And, life goes on…!

abbas1

And Life Goes on …

ఈ నిజాన్నే, ఈ ప్రకృతి సూత్రాన్నే అనుసరిస్తూ గౌరవిస్తూ సినిమాలు తీశాడు అబ్బాస్ కియరోస్తమీ.

కియరోస్తమీ టెహరాన్ లో 1940 లో పుట్టాడు. సత్యజిత్ రాయ్ లాగే గీతల బొమ్మలు వేశాడు.  ఫోటోగ్రఫీ,  గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేశాడు. పర్షియన్ కవిత్వం చదువుకుని సున్నితత్వాన్ని పెంచుకుని చూపుని విశాలం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసి అకిరా కురసోవా లాంటి మహామహుల్ని ఆకట్టుకున్నాడు.  కియరోస్తమీ సినిమాలు చూస్తూ ఆ ప్రపంచంలో గడిపిన కాసేపూ తనలో క్షాళన జరుగుతుందంటాడు మార్టిన్ స్కోర్సేస్సీ. ఆయన అందించే  కళాత్మక స్ఫూర్తి ప్రపంచాన్ని ఒక కొత్త తాజా చూపుతో ఆశగా చూసేలా చేస్తుందంటాడు స్కోర్సేస్సీ.

తను పుట్టిన నేలమీద ఆడుకునే పిల్లలనీ, వాళ్ళకి సుద్దులు నేర్పే పెద్దలనీ, పనిపాటలు చేసుకునేవాళ్ళనీ అలవోకగా పలకరిస్తూ అతిసాధారణంగా ఒక డాక్యుమెంటరీలా సినిమాని తీసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది కియరోస్తమీ స్టైల్. కానీ ఆయన సినిమాని చూస్తూ ఉన్న కొద్దీ అందులో ఇంకేదో కూడా ఉందనే విషయం తట్టకుండా పోదు. కియరోస్తమీ సినిమాల్లో మలుపులు తిరిగే కథలుండవు గానీ మలుపుల దారుల్లో, గోధుమరంగు పొలాలమధ్య, మట్టిగోడలమధ్య తిరుగుతూ దేనికోసమో అన్వేషించే మనుషులుంటారు. ఏ బుజ్జి స్నేహితుడి హోంవర్క్ పుస్తకాన్ని తిరిగివ్వటానికో తిరిగే పిల్లలుంటారు.  ఏదో పనిమీద ఎవరినో కలవటానికో, లేదా సింపుల్ గా చచ్చిపోవడానికో ప్రయత్నిస్తూ తిరిగే  పెద్దలూ ఉంటారు. ఏ పనులూ ఎవరి నలుగుళ్ళూ  ఎలావున్నా .. life goes on..

కియరోస్తమీ డాక్యుమెంటరీకి, ఫీచర్ ఫిల్మ్ కీ మధ్యస్తంగా ఉండే పద్ధతిని పట్టుకున్నాడు. కామెరా ఏంగిల్స్ లో సంప్రదాయ పద్ధతులని వదిలేశాడు. దానితోబాటే హంగులని కూడా వదిలేశాడు. పదేపదే  అలికినాక నున్నగా తయారైనట్టున్న చిన్నచిన్న అందమైన మట్టి ఇళ్ళలో, బ్లాక్ టీ కప్పుల్లో, బురఖాలేసుకుని పన్లు చేసుకుంటూ తీరిగ్గా పిల్లల్ని సాకుతూ తిరిగే ఆడవాళ్ళలో, హుక్కాలు పీల్చే మగాళ్ళలో, ఎక్కడో ఉన్న బడికి చేరటానికో లేక అమ్మ పురమాయించే చిన్నచిన్నపనులమీదో పరుగెత్తే మగపిల్లల్లో.. ఇరానీవాళ్ళ బతుకుచిత్రాన్ని మనకి చూపిస్తాడు. సంగీతాన్ని పెద్దగా వాడడు గానీ డాక్యుమెంటరీల్లోలాగా తన సినిమాల్లో మాటలెక్కువ. నిశ్శబ్దంగా ఉండే క్షణాలు తక్కువ.

ప్రతి  సినిమా ఒక ప్రయాణం. ఆయన చూపించే ల్యాండ్ స్కేప్ మనోహరమూ కాదు. అలాగని సాధారణమూ కాదు. అదెలా వుందో అలాగే ఉంటుంది.  కానీ కొండల మలుపుల్లో ఓ క్లాసిక్ ‘Z’ కాంపోజిషన్ లో అమరిన పసుప్పచ్చని గోధుమ పంటల సౌందర్యం, ఎక్కడో ఓ మనిషి మెల్లిగా వల్లించే  పర్షియన్  కవిత్వం, దుమ్ము రేపుకుంటూ పోయే కారు స్ఫురింపజేసే అధునాతనత్వం, కొండల్లోని ఆదమరుపుతనాన్ని చెదుర్చుతూ డొక్కు బైక్ చేసే డబడబ శబ్దం, విసిరేసినట్టు అక్కడోటీ ఇక్కడోటీ ఉన్న గుబురుచెట్లమధ్య దాక్కున్న జామెట్రీని వెదికి పట్టుకునే కామెరా ఏంగిల్..  ఇవి దర్శకుడిగా ఆయన సంతకాన్ని పట్టి చూపిస్తాయి. సాధారణంగా కనిపించే ఆ సంతకంలోని అసాధారణ కోణాలని మనకి చేతనైనట్టు మనల్ని వెదుక్కోమని వదిలేస్తాడు.  ఏదో నెమ్మదైన డాక్యుమెంటరీ సినిమాలా ఉంది కదాని కళ్ళప్పగించి చూడ్డం కాదు. కియరోస్తమీ సినిమాకి మెదడు వాడాల్సిందే.

***

abbas2

చావనేది  తప్పనిదీ బ్రతుకు నిరంతరమైనదీనూ…

ఈ సాధారణమైన నిజాన్ని కథల్లో కవితల్లో సినిమాల్లో ఎంతో మెలోడ్రామానూ ఆశనూ కరుణ భీభత్స రసాలనూ  జోడించి చెప్పొచ్చు. ఉన్నతస్థాయి కళను సృష్టించటంలో ఇంతటి విస్తృతి ఉన్న వస్తువు ఇంకోటి లేదు. ఇరాన్ లో వచ్చిన పెద్ద భూకంపంలో తను చూసిన మృత్యుతాండవం కియరోస్తమీని చాలా కదిలించిందట.  అలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో చావుమీద బ్రతుకు చేసే పోరాటాన్ని చాలా నాటకీయంగా తీయవచ్చు. కానీ కియరోస్తమీ Minimalist.. ఉత్పాతాల్లోంచి కాకుండా  రోజువారీ జీవితంలోనుంచీ  చావుబతుకులకి సంబంధించిన లోతైన ప్రశ్నలను కొంత ఆధునికతతో, మరికొంత ఇరానియన్ సంస్కృతితో కలుపుతూ సంధించి వదిలేస్తాడు.

కియరోస్తమీ తీసిన సినిమాల్లో రెండు ముఖ్యమైన సినిమాల గురించి…

కాన్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారం Palme d’or సాధించిన కియరోస్తమీ సినిమా “Taste of Cherry”.

‘బదీ’ ఆత్మహత్య చేసుకోవాలని కొండల్లోకి కార్లో బయలుదేరతాడు. టెహరాన్ నగరం దాటి ఒకచోట తనను పూడ్చటం కోసం గొయ్యి తవ్వి సిద్ధం చేసుకుంటాడు. అక్కడికి వెళ్లి నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనీ, ఆ తరువాత తనని ఎవరైనా పూడ్చిపెట్టాలనీ, మర్నాడు పొద్దునే వచ్చి చూసి ఒకవేళ తను చావకపోతే తనను తిరిగి ఇంటికి తీసుకు రావాలనీ  అతని కోరిక. ఆ ప్రాంతానికి కార్లో వెళ్తూ దారిలో కనబడిన వాళ్ళని ఆపి తనకు సాయం చెయ్యమని కోరతాడు. ఆ పని చేస్తే చాలా పెద్దమొత్తం ఇస్తానని చెప్తాడు.

అతనికి తారసపడిన ఒక సైనికుడు, ఒక మతపెద్ద అతని కోరిక విని ఆశ్చర్యపోయి ఆ పని చెయ్యటానికి నిరాకరిస్తారు.  చివరికి బాఘేరీ అనే ఒక taxidermist అతని మాటలను జాగ్రత్తగా విని,  ‘బదీ’ ని ఆత్మహత్యా ప్రయత్నం నుండి తప్పించాలని చాలా ప్రయత్నిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని అనిపించటం చాలా సాధారణమని చెప్తాడు. తనకీ ఓసారి జీవితాన్ని భరించలేని పరిస్థితి వచ్చి ఉరేసుకుని చనిపోదామని అనుకున్నాడట. తాడు బిగించడానికి మల్బరీచెట్టు ఎక్కాడట.  అంతలోనే చేతికి మెత్తగా తగిలిన మల్బరీ పళ్ళు  కోసుకు తిన్నాడట. ఆ రుచిని అందరికీ పంచకుండా ఉండలేక పోయానని చెప్తాడు.  మల్బరీ పండు తనను  ఆత్మహత్యాప్రయత్నం నుండి తప్పించిందని చెప్తాడు. అంతవరకూ తామిద్దరూ కార్లో తిరిగిన దుమ్ము క్వారీలను దాటించి టెహరాన్ కి వెళ్ళే  చక్కని చెట్లు నిండిన వేరేదారిలోకి కారుని మళ్ళిస్తాడు బాఘేరీ.  పచ్చగా ఉండే బతికేదారిని  వెదుక్కోవచ్చునని మెల్లగా సూచిస్తాడు. జీవితపు చెర్రీ పండు రుచిని కాదనవద్దని హితవు చెప్తాడు.

అన్నీ విన్నాక కూడా అలసట నిండిన మొహంతో బదీ అతన్ని తన కోరిక తీర్చమంటాడు. చేసేదేంలేక అతను సరేనని తనుండే చోట కారుదిగి వెళ్ళిపోతాడు. ‘బదీ’ లో చిన్న ఊగులాట. చావాలన్న నిరాశలోంచి చిన్నగా మొలకెత్తిన జీవితేచ్ఛ. పరుగెత్తుకుంటూ బాఘేరీ ఉండే చోటికి వెళ్లి మర్నాడు పొద్దున్న తప్పనిసరిగా వచ్చి చూసి తను బతికుంటే ఇంటికి తీసుకురమ్మని మళ్ళీ చెప్తాడు. మొదట్నుంచీ చివరిదాకా బదీ అసలు ఎందుకు చావాలని అనుకుంటున్నాడో మనకీ తెలియదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించిన బాఘేరీకీ తెలియదు. ఒక స్థాయిలో తెలియనక్కర్లేదని మనకీ అనిపించేస్తుంది.

సర్దుబాటు, సంతృప్తి, ఆశావాదాలవైపు బాఘేరీ ఉంటే, తీవ్ర నిరాశ, అలసట, చావాలన్న బలమైన కోరికతో బదీ నలుగుతూ ఉంటాడు. కలవని ఈ రెండు పట్టాలమీద నడిచే బండిలా వీళ్ళ ప్రయాణం… రకరకాల వైరుధ్యాల మధ్యే మనుషుల బతుకులు తెల్లారుతుంటాయి. వీటితో ఏ సంబంధం లేకుండా ప్రతిరోజూ తెల్లవారుతూనే ఉంటుంది. ఈ స్పృహని అందిస్తూ ఈ సినిమా సాగుతుంది.

బదీ బ్రతుకుతాడా, చచ్చిపోతాడా అనే ఆత్రుత పెంచి, ఆఖరున  ఒక్కసారిగా ప్రేక్షకులని  సినిమానుంచి బైటకి లాగి నేలమీద నిల్చోబెడతాడు కియరోస్తమీ. And life goes on…

 

“The wind will carry us” — కియరోస్తమీ మనచేత చేయించే మరో ప్రయాణం…  బెహజాద్ మరో ముగ్గురితో కలిసి ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ మంచంమీదున్న చావ సిద్ధంగా ఉన్న ఓ ముసలమ్మ. ఆవిడ ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఊరివాళ్ళు చెయ్యబోయే కర్మకాండల తంతులను రికార్డు చేయటం ఈ నాగరికుల ఉద్దేశ్యం. కానీ ఊళ్ళోవాళ్లకి ఆ విషయం చెప్పకుండా తాము ఇంజనీర్లమని చెప్పుకుని ఊళ్ళో ఉండిపోతారు. ముసలమ్మ ఓ రోజు బాగుండి మరోరోజు బాగుండకా అలాగే గడిపేస్తూ ఉంటుంది. జీప్ లో ఎప్పుడూ పరుగులు తీస్తుండే బెహజాద్ పల్లెటూరి నత్త నడకలకూ  ఊళ్ళోవాళ్ళతో సంభాషించటానికీ  నెమ్మదిగా అలవాటు పడతాడు.

సిటీ నుంచి వొచ్చే ఫోన్ కాల్ కి సిగ్నల్ అందక, మొబైల్ ఫోన్లో  మాట్లాడ్డం కోసం జీప్ లో ఎత్తైన ప్రదేశానికి పరుగెడుతూ ఉంటాడు. ఎదురు చూస్తున్న ముసలమ్మ చావు ఎంతకీ రాదు. రోజూ తవ్వకం పని చేసే పరిచయస్తుడైన ఆ ఊరిమనిషి చావు అంచుకి వెళ్లి వస్తాడు. మొత్తానికి ముసలమ్మ చనిపోతుంది గానీ బెహజాద్ లో చావు బ్రతుకుల మధ్య పెద్దగా తేడా చూడని స్థితప్రజ్ఞత వచ్చి చేరుతుంది. చావుబతుకులను కలబోసుకుంటూ జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. And life goes on…

కథ ఏమీలేని ఈ సినిమాని ప్రవహింపజేయటం అసాధారణమైన ఫీట్.  గట్ల మధ్య ఒదిగి పారే నిండైన నదిలా ఉంటుంది ఈ సినిమా.  ఊరికీ నగరానికీ,  బతుక్కీ చావుకీ, సంప్రదాయానికీ ఆధునికతకీ  మధ్య ఉన్న తేడా  ఎంత పెద్దగా కనిపిస్తుందో అంత చిన్నదనే భావన అలుముకుంటుంది.  ఈ వైరుధ్యాల లాగే తేలిగ్గా కనిపించే సంక్లిష్టమైన కథనం కియరోస్తమీ స్టైల్.

 

ఈ రెండు సినిమాల్లో కామెరాను ముఖ్యపాత్ర వరకే చాలావరకూ పరిమితం చేస్తాడు. Protagonist మాట్లాడుతూ ఉంటాడు. అవతల నుండి వొచ్చే సమాధానం ముఖ్యం. ఇచ్చేవాళ్ళు ఎవరన్నది  అప్రధానం.  Protagonist చేస్తున్న అన్వేషణ ముఖ్యం. వెదుకుతున్న దారుల్లో, దొరుకుతున్న సమాధానాలలో ఏముందో మనమే ఊహించుకోవాలి.  ఇరానియన్ న్యూవేవ్ సినిమాలో కిరోస్తమీ కనిపెట్టిన ఈ భాష సగం దృశ్యాలను మన ఊహలకే వదిలేస్తుంది. ఆయన  చూపించే దృశ్యాలతో   మన ఊహల్లోకి వచ్చే దృశ్యాలనూ మనుషులనూ కలిపి చూడగలిగితే కియరోస్తమీ సినిమా విశాలమైన గడ్డిమైదానాల్లో  విహారంలా ఉంటుంది.  అక్కడ సింహాలూ జిరాఫ్ లూ తారసపడవు.  రంగుల గడ్డిపూలూ ఆరుద్రపురుగుల్లాంటి మెత్తటి ప్రాణులే ఎదురౌతాయి. ఆ సూక్ష్మదర్శనం   ఇచ్చే అనుభూతులను అందుకుంటూ పోవటమే.

‘The wind will carry us’ లో బెహజాద్ పాల కోసం ఒక ఇంటికి వెళ్తాడు. చీకటిగా ఉన్న కొట్టంలో ఉన్న పశువు. అస్పష్టంగా ఆ చీకట్లోనే లాంతరు పెట్టుకుని పాలు పిండే అమ్మాయి. పాలపొదుగు, అమ్మాయి చేతివేళ్లు, ఆమె దుస్తులు.. మనకు కనబడేవి ఇంతే.  బెహజాద్ గొంతు మాత్రమే వినిపిస్తుంది. అతను ఆమెకు ఆ చీకట్లో ఇరానీ కవయిత్రి ‘ఫారో ఫరోక్ జాద్’ రాసిన కవిత వినిపిస్తాడు. కియరోస్తమీ దృశ్యంలో సాధించిన సింప్లిసిటీ కి మచ్చుతునక ఈ సీన్.

కియరోస్తమీకి కవిత్వం ఇష్టం. దృశ్యాలను పొదుపు చేసి కవిత్వంమీదే మన దృష్టిని నిలపటం ఇష్టం. కవితతో దృశ్యాన్ని జోడించటం ఇష్టం. దారులిష్టం. ప్రకృతిలో నిశ్శబ్దంగా లీనం కావటం ఇష్టం.

abbas3

(పైవన్నీ కియరోస్తమీ తీసిన ఫోటోలు)

 

“అవసరాల అన్వేషణలో మనిషి ప్రయాణానికి అభివ్యక్తి  ‘దారి ’.

శాంతిలేని ఆత్మకు వ్యాఖ్యానందారి

ఆత్మను ఓ చోటునుండి మరో చోటికి  మోసుకుపోయే శరీరం ఓ గాడిద.

ఈ గాడిదను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా సరే ప్రయాణాన్ని చివరిదాకా సాగించలేరు.

అయితేమాత్రం ?   వాళ్ళు లేకున్నాగానీ  మనిషి ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది.

మన దారులూ మనలాంటివే.

 

ఒకోసారి రాళ్ళూ రప్పలతో నిండి ఉంటాయి.  ఒకోసారి చదును చేసుంటాయి.

ఒకోసారి మెలికలు తిరుగుతాయి. ఒకోసారి తిన్నగా ఉంటాయి.

భూమ్మీద మనం గీసిన దారులు గీరుల్లా ఉంటాయి.

మనలోనూ వేరే  దారులుంటాయి.

 

విషాదపు దారులు, సంతోషపు దారులు, ప్రేమ దారులు, చింతనల దారులు,

పారిపోయే దారులు, ద్వేషపు దారులు, నాశనం చేసే దారులు,

ఎక్కడికీ చేరని దారులు, నిలవనీటి యేరులా ముగింపులేని దారులు…

తప్పించుకు తిరిగే ప్రదేశాల గురించీ, వెళ్తున్న ప్రదేశాల గురించీ మనిషి చేస్తున్న ఒప్పుకోలుదారి’.

 

జీవితమేదారి’. మనిషేదారి’.

ఎంత చిన్నదైనా సరే మనిషి దారి అస్తిత్వపు పుటమీదికి ప్రవహిస్తుంది.

ఒకోసారి ముగింపు ఎరగకుండా

ఒకోసారి విజయవంతంగా..  “                                

 

   —– అబ్బాస్ కియరోస్తమీ.

 

కియరోస్తమీ దారి విజయవంతంగా ప్రవహించి 2016 జూలై నాలుగున గమ్యాన్ని చేరుకుంది.

And Life goes on…

*

 

 

 

మీ మాటలు

 1. Protagonist చేస్తున్న అన్వేషణ ముఖ్యం. వెదుకుతున్న దారుల్లో, దొరుకుతున్న సమాధానాలలో ఏముందో మనమే ఊహించుకోవాలి. ….బాగుంది ఆర్టికల్

 2. rambabu thota says:

  అబ్బాస్ కియకియరోత్సామీ హార్ట్ ని ఇంత చిన్న ఆర్టికల్లో బాగా కేప్చర్ చేసారు

 3. Bhavani Phani says:

  The wind will carry us చూడటం మొదలు పెట్టినా పూర్తి చెయ్యనే లేదు. ఇప్పుడిక చూడాల్సిందే మీ ఆర్టికల్ చదివాకా. సినిమాని మీరు వాక్యాల్లోకి అనువదించే విధానం చాలా బావుంటుంది . ధన్యవాదాలు

 4. చక్రపాణి ఆనంద says:

  ఆర్టికల్ చాలా బాగుంది. సినిమాల విశ్లేషణతో పాటు అబ్బాస్ కియరోస్తమీ దృష్టికోణాన్ని విశదీకరించిన విధానం బాగుంది. రెగ్యులర్ గా మంచి వ్యాసాలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

 5. Suparna mahi says:

  అద్భుతమైన ఆర్టికల్ కు ధన్యవాదాలు… & క్లాప్స్…

 6. satyanarayana says:

  అబ్బాస్ కియరోస్తమి (Abbas Kiyarostami ) , ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా ఇస్తే ఇంకా అనుకూలంగా ఉండేది ,
  ఆయన చిత్రాల గొప్పతనం కళ్ళకు కనిపించేట్లుగా వర్ణించారు .
  సినిమా ప్రియులకి ” రంగుల గడ్డిపూలూ, ఆరుద్రపురుగుల్లాంటి మెత్తటి ప్రాణులు ” ఆయన కెమెరా లో ఎలా బంధించాడో తెలుసుకోడానికి ,సుళువయిన మార్గం చెబితే ఎన్నో కృతజ్ఞతలు .

 7. కె.కె. రామయ్య says:

  ప్రియమైన సత్యనారాయణ గారు, అబ్బాస్ కియరోస్తమి సినిమాలు యూట్యూబు లో చూడ వచ్చనుకుంటా

  The wind will carry us (1999)
  https://www.youtube.com/watch?v=g3gpDKsk_జెస్

  Taste of Cherry (1997)

 8. కె.కె. రామయ్య says:

  ధన్యవాదాలు ల.లి.త గారు.

  Zeynab makes an uncertain contact when he recites to her a poem by the famous 20th century woman poet, Forough Farrokhzād

  In my night, so brief, alas
  The wind is about to meet the leaves.
  My night so brief is filled with devastating anguish
  Hark! Do you hear the whisper of the shadows?
  This happiness feels foreign to me.
  I am accustomed to despair.
  Hark! Do you hear the whisper of the shadows?
  There, in the night, something is happening
  The moon is red and anxious.
  And, clinging to this roof
  That could collapse at any moment,
  The clouds, like a crowd of mourning women,
  Await the birth of the rain.
  One second, and then nothing.
  Behind this window,
  The night trembles
  And the earth stops spinning.
  Behind this window, a stranger
  Worries about me and you.
  You in your greenery,
  Lay your hands – those burning memories –
  On my loving hands.
  And entrust your lips, replete with life’s warmth,
  To the touch of my loving lips
  The wind will carry us!
  The wind will carry us!

 9. satyanarayana says:

  రామయ్య గారూ ,
  యు ట్యూబ్ ,స్ఫురించనేలేదు .
  ధన్యవాదాలు , పైన మీరు ఇచ్చిన ” Forough Farrokhzāడ్” కవిత ,గొప్ప అనుభూతినిచ్చింది .
  ఎంత సున్నితమయిన స్పందనలున్నాయో కవితలో !
  ” A stranger worries about you and me ” ….సినిమాల్లో జరిగే సంఘటనలకు ఎంతమంది అపరిచితులు బాధపడుతుంటారో !
  చివరికి AASHIQUI -2 ,లాంటి సాధారణ సినిమాలో కూడా, ఎంతో బాధ కలిగింది .

మీ మాటలు

*