ఎల్దమొస్తవా…

 

 

ananya“ఇండియా వెళ్లావట కదా? పదిరోజుల్లో ఏం చేద్దామని వెళ్లావు? ఏం చేశావు? పోనీ చివరి రోజు ఏం చేశావు?” షాపులో కనిపించిన ఒక స్నేహితురాలు గుక్కతిప్పుకోకుండా అడిగేసింది.

సంతోషంగా లిస్ట్ చదవబోయాను, “కన్హయ్య కుమార్ ను కలిసి మా పాప తనకోసం గీసిన బొమ్మ ఇచ్చాను,  ….”

“కన్హయ్య కుమార్ ఎవరు?”

“జె ఎన్ యు లో స్టూడెంట్ లీడర్… పోనీ… రోహిత్ వేముల…”

“….”

“దళిత్…”

“అతనెవరు? ఎవరు వీళ్లంతా?”

ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవడమంటే ….

*

విశాఖ పొలిమేరలు దాటింది కారు. రామకృష్ణ బీచికి వెళ్లకుండా ఈ ముగ్గురు తమిళులతో రావడం సరైందేనా అనుకుంటూనే ఉన్నాను. నాకు తమిళం రాదని, ఇంగ్లీషు వచ్చని తెలిసినా తమిళంలోనే మాట్లాడుకుంటున్న వాళ్లపట్ల కాసింత కోపం కూడా వచ్చేసింది.

నేను పెద్ద మాటకారిని కాదు. అయినా డ్రైవర్ భాస్కర్ ను ఏవో చిన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండిపోయాను. వాళ్ళేనా తెలీని భాష మాట్లాడుకునేది? భాస్కర్ కు ఇంగ్లీషు, తమిళం రెండూ రావు. నా తెలుగు అతనికి, తన తెలుగు నాకు అర్థమవడం కష్టంగా ఉంది. అయినా సరే, తెలుగు తెలుగే. చుట్టుపక్కల ఊర్ల గురించి, కొండల గురించి అతను చెప్పే విశేషాల గురించి నేను వాళ్లకు చెప్పను గాక చెప్పను. వాటి గురించి అతనికే సరిగ్గా తెలీదని నాకు అర్థమయిందన్న విషయం కూడా చెప్పను. ఒక కొండను ఒకసారి ఎర్రకొండ అంటాడు, అహా అది కాదు వేరేది అంటాడు. హోర్నీ. నా కలల విశాఖ ప్రయాణం ఇట్లా ముగియబోతోందా?  కృష్ణ నన్ను వీళ్లతో ఇరికించేశారే. వీళ్లు వెళ్లేచోట రామకృష్ణ బీచి కంటే చూడాల్సిన బీచి మరొకటి ఉందని అన్నారు. అది ఏదో సముద్రం ఒడ్డున ఊరు. న్యూక్లియర్ ప్లాంటు కట్టబోయే చోటు. వీళ్లకు అక్కడేం పనో ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ ఊర్లో మమ్మల్ని కలుసుకోబోయే వాళ్లకు ఇంగ్లీషు సరిగ్గా రాకపోవచ్చని, అవసరమైతే సహాయం చెయ్యమని చెప్పారు.

విజయనగరం బోర్డు కనిపించేసరికి “విజయనగరం అంటే శ్రీకృష్ణదేవరాయలి రాజధానే కదూ?” వెనక నుంచి సుందర రాజన్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు తత్తరపడ్డాను. ఒకింత కలవరపాటు కూడా. చరిత్ర పాఠాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అవుననీ, కాదనీ, హంపి కాదూ అనీ మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఉండబట్టలేక భాస్కర్ ను అడిగాను. ఔనన్నాడు, వెంటనే కాదన్నాడు. ఆఖరికి ఔననేశాడు. ఒకసారి అతని ముఖంలో చూసి ఇక మాటమార్చడని తేల్చుకుని, నిట్టూర్చి “ఔనట” అని వెనక్కి తిరిగి అన్నాను.

భాస్కర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్న అమర్తరాజ్ కొంటె నవ్వు అప్పుడప్పుడే అలవాటౌతోంది. నా వెనక ఉన్న సీట్లో కూర్చున్న సుందర రాజన్ నవ్వుతున్నాడో లేదో కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య కూర్చున్న ఉదయకుమార్ నవ్వుతున్నాడో లేదో అర్థమవడం కష్టం. ఎప్పుడూ ఒక చిర్నవ్వు ప్రశాంతమైన ఆ ముఖంలో వెలుగుతుండడం గమనించాను.

కాసేపాగి, “ఇంతకీ మీరు నిజనిర్ధారణ కమిటీకి చెందిన వాళ్లా?” అని అడిగాను. నవ్వేసి, కాదన్నాడు అమర్తరాజ్.

mamata1

అమ్మన్నాయుడు (CITU – Centre of Indian Trade Unions, a CPI(M)-affiliate), సుందర్ రాజన్, గోవింద రావు (CITU), మమత, కె. రాము (మానవహక్కుల వేదిక), ఉదయకుమార్, థవుడు (ప్రజాశక్తి జర్నలిస్టు), కె.వి. జగనాథ రావు (మానవహక్కుల వేదిక), తేజేశ్వర రావు (CITU).

 

మధ్యలో తెలుగు మిత్రులు కలుసుకున్నారు. పేర్లు చెప్పుకున్నాం. అందరి ముఖాల్లో చిర్నవ్వు. ఎప్పట్నుంచో తెలిసున్నవాళ్లలా పలకరింపులు. ఏ ఊరివాళ్లైతేనేం, ఏ రాష్ట్రం వాళ్లైతేనేం, ఏ దేశం వాళ్లైతేనేం – కలిసి పనిచెయ్యబోతున్నామని తెలిసినప్పుడు అన్ని ఎళ్లలూ చెరిగిపోతాయి.

వెళ్లాల్సిన ఊరు చేరుకోవడానికి వేరే రోడ్డు ఎక్కాలని, వాళ్ల కారు ఫాలో అవమని చెప్పారు. పొదలతో, చెట్లతో, వాటిని కలుపుతూ అల్లుకుపోయిన తీగెలతో పచ్చగా ఉంది అక్కడంతా. మధ్యలో చిన్న చిన్న పంట పొలాలు. వరి నాటుతున్న మహిళలు కనిపించారు. అక్కడక్కడ రెల్లుదబ్బులతో వేసిన గుడిసెలు, ఒక చర్చి కనిపించాయి.

చర్చి గోడమీద ఊరిపేరు, “పాతర్ల పల్లి“.

ఆ ఊరు దాటాక మళ్లీ పచ్చని చెట్లు, చిన్ని చెలకల పొలాలు. ఇంకొక ఊరు కనిపించింది. గుడిసెలు లేవు. అన్నీ పక్కా ఇళ్లే.

బడి గేటు మీద పేరు చదివాను, “పాతర్ల పల్లి“

అరే, ఈ రెండు ఊర్లకు ఒకటే పేరా?

కాదు. ఇవి రెండు ఊర్లు కాదు. ఒకటే ఊరు. ఇందాక చూసింది వెలివాడ.

నేను ఆశ్చర్యపోతుంటే, “అన్ని ఊర్లు ఇట్లనే ఉంటయ్ కద మేడమ్” అన్నాడు భాస్కర్.

“మా వైపు కూడా ఇట్లాగే ఉంటాయి.” అదేం కొత్త విషయం కాదన్నట్లు చెప్పాడు ఉదయకుమార్.

“మా కర్నూల్ వైపు ఇట్లా ఉండవు. అన్ని కులాలు, మతాలు కలగలిసిపోయి ఉండవు కానీ, ఒక వాడ తరువాత ఒకటి, ఆనుకునే ఉంటాయి. మాలమాదిగ వాళ్ల వాడలు కూడా” అనేసి చిన్నప్పుడు, పదేళ్లు, పెరిగిన మా ఊరిని గుర్తు చేసుకున్నాను.

హఠాత్తుగా, రెడ్ల ఇళ్లకు మాల వాడకు మధ్య కల్లాలు గుర్తొచ్చాయి. ఊరిమధ్యలో అవెందుకు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎంత దారుణం!! చిన్ననాటి స్నేహితురాలు రంగమ్మ గుర్తొచ్చింది. ఆ కల్లాల్లో తెగ ఆడుకునేవాళ్లం. చీకటవగానే తనొక వైపు, నేనొక వైపు వెళ్లిపోవడం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం ఇంతవరకు ఎందుకు తట్టలేదు? తట్టినా ఏం చేసేదాన్ని? నా చేతులతో మంచినీళ్ల గ్లాసెత్తి దోసిట్లోకి నీళ్లు వంపినదాన్నే కాదూ? అదెప్పుడో చిన్నతనంలో ఐతేనేం? ప్రశ్నించలేని అధైర్యాన్ని పక్కన పెడితే, అసలు ప్రశ్నే ఎప్పుడో గాని రాలేదు. ఆ గిల్ట్ ఎప్పటికీ పోనిది.

“న్యూక్లియర్ ప్లాంట్ వస్తే చానా ఉద్యోగాలొస్తయంట కద మేడమ్?” భాస్కర్ అడిగిన ప్రశ్నతో కొంచెం సర్దుకున్నాను.

“వస్తాయి కానీ ఊరివాళ్లకు కూలి పనుల లాంటివే ఉంటాయి. స్వంతంగా వాళ్లు చేసుకుంటున్న పనులు మానుకుని కూలీ పని ఎందుకు చెయ్యాలి? ఆ పనీ అయిపోయాక సిటీలకు వలసపోవాల్సిందే.” అతనికి అర్థమయ్యే విషయాలు చెప్పాను.

మధ్యలో ఒకచోట కార్లు ఆపి న్యూక్లియర్ పవర్ పార్క్ ప్రపోజ్డ్ సైట్ అంటూ చూపించారు శ్రీకాకుళం మిత్రులు. అంత పచ్చదనం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండదేమో అన్నట్లుంది ఆ ప్రదేశం. అట్లాంటి చోట పొగలు కక్కే బ్రహ్మాండమైన రియాక్టర్లను ఊహించలేకపోతున్నాను.

“ఈ ప్రదేశం ఏ ఎర్త్ క్వేక్ జోన్ కిందకి వస్తుంది?” తెలుగు మిత్రులను అడిగాడు సుందర రాజన్.

అనుకోని ప్రశ్న ఎదురైనట్లుంది వాళ్లకు. కాసేపు ఆలోచించి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, “నాలుగు అనుకుంటా” ఒకరు అన్నారు. కాదనిపిస్తోంది. ఉన్నదే ఐదు జోన్లు. ఎంత దురాశపరులైనా, అలక్ష్యంగా ఉన్నా మరీ నాలుగో జోన్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోరనిపిస్తోంది. ఏమో ఎవరు చెప్పోచ్చారు. రాజధాని, అమరావతి, వెట్ ల్యాండ్స్ మీద కడుతున్నప్పుడు.

కొన్ని నిమిషాలు అక్కడ గడిపి కొవ్వాడలో జనాలతో మాట్లాడదామని బయల్దేరాం. అప్పటిదాకా ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు తమిళులు సీరియస్ అయ్యారు.

దార్లో, “ఇక్కడ భూకంపాలు వస్తాయా?” అని భాస్కర్ ను అడిగాను.

“2014 లో భూమి కొంచెం కదిలింది మేడమ్. పెద్దది కాదు. ఏం నష్టం జరగలేదు.” భాస్కర్ చెప్పిన విషయాన్ని వాళ్లకు చెప్పాను.

కొవ్వాడ చేరుకునే ముందే సముద్రం కనిపించింది. బీచ్ ని ఆనుకుని ఊరు. చేపలు పట్టడం వాళ్ల వృత్తి అని విన్నాను. కానీ పడవలేవీ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్లు బీచిలో వలలాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఊరికి, బీచికి మధ్య ఒక అరుగు మీద కొంతమంది యువకులు పేకాట ఆడుకుంటున్నారు.

“పనులేం లేవు. ఇంకేం చేస్తారు?” ఎవరో అన్నారు. పనులు లేకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు.

నా సందేహం నా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించినట్లుంది. “వీళ్లు మత్స్యకారులు మేడమ్. ఇప్పుడు చేపలు లేక సముద్రం లోకి వెళ్లటం లేదు.”

“చేపలు లేకపోవడం ఏమిటీ?” చాలా విచిత్రంగా అనిపించింది నాకు.

“చుట్టుపక్కల ఉన్న ఫార్మాసూటికల్ ప్లాంట్ల నుంచి వచ్చే టాక్సిక్ వేస్ట్ అంతా ఇక్కడికే వస్తుంది మేడమ్. కొన్నేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు చేపలు లేవు. ఇంతకుముందు చేపలు పట్టలేనోళ్లు, వలలు తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు హ్యామక్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. అవన్నీ గుజరాత్, మహారాష్టృ లాంటి చోట్ల అమ్ముకుంటారు.”

గొంతులో ఏదో అడ్డంపడ్డట్లైంది. ఇస్మత్ చుగ్తాయ్ ప్రస్తావించే ముళ్ల బంతి!

ఇంతలో అక్కడ కొంతమంది కుర్రవాళ్లు గుమిగూడారు.

“ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని రానిస్తారా?” అని అడగమన్నాడు సుందర రాజన్.

అందరికంటే ముందు నిలబడ్డ ఒక అబ్బాయి, “రానివ్వం!” ధీమాగా, కోపంగా అన్నాడు. ఆ అబ్బాయికి పదహారు, పదిహేడేళ్లు ఉంటాయేమో. తీక్షణమైన ఆ అబ్బాయి చూపు ఇక జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది.

మెట్లెక్కి ఆ అరుగుమీద కూర్చున్నాం. మాముందు ఊరి యువకులు. అమర్తరాజ్ మాతో కూర్చోలేదు. కాసేపు అందరి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు. భాష రాని చోట ఒక్కడు అట్లా వెళ్లిపోతే ఎట్లా? పోనీ, చిన్నపిల్లవాడా ఏమన్న. సముద్రం ఫోటోలు తీస్తున్నాడేమో.

ఊరి వాళ్లు మాట్లాడేముందు సుందర్ రాజన్ను, ఉదయకుమారన్ను పరిచయం చేసుకోమన్నారు తెలుగు మిత్రుల్లో ఒకరు. ఇంగ్లీషులో అతను చెప్పేది నన్ను తెలుగులో చెప్పమన్నారు. అప్పటికప్పుడు చెప్పే మాటలను తర్జుమా ఎప్పుడూ చెయ్యలేదు. అయినా, ‘సరే’ అనేశాను.

సుందర్ రాజన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ అనే సంస్థ నుంచి వచ్చాడని, అంటే భూమి మిత్రులు అని అర్థమని వివరించాను. న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని కూడంకుళం అనే ఊర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ మధ్యే ఫుకొషిమా వెళ్లొచ్చాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల ఒరిగే లాభాల కన్నా, జరిగే నష్టలే ఎక్కువ అని, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడతారని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల తరుపున ఆలోచించడం లేదని చెప్పాడు.

కూడంకుళం అన్న పేరు నోరు తిరగలేదు. కూడబలుక్కుంటూ ఆ ఊరి పేరుని పలికినప్పుడు, సుందర రాజన్ శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని వేరేవాళ్లకు తెలియకపోయినా పక్కనే కూర్చున్న నాకు తెలిసిపోయింది. నేను ఎప్పుడూ వినివుండని ఆ ఊరు అతనకి చాలా ముఖ్యమైందని అర్థమయింది.

ఫుకొషిమాలో, పవర్ ప్లాంటుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్లందరినీ వేరే చోట్లకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఒక పాల వ్యాపారి గురించి చెప్పాడు. ఆ వ్యాపారికి సోకిన రేడియేషన్ ను ట్రీట్ చెయ్యగలరు కానీ అతని ఆవులను రక్షించలేమని చెప్పారట. వాటికి రేడియేషన్ సోకడం వలన, అవి ఇచ్చే పాలు ఎవరూ తాగకూడదు. వాటి మాంసం కూడా ఎవరూ తినకూడదు. 75 ఆవులను చంపేసి, ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చిందని చెప్పాడు. భోపాల్ దుర్ఘటను గుర్తు చేసి, కొన్ని వేల మంది మరణించినా, గాయాలపాలైనా సి.యి.వో వారెన్ ఆండెర్సన్ కు ఎలాంటి శిక్ష పడకుండా భారత, అమెరికా ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే సామాన్య జనం తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం పెట్టుకోకూడదని చెప్పాడు.

తరువాత ఉదయకుమార్ మాట్లాడాడు. తాము అభివృధికి ఆటంకం కాదని, ఏ విదేశీ సంస్థకు పని చెయ్యటం లేదని, శాంతియుతమార్గాల ద్వారానే పోరాటం చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. కొవ్వాడ, చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు చేస్తున్న, చెయ్యబోయే పోరాటాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పాడు. టెస్టు చెయ్యని రియాక్టర్లను కొవ్వాడలో వాడబోతున్నారని, ప్రమాదం జరగడానికి చాల ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఫుకోషిమా ప్రమాదం తరువాత ఎన్నో దేశాలు అణురియాక్టర్లు నిలిపివేయడమో, చాలావాటిని మూసివేయడమో చేశాయని, మరి భారత ప్రభుత్వం కొవ్వాడలో ఎందుకు కొత్తగా అణురియాక్టర్లను నిర్మించాలనుకుంటున్నాయో ప్రశ్నించాలని అన్నాడు. ప్రభుత్వాన్ని గాని, ఏ రాజకీయ పార్టీని గాని నమ్మకుండా ప్రజలు తమ పోరాటం తాము చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు.

పక్కన కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ఒకతను తను స్పెషల్ బ్రాంచ్ నుంచి అని అన్నాడు. ఉదయకుమార్ కొంచెం ఆశ్చర్యపోయాడు, “ఓ స్పెషల్ బ్రాంచి నుంచా?” అని చిర్నవ్వు నవ్వాడు. అతనూ నవ్వాడు.

వాళ్లు చెప్పినమాటలైతే ఇంగ్లీషులోంచి తెలుగులో చాలావరకు తర్జుమా చేస్తున్నాను. వాళ్లు చెప్పేవి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆలోచనల్లో పడి, అన్ని విషయాలు తిరిగి చెప్పలేకపోతున్నాను. తెలుగు మిత్రులు అందుకుని తర్జుమా చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ మా చుట్టూ ఉన్న జనం మారుతున్నారు. ముందు కూర్చున్న యువకులు మాత్రం కదలటం లేదు. శ్రద్ధగా వింటున్నారు. మధ్య మధ్యలో “మీరేం చేస్తారు?” అని ప్రశ్నిస్తే “ఈ ఊరు నుంచి వెళ్లం. ఇది మా ఊరు. కొట్లాడ్తాం” అని గట్టిగా చెప్తున్నారు.

ఇంతలో పక్కనుంచి ఒక యువకుడు అరిచాడు, “ఎవరెవరో వస్తారు, ఏదో చెప్పి పోతారు. మా నాయకులే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకే పోరాడుతాం? మా భూమిని ఇచ్చెయ్యక ఏం చేస్తాం?” అతని మాటలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాను.

ఒక పెద్దాయన ప్లాస్టిక్ తాళ్లతో బుట్టల్లాంటివి చేస్తున్నాడు. పళ్లు, కూరగాయలు పెట్టుకోవడానికి అని చెప్పాడు. వలలు చెయ్యడం కాకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పారు గుంపులో ఒకరు. తిండికోసం ఏ తిప్పలైనా పడాలి కదా అని అన్నాడు ఆ పెద్దాయన.

“సరే పవర్ ప్లాంటు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే మాకేం, రేపో మాపో పోయే ముసలోళ్లకు” అని అనేశాడు.

ఆయన పక్కన ఇంకో పెద్దాయన వళ్లో కూర్చున్న పసిపిల్లవాడు నావైపు అమాయకంగా చూస్తున్నాడు.

“మీ సంగతి సరే, మరి మీ పిల్లల సంగతి? వాళ్ల పిల్లల సంగతి మీకు అఖర్లేదా? ఆ పిల్లాడి సంగతి?” అని అడిగాను. ఆయన క్షణకాలం నా ముఖంలోకి చూశాడు.

ఇక ఒకరి మాటలను ఒకరు మింగేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు ఊరి వాళ్లు. గొడవగా తయారయ్యింది అక్కడంతా. అంత గడబిడలోనూ ఎవరూ ఇదొక ఆట అన్నట్లో, కాలక్షేపం కోసం అన్నట్లో మాట్లాడటం లేదు. అయినా, ఇట్లా కాదు. ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే బాగుండుననిపించింది.

“ఊరి సర్పంచ్ తో మాట్లాడడం కుదరదా?” అని అక్కడున్నవాళ్లను అడిగాను.

“ఊర్లో లేడు. ఉన్నా ఏం లాభం. ఆయన ప్రభుత్వం వైపే ఉన్నాడు. వీళ్లు వస్తున్నారని తెలిసి పక్క ఊరికి వెళ్లిపోయాడు.” నాకు ఆశ్చర్యమేసింది. వీళ్లను చూడగానే తెలుగు కార్యకర్తల ముఖాలు వెలిగిపోవడం హఠాత్తుగా గుర్తొచ్చింది. వాళ్లవైపు చూశాను. ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఈ విషయం పట్ల దృఢమైన నిబద్ధతో ఉన్నట్లు తెలిసిపోతోంది. ఈ తమిళులు సామాన్యులు కాదని ఒక్కసారిగా అనిపించింది.

“ఊర్లోకి వెళ్లొద్దాం పదండి” అన్నారెవరో.

బీచికి ఆనుకుని ఉన్న ఇంటివైపు వెళ్లాం. ఒకరిద్దరు ఆడవాళ్లు మాట్లాడారు. వాళ్లకు మావి కొత్తముఖాలే కానీ మాలాంటి వాళ్లను ఇంతకుముందు చూసి, ఆశపడి, నిరాశపడిన అనుభవాలున్నట్లున్నాయి. ఒకింత నిర్లక్ష్యం, ఒకింత ‘మీరేమైనా చెయ్యగలరా’ అనే మిణుకుమనే ఆశ వాళ్ల ముఖాల్లో. ఆ ఇంట్లోనే ఒకతను కొంచెం ఎక్కువ సమాచారం ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలుగుదేశం తమ పోరాటానికి మద్ధతునిచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు వ్యతిరేకంగా, అణురియాక్టర్లను ఇంకా త్వరగా కట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడి వచ్చేశాం. ఇంతవరకు ఒక యువకుడు, ఆ పెద్దాయన తప్ప అందరూ పోరాడుతామనే చెప్తున్నారు.

కొంతమంది విలేఖర్లు ఉదయకుమార్ ను వీడియో స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ నన్ను వీడియోలో వచ్చేట్లో ఉదయకుమార్ పక్కన నిలబడమని చెప్పారు. మధ్యలో నేనేందుకు అనుకుని ‘పర్వాలేదులెండి’ అంటూ దూరంగానే నిలబడ్డాను.

“డోంట్ బి అఫ్రైడ్ మమదా!” అని అన్నాడు ఉదయకుమార్. ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చింది. “హౌ క్యూట్!” మనసులోనే అనుకున్నా.

అవునూ ఇంతకీ భయపడొద్దు అంటున్నారెందుకు? ఇక్కడ భయపడాల్సింది ఏముంది? న్యూస్ వీడియోలోకి రావాలంటే భయపడేదానిలా కనిపిస్తున్నానా?

వీళ్ల స్టేట్మేంట్లు తీసుకోవడం, వీళ్లు వస్తారని సర్పంచ్ ఊర్లో లేకపోవడం, ముగ్గురు నలుగురు విలేఖరులు వీళ్ల మాటలను శ్రద్ధగా నోట్ చేసుకోవడం చూస్తుంటే ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంతకీ భయపడొద్దని ఎందుకు అన్నాడు?

ఎప్పుడు వచ్చాడో అమర్తరాజన్ మా గుంపులో చేరాడు. ఇక అందరం బయల్దేరాం. చిన్న ఊర్లు దాటుకుని ఘాట్ రోడ్డు ఎక్కాం. అందరం అక్కడ టీ తాగి, శ్రీకాకుళం మిత్రుల దగ్గర సెలవు తీసుకుని విశాఖ బయల్దేరాం.

సముద్రం పక్కగా భీమునిపట్నం వైపు కారు పోనిచ్చాడు భాస్కర్.

వెనక కూర్చుని ముగ్గురూ మళ్లీ తమిళంలో మాటలు మొదలు పెట్టారు. పెద్దగా నవ్వులు కూడా.

భాస్కర్ తో ఊరికే మాటలు పెట్టుకోవాలనిపించలేదు. ఏదో ఒకలా వాళ్లనే మాట్లాడించాలనిపించింది.

కాసేపు లాటిన్ అమెరికన్ పోయెట్రీ గురించి, బొలీవియా గురించి మాట్లాడుకున్నాం. కొవ్వాడకు రావడం ఇది మూడోసారి అని చెప్పాడు అమర్తరాజ్. హ్మ్! ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారాండీ?

మధ్యలో కూర్చున్న ఉదయకుమార్ ను అడిగాను, “మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పోయిన ఏడాది డిసెంబర్లో హంపిలో జరిగిన రెవొల్యూషనరీ కల్చరల్ ఫారమ్ కి వచ్చారా? ప్రొఫెసర్ భగవన్ వచ్చారక్కడికి. మనసయ్య గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ల పక్కన చూసినట్లు అనిపిస్తోంది.”

“కల్చరల్ ఫారమ్ దగ్గర ఉదయకుమారనా?” అని పెద్దగా నవ్వాడు అమర్తరాజ్. ఇతనికి నవ్వడం, నవ్వించడం, ఫోటోలు తియ్యడం మాత్రమే వచ్చినట్లుంది. ఇంతవరకు ఫోన్తోనే ఫోటోలు తియ్యడం చూశాను. ఆ పెద్ద కెమెరా బ్యాగ్ ఎందుకు మోస్తున్నట్లో.

“ప్రొఫెసర్ భగవన్ తో ఒకసారి స్టేజి షేర్ చేసుకున్నా కానీ హంపిలో కాదు.” వివరించాడు ఉదయకుమార్.

“హ్మ్. మరి ఎక్కడ చూసానో?”

“ఈయన చాలా ఫేమస్. ఈయన మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా?” అమర్తరాజ్ నవ్వుతూ అడిగాడు.

కేసులా? ఇంత ఫ్రీగా, హాయిగా తిరుగుతున్నారు ఈయన మీద కేసులా? టీజ్ చేస్తున్నాడు ఈ అమర్తరాజ్.

“30?” తోచిన నంబరు చెప్పాను.

“హా…” పెదవి విరిచాడు అమర్తరాజ్. ఉదయకుమార్ ఒకటే నవ్వు. (మల్లెపువ్వు నవ్వు. నిజ్జం. మల్లెపువ్వులే! అట్లాంటి నవ్వును ఇంతవరకు ఎవరి ముఖంలోనూ చూడలేదు… నా చిట్టితల్లి ముఖంలో తప్ప.)

మరీ పెద్ద నంబరు చెప్పానేమో? “3?”

“380!” అమర్తరాజ్ సీరియస్ గానే అన్నా అతని ముఖంలో దాగని నవ్వు. ఉదయకుమార్ మళ్లీ గట్టిగా నవ్వాడు.

“వాటిలో 20, సెడిషన్ కేసులు” అమర్తరాజ్ మళ్లీ అన్నాడు, “మాకేమో ఈయన అపర గాంధీ. పోలీసులేమో ఈయన వెనకాలే ఉంటారు.”

“ఈరోజు పోలీసులేం రాలేదు కదా?” వీళ్లు జోకులేస్తున్నారో సీరియస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు.

“ఒకతను స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చానన్నాడు కదా?” ఆశ్చర్యంగా అన్నాడు అమర్తరాజ్, “అంటే పోలీసు డిపార్ట్మెంట్ అని తెలీదా?”

“ఓహ్. లేదు. భయపడొద్దని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది. నేను డేంజరస్ మనుషుల్తో ఉన్నానన్నమాట.” నవ్వుతూ అన్నాను.

“ఓహ్ మేం చాలా డేంజరస్” ముగ్గురూ నవ్వారు.

మాటల మధ్యలో అమర్తరాజన్,”మేం మాట్లాడే ఇంగ్లీష్ తెలుగులోకి ఇంటర్ ప్రిట్ చెయ్యడానికి మిమ్మల్ని కృష్ణ అరేంజ్ చేశాడనకున్నాం” అని అన్నాడు.

ఒహ్హో, నేను కూడా వీళ్లకు సర్ప్రైజే అన్నమాట. ఉత్సాహంగా చెప్పాను,“లేదు, లేదు. విశాఖకు వేరే పని మీద వచ్చాను. కృష్ణ, న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్పి, సుందర రాజన్ కొవ్వాడ వెళ్తున్నారని చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కొంచెం తెలుసుకుందామని మీతో వచ్చాను.”

“గుడ్” అంటూ చిర్నవ్వుతో తలపంకించాడు అమర్తరాజన్.

భీముని పట్టణం బీచి దగ్గర కాసేపు ఆగాం. మిరపకాయ బజ్జీలు అందరి కోసం కొన్నాడు సుందర రాజన్.

ఒక ఊర కుక్క అక్కడే తచ్చాడుతోంది. అందరూ దాన్ని అదిలిస్తూ ఉన్నారు. ఉదయకుమార్ తన వంతు బజ్జీలో కొంత పిండి భాగం మాత్రం చిన్ని చిన్ని ముక్కలు చేసి చిన్న పేపర్లో పెట్టి దాని ముందు పెట్టాడు, “సాపడీ, సాపడీ” అంటూ. ఏమనుకుందో, ఎంత ఆకలి మీద ఉందో ఒక్క క్షణంలో తినేసిందది.

అక్కడ్నుంచి రామకృష్ణ బీచికి బయల్దేరాం. రామకృష్ణ బీచి చూడాలన్నది హెచ్చార్కె(నాన్న) జ్ఞాపకాల్లోంచి జాలువారిన నా చిన్నినాటి కల. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. గుండె నిండా ఏదో వెళితి. హెచ్చార్కె చెప్పినట్లు లేదన్నది ఒకటైతే, గడిచిన ఆ మూడు గంటలు నన్ను నిలవనీయడం లేదు. నాకు నేను అందని దూరాలకు ఎక్కడికో కొట్టుకుపోయానని ఏదో కంగారు. ఇంటికి వెళ్దామని చెప్పాను. వాళ్లేం అనలేదు. వెంటనే బయల్దేరారు.

అప్పటికే కృష్ణ మాకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చున్న తరువాత వేరే చోటికి వెళ్లడానికి వాళ్లదగ్గర సెలవు తీసుకున్నాను.

ఉదయకుమార్ అమెరికాలో చదువుకున్నారని, ప్రొఫెసర్ గా కూడా పని చేశారని మాటల మధ్య చెప్పడం గుర్తొచ్చింది.

“ఎప్పుడైనా న్యూ జెర్సీ వస్తే మా ఇంటికి రండి.” అని అన్నాను.

“ప్రభుత్వం తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చినప్పుడు వస్తాడు.” అమర్త రాజన్ అన్నాడు.

“పీ ఎమ్ అయిపోండి, పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు? వీసా ఇచ్చేస్తారు” అన్నాను. నవ్వులతోనే వీడ్కోల్లు చెప్పుకున్నాం.

వీడ్కోలైతే తీసుకున్నాను కానీ, మల్లెపువ్వుల వాన కురుస్తూనే ఉంది – వాళ్లెవరో సరిగ్గా తెలీకపోయిన ఆరోజు నించి, ఎంతో తెలుసుకున్న ఈరోజూ, ఇక ఎప్పటికీ.

mamata2

ఇంతకీ వాళ్లెవరు?

అమర్తరాజ్ స్టీఫెన్ – ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

సుందర రాజన్ – ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ సంస్థ నుంచి. జపాన్ ఫుకొషిమా కి వెళ్లివచ్చినవారిలో ఇతనూ ఉన్నాడు. కూడంకుళంలో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. న్యూక్లియర్ పవర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తల్లో మొదటిశ్రేణిలో ఉంటాడు.

ఎస్ పి ఉదయకుమార్ – 1980 ల్లోనే Group for Peaceful Indian Ocean అనే సంస్థను ప్రారంభించాడు. అమెరికాలో పొలిటికల్ సైన్స్ లో పి. హెచ్ డి చేసి, మాన్ మత్ యూనివర్సిటీలో(Monmouth university) ప్రొఫెసరుగా పని చేసి, 2001 లో భారత దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. South Asian Community Center for Education and Research (SACCER) అనే విద్యాసంస్థను, భార్య మీరాతో కలిసి  స్థాపించాడు. People’s Movement Against Nuclear Energy (PMNAE) అనే సంస్థకు కన్వీనర్. ఈ సంస్థ తరపున, కూడంకుళం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. కూడంకుళం పోరాటం గురించి తమిళనాడు బయట ప్రపంచానికి తెలియజేయడమనే ముఖ్య ఉద్దేశంతో, 2014 లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేశాడు. చివరికి ఆ పార్టీ కూడంకుళం పోరాటాన్ని పట్టించుకోకుండా మధ్యతరగతి ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి “పచ్చై తమిళగం” (పచ్చని తమిళనాడు) అనే పార్టీని స్థాపించాడు.  ఏ ఎన్నికలలోనూ గెలవకపోతేనేం – అసలుసిసలు ప్రజల మనిషి. కూడంకుళం పోరాటాన్ని నీరుగార్చేందుకు ఉదయకుమార్ ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ఎన్నో కేసులు బనాయించింది. విదేశీ నిధులు ఉన్నాయనే నెపం మీద ఆయన ఇంటిమీద, విద్యాసంస్థ మీద రైడ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆయన తన ఆస్థుల వివరాలన్నీ బయటపెట్టి, శాంతియుతంగా చేసే పోరాటాలకు, హంగర్ స్ట్రైకులు చెయ్యడానికి నిధులు అవసరం లేదని చెప్పాడు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం ఆలస్యంగా మొదలయ్యింది. పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతున్నా, ఆ అనుభవాన్ని కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి వినియోగించాలని కొవ్వాడకు వచ్చారు అలుపెరుగని యోధులు – మల్లెపువ్వుల నవ్వులు తోడుగా.

*

వీళ్లను కలిసేదాక కూడంకుళంలో జరిగిన పోరాటం గురించి ఏమాత్రం ఎరుక లేదు. మహా అయితే కొన్నాళ్ల తరువాత కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆడంబరంగా విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఏ ఫేస్ బుక్కు ద్వారానో తెలిసేదేమో.

దళిత్ అంటే ఎవరని అమాయకంగా అడిగిన నా స్నేహితురాలికి నాకూ తేడా ఏమీ లేదు. ఇంటి దగ్గరి పోరాటాల గురించి మాకేం తెలీదు. మేం ఇంటినుంచి చాలా దూరం వెళ్లిపోయాం.

నాకు ఇంటికి వెళ్లాలనుంది…

(ఫోటోలు: అమర్తరాజ్ స్టీఫెన్)

*

మీ మాటలు

  1. rambabu thota says:

    ఆర్టికల్ చదవబుల్ గా వుంది. తేలికగా హాయిగా. చదువుతున్నంతసేపూ నేనెదుకు వెళ్ళలేదా అనిపించింది……
    నా చెన్నయ్ అనుభవాల వలన తమిళ్ కాస్త మేనేజ్ చెసేవాడిని కూడా ….

  2. సాయి పద్మ says:

    మమదా.. నవ్వుతూ దుఖాన్ని తేలికగా రాయటం నీకు అలవాటు అయింది. ఈ విషయంపై రెండు రకాలుగా కామెంట్ చేస్తాను .
    ఒక అబ్జార్వర్ గా మమత- అతర్యుధ్ధామ్ గురించి, మంచినీళ్లు తాగినంత చులాగ్గా మాట్లాడుకోవటం ఎంత బాధాకరం.. కానీ, యుద్ద్ధంలో ఉండేవాళ్ళకి, ఆ మాత్రపు హాస్యం జీవనాధారం. నాకు అర్ధం కానిది ఒకటే, మనిషికో యుద్ద్ధం లా తయారైన పరిస్థితుల్లో, ఎన్ని యుద్దాల గరళాన్ని గొంతులో నిమ్పుకుంటాం ?

    వొక కవిగా, మనిషిగా మమత – ఇల్లు వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళటం అసంభవం మమతా .. మనం వదిలి వెళ్ళిన ఇల్లు మారిపోతుంది. రకరకాలు గా మాసిపోతుంది . ఇదే ఇంటిని ఇంకో మనసులో కట్టగలం .. కూలిన జ్ఞాపకాల సౌధాన్ని నిర్మించటానికి అవే ఇటికెల బంధాలూ.. నమ్మకపు మనుషుల్నీ ఎక్కడ నుండి తెస్తావు ?

    సారీ.. ఏమన్నా నిన్ను బాధ పెట్టి ఉంటె.. !!

  3. కథ రూపంలో చెప్పిన సామజిక అంశాలు ,వాస్తవాలు చాలా బాగున్నాయి .
    న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం విజయ వంతం కాలేదు. పోరాటం కానీ కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరగవలసి ఉంది. మనకు స్ఫూర్తి ఇవ్వడానికి కొవ్వాడకు వచ్చిన మిత్రులకు వందనాలు తెలుపుదాము.
    మన కర్తవ్యం ,కార్య దీక్ష తో ముందుకు పోదాం.

    *

  4. కథనం చాలా బాగుంది, కాంటెంటు బాధాకరంగా వుంది.
    శీతల రూముల్లో, కార్లల్లో బతుకుతూ, తిరుగుతూ విలాసంగా వున్న జీవితాలను ఎందుకండీ మీరిలా వెళ్ళి వచ్చి, అవి చెప్పి బాధిస్తారు!! :( :(

  5. THIRUPALU says:

    పంచాయితి ప్రెసిడెంట్ లాగ, ప్రజలు పాలకుల భాష మాట్లాడి నంతకు పుకిషిమా పునారావ్రుతం అవతానే ఉంటాయి. మీరు గోపాల్ గ్యాస్ ట్రాజాడిని మరిచి పోకుండా ఉటంకించడం బాగుంది.
    తోలు బొమ్మలను గాకుండా తోలు బొమ్మలను ఆడించే సామ్రాజ్య వాదాన్ని బయట పెట్టకుండా కూడంకుళాలని, కొవ్వాడలని అర్ధం చేసుకోలేని.

    • THIRUPALU says:

      కొవ్వాడ సర్పంచ్ లాగ, ప్రజలు – పాలకుల భాష మరిచి పో నంతవరకు ఫుకుషిమాలు పునరావృతమౌతూనే ఉంటాయి. భోపాల్ గ్యాస్ ట్రాజడీని మరిచి పోకుండా ఉటంకించడం ( చాలా ఏళ్ల క్రితం జరిగింది గదా ) బాగుంది.
      తోలు బొమ్మలను గాకుండా, తోలు బొమ్మలను ఆడించే సామ్రాజ్య వాదాన్ని బయట పెట్టి తే తప్ప కూడంగుళాలని, కొవ్వాడలని అర్ధం చేసుకో వడం లో తెలివిడి ఏర్పడదు.
      మమద గారు, ఉదయ కుమార్ పరిచయం బాగుంది.

  6. మమత says:

    జీవన్ కుమార్ గారు, ప్రసాద్ గారు, తిరుపాలు గారు: ఈ రైటప్ ను చదివి స్పందించినందుకు ధన్యవాదాలు. ఒక వివరణ – ఈ రైటప్ ను డైరీ లో ఒకపేజి అనొచ్చేమో. ఇది కథ కాదు. నా స్నేహితురాలి మాటలు, మిగతా అందరూ, ప్రస్తావించిన అన్ని విషయాలు ఎవరి మాటలు వాళ్లవే . మధ్యలో అద్దిన కవిత్వం కూడా ఎప్పటికప్పుడు నా అనుభూతులే – అందుకే మల్లెపూల వాన ఎంత క్లీషేగా ఉన్నా, నాకు ఎలా అనిపించిందో అలాగే ఉంచేశాను :)

    @తిరుపాలు గారు, మీ కామెంటు అసంపూర్ణంగా ఉన్నట్లుంది. నిజమే అయితే, దయచేసి మరొకసారి కామెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తారా? మీ ఆలోచన సరిగ్గా తెలుసుకోవాలని ఉంది.

    @రాంబాబు తోట: రాం, సభాముఖంగా తెలియజేయునదేమనగా, I am very much looking forward to working with you on this issue.

    @సాయి పద్మ: సియా! కామెంట్ ఈ రైటప్ కు రెలవెంట్ అనిపించలేదు. మిస్-రీడ్ చేస్తున్నానేమో. నా గురించిన అందోళన కనిపించింది, బాధపెట్టిందేమీ లేదు.
    కమెంట్ గురించి కొంచెం వివరణ: మనిషికో యుద్ధం సరే, దుఃఖమూ సరే. కానీ ఏ దుఃఖాన్ని, ఏ యుధ్ధాన్ని స్వంతం చేసుకుంటామనే దాన్నిబట్టి ఎంత గరళమైనా సరే భరించొచ్చు కదా? ఆత్మాశ్రయ కవిత్వం ఎంతో భరించలేనట్లున్న నొప్పితో రాసేదే, కానీ అదంతా మరచిపోగలిగే దుఃఖమే అనీ నీకూ, నాకూ తెలుసు. మరి అయిలన్ కుర్దీ, జిషా గురించినది? ఏ క్షణం గుర్తొచ్చినా కడుపులోంచి తన్నుకొచ్చే దుఃఖం, ఈ గరళాన్ని ఊరికె మింగి కూర్చోవడం కాకుండా ఏదన్న చెయ్యాల్సిందే అని ఉసిగొల్పే దుఃఖం. దాన్నే కాదూ మనం స్వంతం చేసుకునేది?
    ఇక ఇంటి సంగతి! మనం మాట్లాడేది ఒకే ఇంటి గురించి కాదనిపిస్తోంది. ఇల్లంటే ఒకటా? – శ్రీకాకుళంలో, జాదూగూడలో, కడపలో, కూడంగుళంలో, మల్లన్న సాగర్లో, హెచ్ సి యులో, కాశ్మీరు లోయలో, మణిపూర్లో… – ఎన్ని ఇళ్లో. ప్రపంచ బాధ తమ బాధ చేసుకుని పోరాడే ఒక్కరైనా ఉన్నంతవరకు ఇల్లు ఎప్పటికీ మాసిపోదు. వాళ్లతో మహా అయితే అభిప్రాయ భేదాలు వస్తాయేమో గాని నమ్మకాలెప్పుడూ పోవు.

  7. నిజానికి ఈ టీం తో వెళ్ళాల్సింది ఇదిచదివాకా ఏంతో మిస్ అయ్యాననిపించింది , కానీ విషయం చాలాబాగా వివరించారు … కూడా వెళ్లిన ఫీలింగ్ కలిగింది .

    • మమత says:

      శరత్ గారు,

      ఈ సారికి మిమ్మల్ని కలవలేకపోయానయితే. మాతో రావాల్సి ఉండిన 5th మెంబెర్ మీరేనా? :)

  8. దేవరకొండ says:

    రాజ్యానికి సిగ్గుండదు. రాజ్యానికి సిగ్గెక్కువ. రాజ్యానికి దయ ఉండదు. రాజ్యం దయామయి. ఇంత దుర్మార్గం పట్టపగలు చేస్తున్నందుకు సిగ్గుండదు. బల/ధన వంతులకు ఇంకా ఇంకా ఉపయోగపడలేకపోతున్నందుకు అహరహం సిగ్గుతో చితికిపోతుంది. సర్వనాశనం అయిపోయే సామాన్యులంటే దయ ఉండదు. బలిసిన వారంటే వల్లమాలిన దయ!
    వైజాగ్ కావడం వల్లనేమో ఈ సందర్భంగా రావి శాస్త్రి గారి ఈ క్రింది మాటలు తలపుకొచ్చాయి:
    1. “కమ్యూనిస్టు మీటింగు దగ్గర స్పెషల్ బ్రాంచ్ వాడు నిల్చున్నట్టు నిల్చున్నాడతను” .
    2. “ఈ (భగవత్) సృష్టిలో న్యాయం లేదు, ధర్మం లేదు, సత్యం శివమ్ లేనేలేవు.ఇంతవరకూ, కొంతవరకూ సర్వజీవజాలాన్నీ సమన్వయ పరచి, సమానత్వం సాధించి, న్యాయం నిలబెట్టి ధర్మ సంస్థాపనకి తాపత్రయ పడేది మానవుల్లో కోటికి ఒక్కడే, ఒక్కడే! కోటికి ఒక్కడైనా మానవుడే, మానవుడే! ”
    3 . “మనల్ని ఇలా ఉంచినవాడు దేవుడే అయితే వాడు దేవుడు కాదు. మనల్ని ఇలా ఉంచినవాళ్లు మనుషులైతే వాళ్ళు మనుషులు కారు. మాకు ఈ చావే చాలునని ఇలా ఉండిపోతే మనం పశువులం కూడా కాము.”

    ఒక అనుభవాన్ని పంచుకుంటూ ఎందరిలోనో ఎన్నో ఆలోచనల్ని రేపిన ఈ రచనకీ రచయిత్రికీ అభినందనలు.

    • మమత says:

      దేవరకొండ గారు,

      రావిశాస్త్రి గారి మాటలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  9. కె.కె. రామయ్య says:

    ఉత్తరాంధ్ర కు ఉరితాడు కొవ్వాడ అణుకేంద్రం ~ ప్రొఫెసర్ టి. శివాజీరావు.

    అణురియాక్టర్ల కండెన్సర్ల ను చల్లబరచటానికి వాడే సముద్రజలం ద్వారా, రియాక్టర్ల చిమ్నీల నుండి వాతావరణం లోకి విడుదల అయ్యే అణుధార్మిక కాలుష్యం వల్ల ప్రజలు కాన్సర్, గర్భస్రావ, జన్యులోపాల అంగవైకల్య శిశు జననాలు వంటి అనేక ప్రమాదాలకు గురవుతారు. తుఫానులు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, విధ్వంసక చర్యలు, మానవ తప్పిదాలు, యాత్రిక లోపాల కారణంగా అణుశక్తి కేంద్రాలలో ఘోరప్రమాదాలు జరుగవచ్చుఁ. ( అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్ విపత్తులు ). అణుకేంద్రాల నుండి వెలువడే అణుకాలుష్యం పరిసరాలలోని పచ్చిక, పశువులు, పక్షులు, సముద్రజలాలలోని మత్య సంపదని, ఆహారపదార్ధాలైన పాలు, పండ్లు, శాఖాహార, మాంసాహార పదార్ధాలనన్నీ విషపూరితం చేస్తాయి. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ కలిగే ముప్పే కాక; అణుకేద్రాలలో ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా.

    https://sites.google.com/site/shivajirao32/nuclearplantatsrikakulam

  10. కె.కె. రామయ్య says:

    వాకిలి అంతర్జాల పత్రికలో విక్టర్ హారా మీద అద్భుత వ్యాసం రాసిన హెచ్చార్కె గారమ్మాయి మమత గారూ,

    ఇసాపట్నం వచ్చి శ్రీశ్రీని, రావిశాస్త్రిని ( వీలుంటే త్రిపుర ని ) తలుచుకోకుండా వెళతాననడం ఏవీ బాగాలేదు. విరసం కృష్ణక్క గారిని పలకరించినట్లు రాయలేదు. చలసాని ప్రసాద్ గారికి నివాళి అర్పించినట్లు, రచనల కంటే ప్రజాపోరాట ఉద్యమాలలో ఎక్కువగా తిరిగే జాజిమల్లి డా. మల్లీశ్వరి గారిని కలిసినట్లు చెప్పలేదు. Hyderabad Central University (HCU) లోని రోహిత్ వేముల వెలివాడల నిరసన పోరుకి తన చంటిబిడ్డ నొర్బుని కూడా తీసుకెళ్లిన చైతన్య పింగళి గారు ఎవరు అని మీ మిత్రులెరవైనా అడిగితె మీరేం చెపుతారు.

  11. మమత says:

    రామయ్య గారు,

    ప్రొఫెసర్ ట్. శివాజీరావు గారి వ్యాసం పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా విలువైన సమాచారం అదంతా.

    కృష్ణ (మానవహక్కుల వేదిక) కూడా ఈ విషయం గురించి చాలా విషయాలు పంచుకున్నారు. అవి కూడా ఆ వ్యాసంలో పంచుకోవలసిందని అనిపిస్తోంది ఇప్పుడు. అసలు విశాఖకు నన్ను తనతో కూడా తీసుకెళ్లిన విమల గురించి ప్రస్తావించలేదు, కొవ్వాడకు వెళ్లే దారిలో మౌనంగా ఉన్నంత సేపు తోడొచ్చిన , అంతకు రెండురోజుల ముందు రంగనాయకమ్మ, గాంధీగార్లతో మాట్లాడుకున్న సంభాషణ జ్ఞాపకాలు – ఇవి కూడా రాసి ఉంటే చాలా బాగుండేది. అవన్నీ ఈ వ్యాసంలో విషయానికి రిలవెంట్ కూడా. కానీ, నా జీవితాన్ని ఒక కుదుపు కుదిపి, గమనాన్ని మార్చిన ఆ మూడు గంటల మీదే ఫోకస్ చేశాను.

    విశాఖలో ఉన్నది ఒక్క రోజే. ఇంకొక్క రోజైన ఉండగలిగితే బాగుండేదని విమల, నేను అనుకున్నాం.

    ఆ పదిరోజుల్లో హైదరాబాదులో, వైశాఖలో కలిసిన మిత్రులను, వాళ్ళతో మాట్లాడి, ఇన్ఫ్లుయెన్స్ అయిన విషయాలు రాస్తే డైరీలో ఇంకో పేజీ రాసేయ్యోచ్చు :) అవన్నీ పంచుకోవలసిన విషయాలు కూడా. ఏమో రాస్తానేమో.

    ఇక చైతన్య అంటే, సింపుల్గా … పనికొచ్చే విషయాలు, అవి కూడా అందరికీ సరిగ్గా తెలియని విషయాలు, అందరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు రాస్తోంది. ఆషామాషీగా కాదు, హ్రదయంలో ఇంకి పోయేట్టు రాస్తోంది. వూరికే రాయడం కాదు, ఆ ఉద్యమాల్లో ఒక భాగమై రాస్తోంది. నోర్బును కూడా భాగం చేస్తోంది. అది మామూలు విషయం కాదు. అది తాను రాసేవాటిపట్ల తనకున్న నిబద్ధతకూ, నిజాయితీకీ నిదర్శనం.

  12. కె.కె. రామయ్య says:

    సందర్భోచితమైన రావి శాస్త్రి గారి మాటలు ( సర్వనాశనం అయిపోయే సామాన్యులంటే రాజ్యానికి దయ ఉండదు … ) తలపుకు తెచ్చిన దేవరకొండ గారికి ధన్యవాదాలు.

  13. గొంతు లో ముళ్లబంతి … ఇస్మత్ చుగ్తాయ్ ఎంత బాగా చేప్పారో కదా.. – మనుషుల్ని మరింత మనుషుల్ని చేసే సెన్సిబుల్ కధనం!- థాంక్ యూ మమతగారూ .

మీ మాటలు

*