Archives for June 2015

స్వేచ్ఛ

prajna

ప్రజ్ఞ వడ్లమాని

“వైష్ణవ జనతో తేనె కహియెజే…………”                            “వానా వానా వెల్లువాయే..”

“పీడ్ పరాయీ జానేరే……….”                                            “కొండా కోనా తుళ్లిపోయే..”

“ఏంటి శరత్ ఇదీ? స్కూల్ అసెంబ్లీ లో మెడిటేషన్ జరుగుతున్నప్పటినుండీ చూస్తున్నాను. అక్కడ పెద్ద పెద్ద స్పీకర్ లలో నుండి ఆ సినిమా పాటలు మోగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఏమీ పట్టనట్టు మెడిటేషన్ , ప్రేయర్ జరుగుతూనే ఉంది?” అడిగింది పవిత్ర.

“మరి స్కూల్ కి ఎదురుగ్గా ఫంక్షన్ హాల్ ఉంటే, వీళ్ళు మాత్రం ఏం చేస్తారులే. సర్దుకుపోవాలి అంతే” శరత్ అన్నాడు.

“నీకేమో గాని, నాకు టూమచ్ అనిపిస్తోంది”

“తల్లీ మొదలెట్టకు. ఎప్పటినుండో మంచి పేరున్న స్కూల్ ఇది. ఇంకా ఇప్పుడే అడుగుపెట్టాము. పద ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్దాము”

పవిత్ర, శరత్ లు వారం క్రితమే అమెరికా నుండి ఇండియా కి షిఫ్ట్ అయ్యారు. ఇద్దరూ బాగా సంపాదించి, ఇండియా లోనే ఏదైనా బిజినెస్ పెడదామని అనుకున్నారు. వాళ్ళకి  నాలుగేళ్ల పాప ఉంది. ప్రి-స్కూల్ అయ్యాక పాపని ఇప్పుడు ప్రైమరీ స్కూల్ లో చేరిపిద్దామని, ఇద్దరు ఒక కొర్పోరేట్ స్కూల్ కి వచ్చారు.

“మెట్లు కనిపించడం లేదు, బిల్డింగ్ మాత్రం ఇంత పెద్దగా ఉంది?”

“ఎంటే బాబు నీ డౌట్లు. అక్కడ లిఫ్ట్ ఉంది కనిపించడంలేదా? పద అటు వైపు” శరత్ కసురుకున్నాడు.

“స్కూల్ లో లిఫ్ట్ ఏంటి నా మొహం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైస్ ఉండాలిగా?” లిఫ్ట్ ఎక్కుతూ పవిత్ర అంటోంది.

“మన కాలంలా అనుకుంటున్నావా? అన్నీ మారిపోయాయి. సరేలే ఆపు.. ఉష్” అని ప్రిన్సిపల్ ఆఫీసు తలుపు తీస్తూ, “మే ఐ కమిన్ మేడమ్” అని అడిగాడు.

“షూర్ రండి రండి” అని ఇద్దరినీ లోపలికి రమ్మంది ప్రిన్సిపాల్ అర్చన. పేరుకే ప్రిన్సిపాల్, వయసు ముప్పై కూడా ఉండవు. ఆమె సైగ చేయగా  వాళ్ళిద్దరూ కూర్చున్నారు.

“నా పేరు శరత్ . కిందటి వారం అపాయింట్మెంట్ తీసుకున్నాము. మా పాప గురించి…”

“ఓ మీరా, యా యా, నాకు గుర్తుంది. మీకోసమే అదిగో అతను ఎదురుచూస్తున్నాడు” అని అక్కడే నించున్నతని వైపు చూసి, “మిష్టర్ రవి, వీళ్ళని స్కూల్ టూర్ కి తీసుకువెళ్ళండి. అయిపోయాక మిగితా విషయాలు మాట్లాడుకుందాము” అని మళ్ళీ పవిత్రా వాళ్ళ వైపు తిరిగి, “హి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ” అని అర్చన గబగబా చెప్పేసి రూమ్ నుండి వెళ్లిపోయింది.

ఇంత చిన్న వయసులో ఈమెకి ఎన్ని బాధ్యతలో అని ఆలోచిస్తున్న  శరత్ ని రవి, “సర్ వెళ్దాము రండి” అన్నాడు.

కారిడార్ లో కాసేపు నడిచాక ఒక రూమ్ దగ్గర ఆగి, “ఇది క్లాస్రూమ్ సర్. అన్నీ ఇలాగే ఉంటాయి. ఇవాళ స్కూల్ ఉంది కదా, అందుకే లోపలికి వెళ్లలేము. బయట నుండే చూడండి. ప్రతి క్లాస్ లో కనీసం వంద మంది స్టూడెంట్స్ ఉంటారు” అన్నాడు.

“వంద మంది కొంచం ఎక్కువేమో? అందులో సగం ఉన్నా ఎక్కువే!” పవిత్ర ఆశ్చర్యంగా అడిగింది.

“లేదు మేడమ్. ఈ మధ్య అన్నీ స్కూల్స్ లో ఇలాగే ఉంటోంది. పైగా మా స్కూల్ లో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉంటారు” రవి అన్నాడు.

“బ్లాక్ లేదా గ్రీన్ బోర్డు ఏది?” పవిత్ర కి డౌట్ రానే వచ్చింది.

“మేడమ్ ఈ కంప్యూటర్ యుగంలో బోర్డు ఏంటి మేడమ్. అదిగో స్క్రీను, ఇదిగో కంప్యూటర్. అంతా డిజిటల్ అయిపోయింది గా.  టెక్నో ఎడ్యుకేషన్ అంటారు దీనినే” అని నవ్వుతూ రవి చెప్పాడు.  శరత్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.

“అది సరే, కిటికీలు ఏవి? గాలి కూడా టెక్నో నా?” పవిత్ర వెటకారంగా అడిగింది.

“భలే జోకు వేశారు మేడమ్. రూమ్స్ అన్నీ ఏ‌సి కదా. అందుకే కిటికీలు ఉండవు. కొన్ని రూమ్స్ లో మాత్రం  ఫాన్స్ ఉంటాయి” ఏదో పెద్ద మెహెర్బానీ చేసినట్టు చెప్పాడు రవి. ముగ్గురూ ముందుకి సాగారు.

శరత్ ఏమీ మాట్లాడలేదు. పవిత్ర మాట్లాడేలోపు రవి “మేడమ్ ఇది క్రాఫ్త్స్ రూమ్. చూసారా ఆ బొమ్మలు, ఫ్రేమ్లు ? అవన్నీ మన స్కూల్ స్టూడెంట్స్ చేసినవే” . రవి ‘మా స్కూల్’ నుండి ‘మన స్కూల్’ కి తనమాటని మార్చడం శరత్ గమనించాడు.

swechcha.pragna

Image: Bhavani Phani

“రూమ్ కొంచం చిన్నగా ఉంది? స్టూడెంట్స్ ఒక్కో క్లాస్ లో వంద మంది అన్నారు? సరిపోరేమో కదా?” అని పవిత్ర అడిగింది.

“లేదు లేదు మేడమ్. ఇదీ కేవలం అమ్మాయిలకే. గర్ల్ స్టూడెంట్స్ ఓన్లీ. అబ్బాయిలకి సేమ్ పీరియడ్ లో గేమ్స్ అండ్ స్పొర్ట్స్ ఉంటాయి”

“మరి అమ్మాయిలకి స్పొర్ట్స్ ఉండవా?” శరత్ మొదటి సారి ఒక ప్రశ్న అడిగాడు.

“లేదు సర్. అమ్మాయిలకి క్రాఫ్త్స్. అబ్బాయిలకి స్పొర్ట్స్. మీ సందేహం నాకు అర్ధమయ్యింది సర్. మళ్ళీ ఇద్దరికీ పీటీ అదే ఫిజికల్ ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, నెలకి ఒకసారి” అని రవి మళ్ళీ, “పదండి సర్ కంప్యూటర్ లాబ్ చూపిస్తాను”

“మనం ఇంజనీరింగ్ అప్పుడు లాబ్ లు చూసినట్లు ఏంటి శరత్ ఇదీ? చిన్నపిల్లల స్కూల్ లాగా లేదు” అని శరత్ చెవిలో పవిత్ర చెప్పి, “ఇప్పుడు అన్నీ రూమ్స్ లో కంప్యూటర్లు చూసాంగా, అవే లాబ్ల లాగా ఉన్నాయి” గట్టిగా, వ్యంగ్యంగా అంది.

“హ హ హ, మీరు భలేగా కామెడీ చేస్తున్నారు మేడమ్” అని రవి నవ్వుతూనే లాబ్ చూపించాడు. పవిత్ర, శరత్ లు మాత్రం నవ్వలేదు.

“బ్రేక్ అనుకుంటాను, పిల్లలు బయటకి వస్తున్నారు” పవిత్ర అంది.

“అవును మేడమ్. ఇప్పుడు లంచ్ బ్రేక్”

“ఎన్ని బ్రేక్లు ఉంటాయి మొత్తం?” పవిత్ర ఒక పేపర్ తీసి రాసుకుంటోంది.

“రెండు మేడమ్. లంచ్ బ్రేక్ అండ్ డిన్నర్ బ్రేక్”

తల పైకి ఎత్తి, “డిన్నర్ బ్రేక్ ఏంటి? డిన్నర్ ఇంట్లో చేయరా పిల్లలు? ఇదీ రెసిడెన్షియల్ స్కూల్ కాదు గా” పవిత్ర షాక్ అయింది.

“కాదు మేడమ్. స్టూడెంట్స్ ఇంటికే వెళ్తారు. తొమ్మిదింటికి స్కూల్ అయిపోతుందిగా. సొ లంచ్ బ్రేక్ పన్నెండింటికి, డిన్నర్ బ్రేక్ రాత్రి ఏడింటికి అన్నమాట” రవి చెప్పాడు.

“సారీ. నాకు సరిగ్గా అర్ధంకాలేదు. స్కూల్ టైమింగ్లు ఏంటి?” పవిత్ర సందేహాస్పదంగా అడిగింది.

“నైన్ టు నైన్ మేడమ్, మీరు స్కూల్ బ్రోషర్ లో చదవలేదా? ప్రిన్సిపల్ ఆఫీసు కి వెళ్దాము, ఆవిడ అన్నీ వివరంగా చెప్తారు మీకు” అని వాళ్ళని ప్రిన్సిపల్ ఆఫీసు దగ్గరకి తీసుకొచ్చి రవి వెళ్లిపోయాడు.

“పవిత్రా, మనం ప్రేయర్ టైమ్ లో అక్కడే ఉన్నాము కదా? నీకు ప్లే గ్రౌండ్ కనిపించిందా?” శరత్ సీరియస్ గా అడిగాడు.

“లేదు. నేనే ఆ విషయం అడుగుదామనుకున్నాను. కానీ ‘అన్నీ డౌట్లే’ అని అంటావని అడగలేదు. ఏంట్రా బాబు ఈ స్కూల్ అసలు? వామ్మో” పవిత్ర అంటుండగానే శరత్ రై రై మనుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ లోకి తలుపు కొట్టకుండానే వెళ్లిపోయాడు.

“మేడమ్….” అని శరత్ మాట్లాడుతుంటే అర్చన కట్ చేసి, “మిష్టర్ శరత్, స్కూల్ నచ్చిందా? ఫీ వివరాలు మాట్లాడుకుందామా? ఏ‌సి బస్ అయినా కూడా నార్మల్ చార్జెస్ ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు…” అని ఆవిడ ఇంకేదో చెప్తుండగా అక్కడ ఉన్న బల్ల ని గట్టిగా కొట్టి శరత్, “ అసలు ఇదొక స్కూల్ ఆ?”

“ఏంటండీ మీరు అనేది?” అర్చన ఆశ్చర్యంగా అడిగింది.

“నేనొకటి అడుగుతాను మీరు ఏం అనుకోకుండా సమాధానం చెప్పండి”

“ఏంటది”

“మీ క్వాలిఫికేషన్స్ ఏంటి?”

“మిష్టర్ శరత్” అని గట్టిగా అరిచింది అర్చన.

ఆ అరుపు కి అక్కడ ఉన్న కొంత మండి స్టాఫ్ పరిగెట్టుకుంటూ ఆ ఆఫీసు కి వచ్చారు. ఏం జరుగుతోందో అన్న కుతూహలం, ఆతృత వాళ్ళ మొహంలో కనిపిస్తోంది.

“చెప్పండి. మీరు చాలా చిన్న వయసు వారు, మీకు ఇంత తొందరగా ప్రిన్సిపాల్ జాబ్ ఎలా వచ్చింది?”

Kadha-Saranga-2-300x268

“మా అమ్మ ఇదివరకు ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉండేది. నేను మాస్టేర్స్ చేసొచ్చాక అమ్మ ని రిటైర్ అవ్వమని చెప్పి,  నేను తీసుకున్నాను ఈ బాధ్యత. అయినా అవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు? అసలు మీకు ఏం కావాలి? మీకు స్కూల్ నచ్చకపోతే ఏం గొడవ చేయకుండా వెళ్లిపోండి” అర్చన ఆవేశంలో ఊగిపోతూ చెప్పింది.

“స్కూల్ నచ్చడమా? స్కూల్ లో గ్రౌండ్ ఏది? స్పొర్ట్స్ పీరియడ్ లో ఏం చేస్తారు పిల్లలు? ఓహ్ సారీ, మగ పిల్లలు. ఆడపిల్లల్ని స్పొర్ట్స్ కి అనుమతించరా? ఇదెక్కడి పాలసీ? ఏం ఆడపిల్లలకి ఆటలు ఆడుకోవాలని ఉండదా? అలాగే మగపిల్లలకి క్రాఫ్త్స్, ఆర్ట్స్ అంటే ఇష్టాలు ఉంటాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇంత వివక్ష చూపిస్తున్నారా? వీళ్ళకి స్వేచ్ఛ లేదా? రేపొద్దున సమాజంలో వీళ్ళకి ఒకరిపట్ల ఒకరికి ఇంక గౌరవం ఏముంటుంది?”

“ఇది మా స్కూల్ పెట్టినప్పటి నుండి ఉన్న రూల్స్ అండీ, ఎలా మారుస్తాము? అయినా చదువు మాత్రమే ఇంపార్టంట్. దీనిని మీరు అనవసరంగా చాలా పెద్దది చేస్తున్నారు” అర్చన భావరహితంగా చెప్పింది.

“ఓహో అలాగా? అయితే మరి బ్లాక్ బోర్డుల బదులు కంప్యూటర్ లతో చదువు చెప్పటం కూడా ఉండేదా ఇదివరకు? రూల్స్ అన్న పేరుతో ఇష్టమొచ్చినట్లు చేస్తే మీ మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందేమో, మేము ఒప్పుకోము” పవిత్ర  ఖచ్చితంగా చెప్పేసింది.

“ఇందాక అన్నట్లే మీరు వెళ్లిపోవచ్చు. మీ పాపని మా స్కూల్ లో అడ్మిట్ చేయమని నేనేమీ మిమ్మల్ని బ్రతిమిలాడట్లేదు” అర్చన కూడా దృఢంగా చెప్పింది.

“అంతే గాని, మీ పద్దతులు మార్చుకోరన్నమాట!” కోపంగా శరత్ అన్నాడు.

“ఎన్నేళ్ళ నుండో ఈ స్కూల్ నడుస్తోంది. మా స్కూల్ కి చాలా మంచి పేరు ఉంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి?”

“స్కూల్ కి ఎదురుగ్గా ఒక పెళ్లి హాల్. స్కూల్ మైన్ రోడ్ మీద ఉంది, అక్కిడెంట్స్ అవ్వటానికి చాలా ఆస్కారముంది. స్కూల్ లో గ్రౌండ్ లేదు. ఆడపిల్లలకి గేమ్స్ పీరియడ్ లేదు. రూమ్స్ లో కిటికీలు లేవు, అంటే స్వచ్ఛమైన గాలి లేదు, అన్నిటికంటే దారుణమైనది స్కూల్ టైమింగ్.. పన్నెండు గంటలు పిల్లలు స్కూల్ లో ఉంటారు. పోనీ మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా అంటే రెండే రెండు ..రెండు కలిపి ఒక గంట సమయం. వీళ్ళని పిల్లలు అనుకుంటున్నారా ప్రెషర్ కుకెర్స్ అనుకుంటున్నారా? ఇది స్కూల్ కాదు జైలు .. నా పాపని చచ్చినా ఈ స్కూల్ కి పంపను”

“అన్నీ ప్రైవేట్ స్కూల్స్ ఇలాగే ఉన్నాయి మిష్టర్ శరత్” ఏమి పట్టనట్టుగా అర్చన అంటుంటే, శరత్ “గవర్నమెంట్ స్కూల్ లో వేస్తాను లేదా నేనే చదువు చెప్తాను కానీ ఇలాంటి జైళ్ళకి నేను నా కూతుర్ని పంపనే పంపను” అని అరుచుకుంటూ బయటకి వెళ్లిపోయాడు.

ఆరేళ్ళ తరువాత

“ప్రిన్సిపాల్ మేడమ్, మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తూ లెటర్ వచ్చింది” ప్యూన్  వచ్చి చెప్పాడు.

“వావ్, ఎవరు? ఏంటి విశేషం?”

“స్వేచ్ఛ స్కూల్ అయిదేళ్ళ ఆన్యువల్ ఫంక్షన్, ఈ ఆదివారం”

“తప్పకుండా వెళ్దాము. మన లాంటి పెద్ద స్కూల్ వాళ్ళు అక్కడికెళ్తే అలాంటి చిన్న స్కూల్స్ కి మంచి పేరు” అర్చన అంది.

ఆదివారం స్వేచ్ఛ స్కూల్ కి చేరుకున్నాక, అక్కడ పవిత్ర, శరత్ లని చూసి, గుర్తుపట్టి అర్చన ఆశ్చర్యపోయింది. స్వేచ్ఛ స్కూల్ స్టాఫ్ కొంతమంది అర్చనకి స్కూల్ మొత్తం చూపించారు. పెద్ద గ్రౌండ్, ఆవరణమంతా ఎన్నో చెట్లు, క్లాస్ రూమ్స్ లో ఏ‌సి కాదు కదా, ఫ్యాన్లు కూడా లేవు. అలాగని పాతకాలపు స్కూల్ ఏమీ కాదు. ఆధునిక లాబ్లు కూడా ఉన్నాయి. అర్చన కి లోపల ఒక గిల్టీ ఫీలింగ్ మొదలయింది. తను కూడా ఇలాంటి స్వచ్చమైన వాతావరణంలో చదువుకుంది. తను ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్ లో చాలా మంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా, నిస్సహాయంగా కనిపిస్తూ ఉంటారు. ఆదే ఈ స్వేచ్ఛ స్కూల్ లో పిల్లలు ఎంతో చురుకుగా, సంతోషంగా ఉన్నారు.  ఒక బిజీ సిటి నుండి ఒక ప్రశాంతమయిన పల్లెటూరికెళ్తే వచ్చే భావన. పదేళ్ళలో ‘బెస్ట్ ప్రిన్సిపాల్’ గా ఎన్నోసార్లు ఎంతో మంచి పేరు,  ఎన్నో అవార్డులు సంపాదించుకుంది. ఎన్నో స్కూళ్ళు అర్చననే ప్రిన్సిపాల్ గా జాయిన్ చేయించుకోవాలనుకున్నాయి. అంత గొప్ప స్థాయి కి చేరుకున్నా, ఏదో అసంతృప్తి. తను చేసిన తప్పు ఏంటో, ఈ మెకానికల్ ప్రపంచంలో తను కూడా ఇమిడిపోయి ఎంత మారిపోయిందో అర్చన గ్రహించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. ఫంక్షన్ మొదలయింది.

పవిత్ర స్టేజ్ మీద మైక్ లో “అందరికీ నమస్కారం. మీకో నిజం చెప్పాలి. మేము ఒక స్కూల్ ప్రారంభిస్తామనే అనుకోలేదు. నేను, మా వారు శరత్ అమెరికా నుండి ఇక్కడికొచ్చి ఒక బిజినెస్స్ ప్లాన్ చేశాము. కానీ జీవితం ఎల్లప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు కదా. ఈ కాలంలో ఎంతో కమ్మెర్షియల్ గా తయారయిన స్కూల్స్ ని చూసి, శరత్, నేను కలిసి ఒక స్కూల్ పెట్టాలని సంకల్పించాము. ఒక అద్దె బిల్డింగ్ లో మా స్కూల్ ప్రస్థానం మొదలయింది. మాకు ముందుగా ఎవరు సహాయపడలేదు.  కానీ మా విద్యా పద్ధతులు, పిల్లలకి జ్ఞానం పంచే విధానం నచ్చి చాలా మంది సహాయం చెయ్యడానికి ముందుకి వచ్చారు. రెండేళ్లకి  స్కూల్ లో కౌంట్ – మూడు వందల మంది స్టూడెంట్స్, పది మంది టీచేర్స్.   అంచలంచెలుగా ఎదిగి ఇదిగో అయిదేళ్ళకి ఇక్కడకి చేరుకున్నాము. ఇప్పుడు స్కూల్ లో వెయ్యి కి పైగా స్టూడెంట్స్, పాతిక మంది టీచింగ్ స్టాఫ్. ఒక స్కూల్ కి రాంకులు వస్తే గొప్ప కాదు. ఆ స్కూల్ లో పిల్లలు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళని ఆ స్కూల్ ఎంత తీర్చిదిద్దింది అన్నదే గొప్ప. మా స్వేచ్ఛలో విద్యార్ధులకి మానసిక విద్య , క్రమశిక్షణ తో పాటు శారీరక వ్యాయామం, సామాజిక స్పృహ, యోగా, సంగీతసాహిత్యాలతో పాటు ఇంకా ఎన్నో విద్యల పట్ల అవగాహన ఉంటుంది.  ఒక స్కూల్ లో విజ్ఞానం తో పాటు వికాసం కూడా ఉండాలి అన్నది మా నమ్మకం. ఆదే మా స్వేచ్ఛ స్కూల్ యొక్క లక్ష్యం కూడా. ఇప్పుడు మన ముఖ్య అతిధి అర్చన గారిని మాట్లాడమని కోరుతున్నాను”

పదే పది క్షణాల గాప్ లో  అర్చన మైక్ తీసుకుని, “ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న స్కూల్ లో రాజీనామా చేస్తున్నాను. సందేహం లేకుండా ఆ స్కూల్ నాకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. కానీ నాకు జాబ్ లో తృప్తి లేదు. నీరసంగా ఉండే పిల్లల్ని చూసి నేను కూడా నీరసపడిపోతాను రోజు. ఇవాళ ఇక్కడ స్టూడెంట్స్ ని స్వేచ్ఛగా చూశాక, నేను కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాను. అందుకే పవిత్ర, శరత్ లని నాకు ఒక టీచర్ పోస్ట్ ఇప్పించమని కోరుతున్నాను” అని పవిత్ర, శరత్ వైపు తిరిగి ‘సారీ’ ఫీల్ అవుతునట్లు దణ్ణం పెట్టింది.

శరత్ మైక్ తీసుకొని, “స్వేచ్ఛ కి ఇవాల్టి నుండి కొత్త ప్రిన్సిపాల్, అర్చన గారు” అని అనగానే హర్షద్వానాలు మొదలయ్యాయి.

****

నీలో రాలే చంద్ర కాంతలు ….

మమత వేగుంట

 

వెన్నెలతో వెలిగిపోతోంది చీకటి ఆకాశం!

నక్షత్రాల మెత్తని కాంతిలో తడుస్తోంది.

 

చంద్రకాంతలన్నీ ఒక గాలి తరగలాగా నేలవైపు తరలివస్తున్నట్టే వుంది.

నేల దేహంలోకీ, నీలోకీ తీయతీయని పరిమళం ప్రవహిస్తోంది.

ఈ నడుమ మధ్యలో ఎక్కడో ఒక మేషం గొంతు విప్పుతోంది.

అదే కదా, గాంధారం! సప్తస్వరాల్లో మూడో స్వరం.

 

రాగ బిహాగ్ కి “గ” వాది స్వరం. బిహాగ్ శృంగార రస ఉత్సవం.

రాత్రి రెండో ఝాములో రాగాల పండగ.

ఒక అనిర్వచనీయమైన మాధుర్య ఆకర్షణ ఏదో ఈ రాగంలో వుంది,

అది పట్టుకోవాలని ఈ చిత్రంలో నా వెతుకులాట.

 

చంద్రకాంత పందిరి కింద నెమ్మదిగా నిద్రలోకి జారుకునే వేళ

సుదూరం నించి నీ వైపే వస్తున్న ప్రేమ గీతాన్ని విను! విను!

 

Mamata 1

వస్తువులు చెప్పే మన ఆత్మకథలు!

కందుకూరి రమేష్ బాబు

 

Kandukuri Rameshహ్యూమన్ ఎలిమెంట్ అన్నది ఫొటోగ్రఫిలో మంచి చర్చనీయాంశం.

ముఖ్యంగా భవనాలు, సౌధాలు, ఆలయాలు – వీటిని మనిషి ఉనికి లేకుండా తీయడంతో అవి బోసిపోయి కనబడతాయి. ఒక్కోసారి – ఒక్క మనిషి అయినా చాలు, అవి ప్రాణం పోసుకుని దివ్యంగా శోభిల్లుతాయి.
అట్లా మానవీయ అంశంతో తమ ఛాయాచిత్రకళను మరొక అడుగు ముందుకు వేయించిన ఫొటోగ్రాఫర్లు మనకు కొద్దిమంది ఉన్నారు. కానీ, చిత్రమేమిటంటే కొన్ని చిత్రాలు. వాటిలో హ్యూమన్ ఎలిమెంట్ అన్నది లేదన్న విమర్శా వస్తుంది. కొన్ని చిత్రాల్లో మానవాంశం మచ్చుకు కూడా లేదని అంటూ వుంటే నవ్వే వస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రం చూడండి.
ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కడుంది.
లేదు కదా!

అందుకే ఈ దృశ్యాదృశ్యం.+++

నిజమే.
ఇది వట్టి ఇస్త్రీ పెట్టె.
అంతేనా?

అవును.

+++

ఒక్క ఇస్త్రీ పెట్టే కాదు, చాలా వుంటాయి ఇలా.
మనం వాడుకుని తర్వాత వాడని సమయంలో ఇలా వదిలేసినవి లెక్కకు మిక్కిలే వుంటై.

ఒక్కోసారి దానికి గాలి అవసరమా, లేదా అని కూడా మనం గమనించం.
వెలుతురు అవసరమా వొద్దా అన్నది కూడా ఆలోచించం.
కానీ. అలా కింద వుంచుతాం లేదా తోసేస్తాం.

మంచం కిందికి కొన్ని,అటక మీదికి కొన్ని.
చాలా సార్లు అందుబాటులో వుంచుకునేంత దూరంలో పక్కకు పెడతాం లేదా నెడతాం.
ఇదొక్కటే కాదు, చాలా.+++

కిచెన్ లో కావచ్చు, డ్రాయింగ్ రూంలో కావచ్చు…
డ్రెస్సింగ్ టేబుల్ పై కావచ్చు, టీపాయి పైన కావచ్చు..
కంప్యూటర్ టేబుల్ పైన కావచ్చు లేదా ఆల్మారాలో కావచ్చు…
ఎన్నిటినో మనం అలా పక్కన పెడతాం.

ఎప్పుడైనా చూడండి.
మనిషిని చూసినట్టు చూడండి.
చూస్తే ఎప్పుడైనా అవి బికారిగా. నిరాశగా మీకు కనిపిస్తాయా?

పోనీ, ఉదాహరణకు ఒక వాడని ఒక గడియారం. అది షెల్పులో ఉంటుంది. చూడండి దాన్ని.
లోన ముళ్లు తిరుగుతూనే ఉంటుంది. కానీ దుమ్ముపట్టుకుని వుంటుంది. దాన్ని చెవికి ఆనించుకుని వింటే  అది చాన్నాళ్లుగా మనిషి కేసి కొట్టుకుంటూ వుంటుందని తెలుస్తుంది. తెలిసిందా?పోనీ కళ్లద్దాలే చూడండి.
వాటిని ధరించినప్పుడు వాటి ఉనికే మనకు తెలియదు.
కానీ, తీసాక వాటికి తలా ముక్కూ చెవులూ ఏవీ వుండవు.
ముడుచుకుని తమలోకి తామే తొంగి చూసుకుంటూ ఉంటై.

చూశారా?
ఎప్పుడైనా ధరించని కళ్లద్దాలకేసి తదేకంగా చూశారా?

ఎన్నడైనా, ఆ కళ్లద్దాలను రెగ్యులర్ గా పెట్టే ప్లేసులో కాకుండా అప్పుడప్పుడూ వేరే చోట పెట్టి వదిలేసినప్పుడు అవి మనకోసం వెతుకులాడాయని గమనించారా?

చెప్పులు.
తొడగని చెప్పులు, బూట్లు.
వాటి సంగతైతే ఇక చెప్పరాదు.
అవి మళ్లీ వేసుకోవాలనుకుంటే తుడవాలి.
తుడవాలంటే మనకే భయం.
అంత భయం ఎవరివల్ల?
మనవల్లే కదా?

కానీ, ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు ‘మానవాంశం’ లేదని మాత్రం అనిపిస్తుంది.
కానీ, ఆ మాట అవి అనాలి, మన గురించి.

+++

నిజం. ఎవరింటికైనా వెళితే ఇవన్నీ కనబడుతూ ఉంటై. ఆయా వస్తువులు మాట్లాడుతూ ఉంటై కూడా. తాము ఏం పని చేశామో చెప్పడానికి నోరు తెరుస్తూ ఉంటై. కానీ, యజమాని భయానికి అవి మూగబోతూ ఉంటై,  చిన్న పిల్లల్లానే.

అవును మరి. వాటితో మనం ముచ్చటించాలంటే పర్మిషన్ వంటిదేదో కావాలి. కానీ వొద్దంటారు. ‘అవెందుకు దించుతున్నవ్’  అని అడ్డుపడుతుంటారు. దాంతో వేర్వేరు చోట్ల నుంచి అనేకానేకం కెమెరా కంటికేసి భేలగా చూస్తూ ఉంటై. నిర్తిప్తంగా, నిస్సహాయంగా వాపోతాయి. పనిలో లేని లేదా ఒక్కోసారి పనికిరానివి అనుకునేవన్నీ ఇలా కెమెరా కంటికి అయిస్కాంతానికి ఇనుప రజను అతుక్కున్నట్టు అతుక్కుంటై.

ఇదంతా ఎందుకూ అంటే, ఫొటోగ్రఫీలో మానవాంశం అన్నదాని గురించి కొత్తగా చూసుకోవాలని!
నిజం. దృశ్యాదృశ్యం అందుకే!

+++

చెప్పులు, కళ్లద్దాలే కాదు, జడ పిన్నులు కూడా.
అవి డ్రెసింగ్ టేబుల్ దాటి ఒక్కోసారి వేరే చోటకు చేరుతాయి.
మరి ఏం చేస్తూ ఉంటై?
వెతుకుతూ ఉంటై!
ఒళ్లంతా కళ్లు చేసుకుని వెతుకుతై.

బీరువా.
అవును. దాన్నీ ఒకసారి తెరిచి చూడండి.
పట్టు చీరలు కావచ్చు, ఇతర చీరలు కావచ్చు.
ఒక పద్దతిలో అవన్నీ ఒద్దికైన స్త్రీల్లా మర్యాదా మన్ననలతో అలా నీరసిస్తూ ఉంటై.
బయటకు ఎప్పుడు వెళతామో తెలియని నిట్టూర్పు పోగులవి.

ఆభరణాలూ అంతే.
వాటిని ధరించినప్పటి వైభవం అవి యధావిధిగా పదిలంగా వుంచినప్పుడు కోల్పోతాయి. తమ స్త్రీలకోసం, తమను అందంగా అలంకరించుకుంటే చూసి మురిసే మనుషుల కోసం అవీ పడిగాపులు పడుతూ ఉంటై.

మళ్లీ ఈ ఇస్త్రీ పెట్టె.
దాన్ని వాడింతర్వాత, దానికి ఏ గాయమూ తగలకుండా నిలబెట్టడంలో మటుకు మాత్రం మనకు శ్రద్ధ వుంటుంది. కానీ, మంచం కింద అలా పెట్టడంలో ఉద్దేశ్యం ఏమిటి?

నిర్లక్ష్యం.
అమానుషం.

+++

నిజం. మానవాంశం అన్నది మనం ఫలానా స్థలంలో మనిషిని వెతకడంలోనే కాదు, ఆ ఫలనా వస్తువు మానవుడి కేసి వెతుకులాడటంలోనూ కానవస్తుంది.

అంతేకాదు, మనిషికి ఆ వస్తువుతో ఒక అనుబంధం ఎట్లయితే వుంటుందనుకుంటామో, తనను వాడుకున్న ఆ వస్తువుకూ తనదైన మానవాసక్తి ఒకటి మనిషితో ఏర్పడుతుంది. అందుకే చలన చిత్రంలో కంటే నిశ్చలన చిత్రంలో ఆ అంశం మనకు కానవస్తుంది. అందుకే ఈ చిత్రం.

మనిషి వినియోగించే ప్రతి అంశం, మానవ నిర్మితమైన ప్రతి వస్తూవూ హ్యూమన్ ఎలిమెంటే!
కాకపోతే ఇవతల, మనిషే ఇన్ హ్యూమన్ అవుతూ ఉండటం విషాదం. ఇంకా వ్విషాదం ఏమిటంటే, ఫలానా చిత్రంలో హ్యూమన్ ఎలిమెంట్ లోపించిందీ అని విమర్శించడం.

తన అవసరం తీరాక వాటి అవసరాన్ని అశ్రద్ధ చేస్తుండటమే ఆ ఐరనీ.
మనిషిని మనిషి కావచ్చు. మనిషి తన- పర వస్తువునూ కావచ్చు.
అదే ఈ దృశ్యాదృశ్యం.
*

గమనమే గమ్యం-3

 

Volga-1ధనలక్ష్మి బడికి రాని లోటు ముగ్గురు స్నేహితులకూ తెలుస్తోంది. వాళ్ళలో వాళ్ళు ధనలక్ష్మి పెళ్ళి గురించి మాట్లాడుకున్నారు గానీ అదంత ఉత్సాహంగా సాగలేదు. ఇంకో వారంలో పెళ్ళనగా ముగ్గురూ కలిసి మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. ఈసారి ధనలక్ష్మి ముఖంలో మునుపటి ఆనందం లేదు. చాలా దీనంగా ఉంది. చిక్కిపోయింది. పదిరోజుల్లో స్నేహితురాలు ఇలాగయిందేమిటని కంగారు పడ్డారు. వీళ్ళ ముగ్గుర్నీ చూసేసరికి ధనలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బలవంతాన వాటిని అదిమిపెట్టి స్నేహితుల్ని దొడ్లో బాదం చెట్టు దగ్గరకు తీసుకుపోయింది.

నలుగురూ కాసేపు మాటలు రానట్టు కూర్చుండిపోయారు.

శారద ఎక్కువసేపు ఆ మౌనాన్ని భరించలేక ‘‘అలా ఉన్నావేం ధనం. ఒంట్లో బాగోలేదా’’ అంది అనునయంగా.

ఆ చిన్న అనునయపు మాటలకే ఉగ్గపట్టుకున్న దు:ఖం బైటికి ఉరికింది. ధనలక్ష్మి ఏడుస్తుంటే వీళ్ళకూ ఏడుపొచ్చింది.

చివరికి అన్నపూర్ణ ధనలక్ష్మి భుజం మీద చెయ్యివేసి ఏమయిందో చెప్పమని గట్టిగా అడిగింది.

విశాలాక్షి మరోవైపు నుంచి ధనలక్ష్మి చేయి పట్టుకుని బతిమాలింది.

ధనలక్ష్మి ఏడుపాపి, కళ్ళనీళ్ళు తుడుచుకుని ‘‘నాక్కాబోయే మొగుడికి నలభై ఏళ్ళట. అలా చెప్తున్నారు గానీ ఇంకా ఎక్కువేనంటున్నారు’’ అంది.

ముగ్గురూ భయంతో, పాలిపోయిన ముఖాలతో ధనలక్ష్మిని చూస్తూ కూచున్నారు. ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియటం లేదు. ధనలక్ష్మిని చూస్తే ఏడుపొస్తుంది. చివరికి శారదాంబ గొంతు పెగల్చుకుని ‘‘నీకిష్టం లేదని చెప్పు’’ అంది.

‘‘నామాట ఎవరు వింటారు? వాళ్ళకి బాగా డబ్బుంది. మా వాళ్ళకి నా బరువు దిగుతుంది. మా అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది’’ ఏడుపు ఆపుకుంటూ చెప్పింది ధనలక్ష్మి.

ఎంతసేపు కూచున్నా మాటలు సాగలేదు. ముగ్గురూ ఇంటికి వెళ్ళటానికి లేచారు.

ధనలక్ష్మి ఇల్లు దాటి కొంచెం దూరం గడిచాక ముగ్గురికీ కాస్త ఊపిరాడినట్లయింది.

‘‘పాపం ధనలక్ష్మి’’ అంది విశాలాక్షి.

‘‘ధనలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి’’ అంది శారద.

‘‘ఎక్కడికి?’’ భయంగా అడిగింది అన్నపూర్ణ.

‘‘రాజమండ్రి వీరేశలింగం గారి దగ్గరకు. అక్కడ ఆయన ఆడపిల్లలకు చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాడు. మా నాన్న చెప్పారు. నేనూ చిన్నప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ మామ్మగారు నాకు పూర్ణమ్మ కథ చెప్పారు. ఆ కథలో పూర్ణమ్మకు ఇట్లాగే ముసలివాడితో పెళ్ళి చేస్తారు. పూర్ణమ చెరువులో పడి చచ్చిపోతుంది’’.

‘‘ధనలక్ష్మి కూడా చచ్చిపోతుందా?’’ విశాలాక్షి కళ్ళు నీళ్ళతో నిండాయి.

‘‘పోనీ రాజమండ్రి వెళ్ళమని చెబుదామా?’’ అన్నపూర్ణ ఆలోచనగా అంది.

‘‘చెబుదాం. వెళ్ళమందాం’’ పట్టుదలగా ఉత్సాహంగా అంది శారద.

‘‘వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? ఇంట్లోవాళ్ళు చూడరా? పోనిస్తారా? రైలు చార్జీలకు డబ్బెక్కడిది?’’

‘‘రాత్రిపూట లేచి నడిచి వెళ్ళటమె’’.

‘‘అమ్మో భయం కదూ’’

‘‘భయమైతే ఎట్లా? ఆ ముసలాడితో పెళ్ళి మాత్రం భయం కదూ?’’

‘‘పోనీ నేను మా అమ్మనడిగి డబ్బు తెచ్చి ఇస్తాను. రైలెక్కి వెళ్ళమందాం’’ అంది విశాలాక్షి.

‘‘నేనూ తెస్తాను’’ అన్నారు మిగిలిన ఇద్దరూ.

రైలెక్కి రాజమండ్రి వెళ్ళటం మాత్రం తేలికా? ఎంత దూరం. దానికంటే ఉన్నవ పెద్దనాన్న గారింటి కెళ్ళటం తేలిక కదూ. గుంటూరికి బండి కట్టుకుని వెళ్ళచ్చు. శారదాంబ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి.

నాన్నమ్మకు చెప్పి పెళ్ళి ఆపించగలిగితే ? నాన్నమ్మ మాట అందరూ వింటారు. ధనలక్ష్మి వాళ్ళ నాన్నకు కూడా నాన్నమ్మ అంటే భయం.

 

అసలు తండ్రి ఉంటే బాగుండేది. ఆయనెప్పుడూ మద్రాసు వెళ్ళి కూచుంటాడు ` ఇక్కడ పాపం ధనలక్ష్మి చచ్చిపోతుందో ఏమో ` గుంటూర్లో లక్ష్మీబాయమ్మ పెద్దమ్మయితే బాగా చూసుకుంటుంది. నాన్న ఉంటే ధనలక్ష్మిని అక్కడకు పంపించటం కుదిరేది.

ఇంటికి వెళ్ళగానే నాన్నమ్మతో ధనలక్ష్మికి జరగబోయే పెళ్ళి గురించి చెప్పి దాన్ని ఆపమని అడిగింది శారదాంబ.

నరసమ్మ శారద మాటలకు నవ్వి

‘‘చేతనైతే పెళ్ళి చెయ్యాలి గాని ` చెడగొట్టగూడదమ్మా, మహాపాపం’’ అంది.

‘‘ముసలాడితో పెళ్ళి చేస్తే ఎట్లా నాన్నమ్మా’’ నాన్నమ్మకు ఈ విషయంలో అన్యాయం అర్థం కాకపోవటం శారదకు మింగుడు పడలేదు.

‘‘అదృష్టం బాగుంటే అతను ధనలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఒక పిల్లాడు పుడితే ఇంక మీ స్నేహితురాల్ని నెత్తిన పెట్టుకుంటాడు. లేదూ ` ఆ పిల్ల కర్మ అలా కాలిందనుకోవాలి. మనం ఎవరం ఆ అమ్మాయి తలరాత మార్చటానికి’’

‘‘నాన్నమ్మ  వీరేశలింగం గారు ధనలక్ష్మిని కాపాడతారేమో. అక్కడికి పంపితే’’.

‘‘ఆయన వితంతువులకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నాడని విన్నాను. ఇలా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడతాడు కూడానా? నువ్వు చిన్నపిల్లవి. నీకీ సంగతులన్నీ ఎందుకు. వెళ్ళి అన్నం తిని పడుకో’’ అని గట్టిగా మందలించింది.

తల్లి కూడా ‘‘నాన్నమ్మ నీ మాట వినదు. ఊరుకో’’ అని వారించింది. శారద చిన్ని హృదయం మండిపోతోంది. అన్యాయం అనే భావన ఆ అమ్మాయికి మొదటిసారి చాలా దగ్గరగా వచ్చింది. అన్యాయాన్ని జరగనివ్వకూడదు. ఆపాలి అని ఆ పిల్లకెవరూ చెప్పక పోయినా అది చెయ్యటం చాలా అవసరం అని శారద మనసుకి గట్టిగా అనిపిస్తోంది. కానీ ఏ దారీ కనిపించలేదు. నాన్న ఉంటే బాగుండేది అనుకోవటం తప్ప మరోదారి కనిపించలేదు. విశాలాక్షి కి, అన్నపూర్ణకూ కూడా ఇంట్లో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ధనలక్ష్మి పెళ్ళి ఆపటం తప్పనే అన్నారు పెద్దలు. ధనలక్ష్మి కర్మ అలా ఉందనీ, తలరాత నెవరూ మార్చలేరనీ పదే పదే ఆ పసి పిల్లలకు చెప్పారు.

ఆ రాత్రి ముగ్గురు పిల్లలూ ఏడుస్తూనే నిద్రపోయారు.

మర్నాడు ఉదయం శారద తల్లిని డబ్బులు కావాలని అడిగింది. స్కూల్లో అవసరమేమోనని శారద అడిగిన రెండు రూపాయలూ ఇచ్చింది సుబ్బమ్మ. సాయంత్రం బడి వదిలాక ముగ్గురూ మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. దొడ్లో బాదం చెట్టు నీడలో శారద తనకు చేతనైనట్టు ధనలక్ష్మిలో ఆశ కలిగించటానికి ప్రయత్నించింది. రెండు రూపాయలు ధనలక్ష్మికిచ్చింది.

‘‘బండివాడికివి ఇస్తే గుంటూరు తీసుకుపోతాడు. లక్ష్మీబాయమ్మ పెద్దమ్మ చాలా మంచిది. నువ్వక్కడ చదువుకోవచ్చు. ముందు నీ పెళ్ళి ఆగిపోతుంది’’

‘‘కానీ బండెవరు మాట్లాడతారు? నేనొక్కదాన్నే ఎక్కి గుంటూరు తీసికెళ్ళమంటే బండివాడు తీసికెళ్తాడా?’’ ధనలక్ష్మి బావురుమంది.

తప్పించుకోగలిగిన అవకాశం ఉండీ తప్పించుకోలేని నిస్సహాయపు ఏడుపది.

ముగ్గురూ ధనలక్ష్మికి ధైర్యం నూరిపోసేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

తర్వాత రెండు రోజులకు ధనలక్ష్మిని పెళ్ళి కూతుర్ని చేశారు.

తలనిండా పూలతో కొత్త బట్టలతో కూడా ధనలక్ష్మి ముఖం కళావిహీనంగానే ఉంది.

ఆ తర్వాత రెండు రోజులకు అర్థరాత్రి పూట ధనలక్ష్మి పెళ్ళయిపోయింది. ఇంతెత్తున లావుగా, ఎర్రగా, మీసాలతో ఉన్న పెళ్ళికొడుకుని చూసి ధనలక్ష్మి భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఏడవాలని కూడా మర్చిపోయేంతగా భయపడిపోయింది.

అర్థరాత్రి పెళ్ళికి స్నేహితులు రాలేదు గానీ మర్నాడు శారదాంబ వాళ్ళ తోటలో కూర్చుని ధనలక్ష్మి కోసం ఏడ్చారు.

శారదాంబ పాలేరు తానా పెళ్ళి కొడుకుని చూశానని వర్ణించి చెప్పి వీళ్ళ దు:ఖాన్ని ఎక్కువ చేశాడు.

శారదాంబ తండ్రి కోసం ఎదురు చూడటమే పనిగా పెట్టుకుంది. పెళ్ళి జరిగినా సరే తండ్రి తల్చుకుంటే ఎలాగైనా ధనలక్ష్మిని రక్షిస్తాడు అనుకుని ఆ ఆలోచనతో బలం తెచ్చుకుంటోంది.

olga title

పదిరోజులు గడిచిపోయాయి. పదకొండో రోజు ఊరంతా గుప్పుమంది.

ధనలక్ష్మికి కటికి గర్భాదానం చేశారట. చచ్చిపోయింది.

శారదాంబ ముగ్గు చిప్ప అక్కడ పడేసి ఏడుస్తూ ఇంట్లోకొచ్చి పడిరది.

తల్లిని కావలించుకుని ఏడుస్తుంటే నరసమ్మ వచ్చింది.

‘‘ఆ పిల్ల దురదృష్టం కాకపోతే వాళ్ళకా పాడుబుద్ధి ఎలా పుట్టింది?’’ అంటూ శారదను దగ్గరకు తీసుకోబోతుంటే శారద నాన్నమ్మ మీద తిరగబడిరది.

‘‘ఆ పెళ్ళి ఆపమంటే ఆపలేదు నువ్వు  ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటావు. పెళ్ళి చేసుకుంటే చచ్చిపోతారు. ధనలక్ష్మి చచ్చిపోయింది. అమ్మా నే వెళ్ళి ధనలక్ష్మిని చూస్తానే’’ అని అరుస్తూ ఏడుస్తూ తల్లినుంచి విడివడేందుకు ప్రయత్నిస్తోంది.

సుబ్బమ్మ కూతుర్ని గట్టిగా పట్టుకుని

‘‘నువ్వు చూడలేవే భయపడతావు. ఇంక చూట్టానికేముంది? ఆ పిల్ల గొంతు కోశారు. అత్తయ్యా. కటికి గర్భాదానం చేశారట. పిల్ల అందుకే చచ్చిపోయిందట’’ ‘‘వీళ్ళ బతుకు చెడ. అట్లా ఎట్లా చేశారు? ఏం పోయేకాలం వచ్చింది? ఆ మొగుడు ముండా కొడుకు కావాలని ఉంటాడు. వీళ్ళు కాదనలేకపోయుంటారు. పాపం పిల్ల ఎంత బాధపడి ఉంటుందో’’.

నరసమ్మ మనసు కరిగిపోయింది. కళ్ళత్తుకుంది.

శారదాంబ ‘‘నువ్వు ఆపితే పెళ్ళి ఆగేది’’ అంది నాన్నమ్మతో కోపంగా.

‘‘పెళ్ళికీ, ఆ పిల్ల చావుకీ సంబంధం లేదే పిచ్చిదానా. పెళ్ళి చేసిన వాళ్ళంతా ఇలా కటికి గర్భాదానాలు చేసి పిల్లల్ని చంపుకోరు. నీ స్నేహితురాలు పెళ్ళి వల్ల చావలేదు. ‘ఆయుష్షు మూడి వాళ్ళకా బుద్ధి పుట్టి చచ్చింది’’ అంటూ గట్టిగా అరిచేసరికి శారద ఏడుస్తూ లోపలికి వెళ్ళింది.

వెళ్ళి చూసొద్దామా అనుకుని శారద వెంటబడి వస్తుందేమోననే అనుమానంలో నరసమ్మ కూడా ఆగిపోయింది. ఆ పూట అత్తాకోడళ్ళు, పనివాళ్ళూ అందరూ అవే మాటలు.

ఈ రోజుల్లో కటికి గర్భాదానం ఎవరు చేస్తున్నారమ్మా. మరీ కసాయివాళ్ళూ కాకపోతే అనేమాటే అందరూ అన్నారు.

దాంతో శారదకు ధనలక్ష్మి మరణం పెళ్ళి వల్ల కాదని అర్థం చేసుకుంది. నాన్నమ్మ మీద కోపం కాస్త తగ్గింది.

అసలు కారణాల గురించి తల్లినడిగితే ‘‘నీకు తెలియదు. చిన్నపిల్లవి చెప్పినా అర్థం కాదు’’ అని బుజ్జగించి నిద్రబుచ్చింది.

ఆ రాత్రి శారదాంబకు జ్వరం వచ్చింది. నరసమ్మ తనకు తెలిసిన గృహవైద్యం ఏదో చేసి, ఇంత విబూది నోట్లో వేసి, నుదుటికి పూసి రాత్రంతా మనవరాలి పక్కనే కూచుంది.

తెల్లారేసరికి జ్వరం తగ్గింది గానీ బడికి వెళ్ళలేకపోయింది. సాయంత్రం విశాలాక్షి, అన్నపూర్ణా వచ్చారు. ముగ్గురూ మాటలు లేకుండా ధనలక్ష్మి కోసం కన్నీరు కార్చారు చాలాసేపు. ఆ మౌనం భరించటం కూడా ఆ చిన్నమనసులకు కష్టమయింది.

‘‘గుంటూరు వెళ్తే ధనలక్ష్మి చచ్చిపోయేది కాదు కదూ’’ అంది విశాలాక్షి.

‘‘బండివాడు తీసికెళ్ళేవాడు కాదు. పురోహితుడి గారమ్మాయి ఎక్కడికో వెళ్ళి పోతోందని మళ్ళీ ఇంట్లోనే దించేవాడు’’ అన్నపూర్ణ వాస్తవం సహాయంతో దు:ఖాన్ని జయించాలనుకున్నట్టు అన్నది.

‘‘మా నాన్న ఉంటే ధనలక్ష్మిని గుంటూరు తీసికెళ్ళేవాళ్ళు’’ శారద కన్నీళ్ళు ఆగటం లేదు.

వారం రోజులకు గాని రామారావు రాలేదు. రాగానే శారదాంబను చూసి కంగారు పడ్డాడు.

‘‘సుబ్బూ అమ్మాయికేమైంది. ఇట్లా చిక్కిపోయిందేం. జ్వరంగాని వచ్చిందా? నాకు కబురు చెయ్యలేదేం’’ అని ఊపిరాడకుండా ప్రశ్నలేశాడు. సుబ్బమ్మ ధనలక్ష్మి సంగతంతా చెప్పింది. రామారావు చలించిపోయాడు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు నిండాయి.

‘‘పాపం చక్కటిపిల్ల. అన్యాయమై పోయింది. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారో. బాల్య వివాహాలు కూడదని చట్టం రావాలి. ఈ బ్రిటీష్‌ వాళ్ళకేం తెలుసు. వితంతువులు పెళ్ళాడవచ్చని చట్టం తెచ్చారు గానీ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యకూడదని చట్టం తేవాలనే జ్ఞానం లేకుండా పోయింది. ఆ మాత్రం తెలియదా? విజయనగరం మహారాజు గారు ఆ చట్టం తేవాలని కోర్టుకి కూడా వెళ్ళారు. ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి ఆపుతున్నారు’’.

రామారావు ధనలక్ష్మి విషాదంలోంచి మొత్తం సమాజాన్ని ఆవరించిన విషాదంలోకి వెళ్ళారు. దాని గురించి పత్రికల్లో రాయాలని, స్నేహితుల్తో చర్చించాలని ఎన్నో ఆలోచనలు ఆయన మనసుని ఆక్రమించి తాత్కాలికంగా ధనలక్ష్మి నుంచి పక్కకు మరల్చాయి.

సాయంత్రం బడి నుంచి వస్తూనే తన దగ్గరికి పరిగెత్తుకు వచ్చే శారద ఏ మాత్రం ఉత్సాహం చురుకుదనం లేకుండా పుస్తకాలు ఇంట్లోపెట్టి బట్టలు మార్చుకుని ఉయ్యాలబల్ల మీద పడుకోవటం చూసి ఆయనకు భయం వేసింది. స్నేహితురాలి మరణం శారదాంబను దెబ్బతీస్తుందా? అలా జరగకుండా తను కాపాడాలి.

రామారావు వెళ్ళి ఉయ్యాలబల్లమీద కూర్చుని శారద తలఎత్తి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమపూరిత స్పర్శలో శారద దు:ఖం కట్టలు తెంచుకుంది. తండ్రి ఒళ్ళో తలపెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. రామారావు శారద తల నిమురుతూ ఆ అమ్మాయి దు:ఖాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకుండా పూర్తిగా బైటికి ప్రవహించనిచ్చాడు.

‘‘నాన్నా! నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను’’ దు:ఖం తగ్గిన తర్వాత దీనంగా అంది శారద.

‘‘అలాగే తల్లీ. నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేద్దువుగాని. అసలు ఇప్పుడు పెళ్ళి అనే మాట ఎవరన్నారు? నువ్వు బాగా చదువుకోవాలి డాక్టరవ్వాలి అని కదా నేను చెబుతాను.’’

‘‘మరి నాన్నమ్మ పెళ్ళి చేసుకోవాల్సిందేనంటుందేం?’’

‘‘నాన్నమ్మకు నేను చెప్తానుగా. నాన్నమ్మకు చదువుకోవటం అంటే ఏమిటో తెలియదు. అందుకని అలా అంటుంది. నీకు నేనున్నానమ్మా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను’’ శారద మనసు స్థిమితపడిరది. తండ్రి చెప్పే మాటలు మెల్లిగా శారద మనసులో ధైర్యాన్ని నింపాయి.

నెమ్మదిగా లేచి కూర్చుంది.

‘‘నాన్నా కటికి గర్భాదానం అంటే ఏంటి? అసలు గర్భాదానం అంటే ఏంటి?’’ కూతురి నుంచి ఈ ప్రశ్నలు ఎదుర్కొన్న మొదటి తండ్రి రామారావేనేమో. ఆయన నెమ్మదిగా లేచి వెళ్ళి స్త్రీల శరీర ఆరోగ్యం గురించి తన దగ్గర ఉన్న చిన్న పుస్తకం ఇచ్చాడు. నిజానికి అందులో ఏమీ లేదు. ఏవో బమ్మలు. శరీర పరిశుభ్రతను కాపాడుకోవటం గురించిన వివరాలూ ఉన్నాయి.

olga2a

‘‘అమ్మా శారదా. ఆడవాళ్ళకు పిల్లలు పుడతారు గదా. దానికి సంబంధించిన గర్భాదానం అంటే నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పటం నాకూ రాదు. మీ అమ్మనడుగు. ఏమైనా చెప్పగలదేమో. నువ్వు డాక్టరువయ్యాక ఇలాంటి విషయాలు అందరికీ అర్థమయ్యేలా మంచి పుస్తకం రాయి. నువ్వింక నీ స్నేహితురాలి సంగతి మర్చిపోయి చదువుకోవాలి. నీ చదువే నీకు అన్నీ చెబుతుంది సరేనా?’’ శారద సరేనన్నట్టు తలూపింది.

చీకటి పడటంతో నరసమ్మ దీపాలు వెలిగించి వాళ్ళ దగ్గరగా ఒకటి తెచ్చిపెట్టింది.

‘‘పిల్ల భయపడిందిరా’’ అంది కొడుకు సమీపంలో కూర్చుంటూ.

‘‘ఔనమ్మా. చాలా భయపడిరది. శారదా ` నువ్వెళ్ళి చదువుకో తల్లీ’’ అంటూ శారదను లోపలికి పంపి రామారావు లేచి తల్లి దగ్గరకు వెళ్ళి పక్కనే కూచున్నాడు.

తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని ‘‘అమ్మా శారద పెళ్ళి విషయం మర్చిపో. నేను ఈ విషయంలో నీమాట వినను. నీ మాటే కాదు ఎవరి మాటా వినను. శారదను డాక్టర్‌ కోర్సు చదివిస్తాను. ఇక్కడ మన దేశంలోనే కాదు. ఇంగ్లండ్‌ కూడా పంపించి చదివిస్తాను. ఎవరేమన్నా లెక్కచెయ్యను. దీని గురించి నువ్వింకేం మాట్లాడినా ప్రయోజనం లేదు.

అమ్మా  నువ్వంటే నాకు ప్రేమ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. అది నీకూ తెలుసు. నీ విషయంలో నువ్వెలా చెయ్యాలంటే అలా చేస్తున్నావు. నాకు నమ్మకం లేకపోయినా నీ ఆచార వ్యవహారాలన్నీ ఏలోటూ లేకుండా సాగుతున్నాయి. ఎన్నడూ ‘నాకిది ఇష్టం లేదమ్మా’ అని కూడా అనలేదు నేను. నాకు కులంలో నమ్మకంలేదు. ఐనా నువ్వు బాధపడతావని ఇంట్లోకి ఇతర కులాల వాళ్ళను రానివ్వటం లేదు. కానీ శారద నా కూతురు. అది నా ఇష్టప్రకారం పెరగాలి. మారే లోకంతో పాటు మారుతూ పెరగాలి. నా కూతుర్ని గురించి నాకెన్నో ఆశలున్నాయి.

పదేళ్ళకు పెళ్ళి చేసుకుని, పదిహేనేళ్ళకు పిల్లల్ని కని ` వంటింట్లో, ఆ పొగలో మగ్గిపోవటం నేను భరించలేను. నా చిట్టితల్లి తన చేతుల్తో మనుషుల ప్రాణాలు కాపాడాలి. తను పిల్లల్ని కనటమే కాదు ఎంతోమంది పిల్లలను తన చేతుల్తో భద్రంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. సరైన వైద్యంలేక మన దేశంలో ఎంతమంది తల్లీపిల్లలు చనిపోతున్నారో తెలుసా? నా కూతురు ఆ పరిస్థితిని మార్చేవాళ్ళలో ఒకతె కావాలి. అమ్మా! దయచేసి శారద పెళ్ళిమాట ఎత్తకు. నీకు దణ్ణం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను’’

రామారావు తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళ వెంట నీళ్ళు కారుతూ నరసమ్మ పాదాల మీద పడుతున్నాయి.

నరసమ్మ మాటా పలుకు లేకుండా కొడుకుని చూస్తోంది. ఆమె కళ్ళల్లోనూ నీళ్ళు బుకుతున్నాయి గానీ ఆమె వాటిని కిందికి జారనివ్వకుండా అదిమి పట్టింది. ఆమెలో ఏదో ఒక నిశ్చయం, పట్టుదల, కఠినత్వం క్రమంగా కమ్ముకున్నాయి. రామారావు అక్కడినుంచి లేచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె చాలాసేపు అలాగే కూర్చుంది.

సుబ్బమ్మ వచ్చి ‘‘అత్తయ్య ఫలహారం చేస్తారా?’’ అని అడిగితే సమాధానం లేదు. సుబ్బమ్మ దగ్గరికి వచ్చి అత్తగారిని చూసి భయపడిరది. ముఖం పాలిపోయి, కళ్ళు ఎక్కడో చూస్తూ, ఒంటినిండా చెమటలు. సుబ్బమ్మ రెండు చేతుల్తో అత్తగారిని పట్టుకుని కుదిపింది. నరసమ్మ ఈ లోకంలో అప్పుడే కళ్ళు తెరిచినట్టు సుబ్బమ్మ వంక చూసింది. సుబ్బమ్మకు భయం మరింత పెరిగింది.

‘‘అత్తయ్యా! ఫలహారం’’.

‘‘చేస్తాను. పద’’ నరసమ్మ కష్టంగా లేచి వంటింటి వైపు నడిచింది. సుబ్బమ్మ అత్తగారి వెనకే వెళ్ళి ఆమెకోసం సిద్ధం చేసిన ఫలహారం ఆమె ముందు పెట్టింది.

నరసమ్మ ఏం తింటుందో కూడా తెలియకుండా తింటున్నదని సుబ్బమ్మ గమనించింది. భోజనాల సమయంలో రామారావుతో ఆ మాటే అంది.

‘‘ఇవాళ అత్తయ్య అదోలా ఉన్నారు. ఫలహారం ఏం చేసిందో కూడా ఆమెకు తెలియలేదు. నాకు భయంగా ఉంది’’.

‘‘ఏం లేదులే. శారద పెళ్ళి విషయం మాట్లాడాను. పెళ్ళి ఇప్పుడు కాదనీ, చదివించాలనీ చెప్పాను. అది అరిగించుకోవటం ఆమెకు కష్టమే. కాదనలేం. కానీ అమ్మది వెళ్ళిపోయే కాలం. శారదది రాబోయే కాలం. అమ్మ కోసం శారద భవిష్యత్తుని పాడుచెయ్యలేను. నేను నిర్ణయం తీసుకున్నాను అది మార్చుకోను’’ తనను తను గట్టి పరుచుకునే ప్రయత్నం ఉంది ఆమాటల్లో.

‘‘కానీ ఆమెకు మీరొక్కరే కొడుకు’’

‘‘నాకు శారద ఒక్కతే కూతురు’’.

సుబ్బమ్మ మాట్లాడేందుకేం లేదు. మాట్లాడటం ఆమె స్వభావమూ కాదు. మొత్తంమీద ఆరోజు రాత్రి శారద ఒక్కతే నిశ్చింతగా నిద్రపోయింది. తండ్రి తనకు కొండంత అండ అని ఆ పిల్లకు అస్తిగతంగా అర్థమైపోయింది. నరసమ్మ రాత్రంతా ఆలోచిస్తూనే గడిపింది. రామారావుకీ నిద్ర లేదు. పెళ్ళి కాకుండా శారదాంబ పుష్పవతి ఔతుందనే ఆలోచన భరించటం నరసమ్మ వల్ల కాలేదు. ఈ అనాచారం సహించటం ఆమె వల్ల కాదు. ఆపటం కూడా ఆమె వల్ల అయ్యేట్టు లేదు. ప్రాణంగా పెంచుకున్న కొడుకే ప్రాణాల మీదకు తెస్తున్నాడనుకుంటే ఆమెకు దుర్భరంగా ఉంది.

తల్లి పట్టుదల తెలిసిన రామారావుకి ఈ గండం ఎలా గడుస్తుందోననే భయం మనసును తొలిచేస్తోంది.

అటూ ఇటూ పొర్లుతున్న భర్తను చూస్తూ సుబ్బమ్మ ఎప్పటికో నిద్రపోయింది.

 

***

నాదాన్ పరిందే… ఘర్ ఆజా !

నిశీధి 

 

వాడు

వక్రాసనమో

వామనావతారమో

వంచనల రాజకీయ కులటై

వాచస్పతులని వాగ్బంధనంలో బిగదీస్తూనే ఉంటాడు

 

అప్పుడే

అమ్మల వడిలో

ఆడుకోవాల్సిన కొన్ని పసిగుడ్లు

అండా సెల్లోనో ఆకురాలని ఆడవుల్లోనో

అకారణంగా అదృశ్యమై అనంతమైపోతూ ఉంటాయి

 

అక్కడ

రిథింలెస్

రేవ్పార్టీల్లో నలిగిన

యూనివర్సిటీ కారిడార్లిప్పుడు

కుడిఎడమలు మరచి  మొత్తంగా మునగదీసుకున్న

గుండు సున్నాల్లా సర్కిల్స్లో  సపసాలు మరచి

కాక్టెయిల్ వ్యర్ధగీతాలు ఆవేశంలేని ఆక్రోశంతో  ఆలపిస్తూ ఉంటాయి

 

ఇక్కడ

గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లంలో

వేసినా కరగని కాఠిన్యాలు

కనిపించని మానసికరోగపు

మనోభావాలై పూచికపుల్లల్లా విరుగుతూ

సీరియల్ కన్నీళ్ళలోనో సిగారు ధూపంలోనో

ఎండిపోయిన బానిసల కళ్ళు చెమర్చడం మానేసి వట్టిపోతాయి

 

అప్పటికీ ,

కొన్ని హృదయాల్లో

ఖేదరాగాల భారంతో దాచిన నిప్పురవ్వ

బండబారిన అమానవత్వపు మంచుల్లో ఇరుక్కొని

అచేతనావస్థకి అనియంత్రిత జాగృతావస్థకి మధ్య వ్యధవాక్యంగా మిగిలిపోతుంది

 

కానేందుకో

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వమని

తేల్చి చెప్పిన కవి ఆత్మ మరో ఎర్రబడ్డ ఉదయానికి

కలవరపడుతూ సమాధిలోతుల్లో అస్థిమితంగా కదులుతూనే ఉంటుంది

 

నాదాన్ పరిందేలని

అన్యాయంగా మింగేసిన మరో రోజు

ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప

ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని

ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ

పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది

*

 

అలవోకగా అక్షర ప్రాణవాయువు!

జయశ్రీ నాయుడు
jayasriఅక్షరాల్లోంచి గుప్పుమనే మట్టి పరిమళం ఎప్పుడైనా నేత్రాలనుంచి నాసికకు చేరిందా
పరిమళం నుంచి ఉద్వేగంలా గుండెకి పాకి, మట్టిని పిడికిట పట్టిన ప్రాణాల పంతపు పంచప్రాణాల్ని చూపించిందా… 
ఈ అక్షరాల అనుభూతికి ఎన్ని మాటల తూకపు రాళ్ళు నింపినా ఇంకా అనుభూతించ వలసింది ఏదోమిగిలే వుందని, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. నాకు ఎదురైన ప్రతి గాలిపలకరింతలోనూ, పాదాన్ని ఈ తట్టే మట్టి స్పర్శామాత్రపు సంభాషణలోనూ చరిత్రని చదవడానికి ప్రయత్నించాను. ఏ క్షణాన ఈ కవిత నా కళ్ళ గుమ్మం ముందు నిలిచిందో గానీ, నాకు నేనే ఒక నిరంతర అక్షరార్థ యాత్రని అనుభవించాను.
అలవోకగా నన్ను తన ప్రతి రేణువులోనూ కలిపేసుకుంటూ, జాగమీది పానాన్ని బర్వు బర్వుగా చాటి చెప్పే అక్షరమవ్వడం ఒక కొత్త అనుభూతి. ఇప్పటికి నాకు నేనుగా ఎన్ని సార్లు చదువుకున్నా ఏదో తెలియని రిథం వుంది  ఈకవితలో. ప్రతి పదం లోనూ, భావం లోనూ నందిని సిధారెడ్డి కవిగా అలవోకగా అక్షర ప్రాణవాయువుని పరిచిన కవిత  –  పుట్టువడి
ఒక జాతి తీరుతెన్నుల్ని ఒక కవికన్నా మిన్నగా ఎవరూ చెప్పలేరు. తత్సమ తద్భవాల్లేని పదాల్లో మొదటి పంక్తి నుంచే కవిత చెంగు చెంగునా సాగుతుంది.
జాగతీరే అట్ల 
 
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు 
కువారం లేదు
ఇక కుటిలమూ, కువారమూ లేని చోట సహజత్వానికి కొరతేముంటుందీ?
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం…
నిలువెల్లా ఉరకలేసే ఉద్యమ స్ఫూర్తికి అద్దాలీ అక్షరాలు. దాదాపు 2007 లో ముద్రణలో విడుదలైన అక్షర పగడాలివి.
ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా
మాటలు పూస్తుంటయి 
అవును ఉద్రాక్షపూలు అనడం లో ఎంతటి పల్లెతనపు అందముందో అక్షర పగడాలనుకోవడంలోనూ అంతే సహజత్వముందీ. కళ్ళు అక్షరాల వెంట పరుగెత్తినంత సహజంగా భావం మనలో ప్రవహించడం మొదలవుతుంది. మరో అనువాదం అక్ఖరలేని కవితా పాయలివి. పాదాలు తడుపుకున్నంత సహజంగా తడి మనసుని ఆక్రమించడం మొదలవుతుంది.  ఆత్మకు మరో అర్థం చెపుతాడు కవి ఇలా…
nadi
బట్టలు ఇడిసినట్లు 
శరీరాన్ని ఇడిసిపెత్తేది ఆత్మ కాదు
ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
మరింత చొచ్చుకెళ్ళే పల్లెతనం చూడండీ
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
ముందువెనుకలు ఆలోచించని ఉడుకుదనపు రక్తం. ఎండల్నీ వానల్నీ కరువు కాటకాల్నీ భరించిన సహనం. ఆ మట్టినుంచి పుట్టుకొచ్చిన జాతి కి చావుని సైతం లెక్ఖచెయ్యని మొండితనమే ఆస్తి. 
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా 
నమ్ముకం ఆరిపోదు
 బండెంక బండి కట్టి పోరాటమైన సామాన్యుడు కనిపిస్తాడు. తెలంగాణా ఉద్యమ దినాల్లో వచ్చిన ప్రతి వార్తా ఉద్వేగం అప్పటి ఆకాంక్షా తీవ్రతలకు పునాదుల్నీ ఈ అక్షరాలు చూపిస్తున్నాయి.  తను పుట్టిన మట్టి మీద ఎంత మమకారమంటే, ప్రాణం విడవడానికైనా సిద్ధమే. ప్రాణం విడిచాక కూడా ఆ మట్టిని విడవని ఆత్మలివి. పూర్వీకుల ఆత్మలన్నీ మమేకమైన నేల లో పెరిగిన జాతి తేటదనాన్ని, రోషాన్ని, స్నేహాన్ని, వెనుతిరిగి ఆలోచించని సూటి దనాన్ని పచ్చికలా పరిచిన మాటల వరిచేలిది.
కవితా సంకలం పేరు: నది పుట్టువడి 
కవి పేరు: నందిని సిధారెడ్డి
కవిత శీర్షికపుట్టువడి
 nandini
జాగ తీరే అట్ల
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు
కువారం లేదు
కుండబద్దలుకొట్టినట్టు
కడిగేసుడే ఎరుక
బాధయినా బరువయినా
ఎత్తుకున్నంక మోసుడే
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం
ఇటుపొద్దు అటు పొడిసినా
ఇజ్జత్ ఇడిసేది లేదు
బట్టలు ఇడిసినట్టు
శరీరాన్ని ఇడిసిపెట్టేది ఆత్మ కాదు
 ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగ
మాటలు పూస్తుంటయి
వరిచేండ్ల మీది గాడ్పువలె
స్వచ్చంగా
వాసన వాసనగా వచ్చిపోతుంటం
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
పండ్లమ్మెతందుకయినా తండ్లాడుతం
చేదబాయి గిరక లెక్క
ఇరాం లేకుంట గిరగిర తిరుగుతనే ఉంటం
 గవ్వ ఆందాని లేకపోయినా
గాలికతలు ఎరుగం
ఎవలు కారని తెలిసినా
మేం కాకుంట ఉండలేం
ఎత ఎవలదయినా
ఏడ్వకుంట ఉండలేం
కోపం ఆపుకోలేక
నాలికయినా కొరుక్కుంటం
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా
నమ్ముకం ఆరిపోదు
జాగ మీద పానం
పానమిడిసినా జాగిడువం
ఈ జాగ తీరే అట్ల
ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల
ఈ జాగల
బర్వు బర్వుగ తిరిగే
పూర్వీకుల ఆత్మలుంటయి
*

ఓ గుల్మొహర్ పువ్వంత..                                    

 

ప్రసూనా రవీంద్రన్ 

 

పూరించమని నువ్వొదిలేసిన ఖాళీల్లో ఇవన్నీ నే రాసుకున్న వాక్యాలు.

నువ్వు చెప్పిన సశేష కథల్లో నేనూహించుకున్న ముగింపులూ ఇవే.

 

వాకిలి తట్టి మరీ ఏ కలలూ రావు గానీ, కల మీద సంతకమంటూ చూశాక, కొన్ని గుర్తుల్ని రెప్పలకే వేలాడదీయడంలో ఆనందం కూడా ఇలాగే ఉంటుంది. ఇక ఆ మిగిలిన రాత్రంతా , సగం తెరిచుకున్న తలుపులోంచి లోపల దూరే ఊహల కువకువలూ అచ్చం ఇలాగే ఉంటాయ్.

 

ఆకాశాన్ని పిలిచి ఆనందమంతా దింపుకున్నాక, ఎక్కడిదక్కడ సర్దేటప్పుడు నుదిటికి పట్టే చెమటలు సరిగ్గా ఇలాగే నవ్వుతాయ్.  మౌనంలోంచి మొదలై మధ్యలోనే తెగిపడితే, ఏరుకుని మబ్బుల కింద మడిచిపెట్టిన మాటలన్నీ ఇక్కడ రాలితే ఇలాగే పరాగాలవుతాయ్. ఆ పరాగాన్నే కళ్ళకి కాస్త రాసుకుని చూడు. తెలియటంలేదూ? వ్యతిరేక భావాలన్నీ వెలేయబడే లోకంలో, నీకూ నాకూ మధ్య దూరం ఓ గుల్మొహర్ పువ్వంత. 

 

PrasunaRavindran

 

నిశాగంధి(NIGHT-CACTUS)

ప్రజాచిత్రకారుడు చిత్తప్రసాద్ కవిత

chitta writing

ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది

అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే

ఈ తిమిరాన్ని వెలిగించి

పరిమళాలతో ముంచెత్తడం..

నా సహస్రదళాలను తెరచుకుని

నా మోక్షమైన

సూర్యుడికి నమస్కరించేందుకు ఎదురుచూస్తున్నా..

దారినపోయేవాళ్ల కంటికి ఆనని

అతి చిన్న, అతి మామూలు మొక్కకు పూచాను

అయినా అపురూప జీవనహేలను నేను

నేను చెప్పొదొకటే, నేనో పువ్వును!

అందుకే సౌందర్యం, స్వరూపం అడిగితే

నేనో పువ్వును, అసామాన్య పువ్వును

నన్ను చూడండి అని బదులిస్తా!

మేఘపు అంచులు దిగి

వాన నన్ను మూద్దాడినపుడు నాలో పులకరింత

మొక్కల, వృక్షాల మౌనవేణువయిన

ఈ నేలమీది దేవతవు నువ్వని

వాన నాతో అంటుంది

ఈ చీకట్లో నేను సాక్షాత్తూ

వర్షపు పుష్పహృదయానివేనని అంటుంది

నేను ప్రకాశించాలని

నాకు తెలియకుండానే

అనేక ఉదయ మధ్యాహ్న సంధ్యలూ వెలిగించాయి నన్ను

గత సమస్త సూర్యులతో,

సందేశం లేకుండా అబ్బురంతో

పలుకు లేని ఆహ్వానంతో

కాంతులీనాలని వదలిపోయాయి ఈ చీకట్లో

నిజానికి నేను నీ లోపలి కమలపు ప్రతిబింబాన్ని

చూడు నన్ను!

నీ కళ్లను వెలిగించాను

ఈ రాత్రి నువ్వు చూసినప్పుడు

నీ హృదయంలో ఉన్నట్టుండి ఆ పువ్వును కనుగొని ఉంటావు

అక్కడ నేనున్నాను నీకోసం

దాని ప్రతిబింబాన్ని చూడ్డానికి.

అపుడు నువ్వూ నేనూ ఒకటే

నీలా నాకూ బోలెడు అశ్చర్యం

నేనెక్కడిదాన్నో నాకు తెలియదు

ఇక్కడికెలా వచ్చానో కూడా తెలియదు

క్షణక్షణం ఎన్నెన్నో జరిగిపోతున్నాయ్

ఎన్నెన్నో రేకులు వికసిస్తున్నాయ్

క్షణక్షణం గడచిపోయే కాలంలా

ఒకటి వెళ్లమారిపోయేలోపే

మరో అనుబంధం

మట్టినుంచి వేళ్లకు

వేళ్లనుంచి కాండానికి..

కొమ్మల్లో తెరుచుకునే కాండపు లోపలి ప్రవాహాలు

ఎన్నెన్నో రసాల్లో మునకలేసి

ఒక రూపం నుంచి మరో రూపానికి

సాగింది ఈ తనువు

వికసించిన చిరు మొగ్గదాకా.

తొలిసారి గాలి తాకగానే

మొదలైంది విస్మయం

ఎక్కడి నుంచి? ఎక్కడికి?

నలుదిక్కులా నిండిన నిబిడాశ్చర్యం.

ఏం జరగనుందో నాకు తెలుసా?

జరిగేది ఎక్కన్నుంచి మొదలవుతుందో

ఇప్పటికైనా తెలుసా?

నేను ఒంటరిగా వచ్చినట్టుంది

నిజమేనా?

ఒంటరిగానే వచ్చానా,

ఒంటరిగా వెళ్లిపోవాలా?

తెలుసా నాకు?

నా దోనె నిండా అలవిగాని సౌందర్యం

.. నన్ను తెచ్చింది దోనె కాదంటావా?

మరైతే  చీకట్లోంచి నేనెలా వచ్చాను?

నా దోనె కదిలినపుడు ఎలా ఎగిరిపోవాలనుకున్నాను

ఎగరకుంటే, ఈ రాత్రి ఇక్కడ మెరుపులా ఎలా వచ్చిపడ్డాను?

మనిద్దరం యాదృచ్ఛికంగా కలిశాం

యుగయుగాల బాట పయనించి.

పరస్పరం చూసుకోవడం పూర్తయేలోపు

సంతోషంగా గడిపేద్దాం

మనం వెళ్లాల్సిన వేర్వేరు బాటల సాంతం

మన కలయిక నా పత్రాల ఒడిలో పవిత్రంగా పదిలం

నేను దాన్ని తనివితీరా ఆస్వాదించాను

సంతోష చకిత పుష్పాన్ని నేను

ఈ ప్రపంచాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని చూడ్డానికి

ఒక్కసారి ఒకేఒక్కసారి ఇలా వచ్చాను

మిగతాదంతా మరచిపోయాను.

ఇక్కన్నుంచి నిష్ర్కమించలోపు

ఇంకే అర్థాన్నీ వెతకను.

అంధేరీ, ఆగస్టు 29, 1973

                         తెలుగు: వికాస్

అతని కారునల్లని సంతకం!

పి. మోహన్ 

 

P Mohanకళాకారులందరి లక్ష్యం జనాన్ని చేరుకోవడం. చిత్త లక్ష్యం వారిని చేరుకోవడమే కాకుండా చైతన్యవంతం చేయడం కూడా. కనుక అతని మార్గం భిన్నం. పునజ్జీవనం పేరుతో పాత కథలకు కొత్త మెరుగులద్ది తృప్తిపడిపోయే నాటి బెంగాల్ కళాశైలి అతనికి నచ్చలేదు. జనానికి అర్థం కాని సొంతగొడవల, డబ్బాశల పాశ్చాత్య వాసనల బాంబే, కలకత్తా శైలులు అసలే నచ్చలేదు. తన బొమ్మలు జనబాహుళ్యానికి అర్థం కావాలి, తను చెప్పేదేమిటో వాళ్ల మనసుల్లోకి నేరుగా వెళ్లాలన్నదే అతని సంకల్పం. ‘ఒక చిత్రం గురించి నువ్వూ నేనూ ఏమనుకుంటున్నాం అనేదానికి కాకుండా, ఎక్కువమంది ఏమనుకుంటున్నారనే దానికి ప్రాధాన్యమివ్వడమే అభ్యుదయ మార్గం’ అన్న లెనిన్ మాట దివిటీ అయ్యింది. అందుకే జనానికి కొరుకుపడని పిచ్చిప్రయోగాలవైపు, గ్యాలరీలకు పరిమితమయ్యే ఆయిల్స్, వాటర్ కలర్స్, వాష్ వంటివాటివైపు కాకుండా జనంలోకి ఉప్పెనలా చొచ్చుకెళ్లే ప్రింట్లకు మళ్లాడు.

ప్రజాకళాకారులకు ప్రింట్లకు మించిన ఆయుధాల్లేవు. ఆయిల్ పెయింటింగ్ వేస్తే, అది కళాఖండమైతే ఒక ఇంటికో, గ్యాలరీకో పరిమితం. ప్రింట్లు అలా కాదు. కొద్దిపాటు ఖర్చుతో ఇంటింటికి, ప్రతి ఊరికి, లోకానికంతటికీ పంచి, జనాన్ని కదం తొక్కించొచ్చు. ఒక్కోటీ ఒక్కో కళాఖండం. అందుకే అవి రష్యా, చైనా, మెక్సికన్ విప్లవాలకు పదునైన ఆయుధాలు అయ్యాయి. జర్మనీలో కేథే కోల్విజ్, హంగరీలో గ్యూలా దెర్కోవిట్స్, మెక్సికోలో సికీరో, ఒరోజ్కో, లేపోల్దో మెందెజ్,  చైనాలో లీ కున్, అమెరికాలో చార్లెస్ వైట్.. అనేక దేశాల్లో అనేకమంది జనచిత్రకారులు ప్రింట్లతో సమరశంఖాలు పూరించారు. వాళ్లకు ముందు స్పెయిన్లో గోయా యుద్ధబీభత్సాలపై, మతపిచ్చి వెధవలపై లితోగ్రాఫులతో ఖాండ్రించి ఉమ్మేశాడు. ఎడ్వర్డ్ మంక్, పికాసో, మతీస్.. ప్రింట్లతో చెలరేగిపోయారు. వీళ్లందరికంటే ముందు యూరప్ లో ద్యూరర్, బ్రూగెల్, రెంబ్రాంత్ లు ప్రింట్లలో కావ్యాలు చెక్కితే.. హొకుసాయ్, హిరోషిగే వంటి అమరకళావేత్తలు రంగుల ప్రింట్లతో తూర్పుకళ సత్తా చాటారు. చిత్తపై వీళ్లందరి ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ అతని కళ భారతీయతకు ఎన్నడూ దూరం కాలేదు. కాళీఘాట్ వంటి బెంగాలీ జానపద కళాశైలులు, మొగల్ సూక్ష్మచిత్రాలు, ప్రాచీన భారత కుడ్యచిత్రాల్లోని, శిల్పాల్లోని సరళత, స్పష్టత అతని చిత్రాల్లో కొత్త సొగసులు అద్దుకున్నాయి.

chitta1

ప్రింట్ల శక్తి, సౌలభ్యాలన్నింటిని చిత్త పూర్తిగా వాడుకున్నాడు. తర్వాత వాటిని అంత బలంగా వాడుకున్నవాడు చిత్తకంటే ఆరేళ్లు చిన్నవాడైన హరేన్ దాస్ ఒకడేనేమో. కరువుకాటకాలు, విప్లవం, శాంతి, ప్రణయం, ప్రసవం, పసితనం.. ప్రతి బతికిన క్షణాన్నీ చిత్త తన ప్రింట్లలో నిండైన భావసాంద్రతతో బొమ్మకట్టాడు. కరువుపై అతని ప్రింట్ల పుస్తకాలను బ్రిటిష్ వాళ్లు తగలబెట్టారంటే అతని కళాశక్తి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

చిత్త అనగానే తొలుత ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని పోరాట చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలే. కరువు పీడితులను అతనంత బలంగా ప్రపంచంలో మరే కళాకారుడూ చూపలేదు. అతని కరువు చిత్తరువులు ఆకలి పేగుల ఆర్తనాదాలు, ఆరిపోయిన కన్నీటి చారికలు.

 

1943-44 నాటి బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి విపత్తు, మనిషి స్వార్థం కలగలసి కరాళనత్యం చేశాయి. 1942లో వచ్చిన తుపానులో పంటలు దెబ్బతిన్నాయి. రోగాలు పెచ్చరిల్లాయి. మరోపక్క.. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాపై దాడి చేసి బెంగాల్ సీమలోకి చొచ్చుకొస్తున్న జపాన్ ఫాసిస్టులపై పోరాడుతున్న సైనికులకు బళ్లకొద్దీ తిండిగింజలు తరలించారు. బర్మా నుంచి బియ్యం సరఫరా ఆగిపోయింది. దేశభక్తులు కొందరు తమ పంటను బ్రిటిష్ వాడికి అమ్మకుండా నదుల్లో పడేశారు, కాల్చేశారు. కొందరు దేశీవ్యాపారులకు అమ్మేశారు. నల్లబజారు జడలు విప్పింది. పోలీసులు, అధికారులు కొమ్ముకాశారు. జనం పిడికెడు తిండిగింజల కోసం పొలాలు, బొచ్చెలు బోలెలు అమ్ముకున్నారు. అడుక్కుతిన్నారు, వలస పోయారు. ఏదీ చేతకాకపోతే దొంగతనాలకు, కరువు దాడులకు పాల్పడ్డారు. అవి చేతగాని ఆడకూతుళ్లు ఒళ్లు అమ్ముకున్నారు. లక్షల మంది మంచినీళ్లు దొరక్క మలేరియాతో చచ్చిపోయారు. ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన వంగదేశపు పల్లెసీమల్లో ఎక్కడ చూసినా పీనుగులు, ఆకలి కేకల సజీవ కంకాళాలే కనిపించాయి. కరువును దగ్గరగా చూసి రిపోర్ట్ చేయాలని పార్టీ చిత్తను నవంబర్ లో మిడ్నపూర్ కు పంపింది. చిత్త ఆ శవాల మధ్య, ఆకలి జీవుల మధ్య తిరుగాడి మానవ మహావిషాదాన్ని నిరసనాత్మక నలుపు రూపాల్లోకి తర్జుమా చేశాడు.

2 (5)

సంచిలో కాసిన్ని అటుకులు, స్కెచ్ ప్యాడు, పెన్నుతో కాలినడకన క్షామధాత్రిలో తిరిగాడు. కనిపించిన ప్రతి ఆకలిజీవినల్లా పలకరించి, బొమ్మ గీసుకున్నాడు. కూలిన గుడిసెలను, నిర్మానుష్య పల్లెలనూ గీసుకున్నాడు. ‘ఈ బొమ్మలతో వాళ్లను నేనేమాత్రం ఆదుకోలేనని తెలుసు. కానీ, అవి కళ అంటే విలాసమని భావించేవాళ్లకు ఒక పచ్చినిజాన్ని చాటి చెబుతాయి’ అన్నాడు. చిత్త అలా తిరుగుతున్నప్పుడే అతని తండ్రి కరువు సహాయక కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడినుంచో దాతలు పంపిన తిండిగింజలు దారిలోనే మాయమైపోతున్నాయని, బాధితులకు దొరుకుతున్నది పిడికెడేనని కొడుక్కి చెప్పాడు. చిత్త ఆ కరువు సీమలో ఎలా తిరిగాడో అతని చెల్లి ‘ఒంటరి పరివ్రాజకుడు’ వ్యాసంలో రాసింది. ‘అన్నయ్య ఊర్లు తిరిగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, చెప్పులతో ఇంటికి వచ్చేవాడు. బోలెడన్ని బొమ్మలు గీసుకుని తెచ్చేవాడు. అమ్మ గదిలో కూర్చుని తను చూసిన ఆకలి జనం బాధలను రుద్ధకంఠంతో గంటలకొద్దీ వివరించేవాడు.’

chitta2

చిత్త కరువు నీడలను చిత్రించడంతోపాటు తన పర్యటన అనుభవాలను వివరిస్తూ ‘పీపుల్స్ మార్చ్’ ప్రతికలో సచిత్ర వ్యాసాలూ రాశాడు. కరువులో కాంగ్రెస్, హిందూమహాసభల కుళ్లు రాజకీయాలను ఎండగట్టాడు. ఆ రుద్రభూమిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆస్తులు పోగేసి కొత్త మేడ కడుతున్న వైనాన్ని, ఆ కామందును తిడుతూ ఊరివాళ్లు కట్టిన పాటనూ పరిచయం చేశాడు ‘అభివృద్ధి’ పేరుతో ఈ నేలమీది సమస్త వనరులనూ దేశవిదేశీ పెట్టుబడి దెయ్యాలకు కట్టబెడుతూ, ‘సొంత అభివృద్ధి’ చూసుకుంటున్న నేటి జనసంఘీయులను చిత్త చూసి ఉంటే బొమ్మలతో చావచితగ్గొట్టి ఉండేవాడు.

మిడ్నపూర్ పర్యటన అనుభవాలతో, బొమ్మలతో చిత్త 1943లో ‘హంగ్రీ బెంగాల్’ పేరుతో ఓ చిన్న పుస్తకం అచ్చేశాడు. ఆకలి వ్యథలను కేవలం సాక్షిలా కాకుండా ఆర్తితో, ఆక్రోశంతో వినిపించాడు. ఓపిక ఉంటే, వినండి అతడు బొమ్మచెక్కిన ఆ అభాగ్యుల దీనాలాపనలను…

‘‘ఓ రోజు దారి పక్కన ఇద్దరు ముసలి ఆడవాళ్లు, ముగ్గురు నడీడు వితంతువులు, ఒక యువతి కనిపించారు. ఎక్కడినుంచో తెచ్చుకున్న కాసిని తిండిగింజలను మామిడి చెట్టుకింద పొయ్యి వెలిగించి వండుకుంటున్నారు. వితంతువుల్లో ఒకామె చేతిలో 11 రోజుల పసికందు ఉంది. మరొకామె గర్భిణి. వాళ్లకు తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలని ఉంది. దగ్గర్లో ఓ కామందు వస్త్రదానం చేస్తున్నాడని, అందుకోసం ఆగిపోయామని చెప్పారు. ‘రేపు మా అన్నయ్య ఎడ్లబండిలో వస్తాడు, ఊరికి వెళ్తాను’ అని బాలింత చెప్పింది.. పక్షం రోజు తర్వాత అదే దారిలో రిక్షాలో వెళ్లాను. ఓ పోలీసు ఇద్దరు చింపిరి యువకులతో, ఇదివరకు నేను మాట్లాడిన యువతితో గొడవ పడుతున్నాడు. రిక్షావాలా చెప్పాడు.. ‘ఈ ఆడాళ్లు ఒళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు. పాపం ఇంకేం చెయ్యగలరు? రోజుల తరబడి, వారాల తరబడి తిండి లేకపోతే మానం మర్యాదలకు విలువేముంటుంది బాబూ?’..

chitta3‘‘కరువుపై సభ పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పార్టీ కామ్రేడ్లు చెప్పారు. పార్టీ పోస్టర్లను ఓ సీఐడీ చింపేసి జనాన్ని భయపెట్టాడు. ఈ ప్రాంతంలో మళ్లీ పోస్టర్లు కనిపిస్తే చావగొడతామని బెదిరించాడు.. ఇంతకూ ఆ పోస్టర్లో ఏముంది? కరువును ఎదుర్కోడానికి అందరూ ఏకం కావాలన్న పిలుపు, దేశనాయకులను విడుదల చేయాలన్న డిమాండ్, మా భూమిని మేం కాపాడుకుంటామన్న ప్రకటన..

‘‘కుదుపుల బస్సులో ఇబ్బంది పడుతూ మధ్యాహ్నానికి కాంతాయ్ చేరుకున్నాం. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో ఒంట్లో నలతగా ఉంది. కాంతాయ్ లో ఆ రోజు సంత. బియ్యం ఎక్కడా కనిపించలేదు. పప్పు దినుసుల అంగళ్ల వద్ద జనం మూగి ఉన్నారు. అయితే స్వర్ణకారుడి వద్ద, పాత్రల అంగళ్ల వద్ద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో అంగడి వద్ద పది, పదిహేను మంది రైతులు తమ వంటసామాన్లను అమ్మడానికి వరుసగా నిల్చుని ఉన్నారు.  ఇత్తడి కంచాలు, గిన్నెలే కాదు దీపపు కుందీలు, దేవుడి గంటలు, హారతి పళ్లేలు వంటి పూజాసామగ్రినీ అమ్మడానికి తెచ్చారు. ఒకచోట బెనారస్ లో తయారైన శ్రీకృష్ణుడి కంచుబొమ్మ కూడా కనిపించింది. అది రెండు రూపాయల 12 అణాల ధర పలికింది. ఈ దేవుళ్లు తమ పేదభక్తులను వదలి బానపొట్టల హిందూవ్యాపారుల చెంతకు చేకుంటున్నారు…  మధ్యాహ్నం రెండుకల్లా అంగళ్ల నుంచి జనం వెళ్లిపోయారు. అదే రోజు ఓ ఓడ సంతలో అమ్మిన వంటసామాన్లతో కోలాఘాట్ కు బయల్తేరింది. రెండు పడవల్లో కూడా పాత్రలు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ఇదే తంతట.. రైతులు ఒక్క పాత్రకూడా ఉంచుకోకుండా అన్నింటినీ తెగనమ్మడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది..

3 (4)

‘‘ఓ రోజు పల్లె పొలిమేరలో నడుస్తున్నాం. ‘అదిగో, అటు చూడు, వరిపొలంలో ఏదో కదులుతోంది!’ అన్నాడు తారాపాద. ఓ ఆరేళ్ల పిల్లాడు పండిన పొలం మధ్య మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఏపుగా పెరిగిన పొలం నీడలో ఆ పిల్లాడి తెల్లకళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. మాటలకందని దృశ్యం అది. ఆ పిల్లాడు మేం పిలవగానే వచ్చాడు. ఎముకలతో తయారైన చిన్ననల్లబొమ్మలా ఉన్నాడు. అతని చిట్టికథ తెలుసుకున్నాం. అతని తండ్రి జ్వరంతో, తల్లి మలేరియాతో చనిపోయారు. పెద్దన్న చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లున్న మరో అన్న.. జనం వదిలిపోయిన ఆ గ్రామంలోని ఓ బ్రాహ్మడి ఇంట్లో పాలేరు. ఆ ఇంటివాళ్లు పెట్టే తిండిని అన్నదమ్ములు పంచుకుని తినేవాళ్లు. అయితే కొన్ని రోజులుగా ఇతనికి తిండిపెట్టడం లేదు. అన్నం కావాలని ఏడిస్తే కొట్టారు. ఇప్పటికీ చెయ్యి నొప్పెడుతోంది. చివరికి ఇతన్ని ఇంట్లోంచి గెంటేశారు.. మళ్లీ మీ అన్నదగ్గరికి వెళ్తావా అని అడిగాడు తారాపాద. అతడు తలను గట్టిగా అటూ ఇటూ ఊపి, పోను అన్నాడు. గంజిపోసి, బట్టలిచ్చే అనాథాశ్రమం దగ్గర్లో ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వెళ్తావా అని అడిగాం. సరేన్ననాడు. అతని పేరు అనంత. నిన్ను ఎత్తుకుని నడుస్తాం అని చెప్పాం. అతడు టక్కున ఉహూ అన్నాడు..

‘‘సాయంత్రం అయిదవుతుండగా జనుబాషన్ గ్రామానికి వెళ్లాం. ఐదు గుడిసెలే ఉన్నాయి.. ఊరి ఆనవాళ్లే లేవు. చిన్నసంచి, రెండుమూడు మట్టికుండలతో ఎక్కడికో వలసపోతున్న భార్యాభర్తలు కనిపించారు. ఆడమనిషి కొత్త ముతక చీరకట్టుకుని ఉంది. దాన్ని దగ్గర్లోని గంజికేంద్రంలో ఇచ్చారట. భర్త తుండుగుడ్డకంటే కాస్త పెద్దగా ఉన్న ధోవతీ కట్టుకుని ఉన్నాడు. వాళ్ల దీనగాథ అడిగాం. ఆ పల్లెలో మూడువందల మంది ఉండేవాళ్లట. తుపానులో వందమంది, మలేరియా, ఆకలితో మరికొందరు పోయారట. బతికినోళ్లు పట్నానికి వెళ్లగా, వీళ్లిద్దరే మిగిలిపోయారట. ఇప్పుడు వీళ్లూ వెళ్తున్నారు. ‘సరేగాని, ఈ మునిమాపున ఎందుకు వెళ్తున్నారు?’ అని అడిగాం. దొంగల భయం వల్ల అని చెప్పారు. పది రోజుల కిందట ఓ రాత్రి వీళ్లు అడుక్కుని తెచ్చుకున్న బియ్యం వండుకుంటుండగా 40 మంది బందిపోట్లు వచ్చిపడ్డారట. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారట. భర్త రెండు రోజులపాటు పైకి లేవలేదట. దొంగలు సగం ఉడికిన అన్నంతోపాటు, వీళ్ల దగ్గర మిగిలున్న రెండు ఇత్తడిపాత్రలను, చివరికి మురికి గుడ్డలను కూడా దోచుకెళ్లారట. ఈమెకు ఒంటిపై కప్పుకోవడానికి రెండు రోజులపాటు గుడ్డకూడా లేదట..

chitta6

‘‘గోపాల్ పూర్ లో రోడ్డు పక్కన ఓ వితంతువు శ్యామా గడ్డి విత్తనాలు సేకరిస్తోంది. మూడు గంటలు కష్టపడితే పిడికెడు గింజలు దక్కాయి. ఆమెకు ఆ పూటకు అవే భోజనం..

‘‘అతని పేరు క్షేత్రమోహన్ నాయక్, అందరి మాదిరే రైతు. భార్యాబిడ్డలు ఆకలి, మలేరియాలతో చనిపోయారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తికాకముందే అతనికీ మలేరియా సోకింది. మేం అతన్ని చూసేసరికి అతని కళేబరం కోసం కుక్కలు, రాబందులు కాట్లాడుకుంటున్నాయి. దహనం కోసం ఆ శవాన్ని నిన్న రాత్రి శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించేలోపు అక్కడున్నవారికీ జ్వరం కమ్మేసింది. శవాన్ని అలాగే వదిలేసి ఇళ్లకు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ల  శవాలను మోసుకెళ్లడానికి ఎవరైనా మిగిలి ఉంటారా?.. క్షేత్రమోహన్ కు పట్టిన దుర్గతి బెంగాల్ జిల్లాల్లో అసాధారణమైందేమీ కాదు. కానీ.. క్షేత్రమోహన్ నోటికాడి కూడు లాక్కుని, బోలెడు లాభాలు కూడబెడుతున్నవాళ్లను మనమింకా క్షమించడమే కాదు ప్రోత్సహిస్తున్నాం కూడా..’’

ఇలాంటి మరెన్నో మింగుడుపడని నిజాల ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం సంగతి తెల్లదొరలకు తెలిసింది. అచ్చేసిన ఐదువేల కాపీలనూ తగలబెట్టారు. చిత్త తన తల్లికి పంపిన ఒక పుస్తకం మాత్రం భద్రంగా మిలిగింది. పార్టీ పత్రికలకు చిత్త వేసిన బొమ్మల బ్లాకులు కూడా పోయాయి. అతన్ని పోలీసులు పట్టుకుపోతారనే భయంతో పత్రికల నిర్వాహకులే వాటిని నాశనం చేశారు.

మిడ్నపూర్ కరువు ప్రాంతాల పర్యటన తర్వాత చిత్త 1944లో జూన్-ఆగస్టు మధ్య మరో కరువు సీమకు వెళ్లాడు. బిక్రమ్ పూర్, కాక్స్ బజార్, మున్షీగంజ్, చిట్టగాంగ్ లలో కరువు దెబ్బకు సర్వం కోల్పోయిన జనం బొమ్మలు గీశాడు. వాటి వెనక వాళ్ల పేర్లు, ఊళ్లు, వాళ్ల కష్టాలను నమోదు చేశారు. జాలరి అబ్బుల్ సత్తార్, రైతు అలీ అక్బర్, నేతగాడు గనీ, రోగిష్టి హలీషహర్, వేశ్యగా మారిన చిట్టగాంగ్ బట్టల వ్యాపారి భార్య అలోకా డే, ఆస్పత్రితో అస్థిపంజరంలా పడున్న ముసలి మెహర్జెన్, ఒంటికింత బట్టలేక తనకు వీపులు తిప్పి ఇంట్లోకి వెళ్లిపోయిన బాగ్దీ కుటుంబం.. అన్నింటిని గుండెబరువులో ఆవిష్కరించాడు. ‘ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపా’న్నీ జడుసుకునేలా చూపాడు. ఆకలి తాళలేక పిచ్చెక్కి రాయి గురిపెట్టిన బాలుడి బొమ్మచూస్తే కన్నీళ్లూ, క్రోధమూ వెల్లువెత్తిపోతాయి.

బెంగాల్ కరువును చిత్త మిత్రులైన సోమనాథ్ హోరే, జైనుల్ అబెదిన్ లతోపాటు గోపాల్ ఘోష్, గోవర్ధన్ యాష్ వంటి ఇతర బెంగాల్ చిత్రకారులు కూడా వేశారు. అయితే వాళ్ల బొమ్మలు చిత్త బొమ్మలంత శక్తిమంతంగా కనిపించవు. నందలాల్ బోస్, గోపాల్ గోష్ వంటి బెంగాల్ స్కూల్ వాళ్లకు ఆ కరువు కలిపురుషుడి బీభత్సమైతే, చిత్తకు అది మనిషి స్వార్థం సృష్టించిన మృత్యుకాండ. అందుకే అతని చిత్రాల్లో అంత మానవతా, భావగాఢతా, కన్నీరూ. ‘మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ’ అని అంటాడు ప్రముఖ కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. ఆధునిక భారతంలో ఆ నీరాజనం పట్టిన పిడికెడు మందిలో చిత్త ఒకడు.

                                   నాలుగు భాగాల్లో ఇది రెండో భాగం. మూడో భాగం వచ్చేవారం..

 

శ్రావ్యంగా ‘శబ్దిం’చిన సంగీతం 

భవాని ఫణి 
bhavani phani.The Sound of music! 
చలన చిత్రం(1965) చూసినప్పుడు దృశ్యకావ్యం అనే పదానికి నిజమైన అర్థం తెలుస్తుంది . తరం నించి తరానికి ఆస్తిపాస్తులు ఇచ్చినంత ప్రేమగా ఈ చలన చిత్రంపై ప్రేమని కూడా వారసత్వ సంపదగా ఎందుకు అందిస్తారో  అర్థమవుతుంది . ఒక గొప్ప అనుభూతి గుండెల్లో గూడు కట్టుకుని పది కాలాలు పదిలంగా నిలిచిపోతుంది .. సంగీతం ఎంత సౌందర్యవంతమో మరోసారి అనుభవంలోకి వస్తుంది . భావాలకి పదాల రెక్కలు తొడిగి, సంగీత సామ్రాజ్యంలోకి విడిచిపెట్టినప్పుడు వెలువడే ఓ ఆహ్లాదకరమైన స్వేచ్ఛ అనబడే రెక్కల తాలుకూ చప్పుడు రివ్వుమంటూ గుండెల్లోకి దూసుకొస్తుంది .
ఆత్మకథ ఆధారంగా నిర్మించిన చిత్రమైనప్పటికీ కథలో మార్పులు చేసి నాటకీయత జోడించడం వల్ల దీన్ని ఒక కల్పిత కథగా తీసుకోవడమే మంచిది . ఈ చిత్రానికి ఆయువుపట్టు ఇందులోనే పాటలే . ప్రతి మాటా పాటే అయినా కృత్రిమత్వం కనిపించదు. సంగీతమెంత ప్రకాశవంతమో  ,ఆ ధ్వనిహారంలో కుదురుకున్న అక్షరాలు కూడా కలిసికట్టుగా అంతే కాంతివంతంగా మెరుస్తాయి.
మేరియా ఒక సాధారణమైన స్త్రీ .
సన్యాసినిగా మారాలన్న కోరికతో ఒక క్రైస్తవ మఠంలో శిక్షణ పొందుతూ ఉంటుంది .
కానీ ఆమె మనసు, ఆమెని రోజంతా పర్వతాల్లోనే విహరించమంటుంది .
చీకటి పడిపోయి , నక్షత్రాలు వచ్చేసి ఇక చాల్లే వెళ్లెళ్లమంటున్నా
పచ్చని నీడలేవో ఆమెని తమతోనే ఉండి పొమ్మంటాయి.
ఆమె ఆగుతుంది , వింటుంది.
ఆ పర్వతాలు ఏళ్ల తరబడి వాటిలో దాచుకున్న సంగీతాన్ని ఆమెకి వినిపిస్తాయి .
అలా విన్న ప్రతి పాటనీ పాడమంటూ ఆమె హృదయం  మరీ మరీ మారాం చేస్తుంది .
అంతే కాక ఆమె చిన్ని హృదయం పక్షి రెక్కల్లా కొట్టుకోవాలనుకుంటుంది .
కొలనులోంచి వృక్షాల మీదకి ఉదయిస్తానంటుంది.
చిరుగాలి మోసుకొచ్చే చర్చి గంటల చిరుధ్వనికి మెల్లగా నిట్టూర్చమంటుంది.
రాళ్ల పైకెక్కి జారిపడే సెలయేటి ప్రవాహంలా బిగ్గరగా నవ్వుకోవాలంటుంది. .
ఇంకా ఎన్నెన్నో అల్లరి పనులు చెయ్యమని గొడవ చేస్తుంది .  .
అందుకే ఆమెని ఒంటరితనం ఆవరించినపుడు పర్వతాల్లోకి వెళ్తుంది .
మునుపు విన్నవేవో మళ్లీ మళ్లీ వింటుంది .
ఆ సంగీత ధ్వనుల ఆశీర్వాదాలతో ఆమె పాడుతూనే ఉంటుంది .
నిజానికి ఆమె ఎవరు? ఏమిటి ? అనేది మఠంలోని సన్యాసినుల మాట(పాట)ల్లో అయితే  ఇలా అందంగా ఆవిష్కరింపబడుతుంది .
మేఘాన్ని పట్టుకుని ఎవరైనా నేలకి నొక్కిపెట్టగలరా?
ఎవరైనా చంద్రకిరణాన్ని అరచేతిలో ఆపగలరా?
కెరటాన్ని ఇసుక మీద నిలిపి ఉంచగలరా?
మేరియా కూడా అంతే మరి . మరి మేరియా అనే ఈ సమస్యని  ఎలా పరిష్కరించాలి . అందుకే ఆమెని కొన్ని రోజులు మఠానికి దూరంగా ఉంచాలని నిర్ణయించుకుని ఒక కెప్టెన్ ఇంటికి పంపుతారు సన్యాసినులు  . కెప్టెన్ జార్జ్, భార్యని పోగొట్టుకుని తన ఏడుగురు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు . ఆ పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించేందుకు ఆమె ఆ ఇంటికి వస్తుంది . ఆ అల్లరి పిల్లల్ని ఆకట్టుకుని మచ్చిక చేసుకుంటుంది .
బాధలోనో , భయంలోనో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందో పిల్లలకి ఇలా చెప్తుంది
గులాబీలపై నీటి చుక్కల్నీ, పిల్లిపిల్లల మెత్తదనాన్నీ తలుచుకుంటుందట
ఎప్పుడో కనురెప్పలపైన పడిన మంచు ముత్యాలని మననం చేసుకుంటుందట
వసంత కాలంలోకి కరిగిపోయే తెల్లని శీతలాన్ని స్ఫురణకి తెచ్చుకుంటుందట
తమ రెక్కల మీద చందమామని మోసుకెళ్లే పెద్ద పక్షుల గుంపుని జ్ఞాపకంగా పిలుస్తుందట
…………
అలా ఆమె బాధలో ఉన్నప్పుడు తనకిష్టమైన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుందట.
వాళ్ల భయాల్ని పోగొట్టడంతో సరిపెట్టుకోక, ఆనందంగా జీవించడమెలాగో నేర్పుతుంది . తప్పిపోయిన వారి బాల్యాన్ని తెచ్చి మళ్లీ  వాళ్లకే బహుమానంగా ఇస్తుంది. సంగీతంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తుంది . అప్పుడొచ్చే  డో-రే-మీ పాట గురించి తెలుసుకోవాలంటే వినడమొక్కటే మార్గం .
ఆ క్రమంలోనే ఎప్పుడో ఆ పిల్లల తండ్రి జార్జ్ తో  ప్రేమలో పడుతుంది . తప్పు చేస్తున్నానన్న భావంతో, తిరిగి మఠానికి వెళ్లి తన సమస్యని  ముఖ్య సన్యాసినితో చెప్పుకుంటుంది .అప్పుడామె, మగవాడ్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించనట్టు కాదే! అని నవ్వుతుంది . మేరియాకి ఇలా సలహా ఇస్తుంది .
ప్రతి పర్వతాన్నీ ఎక్కాలాట
ప్రతి ప్రవాహంలోకీ దిగి చూడాలట.
ప్రతి ఇంద్రధనుస్సునీ అనుసరించాలట.
ఇవ్వగలిగినంత ప్రేమని కోరుకునే స్వప్నాన్ని చేరుకునేవరకు
తెలిసిన ప్రతి దారిలోనూ నడవాలట .
ఆ పరిష్కారమార్గానికి తృప్తి చెందిన మేరియా, మళ్లీ జార్జ్ దగ్గరికి వచ్చి అతని ప్రేమని కూడా పొందుతుంది . అందుకు కారణం కూడా ఒక పాటలా ఇలా చెబుతుంది .
ఏమీ లేకపోవడంలోంచి ఏమీ రాదట.
తన చెడ్డ బాల్యంలోనో, దుర్భరమైన యవ్వనంలోనో ఏదో మంచి పని చేసి ఉంటుందట.
అందుకే ఆమె అతని ప్రేమని పొందగలిగిందట.
ఆ ప్రేమ ఫలించి వాళ్లు వివాహం చేసుకోవడం. సన్యాసిని కావాలని కలలు కన్న మేరియా, జార్జ్ భార్యగా , ఏడుగురు పిల్లల తల్లిగా మారి  పరిపూర్ణమైన జీవితాన్ని పొందడం చాలా సాధారణమైన కథే . కానీ ఈ చలన చిత్రాన్ని అసాధారణంగా మార్చినవి మాత్రం సంగీతం , సాహిత్యమే . ఆ సంగీత ప్రవాహంలో మునకలు వేస్తూ, మధ్య మధ్యలో నీటి బిందువుల్లా వేళ్లసందుల్లోంచి జారిపోయే సాహిత్యపు చల్లదనాన్ని అనుభవించడం ఎంత బాగుంటుందో అనుభవించినప్పుడే తెలుస్తుంది. అలాగే ఫేర్వెల్ పాట , సిక్స్ టీన్ గోయింగ్ ఆన్ సెవెంటీన్ పాట … చెప్పాలంటే ఆసలన్ని పాటలూ అద్భుతం అనేకంటే వాటి గురించి చెప్పడానికి మరో పదం లేదు. అందుకే ఈ శ్రావ్యమైన సంగీతధ్వని, తరంగాల తరగలుగా చాలా కాలం పాటు మన జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది . .

ఓ పేదనావికుడి ప్రేమ

 

కామిని, వేశ్యరంగరాజు, ఆమె విటుడు-నావికుడు

 

రంగ:      కామినీ, నువ్వు నన్ను బికారిని చేశావు. ఇప్పుడేమో నన్ను లోపలి రానివ్వడం లేదు. లోగడ నేను విదేశాలనుంచి నీకోసం అద్భుతమైన బహుమతులు తెచ్చినప్పుడు నన్ను నీ ప్రియుడిగా నీపురుషుడిగా నీ యజమానిగా మర్యాద చేసేదానివి. నేనిప్పుడు చితికిపోయి వీథినపడితే నువ్వేమో ఆ బొంబాయి షావుకారుని వల్లో వేసుకొని నన్ను దూరంగా ఉంచు తున్నావు. వాడు నీ పెదాలతీపినీ నీ పొందులోని ఆనందాన్నీ ఆస్వాదిస్తుంటే నేను నీ గుమ్మంలో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నాను. నువ్విప్పుడు ఆ షావుకారుతో పిల్లల్ని కూడా కంటానంటున్నావు. (పెద్దగా ఏడ్చాడు)

కామిని:  నువ్వు నన్ను విసిగిస్తున్నావు రంగారాజూ! ఏంటీ… నువ్వు నన్ను బహుమతుల్తో ముంచె త్తితే నేను నిన్ను బికారిని చేశానా? నీముఖానికి నువ్వు ఎన్ని బహుమతులిచ్చావు నాకు? చెప్పు, ఎన్నిచ్చావు?

రంగ:      కామినీ, లెక్క కోసం కాకపోయినా, నీమీద నాకున్న ప్రేమకు సాక్ష్యం కోసమైనా నేనది చెప్తాను. బాగ్దాద్ నుంచి తెచ్చిన చెప్పుల జత విలువ రెండు వరహాలు. ఆ జత అంత ఖరీదు చేస్తుందని నీకు తెలుసు కదా!

కామిని:  నిజమే కానీ అందుకోసం నేన్నీతో రెండురాత్రులు గడిపాను కదా!

రంగ:      నేను సిరియా నుంచి తిరిగొచ్చినప్పుడు ఒక చలువరాతి పెట్టె నిండా రకరకాల అత్తర్లు తెచ్చిచ్చాను. దాని ఖరీదు ఒట్టేసి చెబుతున్నా రెండువరహాలు.

కామిని:  మరి నేను నీకేమీ ఇవ్వలేదా? ఆ సిరియాకే నువ్వెళ్ళబోయేముందు జమీందారు వెంకట రాజు గారు నాయింట్లో మరచిపోయి వెళ్ళిన పొడుగు చొక్కా నీకిచ్చాను కదా! పడవ తెడ్డు వేసేటప్పుడు తోడుక్కోడానికి బావుంటుందని కూడా అన్నావు నువ్వు, గుర్తొచ్చిందా? జమీందారే నాపొందు కోసం పడిచస్తుంటే, నీలాంటి పకీరుగాడిచ్చే బహుమతుల్ని కూడా గుర్తుంచుకోవాలా నేను?

రంగ:      సరేలే, విశాఖ సముద్రపొడ్డున తిరుగుతుంటే నువ్వు చెప్పే ఆ వెంకటరాజొచ్చి ఆచొక్కా కాస్తా లాక్కుపోయాడు. దానికి చాలా పెద్ద గొడవే అయ్యింది. అదట్లా వదిలేయ్! సైప్రస్ నుంచి ఉల్లిగడ్డల్ని, ఆపక్క దేశం నుంచి వాలిగ చేపల్నీ తేలేదా? టర్కీ నుంచి రొట్టెల్నీ, అంజూరపళ్ళనీ, బంగారు జరీ అల్లిన అందమైన చెప్పులజతనీ తెచ్చివ్వలేదా? విశ్వాసం లేదు నీకు! ఒక పేద నావికుడు నీకోసం బంగారు జరీ అల్లిన అందమైన చెప్పులజతను కొన్నాడు. అంతేనా, ఈజిప్టు నుండి పెద్దడబ్బా నిండా జున్ను తెచ్చిచ్చాను.

కామిని:  (నిరసనగా) అంతాకలిపి ఐదు వరహాలో అంతకంటే తక్కువో అవుతుంది.

రంగ:      అవును. ఒక నావికుడు ఖర్చు పెట్టగలిగే పెద్దమొత్తం అంతకంటే ఎక్కువుండదు కదా! ఇప్పుడు నాపదవి పెరిగింది. తెడ్లేసేవాళ్ళమీద పెత్తనం చేసే పనిచ్చారు. ఏంటలా జాలిగా చూస్తావు? మర్చిపోయా, పోయిన కాముని పున్నమికి నేన్నీకు ఒక వెండి వరహా ఇచ్చాను. మీ అమ్మకు చెప్పులు కొనుక్కోవాలంటే రెండు రాగి కాసులిచ్చాను. ఆమెకి అప్పుడప్పుడూ పావలో అర్ధో ఇస్తూనే ఉంటాను. ఇదంతా నాలాంటి పేద నావికుడు చేయగలిగిందానికంటే ఎక్కువే!

కామిని:  ఉల్లిగడ్డలూ, వాలిగచేపలూ….

రంగ:      నిజమే, ఉల్లిగడ్డలూ వాలిగచేపలూ అంటే నీకు తేలిగ్గానే ఉంటుంది. కానీ అంతకంటే గొప్ప కానుకలు నేనివ్వలేనే! నాకంత స్థాయే ఉంటే ఆ నౌకల్లో పడి దేశాలు తిరుగుతూ గొడ్డు చాకిరీ చెయ్యాల్సిన పనేముంది? నీకివన్నీ ఇచ్చాక మా అమ్మకివ్వడానికి కాసిని చిన్నుల్లి పాయలు తప్ప మరేమీ మిగల్లేదు. సరే ఇంతకీ ఆ బొంబాయి షావుకారు నీకిచ్చిన అంత గొప్ప బహుమతులేంటో తెలుసుకోవచ్చా?

కామిని:  ఈ జలతారు దుస్తులు చూస్తున్నావు కదా, ఇవి అతనిచ్చినవే! ఈ కంఠహారం చూశావా? నువ్వు తెచ్చిన ఎన్ని చేపలైతే ఈ హారం విలువకు సరితూగుతాయి?

రంగ:      అది, ఆ హారం నీ దగ్గర ఇదివరకే ఉండేది కదా!?

కామిని:  ఇదివరకు నువ్వు నాదగ్గర చూసిన హారం చాలా సన్నటిది. రత్నాలు లేనిది. ఇది వేరు. ఈ చెవిదిద్దులు, ఈ కాశ్మీరశాలువలు చూడు. ఇవే కాదు, నిన్నటికి నిన్న అతను నాకు రెండొందల వరహాలిచ్చాడు. ఇంటి అద్దె కూడా ఈ నెల నుంచి తనే కడతానన్నాడు. నువ్విచ్చే ఒక జత చెప్పులూ, కాస్త జున్నూ, ప్రేమ గురించి బోలెడంత సొల్లువాగుడూ వీటికి సాటిరావు కదా!?

రంగ:      ఇంతకీ ఆ షావుకారెలా ఉంటాడో చెప్పలేదు నువ్వు. నా పేదరికాన్నీ అతని దగ్గరున్న డబ్బునీ పోలుస్తున్నావు కానీ అతన్నీ నన్నూ కూడా పోల్చి చూడు. వయసు యాభై పైనే. బట్టతల. ఎండ్రకాయలాంటి ఎర్రని రంగు. సరిగ్గా చూశావో లేదో, బోసినోరు కూడా! ఇక ఆ హుందాతనం చెప్పుకోకపోవడమే మేలు. ఇట్లాంటి ఆకారంతో వాడు కుర్రాడి లాగా ఆడి పాడబోవడం… ముసలోడికి దసరా పండగంటారే, అట్లా ఉంది.

సరే, నీకంతగా నచ్చితే ఆ మన్మధుణ్ణే ఉంచుకో! వాడే నీకు సరైనవాడు. వాడిలాంటి కొడు కునే కను. నన్నిష్టపడే వాళ్ళెవరో నాకు దొరక్కపోరు. నువ్వేమీ విచారించకు. నీ పొరుగింట్లో పిల్లంగ్రోవి వాయించే పిల్ల నాకు బాగా నచ్చింది. తివాచీలు, కంఠాభరణాలు, వందలకొద్దీ డబ్బూ, ఇవేవీ తీసెయ్యాల్సినవి కాదు గానీ, వాటికోసం నాలాంటి అందగాణ్ణొదులుకొని ఒక డొక్కు ముసలాడి పక్కలో చేరడం దరిద్రం. ప్రతిదీ మనకే కావాలంటే దొరకదు కదా!

కామిని:  (వ్యంగ్యంగా) నీప్రేమని పొందినందుకు ఆ పిల్ల చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే నువ్వు సైప్రస్ నుంచి ఉల్లిగడ్డల్నీ, ఈజిప్టు నుంచి జున్నుముక్కల్నీ తెచ్చిపెడతావు కదా!

*

అరణ్య  రహస్యం

 రామా చంద్రమౌళి

Ramachandramouli

అంతస్సంబంధమేమిటో  తెలియదు  కాని

రాత్రి కురిసిన  ముసురులో  తడుస్తూ  సూర్యుడుదయిస్తూంటాడుగదా

అరణ్యం  నిద్రిస్తున్న  నాలోకి  మెల్లగా  ప్రవేశిస్తూ  ఒక  మెలకువగా  మారుతుంది

పాదాలను  అడవిలోని  దారి  పిలుస్తూంటుంది

ఇటు  లోయ .. అటు  శిఖరం .. ఎవరు  పెట్టారో పేరు .. గార్నెట్ వ్యాలీ

ఇల్లేమో.. వుడ్స్  ఎడ్జ్ .. అడవి  అంచుపై  ఒక  వీధి

మనుషులెవరూ  కనబడరు .. ఎప్పుడో  ఒకరిద్దరు  వృద్ధ  దంపతులు

అమెరికన్స్ .. చేతిలో  కాఫీ  కప్పులు .. మరో  చేతిలో  కుక్క గొలుసు

ముఖంపై  పొంగిపొర్లే  చిరునవ్వు ..’ హై ‘ అని  ఆత్మీయ పలకరింత

ఎవరో  అపరిచితులే .. కాని  మనందరం   ప్రాథమికంగా  మనుషులంకదా  అన్న  ప్రాణస్పర్స

తప్పకుండా  ఎప్పటికైనా  విడిపోవలసిన  మనుషులమైన   మనం

కలుసుకున్న ఈ  మధుర  క్షణాన్ని ‘సెలబ్రేట్ ‘ చేసుకుందాం  అన్నట్టు  నవ్వుమెరుపు

ఎదురుగా యాభై  అడుగుల  ఎత్తుతో  ఆకుపచ్చని  స్వర్గాన్ని  మోస్తూ .. చిక్కగా  చెట్లు

ఒంటరిగా  నడుస్తూంటాను. . వెంట పక్షుల సంగీతాన్నీ .. సెలయేరు  శృతినీ .. ఒక  అభౌతిక  నిశ్శబ్దాన్నీ   వెంటేసుకుని

నా లోపలినుండి.. నాకే  తెలియని  ఎవరో  పురామానవుడు  ఆవులిస్తూ .. మేల్కొంటూ.. పరవశిస్తూ

నేనుకాని  నేను  నడుస్తూ

హద్దులనూ.. ఎల్లలనూ.. చెరిపేస్తూ.. ఒకే  ఆకాశంకింది  జీవసంపదనంతా  ఆలింగనం  చేసుకుంటున్నట్టు

ఒక  నీటిబాతు  ధ్వని .. పిచ్చుక  కిచ కిచ .. పక్షుల  రెక్కల చప్పుడు –

ఎక్కడి  పెన్సెల్వేనియా.. ఎక్కడి  వరంగల్లు .. ఐనా  భూమి  ఒక్కటే కదా  అన్న  ఆదిస్పృహ

మొదటిరోజు.. మెల్లగా  నడుస్తూ  బాటలొకొచ్చి  చిన్ని తాబేలు .. గోధుమరంగు డిప్పతో..తలపైకెత్తి

పలకరిస్తోందా.. అది .. ఏ భాష

అటుప్రక్క  కళ్ళు  మిటకరిస్తూ .. చెవులు  రిక్కించి  జింక .. నిలబడి .. ఆ  చూపులదే భాష

వెళ్ళిపోతూంటాను  వృక్షాలను  దాటుకుంటూ.,

జ్ఞాపకమొస్తూంటుంది .. పెన్సెల్వేనియా.. ద  స్టేట్  ఆఫ్  వాల్లీస్  అండ్  హిల్స్ .. అని

అన్నీ కొండలూ..శిఖరాలే మనిషిలోలా..కనబడనివీ..కనబడేవీ..చూడాలంతే కనబడేదాకా

ఒంటరిగా ఒక కర్ర బెంచీ..సన్నని సెలయేరు ప్రక్కన..ఎవరు పెట్టారో మహాత్ముడు

పిలుస్తోంది..రా కూర్చోమని..అతిథినికదా

చుట్టూ  మనుషులు  ప్రకృతిని  పదిలంగా  సంపదలా  దాచుకున్నట్టు .. పచ్చని  గడ్డితివాచీ

నగ్న పాదాలకు నేలను తాకాలనీ.. గడ్డిని  ముద్దాడాలని  ఎంత  తహతహో

పురా దాహం .. యుగయుగాల  అలసట .. ప్రకృతిలోకి  పునర్విముక్తకాంక్ష

నగ్నంగా  వచ్చినవాడా .. మళ్ళీ  నగ్నమైపోవడమే  అని ..హెచ్చరిక

మధ్య  ఈ  బూట్లొకటి .. అడ్డు ..  తొలగించాలి

కోడిపిల్లకూ.. గాలికీ మధ్య ..పెంకు.. ఛేదనం.. అనివార్యమేకదా

అరగంట .. ముప్పావు .. ఉహూ.. విడిచి వెళ్ళలేను

నెల్సన్  డి  క్లేటన్ స్మారక వనం .. అని బోర్డ్

అక్షరాలను  తడుముతాను  ప్రేమగా.. ఎందుకో  కళ్ళలో  నీళ్ళు  చిప్పిళ్ళుతాయి.

నాకు  తెలియకుండానే  ఆ  అరవై  అడుగుల  మాపెల్  చెట్టు   కాండాన్ని  చేతితో  స్పర్శిస్తాను

ఎవరో  యుగాలుగా  తస్సిస్తున్న  మునిని  తాకినట్టు  విద్యుత్  జలదరింత

2

మర్నాడు  మళ్ళీ వెళ్తాను

ఎప్పుడు  తెల్లవారుతుందా  అని  ఎదురు  చూచీ చూచీ

మంచు కురుస్తున్న  రాత్రంతా  అడవి  పిలుపే

ఆకులు  పిలుస్తాయి .. కొమ్మలు  పిలుస్తాయి . . నేల  పిలుస్తూంటుంది .. ఆకాశం  పిలుస్తూంటుంది

నా  తాబేలు .. నా జింక  .. నా  పిచ్చుక .. నా  నీటిబాతు .. నా కుందేలు

నా సెలయేరు .. నా  నిశ్శబ్ద  సంగీతం .. నా  మాపెల్ చెట్టు

ఒడ్డున  నా   ఖాళీ  కర్ర   బెంచీ

నా  అడుగులకోసం  ఎదురుచూచే  నా  కాలిబాట

నా  లోయ . . నా  శిఖరం..నాలో  నేనే  ప్రతిధ్వనిస్తున్నట్టు  నాతోనే  నేను

పేరుకు  ఉదయపు  నడకే .. మార్నింగ్  వాక్

వ్యసనమైపోతోంది  అడవి .. అల్లుకుపొతోంది  అరణ్యం

మనిషినీ ..  మనసునూ.. హృదయాన్నీ ..  అత్మనూ

ప్రతిరోజూ

పిలిచినట్టే  బాటపైకి  తాబేలు  నడిచొస్తుంది ..  జింక  దిబ్బపై  నిలబడి   పలకరిస్తుంది

గడ్డిపై  అల్లరల్లరి  చేస్తూ  పిచ్చుకలు  కచేరీ  చేస్తాయి

సెలయేరు  వేగాన్ని  పెంచుకుని  ఉరికొస్తుంది  నా  కుర్చీ దగ్గరికి

పైనుండి  అకాశమేమో.. నవ్వుతూంటుంది .. పిచ్చి అడవీ .. పిచ్చి మనిషీ .. అని

ఔను .. జీవితాన్ని  జీవవంతంగా  జీవించడం  ఒక  పిచ్చేగదా

3

వెళ్ళిపోవాలిక

వచ్చినవాడెప్పటికైనా  వెళ్ళిపోవాలికదా

వీడ్కోలు .. నా  స్నేహితుల్లారా.. నా  వృక్షాల్లారా.. నా  నేలా.. నా   పెన్సెల్వేనియా   గాలీ

ఇన్ని  రాత్రులు   నన్ను  అల్లుకుని

ప్రతి  ఉదయం  మేల్కొలిపి  తల్లి  పిలిచినట్టు   నన్ను   స్వాగతించిన   అరణ్యమా  నీకు  వీడ్కోలు

చివరి  రోజు .. చివరి  నడక .. చివరి స్పర్శ

చూపులు  తాబేలును  వెదుకుతాయి . .  జింక  కోసం  తహ తహ

సెలయేటి  పాటేది  .. నీటిబాతు  చప్పుడేది

నన్ను  ఒడిలో  కూర్చోపెట్టుకున్న  నా   ఖాళీ   కర్ర కుర్చీ  ఏది

వెదుకులాట .. తడుములాట .. తండ్లాట

అడవిలోకి  వెళ్ళిన   నాలోకి  అడవే  ప్రవేశించి .. ఆక్రమించిన  తర్వాత

అడవిని  పిడికెడు  గుండెల్లో   ధరించివస్తున్న . . దాచుకుని  వస్తున్న  నాలో

ఎంత  దుఃఖమో.. ఎంత  శూన్యమో.. సముద్రమంత .. ఆకాశమంత –

 

   ( అమెరికా..  పెన్సెల్వేనియాలోని   గార్నెట్ లోయ .. వుడ్స్   ఎడ్జ్ లోని  నా  కూతురు ‘ పవన ‘ ఇంట్లో పదిహేను రోజులుండి .. ప్రక్కనున్న   అడవితో  పెంచుకున్న   అద్భుతానుబంధాన్ని  దుఃఖోద్వేగంతో  స్మరించుకుంటూ )

 

 

 

 

 

 

పసునూరి రవీందర్‌ కి యువ సాహిత్య అకాడెమీ అవార్డ్

Pasunoori Ravinder 1

 

సాహిత్య అకాడ‌మి 23భారతీయ భాషల యువపురస్కారం-2015 విజేతల్ని ప్రకటించింది. తెలుగు నుండి ప్రముఖ యువకవి, రచయిత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ను ఎంపిక చేసింది. రవీందర్‌ రాసిన అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా పుస్తకానికి ఈ గౌరవం దక్కింది. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, పరిశోధకునిగా బహుముఖీన కృషి చేస్తున్న పసునూరి రవీందర్‌ సాహిత్యలోకానికి సుపరిచితుడు. వరంగల్‌ నగరంలోని శివనగర్‌ ప్రాంతానికి చెందిన రవీందర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫెలోగా పనిచేస్తున్నారు.

లడాయి దీర్ఘకవిత, మాదిగపొద్దు కవితా సంకలనంతో పాటు అవుటాఫ్‌ కవరేజ్‌ఏరియా, జాగో జ‌గావో, దిమ్మిస‌ పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ ఉద్యమంలో బహుజన వాయిస్‌ను బలంగా వినిపించిన పదునైన గొంతుక రవీందర్‌. ఇటీవలే రవీందర్‌ కృషికి తెలంగాణ ఎన్నారై అవార్డుతో పాటు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును కూడా సీఎం కేసియార్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక సాహిత్య అకాడమి ఎంపిక చేసిన యువపురస్కారం ఈ యేడాది రవీందర్‌ను వరించింది.

 

సురవరం ప్రతాప రెడ్డి రచనలపై సభ

suravaram

‘నీ జీవితమే ఒరవడి!’

వి.వి.

vv.kara                విశాఖపట్నంలో  శ్రీశ్రీ  శతజయంతి సభల్లో  2010 ఏప్రిల్‌ 30,  మేడే రెండురోజులూ నిండా పదిహేనేళ్లు నిండని పసివాడు వేదికమీద, నలుగురిలో గొంతెత్తి పాడిన శ్రీశ్రీ గీతాలు వింటారా? అవి విరసం నిర్వహించిన సభలు. ఆ సభలకు ఆ వసివాడని పసిబాలుడు ఉపాధ్యాయుడైన తండ్రితో వచ్చాడు. తండ్రి డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లో నలగొండజిల్లాలో సభ్యుడు.

 

మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది

 

పదండి ముందుకు

పడండి త్రోసుకు

పోదాం, పోదాం పైపైకి

 

కదం తొక్కుతూ

పదం పాడుతూ

హృదంతరాళలం గర్జిస్తూ`

పదండి పోదాం

వినబడలేదా

మరోప్రపంచపు జలపాతం?

 

దారిపొడుగునా గుండెనెత్తురులు

తర్పణచేస్తూ పదండి ముందుకు!

 

బాటలునడచీ

పేటలుగడచీ

కోటలన్నిటిని దాటండి!

నదీనదాలూ

అడవులు, కొండలు

ఎడారులా మనకడ్డంకి?

..             ..             ..

ఎముకలు క్రుళ్లిన

వయస్సుమళ్లిన

సోమరులారా! చావండి!

నెత్తురుమండే

శక్తులు నిండే

సైనికులారా! రారండి!

 

ఈ గీతం ఇంకెవరో కాదు అప్పటికింకా పదిహేనేళ్లు నిండని వివేక్‌ పాడాడంటే ఇవ్వాళ ఎంత సాధికారికంగా పిలుపు ఇచ్చినట్లు, ప్రకటించినట్లు అనిపిస్తున్నది.

పరస్పరం సంఘర్షించిన

శక్తులలో చరిత్ర పుట్టెను`

అని ‘దేశచరిత్రలు’ కవిత చదివి వినిపించి ఆ పిల్లవాడు అందులోని లోపాలు కూడ చెప్పాడని అంటే అది ఇవ్వాళ మనకాశ్చర్యమనిపించదు.

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం?

అంటాడేమిటి శ్రీశ్రీ? ప్రజలు నిర్మించిన, నిర్మిస్తున్న చరిత్రపట్ల గౌరవం ఉండాలికదా అన్నాడంటే చండ్రరాజేశ్వరరావు పెట్టిన విమర్శ విని ఉన్నట్లా? చెంఘిజ్‌ఖాన్‌ గురించి నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో రాసింది మొదలు, తెన్నేటిసూరి ‘చెంఘిజ్‌ఖాన్‌’ నవల వరకు రాసిన విషయాలు తెలుసుకొని, చదివి ఉన్నాడు ఈ పిల్లవాడు. ఇంతకన్నా శ్రీశ్రీకి ఎక్కువే తెలిసిఉండాలికదా అని ఆశ్చర్యపోయాడు. అవునులే శ్రీశ్రీ, గాంధీని ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ)ని పొగిడినవాడే కదా అని కాస్త కటువుగానే అంటే పిట్టకొంచెం, కూతఘనం అనిపించింది.

ఒక వ్యక్తిని మరొక్కవ్యక్తీ,

ఒక జాతిని వేరొకజాతీ,

ఓడిరచే సాంఘిక ధర్మం

ఇంకానా? ఇకపై సాగదు.

 

చీనాలో రిక్షావాలా,

చెక్‌దేశపు గనిపనిమనిషి

ఐర్లాండున ఓడకళాసీ

అణగారిన ఆర్తులందరూ `

హాటెన్‌టాట్‌, జూలూ, నీగ్రో

ఖండాంతర నానాజాతులు

చారిత్రక యథార్థతత్వం

చాటిస్తారొక గొంతుకతో `

 

ఈ ఆఖరి నాలుగు చరణాలు మరింత పునరుక్తితో చదివాడు

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?

ఏ రాజ్యం ఎన్నాళ్లుందో

తారీఖులు,  దస్తావేజులు

ఇవి కావోయ్‌ చరిత్రకర్థం `

ఈ రాణీ ప్రేమపురాణం,

ఆ ముట్టడికైన ఖర్చులూ,

మతలబులూ, ఖైఫీయతులూ

ఇవి కావోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడికాన్పించని

కథలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగనిసత్యం

 

నైలునదీ నాగరికతలో

సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్‌మహల్‌ నిర్మాణానికి

రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

 

సామ్రాజ్యపు దండయాత్రలో

సామాన్యుల సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,

అది మోసిన బోయీలెవ్వరు?

 

తక్షశిలా, పాటలిపుత్రం

మధ్యధరా సముద్రతీరం

హరప్పా మొహెంజొదారో

క్రో`మాన్యన్‌ గుహాముఖాల్లో `

 

చారిత్రక విభాతసంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించినదే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం

ఏ వెల్గులకీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

 

ఇవీ చారిత్రక భౌతికవాదం నుంచి వేయవలసిన ప్రశ్నలు అంటూనే  ‘పరమార్థం’లోని ఆధ్యాత్మిక వాసన చర్చిస్తే ‘ప్రస్థానం’ గూడా చర్చించాల్సే ఉంటుంది కానీ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు పదాలకు ఉద్దేశాలవల్ల అర్థాలు మార్చినవని అనేవాడు. ఆ సభల్లోనే అని కాదు ` ఆ తర్వాత నాలుగేళ్లలో కలిసినపుడల్లా చర్చల్లో

ప్రశ్నలే, ప్రశ్నలే

జవాబులు సంతృప్తి పరచవు

 

మాకు గోడలు లేవు

గోడలను పగులగొట్టడమే మాపని

 

అలజడి మా జీవితం

ఆందోళన మా ఊపిరి

తిరుగుబాటు మా వేదాంతం

 

ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నా

ముందుదారి మాది

 

ఉన్నచోటు చాలును మీకు

ఇంకా వెనక్కి పోతామంటారు కూడా

మీలో  కొందరు

 

ముందుకు పోతాం మేం

ప్రపంచం మావెంట వస్తుంది

 

తృప్తిగా చచ్చిపోతారు మీరు

ప్రపంచం మిమ్మల్ని మరచిపోతుంది

 

అభిప్రాయాలకోసం

బాధలు లక్ష్యపెట్టనివాళ్లు

మాలోకి వస్తారు

 

అభిప్రాయాలు మార్చుకొని

సుఖాలు కామించేవాళ్లు

మీలోకి పోతారు

 

పందొమ్మిదేళ్లు నిండకుండా రాజ్యహింసకు బలి అయిన వివేక్‌ చితికి నిప్పుపెట్టి తిరిగివస్తున్నపుడు ఒక టీచర్‌ అతనితల్లి మాధవితో ‘వివేక్‌ ఇవ్వాటినుంచి మన ఆలోచనల్లో, ఆచరణలో జీవిస్తాడమ్మా’ అన్నాడు తన కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో

 

కొంతమంది యువకులు రాబోవుయుగం దూతలు

పావన నవజీవన బృందావన నిర్మాతలు

 

అని శ్రీశ్రీ ఇటువంటి విద్యార్థుల గురించే అన్నాడా?

 

పదిహేనో ఏట మాకందరికీ ఇట్లా పరిచయమైన ఈ విద్యార్థి ` అక్షరాలా ` 2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల ఉత్తేజం నుంచి పోరాట బాటలెంచుకున్నవాడు. అతడు లేని, పోరాడని, అరెస్టుకాని తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఏదైనా ఉందా? వీపుమీద పుస్తకాలమూట, కళ్లద్దాలచాటున నూతనప్రపంచ దృష్టి ` అతడొక నవనవోన్మేష అడాలసెంట్‌  వలె లేడూ`  ముఖ్యంగా రెండురెక్కలు పట్టుకొని ఈడ్చుకొని పోతున్న ఉక్కుశిరస్త్రాణాల సాయుధపోలీసుల మధ్యన ` చిరునవ్వుల బాలచంద్రుని వలె.

1934 నుంచీ 41 వరకు రాసిన ‘మహాప్రస్థానం’ మొదలైన గీతాలను శ్రీశ్రీ 1938లోనే అప్పటికే మరణించిన తన మిత్రుడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘మహాప్రస్థానం’ వెలువడిరది మాత్రం 1950లో.

కాని ఇవ్వాళ

ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు

కాగితంమీద ఒక మాటకు బలి అయితే,

కనబడని ఊహ నిన్ను కబళిస్తే….

అనడానికి లేదు. అంతమారింది లోకం` మంచికీ, చెడ్డకూ. సంచలనానికి, సంక్షోభానికీ, సంఘర్షణకు. అందరికీ కావాలి ` కాగితంమీద ఒక మాటకు బలి కావల్సిందేనా అని అడిగే మేధావులూ ఉన్నారు. వాళ్లకాళ్లకు డెక్కలు మొలిచాయి, వాళ్లనెత్తికి కొమ్ములలాగే. వాళ్లందరినీ ఆయన 2 జూన్‌ 2014 నాటికే పోల్చుకున్నాడు. అందుకే నాలుగునెలల్లోనే

నిన్న వదలిన పోరాటం

నేడు అందుకొనక తప్పదని

తన తోటి విద్యార్థి యువకులకు పిలుపునిస్తూ ఆయన విప్లవోద్యమంలోని అజ్ఞాతజీవితానికి వెళ్లిపోయాడు. ఆయనకు పోలవరం పాదయాత్ర దండకారణ్యం జైత్రయాత్రగా మార్చే స్వప్నం. అది సాకారంచేసే జనతన సర్కార్‌లోకి సాగిపోయాడు.

అడవులమీద ఆకాశం తొంగిచూస్తున్నప్పుడు

కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు

తెలుగు దేశంలో ఎక్కడున్నా నేను

నా తొలి యౌవనాన్ని పునర్జీవిస్తాను

అని శ్రీశ్రీ 1975లో అన్నాడు. అప్పుడు ఎమర్జెన్సీ రోజులు. నలబైఏళ్లు పోయాక 2015లో అప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో వివేక్‌ అడవులమీద ఆకాశం తొంగిచూసినపుడు

కొండల్లో ప్రతిధ్వనించిన గుండెలచప్పుడయ్యాడు

బాలెంల సూర్యాపేట తెలంగాణ మట్టిలో తన తొలియవ్వనంలోనే కలిసిపోయాడు. కాని కలిసిపోయిన మరుక్షణం నుంచి మనమధ్యన పునర్జీవిస్తున్నాడు, మరింత ప్రాభవంతో `

అందుకే అంటున్నాం `

లేదు, నేస్తం! లేదు…

నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!

నిరుత్సాహాన్ని జయించడం

నీవల్లనే నేర్చుకుంటున్నాము!

ప్రతికూల శక్తులబలం మాకు తెలుసు,

భయం లేదులే అయినప్పటికీ! `

నీ సాహసం ఒక ఉదాహరణ!

నీ జీవితమే ఒరవడి!

 

(15 జూన్‌ శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా 12 జూన్‌ వివేక్‌ అమరత్వం గురించి)

15 జూన్‌ 2015

 

ఫోటో: కూర్మనాథ్‌ 

 శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా విశాఖపట్నంలో విరసం నిర్వహించిన ఊరేగింపు(2010)లో ఆదివాసులకోసం నినాదం రాసుకొని పాల్గొన్న వివేక్‌

‘ఫాదర్స్’ డే ఫన్ విత్ దినేశన్!

సుధా శ్రీనాథ్ 

 

sudhaఆ రోజు ఫాదర్స్’ డే. స్నేహితులందరూ పిల్లలతో మా ఇంట్లో సమావేశమయ్యారు. ఆ రోజు పిల్లలు తమ అమ్మ సహాయంతో తమ నాన్నకిష్టమైన వంటకాలను చేసి తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుంచివాళ్ళ నాన్న ఫేవరేట్స్ మా డైనింగ్ హాల్ చేరాయి. నేనైతే పిల్లలతో pronunciation కబుర్లకని కూడా ఎదురు చూస్తున్నాను.

అందరం మదర్స్ డే సర్ప్రైజ్‌ని గుర్తుచేసుకొన్నాం. తెలుగులో నాన్నని ‘అప్ప’, ‘అబ్బ’, ‘అయ్య’ అని కూడా అంటాం. కొరియన్స్ కూడా నాన్నని ‘అప్పా’ అని పిలుస్తారట. మొత్తానికి ఈ సారి మదర్స్డే, ఫాదర్స్ డే రెండ్రోజులూ కొరియన్స్‌ని గుర్తు చేసుకొన్నామని అందరికీ నవ్వొచ్చింది. అయితే అమ్మ, అప్ప అనే రెండు తెలుగు పదాలు అదే అర్థంతో వాడే ఇంకో దేశముందనేది అందరికీఅత్యాశ్చర్యాన్నిచ్చిన మాట అక్షరాలా నిజం.

పిల్లల్ని ఆత్మీయంగా సంబోధించడానికి ‘చిట్టి తండ్రీ, చిన్ని నాన్నా’ అంటారని, అమ్మ తనని చాలా సార్లు ముద్దుగా అలా పిలుస్తుందని చెప్పిన ఓ చిన్నారి మాటకు నాన్నల నుంచి ఒకటే చప్పట్లు.ఇంకా బాగుందనేందుకు కొన్ని సందర్భాల్లో ‘దాని అప్ప(అబ్బ)లాగుంది’ అనే వాడుక ఉందనే మాటకి నాన్నల మొహాలు నవ్వులతో నిజంగా వెలిగిపోయాయి. ‘అప్ప’ అనే పదాన్ని పెద్దలకుగౌరవసూచకంగా కూడా వాడుతాం. శ్రీ కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో మహామంత్రియైన తిమ్మరసుని తండ్రిలా గౌరవించి ‘అప్పాజి’ అని అత్మీయంగా సంబోధించేవారట. అవునవును, కొన్నిసముదాయాల్లో నాన్నని ‘అప్పాజి’ అనే పిలుస్తారన్నారు బెంగళూరినుంచి వచ్చిన వారొకరు.

ఆ రోజు పగ్గాలు పూర్తిగా పిల్లల చేతుల్లోనే. పిల్లలు తమకు నాన్నే ఫస్ట్ హీరోనని మళ్ళీ మళ్ళీ చెబుతూ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. అమ్మలు, నాన్నలు కూడా తమ నాన్నను తల్చుకొనిగౌరవాభిమానలందించేలా చేశారు. ఎండెక్కువగా ఉన్నందున ఔట్ డోర్ గేమ్స్ బదులు ఇంట్లోనే నాన్నలకని చిన్ని చిన్ని ఆటలు, బహుమానాలు కూడా ఏర్పాటు చేశారు. “The pioneers in any field are called Fathers in that field. For example: many of you know about Darwin and Mendel. Charles Darwin is known as the father of Evolution theory and Gregore Mendel is for genetics.  Madison is called the father of American constitution. In India, Ambedkar is the father of Indian constitution. Mahatma Gandhi is called the father of the nation.” చిన్నారి మాటలు వింటున్నట్టే ఫాదర్ ఆఫ్ దినేశన్ అంటూ ఒక జోక్ గుర్తుచేశారొకరు.

దినేశన్, గణేశన్ అని అన్నదమ్ములుండేవారు. దినేశన్‌కు తమ్ముడు గణేశన్ అంటే భలే ఇష్టం. ఒక రోజు స్కూల్‍నుంచి వచ్చిన దినేశన్ చాలా డల్‌గా ఉన్నాడు. ఎందుకని వాళ్ళ నాన్న అడిగితే“నాన్నా, నేను నీ కొడుకు కాదా? గణేశన్ నా తమ్ముడు కాదా?” అనడుగుతూ ఏడ్చాడు. ఉన్నట్టుండి నీకీ అనుమానమెందుకన్న నాన్న ప్రశ్నకు అసలు విషయం బయట పడింది. గాంధీజి ఈస్ దిఫాదర్ ఆఫ్ ది నేశన్ అని స్కూల్లో చెప్పారట! జోక్ విన్న నాన్నలకే కాదు, అమ్మలకూ, పిల్లలకూ అందరికీ ఒకటే నవ్వులు. నవ్వులతో, ఆనందంతో నాన్నలందరికీ విందు వడ్డనలతో భోజనాలుమొదలయ్యాయి. వారికి నచ్చిన వంటకాలు నాన్నల విందుకు ఘన స్వాగతం పలికాయి.

భోంచేస్తూ అముదగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి విషయం అందర్నీ భావుకుల్ని చేసింది. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిననాడే వాళ్ళమ్మకు వంటింటినుంచి విడుదల అన్నారట. దాన్ని అక్షరాలాపాటిస్తున్నారట. ప్రతి రోజూ ప్రతి వంటకం తామే చేస్తూ వాళ్ళమ్మకిష్టమైన హాబీస్ కొనసాగించేందుకు పూర్తిగా సహకారమిస్తున్నారట. “మా ఆయన కూడా నాకన్ని విధాలా సహకరిస్తూ మా నాన్ననిగుర్తుతెస్తారు” భర్త పట్ల తమ అభిమానం వెల్లడించారు అముదగారు.

అక్కడున్న ప్రతి నాన్న కూడా అమ్మకు ప్రతి రోజూ ఇంటి పనుల్లో సహాయం, సహకారమిస్తున్నవారేనని పిల్లలందరూనాన్నలను అభినందించారు. అమ్మ ఇంట్లో లేనప్పుడు తను అమ్మా! అని పిలిస్తే నాన్న పలుకుతారని, తనకి అమ్మానాన్నలు రెండు కళ్ళలాగని పలికిందో పాపడు. అవును కదా, రెండు కళ్ళలోఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు; కాకూడదు కూడా. మొత్తానికా రోజు నాన్నలను అభినందనలతో ముంచెత్తారు పిల్లలు. కుటుంబ వ్యవస్థకు అమ్మ నాన్నలిద్దరూ ఆధార స్థంబాలు. బాధ్యతలుతెల్సిన అమ్మా నాన్నలున్న కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు.

bapu

అందరివీ భోజనాలయ్యాయి. వెనకటి వారం సగానికి వదిలేసిన మా pronunciation కబుర్లను కొన సాగించే సమయమది. అంతకు మునుపే నేను మేం మాట్లాడే ఇంగ్లిష్ గురించి పిల్లలతోచర్చించిన విషయం కొందరికి తెల్సి, మన తప్పుల గురించి పిల్లల్ని అడగడం నా తెలివితక్కువ పని అన్నారు.  పిల్లలికపైన మనల్ని ఆడిపోసుకొంటారని బెంగ పడ్డారు. ఇలాంటి ప్రయత్నాలుమానేయమని కొందరు నాకు ఫోన్ చేసి చెప్పారు కూడా. అలాంటి బెంగ అక్కర్లేదని, మనం వట్టినే ఏవేవో ఊహించుకొని దిగులు పడకూడదనే నా అభిప్రాయానికి కొద్దిగా సహకారం దొరికింది. ఈనేపథ్యంలో నేనెదురు చూస్తున్న కబుర్ల సమయం వచ్చేసింది.

అందరం ఒకే చోట కూర్చొన్నాం కబుర్లకని. అచ్చులు, హల్లుల తప్పులతో మొదలెట్టారు పిల్లలు. ‘ఎల్లో’ అనేందుకు ‘యెల్లో’ అంటారన్నారు కొందరు. ‘వోట్’ అనేందుకు ‘ఓట్’ అనడం ‘యెస్’అనేందుకు ‘ఎస్’, ‘ఎండ్’ అనేందుకు ‘యెండ్’ అనడం ఎక్కువగా గమనించిన తప్పులన్నారు ఇంకొందరు. మిగతా పిల్లలు వీరితో సమ్మతిస్తూ తలూపడం కనబడింది.

ఎక్కడైతే z అక్షరం ఉంటుందో అక్కడ j వేసి ఆ పదాలను ఎక్కువగా తప్పు పలుకుతారని, జీరొ, జూ అనే తప్పుల్ని ఉదహరించారు. ఆ ధ్వని తెలుగులో లేనందువల్ల దాన్ని రాసి దిద్దేందుకు వీలుకాదని పిల్లలే తెలిపినప్పుడు విచిత్రమనిపించింది కొందరికి. అదే రీతి x ఉన్న పదాల్లో కూడా అవుతుందని తెలిసింది. ఈ కబుర్లు వద్దని వారించినవారు కూడా పొందికగా ఒదిగిపోయి అభినందించడంవల్ల పిల్లల మాటలు ఊపందుకొన్నాయి. నేను పిల్లలు చెప్పిన ప్రతిదాన్నీ రాసుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే మన తప్పులు మనక్కనపడవు కదూ.

“అండర్‌స్టాండింగ్ అనేందుకు అండ్రస్టాండింగ్ అని, మాడర్న్ అనేందుకు మాడ్రన్ అని అంటారు. కంసిడరేషన్ అనేందుకు కంసిడ్రేషన్ అంటారు. డి మరియు ఆర్ మధ్యలోని అక్షరంమాయమైపోతుంది, ఎందుకో” అంటూ రాగం తీశాడు బాలుడొకడు. Similarly, the vowel between `t’ and ‘r’ disappears  అంటూ ప్యాట్రన్, మ్యాట్రు అన్నాడింకో చిన్నారి.  Also, the vowel between `t’ and ‘l’ disappears  ఇంట్లిజెంటు, మెంట్లు అంటారని బుంగ మూతి పెట్టిందో చిన్నారి.  కారణమేం చెప్పాలో తోచక నవ్వేసి, వాటిని కూడా రాసుకొన్నాను ఆ తప్పులు నామాటల్లో లేకపోయినా కూడా. ఎగైన్‌స్ట్ అనేందుకు మాలో చాలా మంది ఎగెనెస్ట్ అంటామని ఒకావిడ చెబితే విని పిల్లలు చిరునవ్వులు చిందించారు.

“కొందరు what, where, why తప్పుగా pronounce చేస్తారు. వాటినెలా కరెక్ట్ చేయాలో తెలీదు.” చిన్నారియొక్కతె చెప్పవచ్చో, చెప్పకూడదో అనే భావంతో చెప్పింది. ఇండియన్స్ చాలా మందిwicket బదులు vicket అంటారని గుర్తుచేశాడింకో అబ్బాయి. నాకు పాప చెప్పిన v మరియు w ల వల్ల నేను చేసేటటువంటి మిస్టేక్స్ గుర్తొచ్చి పాప వైపు చూశాను. అది కూడా భారతీయ భాషల్లోరాయడం కష్టం. అందుకే wicket కాస్త vicket అని భారతీకరించారని పాపే కారణమిచ్చింది. ఓహో! నేనా తీరున ఆలోచించి ఉండలేదు. సమస్యకు మూల కారణమేమని కూడా పిల్లలేఆలోచిస్తున్నారని గర్వమనిపించింది.

budugu

కొందరు భారతీయులు చాలా వేగంగా మాట్లాడుతారు; దాని వల్ల అక్కడక్కడ అక్షరాలను మింగేస్తారని ఒకరు, కొన్ని చోట్ల లేని ‘అ’కారాన్ని చేర్చి పలుకుతారని ఇంకొకరి ఫిర్యాదు. ఫిల్మ్, ఫార్మ్అనాల్సినప్పుడు ఫిలమ్, ఫారమ్ అంటారనేది వారి వాదం. మనలో చాలా మంది eyes మరియు ice రెంటినీ ఒకే విధంగా ఐస్ అంటారని మరొకరి ఆక్షేపణ. అంత వరకూ మౌనంగావినిపించుకొంటున్న గౌరవ్ మాట్లాడ్డానికని చేయెత్తాడు. గౌరవ్ పుట్టింది, పెరిగింది అమేరికాలోనే. గౌరవ్ తల్లిదండ్రులు తమ పెళ్ళికి మునుపే అమేరికాలో సెటిలై ఉన్న వారట.

“I don’t care much about how foreigners pronounce English. We can always understand it from the context. As a native speaker I feel that English is a crazy language as far as the pronunciation goes. For example, if ‘s’ comes between two vowels then it has a ‘z’ sound. There are too many such rules and too many exceptions which complicate the learning. I love Indian languages because they are phonetic. I love Telugu. Take any letter in Telugu. There is only one way to pronounce it no matter where it comes.” అప్పుడే హైస్కూల్ ముగించి కాలేజికెళ్ళెబోతున్న గౌరవ్ మాటలు, చెప్పిన తీరూ అందరి మొహాలపై సకారణ మందహాసాన్ని తెచ్చాయి.తాము తెలుగువంటి సుసంబద్ధ, తార్కిక భాషికులమనే గర్వం పిల్లల కళ్ళలో తొంగి చూసింది.

ఆ రోజు తల్లిదండ్రులు శ్రోతృలై పిల్లలే ఎక్కువగా మాట్లాడారు. పిల్లలకు తెలియని తెలుగు గురించి మేం చెప్పేలాగా పిల్లలు తాము గమనించిన, తమకు తెలిసిన విషయాలను మాతో పంచుకోవడానికి ఉత్సుకులై కనపడ్డారు. ఇన్ని రోజులు మనస్సులో ఉంచుకొన్న భావాలను బయటికి చెప్పుకొనేందుకు పిల్లలకు ఆరోజొక మంచి అవకాశాన్నిచ్చింది. పిల్లల్లో ఇంత సూక్ష్మంగా గమనించగలిగేసామర్థ్యముంటుందా అని అమ్మానాన్నలు ఆశ్చర్యపడేలా చేసిందా రోజు. ఎవరూ ఏదీ రాసుకొని తీసుకు రాలేదు. ఏది జ్ఞాపకమొస్తే దాన్ని, ఒక్కొక్కరూ తాము విన్న తప్పు ఉచ్ఛారణలనుతెల్పుతూ తమ భావనలను వెలిబుచ్చేందుకొక వేదికయ్యిందా రోజు.

కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళ సలహాలు, సూచనలకు ప్రాధాన్యతనివ్వకుండా వాళ్ళకి తాము నచ్చమనే అపోహలో ఉంటారు. మీరు మీ చిన్నప్పుడు తెలుగు నేర్చినరీతి వేరు; పిల్లలిక్కడ నేర్చిన రీతి వేరు. మీరు ఫోనెటిక్స్ రూల్స్ ఫాలో చేయరన్న మాత్రానికి పిల్లలకు మీరిష్టం లేదని కాదు. మాట కన్నా మనస్సు ముఖ్యం. మనస్సులోని భావనలు ముఖ్యం.మనకు సాధ్యమయినంత ఉచ్ఛారణలను మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చని నేనన్నాను. పిల్లలందరూ నాతో ఏకీభవించారు. మేం తెలుగు తప్పుగా మాట్లాడితే మీకు మా పైన ప్రేమ ఎలా తగ్గదోఅలాగే ఇది కూడా అన్న ఒక చిన్నారి సమన్వయత అందరికీ ఆనందాన్నిచ్చింది.

ఈ చర్చ వల్ల నాతో పాటు అక్కడున్న అందరికీ సహాయమయ్యింది. అంతే కాదు అమేరికాంధ్ర పిల్లలకు అమ్మభాషపై అవగాహన, మమకారం రెండూ పెరిగాయి. ఉచ్ఛారణల్లో సందిగ్ధమయమైన,ధ్వన్యాత్మకం కానటువంటి ఇంగ్లిష్ నేర్చుకొన్న ఆ పిల్లలకు ధ్వన్యాత్మకమైన తెలుగు భాష సుసంపన్నమనిపించింది. భలే సంతోషమయ్యింది. It was, indeed, a win-win discussion.థ్యాంక్యూ వెరి మచ్ చిట్టి తండ్రులూ, చిన్ని నాన్నలూ!

*

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు!

ఎన్ వేణుగోపాల్

 

venu1చాల ఇష్టమైనవాళ్లు, కౌగిలిలోకి తీసుకొని ఆ స్పర్శను అనుభవించాలని అనిపించేవాళ్లు మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాత్రమే అయిన సన్నిహిత, సున్నిత, ఆంతరంగిక సంభాషణ సాగించాలని అనిపించేవాళ్లు ఒక గజం అవతల నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? కాని మీకూ వాళ్లకూ మధ్య అడ్డుగోడ. వాళ్లు కనబడుతూనే వినబడుతూనే ఉంటారు. మీరు చెయ్యి చాపలేరు. అవతలివాళ్లు చెయ్యి అందించలేరు. వాళ్లను మీరు దగ్గరికి తీసుకోలేరు. మీ కంటి తడిని వాళ్ల మునివేలుతో తుడవలేరు. మీకూ వాళ్లకూ మధ్య రెండు ఇనుప జాలీల తెర, ఆ రెండు జాలీల మధ్య ఇటు మూడు అంగుళాలు అటు మూడు అంగుళాలు వదిలి ఇనుప ఊచలు. అప్పుడు మీ హృదయం ఎట్లా రవరవలాడుతుంది? దేహం ఎట్లా స్పర్శ కోసం తపిస్తుంది? అరచెయ్యి అవతలి అరచేతి వేడిని అనుభవించాలని ఎంత కొట్టుకులాడుతుంది? గుండెలోని మాటను చెప్పనూలేక, చెప్పకుండానూ ఉండలేక గొంతు తానే గుండెను ఎలా పొదివి పట్టుకుంటుంది? మనశ్శరీరాలు వాగర్థాల లాగ కలిసిపోయి ఏ అనంతవేదనను అనుభవిస్తాయి? సామీప్యమే సుదూరమైన ఆ కఠినమైన, భయానకమైన, దుఃఖభాజనమైన ఎరుక ఎలా ఉంటుంది?

పది సంవత్సరాల కింద అటువంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది.

నిజామాబాదులో రఘునాథాలయం అనే బోర్డు ఉన్న ఎత్తైన పెద్ద కోట సింహద్వారంలోంచి లోపలికి వెళ్లి, ఒక మలుపు తిరిగితే గుట్ట మీదికి ఓ వంద మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కితే ఒక పక్కన పాత కాలపు గడీ బంకుల లాంటి వరండా, మరొక పక్కన కొండ అంచు పిట్టగోడ. ఆ వరండాను కూడ గదిగా మార్చి అక్కడ కాపలా జవాన్లు ఉంటారు గనుక అక్కడ కూచోవడానికీ నిలబడడానికీ వీల్లేదు. ఆ వరండాకూ ఇటు లోయ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ముగ్గురు మనుషులు నిలబడగలిగినంత స్థలంలో అన్నిటికన్న పై మెట్టు. దాని అవతల ‘ప్రధాన జైలు’ అని రాసి ఉన్న దిట్టమైన తలుపు. ఆ తలుపు పైభాగంలో ఇనుప జాలీ, దాని వెనుక ఇనుప ఊచలు. ఆ వెనుక మరొక ఇనుప జాలీ. ఆ తర్వాత కటకటాల తలుపు. అక్కడినుంచి ఆరడుగుల నడవా. దానికి ఒకపక్కన జైలు అధికారుల గదులు. ఆ నడవా చివర కిందికి దిగడానికి నాలుగైదు మెట్లు. మెట్ల చివర మళ్లీ ఒక చిన్న చెక్క గేటు. అది దాటి లోపలికి వెళ్లి రెండు మలుపులు తిరిగి ఇరవై ముప్పై గజాలు నడిస్తే మళ్లీ గేటు. అది దాటితే నాలుగు వైపులా ఖైదీల బారక్ లు, మధ్యలో కాపలా జవాన్ల గది, దాని పక్కన నీళ్ల ట్యాంక్. అక్కడున్న బారక్ లలో ఒకదాంట్లో దాదాపు ఇరవై రోజులు నిర్బంధంలో గడిపి పది సంవత్సరాలు గడిచింది.

 

మహారాష్ట్ర ఔరంగాబాదులో జరిగిన అరెస్టు, మానసిక హింసతో, ప్రశ్నల వేధింపులతో మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం, అబద్ధపు ఆరోపణలతో నిజామాబాదులో కేసు, ఇరవై రోజుల పాటు నిజామాబాదు జైలు జీవితం, ఐదు సంవత్సరాల పాటు సాగిన విచారణ, ఆ విచారణలో పోలీసుల అబద్ధాలు ఒకటొకటిగా తుత్తునియలు కావడం, చివరికి కేసు కొట్టివేత, నిర్దోషిగా విడుదల ఎన్నో స్థాయిలలో నామీద ప్రభావం వేశాయి. అంతకు ముందు రెండు మూడు సార్లు పోలీసు నిర్బంధంలోకీ, జైలులోకీ కూడ వెళ్లాను. అంతకు ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కుటుంబ సభ్యుల, మిత్రుల అరెస్టుల సందర్భంగా వారిని కలవడానికి జైలుకు వెళ్తూ ఉన్నాను. కాని ఈసారి అనుభవం పూర్తిగా కొత్తది. మన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల పనితీరు గురించి ఆ నిర్బంధం నాకు అనుభవైకవేద్యమైన పాఠాలు నేర్పింది. స్టేట్ వర్సస్ గంటి ప్రసాదం అండ్ అదర్స్ అనే ఆ కేసులో నా సహనిందితుడు, గురువు, మిత్రుడు గంటి ప్రసాదం హత్యకు గురయి రెండు సంవత్సరాలయింది. ఆ కేసు నాటికి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉండిన నేను ఇవాళ ఆ స్థానంలో లేను గాని, ఏ విశ్వాసాలతో ఆ నిర్బంధాన్ని అనుభవించానో ఆ విశ్వాసాలు ఇవాళ మరింత దృఢంగా ఉన్నాయి. పది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఆ భయోద్విగ్న అనుభవాలను, అవి ఇచ్చిన అవగాహనలను పంచుకోవాలనిపిస్తున్నది.

“ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది” అని నా అరెస్టు సమయానికి ప్రజాతంత్ర వారపత్రికలో నేను రాస్తుండిన ‘ఆఖరిపేజీ’ కాలంలో విడుదలై రాగానే రాశాను. (ప్రజాతంత్ర 2005 జూన్ 19-25)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య 2004 అక్టోబర్ లో హైదరాబాదులో తొలివిడత చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన నక్సలైట్ల ప్రతినిధులతో ఆ చర్చలు జరిగాయి. ఒకటి అంతకు ముందు వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (పీపుల్స్ వార్) గా ఉండి, సరిగ్గా చర్చల సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గా మారినది. మరొకటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (జనశక్తి). రెండో విడత చర్చలకు నవంబర్ లో ఆహ్వానిస్తామనే ప్రభుత్వ హామీతో, రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో నక్సలైట్లు వెనక్కి వెళ్లారు. కాని ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు. మళ్లీ ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఆ ప్రస్తావనే మానేసి మళ్లీ నిర్బంధం ప్రారంభించి, జనవరి 2005 తర్వాత ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గనుక తామూ కట్టుబడి ఉండబోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నక్సలైట్ల వైపునుంచి ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నదనీ, విస్తృత ప్రజా సంబంధాలతో ప్రజాభిప్రాయం ఏమిటో చెప్పగల ప్రముఖులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నామనీ. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం (గంటి ప్రసాదం) కబురు పంపారు. ఈ విషయం మాట్లాడడానికి నేను తనను కలవడం వీలవుతుందా అని అడిగారు. ప్రభుత్వ నిర్బంధం పెరిగిన స్థితిలో తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బైట జరిగితే మంచిదని, అందువల్ల రెండు రోజుల కోసం ఔరంగాబాదు రమ్మని అడిగారు. నాతోపాటు విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వస్తారని రాశారు.

venu2

నేను అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, అట్లాగే విరసం సభ్యుడిగా కూడ ఉన్నాను.  పాత్రికేయుడిగానూ, విరసం సభ్యుడిగానూ ఆయనను కలవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య పెద్ద విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయ వృత్తి విధి నిర్వహణలోకి రాజకీయ విశ్వాసాలను తీసుకురాలేదు. మాట్లాడతానంటున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. మాట్లాడదలచుకున్నది పాత్రికేయుడిగా, విరసం సభ్యుడిగా ఉన్న నాతో. అటువంటప్పుడు అభ్యంతరం ఎందుకుండాలి? అంతకు ఆరు నెలల ముందే ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితో, ఇతర నాయకులతో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు ప్రభుత్వ భవనంలోనే మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ప్రభుత్వ మంజీర అతిథి గృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి, మాట్లాడి, తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయాలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ మీద నిషేధం కూడ లేనప్పుడు, నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో, పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే 2005 మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. కాసేపటికి ప్రసాదం, ఇతర మిత్రులు వచ్చారు. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడు – ఏడున్నర మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి ప్రశ్నలతో వేధించారు. చంపుతామని బెదిరించారు. మర్నాడు రాత్రి వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించారు. మరొక చోట మళ్లీ రెండు రోజులు అట్లాగే కళ్లకు గంతలతో, చేతులు వెనక్కి విరిచికట్టి ఒక గదిలో నిర్బంధించారు. అప్పటిదాకా మాపక్కన ఉన్నవాళ్లు మమ్మల్ని పట్టుకున్న మూడో రోజు మధ్యాహ్నం, “ఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారు” అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని అలాగే కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతో ఒక వ్యాన్ ఎక్కించి అరగంట ప్రయాణం చేయించారు. అక్కడ మా కట్లు విప్పదీస్తే అది నిజామాబాదు డిఐజి కార్యాలయం అని మాకు తెలిసింది.

అక్కడ పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే మే 30 సాయంత్రం ఏడు నుంచి జూన్ 2 సాయంత్రం నాలుగు దాకా, దాదాపు 70 గంటలు మేం కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా, మధ్యలో ప్రశ్నల వేధింపులతో, చంపుతామనే బెదిరింపులతో నిర్బంధంలో, మా అదృశ్యం గురించి మా కుటుంబాలు ఎలా ఆందోళన పడుతున్నాయో వేదనతో ఉన్నాం. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని, నిందితుల పట్లనైనా వ్యక్తిగత గౌరవాన్ని చూపాలని, చట్టబద్ధమైన విచారణలో నిస్సందేహంగా రుజువయ్యేవరకూ నిందితులను కూడ నిర్దోషులుగానే పరిగణించాలని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ప్రముఖులుగా, రచయితలుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘనకు గురైతే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు? చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే పోలీసు వ్యవస్థ ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలు కావడానికి అవకాశం ఉంది!

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమయ్యామనే నిజం చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్రలోని పట్టణానికి వెళ్లి అక్కడినుంచి ఐదుగురు వ్యక్తుల్ని ఎత్తుకురావడానికి చట్టబద్ధంగా వీల్లేదు గనుక నిజామాబాదులో అరెస్టు చేశామని అబద్ధం చెప్పారు. మేం ఔరంగాబాదు సమావేశం నుంచి నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం అంత ఘనంగా ఉంది! ఎవరైనా ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్లదలచుకుంటే ఏమార్గంలో వెళతారో పటం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా హైదరాబాద్ తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 సాయంత్రానికి బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయి.

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను నిష్కారణంగా అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, పోరాట నాయకులను దొంగచాటుగా పట్టుకుని చంపడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులను నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖకు తెలిసిన పనులయిపోయాయి.

ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి అసలు పనులు మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పని చేస్తే చాలునని, అది చేస్తే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. ఎంతమందిని చంపితే అంత తొందరగా పదోన్నతులు కల్పించే దుర్మార్గమైన హంతక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ప్రకటించి అమలు చేసింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలిగారో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివీ, నైపుణ్యమూ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని. అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉండడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినదీ, అక్కడ తాము నిర్వహిస్తున్న రహస్య స్థావరంలో ఒకరోజంతా పెట్టుకున్నదీ వాళ్లే. రెండున్నర రోజులపాటు మాతోపాటు ఉన్నది వాళ్లే. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని మామూలు పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. వాళ్లను మేం చూడకుండా, గుర్తు పట్టకుండా ఉండడం కోసమే మా కళ్లకు గంతలు.

ఇక మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీద ఆధారపడి మా మీద కేసు నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని అల్లిన కట్టుకథ మామీద నేరారోపణ. ఆ ఎఫ్ ఐ ఆర్ తో మమ్మల్ని జుడిషియల్ కస్టడీకి పంపించడానికి నిజామాబాదు మెజస్ట్రీటు ముందర హాజరు పరచవలసి ఉండింది. నిజామాబాదులో హాజరు పరుస్తామని చివరిదాకా చెపుతూ వచ్చారు. కాని అంతకు ముందురోజు సాయంత్రం నుంచే మా అరెస్టు వార్త టివిల్లో వచ్చినందువల్ల నిజామాబాదు కోర్టుకు చాలమంది రావడంతో, చివరి నిమిషంలో ఏదో సాంకేతిక కారణం చూపి బోధన్ మెజస్ట్రీట్ ముందర హాజరుపరిచారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో మా మీద కేసు నమోదు చేశారు. మా అక్రమ నిర్బంధం గురించీ, శారీరక, మానసిక చిత్ర హింసల గురించీ, పోలీసులు చెపుతున్న అబద్ధాల గురించీ బోధన్ మెజస్ట్రీట్ ముందు నేను పావుగంట పాటు వినిపించిన వాదన అరణ్యరోదన అయింది. చిన్నకోర్టులన్నిట్లోనూ న్యాయమూర్తులకు తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదనే గుర్తింపే ఉండదు. హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్కన నిలబడి ఉన్న సర్కిల్ ఇనస్పెక్టర్ వైపో, డీ ఎస్పీ వైపో చూస్తూ వాళ్ల కనుసన్నలను బట్టి ప్రవర్తిస్తుంటారు.

venu4

మా అరెస్టుల గురించి మొత్తంగానూ, నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ చాల నిరసన వ్యక్తమయింది. అప్పటికి పదమూడు సంవత్సరాలుగా రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవలసిన డయాబెటిక్ గా ఉన్న నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా మా అరెస్టులను ఖండిస్తూ, మాకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు ఇచ్చాయి. సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి “ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోము” అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ దాఖలు కావడానికి ముందే, విచారణకోసం తమకు అప్పగించాలని పోలీసులు కోరి ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు.

వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. “ఏదో సమాచార లోపం వల్ల అలా జరిగింది” అన్నారాయన! హైటెక్ ప్రభుత్వానికి అంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయింది. కాని నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు. ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల నేనూ, మిత్రులందరమూ బెయిల్ మీద విడుదలయ్యాం. అలా నిజామాబాదు జైలులో దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం వచ్చింది.

నిజామాబాదు జైలు తెలంగాణ జనజీవితంలో, సాహిత్యంలో ముఖ్యమైనది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి మహామహులు నిజాం వ్యతిరేకపోరాటంలో ఆ జైలులో బందీలుగా ఉన్నారు. ‘నాతెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి పద్యాలు రాసినది ఆ జైలులోనే. పోలీసులు చెరిపినకొద్దీ ఆ పద్యాలను మళ్లీ మళ్లీ గోడలమీద బొగ్గుతో ఆళ్వారుస్వామి రాసినదీ ఆ జైలు లోనే. ఆ జైలులోకి వెళ్లడం ఒక అపురూపమైన అనుభవం. అక్కడి గోడల మీద ఆరు దశాబ్దాల కింది దాశరథి, ఆళ్వారుస్వామి అక్షరాలు ఉన్నాయా అని వెర్రిగా వెతికాను. జైలు నుంచి బైటికి రాగానే ‘ఖిలా జైలు – దాశరథి నుంచి ఇవాళ్టి దాకా’ అని నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయింది.

జైలు జీవితం చిత్రమైనది. ఎవరు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో ఎవరికీ తెలియకుండానే ఖైదీలను శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసే దారుణమైన నిబంధనలు అమలవుతుంటాయి. అన్నిటిలోకీ విచిత్రమైనది జీవితాన్ని కురచబార్చడం. ఉదయం ఆరింటికి బారక్ ల తాళాలు తెరుస్తారు. సాయంత్రం ఆరింటికి తాళాలు వేస్తారు. అంటే పన్నెండు గంటలు మాత్రమే బారక్ బైటి జీవితంతో సంబంధం ఉంటుంది. ఆ పన్నెండు గంటలలోకే మొత్తం ఇరవై నాలుగు గంటల జీవితాన్ని కుదించుకోవాలి. రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసిన రోగగ్రస్తుడిగా నాకు ఈ నిబంధన ప్రాణాంతకమయింది. ఖైదీలను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించడానికి ఖైదీల దగ్గర అందుకు ఉపయోగపడే పరికరాలేవీ ఉండనివ్వగూడదని ఒక నిబంధన. అందువల్ల బారక్ లో నా దగ్గర ఇంజక్షన్ ఉంచుకోవడానికి వీలులేదు. అది జైలర్ గదిలో రక్షణలో ఉండేది. నా బారక్ తాళం తెరిచిన తర్వాత అరగంటకో, గంటకో ఏడు గంటల సమయంలో ఉదయపు ఫలహారం తినే ముందు జైలర్ గదికి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని రావాలి. మధ్యాహ్న భోజనం పదకొండు, పన్నెండు మధ్య మళ్లీ జైలర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవాలి. రాత్రి భోజనం బారక్ తాళాలు వేయక ముందే అంటే ఐదు, ఐదున్నర ప్రాంతాలలో పెడతారు గనుక మూడో ఇంజక్షన్ అప్పుడు తీసుకోవాలి. పోనీ ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని గంటల తర్వాత తిందామనుకుంటే, ఆ మొద్దు బియ్యం అన్నం అరగంట ఆలస్యమైనా తినడం అసాధ్యం. అంటే కనీసం ఆరు-ఎనిమిది గంటల వ్యవధి ఉండవలసిన నా ఇన్సులిన్ ఇంజక్షన్లు నాలుగు-ఐదు గంటల వ్యవధికి మారిపోయాయి. మరొకపక్క సాయంత్రం ఇంజక్షన్ కూ ఉదయం ఇంజక్షన్ కూ మధ్య పన్నెండు గంటల వ్యవధి వచ్చింది. ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామమో చెప్పనక్కరలేదు.

venu5

అలాగే జైలు జీవితం గొప్ప అనుభవం, మహత్తర పాఠశాల. జాలీ ములాఖాత్ సంభాషణలు మానవ సంబంధాల మీద ఇనుపతెరలు కప్పుతాయి. అతి చిన్న నేరాలు చేసినందువల్లనో, అసలు నేరాలే చేయకుండానో నెలల తరబడీ, సంవత్సరాల తరబడీ జైలులో గడిపే అమాయకుల విభిన్న జీవన దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. జైలు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలూ, దినపత్రికలూ తక్కువ గనుక దొరికిన ప్రతి అక్షరాన్నీ ఆబగా చదవడం అలవాటవుతుంది. సహఖైదీలతో ఎడతెరిపిలేని చర్చలు వాటికవే వివరంగా రాయవలసిన గ్రంథాలు అవుతాయి.

బెయిల్ మీద విడుదలైన తర్వాత ఐదు సంవత్సరాలపాటు ప్రతి నెలా రెండుసార్లు మేం నిజామాబాద్ కోర్టుకు హాజరు కావలసివచ్చింది. వాదనల సమయంలో పది రోజులు నిజామాబాదులోనే ఉండవలసి వచ్చింది. ఈ వాయిదాల కోసం ప్రతిసారీ కావలి, ప్రొద్దటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి సుదూర ప్రాంతాలనుంచి గంటలకొద్దీ ప్రయాణాలు చేసి, కోర్టులో రోజంతా పడిగాపులు పడి, న్యాయస్థానం చుట్టూ తిరగడంలో ఐదు సంవత్సరాల విలువైన కాలం వ్యర్థమయింది. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సి వెంకటేష్ 2010 ఆగస్ట్ 2 న కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

పోలీసులు కేసు నడిపినతీరు తప్పులతడక అని వర్ణిస్తే అది చాల చిన్నమాట అవుతుంది. మా అరెస్టు చూపిన పత్రికాసమావేశంలో భయంకరమైన నేరం జరగబోతుండగా పట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అసలు ఎవరిమీదనైనా సెక్షన్ 120 (బి) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయదలచుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి, మెజస్ట్రీట్ అనుమతి తీసుకోవాలని చట్టం చెపుతుంది. కాని ఆ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు, కేసు నడిపారు. పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ చట్టవ్యతిరేక ప్రవర్తనకు అది తొలి నిదర్శనం. అసలు నేరారోపణలు అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది. మమ్మల్ని నిజామాబాదు పొలిమేరల్లో అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వాహనం తూర్పుకు వెళ్లిందని ఒకరు చెపితే పడమటికి వెళ్లిందని మరొకరు చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసేటప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు సాక్షులు ఆటోడ్రైవర్లు. తమ ఆటోలను పోలీసులు జప్తు చేసుకుని పోలీసు స్టేషన్ లో పెట్టుకుంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద పోలీసులు తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆ కాగితాలేమిటో తమకు తెలియదనీ, మమ్మల్ని తామెప్పుడూ చూడలేదనీ, మా అరెస్టుకూ పంచనామాకూ తాము సాక్షులం కాదనీ చెప్పారు.

మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపనే కదా’ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడా పోలీసు సాక్షి.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు.  మాదగ్గర తాను జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ‘దీనిలో కుట్ర ఉందా’, ‘దీనిలో కుట్ర ఉందా’ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని ఆ దర్యాప్తు అధికారి తన నోటనే చెప్పకతప్పలేదు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ‘ఆధారమేమీ లేదు’ అని దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాడు.

దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమూ లేదు. కుట్రా జరగలేదు, అరెస్టు చేసినదీ ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులూ కాదు. ఆధారాలుగా ప్రదర్శించినవి ఆధారాలూ కావు. అరెస్టు చేయడానికి వెళ్లామన్న పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు కాదు. అలా ఎన్నెన్నో ‘కాదు’ల మీదా, ‘లేదు’ల మీదా ఆధారపడి పోలీసులు మా నేరం రుజువు చేయదలిచారు.

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు చూపమంటే అది లేదన్నాడు. తాము చేస్తున్న పని అధికారికంగా సరైనదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట. అలా విచారణలో మా న్యాయవాది గొర్రెపాటి మాధవరావు చాల సమర్థంగా పోలీసుల అబద్ధాలనూ కట్టుకథలనూ అబద్ధపు సాక్ష్యాలనూ తుత్తునియలు చేశారు.

అయితే, ఇదంతా కేవలం పోలీసు అధికారుల, సాక్షుల సమర్థత, అసమర్థతలకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ అబద్ధపు సంస్కృతిని, హింసా సంస్కృతిని నేర్పిపెట్టారు. ‘ప్రజలు మాకు శత్రువులు. మీరు మా ఉద్యోగులు గనుక ప్రజలు మీకూ శత్రువులే. మీరు వాళ్లను అలా తప్ప మరొకరకంగా చూడడానికి వీల్లేదు. వాళ్లను ఏమిచేసినా, వేధించినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా ఫరవాలేదు. హక్కుల చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదు’ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు శిక్షణ ఇచ్చారు. (‘అన్నా తమ్ముడూ బంధువూ అని చూడకు, చంపడమే నీ ధర్మం’ అని సరిగ్గా అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత లాగ!) 1947 తర్వాత కూడ పోలీసు శాఖ పాటిస్తున్నది అవే చట్టాలను, అదే సంస్కృతిని, అదే శిక్షణను. అంతకుముందరి వలసపాలకుల సేవ నుంచి ప్రజాసేవ స్థానానికి మారడానికి తగిన శిక్షణ లేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు.

అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారుచేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ తాను చేసిన నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. ఇతర కేసుల సంగతి సరేసరి.

“మావోయిస్టు పార్టీ నాయకులు ఇద్దరితో (గంటి ప్రసాదం, సురేందర్) కలిసి కుట్రపన్నామని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మేం ఆయుధాలు వగైరా సేకరించామని, అది శిక్షార్హమైన నేరమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని మేం కుట్ర చేశామని రుజువు చేసే ఒక్క సాక్ష్యాన్ని కూడ ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. మేం ఆయుధాలు వగైరా సేకరించామని, ఈ ప్రభుత్వ చట్టాల ప్రకారమైనా నేరం చేశామనడానికి ఒక్క ఆధారం కూడ చూపలేకపోయింది. మొత్తం కేసు అంతా మేం ఔరంగాబాదులో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కలిసి మాట్లాడుకున్నామనే ఆధారం తప్ప మరేమీ లేదు. అంటే మనుషులు కలిసి మాట్లాడుకోవడమే ఈ ప్రభుత్వానికి, పాలకులకు, పోలీసులకు తమను కూలదోసే కుట్రలా కనబడిందన్నమాట. ప్రభుత్వాలను కూలదోసే పని పాలకవర్గ ముఠాలు చేసుకుంటూనే ఉన్నాయి. మేం చేయదలచుకున్న పని ఈ వ్యవస్థను కూలదోసే శక్తులకు కలమూ గళమూ ఇవ్వడం. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీద ఆధారపడి ఉన్నది గనుక, ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నది గనుక ఈ వ్యవస్థను కూలదోయడం అవసరమనీ, అనివార్యమనీ, సహజమనీ, న్యాయమనీ మేం భావిస్తున్నాం. అందులో దాపరికమేమీ లేదు. అందుకొరకు మేం కుట్రలు చేయం. ప్రజలకు నిజాలు చెపుతాం. పోరాట అవసరం చెపుతాం. వారు పోరాడుతున్నప్పుడు అండగా నిలబడతాం. వారి పోరాటాలను గానం చేస్తాం. ఆ పోరాటాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతాం” అని మా కేసు కొట్టివేత తర్వాత విరసం పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత చివరిగా న్యాయమూర్తి నిందితులను ‘మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా’ అని అడుగుతారు. దానికి జవాబుగా నిందితులు చేసే ప్రకటనను క్రిమినల్ ప్రొసేజర్ కోడ్ సెక్షన్ 313 వాంగ్మూలం అంటారు. నిజామాబాదు కోర్టులో 2010 జూలై 12న నేను ఆ 313 ప్రకటన చేశాను. దానిలో భాగాలు:

“మొట్టమొదట ఇటువంటి కోర్టు ప్రకటన చదవడం అనే సంప్రదాయం భారతదేశపు న్యాయస్థానాలలో వంద సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని మీ దృష్టికి తేదలచాను. బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్, వి డి సావర్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, ఎం ఎన్ రాయ్ మొదలయిన భారత జాతీయోద్యమ నాయకులు, మీరట్ కుట్రకేసు వంటి ప్రఖ్యాత కేసుల నిందితులు కూడ ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. ఆశ్చర్యమూ విషాదమూ ఏమంటే సరిగ్గా ఇవాళ మామీద ప్రాసిక్యూషన్ వారు బనాయించిన సెక్షన్లే – ఐపిసి 120 (బి), 121 (ఎ), 122 – ఈ నాయకులందరిమీద కూడ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బనాయించింది. ఆ నేరారోపణలకు జవాబుగా ఆ ముద్దాయిలందరూ న్యాయస్థానాలలో తమ మీద బనాయించిన తప్పుడు కేసుల గురించి, తమ రాజకీయ విశ్వాసాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చదివారు. అవన్నీ బ్రిటిష్ వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమ చరిత్రలో భాగమైనవే.

1947 అధికార మార్పిడి తర్వాత కూడ ఇటువంటి నేరారోపణలు, వాటికి జవాబుగా న్యాయస్థానాలలో ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అచ్చయిన ఐదువందల పేజీల పుస్తకం తరిమెల నాగిరెడ్డి హైదరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా చేసిన కోర్టు ప్రకటనే. ఆ కుట్రకేసులోనే ముద్దాయిలందరి తరఫున దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం – ఎత్తుగడల వివరణ’ అనే సుదీర్ఘమైన కోర్టు ప్రకటన చదివారు. పార్వతీపురం కుట్రకేసు నిందితులలో చాలమంది కోర్టులో తమ రాజకీయ విశ్వాసాలను తెలియజెప్పే కోర్టు ప్రకటనలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి అనేక కేసులలో ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. రచయితల విషయానికే వస్తే సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి వాటిలో ముద్దాయిలైన కె. వి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం టి ఖాన్ మొదలయిన వారు సుదీర్ఘమైన కోర్టు ప్రకటనలు చేశారు. అవన్నీ పుస్తకాలుగా కూడ అచ్చయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

venu6ఈ వ్యవస్థలో సాగుతున్న దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ రచనలు చేసేవారిని, ఉపన్యాసాలు ఇచ్చేవారిని ‘ఇదిగో ఇలా వేధిస్తాం, అక్రమ నిర్బంధాల పాలుజేస్తాం, అబద్ధపు కేసులు బనాయిస్తాం’ అని బెదిరించడానికే ఈ కేసు. ఈ దోపిడీ పీడనల వ్యవస్థను మార్చాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న వారిని కలుసుకున్నా, వారితో మాట్లాడినా వేధింపులు తప్పవు అని హెచ్చరించడానికే ఈ కేసు. ఈ వ్యవస్థ మీద వచ్చే ప్రశ్నలను మూసిపెట్టడానికే ఈ కేసు. ప్రశ్నించేవారిని, తమ ప్రశ్నల గురించి ఇతరులను ఆలోచించేలా చేసినవారిని వేధించడానికి పాలకవర్గాలు, అధికార యంత్రాంగం నిరంతరం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కేసు.

నావరకు నేను గత మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలుగా పాలన నెరపడం లేదని, భారత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ప్రవేశికను గాని, ప్రాథమిక హక్కులను గాని, ఆదేశిక సూత్రాలను గాని గౌరవించే, చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించడం బుద్ధిజీవిగా నా బాధ్యత అనుకుంటున్నాను. నేను ఆ బాధ్యత నిర్వహించడం పాలకులకు కంటగింపు అయినందువల్లనే, నన్ను శారీరకంగాను, మానసికంగాను వేధించడానికే, నా కృషిని అడ్డుకోవడానికే నాపై ఈ అబద్ధపు కేసు బనాయించారు.

కాని ఈ కేసు వల్ల ప్రభుత్వాలు, పోలీసులు చెప్పే అబద్ధాలే బయటపడ్డాయి. నా తాత్విక, రాజకీయ విశ్వాసాలు బలపడ్డాయి. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీదనే ఆధారపడి ఉన్నదని, దీన్ని రద్దుచేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించక తప్పదని నా విశ్వాసం బలపడింది. ఆ కొత్త వ్యవస్థ గురించి కలలు కనేవారిని, ఆ కలలను ఇతరులతో పంచుకునే వారిని నిర్మూలించడం, నిర్బంధించడం, భయపెట్టడం, వేధించడం ఈ వ్యవస్థ లక్ష్యం అని నాకు ఈ కేసు తెలియజెప్పింది. మనిషికి కలిగే ఆలోచనలనూ, వాటిని ఇతరులతో పంచుకునే మాటలనూ చూసి ఈ వ్యవస్థ భయపడుతోందని ఈ కేసు తెలియజెప్పింది. ఈ కేసులో మాట్లాడుకోవడాన్నే నేరంగా చిత్రిస్తున్నారు. మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను.”

నిజామాబాదులో ఒక హైటెక్ జైలు కట్టి, ఆ జైలును మార్చేశారు. మా కేసు తీర్పు నాటికే ఆ మార్పు జరిగిపోయింది. వాదనల సందర్భంగా పది రోజులు నిజామాబాదులో ఉన్నప్పుడు మేమందరమూ రఘునాథాలయంలోనుంచి పాడుబడిపోయిన పాత జైలు భవనాల పైకప్పు మీదికి ఎక్కి మాకు ఇరవై రోజులు ఆశ్రయం ఇచ్చిన ఆ స్థలాల ఫొటోలు జ్ఞాపకంగా తెచ్చుకున్నాం. పది సంవత్సరాలు గడిచిపోయింది. జ్ఞాపకంగా మిగిలిన ఆ జైలు శిథిలమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా మారింది. కాని పోలీసులూ, న్యాయవ్యవస్థా, చెరసాలలూ, నిర్బంధ సంస్కృతీ ఏమీ మారినట్టు లేదు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

‘నరు’ని అవతరణా ప్రపంచీకరణలో భాగమే

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి ముందు రాముడు పద్నాలుగు వేలమంది రాక్షసులను ఒంటరిగా చంపాడన్న చిత్రణే చూడండి. కావ్యశైలిలో అలాంటివి సహజమే కానీ, రామాయణం విశ్వాసంలో భాగం అవడం వల్ల వాటిని నిజమని నమ్మే సంప్రదాయం ఏర్పడింది.

రాముడు చారిత్రకపురుషుడా, పురాణపురుషుడా అన్న ప్రశ్నకూ ఇదే వర్తిస్తుంది. ఆయన చారిత్రక పురుషుడు కావడం అసంభవమేమీ కాదు; అదే సమయంలో పురాణపురుషుడు కూడా! చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడాను పాటించని దశలో అలా రెండూ కావడంలో వింత ఏమీలేదు. చరిత్ర, పురాణాల మధ్య తేడాను పాటించకపోవడం మన దగ్గరే కాక ప్రాచీన సమాజాలలో చాలా చోట్ల ఉంది. హోమర్ ను ఇంతకుముందు ఉదహరించుకున్నాం.

రాముడు నరుడనీ, పురుషోత్తముడనీ రామాయణం అడుగడుగునా నొక్కి చెబుతోంది. కాలగతిలో ఆ నరుడే దేవుడిగా మారడం మనకు తెలుసు.

ఇలా నిజానికీ, కల్పనకీ; చరిత్రకీ, పురాణానికీ; నరత్వానికీ, దైవత్వానికీ మధ్య వేలాడవలసిన ఓ త్రిశంకుస్థితి ఇది!  కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలైన మహాభారత పాత్రలకీ ఇదే వర్తిస్తుంది.  పురాణ, ఇతిహాసాలు వాస్తవికార్ధంలో చరిత్ర కావు, నిజమే. కానీ అవి చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి. అలా అనుకున్నప్పుడు త్రిశంకుస్థితి ఉండదు. ఈ సూత్రీకరణ నిజానికి సాహిత్యానికీ వర్తిస్తుంది. సాహిత్యంలో ఎంతో కల్పన ఉంటుంది. అయితే సాహిత్యం ప్రతిఫలించే సమాజమూ, ఆ సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తీ నిజాలు కనుక అందులో ఎంతో నిజమూ ఉంటుంది. ఆ విధంగా అందులో చారిత్రకాంశాల ప్రతిఫలనమూ ఉంటుంది.

మనకిప్పుడు తెలిసిన మానవ కాలమానం రీత్యా చూస్తే రామాయణం ఎప్పటిదో తెలియదు. కోశాంబీ తదితర ఆధునిక చరిత్రకారుల ఊహ ప్రకారం  మహాభారతకథ ఇప్పటికి మూడువేల ఏళ్ల క్రితం జరిగి ఉండచ్చు. అసలు ఋగ్వేదం చెబుతున్న దశరాజయుద్ధమే మహాభారతకథగా రూపొంది ఉండచ్చన్న అభిప్రాయమూ ఉంది(రాంభట్ల, జనకథ). కాలం గురించిన చర్చను అలా ఉంచితే రామాయణ, మహాభారతాలు రెండూ ‘నరు’డి గురించి చెబుతున్నాయి. నరుడే ఆ రెండింటిలోనూ నాయకుడు. రాముడు నరుడైతే, అర్జునుడు ఏకంగా ‘నరు’డనే పేరు కూడా ఉన్నవాడు. అందులోనూ రాముడు సూర్యవంశ క్షత్రియుడు, సౌరవీరుడు.

రాముడు, అర్జునుల చారిత్రకత స్పష్టంగా తెలియకపోయినా; స్పష్టమైన చారిత్రకత కలిగిన ఇద్దరు ముఖ్యులు మనకు తెలుస్తున్నారు. వారు కూడా రాముడు, అర్జునుడిలానే నరవీరులు. క్యాంప్ బెల్ మాటల్లో చెప్పాలంటే సౌరపుత్రులు (sons of light) సాధించిన విజయానికి ప్రతీకలు. తాత్వికార్ధంలో చెప్పాలంటే ఆ విజయం వెలుగు- చీకట్ల(చంద్రుడు)మిశ్రమమైన మాతృస్వామ్యంపై పితృస్వామికమైన వెలుగు(సూర్యుడు) సాధించిన విజయం. వారిలో మొదటివ్యక్తి సారగాన్. ఇతని కాలం క్రీ.పూ. 2350.  అగదకు చెందిన ఇతడు మెసొపొటేమియాను పాలించాడు. రెండోవ్యక్తి హమ్మురాబి. ఇతని కాలం క్రీ.పూ. 1728-1686. బాబిలోన్ కు చెందిన ఇతను కూడా మెసొపొటేమియాను పాలించాడు.hammurabi

వీరికి చెందిన పూర్వరంగం ఇదీ: సమీపప్రాచ్యానికి చెందిన అమ్మవారి ఆరాధన అక్కడికి  ఉత్తరంగా ఉన్న పచ్చికభూముల్లోనూ, దక్షిణంగా ఉన్న సైరో-అరేబియా ఎడారుల్లోనూ నివసించే ఆటవిక జనంలోకి వ్యాపించింది. వీరు స్థిర వ్యవసాయదారులు కారు. అర్ధసంచారదశలో ఉన్న పశుపాలకులు. క్రీ.పూ. 3500 నాటికి వీరు వ్యవసాయగ్రామాలకు, పట్టణాలకు ప్రమాదకరంగా మారారు. హఠాత్తుగా దాడులు చేసి దోచుకుని వెళ్లిపోయేవారు. క్రీ.పూ. 300 నాటికి వీరు రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదిగారు. ఈవిధంగా మెసొపొటేమియా క్రీ.పూ. 2500 నాటికి సైరో-అరేబియా నుంచి వచ్చిన సెమెటిక్ జాతీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సారగాన్, హమ్మురాబి ఈ జాతికి చెందినవారే.

saraganసారగాన్ అమ్మవారి ఆరాధనకు చెందినవాడే అయినా, ఆమెతో అతనిది భిన్నమైన సంబంధం అంటారు క్యాంప్ బెల్. తన తండ్రి ఎవరో తెలియదనీ, నిమ్నవర్గానికి చెందిన తల్లి తనను కని ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెడితే అక్కు అనే సాగునీటిదారుకి దొరికాననీ, అతడు తనను పెంచి పెద్ద చేసి తోటమాలిని చేశాడని, అప్పుడు దేవత ఇష్టార్ తనను ప్రేమించడంతో రాజునయ్యాననీ సారగాన్ చెప్పుకుంటాడు. ఆదిమ పౌరాణికతకు చెందిన దేవత-ఆమె కొడుకు సంబంధం లాంటిదే ఇది కూడా. అయితే క్యాంప్ బెల్ వివరణ ప్రకారం, ఆదిమ పౌరాణికతలో ప్రాముఖ్యం దేవతదైతే ఇందులో కొడుకుది. ఈ కొడుకు దేవుడూ కాదు, బలి పశువూ కాదు; అనామకస్థితి నుంచి హఠాత్తుగా రాజకీయ ఉన్నతిని అందుకున్నవాడు. ఆదిమ పౌరాణికత అహాన్ని వదులుకుని దేవతతో తాదాత్మ్యం (mythic identification) కావడానికి సంబంధించినదైతే, సారగాన్ ఉదంతంలో జరిగింది దానికి వ్యతిరేకం. ఇందులో కొడుకు, అంటే రాజు అహాన్ని పెంచుకుని(mythic inflation) దేవుడి ప్రతిరూపం అవుతాడు. రాజు తనను దేవుడిగా చెప్పుకోవడానికి ఇదే ప్రారంభం. అంటే రాచరికాన్ని పూజారుల ఆధిపత్యం నుంచి, రాజ్యాన్ని మతాధిపత్యం నుంచి తప్పించి ఆనువంశిక రాజకీయవ్యవస్థను తీసుకురావడం.

దీని తదుపరి పరిణామమే భూమి మీది రాజు నమూనాలో దేవతలకు కూడా ఒక రాజును సృష్టించడం! హమ్మురాబి ఉదంతం ఈ పరిణామాన్ని సూచిస్తుంది. మన దగ్గర ఇంద్రుడు దేవతలకు రాజు. ఇప్పటికీ ఆలయాలలో దేవుడికి జరిపే సేవలను ‘రాజో’పచారాలనే అంటాం. హమ్మురాబి మన మనువులా శిక్షాస్మృతిని రూపొందించిన రాజు.  అందులో అతను చెప్పుకున్న ప్రకారం, ఆకాశాన్ని ఏలే ‘అను’, స్వర్గాన్ని, భూమిని ఏలే ‘బెల్’ అనే దేవుళ్ళు  బాబిలోనియా నగరదేవుడు అయిన మర్డుక్ కు ప్రజలందరి మీదా సార్వభౌమత్వాన్ని అప్పగించారు. బాబిలోనియాను ప్రపంచంలోనే దుర్భేద్యంగా మార్చి అందులో మర్డుక్ కోసం పది కాలాలపాటు నిలిచే ఒక పటిష్టమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.  ఆ తర్వాత ఆ దేవుళ్ళు ఇద్దరూ ఎంతో పవిత్రత, దైవభక్తి కలిగిన తనను(హమ్మురాబీని) పిలిచి భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్నీ, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల అణచివేతనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమనీ, మానవాళి శ్రేయస్సుకు పాటుపడమనీ ఆదేశించారు.

తూర్పు దేశాలలో అప్పటికే ఏర్పడిన నిరంకుశ రాజ్యాల నమూనాకు ఈ వాక్యాలు అద్దంపడతాయని క్యాంప్ బెల్ అంటారు. అందులో మానవప్రయత్నంతో రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి, సృష్టికర్త సంకల్పానికి, అనుగ్రహానికి తను ప్రతినిధినని చెప్పుకుంటాడు. అతనిలోని పవిత్రత, న్యాయం, ప్రజాశ్రేయస్సు పట్ల తపన ధార్మికపాలనకు హామీ ఇస్తాయి. ఈ మాటలు వినగానే మనకు వెంటనే ‘రామరాజ్యం’ గుర్తుకువస్తుంది. రామాయణం, బాలకాండ, ప్రథమసర్గలోని మూడు ప్రారంభ  శ్లోకాలు రాముణ్ణి ఇటువంటి లక్షణాలు కలిగినవాడుగా పరిచయం చేస్తాయి. వాటి ప్రకారం రాముడు సకలసద్గుణవంతుడు, ఎలాంటి విపత్తులు ముంచెత్తినా తొణకనివాడు, గొప్ప కార్యశీలి, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు, దృఢనిశ్చయం కలిగినవాడు, ధైర్యశాలి, మహావీరుడు.

ఇంకా విశేషమేమిటంటే, ఈ రాచరిక నమూనాలో రాజును పోల్చవలసింది వృద్ధి, క్షయాలను; చీకటి, వెలుగులను సంకేతించే చంద్రుడితో కాదు; నిత్యం వెలుగునిచ్చే మండే సూర్యుడితో! ఈ సూర్యప్రతాపం ముందు అన్ని రకాల చీకట్లూ, అసురులూ, శత్రువులూ, సందిగ్ధాలూ పలాయనం చిత్తగించవలసిందే. ఈవిధంగా సూర్యభగవానుడు కేంద్రంగా నూతన యుగం ప్రారంభమైందని క్యాంప్ బెల్ అంటారు.  రాముడు ప్రధానంగా చేసింది రాక్షస సంహారమే. ఆయన సూర్యవంశ క్షత్రియుడే కాక, యుద్ధసమయంలో అగస్త్యుడు వచ్చి ‘ఆదిత్యహృదయం’ ఉపదేశించిన తర్వాతే  రావణుని చంపగలుగుతాడు. పైన పేర్కొన్న హమ్మురాబి శిక్షాస్మృతిలోని వాక్యాలలో కూడా “మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింప”మని హమ్మురాబీతో దేవతలు అనడం గమనించండి.

ఈ సూర్యయుగంతోనే పౌరాణిక ప్రపంచంలో ‘సౌరీకరణ'(solarization)గా పేర్కొనే ఒక ఆసక్తికరమైన పరిణామం అడుగుపెట్టిందని క్యాంప్ బెల్ అంటారు. అది, ఆదిమపౌరాణికతకు చెందిన మొత్తం ప్రతీకల వ్యవస్థను తలకిందులు చేయడం! ఎలాగంటే, దేవతా ప్రాధాన్యం కలిగిన ఆదిమ పౌరాణికతలో చంద్రుడు, చంద్రవృషభమూ ముఖ్య ప్రతీకలు అయితే; పురుషుడు, పురుషదేవుడు ప్రాధాన్యం వహించే నవీన పౌరాణికతలో సూర్యుడూ, సింహమూ ముఖ్యప్రతీకలయ్యాయి.

రాజు అధిష్టించే ఆసనాన్ని ఇప్పటికీ ‘సింహాసన’మనే అంటాం. ఈ ‘సింహాసనం’ కేవలం మన రాచరిక సంప్రదాయానికి చెందిన దనుకుంటారేమో, కాదు. ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల రాజులందరూ ‘సింహాసనా’న్నే అధిష్టించారు.

విషయానికి వస్తే, ఆదిమ పౌరాణికతకు చెందిన స్త్రీదేవతలపై రాక్షసులు, లేదా దుష్టశక్తులు అన్న ముద్రవేసి చంపడం; ఆ పౌరాణికతకు చెందిన ప్రతీకలను చిన్నబుచ్చడం లేదా పురుషదేవుళ్ళకు అన్వయించడం; మొత్తంగా స్త్రీ వెనకటి ప్రాధాన్యాన్ని కోల్పోవడం వంటివి ఈ సౌరయుగ పరిణామాలే. ఒక బాబిలోనియా పురాణకథలో జగజ్జనని అయిన తియామత్ అనే దేవత, రాక్షసస్వభావం కలిగిన దుష్టశక్తిగా మారిపోతుంది. ఆమెను మర్డుక్ అనే పురుషదేవుడు చంపుతాడు. అలాగే, రాముడు తాటకను చంపడం; హనుమంతుడు నాగమాతను, సింహిక అనే రాక్షసిని, లంకిణిని జయించడం; కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం, కాళీయుని మర్దించడం మనకు తెలిసిన మన ఉదాహరణలు. ఓడిసస్ సిర్సే, కలిప్సో అనే అప్సరసలను ఎలా లొంగదీసుకున్నాడో చెప్పుకున్నాం. మన పురాణాలలోని దేవాసురయుద్ధాలు కూడా సౌరయుగ పరిణామాలే.

ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది ఏమిటంటే, ఆదిమ పౌరాణికతతో మొదలుపెట్టి, నవీన పౌరాణికత వరకూ ఈ పరిణామక్రమం అంతా  ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తం. ఆపైన, చరిత్రకు అందని ఆదిమ కాలం నుంచి, నేటి ఆధునిక కాలం వరకూ ఈ పౌరాణికతా చరిత్ర అంతా ఒక క్రమగతిలో సాగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్యాంప్ బెల్ నే ఉటంకించుకుంటే, ప్రపంచంలోని ప్రధాన ఆస్తిక/మతవిశ్వాసాలకు  పునాదిగా ఉన్న సృష్టిగురించిన ఆలోచనాక్రమాన్ని ఇలా నాలుగు దశలలోకీ, నాలుగు వాక్యాలలోకీ కుదించుకోవచ్చు :

  1. (ఆదిమ పౌరాణికతలో) ఈ విశ్వమంతటినీ పురుష ప్రమేయం లేకుండా జగజ్జననే సృష్టించింది.
  2. పురుష ప్రమేయంతో జగజ్జనని (ఆది దంపతులు) ఈ విశ్వాన్ని సృష్టించింది.
  3. (నవీన పౌరాణికతలో)పురుషుడు, యోధుడు అయిన దేవుడు జగజ్జనని దేహం నుంచి ఈ విశ్వాన్ని సృష్టించాడు.
  4. ఈ విశ్వమంతటినీ స్త్రీ ప్రమేయం లేకుండా పురుషదేవుడు ఒక్కడే సృష్టించాడు.

సామాజికంగా చూస్తే ఇవే దశలు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లిన క్రమాన్నీ చెబుతాయి.

***

ప్రపంచీకరణపై ముమ్మరంగా చర్చ జరుగుతున్న రోజుల్లో ప్రముఖ ఆర్థికవేత్త మేఘ్ నాథ్ దేశాయి రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది(Globalisation and Culture, The Little Magazine, Globalisation and its contents, Volume V: Issue 4&5, Editor: Antara Dev Sen).  ప్రపంచీకరణ ఇదే మొదటిసారి కాదనీ, రోమన్ సామ్రాజ్యంతో మొదలుపెట్టి అది అనేక అవతారాలలో సాగిందనీ ఆయన అంటారు. నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళి, చరిత్రపూర్వకాలంలోనే మత/ఆస్తిక రంగంలో ప్రపంచీకరణ జరిగిందని అంటాను. ఆదిమ పౌరాణికతలో జగజ్జనని ఆధిపత్యంలో ఉన్న పురుషుడు క్రమంగా ఆ సంకెళ్లనుంచి బయటపడుతూ నరుడిగా/వీరుడిగా/రాజుగా అవతరించి తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కూడా ప్రపంచీకృత పరిణామమే. మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం పాదుకోవడం దాని సామాజిక రూపం. భారతీయ, గ్రీకు పురాణ ఇతిహాసాలతో సహా అనేక పౌరాణికగాథలు ఈ ప్రపంచ పరిణామాన్నే చిత్రిస్తున్నాయి.

epic of gilgamesఇంతకీ నరవిముక్తి రూపంలో జగజ్జననిపై పురుషదేవుళ్లు మహత్తరవిజయం సాధించిన తర్వాత, నరుడి భవితవ్యం ఎలా పరిణమించిందని ప్రశ్నిస్తూ, గిల్గమేశ ఇతిహాసం(The Epic of Gilgames)లో దీనికి జవాబు దొరుకుతుందని క్యాంప్ బెల్ అంటారు. సంగ్రహంగా కథ చెప్పుకుంటే, సుమేరియా నగరమైన ఉరుక్ ను పాలించిన గిల్గమేశుడు ఇందులో నాయకుడు. ఇతనిలో మూడువంతులు దైవాంశ, ఒక వంతు మానవాంశ ఉంటాయి.  ఇతని చండశాసనాన్ని భరించలేక జనం ఇతనికి సమవుజ్జీని సృష్టించమని అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు స్వర్గదేవుడైన అను రూపాన్ని మనసులో తలచుకుని, (పార్వతి నలుగుపిండి నుంచి వినాయకుణ్ణి సృష్టించినట్టు) కాస్త మట్టి చేతుల్లోకి తీసుకుని దానినుంచి ఒక వీరుణ్ణి సృష్టిస్తుంది. అతని పేరు ఎంకిడు.

అడవిమనిషిగా పెరిగిన ఎంకిడుకి పశువులు తప్ప మనుషులు తెలియదు. అతని గురించి విన్న గిల్గమేశ్,(రామాయణంలోని ఋష్యశృంగుడి కథలోలా) అతన్నిఆకర్షించి నగరానికి తీసుకురమ్మని ఒక వేశ్యను పంపిస్తాడు.  ఆమె వలకు చిక్కుకున్న ఎంకిడు ఆమెతో నగరానికి వస్తాడు. గిల్గమేశ్ దేవత ఇష్టార్ పొందు కోసం వెడుతున్నప్పుడు ఎంకిడు అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది. తనకు సమవుజ్జీ అని గ్రహించిన గిల్గమేశ్ అతనితో స్నేహం చేస్తాడు. కొంతకాలానికి ఎంకిడు మరణిస్తాడు. దుఃఖించిన గిల్గమేశ్ తను మరణాన్ని జయించాలనుకుంటాడు. అమరత్వం పొందే మార్గాన్ని అన్వేషిస్తూ (ఓడిసస్ లానే) సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అడ్డంకులను వీరోచితంగా ఎదుర్కొని అమరత్వాన్ని ఇచ్చే ఒక మూలిక గురించి తెలుసుకుంటాడు. విశ్వసముద్రం అడుగున ఉన్న ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తూ ఒక నది దగ్గర ఆగి మూలికను గట్టున ఉంచి స్నానానికి దిగుతాడు. అప్పుడు(మహాభారతంలో ఉదంకుని కుండలాలను తక్షకుడు అనే నాగరాజు అపహరించినట్టు) ఆ మూలిక వాసన పసిగట్టిన ఒక సర్పం నీళ్ళలోంచి పైకి వచ్చి దానిని మింగేసి కుబుసం విడిచిపెడుతుంది. గట్టు మీదికి వచ్చిన గిల్గమేశ్ మూలిక కనిపించకపోవడంతో కుప్పకూలి భోరున విలపిస్తాడు.

అమరత్వాన్నిఇచ్చే సర్పశక్తి(కుండలినీశక్తి) అంతవరకూ పురుషుడి ఆస్తిగా ఉందనీ, దానినిప్పుడు ‘దుష్ట’సర్పమూ, ‘ప్రతిష్ట కోల్పోయిన’ దేవతా తిరిగి తీసేసుకున్నాయనీ, దాంతో మనిషికి దుఃఖమూ, చావు భయమూ మిగిలాయనీ  ఈ కథ కు క్యాంప్ బెల్ వివరణ. క్రీ.పూ. 650 నాటి మట్టిపిడకలపై దొరికిన ఈ రచన హమ్మురాబి(క్రీ.పూ.1750)కాలానికి చెందినదిగా కనిపిస్తుందనీ, చాలామంది ఉద్దేశంలో మనిషి గురించి చెప్పే తొలి ఇతిహాసం ఇదేననీ ఆయన అంటారు.

***

నరుడితోనూ, నలదమయంతుల కథతోనూ మొదలై, ఓడిసస్ కథ మీదుగా వివిధ అంశాలను స్పృశిస్తూ సాగిన వ్యాసపరంపరలో ప్రస్తుతానికి ఇది చివరి వ్యాసమే తప్ప ముగింపు కాదు. వీటిలో చర్చించిన అనేక అంశాలకు పూర్తి న్యాయం చేశానని నేను అనుకోవడంలేదు. ‘నరు’డి అవతరణా, దానితో జమిలిగా అల్లుకున్న పితృస్వామికతలే పురాణఇతిహాసాలకు ప్రధాన ఇతివృత్తాన్ని అందిస్తున్నాయి కనుక, ఏవో కొన్ని వ్యాసాలతో వాటికి ముగింపు పలకడం సాధ్యమూ కాదు. అసలు పురాచరిత్ర అనే సముద్రంలో అవతలి ఒడ్డుకు చేరడం దేవుడెరుగు, నేను ఇంకా ఇవతలి ఒడ్డు దగ్గరే ఉన్నాను…

*

అలా ఉండగానే ‘పురా’గమనం శీర్షిక ప్రారంభించి నేటితో (జూన్ 19)తో సరిగ్గా రెండేళ్ళు గడిచిపోయాయి.  చివరి వాక్యం రాయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఈ క్షణాన నాకే అంచనా లేదు. దానిని కాలానికి విడిచిపెడితే…ఈ వ్యాసాలను ప్రచురిస్తున్న ‘సారంగ’ సంపాదకవర్గానికీ, మొదటినుంచీ ఈ వ్యాసాలపై అమితమైన ఆసక్తిని చూపుతూ ఉత్సాహకరమైన స్పందనను, సవిమర్శక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఎందరో పాఠకులకూ కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇదొక సందర్భం.

షరా మామూలుగా ఇప్పుడు మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరాను. దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలలో ఏ కొసను పట్టుకోవాలన్న విచికిత్సలోకి మరోసారి జారిపోయాను…

*

 

 

 

 

రెండు దమ్ములు

పూడూరి రాజిరెడ్డి

 

rajireddi-1నా కుతూహలానికి ఫలితం ఇవ్వాళ అనుభవించబోతున్నాను.

‘అన్నా, నైట్ ప్లాన్ ఏంటి? అక్కాపిల్లలు ఊళ్లో ఉన్నరా?’ అప్పుడెప్పుడో అనుకున్నది…’ పొద్దున్నే వంశీ నుంచి మెసేజ్.

ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. వేసవి సెలవులు కదా ఊరెళ్లారు. ఏ అజ్ఞాతస్థలంలోనో చేయాల్సివచ్చేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు! ‘పక్కోళ్లు గుర్తుపట్టరు కదా!’

ఆఫీసు పనిలో మునిగిపోయినా, ఒకట్రెండు సార్లు రాత్రి జరగబోయేది చప్పున గుర్తొచ్చింది. ‘ఇవ్వాళ చారిత్రక దినం అవుతుంది నా ఆత్మకథలో’.

వంశీ పడుకోవడానికి సిద్ధపడి వస్తానన్నాడు కాబట్టి, సాయంత్రం వెళ్లాక అన్నం, టమోటపప్పు వండాను. గెస్టు కదా, వేడివేడిగా ఆమ్లెట్లు వేయడానికి సిద్ధంగా అరడజను గుడ్లు కూడా కొనిపెట్టాను. స్నానం చేసి వచ్చేలోగా మిస్డ్ కాల్.

“అన్నా, జీతూ ముందటున్న. బీర్లేమైన తేవాన్న?”

‘బీర్లా? అసలు విషయం ఉందా మనవాడి దగ్గర?’

“రెండు లైట్ బీర్లు తీస్కొ”

“సిగరెట్స్?”

ఇవా మనం కాల్చేది! ‘ఉత్తగనే ఊరియ్యలేదు గదా నన్ను’.

“కింగ్స్ తే”

“లైట్సేనా?”

“రెగ్యులర్”

గిన్నెలు, గ్లాసులు అన్నీ ముందరపెట్టుకుని, చాపలో కొంత చంద్రుడు కనబడేలా కూర్చున్నాక, ఎక్కువ సస్పెన్సులో ఉంచకుండానే పొట్లం బయటికి తీశాడు. దళసరి కాగితంలో చుట్టిన మరో కాగితం. ఆకుపచ్చటి ఎండు ఆకులు!

“వాసన జూడు”

నా ముక్కు బలహీనం. ఏమీ తెలియలేదు.

“ఇది రా అన్న”

“ఏడ సంపాయించినవ్?”

“ధూల్ పేట్. ఇంతకుముందు వందకు ఇంత పెట్టెటోడు. ఇప్పుడు మినిమమ్ మూడు వందలు జేసిండు.”

రెండు బీర్లు, నాలుగు సిగరెట్లు అయ్యాక, చెప్పాడు కవిసోదరుడు: “ఒక మహత్తర కార్యానికి దేహాన్ని సంసిద్ధపరచాలంటే ఇవన్నీ గావాలె. లేకపోతే ఆ మూడ్లోకి పోలేం.”

‘అసలు ఇదే ఏమైనా ఎక్కివుంటే, దాని పాలు ఎలా తెలుస్తుంది?’

“అన్నం ముందు తినేద్దామాన్నా”

“తర్వాత్తిందాం తియ్ ఏంది?”

“తర్వాత ఏ ప్లేన్లో ఉంటమో!”

‘ఇది మరీ అతిశయం’!

అంచనా ఘోరంగా తప్పడం అంటే ఇదే! ఒక విషయం వినడానికీ, అనుభవంలోకి రావడానికీ మధ్య ఊహించలేనంత అంతరం!

 

ఫస్ట్ రౌండ్:

సిగరెట్ లోని పొగాకును వేలితో సుతారంగా మీటినట్టు కిందకు రాల్చేసి, గింజల్ని పక్కకు ఏరేస్తూ ఆకుల్ని అరచేతిలో పొడిగా చేసి, ఆ పొడిని సిగరెట్లోకి బదలాయించి, కొసను దగ్గరగా ఒత్తడం ద్వారా మూతి బిగించిన తర్వాత-

“అన్నా, జాయింట్”

మామూలుగా అగ్గిపుల్ల గీకి అంటించడమే! గట్టిగా లాగాలి. ఏమీ రావట్లేదు. పొగ పీల్చినట్టు కూడా అనిపించదే!

నేను తాగుతున్నానా! ఇది నాకు తాగడం వచ్చా? ఏమీ కాదేంటి?

కటిక చేదు మాత్రం పెదాలకు తెలుస్తోంది. ‘ఛీ’!

అంతే, పెద్ద మార్పు లేదు. ఓస్ ఇంతేనా! ఇది నన్నేమీ చేయదు. మామూలుగానే ఉంది. నేను మామూలుగానే ఉన్నా. అందరినీ అన్నీ కదిలించలేవేమో! నేను సరిగానే పీల్చానా?

లేదు, నేను గట్టివాణ్ని. ఊరికే చెబుతారంతే. నన్ను ఇది పెద్దగా ఏమీ చేయలేదు. తెల్లారి చెప్పాలి, నేను మామూలుగానే ఉండగలిగానని! ఇది జస్ట్… ఉత్తదే! నేను గ్రేటే!

ఊఊఊఊఊఊఊ…. శూన్యం లాంటి గాలి. ఏదో తెలిసింది నెమ్మదిగా!

ఏదో తెలుస్తోంది… తెలుస్తోంది… రెండు మూడు నిమిషాలై ఉంటుందా?

మెదడు మొద్దుబారుతోంది. మెదడు బరువుగా అవుతోంది.

అరే దీన్ని రాయాలి, నోట్ చేయాలి, నోట్సు ఎక్కడుంది?

డైరీ… డైరీ…

“అన్నా, డైరీ నిండిపోతది. కానీ రియల్ లాంగ్ పొయెమ్ అయితది”

వేడి పొగలేవో వస్తున్నాయి, ఛాతీ తిరుగుతోంది, పెదాలు నవ్వుతున్నాయి.

మోకాళ్ల కింద పొడుస్తోంది, పొడుపు మెదడుకు పాకింది, మెదడు ఉందా అని జోక్ వేసుకుంటున్నాను.

కాలికి ఏదో పెద్ద తాడు తగులుతోంది; ఏం తాడు? ఇదెక్కడిది? ఓ దీనియమ్మ డైరీ రిబ్బన్; చక్కలిగింత పెడుతోంది.

నేను రాసింది చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అక్షరాలు పెద్దగా కనబడుతున్నాయి. పెద్దగా… పెద్దగా… బ్లో అప్!

గాలి కంట్లోకి వచ్చింది. ఫ్యానుదేనా? పెద్ద అలలాంటి గాలి కంటి కొసన. చిన్న శబ్దం కూడా పెద్దగా. పేజీ తిప్పుతుంటే పుస్తకం అంత బరువుగా అనిపిస్తోంది. అరే ఈ వాక్యాలకు నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదా? పెట్టాను.

నెమ్మదిగా అక్షరాలు జూమ్ ఇన్ అవుతున్నాయి. నేను నార్మల్సీ… ఇంతే! స్పీడ్ తగ్గుతోంది… దేని స్పీడ్, ఫ్యాన్ స్పీడా?

తగ్గలేదు. తిరుగుతోంది. తల. తల తిరుగుతోంది. గుండ్రంగా తిరుగుతోంది. గుండ్రంగా… గుండ్రం… అరే ఇప్పుడేమో కర్ణంలాగా. ఆఆఆఆఆఆఆ ఇప్పుడు స్లోప్… జారినట్టుగా… జారిపోతున్నట్టు…

ఇప్పుడు పూర్తిగా బోర్లించినట్టు. తల బోర్లా పడుతోంది… బోర్లా…

‘అయినా నువ్వు భలే రాయగలుగుతున్నావురా’

నిజమే, నేను రాస్తున్నా…

తల తలకిందులవుతోంది, తలకిందులు కిందులు…

ఇప్పుడేమో ఏవో కంపనాలు, థిల్లానా థిల్లానా…

చంకల్లో పొడుస్తోంది, వంశీ శ్వాస తెలుస్తోంది, పొడుపు ఎక్కువైంది… పొడుపు… పొడుపు కథ? పొడుపు మరీ ఎక్కువైంది. దీనియమ్మ పొడుపు… పొడుపు…

కళ్లు గట్టిగా తెరిచి, రాయడం చాలించి, నడుమెత్తి వంశీని చూశాను.

“ఏం జేస్తున్నవ్?”

వంశీ రెండో రౌండుకు సిద్ధం చేస్తున్నాడు. ఎన్ని రౌండ్లు తిరగాలని ఇతడు!

నా తలలో మామూలుగానే ఉంది. ఊఊఊఊఊఊఊ…

నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను దీన్ని? ఎగ్జాగ్ట్. లాస్ట్ టైమ్ వాచీ చూసినప్పుడు 11:36. ఛా 11:09. ఇప్పుడు 11:36.

వంశీ ఏదో బ్యాగ్ సర్దుతున్నాడు, జిప్ ఏదో లాగుతున్నాడు, జీప్ అని రాయబోయి జిప్ చేశాను.

ప్లేట్ చప్పుడు… ఎక్కడో కుక్క మొరుగుతోంది, అవ్ వ్ వ్ వ్ వ్ వ్ వ్… బయటా?

“రండి, వచ్చాక రాసుకుందాం; అన్నా, దా”

 

సెకండ్ రౌండ్:

మళ్లీ ఇందాకటిలాగానే- రూమ్ లోంచి బయటి వాకిలి సందులోకి వచ్చి, చీకట్లో గోడకు వీపును ఆన్చి కూర్చుని-

 

(ఈ తర్వాతిదంతా నేను అప్పుడే రాయలేకపోయాను. ఆ మాటకొస్తే తెల్లారి సాయంత్రం కూడా రాయాలనిపించలేదు. 36 గంటల తర్వాత, మళ్లీ జరిగింది గుర్తుచేసుకుని రికార్డు చేశాను. దీన్ని రాయడంలో నా ప్రధాన ఉద్దేశం ఒక స్థితికి సంబంధించిన గ్రహింపును నమోదు చేయడమే! అదైనా 100 స్కేలులో 5,10 కౌంటు మాత్రమే- కేవలం ఒక నీడనీ జాడనీ పట్టుకోగలిగానంతే!)

 

మొదటి పప్ఫు. గట్టిగా, లోపలికి…

రెండోది పీల్చేసరికి శరీరం స్థాణువైంది. చేయి కదిలేట్టు లేదు. వంశీకి దీన్ని పాస్ చేయాలంటే చేయి కదిలించాలని అనిపించట్లేదు. నా చేతు ఇలాగే కాలిపోతుందేమో!

బరువుగా… శక్తిని కూడదీసుకుని… చేయిని కదిపి…

ఇక నేను పీల్చలేను.

నె..మ్మ..ది..గా లేచి మళ్లీ రూమ్ లోకి వచ్చాను.

ముందు తిందాం అనుకున్నా. కానీ కదిలేలా లేను. వెనక్కి చేతులు పెట్టి, నడుం చాపుకుని అలా కాసేపు కూర్చున్నా. బ్యాలన్స్ అవట్లేదు.

శరీరాన్ని మోయలేను. లేను. పడుకోవాల్సిందే… వెల్లకిలా… చేతులు, కాళ్లు బార్లా జాపి…

ఏదో వేడి…  సన్నని మంట ఒళ్లంతా పాకినట్టు, పాదాల నుంచి పైదాకా వచ్చినట్టు… ఎర్రగా…

నోరు పిడచగట్టినట్టు, పెదాలు తెరవలేనట్లు, శాశ్వతంగా మూసుకుపోయినట్లు…

అరే, శక్తి కూడదీసుకుని లేస్తే స్ప్రింగు లాగా లేచిన ఫీలింగ్…

కొన్ని నీళ్లు ఫిల్టర్ లోంచి…

తినేటట్టు లేదు. ఇప్పుడు అన్నం గిన్నె వెతకడం నా వల్లకాదు.

వంశీ తింటున్నట్టున్నాడు. ప్లేట్ కడుగుతాడా? రేప్పొద్దున ఎంగిలిపళ్లెం నాతో కడిగిస్తాడా?

అలాగే రూములోంచి హాల్లోకి వచ్చిపడ్డాను. పడలే, పడ్డంత పనై పడుకున్నా.

నేను శ్వాసిస్తున్నానా?

ఊమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్…

ఏదో కదులుతోంది. ఒంట్లోకి ఏదో ప్రవహిస్తోంది. ఏదో కొత్తది, లేదూ తెలిసినట్టే ఉన్నది… మొత్తం శరీరంలోకి ఆనందం జొరబడుతోంది, పెదాల మీద తెలియకుండానే నవ్వు చేరింది, నా ముఖంలో కొత్త వెలుగేదో తెలుస్తోంది.  దివ్యమైన కాంతి. రంగులరాట్నం ఎక్కినట్టు ఒకటే ఏదో హేహేహేహేహేహేహే…

భావప్రాప్తి. భావప్రాప్తి. భావం ప్రాప్తించింది. ఇదే ఇదే ఇదే, ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నా కలగని సుఖం… అట్లాగే నిలకడగా, నిలిచిపోయినట్టుగా… ఈ ఆనందం నేను ఓపలేను, ఈ ఆనందం తట్టుకోలేను… ఇలా స్త్రీ కదా అనాలి!

మర్మాంగాలు మాత్రమే ఉనికిలో ఉన్నట్టుగా… అవి మాత్రమే నిజం… అంతా అబద్ధం… ఆనందం… బ్లిస్… అద్భుతం… ఇదే ఇదే పరమానందం… వదులుకోలేని ఆనందం… ఓఓఓఓఓఓఓ…

దేవుడా దేవుడా దేవుడా ఆనందం ఆనందం ఆనందతాండవం, ఎక్కడ కదలకుండానే తాండవం, లోలోపలి నర్తనం… ఓహోహోహోహోహోహోహో…

దివ్యానందం… సుఖమజిలీ… సుఖం సుఖం… ప్రాణానికి సుఖం… హాయి హాయి హాయి మహాగొప్పగా నవ్వుగా, ఇక చాలన్నట్టుగా…

ఆఆఆఆఆఆఆ…

కదిలేట్టు లేదు. బరువు అలాగే ఉంది.

స్టేట్ మారుతోంది.

శరీరంలో ఏదో మారుతోంది, మార్పు తెలుస్తోంది, వైబ్రేషన్ మోడ్…

ప్లగ్గులో బాడీని పెట్టినట్టుగా సన్నటి కంపనాలు… క్ క్ క్ క్ క్ క్ క్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్… వైబ్రేషన్ వైబ్రేషన్… శబ్దం తెలుస్తోంది…

శరీరంలో అలలు… ప్రకంపనలు…

అయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యో… జూజూజూజూజూజూజూ…

శరీరాన్ని విరిచినట్టుగా…  బట్టలాగా పిండినట్టుగా… మెడ తిరిగిపోయిందేమో… తిరిగిపోతోందా? పోతోందా? పోతోం…

చచ్చిపోతానేమో! చావడం అంటే ఇదేనేమో! నేను బతకడం కష్టం… నేనిక బతకను…

దాహం దాహం… నీళ్లు నీళ్లు మంచినీళ్లు…

కదిలేలా లేను… నేను కదలలేను… అయ్యో … అయ్యో…

లేదు, తాగకుండా ఉండాల్సింది… ‘వంశీ నువ్వు నన్ను వార్న్ చేయాల్సింది. సరిగ్గా వారించాల్సింది. ఇది నాకు నువ్వు కరెక్టుగా వివరించి చెప్పాల్సింది. ఈ స్థితి గురించి’… దేవుడా దేవుడా చచ్చిపోయానా…

రేపు అందరికీ తెలిసిపోతుంది, ఇట్లా చచ్చిపోయారని తెలిసిపోతుంది… ఈ కారణంగా మరీ ఇలాగా…

చచ్చినట్టే… బతికే చాన్స్ లేదు… డీ హైడ్రేషన్… నీళ్లు ఇంకిపోతున్నాయ్… ఇంట్లో నీళ్లు లేవు, ఒంట్లో ఒంట్లో లేవు, చుక్క కూడా లేదు… చుక్క కూడా చుక్క కూడా…

నీళ్లు తాగాలి, రేపు అందరికీ తెలిసిపోతుంది… నీళ్లు తాగాలి నేను బతకాలి…

తాగాలి నేను బతకాలి నీళ్లు తాగాలి అది తాగకూడదు నీళ్లు తాగాలి తాగకూడదు తాగాలి తాగకూడదు తాగా…

చేయి కదిలింది… అమ్మయ్య… ఈజీ ఈజీ కదిలింది… ఈజీ… లేచాను…

గ్లాసు ఎక్కడ? నీళ్లు… కిచెన్ లోకి…

వంశీ అప్పటికే నీళ్లు తాగుతున్నాడు… నీళ్లు అమ్మా… నీళ్లు… ప్రాణం ప్రాణం…

గుక్క గుక్క గుక్క…. ఊఊఊఊఊఊఊ… ఏమైంది నాకు?

హొహ్హొహ్హొ… ఒక్కసారి స్విచాఫ్ అయినట్టుగా… వైబ్రేషన్ మోడ్ పోయింది. ఇది మ్యాజిక్. మ్యాజిక్ జరిగింది. కంపనం ఆగిపోయింది. లోపలి రొద సద్దుమణిగింది.

“ఏం వంశీ ఇట్లా స్విచాఫ్ అయింది”

నోట్లోంచి మాట వస్తుందని కూడా ఊహించలేదే!

“అంతే అన్నా, త్రీ ఫోర్ అవర్స్ ఉంటుందంతే”

హేహేహేహేహేహేహే… నేను బతికాను నేను బతుకుతాను. నేను చావను నేను చావను బతుకుతున్నా…

అయిపోతుంది ఏం ఫర్లేదు…

ఇప్పుడు టైమెంత? ‘మూడు గంటలు’. సరిగ్గా మూడు.

అమ్మా అమ్మా… మళ్లీ వచ్చి పడక… ఇప్పుడు బెడ్రూములో, ఇప్పటికైనా బెడ్రూములోకి సరిగ్గా…

“వంశీ నువ్వు గూడ బెడ్లోనే పండుకో…  చెద్దరేమన్న గావన్నా?”

“ఏమొద్దన్నా”

“బయటి గొళ్లెం బెట్నవా?”

“అప్పుడే పెట్నన్నా”

ఆఆఆఆఆఆఆ… కొంచెం రిలీఫ్…

నిద్రపోదాం కాసేపైనా…

నిద్ర పోదాం. నిద్ర. నిద్ర.

దోమలు చెమట గాలిలేనితనం… కరెంటు పోయినట్టుంది…

మళ్లీ ఏమవుతోంది? వూవూవూవూవూవూవూ…  కోకోకోలా బుడగలు పేలినట్టుగా… లోపల ఏదో చర్య… ఇది పూర్తిగా రసాయనిక చర్య… బాడీ డీకంపోజ్ అవుతోంది… ఓహో ఇలా చంపేస్తుందేమో… మళ్లీ చావు… చావు తప్పదా?

సూసూసూసూసూసూసూ… మోకాళ్ల కింద నొప్పి. సులుక్ సులుక్ సులుక్…

కిటికీలు బంధించి వుండి గాలి రాకపోతే ఇది కచ్చితంగా సూసైడ్ అవుతుంది. అయిపోతుంది. చచ్చి ఊరుకుంటాం. గాలి కావాలి గాలి…

కిటికీ తీసి కదలకుండా బోల్ట్… లొకేషన్ కుదరట్లేదు… కాన్సంట్రేట్… ధ్యాస ధ్యాస పెట్టగలిగాను.

రేపటి డెడ్ లైన్… ఆఫీసు వర్కు… చెమట వెళ్లిపోతున్నట్టుగా…

ఏదోలా అవుతోంది. తినివుంటే వాంతి అయ్యేదా? తినకపోవడమే మంచిదయ్యిందా?

ఇందాక మిక్చర్ ప్యాకెట్లు కత్తిరించడానికి తెచ్చిన కత్తెరను సర్దానా? ఆ కత్తితో వంశీని పొడుస్తానా… ఆ కత్తెరతో…

అట్లా ఎవరికైనా పొడవాలనిపిస్తుందా? మనం ఏం చేసేదీ మనకు తెలియకుండా పోతుందా? నిజంగా తెలియదా?

నాకు తెలుస్తోంది. మరీ శూన్యమైపోవడం ఏమీలేదు. బాహ్య ప్రపంచం తెలుస్తోంది. ఇది ఇల్లు ఇది మంచం ఇది నేను ఇది వంశీ… అది కిచెన్… నీళ్లు నీళ్లు… ఎలా లేవను? మళ్లీ లేవాలా? మళ్లీ మళ్లీ లేవాలా ఇలాగా! ఆకలి ఆకలి…

తిని పడుకోవాల్సింది… ఇప్పుడు ఈ టైములో తింటే జీర్ణమవుతుందా? తప్పు చేశాను, తిని పడుకోవాల్సింది…

ఆకలి… ప..క్క..కు తిరిగి… అ..మ్మ..య్య ఎంతసేపటికి తిరిగాను!

కరెంటు వచ్చినట్టుంది… హా గాలి… చల్లగా గాలి… గాలి…

ఒకట్రెండు పఫ్పులైతే ఆర్గాజం స్టేట్ వచ్చి ఆగిపోయేదేమో! తర్వాత ఈ పెయిన్ ఎందుకు? అసలు ఎంతయితే కరెక్టు? ఫూలిష్… తెలియక చేశా.. రెండో రౌండులోకి వెళ్లకుండా ఉండాల్సింది…

శ్వాస పీల్చుకుంటున్నానా… కళ్లు బరువుగా రెప్పలు తెరవలేనట్టుగా… కూలిపోయేట్టుగా… ‘వంశీ, దీన్ని మళ్లీ మళ్లీ తాగకు… చచ్చిపోతాం… తెలుస్తోంది. నాకు అర్థమవుతోంది. ఇది చావే ఇది చావే చావు తెచ్చుకోవడమే’…

అయ్యో పొద్దున చెప్పాలి… ఇప్పుడు మాట్లాడబుద్ధి కావట్లేదు… దాహం దాహం… వంశీ ఇందాక ఎక్కడో పెట్టాడు. అద్దం దగ్గర… సగం తాగిన నీళ్లగ్లాసు…

“రెడ్డిగారూ”

……………………

ఓనర్ అంకుల్ పిలుస్తున్నాడు. పడుకోబుద్ధవుతోంది… ఇలాగే ఇలాగే… ఇంకో అరగంట… ఇంకో గంట… ఇంకో రెండు గంటలు…

“రెడ్డిగారూ, రెడ్డిగారూ”

శరీరానికీ మెదడుకూ పోలిక లేదు. అది బరువుగా ఇది రకరకాలుగా… ఎలా మొదలైంది ఇదంతా? ఎలా ఇప్పటి స్థితికి వచ్చాను!

కళ్లు తెరిచి… ఏడు అవుతున్నట్టుంది. “ఆ… అంకు… అంకుల్ వస్తున్నా”

తలుపు తెరిచి- ‘తేడా ఏమన్న గుర్తువడుతడా? నడకలో మార్పుందా?’

ఇంటి రెంటు ప్లస్ కరెంటు బిల్లుకు కలిపి ఇచ్చిన డబ్బుల్లోంచి- “మీకు వన్ సిక్స్టీ నైన్ ఇవ్వాలండీ”

రెండు వంద నోట్లు ఇచ్చాడు.

నేను ఇంట్లోకి వచ్చి… మూడు పది నోట్లు, ఒక రూపాయి బిళ్ల వెతికి…

మళ్లీ కాసేపు పడుకుని, ఇంకాసేపు పడుకుని, లేచి, వంశీని సాగనంపి, “జాగ్రత్త” “ఏం ఫర్లేదన్న”- ‘ఆఫీసుకెళ్లే ధైర్యం చేయొచ్చు’.

ఒకటేదో జరక్కూడనిది జరిగిందన్న ఫీలింగులోనే సాయంత్రం దాకా గడిపి-

దీన్నో ఘనకార్యంగా చెప్పుకోవాలన్న ఉబలాటాన్ని లోలోపలే దాచి-

రాత్రి- స్నానం చేశాక- నిన్నటి గోడ అంచునే కాసేపు విరామంగా, నిశ్శబ్దంగా కూర్చుని- పక్కనే ఉన్న మల్లెచెట్టును చూస్తూ- వేసవి వరంగా విచ్చుకుంటున్న దాని పూల పరిమళాన్ని అనుభవిస్తూ- మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్-

‘ఒక చెట్టుకూ మరో చెట్టుకూ మధ్య ఎంత తేడా ప్రకృతిలో!’

*

ఆనందమే అప్పటి చివరి ఉనికి!

మైథిలి అబ్బరాజు 

 

mythili

అసలు వెళ్ళిందైతే ప్రభా ఆత్రే ని చూద్దామని, విందామని. వలసవెళ్ళిన  శీతల నగరం లో చౌడయ్య గారి పేరిట ఫిడేలు ఆకారం లో కట్టిన హాలు. తిరిగి చూస్తుంటేనే కడుపునిండిపోతూ ఉంది. మర్యాదా వినయమూ ఉట్టిపడే నిర్వాహకులు హెగ్డే గారు అనుకూల పవనం లాగా ఉన్నారు. ధ్వని సరిగ్గా ఉందో లేదో సరి చూసుకుంటున్నారొక విద్వాంసులు, సితార్ పట్టుకుని , పక్క వాద్యాలతో..వయొలిన్ మరీ పెద్దగా ఉందనుకున్నాను . త్యాగరాజ ఉత్సవాల్లో పెద్ద కచేరీ కి ముందర ఔత్సాహికులకి అవకాశం ఇస్తూ ఉంటారు, వాళ్ళ సంగీతం ముగిసేవేళకి అంతా చేరుకుంటారని. వీళ్ళూ అటువంటివారే కాబోలు !

సరిగ్గా అయిదున్నర కి కార్యక్రమం మొదలైంది. పరిచయాలలో తెలిసింది ఆ ఫలానా వారు రవిశంకర్ శిష్యులని ..ఓహో, సరేలే అనుకున్నాను- ఆవిడ ఆయన భార్యేనట, విదేశీయురాలట…అయితే ఏమిటట ? మనవాళ్ళు కాకపోతే సరి, ఊరికే మెచ్చుకునిపోతామనే  prejudice  నాలోపల భేషుగ్గా పనిచేస్తోంది. ఇంతకూ అది వయొలిన్ కాదు చెలో[ cello ]  అట, ఇద్దరూ జుగల్ బందీ వాయిస్తారట…తొందరగా ముగించేస్తే బావుండును, ప్రభా ఆత్రే రావద్దూ ?

మొదలైంది వాదనం….మధువంతి, ముందుగా – సితార్ తోబాటు ఎవరో పక్కనుంచి మంద్రం లో ఆలపిస్తున్నారు , వెతికితే ఇంకెవరూ లేరు . కాసేపటికి తెలిసింది, అది చెలో…అచ్చం మానవకంఠానికి మల్లే వినిపిస్తోంది. నేర్చుకుని ఉన్న కాస్త పరిజ్ఞానం లో , అలా వాయిద్యాన్ని పలికించటం అపురూపమైన విషయమని తెలుసును – అలా చేయగలిగితేనే గొప్ప అని ఏమీ కాదుగాని . సారంగీ వాయిస్తే అస్తమానం అది ఎవరో పాడుతున్నట్లే ఉంటుంది , ఇప్పుడు ఇది.

ఆయన , శుభేంద్ర రావు గారు – నిదానంగా , మట్టసంగా వాయిస్తున్నారు , కొంచెం predictable  గా కూడానేమో. విద్వత్తుకీ మాధుర్యానికీ  వెలితేమీ లేదు. కాసేపటికి ఆపి ఆవిడకి అవకాశం ఇచ్చారు. అమాయకంగా అందుకున్నారు ఆవిడ, కమాను తోబాటు  సభలో ఉన్న వెయ్యిమంది చేతులూ… లాక్కుపోయి దివ్యలోకాలలో  పడేశారు. జన్మించినప్పటినుంచీ ఎరిగిఉండనట్లుగా,  జన్మ ఎత్తింది అందుకేనన్నట్లుగా  మా అంతస్తంత్రులు కంపించిపోతున్నాయి .  ఏ ప్రక్రియో ఏ కల్పనో ఏ స్వరవిశేషమో ఎవరికైనా పట్టిందా… నిండా మునిగిఉన్నవారికి చలివేస్తుందా ? చంద్రకాంత శిల అయి  ఘనీభవించిన ఆ కొంతకాలం తర్వాత ఆమె అప్పటికి ఆపారు..ఒక్క ఉదుటున ఇక్కడికి వచ్చిపడ్డవారి చేతులు కలుసుకుని అదేపని గా మోగాయి. వెనక్కి చూసుకున్నప్పుడు భారతసంగీతచాలనం  తో మిళితమై  symphony    కదలికలు allegro, adagio ల  ఛాయలు   తెలిశాయి

‘’ She was taught by the God himself ‘’ అని ఆవిడ గురువులలో ఒకరైన హరిప్రసాద్ చౌరాసియా  అన్నారట , అవునేమో కాని ఆవిడ ఇంకా పైవారేమో – సరస్వతీ విపంచి ? కచ్ఛపి ?

ఆవిడ సాస్కియా రావ్  డి – హాస్  ,  నెదర్లాండ్స్ లో ethnomusicology  చదువుకుని ఆ లంకె పట్టుకుని ఇక్కడి  సంగీతం కోసం వచ్చారు.

ఆయన కొంచెం మురిశారు, ఇంకొంచెం ఉడుక్కున్నారు బహుశా , అప్పుడు కదుపుకున్నారు తన తీగలని – మృదువుగా, క్రూరంగా – చిత్రంగా … అవి- ‘  లోల మధుకరాళు లూ  ,  నీలోత్పల మాల లూ’ అయి..వెంట వెంట మమ్మల్ని డోలలూపుతూ . అవును ఆ సంగీతం ఊయలే, కదిలించి, వెనక్కి తెచ్చి, తిరిగి కదిలించి…శరీర స్పృహ పోగల ప్రయాణమయితే కాదు –  అది  కలువపువ్వుల   డోల , సౌరభాల లీల- నిజమేలే, అయినా చాలు , ఆవిడ ఏరీ ?

subh

ఆయన నిజంగా గొప్పగా వాయించారు  … ఆవిడ ఆరాధన పొరలిపోయే కవళికలతో ఆస్వాదించారు , మా వైపు తిరిగి ” వినండి వినండి ..మీ పుణ్యం సుమా ఇది ” అంటున్నారు చూపులతో.  ఆయన వాయిస్తూంటే ఒక అన్యస్వరం వచ్చింది , కావాలనే వేశారేమో – ఆ తర్వాత ఆవిడ , వీలు కల్పించుకుని మరీ ఆ స్వరం వేశారు. సాంత్వన అంది – ” కాదేమోగాని, ఒకవేళ ఆయన పొరబాటు చేసిఉన్నా ఆవిడ దాన్ని మళ్ళీ చేసి సరైనదిగా స్థిరపరుస్తారు, అంత ప్రేమ ” అని.

ప్రేమించుకున్న ఇద్దరు , ఆ  ఇష్టాన్ని పక్కపక్కనే కూర్చుని చెప్పుకోవటం లో సౌందర్యం ఎంత ఉంటుందో చెప్పలేను. ఆ సంభాషణ సంగీతం లో అయితే ? లోకోత్తరమైన అనుభవం- మేము పొందాము… ఏడు ఊర్థ్వ  లోకాల మేరన విశ్వం మొత్తమూ రెండయి  విడివడి తీరిగ్గా ముచ్చటించుకుంటూ ఉంటే..   ఆవిడతో కలిసిపాడినప్పుడు ఆయనా అమర్త్యుడి లాగే ఉన్నారు.

తర్వాత, ‘ గతి ‘ ..తబలా విద్వాంసుల మొహం లో విశ్వనాథ అన్నట్లు , కళ్ళు, ముక్కు , నోరు – ఏవీ లేవు, అంతా  ఆనందమే.

మధ్యలో ఆయన ప్రకటించబోయారు – ” ఈ కచేరీ ని ఎవరికి అంకితం చేస్తున్నానంటే ..” చెప్పలేక కన్నీరు మున్నీరయారు. ఆవిడ మమతగా ఆయన బుజం పట్టుకుని ఊరడించి , అప్పుడు  అందుకుని  చెప్పారు ఆయన తండ్రి గారికి అని. ఆయన గతించారట-  ఈ మధ్యేనేమో- శుభేంద్ర  గారి శిరస్సు ముండితమై ఉంది.  ఆయన –  ఎన్.ఆర్. రామా రావు గారు,  రవిశంకర్ కు మొదటి శిష్యులలో ఒకరని , శుభేంద్ర రావు గారి సాధన అంతా ఆయన సంకల్పమేనని , ఆ తర్వాత చదివాను.

తర్వాతి రాగం చారుకేశి..వ్యాకులంగా ప్రారంభించారు ఆయన. మామూలుగా అయితే ఏమోగాని ఇప్పుడు ఆ విషాదాన్ని ఆవిడ చెదరగొట్టి తీరాలి, అలాగే చేశారు… చారుకేశి లో పలికించగలిగినంత సంతోషమంతా అక్కడ ప్రత్యక్షమైంది.

రెండే రాగాలు..అంతే.

ఆ తర్వాత అంతటి ప్రభా ఆత్రే పాట రక్తి కట్టనే లేదు. అంతకుముందరి యుగళం ఆవిష్కరించి వెళ్ళిన అలౌకికత్వాన్ని ఆవిడ కొనసాగించలేకపోయారు , అందుకని .

 

 

ఎప్పటికప్పుడు నిన్ను….

ప్రవీణా కొల్లి
నాకు  తెలిసిన మహా   అద్భుతానివి  నువ్వు
ఏ క్షణంలో ఎలా  ఆసీనమవుతావో
మరుక్షణానికి  ఎప్పుడు వీడ్కోలు చెపుతావో
తెలీనట్టే ఉంటుంది నీ గమనం.
నీ ఛాయలను తడిమితే చాలు
జీవించిన కాలాలు కళ్ళలో  మెదులుతూ
తెరలుతెరలుగా రెపరెపలాడతాయి.
అంచులలో నుంచీ  జారిపోబోతున్న చుక్కలా
నిలిచిన  నిన్ను
ఒడిసి పట్టుకోనూ  లేను
నిన్ను  వదిలిపోనూ లేను.
నీలోనే  తచ్చాడుతూ
నన్ను  వెతుక్కుంటూ  ఉంటాను.
దొరికినదేదీ  నిలకడైనది కాదని
స్థిరమైన  అర్థాలేవీ జీవితంలో ఉండవని
రేపటి  శోధనను వదలవద్దని చెప్పి పోతావ్.
రావొద్దని  నిన్ను ప్రాధేయపడిన క్షణాలను
నిర్దాక్షిణ్యంగా  పక్కకు  తన్నేస్తావ్
పెద్ద పెద్ద అంగలతో నా  వాకిలిని  చిత్తడి చిత్తడి చేస్తావ్
అల్లకల్లోలాలను  నాలో నింపి
ఎండుటాకులపై అడుగులేస్తూ
నింపాదిగా వెళ్లిపోతావ్
ఆకారాలను నాలో చెక్కిన
నిరాకార శిల్పివి  నువ్వు.
ఉలి  పోటులకు నిన్ను ద్వేషించనూలేను
కొన్ని  ఆకృతులకు  నిన్ను  ప్రేమించనూ  లేను.
 సూత్రధారివీ   నువ్వే
మహమ్మారివీ  నువ్వే
గొప్ప  స్నేహానివి  నువ్వే
అంతుపట్టని  శేషానివీ  నువ్వే.
ఎప్పటికప్పుడు  నిన్ను హత్తుకోగలిగితే
జీవితాన్ని ప్రేమించకపోవటానికి  ఒక్క కారణమన్నా మిగలదు  కదూ!
వేళ్ళ  సంధుల్లో  నుంచీ జారిపోతున్న నీకు వీడ్కోలు చెప్పగలిగితే
లోతుగా జీవించిన క్షణాలెన్నో మిగులుతాయి కదూ!
praveena

ఇలాతలంలో హేమం పండగ…!

మమత వేగుంట 

 

 

suswaram

చీకట్లో మెరుస్తున్నాయి పల్లెపొలాల చాళ్ళు.
దున్నడం అయిపోయింది,
ఇక విత్తనాల కోసం వాటి ఎదురు చూపులు.

చీకటి ఎంత నల్లగా వున్నా, ఆ నేల ఎరుపుని దాచలేకపోతోంది.
అవునూ, అది నెలవంకా? లేదూ, ఎద్దు కొమ్మా?!

రి- సప్తస్వరాల్లో రెండోది.
వృషభం రంకెలోంచి పుట్టింది ఇది.
అంతే కాదు, దున్నిన నేల లోతుల్లోంచి మొలకెత్తే ప్రతిధ్వని కూడా అది.

ఈ నేల, మన దేశం.
రి- దేశ్ రాగానికి వాది స్వరం.
రాత్రి రెండో ఝాములో పాడే అందమైన, సంక్లిష్టమైన రాగం.

చాలా దేశభక్తి గీతాల్లాగే, వందే మాతరం మూల గీతం ఈ దేశ్ రాగంలో కూర్చిందే.
నా పెయింటింగ్ విషయానికి వస్తే,
వృషభం – నేలని దున్నే దేశభక్త.
సమున్నత శిఖరాలకు ఎగిసే పునాదినిస్తుంది.
ఎదగడానికి శక్తినిస్తుంది.

సస్య శ్యామలం!

Mamata 1

గమనమే గమ్యం-2

 

Volga-1కృష్ణానదీ తీరంలో గుంటూరుకు దగ్గరగా ఉన్న పెద్ద గ్రామంలో స్థితిమంతుల కుటుంబం రామారావుది. నాలుగైదొందల ఇళ్ళున్న ఆ గ్రామంలో మాగాణి భూములు బంగారం పండుతాయి. అన్ని వసతులూ ఉన్న గ్రామం. బ్రాహ్మణ కుటుంబాలు ముప్ఫై, నలభై మధ్యలో ఉన్నాయి. మిగిలినవి రైతు కుటుంబాలు, చేతి వృత్తుల వారి కుటుంబాలు. ఊరి చివర ఓ వంద గుడిశల మాలపల్లి ఉంది. మంచి బడి, పెద్ద గుడి ఉన్న గ్రామం.

గుంటూరికి, బెజవాడకూ దగ్గరగా ఉండటంతో పట్టణ పోకడలను తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉన్న గ్రామం. రామారావు తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అన్ని బాధ్యతలూ మోసి పెంచింది. అక్క శారదాంబ తమ్ముడిని అమితంగా ప్రేమించేది. పెళ్ళయి తను పట్నంలో కాపురం పెడుతూ తనతో పాటు తమ్ముడినీ తీసుకెళ్ళి కాలేజీ చదువు వరకూ తనే బాధ్యత తీసుకుంది. తమ్ముడి పెళ్ళి చేసిన రెండేళ్ళకే ఆమె మరణించింది. రామారావు అక్క మరణం నుంచి కోలుకోటానికే రెండేళ్ళు పట్టింది. చిన్న శారదాంబ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ మనిషై తనకు ఆసక్తి ఉన్న సాహిత్యం, చరిత్ర విషయాల మీద పని చేస్తున్నాడు.

నెలకు పదిరోజులు పైగా రామారావు మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, బెజవాడలు వెళ్ళటం ఇంట్లో వాళ్ళకి అలవాటే. ఇంటి పనులూ, పొలం పనులు అన్నీ తల్లి నరసమ్మే చూసుకుంటుంది. ఆవిడ చాలా సమర్థురాలు. ఇల్లూ, పొలం రెండూ ఆవిడ ఆదేశాల ప్రకారమే నడుస్తాయి. అన్ని పనులూ ఆవిడ మీద ఒదిలేసి రామారావు తన శాస్త్ర, సాహిత్య విషయాల్లో  మునిగిపోయే వీలుంది గాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోతోంది. శారదాంబ పెంపకం, ఇంటిపని, వంటపని రామారావు భార్య సుబ్బమ్మ అతి తేలిగ్గా చేసేస్తుంది. పాతికెకరాల సేద్యం. మామిడి తోటలున్నాయి. ఆర్థికంగా లోటు లేకపోవడంతో ఆయన జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాడు. పండితులతో స్నేహం, చర్చలు, సంఘం గురించిన ఆలోచనలు సామాన్య జనం గురించి, వారికి, విద్య, సాహిత్య, శాస్త్ర విషయాలు అందుబాటులోకి తేవటం గురించి ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ పని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవటానికి పెద్ద అండగా తల్లి నరసమ్మ ఉంది.

శారదాంబ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. నరసమ్మ, సుబ్బమ్మలు ఆమెను కింద నడవనివ్వరు. చనిపోయిన కూతురు మళ్ళీ పుట్టిందని నరసమ్మ నమ్మకం. కంటిపాపలా చూసుకుంటుంది. ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఎనిమిదో తరగతి వరకూ చదువు చెప్తారు. శారదాంబను ఆ బడికి పంపటానికి రామారావు తల్లితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే చదువు చెప్పించమని తల్లి, బైటి బడికి వెళ్ళి నలుగురితోపాటు చదువుకోవాలని రామారావు, చివరికి శారద బడికి వెళ్తానని పట్టుబట్టటంతో నాయనమ్మ లంగిరాక తప్పలేదు. బడికి వెళ్ళేనాటికే శారదాంబకు రాయటం, చదవటం బాగావచ్చు. ఏడో ఏట మూడో తరగతిలో చేరింది శారదాంబ.

ఆ రోజు బడంతా పండగ వాతావరణం. పిల్లలకు లడ్లు, బూంది పంచి పెట్టారు. శారదాంబ తరగతిలో అంతకుముందే ఇద్దరాడపిల్లలు ఉన్నారు. విశాలాక్షి, ధనలక్ష్మి. విశాలాక్షి దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ధనలక్ష్మి వాళ్ళు బ్రాహ్మణులు తండ్రి పౌరోహిత్యం చేస్తాడు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఏటా పిల్లలు. ఊళ్లో పెరిగే అప్పులు. భారంగా కుటుంబాన్ని లాగుతున్నాడు. శారదాంబ చేరిన నాలుగు రోజులకు అన్నపూర్ణ అనే రైతు కుటుంబపు అమ్మాయి చేరింది. నలుగురమ్మాయిలకూ మంచి స్నేహం కుదిరింది. రోజూ కలిసి బడికి రావటం, పోవటం మొదలైంది. విశాలాక్షి బ్రాహ్మణ వీధికొస్తే ధనలక్ష్మి కలుస్తుంది. ఇద్దరూ కలిసి శారదాంబ ఇంటికి చేరేసరికి ఆ అమ్మాయి వీధి వాకిట్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది. ముగ్గురూ కలిసి తూర్పు వీధిలోకి వెళ్తే అన్నపూర్ణ ఎదురొస్తుంది.

నలుగురూ కలిసి బడికి వెళ్తుంటే దారిలో ఇళ్ళ వాళ్ళంతా విడ్డూరంగా చూసేవారు. చదువు కోసం ఆడపిల్లలు బడికి వెళ్ళటం ఆ ఊళ్ళో అదే మొదలు. శారదాంబ తండ్రి రామారావుకి ఇంగ్లీషు చదువుల పిచ్చి ఉందని తెలుసు. పైగా వాళ్ళు స్థితిమంతులు. ఏం చేసినా చెల్లిపోతుంది. విశాలాక్షి గురించి ఎవరికీ పట్టింపు లేదు. ధనలక్ష్మి బడికి పోవటం ఊళ్ళో బ్రాహ్మణులెవ్వరికీ ఇష్టం లేదు. మూతులు విరుచుకుంటూ, ధనలక్ష్మి తల్లిని సూటిపోటి మాటలంటూ అక్కసు తీర్చుకునేవారు. అన్నపూర్ణ గురించి గొణుక్కునేవారు. నలుగురాడపిల్లలూ బడికి వెళ్ళి హెడ్‌మాస్టారు గదిలో కూర్చుంటారు. గంట కొట్టిన తర్వాత, మగపిల్లలందరూ క్లాసుల్లో కూర్చున్న తర్వాత తమ క్లాసు టీచరు వెనకాల నడుచుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఓ పక్కన కూచుంటారు.

మగపిల్లలకీ వీళ్ళకీ మధ్య చాలా దూరం. పాఠాలు జాగ్రత్తగా విని పంతులుగారి వెనకాలే హెడ్‌మాస్టారు గారి గదిలోకి వచ్చి, మగపిల్లలంతా వెళ్ళిపోయాక నలుగురూ ఒక కట్టగా బయల్దేరతారు. మొదటి రెండేళ్ళూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఐదో తరగతిలోకి వచ్చాక అందరూ సాయంత్రం ఒక గంట శారదాంబ ఇంట్లో ఆగి ఆడుకుని, కబుర్లు చెప్పుకుని ఇళ్ళకు వెళ్ళటం అలవాటయింది. శారదాంబ వాళ్ళది పెద్ద దొడ్డి. జామ, మామిడి, సపోటా చెట్లతో అందంగా ఉంటుంది. బోలెడు పూల మొక్కలు. పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకుని సన్నజాజి మొగ్గలు కోసుకుని మాలకడతారు. అన్నపూర్ణ వెతికి వెతికి సంపెంగ పూలు కోసుకుంటుంది. సుబ్బమ్మ అందరికీ శనగపప్పు, బెల్లం, అటుకులు, కాల్చిన అప్పడాలు, ఉప్పుడు పిండి రోజుకో రకం తింటానికి పెడుతుంది. అవి తిని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు కలుస్తామా అనుకుంటూ నిద్రపోతారు.

Image (13) (1)

చిత్రం: పార్వతి

శారదాంబ నరసమ్మ పక్కలోనే పడుకుంటుంది. ఆమె ఏవో పాటలు పాడుతుంది. రామాయణం, భారతం కథలుగా చెబుతుంది. విశాలాక్షికి కూడా తల్లి కోటేశ్వరి కీర్తనలు నేర్పుతుంది. కథలూ చెబుతుంది. ధనలక్ష్మి తల్లికి అంత తీరికుండదు. అన్నపూర్ణకూ ఇంట్లో చెప్పే వాళ్ళు లేరు. విశాలాక్షి శారదాంబ చెప్పే కథలూ, పాడే పాటలు కళ్ళూ చెవులూ అప్పగించి వింటారు. పాటలు నేర్చుకుంటారు. శారదాంబది మంచి కంఠం. ఆ పిల్ల గొంతెత్తి పాడితే ఎంతో బాగుంటుందని నలుగురూ చేరతారు.

రామారావు ఇంటిపట్టున ఉన్నపుడు శారదకు ఎన్నో విషయాలు చెప్పేవాడు . సైన్సు, చరిత్ర గురించి తండ్రి చెప్పే మాటలు అర్థమైనా, కాకపోయినా నోరు తెరుచుకు వినేది శారదాంబ. విన్నది విన్నట్లు అక్షరం పొల్లు పోకుండా స్నేహితురాళ్ళకు చెప్పేది. వాళ్ళు విని అడిగే ప్రశ్నలకు శారదాంబ దగ్గర సమాధానం ఉండేది కాదు. ‘‘మా నాన్నగారి నడిగి చెప్తాననేది’’. మళ్ళీ రామారావు మద్రాసు నుంచి వచ్చేసరికి కొత్త సంగతులు ఎన్నో ఉండేవి.

‘‘మా నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తాడు.’’ ఈ మాట ప్రతిరోజు ఒక రోజన్నా శారదాంబ తన స్నేహితులకు చెప్పవల్సిందే.

ధనలక్ష్మి శారదాంబ వంక భక్తిగా చూసేది. తను కూడా డాక్టరైతే అన్న కోరిక లీలగా ఎక్కడో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించేది. ఎప్పుడన్నా ఆపుకోలేని రోజు ‘‘నేనూ డాక్టరైతే బాగుంటుంది కదూ’’ అనేది.

‘‘మనందరం డాక్టర్లమైతే’’ శారదాంబ మిగిలిన ఇద్దరివంకా చూసిందోనాడు. విశాలాక్ష్మి భయంగా ‘‘అమ్మో ` నేను డాక్టరవను. నాకు భయం. నేను హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటా. ఆ రోగాలూ నొప్పులూ నా కొద్దు’’ అంది.

అన్నపూర్ణ కూడా ముఖం చిట్లించింది.

శారదాంబ నిరుత్సాహ పడకుండా ‘‘పోన్లేవే ` మేమిద్దరం డాక్టర్లమవుతాం. మీకు మందిలిస్తాం’’ అన్నది.

నలుగురూ నవ్వుకుని కాసేపు డాక్టరు, రోగి ఆట ఆడుకున్నారు.

ఇంకో నాలుగు నెలలకు ఐదో తరగతి పూర్తయి ఆరో క్లాసులోకి వస్తారనగా ఓ రోజు ధనలక్ష్మి బడికి రాలేదు. ముగ్గురు స్నేహితురాళ్ళకూ ఏమీ తోచలేదు. బడి వదలగానే శారదాంబ ఇంటికి వెళ్ళకుండా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. అన్నపూర్ణకు, విశాలాక్షికి ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశం లేదు. శారదాంబ లోపలికి వెళ్ళి ధనలక్ష్మిని పిల్చుకొచ్చింది.

వాళ్ళ వెనకే ధనలక్ష్మి వాళ్ళమ్మ కోటమ్మ వస్తూ

‘‘మీ సావాసగత్తె పెళ్ళి కుదిరింది. ఇంక మీ ఆటలు కుదరవు’’ అంది నవ్వుతూ. ముగ్గురూ ధనలక్ష్మి వంక ఆశ్యర్యంగా చూశారు.

‘‘నన్ను చూసుకోటానికి పెళ్ళివారొచ్చారు. అందుకే బడికి రాలా’’ అంది ధనలక్ష్మి సిగ్గుపడుతూ.

‘‘పెళ్ళికొడుకు బాగున్నాడా?’’ విశాలాక్షి ఆత్రంగా అడిగింది.

‘‘పెళ్ళికొడుకు రాలేదుగా’’ అమాయకంగా చెప్పింది ధనలక్ష్మి.

‘‘ఐతే నువ్వింక బడికి రావా?’’ శారదాంబ అనుమానంగా అడిగింది.

‘‘పెళ్ళయితే ఎట్లా వస్తాను? మీరు మాత్రం వస్తారా?’’

ధనలక్ష్మి ప్రశ్నకు ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు

‘‘మరి నువ్వు డాక్టర్‌ చదువుతానన్నావు’’ ధనలక్ష్మి ఏదో ఆడినమాట తప్పి తనకు ద్రోహం చేస్తున్నట్లు అడిగింది శారదాంబ.

‘‘పెళ్ళయితే ఇంక చదువెలా కుదురుతుంది? నువ్వయినా పెళ్ళి చేసుకోకుండా డాక్టరెలా చదువుతావు?’’

నెమ్మదిగా అడిగిన ధనలక్ష్మి మాటలకు రోషం వచ్చింది.

‘‘నేను అసలు పెళ్ళి చేసుకోను. డాక్టర్‌నవుతా?’’

ముగ్గురూ శారదాంబ వంక ఆశ్చర్యంగా చూశారు. ధనలక్ష్మి ఆలోచనలో పడిరది. కాసేపు నిశ్శబ్దం తర్వాత ధనలక్ష్మి మెల్లిగా చెప్పింది.

‘‘మా నాన్న నన్ను చదివించలేడు. ఈ పెళ్ళివారు నేనంటే ఇష్టపడి చేసుకుంటున్నారట. కట్నం ఇవ్వక్కర్లేదు. ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట. ఈ సంబంధం చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో ఉద్యోగం కూడా ఇప్పిస్తారంట. అందుకని నేను పెళ్ళి చేసుకోవాలి. తప్పదు. ఐనా నేను సంతోషంగానే ఉన్నా’’.

ధనలక్ష్మి తన ముఖంలోకి రాబోతున్న నీలినీడలను తరిమి చిన్నగా నవ్వింది.

కోటమ్మ వచ్చి నలుగురి చేతుల్లో నాలుగు బెల్లం ముక్కలు పెట్టింది. నలుగురూ అవి నోట్లో వేసుకుని ఆ తీపి మింగుతూ దిగులు మర్చిపోయారు.

***

‘‘నాన్నమ్మా ! నాన్నమ్మా! ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’ పుస్తకాలు ఓ పక్కన పెట్టి నాన్నమ్మ మీదికి దూకబోయింది శారద.

‘‘ముందు కాళ్ళూ, చేతులూ కడుక్కుని ఆ కిరస్తానం గుడ్డలు విప్పి శుభ్రమైన బట్టలు కట్టుకుని రా’’ కసిరింది నరసమ్మ.

శారద రోజూ అలాగే చేసేది. ఆ రోజు ధనలక్ష్మి పెళ్ళి కబురు ఎప్పుడెప్పుడు అమ్మకూ, నాన్నమ్మకూ చెబుదామా అనే హడావుడిలో మర్చిపోయింది.

గబగబా స్నానాల దొడ్లోకి వెళ్ళి నాన్నమ్మ చెప్పినట్లు చేసి వచ్చింది.

నరసమ్మ అప్పటిదాకా చేసిన వత్తులన్నీ తీసి వత్తుల పెట్టెలో పెట్టి లేవబోతోంది. శారద వచ్చి నాన్నమ్మ ఒళ్ళో ఎక్కి కూచుంది. నరసమ్మ శారద నెత్తిన ముద్దుపెట్టి గట్టిగా తనకేసి లాక్కుంది.

‘‘నాన్నమ్మా ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’

‘‘తెలుసులేవే. వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నిన్ననే. ఐనా స్నేహితురాలి పెళ్ళికే ఇంత హడావుడి పడుతున్నావు. నీ పెళ్ళి కుదిరితే ఇహ గంతులేస్తావా?’’

శారద నవ్వింది.

‘‘నాన్నమ్మా, నీకు తెలియదా? నేను పెళ్ళి చేసుకోనుగా. డాక్టర్‌ చదవాలిగా. పెళ్ళెలా చేసుకుంటాను?’’

‘‘డాక్టరమ్మవవుతావూ? నయమే. నా బంగారు తల్లి ఎప్పుడు పెళ్ళి కూతురవుతుందా అని నేను చూస్తుంటే.’’

శారద నాన్నమ్మ ఒడినే ఉయ్యాల చేసుకుని ఊగుతూ.

‘‘నాన్నమ్మా, నిజంగా నేను పెళ్ళి చేసుకోను. కావాలంటే నాన్ననడుగు. నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తానన్నాడు. నా చిన్నప్పుడు మేం రాజమండ్రి వెళ్ళాం. అక్కడా అమ్మమ్మ చెప్పింది. గుంటూర్లో పెద్దమ్మ కూడా చెప్పింది. నేను డాక్టర్నవ్వాలట. నాన్న వాళ్ళందరికీ చెప్పేశాడు. నన్ను ఇంగ్గండ్‌ కూడా పంపుతాడు. నీకు ఇంగ్లండ్‌ అంటే తెలుసా?’’

కూతురు ముద్దు మాటలను మురిపెంగా వింటున్న సుబ్బమ్మను చూసింది నరసమ్మ. కోడలంటే ఆమెకు ఇష్టమే. కానీ కొడుకు ఏ మాటంటే ఆ మాటకు గంగిరెద్దులా తలూపుతుందనే కోపం కూడా ఉంది. ఇప్పుడు శారద మాటలకు చిరాకు పడకుండా సంతోష పడుతున్న కోడలిని చూస్తే కోపం ముంచుకొచ్చింది.

‘‘చిన్న పిల్లలకు ఈ మాటలేనా నేర్పించేది. అసలు బడికి పంపొద్దంటే వినకుండా పంపుతున్నారు. డాక్టరు చదివిస్తాడేం. ముందు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి ఆ తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకోమను. వాడంటే మగాడు. పది ఊళ్ళు తిరుగుతున్నాడు. కిరస్తానీ స్నేహాలు పట్టి అటూ ఇటూ ఊగుతున్నాడు. తల్లివి. నువ్వు పిల్లకు బుద్ధులు నేర్పుకోవద్దూ. కట్టుకున్నవాడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడటమేనా? మొగుడికి బాధ్యతలు గుర్తు చెయ్యొద్దూ. అయ్యోరాత! చక్కగా ముస్తాబు చేసుకుని కూచోటం తప్ప నీకింకేం చేత కాదు. అన్నీ నేనే సమర్థించుకు రావాలి’’.

నాన్నమ్మ అమ్మని ఎందుకు కేకలేస్తోందో శారదకు అర్థం కాలేదు. మొత్తానికి నాన్నమ్మకు తను డాక్టరవటం ఇష్టం లేదని మాత్రం అర్థమైంది.

‘‘నాన్నమ్మ! అమ్మనేం అనకు. నన్ను డాక్టర్‌ చేసేది నాన్న’’

‘‘సరేలే సంబరం. పద. దీపాలు వెలిగించే వేళయింది. ఎక్కడి పనులు అక్కడే

ఉన్నాయి’’. మనుమరాలిని ఒళ్ళోంచి కిందికి దించి విసురుగా లోపలికి వెళ్ళింది.

నాన్నమ్మ కోపం చూసి శారద బిక్క ముఖంతో నుంచుంది. సుబ్బమ్మ శారదను దగ్గరకు తీసుకుని

‘‘నాన్నమ్మ అంతేలేమ్మా. నాన్న వస్తే నాన్నమ్మ కోపం పోగొడతారు. నువ్వు చదువుకో’’ అని ఆమె కూడా వంటింటి వైపు నడిచింది.

***

విశాలాక్షి కూడా ఇంటికి వెళ్ళగానే తల్లితో ఇదే విషయం హడావుడిగా చెప్పేసింది. కోటేశ్వరి పెద్ద ఆసక్తి చూపకుండా ‘అలాగా’ అని తన పని తను చూసుకుంటూ

ఉండిపోయింది. ఐతే ఆమె మనసు మాత్రం విశాలాక్షికి ఎప్పటికైనా తను పెళ్ళి చేయగలదా అనే ఆలోచనతో కొంత దిగులు నింపుకుంది.

కోటేశ్వరిది దేవదాసి కులం. ఆ ఊళ్ళోని వేణుగోపాల స్వామి ఆలయం చాలా పెద్దది. ఆ దేవుడి మాన్యం కూడా చాలా ఉంది. దాన్లో కొంత ఆదాయం కోటేశ్వరికి వస్తుంది. దానిని కోటేశ్వరి బెజవాడలో ఉంటూ వృత్తి చేసుకుంటున్న ఇద్దరక్కలకూకొంత కొంత పంచి తను కొంత వాడుకుంటుంది. ఉత్సవాల రోజుల్లో ఆలయంలో నృత్యం చేస్తుంది. పక్క ఊళ్ళోని ధనిక రైతు రంగయ్య గారు వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆయనే విశాలాక్షి తండ్రి. కోటేశ్వరి ఆయననే నమ్ముకుంది. ఊళ్ళో కూడా కోటేశ్వరి అంటే అందరికీ ఆదరమే ఉంది. తిండికి, బట్టకు లోటు లేదు. అన్ని అవసరాలూ రంగయ్యగారు చూస్తాడు. విశాలాక్షి అంటే ఆయనకు చాలా ప్రేమ. కూతుర్ని బాగా చదివించాలని అంటుంటాడు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మాయిని సీమ పంపించి చదివిద్దాం అంటాడు. ఐతే కోటేశ్వరి కూతురికి ఎలాంటి ఆశలూ పెట్టలేదు. సంగీతం, నాట్యం నేర్పటం మానలేదు. ఎటుపోయి ఎటు వచ్చినా కులవృత్తే కూడు పెడుతుందని ఆమె నమ్మకం. కానీ దేవదాసి వృత్తి మీద లోకానికి చిన్నచూపు ఏర్పడుతోందని, రాబోయే కాలంలో అసలు దేవదాసీలే ఉండకుండా చట్టాలు తెస్తారని రంగయ్య చెబుతుంటే కోటేశ్వరి గుండె దడదడలాడేది. నాట్యం చేయటం, పాటలు పాడటం, ఓ పెద్ద దిక్కుని అండగా చూసుకుని నమ్ముకోవటం తప్పెందుకవుతుందో కోటేశ్వరికి అర్థమయ్యేది కాదు ` ఆమె పూర్వీకులు అలాగే బతికారు. గౌరవంగానే బతికారు. దేవుడి దయవల్ల తనకీ ఓ అండ దొరికింది, ఓ కూతురు పుట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకుంటుంది. కానీ ఆమెకీ తెలుస్తూనే ఉంది. గుళ్ళో ఉత్సవాలలో ఆర్భాటం తగ్గుతోంది. నాట్యాన్ని ఇంతకు ముందులా ఆనందించే వారు తగ్గుతున్నారు. తన కులానికి గౌరవం తగ్గుతోంది. నిజమే ` తన కులంలో అవినీతి పరులూ, దురాశాపరులు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏ కులంలో లేరు? మోసం చేసి బతికేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు. ఎవరి వృత్తి వారు న్యాయంగా, ధర్మంగా చేసి కట్టు తప్పకుండా బతికేవారు, ఎప్పుడూ వేళ్ళమీద లెక్కపెట్టేంతమందే ఉంటారు. పైగా ఆర్థికంగా కటకటలాడే రోజుల్లో మోసాలు జరగక ఆగుతాయా?

వీరేశలింగం గారు తమ కులం గురించి మాట్లాడే మాటలు రంగయ్యగారు చెబుతుంటే కోటేశ్వరికి ఆగ్రహం వచ్చేది.

‘‘మా కులం గోల ఆయనకెందుకు? ఆయన కులాన్ని ఆయన్ని ఉద్ధరించు కోమనండి’’ అనేది.

రంగయ్య కాసేపు ఆయన్ని సమర్థించేవాడు. కాసేపు విమర్శించేవాడు.

‘‘నా కూతురు మాత్రం చదువుకుని తగినవాడిని పెళ్ళాడాల్సిందే’’ అనేవాడు. కోటేశ్వరి మనసు చివుక్కుమన్నా కన్నతండ్రి అలాగే అనుకుంటాడని ఊరుకునేది.

‘‘మీ కులవృత్తి మీద ఇంగ్లీషు వాళ్ళ కన్ను పడిరది. వాళ్ళ కన్నుపడిన ఏ కులవృత్తి సజావుగా నడిచింది? నేతపనివారు నాశనమయ్యారు. రైతులూ కటకటలాడుతున్నారు. ఒక్కో వృత్తిని నాశనం చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు’’ అనేవాడు. కోటేశ్వరికి భయం పుట్టుకొచ్చేది. తనకు దేవుడి మాన్యం నుండి వచ్చే ఆదాయం లేకపోతే ఇద్దరక్కలూ వీధిన పడతారు. రంగయ్యగారు తనను చూసుకున్నా అక్కలిద్దరూ నిరాధారంగా నిలబడాలి. రంగయ్యగారు చెప్పినట్టు విశాలాక్షిని చదివించటమే మేలని అనుకుంది. విశాలాక్షి పెళ్ళి జరగటం అంత తేలిక కాదని కోటేశ్వరికి తెలుసు. కానీ చక్కని పిల్ల. ఎవరో ఒకరు చేరదీస్తారనే నమ్మకమూ ఉండేది. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి ఆమె ధనలక్ష్మి పెళ్ళి గురించి సంతోషించనూ లేదు. విచారించనూ లేదు. విశాలాక్షి రోజూలాగే సంగీతం పాడుకుంటూ కూచుంది.

అన్నపూర్ణ ఇంట్లో మాత్రం ధనలక్ష్మి పెళ్ళి వార్త సందడి రేకెత్తించింది. అన్నపూర్ణ పెళ్ళి ఎప్పుడు చెయ్యాలి, ఎలాంటి సంబంధం తేవాలి అని తల్లిదండ్రులు వాదించుకున్నారు. తండ్రి చదువుకున్నవాడినే చూస్తానంటాడు. ఆస్తిపరుడు కావాలని తల్లి, నాయనమ్మా వాదించారు. అన్నపూర్ణ వాళ్ళ మాటలన్నీ వింటూ కూచుంది.

చదువు, పొలం రెండూ ఉన్నవాడు ఉండడా? అలాంటి వాడిని చూడొచ్చుగా ఎందుకిలా తగువుపడుతున్నారనే విసుగొచ్చేదాక వాళ్ళ మాటలు విని ఆ తర్వాత పుస్తకాలు తీసుకుని దీపం ముందు చేరింది?

***

ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ శారదకు. గంటకు పైగా తదేక దీక్షతో ముగ్గులలో మునిగిపోతుంది.

ఆ రోజు కూడా వాకిటి నిండా ముగ్గేసి అరుగు మీద కూచుని ఆనందంగా చూస్తుంటే ఊరినుంచి రామారావు వచ్చాడు.

శారద ఒక్క పరుగున వెళ్ళి తండ్రి చేతిలో సంచీ అందుకుంది.

‘‘నీకోసం బోలెడు పుస్తకాలు తెచ్చా’’నన్నాడు శారదను ఎత్తుకుని ముద్దాడి దించుతూ`

శారద ముఖం వికసించింది.

‘మిఠాయిలు కూడా తెచ్చాలే’’ అంటూ ఇంట్లోకి నడిచాడు. నరసమ్మ, సుబ్బమ్మ చేతిలోని పనులు వదిలేసి వచ్చారు. యోగక్షేమాలడిగి, ముఖ్యమైన సమాచారాలు చెప్పుకున్నాక రామారావు స్నానానికి వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. శారద స్కూలుకి తయారయింది. విశాలాక్షి వస్తుందని చూస్తోంది. తండ్రి తెచ్చిన కొత్త పుస్తకాలు స్నేహితులకు చూపించేదాకా నిలవలేకుండా ఉంది.

స్నానం ముగించి, పూజ చేసుకుని వచ్చిన తండ్రిని చూసేసరికి క్రితం రోజు జరిగినదంతా గుర్తొచ్చింది శారదకు.

‘‘నాన్నా. ధనలక్ష్మి పెళ్ళి కుదిరింది. ఇంక బడికి రాదట’’ అని తండ్రితో రహస్యం చెప్పినట్లు చెప్పింది.

రామారావు ‘‘అయ్యో’’ అన్నాడు.

‘‘నాన్నమ్మ నాకూ పెళ్ళి చేస్తుందట. నేనూ చదువు మానెయ్యాలట. నేను డాక్టర్‌ చదువుతానంటే నాన్నమ్మకు కోపం వచ్చి బాగా అరిచింది. అమ్మ ఏమీ అనకపోయినా అమ్మమీద కూడా అరిచింది’’. రామారావు ముఖం గంభీరమైంది. శారద పెళ్ళి విషయంలో తల్లితో గొడవ పడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. ఎంత గొడవవుతుంతోననే భయమూ ఉంది. ఎంత గొడవైనా సరే తల్లి మాట వినకూడదని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నాడు. కానీ తల్లిని ఎదుర్కోవాల్సిన గడ్డుకాలం దగ్గరపడిరదని ఆయనకు అర్థమైంది. మరో నాలుగు నెలల్లో శారదకు పదేళ్ళు నిండుతాయి. తల్లి ఊరుకోదు. ఏం చెయ్యాలి?  ఆయన మనసులో ఆందోళన ముఖంలో కనపడిరది. శారదకు తండ్రి ఆలోచన అర్థమయ్యి అవనట్లు ఉంది. ఇంతలో విశాలాక్షి పిలుపు విని ఒక్క పరుగు తీసింది.

రామారావు ఫలహారం చేసి బైటికి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా నరసమ్మ వచ్చి పొలం పనులూ, వ్యవహారాలు చెప్పటం మొదలుపెట్టింది.

‘‘ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా. నువ్వు చూసుకుంటే చాలు’’ అన్నాడు.

‘‘నేను ఎన్నాళ్ళు చూసుకుంటానురా. అన్నీ నీకు అప్పజెప్పి నేను హాయిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను. నువ్వు ఈ తిరుగుళ్ళు మాని ఇంటిపట్టున ఎప్పుడుంటావో చెప్పు’’ అంది నిష్టూరంగా.

‘‘అమ్మా. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అక్క రాసిన పుస్తకం అచ్చు అవుతోంది. ఇంకా ఎన్నో పుస్తకాలు అచ్చు వెయ్యాలి. మన తెలుగు వారి చరిత్రంతా రాయించి ముద్రించాలి. ఆ పనులు నావి. ఇంటి వ్యవహారాలన్నీ నీవి.’’

నరసమ్మ కొడుకు భరోసాకు నవ్వింది.

‘‘సరేరా ా ఇంటి వ్యవహారాలన్నీ నేనున్నంత కాలం నే చూస్తా ా కానీ నీ కూతురి పెళ్ళన్నా నువ్వు చెయ్యవా? నాలుగూళ్ళూ తిరుగుతున్నావు. పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేస్తున్నావు. మంచి సంబంధం చూసి శారద పెళ్ళి చేశావంటే ఇక నువ్వు ఎక్కడ తిరిగినా మాకు బెంగ ఉండదు. ఆ ఒక్క పనీ చెయ్యి నాయనా’’.

రామారావు గుండె దడదడలాడిరది. కానీ తేల్చి చెప్పాల్సిన సమయమూ ఇదేననుకున్నాడు.

‘‘శారద పెళ్ళికి తొందరలేదులే అమ్మా’’ అన్నాడు ప్రశాంతంగా. నరసమ్మకు ఆ మాటతో ఎక్కడ లేని ఆవేశం వచ్చింది.

‘‘తొందర లేదా? పదేళ్ళు నిండుతున్నాయి. పెద్దపిల్లయిందంటే ఎంత అప్రదిష్ట. ఎంత అనాచారం. పిల్ల పుష్పవతి కాకుండానే పెళ్ళి చెయ్యాలిరా’’.

‘‘అమ్మా అది జరిగే పని కాదు. శారదని చదివించాలి’’.

‘‘ముందు పెళ్ళి చెయ్యి. మొగుడికిష్టమైతే చదివించు. లేదా చదివించుకుంటానన్న మొగుడ్నే తీసుకురా!’’

‘‘అలా కాదులే అమ్మా! అంత చిన్నపిల్లకు పెళ్ళి మంచిది కాదు.’’

‘‘మంచిది కాదని నువ్వంటే సరిపోయిందా?’’ అష్టా వర్షేత్‌ భవేత్‌ కన్యా’’ అన్నారు. అదెలాగూ చెయ్యలేదు. పిల్ల ఈడేరకుండా పెళ్ళి చెయ్యాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పెద్దలంతా అలాగే చేశారు. వాళ్ళందరికంటే నీకెక్కువ తెలుసా?’’

‘‘కాలం మారుతోందమ్మా’’ పట్టుదలగా అన్నాడు రామారావు.

‘‘ఆ కబుర్లన్నీ నాకు చెప్పకురా. మగవాడివి. ఏం చేసినా నీకు చెల్లిపోతుంది. ఆడవాళ్ళం. మాకు సంప్రదాయం, కుటుంబపరువు ప్రతిష్ట ముఖ్యం. వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. శారద పెళ్ళి జరిగిపోవాల్సిందే. కావాలంటే కొడుకుని కనిచదివించుకో. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో’’

ఇక ఆ మాటలకు తిరుగులేదన్నట్లు లోపలికి వెళ్ళిపోయింది నరసమ్మ.

రామరావుకి సమస్య తననుకున్నదానికంటే పెద్దదనిపించింది. తల్లి సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆవిడ పట్టు పట్టిందంటే వదిలించటం ఎవరి తరమూ కాదు. ఎంతమంచి మనిషో అంత మొండి మనిషి. ఐతే ఆ మొండితనం రామారావుకీ ఉంది. తల్లి నుంచే వచ్చింది. శారదను డాక్టర్‌ చదివించాలనే పట్టుదల ఆయనకీ గట్టిగా ఉంది. ఈ చిక్కుముడి వీడే మార్గం మాత్రం ఆయనకు తెలియటం లేదు. ఆ రోజు రాత్రి తన బాధంతా భార్యముందు వెళ్ళబోసుకున్నాడు. ‘‘అంతా ఆ భగవంతుడి మీద వేసెయ్యండి. ఎలా జరగాలో అలా జరుగుతుంది’’ అందావిడ తేలిగ్గా తీసేస్తూ.

‘‘నీలాగా ఆలోచించకుండా బతికితే భలే సుఖంగా ఉంటుందే ా నేనట్లా బతకలేను గాని ా ’’

‘‘ఆలోచించి ఏం చేస్తారు? చేసేది లేనపుడు ఆలోచించటం దేనికి?’’

‘‘శారద పెళ్ళి గురించి ఏదో ఒకటి చెయ్యాలిగా’’

‘‘పెళ్ళి చెయ్యనంటుంటిరిగదా ` పెళ్ళి చేస్తే గదా ఏదో ఒక సంబంధం చూడటం, పెళ్ళి ఏర్పాట్లు ` వీటి గురించి ఆలోచించేది. చెయ్యనప్పుడేముంది?’’

రామారావు ఆశ్చర్యపోయాడు.

‘‘అంటే  శారదకిప్పుడు పెళ్ళి చెయ్యకపోతే నీకేం అభ్యంతరం లేదుగా?’’

‘‘లేదు. శారద డాక్టరవుతుందనుకుంటే నాకిప్పట్నించే గర్వంగా ఉంది. శారద పుట్టినపుడు కుగ్లర్‌ ఆసుపత్రిలో ఆ అమ్మగారిని చూశాగా. ఎంత ఠీవి. తెలివి. చాకచక్యం. మనుషుల ప్రాణాలు కాపాడటమంటే మాటలా? నా కూతురు ఎందరికి ప్రాణం పోస్తుందో’’

ఆనందాతిశయంతో రామారావు సుబ్బమ్మను గట్టిగా కావలించుకున్నాడు. తల్లంత కాకపోయినా భార్యతో కూడా తగవు పడాల్సి వస్తుందనుకున్నాడేమో, భార్య తనకన్నా ఒకడుగు ముందుందని తెలిసేసరికి ఆనందం పట్టలేకపోయాడు.

‘‘నాకు నీ మాటల్తో ఎక్కడలేని బలం వచ్చింది సుబ్బూ’’.

‘‘తెలుస్తూనే ఉంది’’ అని అందంగా నవ్వింది సుబ్బమ్మ.

ఆ మాటతో దంపతులిద్దరి మధ్యా సంభాషణ ఆగి సరసం మొదలైంది. నాలుగు రోజులు ఊళ్ళో గడిపి మద్రాసు ప్రయాణమయ్యాడు.

‘‘ఈసారి ఒట్టి చేతుల్తో రాకు నాయనా. మంచి కుర్రాడిని చూడు. పిల్లవాడు మంచివాడైతే చాలు. ఆస్తి అంతస్తుల గురించి మనం ఆలోచించవద్దు. మనకున్నదొక్కపిల్ల. దానికి సరిపడా మనకుండనే ఉంది’’ తల్లి మాటలు వినీ విననట్లు వెళ్ళిపోయాడు రామారావు.

***

కొమ్మ సింగారములివి కొలది వెట్టగ రావు

అవినేని భాస్కర్

Avineni Bhaskarప్రకృతినీ, స్త్రీ సౌందర్యాన్నీ ఎందరు కవులు, ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోయే ఉంటుంది! స్త్రీ నఖశిఖ పర్యంత సౌందర్య సిరి. ఫెమింజం పులుముకున్న స్త్రీలను మినహాయిస్తే సహజంగా స్త్రీలు సౌందర్య వర్ణనని, ఆరాధననీ ఇష్టపడుతారు. అందమైన స్త్రీలను పురుషులేకాక స్త్రీలుకూడా అభినందిస్తారు, మెచ్చుకుంటారు.

“కొమ్మ సింగారములివి” అన్న ఈ కీర్తనలో అన్నమయ్య తనని ఒక చెలికత్తెగా ఊహించుకుని అలమేలుమంగ అందాలను సాటి చెలికత్తెలకు వివరించి ఆశ్చర్యానికి లోనౌతున్నాడు! దూరం, బరువు లాంటివాటిని కొలవడానికి కొలబద్దలుంటాయి. మరి సౌందర్యాన్ని కలవడానికేముంది? చూసి ఆశ్చర్యపోవడం, కవితల్లో వర్ణించదం. ఇవి తప్ప ఇంకేం చేస్తాడు కవి? ప్రకృతితో పోల్చి, ప్రకృతికంటే గొప్ప అందాలు అలమేలుమంగది అని చెలులకు చెప్తున్నాడు.

AUDIO Link : KOMMA SINGARAMULIVI

 

 

[ స్వరము, గళము : గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ ]
పల్లవి
కొమ్మ సింగారము లివి కొలఁది వెట్టఁగ రావు
పమ్మిన యీ సొబగులు భావించరే చెలులు
 
చరణాలు
చెలియ పెద్దతురుము చీఁకట్లు గాయఁగాను
యెలమి మోముకళలు యెండ గాయఁగా
బలిసి రాతిరియుఁ బగలు వెనకముందై
కలయ కొక్కట మించీఁ గంటిరటే చెలులు
 
పొందుగ నీకె చన్నులు పొడవులై పెరుగఁగా
నందమై నెన్నడుము బయలై వుండఁగా
ఇందునే కొండలు మిన్నుఁ గిందుమీఁదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు
 
శ్రీవేంకటేశువీఁపునఁ జేతు లీకెవి గప్పఁగా
యీవల నీతనిచేతు లీకెఁ గప్పఁగా
ఆవలఁ కొమ్మలుఁ దీగె ననలుఁ గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ
 
 

తాత్పర్యం (Explanation) :

ఈ అమ్మాయి అందాలు ఇన్ని అన్ని అని లెక్కబెట్టలేము, ఇంత అంత అని వర్ణించలేము. కనులను మురిపింపజేసే అపురూమైన ఈమె చక్కని సొగసులను ఎంచి చూడండి చెలులారా!

ఆమెకు  పొడవైన, ఒత్తనైన నల్లటి కురులున్నాయి. దువ్వి కొప్పు చుట్టింది. ఆమె జుట్టు నల్లగా నిగనిగలాడటంవలన రాతిరైపోయిందేమోనన్నట్టు చిక్కటి చీకట్లు కాస్తుంది. (విభుని రాకవలన) ఆనందంతో వికశిస్తున్న ఆమె మొఖం మెరిసిపోతుంది. ఆ ముఖ కాంతి ఎండకాస్తున్నట్లుగా ఉంది. ఎండా-చీకటీ ఒకే సమయంలో ఉండటం అన్నది అసాధ్యం! అలా ఉంటే అది అతిశయం! అంతటి అతిశయం ఇప్పుడీ అందగత్తె ముందూ, వెనుకలుగా ఒకేచోట, ఒకే సమయంలో ఉన్నాయి చూడండి చెలులారా!

ఈమె కుచగిరులు రెండూ సమానంగా, సమృద్ధిగా పెరిగినట్టు ఉన్నాయి. అందమైన నడుమేమో చన్నగా చిక్కిపోయి ఆకశంలాగా(బయలులా) ఉండీలేనట్టు ఉంది. మామూలుగా కొండలు కింద, ఆకాశం పైన ఉంటాయి. ఇక్కడేమో కొండలవంటి ఆమె కుచగిరులు పైనా, ఏమీ లేని శూన్యంవంటి నడుము కిందా ఉన్నాయి. ఎక్కడా కానని ఈ వింతని చూశారా చెలులారా!

ఇంతటి ఒయ్యారాలుగల సొగసులాడి అలమేలుమంగ శ్రీవేంకటపతిని కౌగిలించగా, తన చేతులను ఆయన వీపును పెనవేసింది. ఆయన చేతులు ఈమె వీపును అల్లుకున్నాయి. మామూలుగా తీగెలు కొమ్మలను చుట్టుకుని పెనవేసుకుంటాయి. అయితే అలమేలుమంగా, వేంకటేశుల కలయికని చూస్తుంటే కొమ్మా, తీగా రెండూ అల్లుకుని ఒకదాన్నొకటి పెనవేసుకుని పరిపూర్ణం చెందినట్టు కనిపిస్తుంది తిలకించండి చెలులూ!

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
కొమ్మ = అమ్మాయి,
సింగారములు = అందాలు
కొలది = కొలమానం
పమ్మిన = ప్రదర్శించబడుతున్న (ఈ సందర్భానికి సరిపోయే అర్థమిది),  ఆశ్చర్యం కలిగించే, అతిశయింపజేసే

తురుము = కొప్పు
కాయగాను = కాస్తు ఉంటే
యెలమి = వికశించుతున్న
మోముకళలు = ముఖములోని కళలు
బలిసి = ముదిరిన, దట్టమైన

పొందుగ = పొందికగా
ఈకె = ఈమె
చన్నులు = కుచములు, రొమ్ములు
పొడవు = పెద్ద
నెన్నడుము = చిక్కిన నడుము
బయలై = ఏమీలేనట్టు, శూన్యమై
ఇందు = కలిసి
కొండలు = పర్వతాలు
మిన్ను = ఆకాశము
ఒక్కచో = ఒకేచోట
చెంది = కలిగి

ఈవల/ఆవల = ఇవతల/అవతల వైపు
కొమ్మలు = కొమ్మలు
చేవదేరీని = పరిపూర్ణతచెందినది ( బలపడినది )

Image Courtesy : Sukanya Ramanathan
*

కళాయోధుడికి వందేళ్లు -1

పి.మోహన్ 

 

P Mohanచిత్తప్రసాద్ కు జాతకాలపై నమ్మకం లేదు. తను బతికి ఉండగా పట్టని అదృష్టం చచ్చాక పడుతుందన్న భ్రమ అసలే లేదు. దున్నపోతులు పాలించే ఈ దేశం తన పిచ్చి బొమ్మలను గుర్తించుకుని, తన వందేళ్ల బర్త్ డే జరుపుకుని, నివాళి అర్పిస్తుందన్న వెర్రి ఆశ అసలే లేదు. అయినా చిత్తప్రసాద్ ఇప్పుడు ఎవడిక్కావాలి? మదరిండియాను ‘మేకిన్ ఇండియా’ కంతల గుడిసెలో ఎఫ్డీఐల కాషాయ పడకపై అంకుల్ శామ్, చైనా డ్రాగన్, యూరప్ గద్దలకు ఏకకాలంలో తార్చేస్తున్న స్వదేశీ జాగరణ మహావానరాలకు ఆ ఆ కల్తీలేని ఎర్ర దేశభక్తుడి పుట్టిన రోజుతో ఏం పని? కళ్లే కాదు సర్వాంగాలూ లొట్ట పోయిన గోతికాడి నకిలీ ఎర్రమనుషులకు ఆ ఒకనాటి తమ సహచరుడి సమరస్వప్నాలు ఏ జూదానికి పనికొస్తాయి? నిమిషానికి కాదు క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లులు అతగాడి బ్లాక్ అండ్ వైట్ నిప్పుల జెండాలను ఏం చేసుకుంటాయి?

కానీ, చిత్తప్రసాద్ మహామోహంతో, నరనరానా ప్రేమించిన ఈ లోకంలో దున్నపోతులు, మహావానరాలు, నక్కలు, ఊసరవెల్లులే కాదు.. మనుషులు కూడా ఉన్నారు. అతని మాదిరే సాటి మనిషి కష్టానికి కన్నీరుమున్నీరయ్యేవాళ్లు, కళ మార్కెట్ కోసం కాదని, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకని నమ్మేవాళ్లు, నమ్మకం కోసం నునువెచ్చని నెత్తుటిని ధారపోస్తున్నవాళ్లూ ఉన్నారు. చిత్తప్రసాద్ వాళ్లకు అవసరం! చెప్పలేనంత అవసరం. శత్రువు గుండెను గెరిల్లా బాంబులా పేల్చే అతని బొమ్మలు వాళ్లకు కావాలి. కలలను, కన్నీళ్లను, అక్కసును, ఆక్రోశాన్ని, కసిని, క్రోధాన్ని మహోగ్రంగా వెళ్లగక్కే ఆ నిప్పుకణికలు వాళ్లకు కావాలి. వాటి కథలూ, గాథలూ వాళ్లకు కావాలి. చిత్తను తెలుసుకోవడమంటే మన గుండెతడిని మనం పరీక్షించుకోవడం. మన భయాన్ని, పిరికితనాన్ని, నంగితనాన్ని వదలించుకుని మన పిడికిళ్లను మరింతగా బిగించడం. వందేళ్ల చిత్త బతుకు చిత్రాల గ్యాలరీని నేటి మన చివికిన బతుకు కళ్లతో చూద్దాం రండి!

1 (3)

చిత్త ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ. దాని రేకులు ఎంత మెత్తనో అంత పదును. ఒక్కో రేకుది ఒక్కో పరిమళం. ఒకటి బొమ్మలు వేస్తుంది, ఒకటి పాడుతుంది. ఒకటి కవితలు, కథలు రాస్తుంది. అది జనం పువ్వు. కష్టజీవుల కళల పంట. అది వాళ్లు నవ్వితే నవ్వుతుంది, దుఃఖపడితే కలతపడుతుంది. ఆగ్రహిస్తే కత్తుల పువ్వయిపోయి వాళ్ల చేతుల్లో ఆయుధంలా మారిపోతుంది. అందుకే బడాబాబులకు అదంటే గుండెదడ. బడుగుజీవులకు గోర్వెచ్చని గుండెపాట.

కళను అర్థం చేసుకోకూడదని, అనుభవించాలని అంటారు మహానుభావులు. చిత్త విషయంలో ఈ మాటకు అర్థం లేదు. అతని చిత్రాలు అర్థం, అనుభవాల మేలుకలయిక.

‘..నేను చెప్పేది నీకర్థం కావడం లేదని అనుకుంటున్నానమ్మా! అయినా, మాటలు ప్రతిభావాన్నీ చేరవేస్తాయా? ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, మిత్రుడు ఎరిక్ మాట్లాడే డేనిష్.. అందరినీ అడిగి చూశాను.. మనుషుల ప్రగాఢమైన సుఖదుఃఖాలను, తృప్తి, అసంతృప్తులను, శాంతిని, క్రోధాన్ని సరిగ్గా చేరవేయగల మార్గాలను ఇంతవరకూ ఏ భాషా కనుక్కోలేదు’ అని అమ్మకు రాసిన లేఖలో అంటాడు చిత్త. భాషలు చెయ్యలేని ఆ పనిని అతని చిత్రాలు చేశాయి. 

చిత్తప్రసాద్ 1915 జూన్ 21న పశ్చిమ బెంగాల్ లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో నైహాతిలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇందుమతీ దేవి, చారుచంద్ర భట్టాచార్య. చారుచంద్ర ప్రభుత్వోద్యోగి. పియానో వాయించేవాడు. ఇందుమతి కవిత్వం రాసేది, పాటలూ పాడేది. పుస్తకాలంటే పిచ్చిప్రేమ. ఈ పిచ్చి కొడుక్కీ సోకింది. పుస్తక సేకరణ సామ్రాజ్య నిర్మాణం వంటిదంటాడు చిత్త. అతనికి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా అంతకుమించిన సాహితీసంస్కారాన్ని, బీదలపట్ల సానుభూతిని, నమ్మిన విలువల కోసం రాజీలేనితనాన్ని అందించారు. చిత్తకు ఒక చెల్లెలు. పేరు గౌరి. ‘దాదామోషి’ ఆ పిల్లను చెల్లి అని కాకుండా ముద్దుగా అక్కాయ్ అని పిలిచేవాడు. చారుచంద్ర ఉద్యోగరీత్యా మిడ్నపూర్, చిట్టగాంగ్ లలో కాపురమున్నాడు. చిత్త ఇంటర్, డిగ్రీ చిట్టగాంగ్ ఆ ఊళ్లలోనే పూర్తి చేశాడు.

 

బెంగాల్ విద్యావేత్త  ప్రొఫెసర్ జోగేశ్ చంద్ర రాయ్(1859-1952) లైబ్రరీ చిత్తకు చిత్రలోకాన్ని పరిచయం చేసింది. కుర్రాడు సాయంత్రం పూట జోగేశ్ పుస్తకాలను తుడిచి, సర్దిపెట్టేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయన ‘ప్రభాషి’, ‘భరతబర్ష’ వంటి పత్రికల్లో వచ్చే బొమ్మలను ఇచ్చేవాడు. ఓ రోజు వాటర్ కలర్స్ బాక్సు కానుకగా ఇచ్చాడు. చిత్త బొమ్మల్లో మునిగి తేలాడు. జోగేశ్ తనను సొంత మనవడిలా చూసుకున్నాడని అంటాడు చిత్త.

3 (4)

1930వ దశకంలో బెంగాల్ విప్లవాగ్నులతో కుతుకుత ఉడుకుతుండేది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై సమర్ సేన్ దండు ముట్టడి, తర్వాత విప్లవకారులను బ్రిటిష్ వాళ్లు వేటాడి చంపడం.. బ్రిటిష్ తొత్తుల ఇళ్లపై అనుశీన్ సమితి దాడులు… ఇవన్నీ చిత్త చుట్టుపక్కలే జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఫాసిస్టులు బెంగాల్ పొరుగున ఉన్న బర్మాను ఆక్రమించారు. చిట్టగాంగ్, కలకత్తాలపై బాంబులు వేశారు. చిత్త రాజకీయాల్లోకి రాక తప్పలేదు. రహస్య కమ్యూనిస్టు రైతు సంఘాలతో పరిచయమైంది. జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ చిత్త వేసిన పోస్టర్లను గ్రామం పక్కన పొలంలో కర్రలు పాతి, తడికలకు అతికించి ప్రదర్శించారు. అక్షరమ్ముక్క తెలియని జనం కూడా వాటిని చూసి మెచ్చుకున్నారు. అది అతని తొలి ఎగ్జిబిషన్. కొండంత స్ఫూర్తని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వేడుక.

చిత్త నిజానికి శిల్పికావాలనుకున్నాడు. కానీ ఆ కళాశిక్షణా గట్రా ఖరీదు వ్యవహారం కావడంతో చిత్రకళతో సరిపెట్టుకున్నాడు. బొమ్మల పిచ్చితో కలకత్తా వెళ్లాడు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చేశాడు. రాజకీయాల్లో తలదూర్చనని హామీ ఇస్తేనే సీటిస్తానన్నాడు. చిత్త నిరాకరించి బయటికొచ్చేశాడు. తన ఆరాధ్యుడైన నందలాల్ బోస్ కళాపాఠాలు బోధిస్తున్న శాంతినికేతన్ కు వెళ్లాడు. రవీంద్రనాథ్ టాగూర్ ముందు కూర్చుని అతని బొమ్మను చకచకా గీసిచ్చాడు. టాగూరు, నందలాల్ ఇద్దరూ భేష్ అన్నారు. ‘నీకు మేం నేర్పేదేమీ లేదు, కాలం వృథా చెయ్యకుండా వెళ్లిపో, మమ్మల్ని మించిపోతావు!’ అని భుజం తట్టారు. చిత్త స్వయంకృషితో కళాసాధన చేశాడు. ఉడ్ కట్లు, లినోకట్లు, ఆయిల్స్, వాటర్ కలర్స్.. ఏది పట్టుకున్నా కళ్లు చెదిరే బొమ్మ తయారై బోలెడు ముచ్చట్లు చెప్పేది. చిత్త 1938లో రంగుల్లో వేసుకున్న స్వీయచిత్రంలో అతని నవకాశల యువపేశల స్వప్నకాంతులను చూడొచ్చు.

2 (4)

చిత్త 1937-38 లో కమ్యూనిస్టులకు మరింత దగ్గరయ్యాడు. బ్రాహ్మణ్నని గుర్తుచేసే భట్టాచార్య తోకను కత్తిరించుకున్నాడు. జంధ్యప్సోసను తెంచేశాడు. అవసరమున్నప్పుడు జంధ్యప్సోసను, నగానట్ర, పట్టుచీరలను బహు అందంగా తగిలించుకుని, అవసరం లేనప్పుడు బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకుంటూ, తోకలను, కొమ్ములను భద్రంగా మోసుకు తిరిగే నేటి ‘వీరవిప్లవ కమ్యూనిస్టులు’ చిత్తను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదా ?

40వ దశకంలో దేశం విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలతో కోట్ల వాల్టుల ఎర్రలైటులా ప్రకాశించింది. ఒక పక్క క్విట్ ఇండియా రణన్నినాదాలు.. మరోపక్క తెభాగా, పునప్రా వాయలార్, తెలంగాణా సాయుధ పోరాటాలు బ్రిటిష్ వాళ్లకు, వాళ్ల తొత్తు కుక్కలకు చుక్కలు చూపించాయి. సాంస్కృతిక కళారంగాల్లోనూ కొత్త విలువలు, ఆదర్శాలు పురివిప్పి నాట్యమాడాయి. ఫాసిస్టు వ్యతిరేక రచయితల, కళాకారుల సంఘం(ఏఎఫ్ డబ్ల్యూఏ), అభ్యుదయ రచయితల సంఘం(పీడబ్ల్యూఏ), భారత ప్రజానాట్యమండలి(ఇప్టా) అన్నీ నూతన మానవుడిని కలగంటూ పలవరింతలు పోయాయి. చిత్త కూడా రూపారూపాల్లో కలలుగన్నాడు. కమ్యూనిస్టుల దళపతి పీసీ జోషి చిత్తలోని కార్యకర్తనే కాక కళాకారుడినీ గుర్తించాడు.  పూర్తికాలం కార్యకర్తగా బాంబేకి పంపాడు.

కమ్యూనిస్టు పార్టీ పత్రికలైన ‘పీపుల్స్ వార్’, ‘జనయుద్ధ’లకు, బులెటిన్లకు ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం, రైతు, కార్మిక సంఘాలకు పోస్టర్లు రూపొందించడం చిత్త పని. ‘ప్రచార కళే’ అయినా కళావిలువల్లో ఎక్కడా రాజీపడకపోవడం చిత్త సాధించిన అరుదైన విజయం. ‘ప్రచార కళ’ అనేది మోటుగా చెప్పాలంటే తప్పుడుమాట. ఎందుకంటే కళను ప్రచారం కోసమే సృజిస్తారు కాబట్టి. ప్రచార కళా, మామూలు కళా అని రెండు రకాలు ఉండవు. కళకు కళాసౌందర్యవిలువలే ప్రమాణం. కళ ఎక్కడున్నా కళే. ‘ప్రచారం’లో ఉన్నంత మాత్రాన కళ కళ కాకుండా పోదు. మనిషి కళను ఎరిగింది మొదలు దాని లక్ష్యమంతా ప్రచారమే. ఆదిమానవులు గుహల్లో గీసిన బొమ్మలు, అధునిక మానవులు గుళ్లలో వేసిన బొమ్మలు, నవాధునిక మానవులు ఎక్కడెక్కడో వేస్తున్న బొమ్మలు.. వీటన్నింటి ఉద్దేశం తమ భావాలను ఎదుటి మనిషికి చెప్పుకోవడం. కాఫ్కాలు, వైల్డులు, డాలీలు, పొలాక్ లు తమ రచనలను, చిత్రాలను సృజించిది నేలమాళిగల్లో, భోషాణాల్లో ఎవరికంటా పడకుండా దాచిపెట్టుకోవడానికి కాదు. చిత్త బొమ్మలు బండగా, అందవికారంగా ఉంటాయని పైకి చెప్పకున్నా కొంతమంది కళాభిమానుల లోపలి అభిప్రాయం. ‘కళలో గుణం(కేరక్టర్) లేకపోవడం ఉంటుంది కానీ అందవికారమనేది అసలుండదు’ అని అంటాడు ఫ్రెంచి మహాశిల్పి అగస్త్ రోదా.

                     మిగతా వచ్చేవారం.

 

 

 

 

నా చింత

కందుకూరి రమేష్ బాబు
.

Kandukuri Rameshచెట్లని చూసినప్పుడల్లా నాకు ఈ చెట్టే గుర్తొస్తుంది.
ఈ ఒక్క చెట్టు ఒక దృశ్యం. కానీ, అనేక చెట్లు దృశ్యాదృశ్యం అనిపిస్తుంది.

ఎందుకంటే ఈ చెట్టుకు చరిత్ర ఉంది. మూసీ వరదల్లో యాభైవేల మంది మరణిస్తే కనీసం నూటా యాభైమందికి పైగా బతికారంటే ఆ బతికిన మనుషులు ఈ చెట్టును ఆశ్రయించి ప్రాణాలతో బతికి బట్టకట్టిన వారే. అందువల్ల ఈ చెట్టును ‘ప్రాణదాత’గా పిలుస్తారు. ఫారెస్టు శాఖ వారు ఒక తపాళా బిల్లను కూడా ముద్రించారు. అందుకే ఈ చెట్టు సరైన విధంగానే పేరు పడింది. 28 సెప్టెంబర్ 1908– ఒక ప్రాణదాత.  

కానీ, మిగతా చెట్లు?
అవన్నీ ఏ ఒక్కరికీ నీడ ఇవ్వలేదా?
మరెవ్వరికీ ఫలాలనివ్వలేదా?
మన బాల్యపు ఆటలకు తానూ ఒక కోతి కొమ్మచ్చి ఆట కాలేదా?
మన యవ్వనపు దాహాలకు తెరచాటుగనైనా నిలవలేదా?
ఇక నా వల్ల కాదనుకున్న వారికి ఉరికొయ్యగ మారలేదా?

బతుక్కీ మరణానికీ ఏ చెట్టు ఏం చేయలేదని చెప్పగలం?

కానీ, ఈ చెట్టును మాత్రం గుర్తించుకున్నాం. అక్కడి పరిసరాలను శుభ్రం చేసి చక్కగా మెట్లుకట్టుకున్నాం. ఏడాదికి ఒక సారి అక్కడకు వెళ్లి ఆ విలయాన్ని గుర్తు చేసుకుని, చెట్టను ప్రేమతో తడిమి వస్తుంటాం. ఆ చెట్టు మీదినుంచే తన కుటుంబం యావత్తూ నీట మునుగుతుంటే చూసి భయభ్రాంతుడైన ఉర్దూ కవి అమ్జద్ ఖాన్ నూ ఇక్కడకొస్తే యాది చేసుకుంటాం. ఆయన ఒక కవిత రాశాడనీ చెప్పుకుంటాం. తర్వాత కవితలూ రాసిన కవుల గురించీ చెప్పుకుంటాం.

కానీ ఒక సందేహం.
ఒక విలయంలోనో, ప్రళయంలోనో తప్పా, వాటినుంచి తప్పించుకుంటే తప్పా మనిషి దేన్నీ గుర్తుంచుకోడా?
‘రామా’ అనిపిస్తుంది!

మనుషులు చెట్లనైనా. తోటి మనుషులనైనా కృతజ్ఞత వల్లే గుర్తించుకోవాలా? అని -లోలోన బాధేస్తుంది. చిరాకూ వేస్తుంది.

వీధినుంచి బయలుదేరి రోడ్డుమీదికి వస్తే ఇవన్నీ ప్రశ్నలు.
ఏ చెట్టును చూసినా మనిషి విధ్వంసం గుర్తొస్తుంది.

అవును. ఏ చెట్టును చూసినా సామాన్య జనం మాదిరి తలవంచుకుని తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టే అనిపిస్తుంది. కానీ, కొన్ని మొక్కలు మాత్రం అనుభవ రాహిత్యం వల్లో ఏమో, ‘నువ్వు మీడియా మనిషివా?’ అన్నట్టనిపిస్తుంది. ‘ఎదిగివస్తే తప్పా, సెలబ్రిటీ అయితే తప్పా నన్ను గుర్తించవా?’ అని ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తుంది. ‘మై డియర్…నాకా ప్రాబ్లం లేదు’ అని చెప్పి, చిర్నవ్వుతూ ఆ చెట్టును ఫొటో తీస్తూ పోతాను. ఆ మొక్కను దానంత సహజంగానే చిత్రిక పడతాను. అదే విధంగా చెట్టంత మనుషులనూ తీస్తూ  పోతాను.

కానీ చెప్పాలనే అనిపిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, వార్త కాకుండా, విశేషం కాకుండా, విచారం నుంచి కాకుండా, కృతజ్ఞతా భావంతో సంబంధం లేకుండా, ఏ చెట్టునైనా ఫొటో తీసుకోవాలనిపిస్తే, ఏ మనిషినైనా తన పేరు, ప్రఖ్యాతి, అధికారం, హోదా – వీటితో నిమిత్తం లేకుండా ఫొటోలు తీయాలనుకుంటే తెలియకుండానే మొదట ఆ చెట్టే గుర్తొస్తుంది. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆ చింతచెట్టే నాకు తొలుత  యాదికొస్తుంది.

అన్ని చెట్లలో అదొక చెట్టుగానే నేను చూస్తాను.

~

అమ్మ చెప్పింది…

కూతురు, వేశ్య

ఆమెతల్లి, తెలివైనది.

 

తల్లి:       నిన్న నీకు పిచ్చేమైనా ఎక్కిందేమిటే, రాత్రి విందులో దెయ్యం పట్టినట్టు ప్రవర్తించావట? పొద్దున్నే ఆ కుర్రాడు కృష్ణమూర్తి ఏడుపొక్కటే తరువాయిగా ఇక్కడికొచ్చాడు. నువ్వతన్ని చాలా బాధపెట్టావని చెప్పాడు. బాగా తాగావట. తన ప్రక్కనే కూర్చోమని చెబుతున్నా వినకుండా విందు మధ్యలో లేచి నృత్యం చేశావట. అంతటితో ఆగకుండా అతని స్నేహితుడు గోపాలాన్ని ముద్డాడావట. అదేమని కోప్పడినందుకు అతన్ని వదిలేసి ఏకంగా గోపాలం కౌగిట్లోనే చేరిపోయావట. పోనీలే అనుకున్నా, అసలు కృష్ణమూర్తితో పడుకోనని చెప్పి అతని ఖర్మ కతన్ని వదిలేసి వేరే మంచం మీద నిగడదన్ని పడుకున్నావట. ఏమిటిదంతా!?

కూతురు: (చిరాగ్గా) నేను చేసిందంతా బాగానే గుర్తుపెట్టుకొని మరీ చెప్పాడు కానీ, అతను నాకు చేసిన అవమానం మర్చిపోయినట్టున్నాడు. అక్కడేం జరిగిందో తెలిస్తే నువ్విలా అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడవు. మదనిక లేదూ, అదేనే ఆ గోపాలం ప్రియురాలు, దాంతో మాట్లాడటం కోసం ఇతను నన్నొదిలేసి దాని దగ్గర చేరాడు. అప్పటికి గోపాలం ఇంకా అక్కడికి రాలేదు. నాకు అయిష్టంగా ఉందని తెలిసి కూడా అతనా పనికి పూనుకున్నాడు. దాన్నొదిలేసి నాదగ్గరికి రమ్మని సైగ చేశాను. వెనక్కి రాకపోగా అతనేం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా…

తల్లి:       ఏం చేశాడమ్మా?

కూతురు: మదనిక కూర్చున్న కుర్చీ వెనక నిలబడి, దాని చెవులు పట్టుకొని వెనక్కు వంచి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మదనికకి దాని పెదాలను విడిపించుకోడానికి చాలాసేపు పట్టింది. నాకు ఏడుపొచ్చి ఏడ్చేశాను. కానీ అతను నాఏడుపును కూడా నిర్లక్ష్యం చేసి దాని చెవిలో ఏవేవో ముచ్చట్లు చెప్పడం మొదలెట్టాడు. నాకుతెలుసు, అతను నాగురించే దానికేదో చెప్తున్నాడు.

తల్లి:       అట్లా ఎందుకనుకోవాల్లేమ్మా…

కూతురు: నువ్వింకా…. సరే, అతను చెప్తున్నంతసేపూ అది నావైపే చూస్తూ ఒకటే చిరునవ్వులు.. నాకు ఒళ్ళు మండిపోయింది. ఈ బాగోతం ఎంతసేపు సాగేదో కానీ, గోపాలం రావడం చూసి వీళ్ళిద్దరూ ముద్దులాపేసి విడిపోయారు. అప్పుడొచ్చాడు దొర నాదగ్గరికి.

తల్లి:       పోన్లేమ్మా, నీప్రియుడు నీదగ్గరికి చేరాడు కదా…

కూతురు: అక్కడితో కాలేదు. ఇంకా విను. విందులో మదనిక ముందుగా నృత్యం చేసింది. అక్కడున్న ఆడవాళ్ళకెవరికీ తనకున్నంత అందమైన కాళ్ళు లేవని చెప్పడానికి కాబోలు, తొడల దాకా కనబడేట్టు బట్ట ఎగ్గట్టింది. కాసేపటికి దాని నృత్యం పూర్తయ్యింది. దాని ప్రియుడు మౌనంగానే ఉన్నాడు. నాప్రియుడికి మాత్రం ఎక్కడలేని ఉత్సాహం పుట్టు కొచ్చింది. ఇకదాని నృత్యాన్ని ఒకటే పొగడ్డం. దాని హావభావాల్ని గురించీ, దాని లయ విన్యాసం గురించీ… వింటున్నావా? దాని పాదాలకు సితారతో పరిణయం జరిగిందట, కవిత్వం ఒలకబోశాడమ్మా, కవిత్వం. దాని కాళ్ళ అందాల గురించి ఒకటే పలవరింత… అదంతా దాన్ని మెచ్చుకున్నట్టు లేదు. నన్ను తక్కువ చేసినట్టుంది.

తల్లి:       అట్లా ఎందుకు చేస్తాడు లేవే!

కూతురు: ఇంకా అతన్నే వెనకేసుకొస్తున్నావా? సరే, తర్వాత జరిగింది కూడా విని అప్పుడు చెప్పు. ఈయన పొగడ్తలకి ఆ మదనికకి ఒళ్ళు తెలియలేదు. అది నావంక హేళనగా చూస్తూ, ‘ఇక్కడ ఉన్న వాళ్లెవరైనా వాళ్ళ కాళ్ళ అందాన్ని గురించి సిగ్గుపడకుండా ఉండేట్టయితే లేచి నృత్యం చేయొచ్చు’ అంది. అప్పుడు నేనేం చెయ్యనమ్మా? లేచి నృత్యం చేశాను. లేకపోతే దాని మాటలే నిజమని అక్కడి వాళ్ళందరూ అనుకుంటారు కదా!?

తల్లి:       నువ్వనవసరంగా ఉద్వేగానికి గురయ్యావు. ఆ విషయాన్ని అంతగా మనసుకు పట్టించుకోవాల్సింది కాదు.

కూతురు: అందరూ నానృత్యాన్ని బాగా మెచ్చుకున్నారు తెలుసా? నాప్రియుడు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా చూస్తూండిపోయాడు గానీ, మెచ్చుకోడానికి నోరు పెగల్చుకోలేకపోయాడు. పోనీ నానృత్యాన్నయినా చూశాడా అంటే అదీ లేదు. అంతసేపూ కప్పు వంక చూస్తూ కూర్చున్నాడు.

తల్లి:       ఐతే తర్వాత నువ్వు గోపాలాన్ని ముద్దాడటం, కృష్ణమూర్తి పక్కనుంచి లేచివెళ్ళి అతగాడిని కౌగిట్లోకి తీసుకోవడం నిజమా కాదా?

కూతురు: (మౌనం)

తల్లి:       మాట్లాడవేమే, నిజంగా నువ్వు చేసిన పని క్షమార్హం కాదు. తెలుసా?

కూతురు: నామనసు నొప్పించాడు కాబట్టి అతని మనసు కూడా నొప్పించాలనుకున్నాను.

తల్లి:       పోనీ అంతటితో ఆగావా? కృష్ణమూర్తిని రాత్రి పక్కలోకి కూడా రానివ్వలేదు. అతను చిన్నబుచ్చుకొని కన్నీళ్ళతో ఉంటే నువ్వు పుండు మీద కారం చల్లినట్టు వేరే మంచం మీద చేరి కూనిరాగాలు తీశావు.

కూతురు: (మౌనం)

తల్లి:       అతను నిన్ను చేరదీయకముందు మనం పేదరికంలో మగ్గుతున్నాం. అలాంటి స్థితిలో అతను మననెంత ఆదుకున్నాడో నువ్వు మర్చిపోయావు. మన్మధుడు దయతలిచి అతన్ని నీకు చేరువ చేయకపోతే పోయినేడు మనం కూటికి మాడి చచ్చేవాళ్ళం.

కూతురు: అందుకని అతనెంత అవమానించినా నేను భరిస్తూ ఉండాలా?

తల్లి:       అలా అని నేనన్నానా? నీకోపాన్నంతా నీప్రియుడి మీద చూపించు, తప్పులేదు. కానీ అతన్ని అవమానించకు. ఒక్కసారి నీ హేళనకు గురైనవాడు మళ్ళీ నిన్ను ప్రేమించగలడా, చేరదీయగలడా? నువ్వు నీప్రియుడితో చాలా దురుసుగా తప్పుగా ప్రవర్తించావు. సామెత చెప్పినట్టు తెగేదాకా లాగకూడదమ్మా! ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

*

మహోజ్వల జానపద నవల “మృత్యులోయ”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

సాహిత్యంలో బాలసాహిత్యం ఓ అవిభాజ్యమైన అంగం. పిల్లల మానసిక వికాసానికి బాలసాహిత్యం ఇతోధికంగా దోహదం చేస్తుంది. పిల్లలో ఉత్సుకతని రేకెత్తించి, విజ్ఞానాన్ని అందిస్తుంది. వీటితో పాటు భాషాజ్ఞానమూ అబ్బేలా చేస్తుంది.

పిల్లలలో ఊహాశక్తిని పెంపొందిస్తూ, చక్కని నడవడి నేర్పే కథల కోసం ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బుజ్జాయి… వంటి పత్రికలు ఉండేవి. చందమామ చదవని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. చందమామ పత్రిక అంతలా జనాదరణ పొందడానికి వ్యవస్థాపకుల విలువలు ఒక కారణమైతే, చక్కని కథలని ఎంచి పత్రికని పరిపుష్టం చేసిన సంపాదకుల దూరదృష్టి, వివేకం మరో కారణం.

పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకునేలా చందమామని తీర్చిదిద్దడంలో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పాత్ర విస్మరించలేనిది. పత్రిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, చందమామలో 12 జానపద సీరియల్స్ వ్రాసి ప్రచురించారు. ఒక్క చందమామలోనే కాదు, బొమ్మరిల్లు, యువ, స్నేహబాల, ప్రమోద వంటి పత్రికలలో జానపద నవలలు ధారావాహికంగా వెలువరించారు.

మృత్యులోయ’ నవల బొమ్మరిల్లు ప్రారంభసంచిక (1971) నుంచి 39 నెలలపాటు (1974) ధారావాహికంగా ప్రచురింపబడింది. జానపద నవలలంటే, రాజులు, రాణులు, రాజకుమారులు, రాకుమార్తెలు, మంత్రులు, మంత్రి కుమారులు, సైన్యాధికారులు, దండనాయకులు, విదూషకులు, కుట్రలు, కుతంత్రాలు, అడవులు, జంతువులు, మాయలు, మంత్రాలు, మాంత్రికులు, ఋషులు, మరుగుజ్జులు, మహాకాయులు… ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెడతాయి. ఈ నవల కూడా అలాంటిదే.

లలాటమనే దేశాన్ని యశోవంతుడనే రాజు ధర్మబద్ధంగా పాలిస్తూంటాడు. మంత్రి జయవర్మ రాజుకి అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. రాజు గారి శూరత్వానికి, మంత్రిగారి వ్యూహచతురతకి జడిసిన పొరుగు రాజులు లలాటం మీదకి దండెత్తాలని ఉన్నా, వెనుకడుగు వేస్తుంటారు. రాజకుమారుడు యశపాలుడు, మంత్రి కుమారుడు జయకేతుడు అనుంగు మిత్రులు. రాచవిద్యలు, యుద్ధవిద్యలన్నింటిలోను ప్రావీణ్యం సంపాదించుకున్న యువకులు. తమ నైపుణ్యాలను కదనరంగంలో ప్రదర్శించే వీలు లేక, అడవిలో వేటకి వెళ్ళి, తమ విద్యలను మెరుగుపెట్టుకుంటూ ఉంటారు. అలా ఓ సారి అరణ్యంలో వేటకి వెళ్ళి, ప్రమాదానికి గురై, మృత్యులోయలోకి జారిపోతారు. పేరులోనే మృత్యువున్న ఆ లోయలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు, చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులు, నరవానరాలు, రాక్షసులు ఎదురయినా ఆ లోయలోంచి వారు బయటపడిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Dasari Subrahmanyam

***

ఆ లోయ ఎంత భయంకరంగా ఉంటుందంటే… “ఆ ప్రదేశమంతా అంతంగా లోతులేని మడుగులతో, వాటి మధ్య చిన్న చిన్న దిబ్బల మీద ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో, చెట్లతో, రకరకాల పక్షులతో భీకరంగా వున్నది”.

ఈ లోయలోంచి బయట పడే మార్గం కోసం వెతుకుతారు యశపాలుడూ, జయకేతుడు.

“ఒకసారి యీ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడడం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా వున్న కొండలు చూశారా? వాటిని పాకి పైకి పోవడం ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు” అంటాడు, వీళ్ళిద్దరికన్నా ముందుగానే ప్రమాదవశాత్తు లోయలో పడిన విదూషకుడు.

“ఈ మృత్యులోయ లోంచి పైకి వెళ్ళేందుకు ఎక్కడో ఒకచోట సొరంగమార్గం లాటిది వుండకపోదు” అంటాడు యశపాలుడు ఆశావక దృక్పథంతో.

***

“పాముల కన్నా, క్రూరమృగాల కన్నా పగబట్టిన మనిషి ప్రమాదం. ఈ మృత్యులోయలో భల్లూకనాయకుడి వంటి వాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు. క్రూరత్వంలో వాడు రాక్షసి మృగాన్ని మించినవాడు.” అంటుంది సర్పవతి, భల్లూక నాయకుడు అపహరించ ప్రయత్నించిన సర్పజాతి నాయకుడి కూతురు. భల్లూక నాయకుడిని చంపి తమ దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పిన జయకేతుడి మాటలు విని ఆశ్చర్య పోతుంది.

“ఈ మృత్యులోయలోంచి బయటకి పోవటమా? అదెలా సాధ్యం? మార్గం ఎక్కడున్నది?” అని అడుగుతుంది.

“మార్గం లేకపోతే, మేం సృష్టించి, మా దేశానికి తిరిగి పోతాం…” అంటాడు యశపాలుడు. తమ శక్తి సామర్థ్యాల మీద అమితమైన విశ్వాసం!

 

***

F1

రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూక జాతి వాళ్ళ ప్రవర్తనలో ఏదో మోసం వున్నట్లు అనుమానం కలిగింది. సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ళ వైపు నుంచి, ఆ పిల్ల పేరూ, రక్షించమన్న పిలుపూ ఎలా వస్తుంది?  ఆ కంఠస్వరాలు యశపాల జయకేతులవి కావు. బహుశా, భల్లూక జాతివాళ్ళు తమను రెండుగా చీలదీసి తరువాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తు వేసి వుంటారు.

ప్రమాదాలు చుట్టు ముట్టినప్పుడు, సంయమనం కోల్పోకపోతే, దాన్నుంచి బయటపడే ఉపాయం సులువుగా తడుతుంది.

***

ఒకటా రెండా, ఇలా నవలంతా ఎన్నో ఘటనలు. ప్రమాదాలని, అడ్డంకులని కథానాయకులు సానుకుల దృక్పథంతో ఎదుర్కునే తీరు.. నేటి వ్యక్తిత్వ వికాస సూత్రాలకు సరిపోతాయి.

సాహిత్యం ఏదైనా మంచి చెడుల సమ్మేళానాన్ని ప్రతిబించించి, చెడును విసర్జించి, మంచిని స్వీకరించమనే చెబుతుంది. ఈ కథా అంతే. పాత్రధారులలో మంచి వాళ్ళుంటారు చెడ్డవాళ్ళుంటారు. మంచికి చెడుకీ మధ్య పోరాటం ఉంటుంది. అంతిమంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఏ దేశపు సాహిత్యమైన చెప్పేది ఇదే.

మాయలు మంత్రాలు, రాక్షసులు, విచిత్రమైన జంతువులు.. ఇవన్నీ ప్రతీకాత్మకమైనవి. రెండు తలల మహాసర్పం, నరవ్యాఘ్రం వంటి జీవులు కల్పనే కావచ్చు… కాని ఆయా పాత్రలను సృష్టించడం వెనుక ఓ నీతి ఉంది. పిల్లల ఎదిగి, జీవితాన్ని అవగతం చేసుకునే వయసొచ్చే సరికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, కష్టం నష్టం, భీతి, భయం, దిగులు, నిరాశ వంటి ప్రతికూల లక్షణాలు కూడా ఇలాంటి కల్పితాలేనని, ఎటువంటి స్థితిలోనూ ధైర్యం కోల్పోకుండా స్థిమితంగా ఉంటే విజయం తధ్యమని గ్రహిస్తారు.

అలాగే, తాము ఎంతటి ప్రమాదంలో ఉన్నా, తోటివారిని కాపాడడానికి చివరిదాకా ప్రయత్నించడం గొప్ప లక్షణం. ఈ నవలలోని నాయకులు కనపర్చిన అనేక సానుకూల దృక్పథాలలో అదీ ఒకటి.

మంత్రాలు, మాయలు ప్రయోగించడం – తమ లక్ష్యం చేరుకోడానికి అడ్డదారులు తొక్కడం లాంటిది. గొప్ప విలువలున్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు మాయమంత్రాల బారిన పడి తమ విద్వత్తును, పాండిత్యాన్ని నాశనం చేసుకుంటారు. విజయానికి అడ్డదారులు లేవని చెబుతుంది ఈ నవల.

Mryutyuloya Front Cover

నిత్యం ప్రమాదాలతో పోరాడుతున్నా, ఆశావాదం విడువరు కథానాయకులిద్దరూ. చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి, జీవితాన్ని విషాదభరితం చేసుకునే వ్యక్తులు ఈ పాత్రల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పాఠకులలో ఉత్కంఠ రేకెత్తించే ఈ నవల పిల్లలకి, పెద్దలకి సైతం ఎన్నో జీవిత పాఠాలు చెబుతుంది.

ఈ నవలకి కథానుగుణంగా గీసిన బొమ్మలు అదనపు ఆకర్షణ. అద్భుతమైన కథనానికి అందమైన బొమ్మలను గీసింది ఎం. కె. బాషా, ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావులు.

వాహిని బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం వారు సంయుక్తంగా ప్రచురించిన “మృత్యులోయ” అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుని పుస్తకాన్ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. 312 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-

~

 

మషాల్చి

పరేశ్ ఎన్ దోశి

 

కవిత్వమింకా ఐపోలేదు
జీవితమింకా మిగిలేవుందిగా!

నువ్వు కవిత్వం పరచుకొంటూ
వాగులు, వంకలు,
వూళ్ళు, వాడలు,
కొండలు, కోనలు,
సందులు, గొందులు,
అరణ్యాలు, సాగరాలు,
యెండలు, వానలు,
పువ్వులు, ముళ్ళు,
యిన్ని దాటుకొచ్చి యిప్పుడు
యీ పొగమంచులో నిల్చున్నావు.

యిక్కడి నుండి ప్రయాణం
నాది!

(మషాల్చి: Torch-bearer)

 

స్వగతం

 

నువ్వు అల్లుతున్న పొడుపు కథను
నేను విప్పటం కాదేమో

నువ్వు నీ బాల్యం నాటి వర్షపురాత్రిని వర్ణిస్తే
నేను నా బాల్యం లో కురిసిన వానలో తడిసి తెచ్చుకున్న జలుబు గుర్తుకొచ్చి
విక్స్ కోసం తడుముకోవడం

తల దువువుకోడానికి నువ్వు అద్దం ముందు నుంచుంటే
అందులో నా ముఖం కనబడటం
నువ్వు వొక బొమ్మ గీస్తావు
సరిగ్గా రాలేదని
అందులో ప్రతి గీతమీదా
మరిన్ని గీతలు దిద్దుతావు
దూరంగా జరిగి చూసుకొని
ఇప్పుడు బాగుందని
మురుస్తావు.

గాఢమైన పదచిత్రాలూ ప్రహేళికలూ రెఫరెంసులూ
ఇన్ని గందరగోళాల ముందు
నువ్వు మొడట వేసిన బొమ్మే
గదిని పరిమళంతో నింపేస్తుంది.
మల్లెలెక్కడ వున్నాయా అని వెతకడం నా వంతు.
ఇంకోసారి —

యెడుస్తున్నా
పాపాయికి నీళ్ళు పోసి
సాంబ్రాణి పొగ పెట్టి
పౌడరు రాసి
దిష్టి కాటుక పెట్టి
బట్టలు వేసి
మురిపెంగా ముద్దు పెట్టుకుంటావు.
ఆ పసిపాపను నా చెతులలో తీసుకుంటే
యేడుపు మరచిపోయి మరి బోసినవ్వులే
కవిత్వమంటే.

paresh

  ముగిసిన తర్వాత

    రాళ్ళబండి శశిశ్రీ
               
కొన్ని యుద్ధాలు ముగిసాక
ఏర్పడ్డ నైరాశ్యపు నిశ్శబ్దం
హఠాత్తుగా ఇద్దరి మధ్యా
పెరిగిపోయిన యోజనాల దూరం
తప్పులు, ఒప్పులు, అజ్ఞానం, అమాయకత్వం,
తోసిపుచ్చలేని, తేలని కొలతలు!
 
 
తెగని అలోచనలతో
అనివార్యమైన రోదనలు
పరిపరివిధాల పోయే మనసులో
పేరుకుపోయే అస్ప్సష్టతలు
కారణాతీతంగా జరిగేదేదీలేదని తెల్సినా
సంజాయిషీలతో సరిపెట్టలేని సందర్భాలు!
 
 
విచ్ఛిన్నమై పోయాక
చేతుల్లో మిగిలేది రిక్తమే-
చూపులు మోసేది నిర్వేదమే-
కాలం కూడా కదలలేదు
భారమైన మనసును మోస్తూ!
 
 
స్తంభించిన కాలాన్ని
దాటాలనే అడుగుల ప్రయత్నం-
జీవితం నడవాలి కదా!
 sasisri
                                   

ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల …

జయశ్రీ నాయుడు 

 

jayasriవేసవి చివరికి వచ్చేశాం. ఋతుపవనాలొచ్చేశాయంటున్నారు. వర్షాకాలం మొదలయ్యే వేళల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు బరువుగా నిలిచి చూస్తుంటే, రాబోయే వానదేవుడికి వింజామరలా చల్లని గాలి హాయిగొలిపే వేళల్లో, ఏదో చెట్టుకొమ్మలకి పొడవాటి వుయ్యాల తాళ్ళు వేలాడుతూ, ఆ ఉయ్యాలలో కూర్చొని కాలిపట్టీలు అందం వెలుగుతుంటే, అలవోకగా ఆ మబ్బుల్ని తాకాలన్న ఠీవిగా ఉయ్యాలలూగే సోయగాల్ని ఊహకు తెచ్చే కవిత,  ఈ వారం కవిత ఇది –  కె శివారెడ్డి గారి ” ఊహల్లోంచి ఊహల్లోకి”

కవికి ఊహ ఒక ఉయ్యాల…

ఆదిశ చివరనుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిల పడ్డ అరసున్నాలా…
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ

గ్రామీణ దృశ్యాన్ని మనముందుంచే ట్రంకు పెట్టె వాసనలూ, కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ – మనకిప్పుడు స్ఫురణకు రావడం కష్టమే. కానీ ఆ వర్ణనతో ఒక దృశ్యం మనోఫలకం మీద ఊపిరి పోసుకుంటుంది. విశాలంగా విస్తరించిన చెట్టు కొమ్మల్లో  కొత్తపరికిణీలో  ఊయలలూగే  నవయవ్వన సౌందర్య సామ్రాజ్ఞి కనిపిస్తుంది మనకిక్కడ.

నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు …

అచ్చమైన గ్రామీణ సంప్రదాయ ప్రతిబింబాలీ పదాలు. బావా మరదళ్ళ మధ్యన కొంత చనువును పెంచే అనేక సందర్భాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది. వానలే మనకు జీవనామృతాలు.   గ్రామాల్లో తొలకరి వానల మెసెంజర్ తూనీగ. కవి చిన్ననాటి నుంచీ వెంట తెచ్చుకున్న  గ్రామీణ సౌందర్యం, అతని సౌందర్య పిపాస తరువాతి పంక్తుల్లో ఫ్రేము కట్టినట్టు కనిపిస్తుంది.

” బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ” 

ఇది ఒక తరం తో ఆగిపోయే రమణీయ భావన కాదు. తరతరాలకీ కొనసాగింపు. వర్ష ఋతువు ఆరంభం జీవన పాత్రనూ సౌందర్యంతో నింపుతుంది. ఆకాశపు ఆ కొస నుంచీ ఈ కొసవరకూ తిరగేసిన సున్నా వంటి ఉద్వేగపు తరంగం ఉయ్యాలతో పాటే ప్రయాణిస్తూ వుంటుంది.  ఆ నవయవ్వన శృంగారదృశ్యావతరణాన్ని చూసి దిక్పాలకులకే కన్ను కుడుతుందంటాడు.  ఉయ్యాల ఒక విధంగా కవి హృదయతరంగం కూడా. ఆ పల్లె నుంచీ ఈ పల్లెకీ, ఈ అడవి నుంచీ ఆ అడవికీ ప్రయాణించే అతని లోని సౌందర్యాన్వేషణ. ఎక్కడో ఏ మూలలోనో వెలిగే సౌందర్యాన్ని నింపుకోవాలనే తపన.

అద్దంలో నెలవంక

” ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభయ్యేళ్ళప్పుడు కూడ
వెర్రిగా చిన్న పిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది”  అంటాడు.

ఊహ మనలోని సృజనాత్మకతకి ప్రాణాధారం. ఎంతటి సౌందర్య సృజనైనా, యాంత్రిక క్రియాశీలతైనా మర్రి విత్తంటి సూక్ష్మ ఆలోచనా తరంగం – అదే – ఊహతోనే మొదలయ్యేది. ఆ ఊహ ఆలోచనా హర్మ్యాలు నిర్మించుకుని, కార్య రూపంలోకి దాల్చిన తర్వాత సాధించే విజయాలు మనిషిని అందరి గౌరవానికి పాత్రుడయ్యేంత ఎత్తులో నిలబెడతాయి.
” భూమ్యాకాశాల మధ్యనున్న సమస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ
ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు”  అని కోరుకుంటాడు.

జీవితం ఒక ఎడతెగని ప్రయాణం. వాస్తవాలు నేల మీద నడిపిస్తుంటే ఊహలు ఆకాశాన్నే నేస్తమంటాయి. ఊహలో వున్న ఉద్విగ్నత వాస్తవం లో వుండకపోవచ్చు. అందుకే ఊహకు పట్టం కట్టి, నిరంతర యాత్రికుడివి కమ్మంటున్నాడు. కవి తన వారసత్వం గా తన పద్యాన్ని వదిలి వెళితే, తర్వాత తరాలు ఆ పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకుని నిరంతరం ఊగవచ్చంటాడు. ఎంతటి ఆశావహ దృక్పథమో! ఎంతటి సౌందర్యావిష్కరణకైనా మొదలు ఒక చిన్న ఊహలోనే ఉంది. అది కవితైనా, కథ అయినా, మోనాలిసా మందహాసమైనా మైనా మరింకేదైనా. నిరంతరం అన్వేషణే జీవితానికి మనం బహూకరించగలిగే జవసత్వాలు.

కవితా సంకలనం పేరు:  నా కలలనది అంచున
  కవి: కె శివారెడ్డి
  కవిత శీర్షిక  : ఊహల్లోంచి ఊహల్లోకి 

ఊహల్లోంచి ఊహల్లోకి ఉయ్యాల
గాల్లోంచి గాల్లోకి ఉయ్యాల

ఆ దిశ చివర నుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిలా పడ్డ అరసున్నాలా
ఈ పక్కనుంచి ఆ పక్కకి దూసుకెళ్ళేటప్పుడు
ఒక్క సారి పొడుగాటి జడ భూమిని తాకుతూ వెళిపోతుంది
పరికిణీ కుచ్చిళ్ళు నేలను ముద్దిడుకుంటూ వెడతాయి
ఎక్కడో భూమి గర్భం లో సముద్రం గుండెల్లో
ఒక వణుకు మొదలవుతుంది
లోకమంతా ఉయ్యాలలూగుతుంది

************
 గలగలా పొంగే నవ్వులోంచి కన్నీళ్ళు
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ
 ఏం చేయాలో తోచని కంగారూ పిచ్చి చూపులూ
దయకూడుకుంటున్న కళ్ళ పర్యావరణాలూ
ఎటు చూసినా పూలే పూలు; పూల జాతర్ల జ్ఞాపకాల రవళి
అక్కడ ఉయ్యాల మీద ఆకాశంలో తెలుతూ మా అక్క ఉంది
నా బుల్లి ప్రియురాలు ఉంది

*****
నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు

బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ
దిక్పాలకులంతా వచ్చి చుట్టూ నుంచుంటారు
పైనున్న దేవతలంతా
వెర్రి ముఖాలేసుకుని నోట్లో వేళ్ళు పెట్టుకుని చూస్తుంటారు
” ఏమందం ఏమందం ఏమానందం ఏమానందం’ అని;

************

ఇప్పటికీ ఊహల ఉయ్యాలనెక్కి ఊగుతుంటాను
ఈ ఊరునుంచి ఆ ఊరికి ఆ యేటినుంచి ఈ యేటికీ
ఈ అడవి నుంచి ఆ అడవికీ ఈ పల్లెనుంచి ఆ పల్లెకీ
ఆ పల్లె నుంచి ఈ పల్లెకీ
ఇపాటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభై యేళ్ళప్పుడు కూడా
వెర్రిగా చిన్నపిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది
ఉన్నన్నాళ్ళు ఊగుతూనే ఉంటాను

నే వెళ్ళిపోయాక
నా పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకొని
నిరంతరం ఊగుతుంటారు మీరు హాయిగా
కిందనుంచి పైకీ పైనుంచి కిందకీ;
షేక్స్పియర్ అన్నట్టు
భూమ్యాకాశాల మధ్యనున్న సంస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ

ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు గుండెల్లోని ఉయ్యాల ఆగకూడదు

*