గమనమే గమ్యం-3

 

Volga-1ధనలక్ష్మి బడికి రాని లోటు ముగ్గురు స్నేహితులకూ తెలుస్తోంది. వాళ్ళలో వాళ్ళు ధనలక్ష్మి పెళ్ళి గురించి మాట్లాడుకున్నారు గానీ అదంత ఉత్సాహంగా సాగలేదు. ఇంకో వారంలో పెళ్ళనగా ముగ్గురూ కలిసి మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. ఈసారి ధనలక్ష్మి ముఖంలో మునుపటి ఆనందం లేదు. చాలా దీనంగా ఉంది. చిక్కిపోయింది. పదిరోజుల్లో స్నేహితురాలు ఇలాగయిందేమిటని కంగారు పడ్డారు. వీళ్ళ ముగ్గుర్నీ చూసేసరికి ధనలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బలవంతాన వాటిని అదిమిపెట్టి స్నేహితుల్ని దొడ్లో బాదం చెట్టు దగ్గరకు తీసుకుపోయింది.

నలుగురూ కాసేపు మాటలు రానట్టు కూర్చుండిపోయారు.

శారద ఎక్కువసేపు ఆ మౌనాన్ని భరించలేక ‘‘అలా ఉన్నావేం ధనం. ఒంట్లో బాగోలేదా’’ అంది అనునయంగా.

ఆ చిన్న అనునయపు మాటలకే ఉగ్గపట్టుకున్న దు:ఖం బైటికి ఉరికింది. ధనలక్ష్మి ఏడుస్తుంటే వీళ్ళకూ ఏడుపొచ్చింది.

చివరికి అన్నపూర్ణ ధనలక్ష్మి భుజం మీద చెయ్యివేసి ఏమయిందో చెప్పమని గట్టిగా అడిగింది.

విశాలాక్షి మరోవైపు నుంచి ధనలక్ష్మి చేయి పట్టుకుని బతిమాలింది.

ధనలక్ష్మి ఏడుపాపి, కళ్ళనీళ్ళు తుడుచుకుని ‘‘నాక్కాబోయే మొగుడికి నలభై ఏళ్ళట. అలా చెప్తున్నారు గానీ ఇంకా ఎక్కువేనంటున్నారు’’ అంది.

ముగ్గురూ భయంతో, పాలిపోయిన ముఖాలతో ధనలక్ష్మిని చూస్తూ కూచున్నారు. ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియటం లేదు. ధనలక్ష్మిని చూస్తే ఏడుపొస్తుంది. చివరికి శారదాంబ గొంతు పెగల్చుకుని ‘‘నీకిష్టం లేదని చెప్పు’’ అంది.

‘‘నామాట ఎవరు వింటారు? వాళ్ళకి బాగా డబ్బుంది. మా వాళ్ళకి నా బరువు దిగుతుంది. మా అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది’’ ఏడుపు ఆపుకుంటూ చెప్పింది ధనలక్ష్మి.

ఎంతసేపు కూచున్నా మాటలు సాగలేదు. ముగ్గురూ ఇంటికి వెళ్ళటానికి లేచారు.

ధనలక్ష్మి ఇల్లు దాటి కొంచెం దూరం గడిచాక ముగ్గురికీ కాస్త ఊపిరాడినట్లయింది.

‘‘పాపం ధనలక్ష్మి’’ అంది విశాలాక్షి.

‘‘ధనలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి’’ అంది శారద.

‘‘ఎక్కడికి?’’ భయంగా అడిగింది అన్నపూర్ణ.

‘‘రాజమండ్రి వీరేశలింగం గారి దగ్గరకు. అక్కడ ఆయన ఆడపిల్లలకు చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాడు. మా నాన్న చెప్పారు. నేనూ చిన్నప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ మామ్మగారు నాకు పూర్ణమ్మ కథ చెప్పారు. ఆ కథలో పూర్ణమ్మకు ఇట్లాగే ముసలివాడితో పెళ్ళి చేస్తారు. పూర్ణమ చెరువులో పడి చచ్చిపోతుంది’’.

‘‘ధనలక్ష్మి కూడా చచ్చిపోతుందా?’’ విశాలాక్షి కళ్ళు నీళ్ళతో నిండాయి.

‘‘పోనీ రాజమండ్రి వెళ్ళమని చెబుదామా?’’ అన్నపూర్ణ ఆలోచనగా అంది.

‘‘చెబుదాం. వెళ్ళమందాం’’ పట్టుదలగా ఉత్సాహంగా అంది శారద.

‘‘వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? ఇంట్లోవాళ్ళు చూడరా? పోనిస్తారా? రైలు చార్జీలకు డబ్బెక్కడిది?’’

‘‘రాత్రిపూట లేచి నడిచి వెళ్ళటమె’’.

‘‘అమ్మో భయం కదూ’’

‘‘భయమైతే ఎట్లా? ఆ ముసలాడితో పెళ్ళి మాత్రం భయం కదూ?’’

‘‘పోనీ నేను మా అమ్మనడిగి డబ్బు తెచ్చి ఇస్తాను. రైలెక్కి వెళ్ళమందాం’’ అంది విశాలాక్షి.

‘‘నేనూ తెస్తాను’’ అన్నారు మిగిలిన ఇద్దరూ.

రైలెక్కి రాజమండ్రి వెళ్ళటం మాత్రం తేలికా? ఎంత దూరం. దానికంటే ఉన్నవ పెద్దనాన్న గారింటి కెళ్ళటం తేలిక కదూ. గుంటూరికి బండి కట్టుకుని వెళ్ళచ్చు. శారదాంబ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి.

నాన్నమ్మకు చెప్పి పెళ్ళి ఆపించగలిగితే ? నాన్నమ్మ మాట అందరూ వింటారు. ధనలక్ష్మి వాళ్ళ నాన్నకు కూడా నాన్నమ్మ అంటే భయం.

 

అసలు తండ్రి ఉంటే బాగుండేది. ఆయనెప్పుడూ మద్రాసు వెళ్ళి కూచుంటాడు ` ఇక్కడ పాపం ధనలక్ష్మి చచ్చిపోతుందో ఏమో ` గుంటూర్లో లక్ష్మీబాయమ్మ పెద్దమ్మయితే బాగా చూసుకుంటుంది. నాన్న ఉంటే ధనలక్ష్మిని అక్కడకు పంపించటం కుదిరేది.

ఇంటికి వెళ్ళగానే నాన్నమ్మతో ధనలక్ష్మికి జరగబోయే పెళ్ళి గురించి చెప్పి దాన్ని ఆపమని అడిగింది శారదాంబ.

నరసమ్మ శారద మాటలకు నవ్వి

‘‘చేతనైతే పెళ్ళి చెయ్యాలి గాని ` చెడగొట్టగూడదమ్మా, మహాపాపం’’ అంది.

‘‘ముసలాడితో పెళ్ళి చేస్తే ఎట్లా నాన్నమ్మా’’ నాన్నమ్మకు ఈ విషయంలో అన్యాయం అర్థం కాకపోవటం శారదకు మింగుడు పడలేదు.

‘‘అదృష్టం బాగుంటే అతను ధనలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఒక పిల్లాడు పుడితే ఇంక మీ స్నేహితురాల్ని నెత్తిన పెట్టుకుంటాడు. లేదూ ` ఆ పిల్ల కర్మ అలా కాలిందనుకోవాలి. మనం ఎవరం ఆ అమ్మాయి తలరాత మార్చటానికి’’

‘‘నాన్నమ్మ  వీరేశలింగం గారు ధనలక్ష్మిని కాపాడతారేమో. అక్కడికి పంపితే’’.

‘‘ఆయన వితంతువులకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నాడని విన్నాను. ఇలా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడతాడు కూడానా? నువ్వు చిన్నపిల్లవి. నీకీ సంగతులన్నీ ఎందుకు. వెళ్ళి అన్నం తిని పడుకో’’ అని గట్టిగా మందలించింది.

తల్లి కూడా ‘‘నాన్నమ్మ నీ మాట వినదు. ఊరుకో’’ అని వారించింది. శారద చిన్ని హృదయం మండిపోతోంది. అన్యాయం అనే భావన ఆ అమ్మాయికి మొదటిసారి చాలా దగ్గరగా వచ్చింది. అన్యాయాన్ని జరగనివ్వకూడదు. ఆపాలి అని ఆ పిల్లకెవరూ చెప్పక పోయినా అది చెయ్యటం చాలా అవసరం అని శారద మనసుకి గట్టిగా అనిపిస్తోంది. కానీ ఏ దారీ కనిపించలేదు. నాన్న ఉంటే బాగుండేది అనుకోవటం తప్ప మరోదారి కనిపించలేదు. విశాలాక్షి కి, అన్నపూర్ణకూ కూడా ఇంట్లో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ధనలక్ష్మి పెళ్ళి ఆపటం తప్పనే అన్నారు పెద్దలు. ధనలక్ష్మి కర్మ అలా ఉందనీ, తలరాత నెవరూ మార్చలేరనీ పదే పదే ఆ పసి పిల్లలకు చెప్పారు.

ఆ రాత్రి ముగ్గురు పిల్లలూ ఏడుస్తూనే నిద్రపోయారు.

మర్నాడు ఉదయం శారద తల్లిని డబ్బులు కావాలని అడిగింది. స్కూల్లో అవసరమేమోనని శారద అడిగిన రెండు రూపాయలూ ఇచ్చింది సుబ్బమ్మ. సాయంత్రం బడి వదిలాక ముగ్గురూ మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. దొడ్లో బాదం చెట్టు నీడలో శారద తనకు చేతనైనట్టు ధనలక్ష్మిలో ఆశ కలిగించటానికి ప్రయత్నించింది. రెండు రూపాయలు ధనలక్ష్మికిచ్చింది.

‘‘బండివాడికివి ఇస్తే గుంటూరు తీసుకుపోతాడు. లక్ష్మీబాయమ్మ పెద్దమ్మ చాలా మంచిది. నువ్వక్కడ చదువుకోవచ్చు. ముందు నీ పెళ్ళి ఆగిపోతుంది’’

‘‘కానీ బండెవరు మాట్లాడతారు? నేనొక్కదాన్నే ఎక్కి గుంటూరు తీసికెళ్ళమంటే బండివాడు తీసికెళ్తాడా?’’ ధనలక్ష్మి బావురుమంది.

తప్పించుకోగలిగిన అవకాశం ఉండీ తప్పించుకోలేని నిస్సహాయపు ఏడుపది.

ముగ్గురూ ధనలక్ష్మికి ధైర్యం నూరిపోసేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

తర్వాత రెండు రోజులకు ధనలక్ష్మిని పెళ్ళి కూతుర్ని చేశారు.

తలనిండా పూలతో కొత్త బట్టలతో కూడా ధనలక్ష్మి ముఖం కళావిహీనంగానే ఉంది.

ఆ తర్వాత రెండు రోజులకు అర్థరాత్రి పూట ధనలక్ష్మి పెళ్ళయిపోయింది. ఇంతెత్తున లావుగా, ఎర్రగా, మీసాలతో ఉన్న పెళ్ళికొడుకుని చూసి ధనలక్ష్మి భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఏడవాలని కూడా మర్చిపోయేంతగా భయపడిపోయింది.

అర్థరాత్రి పెళ్ళికి స్నేహితులు రాలేదు గానీ మర్నాడు శారదాంబ వాళ్ళ తోటలో కూర్చుని ధనలక్ష్మి కోసం ఏడ్చారు.

శారదాంబ పాలేరు తానా పెళ్ళి కొడుకుని చూశానని వర్ణించి చెప్పి వీళ్ళ దు:ఖాన్ని ఎక్కువ చేశాడు.

శారదాంబ తండ్రి కోసం ఎదురు చూడటమే పనిగా పెట్టుకుంది. పెళ్ళి జరిగినా సరే తండ్రి తల్చుకుంటే ఎలాగైనా ధనలక్ష్మిని రక్షిస్తాడు అనుకుని ఆ ఆలోచనతో బలం తెచ్చుకుంటోంది.

olga title

పదిరోజులు గడిచిపోయాయి. పదకొండో రోజు ఊరంతా గుప్పుమంది.

ధనలక్ష్మికి కటికి గర్భాదానం చేశారట. చచ్చిపోయింది.

శారదాంబ ముగ్గు చిప్ప అక్కడ పడేసి ఏడుస్తూ ఇంట్లోకొచ్చి పడిరది.

తల్లిని కావలించుకుని ఏడుస్తుంటే నరసమ్మ వచ్చింది.

‘‘ఆ పిల్ల దురదృష్టం కాకపోతే వాళ్ళకా పాడుబుద్ధి ఎలా పుట్టింది?’’ అంటూ శారదను దగ్గరకు తీసుకోబోతుంటే శారద నాన్నమ్మ మీద తిరగబడిరది.

‘‘ఆ పెళ్ళి ఆపమంటే ఆపలేదు నువ్వు  ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటావు. పెళ్ళి చేసుకుంటే చచ్చిపోతారు. ధనలక్ష్మి చచ్చిపోయింది. అమ్మా నే వెళ్ళి ధనలక్ష్మిని చూస్తానే’’ అని అరుస్తూ ఏడుస్తూ తల్లినుంచి విడివడేందుకు ప్రయత్నిస్తోంది.

సుబ్బమ్మ కూతుర్ని గట్టిగా పట్టుకుని

‘‘నువ్వు చూడలేవే భయపడతావు. ఇంక చూట్టానికేముంది? ఆ పిల్ల గొంతు కోశారు. అత్తయ్యా. కటికి గర్భాదానం చేశారట. పిల్ల అందుకే చచ్చిపోయిందట’’ ‘‘వీళ్ళ బతుకు చెడ. అట్లా ఎట్లా చేశారు? ఏం పోయేకాలం వచ్చింది? ఆ మొగుడు ముండా కొడుకు కావాలని ఉంటాడు. వీళ్ళు కాదనలేకపోయుంటారు. పాపం పిల్ల ఎంత బాధపడి ఉంటుందో’’.

నరసమ్మ మనసు కరిగిపోయింది. కళ్ళత్తుకుంది.

శారదాంబ ‘‘నువ్వు ఆపితే పెళ్ళి ఆగేది’’ అంది నాన్నమ్మతో కోపంగా.

‘‘పెళ్ళికీ, ఆ పిల్ల చావుకీ సంబంధం లేదే పిచ్చిదానా. పెళ్ళి చేసిన వాళ్ళంతా ఇలా కటికి గర్భాదానాలు చేసి పిల్లల్ని చంపుకోరు. నీ స్నేహితురాలు పెళ్ళి వల్ల చావలేదు. ‘ఆయుష్షు మూడి వాళ్ళకా బుద్ధి పుట్టి చచ్చింది’’ అంటూ గట్టిగా అరిచేసరికి శారద ఏడుస్తూ లోపలికి వెళ్ళింది.

వెళ్ళి చూసొద్దామా అనుకుని శారద వెంటబడి వస్తుందేమోననే అనుమానంలో నరసమ్మ కూడా ఆగిపోయింది. ఆ పూట అత్తాకోడళ్ళు, పనివాళ్ళూ అందరూ అవే మాటలు.

ఈ రోజుల్లో కటికి గర్భాదానం ఎవరు చేస్తున్నారమ్మా. మరీ కసాయివాళ్ళూ కాకపోతే అనేమాటే అందరూ అన్నారు.

దాంతో శారదకు ధనలక్ష్మి మరణం పెళ్ళి వల్ల కాదని అర్థం చేసుకుంది. నాన్నమ్మ మీద కోపం కాస్త తగ్గింది.

అసలు కారణాల గురించి తల్లినడిగితే ‘‘నీకు తెలియదు. చిన్నపిల్లవి చెప్పినా అర్థం కాదు’’ అని బుజ్జగించి నిద్రబుచ్చింది.

ఆ రాత్రి శారదాంబకు జ్వరం వచ్చింది. నరసమ్మ తనకు తెలిసిన గృహవైద్యం ఏదో చేసి, ఇంత విబూది నోట్లో వేసి, నుదుటికి పూసి రాత్రంతా మనవరాలి పక్కనే కూచుంది.

తెల్లారేసరికి జ్వరం తగ్గింది గానీ బడికి వెళ్ళలేకపోయింది. సాయంత్రం విశాలాక్షి, అన్నపూర్ణా వచ్చారు. ముగ్గురూ మాటలు లేకుండా ధనలక్ష్మి కోసం కన్నీరు కార్చారు చాలాసేపు. ఆ మౌనం భరించటం కూడా ఆ చిన్నమనసులకు కష్టమయింది.

‘‘గుంటూరు వెళ్తే ధనలక్ష్మి చచ్చిపోయేది కాదు కదూ’’ అంది విశాలాక్షి.

‘‘బండివాడు తీసికెళ్ళేవాడు కాదు. పురోహితుడి గారమ్మాయి ఎక్కడికో వెళ్ళి పోతోందని మళ్ళీ ఇంట్లోనే దించేవాడు’’ అన్నపూర్ణ వాస్తవం సహాయంతో దు:ఖాన్ని జయించాలనుకున్నట్టు అన్నది.

‘‘మా నాన్న ఉంటే ధనలక్ష్మిని గుంటూరు తీసికెళ్ళేవాళ్ళు’’ శారద కన్నీళ్ళు ఆగటం లేదు.

వారం రోజులకు గాని రామారావు రాలేదు. రాగానే శారదాంబను చూసి కంగారు పడ్డాడు.

‘‘సుబ్బూ అమ్మాయికేమైంది. ఇట్లా చిక్కిపోయిందేం. జ్వరంగాని వచ్చిందా? నాకు కబురు చెయ్యలేదేం’’ అని ఊపిరాడకుండా ప్రశ్నలేశాడు. సుబ్బమ్మ ధనలక్ష్మి సంగతంతా చెప్పింది. రామారావు చలించిపోయాడు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు నిండాయి.

‘‘పాపం చక్కటిపిల్ల. అన్యాయమై పోయింది. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారో. బాల్య వివాహాలు కూడదని చట్టం రావాలి. ఈ బ్రిటీష్‌ వాళ్ళకేం తెలుసు. వితంతువులు పెళ్ళాడవచ్చని చట్టం తెచ్చారు గానీ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యకూడదని చట్టం తేవాలనే జ్ఞానం లేకుండా పోయింది. ఆ మాత్రం తెలియదా? విజయనగరం మహారాజు గారు ఆ చట్టం తేవాలని కోర్టుకి కూడా వెళ్ళారు. ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి ఆపుతున్నారు’’.

రామారావు ధనలక్ష్మి విషాదంలోంచి మొత్తం సమాజాన్ని ఆవరించిన విషాదంలోకి వెళ్ళారు. దాని గురించి పత్రికల్లో రాయాలని, స్నేహితుల్తో చర్చించాలని ఎన్నో ఆలోచనలు ఆయన మనసుని ఆక్రమించి తాత్కాలికంగా ధనలక్ష్మి నుంచి పక్కకు మరల్చాయి.

సాయంత్రం బడి నుంచి వస్తూనే తన దగ్గరికి పరిగెత్తుకు వచ్చే శారద ఏ మాత్రం ఉత్సాహం చురుకుదనం లేకుండా పుస్తకాలు ఇంట్లోపెట్టి బట్టలు మార్చుకుని ఉయ్యాలబల్ల మీద పడుకోవటం చూసి ఆయనకు భయం వేసింది. స్నేహితురాలి మరణం శారదాంబను దెబ్బతీస్తుందా? అలా జరగకుండా తను కాపాడాలి.

రామారావు వెళ్ళి ఉయ్యాలబల్లమీద కూర్చుని శారద తలఎత్తి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమపూరిత స్పర్శలో శారద దు:ఖం కట్టలు తెంచుకుంది. తండ్రి ఒళ్ళో తలపెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. రామారావు శారద తల నిమురుతూ ఆ అమ్మాయి దు:ఖాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకుండా పూర్తిగా బైటికి ప్రవహించనిచ్చాడు.

‘‘నాన్నా! నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను’’ దు:ఖం తగ్గిన తర్వాత దీనంగా అంది శారద.

‘‘అలాగే తల్లీ. నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేద్దువుగాని. అసలు ఇప్పుడు పెళ్ళి అనే మాట ఎవరన్నారు? నువ్వు బాగా చదువుకోవాలి డాక్టరవ్వాలి అని కదా నేను చెబుతాను.’’

‘‘మరి నాన్నమ్మ పెళ్ళి చేసుకోవాల్సిందేనంటుందేం?’’

‘‘నాన్నమ్మకు నేను చెప్తానుగా. నాన్నమ్మకు చదువుకోవటం అంటే ఏమిటో తెలియదు. అందుకని అలా అంటుంది. నీకు నేనున్నానమ్మా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను’’ శారద మనసు స్థిమితపడిరది. తండ్రి చెప్పే మాటలు మెల్లిగా శారద మనసులో ధైర్యాన్ని నింపాయి.

నెమ్మదిగా లేచి కూర్చుంది.

‘‘నాన్నా కటికి గర్భాదానం అంటే ఏంటి? అసలు గర్భాదానం అంటే ఏంటి?’’ కూతురి నుంచి ఈ ప్రశ్నలు ఎదుర్కొన్న మొదటి తండ్రి రామారావేనేమో. ఆయన నెమ్మదిగా లేచి వెళ్ళి స్త్రీల శరీర ఆరోగ్యం గురించి తన దగ్గర ఉన్న చిన్న పుస్తకం ఇచ్చాడు. నిజానికి అందులో ఏమీ లేదు. ఏవో బమ్మలు. శరీర పరిశుభ్రతను కాపాడుకోవటం గురించిన వివరాలూ ఉన్నాయి.

olga2a

‘‘అమ్మా శారదా. ఆడవాళ్ళకు పిల్లలు పుడతారు గదా. దానికి సంబంధించిన గర్భాదానం అంటే నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పటం నాకూ రాదు. మీ అమ్మనడుగు. ఏమైనా చెప్పగలదేమో. నువ్వు డాక్టరువయ్యాక ఇలాంటి విషయాలు అందరికీ అర్థమయ్యేలా మంచి పుస్తకం రాయి. నువ్వింక నీ స్నేహితురాలి సంగతి మర్చిపోయి చదువుకోవాలి. నీ చదువే నీకు అన్నీ చెబుతుంది సరేనా?’’ శారద సరేనన్నట్టు తలూపింది.

చీకటి పడటంతో నరసమ్మ దీపాలు వెలిగించి వాళ్ళ దగ్గరగా ఒకటి తెచ్చిపెట్టింది.

‘‘పిల్ల భయపడిందిరా’’ అంది కొడుకు సమీపంలో కూర్చుంటూ.

‘‘ఔనమ్మా. చాలా భయపడిరది. శారదా ` నువ్వెళ్ళి చదువుకో తల్లీ’’ అంటూ శారదను లోపలికి పంపి రామారావు లేచి తల్లి దగ్గరకు వెళ్ళి పక్కనే కూచున్నాడు.

తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని ‘‘అమ్మా శారద పెళ్ళి విషయం మర్చిపో. నేను ఈ విషయంలో నీమాట వినను. నీ మాటే కాదు ఎవరి మాటా వినను. శారదను డాక్టర్‌ కోర్సు చదివిస్తాను. ఇక్కడ మన దేశంలోనే కాదు. ఇంగ్లండ్‌ కూడా పంపించి చదివిస్తాను. ఎవరేమన్నా లెక్కచెయ్యను. దీని గురించి నువ్వింకేం మాట్లాడినా ప్రయోజనం లేదు.

అమ్మా  నువ్వంటే నాకు ప్రేమ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. అది నీకూ తెలుసు. నీ విషయంలో నువ్వెలా చెయ్యాలంటే అలా చేస్తున్నావు. నాకు నమ్మకం లేకపోయినా నీ ఆచార వ్యవహారాలన్నీ ఏలోటూ లేకుండా సాగుతున్నాయి. ఎన్నడూ ‘నాకిది ఇష్టం లేదమ్మా’ అని కూడా అనలేదు నేను. నాకు కులంలో నమ్మకంలేదు. ఐనా నువ్వు బాధపడతావని ఇంట్లోకి ఇతర కులాల వాళ్ళను రానివ్వటం లేదు. కానీ శారద నా కూతురు. అది నా ఇష్టప్రకారం పెరగాలి. మారే లోకంతో పాటు మారుతూ పెరగాలి. నా కూతుర్ని గురించి నాకెన్నో ఆశలున్నాయి.

పదేళ్ళకు పెళ్ళి చేసుకుని, పదిహేనేళ్ళకు పిల్లల్ని కని ` వంటింట్లో, ఆ పొగలో మగ్గిపోవటం నేను భరించలేను. నా చిట్టితల్లి తన చేతుల్తో మనుషుల ప్రాణాలు కాపాడాలి. తను పిల్లల్ని కనటమే కాదు ఎంతోమంది పిల్లలను తన చేతుల్తో భద్రంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. సరైన వైద్యంలేక మన దేశంలో ఎంతమంది తల్లీపిల్లలు చనిపోతున్నారో తెలుసా? నా కూతురు ఆ పరిస్థితిని మార్చేవాళ్ళలో ఒకతె కావాలి. అమ్మా! దయచేసి శారద పెళ్ళిమాట ఎత్తకు. నీకు దణ్ణం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను’’

రామారావు తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళ వెంట నీళ్ళు కారుతూ నరసమ్మ పాదాల మీద పడుతున్నాయి.

నరసమ్మ మాటా పలుకు లేకుండా కొడుకుని చూస్తోంది. ఆమె కళ్ళల్లోనూ నీళ్ళు బుకుతున్నాయి గానీ ఆమె వాటిని కిందికి జారనివ్వకుండా అదిమి పట్టింది. ఆమెలో ఏదో ఒక నిశ్చయం, పట్టుదల, కఠినత్వం క్రమంగా కమ్ముకున్నాయి. రామారావు అక్కడినుంచి లేచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె చాలాసేపు అలాగే కూర్చుంది.

సుబ్బమ్మ వచ్చి ‘‘అత్తయ్య ఫలహారం చేస్తారా?’’ అని అడిగితే సమాధానం లేదు. సుబ్బమ్మ దగ్గరికి వచ్చి అత్తగారిని చూసి భయపడిరది. ముఖం పాలిపోయి, కళ్ళు ఎక్కడో చూస్తూ, ఒంటినిండా చెమటలు. సుబ్బమ్మ రెండు చేతుల్తో అత్తగారిని పట్టుకుని కుదిపింది. నరసమ్మ ఈ లోకంలో అప్పుడే కళ్ళు తెరిచినట్టు సుబ్బమ్మ వంక చూసింది. సుబ్బమ్మకు భయం మరింత పెరిగింది.

‘‘అత్తయ్యా! ఫలహారం’’.

‘‘చేస్తాను. పద’’ నరసమ్మ కష్టంగా లేచి వంటింటి వైపు నడిచింది. సుబ్బమ్మ అత్తగారి వెనకే వెళ్ళి ఆమెకోసం సిద్ధం చేసిన ఫలహారం ఆమె ముందు పెట్టింది.

నరసమ్మ ఏం తింటుందో కూడా తెలియకుండా తింటున్నదని సుబ్బమ్మ గమనించింది. భోజనాల సమయంలో రామారావుతో ఆ మాటే అంది.

‘‘ఇవాళ అత్తయ్య అదోలా ఉన్నారు. ఫలహారం ఏం చేసిందో కూడా ఆమెకు తెలియలేదు. నాకు భయంగా ఉంది’’.

‘‘ఏం లేదులే. శారద పెళ్ళి విషయం మాట్లాడాను. పెళ్ళి ఇప్పుడు కాదనీ, చదివించాలనీ చెప్పాను. అది అరిగించుకోవటం ఆమెకు కష్టమే. కాదనలేం. కానీ అమ్మది వెళ్ళిపోయే కాలం. శారదది రాబోయే కాలం. అమ్మ కోసం శారద భవిష్యత్తుని పాడుచెయ్యలేను. నేను నిర్ణయం తీసుకున్నాను అది మార్చుకోను’’ తనను తను గట్టి పరుచుకునే ప్రయత్నం ఉంది ఆమాటల్లో.

‘‘కానీ ఆమెకు మీరొక్కరే కొడుకు’’

‘‘నాకు శారద ఒక్కతే కూతురు’’.

సుబ్బమ్మ మాట్లాడేందుకేం లేదు. మాట్లాడటం ఆమె స్వభావమూ కాదు. మొత్తంమీద ఆరోజు రాత్రి శారద ఒక్కతే నిశ్చింతగా నిద్రపోయింది. తండ్రి తనకు కొండంత అండ అని ఆ పిల్లకు అస్తిగతంగా అర్థమైపోయింది. నరసమ్మ రాత్రంతా ఆలోచిస్తూనే గడిపింది. రామారావుకీ నిద్ర లేదు. పెళ్ళి కాకుండా శారదాంబ పుష్పవతి ఔతుందనే ఆలోచన భరించటం నరసమ్మ వల్ల కాలేదు. ఈ అనాచారం సహించటం ఆమె వల్ల కాదు. ఆపటం కూడా ఆమె వల్ల అయ్యేట్టు లేదు. ప్రాణంగా పెంచుకున్న కొడుకే ప్రాణాల మీదకు తెస్తున్నాడనుకుంటే ఆమెకు దుర్భరంగా ఉంది.

తల్లి పట్టుదల తెలిసిన రామారావుకి ఈ గండం ఎలా గడుస్తుందోననే భయం మనసును తొలిచేస్తోంది.

అటూ ఇటూ పొర్లుతున్న భర్తను చూస్తూ సుబ్బమ్మ ఎప్పటికో నిద్రపోయింది.

 

***

మీ మాటలు

  1. Basava Purna says:

    ధనలక్ష్మి చనిపోవడం చాల బాధ అనిపించింది.ఎన్ని జీవితాలు వికసీంచకూండానే చిదిమివెయబడ్డయో తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది.

  2. rajani patibandla says:

    కటికి కసాయి కరకు గ …… నా గుండెను కోస్తున్నట్టే ఉంది ఈ రోజుల్లోని అత్యాచారాలకు అప్పటి అధికారిక రూపం ఎంత వికృతంగా ఉందొ రజని పాటిబండ్ల

  3. Yalla Atchuta Ramayya says:

    టైం మెషిన్ లో గతంలోకి ప్రయాణం చేసి – ఆ కాలం లోని సంస్కర్తలతో కలసి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంది. చదువుతుంటే వళ్ళు గగుర్పాటుకు గురవుతోంది. మీ నేరేషన్ అంత బావుంది. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈపాటి స్వేచ్చ వెనక ఎంత మంది త్యాగం దాగి వుందో కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నారు. ఈ సీరియల్ కి పెట్టిన టైటిల్ కూడా బావుంది – యాళ్ల అచ్యుత రామయ్య

మీ మాటలు

*