద్వారా అప్పుడే పరిచయం అయిన అబ్బాయిలతో వాళ్ళని నమ్మి డిన్నర్ కి రిసార్ట్ కి కూడా వెళ్తారు. మద్యం తాగటం తప్పనుకోరు. ఒకమ్మాయి ఇంటి బాధ్యతలకోసం డబ్బు అవసరమై పెళ్ళయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.  మరో అమ్మాయి ఆ ఊళ్లోనే తల్లిదండ్రులుంటున్నా వాళ్ళతో కలిసి ఉండకుండా విడిగా ఉంటుంది. ఈమె పెళ్లి కాకపోయినా వర్జిన్ కాదు.  మూడో అమ్మాయి పుట్టుకవల్లనే (నార్త్ ఈస్ట్) ఇంచుమించు సెక్స్ వర్కర్ గా, సెకండ్ రేట్ సిటిజన్ గా భావించబడే జీవి.  ఒక సంప్రదాయ సమాజంలో ఇవన్నీ ఆ అమ్మాయిలని త్రాసులో వేసితూచి ‘చెడ్డ అమ్మాయిలు’ అని ముద్ర వేసే పరిస్థితులే.

pink2

నిర్భయ కేస్ తరువాత వచ్చిన మేల్ డామినేటెడ్ సంప్రదాయ సమాజపు discourse  కు సరైన సమాధానం చెప్పటం కోసమా అన్నట్టు ఈ ముగ్గురు అమ్మాయిల్నీ సంప్రదాయ సమాజపు ‘చెడ్డ అమ్మాయి’ ముద్రలోనే పెట్టి వాదన పెట్టుకున్నాడు దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌదురి.  కోరికలు పుడతాయి సరే, వాటితోబాటు వొచ్చే ఆలోచనలు సమానత్వమనే గీతదగ్గరే ఆగితీరాలని పట్టుగా చెప్పాడు.  అమాయకపు పల్లెటూరి పిల్లలుగానో, లేక అందరూ ఒప్పుకునే ‘పధ్ధతైన’ పిల్లలుగా ఉంటూనే అన్యాయాన్ని గట్టిగా ఎదిరించేవాళ్లుగానో కాకుండా చాలామంది వ్యతిరేకించే ‘థర్డ్ వేవ్ ఫెమినిస్ట్’ ల్లాగా ఉన్న అమ్మాయిల జీవితాలని చూపిస్తూ వాదించటంవల్ల ‘పింక్’ అర్బన్ యూత్ లోని ఆడామగా అందరికీ బాగా చేరిపోయింది.

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అర్బన్ మధ్యతరగతి మగవాళ్ళకి,  తమ స్పేస్ ని ఆక్రమించేదాన్ని దేనినీ సహించని థర్డ్ వేవ్ ఫెమినిస్ట్ ల జీవిత విధానాలను ఒప్పుకుని బ్రతకటం ఇప్పటికే అలవాటయింది.  ఇంట్లో పెంపకాల్లో అబ్బాయిలకి పొగరు, అమ్మాయిలకి ఒదిగుండేతనం నేర్పిపెట్టే కుటుంబాలకి ‘పింక్’ గట్టి మొట్టికాయ. ఈ సినిమా తర్వాత ‘పింక్’ హీరోయిన్ ‘తాప్సీపన్నూ’ కూడా తనమీద మగవాళ్ళు కొంతమంది తీసుకున్న sexual advances గురించి మాట్లాడింది. అప్పట్లో తల్లిదండ్రులు ఏం జరిగినా ఆడవాళ్ళదే తప్పనీ, నోరుమూసుకుని ఉండాలనీ నేర్పేవారు కాబట్టి తను అలాగే నోరుమూసుకుని ఉండేదని చెప్పింది.  ఆడామగా పెంపకంలో విడివిడి నీతులు పాటించేవాళ్ళని కడిగిపారేసిన ఈ సినిమా ఆడపిల్లలకు ఇంకొంచెం ధైర్యమిచ్చింది. ఇది చూసాకన్నా ‘ఆడది ముఖ్యంగా సెక్స్ టూల్, మనకే సొంతం, ప్రేమించానంటే కామించానంటే ఒప్పుకు తీరాల’ని మెదడులో ఇంకిపోయిన కొంతమంది వృద్ధులకీ వృద్ధుల్లాంటి కుర్రాళ్ళకీ  ‘పింక్’ మాట్లాడుతున్న సభ్యతా సమానత్వాల పరిభాష అర్థమౌతుందా? ఏమైనా చాలామందిని చేరుకుని, చర్చలకి దారి తీయించటంలో ‘పింక్’ టీమ్ గెల్చింది.

‘పింక్’ లో అమితాబ్ ఆక్సిజన్ కోసం మాస్క్ వేసుకు తిరుగుతుంటాడు. అదో మంచి ప్రతీక. ఢిల్లీ వాతావరణంలోని ఊపిరాడనితనాన్నీ, ఆడపిల్లల అభద్రతనీ మాంచి టెన్షన్ నిండిన మ్యూజిక్ తో నింపి సినిమా అంతా అందర్నీ  కుర్చీల అంచుల్లో కూచునేలా చేసేస్తుంది సినిమా.  శూజిత్ సర్కార్ ఆధ్వర్యంలోని సినిమా కాబట్టి నటులందరూ పోటీలుపడి జీవించక తప్పదు గానీ, ఈ ముగ్గురాడపిల్లల్నీ వేధించిన పోలీస్ ఆఫీసర్ గా వేసిన అమ్మాయిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎటూ కాని చదువులతో  ఉద్యోగంలో చేరిపోయి ఉన్న తెలివీ పోయి, బండతనం నేర్చేసుకున్న కింది లెవెల్ ఆడపోలీస్ ల మగ మనస్తత్వాన్ని ఆమె కళ్ళకి కట్టేస్తుంటే, ధర్నాలు చేసే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టి వాన్ ఎక్కించే పోలీస్ ఆడవాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది కదా అనిపించింది.

***

“ఉడ్తా పంజాబ్” … విడుదలకి ముందే ఎంతో హడావుడి జరిగింది దీనిగురించి. సెన్సార్ బోర్డు కసిగా కత్తిరించి పోగులు పెట్టాలని చెప్పిన తర్వాత కష్టపడి ఎలాగో బయటికొచ్చిందీ సినిమా. వరసగా పంజాబ్ లోని ఊర్ల పేర్లన్నీ చెప్పి, అవన్నీ డ్రగ్స్ మయం అయిపోయాయని ఒక డయలాగ్, పంజాబ్ ని మెక్సికో ఆఫ్ ఇండియా అని మరో డయలాగ్, ఇలా అదరగొట్టి, పంజాబ్ నీరసించిపోతోందన్న నిజాన్ని కటువుగా చెప్తుంది ‘ఉడ్తా పంజాబ్’.  ఎంతో సెన్సిటివ్ సినిమా.  ఇంత స్థాయిలో డ్రగ్స్ కి అలవాటు పడుతున్న మనుషులు, డ్రగ్స్ రవాణా, డీ అడిక్షన్ సెంటర్స్, మత్తుమందుల వ్యతిరేక ప్రచారం వరకూ సమస్య సాగిందని చూపిస్తుంటే ఇదంతా నిజమేనా మనదేశంలోనే జరుగుతోందా అనిపిస్తుంది.

పేరుకూడా ఎవరూ గుర్తుపెట్టుకోని బీహారీ వలసకూలీ పిల్ల (అలియా భట్) (హాకీ ఆడగలిగే ఈ పిల్లకి పొలంలో పాకిస్తాన్ బోర్డర్ నుండి విసిరిన పెద్ద మత్తుమందు పొట్లం దొరుకుతుంది. దాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించాలని వెళ్లి చిక్కుల్లో పడుతుంది), సెలెబ్రిటీ అయినతర్వాత మీదపడే అభద్రతతో వీడ్ కొట్టి, చస్తూబతుకుతూ బూతులు కురిపిస్తూ గాలిపటంలా తిరిగే రాప్ సింగర్ (షాహిద్ కపూర్),  డ్రగ్స్ రోగులకి వైద్యంచేస్తూ ఈ దందాని పూర్తిగా బయటపెట్టాలని ప్రయత్నించే social activist లాంటి డాక్టర్ (కరీనా కపూర్),  డ్రగ్స్ రవాణాదార్ల దగ్గర లంచాలు కొడుతూ, సొంత తమ్ముడే addict అయాడని తెలిశాక డాక్టర్ కి సాయంచేసి, డ్రగ్ మాఫియాని బైటపెట్టే ప్రయత్నం చేసిన చిన్నస్థాయి పోలీసూ(పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్) ఈ సినిమాని నడిపిస్తారు.

కమర్షియల్ మసాలా అంతా ఉన్న సినిమా. కానీ ట్రీట్ చేసిన పద్ధతి కొత్తది.  అభిషేక్ చౌబే దీనికి డైరెక్టర్. అనురాగ్ కాశ్యప్ ఛాయలు కొన్ని కనిపిస్తున్నా పూర్తిగా ఆ శైలి కూడాకాని freshness తీసుకొచ్చాడు చౌబే.  డ్రగ్స్ వాడకాన్ని ఏదో మాయగా మేజిక్ లాగా చూపించడు. దానిలోనే భీభత్సాన్నే చూపించి భయపెడతాడు. చెడుని ఆకర్షణీయంగా చూపిస్తూ చివరకి నీతులు చెప్పే సినిమాలాంటిది కాదు ఉడ్తా పంజాబ్. మత్తుమందుల ఊబిలోకి నిస్సహాయంగా జారిపోతున్న పిల్లలని చూపించి భయపెడుతుంది. బలవంతంగా డ్రగ్స్ ఎక్కిస్తుంటే అచేతనంగా అయిపోయే అమ్మాయిని చూపించి పిచ్చెక్కిస్తుంది.  తన్ని తాను కూడదీసుకుని మత్తుమందుని గొప్ప మనోధైర్యంతో resist చేసే ఆ పిల్ల పట్టుదలని కూడా చూపించి, కాస్త గాలి పీల్చుకునేలా చేస్తుంది. తల విదుల్చుకుని తానెవరో తన బాధ్యత ఏమిటో తెలుసుకున్న రాప్ సింగర్ ‘హమ్మయ్య’ అనిపిస్తాడు. మత్తుమందుతో విచక్షణపోయి, విలువైన ప్రాణాన్ని ఇట్టే ఊదేసిన పిల్లవాడిని చూసి ఏడుపొస్తుంది.  మన దేశంలోని ఒక రాష్ట్రంలోనే  మనుషులు ఇంతగా బలవుతున్నారా అని బాధేస్తుంది.

సెలబ్రిటీ సిండ్రోమ్ ని కూడా పట్టుకుంటుంది ఉడ్తా పంజాబ్.  ఈ సినిమాలోని రాప్ సింగర్ టామీసింగ్ aka గబ్రూ,  ఇప్పటి పంజాబీ పాటగాడు హ్రిదేష్ సింగ్ aka యోయో హనీసింగ్ ని గుర్తుచేస్తాడు.  ఆడవాళ్ళమీద ‘ఐ స్వేర్  ఛోటీ డ్రెస్స్ మే బాంబ్ లగ్తీ మైనూ’ లాంటి లోకువ పాటలు పాడే sexist రాపర్ హనీసింగ్.  ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలో ‘లుంగీ డాన్సు’ పాటతో దేశమంతా పేరుగడించిన ఈయనీమధ్య రెండేళ్ళపాటు మానసిక వ్యాధివల్ల పాటలకి సెలవిచ్చుకున్నాడు.  ఆ పంజాబీ rap culture, ఆ frustration, ఆ బూతులూ, అవన్నీ మర్యాదస్తుల సంస్కరణకి లొంగని నిజాలే. Psychedelic music లో బూతుల్లో  డ్రగ్స్ ఉన్మాదాన్ని చూడమంటుంది ‘ఉడ్తా పంజాబ్’.  దాస్యం చేయించే మాదకతనీ దాన్లోంచి బయటపడాలన్న  తపననీ బాగానే చూపించాడు ‘గబ్రూ’గా షాహిద్ కపూర్.

ఒక పదేళ్ళనుంచీ పంజాబ్ మత్తుమందుల మీద ఒంటరి పోరాటం సాగిస్తోందని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. హరితవిప్లవం తర్వాత అక్కడ విపరీతంగా పొలాల్లో వాడిన పురుగుమందుల ఫలితంగా చాలామందికి  కేన్సర్ వచ్చింది. మాల్వా ప్రాంతానికి చెందిన జిల్లాల్లో కేన్సర్ సోకినవాళ్ళు భటిండా నుండి బికనీర్ వెళ్ళే ట్రైన్ లో బికనీర్ వెళ్లి అక్కడ వైద్యం చేయించుకుంటారు. ఆ ట్రైన్ కే కేన్సర్ ట్రైన్ అని పేరొచ్చేసింది. అంతలా కేన్సర్ పాకిపోయింది. దీనికితోడు నార్కో కేన్సర్ పంజాబ్ ని చుట్టేసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా పంజాబ్ కి అదుపు లేకుండా వస్తున్న హెరాయిన్ వ్యాపారానికి రాజకీయ నాయకులు, పోలీసులు అవినీతిమరకల చేతులు కలిపి సాయపడుతున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డ జనం బతికున్న శవాల్లా తయారవుతున్నారు. హెరాయిన్ సప్లై ఆగిపోతే అది అందక వెంటనే మనుషులు చచ్చిపోతారనే భయంతో ఊళ్లలో పెద్దవాళ్ళు సప్లై ఆపవద్దని అధికార్లని కోరేటంత దీనస్థితికి వచ్చారని Pioneer డైలీపేపర్ చెప్తోంది. ధైర్యానికీ పోరాటానికీ పేరుపొంది, ప్రతి ఇంటినుంచీ సైన్యానికో యువకుడిని పంపించే సంప్రదాయం, ఆరోగ్యంగా ఆటలాడుతూ పతకాలు గెల్చే దమ్మూ ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని యువత ఈ రోజు నీరసంగా మత్తులో తూలుతోంది.  ఇప్పుడీ సినిమా విడుదలవటం, సక్సెస్ కావటం సహజమే కాదు అవసరం కూడా కదా.

***

‘దంగల్’, ‘నీర్జా’, ‘ఎయిర్లిఫ్ట్’ లాంటి మంచి సినిమాలూ, ‘క్యా కూల్ హై హమ్’, ‘మస్తీ జాదే’ లాంటి ఒట్టి చెత్త సినిమాల మధ్యలోంచీ  పై మూడు ముఖ్యమైన topical సినిమాలనిచ్చింది ఈ సంవత్సరం బాలీవుడ్. కొత్తగా కథలు  చెప్పటంలో త్వరత్వరగా ఎదుగుతున్న bollywood sophistication వొచ్చే సంవత్సరం ఇంకెన్ని మంచిసినిమాలిస్తుందో చూడాలి.

ఇక్కడ ‘అలీగఢ్’లో మనోజ్ బాజ్ పాయ్ నటన చూడండి…

 

 

 

 

 

 

 

 

ది లాస్ట్ బ్రాహ్మిణ్: ఒక దళారీ పశ్చాత్తాపం!

last

 

నిజాయితీగా మాట్లాడాలంటే నిర్భీతి ఉండాలి అని అంటారు. నిర్భీతి అనే క్వాలిటీ నిజాయితీగా మాట్లాడ్డానికి పూర్వగామిగా ( precursor) గా ఉండడం ఏమిటి ? మనకు ఏవన్నా నష్టం అంటే అది కూడా తీవ్రమైన నష్టం భౌతికంగానో, ఆర్థికంగానో లేదా మన అభిలాషకు, ఆశలకు  (  aspirations   ) విఘాతం కలుగుతుందనుకున్నప్పుడో భీతి ఉండాలి. అలాంటప్పుడు  నిజాయితీగా మాట్లాడాలంటే వెనకా ముందు ఆలోచించుకోవాలి. ఐతే కొల్పోడానికి ఏమీ లేని తనం ఉన్నప్పుడు, కోల్పోడానికి సిధ్ధపడ్డప్పుడు, కోలుపోతను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడ్డానికి భీతి ఎందుకు ?  పైగా మనమొక తప్పులో భాగమై నప్పుడు, ఆ తప్పు డొంక తిరుగుడుగా, సూచనప్రాయంగా, నీళ్ళు నములుతూ కాక నిజాయితీగా ఉన్నదున్నట్టుగా ఒప్పుకోవాలంటే (ఏమీ కోల్పోలేని తనం వలన కలిగే )  నిర్భీతి తో పాటు పాశ్చాత్తాపం కూడా ఉండాలి.  ఆ పాశ్చాత్తాపం ‘ అయ్యిందేదో అయ్యింది ..ఇక పద ‘ అన్నట్టు గాక  Descriptive  గా ఉంటే అందులో నిజాయితీ బలంగా ఉంటుంది.

‘ దళారీ పశ్చాత్తాపం ‘ అనే పుస్తకం విడుదల అయ్యాక ప్రపంచ బేంకు రాజకీయాలు చాలా దుమారమే లేపేసాయి. అంత వరకు ఈ రాజకీయాలు ఎవరికీ తెలియదని కాదు. ఐతే ఒక  insider  పబ్లిక్ గా నోరు విప్పి జరిగింది చెప్పడం తో , కేవలం విశ్లేషణ, గమనికల మీద ఆధారపడ్డ ప్రతి సామ్రాజ్య వ్యతిరేక వాదికి కాన్ ఫిడెన్స్ బల పడ్డది. ప్రతి సంస్థాగతమైన అన్యాయాల పట్ల ఒక ఖచ్చితమైన కంక్లూజన్ కు రావాలాంటే, శతృ స్థావరం నుండి ఒక్క వేగువైనా కావాల్సి వస్తుంది మనకు. శతృవు గురించి అంచనాకు రావడం ఒక ఎత్తైతే , వేగు సమాచారం ఒక బలమైన   conviction  ను నింపుతుంది. అది జరిగే యుద్ధం లో   predictability  ని తెస్తుంది. ‘ నిన్ను నీవు అర్థం చేసుకునే ముందు శతృవును అర్థం చేసుకో ‘ అనే మావో నినాదం సంపూర్తి అర్థాన్ని అప్పుడు సంతరించుకుంటుంది.

ఇంత ఉపోద్ఘాతం ఒక పుస్తక పరిచయానికి ఎందుకు అవసరమౌతుందో తెలుసుకోవాలంటే – అది ‘ ది లాస్ట్ బ్రాహ్మిణ్ ‘ కున్న ప్రత్యేకమైన ఫార్మాట్ ను గుర్తించడమే. ఇది ఆత్మకథ ఫార్మాట్ లో ఒక సనాతన బ్రాహ్మణుడి కుంచిత వ్యవహారాలను నిజాయితీగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం. అది కూడా అది ఒక సనాతన బ్రాహ్మణ వంశం లో పుట్టి కుటుంబ బంధాలపై ఉండే ప్రేమ చంపుకోలేక  కుటుంబ వ్యవహారాలపై ద్వేషం కలిగి ఉండే ఒక వ్యక్తి ఆ పుస్తక రచయిత  కావడం ఈ ఫార్మాట్ ప్రధాన లక్షణం.

నాకు ఈ  insider view  అవసరం ముఖ్యంగా అఫ్సర్ ‘ చంకీ పూల కథ ‘ రాసినప్పుడు తోచింది. అగ్ర కుల మేధావులు మార్క్సిస్టులమని చెప్పుకునే వాళ్ళు మైనారిటీ వాదాన్ని, సెక్యులరిస్ట్ ఫైట్ ను  ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య పోటీ కింద కుదించేసి మాట్లాడ్డం చూడ్డానికి అందంగా articulate  చేయడం , సాధారణ పాఠకులు డ్రైవ్ అయిపోవడం చూసి అనిపించింది ‘ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నిమ్న వర్గాల గురించి ఏమని ఊహించుకుంటూ ఉంటారో కదా ? ‘ అని. ‘ వీళ్ళు అగత్యం లేని పరిస్థితుల్లో నిమ్న వర్గాలను కూడ గట్టుకుని ఎలా పబ్బం గడపాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా ? ‘ అని. ‘ వీళ్ళ మాటలు ఆలోచనలు విన్న వాళ్ళెవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగున్ను కదా ? ‘ అని. నలుగురు అబ్బాయిలు గుమి కూడి ఒక అమ్మాయి గురించో , లేదా ఇక ఏదో సెక్సిస్ట్ టాపిక్ గురించో ఏం మాట్లాడుకుంటారో ఊహించి వారి గురించి అంచనాకు రావడం ఒక పద్దతి. ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి స్వయాన విని వారి గురించి ఒక అంచనాకు రావడం ఒక పద్దతి.

ఈ వేగులు అందించే సమాచారం లో మన అంచనాలు, విశ్లేషణకు లోతు వెడల్పును పెంచుతాయి.

“ఇలాంటి అభిప్రాయాలు మా నాన్న గారి నుంచి విన్నప్పుడల్లా ఆయన పట్ల నాకున్న వ్యతిరేకత మరింత ప్రబలమ్య్యేది.  శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రాతినిధ్యం వహించే సనాతన ధర్మం అంటే నాకు అరికాళ్ళ కింద మంటలు లేచేవి. మనిషిని మనిషిని విడదీసే ఈ కులాలు నిర్మూలింపబడాలని మానవులందరూ సమానంగ ఉండాలని నేను భగవంతుడిని మూగగా రోదించేవాడిని. మా నాన్న గారిని సనాతన ధర్మం నుండి బయట పడేయమని భగవంతుడిని ఒక సారి కోరుకున్నాను కూడా ” అని మధ్యలో ఒక చోట రచయిత చెప్తాడు. ఈ పుస్తకం మొత్తానికి ఇది భూమిక.  రచయిత తండ్రి తీవ్ర అనారోగ్యం తో, మరణానికి చేరువలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు,  తండ్రి కి కళ్లనీళ్ళ ప్రయంతం సపర్యలు చేసుకుంటూనే , ఆయన  psyche  పట్ల చంపుకోలేని ద్వేషానికి పుస్తక రూపం ఇస్తూ ఉండే  ఒక సంఘర్షణ వాతావరణం ఉండింది.

నాతో చాలా మంది అంటూ ఉంటారు ” బ్రాహ్మణులుగా పుట్టామండి…ఐతే మా చేతులో ఉందా ఏంటి ? మమ్మల్ని ఏ మాట మాట్లాడినా అలా వంకరగా విశ్లేషించడం ఏవన్నా భావ్యమా ? ” అని. పుట్టడం మన చేతులో లేదు. కాబట్టి మాకు మిగతా ఛాందస బ్రాహ్మణుల నుండి, బ్రాహ్మణ వాదులనుండి   exemption  కావాలి అని.  ఈ వాదనలో ఒక సౌకర్యం ఉంది. ఈ ఆత్మ విమర్శలో ‘ ఈ తప్పేదో జరగడం బానే ఉందే ‘ అన్నట్టు ఉంటుంది తీరు. కులం పుట్టుకకు సంబంధించిన అంశం కాదు, అది నిర్దుష్ట  సాంఘిక ఆర్థిక చట్రం కు సంబంధించింది అనే నిర్ధారణ జరిగాక ఈ లిబరల్ వాదనలు ఊపందుకున్నాయి. ‘ అసలు బ్రాహ్మణుడు అని నీకు ఇంకా ఎందుకు గుర్తు ఉంది ? ‘ అని అడిగితే ఏం తెలుస్తుంది ? భర్తనో భార్యనో బ్రాహ్మణ్ అయి ఉంటారు, ఇంట్లో సనాతన అచారాలు అలా కొనసాగుతూ ఉంటాయి, ప్రతి హిందూ పండక్కి ఇంట్లో సందడి ఉంటుంది, అడపా దడపా ఆఫీసుల్లో లిబరల్ బ్రాహ్మిణ్ అవ్వడం వల్ల అసలు సిసలు బ్రాహ్మిణ్ స్థాయిలో గౌరవం లేకున్నా ఉన్నత కులం వాడికుండె సగటు గౌరవం తక్కువ కాకుండా దొరుకుతుంటుంది, బంధువులు , మేధావులు చుట్టూ బ్రాహ్మణులే ఉండి బ్రాహ్మణ సందోహం ఆనందదాయకంగా లేకపోయినా తమ స్థాయిని గుర్తు చేసుకునే నిమిత్తం వరకైనా అలా ఉంటుంది.  ఇదంతా సోషల్ కేపిటల్ వెన్నంటి ఉంటుంది. ఆ మాత్రం దానికి ‘ నన్ను  exempt  చేయండి ‘ అని వాదించి , కొత్త తరహా బ్రాహ్మణ హక్కుల కోసం వాదించడం ఎందుకు ? ‘ సరేనండి…ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు ? పుట్టుకను మార్చలేము కదా ‘ అని వితండ వాదం చేసినప్పుడు నేనంటాను ‘ కులం తెలిస్తే తలలు తెగిపడతాయి అనే రోజు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతారా మీరు ? ‘ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత. రోహిత్ వేముల మరణానికి కారణమైన డాక్యుమెంటరీ ‘ ముజఫర్ నగర్ బాకీ హై ‘ ఫిల్మ్ మేకర్ బ్రాహ్మణుడు. ఒక ఇంటర్వ్యూ లో ” నేను బ్రాహ్మణ కులం లో ఉన్నా కాబట్టి నెను ప్లాన్ చేయని నేను ఊహించని అవకాశాలు నా చుట్టు ఉన్నాయి. కాబట్టి నేను సినిమా తీయగలిగాను. కులం అనేది లేకపోతే ఇంత కంటే ఇంకా బాగు తీయగలిగే వారు వచ్చే వారేమో ”  అన్నాడు. బ్రాహ్మణుడు కుల నిర్మూలన ఉద్యమం లో చేరుతున్నప్పుడు ఖరాఖండిగా జనాలకే కాదు, తనకు తాను చెప్పుకోవాల్సిన నిజం ఇది. డీ బ్రాహ్మినైజ్ కావడం లో మొదటి మెట్టు తనకున్న  Brahmin privileges  ను గుర్తించడం. ఇవేవీ లేనట్టు తెలీనట్టు నటించడం, లేదా తనకు మాత్రం అవి సంబంధం లేనట్టు మొహం పెట్టి మిగతా బ్రాహ్మణులను తిట్టడం గమనించలేని మూర్ఖమైన స్థాయిలో దళితులు, ఆదివాసీలు ముస్లిములు ఈనాడు లేరు.

ఈ ఆత్మ కథ లాంటి సాంఘిక ఇతివృత్తం కలిగిన పుస్తకం లో ఒక సనాతన బ్రాహ్మణ తండ్రి తన మొదటి కొడుకు హిందువుగా మారడం ( సనాతన ధర్మం ప్రచారాన్ని  కోరుకోదు. ఇతర వర్ణస్తులను సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకోమని కోరుకోదు ) ఇంకో కొడుకు ( రచయిత ) నాస్తికుడిగా మారడం, తన వంశానికి ఇక తనే చివరి బ్రాహ్మణుడిగా గుర్తించి చివరి క్షణాల్లో కూడా అదే మనోవ్యధలోనే బతుకుతాడు.

ఈ పుస్తకం ఒక సోషియాలజీ సబ్జెక్ట్ లాంటి పుస్తకం. సనాతన వర్ణశ్రమ ధర్మం లో బతికే ఒక బ్రాహ్మణ తెగ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా జీవిస్తుంది అని తెలియజేసే పుస్తకం. ఇస్లాం అని ప్రస్తావిస్తూ ఖురాన్ ఉంటుంది, క్రీస్తు బిడ్డలు అని ప్రస్తావిస్తూ బైబిల్ ఉంటుంది కాని హిందువు అని ప్రస్తావిస్తూ ఒక్క వేదం లేకపోయినా హిందువులు ఆ వేదాలను, ఆయా గ్రం థాలను నెత్తినేసుకుని తిరగడం భలే విచిత్రం. మొదటగా బ్రాహ్మిణిజం మాత్రమే మతం. అది ప్రజలను వర్ణాలుగా విడదీసింది. శ్రీ రామ కళ్యాణం బ్రాహ్మణుల ఆచారం. శివుడు, కృష్ణుడు వీళ్లందరూ బ్రాహ్మణుల ఇంటిలో మాత్రమే పరిమితం కావాల్సిన దేవుళ్ళు.  Temple system   బ్రాహ్మిణిజం ఈ సమాజం తో terms కుదిరించుకుని ఏర్పరుచుకున్న ఒక రాజీ. పూజారి వృత్తే కాని, బ్రాహ్మణుడి ప్రవృత్తి కాదు. ఈ విషయాలు తెలీక  ప్రతి హిందు ఛాందస వాది , అఖండ భారతం అని ఊగిపోతాడు. మన దేశం లో హిందుత్వం అన్న మతమే లేదు. ఉంటే అది బ్రాహ్మణీయ హిందుత్వం మాత్రమే. బ్రాహ్మణిజం అన్ని కులాల ప్రజలకు దేవాలయ వ్యవస్థ ద్వారా చేరాక, ఆయా వర్ణాశ్రమ ధర్మాలకు లోబడి ఉన్నా ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిని అనుకరించే పద్దతి మొదలయ్యింది. దళితుల్లో క్షవరం చేసే దళితులు వేరుగా ఉంటారు. వాళ్ళు దళితుల్లో దళితులకు  అధములు. సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సిన వ్రతం. ఐతే ప్రతి ఒక్కరూ చేస్తారు. పౌరోహిత్యం లో వైదిక పౌరోహిత్యం వేరు. పౌరాణిక పౌరోహిత్యం వేరు. సనాతన ధర్మం లో ‘ ఘర్ వాప్సీ’ లేదు. ఎందుకంటే అది హిందుత్వాన్ని నమ్మదు కాబట్టి. ( బ్రాహ్మణీయ హిందుత్వానికి సంఖ్యా బలం అవసరం ఎందుకయ్యింది అన్నది ఈ వ్యాసానికి వెలుపలి అంశం. ప్రస్తుతానికి వదిలేద్దాం )  దానికి శూద్రుడైనా ఇతర మతస్థులైనా ఒకటే. ఘర్ వాప్సీ చేసి ప్రయోజనం లేదు. బ్రాహ్మిణిజం అనే మతం ఒక వర్గం లోనే ఉండాల్సిన మతం . ప్రచారప్రధానం అయ్యాక అది బ్రాహ్మణీయ హిందూత్వం అయ్యింది. మనుస్మృతి  మన జీవన విధానం లో భాగమయ్యింది. ‘ వర్ణ ధర్మాన్ని అతిక్రమించడం అంటే తక్కిన వర్ణాల్లోకి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రవేశపెట్టడం అన్న మాట ‘ అంటూ , రచయిత ఇలా  అంటాడు ‘ మనుస్మృతి తగలబెట్తడం , భావొద్వేగాలను ప్రతిబింబిస్తుందే తప్ప , మనుస్మృతి సారాంశాన్ని మన జీవితాల నుండి వెళ్ళగొట్తలేదు ” ఇప్పుడు ప్రతి హిందువు ఒక బ్రాహ్మణుడిగా మారడం జరుగుతుంది. బ్రాహ్మణుల్లో వంటా వార్పు చేసే స్త్రీలు, ముట్టు బారిన పడే వీరు శూద్రులతో సమానంగా చూడబడతారు. బ్రాహ్మణ స్త్రీ లు ద్విజులు కాదు. వీరికి ఉపనయనం జరగదు. వేద మంత్రాలు చదివే అధికారం ఆ స్త్రీ లకు లేదు.  బ్రాహ్మణుల్లో స్త్రీలు సాధారణంగా వీణ ఎక్కువ నేర్చుకుంటారు. సనాతన ధర్మ వ్యవస్థలొ బయటి ప్రపంచం తో మగ వాళ్ల కన్న కాస్తో కూస్తో ఎక్కువ  interaction  పెంపొందించుకునే వాళ్ళు స్త్రీలే. ఈ పుస్తకం లో రచయిత తన తల్లి పరిస్థితి గురించి ఎంత మనోవ్యధ చెందుతాడో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. బ్రాహ్మణులు వాడే తిట్లు వేరు. ‘ సప్త కట్ల వెధవ ‘ ‘ లబోడి శంఖం ‘ లాంటి తిట్లు కనబడతాయి.

ఇలా సోషియలాజికల్ స్టడీ తో పాటు , ఒక బ్రాహ్మణుడిగా ఇంకో బ్రాహ్మణుడి రచనులు ఎలా అంతర్లీనంగా  connect  అవుతాయో కూడా రచయిత వివరిస్తాడు. ” బ్రాహ్మణ స్త్రీ లను చలం లేచి పొమ్మన్నాడని సనాతనస్తులు కాని హిందూ పాఠకులు పొరబడ్డారు. కానీ చలానికి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ లకు అంత ధైర్య సాహసాలు గానీ అవకాశాలు గానీ లేవని స్పష్టంగా తెలుసు. అందువలన సనాతన ధర్మ పీటాలకు అభ్యంతరం లేని ముస్లిం మతస్థులను తన రచనల్లో రహస్యంగా అభ్యర్థిబ్చాడు. ” ” చలం తన రచనల్లో వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ఊహ కూడా చేయలేదు. తన రచనల్లో వివాహాన్ని అరికట్టడం ద్వారా జాతి సాంకర్యాన్ని వర్ణ సాంకర్యాన్ని నివారించ బూని నాడు ” ఇలా చలం గురించి  బ్రాహ్మణ కోణం లో చూస్తునే విమర్శిస్తాడు. ఈ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనే కన్నా , ఇందులో ఎన్నో తరాల నుండి జరుగుతున్న బ్రాహ్మణ మేధో అవినీతిని బట్టి మొత్తానికి కొట్టివేసే వాదనగా కూడా అనిపించదు. అలాగే ” శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా లోని భాషంతా బ్రాహ్మణుల అద్వైత పరమాత్మ తత్వానికి – శంకరాచార్య వేదాంతానికి పూర్తిగా సంబంధించినదే . విశ్వానాథ సత్యనారయణ , కవితా ఓ కవితా చదివి శ్రీ శ్రీని తెగ కౌగిలించెసుకున్నట్టు చెప్తాడు. ‘ అది పురోగమనంగా కనిపించినా దాని ఆత్మ సనాతనమే . అది ఆ కవిత గొప్ప తనం’  అని అంటాడు రచయిత. అంతే కాకుండా గురజాడను విమర్శిస్తూ ఇలా అంటాడు ‘ సత్య సంధుడైన సౌజన్యారావు పంతుల్ని వైదిక బ్రాహ్మణుడిగానూ, లిటిగెంటు క్లయింటు రామప్పంతుల్ని వియోగి గాను గురజాడ చిత్రించాడు. వైదికులు సహజంగానే  వియోగులను అపహాస్యం చేస్తుంటారు. అంతెకాని గురజాడ ప్రత్యేకంగా బ్రాహ్మణులను విమర్శించింది లెదు ‘ అని కట్టే విరిచి నట్టుగా చెప్తాడు. ‘గురజాడ పూర్ణమ్మని వృద్ధుడికి యిచ్చి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. తన కుమార్తెకు సైతం బాల్య వివాహమే చేసాడు.’ అని మనకు విశదీకరిస్తాడు. అలా చె ప్తూ బ్రాహ్మణ కవులు రచయితల పట్ల ఇలా ముగిస్తాడు. ” మొత్తానికి బ్రాహ్మలకు సరిపడేదేదో కమ్యూనిజం లో ఉంది . అదేదో యెంతో కాలానికి కాని నాకు తెలీలేదు ”

అంతే కాక చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి. మఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఆది శంకరాచార్యుడు హిందువా బ్రాహ్మణుడా ? హిందుత్వం పై బుద్దిజం ప్రభావం , పదకొండవ పన్నెండవ శతాబ్దం లో దేవాలయాల పై దాడి దోపిడీ గురించి, చరిత్ర లో గుడికి ప్రాధాన్యత ఎంత ఉంది లాంటి విషయాలు కూడ మనం చూడవచ్చు.

రచయిత కుల నిర్మూలన పై ఆశవహంగా ఇలా  theorise  చేస్తాడు. ” పార్లమెంటును హేళన చేసే వాడు పార్లమెంటును ఏమీ చేయలేదు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నంగా పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారత దేశం లో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే. బ్రాహ్మణులు వస్తు జాలం కన్నా కష్టమైన భావ జాలాన్ని ఉత్పత్తి చేశారు. దాని మన్నిక చాలా కాలం ఉంటుంది. అది తిట్లతోనూ హేళనతోనూ నిర్మూలన కాదు. దీనిని ఎదుర్కోవాలాంటే చరిత్ర తెలియాలి. చరిత్ర చలన సూత్రాలు తెలియాలి. మానవ పరిణామం తెలియాలి. సంస్కృతి తెలియాలి. భావజాలం ఉత్పత్తి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి ”

ఈ పుస్తకం లో అక్కడక్కడా బ్రాహ్మణ జాఢ్యం చాయలు కూడా లేకపోలేదు. వీరేశ లింగం సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేశాడు అని ( సనాతన ధర్మమే ద్రోహం , దానికి తిరిగి ద్రోహం చేయడం ఏంటి ? ) , దీక్షితులు గారికి చందుడిలో మచ్చలా నల్లమందు అలవాటు ( అంటే ఆయన గారు  చంద్రుడు లాంటి వాడు అన్న మాట ) అంటాడు. ఐతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలి. ఇంత నిజాయితీగా రాస్తూ ఇలాంటి వాక్యాలు ఎందుకు దొర్లించాడు అని. రాణీ శివశంకర శర్మ గందరగోలవాది. ఆయన హిందూత్వాన్ని, కులాన్ని ఎంత నిరసిస్తాడొ, క్రైస్తవ్యాన్ని అంత నిరసిస్తాడు. హిందుత్వానికి వచ్చినా ఆ ప్రచార కాంక్ష సామ్రాజ్యవాద క్రైస్తవ కాంక్షగా చూస్తాడు. ఐతే వర్గ లక్షణం లేని మతం ఎలా ఉంటుందొ మనకు సరి అయిన వాదన దొరకదు. చాలా ఎలాబొరేట్ గా ఒక్కో పాయింట్ తీసుకుని ఆయన క్రైస్తవ్యానికి, హిందూత్వానికి పోలిక చూపిస్తూ రాస్తూ వస్తాడు. ముస్లిం మతస్తులు ఇక్కడ బతికి ఇక్కడే ఉండడానికి వచ్చారు. క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి రాలేదు. కేవలం దోచుకోడానికి వచ్చారు లాంటి కంక్లూజన్స్ కనిపిస్తాయి ఈ పుస్తకం లో.  ఇందులో కుటిలత్వం ఏమీ లేదు. కేవలం గందరగోళం. కొంచెం పిడివాద మూర్ఖత్వం తప్ప.

ఇలాంటి పాజిటివ్స్ నెగటివ్స్ తో చదవాల్సిన ఈ పుస్తకం సౌదా అరుణ తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఏ పుస్తక శాలలో కూడా దొరకదు. కేవలం సౌదాను ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేస్తే తప్ప దొరకదు. ప్రచురణ కర్తలు రివ్యూలపై అనాసక్తి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుస్తకం ఫార్మాట్ ఇందులో ఉన్న అంశాలు ఎంతగానో ఆకర్శించడం వలన తప్పక షేర్ చేసుకోదలచి రాయాల్సి వచ్చింది ( మితృడు సౌదాకు తప్పని సరి సారంగ పత్రికా ముఖంగా క్షమాపణలు. పాఠకుడికి రివ్యూ చేసే హక్కు నేను ఉపయోగించుకుంటున్నాను )

Note  : ఈ రివ్యూలొ చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు దొర్లాయి. అయితే సంస్కృత పర్యాయ పదాలు వాడ్డం చాత కాక అవి అలాగే ఉంచడం జరిగింది. వ్యాసకర్త వద్ద మరింత స్పష్టత కోరదల్చుకుంటే   pvvkumar@yahoo.co.uk  వద్ద గాని, ఫేస్ బుక్  ID – P V Vijay Kumar  వద్ద కూడ కాంటాక్ట్ చేయవచ్చు. 

*

 

 

 రంగు రెక్కల వర్ణ పిశాచం

 

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

 

మీరెప్పుడైనా పిశాచాన్ని చూశారా…?

భయపడకండి… !!

పిశాచమంటే తెల్లని చీర అందంగా  కట్టుకొని….తెలుగు సినిమా పాటలు పాడే పిశాచం కాదు. కనపడకుండానే జనాన్ని మింగే పిశాచం. రంగు రంగుల పిశాచం. రక్త వర్ణ పిశాచం. ఈ పిశాచం గురించి మొదట నాకూ తెలీదు. నా చుట్టూ ఆవహించి ఉన్నా.. నేను గుర్తించని పిశాచాన్ని ఫకీర్ కనిపెట్టి నాకు చూపించాడు. మీకూ చూపిస్తాను.
***
ఆరోజు నాకు బాగా గుర్తు…..
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం”  ఎవరో మంత్రాలు జపిస్తున్నారు. మేడ మీద పడుకొన్న నేను మెల్లగా కళ్లు తెరిచి ఆకాశం వైపు చూశాను.

రైతు పొద్దంతా దున్ని చదును చేసిన దుక్కిలా ఆకాశం ఎర్రమన్ను పూసుకుంది. లోకమంతా మోదుగుపూల వనంలా మెరుస్తోంది. తొలి పొద్దు చూసేందుకే  నేను రోజూ డాబాపైన పడుకుంటాను. ఆ పొడిచే పొద్దులా నేనూ కొత్తగా పుడతాను.
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం…” అంటూ పక్కనే మా తమ్ముని
కూతురు  లావుగా ఉన్న పుస్తకంలో చూసి ఏవో మంత్రాలు బట్టీ పడుతోంది.
” ఏం పాఠం రా తల్లీ అదీ. నేనెప్పుడూ విన్నట్లు లేదు” ఆరా తీశాను.

“మా స్కూల్లో ఈ పుస్తకంలోని మంత్రాలు కంఠస్తం చేసే పోటీలు పెడుతున్నారు పెదనాన్న….. గెలిచిన వాళ్లను హైదరాబాద్ కు తీసుకుపోతారట. అక్కడ కూడా గెలిస్తే ఢిల్లీకి తీసుకుపోతారట. అందుకే పొద్దున్నే లేచి బట్టీపడుతున్నా.” ఆశగా చెబుతోంది.
“స్కూల్లో పాఠాలు చెప్పకుండా ఇప్పుడు మంత్రాలు చెబుతున్నారా…?” అనుకుంటూ మెట్లు దిగి కిందికొచ్చాను.
” అన్నా సర్పంచ్ ఫోన్ చేసిండు పంచాయతీ ఆఫీసు దగ్గర గొడవ అవుతోందట..”
అంటూ తమ్ముడు ఫోన్ ఇచ్చాడు. “వస్తున్నా” అని ఫోన్ పెట్టేసిన.
మాది చాలా మారుమూల  గ్రామం. చుట్టు పట్టు పెద్ద ఊర్లు కూడా లేకపోవడంతో మండల కేంద్రం చేశారు. మా తాతల కాలం నుంచి ఊళ్లో మా కుటుంబానిదే పెత్తనం. మా నాయిన పోయిన కాన్నుంచి ఇంటితో పాటూ ఊరి బాధ్యత నా మీద పడింది. నానా కులాలు, మతాలు ఉన్నా అంతా కలిసి మెలిసి బతుకుతున్నాం.గబగబ ముఖం కడుక్కోని పంచాయతీ ఆఫీసు దగ్గరకు వచ్చిన. అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నరు.
“మా గుడి దగ్గర మీ పుస్తకాలు పంచుడేంది?…నాలుగు తన్నండి..బుద్ధి వస్తుంది.” అంటూ జనం గోలగోలగా అరుస్తున్నారు.
సర్పంచ్ తో పాటూ ఐదారుమంది ఊరి పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. సర్పంచ్ నన్ను చూడంగనే “నమస్తే అన్నా” అంటూ ఎదురొచ్చాడు.

అక్కడున్న వేప చెట్టుకు ఇద్దరు ఆడమనుషుల్ని తాళ్లతో కట్టేశారు. ఇరవై ఏళ్లలోపు అమ్మాయి, ఇంకో నడి వయసు ఆడామె. కొందరు ఆడోళ్లు వాళ్ల జుట్టుపట్టి లాగుతున్నారు. పిడిగుద్దులు గుద్దుతున్నరు. బెదిరిపోయిన వాళ్లిద్దరూ “కొట్టొద్దు” అని దండం పెడుతున్నారు.

మాఊళ్లో ఏటా జాతర జరుగుతుంది. కానీ ఇట్లాంటి గొడవ ఎప్పుడూ  కాలే.

‘మాకేం తెలవదు నాయనా..నీ కాళ్లు మొక్కుతా.  రోజు ఐదొందలు కూలీ ఇస్తమంటే ఈ పుస్తకాలు పంచుతున్నం. ఇది నా బిడ్డ. కాలేజీల చదువుతున్నది. పొట్ట తిప్పలకు చేస్తున్నం తప్పితే ఇయ్యేం పుస్తకాలో, ఏందో మాకు తెల్వదు” ఏడుస్తోంది  పెద్దామె.
“వీళ్లను ఏం చేద్దాం…? కేసు పెట్టమంటరా..?” ఎస్సై అడిగిండు .

వాళ్లను చూస్తేనే అర్థమైతోంది. వాళ్లేదో బతుకుతెరువుకోసం చేస్తున్నరని. వాళ్లమీద ఏమని కేసు పెడతాం..!? వద్దని చెప్పిన.

” ఏమ్మా బతకటానికి ఇదే పని చేయాలా. మీ మతం పుస్తకాలు ఇంకెక్కడైనా పంచుకోండి. ఇలాంటి జాతరలు, గుళ్ల దగ్గర కాదు. చదువుకునే బిడ్డ భవిష్యత్తు నాశనం కావొద్దని వదిలేస్తున్నం..పో” అని పంపిచాను.
ఎవని బతుకు వాడు బతకొచ్చు కదా..? ఒకరి గుడి దగ్గరకు వేరేవాళ్లు వచ్చుడెందుకు..? ఈ పుస్తకాలు పంచుడెందుకు.?
ఇప్పుడు చెప్పండి. మీకు పిశాచం కనిపించిందా..? రంగు రంగుల పిశాచం కనిపించిందా..? లేదా…?
మనకు తెలీకుండానే మనల్ని ఆవహిస్తున్న పిశాచం…రంగు రంగుల పిశాచం….రక్త వర్ణ పిశాచం. నాకు ఫకీర్ చూపించాడు. అవునూ,  ఫకీర్ ఎవరో మీకు తెలీదు కదా…?
ఫకీర్ ది మావూరు కాదు. ఎక్కడో చైనా-కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఊరు. అక్కన్నుంచి శాలువాలు, చద్దర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరు. హైదరాబాద్ దాకా సరుకు రైలులో తీసుకొచ్చి, అక్కడ ఓ గది కిరాయి తీసుకుని గోడౌన్ లాగా పెట్టుకుంటరు.

హైదరాబాద్ లో కొంతమంది పుట్ పాత్ మీద అమ్మితే… ఇంకొందరు ఊర్లు తిరిగి అమ్ముతరు. ఫకీర్ మా సరుకుతో మా ఊరుకు వచ్చి  మా ఇంట్లోనే సరుకు దింపుతడు.
***
అప్పుడు నాకు పదేళ్లు. బజారులో పాటలు వినిపిస్తుంటే పిల్లలతో పాటే నేను కూడా పరిగెత్తాను. ఏదో సినిమా ప్రచారం చేసే రిక్షా అనుకున్నాను. కానీ అది దుప్పట్లు, శాలువలు అమ్మే బండి. ఆ బండి మీద ఓ ముసలాయన, నా ఈడు పిలగాడు ఉన్నారు. ఆ చప్పుడుకు చాలా మంది బండి చుట్టూ మూగారు.

రంగు రంగుల రగ్గులు.

వాటి మీద అందమైన బొమ్మలు –

ఆ చద్దర్లు, శాలువలు ఆరుద్ర పురుగుల్లా… అందంగా, మెత్తగా ఉన్నాయి. అంత సుతి మెత్తని చెద్దర్లు నేనెప్పుడూ చూడలేదు. పట్టుకుంటేనే జారిపోతాయేమో అనిపిస్తూ…. పసిపాపల్లా ఉన్న వాటిని వొకసారి పట్టుకుంటే వదల్లేము.

మా బజారోళ్లు చాలా మంది వాటిని తీసుకు పోయారు కానీ మళ్లీ వెనక్కు రాలేదు.
రెండు రగ్గులు తీసుకున్న వాళ్లు ఒక్క రగ్గుకే డబ్బులు తెచ్చారు. ఇక్కడి భాష తెలీని వాళ్లు కావడంతో మోసం చేద్దాం అనుకున్నరు.
“యా అల్లా… ఇంత దోఖా చేస్తరా.? ఎక్కడో కాశ్మీర్ నుంచి బతికేటందుకు వచ్చినం. మాది పొట్టకొట్టొద్దు.” అంటూ పెద్దాయన బతిమాలుకుంటున్నాడు.  ఈ గొడవకు  పెద్దాయనతో ఉన్న పిల్లగాడు గట్టిగా ఏడుస్తున్నాడు.
ఇంతలో ఊరి పెద్ద మా నాయనకు సంగతి తెలిసి అక్కడకి వచ్చిండు.
జరిగిదంతా చెప్పి ఆ పెద్దాయన భోరుమన్నాడు.

మా నాయన అక్కడున్నవాళ్లని గద్దించాడు. “ఏదో పొట్టతిప్పలకోసం  దూరదేశం నుంచి వచ్చిన మనిషిని మోసం చేస్తారా..? మర్యాదగా డబ్బులు ఇచ్చారా సరే. లేదా పోలీసుల్ని పిలుస్తాను” అనడంతో జనం భయపడి డబ్బులిచ్చారు.
డబ్బులన్నీ లెక్క సరిపోయాక వాళ్లని మా ఇంటికి తీసుకొచ్చాడు నాయన.  అమ్మతో చెప్పి అన్నం పెట్టించాడు. “మీకేం భయం లేదు. మీరు ఎప్పడైనా ఇటువైపు వస్తే మా ఇంట్లోనే ఉండండి .” అని  భరోసా ఇచ్చాడు.
‘నా పేరు సులేమాన్’…నా కొడుకు పేరు ఫకీర్’ అంటూ వాళ్ల వివరాలు చెప్పాడు పెద్దాయన.
ఫకీర్ తల్లి …అతని చిన్న వయసులోనే చనిపోయిందట. అప్పటినుంచీ తనతోనే వ్యాపారానికి తీసుకొస్తున్నాడట.
మరి పిల్లవాన్ని చదివించరా అంటే…” ఎంత చదివినా ఏదో ఓ పని చేయాల్సిందే కదా సాబ్..అందుకే  వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతున్నాను” అన్నాడు సులేమాన్.
ఫకీర్ దీ,  నాదీ ఒకటే ఈడు కావడంతో  మంచి జంటగాల్లమయ్యాం. ఫకీర్ మెల్లగా తెలుగు నేర్చుకున్నాడు. ఫకీర్ బడికి
పోకున్నా లెక్కలు బాగా చేసేవాడు. మా నాయన కూడా ఫకీర్ తెలివికి ఆశ్చర్యపోయేవాడు. ఫకీర్ ఒక్కో సారి నాతో స్కూలుకు వచ్చేవాడు.

మా స్కూల్లో అప్పుడు ఉర్దూ మీడియం  ఉండేది. ఫకీర్ ఉర్దూ రాత  చూసి పంతుళ్లు మెచ్చుకునే వారు. ముఖ్యంగా అతడు పాడే పాటలంటే మా సార్లకి చాలా ఇష్టం.

ఫకీర్ ఎప్పుడో ఓ సారి మా స్కూలుకు వస్తే  పిల్లలకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం ఫకీర్ పాటలు వినిపించేందుకు పిల్లలందరినీ ఒకదగ్గర కూర్చోపెట్టేవారు. పాఠాలు వినే బాధ తప్పినందుకు పిల్లలు సంతోషించేవారు.
” దునియాకే ఏ ముసాఫిర్…..మంజిల్ తేరీ కబర్ హై….” ఫకీర్ గొంతెత్తి పాడితే పిల్లలంతా పక్షుల్లాగా ఆలకించేవారు. అర్ధం తెలీకున్నా పిల్లలంతా ఆ పాటలు పాడుకునే వారు.

పాట భావం తెలియకున్నా…ఏదో భావన ఆవహించేది. వొక మత్తులాగ. వొక మాయలాగా…

అతను నాకు ఉర్దూ నేర్పాడు. నాకంటే వేగంగా తెలుగు నేర్చుకున్నాడు.

బడిలోనే కాదు… బయట కూడా ఫకీర్ చాలా హుషారుగా ఉండేవాడు.

ఆదివారం వాగుల్లో ఈతలు కొట్టేవాళ్లం. చేపలు పట్టేవాళ్లం. నేను ఒక్క చేపను పట్టేందుకే నానా తంటాలు పడేవాన్ని. ఫకీర్ నీళ్లల్లో చేతులు పెడితే చాలు,  చేపలే పరిగెత్తుకొచ్చేవో …అతడే ఒడుపుగా పట్టుకునేవాడో కానీ చాలా చేపలు
పట్టేవాడు. కొన్ని చేపల్ని  అక్కడే కాల్చి తినేవాళ్లం. ఇంకొన్ని  ఇంటికి తెచ్చేవాళ్లం. అమ్మ వాటితో కమ్మగా పులుసు చేసేది.

Kadha-Saranga-2-300x268

నాయనకు నేనంటే ఎంత ఇష్టమో ఫకీర్ అన్నా అంతే ఇష్టం. అలా అతను  మా ఇంట్లో మనిషయ్యాడు. మా ఇంట్లోనే కాదు. ఊరు ఊరంతా ఫకీర్ మాయలో పడిపోయారు. ఊరందరికీ  ఫకీర్ చుట్టమే. ఇక పీర్ల పండగ వచ్చిదంటే చాలు. ఫకీర్ కు చెప్పలేని సంబరం.  పెద్ద పీరును ఎత్తుకుని.. “అస్సైదులా” అంటూ ఎగిరేవాడు. రాత్రిపూట నిప్పుల గుండంల ఉరికేటోడు.

ఫకీర్ మా దగ్గర ఉన్న నెల రోజులూ పండగలాగా ఉండేది.
తెచ్చిన సరుకు అంతా అమ్ముడు పోగానే వాళ్లు వాళ్ల ఊరు కాశ్మీరు వెళ్లిపోయేవాళ్లు.  ఫకీర్ పోతుంటే చెప్పలేని బాధ. తను మళ్లీ వచ్చేది సంవత్సరం తర్వాతే. ఆ సంవత్సరం మొత్తం అతని కోసం ఎదురుచూసే వాళ్లం.
ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మా జీవితాలు  మారిపోయాయి. ఫకీర్ వాళ్ల నాన్న సులేమాన్ కాలం చేశాక వ్యాపార బాధ్యతలు ఫకీర్ మీద పడ్డాయి.
పగలంతా వ్యాపారం… రాత్రికి ఇంటికి రావడం.  రాత్రి అయిందంటే చాలు… ఫకీర్ ఖవ్వాళి కోసం జనం మా ఇంటి ముందు కూచునే వాళ్లు.

అతను అమ్మే చద్దర్లు, శాలువాల్లాగనే అతని గొంతు కూడా మెత్తగా, కమ్మగా ఉండేది.
” దమాదమ్ మస్త్ కలందర్…దమాదమ్ మస్త్ కలందర్ ….” ఫకీర్ ఖవ్వాలికి జనం పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు.
ఫకీర్ నాకు ఉర్దూ  నేర్పాడు కదా. అతని పాటల్లోని భావాలు  నాకు బాగా అర్థమయ్యేవి.
” నాదేహం…నా సర్వం నీదే….ఓ దేవుడా,  ప్రియుడా నన్ను పవిత్రంగా ఉంచు……”

ఎంత గొప్ప భావన…!?
దేవున్ని ప్రేమిస్తున్నావా…? అవును,  ప్రతిక్షణం అతన్నే ప్రేమిస్తున్నాను.
సైతాన్ను ద్వేషిస్తున్నావా…లేదు,

నాకు అంత తీరిక లేదు…!

ప్రతీ గీతంలో అంతులేని తాత్విక భావనలు. అట్ల ఒక పాట తర్వాత ఇంకో పాట.
చుట్టూ కమ్ముకున్న చీకట్లను చీలుస్తూ అతని గీతాలు కొత్త వెలుగునిచ్చేవి.
తెల్లవారుతున్న సంగతి సైతం జనం మరిచిపోయేవాళ్లు.
గుడి గంటల సవ్వడిలో మేలుకొలుపు…నమాజ్ లోని గుండెతడి….చర్చి ప్రార్థనలో క్షమాగుణం… అన్నీ  ఫకీర్ గొంతులో వినిపించేవి.

ఫకీర్ రాముని గుడి దగ్గరా భజన చేసేవాడు.

” రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై…..రామ్ సబ్ మే హై”  ( రాముుడు అన్నింటా…ఉన్నాడు,
అణువణువూ రాముడే నిండి ఉన్నాడు. ) అంటూ పాడేవాడు. భక్తులతో కలిసి ఊగిపోయేవాడు.

అతని పాటకు మతం లేదు. ప్రేమ మాత్రమే ఉంది.
ఫకీర్ నీకీ పాటలన్నీ ఎవరు నేర్పారు..? అంటే

” ఇవన్నీ సూఫీ గీతాలు. భూమ్మీద ఎక్కడైనా రాత్రంటే చంద్రుడు, చుక్కల వెలుగులే. కానీ మా కాశ్మీరంలో రాత్రి ఖవ్వాలీ వెలుగులతో నిండిపోతుంది. మా కాశ్మీర్ లో ఉన్నది ఇస్లామే…కానీ అది సూఫీ. అది ఒక్క మతం కాదు. సర్వమత సారం.
మేము దేవుడిని పూజించం. ప్రేమిస్తాం.

అతని కోసం విరహ వేదనలో తపించిపోయే ప్రేమికుల్లా… పిచ్చిగా.

దేవుడు-నేను,  నేను-దేవుడు…ఇద్దరూ ఒక్కటై పోతాం.

అతడంటే భయం కాదు, ప్రేమ ఉండాలి. ఆరాధించాలి. అతనిలో లీనమై పోవాలి.”  ఫకీర్ చెప్పే మాటలు నాకు దేవున్ని మరింత చేరువ చేసేవి.

“ భాయ్….మతం ఐనా భక్తి ఐనా… భార్యభర్తల మధ్య గుట్టుగా జరిగే కాపురం లాగా ఉండాలి. భార్యతో చేసే కాపురం పదిమందికి  చెప్పుకోం కదా… అలాగే భక్తి కూడా,  దేవునికి మనకూ మధ్య రహస్యంగా ఉండాలి.” అనేవాడు.

ఫకీర్ మా ఊరు విడిచి వెళ్లినా మమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. అక్కడ కాసే
ఆపిల్ పళ్లను మాకు పంపేవాడు.  కాశ్మీర్ లో దొరికే ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్లు తెచ్చి పిల్లలకు క్రికెట్ నేర్పించాడు.

మా ఇంటిని వాళ్లనే కాదు ఊరంతటినీ తన కుటుంబం చేసుకున్నాడు ఫకీర్. మా కన్నా మిన్నగా మా ఊరిని ప్రేమించాడు. మా అందరికీ ప్రేమ అంటే ఏమిటో చూపించాడు. మా ఊరిలోని పిల్లా పాపలే కాదు…చెట్టూ -చేమ, రాయి-రప్పా అణువణువూ ఫకీర్ ని ప్రేమిస్తుంది.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి.
***
ఎప్పటిలాగే పోయిన ఏడాది కూడా ఓ రోజు మా ఊరు వచ్చాడు ఫకీర్. సరుకుతో కాదు. మాసిపోయిన గడ్డంతో. పిచ్చోడిలా ఉన్నాడు. వస్తూనే “ఐపోయింది. అంతా అయిపోయింది భాయ్” అంటూ భోరుమన్నాడు.
పోయినేడాది వ్యాపారం చేసుకుని అక్కడకి పోయేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందిట.
అక్కడ కాపలాగా ఉన్న వొక దళంలోని దుర్మార్గులు కొందరు… ఫకీర్ కూతురును దారుణంగా అత్యాచారం చేసి చంపారట. ఒక్కడు కాదు ఇద్దరు కాదు…పశువుల్లా పదిమంది పైనే…భార్య, చిన్న కొడుకును అందరి ముందే కాల్చిచంపారుట. తనతో పాటే వ్యాపారానికి వచ్చిన  పెద్ద కొడుకు మాత్రం బతికిపోయాడు.

సర్వం కోల్పోయిన ఫకీర్ ఎటు పోవాలో తోచక కొడుకుని తీసుకుని మా ఊరు వచ్చాడు.
తలచుకుంటేనే ఒళ్లు జలదరించే దారుణం.
పదేపదే ఆ దారుణం గుర్తుకు రావడంతో ఫకీర్ చాలా కాలం పాటూ కోలుకోలేక పోయాడు.
ఫకీర్ పరిస్థితే అలా ఉంటే  కొడుకు రియాజ్ సంగతి చెప్పేదేముంది. .?

తిండి లేదు…నీళ్లు లేవు. గంటలు గంటలు ఆకాశంలోకి చూస్తూ ఉండేవాళ్లు. ఫకీర్ కైతే పిచ్చోడికి మల్లే మరింత గడ్డం పెరిగింది. మా ఊరి చెరువు గట్ల దగ్గర ఒంటరిగా పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది.
చాలా రోజుల తర్వాత ఓ రోజు తన ఊరు వెళతానని అన్నాడు.

“ ఇంకా అక్కడ ఏముందని వెళతావు నీ కొడుకు రియాజ్  నువ్వు ఇక్కడే ఏదైనా వ్యాపారం పెట్టుకుని మాతో పాటే కలిసి ఉండమని ” బతిమాలాను.

సరేనన్న ఫకీర్ కాశ్మీర్ వెళ్లి సరుకు తెచ్చుకుంటానని వెళ్లాడు.
అలా నా మాట మీద గౌరవం తోనో…..మా ఊరి మీద ప్రేమ తోనో మొత్తానికి ఫకీర్ కొడుకుతో మా ఊరు వచ్చాడు. నాతో సహా ఊరంతా సంతోషించింది. ఇంతకాలం మా ఊరికి అతిథిగా వచ్చే ఫకీర్ ఇప్పుడు మా ఊరివాడయ్యాడు.
ఫకీర్ ను మా ఇంట్లోనే ఉండమని చెప్పినా ఒప్పుకోలేదు. వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బు నా చేతిలో పెట్టాడు. ఊళ్లోనే ఎక్కడన్నా ఓ చిన్న ఇల్లు చూసి పెట్టమని చెప్పాడు. తెచ్చిన సరకుతో ఫకీర్ ఒక ఊరు….కొడుకు రియాజ్ మరో ఊరు వెళ్లి చద్దర్లు అమ్మి సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవాళ్లు.
ఫకీర్ వచ్చి చాలారోజులైనా ఇంకా ఖవ్వాలీ పెట్టలేదని  ఊరి జనం అడుగుతున్నారు. రేపో మాపో వీలు చూసుకొని తప్పకుండా ఖవ్వాలీ పెడతానని హామీ ఇచ్చాను.
ఫకీర్ ఖవ్వాలీ కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
***
‘ సాబ్ మీరే న్యాయం చెయ్యాల’  అనుకుంట ఇంట్లెకు వచ్చిండు పీర్ సాబ్.
‘ ఏమైంది పీర్ సాబ్. ఏం సంగతి..? ఎడ్ల వ్యాపారం ఎలా ఉంది..? ‘  అని అడిగిన.
” ఏం చెప్పమంటవ్ సాబ్. నిన్న మొన్న ఊళ్లే తిరిగి నాలుగు ఎడ్లు, రెండు ముసలి బర్లు కొన్న… కానీ వాటిని అమ్మకూడదు అంటూ  గొడవ చేస్తున్నరు. జర మీరె న్యాయం చెప్పాలే.”  బతిమాలిండు పీర్ సాబ్.
మాఊరిలో దూదేకులోళ్లు చాలా మంది ఉన్నరు.  వాళ్లు రైతుల దగ్గర వ్యవసాయానికి పనికిరానివో, ముసలివో ఎద్దులు, ఆవులు కొని పట్నంల అమ్ముతరు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతోంది  కాదు. వాళ్ల తాతల కాలం నుంచీ అదే పని చేస్తున్నరు.
‘ఆపింది ఎవరు.?’ అని అడిగిన.
ఇంకెవలు సాబ్ మీ కొడుకు వెంకట్… కొంతమంది పోరగాళ్లను తెచ్చి ” ఎద్దులు, ఆవులు ఇప్పటి నుంచి అమ్మొద్దు,కొనొద్దు. దూదేకులోళ్లని ఎద్దుల బేరం మానెయ్యమని బెదిరిస్తున్నడు. తాతల కాలం నుంచి ఇదే బతకు తెరువుగా బతుకుతున్నం. ఇప్పుడు ఒక్కసారిగా మానెయ్యమంటే ఎట్ట సాబ్.” ప్రాధేయపడుతున్నడు.

“ నేను మాట్లాడుత గనీ నువ్ పో ” అని పీర్ సాబ్ ను పంపిన.
నాకు ఒక్కడే కొడుకు. పట్నంల ఇంజనీరింగ్ చదువుతున్నడు. చదువు సంగతి
ఏమోగానీ రాజకీయాలు మాత్రం బాగా నేర్చుకున్నడు. దేవుని పేరుతోని
రాజకీయాలు….!
” ఏరా వెంకట్…దూదేకులోళ్లని పశువులు కొనొద్దని బెదిరించినవట నిజమేనా…?”  కోపంగా అడిగాను మా వాణ్ని.
“అవును నాయన. జంతువుల్ని చంపడం పాపం కద నాయిన.”
“ మరి మనం కోళ్లను, గొర్రెల్ని చంపితే పాపం కాదా. మనం చేస్తే పుణ్యం,వాళ్లు చేస్తే పాపమా…? వాళ్లు వాటిని కోపంతోనో, పగతోనో చంపడం లేదు. తినడం కోసం కోసుకుంటున్నరు.

జంతువులను చంపకూడదు  అన్న మీ వాదం గొప్పదే కానీ…జంతువును చంపకుండా బతికే స్థాయికి మనిషి ఇంకా ఎదగలేదు. ఒకలిద్దరు ఎదిగి ఉండొచ్చు. జనమంతా ఆ స్థాయికి చేరినప్పుడు ఒకడు నిషేధించాల్సిన
పనిలేదు. ఎవడికి వాడే మానేస్తాడు. నీ బలవంతం ఎందుకు…? ”

నా ప్రశ్నకు బదులు చెప్పలేదు. కోపంతో గబగబ అక్కన్నుంచి వెళ్లిపోయిండు.
***
chandram2“ మీ కాశ్మీర్ లో చాలా మందికి ఎందుకు మన దేశమంటే ప్రేమ లేదు.? ఎందుకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ గా పాకిస్తాన్ జండాలు పట్టుకుని ఊరేగుతారు” మా వాడు వెంకట్,  ఫకీర్ కొడుకు రియాజ్ తో వాదనకు దిగాడు.
నేను , ఫకీర్ ఆసక్తిగా గమనిస్తున్నాం.
” అందరూ ఒకలాగా ఉండరు కదా….ఒక్కో మనిషి ఒక్కోలాగా ఆలోచిస్తడు భాయ్.’
రియాజ్ బదులిచ్చిండు.
” మా సైన్యం లేకుంటే….మిమ్మల్లి పాకిస్తాన్ ఎప్పుడో ఆక్రమించేసి ఉండేది. కాదంటారా.?”
” అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. పేపర్లో, టీవీల్లో వచ్చేదంతా నిజం కాదు.”
“ఏది నిజం కాదు. మా కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరిమేశారు. అది నిజం కాదా. వాళ్లు బిచ్చగాళ్లలా ఢిల్లీ వీధుల్లో ఇబ్బందులు పడేది నిజం కాదా. హిందువులు కాబట్టే కదా వాళ్లని తరిమేశారు”..ఆవేశంగా అడిగాడు మావాడు.
“ హిందువుల మీద మాకు ఎప్పుడూ కోపం లేదు భాయ్.  ప్రతీ సంవత్సరం వేలాది మంది హిందువులు అమర్ నాథ్ యాత్రకు వస్తున్నారు కదా. వాళ్లు మా నేలమీద అడుగు పెట్టిన దగ్గరనుంచీ డోలీల్లో  మోసుకెళ్లడం, గుర్రాలపైన తీసుకెళ్లడం, దేవుడ్ని దర్శనం చేయించడం … ప్రతీ పని ముస్లింలే చేస్తారు తెలుసా భయ్యా.? ”
“ మీ కోసం కోట్లు ఖర్చు చేసి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఐనా మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు..? ”
“ సెక్యూరిటీ అంటే ఏది భయ్యా. మా ఆడవాళ్లను అందరి ముందే బలవంతం చేసి పాడు
చేయడం…యువకుల్ని పిట్టల్లా కాల్చేయడం… ఆఖరుకు స్కూలుకెళ్లే పిల్లల్ని కూడా  రాక్షసంగా…” మాట రాక భోరుమన్నాడు రియాజ్.
మావాడికి ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండిపోయాడు.
” రియాజ్ భేటా ఏమీ అనుకోకు. వాడికి నీ మీద కోపం లేదు. మా దగ్గర జనం అనుకునేదే నీతో అన్నాడు ” అంటూ రియాజ్ ను దగ్గరకు తీసుకున్నాను. ఆవేశంలో రియాజ్ ఏదో అన్నాడు కానీ…తర్వాత వాడు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వెళ్లి పడుకోమని చెప్పాను.

నేను ఫకీర్ డాబాపైకి వచ్చాము.
” ఫకీర్ మావాడి మాటలకు బాధపడుతున్నావా..”
” లేదు భయ్యా. ఆ ప్రశ్నలు మీ వాడివే  కాదు. మిగతా దేశమంతా మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలని తెలుసు. భయ్యా.., ఇప్పుడంటే కాశ్మీర్ పేరు చెపితే ఉగ్రవాదం….మతం అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాది ఈ దునియా మొత్తం మీద అత్యంత సుందర ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఓ సారి కాశ్మీర్ కు  వచ్చాడట. అందమైన పర్వతాలు…సరస్సులు, అంతకన్నా అందమైన మనుషుల్ని చూసి పులకించి పోయాడట. స్వర్గం అనేది ఉంటే అది కచ్చితంగా కాశ్మీరే  అన్నాడట.

ఒకప్పుడు హిందూ, ముసల్మాన్ రెండూ విడదీయలేనంతగా అల్లుకుపోయిన పోయిన సంస్కృతి మాది. కాశ్మీర్ లో ముస్లింలు-హిందువులే కాదు, బౌద్ధ మతస్తులు చాలామంది ఉన్నారు. సిక్కులూ ఉన్నారు. చాలా మందికి తెలీని సంగతి ఏమంటే యూదు మతస్తులు కూడా ఉన్నారు. అసలు మతమంటేనే తెలియని గిరిజనులూ ఉన్నారు. ఆకాశంలో ఇంధ్రధనస్సులా  అందంగా  మేమంతా కలిసిపోయాం.   అటువంటి మా  ప్రాంతం…. కొన్ని రాజకీయ సైతాన్ ల వల్ల  రావణకాష్టంగా మారింది.

మాతో సంబంధం లేకుండానే…మా ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేకుండానే మా నసీబ్ మార్చేశారు. మా జిందగీ  మా చేతుల్లో లేకుండా చేశారు. ”
” ఐతే ఫకీర్ దీనికి పరిష్కారం లేదంటావా…? ”
”  ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది భాయ్ సాబ్….”
” ఉంటే ఎందుకు పరిష్కారం కావడం లేదు…!!?”
”  భాయ్ సాబ్. నిజంగా నిద్రపోయే వాన్ని లేపొచ్చు. మెలకువతో ఉన్న వాన్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాన్ని ఎప్పటికీ నిద్రలేపలేం కదా…!?” విషాదం, వైరాగ్యం కలిసిన ఒకలాంటి నవ్వు నవ్వుతూ అన్నాడు ఫకీర్.
నాకర్థమైంది. అంతా అర్థమైంది.  ” నిద్ర నటించేవాన్ని లేపలేం కదా..?”
రాత్రంతా ఆ మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. కళ్లు మూసినా తెరిచినా ఫకీర్ నవ్వే కనిపిస్తోంది.
***

నేను నిదుర లేవకముందే  ఫకీర్, రియాజ్ చద్దర్లు అమ్మేటందుకు పోయిన్రు.
పేపర్ చదువుతుంటే సెల్ ఫోన్ మోగింది. ” భయ్యా…ఎక్కడున్నావ్. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కొస్తావా..”  గాభారాగా అడిగాడు ఫకీర్.
” ఏమైంది భాయ్…” కంగారుగా అడిగాను. ” రియాజ్, రియాజ్ ను పోలీసులు పట్టుకున్నరు.” ఫోన్ లో చెప్పలేక పోతున్నాడు ఫకీరు.  సరే నేను వెంటనే వస్తున్నా అని చెప్పి బండి తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాను.
ఫకీర్ నాకు పరిచయమై ముప్పై ఏళ్లపైనే అయింది. కానీ ఎప్పుడు పోలీసు స్టేషన్ తో పని పడలేదు. ఏమై ఉంటుంది..? బహుశా లైసన్స్  లేదని పోలీసులు పట్టుకుని ఉంటారా..? ఆలోచల్లోనే స్టేషన్ దగ్గరకు చేరుకున్నాను.

అక్కడంతా గుంపులు గుంపులుగా జనం. ఐదారు ఛానళ్ల రిపోర్టర్లు కెమెరాల ముందు ఏదో చెబుతున్నారు. గబగబా లోపలకి వెళ్లాను.

అక్కడ దూరంగా ఫకీర్ చేతులు కట్టుకుని దీనంగా నిలబడి ఉన్నాడు.  నన్ను చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా కావలించుకుని “భాయ్ “అని ఏడ్చిండు.
‘వీళ్లు మీకు తెలుసా సాబ్”  ఎస్సై ఆశ్చర్యంగా అడిగిండు. చాలా కాలం నుంచి పరిచయమేనని చెప్పిన.
” ఈ ఏరియాల టెర్రరిస్టులు తిరుగుతున్నరని మాకు ఇంటలిజెన్స్ రిపోర్టు ఉంది. అందుకే  నిఘా పెట్టినం. ఈ కుర్రాడు అనుమానస్పదంగా తిరుగుతుంటే ఎవరో కంప్లైట్ చేసిన్రు. కాశ్మీర్ అంటున్నాడు.  అందుకే అనుమానం వచ్చి అరెస్టు
చేసినమన్నా”డు ఎస్సై.
లోకల్ ఎమ్మెల్యే తోని ఫోన్ చేయించి మొత్తానికి ఫకీర్ ను, రియాజ్ ను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటరాగేషన్ల దెబ్బలు బాగా కొట్టినట్టున్నారు..
రియాజ్ నడవలేక పోతున్నాడు.
కొడుకు వంటిమీద దెబ్బలు చూసి….ఇంటికొచ్చిన తర్వాత కూడా ఫకీర్ ఏడుస్తనే ఉన్నడు. రాత్రికి పెట్టాలనుకున్న ఖవ్వాలీ కూడా జరగలేదు.
” భాయ్.. ” మెల్లగా పిలిచాడు ఫకీర్.

ఎన్నడూ లేనిది ఫకీర్ కళ్లల్లో మొదటిసారి భయం చూశాను.
” భాయ్ నేను కాశ్మీర్  వెళ్లిపోతాను”  అన్నడు.

”  అదేంది భాయ్..ఇపుడేమైందని.నేను చూసుకుంటాను. కదా…?’
” . మేం ఇక్కడ ఉండలేము భాయ్. తెల్లవారక ముందే బస్ లో హైదరాబాద్ వెళ్లిపోతాము ”  కరాఖండిగా చెప్పాడు ఫకీర్.
***

టైం తెల్లవారు ఝాము నాలుగవుతోంది. ఫకీర్ గబగబ కొడుకుని లేపాడు. నేను ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి చేతిలో పెట్టాను. ‘వద్దు భాయ్. ఛార్జీలకు మాత్రం చాలు’ అని ఓ రెండు నోట్లు తీసుకుని మిగిలిన డబ్బు మళ్లీ నా చేతుల్లోనే పెట్టాడు.

ఆ చీకట్లోనే కిలోమీటర్ దూరంలో ఉన్న బస్టాపు దాకా నడిచి వచ్చాం.
” ఫకీర్ భాయ్ ఇంకో సారి ఆలోచించు.  పోక తప్పదా”  అన్నాను.
”  లేదు భాయ్….ఇక్కడ జరిగిన దానికి భయపడి పోవడం లేదు. మేం గొడవల్లోనే పుట్టాం. గొడవల్లోనే పెరిగాం. అక్కడ బతికే దారిలేక ఇలా దేశాలు తిరుగుతూ బతుకుతాం. అక్కడ మాకు అందమైన ప్రకృతి ఉంది. కానీ ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. మీ ఊరు నాకెందుకు ఇష్టమో తెలుసా.  మీ ఊరు మొదటిసారి వచ్చినప్పుడు వింతగా చూశాను. ఎందుకంటే ఇక్కడ మతం లేదు. పీర్ల పండగను అందరం కలిసి చేసుకున్నం. రాముని పండగకు భజనలు చేసినం. క్రిస్మస్ కు ప్రార్థనలు చేసినం. కులం, మతం అన్నీ మర్చిపోయి…. ఖాళీ మనుషుల్లాగా బతికినం.  అందుకే మీ ఊరు నా ఊరు కన్నా బాగా నచ్చింది.  కానీ ఇప్పుడు ఈ ఊరుకు మతం సైతాన్ పట్టింది.

మతం పేరు చెప్పి చేసే రాజకీయం సైతాన్ లాంటిది భాయి. ఒకసారి పట్టిందంటే చంపేదాకా వదలదు. మతం-రాజకీయం కలిసి చేసే మారణహోమం ఎంత విధ్వంసంగా ఉంటుందో మేం కళ్లారా చూశాం. అది ఇప్పుడు మీదాకా
పాకింది. జాగ్రత్త భాయ్. ”
ఫకీర్ మాటలు నాకు మా ఊరిని కొత్తగా చూపిస్తున్నయి. ఇంతకాలం ఈ ఊరిలోనే ఉంటూ నేను గ్రహించని నిజం అతను రెండు రోజుల్లోనే గ్రహించాడు.
బస్సు వచ్చింది. ఫకీర్, రియాజ్ ఎక్కారు. బస్సు దుమ్ము లేపుకుంటూ కదిలిపోయింది.

మెల్లగా మా ఊరి వైపు నడిచాను.
“ఊరు మారిపోయింది భాయ్. మతం పిశాచి ఆవహిస్తోంది…..జాగ్రత్త భాయ్..”అంటూ
ఫకీర్ చేసిన హెచ్చరిక మళ్లీ మళ్లీ గుర్తుకువస్తోంది.
జాతరలో మత ప్రచారాలు…
పిల్లలచేత మత గ్రంథాలు బట్టీ పట్టించడం…
మేం చెప్పిందే తినాలని భయపెట్టడం…
పరాయి మతస్తుడైన ఫకీర్ కొడుకును ఉగ్రవాదిగా అనుమానించడం…
ఇవన్నీ ఊరికే జరిగినవి కావని ఫకీర్ చెప్పాక అర్థమవుతోంది.
పూర్తిగా తెల్లవార వచ్చింది.
దూరంగా కొండల మధ్యనుంచి రకరకాల వర్ణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ రంగులు
పూసుకున్న భూతాల్లా పైకి లేస్తున్నాయి.

రక్తం లాంటి వర్ణం ఆకాశమంతటా పరచుకుంది.

ఎప్పడూ అందంగా కనిపించే ఆ పొద్దు ఇవాళ ఎందుకో వికృతంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ప్రశాంతంగా మా ఊరిలాగే ఉన్న ఆకాశాన్ని….ఆ రంగు భూతం అల్లకల్లోలం చేసింది. భయంకర బ్రహ్మ రాక్షసి చేసుకున్న రక్తపు వాంతిలాగా ఉంది ఆ రంగు. లోకమంతటినీ కబళిస్తూ…రాకాసిలా చీలికల నాలుకలు చాచుకొంటూ వస్తోంది.

విధ్వంసం…వర్ణ విధ్వంసం, ఆవాహనం వర్ణవాహనం……

మొదటి సారిగా ఆ వర్ణాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టింది.  ఆ రంగు ఇప్పుడు మా ఊరివైపు వెళుతోంది.

ఆ రంగుల సైతాన్  నుంచి మా ఊరిని కాపాడుకోవాలి.

పరిగెత్తుతున్నాను…..పరిగెత్తుతున్నాను.

 

*

తూర్పు వాకిటి పశ్చిమం!

 

addtext_com_mte1njizode3mzg

కాలిఫోర్నియాలోని ఓ నగరంలో,ఉద్యోగస్తులు అనిత, మోహన్ లు.

ఉన్న ఒక్కగానొక్క కూతురు సింధుకి జ్వరం వొస్తే,ఎవరు శలవు పెట్టి చూసుకోవాలి ? అనే మీమాంశలు తప్ప,

పెద్ద చీకూ, చింతా లేని సంసారం!

అమెరికన్ లలో అమెరికన్లు గా,ఇండియన్స్ తో ఇండియన్లుగాకలిసిపోయే నైజం వారిది.

ఈ అంతర్జాతీయ సమాజంలో ఉండే అనేక సాంస్కృతిక భేధాలని, విభిన్న ఆచారాలని ఆకళింపు చేసుకోవడమే కాకుండా, నలుగురిలో  ఆ మర్యాదలను పాటించే వారి తీరు ముచ్చటేస్తుంది కూడా!

నిజానికి, ఈ  స్నేహశీల ధోరణే లేదా సరదానే వాళ్ళ కెరీర్ కి మంచి బాటలు వేస్తోందని, స్నేహితులు అంటుంటారు.

అలా అన్న వాళ్లతో,

అదంతా, బతుకుతెరువు నేర్పించిందని,

ప్రవాస జీవితంతో సమతుల్యత కోసమనీ….

ఇంటికొచ్చేసరికి మాత్రం,

సాధారణ తెలుగు దంపతులమే అంటుంటారు.

అలాంటి వీరికి,ఈ మధ్య,

పాశ్చాత్య నీడలు తమ కూతురి ఆలోచనలని పెడ త్రోవ పట్టిస్తాయేమో అనే ఆందోళన మొదలైంది!

అమెరికాలో ఉండే తల్లిదండ్రులకి ఇదేం కొత్త భయం కానప్పటికీ,
ఉన్నట్టుండి,

అదీ ఎనిమిదేళ్ళ కూతురి విషయంలో రావటానికి కారణం,

ఓ వారం క్రితం,

“నువ్వు చెప్పేవన్నీ కధలు, కల్పితాలు,!” ,

తల్లి తో నిష్టూరంగా అంది సింధు.

స్కూలు అయిపోగానే, తన స్నేహితురాలు సేజ్  ఇంటికి వెళ్లి, ఓ గంట ఆడుకుని వస్తానందవాళ.   వాళ్ల అమ్మ  డెబ్బీ కూడా ప్లే డేట్ కావాలని సేజ్ అడుగుతోందని ఇ మెయిల్ చేసింది.

తన మాటలకి రియాక్షన్ ఏమిటా అని సింధు కళ్ళు విప్పార్చుకుని చూస్తుంటే,

ఆ కధలు, కల్పితాలు ఏమిటని అడిగింది అనిత.

“నేను నీకు దేవుడిస్తే పుట్టలేదు,  నాకు నిజం తెలిసి పోయింది”,  అన్న కూతురిని,

“హాయిగా ఆడుకోకుండా, ఎవరు ఎలా పుట్టారనే సోదితోనే పొద్దుపుచ్చారా? అసలు, ఇలాంటివి తప్పితే వేరే ధ్యాసే ఉండదా? సేజ్ వాళ్ల అమ్మ అయినా ఈ పనికిమాలిన మాటలేంటని ఆపలేదా?”

మందలించకుండా ఉండలేకపోయింది అనిత.

చిన్నబుచ్చుకుని,

“ఆడుకునేప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు,  ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటారు,  స్ప్రింగ్ సీజన్ లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారని  మా టీచర్ కూడా చెప్పింది. నీకో విషయం చెప్పనా?, సేజ్ వాళ్ల అమ్మ నీలా విసుక్కోదు , డెలివరీలు ఎలా జరుగుతాయో చూపించే టివి చానల్ చూసినా సేజ్ ని ఏమీ అనదు, మేం స్నాక్ తినేప్పుడు డెబ్బీ కూడా మాట్లాడింది, తనకి చాలా విషయాలు తెలుస”ని నొక్కి చెప్పింది సింధు.

“నేను నీకు నిజం చెప్పలేదని ఎలా  అనుకుంటున్నావు ? నిజానికి,  మీ అమ్మమ్మ అంటే మా అమ్మ కూడా నాకిదే చెప్పింది. తను ఎన్నో దేవుళ్ళకి  మొక్కితే నేను పుట్టానని, ఓ బిడ్డని ప్రసాదించమని నా ఇష్ట దైవాన్ని వేడుకుంటే,  నువ్వు పుట్టావు . ఇప్పుడు నేను కూడా అమ్మమ్మతో నువ్వు నాకు నిజం చెప్పలేదని అనాలా? ఇక్కడి నీ స్నేహితులు చెపుతుంటారుగా ఆకాశం నుంచి కిందకి రాలుతున్న నక్షత్రాన్ని కోరిక కోరితే జరుగుతుందని, ఇదీ అలాంటిదే అనుకోరాదా?” అనే  అనిత పాయింటుకు

ఏ మాత్రం తగ్గకుండా,

సేజ్ వాళ్ల అమ్మ అలాంటివేమీ తను నమ్మనంది. కొంతమంది నమ్మే వాళ్లు అలా చెప్పినా,   రుజువు చెయలేరని నమ్మకంగా చెప్పిందనే  సమాధానం సింధు నుంచి వొచ్చింది.

సేజ్ వాళ్ల అమ్మని ఇలాంటివి అడగాలనే అలోచన ఎందుకు వొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా,

“స్కూల్ లో ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటుండగా, నేను నీకు దేవుడిస్తే పుట్టానని చెప్పగానే, చాలా మంది నమ్మలేదు! అలాంటివన్నీ కిండర్ గార్టెన్ పిల్లలు  చెప్పే కధలు,  మెక్ బిలీవ్ స్టోరీస్ (Make believe)  అని నీకు ఇంకా తెలీదా? అన్నారు. నాకు ఏడుపొచ్చింది. అప్పుడు సేజ్ నన్ను చాలా సేపు ఓదార్చడమే కాకుండా, మా మామ్  హాస్పటల్లో  నర్సుగా పనిచేస్తుంది, డెలివరీలకి సహాయం చెయ్యడమే తన పని. తనకు ఇలాంటివన్నీ బాగా తెలుసనటం వల్ల, వాళ్ళింటికెళ్ళినపుడు,  డెబ్బీ ఏం చెపుతుందో తెలుసుకోవాలనిపించి” అడిగానన్నది .

స్నేహితుల ముందు కూతురు చిన్నబోవటం అనితకి చివుక్కుమనిపించినా,  సంభాళించుకుని,

అమెరికాలోని  చాలా మంది పేరెంట్స్ ప్రపంచం నాలుగు మూలల నుంచి వొచ్చిన వాళ్లవడం వల్ల అందరూ ఒకేలా చెప్పరని, పెరిగిన వాతావరణం,  ఏర్పరుచుకున్న భావాల ప్రభావంతో పిల్లలకు సమాచారాన్నిస్తారనే వివరణ ఇస్తే,

సింధు తన  ధోరణిలో,

ఈ పాయింట్ లో అది సరి కాదంది.

ఏ జాతి కుక్క పిల్ల అయినా, అమెరికాలో ఎలా పుడుతుందో, ఇండియాలోనూ అలాగే పుడుతుంది, మనుషులూ అంతే కాబట్టి, అనిత చెప్పింది తప్పు దారి పట్టించడమే అంది.
“నేను పెద్దవుతున్నానని నువ్వు పదే పదే అంటావు కానీ, you really don’t mean it?!”

అనే వాదనకి దిగింది,

“అసలిలాగే నేను ఎందుకు పుట్టాను? ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను అని ఎన్ని సార్లు అడిగినా నువ్వు అర్ధం అయ్యేట్టు చెప్పనే లేదు, అదే డెబ్బీ అయితే,

ప్రపంచంలోని ఏ ప్రదేశంలో ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలు కావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని కంటారని, అందుకే నేను మన ఇంట్లో పుట్టానని, నా రూపురేఖలు మీ ఇద్దరి నుంచి, మీ ఇద్దరి కుటుంబాల నుంచీ వొచ్చాయనీ చెప్పింది…and it makes sense!”  అంది.

అమ్మ కడుపులోకి బేబీస్ ఎలా వెళతారని అడిగినపుడు,

“Sperm and eggలు అమ్మ శరీరంలో కలుసుకుని బేబీని తయారుచేస్తాయని డెబ్బీ చెప్పిందంటూ, అమ్మమ్మకు తెలియక పోవడం వల్లే నీకిది తెలియలేదా?! అందుకే నువ్వు నాకు చెప్పలేక పోయావా ? “అని ఆరా తీసింది.

ఇంకా ఏం చెప్పాలో అనితకి తట్టక మునుపే ….

“By the way, ఇదంతా జరగటానికి కొన్ని స్పెషల్ ఫీలింగ్స్ అవసరం! “
గొంతు తక్కువ చేసి, రహస్యంగా…
“ఆడుకొనేటప్పుడు సేజ్ చెవిలో చెప్పింది. వాటి గురించి అందరిలోనూ మాట్లాడటం పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు కనుక, మనం వాళ్ళ భావాలను గౌరవించాలంద”ని కూడా అంటూ

తల్లి వంక చూస్తూ, అవునన్నట్టు తల ఊపింది.

సింధు చెపుతున్న ఒక్కో మాటకి,

డెబ్బీ మీద పట్టరాని కోపం వొచ్చింది అనితకి.

హాస్పటళ్ళలో  పని చేసే వాళ్లకి ఏవి గుట్టుగా ఉంచాల్సినవనే జ్ఞానం ఉండదు, ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉందా?!
ఇదే ధోరణిలో సాగితే,
ముందు ముందు ఇంకా ఎన్ని వినాలో…
అనుకుంటూ,

ఒక్క సెకను కూడా ఇక ఈ మాటలు భరించలేనట్టు,

“ సరే సరే ! టైమున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ముఖం కడుక్కుని రా! ఏదైనా తిని, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టు మెదలుపెట్టు. వారంలో ఇచ్చెయ్యాల”ని పురమాయిస్తే,

“ I know ! “

అసంతృప్తినంతా  గొంతులో పలికిస్తూ తన గదిలోకి వెళ్లింది సింధు.

అ నిరసన,

తమ మధ్య దూరానికి కొలమానంలా వినిపించింది అనితకి.

ఇదంతా,

మోహన్ తో చెపితే,

మొదట,  “సీరియస్లీ….” అన్నాడు,

అంతా విని,

మరీ మూడో క్లాసుకే ఇన్ని ఆరాలు, ఇంత పోగెయ్యటమా ? అని గుండెలు బాదుకున్నాడు,

ఎంత తండ్రినయినా,  చిన్నపిల్లతో ఇవన్నీ నేను మాట్లాడటం బాగుండదు, నువ్వే దగ్గర కూచోపెట్టుకుని, ఇలాంటి మాటలు మాట్లాడటం, వివరాలు తెలుసుకోవడం మంచి పిల్లల లక్షణం కాదని తెలియచెప్పాలన్నాడు.

“ఇది మంచి పిల్లల లక్షణం కాదు అంటే, వినే కాలమా?! మనం ఒకటి చెపితే, తను పది ప్రశ్నలు వెయ్యగలదు,  స్కూళ్లలో,  పిల్లలు నలుగురూ నాలుగు రకాలుగా ఉంటారు! పది రకాలుగా చెప్పుకుంటారు, అసలు పిల్లలకి తెలీకుండా ఉంచాల్సినవేవీ మిగలట్లేదేమో ?!, ఈ ధోరణి ఎటు పోనుందో… “

అనిత దిగాలు పడిపోతే,

ఆ బెంగ తనకీ కలుగుతోందంటూ, ఈ వయసులోనే సరైన మార్గంలో పెట్టాలన్నాడు మోహన్,

ఇలా మొదలైన తమ ఆందోళనని, ముందుగా,

ఇండియాలో ఉన్న పెద్దవాళ్లతో టూకీగా అంటే,

చిన్నపిల్లల్ని ఏమార్చి, దృష్టి మరల్చాలి కానీ, ఇలా బెంబేలు పడకూడదన్నారు.

ఇక్కడి పోకడలపై అవగాహన లేక వాళ్ళు అంత తేలిగ్గా సమాధానమిచ్చారని అనిత, మోహన్ లు  భావించారు.

తరువాత,

అనిత స్నేహితురాలు సుగుణ కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు.

అమ్మాయిలని ఇండియాలో పెంచడమే “ఉత్తమం” అనుకుంటూ, వాళ్లు హైదరాబాద్ కి వెళ్ళిపోయి నాలుగేళ్ళవుతోంది.

మనం ఇవన్నీ తెలుసుకుని పెరిగామా?

పరమ రోత అంతా మన సినిమాల్లోనూ, టీవీ ప్రోగ్రాముల్లోనూ అగుపించడం గుర్తుకుతెచ్చుకుని, సుగుణ తరచూ వేసే ఈ ప్రశ్నతోనూ ఏకీభవించలేకపోయారు.

‘ఫ్యామిలీ లైఫ్’ గురించి స్కూల్లో తెలుసుకొచ్చిన మా అబ్బాయి, ఇలాంటిదేదో ఇంట్లో జరుగుతుందని నాకు తెలియకుండా ఎలా మేనేజ్ చేసారని అడిగాడంటూ వాపోయిన పూర్ణిమ, అనందరావులు కూడా వాళ్ళ కళ్ల ముందు కదలాడారు.

ఏషియన్స్, ఇండియన్స్ ఎక్కువగా ఉన్న స్కూళ్లలో అయితే ఈ ధ్యాస తగ్గి చదువులో పోటీ పెరుగుతుందంటూ, ఉన్న పళాన, వాళ్ళు బే ఏరియాకి (కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ,  దాని చుట్టుపక్కల ప్రాంతాలు) వెళ్ళిపోయిన తీరు తల్చుకుని,

మనం కూడా ఆ పని చేద్దామని అనిత అంటే,

అన్నీ సెట్ అయి ఉన్న చోటి నుంచి, ఉన్నపళాన కొత్త ప్రదేశానికి వెళ్లడం సాధ్యం కాదంటూ,  అక్కడికి వెళ్ళినా గ్యారంటీ ఉంటుందనిపించడం లేదన్నాడు మోహన్.

‘మన’ వాళ్ల కెవరికయినా ఫోన్ చేసి సలహా అడుగుదామనుకుని,

తెలిసిన నలుగురిలో, కూతురిని ఎందుకు బయట పడెయ్యాలని మనసు మార్చుకుంది అనిత.

మరేం చెయ్యాలి??

తమ కమ్యూనిటీలోనే ఉంటూ, సింధు చదివే స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసే మిషెల్ ఆపద్భాందవిలా అనిపించింది. పైగా తను ప్రొఫెషనల్ కూడా!

హాస్పటల్లో పనిచెయ్యడమే కాకుండా, స్కూల్లో పిల్లలకి “ఫ్యామిలీ లైఫ్ “ (లేదా లైంగిక విజ్నానం) పాఠాలు చెపుతుంది.

ఇరువురూ, తరచూ ఈవినింగ్ వాక్ లో కలుస్తూనే ఉంటారు. రెండేళ్ళుగా స్నేహం !

ఈ మాటే మోహన్ తో అంటే, మాట్లాడి చూడమన్నాడు.

ఓ రోజు,

పార్కులో కనిపించిన మిషెల్ తో,

పలకరింపులయిన తరువాత,

మీ సహాయం కావాలి అంటూ తన గోడు వెళ్లబోసుకుంది.

మా కల్చర్ లో ఇలాంటి వివరాలని పిల్లల నుంచి చాలా గోప్యంగా ఉంచుతాం.  తెలిసీ తెలియక నలుగురిలో మాట్లాడితే బాగుండదని, తగిన వయస్సు వొచ్చినపుడు వాళ్ళే తెలుసుకుంటారని, ఏకాగ్రత లోపిస్తుందని, ఇలా రకరకాల కారణాలని చెప్పుకుపోతున్న అనితతో,

ఇలాంటివి పెద్దవాళ్లు చెపితేనే పిల్లలకి తెలుస్తాయని అనుకోలేమంది మిషెల్.

మొన్నా మధ్య కిండర్ గార్టెన్ చదువుతున్న పిల్లాడు ఒకడు, తను చూసిన “ పెప్పా పిగ్ “ కార్టూన్ ఎపిసోడ్ లొ మామీ (Mommy) పిగ్ ఎలా డెలివరీ అయిందో, తన క్లాస్మేట్ తో చెపుతుంటే విన్నానంటూ, అవగాహన పెరుగుతున్న కొద్దీ,  పిల్లలు తమ శరీరాల నుంచి వొచ్చే సిగ్నల్స్ తో పాటు, గమనించిన లేదా తెలుసుకున్న ఒక క్లూ నించి, ఇంకో క్లూ కి కనెక్ట్ చేసుకుంటూ పోతారని వివరించింది.

వాస్తవానికి, తను  పాఠాలు మొదలుపెట్టేనాటికే, పిల్లలలో చాలా మందికి లైంగిక విషయాల పట్ల అంతోఇంతో అవగాహన ఉంటోందని, కాకపోతే వాళ్లకున్న అపోహలు పోగొట్టి, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు చెప్పడం, ముఖ్యంగా శరీరం మీద పూర్తి అవగాహన కలిగించడమే తన లాంటి వాళ్ల పని అన్న మిషెల్ మాటల్ని అందుకుంటూ,

“మా లాంటి పేరెంట్స్ గురించి చెప్పాలంటే, వేరే సబ్జక్టులలో వాళ్ళు ఎంత లోతు ప్రశ్నలు వేస్తే అంత సంబర పడతాం! ఇంకా చెప్పాలంటే,  సెకండ్ గ్రేడ్ కూడా కాకుండానే వాళ్లని రొబోటిక్స్ క్లాస్ లో పెట్టాలని ఉబలాటపడుతుంటాం, వాళ్ళు ప్రపంచంలోని విఙానాన్ని అంతా  అవపోసన పట్టేయ్యాలని కలలు కంటాం కానీ, వాళ్ళ శరీరం మీద, పుట్టుక మీద వొచ్చే ప్రశ్నలు ప్రాధమికమైనా ఎందుకో తడబడతాం. బహుశా, వయసొచ్చినా కూడా  మేం పేరెంట్స్ తో మాట్లాడనివి, ఇప్పుడే ఈ పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీకేమో అనిపిస్తోంది” అంది.

అనిత మాటలని ఓపికగా విన్న మిషెల్,

కాలంతో పాటు పోక తప్పదంటూ, సింధు చిన్న పిల్ల కాబట్టి,  తను విన్నది మార్చకుండా చెప్పిందని తన అంచనా అని,  సాధ్యమయినంత వరకు తన సందేహాలు తీర్చి, నమ్మకాన్ని పెంచుకోవడమే ఉత్తమమనీ, సింధు వైపు నుంచి చూస్తే ఇదో భధ్రమైన మార్గమని సలహా ఇచ్చింది.

“ఈ అమెరికాలో,  ప్రతిదీ భూతద్దంలో చూడటం ఆలవాటు, అన్ని వివరాలు పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది?  చేసే అల్లరి పనులన్నీ హార్మోన్ల పేరు మీద నెట్టేసే టీనేజ్ పిల్లల ధోరణి వింటున్నప్పుడు, ఎక్కువగా తెలిసిపోయి ఈ పైత్యం అంతా ప్రదర్సిస్తున్నారు అనిపిస్తుంది. మీరు మరోలా అనుకోవద్దు, మరో రెండు సంవత్సరాలలో  సింధుని మీ క్లాసుకి పంపాలంటే,  ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉందన్న” అనితతో,

స్కూల్ లో “ఫ్యామిలీ లైఫ్” తప్పని సరిగా తీసుకోవాల్సిన సబ్జక్టు కాదని, పైగా సిలబస్ ప్రకారం నాలుగైదు ఏళ్ళు చెపుతామని,  ఇండియన్సే కాదు, ఈ క్లాస్  వొద్దనుకునే తల్లిదంఢ్రులు,  చాలా మందే ఉంటారని చెప్తూ,  శరీరాల్లో మార్పులు వొచ్చేటప్పుడు పిల్లల్లో ఆందోళన అధికంగా ఉంటుందని,  అందుకే దాదాపు ఐదో తరగతికే ఈ పాఠాలు మొదలుపెడతారంది.  ఒక టీచరుగా, పిల్లలు ఏదైనా ప్రశ్న వేసినపుడు లేదా వేయగలిగినపుడు, దానికి సమాధానాన్ని తెలుసుకోవడానికి వారు సిద్దంగా ఉన్నట్టు భావిస్తానంది మిషెల్.

ముఖ్యంగా కాలిఫోర్నియాలో, టీనేజ్ పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు మెడికల్ రికార్డులు కూడా చూడలేనటువంటి చట్టాలు వున్న ఈ రోజుల్లో,  శరీరం మీద అవగాహన ఉండటం వాళ్లకి  ఎంతో అవసరమని వివరిస్తూ, తోటి పిల్లల వొత్తిడి ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో, సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన పిల్లలకి ఉంది అనే భరోసా తల్లిదండ్రులకి చాలా మనశ్శాంతి నిస్తుందనే  కోణంతో పాటు, టీనేజ్ లో  ప్రగ్నన్సీకి  అవగాహన లేకపోవడమే సగం కారణమనేది తన అభిప్రాయంగా చెప్పింది.

ఆమె అభిప్రాయాల్ని శ్రద్దగా విని,
అఖరి మాటగా,
మళ్ళీ ఇలాంటి  ప్రశ్నలడిగితే, ఐదో తరగతిలో మీ టీచర్లే నీ ప్రశ్నలకి సమాధానాలిస్తారని సింధుతో చెపుతానంది   అనిత.

దానికి సమాధానంగా,

పిల్లల సంఘర్షణలకి తొలి వేదిక చాలా వరకు ఇల్లే అవుతుందంటూ,  గమనించి, అర్ధం చేసుకుంటే చాలా సమస్యలు అక్కడే తీరిపోతాయని, తోటి మనిషికి, వారి భావాలకి ఇవ్వాల్సిన విలువ, అలాగే ఇతరుల నుంచి తాము ఎటువంటి ప్రమాణాలు ఆశించాలి అనేది  పిల్లలు చాలా భాగం ఇంటి నుంచే నేర్చుకుంటారంది మిషెల్.

సమయం మించిపోవడంతో, కృతజ్నతలు చెప్పి, శలవు తీసుకుంది అనిత .

‌రెండు వారాల తరువాత,

ఓ రోజు, స్కూలు నుంచి వొస్తూనే, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అమెజాన్ మెయిల్ కవర్ చూసి, ఏం ఆర్డర్ చేసావని అడిగింది సింధు.

మనిద్దరి కోసం పుస్తకాలు, నువ్వొచ్చిన తరువాత ఓపెన్ చేద్దామని ఆగానంది అనిత.

“మనిద్దరికీ పుస్తకాలా?! “

తల్లి వంక విచిత్రంగా చూసింది సింధు.

కూతురిని దగ్గరికి తీసుకుని,

“ఇంత కాలం నీతో అనలేదు కానీ,

నీ వయసులో ఉన్నప్పుడు నాక్కూడా బోలెడన్ని సందేహాలు వొచ్చేవి. కానీ వాటిలో సగం ప్రశ్నలు ఎవర్ని అడగాలో, అసలు అడగచ్చో లేదో కూడా తెలిసేది కాదు.  అమ్మానాన్నల్ని అడిగి, వాళ్ళు చెప్పిన వాటిని మాతో పంచుకున్న స్నేహితులూ తారసపడలేదు.  దాంతో తోటి పిల్లల మధ్య అదో పెద్ద సమస్య కాలేదు,

ఒకటి మాత్రం ఒప్పుకుంటాను, తెలియని విషయాలు చాలా ఉండేవి! మీ నాన్న కూడా ఇదే మాట అన్నాడు!

ఈ మధ్య,  ఇద్దరం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు అర్ధం అయిందేమిటంటే,  నీకు ఎదురయ్యే ప్రశ్నలకి, నువ్వు పెరుగుతున్న పరిసరాలకి,

మా చిన్నతనానికి,

మధ్య చాలా అంతరం ఉందని, దానిపై మాకు ఇంకా పూర్తి అవగాహన లేదని.

మీరందరూ ఎవరికి ఏం తెలుసు అని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు చూశావా అది మాకు చాలా కొత్త, అందుకే మా సమాధానాలు నీకు సరిపోవడం లేదు!

ఇక మేం చెయ్యాల్సిందల్లా,  నీ వేగాన్నిఅందుకోవడమే!

బాగా అలోచించి, అమ్మాయిల కోసం రాసిన అమెరికన్  గర్ల్ సిరీస్ బుక్స్ కొన్ని, అలాగే  నీ లాంటి పిల్లలు ఇక ముందు అడిగే ప్రశ్నల కోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు కొన్నాను. కొన్ని ఇద్దరం కలిసి చదువుదాం, మిగతావి నేను చదువుతాను, ముందు ముందు నీకేమయినా సందేహాలొస్తే వివరంగా మాట్లాడుకుందామని, అవసరమైతే నాన్న కూడా సాయం చేస్తాన్నాడ”ని చెప్పింది.

నమ్మలేనట్టుగా చూసి,

ఇంతలోనే తేరుకుని,

అమ్మకి ఆనందంగా హగ్ ఇచ్చిన సింధు,

కొన్నిటి గురించి, బయటి వాళ్లని అడగటం చాలా కష్టం అంటూ మనసులో మాట చెప్పింది.

సింధు చేయి తన చేతిలోకి తీసుకుంటూ అనిత ఇచ్చిన భరోసా,

“ I know ! “

ఎస్. హిమబిందు

 

 

కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

santhi1

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .

నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.

కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .

 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం

ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .

వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .

santhi2

నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 

అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .

చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .

2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .

మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .

ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..

పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 

మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.

ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .

santhi4

ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .

బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.

యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .

బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .

అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .

santhi3

కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .

ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .

అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..

మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .

నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.

అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..

ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .

ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .

ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.

ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .

ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..

*

 

 

ఉద్దానం- ఒక గుండె గోడు!

vuddanam-cover

ఆ నిర్లిప్తత భయావహం

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-8

 

sudrarsanamలౌకికం-అలౌకికం; సామాన్యత-అసామాన్యత అనే ద్వంద్వాల మధ్యనే ‘వేయిపడగలు’ నవల మొత్తం సాగుతూ ఉంటుంది. అయితే, అవి వేటి కవిగా ఉండిపోవడం తప్ప;  వాటి మధ్య ఒక లంకె ఉంటుందనే స్ఫురణను రచన కలిగించదు. అలౌకిక ప్రపంచంలో అర్థవంతంగా అనిపించే పాత్రలు లౌకిక ప్రపంచానికి వచ్చేసరికి తేలిపోతాయి. ఉదాహరణకు అలౌకికతనుంచి చూస్తే రామేశ్వరశాస్త్రి అసామాన్యుడు. “మా తండ్రి నేమనుకొంటివి? ఆయన లోకసామాన్యుడు కాదు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకు యెట్లు తెలియును?” అని అరుంధతితో ధర్మారావు అంటాడు. లోకసామాన్యుడు కాని వ్యక్తి గొప్పతనం లోకంలోని అసంఖ్యాకులైన దౌర్భాగ్యులకు తెలియనప్పుడు ఆ గొప్పతనం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

లౌకిక జీవనానికి వస్తే, రామేశ్వరశాస్త్రి మొదట్లో సంపన్నుడు. జమీందారు తర్వాత అంతటివాడు. కానీ చేతికి ఎముక అన్నది లేకుండా దానధర్మాలు చేశాడు. బంధువులనూ, పేదలనూ, రైతులనూ, వర్తకులనూ కూడా ఆదుకున్నాడు. చివరికి చితికిపోయి శేషజీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులే కాక, అతని సాయంతో వృద్ధిలోకి వచ్చిన రైతులు, వర్తకులూ కూడా మొహం చాటేశారు. తను వివాహమాడిన మిగతా మూడు వర్ణాల స్త్రీలకు; భోగస్త్రీకి ముందే ఆస్తి పంచి ఇచ్చిన రామేశ్వరశాస్త్రి కొడుకు ధర్మారావుకు మాత్రం పేదరికన్నే మిగిల్చిపోయాడు.

‘వేయిపడగల’ రచయిత వాస్తవానికి రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా సామాజిక పరిణామ చరిత్రను చెబుతున్నాడు.  బ్రిటిష్ కాలంలో లేదా ఆధునికత అడుగుపెడుతున్న దశలో బ్రాహ్మణ్యం అగ్రహారాలనూ, ఇతర ఆస్తులనూ కోల్పోయి ఆర్థికంగా అణగారిపోతూవచ్చింది. అగ్రహారం భూములు  రైతుకులాల పరమయ్యాయి. దానికితోడు, తెలుగు ప్రాంతాలలోని గోదావరీ, కృష్ణా మండలాలలో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల  వ్యవసాయం అభివృద్ధి చెంది చూస్తుండగానే రైతుకులాలవారు ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉచ్చదశను అందుకోవడం మొదలైంది. రెండు మూడు తరాల వ్యవధిలోనే సంభవించిన ఈ పరివర్తనకు తెలుగు ప్రాంతాలలోని బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో సాక్షిగా నిలిచాయి. తాత తరంలో బ్రాహ్మణభూస్వామి కింద పాలెకాపులుగా ఉన్న రైతుకులాలవారు మనవడి కాలానికి వచ్చేసరికి రాజకీయంగా ఉన్నతపదవులు అందుకోవడం, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం వారిని ఆశ్రయించడం ఈ పరివర్తన క్రమాన్ని ఆశ్చర్యస్ఫోరకంగా  మన కళ్ళముందు నిలుపుతాయి.

ఆర్థికక్రమశిక్షణ, కుటుంబ భవిష్యత్తుపట్ల బాధ్యతా రాహిత్యాలతో బ్రాహ్మణులు ఆర్థికపతనాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శ బ్రాహ్మణ్యంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పతన చరిత్రలోని ఒక పార్స్వాన్నే హాస్యబీభత్సవంతంగా ‘కన్యాశుల్కం’ చిత్రించింది. ‘వేయిపడగల’లోని రామేశ్వరశాస్త్రి ఉదంతాన్ని చదువుతున్నప్పుడు ఆయన మరీ ముందు వెనకలు చూడకుండా దానాలు, సాయాలు చేసి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టాడన్న భావన పాఠకులకు కలుగుతుంది. కానీ రచయిత వైపునుంచి ఆ అభిప్రాయం కానీ, విమర్శ కానీ ఉండవు. ఉండకపోగా రామేశ్వరశాస్త్రి ఆర్థికక్షీణతను కార్యకారణ సంబంధానికి అతీతమైన ఓ దైవఘటనగా, ఓడలు బండ్లు సామెతలా నిర్లిప్తంగా తీసుకోవలసిన పరిణామంగా చెబుతున్నట్టు ఉంటుంది. అదీగాక  రామేశ్వరశాస్త్రి అసామాన్యవ్యక్తి కనుక అతని లౌకిక ప్రవర్తనను సైతం లౌకిక కొలమానాలతో చూడకూడదన్న ధ్వనీ వ్యక్తమవుతూ ఉంటుంది.  అతను ఏం చేసినా ఒప్పే, ఏం చేయకపోయినా ఒప్పే. ప్రశ్నలకు, విమర్శలకు, కలిమిలేములతో సహా అన్నిటికీ అతను అతీతుడు. అసలు అతని, అతని కుటుంబపోషణ బాధ్యత అతనిది కాదు; రాజుదీ, లేదా సమాజానిదీ. విచిత్రమేమిటంటే, రచయిత రామేశ్వరశాస్త్రిని లౌకికానికి అందనంత పై మెట్టున నిలుపుతూనే; అతని వల్ల సహాయాలు పొందిన బంధువులు, బ్రాహ్మణేతరుల కృతఘ్నతను ఎత్తిపొడవకుండానూ ఉండడు.

ధర్మారావు లౌకిక జీవన చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. తేడా అల్లా, దాన ధర్మాలు చేయడానికి అతనికి తండ్రి ఏమీ మిగల్చలేదు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగానికి అర్హత అయితే సంపాదించాడు కానీ, మొదట్లో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటాడు. మధ్యలో జాతీయకళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తాడు కానీ అందులో ఇమడలేక విడిచిపెట్టేస్తాడు. కళ్ళముందు భార్య అనారోగ్యంతో చిక్కిశల్యమవుతున్నా మందు ఇప్పించలేని లేమిలో మగ్గిపోతాడు తప్ప ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం పాఠకులకు విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి జమీందారు రంగారావు కొడుకు హరప్పకు గురువుగా నియమితుడైన తర్వాత సంభారాలు కోట నుంచే వస్తుంటాయి. దాంతో తిండి సమస్య పరిష్కారమవుతుంది కానీ, చేతిలో డబ్బు ఆడని పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రచయిత చెప్పదలచుకున్నది, ధర్మారావు కుటుంబ పోషణ చూసుకోవలసినది రాజు, లేదా సమాజమనే. అంటే, మారిన కాలంలో కూడా రచయిత వర్ణవ్యవస్థ తాలూకు బ్లూ ప్రింటును అమలు చేయడానికి ప్రయత్నించాడు.

viswanatha

రచయిత కల్పించే ఊహ ప్రకారం రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల డబ్బు సంబంధం కూడా ఓ తాత్విక ప్రశ్నలా ఉంటుంది.  డబ్బుతో వారికి అవసరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎంత డబ్బు అవసరమైనా వారు దాని వెంట పడరు, అదే తమ వద్దకు రావాలి! డబ్బు దగ్గర కూడా రచయిత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర భేదం తీసుకొస్తాడు. ధర్మారావు మిత్రుడు కిరీటి తన మేనమామకు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు:

నీవు నెలకు మూడువందలు తెచ్చుచున్నావు కనుక నీవే వివేకవంతుడవు కావు. ధనము సంపాదించుట వివేకము కాదు. ఏదో మనము బ్రాహ్మణేతరులము కనుక నెమ్మదిగా అందులోనుండి యందులోనికి మ్యాజిస్ట్రేటును, తహసీల్దారును, ఇంగ్లీష్ హెడ్ క్లార్కును, హుజూరు శిరస్తాదారును, డిప్యూటీ కలెక్టరునైనది. కానీ ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా? మహాశిల్పులమా? మతకర్తలమా? ఏమని?

సామాన్యార్థంలో చెప్పుకుంటే భౌతిక సంపద కన్నా జ్ఞానసంపద గొప్పదీ, సమాజం పోషించదగినదే. కానీ, పై వాక్యాలు  జ్ఞానసంపద ఉన్నవారికీ, ‘అలాంటి జ్ఞానసంపద’ లేని వారికీ మధ్య తారతమ్యాన్ని ఎంచి; జ్ఞానసంపద ఉన్నవారినీ, వారి జ్ఞానాన్నీ కూడా  ఎత్తు పీట మీద కూర్చోబెడుతున్నాయి. అసలు ఏది జ్ఞానమన్న మౌలిక చర్చ ఒకటి ఉండనే ఉంది. నిర్దిష్ట వర్గానికి చెందిన నిర్దిష్ట జ్ఞానమే జ్ఞానం కాదు. జ్ఞానం బహుముఖాలుగా ఉంటుంది. ఆ చర్చలోకి వెడితే కిరీటి నోట పలికించిన పై అభిప్రాయం అసమగ్రంగా తేలిపోతుంది. ఎంత గొప్ప జ్ఞానమైనా సామాన్యీకరణ చెంది ప్రజల పరం అయినప్పుడే దానికి విలువా, సార్థకతా.  కానప్పుడు అది అలంకారప్రాయంగా మారి షో కేస్ కు పరిమితమవుతుంది.

ధర్మారావుతో పోలిస్తే, అతని భావజాలంతో ప్రభావితుడై, దాని పక్షాన పోరాడిన కుమారస్వామి విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకుంటాడు. కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ధర్మారావులానే ఉద్యోగంలో ఇమడలేక రెండు ఉద్యోగాలను వదిలేస్తాడు. ధర్మారావులా అతనికి కోటనుంచి సంభారాలు వచ్చే పరిస్థితిలేదు. అయినా సరే, దుర్భర దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాను తప్ప, ఆత్మగౌరవం చంపుకుని ఉద్యోగం చేయనని అతను నిర్ణయించుకుంటాడు. ఆవిధమైన పోరాటశీలం కానీ, త్యాగం కానీ ధర్మారావులో లేవు. చివరికి మంగమ్మ తన ఆస్తిని కుమారస్వామికి రాయడంతో అతను ఆర్థికసమస్యలనుంచి బయటపడడం వేరే విషయం.

లౌకికంగా చూసినప్పుడు; ఊళ్ళో ఇళ్ళు అంటుకుని, తన ఇంటిని కూడా మంటలు చుట్టు ముట్టే ప్రమాదఘట్టంలోనూ  ధర్మారావు ప్రవర్తన విపరీతమనిపించి విస్మయం కలిగిస్తుంది. అతనిని ఒకవైపు నిర్లిప్తుడిగా, నిష్క్రియుడిగానే కాక; ఇంకోవైపు అసామాన్యుడిగా, అధికుడిగా చూపడానికి ఇక్కడా రచయిత తాపత్రయపడతాడు. బ్రాహ్మణుల ఇళ్లకు దగ్గరలో, వేణుగోపాలస్వామి గుడి వెనక  మత్స్యమాంసాలను అమ్మే మార్కెట్ అవతరించడం ద్వారా ధర్మానికి జరిగిన హాని ఈ అగ్నిప్రమాదానికి కారణంగా చూపుతాడు. ఊళ్ళో జనం మంటలు ఆర్పడానికి రంగంలోకి దిగినా ధర్మారావు మాత్రం కుటుంబంతో బయటకు వచ్చి నిలబడిపోతాడు. ఇతరుల ఇళ్లను ఆర్పడానికి సాయపడడు సరికదా; తన ఇంటిని కాపాడుకోడానికి కూడా ప్రయత్నించడు. తల్లి సామాన్లు బయటికి తీసుకురాబోతే వారిస్తాడు. అప్పుడతని మాటలు ఇలా ఉంటాయి:

ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు; వీరు నలువు రన్నదమ్ములు. ధర్ము డందరిలో పెద్దవాడు. అతని కవమానము చేసినచో తక్కిన మువ్వురకును కోపము వచ్చును. అగ్ని తగులబెట్టును. తస్కరుడు దొంగిలించును. రాజు రాబడి పన్నని, అదనపు పన్నని లక్షవిధములుగా ధనము హరించును. మనము ధర్మావమానము చేసినచో  కానిమ్ము. పాతికవేల ఇల్లే పోయినప్పుడు వంద, రెండు వందల రూకల సామాను రక్షించునా?

దీనికి కొస మెరుపు ఏమిటంటే, “అతని యింటి మీద నెక్కి యెవరును నీరు పోయలేదు” అన్న రచయిత ఫిర్యాదు. అంటే, ధర్మారావు ఇంటి మంటలను ఆర్పే బాధ్యత కూడా సమాజానిదే కానీ అతనిది కాదన్నమాట. లౌకిక వ్యవహారాలలో ధర్మారావులో చిత్రించిన ఈ నిర్లిప్తత, నిష్క్రియత భయం గొలుపుతాయి. ఇలాంటి జడీభూతస్థితికి తాత్వికార్థమిచ్చి ఆకాశానికి ఎత్తిన జడభరతుడిలాంటి ఉదంతాలు మన పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి.  ధర్మారావు పాత్ర చిత్రణలో రచయిత ఊహల్ని అలాంటి నమూనాలు ప్రభావితం చేసి ఉంటే ఆశ్చర్యంలేదు. అయితే ఈ నిర్లిప్తతకు, నిష్క్రియతకు ఎంత గొప్ప తాత్విక అర్థాన్ని ఆపాదించినా, వాటికి సంస్కృతీ సంప్రదాయాల విచ్ఛిత్తీ, పారతంత్ర్యం వంటి లౌకిక పర్యవసానాలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలపైనే కదా ధర్మారావు ముఖంగా, ఇతర పాత్రల ముఖంగా రచయిత నవల పొడవునా చేసిన విమర్శ?!

ధర్మారావు భావజాలంతో ఏకీభవించేవారి వైపునుంచి చూసినా, స్వరాజ్యోద్యమం అలాంటి లౌకిక పర్యవసానాలనుంచి దేశాన్ని బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక కీలక సందర్భమే. కానీ ధర్మారావు మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనడు. పాల్గొనకపోగా స్వరాజ్యోద్యమం గురించి అతని అభిప్రాయం ఇలా ఉంటుంది:

నాకు చూచిన కొలది, దేశమందరు నుద్యమములో చేరినచో స్వరాజ్యము రేపే వచ్చును. కానీ యెవరికి వారు స్వార్థపరాయణులై యున్నారు. అట్టి సమయములో మరియు నిబ్బందులలో నున్నవారు తమ జీవితమార్గమును చెడగొట్టుకుని సంకటపడినందువల్ల నాకు లాభము కనిపించలేదు.

దేశంలో అందరూ ఉద్యమంలో చేరితే రేపే స్వరాజ్యం వస్తుందంటాడు. కానీ ఎవరికి వారు స్వార్థం చూసుకుంటున్నారంటాడు. వారిలో తనూ చేరతాడన్న స్పృహ మాత్రం అతనిలో ఉండదు. ఇంకోవైపు, మరీ ఇబ్బందులలో ఉన్నవారు తమ జీవితమార్గాలను చెడగొట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదంటాడు. అంటే, మిత్రుడు రాఘవరావులా తను స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణం, అతని కంటే తను ఎక్కువ ఇబ్బందులలో ఉండడమే నని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సంజాయిషీ అతనిలోని భద్రలోగ్ మనస్తత్వాన్ని బయటపెట్టి భీరువుగా చూపిస్తుంది తప్ప అతనిపై గౌరవాన్ని కలిగించదు. తాము పడే ఇబ్బందులు ఎక్కువా తక్కువా అన్నది చూసుకుని ఎవరూ స్వరాజ్యోద్యమంలో చేరలేదు. ఉద్యమంలో చేరి జీవనోపాధులను చెడగొట్టుకోవడమే కాదు, ఆస్తులను కోల్పోయినవారు కూడా ఎందరో ఉన్న సంగతి మనకు తెలుసు.

అదలా ఉంచితే, గాంధీ నాయకత్వంలోని స్వరాజ్యోద్యమంలో ధర్మారావు చేరకపోవడానికి భావజాల పరమైన విభేదాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు, దళితుల దేవాలయప్రవేశానికి ధర్మారావు వ్యతిరేకి. ఆ వ్యతిరేకతను రచయిత ఒకచోట ఇలా చిత్రిస్తాడు:

గణాచారి ధర్మారావులు కలసి దారి వెంట పోవుచుండిరి. ఒక పంచముడు ఎదురుగా వచ్చుచుండెను. గణాచారి తొలగి పోబోయినది. అతడు మరియు సమీపమునకు రాబోయెను. ధర్మారా వతనితో, ‘ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే యుండదు. అప్పుడు మనమందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు. మూలమైన బీజాక్షరపీఠమున శక్తి యప్పటికి సమూలముగా నశించును. నేను నీ వాడను పద’ యనెను. అతనికి తెలియలేదు. ధర్మారావు వంక వెర్రిమొర్రిగా చూచుచు నతడు దూరదూరముగా పోయెను.

ధర్మారావు మాటల్లోని వెక్కిరింత, వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. గాంధీతో భావజాల విభేదాలే ధర్మారావు స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణమని రచయిత సూచించి ఉంటే అది ధర్మారావుకు కొంత గౌరవప్రదంగా ఉండేది. అటువంటి స్పష్టత రచయితకు ఉండకపోవడానికీ అవకాశముంది. గాంధీ నాయకత్వంలో కాకపోయినా తనతో భావసారూప్యమున్న వ్యక్తులతోనో, సంస్థతోనో కలసి ధర్మారావు స్వరాజ్యానికి ప్రయత్నించి ఉండవచ్చు. అదీ చేయలేదు.

అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. అతని నిర్లిప్తత, నిష్క్రియత లౌకిక విషయాలలోనే. అలౌకిక విషయాలలో అతను క్రియాశీలిగా, నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నవాడిలా కనిపిస్తాడు. అది, దేవాలయం కేంద్రంగా సాంప్రదాయికతను లేదా వర్ణవ్యవస్థను పరిరక్షించడం. అలౌకిక జీవులుగా తోచే గణాచారి, గిరిక, పసరికలకు అతను అక్షరాలా అంగరక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ ఘట్టాలలో అతను ఎంత క్రియాశీలంగా ఉంటాడంటే, మరో ధర్మారావు అనిపిస్తాడు. ఈ సందర్భాలలో రచన కూడా అనూహ్య వేగాన్ని, సంవిధానాన్ని పుంజుకుని పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా పసరికను ఒక ఆంగ్లేయుడు అపహరించి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ధర్మారావు దానిని అడ్డుకుని పసరికను విడిపించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.

అదలా ఉంచితే, వ్యవస్థా పరిరక్షణలో భాగంగా యువరాజు హరప్పకు గురువుగా మారి అతన్ని కర్మయోగం వైపు నడిపించినట్టు, దేవదాసి అయిన గిరికను భక్తిమార్గంలో పరిణతను చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది.  అయితే ఆ గురుత్వం చుట్టూ నిగూఢత అనే తెర వేలాడుతూ ఉంటుంది. చెల్లెలైన గిరిక చేత సాధన చేయించడంలో అది మరింతగా వ్యక్తమవుతుంది. గిరిక పూర్తిగా అతిమానుష లోకంలోనే జీవిస్తూ ఉంటుంది. ధర్మారావు లౌకిక జగత్తు నుంచి, మధ్య మధ్య గిరికకు చెందిన అలౌకిక జగత్తులోకి పయనిస్తూ ఉంటాడు. పాఠకుల్ని ఆకట్టుకునే అంశాలలో ఈ అన్నా-చెల్లెళ్ల అనుబంధ చిత్రణ ఒకటి.

లౌకికంగా చూసినప్పుడు సామాన్య పాఠకులలో గిరిక పాత్ర కూడా ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది. ఆ భక్తి ఏమిటో, అంత చిన్న పిల్ల దేవుణ్ణే(వేణుగోపాలస్వామి) పతిగా వరించి లౌకిక పరిసరాలు పట్టకుండా అతని స్మరణలోనే గడపడమేమిటో అనిపిస్తుంది. నాస్తికుల సంగతి అలా ఉంచి భక్తులకు సైతం విడ్డూరం గొలిపేలా ఆమె భక్తితత్పరత ఉంటుంది. శారీరకంగా ఆమెలో ప్రకృతిసహజమైన ఎదుగుదల, సౌందర్యం, లావణ్యం ఉంటాయి. కానీ మానసికంగా ప్రకృతి సహజమైన కోరికలకు అతీతంగా ఉంటుంది. వేణుగోపాలస్వామితోనే ఆమె శృంగారానుభవం. ఈ చిత్రణ చివరికి ప్రకృతికి, దైవానికి మధ్య వైరుధ్యంగా పరిణమిస్తుంది. గిరిక ఉదంతాన్ని విడిగా చిత్రిస్తే భక్తికి ఆమె ఒక పరాకాష్టగా కనిపించి భక్తులను అలరించి ఉండేదేమో కానీ; సామాజికవస్తువుతో కూడిన నవలలో భాగం చేయడం వల్ల సార్వత్రిక సమాజం ఈ పాత్రతో ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పసరిక పాత్రతో పోల్చి చూసినప్పుడు ఈ తేడా అర్థమవుతుంది. పర్యావరణానికి ప్రతీకగా సృష్టించినది కనుక పసిరికతో సార్వత్రిక సమాజం తేలికగా అనుసంధానం కాగలుగుతుంది. భక్తి అనేది పర్యావరణం వంటి సార్వత్రిక అంశం కాదు కనుక గిరికతో అలాంటిది సాధ్యం కాదు. మళ్ళీ లౌకికంగా చెప్పుకుంటే గిరిక పాత్ర ద్వారా రచయిత దేవదాసీ వ్యవస్థను అసలు అర్థంలో నిరూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అయితే గిరిక దేవదాసీ వ్యవస్థకు అచ్చమైన ప్రతినిధి అవుతుందా, ఏ కాలంలోనైనా దేవదాసీలు ప్రకృతి సహజమైన స్పందనలకు దూరంగా గిరికలా పూర్తిగా దేవుడికే అంకితమై ఆయనే లోకంగా జీవించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరివరకో ఎందుకు, గిరిక తల్లి రత్నగిరి కూడా అలా లేదు. ఆమె రామేశ్వరశాస్త్రికి భోగస్త్రీ అయింది.

  (సశేషం)

 

 

 

 

ఆనందానికి ఒక అడ్రస్ ఇదిగో ఇక్కడ!

aanandaarnavam

 

“ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని ఆ కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి ఉపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. ఆ శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి ఆశక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. ఆ హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి ఆ అనందాన్నిపొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆ ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మలూ వున్నాయి.”

అంటాడు తన “ఆనందం” వ్యాసంలో చలం.

‘నా రక్తంలో ఒక ధిక్కారం ఉంది.

దేనినీ సహించని ధిక్కారం.

ఎవరికీ భయపడని ధిక్కారం.

భయమంటే తెలియని ధిక్కారం.

ఈ ధిక్కార స్వభావమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.’  ఇది అమ్మ మాట… ఇదే అమ్మ బాట…

అవును ఆ ధిక్కారమే మహిళల పాలిట ఆనందహేతువు అయ్యింది.

ఒక ధిక్కారం నుండి ఆనందాన్ని ఎలా విశ్వవాప్తం చెయ్యవచ్చో అమ్మ నిరూపించింది.

చలం అన్నా… అమ్మ అన్నా … వర్షం… వెన్నెల అంత ఇష్టం నాకు.

మనలో అణగారిపోయిన ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని మనకే కొత్తగా పరిచయం చేసి, లోకానికి ఒక సరికొత్త దృక్పధాన్ని ఇచ్చిన ఉత్ప్రేరకాలు వీళ్ళు.

***

“తుపాకి మొనపై వెన్నెల” పుస్తకం అందిందా అని ఫోన్ చేసినప్పుడు మొదటి సారిగా తన గొంతు విన్న క్షణం…

విజయనగరంలో కలిసినప్పుడు.. “మహీ” అని నవ్వుతూ రెండు చేతులూ చాపి నన్ను దగ్గరకి తీసుకున్న ఆత్మీయ ఘడియలూ..

04.09.2014 న తన భుజం మీద తల పెట్టుకుని అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకున్నాక ” ఇదిగో నా డైరీ ఇప్పటిదాకా ఎవ్వరికీ ఇవ్వలేదు. నీకే ఇస్తున్నా” అంటూ.. ఆనందార్ణవాన్ని నాకిచ్చిన ఆ చేతులూ…

నా జీవితంలో మర్చిపోలేని అత్యంత అద్భుతమైన జ్ఞాపకాలివి.

అలా నాదగ్గరకి వచ్చిన “ఆనందార్ణవం” ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.

దాదాపు తొమ్మిది నెలల పాటు ఆ డైరీ నాదగ్గరే ఉంది.

సంతోషంలో దుఃఖం లో ఎప్పుడూ నాతోనే ఉంది.

సంతోషం అంటే ఏంటి?  ఎలా ఉంటుంది ?  ఎక్కడుంటుంది ? ఎందులో ఉంటుంది ? ఎవరికి దక్కుతుంది ?

సంతోషాన్ని ఎలా నిర్వచించాలి ?  ఎక్కడ వెతకాలి ?

అసలెందుకు సంతోషం? సంతోషం లేకపోతే ఏమవుతుంది ?

అది దొరక్క పోతే దుఃఖమేనా ?

సంతోషానికీ దుఃఖానికి తేడా ఏమిటి ?

పుస్తకం నిండా  ఎన్నో ప్రశ్నలు.

సమాధానం అమ్మ చెప్పిందా… అంటే.. ఉహూ… లేదు… ఎక్కడా చెప్పదు. సంతోషం అనే పదానికి నిర్వచనంగా తన జీవితం చూపిస్తుది. తనెక్కడ పొందగలిగిందీ మనకి చెప్తుంది.

తనతో పాటు గోదావరి గట్ల వెంట వెన్నెల రాత్రుల ప్రయాణాలు చేయిస్తుంది.

అనియమిత ప్రేమ (అన్ కండీషనల్ లవ్) ఎలా ఉండాలో చెప్తుంది.

ఇవ్వడంలో ఉన్న సంతోషం

వదులుకోవడంలో ఉన్న ఆనందం.

ఇవన్నీ తను చెప్తే తెలుసుకోవాల్సిందే.

అసలు ఆనందం ఎక్కడ ఎలా దొరుకుతుందంటే.. మనమైతే  ఏం చెప్తాం.

పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం…

పాతికేళ్ళొచ్చాక ఉద్యోగంలో ఉందనుకుంటాం..

నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం..

యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..

అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..

ప్చ్.. ఎక్కడా కనిపించదు!!!

ఆనందమా నువ్వెక్కడున్నావు??

ఆనందం ఎక్కడుంది?

మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,

శృంగారంలోనా, లేక…

మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..

ఈ ఒక్క ప్రశ్నకి జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కరలేదు..

ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా…

దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి…

అంత వెతకక్కరలేదు..

ఆనందం మజ్జిగలో వెన్నలాగా..

పాలలో మీగడలాగా..

మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..

చిలికి చిలికి వెలికి తీస్తామా..

వృధాచేసి పారేస్తామా…

అది మనమే నిర్ణయించుకోవాలి…

ఎనీ.. డౌట్స్????

 

సత్యవతి అమ్మ రాసిన ఈ  “ఆనందార్ణవం” లో ఒక్కసారి మునిగి చూడండి.

ఇరుకు భావాల్లోంచి.. విశాల ప్రపంచంలోకి ఎలా నడవాలో అమ్మ చెప్తుంది.

ప్రేమించడం అంటే ఏమిటో చెప్తుంది.

ఈర్ష్యా.. అసూయా.. ద్వేషం లేని ప్రపంచం ఉంటే అది ఎంత అందంగా ఉంటుందో కూడా మనకి చెప్తుంది.

పౌర్ణమితో పాటు అమావాస్యని ప్రేమించడం..

వెలుగుతో పాటు చీకటిని ఆహ్వానించడం…

ప్రకృతి మనకు ఇచ్చిన దాన్ని యధాతదంగా…

ప్రేమగా స్వీకరించడం….

 

విలువైనదేదీ సులువుగా దక్కదు.

అదే అమ్మ కూడా అంటుందిక్కడ “సంతోషాన్ని వెతికి పట్టుకోవాలంటే.. ప్రమాదాల వెంట ప్రయణం చెయ్యాల్సిందే”

ఎంత గొప్పనిజమిది. సహజ అనుభూతిలో ఒదగనిదేదైనా ఆనందాన్ని తన వెంట తీసుకుని రాదు కదా మరి.

‘ ఒక చోట ఆగిపోవడం అంటే నూతనత్వం లేకపోవడం’ అంటుంది అమ్మ మరో చోట.

అందుకే ప్రవహించాలి… నిరంతర ప్రవాహం గండుశిలల్నీ ఎంత నునుపుగా మారుస్తుందో మనకి తెలియని సంగతా యేమి?  ఒక్కసారి ప్రవాహం మొదలయ్యిందా అది చేరుకునే తీరం ఆనందార్ణవమే అనటంలో ఎలాంటి సందేహం లేదు.   అది చదివాక ప్రవహించాలనిపిస్తుంది. అలా అనిపించటమే ఇది అక్షరాలు పొదిగిన పుస్తకం కాదు జీవితం వొదిగిన కావ్యం అనుకోవడానికి ఋజువు.

పసితనంలో తనకిష్టమైన టీచర్ కోసం 30 కిలోమీటర్ల దూరపు గమ్యంతో మొదలైన తన అడుగులు ఇప్పుడు సప్తసింధువులనీ ఆనందార్ణవాలుగా మార్చే మహాక్రతువులో విశ్వవ్యాప్తమవుతున్నాయ్.

అమ్మ ‘ఒక నిలువెత్తు పసితనం… సాగరమంత ధీరత్వం… విశ్వమంత స్వచ్ఛతా పవనం’. అక్షరాల వెంట నడచి చూద్దాం రండి. ఎక్కడిది అవసరమో అక్కడ అది మనకి దొరుకుతుంది.

చివరిగా ఒక్క మాట మనం ఈ పుస్తకం చదవటం వల్ల తనకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు కానీ మనకి మాత్రం మన జీవితాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోగలమన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

*

 

ఉదయాస్తమయాల మలుపులు!

seetaram1

 

-సుపర్ణా మహి 

చిత్రం: దండమూడి సీతారాం

~

 

…తలుచుకున్నప్పుడల్లా

మరింత బరువెక్కే ఈ గుండె తో

నిశి వొడిలోకి తలొంచుకు వెళ్ళాలంటే

వెనుక

గతం నిముషానికోసారి

విస్తరించుకుపోయే అనంత విశ్వమ్…

🌼

తారాతీరాల తరగతి గదుల ముందు

నువ్వూ నేనూ

రోజూ దూరం తగ్గించలేని అపరిచితులమయ్యాక,

మన దారి రేపటికి లోపల

ఓ ఆశదీపం వెలిగించుకునే చిరునవ్వు

జ్ఞాపకమూ కాదూ,

దహించుకుపోతున్న విరహాగ్నిని ఆర్పి

ఊరుకోబెట్టే వీడ్కోలు కన్నీటిచుక్కా కాదు..

🌼

అసలు మైలురాళ్లే లేని పయనంలోకి

తప్పిపోయాక

ఉదయం, అస్తమయం

ఎవరికైనా

మలుపులే అవుతాయి తప్ప

చిరునామాలసలెన్నటికీ కావు…

*

ఒక ఆదివాసి ఆత్మగీతం

chandram

Art: Rajasekhar Chandram

 

 

ఆకుల్లో పచ్చదనానికి

నేను తప్ప అమ్మ నాన్న లేరా

మీరంతా హరితానికి అత్తారింటి వారా

అందరి గాలి ఇది, దీన్ని వడకట్టడానికి నా ఒక్కడి చర్మమేనా?

మీరు తీరిగ్గా చదువుకోడానికి పుస్తకాలు కావాలి, కాగితాలు కావాలి

దానికి తన చెట్లన్నీ ఇవ్వాలి అడివి, మీరు ముడ్డి తుడుచుకోడానికి కూడా

అడివి మీకు ఇంకా ఏమేమి ఇవ్వాలి

నేల మాలిగల్లోని నిధులను ఎందుకు కాపాడాలి సొంత బిడ్డల ప్రాణాలొడ్డి

పట్టణాల్లో, నగరాల్లో మీ చర్మ రక్షణ కోసం ఈ హరితాన్నిలా ఈ గాలినిలా

వుంచడానికి అడివి ఎందుకు పేలిపోవాలి మందుపాతరలయ్

అడివి బిడ్డల కండలెందుకు వ్రేలాడాలి బందిపోట్ల బాయ్నెట్లకు

అడివిని దోచిన డబ్బుతో బందిపోట్లు

మీ సమ్మతులను కొనేస్తారు మీ తలకాయలని లీజుకు తీసుకుంటారు

అబద్దం, అడివి మాది కాదు, మాది కాదు, నీది నాదనే భాషే మాది కాదు

అందరిదీ అయిన దాని యోగక్షేమాల కోసం మేం మాత్రమే మరణించాలా?

మేం వదిలేస్తాం ఈ జీతభత్యాల్లేని వూరుమ్మఢి కావలి పని

 

అడవుల్ని, నేల మాలిగల్ని అమ్ముకుని; కడగని కమోడ్ల వంటి

బంగారు సింహాసనాల మీద మీరు

ప్రకృతి వైపరీత్యాల వంటి తూటాల వడగళ్లకు నెత్తురోడుతూ మేము

మా మృతశరీరాలతో మీ ఆత్మలను అలంకరించుకునే ఆటపాటలతో మీరు

అందరిదీ అయిన గాలికి అందరిదీ అయిన నీటికి అందరి ప్రాణ హరితానికి

హామీ పడాల్సిన అతి నిస్సహాయ దైన్యంలో మేము

మీరు కూడా మనుషులై రోడ్లు గాయపడే దెప్పుఢు

అడవుల కార్చిచ్చులో మీ పట్టణాలు నగరాలు తగలబడినప్పుడా?

అంచుల్లో మంచు కరిగి మీ భవనాల ప్రాకారాలను ముంచెత్తినప్పుడా?

మనిషి పాట పాడడానికి, మనిషి కోసం ఒక స్మృతి గీతం రాయడానికి

వంకరపోని చేతి వ్రేలు ఒక్కటీ లేనప్పుడా? కంటిని తినేసిన కాటుక

వంటి చీకటి లోకాన్ని ముంచెత్తినప్పుడా?

అడగడానికి వినడానికి ఎవరూ లేనప్పుడా?

 

*

 

 

మీరంతా ..

40-year-old-woman-dies-of-shock-from-demonetization-move-in-gorakhpur-indialivetoday

మీరు ప్రజలా !
మీరక్కరలేదు మాకు
మీరంతా వొట్టిపోయారు
మీరంతా చెమట పట్టిపోయారు
మీకు టెక్నాలజీలు,
ఎకానమీలు తెలీవు
అస్సలు
మీకు మాయజేయడం రాదు
మీకు మభ్యపెట్టడడం రాదు
ఎదుటివాడిని ముంచడం రాదు
ఎదిగిన వారికి మొక్కడం రాదు
ఇంకెందుకు మీరు

మీకు ఒక్క వేలే చాలిక

మీరు ప్రజలు !
మీరు సమూహాలు !!
అందుకే
మాకు మీరక్కరలేదు
మీరంతా అడ్డు తొలగండి
మీరంతా రోడ్లెక్కండి
మీ చావే మీకున్న అర్హత
మీ చావులో మీరు స్వేచ్ఛను అనుభవించండి
మీ చావు మాత్రమే మీది
ఇంకేది మీది కాదు

మీరు ప్రజలా !!
మీరక్కరలేదు మాకు
మీరు మాట్లాడుతారు
మీరు ప్రశ్నిస్తారు
మీ గొంతులు నినదిస్తాయి
మీ చేతులు ఉద్యమిస్తాయి

*

… అంటే అనురాగమే కదా !

satya

Art: Satya Sufi

.
(Come Down, O Maid -Tennyson )

~
దిగిరా ఓ  రమణీ !
మంచు మలల వ్రజ భూములలో
ఏ అచల శోభ లున్నవని,
దూర గిరుల దారులలో
ఏ ప్రణయ గమ్యమున్నదని
తారాడేవు తరుణీ
పర్వత శ్రేణుల మీద !
చెట్లపై చిట్లిన కిరణాల మీద జారుతూ
సాగిపోకు సుమా స్వర్గ ధామాల కేసి.
నక్షత్ర దీప్తుల సుఖాసనానికి స్వస్తి పలికి
దిగిరా, దిగువ భూములకు;
హరిత లోయ అంటే అనురాగమే కదా !

నీవు వెదికే అతను
మరో ముంగిలి ముందు తాచ్చాడుతూనో
ఆనందాల సంపదలో తులతూగుతూనో
మధుర పానీయం మీద పొంగెత్తిన మత్తులా
రంగేళి రాజాగా మారిపోయి ఉండొచ్చు,
మధుకేళీ వలపు తోపుల తోవలలో
జిత్తుల మారి నక్కలా  మాటేసి  ఉండొచ్చు.

అతనికి
నీ మృత్యుసదృశ హిమగిరుల
రజత శృంగాల ఏటవాలు దారులలో
నీతో కలిసి నడవడం నచ్చక పోవచ్చు,
అతను నీకు చిక్కక పోవచ్చు.
కూలుతున్న ఆ హిమ సమూహాలలో
అతన్ని అన్వేషించడం మానేసి
దిగిరా ఈ లోయలోకి
గిరి ఝరిపై నడయాడే హిమ శకలంలా.
ఆ శిఖరాలలో రొద చేస్తున్నరాబందులను,
గాలిలో కలిసి వ్యర్థమౌతున్న జీవన ధ్యేయాలలా
కొండ చరియలకు వేలాడుతున్న తుషార హారాలను
అక్కడే వదిలేసి దిగిరా , ఓ తరుణీ !

నిన్ను తాకేందుకు
నింగి నంటుతున్నది జనపథాల
నిప్పు గూటి ధూమ స్తంభం,
నీకోసం
ఆబాలగోపాలం అర్రులు చాస్తున్నది,
వేణువు మధు గీతికలు ఆలపిస్తున్నది,
శాద్వలాలలో
వేల సలిల స్రవంతులు చెంగలిస్తున్నవి,
అనాది వృక్ష తతిలో గువ్వల కల కూజితం
అసంఖ్యాక మధుకరాల అతులిత ఝంకారం
మర్మర మధుర నాదమై నినదిస్తున్నది.

దిగిరా ఓ గిరిబాలా!
హరిత లోయ పిలుస్తున్నది.
*

కన్ఫెషన్స్ ఆఫ్‌ సిద్ధార్థ్ అభిమన్యు!

arvind-swamy-thanioruvan-01

 

“చదరంగానికి ప్రాథమిక సూత్రం ఎదుటివాడు వేసే ఎత్తు మనం ఊహించి, ప్లాన్ చేసుకోవడం కాదు.
ఎదుటివాడు ఎలాంటి ఎత్తు వేయాలో మనమే నిర్ణయించడం”

“ప్రపంచంలో చాలామంది పరిస్థితుల చేతిలో బందీలు, అవి ఎటు నడిపిస్తే అటు నడిపిస్తారు. అలా నడుస్తూ ఒక్కోసారి లక్కీ మీ అనుకుంటారు, మరోసారి హార్డ్ లక్ అని బాధపడతారు. ప్రేమ, కృతజ్ఞత, న్యాయం, అన్యాయం, ధర్మం లాంటి ముసుగు మాటలని తాళ్లుగా కట్టి వీళ్ళని తోలుబొమ్మలుగా ఆడిస్తూంటే ఆడుతూంటారు. జనం చదరంగంలో పావులైతే, వీళ్ళని కెదుపుతూ చదరంగం ఆడేవాళ్లు వేరు, వాళ్ళు చాలా తక్కువమంది. ఆ చదరంగంలో ఛాంపియన్‌ని నేను. సామాన్యమైన జనాన్ని పావులుగా చేసి చదరంగం ఆడుకుంటున్న కింగ్‌పిన్స్ నా చదరంగంలో పావులు – అంటే పరిస్థితులను నడిపిస్తున్నాం అనుకునేవాళ్ళని నడిపించేవాణ్ణి.

ఎక్కడో జరిగే దొంగతనం, మరెక్కడో హత్య – చేసేవాళ్ళకి తామిద్దరూ నా కోసం పనిచేసేవాళ్ళ కోసం పనిచేస్తున్నారని తెలియదు. ఎందుకు చేస్తున్నారో నాకు తప్ప మరెవరికీ తెలీదు. నా చదరంగపు టెత్తులు తెలియాలంటే నా స్థాయిలో ఆలోచించి, నా ఊహని పసిగట్టాలంటే నా మెథడ్స్‌ని ఎంతగా మెడిటేట్ చెయ్యాలి! ఇక ఆ ఆటలో నాతో తలపడి నన్నే దెబ్బకొట్టాలంటే ఇంకెంత కెపాసిటీ కావాలి? అందుకే ఏళ్ళపాటు నన్ను టచ్ చేయడం సంగతి అటుంచి, గెస్ చేయడానికి ప్రయత్నించినవాడెవడూ ప్రాణాలతో మిగల్లేదు. అలాంటిది.. వాడు నన్నే కుదిపేశాడు.

డబ్బు, కీర్తి, అధికారం లాంటివన్నీ నా నుంచి లాక్కుని, నాకు చెక్‌మేట్ పెట్టగలిగాను అనుకుంటే తప్పు. నాకు తగిలిన నిజమైన దెబ్బ – పరిస్థితుల్ని నేను నియంత్రించగల స్థితి నుంచి పరిస్థితులు నన్ను నియంత్రించే స్థితిలో నిలబెట్టడం. అంటే నేను ఈ చదరంగంలో పావులు కదపలేను, పావులా కదులుతాను. నా పదిహేనో ఏట పావుల్ని తీసేయడం, మంత్రిని కదపడం, గుర్రాన్ని జరపడం మొదలుపెట్టక ముందు ఎలా చదరంగంలో పావుగా ఉండేవాణ్ణో – మళ్ళీ అలాగే అయ్యాను.

I hate it – పరిస్థితులు నన్ను పరుగులు తీయించిన ఆ రాత్రి మళ్ళీ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చింది.
****

పవన్  సంతోష్

పవన్ సంతోష్

రాజకీయ చదరంగంలో ఎప్పుడూ మానాన్న బంటుల్లోకీ బంటు. ఆ రాత్రి కూడా అలానే ఎవడో నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇంట్లో మా అమ్మ ఎలా వుందో అతనికి తెలీదు. పన్నెండేళ్ల వయసున్న నాకు ఊహకందని జబ్బు అది. నానా తంటాలూ పడి అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. అయితే అదేమీ మా నాన్న బానిసగా ఉన్న నాయకుణ్ణి చేర్చిన గొప్ప ఆసుపత్రి కాదు, అలాంటి వాళ్లు పళ్లు పంచిపెట్టే పెద్దాసుపత్రి.

హాస్పిటల్ బయటా, నాలోపలా తుఫాను. మా బస్తీ జనం నాన్న వస్తాడేమోనని ప్రయత్నించారు. అయితే అతనున్న చోట లక్షల మంది జనం. అందరూ గాలి గట్టిగా వీస్తే ఒకే వైపుకు ఊగే గడ్డి మొక్కల్లాంటి పనికిమాలిన జనం. వాళ్ళలో మావోడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. తెలిస్తే మాత్రం ప్రయోజనం..

జబ్బుపడ్డ భార్య మంచాన పడివుండగా, ఎవడో నాయకుడి ఆఖరి చూపు కోసం ఆస్పత్రికి పోయిన ఆ నా కొడుకు గురించి వెతకడం అనవసరం. ఓ పక్క తుఫాను పెరుగుతూంటే – వాళ్ళ గుడిసెలు కూలిపోతాయేమోనని చూసుకోవడానికి ఇప్పుడే వస్తాం అని ఒక్కొక్కడే వెళ్లిపోయాడు. డాక్టర్ వచ్చాడు, అప్పటికి జరిగిన టెస్టులు, పేషెంట్ ఉన్న స్థితి చూశాడు. పేషెంట్‌తో ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణే, చిన్నపిల్లాణ్ణని ఆలోచించినా, తప్పక నాకే ఆమె స్థితి చెప్పాడు. ఆపరేషన్ చెయ్యడానికి ఇక్కడ ఎక్విప్‌మెంట్ లేదట, ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి నా దరిద్రం రికమెండ్ అయినా చెయ్యనివ్వలేదు. ఓ మందుల చీటీ మాత్రం రాశాడు, చూడాల్సినవాళ్లెవరైనా ఉంటే తీసుకువచ్చి చూపించండి అని క్యాజువల్‌గానే అయినా, కళ్ళలో ఓ జాలి పొర కదులుతూంటే చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ చీటీతో రోడ్డు మీదికి వెళ్ళిన నాకు తుఫాను గాలికి వదిలిన చీటీ, రూపాయి బరువు లేని మనిషీ ఒకటే అని తెలిసి రావడానికి టైం పట్టింది. జాలి, దయ కరెన్సీ కాదని, చెల్లవని తెలిసొచ్చింది. ఏడుస్తూ, ఓదార్చుకుంటూ వెనక్కి వచ్చిన నాకు వార్డులో అమ్మ ఉండాల్సిన మంచం ఖాళీగా కనిపించింది. గాలికి ఎగిరే చిత్తుకాయితంలా దారీ తెన్నూ లేక తిరిగీ తిరిగీ ఓ మూల నెత్తురు ఉబుకుతున్న బుగ్గలా కనిపించింది, ప్రాణానికి కొట్టుకుంటోంది.

అమ్మని ఆ స్థితిలో చూడగానే ఏమయిందో అర్థమైంది, కానీ చెప్పడం కాదు కదా తలచుకోవడం కూడా నాకిష్టం లేదు. బతకడానికి కాక చావడానికి ఆ ప్రాణం గింజుకుంటోంది. అంతే సుళ్ళుతిరుగుతున్న నా మనుసులో బాధ, నిశ్చలమైపోయింది. వందమైళ్ళ స్పీడులో వచ్చే కార్లు, బైకులూ ఢీకొట్టేసుకుంటున్న సిగ్నల్లా ఆలోచనలు ఢీకొట్టుకుంటూన్న నా మెదడు స్తంభించిపోయింది.

అమ్మ ప్రాణాన్ని నేనే తీసేశాను, ఆ క్షణమే మళ్ళీ పుట్టాను.

ప్రేమ, స్నేహం, మర్యాద, జాలి, దయ లాంటివాటి నిజమైన అర్థం తెలిసింది. అవి ఒకోసారి పాచికలు, ఒకోసారి ముసుగులు. అంతటితో ఆ మాటలకి విలువ ఇవ్వడం పూర్తిగా మానేశాను. పరిస్థితులు నన్ను తీయించిన పరుగులు చాలు, ఆ రాత్రి నేను చచ్చిపోయి బూడిదలోంచి మళ్ళీ పైకి లేచాను. అమ్మ ప్రాణం కోసం పరుగులు పెట్టినంతసేపూ అవి నాతో ఆడుకున్నాయి. ఆ ప్రాణాన్ని నేనే తియ్యడానికి నిర్ణయించుకోగానే నా చేతిలోకి వచ్చేశాయి.
సిద్ధార్థ్ అభిమన్యు … పరిస్థితులను శాసించే దేవుడు.

తెల్లవారాకా అందరూ వాలారు. శవాన్ని ముందుపెట్టుకుని నాన్న ఏడుస్తూంటే – నవ్వొచ్చింది. వాళ్ళూ వీళ్ళూ నేను డాక్టర్‌ని అయి, ప్రాణాలు కాపాడుతూ ఉచితంగా సేవ చెయ్యాలన్నారు. హహ్హహ్హహ్హ. మా అమ్మకి ఎవడు చేశాడు? ఎవడినీ నమ్మలేదు, అందరి మాటలూ విన్నాను.

నా సర్వశక్తులూ కూడదీసుకుని చదవడం మొదలు పెట్టాను – పుస్తకాలని, ప్రపంచాన్నీ, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్ని. ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకోవాలంటే, మనికి ఓ సైన్యం ఉండాలి. కొందరు బంట్లు, రెండు ఏనుగులు, గుర్రాలూ, ఒంటెలు, మంత్రి ఇలా. మా నాన్ని బంట్లలోకెల్లా బంటు. అతన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకుపోయి అవతలి గడికి చేర్చి మంత్రిని చేశాను.

ఇంతకీ నేను చేసిన ఆఖరి హత్య మా అమ్మదే. ఆ తర్వాత అంతా చదరంగం గడిలోంచి పావుల్ని తీసేయడమే తప్ప మరేం కాదు. అలాంటి నన్ను వాడు… వాడు….
వాడు పావుని చేసి ప్రాణాల కోసం అడ్డమైనవీ ఒప్పించాలనుకున్నాడు. చివరకు వాణ్ణి నా స్థానంలోకి తీసుకువచ్చి నేను తప్పించుకున్న ప్రమాదాలు తలకు చుట్టాను. మరి నేనంటే ఏంటి?

ష్‌… అదిగో జింకల గుంపు. నేనొస్తా”

పసుపు రంగు చర్మంపై, చారలు అలల్లా కదులుతున్నాయి. ఊపిరి మంద్రంగా అయింది, జింక తను అనుకున్న చోటికి రాగానే వందల కిలోల బరువు పంజాపై నిలిపి, వేట మీద వేటు వేసింది. జింకల గుంపులో కలకలం మధ్య ఆ జింక చట్టని నోటితో చీలుస్తూ …

“సిద్ధార్థ్‌ అభిమన్యు సైనింగ్ ఆఫ్‌”


(తని ఒరువన్, ధృవ సినిమాల్లో ప్రతినాయక పాత్ర సిద్ధార్థ్ అభిమన్యు కల్పిత చరిత్ర)

 అస్తిత్వానికి ఇంకో కోణం!

                  pothuri          

అస్తిత్వం.

ఆ మాట అందరికీ వర్తించటం ధర్మం.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రాసేసుకున్నారుగా మీగురించే – ఇప్పుడక్కర్లేదులే అనటం అన్యాయం. చలనశీలమైన చరిత్ర లో కొత్త మనుషులు, వాళ్ళ సంగతులు- ఆ తర్వాత వాటిని తలచుకోవాలనుకునేవాళ్ళు – ఉంటూనే ఉంటారు.

90 లకి ముందర తెలుగు లో మనకు  ఆత్మాశ్రయ వచనం తక్కువ. ‘ అమరావతి కథలు ‘అమరావతి ని ఆశ్రయించుకున్నాయి గాని, ప్రత్యేకమైన మనుషులని కాదు. ‘ పసలపూడి కథలు ‘ దీ ఆ దారే. అది క్షేత్ర సాహిత్యం.

‘ పచ్చనాకు సాక్షి గా ‘ చదివి అందరం ఉలిక్కి పడ్డాం. నవ్వాం, ఏడ్చాం, జాలి పడ్డాం, కోపం తెచ్చుకున్నాం. ఆ తర్వాతి ‘ దర్గా మిట్ట కథలు ‘ – మరింకొంత ‘ సౌమ్యంగా ‘ అనిపిస్తాయి. అవీ బావున్నాయి . అంతకు ముందో ఆ తర్వాతో వచ్చిన ‘ మల్లె మొగ్గల గొడుగు ‘ . కథ ని మించి ఇతిహాసపు స్థాయి కి వెళ్ళబోయిన ‘ అంటరాని వసంతం ‘ ….

దర్గా మిట్ట కథలు  comfort zone  లో ఉండటం ఎక్కువనీ, పురాస్మృతులను romanticize  చేస్తున్నారనీ వచ్చిన విమర్శ కూడా నాకు తెలుసు. కావచ్చు. వేదన తోనో ఆగ్రహం తోనో మాత్రమే కాదు, ఇష్టం గానూ ముచ్చట తోనూ  కూడా  ఎవరి జ్ఞాపకాలను వారు రాసుకోవటం లో  తప్పు ఉందా ? ‘ ఎక్కువ కష్టాలను ‘ అనుభవించి ఉండకపోవటం అనర్హత అవుతుందా ? ” ఊహూ. నువ్వు అలా అనుకుని రాస్తున్నావు గాని జరిగింది అది కాదు, మాకు తెలుసు ” – అనేందుకూ వీలు లేదు. ఎన్నయినా దృక్కోణాలు ఉండవచ్చు –  ఉట్టిగా జ్ఞాపకాలనే పట్టుకుని ఎవరైనా తీర్మానాలు చేయబోతే అప్పుడు పేచీ పెట్టచ్చునేమో. నాకు తెలిసి , ఇటువంటి వాటి లక్ష్యమూ లక్షణమూ record  చేసి పెట్టటమే . తెలిసినదే రాస్తే దానిది సాధికారమైన  పరిమళం.

    సమగ్రమైన , విస్తృతమైన అధ్యయనం, తప్పని సరి గా పనిచేస్తుండవలసిన సహానుభూతి – ఇంకా చాలా కావాలి తీర్మానించటానికి.

ఈ  వర్గానికి మేము చెందుతాము, మా తీరూ తెన్నూ ఇదీ  అని రాసుకునే ధైర్యాన్ని కొద్దిగానైనా తెచ్చి ఇచ్చినవారు శ్రీ రమణ గారు. ‘ మిథునం ‘ పూర్తి గానూ, ‘ బంగారు మురుగు ‘ చాలా మేరకూ బ్రాహ్మణుల కథలు. ఇంకొక మంచి కథ ‘ ధనలక్ష్మి ‘ కూడా బ్రాహ్మణ, వైశ్య  వర్ణాల ప్రసక్తి లేకుండా సాగదు. భారత దేశం లో అప్పుడూ ఇప్పుడూ కూడా కులం ఉంది. ప్రతి కులం లోనూ రకరకాల ఆర్థిక స్థాయిలూ బౌద్ధిక పరిణతులూ ఉన్నా – సామాన్య ధర్మాలు గా కొన్ని గొప్పలు, కొన్ని తప్పులు , కొన్ని నడతలు, కొన్ని మమతలు .

ఒప్పుకోవటం లో సిగ్గు పడేదేముంది ? చెప్పుకోవటం లో అతిశయమేముంది ?

 అవును, నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయనే – 90 ల తర్వాత ఈ కథలు వచ్చాయి, అలాగే అనుకుందాం.

వ్యక్తిగతం గా నాకొక నేపథ్యం ఉంది. దానికీ కథ లోకి రావాలనే ఉబలాటం ఉంది.

 ‘ ఇల్లేరమ్మ కథలు ‘ – దాన్ని కొంత దగ్గరగా చూపించాయి . ప్రత్యేకించి ప్రస్తావించేందుకు రచయిత్రి వెనుకాడారేమోననిపిస్తుంది గాని,  అవి ఉద్యోగాలు చేసే మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు. మరి ముఖ్యం గా, పల్లెటూళ్ళని ముందు వదిలిపెట్టిన బ్రాహ్మణ శాఖ అయిన నియోగుల ఇంటి కథలు.

 ఆ తర్వాత వచ్చిన ‘ పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు ‘ – ఆవిడే చెప్పినట్లు ‘ పఠం ‘ కట్టిన బ్రాహ్మణ కథలు.[ వాక్యం లో రెండో భాగం ఆవిడ ది కాదు ]   పల్లెటూళ్ళవీ పట్నాలవీ – నా సొంత జిల్లా కథలు. నాకు తెలిసిన మనుషులే ఉన్న కథలు. Larger than life అనిపించే వాళ్ళవి.

 అసలు ఆ పేరు ఆ పుస్తకానికి పూర్తిగా తగదు. అందులో హాస్యం కానిది చాలా ఉంది.  హాస్యం మీద అఖండమైన గౌరవం  నాకు , అది కాదు ప్రశ్న. అవి ‘ హృద్యమైన ‘ కథలు. Feel good  అనే మాట కు తెలుగు ఏదో నాకు తెలియదు, ఇవి ఖచ్చితం గా అవే. ఈ feeling good  అనేది ముడుచుకు కూర్చోవటం కాదండీ, ‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ .  వీటిలో మనుషులకి చాదస్తాలు, వెర్రి బాగుల తనాలు , పిచ్చి పట్టుదలలు – ఉన్నాయి. ఇంకొకడికి తిండి పెట్టటాలూ అందుకు వాళ్ళు  చిన్నబుచ్చుకోకుండా నెపాలు కల్పించటాలూ, పెద్దవాళ్ళు లెమ్మని, ఇబ్బంది అవుతున్నా చూసీ చూడనట్లుండటాలూ , ఆ పని మనదో కాదో ఎంచకుండా చేసుకుపోవటాలూ – ఇవీ ఉన్నాయి. తృప్తి గా బతకటం ఉంది. శాంతం గా ఊరుకోవటం ఉంది.  అంతా అనుకునేట్లు వియ్యాల వాళ్ళకి మధ్యలో ద్వేషాలూ పగలూ కాదు –  గౌరవాలూ మర్యాదలూ – దాదాపు గా మనస్ఫూర్తిగానే – ఉన్నాయి. ఈ కథల కొత్త ముద్రణ లో ‘ జ్ఞాపకాల జావళి ‘ అనే సీరీస్ ని కలపటం లో చాలా ఔచిత్యం ఉంది.

MythiliScaled

  రేడియో మోగుతుంటే కూర్చుని వినకపోతే అది నొచ్చుకుంటుంది . కరెంట్ పెట్టించుకుంటే షాక్ కొడితేనో …కట్టుకున్న మొగుణ్ణి కర్ర తో ఎట్లా కొడుతుంది అమ్మమ్మ ? టేప్ రికార్డర్ ని చూసి ‘ జాగర్త, అది వింటుంది ‘ అని భయపడతారు . అదొక అమాయకపు కాలం.

చెన్నా పట్నం నుంచి వస్తున్నాం కదాని వియ్యపురాలికి ఇంగిలీషు కూరలు తెచ్చిపెడతాడు వియ్యంకుడు. మా మామ గారు అటువంటి వారు. మా అమ్మకీ ఆయనకీ మంచి rapport  ఉండేది. ప్రాణాంతకమైన వ్యాధి తో మా నాన్న గారు హాస్పిటల్ లో చేరినప్పుడు – రెండు నెలల పాటు మామ గారే ఆయనని కనిపెట్టుకు ఉండిపోయారు.  చూసేవాళ్ళు తండ్రీ కొడుకులనో అన్నదమ్ములనో అనుకునేవారు.

ఉంటారు అటువంటి మనుషులు – చూశాము .

  భుక్తి గడవని వితంతువు చేత అట్ల దుకాణం పెట్టిస్తారు తాతగారు. ఆయన తో మొదలెట్టి ఆఖర్న అమ్మమ్మ కీ అవి నోరు ఊరిస్తాయి. ఏ పనీ రాని సీతా రావమ్మ కి ఊరికే తింటున్నాననిపించకుండా గుళ్ళో పాటలు పాడే పని ఇస్తారు. అదీ రాదు ఆవిడకి. ” వసుదేవాత్మజ రామా , కైలాసవాసా శ్రీహరీ ”- అదీ ధోరణి. ఆ పాటలు వినలేక దేవుడు పారిపోయి ఉంటాడనుకుంటారు, వరుణ యాగం చేసినా వానలు పడవు. అన్నమూ నీళ్ళూ మానేసి ఆవిడ పాడుతూ కూర్చుంటే రాత్రి పది గంటలు దాటాక వర్షం కురుస్తుంది. ఎందుకైతేనేమీ, ‘ పిచ్చి దాని పరువు దక్కింది ‘ . అవును – ఎవరికి మటుకు పరువు ఉండదు ? సీతారావమ్మకి  అక్క  భ్రమరాంబ గారు. నీళ్ళు తెచ్చి పోసి బతుకుతుంది, ఇబ్బందొచ్చినా చుట్టాలొచ్చినా చేసాయం చేసి పెడుతుంది. మిగిలిపోయినవి ఇస్తే తీసుకోదు, పాత చీర ఇస్తే సున్నితం గా వద్దంటుంది. మర్యాద గా భోజనం చేయమంటే చేస్తుంది, కొత్త చీర ఇస్తే నోరారా దీవిస్తుంది. ఎవరి ఋణానా పడకుండా దాటిపోతుంది.

   అల్లుళ్ళ మీద పెత్తనం చేసే మామ గారుంటారు ఇందులో. వాళ్ళకి ఇష్టమైన సినిమా ని కాదని తాను మెచ్చిన దానికి టికెట్ లు కొని కూర్చోబెట్టి మరీ వస్తాడు. చండశాసనుడు. ఆయనకి అన్నం వడ్డిస్తుంటే వంటావిడకి వణుకు పుడుతుంది – కాని చేతికి ఎముక లేని మనిషి. తన వాళ్ళూ కానివాళ్ళూ అని చూసుకోని మనిషి. ఈ అన్ని  లక్షణాలనూ

సంపూర్ణం గా మా మాతామహులు పూండ్ల రామమూర్తి రావు గారి లో చూశాను – ఆయన ఎంచి పెట్టే  ‘ లవకుశ ‘ వంటి సినిమాల తో సహా. ఆడ పెళ్ళి వాళ్ళ పనులనీ నెత్తి మీదేసుకుని చేయించే తాత గారి కథ ‘ మగ పెళ్ళివారమండీ ‘ చాలా మంచి కథ. అటువంటి తాత గారు నాకూ ఉండటం ఒకటే కారణం కాదు.

‘ పీత మీద కూతుని పాత పాదే ‘ పండు గాడి కథ అక్షరాలా గొప్ప కథ.బాగా  అలవాటయిపోయిన ఆ చిన్న వెధవ ని ఎక్కడికో వెంటబెట్టుకు పోదామనుకుంటే,  ‘ నేను లాను బాబూ. నాతు బోలెదన్ని పనులున్నాయమ్మా. నేనూ మా అమ్మ ఈ లాత్తిలి మీ బావిలో దూతి తచ్చిపోవాలి ‘ అంటాడు వాడు. అది నిజమే అని రాబట్టుకున్న ఈ కుటుంబం పెద్ద , పండుగాడి నాన్న కి ఊడిన ఉద్యోగాన్ని ఇంకోచోట వేయించి పెడతాడు. చిన్నదే ఉద్యోగం- చాలు, బతికేందుకు. పైకి చదువుతూంటే మా ఇంటి పెద్ద కంట తడి పెట్టిన కథ ఇది మాకు. 1992 లో అన్యాయం గా ప్రభుత్వ ఆసుపత్రి

పని లోంచి తీసేసినవాడికి  సొంత డబ్బు నలభై వేలు [ఆ. లంచమే ] ఖర్చుపెట్టి , జిల్లా కోర్ట్ లో కేసు వేయించి

తణుకు నుంచి ఏలూరు పదిసార్లు తిరిగి,   ఊడిన ఉద్యో గాన్ని మళ్ళీ వేయించిన  Deputy civil surgeon, మా నాన్న గారు గుర్తొచ్చారు.

గుర్తు చేసుకోనివ్వండి.

 వారానికి రెండు రోజులే పల్లెటూరికి వచ్చే తపాలా బంట్రోతు . ఆ వేళకి అంతా అక్కడికి చేరి వచ్చిన ఉత్తరాలన్నీ ముందే చదివేస్తుంటారు.

మా గుంటూరి బ్రాహ్మణేతర  మాండలికాన్ని ఈ ‘ రంగడు వస్తాడు ‘ [ ” ఎండన పడొస్తాడు, అన్నం తిననివ్వండి ముందు ” ]  లో ప్రయత్నించారు రచయిత్రి.

” సోమయ్య బావకి,

బావుండావా ? మా చెల్లి పిల్లలు బావుండారా ? బావా మా కోడలికి ఈ మధ్యన వొళ్ళు బాగాలేదు. …….

                   లక్ష్ముడు వ్రాలు ” [ ఈ ఉత్తరమూ వియ్యంకుడు రాసినదే ]

చెల్లెలికి పెళ్ళి సంబంధమని కబురు, సీతాపతి మేష్టారికి. ” నా మొహం నాకేం తెలుసు ? నాన్నే ఉంటే…” అని కళ్ళ నీళ్ళ పర్యంతమవుతాడు.

” ఉంటే బాగానే ఉండేది. లేనంత మాత్రాన ఏదీ అగదు. నాన్న లేకపోతేనేం బాబాయి ఉన్నాడు, చెట్టంత మేనమామ ఉన్నాడు…..అంతా సానుకూలం అయితే పెళ్ళే చెయ్యలేకపోతావా ? నువ్వు ఊళ్ళో ఉన్నావుగానీ అడవి లో లేవు కదా. మేమంతా లేమట్రా ? ” అని గదమాయించే తాతగారికి అందరూ అవునవునని వంత .

శంకరమంచి సత్యం గారు గుర్తు రాలేదా ?

ఇటువంటి theme నే మరొక సంపుటం’ పూర్వి ‘  లోని ‘ సుఖాంతం ‘ , ‘ పుణ్యాత్మురాలు ‘ కథల్లోనూ రాస్తారు.

గాజుల బత్తుడు విడిపోయి బతుకుతూన్న అన్నా చెల్లెళ్ళ మధ్యన వార్తలు మోస్తుంటాడు. ఇద్దరూ ముసలివాళ్ళే, దక్షత చేజారిన వాళ్ళే. విషయం తెలిసి తక్కినవారు సరిచేస్తారు. ఇక్కడా కంట తడి. నిజమే, చాలా చోట్ల ఉంటుంది. అది శోకం కాదు , బాధ్యత.

అప్పటి రోజుల్లో ప్రతి ఇంటా  ఉండిన బ్రాహ్మణ విధవ లు రెండు కథల్లో వస్తారు. అందరినీ పిల్ల విజయలక్ష్మి  గారు సినిమా కి తీసుకుపోయే కథ మహా సరదా గా ఉంటుంది. ఆవిడ ముద్ర కనిపించేది మరొకదాని లో- ‘సభల  సంరంభం ‘

 నెహ్రూ పోయాక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ కాంగ్రెస్ సభలకి గుంటూరు వస్తుంది. కొత్త గా తండ్రి పోయిన ఆడపిల్ల అని, ఆవిడని ఇంటికి పిలిచి తీపి తో భోజనం పెట్టి చీరె పెట్టాలంటారు ఈ ముసలమ్మలు – కబురు అందిందనేవరకూ ఊరుకోరు. ” ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం వాళ్ళకీ బాధలూ బరువులూ ఉంటాయి. మనం పిలవటం మర్యాద. అంత వీలు కాకపోతే ఆవిడే రాదు. అంతే గానీ అసలు పిలవకుండా ఎట్లా ? ” –

చెప్పండి, నవ్వొక్కటేనా వస్తోంది మీకు ?

పనిమనిషి కి తను అధ్యక్షు రాలిగా ఉన్న మహిళామండలి లో ఉద్యోగం వేయిస్తుంది అమ్మమ్మ. ఆమె ఆ తర్వాత ఈవిడ పనిని నిర్లక్ష్యం చేస్తోందని ఉడుక్కుని పీకేయమని బీడీవో కి ఉత్తరం రాయిస్తుంది. అంతలోకే చల్లబడిపోయి, ” పాపం, వద్దులే .ఉద్యోగం ఊడగొట్టి ఆ పాపం మూట కట్టుకోటం ఎందుకు ” అని ఆ ఉత్తరాన్ని వెనక్కి పట్టుకొచ్చెయ్యమంటుంది. డెబ్భై దాటిన  మా అమ్మకి  ఇట్లాగే పిచ్చి కోపమొస్తుంటుంది, ఇట్లాగే తగ్గిపోతుంటుంది.

 లేనివారి  ఇంటి పెళ్ళికి హడావిడిగా  అరిసెలు డబ్బాలకెత్తే ఇల్లాళ్ళు, గొప్పింటి  స్నేహితురాలికి ,ఇంట్లోవాళ్ళు కొని ఇవ్వరని,  పుణుకులు కొనిపెట్టేందుకు కనకాంబరాలు పెంచి అమ్మిన బీద పిల్లలు – ఇక్కడ ఉన్నారు. ఉండేవారు.

పూర్వి సంపుటం లోని బాలరాజు కథ నాకు చాలా ఇష్టం. విజయవంతం గా హోటల్ లు నడిపే ఒకాయన పూర్వాశ్రమం లో గల్ఫ్ వెళతాడు, ప్లంబర్ ఉద్యోగానికి. అక్కడి వాళ్ళకి కావలసింది వంటవాడు . పొరబాటు జరిగిందని

తిప్పి పంపించేస్తే చేసి వెళ్ళిన అప్పులు ఎట్లా తీరతాయి ? అక్కడి ఆఫీసర్ పూనుకుని, అతనికి వంట నేర్పి నిలబెడతాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ వెళతాడు హోటల్ యజమాని. పూర్తిగా మతిమరుపు [ Alzheimer’s ? ]  వచ్చేసి ఉంటుంది , కాని ఆఖరికి గుర్తు పడతాడు- ” నువ్వు రాజప్పడివి కదుట్రా ! వంట నేర్చుకున్నావా మరి ? ” – ఇతను సంబరం గా ఏడుస్తాడు.

” అన్నీ అంత సులువు గా అయిపోతాయా ఏమిటి ? అసలు అలా జరిగే వీలెక్కడుంటుంది ? ”  – అని ఒక రచయిత్రి నన్ను ప్రశ్నించారు.

సులువే. జరుగుతాయి. చాలా సార్లు.

పెద్ద మనసు ఉంటే.

అంటే ఏమిటంటే నేను చెప్పలేను.

*

 

తెలంగాణ కథల వెలుగు “అలుగు”

alugu-title-2

 

ఇండియాలో ఏండ్లుగా వేళ్లూనుకున్న జఠిలమైన సమస్యలకు, కొత్తగా ముందుకు వస్తున్న సమస్యలకూ ఇవ్వాళ ప్రజలు అస్తిత్వవాదం/భావజాలం సోయితో పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. ఈ ప్రజల్లో చైతన్యం నింపుతున్న అస్తిత్వవాదులు ఎవరికి వారు ఆత్మగౌరవంతో తమ స్వీయ అస్తిత్వాన్ని నిబెట్టుకుంటూనే తమతోటి వారి పట్ల కన్సర్న్‌తో వ్యవహరిస్తున్నారు. తమ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ‘సమానత్వ’ భావనకు దారులు వేస్తున్నరు. ఇది అంత ఈజీ టాస్క్‌ ఏమీ కాదు. అయినా కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటి ప్రయత్నాల్లో ఒకటి ఈ సంకలనం.

నిజానికి అస్తిత్వ వాదం విజయవంతం కావడానికి స్థూలంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది చట్టబద్ధంగా లేదా రాజ్యాంగ బద్ధంగా అమల్లో ఉన్న చట్టాలను తూ.చ. పాటించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ మార్పును తీసుకురావడానికి అవకాశమున్నది. అయితే ఇది ఫెయిల్యూర్ గా  మిగిలిపోయింది. ఇక రెండోది సామాజిక చైతన్యం ద్వారా కుల, మత, జెండర్‌, పేదరికం, వ్యవసాయం, చేతివృత్తులు, సామాజిక అణచివేత, ప్రభుత్వాల  నిర్లక్ష్య ధోరణి, గ్రామీణ ప్రాంత సంక్షోభం, పట్టణీకరణ లాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం. సామాజిక చైతన్యానికి సాహిత్యం ఒక ప్రధానమైన ఇరుసు. ఆ ఇరుసుకు కందెన పూసే పనిని ఈ సంకలనం ద్వారా చేస్తున్నాం.

అస్తిత్వోద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడడానికి, ప్రచారం చేయడానికి సాహిత్య రంగానికి వెసులుబాటుతో పాటు మంచి అవకాశమున్నది. నిజానికి అస్తిత్వాలకు బలం చేకూర్చేది సాహిత్యం. ఇక్కడ అస్తిత్వమంటే ఒక్క ‘ప్రాంతీయ’ అంశం మాత్రమే కాదు. సమస్య మనిషికి సంబంధించినది. మనిషికి – సమాజానికి ఉండే ఘర్షణకు సంబంధించినది. మనిషికి-మనిషికి మధ్య ఉండే ఆధిపత్యాలకు సంబంధించినది. ఈ ఘర్షణను అర్థం చేసుకొని సాహితీ సృజన చేసినట్లయితే అది అస్తిత్వ సాహిత్యమవుతుంది. అట్లాంటి అస్తిత్వ సాహిత్యానికి ఆనవాలు ఈ అలుగు.

katha-2015-invitation

అరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ తల్లి విముక్తం అయింది. ఆధిపత్యం సంకెళ్లు పటాపంచలయ్యాయి. మన నేల, మన రాష్ట్రం, మన బతుకు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ వైపు ఆత్మగౌరవంతో, గర్వంగా అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులు మిగిల్చిన పాద ముద్రలు ఏవి అని అవలోకించినపుడు ఈ కథా సంకలనం సమాధానం చెబుతుంది. ప్రతి మట్టి రేణువును పట్టి చూపి స్వరాష్ట్రంలో మనం ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో కొన్ని స్పష్టంగా, కొన్ని మౌనంగా చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతు, నేత కార్మికులు, స్వర్ణకారులు ఇతరత్రా వృత్తిదారులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని బాధ పడ్డం. స్వరాష్ట్రంలో కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రపంచమంతా మెతుకు చుట్టూ ప్రదక్షణం చేస్తోన్నా రైతు ప్రయాణం మాత్రం ఆగిపోతోంది.

అప్పు, కరువు, సాగునీటి సమస్య, ఆధిపత్యుల దౌర్జన్యం ముందు రైతు కుప్పకూలి పోతున్నాడు. ఉన్న భూమి అమ్మలేక, దాన్నుండి పంట తీయలేక, అడ్డామీది కూలీగా మారలేక చివరాఖరికి ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. కుటుంబ బరువును పిల్లల  లేత భుజాలఫై  వదిలేసి తన దారి తాను చూసుకుంటున్నాడు. అతనితో వెళ్లలేక ఇక్కడే మిగిలిపోయిన రైతు ఆనవాళ్లు దిక్కు, దారి లేక భవిష్యత్తును తల్చుకుంటూ భయం  భయంగానే బతుకుపోరుకు సిద్ధం అవుతున్నారు. (ప్రయాణం ఆగింది) ఒక్కోసారి ఈ పోరాటంలో పూర్తిగా ఓడిపోతున్నారు కూడా. ఎంతగా ఓడిపోతున్నారంటే కనీసం తన తల్లి సమాధికి కాస్త నీడనిచ్చే, పండ్లనిచ్చే తన పొలం గట్టు మీది మామిడిచెట్టును కూడా రక్షించుకో లేనంతగా. అగ్రవర్ణపు దౌర్జన్యానికి జడుసుకొని అశక్తతతో, శాపనార్థాలు పెట్టుకుంటూ ఎవరూ సహాయం చేయలేని దుర్భర స్థితిలో తనలో తానే ముడుచుకు పోతున్నాడు. కాని ఈ దౌర్జన్యాన్ని ఎట్లా దెబ్బతీయాలో లేదా  ఎట్లా  ధిక్కరించాలో ఆ రైతుకు తెలుసు. (ఆకుపచ్చ నెత్తుటి జాడ)

ప్రభుత్వం లేదా ఈ వ్యవస్థ తప్పుడు ప్రవర్తనల  వల్ల అనేక మంది సామాన్యులు బలవుతున్నారు.  వ్యవస్థలోని ఏ వ్యక్తీ తన వల్ల జరిగిన తప్పును ఒప్పుకోడు ఆ తప్పును పక్కవాని మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. మొత్తంగా ఏడుచేపల కథను గుర్తుకు తెస్తారు. రాజ్యం  దృష్టిలో  సామాన్యులెప్పుడూ చీమలే. చీమలన్నీ కలిసి కట్టుగా తిరుగుబాటు చేసేదాకా ఎంతో మంది అనామకంగా చీమల్లా పుడుతుంటారు. గిడుతుంటారు. (‘చీమా చీమాఎందుకు పుట్టావ్‌?)

బహుజనులు  అధికారంలో వున్న వారికి లేదా సాటి మనిషికి ఆపత్కాలములో అప్పు ఇవ్వడం కూడా తప్పే. వాటిని వసూలు చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. అందుకే పందులుగాసుకునే ఎరుకల బక్కని జీవితం పందులు సొచ్చిన ఇల్లులాగా ఆగమవుతుంది. వాని పందులన్నీ అధికార మదానికి బలైపోతాయి. వాడు మాత్రం పోలీసు దోపిడీకి, బలవంతుని పీడనకు ప్రతీకగా బక్క పల్చని మనిషిగా అలా నిబడిపోతాడు. (బక్కడు).

వలస పాలనలో, ప్రపంచీకరణలో తెలంగాణ ఆటలన్నీ పారిపోయి స్వర్గంలో దాక్కున్నాయి. అలాంటి స్వర్గం నుండి మనం మరచిపోయిన ‘పచ్చీసు’ను తీసుకొచ్చి దానికి బాల్యాన్ని అద్ది, జీవితాన్ని ముడివేసి తెలంగాణ సంస్క ృతిని తడిమిన కథ మళ్ళీ మనల్ని ఆరు దశాబ్దా వెనకకు తీసుకెళ్తుంది.

స్వీయ పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ కాస్త సఫల మైనట్టుంది. ప్రజల ముఖాల్లో, జీవితాల్లో నీటి మెగులు, తెలంగాణ నేలలో ఆకుపచ్చని వర్ణం కనిపిస్తోంది. అయితే రియలెస్టేట్‌ రంగం చెరువును కూడా వదలకుండా ఆక్రమణలు, అక్రమంగా భవనాలు నిర్మించి నీటి తల్లికి సమాధులు కడుతున్నారు. అలాంటి కుట్ర మీదికి ‘ఏరువాక’ సాగాలని ఇప్పుడు తెంగాణ ప్రజల ఆకాంక్ష.

మైళ్ల దూరం నుండి నీటినీ, భూమినీ వెతుక్కుంటూ తరలి వచ్చి తెలంగాణ అంతటా కాలువల పక్కన విస్తరించిపోయిన ‘వసపక్షులు’ మనస్తత్వాన్ని, సుతిమెత్తని, నిర్మాణాత్మక దోపిడీని పసిగట్టకపోవడం తెలంగాణ రైతు అమాయకత్వం. కాళ్లకింది నేలను జారవిడుచుకొని, ఎముకల్లోని మూలుగులను కూడా కోల్పోయి తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు ఏ ఆదరణా లేక ఒచ్చొరకు నిల్చుండిపోయారు.

బీజేపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆరెస్సెస్‌ భావజాలం, విపరీత హిందుత్వం తెరమీదికి వచ్చి దేశ లౌకికత్వాన్ని బోనులో నిలబెడుతుంది. మైనార్టీలు అభద్రతలోకి జారుకుంటారు. రాజ్యం పోలీసు విధులను నిర్వర్తించకుండా మనం అడక్కుండానే ప్రజల అవాట్ల, భోజన విషయాల్లోకి కూడా చొరబడి ఈ దేశంలో ఉండాలంటే ఫలానా పదార్థాన్నే తినాలని పరోక్షంగా ఆదేశాలిస్తుంది. పేదవాడు తనకు తోచిన ‘బుక్కెడుబువ్వ’ ను తినే స్వేచ్ఛ ఈ దేశ ప్రజాస్వామ్యం కల్పించలేకపోతోంది. అటు ముస్లిం మైనార్టీలను, ఇటు దళితులను టార్గెట్‌ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి  అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటారు.

ముస్లీం మైనార్టీలు ఒకే సమయంలో అటు హిందుత్వవాదులతో ఇటు పేదరికంతో ‘యుద్ధం’ చేయాలి. హైదరాబాద్‌, ముంబయి ఆ మాట కొస్తే ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముందుగా కనిపించే అనుమానితులు ముస్లీంలే. ఆ బాంబు దాడుల్లో ముస్లింలు కూడా తమ జీవితాలను కోల్పోతున్నారనే విషయాన్ని బుద్ధిజీవులు ఆలోచించరు. అట్లాంటి ఘర్షణల్లో తండ్రులను కోల్పోయిన కొడుకు  బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో జీవిత పాఠశాలలో అనుభవాల చేదు పాఠాలను వళ్లిస్తూ  కుటుంబ భారాన్ని భుజానికేసుకొని జీవన పోరాటం చేస్తూనే ఉంటారు. బతికినంత కాలం ఎంత నిజాయితీగా బతికినా విధి ఘోరంగా దెబ్బతీస్తూనే ఉంటుంది.

జీవితం ఇంత సంక్లిష్టం అయిపోయిన సందర్భంలో బతుకు ‘ఆవలితీరం’ చేరడం చాలా కష్టం. ఫేస్‌బుక్‌ వేదికగా దోస్తాని చేసే వ్యక్తుల పరిచయాలు చాలా వరకు మోసపూరితంగానే ఉంటాయి. అయితే కొంత పరిణతి చెందిన స్త్రీ, పురుషుల పరిచయాలు నిజ జీవితంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఉపయోగపడవచ్చు. మానవ సంబంధాలు స్వచ్ఛమైన పూ పరిమళాలను వెదజల్లాలి కాని అలంకార ప్రాయంగా మెడలో నిలిచే ‘గంధపు దండ’ కాకూడదు. ఒక తరంలో వివాహం నాన్న స్థానాన్ని రెండో స్థానానికి దిగజార్చుతే, మరో తరంలో కూడా అదే రిపీట్‌ అవుతుంది. కొసకు నాన్న తాలూకు ఫోటోకు కూడా ఇంట్లో స్థలం దొరకని పరిస్థితి. ఇప్పుడు నాన్న స్థానం గుండెలోనే. తరాలు మారినా ఇదే నిఖార్సయిన నిజం.

సంక్షోభ భరితమైన, సంఘర్షణాయుతమైన జీవితాన్ని వ్యాఖ్యానించడానికి ఇన్ని పేజీలు అవసరమా? పది పదిహేను వాక్యాలు సరిపోవా? అసలు పది పదిహేను వాక్యాలైనా ఎందుకు? ఒక పొడవాటి వాక్యం సరిపోదా? కాదు ఇంత పొడవాటి వాక్యం కూడా వద్దు. ‘ఒక్క పదం చాలు’. ఒక్క పదమైనా ఎందుకు? పెళ్లలు పెళ్లలుగా కూలిపోతున్న జీవితపు శిథిలత్వాన్ని మన హృదయంలోకి నిశ్శబ్దంగా చేరవేయడానికి ఎన్నో భావాలను మోస్తున్న అనంతమైన ఒక్క మౌనం చాలు.

* * *

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరినీ కొత్త బంగారు లోకంలోకి తీసుకు వెళ్తామని వాగ్దానం చేసి బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకా ఎన్నో సంస్కరణలను ఆచరణలోకి తేవాల్సి ఉంది. ప్రతి పేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. రైతుకు 12 గంట కరెంటన్నారు. రైతులు, చేనేత కార్మికులు, వృత్తికులాల వాళ్ళ ఆత్మహత్యల్ని ఆపుతామన్నారు. ఇవన్నీ కలగానే మిగిలాయి. పల్లెతో పాటు అనేక వృత్తులు కూడా ధ్వంసమైపోతూనే   ఉన్నాయి. నగరాల్లో యంత్రాలతో చేయించాల్సిన మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌ మనుషుతోనే చేయించడం మూలానా 2015లో దాదాపు డజన్‌ మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో కళాశాల విద్య కూడా గందరగోళంగా మారిపోయింది. స్కాలర్‌షిప్‌లు ఎవరికి ఇస్తున్నారో, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఎవరికి కల్పిస్తున్నారో ఏదీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష మూడు సార్లు నిర్వహించారు. వీటిలో వేటినీ తెలంగాణ కథకులు పెద్దగా ప్రశ్నించే కథలు రాయలేదు. ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మకమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై రావాల్సినన్ని కథలు గాని, నవలలు గానీ ఇంకా రాలేదు. అయితే సీనియర్‌ కథకులు (అల్లం  రాజయ్య, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, నందిని సిధారెడ్డి, జూకంటి జగన్నాథం, డా. నలిమెల భాస్కర్‌…లాంటి వారు) మౌనముద్రలో ఉన్న సందర్భంలో కొత్త కథకులు తెలంగాణ కథా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం కొంత ఆశావహ దృక్కోణం.

శిల్ప పరంగా కూడా తెలంగాణ కథకులు ఇంకా రాటుదేలాల్సే ఉంది. కేవలం తెలుపు నలుపు స్టిల్‌ ఫోటోగ్రఫీ లాంటి కథలే కాదు. తెంగాణ ‘సింగిడి’లోని ఏడు రంగుతో మిళితమైన శైలీ, శిల్పాల కథలు రావాలి. ఎలాంటి ప్రయోగాలు లేకుండా, వాఖ్య విన్యాసం లేకుండా ప్లేన్‌ కథలే ఎక్కువ వచ్చాయి. తెలంగాణ తెలుగు మాధుర్యతను కూడా కథల్లో చూపించాల్సి ఉంది.

కథంటే ఏదో మానసిక వికాసం కల్గించాని, కథ సాంతం చదివి మూసేసిన తరువాత ఏదో కదలిక తేవాలని, సంక్షోభిత జీవితాన్ని చిత్రించేదిగా ఉండాలని, తెలంగాణ నేటివిటీని పట్టి చూపేదిగా ఉండాలని, మానవ సంబంధాలను పునర్వ్యాఖ్యానించేదిగా ఉండాలని ఇలాంటి కొన్ని నియమాల్ని పెట్టుకొని ఎంతో సమయాన్ని వెచ్చించి, అనేక కథల్ని జల్లెడ పట్టి ఈ 12 కథల్ని ఎన్నిక చేశాము. ఎంపికలో వస్తు వైవిధ్యం, భాషా వైచిత్రి, శిల్ప నైపుణ్యాన్ని లెక్కలోకి తీసుకున్నం. ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా, కథకుల్ని పట్టించుకోకుండా కేవలం కథలను మాత్రమే పట్టించుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేయడం జరిగింది. మేం పెట్టుకున్న గీత మీద నడవలేక కొన్ని సార్లు జారిపడిపోయాం కావచ్చు. (ఈ విషయం విమర్శకులు, పరిశీలకులు, పాఠకులే చెప్పాలి.) ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కథల భాగస్వామ్యం చాలా పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తమ కథల్ని(?) పాఠకులకు అందించడానికి అనేక కథా సంకలనాలు

వెలువడుతున్నాయి. ఆ కోవలోనే మేము ఈ సంకలనాలను 2013 నుండి తెస్తున్నాము. మా ప్రయత్నం ఏ మాత్రం సఫలీకృతమైనా మేము విజయవంతం అయినట్లే. ఈ ప్రయత్నాలన్నీ  మరిన్ని  ‘మంచి’ కథల్ని పాఠకులకు చేరవేయడానికి, లేదా రికార్డు చేయడానికి ఉపయోగ పడతాయని భావిస్తున్నాం. ఈ దిశలో సహృదయ పాఠకులు, విమర్శకులు సలహాను, సూచనలను ఆహ్వానిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ తెలంగాణ కథ ` 2015ను కూడా ఆదరించి మాకు మరింత బలాన్నందిస్తారని ఆశిస్తున్నాం.

(అలుగు తెలంగాణ కథ -2015 రాసిన ముందుమాట)

 

మంచి చెడ్డలు పట్టించుకోండి!

ఏడాది కోసారి ఆ సంవత్సరం ప్రచురితమైన కథల్లోంచి తెలంగాణ దృక్కోణంతో మెరుగైన కథల్ని ఎంపిక చేయడం శక్తికి మించిన పని అని అనుభవ పూర్వకంగా అర్థమయింది. అయినా ఇది థ్యాంక్‌లెస్‌ జాబ్‌. థ్యాంక్స్‌ కోరుకొని ఈ పని చేయడం లేదు. తెలంగాణ సాహిత్యంఫై ఇష్టంతో ఈ పని జేస్తున్నాం. అయితే ఇంత జేసినా ఎక్కువ మందికి కంటు అయితున్నం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ వస్తువు, శిల్పం, భాష ముద్ర ఉన్న 12 కథలను ఈ సంకలనం ద్వారా ఒక్క దగ్గరికి తెస్తున్నం. ఆయా పత్రికలు, అంతర్జాల మాధ్యమాలు వీటిని ప్రచురించే ముందు కొంత వడపోత పోసే వాటిని మలుగులోకి తెచ్చాయి. వాటిల్లోంచి మళ్ళీ వస్త్రగాలం బట్టి ఈ కథలను అందిస్తున్నాం. వివిధ వార్షిక కథా సంకనాల్లో చేరిన కథలను ఈ సంకలనం కోసం పరిశీలించలేదు. ఎక్కువ కథల్ని తెలుగు పాఠకులకు అందించడం ధ్యేయంగా ఈ పని చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి యేటా జూన్‌ నెలలో వార్షిక తెలంగాణ కథా సంపుటాలు తీసుకు రావాలని నిర్ణయించాం. ఈ సంకనలంలోని కథల ఎంపికలోని మంచి చెడ్డలు  పట్టించుకొని మాకు అండగా నిలవాలని మీ అందరినీ కోరుతున్నాం.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

మంచి కథలకు గట్టి హామీ

కోర్టు బెంచీ మీద కూర్చొని తెలంగాణ కథపైన అలవోకగా ఏదో తోచిన తీర్పు చెప్పడం కాదు. ఈ అలుగులో చేరని కథలు మంచి కథలు కావనీ కాదు. నిజానికి ఇందులో చేరని ఎన్నో మంచి కథలు మా దృష్టి నుంచి జారిపోవచ్చు కూడా. ఇవీ ‘మంచి’ కథలు అని తూచడానికి మా దగ్గర ఎలాంటి ‘తరాజు’ లేదు. అయితే సహృదయ పాఠకుల మనసులో ఏదో మార్పు, కథంతా చదివి మూసేసిన తరువాత పాఠకుని గుండెకు ఏదో జ్వరపీడిత భావన, కాస్తయినా పెయిన్ ఫీలవ్వాలని అనుకున్నాము. దానికి శైలీ, శిల్పమా, కథనమా,  భాషా, నేటివిటీనా లేదూ ఇవన్నీ కలిసిన మరో పేరేదేయినా పెడతారేమో కూడా తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలం. తెలంగాణ మట్టి (కథా వస్తువు) చాలా సారవంతమైనది. ఈ మట్టితో చాలా అందమైన, జీవితాన్ని వడగట్టిన శిల్పాలను (కథలను) తయారు చేయవచ్చు. అలాంటి శిల్పాలను మలిచే నాజూకు చేతుల  కోసమే మా తన్లాట. ఆ నాజూకు చేతి వేళ్ల నుండి ఏదో రూపాన్ని సంతరించుకొని మీ ముందు నిల్చున్నవే ఇందులోని కథలు. అన్నీ నచ్చుతాయని కాదు. ఒక్క కథైనా మీకు తప్పకుండా నచ్చుతుందని, తెలంగాణ నుండి మంచి కథలు వస్తున్నాయని, వస్తాయనీ హామీ ఇవ్వగలం. అయితే ఒక సంవత్సరంలో వెలువడిన కొన్ని వేల కథల్లో మంచి కథలను పట్టుకోవడం మాత్రం కొంచెం కష్టమైన పనేనని చెప్తూ మా ప్రయత్నం సఫలం అయిందో, విఫలం అయిందో పాఠకులు కథలన్నీ చదివి తమ విలువైన అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాం.

                                                                                      -వెల్దండి శ్రీధర్

 

సుందర సుకుమారి 

samanyaఆకాశాన ధగధగమని మెరుస్తున్నాడు వెండివెన్నెల చందమామ . మెస్ నుండి రూమ్ కి తిరిగి వస్తూ గేటు దగ్గర వున్న గంగరావి  చెట్టు క్రింద నిలబడి ,ఆకుల సందులలోనుండి భూమి మీద పడుతున్న పండు వెన్నెల రేఖల కింద చెయ్యి పెడుతూ ”ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది అదితి ,చూడు ఆ బ్యూటీ , ఆ చంద్రుడిని ఏం చేసుకోవాలి చెప్పు ,ఎంత అశక్తులం మనం ..  , కదా ! ” అంది బోలెడంత దిగులు గొంతులోకి తెచ్చుకుని శ్రీప్రియ . అదితి ఢిల్లీ అమ్మాయి . అక్కడే ఇద్దరు ఇంజినీర్లకు పుట్టి పెరిగింది . అందుకనేమో శ్రీప్రియ చూపించిన చంద్రుడి వంక దీర్ఘంగా చూసి ,తల క్రిందికి దించి , దిగులుపడుతున్న  శ్రీప్రియ వైపు చూసి ,”నాకు పీజ్జా ఆకలి వేస్తుంది శ్రీ ,చంద్రుడు అచ్చం చీజ్ పిజ్జా లాగున్నాడు నాకెందుకు  నీలా అనిపించడంలేదు ” అంది తానూ దిగులుగా . అదితి మాటలకు పెద్ద నిట్టూర్పు విడిచి ”పద వెళదాం ” అంది శ్రీప్రియ .

శ్రీప్రియ ది  విజయవాడ  . అమ్మా నాన్న ఇద్దరూ అక్కడ పేరు మోసిన డాక్టర్లు . మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్లు . వారికి శ్రీప్రియ ఒక్కటే సంతానం .  శ్రీప్రియ తెల్లగా ఉంటుంది , రింగులు తిరిగిన ఒత్తయిన తలకట్టు ,మధ్యలో గీత ఉండి అటుఇటు ఉబ్బి వుండే ఎర్రటి కింది పెదవితో అందంగా ఉంటుంది . కవి కాకున్నా ఆవేశపడి అవీ ఇవీ రాస్తుంది . చక్కగా కాకున్నా  ముద్దు ముద్దుగా పాడుతుంది . చాలా సున్నిత మనస్కురాలు . చదువుతున్నది భౌతిక శాస్త్రమే అయినా ఒందశాతం భావవాది . ఎంత భావవాది అంటే , రాకెట్టును అంతరిక్షంలోకి పంపే ముందు, మంచి ముహూర్తం పెట్టుకుని ,అయ్యవారిని పిలిపించి పూజలు చేయించుకుని శాస్త్రోక్తంగా ఆకాశంలోకి ఎగరేసే భారతీయ  శాస్త్రజ్ఞులంత భావవాది .

ఇద్దరూ రూంలోకి వెళ్ళగానే అదితి మొబైల్ మ్రోగింది .  మొబైల్ అలా ఆ టైం లో మ్రోగిందంటే మరిక అదితి ఈ లోకంలో ఉండదనే అర్ధం . ఆ అమ్మాయి అలా  మొబైల్ చేతి లోకి తీసుకోగానే  శ్రీప్రియ నిట్టూర్చి , పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది . కూర్చున్నదన్న మాటే కానీ చెవులంతా అదితి సంభాషణ పైనే వున్నాయి . ఏవేవో సరస సంభాషణలు జరుగుతున్నట్టున్నాయ్ , అప్పుడప్పుడు అదితి బుంగ మూతితో గారాలు పోతుంది . అదితికి బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు . ఏదీ సీరియస్ గా తీసుకోదు ఆ పిల్ల . ”ప్రేమ అనే భావనకి విలువనివ్వవా నువ్వు ”అంది ఒకరోజు అదితి తో . ఆ ప్రశ్న విని ,అదితి చాలా ఆశ్చర్యపడి ‘అదేమిటి ! ఎందుకివ్వను ,  ఇస్తేనే కదా అంత టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నాను ” అంది . కొన్ని రోజులకు ఆ ప్రేమికుడు మారి కొత్తవాడు వస్తాడు  . ఏమిటిలా అంటే ”నేనేం చేసేది వాడికి నా మీద ప్రేమ పోయింది ,ప్రేమలేని వాళ్ళ దగ్గర ఎందుకుండాలి చెప్పు ” అంటుంది  . శ్రీప్రియ కి ఆ లాజిక్ ఒందశాతం  నిజమనిపిస్తుంది  ,కానీ మనసు ఎందుకనో ఇదంతా అంగీరించదు . అందుకే ఈ కొత్త ప్రేమికుడుతో మాట్లాడుతున్న అదితిని చూసి నిట్టూర్చింది .

ఇవాళ రేపట్లో అమ్మాయిలందరికీ , అబ్బాయిలు స్నేహితులుగా వుంటున్నారు , ఆ స్నేహాలనుండి ప్రేమలూ పుట్టుకొచ్చి పెళ్ళిళ్ళూ అవుతున్నాయి . కానీ శ్రీప్రియకి భయం ,అబ్బాయిలతో మాట్లాడొద్దని నాన్న అమ్మ ఎప్పుడూ చెప్పలేదు కానీ ,కులాంతర వివాహం అనే మాటను కూడా వాళ్ళు ఇంటిలోపలికి రానివ్వరు . తమకి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ ఆడపిల్ల పిల్ల కావడంచేత మరింత కట్టుదిట్టంగా మాటల నుండి చేతల వరకూ అంతటా జాగ్రత్తపడుతూ వుంటారు . శ్రీప్రియ కి అదంతా తెలుసు . అందుకే తానూ జాగ్రత్తగా ఉంటుంది .

%e0%b0%b8%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf

యూనివర్సిటీ లో శ్రీప్రియ కులపు వాళ్ళు , కార్తీక పౌర్ణమికి సెలవు రోజు కలిసి వచ్చింది కనుక వన భోజనాలు  పెట్టుకున్నాం , దగ్గరున్న అడవికి వెళదాం అనుకున్నారు . పున్నమి అడవి  అనేసరికి శ్రీప్రియ హృదయంలో  ఆకాశంలో యెగిరి పూసే కాకర పువ్వొత్తుల్లాంటి టపాకాయల్లా  కోటి చంద్రుళ్లు రంగులు రంగులుగా పూశారు . ఇంతలో కార్తీక పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి ,ఒక ప్రజాస్వామిక స్తూడెంట్స్ యూనియన్ ఈ కులబోజనాల గురించి కరపత్రం వేసింది , అప్పుడిక డిపార్ట్మెంట్ అంతా వనభోజనంకి వెళదాం అనే ముగింపుకి వచ్చి అందరూ వనభోజనాలకు బయల్దేరారు. అలా వచ్చాడు వెంకట్ వనభోజనాలకు .

వెంకట్ వాళ్ళ నాన ఊరి పెద్దమాదిగ. వాళ్ళ మాదిగగూడెంలో  పదోతరగతి వరకు చదువుకున్న  శీనివాసు ఎంత చెపితే అంత . వెంకట్ వాళ్ళ అమ్మ , నాన్న ఇద్దరూ ఎర్రగా వుంటారు , ఎత్తుగా వుంటారు . ”యెర్ర మాదిగల్ని నల్ల బాపనోళ్ళని  నమ్మకూడదని ” సామెత . ఎప్పుడో ఎవరో ఆ సామెత అని  వెంకట్ ని తిడితే ,వెంకట్ ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ  నాన్నకి చెప్పాడు . శీనివాసు అది విని నవ్వి , మనం మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్లమని దానికర్ధం రా చిన్న , చూడు మీ క్లాసులో నువ్వే కదా ఎప్పుడూ ఫస్టు  వచ్చేది” అని చెప్పేడు . అది నిజమే వెంకట్ ఎప్పుడూ ఫస్టే , ఇప్పుడు కూడా csir ఫెలోషిప్ తో P hd లో చేరాడు . అతను ఎర్రగానే కాదు , చూడటానికి కూడా బాగుంటాడు . దరువేస్తూ పాట  పాడితే  ఆకాశంలో చందమామ దిగి వెంకట్ ముందు కూర్చుంటాడు . అందుకని స్తూడెంట్స్ అందరూ కేంప్ ఫైర్  ముందు వలయంగా కూర్చున్నాక  వెంకట్ ని పాడమని అడిగారు .

వెంకట్ వలయంకి కొంచెం దూరంలో వున్న చిన్న బండరాయి మీద ఎక్కి కూర్చున్నాడు . అతనికి జానపదాలంటే చాలా ఇష్టం అందుకే మొదలు పెట్టడమే ” బొట్ల బొట్ల చీర కట్టి ,బొమ్మంచు రైక తొడిగి , నీకోసం నేనొస్తినిరో  నా ముద్దూల మామయ్యా ,నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అని మొదలు పెట్టాడు . ”మేడారం జాతరలో మల్లన్న గుడికాడా మన మాట మాట కలిసెనురో నా ముద్దూల మావయ్య / నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అంటూ వస్తానన్న ప్రియుడు రాకపోవడంతో అతని  పరిచయపు జ్ఞాపకాలను తలపోసుకుంటున్న ప్రియురాలి గుండెలోని వేదనొకటే  కాదు అతని కంఠంలో ,స్త్రీ కంఠంలోని మృదు సొబగు కూడా జాలువారుతూ వుంది . ఒకటి తర్వాత ఒకటి పాడుతూ ఉంటే ఎవరో అన్నారు ”రేయ్ వెంకట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి రా ,చంద్రుని మీద పాడు” అని . వెంకట్ నవ్వుతూ అలా అన్న అబ్బాయి వంక చూసి ,ఏం పాడమంటావో నువ్వే చెప్పు అన్నాడు . ఆ చెప్పమన్న పిల్లవాడు చెప్పకముందే అతని పక్కన కూర్చుని వున్న శ్రీప్రియ మృదువుగా , మొహమాటంగా ”చౌదవీ క చాంద్ హో… ” పాడుతారా  అంది . వెంకట్ ఆ అమ్మాయి వంక చూసాడు . వరాలిచ్చే దేవుడు తనని చూసినంత తన్మయం కలిగింది అప్పటికే అతని మధురమైన కంఠంతో మోహంలో పడ్డ శ్రీప్రియకి ,వెంకట్ అంతసేపు ఆ అమ్మాయిని గమనించలేదు , ఎర్రని మంటవెలుగులో గులాబీ రంగులో ప్రకాశిస్తున్న ఆమె ముఖమూ , లీవ్ చేసుకుని ఉన్నందున మెడచుట్టు అలుముకుని వున్న నొక్కుల జుత్తుతో ఆమె రూపసౌందర్యం విస్తుగొలుపుతూ వుంది , ఆమె ముఖం వంక చూసి ,లిరిక్స్ పూర్తిగా గుర్తు లేవు కొంచెం చెప్పగలరా ”  అన్నాడు ,శ్రీప్రియ లిరిక్స్ చెప్పింది  ,మధ్యలో గీత వుండి నిండుగ ,కొద్దిగా తెరుచుకున్నట్టు వుండే ఆమె యెర్రని పెదాల వంక చూస్తూ లిరిక్స్ విన్న  వెంకట్  కొన్ని వాక్యాలు పాడేటపుడు   శ్రీప్రియ పై చూపు నిలిపి  పాడాడు ” చెహరా హై జెయిసే జీలుమే హాస్తా హువే కమల్ /ఏ జిందగీ కె సాజ్ పే చేరి హుయి గజల్ / జానే  బహార్ తుమ్ కిసి షాయిరా  కి క్వాబ్ హో” అనేవి అందులో కొన్ని లైన్లు . ఆ లైన్లే కాదు ,కవి ఆ పాట ఆమెనే ఉద్దేశించినట్టు రాసిన విషయం ఆమెకు కూడా తెలుసేమో అని వెంకట్ కి అనిపించింది .

Kadha-Saranga-2-300x268

యూనివర్సిటీ కి రాగానే వెంకట్  చేసిన మొదటి పని శ్రీప్రియ కులమేంటో తెలుసుకోవడమే . ఆ అమ్మాయి కులమేంటో  తెలిసాక , తెలివయిన వాడు కావడం చేత వెంకట్ ఆమె  సౌందర్యాన్ని కలలకి పరిమితం చేసేసాడు , కొన్ని రోజులకు కలల్లోకూడా  ఆమెని మరిచిపోయాడు . అలాటి రోజుల్లో ఒక రోజు శ్రీప్రియ హెచ్ ఓ డి రూమ్ నుండి వస్తూ వెంకట్ కి ఎదురుపడింది . అతన్ని చూసీ చూడగానే విశాలంగా నవ్వుతూ ముఖమంతా సంతోషాన్ని నింపుకుని ”బాగున్నారా , మిమ్మల్ని  చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాను ,  మీ గురించి ఎవరిని అడగాలో తెలియక ఊరుకున్నాను ,మీరు మొహమ్మద్ రఫీలా … ఊహు కాదు కాదు అంతకన్నా గొప్పగా చాలా చాలా గొప్పగా పాడుతారు , మీ గొంతు చాలా బాగుంది , సినిమాలల్లో ట్రై చేస్తే మీరు నంబర్ వన్ పొజిషన్ లో వుంటారు ” అని గుక్క తిప్పుకోకుండా వుద్రేకపడుతూ  గబగబా చెప్పేసింది . శ్రీప్రియ చెప్పిన మధురమయిన మాటలకి  గుండె ఉప్పొంగుతుండగా నోట మాట రాని  వెంకట్ గొంతు పెకలించుకుని ”తాంక్  యు ” అని మాత్రమే అనగలిగాడు  . కానీ శ్రీప్రియ అంతటితో ఊరుకోకుండా ”మీకు టైం ఉంటే కేంటీన్ కి వెళదాం వస్తారా ” అని అడిగింది .

కేంటీన్ ముందు బెంచీల మీద సెటిలయ్యారు ఇద్దరూ . క్లాసులయిపోయాయి గనుక డే స్కాలర్లు  ఇళ్లకు వెల్తూ వున్నారు , హాస్టలేట్స్ కబుర్లు చెప్పుకుంటూ సైకిళ్ళు నెట్టుకుంటూ నడుస్తున్నారు . క్యాంటీన్ కి  ఆ మూల వున్న చెట్టు మీద ఉడుత ఒకటి పైకీ కిందకీ అలజడిగా తిరుగుతూ కీ..  కీ  అంటూ చప్పుడు చేస్తుంది . సంజె వాలుతూ వుంది . వెంకట్ ఏమయినా మాట్లాడుతాడని శ్రీప్రియ , కేంటీన్ కి పిలిచింది కదా ఏదో ఒకటి మాట్లాడొచ్చుకదా అని వెంకట్ మనసులో అనుకుంటూ అప్పుడప్పుడూ కనుకొలకులనుండి ఒకరినొకరు చూసుకుంటూ కాఫీ పూర్తి చేసి బై  బై చెప్పుకున్నారు . నాలుగడుగులు వేసాక శ్రీప్రియే వెంకట్ సర్ అని కేక వేసి ” మీ ఫోన్ నంబర్ ఇస్తారా అభ్యంతరం లేకుంటే ” అని ఫోన్ నెంబర్  తీసుకుని వెళ్ళిపోయింది .

ఎదురుబొదురు మొహమాటాలని మొబైల్ తీర్చింది . కొద్ధి  రోజులకు వారిద్దరి  మధ్య కలిసి మాట్లాడుకోవాలనే  కోరిక మొదలయ్యేంత చనువు వచ్చి చేరింది . ఇప్పుడు అదితికి ,శ్రీప్రియకు ఇద్దరికీ సమయంలేదు తీరికగా రూంలో కబుర్లు చెప్పుకోవడానికి . అయినా ఒకరోజు తీరిక చేసుకుని అదితి అన్నది ”ఏంటీ ప్రేమా ?” అని . శ్రీప్రియ మనసులో ఉలిక్కిపడింది . చటుక్కుమని అమ్మానాన్న మెరుపుల్లా మనసులోకి దూసుకొచ్చారు . ” చ ఛ !లేదు ,అతను గ్రేట్ సింగర్ అయామ్ గోఇంగ్ క్రేజీ అబౌట్ హిస్ వాయిస్  . అంతే ” అనేసింది . అదితి తోనే కాదు వెంకట్ తో కూడా అదే మాట చెప్పింది ఒక రోజు .

ఒక మధ్యాన్నం పూత  డిపార్ట్మెంట్ నుంచి కేంటీన్ వైపు వస్తున్నారు వెంకట్ , శ్రీప్రియ . మధ్యలో జోరు వర్షం పట్టుకుంది . పక్కనే వున్న లైబ్రరీలో కి వెళ్లారు . వాన తగ్గేదాకా కూర్చోక తప్పదు కనుక వెంకట్ వెళ్లి ,కవిత్వం పుస్తకాలేవో పట్టుకొచ్చి శ్రీప్రియ కి ఇచ్చి  తానూ చదువుతూ కూర్చున్నాడు . చదువుతున్నవాడు హఠాత్తుగా శ్రీప్రియ వంక చూసి రూమి పోయెమ్ ఒకటి వింటావా  అని ,ఆమె జవాబు కోసం ఆగకుండా ONCE a beloved asked her lover / “Friend, you have seen many places in the world ! / Now – which of all these cities was the best?/He said: “The city where my sweetheart lives!”అంటూ చదివి వినిపించి , శ్రీప్రియ కళ్ళల్లోకి ఒకసారి చూసి తలవంచుకుని పుస్తకంలోకి చూస్తూ ”నాకయితే ఈ క్షణం నా ఎదురుగా నువ్వున్న ఈ లైబ్రరీనే ప్రపంచంలోకెల్లా అందమయినది . ” అన్నాడు . శ్రీప్రియ కి కొంత  ఆలస్యంగానైనా అతను చెప్పింది అర్థమయింది . కానీ తిరిగి ఏంమాట్లాడలేదు . వెంకట్ రెట్టించలేదు . ఇద్దరూ వాన తగ్గాక కేంటీన్ కి  వెళ్లారు . అక్కడా ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు . ఆమె మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ వెంకట్ కూడా ఏం మాట్లాడలేదు . ఇద్దరూ ఎవరి హాస్టల్స్ వైపు వాళ్ళు వెళ్లిపోయారు .

రూముకొచ్చిన శ్రీప్రియ అలాగే బెడ్డు పైన పడిపోయింది . ఆ రాత్రి తిండి కూడా తినలేదు . కారణం అడిగిన అదితికి జవాబు చెప్పలేదు . కానీ వెంకట్ ఫోన్ కోసం ఎదురు చూసింది . తప్పకుండా చేస్తాడనుకుంది . చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదనుకుంది . కానీ వెంకట్ ఫోన్ చెయ్యలేదు . వెంకట్ అలా ప్రపోజ్ చేసేడే కానీ మనసులో అలజడిగా వుంది . దుఃఖంగా వుంది ,తనెందుకు ఏ గొప్పకులంలోనో పుట్టలేదు అని ఒక వైపు ,ఎన్నెన్ని మాటలు చెపుతుంది ,సెన్సిబుల్ గా ఉంటుంది కానీ ఎంత సులభంగా తనతో మాట్లాడటం మానేసింది తాను మాత్రం ఎందుకు మాట్లాడాలి అనే ఆత్మాభిమానం ఒకవైపు కృంగదీస్తుండగా రూంలోనుంచి బయటికి రావడం మానేసాడు .

బహుశా ఒక నాలుగు రోజులకేమో శ్రీప్రియ వెంకట్ కి ఫోన్ చేసింది . ఫలానా గుడికి వెళదాం వస్తావా అన్నది . ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు . ఒకచోట కూర్చున్నారు . అతని మౌనం ఆమెకి విసుగ్గా వుంది . భరించరానిదిగా వుంది . అతనితో మాట్లాడకుండా వుండలేనట్టు వుంది . అందుకే తానే చివరికి ” సారీ , నేను ,నీకు పాసిటివ్ గా రెస్పాండ్  అవలేను,ఎందుకూ అని అడగకు , చెప్పలేను ! కానీ నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి , ఐ లైక్  యువర్ ఫ్రెండ్షిప్ ” అన్నది . అని భోరుమని ఏడ్చింది . వెంకట్ ఏడుస్తున్న ఆ అమ్మాయి వంక చూసాడు . శ్రీప్రియ కి నవ్వితే కూడా చెంపలు తడిసేంత కళ్ళనీళ్లొస్తాయి , కనుగుడ్డు పైనే తడిగా మెరుస్తూ ఉంటాయి కళ్లనీళ్లు .  అతనికా విషయం హటాత్ గా అప్పుడెందుకు గుర్తొచ్చిందో కానీ ఆ అమ్మాయి వైపు నుండి చూపు తిప్పుకుని ,”నువ్వు చెప్పకున్నా కారణం నాకు తెలుసు శ్రీ ,ఏడవకు ,అలాగే , నువ్వెలా అంటే అలానే ,ఫ్రెండ్స్ గా ఉందాం ,నిన్ను బాధ పెట్టినందుకు సారీ ” అన్నాడు  .

మరికొన్ని రోజుల్లో శ్రీప్రియ ఫస్టియర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ కి వచ్చేసింది . వెంకట్  P hd సెకండ్ ఇయర్కి  వచ్చాడు .ఆ రోజు తర్వాత అతనెప్పుడూ ఆమెతో వేరే రకం సంభాషణలు చెయ్యలేదు . స్నేహము తప్ప మరేమీ లేని వాళ్లిద్దరూ ఒకరోజు కలిసి సిటీలో సినిమాకి వెళ్లారు . సినిమా చూసి షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటే చాలా టైం అయింది . బయటికి వచ్చి బస్టాపుకి వచ్చేలోపు యూనివర్సిటీ వైపు వెళ్లే చివరి బస్సు కూడా వెళిపోయింది . అంతలోనే జోరు వాన మొదలయింది . ఒకటి ఆరా  ఆటోలున్నాయి కానీ వాళ్ళు అంతదూరం మేము రాము అనేసారు  . ఏంచేయాలో తోచలేదు వెంకట్ కు . చివరికి ”ఫ్రెండ్ రూమ్ వుంది దగ్గర్లో వాడినడిగి బైక్ తీసుకుని వాన తగ్గాక వెల్దామా ”అన్నాడు . శ్రీప్రియ వెంటనే సరే అని తలూపింది . ఆటో తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఆ ఫ్రెండ్  లేడు .ఫోన్ చేస్తే ఊరెళ్ళాననీ  , రూమ్ తాళాలు సన్షేడ్ మీద వున్నాయి బైక్ తాళాలు రూంలో వున్నాయి తీసుకోమని చెప్పాడు . తాళం తీసుకుని రూంలోకి వెళ్లి కూర్చున్నారు . వాన ఎంతకూ తగ్గక పోయేసరికి శ్రీప్రియ అన్నది ”వెంకట్ ! పన్నెండు దాటింది , ఇప్పుడు వెళ్లడం ప్రమాదం కదా ,రేపు పొద్దున్న వెళదామా ” అని. ఆమాట అనడానికి భయపడుతున్న వెంకట్ చప్పున తల ఊపి , నేల మీద దుప్పటి పరుచుకుని ” హాయిగా నిద్రపో శ్రీ రేప్పొద్దున లేపుతా ” అని పడుకున్నాడు .

మంచం మీద పడుకున్న శ్రీ ప్రియకి నిదర రావడం  లేదు .గుండె దడ దడ కొట్టుకుంటుంది . ఊపిరి బరువయింది . ఏకాంతం  ఏవేవో ఆలోచనలు పుట్టిస్తుంటే,  వాన శబ్దం వింటూ, ఆగి ఆగి చివరికి ఇటు పక్కకి వత్తిగిలి ”నిద్దరొచ్చేసిందా ,ఏదయినా పాడవచ్చు కదా నాకు జోలపాట ” అని చిన్నగా ,గారంగా పదం పదం నొక్కుతూ అని , మృదువుగా నవ్వింది . వెంకట నవ్వి చీకట్లో నెమ్మదిగా పాడటం మొదలు పెట్టాడు . పాట  మీద పాట వెళ్తూ   వుంది . కానీ,  శ్రీప్రియ మనసు పాటలపైన లేదు .  రూంలోకి వచ్చిన మొదట్లో కాసేపు ,అతనేమయినా చేస్తాడేమో అని బితుకుగా అనిపించింది ,ఇప్పుడు అతనేమయినా చేస్తే బాగుండు అని అలజడి మొదలయింది . కాసేపటికి చాలా కేజువల్గా అన్నట్లు అతని వైపు తిరిగి అతని చేయి అందుకుని  పెదవులకు ఆనించుకుని ముద్దుపెట్టి ” థాంక్ యు ,నిద్రొస్తుంది , ఇక పడుకో అంది ” వెంకట్ పడుకోలేదు , ఆమె  చేయిని విడిచిపెట్టనూ లేదు . ఇంతకాలంలో శ్రీప్రియ ఎప్పుడూ అలా ముద్దు పెట్టలేదు , ఈ ఏకాంతంలో ఆమె చేసిన ఆ చుంబనకు , ఆమె నోటితో చెప్పని  మాటలకు  అర్థమేమిటో అతని మనసు గ్రహించింది .

మరుసటి రోజు పొద్దునే వాళ్లిద్దరూ యూనివర్సిటీకి వచ్చేసారు . ఆ తరువాత వారం రోజులు శ్రీప్రియ వెంకట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు . అతనికి ఎదురు పడాల్సి వచ్చిన ప్రతి సందర్భాన్ని తప్పించింది . ఈ సారి వెంకట్ క్రితంలా నిలకడగా ఉండలేక పోయాడు . పిచ్చెక్కి పోయింది అతనికి   . ఆ రోజు రాత్రి మెత్తటి , తెల్లటి పావురాయిలా ఆమె తన భుజంపైన తల పెట్టుకుని తన ఛాతీ చుట్టూ చేయివేసిన నులివెచ్చటి మృదు క్షణాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి . చివరికి ఒక రోజు  డిపార్ట్మెంట్ బయట ఆమెని చెయ్యి పట్టుకుని దొరకబుచ్చుకున్నాడు  . మాట్లాడాలన్నాడు . ఆమె నిర్లిప్తంగా సరే అని తలూపి ,అతని వెనక నడిచింది .

ఇద్దరూ ఏకాంతపు చోటు వెదికి  కూర్చున్నారు . ఇప్పుడతనికి ఆత్మవిశ్వాసం వుంది . ఆమె ప్రవర్తన కొంత అనుమానానికి తావిస్తున్న ,ఆమె తనది అనే ధీమా వుంది అతనికి . అందుకే కొంత విసురుగా , తలవంచుకుని కూర్చున్న ఆమె చుబుకాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ,” ఏంటి , ఏమైంది ? ఫోన్ లిఫ్ట్ చేయలేదెందుకు? ” అన్నాడు . శ్రీప్రియ బదులీయలేదు ,కానీ ”నాకు చచ్చిపోవాలని వుంది వెంకట్ , నేను తప్పుచేసాను , నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు , నిన్ను ఇబ్బంది పెట్టాను , నేను చచ్చిపోతాను ” అని భోరుమని ఏడవటం మొదలు పెట్టింది . అప్పటిలా వెంకట్ ” సరే అట్లాగే పెళ్లి చేసుకోవద్దులే ” అని ఈ సారి భరోసా ఇవ్వలేదు . మౌనంగా కూర్చున్నాడు . స్వతహాగా అతను పెద్ద మితభాషి . ఏదయినా కష్టమొస్తే తనలోకి తాను మరింత ముడుచుకు పోతాడు . ఈ సారీ అలానే  ముడుచుకుపోయాడు . అతనికి ఆమె మాటలకు అర్థం తెలుసు . తాను ఇప్పుడిక ఆమెనుండి వెనక్కి రాలేను అనీ తెలుసు . అందుకే చాలాసేపటి ఎక్కడో చూస్తూ , ”నేను నిన్ను బాగా చూసుకుంటాను శ్రీ , నీకోసం కష్టపడతాను , సంపాదిస్తాను , నన్ను పెళ్లిచేసుకో శ్రీ , అయామ్ రిక్వెస్టింగ్  యు ” అన్నాడు . అన్నాడే  కానీ,  అతనికి తెలుసు ,శ్రీప్రియ వాళ్ళకున్నంత ఆస్తి సంపాదించాలంటే తాను తన జీవితకాలమంతా కష్టపడినా సరిపోదని ! అందుకే వినటానికి ఇంపితంకాని ఆ మాటలని అంతకంటే మరి పొడిగించలేక మౌనంగా కూర్చున్నాడు  . ఏడుస్తున్న ఆమెను ఓదార్చలేదు . కాసేపటికి ఇద్దరూ విప్పని పొడుపు కధని అక్కడే వదిలేసి మౌనంగా ఎవరి దారిన వాళ్లు హాస్టల్ కి వెళ్లారు .

ఆ రాత్రి శ్రీప్రియ అదితికి చెప్పింది జరిగిందంతా , అదితికి ఆశ్చర్యమేసింది , అసలు శ్రీప్రియ ఇబ్బందేమిటి ? వెంకట్  చురుకయినా వాడు , శ్రీప్రియ కూడా  ఏదో ఒక వుద్యోగం చేయకలదు , ప్రేమ వుంది , కులందేముంది అని . అదేమాట శ్రీప్రియతో అంది . శ్రీప్రియ , ”అతనికి వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రాణం ,అంత  పేద వాళ్ళతో ఎలా బ్రతకడం ” అంది .  అదితి ఆ మాటలు విని నిర్ఘాంతపోయి ”ఏయ్ శ్రీ ! యు ఆర్ కిడ్డింగ్  … రైట్ , ఈ మాటలు నీ లాటి భావవాదికి సరిపోవు ” అంది . శ్రీప్రియ కాసేపటికి ” యా … ఆమ్ కిడ్డింగ్ ! కానీ కారణం చెప్పలేను ఇది కుదరదంతే” అన్నది . ఆమె కంఠంలో దృఢత్వాన్ని చూసి అదితి మరేం మాట్లాడలేదు . కానీ మనసులో అనుకున్నది ,”శ్రీ చేసింది కరక్ట్ గా లేదు , షి ఈస్ ప్లేయింగ్ విత్ హిం , డెలిబరేట్లీ ” అనుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నది .

వెంకట్ నుండి శ్రీప్రియకి  ఫోన్ రాలేదు , అతను కనిపించనూ లేదు . ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు . చూసి చూసి కొన్ని   రోజులకు శ్రీప్రియ అతనికి మెయిల్ పెట్టింది , మాట్లాడాలి ప్లీస్ అని . అతనొచ్చాడు . ఆమె మళ్ళీ అదే అన్నది ”ఫ్రెండ్స్ గా ఉందాం ” అని . వెంకట్ కి ఆ మాట వికారంగా అనిపించి ,నవ్వి ”అట్లాగే ”అని వెళ్ళిపోయాడు . కానీ శ్రీప్రియ అతన్ని వదిలి పెట్టలేదు . అతనితో స్నేహమే కాదు ,అతనితో సెక్స్ ను కూడా ! పొరపాటుగా అన్నట్లో గ్రహపాటుగా అన్నట్లో వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగేది . సెక్స్ తరువాత ఆమె అతని భుజంపైన తలపెట్టుకుని పడుకునే క్షణాలలో ఇద్దరం ఇలాగే చచ్చిపోతే బాగుండు  అనిపించేది అతనికి . తనని విడిచిపెట్టి ఆమె బ్రతకలేదు అని ఎక్కడో ఒక ఆశ మెదిలేది . అలాటి రోజుల్లో ఒక సారి వారం రోజులకని ఇంటికెళ్లిన ఆమె , పెళ్లి పత్రికలు  పట్టుకుని యూనివర్సిటీ కి వచ్చింది .

శ్రీప్రియ చేతిలో పెట్టిన కార్డు చూసి వెంకట్ నిర్ఘాంత  పోయాడు. పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్వెర్ కంపెనీలు నడుపుతున్నాడు , పూర్వీకులు ఏదో రాజ సంస్థానానికి అతి దగ్గరి వారు . చాలా ధనికులు . కార్డు మీద వేసిన ఫొటోలో రాకుమారుడిలా వున్నాడు . వెంకట్ ఏమైనా మాట్లాడేలోపే శ్రీప్రియ అంది , పదిహేను రోజుల్లో పెళ్లి , పెళ్లి చేసుకుని వస్తాను , మేక్  మీ కన్సీవ్  , నీ బిడ్డను పెంచుకుంటాను . రాజులాగా పెంచుతాను , నీ గొంతు వాడికి వస్తే ఈ ప్రపంచానికే పెద్ద సింగర్ ని చేస్తాను ” అని వెంకట్ వళ్లో  తల పెట్టుకుని ఏడ్చింది . ఎందుకో అతనేం మాట్లాడలేదు . ఆమె పెళ్ళికి వెళ్ళాడు . ఆమె పుట్టిన రోజుకి వెంకట్  ఆమెకో స్పోర్ట్స్ వాచ్  ప్రెసెంట్ చేసాడు . పెళ్ళికి ఆమె అది పెట్టుకుంది . పెళ్లి అలంకరణకు అది నప్పలేదు అని ఎవరెంత చెప్పినా దాన్ని తియ్యలేదు .

untitled

వెంకట్ తిరిగి యూనివర్సిటీకి వచ్చాడు . ఫ్రెండ్స్ అందరూ అతన్ని జాలిగా చూడటం మొదలు పెట్టారు . అతను వాళ్ళని తప్పించుకొని తిరగటం మొదలు పెట్టాడు . స్పోర్ట్స్  వాచ్ కట్టుకుని పెళ్లిచేసుకున్న శ్రీప్రియ రూపం ,భుజంపై తల పెట్టుకుని చెవిదగ్గర కువకువలాడే ఆమె మృదు స్వరం , నీ బిడ్డను పెంచుకుంటాను అన్నపుడు ఆమె ఆవేశం అతని గుండెల్లో జోరీగల్లా వినిపించేవి .శ్రీప్రియ  పెళ్లయిన నాలుగో రోజు లైబ్రరీ నుండి వస్తుంటే క్లాస్మేట్ వికాస్ కేంటీన్ దగ్గర ఎదురుపడి ,”వెంకట్ గాడిని బాగా వాడింది ,ఇప్పుడెళ్ళి పెళ్లి చేసుకున్నది అంటున్నారు రా   అందరూ , ఇటువంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి  భయ్యా, దానికి నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని ముందు తెలీదా  ” అన్నాడు  . వెంకట్ వికాస్ కి ఏమీ  బదులీయలేదు కానీ మరుసటి రోజుకి అతని శవం లైబ్రరీ వెనుక కనిపించింది .

మనుగడుపులై యూనిర్సిటీకి వచ్చిన శ్రీప్రియకు అతని చావు కబురు తెలిసింది . అదితి ఏం ప్రస్తావించక పోయినా శ్రీప్రియ తో ముభావంగా ఉండటం మొదలు పెట్టింది . అంతకు ముందుకూడా అందరితో కలివిడిగా వుండే అలవాటు లేని శ్రీప్రియ అలాగే  ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసి అమెరికాకు వెళ్లి పోయింది .

అమెరికాకు వెళ్లిన కొంత కాలానికి శ్రీప్రియకు మొగుడితో కొడుకు కూడా పుట్టాడు . కొడుకు పుట్టకముందు కూడా ఉన్నా,  కొడుకు పుట్టాక ఆమెకు సెక్సువల్ ఫ్రిజిడిటీ ఎక్కువయింది . సెక్స్ అంటే తనకు చాలా ఇష్టమయినా ఇలా అవడానికి  కారణమేమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థంకాదు . మొగుడువిసుక్కుంటాడనే భయంతో అతను కావాలన్నపుడు బిగదీసుకుని అతని పక్కన పడుకుంటుంది , పడుకున్నాక కళ్ళు మూసుకుని వెంకట్ స్పర్శని గుర్తు తెచ్చుకుంటుంది . అలా గుర్తు తెచ్చుకున్న కాసేపటికి ఆమె శరీరం మేఘమంత తేలికై ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది  . అలా ఆ సమయంలో  వెంకట్ ను గుర్తు తెచ్చుకోవడం  ఇప్పుడామెకి అలవాటుగా మారింది  .

సామాన్య 

 

మజిలీ మాత్రమే!

afsar1

 

విత్వం వొక గమ్యం కాదు,

అదెప్పుడూ వొక మజిలీ మాత్రమే.

అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. దీన్ని ఎవరూ ఏ ఆనకట్టా వేసి బంధించలేరు. బంధించిన చోట కవిత్వం నిలవ నీరైపొతుంది. కట్టుగొయ్యలూ కృత్రిమమైన కట్టుబాట్లూ ఆకవిత్వాన్ని మాత్రమే రాయించగలవు. ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం. ఇక్కడే వుంటానన్న సుస్థిర భావన అకవిత్వం. ఇక్కడే వుండిపోలేనన్న అస్థిరమైన వలస జీవనం కవిత్వం.

afsar4

-ఇవన్నీ కవిత్వానికి నిర్వచనాలు కాకపోవచ్చు. ఇవి నా నమ్మకాలు మాత్రమే. ఇవి మూఢ నమ్మకాలైనా నాకు ఇష్టమే. ఎవరి ఇష్టానిష్టాల కోసమో కవిత్వం రాయడం నాకు కష్టం కాబట్టి.

కవిత్వ ప్రయాణం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. నాకు మాత్రం నా ప్రతి కవితా వొక కొత్త ప్రయాణమే. ప్రాణాన్ని పొదిగే వాక్యాలు విఫలమైన నా కోర్కెలు.  ఆ వాక్యాలు ఆదిమ గోడ మీద అస్పష్టమైన చిత్రాలే ఇప్పటికీ!

afsar2కవిత్వ ప్రయాణం ఇప్పటికిప్పుడో రేపో మాపో అంతమయ్యేదీ కాదు. దేవుడు మరణించాడని చెప్పిన  వాళ్ళు కూడా కవిత్వం మరణిస్తుందని మాత్రం చెప్పలేరు. పుస్తకాలు మ్యూజియంలో తప్ప ఇంకెక్కడా కనిపించవని నమ్మబలుకుతున్న కాలంలోనూ కవిత్వం బతుకుతుంది. కవిత్వం అంటే నల్లగా మారిన కాయితం కాదు కాబట్టి-

కవిత్వం అచ్చులోంచి పుట్టిన మూస కాదు. లిఖిత లిపి కాదు. గుండెలోంచి గొంతులోంచి పొంగుకొచ్చే శబ్దానికి శైశవ రూపం. ఎన్ని కరువుకాలాలు వెంటాడినా, ప్రకృతి ఆకుపచ్చదనాన్ని మరచిపోయినా ఆకాశం నీలిమని రాల్చుకున్నా గాలి ఊపిరాడక వురేసుకున్నా …నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది. నేలని వెతుక్కుంటూ ఇంకో నేల వున్న చోటికే వలస పోతుంది. అందుకే స్థలరాహిత్యంలో మాత్రం అది బతకదు.

కవిత్వం విశ్వజనీనం సార్వకాలీనం అనే భ్రమలు బద్దలైన కాలంలోకి మనం వచ్చాం. సర్వ కాల సర్వావస్థల్లోనూ వుపయోగవస్తువు కాగలిగిన కవిత్వాన్ని బాగా శంకించాలి. ఈ కాలాన్ని కాదని అతీతరేఖల మీద సాహంకారంగా సంచరించే అక్షరాల్ని వొదులుకోవడమే ఇప్పటి కవిత్వ జీవలక్షణం. ఎప్పటికీ ఎవరూ వదిలించుకోలేని వర్తమానం కవిత్వ ప్రాణం. సమకాలీన స్థల కాలాల్లోకీ…ముఖ్యంగా తన కాలంలో వొదగలేని కవిత్వం ఇప్పుడు బొత్తిగా అనవసరం. ఆ మాటకొస్తే కవి తన స్థలకాలాల్ని అన్వేషించడానికే రాస్తాడని నాకు అనిపిస్తుంది.

జీవితం అంటే నలుపూ తెలుపూ కాదనీ, ఇతరేతర రంగు తేడాలూ వున్నాయని, వ్యవస్థ అంటే వున్న వాళ్ళూ లేని వాళ్ళే కాదనీ ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలున్నాయని ఇప్పుడేమీ నేను కొత్తగా చెప్పడం లేదు. ఈ నిర్దిష్టత అర్ధమైన తరవాత ఇప్పటి దాకా మనం రాస్తున్నదల్లా అమూర్త కవిత్వమే అన్న నిజం తెలిసింది. జీవితం వ్యాఖ్యానాలలో లేదనీ, క్రూరమైన వాస్తవికతలో ఉందనీ అర్థమైంది. ఆ మేలుకొలుపులోంచి వచ్చిన రెండు తరాలని చూస్తూ వాళ్ళ అంతరంగాల అలజడిని వెతకడానికి భాష చాలక రోదించిన క్షణంలో ఈ పాటలన్నీ పాడుకున్నాను. ఇందులో నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొక మూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట మానసాన్ని.

నిన్నటి కన్నా ఎక్కువగా భయపెడ్తున్నా ఇవాళ్టినే ప్రేమిస్తున్నా. ఇవాళ్టి కన్నా అస్థిరంగా కనబడుతున్నా రేపటినే కళ్ళలోకి నిలుపుకొంటున్న అనేక సమూహాల అస్తిత్వ వేదనని నేను.

afsar5

afsar3

నిన్నటి నించి ఇవాళలోకీ, ఇవాళ్టి లోంచి రేపటిలోకీ వలసపోతున్న జీవన యాతన నేను. అందుకే, నా వాక్యాల్లోని ఏక వచనం నేను కాదు, అనేకం! నేను ఇప్పుడు ద్వీపం కాదు, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న లాంతరు అనుక్షణిక వెలుగు.

ఈ చిన్ని వెలుగులోనే దారి వెతుక్కోవాలి. కాస్త చోటిమ్మని నేలని అడగాలి. ఆగకుండా సాగిపోయే కాలం నించి అర అర క్షణాలుగా బతుకు క్షణాల్ని అప్పడగాలి.

అప్పో సప్పో చేసి ఆగిపోకుండా నడవాలి, నడుస్తూనే వుండాలి.

నేలని నమ్ముకున్న వాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. వలస పాదాలక్కూడా అదే దారి. నేల అంతమయ్యే చోట అవి తెగిపోతాయి, దారిలానే!

తెలియని దారిలో వొంటరిగా వెళ్తున్నప్పుడు భయంతో అరుస్తాం. ఏవేవో మాటలు పాటలుగా పాడుకుంటాం. మొండి ధైర్యంతో కాళ్ళని నేలకేసి కొడతాం. అలా నడవని నేలకూ, నడిపించే కాళ్ళకూ, దగ్గిరే దగ్గిరే అనిపించే ఆకాశానికీ మధ్య వెతుకులాట ఇదంతా.

దీనికో గమ్యం మాత్రం లేదు, అదొక్కటీ అడక్కండి!

 

(12 డిసెంబర్ 2000)

డిసెంబర్ ఇరవై హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం సందర్భంగా  మళ్ళీ…

telugu-award

రాచకురుపు

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఇరవై రెండేళ్ల ప్రాయంలో, అమెరికాలో గాలన్ పెట్రోలు పాతిక సెంట్లు ఉన్న రోజునుంచి అది మూడు డాలర్లుకి పెరిగే రోజులొచ్చేసరికి, నలభై ఐదేళ్ళు పనిచేసి రిటైరైపోయాడు విశ్వం. ముగ్గురు పిల్లల్ని కని, పెంచి ఓ ఇల్లు కొని తీరిగ్గా నడుం వాలుద్దామనుకునేసరికి రిటైర్మెంటు ఎదురుగా వెక్కిరిస్తూంది. పిల్లల్లో ఒకడు డాక్టర్ అవగలిగేడు గానీ మిగతా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పిల్లలందరూ ఏవో ఉద్యోగాల్లో కుదురుకున్నారు వాళ్ళ ఓపికా, కోరికల ప్రకారం. విశ్వం రిటైరయ్యేనాటికి యామినికి ఇంకో ఐదేళ్ళు పనిచేసే జవసత్వాలు ఉన్నా మరో రెండేళ్ళకి ఆవిడా రిటైర్మెంట్ తీసుకుంది, రిటైరైన అందర్లాగానే ఇద్దరూ కలిసి ప్రపంచం చూసిరావడానికి.  ప్రపంచం అంతా కాకపోయినా ఇలా ఓ మూలకీ అలా రెండో మూలకీ తిరిగొచ్చేసరికి మొహం మొత్తింది ప్రయాణాలంటే. అప్పట్నుండీ టి.వి చూసుకోవడం, అప్పుడో సారీ, ఇప్పుడో సారీ దగ్గిర్లో గుడికెళ్ళడం, మరెప్పుడైనా పిల్లల్తో ఫోన్లూ, రాకపోకలూ, హితులూ, స్నేహితులూ హలో అంటే హలో అనుకోవడం; వంకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయల్తో రెగ్యులర్  గా గడిచిపోతున్న జీవితంలో ఒక్కసారి విశ్వానికి ఎప్పుడూ తగలని ఎదురుదెబ్బ తగిలింది. ఓ రాజు రాత్రి లేచి లఘుశంకకి వెళ్ళినప్పుడు రక్తం పడడం గమనించాడు. ఏదో వేడి చేసిందేమో అనుకోవడానికి లేదు జనవరి నెలలో. ఇంతటి చలిలో కూడా రక్తం పడేంత వేడి చేయడం తన వయసుకి అసంభవం కాకపోయినా విశ్వానికి అర్ధంకాలేదు ఎందుకలా అయిందో. తాను తినే శాకాహార భోజనానికి రక్తం పడే అవకాశం లేదే?

అర్ధరాత్రి యామినిని లేపి ఆవిడ బుర్ర తినేయకుండా మర్నాడు చెప్పాడు రక్తం సంగతి. మొదటగా ఆవిడ చేసిన పని డాక్టర్ కొడుక్కి ఫోన్ చేయడం.

బిజీగా ఉన్న కొడుకు ఫోన్ ఎత్తలేదు కానీ మరో గంటలోపున వెనక్కి ఫోన్ చేసాడు. విషయం అంతా విన్నాక చెప్పాడు. “దీన్ని హిమాటూరియా అంటారు. దానికి కారణాలు అనేకం. ఇన్ ఫెక్షన్ కావొచ్చు, బ్లేడర్, కిడ్నీలలో రాళ్లవల్ల కావొచ్చు. ప్రోస్టేట్ గ్రంధి వల్ల కూడా కావొచ్చు,” కేన్సర్ అనే పదం నోట్లోంచి రాకుండా జాగ్రత్తపడుతూ.

యామిని ఫోన్ చేతికిస్తే వేరే గదిలోకి ఫోన్ తీసుకెళ్ళి విశ్వం అడిగాడు, “ఒరే దీని మూలాన నాకు యూరిన్ బ్లాక్ అవుతుందా, దానికో గొట్టం, ఓ బ్యాగూ తగిలిస్తే దాన్ని నేను జీవితాంతం మోస్తూ తీసుకెళ్ళాలా?”

తండ్రి గొంతుకలో ఆదుర్దా గమనించి చెప్పాడు, “డాడ్, మరీ అంత కంగారు పడకండి. ఉత్తి ఇన్ ఫెక్షన్ అవ్వొచ్చు. చిన్న మందుతో పోతుంది. డాక్టర్ దగ్గిరకి అంటే యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళండి వెంఠనే.”

ఫోన్ పెట్టేసేముందు విశ్వం “ఇది కేన్సర్ అవొచ్చా?” అనే ప్రశ్నకి డాక్టర్ కొడుకు సమాధానం చెప్పకుండా, “ముందు యూరాలజిస్టుని కలవండి, తర్వాత చూద్దాం” అన్నాడు.

ఫోన్ పెట్టేసిన విశ్వం కొడుకు డాక్టర్ సురేష్ ఆలోచనలు పరిపరి విధాలా పోయేయి. తనకి తెల్సినంతలో విశ్వం తల్లి బ్రెస్ట్ కేన్సర్ పోయింది. ఆవిడ రోజుల్లో ఇంతమంది డాక్టర్లూ లేరు, ఇన్ని మందులూ లేవు. పోయే రోజుకి రెండు మూడు నెలలముందు మాత్రం ఆవిడకి తెలిసింది కేన్సర్ అని. ఏవో ఆయుర్వేదం మందులూ, తాయెత్తులూ కట్టారు గానీ అప్పటికే పూర్తిగా ఆలస్యమైంది. ఆవిడ పోయేనాటికి కేన్సర్ మెటాస్టసైజ్ అయ్యి అంగాంగాలకీ పాకిపోయి ఉండొచ్చు. ఆ పరిస్థితిల్లో ఎవరేం చేయగలరు? లింఫ్ నోడ్స్ లోకి చాపకింద నీరులా పాకిపోయే కేన్సర్ ని ఆ మృత్యుంజయుడైనా బాగుచేయగలడా? ఏవో కొన్ని చోట్ల నోడ్స్ ని సర్జరీతో తీసేసినా అది పాకుతూనే ఉంటుంది…” తల విదిల్చి ఆలోచనలు తప్పించడానికి రెసెప్షనిస్టు తో చెప్పి ఆఫీసులోంచి బయటకొచ్చి మెల్లిగా రోడ్డుమీద నడవడం సాగించాడు. ఎవరో ఒక్కసారి షాక్ లాగా కుదిపినట్టూ ఓ ఆలోచన బుర్రలో చొరబడింది, “తన తండ్రి విశ్వం వేసిన ప్రశ్నే తన పేషెంట్ వేసి ఉంటే ఏమి సమాధానం చెప్పి ఉండేవాడు? అసలు ఏది చెప్పాలో, చెప్పకూడదో నిర్ణయించుకోవడం ఎలా? పేషెంట్ తో అబద్ధం ఆడకూడదు సరే మరి నిజం చెప్తే పేషెంట్ తట్టుకోగలడా?” ఎటూ తేల్చుకోలేక కాసేపు అలా తిరిగి మళ్ళీ ఆఫీసులోకి వచ్చి పేషెంట్లని చూడ్డం మొదలుపెట్టాడు.

* * * * * * * * *

విశ్వానికి యూరాలజిస్టు దగ్గిర అపాయింట్ మెంట్ దొరకడానికి మరో మూడు రోజులు పట్టింది. అప్పటికి ఓ సాంపిల్ లేబ్ కి తీసుకెళ్ళడంతో యూరాలజిస్టు రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పేడు, “ముందీ మందు ట్రై చేయండి. తర్వాత ఓ ఎం.ఆర్. ఐ, ఓ సి.టి స్కాన్ తీయించండి. అన్నట్టు మీరు గతంలో ఎప్పుడైనా పి.ఎస్.ఏ టెస్టు చేయించుకున్నారా? వాటి తాలూకు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? కాలనోస్కోపీ చేయించారా ఈ మధ్య?”

యామిని చెప్పింది సమాధానం, “పి.ఎస్.ఏ టెస్ట్ చేయించి రెండేళ్ళవుతోంది. అప్పట్లో మామూలుగానే ఉందన్నారు ఈయన డాక్టర్. కాలనోస్కోపీ తీయించి అయిదేళ్ళు అవుతోంది.”

“అయితే మరో సారి చేయించండి. ప్రోస్టేట్ సంబంధించినది అయితే చిన్న వాపు అయినా, ఇన్ ఫెక్షన్ అయినా కావొచ్చు.”

“ఇది కేన్సర్ కావొచ్చా?” విశ్వం అడిగేడు మొహం పాలిపోతుంటే.

కాసేపు సాలోచనగా చూసి యూరాలజిస్ట్ అడిగేడు, “మీ వంశంలో ఎవరికైనా కేన్సర్ ఉందా?”

“మా అమ్మగారు బ్రెస్ట్ కేన్సర్ తో పోయారు దాదాపు ముఫ్ఫై ఏళ్ల క్రితం. మరెవరికీ లేదు.”

తల పంకించేడు యూరాలజిస్టు, “సరే అయితే, ఇది కేన్సరా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది ఈ టెస్టులన్నీ చేసాక. అప్పటిదాకా ఏమీ నిర్ధారించలేం. మందు వాడి చూడండి, ఏమైనా గుణం కనిపించవచ్చు.”

మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాతి వారంలో అన్ని స్కాన్ లూ తీయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిగా చూసుకోవాల్సింది ఇన్స్యూరెన్స్. డాక్టర్ రోగ నిర్ధారణ ఇంకా చేయలేదు కనక ఈ స్కాన్ లన్నింటికీ చాలా మటుక్కి ఇన్స్యూరెన్స్ ఇచ్చింది డబ్బులు. అయినా సరే విశ్వం జేబులోంచి మరో అయిదారు వేల డాలర్లు పడ్డాయి కో-పే అనే పేరుతోటీ, కో- ఇన్స్యూరెన్స్ అనే పేరుతోటీను. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రజల బాగు కోసమా వాటి బిజినెస్సు బాగు పడ్డానికా? ఏదైనా ప్రశ్నలడిగితే “అరే, మీరు కట్టిన ప్రీమియం డబ్బులకీ మేము ఇచ్చిన ట్రీట్ మెంటు డబ్బులకీ ఓ సారి పోలిక చూసుకోండి” అనే దెప్పడం ఎప్పుడూ ఉన్నదే.

స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చి మరోసారి యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళవల్సి వచ్చేసరికి విశ్వానికి మందు గుణం ఇస్తున్నట్టు కనిపించింది. రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. ఈ సారి యూరాలజిస్ట్ దగ్గిరకెళ్ళేసరికి కొడుకు సురేష్ కూడా వచ్చేడు.

రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పాడు యూరాలజిస్ట్, “పి. ఎస్. ఏ టెస్టులో 7.5 అని వచ్చింది. మందు వాడుతున్నారు కదా ఏదైనా గుణం కనిపించిందా?”

సురేష్ తండ్రికేసి చూస్తే విశ్వం చెప్పాడు సమాధానం “రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. మరో కొన్ని రోజులు వాడమంటారా?”

“వాడి చూడండి. మీ స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. వాటిలో మీ ప్రోస్టేట్ వాచినట్టు ఉంది. దానికి బయాప్సీ చేస్తే తెలియవచ్చు. కానీ ఒక్కోసారి మందులతో కూడా తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు. బయాప్సీ చేస్తే మరిన్ని తెలుస్తాయి.”

యూరాలజిస్టు చెప్తున్నది విశ్వం విన్నాడో లేదో కానీ “డాక్టర్, అర్జెంట్ గా బాత్రూం కి వెళ్ళాలనిపిస్తోంది. ఈ లోపుల మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారా?”

“వెళ్ళిరండి, ఏం ఫర్వా లేదు”

విశ్వం లేస్తుంటే డాక్టర్ అన్నాడు యామినితో, “మీరు కూడా వెళ్ళండి ఆయనికి తోడుగా”

వాళ్ళటు వెళ్ళగానే సురేష్ అడిగాడు యూరాలజిస్టుని, “స్కాన్ లలో కేన్సర్లాగా ఏదైనా కనబడిందా?”

“క్రిస్ట్ మస్ లైట్స్”

“అంటే?”

“మీ నాన్నగారికి కేన్సర్ లాంటి కణితి ప్రతీ అవయవంలోనూ ఉన్నట్టు రేడియాలజిస్ట్ రాసారు.” స్కాన్ లో కేన్సర్ కణితిలు క్రిస్ట్ మస్ లైట్లలాగా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.”

“మై గాడ్”

యూరాలజిస్ట్ ఏమి చెప్పాలో తెలియక తల పంకించాడు.

మరో కొద్ది క్షణాలు ఆగి సురేష్ నోరు ఎండిపోతూండగా అడిగేడు, “సర్జరీతో తీసేయవచ్చు కదా?”

“అది నేను చెప్పలేను. ఇప్పుడు మీకు చెప్పేదొక్కటే. అర్జెంట్ గా ఆంకాలజిస్ట్ ని కలవండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది.”

కాసేపటికి వచ్చిన విశ్వాన్నీ తల్లినీ తీసుకుని ఇంటికొచ్చాడు సురేష్. ఆ పై వారంలో ఆంకాలజిస్ట్ ని కలిసాక మరిన్ని టెస్టులూ, ప్రోస్టేట్ బయాప్సీ చూసి చెప్పేడు ఆంకాలజిస్ట్, “మీ నాన్నగారికి మూడో స్టేజ్ కేన్సర్. ఇది ప్రస్తుతానికి లివర్ లో, కిడ్నీలలో, ప్రోస్టేట్ లో ఉందని గుర్తించాం. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి ఉంటుందని నా అనుమానం. పెద్ద, చిన్న పేగుల్లోకి వెళ్ళిందా అనేదానికి ఇంకా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది.

విశ్వం మొహం పాలిపోయింది. ఆ తర్వాత సురేష్, అంకాలజిస్ట్ మాట్లాడుకున్న మెడికల్ పదాలు విశ్వానికి, యామినికీ అక్కడక్కడా అర్ధమయ్యాయి కానీ ఇంకా గజిబిజిగా ఉంది. తానింకా చాలా కాలం బతుకుతాడనీ మరో డాక్టర్ దగ్గిరకో, మరో హాస్పిటల్ కో వెళ్తే బాగుండొచ్చనీ లేకపోతే హోమియోపతీయో, ఆయుర్వేదమో పనిచేస్తుందనీ పేషంట్ ఎప్పుడూ డాక్టర్ కన్నా పాజిటివ్ గా ఉంటాడా?

ఇంటికొస్తూంటే విశ్వం కారులో కళ్ళుమూసుకున్నాడు. మందు ప్రభావమో మరొకటో గానీ నిద్ర పట్టినట్టుంది. యామిని దార్లో సురేష్ ని అడిగింది, ” సురేష్, అంకాలజిస్ట్ చాలా సార్లు మెటాస్టసైజ్ అనే మాట అన్నారు. అంటే ఏమిట్రా?”

కొరడా దెబ్బ మొహం మీద ఛెళ్ళున తగిలిన భావన. డ్రైవ్ చేస్తోన్న కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క లేన్ లోకి వెళ్ళబోతూంటే అక్కడొచ్చే కారు అదే పనిగా హార్న్ కొట్టడంతో సురేష్ తెలివి తెచ్చుకుని సరిగ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి మళ్ళీ అడిగింది, “మెటాస్టసైజ్ అనేది కేన్సర్ కి సంబంధించినదేనా?”

“ఇంటికెళ్ళాక చెపుతానమ్మా, ఇప్పుడు డ్రైవ్ చేయాలి. ఇప్పుడే పక్క లేన్ లోకి వెళ్ళిపోబోయాను చూసావా?”

* * * * * * * * *

రాత్రి విశ్వం పడుకున్నాక ఆలోచనలు బుర్ర తినేస్తూంటే మనసు మరల్చడానికి టి.వి చూస్తూ కూర్చున్నాడు సురేష్. యామిని వంటపని పూర్తయ్యాక వచ్చి కూర్చున్నప్పుడు చిన్న గొంతుకతో చెప్పాడు “మెటాస్టసైజ్ అంటే కేన్సర్ వేరే అంగాలకి పాకుతోందని అర్ధం. ఎంతవరకూ ఎన్ని చోట్లకి పాకింది అనేది పూర్తిగా టెస్టులు చేస్తే గానీ చెప్పరు. కానీ మందులూ కీమో థెరపీ వాడి చూడొచ్చు.” మాట్లాడుతూంటే తన గొంతులో తనకీ, అమ్మకీ నమ్మశక్యంగా ఏమీ చెప్పలోకపోతున్నాడనే ధ్వని గమించాడు సురేష్. లోపల మాత్రం మూడో స్టేజ్ కేన్సర్ అంటే తండ్రి మహా అయితే మరో రెండేళ్ళు బతుకుతాడేమో అనిపించింది.

ఓ వారం అక్కడే ఉండి తండ్రిని కీమో థెరపీకి, అమ్మని వీటన్నింటినీ చూడడానికి కుదుర్చిపెట్టాక ఇంటికి బయల్దేరాడు. ఇవి అలా జరుగుతూండగానే రోజులు పరుగెడుతూ ధేంక్స్ గివింగ్ దగ్గిరకొచ్చింది. శెలవులకి పిల్లలందరూ కుటుంబాలతో ఓ చోట చేరారు తల్లినీ తండ్రినీ చూడ్డ్డానికి.

తల్లీ తండ్రీ పడుకున్నారనుకున్నాక సురేష్ మిగతా అందరితో చర్చించేడు తండ్రికొచ్చిన కేన్సర్ విషయం. అంతకు ముందు ఫోన్ లో విన్నదే అయినా ఇప్పుడు తండ్రిని చూసేసరికి తెలుస్తూన్న విషయం – ఆయనింకెంతో కాలం బతకడు. నిర్జీవమైన కళ్ళూ, కీమో థెరపీ వల్ల ఊడిపోయే జుట్టూ, బయాప్సీల వల్ల నిరంతరం పడే నెప్పీ, వాటికి మందులూ ఇవన్నీ ఓ ప్రహసనం. ఎంత మనసు వేరే దానిమీద పెడదామన్నా నిరంతరం మనసుల్లో కదిలే ఒకే ఒక పదం  “కే-న్స-ర్.” మనిషి జీవితాన్ని అత్యల్పంగా చేసి తోలుబొమ్మలాగా నిరంతరం ఆడించే ఒకే ఒక వదుల్చుకోలేని దారుణమైన జాడ్యం. అదృష్టవంతులైన వాళ్ళలో రిమిషన్ ఉండొచ్చేమో కానీ నూటికెంతమంది రిమిషన్ కి నోచుకునేది? అయినా ఈ వయసులో తండ్రికి రిమిషన్ వచ్చేనా? అందరికన్నా ఎక్కువ కంగారు పడినది మొదటి సంతానం అయిన కూతురు. సురేష్ ఇంతకుముందు డాక్టర్లతో మాట్లాడాడు కనక కాస్త కుదురుగానే ఉన్నాడు. మూడో సంతానం వినీత్ కి ఏమి చేయాలో తెలియక అలాగే స్తబ్దుగా కూర్చున్నాడు. మొదటగా నోరు విప్పినది వాడే. “సురేష్, ఇప్పుడు నాన్నకి వచ్చిన కేన్సర్ కి అన్ని టెస్టులూ చేయించి, అంతమందికి చూపించాలి కదా మరి ఆయన ఇస్యూరెన్సూ, మెడికేర్ ఇవన్నీ కవర్ చేస్తాయా?”

“కొన్ని చేస్తాయి, కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు. చివరిదాకా ఈ పోరాటం కేన్సర్ మీదా, ఇన్స్యూరెన్స్ కంపెనీల మీదాను.”

“మరి ఇన్స్యూరెన్స్ కవర్ చేయకపోతే ఎలా?”

“జేబులోంచి పెట్టుకోవాలి. కొంత నేను సర్దగలను. అందరూ తలో చేయి వేస్తే సులభం.”

వెంఠనే కూతురు అంది, “నేను ఒక్క సెంటు కూడా సర్దలేను. పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉద్యోగం మానేసి రెండు నెలలైంది; మరో రెండేళ్ళు ఆగి మరో ఉద్యోగం చూడాలి. మా ఆయన్ని అడిగితే మహా అయితే ఐదువేలు సర్దొచ్చు.”

చివరి కొడుకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పావుగంట గడిచాక సురేష్ అడిగాడు వినీత్ ని, “ఏరా, నువ్వు ఎంత డబ్బులు సర్దగలవు?”

“మహా అయితే పదో, పదిహేనో.”

“మీరిచ్చే ఇరవై, కేన్సర్ ట్రీట్ మెంటుకి ఈ మూలకి? కనీసం యాభై సర్దుతారేమో అనుకున్నాను.”

“…”

సమాధానం లేకపోవడం చూసి కూర్చున్న సురేష్ లేచి చెప్పాడు గోడకేసి తిరిగి ఎవరికో చెప్తున్నట్టూ, “నేను ఇంటిమీద రెండో అప్పు తీసుకుని ఈ కేన్సర్ పని పట్టాలి అయితే; కని పెంచిన నాన్నకి ఇలా అయిందని తెల్సినా మీరిద్దరూ ఇలా అన్నారంటే …”

ఈ మాటలన్నీ నిద్రపోకుండా పై గదిలోంచి పడుకున్నాడనుకున్న విశ్వం, యామినీ విన్నారని పిల్లలకి తెలియలేదు.

* * * * * * * * *

శెలవులు అయిపోయాక ఇంటికెళ్ళబోయే ముందు అందర్నీ కూచోపెట్టి చెప్పాడు విశ్వం, “నాకు డభ్భై దాటుతున్నాయి. ఈ వయసులో వచ్చే రోగాలు మందులకి తగ్గడం కష్టం. ఈ కేన్సర్ మందులతో, కీమోథెరపీతో నా వళ్ళు హూనం అవుతోంది. నాకిప్పటికి అర్ధమైనదేమిటంటే, నేను మూడో స్టేజ్ లో ఉన్నాను. ఇక్కడ్నుంచి ఆంకాలజిస్టూ, యూరాలజిస్టూ మిగతా డాక్టర్లూ ఎంత నన్ను నమ్మించడానికి  ప్రయత్నం చేస్తున్నా ఇది వన్ వే ట్రాఫిక్కే. ఎందుకంటే కేన్సర్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిందని చెప్పారు. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిన కేన్సర్ తగ్గడం దాదాపు అసంభవం. ఈ కేన్సర్ పాకిన ఒక్కో అవవయం తీసేసి నన్ను మరో రెండేళ్ళు బతికించవచ్చేమో. అప్పుడు నేను జీవఛ్ఛవాన్నే కదా? దీనిమీద ఖర్చులు చూడబోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగా తయారౌతున్నై. ఇలా ఒక్కో స్టేజ్ దాటుకుంటూ చావడం కంటే అన్ని ట్రీట్ మెంట్లూ మానేసి మూడు నాలుగు నెలల్లో పోవడమే మంచిది. ఇప్పుడు అద్దంలో నా మొహం చూసుకోవడానికీ నాకే భయం వేస్తోంది. దీనికి డబ్బులు తగలేయడం శుద్ధ దండుగ. యామినితో చెప్పాను కూడా. నేను పోయాక లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి. అవి యామినికి సరిపోతాయి సోషల్ సెక్యూరిటీ డబ్బులతోటి. అందువల్ల మీరందరూ కంగారు పడి డబ్బులు వేస్ట్ చేయకండి. అందరం ఎప్పుడో ఒకసారి పోవాల్సినవాళ్ళమే. ఇప్పుడు నాదీ వంతు.”

సురేష్ చెప్పేడు వెంఠనే, “అలాక్కాదు, మీకు కేన్సర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా ఈ కేన్సర్ ని ధైర్యం గా ఎదుర్కోవాలి గానీ అలా డీలా పడిపోకూడాదు. నాకు తెల్సున్న కొంతమంది డాక్టర్లు ఉన్నారు. నేను కనుక్కుంటా. డబ్బులదేవుంది; కుక్కని కొడితే రాల్తాయి. అప్పు తీసుకున్నా తర్వాత కట్టేయవచ్చు.”

విశ్వం కళ్ళలో కాస్త మెరుపు కనిపించింది. అది కొడుకు తనని బాగా చూసుకుంటున్నాడనా లేకపోతే కేన్సర్ నిజంగా తగ్గిపోయి తన ఆరోగ్యం బాగై పోతుందనా?

వెంఠనే అందరూ ఏక కంఠంతో అన్నారు, “అవునవును కేన్సర్ కి అలా లొంగిపోకూడదు. పోరాడవల్సిందే.”

అంతా విన్న విశ్వానికి ఇంక తప్పలేదు. సురేష్ తనకున్న ఇంటిమీద హోం ఇంప్రూవ్ మెంట్ లోన్ తీసుకోడానికీ, కేన్సర్ మీద పోరాటానికీ నిశ్చయం అయిపోయింది. విశ్వం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

* * * * * * * * *

మూణ్ణెల్లు గడిచాయి. సురేష్ తీసుకున్న అప్పు అలా పెరుగుతోందే కానీ విశ్వానికేమీ తేడా కనిపించినట్టు లేదు. దీనికితోడు అటూ ఇటూ రాకపోకలవల్ల సురేష్ ప్రాక్టీస్ కుంటుబడడం, రాబడి తగ్గడం మొదలైంది. చాప కింద నీరులా కేన్సర్ అలా పెరుగుతూనే ఉంది. కొంతమందికి కేన్సర్ ఖర్చులు మొదట్లో ఎక్కువగా ఉన్నా అవి మెల్లిగా తగ్గిపోతాయి కేన్సర్ తగ్గే కొద్దీ. వీళ్ళు మొదటి జాతి అదృష్టవంతులు అనుకోకుండానో, తెలిసో తమకి కేన్సర్ వచ్చినట్టు అతి చిన్న స్టేజ్ లో పట్టుకున్న వాళ్ళు. వీళ్ళు మరో ఇరవై ఏళ్ళదాకా బతకొచ్చు రోగం తిరగబెట్టకపోతే. తిరగబెడితే వీరి అదృష్టం తీరిపోయి రెండో కోవలోకి వస్తారు. ఈ రెండో కోవలో మొదట ఖర్చులు తడిసిమోపెడయ్యాక, కేన్సర్ మెల్లిగా తగ్గినట్టు అనిపించేసరికి ఖర్చులు తగ్గుతూ వస్తాయి. కానీ కొంతకాలాని కేన్సర్ మళ్ళీ వంటిమీదకి పాకడం మొదలుతుంది అప్పుడు ఖర్చులు పుంజుకుంటాయి. ఆ పుంజుకోవడం ఆకాశమే హద్దా అన్నట్టూ ఉండడంతో పేషంట్ కీ, అతనికి తెల్సిన చుట్టాలకీ స్నేహితులకీ అందరికీ అదో మానసిక పోరాటం. మొదటి అదృష్టవంతులకి ఖర్చు ఎక్కువగా మొదలై రోజులు గడిచే కొద్దీ టేపర్ అవుతాయి. రెండో దురదృష్టవంతులకి టేపర్ అయినట్టు కనిపించి ఖర్చు యు అక్షరం ఆకారంలో పడగ చాస్తుంది. ఎప్పుడైతే ఆ కోడె తాచు పడగ విప్పడం  మొదలైందో అప్పుడే ఆశలన్నీ వదులుకోవటం మొదలౌతుంది. కానీ మానవ జీవితంలో ఆశకీ కోరికకీ అంతులేదు కదా? పడగ నీడన ఏదీ మొలవదని తెలిసీ, ఆ ట్రీట్ మెంటు మింగలేకా, కక్కలేకా కొనసాగించాల్సిన పరిస్థితి.

మరో మూడు వారాలు పోయాక అంకాలజిస్ట్ విశ్వానికి చెప్పాడు, ” ఈమధ్య ఒక ఎక్స్ పెరిమెంటల్ మందు మా దగ్గిరకి వచ్చింది. అది కంపెనీలు ఇంకా టెస్ట్ చేస్తున్నారు. మీకున్న లక్షణాలవల్ల ఈ రీసెర్చ్ కి సరిపోతారు. ట్రై చేస్తారా?”

“ఇది మీరు కవర్ చేస్తారా లేకపోతే ఇన్స్యూరన్స్ ని అడగాలా?” అప్పటికీ పూర్తిగా జవసత్వాలు పోయిన విశ్వం అడిగాడు, కనీసం ఆర్ధికంగానైనా దెబ్బతినకుండా ఉండడానికి.

“మందు పూర్తిగా మేము కవర్ చేస్తాం. కానీ హాస్పిటల్ లో ఉండడానికీ డాక్టర్లకీ అలా కొంత చొప్పున ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.”

“ఆ ఖర్చు ఎంతవరకూ ఉండొచ్చు?”

“చెప్పలేమండి. మందు పనిచేస్తే తక్కువకాలం హాస్పిటల్లో ఉండడం. చేయకపోతే ఎక్కువ రోజులుండడం. ఏ ఒక్కరి కేసూ ఒక్కలా ఉండదు కదా?”

“సరే అయితే నేను ఇన్స్యూరెన్స్ కి ఫోన్ చేసి కనుక్కుని చెప్తాను.”

“అలాగే, మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు.”

* * * * * * * * *

ఇంటికొచ్చిన యామిని ఓ గంటపాటు ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఫోన్ మీద కుస్తీ పట్టాక వాళ్ళు చెప్పారు, “మీ డిటైల్స్ అన్నీ రాసుకున్నాము. ఎక్స్ పెరిమెంటల్ అన్నారు కనక అది మా మేనేజర్ ని అడిగి మీకు ఉత్తరం రాయాలి. దానికి మూడు నుంచి అయిదు రోజులు పడుతుంది….”

“మరి ఇది కేన్సర్ కదా, వెంఠనే ట్రీట్ మెంట్ మొదలు పెడితే గుణం కనిపించవచ్చు. అంతకన్నా ముందు చెప్పలేరా?”

“… అసాధ్యం. ఈ కేన్సర్ కేసులన్నీ ఒక్కొక్కటీ ఒకో టైపు. దేనికదే విడివిడిగా చూస్తాం. మాకున్న రూల్స్ ప్రకారం ఇలాంటివి అప్పుడప్పుడూ తొందరగానే ఆమోదించినా ఫోన్ మీద ఆమోదించరు. కానీ మీకు మరీ అంతగా కావాలంటే మరోసారి మంగళవారం ఫోన్ చేయండి.”

ఇన్స్యూరెన్స్ ఎలాగా ఒప్పుకుంటారనుకునీ, తర్వాత వారితో మాట్లాడొచ్చుఅనుకునీ యామిని విశ్వాన్ని ఎక్స్ పెరిమెంటల్ మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ డాక్టర్ ఆఫీసుకి చెప్పేసింది. ఆ వారం నుంచే మందు వాడడం మొదలైపోయింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా త్వరలోనే తలనెప్పిగా తయారవబోతోందని ఇద్దరికీ తెలియలేదు. బేంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి మంచిదా బేంకుకి మంచిదా? బేంకులు బిజినెస్సు చేసుకుంటాయి గానీ మనగురించి నిజంగా పట్టించుకున్నదెప్పుడు? అలాగే ఇస్యూరెన్స్ కంపెనీలూను.

* * * * * * * * *

ఆ పై వారంలో సోమవారం విశ్వం బాత్రూంలో పడి ఉంటే కొంచెం లేటుగా లేచిన యామిని కంగారుగా వెళ్ళి చూసింది. బాత్రూం నేలంతా రక్తం; నోట్లోంచి వచ్చిందే అని తెలుస్తోంది. ఓ 911 ఫోన్ కాల్ తర్వాత ఆఘమేఘాల మీద విశ్వం ఎమర్జన్సీలో ఎడ్మిట్ చేయబడ్డాడు. తర్వాత విషయాలు అన్నీ అందరి కేన్సర్ పేషంట్లకీ తెలిసొచ్చినట్టే విశ్వానికీ, యామినికీ కూడా పూర్తిగా తెలిసొచ్చాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలన్, ఇలా కేన్సర్ లేని అవయవం లేదు విశ్వానికి. మరో పెద్ద న్యూస్ ఏమిటంటే ఇప్పుడు కేన్సర్ అయిదో స్టేజ్ లో ఉంది. విశ్వాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి డాక్టర్ ఒప్పుకునేసరికి మరో మూడ్రోజులు పట్టింది. ఈ కంగార్లో హాస్పిటల్లో మంచం మీద తెలివి లేకుండా పడి ఉన్న విశ్వాన్ని చూసుకుంటూ మంగళవారం ఇన్స్యూరెన్స్ ఫోన్ చేయమన్నారన్న సంగతి యామినికి ఏ మాత్రం గుర్తు రాలేదు.

ఇంటికెళ్ళేసరికి ఇన్స్యూరెన్స్ దగ్గిర్నించొచ్చిన ఉత్తరం రడీగా ఉంది, “మీరు మాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు మా మానేజర్ చూసారు. మీరు చెప్పిన మందులూ అవీ ఇంకా ఎక్స్ పెరిమెంటల్ అన్నారు. అవి పనిచేస్తాయో లేదో ఝూడీగా తెలియదు. మందులు మీ డాక్టర్ ఆఫీసు కానీ మందుల కంపెనీలు కానీ ఇచ్చినా మిగతా ఖర్చులన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఇంతా చేస్తే ఈ మందు ఎఫ్. డి. ఏ అప్రూవ్ చేసినట్టు లేదు. అందువల్ల మేము ఈ ఖర్చులు భరిండానికి ఒప్పుకోము. మీకు ఈ విషయంలో మేము ఏమీ సహాయం చేయలేము. మీకు కలిగిన పరిస్థితికి మేము విచారిస్తున్నాము.”

విశ్వాన్నీ ఎలాగా మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ చెప్పేసారు కనుక ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా, ఇంక వెనక్కి చూసుకోకుండా కొడుకు సలహా తో మందు కంటిన్యూ చేయడానికి నిశ్చయం అయిపోయింది. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు ముందూ వెనకా చూసుకోవడం అనవసరం. ఇన్ని రోజుల్లోనూ అమ్మాయీ, రెండో కొడుకూ అప్పుడప్పుడూ వచ్చి చూస్తున్నా, ఫోనులు చేస్తున్నా డాక్టరైన సురేష్ దగ్గిర ఉన్నాడని ఏదో భరోసా కాబోలు, వాళ్ళిద్దరికీ అంత పట్టలేదు తండ్రి గురించి. ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఒకేలాగ ఉండాలని ఎక్కడుంది?

 

* * * * * * * * *

ఫోన్ మీద తల్లి చెప్పినవన్నీ విన్నాక సురేష్ తండ్రి దగ్గిరకి బయల్దేరాడు. ఈ సారి అంతా ఖాయం అయినట్టే. అయిదో స్టేజ్ లోంచి కేన్సర్ పేషెంట్ ని బాగుచేసి మామూలుగా చేయడం భగవంతుడిక్కుడా సాధ్యం కాకపోవచ్చు. బయల్దేరేముందు రోడ్డుమీద అలా నడుస్తూంటే అదే బ్లాకులో ఉంటున్న డేవిడ్ కనిపించాడు. డేవిడ్ ఏదో బిజినెస్ చేస్తూంటాడు. వాళ్ళావిడకి కూడా కేన్సర్ అని తెలుసు కానీ ఎప్పుడూ దాని గురించి మాట్లాడ లేదు. తన తండ్రికి కేన్సర్ వచ్చినప్పటునుండీ అసలు ఈ మధ్య ఎవరినీ కలవడం కానీ చూడ్డం కానీ కుదరనే లేదు. ఈ సారి డేవిడ్ పలకరించాడు, “హలో డాక్టర్ ఎలా ఉన్నారు?”

“ఏదో, అలాగే ఉంది. మీరో?”

“ఏం బాగు లెండి జీవితంలో ఢక్కా మొక్కీలు తప్పడం లేదు. మా ఆవిడ జెన్నీకి కేన్సర్ అని తెలుసు కదా? తనకి ఇంక తగ్గదనీ ట్రీట్ మెంట్ వద్దనీ చెప్పేసింది. ఈ కేన్సర్ డాక్టర్లు ఏదో చేస్తామన్నారు కానీ, ఒక్కో అవయవం తీసేసి జీవితాన్ని ముందుకి లాగుదామని చూస్తారు. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? అలా బతకడం కంటే పోవడమే మంచిదని జెన్నీ వాదన. కొన్ని రోజులు ఈ డాక్టర్ల చుట్టూ తిరిగే సరికి నాక్కూడా అదే నిజం అనిపించింది. మూడు వారాల క్రితం జెన్నీని ఫ్లోరిడా తీసుకెళ్ళాను ఆఖరుసారిగా వెకేషన్ పేరుమీద. అక్కడే హాస్పిటల్లో పోయింది. పోనీ లెండి అంత నొప్పితో, నరకం అనుభవించడం కన్నా అదే మంచిది. జెన్నీని బతికించుకోవడం బాగానే ఉండుండేది కానీ ఇలా అవయవాలు ఒక్కోటి తీసేసాక ఏమిటి బతికి ప్రయోజనం? రొమ్ము కేన్సర్ వచ్చాక సర్జరీ చేయించుకున్న మహిళలు మానసికంగా నరకం అనుభవిస్తారని ఎక్కడో చదివాను. అస్తమానూ నా స్వార్ధం చూస్కోవడం ఎలా? పోనీ లెండి, చివరికి ఎలగైతేనేం అయాం హేపీ ఫర్ హర్.”

సురేష్ చెప్పిన సారీ విని సురేష్ తండ్రికి కూడా కేన్సర్ అని విన్నాక మెకానికల్ గా ఓ సారీ చెప్పేసి ముందుకి సాగిపోయేడు డేవిడ్. వీళ్ళెంత ఈజీ మనుషులు? స్వంత భార్య పోయినందుకు మనసు ఎంత కష్టపెట్టుకున్నాడో పెద్దగా తెలియదు కానీ జెన్నీ చివరి రోజుల్లో కోరుకున్నట్టూ చేసి అయాం హేపీ ఫర్ హర్ అనగలిగేడు. మరి తానో? బుర్ర విదిల్చి చిన్నగా గొణుక్కుంటూ ముందుకి నడిచేడు.

* * * * * * * * *

తండ్రిని చూడ్డానికొచ్చిన సురేష్ కి చూడగానే మైన విషయం – తన తండ్రి మరో రెండు వారాలు బతికితే గొప్పే. సురేష్ వచ్చిన మూడో రోజు విశ్వానికి తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో చేయగలిగింది అంతా చేసాక ఎమర్జన్సీ డాక్టర్ చెప్పాడు బయటకొచ్చి, “రక్తంలో తయారైన క్లాట్ ఊపిరితిత్తుల్లోకి ఒకటీ, బ్రైన్ లోకి ఒకటి వెళ్ళాయి. మేము టి.పీ.ఏ మందు ఇచ్చినా ఏమీ గుణం కనిపించలేదు. ఈ క్లాట్ కేన్సర్ మందుల వల్ల వచ్చిందా, మరోదాని వల్లా అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడు హెమొరేజ్ వల్ల వళ్ళు తెలియదు ఆయనకి. కానీ మరి తెలివి వస్తే మీతో మాట్లాడ్డం కానీ, మామూలుగా జీవించడం కానీ అసంభవం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచితే మరో కొన్ని రోజులు బతకొచ్చు. బతికినా ఎవర్నీ గుర్తుపట్టడం గానీ మాట్లాడ్డం కానీ జరగదు అని మా మెడికల్ టీం అభిప్రాయం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచమంటారా, తీసేయమంటారా?”

కడుపులో ముఫ్ఫై అంగుళాల కత్తి వెన్నెముకకి అంటుకునేలా గుచ్చి ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగితే ఏమిటి సమాధానం? సురేష్ వెంఠనే చెప్పేడు, “ఓ పది నిముషాలు ఆలోచించుకోవచ్చా?”

“తప్పకుండా” ఎమర్జన్సీ రూం డాక్టర్ లోపలకి నడిచేడు.

యామిని అక్కడే కుర్చీలో నిశ్చేతనంగా కూలబడింది. తల్లిని వదిలేసి బాత్రూంలో దూరేడు కన్నీళ్ళు కనపడకుండా ఉండడానికి. చిన్నప్పుడు సరిగ్గా అన్నం తినకుండా ఇల్లంతా పరిగెడుతూంటే తనని కూర్చోపెట్టి కధలు చెప్తూ ఒక్కొక్క చెంచాతో అన్నం తినిపించిన తండ్రికి ఫీడింగ్ ట్యూబ్ ఉంచమని చెప్పాలా? తీసేయమని చెప్పాలా? నాన్నా, ఇలా సిమ్మింగ్ క్లాస్, అదిగో బేస్ బాల్ ప్రాక్టీస్, ఇక్కడ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పోరుతుంటే ఎక్కడకి పడితే అక్కడకి తీసుకెళ్ళిన తండ్రిని ఏంచేయాలి? తాను హిందువు కనక ఆ ధర్మం ప్రకారం ఫీడింగ్ ట్యూబ్ తీసేయడం మంచిదా? ఉంచడం మంచిదా? మోరల్ గా అయితే ఏం చేయాలి? తనదొక్కడిదీ కాదు నిర్ణయం. అయినా తల్లిని ఇప్పుడు ఏమని అడగాలి? అమ్మా ట్యూబ్ తీసేయమని చెపుదామా అని చెప్పాలా? లేకపోతే ఉంచుదాం, అప్పుడు తండ్రి బతికితే నువ్వు క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయన్ని చూసుకో అని చెప్పాలా? ఇప్పటికే ఈ కేన్సర్ వల్ల తల్లి చితికిపోయింది మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగానూ….. బుర్ర తినేసే ప్రశ్నలన్నీ ఒకదానిమీద ఒకటి సమ్మెట దెబ్బల్లా తగులుకుంతూంటే తల బద్దలౌతోంది. ఒక్కసారి చణ్ణీళ్లతో మొహం కడుక్కున్నాడు. కొంత తెరిపి పడ్డాక బయటకొచ్చాడు అయిదు నిముషాలకి.

యామిని, దగ్గిరకొచ్చిన కొడుకుని తలెత్తి  చూసింది. ఓ క్షణం ఆగి చెప్పింది, “మీ నాన్న ఇష్టం మొదట్నుండీ తెలుస్తూనే ఉంది. ట్రీట్ మెంట్ వద్దని చెప్పినా మనమే కొనసాగించాం. ఇంక ఈ దశలో ఏ మాత్రం ఉపయోగం లేదని డాక్టర్లు చెప్తున్నారు కదా, ట్యూబ్ తీసేయడమే మంచిది.”

తాను ట్యూబ్ తీసేయమంటే తల్లి ఏమంటుందో, అసలెలా చెప్పాలా అనుకుంటున్న సురేష్ కి తలమీదనుంచి పెద్ద బరువు దింపేసినట్టు అయింది. తల్లికేసి కాసేపు చూసి తన చేతిని అమ్మ చేయి మీద వేసి “అలాగే” అన్నాడు.

* * * * * * * * *

ఆ తర్వాత జరగవల్సినవన్నీ జరిగిపోయాయి. అమ్మాయీ, రెండో కొడుకూ వచ్చాక శరీరాన్ని దహనానికి అప్పగించడానికీ, అస్థికలూ అవి తీసుకుని ఇండియా వెళ్ళి గంగలో కలపడానికీ నిశ్చయించుకున్నాక ఎవరి పనుల్లోకి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచం ఒక్క మనిషికోసం ఆగదు కదా?

మరో రెండు రోజులు పోయాక అక్కనీ, తమ్ముణ్ణీ ఇంట్లో వదిలి యామినితో అస్థికలు తీసుకురావడానికి బయల్దేరాడు సురేష్. ఫ్యూనరల్ హోం లో వాటికోసం చూస్తూంటే ఎక్కడలేని నీరసం, నిస్సత్తువా ఆవరించాయి. వెనక్కి తిరిగి ఓ సారి చూసుకుంటే తనకి కొండచిలువలా తాడి ఎత్తున వికట్టహాసం చేస్తూ పెరిగిన అప్పు. ఇంత ఖర్చు పెట్టినా తన తండ్రి పడ్డ నిరంతర నరకం తప్పలేదు. ఏనాడూ తనని ఏదీ అడగని తండ్రి చివర్లో కూడా తమ శ్రేయోభిలాషే. తానెలాగా పోతాననీ దానికోసం ఇంత డబ్బు వేస్టు చేయొద్దనీ అడిగితే తానేమన్నాడు? తనకి తల్లీ తండ్రి తప్ప మరెవరూ బంధువులు లేరనీ, ఆయనపోతే తాము ఏకాకి అయిపోతారనీ తెలిసి తండ్రిని బతించుకోవడానికి – మిగతా ఇద్దరికీ పట్టకపోయినా – అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఇదంతా చూస్తే తానో పూర్తి స్వార్ధపరుడు. డేవిడ్ చెప్పినట్టూ తాను కూడా నిస్వార్ధంగా తండ్రిని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్తే చివరకి మనశ్శాంతితో హాయిగా పోయి ఉండేవాడా? ఇదంతా తన స్వార్ధం వల్లేనా? తలెత్త లేక అలా నేల చూపులు చూస్తూంటే పక్కనే ఉన్న తల్లి చేయి తన భుజం మీద పడటం గమనించాడు. ఒక్కసారి శోకం ముంచుకొచ్చింది. చటుక్కున బాత్రూములోకి దూరి వెక్కి వెక్కి ఏడిచాడు హృదయం పగిలేలా.

ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టాడా, ఖర్చుపెట్టిన డబ్బులకి ఎంత ఫలితం ఉందా అనేమాట పక్కన పెడితే, డాక్టరై ఉండీ ఏం సాధించాడు తాను? ఇన్నాళ్లూ తాను పోరిన పోరాటం శుద్ధ దండుగ. ఎంత నిబ్బరంగా ఉండి కేన్సర్ తో పోరాడి విజయం పొందుదామనుకున్నా, ఆఖరికి ఆ రాచకురుపే గెల్చింది. తమ పోరాటం ఆషామాషీ రోగంతో కాదు. నిరంతరం అనేక లక్షలమంది చేస్తున్నదే. తన తండ్రి బతుకుతాడా పోతాడా అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీలకి గానీ, ప్రతి రోజూ ఇటువంటి కేసులని చూసే హాస్పిటళ్లకి గానీ పట్టలేదు. వాళ్ల ఉద్యోగాలు వాళ్ళు చేసారు. ఫలానా ఎక్స్ పెరిమెంటల్ మందు పనిచేస్తే అది పనిచేసినట్టు కేన్సర్ మీద ఓ పేపర్ రాసుకునేవారేమో. అయినా వాళ్ల తప్పేం ఉంది ఇందులో? తన తండ్రి అనగా ఎంత? ఈ జన సముద్రంలో ఆయన కూడా ఓ నీటి బొట్టు…. మనసు మరల్చుకోవడానికి ఓ సారి తండ్రి చదివే భగవద్గీతలో శ్లోకం గుర్తు తెచ్చుకున్నాడు సురేష్, “జాతస్య హిధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్యచ, తస్మాద పరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి”

విశ్వం అస్థికలూ, చితాభస్మం ఉన్న డబ్బా పట్టుకుని ఫ్యూనరల్ హోం నుంచి తల్లి యామినితో వెనక్కి వస్తూంటే సురేష్ మదిలో ఎందుకో ఒక్కసారి మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ పాఠం చెప్తూ అన్న మాట గుర్తొచ్చింది “కేన్సర్ అనేదో రాచకురుపు. అది మనిషి జీవితాన్నే కాదు, మనసులనీ, మనుషుల మనఃస్తత్వాన్నీ, మన మధ్య బాంధవ్యాలనీ మన బేంక్ ఎకౌంట్లనీ, ముందు రాబోయే రోజులనీ అన్నింటినీ పూర్తిగా మార్చి వేయగల అసాధారణ శతృవు. కేన్సర్ వచ్చిన మనిషి ఒకేసారి ఛస్తాడు, కానీ ఆ తర్వాత పేషంట్ తాలూకు చావు దెబ్బ తగిలిన మృతశేషులు అంటే సర్వైవర్స్, ప్రతీ రోజూ ఛస్తూనే ఉంటారు చాలా కాలం వరకూ.”

కళ్ళలో నీళ్ళు చిమ్ముతూంటే పక్క సీట్లో కూర్చున్న తల్లికి కనబడకుండా వాటిని అదిమిపెట్టి కాలు బలంగా ఏక్సిలెరేటర్ మీద నొక్కాడు. ఏక్యురా కారు కీచుమంటూ ఇంటివేపు దూసుకుపోయింది.

* * * * * * * * *

 

మన “ఆధునికత” వొట్టి డొల్ల!

painting: Rafi Haque

painting: Rafi Haque

 

సాంస్కృతిక సామ్రాజ్యవాదం తృతీయ ప్రపంచదేశాలప్రజల మానసిక దౌర్భల్యాలనూ, ముఖ్యంగా అణగారిన ప్రజల్లో తమ “వెనుకబాటుతనం”, “సాంప్రదాయకత” పట్ల ఉన్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని వారికి ఒక రకమైన “వేగాన్నీ”, భావ ప్రకటనా స్వేఛ్ఛనీ ఇస్తున్నట్లుగా ఫోజు కొట్టి , వారి పాత కుటుంబ సామాజిక సంబంధాలను విచ్చిన్నం చేస్తుంది. తన కొత్త సంబంధాలను ప్రవేశ పెడ్తుంది. సంప్రదాయ వాదులనే ముద్రను చూసుకొని భయపడే తృతీయ ప్రపంచ దేశాల ప్రజల పట్ల , ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదం “స్వేచ్చగా అభిప్రాయాలు వెలిబుచ్చడం” పేరిట నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. మార్కెట్ అనే వొకే వొక్క ఆధునిక దైవం వుందని, దానికి అడ్డుగా వచ్చే సాంప్రదాయిక సంబంధాలన్నీ నాశనం చేయాలని సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఉపదేశిస్తోంది ( జేమ్స్ పెట్రాస్).

యింకా సాంస్కృతిక సామ్రాజ్యవాదం “ఆధునికత” అనే భాహ్య చిహ్నాలను ఆరాధించేలా చేస్తుంది. స్వతంత్ర వ్యక్తిత్వం పేరిట వ్యక్తివాదం పేరిట సామాజిక సంబంధాలపై దాడి చేస్తుంది అంటాడు జేమ్స్ పెట్రాస్. ప్రజలను వారి సాంస్కృతిక మూలాలనుంచీ, ఒకరికొకరు  యిచ్చిపుచ్చుకొనే సంప్రదాయాల నుంచీ తొలగించి ఆ స్థానంలో మీడీయా సృష్టించిన కృత్రిమ అవసరాలను ప్రవేశపెడ్తోంది అంటాడు. యిందుకు ఉదాహరణగా తమ వాతావరణానికి అనుకూలంగా వుండే,  వదులుగా, హాయిగా వుండే సంప్రదాయ దుస్తులను త్యజించి, తమకు తగని టైట్ బ్లూ జీన్ ఫ్యాంట్లు ధరించాలనీ, పెట్టుబడిదారీ మార్కెట్ డిమాండ్లకు తలవంచాలనీ, తృతీయ ప్రపంచ దేశాల ప్రజలను ప్రోత్సహించడమే కాదు,  నిర్బంధిస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

జేమ్స్ పెట్రాస్ పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాదం గురించి మాట్లాడడానికి చాలా సంవత్సరాల ముందే బ్రిటీష్ పరిపాలనా కాలంలోనే సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శని ఎక్కుపెట్టిన తెలుగు మేధావి విశ్వనాథ సత్యనారాయణ. భాష, వ్యవసాయం, కళలు, వొకటేమిటీ, అన్ని రంగాల్నీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం కబళించి వేయడాన్ని భారతీయ గ్రామీణ వ్యవస్థ నేపథ్యంలో చిత్రించారు విశ్వనాథ. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టుగానే, సంప్రదాయవాది, వెనుకబడినవాడు, ఫ్యూడల్ అనే వొక్క మాటతో ఆయన్ని నిరాకరించేవారు కమ్యునిస్టులు. వారి దగ్గర ఆధునికత అనే అస్త్రం వుంది.

ముఖ్యంగా భారత దేశంలో ఆధునికత అంటే వలసవాద ఆధునికతే.  యీ వలసవాదాన్నే సూర్యోదయంగా భావించారు కెవిఆర్ లాంటి కమ్యునిస్టు మేధావులు. వలసవాదాన్ని సర్వాత్మనా సమర్ధించిన గురజాడ, కందుకూరి వీరేశలింగంపంతులు వైతాళికులుగా అవతరించడంతో ఆధునికతకి రాజముద్ర పడింది. ఆధునికతని సందేహించడమే పాపమై పోయింది.

మన “ఆధునికత” తెచ్చిపెట్టుకున్నదీ, వలసవాదం వల్ల దిగుమతి ఐనదీ కావడం వల్ల కావచ్చు- దానిలో లోతు తక్కువ. మనకి  బెట్రాండ్ రసెల్ వంటి వైవిధ్యభరతమైన ఆలోచనలు కల మేధావులు లేరు. తీవ్ర వలసవాద ప్రభావం వల్ల కావచ్చు. మావోలా స్వదేశీ తత్వాన్ని జీర్ణించుకున్న మేధావులు బలంగా ముందుకు రాలేదు. ఫలితం ఆధునికత కాదు. వలసవాద లక్షణం కల ఆధునికత.  దేశీయమైన ప్రతీదాన్నీ,  స్థానికమైన ప్రతీదాన్నీ వెనుకబాటుగా చిత్రిస్తూ,  మేధావిలా కాదు, రౌడీలా,  పోలీసులా ముందుకొచ్చింది.  చైనాలో మావో పురాణకథల్ని ఉటంకిస్తాడు. మన పురాణాల్ని  ప్రస్తావిస్తే ఎక్కడ తిరోగమనంగా భావిస్తారోనని కొడవటిగంటి వాపోయారు.

దీని వల్ల జరిగిన పొరపాటు యేమిటంటే భారతీయ గతాన్ని పూర్తిగా నిరాకరించడం, లేక గతాన్ని పూర్తిగా కీర్తించడం అనే రెండు విధానాలు ముందుకొచ్చాయి.మొదటి పద్ధతి అగ్రెసివ్, రెండవది స్వీయ రక్షణాత్మకం (డిఫెన్సివ్). మొదటిది లెప్ట్, రెండవది రైటు. అందువల్ల విశ్వనాథ సత్యనారాయణ, బెంగుళూరు నాగరత్నమ్మ లాంటి వారిని తిరస్కరించడమో, పూజించడమో జరిగింది గానీ, వారి సామాజిక ప్రాధాన్యాన్ని గుర్తించడం జరగలేదు. వారి సామాజిక పాత్ర తిరోగమనశీలమైనదిగా నిరాకరించబడింది. లేక వారిని విగ్రహాలుగా  మార్చి  పూజించడం జరిగింది. ఈ రెండు పాత్రలూ వారి పాత్రని మరుగు పరిచేవే.

కందుకూరి వీరేశలింగంపంతులుని వైతాళికుడిగా కీర్తించే కమ్యునిస్టులు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన బెంగుళూరు నాగరత్నమ్మ పోరాటశీలతని ఎలా అర్థం చేసుకోవాలో విచారణ జరపనే లేదు. కెవిఆర్ అనే కమ్యునిస్టు మేధావి మగవాళ్ళని మించి పచ్చిగా శృంగారం రాసిందని నిందించిన ముద్దుపళని, “రాధికా స్వాంత”నాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడింది బెంగుళూరు నాగరత్నమ్మ. సిగ్గు అనేది ఆడవాళ్ళకు మాత్రమే ఉండవలసిన నీతా అని సవాలు విసిరింది. ముద్దుపళని శృంగారం రాసిందంటూ గోల చేసిన వీరేశలింగం అంతకంటే పచ్చి వర్ణనలున్న పుస్తకాలను మద్రాసు యూనివర్సిటీకి పాఠ్యపుస్తకాలుగా సిఫారసు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించింది. “రాధికా సాంత్వ”నాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అసభ్యమని నిషేధించింది. యీ నిషేధం వెనుకా,  అసలు మొత్తంగా దేవదాసీ వ్యవస్థే రద్దు చేయాలన్న ప్రయత్నం వెనుకా వీరేశలింగం ఉన్నారు. కానీ బెంగుళూరు నాగరత్నమ్మ దేవదాసీ వ్యవస్థని సమర్ధించారు. వ్యభిచారం మీద ఆందోళన పేరుతో కళలతో ముడిపడ్డ వ్యవస్థని రద్దు చేయడం తగదని పేర్కొన్నారు. “యీ రకంగా మొత్తం జాతిని నిషేధించాలనుకోవడం వెర్రితలలు వేసిన ప్రెంచి విప్లవం లాంటి” దని నాగరత్నమ్మ,  “ఆధునికత” సాంప్రదాయ సామాజిక సంబంధాల మీద చేస్తున్న ఏకపక్ష దాడిని వ్యతిరేకించారు. విశ్వనాథ దేవదాసీ పాత్రని సహానుభూతితో చిత్రించారు వేయిపడగలులో.  దేవదాసీ నృత్యాలు, భరతనాట్యం పేరుతో అగ్రవర్ణికరించబడ్డాయి చివరికి. బ్రిటీషువారు భారతీయ శృంగార గ్రంథాలను, జాతి చైతన్యాన్ని ప్రోది చేసే రచనలను కూడా నిషేధించారు. దానిలో భాగంగా విశ్వనాథ రాసిన ఆంధ్ర ప్రశస్తిని నిషేధించారు.

ఆధునిక క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథంతో భారతీయ సామాజిక అంశాల్ని తిరస్కరించారు. అంతేకాదు. జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టు తమ వునికి, సమాజం మొత్తంగా వెనుకబాటుతనంతో నిండి వున్నాయని, ఆ స్థానాన్ని వలసవాద భావాలతో భర్తీ చేయాలనీ భావించారు. అందుకే ముద్దుపళని శృంగార కావ్యాలని వ్యతిరేకించిన వీరేశలింగం పాశ్చాత్య శృంగార కథల్ని అనువదించి ముద్రించడానికీ, వాటిని పాఠ్యగ్రంథాలుగా సిఫార్సు చేయడానికీ వెనుకాడలేదు. అందువల్ల సెక్స్ అపవిత్రం అనికాదు, భారతీయ సెక్స్ అనాగరీకం, వెనుకబాటుతనం అనే న్యూనతా భావం ఆధునికుల్ని వెంటాడింది. యీ దృష్టితోనే దయానంద సరస్వతి ( ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు) శ్రీకృష్ణుని శృంగార లీలలతో కూడిన భాగవత పురాణన్ని నిషేధించాలన్నాడు. యీ విధంగా స్థానిక సంప్రదాయాలూ, సామాజిక సంబంధాలూ, విశ్వాసాలూ, పాశ్చాత్య వలసవాద సాపేక్షికంగా నిరాకరింపబడ్డాయి. మార్కిస్టు మేధావులు యిదే పని చేసారు. ఎందుకంటే మార్క్స్ కూడా భారతీయ విశ్వాసాలూ, పూజా విధానాలూ, మనిషిని పశువుని పూజించే  పశు స్థాయికి దగజార్చేవిగా వున్నాయని విమర్శించాడు. సాంస్కృతికంగా ఉన్నతులైన పాశ్చాత్యుల పరిపాలన వల్ల భారతీయులు ఉద్ధరించబడ్తారని అంటాడు. అంటే మతం మత్తుమందు అనే మాట నిజమే కానీ కల్లు కన్న సారా గొప్పది. సారా కన్నా  విస్కీ గొప్పది. యీ సాపేక్షికత -పాశ్చాత్య వలసవాద సాపేక్షికత,  లెప్టునీ రైటునీ వెంటాడింది.

అందుకే హిందూత్వ వలసవాద సిద్ధాంతకర్త సావర్కర్ అన్ని రకాల ఆచారాల్నీ, సంప్రదాయాల్నీ తిరస్కరించాడు. భార్యకు కర్మకాండ జరపలేదు. తనకు కూడా కర్మకాండ జరపవద్దని వీలునామా రాసాడు. గుళ్ళూగోఫురాలూ తిరగవద్దన్నాడు. గోపూజని పరిహసించాడు. పాశ్చాత్య ఫాసిస్టు జాతీయ వాదం నుంచీ స్పూర్తిని పొందాడు. ఆర్యసమాజమైనా, బ్రహ్మసమాజమైనా యిలా పాశ్చాత్యం నుంచీ స్పూర్తిని పొంది ఏకేశ్వరోపాసన, వొకే గ్రంథం లాంటి ప్రొటెస్టెంట్ భావనలని పుణికి పుచ్చుకోవడానికి ప్రయత్నించాయి.

మనం తీవ్రంగా వలసవాద దాస్యంలో కూరుకపోవడం వల్ల చరిత్రని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారింది. నిజానికి కొన్ని ప్రాంతాలకి, కొన్ని కుటుంబాలకి పరిమితమైన సతీసహగమనం వలసవాద ప్రమేయం వల్ల మితిమీరిపోయిందని వెండీడోనేగర్ రాసారు (హిందూస్- ఏన్ ఆల్టర్నేటీవ్ హిస్టరీ). భారతీయుడు ఎవరైనా యిలా రాయగలడా? రాస్తే అతడు వెనుకబాటుదనంలోకీ సంప్రదాయంలోకీ కూరుకపోయినట్లుగా చిత్రించబడ్తాడు. అలాగే మనుస్మృతికి మితిమీరిన ప్రాధాన్యం వలసవాదుల కాలంలోనే వొచ్చిందని ఆమె రాసారు. మనుస్మృతిని చేతిలో పుచ్చుకున్న మొట్టమొదటి పాశ్చాత్య అనువాదకుడు విలియం జోన్స్ విగ్రహం ఇంగ్లండులోని ప్రముఖ చర్చి ముందు వుందని ఆమె రాసారు. అంతేకానీ అలాంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా కానరాదని ఆవిడ రాసారు. గ్రామీణ జీవితంలో మతగ్రంథం ప్రమేయం లేకపోవడాన్ని విశ్వనాథ, శార్వరీ నుంచీ శార్వరీ దాకా అనే నవలలో చిత్రించారు. అంటే అక్కడ మౌఖికమే ప్రధానం అన్న మాట.

ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే లెప్టుకు కానీ రైటుకు కానీ స్థానిక సంప్రదాయ సంస్కృతులతో ఏమాత్రమూ సంబంధం లేదు.

నిజానికి హిందూత్వని, ఆరెస్సెస్ లాంటి సంస్థల్నీ పోషించిన వాళ్ళు మహారాష్ట్రకు చెందిన చిత్పవన్ భ్రాహ్మణులు. నిజానికి శివాజీ ఆస్థానంలో ఉన్న సంప్రదాయ బ్రాహ్మణులు దేశస్థ భ్రాహ్మణులే. శివాజీ గురువులు సమర్ధ రామదాసు దేశస్థ బ్రాహ్మణుడే. చిత్పవన్ బ్రాహ్మణులు 17వ శతాబ్ధంలో హఠాత్తుగా వెలుగులోకి వచ్చారు. వీరు లౌకికులు. సంప్రదాయంతో వీరికి సంబంధం లేదు. వీరు సైన్యంలో పనిచేసారు. రాజకీయాల్లో ఆరితేరారు. పీష్వాలు వీరే. శృంగేరీ పీఠంపై దాడి చేసి దోపిడీ చేసిన బ్రాహ్మణుడు చిత్పవన బ్రాహ్మణుడే. ఆయన పేరు పీష్వా పరుశరామ భావూ. అప్పుడు శృంగేరీ మఠానికి రక్షణ కల్పించినదీ, తిరిగి సంపదనిచ్చినదీ టిప్పుసుల్తాన్. అందుకే 23వ శ్రుంగేరీ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి టిప్పుసుల్తాన్‍కి వ్యతిరేకంగా బ్రిటీష్ వారు రాసిన చరిత్రని ఖండించారు.

అలా శంకరాచార్యులు స్థాపించిన శృంగేరీ మఠంపై దాడి చేసిన చరిత్ర కలిగిన వారే చిత్‍పవన బ్రాహ్మణులు. అందుకే హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ కుల నిర్మూలనని  సమర్ధించాడు. అంబేద్కర్ మహద్ పోరాటానికి మద్దతు పలికాడు( అంబేద్కర్, సావర్కర్ ల జీవిత చరిత్రలు రెండూ రాసిన ధనుంజయ కీర్ ఈ విషయం రాసారు) సావర్కర్ దృష్టి విశాల హిందూ ఐక్య సంఘటన మాత్రమే. అది పూర్తి రాజకీయ పరమైనది.

1927లో సావర్కర్ సంగీతఉష్రాఫ్ అనే నాటకం రాసాడు. అదే ఏడాది ప్రదర్శన జరిగింది. అంటరానితనం, అగ్రకులాల హిందువులలో ఉన్న దౌష్ట్యం, దీని ఫలితంగా హిందూ కులాలు ఇస్లాం మతానికి మార్పు చెందడం, బ్రాహ్మణీయ హైందవంలో ఉన్న పరిమితులు, భారత దేశంలో ముస్లీంల అజెండా- యివన్నీ యీ నాటకంలో చర్చించిన అంశాలు. ఐతే యీ నాటకంలో ముస్లీంలని హిందూ స్త్రీలని అపహరించుక వెళ్ళే దుర్మార్గులుగా చిత్రించాడు (హిందూత్వ- జ్యోతిర్మయశర్మ)

దీనిలోసావర్కర్  మతమార్పిడికి హిందూమతంలోని కులవివక్ష, లోపాలే కారణమని పేర్కొనడం విశేషం. అంబేద్కర్ కూడా అలాగే భావించాడు.  కానీ యిద్దరూ ముస్లీంలు ప్రమాదకరమైనవాళ్ళే, దాడి చేసే దుందుడుకు స్వాభావం కలవాళ్ళేని వ్యాఖ్యానించారు. గురజాడ మతము- విమతము అనే కథలో ముస్లీముల బలవతపు మార్పిడుల  గురించి రాశాడు.

ఆధునిక విద్య ( ఇంగ్లీషు విద్య) నేర్చిన వాళ్ళూ, అన్ని రకాల సంస్కర్తలూ, ముస్లీంలని ప్రమాదంగా భావించారు.అదే సమయంలో ఇంగ్లీషు వాళ్ళని ఉద్ధారకులుగా భావించారు. వందేమాతరం గేయరచయిత బకించద్ర చటర్జి ముస్లీం దౌష్ట్యం నుండీ భారతీయులని యింగ్లీష్ వాళ్ళు కాపాడారన్నాడు ( ఆనందమఠం).

ముస్లీంలని దుర్మార్గులుగా చూపడంఅనేది బ్రిటీష్ పాలనకి, వలస ఆధునికతకి వొక సమ్మతిని కూర్చడంలో భాగంగా మారింది. అదే సమయంలో హిందూ అనైక్యతే ముస్లీంల విజయానికి కారణంగా వర్ణించబడింది. కనుక హిందువుల సంస్కృతి కూడా లోపభూయిష్టమైనదే. కులం దాని ప్రధాన లోపం. కనుక కులాలనీ, కులసంస్కృతులనీ నిర్మూలించి హిందూజాతీయవాదాన్ని నిర్మించాలి. కులం పునాదులపై  జాతిని నిర్మించలేమని అంటాడు అంబేద్కర్. సావర్కర్ అంగీకరిస్తాడు. అందుకోసం హిందూ ఐక్యత అవసరం. ఈ ఐక్యతలో ముస్లీం వ్యతిరేకత విడదీయరాని భాగం అని సావర్కర్ దృక్పథం.

వలస వాదం ఆధునికతపై లెఫ్టిస్టులకీ,  రైటీస్టులకీ యిద్దరికీ వ్యతిరేకత లేదు. ముఖ్యంగా సాంస్కృతిక వలసవాదంపై విమర్శ లేదు. అందుకే శ్రీశ్రీ  “దేశచరిత్ర” కవితలో ఇంగ్లీషు నియంతల పేర్లు వుండవు. ఎందుకంటే యింగ్లిషు వాళ్ళ రాక దైవప్రేరితమని బకించంద్ర చటర్జి, వీరేశలింగం లాంటి  వాళ్ళు భావించారు. మార్క్స్ చారిత్రక అనివార్యతగా,  చారిత్రక పురోగతిగా భావించాడు. ముస్లీం పరిపాలన యథాతథవాదంగా నిర్వచించబడింది.

వలసవాదంపై,  సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై విమర్శ లెఫ్టిస్టు రైటిస్టు బృందాల నుండీ రాలేదు. సంప్రదాయ విద్యావంతుల నుండీ వచ్చింది. ముఖ్యంగా వలసవాదం తీసుకొని వచ్చిన సాంస్కృతిక సామాజిక మార్పుపై విమర్శ.

 

భాషని గురించే తీసుకోండి. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ప్రముఖ ఆఫ్రికన్ రచయిత గుగి “డీకలోనైజింగ్ మైండ్ ” అనే గ్రంథం రాసాడు. ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తెలుగునాట ప్రధానంగా విమర్శించింది కవికోకిల జాషువా. ముక్కుతిమ్మన, తిక్కన లాంటి తెలుగు ప్రబంధకవులతో భైరన్, మిల్టన్, గోల్డ్ స్మిత్ లాంటి ఆంగ్లరచయితలు ఏమాత్రం పోటీపడలేరు. స్వకీయులైన కవులు నాటుగా భావించబడ్తున్నారు.  ఆంగ్ల భాషాకవులు నీటుగా భావించబడుతున్నారు అని ఆయన బాధపడతాడు. జాషువా ఆత్మకథలో( గబ్బిలం ) ఇంగ్లీషు భాషాధిపత్యం వల్ల తనకి గుర్తింపులేకుండా పోతోందని బాధపడ్తాడు. ఆధునిక కవులలో అందరికీ స్థానమిచ్చిన ముద్దుకృష్ణ,  “వైతాళికు”లలో జాషువా లేడు. అంటే వారి దృష్టిలో ఆయన వైతాళికుడు కాదు. ఆయనకి  ఆంగ్ల విద్యా సంపర్కము లేదు. పైగా సంస్కృతం, ఆంధ్రభాషలనభ్యసించి పద్యకవిత్వాన్ని అభ్యసించాడు. కాళిదాసు రాసిన మేఘసందేశాన్ని విలోమీకరించి “గబ్బిలం”  రాశాడు. ఆయన తిరుగుబాటులోనూ  సంప్రదాయకతని విడనాడలేదు. వలసవాదాన్ని యింగ్లీషుభాషా సాహిత్యాలని ప్రమాణంగా భావించిన గురజాడని సమకాలీన కవులందరూ ప్రస్తుతించారు.కానీ జాషువాని మాటమాత్రంగానైనా స్మరించకపోవడం విశేషం. చివరకి జాషువాని చెళ్ళపిళ్ళ వంటి సంప్రదాయ కవులే అభిమానించి గౌరవించారు.

ప్రతీ భాషా తనదైన ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటుందని చెళ్ళపిళ్ళ వెంకటకవుల శిష్యుడు విశ్వనాథసత్యనారాయణ భావించాడూ అంటే భాష నశించడం అంటే జాతి నశించడమన్న మాట. అందువల్ల యింగ్లీషుకీ తెలుగుకీ గల తేడాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు విశ్వనాథ. యింగ్లీషు భాష వల్ల తెలుగుకి రాబోయే ముప్పుని గుర్తిస్తాడు. వొక కథ ద్వారా యీ సత్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు. వొక విషాధ వృత్తాంతాన్ని చెప్పినా ఇంగ్లీషులో బ్యూటీపుల్, బ్యూటిపుల్ అంటారు. అదే తెలుగులో ” అయ్యో పాపం ” అంటారని వివరిస్తాడు (వేయిపడగలు ). దేవుడు అనే మాటకి కూడా యింగ్లీషు వాళ్ళ అర్థం వేరు, మన అర్థం వేరు అని వ్యాఖ్యానిస్తాడు. భాషతో మత సంస్కృతులు విడదీయరానివి. స్థానికత కూడా భాషలోనే వ్యక్తమవుతుంది.

ఇలా వలస భాష వల్ల, వలస సంస్కృతి వల్ల తెలుగు భాషకీ, సంస్కృతికీ వచ్చిన ముప్పుని గుర్తించిన వాళ్ళలో శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి  కనపడ్తారు. విశ్వనాథ యింగ్లీషు చదివారు కానీ శ్రీపాద, జాషువాలాగానే యింగ్లీషు విద్య లేనివాడు. శ్రీపాద, విశ్వనాథ యిద్దరూ కూడా సుదీర్ఘ ముస్లీం పాలనలో కాదు, యింగ్లీషు పాలనలోనే సంస్కృతికి  ముప్పు వచ్చిందని భావించారు( అనుభవాలూ-ఙ్ఞాపకాలూ , మ్రోయు తుమ్మెద )

యీ సాంప్రదాయక మేధావుల్లో కనపడని లక్షణం జాతివిద్వేషం. చారిత్రకంగా వొక  పరాయి జాతి మనలని అణచి వేసిందన్న భావన వీరిలో మచ్చుకైనా కానరాదు. “వేయి పడగ”లలో ధర్మారావు కొడుకు శాస్త్రి, తాను హస్సవలీ నుంచీ రామకథని తెలుసుకున్నాను అంటాడు. వాడు కబీరు, నేను రామదాసుని అనికూడా అంటాడు. గుడిలో దేవదాసి నాట్యానికి సంగీతాన్ని సమకూర్చేవాని పేరు కబీరే ( కంచి పరమాచార్య తన ఆశ్రమంలోని ముస్లీం వాయిద్యకారుల పాండిత్యం గురించి వొక చోట ప్రస్తావించారు).  హిందుస్థానీ భక్తి సంగీతంలో ముస్లీం  మతస్థుల పాత్రని గురించి విశ్వనాథ “మ్రోయు తుమ్మెద”లో స్పష్టం చేశారు. మ్రోయు తుమ్మెదలో తెలుగువాడైన “తుమ్మెద” హిందుస్థానీ సంగీతంలో పాండిత్యాన్ని సంపాదిస్తాడు. నీవు పాడే పద్ధతి తురక పద్ధతిలో ఉందని వొక హిందుస్థానీ పండితుడు ఆక్షేపించినపుడు ముస్లీంలు లేకుండా హిందూస్థానీ ఉందా అని అడుగుతాడు తుమ్మెద.

 

సంగీతంతోనూ, భక్తితోనూ, గుడితోనూ ముస్లీంలకు గల అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తాడు విశ్వనాథ.  హిందుస్థానీ సంగీతంలో చాలామంది మతరీత్యా ముస్లీంలైనా దుర్గ, కృష్ణుడు, మొదలైన అనేక దేవతలని కొలుస్తారని అంటాడు విశ్వనాథ. మతాంతరీకరణ పట్ల వుద్వేగాన్ని విశ్వనాథ అనుభూతి చెందడు. అంతర్వాహిణిలా సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని ఆయన భావన. అందుకే “తెఱచిరాజు”నవలలో నాయకుడు అనేక మతాలని స్వీకరించినా, అతనిలో  సనాతన ధర్మం జ్వలిస్తున్నట్లుగా చూపుతాడు. వలసవాదం తీసుకొని వచ్చిన విధ్వంసాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. అందుకే తెలంగాణా గురించి రాసినా  ముస్లీంపాలన, ఉర్దూ విద్యల గురించి వ్యతిరేకంగా మాట్లడడు. ముస్లీం దాడుల వల్ల సంస్కృతికీ, ధర్మానికీ యేదో నష్టం జరిగిపోయిందన్న ఆవేశమూ కనపడదు. పైగా మన లోపాల వల్లే సంస్కృతికి ముప్పు అని ఆయన భావనలా కనిపిస్తుంది.

అరిపిరాలలోని శిథిల శివాలయము గురించి విశ్వనాథ యిలా వ్యాఖ్యానిస్తాడు.

“ముసల్మానులు ఆ దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక అపప్రధ యేమో. వీరే తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో ….” ( మ్రోయు తుమ్మెద ).

నిరాదరణ భావం, అభిమానంలేకపోవడం వల్లనే సంస్కృతికి వినాశనం జరుగుతుంది. కానీ బలవంతపు మతమార్పిడులు, దాడుల వల్ల కాదు.    వలసవాదం ఈ నిరాదరణ భావాన్ని పెంచుతోంది. అదే సాంస్కృతిక సామ్రాజ్యవాదం.

హిందుస్థానీ సంగీత విద్వాంసుల గురించి మాట్లాడుతూ, బ్రాహ్మణులే రాజాశ్రయం కోసం ముస్లీంలుగా మారారని అంటాడు ( హిందూత్వవాది, సావర్కర్ లా వర్ణ వివక్ష ప్రసక్తి తీసుకరాడు, మతాంతరీకరణ సందర్భంలో ). అలా మతాంతరీకరణం పొందిన వారు అంతరాంతరాలలో స్థానిక దేవీ దేవతల భక్తులే. హిందుస్థానీ సంగీతంలో భక్తి,  కర్ణాట సంగీతంలో అధ్వైతం ప్రధానమంటాడు. హిందూస్థానీలో “భక్తి” ప్రధానం కావడానికి ఇస్లాం కారణామా అన్నది నా ప్రశ్న అనుకోండి.

జాషువా కూడా ఫిరదౌసీ,ముంతాజు మహలు లాంటి ముస్లీం జీవితాలని ఉదాత్తంగా చిత్రించే రచనలు చేసారు. విశ్వానాథలో, జాషువాలో, శ్రీపాదలో జాతి విద్వేషపు చాయలు కనపడవు. దానికి కారణం చారిత్రక నిర్లిప్తతే.

భారతదేశానికి చరిత్ర లేకపోవడం గురించి ఆధునికులు అందరూ బెంగపెట్టుకున్నారు. చరిత్ర అనేభావనలో స్పష్టమైన కాల విభజన, కాలానికి ఆది అంతాలు, పురోగతి అనే భావాలు వున్నాయి. కాలాన్ని స్వయం చలనంలో వున్నదిగా, అనంతమైనదిగా చూశారు ప్రాచీనులు. కానీ చరిత్ర రచనతో పాటూ చరిత్ర పురుషులూ, చారిత్రక శత్రువులూ పుట్టుకొచ్చారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు, “చరిత్ర బేలెన్స్ చేయబడింది” , అని వి. ఎన్. నైపాల్ ప్రకటించాడు. ఇలా చరిత్రని బేలెన్స్ చేయడం, చారిత్రక ప్రతీకారం లాంటి డైనమిక్ ఆలోచనలు మొదలయ్యాయి.

శ్రీపాద, జాషువాలకి భిన్నంగా యింగ్లీషు చదువు చదివినప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ “చరిత్ర”ని నిరాకరించారు. పురాణాన్నీ, వాస్తవాన్నీ ఏకం చేసి పౌరాణిక వాస్తవికతని కల్పించారు.దీనికే విసుగుచెంది ఆర్.ఎస్ సుదర్శనం పురాణం, నవల వేరువేరు అని హెచ్చరించారు.

చరిత్ర గమనమనే దృక్పథాన్ని పక్కనపెట్టడంతో చరిత్ర భావనవల్ల వచ్చే టెన్షన్ విశ్వనాథకి లేకుండా పోయింది. అదే ధర్మారావులోని నిర్లిప్తత.

గురజాడ, సావర్కర్ లాంటివాళ్ళలోవున్న మతపర ఉద్వేగం లేకపోవడానికి యీ నిర్లప్తతే కారణం. లెఫ్ట్, రైట్ వర్గాలకి చరిత్రే చోదకశక్తి.   విశ్వనాథ సనాతనత్వంలో “ఉదాసీనో మహాబలః”. ఉదాసీనంగా ఉండేవాడే బలవంతుడు. అందుకే “వూరకే ప్రహించుటకు ప్రవహించడం” అనేది ధర్మారావు స్థితిగా వర్ణించబడింది( వేయిపడగలు).

అందువల్లనే హిందూమతాన్ని క్రైస్తవవిద్యార్థులు అవమానించినపుడూ ధర్మారావు ఉద్వేగానికి గురికాడు. విద్యార్థుల సమ్మెలో పాల్గోడు. సమ్మెని కొనసాగింఛవద్దని సలహా యిస్తాడు.ఇది స్వార్థంగా ఎస్కేపిజంగా కనపడింది ఆర్.ఎస్ సుదర్శనం గారికి. నిజానికి ధర్మారావులో ఎక్కువశాతం యీ నిర్లిప్తతా భావమే రాజ్యం చేస్తుంది ధార్మికవిషయాల్లో. ఇతర మతాల్ని ఢీకొనడం కనపడదు. క్రీస్తు గొప్పా, హరిశ్చంద్రుడు గొప్పా, విగ్రహారాధన వ్యతిరేకత లాంటి విషయాల్లో ప్రత్యక్షంగా యితరమతాల వారితో ఘర్షణకు దిగడు. తన అభిప్రాయం క్లుప్తంగా చెప్పి వూరుకుంటాడు

మొత్తం విశ్వనాథ స్వభావంలోనే యీ ఘర్షణ స్వభావం కనపడదు. కారణం అంతర్గతంగానే ధర్మానికి హాని జరుగుతుందనే భావన. బ్రాహ్మణుల పతనం వల్లే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి అంటాడు (వేయిపడగలు).  అంతర్గత శత్రువుల వల్లనే ప్రమాదం ఎక్కువ. పసరికని అమ్మకానికి పెట్టిన వాడు అంతర్గత శత్రువే. అందుకే ఆర్య సమాజం లాంటి ఆధునిక సంస్థల్ని కూడా విమర్శిస్తాడు. హైదరాబాదులోని కళాశాలలో హిందూ ముస్లీంలకి వేరువేరు ప్రార్థనా గదుల్ని ఏర్పాటు చేయడాన్ని విమర్శిస్తాడు విశ్వానాథ. ప్రార్థన అనే ఆచారం సనాతన ధర్మంలోలేదు అని ఆయన భావన. అలాగే ఆధునిక బాబా కల్ట్ లాంటి “కేషబ్జీ”నివ్యతిరేకిస్తాడు.ఇలా ఇతరుల్ని అనుకరిస్తూ తన ఉనికినే మరచిపోవడమే అసలు ప్రమాదం. అందుకే సంగీతంపై ముస్లీం ప్రభావాన్ని అంగీకరిస్తూనే స్వతంత్రమార్గంలో పయనిస్తే తాన్‍సేన్ గౌడీ లాగే ఆంధ్రీ అనేకొత్త మార్గం ఏర్పడేదని ’తుమ్మెద”తండ్రి అంటాడు ( మ్రోయు తుమ్మెద ).

విమర్శకులు ఆర్ ఎస్ సుదర్శనంగారిది చరిత్ర దృష్టి. అందుకే మార్పు ముఖ్యం అని భావిస్తారు. ఆమార్పు చారిత్రకోద్వేగంతో వుంటుంది. ఆధునిక అసమానత్వ పరిభాషలో వుంటుంది. యీ అసమానత్వ పరిభాష సమానత్వంలా భాషిస్తుంది. వ్యక్తివాదం అనేది చాలా ముఖ్యం. వ్యక్తిమార్పు, వ్యక్తి అభివృద్ధి,  వ్యక్తి పురోగతి, అనేవి యీదృష్టిలో ప్రదానమైనవి. నిర్లిప్తత పనికిరానిది. చర్య ప్రధానం. సుదర్శనం గారి దృష్టిలో ధర్మారావు ఏమిచేయాలి?  విద్యార్థులతో కలసి క్రైస్తవులని కళాశాల నుంచీ నెట్టి వెయ్యాలి. హిందూత్వవాదుల దృక్పథం అదే. యిప్పుడు నడుస్తున్న చరిత్ర అదే.

యిటువంటి దుందుడుకు దృక్పథాన్ని అమలు చేయడానికి ఆధునిక మర్యాదస్తుల పరిభాష అవసరం.

“భారతరాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేకత ద్వారాహరిజనులలో జాత్యాభిమానము పొటమరించి పాదుకొనిపోవడం జరిగింది. తద్వారా దేశంలో అహంకారమునకు వృద్ధియే గానీ క్షయము మాత్రం జరగలేదనే సంగతి స్పష్టమే”(సాహిత్యంలో దృక్పథాలు- ఆర్.ఎస్ సుదర్శనం ).

దళితుల్లో అహంకారంపెరిగిపోతోంది. దానికి కారణంప్రభుత్వంప్రసాదించిన ప్రత్యేకత.1968కిముందే సుదర్శనం గారు వ్యక్తం చేసిన భయం యిది. దళితులది పోరాడి సాధించుకున్న హక్కుకాదు. దయాధర్మ భిక్షంగా ప్రభుత్వం కల్పించిన ప్రత్యేకత. యిప్పుడు యూనివర్సిటిల్లో అగ్రవర్ణాల వాదం యిదే. దళితులకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి? ప్రతిభకి విలువలేకుండా పోవడానికి , నిమ్నకులాలకి తలపొగరు పెరగడానికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడమే కారణమంటారు హిందూవాదులు. దళితుల చైతన్యాన్ని జాత్యాభిమానం కులతత్వంగా, అహంకారంగా తలపొగరుగా చిత్రీకరిస్తారు.

ఆధునికులకీ, హిందూవాదులకీ వివక్షని కొనసాగించేందుకు వొక తటస్థ భాష అవసరం. అందులో కులం, వర్ణం లాంటి పదాలు కనపడకూడదు. యిలాంటి మేధావులు వివక్షాపూరితమైన సెక్యులర్ భాషని ఏర్పరచారు. అర్థిక సమానత్వ, ప్రతిభ, పోటీ, ఉమ్మడి సివిల్ కోడ్ లాంటి పదాలు సెక్యులర్ పదాలే. కానీ అవి సృష్టించే వివక్ష సూక్ష్మమైనదేకాక తీవ్రమైనది.

కానీ విశ్వనాథసత్యనారాయణ జాషువాపై వివక్షతో కూడిన వ్యాఖ్యానంచేసేడంటారు. ఆయన రచనల్లో కొన్ని చోట్ల వర్ణవివక్ష బహిరంగంగానే కనబడ్తుంది “ఒక్క క్రైస్తవకవి  ఉదిత మాధుర్య రస్కోతటంబగు శబ్ధమూది పలుకు” ,అనిజాషువని అతని మత అస్తిత్వంతో సహా గుర్తిస్తూ కీర్తించే ఉదారత్వం విశ్వనాథలో కనపడ్తుంది. ఈ విషయాన్ని బయటకు తెచ్చింది ప్రముఖ దళితకవి ఆచార్య యెండ్లూరి సుధాకర్.

శ్రీశ్రీ జాషువాని ద్వితీయ స్థాయి కవి అని అంటే మిగిలిన కమ్యునిష్టులు జాషువాని స్మరించనే లేదు. ఆర్ ఎస్ సుదర్శనం కూడా  మాలపల్లి గురించి మాట్లాడారు కానీ ఆ పల్లెలోని మహాకవి గురించి మాటాడలేదు. ఎందుకంటే దృష్టి సూక్ష్మవివక్షా భావంతో నిండినది. సంప్రదాయవాదుల్లో వివక్ష కేవలం సైద్ధాంతికమైనదిమాత్రమే. ఆధునికుల్లో అది రాజకీయ పరమైనది.

సంప్రదాయ సమాజాల్లో కులాలు కులసంస్కృతులు చాలా బహుళత్వంతో వైవిధ్యంతో కూడుకొనిఉండేవి. సాంకర్యం కూడా సాధ్యమయ్యేది. కానీబ్రిటీష్ ఆధునికత హిందూ అస్తిత్వాన్ని వర్గ కుల అస్తిత్వాలుగా స్థిరీకరించింది. లిఖిత పూర్వకం చేసింది. జనాభా గణన అదే పద్ధతిలో చేయడం కూడా యీ స్థిరీకరణకి కారణమైంది.

అందువల్లే విశ్వనాథ నవలలో కులాల గురించిన వర్ణనలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వేయిపడగలలో రామేశ్వరశాస్త్రి నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్ళి చేసుకుంటాడు. అనులోమ విలోమవివాహాల పేరుతో యిటువంటి వివాహాలని శాస్త్రాలు సమర్ధించాయి. అంతేకాదు, నాలుగవశతాబ్ధానికి చెందిన మీమాంస భాష్యకారుడు శబరుడు నాలుగు వర్ణాల స్త్రీలని వివాహం చేసుకున్నట్టుగా కథ ఉంది.  దీని ఆధారంగా విశ్వనాథ ఈ కల్పన చేసి ఉండవచ్చు. “మ్రోయుతుమ్మెద”లో బ్రాహ్మణ బాలుడిని పద్మశాలీ దంపతులు పెంచుతారు. కానీ బ్రాహ్మణుడిలాగే విడిగా పెంచుతారు. కానీ అతడు పెద్దయ్యాక పెంచిన తల్లితండ్రుల మీదప్రేమతో పద్మశాలీ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు. ఐనప్పటికీ శంకరాచార్యులు అతనిలో బ్రాహ్మణత్వం నిలచి ఉందని తీర్మానిస్తాడు. దాంతో ఉపనయనం చేసుకొని దేవీదీక్ష వహిస్తాడు. అతడే నవలా నాయకుడు “తుమ్మెద”.

ఇటువంటి విశ్వనాథ వర్ణనల్ని చూసి ఆర్ ఎస్ సుదర్శనం సందేహంలో పడిపోతారు. “వర్ణాంతర వివాహాలు నేటి వర్ణ విబేధ సమస్యకు పరిష్కారం సూచిస్తున్నాయంటారా? ఆ పరిష్కారం ఎంతమదికి నచ్చుతుంది ?” అని ప్రశ్నిస్తారు ఆర్ ఎస్ సుదర్శనం. విశ్వనాథని మార్పుకి అంగీకరించని చాందసుడిగా చిత్రించిన సుదర్శనం గారి ప్రశ్నలు యివి. కారణం ఏమిటంటే సంప్రదాయఙ్ఞుల కన్నా ఆధునికులు మూస దృష్టి కలవారు. ఆధునికత వైవిధ్యాన్ని వైరుధ్యంగా నిరాకరిస్తుంది.

యీ ఆధునిక దృష్టే భోగానికీ, యోగానికీ, శృంగారానికీ, అధ్వైత తత్వానికీ మధ్య విభజన రేఖలు గీస్తుంది. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లిలో మానసిక దైహిక బేధంలేని శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని చాటుతాడు. అక్కడ ఉన్నవని మెచ్చుకొన్న సుదర్శనం వేయిపడగలు నవలలోని రామేశ్వరశాస్తిని భోగే కానీ యోగి కాదని సులభంగా సూత్రీకరించేస్తారు. వలస ఆధునికత ఐహికానికీ, పారలౌకికానికీ మధ్య విభజన తెచ్చింది. శ్రీకృష్ణుడు దేవుడు కనుక ఆయన శృంగారం పవిత్రం. కానీ రామేశ్వర శాస్త్రి మనిషి అనేది సుదర్శనం అభిప్రాయం కావొచ్చు. యీ విభజన నుంచీ జనించిన ప్యూరిటన్ దృక్పథమే బలపడి హుస్సేన్ గీసిన దేవతల నగ్న చిత్రాలపై దాడికి హిందూవాదులని పురికొల్పింది.

వ్యక్తికీ వ్యవస్థకీ మధ్య కూడా విభజనరేఖ గీసి వ్యక్తిధర్మమే సనాతన ధర్మమని సూత్రీకరించడంతో ఆర్ ఎస్ సుదర్శనంగారి వక్రవలస ఆధునికదృష్టి పరిపూర్ణమౌతుంది. వ్యక్తి ధర్మం అనే పదం కానీ తత్వంకానీ భారతీయతత్వశాస్త్రంలో మచ్చుకైనా కానరావు. విశ్వమంతా భగవంతుని స్వరూపమైతే, జీవుడు భగవంతుని యొక్క సూక్ష్మరూపం ( పంచీకరణం-శంకరాచార్య). యిక్కడ వ్యక్తికీ, విశ్వానికీ ; ప్రకృతికీ, మనిషికీ సూక్ష్మ స్థూలానికీ మధ్య ఎడతెగని వైరుధ్యం లేదు. అది ఆధునికత సృష్టించింది.

అందుకే ప్రకృతితో  మనిషికి గల బంధాన్ని ’పసరిక” పాత్ర ద్వారా నిరూపిస్తారు విశ్వనాథ. మెట్టపొలాలు అంతరించి అన్నీ మాగాణులు కావడంవల్ల,  వ్యవసాయంలో తీవ్రమార్పుల వల్ల, ఆధునిక నాగరికత వల్ల జీవవైవిధ్యం నశించిపోవడంగురించి  చాలాముందుగా హెచ్చరించింది విశ్వనాథవారే. యీపని యితరులెవరూ యెందుకు చేయలేకపోయారు. కార్యాకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మితిమీరిన “రిడక్షనిజం” చోటుచేసుకోవడమే దానికి కారణం. ఆధునికత, సాంకేతికత, తీసుకవస్తున్న ప్రత్యక్ష సౌకర్యాలనీ, భోగాలనీ చూడగలిగారే కానీ పర్యవసానాలని గురించి ఆలోచించలేదు. అలా ఆలోచించడం చారిత్రకపురోగతి, కాల గమనాలని అడ్డుకోవడంగా భావించబడింది.

 

యిది నేటి ట్రంపు,మోడీ లాంటివాళ్ళప్రాగ్మాటీక్ దృక్పథానికి దారితీసింది. పర్యావరణ చట్టాలనీ, పర్యావరణ అనుకూల చర్యలనీ పూర్తిగా నిలిపివేసి అధిక ఉత్పత్తి లాభాలే పరమార్ధంగా భావించబడ్తోంది. యిటువంటి దృక్పథానికి ఏనాడో ఎదురీదాడు విశ్వనాథ. మార్క్సు, అంబేద్కర్‌లలోని మానవ కేంద్రకదృష్టీ పర్యావరణ సంక్షోభానికి కారణమౌతుందని అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే భావించాడు. సకలజీవులలోనూ  ప్రాణం, ఆత్మ వున్నాయనే భారతీయ సనాతన దృక్పథాన్ని  విశ్వనాథ నొక్కిచెప్పారువేయిపడగలలో.

అంతరించి పోతున్న జానపద కళలు, కల్లుని కబళిస్తున్న సారా, గ్రామాల్నిమింగేస్తున్న ధనస్వామ్యం ఆధునికత విశ్వరూపాన్ని వేయిపడగలులో చూపారు విశ్వనాథ. గోరటి వెంకన్నరాసిన “పల్లె కన్నీరు పెడుతుందో ’’ పాటకి పూర్వ రూపం “వేయిపడగలు”. ఆనవలలోని నిజాయితీ యేమిటంటే – బ్రాహ్మణుడినే ప్రధాన పాత్ర చేసి తన అస్తిత్వాన్ని మరుగుపరుచుకోకుండా సూటిగా ముందుకు రావడం.

ఆధునిక భ్రాహ్మణుడి  అనుసరిస్తూ ఆధునిక శూద్రుడు అవతరించాడు. వారిద్దరికీ వలస ఆధునిక దృక్పథంలో సంస్కృతి కనపడ్తుంది. సంప్రదాయం కనపడ్తుంది. నిజానికి సంస్కృతి సంప్రదాయాలు రూపాంతరం చెంది తమ మౌళిక భావనల్ని కోల్పోయాయన్న వాస్తవాన్నిమరుగు పరుస్తారు. తద్వారా ఆధునికతకి తిరుగులేని సమ్మతినికలుగ జేస్తారు.

సామ్రాజ్యవాదం భారతదేశంలో హిందూత్వరూపం సంతరించుకోవడానికి సుదీర్ఘ వలసచరిత్ర వుంది. అది అన్ని కులాల్లోకి చొచ్చుకపోవడానికి మేధావుల కృషి ఉంది. జర్మనిలో యాంటీ సెమిటిజాన్ని రూపొందించింది సంప్రదాయవాదులు కాదు. ప్రగతిశీలురు, సంస్కర్తలు అనుకున్నవాళ్ళే దానికి బీజాలు వేశారు.హెగెల్, మార్టిన్ లూథర్, గొథేలాంటి మేధావులు యాంటీసెమిటిజానికి బలం చేకూర్చారు( రైజ్ అండ్ ఫాలాఫ్ థర్డ్ రీక్- విలియం.ఎల్. షీరర్). యూదు పురుషుల్ని జర్మన్ స్త్రీలు వరించరాదని లవ్ జిహాద్ లాంటి సిద్ధాంతాల్ని ప్రవచించాడు గోథే. యీ విషయాన్ని హిట్లర్ స్వయంగా తన ఆత్మ కథలో స్మరించుకున్నాడు. మత సంస్కర్త మార్టిన్ లూథర్ యూధు వ్యతిరేకి, రైతు వ్యతిరేకి.  ప్రొటెస్టింటిజం ఆధునికతకి బీజం వేసింది మరి. ఫాసిస్టులకి సిద్ధాంతాలేమీ ఉండవు. ఆధునికత యొక్క విషమ పరిణామమే ఫాసిజం. భారతదేశంలోనైనా సంస్కర్తలూ, ప్రగతిశీలులే ఫాసిస్టు భాషని రూపొందించారు. యీ విషయం ఖాదర్ మొహిద్ధీన్ “పుట్టుమచ్చ” కవితద్వారా స్పష్టమైంది.

సాంస్కృతిక సాంకర్యంలేని స్వచ్చమైన గతాన్ని విశ్వనాథ స్థాపించలేదు. మ్లేచ్చ సంపర్కాన్ని కప్పిపుచ్చలేదు. పైగా దానివల్ల సంస్కృతి విచ్చిన్నమైపోయిందని ఆయన ఏనాడూ ప్రతిపాదించలేదు.

“తాన్‍సేన్ చనిపోయినాడు. ఆయనకి యిద్దరు కుమారులు కలరు. ఒకడు తురుష్కుడు, మరొకడు హిందువు. ఆయనకొక తురుష్క స్త్రీ భార్యగా కలదు. ఆమెయందలి సంతానము విలాస్ ఖాన్, పేరు హిందువు పేరే కానీ చివర ఖాన్ అనికలదు. తాన్‍సేన్ బ్రాహ్మణ  స్త్రీ యందలి సంతానము సూర్యసేనుడు. తాన్‍సేన్ యొక్క శవము తనదియనగా తనదియని వీరిర్వురూ వివదించుకొనిరి. ఈ వివాదము ఎవరు తీర్చవలెను?”

 

” తాన్‍సేన్ భ్రాహ్మణుడో, ముసల్మానో మాకు తెలియదు. ఆయన మహా గాయకుడు. మీరిద్దరూ సంగీతమును పాడుడు. శవములేచి సెభాషనవలయును. ఎవనిపాటకు తాన్‍సేన్ యొక్క శవము సెభాష్ అని మెచ్చుకొనునో శవము వానికిత్తుము”అనిరి. సూర్యసేనుడు పాడెను. శవము కదలలేదు. అప్పుడు విలాస్ ఖాన్ “తోడి” రాగము పాడెను. పాడునది “భైరవి”,  రాగము “తోడి”. ఇది చాలా కష్టమైన రాగము. నాటి నుండీ యీ రాగమునకు “విలాస్ ఖాన్ తోడీ రాగము”యన్న పేరు వచ్చెను. తాన్‍సేన్ శవము లేచి కూర్చుండి చేయి యాడించి వీడే నాకొడుకు యన్నదట (మోయు తుమ్మెద).

శవం నిజంగా లేస్తుందా, ఎవరు వారసుడో నిర్ధారిస్తుందా, యిది అసంబద్ధం అనికొందరు నాతో అన్నారు.ఆధునిక సంబద్ధత కంటే, యిటువంటి జానపద పౌరాణిక కథలే  సత్యాన్ని వెలుగులా ప్రసరిస్తాయి. భారతీయ సంగీత సాహిత్యాల్లో,  సంస్కృతిలో ముస్లీంల పాత్ర విడదీయరానిది. ముస్లీంలతో కలసినడచిన కాలాన్ని మరుగుపరచడానికి కానీ, దానిని దుర్మార్గమైనదిగా చిత్రీకరించడానికి గానీ విశ్వనాథ ప్రయత్నించలేదు అనేదిప్రధాన విషయం.

భారతీయ చరిత్ర చాలా విచిత్రమైనది. బాబ్రీ మసీదు విధ్వంసం చేయాలన్న మూకల్నీ, అధ్వానీ రథయాత్రనీ వ్యతిరేకించిన లాల్ దాస్ రామజన్మభూమి పూజారి. ఫలితంగా  ఆనాటి  అతిశూద్ర హిందూముఖ్యమంత్రి ఆయనను పూజారి పదవినుండీ తొలగించాడు. ఆయన్ని చంపేసారు. బాబ్రీమసీదుని కూల్చేసారు. బాబ్రీస్థలం కోసం హిందూవాదులతో పోటీపడ్డ దళితవాది ఉదిత్ రాజ్,  అది బుద్ధిస్టుల స్థలం అని అన్నారు. బౌద్ధారామాల్ని కూల్చి మసీదు కట్టారని కోర్టుకెక్కాడు. ఆ ఉద్యమంలో అంబేద్కర్ భార్య సవితా అంబేద్కర్ మద్ధతు పలికారు. తర్వాత ఉదిత్ రాజ్ బిజెపిలో చేరాడనుకోండి.

హిందూత్వం అన్నా,బౌద్ధం అన్నా, మరేమన్నా ఆధునికులందరిదీ వొకటే దృష్టీ. ముస్లీం పరిపాలనా కాలం చెడ్డది అని చెప్పడం ద్వారా వలస ఆధునికతకి సమ్మతిని సమకూర్చడం.  అందువల్ల లెఫ్ట్, రైట్, దళిత వాదం- అందరి దృక్పథాలూ వొకే రకమైన చారిత్రక దృష్టిలో ఏకమైతాయి. అవి వలస ఆధునికతకి, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి మద్ధతునిస్తాయి.

యిటువంటి దృష్టిని ఎదుర్కొన్న వారు చరిత్రకీ, కాలానికీ ఎదురీదిన వారే.   జేమ్స్ పెట్రాస్ చెప్పినట్టూ యీ ఎదురీతని వెనుకబాటుతనంగా, సంప్రదాయవాదంగా ముద్రించడం సులభం. తద్వారా సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని బలపరచడమే జరుగుతుంది చివరికి.

*

మహానాయక్ ఉత్తమ్ కుమార్

 

uttam1

కలకత్తా లో, ఇంకా చెప్పాలంటే బెంగాల్ మొత్తం మీద అంతిమ యాత్ర  చరిత్రగా మిగిలిన సందర్భాలు రెండు ఉన్నాయని చెపుతారు. ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతిమయాత్ర, ,మరొకటి అరుణ్ కుమార్ ఛటర్జీది.ఈ రెండు సందర్భాల్లో అశేష జనవాహిని, వారు అంతగా అభిమానించేవారి మరణాన్ని జీర్ణించుకోలేక, తీరని శోకం తో అంతిమయాత్ర లో పాల్గొని చివరి వీడ్కోలు పలికారు. అరుణ్ కుమార్ ఛటర్జీ మరణం తన అభిమానులకి జీర్ణించుకోవటానికి చాలా కాలమే పట్టింది. ఆ అరుణ్ కుమార్ ఛటర్జీయే బెంగాళీ సూపర్ స్టార్, మహానాయక్ ఉత్తమ్ కుమార్.

తన చివరి శ్వాస సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే వదలాలని అనుకునే ఉత్తమ్ కుమార్, ఈ ప్రపంచ రంగస్థలం నుండి అదే విధంగా నిష్క్రమించాడు. ‘ఓగో బొదు శుందొరి సినిమా షూటింగ్ సమయం లో గుండెపోటు రావడంతో బెల్లీవ్యూ హాస్పిటల్ లో చేర్పించారు. 16  గంటలపాటు డాక్టర్లు ఎంతగా శ్రమించినా తనని బ్రతికించలేకపోయారు.

దాదాపు మూడు దశాబ్దాలపాటు బెంగాలీ సినీరంగాన్ని రారాజుగా ఏలి, దాదాపుగా 250 వరకు (బెంగాలీ, హిందీ అన్నీ కలిసి) సినిమాల్లో నటించాడు. ఉత్తమ్ కుమార్ కేవలం నటన తో తన పిపాసని తృప్తి పరచుకోలేదు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా,నిర్మాతగా,నేపథ్య గాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసాడు.

బెంగాళీ లోనే కాకుండా భారత దేశం లోనే అత్యుత్తమ నటుడిగా కిర్తించబడ్డ మహానాయక్ ఉత్తమ్ కుమార్.

ఉత్తమ్ కుమార్ మరణించిన రోజు కొంత మంది సినీ ప్రముఖులు:

“బెంగాళీ చిత్రపరిశ్రమకే దారిచూపించే దివిటీ వెళ్లిపోయింది. తనకు ముందు గానీ తరువాత గాని అలాంటి హీరో లేడు”

~~ సత్యజిత్ రే         

“మా అందరు హీరోల్లో ఉత్తమ్ కుమార్ బెస్ట్”

~~రాజ్ కపూర్

“ప్రపంచంలోని ఏ నటుడితో అయినా పోల్చగల సమర్థత ఉన్న నటుడు ఉత్తమ్ కుమార్. తనలో ఉన్న గొప్ప సుగుణం శ్రద్ధ.

చాలా మంది నటులకు పుట్టుకతోనే ఆ ప్రతిభ ఉంటుంది. కానీ ఆ ప్రతిభ,  శ్రద్ధ లేకపోవటం వల్ల త్వరగానే అంతరిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ కి  ప్రతిభతో పాటు అకుంఠిత శ్రద్ధ ఉంది. అందువల్లే ఆ నట నక్షత్రం ఇంకా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

  ~~ తపన్ సిన్హా

ఉత్తమ్ కుమార్ సినీ ప్రస్థానం లో అద్భుతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.  దస్తూరి లా, తన సొంతదైన ప్రత్యేక నటనాశైలి తో భావి నటులకి సమగ్రంగా ఒక “నటనా నిఘంటువుని” సమకూర్చాడు. ఆయన  చేసిన ఒక్కొక్క పాత్ర, ఒక్కో నటనా శైలిని ఆవిష్కరిస్తాయి. తను చేసిన కొన్ని పాత్రలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పాత్రతో పాటుగా మనల్ని పయనింపజేస్తాయి. ఉత్తమ్ కుమార్ నటనా తాలూకా ప్రభావం మనల్ని అంత సులువుగా వదలదు. ఆ పాత్రలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. చూసిన ప్రతీసారి , ఆ పాత్ర తాలూకు కొత్త కోణం ఏదో కనపడుతుంది.

తన నటన గురించి చెపుతూ ” నేను నా సహజ నటనా పద్ధతులనే అనుసరిస్తాను. మనం నిజ జీవితం లో ఎలా మాట్లాడుకుంటాము? ఎలా కోపగించుకుంటాము ? అలాంటి సహజమైన నటననే నేను ఇష్టపడతాను” అని అంటాడు మహానాయక్.

అంత స్టార్డం ని , ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఉత్తమకుమార్ కి విజయ శిఖరాల వైపు ప్రయాణం అంత సులువుగా జరగలేదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని , కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం నుండి మహానాయక్ ఉత్తమ్ కుమార్ గా ఎదిగేవరకు ఎన్నో అపజయాలు ఎప్పటికప్పుడు తనని పరీక్షిస్తూనే ఉన్నాయి.

మొదటి సినిమా విడులకి నోచుకోలేదు. తరువాత చేసిన 4 -5  సినిమాలు పరాజయంపాలు కావటంతో ఎన్నో అపజయాలు,హేళనలు, అవమానాలు తనని ప్రతి నిత్యం పలకరించేవి. ఇలా వరుస అపజయాలతో విసిగిపోయి, సినీరంగాన్ని వదిలివెళ్ళి క్లర్క్ ఉద్యోగానికి వెళ్లిపోదామనుకునే తరుణంలో భార్య గౌరి దేవి “మీకు ఇష్టమైన కళని వదులుకుని , ఏమాత్రం ఇష్టపడని ఆ ఉద్యోగం చేయటం కంటే,మీరు ఖాళీగా ఉన్నా ఫరవాలేదు ” అని ఉత్తమ్ కి ధైర్యాన్నిచ్చింది.

బెంగాళ్-బాంగ్లాదేశ్ లో అంతలా అభిమానులని సంపాదించుకున్న చరిత్ర బహుశా ఉత్తమ్ కుమార్ కే సొంతం.

దిలీప్ కుమార్దేవానంద్ఉత్తమకుమార్ ముగ్గురూ సమకాలీన నటులు. ముగ్గురూ దాదాపుగా తమ సినీరంగ ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టారు.

దిలీప్ కుమార్ ఎక్కువగా త్యాగపు ఛాయలు ఉన్న పాత్రలకి పెద్ద పీట వేస్తే, దేవానంద్ ప్రేమికుడి గా, డైనమిక్ గా ఉండే పాత్రల్ని ఎంచుకునేవాడు.అందుకు భిన్నంగా ఉత్తమ్ కుమార్ అన్నిరకాలయిన కథలని ఎంచుకునేవాడు. తాను ఎంచుకునే కథలూ, పాత్రలు అప్పటి బెంగాళీ హీరోలు పాటించే పద్దతులకి భిన్నంగా ఉండేది.

అయితే ఈ కథల్ని ఎంచుకునే ప్రక్రియ తనకి అంత సులువుగా రాలేదు. తన సినీ జీవితం లో ఎదుర్కున్న అపజయాలనుండే ఈ కొత్త పాఠాలు నేర్చుకున్నాడు.

బెంగాళీ ప్రొడ్యూసర్లకి ఉత్తమ్ కుమార్ ఒక కల్పవృక్షమే. అగ్రస్థాయి నిర్మాతలు ఇద్దరు ముగ్గురు తమ సినిమా ఒప్పుకోవడానికి ముందే బ్లాంక్ చెక్స్ పంపేవారట. అప్పటి హీరోయిన్స్ ఉత్తమ్ పక్కన నటించడం ఒక అదృష్టం లా భావించి, తమకి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని అనుకునేవారట. సినిమా రిలీజ్ కి ముందే ‘హౌస్ ఫుల్’ బోర్డ్స్ కి ఆర్డర్లు ఇచ్చేవారట.

ఉత్తమ్ కుమార్ సెప్టెంబర్ 3, 1926 తేదీన తన మేనమామ ఇంట్లో జన్మించాడు. ఉత్తమ్ కుమార్ అసలుపేరు అరుణ్ కుమార్ ఛటర్జీ,తల్లిదండ్రులు, చపలాదేవి-సత్కారి ఛటర్జీ.

సౌత్ సబర్బన్ స్కూల్ లో చదివి , గోయెంకా కాలేజీ లో డిగ్రీ పూర్తి అవకముందే కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం రావడం తో,  క్లర్క్ గా పనిచేస్తూనే నాటక రంగానికి పయనం.

ఉత్తమ్ కుమార్ కుటుంబానికి సుహృద్ సమాజ్, అని ఒక నాటక సంస్థ ఉండేది.  చిన్నతనంలోనే ఆ వాతావరణం ఉండటం వల్ల తన నటన కి సంబందించిన బీజాలు అక్కడే పడ్డాయి. నటనే కాకుండా రకరకాలయిన ఆటలు, ఈత, టెన్నిస్, కుస్తీ పోటీలు,గుర్రపు స్వారీ ఇలా ఒకటేమిటి అన్నిట్లో తన ప్రతిభ కనబరిచేవాడు.

నితిన్ బోస్ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా “మాయాదోర్”, కానీ అది విడుదల అవలేదు.

ద్రిష్టిదాన్ (1948 ) విడుదలయిన మొదటి సినిమా. ఆ తరువాత విడుదల అయిన, 4 -5 సినిమాలు వరుసగా ప్లాప్. అందువల్ల ప్రతి సినిమాకు తన పేరు మార్చుకున్నాడు. అరుణ్ ఛటర్జీ నుండి అరుణ్ కుమార్ అని , ఆ తరువాత ఉత్తమ్ ఛటర్జీ అని, చివరగా ఉత్తమ్ కుమార్ అని మార్చుకున్నాడు. ఆ పేరుతోనే బెంగాళ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా, మహానాయక్ గా నిలిచిపోయాడు.

uttam2

‘బసుపరిబార్ ‘ సినిమా కొంతమేర విజయాన్ని సాధించగలిగింది.ఆ తరువాత విడుదలయిన ‘అగ్ని పరీక్ష'(1954 ) ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తమ్ కుమార్సుచిత్ర జంటగా నటించిన ఇది. ఈ సినిమా తరువాత ఈ జంట రొమాంటిక్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది.

సుచిత్ర-ఉత్తమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని:

శిల్పి ,సప్తపది, పతే హోలో దేరి,హరనో సుర్, ఛోవాపావా, బిపాషా ,జిబాన్ త్రిష్ణ.

ఉత్తమ్ కుమార్కొన్ని విశేషాలు::

కలకత్తాలో ఉత్తమ్ స్మారకార్థం ఒక థియేటర్ ని (ఉత్తమ్ మంచ) నిర్మించారు.

కలకత్తా టోలీగంజ్ ప్రాంతం లో ఉత్తమ్ కుమార్ భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. సెంట్రల్ రైల్వేస్ వారు టోలీగంజ్ మెట్రో స్టేషన్ ని ఉత్తమ్ కుమార్  స్టేషన్ గా మార్చారు.

శిల్పి సంసద్ అని పేద, వృద్ధ కళాకారులని ఆదుకోవడానికి ఉత్తమ్ స్థాపించిన సంస్థ తన కార్యకలాపాల్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

2009  లో భారత ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ పేరు మీద  “ఉత్తమ్ కుమార్ది లెజెండ్ అఫ్ ఇండియన్ సినిమా” అని  స్టాంప్ ని విడుదల చేశారు.

సినిమా టైటిల్ క్రెడిట్డ్స్ లో తన పేరుకి ముందుగా హీరోయిన్ పేరు ని వేయించే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు ఉత్తమ్ కుమార్.

భారతరత్న సత్యజిత్ రేఉత్తమ్ కుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నాయక్ సినిమా అత్యద్బుతమైనది. కొన్ని సంవత్సరాల క్రితం సత్యజిత్ రే సినిమాలు ఏవో చూస్తూ అనుకోకుండా నాయక్ సినిమా చూశాను. ఉత్తమ్ కుమార్ నటన నన్ను మెస్మరైస్ చేసింది. ఒకసారి చూశాక మళ్లీ చూశాను. అలా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. ప్రముఖ హీరో అరింధం ముఖర్జీ గా ఉత్తమ్ కుమార్ నటన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అసలు ఉత్తమ్ కుమార్ ని నేను అంతలా అభిమానించడానికి కారణమే ,నాయక్(1966) సినిమా.

దీని గురించి వచ్చేవారం….!

*

 

ఇంకా పుట్టని శిశువు

 

Art: Satya Sufi

Art: Satya Sufi

 

వేనవేల పూల పరిమళాలతో

అడవి ఆహ్వానించింది నన్ను.

వనదేవతల్లా నా నరాల్లో కూడ

పలుకుతున్నాయి సెలయేళ్ల

గలగలల హాసాలు.

నా యవ్వనమంతా ఈ అరణ్యాలకే ఇచ్చాను

నా హృదయమా, ఈ అనాథల వేదనలకే ఇచ్చాను.

గజ్జెలు లేని కాళ్లతో కొండల మీద

పరుగులెత్తిన నా బాల్యం

నా పాదాలకింకా వేలాడుతోంది.

కాలుజారి నగరపు మురికికాలువలో పడిపోయిన

ప్రేమరహిత కౌమారం నా తలలోనే ఉంది.

నేనొక నవయువతిలా లేచినిలిచింది

ఈ ఆదివాసి ప్రజల కనుపాపలలోనే.

వాళ్లే నా పాఠశాల.

నా భాష తిరుగుబాటు

నా అక్షరాలు స.మ.న్యా.యం.తో మొదలవుతాయి.

ఆకులమధ్య గాలి ఉసురుసురన్నట్టు

వాళ్ల వేదనామయ చెవుల్లో

నేను స్వేచ్ఛా రహస్యాన్ని గుసగుసలాడాను

ప్రతిగా వాళ్లు నాకు

ప్రేమ నిండిన ఉప్పుచేపలు తినిపించారు

 

జ్వరపడి మగతలో ఉన్నప్పుడు

నేను తిరిగి నా బడికే వెళ్లేదాన్ని

ఓ తోకజడవేసుకుని

చేతి గాజులు పగిలినట్టు గలగలలాడుతూ

నేస్తాలతో ముచ్చట్లాడుతూ.

అప్పుడప్పుడు కొండగోగుల పొద

చాటునుంచి తొంగిచూసే కుర్రవాడు

అప్పుడప్పుడు గుర్తుకొచ్చే తల్లిదండ్రులూ ఇల్లూ

నా కలల నిండా మెరుపుతీగల కాంతి నిండేది

అప్పుడే గాలిలో తుపాకిమందు వాసన తగిలింది

అది బూట్ల కరుకు ధ్వనుల్లో మణగిపోయింది

సగం మెలకువలో పీడకలేమోననుకున్నాను

కాని నా ఛాతీ ఎగజిమ్మిన నెత్తురు, ఎర్రగులాబీ అయింది.

 

ఇప్పుడిక నేను భవిష్యత్తు మార్గాలలో

అవిశ్రాంత స్ఫూర్తినై తిరుగాడుతున్నాను

న్యాయమెప్పుడూ చట్టానికి ముందే నడుస్తుందని

నేను నా ప్రజలకు చెప్పదలిచాను

మీరే సమస్తం అని చెప్పదలిచాను

అది మీరు గుర్తించిన క్షణాన

సింహాసనాలు కదిలిపోతాయని చెప్పదలిచాను

అప్పుడిక మనం హింసను వాడనక్కరలేదని

చెప్పదలిచాను

చాల ఆలస్యమయిపోయింది

 

ఎడారి మీద చింది

ఎండిన నెత్తుటి చారికల్లోంచి

నేనింకా పుట్టవలసే ఉంది

నేను నాలుగో అజితను

అపరాజితను.

 

మొదటి అజిత, అజిత కేశకంబలి. క్రీపూ ఆరోశతాబ్దికి చెందిన బౌతిక వాద తత్వవేత్త. రెండో అజిత, 1970ల కేరళలోని మావోయిస్టు విప్లవకారిణి. మూడో అజిత, 2016 నవంబర్ లో కేరళలో నీలంబూరు అడవిలో బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యకు గురై ఈ కవితలో మాట్లాడుతున్న అజిత. నాలుగో అజిత, ఇంకా పుట్టని అజిత, భవిష్యత్ అహింసా విప్లవానికి నాయకత్వం వహించే అజిత.

మలయాళ మూలం నుంచి ఇంగ్లిష్ అనువాదం: కె సచ్చిదానందన్, ఇంగ్లిష్ నుంచి తెలుగు: ఎన్ వేణుగోపాల్