Archives for August 2016

ఒక లాలన…ఒక దీవెన!

bhaskarabhatla

 

సినిమా పాట క్వాలిటీ పడిపోయిందని కంప్లయింట్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు! అయినా ఎప్పటికప్పుడు అవసరమైనన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. ‘పాత పాటలు వింటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ సాహిత్యం, ఆ సంగీతం.. అబ్బా ఆ రోజులే వేరు!’ అని నేటి తరం పాటల్ని ఆడిపోసుకునేవాళ్ళు, 1950 నుండి 1970 వరకు ఎన్ని పాటలు వచ్చాయో, వాటిల్లో ఎన్ని పాటలు ప్రాచూర్యంపొందాయో, ఎన్ని పాటలు అసలు వినలేమో పోల్చుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లోకూడా పాటల విషయంలో మంచీ చెడుల నిష్పత్తి ఇంచుమించు ఈకాలంలో లాగే ఉందని.

పాట వస్తువు మారింది, భాషమారింది, సంగీతం మారింది, గాయకుల మారారు, సంస్కృతి మారింది, సినిమాలో కథలు మారాయి, ఇక పాట ఒక్కటీ మారకుండా ఉంటుందా? మన తాతలకి నచ్చిన పాటలు వాళ్ళ నాన్నలకీ, మన నాన్నలకి నచ్చినవి తాతలకీ, మనకి నచ్చినవి మన నాన్నలకీ నచ్చవు! అదంతే.

సంవత్సరానికి సుమారు అరవై సినిమాలూ, నాలుగైదు వందల పాటలూ వస్తున్నాయి మనకి. వాటిల్లో ఒక పది సినిమాలు మెచ్చుకోతగ్గవిగానూ, నలభైపాటలు ఆస్వాదించదగినవిగానూ మిగుల్తున్నాయి.

సినిమా సమిష్టి కృషే అయినప్పటికీ, అందర్నీ సమిష్టిగా ఒక ధ్యేయంవైపుకి తీసుకెళ్ళేవాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ అభిరుచినీ, సమర్ధతనీబట్టే ఎండ్ ప్రాడక్ట్ ఉంటుంది.

సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ చేసినా, పాటలు కవి రాసినా, గాయకులు పాడినా ఆ డైరెక్టర్ వీళ్ళ దగ్గర తనకి కావలసింది రాబట్టే చాతుర్యాన్నిబట్టే పాటలు ఉంటాయి.

మొన్న విడుదలైన “జ్యో అచ్యుతానంద” సినిమాలో పాటలు ఒకసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంత మంచి పాటలు చేయించుకున్న డైరెక్టర్ శ్రీనివాస్ కి అభినందనలు.

jyotachyutananda

సంగీతం : శ్రీకళ్యాణ్రమణ

గేయ రచయిత : భాస్కరభట్ల రవికుమార్

 

) ఆకుపచ్చని చందమామలా

గాయకులు : కార్తిక్, రమ్య బెహర 

 

ఒక అమ్మాయీ అబ్బాయి పాడుకునే డ్యూయట్ ఇది. ఆ కొత్త స్నేహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సన్నివేశానికి తేలికైన తెలుగు పదాలతో హాయిగా సాగిపోతుంది పాట!

సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా? మనచుట్టే ఉంటుందిగా చూస్తే ఇలా – యువకుల యుగళగీతమే అయినప్పటికీ పల్లవిలోనే ఒక తాత్విక భావన “ప్రశాంతతని ఎక్కడో బయట వెతక్కు, అది నీలోనే ఉంటుంది” అన్న రేంజ్ లో మెరుస్తోంది ఈ లైన్.

కూడబెట్టుకున్న డబ్బులూ, ఆస్తులకంటే ఆనందంగా జీవించిన క్షణాలే నిధులు అని చరణంలో మరొక తత్వభావం విసిరాడు కవి – తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం!

మనసులో నింపుకోవలసింది చెత్తకాదు, హాయినిచ్చే జ్ఞాపకాలు అని మరో చమక్కు – తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం

అప్పుడు ప్రతిఋతువూ వసంతంలా కనిపిస్తుంది, మన చిరునవ్వుల్లో చల్లని మంచు ముత్యాలు కురుస్తాయి అని సాగుతున్నారు! – వసారాలు దాటొచ్చాయి వసంతాలు వేళ; తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా

లోలోపల ఆనందం వెలిగిపోతుంటే వెళ్ళేదారులన్నీ వెలుతురు మయమేనట – “ప్రతీదారి మిణుగుర్లా మెరుస్తోంది వేళ

రెండో చరణంలో —

ఆ అమ్మాయీ అబ్బాయీ ఒకరికొకరు అండగా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ కోరుతున్నారు. ఒకరి కలల్ని మరొకరికి చెప్పుకోవడం ఎందుకు? నిద్రపోయేప్పుడు డైరెక్ట్ గా ఒకరి కలల్లో మరొకరు ప్రవేశించుకు పంచుకుందాం అంటున్నారు. ఎంత అందమైన ఊహ! ఎంత చక్కని కల్పన!

వారి చుట్టు వీచేగాలి ఆనందపు మత్తులో ముంచేస్తుందిట. మరి ఏం సుగంధాలు జల్లిందో మరి అని ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటున్నారు. మరి, వారి తీయని స్నేహ సుగంధాన్ని జల్లుకుందేమో!

*

 

) సువర్ణా సువర్ణా

గాయకుడు : సింహ

 

ఇది అమ్మాయిని టీజ్ చేస్తూ అబ్బాయి పాడే పాటలా ఉంది. అయినా సాహిత్యం ఎంత డీసెంట్ గా, కవితాత్మకంకా ఉందంటే  ఆ పాట అయిపోయే సమయానికి అమ్మాయి ముచ్చటపడి అబ్బాయితో ప్రేమలో పడిపోతుందన్నట్టు ఉంది.

అమ్మాయిని అల్లరిపెట్టిన తీరు, ఆమె ప్రవర్తనని వర్ణించిన విధానం, వాడిన విశేషణాలూ బాగున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాటల్ని తెలుగు పదాలతో రాయడం బాగుంది.

ఆల్చిప్పల్లాంటి కళ్ళనీ, జాంకాయలాంటి దోర ఈడనీ అంటూనే, ఆ అమ్మాయి చిటపటని ముద్దుగా “చక్కెర కలిపిన పటాసు” అంటూ మెచ్చుకుంటున్నాడు. నవ్వితే ముత్యాలు రాలినట్టు అన్న పాత ఉపమానాన్ని పక్కకి తోసి “తిప్పొదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వేయ్” అని బ్రతిమలాడటం కొత్తగా ఉంది.

ఎంతసేపు గోదావరీ, కృష్ణ, వంశధార, గౌతమీ, తుంగ, భద్ర నదులేనా? అమ్మాయిల్ని పోల్చడానికి, పొగడటానికి తెలుగునాట ఉన్న ఇతర చిన్న నదులు పనికిరావా ఏంటి? ఈ కవులెందుకు రాయరు అనిపించేది. ఈ పాటలో నాగావళి నదిని మొదటిసారిగా సినిమాపాటకెక్కించాడు కవి!

నాగావళి హొయలున్నవే మెలికల్లో” – సో క్యూట్!

నాగావళి కి ప్రాసగా నెక్స్‌ట్ లైన్ లో “బంగారి” అనడం బాగుంది. పాత సినిమా పాటని గుర్తుచేస్తుంది!

కొందరికి PDA (పభ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్టన్) నచ్చినట్టు, మరికొందరికి PDB (public display of బెట్టు ) నచ్చుతుందేమో :-)

ఏయ్ అనార్కలీ, అరసున్నా నడుముల్లో” అని నడుముకి తెలుగులో అరుదైపోతున్న అక్షరాన్ని ఉపమానంగా వాడటం గొప్పే!

దీపావళి వచ్చింది మే నెల్లో – పాట మొత్తానికి ఇదొకటే ఇంగ్లీషు పదం! అయినా ఆ దీపావళి చమత్కారంకోసం మెచ్చుకోవచ్చు.

నడిరాతిరి తెల్లారి పోతున్నా పొలమారి” – ప్రేమలో పడిన అబ్బాయి అవస్త కళ్ళముందు కనబడుతుంది.

 

*

) ఒక లాలన ఒక దీవెన (మేల్ వర్షన్)

గాయకుడు :  శంకర్ మహాదేవన్

 

బ్రేకప్ తర్వాత ప్రేయసి జ్ఞాపకాలను నెమరు వేసుకునే సన్నివేశానికో లేదు విడిపోయిన ప్రియురాలిని మళ్ళీ కలుకున్న సన్నివేశానికో రాయబడిన పాటలా ఉంది.  కర్ణాటక సంగీతం బాణీ పాట. కళ్యాణిరాగమని ఎవరో అన్నారు. శంకర్ మహాదేవన్ ఇదివరకే ఇలాంటొక మెలోడీ పాట విశ్వరూపంలో పాడాడు. అప్పట్నుండి ఎదురు చూస్తున్నా శంకర్ మహదేవన్ నోట మళ్ళీ ఎవరైనా అలా పాడించరా అని.

కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒకప్పుడు ఇద్దరం చెప్పుకున్న ఊసులు,  ఇద్దరినీ పెనవేసిన ఆ ప్రేమలు ఏమైపోయాయి? ఎందుకింత మౌనం మనమధ్య? పరాయి వ్యక్తిని కలిసినట్టు? అని గాఢమైన బాధని పలుకుతున్నాయి ఈ లైన్స్!

ఇంతకాలం దాచుకున్న ప్రేమని, హాయిని కాలమేమీ దోచుకోదు ఇమ్మని!

పెదవంచుమీద నవ్వుని పూయించుకోడం నీ పని నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని?

 

అందనంత దూరమేలే నింగికి నేలకీ

వాన జల్లే రాయబారం వాటికి

మనసుంటే మార్గమే ఉండదా?

ప్రతి మనిషి నీకే చెందడా?

అసాధ్యం అంటూ ఏదీలేదు అని ఆశావాదం చాటుతుంది!

 

బంధమే ఆనందమే

నువ్వు మోసుకెళ్ళే సంపద!

 

ఈ ఆల్బం లో సెకండ్ బెస్ట్ ఈ పాట!

 

*

) ఇదేమి తాకిడి ఇదేమి గారడి (టైటిల్ సాంగ్)

గాయకులు : స్మిత, శ్రీకల్యాణ్రమణ

 

ఈ పాట ప్రేమ డ్యూయట్! పాట ట్యూన్ ఒకటి రెండు చోట్ల ఇదివరకొచ్చిన కొన్ని పాత తెలుగు పాటల్ని గుర్తు చేయక మానదు (అష్టాచమ్మ సినిమాలో హల్లో అంటూ ఇల్లా రాకే… పాట & సరిగమలు సినిమాలో “సరిగమలాపవయ్యా…” పాట)

చెవులకి హాయిగొలిపే తెలుగు పదాలతో రాయబడిన సాహిత్యం. అంతకంటే ఎక్కువేం చెప్తాం? విని ఆనందించడమే!

*

 

) ఒక లాలన ఒక దీవెన

గాయకురాలు : హరిణి రావ్

 

ఈ ఆల్బం లో నాకు బాగా నచ్చిన పాట ఇదే. గాయని గళంలో ఫ్రెష్నెస్! బాంబే జయశ్రీ గొంతులో సుబ్రహ్మణ్య భారతి పాటలా హాయిగా ఉంది వినడానికి.

పల్లవి మేల్ వర్షన్ కీ ఫీమేల్ వర్షన్ కీ ఒకటే. చరణం మాత్రం వేరు వేరుగా ఉంది. ఏ చరణంలో గొప్పతనం దానిదే.

తన మనసులో ఉన్నది చెప్పలేక, దాచలేక తికమకలో కొట్టుకుంటున్న ప్రియుడిని విన్నవించుకునే పాట ఇది! నీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పేయ్. నా చేయి పట్టుకోవాలని తహతహలాడే నీ చేయిని కట్టిపెట్టుకోకు అని లాలిస్తుంది ఆమె మాటలతో!

 

అంతులేని ఇష్టమంతా గంగలా పొంగనీ,

ఆనకట్టే వేసుకోకు అందనీ

కలపాలనుంటే చేతినీ,

ఎగరాలనుంటే మనసునీ

దాచేయకు, ఆపేయకు

అటువైపు సాగే అడుగుని

 

Nasal voice ఈ పాటకి మరింత ఎమోషన్ ని పెంచింది.

 

———————-

రికార్డింగప్పుడు కవి దగ్గరే ఉండి పాటలు పాడించుకున్నట్టున్నాడు. ఎక్కడా ఉచ్ఛారణ దోషం అనిపించలేదు. వాద్యాలు కూడా సాహిత్యాన్ని ఎక్కడా డామినేట్ చెయ్యలేదు.

ప్రేమికులు తమ ప్రేమలేఖల్లోనూ ప్రేమహైలైటర్స్ గానూ, టీన్ ఏజ్ పిల్లలు నోట్‌బుక్స్ అట్టల మీదా, నెటిజన్ లు తమ ఫేస్‌బుక్ గోడల మీదా ఈ సినిమాలో పాటల లైన్స్ ని రాసుకుంటారు అని కచ్చితంగా చెప్పొచ్చు.

 

*  *  *

కొంత సిగ్గు మిగిలి వుండాలని…

dabral

మంగలేష్ డబ్రాల్ 1948 మేలో వుత్తరాఖండ్ లో జన్మించారు.అక్కడే ప్రాధమిక విద్యను అభ్యసించారు. అనేక పత్రికల్లో సంపాదక, వుపసంపాదకులుగా పనిచేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ లో సంపాదక బాధ్యతను నిర్వహించారు.

హిందీ పేట్రియాట్,ప్రతిపక్ష్, పూర్వగ్రాహ్ లాంటి పత్రికలు ఆయన సంపాదక వర్గంలో వూపందుకొన్నాయి.లోవా యూనివర్శిటీ నుంచి రైటర్స్ ప్రోగ్రాం ఫెలోషిప్ ను పొందారు.సాహిత్య అకాడమి అవార్డునూ పొందారు.

వర్తమాన హిందీ కవిత్వంలో వో ప్రముఖ గొంతుక మంగలేష్ డబ్రాల్. యితని కవిత్వం భారత దేశపు ప్రముఖ భాషల్లోనే కాక ప్రపంచ ప్రధాన భాషలైన ఆంగ్లం,రష్యన్,స్పానిష్,పోల్స్ కీ,బల్గేరియన్ లలో అనువదింపబడింది. యితను నాలుగు కవిత సంపుటాలు వెలువరించారు.యితని కవిత్వంలో సామంత,పెట్టుబడిదారి విధానాల పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది.తనే వో ప్రతిపక్షమై వో అందమైన కళ ప్రపంచాన్ని స్వప్నిస్తారూ. యితని కవిత్వం సూక్ష్మంగా సౌందర్యముతో,  పారదర్శిక భాషతో పాఠకులను ఆలోచింపజేస్తుంది.

*

నేను కోరుకొంటున్నాను
——————————

నేను కోరుకొంటున్నాను
కవుల్లో కొంత సిగ్గు మిగిలి వుండాలని

స్పర్శ మిగిలివుండాలని కోరుకొంటున్నాను
అది భుజాలను చెక్కుతూ
అత్యాచారిలా వెళ్ళాలని కోరుకోను
యెందుకంటే
అది వొక అపరిచితయాత్ర తరువాత
భూమి చివరి అంచుపై చేరినట్లు వుండును

నేను రుచి మిగిలివుండాలని కోరుకొంటున్నాను
తీపు చేదులకు అతీతంగా
తినని వస్తువులను కాపాడే
వొక ప్రయత్నపు పేరు

వొక సరళ వాక్యం కాపాడడం నా లక్ష్యం
మనం మనుషులం కదా!
యీ వాక్యపు నిజాయితీ బతికి వుండాలని కోరుకొంటున్నాను

దారిపై విన్పించే వో నినాదం
దాని అర్థంతో పాటు
అది మిగిలి వుండాలని
నేను కోరుకొంటున్నాను
నిరాశ మిగిలి వుండాలని

మళ్ళీ వొక ఆశ
మన కోసం జన్మిస్తుంది

పక్షుల్లా అప్పుడప్పుడూ
దొరకని పదాలు మిగిలి వుండాలి
కవుల్లో కొద్దిగా సిగ్గు మిగిలి వుండాలి

*

And, life goes on…!

abbas1

And Life Goes on …

ఈ నిజాన్నే, ఈ ప్రకృతి సూత్రాన్నే అనుసరిస్తూ గౌరవిస్తూ సినిమాలు తీశాడు అబ్బాస్ కియరోస్తమీ.

కియరోస్తమీ టెహరాన్ లో 1940 లో పుట్టాడు. సత్యజిత్ రాయ్ లాగే గీతల బొమ్మలు వేశాడు.  ఫోటోగ్రఫీ,  గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేశాడు. పర్షియన్ కవిత్వం చదువుకుని సున్నితత్వాన్ని పెంచుకుని చూపుని విశాలం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసి అకిరా కురసోవా లాంటి మహామహుల్ని ఆకట్టుకున్నాడు.  కియరోస్తమీ సినిమాలు చూస్తూ ఆ ప్రపంచంలో గడిపిన కాసేపూ తనలో క్షాళన జరుగుతుందంటాడు మార్టిన్ స్కోర్సేస్సీ. ఆయన అందించే  కళాత్మక స్ఫూర్తి ప్రపంచాన్ని ఒక కొత్త తాజా చూపుతో ఆశగా చూసేలా చేస్తుందంటాడు స్కోర్సేస్సీ.

తను పుట్టిన నేలమీద ఆడుకునే పిల్లలనీ, వాళ్ళకి సుద్దులు నేర్పే పెద్దలనీ, పనిపాటలు చేసుకునేవాళ్ళనీ అలవోకగా పలకరిస్తూ అతిసాధారణంగా ఒక డాక్యుమెంటరీలా సినిమాని తీసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది కియరోస్తమీ స్టైల్. కానీ ఆయన సినిమాని చూస్తూ ఉన్న కొద్దీ అందులో ఇంకేదో కూడా ఉందనే విషయం తట్టకుండా పోదు. కియరోస్తమీ సినిమాల్లో మలుపులు తిరిగే కథలుండవు గానీ మలుపుల దారుల్లో, గోధుమరంగు పొలాలమధ్య, మట్టిగోడలమధ్య తిరుగుతూ దేనికోసమో అన్వేషించే మనుషులుంటారు. ఏ బుజ్జి స్నేహితుడి హోంవర్క్ పుస్తకాన్ని తిరిగివ్వటానికో తిరిగే పిల్లలుంటారు.  ఏదో పనిమీద ఎవరినో కలవటానికో, లేదా సింపుల్ గా చచ్చిపోవడానికో ప్రయత్నిస్తూ తిరిగే  పెద్దలూ ఉంటారు. ఏ పనులూ ఎవరి నలుగుళ్ళూ  ఎలావున్నా .. life goes on..

కియరోస్తమీ డాక్యుమెంటరీకి, ఫీచర్ ఫిల్మ్ కీ మధ్యస్తంగా ఉండే పద్ధతిని పట్టుకున్నాడు. కామెరా ఏంగిల్స్ లో సంప్రదాయ పద్ధతులని వదిలేశాడు. దానితోబాటే హంగులని కూడా వదిలేశాడు. పదేపదే  అలికినాక నున్నగా తయారైనట్టున్న చిన్నచిన్న అందమైన మట్టి ఇళ్ళలో, బ్లాక్ టీ కప్పుల్లో, బురఖాలేసుకుని పన్లు చేసుకుంటూ తీరిగ్గా పిల్లల్ని సాకుతూ తిరిగే ఆడవాళ్ళలో, హుక్కాలు పీల్చే మగాళ్ళలో, ఎక్కడో ఉన్న బడికి చేరటానికో లేక అమ్మ పురమాయించే చిన్నచిన్నపనులమీదో పరుగెత్తే మగపిల్లల్లో.. ఇరానీవాళ్ళ బతుకుచిత్రాన్ని మనకి చూపిస్తాడు. సంగీతాన్ని పెద్దగా వాడడు గానీ డాక్యుమెంటరీల్లోలాగా తన సినిమాల్లో మాటలెక్కువ. నిశ్శబ్దంగా ఉండే క్షణాలు తక్కువ.

ప్రతి  సినిమా ఒక ప్రయాణం. ఆయన చూపించే ల్యాండ్ స్కేప్ మనోహరమూ కాదు. అలాగని సాధారణమూ కాదు. అదెలా వుందో అలాగే ఉంటుంది.  కానీ కొండల మలుపుల్లో ఓ క్లాసిక్ ‘Z’ కాంపోజిషన్ లో అమరిన పసుప్పచ్చని గోధుమ పంటల సౌందర్యం, ఎక్కడో ఓ మనిషి మెల్లిగా వల్లించే  పర్షియన్  కవిత్వం, దుమ్ము రేపుకుంటూ పోయే కారు స్ఫురింపజేసే అధునాతనత్వం, కొండల్లోని ఆదమరుపుతనాన్ని చెదుర్చుతూ డొక్కు బైక్ చేసే డబడబ శబ్దం, విసిరేసినట్టు అక్కడోటీ ఇక్కడోటీ ఉన్న గుబురుచెట్లమధ్య దాక్కున్న జామెట్రీని వెదికి పట్టుకునే కామెరా ఏంగిల్..  ఇవి దర్శకుడిగా ఆయన సంతకాన్ని పట్టి చూపిస్తాయి. సాధారణంగా కనిపించే ఆ సంతకంలోని అసాధారణ కోణాలని మనకి చేతనైనట్టు మనల్ని వెదుక్కోమని వదిలేస్తాడు.  ఏదో నెమ్మదైన డాక్యుమెంటరీ సినిమాలా ఉంది కదాని కళ్ళప్పగించి చూడ్డం కాదు. కియరోస్తమీ సినిమాకి మెదడు వాడాల్సిందే.

***

abbas2

చావనేది  తప్పనిదీ బ్రతుకు నిరంతరమైనదీనూ…

ఈ సాధారణమైన నిజాన్ని కథల్లో కవితల్లో సినిమాల్లో ఎంతో మెలోడ్రామానూ ఆశనూ కరుణ భీభత్స రసాలనూ  జోడించి చెప్పొచ్చు. ఉన్నతస్థాయి కళను సృష్టించటంలో ఇంతటి విస్తృతి ఉన్న వస్తువు ఇంకోటి లేదు. ఇరాన్ లో వచ్చిన పెద్ద భూకంపంలో తను చూసిన మృత్యుతాండవం కియరోస్తమీని చాలా కదిలించిందట.  అలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో చావుమీద బ్రతుకు చేసే పోరాటాన్ని చాలా నాటకీయంగా తీయవచ్చు. కానీ కియరోస్తమీ Minimalist.. ఉత్పాతాల్లోంచి కాకుండా  రోజువారీ జీవితంలోనుంచీ  చావుబతుకులకి సంబంధించిన లోతైన ప్రశ్నలను కొంత ఆధునికతతో, మరికొంత ఇరానియన్ సంస్కృతితో కలుపుతూ సంధించి వదిలేస్తాడు.

కియరోస్తమీ తీసిన సినిమాల్లో రెండు ముఖ్యమైన సినిమాల గురించి…

కాన్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారం Palme d’or సాధించిన కియరోస్తమీ సినిమా “Taste of Cherry”.

‘బదీ’ ఆత్మహత్య చేసుకోవాలని కొండల్లోకి కార్లో బయలుదేరతాడు. టెహరాన్ నగరం దాటి ఒకచోట తనను పూడ్చటం కోసం గొయ్యి తవ్వి సిద్ధం చేసుకుంటాడు. అక్కడికి వెళ్లి నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనీ, ఆ తరువాత తనని ఎవరైనా పూడ్చిపెట్టాలనీ, మర్నాడు పొద్దునే వచ్చి చూసి ఒకవేళ తను చావకపోతే తనను తిరిగి ఇంటికి తీసుకు రావాలనీ  అతని కోరిక. ఆ ప్రాంతానికి కార్లో వెళ్తూ దారిలో కనబడిన వాళ్ళని ఆపి తనకు సాయం చెయ్యమని కోరతాడు. ఆ పని చేస్తే చాలా పెద్దమొత్తం ఇస్తానని చెప్తాడు.

అతనికి తారసపడిన ఒక సైనికుడు, ఒక మతపెద్ద అతని కోరిక విని ఆశ్చర్యపోయి ఆ పని చెయ్యటానికి నిరాకరిస్తారు.  చివరికి బాఘేరీ అనే ఒక taxidermist అతని మాటలను జాగ్రత్తగా విని,  ‘బదీ’ ని ఆత్మహత్యా ప్రయత్నం నుండి తప్పించాలని చాలా ప్రయత్నిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని అనిపించటం చాలా సాధారణమని చెప్తాడు. తనకీ ఓసారి జీవితాన్ని భరించలేని పరిస్థితి వచ్చి ఉరేసుకుని చనిపోదామని అనుకున్నాడట. తాడు బిగించడానికి మల్బరీచెట్టు ఎక్కాడట.  అంతలోనే చేతికి మెత్తగా తగిలిన మల్బరీ పళ్ళు  కోసుకు తిన్నాడట. ఆ రుచిని అందరికీ పంచకుండా ఉండలేక పోయానని చెప్తాడు.  మల్బరీ పండు తనను  ఆత్మహత్యాప్రయత్నం నుండి తప్పించిందని చెప్తాడు. అంతవరకూ తామిద్దరూ కార్లో తిరిగిన దుమ్ము క్వారీలను దాటించి టెహరాన్ కి వెళ్ళే  చక్కని చెట్లు నిండిన వేరేదారిలోకి కారుని మళ్ళిస్తాడు బాఘేరీ.  పచ్చగా ఉండే బతికేదారిని  వెదుక్కోవచ్చునని మెల్లగా సూచిస్తాడు. జీవితపు చెర్రీ పండు రుచిని కాదనవద్దని హితవు చెప్తాడు.

అన్నీ విన్నాక కూడా అలసట నిండిన మొహంతో బదీ అతన్ని తన కోరిక తీర్చమంటాడు. చేసేదేంలేక అతను సరేనని తనుండే చోట కారుదిగి వెళ్ళిపోతాడు. ‘బదీ’ లో చిన్న ఊగులాట. చావాలన్న నిరాశలోంచి చిన్నగా మొలకెత్తిన జీవితేచ్ఛ. పరుగెత్తుకుంటూ బాఘేరీ ఉండే చోటికి వెళ్లి మర్నాడు పొద్దున్న తప్పనిసరిగా వచ్చి చూసి తను బతికుంటే ఇంటికి తీసుకురమ్మని మళ్ళీ చెప్తాడు. మొదట్నుంచీ చివరిదాకా బదీ అసలు ఎందుకు చావాలని అనుకుంటున్నాడో మనకీ తెలియదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించిన బాఘేరీకీ తెలియదు. ఒక స్థాయిలో తెలియనక్కర్లేదని మనకీ అనిపించేస్తుంది.

సర్దుబాటు, సంతృప్తి, ఆశావాదాలవైపు బాఘేరీ ఉంటే, తీవ్ర నిరాశ, అలసట, చావాలన్న బలమైన కోరికతో బదీ నలుగుతూ ఉంటాడు. కలవని ఈ రెండు పట్టాలమీద నడిచే బండిలా వీళ్ళ ప్రయాణం… రకరకాల వైరుధ్యాల మధ్యే మనుషుల బతుకులు తెల్లారుతుంటాయి. వీటితో ఏ సంబంధం లేకుండా ప్రతిరోజూ తెల్లవారుతూనే ఉంటుంది. ఈ స్పృహని అందిస్తూ ఈ సినిమా సాగుతుంది.

బదీ బ్రతుకుతాడా, చచ్చిపోతాడా అనే ఆత్రుత పెంచి, ఆఖరున  ఒక్కసారిగా ప్రేక్షకులని  సినిమానుంచి బైటకి లాగి నేలమీద నిల్చోబెడతాడు కియరోస్తమీ. And life goes on…

 

“The wind will carry us” — కియరోస్తమీ మనచేత చేయించే మరో ప్రయాణం…  బెహజాద్ మరో ముగ్గురితో కలిసి ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ మంచంమీదున్న చావ సిద్ధంగా ఉన్న ఓ ముసలమ్మ. ఆవిడ ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఊరివాళ్ళు చెయ్యబోయే కర్మకాండల తంతులను రికార్డు చేయటం ఈ నాగరికుల ఉద్దేశ్యం. కానీ ఊళ్ళోవాళ్లకి ఆ విషయం చెప్పకుండా తాము ఇంజనీర్లమని చెప్పుకుని ఊళ్ళో ఉండిపోతారు. ముసలమ్మ ఓ రోజు బాగుండి మరోరోజు బాగుండకా అలాగే గడిపేస్తూ ఉంటుంది. జీప్ లో ఎప్పుడూ పరుగులు తీస్తుండే బెహజాద్ పల్లెటూరి నత్త నడకలకూ  ఊళ్ళోవాళ్ళతో సంభాషించటానికీ  నెమ్మదిగా అలవాటు పడతాడు.

సిటీ నుంచి వొచ్చే ఫోన్ కాల్ కి సిగ్నల్ అందక, మొబైల్ ఫోన్లో  మాట్లాడ్డం కోసం జీప్ లో ఎత్తైన ప్రదేశానికి పరుగెడుతూ ఉంటాడు. ఎదురు చూస్తున్న ముసలమ్మ చావు ఎంతకీ రాదు. రోజూ తవ్వకం పని చేసే పరిచయస్తుడైన ఆ ఊరిమనిషి చావు అంచుకి వెళ్లి వస్తాడు. మొత్తానికి ముసలమ్మ చనిపోతుంది గానీ బెహజాద్ లో చావు బ్రతుకుల మధ్య పెద్దగా తేడా చూడని స్థితప్రజ్ఞత వచ్చి చేరుతుంది. చావుబతుకులను కలబోసుకుంటూ జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. And life goes on…

కథ ఏమీలేని ఈ సినిమాని ప్రవహింపజేయటం అసాధారణమైన ఫీట్.  గట్ల మధ్య ఒదిగి పారే నిండైన నదిలా ఉంటుంది ఈ సినిమా.  ఊరికీ నగరానికీ,  బతుక్కీ చావుకీ, సంప్రదాయానికీ ఆధునికతకీ  మధ్య ఉన్న తేడా  ఎంత పెద్దగా కనిపిస్తుందో అంత చిన్నదనే భావన అలుముకుంటుంది.  ఈ వైరుధ్యాల లాగే తేలిగ్గా కనిపించే సంక్లిష్టమైన కథనం కియరోస్తమీ స్టైల్.

 

ఈ రెండు సినిమాల్లో కామెరాను ముఖ్యపాత్ర వరకే చాలావరకూ పరిమితం చేస్తాడు. Protagonist మాట్లాడుతూ ఉంటాడు. అవతల నుండి వొచ్చే సమాధానం ముఖ్యం. ఇచ్చేవాళ్ళు ఎవరన్నది  అప్రధానం.  Protagonist చేస్తున్న అన్వేషణ ముఖ్యం. వెదుకుతున్న దారుల్లో, దొరుకుతున్న సమాధానాలలో ఏముందో మనమే ఊహించుకోవాలి.  ఇరానియన్ న్యూవేవ్ సినిమాలో కిరోస్తమీ కనిపెట్టిన ఈ భాష సగం దృశ్యాలను మన ఊహలకే వదిలేస్తుంది. ఆయన  చూపించే దృశ్యాలతో   మన ఊహల్లోకి వచ్చే దృశ్యాలనూ మనుషులనూ కలిపి చూడగలిగితే కియరోస్తమీ సినిమా విశాలమైన గడ్డిమైదానాల్లో  విహారంలా ఉంటుంది.  అక్కడ సింహాలూ జిరాఫ్ లూ తారసపడవు.  రంగుల గడ్డిపూలూ ఆరుద్రపురుగుల్లాంటి మెత్తటి ప్రాణులే ఎదురౌతాయి. ఆ సూక్ష్మదర్శనం   ఇచ్చే అనుభూతులను అందుకుంటూ పోవటమే.

‘The wind will carry us’ లో బెహజాద్ పాల కోసం ఒక ఇంటికి వెళ్తాడు. చీకటిగా ఉన్న కొట్టంలో ఉన్న పశువు. అస్పష్టంగా ఆ చీకట్లోనే లాంతరు పెట్టుకుని పాలు పిండే అమ్మాయి. పాలపొదుగు, అమ్మాయి చేతివేళ్లు, ఆమె దుస్తులు.. మనకు కనబడేవి ఇంతే.  బెహజాద్ గొంతు మాత్రమే వినిపిస్తుంది. అతను ఆమెకు ఆ చీకట్లో ఇరానీ కవయిత్రి ‘ఫారో ఫరోక్ జాద్’ రాసిన కవిత వినిపిస్తాడు. కియరోస్తమీ దృశ్యంలో సాధించిన సింప్లిసిటీ కి మచ్చుతునక ఈ సీన్.

కియరోస్తమీకి కవిత్వం ఇష్టం. దృశ్యాలను పొదుపు చేసి కవిత్వంమీదే మన దృష్టిని నిలపటం ఇష్టం. కవితతో దృశ్యాన్ని జోడించటం ఇష్టం. దారులిష్టం. ప్రకృతిలో నిశ్శబ్దంగా లీనం కావటం ఇష్టం.

abbas3

(పైవన్నీ కియరోస్తమీ తీసిన ఫోటోలు)

 

“అవసరాల అన్వేషణలో మనిషి ప్రయాణానికి అభివ్యక్తి  ‘దారి ’.

శాంతిలేని ఆత్మకు వ్యాఖ్యానందారి

ఆత్మను ఓ చోటునుండి మరో చోటికి  మోసుకుపోయే శరీరం ఓ గాడిద.

ఈ గాడిదను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా సరే ప్రయాణాన్ని చివరిదాకా సాగించలేరు.

అయితేమాత్రం ?   వాళ్ళు లేకున్నాగానీ  మనిషి ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది.

మన దారులూ మనలాంటివే.

 

ఒకోసారి రాళ్ళూ రప్పలతో నిండి ఉంటాయి.  ఒకోసారి చదును చేసుంటాయి.

ఒకోసారి మెలికలు తిరుగుతాయి. ఒకోసారి తిన్నగా ఉంటాయి.

భూమ్మీద మనం గీసిన దారులు గీరుల్లా ఉంటాయి.

మనలోనూ వేరే  దారులుంటాయి.

 

విషాదపు దారులు, సంతోషపు దారులు, ప్రేమ దారులు, చింతనల దారులు,

పారిపోయే దారులు, ద్వేషపు దారులు, నాశనం చేసే దారులు,

ఎక్కడికీ చేరని దారులు, నిలవనీటి యేరులా ముగింపులేని దారులు…

తప్పించుకు తిరిగే ప్రదేశాల గురించీ, వెళ్తున్న ప్రదేశాల గురించీ మనిషి చేస్తున్న ఒప్పుకోలుదారి’.

 

జీవితమేదారి’. మనిషేదారి’.

ఎంత చిన్నదైనా సరే మనిషి దారి అస్తిత్వపు పుటమీదికి ప్రవహిస్తుంది.

ఒకోసారి ముగింపు ఎరగకుండా

ఒకోసారి విజయవంతంగా..  “                                

 

   —– అబ్బాస్ కియరోస్తమీ.

 

కియరోస్తమీ దారి విజయవంతంగా ప్రవహించి 2016 జూలై నాలుగున గమ్యాన్ని చేరుకుంది.

And Life goes on…

*

 

 

 

  వేల  నక్షత్రాలు నడిచిన గది!

eleanor-farjeon-4

Eleanor Farjeon ప్రధానంగా కవయిత్రి. తర్వాతి రోజుల్లో  బాలసాహిత్యాన్ని సృష్టించారు. సంపూర్ణమైన జీవితాన్ని  పువ్వులతోటీ  మనుషులతోటీ పుస్తకాల తోటీ ప్రేమగా నింపుకుని ఆఘ్రాణించినవారు.

 చిన్నతనం, పుస్తకాల మీది మోహం – రెండూ కలిసి ఉండిపోయాయి నాకు. అర్థ శతాబ్దపు వయసు పూర్తయిన ఈ రోజుకీ ‘ పిల్లల కోసం ‘ రాసిన పుస్తకాలూ romance లూ fairy tales  – బలం గా లాగుతూంటాయి. Ms. Farjeon లో నేనొక  kindred spirit ని కనుగొన్నాను. ఆమె తన పుస్తకానికి తానే రాసుకున్న పరిచయం ఇది. స్నేహితులతో పంచుకోవాలని – ఇలా, ఈ సారికి.

*****

చిన్నప్పుడు మా ఇంట్లో మాకు ‘ బుల్లి పుస్తకాల గది ‘ ఉండేది. అసలైతే ఇంట్లో ప్రతీ గదీ పుస్తకాలదే – మేడ మీద మా పిల్లల గదుల నిండా పుస్తకాలే. కిందని నాన్న చదువుల గది లోనూ అవే. భోజనాల గది గోడల పొడవునా పుస్తకాలే , అవి పొంగి పొర్లి అమ్మ కూర్చుని కుట్టుపని చేసుకునే గదిలోకీ, పడక గదుల్లోకీ ప్రవహిస్తూనే ఉండేవి. దుస్తులు లేకుండా బ్రతకటం సాధ్యమేమో – పుస్తకాలు లేకుండానా ? ఆహారం ఎంత సహజమైన అవసరమో , చదవటమూ అంతే.

మా  బుల్లి పుస్తకాల గది – యథేచ్ఛగా పెరిగేందుకు వదిలేసిన తోట లాంటిది. పువ్వులూ పిచ్చి మొక్కలూ అన్నీ కలగలసిపోయి ఉండేలాగా. అక్కడ ఒక ఎంపిక గానీ పద్ధతి గానీ ఏమీ లేవు. తక్కిన గదులన్నిటినీ శ్రద్ధగా తీర్చి దిద్ది అమర్చేవారు – ఇది  మటుకు ఒక నానా జాతి సమితికి మల్లే ఉండేది. ఎక్కడా ఇమడని, పట్టని – అల్లరి చిల్లరి పుస్తకాలూ ఆకతాయి వీ , టోకున తగ్గింపు ధరల్లో నాన్న కొనుక్కొచ్చి పడేసిన బంగీ లూ- ఇంకా ఏమిటేమిటో. చాలా చెత్త, మరింకా చాలా సంపద . దేశ దిమ్మరులూ మర్యాదస్తులూ కులీనులూ అందరూ ఒక్కచోటే.   ఏ పుస్తకాన్ని ముట్టుకుని తిరగేసేందుకైనా మా ఇంట్లో పిల్లలకి అనుమతి ఉండేది – ఇక తవ్విన కొద్దీ దొరుకుతుండే నిధులూ నిక్షేపాలూ – అంతు లేకుండా.

MythiliScaled

ఆ గది కిటికీ లు మూసి బిగించి ఉండేవి . గాజు అద్దాలలోంచి  పడుతుండే సూర్యకాంతి తడవకొక్క మారుమూలకి వెలుతురు ఇచ్చేది  . పేరుకు పోయి ఉన్న దుమ్ము బంగారపు తునకల్లాగా మిల మిల మనేది.   మంత్రపు గవాక్షాలు నాకు తెరుచుకున్నది అక్కడే – అప్పటివీ అక్కడివీ కాని కాలాల్లోకీ దేశాల్లోకీ వాటిలోంచి తొంగి చూశాను- వచనమూ కవిత్వమూ వాస్తవమూ అద్భుతమూ నిండి ఉన్న లోకాల్లోకి.

పాత కాలపు నాటకాలుండేవి, చరిత్ర గ్రంథాలుండేవి, ప్రాచీన కాల్పనిక గాథలు…’ నిరాధారపు ‘ విశ్వాసాలూ ఇతిహాసాలూ పుక్కిటి పురాణాలూ – సాహిత్యపు ఉత్కంఠ అంతా రాసులు గా నివసించేది.  నన్ను మోహ పెట్టిన  ‘ Florentine Nights’ , జడిపించిన  ‘The Tales of Hoffman  ‘ అక్కడ ఎదురు పడ్డాయి. ఇంకో పుస్తకం – దాని పేరు ‘The Amber Witch ‘ . మామూలు గా నేను చదువుకునే fairy tales  లో మంత్రగత్తె కీ ఇందులో witch కీ ఏమీ సంబంధం లేదు – చాలా రోజులపాటు ఆమె ని తలచుకుంటే ఒళ్ళు జలదరించేది.

అన్ని రకాల అక్షర  పదార్థాలతో   కిక్కిరిసిన అల్మైరాలు అవి – ఇరుకు ఇరుకుగా గోడల కి సగం ఎత్తు వరకూ. వాటి మీదని అడ్డదిడ్డంగా పేర్చిన కుప్పలు పై కప్పుని తాకుతుండేవి. నేల మీది దొంతరల పైకి ఎక్కి చూడాల్సి వచ్చేది , కిటికీ అంచుకి బోటు పెట్టినవి ముట్టుకుంటే మీద పడేవి. ఒక లావుపాటి బౌండ్ పుస్తకం ఆకర్షించేది, దాన్ని అందుకునేలోపున మరొక వింత కాలికి తగిలేది. ముందే అనుకుని వెతకబోయినా వేరేవే ఒళ్ళో వాలేవి. అక్కడ – ఆ బుల్లి గదిలోనే – ‘ పుస్తకం ‘ అని పిలవదగిన ప్రతిదాన్నీ చదవటం నేర్చాను –  Charles Lamb లాగా.

The Little Bookroom

నేలమీద కూలబడో బీరువాకి ఆనుకునో – మహా అసౌకర్యపు భంగిమలలో స్తంభించిపోయి,  మైమరచి చదువుకుంటూంటే-  ముక్కుల్లోకీ కళ్ళలోకీ దుమ్ము పోయి దురదలు పెట్టేవి . నిజం కన్నా ఎక్కువ నిజమనిపించే ఆ గంధర్వ ప్రపంచాల లోంచి దిగి వచ్చిన తర్వాత గానీ కాళ్ళూ చేతులూ పట్టేయటమూ గాలి అందని ఉక్కిరి బిక్కిరీ తెలిసేవి కావు. తరచూ వచ్చే గొంతు నొప్పులు ఆ దుమ్ము వల్లనేనేమో అని అనుకోబుద్ధేసేది కాదు.

చీపురో పాతబట్టో పట్టుకుని ఆ గదిలోకి ఏ నౌకరూ అడుగు పెట్టిందే లేదు.  అద్దాల మీదా నేల మీదా అది అతి ప్రాచీనమైన ధూళి. అదే లేక పోతే అసలది ఆ గదే కాదు . అది నక్షత్ర ధూళి, సువర్ణ ధూళి, వృక్షాల ధూళి, భూమి అడుగున ధూళి లోకి చేరిపోయే ధూళి[dust to dust ] , తిరిగి భూమి ఒడిలోంచి పుష్పం గా రత్నం గా విరిసే ధూళి, వెలిగే ధూళి. ఆ నిశ్శబ్దపు ధూళి ని అమెరికన్ కవయిత్రి Emily Dickinson వర్ణించారు –

” ఇది, ఈ శాంత  ధూళి – ఇది స్త్రీలూ పురుషులూ అబ్బాయిలూ అమ్మాయిలూ అందరూ.

ఇది నవ్వులు, సామర్థ్యం, నిట్టూర్పులు – అన్నీ. ”

ఇంగ్లీష్ కవయిత్రి –Viola Meynell , ‘ రహస్యంగా ప్రవేశించి  ముంగిట్లో కమ్ముకున్న ‘  ధూళిని శుభ్రం చేస్తూ చేస్తూ – ఒకింత ఆగి అంటారు ఇలా –

” ఈ ధూళి ని తుడిచేస్తూంటే – పువ్వులని తుడిచేస్తున్నా నేమో, చక్రవర్తులని తుడిచేస్తున్నా నేమో – ఆలయాలనూ కవులనూ నగరాలనూ…”

పుస్తకాల గదిలోంచి మంట పెడుతూన్న కళ్ళతో బయటికి వచ్చాక కూడా ఆ చిత్ర వర్ణాల ధూళి మనస్సులో నర్తిస్తుండేది. ఆ సాలెగూడుల వెండి దారాలు బుద్ధికి పట్టుకునే ఉండేవి. అందుకనే – ఎన్నో ఏళ్ళ తర్వాత , సొంతగా నేను రాయటం మొదలెడితే అది – కల్పనా వాస్తవమూ,  సత్యమూ స్వప్నమూ కలిసిపోయి తయారైందంటే ఏం ఆశ్చర్యం ఉందని ? ఒక దాన్నుంచి మరొకదాన్ని విడదీయటం నాకెప్పుడూ పూర్తిగా సాధ్యం కాలేదు – నా కథలలో.  మాయమైన ఆలయాలూ మహారాజులూ , అందగత్తెల గిరజాలూ పువ్వులూ, పిల్లల నవ్వులూ కావ్యకర్తల నిట్టూర్పులూ – వీరందరి దుమ్మునీ – ఏడుగురు అమ్మాయిలు ఏడేసి చీపురులు చేతబట్టి అర్థ శతాబ్దం పాటు చిమ్మినా నా లోపల అది నశించలేదు. అదృష్టవంతులూ కానివారూ అందరూ – ఏదో ఒక బుల్లి పుస్తకాల గదిలోకి చేరి ధూళి గా మణిగేవారే – ఎప్పుడో ఒక్క లిప్త పాటు , కాంతివంతమవుతారేమో – ఏమో !

*

ఒక శంక !

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

పాదులు వేసి

నీరు పోసి

ఎరువులు వేసి

నెమ్మదిగా

పురికొసపందిరి మీదికి

పాకిస్తున్న ఈ ప్రేమపంచే చేతులు

ఏ నిశీధివీధిలోకో నిష్క్రమిస్తే,

ఈ రక్తరాగాలు అనునయగీతాలు

ఆలపించడం ఆపివేస్తే,

చిదిమితే ఇంకా

పాలు కారుతున్న ఈ రెండు పూలమొక్కలు

తరిమే ఎండలోనూ

ఉరిమే వానలోనూ

కరిచే పెనుగాలులలోనూ

అడ్డుపడే అరచేతులు కానరాక…

అప్పుడెలా… ?

 

( ఇవా పిల్లలు చిన్నారి ఆకాంక్ష, చిన్నారి ఆర్యదేవ్ ల కోసం, ఒకానొక ఉద్వేగ సందర్భంలో )

ఒరే, సుబ్బిగా!!

 

 

ఒక చేతి లో వెండిగిన్నె పట్టుకుని, మరో మరో చేత్తో – ఒకో జాజి మొగ్గని తుంపుతూ… – పందిరివైపు పరీక్షగా చూసింది కమల.

ఒక గుంజ -మెల్ల మెల్లగా వెనక్కి ఒరుగుతోందని గమనించింది. గుంజని పైకి లేపి, బాగా లోతుకల్లా మట్టి తవ్వి, గుంజని గట్టిగా నిలిపి, పూడ్చాలి. అప్పుడిక కదలదు. ఇది తన ఒక్క దానివల్లయ్యే పని కాదు.  సుబ్బిగాడొస్తే, చెప్పాలి. క్షణాల్లో  చేసి పెడ్తాడు.

మొన్నటికి మొన్న, దొడ్లో మూల వైపు బిగిసిన గట్టి నేలని ఎలా బాగుచేసాడూ? ఒక్క పలుగేసి,  మట్టినెలా  పెళ్ళగించాడనీ! అంత మేర దిబ్బనీ, – నాగలితో దున్నినట్టు నిముషాల్లో  చదును చేసి పారేశాడు. ఎలా అయినా, వాడి బలం వేరు. పిడుగులాంటి మనిషి. ‘ – తమ్ముణ్ణి తలచుకుంది.

“అమ్మా, మావయ్యొచ్చాడు..” చేతిలో లడ్డూ పొట్లమెత్తుకుని, తూనీగలా పరెగెత్తుకుంటూ వచ్చి చెప్పింది పదేళ్ళ కూతురు.

తమ్ముడొచ్చాడని తెలీగానే కమల ముఖం ట్యూబ్ లైట్ లా  వెలిగిపోయింది. వున్న మనిషి వున్నట్టుగా ఉరికి, ముందు గదిలోకొచ్చింది. – “సుబ్బిగా నీకు నూరేళ్ళురా! ఇప్పుడే నీ మాటనుకుంటున్నా..నువ్వొచ్చావు ?” అంది సంతోషంగా.

“నన్ను తలచుకుంటున్నావా? ఏమనీ? ఈ వెధవ ఊళ్ళో వుండి కూడా, చూడ్డానికి రావడం లేదు సచ్చినోడు అని తిట్టుకుంటున్నావా?” అంటూ పకపకా నవ్వాడు సుబ్బులు.”

తమ్ముడి మాటలకు నొచ్చుకుంటూ.. “ ఛ! అవేం మాటలురా సుబ్బిగా?!- అలా ఎందుకనుకుంటాను? మీ ఆవిడ  చెప్పింది. నీకు ఆఫీస్ లో పనెక్కువగా వుంటోందనీ, రాత్రిళ్ళు  కూడా లేట్ గా వస్తున్నావనీ! అద్సరే,  ఇలా నా మీద దయపుట్టింది? ఏమిటీ విశేషం?” అంది నవ్వుతూ.

“చూడాలనిపించింది, వచ్చేశా. నా అక్క ఇంటికి నేనెప్పుడైనా రావచ్చు కదా? కదరా తల్లులూ?” అంటూ ప్రేమగా మేనకోడల్ని వొళ్ళో కుర్చోబెట్టుకుని, లడ్డూ పొట్లం విప్పి, ఒక లడ్డూ తీసి తినిపిస్తున్నాడు.

ఇలాటి సన్నివేశం ఎంత కనుల విందుగా వుంటుందో – కమలకి!  మనసంతా ఏం సంబరమౌతుందో ఏమో కానీ,  ఆ సంతోషం తెచ్చే వెలుగుతో ఆమె ముఖం మరింతగా కళకళ లాడిపోతుంది.

ఆడపడుచులకి – అన్నదమ్ములంటే  ఎందుకింత  పిచ్చిప్రేమో  తెలీదు. ఒక్కసారి కనిపిస్తే చాలు. అప్పటిదాక వున్న అలకలు, కినుకులు అన్నీ మాయమైపోతాయి. వాటి స్థానంలో ఎక్కడ్లేని ఆప్యాయతలూ పొంగి పొర్లుతాయి.  యేడాదికొక్కసారి ఇంటికి పిలిస్తే చాలు. పదేళ్ళ దాకా ఆ మురిపాలే చెప్పుకుని చెప్పుని మురిసిపోతుంటారు.  కట్టిపారేసే ఎన్ని చీరలున్నా, అన్నదమ్ములు పెట్టిన  చీరలని మాత్రం భద్రం గా దాచుకుంటారు బీరువాల్లో. ‘ఈ చీర మా పెద్దాణ్ణి కడుపుతో వున్నప్పుడు పెట్టాడు, ఈ పట్టు చీర ఇంటి గృహప్రవేశానికి పెట్టాడు -మా పెద్ద తమ్ముడు.. మొన్న ఎండా కాలం సెలవలకని వెళితే వొద్దు వొద్దన్నా వినకుండా పట్టుబట్టి మరీ కొనిపించాడు ఈ జరీ చీర..’ అంటూ చెప్పుకుంటారు. అవేవో వెయ్యెకరాల పొలం అన్నట్టు!  ఆ అభిమానానికి అంతే వుండదు. ఆప్యాయతానురాగాలను నిర్వచించడానికి అక్షరాలే చాలవు.

అన్నదమ్ములు –  తన మీద కంటే కూడా తన పిల్లల మీద   ప్రేమ చూపుతూ ముద్దు చేస్తున్నప్పుడు సోదరుల మీద ప్రేమ రెట్టింపౌతుంది ఏ ఆడపడుచుకైనా!పెళ్ళయ్యాక స్త్రీలు – కోరుకునే అసలైన పుట్టింటి ఆస్థిపాస్తులు ఇవే!

సోదరులెంత పేదవారైనా సరే,  ఆ గడప నించి  తెచ్చుకునే చిటికెడు పసుపు కుంకుమలు- ఓ కుంచెడు మణి మాణిక్యాలంత విలువుగా వుంటాయి ఆడపడుచులకి. విలువలనేవి- వస్తువులని బట్టి వుండవు. వ్యక్తులని బట్టి వుంటాయి.  నిజమే, అవి ప్రేమని బట్టి నిర్ణయించబడతాయి.

“అమ్మా, నాన్న ఎలా వున్నారు రా? పది రోజులైపొయింది, చూడక! వద్దాం వద్దాం అనుకుంటే.. ఎక్కడా,  కుదరడమే లేదు. పెద్దాడికి టెంత్ క్లాస్ ఎగ్జాంస్ దగ్గరకొస్తున్నాయి కదా! వాడటూ ఇటూ కదలకుండా చదివించాల్సొస్తోంది.

“అవునవును. చదివించాలి. మార్కులెలా వస్తున్నాయి..?”

“బాగానే వస్తున్నాయిలే. కష్టపడుతున్నాడు. అయినా వాడి వెనకెనకే వుంటున్నాం.  మీ బావ గారు కూడా  చెవినిల్లు కట్టుకుని మరీ  చెబుతున్నారు. మనకే ఆస్థి పాస్తులు లేవూ, చదువొక్కటే దిక్కని.” పిల్లాడి భవిష్యత్తు గురించో, మరెందుకో ఆమె స్వరం దిగులు పడింది.

“వాడింకా పదో క్లాసే కదక్కా! మరీ చాదస్తం కాకపోతే, అప్పుడే మీ ఇద్దరికీ అంతంత దిగుళ్ళైతే ఎలా?  ఆ? ” ప్రేమగా కోప్పడ్డాడు.

“నిజమే అనుకో. ఏదైనా, వాడొక ఒడ్డు చేరేదాకా మాకు స్థిమితం వుండదురా. ఆడపిల్ల సంగతంటావా?, అది వేరే సంగతి. ఎంత చదివితే అంత చదివించి పెళ్ళి చేసి పంపేస్తాం..చూసావా మాటల్లో పడి అడగడమే మరిచిపోయా. మంచి నీళ్ళివ్వనానా?  ఏం తింటావో చెప్పు?” అంటూ ఇక కష్టాల రేడియో కట్టేస్తూ అంది.

పుట్టింటి వారిని చూడంగానే ఆడపిల్లలకు ఏం పూనుతుందో ఏమో కానీ,  కుండపోత వర్షం కురిసినట్టు కురుస్తాయి కబుర్లు. అదొక ఆగని ప్రవాహం. ఇది మొదలు, ఇది ముగింపు అన్నట్టుండదు సంభాషణ. ఎక్కడ్నించి  ఏ విషయం  మొదలు పెట్టాలి అనే ప్రణాలికలేవీ వుండవు. మనసులోవన్నీ ఒకేసారి చెప్పేయాలనే తాపత్రయం లో  ఏవేవో మాట్లాడేయడం పరిపాటే ఆమెకి!

అక్క అడిగిందానికి జవాబుగా  – “ఏం తింటానంటే.. కాస్త నీ బంగారు చేతుల్తో మరమరాలలో ఉల్లిముక్కలేసి చేస్తావు చూడూ, ఆ మసాలా చేసి పెడ్తావూ?” అని అడిగాడు చిన్నపిల్లాడిలా నవ్వుతూ.

తమ్ముడు అడగడమేమిటీ, ఆమె అక్కణ్ణించి వేగంగా  కదలడమేమిటీ!!  – రెండూ ఒక్కసారే  జరిగాయి.

సుబ్బులు – తన   మేనకోడలితో ముచ్చట్లాడటం, మాటలయ్యాక, ఆమె వొళ్ళోంచి దిగి వెళ్ళిపోవడం, అతడు  రేడియో ట్యూన్  చేసి, అలవాటుగా వివిధభారతి లో హిందీ పాటలు పెట్టుకుని, రఫీతో కలిసి గొంతు కలపడం..

– అంతా మనసుతో వీక్షిస్తున్న – కమల ‘హమ్మయ్యా’ అనుకుంది భారం తీరిన దానిలా. ‘ఆ రోజు’ నించి తమ్ముడు ఇంటికి రాకపోతే కోపమొచ్చిందేమో అని  తర్జనభజన పడింది. మునపట్లానే  వున్నాడు చనువుగా. మార్పేమీ లేదు.    ‘అంతా మరిచిపోయాడులే’ –  స్థిమిత పడింది ఆమె మనసు.

ఇంతకీ – ఈ అక్క గారు ‘ఒరే, సుబ్బిగా’అని ముద్దుగా పిలుచుకునే ఇతగాని  అసలు పేరు – నాగ వీర వెంకట శివ సుబ్రహ్మణ్య శర్మ.

చదువులో పూర్. అందరూ చదివే పాఠ్య పుస్తకాలలోని సారమేదీ బుర్రకి అంటకపోవడంతో.. టెక్నికల్  కోర్సులో జేర్పించారు. ఎలా అయితేనేం గట్టెక్కి,  గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు.  ఎలెక్ట్రికల్ విభాగం లో సూపర్ వైజర్  పోస్ట్. వెంటనే వివాహం జరగడం, పిల్లలు కలగడం అంతా సవ్యంగానే వుంది.  మొత్తానికి స్థిరపడ్డట్టే కనిపిస్తాడు చూసే వాళ్ళకి.  కానీ జీవితం లో ఎప్పుడు బాగుపడతాడా అని చింత పోతారు అయిన వాళ్ళు, అతన్ని బాగా తెలిసినవాళ్ళూ.

అలా అని మనిషి దుర్మార్గుడా అంటే  అంటే కాదు. మనసున్న మంచి వాడు.తల్లి తండ్రుల్ని తలా కొన్నాళ్ళు పంచుకోవాలంటూ అన్న గర్లులు తీర్మానించి,  వంతులేయబోతుంటే భోరుమని ఏడ్చిన, గొప్పపసి హృదయుడు. ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్ళూ తనింట్లోనే వుంటారని చెప్పి పుత్రుడనే పదానికి నిర్వచనంగా నిలిచిన వాడు.

కోపమొచ్చినప్పుడు తప్ప, – పెళ్ళాం అంటే  ప్రేమున్న వాడు.

తోబుట్టువులంటే ప్రాణం. ప్రేమగా పలకరిస్తాడు. తృణమో ఫలమో పిల్లల చేతుల్లో పెడతాడు. సుబ్బి మావయ్యంటే అందరకీ ప్రియమే.

కమలకి ఇంకా ప్రియం. ‘ఒరే సుబ్బిగా’అంటూ ఎడ తెగని కబుర్లాడుకుంటుంది తమ్ముడితో.

అలానే అతనూ! వీలు చిక్కినప్పుడల్లా అక్క ఇంటికెళ్లడం, కుశలమడగడం, చిన్నా చితకా పనులు  వుంటె  చేసి పెట్టి రావడం అతనికి అలవాటు. ఇలా వచ్చి అలా పిల్లలతో గడిపి వెళ్తుంటాడు.

చుట్టుపక్కల వాళ్ళు కమల అదృష్టాన్ని పొగుడుతుంటారు. “మీ తమ్ముడికెంత ప్రేమండి, మీరంటే! అదృష్టవంతులు. మా వాళ్ళూ వున్నారు..చుట్టం చూపుకైనా వచ్చి పోరు..” అంటున్నప్పుడు కమలకి నిజంగానే గర్వమేసేది.

నిజమే. అక్క చెప్పే మాటలన్నీ  ఆలకిస్తాడు. అన్నీ వింటాడు. ఐతే – ఆ ఒక్క మాట తప్ప!

తమ్ముడి చేతికి మసాలా మరమరాల పళ్ళెం అందిస్తూ అంది. “ఏవిటీ, శ్రావణ శుక్రవారం ఏం కొంటున్నావ్, అమ్మకీ, మరదలకీ? అంటూ, మావూలుగా అడిగింది.

వెంటనే సుబ్బు ముఖంలో వెలుగు మాయమైంది. ” ఏం చెప్పమంటావ్ అక్కా! అటు నా పెళ్ళాం, ఇటు అమ్మా నా ప్రాణం తినేస్తున్నారనుకో..” అంటూ చెంచాతో మరమరాలు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.

కమలకి  సమస్య ఏవిటో తెలుసు. అయినా, ఏమీ ఎరగనట్టు ” ఏమంటున్నారురా?” అని అడిగింది అమాయకపు ముఖమేసుకుని.

“ఏముందీ, దాని గాజులు, ఆవిడ రవ్వల దిద్దులూ విడిపించమనీ…”

తమ్ముడి నోట్లోంచి నిజం బయటకొచ్చింది కాబట్టి, నిట్టూర్చింది. ఇన్ని మంచి లక్షణాలున్న తమ్ముడికి ఈ ఒక్క చెడ్డ అలవాటు లేకపోయుంటే ఎంత బావుండేది జీవితం! అనుకుంటూ  లోలోనే బాధపడింది.

వెంటనే అతని మీద జాలీ, ప్రేమలు కలిసి ఒక ఉప్పెనలా పొంగుకొచ్చాయి. ఎదలోంచి తన్నుకొచ్చిన ఆ భావోద్వేగంలో గభాల్న అనేసింది. “ఒరే, సుబ్బిగా! మనిషివేమో బంగారం లాంటి వాడివి!  ఈ వెధవ చీట్ల పేకాట మానేసి, బాగు పడకూడదట్రా? అమ్మ  ఎంత ఏడుస్తోందో తెలుసా, నిన్ను తలచుకుని తలచుకునీ? మరదల్ని చూసావా? చిక్కి సగమైంది మనిషి. సుబ్బిగా! నా మాట వినరా!  ఇక నైనా ఆ ముదనష్టపు  పేకాటకెళ్ళడం మానేయరా.” తమ్ముడి చేతులు పట్టుకుని బ్రతిమిలాడింది.

ఆమె మనసు ప్రేమతో, మాటలు అభ్యర్ధనతో, చూపులు ఆప్యాయతా స్పర్శలతో  నిండిపోయున్నాయి. నిజానికి  ఆ ఆర్ద్రతా హృదయానికి ఎంతటి రాయైనా చలిస్తుంది. కానీ సుబ్బూ కి మాత్రం అరికాలి మంట నెత్తికెక్కి, చిర్రెత్తుకొచ్చింది.

తాగుబోతుని తాగొద్దన్నా, తిరుగుబోతుని తిరగొద్దన్నా, వాగుబోతుని వాగొద్దొన్నా ఎంత కోపమో, – పేకాట ప్రియుళ్ళకి పేకాటని తిడితే  అంత కోపం వస్తుంది. అది సహజం. ఎందుకంటే – వ్యసనాలకి బానిసలైన వారికి మాన ప్రాణాల పట్ల స్పృహ వుండదు . బ్రతుకు – పతనావస్థకి చేరుతున్నా గ్రాహ్య ధారణ వుండదు. నశించి వుంటుంది ఆ శక్తి.

కన్న వాళ్ళు, తోబుట్టువులు, కన్నీరు నింపుకుని ఇలా ఏమైనా నీతులు చెప్పబోతే..వాళ్ళకి అవి అశ్లీల పదాలు గా  వినిపిస్తాయి.  తీవ్ర అవమానానికి గురి అవుతున్నట్టు భగభగ లాడిపోతారు. క్షణంలో కోపం బుస్సుమని లేస్తుంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సుబ్బులు కూడా అదే స్థితి లో వున్నాడు.  అయితే, అక్క గారితో అవసరం వుండి,  వెనక్కి తగ్గాడు. “అదేవిటక్కా, అప్పుడే ఆపేశావ్, భగవద్గీత?  ఇంకా చెప్పు. వినే చవటనున్నాగా!” అన్నాడు పొడిపొడిగా.

తమ్ముడి కి కోపం వచ్చిందని గ్రహించింది. ఏం  మాట్లాడలేదు.  అతనే అందుకున్నాడు. “ ఇంటికెళితే వాళ్ళిద్దరూ చెరోపక్క తినేస్తున్నారు. మనశ్శాంతి కోసం ఇక్కడికొస్తే – ఇహ ..ఇప్పుడు నువ్వూ మొదలు పెట్టావన్నా మాట..నీతి బోధలు..అసలు నా గురించి మీకేం తెలుసని అసలు?” తుఫాను ముందు పిడుగుల్లా వున్నాయి ఆ మాటల జోరు.

“అది కాదురా..పాపం..” అంటూ గుటకేసింది కమల, తమ్ముడు ముఖంలో రంగులు మారడాన్ని చూసి.

“పాపం అంటే? అంతగా హింసించేస్తున్నానా? వాళ్ళకి నేనేం తక్కువ చేస్తున్నానని? అన్నం పెట్టడం లేదా? పస్తులు పడుకోబెడుతున్నానా?”

“……”

“ నాకీ అలవాటు ఎలా అయి చచ్చిందో, అయి చచ్చింది. దీన్ని వదిలించుకోవాలనీ నాకూ వుంటుందమ్మా..మీ అందరితో చివాట్లూ చెప్పుదెబ్బలు తింటం నాకు మాత్రం సరదానా? ఎప్పటికప్పుడు బయటపడాలనే తంటాలు పడుతున్నా. కానీ నా వల్ల  కావడం లేదు.

అయినా, ఒక మాట చెప్పనా అక్కా? –  నేను పేకాట్లో పోగొట్టుకున్నదే మీకందరకీ కనిపిస్తోంది కానీ, ఈ ఆటలో  ఎంత సంపాదించానో అన్నది మీకు కనపడటం లేదు. డబ్బొచ్చినప్పుడు  రాలేదా? అలానే పోయినప్పుడు పోతుంది. వ్యాపారం లో మాత్రం నష్టాలు రావా? తిప్పుకోవాలి. ఇదీ అంతే అనుకోవాలి మనం.”  వివరిస్తున్నాడు. తను చేస్తున్న పనేదో అంతర్జాతీయ మార్కెటింగ్ సర్వీస్ అన్నట్టు.

ఏ వ్యక్తయినా తాను చేసిన వెధవ పనిని గనక  తాను సమర్ధించుకోకపోతే –  చేసిన తప్పుని ఒప్పుకున్నట్టు ఔతుంది. అందుకే ప్రతి నేరస్థుడూ   లాజికల్ థియరీస్ని, లింక్డ్ స్టోరీస్ నీ వినిపిస్తాడు.  వినే వాళ్ళకి నిజమనిపించేలా..’పాపం’ అని జాలి కలిగించేలా మాట్లాడి మెప్పించే సామర్ధ్యం కలిగివుండటం – వ్యసన పరులకున్న గొప్ప లక్షణాలలో చెప్పుకోదగిన లక్షణం.    .

“చెడి పోయావ్  చెడిపోయావని అంటారు మీరందరూ! నిజానికి నాకేం చెడ్డలవాట్లున్నాయంటావ్? పోనీ, నువ్వు చెప్పు! డబ్బు పెట్టి కార్డ్స్ ఆడేటప్పుడు టెన్షన్ పుట్టుకొస్తుంది. ఇదిగో ఈ సిగరెట్టు – అలా అంటుకున్నదే! ఇది తప్ప, నాకే దురలవాట్లూ అంటలేదు, అంటించుకోలేదు.

నా చుట్టూ వుండే మా వాళ్ళందరూ పీకల్దాకా ఎలా తాగుతారో తెలుసా? అంతమంది తాగుబోతులతో కుర్చున్నా, నేనొక్క చుక్కయినా నోట్లో వేసుకోను. అసలా వాసనంటేనే నాకు వాంతేసుకొస్తుంది.”

సుబ్బి చెబుతున్నది నిజమే. ఆ సంగతి ఆమెకి తెలుసు. అంతే కాదు. మాంసం తినడు. మందు తాగడు. పర స్త్రీలని కన్నెత్తి చూడడు. పన్నెత్తి పరుషంగా మాట్లాడడు.

కానీ, లేని దురలవాట్లకంటేనూ, వున్న ఈ ఒక్క చెడ్డలవాటు వాణ్ణీ, వాడి జీవితాన్నీ నిలువునా కూల్చేస్తోంది. ఇది చాలదూ?

దొరికిన వాళ్ళ దగ్గర దొరికినంతగా అప్పులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి, జీతాల రోజున ఆఫీస్ నించే వసూలు చేసుకుపోతున్నారు. పది శాతం వడ్డీకి తెచ్చిన మరో కొత్త అప్పుతో  ఇల్లు నడుపుతున్నాడు. ఇంత జరుగుతున్నా, పేకాట కెళ్ళడం మానటం లేదు. ఇంట్లో ఆడవాళ్ళ నగలు తీసుకెళ్ళి, కుదువ పెట్టి మరీ పేకాడి, డబ్బు తగలేసొస్తున్నాడంటే..ఇక కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి ఏమౌతుందని ఏడ్వాలి?

‘ఇదేమిటని అడిగినప్పుడల్లా..ఇంట్లో రామ రావణా యుధ్ధాలు జరుగుతున్నాయని, మీరైనా మీ తమ్ముడికొకసారి చెప్పి చూడండి వదినగారు, నా కాపురాన్ని నిలబెట్టండి..’ అంటూ మరదలు తనతో చెప్పుకుని భోరుమంది.. అన్న సంగతి తమ్ముడికి చెప్పలేదు కమల.

ఈ నిజం తెలిస్తే, అతని అహం ఇంకా దెబ్బ తింటుందని ఆమెకి తెలుసు.

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కుటుంబ స్త్రీలు మాట రాని వాళ్లయిపోతారు. రాయి కంటే నిశ్శబ్దంగా మిగిలిపోతారు. ఈ కటిక సమస్య నించి బయటపడే మార్గం కనపడక,  అంధకారం లో తల్లడిల్లిపొతుంటారు.

చెప్పే వాళ్ళెంత మంది వున్నా, వినే వాడి కి బుధ్ధి లేనప్పుడు ఏంచెప్పి ఏం లాభం?

ఇంటి దీపాన్ని కాపాడాల్సిన వాడు ఆర్పేస్తానంటే ఇక ఎవరు మాత్రం ఆ చీకట్లను తరిమేయగలరు? ఎంతకని బాగుచేయగలరు ఆ యజమానిని?

గాఢం గా నిట్టూర్చి, అంది మెల్లగా. “మరేం చేద్దామనుకుంటున్నావ్ రా సుబ్బీ?..ఎలా ఈ విష వలయం నించి బయటపడదామనుకుంటున్నావ్?”

“అదే ఆలోచిస్తున్నాను అక్కా..సరదాగా అలవాటైన ఈ పేకాట – నా తలనిలా చుట్టుకుంటుందనుకోలేదు..” – చేసిన తప్పు అతనకి ఇప్పుడిప్పుడే అతని తెలుస్తోందనడానికి గుర్తుగా చిన్నపశ్చాత్తాపం కూడావుంది ఆ కంఠంలో. కమల ఉలిక్కిపడి చూసింది సుబ్బి వైపు.

“అవునక్కా, బయటపడాలనుకుంటున్నా. ఇక శాశ్వతం గా అందులోంచి బయటకొచ్చేయాలనుకుంటున్నా….”

“ఎలా…?” ఆశగా  చూసింది.

“ఇలానే..మరో సారి పేకాటలో నా అదృష్టాన్నీ పరీక్షించుకుని..”

అతడి మాటలకి వినంగానే గాలి తీసిన బెలూన్లా నీరు గారిపోయింది.

“అవునక్కా. ఎక్కడ పారేసుకున్నావో  అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. నాకు తెలిసిన విద్య ఇదొక్కటే. నాకు వేరే వ్యాపారాలు, వ్యూహాలూ ఏవీ తెలీవు. అందుకే ఆఖరి సారిగా ఈ ఆదివారం క్లబ్ కెళుతున్నా. ఎందుకంటే, ఈ సారి చాలా పెద్ద పెద్ద వాళ్ళొస్తున్నారు బోంబే  నించి. అంతా కాకలు తీరిన వాళ్ళే. ప్రెటీ కాష్ పార్టీలు. పందెం కూడా డబల్ బెట్టింగ్ లో సాగుతుంది.  నా తడాఖా చూపించి గెలుచుకురావాలని చూస్తున్నా. బంగారం విడిపించి, అప్పులన్నీ తీర్చేపడేసి హాయిగా ఊపిరి తీసుకోవాలనుంది అక్కా!”

పగటి కలలు కంటున్న తమ్ముడ్ని చూసి జాలి గా అనుకుంది. ‘సుబ్బిగా..ఎంత పిచ్చివాడివిరా తండ్రీ! పేకాటలో పెట్టే డబ్బు, వెలయాలికిచ్చే మూల్యం రెండూ వెనక్కొస్తాయన్న నమ్మకమే?..ఏమిటీ పిచ్చి ఆశ వీడికి? ఏమిటా గుడ్డి నమ్మకం ఈ అమాయకుడికీ?..మానేస్తా అంటున్నాడు కానీ ఎంత వరకు నిజమని ఈ మాటలు?..

“నన్ను నమ్ము అక్కా! ఈ ఒక్క సారి కి నువ్వు నాకు సాయం చేస్తే..నా జాతకమే మారిపోతుందక్కా, ప్లీజ్..ప్లీజ్..మా బంగారక్కవి కదూ..?

పరధ్యాన్నంగా వున్న కమల అతని మాటలకి ఎవరో  వెన్ను చరిచిన దాన్లా నిఠారై కుర్చుంది.

ఏమిటి..అడుగుతున్నాడు తనని? డ..బ్బా? కనుబొమలు ముదిచి చూసింది.

“అవునక్కా. ఒక్క పదివేలు ఇస్తే చాలు. అదక్కడ పెట్టి కుర్చున్నానంటే, రొటేషన్లో అదే పదింతలౌతుంది. తక్కువైతే లోన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు..” వివరిస్తున్నాడు.

అవేమీ కమలకు వినిపించడం లేదు. తల అడ్డంగా వూపుతూ అంది.

చిత్రం: మన్నెం శారద

చిత్రం: మన్నెం శారద

“ఒరే, సుబ్బిగా. కిందటి సారి ఇలానే అడిగి తీసుకెళ్ళావు. కంపెనీ డబ్బు ఇంట్లో వుంటే,  మీ బావ గారికి తెలికుండా ఇచ్చాను. కానీ ఆ రోజు గుర్తుందా.. ` మనిషిని పంపుతున్నా డబ్బిచ్చి పంపించమని మీ బావగారు చెబితే .. ఎంత గా హడలిపోయాను? వున్నపళంగా  నీ ఆఫీసుకి పరుగెత్తుకొచ్చాను. కాళ్ళల్లోంచి ఒకటే వొణుకు. నువ్వు లేవు. నీ ఫ్రెండెవరో స్కూటరేసుకుని నిన్ను వెదికి పట్టుకొచ్చాడు. నువ్వేమో నన్ను చూసి తెల్ల ముఖమేసావ్. ‘ఇప్పటికిప్పుడంటే ఎలా?’ అన్నావ్..నాకు గుండాగినంత పనైంది..నా యందు దేవుడుండి, నీకెవరో డబ్బిచ్చారు..సర్దావు. కానీ నేను ఆ రెండు గంటలు పడ్డ మానసిక క్షోభ ఎంత భయంకరమైనదో  నీకు అర్ధం కాదు. ఆనాటి చేదు అనుభవంతో నాకు గొప్ప కనువిప్పు కలిగింది. అప్పుడే నేనొక స్థిర  నిర్ణయం నిర్ణయానికొచ్చాను.  నా భర్తకి తెలీకుండా జీవితం లో నేనెవరికీ  డబ్బు ఇవ్వకూడదని!

అంతే కాదు, అప్పుడా క్షణం లో నిన్ను విసుక్కున్నానని, నా మీద నీకు కోపం వచ్చిందని తెలుసుకుని బాధ పడ్డాను. రక్త సంబంధీకుల మధ్య ఆర్ధిక సంబంధాలుండకూడదని అవి ప్రేమాప్యాయతల్ని నొక్కేస్తాయని అర్ధమయింది.

సుబ్బిగా! నన్ను మన్నించరా. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇవ్వలేను.” అంటూ తలొంచుకుంది.

“అంతేనా అక్కా? ఇదేనా నీ చివరి మాటా?” అది బెదిరింపో, లేక చివరి అభ్యర్ధనో అర్ధం కాలేదామెకి.

“సుబ్బూ..నువ్వు మగాడివి. పేకాటలో ఓడినా, అప్పులు నిన్ను ముంచినా, ఉద్యోగం ఊడినా  బ్రతికేయగలనని అన్నావు.  రిక్షా లాగయినా నీ వాళ్ళని బ్రతికించగలనని  ధైర్యంగా చెప్పావు గుర్తుందా? కానీ..ఈ అక్క జీవితం అలా కాదురా! నా బ్రతుకు – నేను పూర్తిగా నమ్మి బ్రతుకుతున్న నా  కాపురం మీదే ఆధారపడి వుంది…”

“నీకేం తక్కువని అక్కా అలా మాట్లాడుతున్నవ్? బావగారు మంచివారైతేనూ!”

“అదే రా నా భయం. అందుకే అబధ్ధం చెప్పి మోసం చేయలేను. ఆరునూరైనా నేను  నిజాయితీ తప్పే అవకాశమే లేదు. అంతే.”

అంతా అర్ధమైంది అతనికి. కానీ, వేరే రీతిలో. “కథలెందుకులే అక్కా. నువ్వు ఇవ్వాలనుకుంటే  ఎలా అయినా ఇవ్వొచ్చు.” అంటూనే, కుర్చీ లోంచి లేచి నిలబడ్డాడు.

ఇంత చెప్పినా తమ్ముడికి అర్ధం కాలేదంటే..అది అతని తప్పు కాదు.

కనీసం ‘వెళ్తున్నా’అని అయినా చెప్పకుండా,  పెద్దపెద్ద అడుగులేసుకుంటూ వీధి ద్వారం దాటి పోతున్న తమ్ముడి వైపు అసహాయంగా  చూస్తుండిపోయింది.

‘ఒరే సుబ్బిగా! నా మీద కోపంతో  నా ఇంటికి  రాకపోయినా ఫర్వాలేదురా! నువ్ బాగుపడితే చాలు..నాకంతే  చాలు..” ఎందుకో! ఎద వంతెన దాటి దుఃఖం పొంగుకొచ్చింది.   చాలా సేపు కళ్ళు వర్షిస్తూనే వున్నాయి ఆమెకు తెలీకుండా!

ఇద్దరి మనుషుల మధ్య గల బాంధవ్యం ఎంత బలమైనదే అయినా, దాన్ని బలహీన పరిచే చేసే శక్తి – కొన్ని పరిస్థితులకుంటుంది.

ఇది జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత..

****

“ఇంటి ముందు ఆ జనమేమిటండీ?” కంగారు పడుతున్న భార్యతో నిజం చెప్పాల్సొస్తున్నందుకు బాధ పడుతూ చెప్పాడు మూర్తి. “సుబ్బిగాడు పోయాడు కమలా!నువ్వు తట్టుకోలే…” ఆయన మాటలేవీ ఆమెకి వినిపించలేదు..”ఆ!!” అంటూ ప్రాణం ఎగిరిపోయినదాన్లా, ఒక్క ఉదుట్న రిక్షాలోంచి దూకి, పరుగెత్తుకుంటూ లోపలకెళ్ళింది.

తను విన్నది అబధ్ధమనుకుని భ్రమపడింది కానీ నిజంగానె సుబ్బి గాడు పోయాడు. గదంతా కిక్కిరిసి ఉన్నారు మనుషులు.

చలనం లేని దానిలా అడుగులేసుకుంటూ వెళ్ళి, తమ్ముడి మృత దేహం పక్కన చతికిలబడిపోయింది.  శరీరం మీద తెల్లని దుప్పటి కప్పి వుంది. ఒక్క ముఖం మాత్రమే కనిపిస్తోంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టున్నాడు. – ‘ఎంత పని చేసావురా సుబ్బిగా..ఎంత పని చేసావ్..” అంటూ మీద పడి భోరుమంది.

ఆమె ని చూసి అందరూ ఒక్క సారి గా ఘొల్లుమన్నారు. ‘అమ్మా, కమలా..చూడవే తల్లీ మమ్మల్నెంత మోసం చేసి పోయాడో వీడు. కడుపు శోకం భరించలేకపోతున్ననమ్మా..భగవంతుడా! ఎంత అన్యాయం చేశావయ్యా…ఒరే సుబ్బిగా..ఒరే సుబ్బిగా..” గుండెలు బాదుకుంటున్నతల్లి తండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.

దుఃఖతీవ్రత లో గమనించలేదు కానీ మరదలి పరిస్థితి ఇంకా హృదయవిదారకంగా వుంది. ఏడ్చి ఏడ్చి ఓపిక లేనిదాన్లా వ్రేలాడిపోతోంది. దగ్గరికి తీసుకున్న కమలకి తెలుస్తోంది.  ఆమె దుఖంలో మరో సముద్రమేదో భీకరంగా పొంగుతోందని. మనిషి బిగుసుకుపోయి వుంది..కట్టెలా.. ఏదో అనుమానం. ఎన్నో సందేహాలు

“పొద్దుట్నించి పచ్చి నీళ్ళైనా గుటకేయలేదు..” ఎవరో అంటున్నారు.

“పద..ఒక్కసారి లోపలికి పద..నా తల్లివి కదూ?” కమల అతి కష్టం మీద మరదల్ని లోపలికి తీసుకు రాగలిగింది.

“నేను తీసుకొస్తా..మీరెళ్ళండి” అంటూ వెనకొచ్చిన వాళ్ళని పంపేసి,గది తలుపులు మూసేసింది.

తడి బట్టతో ముఖం తుడిచి, మంచి నీళ్ళు తాగించి, ఇన్ని పాలు నోట్లో పోసి బలవంతం గా గుటకేయించింది. చెరిగిన జుట్టు సరిచేస్తూ, రెండు చేతుల్లోకి  ముఖం తీసుకుని మరో సారి కదిలిపోయింది కమల. వదిన గార్ని చుట్టుకు పోతూ భోరుమని శోకించింది.

ఆమెని ఓదారుస్తూనే  అడిగింది మెల్లగా. – ” లతా! ఎలా జరిగింది ఈ ఘోరం..?”

అప్పటికే – ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త పొక్కింది.

అది నిజం కాదన్నట్టు తలూపి, చెప్పింది వెక్కుతూ…”మీ ఇంటి నించి వచ్చాక నాతో గొడవ పెట్టుకున్నారు. మెళ్ళో నాంతాడు ఇవ్వమంటే శుక్రవారం పొద్దు ఇవ్వనన్నాను. అయినా  విన్లేదు..నన్ను కొట్టి, మరీ లాక్కుపోయారు. ఈ రెండురోజులు క్లబ్లోనే వున్నారు.నిన్న తెల్లవారు ఝామున ఫోన్ చేసారు..” అంటూ పెద్ద పెట్టున ఏడ్చింది.

“ఫోన్ చేశాడా!?”

“అవును. చేసారు. డబ్బు గెలిచిన ఆనందం లో  ఏవిటేవిటో మాట్లాడేసారు. ఇక పేక ముక్క ముట్టనని  పిల్లల మీద వొట్టని  చెప్పారు…రేపు కమలక్కింటికి వెళ్ళి చెప్పాలి అన్నారు. గంటలో బయల్దేరి వస్తున్నా అన్నమనిషి..    మాయ..మై.పో..యి,  తెల్లారి….చెరువులో పడున్నాడంటూ…ఇంటికి తీసుకొచ్చారు..”ఇక చెప్పలేనిదానిలా..” కీచు మంటూ ఆగింది స్వరం. ఏడ్వడానికి కూడా కంఠం సహకరించడం లేదామెకి.

వింటున్న కమల రాయిలా అయిపోయింది. మరదలి రెక్కపుచ్చుకుని ఎలా నడుచుకుంటూ వచ్చిందో శవం దగ్గరికి తెలీదు.

మెదడు అనే స్క్రీన్ మీద ఏవో ఆకారాలు నల్ల నల్ల గా కనిపిస్తున్నాయి. పెనుగులాడు   తున్నాడు తమ్ముడు.

. వాడొకప్పుడు అన్న మాటలు – గుండె గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి ‘గెలవంగానే డబ్బు మూటకట్టుకుంటానంటే ఊరుకుంటారనుకున్నావా?  మళ్లా ఆడమంటారు..జాగ్రత్తగా ఆడి, కొంత పోగుట్టుకోవాలి..లేకపోతే…వెంటపడి ప్రాణం తీస్తారు..కక్షలు అలా వుంటాయి..”

‘అవునా సుబ్బీ!?నీ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారా నానా!’

తమ్ముడి ముఖం వంక చూసింది..ఆ తర్వాత కంఠం దగ్గర..అంతే. ఆమెకి కళ్ళు తిరిగాయి.

‘ఒరే, సుబ్బిగా..” అంటూ గావు కేకేసి  నేల మీద కుప్పకూలిపోయింది.

స్పృహ తప్పిన భార్య ని చూసి కంగారు గా దగ్గరకొచ్చాడు మూర్తి.

*****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సర్కస్ కాదు, యుద్ధం చేయాలి!

 

  

చిత్వాన్ – అతనొక కథలోని పాత్రే గానీ యిటీవల నన్ను చెప్పలేని కల్లోలానికీ వ్యాకులతకీ గురిచేసిన అత్యాధునిక యువకుడు. దాదాపు వొక సంవత్సర కాలంగా చాలా సార్లు అతను నన్ను నిద్రపోనివ్వ లేదు. ఏ పని చేస్తోన్నా అతను నా ఆలోచనల్లో తారాడుతూనే వున్నాడు. అతని జ్ఞాపకాలు తరచు నన్ను వెంటాడుతున్నాయి . బతుకు పట్ల చావు పట్ల అతని ఫిలాసఫీ నన్ను యేదో తెలీని యిబ్బందికి గురిచేస్తోంది. అతని అకాల మరణం నన్ను పదే పదే  వెంటాడుతోంది. ఇక తప్పించుకొని  పారిపోవడం నా వల్ల కావడం లేదు. ముఖాముఖి యెదుర్కోవడమే యిప్పుడు చేయాల్సింది.

‘యెందుకు జీవితాన్ని చేజేతులా అర్ధాంతరంగా ముగించుకొని చచ్చిపోయావు ?’ యెటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగా.

నా ప్రశ్నకి అతనేం తత్తరపడలేదు. నా వైపు నిశితంగా వొక క్షణకాలం చూసి – ‘నువ్వు మాత్రం చావక బతికున్నావా ?’ అని యెదురు ప్రశ్నించాడు. నేను నిరుత్తరుణ్ణయ్యా.

 ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!’

మనం మనకు నచ్చినట్టు బతకడం లేదని చిత్వాన్ ఆరోపణ. ప్రతిక్షణం అనేక విధాల పరాయీకరణకి లోనై బతికే బతుకు చావుతో సమానమని అతని నిర్ధారణ. అసంబద్ధ బంధాల్లో చిక్కుకొని మనల్ని మనం కోల్పోయి బతికే బతుకూ వొక బతుకేనా అని అతని ప్రశ్న. నిజమే. కానీ ‘జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది.’ అన్న అతని మాటల్ని అర్థం చేసుకోవాలనే తద్వారా అతణ్ణి అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం.

కానీ ‘అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడ’ నే చిత్వాన్ మాటలే మళ్ళీ అతణ్ణి అర్థం చేసుకోడానికి అడ్డుపడుతున్నాయి. అయినా అన్నిటికీ అర్థాలు వెతికే క్రమంలోనే మ్యాజిక్కో  థ్రిల్లో మరేదో వుందని నేను నమ్ముతాను కాబట్టి చిత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని నేను మానుకోలేను. చిత్వాన్ ని అర్థం చేసుకోవడమంటే సంక్లిష్టమైన సంక్షుభితమైన సమాజాన్నీ సమాజ చలనాన్నీ అర్థం చేసుకోవడమే. ఇవాళ్టి అత్యాధునిక సందర్భంలో నిర్దిష్ట సామూహిక ధ్యేయాల్లేని యువత  అంతరంగ సంచలనాన్ని  కొలిచే ప్రయత్నం చేయడమే.

ఇంతకీ యెవరీ చిత్వాన్ –  అంటే వెంకట్ సిద్ధారెడ్డి ‘సోల్ సర్కస్’ లోని (సారంగ – జూన్ 11, 2015 ; కథ లింక్ : ) పాత్ర అని వొక్క ముక్కలో చెప్పొచ్చు. కానీ అతణ్ణి అర్థం చేసుకోడానికి యెందుకంత తపన  అంటే మాత్రం అంత తేలిగ్గా చెప్పలేం. కారణం అతను కేవలం కథలో పాత్ర మాత్రమే కాదు అనిపించడం వల్ల కావొచ్చు. రక్త మాంసాలతో వెచ్చని వూపిరితో మన మధ్య జాజ్వల్యమానంగా వెలిగి ఆరిపోయిన మనలోని వ్యక్తే కథలోకి నడిచి వచ్చినట్లు అనిపించడం వల్ల కావొచ్చు. డబల్ పిహెచ్ డి తో తన తెలివి తేటలతో కొత్తతరానికి దారి చూపించగల మేధావికి  తన దారి తానే మూసుకొనే ఆలోచన కలగడంలోని అసంబద్ధత పట్ల అసహనం వల్ల కావొచ్చు. అతణ్ణి బతికించుకోలేని దుస్థితి పట్ల క్రోధంతో కావొచ్చు. మరొకర్ని అతని దారిలో నడవకుండా చేయాలంటే తోటి వ్యక్తులుగా మనమేం చేయాలి అన్న ప్రశ్న తొలవడం వల్ల కావొచ్చు…  యిలా  యెన్నో కారణాలు.

soul

గోపీచంద్ సీతారామారావో రావిశాస్త్రి సుబ్బయ్యో బుచ్చిబాబు దయానిధో కేశవరెడ్డి బక్కిరెడ్డో – యిలా  నవలల్లో పాత్రలు పాఠకుడి మనసు మీద బలంగా ముద్ర వేయడం సాహిత్య ప్రపంచంలో పదికాలాలు నిలబడటం సాధారణంగా జరుగుతుంది కానీ వొక యువ రచయిత రాసిన పది పేజీల కథలోని పాత్ర యింతలా గుర్తుంది అంటే యింతగా వెంటాడుతోంది అంటే కారణం ఆ పాత్రని నిర్మించడంలో లేదా ఆవిష్కరించడంలో అతను చూపిన నేర్పు వొకటే కాదు ;  చిత్వాన్ అతని జీవితంలో భాగం . అందుకే చిత్వాన్ చనిపోతే తన లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా  తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టు , అంత్యక్రియలు జరగాల్సింది ఒక్క చిత్వాన్ కే కాదు. తన లోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అని అతనికి అనిపించింది.

నిజానికి చిత్వాన్ రచయితకే కాదు మనకి కూడా లోపల్లోపల వొక భాగమే. అతనిలా మనమూ యే బంధనాల్లేని జీవితాన్నే ఆశిస్తాం . అతనిలా కట్టుబాట్లు లేని స్వేచ్ఛే  కోరుకుంటాం. ఇళ్ళూ వాకిళ్ళూ అర్థంలేని మమకారాలూ అన్నీ తెంచుకొని పోవడం బాగానే వుంటుంది కానీ చిత్వాన్ బుద్ధుడిలా క్షణిక వాది అయ్యాడు గానీ అన్వేషకుడు కాలేకపోయాడు. మానవకోటి దు:ఖానికి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నంలో సిద్ధార్థుడు బుద్ధుడైన క్రమాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను అన్వేషించుకొనే దారుల్ని వదులుకొన్నాడు. గుర్తు చేసుకొని సంతోషించే మధురమైన గతమూ ఆశావహమైన భవిష్యత్తూ లేకపోవడం వల్ల తానే క్షణికమని నమ్మిన వర్తమానాన్నీ అందు దాగిన దు:ఖాన్నీ యెదుర్కోలేక  మృత్యుద్వారాన్ని తట్టాడు. హంసలా ఆర్నెల్లు బతికితే చాలనుకొన్నాడు. కానీ మనుషులతో జీవించడానికి కావలసిన వనరుల్ని వెతకలేకపోయాడు , పంచలేకపోయాడు. జీవితాన్నే కాదు  ఆఖరికి ప్రేమనీ ప్రేమించినవాళ్ళనీ బంధనంగానే భావించాడు.

ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. అని సిద్ధాంతీకరించాడు. ప్రేమలోనూ అతని ఆలోచనలు అసాధారణంగానే వుంటాయి. అతని ప్రేమలో గాఢత వుంది. నిజాయితీ వుంది. ప్రేమించినంతసేపూ తనను తాను మర్చిపోయాడు. బయటి ప్రపంచాన్ని వదిలేశాడు (బయటి ప్రపంచం గురించి అతనికెప్పుడూ పట్టలేదు – అది వేరే విషయం). అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మనసులోని ఫీలింగ్సన్నింటినీ సాధారణీకరించడం అతనికి  నచ్చదు. ఇన్నేళ్ల  జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన  ఫీలింగ్ కి అంకితం చేయడంలో యేదో తేడా వున్నట్టు భావిస్తాడు. ప్రేమించడమంటే కోల్పోవడం అని అతని నమ్మకం.

నిన్ను నువ్వు కోల్పోకుండా కూడా యెదుటివారిని ప్రేమించవచ్చనీ  లేదా యెదుటివారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు కోల్పోడంలో కూడా మాధుర్యం వుంటుందనీ భరోసానిచ్చే వొక వోదార్పు వాక్యం అతనికెవరూ యివ్వలేకపోయారు.

యే బంధనాల్నీ ఇష్టపడని అతని వ్యక్తిత్వమే ప్రేమకీ జీవితానికి కూడా కట్టిపడేయలేకపోయింది. అతని బాల్యం అతణ్ణి ప్రేమ పట్ల కూడా అవిశ్వాసిగా మార్చింది.

చిత్వాన్ అసలు పేరు కృష్ణమూర్తి. అతని మాటల్లోనే చెప్పాలంటే తండ్రి నెల్లూరికి చెందిన వొక డబ్బులబస్తా , వొక ‘రిచ్ బాస్టర్డ్’. వాడు వుద్యోగరీత్యా నేపాల్ వెళ్ళినపుడు అక్కడ ‘ఉంచుకున్న దాని కొడుకు’ చిత్వాన్. అందుకే అతణ్ణి బాబు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ  ‘నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు’ అని కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాడు. నాన్న అతణ్ణి డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. కానీ చిత్వాన్ సమురాయ్. పోరాడాడు. నాన్న ఏ ఊరెళ్తే ఆ ఊర్లో.  చివరికి తండ్రి కాళ్ల బేరానికొచ్చాడు. తండ్రినొక  ఏటియం గా మలచుకొన్నాడు.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ పోయాడు. పోరాడి తన జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాడు.

బాబు పోవడంతో ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది.

డబుల్ పిహెచ్ డి తో వుద్యోగం సంపాదించాడు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాడు.  జీతాల జీవితం వొద్దు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాడు.

రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే అన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడేమో.  కానీ ఈ పేదరికం అతనికి చాలా కొత్త.  ‘జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై’  అని ప్రయత్నించాడు.  కానీ వల్ల కాలేదు.

ఎటియం లు వున్నంత కాలం జీవితం గురించి యెన్నో కబుర్లు చెప్పగలిగిన చిత్వాన్ , జీవితాన్ని యిష్టమొచ్చినట్టు గడపాలంటే ఎటియం ల అవసరం తప్పదని గ్రహించాడు.  ‘యెన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు’ అని గుర్తించాడు గానీ దాన్ని జయించలేకపోయాడు. అందుకు మనసు చంపుకోలేక ఆత్మని అమ్ముకోలేక చావుని ఆశ్రయించాడు.

అంతా చూస్తే లోపలి మనిషి అస్తిత్వ అన్వేషణ – స్వేచ్ఛ ముసుగులు తగిలించుకొన్న వొక వ్యక్తివాదే చిత్వాన్ లో కనిపిస్తాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం , భవిష్యత్తు అగమ్య గోచరం కావడం ,  వ్యవస్థాగత నిర్మాణాలు దాని పట్ల భరోసా ఇవ్వలేని పరిస్థితి , సమూహంలో సైతం వొంటరి ద్వీపాలుగా మిగిలి పోయే భద్రతా రాహిత్యం, వొక చట్రంలో యిమడలేని వ్యక్తిత్వం , వ్యక్తిగతమైనదో సామాజికమైనదో వొక గమ్యం లేకపోవడం , జీవితంలో అస్థిరత్వం , అరాచకత్వం  … యివన్నీ చిత్వాన్ చావుకి కారణమేమో అని తోస్తుంది.

మనుషుల్లోని హిపోక్రసీని ద్వేషించి సమాజానికి అతను దూరమయ్యాడు సరే ; సమాజం కూడా అతణ్ణి తనలో యిముడ్చుకోలేకపోయింది. కెరీరజం వూబిలోకి నెట్టి వైయక్తిక ప్రతిభని పై మెట్టు మీద నిలిపే  విశ్వవిద్యాలయాల డొల్ల చదువులు , మనుషులు సామాజిక జీవులుగా గాక వ్యక్తులుగా విడిపోవడమే స్వేచ్ఛకి పరమార్థంగా నిర్వచించే ఆధునికోత్తర ధోరణులు యువతరాన్ని గందరగోళపరుస్తున్నాయి. చిత్వాన్ లోని వైరుధ్యాలకూ ఇంటలెక్చువల్ యారోగెన్స్ కీ పలాయన తత్త్వానికీ వ్యక్తివాదానికీ కారణం యీ వాతావరణమే.

ఈ ఖాళీలని పూరించుకోడానికి  గానీ యీ గందరగోళాన్నుంచి బయటపడటానికి  గానీ  చిత్వాన్ ప్రయత్నం చేయలేదా అంటే – చేశాడు. కానీ అవి బలహీనమైనప్రయత్నాలు. నిలువుటద్దం లాంటి వొక మంచి స్నేహితుడి కోసం వెతుక్కొన్నాడు.

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలుఅన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ.’

చిత్వాన్ రచయితలో అటువంటి స్నేహాన్ని చూశాడు. అనుభవించాడు.ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది’ – అంటూ నెమళ్ళ కొలను (పీకాక్ లేక్ కి చిత్వాన్ పెట్టిన పేరు) దగ్గర చేసుకొన్న తొలి పరిచయం తోభయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని’  వున్న రచయితని వాటి నుంచీ బయట పడేశాడు.

‘యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కృత్వా ఘృతం పీబేత్. భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత:’ అంటూ చార్వాకుడై కాసేపు , పీత్వా పీత్వా పున: పీత్వా అంటూ ఒమర్ ఖయ్యాంగా కాసేపూ , జరాతుష్ట్రగా కాసేపూ , అదేదో సినిమాలో కళాపోషకుడిగా కాసేపూ … గంటకో కొత్త వేషం వేస్తూ వింత  అనుభవాలు  పరిచయం చేసాడు.  వాదాలూ సిద్ధాంతాలూ ప్రవచించాడు ( ఇవ్వాళ చిత్వాన్ బతికుంటే ‘హాయ్ అయామ్ కన్హయ్య కుమార్ ఫ్రం జెయెన్టీయూ’ అనో ‘రోహిత్ వేముల ఫ్రం నక్షత్ర ధూళి అనో’ తనను తాను  పరిచయం చేసుకొనే వాడేమో!)

భీముని కొలను , శ్రీశైలం టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ,   జమ్ము తావిలో వైష్ణోదేవి గుడి , నాసిక్ త్రయంబకేశ్వరం  , ఎల్లోరా కైలాష గుడి , హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె … దేశమంతా తిరిగాడు , తిప్పాడు. జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని – జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుందని చెప్పాడు.

రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని అగ్నిగుండంలోకి నడిపించినప్పటికీ , గంటల లెక్కన నిన్ను నువ్వు అమ్ముకోవద్దని వారించి నప్పటికీ – రచయిత పేదరికాన్ని జయించడానికి విదేశానికి యెగిరిపోయినప్పుడు మాత్రం డీలాపడ్డాడు అనిపిస్తుంది.

‘ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి’ – అని తెలిసినప్పటికీ వొంటరివాడయ్యాడు.

హంపిలో  శిధిలాల్లో   జీవితం  అశాశ్వతమన్న ప్రతీకల్ని చూశాడు. ఆ  శిధిలాల్నుంచి  జీవితం  నశ్వరమని నేర్చుకున్నాడు. అక్కడి రాళ్ళతో అతను మాట్లాడాడు. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిల శిల్పం ‘ ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని అతనికి బోధించాయి. వాటి భాష అర్థం చేసుకొన్నాడు.

కానీ పేరడాక్స్ యేమంటే ఆ శిధిలాల్లోనే ప్రేమలో పడ్డాడు. ప్రేమలోని మాధుర్యం అనుభవించాడు. ఆమెను చూస్తున్నంత సేపూ తన  గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేకుండా పోయాయి. ఆమె మాత్రమే కావాలనుకునే వొకే వొక్క ధ్యేయంతో బతికాడు.ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు. ఆమెను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ  రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది అతనికి.

అంతే –  సడెన్ గా పెరుగన్నంలో ఆవకాయ వేసుకు తినాలనిపించి కాళ్ళా వేళ్ళా బడి ఆమె యెంత బతిమాలినా వినిపించుకోకుండా ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యీ లోకం నుంచే వెళ్ళిపోయాడు.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు – అని  చిత్వాన్ భావించడానికి కారణాలేంటి అని కథ చదువుతున్నంతసేపూ వొక ప్రశ్న మనల్ని బాధిస్తుంది.

సమూహం నుంచి దూరమైన వ్యక్తివాదమే చిత్వాన్ ఆత్మ హననానికి కారణమని నాకు బలంగా అనిపిస్తుంది. మార్గదర్శనం చేయించే  సామూహిక సామాజికోద్యమాలు బలహీనం అయిన నేపథ్యంలో యిటువంటి ఫిలాసఫీ ముందుకు వస్తుందేమో అని తోస్తుంది. రోల్ మోడల్స్ లేనితనం నుంచి వొక నిస్పృహ నుంచి యిటువంటి విపరీత మనస్తత్త్వం రూపొందుతుందేమోనని భయమేస్తుంది. ఆదర్శవంతంగా వుండాల్సిన వుద్యమ జీవితాల్లోకి సైతం స్వార్థపు నీడలు వ్యాపించడం , ఆచరణలో బోలుతనం చోటుచేసుకుంటున్న అవిశ్వాస వాతావరణంలో వొక సామూహిక స్వప్నాన్ని అతనికి అందించలేకపోయాం అని కూడా వ్యథ కల్గుతుంది.

రొటీన్ లో కూడా మరణించనీకుండా కాపాడే మ్యాజిక్ యేదో మన జీవితాల్లోనూ మనం జీవిస్తున్న యీ సమాజంలోనూ వుందనీ ఆ యేదోని తెలుసుకోలేకపోవడం వల్లే నువ్వు మరణించావు చిత్వాన్ అని అతనికి చెప్పాలని వుంది.

జీవితం అనశ్వరం కాదు ; అశాశ్వతమే …  కానీ స్వయంగా దాన్ని స్వయంగా అకారణంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు. చావడానికి ధైర్యం అక్కరలేదు – బతకడానికి కావాలి. నిజానికి ప్రేమించడం చావు గాదు ;  ప్రేమరాహిత్యమే మరణం అని గొంతు చించుకు అరవాలని వుంది. వ్యక్తల్నే కాదు మందిని ప్రేమించు , నూతన మానవావిష్కరణ కోసం సమాజంలో యేదో వొక మూల సమూహాలు చేసే ప్రయత్నాల్ని ప్రేమించు , చీకటిని కాదు వెలుగుని ప్రేమించు అని బుజ్జగించాలని వుంది. కానీ కాంక్రీట్ అడవుల్లోనో , భద్ర లోకాల మూలల్లోనో , మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలోనో , ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి పుట్టించడంలోనో మైమరచిపోయి ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు దేశం నుంచి దేశానికి మోసుకుంటూ సంసార రంగుల రాట్నంలో   బిజీగా తిరుగుతూ  వున్న రచయితకు లాగానే నాక్కూడా యేదో తెలీని వ్యక్తం చేయలేని గిల్టీ ఫీలింగ్.

దాన్నుంచీ బయట పడటానికే – అపరాధ భావనని కడిగేసుకోడానికే – పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకుంటూ  జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియని తనం నుంచీ తనను కాపాడుకోడానికే కథలో తననో పాత్ర చేసుకొని తన కథనీ చిత్వాన్ కథనీ రాయడానికి  పూనుకొన్నాడు రచయిత. రాయడం గురించి చిత్వాన్ చెప్పిన మాటలే అతడికి భయం కల్గించాయి  దారిచూపాయి కూడా.

‘రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

 ‘లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.’

 ఈ మాటలు కథకుడి మీద బలంగా ముద్ర వేశాయి. ‘నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే’ అని నిర్ధారించుకొన్న రచయిత రాయడానికే పూనుకొన్నాడు.

నిజానికి కథలోని పాత్రతో రచయితకు అభేదం పాటించి విశ్లేషించడం ఎంతవరకు సమంజసమో తెలీదు గానీ , సిద్ధారెడ్డి కథ పొడవునా రచయిత పాత్రతో ఐడెంటిఫై అవడం కనిపిస్తుంది. ఆత్మ కథాత్మక కథనంతో విశ్వసనీయత సాధించాడు. అందువల్ల రచయితే కాదు పాఠకులుగా మనం కూడా కథతో కనెక్ట్ అవుతాం. జీవితం పట్ల రచన పట్ల చిత్వాన్ తో యేకీభవిస్తూ విభేదిస్తూ కొట్లాడుతూ రాజీపడుతూ కథలో లీనమవుతాం. ఈ కథ యెందరినో కదిలించిందంటే , దు:ఖ పెట్టిందంటే , చిత్వాన్ పట్ల క్రోధాన్నీ ప్రేమనీ కల్గించిందంటే ,  యేకకాలంలో నచ్చిందీ నచ్చలేదు అన్న ద్వంద్వానికి గురి చేసిందంటే , చదువుతూన్నంత సేపూ తమ లోపలికీ చుట్టూ వున్న యితరుల్లోకీ చూసేలా చేసిందంటే ,   కథా రచనకు  సిద్ధారెడ్డి ఎంచుకొన్న టెక్నిక్కే అందుకు ప్రధాన కారణం.

sidha

అందుకే కథ ఆవు వ్యాసం కాలేదు. మంచి కథ కొత్త కథ చదివామని చాలా మండి పాఠకులు స్పందించారు. కథ యిలా చెప్పడానికి ( రచయిత ఐచ్ఛికంగా యెన్నుకొన్న మౌఖిక శైలి కథకి గొప్ప అందాన్నిచ్చింది) రచయిత దశాబ్దం పైగా స్ట్రగులయ్యాడు. సిద్ధారెడ్డి అంతకు ముందు కథా రచనలో చిన్నా చితకా ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా రంగంలోకి డీవియేట్ అయిన తర్వాత కథా రచయితగా తనను తాను రీడిస్కవర్ చేసుకొనే క్రమంలో రాసిన తొలికథ సోల్ సర్కస్.

రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే అన్న చిత్వాన్ మాటలతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ చాలెంజ్ ని రచయిత యెలా  నిర్వహించాడో చూద్దామనే వుత్సుకతతోనే కథ చదవడం మొదలెడతాం. అక్కడ నుంచీ రచయిత పంచుకొనే చిత్వాన్ జ్ఞాపకాలు వూపిరి తీసికోనివ్వవు. జీవితం గురించి చిత్వాన్  ఆలోచనలు మన గుండె లోతుల్ని తడుముతూ వుంటై. అతని మరణానికి కారణం తెలుసుకోడానికి రచయిత వెంట అన్వేషిస్తూ పోతాం.

కథ రచయిత దృష్టి కోణం నుంచీ నడుస్తుంది. కథకుడి దృక్పథం తన సొంత జీవితంపై చిత్వాన్ చూపిన ప్రభావాల గురించి ప్రస్తావించిన సందర్భాల్లో వ్యక్తమౌతుంది. నిజానికి యిద్దరి కథా పక్క పక్కనే కాకుండా జమిలిగా పెనవేసుకొని నడుస్తుంది. అలా నడపడంలోనే వెంకట్ సిద్ధారెడ్డి నేర్పు కనపడుతుంది. నిజానికి కథ అంతా గతమే. కానీ గత వర్తమానాల్లోకి ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కథ భిన్న స్థల కాలాల్లో జరిగినప్పటికీ అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా వుండటమే కథలో బలం. ఆ అనుభూతి పాఠకుల అంతరంగాల్లో విషాదం మిగుల్చుతుంది. ‘నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.’ అని కథకుడి స్థానం నుంచి  రచయిత చేసిన ప్రకటనతో యేకీభవిస్తాం. అందుకే రచయిత లోపలి సంఘర్షణకి కూడా  కథలో సమ ప్రాధాన్యం లభించింది. రచయిత పాత్ర ద్వారా జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో మనం కోల్పోతున్నవాటిని గుర్తుచేయడం కూడా వొక కథాంశంగా తయారైంది. రాయడం గురించి రచయిత తనదైన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కూడా వొక సందర్భాన్ని సృష్టించుకొన్నాడు.  అది చిత్వాన్ అభిప్రాయానికి విరుద్ధం కాదు గానీ మరో చూపు.

రచయిత శిల్ప నైపుణ్యం వల్ల దృక్పథా బలం వల్ల కథ వ్యక్తి తలం నుంచీ సామాజిక తలానికి యెదుగుతుంది.

‘రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమోఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా?అంటూ వర్షంలో విరూపాక్షాలయం ముందు నించుని గుండె పగిలేలా రచయిత రోదించినట్టే మనం కూడా వుద్విగ్నులమౌతాం. చిత్వాన్ లను కాపాడుకొనే దారులు వెతుకుతాం. చిత్వాన్ కథ చెప్పడం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం అదే అయితే అందులో అతను నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.

మరో చిత్వాన్ అకాలంగా  అకారణంగా మన మధ్య నుంచి వెళ్ళిపోకూడదు.

మన మధ్య తిరుగాడే చిత్వాన్ లకీ మన లోపల కదలాడే చిత్వాన్ కీ వొక సామూహిక స్వప్నాన్నిద్దాం ; బతికించుకొందాం. అయితే వొక బృంద గానం ఆలపించిన సామూహిక నినాదమై మోగిన మంది కల గన్న రోహిత్ వేముల కూడా మననుంచి నిష్క్రమించిన విషయాన్ని సైతం మనం మర్చిపోకూడదు. మన స్వప్నాల్ని ధ్వంసం చేసే కుట్రలపట్ల  అప్రమత్తంగా వుండాలి. వాటిని యెదుర్కోడానికి సమాయత్తం కావాలి. అందుకు అవసరమైన శక్తులన్నిటి సమీకరణం యివాళ్టి అవసరం. రోహిత్ ని అయినా చిత్వాన్ ని అయినా మిగుల్చుకోడానికి – అదే యిప్పుడు మనం చేయాల్సిన  సర్కస్ ; కాదు యుద్ధం.

*

బతుకు లయను వినుడీ! 

ఎల్దమొస్తవా…

 

 

ananya“ఇండియా వెళ్లావట కదా? పదిరోజుల్లో ఏం చేద్దామని వెళ్లావు? ఏం చేశావు? పోనీ చివరి రోజు ఏం చేశావు?” షాపులో కనిపించిన ఒక స్నేహితురాలు గుక్కతిప్పుకోకుండా అడిగేసింది.

సంతోషంగా లిస్ట్ చదవబోయాను, “కన్హయ్య కుమార్ ను కలిసి మా పాప తనకోసం గీసిన బొమ్మ ఇచ్చాను,  ….”

“కన్హయ్య కుమార్ ఎవరు?”

“జె ఎన్ యు లో స్టూడెంట్ లీడర్… పోనీ… రోహిత్ వేముల…”

“….”

“దళిత్…”

“అతనెవరు? ఎవరు వీళ్లంతా?”

ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవడమంటే ….

*

విశాఖ పొలిమేరలు దాటింది కారు. రామకృష్ణ బీచికి వెళ్లకుండా ఈ ముగ్గురు తమిళులతో రావడం సరైందేనా అనుకుంటూనే ఉన్నాను. నాకు తమిళం రాదని, ఇంగ్లీషు వచ్చని తెలిసినా తమిళంలోనే మాట్లాడుకుంటున్న వాళ్లపట్ల కాసింత కోపం కూడా వచ్చేసింది.

నేను పెద్ద మాటకారిని కాదు. అయినా డ్రైవర్ భాస్కర్ ను ఏవో చిన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండిపోయాను. వాళ్ళేనా తెలీని భాష మాట్లాడుకునేది? భాస్కర్ కు ఇంగ్లీషు, తమిళం రెండూ రావు. నా తెలుగు అతనికి, తన తెలుగు నాకు అర్థమవడం కష్టంగా ఉంది. అయినా సరే, తెలుగు తెలుగే. చుట్టుపక్కల ఊర్ల గురించి, కొండల గురించి అతను చెప్పే విశేషాల గురించి నేను వాళ్లకు చెప్పను గాక చెప్పను. వాటి గురించి అతనికే సరిగ్గా తెలీదని నాకు అర్థమయిందన్న విషయం కూడా చెప్పను. ఒక కొండను ఒకసారి ఎర్రకొండ అంటాడు, అహా అది కాదు వేరేది అంటాడు. హోర్నీ. నా కలల విశాఖ ప్రయాణం ఇట్లా ముగియబోతోందా?  కృష్ణ నన్ను వీళ్లతో ఇరికించేశారే. వీళ్లు వెళ్లేచోట రామకృష్ణ బీచి కంటే చూడాల్సిన బీచి మరొకటి ఉందని అన్నారు. అది ఏదో సముద్రం ఒడ్డున ఊరు. న్యూక్లియర్ ప్లాంటు కట్టబోయే చోటు. వీళ్లకు అక్కడేం పనో ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ ఊర్లో మమ్మల్ని కలుసుకోబోయే వాళ్లకు ఇంగ్లీషు సరిగ్గా రాకపోవచ్చని, అవసరమైతే సహాయం చెయ్యమని చెప్పారు.

విజయనగరం బోర్డు కనిపించేసరికి “విజయనగరం అంటే శ్రీకృష్ణదేవరాయలి రాజధానే కదూ?” వెనక నుంచి సుందర రాజన్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు తత్తరపడ్డాను. ఒకింత కలవరపాటు కూడా. చరిత్ర పాఠాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అవుననీ, కాదనీ, హంపి కాదూ అనీ మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఉండబట్టలేక భాస్కర్ ను అడిగాను. ఔనన్నాడు, వెంటనే కాదన్నాడు. ఆఖరికి ఔననేశాడు. ఒకసారి అతని ముఖంలో చూసి ఇక మాటమార్చడని తేల్చుకుని, నిట్టూర్చి “ఔనట” అని వెనక్కి తిరిగి అన్నాను.

భాస్కర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్న అమర్తరాజ్ కొంటె నవ్వు అప్పుడప్పుడే అలవాటౌతోంది. నా వెనక ఉన్న సీట్లో కూర్చున్న సుందర రాజన్ నవ్వుతున్నాడో లేదో కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య కూర్చున్న ఉదయకుమార్ నవ్వుతున్నాడో లేదో అర్థమవడం కష్టం. ఎప్పుడూ ఒక చిర్నవ్వు ప్రశాంతమైన ఆ ముఖంలో వెలుగుతుండడం గమనించాను.

కాసేపాగి, “ఇంతకీ మీరు నిజనిర్ధారణ కమిటీకి చెందిన వాళ్లా?” అని అడిగాను. నవ్వేసి, కాదన్నాడు అమర్తరాజ్.

mamata1

అమ్మన్నాయుడు (CITU – Centre of Indian Trade Unions, a CPI(M)-affiliate), సుందర్ రాజన్, గోవింద రావు (CITU), మమత, కె. రాము (మానవహక్కుల వేదిక), ఉదయకుమార్, థవుడు (ప్రజాశక్తి జర్నలిస్టు), కె.వి. జగనాథ రావు (మానవహక్కుల వేదిక), తేజేశ్వర రావు (CITU).

 

మధ్యలో తెలుగు మిత్రులు కలుసుకున్నారు. పేర్లు చెప్పుకున్నాం. అందరి ముఖాల్లో చిర్నవ్వు. ఎప్పట్నుంచో తెలిసున్నవాళ్లలా పలకరింపులు. ఏ ఊరివాళ్లైతేనేం, ఏ రాష్ట్రం వాళ్లైతేనేం, ఏ దేశం వాళ్లైతేనేం – కలిసి పనిచెయ్యబోతున్నామని తెలిసినప్పుడు అన్ని ఎళ్లలూ చెరిగిపోతాయి.

వెళ్లాల్సిన ఊరు చేరుకోవడానికి వేరే రోడ్డు ఎక్కాలని, వాళ్ల కారు ఫాలో అవమని చెప్పారు. పొదలతో, చెట్లతో, వాటిని కలుపుతూ అల్లుకుపోయిన తీగెలతో పచ్చగా ఉంది అక్కడంతా. మధ్యలో చిన్న చిన్న పంట పొలాలు. వరి నాటుతున్న మహిళలు కనిపించారు. అక్కడక్కడ రెల్లుదబ్బులతో వేసిన గుడిసెలు, ఒక చర్చి కనిపించాయి.

చర్చి గోడమీద ఊరిపేరు, “పాతర్ల పల్లి“.

ఆ ఊరు దాటాక మళ్లీ పచ్చని చెట్లు, చిన్ని చెలకల పొలాలు. ఇంకొక ఊరు కనిపించింది. గుడిసెలు లేవు. అన్నీ పక్కా ఇళ్లే.

బడి గేటు మీద పేరు చదివాను, “పాతర్ల పల్లి“

అరే, ఈ రెండు ఊర్లకు ఒకటే పేరా?

కాదు. ఇవి రెండు ఊర్లు కాదు. ఒకటే ఊరు. ఇందాక చూసింది వెలివాడ.

నేను ఆశ్చర్యపోతుంటే, “అన్ని ఊర్లు ఇట్లనే ఉంటయ్ కద మేడమ్” అన్నాడు భాస్కర్.

“మా వైపు కూడా ఇట్లాగే ఉంటాయి.” అదేం కొత్త విషయం కాదన్నట్లు చెప్పాడు ఉదయకుమార్.

“మా కర్నూల్ వైపు ఇట్లా ఉండవు. అన్ని కులాలు, మతాలు కలగలిసిపోయి ఉండవు కానీ, ఒక వాడ తరువాత ఒకటి, ఆనుకునే ఉంటాయి. మాలమాదిగ వాళ్ల వాడలు కూడా” అనేసి చిన్నప్పుడు, పదేళ్లు, పెరిగిన మా ఊరిని గుర్తు చేసుకున్నాను.

హఠాత్తుగా, రెడ్ల ఇళ్లకు మాల వాడకు మధ్య కల్లాలు గుర్తొచ్చాయి. ఊరిమధ్యలో అవెందుకు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎంత దారుణం!! చిన్ననాటి స్నేహితురాలు రంగమ్మ గుర్తొచ్చింది. ఆ కల్లాల్లో తెగ ఆడుకునేవాళ్లం. చీకటవగానే తనొక వైపు, నేనొక వైపు వెళ్లిపోవడం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం ఇంతవరకు ఎందుకు తట్టలేదు? తట్టినా ఏం చేసేదాన్ని? నా చేతులతో మంచినీళ్ల గ్లాసెత్తి దోసిట్లోకి నీళ్లు వంపినదాన్నే కాదూ? అదెప్పుడో చిన్నతనంలో ఐతేనేం? ప్రశ్నించలేని అధైర్యాన్ని పక్కన పెడితే, అసలు ప్రశ్నే ఎప్పుడో గాని రాలేదు. ఆ గిల్ట్ ఎప్పటికీ పోనిది.

“న్యూక్లియర్ ప్లాంట్ వస్తే చానా ఉద్యోగాలొస్తయంట కద మేడమ్?” భాస్కర్ అడిగిన ప్రశ్నతో కొంచెం సర్దుకున్నాను.

“వస్తాయి కానీ ఊరివాళ్లకు కూలి పనుల లాంటివే ఉంటాయి. స్వంతంగా వాళ్లు చేసుకుంటున్న పనులు మానుకుని కూలీ పని ఎందుకు చెయ్యాలి? ఆ పనీ అయిపోయాక సిటీలకు వలసపోవాల్సిందే.” అతనికి అర్థమయ్యే విషయాలు చెప్పాను.

మధ్యలో ఒకచోట కార్లు ఆపి న్యూక్లియర్ పవర్ పార్క్ ప్రపోజ్డ్ సైట్ అంటూ చూపించారు శ్రీకాకుళం మిత్రులు. అంత పచ్చదనం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండదేమో అన్నట్లుంది ఆ ప్రదేశం. అట్లాంటి చోట పొగలు కక్కే బ్రహ్మాండమైన రియాక్టర్లను ఊహించలేకపోతున్నాను.

“ఈ ప్రదేశం ఏ ఎర్త్ క్వేక్ జోన్ కిందకి వస్తుంది?” తెలుగు మిత్రులను అడిగాడు సుందర రాజన్.

అనుకోని ప్రశ్న ఎదురైనట్లుంది వాళ్లకు. కాసేపు ఆలోచించి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, “నాలుగు అనుకుంటా” ఒకరు అన్నారు. కాదనిపిస్తోంది. ఉన్నదే ఐదు జోన్లు. ఎంత దురాశపరులైనా, అలక్ష్యంగా ఉన్నా మరీ నాలుగో జోన్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోరనిపిస్తోంది. ఏమో ఎవరు చెప్పోచ్చారు. రాజధాని, అమరావతి, వెట్ ల్యాండ్స్ మీద కడుతున్నప్పుడు.

కొన్ని నిమిషాలు అక్కడ గడిపి కొవ్వాడలో జనాలతో మాట్లాడదామని బయల్దేరాం. అప్పటిదాకా ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు తమిళులు సీరియస్ అయ్యారు.

దార్లో, “ఇక్కడ భూకంపాలు వస్తాయా?” అని భాస్కర్ ను అడిగాను.

“2014 లో భూమి కొంచెం కదిలింది మేడమ్. పెద్దది కాదు. ఏం నష్టం జరగలేదు.” భాస్కర్ చెప్పిన విషయాన్ని వాళ్లకు చెప్పాను.

కొవ్వాడ చేరుకునే ముందే సముద్రం కనిపించింది. బీచ్ ని ఆనుకుని ఊరు. చేపలు పట్టడం వాళ్ల వృత్తి అని విన్నాను. కానీ పడవలేవీ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్లు బీచిలో వలలాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఊరికి, బీచికి మధ్య ఒక అరుగు మీద కొంతమంది యువకులు పేకాట ఆడుకుంటున్నారు.

“పనులేం లేవు. ఇంకేం చేస్తారు?” ఎవరో అన్నారు. పనులు లేకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు.

నా సందేహం నా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించినట్లుంది. “వీళ్లు మత్స్యకారులు మేడమ్. ఇప్పుడు చేపలు లేక సముద్రం లోకి వెళ్లటం లేదు.”

“చేపలు లేకపోవడం ఏమిటీ?” చాలా విచిత్రంగా అనిపించింది నాకు.

“చుట్టుపక్కల ఉన్న ఫార్మాసూటికల్ ప్లాంట్ల నుంచి వచ్చే టాక్సిక్ వేస్ట్ అంతా ఇక్కడికే వస్తుంది మేడమ్. కొన్నేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు చేపలు లేవు. ఇంతకుముందు చేపలు పట్టలేనోళ్లు, వలలు తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు హ్యామక్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. అవన్నీ గుజరాత్, మహారాష్టృ లాంటి చోట్ల అమ్ముకుంటారు.”

గొంతులో ఏదో అడ్డంపడ్డట్లైంది. ఇస్మత్ చుగ్తాయ్ ప్రస్తావించే ముళ్ల బంతి!

ఇంతలో అక్కడ కొంతమంది కుర్రవాళ్లు గుమిగూడారు.

“ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని రానిస్తారా?” అని అడగమన్నాడు సుందర రాజన్.

అందరికంటే ముందు నిలబడ్డ ఒక అబ్బాయి, “రానివ్వం!” ధీమాగా, కోపంగా అన్నాడు. ఆ అబ్బాయికి పదహారు, పదిహేడేళ్లు ఉంటాయేమో. తీక్షణమైన ఆ అబ్బాయి చూపు ఇక జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది.

మెట్లెక్కి ఆ అరుగుమీద కూర్చున్నాం. మాముందు ఊరి యువకులు. అమర్తరాజ్ మాతో కూర్చోలేదు. కాసేపు అందరి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు. భాష రాని చోట ఒక్కడు అట్లా వెళ్లిపోతే ఎట్లా? పోనీ, చిన్నపిల్లవాడా ఏమన్న. సముద్రం ఫోటోలు తీస్తున్నాడేమో.

ఊరి వాళ్లు మాట్లాడేముందు సుందర్ రాజన్ను, ఉదయకుమారన్ను పరిచయం చేసుకోమన్నారు తెలుగు మిత్రుల్లో ఒకరు. ఇంగ్లీషులో అతను చెప్పేది నన్ను తెలుగులో చెప్పమన్నారు. అప్పటికప్పుడు చెప్పే మాటలను తర్జుమా ఎప్పుడూ చెయ్యలేదు. అయినా, ‘సరే’ అనేశాను.

సుందర్ రాజన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ అనే సంస్థ నుంచి వచ్చాడని, అంటే భూమి మిత్రులు అని అర్థమని వివరించాను. న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని కూడంకుళం అనే ఊర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ మధ్యే ఫుకొషిమా వెళ్లొచ్చాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల ఒరిగే లాభాల కన్నా, జరిగే నష్టలే ఎక్కువ అని, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడతారని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల తరుపున ఆలోచించడం లేదని చెప్పాడు.

కూడంకుళం అన్న పేరు నోరు తిరగలేదు. కూడబలుక్కుంటూ ఆ ఊరి పేరుని పలికినప్పుడు, సుందర రాజన్ శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని వేరేవాళ్లకు తెలియకపోయినా పక్కనే కూర్చున్న నాకు తెలిసిపోయింది. నేను ఎప్పుడూ వినివుండని ఆ ఊరు అతనకి చాలా ముఖ్యమైందని అర్థమయింది.

ఫుకొషిమాలో, పవర్ ప్లాంటుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్లందరినీ వేరే చోట్లకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఒక పాల వ్యాపారి గురించి చెప్పాడు. ఆ వ్యాపారికి సోకిన రేడియేషన్ ను ట్రీట్ చెయ్యగలరు కానీ అతని ఆవులను రక్షించలేమని చెప్పారట. వాటికి రేడియేషన్ సోకడం వలన, అవి ఇచ్చే పాలు ఎవరూ తాగకూడదు. వాటి మాంసం కూడా ఎవరూ తినకూడదు. 75 ఆవులను చంపేసి, ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చిందని చెప్పాడు. భోపాల్ దుర్ఘటను గుర్తు చేసి, కొన్ని వేల మంది మరణించినా, గాయాలపాలైనా సి.యి.వో వారెన్ ఆండెర్సన్ కు ఎలాంటి శిక్ష పడకుండా భారత, అమెరికా ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే సామాన్య జనం తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం పెట్టుకోకూడదని చెప్పాడు.

తరువాత ఉదయకుమార్ మాట్లాడాడు. తాము అభివృధికి ఆటంకం కాదని, ఏ విదేశీ సంస్థకు పని చెయ్యటం లేదని, శాంతియుతమార్గాల ద్వారానే పోరాటం చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. కొవ్వాడ, చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు చేస్తున్న, చెయ్యబోయే పోరాటాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పాడు. టెస్టు చెయ్యని రియాక్టర్లను కొవ్వాడలో వాడబోతున్నారని, ప్రమాదం జరగడానికి చాల ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఫుకోషిమా ప్రమాదం తరువాత ఎన్నో దేశాలు అణురియాక్టర్లు నిలిపివేయడమో, చాలావాటిని మూసివేయడమో చేశాయని, మరి భారత ప్రభుత్వం కొవ్వాడలో ఎందుకు కొత్తగా అణురియాక్టర్లను నిర్మించాలనుకుంటున్నాయో ప్రశ్నించాలని అన్నాడు. ప్రభుత్వాన్ని గాని, ఏ రాజకీయ పార్టీని గాని నమ్మకుండా ప్రజలు తమ పోరాటం తాము చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు.

పక్కన కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ఒకతను తను స్పెషల్ బ్రాంచ్ నుంచి అని అన్నాడు. ఉదయకుమార్ కొంచెం ఆశ్చర్యపోయాడు, “ఓ స్పెషల్ బ్రాంచి నుంచా?” అని చిర్నవ్వు నవ్వాడు. అతనూ నవ్వాడు.

వాళ్లు చెప్పినమాటలైతే ఇంగ్లీషులోంచి తెలుగులో చాలావరకు తర్జుమా చేస్తున్నాను. వాళ్లు చెప్పేవి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆలోచనల్లో పడి, అన్ని విషయాలు తిరిగి చెప్పలేకపోతున్నాను. తెలుగు మిత్రులు అందుకుని తర్జుమా చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ మా చుట్టూ ఉన్న జనం మారుతున్నారు. ముందు కూర్చున్న యువకులు మాత్రం కదలటం లేదు. శ్రద్ధగా వింటున్నారు. మధ్య మధ్యలో “మీరేం చేస్తారు?” అని ప్రశ్నిస్తే “ఈ ఊరు నుంచి వెళ్లం. ఇది మా ఊరు. కొట్లాడ్తాం” అని గట్టిగా చెప్తున్నారు.

ఇంతలో పక్కనుంచి ఒక యువకుడు అరిచాడు, “ఎవరెవరో వస్తారు, ఏదో చెప్పి పోతారు. మా నాయకులే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకే పోరాడుతాం? మా భూమిని ఇచ్చెయ్యక ఏం చేస్తాం?” అతని మాటలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాను.

ఒక పెద్దాయన ప్లాస్టిక్ తాళ్లతో బుట్టల్లాంటివి చేస్తున్నాడు. పళ్లు, కూరగాయలు పెట్టుకోవడానికి అని చెప్పాడు. వలలు చెయ్యడం కాకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పారు గుంపులో ఒకరు. తిండికోసం ఏ తిప్పలైనా పడాలి కదా అని అన్నాడు ఆ పెద్దాయన.

“సరే పవర్ ప్లాంటు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే మాకేం, రేపో మాపో పోయే ముసలోళ్లకు” అని అనేశాడు.

ఆయన పక్కన ఇంకో పెద్దాయన వళ్లో కూర్చున్న పసిపిల్లవాడు నావైపు అమాయకంగా చూస్తున్నాడు.

“మీ సంగతి సరే, మరి మీ పిల్లల సంగతి? వాళ్ల పిల్లల సంగతి మీకు అఖర్లేదా? ఆ పిల్లాడి సంగతి?” అని అడిగాను. ఆయన క్షణకాలం నా ముఖంలోకి చూశాడు.

ఇక ఒకరి మాటలను ఒకరు మింగేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు ఊరి వాళ్లు. గొడవగా తయారయ్యింది అక్కడంతా. అంత గడబిడలోనూ ఎవరూ ఇదొక ఆట అన్నట్లో, కాలక్షేపం కోసం అన్నట్లో మాట్లాడటం లేదు. అయినా, ఇట్లా కాదు. ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే బాగుండుననిపించింది.

“ఊరి సర్పంచ్ తో మాట్లాడడం కుదరదా?” అని అక్కడున్నవాళ్లను అడిగాను.

“ఊర్లో లేడు. ఉన్నా ఏం లాభం. ఆయన ప్రభుత్వం వైపే ఉన్నాడు. వీళ్లు వస్తున్నారని తెలిసి పక్క ఊరికి వెళ్లిపోయాడు.” నాకు ఆశ్చర్యమేసింది. వీళ్లను చూడగానే తెలుగు కార్యకర్తల ముఖాలు వెలిగిపోవడం హఠాత్తుగా గుర్తొచ్చింది. వాళ్లవైపు చూశాను. ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఈ విషయం పట్ల దృఢమైన నిబద్ధతో ఉన్నట్లు తెలిసిపోతోంది. ఈ తమిళులు సామాన్యులు కాదని ఒక్కసారిగా అనిపించింది.

“ఊర్లోకి వెళ్లొద్దాం పదండి” అన్నారెవరో.

బీచికి ఆనుకుని ఉన్న ఇంటివైపు వెళ్లాం. ఒకరిద్దరు ఆడవాళ్లు మాట్లాడారు. వాళ్లకు మావి కొత్తముఖాలే కానీ మాలాంటి వాళ్లను ఇంతకుముందు చూసి, ఆశపడి, నిరాశపడిన అనుభవాలున్నట్లున్నాయి. ఒకింత నిర్లక్ష్యం, ఒకింత ‘మీరేమైనా చెయ్యగలరా’ అనే మిణుకుమనే ఆశ వాళ్ల ముఖాల్లో. ఆ ఇంట్లోనే ఒకతను కొంచెం ఎక్కువ సమాచారం ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలుగుదేశం తమ పోరాటానికి మద్ధతునిచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు వ్యతిరేకంగా, అణురియాక్టర్లను ఇంకా త్వరగా కట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడి వచ్చేశాం. ఇంతవరకు ఒక యువకుడు, ఆ పెద్దాయన తప్ప అందరూ పోరాడుతామనే చెప్తున్నారు.

కొంతమంది విలేఖర్లు ఉదయకుమార్ ను వీడియో స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ నన్ను వీడియోలో వచ్చేట్లో ఉదయకుమార్ పక్కన నిలబడమని చెప్పారు. మధ్యలో నేనేందుకు అనుకుని ‘పర్వాలేదులెండి’ అంటూ దూరంగానే నిలబడ్డాను.

“డోంట్ బి అఫ్రైడ్ మమదా!” అని అన్నాడు ఉదయకుమార్. ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చింది. “హౌ క్యూట్!” మనసులోనే అనుకున్నా.

అవునూ ఇంతకీ భయపడొద్దు అంటున్నారెందుకు? ఇక్కడ భయపడాల్సింది ఏముంది? న్యూస్ వీడియోలోకి రావాలంటే భయపడేదానిలా కనిపిస్తున్నానా?

వీళ్ల స్టేట్మేంట్లు తీసుకోవడం, వీళ్లు వస్తారని సర్పంచ్ ఊర్లో లేకపోవడం, ముగ్గురు నలుగురు విలేఖరులు వీళ్ల మాటలను శ్రద్ధగా నోట్ చేసుకోవడం చూస్తుంటే ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంతకీ భయపడొద్దని ఎందుకు అన్నాడు?

ఎప్పుడు వచ్చాడో అమర్తరాజన్ మా గుంపులో చేరాడు. ఇక అందరం బయల్దేరాం. చిన్న ఊర్లు దాటుకుని ఘాట్ రోడ్డు ఎక్కాం. అందరం అక్కడ టీ తాగి, శ్రీకాకుళం మిత్రుల దగ్గర సెలవు తీసుకుని విశాఖ బయల్దేరాం.

సముద్రం పక్కగా భీమునిపట్నం వైపు కారు పోనిచ్చాడు భాస్కర్.

వెనక కూర్చుని ముగ్గురూ మళ్లీ తమిళంలో మాటలు మొదలు పెట్టారు. పెద్దగా నవ్వులు కూడా.

భాస్కర్ తో ఊరికే మాటలు పెట్టుకోవాలనిపించలేదు. ఏదో ఒకలా వాళ్లనే మాట్లాడించాలనిపించింది.

కాసేపు లాటిన్ అమెరికన్ పోయెట్రీ గురించి, బొలీవియా గురించి మాట్లాడుకున్నాం. కొవ్వాడకు రావడం ఇది మూడోసారి అని చెప్పాడు అమర్తరాజ్. హ్మ్! ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారాండీ?

మధ్యలో కూర్చున్న ఉదయకుమార్ ను అడిగాను, “మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పోయిన ఏడాది డిసెంబర్లో హంపిలో జరిగిన రెవొల్యూషనరీ కల్చరల్ ఫారమ్ కి వచ్చారా? ప్రొఫెసర్ భగవన్ వచ్చారక్కడికి. మనసయ్య గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ల పక్కన చూసినట్లు అనిపిస్తోంది.”

“కల్చరల్ ఫారమ్ దగ్గర ఉదయకుమారనా?” అని పెద్దగా నవ్వాడు అమర్తరాజ్. ఇతనికి నవ్వడం, నవ్వించడం, ఫోటోలు తియ్యడం మాత్రమే వచ్చినట్లుంది. ఇంతవరకు ఫోన్తోనే ఫోటోలు తియ్యడం చూశాను. ఆ పెద్ద కెమెరా బ్యాగ్ ఎందుకు మోస్తున్నట్లో.

“ప్రొఫెసర్ భగవన్ తో ఒకసారి స్టేజి షేర్ చేసుకున్నా కానీ హంపిలో కాదు.” వివరించాడు ఉదయకుమార్.

“హ్మ్. మరి ఎక్కడ చూసానో?”

“ఈయన చాలా ఫేమస్. ఈయన మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా?” అమర్తరాజ్ నవ్వుతూ అడిగాడు.

కేసులా? ఇంత ఫ్రీగా, హాయిగా తిరుగుతున్నారు ఈయన మీద కేసులా? టీజ్ చేస్తున్నాడు ఈ అమర్తరాజ్.

“30?” తోచిన నంబరు చెప్పాను.

“హా…” పెదవి విరిచాడు అమర్తరాజ్. ఉదయకుమార్ ఒకటే నవ్వు. (మల్లెపువ్వు నవ్వు. నిజ్జం. మల్లెపువ్వులే! అట్లాంటి నవ్వును ఇంతవరకు ఎవరి ముఖంలోనూ చూడలేదు… నా చిట్టితల్లి ముఖంలో తప్ప.)

మరీ పెద్ద నంబరు చెప్పానేమో? “3?”

“380!” అమర్తరాజ్ సీరియస్ గానే అన్నా అతని ముఖంలో దాగని నవ్వు. ఉదయకుమార్ మళ్లీ గట్టిగా నవ్వాడు.

“వాటిలో 20, సెడిషన్ కేసులు” అమర్తరాజ్ మళ్లీ అన్నాడు, “మాకేమో ఈయన అపర గాంధీ. పోలీసులేమో ఈయన వెనకాలే ఉంటారు.”

“ఈరోజు పోలీసులేం రాలేదు కదా?” వీళ్లు జోకులేస్తున్నారో సీరియస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు.

“ఒకతను స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చానన్నాడు కదా?” ఆశ్చర్యంగా అన్నాడు అమర్తరాజ్, “అంటే పోలీసు డిపార్ట్మెంట్ అని తెలీదా?”

“ఓహ్. లేదు. భయపడొద్దని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది. నేను డేంజరస్ మనుషుల్తో ఉన్నానన్నమాట.” నవ్వుతూ అన్నాను.

“ఓహ్ మేం చాలా డేంజరస్” ముగ్గురూ నవ్వారు.

మాటల మధ్యలో అమర్తరాజన్,”మేం మాట్లాడే ఇంగ్లీష్ తెలుగులోకి ఇంటర్ ప్రిట్ చెయ్యడానికి మిమ్మల్ని కృష్ణ అరేంజ్ చేశాడనకున్నాం” అని అన్నాడు.

ఒహ్హో, నేను కూడా వీళ్లకు సర్ప్రైజే అన్నమాట. ఉత్సాహంగా చెప్పాను,“లేదు, లేదు. విశాఖకు వేరే పని మీద వచ్చాను. కృష్ణ, న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్పి, సుందర రాజన్ కొవ్వాడ వెళ్తున్నారని చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కొంచెం తెలుసుకుందామని మీతో వచ్చాను.”

“గుడ్” అంటూ చిర్నవ్వుతో తలపంకించాడు అమర్తరాజన్.

భీముని పట్టణం బీచి దగ్గర కాసేపు ఆగాం. మిరపకాయ బజ్జీలు అందరి కోసం కొన్నాడు సుందర రాజన్.

ఒక ఊర కుక్క అక్కడే తచ్చాడుతోంది. అందరూ దాన్ని అదిలిస్తూ ఉన్నారు. ఉదయకుమార్ తన వంతు బజ్జీలో కొంత పిండి భాగం మాత్రం చిన్ని చిన్ని ముక్కలు చేసి చిన్న పేపర్లో పెట్టి దాని ముందు పెట్టాడు, “సాపడీ, సాపడీ” అంటూ. ఏమనుకుందో, ఎంత ఆకలి మీద ఉందో ఒక్క క్షణంలో తినేసిందది.

అక్కడ్నుంచి రామకృష్ణ బీచికి బయల్దేరాం. రామకృష్ణ బీచి చూడాలన్నది హెచ్చార్కె(నాన్న) జ్ఞాపకాల్లోంచి జాలువారిన నా చిన్నినాటి కల. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. గుండె నిండా ఏదో వెళితి. హెచ్చార్కె చెప్పినట్లు లేదన్నది ఒకటైతే, గడిచిన ఆ మూడు గంటలు నన్ను నిలవనీయడం లేదు. నాకు నేను అందని దూరాలకు ఎక్కడికో కొట్టుకుపోయానని ఏదో కంగారు. ఇంటికి వెళ్దామని చెప్పాను. వాళ్లేం అనలేదు. వెంటనే బయల్దేరారు.

అప్పటికే కృష్ణ మాకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చున్న తరువాత వేరే చోటికి వెళ్లడానికి వాళ్లదగ్గర సెలవు తీసుకున్నాను.

ఉదయకుమార్ అమెరికాలో చదువుకున్నారని, ప్రొఫెసర్ గా కూడా పని చేశారని మాటల మధ్య చెప్పడం గుర్తొచ్చింది.

“ఎప్పుడైనా న్యూ జెర్సీ వస్తే మా ఇంటికి రండి.” అని అన్నాను.

“ప్రభుత్వం తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చినప్పుడు వస్తాడు.” అమర్త రాజన్ అన్నాడు.

“పీ ఎమ్ అయిపోండి, పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు? వీసా ఇచ్చేస్తారు” అన్నాను. నవ్వులతోనే వీడ్కోల్లు చెప్పుకున్నాం.

వీడ్కోలైతే తీసుకున్నాను కానీ, మల్లెపువ్వుల వాన కురుస్తూనే ఉంది – వాళ్లెవరో సరిగ్గా తెలీకపోయిన ఆరోజు నించి, ఎంతో తెలుసుకున్న ఈరోజూ, ఇక ఎప్పటికీ.

mamata2

ఇంతకీ వాళ్లెవరు?

అమర్తరాజ్ స్టీఫెన్ – ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

సుందర రాజన్ – ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ సంస్థ నుంచి. జపాన్ ఫుకొషిమా కి వెళ్లివచ్చినవారిలో ఇతనూ ఉన్నాడు. కూడంకుళంలో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. న్యూక్లియర్ పవర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తల్లో మొదటిశ్రేణిలో ఉంటాడు.

ఎస్ పి ఉదయకుమార్ – 1980 ల్లోనే Group for Peaceful Indian Ocean అనే సంస్థను ప్రారంభించాడు. అమెరికాలో పొలిటికల్ సైన్స్ లో పి. హెచ్ డి చేసి, మాన్ మత్ యూనివర్సిటీలో(Monmouth university) ప్రొఫెసరుగా పని చేసి, 2001 లో భారత దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. South Asian Community Center for Education and Research (SACCER) అనే విద్యాసంస్థను, భార్య మీరాతో కలిసి  స్థాపించాడు. People’s Movement Against Nuclear Energy (PMNAE) అనే సంస్థకు కన్వీనర్. ఈ సంస్థ తరపున, కూడంకుళం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. కూడంకుళం పోరాటం గురించి తమిళనాడు బయట ప్రపంచానికి తెలియజేయడమనే ముఖ్య ఉద్దేశంతో, 2014 లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేశాడు. చివరికి ఆ పార్టీ కూడంకుళం పోరాటాన్ని పట్టించుకోకుండా మధ్యతరగతి ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి “పచ్చై తమిళగం” (పచ్చని తమిళనాడు) అనే పార్టీని స్థాపించాడు.  ఏ ఎన్నికలలోనూ గెలవకపోతేనేం – అసలుసిసలు ప్రజల మనిషి. కూడంకుళం పోరాటాన్ని నీరుగార్చేందుకు ఉదయకుమార్ ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ఎన్నో కేసులు బనాయించింది. విదేశీ నిధులు ఉన్నాయనే నెపం మీద ఆయన ఇంటిమీద, విద్యాసంస్థ మీద రైడ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆయన తన ఆస్థుల వివరాలన్నీ బయటపెట్టి, శాంతియుతంగా చేసే పోరాటాలకు, హంగర్ స్ట్రైకులు చెయ్యడానికి నిధులు అవసరం లేదని చెప్పాడు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం ఆలస్యంగా మొదలయ్యింది. పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతున్నా, ఆ అనుభవాన్ని కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి వినియోగించాలని కొవ్వాడకు వచ్చారు అలుపెరుగని యోధులు – మల్లెపువ్వుల నవ్వులు తోడుగా.

*

వీళ్లను కలిసేదాక కూడంకుళంలో జరిగిన పోరాటం గురించి ఏమాత్రం ఎరుక లేదు. మహా అయితే కొన్నాళ్ల తరువాత కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆడంబరంగా విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఏ ఫేస్ బుక్కు ద్వారానో తెలిసేదేమో.

దళిత్ అంటే ఎవరని అమాయకంగా అడిగిన నా స్నేహితురాలికి నాకూ తేడా ఏమీ లేదు. ఇంటి దగ్గరి పోరాటాల గురించి మాకేం తెలీదు. మేం ఇంటినుంచి చాలా దూరం వెళ్లిపోయాం.

నాకు ఇంటికి వెళ్లాలనుంది…

(ఫోటోలు: అమర్తరాజ్ స్టీఫెన్)

*

అన్నం పెడితే చాలు… ఎంతసేపైనా!

 

 

 

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

*

 

వలసరవాక్కం మెయిన్ రోడ్డు నుంచి శ్రీదేవి కుప్పానికి దారి వుంది. ఆ శ్రీదేవి కుప్పం చాలా ఫేమస్. ఒకటి సినీ జనాల వల్ల, రెండు వేంకటేశ్వర స్వామి ఆలయం వల్ల. ప్రసిద్ధ గాయకుడు మనో ( మన నాగూరు బాబే) , విలక్షణ రచయిత బహుభాషా కోవిదుడు సాహితి, ఏ తెలుగు ఫన్షన్ జరిగినా నోరారా అందరినీ పలుకరిస్తూ తలలో నాలుకగా మెలిగే డా! శివకుమారీ, అంతే కాదు .. ఆ శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డుని ఆనుకొని వున్న కనకతారానగర్ లో ఒకప్పుడుండే వేలుగారు, ముత్యాల సుబ్బయ్యగారు ( మా మంచి మనిషి.. దర్శకులు) , శ్రీలక్ష్మి, పి.జె. శర్మగారు, ఆంజనేయులుగారు, భీమనేని శ్రీనివాసరావుగారు, ఇప్పుడు వుంటున్న నిర్మాతలు శివరాజుగారు, వెంకటరాజుగారు, వందేమాతరం శ్రీనివాస్ గారు ( ఇప్పటికీ ఇల్లు అలానే వుంది.. ఆయనదే) వీరందరితోనూ కళకళాడుతూ వుండేది. ఇక హాస్య నటులు కారెక్టర్ ఆర్టిస్టులూ, మ్యుజీషియన్లు లెక్కకి మించి వుండేవారు.

గతాన్నంతా స్మరించుకుంటూ అటువైపే వాకింగ్ కి వెళ్ళాను. ఇప్పటికీ  ప్రొడక్షన్ మేనేజర్   సర్వేపల్లి బ్రహ్మయ్య , ప్రొడక్షన్ మేనేజర్ రాజు అక్కడే వున్నారు.

ఆ మెయిన్ రోడ్డు మీదే ‘సినిమా నాగే౦ద్రుడి “గుడి వుంది. అదీ కె.ఆర్.విజయ గార్డెన్స్ కి ఎదురుగా.  సినిమా నాగేంద్రుడని ఎందుకన్నారంటే పుట్ట బ్రహాండంగా ఆరేడు అడుగులకి పైగా వుంటుంది. లోపల నాగుపామే వుండదు. ( అని అందరికీ తెలుసు). గుడి మాత్రం కట్టుదిట్టంగా వుండి చాలా డీప్ ఎఫెక్ట్ ని కలిగిస్తుంది. ఇంతా చూస్తే ఆ ‘ప్రాపర్టీ “ప్రైవేట్ వారిది. షూటింగు చెయ్యాలంటే వాళ్లకి డబ్బులు చెల్లించాల్సిందే.

సరిగ్గా ఆ గుడి దాటాక వచ్చే రోడ్డే కనకతారానగర్ కి వెళ్ళే రోడ్డు. అక్కడే కలిశాడు నటరాజన్.

తెలుగులో ‘శీనులు “’రాజులు “ఎట్టాగో తమిళ్ లో “నటరాజన్ “లు ‘వాసు”లు అట్లాగ. నటరాజన్ కూడా ఒకప్పుడు పెద్దపెద్ద తమిళ్ సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చెయ్యడమే కాకుండా , తమిళ్ టూ తెలుగు డబ్బింగ్ రైట్స్ బ్రోకర్ గా పని చేసి చాలా సంపాదించాడు. ఎంతా అంటే శ్రీదేవి కుప్పంలోనూ , చుట్టుపక్కల ఏరియాల్లోనూ మూడు షూటింగ్ లకి పనికొచ్చే బంగళాలు, తోటలు కట్టేంత.

“ఏమీ సార్ మీ వీధి వదిలి మా ఏరియాకి వచ్చుండారు? లాంగ్ వాకా? ఏమైనా రొంబ హాపీ!”ఆగి మర్యాదగా పలుకరించాడు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వుండటం తమిళ్ వాడి లక్షణం. ఎ.వి.యం శరవణన్ గారి లాంటి గ్రేట్  ప్రొడ్యూసర్లు కూడా ఎవరు ఆఫీసులోకి అడుగు పెట్టినా లేచి, చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానిస్తారు.  మన వాళ్ళ సంగతి అడక్కండి. అలా అని మనవాళ్ళని తక్కువ చేయడం లేదు. హీరో నుంచి బాయ్ దాకా అద్భుతమైన భోజనాలు పెట్టడం ఒక్క తెలుగు నిర్మాతకే సాధ్యం. తమిళ్ వాళ్ళు సాంబారు సాదం పొట్లం , తైరు సాదం పొట్లంతో సరిపెడితే , మనవాళ్ళు మాత్రం విందు భోజనాలే పెడతారు.

సరే…..’’హాపీ…నటరాజన్ సారు.. ఏమిటి విశేషాలు? “గుడి పక్కనే ఆగి అన్నాను. “ఏమైనా మీ లకలక సాంగ్  మాత్రం అదిరిపోయింది… అన్నట్టు ఫ్రీ గా వుంటే ఒక చోటకి పోద్దాం”అన్నాడు.

నేను దాదాపు 200 సినిమాల్లో ( డబ్బింగ్) పాటలు వ్రాయడం వల్ల తమిళ్ ఫీల్డ్ లో వారు చాలామంది తెలుసు. మ్యూజిక్ సిట్టింగ్స్ గట్రా  ఏర్పాటు చేసేది ప్రొడక్షన్ మేనేజర్లేగా, అందుకే నటరాజన్ బాగా తెలుసు.

“ఎక్కడకీ? “అన్నాను. టైం చూసుకొని ఏడున్నర అయ్యింది. నేను బ్రేక్ ఫాస్ట్ చేసేది పదింటికి గనక తొమ్మిదింటికి ఇల్లు చేరితే చాలు. స్నానం, పూజా పూర్తవ్వడానికి.

“దగ్గరలోనే… పది నిమిషాల నడక “బుగ్గ గోక్కుంటూ అన్నాడు.

“సరే పదండి..”అన్నాను నడుస్తూ..

“న్యాయంగా మిమల్ని తీసుకెళ్ళకూడదు , మీ ‘కవింజర్లు (కవులు ) రొంబ సెన్సిటివ్. కానీ, ఆమె మీకు నిండా తెలిసిన మనిషి “మనో ఇంటి వైపు వున్న రోడ్డులో ఎంటర్ అయ్యి అన్నాడు.

“ఎవరూ? “అని అడిగాను

“కోడంబాకంలో మీ తెలుగు ప్రొడ్యూసర్ వుంచుకున్నాడే , కుముదం .. ఆమె దగ్గరకి “చిన్నగా నవ్వి అన్నాడు.

ఇండస్ట్రీ హైద్రాబాద్ కి మారాక కోడంబాకంలో తెలుగు సినిమా వాళ్ళు ఎవరు మిగిలారూ? శ్రీ చంద్రమోహన్ గారు, జలంధర్ గారూ, మరి కొంతమంది, విశ్వనాథ్ గారు కూడా హైద్రాబాద్ కి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు.

“గుర్తురావడం లేదు “అన్నాను.

“ఆయన రెండు తమిళ్  సినిమాలు కూడా తీసి వుండాడు. బాగా వున్నోడు “అన్నాడు. అయినా పేరు గుర్తురావడం లేదు. అసలు కోడంబాకం సినిమా పని మీద వెళ్ళే దశాబ్దం దాటింది.

“సరే ఆ యమ్మని చూస్తే గుర్తుపడతారేమో చూద్దం “అన్నాడు.

సినిమా జనాలకి ఓ తెగులుంది. ఉన్నదిఉన్నట్టు చెప్పరు. బోలెడంత సస్పెన్సు మెయిన్ టైన్ చేస్తారు.  నటరాజన్ ఆ సిస్టంకి విరుద్ధమేమీ కాదు.  ప్రొడ్యూసర్ పేరు తెలిసినా ప్రస్తుతానికి చెప్పడని నాకు అర్ధమయ్యింది.

“ఇంతకీ ఆవిడని నేనెందుకు చూడాలి? “ఆగి అన్నాను.

“మీరు మంచివాండు గనక. కళ్ళలో నీళ్ళు తిరిగితే జేబులో నోటు తీసిస్తురు గనకా. అన్నిటికీ మించి ‘కుముదం “అని తమిళ్ నాట పెరిగినా ఆయమ్మ తెలుగే గనక “అన్నాడు

తమిళ్ వాళ్లని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు చేసే సహాయం చేసి వూరుకోరు. వీలున్నంతగా ఎదుటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అయితే ఎదటి వాళ్ళు చేసి౦దంతా కూడా ‘తామే “చేశామని అనుకోవడమే కాదు , పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటారు. ఇవ్వాళ నేనేదో తమిళ్ సోదర్లని ‘ఏకి “పెడుతున్నానని అనుకోకండి స్నేహితులారా! ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ వందనాలు. కొందరున్నారు , వాళ్ళని గౌరవించడం ఏ తెలుగువాడి వల్లా కాదు. తమిళ్ భాషకి ప్రాచీన హోదా దక్కిందని ఏ తెలుగు వాడు బాధపడలేదు. నిజం చెబితే సంతోషించాము కూడా.

అదే హోదాని కేంద్రప్రభుత్వం తెలుగు భాషకిచ్చినప్పుడు ‘ఎందుకివ్వాలి? ఏ బేసిస్ మీద ఇచ్చారు? “అంటూ కోర్టుకెళ్ళారు. తెలుగుభాషకి ప్రాచీన హోదా దక్కితే వాడికి పోయిందేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అది రావణ కాష్టంలా రగిలీరగిలీ ఇవ్వాళ మళ్ళీ తెలుగు వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందనుకోండి.

సరే నడిచీ నడిచీ 20 నిమిషాలు నడిచాక ఓ చిన్న సందు వచ్చింది. లోపలికెళ్ళాం. సందు చివర్న కొబ్బరాకుల్తో కుట్టిన చిన్న చిన్న పాకలు, గుడెసెలు. ఓ పాక ముందు ఆగాడు, నేనూ ఆగాను. ‘పొన్నాంబళం “అంటూ అరిచాడు నటరాజన్. నాకూ మీకూ తెలిసిన ‘పొన్నాంబళం “భారీ వ్యక్తి, విలన్. (ముత్తు సినిమాలో చూడండి). అతనిక్కడ వుండటం ఇంపాజిబుల్.

సన్నగా, రివట్లా వుండే ‘పొన్నాంబళం “బయటకు వచ్చాడు. “వాంగ…వాంగ “అతి వినయంతో లోపలకి ఆహ్వానించాడు. నటరాజన్ కదలకుండా , “అందమ్మా ఏమిసేస్తా వుండాది “అని చెన్నై తెలుగులో అడిగాడు.

“పడుకోని వుండాది”గుసగుసగా అన్నాడు. “సరే “వెనక్కి తిరిగాడు నటరాజన్.

“చూడాలన్నారుగా”అడిగాను నేను. ఇంతదూరం నడిపించి ఇప్పుడు వెనక్కి తిరిగితే అసలు తీసుకురావడం ఎందుకట?

“లేపితే బేజారు”అన్నాడు పొన్నాంబళం. అతనా మాట పూర్తి చేసేలోగానే ఓ నడివయసావిడ “హా.. ళ్ “అనే ఒక వికృతమైన అరుపుతో పాకలోనుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. పొన్నాంబళం ఠక్కున ఆమెని పట్టుకున్నాడు.

“వాంగ సారు… వాంగ… అన్నం పెడితే చాలు ఎంతసేపైనా.. ఎలాగైనా… రా.. ఇదిగో రా.. “అంటూ జాకెట్టు చింపుకొని రొమ్ము చూపిస్తూ అరచింది. ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి వున్నా, చీర చిరుగులు పట్టి వున్నా, వదనం  మాత్రం మారలేదు. ఆమె.. అవును.. ఆమెని ప్రొడ్యూసర్ (so and so) ఇంట్లోనే చూశా.

“వాంగ సారు.. వా.. అన్నం పెడితే చాలు ఎంతసేపైనా .. వూ? రావూ? రారా నా కొడకా “అంటూ నటరాజన్ మీదకి వురికింది. ఒక్క గంతులో తప్పుకున్నాడు. యీలోగా పొన్నాంబళం లాగి ఆమె చెంప మీద కొట్టి, గట్టిగా పట్టుకొని పాకలోకి తీసుకెళ్ళి పాక తలుపుకి తాళం వేశాడు. లోపల నుంచి అదే అరుపు “అన్నం పెడితే చాలు రా “అంటూ

“మీరుండండి.. నేనొచ్చేదాక.. డాక్టర్ని తీసుకొస్తా “అని గబగబా అన్నాడు పొన్నాంబలం.

“ఏమయ్యిందండి? “బాధగా అడిగాను.

ఆ ప్రొడ్యూసర్ ది రాయలసీమ. భార్యబిడ్డలు అనంతపురంలోనో ధర్మవరంలోనో మరో ఊళ్లోనో వుంటారని జనాలు చెప్పుకునేవాళ్ళు. మనిషి మాత్రం ‘జమ్ .”చెప్పిన అమౌంట్ ని ఠంచన్ గా ఇచ్చేవాడు. ఆయన తీసిన ఓ డబ్బింగ్ సినిమాకి నేను రెండు పాటలు వ్రాశాను. అప్పుడు చూశాను యీవిడని. ఖరీదైన పట్టుచీరా, ఒంటి నిండా నగలూ, ఓ..హ్… మహా రాజసంగా ఆజ్ఞ ఇవ్వడం.   మహా గయ్యాళి అనేవాళ్ళు డ్రైవర్లు, నౌకర్లు.

అందంతా నీకెలా తెలుసంటే , వాళ్ళింట్లో పని చేసే ‘తిలగమే “తరవాత మా ఇంట్లోకి పనిమనిషిగా చేరింది.

“ఏవన్నా చెప్పండి అప్పా, ఆయమ్మకి నిండా తిమురు”అనేది… యీవిడ ప్రసక్తి వచ్చినప్పుడల్లా. అయితే మాకు తెలిసిన యీవిడ పేరు మహేశ్వరి.  పాండీబజార్లో నేను       ‘మలర్ కోడి మేన్షన్”లో వుండేటప్పుడు యీవిడ బ్రిలియంట్ టుటోరియల్స్ కి అవతల  వున్న వీధిలో వుండేది. మహాచలాకీ మనిషి. క్షణంలో మాటలు కలిపేది. “సినిమాని నమ్ముకొని వచ్చానండి, చిన్న వేషం ఇప్పించినా మీకు కృతజ్ఞురాలిగా వుంటా !”అని అనేది. నేనూ కొత్తే. ఆ మాట అడిగితే చెప్పాను “అమ్మా.. నేనూ కొత్తవాడ్నే “అని “మగాళ్ళకేం సార్ క్షణాలలో ఎదిగిపోతారు “అన్నది. ఆ మాట నాకూ ఇప్పటికీ గుర్తే.

సడన్ గా ఆవిడని ‘ఇలా “చూడటం నాకు డైజెస్ట్ కాలేదు. “నటరాజ్ గారు.. అసలు జరిగింది ఏమిటి? “అడిగాను. లోపలి నుంచి అవే అరుపులు వినిపిస్తుంటే మనసుకి దుర్భరం అనిపించింది.

“ఈ ‘కుముదం “తెలుగు పిల్ల. ఎట్టా చేరిందో మద్రాసుకి చేరింది. సెంట్రల్ బాచ్ వాళ్ళ గురించి విన్నారుగా ! పాపం వాళ్ళ చేతులో పడింది. “ఓ క్షణం ఆగాడు నటరాజన్.

సెంట్రల్ బాచ్ అంటే సినిమా మోజులో అనేక రాష్ట్రాల నుంచీ , పల్లెటూర్ల నుంచీ మద్రాసు కొచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి , వాళ్ళకి బోలెడు ఆశలు కల్పించి ‘వృత్తి “లోకి దించుతారు. లొంగని వాళ్ళని ఏ బాంబే కో, కలకత్తాకో, ఎగుమతి చేస్తారు. అదో పెద్ద సాలెగూడులాంటిది.

“మరి “షాక్ తో అన్నాను…

“యీ పొన్నాంబళం గాడు కూడా ఆ బాచ్ వాడే. అయితే సినిమా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పని చేస్తూ వుండేవాడు. ఆ పిల్లని చూడగానే వీడికి బ్రహ్మాడంగా  ప్రేమ పుట్టుకొచ్చి, విడిగా తన దగ్గర పెట్టుకున్నాడు. సినిమా ఛాన్సులు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సినిమాలలో ‘గుంపులో గోవిందం”లా కూడా కనిపించింది. ఆ తరవాత యీ పిల్ల ‘లక్ “ తిరిగింది. అలాంటి ఓ గుంపులో యీమెని చూసి మా బండరాక్షసుడిలాంటి కమేడియన్ … అదేనండీ… తెలీదా… నల్లగా.. లావుగా.. ఆ.. ఆయనే యీవిడకో చిన్న యిల్లు ఏర్పాటు చేశాడు. ఆ కమేడియన్ భార్య ఓ కొరకంచు. ఎట్టా తెలుసుకుందో ఏమో ఆర్నెల్లు

గడవకుండానే ఓ పొలిటికల్ గ్యాంగ్ కి చెప్పి యీవిడ్ని ఇల్లు ఖాళీ చేయించడమే కాక వార్నింగ్ కూడా ఇప్పించింది. ఆ గొడవతోనే సదరు కమేడియన్, భార్య విడిపోయేంతవరకు వస్తే ‘పెద్దాయన’  సంధి కుదిర్చి ఫామిలీ సేవ్ చేశాడు.“ఆగాడు నటరాజన్.

ఆ విషయం నాకూ గుర్తుంది. తమిళ్ నాడులో సినిమాకి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఏదో వుంది.   అంతేకాదూ, రాజకీయనాయకుల్లో 90 మంది తెలుగు జాతి ‘వేర్లు  “ వున్నవారైనా , తెలుగుని విమర్శించడం, విస్మరించడం నిజంగా మనకు విస్మయం కలిగిస్తుంది.

“తరవాత “అడిగాను

“నేను చెబుతాను సామీ “అన్నాడు డాక్టర్ని తీసుకొచ్చిన పొన్నాంబళం. ఆ డాక్టర్ గారు నాకూ తెలుసు. శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డు లో వుండే ఎం.బి.బి.ఎస్. డాక్టర్. హస్తవాసి చాలా మంచిది. కానీ ఆయన ఇలా హోం విజిట్ చేయరు. మరి ఇక్కడికెలా వచ్చారో? అదే ఆయనతో అంటే “యీ పేషంటు నాకు కొత్త కాదు సార్, ఈవిడ అక్కడికి వచ్చేకంటే, నేను ఇక్కడకి రావడమే ఉత్తమం. అదీగాక అప్పుడప్పుడైనా వృత్తికి సంబంధించిన తృప్తి వుండాలి కదా సార్! “అని చిన్నగా నవ్వారు.

డాక్టర్ వెళ్ళిపోయాక మాతో పాటు పొన్నాంబళం కూడా నడుస్తూ వచ్చాడు.. ఇంటి తాళం వేసి. “మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, కొన్ని గంటల పాటు పర్లేదు. “ముక్తసరిగా అని “కథ నేను చెబుతానన్నాను కద సార్, తమిళ్ కమేడియన్ భార్య ఈవిడ్ని వెళ్ళకొట్టాక యీమెకి మళ్ళీ నేనే దిక్కయ్యాను. మనిషి చాలా మంచిది. అయినా ‘పాదరసం “లాంటిది. రెండు నెలలలోనే దుఖం నుంచి పుంజుకుంది.

మళ్ళీ ఓ నాడు షూటింగ్ దగ్గరే మీ తెలుగు ప్రొడ్యుసర్ గారి కంట పడింది. ఆయన పోయేంతవరకు అధారిటీ ఈవిడదే. అంత బలంగా ఆయన్ని అల్లుకుపోయింది. నేనూ అక్కడే ఆయన దగ్గరే డ్రైవర్ గా చేరాను. ఎంతలా ఈవిడ వుండేదంటే , నా మొహమే తెలీనట్టు ప్రవర్తించేది. డ్రైవర్ గానే చూసేది. కానీ సార్, నాకెందుకో యీమంటే ప్రాణం. కారణం నేను నిజంగా ప్రేమించిన అమ్మాయిలా వుండటమే. “ఓ క్షణం ఆగి, “నవ్వకండి సార్.. ఆఫ్ట్రాల్ డ్రైవర్ గాడికి ప్రేమేమిటి అనుకోకండి. లోకంలో అందరికీ ఎవరో ఒకరి మీద ప్రేమ వుంటుంది. ఎవరో ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ వుంటుంది. నేనూ ఆర్టిస్టు కాదలచుకునే మద్రాసొచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువు ఆగిపోయింది. నేను ప్రేమించిన పిల్ల నాకు షాక్ ఇస్తే, ఆ షాకులో స్త్రీలనే అసహించుకుంటూ చేయరాని పనులు చేశా. సినిమాల్లో అవకాశాలు రాలేదనే ఫ్రస్ట్రేషన్ మరో వైపు పీడిస్తుంటే , దయా ధర్మం జాలీ కృపా లేని సెంట్రల్ బాచ్ లో చేరాను. మళ్ళీ యీ మనిషిని చూశాక ఎందుకో ‘మనిషి “ నయ్యా. మీ తెలుగు ప్రొడ్యూసర్ అర్ధాంతరంగా పోయాక, యీవిడ చేతులు మారింది , పొట్ట గడవడం కోసం చివరికి ‘ఫలాన “వాళ్ళ చేతుల్లో పడింది. మొదటి నుంచీ నేను ఆమెని ఎంత ప్రేమించినా , నా ప్రేమ విషయం ఎన్ని సార్లు చెప్పినా తను మాత్రం లెక్క చేసేది కాదు. సెంట్రల్ బాచ్ నుంచి తప్పించాను కానీ “ఫలాన “బాచ్ నుంచి మాత్రం తప్పించలేకపోయాను. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఫుల్ గా వుంటుంది. ఎంత క్రూరత్వానికైనా పాల్పడుతారు. నాకు తెలిసిన యీవిడ ఏ పనైనా ఇష్టపడితేనే చేస్తుంది గానీ, బలవంతపెడితే లొంగదు. మరి లొంగదీసుకోడానికి వాళ్ళు ఏమేం చేశారో మన వూహలకి అందదు. ఆరునెలల పాటు పిచ్చిగా వెతికినా ఆవిడ నా కంట పడలేదు. చివరికి ఓ నాడు అంటే మూడు నెలల క్రితం “ఇప్పటిలాగానే , “అన్నం పెడితే చాలు.. ఆ తరవాత నీ ఇష్టం “ అని అరుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దగ్గర కనిపించింది. బట్టలన్నీ చీలికపీలికగా వున్నాయి.

నా గుండె ఒక్కసారి ఘొల్లుమంది. నా కారు… అదే, నేను నడిపే టాక్సీ లో తీసుకొచ్చి యీ పాకలో పెట్టాను. అప్పుడే యీ నటరాజన్ గారు చూసి మంచి మనసుతో కొంత డబ్బిచ్చారు. ఆమెకి ట్రీట్ మెంట్ చేయించాలంటే ఎంతవుతుందో తెలీదు. అదీగాక  ఎలా బయటపడాలో కూడా తెలీదు. పాపం ఆ డాక్టర్ గారికే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఆయనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఇప్పుడు పరవాలేదు. పదిహేనురోజులకో ఇరవైరోజులకో యీ మాదిరిగా అరుస్తూ వుంటుంది. ఓ రెండుమూడు ఇంజక్షన్ల తరవాత మౌనంగా పడుకొని వుంటుంది.  ”సైలెంటయ్యాడు పొన్నాంబళం.

ఎందుకో అతని చెయ్యి అందుకోవాలని అందుకున్నాను. మనం మనిషిని చూడగానే ఏవేవో అంచనాలు వేస్తాం. కానీ మనిషిలోని ‘అసలు మనిషిని “అర్ధం చేసుకోవాలంటే యీ బతుకు చాలదు.

“కనీసం నిన్నైనా గుర్తుపడుతుందా? “అడిగాను.

మెల్లగా నవ్వాడు “పడుతోందని నాకు తెలుసు సార్… కానీ గుర్తుపట్టనట్టే వుంటుంది. ఏమో గుర్తు కూడా లేనేమో. కానీ, అందరిలో వైల్డ్ గా ప్రవర్తించే ఆమె, నాతో మాత్రం వైల్డ్ గా ప్రవర్తించదు. పైపెచ్చు తలవొంచుకుంటుంది. ఆ తల వొంచుకుని కూర్చున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది సార్! మీ తెలుగు ప్రొడ్యూసరింట్లో రాణివాసం నెరిపింది. కానీ ఇప్పుడు , ఇంత దయనీయంగా .. “సైలెంటు అయిపోయాడు.

“ఆమెని నువ్వు.. “ఆగాను. “ప్రేమిస్తానా లేదా అనా? లేక ఆమెని నేను వాడుకున్నా లేనా అనా? ప్రేమిస్తాననే చెబుతా. నిజం చెబితే నేను ప్రేమించేది యీమెని కాదు, యీమె పోలికలున్న నా ‘కుముదా “న్ని. యీమెకి ఆ పేరు పెట్టింది నేనే. ఈవిడ అసలు పేరు ఏమిటో కూడా నాకు గుర్తులేదు. ఇహ వాడుకోవడం గురించా? లేదు సార్. ఒకప్పుడు నేను పచ్చి రౌడీని, తిరుగుబోతుని. ఇప్పుడు ఆ ఆలోచన వస్తేనే పొడుచుకొని చచ్చిపోవాలనిపిస్తుంది.

ఎందుకంటే, ఆవిడ అరుపులు విన్నారు కదా సార్… “అన్నం పెడితే చాలు … రారా “అని. నాలాంటి పాషాణంగాడే యీవిడ్ని అంత నీచానికి దిగజార్చి వుండాలి. ఏముండాది సార్? ఎముకలు చర్మం.. అక్కడక్కడా కొండలూ లోయలూ.. ఏముండాది సార్ యీ శరీరంలో. నేనిప్పుడు దీని గురించే ఆలోచించట్లేదు సార్. ఈమె బాగుపడాల. అంతే నేను చేసిన పాపంలో కొంతైనా యీమె బాగుపడితే , కరిగిపోయిందనుకుంటాను.

ముగ్గురం మౌనంగా నడుస్తూ నడుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దాకా వచ్చాం. మౌనంగానే సెలవు తీసుకొని కనకతారా నగర్ వైపెళ్లాడు నటరాజన్. నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు పొన్నాంబళం. నేను నడుస్తూనే వున్నాను. ఆలోచిస్తూనే వున్నాను. సినిమా వ్యామోహంలో ఎందరు బంగారు తల్లులు ఇలా పరమనీచుల చేతుల్లో చిక్కారో! ఎందరి మానాలు టైర్ల కింద పువ్వుల్లా నలిగిపొయాయో! ఎందరు ఆకలి కోరలకి బలై ఇలా ఆక్రోశిస్తున్నారో!

మెరిసే తారల్నే కాదు… రాలిపోయిన, రాలిపోతున్న నక్షత్రాలని మాత్రం ఎవరు లెక్కించగలరూ?

PS  : నటరాజన్ చెప్పిన కథనే (కొంత) పొన్నాంబళం చెప్పినా, రిపీట్ చెయ్యడం ఎందుకని పొన్నాంబళంతో కథని కంటిన్యూ చేశా. కథనం సాఫీగా వుండటం కోసం. వాళ్ళు మాట్లాడింది మూడు వంతులు తమిళం ఒక వంతు చెన్నై తెలుగు , అయినా నేను వీలున్నంత వరకు తెలుగులోనే చెప్పాను.

*

రాత్రంతా నాతో గడిపి…!

 saif
1
నువ్వింకా ఎంతో ఎదగాలి అప్పుడే తొందరపడకు చెప్పాను
అయినా బేషరం చిన్న మొక్కే అద్భుతమయిన పూలనిచ్చింది 5 <3
2
ఇక నేను వెళ్ళాలి తెల్లారుతుంది అనేసివెళ్ళింది
బేషరం రాత్రంతా నాతో గడిపిన వెన్నెల 5 <3
3
నాకు ఎడమవైపు ఉన్నది నీకు కుడివైపు ఉంటది బేషరం
మనం ఎదురెదురు నిలబడినంతకాలం అంతే ఏదైనా   5 <3
4
నవ్వు చాలా అందంగా ఉంటది బేషరం
అది నల్లని పెదవులైన ఎర్రనిపెదవులైనా  5 <3
5
ప్రతి దేశం చాలా బాగుంటది బేషరం
మంచి మనసులున్న ప్రతి చోటు స్వర్గం లా ఉంటది 5 <3
6
విహారయాత్రలు చేసివస్తుంటది బేషరం
ఈ మనసు ఒక చోట నిలవదు ఎప్పుడూ 5 <3
7
పువ్వులు పాతవే అయినా ప్రేమిస్తుంటాం బేషరం
ప్రతి సారి కొత్త అనుభూతి ఇస్తుంటాయ్ నయా నయా గా 5 <3
8
మన సైజు దొరికెంతవరకు వెతుకుతాం బేషరం
ఒక్కోసారి చెప్పులని దుస్తులని ఒక్కోసారి సమయాన్ని 5 <3
9
స్వాతంత్ర దినోత్సవాలరొజు ప్రతి దేశం లో ఇలానే చేస్తారు
రంగు రంగుల బూరల్లో గాలిని బంధించి వదులుతారు బేషరం 5 <3
10
స్వచ్చమైన కాశ్మీరాన్ని శత్రువు ఆక్రమించినట్లు ,బేషరం
ఈ దేశ పవిత్రమైన మనసుల్ని రాజకీయాలు ఆక్రమిస్తున్నాయి 5 <3
*

ఆకాశానికి అంకెల నిచ్చెన!

ramanujan1

గణితమంటే అతనికి అంకెలతో ఉప్పొంగే అనంత ప్రవాహం . అందరూ చూడలేని  విచిత్రమైన రంగుల్ని నింపుకున్న వింత వర్ణచిత్రం, ఇసుక రేణువులన్ని రహస్యాల్ని గర్భాన దాచుకున్న సాగర తీరం. గణితం అతనికి జీవం, జీవన వేదం. గణితం అతని దైవం. అసలతనికి గణితమే జీవితం. ఇంతకీ అతని పేరు శ్రీనివాస రామానుజన్. అంకెల్తో ఎటువంటి ఆటైనా  అడగలిగేటంతటి మేధస్సును కలిగి ఉన్నప్పటికీ వాటిని దైవ సమానంగా పూజించగలిగేటంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన  గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్.

రాబర్ట్ కనిగల్ రచించిన రామానుజన్ జీవిత చరిత్ర  ఆధారంగా, అదే పేరుతో 2015లో నిర్మింపబడిన చలన చిత్రం The Man Who Knew Infinity.

భారతీయ గణిత శాస్త్రవేత్తగా, అత్యున్నతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తిగా శ్రీనివాస రామానుజన్ పేరు వినని వారెవరూ ఉండరు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1887 నవంబర్ 22న జన్మించిన రామానుజన్ ని ముఖ్యంగా గణిత శాస్త్రం రంగంలో అత్యంత మేధావిగా పేర్కొనవచ్చు. కానీ అతని జీవితం నల్లేరు మీద నడకేమీ కాదు.

ఈ సినిమా అతని చిన్నతనాన్నీ, చదువుకున్న రోజుల్నీ ప్రస్తావించకుండా యవ్వన దశలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న పరిస్థితులతో మొదలవుతుంది. మెల్లగా చిన్న ఉద్యోగం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి వెళ్లే అవకాశం అతనికి లభిస్తుంది. ఆ రోజుల్లో సముద్రయానం నిషిద్ధం కావడం వల్ల కొన్ని సందేహాలతో, మరి కొన్ని సంశయాలతోనే అతను కేంబ్రిడ్జికి వెళ్తాడు.

అతను ఇంగ్లాండ్ రావడానికి కారకుడైన సీనియర్ గణిత శాస్త్రవేత్త సి.హెచ్. హార్డీతో కలిసి ఐదు సంవత్సరాల పాటు తాను రాసిన గణిత సిద్ధాంతాలపై సాధన చేస్తాడు. పరస్పర వ్యతిరేక వైఖరులు కలిగిన ఆ ఇద్దరు మేధావుల మధ్య  ఏర్పడే ఘర్షణ, అనుబంధం, అక్కడ రామానుజన్ గడిపిన జీవితం ఈ చలనచిత్రంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఆ రోజులే రామానుజన్ కి అత్యంత ఆనందాన్నీ, కష్టాన్నీ కూడా కలిగించిన రోజులు.

ramanujan2

అంకెల్ని అక్షరాలుగా భావిస్తే, రామానుజన్ ని అతి విశిష్టమైన కవిగా పేర్కొనవచ్చు. కవికి హఠాత్తుగా కలిగే సృజనాత్మకమైన ఊహల్లా ఇతని ఆలోచనల్లోకి ఉన్నట్టుండి సరికొత్త సమీకరణాలు ప్రవేశించేవి. కవి వాస్తవాన్నీ, కల్పననీ పద చిత్రాలతో పెనవేసినట్టు, అసంకల్పితంగా ఇతను రాసిన సిద్ధాంతాలన్నీ నిదర్శనాలతో సహా నిజాలుగా నిరూపితమయ్యాయి. ఇసుక రేణువుల్లోనూ, నీటి ప్రతిబింబంలోనూ, కాంతి రంగుల్లోనూ ఇలా ప్రకృతికి చెందిన ప్రతీ చిత్రంలోనూ విచిత్రమైన అంకెల క్రమాన్నీ, అందాన్నీ చూడగలిగిన సౌందర్య పిపాసి రామానుజన్.

ఆటోడిడక్ట్ అయిన రామానుజన్ గణిత శాస్త్రంలో అప్పటివరకూ సాంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తున్న పద్ధతులేవీ తెలుసుకోకుండానే ఆ శాస్త్రానికి చెందిన ఎన్నో కొత్త విషయాల్ని వెలికి తీసి తనకో ప్రత్యేకమైన శైలినీ, మార్గాన్నీ ఏర్పరుచుకున్నాడు. తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ మేధావి, తన ప్రతిభను తమ ఆరాధ్య దేవత నామగిరి అమ్మవారి అనుగ్రహంగా అభివర్ణించాడు. ‘దేవుడి ఆలోచనను ప్రతిబింబించనప్పుడు ఏ సమీకరణమైనా తనకి  అర్థవంతం కాదన్న’ అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. మేథమెటికల్ ఎనాలసిస్, నెంబర్ థియరీ వంటి గణిత శాస్త్ర రంగాల అభివృద్ధిలో ఇతని పాత్ర అమూల్యమైనది. రామానుజన్ వ్యక్తిత్వంలోని ఈ విభిన్నమైన

కోణాలన్నిటినీ నటుడు దేవ్ పటేల్ అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. హార్డీగా నటించిన జెర్మీ ఐరన్స్  నటన కూడా చెప్పుకోదగ్గది.

అతని జీవితాల్లోని కొంత భాగానికే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చి, నటీనటుల నటనా చాతుర్యంపై ఎక్కువగా ఆధారపడిపోవటం వల్ల ఈ చలన చిత్రం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ రామానుజన్ వ్యక్తిత్వాన్నీ, మేధా శక్తినీ ప్రతిఫలించడంలో  మాత్రం సంపూర్ణంగానే  సఫలమైంది. పరిసరాలపై తక్కువా, వ్యక్తుల భావాలపై ఎక్కువా శ్రద్ధ పెట్టడం వలన కెమెరా కన్ను వంద శాంతం పనితీరును ప్రదర్శించలేకపోయినప్పటికీ అసంతృప్తిని మాత్రం మిగల్చలేదు. పూర్తి సాంప్రదాయ పద్ధతిలో చలన చిత్రాన్ని నడిపించినా  దర్శకుడు మాథ్యూ బ్రౌన్ కృషి, ప్రయత్నం అభినందనీయమైనవి.

‘మనుషులకంటే మీరు అంకెలనే అధికంగా ప్రేమిస్తారటగా’ అని అతని భార్య  జానకి దెప్పి పొడిచినప్పుడు అతను సంతోషంగా అంగీకరిస్తాడు గానీ భార్యనీ, బాధ్యతనీ కూడా అతను అమితంగానే ప్రేమిస్తాడు, ఇంగ్లాండ్ లో ఉన్న రోజుల్లో ఆమె కోసం తీవ్రంగా పరితపిస్తాడు. సనాతన వాది కావడం వలన అక్కడి ఆహారానికి అలవాటుపడలేక, పర దేశపు వాతావరణంలోని మార్పులకి సర్దుబాటు చేసుకోలేక అనారోగ్యం పాలవుతాడు. టీబీ వ్యాధి బారిన పడి శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నా తన పనికి మాత్రం ఆటంకం కలగనివ్వడు. ఒక భారతీయుడిగా వివక్షకి గురికావడం వలన కొంత  ఆలస్యమైనప్పటికీ చివరికి హార్డీ కృషి ఫలితంగా తన సిద్ధాంతాలని ప్రచురించుకుని, అరుదైన పురస్కారమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ ని పొందుతాడు. ఇక ఇంటికి వెళ్లాలన్న కోరికతో ఇండియాకి తిరిగొచ్చి దారిలో మళ్ళీ  తిరగబెట్టిన అనారోగ్యం కారణంగా, జన్మభూమిని చేరుకున్న సంవత్సరానికే 1920 లో తన 32 వ ఏట తుది శ్వాసని విడుస్తాడు ఈ అపర బ్రహ్మ.

మరణం కంటే బాధాకరమైన విషయం మరింకేముంటుంది. మరణమంటే నాశనం కావడమేగా. మరణించిన వారు, జీవించి ఉన్న కాలంలో చేసిన గొప్ప పనులు, లోకం వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా  చెయ్యవచ్చు . కానీ వారి అనుభూతులు, అనుభవాలు ముఖ్యంగా వారి  విజ్ఞానం వారితో పాటుగా అంతం కావాల్సిందేగా. అటువంటిది, ఒక మేధావి అంత చిన్న వయసులో మరణించడం జాతికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందన్న భావన మనల్ని దుఃఖానికి గురిచెయ్యకమానదు.

అయితేనేం? అతనికి అనంతమైన అంకెల గమనం తెలుసు. అత్యల్పమైన జీవితకాలంలోనే అంతులేనన్ని అద్భుతాలని సృష్టించడమూ తెలుసు. అందుకే అతను విశ్వమంత విశాలమైన ప్రపంచ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మిగిలిపోయాడు.

                              ***

 

విరామ దుఖం   

satya1

 

బ్రతుకు దుఃఖమేదైనా  మిగిలి  ఉంటే

వెచ్చటి నూలు స్వెట్టర్  లో చుట్టేసి

తీరపు అంచున  కూర్చొని

ఒక్కో దుఖాన్ని   జారవిడిచే నగ్న నేత్రం…..!

..

..

షరా నవ్వుల మర్మాన్నో….

కన్నీటి ద్వైభాషల అర్థాలనో  ఆరాలు తీసి  తీసి

అలసిన ఆకుపచ్చ  మైదానం

జీవిత నాటకపు  చివరి అంకాన్ని

ట్రాజెడీ గా మార్చాలో?   కామెడి గా మలచాలో ?

అర్థం కాక  అర్ధా౦త౦గా వదిలేసిన ముగింపు

..

..

దంకన్ స్టీల్ చెప్పినట్లో

నోస్టర్ డమాస్, అమియోబ్ ల యుగా౦తపు రహస్యద్వారాల

అన్వేషణలోక వైపు …

వేల  కోట్ల  పడగల సాగరాన  దాహార్తియై

చివరకు  ఎం  మిగిలిందన్న  నిర్వేదమోక వైపూ…

అనుభవిస్తూ ఆ నిస్తేజమైన కళ్ళతోనే

మహా స్మశానాన  గడుపుతున్న సుదీర్ఘ  రాత్రులు!!

..

..

 

బ్రతుకు కీళ్ళ సందుల్లోన

గతం ఆడిన కీలుబొమ్మల ఆట  జ్నాపకాలను

అక్కున చేర్చుకొనే తీరం

ఒడ్డున సేద తీరే ప్రతి పండుటాకు తో పంచుకొంటుంది…..!!!

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎరువు..

satya2

దించిన నడుం ఎత్తకుండానే
కమ్మిన మబ్బుకుండ ఒట్టిపోయి
నాటిన నారు నీరిగిరిన మడిలొ
విలవిలలాడుతుంటే
నెత్తురు చిమ్మిన కళ్లు!

వానా వానా వస్తావా
ఈ నేల దాహం తీర్చుతావా!

ఆశలన్ని మొగిలికి చేరి
ఆవిరింకిన కనులలోకి
కాసింత తడి చేరుతుందా!

వాడు నలుదిక్కులా వేసిన
కార్పెట్ బాంబింగ్ పొరల పొరలుగా
బద్ధలై పచ్చదనంతో పాటు పసిపాపలను
హరించి ఇప్పడీ హరిత వనం కోతలు కోస్తున్నాడు!

నేలతల్లి నవ్వలు విరబూసేలా
నువ్వూ నేను కలిసి
ఓ మొక్క నాటుదాం
ఎరువుగా వాడినే పాతుదాం!!

*

జ్ఞాపకాల నీడలలో…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

*

కూపస్థమండూకాన్ని మరపించే నిర్విరామ జాగృదావస్థ.

రెప్పలు విప్పుకున్న అతడి కళ్లలోకి వెలుగురేఖల్ని సూర్యుడు నిర్విరామంగా గుచ్చుతున్నాడు. సూది మొనల గాయాల్తో కనుగుడ్ల చుట్టూ, ఎరుపు రంగు చిక్కబడుతోంది. ఆ చిత్రహింసకి తెర లేపినవి, తెరిచున్న కిటికీ రెక్కలు.  ఆవిష్కృతమైన ఆ మనోజ్ఞ దృశ్యాన్ని అవి, అలవాటుగా తనివి తీరా చూస్తున్నాయి.

ఓ పక్కకి వొరిగి పడుకున్న అతడు, ఆ నొప్పి భరించలేక వెల్లకిలా తిరిగాడు.

కొలుకులమీద నులివెచ్చటి రక్తం తడి. జిగటగా అనిపించని కన్నీళ్లు, వేళ్ల చివళ్లతో తుడుచుకుని పైకి ఒకసారి చూశాడు. పంకా రెక్కల సవ్వడి. గాలి వీస్తున్నట్లుగా అనిపించటం లేదు. వినిపిస్తున్నట్లుగా ఉంది.  స్పష్టంగా కనిపిస్తున్న ఒక అస్పష్టత. అలవాటుగా మారిన మెలకువని రెచ్చగొడుతున్న అలసట.

ఆశల్ని ఊపిరిగా పీలుస్తున్న మెదడు. ఉన్నట్లుండి ఒక ఉక్కిరిబిక్కిరి. శ్వాస ఆడకుండా ఒక నిస్పృహ  అదుముతున్న అనుభూతి. స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించి సహాయం కోసం కేక వేశాడు. అరుపు గొంతులోనే  సజీవసమాధి అయింది. నిస్సహాయంగా కుడి ప్రక్కకి తిరిగి చూశాడు. ఒక అదృశ్యదృశ్యం గోచరించింది.

ఎదురుగా చెలి. ఆమె పెదాలపై విరిలా విప్పారిన విషహాసం. అతడి గుండెలమీద ఆమె కుడి చేయి.

అరచేతిలో కర్కశత్వం. అయిదు వేళ్లూ ముళ్లలా అతనికి గుచ్చుకున్నాయి. ఒకప్పుడు మైమరపు కలిగించిన స్పర్శ ఇప్పుడు వెరపు కలిగిస్తోంది. లోపం ఎక్కడుంది? ఆమె తనని ఉపయోగించుకుంటున్న విధంలోనా? తాను ఆమెని వినియోగించుకుంటున్న విధానంలోనా? బోధపడలేదతడికి.

ఈ మధ్యన జరిగిన సంఘటనలు కొన్ని ఒక్కసారిగా అతడికి గుర్తొచ్చాయి. అవి తలపుకి రావటం వెనక సైతం తనకెదురుగా ఉన్న చెలి హస్తముంది. ఆ విషయం అతడికి తెలుస్తోంది.

***

“ఇన్నాళ్లకి, నేను గుర్తొచ్చానా?” నిష్టూరంగా అడిగింది చెలి.

“నువ్వు నాతో లేకపోవటమే కదా నాకు గుర్తు రాకపోవటానికి కారణం!” అతడు జవాబిచ్చాడు.

“మాటలతో బాగా ఆడుకోగలవు. అవి నిజమని నమ్మించగలవు,” అంటూ ఆమె నవ్వింది. విడకుండానే విచ్చుకున్నట్లుగా అనిపించే పెదాలు. ఒక ముకుళితవికసనం.

“ఇక నుంచి నేను నీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇది మాత్రం నిజం. నువ్వు నా మిగిలిన మాటలు నమ్మకపోయినా ఫర్లేదు. ఈ ఒక్క మాట మాత్రం నమ్ము,”

“నీ నెచ్చెలి అంత త్వరగా నిన్ను వదిలిపెడుతుందా?” అనుమానం వ్యక్తపరిచింది చెలి.

“ఇన్నాళ్లూ నిన్ను వదిలి ఆమె దగ్గర పూర్తిగా ఉండలేదా? అది నువ్వు సహించలేదా? మౌనం వహించలేదా? ఇప్పుడు అదే పని  తానూ చేస్తుంది,”

“నీ ఇష్టం,”

“నీ దగ్గరకు నేను రావటం, ఎవరికయినా అభ్యంతరమా?”

“నా జీవితంలో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు దూరమయినప్పట్నుంచీ నేను ఒంటరినే!”

ఏదో ఒక రోజు అతడు తన దగ్గరకి వస్తాడని ఆమెకి తెలుసు. ఆమెకు కావాల్సిందీ అదే.

***

ఇప్పటివరకూ తనతో సఖ్యంగా సహజీవనం చేస్తున్న అతడు ఈ మధ్యన తరచుగా అన్యమనస్కంగా ఉండటం, నెచ్చెలి గమనించింది.

“ఈమధ్య మీకు నా ధ్యాస ఉండటం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. ఎదురుగా ఉన్నట్లే ఉంటున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లివస్తున్నారు.  ఏమైంది మీకు?” ఒక రోజు అతడ్ని నిలదీసి అడిగింది. నిశ్చలచలనం.

“అలాంటిదేం లేదు. నువ్వనవసరంగా అనుమానపడుతున్నావు,” అతడు తన మనసు కప్పి పుచ్చుకోవటానికి ఒక విఫల ప్రయత్నం చేశాడు.

ఆ జవాబు చెప్పేప్పుడు అతడి చూపు ఆమె కళ్లలోకి సూటిగా లేదు. అదొక్కటి చాలు, అతడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అన్నది ఆమె తెల్సుకోటానికి!

“ఆ మాత్రం గ్రహించలేననుకోకండి. మీరు వెళ్తున్నది ఒకప్పటి మీ చెలి దగ్గరకేగా?” ఎప్పుడూ సరళీస్వరాలు వినిపించే నెచ్చెలి గొంతు ఉన్నట్లుండి పరుషంగా ధ్వనించింది.

ఈ విషయం ఆమెకెలా తెలిసింది? అతడికి అర్థం కాలేదు.

“బంధాన్ని ఎంతవరకు పెంచుకోవచ్చో తెలీకుండానే, ఆమెతో బలమైన అనుబంధాన్ని మీరు మళ్లీ కోరుకుంటున్నారు. నేను వద్దంటానని, ఆ విషయం నా దగ్గర దాచారు. అవునా?” అడిగింది.

“నీతో పాటు ఆమె కూడా కావాలనిపిస్తోంది. అందుకే ఆమె దగ్గరకి మళ్లీ వెళ్తున్నాను,” అన్నాడు అతడు.

“ఒకప్పటి మీ స్నేహం నాకూ తెలుసు. నాకు దూరం కానంతగా ఆమె దగ్గరకూ అపుడపుడు వెళ్తుండండి. అంతవరకూ నాకు అభ్యంతరం లేదు. కాని, అది వ్యామోహం క్రింద మారకుండా చూసుకోండి,”

ఆమె గొంతులో ధ్వనించిన ధృడత్వానికి అతడు విస్తుపోయాడు.

***

చెలి సాంగత్యంలో ఇంతకు ముందెరగని ఒక ఆనందం. ఆమె సాన్నిధ్యంలో నెచ్చెలి హెచ్చరిక అతడికి గుర్తు రావటం లేదు. ఇంతకుముందుకన్నా అతడు ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాడు. వీలు దొరికినప్పుడల్లా చెలితోనే గడపటానికి తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ నెచ్చెలి దృష్టిని దాటిపోలేదు.

“నా మాటని మీరెందుకు లక్ష్యపెట్టటం లేదు?”  ఒక రోజు అతడి చెయ్యి పట్టుకుని కోపంగా అడిగింది.

“…”

“నన్నెందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు?”

“నీ కన్నా చెలితో గడపటమే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. అందుకని!” అసలు విషయం చెప్పాడు అతడు. చెప్పింతర్వాత ఎందుకు చెప్పానా? అని బాధపడ్డాడు. గతజల సేతుబంధనం.

ఆ మాటతో నెచ్చెలి ముఖకవళికలు మారిపోయాయి.  దీపకళికని అంధకారం అంతమొందించింది.

***

“ఎంత సేపు మీలో మీరు ఉంటారు. బయటికి రండి. అలా  కాసేపు తిరిగొద్దాం,” అడిగింది చెలి.  నిక్వణం పలికిస్తానని నమ్మించి, విపంచి తంత్రుల్ని తెంచే ప్రయత్నం.

మొదట్లో ఆమె తనని ఆహ్లాదం కలిగించే ప్రదేశాల దగ్గరకే ఎక్కువగా తీసుకెళ్లేది.  క్రమంగా అది తక్కువైంది. ఇప్పుడు ఆమె తనను తీసుకు వెళ్తున్నది రెండే చోట్లకి.

ఒకచోట, ఒకప్పుడు  తనకు తెలిసి ఏమీ లేదు. ఆ శూన్యాన్ని ఇప్పుడొక శ్మశానం కౌగలించుకుంది. దాంతో అదిపుడు  అంతరించిన అంతశ్చేతనకి ఆలవాలం. చెవుల్లో ఇంకా ధ్వనిస్తున్న చరమగీతం చరణాలు. ఇంకా పూర్తిగా ఆరని చితులు. ఆర్తితో సగంలో ఆగిపోయిన మంటలు. అర్ధభాగం కాలి నిరర్థకంగా మిగిలిన అనుభవాల శవాలు. ఘనీభవించిన విషాదం. దాన్ని అశ్రువులుగా స్రవింపచేయటానికి ఉండుండి ఎవరో గుండెలు బాదుకుంటున్న చప్పుడు. దిక్కులు పిక్కటిల్లేలా ఒక ఏడుపు. అపస్వరఅష్టమస్వరం.

రెండోచోట నిన్నో మొన్నో ఆమని నిష్క్రమించిన వని, పూవని. పచ్చదనం వలువలు పోగొట్టుకుని నగ్నంగా నిలబడ్డ వాంఛావృక్షాలు. తలలొంచిన స్వప్నలతలు. వాటి వైఫల్యం. సాఫల్యత సిద్ధించకుండానే రాలిపోయిన సుమదళాలు. అలరించకుండానే అవనిలో కలిసిపోయిన సురభిళపరిమళాలు. కనిపించే మూగవేదన. వినిపించని మౌనరోదన. జలవీచికల బదులు మరీచికలు.

విభిన్నరూపాల్లో బీభత్సం, భయానక వాతావరణం. జుగుప్స, భయం; ఒక్కోదానికి ఒక్కో స్థాయీభావం.   ఇవేవీ తాను మళ్లీ మళ్లీ చూడాలనుకునేవి కావు.

సింహావలోకనం చేసుకుంటే, అంతా ఒక హింసావలోకనం. నెచ్చెలి తోడులో ఎంత వేదనయినా ఎక్కువగా వేధించేది కాదు. చెలి సాన్నిహిత్యం అలా అనిపించటం లేదు. ఒకప్పుడు అద్దంలో చూసిన అగ్నిపర్వతం ఇప్పుడు భూతద్దంలో దర్శనమిస్తోంది. భూతంగా మారిన ప్రస్తుతం, భూతంలా భయపెడుతోంది.

ధైర్యం తెచ్చుకుని చెలిని అడిగాడు, “నాకు చూపించటానికి ఇంతకన్నా మంచిచోట్లేవీ లేవా నా గతంలో?”

“క్లుప్తమైన సరిగమలు. లుప్తమైన మధురిమలు. సంక్షిప్తంగా నీ జీవితచిత్రం ఇది. వెన్నెలరాత్రులూ, విహారయాత్రలూ ఉండుంటే నువ్వడక్కుండానే నేను వాటిదగ్గరికే  నిన్ను తీసుకెళ్లేదాన్ని. వాటిని నీ నెచ్చెలి మాయం చేసింది. లేని వాటిని చూపించలేదని, నన్నని ఉపయోగం ఏముంది?” అన్నది ఆమె.

ఆ గొంతులో లీలగా ధ్వనించిన వెటకారం, అవలీలగా అర్థమైంది అతనికి.

Kadha-Saranga-2-300x268

***

నెచ్చెలి సోదరి ఇంతకుముందు రోజుకు ఒకసారైనా తన దగ్గరకు వచ్చేది. వచ్చినప్పుడల్లా తన చెల్లెల్ని  ప్రేమగా కౌగలించుకునేది. మనఃస్పూర్తిగా తనని పలకరించేది. ఉన్నట్లుండి రావటం మానేసింది. ఎందుకో తెలీదు.

“ఈ మధ్యన మీ అక్కయ్య కనపడటం లేదేం?” తనకి అందుబాటులో లేకుండా తలుపులు బిగించుకుని  దాక్కున్న నెచ్చెలిని అడిగాడు.

మౌనం సమాధానమయింది.

నేరుగా నెచ్చెలి సోదరినే అడిగితే సరి. ఉదయం ఆమె గృహోన్ముఖురాలయే సమయం.

ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. తేజస్సును విరజిమ్ముతూ, తేలుతున్నట్లుగా నడిచి వస్తూ దూరంగా ఒక కాంతిపుంజం. క్రమంగా అది పెద్దదయింది. ఆ రూపం ఒక ధవళవస్త్రధారిణిది. ఆమె సమీపిస్తున్న కొద్దీ పరిసరాలన్నిటా పరివ్యాపితమై ఒక సాంత్వనాగీతం.  మలయమారుతం.

“మీ కోసం ఎదురు చూస్తున్నాను,”

“నాతో మీకేం పని?”

“ఒక్క మాట అడుగుదామని,”

ఆగకుండా వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపాలని ప్రయత్నించాడతను. ఆమె వొంటి స్పర్శ అతడికి తెలీలేదు. కాని, అతడి స్పర్శ తనకి తగిలినట్లు, అది రుచించనట్లు ఆమె విదిలించుకుంది. ఓ క్షణం ఆగింది. రాత్రంతా తనకి తాను లేనట్లు బరువెక్కిన కళ్లు.

ఏమిటో చెప్పమన్నట్లు అతడి వంక అసహనంగా చూసింది.

“నా మీద కోపం వచ్చిందా? రావటం మానేశారు!”

“కోపం రాలేదు. మీరే తెప్పించారు,”

“బహిరంగంగా ఎందుకు? నా తలపుల్ని తెరుస్తాను. లోపలకి వస్తే ఆన్ని విషయాలూ సాకల్యంగా మాట్లాడుకోవచ్చు,” ఆప్యాయంగా  ఆహ్వానించాడతను.

“ఆ అవసరం లేదు,” కర్కశంగా జవాబిచ్చింది ఆమె.

“ఇంతకు ముందు రోజూ వచ్చేవారుగా?”

“అంతకు ముందు నా చెల్లెలు నీ దగ్గర ఉండేది. సుఖపడుతుండేది. నిన్ను సుఖపెడుతుండేది. అందుకని నేను స్వేచ్ఛగా రాగలిగేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు,” అంది ఆమె.

“ఇప్పుడు కూడా ఆమె నా దగ్గరే ఉందిగా?”

“ఉంది. కాని ఇంతకు ముందులా లేదు. చిక్కి శల్యమైంది,”

“మీకెలా తెలుసు?”

“నీకు కనపడనంతమాత్రాన, ఇంకెవరికీ  కనపడదనుకోకు,”

అందుకనేనా? ఎప్పటెప్పటి విషయాలో  ఒకటొకటి తన మీద దాడి చేస్తున్నది! వాటి వెనక ఉండి వాటిని చెలి రెచ్చగొట్టగలుగుతున్నది! పగబట్టినట్లు వాటిని తట్టి లేపి తనవైపు తరమగలుగుతున్నది!

నెచ్చెలి సోదరి వాటివంక నిర్నిమేషంగా చూస్తోంది.

***

కనపడిన రెండు నిజాలనీ అతడు జీర్ణించుకోలేకపోయాడు. అలాగే కూర్చుండిపోయాడు. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని, “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” ఇంకా తన ఎదురుగా నిలబడే ఉన్న నెచ్చెలి సోదరిని  నిస్సహాయంగా అడిగాడు.

“చేయగలిగిందేమీ లేదు. మా అమ్మ రాక  కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే!”

“నెచ్చెలికి నా వల్ల జరిగిన హాని తెలిసి కూడా,  మీ అమ్మ నా దగ్గరకు వస్తుందా?”

“కన్నకూతుళ్లు కదా! రాక తప్పదు,”

“వచ్చి ఏం చేస్తుంది?” అయోమయంగా అడిగాడు అతడు.

“తన కూతుళ్లని తనతో తీసుకు వెళుతుంది,”

“నా సంగతో?”

“ఆమె వస్తే నీ దగ్గర నువ్వూ మిగలవు!” ”

-o) O (o-

 

 

 

మందు, మత్తు బిళ్ళలు

 

gopi
ఊళ్ళన్నీ నిశ్శబ్దం…
రెండునెల్లుగా యిదే పరిస్థితి.
ఎవురూ ఎవురితో మాట్టడేది లేదు. ఏదన్నా మాట్టాడినా రాజధాని… భూములు… మంత్రుల మాటలు తప్ప వేరే సంగతులేం లేవు.
అందరూ పొలాలకెల్తున్నారు. పనులు సేసుకుంటున్నారు. కానీ ఏదో తెలియని అయోమయ పరిస్థితి. బతుకేమవుద్దో, బతికేదెట్టో అనే ఆలోచన్లే…
పెద్ద ఆసాములు కొంతమంది భూములిచ్చెత్తం అంటన్నారు. మనూరుకి రాజధానొత్తే మంచిదేగా అంటన్నారు.
ఏం మంచిదో… ఎట్టమంచిదో ఎవురూ చెప్పట్లేదు.
“రాజధానొస్తే మన భూములకు మంచి రేటొస్తదిరా” అన్నారు పెద్ద రైతు శ్రీనివాసరావు గారు.
“మన పొలాలన్నీ గవర్మెంటోల్లు తీసుకున్నాక ఆటికెంత రేటొత్తే మాత్రం మనకేం లాభం సార్” అని అడిగిన.
“పిచ్చోడా… గవర్నమెంటు మన భూములు తీసుకొని అభివృద్ధి చేస్తారు. రోడ్లేస్తారు. మంచినీళ్లు, కరెంటు అన్నీ ఇస్తారు. అక్కడే ఎకరానికి ఇంత సొప్పున మన వాటా ఇస్తారు. అది మంచి రేటొస్తది.”
“అంటే అది కూడా అమ్ముకుంటేనేగా సార్”
“డబ్బులు కావాలంటే అమ్ముకోవాలి. లేకపోతే అలాగే ఉంచుకో.”
“అది అమ్ముకుంటే ఎక్కడకి పోవాల? అమ్ముకోకపోతే ఏం తినాల సారూ?”
శ్రీనివాసరావు సార్ కి కోపం వొచ్చినట్టుంది. నావంక గుర్రుగా సూసిండు.
“ఏంట్రా… ఏం మాట్లాడుతున్నావ్?  మనూళ్ళో రాజధాని వద్దంటావా ఏంటి?”
“అంత మాట నేనెందుకంటా సార్… నేను బతికేదెట్టా అంటున్నా. కోపం తెచ్చుకోండి సారూ”
మెల్లగా బతిమాలినట్టు అడిగిన.
“నీలాంటి తిక్క ప్రశ్నలకి నాదగ్గర సమాధానం లేదు. నీకేదో దెయ్యం పట్టినట్టుంది. రాజధాని వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటుంటే తిక్క ప్రశ్నలేస్తావేంట్రా?”
శ్రీనివాసరావు సారు గట్టిగానే మందలిచ్చిండు నన్ను.
బతుకులెట్టా బాగుపడతయో అర్ధం కావట్లేదు. నేను అర్ధం కాక అడుగుతుంటే ఆయన ఇంకేంటో అంటుండు.
***
ఇయ్యాల మాఊళ్లోకి గవర్మెంటు అధికారులొచ్చారు. మేం పొలాలిత్తే వాళ్ళేం సేత్తారో, మాకేంవిత్తారో సెపుతున్నారు.
గవర్మెంటు ఆపీసులోత్తయ్, ప్రయివేటు కంపెనీలొత్తయ్ అంటన్నారు. మా పిల్లలకి ఉద్యోగాలొత్తయ్ అంటన్నారు.
సుబ్బయ్య నాయుడుగారి మనవడు అమెరికాలో వుండు. యిప్పుడు ఆమెరికావోళ్ళే యిక్కడికి ఉద్యోగాలకి వత్తారంట.
“అది సరే సార్… మా సంగతేంటి? మా పిల్లల సంగతేంటి?”
ధైర్యం సేసి నేనే అడిగిన ఆపీసర్ సార్ని. ఒక పక్క భయంగానే ఉంది. సుట్టూ పోలీసులున్నారు. ఆల్లందరూ నన్నే సూత్తన్నారు.
“రైతులకు ఎకరానికి కొంత సొప్పున అభివృద్ధి చేసిన భూమి ఇస్తాం. కొంత నష్టపరిహారం కూడా ఇస్తాం. రైతు కూలీలకు నెలకు కుటుంబానికి 2,500 రూపాయలు ఇస్తాం. అంతే కాదు రైతు కూలీలకు ఇతర వృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం.”
ఆయన సెప్తుండు. అందరూ యింటన్నారు.
“ఇప్పుడు మాకు మీరు నేర్పించేదేంటి సారు. మా భూములు తీసుకొని మాకే బిచ్చం వేస్తారా?”
జనంలోనుండి ముగ్గురు రైతులులేచి  అడిగారు.
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి సూసా… ముగ్గురిలో మా పక్కూరి గాంధీ సార్ ఉన్నడు.
నాకు ధైర్నం వొచ్చింది.
“అయ్యా మొగుడూ పెళ్ళాలం కూలికెల్తే రోజుకి 600 నుండి 800 దాకా కూలోత్తది. యింట్లో యిద్దరం నెలకి 20 రోజులు పనిసేత్తే పది, పన్నెండువేలు వత్తయ్. మీరు నెలకి రెండువేలిత్తే మేం బతికేదెట్టా సారూ.”
అధికార్లేదో సెప్పబోతున్నారు… గాంధీ గారూ, యింకొంతమంది ఏంటో అడుగుతున్నారు. గోల మొదలైంది.
సరిగ్గా అప్పుడే పోలీసులు కదిలారు. గాంధీ గారిని, ఆ పక్కనున్న వాళ్ళనీ, నన్నూ బయిటికి లాగేసారు. “ఎవర్రా మీరూ” ఒక కానిస్టేబులు నా సొక్కాపట్టుకొని గుంజిండు.
“మీటింగ్ పాడుచేయటానికొచ్చార్రా? అధికార్లు చెప్పేది మీరు వినరు, మిగతావాళ్ళని విననివ్వరా?” పోలీసు కానిస్టేబులు గట్టిగానే మందలిచ్చిండు.
నాకు బయమేసింది. కొడతాడేమో పోలీసోడు అనుకున్న. కానీ కొట్టలేదు. దూరంగా తోసేసిండు.
ఈ గొడవ వల్ల మీటింగు రద్దయింది. యింకోసారి పెడతారంట. జనం బైటికి రాకుండా పోలీసోళ్ళు ఆపేసారు. అధికార్లంతా బయటికొచ్చి కార్లెక్కి ఎల్తన్నారు. పోలీసులు అధికార్ల పక్కకి జనం ఎల్లకుండా అడ్డంగా నిలబడ్డారు.
యింతలో గాంధీ గారు నా దగ్గరకొచ్చిండు. భుజమ్మీద చెయ్యేసి “సూరీ బాగా మాట్లాడినావ్. అలాగే ఉండు. తగ్గకు. మనం మన పొలాల్ని కాపాడుకుందాం.”
కొండంత ధైర్నం వొచ్చింది. “అట్నే సారు. మీరు ముందుంటే నాబోటోల్లు శానమంది ఎనకుంటాం”
“సరే, రేపొకసారి కలుద్దాం.”
“అట్నే సార్… వత్తా… కలుద్దాం సార్” అన్న. తర్వాత గాంధీ గారు ఎల్లిపోయిండు.
 ఏదో కొద్దీ ధైర్నం వొచ్చింది. కానీ అన్నీ అనుమానాలే …. భయాలే …
***
అధికార్లు వత్తన్నారు… పోతన్నారు…
పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.
కొంతమంది రైతులు తమ పొలాల్లో కొంత భాగం కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారు. డబ్బు రాగానే పెద్దోళ్ళు కార్లు కొన్నారు. బంగారం కొన్నారు. అల్ల ఆడోల్లు పట్టుచీరలు కొంటన్నారు.
మా వూళ్ళల్లో పరిస్థితి యిది.
పెద్దోళ్లంతా ఉషారుగున్నారు. నాబోటోళ్లంతా ఉసూరంటున్నారు.
రాత్రిళ్లు నిద్ర పట్టటం లేదు. మొగోళ్ళు, ఆడోళ్ళు అందరూ అంతే… కంటిమీద కునుకు లేదు.
మొగోళ్ళు బార్లకెళ్తున్నారు. మందు తాగి ఇంటికొచ్చి పడుకొని ఆ మత్తులో నిద్ర పోతన్నారు.
ఇక ఆడోళ్ళు మందుల సాపు కాడ నిద్ర మాత్రలు తెచ్చుకొని అయి మింగి పడుకుంటన్నారు.
తాగి, తాగి మగాళ్లేమవుతారో, మాత్రలు మింగి ఆడోళ్లేమవుతారో తెలవట్లేదు.
***

మనం మాట్లాడుకోవాలి

హృదయము సుమ్మీ!  

myspace

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో

చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?

అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.

***

ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.

***

ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!

ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.

అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.

ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.

అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పడాల్సిందే.

రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు .

తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.

దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.

అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.

ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.

అది హృదయమ్ము సుమ్మీ!

 

 

దృష్టీ సృష్టీ కలిస్తే బాబా కవిత్వం!

baba

 

 

జీవితంలో తారసపడే ఒక సందర్భమో,  సంఘటనో కవిత్వానికి ప్రేరణ. ఆ అనుభవమే కవితకు సృజన రూపం. అనుభవాన్ని నిర్వచించుకోవటం కొంతవరకు అసాధ్యమే. అనుభవానికి కూడా కొన్ని నిర్దిష్టమార్గాలున్నాయి. ఒక దృశ్యం నుంచి సామాజికానుభవాలు ఎదురైతే, సృజన ఆదిశలో రూపాన్ని పొందుతుంది. తాత్వికానుభవం పొందితే ఆ తాత్వికత కవిత్వమౌతుంది. దృశ్యంలో సౌందర్యం, మానవీయత, నైతికత లాంటివి కవిత్వమవటంలోనూ ఇదే ప్రధాన కారణం. ఈ అనుభవం సృజనరూపానికి తగిన భాషను కూడా ఇస్తుంది.

వ్యక్తీకరణ సిద్ధాంతాలు దాని పరిధులమేరకు బోధి,అనుభూతి,రూపం,పద్ధతి,ముగింపు అనే రూపాల్లో అవధారణను కలుగ చేస్తాయి” అంటాడు రూసో.

ధారణ మేరకు కలిగే బోధి సామాజిక, తాత్విక కళావిష్కరణలు వేటినైనా చేస్తుంది.ఇది ఆసక్తిని బట్టి ఉంటుంది.అది ఏ రూపంలో ప్రతిఫలిస్తుందనేదే ప్రధానం.అనుభూతి రూపం కళాసంబంధాలు. ఇవి కళావిష్కరణనే ప్రధానంగా చేస్తాయి.ఇందులోనూ అనుభూతి రస(aesthetic taste) సంబంధమైంది. రూపం ప్రతీక (symbol)సంబంధమైంది. ఈమూడు వ్యక్తీకరణ పద్ధతిని ,ముగింపును నిర్దేశిస్తాయి.

బొల్లోజు బాబా కవిత్వంలోఅనుభూతి ప్రధానమైన కవితలున్నాయి. మానసికంగా అనుభూతికో అనుభవానికో వచ్చిందాన్ని మార్దవంగా చెప్పడం తప్ప నిడివికోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయకపోవడం. మనసు వేసిన ముద్రను అంతే సౌందర్యాత్మకంగా అందించడం ఈవాక్యాల్లో కనిపిస్తుంది.ప్రధానంగా కవిత్వంలో ఒక ధ్యానం ఉంటుంది. ఈ ధ్యానం గొప్ప భావ చిత్రాలను గీసేలా చేస్తుంది.

 

1.చెట్ల ఆకులు ధ్యాన ముద్రలో ఉన్నాయి/కొలను అలలు కూడా వాటిని కలచ సాహసించడం లేదు/నీటిపొడలు నిశ్సబ్దంగా తొంగి చూస్తున్నాయి./పరిమళాలసంచారం నిలచిపోయింది“-(తపస్సు-1)

2.”క్రోటాన్ మొక్కలు ఇంద్ర ధనుస్సుని/పగల గొట్టుకుని/పంచుకున్నట్లున్నాయి/లేకపోతే మొజాయిక్ గచ్చులా/ఇన్ని రంగులెలా వస్తాయి“-(ప్రాగ్మెంట్స్-5)

3.”వేకువని/తలో ముక్కా పంచుకున్నాయి పక్షులు//కిరణాల్ని పేచీలేకుండా పత్రాల సంచుల్లో పంచుకున్నాయి తరువులు

ఇంద్ర ధనుస్సుని/పొరలు పొరలుగా ఒలుచుకుని/పంచుకున్నాయి పూలు“-(అసమానతలు-11)

4.సూర్యుని వేడి రక్తపు చుక్కలు/నెర్రలు తీసిన భూమి చర్మం

చలి చీకటితాగి/మెరుస్తున్న అకాశపుటిరుకు సందులు“-(దేహమూ నీడా-32)

5.నేలకోరిగిన తూనిగపై పూలవాన/అధ్భుత సమాధి/చుంబించుకున్న పెదాలు అదృశ్యమైనా/ఎప్పటికీ పరిమళించే ప్రేమలా“-(నువ్వుకాదు నేనే-40)

8.రాలిన పత్రాల్ని/లోనికి లాగేసుకుని/పూవులుగా అందిస్తాయి/తరువులు“-(ప్రాగ్మెంట్స్-71)

padam.1575x580 (2)

 

ఈ వాక్యాలన్నీ ధ్యానాన్ని చూపుతాయి. సౌందర్యాన్ని పట్టుకోవడానికి నైపుణ్యం కావాలి. “చూడగలిగిన కళ్ళు తారసపడినప్పుడు వస్తువులో సౌందర్యం రెండితలవుతుంద”న్నారు సంజీవదేవ్.ఈ అనుభవాన్నే శ్యామదేవుడు”కావ్యకర్మణీ కవేః సమాధిఃపరం వ్యాప్రియతే”-(కావ్యరచనలో కవికి సమాధి ఉపయోగపడుతుంది)అన్నాడు.ఈ రమ్యాలోకనను జపానీలు -జెన్ ఆచార్యులు “సతోరి”అన్నారు.పేరేదైనా ఈ ధ్యానాత్మక దర్శనంలోని అనుభవం పై వాక్యాలను అందించింది.

బాబా వాడుకునే భాష ప్రతీకల భాషగాదు.ఉహా మాత్రమైన అనుభూతితో భావచిత్రాలను గీస్తారు.వాస్తవికతకు మించి ఊహించడం వల్ల ఇది సాధ్యపడింది.ప్రధానంగా సౌందర్య చిత్రణలోని ఊహాత్మకత,భావన క్రియల్లో ఉంటుంది.”పరిమళాలు నిలచ్పోవడం””ఇంద్ర ధనస్సుని పగల గొట్టుకుని పంచుకోవడం””చీకటి తాగటం”ఇలాంటివి అందుకు నిదర్శనాలు. ఒక పద్ధతిని అనుసరించి ఊహలో సౌందర్యాన్ని సాధిస్తారనడానికి ఒకటి ,రెండు, మూడవ వాక్యాల్లోని రెండు వాక్యాల్లో “పంచుకోవడం “అనే క్రియ సాధారణ మవడం నిదర్శనం.రూపం,పద్ధతి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.

కావ్యతత్వ విచారాన్ని ఆధునిక దర్శన శాస్త్రాలు వాస్తవ వివేచన,ప్రమాణ విచారణ,ప్రయోజన విచారణ అనే విభాగాలలో జరుగుతుందన్నాయి.ఇవి మీమాంస కాలానికి”ప్రకృతి స్వభావం,దాన్ని తెలుసుకుని సౌందర్యాత్మకం చేసిన పద్ధతులు,సిద్ధించిన ప్రకృతి జ్ఞానం ద్వారా జీవితలక్ష్యాల పరిశీలన”అనే అంశాలద్వారా తాత్విక స్థితికి చేరుతాయి.ఈ పరిక్రియల ద్వారా ప్రకృతి సౌందర్యానికి అక్కడినుండి జ్ఞానానికి ప్రయాణిస్తుంది.నాలుగులో “రక్తపు చుక్కలు,చర్మం “అనే పదాల వల్ల మానవస్వభావం చేరి తాత్విక స్థాయికి ఇలాంటి వాక్యాలు చేరుతాయి.ఇక్కడ మానవ గుణారోపణ చేయడం కనిపిస్తుంది.

ఈ కవిత్వంలో సౌందర్యఛాయ ప్రధానంగా కనిపిస్తుంది కాని సామాజిక సంబంధంగా అనేకమైన మానవీయకోణాలు ఇందులో కనిపిస్తాయి.తాత్విక దృష్టికి,జీవితాన్ని అన్వయం చేయడానికి “రెండు చింతలు”-(77పే)ఉదాహరణగా కనిపిస్తుంది.తాత్విక స్థితిని ప్రకృతికి చేర్చి వ్యాఖ్యానించడానికి బాబా మానవగుణారోపణ(Personification)పై ఆధారపడి తాత్వికంగా జీవితాన్ని సాధిస్తారు.

 

1.”భుజాలపై చేతులు వేసుకుని/నిలుచున్న మిత్రుల్లా ఉండేవి/రెండు చింతలూ

2.”నాలుగు తరాల్ని చూసుంటాయి/చివరకు రియల్ఎస్టేట్ రంపానికి/కట్టెలు కట్టెలుగా చిట్లిపోయాయి/వేళ్ళ పేగులు తెంపుకుని /రెండు చింతలునేలకొరిగాయి

3.”వృక్షం  నేలకూలితే పిట్టలు /కకావికలం అయినట్టు/హృదయం చుట్టూ చింతనలు

4.చిత్రంగా జీవితానికి కూడా/నిత్యం రెండు చింతలు/గతం భవిష్యత్తు/వర్తమాన రంపం/పరపరా కోస్తూంటుంది

అలవోకగానే రాసినా ఈ కవితలో ఒక తీరైన సరళి  (methodology) కనిపిస్తుంది. మొదటివాక్యాంశంలో నిర్వచించి, రెండులో మానవగుణారోపణతో ప్రధానంగా “చిట్లిపోవడం,పేగులు తెంపుకోవడం”లాంటి క్రియలతో తాత్విక సమన్వయం చేయడం, మూడులో మానసిక స్థితిని చెప్పడం. నాలుగులో ఏ అన్వయంలేని తాత్విక స్థితి వెళ్ళడం కనిపిస్తుంది.నిజానికి మూడులోని మానసిక స్థితినుంచే రెండుచింతలు ఉపమానాలు పరివర్తన చెందాయి.రెందవ వాక్యం దాకా ఇవి “వేళ్లపేగులు”లాంటి సమాసాలనుంచి ఉపమేయాలుగానే ఉన్నాయి.చలాకవితల్లో ఇలాంటి స్థితిని ఈ ప్రణాలికను గమనించవచ్చు.

ప్రకృతిని జీవితాన్ని సౌందర్యాత్మకంగా,తాత్వికంగా దర్శించడం,అనుభవించడం,అంతే కళాత్మక స్థితినుంచి పాఠకులకు ఇవ్వడం బొల్లోజు బాబా కవిత్వంలో కనిపిస్తుంది.నిజానికి సౌందర్యాన్ని చిత్రించే క్రమానికి అస్పష్టత పెద్ద అవరోధం దీన్ని అధిగమించడానికి అలంకారికతవైపు వెళ్ళడం, సమాసాలద్వార వాక్యాల్ని ఇవ్వడం కనిపిస్తుంది.పాఠకులకు అస్పష్టంగా ఉండకుండా ఇలాంటి శ్రద్ధతీసుకున్నారనిపిస్తుంది. ఇలాంటి వాక్యాల్ని పదబంధాల్ని చూసినప్పుడు. వర్తమాన కవిత్వం అనేక మార్గాల్లో ప్రవహిస్తున్నప్పుడు దృష్టిని సృష్టిని కాపాడుకుని తనదైన శైలితో కవిత్వమౌతున్నారు బాబా.

కలల్లో …కలవరింతల్లో… మెక్సికో!

highres_443910893

ప్రయాణానికి ఏర్పాట్లు – 2016

పెళ్ళికి ముందు పెళ్ళికూతురు ముస్తాబవుతున్నట్టు మన బైకుని కూడా దూరప్రయాణానికి సిద్ధం చెయ్యాలి. కార్లకి లాగా బైకు టైర్లు ఎక్కువ రోజులు రావు. మహా అంటే అయిదువేల మైళ్ళు. సాంబారులో తగినంత ఉప్పు వేసినట్లు బైకు టైరులో గాలిని తగినంత ఉండేలా చూసుకోవాలి.లేకపోతే టైరు మరికొంచెం తొందరగా అరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్యనే ఓజార్క్సు వెళ్ళినపుడు టాళ్ళమేనాలో బైకు వెనక టైరు పంచర్ అయింది.

“టైరులో సరిగ్గా గాలి లేకపోవడమే ఇందుకు కారణం!” అని ఫరూఖ్ చెప్పాడు.

అపుడు మార్చిన వెనక టైరుతో ఇంకో మూడు,నాలుగువేలు తిరగవచ్చు. ముందు టైరు మాత్రం మార్చుకోవాలి, అలాగే ప్రతి సంవత్సరం ఆయిల్ కూడా మారుస్తూ ఉండాలి. చలికాలం పోగానే పని చేసుకోవాలి. బైకు ఆయిల్ మనమే మార్చేసుకోవచ్చు. కారులాగా పెద్ద ఇబ్బందిఉండదు. నేను ఎలాగూ టైరు మార్చుకోవాలి కాబట్టి మెకానిక్ దగ్గర చేపిస్తే మంచిది అనుకున్నాను.

మాకు మీటప్ గ్రూపు కాకుండా వాట్సప్ గ్రూపు కూడా ఉంది. బైకు రిపేర్ల గురించి చర్చలు, సలహాలు, ముచ్చట్లు ఇక్కడ జరుగుతుంటాయి. సాయీ తనకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడని, డీలరు కంటే చాలా తక్కువగా చేస్తాడని చెప్పాడు. ఈసారి అతని దగ్గర ఆయిల్

మారుద్దా మని అనుకున్నా. కాకపోతే అతను మా ఇంటికి చాలా దూరం. పోను గంట, రాను గంట పడుతుంది. పైగా అతను సాయంత్రం ఆరువరకు మాత్రమే ఉంటాడు. నేను అతని షాపుకి చేరాలాంటే అయిదుకి మా ఇంటిలో బయలుదేరాలి. రష్ అవరులో ట్రాఫిక్ నరకం!అవసరమయితే శనివారం అతను మనకోసం షాపు తీస్తాడు. వారాంతం అంటే మన ఊళ్ళో చాలా హడావిడి. మనకి కుదరదు.

ఇతను మనకు కుదరడు అనుకునే సమయంలో అవతార్ సింగుమన ఇంటికి దగ్గరలోనే ఒక కొత్త మెకానిక్ షాపు తెరిచారు. ఇక్కడ చాలా సరసమైన ధరకే మరమ్మత్తులు చేస్తున్నారుఅని సెలవిచ్చాడు.

కావలసింది మన ఇంటిలోనే పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది అనుకుని కొత్త షాపులో కొత్త టైరుకొని ఆయిల్ కూడా మార్చేసాను.

మెకానిక్ బ్రేకులు, క్లచ్చు గట్రాలు చెక్ చేసిబండి కండిషన్ బాగుంది, ఇక కుమ్మేసుకోఅని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

బండి అయితే సిద్ధంగా ఉంది, ఇక మిగిలింది ఒక్కటే! వానలకు సామాను తడవకుండా ఉండేలాంటి బాగు కొనుక్కోవాలి. కొలరాడో వెళ్ళినపుడు నా లగేజ్ అంతా గందరగోళం అయింది. నా బైకు షాపింగ్ అంతా మా ఊరిలోని సైకిల్ గేరులోనే!  ఖాళీ సమయంలో అక్కడే పచార్లు కొడుతూపనికిరానివీ, పనికివచ్చేవీ కొంటూ ఉంటాను. ఆన్ లైనులో వాటర్ ప్రూఫ్ బాగులకి యాభై శాతం పైగా తగ్గింపు ఉంది. ఎప్పటినుండో వీటిపైన ఒక కన్ను వేసి ఉంచాను. షాపులో వీటిని చూసి కొనుక్కుందామంటే వాటిని పెట్టిచావడు. చూసి కొందాములే అని నేను చాలా రోజులుకొనలేదు. తీరా మెమొరియల్ వారాంతానికి రెండు వారాల ముందు వాటిని షాపులో పెట్టి తగ్గింపు ధరని అటకెక్కించేసాడు.

“ఓరి వీడి దుంపతెగా! ఆశకు పోతే దోశ వచ్చిందిఅని వాడిని, నన్ను తిట్టుకున్నాను.

చూస్తూ, చూస్తూ బాగుని అంత ధరలో కొనలేను. ఇక ప్రత్యామ్నాయ మార్గాలని వెతకసాగాను. యూట్యూబులో మోటారుసైకిలు లగేజీల గురించి వెతుకుతూ, చూస్తూ గడిపాను. చివరికి REI లో నాకు కావలసింది దొరికింది. కొలరాడో వెళ్ళేటపుడు ఇక్కడే మడతకుర్చీకొనుక్కున్నాను. కుర్చీని మడతవేసి చిన్నగొడుగు పరిమాణంలోకి మార్చెయ్యచ్చు. కాంపింగ్, ట్రెక్కింగ్, ఆటలకి కావలసిన సామానంతా ఇక్కడ దొరుకుతుంది.  మనకి కొనే వస్తువు మీద అవగాహన లేకపోతే మనకి కొన్ని గంటలు క్లాసు పీకి చావగొట్టి చెవులు మూసేస్తారు. జన్మకి ఇంకొక అనుమానం వస్తే ఒట్టు! నాకు కావలసినది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఎవరినీ కదిలించకుండా తెచ్చేసుకుందామని వెళ్ళాను. అయినా పసిగట్టి, పాఠం చెప్పేసి వెళ్ళిపోయాడు. నలభై లీటర్ల బాగు కొనుక్కున్నాను. ఇందులో బట్టలు కుక్కేసుకునిబంజీతాడులతో వెనకసీటుకి కట్టేసుకోవచ్చు. బంజీతాడులు మొలతాడుకంటే ఎంతో మేలు చేస్తాయి. ఇలా సామాను కట్టేసుకోవడమే కాకుండా జాకెట్టు, హెల్మెట్టు లాంటివి కూడా వీటితో బైకుకి కట్టేయచ్చు. ప్రతి బైకరు దగ్గర ఇలాంటి తాళ్ళు కొన్ని మనకి కనపడుతాయి.

మాకు మెక్సికో వెళ్ళడానికి వీసా అఖ్ఖరలేదు కానీ మేము తీసుకుని వెళ్ళే బైకుకి పర్మిట్ కావాలి. డాలసులోనే ఉన్న మెక్సికన్ ఎంబసీలో ఈ పని పూర్తి చెయ్యచ్చు. ఫరూఖ్ ముందుగా పర్మిట్ తీసుకుని మాకు ఎలా చెయ్యాలో తెలిపాడు. మొదటిసారి అపాయింటుమెంటుతీసుకోకుండా వెళ్ళి తిరిగి వచ్చాను. మెక్సికోకి ఫోన్ చేసి తీసుకోవాలి. ఫోన్ చేస్తే స్పానిష్ లో మాట్లాడుతారు. ఇంగ్లీషులో మాట్లాడితే ఫోన్ పక్కకు పెట్టేస్తారు. మన అవసరం కదా! పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా ఫోను కింద పెట్టకుండా ఉంటే ఎవరో ఒక మహాతల్లి వెహికల్ పర్మిట్ కోసంఅపాయింటుమెంటు ఇచ్చింది. ఈసారి పని తొందరగానే అయిపోయింది. రెండువందలు మెక్సికన్ డాలర్లు డిపాజిట్ ఉంచుకుని పర్మిటుకి డబ్బులు కట్టించుకున్నారు. తిరిగి వచ్చేటపుడు సరిహద్దులో డిపాజిట్ వెనక్కి ఇస్తారట! నేను చాలావరకు ఇంటి నుండి పనిచేస్తాను కాబట్టి,ఆరోజు గడ్డం గీసుకోలేదు. నన్ను మెక్సికన్ అనుకున్నారు. పాసుపోర్టు చూసి కానీ నమ్మలేదు.

ఇదే విషయం మా దోస్తులకి చెపితేఅదే గడ్డం కంటిన్యూ చేసెయ్” అని ఒక ఉచిత సలహా పడేసారు. నేను నిజంగానే అన్నారేమో అనుకుని అలాగే గడ్డం ఉంచుకున్నాను.

పర్మిటుతో పాటూ మెక్సికోలో మన వెహికలుకి ఇన్స్యూరన్సు కావాలి. అమెరికా ఇన్స్యూరన్సు అక్కడ పని చెయ్యదు. మెక్సికన్ కన్సొలేట్ చెప్పిన కంపెనీ నుండి బాగా దమ్మున్న ప్లాటినం పాలసీ ఒకటి తీసుకున్నాము. ఇది నాకైతే చాలా బాగా పనికి వచ్చింది.

నెలకో, రెండు నెలలకో ఒకసారి కలుసుకుంటూ అందరి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అమిత్ కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వినయ్ ఇంకొన్ని రోజుల్లో వెహికల్ పర్మిట్ కోసం వెళ్తానన్నాడు. న్యూయార్కు నుండి రాము తన బైకుని ఒక నెల ముందే డాలసుకీ షిప్ చేపించాడు. రాముకి న్యూయార్కులో వ్యాపారం ఉంది. ఏ పని చేసినా మంచి డీల్ కోసం చూస్తూ ఊంటాడు. ఏదో చీప్ డీల్ అని బైకుని షిప్ చేసాడు. బైకుని తీసుకెళ్ళిన వాళ్ళు పక్క రోజు నుండి ఫోన్ ఎత్తడంలేదు. మనవాడికి ఫుల్లు చమటలు! అదృష్టవశాత్తూ రెండు రోజుల్లోనే లైనులోకి వచ్చి, క్షేమంగా డాలసులో బైకుని చేర్చారు.

మాలో ఎవరికీ స్పానిష్ పెద్దగా రాదు. స్పానిష్, రష్యన్ వచ్చిన బాబీ ట్రిప్పుకి రావడం లేదు. కనీసం కొంత ప్రాధమిక మాటలు నేర్చుకోవాలని యూట్యూబు, అండ్రాయిడ్ ఆపులు చూసుకుంటూ కూర్చున్నాము. గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్ బాగా పనిచేస్తుందని దాన్ని డౌన్లోడ్చేసుకున్నాము.             

నాకు మెక్సికో వెళ్ళాలని ఎప్పటి నుండో కోరిక. నేను శాన్ ఆంటోనియోలో ఉండే రోజుల్లో వెళ్దామనుకున్నాను. ఒక్కడే అక్కడకి వెళ్ళడమంటే కొరివితో తల గోక్కున్నట్లే! ఒకసారి మా డ్రయ్యర్ పాడయితే రిపేరు చెయ్యడానికి ఒక పనివాడు వచ్చాడు. అతడు చిన్న వయసులోఉన్నపుడు మెక్సికో నుండి ఇటు వైపు వచ్చేసాడు.

అతన్ని కదిపితేనేను ఇంతవరకూ మళ్ళీ మెక్సికో వైపు వెళ్ళలేదు. మా ఆవిడ వెళ్ళనివ్వదుఅన్నాడు.

అంతే కాకుండాపోలీసులు బాగా అవినీతిపరులు. మనం సరిహద్దు దాటగానే మన వివరాలు చెడ్డవాళ్ళకి చేరవేస్తారుఅన్నాడు.

sree mexico

నేను చూసిన చాలా సినిమాలు ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పాయి. మా ధైర్యం ఏమిటంటే మాకు తెలిసిన బైకర్లు గత సంవత్సరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన రూటులోనే మేము వెళ్తున్నాము. వాళ్ళు ఉన్న హోటలులో బస చేస్తున్నాము. హోటలు బుకింగులు అన్నీఅయిపోయాయి. మేము వెళ్తున్న ఊర్ల గురించి వీకీలో చదువుతూ, యూట్యూబులో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

వారం రోజుల్లో మెక్సికో వెళ్దామనంగా మా టీము ఒక కొలిక్కి వచ్చింది. ఫరూఖ్, నేను, అమిత్, రాము ప్రయాణం ఖాయం చేసుకున్నాము. వినయ్ కి సెలవలు దొరక్క మాతో రాలేకపోయాడు. బాబీకి మెక్సికో రావాలని ఎంతో కోరికగా ఉంది, అతనికి కూడా సెలవలు లేక ఆగిపోయాడు.అవతార్  సింగ్ కూడా చివరి నిముషంలో రాలేకపోయాడు. మెక్సికో నుండి రాము ప్రయాణానికి మూడు రోజుల ముందు డాలసు వచ్చాడు.

మేము బయలుదేరేముందు రాత్రి అవతార్ సింగ్ ఇంటిలో చిన విందు జరిగింది. డాలసులో ఉన్న బైకు మిత్రులు కొందరు రాముని కలవాలని, దానితోపాటూ మాకు వీడ్కోలు పలకాలని వచ్చారు. అందరం విందులో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నాము. కొంచెంలేటుగా వచ్చిన అమిత్ మమ్మలందరినీ కలవరపెట్టే మాట చెప్పాడు. అమిత్ సోమవారం నుండీ గురువారం వరకూ క్లైంట్ దగ్గర పని చేస్తాడు. గురువారం సాయంత్రం డాలస్ చేరుకుంటాడు. సాఫ్టువేరులో చాలా మంది ఇలాగే వారమంతా తిరుగుతూ ఉంటారు. అమిత్ వాళ్ళకి బాగాదగ్గర అయిన స్నేహితుడి తండ్రి హఠాత్తుగా చనిపోయారు. ఆరోజే డాలాసు చేరుకున్న అమిత్ రేపు ప్రయాణించడం కుదరదు అని చెప్పాడు. స్నేహితుని కుటుంబంతో మరి కొన్ని రోజులు తోడుగా ఉండాలని అన్నాడు.

మనం వేసుకున్న ప్రతి ప్లానూ పారుతుందని ఎపుడూ అనుకోలేము. అందుకే ప్లాను నుండి మొదలయి జెడ్ వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకపోతే మరొకటి! దారులన్నీ మూసుకుపోయినా రెక్కలు కట్టుకుని ఎగరవచ్చు, లేకపోతే ఈతకొట్టి అవతలి గట్టు చేరవచ్చు. అందరం అలోచించడం మొదలుపెట్టాము. అందరూ సలహాలు విసిరిపారేస్తున్నారు. వాటిలో అందరికీ నచ్చిన సలహాని పట్టేసుకుని  దాన్ని ఖాయం చేసేసుకున్నాము. అదేమిటంటే నేను, ఫరూక్, రాము కలిసి అనుకున్న ప్రకారం రేపు ఉదయం డాలసు నుండి బయలుదేరుతాము.కాకపోతే లొరేడో వెళ్ళకుండా హిల్ కంట్రీ వెళ్తాము. పక్కరోజు లొరేడో వెళ్తాము. అమిత్ కూడా అదే రోజు మమ్మల్ని దారిలో కలుసుకుంటాడు. కొత్త ప్లాను విని వినయ్, నిలేష్ మాతో పాటూ హిల్ కంట్రీ వరకు వచ్చి పక్కరోజు తిరిగి డాలస్ వచ్చేస్తామని చెప్పారు. వస్తానన్నాడుకానీ మళ్ళీ ఎందుకో ఆగిపోయాడు. ట్రంప్, హిల్లరీ గురించి కాసేపు వాదులాడుకుని అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయాము.

ఉదయాన్నే బట్టలు ఉతికేసుకుని వాటిని REI లో కొన్న బాగులో సర్దేసాను. బాగుని వెంకసీటు మీద అడ్డంగా ఉంచి, బంజీ తాడులతో కట్టాను. బండి తలకిందులు అయినా కూడా, అంటే మన తాడు తెగినా కూడా బంజీ తాడు తెగదు! క్రితంసారి బట్టలన్నీ బైకుకి తగిలించి ఉన్నసాడల్ బాగ్సులో ఉంచాను. ఈసారి బాగులో ఉంచేసరికి సాడల్ బాగులు ఖాళీ అయ్యాయి. అందులో టూల్ కిట్టు, కెమెరాలు కేబిల్సు సర్దాను. వీటిని ఎలా సర్దుకోవాలో రాముని చూసాక తెలిసింది. ఆవిషయం సమయం వచ్చినపుడు మీకు తెలియజేస్తాను. వర్షం వస్తే తడవకుండా రైన్గేరు సాడల్ బాగులో సర్దాను. రెండు టైర్లలో గాలి కూడా నిండుగా ఉంది. ఉదయం బయలుదేరేముందు పెట్రోలు కూడా కొట్టిచ్చేస్తే ఇక దిగులు ఉండదు.

మా ఆవిడ ఫోనులో గ్లింప్సు ఆప్ లోడ్ చేపించా. ఆపు వలన చాలా లాభాలున్నాయి. మా గ్రూపులో ఎవరన్నా వెనకబడితే, లేకపోతే ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటే వారి లొకేషన్ మిగతావారితో పంచుకోవచ్చు. మాపులో బైకరు ప్రయాణం మనం గమనిస్తూ ఉండచ్చు. మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నాము అన్న విషయం ఇందులో తెలిసిపోతుంది. పటంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చూసుకుని అందరం భోజనానికి ఎక్కడ ఆగాలో తెలుసుకోవచ్చు.

పక్కరోజు ఉదయం ఏడుకంతా కొపెలులో కలవాలనుకున్నాము. రాత్రి తొందరగానే నిద్ర పోవాలనుకున్నాము. 

మరికొన్ని గంటల్లో ప్రయాణం చెయ్యాలన్న ఆలోచన నిద్ర పోనివ్వలేదు. ఎపుడూ వెళ్ళని చోటుకి వెళ్తున్నాము. ప్రయాణం అంతా బాగా జరుగుతుందో, లేదో? మెక్సికోలోఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో? లాంటి ఆలోచనలు బాగా కలవరపెట్టాయి. అంతకుమందే అవతార్ సింగుగారి ఇంట్లో తీసుకున్న సురాపానం ఎక్కువసేపు ఆలస్యం చెయ్యకుండా నిద్రాదేవిని ముగ్గులోకి దింపింది.

*

 

ఉదయాన్నే వెలిసిన వర్షం

ఉదయ్యాన్నే

 

రాత్రంతా కురుస్తూ ఉదయాన్నే వర్షం వెలసిన అనంతరం  ఎలా వుంటుంది?  అచ్చం తన అంతరంగ లోతుల్నుండి భావోద్వేగాలను తోడుతూ కవిత రాసిన అనంతరం కవి మనస్తితిలా వుంటుంది.  నిజాయితీగా తనదైన ఒక కవితని  రాయాలంటే కవి బాధో ఆనందమో ఎంత హోరుని అనుభవించాలి? వికాసమో విలాపమో జ్ఞాపకాల్లో ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోవాలి?  దుఖం నుండో ఆనందం నుండో వచ్చిన కన్నీటిలో ఎంత తడిసిపోవాలి?

కిటికీగుండా చూస్తేనో లేక తలుపు తెరిచి గుమ్మం బైట తల పెడితేనో ఒక నిండైన దృశ్యం కనబడితే రామానుజరావుగారిలాంటి కవి ఊరుకోగలడా?  అందుకేనేమో ఆయన కవిత్వం నిండా దృశ్యాలు పరుచుకుంటాయి.

***

కవిత్వం గురించి ఆలోచించేప్పుడు చాలా ఆలోచనలొస్తాయి.  అసలు కవిత్వం అంటే ఏమిటి, ఏది కవిత్వం అని సందేహాలొస్తాయి.  కవిత్వం అంటే ఎదైనా కావొచ్చు. అది లిఖితం కావొచ్చు. మౌఖికం కూడా కావొచ్చు. నిర్వచనీయం కావొచ్చు లేదా అనిర్వచనీయం కావొచ్చు.   అయితే ఈ సందేహాల్ని దృష్థిలో పెట్టుకొని, ఒక నిర్వచన స్పృహతో కవిత్వం రాస్తే మాత్రం కవి దారుణంగా విఫలమౌతాడు.  ఒక కవిత్వ విమర్శకుడో లేదా ఒక మంచి పాఠకుడో నిర్వచనాల జోలికి పోవాలి కానీ “ఒక మంచి కవితకి ఇవిగో ఇవీ లక్షణాలు, ఇంకా ఈ లక్షణాలు నేనిప్పుడు రాయబోయే కవితలో ప్రతిఫలించాలి” అని కవి అనుకుంటే కవి ఊహాశక్తికి క్రోటన్ కత్తెర్లు పడతాయి.  ఒక గొప్ప కవి రాసిన కవిత్వంలో ఫలానా లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి కాబట్టి తాను కూడా అలాగే వస్తువు పరంగా, ఎత్తుగడ పరంగా, నడక పరంగా కవిత్వం రాస్తే అది ఎట్టి పరిస్తితుల్లోనూ మంచి కవిత్వం కాబోదు.

 

ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వర్తమాన తెలుగు కవుల్లో అనేకమంది ఎవరో ఒకరి కవిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటం జరుగుతున్నది.  కవిత్వం రాయటానికి మరో గొప్ప కవిని ఆదర్శంగా తీసుకోవటం మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు.  అందుకే వారిలో ఒక స్వంత గొంతుక లోపిస్తున్నది.  తనదైన ఊహ, డిక్షన్ చాలామందిలో కనిపించటం లేదు.  ఒక గొప్ప కవిత్వం చదివాక కవి మనసులో ఒక గాఢమైన కవిత్వ వాతావరణం ఏర్పడాలి.  ప్రభావం వేరు, అనుసరణ వేరు.  కవిత్వంలోకి స్వంత రక్తాన్నెక్కించి పరుగులు తీయించటానికి ప్రభావం అడ్డుకాబోదు.  కానీ కలంలోకి పరాయి రక్తాన్నెక్కించుకొని రాస్తున్నట్లుంటుంది అనుసరణ కవిత్వం.

*****

రామానుజరావు గారు ఎంతోమంది అంతర్జాతీయ కవుల్ని చదివారు.  కానీ ఆయన ఎవర్నీ అనుసరించ లేదు.  ఆయన అనువాదాలు కూడా చేసారు.  ఆయన అనువాద కవితలకి, తెలుగులో స్వంతంగా రాసిన కవితలకి ఎక్కడా పోలిక లేదు.

 

కవి రాజకీయ, ప్రాపంచిక దృక్పధం ఏదైనా కావొచ్చు.  ఒకరి కవిత్వం ప్రధానంగా దృశ్య వర్ణనగా వుంటుంది.  మరొకరి కవిత్వం జీవితం గురించి, సమాజం గురించి వ్యాఖ్యానంగా వుంటుంది.  ఎలాగైనా వుండొచ్చు.  ఇలా రాస్తేనే కవిత్వం అంటే అదో రకపు మూర్ఖత్వం, నిరంకుశత్వం.  రాసే పద్ధతిని చర్చించొచ్చు.  కానీ నిర్దేశించటం సరైంది కాదు.

 

తనదైన శైలిలో వర్ణన ప్రధానమైన కవిత్వం రామానుజరావు గారిది.  కొన్ని చోట్ల భావుకమైన ఊహలు చేసినప్పటికీ  జీవన గాఢతని పట్టించే దృశ్య వర్ణన ఈ కవిలో ప్రధానంగా కనిపిస్తుంది.  ఆయనెంచుకున్న దృశ్యాలు భిన్న వర్ణ సముదాయం.  భిన్న భావోద్వేగాల సమ్మేళనం.  భిన్న సందర్భాల మాగమం.  అది భర్తని కోల్పోయిన స్త్రీ కావొచ్చు. అంధ భిక్షువు కావొచ్చు, అమ్మ కావొచ్చు.  తూర్పు దిక్కుగా దిగులుగా చూస్తూ పార్కు చీకటి దుప్పటి కప్పుకునే ముందటి సందడి కావొచ్చు. మోటార్ సైకిల్ మీద జాంఝామ్మని హుషారుగా షికారు చేసే  జంట కావొచ్చు.

 

కేవలం దృశ్య వర్ణనే కవిత్వం అయిపోదు  ఆ దృశ్యంలో తనను ఇముడ్చుకుంటేనే కదా కవిత్వం అయ్యేది.  తానెంచుకున్న దృశ్యం తాలూకు ఆనందంలో, దుఖంలో,  ప్రేమలో, పరవశంలో తాను మానసికంగా భాగం కాగలిగినప్పుడు,  ఆ దృశ్యాన్ని తన హృదయంలోకి ఆవాహన చేసి తనదైన అవగాహనతో మన ముందు పెట్టినప్పుడే కదా ఆ వర్ణన కవిత్వం కాగలిగేది.  చూడగానే మనసుని తడిమే ఒక దృశ్యం మీదుగా కవి జీవితాల్లోకి తొంగి చూడగలగాలి.  జీవితాల్లోని బాధలకి, ఆనందాలకి హేతువుని, మనుషుల్ని నియంత్రించే ఆర్ధిక, సాంస్కృతిక శక్తుల్ని పట్టించుకోకుండా కేవలం ఒక రసాత్మక స్పందన మంచి కవిత్వం కాజాలదు.  అయితే ఇదంతా ఒక్క కవితలో జరగక పోవచ్చు.  కానీ ఒక కవి రాసిన మొత్తం కవిత్వంలో ఆ అంశ ప్రతిఫలించాలి.  ఈ కవి సరిగ్గా అదే పని చేసారు.  కవి తన ఒక కవితలో ఇలా అంటారు:

“హృదయాన్ని తాకిన రూపమేదైనా

నా నరాల తీగెలను మీటే

ఆర్ద్రతే నా రస దృష్టి”.

కవిత్వ ప్రధాన లక్షణాల్లో ఒకటైన ఆర్ద్రతని తన రసదృష్టిగా  చేసుకున్నారు.

****

 

ప్రకృతి ప్రేమ, మానవసంబంధాలు, రొమాన్సు, ప్రాంతీయ అసహనాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, స్త్రీ సౌందర్యం, కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ, పార్కులలో వ్యాహ్యాళి, నాన్న, డాబాపై కురులార పోసుకునే అమ్మాయి, అమ్మ…ఇలా జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, జీవితాన్ని ఆవరించి వుండే వాతావరణం, జీవితాన్ని సుసంపన్నం చేసే అనుభవాలు, జీవితం మీద ప్రేమని పెంచే భావోద్వేగాలు, సౌందర్య దృష్టి…అన్నింటినీ కవిత్వంగా స్వీకరించారు కవి.

 

 

“ఇంద్ర ధనుస్సు రంగుల్లో స్నానించిన పాలపిట్టొకటి

కారు బానెట్ పై వాలి ముక్కుతో పొడుస్తూ

మధ్యమధ్య తలెత్తి చూస్తూ మోగిన హారను శబ్దాన్ని

రెక్కలతో అదిలించి ఎగిరిపోతుంది”

 

“వాన చినుకుల్ని తాగి మత్తెక్కినట్లున్న రోడ్డుపై

మట్టి వాసన మోసుకొస్తున్న గాలితో పోటీ పడుతూ

సైకిల్ పై గడ్డి మోసుకొస్తున్న యువకుడు”

 

“అసహనం దుమ్మ్ పట్టిన కారు అద్దాల వెనక

నా పట్నవాసపు మితృడు

అకస్మాత్తుగా గొడ్లకాపరిగా మారి పిల్లనగ్రోవి ఊదుతూ

తన్మయత్వపు జడివానలో తడిసిపోతూ నేను” (“ఓరుగల్లుకు ఒక రోజు”)

 

“ఓరుగల్లుకు ఒక రోజు” ప్రకృతిలో జీవన సౌరభాన్ని వెతుక్కున్న కవిత.  ప్రకృతి ఎంత అందంగా వుంటుందో అంత అందంగానూ జీవితాన్ని చెక్కిన కవిత ఇది.  ప్రకృతిని ఇంత నాజూగ్గా పట్టుకొన్న మరో కవిత “ఉదయాన్నే వెలసిన వర్షం”.  ఇక్కడి దృశ్యవర్ణనలో మానవాంశని కవి హైలైట్ చేసిన తీరు బాగుంటుంది.  ఉదయాన్నే వెలసిన వర్షం ఏ దృశ్యాన్ని మంజూరు చేస్తుంది?

 

“వేకువనే వెలుగులిచ్చి వెళ్ళిపోతుంది

తూర్పు సముద్రంలో స్నానించి సూరీడు తేలి వస్తున్నాడు

ఇంటిముందు పారిజాతం చెట్టు

పులకరించి పూల దోసిళ్ళు విప్పార్చింది

ప్రేమ పావురాలు రెండు సన్ షేడ్ పై వాలి

క్రీనీడలో కువకువలాడుతున్నాయి”

 

“మా ఇంద్రపురి వీధిలో బాల గంధర్వుడొకడు

తలెత్తి అమృతం చినుకుల్ని ఆస్వాదిస్తున్నడు”

 

ఆయనొక ప్రాపంచిక దృక్పధానికి చెందిన కవి కారు.  కానీ అయన కవిత్వంలో హేతువు కనబడుతుంది.  ఆరోగ్యకరమైన ప్రతిస్పందన కనబడుతుంది.  ఆయన కవిత్వంలో ప్రశ్నలు లేకపోయినా పాఠకుల్లో అనివార్యంగా ప్రశ్నలు రేకెత్తుతాయి.  ఉదాహరణకి “గుజరాత్ గాయం” అన్న కవితలో ఇలా అంటారు.

 

“హింస ఒక వ్యసనమైతే

బోధివృక్షాల వేళ్ళు తెగుతాయి

చంపడమొక నాగరికత అయితే

ఏ సబర్మతీ తీరాన స్వాతంత్ర్యాలు అనర్హమౌతాయి

 

శతాబ్దాల యుద్ధాలు, భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు”

 

నిజమే “శతాబ్దాల యుద్ధాలు భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు” అన్నప్పుడు ప్రశ్నలు రేకెత్తకుండా వుంటాయా?

 

“నేనొక్కడినే” అన్న కవితలో “ఆ రాత్రి చెట్ల ఆకులు / ప్రసవ వేదనతో అల్లల్లాడుతూ” అంటారు.  ప్రసవ వేదనతో అల్లల్లాడే రాత్రి చెట్ల ఆకులు నిజానికి ఏదో నిగూఢ అంతరంగ అశాంతికి సంకేతం.  కవిత్వం రాస్తున్నప్పుడు తోచిన ఏ ప్రతీకైనా నిజానికి నిష్కారణంగా బైటికొచ్చేదీ కాదు, నిర్వ్యాపకంగా వుండదు.  చాలాసార్లు తన ప్రతీకలు ఏ కవికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి.  కవిత్వం రాసే సమయం కవి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  తనను తాను కొత్తగా, మరింత లోతుగా పరిచయం చేసుకునే సందర్భం అది.  అటువంటి కొన్ని సందర్భాల్లో “వీధి కుక్కల వంతపాటలో స్రవించే విషాదాన్ని” అంచనా వేయటానికి అధివాస్తవిక ప్రతీకలతో “అంధ బిక్షువు” లాంటి కవిత పలుకుతుంది.

 

“రాత్రి

చీకటి దేహావృతమై

నక్షత్రాల వంకీ కర్ర ఆధారంగా

ఒక దయార్ద్ర హృదయ అన్వేషణలో

వీధి అంతా గిరికీలు కొడుతుంది

మూసిన తలుపుల ముందు కీచురాయి గొంతుతో

దీనంగా వేడుకుంటుంది”

 

అమెరికా లోని యూసమైట్ కొండల్లో సెలయేటిని చూసి అక్కడి ప్రశాంతతకి ఉక్కిరిబిక్కిరయిన కవి “ఇక్కడ అలలు లేవు”కవితలో అనుభూతుల జుగల్బందీని వినిపిస్తారు.

“చేతి పట్టు దాటి నీట తప తప తన్నే

ఆనందం

పిల్లల చుట్టూ ప్రవహిస్తుంది

ఇసుకలో కట్టిన గుజ్జన గూళ్ళు

కదిలి వస్తున్న పసితనాల పావురాలు

నిశ్శబ్దం నీట మునిగి కోలాహాలం”

 

ఇక్కడ నేను ప్రస్తావించని కొన్ని మంచి కవితలు ఇంకా వున్నాయి.  ద్రవ్యోల్బణం మీద రాసిన “రూపాయి”,  జంట ప్రయాణ ప్రణయాన్ని వర్ణించే “వాళ్ళిద్దరూ”, నోస్టాల్జియా మీద రాసిన “నాన్న” కవితలు చదవాల్సిన కవితలు.

కవిత్వంతో చాలా కాలం నుండి ప్రయాణం చేస్తున్నా చాలా తక్కువగా కనిపించిన రామానుజరావు గారు తన నడక వేగాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళగల సత్తా ఆయనకుందని ఉదయాన్నే వెలసిన వర్షం సాక్ష్యం చెబుతుంది.

 

*

 

కాన్వాస్ పై కాంతి పుంజం- అరుణా రావ్

 

                                                        Aruna (2)             

‘సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్య’మన్న కొడవటిగంటి కుటుంబరావు ఆమె మాతామహులు. సాహిత్యం సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో ఉండాలని భావించి అత్యంత సరళమైన భాషలో తన అనువాదాలు సాగిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అనేక పురస్కారాలు పొందిన శాంత సుందరి రామ వరపు ఆమె తల్లి. అదే ఒరవడిని కొన సాగిస్తూ మానవ జీవితం గురించి చెప్పే ప్రకృతి దృశ్యాలనెన్నుకుని, ఆ వెలుగు నీడల్లో కెమెరా పట్టుకోలేని రంగుల్ని నేర్పుగా పట్టుకుని, సమ్మోహకంగా కాన్వాస్ మీద ఆవిష్కరిస్తున్న అరుణారావ్ తో ముఖాముఖి, ‘సారంగ’ పాఠకుల కోసం.

* అరుణా! అంతర్జాలం లో తెలుగు సాహిత్యానికి వేదికగా నిలుస్తున్న సారంగ పత్రిక కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఒక గొప్ప సాహిత్య వాతావరణంలో పుట్టి పెరిగిన మీలో చిత్రలేఖనం మీద ఆసక్తి ఎలా వచ్చింది? ఆ ఆసక్తిని మీరే వయసులో గుర్తించారు?

అరుణ: చిన్నతనం నుంచి సహజంగానే బొమ్మలు వెయ్యటం లో ఆసక్తి ఉండేది. కానీ పాశ్చాత్య చిత్రకళ వైపు మొగ్గటానికి ఫ్రెంచ్ ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్స్ గురించిన పుస్తకాలు చదవటమే ముఖ్యమైన కారణం. కాలేజీలో చదువుతున్నప్పుడు వాన్ గో, డేగాస్, మోనే లాంటి గొప్ప చిత్రకారుల జీవితాల గురించి చదివే అవకాశం లభించింది. వాన్ గో జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన ‘లస్ట్ ఫర్  లైఫ్ ‘ అనే నవల అప్పట్లో నామీద గొప్ప ప్రభావాన్ని చూపింది. పాశ్చాత్య కళ పట్ల నాకున్న ఆసక్తికి అది  ఆజ్యం పోసింది. పదో ఏటినుంచే నాకు నచ్చిన ఏ బొమ్మ ఎక్కడ కనిపించినా దాన్ని చిత్రించేదాన్ని.

* Modernism, Impressionism, Expressionism, Cubism, Surrealism ఇలా ఎన్నో రకాల శైలులున్నాయి కదా చిత్రకళా రంగంలో? రియలిస్టిక్ పెయింటింగ్ నే మీరు ఎంచుకోవడానికి కారణం?

అరుణ: ఏదైనా ఒక శైలిని ఎంచుకోవటం అనేది వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుందని నా ఉద్దేశం. చిన్నతనంలో నామీద పడిన ప్రభావాలూ, ప్రస్తుతం నేను చేస్తున్న కోర్స్ లో నేర్చుకుంటున్న కొత్త విషయాలూ నన్ను ‘రెప్రెజెంటేటివ్ పెయింటింగ్ ‘ అంటే కళ్ళకి కనిపించే వాస్తవ దృశ్యాలని చిత్రించటం  వైపు తీసుకెళ్తున్నాయని నా నమ్మకం .

* ఆరుబయట ప్రకృతిని ప్రత్యక్షంగా చూస్తూ చిత్రించే plein air painting  బృందంలో ఉన్నారని విన్నాను. మీ బృందం గురించీ, మీరు చేసే పనుల గురించీ చెప్పండి.

అరుణ: మిషిగన్ లో ఉన్న ఒక ప్లేన్ ఎయిర్ పెయింటర్స్ బృందం లో నేను సభ్యురాలిని. వసంత ఋతువులో మొదలుపెట్టి మంచు కురవటం మొదలుపెట్టే లోపల, అంటే ఆకురాలుకాలం వరకూ మేము వారానికి ఒకసారి కలుసుకుని ఆరుబయట చిత్రాలు వేస్తాం. డిట్రాయిట్ లో పార్క్ లూ, పొలాలూ , తోటలూ, నగర దృశ్యాలూ మొదలైన నగరంలోని విభిన్నమైన ప్రదేశాలని ఎన్నుకుంటాం. ప్లేన్ ఎయిర్ లో నేనింకా ప్రారంభ దశలోనే ఉన్నానని అనాలి. ఇంతవరకూ నాకది ఒక సవాలు లాగే అనిపిస్తోంది.

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

ఇందులో లాభాలేమిటంటే, జీవితం నుంచి దృశ్యాలు చిత్రించవచ్చు. కళ్లెదుట సజీవంగా కనిపిస్తున్నవాటిని పంచేంద్రియాలతోనూ అనుభవిస్తూ చిత్రించగలగటం ఒక అద్భుతమైన అనుభూతి. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక తాజాదనం, సాన్నిహిత్యం అనుభవంలోకి వస్తాయి. అంతే కాకుండా వెలుగు నీడల్లోని రంగులు కళ్ళకి కనిపించినట్టు కెమెరా చూపించలేదు. అందుకే వాటిని ఉన్నదున్నట్టు గమనించటం సాధ్యమౌతుంది.

స్టూడియో పెయింటింగ్ తో పోలిస్తే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక కాలపరిధిలో, అంటే 2-3 గంటల్లో, చిత్రాన్ని ముగించాలి. వెలుగు నీడలు మారిపోతూ ఉంటాయి. అందుకే చిన్న కాన్వాస్ లో చిత్రించవలసి వస్తుంది, వేగంగా చూసిన దృశ్యాన్ని రంగుల్లోకి దింపాలి. ఒక్కోసారి ఔట్ లైన్ లాగ వేసుకుని స్టూడియోలో పూర్తి చెయ్యాలి. అప్పుడు కావాలంటే వాటిని పెద్ద కాన్వాస్ మీద కూడా వేసుకోవచ్చు.

* పెయింటింగ్ లో ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్ నే ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కారణం?

అరుణ: ఇతర మాధ్యమాలతో నేను ఎక్కువగా చిత్రాలు వెయ్యలేదు. ఆయిల్ పెయింట్స్ రంగులు లోతుగా, మెరుగ్గా ఉండి చిత్రాలకి ఎక్కువ అందాన్నిస్తాయని నా నమ్మకం. అందుకే వాటిని వాడటం ఇష్టం.

* మీకిష్టమైన ఆర్టిస్ట్?

అరుణ: నాకిష్టమైన చిత్రకారుల్లో ముఖ్యమైన పేర్లు కొన్ని:  డేగాస్, మోనే , Jaoqine Sorolla, ఐసాక్ లెవితాన్, ఎడ్వర్డ్ హోపర్. వర్తమాన చిత్రకారుల్లో సీడబ్ల్యూ ముండీ, టీ అల్లెన్ లాసన్, డేవిడ్ కర్టిస్, జోన్ రెడ్ మాండ్, జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్.

1 (3)

* మీకు యూరోపియన్ ఆర్ట్ మీద ఇంత మక్కువ కలగడానికి కారణం?

అరుణ: పాశ్చాత్య కళలో ఆసక్తికి  కారణం చిన్నతనంలో ఆ సాహిత్యానికీ, చిత్రకళకీ పరిచయమవటమే. నా పదో ఏట మా అమ్మా, నాన్నా, అక్కచెల్లెళ్ళం  ఇద్దరం, మూడు వారాలు యూరప్ లో పర్యటించాం. అందులో ఒక వారం మొత్తం ఇటలీ లోనే గడిపాం. అప్పుడు ఎన్ని ఆర్ట్ గాలరీలు చూశామో లెక్కలేదు. నాకు తెలీకుండానే దాని ప్రభావం నామీద పడి  ఉండాలి. అలా అన్ని గొప్ప చిత్రాలూ, శిల్పాలూ చూడటం నాకదే మొదటి సారి.

* మీ చదువు , ఉద్యోగం వివరాలు? అమెరికాకి ఎప్పుడు వెళ్లారు?

అరుణ: పన్నెండో క్లాసు వరకు మద్రాస్ లో కాన్వెంట్ లో. డిగ్రీ , పీజీ ఢిల్లీలో. ఎలెక్ట్రానిక్స్ లో మాస్టర్స్ చేసి 1996 లో అమెరికా వెళ్ళాను. 2015 వరకు IT  లో ఉద్యోగం చేశాను.

* అంటే పదేళ్ల పైగా IT రంగంలో పనిచేసి నలభయ్యోపడిలో చిత్రకళాభ్యాసంలోకి ప్రవేశించారు. ఈ నిర్ణయం ఎలా జరిగింది?

అరుణ: కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నాను. కొంత గాప్ తర్వాత 2011 లో మళ్ళీ కేవలం ఒక హాబీ గా చిత్రాలు వెయ్యటం మొదలుపెట్టాను. నా భర్త సలహా మేరకు (అతను అమెరికాలో MS చేశారు) శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లోని  అకాడమీ అఫ్ ఆర్ట్ యూనివర్సిటీ లో MFA  ప్రోగ్రాం కి అప్లై చేశాను. అంతవరకూ హాబీగా వేసిన నా చిత్రాలని వాళ్లకి పంపించాను. వాళ్ళు నా అప్లికేషన్ ని ఆమోదించారు. క్లాసుల్లో మంచి గ్రేడ్లూ, కామెంట్లూ రావటం నాకు  మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఇక ఆ తరవాత ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని చిత్రకళకే కేటాయించాలన్న ప్రేరణ కలిగింది. డిగ్రీలో చదివినది వేరైనా నాకు చిన్నతనం నుంచీ  కళలమీదా, సాహిత్యం మీదా ఎక్కువ అభిరుచి ఉండేది. ఇక జీవితంలో స్థిరపడ్డాక నాకు నా ప్రియమైన చిత్రకళ అభ్యసించేందుకు అవకాశం దొరికింది.

 

* ఒక వ్యక్తిని ప్రేమించడమంటే ఆ వ్యక్తి అభిరుచుల్ని గౌరవించడమంటారు! మీ అభిరుచినే మీ కెరియర్ గా ఎన్నుకోవడం వెనక మీ భర్త పాత్ర?

అరుణ: నా భర్త కూడా నేను చిత్రాలు బాగా వెయ్యాలని ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన చిత్రకళ అభ్యసించి, అందులో ప్రతిభ సాధించి నేను సంతోషించాలని అతని ఆశయం. నేను ఉద్యోగం మానేసి పూర్తి సమయం చిత్రకళకే కేటాయిస్తున్నానంటే, అది అతని ప్రోత్సాహం వల్లే.

* మిమ్మల్ని ఆకట్టుకునే ఇతివృత్తాలు ఎలాంటివి?

అరుణ: నాకు చిత్రకళలో ఆసక్తి కలిగించేవి, వెలుగు నీడలూ, రంగులూ. వస్తువు ఏదైనప్పటికీ దాన్ని  చక్కగా వేస్తే అది చూసేందుకు అందంగానే ఉంటుంది. నామటుకు నాకు మానవ జీవితం గురించి చెప్పే ల్యాండ్ స్కెప్స్, స్టిల్ లైఫ్  చిత్రించటమంటే ఇష్టం.

 

* మీ ఇతర అభిరుచులు? తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?

అరుణ: నాకు చిత్రకళ కాకుండా ఉన్న ఇతర అభిరుచులు, సినిమా, సంగీతం (ముఖ్యంగా సినిమా పాటలు), రకరకాల ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యటం.

2 (2)

* ఎలాంటి అడ్వెంచర్స్ ఇష్ట పడతారు?

అరుణ: కాలేజీలో ఉండగా రాణిఖేత్ లాంటి ప్రాంతాలకి మా లెక్చరర్లతో ట్రెకింగ్ కి వెళ్లాను. రాక్ క్లైమ్బింగ్ కూడా ఒకసారి చేశాను. అలా అరుదైన ప్రదేశాలకి వెళ్ళటం, హైకింగ్, కాంపింగ్ లాంటివి చెయ్యటమంటే సరదా.

* ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిస్టులెవరు?

అరుణ: ప్రస్తుతం నాకు ఎక్కువ నచ్చుతున్నది జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్ వేసే చిత్రాలు. ఆమె చిత్రాలు  నాకు ముఖ్యమైన ప్రేరణ అని చెప్పవచ్చు. వర్తమాన కాలంలో ఇంప్రెషనిస్టిక్ చిత్రాలు వేసే కళాకారిణి. ఆమె చిత్రాలలో బ్రష్ వర్క్ , మరీ స్పష్టంగా ఉండకపోయినా దృఢంగా కనిపించే  కుంచె విన్యాసాలూ, అంచులని చిత్రించే తీరూ, ఎంచుకునే వస్తువూ నాకు చాలా గొప్పగా కనిపిస్తాయి. సామాన్యమైన దృశ్యాలని అద్భుతమైన చిత్రాలుగా తీర్చిదిద్దగల ఆమె నేర్పును నేను చాలా అభిమానిస్తాను.

* పిల్లల్ని చదువులో అద్భుతాలు చెయ్యాలని ఒత్తిడి చేసే తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒక లలిత కళలో ప్రవేశం ఉండేలా శ్రధ్ధ చూపాల్సిన అవసరం ఉందంటారా?

అరుణ: లలిత కళలపట్ల చిన్నతనంలోనే ఆసక్తి కలిగించటం అవసరమని నా నమ్మకం. ఈ పనికి తలిదండ్రులూ, అధ్యాపకులూ పూనుకోవాలి. వీటివల్ల మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవటం, స్పందించే గుణం పెంపొందుతాయి. చిన్నపిల్లలు కళలను సాధించటంలో ఒకవేళ కృతకృత్యులు కాలేకపోయినా, వాళ్లకి వాటిని  పరిచయం చేయటంవల్ల మంచే జరుగుతుంది.

* మీ ఆసక్తి  వెనక మీ తల్లిదండ్రుల పాత్ర ఉందా?

అరుణ: పెరిగి పెద్దవుతున్న వయసులో సాహిత్యం, కళలకి సంబంధించిన పుస్తకాలని చదవమని సలహా ఇచ్చి వాటిని నాకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి  మా అమ్మ. అందుచేత నా అభిరుచుల్ని ప్రోత్సహించటంలోనూ, వాటిని నేను నేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలలోనూ మా అమ్మ  పాత్ర  ముఖ్యమైనది. ప్రస్తుతం మా అమ్మా, నాన్నా ఇద్దరూ నా చిత్రకళ పట్ల ఆసక్తి కనబరచటమే కాకుండా, నా కృషిని  ప్రోత్సహిస్తున్నారు.

Aruna with parents

* మీరిప్పుడు చేస్తున్న కోర్స్ గురించి కొంచెం వివరిస్తారా?

అరుణ: నేను చేస్తున్న ఈ MFA కోర్స్ ఆన్లైన్ లో చేసేందుకు వీలుంది. ప్రపంచంలో ఏమూల ఉన్నవారైనా దీన్ని చెయ్యచ్చు. ఈ కోర్స్ లో నేను నేర్చుకుంటున్న విషయాలు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఒక్కొక్క క్లాసూ క్షుణ్ణంగా, విద్యార్థి నుంచి చాలా ఎదురుచూసేదిగా ఉంటుంది. ఆషామాషీ గా చేసేందుకు వీల్లేదు. ప్రొఫెసర్లు  చిత్రకళ గురించి మంచి పరిజ్ఞానం గలవారు. పరిమాణాలు (standards )చాలా ఉన్నతమైనవి. రాబోయే సెమెస్టర్లలో నా థీసిస్ మీద కేంద్రీకరించి పనిచేయాలి కాబట్టి నేను దానికోసం చాలా అతృతతో ఎదురుచూస్తున్నాను.

*మీ థీసిస్ స్టడీ కోసం ఎలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారు?

అరుణ: నా థీసిస్ స్టడీ ‘ప్రకృతి దృశ్యాలలో వెలుగు తాలూకు సౌందర్యా’న్ని చిత్రాలలో ప్రతిబింబించేట్టు  చెయ్యడం. దీనికోసం బైటికి వెళ్లి  దృశ్యాలని చిత్రించటం (ఫీల్డ్ స్కెచెస్),ప్లేన్ ఎయిర్ స్టడీస్ , స్వయంగా తీసిన ఫోటోల ఆధారంగా చిత్రాలు వెయ్యటం లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ల్యాండ్ స్కేప్ చిత్రాలు వెయ్యటంలో నేర్పుని మరింతగా అర్థం చేసుకుని మెరుగుపరచుకోవాలన్నది నా ఆశయం.

* మీ లక్ష్యం?

అరుణ: ప్రస్తుతం నా లక్ష్యం చిత్రకళ నేర్చుకుంటూ నాకున్న నేర్పును మెరుగుపరచుకోవడం.

ఈ డిగ్రీ పూర్తి చేశాక నాకు చిత్రకారిణిగా కళారంగంలో పేరు సంపాదించుకోవాలని ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం అద్భుతమైన చిత్రకారిణి అయితే సరిపోదు. ఇంకా ఎన్నో విషయాలలో కృషి చెయ్యాల్సి ఉంటుంది. వర్తమాన కళాకారులకి గల అవకాశాలు ఎన్నో, అవి ఎటువంటివో నేనింకా తెలుసుకోవలసి ఉంది, వాటిలో దేన్ని ఎంచుకోవాలో కూడా నిర్ణయించుకోవలసి ఉంది. ఒక చిత్రకారిణిగా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలనీ, గొప్ప చిత్రాలని అద్భుతంగా  చిత్రించాలనీ అనుకుంటున్నాను.

7 (2)

* అనువాదరంగంలో శాంతసుందరి గారు తనదైన ఒక ముద్రని గాఢంగా వేయ గలిగారు. సృజనాత్మక రచనలో మీ తాతగారు కొకు గారి శైలి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చిత్రలేఖనంలో మీరూ అలాంటి విశిష్టతని సాధిస్తారనీ, చిత్రకళా రంగంలో అంతర్జాతీయ వేదిక మీద తెలుగువారికి సమున్నత స్థానాన్ని కల్పిస్తారనీ ఆశిస్తూ ‘సారంగ’ తరఫున అనేక శుభాకాంక్షలు!

 

*****

గాంధారంలో అంతరం

Art: Satya Sufi

Art: Satya Sufi

 

*

మన సౌకర్యం కోసం స్టాఫ్ నొటేషన్ ని మ్యూజికల్ నోట్స్ అనుకుందాం. మనకు అర్ధం కాని గుర్తుల పేర్లు క్రోచెట్లు, క్వేవర్లు… వాటికి ఆ పేర్లుంటాయని కూడా మనకు తెలియదు. అసలు రిషభ్ లాగా గిటార్ వాయించేవాళ్ళు నోట్స్ చూసి… నోట్స్ లో గుర్తులు … తెలుగులో చెప్పాలంటే ‘సింబల్స్’ చూసి వాయిస్తారని కూడా మనలో చాలా మందికి తెలియదు.

రిషభ్ వయసు రెండు డజన్లకి దగ్గరగా ఉంటుంది. ఆ వయసు వాడు, అందులోనూ రిషభ్ లా ఉద్యోగం సద్యోగం లేకుండా సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసేవాడు ఇలాగే సాయంత్రాలు తన ఫ్లాట్లో గిటార్ వాయించుకుంటూ కూర్చోడం మనకి వింతగా తోచకపోవచ్చు. కానీ అమృత వర్షిణి లాంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో సహజీవనం చేసున్నాడని ఎవరైనా మనకి చెప్పారనుకోండి… మనకి వింతగా అనిపించి తీరుతుంది.

కాలింగ్ బెల్ మ్రోగడం మనకి వినిపించింది… ఆ కాలింగ్ బెల్ ట్యూన్ ని అనుకరిస్తూ రిషభ్, తన గిటార్ తీగలు సవరించాలని ఉన్నా, తలుపు తీయడంలో తను చేసిన తాత్సారానికి ఫలశృతిగా పొందిన రసాభినివేశం… అమృతతో ఒక రాత్రి గొడవ పాటి చేస్తుందా అనే తర్కం, తనతో తలుపు తీయించింది. అమృత లోపలికి రాగానే, ఎదురింటి పోర్షన్ గ్రిల్ కి ఆవల ముసలాయన ముఖంపై మూతబడ్డ తలుపు… రిషభ్ పెట్టిన గొళ్ళెంతో మరింత గట్టిగా బిగుసుకుంది. ఆవులింతలు దిగమింగిన గొంతులు కౌగిలింతల పేరుతో ఒక్కటవ్వగా అమృత మెడలో వేలాడుతున్న కంపెనీ ఐడెంటిటీ కార్డ్, ఇరువురి గుండెల మధ్య నలగడంతో మనలోని కొందరు సంస్కారులు తలలు దించుకున్నట్లు నటించారు. నాకు అలాంటి కుసంస్కారాలు లేవు గాక లేవు.

“సాకేత్ దింపాడు” అని అమృత చెప్పే సమాధానాన్ని ఊహించి “ఆఫీస్ నుంచి ఎలా వచ్చావు” అని రిషభ్ అడగలేదు. “రోజూ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎదురింటి ముసలాడితో పడలేకపోతున్నాను” అని మాత్రం చెప్పింది “ఎందుకు విసుగ్గా ఉన్నావు” అని అడిగితే.

“పాపం అతను ఏం చేసాడని… నిన్నేమైనా తిట్టాడా కొట్టాడా… కనీసం నీతో ఒక మాట కూడా మాట్లాడడు” అని రిషభ్ ఏదో చెప్పబోతే “రోజూ గుడ్ల గూబకి బాబులా ఇంతింత కళ్ళేసుకుని చూస్తాడు. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ? మన దేశంలో అమ్మాయిలకి, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికే హక్కు లేదా ? ” అని అమృత వేసిన ప్రశ్నే రిషభ్ కి సమాధానం అవుతుంది.

ఎదురింటి ముసలాడు అమృత మెట్టెలకోసం, పుస్తెల కోసం వెతుకుతూ అవి కనబడకపోయే సరికి… వయసు తెచ్చిన విచ్చలవిడితనం గురించి విచారించి, విశ్వమానవ విశృంఖల వీచికలతో విసిరివేయబడ్డ విచక్షణారాహిత్యానికి వగచి, అణగారిపోతున్న ఆచారాల గురించి  అగ్గగ్గలాడిపోతున్నాడని నిర్ధారణగా ఆమెకు తెలియకపోయినా గిల్టీనెస్ గిల్లిన సెల్ఫ్ కాన్షియస్నెస్ స్పృహ ఆమెలోని ఫెమినిజాన్ని ఫ్లూటు గానంతో నిద్రలేపింది.

“బ్లడీ బగ్గర్… అక్కడికి మనమేదో దోపిడీలూ దొంగతనాలూ చేస్తున్నట్లు… ఒకరంటే ఒకరికి ప్రేమ… పెళ్ళిచేసుకోకుండా కలిసి ఉంటున్నాం… రేపో మాపో మూడొస్తే పెళ్ళి చేసుకుంటాం. అదేదో పెద్ద నేరమైనట్లు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వీడి విజిలెన్స్ ఏమిటో ! “

“ఇలాంటి వాళ్ళందరూ ఇంటిగ్ర్రేషన్ టెస్ట్ లో మిస్ అయ్యి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లో దొరికిన డిఫెక్ట్స్ లాంటి వాళ్ళు. ఫ్రీకింగ్ *****(ఇక్కడ వ్రాయలేని ఇంగ్లీష్ బూతేదో ఆమె వాడితే.. ప్రహ్లాజుడి పాత్ర పోషించాల్సి వచ్చింది). ఇలాంటి వాళ్ళు, ఎప్పుడెప్పుడు మనలాంటి లవర్స్ గొడవపడతామా అని చూస్తుంటారు. ఒకవేళ గొడవపడి విడిపోతే భారతీయ వివాహ వ్యవస్థలోని దృఢత్వాన్ని అంభుజా సిమెంట్ తో సరిపోల్చి సనాతన సాంప్రదాయాలకి సాగిలపడతారు ” అని అమృత అంది. ఆమె వాడే ఆస్కారంలేదని మనం భావించిన తెలుగు పదాలు రచయిత ఖాతాలో వేసుకుని ముందుకెళ్ళాం.

Kadha-Saranga-2-300x268

“నేను కూడా రెండు మూడు సార్లు పీప్ హోల్ లోనుంచి చూసాను అమ్మూ… రోజూ సాయంత్రాలు మన డోర్ దగ్గరే చెవి పెట్టి వింటున్నాడు”.

“దట్సిట్… నేను చెప్పలే ! మనం గొడవ పడ్డం వాడికి కావాలి… విడిపోవడం కావాలి… ‘ఇవన్నీ మారోజుల్లో ఉండేవా ? ఏటికి ఎదురీదితే ఎవరికైనా ఇదే గతి ‘ అని తన ఏజ్ గ్రూప్ గయ్స్ తో గడిపే మార్నింగ్ వాక్స్ లో సాగదియ్యాలంటే మషాలా కావాలి” అని అమృత అంటే అది మనలో కొంతమందికి సబబుగానే తోచింది.

“అయితే.. వాళ్ళకి కావాల్సిన మషాలా మనమే ఇద్దాం అమ్మూ”

“ఏం మాట్లాడుతున్నావ్ రిషభ్… వాళ్ళకోసం మనం గొడవ పడతామా”

“గొడవ పడం బేబీ… పడినట్లు నటిస్తాం… వాడు అది నిజమని నమ్మి అందరితో చెప్తాడు. అప్పుడు ప్లాట్స్ లో అందరూ మన వైపు జాలిగా చూస్తే ఇంతమందిని ఫూల్స్ చెయ్యగలిగామని మనలో మనమే నవ్వుకోవచ్చు”

“వావ్ డూడూ… ఇలాంటి ప్రాంక్స్ ఫన్నీ గా ఉంటాయి. రోజూ ఆఫీస్ నుంచి వచ్చే సరికి ఇలాంటి గేం ఏదో ఉంటే నేను కూడా రిలాక్స్ అవుతా” అంది అమృత.

“యా… ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ కొత్తగా ఉంటుంది. రోజూ ఫేస్బుక్, ఎక్స్-బాక్స్ బోర్” అని కోరస్ గిటార్ మ్రోగించాడు రిషభ్.

 

  తరువాతి రోజు

 

అమృత ఆఫీస్ నుంచి రాగానే రిషభ్ తలుపు తీసాడు.

“తలుపు తీయడానికి ఇంత సేపు ఏంటి   ?” అంటూ వరండాలో ఉన్న ముసలాయన్ని చూడమన్నట్లు కళ్ళతోనే సైగ చేసేసరికి..వరండాలో వాలు కుర్చీలో కూర్చుని ఏదో చదువుతున్నట్లు నటిస్తున్న ముసలాయన్ని రిషభ్ తో పాటు మనం కూడా గమనించాం. అమృత లోపలకి రాగానే రిషభ్ ఎప్పటిలా తలుపు వేసి గొల్లెం పెట్టాడు.

“వాడు బయిటే ఉన్నాడు… లెట్స్ స్టార్ట్ ” అని గుసగుసమన్నారిద్దరూ. రిషభ్ గిటార్ తీసి వాయించడం మొదలుపెట్టాడు.

“అబ్బా… కాసేపు ఆ గోల ఆపు రిషభ్” అమృత ముఖం నవ్వుతున్నా గొంతు అరుస్తుంది.

“గోలా ? ఇదేంటో తెలుసా ? మ్యూజిక్… ఏ స్కేలో తెలుసా ?” రిషభ్ కూడా కోప్పడ్డట్లు అంటున్నా… ముఖంలో ఆనందపు అవశేషాలు.

“ఏ స్కేల్.. నట్రాజ్ స్కేల్ ఆ( ” వెటకారంగా అని ఎదురింటి ముసలాయనకి వినబడనంత జాగ్రత్తగా నవ్వింది.

“నీకు అంతకన్న ఏం తెలుసు లే… ఇది సీ షార్ప్ స్కేల్” ఉత్తుత్తి గొడవని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం మనం.

“అబ్బా చా… నీకు ‘సీ షార్ప్ ’ స్కేల్ గురించి తెలిస్తే నాకు సీ షార్ప్ డాట్ నెట్ గురించి తెలుసు. నీ సీ షార్ప్ వల్ల రూపాయి రాలదు. కానీ నా సీ షార్ప్ నెలకు నలభై వేలు తెచ్చిపెడుతుంది. అది మర్చిపోకు” అని అమృత అన్నప్పుడు … ఇంత కేజువల్ గొడవలో కూడా అతను నొచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

అది ఆమె గమనింపులోకి వచ్చి అతడి మూడ్ మార్చే ముద్దేదో ముఖాన విసిరికొట్టాలన్న తలంపుతో అసిమెట్రిక్ గా అతుక్కున్న ఆమె అధరాల ఐక్యతలో లోపించిన ఖాళీలు పూరించే దన్ను కోసం దాపెట్టిన దంతాల సౌజన్యంతో జనియించిన చుంబన సంరంభమారంభమైన కొద్ది క్షణాల్లోనే అహాలను పరస్పరం స్ఖలించుకుని ఇహాలలో గుణుస్తున్నకలహభావ ప్రాప్తికి చేరుకున్నారిద్దరూ.

 

ఇందాకటి “తరువాతి రోజు”కి మరుసటిరోజు

 

“ఎలా వచ్చావ్ అమ్మూ” ఉత్తుత్తి గొడవకి కొబ్బరి కాయ కొట్టిన రిషభ్ కి అది ఉత్తుత్తి గొడవ అన్న స్పృహ లేదు.

“సాకేత్ దింపాడు” తాము పడుతున్నది ఉత్తుత్తి గొడవన్న భ్రమలో నవ్వింది.

“ఇంక ఆఫీస్ బస్ కి ఫీజ్ కట్టడం ఎందుకు దండగ. ఈ సాకేత్ గాడి ఓలా క్యాబ్లో పోతే పోలా !” నిన్నటి సరదా లేదు రిషభ్ లో.

“ఏం అంటున్నావో స్ట్రైట్ గా చెప్పు” అంతవరకు గొంతులో మాత్రం దాగిన కోపం ఆమె ముఖంలో నవ్వుని భర్తీ చేసింది.

“చెప్పేదేముంది.. నెలకో మూడు వేలు కడుతున్నందుకైనా ఆఫీస్ బస్ లో రాలేవా ? రోజూ ఆ సాకేత్ గాడే దింపాలా”

“ఏం… సాకేత్ నన్ను దింపకూడదా ? ”

“ఒక్క రోజో రెండు రోజులో అయితే ఒ.కె. కానీ రోజూ వాడి కార్ లోనే రావాలా ” నాయనా రిషభ్… నువ్వు గేం రూల్స్ మర్చిపోయినట్లున్నావురా… ఇది నిజం గొడవ కాదురా… ఉత్తుత్తి గొడవ.

“సరే.. రేపట్నుంచి వాడి కార్లో రాను. రోజూ నీ బెంజ్ కార్లో నన్ను ఆఫీస్ నుంచి పిక్ అప్ చేసుకో” ఏంటమ్మా అమృత నువ్వు కూడా… ఇది గేం , నిజం గొడవ కాదంటే వినిపించుకోరేం ?

“కొంటాను.. బెంజ్ ఏం ఖర్మ బుగట్టీ కొంటాను… నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ రానీ” రిషభ్ ఎర్రగా మారి కోపంతో ఊగిపోవడం మనం గమనించి ఏమౌతుందా అని ఆతృతపడ్డాం.

“హా హా హా” ఆమె నవ్వింది. అది మామూలు నవ్వు కాదు… కారపు వెటకారపు కలగలుపు. ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్ట హాసమూ..

అమృత ఇంకా నవ్వుతూనే ఉంది…తరతరాల సాగరాల నిక్షిప్త ముత్యాల తరళ పాతరల దొంతరలుగా …”హా హా హా”… రెడీ… ఒన్… టూ… త్రీ… “ఫట్”… అమృత చంప పగిలింది.

థ్రీ.. టూ.. ఒన్.. “ఫట్” మని రిషభ్ చంప కూడా పగిలిందని వ్రాయకపోతే మనలో ఫెమినిస్టులు ఒప్పుకుంటారా ?

“నన్నే కొడతావా ? నువ్వేమైనా నా మొగుడివనుకున్నావా ?” మొగుడైతే కొట్టొచ్చా ? నోట్ దిస్ పాయింట్ యువరానర్.

“…”

“ఇంకొక్క నిమిషం కూడా నీతో ఉండను ” అని విసురుగా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటున్న అమృతని ఆపే ప్రయత్నం నాతో సహా మనలో ఎవ్వరమూ చెయ్యలేదు. తీరం దాటుతున్న తుఫానుని పట్టుకుని ఆపే సాహసం చేసేదెవరు ?

**************

కొన్ని రోజుల ఒంటరితనం నేర్పిన ఏకాకి రాగాలు నెమరేసుకుంటూ రిషభ్.. గిటార్ ముట్టుకోవడం మానేసాడు. వాయించమని మనమూ చెప్పలేదు. ఆ రోజు లిఫ్ట్ దగ్గర ముసలాయన ఎదురయ్యేదాకా…

“ఏమయ్యా.. మీ ఇంట్లో గిటార్ వాయించేది నువ్వా… ఆ పిల్లా ?” అడిగాడు ముసలాయన.

“…”

“ఆ పిల్లే అయ్యుంటుంది.. ఆ అమ్మాయి కనబడ్డం మానేసిన దగ్గర నుంచి గిటార్ మ్యూజిక్ వినబడడం లేదు. సల్వార్ కమీజ్ వేసుకున్న సరస్వతీదేవి అనుకో… ఎక్కడికి వెళ్ళింది ? మళ్ళీ ఎప్పుడొస్తుంది ?”

“…”

“ఆ అమ్మాయిలాగా నీకు కూడా గిటార్ వాయించడం వచ్చా ?”

“…”

ముసలాయన అడిగే ప్రశ్నలకి రిషభ్ కి సమాధానాలు చెప్పాలని ఉన్నా… సమకాలీన కధల క్లైమేక్సుల్లో ముసలాళ్ళని కెలికితే వినవలసివచ్చే నాలుగు పేరాగ్రాఫుల సోది యొక్క సమ్మెట పోటు సలుపు ఎలా ఉంటుందోనన్న ఎరుక తెచ్చిన భయం… రిషభ్ వహించిన మూడు చుక్కల మౌనం.

“నీకు తెలుసో లేదో, నాకు గిటార్ అంటే చాలా ఇష్టం.. శాస్త్రీయ సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. రోజూ గిటార్ వినడానికే మీ ఇంటి ముందు వరండాలో మీకు తెలియకుండా తచ్చాడేవాడ్ని. ఈ మధ్య మీరు వాయించడం మానేసిన దగ్గర నుంచి నా సాయంత్రాల్లో ఏదో వెలితి. మళ్ళీ రేపట్నుంచి వాయించమని ఆ పిల్ల రాగానే చెప్పవా ప్లీజ్” అనేసి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి “అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.. మొన్నామధ్యన ఎప్పుడో పాత ఘర్షణ సినిమాలోని “కురిసేను విరిజల్లులే…ఒకటయ్యేను ఇరుచూపులే” పాట గిటార్ మీద వాయిస్తున్నప్పుడు “అంతర గాంధారం”, రిషభంలా వినిపించింది. ఆ పాట ‘అమృత వర్షిణి ‘ రాగంలో ఉంది. ‘అమృత వర్షిణిలో  రిషభం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి” … మనం గుర్తుపెట్టుకున్నాం…’ అమృత వర్షిణి ‘ లో ‘రిషభం ‘ ఉండదని… మనతో పాటే రిషభ్ కూడా..

***

 

 

మంచు తడి ఆరని పారిజాతాలు!!

 Naa_Smruti_Pathamlo._1024x1024

ఆ మధ్య  అఫ్సర్ గారు  ఒక  సందర్భంలో   ఆచంట జానకిరాం గారి “నా స్మృతి పథంలో…సాగుతున్న యాత్ర”  పుస్తకాన్ని  గురించి  విశేషంగా ప్రస్తావించారు,  వెంటనే ఆ  పుస్తకం  చదివి  తీరాలని   అనిపించేంతగా!

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది.

“ఇవిగో! ఇంకా నిద్ర లేవని

మంచు తడి ఆరని, పారిజాతాలు!!

ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;

ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ

ఈ పరిమళము మన స్నేహసౌరభము!

అందుకోవూ..”

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది.

ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం – పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు:

 

” నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ

గవాక్షమందుండి యొక్క తారకామణి

మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు..”

 

“నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు

మమతతో కూయుచు మునిమాపువేళ

గువ్వతల్లియు తన గూడు చేరునపుడు

సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు

నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను

బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు

దూరమున దీపించు నా దివ్యతార

ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు”

 

” ” I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love..””  – ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, “మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?” అని అడిగారట శర్మ గారు.

“అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది.” అన్నారు ఆచంట.

“అల్లాగా ? ఈ పద్యం విన్నారా?” అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

“కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్”

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

“హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.” అని గుర్తు చేసుకుంటారు ఆచంట.

“చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక…” అంటూ మొదలయ్యే మరో పద్యంలో, “ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్” అంటాడు కవి.  ఇందులో మొదట చక్కెర బొమ్మ వినగానే, మగధీర చిత్రంలో, “పంచదారా బొమ్మా బొమ్మా” అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా:

“ఒకనాడు బుచ్చిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : ” మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో.”

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు.

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

“రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది” అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు.

” నువ్వూ నేనూ కలి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా

నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా” అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, “మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల” అన్న దేవులపల్లి గీతాలనైనా, “కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?” అన్న బసవరాజు గేయాన్నైనా,  “వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను” అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, ” గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!” అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న “చేతులార శృంగారము చేసి చూతు” నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

 

“ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది

మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది

లలితసుందర దివ్య లావణ్య నవజీవ

మధుమాస సుధలలో  హృదయమే పొంగినది”

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు.

బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, “ఎముకలు కుళ్ళిన” అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.

ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

“అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో

పాల్గొనమని నన్ను ఆహ్వానించావు

నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!

ఆనంద గీతము చెవులారా విన్నాను.

ఈ మహోత్సవములో నా వాద్యమును

నా చేతనైనంత అందంగా వినిపించాను..”

*

 

నేను యిరోంని!

arya

డాక్టర్  కర్మానంద్ ఆర్య అనే యీ యువకవి బీహార్ లోని గయలో నివసిస్తున్నాడు. దక్షిణ బీహార్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు.యితని కవితలు ప్రముఖ హిందీ సాహిత్యపత్రికలలో ప్రచురింపబడ్డాయి. త్వరలోనే తన మొదటి సంకలనం బోధి ప్రకాషన్, జైపూర్ వారు ప్రచురించనున్నారు.

“నీ దిగులు నా కవిత్వం సాధించిన అపజయమ”నే యీ కవి అడవి చరిత్రను కొత్తగా లిఖించే ప్రయత్నం కవితల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే మోచీనీ చూసి దుఖిస్తాడు. నదుల్లోని చేపల ప్రాణాన్ని యెంత గణిస్తాడో, విద్యా,ప్రజాస్వామిక వ్యవస్థలలోని అసమానతలను ఖండిస్తాడు. వొకటి చూస్తే మరొకటి కనిపించే అడవిపుత్రుల దుఖాన్ని చూసి కవితై ప్రవహిస్తాడు. చరిత్రలేని అడవిని గొంతెత్తి పాడుతాడు. తనను తాను వెతుక్కునే ప్రయత్నంలో వో ప్రత్యేక అస్తిత్వం కోసం చేసే కృషి కనిపిస్తుంది. విపరీతమైన ఆర్తి ఆవేశాలు యితని కవిత్వంలో మెండు.
యిరోమ్ షర్మిలా గురించి దాదాపు భారతదేశపు అన్ని భాషల్లో కవితలు లిఖింపబడిన కర్మానంద్ రాసిన యీ కవిత పాఠకులను కదిలిస్తుంది.

మృత్యువు అర్థాన్ని గ్రహించిన షర్మిలా కోసం యీ కవిత..

Irom-Sharmila-t40807

షర్మిలా యిరోమ్
———————–

నేను పోరాడుతున్నాను
మనుషులు పోరాడడం ఆపేసారు
వొక కలకు,వొక వొడంబడికకు వ్యతిరేకంగా
యేమౌతుంది?
గుర్రపు డెక్కల శబ్దం కంటే భయంకరంగా
యిప్పుడు నా గొంతు పదునెక్కి హెచ్చింది

నాకు జీవితమంటే  ప్రేమ యెక్కువే
నాకు చావు విలువ తెలుసు
అందుకే పోరాడున్నాను
గాయపడ్డ వేటగాడు నేర్పరి
అందుకే పోరాడుతున్నాను
నా పిల్లల నోళ్ళల్లో నా స్థన్యం వుంది
నన్ను నలువైపులా చుట్టుముట్టేసారు
పోరాడుతూనే వున్నాను

వేటగాడికి నా దంతాలు,నా గోళ్ళు, నా  అస్థికలు కావాలి.
నా సాంస్కృతిక ధనస్సు,బాణాలును
మార్కెట్టు లో అన్నింటి విలువలు
నిర్ణయింపబడ్డాయి
నా నల్లమందు మట్టి కూడా అమ్ముడైంది
నాకు నా దేశంలోనే నిర్వాసిత శిక్ష. విధింపబడింది
నేను నా దేశాన్ని వెతుక్కుంటున్నాను
డిల్లీ వీధులలో ఫిర్యాదులతో
తిరుగుతున్నప్పుడు
నా దేశం యేదని అడిగారు
నేను వారి చేరికకు లోపలే వున్నానని
నన్ను అంగీకరిస్తారు

వారు యెక్కడ కోరుకుంటే
అక్కడ జెండా పాతేస్తారు
మా పచ్చని దేహాలను పిసకడం
యీ వేటగాళ్ళను మోహింపచేయును
కామ పురుషులకు విరిగిన మా
యెముకలు కనిపించవు
సైనికుల చప్పుళ్లతో మా నిద్దుర
ముక్కలౌతుంది
వారు మమ్మల్ని వేశ్యలుగా భావించారు
మా పనులు చూస్తే వారికి అసహ్యం కలగదు
మమ్మల్ని చెరపడమే వారికి యిష్టం
వాడి అల్ప ప్రతిక్రియలలో నేను వోడిపోతానని ఆలోచిస్తాడు

గాయపడ్డ వేటగాళ్ళారా రండి చూడండి
నీ కోరిక కంటే యెతైన కఠినమైన నా వక్షోజాలను
నీవు నా స్తనాలను తాగాలనుకొన్నావు కదూ
రా వుప్పుతో విషంతో కలిసిన నా
నెత్తురును రుచి చూడూ!
రా చూడు! బూడిదను వెచ్చగా వుంచే రాతిరి నాలో ప్రాణాలతో వుంది

బ్రహ్మపుత్ర యెలా నవ్వుతుందో చూడూ
వితస్తా నన్నెలా కాపలా కాస్తుందో చూడూ
మా పగుళ్ళలో నుంచి ప్రవహిస్తన్న సిరా
యెంత యెర్రగా మత్తును యిస్తుందో వుందో చూడు
నేను మళ్ళీ పుట్టనని అనుకోకు
నేను నా తరాల్లో స్థిరంగా వున్నాను
నేను యిరోంని
యిరోమ్ షర్మిలా చాను

*

జ్ఞాపకాలనిండా బేషరం ప్రేమే!

 

saif

1
కాలక్షేపానికి వచ్చిపోతుంటారు
బేషరం చాలా మంది ఈ భూమ్మీదకు  5 <3
2
ఎంత ఎండని అయినా ఎప్పుడైనా లెక్క చేశామా బేషరం
ఆ ఐసు ఫ్రూట్ బండి కోసం చెప్పుల్లేకుండా పరిగేత్తాం కదా 5 <3
3
బాధని మర్చిపోవడానికి మగాడు తాగుతాడంట
బేషరం లోలోనే కన్నీళ్ళు తాగే స్త్రీల సంగతేంటొ మరి  5  <3
4
పసిపిల్లలు అద్దం లో చూసుకుంటూ ఖుషిగా ఉంటారు
బేషరం వయసు పెరిగాక అద్దం సాహిత్యం అవుతుంది   5  <3
5
అద్భుత మైన కవితల పుస్తకాలు ఫుట్పాత్ల మీద
 పెళ్ళి కూడా ఒకప్రచురణ లాంటిదే  బేషరం 5  <3
6
కవులు చాలా సాదా సీదా గా కనిపిస్తుంటారు
బేషరం రహస్యమయ లోకాలకు చక్రవర్తులు 5  <3
7
కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు బేషరం
 నీకు దొరకాల్సిన వెలుతురు వెన్నెల నీవద్దకు వచ్చేస్తాయ్ ఓపిక కాస్త 5 <3
8
మనుషుల మధ్యన దూరం పెరిగిపోతుందంట బేషరం
బెడ్రూముల్లోనే అసలు దూరాలు పెరుగుతున్న విషయం ? 5 <3
9
ఆశలు పెంచుకోకపోతే ఎలా బేషరం
కనీసం కుండీలో పెంచే మొక్కకు ఒక పువ్వుపూస్తుందని 5 <3
10.
ఎవరు అదృష్టవంతులు అంటే ఏం చేప్పను
జ్ఞాపకాలనిండా బేషరం ప్రేమే ఉన్నవారే కదా 5<3
*

స్వాతంత్ర ఫలాలు!

 

Indian Flag 3

ప్రధాన అమాత్యుల వారికి..

ప్రణామములు!

భారత దేశానికి డబ్బైవ స్వాతంత్ర్య దినోత్సవం! ఈ సందర్భంగా “స్వాతంత్ర్య ఫలాలు ప్రతి వొక్కరికి అందాలి..!” అన్న మీ పిలుపు జాతికి మేలు కొలుపు! స్వాతంత్ర్య ఫలాలు అందుకున్న భారతీయ మణి మకుటములైన వారి సందేశాలను సంక్షిప్తంగా మీకు కొన్ని సమర్పించుకొనుచున్నాము!

***

“విదేశాల్లో నల్ల ధనాన్ని మేం దాచుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“విదేశాలలో నుండి నల్ల ధనాన్ని రప్పిస్తాం.. తెప్పిస్తాం..’ అని పదే పదే మీరు ప్రకటించినగాని- ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోవడం, తప్పనిసరి వొత్తిళ్ళలో కొందరిని మొక్కుబడిగా యిబ్బంది పెట్టినగాని- మా యెవ్వరి పేర్లూ ప్రకటించనందుకు.. బయటపెట్టకుండా గోప్యత పాటించినందుకు.. మీకూ మీ మంత్రివర్గానికి పేరు పేరునా కృతజ్ఞతలు..!”

యిట్లు

నల్లకుబేరులు.

***

“మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మా వ్యాపారాలు మేము చేసుకోనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు! మా వృద్ధిని ప్రజల అభివృద్ధిగా మీరు అభివర్ణించిన తీరు మిక్కిలి ఆనంద దాయకము మరియు శుభకరము!

“మీ ప్రజలకు రాయితీల్లో కోతలు విధించుకుంటూ వొచ్చినా గాని- ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’తో మమ్మల్ని ప్రోత్సహించి రాయితీలు కల్పిస్తున్నందుకు మీకు మా ధన్యవాదములు.!”

యిట్లు

విదేశీ బిజినెస్ మేగ్నెట్స్.

***

“ఉల్లి నుండి కందిపప్పు వరకు..

మినప్పప్పు నుండి మిరప వరకు..

అన్నిటా మార్కెట్టును బ్లాక్ చేసి.. అధికరేట్లతో అమ్ముకొని.. మేం వ్యాపారం చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“మా వ్యాపారాలే కాదు, మీ వ్యాపారాలూ బావుండాలని కోరుకుంటున్నాము!”

యిట్లు

స్వదేశీ వ్యాపారస్తులు.

***

“ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్య..

అన్ని విద్యా విభాగాల నుండి మీరు తప్పుకొంటూ మా ప్రవేటు వాళ్ళకి అప్పగించడమే కాక, నచ్చినంత ఫీజులు మేము వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

విద్యాసంస్థల నిర్వాహకులు.

***

 

“ప్రతి పౌరుడిని రోగిగా గుర్తించి అందించే మా వైద్యానికిగాను  మాకు నచ్చినంత ఫీజు వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“ప్రభుత్వ వైద్య రంగాన్ని రోగగ్రస్తము చేసి యేకంగా పడక యెక్కించి.. మీరు సేవా విభాగాలనుండి తప్పుకొని.. ఆ బాధ్యతను మా భుజస్కంధాలపై వుంచడమే కాక వైద్యము లాభసాటి వ్యాపారముగా మించి వొక పరిశ్రమగా అభివృద్ధి చేసుకొనే వెసులుబాటు కల్పించినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు!”

యిట్లు

ప్రవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.

***

“దళితులమీద దాడులు చేసే ఆధిపత్య స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“తోలు కనిపిస్తే దళితుల తోలు తీసే హక్కునూ.. మాంసము కనిపిస్తే దళితులను మాంసము కొట్టే అధికారమునూ మాకు సంక్రమింపజేసిన మీ పాలన పదికాలాలు వుండాలని కోరుకుంటున్నాము!”

“గోవును నువ్వు రక్షించు! గోవు నిన్ను రక్షిస్తుంది!”

“గోరక్షణే మానవ రక్షణ!”

యిట్లు

గో రక్షక దళం మరియు అగ్రకుల హిందూ ధర్మ పరిరక్షకులు.

***

“మానవ వనరులను బహు చవుకగా వినియోగించుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

“చైల్డ్ లేబర్ కారు చవగ్గా దొరకడం బహు ఆనందనీయమూ మరియు అభినందనీయమూ!”

యిట్లు

పారిశ్రామిక వేత్తలు.

***

“మహిళలను అత్యాచారం చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“నిర్భయ లాంటి కేసులనేకం దేశమంతా తలెత్తడం.. అయినా తగు చర్యలు తీసుకోకుండా జరిగినప్పుడు మాత్రము హడావిడి చేసి మమ్ములను విచ్చలవిడిగా వదిలేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము!”

యిట్లు

పురుష పుంగవులు.

***

“విమెన్ ట్రాఫికింగ్ ను కూడా ‘యెగుమతి’ వనరుగా గుర్తించి మా పనులు మేము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

బ్రోకర్ల ముఠా.

***

”మాదక ద్రవ్యాల సరఫరా మరియు అమ్మకము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

మాఫియా ముఠా.

***

“ఓడిన పార్టీలో కొనసాగకుండా-

పోటీచేసిన పార్టీకి రాజీనామా చెయ్యకుండా-

అధికార పార్టీలోకి జంప్ చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

జిలానీ ఎమ్మెల్యేలు.

***

“మీ వోటును మీరే శ్రమపడి వెయ్యకుండా మేము వేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

పార్టీ కార్యకర్తలు!

***

నోట్:

తమ తమ స్వాతంత్ర్యాలను.. తమకు దక్కిన స్వాతంత్ర్య ఫలాలను గుర్తు చేసుకుంటూ యిలా యెన్నో యెన్నెన్నో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలు మన కోటప్రాసాదాలకు లెక్కకు మిక్కిలిగా వచ్చినవి! కొన్ని ఉత్తరాలను మచ్చుకి మీ దృష్టికి తెస్తూ తమ పరిశీలనార్థం జతపరచడమైనది!

మళ్ళీ స్వాతంత్ర్య దినోత్సవానికి చూసుకుందాంలే అని మిగతా వుత్తరాలను సమయ స్థలాభావాల వల్ల పక్కకు పెట్టడం జరిగినది!

కృతజ్ఞతలు!

యిట్లు

తమ వ్యక్తిగత సహాయక కార్యదర్శి

 

వాడే నయం…….

 

painting: Rafi Haque

painting: Rafi Haque

*

 

అప్పటి గాంధోళీగాడే నయం

తోలుబొమ్మలాట…. ఉత్త ఆటే గాదు

గుమ్మిల కొద్ది ధైర్యం నూరి పోసే రోలు

చందమామ మామ కాకున్నా

పొన్నచెట్టు  ఉన్నా లేకున్నా

అమ్మమ్మలు చెప్పిన బొడ్డుమల్లె పందిరి

మాయల ఫకీర్ బాలనాగమ్మను బాధపెట్టినా

బాలవర్థి రాజు చిలక ప్రాణం తీసినా

ఎవరికి వారే సాటి

ఎవరికి వారే పోటీ

మూల్గుకుంట కథలినేటోళ్లకు

అంతా ధైర్యం నింపిన వారే

కాంభోజ రాజుల కయ్యాలు

రాణుల కష్టనష్టాలు

మనకు సంబంధం లేక పోయినా

ఇంటుంటే మనుసు కరిగేది

కష్టాలను ఇసిరి కొట్టాలని నేర్పేది

ఆ కథలే…….

బడి బయటి చదువు

బత్కనేర్పేది….

కథలంటే నిద్రపుచ్చే మాత్రలే కాదు

జీవితాన్ని నిలబెట్టే పాత్రలు కూడా

ఒలపటి దాపటి ఎద్దుల జత ఉన్నా లేకున్నా

వాటి జతకాడు పట్నంలో అడ్డా కూలి అయినా

బతికి సాధించనే తత్వం నేర్పే యూనివర్సిటీ

ఆ కథలే కదూ……..

నీతి, నైతికత రూచి చూపించిన

నేతి ధారలే కదూ అవి….

కాలం మారింది

కథా మారింది… దాని తీరూ మారింది

మార్పు మంచికే

కానీ… ఈ డిస్కవరీలో యుగంలో

ఆన్ లైన్ గేమ్ లతో డ్యామేజీ అవుతూ

చిన్నతెరకు అతుక్కున్నదీ తరం

ముసలి వారి ముచ్చట్లను కాదన్నందుకు

రొక్కం వొదిలించుకునే దు:ఖమే వాటి నిండా

లోపలిది బయట ధరించే స్పైడర్ మ్యాన్ కంటే

సెల్యూలాయిడ్ లో చెలరేగే ఫాంటసీ బొమ్మల కంటే

అయిందానికి… కానీ దానికీ జడుసుకునే

ఈ తరాని కంటే

టోటల్ గా…..ఈ గడబిడల గత్తర  కంటే

ఆ… గాంధోళీగాడే  నయం.

 

( గాంధోళీగాడు-తోలుబొమ్మలాటలో హాస్యకాడు.)

 

 

 

 

దిక్సూచిలా …

గోడంత అద్దంబు గుండెలకు వెలుగు

mandira2

Art: Mandira Bhaduri

 *
అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ

అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా?

ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦

అదేపనిగానో , అప్పుడప్పుడో

అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా

నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ

ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను

ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది ?

అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ

వంద మయసభలు కట్టుకోవచ్చు

అద్దంతో నా అనుబంధం ఇవాళ్టిది కాదు

నీమొహంలా వున్నావు – అని ఎవరు కుండ బద్దలు కొట్టినా

అద్దంముందు వొలికిపోవడ౦ తప్ప గత్యంతరం లేదు

అయినా నామొహం నామొహం లానే వుండిపొతే

ఇంత లావు సౌందర్య శాస్త్రమూ చిత్తుకాయితమే కదా

అద్దం పుట్టని రోజుల్లో అందగత్తెలంతా

జీవితాంతమూ సౌందర్య భ్రాంతిలోనే వుండేవారేమొ తెలీదు

భ్రమలు దిగ్భ్రమలవడ౦ కొసమే అయినట్టు

ఇపుడిక్కడ ఇంటికున్న ప్రతి నాలుగో గోడా అద్దమే

సూటిగా చెప్పాలంటే యవ్వనం వున్నప్పుడు అద్దం లేదు

అద్దం అమిరాక యవ్వనం లేదు

అద్దాలన్నీ యవ్వనం కోసమే అయితే

మిగిలిన వనాల మాటేమిటి ?

అద్దాన్ని నమ్ముకున్నవాళ్లు

ఒక యుద్దాన్ని కూడా చేస్తుంటారు

ఏమిటా యుద్దం ?

ఇటువైపు ఒక బింబం వుంటుంది

అటువైపు ప్రతిబింబం వుంటుంది

బింబానికి అబద్ధాలతో మోసపోవడం ఇష్టం

ప్రతిబింబానికి మసి పూసుకుని ఎదురవడ౦ వేడుక

బింబ ప్రతిబింబాల ఘర్షణలో మధ్య నేను నలిగిపోకుండా

అద్దమే నా ఫేస్ ని ప్యాక్ చేసి రక్షణ ఇస్తుంది

ఇన్నివిధాల ఆదుకున్న మమతల కోవెల లాంటి

నా మురిపాల అద్దం ఈ మధ్య ఎందుకో కళ్లలో నిప్పులు పోసుకుంటోంది

నిజమ౦టే నిప్పే కదా

ఇప్పుడు దాని సెగకి దూరంగా కూడా నుంచోలేక పోతున్నాను

చూస్తూ చూస్తూ నిప్పుని కొంగున ముడేసుకుంటామా చెప్పండి

నిన్నటికి నిన్న ఒక నడివయసు నాంచారమ్మ

కళ్లు రిక్కించి నావంకే చూస్తో౦ది

నాంచారమ్మా నాంచారమ్మా నువ్వెవరమ్మా అ౦టే

నాపేరు చెప్పింది చూడు

అబ్బే ,లాభంలేదు అద్దానికి మతి పోయినట్టుంది

ఆస్పత్రిలో పడెయ్యాలి

అద్దం అన్నాక అది బద్ద లయ్యేలోపు

ఒక నిజాన్ని వాంతి చేసి పోతుందని తెలుసులే కాని

కడుపులో మరీ ఇంత కుట్ర దాచుకు౦దనుకోలేదు

ఇప్పుడీ నాంచారమ్మ దేహ సమాధిలో

ఒక రెండు జెళ్ల సీత వుందా లేదా?

*