గోడంత అద్దంబు గుండెలకు వెలుగు

mandira2

Art: Mandira Bhaduri

 *
అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ

అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా?

ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦

అదేపనిగానో , అప్పుడప్పుడో

అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా

నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ

ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను

ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది ?

అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ

వంద మయసభలు కట్టుకోవచ్చు

అద్దంతో నా అనుబంధం ఇవాళ్టిది కాదు

నీమొహంలా వున్నావు – అని ఎవరు కుండ బద్దలు కొట్టినా

అద్దంముందు వొలికిపోవడ౦ తప్ప గత్యంతరం లేదు

అయినా నామొహం నామొహం లానే వుండిపొతే

ఇంత లావు సౌందర్య శాస్త్రమూ చిత్తుకాయితమే కదా

అద్దం పుట్టని రోజుల్లో అందగత్తెలంతా

జీవితాంతమూ సౌందర్య భ్రాంతిలోనే వుండేవారేమొ తెలీదు

భ్రమలు దిగ్భ్రమలవడ౦ కొసమే అయినట్టు

ఇపుడిక్కడ ఇంటికున్న ప్రతి నాలుగో గోడా అద్దమే

సూటిగా చెప్పాలంటే యవ్వనం వున్నప్పుడు అద్దం లేదు

అద్దం అమిరాక యవ్వనం లేదు

అద్దాలన్నీ యవ్వనం కోసమే అయితే

మిగిలిన వనాల మాటేమిటి ?

అద్దాన్ని నమ్ముకున్నవాళ్లు

ఒక యుద్దాన్ని కూడా చేస్తుంటారు

ఏమిటా యుద్దం ?

ఇటువైపు ఒక బింబం వుంటుంది

అటువైపు ప్రతిబింబం వుంటుంది

బింబానికి అబద్ధాలతో మోసపోవడం ఇష్టం

ప్రతిబింబానికి మసి పూసుకుని ఎదురవడ౦ వేడుక

బింబ ప్రతిబింబాల ఘర్షణలో మధ్య నేను నలిగిపోకుండా

అద్దమే నా ఫేస్ ని ప్యాక్ చేసి రక్షణ ఇస్తుంది

ఇన్నివిధాల ఆదుకున్న మమతల కోవెల లాంటి

నా మురిపాల అద్దం ఈ మధ్య ఎందుకో కళ్లలో నిప్పులు పోసుకుంటోంది

నిజమ౦టే నిప్పే కదా

ఇప్పుడు దాని సెగకి దూరంగా కూడా నుంచోలేక పోతున్నాను

చూస్తూ చూస్తూ నిప్పుని కొంగున ముడేసుకుంటామా చెప్పండి

నిన్నటికి నిన్న ఒక నడివయసు నాంచారమ్మ

కళ్లు రిక్కించి నావంకే చూస్తో౦ది

నాంచారమ్మా నాంచారమ్మా నువ్వెవరమ్మా అ౦టే

నాపేరు చెప్పింది చూడు

అబ్బే ,లాభంలేదు అద్దానికి మతి పోయినట్టుంది

ఆస్పత్రిలో పడెయ్యాలి

అద్దం అన్నాక అది బద్ద లయ్యేలోపు

ఒక నిజాన్ని వాంతి చేసి పోతుందని తెలుసులే కాని

కడుపులో మరీ ఇంత కుట్ర దాచుకు౦దనుకోలేదు

ఇప్పుడీ నాంచారమ్మ దేహ సమాధిలో

ఒక రెండు జెళ్ల సీత వుందా లేదా?

*

 

 

 

 

 

మీ మాటలు

  1. Aranya Krishna says:

    అద్దం లో అందం వుంది. తత్వం వుంది. అన్నింటికీ మించి వాస్తవం వుంది. కానీ అబద్ధం లేదు. సృష్ఠిలో అద్దాన్ని మించిన సత్యసంధత కలిగింది మరేదీ లేదు. మనిషి తనని తాను మోసం చేసుకొని అబద్ధాలు చెప్పగలడేమో కానీ అద్దానికి అబద్ధాలు చెప్పలేడు. అద్దం కూడా అబద్ధమాడదు. చాలా రోజుల తరువాత చదివిన నిర్మల కవిత గొప్పగా వుంది. ప్రతి కవితాంశంలోనూ అస్తిత్వ వేదనను, తాత్వికతను పతాకస్థాయిలో చూపించి పాఠకుణ్ని అనుభూతి జడివానలో ముద్దముద్ద చేసే ఆమె ఈ కవితలోనూ అదే పని చేసారు. అభినందనలు నిర్మలా!

మీ మాటలు

*