బాలీవుడ్ భాష మారిపోతోంది!

2016 చివరకొచ్చేసింది. ఈ సంవత్సరం వచ్చిన మూడు ముఖ్యమైన బాలీవుడ్ ఫిల్మ్స్ గురించి చెప్పుకుని తీరాలనిపిస్తోంది.  సినిమాభాషని సరికొత్తగా పలికించటంతోపాటు ఇప్పుడున్న సమస్యలగురించి మాట్లాడ్డం ఈ సినిమాల ప్రత్యేకత.

ఎవరిగురించైనా మంచినీళ్ళు తాగినంత సులువుగా తీర్పులు చెప్పెయ్యటం డిజిటల్ యుగంలో మామూలయిపోయింది.  మనిషన్నవాడికి తీర్పులు చెప్పటం మంచి కిక్ ఇచ్చే విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళూ,  మైనారిటీలూ, దళితుల విషయంలో చాలామంది తీర్పులుచెప్పే నిషాలోకి భలే తొందరగా జారిపోతుంటారు. ఆ నిషా sexist ఆలోచనలది కావచ్చు. నిజమైన మత్తుమందుల వెల్లువలో మనిషి జంతువైపోయే నిషా కావచ్చు. లేకపోతే మాకు తెలిసినదేదో అదే మనిషికుండాల్సిన sexual behaviour అని వాదించే మూర్ఖత్వపు నిషా కావచ్చు.

‘ఉడ్తా పంజాబ్’ లో జనం నోళ్ళలో తెగనలిగిన ‘చిట్టావే’ పాట చరణంలో ‘కుండీ నషేవాలీ ఖోల్ కె దేఖ్’ (నిషాతనపు గొళ్లెం తెరిచిచూడు) అంటాడు.  అలాంటి మూసుకుపోయి తుప్పు పట్టిన నిషాతనపు గొళ్ళేలు తెరిచి, మది తలుపుల్లోకి కొత్త వెలుతురు ప్రసరించాలని ప్రయత్నించిన సినిమాలివి మూడూ.

The issues of humanity and what is fair and good treatment of a fellow human being,  should not be based on a personal sense of right and wrong or judgment” –  Debbie Harry (American Rapper).

అలీగఢ్ యూనివర్సిటీలో పనిచేసిన మరాఠీ ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ జీవితకథే ‘అలీగఢ్’ సినిమా. ‘గే’ అయినందువల్ల ఆయన్ను శారీరకంగా మానసికంగా హింసించి కేంపస్ నుండి వెళ్ళగొట్టారు.  పదవీకాలం ఇంకో ఆర్నెల్లుఉందనగా కోర్ట్ తీర్పుతో ఉద్యోగాన్నీ, కేంపస్ క్వార్టర్స్ ని సాధించుకున్నాడాయన.  మర్నాడు ఉద్యోగంలో చేరతాడనగా ముందురోజే అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన దీపూ సెబాస్టియన్ అనే జర్నలిస్ట్ చెప్పిన వివరాలు ముఖ్య ఆధారంగా ఈ సినిమా తీశాడు హన్సల్ మెహతా.

ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ జూలై 2009లో తీర్పు చెప్పింది. కానీ 2013లో సుప్రీం కోర్ట్ ఆ తీర్పుని కొట్టేసి స్వలింగసంపర్కాన్ని నేరమని నిర్ణయించే సెక్షన్ 377 అమల్లోనే ఉంటుందని చెప్పింది. ఈ రెండుతీర్పుల మధ్య కాలంలో 2010 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ ఇంటిమీద దాడి జరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీన 2010 లో ఆయన అలహాబాద్ హైకోర్ట్ లో కేసు గెల్చాడు. ఏప్రిల్ 7వ తేదీ 2010 న తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉన్నాడు. అటాప్సీ రిపోర్ట్ లో విషప్రయోగం జరిగిందని వచ్చింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినా, సరైన ఆధారాలు ఇవ్వలేకపోవటంతో అది హత్య కేసుగా నిలవలేదు.

‘అలీగఢ్’ సినిమా ఒక లాంగ్ పోయెమ్.  ప్రొఫెసర్ సిరస్ తో ‘కవిత్వంలోని పదాలు నాకు అర్థం కావం’టాడు జర్నలిస్ట్ దీపూ. ‘పదాల్లో ఏముంది అర్థం? పదాల మధ్య వున్న నిశ్శబ్దంలో ఉంటుంది గానీ’ అంటాడు శబ్దాల మధ్య ఒదిగున్న నిశ్శబ్దంలాంటి సిరస్. అతనికి లతా మంగేష్కర్ పాటలంటే ప్రాణం. మరాఠీలో కవిత్వం రాసి అచ్చేసుకున్నవాడు.  ‘Gay’ అనే  మూడు అక్షరాలలో ఓ మనిషిని కుదించటం ఏమిటని మౌలికమైన ప్రశ్న వేస్తాడు.  తన పార్టనర్ ని చూస్తే తనలోని ప్రేమ తనను నిలవనీయదని చెప్పి, ఆ పరిస్థితిని వీలైనంత స్పష్టంగా చిన్నమాటలతో  దీపూ కి వివరించటానికి ప్రయత్నిస్తాడు.

alia-bhatt-udta-punjab-trans

కథలోకొస్తే, రాత్రివేళ సిరస్ ఒక రిక్షాఅతనితో కలిసుండగా ఇద్దరు మనుషులు అతని ఇంట్లోకి చొరబడి వాళ్ళిద్దరినీ వీడియో తీసి, రిక్షాఅతన్ని కొట్టి, ఇద్దరిమీదా విరుచుకుపడి తిట్లకి దిగుతారు.  సిరస్ భీతితో ముడుచుకున్న పావురాయిపిల్లలా అయిపోతాడు. తరువాత ‘గే’ అనే ఆరోపణమీద అతన్ని యూనివర్సిటీ సస్పెండ్ చేస్తుంది. సిరస్ నమ్మిన తోటి ప్రొఫెసర్ ఒకాయన అతన్ని ఓ పక్క అసహ్యించుకుంటూనే మరోపక్క సాయం చేస్తున్నట్టుగా, తను ‘గే’ అని ఒప్పుకుంటూ క్షమాపణ పత్రం రాయమని సిరస్ కు సలహా ఇస్తాడు. ఏమీ తోచని సిరస్ అలాగే రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కేంపస్ లో సిరస్ శీలపరీక్ష, అతని దిష్టిబొమ్మ తగలేయటం లాంటి పనులు జరుగుతాయి. అప్పట్నుంచీ తలుపులు వేసుకుని అతను దిగులుగా భయంగా ఇంట్లోనే ఉండిపోతాడు.  వారంరోజుల్లో అతను యూనివర్సిటీ క్వార్టర్ ను ఖాళీ చెయ్యాలని చెప్పి, ఇంటికి ఎలక్ట్రిసిటీ లేకుండా చేసేస్తారు. దీపూ తన పత్రికకోసం ఈ విషయాన్నంతా స్టోరీ చేయాలన్న తపనతో, చాలా సానుభూతితో కష్టపడి సిరస్ కి చేరువై, అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో హక్కుల సంఘాలవాళ్ళు సిరస్ కు ఆసరా ఇచ్చి అతనిచేత కోర్ట్ లో కేసు వేయిస్తారు. అలీగఢ్ విద్యాలయాన్ని ఎంతగానో ప్రేమించిన సిరస్ యూనివర్సిటీ క్వార్టర్ విడిచిపెట్టి వేరేయింటికి మారాల్సివస్తుంది.  అతని వ్యక్తిగత జీవితంలోకి దౌర్జన్యంగా చొరబడి వీడియోలు తీసే హక్కు ఆ వ్యక్తులకీ, ఆ వీడియోల ఆధారంగా సిరస్ ను శిక్షించే హక్కు యూనివర్సిటీకీ లేదని వాదించి కూడా ఆవిధంగా ఒప్పించలేక, చివరకు స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని precedent గా చూపించి కేసు గెలిపిస్తాడు లాయర్.

సిరస్ హక్కులంటూ పోట్లాటకు దిగలేని నెమ్మదస్తుడు.  లతామంగేష్కర్  పాటలూ కవిత్వమూ తప్ప ఇంకేం అక్కర్లేదు. కోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా అంతగా ఇష్టపడక ఇక తప్పని పరిస్థితిలో దానికి ఒప్పుకునేంత ఇంట్రావర్ట్.  తనగురించి కోర్ట్ లో వాదనలు జరుగుతుంటే అవన్నీ అర్థంకాక అలిసిపోయి చేతిలో పుస్తకం పట్టుకుని చిన్నకునుకు తీస్తుంటాడు.  అలీగడ్ లో మరాఠీ విభాగానికి హెడ్ గా ఉండటమంటే అక్కడ తను బయటివాడని అర్థం. అదేకాకుండా తనకు యూనివర్సిటీలో వున్న ప్రతిష్టను కూడా సహించలేని కొంతమంది ఇలా హింసకు దిగారని  దీపూ వొక్కడికే చెప్తాడు.

“అలీగడ్” ఒట్టి హక్కులూ పోరాటాల సినిమా కాదు. ఒంటరితనం.. వేధింపులకి గురై అలసిన ఒంటరితనం.. కొత్త ఇంట్లో చుట్టూ పరుచుకున్న సామాన్ల మధ్య దోమలు కొట్టుకుంటూ లతా పాటలూ, బయట హైవేమీదనుంచి పోతున్న లారీల చప్పుళ్ళమధ్య   ఇబ్బందిగా మసిలే ఒంటరితనం.. ‘గే’ అన్న ఒక్క తేలిక మాటతో తానెంతో ప్రేమించిన వాతావరణానికి క్రూరంగా దూరం చేస్తే గుక్కలు మింగే దుఃఖపు ఒంటరితనం ఈ సినిమా. ఇద్దరి ఏకాంతాన్ని వాళ్ళ అనుమతితో పని లేకుండా జొరబడి ధ్వంసంచేసి మనిషి విలువను నేలరాసి అవమానించటంలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపించటమే ఈ సినిమా..  ఎంతో ఆర్ద్రంగా తీశాడు హన్సల్ మెహతా.  సిరస్ గా వేసిన మనోజ్ బాజ్ పాయ్, దీపూ సెబాస్టియన్ గా వేసిన రాజ్ కుమార్ రావ్ సినిమానుండి కన్ను తిప్పుకోనివ్వకుండా చేశారు. మనోజ్ బాజ్ పాయ్ కి  2016 కి best actor గా జాతీయఅవార్డు ఏకగ్రీవంగా రావాలి మరి.

Loudness ఏ కొద్దిగానూ లేకుండా ఆర్ట్ ఆఫ్ సినిమాని పట్టుకుంది ‘అలీగఢ్’. ఏదో ఒక విషయాన్ని రుజువు చెయ్యటానికో, సమస్యను వివరించటానికో పరిష్కరించటానికో తీసినట్టుగా ఉండదు. సమస్య తీవ్రతనీ  వ్యక్తి ఆవేదననీ కలబోసి చెప్పిన తీరులో గొప్పగా తూకం కుదిరింది అలీగఢ్ లో.  మనోజ్ బాజ్ పాయ్ నటన, సినిమాటోగ్రాఫర్  సత్యారాయ్ నాగ్ పాల్ సినిమాకిచ్చిన melancholic tone, visuals సినిమాకున్న  పొయటిక్ పోకడకి బాగా అనుకూలించాయి.  వ్యాపారాన్ని పక్కనపెట్టి తీసిన సినిమా కావటం వల్ల డబ్బు కంటే ఎక్కువగా పేరూ ప్రశంసలూ వచ్చాయి.

***

లైంగిక వేధింపులని రకరకాలుగా సమర్ధించుకుంటున్న పురుషాధిక్యతకి చాచిపెట్టి లెంపకాయ కొట్టింది ‘పింక్’.  ఏ పరిచయస్తురాలైనా, స్నేహితురాలైనా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, నార్త్ ఈస్ట్ అమ్మాయయినా (వాళ్ళు సులువుగా దొరికేస్తారని చాలామంది మగవాళ్ళకి నమ్మకం), భార్య అయినా, అంటే అసలే స్త్రీ అయినాసరే నీ ప్రేమకీ కోరికకీ ‘వద్దు’ అని చెప్పిందంటే అది ఖచ్చితంగా ‘వద్దు’ అనే. ఇంకో వాదనకి అవకాశం లేదని సూత్రప్రాయంగా నిరూపించింది. నిర్భయ కేస్ తరువాత వచ్చిన నిరసనల్ని ఎదుర్కోలేక, పులి మేకమీద పడి తినేస్తే మేకదే తప్పన్నట్టుగా ఆడవాళ్ళ దుస్తులతీరు మీదా స్వాతంత్ర్యం మీదా ఏడ్చి, బాధితులనే నేరస్తులని చేసే దబాయింపుకి దిగారు కొంతమంది. ఏయే విషయాల్లో ఆడవాళ్ల ప్రవర్తన తప్పన్నారో ఆ పరిస్థితులన్నిటిలోనూ ఒక ముగ్గురు అమ్మాయిలని ఇరికించి, వాళ్ళమీద వచ్చిన లైంగికవేధింపులని ఇంకోమాట లేకుండా శిక్షించాల్సిన నేరాలుగా వాదించి ఒప్పించారు ‘పింక్’ సినిమాలో.

వాళ్ళు ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిలు. మెట్రోసిటీలో ఈతరం అమ్మాయిలు వేసుకునే బట్టలు వేసుకుంటారు.  ఫ్రెండ్స్ ద్వారా అప్పుడే పరిచయం అయిన అబ్బాయిలతో వాళ్ళని నమ్మి డిన్నర్ కి రిసార్ట్ కి కూడా వెళ్తారు. మద్యం తాగటం తప్పనుకోరు. ఒకమ్మాయి ఇంటి బాధ్యతలకోసం డబ్బు అవసరమై పెళ్ళయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.  మరో అమ్మాయి ఆ ఊళ్లోనే తల్లిదండ్రులుంటున్నా వాళ్ళతో కలిసి ఉండకుండా విడిగా ఉంటుంది. ఈమె పెళ్లి కాకపోయినా వర్జిన్ కాదు.  మూడో అమ్మాయి పుట్టుకవల్లనే (నార్త్ ఈస్ట్) ఇంచుమించు సెక్స్ వర్కర్ గా, సెకండ్ రేట్ సిటిజన్ గా భావించబడే జీవి.  ఒక సంప్రదాయ సమాజంలో ఇవన్నీ ఆ అమ్మాయిలని త్రాసులో వేసితూచి ‘చెడ్డ అమ్మాయిలు’ అని ముద్ర వేసే పరిస్థితులే.

pink2

నిర్భయ కేస్ తరువాత వచ్చిన మేల్ డామినేటెడ్ సంప్రదాయ సమాజపు discourse  కు సరైన సమాధానం చెప్పటం కోసమా అన్నట్టు ఈ ముగ్గురు అమ్మాయిల్నీ సంప్రదాయ సమాజపు ‘చెడ్డ అమ్మాయి’ ముద్రలోనే పెట్టి వాదన పెట్టుకున్నాడు దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌదురి.  కోరికలు పుడతాయి సరే, వాటితోబాటు వొచ్చే ఆలోచనలు సమానత్వమనే గీతదగ్గరే ఆగితీరాలని పట్టుగా చెప్పాడు.  అమాయకపు పల్లెటూరి పిల్లలుగానో, లేక అందరూ ఒప్పుకునే ‘పధ్ధతైన’ పిల్లలుగా ఉంటూనే అన్యాయాన్ని గట్టిగా ఎదిరించేవాళ్లుగానో కాకుండా చాలామంది వ్యతిరేకించే ‘థర్డ్ వేవ్ ఫెమినిస్ట్’ ల్లాగా ఉన్న అమ్మాయిల జీవితాలని చూపిస్తూ వాదించటంవల్ల ‘పింక్’ అర్బన్ యూత్ లోని ఆడామగా అందరికీ బాగా చేరిపోయింది.

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అర్బన్ మధ్యతరగతి మగవాళ్ళకి,  తమ స్పేస్ ని ఆక్రమించేదాన్ని దేనినీ సహించని థర్డ్ వేవ్ ఫెమినిస్ట్ ల జీవిత విధానాలను ఒప్పుకుని బ్రతకటం ఇప్పటికే అలవాటయింది.  ఇంట్లో పెంపకాల్లో అబ్బాయిలకి పొగరు, అమ్మాయిలకి ఒదిగుండేతనం నేర్పిపెట్టే కుటుంబాలకి ‘పింక్’ గట్టి మొట్టికాయ. ఈ సినిమా తర్వాత ‘పింక్’ హీరోయిన్ ‘తాప్సీపన్నూ’ కూడా తనమీద మగవాళ్ళు కొంతమంది తీసుకున్న sexual advances గురించి మాట్లాడింది. అప్పట్లో తల్లిదండ్రులు ఏం జరిగినా ఆడవాళ్ళదే తప్పనీ, నోరుమూసుకుని ఉండాలనీ నేర్పేవారు కాబట్టి తను అలాగే నోరుమూసుకుని ఉండేదని చెప్పింది.  ఆడామగా పెంపకంలో విడివిడి నీతులు పాటించేవాళ్ళని కడిగిపారేసిన ఈ సినిమా ఆడపిల్లలకు ఇంకొంచెం ధైర్యమిచ్చింది. ఇది చూసాకన్నా ‘ఆడది ముఖ్యంగా సెక్స్ టూల్, మనకే సొంతం, ప్రేమించానంటే కామించానంటే ఒప్పుకు తీరాల’ని మెదడులో ఇంకిపోయిన కొంతమంది వృద్ధులకీ వృద్ధుల్లాంటి కుర్రాళ్ళకీ  ‘పింక్’ మాట్లాడుతున్న సభ్యతా సమానత్వాల పరిభాష అర్థమౌతుందా? ఏమైనా చాలామందిని చేరుకుని, చర్చలకి దారి తీయించటంలో ‘పింక్’ టీమ్ గెల్చింది.

‘పింక్’ లో అమితాబ్ ఆక్సిజన్ కోసం మాస్క్ వేసుకు తిరుగుతుంటాడు. అదో మంచి ప్రతీక. ఢిల్లీ వాతావరణంలోని ఊపిరాడనితనాన్నీ, ఆడపిల్లల అభద్రతనీ మాంచి టెన్షన్ నిండిన మ్యూజిక్ తో నింపి సినిమా అంతా అందర్నీ  కుర్చీల అంచుల్లో కూచునేలా చేసేస్తుంది సినిమా.  శూజిత్ సర్కార్ ఆధ్వర్యంలోని సినిమా కాబట్టి నటులందరూ పోటీలుపడి జీవించక తప్పదు గానీ, ఈ ముగ్గురాడపిల్లల్నీ వేధించిన పోలీస్ ఆఫీసర్ గా వేసిన అమ్మాయిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎటూ కాని చదువులతో  ఉద్యోగంలో చేరిపోయి ఉన్న తెలివీ పోయి, బండతనం నేర్చేసుకున్న కింది లెవెల్ ఆడపోలీస్ ల మగ మనస్తత్వాన్ని ఆమె కళ్ళకి కట్టేస్తుంటే, ధర్నాలు చేసే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టి వాన్ ఎక్కించే పోలీస్ ఆడవాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది కదా అనిపించింది.

***

“ఉడ్తా పంజాబ్” … విడుదలకి ముందే ఎంతో హడావుడి జరిగింది దీనిగురించి. సెన్సార్ బోర్డు కసిగా కత్తిరించి పోగులు పెట్టాలని చెప్పిన తర్వాత కష్టపడి ఎలాగో బయటికొచ్చిందీ సినిమా. వరసగా పంజాబ్ లోని ఊర్ల పేర్లన్నీ చెప్పి, అవన్నీ డ్రగ్స్ మయం అయిపోయాయని ఒక డయలాగ్, పంజాబ్ ని మెక్సికో ఆఫ్ ఇండియా అని మరో డయలాగ్, ఇలా అదరగొట్టి, పంజాబ్ నీరసించిపోతోందన్న నిజాన్ని కటువుగా చెప్తుంది ‘ఉడ్తా పంజాబ్’.  ఎంతో సెన్సిటివ్ సినిమా.  ఇంత స్థాయిలో డ్రగ్స్ కి అలవాటు పడుతున్న మనుషులు, డ్రగ్స్ రవాణా, డీ అడిక్షన్ సెంటర్స్, మత్తుమందుల వ్యతిరేక ప్రచారం వరకూ సమస్య సాగిందని చూపిస్తుంటే ఇదంతా నిజమేనా మనదేశంలోనే జరుగుతోందా అనిపిస్తుంది.

పేరుకూడా ఎవరూ గుర్తుపెట్టుకోని బీహారీ వలసకూలీ పిల్ల (అలియా భట్) (హాకీ ఆడగలిగే ఈ పిల్లకి పొలంలో పాకిస్తాన్ బోర్డర్ నుండి విసిరిన పెద్ద మత్తుమందు పొట్లం దొరుకుతుంది. దాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించాలని వెళ్లి చిక్కుల్లో పడుతుంది), సెలెబ్రిటీ అయినతర్వాత మీదపడే అభద్రతతో వీడ్ కొట్టి, చస్తూబతుకుతూ బూతులు కురిపిస్తూ గాలిపటంలా తిరిగే రాప్ సింగర్ (షాహిద్ కపూర్),  డ్రగ్స్ రోగులకి వైద్యంచేస్తూ ఈ దందాని పూర్తిగా బయటపెట్టాలని ప్రయత్నించే social activist లాంటి డాక్టర్ (కరీనా కపూర్),  డ్రగ్స్ రవాణాదార్ల దగ్గర లంచాలు కొడుతూ, సొంత తమ్ముడే addict అయాడని తెలిశాక డాక్టర్ కి సాయంచేసి, డ్రగ్ మాఫియాని బైటపెట్టే ప్రయత్నం చేసిన చిన్నస్థాయి పోలీసూ(పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్) ఈ సినిమాని నడిపిస్తారు.

కమర్షియల్ మసాలా అంతా ఉన్న సినిమా. కానీ ట్రీట్ చేసిన పద్ధతి కొత్తది.  అభిషేక్ చౌబే దీనికి డైరెక్టర్. అనురాగ్ కాశ్యప్ ఛాయలు కొన్ని కనిపిస్తున్నా పూర్తిగా ఆ శైలి కూడాకాని freshness తీసుకొచ్చాడు చౌబే.  డ్రగ్స్ వాడకాన్ని ఏదో మాయగా మేజిక్ లాగా చూపించడు. దానిలోనే భీభత్సాన్నే చూపించి భయపెడతాడు. చెడుని ఆకర్షణీయంగా చూపిస్తూ చివరకి నీతులు చెప్పే సినిమాలాంటిది కాదు ఉడ్తా పంజాబ్. మత్తుమందుల ఊబిలోకి నిస్సహాయంగా జారిపోతున్న పిల్లలని చూపించి భయపెడుతుంది. బలవంతంగా డ్రగ్స్ ఎక్కిస్తుంటే అచేతనంగా అయిపోయే అమ్మాయిని చూపించి పిచ్చెక్కిస్తుంది.  తన్ని తాను కూడదీసుకుని మత్తుమందుని గొప్ప మనోధైర్యంతో resist చేసే ఆ పిల్ల పట్టుదలని కూడా చూపించి, కాస్త గాలి పీల్చుకునేలా చేస్తుంది. తల విదుల్చుకుని తానెవరో తన బాధ్యత ఏమిటో తెలుసుకున్న రాప్ సింగర్ ‘హమ్మయ్య’ అనిపిస్తాడు. మత్తుమందుతో విచక్షణపోయి, విలువైన ప్రాణాన్ని ఇట్టే ఊదేసిన పిల్లవాడిని చూసి ఏడుపొస్తుంది.  మన దేశంలోని ఒక రాష్ట్రంలోనే  మనుషులు ఇంతగా బలవుతున్నారా అని బాధేస్తుంది.

సెలబ్రిటీ సిండ్రోమ్ ని కూడా పట్టుకుంటుంది ఉడ్తా పంజాబ్.  ఈ సినిమాలోని రాప్ సింగర్ టామీసింగ్ aka గబ్రూ,  ఇప్పటి పంజాబీ పాటగాడు హ్రిదేష్ సింగ్ aka యోయో హనీసింగ్ ని గుర్తుచేస్తాడు.  ఆడవాళ్ళమీద ‘ఐ స్వేర్  ఛోటీ డ్రెస్స్ మే బాంబ్ లగ్తీ మైనూ’ లాంటి లోకువ పాటలు పాడే sexist రాపర్ హనీసింగ్.  ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలో ‘లుంగీ డాన్సు’ పాటతో దేశమంతా పేరుగడించిన ఈయనీమధ్య రెండేళ్ళపాటు మానసిక వ్యాధివల్ల పాటలకి సెలవిచ్చుకున్నాడు.  ఆ పంజాబీ rap culture, ఆ frustration, ఆ బూతులూ, అవన్నీ మర్యాదస్తుల సంస్కరణకి లొంగని నిజాలే. Psychedelic music లో బూతుల్లో  డ్రగ్స్ ఉన్మాదాన్ని చూడమంటుంది ‘ఉడ్తా పంజాబ్’.  దాస్యం చేయించే మాదకతనీ దాన్లోంచి బయటపడాలన్న  తపననీ బాగానే చూపించాడు ‘గబ్రూ’గా షాహిద్ కపూర్.

ఒక పదేళ్ళనుంచీ పంజాబ్ మత్తుమందుల మీద ఒంటరి పోరాటం సాగిస్తోందని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. హరితవిప్లవం తర్వాత అక్కడ విపరీతంగా పొలాల్లో వాడిన పురుగుమందుల ఫలితంగా చాలామందికి  కేన్సర్ వచ్చింది. మాల్వా ప్రాంతానికి చెందిన జిల్లాల్లో కేన్సర్ సోకినవాళ్ళు భటిండా నుండి బికనీర్ వెళ్ళే ట్రైన్ లో బికనీర్ వెళ్లి అక్కడ వైద్యం చేయించుకుంటారు. ఆ ట్రైన్ కే కేన్సర్ ట్రైన్ అని పేరొచ్చేసింది. అంతలా కేన్సర్ పాకిపోయింది. దీనికితోడు నార్కో కేన్సర్ పంజాబ్ ని చుట్టేసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా పంజాబ్ కి అదుపు లేకుండా వస్తున్న హెరాయిన్ వ్యాపారానికి రాజకీయ నాయకులు, పోలీసులు అవినీతిమరకల చేతులు కలిపి సాయపడుతున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డ జనం బతికున్న శవాల్లా తయారవుతున్నారు. హెరాయిన్ సప్లై ఆగిపోతే అది అందక వెంటనే మనుషులు చచ్చిపోతారనే భయంతో ఊళ్లలో పెద్దవాళ్ళు సప్లై ఆపవద్దని అధికార్లని కోరేటంత దీనస్థితికి వచ్చారని Pioneer డైలీపేపర్ చెప్తోంది. ధైర్యానికీ పోరాటానికీ పేరుపొంది, ప్రతి ఇంటినుంచీ సైన్యానికో యువకుడిని పంపించే సంప్రదాయం, ఆరోగ్యంగా ఆటలాడుతూ పతకాలు గెల్చే దమ్మూ ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని యువత ఈ రోజు నీరసంగా మత్తులో తూలుతోంది.  ఇప్పుడీ సినిమా విడుదలవటం, సక్సెస్ కావటం సహజమే కాదు అవసరం కూడా కదా.

***

‘దంగల్’, ‘నీర్జా’, ‘ఎయిర్లిఫ్ట్’ లాంటి మంచి సినిమాలూ, ‘క్యా కూల్ హై హమ్’, ‘మస్తీ జాదే’ లాంటి ఒట్టి చెత్త సినిమాల మధ్యలోంచీ  పై మూడు ముఖ్యమైన topical సినిమాలనిచ్చింది ఈ సంవత్సరం బాలీవుడ్. కొత్తగా కథలు  చెప్పటంలో త్వరత్వరగా ఎదుగుతున్న bollywood sophistication వొచ్చే సంవత్సరం ఇంకెన్ని మంచిసినిమాలిస్తుందో చూడాలి.

ఇక్కడ ‘అలీగఢ్’లో మనోజ్ బాజ్ పాయ్ నటన చూడండి…

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Bhavani Phani says:

    ముఖ్యమైన మూడు సినిమాల గురించీ చాలా విపులంగా రాసారు. నిజంగానే మంచి సినిమాలు. బాలీవూడ్ భాషను మార్చిన సినిమాలు. మన తెలుగు పరిశ్రమ ఎప్పుడు మార్చుకుంటుందో మరి తన భాషని!

  2. Sivalakshmi says:

    లలితా, హిందీ బాగా రాక Dialogue Immersion రాదు.పింక్ ఒకటే చూశాను.మీ సమీక్ష చదివాక మిగిలిన రెండు సినిమాలూ అర్జెంట్ గా చూడాలనిపిస్తోంది.అభినందనలు!

  3. ఉణుదుర్తి సుధాకర్ says:

    గొప్ప రచనలు సాంఘికశాస్త్రాలు వేసే అంచనాలకన్నా నాలుగడుగులు ముందుండి సమకాలీన సమాజాన్ని అర్థంచేసుకొనే దిశలో మార్గనిర్దేశం చేస్తాయని ఎక్కడో చదివాను. గొప్ప సినీమాలు కూడా ఆ పనిని సమర్థవంతంగా చెయ్యగలుగుతాయని – మిత్రులు లలితగారి సునిశితమైన సద్విమర్శ చదివాక తెలుసుకున్నాను. ‘ఉడతా పంజాబ్’ చూడడం కుదరలేదు గాని, మిగతా రెండూ చూశాక లలితగారు ప్రకటించిన అనుభూతే కలిగింది. మనోజ్ బాజ్ పాయికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఇవ్వడం న్యాయంగా ఉంటుందని అనిపించింది. అతను తన అండర్ స్టేటెడ్ నటన ద్వారా అన్స్టేటెడ్ ఎమోషన్స్ ని గొప్పగా కన్వే చేసాడు. రెండు సినిమాలూ బాధితులరోదన నుండి రోజువారీ నిర్ణయాల ఉద్రిక్తత వైపు ప్రేక్షకుల దృష్టిని మళ్ళించాయి; కుర్చీల అంచుకు వారిని నిర్దాక్షిణ్యంగా నెట్టివేసాయి. ఇవన్నీ మన సినీమాల్లో చూడడం ఆనందదాయకం. (తెలుగు సినీమాల్లో మరి ఎప్పుడు చూస్తామో). మంచి విమర్శకులకు వాళ్ళు చర్చిస్తూన్న విషయమే కాక ఇంకా అనేక అంశాలపట్ల లోతైన అవగాహన ఉండితీరాలని లలితగారు మరోసారి స్పష్టం చేశారు. అభినందనలు.

మీ మాటలు

*