కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

santhi1

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .

నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.

కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .

 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం

ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .

వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .

santhi2

నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 

అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .

చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .

2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .

మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .

ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..

పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 

మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.

ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .

santhi4

ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .

బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.

యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .

బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .

అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .

santhi3

కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .

ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .

అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..

మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .

నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.

అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..

ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .

ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .

ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.

ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .

ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..

*

 

 

మీ మాటలు

  1. e a v srinivass says:

    థాంక్యూ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్ .

  2. RATNAKAR CHERUKU says:

    ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళతో గడిపిన అనుభూతి కలిగిందండీ. చాలాబాగా వివరించేరు.థాంక్యూ శాంతి గారు.

    • shanti prabodha says:

      ధన్యవాదాలండి రత్నాకర్ గారు. ఇంకా వాళ్ళగురించి రాయాల్సింది , చెప్పాల్సింది చాలా మిగిలే ఉంది రత్నాకర్ గారు

మీ మాటలు

*