ఆ నిర్లిప్తత భయావహం

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-8

 

sudrarsanamలౌకికం-అలౌకికం; సామాన్యత-అసామాన్యత అనే ద్వంద్వాల మధ్యనే ‘వేయిపడగలు’ నవల మొత్తం సాగుతూ ఉంటుంది. అయితే, అవి వేటి కవిగా ఉండిపోవడం తప్ప;  వాటి మధ్య ఒక లంకె ఉంటుందనే స్ఫురణను రచన కలిగించదు. అలౌకిక ప్రపంచంలో అర్థవంతంగా అనిపించే పాత్రలు లౌకిక ప్రపంచానికి వచ్చేసరికి తేలిపోతాయి. ఉదాహరణకు అలౌకికతనుంచి చూస్తే రామేశ్వరశాస్త్రి అసామాన్యుడు. “మా తండ్రి నేమనుకొంటివి? ఆయన లోకసామాన్యుడు కాదు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకు యెట్లు తెలియును?” అని అరుంధతితో ధర్మారావు అంటాడు. లోకసామాన్యుడు కాని వ్యక్తి గొప్పతనం లోకంలోని అసంఖ్యాకులైన దౌర్భాగ్యులకు తెలియనప్పుడు ఆ గొప్పతనం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

లౌకిక జీవనానికి వస్తే, రామేశ్వరశాస్త్రి మొదట్లో సంపన్నుడు. జమీందారు తర్వాత అంతటివాడు. కానీ చేతికి ఎముక అన్నది లేకుండా దానధర్మాలు చేశాడు. బంధువులనూ, పేదలనూ, రైతులనూ, వర్తకులనూ కూడా ఆదుకున్నాడు. చివరికి చితికిపోయి శేషజీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులే కాక, అతని సాయంతో వృద్ధిలోకి వచ్చిన రైతులు, వర్తకులూ కూడా మొహం చాటేశారు. తను వివాహమాడిన మిగతా మూడు వర్ణాల స్త్రీలకు; భోగస్త్రీకి ముందే ఆస్తి పంచి ఇచ్చిన రామేశ్వరశాస్త్రి కొడుకు ధర్మారావుకు మాత్రం పేదరికన్నే మిగిల్చిపోయాడు.

‘వేయిపడగల’ రచయిత వాస్తవానికి రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా సామాజిక పరిణామ చరిత్రను చెబుతున్నాడు.  బ్రిటిష్ కాలంలో లేదా ఆధునికత అడుగుపెడుతున్న దశలో బ్రాహ్మణ్యం అగ్రహారాలనూ, ఇతర ఆస్తులనూ కోల్పోయి ఆర్థికంగా అణగారిపోతూవచ్చింది. అగ్రహారం భూములు  రైతుకులాల పరమయ్యాయి. దానికితోడు, తెలుగు ప్రాంతాలలోని గోదావరీ, కృష్ణా మండలాలలో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల  వ్యవసాయం అభివృద్ధి చెంది చూస్తుండగానే రైతుకులాలవారు ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉచ్చదశను అందుకోవడం మొదలైంది. రెండు మూడు తరాల వ్యవధిలోనే సంభవించిన ఈ పరివర్తనకు తెలుగు ప్రాంతాలలోని బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో సాక్షిగా నిలిచాయి. తాత తరంలో బ్రాహ్మణభూస్వామి కింద పాలెకాపులుగా ఉన్న రైతుకులాలవారు మనవడి కాలానికి వచ్చేసరికి రాజకీయంగా ఉన్నతపదవులు అందుకోవడం, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం వారిని ఆశ్రయించడం ఈ పరివర్తన క్రమాన్ని ఆశ్చర్యస్ఫోరకంగా  మన కళ్ళముందు నిలుపుతాయి.

ఆర్థికక్రమశిక్షణ, కుటుంబ భవిష్యత్తుపట్ల బాధ్యతా రాహిత్యాలతో బ్రాహ్మణులు ఆర్థికపతనాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శ బ్రాహ్మణ్యంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పతన చరిత్రలోని ఒక పార్స్వాన్నే హాస్యబీభత్సవంతంగా ‘కన్యాశుల్కం’ చిత్రించింది. ‘వేయిపడగల’లోని రామేశ్వరశాస్త్రి ఉదంతాన్ని చదువుతున్నప్పుడు ఆయన మరీ ముందు వెనకలు చూడకుండా దానాలు, సాయాలు చేసి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టాడన్న భావన పాఠకులకు కలుగుతుంది. కానీ రచయిత వైపునుంచి ఆ అభిప్రాయం కానీ, విమర్శ కానీ ఉండవు. ఉండకపోగా రామేశ్వరశాస్త్రి ఆర్థికక్షీణతను కార్యకారణ సంబంధానికి అతీతమైన ఓ దైవఘటనగా, ఓడలు బండ్లు సామెతలా నిర్లిప్తంగా తీసుకోవలసిన పరిణామంగా చెబుతున్నట్టు ఉంటుంది. అదీగాక  రామేశ్వరశాస్త్రి అసామాన్యవ్యక్తి కనుక అతని లౌకిక ప్రవర్తనను సైతం లౌకిక కొలమానాలతో చూడకూడదన్న ధ్వనీ వ్యక్తమవుతూ ఉంటుంది.  అతను ఏం చేసినా ఒప్పే, ఏం చేయకపోయినా ఒప్పే. ప్రశ్నలకు, విమర్శలకు, కలిమిలేములతో సహా అన్నిటికీ అతను అతీతుడు. అసలు అతని, అతని కుటుంబపోషణ బాధ్యత అతనిది కాదు; రాజుదీ, లేదా సమాజానిదీ. విచిత్రమేమిటంటే, రచయిత రామేశ్వరశాస్త్రిని లౌకికానికి అందనంత పై మెట్టున నిలుపుతూనే; అతని వల్ల సహాయాలు పొందిన బంధువులు, బ్రాహ్మణేతరుల కృతఘ్నతను ఎత్తిపొడవకుండానూ ఉండడు.

ధర్మారావు లౌకిక జీవన చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. తేడా అల్లా, దాన ధర్మాలు చేయడానికి అతనికి తండ్రి ఏమీ మిగల్చలేదు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగానికి అర్హత అయితే సంపాదించాడు కానీ, మొదట్లో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటాడు. మధ్యలో జాతీయకళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తాడు కానీ అందులో ఇమడలేక విడిచిపెట్టేస్తాడు. కళ్ళముందు భార్య అనారోగ్యంతో చిక్కిశల్యమవుతున్నా మందు ఇప్పించలేని లేమిలో మగ్గిపోతాడు తప్ప ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం పాఠకులకు విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి జమీందారు రంగారావు కొడుకు హరప్పకు గురువుగా నియమితుడైన తర్వాత సంభారాలు కోట నుంచే వస్తుంటాయి. దాంతో తిండి సమస్య పరిష్కారమవుతుంది కానీ, చేతిలో డబ్బు ఆడని పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రచయిత చెప్పదలచుకున్నది, ధర్మారావు కుటుంబ పోషణ చూసుకోవలసినది రాజు, లేదా సమాజమనే. అంటే, మారిన కాలంలో కూడా రచయిత వర్ణవ్యవస్థ తాలూకు బ్లూ ప్రింటును అమలు చేయడానికి ప్రయత్నించాడు.

viswanatha

రచయిత కల్పించే ఊహ ప్రకారం రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల డబ్బు సంబంధం కూడా ఓ తాత్విక ప్రశ్నలా ఉంటుంది.  డబ్బుతో వారికి అవసరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎంత డబ్బు అవసరమైనా వారు దాని వెంట పడరు, అదే తమ వద్దకు రావాలి! డబ్బు దగ్గర కూడా రచయిత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర భేదం తీసుకొస్తాడు. ధర్మారావు మిత్రుడు కిరీటి తన మేనమామకు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు:

నీవు నెలకు మూడువందలు తెచ్చుచున్నావు కనుక నీవే వివేకవంతుడవు కావు. ధనము సంపాదించుట వివేకము కాదు. ఏదో మనము బ్రాహ్మణేతరులము కనుక నెమ్మదిగా అందులోనుండి యందులోనికి మ్యాజిస్ట్రేటును, తహసీల్దారును, ఇంగ్లీష్ హెడ్ క్లార్కును, హుజూరు శిరస్తాదారును, డిప్యూటీ కలెక్టరునైనది. కానీ ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా? మహాశిల్పులమా? మతకర్తలమా? ఏమని?

సామాన్యార్థంలో చెప్పుకుంటే భౌతిక సంపద కన్నా జ్ఞానసంపద గొప్పదీ, సమాజం పోషించదగినదే. కానీ, పై వాక్యాలు  జ్ఞానసంపద ఉన్నవారికీ, ‘అలాంటి జ్ఞానసంపద’ లేని వారికీ మధ్య తారతమ్యాన్ని ఎంచి; జ్ఞానసంపద ఉన్నవారినీ, వారి జ్ఞానాన్నీ కూడా  ఎత్తు పీట మీద కూర్చోబెడుతున్నాయి. అసలు ఏది జ్ఞానమన్న మౌలిక చర్చ ఒకటి ఉండనే ఉంది. నిర్దిష్ట వర్గానికి చెందిన నిర్దిష్ట జ్ఞానమే జ్ఞానం కాదు. జ్ఞానం బహుముఖాలుగా ఉంటుంది. ఆ చర్చలోకి వెడితే కిరీటి నోట పలికించిన పై అభిప్రాయం అసమగ్రంగా తేలిపోతుంది. ఎంత గొప్ప జ్ఞానమైనా సామాన్యీకరణ చెంది ప్రజల పరం అయినప్పుడే దానికి విలువా, సార్థకతా.  కానప్పుడు అది అలంకారప్రాయంగా మారి షో కేస్ కు పరిమితమవుతుంది.

ధర్మారావుతో పోలిస్తే, అతని భావజాలంతో ప్రభావితుడై, దాని పక్షాన పోరాడిన కుమారస్వామి విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకుంటాడు. కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ధర్మారావులానే ఉద్యోగంలో ఇమడలేక రెండు ఉద్యోగాలను వదిలేస్తాడు. ధర్మారావులా అతనికి కోటనుంచి సంభారాలు వచ్చే పరిస్థితిలేదు. అయినా సరే, దుర్భర దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాను తప్ప, ఆత్మగౌరవం చంపుకుని ఉద్యోగం చేయనని అతను నిర్ణయించుకుంటాడు. ఆవిధమైన పోరాటశీలం కానీ, త్యాగం కానీ ధర్మారావులో లేవు. చివరికి మంగమ్మ తన ఆస్తిని కుమారస్వామికి రాయడంతో అతను ఆర్థికసమస్యలనుంచి బయటపడడం వేరే విషయం.

లౌకికంగా చూసినప్పుడు; ఊళ్ళో ఇళ్ళు అంటుకుని, తన ఇంటిని కూడా మంటలు చుట్టు ముట్టే ప్రమాదఘట్టంలోనూ  ధర్మారావు ప్రవర్తన విపరీతమనిపించి విస్మయం కలిగిస్తుంది. అతనిని ఒకవైపు నిర్లిప్తుడిగా, నిష్క్రియుడిగానే కాక; ఇంకోవైపు అసామాన్యుడిగా, అధికుడిగా చూపడానికి ఇక్కడా రచయిత తాపత్రయపడతాడు. బ్రాహ్మణుల ఇళ్లకు దగ్గరలో, వేణుగోపాలస్వామి గుడి వెనక  మత్స్యమాంసాలను అమ్మే మార్కెట్ అవతరించడం ద్వారా ధర్మానికి జరిగిన హాని ఈ అగ్నిప్రమాదానికి కారణంగా చూపుతాడు. ఊళ్ళో జనం మంటలు ఆర్పడానికి రంగంలోకి దిగినా ధర్మారావు మాత్రం కుటుంబంతో బయటకు వచ్చి నిలబడిపోతాడు. ఇతరుల ఇళ్లను ఆర్పడానికి సాయపడడు సరికదా; తన ఇంటిని కాపాడుకోడానికి కూడా ప్రయత్నించడు. తల్లి సామాన్లు బయటికి తీసుకురాబోతే వారిస్తాడు. అప్పుడతని మాటలు ఇలా ఉంటాయి:

ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు; వీరు నలువు రన్నదమ్ములు. ధర్ము డందరిలో పెద్దవాడు. అతని కవమానము చేసినచో తక్కిన మువ్వురకును కోపము వచ్చును. అగ్ని తగులబెట్టును. తస్కరుడు దొంగిలించును. రాజు రాబడి పన్నని, అదనపు పన్నని లక్షవిధములుగా ధనము హరించును. మనము ధర్మావమానము చేసినచో  కానిమ్ము. పాతికవేల ఇల్లే పోయినప్పుడు వంద, రెండు వందల రూకల సామాను రక్షించునా?

దీనికి కొస మెరుపు ఏమిటంటే, “అతని యింటి మీద నెక్కి యెవరును నీరు పోయలేదు” అన్న రచయిత ఫిర్యాదు. అంటే, ధర్మారావు ఇంటి మంటలను ఆర్పే బాధ్యత కూడా సమాజానిదే కానీ అతనిది కాదన్నమాట. లౌకిక వ్యవహారాలలో ధర్మారావులో చిత్రించిన ఈ నిర్లిప్తత, నిష్క్రియత భయం గొలుపుతాయి. ఇలాంటి జడీభూతస్థితికి తాత్వికార్థమిచ్చి ఆకాశానికి ఎత్తిన జడభరతుడిలాంటి ఉదంతాలు మన పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి.  ధర్మారావు పాత్ర చిత్రణలో రచయిత ఊహల్ని అలాంటి నమూనాలు ప్రభావితం చేసి ఉంటే ఆశ్చర్యంలేదు. అయితే ఈ నిర్లిప్తతకు, నిష్క్రియతకు ఎంత గొప్ప తాత్విక అర్థాన్ని ఆపాదించినా, వాటికి సంస్కృతీ సంప్రదాయాల విచ్ఛిత్తీ, పారతంత్ర్యం వంటి లౌకిక పర్యవసానాలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలపైనే కదా ధర్మారావు ముఖంగా, ఇతర పాత్రల ముఖంగా రచయిత నవల పొడవునా చేసిన విమర్శ?!

ధర్మారావు భావజాలంతో ఏకీభవించేవారి వైపునుంచి చూసినా, స్వరాజ్యోద్యమం అలాంటి లౌకిక పర్యవసానాలనుంచి దేశాన్ని బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక కీలక సందర్భమే. కానీ ధర్మారావు మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనడు. పాల్గొనకపోగా స్వరాజ్యోద్యమం గురించి అతని అభిప్రాయం ఇలా ఉంటుంది:

నాకు చూచిన కొలది, దేశమందరు నుద్యమములో చేరినచో స్వరాజ్యము రేపే వచ్చును. కానీ యెవరికి వారు స్వార్థపరాయణులై యున్నారు. అట్టి సమయములో మరియు నిబ్బందులలో నున్నవారు తమ జీవితమార్గమును చెడగొట్టుకుని సంకటపడినందువల్ల నాకు లాభము కనిపించలేదు.

దేశంలో అందరూ ఉద్యమంలో చేరితే రేపే స్వరాజ్యం వస్తుందంటాడు. కానీ ఎవరికి వారు స్వార్థం చూసుకుంటున్నారంటాడు. వారిలో తనూ చేరతాడన్న స్పృహ మాత్రం అతనిలో ఉండదు. ఇంకోవైపు, మరీ ఇబ్బందులలో ఉన్నవారు తమ జీవితమార్గాలను చెడగొట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదంటాడు. అంటే, మిత్రుడు రాఘవరావులా తను స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణం, అతని కంటే తను ఎక్కువ ఇబ్బందులలో ఉండడమే నని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సంజాయిషీ అతనిలోని భద్రలోగ్ మనస్తత్వాన్ని బయటపెట్టి భీరువుగా చూపిస్తుంది తప్ప అతనిపై గౌరవాన్ని కలిగించదు. తాము పడే ఇబ్బందులు ఎక్కువా తక్కువా అన్నది చూసుకుని ఎవరూ స్వరాజ్యోద్యమంలో చేరలేదు. ఉద్యమంలో చేరి జీవనోపాధులను చెడగొట్టుకోవడమే కాదు, ఆస్తులను కోల్పోయినవారు కూడా ఎందరో ఉన్న సంగతి మనకు తెలుసు.

అదలా ఉంచితే, గాంధీ నాయకత్వంలోని స్వరాజ్యోద్యమంలో ధర్మారావు చేరకపోవడానికి భావజాల పరమైన విభేదాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు, దళితుల దేవాలయప్రవేశానికి ధర్మారావు వ్యతిరేకి. ఆ వ్యతిరేకతను రచయిత ఒకచోట ఇలా చిత్రిస్తాడు:

గణాచారి ధర్మారావులు కలసి దారి వెంట పోవుచుండిరి. ఒక పంచముడు ఎదురుగా వచ్చుచుండెను. గణాచారి తొలగి పోబోయినది. అతడు మరియు సమీపమునకు రాబోయెను. ధర్మారా వతనితో, ‘ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే యుండదు. అప్పుడు మనమందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు. మూలమైన బీజాక్షరపీఠమున శక్తి యప్పటికి సమూలముగా నశించును. నేను నీ వాడను పద’ యనెను. అతనికి తెలియలేదు. ధర్మారావు వంక వెర్రిమొర్రిగా చూచుచు నతడు దూరదూరముగా పోయెను.

ధర్మారావు మాటల్లోని వెక్కిరింత, వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. గాంధీతో భావజాల విభేదాలే ధర్మారావు స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణమని రచయిత సూచించి ఉంటే అది ధర్మారావుకు కొంత గౌరవప్రదంగా ఉండేది. అటువంటి స్పష్టత రచయితకు ఉండకపోవడానికీ అవకాశముంది. గాంధీ నాయకత్వంలో కాకపోయినా తనతో భావసారూప్యమున్న వ్యక్తులతోనో, సంస్థతోనో కలసి ధర్మారావు స్వరాజ్యానికి ప్రయత్నించి ఉండవచ్చు. అదీ చేయలేదు.

అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. అతని నిర్లిప్తత, నిష్క్రియత లౌకిక విషయాలలోనే. అలౌకిక విషయాలలో అతను క్రియాశీలిగా, నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నవాడిలా కనిపిస్తాడు. అది, దేవాలయం కేంద్రంగా సాంప్రదాయికతను లేదా వర్ణవ్యవస్థను పరిరక్షించడం. అలౌకిక జీవులుగా తోచే గణాచారి, గిరిక, పసరికలకు అతను అక్షరాలా అంగరక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ ఘట్టాలలో అతను ఎంత క్రియాశీలంగా ఉంటాడంటే, మరో ధర్మారావు అనిపిస్తాడు. ఈ సందర్భాలలో రచన కూడా అనూహ్య వేగాన్ని, సంవిధానాన్ని పుంజుకుని పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా పసరికను ఒక ఆంగ్లేయుడు అపహరించి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ధర్మారావు దానిని అడ్డుకుని పసరికను విడిపించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.

అదలా ఉంచితే, వ్యవస్థా పరిరక్షణలో భాగంగా యువరాజు హరప్పకు గురువుగా మారి అతన్ని కర్మయోగం వైపు నడిపించినట్టు, దేవదాసి అయిన గిరికను భక్తిమార్గంలో పరిణతను చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది.  అయితే ఆ గురుత్వం చుట్టూ నిగూఢత అనే తెర వేలాడుతూ ఉంటుంది. చెల్లెలైన గిరిక చేత సాధన చేయించడంలో అది మరింతగా వ్యక్తమవుతుంది. గిరిక పూర్తిగా అతిమానుష లోకంలోనే జీవిస్తూ ఉంటుంది. ధర్మారావు లౌకిక జగత్తు నుంచి, మధ్య మధ్య గిరికకు చెందిన అలౌకిక జగత్తులోకి పయనిస్తూ ఉంటాడు. పాఠకుల్ని ఆకట్టుకునే అంశాలలో ఈ అన్నా-చెల్లెళ్ల అనుబంధ చిత్రణ ఒకటి.

లౌకికంగా చూసినప్పుడు సామాన్య పాఠకులలో గిరిక పాత్ర కూడా ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది. ఆ భక్తి ఏమిటో, అంత చిన్న పిల్ల దేవుణ్ణే(వేణుగోపాలస్వామి) పతిగా వరించి లౌకిక పరిసరాలు పట్టకుండా అతని స్మరణలోనే గడపడమేమిటో అనిపిస్తుంది. నాస్తికుల సంగతి అలా ఉంచి భక్తులకు సైతం విడ్డూరం గొలిపేలా ఆమె భక్తితత్పరత ఉంటుంది. శారీరకంగా ఆమెలో ప్రకృతిసహజమైన ఎదుగుదల, సౌందర్యం, లావణ్యం ఉంటాయి. కానీ మానసికంగా ప్రకృతి సహజమైన కోరికలకు అతీతంగా ఉంటుంది. వేణుగోపాలస్వామితోనే ఆమె శృంగారానుభవం. ఈ చిత్రణ చివరికి ప్రకృతికి, దైవానికి మధ్య వైరుధ్యంగా పరిణమిస్తుంది. గిరిక ఉదంతాన్ని విడిగా చిత్రిస్తే భక్తికి ఆమె ఒక పరాకాష్టగా కనిపించి భక్తులను అలరించి ఉండేదేమో కానీ; సామాజికవస్తువుతో కూడిన నవలలో భాగం చేయడం వల్ల సార్వత్రిక సమాజం ఈ పాత్రతో ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పసరిక పాత్రతో పోల్చి చూసినప్పుడు ఈ తేడా అర్థమవుతుంది. పర్యావరణానికి ప్రతీకగా సృష్టించినది కనుక పసిరికతో సార్వత్రిక సమాజం తేలికగా అనుసంధానం కాగలుగుతుంది. భక్తి అనేది పర్యావరణం వంటి సార్వత్రిక అంశం కాదు కనుక గిరికతో అలాంటిది సాధ్యం కాదు. మళ్ళీ లౌకికంగా చెప్పుకుంటే గిరిక పాత్ర ద్వారా రచయిత దేవదాసీ వ్యవస్థను అసలు అర్థంలో నిరూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అయితే గిరిక దేవదాసీ వ్యవస్థకు అచ్చమైన ప్రతినిధి అవుతుందా, ఏ కాలంలోనైనా దేవదాసీలు ప్రకృతి సహజమైన స్పందనలకు దూరంగా గిరికలా పూర్తిగా దేవుడికే అంకితమై ఆయనే లోకంగా జీవించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరివరకో ఎందుకు, గిరిక తల్లి రత్నగిరి కూడా అలా లేదు. ఆమె రామేశ్వరశాస్త్రికి భోగస్త్రీ అయింది.

  (సశేషం)

 

 

 

 

మీ మాటలు

  1. ప్రసాద్ చరసాల says:

    అద్భుతమైన విశ్లేషణ. మొదటి నుండీ అన్ని భాగాలు చదివాను.
    చదవలేక పక్కన పెట్టిన వేయి పడగలని మళ్ళీ చదవాలనిపిస్తోంది ఈ విష్లేషణల కోణంలో రచయితను, ధర్మారావును అర్థం చేసుకొనడానికి.
    రచయిత భావాల పట్ల కోపం, బాధ, ఆగ్రహం, ఆవేదన, జాలి అన్నీ కలుగుతున్నాయి మీ వ్యాసాలు చదువుతుంటే.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ ప్రసాద్ గారూ…వేయిపడగలు చదువుతుంటే మీరన్న అనుభూతులు అన్నీ కలుగుతాయి. అందులోని కొన్ని పాజిటివ్ అంశాలను కూడా ఇలాంటి భావనలు కప్పేస్తాయి. అదే మరింత విషాదం.

మీ మాటలు

*