Archives for August 2016

ఆవు అంబా అనును!

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అఖ్లాక్.. రోహిత్.. యింకా ఆ‘నలుగురికి’!

అనామకులకి.. అనేకానేకులకి!…

చూసారా? దెయ్యాలు వేదాలు వల్లించడం చూసారా?..

“మీరు తూటాలు పేల్చాలనుకుంటే నన్ను కాల్చండి.. ఇప్పటికైనా ఈ దాడులు ఆపేయండి..”

“నా దళిత సోదరులపై దాడులు ఆపండి. కావాలంటే నాపై దాడి చేయండి.. నాతో యుద్ధం చేయండి..”

ఈ వేద మంత్రాలు విన్నారా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయనేమో? ఆవేశం చూసారా? ఆ-వేషం చూసారా? ఆ వేగమూ వుద్వేగమూ చూసారా? దేశ ప్రజలే నా హైకమాండ్ అంటున్నాడు! నూటా యిరవై అయిదు కోట్లమంది నా అధిష్టానం అంటున్నాడు! వారి ఆశలూ ఆకాంక్షల మేరకే.. మార్గదర్శకత్వం మేరకే ప్రభుత్వం నడుస్తోందంటున్నాడు! ఓటు వేసి అధికారము అందివ్వడంతోనే అయిపోలేదంటున్నాడు! నన్నూ నిలదీయండంటున్నాడు! ప్రధానినీ ప్రశ్నించే వ్యవస్థ రావాలంటున్నాడు!

అందుకైనా ప్రశ్నిద్దాం! ప్రశ్నించమన్నందుకైనా ప్రశ్నిద్దాం! మన చావులు వొక ప్రశ్న కాదా? మన వొంటి మీది గాయాలు ప్రశ్నల గుర్తులుకాక మరేమిటి? ప్రశ్నిస్తే మాత్రం వాడు జవాబుదారి కాగలడా? అయినా కాకపోయినా మనం ఈ దేశ ప్రజలమే కదా? మనల్ని అధిష్టానం అని అన్నందుకైనా.. నిలదీయమన్నందుకైనా.. నిలదీద్దాం! నిగ్గదీద్దాం!

నిన్న నిన్న ఢిల్లీ టౌన్ హాల్లో- భిన్నత్వంలోనే భారతదేశం బలం దాగుందని సెలవిచ్చాడే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో తీవ్ర వివక్ష యెదుర్కొన్నారని, విదేశాల్లో గౌరవం పొందారని, అయినా ఆయన భారతీయుడుగానే వున్నారని, ఆయన స్ఫూర్తి ప్రతివొక్కరిలో వుండాలని విన్నవించాడే?..

మరి ఆ స్పూర్తి చెప్పేవాడిలో చిగురంతయినా వుందా? ఏలేవాడిలో పూచిక పుల్లంతయినా వుందా? ఉంటే దేశమిలా వుంటుందా? అంబేద్కర్ యెదుర్కొన్న తీవ్ర వివక్ష వారి జాతి జనులమైన మనకు యింకా వారసత్వంగా కొనసాగుతూనే వుందే? స్వాతంత్ర్యం వొచ్చి యేడు దశాబ్దాలు గడుస్తున్నా సామాజిక రుగ్మతలు కొనసాగడం, అంటరానితనం వుండడం, దళితులు వివక్షకు గురికావడం సిగ్గుచేటని మళ్ళీ ఆ నోటితోనే అన్నాడు! మొట్ట మొదట దేశ ప్రధానిగా సిగ్గుపడాల్సింది తను కాదూ?!

వివక్ష! కక్ష! కక్ష గట్టి కత్తిగట్టి చంపుతున్నారే?, ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. పంతొమ్మిది శాతం దాడులు యెక్కువయ్యింది? ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. ఈ రెండేళ్లలో నలభైయ్యేడు వేల అరవైనాలుగు దాడులు జరిగింది? లెక్కలకందినవే.. లేనివి లేవే?, యెక్కడికక్కడ యెప్పటికప్పుడు వుసుళ్ళు తీస్తున్నారే? జీవాలార్పేస్తున్నారే? మాది మతం కాదు, జీవన విధానం అంటున్నారే.. మరి యెవరి జీవన విధానాన్ని యెవరు డిజైన్ చేస్తున్నారు? సంస్కృతి మాత్రం అందరికీ వొక్కటే వుంటుందా? ఒకవైపు భిన్న సంస్కృతుల సమాహారం అంటున్నారే.. మరోవైపు సహనం తప్పి సంహారం చేస్తున్నారే..?

జీవమంటే గోవుదీ ఆవుదేనా? మనిషి.. సాటి మనిషి జీవి కాడా? ప్రాణి కాడా? జంతు వధశాలలు దేశంలో పదహారువందల యిరవైమూడేనని వాడనుకుంటున్నాడు! మహారాష్ట్రలో మూడొందల పది, ఉత్తరప్రదేశ్ ల రెండువందల యెనభై అయిదు, ఏపీ తెలంగాణాల కలిపి నూటా యెనభై మూడు.. జంతు వధశాలలు లెక్కలు చూపుతున్నారే! మరి యెక్కడికక్కడ దళితుల్ని చంపుతున్నారే, ఆదివాసీలను చంపుతున్నారే, మైనార్టీలను చంపుతున్నారే.. వధిస్తున్నారే.. మనిషి కూడా జంతువే కదా? వేటాడుతున్నారు కదా? వెంటాడి చంపుతున్నారు కదా? మరి ఈ వధ శాలల లెక్కల మాటేమిటి? అయినా జంతుమాంసం వుత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం కదా, ఆ స్థానం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా? ముప్పై మూడు వేల నూటా యిరవై యెనిమిది కోట్ల రూపాయల ఆదాయం వొస్తోందే? ఒక్క యేడాదికే వొచ్చిన ఆదాయం అది. అందులో పశుమాంసమే యిరవైతొమ్మిది వేల రెండువందల యెనభై రెండు కోట్ల రూపాయలు. ఆడబ్బుతో పరిపాలిస్తున్న వాళ్ళకీ జబ్బేమిటి? జాడ్యమేమిటి?

మరోవైపు నిస్సిగ్గుగా ఆయనగారు లండన్ లో అంబేద్కర్ నివసించిన భవనాన్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని గొప్పగా చెపుతున్నాడు. చివరి రోజుల్లో ముంబైలో అంబేద్కర్ నివసించిన భవనాన్ని స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నట్టు మహగొప్పగా చెపుతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్మారక భవనం యేర్పాటు చేస్తున్నాడట! అయ్యవారు చేస్తున్నదానికి అంబేద్కర్ ఆనందపడతాడా? మన నోట్లో మలమూ మూత్రమూ పోసి దేశాన్ని స్వచ్చభారత్ చేస్తున్నారే? గో మూత్రము తాగించి.. పేడ తినిపించి.. అక్కడితో ఆగక హత్యలు చేస్తున్నారే? ఆనవాళ్ళు కావాలా? హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్.. యెక్కడికి వెళ్ళినా శవాలు సాక్ష్యం చెపుతాయి! గాయాలే కావాలా.. ఆమడదూరం అక్కర్లేదు.. నిన్నటి తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం.. భీమనపల్లి శివారు సుధాపాలెం శ్మశానమే సాక్ష్యం! ఎలీషా, లాజర్ యిద్దరూ చనిపోయిన గోవుల చర్మం వొలిచారు! చేసిన నేరానికి శిక్షగా వాళ్ళిద్దర్నీ చావుబతుకుల్లోకి తోసేసారు! ఊనా లో జరిగిందే ఊళ్ళోనూ జరిగింది! యిప్పుడు ప్రతి వూరు ఊనా నే! ‘ఆ నలుగురినీ’ కారుకి కట్టి తొక్కుతొక్కు పొట్టుపొట్టు కొట్టారే.. అదే విధము.. అదే పథము..

కులవృత్తికి కట్టు బానిసలని చేసారు. కుల వృత్తి చేస్తే నేరం. చెయ్యకుంటే నేరం. పుట్టుకే నేరం చేశారే? పుట్టకముందే నేరస్తులను చేశారే? అరే.. వీళ్ళకు వీళ్ళే న్యాయ మూర్తులు! వీళ్ళకు వీళ్ళే తీర్పరులు! వీళ్ళకు వీళ్ళే పోలీసులు! ఎన్నడూ లేనిది వీళ్ళకు యింత కండకావరం యెలా వొచ్చింది? వీళ్ళకు వీళ్ళే కత్తులు కర్రలు గొడ్డళ్ళు పట్టుకొని వుగ్రమూకల్లా వురికురికి మీద పడుతున్నారే?

గోరక్షకుల ముసుగులో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన పడడానికి అల్లాటప్పావా ప్రధానివా అని అడగాలని వుంది. ఆ మొసలికన్నీరు చూసి నిజంగానే మొసలి కన్నీరు పెట్టుకుంటుంది. గోపరిరక్షక దళాల పేరుతో సంఘవిద్రోహక శక్తులు దుకాణాలు తెరిచారు, వారి చర్యలపట్ల నాకు ఆగ్రహం కలుగుతోంది అంటున్నావే?, వారి చర్యలు యివాల్టికి యివాలే మొదలు కాలేదు, నువ్వు అధికారంలోకి వొచ్చినప్పటి నుండి జరుగుతున్నాయే? రోజు రోజుకీ మితిమీరుతున్నాయే? ఎంత విదేశాలలో తిరిగితే మాత్రం అంత మాత్రము కూడా దేశం గురించి పట్టదా? దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్టు లేదూ?

అడగాలని వుంది! అగ్గితో కడగాలని వుంది! నిలదియ్యాలని వుంది! నిప్పుతో వొడి కట్టుకోకు అని చెప్పాలని వుంది!

అయ్యా దాద్రీ మొదలు ఊనా వరకు దేశం రెండేళ్లుగా దద్దరిల్లిపోతూనే వుందే.. వొక్కనాడు వొక్కమాట మాట్లాడావా? వొక్క భాదితున్ని పలుకరించావా? విషం తాగి దళితులు ఆత్మహత్యలకి పాల్పడబోతే వద్దన్నావా? వారించావా? శవాలు లేచిన వొక్క యింటికయినా వెళ్లి కనీసం సానుభూతి చూపించావా? కన్నీళ్ళయినా తుడిచావా? కనీసం ఖండించావా? హంతకులు రోజుకి రోజూ చెలరేగిపోతుంటే ఆగమన్నావా? ఆపమన్నావా? అరెస్టులు చెయ్యమన్నావా? కఠినంగా వున్నావా? వుండమన్నావా? వాళ్ళని ఆపే శక్తి నీకు లేదా? మీ సంఘ్ పరివారమనే వెసులుబాటు యిచ్చావా? గోరక్షక దళ్ దాని తోక అనో.. తొండం అనో.. చూసి చూడనట్టు వున్నావా? వూరుకున్నావా? అందరం ఆ బళ్ళో చదివినోల్లమే అని మూకల్ని వెనకేసుకు వచ్చావా? ఆనాడే ఆపివుంటే యెన్ని ప్రాణాలు దక్కేవి? రాజ్యాంగ వ్యతిరేక శక్తులపట్ల అంత రాగమూ అనురాగమూ నీకెందుకయ్యా? పిర్ర గిల్లేది నువ్వే.. జోల పాడేది నువ్వే.. నువ్వు మా కానోడివి.. అని ముఖం మీద అడగాలని వుంది!

చేపల కోసం కొంగ జపం చేసినట్టు దళిత జపం! దళితులు యెప్పటికీ కళ్ళు తెరవని చేపపిల్లల్లాగే వుంటారా? నేను చావనైనా చస్తాను గాని నీకు గులాం కాను, ఆహారం అంతకన్నా కాను.. అని బలవంతంగా వెళ్ళిపోయిన రోహితా నువ్వు తిరస్కరించిన గడ్డమీద మాట్లాడాడు. నీ హత్యకు కారకుడైన వీసీ పొదిలి అప్పారావు మీద యింతవరకూ చర్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడి రెండుమూడు రోజుల్లోనే చక్కదిద్దుతానని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన మాట యెన్నడో యాది మరిచిపోయాడు. విద్యార్థులను వెక్కిరించి, రెచ్చగొడుతున్న వాన్నే తెచ్చి తిరిగి పెట్టారు. అడిగిన యిద్దరు ప్రొఫెసర్లని సస్పెండ్ చేసారు. ఇరవయ్యేడు మంది విద్యార్థులను అరెస్టు చేసారు. కేసులు పెట్టినవి పెట్టినట్టే వున్నాయి! బెయిల్లూ జెయిల్లూ యివే విశ్వవిద్యాలయాలు! అటు హంతకులకి అధికారమిచ్చి యిటు దళితులు నా సోదరులు అనడం నోటితో పిలిచి నొసటితో వెక్కిరించడం కాదా అని అడగాలని వుంది. నిజంగా నీకు దళిత సానుభూతి కావాల్సి వస్తే మానవ వనరుల మంత్రిత్వ శాఖ నీ చేతుల్లో లేదా? నిప్పు రాజేయకూడదని నువ్వు అనుకొని వుంటే ఈపాటికే చల్లార్చేవాడివి కాదా? నీ చేతొక తీరు.. నీ మాటొక తీరు.. అని నిలబెట్టి అడగాలని వుంది! అడగనా?

గుండెలు జలదరించే గుజరాత్ అల్లర్లు మేం మర్చిపోలేదు.. నీవు మాదేశం రావటానికి వీల్లేదని అమెరికా కూడా అభ్యంతరం చెప్పడం మేం మరిచిపోలేదు.. ఢిల్లీ బీహార్లో నువ్వు వోడిపోయావని మేం మర్చిపోలేదు.. పంజాబ్ లాభం లేదు.. యూపీ గుజరాత్ లో నీవు వోడిపోతావన్న భయంతోనే యిదంతా నువ్వు మాట్లాడావని మేం మరిచిపోలేదు.. ఎన్నికలు వస్తే యెలా అయినా మాట్లాడతారని మేం మరిచిపోలేదు.. అందుకే నిన్ను నమ్మలేదు.. మాటుగాసిన నీ మాటలు నమ్మలేదు..

అని రాజుకి చెప్పాలా? చెప్పకుండానే గ్రహించాడు! అందుకే అంతలా నటించాడు!

అయ్యగారు అధికారంలోకి వొచ్చింది మొదలు నల్ల రంగు నిషేధించబడింది! నల్లని చర్మాలు ఫెటిల్లున పేలిపోతున్నాయి! ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి! మనం తినే తిండి.. పీల్చే గాలి.. కట్టే బట్ట.. అన్నిటా వాడే! వాడి కాషాయమే! పైగా కాషాయం విప్లవమంటున్నాడు! విద్యుత్ వెలుగులంటున్నాడు! విడ్డూరం గుడ్డెడితే తెల్లుల్లిపాయ పిల్లెట్టినట్టుగా లేదూ?

అఖ్లాక్.. వాళ్ళు మనిషి మాంసాన్ని తప్ప గొడ్డు మాంసాన్ని చూడలేరు! అంతటి దయామయులు!

గురూ.. మీ నలుగురూ చూసారు కదా? కాశారు కదా? మీ వొంటి మీద పడ్డ దెబ్బల్ని లెక్కపెట్టండి! వడ్డీతో సహా రేపోమాపో మన సహ దళితులు తీర్చేస్తారులే! తిరుగులేదులే! తిరగ రాస్తారులే!

మన పక్షం వహించిన మన ప్రధాని మీద వొట్టు!

యిట్లు

‘అధిష్టానం’లో వొకడు!

కొత్త కవిత్వానికి చిరునామా తెలంగాణా: సోమసుందర్

 

sosu1

‘ వజ్రాయుధం ‘ – నేను చదివిన ఆవంత్స సోమసుందర్ గారి కవిత్వం. శ్రీశ్రీ కవిత్వం తర్వాత లయాత్మకతతో నన్ను చదివించిన కవిత్వం అది. వడివడిగా సాగుతూ, గుర్రపు కాలిగిట్టలు చేసే ధ్వనిలా అనిపించింది.

నా కవితా సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ సోమసుందర్ గారికి నేను పంపిన తర్వాత – చదివి – వొక రోజు ఫోన్ చేసారు. ‘ పిఠాపురం ఎప్పుడొస్తావు ‘ అన్నారు. ‘ వస్తాను గురువు గారూ.. మిమ్మల్ని చూడాలని – మీతో దగ్గరగా వుండి మాట్లాడాలని వుంది ‘ అన్నాను. ఫలానా రోజున వస్తాను – అన్నాను. మళ్లీ కొన్ని రోజులు పోయాక ఫోన్ చేసి.. ‘ ఎప్పుడు వస్తావు ? ‘ అని అన్నారు. ఆ ఫలానా వెళ్తానన్న రోజు నేను వెళ్లలేదు. ‘ మళ్లీ సెలవుల్లో వస్తాను గురువు గారూ… ! ‘ అని అన్నాను. కానీ వేసవి సెలవుల్లో గానీ, దసరా సెలవుల్లో గానీ – వెళ్లలేకపోయాను. మళ్లీ ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ‘ ఎప్పుడు వస్తావు ! ‘ అంటూ ఫోన్ చేసారు.

నా కవిత్వం మీద – ప్రేమగా, ఆప్యాయంగా, విశ్లేషనాత్మకంగా – నాకు చాలా ప్రేరణను యిచ్చే వ్యాసం వొకటి రాసారు గురువు గారు. నా కవిత్వం ఎదుగుదలకు విలువైన సూచనలు చేసారందులో. ఎదిగే క్రమంలో సాధించాల్సిన కవిత్వాంశాలను చెప్పారు. లోపాలను – ప్రేమతో ఎత్తి చూపారు.

ఆ వ్యాసం పదేపదే చదువుకుని – నన్ను నేను దిద్దుకోవాల్సిన వ్యాసంగా మారింది.

చిన్నప్పుడు – తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఆయన కవిత్వం చదివి – గొప్పగా భావించిన నాపై, నా కవిత్వం పై ఆయన వ్యాసం రాయడం గొప్ప ఆనందంగా అనిపించింది.

మళ్లొకసారి ‘వజ్రాయుధం’ చదివాను.

ఈ సంవత్సరం జనవరి 9, శనివారం – తెల్లారిజామున – కవిత్వం రాస్తున్న నా పాఠశాల విద్యార్థిని వెంట తీసుకుని – పిఠాపురం బయలుదేరాను.

మాధవస్వామి గుడి వీధిలో వున్న ఆయన ఇంటికి వెళ్లాము.

ఆయన గదిలోకి అడుగుపెట్టాం.

మంచం మీద వెల్లకిలా పడుకుని వున్నారు. మెలకువగానే వున్నారు. వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నారు.

నేను వెళ్లి..

‘ గురువు గారూ…. ! ‘  అని పిలిచి – నా పేరు చెప్పాను. నా రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకున్నాను. ఏదో ఆప్యాయత అసంకల్పితంగా నన్ను అలా చేయించింది. మహా మృదువైన ఆ చేతి అనుభూతికి లోనయ్యాను. పక్కన కూర్చున్నాను. ‘ నువ్వా… ! ‘ అని చాలా ఆనందపడ్డారు. కళ్లు ఆనందానికి లోనయ్యాయి. వస్తున్నానని ముందుగా తెలియజేయలేదు నేను. నన్ను వాళ్ల అబ్బాయికి పరిచయం చేసారు.

సొసు౨

పక్కనే వున్నాను. నా చేతుల్లోనే ఆయన చేయి వుంది. ఆ మృదుత్వం నాకు తెలీకుండానే నా లోపలకి అనుభూతమవుతుంది.

ప్రేమగా మాట్లాడారు.

తర్వాత లేచి – ఆయన మంచానికి ఆనుకుని వున్న కుర్చీలో కూర్చున్నాను.

ఆయన జీవితానుభవాలు, కవిత్వానుభవాలు, జైలు అనుభవాలు, పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేసినప్పుడు.. ఇంటందరూ ఏడ్వవడమూ ; మిగిలిన సాహిత్యజీవులతో అనుబంధాలు.. ఇంకా పాత జ్ఞాపకాలను అనేకం నెమరువేసుకోవటం ; సామ్యవాదం గురించి – కులం గురించి – హైందవభావజాలం గురించి – ఆ నాలుగు గంటలూ చాలా విషయాలను చెప్పారు. మాట్లాడానికి కష్టపడుతూ.. అయినా కవిత్వం – సాహిత్యం యిస్తున్న బలంతో చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. చాలా అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కల్బుర్గి గురించి మాట్లాడారు . ‘కబుర్గి’ని దగ్గర నుంచే చంపారట ! రచయితలని కూడా బతకనివ్వటలేదా.. ‘ అని బాధతో, ఆగ్రహంతో – అన్నారు.

అప్పటికి నేను రాసిన కొత్త కవితలు చదివాను. కళ్లు మూసుకుని చాలా శ్రద్ధగా విన్నారు. నచ్చిన చోట ‘ బాగుంది ‘ అని అంటూ.. నిమగ్నతతో విన్నారు. అంత గొప్ప కవి, గొప్ప జీవితానుభవం వున్న మనిషి ముందు – కవిత్వం చదవటం.. నేను నా జీవితంలో మరిచిపోలేని అనుభవం.

‘ పద్యం గురించి కాస్తా మాట్లాడుతా ‘ కవిత చదివాను. ‘ పద్యాన్ని అరచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరితే అట్టే అంటిపెట్టుకుని వుంటుంది ‘ అన్న స్టాంజాని విని.. ఆగమని చెప్పి నెమ్మదిగా కళ్లు మూసుకున్నారు… ఆరేడు సెకెన్లు తర్వాత కళ్లు తెరిచి ‘ కానీ… ‘ అన్నారు. ‘ వేళ్లు గురించి.. ‘ కవిత చదివాను. ‘ అమ్మ నన్ను చంకలో ఎత్తుకునేటప్పుడు కిందకు జారిపోకుండా ఆ వేళ్లతోనే గట్టిగా దేహానికి అదుముకునేది ‘ అన్న దగ్గర.. ఆగి.. ” మా పెద్దబ్బాయిని నా గుండెల మీద వేసి పెంచాను ” అని అంటూ.. కాసేపు కళ్లు మూసారు.

అప్పుడు తెలిసింది ‘ ఆయన కవిత్వంతో తాదాత్మయం చెందుతున్నారని ‘. అంత పెద్ద వయసులోనూ కవిత్వం కోసం ఆవురావురమనడం నాకు గొప్ప ప్రేరణనిచ్చింది.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అతనితో నేను గడిపిన కాలం అమూల్యమైనది. ‘ మళ్లీ మళ్లీ చూసిరావాలి. మాట్లాడాలి ‘ అని అనిపించే మనిషి. క్రిష్టోఫర్ కాడ్వెల్ ‘ ఇల్యూజన్ అండ్ రియాలిటీ ‘ పుస్తకం ఇస్తూ.. ” మళ్లీ వచ్చినప్పుడు ప్రతీ భాగం గురించి నువ్వు నాకు చెప్పాలి. ఉత్తరాల్లోనూ రాయాలి ” అని అన్నారు. ఆయన ఆత్మకథ రెండో భాగం ‘ పూలు – ముళ్ళు ‘ ఇచ్చారు. ఇంకా ఆయన సాహిత్యం చాలా ఇచ్చారు. ‘ నిద్రపోకు అనుభవాలు జారిపోతాయి.. మేలుకోకు కలలు పారిపోతాయి ‘ పుస్తకం పేరు ప్రత్యేకంగా వుందండి – అని అన్నాను. నవ్వి.. అలాంటివే మరికొన్ని తన పుస్తకాల పేర్లు చెప్పారు. ఆయన తన పుస్తకాలును ఇస్తూ.. వొక మాట అన్నారు : ‘ ఇంత వరకు నా సాహిత్యం మొత్తం చదివిన వాళ్లు వొక్కరూ కనిపించలేదు.. ‘ అని.. కొనసాగిస్తూ…..  ‘ మళ్లా కొత్త పుస్తకం వేస్తున్నాను ‘ అని చెప్పారు. ‘ అందులో వర్తమాన కవుల మీద నేను రాసిన వ్యాసాలు వుంటాయి , నీ కవిత్వం మీద రాసింది కూడా వుంటుంది ‘ అని అంటూ….  ఆ పుస్తకం పేరు చాలా గమ్మత్తుగా వున్నది.. చెప్పారు. ‘ ఎలా వుంది పుస్తకం పేరు ? ‘ అని అన్నారు. ‘ చాలా ప్రత్యేకంగా పెట్టారండీ ‘ అని అన్నాను. ఆ పేరు వైవిధ్యంగా వుంది.. యిప్పుడు గుర్తుకురావటం లేదు.

ఇలా ఆత్మీయసంభాషణ సాగుతున్నప్పుడే మధ్య మధ్యలో నేను వేసిన కొన్ని ప్రశ్నలకు స్పందించారు :

ప్రశ్నలు – జవాబులు

* ఇప్పడు వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ?

ఇప్పటితరం యువకవులు బాగా రాస్తున్నారు. తెలంగాణా నుంచి మంచి కవిత్వం వస్తుంది. స్ట్రగుల్ వుంది. ఆధునికం కవిత్వం మలుపు తిరగాలి.

* ఇంగ్లీష్ కవిత్వం అధ్యయనం అవసరం గురించి చెప్పండి ?

చదవాలి. కచ్చితంగా చదవాలి. ప్రపంచ కవులను చదవడం అవసరం.

* కులం గురించి… ?

కులం పోవాలి. పేర్లులో వున్న కులం అస్తిత్వం కూడా పోవాలి.

* శ్రీశ్రీ తో మీ అనుబంధం ?

1945 లో ఇంటర్ పూర్తి అయ్యాక.. శ్రీశ్రీని కలవటానికి శ్రీశ్రీ కోసమే మద్రాసు వెళ్లాను. ఇంటికి వెళ్లాను. ఇంటిలో ఆ పూట తినడానికి లేదు. బయటకు వెళ్లి.. టీ, బిస్కెట్స్ తిన్నాము.

అప్పుడు నా దగ్గర వున్న డబ్బులతోనే వండుకోవడానికి కావాల్సిన సామాన్లు కొన్నాం.

మొదట శ్రీశ్రీ కవిత్వం పరిచయం లేదు. ఎలా కవిత్వం రాయాలి ? దారి ఏమిటి ? అని సంశయం వుండేది. కానీ కవిత్వం రాయటం అప్పటికే మొదలుపెట్టాను. శ్రీశ్రీ కవిత్వంలో… ‘ కవితా! ఓ కవితా !, జగన్నాథుని రథచక్రాలు ‘ ఎక్కువుగా పదే పది చదివేవాడిని.

* శివారెడ్డి గారితో మీ అనుబంధం ?

శివారెడ్డి నమ్మే రాజకీయాల గురించి మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. శివారెడ్డి నన్ను బాగా ప్రేమిస్తాడు. నేనూ అంతే. బలాఢ్యుడు కాడనిపిస్తుంది కానీ గట్టివాడే. శివారెడ్డి కొడుకుని వొకరోజు వాళ్ల ఇంటి దగ్గర నా రెండు చేతుల్లో పెట్టాడు.. చాణ్ణాళ్ల క్రితం.

* భారతదేశంలో సామ్యవాదం గురించి… ?

సామ్యవాదం ఎప్పుడొస్తుందో చెప్పలేం. స్పాంటేనియస్ గా వస్తుంది – యాక్సిడెంటల్ గా వస్తుంది. సామ్యవాదం వచ్చితీరుతుంది.

ఆ రోజు ఆ సాహిత్యపిపాసిని వదిలి వచ్చేసానే గానీ..  మళ్లీ మళ్లీ వెళతాను… కలుస్తాను… మాట్లాడుతాను… అని అనుకున్నాను. నమ్మాను. పిఠాపురం ఏమాత్రం.. దగ్గరే… ఎప్పుడు పడితే అప్పుడ వెళ్లి వచ్చేయవచ్చు.. అని అనుకున్నాను. నా కొత్త కవిత్వ సంపుటి వచ్చిన వెంటనే పిఠాపురం వెళ్లి.. ప్రత్యక్షంగా యిచ్చి రావాలి – అనీ అనుకున్నాను. నాలుగు రోజుల కిందట హాస్పిటల్లో చేరారు.. అన్న వార్త పేపర్లో చదివి ఫోన్ చేసాను.  ‘ కోలుకుంటున్నారు.. బాగున్నారు – రేపే డిస్చార్జ్ ‘ అని గురువు గారి అబ్బాయి చెప్పారు. ఈ రోజు యిలాంటి వార్త వినాల్సిరావడం పూడ్చుపెట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. మళ్లీ  పిఠాపురంలో నేను ఎవరిని కలవాలి ? నా కవిత్వం మీద మరెన్నో ఎదుగుదలకు తోడ్పడే ఆయన మాత్రమే ఇవ్వగల సూచనలు యింకెవరిస్తారు ?

*

తెలుగు సాహితీమేరువు సోమసుందర్

soma2

1989లో మా యానాం డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవానికి శ్రీ సోమసుందర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు. అప్పుడు ఏం మాట్లాడారో గుర్తులేదు కానీ, ఆయన వస్త్రధారణ ఆకర్షించింది నన్ను. సన్నని దేహం, మడతనలగని పంచె, లాల్చీ లతో గొప్ప కాంతితో కనిపించిన ఆయన రూపం నా ఊహల్లో ఇంకా తాజాగానే ఉంది.

బదిలీపై 2007 లో కాకినాడ వచ్చాకా మరలా ఆవంత్స సోమసుందర్ గారిని కలిసాను. వారితో సంభాషించాకా, వారిగురించి ఏదైనా చిన్నవ్యాసం వ్రాసి అంతర్జాలంలో పెట్టాలన్న కోర్కె కలిగింది. మూడు నాలుగు సార్లు కలిసి కొన్ని వివరాలు సేకరించి వ్యాసం తయారు చేసి వికి పీడియాకు పంపాను. వారు అంగీకరించి యధాతధంగా తీసుకొన్నారు.

ఈ కలయికల ద్వారా సోమసుందర్ గారిని కొద్దిగా అర్ధం చేసుకోగలిగాను. ఆయనకు భాష పట్ల అపారమైన పట్టు ఉంది. ఇప్పటికీ బాగా గుర్తు ఉన్న అంశం – ఒకసారి ఆయన నన్ను “పీయూషమంటే ఏమిటి” అని అడిగారు మా జువాలజీలో పీయూష గ్రంధి (Pituitary gland) ఉంటుంది. కానీ పీయుషం అంటే ఏమిటో తెలీదు. అదే నసుగుతూ అంటే ‘పీయూషమంటే అమృతం” అని చెప్పి ‘కవిత్వం వ్రాసేవ్యక్తికి భాషమీద పట్టు ఉండాలి, అది విస్త్రుతంగా చదవటం ద్వారా వస్తుంది” అన్నారు.

వారికి వాక్యనిర్మాణం పట్ల చాలా శ్రద్ద. నా కవితల్ని కొన్ని చదివి వినిపించుకొన్నారు. ఒక చోట “ఏదైతే ఉందో అది” లాంటి ఒక దూడ వాక్యాన్ని పట్టుకొని “ఛి ఛి ఎందుకలా భావాన్ని అన్ని వంకర్లు తిప్పటం, సూటిగా రాయి” అని మందలించారు.

soma1

శ్రీశ్రీ , తిలక్, నారాయణబాబు, ఆరుద్ర, కృష్ణ శాస్త్రి వంటి మహామహులతో వారి అనుభవాల్ని ఎన్నో చెప్పారు. ఆయనతో జరిపిన ఆనాటి మూడు నాలుగు సమావేశాలు నాకు సంబంధించి మంచి సాహిత్యపాఠాలు. ఆయన శతాధిక గ్రంధకర్త,, వేయి పున్నములు చూసిన పూవనం, మేరుసమానమైన సాహితీమూర్తి, … అయినప్పటికీ, ఏదైనా ఆయనకు నచ్చిన వాక్యం కనిపిస్తే, కల్మషమెరుగని హృదయంతో నిండార నవ్వుతూ, భలే ఉంది ఊహ…. బాగు బాగు అంటూ మెచ్చుకొనే వారు.

ఆ తరువాత  సోమసుందర్ ఏటా నిర్వహించే అవార్డుల సభకు రెండుమూడు సార్లు వెళ్ళాను. పోయినేడాది కాకినాడ బుక్ ఎక్జిబిషన్ ప్రారంభించటానికి ఆయన వచ్చినప్పుడు- పెద్దవయసు కదా గుర్తుపట్టగలరా అంటో సందేహిస్తూ వెళ్ళికలవగా ‘నువ్వు బాబా వి కదూ? ఏం రావటం లేదు, రా ఒకసారి’ అని ఆశ్చర్యపరిచారు.

గత నెల 10 వ తారీఖున  అవధానుల మణిబాబుతో కలిసి వెళ్ళి  సోమసుందర్ గారిని కలిసినపుడు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఉత్సాహంగా కనిపించారు.

soma3
అక్కడ అల్మారా డిస్ప్లే లో వీరు వ్రాసిన “పాబ్లో నెరుడా కవితా జీవితయాత్ర” పుస్తకాన్ని చూసి ‘సార్ .. ఈ పుస్తకం నాకు కావాలి’ అని అడగ్గా వెంటనే ఆయన పక్కనే ఉన్న కిటికీ గూడులోని ఆ పుస్తకాన్ని తీసి ఇచ్చారు. సంతకం పెట్టి ఇవ్వండి సార్ అంటే సంతకం కూడా చేసారు దానిపై.
నీ వయసెంత అని అడిగారు- చెప్పాను నేను. చాలా చిన్నపిల్లాడిలా కనపడుతున్నావు అన్నారు. బయటకు వచ్చేసాకా – అదేమిటి పెద్దాయన అలాగ అంటారు? అని మణిబాబుని అడిగితే, “ఆయన వయసు 94, ఆయనకు మీరు చిన్నపిల్లాడిలా కనపడక ఇంకెలా కనపడతారు అని తిరిగిప్రశ్నించాడు నన్ను.

అద్దేపల్లి రామమోహనరావు గారు గతించి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడు  సోమసుందర్ గారు. కొద్దో గొప్పో వారిరువురితోనూ భౌతికంగానో, మానసికంగానో సన్నిహితంగా మసలిన నాలాంటి వారికిది తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

సోమసుందర్ గారు తమ దేహాన్ని రంగరాయ మెడికల్ వైద్యకళాశాలకు దానమివ్వటం వారి శాస్త్రీయ దృక్పధానికి నిదర్శనం.

సోమసుందర్ గారిపై నేను వ్రాసిన వ్యాసం లింకు

http://sahitheeyanam.blogspot.in/2009/01/blog-post_25.html

 

  ఖాకీవనం

 gopi
పొలానికెల్దామని పొద్దున్నే లేసి బయటికొచ్చిన…
రోడ్డు మీద తుపాకులు పట్టుకొని పోలీసులు తిరుగుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు… శానా మంది…
ఖాకీ బట్టలేసుకునే మామూలు పోలీసులు కాదు… సినిమాల్లో గొడవలప్పుడు సూపించే పోలీసులు…
గట్టి బూట్లు, సేతిలో పెద్ద తుపాకీ…. రోడ్డుమీద తిరుగుతున్నారు.
భయమేసింది… అయినా పొలానికెల్లాలిగా…
మెల్లిగా నడుత్తుంటే ఒక పోలీసాయన అడిగిండు …
“ఏయ్ … ఎవర్నువ్వు? ఎక్కడికెళ్తున్నావ్?”
“మాదీవూరే నండి… పొలంకాడికెల్తున్నా… :
భయం భయం గానే చెప్పా
“సరే పో… “
హమ్మయ్య అనుకొని పొలంలోకెల్లా. కాయగూరలు, ఆకుకూరలు కోసి బాబూరావుకిచ్చి ఇంటిదారి పట్టా…
“పోలీసులెందుకొచ్చినట్టు?  యింతమందా?”
ఎం అర్ధం కావట్లేదు…
అలా నడుచుకుంటూ ఉళ్ళోకెల్లా…
సెంటర్లో ఒక పోలీసు జీపు… జీపులో ఒక పెద్దాపిసరు… జీపు బయట కానిస్టేబుళ్లు…
రోడ్డుమీద ఒక పక్కాగా 20 గజాలకొక్కడు చొప్పున తుపాకీ పట్టుకున్న పోలీసులు నడుస్తున్నారు…
ఆళ్లనే సూత్తా ఉన్నారు మావూరోళ్ళు .
“ఏరా సూరీ…ఇక్కడున్నావేంటి?  పొలానికెళ్లలేదా?”
ప్రశ్నతో పాటు భుజమ్మీద చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూశా.
ఎదురుగా గాంధీ గారు… మా పక్కూరు. పెద్ద ఆసామి. ఈ సుట్టుపక్కల నాలుగూళ్ళలో ఆయనకి పొలాలున్నయ్. ఆయన ఈమధ్యనే బెజవాడలో మకాం పెట్టిండు.
“నమస్తే సార్… పొలంకాడనుండే వత్తన్న సార్” ఆయన ప్రశ్నకు జవాబిచ్చా.
నా బుర్రలో ఉన్న ప్రశ్నలన్నిటికీ యీయనైతేనే సరైన సమాధానం సెపుతాడనిపించింది.
“సార్… ఏంటి … ఈ పొలిసు జీబేంటి… ఈ పోలీసులేంటి… ఈ తుపాకులేంటి? నాకంతా అయోమయంగా ఉంది సిర్”
గాంధీ గారు చిన్నగా నవ్వి..
“ఏముంది.. మాములే… నిన్న సత్యనారాయణ గారి పొలంలో మంటలు అంటుకున్నాయిగా…. అలాంటివి జరగకుండా బందోబస్తు…”
“అసలు ఆ మంటలేంటి… ఈ పోలీసులేంటి సార్?”
“పిచ్చోడిలా మాట్లాడకు… మంటలేంటంటే నేను చెప్పలేను గానీ పోలీసులు మాత్రం ఈ రాజధాని గ్రామాల్లో అలాంటి సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యగా వచ్చారు.”
“అర్ధం కాలేదు సార్”
“నీ బొంద… నాకూ ఇంకా ఏం అర్ధం కాలేదు. అదే చూస్తున్నా” అన్నారు గాంధీ గారు నా భుజమ్మీద గట్టిగా నొక్కుతూ.
“మీబోటోళ్ళకే అర్ధం కాకపోతే మాకేం అర్ధమైద్ది సార్” అమాయకంగా అడిగా…
“చూద్దాం… కథ ఇప్పుడేగా మొదలైంది…. “
గాంధీ గారు కూడా ఏదో ఆలోసిత్తన్నారని అర్ధమైంది. కానీ ఏం జరగబోతందో అర్ధం కావట్లేదు.
“ఈ పోలీసులంతా ఎంతమందొచ్చారు సార్”
“చానా మంది… మన 29 గ్రామాలకు వచ్చారు. ప్రతి గ్రామంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు. ఇంకొంతమంది ఇలా తుపాకులు పట్టుకొని రోడ్లమీద తిరుగుతున్నారు. “
“అవుట్ పోస్ట్ అంటే?”
“అవుట్ పోస్ట్ అంటే చిన్న పాటి పోలీస్ స్టేషన్ లాంటిది. చిన్న డేరా లాగా వేసుకొని అందులో పోలీసులు కూర్చుంటారు. అక్కడినుంచి అటూ ఇటూ తిరుగుతుంటారు. అనుమానంగా కనిపించిన వాళ్ళను ఆపుతారు… గ్రామాల్లో గొడవలు జరక్కుండా ఆపుతారు.”
“మనఊళ్లలో గొడవలేంటి సార్? ఎప్పుడు జరిగినియ్?”
“అదేంటి సూరీ అలా అంటావ్? మన ఊళ్లలో పంట పొలాల్లో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగిందా? ఇప్పుడు జరిగింది. గొడవలు అంతే.. జరగొచ్చేమో”
“ఏమోలెండి… నాకేం అర్ధంగాలా… అది సరే గాంధీ గారూ… మన పొలాలు తీసుకుంటారంట కదా?”
నా అనుమానం తీర్చగలిగేది ఈయనొక్కడే అనిపిచ్చింది.
ఆయన నావైపు అదోలా చూసి “అవును… పొలాలు తీసుకోకుండా బిల్డింగులు ఎలా కడతారు?”
“అంటే మన పొలాలు గవర్మెంటోళ్లు కొంటారా?”
ఆయన మళ్ళీ నవ్విండు…
“కొనటం కాదు తీసుకుంటారు”
“అదేంటి సార్… తీసుకోవటమేంటి?”
“మరి? కొనాలంటే అంత డబ్బు గవర్నమెంటు దగ్గర ఎక్కడిది?”
“……?”
“అర్ధం కాలేదా….? ఇప్పుడేగా కథ మొదలైంది… ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే… చూస్తా ఉండు”
“పొలాలన్నీ గవర్మెంటు తీసుకుంటే మన గతేంటి.  పంటలెక్కడ పండుతాయ్”
“ఎక్కడో పండుతాయ్… అవన్నీ మర్చిపోవాల్సిందే…”
“నా పొలం ఇవ్వను అంటే!?”
ధైర్యం సేసి అనేసా…
గాంధీ గారు నావైపు సూసిండు… నా కుడి సేతిని పట్టుకొని మెత్తగా నొక్కి…
“ఇవ్వను అంటావా? నీ పొలం గవర్నమెంటుకి ఇవ్వనంటావా?” అడిగిండు…
“యిత్తె నేనూ నా సంసారం ఎట్టా సారూ?”
“అంటే పొలం ఇవ్వనంటావా?”
మల్లి అడిగిండు నా కళ్ళలోకి సూసి.
“ఎట్టా ఇత్తా…? ఎందుకిత్తా?”
“సరే… యిదేమాట ఆ పోలీస్ జీబు దగ్గరకెళ్ళి అను”
భయం వేసింది… వెన్నుపూసలో ఏదో వొణుకు.
“అమ్మో… పోలీసులు… కొడతారేమో సార్!”
ఈ సారి గాంధీ గారు పక్కున నవ్విండు.
“ఇప్పుడర్ధమైందా ఈ పోలీసులు ఇంతమంది ఎందుకొచ్చారో!”
అర్ధమైంది…. నిన్న ఒక పంట పొలంలో రేగిన మంటలకోసం కాదు… రేపు ఈ మొత్తం పంటపొలాల్లో బిల్డింగులు కట్టటంకోసం.,.. అందుకే ఈ పోలీసులు… అందుకే ఈ తుపాకుల పహారా…
నా చెయ్యి వదిలేసి గాంధీ గారు ముందుకు కదిలిండు.
ఆయనెల్లిపోయేదాకా అటే సూసుకుంట నిలబడ్డ.
ఇక యింటికెల్దామని వెనక్కి తీరిగా… ఎదురుగా పోలీసులు… రోడ్డు మీద నడుత్తున్నారు. ఒక చేతిలో లాఠీ కర్ర. మరో చేతిలో తుపాకీ… కాళ్ళకి పెద్ద పెద్ద బూట్లు…
పోలీసోళ్ళు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటా నన్ను దాటుకొని ముందుకెళ్లారు.
నేను ఇంటిముకం పట్టిన…
“ఏరా సూరీ, బాగున్నావా?”
ఎదురుగా మా పుల్లయ్య బాబాయి. పక్కూరు. రాజధాని కోసం తీసుకుంటన్న 29 ఊళ్ళల్లో ఆళ్లూరు కూడా ఉంది.
“బాగున్నా బాబాయ్. నువ్వెట్టున్నావ్?. పిన్నీ, పిల్లలూ బాగుండారా?”
“ఏం బాగులేరా ….”
గట్టిగా నిట్టూర్చిండు బాబాయ్.
“ఏంటి బాబాయ్… యేమైంది?”
“ఏముంద్రా? నీకు తెలవందేంవుంది? రాజధాని అన్నాక, పొలాలు తీసుకుంటారన్నాక కంటికి కునుకు లేదు, మెతుకు దిగటం లేదు”
అప్పుడర్ధమైంది… నేనొక్కణ్ణే కాదు… అందరి పరిస్థితీ నాలాగే ఉందని.
“అవును బాబాయ్… పొలాలు పోతాయంట. పెద్దోళ్ల దేంవుంది? అల్లెట్టాగో సాగు సేయ్యట్లేదు. మనబోటోళ్ళకి కౌలుకిచ్చి కూసుంటున్నారు. యిప్పుడు గవర్నమెంటోల్లకి యిచ్చిన యేమయిద్ధి? నట్టం మనకే”
మా బాబాయ్ వాళ్ళూల్లో అయిదెకరాలు కౌలుకి సేత్తుండు. బాగానే ఉండు.
“మా ఆసామి భూమి గవర్నమెంటోల్లకి యిచ్చేత్తడంట.  యిన్నాళ్ళూ ఆ బూమ్మీదే బతుకుతున్నం. ఇప్పుడది లేకపోతే ఎట్టాగో తెలవట్లేదురా”
బాబాయ్ కళ్ళల్లో నీళ్లు…
“యిక్కడా అదే పరిస్థితి బాబాయ్… ” అన్న బాబాయికి వోదార్పుగా…
“అయినా బాబాయ్ మనం అందరం కలిసి మా భూములివ్వం అంటే?”
బాబాయ్ నావంక సూసిండు… “యేంట్రా, నీకేమైనా పిచ్చా? పెద్దపెద్దోళ్లే నోరుమూసుకుంటే, నువ్వూ నేనూ ఏంమాట్టాడతం?”
బాబాయ్ గట్టిగానే అన్నడు. యించుమించు నన్ను మందలిచ్చినట్టే.
“ఈ పోలీసుల్ని సూసినవా యెంతమందున్నారో? ఏంమాట్టాడతం. ఆల్లని సూత్తుంటే బయమెయ్యట్లేదా?”
నిజమే… నాకు బయమేసింది. బాబాయ్ కూడా అదేమాట…
“సర్లే, ఎట్టా జరగాలనుంటే అట్టే జరుగుద్ది. సూద్దాం. నువ్వు మాత్రం జాగర్తరోయ్. కోడల్ని అడిగినట్టు సెప్పు”
బాబాయ్ ఎల్లిపోయిండు.
ఆలోచనలు మల్లీ మొదలు.

నాపొలం నాదికాదా? ఇవ్వను అంటే కుదరదా?

భయం నాకే కాదు అందరికీ అట్నే వుంది. అన్నూళ్ళల్లో పోలీసులున్నారు.
పెద్దోళ్ళు, బూమున్నోళ్లు, డబ్బున్నోళ్ళు మాట్టాట్టం లేదు. నాబోటి సిన్నోళ్లు మాట్టాడే దైర్యం సేయ్యట్లేదు.
భయం… నాలాగే అందర్లోనూ భయం…
లాఠీలంటే భయం… తూటాలంటే భయం…
భయం అంతటా, అందర్లోనూ మెల్లగా పాకుతుంది.
పంట భూములు పోతున్నా నోరెత్తకుండా … ఎదురు సెప్పకుండా
పళ్ళు, పూలు, కూరగాయలు పండిన ఈ వూళ్ళలో యిప్పుడు లాఠీలు, తూటాలు…
***                                  

బాబూ! గుడ్ బై టు యూ!

kasi1

(సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు,  గొప్ప  వక్త, విర‌సం వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు యాధాటి కాశీప‌తి  హైద‌రాబాద్‌లో కన్నుమూశారు. కాశీపతి స్మృతిలో   ఆయన  సన్నిహిత  మిత్రుడు  హెచ్చార్కె   నాలుగు  మాటలు…)

*

క కంచం ఒక మంచం అంటారు స్నేహానికి పరమావధిగా. ఆ అవధిని చవి జూచిన స్నేహం మాది. ముషీరా బాదు డిస్త్రిక్ట్ జైలులో ఆ రెండు పనులూ చేశాం. ఒకే కంచం లోంచి తిన్న సందర్భాలు, ఒకే సిగరెట్ పంచుకున్న సందర్భాలు సరే…. అవి కొల్లలు.

అది కాదు. ‘మీసా’ (‘మెయింటెనెన్స్ అఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’) డిటెన్యూలకు జైలు బ్యారక్ లో  పొడుగ్గా రెండు వరుసలుగా మంచాలు వేసి వుండేవి. రాత్రులు పక్క పక్క మంచాల మీద దోమ తెరలు కల్పించే హేజీ వెలుతురులో కబుర్లు చెప్పుకుంటూ కబుర్లలోంచి నిద్దట్లోకి జారిపోయేది మేమిద్దరం.  వేర్వేరు మంచాలు వీలుగా లేవని, మా మంచాల్ని దగ్గరగా జరుపుకుని, ఒకే మంచంగా చేసుకుని, దోమ తెరల్ని కలుపుకుని మాట్లాడుకుంటూ నిద్రపోయే వాళ్ళం కూడా. ఇది చూసి ఒక అనంతపురం వీరుడు మేము ‘స్వలింగ సంపర్కుల’మని జైలు గోడల మీద రాశాడు. మేము ఆ దుష్ప్రచార వ్రాతను గుర్తు చేసుకుని, చాల సార్లు నవ్వుకున్నాం. మా స్నేహాన్ని నిలబెట్టుకున్నాం.  ఇప్పుడెలా వుంటుందో ఏమో గాని, అప్పుడు… 70లలో… ‘గే’ అనే ప్రచారం ఎవరి గురించి చేసినా, అది హీనమూ, దుర్మార్గమే.

‘ఎవ్వడికీ, దేనికీ భయపడగూడదు, ఇతర్లు మన గురించి ఏమనుకుంటారనే దానికి ఆసలే భయపడకూడదు, మనకు నిజ్జంగా ఎలా ఇష్టమో అలా జీవించాలి. ఏదైనా మనం బలంగా అనుకుంటున్నామంటే, అది నూటికి తొంభై వంతులు తప్పై వుండదు’ అనేది ఆనాడు మా ‘బాబు అండ్ బాబు’ లెజెండ్. బాబు అంటే నేను లేదా తను. అది మేము ఒకరినొకరం పిలుచుకున్న పిలుపు.

మేము పరస్పరం విభేదించలేదా? ఎందుకు లేదూ?! ఇద్దరం సిపిఐ ఎం ఎల్ చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో క్రియాశీలురం. తను బాగా సీనియర్. ఎమర్జెన్సీ తరువాత పార్టీలో నేను ఏం చేయాలనే విషయంలో, పార్టీలో చీలిక ఏర్పడుతున్నప్పుడు మేము ప్రవర్తించిన పద్ధతుల్లో విభేదాలు వచ్చాయి. విభేదాలు మా వంటి వాళ్ళ మధ్య ఎలా రావాలో అలాగే వచ్చి, అలాగే కరిగిపోయాయి.

నేను హోల్ టైమర్ గా వొద్దని, భార్యాబిడ్డలను చూసుకుంటూ జీవించాలని తను కోరుకోడమే కాదు. ‘ఈ రాజకీయాలు వాడికి చాత కావు, వాడు సంసారం చూసుకుంటూ, వుద్యమం పనులు చేయనీ’ అని పార్టీతో వాదించాడు. నేనూ వినలేదు, పార్టీ వినలేదు.

పార్టీ చీలిక రోజుల గురించి చిన్న సరదా వుదాహరణ. ఒక ముఖ్య కార్యకర్త కమ్ రచయిత్రి విషయమై పార్టీ రాష్ట్ర నాయకులున్న సమావేశంలో చర్చ  వచ్చింది. ఆమె ‘అటు’వైపు వున్నారంటూ నేను అన్నానని… కాశీపతి చెప్పాడు. కాశీపతి అక్కడ అలా అనగూడదు. అలా అనడం నష్టకరం. ఎందుకంటే ఆ సమావేశంలో నా మాటల్ని ఇష్టపడని ‘అటు’వైపు వాళ్లు కూడా వున్నారు. అదింకా చీలికలో శ్రేణీకరణ పూర్తి కాని కీలక దశ. నేను ఆమె గురించి అలా అనలేదని, కాశీపతి చెబుతున్నది నిజం కాదని  వెహిమెంట్ గా ఖండించాను. అక్కడున్న వారంతా నా మాటలనే సీరియస్ గా తీసుకున్నారు. కాశీపతి అబద్ధం చెప్పినట్టయింది.

బయటికి వచ్చాక, టీ కొట్టులో పూర్తిగా మా ‘వైపు’ వాళ్లే వుండగా కాశీపతి ఆ విషయం ప్రస్తావించాడు. “ఏమిరా, నువ్వు నాతో అలా అనలేదా?” అని అడిగాడు. “అన్నాను. ఆ మాట నీతో అన్నాను. అది నీ వరకే వుండాలి. దాన్ని నువ్వు అతిక్రమించావు. నేను అబద్ధం చెప్పను. ఇంత రేర్ గా అబద్ధం చెప్పినా, సమావేశంలో నా మాటకు వుండే విలువ నీ మాటకు వుండదు, నువ్వు చెప్పేది నిజం అయినప్పటికీ. నాకున్న ఆ కాస్త లివరేజ్ ని నేను అక్కడ వుపయోగించుకున్నాను. అలా వుపయోగించుకోడం రైటే” అనే సరికి, “ఉరేయ్, నువ్వు దేవాంతకుడివి” అని నవ్వేశాడు కాశీపతి.

(‘దేవాం’తకుడిని కావడానికి బాగా ప్రయత్నిస్తున్నాను బాబూ! కుదరడం లేదు. )

ఇటీవల కొంతకాలం, నాకు నేను మానసిక ఆరోగ్యం కోల్పోవడం వల్ల, తనను ఆ తీవ్ర అనారోగ్యంలో చూడడం చాతగాక…  విషయాలు తెలుసుకుంటున్నా…. ఎక్కువగా కలుసుకోలేకపోయాను. శ్రీ శ్రీ మీద తను సరదా భాషలో రాసిన సీరియస్ పుస్తకం ‘మందు’ హాసం ఆవిష్కరణలో చూశాను. అనారోగ్యం శరీరానికే గాని, బుద్ధికి కాదని ఆ గంట తన వుపన్యాసం నిరూపించింది.

రాజకీయ ఆర్థిక అధ్యయనంలో, ప్రజా సమస్యలను భౌగోళిక (గ్లోబల్) దృక్పథంతో వివరించడంలో తరిమెల నాగిరెడ్డి తరువాత అంతటి వాడనిపించే అద్భుత మేధావి యాధాటి కాశీపతి. నాగి రెడ్ది లాగే కాశీపతి కూడా పెదిమల మధ్య సిగరెట్ వుంచుకుని, గంటల తరబడి మాట్లాడే వాడు. బహుశా ఈ సిగరెట్ కూడా తనకు తరిమెల నాగిరెడ్డి నుంచి అబ్బిన విద్యే అయ్యుంటుంది.

తన సంగతేమో గాని, నా పొగ మాత్రమే కాశీపతి పెట్టిన నిప్పుదే. జైలుకు వెళ్ళక ముందు నాకు సిగరెట్ల అలవాటు లేదు. జైలుకు వెళ్ళాక పక్కన కాశీపతి రోజుకు పది పాకెట్ల చార్మినార్లను తగలేసే వాడు. నేను ముందే డిప్రెస్డ్ గా వున్నానేమో కాశీపతి సిగరెట్ డబ్బాలు నా వల్ల కూడా ఖాళీ కావడం, నా ‘పాకెట్ మనీ’ నుంచి కూడా సిగరెట్లు కొనడం మాకు తెలీకుండానే మొదలయిపోయింది. నన్నూరు వెంకట్రెడ్డన్న వంటి వారు ‘పిల్లోన్ని చెడగొడుతున్నాడ’ని కాశీపతిని కోప్పడే వారు. ఇద్దరం సిగరెట్ మానలేదు. మొన్న మొన్నటి వరకు.  

మా స్మోకింగ్ అలవాటు గురించి ఇద్దరం తరచు అనుకునే వాళ్ళం. స్మోకింగ్ వల్ల మనిషి ఆయుష్షు పదేండ్లు తగ్గుతుందట కదా?!.ఓకే, లెటజ్, ఎంజాయ్. క్రిష్టొఫర్ మార్లోవ్ నాటకంలో డాక్టర్ ఫాస్టస్ తన ఆత్మను దయ్యానికి ఇచ్చి ఏవేవో ఆనందాల్ని తీసుకుంటాడు. మేము మరీ అంత కాదు. మా జీవితాలు వందేళ్ళ లోంచి ఒక పదేళ్లు సిగరెట్లకు ఇచ్చేస్తాం అని హాస్యమాడుకునేది. ఆ లెక్కన ఇప్పుడు కాశిపతికి ఎన్నేళ్లు? తను సిగరెస్టస్ కు ఇచ్చినవి కూడ కలుపుకుంటే, దరిదాపు ఎనభయ్యయిదు అవుతాయి.

బాబూ, మరేం ఫరవాలేదు! ఎవడు  బతికేడు మూడు యాభైలు. మనం అనుకున్నదే కదా, మనకు నిజంగా ఇష్టమయినట్టు జీవించాం. ఇలా జీవించేట్లయితే, ఇక, ఎవరం ఎప్పుడు మరణిస్తేనేం?

‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్’ అని సవాలు చేసి బతికే వాళ్ళం మనం. ఎప్పుడయితేనేం, ఎక్కడయితేనేం?

ఇట్స్ ఓకే బాబూ!

ఈ ‘బాబు అండ్ బాబు’ ఏంటి అనుకుంటారు ఇది చదివే వాళ్లు.

కాశీపతికి ఒక జబ్బుంది. తన కన్న చిన్న వాళ్లైతే చాలు పరిచయం కాగానే ‘ఒరే’ అనేస్తాడు. నన్నూ అలా అనే సరికి ఖోపమొచ్చింది. ఇది తన బ్రాహ్మణ్యాహంకారపు మిగులు అని విమర్శించాను కూడా.  ఒకటి రెండు సార్లు తిరిగి తనను నేనూ ఒరే అని చూశా. అది నాకు బాగుండ్లేదు. నా కన్న కనీసం పదేళ్లు పెద్దాడు . అది మానేసి పేరుతో పిలిచి చూశా. మేము సన్నిహితమయ్యే కొద్దీ పేరు మానేసి ‘అది కాదు బాబూ’ తరహాలో బాబూ అనడం మొదలెట్టా. ఆ మాట తనకు నచ్చింది. తను కూడా బాబూ అనడం మొదలెట్టాడు. ఇద్దరం ఒకరికొకరం ‘ఒరే’లం కాలేదు గాని, ఒకరికొకరం బాబూ అయ్యాం. ‘బాబూ అండ్ బాబూ’…. అనేది ఆ ‘మూవీస్’ వాళ్ళకేమో గాని, మా స్నేహానికీ మంచి బ్యానర్ అయిపోయింది.

బాబూ రావు (మాచవరం ), చలపతి (అరుణోదయ), బూర్గుల ప్రదీప్, శ్యామ్(మధుసూదనరాజు తమ్ముడు), ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి), కృష్ణారెడ్డి (తరువాత, విమలక్క భర్త) …  అందరికీ మా ‘బాబూ- బాబూ’ వ్యవహారం కుంచెం అసూయగా వుండేది.

కాశీపతి బయటి నుంచి తెప్పించిన స్టౌ తో ఏవేవో వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేసే వాడు. తన వంట పూర్తి కాగానే, దానికి ఫ్రెంచి పుడ్డింగ్ అనో పోర్చుగీస్ పుడ్డింగ్ అనో నామకరణం కూడా చేశాక స్టౌ దగ్గర మా పిల్లల క్యూ. “వాడేడీ? బాబు.. బాబూ.. ఏడీ వాడు?’ అని లైనులో వెనుక వున్న నేను ముందుకొచ్చి, ప్లేటు చాచే వరకు వడ్డన మొదలెయ్యేది కాదు. మరి వాళ్ళకు అసూయ వుండదూ.

వాళ్ళకు చాటుగా చెప్పేవాడు. ‘వాడు, పాపం, పెండ్లైన ఇరవై రోజులకే జైలుకు వచ్చాడు రా. పెద్దోళ్ళం మాకైనా ఒకటి రెండు పెరోల్స్ వచ్చాయి. అదేంటో, వాడికి ఒక్క పెరోలు కూడా రాలేదు. పాప పుట్టినప్పుడు కూడ రాలేదు. పాపం, వాన్ని మనం బాగా చూసుకోవాలి’ అనే వాడు.

ఇప్పుడు అదేం అవసరం లేదులే బాబూ. ఆ ‘ఇరవై రోజుల’ జయకు, అప్పుడు నేను చూడలేదే అని నువ్వు అంగలార్చిన చిన్నారి మమతకు.. ఇప్పుడు నిరంతరం దగ్గరగా వుంటున్నాను. సంతోషంగా వుంటున్నాను. నీ ఫ్రెంచ్, పోర్చుగీస్ పుడ్డింగ్ లను మిస్ అవుతూనే వుంటా.

అయినా జీవితం ప్రహిస్తూనే వుంది. నీ బిడ్డలు ప్రగతి, వెన్నెల…. నువ్వు ఏం చెప్పావో అలాగే…. తమకు నిజ్జంగా ఇష్టమైన విధంగా, అదే సమయంలో ప్రగతి శీల రీతులలో జీవిస్తున్నారు. డోంట్ వర్రీ. వాళ్ళ సంగతి, పుష్ప సంగతి కూడా వాళ్ళు చూసుకుంటారు.

నువ్వొప్పుకుంటావో లేదో గాని, మిగిలిన ప్రపంచం కూడా బాగుంది. తన సంగతి తాను చూసుకోగలనని ప్రతీప శక్తుల తీవ్ర ముట్టడి మధ్య కూడా ప్రపంచం నిరూపిస్తున్నది. మనిషి తనకిష్టమైన విధంగానే జీవిస్తాడు. సందేహం లేదు. ఎవరు ఎలా నియంత్రించినా, ఎవరు ఎలా బుజ్జగించినా… కాసేపు కాలక్షేపానికి అవీ ఇవీ బొమ్మలతో ఆడుకుంటాడేమో గాని…. మనిషి తనకు ఇష్టమైన విధంగానే జీవిస్తాడు. అన్ని నిరంకుశాల్ని, బుజ్జగింపులను, అబద్ధాల్ని కాదని… కాలిలో విరిగిన తుమ్మ ముళ్ళను పిన్నీసు పెట్టి తీసుకున్నంత సహజంగా, సునాయాసంగా తీసేసుకుని…  నడుస్తాడు. నడవడం చాల ఇష్టం మనిషికి, కలలు కంటూ నడవడం మరీ ఇష్టం.

కాశీపతీ! మనం కలిసి పంచిన కలల్ని ఇక్కడ మిగిలి వున్న వాళ్ళం పంచుతూనే వుంటాం. ఎక్కడికక్కడ కలల్ని పంచడానికి, అబద్ధాల్ని తుంచడానికి ఇక్కడ ఎవరమో ఒకరం మిగులుతూనే వుంటాంలే. అబద్ధాల కలుపు తీయడం కూడా కలల సేద్యంలో భాగామే.

“హెచ్చార్కె! ఎవరో అఫ్సర్, జీఎస్ రామ్మోహన్ అట. నీకు మెసేజ్ లు పెట్టారట. చూడు. నీ క్లోజ్ ఫ్రెండు ఎవరో చనిపోయారట. మమత వాళ్ల మేసేజ్ చూసి ఆఫీసు నుంచి ఫోన్ చేసింది.”….  అని పొద్దున్నే మొద్దు నిద్ర పోతున్న నన్ను లేపి కూర్చోబెట్టి, ఆ తరువాత, నేనిది రాస్తుంటే పక్కనే తన ల్యాప్ టాప్ లో తానేదో చేసుకుంటున్న అన్య పాపకు, బహుశా, నువ్వు నేను గుర్తుంటాములే బాబూ! మమత, అన్య వాళ్లకు, ప్రగతి, వెన్నెల వాళ్ళకు మన పనుల్లో మిగుళ్ళు గుర్తుంటాయిలే.

గుడ్ బై, బాబూ! ఐ విల్ మిస్ యూ!.

*

  

ఖుష్బూ

 

saiపరిచయం:

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ. చిన్నప్పటినుండి సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది.

సినిమాలు చూసే అలవాటు కాస్తా సినిమా తియ్యాలనే ఆశయంగా మారి ఇప్పుడు అదే ఫీల్డ్ లో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఇప్పుడు మరో సినిమాకి కో-డైరెక్టర్ గా పని చేసే వరకు తెచ్చింది. ఇప్పటి వరకూ నాలుగు షార్ట్ ఫిలిమ్స్ చేసాను. ఫీచర్ ఫిలిం చెయ్యాలని ముందుకు సాగుతున్నా.
పుస్తాకాలు చదివే అలవాటు అప్పుడప్పుడు నాతో చిన్నచిన్న కథలని రాయిస్తుంది. ఏదైనా రియాలిటీ కి దగ్గరగా లేదా నా సొంత అనుభవాలని కథగా మలిచే ప్రయత్నం చేస్తాను.

ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలి, మరిన్ని కథలు రాయాలి.

“Writing is the Painting of the Voice” అనే కొటేషన్ గుర్తుచేసుకుంటూ.

-సాయి యోగి

ఎన్నేళ్ళయింది ఇక్కడికొచ్చి, ఎప్పుడో చిన్నప్పుడు వదిలిపోయిన ఈ బస్తీని. అంతా మారిపోయింది, కాని నా జ్ఞాపకాలల్ల ఏం మారలే.

అప్పుడు డాడి కార్ నడ్పుతుంటే తిరిగేటోల్లం ఈ గల్లీలల్ల, ఇప్పుడు రద్దీ వెరిగింది. నేనూ, అక్కా ఎన్కల కూసోని కిట్కీలకెల్లి బైటికి చూస్తుండే, తెల్సిన ప్లేసే అయినా కార్ల నుంచి చూస్తే అదో షోక్ అప్పుడు.

ఇంతకంటే లోపలికి పొయ్యేతట్టు లేదనిపించి ఎడ్మదిక్కున్న మస్జిద్ పక్కన కార్ ఆపి దిగిన. ఈ మస్జిద్ పేరేమో ఉండే… హా… గౌసియా మస్జిద్ కదా! అవును. మస్జిద్ గోడ కింద మూలకి కనిపించినై బొగ్గుతోని గీసిన వికెట్లు. అరె! ఇదైతే మారలే ఇంకా. లోపల్నే నవ్వుకున్న. అప్పుడు మేము ఇట్లనే గీసి ఆడుతుండే బ్యాట్-బాల్, బాల్కి బొగ్గు మర్క అంటుకుంటే అవుట్, లేదంటే లేదు. అయ్యన్ని గుర్తురాంగనే  ఏందో మనసంత ఫుల్ ఖుష్, ఖుష్  ఐతుంది.

ఎవ్వర్కైనా  పుట్టి పెరిగిన జాగకి చాన ఏండ్లకి వస్తే ఇట్లనే ఉంటదేమో!

పక్క గల్లీలకి నడిస్తే మా పాతిల్లు. దర్వాజలు, గోడలు అట్లనే ఉన్నయ్, చత్తు మీద రూమేసిర్రు, కలర్ మర్చిన్రు అంతే. చూడంగనే ఎందుకో కన్లళ్ళ నీళ్ళు తిర్గుతున్నై, గొంతులకి దుక్కమొచ్చింది ఒక్కటే సారి.

ఆషా బీబీ వాళ్లకి అమ్మినం అని చెప్పిండు డాడీ. అప్పుడు నేను అమ్మమ్మోల్ల ఇంట్ల ఉంటుండే. అమ్మినం అని చెప్పినప్పుడు ఏం అనిపియ్యలె, ఇన్నేళ్ళల ఒక్కసారి గూడ రాలే గానీ, ఇప్పుడు ఏందో? పైసలిచ్చి మల్ల ఇల్లు కోనేయ్యల్నా అన్పించింది. ఎమ్జేయ్యాలె ఇప్పుడు కొని ఎవరుంటరు? నేను ఇయ్యాల  యూ. ఎస్. వోతున్న. ఈ సారి ఎప్పటికోస్తనో తెల్వది.

*****

Kadha-Saranga-2-300x268

కార్ కీ కొనాతోటి దర్వాజా కొట్టిన, లోపల్కెల్లి రాజా హిందుస్తానీ పాటలు ఇనిపిస్తున్నై. మల్ల కొంచెం గట్టిగ కొట్టిన, ఒక చిన్న పోరడు ఒచ్చిండు. “కోనోనా?” అన్నడు. “కోయిబి నయ్యేక్యా, బడే” అడ్గిన. “అబ్బూ నయ్యే, కామ్కూ గై” అని చెప్తుంటే లోపలికెళ్ళి “రియాజ్… కౌన్?” అని ఆడ గొంతు. “హా మా… హమ్ లోగ్ యే ఘర్మే రహేతెతే…” అని నా మాట పూర్తి అవ్వక ముందే “ఇను నహిహే, ఆప్ షాంకు ఆవో” అంది. నేను “ఒక సారి మా ఇల్లు సూస్కోని పోతా” అందాం అనుకున్న గాని ఎందుక్లే బైటికేంచి చూస్న గదా సాలు, ఎవరైన రానిస్తారా అట్లా. కన్లారా మా ఇల్లు మల్ల చూస్కొని గట్టిగ ఊపిరి వీల్చి అక్కడ్నించి కదిల్నా, నవ్వుకుంట రియాజ్ గాని చెంప విండి.

మస్జిద్ ముందల కిరాణా షాప్ కనిపిస్తే సిగరెట్ తాగి పోదాం అన్కొని, పోయి తీస్కోని ముట్టిస్తుంటే చూస్న ఆయనని, హామీద్ భాయ్! కొంచెం గూడ మారలే అట్లనే ఉన్నడు. జెర్ర ఎంటికెలు తెల్లగైనై గంతే. చేత్ల సిగరెట్ పడేయాల్నా? అరె… ఇప్పుడు నేను పెద్దోన్నైన కదా!

పల్కరిచ్చిన, గుర్తుజేస్నా. డాడీ పేరు జెప్పంగనే గుర్తు వట్టిండు. మస్తు ఖుష్ అయ్యుండు, దుకాన్కి ఒచ్చిన ఒకరిద్దరికి అడిగిండు, “ఇస్కు పైచనే?” అని. చానసేపు మాట్లాడిన, “మీ నాయ్నాకీ రంజాన్కి షీర్కుమా పంపిస్తా” అని అడ్రెస్స్ తీస్కుండు.

ప్రియ నుండి  మెసేజ్ ఒచ్చింది “Where are You?” అని, రిప్లై ఇచ్చిన. చెక్ ఇన్ కి లేట్ అయితది, హమీద్ భాయ్ కి “ఖుదా హఫిజ్” చెప్పిన .

కార్ దగ్గరికి నడుస్తుంటే కనిపించిండు ఎత్తుగా, ఎర్రగ, గడ్డంతోని, నమాజ్ టోపీ వెట్కొని, చేత్ల యేవో కవర్లు పట్కోని. నాదిక్కే చూస్కుంట వస్తున్నడు. ఎవడీడు ? ర…హీం, రహీం గాడు. నా రక్తం బగ్గున మండింది, ఆని మొఖం చూడలనిపించలే, ఆ రోజు జరిగిన విషయం గుర్తొచ్చింది నోట్ల నుండి మాంచి మాటొచ్చింది.

 

నా పక్కనుండి ఎల్లిపోయిండు గుప్పున అత్తరు వాసన, తూ… కంపరమొచ్చింది.
రహీం గాడు నేను జిగిరి దోస్తులం. ఆ రోజు ఆదివారం అందరం జండా కాడ  క్రికెట్ ఆడుతున్నం, ఆ రోజే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్, మట్టన్ షాప్ టీవిల స్కోర్ చూస్కుంట, ఆడకుంట ఉన్నం. ఇండియా గెల్చింది. నేను ఫుల్ ఖుష్ అయ్యి ఆన్ని ఎక్కిరించుకుంట, మజాక్ చేస్కుంట దున్కులాడ్తున్న. రహీం గాన్కి కోపం ఒచ్చింది, ఆడు పాకిస్తాన్ ఫ్యాన్. నన్ను తిట్టిండు, నేను కొట్టిన మెల్లగనే,  ఆడు ఆని చేతిల బ్యాట్ తోని నా కాళ్ళ మీద గట్టిగ కొట్టిండు. ఎద్దు కూర తింటడు గద దెబ్బ గట్టిగ తాకింది. నాకు భయమయ్యి గలీజ్ మాటలు తిట్టుకుంట ఇంటికి ఉర్కిన.

ఇంటికివోయి డాడీకి చెప్పిన, “నువ్వీడుంటే ఇట్లనే అవారా గాన్వి తయ్యారైతట్టు ఉన్నవ్” అని నన్నే తిట్టి  అమ్మమ్మా వాల్లింటికి పంపిండు.

ఆని వల్లనే నేను ఇక్కడ్నుండి పోయిన, ఆని వల్లనే… అప్పట్నుండి ఆడంటే కోపం పోలే… కొన్ని సార్లు వాన్ని చూడాల్సి వొస్తదని ఊరునుండి ఇంటికి గూడ రాలే. ఆని వల్లనే నేను ఇక్కడి నుండి… చిన్నప్ప టి నుంచి ఆని మీద అదే కో…..? అవును, ఆని మీద అదే కోపం, చిన్నపట్టినుండి కోపం… చిన్నప్పుడు…..? చిన్నతనం… ఇప్పుడు?

ఎప్పుడో కొట్లాడినం, అయిపొయింది ఇప్పుడేమైంది మాట్లాడనీకే? వాని ఇష్టం వాంది, నా ఇష్టం నాది. అయినా దోస్తాన్ల కూడా టేస్ట్లు – స్టేటస్ లు, అవసరాలు – అవకాశాలు చూస్కోని దోస్తాని చేస్తరా? అప్పుడది దోస్తాని అయితదా. ఆని మీద కోపం గాయబ్ అయ్యింది. “మన మనసుకి ఏది కరెక్ట్ ఆలోచనో ముందే తెలుసు, ఆ ఆలోచన వచ్చేదాకా దిమ్మాఖ్ ఖరాబ్ అయితుంటది”. అది అర్ధమైన కొన్ని సెకండ్లల్ల నా కార్ యు టర్న్ తీస్కుంది.

sai1

ప్రియా కాల్ ఒస్తుంది… ఎత్తలేదు. కార్ స్పీడ్గ పోనిస్తున్న రహీం గాన్ని కల్వనీకె, మళ్ళీ ఫోన్, లిఫ్ట్ చేసి “Yaa Honey, I will be there in 30 Minutes” అని చెప్పి ఫోన్ పెట్టేస్నా. ఆమెకి ఇంగ్లీశ్లనే చెప్పలే, ఇక్కడామె కాదు, యూ. ఎస్. సిటిజెన్.

కార్ ఆగింది, వానిల్లు నాకు బాగ గుర్తు, జెండా పక్కన డెడ్ ఎండ్ గల్లీ ఉంటది, గల్లీలకి ఒచ్చిన. అక్కడెప్పుడు  రెండు మూడు మేకలు కట్టేసుంటై, అరె! ఇప్పుడు గూడ ఉన్నయ్. పక్కనే ఫుల్ కవర్ ఉండే హాఫ్ వైట్ కలర్ ఇన్ప డోర్.

డోర్ కొట్టిన ఏం సప్పుడు లేదు. ఫోన్ సప్పుడయ్యింది, సైలెంట్ జేసిన. మల్లా డోర్ కొట్టిన ఒక చిన్నోడు ఒచ్చిండు, ర…హీం గాడే… అరె ! కాదు. ఆడిలాగనే ఉన్నడు… సేమ్ టు సేమ్. ఆ చూపు, ముక్కూ, సుడి తిరిగిన పాపిడి.

ఎటో పోతుండు చేత్ల తర్మస్ ఉంది ఆపిన, “రుకో తుమ్హారే అబ్బుకా నాం క్యా హై?” అడిగిన, “మహమ్మద్ రహీముద్దిన్” అన్నడు. నవ్వొచ్చింది నాకు. “హై ఘర్మే?”, “నై కామ్కూ గై… షామ్మే ఆతే” అని  చెప్తుంటే లోపలి నుండి ఆడ గొంతు వీడి అమ్మ అనుకుంటా “కౌన్?” అని, నేను “భాబీ జాన్…రహీంకె లియే ఆయతా”, “నై ఉణు బాహర్ గై ఆప్ కౌన్?”, “మై కిరణ్, రహీం కా బచ్పన్ కా దోస్త్ హూ, మిల్నే అయ తా” , “అచ్ఛా… ఇను కబ్ అతేకి పతానై”. ప్రియ ఫోన్ ఒస్తుంది, సైలెంట్ జేసి, “ఫోన్ నెంబర్ దేసక్తే క్యా ?”, “హై నెంబర్ మగర్, ఫోన్ చాలూ నైహై… కాం నై కర్రా ఫోన్, ఆప్ చాయ్ పానీ పీనతా”, “నై భాబీ షుక్రియా, మై అర్జెంట్ మే హూ, అచ్ఛా ఆప్ నెంబర్ దిజియే మై కభి ట్రై కరుంగా”.

 

నెంబర్ తీస్కోని, ఆడి కొడుకు ఫసీవుద్దిన్ చేత్ల చేత్కోచ్చిన పైసల్ వెట్టి బయల్దేరిన, ఆన్ని కలిస్తే బాగుంటుందే, చా… బాదనిపిస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు నా దిమాఖ్ పంచేయ్యలె, ఆనికి సారీ అయిన చెప్పలే అంజాన్ కొట్టినందుకు.

ఒక గంట టైం ఎన్కకి పోతే బాగుండు అనిపించింది. కోపం ఒచ్చింది నామీద నాకే, ఇన్నేళ్ళ నుండి కల్వలే గానీ ఇయ్యాల ఎక్కడ లేని ప్రేమొచ్చింది? అవ్వు, నవ్వొచ్చింది. కానీ కలిస్తే బాగుండు, సారీ చెప్పి గలె మిలాంస్తే అదో తృప్తి ఉంటుండే.

*****

మా అపార్ట్మెంట్ కొచ్చిన, నా పార్కింగ్ల  స్కూటర్, అయిపోయిండు వాచ్మన్ ఇయ్యాల, అసలే నారాజ్లున్న “హే వాచ్ మాన్ ఎన్ని సార్ల చెప్పాలే ఈడ మా బండ్లు ఒస్తై అని”, తిట్టిన మల్ల నాకే మంచిగన్పియ్యలె, కార్ పార్క్ చేసి ఎల్లిపోయిన.

ఏం వాసనిది, అత్తరు… ఎక్కడినుంచో…. నాకొచ్చిన అన్మానం నిజం కావాలె అన్కున్న నెక్స్ట్ సెకండ్ల  హాల్లకి ఎంటర్ కాంగనే, రహీ….మ్ గాడు.

ప్రియా “I was dialing you”, అని ఏదో అంటుంది. నేను ఇంటలే. వీడు సోఫలకేంచి లేచి నన్ను చూస్తుండు. నాకేం మాటలోస్తలేవు, అట్లనే చూస్తున్న, ఆడే ధన్మని నా దగ్గరికొచ్చి నన్ను గట్టిగ గల్లె మిళాయించి “మాఫ్ కర్ భాయ్… తెరేకు దేక్కే భి అంజాన్ మారా, క్యా హూహాకి జబ్… ఫిర్ హామీద్ భాయ్ సే మిలా” ఏదో చెప్తున్నడు. అరె! నా కన్లళ్ళకెళ్ళి నీల్లోస్తున్నయేoది! వీనికి గూడ కళ్ళు తడ్సినట్టున్నాయ్. మా ఇద్దరికీ ఒకటే సారి షైతాన్ ఇడ్సినట్టుంది, “మేరేకుబి మాఫ్ కర్ భాయ్”, నేన్ గూడ గట్టిగ వట్కున్న. ఇప్పుడు రహీంగాని  అత్తరు వాసన గలీజ్గా అన్పిస్తాలేదు, ‘ఖుష్బూ’ వస్తుంది!

*

 

గడ్డపాయన!

 

damayanti

“ఏమండీ!”

‘ఉ..”

” మన ఎదురింట్లో  మేడ మీద పోర్షన్ లేదూ? అందులో   ఒక గడ్డపాయన దిగాడు.”

“ఊ..”

“ మనిషి భలే తమాషాగా వున్నాడు, తెలుసా? ”ఆజానుబాహువు. నలుపు తెలుపు గడ్డమేసుకుని, ఫ్రెంచ్ తత్వవేత్త పోజ్ కొడ్తూ  వున్నాడు”

“ఊ”

“పగలంతా ఏం చేసినట్టో?  సాయంత్రం చీకట్లు  పడుతుండగా  దిగాడు.  పెద్ద సామానేమీ కనిపించలేదు.  మొత్తం కలిపి పది డబ్బాలు కూడా లేవనుకోండి.. ఇట్టా దింపి అట్టా వెళ్లిపోయింది – చిన్న ట్రక్..”

“ఉ..”

“సంసారం తర్వాత వస్తుందేమో?”

“…..”

ఏవిటీ, నిద్ర పోయారా అప్పుడే?”

“….”

***

“ఏమండీ,  గడ్డపాయనింట్లో మన పోచమ్మే పని చేస్తోంది. నేనే చెప్పాను వెళ్ళమని.”

“ఊ..”

“ పనిచేసొచ్చి చెప్పింది.  పెళ్ళాం పిల్లలూ తర్వాత వస్తారేమో అనుకున్నానా?  కాదట. ఇంట్లో ఆడవాళ్ళెవరూ  వుండరు, తనొక్కడే ఉంటానని  చెప్పాడట.

“ఉ..”

“బ్రహ్మచారంటారా?”

“ఏమో. నన్నడిగితే నేనేం చెబుతాను?” ఫక్కున నవ్వి చెప్పాడు ప్రశాంత్.

ఆమెకి రోషమొచ్చింది. “ఎప్పుడూ ఊ కొట్టి వదిలేసే మొగుడు, పాయింట్ పట్టుకుని  నవ్వేసరికి ఉడుకుమోత్తనం వచ్చింది శైలజ కి.  “అవున్లేండీ, ఏమీ వినని  మొగుడుకి అన్నీ చెప్పుకోవడం నాది బుధ్ధి తక్కువ..” అంటూ, విస్సురుగా అటు తిరిగి పడుకోవటం తో ఆమెకి కోపమొచ్చిందన్న సంగతి అర్ధమైంది అతనికి. నవ్విన పాపానికి బ్రతిమాలుకోక తప్పదన్నట్టు, లాప్ టాప్ పక్కన పెట్టి, “అది కాదురా శైలూ! ఊరికే  జోక్ చేసానంతే.  వారం నించి వరసగా నువ్వు ఆయన గురించి చెప్పేవన్నీ వింటూనే వున్నానా, లేదా చెప్పు?” మాటలతో ఊరడిస్తూనే, సలహా కూడా ఇచ్చాడు.  “ పోనీ ఓ పని చేయకూడదూ?  ఒక సారి వాళ్ళింటికెళ్ళి పలకరించి, ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో ఏక మొత్తంగా   తెలుసుకు రారాదూ? ఎంతైనా ఎదురెదురు ఇళ్ళ వాళ్ళం కదా! నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నట్టూ వుంటుంది. నీ సందేహాలు తీరినట్టూ వుంటుంది. ఏమంటావ్?” అంటూ ఆమె చెంప మీద చిటికేసి చెప్పాడు చెవిలో.

‘హమ్మయ్యా, పర్మిషన్ దొరికింది వెళ్ళడానికి’  అనుకుని, ముఖం మీద దుప్పటి లాక్కుని పడుకుంది.”

****

గత కొన్ని రోజులుగా ఆయన్ని గమనిస్తోంది శైలజ. కిటికీలోంచి రహస్యం గా  చూస్తూ, బట్టలారేసే నెపం తో మేడ మీదకి – ఒకటికి పది సార్లు వెళ్లొస్తూ..పసిగడుతోంది ఆయన కదలికల్ని.

పోచమ్మ మాటలు చెవిలో మోగుతున్నాయి.   “ ఆళ్ళు బాపనోళ్ళమ్మా. వాళ్ళమ్మ నాయన్ల పోటో చూసినా. కానీ, ఈయన గుడ్డు తింటాడు. మొన్న పొద్దుగాల  ఆమ్లెట్    ఏసిమ్మంటే ఏసిచ్చినా…”

“ఊహు.అలానా!” చెవి వొగ్గి వింటూనే, ఆసక్తి లేనట్టు ముఖం పెట్టింది  శైలజ.

“ఇల్లంతా ఖాళీ గా వుంటుందమ్మా. మనిల్లు లా నిండా సామానుండదు.  గదినిండా, షెల్ఫుల నిండా బుక్కులే…  బోలెడు పుత్తకాలు.. ”

“అవునా, పుస్తకాల వ్యాపారమంటావా?”

“కాదటమ్మా, ఏవిటికి సారూ గిన్ని బుక్కులు అని అడిగా..”

“ఏమన్నాడు?”

“సదువుకుంటాకని చెప్పిండు….”

“ ఏం పని చేస్తాడట? అడగకపోయావా?”

“అడిగినా. ఏం డ్యూటీ చేస్తారు సారూ అంటే, ఏం సెప్పలా..నవ్విండు.  ఇంట్లో మీరొక్కరే వుంటారా సారూ అంటే ‘ఇదిగో ఇట్టా తలాడించాడు. గంతే..” అనుకరించి చూపిస్తూ, నవ్వి  చెప్పింది పోచమ్మ. “ఎక్కువేం మాట్లాడ్డు….గమ్మున కూకుంటాడు. బుక్కట్టుకుని …”

వింటూ ఆలోచన్లో పడింది. నిజమే ఆయనలో ఆయన  ఆలోచిస్తూ ఒంటరిగా కుర్చోవడం ఆమెకి తెలుసు. కానీ ఆ ఆకారం లో విచారం కనిపించదు. ఏదో శోధన, అన్వేషణ కనిపిస్తుంది.  ఉదయాలు, సాయంకాలాలూ  ఆరుబయట పడక్కుర్చీ లో  పడుకుని కనిపిస్తుంటాడు. లేదా, తూర్పు వైపుకు తిరిగి దూరం గా కనిపించే సముద్రాన్ని చూస్తూ వుండిపోతాడు. అలా గంటల తరబడి.  రాత్రంతా గదిలో  లైట్ వెలుగుతూనే వుంటుంది. సూర్యోదయం కాకముందే లేచి వాకింగ్ కెళ్ళొస్తాడు. కొన్ని సార్లు బయటనించి వస్తూ రెండు చేతుల్లో  బరువైన సంచీలను  మోసుకొస్తుంటాడు.  మరో విషయం. –  ఈయన వాహనం సైకిలు.  దీని  మీద వెళ్ళి రావడం చోద్యమనిపిస్తుంది. మనిషి చూస్తే జమిందార్ లా కనిపిస్తాడు? సైకిల్ ఏమిటో అర్ధం కాదు.

మొత్తానికి ఆమె మెదడు అనే  స్క్రీన్ మీద  గడ్డపాయనకి ఒక ఫోటో ఫ్రెం కట్టేసింది. అందులో ఆయన –    వాలు కుర్చీ లో పడుకుని, కాళ్ళేమో స్టూల్ మీద జాచిపెట్టుకుని, పుస్తకం లో ముఖం దూర్చేసుకునుంటాడు.  అదే స్టిల్ ఫోటో గ్రాఫ్  అయింది. ఐతే,  ఆ ఫోటో ఒక సజీవ చిత్రమౌతుందని ఆమె అప్పుడు అనుకోలేదు. అస్సలు ఊహించనైనా ఊహించలేదు. ఎందుకంటే – గడ్డపాయన మీద ఆమెకి సదభిప్రాయం లేదు కనక.

వైశాఖ పౌర్ణమి నాడు  – మొగుణ్ణి తీసుకుని మేడ మీదకెళ్ళిందా!, ఎదురుగా ఆయనే ప్రత్యక్షం.   చేతిలో గ్లాసు పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ, నింపాదిగా సిప్ చేస్తూ,  ఒక దివ్యామృతాన్ని చుక్కచుక్క గా సేవిస్తున్నవాడిలా అగుపించాడు.  నాట్య శాస్త్రం లో నేర్పని పాదాల కదలికలోని అందమేమో వుంది ఆ షికారు నడకలో. `ఈయన అద్దె కట్టేది ఇంటికికాదు, ఆరుబయట బ్రతికేందుకు` అనుకుంటూ మొగుడితో చెప్పింది – రహస్యంగా! – “ఆయనే గడ్డపాయన  ..చూడండి..చూడండి” అంటూ!

అతను ఎప్పట్లానే “ ఊ…” అన్నాడు.

ఆమెనింకా ఆశ్చర్య పరిచిన విషయమేమిటంటే.. మొన్న మిట్ట మధ్యాహ్నం టీవీ సీరియల్ లో నిమగ్నమై వుంటే.. హఠాత్తుగా ఆకాశం నల్లమబ్బేసుకొచ్చింది. క్షణాల్లో చీకటిపడిపోయింది.  చినుకు మొదలౌతుంటే మేడ మీద కి పరిగెత్తింది. ఆరేసిన దుప్పట్లు  తేవడానికని. అంతలోనే వర్షం -ఆగకుండా  గుమ్మరించేసింది. అలవాటుగా అటు చూస్తే…. గడ్డపాయన వానలో చిందులేస్తూ  కనిపించాడు.   చిన్న పిల్లాడిలా  రెండు చేతులూ బార్లా జాచి, కళ్ళు మూసుకుని వర్షంలో తడుస్తూ   స్టైల్ గా   గిరగిరా తిరుగుతున్నాడు. తనలో తను నవ్వుకుంటూ,  పరవశించిపోతున్నాడు.

ఆ దృశ్యానికి నవ్వొచ్చింది ఆమెకి.అంతకంటేనూ, చిత్రమేసింది. ‘ఈయనింత  పసివాడా!! ’ అని విస్మయం కల్గింది.

ప్రతి మనిషిలోనూ ఒక పసివాడు దాగుంటాడు.  ప్రకృతి అందాలని  చూసినప్పుడో , సృష్టికి  ప్రతినిధి అయిన స్త్రీని చూసినప్పుడో పసివాడిలా కేరింతలాడ్తాడు. గడ్డపాయన కూడా అంతే అన్న  సంగతి ఆమెకి తెలీదు.

గబగబా ఇంట్లొకొచ్చి పొడి బట్టల్లోకి మారి, టీ కాచుకోడానికని స్టవ్ వెలిగిస్తుంటే, బుర్రలో లైట్ వెలిగినట్టు శ్రీకాంత్  మాటలు మనసులో వెలిగాయి. ఒకసారి వెళ్ళి మాట్లాడి రారాదూ అని. వెంటనే మరో కప్పు టీ తయారు చేసి, ఫ్లాస్కులో పోసింది. గొడుగు తీసుకుని, ఇంటికి తాళం వేసి, ఎదురింటి గడ్డపాయనింటికి బయల్దేరింది శైలజ. వర్షం జోరు తగ్గినా,  చినుకు మందంగా రాలుతూనే వుంది.

మేడ మెట్లెక్కుతూ ఆమె ఊహించింది. గడ్డపాయన డాన్స్ చేస్తూ కనిపిస్తాడని.  కానీ, ఆయనక్కడ  కనిపించలేదు.

ముందుగది తలుపులు తీసే వున్నాయి.  తెల్లటి లాల్చీ పైజమా లో గడ్డపాయన ఇందాక తను చూసిన చంటి వాడులా   లేడు. ఎంతో హుందాగా, పెద్ద మనిషి లా కనిపిస్తున్నాడు. తలొంచుకుని టవ ల్  తో తల తుడుచుకుంటున్న వాడు కాస్తా – తలుపు మీద చిటికల  శబ్దం వినిపించడంతో తలతిప్పి చూసాడు.

 

“నేనే”- అన్నట్టు చూసి, “ లోపలకి రావచ్చాండీ?” అని అడిగింది  నవ్వుతో.

ఆయన కనీసం ‘మీరా’ అన్నట్టు గా కూడా చూళ్ళేదు.   “రండి” అంటూ ప్లాస్టిక్ కుర్చీ చూపించాడు – కుర్చోమన్నట్టు.

మన కోసం మనింటికెవరైనా వస్తే..ఎలా స్వాగతిస్తాం? వీరభద్రపళ్ళెరమంత మొహంతో! చాటంత నవ్వుతో…” ‘అయ్ బాబోయ్..మీరే!?..ఏమిటి నా మీదిలా దయ పుట్టింది..? ఏమి నాభాగ్యం అంటూనో నానా హడావుడి పడిపోతాం. ఈయనేమిటీ..ఎక్స్ ప్రెషెన్ లెస్ లుక్ ఇచ్చాడు?

‘ఆ! పోనీయి.’  ఈయనేమైనా నా మేనమామ కొడుకా? మేనత్త మొగుడా? రాకపోకలు సాగించడానికి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ విజిట్ ఔతుంది అంతే గా.’ అని సముదాయించుకున్నాక మనసు స్థిమిత పడింది. మాట పెగిలింది.

“ఒకసారి వచ్చి పరిచయం చేసుకుంటే  బావుంటుందని  వచ్చానండి. బయట వాన గా వుంది కదానీ,  టీ చేసి తీసుకొచ్చాను..మీ కోసం..” – ‘మీ కోసం’ అనే మాటని నొక్కి పెట్టి అంటూ –  ఆయన ముఖం లోకి చూసింది. విప్పారుతుందా లేదా అని.

ఊహు. ఆయనేం మాట్లాడ్లేదు. నిశ్శబ్దం గా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఫ్లాస్క్ ని  టీ పాయ్  మీద పెడుతూ..’ఇద్దరికీ కలిపి తెచ్చాన్లేండి. కలిసి తాగుదామని…” అంటూ మళ్ళి ముఖం లోకి  చూసింది. ఎందుకో  నవ్వాడు. కాస్త చిరు శబ్దం చేస్తూ.  నవ్వు బాగుంది.  కానీ, అది నిలదీయడం నచ్చలేదు.  రెండు స్టేట్మెంట్స్ లో ఏది నిజం అని అడుగుతున్నట్టుంది .

నోరూరుకోదు. నిజాలు వాగేంత వరకు. ఏం చేస్తాం? పుట్టుకతో వచ్చిన బుధ్ధులంటారు ఇదే మరి.

ఆయన కప్పులు తేవడానికి  లోపలకెళ్ళాడు.

ఇంటిని  నలువైపులా పరిశీలిస్తున్న  ఆ నిఘా కళ్ళకి టేబుల్ మీద లాంప్, పుస్తకాలతో బాటు, కింద పేర్చిన ఖాళీ లిక్కర్ బాటిల్స్ కూడా కనిపించాయి. – హమ్మో, ఇన్ని ఎప్పుడు లాగించేసాడో!

ఈయన సంచులతో సైకిల్ మీద మోసుకొచ్చే బరువులు ఇవన్నమాట!..

అప్పటికే గడ్డపాయన మీదున్న తేలిక అభిప్రాయం మరింత బలపడింది. ‘బాడ్ అన్న మాట..’అనుకుంది.

ఆయనొచ్చి,  కప్పులు అందించి,  ఎదురుగా కుర్చున్నాడు.

ఆమేం మాట్లాడకుండా   టీ వొంపి,  ప్లాస్కు పక్కన పెట్టి,  చూసే సరికి ఆయన అప్పటికే తన కప్  తీసుకుని, సిప్ చేసేస్తు కనిపించాడు. రెండు గుటకలేసాక మాట్లాడాడు. “మీరు నన్ను చూడ్డానికే వచ్చారు. నాకు తెలుసు ఆ సంగతి” అన్నాడు.

ఆమె ఉలిక్కిపడింది  చూసింది. –  ఎలా తెలుసన్నట్టు.

“టీ కోసమే ఐతే, నన్ను మీ ఇంటికే పిలిచేవారు కదా?” అన్నాడు చతురోక్తిగా.“ టీ బావుందని పొగడటం, థాంక్స్ చెప్పడం, మళ్ళీ వస్తారు కదూ అనడం వంటి మాటలు నా నించి ఆశించకండి. నాకు అలాటి వన్నీ తెలీదు.” హెచ్చరిక గా చెప్పాడు.

గురువు కి మైండ్ రీడింగ్ వచ్చనుకుంటా..చదివేస్తున్నాడు తనని. పట్టుబడకూడదనుకుంటూ, పైకి మాత్రం డాంబికం గా కనిపించడం కోసం కాలు మీద కాలేసుకుని అడిగింది. “నేనేమీ ఆశించడం లేదండీ.  కానీ, మనుషుల మధ్య ఆ మాత్రపు కనీస మర్యాదలు వుండాలి కదా?”

“అవసరం లేదు”ఖచ్చితం గా వుందా స్వరం. మనిషి మాత్రం చాలా కూల్ గా కదలకుండా  ‘అవసరాల కంటే ముఖ్యమైనది మరొకటి వుండాలి.”

‘నీ మొహంలే! నీకు ఇలాటి  సెంటిమెంట్స్ లేవు  కాబట్టే పెళ్ళి కాలేదు. ఎవర్తి చేసుకుంటుంది మరి ఈ ముఖాన్ని’? అలా అనుకోగానే మనసులో రేగిన కోపం అణిగింది.  –  కాస్త చల్లారాక, అంది. – “ పోచమ్మ మీ గురించి చెబుతుంటుంది. చాలా మంచి వాడమ్మా అని..’ ఆ మాటలకి ఉబ్బి పోతాడనుకుంది కానీ, ఆయనేం పొంగిపోలేదు. సరి కదా పైగా  – “పొరబడిందేమోనండి.. నేనంత మంచి వాణ్ణి కాదు ..” అంటూ మళ్ళీ నవ్వాడు.

వొళ్ళు మండింది శైలజకి –  “ అంటే ఎదుటి వాళ్ళు ఏదంటే అది కాదని వాదించడమే  నేర్పుతుందాండీ మీ బుక్ రీడింగ్..?” అంది ఉక్రోషం గా.

ఆయన దెబ్బ తిన్నట్టు చూస్తాడనుకున్న ఆశ కూడా నిరాశే అయింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు గడ్డపాయన అదే నవ్వుతో. “ మనిషి హాయిగా బ్రతకడానికి ముందు కొన్ని సూత్రాల్ని మనం గట్ఠిగా నమ్మి పాటించాలి. అందులో మొదటిది – ఎదుటి వారు ఎలా ప్రవర్తించినా, మనం షాక్ అవ్వకూడదు.”

ఖంగు తిన్న ఆమె  ‘గడ్డపోడు అంటోంది తననే’అని గ్రహించి చూపులు తిప్పుకుంది.

ఆమె ఇబ్బందిని గ్రహించి మావూలు సంభాషణ లోకి  దిగాడు. “ఏం చదువుకున్నారు  మీరు?” అని అడుగుతూ.

ఆమె చెప్పింది. ఇంకా తన భర్త గురించి, అతను చేస్తున్న జాబ్ గురించి,   తను జూనియర్ లెక్చరర్ టీచర్ గా పనిచేస్తున్న విషయం, ఎండాకాలం శెలవులు, తిరిగొచ్చిన సొంతూరు..  అంతా గడ గడా చెప్పేసి ఆగింది. కొంచెం ధైర్యం రావడం తో. “మీరు? మీరేం చేస్తుంటారు?” అడిగింది ఆసక్తిగా.

“ఏమీ చేయను. ప్రస్తుతానికి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను..” అంటూ ఖాళీ కప్పుని టీపాయి మీద పెట్టి, రెండు చేతులూ తల వెనక్కి పెట్టుకున్నాడు.

“మీ ఆవిడ..” అనే లోపే మాటలని ఆపేస్తూ అన్నాడు. “నేను చెప్పను అనడానికి ముందు మీరు అడగకూడదు అని అంటాను. ఎందుకంటే – నాతో మాట్లాడ్డానికి  వ్యక్తిగత  వివరాలు ఒక బయోడటా కాకూడదు. మా ఆవిడ లేకపోయినా మా ఇంటికి వచ్చారు కదా? ఆవిడున్నా లేకపోయినా నేను ఇలానే మాట్లాడతా మీతో. నాకు పెళ్ళైందంటే మీరు సేఫ్ అనుకుంటున్నారా? కాకపోతే ఒంటరిగ వెళ్లడం ప్రమాదమనుకోవడం కూడా పొరబాటే..కదూ? లేకపోతే మీరు వచ్చే వారు కాదు గా? “

“అంటె, వివాహం మనిషికి విలువని భద్రతనిస్తుందంటే కాదంటారా?..”

“కాదనను. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని  బతికిపోవడం తప్పంటాను. మనిషి లోని హీన సంస్కారాలని, బలహీనతల్ని ఉన్నతంగా   కాపాడే ముసుగు  వ్యవస్థలు –  ఎంత సాంప్రదాయమైనవైనా వాట్ని తొలగించేయాల్సిందే సమాజం నించి! కాదంటారా?”

ఆమె తలొంచుకుంది.

“మీరు వివాహిత స్త్రీ అని మీ మీద నాకు కోర్కె కలగకూడదన్న రూలేం వుండదు. ముఖ్యంగా ఇలాటి బలమైన బలహీన క్షణాల్లో” అనుకోని ఆయన మాటలకు హడలిపోతూ చూసింది.‘హవ్వ’అనుకుంటూ  పెదాల మీద అరచేయి కప్పేసుకుంది. పెద్దవైన ఆ కళ్ళల్లో భయాన్ని చూసి ఆయన ఫక్కున నవ్వాడు. “నేను మీ గురించి చెప్పడం లేదు. అందుకు వివాహం అడ్డు రాదని చెప్పడం కొసం. అంతే. నేను జరగనిది మాట్లాడటం లేదు. ఇవాళో నిన్నో జరిగింది కూడా కాదు. రెండు యుగాల కిందటి మాటే చెబుతున్నా.”

ఆమె కొద్దిగా తేరుకుని అడిగింది. – “మీరు రైటరా?” అని.

“లేదండి.  ఎందుకలా అడిగారు?”

“ఇన్ని గుట్టల పుస్తకాలేసుకుని కూర్చుంటే!..”

“రచయితలు ఐతేనే  పుస్తకాలు చదవాలని లేదు…”

“మరి ఇన్ని చదివి ఏం చేస్తారు?”

“నన్ను నేను తెలుసుకుంటుంటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటాను.  నా పాత్ర పోషించడంలోని నైపుణ్యాన్ని కనుగొం టాను.  ”

“దాని వల్ల నటిచడం బాగా తెలుస్తుందంటారా? “ – వ్యగ్యం ధ్వనించేలా బిగ్గరగా నవ్వింది. కావాలనే.

“కాదు.  నటించకూడదని తెలుస్తుంది. జీవితం జీవించడం కోసమని  నేర్పుతుంది. నిన్ను నువ్వు అర్ధంచేసుకుంటూ సంతోషంగా..శాంతిగా..బ్రతకడం కి మించిన పరమార్ధం ఏవిటో అనుభవంలోకి తెచ్చిస్తుంది. ”

“ఏవిటో! మీరు మాట్లాడే ఒక్క ముక్కా నాకర్ధం కావడం లేదు..” పెదవి పెదవి విరిచింది.

“మీ ఇంట్లో ఎవరు సుపీరియర్?

“ఖచ్చితం గా మా ఆయనే..”

“ఐతే, ఐతే ఆయనకు కాస్త తగ్గి వుంటారన్నమాట కదూ? “

“ చస్తే తగ్గి వుండను.” – ఆలోచించకుండా గభాల్న జవాబిచ్చేసింది.

“ఐతే మీరే కదా ఇంటికి సీనియరు, సుపీరియర రూ? కానీ,  పైకి చెప్పరు. కదూ?”

ఆమె గబుక్కున తలొంచేసుకుంది.

“మీ ఆయన మీకంటే ఆర్ధికంగా ఎక్కువ స్థాయిలో వున్నాడని ప్రేమిస్తె అది ఆర్ధిక సంబంధమౌతుంది. ఎంత సంపాదిస్తె నాకేం లెక్ఖా? నేను పెళ్ళాన్ని. అని ధిక్కరిస్తే అది అధికారమౌతుంది. సీత లా అనుసరిస్తే అది బానిసత్వమౌతోంది. సత్య భామలా ముడుచుకుపోతే  భర్తని వొదులుకోవాల్సి వస్తుంది.  ఇంతకీ మీ పాత్ర పోషణ లో లోపాలేమైనా వున్నాయేమో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా?”

“లేదు. అవసరం లేదనుకుంటున్నా..”

“వుందనుకుంటున్నాను.  ఒకసారి వెతికి చూడండి.” అంటూ చేతి వాచీ వైపు చూసుకున్నాడు.

అర్ధమైన దాన్లా లేచి నిలబడింది. కానీ, మెదడుకి ఏ సంకేతాలూ చేరడం  లేదు. ఎవరి మాటలకైతే మైండ్ బ్లాక్ అవుతుందో అతనే ఈ గడ్డపాయన అన్నట్టుంది పరిస్థితి.

ఇతరుల మీద మనం ఏర్పరచుకునే హీన మైన అంచనా, తప్పని   స్వయం గా తెలుసుకుంటున్నప్పుడు, ఆ గొప్ప తనాన్ని వెంటనే అంగీకరించనీదు మనసు. ఏదో మాటల గారడీ జరుగుతోందని మభ్యపెట్టుకోకపోతే అహం ఊరుకోదు మరి.

ఆయన్ని చాలా అడిగేయాలి, నీ గొప్పేమిటో  తెలుసుకోవాలి అన్నట్టు వచ్చింది. పక్కింటి బాబాయి గారింటికొచ్చినట్టు. కానీ లుక్ మార్చేసాడేమిటి ఇలా.

రంగుటద్దాలు అలవాటయ్యాక, అవి లేకుండా లోకాన్ని చూడ్డం, చూసి తట్టుకోవడం   చాలా కష్టమైన పని కాదూ!?.

ఆమె బయటకొచ్చి చెప్పులేసుకుంటుంటే అన్నాడు. “ఆగండి. ఇంటికొచ్చిన ఆడపిల్లని ఉత్తి చేతుల్తో పంపకూడదంటారు. …ఇదిగో ఈ పుస్తకం తీసుకెళ్ళండి. కానీ, చదివి వెనక్కి ఇవ్వాలి.” అన్నాడు నవ్వుతూ.

అప్పటికే నవ్వు మర్చిపోయిందాన్లా తయారైంది ముఖం. తిరిగి నవ్విందేమో తెలీదు.

ఒక యంత్రం లా పుస్తకం అందుకుని మొద్దుబారిన  అడుగులతో  ఇంటికొచ్చి పడింది.

ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత…

****

“ప్రశాంత్” మొగుణ్ణి పిలిచింది పేరుతో. ఆ  పిలుపుకి ఉలిక్కిపడి చూసాడు.  ‘ఏమిటీ నన్నే?’ అన్నట్టు.

“ఇలా రా..’ అంటూ దగ్గరికి పిలిచింది. ‘హమ్మో, ఇదేం జోరు?’ ఆశ్చర్య చకితుడౌతూ దగ్గరికి వెళ్ళాడు.

ఆమె చూపులు అతని శరీరానికి కొత్త గా తాకుతున్నాయి. మేనులో గిలిగింతలు పుట్టించేలా..గులాబీలు గుచ్చుకున్నట్టు..

ఆఫీస్ కి తయారై వెళ్తున్న అతనికి ఇదొక ప్రియమైన సందేహ హేల..

దగ్గరగా నిలబడిన  అతని నడుంని రెండు చేతులతో  చుట్టుకుని, గుండెకి హత్తుకుంటూ చెవిలో రహస్యం గా చెప్పింది. ‘ ఈ బ్లూ షర్ట్ లో నువ్వు చాలా హాట్ గా వున్నావ్  మాన్!  రియల్లీ  ముద్దొచ్చేస్తున్నావ్. ఇక నన్నాపలేవ్ నువ్వు. ” అంటూ ముద్దులిచ్చింది. అది కూడా  – అతనికిష్టమైన వెల్లువలో!!

అనుకోని విరజాజుల ఉప్పెన కి  అతను ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు.  పెళ్ళైన ఇన్నేళ్ళ వైవాహిక జీవితం లో జరిగిన మొట్టమొదటి ఈ అద్భుతం – అతన్ని ఆనంద వివశుణ్ణి చేసేసింది. మధుర డోలికలో ఊరేగిపోతోంది మనసు.

నిజానికి ప్రతి మగాడు పెళ్ళయ్యాక – భార్యలోనే ప్రేయసిని కోరుకుంటాడు. భార్యే ప్రియురాలైన భర్తకి జీవితం ఒక పంచభక్ష్య పరమాన్నం. ఆమె  కితాబు కి అతనా క్షణం లో  అమాంతం నవాబై పోయాడు. సతి  మెచ్చిన ప్రతి మొగుడూ మహరాజు కాక ఇంకేమిటనీ?

హృదయం లోంచి జనియించే ప్రేమ కి మహిమేదో వుంటుంది. అది మనిషిని చిత్తు చేస్తుంది. ఆ అరోమా ఒక స్వర్గం లాటి మత్తు ని ఇస్తుంది. నరం నరం లోనూ ఇంజెక్ట్ అయి, యవ్వనాన్ని ప్రసాదిస్తుంది.

ప్రస్తుతం అతని పరిస్థితి అంత దివ్యం గా వుంది. ఆమెని నిలువునా పెనవేసుకుని కళ్ళు మూసుకుని  అలా వుండిపోయాడు. దాంపత్యం లో శరీరాలు పాతపడటం అంటూ వుండదు. ప్రేమ వ్యక్తీకరణలు కొత్త గా వున్నంతకాలం!

అతను తేరుకుని కళ్ళు తెరిచి  “ హేయ్, శైలూ….గడ్డపాయన  సైకిల్ మీదెళ్తూ మనల్ని చూసాడు…” బిడియపడిపోతూ చెప్పాడు.

“చూడనీ..సంతోషిస్తాడు. ” అంది.  చేతుల్ని మరింత గా బిగిస్తూ..

**

కాలం గడుస్తున్న కొద్దీ..

శైలజ గడ్డపాయనకి మరింత దగ్గరకి జరిగింది. కాదు . పుస్తకాలు దూరాన్ని జరిపాయి. చలం, కుటుంబరావు, శ్రీశ్రీ, రావి శాస్త్రి, తిలక్, లత, బీనాదేవి తెలుగు సాహిత్యం లోంచి మరింత ముందుకు నడిచొచ్చింది. … కాఫ్కా – మెటామార్ఫాసిస్  దాటి,   లియో  స్ట్రాస్ సిధ్ధంతాల పై విమర్శలు సయితం చదివి తెలుసు కుంటోంది.

షేక్ ష్పియర్  కంటే మిల్టన్ ఎలా , ఎందుకు గొప్పవాడు కాదో  ఆయనతో తగవులాడుతుంది.

ఏ కొత్త విషయమైనా వాదిస్తూ వుంటుంది. ఆయన వివరిస్తూ వుంటాడు.

మాటల మధ్య లో  ఆయన  గ్లాసందుకుని రంగు ద్రవాన్ని సిప్ చేస్తున్నా – ఇప్పుడామెకి  – ఆ గడ్డపాయన  తాగుబోతులా కనిపించడం మానేశాడు.

ఆయననే కాదు. ఎవ్వర్లోనూ,   లోపాలు కనిపించడం మానేసాయి. మనుషుల్లో అన్నీ మంచి గుణాలే వుండవు. బలహీనతలూవుంటాయి. అయితే వ్యక్తుల్ని వీక్నెసులతో  సహా  స్వీకరించడం వల్ల కలిగే ఆనందం ఎలాంటిదో  ఆమెకి పూర్తిగా అర్ధమైంది. అందులో ఆరితేరిన విద్యనభ్యసించింది.

నడిచే విశ్వవిద్యాలయాల వంటి వ్యక్తులు జీవితంలో తారసపడటం  ఒక అరుదైన అదృష్టం. వాళ్ళు – ఏ సిలబస్ లో చేర్చని  అతి విలువైన విషయాలు బోధిస్తుంటారు.

*****

ఆ రోజు ప్రిన్సిపాల్ పిలిచి -‘స్టూడెంట్స్ కి మీరు ఇస్తున్న ఆత్మ విశ్వాసం ఎనలేనిదని కమిటీ గుర్తించింది శైలజా!  ఇకనించి రోజూ అన్ని తరగతుల వారికీ మీ ప్రత్యేక క్లాసులు తప్పని సరి అని నిబంధన చేసింది. మీ సాలరీ కూడా రెట్టింపైందని చెప్పడానికి సంతోషంగా వుంది..” కంగ్రాట్స్’’ – అభినందింస్తూ చేయందించింది.

అలవి కాని ఆనందం – ఎగసిన కెరటమై కళ్ళల్లోకి ఉబికింది. చిత్రం గా పెదవులు వొణికాయి.    మనసులోని –    ఫోటో ఫ్రేం లోంచి  గడ్డపాయన నవ్వుతూ కనిపించాడు.

‘  అది ఎలాటి ఉద్వేగపు భావం కానీయి, ఆ క్షణం – నీ ఆధీనంలో వున్నప్పుడు నువ్వు మరింత హుందాగా కనిపిస్తావ్. ఎందరికో మార్గ దర్శకురాలివౌతావ్.  ” గడ్డపాయన   చెవిలోకొచ్చి చెబుతున్నట్టే వుంది.

మౌనంగా మనసులోనే కైమోడ్పులిడింది.

ఒక విజ్ఞానవంతుణ్ణి  చదవడం అంటే – కొన్ని వందల  గ్రంధాలను శోధించినట్టు!!

******

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆకలి (1973 – 1991)

 

 

తొలిసూరి  కానుపని మా అవ్వను వాళ్ల పెద్ద మేనమామ నర్సయ్యచ్చి వాళ్ళ తల్లిగారింటికి కాన్పుకు తీస్కపోయిండట. అప్పుడు నేను మా అవ్వ కడుపులున్న. మా అవ్వ తల్లిగారూరు కాజీపేట జంక్షన్ పక్కన శిన్న పల్లెటూరు. మా అవ్వకు ముగ్గురు మేనమామలు. మా అవ్వ చిన్నగున్నప్పుడే మా అవ్వోళ్ళ తల్లి సచ్చిపోయిందట. అయ్యో  తల్లి లేని పిల్లాయే అందునా అక్క బిడ్డాయె అని మా అవ్వను మేనమామలు, వాళ్ళ భార్యలు మస్తు గార్వంగ సూసుకునేదట. మా అవ్వోళ్ళ పెద్ద మేనమామ నర్సయ్య ఇంట్ల 1973ల మా అవ్వ పసిద్దకాంగనె (డెలివరి) నేను పుట్టిన్నట. వెంటనే బాపనాయినను పిలుస్తే ఆయనచ్చి పిలగాడు పుట్టిన గడియ మంచిదిగాదు. మూడొద్దులు (3 రోజులు ) తల్లి మొఖం పిలగాడు, పిలగాని మొఖం తల్లి సూడద్దు, సూత్తె మంచి జరుగదన్నడట. మావోళ్ళు భయపడి నన్నో అర్రల, మా అవ్వనో అర్రలపండుకోబెట్టిండ్లట. నేను ఆకలయి పాలకోసం మస్తు ఏడిషేదట. ఎంత ఊకుంచిన ఊకోకపోయేదట. ఏడిషి ఏడిషి ఊపిరి పట్టేటోన్నట. మా అవ్వోళ్ల మేనమామలు వాళ్ల భార్యలు ఊళ్ళెకు బోయి ఆవుపాలు, మేకపాలు, బర్రె పాలు ఏవ్వి దొరికితే అవ్వి తెచ్చి నాకు తాపిచ్చెటోళ్ళట. అగో.. అప్పడిసంది నా ఎంటబడ్డది ఈ ఆకలి…

మాది తాలుకా హెడ్‌క్వాటర్‌కు ఓ ఐదు కిలోమీటర్ల దూరంల వుండే చిన్న పల్లెటూరు. మేము కుమ్మరోళ్ళం. కూటికి గతిలేనోళ్ళం. మూడు పూటల కడుపునిండ బువ్వ తినే ఔషత్ లేనోళ్ళం. మాకు రాగడి మట్టిగోడల్తోని కట్టిన ఒక గడ్డి గుడిసె ఒక కుమ్మరి గూనపెంక ఇండ్లుండేటియి. నాకు ఏడెనమిది సంవత్సరాల వయసచ్చి కొంచెం తెలివచ్చేసరికి మా తాత మా ఇంటిముందు సాయబాన్ల కూసోని కుండలు జేస్తుండెటోడు. మా ఇంటి ముందు చిన్న “కుంట” వుండేది. ఎడ్లబండి కట్టుకోని కుంట్లకుబోయి తట్టతోని రాగడి మట్టి ఎత్తి బండి నింపుకోనచ్చి, మట్టిపెళ్ళలను ఎండల  ఎండబెట్టి, ఎండినక్క ఆ పెళ్ళలను పలుగగొట్టిమెత్తగ పొశిపొశి జేసి తరువాత నీళ్ళు బోసి నానబెట్టి, తొక్కి తొక్కి మెత్తగ గ్రీస్ లెక్క జేసి మట్టిముద్దను “సారె”మీద బెట్టి కోలకట్టెతోని సారెను తిప్పి , పేర్పులు, అటికెలు, ఎసులలు, మంచి నీళ్ల కుండలు, ఐరేని కుండలు, కూర కంచుల్లు, కూరాడు కుండలు, ముంతలు, దొంతులు, బోనం కుండలు, పటువలు, గురుగులు, దీపంతలు జేసి “వాము”ల కాలబెట్టి అమ్మెటోడు. పెయ్యంత మట్టి బూసుకొని కాయకష్టం జేషినా ఈ కులం పనిల అర్కత్ లేదు, బర్కత్ లేదని ఒక్క శిత్తం జేసుకోని కుండలు వానుడు ఇడిషిబెట్టి వున్న రెండెకరాల బూమిల వ్యవసాయం జేసుడు షురువు జేషిండు.

మా నాయినను ఊళ్ళె ఓ పటేలుకు  జీతముంచిండు. ఆ పటేళోళ్లు మా నాయినకు జీతం కింద మక్కజొన్నలు కుంచాలతోని కొలిశి ఇచ్చెటోళ్ళు. అప్పుడు మా ఇంట్ల పొద్దున, రాత్రి గడుక వండెటోళ్ళు. పండుగలప్పుడు యాటపోగు తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంటికి ఎవ్వలన్న సుట్టాలచ్చినప్పుడు బువ్వ వండేది. ఆ పూట నేను మస్తు కడుపునిండ తినెటోణ్ణి. తతిమ్మరోజులు సగం సగం తిండే. మస్తు ఆకలయ్యేది. ఆ మక్కజొన్న గడుక పాడుగాను మూడుపూటల అదే తినేవరకు అరుగక శెంబడుక (విరేచనాలు) పెట్టేది. గడుక పెద్దగ రుశుండకపోయేది కాని తినక తప్పకపోయేది. తినకపోతే ముడ్డెండుతది. ఆకలిగదా ఆకలి.. అందుకే పెద్దోళ్ళు అన్నట్టున్నది “ఆకలి రుశెరుగది, నిద్ర సుఖమెరుగది” అని.

మక్కజొన్న గడుకల ఇంతంత పెరుగు బోసుకొని పల్చగ పిసుక్కోని పక్కకింత మామిడికాయ తొక్కేసుకోని తింటే మంచిగనె అరిగేది కని పెరుగు కొందమంటే పైసలుండకపోయేది. పైసలున్నప్పుడు పెరుగు దొరుకకపోయేది. ఎందుకంటే ఏగిలిబారంగనె లేసి పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు గంపలల్ల పెట్టుకోని మండలంకు బోయి అన్ని అమ్ముకొని వచ్చేటోళ్ళు మా ఊరోళ్ళందరు. బారతదేశంల పల్లెల పరిస్థితి గమ్మతిగుంటది. ఒంట్లె బొక్కలరిగెదాక, మాంసం కరిగెదాక కాయకష్టం జేసి పండిచ్చిన పంటలను అన్నిటిని తీస్కపోయి అడ్డికి పావుశేరు పట్నపోల్ల దినాలకు పెట్టత్తరు కని పండిచ్చినవాళ్లు కూడా తినాలె. వాళ్లది కూడ పానమే, వాళ్లు గూడ ఆరోగ్యంగా వుండాలే అని అస్సలే ఆలోసించరు. మళ్ల రోగమత్తె హాస్పటలల్ల శెరీకయ్యి బాగు శేయించుకోనికి అప్పులు మస్తు జేస్తరు. మంచి తిండి తినండ్లయ్యా నాయిన అసలు రోగమే రాదు అంటే అరికీస్ ఇనరు..

యాభై సంవత్సరాలకె అస్థిపంజరాల లెక్క అయితాండ్లుపల్లెజనం కని అదే అరవై ఏండ్ల చిరంజీవి తెల్లబూరుకు కర్రె రంగేసుకోని 150వ సిన్మా సురువు జేషిండు. పల్లెటూరోళ్ళు పండిచ్చుడు బాగనే నేర్సుకున్నరు. ఇగ పండిచ్చినదాన్ని తినుడు కూడ అలవాటు శేస్కోవాలె.

అట్ల మూడు, నాలుగు ఏండ్లు మక్కజొన్న గడుక అరిగోసబెట్టి నన్ను ఆకలితోని సంపింది. తరువాత మా ఇంట్ల పొద్దున మక్కజొన్న గడుక, రాత్రి బువ్వ వండుడు సురువు జేషిండ్లు. మా నాయినమ్మ ఒక పెద్ద కురాడు కుండ బెట్టి దాంట్లె గంజిని బోషి పులుసబెట్టి “కలి” తయారుజేశేది. పెద్ద బువ్వ కుండల బియ్యంబోసి ఆ “కలి”ని బొశి బువ్వ వండేది. ఎసరు వచ్చి బియ్యం కుతకుత వుడుకుతాంటె పలుకు మీద వున్నప్పుడే సన్నటి, గుండ్రటి శిల్లులు శిల్లులున్న వెదురుబద్దల “శిబ్బి”ని కొంచెం వంచి బువ్వకుండ మూతిలకెళ్లి లోపలికి సొర్రిచ్చి బువ్వకుండను తలకిందులు జేశి గంజి వారబెట్టేది. కొంచెంశేపు వుంచంగనే గంజి కిందబెట్టిన గిన్నెలకు కారేది. ఈ కారిన గంజి వేడి ఆవిరితోని బువ్వ  “ఉమ్మగిల్లేది” కారిన గంజిని మళ్ళా తీస్కపోయి కొంత కలిల కలిపేది. మిగిలిన గంజిల మేము ఉప్పు ఏసుకోని తాగేది. అట్ల కలితోని వండిన బువ్వ పుల్లగ గుమగుమ వాసనచ్చేది. అదో శిత్రమైన పుల్లని పరిమళం. ఆ పరిమళాన్ని నా జిందగీబర్ నేను మల్లెక్కడ పీల్చలే. అది ప్రపంచ వింతలల్ల ఎనమిదో వింత. సచ్చి ఏ సర్గంల వున్నదో  మా ముసల్ది ( నాయినమ్మ). ఆ వాసనతోని సంపేది. ఆ వాసన పీల్వంగనే ఆకలి కొరివి దయ్యమై అదాట్న మీద దునికేది. జెల్ది బువ్వెయ్యె ముసల్దాన అంటె “ఎహె పులిగండు గుంజిగ బువ్వ ఉమగిల్లద్దారా అగడుబడ్డ పోచమ్మ మొగుణ్ణి మింగినట్టు” శేత్తవేందిరా అరుగుడు పేగు వున్నదా నీకు అని తిట్టేది నవ్వుకుంట. రొండు మూడు రోజులున్నా గూడ ఆ బువ్వ పాశిపోయేది గాదు. మళ్ళా మస్తు పుల్లలు, పుల్లలుండేది. ఈ హీరోయిన్ సుహాసిని రోజు T.V. యాడ్‌ల  శెప్పుతాంటదిగదా.. లలిత బ్రాండ్ రైస్ .. సన్నగా సమానంగా 48 గంటలపాటు ఫ్రెష్‌గా వుంటది అని. కని మా ముసల్ది కుండల వండిన కలిబువ్వ ముందు ఈ లలిత బ్రాండ్ రైస్ బలాదూరె. బల్లగుద్ది శెప్తా. పొద్దుందాక మక్కజొన్న గడుక తినలేక ఆకలికి సచ్చినాగాని రాత్రికి బువ్వ మాత్రం కమ్ముగ తినేది.

మా ఊరిబళ్ళె నాలుగో తరగతిదాకనే వుండేది. నాలుగు ప్యాసై అయిదో క్లాసు సదువనీకి మండలం హెడ్‌క్వార్టర్ స్కూళ్ళ శేరికయిన. రోజు పొద్దుగాల లేశి పిడిక బొగ్గుతోనన్న, యాపపుల్లతోనన్న లేకపోతే ఇటుకపొడి పరంతోనన్న పండ్లు తోముకొని,  ఒత్తుల వేడినీళ్లతోని పెయ్యి కడుక్కోని గడుకుంటె గడుక, బువ్వుంటె బువ్వా ఇంతంత తిని పగటికి సద్దిబెట్టుకొని పోను ఐదు, రాను ఐదు మొత్తం పది కిలోమీటర్లు నడుసుకుంట బోయచ్చి సదువుకునెటోణ్ణి. గడుక వండిన నాడు పగటికి సద్దిపెట్టుకపోయెటోణ్ణిగాదు. ఎందుకంటె బళ్ళె అందరం పగటీలి ఒక్కదగ్గర్నే కూసోని తినేటోళ్ళం. అప్పుడు కడుమ పోరగాండ్లు నా గడుక సూత్తె నా ఇజ్జత్ పోతదని పొద్దటిబడి ఇడిషిబెట్టినంక అరేయ్ నువ్వు సద్ది తెచ్చుకోలేదార అని ఎవ్వలన్న దోస్తుగాండ్లు నన్నడిగితె నేనత్తానప్పటికి మా అవ్వ ఇంకా బువ్వ వండలే. రాత్తిర్ది సలిబువ్వుంటె ఇంత తినచ్చిన అని నేను అబద్ధమాడెటోణ్ణి. దోస్తుగాండ్లు వాళ్ల సద్దిగిన్నె మూతల న పరింత బువ్వేశి ఇంతంత కూర ఏత్తె నేను తినేటోణ్ణి. అట్ల రోజు ఒగలుపెట్టేది. తినాల్నంటె తలకాయ తీశినంత పనయ్యేది. పొద్దటిబడి ఇడిషిబెట్టంగనె ఆ గంటశేపు అటుఇటు తిరిగచ్చెటోణ్ణి. మా కింది కులాలోళ్ళ బతుకులల్ల ఇదో పెద్ద పరేషానున్నది. మా ఇండ్లళ్లకు చెప్పు ఇసిరేత్తె కుండ తలుగకపోవచ్చు కని మాకు రేషం ఎక్కువ. జేబుల శిల్లిగవ్వ లేకపోయిన పెయ్యి మీద అయిమనంగ బట్టలేకపోయిన, ఆత్మాభిమానాన్ని మాత్రం అరికీస్ సంపుకోం. ఒకల మోశేతికింది నీళ్ళు తాగి బతుకం.

బొండిగల పాణం పోయెదాక కొట్లాడతనే వుంటం. కిందబడ్డా, మీదబడ్డా పిడికిలి పైకే లేపుతం. శరం దప్పిన రండ బతుకు మేం బతుకం. మా తాతల తండ్రుల జీన్స్‌లల్లకెళ్ళి ఆ గుణం తబాదాలవుకుంట (ట్రాన్స్‌ఫర్) వస్తాంది. అందుకే మేం ఆర్ధికంగా బలపడుతలేమో ఏమో అనిపిస్తది. మా బడి పక్కనే ఒక సౌండ్‌సెంటర్ వుండేది. అప్పుడు రికాడ్లు వుండేటియి. అవి నల్లగ గుండ్రగ పెద్ద పెద్ద జొన్నరొట్టేలున్నట్టుండేటియి. బయిటికి ఇనబడేటట్టు అక్కడ పాటలేశేటోళ్ళు.  నేను రోజు పగటీలి అక్కడ పాటలు ఇనుకుంట ఆకలి మర్శిపోయెటోణ్ణి. పాటలల్ల శానా బలముంటది, ఎగిరిపిస్తది, దునికిపిస్తది, ఏడిపిస్తది, నవ్విపిస్తది, ఉరికిపిస్తది, ఉద్యమాలు చేపిస్తది, నరాలల్ల రకుతాన్ని మరిగిపిస్తది, ఆకలిని మరిపిస్తది, ఆకలి ఎందుకయితాందో ఎరుక కలిగిపిస్తది. సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనేనేను ఐదు కిలోమీటర్ల చిల్లర నడుసుకుంట బోయెటోణ్ణి. అసలే ఆకలి, అంత దూరం నడువాల్నంటె ఏడుపచ్చేది. మా ఊరి సడుగు (రోడ్డు ) పెద్ద పెద్ద కంకర్రాల్లతోని ఏశిండ్లు. నా కాళ్ళకేమో చెప్పులుండకపోయేది. నడుత్తాంటె నడుత్తాంటె పోట్రవుతు నా కాలు ఏల్లకు ఊకె తాకి గోర్లు లేశిపొయ్యేటియి. రక్తం కారుతాంటె మట్టి సన్నగ శెరిగి మట్టి పరాన్ని దెబ్బమీద పోస్తే దెబ్బకే రక్తం కారుడు ఆగేది. ఎండకాలంల్నయితే మస్తు దూప అయ్యేది. వాగుకాడికి పోంగనే వయ్యిలు పక్కనబెట్టి శెలిమెతోడి నీళ్లూరంగనే వంగి మూతితోని కడుపునిండ తాగేది. ఆ నీళ్లు తేటగ సల్లగ పిర్జిల పెట్టినట్టుండేటియి కని ఇప్పుడు మా వాగుల నీళ్లు తాగుతే మారుమాట్లాడకుంట సచ్చుడే.. ఎందుకంటే సుట్టు పొలాలల్ల శితం ఫెస్టిసైడ్ మందులు కొడుతాండ్లు. అడ్డగోలుగా యూరియా పిండి బస్తాలు సల్లుతాండ్లు. ఆ పొలాలల్ల నీళ్లు వాగులకి వచ్చి కలుత్తాంటయ్.అప్పుడు మందులు వాడుకమే లేకుండె ఏదో అడపాదడపా తప్ప.

ARIF6

ఇగ రోజు ఈ ఆకలి, ఈ నడుసుడు నావల్లగాక మా నాయిన బుష్కోట్ కీస(అంగిజేబు)ల కెల్లి పైసలు ఎత్తుకపోయి పావులబెట్టి హాస్టల్ ఫాం, ఆటాన బెట్టి కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, ఇంకో రూపాయిబెట్టి రెవెన్యూ టిక్కట్లు కొని అన్ని ఫాముల మీద నా వివరాలు నింపి తహసిల్దారుతోని సంతకాలు బెట్టిచ్చి, సోషల్ వెల్ఫర్ ఆఫీసుల ఫాంస్ ఇత్తే మేము కుమ్మరోళ్ళమని నాకు B.C. హాస్టల్ల సీటిచ్చిండ్లు. మా ఇంట్ల “గుమ్మి”ల ఓ పాత ఇనుప సందూగ వుండేది. దాన్ని బయటికి దీసి దాని లోపలున్న “పాశిట్టు” దులిపి ఓ తడిగుడ్డతోని తుడిశి దాంట్లె నా వయ్యిలు, అంగిలాగులు, పండుకునెటప్పుడు కప్పుకునెదానికి ఓ చెద్దరి కిందేసుకునె దానికి ఓ తట్టు పెట్టుకోని B.C  హాస్టల్‌కు పోయిన. హాస్టల్ల పొద్దటి8.30కు , రాత్రి బువ్వ5.30 కు పెడుతరు. సొట్లుబోయిన పల్లాలు బట్టుకోని లైనుకు నిలబడి బువ్వ పట్టుకోని సకిలమ్ముకిలం బెట్టుకోని తినేది. రోజు పొద్దున కందిపప్పన్న, పెసరపప్పన్న, శెనిగెపప్పన్న, మైసూరుపప్పన్న పెట్టేది. పప్పంత నీళ్ళు నీళ్ళు పలుచగ వుండేది. పొద్దున మాపున పచ్చిపులుసు గూడ శేశేది. పచ్చిపులుసు నల్ల శింతపండుతోని శేశేది. కర్రెగ పాడయేది. సూడంగనే “ఒకారం” వచ్చేది. అడిగెటోడులేడు, నుడిగెటోడు లేకుండె.

మా బతుకులు “ఎవ్వనికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తాంది” అన్న బాలగంగాధర్ తిలక్ కవిత లెక్కుండేది. మాకు పొద్దటిబడి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడిషిబెట్టంగనే నా తోటోళ్ళందరు పోరగాండ్లు వాళ్ళ వాళ్ల ఇండ్లళ్ళకు ఉరికి బువ్వ తినచ్చేది. నాకేమో పగటీలి హాస్టల్ల బువ్వ పెట్టకపోయేది. నాకు మస్తు ఆకలయ్యేది. హాస్టల్ల కొంచెంసేపు కూసోని, లైఫ్‌బాయ్ సబ్బుతోని మొఖం కడుక్కునేది. అప్పుడు నాకు వేరే సబ్బులు తెల్వయి. ఎర్ర లైఫ్‌బాయ్ సబ్బు తప్ప. మళ్లా నాలుగున్నరకు సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనే దనదనా ఆకలితోని హాస్టల్‌కు ఉరికచ్చేది. ఓ గంట అటు ఇటు టైమెల్లదీయ్యంగనే 5.30 కు రాత్రి బువ్వ కూరగాయల్తోటి పెట్టేది. పచ్చిపులుసు సాయంత్రం గూడ పోశేది. ఒక స్టీలు “రికాబు”తోని హెడ్ కుక్ పెద్ద అండ ముందటబెట్టుకోని మాకు బువ్వ పెట్టేది. ఆకలిమీద మంటర మంటర దనాదనా తిని సరిపోక “మారు”కు మల్లబోతె బువ్వ పెట్టకపోయేది. సరిపోలే అన్న ఆకలయితాంది ఇంకొంచెం బువ్వ ఎయ్యి అంటే ఏంచెల్లి తెచ్చిపెట్టాలె  మా ఇండ్లల్లకెళ్లి తెచ్చిపెట్టాల్న అని వంటమనిషి మొఖమంత ఖండిచ్చుకుంట గదిరిచ్చిపెట్టేది. అవాజ్ ఎత్తుతే ఏదో వంకతోని వార్డన్‌తోని కొట్టిపిచ్చేది. రాత్రి ఎనమిది గంటలకల్లా సాయంత్రం 5.30 కు తిన్న బువ్వ అరిగిపోయి ఆకలయి రాత్రి నిద్ర పట్టకపోయేది.

రూంలల్ల ఫ్యాన్లులేక దోమలు కుట్టి సంపేటియి. వానకాలం వస్తెనయితె ఆ దోమల బాధ శెప్పవశంగాదు. ఆ గోస శెపుకుంటబోతె ఓ రామాయణం ఓ మహాభారతమె అయితది. మాకు హాస్టల్ల సరైన పోషక విలువలున్న బలమైన తిండి లేక రకరకాల రోగాలచ్చేటియి. అవి తిండిలోపం వల్ల వస్తానయని అప్పుడు మాకు తెల్వది. నోరు,నాలుక, పెదవులు, పెదవుల శెలిమెలల్ల తెల్లగ పూశేది. పలిగేది పుండ్లయేటియి. ఒంట్లె చెటాక్ మాంసం వుండకపోయేది. మాకు ప్రొటీన్ ఫుడ్డు సరిగ్గ దొరకకపోయేది. ఎవన్ని సూశిన బక్కపలుసగ, ఎండుకపోయి, బరిబాతబొక్కల్లెల్లి వాయిలు చెట్ల బరిగెల లెక్క, చిన్నపాటి జామాయిలు చెట్ల లెక్కుండేది. శానామందికి నెత్తి ఎంటికలు వూడిపోయేటియి. మేము నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకోకపోయేది. మంచినూనె పెట్టుకునేది. చలికాలంల కాళ్లు రెక్కలు పలుగుతె మంచి నూనెనే రాసుకునెటోళ్ళం. మాయిశ్చరైజర్లా మన్నా. పోరగాండ్లందరు మంచినూనెకు ఎగబడుతాండ్లని కూరలల్ల పోశెదానికి తక్కువబడుతాందని మా వంటమనుషులు మంచినూనెల పసుపు కలిపి ఆ నూనె నెత్తికి రాసుకుంటె పెయ్యికి పూసుకుంటె తెల్ల ఎంటికలు వత్తయని బెదిరిచ్చేది. ఇగ మంచినూనె జోలికి ఒక్కడు పోకపొయ్యేది.

సర్కారు హాస్టల్లల్ల వుండి సదువుకునే పోరగాండ్లమంటే అందరికీ అలుసే. బువ్వ సరిపోతలేదంటె వంటమనుషులు వార్డన్లు బెదిరిచ్చేది. బళ్ళెకుపోతె మాతోనిపాటుగ సదువుకునె బాగ పైసబలుపు వున్న పోరగాండ్లు మమ్ముల అంటిముట్టనట్టు వుండుకుంట చిన్న సూపు సూశేది. ఆఖరికి పంతుళ్ళుగూడ మమ్ముల జిల్లపురుగుల సూశినట్టు సూశేది. “సర్కారు బువ్వ తింటాంటె బాగ బలుపులచ్చినాయిరా” అనుకుంట కొట్టేది, తొడపాశం బెట్టేది. నాకయితే “అసలు బువ్వే సరిపోత లేదురా నాయినా” అని అనాల్ననిపిచ్చేది కని ఎందుకచ్చిన లొల్లి అట్లంటె ఇంక నాలుగు ఎక్కువ సప్పరిత్తడని కుక్కినపేనులెక్క కూసునేది.

హాస్టల్ల వుండి సదువుకునే పోరగాండ్లం మాతోని మేమే దోస్తాన్ జేశేటోళ్ళం. S.C హాస్టల్ల వుండే మాదిగోల్ల సామ్రాట్‌గాడు, సంపత్‌గాడు, మాలోల్ల సురేందర్‌గాడు, B.Cహాస్టల్లవుండే నేను, ముత్రాశోల్ల శీనుగాడు, బెస్తోల్ల రమేశ్‌గాడు, గౌలోళ్ల అశోక్‌గాడు, గొల్లోల్ల బిక్షపతిగాడు, కాపోల్ల భాస్కర్‌గాడు మేమంతా ఒక గ్యాంగ్‌గ వుండెటోళ్ళం. హైస్కూళ్ళ మాజోలికి ఎవడన్న రావాల్నంటె “కాకి నెక్కర్ల” వుచ్చ పోసుకునేది.

 

ఆదివారం వచ్చిందంటె మాశిపోయిన అంగి లాగులు, స్కూలు డ్రెస్సులు పట్టుకోని పొద్దుగాల్నే లేశిపెద్ద కాలువకు పోయెటోళ్ళం. అక్కణ్ణే “బర్రెంక” పుల్లతోణి పండ్లు తోముకోని బట్టలు పిండుకోని తానాలు జేసి వచ్చేటోళ్ళం. అప్పుడు మాకు సబ్బులు కొనుక్కునెదానికి హాస్టల్ల నెలకు 10 రూపాయలు సర్కారు ఇచ్చెది. ఆ పైసలు దాసుకోని ఆదివారం సిన్మాకు పోయెటోళ్ళం. నా శిన్నతనంల సూశిన  సిన్మాలల్ల కమల్‌హాసన్ సత్య (1988), నాయకుడు (1987), నాకు మస్తు నచ్చినయ్. నేనొక్కణ్ణే మళ్లా మళ్ళా బోయి ఆ సిన్మాలు సూశెటోణ్ణి. శనివారం నాడు పొద్దుగూకంగనె చిత్రలహరి సూశేదానికి పోయెటోళ్లం. అంగడి రోడ్డు పక్కన గ్రందాలయం ముందట, దీపక్ ఫోటో స్టూడియోల్లకు ఒక్కలకే అప్పుడు “డిష్ ఆంటేనా” T.V  వుండేది. T.V.ల వారానికో సిన్మాగూడ వచ్చేది. “కోకిలమ్మ” సిన్మా నేను T.Vల సూసుకుంట హీరోగాడు హీరోయిన్ సరితను మోసం జేసినప్పుడు నేను దుఃఖం ఆగక ఏడిసిన.

మేము హాస్టల్ల ఏం తక్కువ 200 మందిమి వుండెటోళ్ళం. అందరం ఒక్క దగ్గర్నె తానాలు జేసుడు, మొఖాలు కడుగుడు. తిన్న పిలేట్లు కడుక్కునేవరకు అక్కడ పెద్ద బురద మడుగు తయారయ్యేది. దాంట్లెకు పందులచ్చి బొర్రేటియి. పందుల పక్కనుంచెల్లి మేము మా పక్కనుంచెల్లి పందులు పొయ్యేటియి. వాటిని మేము మమ్ముల అవ్వి పట్టిచ్చుకోకపోయేటియి.నాకు ఇప్పుడు ఆలోసిస్తే నవ్వస్తది. మమ్ముల సర్కారోల్లు మనుసుల లెక్క గుర్తించకపోతే గుర్తించకపోనీయి. కాని ఆఖరికి పందులు కూడ మమ్ముల మనుషుల లెక్క గుర్తించలె.

ఇట్ల హాస్టల్ల ఆకలి నన్ను ఐదు సంవత్సరాలు సంపింది. ఇంటికాడ వుంటెనేమో నడుసుడు బాధ, ఆ మక్కజొన్న గడుక తినలేక ఆకలి బాధ, హాస్టల్ల వుంటెనేమో మద్యాహ్నం, రాత్రి ఆకలి బాధ, నిద్రబాధలు. ఎనుకకుబోతె నుయ్యి ముందుకుబోతె గొయ్యి లెక్కుండేది బతుకు. కాని హాస్టలే నయ్యమని హాస్టల్లనే వుండేది. బాధాకరమైన విషయమేందంటె ఈ దళిత బహుజనుల బతుకులల్ల కష్టాలకు, కన్నీళ్లకు రొండు రకాల పరిష్కారాలుంటయ్. మళ్లా రొండీట్లల్ల దు:ఖమే వుంటది. కాకపోతె ఒకదాంట్లె ఎక్కువ, ఒకదాంట్లె తక్కువ. ఎటుబడి ఏడుస్తానే వుండాలె.నలుభై ఏండ్ల బతుకును ఎనుకకెనుకకు తవ్వుకుంట తవ్వుకుంట పోతాంటె అడుగడుగునా అన్నీ ఆకలి గాయాలే. ఆకలి జ్ఞాపకాలే. ముడ్డి మీద సరిగ్గ లాగు ఏసుకునుడు శాతగాని పసిపోరగాణ్ణి గంత ఆకలిని ఎట్ల బరించిన్నో తలుసుకుంటాంటే అఫ్సోస్ అయితాంది.

*

బేషరమిత్వం -2

saif
11
బేషరం ప్రయత్నిస్తే తప్పకుండా ఏదో ఒక విజయం లభిస్తుంది
ఎవరో ఒకరు ప్రయత్నం చెయ్యబట్టే కదా విమర్శకులు గా కొంతమంది బతికేస్తున్నారు 5 <3
*
12
ఎవరి కట్టు బాటులొ వారు బతుకుతున్నారు బేషరం
 కోపం అహం అసహ్యాలు ఎవరివి వారికున్నాయి 5 <3
*
13
పూర్తిగా చేయి చాపుతుంటాం బేషరం 
ఐనా మనకు అందెంత దూరం లో కొన్ని పళ్ళుండవు 5 <3
*
14
చాలా మంది బేషరం ఓ తాడు కట్టుకుంటూ ఉంటారు
ఇష్టమయిన బావి నీళ్ళు ప్రతి రోజు చేదుకోవడానికి 5 <3
*
15
మగాళ్ళని తమ దారిలో తెచ్చుకోవాలి అనుకునే వారు
బేషరం  పడగ్గది కి వెళ్ళే దారిని ఉపయోగించుకుంటారు 5 <3
*
13
ముక్కలు ముక్కలు చేస్తున్నారు బేషరం
కాలాన్ని మనుషులు ఒక్కో పనికోసం ప్రతి రోజు 5 <3
*
14
జిందగీలో ముందుకు వెళ్ళాలనుకున్నవారు ఎందరో
బేషరం వెనక్కు వెళ్ళిపోయే వారితో జత కట్టరు  5 <3
*
15
సగం ఖాళిగా ఉందని  కొంతమంది  బాధపడుతారు  బేషరం 
కొంతమంది జవరాళ్ళు  సగం   నిండి ఉందని తృప్తి పడుతారు  5 <3
*
16
 మరోకంటికి తెలియకుండా చాలా మంచి పనులు జరుగుతుంటాయ్
బేషరం పడగ్గదుల్లోనే ఎక్కువ 5 <3
*
17
లాభం లో ఓ భాగం పంచుకుంటూ ఉంటారు విజేతలు
బేషరం ముద్దు తాము తీసుకుంటూనే తిరిగి ఇస్తుంటారు5 <3
*
18
తేనే పట్టు మధ్యలో ఏముంటుంది బేషరం 
రాణి ఈగే  కదా.. అది లేకుంటే తెనే పట్టు లేదు కదా 5 <3
*
19
ఫకీర్లు చిప్పలతో తిరుగుతుంటారు ఎక్కడైనా బిక్షం దోరికెయ్యోచ్చు
బేషరం కవులు జేబుల్లో పెన్నులు పెట్టుకోని తిరుగుతుంటారు కవితల కోసం 5 <3
*
20
కొన్ని పనుల్లో కొందరు ఆరి తేరి ఉంటారు బేషరం 
అందరికి మోసం చెయ్యడం అస్సలు రాదు ఎప్పటికి 5 <3

ఆమె కవిత రాస్తే కొరడా పడ్డట్టే!

subham

పాతికేళ్ళ  శుభమ్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని.శుభమ్ శ్రీ యెప్పుడు రాసిన చర్చనీయాంశమే.ఆమె  బుఖార్(జ్వరం) ,బ్రేక్ అప్ ఐ లవ్ యూ కవితలు రాసినపుడు కూడా చాలా చర్చలు, విముఖతలు,సుముఖతలెన్నో విన్పించాయి.యీమెకు హిందీ కవిత్వానికిచ్చే ప్రతిష్టాత్మకమైన భరత్ భూషణ్  అగ్రవాల్ పరస్కారం 2016 వ సంవత్సరానికి గానూ లభించింది. హిందీ సాహిత్యప్రపంచం జీర్ణించుకోలేక పోయింది.జ్యూరీ సభ్యులలో వొకరైన వుదయ్ ప్రకాష్ మాత్రం సరైన యెంపికేనని కొత్త వొరవడిని ఆహ్వానించాలని చెప్పారు.

సాంప్రదాయ శిల్పపు నడుములను విరచి ముక్కలుగా చేసి రాస్తున్నప్పుడంతా యిలాంటి చర్చలు జరగడం సహజమే అన్పిస్తోంది.

శుభం శ్రీ యీ కవితలో నెరేటివ్ వ్యాఖ్యానపు వుత్తరాధునిక శిల్పమైన పెరడి గొప్పగా కనిపిస్తుంది.కవిత్వపు జడత్వాన్ని విదిలించే వొక కావ్యాత్మక ప్రయత్నాన్నీ తిరస్కరించే కంటే దానిని అర్థం చేసుకొనే దృష్టిని అలవరచుకోవాలి. యీ కవితలో కవిత్వం రాయడం వొక వ్యాపారంగా,వొక కెరీర్గా భావించే వారిపై తిరుగుబాటు కనిపిస్తుంది.సోషల్ మీడియాపై వొక గర్జన, యింకా వామపక్ష భావజాలం, స్త్రీ పట్ల మగవాడి పెత్తందారి ప్రవర్తన,రాడికల్ స్త్రీవాద చర్చలు యీమె కవిత్వంలో అంతర్లీనంగా వుంటాయి.యిది మౌఖిక కవిత యిందులో కవిత్వాన్ని యెలాంటి ఫలాలు యివ్వని చర్యగా,ప్రపంచ వ్యాప్తంగా యే వుద్దేశ్యాలను పూరించలేక పోతుందని వాపోవడం కనిపిస్తోంది.

పొయెట్రీ మేనేజ్మెంట్
—————————

కవిత్వం రాయడం బోగస్!
అరే,పనికిరాని పని
మొత్తంగా….
పనిపాటలేని పని!
పార్ట్ టైం!

మావాఁ,యేదో నెమరేసినట్టు
యెంబియే సేమ్ బియే టైపు అన్పిస్తోంది
గుజ్జు వచ్చేస్తోంది గురూ!

యిటు వొక కవిత రాసారనుకో;
సెన్సెక్స్ పడిపోతుంది
కవి లింగరాజు వొక కవిత రాసారు
పెట్టుబడివాదాన్ని వ్యతిరేకిస్తూ
సెన్సెక్స్ పడిపోయింది
ఛానల్ లో చర్చ
యిది వొక నమూన
అమెరికా సామ్రాజ్యవాదం పడిపోయిందని
వెనిజులతో ప్రేరేపింపబడిన కవులను
అమెరికా నియంత్రించగలదా?
ఆర్థికమంత్రి వుపన్యాసంలో
చిన్న యిన్వెష్టర్లకు నమ్మకం లభిస్తుంది
ఆర్బీఐ వెంటనే రెపోరేటును పెంచేస్తుంది
మీడియాలో గందరగోళం
సమకాలీన కవిత్వం
వొక సంకలనంగా ప్రచురింపబడుతోంది
వొక సామాన్యుడు యీ కవితాసంకలనాన్ని
యెలా యెదుర్కుంటాడో ?దీని గురించి
మీరే చెప్పండి
మీ స్పందనలు మాకు యెస్యంమెస్ చేయండి

అరే, సీ పీ వో (చీఫ్ పొయెట్రీ ఆఫీసర్)పేరు
ఆకాశంలో మెరుస్తుంటుంది
యాడ్లు ప్రతి కార్యక్రమంలో చూపిస్తుంటారు
రిలయన్స్ డిజిటల్ కవిత
లైఫ్ ను యిచ్చును
టాటా కవిత
ప్రతి పదం మీ కోసమే
ప్రజలు తమ డ్రాయింగు రూముల్లో
వేలాడదీస్తారు
అరే, వావ్ భలే వుందే! అని
యే అకాడమీ వాడికో అనిపిస్తుంది
లేదండీ, యింపోర్టెడ్
అసలైనది కోట్ల డాలర్లది
మేము డూప్లికేటు కొనుక్కున్నాం
పిల్లలు వ్యాసాలు రాస్తారు
నేను యం పీ యే చదువుతానని
యలైసీ పొయెట్రీ యిన్సురెన్స్
మీ కల కూడా మాదే
డియూ, పొయెట్రీ ఆనర్సు, ఆకాశంలో
కట్ ఆఫ్ ప్యాట్ (పొయెట్రీ ఆప్టిట్యూడ్ టెస్టు)
పరీక్షలో మళ్ళీ అమ్మాయిలే సత్తా చాటారు
ప్యాట్ రిజర్వేషన్లలో జరిగిన అవినీతికి
వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో
వి.సీ.దిష్టిబొమ్మ దహనం చేయబడుతుంది
దేశంలో యెనిమిది కొత్త కవితాసంస్థల
స్థాపనకు ఆమోదముద్ర లభిస్తుంది

మూడేళ్ళ వయసుకే
మూడువేల కవితలు వల్లెవేస్తుంది
భారతదేశపు పసిఅధ్భుతం
అమెరికా యిరాన్ ప్రవృత్తితో దిగులు పడి
ఫారసీ కవితాసాంప్రదాయాన్ని వోడిస్తుంది.

యిది ఆల్ యిండియా రేడియో
వార్తలు చదువుతున్నది దేవానంద రావు
నమస్కారం
యీ రోజు ప్రధానమంత్రి అంతర్జాతీయ
కావ్యసమ్మేళనంలో పాల్గొనేందుకు
మూడురోజుల పర్యటన కోసం బయలుదేరారు
యిందులో కవితాగుంపుల నుంచి
ప్రతినిధులుగా పాల్గొంటున్నారు.
భారతదేశం యెలాంటి పరిస్థితులలోనూ
తన విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేసింది
భారత్ – పాకిస్తాన్ ల కవితా దైపాక్షిక చర్చలు మళ్ళీ విఫలం.
పాకిస్తాన్‌ యిక్బాల్,మంటో, ఫైజ్ ల
వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకోమటోంది

చైనా నేడు మళ్ళీ కొత్త కావ్యాలంకారాలను పరీక్షించింది
యిప్పుడు అతిశక్తివంతమైన కావ్యసంపుటాలను
సృష్టిస్తుందనే కథనాలు విన్పిస్తున్నాయి
యీ రోజు వుదయాన్నే ప్రముఖ కావ్యనిర్మాత ఆషిక్ ఆవారా ప్రాణాలొదిలారు
వారి అకాల మరణానికి రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు
వుత్తరప్రదేశ్ లో మళ్లీ దళితులపై దాడి
అటు క్రీడల్లో భారత్ వరుసగా మూడోసారి
కవిత అంతాక్షరిలో పసిడిపతాకాన్ని సాధించింది
భారత్ వరుస సెట్లలో 6 -4, 6-4, 7-2 తో
మ్యాచ్ ను గెల్చుకుంది
వార్తలు సమాప్తం

వచ్చేసింది నేడే హిందూ,హిందుస్తాన్ టైమ్స్, యీనాటి పత్రిక, ఆంధ్రనాడు
తెలంగాణ జ్యోతి
యువకుల్లోకి ప్రవేశించిన పొయెట్ హేర్ స్టైల్ జ్వరం
కవయిత్రులు తమ కురచైన,పొడవైన
అచ్చుల రహస్యాలను పంచుకున్నారు
ముప్పై యేళ్ళ యెం పీ యే అబ్బాయికీ
సంస్కార,సాంప్రదాయబద్ధమైన వధువు కావాలి
యిరవై ఐదు సంవత్సరాల యెం పీ యే చేసిన
సన్నని పొడవైన వధువు కోసం యోగమైన
వరుడు సంప్రదించగలరు

గురూ! తమాషాగా వుందే
మాట్లాడుతూనే వుండూ
నేనూ హీరో అవుతాను
యెక్కడికెళితే అక్కడ ఆటోగ్రాఫ్ లు
యిస్తూనే వుంటాను
చాల్లే రా
థార్డ్ డివిజనులో యెం .యే
యెం పీ యే ఫీజు యెవరిస్తారు?
కూర్చోని ప్రూఫ్ రుద్దూ.

*

అక్కడి గార్బేజ్…ఇక్కడి హెరిటేజ్!!

 

 

ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు ఏ కోశాన అన్నారో తెలీదు. దాన్ని అనేక రకాలుగా అన్వయించుకునే వారు పెరిగిపోయారు. భూమి భారతిని పొగడడం అంటే వెనుకబాటు తనాన్ని పొగుడుకోవడం కాదు. నలుగురి దృష్టిలో నవ్వుబాటు కావడం కాదు. సంస్కృతి సంప్రదాయాల పేరుతో పాత చెత్తనంతా నెత్తికెత్తుకుని ఊరేగడం కాదు. కానీ కొందరు సంస్కృతీ రక్షకులు విదేశీ గడ్డమీద చేస్తున్నదేమిటి? మా మూలాలు ఇవి మా సంస్కృతి ఇది అంటూ హేయమైన ఆచారాలను ప్రదర్శిస్తూ భారత్‌ అంటే ఇంకా ఈ స్థితిలో ఉన్న దేశమా అని అంతా నోరెళ్లబెట్టేట్టు చేస్తున్నారు.

విదేశీ గడ్డమీద అడుగుపెట్టి అక్కడ జీవనం సాగిస్తున్నవారికి సొంత మూలాలకు సంబంధించిందేదో ప్రదర్శించుకోవాలని ఉంటుంది. తప్పులేదు. కానీ ఈ మూలాల కోసం కాలంలో వెనక్కు ప్రయాణించనక్కర్లేదు. సొంత గడ్డమీద కూడా ఎబ్బెట్టు అనిపించే విషయాలను పరాయి గడ్డమీద పదిమంది ముందు చాటాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని అంశాల్లాగే సంస్కృతి సంప్రదాయాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. పురోగామి అంశాలు, ఆహ్వానించ దగిన అంశాలు కూడా మన సంస్కృతిలో ఉంటాయి. అవి వదిలేసి ఆధిపత్య చిహ్నాలైన వాటిని అవమాన కరమైన వాటిని ప్రదర్శనకు పెట్టి ఇవి మా మూలాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతో చదువుకుని దేశాలు దాటిన వారి ప్రపంచం విస్తృతమవుతుందని ఎవరైనా ఆశిస్తాం. కానీ ఇక్కడ సాగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది.నమ్మాలని పించదు. ఇది అవసరమా, ఇది దేశభక్తా, తెలుగు సంస్కృతి అంటే ఇదేనా! అని చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ రకమైన చర్చ కోసమే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐగా ఒక అనుభవాన్ని ఇక్కడ నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను.

నీకు మైల ఉందా! ఈ హఠాత్ ప్రశ్నకు ఒక్క క్షణం ఊపిరాడలేదు. ఇది సాధారణమే అనుకునే వారు కూడా ఉండొచ్చు. అది వారి సంస్కృతి. అమెరికాలో ఇక్కడ …సంస్థలో సాంకేతికంగా ఉన్నతమనుకునే …ఇండస్ర్టీలో ఈ మాట వినిపించడం నాకైతే షాక్‌. ఆరోజు గురువారం. ఆ మాట వినిపించిన వైపు చూశాను. ఫ్యాంటు, చొక్కా, చెవులకు జుంకీలు , మెళ్లో నల్లపూసలు , నుదుటన ఇంత పెద్దబొట్టు, దాన్ని డామినేట్‌ చేస్తూ దేవుని కుంకుమ, వెరసి ఆవిడ పేరు ఎక్స్‌ అనుకుందాం. పేరు బయటపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సాయి భక్తురాలు. భక్తి ఉండడం లేకపోవడం వారి వైయక్తిక విషయం. ఆవిడ మైల భక్తి కూడా ఉండవచ్చును. కానీ ఆఫీసులో పదిమంది ముందు అంత గట్టిగా నీకు మైల ఉందా అని వినిపిస్తే ఏమనుకోవాలి?

ఆగండి.

కథ ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రశ్న ఎందుకొచ్చిందో మూలాల్లోకి పోవాలి. ఆవిడకు కూడా ఒక లాజిక్‌ ఉంటుంది కదా! మనం ఎవరినైనా విమర్శిస్తున్నామంటే వారి కోణాన్ని కూడా అర్థం చేసుకుని విమర్శించడమే న్యాయం. ఆవిడ ప్రతి గురువారం సాయి ప్రసాదం తీసుకువస్తారు. ఆ ప్రసాదం పంచేముందు అడిగే ప్రశ్న ఇది. ఎవరు పంచమన్నారు? మేము అడిగామా! అంత గట్టిగా అడుగుతుంటూ పదిమంది ముందు అందులోనూ మగవారి ముందు ఎంత ఎబ్బెట్టు అని ఆలోచించే జ్ఞానాన్ని ఆ మైల తాలూకు భక్తీ భయం మింగేశాయి. ఇక్కడ తెలుగువారు ఎక్కువే. అందులోనూ మగవాళ్లున్నారు. ఈ బాధితురాలిని నేనొక్కదాన్నే కాదు. ఇంకా భారతీయులు ఉన్నారు. ఈ మైల గొడవ పశ్చిమదేశాల వారికి లేదు కాబట్టి బతికిపోయారు. చివరకు గురువారం వచ్చిందంటే ఆమె రాకను చూసి తప్పించుకోవాల్సి వచ్చేది. నాలాంటి వారంతా అదే పనిచేయడం కూడా గమనించాను. ఇది ఒక తరహా.

ఇపుడు ఇంకో “వై” దగ్గరికి వద్దాం. ఈ “వై”లు ఒకరు కాదు. అనేక “వై”లున్నారు. వీరు పెద్ద ముత్తయిదువ బాపతు. వీరు ఏకంగా ఆఫీసులోనే వ్రతాలు నోములు జరిపించేవారు. పశ్చిమదేశాల వారు ఇది భక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గౌరవం తోనో సహనం తోనే ఉండిపోయేవారు. కన్నడిగులైతే మంగళవారాలు, తెలుగువారైతే శ్రావణ శుక్రవారాలు. ఈ వైలలో ఒక పెద్ద ముత్తయిదువ అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసింది. ఆఫీసులో ఇద్దరు మగవాళ్ల భార్యలు గర్భం దాలిస్తే ఆమె పట్టుబట్టి వారిద్దరికీ బేబీ షవర్‌ జరిపించింది. వాళ్లిద్దరూ ఎంత సిగ్గుపడిపోయారో తల్చుకుంటే సిగ్గేస్తుంది.

ఇంకొందరు. భర్తతో పాటు వస్తారు. గ్రీన్‌ కార్డ్ వచ్చాక క్యుఏ ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లి ఎలాగోలా ఉద్యోగంలో చేరిపోతారు. తప్పేమీ లేదు. ఆర్థిక స్వతంత్రం ఆహ్వానించదగిన అంశం. కానీ ఏం చేస్తారు? తెలుగు సీరియల్స్ లో లాగా అమ్మలక్కల కబుర్లు మొదలెడతారు. అన్నీ మానవసంబంధాల చర్చలే. తామెంత పతివ్రతలు-అవతలివారు ఎంత అపతివ్రతలు. అంతా తెలుగులోనే. ఆఫీసుకు సంబంధించిన అంశాలు కూడా తెలుగులోనే మాట్లాడతారు. పరాయివాళ్లు కలిసిన గ్రూప్‌లో మాట్లాడుతున్నపుడు అందరికీ
అర్థమయ్యే భాష మాట్లాడాలనే కనీస ఇంగితం ఉండదు. చివరకు మీటింగ్స్లో కూడా తెలుగులోనే మాట్లాడతారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం గొప్ప అని కాదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగ అవసరం కదా! ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉండడం వల్ల జరిగిపోతుందనే నమ్మకం. ఒక టీమ్‌ లీడర్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడమని రిక్వెస్ట్‌ చేస్తే నువ్వొక్కడివి తెలుగు నేర్చుకుంటే ఖతం అనేశారు. అతను నాదగ్గరకి వచ్చి తెలుగు ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు. ఎందుకు నీకు అంత కస్టం అంటే ఐ నీడ్‌ దిష్‌ జాబ్ అనేశాడు. అలాఉంటుంది కథ.

ఈ వైలలోనే ఇంకో పులిహార బ్యాచ్‌ఉంది. బాస్‌లను మేనేజ్‌ చేయొచ్చు ఇంప్రెస్‌ చేయొచ్చు అని నమ్ముతారు.తప్పుగా అనుకోకండి. ఒకావిడ ప్రతి శుక్రవారం మేనేజర్‌కు పులిహోర పట్టుకువస్తుంది. పైగా క్రిస్‌కి నా పులిహోర చాలా ఇష్టం అంటుంది. క్రిస్‌ వెజిటేరియన్‌ కాబట్టి ఇంకో ఆవిడ ఎగ్‌ లెస్‌ కేక్‌ చేసి తరచుగా పట్టుకు వస్తుంది.

ఈ ఆచారాలు అనే కాదు. ఈ పెద్ద ముత్తయిదువల్లో మరి కొందరున్నారు. వారు సలహాలివ్వడం తమ హక్కు- పాటించడం ఎదుటివారి బాధ్యత అని స్థిరంగా నమ్ముతారు. వయోధిక్యాన్ని ఆధిక్యంగా మార్చుకుని ప్రదర్శిస్తుంటారు. ఫలానా అమ్మాయి, బ్యాడ్‌-మగవాళ్లతో మాట్లాడుతుంది-ఆమెతో మాట్లాడొద్దు అని డిక్రీ జారీచేస్తూ ఉంటారు. వినకపోయామో మనపేరు కూడా ఆ అమ్మాయి పేరు పక్కన జత చేస్తారు.

ఒక అమ్మాయి గురించి చెప్పాలి ఇక్కడ. తను కష్టజీవి. మంచుకురిసే కాలంలో కూడా ఎన్నడూ లేట్‌కాకుండా గడియారానికే టైం నేర్పుతున్నట్టు ఠంచన్‌గా వస్తుంది. కొత్తగా జాయిన్‌ అయిన వారికి చాలా చాలా సాయం చేస్తుంది. డిగ్రీ అవగానే పెళ్లి చేశారు. భర్త శాడిస్ట్‌. కూతురు పుట్టాక విడాకులు తీసుకుంది. వేరే దేశస్తున్ని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడింది. అదో పెద్దనేరం మనవాళ్ల దృష్ఠిలో. పెద్ద ముత్తయిదువులకు ఆమె ఒక విలన్‌. పాత సినిమాల్లో చేతిలో సిగరెట్‌ పట్టుకుని డాన్స్‌ వేస్తూ మామయ్య వస్తే పనిమనిషి అని పిలిచే కోడలు ఉంటుందే అలాంటి దర్శకుల ప్రతిభ వీళ్లలో పుష్కలంగా ఉందన్నమాట. ఆమెను బిచ్‌ అని బ్యాడ్‌ అని ఏమేమో అనేవారు. అందరూ నీవెనుక ఇలా అనుకుంటారు ఎందుకు అయినా అందరితో మంచిగా ఉంటావు. సాయం చేస్తావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఇది. వాళ్లు నన్ను అలాగే పిలుచుకుంటారు అని తెలుసు. ఇలా ఉండడం వల్ల పాజిటివ్‌ స్పిరిట్ తో గతకాలపు గాయాలను మర్చిపోగలుగుతున్నా. ఇలా ఉండడమే బిచ్‌ అయితే “ఎస్‌ ఐయామ్‌ బిచ్‌ ” అని చెప్పింది. “ఐ యామ్‌ ప్రౌడ్‌ టు బి ఎ బిచ్‌ రాదర్‌దాన్‌ ఏ పతివ్రత” అని కూడా చెప్పింది. సూటిగా స్పష్టంగా. ప్రాజెక్ట్‌ అయ్యాక మిగిలిన వాళ్లు అలా ఇలా వెతుక్కుంటూ ఉంటే ఆ అమ్మాయికి మూడు ఆఫర్లు వచ్చాయి.

అందరికీ ఇలాంటి అనుభవాలు లేకపోవచ్చు. కానీ ఈ అనుభవాలు అయితే నా జీవితంలో నేను కళ్లెదురుగా చూసినవి. ఇది ఏ సంస్కృతి. ఏ సంస్కృతిని మనం అక్కడినుంచి మోసుకొచ్చాం. ఇది మనకు గౌరవం తెచ్చే సంప్రదాయాలా!వాస్తవానికి ఇవాళ భారత్‌లో కూడా ఆఫీసుల్లోకి ప్రసాదం తెచ్చి అందరి ముందూ నీకు మైల ఉందాఅని అడుగుతూ పోయే ఆడవాళ్లని ఊహించుకోలేమని అక్కడివారు చెపుతున్నారు. అక్కడ మహిళలు ఎంతో కొంత పురోగతి సాధిస్తూ ఉంటే ఎంతో ఎదిగామని రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడ వాలిన వాళ్లు సంస్కృతి పేరుతో ఆచారాల పేరుతో అక్కడ గార్బేజ్‌లో వదిలేసిన సంస్కృతిని జాగ్రత్తగా ఏరుకుని మూటగట్టుకుని ఇక్కడకు తెచ్చి అందరిముందూ ప్రదర్శనకు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

*

చెదరని సంతకం

నిన్ను నువ్వు అద్దంలో జూసుకుని
తాషిలి మొఖపోనివని  బిరుదులిచ్చుకున్నప్పుడు
తాకట్లుబెట్టి…తలకుబోసుకుంటవని
నీలో సగం నీతో పరాశాకాలాడినప్పుడు
తప్పెవరిదైనా.. బోనులో నిన్నొక్కడినే నిలబెట్టి
ముద్దాయివని ముద్దెర్లు గుద్దినపుడు
యుద్ధంలో ప్రత్యర్ధి సుత
నీ ప్రతిబింబమేనని ఎరుకైనపుడు

నీకు నువ్వే…
జవాబు లేని ప్రశ్నవై
అటక మీద ఓరకు బెట్టిన
సత్తుపైసల మూటవై
జిబ్బ జిబ్బ ముసురుకున్న సంతలో
బ్యారంగాని ల్యాగదూడవై
లబ్బలబ్బ మొత్తుకున్నా…
ఇనుపించుకోని మావుల మన్సుల నడ్మ
పిడ్సగట్కబోయిన నాల్కెవై

art: Rafi Haque

art: Rafi Haque

లంగరేసిన పడవలెక్క ఎటూకదల్లేక
తోట్ల బొమ్మోలె నిలబడి
పాలిపోయిన మొఖంతో
బీరిపోయిన సూపులతో
యుద్ధంలో గాయపడ్డ సైనికునిలా..
మనసంతా కలి కలి!
నెత్తురు పేరుకపోయిన కండ్లతో
అంతా మసక  మసక !!

మాయిల్నే కోంచెపడేటోల్లు
కూసున్న కొమ్మనే నరుక్కునేటోల్లు
తమ  కన్ను తామే పొడ్సుకునేటోల్లు
నీ  కంతకు సూటివెట్టి…
నువ్వెప్పుడో ఓడిపోయినవని  ఎకసెక్కాలాడుతరు !

నువ్విప్పుడు
పారుతున్న ఏరుతోటి పొత్తుగూడి …
తొక్కుడుబండ మీద ..
చెక్కుచెదరని  సంతకమవ్వాలె  !!

*

బైకు మీద మెక్సికో…

 sree1
డాలస్,  నవంబరు, 2015

ప్రతి సంవత్సరం మా ఇండియన్ మోటార్ సైకిలు గ్రూపులో రెండు దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రతి వారం, రెండు వారాలకి డాలసు చుట్టుపక్కలాచక్కర్లు సరేసరి! మొన్న జూలై నెలలో తొమ్మిదిమంది కలిసి కొలరాడో వెళ్ళాము. వచ్చే జూలైలో లే లడాక్ వెళ్దామని మాకు అప్పటికే ఒక ప్రణాళికఉంది. ప్రపంచంలో మోటారుసైకిలు నడిపే ప్రతివారికీ లే లడాక్ యాత్ర అంటే ఒక కల! కఠినమైన దారులు, అంతే కఠినమైన వాతావరణం! ఇవికాకుండా 18000 అడుగులపైగా ఉన్న ఖాడుంగులా అన్న ప్రదేశంలో సవారీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇంత ఎత్తులోసవారి చేసే రహదారి లేదు. అందుకే ఇక్కడకి ప్రపంచం నలుమూలల నుండీ బైకర్లు వస్తూ ఉంటారు. 

ఈమధ్యలో మెమొరీల్ డే వారాంతం మెక్సికో వెళ్దామని తీర్మానించుకుని ఎప్పటిలాగే ఇర్వింగులోని మెకార్థర్ రోడ్ మీద ఉన్న స్టార్ బక్సులో ఒక సాయంకాలం కలిసాము. మా ప్రతి దూరప్రయాణం మొదలయ్యేది ఇక్కడ నుండే! ప్రయాణం గురించి మీటపులో ప్రకటించగానే ఇష్టమున్నవారుకలిసి కాఫీ తాగుతూ చర్చించుకోవడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడే జరుగుతుంది. మొదటి మీటింగులో ఏదీ తేలదు,పోను పోనూవిషయాలు ఒక కొలిక్కి వస్తాయి.

మెక్సికో అనగానే చాలా మంది భయపడ్డారు, ఇష్టమున్న వాళ్ళు చేతులు కలిపారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోలేని వారు, వీలయితే చూద్దాముఅనుకున్నవారు కూడా వచ్చారు. మోటారుసైకిలు మీద దూరప్రయాణం చెయ్యాలంటే   కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. బైకుకికనీసం అయిదు గాలన్ల పెట్రోల్ టాంకు ఉండాలి. లేకపోతే ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణించలేము. టూరింగ్ బైకులు ఇటువంటి ప్రయాణాలకుఅనువుగా ఉంటాయి. కనీసం అయిదు గాలన్లు పెట్రోలు పట్టే వీలు,  ఎక్కువసేపు బైకు మీద కూర్చునే సౌకర్యం, తగినంత సామాను తగిలించుకునేవీలు ఉంటే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది.

ఫరూఖ్, నేను మెక్సికో ప్రయాణానికి తయారుగా ఉన్నాము. న్యూయార్కు నుండి రాం కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అవతర్ సింగ్కూడా అలోచించుకుని చెప్తాను అన్నాడు. వినయ్ కి ఆఫీసులో సెలవు ఉంటుందో, లేదో తెలియదు. నిదానంగ చెప్తాను అన్నాడు. నేను ఫిట్టింగ్సెక్షనులో సూపర్వైజరు కాదు, డైలీ లేబరు! నేను పని చేస్తే జీతం, లేకపోతే లేదు, అందుకే నాకు సెలవలు బాగా వీజీగా దొరికేస్తాయి!

అందరి మెదడులో ఒకే ప్రశ్న! “మెక్సికోలో ఎక్కడకి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వెళ్తే తిరిగి వస్తామా?”

“ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను తొందరలోనే చెప్తాను” అని ఫరూఖ్ చెప్పాడు.

ఫరూఖ్ మనసులో ముందే ఒక ప్లాన్ వేసుకొని ఉంటాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిగానీ బయటకు వదలని చాణక్యుడు. మా ప్రతి ప్రయాణంఇతని చేతులమీదుగా నామకరణం చేసుకుంటుంది. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుని మాకు కూడా వాటి గురించి చెప్తాడు.మధ్యలో బైకు కష్టాలు ఆర్చి, తీర్చే శ్రీకృష్ణుడు. ఫరూఖ్ దగ్గర మూడు, నాలుగు బైకులు ఉన్నాయి. బైకు మొత్తం విప్పేసి మళ్ళీ బిగించగలఘటికుడు. నాకు చిన్నప్పటి నుండీ విప్పడం మాత్రమే వచ్చు! 

sree2

కొలరాడో నాకు మొదటి దూర ప్రయాణం. వారం రోజుల పైగా ప్రయాణం, ఇంచుమించు రెండువేలకు పైగా మైళ్ళు. అక్కడక్కడా కాంపింగ్ చేస్తూ,కొన్ని చోట్ల హోటళ్ళలో ఉన్నాము. ఈసారి మాత్రం పూర్తిగా హోటలులోనే ఉందామని అనుకున్నాము. కాంపింగ్ అంటే టెంటు, దాంట్లో పరుచుకునేపరుపు లేక దుప్పటి,  దిండు, స్లీపింగ్ బాగ్, కూర్చోవడానికి ఒక ఫోల్డింగ్ కుర్చీలాంటివన్నీ బైకు మీద వేసుకోవాలి. కేంపింగ్ లేకపోతే  బండి చాలాతేలిక అయిపోతుంది.

ఎంత మండే వేసవి అయినా కొలరాడోలో ఉదయం పూట చలిగా ఉంటుంది. మధ్యాహ్నం కొద్దిగా వేడి పెరిగి పెద్ద వాన పడుతుంది. ప్రతిరోజూ ఇదేవాతావరణం అక్కడ. వాతావరణానికి తగ్గట్టు రైన్ గేర్ కొనుక్కున్నాము. మెక్సికోకి కూడా రైన్ గేర్ పెట్టుకుండామని నిశ్చయించుకున్నాము.వాన పడుతుందో,లేదో తెలియదు కానీ పడినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి కదా! మెక్సికోలో కూడా కొండ ప్రాంతాలలో ఉన్నపుడు చలి పుట్టచ్చు,అందుకని మెష్ జాకెట్ కింద వేసుకోగలిగిన బేస్ లేయర్లు కొన్ని పెట్టుకోవాలి. ఎక్కువగా ఎండ ప్రాంతం, ఎండాకాలం కాబట్టి మెష్ జాకెట్వేసుకోవాలి. జాకెట్లో గాలి దూరే సందులు చాలా ఉంటాయి. బైకులో వెళ్ళేటపుడు గాలి ఇందులొకి దూరి చక్కిలిగిలి పెడుతుంది, అదో కమ్మనిహాయి! 

కొలరాడో ప్రయాణంలో కొంతమంది నీళ్ళు తీసుకుపోయే బాగ్ వాడారు. ప్రతిసారీ నీళ్ళు కొనుక్కోకుండా ఉదయం పూట ఇంచుమించు రెండు, మూడు గాలన్లు ఇందులో నింపుకోవచ్చు. నీళ్ళు చల్లగా ఉండడానికి ఐసు ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. కొలరాడో నుండి రాగానే వినయ్ కాస్టుకోలో కొంటూ నాకు కూడా ఒకటి తీసుకున్నాడు. అది ఈసారి మెక్సికోకి బాగా పనికి వస్తుందనుకున్నాను.

ప్రతి ప్రయాణంలో ఎవరో ఒకరు కొత్త పరికరం వాడడం, తరువాత ప్రయాణంలో మిగతావారు దాన్ని కొనుక్కోవడం మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. గత సంవత్సరం బిగ్ బెండు పార్కుకి వెళ్ళినపుదు కొందరు సేనా బ్లూటూత్ వాడడం, కొలరాడో ప్రయాణానికి అందరూ అది వాడడం జరిగింది. ఈ బ్లూటూతులో ఒకరు, ముగ్గురుతో కలవచ్చు. అలా గుంపులోని బైకర్లందరూ కలిసి కబుర్లాడుతూ సవారీ చేస్తుంటే ఆ ఆనందం వేరు. కొంత మంది మాట్లాడకపోయినా వింటూ ఉంటారు. లేకపోతే సంగీతం కూడా వినచ్చు ఇందులో.

మేము వెళ్ళే ప్రదేశం మాకంతా కొత్తది, అంతే కాకుండా కొంత ప్రమాదకరం కూడా. మరి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? కొలరాడో వెళ్ళేటపుడు మా గ్రూపులో ఒకరైన అంజాన్ మాకు స్పాట్ అనే పరికరం ఇచ్చాడు. ఇది ఉపగ్రహం ఆధారంగా పని చేసే పరికరం. ఇందులో మన ప్రయాణంలోని గమ్యాలని నింపుకోవచ్చు. మనం ఆ గమ్యం చేరగానే మన ఇంట్లోవారికి టెక్స్టు లేక ఈ-మెయిలు పంపుతుంది. మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో కూడా తెలిపే మాప్ కూడా మన ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మనకి ఆక్సిడెంట్ అయితే ఈ పరికరం ద్వారా అంబులెన్సుకి మన లొకేషన్ చెప్పచ్చు. పరిస్థితి మరీ ప్రమాదకరం అయితే మనల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి విమానంలో తీసుకువెళ్ళే సౌకర్యం కూడా ఉంది. ఒంటరిగా సాహసయాత్రలు చేసేవారికి ఇది ఎంతో పనికివస్తుంది. నెల్లూరికి చెందిన పర్వతారోహకుడు మస్తాన్ బాబు మంచుకొండల్లో చనిపోయాక అతని మృతదేహం దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి అందరూ స్పాట్ కొనుక్కుందామని నిర్ణయించుకున్నాము. మెక్సికో ప్రయాణానికి ఒక వాట్సాప్ చేసి అందులో మాట్లాడుకునే వాళ్ళం.

sree3

****************

  

బైకులో మెక్సికో వెళ్ళడమంటే పెద్ద సాహసం! వెళ్ళడానికి ముందడుగు వేసినా మా ఆవిడకి అపుడే చెప్పలేదు. దానికి తగిన సమయం, సందర్భంరావాలి, కావాలి కూడా!

మా స్నేహితులందరూ మా ఆవిడని పొగుడుతూమీరు భలే వాళ్ళండీ! మీ ఆయనను ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటారుఅని అంటూ ఉంటారు.మా ఆవిడ ఉబ్బితబ్బిబ్బవుతుంది కానీ అసలు విషయం చెప్పదు. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే సాహసోపేతమైన కార్యాలు చేస్తారని నేనుచిన్నపుడు ఎక్కడో చదివినట్టు గుర్తు. అందుకే కాలేజీలో ఉన్నపుడు బ్రేకులు లేని సైకిలు మీద నెల్లూరులో ఉన్నమూలాపేట,చిన్నబజారు,పెద్దబజారు, ట్రంకురోడ్డులో విపరీతంగా తిరిగేవాడిని. దేవుడు నాకు కుడిభుజం మీద పుట్టుమచ్చ అయితే పెట్టాడుకానీ మా ఆవిడని ఒప్పించడానికి ఒక మంచి మచ్చ ఇవ్వలేకపోయాడు. భారతదేశం మీద దండెత్తడానికి తగిన సమయం కోసం అలెగ్జాండర్ ఎలాఎదురుచూసాడో నేను కూడా మా ఆవిడని ఒప్పించడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఒక మంచి సినిమా, సూపరుగా ఉండేబిరియానీ, తృప్తి పడే విధంగా షాపింగ్ చేపించిన తర్వాత మా ఆవిడ నా ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దేవుడు వరమిచ్చినా పూజారి ప్రసాదం పెట్టడు అన్నట్టు మా ఆవిడ ఒప్పుకున్నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళుఅలా ఎలాగ ఒప్పుకున్నావు?” అనిమా ఆవిడ మీద బాగా వత్తిడి తీసుకువచ్చేవారు.

ఒక్కసారి కమిటయ్యాక మా ఆవిడ మాటే కాదు, పక్కింటావిడ మాట కూడా వినను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఎదురవలేదు.

*

చీకటీగలు

kasibhatla

శ్రీమన్నారాయణే చీకటీగ తాత్పర్యానికి దగ్గరిగా వస్తాడనిపించింది. ఎంత మేధావైతేనేం… పెళ్ళానీకీ కొడుక్కి ఇలా ఒక్కోమాటు స్నేహితులమయినా మాకూ చీకాకు కలిగించే శ్రీమన్నారాయణ చీకటీగలాగన్పిస్తాడు… పాపం అతనికీ సమాజమే చీకటీగ మూక… అస్వామాఫ్‌ ఐన్యాట్స్‌… నిజానికతని మానసిక వ్యవస్థ తోటి సమాజానికి సంబంధమెందుకుండాలి? అసలుండదు కూడానూ… వ్యష్టికి సమష్టితో అవసరంకానీ సమష్టికి వ్యక్తి మానసిక జీవితంతో అవసరం లేదు. తనకనుగుణంగా వ్యక్తి అంతర్భహిర్ప్రపంచాలుండాలనే సమాజం కోరుకుంటుంది… అట్లా బ్రతకలేని వ్యక్తికి సమాజం అనునిత్యం చీకాకు కలిగిస్తూనే వుంటుంది. తప్పెవరిదన్న ప్రశ్న అస్సలుదయించడానికే వీల్లేదు.

అనాదినించీ జరిగిపోయిన నిర్ణయమది… పూర్‌ శ్రీమన్నారాయణలు… ఎంతమందో… కన్పించే శ్రీమాన్నారాయణొక్కడుంటే నాకళ్ళముందే అదృశ్య శ్రీమన్నారాయణులెంతమంది తిరుగాడుతున్నారో…

చీకటీగల్లా ముసురుకుంటూ పుండైన మెదడు చుట్టూ ఆలోచనలు… అయాం నాటోన్లీ సారీఫార్‌ శ్రీమన్నారాయణ… అయాం సారీ ఫర్మైసెల్ఫ్‌… అయ్‌ పిటీ యూ మై ఓన్‌ సెల్ఫ్‌ అనుకొంటూ ఇంటర్మీడియట్‌ పిల్లలకి  ఖలీక్‌ జిబ్రాన్‌ క్లాసు తీసుకునేందుకు సిద్ధమయ్యా…

జిబ్రాన్‌ జిబ్రాన్‌, లెబనాన్‌. పలెస్తీను… దర్జీతల్లి జూదరి తండ్రి… చిరంజీవిగా వుండాలనే కోరికతో ఏభై నిండకనే మరణించీ… క్షయించకూడదని క్షయతో క్షయించి, తను పుట్టిన మట్టి మీది మమకారంతో… అదే మట్టిలో లయమయిపోయి. అటు జియాదాతో… యిటు హ్యాస్కెల్‌తో ఉత్తుత్తి ఉత్తర ప్రేమాయణం నడపీ… సమాధి శిలాఫకం మీద తను చిరంజీవినని చెపుతూ రాయించుకున్న మాటలు..

‘‘నా సమాధి శిలమీద నే చూసుకోవాలనుకున్న వాక్యం…. నేను మీలా జీవించే వున్నాను. మీ పక్కనే నించుని రెప్పలార్పి ఒక్కసారి కలియచూడండి మీముందే వుంటాను…’’

నిజమే ప్రాణమున్న మనందరికీ ఖలీల్‌ జిబ్రానుంటాడు. అతని సమాధి రాతి మీద వాక్యముంటుంది. కానీ జిబ్రాన్‌కు ఈ ప్రపంచమే లేదు కదా మన ప్రపంచమేకాదు తనదైన ప్రపంచమే లేదు కదా… అప్పుడెప్పుడో ఎనభై ఏళ్ళ క్రితమే క్షయతో క్షయించిన లివరు జబ్బుతో అంతరించి పోయిన ‘నేను జిబ్రాన్‌ జిబ్రాన్ని’ అన్న ఆలోచనతోపాటే అతని ప్రపంచం కూడా లుప్తమయిపోయింది కదా…. ఇవన్నీ పిల్లలకి పాఠంతోపాటు చెబితే…. ఇంగ్లీషు సారుకు పిచ్చిపట్టింద్రోయ్‌ అనంటారు.

ముసురుతున్న చీకటీగ ఆలోచనల్ని విసురుకుంటూ కదిలా…

***

సాయంత్రం ఏడైనా సుభద్ర రాలే… ఉదయాన్నే చెప్పింది కదా వసంతతో షాపింగని… ఏమేం కొంటారో…. సుభద్రెళ్ళిందంటే ఏదో ఖరీదైందే అయి వుంటుంది…

ఇంటికి రాగానే తిని మిగిల్న వంకాయ కూరా చారూ ఫ్రిజ్‌లో సర్ది…. మిగిలిన అన్నంగడ్డని ఇంటిగేటు బయట కాలువగట్టు మీదేసి…. రెండుసార్లు శ్రీమన్నారాయణకి ఫోన్‌ ట్రైచేసి… విసుక్కుని కాస్సేపు నడుం వాల్చి…. టీవీ ఆన్జేసి వార్తనబడే నాన్సెన్స్‌… ఓ తెలుగూ… ఓ ఇంగ్లీష్‌… ఓ హిందీ సినెమాల్ని కలిపి ముక్కలు ముక్కులుగా చూసి విసుగేసి… టీ కాచి… ఎండిపోయిన అల్లం ముక్కని విషాదంగా చూసి యాలక్కాయ దొరక్క…. అంచు విరిగిన పింగాణీ కప్పును ప్రేమగా నిమిరి…. ఇంటిబయట కడియం మొక్కల కుండీ మధ్య నిబడి సిగరెట్‌ని మళ్ళీ ఓ రోజులా పీల్చి…. సాయంత్రం ప్రశ్నని భుజానికి తగిలించుకుని…. లోపలికెళ్ళి చల్లారిన్టీని వేడిచేసి థర్మాస్‌లో నింపి… మిగిలించుక్కల్ని మళ్ళీ నోట్లో పోసుకుని…. సాయంత్రం ప్రశ్నకి సమాధానంగా రంగరాజుల్కి ఫోన్కొట్టా… ‘‘సారు పొద్దున దాసు క్యాంటీన్కిపోయి టిఫిన్దిని దాస్కాడ వెయ్యి రుపాయలిప్పించుకున్నాంట… యాటికి బోయినాడో… సాయింత్రం మీనాక్షి కాటికిరా… సుబ్బార్డికి ఫోన్చేస్తా… ఒగ్గంటకి మనకి రూమిస్తాడ్లే కంటమన్నగ్గూడ రింగిస్తా’’ ఓ సంక్లిష్టతకి ముక్కలు ముక్కలు సమాధానంగా రంగరాజు…

శ్రీమన్నారాయణెటెళ్ళుంటాడూ? ఎందుకో అసంకల్పితంగా మెదడు మైత్రి బొమ్మను కళ్ళముందు ఫ్లాష్‌ చేసింది… శ్రీమన్నారాయణ ఆంతరంగికత ఆ అమ్మాయికి సుపరిచితమేమో! అన్పించింది. అనిపిస్తుంది.. స్త్రీ పురుష స్నేహాలూ, సంబంధాలూ… కొన్ని యుగాలుగా పాతుకుపోయిన చట్రాల్లోకాక భిన్నంగా వుండటం… ఎంత రేషనల్‌ మనుషులకైనా పొసగదేమో…. ‘అయితే ఏం?’ అన్న ప్రశ్న రాకూడదసలు… తల విదిలించుకుని. బియ్యం కడిగి ఎలెక్ట్రిక్‌ కుక్కరాన్చేసి… దాదాపు అర్ధ శతాబ్దంగా చూసుకుంటున్నా ఎప్పటికీ పరిచయం లేని నా ముఖాన్ని అద్దంలో చూసుకుని…. టీ ఫ్లాస్క్‌… ఓ ఖాళీ కప్పుతో పాటు నాలుక్కుర్చీ డైనింగ్టేబిల్మీదుంచి… ‘సీయూ సుభద్రా’ అనుకుని తలుపు ఆటోలాక్చేసి తాళాలు బైక్‌ డబ్బాలో వేసుకుని రోడ్డెక్కా… కదిలీ కదలంగానే ‘మామయ్యా!’ అన్న గొంతు… గుర్తుపట్టా అది కంఠం కూతురు కంఠం దమయంతిది… ఆపి… దగ్గిర్రా అన్నట్టు తలూపా… ‘‘ఏమిటే నువ్వీ డకోటామీదా… అంతంత పెద్ద బళ్ళు నడిపే మీ నాన్నకే మాటిందిదీ… నువ్వు నడిపేస్తున్నావ్‌… ఇటెక్కడికొచ్చావ్‌?’’ అడిగా.

‘‘ఫ్రెండుంది మావయ్యా ఇక్కడా… అత్తయ్యలేదా… చాల్రోజులైంది మాటాడించెళ్దామనిటొచ్చా… నాన్నగారికి తెలీకుండా ఎత్తుకొచ్చీసా బండీ’’ పదహారు దాటినా పసితనపు ఛాయలు వదల్లేదీ పిల్లకి.

‘‘అత్తయ్య లేదు కానీ నే బైటికెళ్తున్నా… తిన్నగా యింటికెళ్ళు… వెనకాలి రోడ్డు మీదెళ్లు. మెయిన్రోడ్లో వద్దు… ఇంటికెళ్ళింతర్వాత నాన్నకు చెప్పు నాకు ఫోన్చేయమని… జాగ్రత్తా… అదాగిందంటే తోసుకెళ్ళే శక్తి కూడా లేదు నీకు. వంకాయలు బాగున్నాయనమ్మకి చెప్పు. వెళ్ళు… వెళ్ళు.. నాన్నరుస్తూ వుంటాడు…’’ కదలా.

ఇదే ఓ నలభై ఏభై ఏళ్ళ క్రితమయితే యీ పిల్లకి పెళ్ళై ఓ ఇంటి ఇల్లాలై.. బరువు బాధ్యతలు తకెత్తుకునుండేది…

మార్పు… మార్పు చాలా చాలా త్వరగా వచ్చేస్తోంది.

వచ్చేయడమేమిటి కమ్ముకొస్తోంది…

సాంకేతిక విస్ఫోటం… మేధో విస్ఫోటం…

ఇదెంత వరకు విస్తరిస్తుందీ? ‘నికొలాడ కాండార్సె అన్నట్టు యీ విస్తరణకు పరిమితుల్లేవ్‌… పరిపూర్ణతవేపు మానవమేధ, ‘ఈ ప్రకృతిలో, అనంత విశ్వంలో ఈ భూమి మనుగడ వున్నంత వరకూ విస్తరిస్తూనే వుంటుంది. ఎన్ని అవరోధాలెదురైనా’ కానీ 2040కల్లా కృత్రిమ మేధ, మానవ మేధను జయించేస్తుందని కొందరు… అంటే ఇంకో రెండు మూడు దశాబ్దాల్లో యిప్పటి నాలాంటి వాళ్ళ మట్టి బుర్ర వూహకతీతంగా నాగరికతలు మారిపోతాయా… అచ్చూటానికి నేను బ్రతికేవుంటానా? ఆర్టిఫిషల్‌ జనరల్‌ ఇన్టలిజెన్స్‌ ప్రపంచాన్ని పాలిస్తుందా? చూస్తుండగానే కళ్ళెదుటే మారిపోతోంది కాలం. ఏదో టెక్నలాజికల్‌ సింగ్యులారిటీ… నా పిండాకూడూ న్యుమనో ఓల్ట్‌మనో 2050 కల్లా అయిపోతుంది అడ్వాన్స్‌మెంటంటాడే! నేనిట్లాగే వుంటా.. వుండి తీరతా… నా ఆలోచనిట్లాగే వుంటాయి… ఎన్ని చరిత్రలు చదివినా… ఎంత భవిష్యత్తు గురించి తొలుస్తున్నా నా మౌలిక ఆలోచనా వ్యవస్థ మారదుకదా… అదీ మారనుందా? పీపుల్స్‌ పార్క్‌ దగ్గర రోడ్డుకు అటువేపు స్కూటీ మీద వెళ్తూ మైత్రి కన్పించింది. ఒక్కసారి… ఓ క్షణం ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గర యూటర్న్‌ తీసుకుని మైత్రిని వెంబడించి… శ్రీమన్నారాయణ గురించడగాలన్పించింది… ఆ ఆలోచన్ని తరిమేశా…

అక్భర్‌ భాయ్‌ పాన్‌షాపు ముందు కన్పించాడు కంఠం కొలీగ్‌ కండక్టర్‌ దయానంద్‌… ఆర్టీసీ సాంస్కృతిక ఉత్సవాల పోటీల్లో ఎప్పుడూ సంగీతం విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ వస్తాడు దయానంద్‌… మంచి కంపోసర్‌ కూడా… హిందుస్తానీ బాసురీ నేర్పరి… ఆగి అతన్ని పలకరించి… కాలే… సురేంద్రనాథ్‌ కాలే గురించి వాకబు చేసా…

‘‘అవున్సార్‌… కాలేసార్కి పెరాలిసిస్‌ అటాకయ్యింది. ఎడం కాలూ చెయ్యీ పన్చేయడం లేదు మాట కూడా రావడం లేదు… కంటమన్న చెప్పినట్టున్నాడు మీకు… కట్టించుకున్న బాబా ప్రభాత్‌ జర్దాపాన్లు జేబులో వేసుకుని నావేపు చూసి పెద్దగా నవ్వి ‘‘ఫోర్‌ట్వంటీ పాన్‌ సార్‌ రతన్‌ తీన్‌సౌ బాబా ఎక్‌సౌబీస్‌… మిల్కే బాబా ప్రభాత్‌ ఫోర్‌ ట్వంటీ’’ జేబులో వేస్కున్న పాన్‌ను తడుంకుంటూ ఎదరుగా వున్న హనిమిరెడ్డి వైన్స్‌ వేపు కదుల్తూ… ‘‘ఏస్తరా?’’ అనడిగి జవాబాసించకుండా వెళ్ళిపోయాడు. దయానంద్‌ సాంకల్కర్‌ ది ఫ్లాటిస్ట్‌… ఆర్టీసీ కండక్టర్‌… అతనో విరుద్ధ భాసాలంకారం. ఆక్సిమొరాన్‌ నాకు….

***

మీనాక్షి లాడ్జ్‌ ముసలి రిసెప్షనిస్ట్‌ నన్ను చూడగానే వేళ్ళ మద్య బాల్పెన్నున్న కుడిచెయ్యి పైకెత్తి ‘వన్లెవన్‌’ అన్నాడు…

గదిలో ఎవ్వరూలేరు… రూం బాయ్‌ గ్లాసు కడిగి ప్లాస్టిక్‌ జగ్గుతో నీళ్ళు టీపాయ్‌ మీద పెట్టి నాకు ఒంటి చెయ్యి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ప్లాస్టిక్కుర్చీలో కూaబడి మంచం మీదకి కాళ్ళు చాచి కంఠంకు ఫోన్చేసా… రింగైంది లిఫ్ట్‌ చేయలేదు… దార్లో వుండుంటాడనుకుని… రంగరాజుల్కిచేసా… ‘‘సార్‌… వికట్రీ టాకీస్కాడున్నా. రెన్నిమిషాల్లో ఆడుంటా…. ఏం తెప్పియ్యాకు…. మిల్ట్రీదుంది నాకాడ… వచ్చేస్తాలే… కంఠమన్నగ్గూడ చెప్నా వస్తాంటాడు… సోడాలూ నీల్లూ కోలా దెప్పిచ్చు… శంకర్‌ మిటాయిలో స్టఫ్‌ తీస్కున్న వన్టౌన్కి పోయింటి… వచ్చేస్తాండా’’ తన రివాజు హడావుడి మాటలు మాట్లాడాడు రంగరాజు.

ఫోన్కట్చేసేంతలో… కంఠం వచ్చేసాడు..

‘‘మేషారెటెళ్ళాడో సార్‌… ఉదయాన్నే దాసు క్యాన్టీన్కెళ్ళి టిఫినీు చేసి ఓ వెయ్యిరూపాయు తీసుకెళ్ళాట్ట… గది తాళమెట్టుంది… రెండు మూడు మాట్లెళ్ళి చూసా… ఎటెళ్ళుండొచ్చంటారూ? ఏవిటో ఆయనా ఆయన పద్దతులూ… ఎప్పటికీ అర్థమవని మనిషి… అయినా ఏదో పారిపోయినట్టిదేమిటీ… అంతా ఆయన స్వార్జితమే… ఎవ్వళ్ళకీ భయపడక్కర్లే… దాసుకూడా వస్తా వీలవుతే అన్నాడు.. క్యాష్లో అమ్మాయిని కూచోబెట్టి యిటొస్తానన్నాడు… రాజుల్కి ఫోన్కొట్టారా? పాపొచ్చిందిటగా… ఒద్దే అన్నా విందండీ చెప్పా చెయ్యక మోపెడ్‌ కాస్తదూరం తోసుకెళ్ళి స్టార్ట్‌చేసుకుని వెళ్ళిపోతుంది… స్కూటీ కావాల్ట… ఎక్కడ్సార్‌… సెకండ్హాండైనా ఇరవై పాతిక పెట్టంది రాదు… వాళ్ళమ్మగారమెక్కువైంది… నాదికూడా లెండి. ఉదయాన వాళ్లమాయ్య, మా బామ్మర్దొచ్చాడు కద్సార్‌… వాడు కొనిపెడ్తానన్నాడు దానికి… వాడికీ పిల్లల్లేరుగా… ఇదంటే మరీ గారం…’’ కంఠం కళ్ళల్లో కూతురి పట్ల ప్రేమ దిగంబరంగా బహిర్గతమవుతోంది..

***

కోడీ కోడి పిల్లలూ.. పేద్దగంపా గుర్తుకొచ్చాయి… జస్ట్‌ యానిమలిన్ట్సింక్ట్‌? కేశవరెడ్డి పందీ… పిల్లలూ కూడా గుర్తొచ్చాయి.

పాపమాపిల్ల దయమంతిని కోడిపిల్లతోటీ, పందిపిల్లతోటీ పోల్చటం బాలేదనిపించింది…. ఆ పిల్ల దమయంతి చాలా అదంగా వుంటుంది… కోడిపిల్లలూ, పంది పిల్లలూ ముద్దుముద్దుగానే వుంటాయి కదా? ఏమిటీఅందం కాన్సెప్టు? ఒక్క మనిషికే అందమూ… వికారమూ… ఆలోచనన్నదేడిచింది కాబట్టి… ఈస్తటిక్‌ యాటిట్యూడూ… అనుభూతి ఇంద్రియజ్ఞానం… ఈస్తటిక్సూ తాత్త్వికచింతనా… నానా గందరగోళం… కంటికీ మనసుకీ చూడగానే హాయిగొలిపేదంతా అందమే… మళ్ళీ హాయి ఏమిటో? అదీ ఓ గజిబిజీ. అన్నీ… అందాలూ… హాయిూ… వికృతాలూ… రుచులూ… మంచీచెడూ అన్నీ అన్నీ సాపేక్షాలే… అస్సలు పోలిక లేక గుణమనేదుంటుందా?  ఈ ఆలోచన్లన్నీ ఉత్తి పనికిమాలినాలోచల్లే… దమయంతీ, కోడిపిల్లా, పందిపిల్లా అన్నీ అందరూ… ఏమిటో వ్యాకరణం? ముద్దుగా అందంగానే అనిపిస్తాయి…

‘‘వీడు ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కలే వున్నాడు… మందుందన్నాడు.. బాయ్‌ని పిల్చి… కోలా… సోడా… నీళ్ళూ తెప్పిద్దాం..’’ కంఠంతోటన్నాను.

కంఠం అందమే అతని కూతురు దమయంతికొచ్చింది. స్ఫురద్రూపి కంఠం… మళ్ళీ దీన్సిగ్గోసినందం. సార్త్ర్‌, సోక్రెటిస్‌ లు కురూపితనంపై తమతమ వైయక్తిక యుద్ధాలు… తాత్త్విక చింతనలు… అందం వికృతత్వాతాత్త్వికత.. ష్‌… హూష్‌… తోలేయ్‌ తోలేయ్‌ చీకటీగలు…

(సశేషం)

తెలంగాణా చెలిమె కూకట్ల కవిత్వం

 

–     విలాసాగరం రవీందర్

~

 

మనిషి సంఘజీవి.   సంఘం చరణం గచ్ఛామి అంటూ బుద్ధునిలా త్యాగం చేసే వారు కొందరయితే, సమాజాన్ని చీడ పురుగులా కొరుక్కుతినే వారు మరికొందరు. సమాజ హితాన్ని కోరుతూ, సమ సమాజం కొరకు పరితపించే వారు బుద్ధి జీవులు. వారిలో కవులు, కళాకారులు అగ్ర భాగాన వుంటరు. కత్తి కన్నా కలం గొప్పదని నిరూపిస్తూ సమాజంలోని అసమానతల చెదను దులిపే అక్షరాలెన్నో ! కవిత్వం మనిషిలోని మనసును మేలుకొల్పుతది. మనిషిని మనీషిగ జేస్తది.

          కూకట్ల తిరుపతి 2000 నుంచి కవిత్వం రాస్తున్నడు. మూడు పదుల వయసులోనే “మేలుకొలుపు(2005)” కవితా సంపుటిని వేసి, ఒక శతకం, ఒక నానీల సంకలనాలను ప్రచురించి కవిత్వ ప్రపంచంలో సుపరిచితమయిన పేరు. ఇతడు “ఆరుద్ర పురుగు” పుస్తకంలో రాసిన ప్రతి పదంలో పల్లెదనం పరిమళిస్తది. మండుతున్న పల్లెల గుండెలను చూసి ఈ కవి కలం నుంచి వచ్చిన మరో కన్నీటి కావ్యమే “ఎర్ర గాలు”.

ప్రపంచీకరణ ప్రభావంతో పల్లెల ఉనికి ప్రశ్నార్ధకమయింది.  చేతి వృత్తుల మెడకు కత్తి వేలాడుతంది. ఈ దుస్థితిని ‘వలస వోయిన పల్లె’ కవితలో చిత్రిక కట్టిండు.

“ఎర్రమట్టి అలుకు పూతలు

ముంగిళ్ళ జాజు తీనెలు

ఎలిసిన సున్నం బొట్లు

కూలిన కుమ్మరి గూనపెంకుటిళ్ళు…

కూలవడ్డ మట్టి గోడలు

చితికిన బతుకుల ఆనవాళ్ళు …”

అంటూ వలస వోయిన పల్లె ధీన దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెస్తడు. మనుషులు వలస బోతరు. బతుకు దెరువు వెతుక్కుంట వేరే చోటికి మారుతరు. కాని కవి పల్లెనే వలస బోయిందని చెబుతున్నడు. అంటే పల్లె తన అస్తిత్వాన్ని కోల్పోవటం. పల్లె ఖాళీ కావడం.

మరో కవిత ‘దీన దృశ్యం’లో పల్లెలు బొందల గడ్డలయినవంటడు. ఓట్ల కోసం తెచ్చే పథకాలతో ప్రభుత్వాలు కనికట్టు చేస్తున్నయని బాధ పడుతడు.

“ఎండిన చెరువు

బోర్లేసిన బాయి

నడుమిరిగిన నాగలి

కొండెక్కిన కోరిక

వట్టిపోయిన ముల్లెలు

బొందల గద్దయిన పల్లెలు “

మనిషి చివరి ప్రయాణం బొందలగడ్డకు పోవుడే గదా ! బతికినాన్ని నాళ్లు ఆసరా వుండే పల్లెనే నేడు బొందల గడ్డ అయ్యిందట. అన్ని వృత్తులు నశించి పల్లె మాయమయింది అంటున్నడు కూకట్ల తిరుపతి. చాలామంది ప్రపంచీకరణ వల్ల ఏమి నష్టం వచ్చింది అని అడుగుతరు. ఈ కవితను వినిపిస్తే చాలు వారికి నష్టం కళ్ళకు కడుతది.

ప్రభుత్వాలు ప్రజల కోసం చట్టాలు చేస్తయి. కాని వాటి అమలులో నిర్లక్షం వహిస్తయి. మనిషి జీవనాధారం నీరు.  ఈ నీటి వనరుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడింది వాల్టా చట్టం.  ఈ చట్టం ఏ విధంగా నిర్వీర్యం చేయబడిందో ‘పచ్చ దనాల బాట’ పేరుతో కవిత్వం చేస్తడు.

“ఉల్టా పల్టాగా వాల్టా

పచ్చల హారాలు  ఏలిక మేడల్ల

భరించడం ఇంకెన్నాళ్ళు ?” అంటూ ప్రశ్నిస్తడు.

బుక్ టైటిల్ పోయెం “ఎర్రగాలు” పుస్తకానికే హైలైట్ . ఎర్రగాలు అనేది ఎర్ర కాలం. యాసంగి(రభి)కి వానా కాలం(ఖరిఫ్) కు మధ్యన వచ్చే పంట కాలం. స్వచ్ఛమైన తెలంగాణా భాషలో రైతు ఎతను, ఎవుసం చేసే విధానాన్ని వర్ణిస్తది. ఈ కవిత మనం కన్న పిల్లలను ఎట్లా అరుసుకుంటమో అట్లా పోషణ చేస్తరట

“కంటి పాపల కడుపుల వెట్టుక

అరొక్క తీర్ల అరుసుకున్నట్టు

ఆవురావురుగా ఆరుకాలం

యాళ్లకనంగ సేన్ల పొదన…”

ఇంత కష్టం జేసినా పూర్తిగా కరువుతీరుతుందా అంటే అదీ లేదు. మండే ఎండల్ల ఎండుక పోవుడే తప్ప రైతుకు మిగిలేది ఏమి వుండదంటున్నడు కూకట్ల తిరుపతి.

“ఎర్రగా బుర్రగ ఎర్ర తేలోలె వున్నా !

ఎండి ఎర్రగప్పవుడే

ఎర్రగాలు దెబ్బకు.

రైతుల కాయ కష్టాన్ని, వారి దయనీయ జీవన దృశ్యాన్ని ఆవిష్కరించేది ‘అకాలం’ కవిత. మూడు కాలాలు కలసి రైతును విగత జీవిగా చేస్తున్నయంటడు కవి.

నాటి నుంచి నేటి వరకు కుల, మతాలు సమాజాన్ని ఎట్లా అతలా కుతలం చేస్తున్నాయో చూస్తున్నం. అట్లనే ఆడా, మగ తేడాలు కూడ ముల్లులా గుచ్చుకోవడం అనుభవంలోదే కదా !  అందరూ సమానమే నంటూ ‘సర్దుబాటు’ కవితలో ఎవుసానికి ఎనగర్ర అయిన నాగలిలోని భాగాలను ప్రతీకలుగా తీసుకొని అద్భుతంగా కవిత్వం చేస్తడు. నాగలిలో పొడుగు కర్రను ‘కోలా’, అని నిలివు భాగాన్ని ‘పాలే’ అని, పట్టుకొనే కర్రను ‘పడుసోగ’ అని అంటరు. ఇవన్ని కలిసి పని చేస్తేనే దుక్కి దున్నబడి పంట వేయడానికి పనికివస్తుంది. అలాగే సమాజంలో కుల, మత, ఆడ, మగ తేడాలు లేకుండా ఉండాలంటడు ఈ కవి. ఈ కైత ను సంపుటి చివరికి పెట్టడంలో కూడా తన అంతిమ లక్ష్యం అదే అని చెప్పకనే చెబుతడు.

 

కవిది మెత్తటి మనసు. సున్నిత మనస్కులే కవిత్వం రాస్తరని ఎక్కడో చదివిన గుర్తు.  ఏది కవిత్వమో ‘కవిత్వం’ శీర్షికన మొదటి కవితలో  చెబుతడు. ‘నిప్పుల ఉప్పెన వలె ఉప్పొంగి \ వెట్టి చాకిరిని మట్టీడేది , భూస్వామ్య నియంతృత్వం పై \ అగ్ని పూలు పుయించేది’ కవిత్వం అంటదు. కవిత్వం ‘సామాన్యుని తలలో నాలుకలా, గాయపడిన ఉవిదకు ఓదార్పునివ్వాలనీ, అణచబడినోడి కరాయుధం కావాలనీ, జన చైతన్యం పరమార్ధంగా ఉండాలంటడు. బడుగు జీవుల బానిసత్వ విముక్తి కోసం సమరం సాగించాలని పిలుపునిస్తడు.

ఈ కవి చెప్పిందే రాస్తడని “అక్షర నిరసన”, “ఖబర్దార్ ఖబర్దార్”  కవితలు చదివితే అర్ధం అవుతది. లక్ష్మిదేవిపల్లి గ్రామంలో దళితుల ఊచకొతను ఖండిస్తూ ‘అక్షర నిరసన’ ప్రకటిస్తడు. ప్రభుత్వ భూ పంపిణీ ప్రచార పటాటోపాన్ని దునుమాడుతడు.  ఫాసిస్టు పాలకుల పక్ష పాతాన్ని తెగడుతడు. భూ విముక్తి పోరాట యోధులను గుర్తుచేస్తడు. అణగారిన జనం అగ్గిరవ్వలై తిరగబడాలంటడు. అణచబడ్దోడు లేచి నిలబడి, తెగిపడిన చోట తెగబడటమే అంతిమ పరిష్కారమని నినదిస్తడు.

యానాం పరిసర ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సంఘటనను తీవ్ర స్వరంతో ఖండిస్తడు. అగ్రవర్ణ దురహంకారాన్ని నిరసిస్తడు.  కారంచేడు, నీరుకొండ, చుండూరులలో పారిన నెత్తుటిదారలకు దుక్కపడుతడు.  ‘ఒక్కో బక్క జీవి…. మండే సూర్యుల్లయి  మసి చేస్తరు… ఖబర్దార్ ఖబర్దార్’ అంటూ హెచ్చరిస్తడు.

కూకట్ల తిరుపతికి అమ్మంటే అలవిమాలిన ప్రేమ.   ‘కమ్మని అమ్మ మనసు, పూల జల్లైయి కురిసి, మంచు పర్వతంలా మారి, శాంతి కపోతమై సమతను పంచుతుందని’ చెబుతడు. చివరకు ‘అమ్మ ఋణం జన్మ జన్మలకు సశేషం’ అంటడు.

పేగు సంబంధం తల్లి అయితే జీవిత బంధం ఇల్లాలు. ఈ కవి తన భార్యను ‘ఇంటికి దీపం’గా భావిస్తున్నడు. దీపం లేని ఇల్లు చీకటి చిరునామే కదా ! అలాగే తన ఇంటికి దీపం ఆవిడే అంటున్నడు. ఆమె

“చేనుకు చెమట చుక్కలను జల్లుతూ

పంట పరిమళాలను పరివారానికి పంచుతూ

వ్యవసాయాన వెన్నుదన్నుగా నిలిస్తుంది” అంటడు.

మహా కవి జాషువా కష్ట జీవి కవితలో ‘వీని రెక్కల కష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకరించ సంశయించు… అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్’ అన్నట్టు ఈ కవి “నా అక్షరాల సాక్షిగా / ఆమె సేవకు / నా జీవితం ఋనపడ్డది” అని నొక్కి చెబుతడు.

ఈ కవి మూలాలు మరువని కవి. తన ముందు మాటలో చెప్పినట్టు తాను బాల కార్మికుడి నుండి బడి పంతులు దాకా కష్టపడి ఎదిగాడు. తన స్వానుభవాన్ని, తాను సమాజంలో గమనించిన పసి చేతుల కష్టాన్ని, దీనత్వాన్ని కళ్ళకు కట్టే విధంగా ‘బాల కార్మికులం’ పేరున అక్షరీకరిస్తడు.

సునామీ వచ్చినప్పడు చాలా మంది కవులు సునామీని తిడుతూ కవిత్వం చేసారు. దానికి భిన్నంగా కూకట్ల తిరుపతి సముద్రాన్ని విచ్చలవిడిగా మనిషి తన స్వార్ధానికి ఉపయోగించుకోవడం వల్లలే ఈ ఆపద వచ్చిందని ‘సాగర ఘోష’లో అంటడు. ‘అంతులేని సముద్ర తీరాన పిల్లల గొప్ప సమావేశం జరుగుతూంది’ అని గీతాంజలిలో రవీంద్రనాథ టాగూరు అంటే ఈ కవి మానవుడి దురాశనే ‘మృత్యువు విచ్చలవిడిగా సంచరించెట్లు ‘ చేస్తుందని చెబుతడు.

ఈ కవికి స్నేహమంటే వల్లమాలిన ప్రేమ. అందుకే “ఆపదలో … ఆనందంలో … / నా చెలిమి చెలిమయి / అలుపెరుగక పారునది” అని ‘చెలిమి’ కవితలో నెయ్యాన్నిపారే నదితో పోలుస్తడు. పారే నది ఎప్పుడు ఎండి పోనట్టే తన మిత్రత్వం కూడా అజరామరం అంటున్నడు.

కవిత్వంలో రూపం, సారంతో పాటూ అలంకారాలు ఉన్నప్పుడే వినసొంపుగా వుంటది. “ఎర్ర గాలు”లో ‘ఊర చెరువు’ అద్భుతమైన నాద సౌందర్యం వున్న కవిత. ప్రతి పాదం చివర సున్నాతో కూడిన గకారాలను వాడినరు. దీనివల్ల ఆ కవిత చదువుతుంటే నీటి ప్రవాహ వేగం కనబడుతది. అంత్య ప్రాసలతో పాటు రూపకాలను, ఉపమాలను సందర్భానుసారంగా ఉపయోగించే నేర్పు కూకట్ల తిరుపతి కవిత్వంలో మరో ప్రత్యేకత.

ఈ సంపుటిలోని 37 కవితలలో ‘కలం యోధుడు’ కాళన్న, ‘షెహనాయి శిఖరం’ బిస్మిల్లా ఖాన్, ‘ఆదివాసి ఆణిముత్యం’ కొమురం భీమ్ కవితలు అద్భుతమైన స్మృతి కవితలు. అలాగే ‘అమ్మ ఆనవాళ్ళు’లో మనువాద ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ. ‘అమీనాలు’ కవిత లో అరబ్బు షేకుల అకృత్యాలను తెగనాడుతూ హైదరాబాదుపాత బస్తి పేదరికానికి బాధ పడుతున్న కవితలూ కలవు.

మొత్తంగా చూస్తే కూకట్ల తిరుపతి కవిత్వం తెలంగాణా మట్టి పదాల పరిమళం అద్ది, పాల కంకుల సాల్ల వాక్యాలతో సాగి, సమ సమాజం కొరకు ఆరాటపడే పందిరి గుంజలాంటి కవిత్వం. అసమానతల పొగరును నరికే కరవాలం ఇతని కవనం.

*

 

నీలి సుమ౦ లాలస

khalil1

 

మూలం: ఖలీల్ జిబ్రాన్ 

అనువాదం: స్వాతీ శ్రీపాద 

 

అందమైన సువాసనగల నీలి పుష్పం ఒకటి తన మిత్రులతో ప్రశాంతంగా, మిగతా పూల మధ్య ఆనందంగా ఊగుతూ, ఒక ఒంటరి తోటలో ఉ౦డేది. ఒక ఉదయం మంచు ముత్యాలతో అల౦కరి౦పబడిన ఆమె కిరీటం గల తలెత్తి చుట్టూ చూసి౦ది. ఒక పొడవైన అందమైన గులాబీ ఆకాశాన్ని తాకుతున్నట్టు పచ్చని దీపంపై వెలుగుతున్న కాగాడాలా గర్వంగా నిలబడి ఉండటం ఆమె చూసి౦ది.

ఆ నీలం తన నీలి పెదవులను తెరిచి ఇలా అంది, “ ఈ పూలన్ని౦టిలో నేను ఎంత దురదృష్ట వంతురాలిని.వారి సమక్షంలో నా కున్న స్థానం ఎంత సాధారణం. ప్రకృతి నన్ను ఇలా పొట్టిగా, బీదగా సృష్టి౦చి౦ది. నేను నేలకు అతి సమీపాన నివసిస్తాను, నీలి ఆకాశంవైపు తలెత్తలేను కూడా, లేదూ, గులాబీల మాదిరి నా వదనం సూర్యుడి వైపు తిప్పనూ లేను.

గులాబీ తనపక్కనున్న నీలం మాటలు వి౦ది. అది ఒక నవ్వు నవ్వి ఇలా వ్యాఖ్యాని౦చి౦ది,

“  నీ మాటలు ఎంత చిత్రంగా ఉన్నాయి, నువ్వు అదృష్టవంతురాలవు. అయినా నీ అదృష్టం ఏమిటో నీకు అర్ధంకాడం లేదు. ఎవరికీ అనుగ్రహి౦చని అందం, సువాసన నీకు వరంగా ఇచ్చి౦ది ప్రకృతి. నీ ఆలోచనలు పక్కకు తోసి సంతృప్తిగా ఉండు. పైగా గుర్తుంచుకోవలసినది ఏమిట౦టే ఎవరైతే ఒదిగి ఉ౦టారో వారు ఉన్నత స్థితికి వస్తారు. ఎవరిని వారు పైకి ఎత్తుకు౦టే నలిపెయ్యబడతారు”

ప్రకృతి గులాబీ , నీలి పుష్పం సంభాషణ వింది. ఆమె వారిని చేరుకొని , “బిడ్డా , నీలం ఏమైంది నీకు?నీ మాటలు చేతల్లో ఎంతో హుందాగా, వినయంగా ఉ౦టావు. దురాశ నీ హృదయం లో చేరి నీ చేతనత్వాన్ని మొద్దుబారేలా చేసి౦దా?” అని అడిగి౦ది

వేడుకు౦టున్న స్వరం తొ నీలం జవాబిచ్చి౦ది.

violet2

“ ఓహ్ ఉన్నతురాలు, కరుణామూర్తివై, అణువణువునా పూర్తీ ప్రేమా, సానుభూతి గల తల్లీ, నేను మనసా వాచా హృదయంతో  నిన్ను వేడుకు౦టున్నాను. నా కోరిక మన్ని౦చి నన్నుఒక్కరోజు గులాబీగా ఉ౦డనివ్వు”

దానికి ప్రకృతి స్పందించి, “నువ్వేం అడుగుతున్నావో  నీకు తెలియడం లేదు. నీ గుడ్డి ఆశ ము౦దు నీకు దాని వెనకాల దాగిన విపత్తులు అసలు తెలియడం లేదు. నువ్వు గులాబీవయితే నువ్వు బాధపడతావు, ఆ తరువాత  ఎంత పశ్చాత్తాపపడ్డా ఏమీ లాభం ఉ౦డదు”

కాని నీలి పుష్పం బలవ౦త౦  చెసి౦ది. “ నన్ను పొడవైన గులాబీ గా మార్చు, గర్వంగా తలెత్తుకుని ఉండాలని నా కోరిక , నా భవిష్యత్తు ఎలాగైనా ఉ౦డనీ అది నా స్వయ౦ కృతం”

ప్రకృతి దానికి లొ౦గిపోతూ  అంది, “ ఓ అజ్ఞానురాలా, అవిధేయురాలైన నీలమా, నీ కోరిక మన్నిస్తాను. కాని ఏదైనా విపత్తు సంభవిస్తే నిన్ను నువ్వే ని౦ది౦చుకోవాలి”

అప్పుడు ప్రకృతి తన నిగూఢమైన , మాయాపూరిత వేళ్ళను ము౦దుకు చాపి నీలం మొక్క వేళ్ళను తాకి౦ది. వెంటనే అది ఆ తోటలో ఉన్న అన్ని పూలకన్నా పొడవైన గులాబీ గా మారి౦ది.

అదే సమయంలో ఆకాశం నల్ల మబ్బులతో మందంగా మారి , తీవ్రమవుతున్న పరిసరాలు, నిశ్శబ్దపు ఉనికిని అల్లకల్లోలం చేస్తూ ఉరుములతో ఆ తోటను ముట్టడి చెయ్యడం, బలమైన గాలులతో పెద్ద వాన మొదలై౦ది. ఆ తుఫాను కొమ్మలను విరిచేసి, చెట్లను పెళ్ళగి౦చి, పెద్దపెద్ద పూల కాండాలు విరిచేసి౦ది, కేవలం భూమికి దగ్గరగా మొలిచిన చిన్న వాటిని వదిలేసి౦ది. ఆకాశ౦ చేసే యుద్ధ తాకిడికి ఆ ఒంటరి తోట చాల ఎక్కువగా  గురైంది, తుఫాను తగ్గుముఖం పట్టి, ఆకాశం తేటగా మారేసరికి పూలన్నీ వ్యర్ధంగా నేలన వాలి ఉన్నాయి.  ఒక్కటి కూడా ప్రకృతి వైపరీత్యానికి, కోపానికి గురి కాకుండా మిగలలేదు. కేవల౦ తోట గోడ పక్కన దాక్కున్న నీలం పుష్పాలు తప్ప.

ఆ నీలం పూలలో ఒకటి తలపైకెత్తి ఆ చెట్ల, పూవుల విషాదాన్ని గమని౦చి సంతోషంగా చిరునవ్వుతో తన చెలికత్తెలలో ఒకరిని పిలిచి అంది, “ చూడండి ఆ తుఫాను ఆ అహంకారపు పూలను ఏ౦చేసి౦దో” మరో నీలి పువ్వు అన్నది, “ మనం చాలా చిన్న వాళ్ళం, నేలకు చేరువగా ఉ౦టా౦. కాని మన౦ ఆకాశపు కోపానికి దూర౦ గా ఉ౦టా౦.” మూడో పువ్వు దానికి మరి౦త జోడిస్తూ, “ మనం పెద్ద ఎత్తుగా లే౦ కదా, అందుకే తుఫాను మనను అణగ దొక్కలేదు”

ఆ సమయంలో నీలం పూల రాణి తనపక్కన ఆకారం మార్చుకుని  యుద్ధభూమిలో కు౦టి సైనికుడిలా తుఫాను వల్ల తడి గడ్డిలో ఒరిగి, రూపం చెదిరి నేలకు వాలిన నీలం పూవును చూసి౦ది. నీలం పూల రాణి దాని తల పైకెత్తి ఆమె కుటు౦బాన్ని పిలిచి ఇలా అంది, “ నా పిల్లల్లారా, చూడ౦డి. ఒక గంట కోసం అహంకారపు గులాబిగా మారిన ఈ నీలం ఏమైందో చూడండి. ఈ దృశ్యం మీ అదృష్టాన్ని మీకు గుర్తు చేసేదిగా పదిలంగా దాచుకో౦డి”

ఆ మరణిస్తున్న గులాబీ కదిలి, మిగిలిన తన శక్తిని కూడగట్టుకుని శాంతంగా అన్నది, “ మీరు సంతృప్తిపడిన పిరికి సన్నాసులు. నేనెప్పుడూ తుఫానుకు భయపడలేదు. నిన్నటి వరకూ  నేనూ జీవితం తో తృప్తిపడి సంతృప్తిగా ఉన్నాను, కానీ సంతృప్తి అనేది నా ఉనికికీ జీవితపు తుఫానుకూ  మధ్య అడ్డుగోడలా, నన్ను ఒక బంకలా అంటుకున్ననిదానంతో ప్రశాంతత ,మానసిక సంయమనానికి  బందీని చేస్తూ నిలిచి౦ది. నేనూ మీలాగే భయంతో నేలకు అ౦టుకుపోయి వేళ్ళాడుతూ అదే జీవితం గడిపి ఉండే దానను. నేనూ శిశిరానికి ఎదురుచూస్తూ, అది నాపై మంచు తెల్ల గుడ్డ కప్పి, తప్పకు౦డా నీలం పూలన్నీసొ౦త౦ చేసుకునే  మృత్యువు వద్దకు ప౦పే వరకూ ఎదురు చూసి ఉ౦డేదాన్ని. నేనిప్పుడు ఆనందం గానే ఉన్నాను, నాచిన్ని ప్రపంచానికి ఆవల ఈ ప్రపంచ౦లో  అర్ధం కానిది  ఏము౦దో తెలుసుకున్నాను, అదేదో మీరెవరూ ఇంత వరకూ చెయ్యనిది. నేను నా దురాశను నిర్లక్ష్యం చేసి ఉ౦డవచ్చు, దాని స్వభావం నాకన్నా ఉన్నతమైనదే. కాని రాత్రి చీకటి నిశ్శబ్దాన్ని నేను విన్నప్పుడు రాత్రి ఒక స్వర్గ ప్రపంచం ఈ భూప్రపంచంతో మాట్లాడటం విన్నాను. అది అన్నది కదా, “ మన ఉనికి కి ఆవల లాలస అనేది మన గమ్యం”

ఆ సమయాన నా ఆత్మ ఎదురు తిరిగి, నా హృదయం నా పరిమిత జీవనాని కన్న ఉన్నతమైన స్థితిని కోరుకు౦ది. పాతాళం అనేది నక్షత్రాల గానం వినలేదని  నేను గ్రహి౦చగలిగాను , ఆ క్షణమే నేను నా అల్పత్వంపై  పోరాటం మొదలుపెట్టి, నాది కాని దాని కోస౦ వా౦ఛి౦చడం, నా తిరుగుబాటుతనం గొప్ప శక్తిగా నా కోరిక మనో బలంగా మారే వరకూ కొనసాగించాను. మన లోలోపలి కలలకు సాకారమైన ప్రకృతి , నా కోరిక మన్ని౦చి ఆమె మాంత్రిక వేళ్ళతో నన్ను ఒక గులాబిగా మార్చి౦ది”

 

ఆ గులాబీ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉ౦డి , బలహీనమవుతున్న స్వరంతో సాధించిన గర్వం కలగలిపి అన్నది, “ ఒక గంట గర్వంగా గులాబీగా బ్రతికాను. కాస్సేపు నేను ఒక మహారాణిలా నివసి౦చాను. గులాబీ కళ్ళ వెనకను౦డి  ఈ విశ్వాన్ని వీక్షి౦చాను. గులాబీ పూల చెవులతో ఆ ఆకాశపు గుసగుసలు విన్నాను, వెలుగు వస్త్ర౦ మడతలను గులాబీ రెక్కలతో స్పర్శి౦చాను. ఇలాటి గౌరవం ఇక్కడ ఎవరికైనా దక్కి౦దని చెప్పగలరా?”

 

ఆ మాటలు చెప్పి తల వాల్చి ఉక్కిరిబిక్కిరయే స్వరంతో అంది, “ నేనిప్పుడు మరణిస్తాను. నా ఆత్మ దాని గమ్యాన్ని చేరుకు౦దిగా,  చివరిగా నేను నా విజ్ఞానాన్ని, నేను జన్మి౦చిన ఒక ఇరుకైన గుహ బయటి ప్రపంచానికి విస్తరి౦చగలిగాను. ఇది జీవన విధానపు పధ్ధతి. ఇదే మన ఉనికి రహస్యం”

ఆ తరువాత ఆ గులాబీ వణికి, నెమ్మదిగా రెక్కలు ముడుచుకుని చివరి శ్వాస ఆమె పెదవులపై  ఒక స్వర్గపు చిరునవ్వుతో పీల్చుకుని, జీవితాన ఒక ఆశ, ఉద్దేశ్యం నెరవేరిన సంతృప్తి, ఒక విజయ సాధన చిరునవ్వుతో, భగవంతుడి నవ్వు నవ్వి౦ది.

*

 

కథల పోటీకి ఆహ్వానం

Namaste-02

తెలుగు సాహిత్యంలో.. ఆ మాట‌కొస్తే భార‌తీయ సాహిత్యంలో క‌విత్వం త‌ర్వాత స్ధానం క‌థ‌కే ద‌క్కుతుంది. క‌థ‌ త‌ర్వాతే న‌వ‌ల‌, నాట‌కం, నాటిక‌, విమ‌ర్శ. తెలుగు క‌థ‌ని మహారచయితలు గుర‌జాడ అప్పారావు, వ‌ట్టికోట ఆళ్వార్ స్వామి, చ‌లం, రాచ‌కొండ విశ్వ‌నాథ శాస్త్రి వంటి వారు దేదీప్య‌మానం చేశారు. అలాగే నేటితరం రచయితలైన చేతన్ భగత్, రాబిన్‌శర్మ వంటి వారు కూడా ఈ తరాన్ని ప్రభావితం చేస్తూ రచనలు చేస్తున్నారు. అలా తెలుగు క‌థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. మారుతున్న స‌మాజంతో పాటు క‌థ కూడా ఆయా కాల‌మాన ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి కొత్త రూపం సంత‌రించుకుంది. కొన్నాళ్ల పాటు స్ధ‌బ్దంగా ఉన్న తెలుగు క‌థ మ‌ళ్లీ విక‌సిస్తోంది. కొత్త‌గా వంద‌లాది మంది ర‌చ‌యిత‌లు, ర‌చ‌యిత్రులు అనేక కొత్త అంశాల‌తో క‌థ‌లు రాస్తున్నారు. ప్ర‌తి క‌థ వ‌స్తుపరంగానూ, రూప‌ప‌రంగానూ కూడా కొత్త కాంతులీనుతోంది. ఈ స‌మ‌యంలో క‌థ‌కు మ‌రింత గౌర‌వాన్ని తీసుకురావ‌డం, కొత్త క‌థ‌కుల‌ను ప్రోత్స‌హించాల‌నే స‌దుద్దేశ్యంతో మీడియా రంగంలోకి దూసుకువ‌స్తున్న న‌మ‌స్తే ఆన్ లైన్ క‌థ‌ల పోటీని నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టింది. స‌మాజంలో వ‌స్తున్న మార్పులతో పాటు సమాజ గమనాన్ని పాఠకులకు చూపించాలనే తపన ఉన్న యువ రచయితలు, ర‌చ‌యిత్రులకు ఇదో సువర్ణావకాశం. ఈ పోటీలకు కథలను పంపే వారు హాస్యం, కరుణ, సమాజ హితం కోరుకునే అంశాలతో కథలు రాసి పోటీకి పంపండి. ఈ కథల పోటీలో విజేతలు కండి… ఊహించని నగదు బహుమతి గెలుచుకోండి. కథలు పంపాల్సిన చిరునామా…

టు ది

అసోసియేట్ డైరక్టర్

నమస్తే ఆన్ లైన్

304, ప్రతీక్ వెంచర్స్

వి.వి.వింటేజ్ బొలేవార్డ్

రాజ్ భవన్ రోడ్డు

సోమాజిగుడా

హైదరాబాద్ 500082

లేదూ..

stories@namaste.in/

మెయిల్ చేయండి

కథల పోటీ నియమ నిబంధనలు

కథలు విధిగా మూడు లేదా నాలుగు పేజీలు మించకూడదు

కథల్లో హింస, శృంగారం వంటి అంశాలకు తావివ్వరాదు

ఒక్కో రచయిత, రచయిత్రి ఎన్ని కథలైనా పంపవచ్చును

కథతో పాటు ఆ రచన తన స్వంతమనే హామీ పత్రాన్ని విధిగా జత చేయాలి

బహుమతి పొందిన కథలతో పాటు ప్రచురుణార్ధమైన కథలను నమస్తే ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తాం.

రచనలు పంపిన వారు వారి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా పంపాలి.

కథల ఎంపిక, విజేతల ఎంపిక వంటి అంశాలపై తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే.

కథలను నమస్తే ఆన్ లైన్ పోటీకి పంపిన తర్వాత మరో పత్రికకు కాని, వెబ్ సైట్లకు కాని పంపరాదు. అలా పంపినట్లు రుజువైతే ఆ రచనను అనర్హమైన రచనగా పరిగణిస్తాం.

కథలు మాకు చేరాల్సిన చివరి తేది 15 – 09- 2016

and also

బ్లాగర్లకు పోటీకి ఆహ్వానం

ఇది బ్లాగ్స్ కాలం. తమ భావాలు.. మనోభావాలు ఏమైనా సరే హాయిగా.. స్వేచ్ఛగా… పంచుకునే కాలం. ఇంతకు ముందు పత్రికల్లో రాయడానికి ఎదురు చూపులు చూసి వేసారిపోయేవారు. ఎంతటి బంగారంలాంటి రచయితైనా ఏదో ఒక పత్రిక గోడ చేర్పు అవసరం పడేది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరి పత్రిక వారికుంది. అదే బ్లాగ్. ఎలాంటి రచయితైనా ఓ బ్లాగ్ క్రియేట్ చేసుకుని తన ఇష్టాలు.. అయిష్టాలు.. తన సృజ‌నాత్మ‌క‌త‌.. తన స్వవిషయాలు.. ఇలా ఏవైనా రాసుకుని అభిమానులను సంపాదించుకుంటున్నారు. అలాంటి బ్లాగర్లు వందల్లో ఉన్నారు. వారిలో దాగి ఉన్న సృజ‌నాత్మ‌క‌ శక్తి ప్రపంచానికి ఈ బ్లాగుల ద్వారానే తెలుస్తోంది. ఇలాంటి బ్లాగర్లలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన లీలా బన్సాల్, ప్రభు దత్తా సాహ, సురభి సురేంద్ర, యోగితా అగర్వాల్ వంటి ఎందరో ఉన్నారు. వారి సరసన మీరు చేరేందుకు నమస్తే ఆన్ లైన్ ఓ వేదిక కానుంది. నానాటికి విస్తరిస్తున్న ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగర్లకు వినూత్న పోటీని నిర్వహించతలపెట్టింది నమస్తే ఆన్ లైన్. సమస్త పప్రంచాన్ని మీ చేతిలో ఉంచేందుకు మీడియా రంగంలోకి వస్తున్న నమస్తే ఆన్ లైన్ బ్లాగర్ల సృజ‌నాత్మ‌క‌ శక్తికి ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు బ్లాగర్లకు ఆహ్వానం పలుకుతున్నాం. మీకు నచ్చిన.. మీరు మెచ్చిన అంశంపై మీరు రాయవచ్చు. మీ రచనలు పంపాల్సిన చిరునామా

టు ది

అసోసియేట్ డైరక్టర్

నమస్తే ఆన్ లైన్

304, ప్రతీక్ వెంచర్స్

వి.వి.వింటేజ్ బొలేవార్డ్

రాజ్ భవన్ రోడ్

సోమాజిగుడా

హైదరాబాద్ 500082

లేదూ..

blogs@namaste.in

మెయిల్ చేయండి

బ్లాగ్ పోటీ నియమ నిబంధనలు

మీరు రాసే అంశం విధిగా మూడు వందల పదాలు మించకూడదు

మీరు రాసే వ్యాసంలో హింస, శృంగారం వంటి అంశాలకు తావివ్వరాదు

ఏ ఒక్క వ్యక్తినో… కొందరు వ్యక్తుల మనోభావాలనో దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఒక్కో బ్లాగర్ ఎన్ని రచనలైనా పంపవచ్చును

బ్లాగ్ తో పాటు ఆ రచన తన స్వంతమనే హామీ పత్రాన్ని విధిగా జత చేయాలి

బహుమతి పొందిన వ్యాసాలతో పాటు ప్రచురుణార్ధమైన ఇతర వ్యాసాలను నమస్తే ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తాం.

రచనలు పంపిన వారు వారి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా పంపాలి.

ఈ పోటీకి పంపిన మీ రచనలు మరే ఇతర బ్లాగుకు కాని, పత్రికలకు కాని, వెబ్ సైట్లకు కాని పంపరాదు. అలా పంపినట్లు రుజువైతే మీరు పంపిన ఆర్టికల్ ను పోటీకి అనర్హమైనదిగా పరిగణిస్తాం.

బ్లాగుల ఎంపిక, విజేతల ఎంపిక వంటి అంశాలపై తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే.

బ్లాగులు మాకు చేరాల్సిన చివరి తేది 15 – 09- 2016

జ్యోతిలక్ష్మికి చీర కడితే!

samvedana logo copy(1)

jyothi-lakshmi-18045జ్యోతి లక్ష్మి పోయారు. కొందరు మిత్రుల పోస్టులు చూశాక ఏవో ఆలోచనలు.

జ్యోతి లక్ష్మి కేవలం ఐటెం గర్ల్‌ కాదు. ఆమె సంప్రదాయ నృత్య కళాకారిణి అని చెప్పాలనే ప్రయత్నం అందులో కనిపించింది. కేవలం సమాచారం ఇవ్వడం కాకుండా విలువల పరమైన విషయమేదో అంతర్లీనంగా ఉంది. ఇంత చెత్త డాన్సులే కాదు, కూసింత మంచి డాన్సులు కూడా చేసింది అని గుర్తించండి అని చెప్పడం ఉంది. అది నిజమేనా! అంతకుముందు రాజాస్థానంలో చేసిన నృత్యాల్లోనూ- పాటల్లోనూ ఉన్నది ఏమిటి? అభిరుచుల విషయంలో మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదేమిటి? సినిమా పరంగా బూతు చుట్టూ అల్లుకున్న భావనల్లో ఉన్న మతలబు ఏమిటి అనేది చూడాల్సి ఉంది.

క్లబ్‌డాన్సర్‌ అనే బదులు ఇటెం గర్ల్‌అనే పదం పొరబాటున వాడుతున్నారు. కొత్త పరిభాష అలవాటైపోయాక పాత పదం మర్చిపోయి కొత్తదే వాడేస్తూ ఉంటాం. ఈ ఐటెం అనే పరిభాష 90ల తర్వాతది. రాంగోపాల్‌వర్మ శిష్యుడు నివాస్‌తీసిన శూల్‌లో చోలీకీ పీచే క్యాహై అంటూ మాధురీ దీక్షిత్‌ చిందులేసే దాకా  ఐటెంసాంగ్‌ అనే పదం మన పదకోశంలోకి రాలేదు. తెలుగులో  వర్మ మరో శిష్యులు పూరీ జగన్నాధ్‌ తన మ్యూజ్‌ ముమైత్‌ఖాన్‌తో మరో దశకు తీసికెళ్లారు.

ఇటెం, మాల్‌, చీజ్‌ అనేవి బాంబేలో ప్రబలంగా వినిపించే మాటలు. అమ్మాయిలను సెక్స్‌ఆబ్జెక్ట్స్‌గా చూసే లంపెనైజ్డ్‌ మార్కెట్‌ పరిభాష.  జ్యోతి లక్ష్మియుగానికి వాళ్లు క్లబ్‌డాన్సర్లే. అవి బీడీ కీ జలైలే, చింకీ చమేలీ రోజులు కావు. అవి డిటెక్లివ్‌లు, పోర్నో పుస్తకాలు చిన్నచిన్న దుకాణాల ముందు తీగలపై వేలాడుతున్న రోజులు. పోర్నో ప్రతి మనిషికి అందుబాటులోకి రాని రోజులు. ల్యాండ్‌లైన్‌రాజ్యమేలుతున్న రోజులు. ప్రైవసీకి కష్టపడాల్సి వచ్చే రోజులు.  యాస్పిరేషనల్‌ మిడిల్‌క్లాస్‌ఇంత పెరగలేదు కాబట్టి విలాసం అనేది నెగెటివ్ అర్థంలో స్థిరపడిపోయి ఉండేది. అప్పుడు కారు అనేది అరుదైన వ్యవహారం కాబట్టి కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనేది విలాసాన్ని దెప్పిపొడవడానికి సరిపోయింది. ఇవాళ ఆ పాటను అదే అర్థంలో సమాజం స్వీకరించలేదు. వర్గ రాజకీయాలను అంత కుదించి మాట్లాడడం ఇవాళ కుదరదు. అప్పటికి రిసార్టులు ఇంత లేవు కాబట్టి క్లబ్‌ విలాసానికి చిరునామాగా ఉండేది. సినిమాల్లో అలాగే చూపించేవారు. అందువల్ల క్లబ్తో ముడివేసి క్లబ్‌డాన్సర్‌ అనే పేరు పెట్టారు. లేదా క్యాబరే అన్నారు. కేవలం క్లబ్బుల్లో తాగుబోతుల మధ్య డాన్స్ వేసే వారు అని నైఘంటికార్థం తీయకూడదు.

పల్లెటూరి ప్రేక్షకుడితో పాటు పట్నపు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోవాల్సిన మార్కెట్‌అవసరం ఏర్పడిన సంధికాలంలో తెలుగు సినిమాలో ఆ సంధి ప్రేలాపన చాలా కనిపిస్తుంది. ఆ సంధికాలపు తొలిదశలో దాసరి ఉంటే దాని ఉచ్చదశకు ప్రతినిధిగా రాఘవేంద్రరావు కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో కత్తులు కటార్లు తగ్గిపోయి దొరలు-భూస్వాములు వాళ్ల పంచెకట్లు తగ్గిపోయి గన్స్‌-పాంట్స్‌తో విలన్లు వస్తున్న కాలంలో వచ్చిన ట్రెండ్‌ ఈ క్లబ్‌డాన్సర్లు. అంతకుముందు పూర్తిగా గ్రామీణ ప్రేక్షకులే ఎక్కువగా మార్కెట్‌లో ఉన్నరోజున రాజుగారి లేదా జమీందారుగారి సంస్థానంలో పాటలను చూపించేవారు. స్త్రీని విలాసవస్తువుగాచూపే విషయంలో అవేమీ తక్కువ కాదు. ఇపుడు మిత్రులు జ్యోతిలక్ష్మి మీద గౌరవం పెంచడానికి పంచుతున్న త్యాగయ్య పాటే తీసుకున్నా అందులో ఆడువారు యమున కాడ క్రిష్ణుని గూడి..అందరు చూడగ.. ఏమేమి చేయుచున్నారో ఉంది. అలా క్రిష్ణుని గూడి చేసినా ఆధునిక హీరోను కూడి చేసినా చేసేది ఒకటే. చెప్పేది ఒకటే.అలాగే ఆ గీతంలో జ్యోతి లక్ష్మి వస్త్రధారణ కూడా భిన్నంగా ఏమీ లేదు. జ్యోతిలక్ష్మి రెండు పాటల్లోనూ తన పాత్రేదో తాను పోషించింది. ఒకదాని కొకటి తక్కువా కాదు. ఎక్కువా కాదు.

సెక్స్‌సంబంధమైన పరిభాషను నిత్యజీవితంలో సామాన్యులు వాడే పదజాలంనుంచి విడదీసి గంభీరంగా సంస్కృతంలో మాట్లాడుకుంటే అదేదో సున్నితం అనిపిస్తుంది.నేనెక్కడో దాచాను బంగినపల్లి అంటే బూతుగా కనిపించి ఆ త్యాగయ్య చిత్రం పాటలోని పాలిండ్లు కదల, కుటిలోలకములు మెదల అంటే బూతుగా అనిపించదు. అంతెందుకు మన సాహిత్యంలో కూడా అవసరమైన చోట రతి ప్రక్రియ అనో ఇంకోటో వాడగలం కానీ తెలుగుపదం వాడలేము. శిశ్నము, భగము అంటే అంత బూతుగా కనిపించదు, తెలుగు వాడితేనా, అమ్మో! ఇదంతా ఒక సంస్కృతి మన మెదళ్లపై చేసిన పెత్తనం ఫలితం. ఇపుడు ఇంగ్లిష్‌కి వద్దాం. ఫక్ అనేమాట యథాలాపంగా వాడేస్తుంటారు. షిట్‌ అనే మాటని డైనింగ్‌టేబుల్‌మీద కూడా యథాలాపంగా విసిరేస్తుంటారు. కానీ తెలుగులో వాడమనండి, ఎంత అసహ్యంగా మొకం పెడతారో అందరూ! ఇవేమో ఆ పదాలతో ముడిపడిన ఆంగ్ల సంస్కృతిలో ఉన్న పారదర్శక స్వభావానికి సంబంధించిన అంశం. అంతకంటే ముఖ్యంగా మార్కెట్‌కు సంబంధించిన అంశం. అంటే కాస్త వెనక్కు పోతేనేమో కొందరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గాంభీర్యం లేదా లాలిత్యం అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకో భాషలోనేమో ఆ భాషలో అది కామన్‌ కాబట్టి మనకు ఏమీ అనిపించదు.

actress-jyothi-lakshmi-passes-away-63

ఒకటి ఫ్యూడల్‌ మాయాజాలం. ఇంకోటి మార్కెట్‌ మాయాజాలం.ఇక్కడ బూతు అనేది ఆ భాషతోనూ ఆ భాషతో ముడిపడిన సమాజముతోనూ ముడిపడి ఉన్నది. భాషతో పాటు అనేకానేక ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి. విచ్చిన పూరేకు పచ్చల పిడిబాకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా అంటే కనిపించని బూతు వేటకత్తి ఒంట్లో దూసి సిగ్గు గుత్తి తెంచేశారు అంటే కనిపిస్తుంది. రెండూ ఒకటే . వాస్తవానికి మొదటిది రెండో దానికి ఇన్‌‌స్పిరేషన్‌కావచ్చు కూడా. పిక్చరైజేషన్‌ అప్పటి వాతావరణం అనేకం పనిచేస్తాయి. అక్కడ ఆ పాత పాటలోనైనా రాక్షసి పాత్ర కాబట్టి ఆ మాత్రం తెలుగు వాడేశారు.దేవతల ఆస్థానమైతే పెట్టేవారు కాదు.దేవతల సెక్స్‌ కూడా సంస్కృతంలోనే ఉంటుంది మరి! అంతకంటే ముఖ్యంగా అప్పటి మార్కెట్‌కి అది బాహాటంగా ఉండడం అవసరం కాదు.ఇపుడు ప్రేక్షకుడి తొడనిమిరి అరే అబ్బాయి్‌ఇది ఇందుకోసమే పొరబడనక్కర్లేదు ఇందుకోసమే అని చెప్పే మార్కెట్‌. ముసుగులు అక్కర్లేని కాలం. ఇదంతా ఎందుకంటే జ్యోతిలక్ష్మి త్యాగయ్యలో పాడిన పాటైనా, లేలేలే నారాజా పాట అయినా ఒకటే. రెండూ టిటిలేటింగ్‌ ఎఫెక్ట్‌కోసమే. ఒకప్పుడు ఏదైనా ముసుగులో మాత్రమే చెప్పాల్సిన టైం కాబట్టి ఆస్థాన నర్తకిగానూ, మేజువాణీగానూ మేలిముసుగుల్లో ఆడాల్సి వచ్చేది. పట్టణ మార్కెట్‌పెరిగే కొద్దీ కొత్త తరం ప్రేక్షకుల్లో టిటిలేటింగ్‌ఎఫెక్ట్‌కోసం వేరే రూపం తీసుకోవాల్సి వచ్చింది. అపుడైనా ఇపుడైనా మార్కెటే ప్రధాన నిర్దేశకురాలు. అపుడైనా ఇపుడైనా అనేకమంది మగవాళ్ల ముందు ఒక స్త్రీ  తనను తాను ప్రదర్శించుకోవడమే. ఆ మగవాళ్లు ఇంద్ర దర్బారులోని దేవుళ్లా, ఆధునిక పబ్బులోని మగవాళ్లా అనేదే తేడా కానీ విషయంలో తేడా లేదు.

సినిమాల్లో ఏదో చేసేద్దామని దాన్ని సామాజిక సాధనంగా భావించి కొందరు చేసిన ప్రయోగాలను మినహాయిస్తే ఇతరత్రా విషయాల్లో పాత సినిమాలు సెన్సిబిల్‌అయిపోయి కొత్త సినిమాలు ఇన్‌సెన్సిబిల్‌ అయిపోవు. స్ర్తీ శరీరాన్ని వంకర్లు తిప్పుతూ మగవారి ఆనందం కోసము చిందులేయించడం అనే విషయంలో మూడు దశలు ప్రధానంగా కనిపిస్తాయి. తొలి దశ ఆస్థాన నర్తకి లేదా మేజువాణి దశ. రెండో దశ క్యాబరే డాన్సర్‌లేదా క్లబ్బు సాంగులు అనే దశ. మూడో దశ ఇటెం సాంగ్స్. ఈ మూడు పదాలకు మూడు మార్కెట్‌దశలతో సంబంధం ఉంది. గ్రామీణ ప్రేక్షకులే ప్రధానమైపోయిన దశ ఒకటి. గ్రామాలనుంచి పట్టణాలకు వలస ప్రధాన లక్షణంగా కలిగిన దశ ఒకటి. పట్టణ ప్రేక్షకులే ప్రధాన ప్రేక్షకులుగా మారిన దశ ఒకటి. స్థూలంగా అరవైల దాకా మొదటి దశ అనుకుంటే అరవైల నుంచి 90ల దాకా రెండో దశ. ఆ తర్వాత మూడో దశ అనుకోవచ్చు.దానికి సంబంధించిన ఇతర సెన్సిబిలిటీస్ అన్నీ ఆ సినిమాల్లో ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమాల్లో విలన్‌ఎలా మారుతూ వచ్చాడో చూస్తే తెలుగు సినిమా ప్రయాణం తెలిసిపోతుంది. వైరుధ్యమే కదా మూలం దేనికైనా!లేట్‌ సిక్సిటీస్‌నుంచి 90ల దాకా నడిచిన కాలం తెలుగు సినిమాకు అటూ ఇటూ కాని నాశినపు కాలం అనిపిస్తుంది. ఆ దశలో సినిమా తనకిచ్చిన పాత్రను పోషించిన నటి జ్యోతిలక్ష్మి. సమర్థురాలు కాబట్టి ముద్ర వేయగలిగింది. తర్వాతి కాలంలో సెక్స్ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోయి శరీరానికి కూడా ప్రదర్శనా వస్తువుగా లెజ్టిమసీ వచ్చాక హీరోయిన్లే ఆ పాత్ర పోషించడం మొదలెట్టారు. టాప్‌ హీరోయిన్లు పోటీపడుతున్నారు కూడా. నాట్యంలో వేగం వల్ల ఒకరిద్దరు స్పెషలిస్టులు మిగిలి ఉన్నారు తప్పితే సాధారణంగా ఆ ట్రైబ్‌ మాయమైపోయింది. వారి ఉపాధి పోయింది.

ఫ్యూడల్‌ సమాజపు సినిమాల్లోనైనా పూర్తిగా మార్కెట్‌ మయమైన నేటి కాలంలోనైనా స్త్రీ పాత్రల్లో చైతన్యం పరంగా మౌలికమైన తేడా అట్టే లేదు. అబరేషన్స్‌ సంగతి పక్కనబెడదాం. జేబు ఇంకా ప్రధానంగా పురుషుడికే  ఉంది కాబట్టి బహిరంగ స్థలాల్లో బహిరంగ సంచారంలో పురుషుడే ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి ప్రేక్షక ప్రపచంలో అతన్ని ప్రధానంగా టార్గెట్‌ చేయడం ఒక విధిగా సినిమా వాళ్లు భావిస్తారు. దానికి తగిన ఏర్పాట్లేవో చేస్తారు. పురుషుడితో పాటు స్ర్తీ కూడా ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం  స్వేచ్ఛ చైతన్యం పెంచుకుంటున్నదని భావించే మెట్రో అర్బన్‌ సెక్షన్‌ కోసం మల్టీ ప్లెక్స్‌లు రాబట్టి కూసింత సెన్సిబిల్‌ సినిమాలు కూడా చూడగలుగుతున్నాం. గతానికి వర్తమానానికి తేడా రూపంలోనే, సారంలో కాదు. ఫ్యూడల్‌ సమాజమే ముసుగు సమాజం కాబట్టి స్ర్తీ మరీ బహిరంగంగా బయటపడకూడదు. సిగ్గుల మొగ్గగానే ఉండాలి. సున్నితంగా చెప్పినట్టు ఉండాలి. భలే భావుకత అండీ అన్నట్టుండాలి. విద్యాగంధం కొందరిదే కాబట్టి వారు చెప్పిందే వేదం. వేదమైనా భావుకత అయినా సంస్కృతమే మరి! ఆ సినిమాల్లో అదంతా కనిపిస్తుంది. అంతకంటే ముందునుంచి వచ్చిన వారసత్వం అది.

వచ్చినవాడు వామనుడు కాదయ్యా, వాడు విష్ణుమూర్తి  అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తే బలి చక్రవర్తి ఏమంటాడు?

“ఆదిన్‌శ్రీ సతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు కిందగుట, మీదై నాకరంబు మేల్గాదే, రాజ్యమున్‌గీజ్యమున్‌సతతమే, కాయంబు నాపాయమే’’ అన్నాడు.

అంతటి విష్ణుమూర్తి నా ముందు చేయి చాచడం కంటే ఇంకేమి కావాలి అని చెప్పడానికి ఏ ఘనత తీసుకున్నాడు? లక్ష్మీ దేవి ఒంటి మీద పాలిండ్లమీద పారాడే చేయి మన చేయికంటే కింద ఉందంటే ఇంకే కావాలి, ఎపుడైనా పోవాల్సిన ఈ దేహానిదేముంది అన్నాడు. అంటే ఏమిటిట? అంతరార్థం ఏమిటి? ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? వివరించి చెబితే భక్తులు గింజుకుంటారు కాబట్టి ఇక్కడ వదిలేస్తా. అదే కాదు, కమలాకుచ చూచుక కుంకుమతో…అని పొద్దుపొద్దునే కాలర్‌ట్యూన్‌పెట్టుకుని మరీ వింటాం కదా! అంటే అర్థాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పిన ఒక భావనకు మెజారిటీ సమూహం తలవంచి ఆరాధించేలా చేయగలిగింది ఒక పర్టిక్యులర్‌  సమూహం. మళ్లీ చెప్పొచ్చేదేంటే అయ్యలారా, అమ్మలారా! ప్రతి దానికి స్త్రీ శరీరాన్ని అడ్డుపెట్టి అవమానించడం ఆధునిక నేరం కాదు, చాలా చాలా పాత నేరం. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలమే ఎంతో కొంత మెరుగు.

త్యాగయ్య జ్యోతిలక్ష్మికి ప్రేమ్‌నగర్‌జ్యోతిలక్ష్మికి ప్రేక్షక మార్కెట్‌లో వచ్చిన తేడా తప్ప విలువల పరమైన తేడా లేదు. సింబాలిజం తేడా ఉంటుంది. పళ్లూ, పూలూ కరవాలాలూ, బాకులు, మొగ్గలు, రేకులు ఇవన్నీ సున్నితమైన భావనలుగా ప్రచారంలో పెట్టి అట్లా అప్పట్లో లాక్కొచ్చారు. మధ్యరకం క్లబ్‌డాన్సర్ల టైం వచ్చేసరికి అరకోడి, చిల్లిగారె లాంటి సింబాలిజమ్ యాడ్‌అయ్యింది. ఆ తర్వాత పిడతకింద పప్పు లాంటి మరీ నాటు కూడా కలిసిపోయింది. అక్కడ ఉత్తరాదినా అంతే. ఏ మేరా దిల్‌-యార్‌కా దివానా నుంచి షీలా కీ జవానీ దాకా జరిగిన ప్రయాణం తెలుగు సినిమాల కంటే భిన్నమైన దేమీ కాదు. ఇక్కడ జ్యోతిలక్ష్మి-జయమాలిని అక్కడ హెలెన్‌-ఇరానీ. ఇక్కడ రాఘవేంద్రరావు-అక్కడ డేవిడ్‌ధావన్‌. రాజమౌలి-పూరీ జగన్నాధ్‌ టైం వచ్చేసిరికి టెన్నిస్ బంతుల పాపా, నీ బంతులకింతటి ఊపా అని మార్కెట్‌సింబల్స్‌పచ్చిగా ప్రవేశించాయి. లేటెస్ట్‌గా సాల్టెడ్‌ బటర్‌, క్రీమ్, వంటి ఆంగ్ల శృంగార ఇమేజరీ మన తెలుగు సినిమా సారస్వతంలోకి కూడా బట్వాడా అవుతున్నది. తెలుగులో పచ్చి వెన్న లాంటివి ఆల్‌రెడీ వచ్చి ఉన్నాయి. అయితే ఈ పచ్చితనం మాత్రమే బూతు అయిపోయి గతంలోది సున్నితమైన భావుకత్వం అనుకుంటే మనం ఫ్యూడల్ విలువలను మోస్తున్నట్టే అర్థం. మార్కెట్‌కు వెలుపల ఆలోచిస్తే సినిమాను అభిరుచుల వ్యవహారంగా మార్చే ప్రమాదం ఉంటుంది.

కాలంతో పాటే సింబాలిజం కూడా పాతబడుతుంది. మార్కెట్‌తో పాటు కొత్త సింబాలిజం యాడ్ అవుతూ ఉంటుంది. వర్తమానం బాగోలేదు నిజమే కానీ దానికి సమాధానం వెనక్కు పోవడంలో లేదు. ఇంతకంటే ఆరోగ్యకరంగా ముందుకెళ్లడంలో ఉంది. దానికోసం ప్రయత్నించడంలో ఉంది. టెక్నాలజీ మార్పుల వల్ల సినిమా ప్రొడక్షన్‌ ఎంతో కొంత ప్రజాస్వామికమయ్యింది. మార్కెటింగ్లో ప్రధానమైన డిస్ర్టిబ్యూషన్‌ ఇంకా ఫ్యూడల్‌ కంపు కొడుతోంది. అక్కడ ఎవరైనా మార్పు తేగలిగితే సెన్సిబిల్‌ సినిమాకు దారి వైశాల్యం పెరుగుతుంది. ఇతర రంగాల్లో మార్కెట్‌ వల్ల అది తెచ్చిన టెక్నాలజీ వల్ల కొన్ని సమూహాల గుత్తాధిపత్యానికి కొంతవరకు గండి పడింది. సినిమా రంగంలో ఆ లోటు మిగిలే ఉంది.

*

 

 

 

 

 

 

ఈ ఆదివాసీ కంట తడి కనిపిస్తోందా మీకు?!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా …

adivasi

సమాజంలో జరుగుతున్న దాడులు , అసమానతలు ,అవినీతి వంటి అంశాల పై సామాజిక ఉద్యమకారులతో పాటు రచయితలు కూడా అంతే బాధ్యతతో బాధితులకి అండగా నిలవడం నైతిక బాధ్యత .ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు రచయితలు తమ కలాలకు పదును పెట్టి ఉద్యమాల విజయానికి కారకులయ్యారు . భారత దేశపు ఆదివాసీయుల సంస్కృతి , పోరాటాలు వారి కన్నీటి గాధలు పరిచయం చేస్తూ రచనలు చేసి రచయిత్రి మహాశ్వేతాదేవి సాహిత్యలోకానికి స్పూర్తిగా నిలుస్తుంది .

ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గి పోతున్న సామాజిక వర్గాలలో ఆదివాసీలు ఇంకా అట్టడుగున వున్నారు . ఆదివాసీ దినాలు వస్తున్నాయి పోతున్నాయి గానీ వాళ్ళ జీవితాల్లో మార్పు కనిపించట్లేదు . ఇంక ఆదివాసీ మహిళల జీవితాలు , సొంత సమాజంలో వారి స్థానం ,వారిపై జరుగుతున్న హింసాకాండ ,అంతు చిక్కని న్యాయవ్యవస్థ  ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.

మన రాజ్యంగంలోని ఆర్టికల్ 46 గిరిజనులపై జరిగిన అన్ని రకాల అన్యాయలనుంచి కాపాడాలని, 275(1)  ప్రకారం వీరి అభివృద్ధికి నిధులను కేంద్రప్రభుత్వం విడుదల చేయాలనీ తెలియజేస్తుంది .350(2)ఆదివాసుల జనాభా, అధికారం,గిరిజన రక్షణ చట్టాలను కల్పిస్తుంది.ఇది కాకుండా అట్రాసిటి చట్టం,ల్యాండ్ ట్రాన్సఫర్ ఆక్ట్ ,పిసా ఆక్ట్ ,RNR ప్యాకేజ్ ,ఆటవిక సంరక్షణ హక్కు వంటి చట్టాలు మన రాజ్యాగంలో వున్నాయి.మనదేశంలో 600 కు పైగా  , మన రాష్ట్రoలో 33 కు పైగా ఆదివాసీ  తెగలు గుర్తించబడ్డాయి . భారత జనాభాలో 8%వున్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం న్యాయం చేయటం లేదు.

ఆదివాసీ మహిళల ఆక్రందన 

2007 లో ఇదే నెలలో విశాఖ జిల్లా వాకపల్లి లో  జరిగిన ఆదివాసీ మహిళలపై పోలీసుల అత్యాచార సంఘటన మనసుల్ని కదిలిస్తుంది. నక్సలైట్ల కూంబింగ్ కోసం వెళ్ళిన పోలీసులు వారి స్త్రీలపై జరిపిన ఈ అవమానకరమైన సంఘటన ,ప్రాంతాలతో సంబంధం లేకుండా కదిలించి వేసింది.న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటం పెద్ద సవాల్ గా మారింది. ప్రజా సంఘాలు,బాధితులు కలిసి చేసిన పోరాటంలో 21 మంది నిందితులుగా నమోదయ్యారు.చివరికి అందులో 13 మంది మాత్రమే మిగిలారు.తొమ్మిది ఏళ్ళు గడచిన ఈ సంఘటనని  జనం మరచిపోయినా, బాధితుల మనసులు భగభగ మండుతూనే వున్నాయి .వారిలో ఇద్దరు మహిళలు ఆహార పానీయాలు మానేసి బలవంతపు చావుని ఆహ్వానించారు.తమకు న్యాయం జరగాలని రాజధానుల వెంట నడిచిన రోజుల్ని గుర్తు తెచ్చుకుని తమ తెగలోని మహిళల మధ్యకూడా తాము అవమానాల పాలయ్యామని బాధపడుతున్నారు. ఐదేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ  న్యాయానికి  నోచుకోలేదు. ఖాకీల కర్కశ పాదాల కింద నలిగిన స్త్రీ మూర్తుల జీవితాలు   బాగుపడనేలేదు.  ఈచట్టలు  గిరిజనుల  కోసం   ఏర్పాటు  చేయబడ్డ నిబంధనలు ఎంతవరకు అమలౌతున్నాయో ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి.

చత్తీస్ ఘడ్ లో ఇటువంటి సంఘటనలెన్నో జరుగుతూనే వున్నాయి.అక్కడి ఆదివాసీ మహిళల సమస్యలపై పోరాడుతున్న ‘సోనీసోరి’ బస్తర్ జిల్లా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నాయకురాలు.ఆమె మీద పోలీసు దాడులు జరపడం అప్రజాస్వామికం.ఆమె ముఖంపై ఒక అజ్ఞాత ముఠా రసాయన పదార్థాన్ని  చల్లి పారిపోవటం ఆమెను శారీరకంగా కుంగదీసినట్లు భావించవచ్చునేమో కానీ ఆమె మానసికంగా దృఢ నిశ్చయంతో అన్యాయాన్ని ఎదిరించటానికి ముందుకు వెళ్ళటానికి ఈ సంఘటన సహాయపడింది.

ఆదివాసీలు – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యయనం

సామాజికంగా సాంఘికంగా స్త్రీలు రకరకాల నేపథ్యాలలో అణిచివేతకు, అన్యాయానికి గురౌతున్న సందర్భంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక స్త్రీల అస్తిత్వ సమస్యలను అధ్యయనం చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించింది.

2013 సెప్టెంబర్ 26 న ఆదిలాబాదులోని మంచిర్యాల చుట్టు పక్కల గ్రామాల ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాన్ని పర్యటించిన ప్రజాస్వామిక రచయిత్రుల  వేదిక సభ్యులు ఎన్నో యదార్ధ బాధితుల గాధలని రికార్డ్ చేశారు.సింగాపూర్ లో తవ్వుతున్న బొగ్గు గనుల ప్రాంతాన్ని వర్ణిస్తూ రచయిత్రి శివలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిoది.’’ఈ గనుల కోసం తవ్విపోస్తున్న ఇసుక గుట్ట ఒక చిన్న ఊరంత జాగాని ఆక్రమించి బొగ్గు తవ్వే కొద్ది అది పాపంలా పెరిగిపోతూనే వుంటుంద”ని చెప్పింది.  880 ఎకరాలలో 19 గ్రామాలను సర్వ నాశనం చేస్తూ ఊళ్ళను బొందలగడ్డలుగా మారుస్తున్నారని గ్రామస్తులు తెలియజేసారు.

ప్రరవే సభ్యురాలు శాంతి ప్రబోధ, భండారు విజయ , తాయమ్మ కరుణ , హేమలలిత    కలిసి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలోని ఎర్ర చెలక , పునుకుడు చెలక , తోక బందల గ్రామాలకు  పర్యటించారు  . అక్కడి కోయ , గిరిజన గ్రామాలలో  కొత్త గూడెం విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ అక్కడి ఉద్యమకారులకి గిరిజనులకు మద్దతు తెలిపారు .

మెదక్ జిల్లా సింగూర్ ప్రాంతాలలోని తండాల ప్రజలు సందర్శించిన ప్రరవే సభ్యురాలు కవిని ఆలూరి వారి సమస్యల పై అధ్యయనం చేసింది . ఒక్క పూటైనా తినడానికి కష్టంగా ఉన్న వాళ్ల పరిస్థితిని వివరించింది . చెరకు కర్మాగారాలకు నీరు లేకపోవడం వలన వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి . కర్ణాటక , తెలంగాణ సరిహద్దుల నుంచి పుల్కల్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెరకు కొట్టడానికి వచ్చిన జూకల్ తండా , తడ్కల్ తండా స్త్రీలను కలిసి వారి జీవన గాథల్ని తెలియజేసింది . ప్రపంచీకరణ విధానాల అమలుతో గ్రామాలలో చేతి వృత్తులు ధ్వంసమై ,ప్రజలు జీవనాధారం లేక వలసలకు వెళుతున్నారని , వెళ్ళిన చోట పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారని కవిని వివరించింది .  తండాలలో వలసపోయే ముందు రోజు తండావాసులoదరు కలసి పoడగ చేసుకొని ఆ రాత్రి గతంలో వలస సమయంలో ఎదుర్కొన్న కష్టాలను తలచుకుంటూ విలపిస్తుంటారు . వృద్ధులను చూస్తే చాలా దయనీయంగా అనిపిస్తుంది .

పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్సు వచ్చిన దగ్గరనుంచి ప్రజా  సంఘాలు , ఉద్యమకారులు,రచయితలు కూడా పర్యావరణానికి, గిరిపుత్రులకి అండగా నిలిచి ఆందోళన చేపట్టారు .తెలంగాణా ఆంధ్రాప్రాంతాల ముంపు గ్రామాలను దర్శిస్తూ వారి బాధల్ని  పంచుకున్నారు.ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారుగా ఏడు లక్షల ఎకరాలకు పైగా పొలాలను పండించవచ్చు . అదే సమయంలో ఆదివాసీల అటవీ ప్రాంతం మూడున్నర లక్షల హెక్టార్ల భూమిని కోల్పోతున్నారు.నిర్బoధoగా ఆదివాసీల జీవన సౌధాలను కొల్లగొట్టి పట్టణాలకి పరుగులు తీయించడం , సంస్కృతిని అంతంచేయటం వంటిది .

ఇందులో భాగంగానే తెలంగాణా విభాగం నుంచి  ప్రజాస్వామిక  రచయిత్రుల  వేదిక సభ్యులు అనిసెట్టి రజిత, భండారు విజయ ,కొలిపాక శోభారాణి, కందాళ శోభారాణి,బండారి సుజాత ,కొమర్రాజు రామలక్ష్మి జూన్ 10 , 2014 న ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నగ్రామాలకు వెళ్ళారు .కుకునూరు , కోకుళ్ళపాడు , టేకుపాక మొదలైన గ్రామాల గుండా కూనవరం వెళ్ళారు . బలవంతంగా తమ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపటాన్ని నిరసిస్తూ ‘’మా పంటలు , మా గొడ్డు గోదా , మా అడవి తల్లి సంపద అన్నింటినీ వదిలేసి మేం ఎందుకు వెళ్ళాలి ‘’అని ప్రశ్నిస్తున్న ఆ ప్రాంతపు స్త్రీల మనోవేదనని తెలియజేశారు .

‘’కూనవరం, వీ. ఆర్. పురం , చింతూరు మండలాలలో దాదాపుగా 85 వేల   మంది గిరిజనులు , గిరిజనేతరులు నివసిస్తున్నారు . నిత్యావసర వస్తువుల కోసం గుట్టలు , పుట్టలు దాటి సరుకులు కొనుగోలు చేస్తారు . కొన్ని సందర్భాలలో నిల్వ ఉంచిన ఆహారాలు తిని రోగాల బారినపడి చావుకు దగ్గర అవుతున్నారు . విషపురుగుల బారిన పడి వైద్యసదుపాయం లేక నాటు మందులతో ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు . రాష్ట్రాల విభజనవల్ల నష్టపోయే ఆదివాసుల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకపోవటం వలన  సంస్కృతిని కోల్పోతున్నారు ‘’అని భండారు విజయ తెలియజేసింది   .

కందాల శోభారాణి  ప్రజలందరూ సమానమని భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణంలో పొందుపరుచుకున్నాం కాని , పర్యావరణానికి , ఆదివాసీ జీవనానికి తీవ్ర హాని జరుగుతున్నా కూడా పాలకులు పట్టించుకోవటం లేదని ఆదివాసుల ఆస్తిత్వాన్ని రద్దు చేసి వారి జీవితాన్ని విధ్వంసం చేస్తూ పరాయీకరణకు గురి చేస్తున్నారని , కొమరంభీం , బేర్సా  ముండా , మన్యం తిరుగుబాటు సందర్భంలో ఆదివాసులు చురుకైన పాత్ర వహించారని గుర్తుచేసింది .

బండారు సుజాత , కొమ్రరాజు లక్ష్మి తమ కవితలలో ఆదివాసుల కష్టాలను కవితల్లో చెప్పారు .

ధనసరి అనసూయ ’ ముంపు’ దీర్ఘ కావ్యాన్ని కోయ భాషలోనికి అనువదించింది .

కాత్యాయనీ విద్మహే వరంగల్ చుట్టు ప్రక్కల ప్రాతాలలోని లంబాడీ తండాలకు వెళ్లి వారి జీవన విధానాన్ని , ఆ స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలని , హక్కుల గురించి అధ్యయనం చేసింది .

ఈ ముంపు  గ్రామాలలో ‘’వ్యవసాయ ఆధారిత జీవన విధానాన్ని సమూలంగా ధ్వంసం చేసే విపత్తు అంతర్భాగంగా ఉందని,  ఆoధ్రప్రదేశ్ లో  275 గ్రామాలు , ఒరిస్సా లో 13 గ్రామాలు , ఆoధ్రప్రదేశ్ కలిసిన  ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలు మొత్తం 27 వేల  కుటుంబాలు , లక్ష పదిహేడు వేల మంది  ప్రజలు నిర్వాసితులు అవుతార’’ని అనిసెట్టి రజిత తన ఆవేదనని  వ్యక్తం చేసింది .

కొలిపాక శోభారాణి శ్రీకాకుళం నుంచి నెల్లూరు  తీర ప్రాంతం వెంబడి నిర్మించబడుతున్న భారీపరిశ్రమలకి నీటి అవసరాన్ని తీర్చడానికి మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించబడుతుందని , ఈ పరిశ్రమలన్నీ జాతీయ బహుళ  ప్రైవేటు కంపెనీలే అని అభిప్రాయపడింది .    గిరిజనలు కోల్పోయే భూములకి సమానమైన భూమి ప్రాజెక్ట్  ఆయకట్టు కింద ఇవ్వాలనే ఒప్పందం పైన గిరిజన మంత్రిత్వ శాఖ 2007  లో ప్రాజెక్ట్ పనులకి అనుమతినిచ్చిందని కానీ యిప్పటి వరకు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని తెలిపింది .

 

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (A.Pశాఖ) ఆదివాసీ స్త్రీల అస్తిత్వ సమస్యల పై ఎన్నో కార్యక్రమాలు చేసింది .యువ గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో బాలికల స్థితిగతుల మీద అధ్యయనం గిరిజనుల సాంస్కృతిక జీవనం మీద అధ్యయన కార్యక్రమాలను నిర్వహించింది .

 

2016 ఏప్రిల్ లో సంస్కృతీ గ్లోబల్ స్కూల్ ,మహిళాచేతనతో కలసి నవతరంతో యువతరం అనే కార్యక్రమంనిర్వహించింది. ఇందులో భాగంగా ప్రకృతి సోయగాల్ని ,విరజిమ్మే అందాల విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలోని సుంకరమెట్టలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలపై అవగాహన కోసం విద్యార్థులు, రచయితలు పర్యావరణ ప్రేమికులతో కలిసి ఒక పర్యటన నిర్వహించింది. విశాఖపట్నం జిల్లాలోని సుంకర మెట్ట ప్రాంతంలోజరుపుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలవల్ల అక్కడి గిరిజన  ప్రాంతాల ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలవారికీ కలుషిత పర్యావరణం కలిగించే విషప్రభావం ఎంతగా వుంటుందో భావి పౌరులకి తెలియజేసింది.స్వార్ధ పూరిత ప్రభుత్వ విధానాలు అందమైన ప్రకృతిని నాశనం చేస్తూ ఆదివాసీల మనుగడకి ప్రమాదం ముంచుకు రావటం తీవ్రంగా ప్రతిఘటిoచవలసిన విషయాలు.

***                                    ***                                    ***

విహంగ మహిళా సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో నేను , రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి , ప్రముఖ బ్లాగర్ రసజ్ఞ  , పోలవరం మండలం లోని ఆదివాసీ గ్రామాల పై పరిశోధన చేస్తున్న ఎం .ఫిల్ విద్యార్ధి, విహంగ పాఠకులు జొన్నకూటి రవికిరణ్ , సందీప్ ఒక బృందంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం ముంపు గ్రామాల సందర్శనకు వెళ్ళాము .

పోలవరం ,ఎర్రవరం ప్రాంతంలో అతివేగంగా జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణo,పనిచేస్తున్న మరయంత్రాలు భూమాత గుండెల్ని కర్కశ ఇనుప చేతులతో పెళ్ళగిస్తున్న  ప్రొక్లైనర్లు, గుoడెల్ని తూట్లు పొడిచే డ్రిల్లింగ్ యంత్రాలు… అక్కడక్కడ కన్నీటి ధారలుగా ప్రవహిస్తున్న నీటిపాయలు… మనసుని వికలం చేస్తుండగా ప్రాజెక్ట్ నిర్మాణం మధ్య వేసిన తాత్కాలిక రహదారుల మీద మా ప్రయాణం కొనసాగింది.పచ్చని ప్రకృతి మధ్య గోదావరి నదిపై జరుతున్న ఆ మహానిర్మాణం సిరిసంపదలు తెచ్చి పెడతాయని భావిస్తుంటే గిరిజనుల మానసిక పరిస్తితి,అలజడి, మనోభావాలు ఏవైపుగా ఆలో చిస్తున్నాయో ఈ ప్రయాణం నాకు  తెలియజేసింది.

మేము పర్యటించిన ప్రాంతంలో యర్రవరం ,మాధవవరం,పైడాకుల మామిడి సరుగుడు, టేకూరు,శివగిరి ,కొండ్రకోట,సింగన్నపల్లి గ్రామ ప్రజలు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.

యర్రవరం గ్రామస్తురాలు ఎండిపల్లి నాగమ్మ ఎంతో సేపు నాతో ముచ్చటించింది.వాళ్ళ మాటల్లో అడవి, కొండలు,ప్రకృతిని దాటి వేరే విషయాలు రాలేదు.తమ జీవనాధారమైన కొండ ప్రాంతాలకు వెళ్ళటాన్ని నిషేధించటం  ఎంత బాధను కలిగించిందో ఇలా చెప్పారు.

బుట్టాయగూడెం మండలంలోని చంద్ర వంక గ్రామంలో పోలవరం ప్రాంతపు ఆదివాసీలకు ఇళ్ళస్థలాలు ఇచ్చారు .కానీ ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అక్కడ కొండలు కనిపిచవు.వీరి ఆవేదనకు ముఖ్యకారణం కొండలు లేవనేదే.వారితో మాట్లాడినంత సేపు కొండలు లేవు లేవు లేవు అని ఎన్నో సార్లు ఎంతో బాధతో చెప్పారు .ప్రకృతితో విలీనమైన వారి జీవితాలు ఆ వాతావరణాన్ని వదలలేనివారి అమాయకం  అర్థమయ్యాక లేగదూడని  తల్లి నుండి విడదీస్తున్న భావంతో మనసు బరువెక్కిపోతుంది.

‘’కొండ ఎక్కుతుoటే ఎక్కటానికి వీల్లేదన్నారు కట్టె పుల్లల కోసం కూడా వెళ్ళటానికి వీల్లేదన్నారు  మాకు గ్యాస్ వాడకం రాదు కదమ్మా చిన్నప్పటి కాడ నుండి పుల్లలమీద  వండుకోవటం అలవాటు , అందరూ రాయించుకున్నారు కానీ మేము గ్యాస్ రాయించుకోలేదు .’’

వాళ్ళకి పునరావాసం కల్పించిన చంద్రవంక కాలనీ గురించి అడిగితే ఎంతో అసంతృప్తిని వ్యక్తం చేసారు. “ ఏమో అక్కడ ఎలాగున్నదో మేముకూడా చూడలేదు అని నాగమ్మ అంటే- పామా బుచ్చిరాజు వెంటనే ఇలా అన్నాడు “అక్కడేం బాగాలేదండి .కొండల్లేవ్ ఏమ్లెవ్” అని పెదవి విరిచాడు .

“మీరు ఈ కొండలమధ్యే  ఉండటానికి ఇష్టపడుతున్నారా  అన్న ప్రశ్నకి అవునని ఖరాఖండిగా సమాధానం చెప్పారు.

‘’మీరు ఈ ఊర్లో ఉంటే సమయానికి బస్సు సౌకర్యం ,వైద్యం వసతులు వంటివి వుండవు కదా!’’అని నేను ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా నాగమ్మ మాట్లాడుతూ ‘’మనుషులందరూ ఒకే స్థితిలో వుండరు కదా!నేనున్నట్లు నువ్వు వుండవు నువ్వు  వున్నట్లు నేను ఉండను.మాకు పది తోకల దూడలు వున్నాయనుకోండి .ఇక్కడైతే ఖాళీ స్థలంలో తిరుగుతాయి .మేము  కూడా ఇక్కడ ఖాళీ స్థలంలో తిరుగుతాము.మేము అక్కడికెల్లాక ఏ ఖాళీ స్థలంలో తిరుగుతాము?

మా పశువులు ,మా దూడలు ఎవరి చేలోకెల్లి మేస్తాయి? ఇక్కడైతే వాటికి నచ్చిన చోట మేస్తాయి.కట్టె  పుల్లలు తెచ్చు కోవాలంటే ఇక్కడైతే అడవుల్లోకి వెళ్తాం .అక్కడ ఎక్కడ నుండి తెచ్చుకుంటాం? మాకు అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు .కాని మీకు డబ్బులిచ్చేసాం మీరిక బయలు దేరండని మమ్మల్ని పంపేస్తున్నారు .పోక్లేనర్లతో గుడిసెలు కూలగొడుతున్నారు  పిల్లలమీద పడిపోతాయనే భయం తో అందరు ఊళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు .ఇటువంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి .ఇవన్ని పగలైతే మేమేదైనా చేసే వాళ్ళం .ఇదంతా రాత్రి చేసారు.

ఇంక ఆస్పత్రి అంటే పోలవరం కాని కొండ్రుగూడ కానీ వెళ్లి చూపించుకుంటాం .ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళాల్సిందే .’’

 

పోలవరం ప్రాజెక్ట్ కడితే మీకు లాభకరంగా ఉంటుందని అనుకుంటున్నారా? అని అడిగితే నాగేశ్వరరావ్ ,రామ కృష్ణ , లింగరాజు అందరు ఒకే మాట చెప్పారు. ‘’ఏం  ఉపయోగo ఉంటుందమ్మా? మా కొంపా గోడు చెల్లా చెదురై పోయాక మమ్మల్నిక్కడనుంచి పంపేసి అక్కడ ఏమిస్తారో ఏమివ్వరో? తెలీదు’’ అన్నారు .

‘’ప్రాజెక్ట్ కడితే పొలాలకి నీళ్ళందుతాయి.పంటలు బాగా పండుతాయి .మన రాష్ట్రo బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా? ‘’ అన్న ప్రశ్నకి

‘’లాభపడే వాళ్లకి బాగానే వుంటుంది .మేం ఇక్కడ మా నివాసాలను,పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మాకున్న అతి కొద్ది భూమిని మాకు నచ్చిన చోట కోల్పోతున్నాం . మేం కోల్పోయిన దానికి సరిపడ నష్ట పరిహారం ఇవ్వాలి .మాకు స్వేచ్ఛగా బతికే మంచి ప్రదేశంలో నివాసాలేర్పాటు చేయాలనీ కోరుకుంటున్నాం.అది కూడా అడవిలోనే మేం వుండాలని కోరుకుంటున్నాం.వాళ్ళు పట్టణ  ప్రాంతాలకి దగ్గరగా నివాసం ఇస్తున్నారు. అక్కడికెళ్ళి బ్రతకటం మావల్ల కాదు . అక్కడ మా వాతావరణం వుండదు.ఇక్కడున్న జీవితం అక్కడ రావాలంటే కొన్ని సంవత్సరాలు అలవాటుపడితే కానీ రాదేమో. కొండలు లేవు . పనులు దొరకవు. ఇది మాకు అలవాటైన ప్రాంతం కాబట్టి ఏపనైనా చేసుకుని బ్రతుకుతాం.ఊర్లో కుర్రోళ్ళు అడవికి వెళ్లి వేటాడుకొస్తుంటారు.కుందేళ్ళు ,కొండ గొర్రెలు, అడవి పందులు వంటివి వేటాడుతారు‘’ అని సామా బుచ్చి బాబు అన్నాడు .

జానకి, కుమారి  మాట్లాడుతూ తమ కుటుంబంలో ఐదు మంది సభ్యులుండగా మొత్తం కుటుంబానికి లక్షరూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు చెప్పారు .

ఉమ్మడి కుటుంబాలుగా వున్న ఇళ్ళకి కూడా ఈ లక్షరూపాయలే వర్తిoచటంతో ఈ మొత్తం ఎంత మందికి నష్ట పరిహారంగా  మారుతుంది?కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములకు విడివిడిగా ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదా అన్నది అటు ప్రభుత్వం తేల్చి చెప్పకపోవటంతో గ్రామస్తులు అయోమయంలో వున్నారు. ఉన్న చోట పోడు  వ్యవసాయం, పశువుల మందలు ,ఇల్లు,వాకిలి కోల్పోయి  తెలియని ప్రాంతాల్లో ఎలా బతుకును వెళ్ళదీసుకోవాలో అర్థం కాని స్థితి లో ఉన్నట్టుగా వారి మాటల్ని బట్టి తెలుస్తుంది .

పునరావాసం కల్పించిన చోట మీకు పొలాలు కూడా ఇచ్చారా? అన్న ప్రశ్నకి – ‘’ఇక్కడ మా చేలల్లో పండిన పంటలు చేతికి అందాక చంద్రవంక కాలనీలో గవర్నమెంట్ మమ్మల్ని ఏం వుద్దరించారో  అని అడగటానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక కాని మా కోసం ఏం వుందో ఏం లేదో తెలుస్తుంది .ఒక్కప్పుడు మాకిక్కడ పొలాలు ఉండేవి .మా పెద్దోళ్ళు అవన్నీ కోల్పోయారు .ఆ తర్వాత కొంత కాలానికి మా ప్రాంతపు ప్రజలంతా భూపోరాటం చేసి భూములు సంపాదించుకున్నాం. నాకో 70 సెంట్ల పొలం వచ్చింది ఈ భూమిని ఇక్కడ పోగొట్టుకున్నట్టే .అక్కడ ఇస్తారో లేదో తెలియదు.

పండిన పంట  మాకు కావలిసినంత మేం వుంచుకొని మిగిలినవి ఇచ్చేస్తాం .మా వూళ్ళో  వరి ,శనగలు,మినుములు ,పెసర్లు ,కందులు ,దనియాలు అన్నీ  పండిస్తాం . .’’ అన్నారు .

‘’అవి అమ్మితే ఎంత ధర వస్తుంది ?’’

‘’ ఏమో మాకు తెలియదు. అవి మేము కేజీల లెక్కన అమ్మం. కాటాకి  ఇచ్చేస్తాం. బస్తాల లెక్కన అమ్మేస్తాo.నాల్గు ముంతల పెసర్లు పండితే  ఇచ్చేసాం  ’’

‘‘దానికి మీకు ఎంత డబ్బు వచ్చింది ?

‘’ఇంకా లెక్క తేలలేదు ‘’

ఇంతకీ ఎవరికి ఇచ్చారుమీ ధాన్యం ? మీ  లెక్కలెవరు చూస్తారు ?

‘’సెట్టిగారు అని ఒకాయన వున్నారు.నాగలి దున్నటానికి,విత్తనాలకి, మందులకి అన్ని ఖర్చులు ఆయనవే. దున్ని పంట పండించిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకిస్తే  ఆయన పెట్టిన ఖర్చుల లెక్కలు చూసుకొని మిగిలింది మాకిస్తాడు. అన్ని లెక్కలు చూసి ఇంతవరకు తీర్మానం అయిoదని ఆయన డబ్బులు   ఆయన తీసుకుంటాడు.  మిగిలింది మాకిస్తాడు ‘’అని చెప్పారు .

 

పై సంభాషణని పరిశీలిస్తే ఇంకా మారుమూల   ఆదివాసీల ప్రాంతాలలో వున్న నిరక్ష్య రాస్యత ,పేదరికం ,అమాయకత్వం,పట్టణ  ప్రాంతపు దళారీల చేతులో చిక్కుకున్న వారి జీవితాలు అర్థమౌతా యి .

శ్రీకాకుళ ప్రాంతం లో జరుగుతున్న భూమి పోరాటాలు, పోలవరం ప్రాజెక్ట్ కి సంబందించిన ఆదివాసీ ప్రాంతాలలో బలవంతంగా జరుపుతున్న వలసలు, ఆదివాసీయుల సొంత  అస్థిత్వానికి గౌరవం  లేకుండా చేస్తున్నారు . పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం గిరిజనులకు,ప్రకృతికి విడదీయరాని అనుబందం వున్న దృష్ట్యా వారి హక్కులకు భంగం కలిగించకూడదు. యాభైవేల కంటే ఎక్కువగా ఆదివాసీ జనాభా ఉన్నట్లయితే ఆప్రాంతాలలో ప్రాజెక్ట్ల నిర్మాణం చేయరాదని 2006 లో జాతీయ గిరిజన ముసాయిదా చట్టం చేయబడింది.

యిప్పుడు పోలవరం ప్రాంతంలో జరుగుతున్న ప్రాజెక్ట్ నేపథ్యంలో జలసమాధి కాబోతున్న భూముల్లో నివసించే   ఆదివాసీయులను పట్టణ ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రకృతితో మమేకమైన వారి జీవితాలను శరీరం నుండి ప్రాణాన్ని వేరుచేసినట్లుగా వారు భావిస్తున్నారు.

నాగమ్మ  స్వచ్ఛ మైన నవ్వు, మనసు విప్పి మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకుతుండగా ‘’నువ్వు భలే నవ్వుతున్నావు’’ అన్నాను.

నాగమ్మ నవ్వుతూ ‘’మరింకేం చేస్తామమ్మా నవ్వాలి కదా !’’అన్నది.

ఉన్నదంతా కళ్ళముందే పోతూ ఉన్నా అడవి బిడ్డలుగా పుట్టటంలో వున్న సంతృప్తి వాళ్ళ మొఖంలో కన్పించింది నాకు .

మేము ఆగ్రామాన్ని విడిచి వస్తుంటే మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళే అవకాశం లేదని అనిపించే సరికి హృదయం భారం అయింది . అక్కడి వాళ్ళు కూడా ఏ సమయానికి గ్రామాన్ని వదిలి పెట్టాల్సివస్తుందో మాకే తెలియదు అన్నారు .   కొన్ని వందల  అడుగుల లోతున జల సమాధి కాబోయే ఆ ప్రాంతాల్ని మా కళ్ళలోకి నింపుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యాo.

ప్రకృతి బిడ్డలను స్వేచ్ఛగా జీవించే హక్కు ఆనందంగా తమకు నచ్చినట్టుగా జీవించేలా నాగరికులు సహకరించటం అత్యవసరమైన విషయాలు. వారి హక్కుల్ని వారి సంపదను వారినే అనుభవించనిద్దాo .

*

 

అవధూత గీత

dhyanam

ఆప్త చైతన్య గా ప్రసిద్ధి చెందిన దొడ్లంకి వెంకటరావు కవి, చిత్రకారుడు, పిల్లల ప్రేమికుడు, అన్నిటికన్నా మెహెర్ చరణాలముందు మోకరిల్లినవాడు. సహజంగానే ఉపాధ్యాయుల హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. ఇక ఆ ఉపాధ్యాయుడు కళాకారుడు కూడా అయితే చెప్పవలసిందేముంది? ఆ కళాకారుడు ‘ధూళిగా మారే’ ‘ప్రేమ పథికుడు ‘అయితే ఆ జీవితం నిత్యం దీపం వెలిగే కోవెలనే కదా.

ఇప్పుడు ఈ ‘కవితాధ్యానం ‘ చేతుల్లోకి తీసుకోగానే మనమట్లాంటి ఒక మందిరంలో అడుగుపెట్టినట్టు అనుభూతి చెందుతాం. అసలు కవిత, ధ్యానం రెండూ ఒకటే, ‘కవితా ధ్యానం ‘ ఒకరకంగా పునరుక్తి పదమే. కాని అర్థవంతం కాకపోతే కవి ప్రయోగించడు కదా. పుస్తకం ఒక పఠనం ముగించేటప్పటికి నాకేమనిపించిందంటే, ఇది కవిత ద్వారా చేసిన ధ్యానమని.

ధ్యానమంటేనే, మరే విషయం మీదా మనసు పోకుండా ఒకే అంశం మీద మనసుని లగ్నం చెయ్యడం కదా. అది నేరుగా జరగవలసిందే కదా. మధ్యలో కవిత్వమెందుకు?

ఇది చాలా సూక్ష్మమైన విషయమనిపించింది. దీని వెనక ఎంతో యోగశాస్త్రముందేమో కూడా. కాని, అనాది కాలంనుంచీ భక్తి కవులు చేస్తూ వచ్చింది ఇదే కదా. ఒక చోట తుకారాముడిట్లా అంటాడు:

‘తుకా అడిగేదొక్కటే, ఏదో ఒకటి మాటాడు నాతో
అప్పుడు ఈ కవిత కూడా ఏదో ఒకటి మాటాడుతుంది.’

కవిత మనకి అద్దం లాంటిది. అద్దం నిశ్చయాత్మకతకు చిహ్నం. మనమున్నామని మనకు ధైర్యం చెప్తుంది. కవిత కూడా అంతే. మన అంతరంగ ప్రయాణానికి అదొక అక్షరసంకేతం.

నిజమైన సాధకుడికి జీవితమంతా తనకీ దేవుడికీ మధ్య ఎడతెగని ఒక సంభాషణ. కొందరు సాధకులు తాము నిత్యం దేవుడి ముందు ప్రసంగిస్తూ, సంకీర్తన చేస్తూ ఉంటారు. అన్నమయ్య లాగా. కొందరు దేవుడి ప్రసంగాన్ని మౌనంగా వింటూ ఉంటారు, రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షి లాగా. కాని చాలామంది సాధకులకి అది తమకీ దేవుడికీ మధ్య సంభాషణ. తమ మాటలు దేవుడు వింటున్నాడనీ,తాము దేవుడి మాటలు వింటున్నామనీ తమని తాము గిల్లి చూసుకున్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు కవిత్వం చెప్తుంటారు.
ఈ కవితా ధ్యానం కూడా అట్లాంటి సంభాషణ. అన్ని సంభాషణల్లోలానే ఇందులో కూడా కొంత కలకలం, కొంత కలవరం, చివరికి ఆ కల వరంగా మారేదాకా-

‘నీవు చెప్పేదంతా గందరగోళంగా కనిపిస్తాది నాకు
పరీక్ష పెట్టేవాడే తట్టుకునే శక్తినిస్తాడంటావు
పరీక్ష ఎందుకో, తట్టుకుని నిలబడ్డవెందుకో
నేనెంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు
కల గనడమెందుకొ,ఆ కలను బాధల ఒత్తులతో చెరపటమెందుకో ‘ (పే.7)

మామూలుగా ధ్యానం మౌన వ్యాసంగం. కాని కవితాధ్యానం కాబట్టి నాదమూ,రాగమూ, అనురాగమూ తప్పనిసరి. కాని ఆ ప్రయాణం దారితీసేది చివరికి మౌనానికే.

మౌనం నుంచి మౌనానికి చేసే ఈ ప్రయాణంలో సాధకుల మానసికావస్థలన్నీ గోచరమవుతున్నాయి కాబట్టి ఈ కవిత్వం మనకొక సాధకుడు అయాచితంగా తన ఆత్మరహస్యాన్ని విప్పి చెప్పినట్టుంది.

ఒక సూఫీకీ ఈశ్వరుడికీ మధ్య అనుబంధం మూడు దశల్లో బలపడుతుందని ఒక సూఫీ సాధువు చెప్పాడు. అందులో మొదటిదశలో సూఫీకీ, ఈశ్వరుడికీ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన ఒక క్లయింటుకీ, అతడి లాయరుకీమధ్య ఉండే సంబంధంతో పోల్చాడు. ఆ క్లయింటు తన లాయరుతో మొత్తం మొరపెట్టుకుంటాడు. ఏ చిన్న వివరం, రహస్యం, విశేషం ఏదీ అతణ్ణుంచి దాచడు.

‘ప్రీయమైన తండ్రికి,
ఆ ఒక్కటీ నీకు చెప్పేశాక
ఇంక నా దగ్గర ఏవీ మిగల్లేదు
నావన్నీ నువ్వు లాక్కుంటావని
ముందస్తుగా నన్ను హెచ్చరించిన నీకు
నా కృతజ్ఞతలనెలా తెలుపుకోవాలో నాకు తెలీదు.’ (పే.21)

అనే మాటలు ఆ దశకి చెందినవే.

రెండవ దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య అనుబంధం పసిపాపకీ, తల్లికీ మధ్య ఉండే హృదయబంధం. పసిపాప ఒక క్లయింటులాగా ఏదీ చెప్పుకోలేదు. అసలు మాట్లాడనే లేదు. తన సంతోషం, దు:ఖం ఏదైనా సరే, గుక్క పట్టి ఏడుస్తుంది. ఆ బాధ ఏమిటో ఆ తల్లికే తెలుస్తుంది, ఆ రోదన వినగానే, ఆ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను ఎదకు హత్తుకుంటుంది.

‘నేనెవరిమీద కేకలేస్తున్నాను?
నీ మీదేకదా!
నేనెవరిని కావలించుకుంటున్నాను?
నిన్నే కదా!
నా చుట్టూ నువ్వు తప్ప
వేరే ఎవరున్నారు?
నువ్వు కోపించడం చూసాను
నువ్వు ద్వేసించడం చూసాను
నువ్వు లాలించడం చూసాను
నువ్వు ప్రేమించడం చూసాను
నువ్వు మథన పడటం చూసాను
నువ్వు దు:ఖించడమూ చూసాను
నువ్వు పీకలు కోయడమూ చూసాను
నువ్వు నీ కుత్తుకను కత్తికి బలివ్వడమూ చూశాను
నువ్వు మోసగించడం చూసాను
నువ్వు మేల్కొల్పటమూ చూసాను ‘ (పే.86)

అట్లాంటి రోదన.

ఇక చివరి దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య ఉండే అనుబంధం ఒక మాసిన వస్త్రానికీ, ఒక రజకస్త్రీకీ మధ్య ఉండే సంబంధం లాంటిదట. ఆ మాసిన గుడ్డ కనీసం ఏడవను కూడా ఏడవదు. తనని తాను ఆ రజకస్త్రీ హస్తాలకు మౌనంగా సమర్పించుకుంటుంది. తన మురికి వదిలేదాకా, ఆ హస్తాలు తనని బండకేసి బాదుతుంటే, వళ్ళప్పగించేస్తుంది.

‘కొట్టేది నువ్వే!
కౌగలించుకునేది నువ్వే!’ (పే.6)

అనే మాటలు అప్పుడే వస్తాయి.

ఆప్త చైతన్య ఈ మూడు దశలూ దాటాడు అనటానికి, ఈ కవిత్వం ఒక ఆనవాలు. కనుకనే ఇట్లా అంటున్నాడు:

‘నా దృష్టి ఇప్పుడు దేనిమీదా లేదు
సూర్యుని మీదా లేదు
సుందరమైన ప్రకృతిమీదా లేదు.
భ్రమర ఝుంకారానికీ, ఝుమ్మన్న ఈగల శబ్దానికీ
తేడా నాకు తెలియడం లేదు
స్త్రీ వక్షానికీ, శరాఘాతానికీ తేడా నాకు తెలియడం లేదు.’

ఎట్లాంటి కవిత ఇది! నేను చదివిన అత్యున్నత ఆధ్యాత్మిక సాహిత్యానికి సరితూగే వాక్యాలివి, ఇంకా వినండి:

‘నా దృష్టి ఇప్పుడు సంతోషం మీదా లేదు
సంకట స్థితి మీద లేదు
మలయమారుతానికీ, మండే జ్వాలకీ
తేడా నాకు తెలియడం లేదు
వలపులు విసిరే నవ్వుకీ, వల విసిరే జాలరికీ
తేడా నాకు తెలియడం లేదు.
నా దృష్టి ఇప్పుడు కలమీదా, వాస్తవం మీదా లేదు
పగటికీ, రాత్రికీ తేడా నాకు తెలియడం లేదు
వగలకీ, పగలకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు నవ్వుల పడవ మీదా లేదు
కెవ్వుమన్న ఏడ్పుల పాడె మీదా లేదు
పకలరింపులకీ, పరనిందలకీ తేడా నాకు తెలియడం లేదు
తీయని మాటలకి, తేనె పూసిన కత్తులకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు సముద్రం మీద గాని, అలలమీదగానీ
నురుగుమీదగానీ, బుడగమీద గానీ లేదు
నీ మీదే ఉంది!
ఒక్క నీ మీదే ఉంది! (పే.28)

మన కాలంలో మన మధ్య సంచరిస్తున్న మన మిత్రుడొకరు రాసిన అవధూత గీత ఇది. ఇతడూ, నేనూ కలిసి కొన్నాళ్ళు ఒకచోట పనిచేసామని తలచుకుంటే నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోతున్నాను.

*

మనందరి కథ!

manam1
‘మనమంతా’ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగులోనే కాకుండా, తమిళం మరియు మళయాలంలోకి డబ్ చేయబడింది. ప్రేమం, దృశ్యం లాంటి చిత్రాలను మన తెలుగు వారు అప్రీషియేట్ చేయడమే కాకుండా ఈ సారి ఇతర భాషల సినీ ప్రేమికులు మన తెలుగు వాడి గురించి చెప్పుకునే విధంగా, మనం కూడా తలెత్తుకొనే విధంగా తీయబడ్డ సినిమా ‘మనమంతా’.
 M1
సాయిరాం అనే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ తను మేనేజర్ కావడానికి చేసిన ప్రయత్నం ఎలా మలుపు తిరిగింది అనేది ఒక కథ, మహిత అనే అమ్మాయి తమ ఇంటి పక్క గుడిసెలో ఉన్న చిన్న పిల్లవాడికి చదువు చెప్పించాలనే కోరిక… తర్వాత ఆ పిల్లవాడు తప్పిపోయి వాడిని వెతుకుతూ వెళ్లే దారి మరో కథ, ఓ కుర్రాడు తను ఎంతో ప్రేమతో చూసుకునే లాప్ టాప్ అమ్మి ఓ అమ్మాయి ప్రేమ కోసం తను నమ్మిన విలువలను ఒక్కోటీ ఎలా కోల్పోయి హుస్సేన్ సాగర్లో తన ఐడెంటిటినీ మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకొన్నాడో చెప్పే కథ, గాయత్రి అనే మధ్యతరగతి గృహిణి తన కుటుంబం కోసం సింగపూరు బయలుదేరి చివర్లో తన గమ్యం చేరే కథ…ఈ నాలుగు కథల్ని ఒడుపుగా ఒకదానిలోంచి మరోటి పాయలుగా సాగి ఒక నదిలా ఉరకలెత్తి, సంద్రంలా మనల్ని ఓ భావావేశంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాకు ఇరవై నిమిషాల క్లైమాక్స్ ఆయువుపట్టు. అలా అని క్లైమాక్స్ ఒక్కటే బావుందని కాదు. అనుకోకుండానే ఓ చిన్న కన్నీటి పొర, మీ గుండె చిక్కబడేలా చేస్తుంది. ఒక కథని ఎంత చిక్కగా చెప్పవచ్చో దర్శకుడు నిరూపించాడు.
yeleti
ఇరువర్/ ఇద్దరులో తన నటనతో సంభ్రమంలో ముంచెత్తిన నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో సటిల్ గా నటిస్తూ చివరికొచ్చే సరికి తనేంటో మరోసారి తెలియపరుస్తాడు. గౌతమి కూడా చాలా చక్కగా చేస్తూ చివరి ఇరవై నిముషాల్లో తన ప్రతిభ ఏంటో గుర్తు చేస్తుంది. వీరిద్దరినీ మరిపిస్తూ ఓ పదేళ్ల పాప ‘రైనా రావు మహిత పాత్రలో మనల్ని లీనం చేసుకుంటుంది. తను నవ్వితే మనం నవ్వుతాం, తను ఏడిస్తే మనం కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంటాం. అంతగా ఆ అమ్మాయి మనల్ని కదిలిస్తుంది. విష్వాంత్ అనీషా ఆంబ్రోస్ హర్ష వర్ధన్, గొల్లపూడి, ఊర్వశి, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, ధన్ రాజ్ వారి పాత్రల కు పూర్తి న్యాయం చేసారు.మొత్తం మీద ఇది ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా. ‘వారాహీ చలనచిత్రం సాయి కొర్రపాటి నిర్మాణం: ‘మనమంతా’ Rating 4****/5

స్వేచ్ఛకి లోపలి కోణం!

konni sephalikalu

లోగో: భవాని ఫణి

 

 

పదిహేను రోజులు క్రితం హైదరాబాద్ లో ‘రమణీ సె రమణాశ్రమ్ తక్’ అనే పేరుతో హిందీలో రాసిన చలం గారి సంపూర్ణ చరిత్ర 14 వందల పేజీల పుస్తకం తాలుకు ఆవిష్కరణ సభ జరిగింది.  ఆ సభలో మాట్లాడుతూ ఇంతకాలం చలం చెప్పిన బయటి  స్వేచ్ఛ గురించే మాట్లాడాం.  ఇక లోపలి స్వేచ్చ గురించి మాట్లాడాలి.  ఎందుకంటే లోపలి స్వేచ్ఛ లేని బయట స్వేచ్ఛ హాని చేస్తుంది అన్నాను.  సభ పూర్తయ్యాక నన్ను ముగ్గురు నలుగురు ఆ లోపలి స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగారు.  వెంటనే నాకు చలంగారి ‘శశాంక’ నాటకం గుర్తొచ్చింది.  చాలా కాలం నన్ను ఆలోచింపజేసి ఇప్పటికీ నా వెంట ఉండి నడిపించే మార్గదర్శకాల లాంటి పాత్రలున్న నాటకం అంది.  ఆ కథ, దానిలో కలగలిసిన ఆలోచనల గురించి కాస్త చెప్పుకుందాం.

తారాశశాంకమనే పురాణ కథను పెద్దగా మార్చకుండా అసలు అలాంటి కథలో అంతరార్థమేమయి ఉంటుందో చెప్పడానికి చలంగారు చేసిన ప్రయత్నమే ఈ నాటకం, ఇది నిరుపమానం.  రచన అంతా కవితాత్మకంగా ఉంటూనే ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది.

బృహస్పతి దేవ గురువు.  అతని భార్య తార.  బృహస్పతి బుద్ధిశాలి, వివేకి.  తారలోని రసస్నిగ్దత అతనికి తెలుసు.  కానీ అది తనవల్ల స్పందన పొందడం లేదని, దానికి లోపం తనదేనని గ్రహించుకోగల వివేకి.  ఎవరిలోనూ లోపాన్ని ఎంచడానికి ఇష్టపడని వ్యక్తి. వారిద్దరూ కలిసి శశాంకుడనే కుర్రవాడిని పెంచారు.  శశాంకుడు ఇప్పుడు లేప్రాయపు యువకుడయినాడు.  అతని మిత్రురాలు అనూరాధ.  తార అనూరాధను నిందిస్తుంటే బృహస్పతి ఇలా అంటాడు “ఇతరులలో కనపడే మాలిన్యమెప్పుడు హృదయ దర్పణాల ప్రతిబింబితమయిన స్వకీయ కల్మషమే” అని అంటూ ఈర్ష్యాసూయలు వద్దు అంటాడు.  అప్పటికే తార శశాంకుడి పట్ల మోహంతో ఉంది అని ఆయన గుర్తించాడు.  తన ప్రేమకు ఆమె స్పందించకపోవడాన్ని కూడా గుర్తు చేస్తాడు.  దానికి ఆమె “తపసి ప్రపంచము వాంఛాతీతము కదా” అంటుంది.  ఇక్కడ బృహస్పతి నోటి వెంట చలంగారు ఒక గొప్ప మాట అనిపిస్తారు.  “ప్రపంచ రసాస్వాదనమే తపస్సు” అని, రసాస్వాదన చెయ్యగల హృదయ స్పందన కలిగి ఉండడమే, అటువంటి హృదయాన్ని సంపాదించు కోగలగడమే తపస్సు అని ఆయన ఉద్దేశం.  తారలో ఉన్న అపారమయిన ప్రణయ ప్రళయ పాతాళగంగను విజ్రుంబించ జేసి, సాఫల్య పరచుకునే శక్తి తనకు లేదని గ్రహించి ఆ లోపం తనదేనని అర్ధం చేసుకోగల ధీరుడు బృహస్పతి.  అతని ప్రేమకు తనను అర్హురాలిగా అతన్నే మార్చుకోమంటుంది తార.  కాని ‘ప్రేమ ఆత్మసమర్పణ మయినప్పుడే స్వీకరణార్హము’ అనే స్వేచ్చ వల్లనే అది సాధ్యపడాలి గాని ప్రయత్నం వల్ల సాధ్యం కాదంటాడు.  ఈ మాటలు జీర్ణం చేసుకోగలిగితే ఎంత స్థిమితం వస్తుంది మనకి.

ఇటువంటి వాతావరణంలో బృహస్పతి పట్ల స్పందించని ఆమె హృదయం శశాంకుడి పట్ల కదలడానికి, కరగడానికి కారణం తారలాగే శశాంకుడు రసోన్మత్తుడు కావడమే.

“నా కళ్ళలో జ్వలించే మహారతి దీప్తికి, నా మొహంలో నాట్యమాడే మోహాతురతను చూసి పార్వతమయినా నన్ను  వరించి ఉంటుందనే నా నమ్మకం” అనేటంత నమ్మకం అతని మీద అతనికి.  ఈ ప్రపంచం లోని స్త్రీత్వమంతా అతనికి దాసోహమవ్వాలన్నంత కాంక్ష అతనిది.

అలాంటి శశాంకుడి పట్ల తార స్పందిచండం గమనించిన బృహస్పతి ఆమెను హెచ్చరించాడు.  అతని హృదయాన్ని అతన్ని ప్రేమించే అనూరాధ వైపు తిప్పే ప్రయత్నం చెయ్యమన్నాడు.  కానీ అది తార వశంలో లేదు.  అది కుడా బృహస్పతి గ్రహించాడు.

gudipati_vekata_chalam

తారా శాశంకల సమాగమం జరిగితే దాన్ని ఎంతో సహజమయిన విషయంగా తీసుకోగల మానసిక శక్తి కోసం, తిరిగి తారను తనదానిగా అంగీకరించగల మానసిక నైర్మల్యం సంపాదించడం కోసం అతను మరింత తపశ్శక్తిని సంపాదించుకోవడానికి వెడతాడు.

సమాగమం జరిగి శశాంకుడు భీతితో ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు.  తార దిగులుతో ఉంది.  అది తన మనసుకు తగిలి తపస్సు మధ్యలోంచి లేచి వచ్చాడు బృహస్పతి.  ఏ సహాయం కోరి నన్ను తల్చుకున్నావని అడిగినప్పుడు శశాంకుడిని తీసుకురమ్మన్నది తార.  ఇక్కడ వారి సంభాషణ ఎంతో ఆలోచింపచేస్తుంది.  ఒక స్పష్టత కుడా ఇస్తుంది.

“నువ్వే అతని వద్దకు వెళ్ళు” అంటాడు.  “ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటున్నారా సాధారుణులవలె ? లోకమూర్ఖత్వాన్ని సహించగలనా ?” అంటుంది.

“నీ భీరుత్వానికి చౌర్యాన్ని జతచేసి నన్ను తెరగా నీతి వస్త్రం కప్పి నుంచోమంటున్నావు తెలుసా” అని ఆమెను ప్రశ్నిస్తాడు.

ప్రేమకోసం తార బృహస్పతిని ఆ త్యాగం చేయమంటుంది.  అతను ప్రేమ కోసం చేస్తానని చెప్పినా, తారకు హెచ్చరిక చేస్తాడు.  “ప్రజల తుచ్ఛ అభిప్రాయాలను లక్ష్య పెట్టే నడత సత్యచోదితం కాదు.  కాంతి నుంచి విముఖవు కావద్దు, హృదయ పరీక్ష తెచ్చే పర్యవసానాన్ని విశ్వసించి, అంగీకరించి, అనుష్టించే ధైర్యం విడనాడకు” అంటాడు.  నమ్మినదాన్ని ఆచరించడానికి కావలసిన నిర్భీతి గురించే ఇలా చెప్తారు చలం గారు.

బృహస్పతి వెళ్లి శశాంకుడిని తీసుకొచ్చి తారకు అప్పగించేడు.  తార అతడిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళింది.  కానీ ఈ విధమైన అనుభవం ఆమెను మాతృత్వ భావనలోకి తీసికెళ్ళింది.  శశాంకుడి వల్ల పూర్ణ స్త్రీగా మారిన ఆమె “ఏ దేశమో పోయి వచ్చిన కుమారుణ్ణి కౌగిలించుకున్నట్టుగా ఉంది ఈ రాత్రి నాకు అంటుంది.

ఈ సంఘటన తర్వాత ప్రపంచ సౌందర్యంలోకి దృష్టి వికసించడాన్ని గురించి చెప్తూ “ఇదంతా నాదే అన్న భావం నుంచి ఇదంతా నేనే” అన్న దానిలోకి మనసు ప్రయాణించాలంటారు చలం గారు.

శశాంకుడినీ, తారనూ అంగీకరించగల శక్తితో లోకపు మూర్ఖత్వాన్ని ఎదిరించగల ధీరుడుగా బృహస్పతి కనిపిస్తాడు.

అయితే శశాంకుడి మాటేమిటి? అందుకోసం చలంగారు ఈ ఆశ్రమంలోకి అహల్యను కూడా రప్పించారు. ‘అమితమైన స్త్రీ ప్రేమ కోసం, మోహం కోసం ఆరాటపడే శశాంకుడికి ఆమె ప్రేమ జీవనానికి కావలసిన ఏకాగ్రత గురించి చెప్తుంది.  చంచలత నుంచి నిశ్చలకు రావలసిన ఏకాగ్రత యొక్క అవసరం, ఆ దారీ వివరిస్తుంది.

కళాకారుడు, పిపాసీ అయిన అతని మోహకాంక్ష సంగీత, సాహిత్యం వంటి ఉపకరణాల ద్వారా శమింప జేసుకునే మార్గాన్ని, వాటినే తపస్సుగా మార్చుకునే ఏకాగ్రతా సిద్ధిని, మనో నిశ్చలతను పొందే దారిని సూచిస్తుంది.

తన కొద్దికాలపు సౌఖ్యానుభవం వల్ల కలిగిన లోకనింద భరించలేక, వేల ఏళ్ళు పాషాణంగా మారిపోవడం తన హృదయ స్థితినే సూచిస్తుందనీ, కానీ ఆ కొద్ది ఘడియల ప్రేమానుభవం వల్లనే మిగిలిన జీవితాన్ని జీవించగల శక్తి వచ్చిందని అహల్య అంటుంది.  అయితే ఏ పురుషుడితో ఆ అనుభవం కలిగిందో అతను భీరువు కావడం వల్లనే తనకలాంటి స్థితి వచ్చిందని, అతడు ధీరుడయితే తను లోకాన్ని జయించి ఉండేదాననని అంటుంది. చివరిగా ఒక మాట అంటుంది.  ఇది చలంగారి మాటే “మన హృదయంలోని సౌందర్యాశయం ఉందే! దాన్ని మన హృదయమే కవ్విస్తోంది.  అది దేనివల్లా సఫలం కాదు.  మన హృదయం వల్లనే తప్ప.  మనని  ప్రేమించిన వ్యక్తిలో మనం ఆ ఆదర్శాన్ని కల్పించుకుని సంతుష్టి పడాలి”  అంటుంది.  అంతే కాక అతని అహంకారాతిశయం చూసి, చెంపల నునుపు చూసి భ్రమసి మతిహీనులయ్యే క్షుద్రులనుకోకు – స్త్రీ జనమంతా” అని హెచ్చరిస్తుంది.  ఈ హెచ్చరిక చాలా మంది పురుషులకు కుడా చెంప దెబ్బే.

మోహ జీవనం నుంచి ప్రేమ జీవనం వైపు చేసే ప్రయాణంలోని కఠోరత అంతా ఈ కథలో ఉంది.  ఇంత కన్నా ముఖ్యమయినది మరోటి ఉంది.  అది ఇలాంటి జీవనంలో ఉన్నవారి గురించి మనం ఎలా ఆలోచించాలి,  అసలు లోకం పట్ల మన స్పందన ఎలా ఉండాలి, అన్నది.

విశ్వామిత్రుడితో కలిసి ఋషులు బృహస్పతి ఆశ్రమానికి వచ్చి ఈ అక్రమ సంబంధాన్ని గురించి నిలదీసినప్పుడు బృహస్పతి వారికి చెప్పిన సమాధానాలు, “నీతి, దుర్నీతుల విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఉపయోగపడాలి తప్ప లోకాన్ని దిద్దేందుకు కాదు.  నీ ధర్మం తప్ప సామాన్యుడు గానీ, ఇంకెవరు గానీ ఇంకొకరి ధర్మం నీవు నిర్ణయించడం మూర్ఖం, సాహసం” ఇంకా గౌతమ మహర్షితో ఇలా అంటాడు.

new doc 10_1

“అజ్ఞానంతో, దుర్బలత్వంతో, మూర్ఖత్వంతో, సమస్త ఈతి బాధలకూ లోనయి కర్మవశాన జరామరణాదులనుంచి విముక్తి గానక అంధకారంలో మునిగే ఈ ప్రాణికోటికి ధర్మ బోధ చేస్తావా గౌతమా? వారికి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం నీకుందా ? ఉంటే ప్రేమించు, సమస్త జీవుల్నీ ప్రేమించు.  ఖండించకు, శిక్షించకు, నీకన్న, నీ తపస్సుకన్నా, నీ భర్య కన్నా, నీ ఈశ్వరుడి కన్నా అధికంగా దుర్గతిలో పెనుగులాడే ఈ లోకాన్నంతా ప్రేమించు.  కల్మషమంతటితోనూ నిండిన ఈ ప్రపంచాన్ని నీ హృదయానికి హత్తుకో” అంటాడు.

కర్మానుసారం మనుషులు నశిస్తారు.  మనమేం చెయ్యగలం -? ప్రేమించి ఎమిటి లాభం” అన్న గౌతముడి ప్రశ్నకు తిరిగి బృహస్పతి ఇచ్చిన జవాబు నన్ను కదిలించి నిరంతరమూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ జవాబు “ప్రేమించడం వారి కోసం కాదు.  నీ ఆత్మ పారిశుధ్యం కోసమోయీ” అన్నది.  అనేకానేక ఉద్యమాలు నడిపే అనేకానేకులైన మహానుభావులు ఈ మాట గ్రహిస్తేచాలనిపిస్తుంది.  ఇంతకన్నా లోపలి స్వేచ్ఛ గురించి స్పష్టంగా ఎవరు చెప్పగలరు -???

ప్రకృతి అందాలకి పరవశిస్తూ అందులో లీనమావుతూ ఆ ఆనందాన్ని తన పాటలో పలికించుకునే మరో విశిష్ట పాత్ర అనూరాధ. “ఈ అడవి దాగి పోనా ! ఎటులయిన ఇచటనే ఆగిపోనా” అన్న కృష్ణ శాస్త్రి గారి మాటలో ‘ఎటులయినా’ అన్నమాట ఎంతగానో ఆలోచింపదగ్గది.  ప్రకృతి మనకి ఎంత ఇష్టమయినా జీవితపు మోహాలు అక్కడ ఆగనివ్వవు.  వెనక్కిలాగుతాయి.  కాబట్టి ఎలాగయినా సరే వాటినన్నిటినీ జయించి ఇక్కడే ఆగిపోతాను అని కవి ఆశయం.  అనూరాధ అలాంటి మోహాలు లేని ప్రేమ జీవి. ప్రశాంతంగా ఉంటూ, నిర్మలంగా శశాంకుడిని ప్రేమిస్తూ ఉంటుంది.  శశాంకుడి వంటి మోహోన్మత్తుడికి ఆమె మాత్రమే తరణోపాయం.  ఇది అహల్య మాటల ద్వారా శశాంకుడు గ్రహిస్తాడు గాని అతని జీవన మోహ జ్వరాలు ఎంతో సాధన వల్లగాని శమించవు అని మనం అలాంటి వ్యక్తుల్ని చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

ఈ నాటకం మొత్తం మీద చలంగారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయస్పందనే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని.  అపుడే ఆ సంబంధం దివ్యం అవుతుంది.  ఇటువంటి హృదయ ప్రధానమయిన స్త్రీ పురుష సంబందాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచమూ, ఆయా సంబంధిత వ్యక్తులూ ఎంతో ఉదారంగా ఉండగలగాలి.  ఏ గొప్ప జ్ఞానమయినా అటువంటి దివ్యానుభవం వల్లనే ఆయా వ్యక్తులకు కలుగుతుంది.  కలగలేదు అంటే ఆ అనుభవంలోని దివ్యత్వంలో ఎక్కడో ఏదో లోపం ఉందని అర్ధం.  ఇటువంటి దివ్యానుభవం పొందిన వ్యక్తులకు  ఉదాహరణగా ఇందులో బృహస్పతి, తార, అహల్య పాత్రలను చూపించారు. ఇందుకోసం కాకుండా కేవల ఆకర్షణే ప్రధానంగా శరీర సంబంధాలు పెట్టుకోవడం పట్ల చలంగారికి పెద్ద ఆసక్తి లేదన్నది తెలుస్తోంది.

ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.

*

అద్దాలు అనేకం!

 saif
1
కధల పుస్తకాలు ఎంత అందంగా ఉంటాయో బేషరం
కొన్ని ఎర్రని పెదాలుగా కొన్ని నల్లని కాటుక కళ్ళు గా  5 <3
*
2
మనసు అద్దం లాంటిది అంటారు బేషరం 
అద్దాలు చాలా రకాలు ఉంటాయ్ మరి 5 <3
*
3
ఈ రోజు సెలవు తీసుకున్నట్లుంది  బేషరం 
జాబిల్లి ఆకాశం లో కనిపించలేదు 5 <3
*
4
ఊహలకు రెక్కలు తొడిగించారు మనుషులు. బేషరం 
స్తనాలు రవికలు తొడిగించడం ప్రారంభించినప్పటినుంచి 5 <3
*
5
పెద్ద పెద్ద మీసాలుంటేనే మగతనమా ? బేషరం
పిరికి బొద్దింకలకు కూడా ఉంటాయ్ మరీ 5 <3
*
6
మొండితనం ఎవరికెంత ఉందో తెలిసిపోతూనే ఉంటుంది
బేషరం పడగ్గదుల్లో 5 <3
*
7
తీసి పారేసే చెత్తాచెదారం లా మారిపోతాయి
బేషరం పడగ్గదుల్లో ఇష్టమైన దుస్తులు అభరణాలు అన్నీను5 <3
*
8
బాధ్యతలు పంచుకోవడం ఎంత బాగుంటదో బేషరం
ఒకరు హుక్స్ పెట్టుకుంటే మరోకరు తీసే బాధ్యతలా 5 <3
*
9
క్లాసు రూములో వెళ్ళి పడుకుంటారు కొంతమంది
బేషరం అది పడగ్గది అని మర్చిపోతుంటారు 5 <3
*
10
నిన్న ఒక తెలివైన వాడిని చూసాను బేషరం
ఈ రోజు అతను మోసపోయిన విషయం తెలిసింది 5 <3
*

జాలం

 

తెల్లవార్లూ ప్రయాణంతో పట్టీపట్టని నిద్ర…ఒళ్ళు తెలీలేదు. విమానం అడ్రెస్ సిస్టమ్ లో స్పీకర్స్ నుంచి వచ్చే అమ్మాయి గొంతుతో మెలకువ వచ్చింది.

“కొద్ది నిమిషాల్లో గన్నవరం – విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్నాం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. వాతావరణం వేడిగా ఉంది. ల్యాండింగ్ కి అనువుగా, విజిబిలిటీ పది కిలోమీటర్ల వరకూ స్పష్టంగా ఉంది.”

బోయింగ్ 747 న్యూయార్క్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల్లోనే నాన్ స్టాప్ గా విజయవాడలో దిగాబోతోంది. భుజం మీద వాలి గాఢంగా నిద్రపోతున్న శైలజను తట్టిలేపాడు, శివ.

“శైలూ! లే! దిగిపోతున్నాం.”

రోజులు మారాయి, కాలం మారింది. రెండు రాష్ట్రాలు ఇప్పుడు. విజయవాడ గన్నవరంలో ఒక పెద్ద అద్భుతమైన ఎయిర్ పోర్ట్!

బయటకడుగు పెట్టగానే వేడి గాలి, నిప్పుల కొలిమి లోంచి వచ్చినట్టు! జేబులో మొబైల్ ఫోన్ ‘టింగ్’ మని చప్పుడు.

“విజయవాడకి స్వాగతం! మీరిప్పుడు సన్ షైన్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో దిగారు! ఇదిగో ఎయిర్ పోర్ట్ మ్యాప్. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, కాంటీన్, టూరిస్ట్ డెస్క్, టాక్సీలు, బస్సులు ఎక్కడెక్కడుండేదీ వివరంగా మ్యాప్ ప్రత్యక్షం అయింది.

ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్ళే బస్ కదిలింది. దాని లోపల చల్లగా ఉంది.

‘టింగ్’ మళ్ళీ ఇద్దరి ఫోనులు చెప్పాయి. “విజయవాడలో స్వాగత్ ఐదు నక్షత్రాల హోటల్ కి స్వాగతం! మీకోసం హోటల్ కారు వేచి వుంది. డ్రైవర్ నంబర్ ఇదిగో…”

“ఓ! అద్భుతం!” అన్నాడు శివ.

‘టింగ్! మీ బ్యాగేజి బెల్ట్ నంబర్ రెండుకు వచ్చి వుంది.”

‘టింగ్! మీరు అమెరికన్ సిటిజెన్ కనుక గ్రీన్ లైన్లో కస్టమ్స్ నుంచి బయటకు రాగానే త్వరగా వీసా స్టాంప్ ఇవ్వగలము! స్వాగతం!’

‘టింగ్! మీరు విజయవాడలో వుంటే ప్రఖ్యాత బాబాయ్ హోటల్ కి విచ్చేయండి. మరచిపోలేని ఇడ్లీ, పెసరట్ లోయ్!’

‘టింగ్! కొండపల్లి బొమ్మలు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో. ఆర్డర్ చేయండి!’

“ఇదేమిటి బాబూ, అప్పుడే ఇన్ని మెసేజిలా?” విసుక్కుంది శైలజ.

“స్మార్ట్ సిటీ శైలూ!” అన్నాడు శివ. “విజయవాడ ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఆఖరికి మనూరు మామిడిపూడి కూడా స్మార్ట్ విలేజ్ గా మారిపోయింది తెలుసా?”

ట్రింగ్ ట్రింగ్ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. టాక్సీలనీ, టూరిస్ట్ ప్యాకేజీలు, కూచిపూడి నాట్యానికి, దగ్గరలో బీచ్ మచిలీపట్నానికీ, విశాఖ సైట్ సీయింగ్, అరకు లోయలో మూడు రోజులు…

“అది సైలెంట్ లో పెట్టండి, లేదా ఆఫ్ చేయండి!” అంది శైలూ కోపంగా.

గన్నవరం నుంచి విజయవాడకి పొలాల మధ్యగా ఆరులైన్లలో రోడ్డు. అటూ ఇటూ ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. వేసంకాలం రాకముందే బయట చాలా వేడిగా వుంది. దూరాన ఎక్కడో ఒక వారి కుప్ప చుట్టూ ఒక ట్రాక్టర్ నీరసంగా తిరుగుతోంది. కొంచెం దూరం తర్వాత ఇక పొలాలు లేవు. అటూ యిటూ క్రమంగా పెద్దవవుతున్న బహుళ అంతస్థుల భవంతులు, మధ్యలో పెద్ద పెద్ద ప్రకటనలు వున్న బోర్డులూ కనిపిస్తున్నాయి.

“ఓ!! వాల్ మార్ట్! స్పెన్సర్స్… అన్నీ వున్నాయిక్కడ!” అంది శైలూ.

“ఔను! కొత్తరాష్ట్రం డిజిటల్ రాష్ట్రం. చాలా మార్పు వచ్చింది.”

కారు రామవరప్పాడు దాటి బెంజ్ సర్కిల్ దారిలో ఒక చోట ఆగింది. ‘హోటల్ స్వాగత్’ ఐదు నక్షత్రాల సౌకర్యం.

రూమ్ కి చేరుకోగానే, “నన్ను రెండుగంటల వరకూ నిద్ర లేపకండి! బడలికగా వుంది. పడుకోవాలి.” అని శైలూ నిద్రలో మునిగిపోయింది.

శివ కూడా బట్టలు మార్చుకొని, టేబుల్ మీదనున్న చల్లని మినరల్ వాటర్ తాగి, ఆనాటి న్యూస్ పేపర్ చదివి నిద్రలోకి జారాడు.

***

“ఆళ్ళు ఒచ్చారంటావా?” అడిగాడు రామకోటయ్య. ల్యాప్ టాప్ మీద, మొబైల్ తెర మీద రెండు చుక్కలు మెరుస్తున్నాయి.

“ఆ, ఒచ్చారు! హోటల్లో దిగారు.” చెప్పాడు నవీన్.

రామకోటయ్య గుబురు మీసాలు తెల్ల గడ్డంలోంచి “హ” అని చప్పుడు చేసి, వెక్కిరింతగా నవ్వేడు.

“రేపు మధ్యాన్నం కేతారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారంట! జరగడానికి ఈల్లేదు! జరగదు!” కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు.

“అది నీ డూటీ! మరి చూసుకో!” నవీన్ జీన్ ప్యాంటు, తెల్ల టీ షర్టు వేసుకున్నాడు. మాసిన గడ్డం, చురుకైన కళ్ళు, నుదుటి మీద కొద్దిగా, కొద్దిగా ఏమిటి ఈ వాతావరణానికి ఒళ్ళంతా చెమటే!

“చూద్దాం! కానీ గ్యారంటీ చెప్పలేను!” రామకోటయ్య వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి చూసి ఖాండ్రించి ఉమ్మేశాడు.

“పని కాకపోతే డబ్బులుండవ్! నువ్వొక్కడివే  అనుకోబాక! ఇంకా నలుగురున్నారు ఈ పని మీద!” నవీన్ కి అంత వేడిలోనూ చలి పుట్టుకొచ్చింది.

“కోటయ్య తాతా! ఒక కష్టమైన పని పెట్టుకొంటే ఈ కంప్యూటర్ లతో ఖచ్చితంగా చెప్పలేం మరి. మాగ్జిమం ట్రై చేస్తా!”

అతనొక ఎమెచ్యూర్ హ్యాకర్.

***

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

సాయంత్రం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగారు ఇద్దరూ. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ సర్వే మ్యాప్ లు చూడటం మొదలుపెట్టాడు, శివ. సర్వే నంబరు, వూరిపేరు కొట్టగానే మ్యాప్ వచ్చింది.

“ఎకరం రెండు కోట్లు. ఐదు ఎకరాలు అమ్మేస్తే ఈ వూరితో బంధం తెగిపోతుంది!”

“ఎందుకు ఇక్కడ? ఆ డబ్బుతో రాగిణి మెడిసిన్ చదువు మొత్తం అయిపోయి, అమెరికా లో సెటిల్ కూడా అయిపోవచ్చు అని ఎందుకనుకోరు?” అంది శైలూ.

అతి కష్టం మీద రెండెకరాలు కొనడానికి ఒప్పుకున్నారు. ఇవాళ  సగం డబ్బు క్యాష్ ఇస్తారు. ఈ దేశంలో సగానికి సగం బ్లాక్ మనీ లావాదేవీలు! రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మిగిలిన సగం రేపు చెక్కు ఇస్తారట…”

“అంటే ఇంకా మూడెకరాలు…అమ్ముడుపోవా?”

“మార్కెట్ డల్ గా వుంది శైలూ. ఇప్పటికి నాలుగు కోట్లు చదువుకి సరిపోతాయిగా? అది కూడా కొత్త క్యాపిటల్ రావడం, కొత్త రాష్ట్రం అభివృద్ధి వల్ల ఈ మాత్రం రేట్లు! కొనే వాళ్ళు వుండద్దూ? వాళ్లకి కూడా అంత డబ్బు పెట్టాలంటే ఏదో వ్యాపారం ఉండాలిగా?”

“అంతే మీరు! ఏది చేసినా సగం సగమే!” మూతి ముడిచింది శైలూ.

ఆమెను సంతృప్తి పరచటం బ్రహ్మతరం కూడా కాదు.

***

కంకిపాడు నుంచి ఆరులైన్ల రోడ్డు సిగ్నల్ దగ్గర నల్లరంగు ఇన్నోవా కారు.

కంప్యూటర్ లో కనిపిస్తోంది. “ట్రాఫిక్ జామ్. అది కదలడం లేదు.” అన్నాడు నవీన్. అన్ని చోట్లా సీసీ కెమెరాలు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో తెరలు. అక్కడినుంచి తనకి సమాచారం. ఏ క్షణం, ఏ వస్తువు, ఏ వాహనం, ఏ మనిషినైనా ఎక్కడున్నాడో తెలుపుతుంది సమాచార వ్యవస్థ.

స్టోర్ రూమ్ లో ఎన్ని వస్తువులున్నాయి, బస్ లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, రైల్లో ఎంత మంది దిగారు, ఏ హోటల్లో ఎవరున్నారు, ఎవరి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లలోంచి ఎంత డబ్బు స్వైప్ అవుతోంది, ఎక్కడ సమావేశాలు, ఆందోళనలు జరుగుతున్నాయి – ఒకటేమిటి వస్తువులు, మనుష్యులు వాహనాలు అన్నీ అనుసంధానమైన డిజిటల్ రాష్ట్రం – స్మార్ట్ రాష్ట్రం. దాంట్లోకి ప్రవేశించాడు, నవీన్ హ్యాకరు.

“ఆ కార్లో రెండు కోట్లున్నాయ్. అవి ఆడికి చేరడానికి వీల్లేదు.” అన్నాడు రామకోటయ్య.

నవీన్ అన్నాడు, “ఆకారును ఆపటానికి అన్ని విధాలా ప్రయత్నించాను సార్. ఇక ఒక్కటే మార్గం.” ఉన్నట్టుండి ఒకేసారి కంకిపాడు జంక్షన్ దగ్గర వాహనాలు అన్నీ రెండు వైపులా కదలసాగాయి. సంక్షోభం! జామ్!! అటూ యిటూ ఒకేసారి గ్రీన్ లైట్లు వెలిగాయి. కార్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండటానికి అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. అవి ఎర్ర చుక్కల రూపంలో స్క్రీన్ మీద.

రామకోటయ్య సంతృప్తిగా నవీన్ కేసి చూసి, “గట్టోడివే, నువ్వా పనిమీదుండు, నేనింటికి వెళ్లి వొస్తా…” అన్నాడు.

ఇల్లు అంటే రెండో ఇల్లు. రామకోటయ్య కోసం మేరీ ఎదురు చూస్తోంది.

“అయ్యిందా?”

“అయినట్టే. నా కడుపు కాడ కూడా కొడితే నేనూరుకుంటానా? ఎంత మేనల్లుడైతే మాత్రం? సంవత్సరం తిరిగేసరికి పది లక్షలు ఆదాయం వస్తా వుండేది. అమెరికా వెళ్లి అక్కడి పౌరసత్వం పుచ్చుకొన్నోడికి ఈ మామిడిపూడి పొలాలే కావలసి వచ్చాయా?”

వృద్ధుడంటే వృద్ధుడు, మధ్య వయస్కుడంటే మధ్య వయస్కుడు రామకోటయ్య. మేరీ మామిడిపూడి ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ళక్రితం భార్య పోయిన దగ్గర్నుంచి మేరీ నే తోడూ, సహచరీ! అసలు అతనుండేది మామిడిపూడి పక్కనే పది కిలోమీటర్ల దూరంలోని గుడివాడ పట్టణంలో. అమెరికా లో ఉన్న మేనల్లుడి పొలాలు చూడటానికి ఈ వూరు వస్తుంటాడు. రాజధాని కోసం ఈ వూరు గుర్తించి, ఆ ప్రాంతం కలిపేసరికి కోట్ల విలువయ్యింది. న్యూయార్క్ లో, న్యూజెర్సీలో ఇళ్ళు కట్టుకొని వందల కోట్లు సంపాదించిన శివ గాడికి ఈ మారుమూల గ్రామంలోని పొలాలే కావాలా? ఎంత వద్దని చెప్పినా అమ్మాలని పట్టు పట్టుక్కూర్చున్నాడు. తనకి చెప్పకుండానే బేరం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. గుంటూరోళ్ళు  ఎకరా రెండు కోట్లకి బేరం కుదిర్చారు. రామకోటయ్య ఆలోచిస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవాలి, ఏమైనా సరే. ఆగిపోతుంది. చాకుల్లాంటి కుర్రాళ్ళు చేతిలో వుండగా పదిలక్షల ఖర్చుతో పదికోట్ల ఆస్థి తన చేతుల్లోనే ఉండిపోతుంది.

***

ఇన్నోవా వేగంగా అడ్డదిడ్డంగా తిరుగుతోంది. కారులో వ్యక్తులకి విసుగ్గా వుంది.

“ఏందీ ట్రాఫిక్ జాములూ? సిగ్నల్లో అన్నీ ఒక్కసారే వెలిగాయి. అందరూ అన్ని వైపులనుంచి వొస్తన్నారు! ఎలా? నీ…”అతనికి కోపంలో బూతులు వస్తున్నాయి.

ఎదురుగా లారీ మచిలీపట్నం వైపు ఓడరేవుకు పెట్రోల్ ట్యాంకర్లని మోసుకొని వేగంగా వస్తోంది. ఇటు గరుడా  బస్సు విజయవాడవైపు వెళుతోంది. మీద మీదకి వస్తోంది. ఎలా వచ్చాడో, ఒక గడ్డి మోపు కట్టి వున్నా రెండు చక్రాల సైకిల్ తొక్కుకుంటూ తలపాగా ముసలోడు కారుకి అడ్డంగా వచ్చేసాడు. అట్నుంచి ఎడ్లబండి ఒక్కసారి మీదికి దూకింది.

రెండు ఎద్దుల మేడలో గంటలు గణగణా మోగాయి. శివుడి వాహనం నందిలా. అపుడు చేసే సాయంత్రపు నాట్యంలా బండి గెంతింది. ఒక్క మెరుపు మెరిసి, ట్యాంకరూ, ఇన్నోవా ఢీ కొట్టాయి. ప్రళయంలా మంటలు చెలరేగాయి.

***

“ఏదో భయంగా ఉందండీ…” అంది శైలు.

ఏడున్నరకి ‘కూచిపూడి’ రెస్టారెంట్ లో అసలైన ఆంధ్రా రుచులు అన్న బోర్డు. ఇద్దరూ చాలా కాలం మిస్ అయిన వంటకాలు తింటున్నారు.

“డబ్బు ఇస్తానని వస్తానన్న వాళ్ళు ఇంకా రాలా!” అన్నాడు శివ.

“అది కాదు. ఎక్కడ కోర్చున్నా, ఎవరో నన్నే గమనిస్తున్నట్లు, నా వంకే చూస్తున్నట్లు, ఇందాక కార్లో కూడా వెంక ఇంకేదో కారు వెంబడిస్తున్నట్టు..”

“నీ మొహం!” భార్యని తిట్టడానికి అవకాశం దొరికింది శివకి. “అంతా నీ భయం. ఇన్ సెక్యూరిటీ… అభద్రతాభావం!”

టీవీలో తాజావార్తలు డైనింగ్ రూమ్ లో అందరికీ వినబడేట్లు, కనబడేట్లు, “కంకిపాడు దగ్గర ఘోర ప్రమాదం. ఇన్నోవా, ఆయిల్ టాంకర్ ల ఢీ! నలుగురి దుర్మరణం. కారులో కాలిపోయిన కరెన్సీ నోట్లు లభ్యం!”

“అయ్యో…” అంది శైలూ.

“బ్లాక్ మనీ…” అన్నాడు శివ.

***

హోటల్ సీసీ కెమెరాల్లో ఇద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు. నవీన్ నవ్వి ఈల వేయసాగాడు.

“ఆంధ్రా చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, సాంబారులో ములక్కాడలు కూడా కనిపిస్తున్నాయి. హ! హ! హ!”

శివ, శైలూ బిల్ తీసుకొచ్చిన వెయిటర్ కి క్రెడిట్ కార్డు ఇవ్వడం, సంతకం పెట్టడం, కొంత డబ్బు టిప్ కింద ఇవ్వడం లేచి లాబీలోకి రావడం అన్నీ కనిపిస్తున్నాయి.

“హోటల్ అధునాతనమైనది. మొత్తం కెమెరాలే! వస్తువులకి కూడా ఇంటర్నెట్. స్టోర్ రూమ్ లో సరుకులెంత ఉన్నాయో కూడా తెలుసుకోవటానికి సెన్సర్ లు. ఏసీలో టెంపరేచర్ ఎంతో, రెస్టారెంట్ లో, బార్ లో జిమ్ లో, బ్యూటీ పార్లర్ లో అన్ని చోట్లా సెన్సార్లు “ నవ్వాడు.

“రామకోటయ్య గారూ, అన్న మాట నిలబెట్టుకున్నా…” అన్నాడు. లోపల మాత్రం “IOT – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనుకున్నాడు. ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం లోకి హోటల్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా ప్రవేశించాడు.

“ఆళ్ళు ఆగరు. మళ్ళీ ఇంకో బేరం మొదలుపెడతారు. అదీ చూడు!” అన్నాడు రామకోటయ్య. “ఇదిగో ఐదు. పని అయినాక మిగిలిన అయిదు…” కరెన్సీ నోట్లున్న బ్రీఫ్ కేస్ నవీన్ హ్యాకర్ పక్కన నల్లటి నీడలా  నిలబడింది.

దుష్టుడి దురాశలా.

***

“హలో! హలో!”

“హలో?” అన్నాడు శివ విసుగ్గా అర్థరాత్రి.

“సారీ సార్, నాన్నగారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయనతో పాటుగా నలుగురు పోయారు. మీకందుకే డబ్బు అందలేదు. రిజిస్ట్రేషన్ రేపు చెయ్యలేం.” ఎడుపుగొంటుతో యువకుడు.

“ఓ!! సారీ!” తలపట్టుకున్నాడు శివ.

“ఇంకెవర్ని అయినా చూడండి. మాకసలే సెలవు లేదు. అర్జెంటు!”

ఇదేం క్రూరత్వం? సాటి మనిషి ప్రాణాలు పోతే? అని శైలుకి అనిపించలేదు.

“అనుకొంటూనే ఉన్నా. వీళ్ళకి డ్రైవింగ్ రాదు. ట్రాఫిక్ కంట్రోల్ లేదు. డబ్బు ఇవ్వడం, సంపాదించడం రాదు!” విసుగ్గా అంది.

“ఇంకెవరైనా కొనాలనుకొంటున్నారేమో అడగండి. మన ప్రోగ్రాం అంతా ఖరాబు అయింది! ఛీ! బ్యాక్ వర్డ్ కంట్రీ అండ్ పీపుల్!! ఏసీ పెంచండి చల్లగా లేదు, ఈ విజయవాడ వేడికి!”

శివ ఏసీ రిమోట్ తో టెంపరేచర్ పదహారు సెంటిగ్రేడ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు.

ఏసీ గాలి వేగంగా చల్లగా భారంగా రాసాగింది.

నిద్రలోకి జారుకున్న వాళ్ళిద్దరికీ క్రమంగా ఊపిరి భారం అవుతోంది. వచ్చేగాలిలో ఏదో తేడా వస్తోంది. ఊపిరి ఆడటం లేదు. కళ్ళు మండుతున్నాయి. శ్వాస భారంగా … ఆక్సిజన్ అందనట్టు… ఎనాక్సియా. ఏసీ గాలిలో మిథైల్ ఐసో సైనేట్? విషపుగాలి ఎలా కలిసింది?ఇందాక రూమ్ లోంచి బయటకొస్తున్న ఏసీ మెకానిక్ రూమ్ సర్వీస్ అంటూ… పాడయిందా?

అలసిన శివ మస్తిష్కంలో మామిదిపూడిలో కొబ్బరి చెట్ల మధ్య తూర్పు పొలం, ఐదు ఎకరాలు పచ్చని చేలతో కనిపించింది. చిన్నప్పటి తను ట్రాక్టర్ తో పొలం దున్నటం, తండ్రి తలపాగా చుట్టుకొని మోకాలి లోటు నీళ్ళలో కూలీలతో పాటు నాట్లు వెసూ…

తర్వాత, శరదృతువులో ఏపుగా పెరిగిన పొలాలు గాలికి ఊగుతూ, ఆ తర్వాత సంక్రాంతికి బంగారు రంగులో కుప్పలు రాశులుగా పోసిన ధాన్యం…మరుక్షణం తండ్రి చితిలో మంటలు.. ఆ వెనక మీసాలు గడ్డాలతో నిండిన రామకోటయ్య ముఖం త్రీడీ బొమ్మలా “నీకెందుకురా! నువ్వు అమెరికా ఎల్లి రా.. పొలాలన్నీ నే జూసుకుంటా…” అంటోంది.

గదిలో ఆక్సిజన్ కరువైంది. శివ, శైలూ ఇద్దరికీ ఊపిరి ఆడటం లేదు. చల్లగాలిని ఇవాల్సిన ఏసీ కంప్రెసర్ లోకి ఎవరో విషవాయువు పంపించారు.

మరో గంటలో కలలన్నీ కరిగిపోతాయి. నిశ్శబ్దం. వస్తువులని, మనుషులని, మనసుల్నీ ఆవహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్…

మామిడిపూడిలో నవీన్ రామకోటయ్య కేసి చూసి తలవూపాడు.

“గట్టోడివే.”మెచ్చుకున్నాడు రామకోటయ్య.

రెండో సూట్ కేస్ చేయి మారింది.

నవీన్ చేతిలో చల్లటి చెమట. సగం ఏసీ మెకానిక్ కి ఇస్తే సగం తనకీ. ఏం సరిపోతుంది? ఫ్లాట్ కొనటానికి ఇంకా కావాలి. కనీసం రెండు కోట్లయినా కావాలి. బయటకు నడిచాడు నీరసంగా. బయట వెన్నెల లేదు. చీకటి వేడిగా కూడా వుంది.

***

మాటల్లో నిశ్శబ్దం

 

painting: Rafi Haque

painting: Rafi Haque

 

 

బరువుగా ఘనీభవించిన బండనిశ్శబ్దం ఒకటి

చాటుగా పేరుకున్న రహస్యం –

అది దూదిపింజల్లా గాలికెగిరినవాళ్ళకే తెలిసొస్తుంది

తేలికపాటి జల్లులు సుతారంగా కురిసినప్పుడల్లా.

 

పోనీ, అలాగని –

దాన్ని పెళ్ళగించి బహిరంగంగా దొర్లించడం అంటే

రక్తసిక్త రాకాసి చీకటిని ముందుగా మొహమ్మీదకి తెచ్చుకోవడమే కదా!

అయినా ఇప్పుడేం తొందర?

 

తీరం వెంబడే మెరిసిన

స్ఫటిక రాత్రుళ్ళ నక్షత్రాలు మిలమిలా తొడుక్కున్న గొడుగుకింద

వొట్టి పాదాలను తాకే ఇసుకవేడి గరగరని

ఆస్వాదిస్తూ ఇంకాసేపు కలిసినడుద్దాం నాలుగడుగులు – ఊరికే.

 

మూకం కరోతి వాచాలం,

మాటల్లో దొర్లేను నిశ్శబ్దం.

 

*

 

 

చీకటీగలు

kasibhatla

4

*****

ఎవరూ ఎవరికీ ఎప్పటికీ ఏమీ కారన్న యుగాల సత్యం…. మన మన భుజాల మీద అదృశ్యంగా వేల్లాడ్తునే వుంటుంది…. జీవితానికోసారైనా దాన్ని మనమో… అది మనల్నో తడమడం ఖాయం.

ఆ స్పర్శ…

ఆ స్పృహ…

ఆ నగ్నత్వం…

మన యాంత్రిక నిశ్చేతనకీ… కారణ రాహిత్య జీవితానికీ… అర్థరాహిత్యానికీ అసంగతత్వానికీ… ఓ క్షణ కాలపు ఉపశమనం అదే సిసిఫస్‌ కొండ శిఖరమ్మీద క్షణ కాలపు అసంపూర్ణ నిట్టూర్పు నాపక్కనున్న రంగరాజులు ముఖం పెద్దగా కనబడ్తోంది సాధారణంకంటే, వీడు… ఈ రంగరాజుల్గాడు కూడా…

జీవితం గురించిలాగే ఆలోచిస్తుంటాడా?

యాంత్రికంగా జీవితం గురించి….

జీవితపు యాంత్రికత్వం గురించీ…

క్లోజప్‌లో రంగరాజులు ముఖం జిడ్డు కార్తో… మొలుస్తూన్న నలుపు తెలుపు వెంట్రుకల గరికతో…. బండముక్కు…. చివర్నమచ్చ…. ముక్కురంద్రంలోంచీ తీక్షణంగా పొడుచుకొచ్చిన వెంట్రుకలు… బోడి మూతి మా యిద్దరి మధ్యా నల్ల పల్చటి ప్లాస్టిక్‌ సంచీల్లోచచ్చిపోయిన గొర్రె శరీర భాగాలు…

‘‘అవ్‌సార్‌ మన్సారు దాసన్నకి అంతగ్గవకి ఫ్లాటెందుకమ్మేశ్నాండటావ్‌? ఏందో కితామతీ…’’ ఒక్క మిడిగుడ్డుతో నన్ను సగం చూస్తూ అడిగాడు… రంగరాజులు.

‘‘ఏమో ఆయనే చెప్తాళ్ళే సాయంత్రం రమ్మన్నాడు కదా… నాక్కూడా అర్థం కాలే… అయినా అతనిష్టం… మనకనవసరం కదా?’’ అన్నాను.

‘‘ల్యా సార్‌ నేనే నలపైకి మాట్లాన్నీకె రడీ అయ్యింటి…. అవ్లే మనకాసోదెందుగ్గాని…’’

కారింటి ముందాగగానే… నా కోసం కొన్న మటన్‌ వున్న సంచీ నా చేతిలోకి తీసుకుని… రెండు వందకాయితాల్ని జేబులోంచీ పెరికి రంగరాజుల్కేసి చాచా..

‘‘తీ సార్‌ యిన్నూర్రూపాయల్కాడేమి… అక్కకు నేనే దెస్తానన్చెప్తి కద పొద్దున్నే… పా… పా… లోనబెట్టుకో…’’ కదిలెళ్ళిపోయాడు రంగరాజు.

ఇంట్లో టీవీలో ఏదో తెలుగు సినిమా… కుర్ర హీరో ఓ వందమందిని గాల్లో ఎగిరెగిరి తంతున్నాడు… భౌతిక సూత్రాలకతీతంగా తన్నించుకున్నవాళ్లు ముప్ఫై నలభై అడుగులెత్తు ఎగిరెగిరి పడ్తున్నారు… పనమ్మాయి కడిగేసిన అంట్లని పొడిగుడ్డతో తుడుస్తూటీవీకి గుడ్లప్పజెప్పి చూస్తోంది.

సుభద్ర మొబైల్లో ఎవర్తోనో మాట్లాడ్తోంది…. సోఫాలో కూచోని… ఒళ్ళో ఆదివారం మ్యాగజీన్‌ సెక్షన్లున్నాయి… నా వేపు తల తిప్పి చూసి మళ్ళీ తనెదురుగా వున్న అదృశ్య వ్యక్తితో మాట్లాడ్డానికన్నట్టు తలతిప్పేసింది….

‘‘ఎవరో..?’ అనుకుంటూ ఎకా ఎకి వంటగదిలోకెళ్ళి ఓ స్టీలు గిన్నలోకి మటన్‌ సంచీ విదిలించి… సింక్‌లో కుళాయి కిందపెట్టి మటన్ని పిసుకుతూ కడిగా… లేత గులాబీరంగులో నీళ్ళు… మాంసం నగ్నంగా వేళ్ళ మధ్య నలుగుతుంటే… నున్నగా జారుతో… ఓరెండు దశాబ్దాల వెనక్కి… టైం ట్రావెల్‌…

మొదటి స్పృహ…

ప్రథమ విస్పోటం…

తెరలు తొలిగిన జ్ఞానం…

ఆలోచన సరిహద్దులు దాటి. శరీర శిఖరాలెక్కి ఎగరేసిన జెండా…

ఊపిరు హోరుగాలుల రెపరెపలు…

లిప్త ప్రయాణం… ప్రస్తుతంలోకి…. ట్రావెల్‌ బ్యాక్‌…

చివుక్కున పైకెగిరిన మాంసమ్ముక్క… సింక్‌లో… గులాబీ రంగులో… ప్రాణరహితంగా…

‘‘జొన్న రొట్టె దీంతో తెప్పిస్తా… కూర చేసేయ్యి… కొంచెం అన్నం… ఓ అరపావు పెట్టెయ్యి కుక్కర్లో… నేను కొంచెం పడుకుంటా బాగాలేదు ఒంట్లో మెత్తగా వుంది… టీ థర్మాస్లో వుంది చూడు… జ్యోతిలో మహర్షి కథ బాంది చూడు…. కవిత్వమేమో అది నాకెక్కలే… కూరకు ఉప్పు తక్కువెయ్యి. అల్లం పేస్టులో వాడు చాలా ఎక్కువేశాడు’’ చెప్పాల్సింది చెప్పేసాననుకుని చెప్పేసి వెళ్ళిపోయింది సుభద్ర…

ఎవరీమె?

ముందసలు నేనెవరూ?

ఇద్దరం కలిసున్నట్టు… యిదేమిటీ?

నాటకమా?

అయితే ఎన్నో అంకం?

కథేమిటీ?

నేను హీరోనా?

తనూ?

ఎక్కడ మొదలైందీ నాటకం?

చివరంకం ఏమిటీ?

ఎవరు తెర దించేదీ…

అసలేమిటా తెర?

దించడంతో నాటకమయిపోతుందా?

ఇంకో నాటకం సరికొత్తగా మొదలవదా? రెండు ప్రధాన పాత్రల నిష్క్రమణ ఒకేసారి జరిగిపోతుందా?

‘పంఖ్‌హోతేతో ఉఢ్‌ ఆతీరే’ లతా సాలామత్‌ ఊపిరిలో కలిసిపోయి అతని వేణువు గవాక్షాల్లోంచీ పిలుస్తోంది…

పసుపూ అల్లం వెల్లుల్లి పేస్టూ ఉప్పు… పెరుగూ మటన్‌ గిన్నెలో కలిపి మరో మాటు పిసుకుతూ కలిపి చిన్న మూత ఆగిన్నెమీదకి జార్చి ఫోన్తీసా…

కంఠం…

‘‘నేనండి మేషారు వున్నర్టగదండీ… చూడండ్చూడండి ఊళ్ళోనే వుండీ ఏవేనా గొడవలూగట్రా జరిగినయ్యా? లేదు గదండీ… నేన్చెప్పలేదండీ యీనే అనవసరంగానూ అందర్నీ కంగారు పెట్టీసారు. సాయంకాలం అటొస్తానండి… అంతేగదండీ… వుంటానండి’’

ఉన్నాడు… నిజంగానే ఉ… న్నా… డు… ఏదో ఒక అస్తిత్వం.

ఆ అస్తిత్వానికో అర్థం పరమార్థం లాంటివున్నాయా అన్నది అనవసరం… అర్థ రాహిత్యమనే చెత్తకుండీలో అర్థాన్ని దేవులాట్టం…

అతనున్నాడు… నీ… ల… కం… ఠ… మూ… ర్తి వున్నాడు.

అతని కారణంగా యింకొన్ని జీవితాలున్నాయి… అపెండిసెస్‌…. ఒక దాన్ని కరుచుకునింకోటి… దాన్ని కరుచుకునెన్నెన్నో… కుటుంబం వీధి… వాడ… గ్రామం… పట్టణం… నగరాలూ… దేశాలూ… లోకం… నాగరికతలూ… వ్యక్తీ…! నీకు వందనం…ఒకటికాదు శతకోటి…

థర్మాస్లో టీ కప్పులోకొంచుకుని…. సుభద్ర చెప్పిన మహర్షి కథ కోసం జ్యోతి తిప్పుతున్నా…

అవునూ సుభద్రిలా ఉదయాన్నే పండుకోదే! మెత్తగా వుందంది… ఏమిటో నలత…? పేపర్లు పక్కన సోఫాలో పారేసి లేచా… మడతలుగా పడుకునుంది. పడుకునుందంతే నిద్రపోటంలే… బ్రౌన్కలర్‌ మీద తెల్ల చుక్కల నైటిలో… పగటిపూట మడతలు పడిపోయిసుభద్ర… ఏమవుతుంది నాకు? నేనేమవుతా తనకూ?

ఆమె లోపల ఏ అగ్నిపర్వతాలున్నాయో? ఏ కల్లోల సముద్రాలున్నాయో! ఏ ప్రశాంత మైదానాలున్నాయో! యీ ప్రపంచంపట్ల ఎన్నెన్ని కోట్ల సమాధానాల్లేని ప్రశ్నలు పోగుపడివున్నాయో…. రేపటి పట్ల కోరికలూ… లేదా నిర్లిప్తతా… స్త్రీ సహజమయిన…స్త్రీత్వ కాంక్షలు ప్రాకృతికమయినవే… ఎన్ని… ఎన్నెన్ని..

అన్నింటినీ కుదించి కుప్పచేసి… ఆ అయిదున్నరడుగు దేహంలో కప్పెట్టుకుని.

‘‘ఏమైందీ?’’ కొంచెం వినపడేట్టే గట్టిగా అడిగా… కళ్ళమీద కప్పుకున్న మోచేయి తొలగించి… నావేపు వింతగా… కొత్తగా చూసి… పక్కకు వత్తిగిలి.

(సశేషం)

సమాంతర భాష: వొక సంభాషణ!

sach

 

1

కె. సచ్చితానందన్ కేరళకు చెందిన ప్రముఖ భారతీయ కవి, విమర్శకుడు, అనువాదకుడు.  ఈయన ఇంతవరకు    ఇరవైరెండు కవితాసంపుటులు, పదహారు అనువాద కవిత్వ సంకలనాలు, పంతొమ్మిది సాహిత్యవ్యాస సంపుటులు, నాలుగు నాటకాలు – వెలువరించారు.  ఆధునిక మళయాల సాహిత్యానికి బీజంవేసిన వారిలో సచ్చిదానందన్ ఒకరు.   సరళమైన భాష, కొత్తఒరవడి, ప్రతీకాత్మకత, సునిశితమైన వ్యంగ్యం వంటి లక్షణాలతో ఉండే సచ్చితానందన్  కవిత్వం దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకొంది.

2

ప్రశ్న: కవిత్వానికి తనదైన భాష ఉంటుందా? (A CONVERSATION WITH K. SATCHIDANANDAN ~ Rizio Raj  గారి ఇంటర్వూ లో ఒక ప్రశ్న)

సచ్చితానందన్ జవాబు:  కవి ఆత్మను సంపూర్ణంగా ఆవిష్కరించటంలో  భాష సరిపోదని కొన్ని కవితల్లో చెప్పాను. నేను వ్రాసిన కాక్టస్ అనే కవితలో, పదునుగా గుచ్చుకొనే సమాంతర భాష ఆవిష్కృతమవటం గమనించాను. ఉత్తర కేరళలో జరిగిన హింసాత్మక ఘటనలపై వ్రాసిన An attempt at Conversation  అన్న కవితకూడా అలాంటిదే. ప్రస్తుత కవులు- సంప్రదాయాల్ని, పునరుక్తుల్ని ధిక్కరించే కొత్త నుడికారాల్ని, భాషని వెతుక్కొని- నూతన తాత్వికతను, వినూత్న కోణాల్ని ఆవిష్కరిస్తున్నారు.

Tadeus Rozewicz – యుద్దానంతర కవిత్వం గురించి మాట్లాడుతూ- “ఆ కవిత్వం- భయకంపితమైన, కసాయివాళ్ళకు ఒదిలిపెట్టబడిన జీవన్మృతుల కొరకు వ్రాయబడి – తుక్కులోంచి తీసిన  పదాలతో, ఆకర్షణ లేని పదాలతో, కాపాడుకొన్నపదాలతో నిండి  ఉంటుంది” అంటాడు.  చివరకు కవిత్వం అంటే దాని పదాలే. Paz  “తన అస్తిత్వాన్ని తన పదాలుగా మార్చుకొన్నమనిషే కవి” అని అంటాడు. మనిషి- తనతో , ఇతరులతో, ప్రకృతితో , అగోచరత్వం తో చేసే సంభాషణలో కలిగే చిక్కులన్నీ అతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.

 

3.

“సంభాషించటానికి ఒక ప్రయత్నం” అన్న కవితలో సచ్చితానందన్ ఒక బీభత్స ప్రపంచాన్ని మనముందుంచుతాడు.  ఇది కవిత్వభాష.  వాచ్యం కాదు, ధ్వని పూరకం. మన చుట్టూ జరుగుతున్న హింసకు రక్తాన్ని ప్రతీకగా తీసుకొని చెపుతాడు. ఫుట్ నోట్సులు ఉండేది కవిత్వమే కాదు అని త్రిశ్రీ అన్నప్పటికీ ఈ కవితలో వచ్చే కొన్ని అంశాలకు ఇచ్చిన ఫుట్ నోట్సులు కవితను పరిపుష్టం చేస్తాయి. కొన్ని  పాతవిషయాల్ని సచ్చితానందన్ ఎలా ప్రస్తుతానికి అన్వయించాడో అర్ధమౌతుంది.

2వ ఖండికలో వచ్చే  Ezhuthachan, రాముని కథను రామచిలుక తో చెప్పించిన ప్రసిద్ద మళయాలకవి.

7వ ఖండికలో వచ్చే  Asan అనేది ఒక కవిపేరు. అతను  వ్రాసిన ఓ కవితలో సీత, రాముని పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుంది.

9వ ఖండికలో  “మన భాష చచ్చిపోయింది” అన్న వాక్యం వ్రాసి ఆత్మహత్య చేసుకొన్నది సుబ్రమనియదాస్ అనే ఓ యువ రాడికల్.

 

ఈ కవితలో ఖండికలన్నీ- కవి తనతో, సమాజంతో చేసే సంభాషణలు.  చెల్లాచెదురుగా, ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నప్పటికీ బీభత్సం, మానవత్వం రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగినట్లు- ఏదో ఏకసూత్రత    అన్నింటినీ బంధిస్తుంది.

ఈ కవితలో కనిపించే చేదు అంతా, ఒక కవి  అంతర్, బాహ్య లోకాలతో చేసిన సంభాషణలలో పలికిన చేదుగా అర్ధం చేసుకోవాలి.

 

 

సంభాషించటానికి ప్రయత్నంశ్రీ కె. సచ్చితానందన్

 

 

1
మనం ఒక కత్తినీడలో జీవిస్తున్నాం
ఎవరో పెంచిపోషించిన కత్తి అది.
ఎవరి హృదయమో చీల్చబడుతుంది.
ఆ రక్తం మనల్ని అంధుల్ని చేస్తుంది.
రక్తంలో స్నానం చేసి అన్నం తింటాం
రక్తంలో స్నానం చేసి ప్రేమించుకొంటాం
ఆఖరకు కలల్లో కూడా రక్తమే.
2

Ezhuthachan కు రామాయణ గాథ చెప్పిన రామచిలుక
మండేఎండలో టివి కేబుల్ పై విశ్రాంతి తీసుకొంటోంది
దాని ముక్కుపై నక్షత్రకాంతులు లేవు
దాని రెక్కలు కూడా రక్తమోడుతున్నాయి.
3

నాకు కన్నీళ్ళు లేకుంటే
నేనూ ఒక కత్తిగా మారి ఉండేవాడినేమో.
మా అమ్మ నాకు కన్నీళ్ళు ఇచ్చింది
ఆమె గొప్ప పాటకత్తె కాదు అయినప్పటికీ
ఆ స్త్రీమూర్తి సంగీతంలో నేను మునిగిపోయాను
4

నేను అమ్మాయినయితే బాగుండేదని ఆశపడేవాడిని
నా చిన్నతనంలో కళ్ళకు కాటుకపెట్టుకొని
పొట్టిగౌనులు వేసుకొని అద్దం ముందు ఆడుకొనేవాడిని
వద్దు వద్దు… ఏదో ఓ రాత్రిఫూట ఓ ఇరవై మందిచే
ఈ దేహం చీలి ఛిద్రమవటం నేను కోరుకోను.
నా సహచరీ! దయచేసి మూడో అమ్మాయిని ఈ లోకంలోకి తీసుకురాకు.
5

మా అమ్మ కన్నీళ్ళలో నేను పండించుకొన్న ముత్యాలు
ఏ సాగరాల్నీ వెలిగించలేక పోయాయి.
వాటి పిలుపును ఎక్కడో విన్న ఒకే ఒక్క అమ్మాయి
తన కనులు తెరిచి, ఓ పూవుగా మారింది
6

కత్తులు పూలగురించి మాట్లాడవు.
దారుల్ని, స్థలాల్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తుంటాయి
హృదయాల్లోకి చొచ్చుకొని అరుస్తాయి ‘నీ మతమేమిటి అంటో
పదాల్లోకి ప్రవేశించి గర్జిస్తాయి ‘నీదే పార్టీ అనీ.
7
Asan వర్ణించిన సీత
అడవికి, భర్త పేర్చిన అగ్నిపరీక్షకు మధ్య కూర్చొని
ప్రేమంటే ఏమిటో తొలిసారిగా నేర్పిన రావణుని త్యాగాన్ని
జ్ఞాపకం చేసుకొంటుంది.
ఆమె గర్భాశయం రాక్షస శిశువుని కాంక్షిస్తుంది
తన రావణుడు కోరుకొన్నంత బలంగా…
8
ప్రేమ పదాలు అన్నీ అయిపోయాయి
ఒక్కో పదము ఇప్పుడో పగిలిన సారాసీసా ముక్క
మనం ఒకరినొకరం దానితో గాయపర్చుకొంటూఉంటాం.
ఈ ప్రపంచం, కోర్టునోటీసులు మన తలుపులకు అంటించాకా
ప్రేమించుకోవటం అంటే ఒకరి రక్తం ఒకరు తాగటమే.
9
‘మన భాష చచ్చిపోయింది’ అన్న వాక్యం వ్రాసిన వాడు పారిపోయాడు
ఆ భేతాళ శవాన్ని మనమింకా మోసుకు తిరుగుతున్నాం
దాని ప్రశ్నలకు సమాధానాలు
పక్షి కువకువల్లో లేదా గజ్జెల గలగలల్లో ఎక్కడా లభించవు
10
తడబడుతూ మాట్లాడేవారు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు
నాలిక కత్తిరింపబడిన వ్యక్తి మాటల్లా నేను అస్పష్ట శబ్దాలు చేస్తున్నాను
అంతా కుదుటపడుతుందని, పూర్వస్థితి వస్తుందని ఏదో సంకేతం చెపుతుంది
నమ్మబుద్దికాక నన్నునేను కొరడాతో కొట్టి చూసుకొంటాను
11
బ్రహ్మపుత్ర నదీతీరాలపై గుల్మొహర్లు విచ్చుకొన్నాయి
నువ్వు ఈ గదిలో లేవు
నా భుజాలు మరల సలుపుతున్నాయి
మరో శవాన్ని మోయటానికేమో
లేక ఏ కత్తీ ఖండించలేని రెక్కలు మొలవటానికో

బయట నిప్పులు చెరిగే ఎండలో
జటాయువు తన తెగిన రెక్కల్ని తపతప లాడిస్తోంది

 

 

(An attempt at Conversation by Sri.K. Sachithanandam)

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

 

రహస్య గీతిక

satya1

చిత్రం: సత్యా సూఫీ

 ~
సగం నవ్విచ్చిమధ్యలో దూరం ఉందని గుర్తుచేసి
మౌనంగా నువ్వెళ్తున్నప్పుడల్లా
ఆపి చెప్పాలనిపిస్తుంది నేస్తం!…
అలవాటు కథగా కాలం అవతారమెత్తకముందే
నిన్నటి నీ గడపముందు నిరీక్షించి
వాడిపోయిన ఆ ఆశ అసలు అందం చూడాలంటే
నీ కళ్ళకి కాసింత ప్రేమ కూడా రాసుకోవాలనే
యుగాలనాటి నిజమైన రహస్యం…
సామాన్య న్యాయ శాస్త్రం ఋజువు చేయడం కోసం
అటునుంచి ఇటుకీ, ఇటునుండి అటుకీ
నిన్నే నువ్ పంచుకుంటూ రెండువైపులా
బరువు సమానమయిందా అని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది…
బతుకంటే బంధాల్ని
గణించే త్రాసు కాదు నేస్తం!
ఒకరి ఆనందం కోసం మరొకరు తగ్గే
తూగుడుబల్లేననే జీవిత రహస్యం…
గెలవడం, ఓడటం తప్ప
ఈ ఆటకు అంతం ఉండదని
నువ్ పిడికిళ్లు బిగించి
చూపులు రాజేస్తున్నపుడల్లా చెప్పాలనిపిస్తుంది నేస్తం!
ఎవరి బ్రతుకూ రణరంగం కాదూ
లోపల ఎవరితో వారు
ఓడిపోతూ చేసే అంతర్యుద్ధమనే యుద్ధ రహస్యం…
ఓ అనుకోని ప్రశ్న
ఈ వర్తమానం దారిమీద ఏ మలుపులోనో
ఎవర్నువ్వని ఎదురైతే,
నీ ఆలోచనని ఇదీ నేనని
పెదాల మీదకి అనువదించుకుని చెప్పాలంటే
ఈ భ్రమలాంటి అనుభవాల మధ్య,
లోపల నాకోసం ఇవ్వడానికి
కొంచెమైనా ఖాళీ మిగుల్చుకో నేస్తం అనే అసలు రహస్యం..

ఆదివాసీల కొత్త గొంతుక!

jacinta

జార్ఖండ్ రాంచిలో నివశించే 32 యేళ్ళ జసింత కేర్ కెట్టా వోరాన్ అనే ఆటవి తెగకు చెందిన వో సాహస పాత్రికేయురాలు,ఆవేశపూరితమైన కవయిత్రి.కార్పోరెట్ వుద్యోగాలను  వొదలి తను పుట్టిన, తాను సంబంధపడిన ఆదివాసి మూలాలలోని కష్టాలకూ,మౌఖికంగా,రాతపూర్వకంగా,కవితాత్మకంగా ఫుల్ టైం శ్రమిస్తూ,బయటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రకటిస్తున్న ధైర్యవంతురాలు.తన ఆదివాసి సమాజంలో బాలికలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆదివాణి అనే వో ప్రచురణ సంస్థను సొంతంగానే స్థాపించింది.

యీమె మొదటి కవితాసంకలనం అంగోర్ (నిప్పు) హిందీ ఆంగ్ల భాషల్లో వొకే సంకలనంగా విడుదలైంది.యిదేకాక హిందీ-జర్మన్ అనువాదం,హిందీ-డచ్ అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా గత మే నెలలో ప్రచురింపబడ్డాయి. యీమె కవితాసంకలనం వొక సంచలనం.భారత దేశంలో కంటే విదేశాల్లో అనేక స్పందనలు, అనేక సమీక్షలు వొచ్చాయి.

యీమె కవిత్వంలో అడవి సౌందర్యంతో పాటు ఆదివాసీల భయం, పీడన,అభద్రత,బయటి ప్రపంచపు దోపిడీ, వారి సంస్కృతి పరిరక్షణ,అడవిని తవ్వకాలపట్ల విపరీత వ్యతిరేకత కన్పించే ప్రధాన వస్తువులు.చిన్నప్పటి నుంచి నాలో యేదో బూడిదలో దాగిన నిప్పులా లోలోపల యెక్కడో దహించివేస్తుండేది-అది యిప్పుడు అర్థం అయి యీ బాటను యెంచుకున్నాను అంటోది జసింత. యీమె కవిత్వం చదువుతుంటే పాఠకుడిలో సంభవించే విస్పోటనాలు,కోపం,ఆవేశాలను, నొప్పినీ  పర్సానిఫై చేస్తుంది.

~

satya2

చిత్రం: సత్యా సూఫీ

సుడిగాలులు – దిక్కులు
——————————

యీ నేల పైన
పిడికెడు గింజలు
మిగిలివుండాలి
అందుకే వరిపొట్టు
తూర్పార పట్టేందుకు
నిలబడి వుందొక వూరు
వేడిగాలులకు యెదురుగా

యిలా పని చేస్తున్న వొక సాయం వేళ
పెంకుల రంధ్రాలలో నుంచి
చూసుకొంటోంది దీపపు వెలుగును
కాలిబాటల నుంచి నిశబ్దంగా నడిచి
వచ్చే సుడిగాలులను
పరుగెత్తుతున్న తాజావాసనపు వొరిగింజల నుంచి తీగలను
యెండ యొక్క నిప్పులాటి కత్తిపదునును, కొడవలిని
సుడిగాలుల వక్షస్థలంపై పూడ్చిపెట్టేందుకు..

తటాలున నిలబడి చూసి

వేగంగా వీస్తున్న గాలుల కత్తితో
ధృఢమైన వూరిగాయం పైన
దిక్కుల్ని చీల్చి వేస్తోంది

వారి చరిత్ర పాత గుడ్డపేలికే
అది తనని తాను
మెల్లమెల్లగా ఘాఢమైన చీకట్లోకి
వోదార్పునిచ్చే దిక్కుల ఆధీనంలోకి …

చివరికి దిక్కులు
వెలుగు అభయాన్ని యిచ్చి
సుడిగాలుల్లోకి తోసేస్తాయి

వూడ్చుకొంటారూ
అధికారమిచ్చి
అధికారాన్నే

“యీ నేలను కాపాడేందుకు
యెవరో వొకరూ
ప్రాణాలర్పించుకోక తప్పదు”.

మూలం :జసింత కెర్ కెట్టా

ఎవర్ని ప్రశ్నించాలి?!

 

ప్రజలు అనేమాట నాకు చాలా ఇష్టమైన పదం ఎప్పటికీ.

స్వేచ్ఛ అనేమాట ఒకప్పుడు అంటే యవ్వనంలో నాకు చాలా ఇష్టంగా వుండేది. కానీ కాలం గడిచేకొద్దీ ఆపదం ప్రచారం కావడం వెనక వున్న విస్తృతి అర్ధం అయ్యేకొద్దీ, పరిణామాలు చూసేకొద్దీ ఆమాటపై మోజు తగ్గిపోసాగింది. సరే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు పరిణామాలకి వారే బాధ్యులుగనక ఆవిషయం పక్కన పెడితే; సాహిత్యకారులు, రచయితలు మానవ సమాజాన్ని వ్యక్తీకరించడంలో, విశ్లేషించడంలో తమకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి అవసరం రాను రాను పెరిగిపోతున్న దశలో మనం ఉన్నామన్నది నా నిశ్చితమైన అభిప్రాయం.
లాజికల్ గా సరైనవి అనిపిస్తున్న విషయాలు అన్నీ సామాజికంగా సరైనవి అనడానికి లేదు.  ప్రతి అస్థిత్వ ఉద్యమమూ మనకి ఈవిషయాన్ని అనేక ప్రశ్నలతో, అనేక రుజువులతో బయటపెట్టాయి, నిరూపించాయి.  అయినాగానీ, సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా,  సామాజికాంశాలని లాజికల్ గా విశ్లేషించ బూనడం, వ్యాఖ్యానించడం కొందరు రచయితలు తరచూ  చేస్తుంటారు. వారు సమాజంలోని
అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ  కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు. అలాంటి వారు తమ వ్యాఖ్యానాలతో ప్రజలని తప్పుపట్టడం తరచూ చూస్తూ వుంటాం.  వారు అలా వ్యాఖ్యానించే స్వేచ్ఛని కాదనలేం గాని, అలాంటివారు విధిగా గ్రహించవలసిన విషయాలని తెలియ జెప్పడమే ఈ వ్యాసం యొక్క
సారాంశం.

*       *       *       *

ఇప్పటి సమాజం ఇలా వుండడానికి అంటే మనం తరచూ ఒక నిస్పృహతో భావిస్తున్నట్టు   కుళ్లిపోయినట్టు వుండటానికి ప్రభుత్వాలు, రాజకీయ
నాయకులే కారణమా? మనం (అంటే ప్రజలు) కారణం కాదా? అని తరచూ కొందరు ప్రశ్నించడాన్ని మనం చూస్తూవుంటాం.  కొందరినుండి వచ్చే ఇలాంటి ప్రశ్నలు లాజికల్ గా వినడానికి బాగుంటాయి గాని, అలాంటి ప్రశ్నలు సామాజిక బాధ్యతతో అడిగిన ప్రశ్నలు  ఎన్నటికీ కాలేవు.

ప్రజలు అనేపదం ఒక సమూహానికి పర్యాయంగా మనం వాడుతాము. ఆ సమూహంలో దొంగలు మొదలుకుని మేధావులు, సైంటిస్టులు, బాలురు, స్త్రీలు, వ్యాపారులు, ఉద్యోగులు, బిచ్చగాళ్ల వరకు… ఇలా అన్ని విభాగాలలోని వ్యక్తులందరినీ కలిపి ప్రజలు అని మనం పిలుచుకుంటాం.  ఈప్రజలని సాధారణంగా విడివిడిగా కొన్ని సాంప్రదాయ నియమాలతోబాటు వారి బుద్ది మరియు హృదయం నడిపిస్తు
ఉంటాయి.  ఇంకా వారి కుటుబ సభ్యులతో వున్న మానవ సంబంధాలు కూడా నడిపిస్తుంటాయి.  దైనందిన జీవితంలో వారి ప్రవర్తనలకి, ఎమోషన్లకి నియంత్రణ కలిగించే విషయాలు అనేకం వుంటాయి.  ఆర్ధిక స్థితి,  కులం, బంధుత్వాలు, సాంప్రదాయాలు వంటివి ఎన్నో విషయాలు  వారి ప్రవర్తనలని నిర్దేశిస్తుంటాయి. మీరు ఇలా ఇన్నిగంటలు ఈపని చెయ్యాలనే రూల్స్ ఏవీ ప్రజలపై వుండవు.

ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది దానిని  సక్రమంగా నడపడానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకుని, ఆపని చేస్తున్నందుకు జీతం పొందే వారితో ప్రభుత్వం నిర్వహించబడుతుంది.  ప్రతి అధికారికీ, ప్రభుత్వోద్యోగికీ జిల్లా కలెక్టర్ తో సహా తామెలా పనిచెయ్యాలో ఒక మాన్యువల్ వుంటుంది. అలా చేసినందుకు ప్రభుత్వం వారికి జీతంతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో గృహవసతి, ఆరోగ్య సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, పెన్షను, లోన్లు వంటివి ఎన్నో కల్పించి వారికి ఒక భద్ర జీవితాన్ని, వారి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునీ కల్పిస్తుంది ప్రభుత్వం.  వీరి పని ఏమంటే ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా నడిచేలా బాధ్యతతో, నిజాయితీతో,  పైన చెప్పుకున్న ప్రజలకి ప్రజా సౌకర్యాలకీ మేలు కలిగించే పని చెయ్యడం.
ఇప్పుడు విషయానికి వద్దాం.  ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న  కారణం  ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే.  ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై  విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ.  ఇలా కావడానికి వారే చెప్పే కారణం  ఉద్యోగుల ఉద్యోగం, వారి పిల్లల భవిష్యత్తు “ట్రాన్స్ఫర్స్” అనే పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం.

ఇకపోతే ప్రభుత్వాలని ఏలే పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్లని ప్రజలు తమ సంక్షేమం కోసం ఎన్నుకుని అసెంబ్లీ, పార్లమెంట్స్ కి ఎన్నిక చేసి పంపుతారు. కానీ కరెప్ట్ అయిన అధికార వ్యవస్థలన్నీ కూడబలుక్కుని లేదా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఎన్నికల భారతం ఒక తంతుగా మారిపోయింది. ఈక్రమంలో ఎన్నికలప్పుడు కార్పొరేట్ సెక్టార్ తమకి 5 యేళ్లపాటు అనుకూలంగా వుండటానికి సమకూర్చిన  నిథులతో డబ్బు, మద్యం పంపిణీ
చేసి, మీడియాని కొని, కోట్ల రూపాయల పబ్లిసిటీల ఖర్చుతో నాయకులు పుట్టుకొస్తున్న కాలం ఇది.  ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఈ నాయకులు కూడా
భారీగానే చట్టబద్దంగా జీతాలు తీసుకుంటారు. ఇక పోతే గెలిచాక మన ప్రభుత్వాలు, వాటి నాయకులు ఏమేం చేస్తున్నారనేది ఏరోజు ఏపేపర్ చూసినా ఏదోరకంగా క్లూ దొరికిపోతుంది.

ఇక్కడ మళ్లీ కొందరు  లాజికల్ గా, అమాయకంగా ఒక ప్రశ్న వేస్తారు. “ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం తప్పుగదా? డబ్బు తీసుకుని వాళ్లకి ఓట్లేసి
వాళ్లని గెలిపించేది మనమే ( అంటే ప్రజలే) కదా?” అని. ఇదెలా వుంటుందంటే, బస్సులోనో బజారు సెంటర్లోనో ప్రతి రోజూ ఒకమ్మాయి ఒళ్లంతా కామంతో చూసేవాడు; “నువ్వు చూడకపోతే నేను చూసినట్టు నీకెలా తెలుసు?” అని వాదించినట్టు వుంటుంది.

rafi1

ఎన్నికల్లో రాజకీయ నాయకులు డబ్బు పంచకుండా ఉండడానికి భారత దేశంలోని సకల అధికార యంత్రాంగాము ఉండికూడా దేశంలో వందల  కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతూనే వుంది. పట్టుబడ్డదే ఇంతింత వుంటే పంచుతున్నదెంత? ఎన్నికలంటే ఇన్ని దశాబ్దాలుగా నడుపుతున్న వారికెంత నిర్లక్ష్యమో అర్ధం అవుతుందిగదా!  పోనీ, ఎన్నికల సమయంలో  పదిమంది నాయకులు గుంపులు
గుంపులుగాగా ఇంటికొచ్చి నవ్వుతూ నమస్కారం పెట్టిపోయి, ఆరాత్రికి వాళ్ల అనుయూయులతో మనిషికి ఇంతని లెక్కవేసి రెండువేలో మూడువేలో కుటుంబపెద్ద  చేతిలో పెడితే తిరస్కరించ గలిగే ధైర్యం సగటు మనిషికి ఉంటుందా? ఈ విషయాలన్నీ  ఆలోచించకుండా “డబ్బు తీసుకుని ఓట్లేయడం తప్పుకదా?” అని ప్రశ్నించడం వాస్తవం పట్ల అవగాహన లేకపోవడమే అవుతుంది. రేపు ఆనాయకుడు గెలిస్తే మనకి ఏదైనా  పనిబడితే పొయ్యి పలకరించాల కదా? ఇక పోతే రెండవ విషయం సగటు ప్రజలు ఆర్ధిక దారిద్ర్యం వల్ల కూడా 500/1000 కాగితానికి
ప్రలోభ పడతారు. ఆ రంగురంగుల కాగితం అప్పుడు తప్ప చూడలేని వాళ్లు కోట్ల మంది.  నిజానికి నాయకుల  డబ్బు పంపకం కార్యక్రమం  అంతా  ఆర్ధికావసరాలు చుట్టు ముడుతున్న స్లంస్ మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.  ధనవంతుడు కట్టిన 33 అంకణాల్లో మూడో నాలుగో ఓట్లుంటే, అదే 33అంకణాల స్లం ఏరియాలో 30- 40 ఓట్లుంటాయి.

ఇప్పుడు ఈమూడు వర్గాల మధ్య వ్యత్యాసం గమనిస్తే…. ప్రజలేమీ నాయకులలాగా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల మాదిరి జీతం తీసుకోరు.
రెండుపూటలు తింటారో, ఒక పూట తింటారో, తాగతారో, తలకి పోసుకుంటారో, వీథుల్లో తన్నుకుంటారో గాని  ప్రభుత్వం నడవడానికి మాత్రం పన్నులు కడతారు. అంతకు మించి వ్యవస్థని, ప్రభుత్వాన్నీ నడిపించడంలో వారి పాత్ర శూన్యం. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మించి గద్దెనెక్కిన వారినీ, జాబ్ మేన్యువల్ ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులనీ వదిలేసి ”  ప్రజలని తప్పు పట్టడం  సామాజిక క్రమం అంతటిపట్లా అవగాహన ఉన్నవారు చెయ్యలేరు.

ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికీ; వారికి విద్య, జ్ఞానం, వైద్యం, భృతి, ఇవ్వడానికే, మంచి పౌరులుగా ఆత్మాభిమానంతో బతకడానికీ, చైతన్యవంతంగా సమాజాన్ని బాగు చెయ్యడానికీ  (ఎన్నికల ముందు చెప్తారు) నాయకులు గెలిచి జీతం తీసుకుని పని చేస్తున్నారు.  అందుకనే నాయకులు మెరికల్లాంటి IAS అధికార్లని తమ పియ్యేలుగా నియమించుకుంటున్నారు.  కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఈదేశంలోని మానవ వనరులు, భౌగోళిక వనరులు చూపి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, వాటిలో కమీషన్లు మింగి, అవి కట్టలేక అప్పిచ్చిన వాడు విధించిన షరతులతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరిగి పెరుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు  వీళ్ల అసమర్ధతకి, వీళ్ల
అవినీతి అక్రమాలకీ ప్రజలని ఎలా తప్పు పట్టగలం? ప్రజలు ఏం చేశారని తప్పు పట్టగలం?  అసలు నోరెలా వస్తుంది?  అందుకే పైన చెప్పిన మాటని మళ్లీ ఇక్కడ రాస్తాను.

రచయితలకి  సమాజం యొక్క వర్తమాన  పరిణామ క్రమాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. మనకి రాయడానికి, ప్రశ్నించడానికీ అందిన స్వేచ్ఛని  మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకుని, వ్యాఖ్యానిద్దాం. మనకున్న ప్రశ్నించే స్వేచ్చని రచయితలుగా మనం దుర్వినియోగ పరచకుండా జాగ్రత్త పడదాం! ప్రశ్నించ వలసిన వారినే ప్రశ్నిద్దాం!

ఇప్పుడిక నా వ్యాసాన్ని ప్రముఖ రచయిత చెప్పిన ఆణి ముత్యాల్లాంటి రెండు మాటలతో ముగిస్తాను.

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

*       *       *       *