Archives for 2014

పుస్తకాల అలల మీద ఎగసిపడింది కృష్ణమ్మ!

10888496_10204845333720483_5903717139337843051_n

బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా –

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది…అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ….అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.

కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి…

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

(ఆంద్ర భూమి “మెరుపు” పేజీ నుంచి…)

జాయపసేనాని -2

 

OLYMPUS DIGITAL CAMERAదృశ్యం-2

 

స్వయంభూ దేవాలయం..రంగ మండపం

( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..)

 గుండామాత్యులు:నాయనా “గురు సాక్షాత్ పరబ్రహ్మ..కాబట్టి ఈరోజునుండి కాకాతీయ మహాసామ్రాజ్య చక్రవరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుంగారి ఆదేశానుసారము   నేను నీకు  బోధించడానికి ఉపక్రమిస్తున్న ఈ నాట్యశాస్త్ర రహస్యాలను అతిజాగ్రత్తగా గ్రహించు..ఓం….దైవస్వతమన్వంతరము తొల్లి త్రేతాయుగమందు,కామక్రోధాది అరిషడ్వర్గములకు లొంగి లోకులందరును సుఖదుఃఖములననుభవించుచుండగా,ఇంద్రుడు మున్నగు దేవతలు బ్రహ్మను “అందరూ చూడదగిన,వినదగిన వినోద సాధనమును” అపేక్షించుచున్నామని అర్థించగా బ్రహ్మ ఆత్మాంతర భావనచేసి అన్ని వర్ణముల,వర్గముల వారికిని హితమైన సారమును వేదములనుండి సంగ్రహించి “నాట్యవేదము”ను సృజించినాడు.తర్వాత ఆంగికాది అభినయములందు మనుషులకు గల చాతుర్యమును గమనించి తన మానసపుత్రుడైన భరతమునికి ఆ నాట్యకళను నేర్పించినాడు.భరతుడు తన కుమారుడు శాండిల్యుడు మొదలైనవారికి దానిని నేర్పెను.వారితోను,అప్సరసలతోను,భరతముని నాట్యవేదమును ప్రయోగించి ప్రవర్తింపజేసెను.

       జాయప:ఊ…ఆచార్యా..ఈ నృత్యకళకు ఆధారభూతములైన మూలభావనలేమిటి.?

గుండా:మంచి ప్రశ్న జాయపా..ఎప్పుడైనా మూలమునూ,కేంద్రకమునూ స్పృశిస్తేగాని అసలు రహస్యం బట్టబయలు కాదు..సృష్టిలోని పంచభూతముల ప్రతీకాత్మక వ్యక్తీకరణే నృత్తము.భూమిలోని రత్నకాంతుల తళతళలు,నీటి తరంగముల లాలిత్యము,అగ్నిజ్వాలల ఊపు,వాయుసహజమైన వింతనడక,ఆకాశంలోని మెరుపుతీగల విన్యాసము..యివే నాట్యవేదమునకు పునాది భావనలు.ఐతే సుఖ దుఃఖ మిశ్రమమైన లోకస్వభావముననుకరించి నాలుగు విధముల అభినయములతో ఏర్పడినదే నాట్యవిద్య.ఆంగికము,వాచికము,ఆహార్యము,సాత్వికము అని అభినయము నాల్గు విధములు.నాట్యకళ అంతయూ వీటియందే నెలకొని ఉన్నది.

   జాయప:ఆచార్యా..నాట్యము..నృత్యము..మున్నగు ఏకరీతి భావనలవలె,పర్యాయపదములవలె ధ్వనింపజేయు రూపాలన్నీ ఒకటేనా.?

గుండా:నాయనా..శాస్త్రరీతిలో భరతమునిచే నిర్వహించబడ్డ ఈ విశేషణాలన్నీ అతి సూక్ష్మ భిన్నతలతో స్పష్టముగా చెప్పబడి ఉన్నాయి…ప్రధానమైన “నర్తనము” మూడు విధములు.ఒకటి..పాట,వాద్యములు మొదలగువానితోగలిసి,లయనుమాత్రము ఆశ్రయించి,అభినయములేక,అంగముల నాడించుట ‘ నృత్తము ‘. రెండవది..భావముల నాశ్రయించినది,పదార్థములను అభినయించు స్వరూపముగలది ‘ నృత్యము ‘.మూడవది..సాత్త్విక భావములతోనిండి,రసాశ్రయమై,వాక్యార్థమును అభినయించునదై ఉన్నచో అది ‘ నాట్యము ‘.

జాయప:గురువర్యా..నా సంశయములు సూర్యసమక్షములో మేఘ శకలాలవలె తొలగిపోయినవి.

   గుండా:జాయనా..నాట్య,నృత్య,నృత్తములలోని ప్రధానమైన చేష్టలను నిర్వహించు అంగ,ప్రత్యంగ,ఉపాంగములు మొత్తము 18..ఒక్కొక్కటి ఆరు.శిరస్సు,చేతులు,వక్షము,ప్రక్కలు,మొల మరియి పాదములు అంగములనబడును.ప్రత్యంగములు మెడ,భుజములు,కడుపు,వెన్ను,తొడలు మరియుపిక్కలు.మొత్తము ఆరు.కన్నులు,బొమ్మలు,ముక్కు,పెదవులు,చెక్కిళ్ళు మరియు గడ్డము..ఇవి ఉపాంగములు.

జాయప:శాస్త్రసారము ఇసుకలోనికి నీరువలె నాలోకి ప్రవహిస్తున్నది గురుదేవా..ధన్యుడను.

  గుందన:నృత్తము మార్గము..దేశీ అని రెండు విధములు.నాట్యవేదమునుండి మహర్షులచేత వెలికితీయబడి,సజ్జనుల ద్వారా ప్రచారము చేయబడినదిగా ఉన్న శాస్త్రానుగుణ పద్ధతిని బుధులు ‘ మార్గము ‘ అనీ,దేశ కాల స్థితిగతులనుబట్టి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విధానాలతో ఆయా దేశ రాజుల,జనుల యిష్టానుసారము చెల్లుబాటు ఐన నృత్త విధానమును ‘ దేశీ ‘ అని వ్యవహరించినారు.

 జాయప: ఉహూ..

  గుండన:కాగా నృత్య,నృత్తములు లాస్యమని,తాండవమని మరల రెండు విధములు. అందు మొదటిది లాస్యము..సుకుమారముగా ఉండునది.రెండవది..తాండవమైనది.స్త్రీ పురుషుల పరస్పర విషయములైన భావనలు లాసము.దానికొరకైనది,లేదా దానికి తగినది అను అర్థము గలది లాస్యము.అది కామోల్లాసమునకు హేతువులగు మృదువైన అంగవిక్షేపములు గలది.పార్వతీదేవికి శివుడుపదేశించినది కనుక ప్రాయికముగా దీనిని స్త్రీలే ప్రయోగింతురు.

  జాయప:గురువర్యా..లాస్య సంబంధ నృత్యములు కేవలము స్త్రీలచేతనే నిర్వర్తింపబడ్తాయా.?

గుండన :ఔను జాయనా..సందర్భోచిత పురుష ప్రవర్తనను ప్రయోగాత్మకంగా నర్తించడము అప్పుడప్పుడు జరిగినా లాస్యము ప్రధానముగా స్త్రీల నృత్యక్రియే.ఉద్ధతము పురుషులచే ప్రదర్శింపబడునది.

లాస్యాంగములు పది.గేయపదము,స్థిత పాఠ్యము, ఆసీనము, పుష్పగంధిక, ప్రచ్ఛేదకము, త్రిమూఢము, సైందవము, ద్విమూఢకము, ఉత్తమోత్తకము, ఉక్త ప్రత్యుక్తము..అనేవి ఆ అంగములు.వీటిలో సంక్లిష్టమైనవి .. విరహమందు స్త్రీ కామాగ్నిచే దేహము తపించగా, ఆసనమందుండి ప్రాకృతభాషతో వ్యవహరించునది స్థితపాఠ్యము..నానావిధములైన నృత్తగీత వాద్యములతో మగవానివలె స్త్రీ వివిధ చేష్టలు చేయుట పుష్పగంధిక..వెన్నెలవేడి తాళలేక కామినులు సిగ్గువదిలి,తప్పుచేసిన ప్రియులనైననూ వెన్నాడుట ప్రచ్ఛేదకము.ముఖ ప్రతిముఖములు గలది,చతురశ్రమైన నడక గలది,భావరసములు శ్లిష్టముగా నుండు,విచిత్రములైన అర్థములు గలది ద్విమూఢకము.

ఇకపోతే..ఉద్ధతము మహేశ్వరుని ఆజ్ఞచే భట్టతండువు భరతమునికి చెప్పినది.అందువలన అది “తాండవము” అని వ్యవహరింపబడుతున్నది.దానిని ప్రాయికముగా ఉద్ధతమైన అంగహారములతో పురుషులే నెరవేర్తురు.

        జాయన:గురుదేవా..కేవలము కొన్ని స్త్రీలచేతనే,మరికొన్ని పురుషుల చేతనే నిర్వర్తించబడవలెనన్న నియమము ఎందుకు విధించబడినది.

 గుండన:ఏలననగా .. నాట్యక్రియలో కొన్ని శరీర పటుత్వ, శక్తి, సమర్థతా సంబంధ విషయములతో కూడిఉన్నవి.ఉదాహరణకు ..ఉద్ధత నృత్యములో ఎంతో దుష్కరమైన ప్రదర్శనను..అంటే గాలిలోకి పైకి ఎగిరి, గాలిలోనే పద్మాసనం వేసి,వెంటనే కాళ్ళను విడదీసి నేలమీద నిలుచోవడమో, కూర్చోవడమో చేయగల ‘ అంతరపద్మాసనం’,’ ఊరుద్వయ తాడితం ‘,’ లవణి ‘ వంటి సంక్లిష్ట భంగిమలను ప్రేక్షకులకందించి నర్తకుడు మన్నన పొందుతాడు.దీనికి బలిష్ఠమైన,సౌష్ఠవమైన,శరీరం,దారుఢ్యం అవసరం.

జాయప:ఆచార్యా..పరమ ఆసక్తికరమైన ఈ అంశములను వింటున్నకొద్దీ సముద్రాంతర లోలోతులను సందర్శిస్తున్న మహానందానుభూతి కలుగుతున్నది.నేనదృష్టవంతుడను.

     గుండన: అతి విసృతమైన నాట్యశాస్త్ర వివరాలు ఇంకెన్నో ఉన్నాయి జాయనా.26 రకముల శిరోభేదములు,36 రకముల దృష్టిభేదములు,స్థాయిదృష్టులు.సంచారి దృష్టులు,దర్శనరీతులు,పుటకర్మలు,భ్రూకర్మలు,నాసాకర్మలు,ఓష్ఠకర్మలు,68 రీతుల హస్తలక్షణములు,వక్షో,పార్శ్వ,జఠర,కటి,జాను,ఊరు,జంగా,పాదాంగుళీ కర్మలు,108 రకముల నృత్తకరణములు..ఈ విధముగా నృత్యశాస్త్రము ఒక అనంతాకాసము వంటిది పుత్రా.దీని అధ్యయనము తపస్సమానమైనది..ఉత్కృష్టమైనది.

 జాయన:ఈ మధుర శాస్త్రాన్ని మీనుండి ముఖతః వినే భాగ్యము నాకు కలుగడము నా పూర్వజన్మ సుకృతము ఆచార్యా.ధన్యుడను.

( రాజనర్తకి మాళవిక ప్రవేశము)

మాళవిక:ఆచార్య గుండనామాత్యులకు కాకతీయ సామ్రాట్టుల రాజనర్తకి మాళవికాదేవి ప్రణామములు.

     గుండన:ఆయుష్మాన్ భవ..చిరంజీవ.రా మాళవికా.ఈతడు జాయప…(పరిచయం చేస్తూందగా..)

మాళవిక:గణపతిదేవ చక్రవర్తులు మాకు విషయమంతా చెప్పి జాయనకు శాస్త్ర బోధన జరుపుతున్నపుడు మీతో సహకరించమని మమ్మల్ని అదేశించి ఉన్నారు.తమరి ఆజ్ఞ గురుదేవా.

 గుండన:జాయనా..కొద్దిరోజులు ఈ ప్రాథమికాంశాల చర్చ తర్వాత మన రాజనర్తకి మాళవికాదేవి స్వయముగా మూడు రకముల గతులు..అంటె నదక,ద్రుతము,మధ్యము మరియు విళంబితముల గురించీ,శుద్ధ సంకీర్ణ గతుల గురించీ ప్రదర్శించి అవగతపరుస్తుంది.

జాయన:సరే గురుదేవా..మాళవికాదేవి గారికివే మా నమోవాకములు.

మాళవిక: శివానుగ్రహ ప్రాప్తిరస్తు..చిరంజీవ.

     గుండన:ఈ నాటికీ పాఠం చాలు నాయనా..నీవిక విశ్రమించుము.

( తెర..)

డిశెంబరు చలి గాలి పటాలు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

1
నిగ నిగ లాడుతున్న రేగుపండు,
కొరికితే వకటే వగరు
2
ఎటు పోయింది
మద తుమ్మెదల గుంపు!
పూలు నిగారింపు కోల్పోయి
విరహ నిట్టూర్పులతో తలవాల్చి…
3.
మత్తు కిటికీ తెరుస్తూ
పురాతన బౌద్ధ సన్యాసి-
మోహ చీమల బారు,
ఈ రాత్రికి ఇంకేమి కావాలి?
4.
ఈ బాహువులకి
వొక జన్మంత చలి,
బహు దూరపు చలి మంట
చేరేలోపునే ఆరిపోయింది.
5
చాలా దూర ప్రయణం,
మంచు కప్పేసుకున్న
దారి కంటికి పొరల్ని తొడుగుతూ-
6
ప్రాత: కాలం,
మాలి పూలవనం ఊడుస్థుంటే
రంగు రంగుల అలల నర్తనం-
7
వాళ్ళు అంటున్నారు
ఈ తరుణం మంచిది కాదని-
నేనంటున్నాను
అనుభవానికి ఇదే హుషారు కాలమని-
8
గూట్లోని ముసలి జంట కలవరిస్తున్నారు
నిన్నటి యవ్వనాన్ని శపించుకొంటున్నారు
కీళ్ళ నొప్పుల్ని స్వప్నిస్తున్నారు
రేపటి సరిజోడుని-
9.
ముదురు చలి
లేత యవ్వన విరహ వితంతువు చుట్టూతా ఇనుప వల-
కలలు కూడా
దోమ తెర ఆవలే తచ్చాడుతున్నాయి-
10
అదే పనిగా
కురుస్తున్న మంచు పరదాలను వొలుచుకొంటూ
వొంటరి పక్షి ఎదురేగుతుంది
రేపటి ఉదయానికి ఏ కొమ్మ మీద వాలునో?
11.
మరో కాలి బాట వేయాలి
దారిలో మరెన్నో దీపాల్ని వెలిగించాలి
మరో ఊట చెలమను తోడాలి-
-ఇక్బాల్ చంద్

Iqbal chand

పీకె హై క్యా?

samvedana logo copy(1)పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది మన సమాజానికి అవసరమైన ఒక అంశాన్నిపరిమితుల్లోనైనా చర్చించగలిగింది. 300 కోట్ల వసూళ్లవైపు దూసుకెళ్తోంది అని చదివినప్పుడు కాదు గాని పీకె అంటే ఏమిటి అనేది ఐదో తరగతి పిల్లలు చర్చించుకుని చివరకు పాగల్‌ కుత్తా అని వాళ్లొక అబ్రివేషన్ ఇచ్చేసుకున్నారని తెలిశాక హిరానీ సక్సెస్‌ అయినట్టు అనిపించింది. పీకె సినిమాకు పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెట్టుబడి పెట్టిందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించినపుడు భలే అనిపించింది. సిటీకొచ్చి ఇన్నేళ్లయినా దేడ్‌ దిమాక్‌ అంటే సరిగా తెలిసేది కాదు. ఇపుడే తెలిసింది. కొత్త ఆశ్చర్యాలు, కొత్త విషాదాలు లేని నిస్సత్తువ కాలంలో ఎంత వినోదం, ఎంత విషాదం?

పీకెలో కొత్త అంశాలేమీ లేవు. అన్నీ మనకు తెలిసినవే. అందులోనూ మనం నాస్తికులమో హేతువాదులమో కమ్యూనిస్టులమో అయిఉంటే ఎప్పుడో ఒకసారి ఆ జోకులన్నీ వేసే ఉంటాం.అవేవీ పూర్తిగా ఏలియన్‌ విషయాలు కావు. కోడలు దిద్దిన కాపురం నాటినుంచో ఇంకా అంతకుముందునుంచో అక్కడక్కడా అపుడపుడూ కొన్ని శకలాలు చూస్తూనే ఉన్నాం.

ఓ మైగాడ్‌తో కూసింత ఎక్కువే చూశాం. కాకపోతే హిరానీ అలాంటి ఎలిమెంట్స్‌ని పూర్తిస్థాయిలో మెయిన్‌స్ర్టీమ్‌ లోకి తెచ్చి అల్లిన తీరు కొత్తది. ఈ దేశంలో మనోభావాలు అనే పదం ఒకటి ఏడ్చింది. దేవుడు లాంటి అమూర్తమైన పదార్థం అది. అది ఎవరైనా ఏలు పెడితే బొక్కడిపోయేంత సున్నితము. అత్తిపత్తి వలె అలా తాకితే ఇలా ముడుచుకుపోయేంత సున్నితము. పీకెకు దేవుని రూపరేఖా లావణ్యములు తెలీనట్టే మనకూ ఈ మనోభావాలు అనేవి ఎలా ఉంటాయో ఎందుకంత సున్నితంగా ఉంటాయో తెలీదు. కాకపోతే ఒకటి తెలుసు. ఇతరుల మీద దాడులు చేసి చంపేసేవారు, త్రిశూలాలతో తల్వార్లతో ఊరేగేవారికే ఇట్లా సున్నితమైన మనోభావాలు ఉంటాయని చరిత్ర మనకు తెలుపుచున్నది.

ఒక ఆర్టిస్టును దేశం విడిచిపోయేట్టు చేసినవారు, ఆడపిల్లలపై విధించిన స్థలకాల ఆంక్షలను ధిక్కరించినందుకు-అంటే మగవారికి మాత్రమే పరిమితమైన రాత్రిపూట రోడ్లమీద తిరుగుట, పబ్బుల్లో క్లబ్బుల్లో కనిపించుట వగైరా చేసినందుకు దాడులకు పాల్పడువారు. వాలంటైన్స్‌ డేనాడు తిట్టి కొట్టి బలవంతపు పెళ్లిళ్లు చేయువారు. ఒక నవల రాసినందుకు తలతీస్తాం అని ఫత్వా విధించినవారు, పబ్లిగ్గానే దాడులు చేయగలిగిన వారు. వీరందరి మనోభావాలూ సున్నితమైనవే. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట! ఇదిగో ఈ బ్యాచ్‌ ఇపుడు రోడ్డున పడింది. ఇలాంటివారితో డీల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.

pk1

ఇక్కడ చాలా నేర్పుగా జాగ్రత్తగా వ్యవహరించారు రాజూ హిరానీ. నేర్పుగా అంటే సబ్‌ ఠీక్‌ హై అని కాదు. సర్దుబాట్లే కాకుండా కొన్ని రాజీలు కూడా ఉన్నాయి. ఇంత జేసినా ఈ మనోభావాల గుంపులకు తృప్తి లేదు. ఊరుకుంటే మెత్తదనం అనుకుంటారేమో, పైగా మనోడు పదవిలో ఉన్నపుడు కూడా మనం హడావుడి చేయకపోతే మన ఆధిపత్యం ఏమైపోవాలి అని తీర్మానించేసుకుని బజార్న పడుతున్నారు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇది మతాన్ని కించపరిచే సినిమా అనలేడు అని స్టేట్‌మెంట్‌ ఇవ్వచ్చుగానీ అన్నం బదులు చపాతీతింటే ఒకేనా అనొచ్చు.

అభిప్రాయాల్లో కూడా వైవిధ్యం ఉండొచ్చును. మన అభిప్రాయమే అంతిమం కావాలని   అనుకోకూడదు. విభేదాలున్నవారు రాసుకోవచ్చు. హిరానీ అనే పెద్దమనిషి ఒక సినిమా తీశాడు, నీకు నచ్చకపోతే ఇంకో సినిమా తీస్కో. లేదంటే ఒక వ్యాసంరాస్కో. నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. “నా చేతిలో కర్ర ఉండాది కాబట్టి అందరూ నా మాట వినాలనిపిస్తాది” అంటే ఏం బాగుంటాదప్పా! అని మనం అడగాల్నా వద్దా! ఒకవైపు ప్రజాస్వామ్యంఅంటావు. ప్రజాస్వామ్యం చాలా గొప్పదని మీ నాయకుడు పార్లమెంట్‌ మెట్లకు సాష్టాంగనమస్కారాలు వగైరా పెడతాడు, నువ్వేంది స్వామీ, కర్రలు తీసుకుని వీధుల్లో పడతావ్ అని అడగాల్నా వద్దా! ఈ డ్యూయల్‌ రోల్‌ రహస్యమేంటో చెప్పమని డిమాండ్‌ చేయాలా వద్దా! ఏదో ఒకటి చెప్పండి, అట్లాగే ఖాయం చేసుకుందారి అనాల్నా వద్దా1 ఏ రోటి కాడ ఆ పాట అంటే ఎలాగబ్బా వీళ్లతో వేగడం. జ్ఞానానికి అవధి ఉంటుంది, అజ్ఞానానికి ఎక్కడా! అనుకుని ఊరుకోవడానికి లేదు. ఇది జ్ఞానాజ్ఞానాలకు సంబంధించిన విషయం కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదానికి సంబంధించిన విషయం.

ఇపుడు కాస్త పెద్దమనిషి తరహాలో గంభీరంగా మాట్లాడుకుందాం. వీళ్ల గొడవేంటసలు. అహా, ఏంటసలు అని! అసలైతే వీళ్లతో మనం మాట్లాడలేం. వాదించలేం. మాట్లాడకూడదు, వాదించకూడదు. వాదిస్తే ఏమవుద్దో నీషే చెప్పాడు కదా! కానీ కొందరు చాలా పెద్దమనిషి తరహాగా తర్కపు ముసుగేసుకుని గొంతును బేస్‌ వాయిస్‌లోకి మార్చి ఆ రూట్లో ముందుకు వస్తుంటారు. స్వాములోర్లలో మాత్రం అందరూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారే ఉంటారా. అక్కడక్కడా కాస్త లాజికల్‌గా కనిపించాలని ప్రయత్నించువారు ఉంటారు. చర్చించకపోతే వీళ్లసలు ఊర్కోరు. వీళ్లేమంటారు?

images

ఈ దేశంలో హిందువులు అందరికీ చులకనైపోయారు. ఎవరుపడితే వారు నాలుగు రాళ్లు విసిరేయడమే అంటారు. అదే ఇస్లాంను అనగలరా, క్రైస్తవాన్ని అనగలరా! అమీర్‌ ఖాన్‌ అనే ముస్లిం కాబట్టి ఇలా చేశాడు అంటారు. ఈ చివరి ప్రశ్న జోలికి మనం పోకనక్కర్లేదు. అది దేడ్‌ దిమాక్‌ కంటే ఒక దిమాక్‌ తక్కువైన మాట. ఆనంద్‌ పట్వర్థన్‌ ఏ మతంలో పుట్టారని ఆయన సినిమాలను డాక్యుమెంటరీలు ఆంక్షల నడుమ నలిగిపోతున్నాయి. సంజయ్‌ కాక్‌ ఏ మతంలో పుట్టాడు? దీపా మెహతా ఏ మతంలో పుట్టింది? ఇక ఇతరత్రా విషయాల్లోకి వెళ్దాం. అదే అమీర్‌ ఖాన్‌ మసీదు లోకి మద్యం బాటిళ్లతో వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ముగ్గురు భార్యల మొగుడైన ముస్లిం వ్యక్తికి కోపం తెప్పిస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ఇస్లామిస్ట్‌ టెర్రరిస్టుల దాడికి చలించిపోతాడు. చనిపోయిన తన మిత్రుడి చెప్పు మోసుకుని తిరుగుతాడు. అసలు ఇంత బాలెన్సింగ్‌ యాక్ట్‌ అనవసరం. ఇందులో కొన్ని అంశాల్లో ప్రత్యేకించి ముగ్గురుభార్యల సెటైర్‌లో స్టీరియోటైప్‌ వ్యవహారం ఉంది. హిరానీ ప్రమాదకరమైన పర్వతాల మధ్యలో తాడుమీద నడిచే మాదిరి విన్యాసం చేశాడు. అయినా ఈ గుంపులకు ఆనలేదు.

ఇపుడు హిందూ దేవతలే హిందూ బాబాలే దొరికారా అనే ప్రశ్న దగ్గరకు వద్దాం. ఇది హిందూ మెజారిటీ దేశం. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా ఏ మతంలో ఉన్న దురాచారాల గురించి ఫోకస్‌ చేయాలి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లి ఇస్లాంను ఇట్లా చిత్రించగలరా అనేవారు ఈ దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారా అనేదానికి సమాధానం చెప్పాలి. ఎదుటోడు కన్ను పొడుచుకున్నాడు కాబట్టి మనం కూడా పొడుచుకోవాలి అనడం   తప్ప ఇందులో ఏమైనా ఉందా! అట్లాంటి స్థాయికి తీసికెడితేనే కానీ వీళ్లు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించడానికి అవకాశం దొరకదు. అదీ అసలు విషయం.

ఏ దేశంలో నైనా పురోగామిగా ఆలోచించే శక్తులుంటాయి. ఏదో ఒక స్థాయిలో అక్కడి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. క్రైస్తవ ఆధిపత్యంలోని దేశమైనా ఇస్లాం ఆధిపత్యంలోని దేశమైనా అన్ని దేశాల్లోనూ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. మనం చూడదల్చుకోకపోతే వేరే విషయం. బాబాల అవతారమెత్తి ఒక్కొక్కడు ఎన్ని రకాల నీచాలకు మోసాలకు పాల్పడుతున్నారో తెలిసి కూడా మా హిందూ బాబాలను అలా అంటావా అంటున్నారంటే వీరికి కనీసం తమ మతాన్ని సంస్కరించుకోవాలనే కోరిక కూడా లేదని అర్థమవుతోంది.

అక్కడక్కడా కొన్ని మౌలిక అంశాలు లేవనెత్తినప్పటికీ మొత్తంగా చూసినపుడు వివేకానంద స్కూల్‌కు దగ్గరగా ఉండే సంస్కరణ వాద వ్వవహారం ఈ సినిమా. తిరుగుబాటు వ్యవహారం కానేకాదు. చివర్లో బాబాతో చర్చ సందర్భంగా దైవాన్ని ప్రశంసించి అది సాంత్వనకు అవసరం అని చెప్పి భక్తులను సంతృప్తి పరిచే పని కూడా చేశాడు హీరానీ. కానీ మెయిన్‌స్ర్టీమ్‌ సినిమాలో ఆ మాత్రం ప్రయత్నం చేయడం, అది ఎక్కువమందికి చేరే విధంగా చేయడం రాజూ హీరానీ సాధించిన విజయం. అభినందించాల్సిన విషయం.

   -జి ఎస్‌ రామ్మోహన్‌

 

హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన కధ

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది మధ్యతరగతి వారికి హింస మొదట కుటుంబంలోనే పరిచయం అవుతుంది. అలాటి వారికి సమాజంలో ఉండే హింసను గ్రహించటానికి కొంత వయసు, జ్ఞానం కావాల్సి వుంటుంది. కానీ ‘సంగి’ లాంటి సమాజానికి వల్నరబుల్ గా ఉండే చిన్న పిల్లలు హింసాయుత ప్రపంచంలో నిత్యం రాపిడికి గురౌతూ ఉంటారు. ఆ హింస ఎక్కడ నుండి ఉద్భవిస్తుందో, దానికి మూలకాలు ఏమిటో గ్రహింపు లేకపోయినా … వెంపర్లు ఘాటుగా, చేదుగా, దుఃఖంగా అనుభవమవుతూ ప్రతిచర్యకు వారిని పురికొల్పుతూ ఉంటాయి. శత్రువు ఎవరో తెలియని అయోమయ స్థితిలో కూడా హింసానుభవానికి సంబంధించిన పగ, ప్రతి హింసకు వారిని ప్రేరేపిస్తుంది. చూసే వాళ్ళకు ఆ హింస అసంబద్ధంగా అనిపించుకాక! అధికారానికి అది తలనొప్పిగా, సంఘ వ్యతిరేక శక్తిగా, ‘దువ్వేసి’ తొలగించాల్సిన ఉగ్రభావంగా అగుపించుకాక! సామాజిక నియమాలుగా చెప్పబడుతున్నవి ఎంత నిర్దేశించినా..  తలవొగ్గి ఉండమని శాస్త్రాలు ఎంత బుజ్జగించినా .. చట్టం, పోలీసు లాంటి రాజ్య నిర్మాణాలు ఎంత శాసించినా మానవ ఉద్వేగాలు సహజంగా బయలు దారిలోనే ప్రవహిస్తాయి.

విద్యార్ధులు ప్రభుత్వ హాస్టల్లో అధ్వాన్న వసతులకు వ్యతిరేకంగా రోడ్డు మీద పడుతుంటారు. కాశ్మీర్ లో మిలటరీ మీద ఆగ్రహంతో ప్రజలు రాళ్ళు రువ్వుతుంటారు. మణిపూర్ లో పారా మిలటరీ దళాలు చేసిన అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు నగ్న ప్రదర్శన చేస్తారు. మర్యాదస్తులకు అహేతుకంగా కనిపించే ఈ చర్యల వెనక అదృశ్యంగా వ్యవస్థ మీద కనబడని ఆగ్రహావేశాలు బుసలు కొడుతుంటాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం పుట్టిన చిన్న ‘సంగి’కి ముందు ముందు ఇలా జరగబోతుందని తెలియదు. అయినా అదేమిటో సంగి కూడా అంతే ప్రవర్తించింది .. అచ్చు శ్రీకాకుళం పోరాటంలో గోసి పెట్టుకొన్న గిరిజనులు భూస్వాముల మీద తిరగబడ్డట్టు. కానీ ఇక్కడ సంగికి శత్రు స్పృహ తెలుస్తుంటుంది కాని శత్రువు ఎవరో తెలియదు.

‘హింస’ కధలో కాళీపట్నం రామారావు గారు ఒక పసిదాని సామాజిక, ఆర్ధిక జీవితం చుట్టూ అల్లుకొన్న హింసను కళ్ళకు కట్టించి దాని ప్రతి చర్యను శక్తివంతంగా సమర్ధించారు. 1968 ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ఈ కధను ప్రచురించారు. సాహిత్య ప్రయోజనాల్లో సమాజంలోని సంక్లిష్టతను అర్ధం చేయించటం ఒకటి అయితే ఆ పనిని కా.రా గారు గొప్పగా చేయగలిగారు ఈ కధలో. బారెడంత గోచి గుడ్డతో కధంతా తిరిగే సంగి ఈ కధా నాయకురాలు. కధ ప్రారంభం, ముగింపు రెండూ ఈ కధకు ప్రత్యేకంగా ఉంటాయి. తన చుట్టూ జీవిస్తున్న సమూహంలో వివిధ వ్యక్తుల నుండి ఒక్క రోజులో సంగి అనుభవాలు ఆ గొల్లపిల్లను ఉలికిపాటుకి, అంతర్మధనానికీ గురిచేసి కసికి ప్రేరేపిస్తాయి.

రామారావు గారి కధల్లో చిన్న ఆడపిల్లల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంటుంది. చావు కధలో సిమ్మాద్రి, దాలి .. మహదాశీర్వచనంలో కామేశ్వరి.. హింస కధలో సంగి, నీలి – ఇలాంటి పిల్లలు తమ నేలబారు జీవితాలని ఎదురీదటానికి తల్లో తండ్రో లేక ఇద్దరో పడుతున్న కష్టాలలో మమేకం అవుతుంటారు. ఒక్క పూట కూలికి వెళ్ళకపోతే కలిగే పర్యవసానాలు అర్ధం చేసుకోగలిగిన పరిణితి వారి పేదరికం వాళ్ళకు నేర్పుతుంది. ఈ పిల్లలు ఎక్కడా బడి మొహం చూసిన దాఖాలాలు ఉండవు. ఈ కధలో సంగి, నీలి తమ లేత రెక్కలను పెట్టుబడిగా పెట్టి నిరంతర ఆకలి పోరాటంలో తలమునకలవుతుంటారు. కధ మొదలులోనే సంగి రూపం వర్ణిస్తూ “… ఆ వెల్తుర్లో సంగి మెడలో పగడాలూ, పూసలూ మకిలి మకిలిగా మెరుస్తున్నాయి. దాన్ని వేలాడే కొత్త పిన్నీసులు జిగజిగ లాడుతున్నాయి … కొట్టు దాటగానే వెనకానున్న నీడ సర్రన ముందుకొచ్చింది. బారెడు గోచిగుడ్డ మొలకు చుట్టుకొన్న బ్రహ్మరాక్షసిలాటి నీడన్చూసి, ‘శా, పయ్యాట గుడ్డ మర్సిపోనాను!’ అనుకుంది సంగి.” ఇక సంగి స్నేహితురాలు నీలి పరిచయంలోనే “ఒక చేతిలో – జానెడు నూనె సీసా, చిన్నబెల్లమ్ముక్కా; రెండో చేతిలో పట్టేడు చింతపండు వుండా …” తో కనిపిస్తుంది. అప్ప వచ్చిన రోజు తను ఎందుకు సంగిని కలవలేక పోయింది సంజాయిషీ ఇస్తూ నీలి “అడివవతల బుడువూరు సోవయ్య శేరికి తానూ తల్లి పప్పేత కెళ్ళేరు. రాను పోనూ ఆరు మైళ్ళు. ఏకువనగా నెగిసి పాసిపనంతా సేసుకుని యింటికిపడ్డ నీళ్ళన్ని మోసి ఆడుతూ బడుతూ యెల్తే యియ్యేళకు తేలేరు.” ఇంక సంగి పరిస్థితి – “తెల్లారేక యిలా నీళ్ళైనా పుక్కిలించలేదు. సిన్నాయిన కూతురు పారొచ్చింది. కాపోళ్ళ గుడ్డల మీద గడ్డలు పగలేయ్యాలిట! వొస్తదేమో కనుక్కోమంది సిన్నమ్మ. ‘యేల్రాదూ? మారాజులా గొస్తాది. తీసుకెల్లం’ది తల్లి. అంబళ్ళేలకు పనిపోదా అనుకుంది సంగి. కానీ గుడ్డెలమీదే పొద్దు పోయింది, తిరిగివొచ్చింది లగాయతు, దినవెచ్చాలు, తల్లికి వంట సాయం, ఇప్పుడు టీ.” కధ గడిచిన నలభై ఆరేళ్ళకు కూడా తలకు గుడ్డలు గట్టుకొని చేతిలో కొడవలో, దోకురుబారో పట్టుకొని తల్లి వెంట పనులకు పోతున్న సంగులు, నీలులు ఎంతమందో!

ఆకతాయి దాసు పట్నం నుండి వస్తూ ఆయన చూసిన దృశ్యాన్ని సుబ్బయ్య హోటల్లో జనానికి వివరిస్తుంటే, టీ కోసం చెంబు పట్టుకొని ‘సంగి’ ఆ పాక హోటల్ ప్రవేశంతో కధ మొదలువుతుంది. ఒక దానితో ఒకటి సంబంధం లేని సంగతులుగా అనిపించే ఈ రెండు విషయాలనీ రచయిత నేర్పుగా కలుపుతాడు. దాసు చెబుతున్నసంఘటనలోని స్త్రీ పైడమ్మ సంగి అప్పే (అక్క) అవటమే ఆ లంకె. ఆ పాకలో బైఠాయించిన ఆ సమాజం తన అక్కను ఎద్దేవా చేస్తున్నదన్న విషయం గ్రహించటానికి సంగికి కొంత సమయం పడుతుంది. చిన్న వయసులోనే కూలికి వెళ్ళి తల్లికి సాయం చేయటం తప్ప లోకం ఎరగని సంగిని ఆ హేళన ఆ రోజు ఆమె ఎదుర్కొన్న మొదటి హింస.

ఆ దృశ్యం కొనసాగింపులోనే, అప్ప ఇంటికి వచ్చిందని తెలిసీ ఇంటికి రావటానికి సందేహించిన స్నేహితురాలు నీలి వైఖరి కలిగించిన నిరాశ యింకో హింస. చాలా ఏళ్ళ తరువాత ఇంటికి వచ్చిన అప్పతో ఒక్క గడియ మాట్లాడటానికి కాలం చాలని బతుకులో ఉన్న సంగికి, అప్ప అందరి చర్చలకు కేంద్ర బిందువు ఎలా అయ్యిందో అర్ధం కాని అయోమయం ఆమె ఎదుర్కొన్న కొత్త రకం హింస. చుట్టాలు అందరూ కలిసి అప్ప బతుకుకి తీర్పు ఇవ్వటం, అది అంగీకరించాల్సిన నిస్సహాయ పరిస్థితిలో తల్లి దుఃఖం ఆమెకు అర్ధం కాని హింస. అప్పకు ఏమయ్యింది? అప్ప స్నానం చేస్తుంటే చూసి, ఏమి మార్పు వచ్చిందని అందరూ అప్పను నిప్పును చూసినట్లు చూస్తున్నారో అనుకొంటుంది. తల్లి దుఃఖం వెంటాడుతుండగా అప్పటి వరకు ఒంటరిగా వెళ్ళటానికి భయపడే ‘శలక’కు నిర్భయంగా, నిర్వికారంగా బయలుదేరుతుంది. గతంలో అక్కడ ఆమెను భయపెట్టిన ‘గుండెలు పగలవేసే నిశ్శబ్దం’ ఇప్పుడు ఆమెను ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇక్కడ వరకు చదివిన పాఠకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకోక తప్పదు. సంగిలాంటి పసిపిల్ల కఠిన దరిద్రంతో బతుకు పోరాటం కోసం చిన్నతనం నుండే కూలికి వెళ్ళటం ఈ దేశంలో వింత కాదు. కాని అంత పిందె వయసులో భయాన్ని జయించ గలగటం సంతోషానికి బదులు విషాదాన్ని కలగ చేస్తుంది. ఆ భయరహిత స్థితికి నేపధ్యం చాలా కఠినమైనది. గుండె లేనిది. ఆ నేపధ్యం ఆమెను తను బతుకుతున్న సమూహపు హృదయరాహిత్యాన్ని అనుభవింప చేసింది. ఒక జెండర్ వ్యభిచారం చేయటం అంగీకారంగాను, ఇంకొక జెండర్ చేయటం ఘోరమైన తప్పిదంగాను నిర్దేశించిన సమాజపు ద్వంద్వ విలువలను గ్రహింప చేసింది. గతి లేని పరిస్థితుల్లో అలాంటి ఘోరమైన తప్పు చేసిన ఆడపిల్లకు కుటుంబం నుండి కూడా తిరస్కారం తప్పని సరైన చేదు నీతిని అవగతం చేసింది. ఒక్కరోజులో వచ్చి పడిన ఈ ఎరుక, ఆమెను మౌనిగా మార్చేసిన ఆ కాఠిన్య సందర్భం కొస కంట తడిని రగిలిస్తుంది. అయితే సంగిలోని ఈ మౌనం ఆమె అంతర్గత దహనానికి వ్యక్తీకరణ. ఆ దహనం కసిగా మారి, తన కుటుంబాన్ని క్షోభింపచేసిన కనబడని శత్రువును ఎగిరి తన్నాలన్న క్రోధంగా వ్యక్తమౌతుంది.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. కానీ ప్రతీకాత్మకంగా ముగింపు ఇచ్చిన కధ ‘హింస’. మేకపిల్లను చంపిన నక్కలను చేతి రాళ్ళతో వెంటాడి “యియ్యేళ మిమ్మల్ని, ఒకళ్ళనో ఇద్దర్నో సంపిందాకా నానింటికిపోను” అని ఆవేశించిన సంగి ఆక్రోశం అర్ధం కావాలంటే ఆమె బతుకుతున్న ‘చుట్టూ యిలారం’ పాకలోకి వెళ్ళాలి. కూలాడక గంజి తాగి ఆర్చుకు పోయిన ఆమె పేగులు గమనించుకోవాలి. అంత పేదరికంలో కూడా “అప్ప రక్తం నాళ నాళానా వేడిమి నింపుతూ ఆమెను పొదువుకొన్న” ప్రేమ బంధం గుర్తించగలగాలి. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిచ్చిన బంధుగణం అసహాయతను అసహ్యించుకోవటమో, అర్ధం చేసుకోవటమో చేయాలి. కూతుర్ని ఇక కాపాడుకోలేనని గ్రహించి గొంతు వెలుగు రాసేదాకా ఏడ్చిన తల్లి శోకాన్నం సంగిలో కలిగించిన మొయ్యలేని బాధతో సహానుభూతి చెందాలి. ఇవన్నీ చేయగలిగారు కాబట్టే కారాగారు ఈ కధను ఇంత సహజాతి సహజంగా, అద్భుతంగా రాయగలిగారు.

 -బత్తుల రమాసుందరి

089బత్తుల రమాసుందరి ప్రకాశం జిల్లాలో ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో సీనియర్ లెక్చెరర్ గా పని చేస్తున్నారు. ఈమె రాసిన కొన్ని కధలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఇప్పటి వరకూ చదివిన తెలుగు సాహిత్యంలో రంగనాయకమ్మ, కారా, రావి శాస్త్రి, పతంజలి, పి. సత్యవతి, అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి, ఆర్. వసుంధరాదేవి, బజరా, నామినీ, మధురాంతకం నరేంద్ర, స.వెం. రమేశు, బండి నారాయణస్వామి, వి. చంద్రశేఖరరావు, గోపిని కరుణాకర్, దాసరి అమరేంద్ర, … ఇంకా చాలామంది స్త్రీ, దళిత, మైనారిటీ, ప్రాంతీయ, భాషా అస్తిత్వవాద రచయితల అనేక రచనలు ఇష్టం. రమాసుందరి రచనలు ‘మోదుగపూలు’ (kadhalu.wordpress.com) లో చదవవచ్చు.

 

 “హింస” కథ:

ఒక పెయింటింగ్ అంటే వెయ్యి పేజీల పుస్తకమే!

Rorich "compassion"

Rorich “compassion”

‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’

నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే మారారు. నాకు బొమ్మలు వెయ్యడం రాదని నాకే కాకుండా మా వాళ్లందరికీ గట్టి నమ్మకం మరి.

‘‘ఎప్పుడూ ఆ పాడు పుస్తకాలేమిట్రా.. క్లాసు పుస్తకాలు చదువుకో, బాగుపడతావు!’’

చిన్నప్పుడు చందమామ, బాలమిత్రలు, పెద్దయ్యాక స్వాతి, ఆంధ్రభూమి వగైరా పత్రికలు, ఇంకొంచెం పెద్దయ్యాక శ్రీ శ్రీ, ఆరుద్ర, చలం పుస్తకాలు చదువుకునేప్పుడు అందిన మరో ఆశీర్వాదం.

‘‘ఎప్పుడూ ఆ పిచ్చిబొమ్మల పుస్తకాలు చదవకపోతే డీఎస్సో గీయస్సో రాయొచ్చుగా. ఈ పాడు రేత్రి ఉజ్జోగం ఇంకెన్నాళ్లు?’’

బొమ్మలు రావని తెలిసి బొమ్మలేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇల్లాలు చేస్తున్న హితబోధ ఇది. వచ్చే జన్మంటూ ఉంటే జర్నలిస్టును పెళ్లి చేసుకోనని ఆమె మంగమ్మ శపథం పట్టింది.

వాళ్లకు జీవితానుభవం మెండు. రియలిస్టు చిత్రకారుల్లాంటి వాళ్లు. మరి నేను?

నేను భూమ్మీదపడి ముప్పైయారేళ్లు. ఊహ తెలియని రోజులు తప్ప ఊహ తెలిసిన కాలమంతా పుస్తకాలు, బొమ్మలే లోకం. అలాగని నేను పండితుడినీ కాను, కళాకారుడినీ కాను. నిజానికి సృజనలోకంటే ఆస్వాదనలోనే చాలా సుఖముంది. రచయితలూ, కళాకారులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. మనం వాటిని హాయిగా కూచుని, ఎలా పడితే అలా పడుకుని, నుంచుని ఆస్వాదించొచ్చు. తినడం కంటే వండడం కష్టం కదూ, అదీ రుచిగానూ.

ఎందుకో తెలియదు కానీ బొమ్మల్లేని పుస్తకాలు నచ్చవు నాకు. కవితయినా, కథయినా, నవలైనా, వ్యాసమైనా బొమ్మ ఉంటే దాని అందం వేరు. బొమ్మలేని పుస్తకం ఉప్పులేని కూర. అక్షరాలకు బొమ్మ తోడుంటే పఠనం విసుగెత్తించదు. వాక్యాలు ఇబ్బందిపెట్టినప్పుడు బొమ్మ ఊరటనిస్తుంది. పిండారబోసిన వెన్నెల్లో చందమామలాంటిది బొమ్మ. ఉడుకుడుకు రాగిసంకటి ముద్దలో కాసింత నేతిబొట్టు, వెల్లుల్లికారం పూసిన ఎండుచేప లాంటిది బొమ్మ. నీది పిల్లతనం అంటారు మిత్రులు. తెలివిమీరిన పెద్దతనానికంటే అదే మంచిదంటాను నేను. చిన్నప్పుడు కథల కోసం కాకుండా బొమ్మలు చూడ్డానికే చందమామ, బాలమిత్రలు కొనేవాడిని, చిరుతిళ్లు మానుకుని. కథ కోసం కాకుండా బొమ్మల కోసమే సినిమాలకు వెళ్లేవాడిని.

Hokusai boy on the tree

Hokusai boy on the tree

నాకు తెలియకుండానే బొమ్మలకు బానిసనయ్యాను. దేన్ని చూసినా, దేన్ని చదివినా రంగురూపాల తపనే. ఎంత పిచ్చో ఒక ఉదాహరణ చెబుతాను. కాళహస్తీశ్వర మాహత్మ్యంలోని విచిత్ర సరోవర సందర్శనం విభాగంలో ఓ వచనం నాకు అచ్చం ఎంసీ ఈషర్ వేసిన చేపలు పక్షులుగా మారే చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ వచనం చదవండి..

నత్కీరుడు ఓ మర్రిచెట్టు కిందికెళ్లి..  ‘తదీయ శాఖాశైత్యంబున కత్యంత సంతోషంబునొంది, కూర్చుండి, తద్వటంబుననుండి రాలిన పండుటాకులు బట్టబయటఁ బడినయవి విహంగంబులు, జలంబునం బడినయవి మీనంబులునైపోవ, నందొక్క పలాశంబు జలాశయంబున సగమును, దట ప్రదేశంబున సగమును బడి, మీనపక్షిత్వంబులఁ గైకొని, లోపలికిన్వెలుపలికిం దివియు చమత్కారంబు నత్కీరుండు చూచి, యద్భుతరసపరవశుండై యుండె..’’

ఇప్పుడు ఈ వ్యాసంలోని ఈషర్ బొమ్మను చూడండి. ధూర్జటి వచనంతో పోల్చుకోండి!!

Escher "birds fish"

Escher “birds fish”

మా ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఊరిలో ఓ బక్కపల్చని ముస్లిం(మతంతో గుర్తింపునిచ్చే నా నిమిత్తం లేని నా మెజారిటీతనానికి సిగ్గుపడుతున్నా) తోపుడు బండిలో పాతపుస్తకాలు అమ్మేవాడు. నాకప్పుడు పన్నెండేళ్లనుకుంటా. మూడు రూపాయలిచ్చి రామకృష్ణ పరమహంస జీవితచరిత్ర కొన్నాను. మూడునాలుగు వందల పేజీల పుస్తకం. అందులో చక్కని నలుపుతెలుపు ఫొటోలు.. పరమహంసవి, శారదమాతవి, వివేకానందుడివి చాలా ఉన్నాయి. బొమ్మలున్నాయి కనుకే కొన్నాను. నా జీవితంలో చూసిన అతి పెద్ద తొలి పుస్తకం. ఎంతో గర్వంతో స్కూలుకు తీసుకెళ్లి క్లాసులో అందరికీ చూపించాను. గుర్తులేదు కానీ, వెర్రివాడినన్నట్టే చూసుంటారు. ఆ పుస్తకాన్ని డిగ్రీకి వచ్చేంతవరకు జాగ్రత్తగా దాచుకున్నా, కాలేజీ రోజుల్లో ఆలోచనలు మారి, ఆ పుస్తకంతో ఏకీభావం లేకపోయినా. మాకు సొంతిల్లు లేదు కనుక ఇళ్లు మారడంలో అదెక్కడో పోయింది. లేకపోతే ఇంట్లోవాళ్లు పడేసుంటారు.

విశాలాంధ్ర వాళ్ల వ్యాను మా ఊరికీ వచ్చేది. అదొచ్చిందంటే కాళ్లు నిలిచేవికావు. దాచుకున్న, ఇంట్లో దోచుకున్న డబ్బులు, స్కాలర్ షిప్ డబ్బులు పట్టుకెళ్లి కొనేసేవాడిని. బొమ్మల పుస్తకాలకే ప్రాధాన్యం. తెలుగులో అలాంటివి చాలా తక్కువ కనుక సోవియట్ పుస్తకాలపై పడేవాడిని. దిండులాంటి రష్యన్ కథలూ గాథలూ, ప్రాచీన ప్రపంచ చరిత్ర, కుప్రీన్ రాళ్లవంకీ, నొప్పి డాక్టరు, మొసలి కాజేసిన సూర్యుడు, లెనిన్ జీవిత చరిత్ర.. ఇంకా గుర్తులేని బొమ్మల పుస్తకాలు కొని చాటుమాటుగా ఇంటికి తెచ్చేవాడిని. సంగతి తెలియగానే తిట్లు, శాపనార్థాలూ. తొమ్మిదిలోనో, పదిలోనో ఉండగా, పాతపుస్తకాలాయన వద్ద మార్క్సూ, ఎంగెల్స్ లపై వాళ్ల మిత్రుల స్మృతుల పుస్తకం దిండులాంటిదే ఇంగ్లిష్ ది దొరికింది. అప్పటికి మార్క్స్ ఎవరో,  ఎంగెల్స్ ఎవరో తెలియదు. ఆ పుస్తకంలో చక్కని ఇలస్ట్రేషన్లు, ఫొటోలు ఉన్నాయి కనుక కొన్నాను అంతే.  జీవితపు అసలు రుచి చూపిన ఆ మహానుభావులు తొలిసారి అలా తారసపడ్డారు బొమ్మల పుణ్యమా అని. అయితే ఇలాంటి ‘పిచ్చి’ పుస్తకాలు ఎన్ని చదివినా పరీక్షలకు రెండు మూడు నెలల ముందు మాత్రం క్లాసు పుస్తకాలు దీక్షగా చదువుతూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండడం, ఏడు, పదిలో స్కూలు ఫస్ట్ రావడం, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఫస్ట్ క్లాసులో పాసవడంతో ఆ తిట్ల తీవ్రత తగ్గుతూ వచ్చేది.

తర్వాత రాజకీయాలు ముదిరి లెఫ్ట్ ను మించిన లెఫ్ట్ లో ‘పక్కదోవ’ పట్టాక బొమ్మల పిచ్చి మరింత ఎక్కువైంది.  ఎస్వీ యూనివర్సిటీలో కామర్స్ పీజీ చేస్తున్నప్పుడు నా చిత్రలోకం పెద్దదైంది. స్కాలర్ల రిఫరెన్స్ విభాగంలోకి పగలు పీజీ వాళ్లను రానిచ్చేవాళ్లుకారు. అందుకే సాయంత్రం ఆరుకెళ్లి రాత్రి మూసేవరకు ఫైనార్ట్స్ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని. అప్పటికి అరకొరగా తెలిసిన డావిన్సీ, మైకెలాంజెలో, రాఫేల్, పికాసో, డాలీలు మరింత దగ్గరయ్యారు. కూర్బె, మిలే, డామీ వంటి రియలిస్టులు, మానే, మోనే వంటి ఇంప్రెషనిస్టులు, వాన్గో, గోగా, సెజాన్ వంటి పోస్ట్ ఇంప్రెషనిస్టులు, ఫావిస్టులు, క్యూబిస్టులు, డాడాయిస్టులు, సర్రియలిస్టులు, ఫ్యూచరిస్టులు, సోషల్ రియలిస్టులు.. నానాజాతి కళాకారులు దోస్తులయ్యారు. పనిపైన హైదరాబాద్ కు వచ్చినప్పుడు సండే మార్కెట్లో అందుబాటు ధరకొచ్చిన ఆర్ట్ పుస్తకాన్నల్లా కొనేవాడిని. అనంతపురం ఎస్కే వర్సిటీలో ఉంటున్నప్పుడు స్నేహితులను చూడ్డానికి బెంగళూరుకు వెళ్లేవాడిని. హైదరాబాద్ లో దొరకని పుస్తకాలు కనిపించేవి. సిగ్గు వదిలేసి డబ్బులడుక్కుని కొనేవాడిని.

తెలుగు సాహిత్యం చదువుకుంటూనే, బొమ్మలూ అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. అదొక ఒంటరి లోకం. కథలూ కాకరకాయలపై మాట్లాడుకోవడానికి బోలెడంత మంది. కానీ బొమ్మల గురించి మాట్లాడుకోవడానికి ఎవరున్నారు? పుస్తకాల్లో చూసిన ఇంప్రెషనిస్టుల చెట్లను, దృశ్యాలను వర్సిటీ ఆవరణలోని, అడవుల్లోని చెట్లతో, కొండలతో పోల్చుకుని వాటితో ముచ్చటించేవాడిని. చేతకాకున్నా ఉద్యమ పత్రికల కోసం ‘ఎర్ర’ బొమ్మలను వేసేవాడిని. చిత్రంగా అప్పుడు చూసిన చిత్రాలు, చదివిన ఆర్ట్ పుస్తకాలు దాదాపు అన్నీ పాశ్చాత్య కళవే. జపాన్, చైనాలవి ఉన్నా తక్కువే. భారతీయ కళవి అయితే రెండోమూడో. అవి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్, లలితకళల అకాడెమీ వాళ్లు వేసినవి. ఎస్కే వర్సిటీలోని తరిమెల నాగిరెడ్డి పుస్తకాల్లో ఆయన సంతకంతో చైనా చిత్రకళపై పుస్తకం కనిపించడం ఒక వింత.

‘పక్కదోవ’లో నడిచే ధైర్యం లేక ‘సరైన దారి’కి మళ్లాకా బొమ్మల పిచ్చి పోలేదు. తిండితిప్పలు మానేసి, వేల రూపాయలు అప్పులు చేసి ఆర్ట్ పుస్తకాలకు తగలేసిన సందర్భాలు అనేకం. ఒకప్పుడు నావద్ద నాలుగైదు వందల తెలుగు సాహిత్య పుస్తకాలు, ఐదో ఆరో ఆర్ట్ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ అంకెలు తారుమారయ్యాయి. ఊళ్లు మారడం వల్ల చాలా తెలుగు పుస్తకాలను లైబ్రరీలకు, మిత్రులకు ఇచ్చేశాను. ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు రెండు మూడువందలున్నాయి. వాటి మధ్యన తెలుగు పుస్తకాలు ఐదో పదో బిక్కుబిక్కుమంటున్నాయి.  కళపై, కళాకారులపై నేను రాసిన వ్యాసాలు, సొంతంగా అచ్చేసిన ‘పికాసో’, ‘డావిన్సీ’ పుస్తకాలు నా జ్ఞానానికో, అజ్ఞానానికో ఉదాహరణలు.

ఇప్పుడు.. అంటే సాహిత్యం, బొమ్మలూ పరిచయమై, అనుభవంలోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… నా సాహిత్య ప్రయాణం, కళాధ్యయనం కలసి సాగినట్టు అనిపిస్తోంది. బొమ్మల జోలికి వెళ్లకపోయుంటే సాహిత్యంలో నాకంటూ ఓ స్థానం దక్కేదేమోననిపిస్తోంది. అయినా చింతలేదు. మహా రచయితల పుస్తకాల్లోని సారాంశాలను మహాచిత్రకారుల బొమ్మల్లో పట్టుకోగల దారి నాకు ఆర్ట్ పుస్తకాలు చూపించాయి. సాహిత్యం చూపలేని నానా దేశాల, నానా జాతుల నిసర్గ సౌందర్యాన్ని అవి నాకు పరిచయం చేశాయి.

బొమ్మ రాతకంటే ముందు పుట్టింది. అది సర్వమానవాళి భాష. వెయ్యిపేజీల పుస్తకం చెప్పలేని భావాన్ని అది చక్కగా చెబుతుంది. ఒకవేళ బొమ్మ చెప్పలేని భావాన్ని చెప్పే పుస్తకం ఉంటేగింటే, దానికి బొమ్మ కూడా జతయితే ఇక అర్థం కానిదేమీ ఉండదు.

నింగికి, నేలకు మధ్య హద్దులు చెరిపేసిన ఫుజీ మంచుకొండ ముందు, వాగుపై వాలిన ఒంటరి చెట్టుపై కూచుని పిల్లనగోవి ఊదుతున్న హొకుసాయ్ జపాన్ కుర్రకుంకనూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రష్యన్ రాజకీయప్రవాసిని మాటలకందని ఆశ్చర్యానందంతో చూస్తున్న రెపిన్ మనుషులను, రోరిక్ కుంచెలో రంగులద్దుకుని మెరిపోయే హిమాలయాలను, హిమాలయాల పాదపీఠంలో పేదరికంతో మగ్గే, చలితో ముడుచుకుపోయే అమృతా షేర్గిల్ పల్లె పడచులను, కడుపుతీపిని, కడుపుకోతను గుండెలు చెదిరేలా చూపే క్యాథే కోల్విజ్ జర్మన్ తల్లులను, దేవుడంటూ ఒకడుంటే, అతనికంటే అద్భుతమైన కళాసృజన చేసిన ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారులను, ఆత్మలను ముఖాలపైకి తెచ్చుకుని చీకట్లో కాంతిపుంజాల్లా తొంగిచూసే రెంబ్రాంత్ డచ్చి జనాన్ని,  కళ్లు తిప్పనీయని ప్రాచీన గ్రీకు శిల్పాలు, నమ్మశక్యంకాని ఈజిప్ట్ పిరిమిడ్లు, స్తంభాలు, పురాతన ఉద్వేగాలను అంటిపెట్టుకున్న ప్రీకొలంబియన్ కుండలను… ఇంకా ఎన్నింటినో ఆర్ట్ పుస్తకాలు నాకు పరిచయం చేశాయి. నా చేతులు పట్టుకుని ఆదిమానవులు ఎద్దుల, మేకల బొమ్మలు గీసిన లాక్సా గుహల దగ్గర్నుంచి నవనాగరిక ఇన్స్ స్టలేషన్ కర్రల, కడ్డీల ఆర్ట్ వరకు నడిపిస్తూ ఉన్నాయి.

                                                                                            -పి. మోహన్

P Mohan

 

కవుల కవి – ఇస్మాయిల్

ismayil painting rainbow

 
ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ. ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.

ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప

అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా

ఒక అడ్డుగీతా

ఒక నిలువు గీతా –

తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ

పైది ఆకాశమూ

కావొచ్చు.

సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది. నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ. తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత. అంతే అంతకు మించేమీ లేదు. ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు “నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం” అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు. కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది. అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది. అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “…… మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని – ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే” అని అంటారు.

చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి ఇస్మాయిల్ కవిత్వం నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు. కవికి అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట

సెలయేరా, సెలయేరా!

గలగలమంటో నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.

పాడకుంటే ఏలా?

లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది. సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి. మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి – మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు. బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత సాధారణమైన అనుభవం. కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది….. ఇలా…..

దాహం

వేసవి గాడ్పులకి

దాహపు ఖర్జూరచెట్టు

యెడారి గొంతులో

అమ్ములపొదిలా

విచ్చుకుని

గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు

గొంతు దిగుతోంటే

ఎంత హాయి//

యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.

ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి. ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం

బరువెక్కిన సూర్యుడు

బతకనీడు భూమిని

ఉదయమ్మొదలు

ఊపిరాడనీడు

సర్వాన్ని అదిమిపట్టి

వీర్యాన్ని విరజిమ్మాడు.

ఆకల్లాడదు.

ఏ కాకీ ఎగరని

ఏకాకి ఆకాశం.

ఇంతలో హటాత్తుగా

ఇలకు కలిగింది మబ్బుకడుపు.

వేవిళ్ళ గాలులు

వృక్షాగ్రాల్ని వూపాయి.

ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.

తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి. అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి. రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడు, మబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో “వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్ని” అంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో….

దినపు రేకలపైన వాలెను

ఇనుని సీతాకోకచిలుక//

గులక రాళ్ళ పిట్టలతో

కులుకు తరుశాఖ ఏరు//

వొంగిన సాయింత్రపు రంగుల ధనసు

విసిరే గాలి బాణం

పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.

వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.

శ్రావణ మంగళవారం

సాయంత్రం

ఒకానొక మబ్బు డస్టరు

అకస్మాత్తుగా ప్రవేశించి

భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ

పూర్తిగా తుడిచేసి,

మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి

వీధుల్లో కళ్ళనీ

రోడ్లపై పడెల్నీ

లోకంలో కాంతినీ

వెయ్యిపెట్టి గుణించేసి

చెయ్యూపి వెళ్ళిపోయింది///

ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!

స్వారీ

కళ్ళెం లేని గుర్రమెక్కి

పళ్ళు గిట్ట కరచి

ఏ శత్రు సంహారం కోసమో

వైచిత్ర సమరంలోకి

స్వారి చేసే యోధురాలామె.

మళ్ళీ, యుద్ధాంతాన

కళ్ళు తేలేసి

నిర్వికల్ప సమాధిలో

సర్వాంగాలూ స్తంభించే

యోగిని కూడాను.

ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం. అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.

చిగిర్చే చెట్లు

నడచివచ్చి నిశ్శబ్దంగా

నా కిటికీ దగ్గిరాగి

హటాత్తుగా

పటేలుమని

వంద వాయిద్యాలతో

వికసించిన బ్యాండుమేళంలా

ఒక రోజు

అకస్మాత్తుగా

చివురించిన చెట్టు

గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///

పై కవితలో చెట్టు చివురించటాన్ని “వందవాయిద్యాల బ్యాండుమేళం” అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి. వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా. అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు. చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.

పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ కవిత్వాన్ని వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు.

-బొల్లోజు బాబా

పిల్లలది కాదీ లోకం!

myspace

ఓ వందేళ్ల క్రితం హెమింగ్వే రాసేడు ఓ ఆరు పదాల కావ్యం. ఎప్పుడు గుర్తొచ్చినా కలవరపెట్టే రచన — For sale: baby shoes, never worn.  అమ్మకానికి పెట్టిన ఏదో చిన్నారి కోసం కొన్న బూట్లు, ఎన్నడూ వాడనివి. ఎంతో ప్రేమతో పుట్టబోయే బిడ్డకి తల్లిదండ్రులో, ఇంకెవరైనా ఆప్తులో కొన్న బూట్లు. అవి వాడకుండానే, ఆ బిడ్డ వెళ్లిపోయింది. లేదా, ఆ తల్లికి ఏదో అయివుంటుంది, బిడ్డ గర్భంలో వున్నపుడే. లేదా, ఏ హింసకో బలయ్యి వుండి వుంటుంది. బిడ్డ పోయినతర్వాత అమ్మకానికి పెట్టారంటే బహుశా కనిపించని పేదరికపు రక్కసి మింగేసి వుంటుంది.

గుజరాత్ లో అల్లరిమూకల కత్తులకు బలైన గర్భస్థ శిశువల గురించి విన్నపుడు, ముళ్ళపొదల మధ్య, చెత్త కుప్పలమీదకి విసిరివేయబడ్డ పిల్లలగురించి చదివినపుడు, బస్సు టైర్ల కింద, ట్రైన్ల కింద చనిపోతున్న పిల్లల గురించి విన్నపుడు, గాజా పిల్లల రోదన చూసినపుడు ఈ కధ గుర్తొస్తుంది. మొన్న పెషావర్లో ముష్కరుల బులెట్ల వర్షానికి బలైన పిల్లల్ని చూసి మళ్ళీ గుర్తొచ్చింది.    ఇంత శక్తివంతమైన కథారచన హెమింగ్వేలాటి వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యమవుతుంది! మహిళలపై అత్యాచారం చెయ్యడం యుధ్ధాల్లో బలమైన పక్షం చేసే పని. బోస్నియాలోనో, ఇరాక్ లోనో కాశ్మీర్ లోనో, శ్రీలంకలోనో – పోరాడే ప్రజల్ని భయపెట్టడానికి, వాళ్ళ స్థైర్యం దెబ్బతీయడానికి, వాళ్ళ అసహాయతని చూసి వెక్కిరంచడానికి ప్రపంచం నలుమూలలా సైన్యాలు చేసే పని అది.

యువకుల్ని ఎత్తుకుపోయి తల్లులకు క్షోభ మిగిల్చడం కూడా మరో ప్రధానమైన ఆయుధం.   తల్లుల మీద దాడి, పసిపిల్లల మీద దాడే. ఇక నేరుగా పిల్లలమీదే నేరుగా యుధ్ధాలు మొదలయ్యాయి. గాజాలో పిల్లలని కూడా చూడకుండా ఇజ్రాయిల్ ఎలా మిసైళ్లను ప్రయోగించిందో, బాంబులు వేసిందో చూశాం. స్కూళ్ళు, ఇళ్లు – వేటినీ వదలలేదు. మొన్నటికి మొన్న శ్రీలంకలో కూడా ఇలాటి దాడులు చూసేం. బులెట్లతో చిల్లులు పడ్డ ప్రభాకరన్ కొడుకు శవాన్ని చూసేం. ఇవి నేరుగా ప్రభుత్వాలు పిల్లలమీద జరిపే హింస.    ఇక పిల్లల మీద ఎక్కుపెట్టిన వ్యస్థీకృతమైన దాడులు, హింసా రూపాలు వర్ణనాతీతం. రక్తమాంసాలు, హృదయ స్పందనలుండే వాళ్ళుగా మనం వాళ్ళని అసలు చూడనే చూడం. వాళ్ళని మనుషులుగా చూసేవాళ్ళు అస్సలే లేరని కాదు. వాళ్ళు మైనారిటీ. మనకి తెలీకుండానే వాళ్ళ మీద చూపే క్రౌర్యం అంతా ఇంతా కాదు. హేళన, కసురుకోవడం, కొట్టడం, విసుక్కోవడం, సాంస్కృతిక దాడితో మనసుల్నీ మెదళ్ళనీ కలుషితం చెయ్యడం – ఎన్ని రకాల హింసలకి గురిచేస్తున్నాం వాళ్ళని.

విద్య పేరుతో, వైద్యం పేరుతో జరుగుతున్న హింసా రూపాలు ఇంకా ఘోరమైనవి. ఇవి ప్రాణాలైతే తియ్యవు కానీ, పీల్చి పిప్పి చేసెయ్యగలవు.

ఈమధ్య మా పాప ఆడుకుంటూ గోడ మూల తాకింది. నుదుటి మీద ఇంచిన్నర దెబ్బ తగిలింది. డాక్టరు చదువు చదివిన సతీశ్ చందర్ గారమ్మాయి first aid చేసి, హాస్పటల్లో చూపించమంది. నేనింటికి వెళ్ళేసరికి లేటయింది. అప్పుడు తీసుకెళ్ళాం హాస్పటల్ కి.

 

హాస్పటల్ నంబర్ 1

నర్స్ కట్టు విప్పుతుంటే  చూస్తున్న డాక్టర్, “రేప్పొద్దున్నే 5-6 గంటలకి వచ్చెయ్యండి, పదిహేను వేలు పట్టుకు. ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేస్తారు. లేకపోతే మచ్చ మిగిలిపోతుందని,” అన్నాడు.

మచ్చ మిగులుతుందా, మిగలదా అన్న మీమాంస నాకూ, నా సహచరికీ లేవు. రీ ఇంబర్స్ మెంట్ వుంటుంది కాబట్టి డబ్బులు సమస్యా కాదు. కానీ, ఆరేళ్ళ పాపకి అనవసరమైన ట్రౌమా అవసరమా?

ఆ ప్లాస్టిక్ సర్జన్ కి (హాస్పటల్ లోనే వున్నారు) చూపించకుండా, అభిప్రాయం కలుసుకోకుండా  ఈయన సర్జరీ అని డిసైడ్ చెయ్యడం మాకు ఇంకా ఆశర్యం కలిగించింది.

మా డాక్టరుకి చూపించి (సెకెండ్ ఒపీనియన్) వస్తాం పొద్దున్న అని బయటపడ్డాం.

 

హాస్పటల్ నంబర్ 2

పొద్దున్న, డాక్టర్:  “మీరు ఆరుగంటల లోపలే రావాలండీ. అయినా సాయంత్రం రండి మా సర్జన్ సర్జరీ చేస్తారు. ”

“మరి ఆరుగంటల లోపలే రాలేదని అన్నారు కదండీ,” నా సహచరి.

“చేస్తే ఆరుగంటల లోపల చెయ్యాలి. లేకపోతే ఎప్పుడు చేసినా ఒకటే,” డాక్టరు (మేజిక్ రియలిజం కాదు. నిజంగానే అన్నాడు.)

అంటూ, మా అనుమతి తీసుకోకుండానే సర్జన్ నంబర్ డయల్ చేసారు. (అదృష్టవశాత్తు ఆ నంబర్ కలవలేదు.) “ఇదిగో ఈ నంబర్ తీసుకుని ప్రయత్నించండి.”

(ఇద్దరు డాక్టర్లూ పేషెంట్ తో ఒక్క మాటా మాట్లాడలేదు)

 

హాస్పటల్ 3 (ఓ మిత్రుడి సలహాతో)

after making her comfortable by asking a few questions, కట్టు కొంచెం పైకెత్తి చూసి

“ఇది చాలా superficial దెబ్బ. చర్మం కిందికి పోలేదు. స్టిక్కర్లు వేస్తే సరిపోతుంది. మూడు రోజులకోసారి స్టిక్కర్ వేయించుకోండి,” అన్నారు ఆ సర్జన్.

నేను రిసెప్షన్ దగ్గరికెళ్ళి ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చేలోపలే స్టిక్కర్ వేసేసి మళ్ళీ థియేటర్ లోకి వెళ్ళిపోయాడాయన.

ఓ మూడు స్టిక్కర్లు వేసేరు. అంతే. ఇంకో స్టిక్కర్ వేస్తారా (దెబ్బ ఇంకా కొంచెం పచ్చిగా వుండడం చూసి) అని మేం అడిగినా కూడా వెయ్యనిరకరించారు.

రెండు వారాలపాటు దాని సంగతే మరిచిపోయాం. ఎందుకో గుర్తొచ్చి ఈరోజు చూసేను. ఎనబై శాతం దెబ్బ చర్మంలో కలిసిపోయింది. ఇంకాస్త కూడా కలిసిపోయేట్టే వుంది రెండు, మూడు వారాల్లో!

వైద్యం చేసి డబ్బు సంపాదించవచ్చు కానీ, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోసమే వైద్యం అనుకోవడం ఎంత అమానుషం! దెబ్బ దానంతట అదే చర్మంలో కలిసిపోతుందని తెలిసికూడా కాస్మోటిక్ సర్జరీలు చెయ్యడం ఎంత హింస.

పిల్లలనీ, వృద్దులనీ, డబ్బులు సమకూర్చుకోడం కష్టం కావచ్చని తెలిసి  కూడా చూడకుండా అనవసరంగా సూదులు గుచ్చేసి, కోసేసి సంపాదించకపోతే ఏం?

 

PS: స్టిక్కర్ వేయించుకుని బయటకి వస్తుంటే, ఓ ఫోన్ వచ్చింది: “I’ve got your reference from xyz. Are you trying to reach me?,” అని.

కాల్ ఎవరిదగ్గర నుంచీ అంటే, రెండో హాస్పటల్ లో సర్జరీ చెయ్యాల్సిన డాక్టర్!

ఏదో సినిమాలో డైలాగ్ ప్రేరణతో, “హల్లో, హల్లో, హెలో, హెలో,” అని అన్నాను.

-కూర్మనాధ్

మనోరమ, స్టోరీ ఆఫ్ మనోజ్ అండ్ రమణి

 story of manoj and ramani

సిటీలో కాస్ట్ లీ ఏరియాలో మినిమo ఛార్జీల్తో నడిచే మనోరమ రెస్టారెంట్ ఎప్పట్లాగే ఆరోజు సాయంత్రం  కూడా ఫుల్గా నిండిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ శబ్దాల్తో ఫస్ట్ ఫ్లోర్లో సప్లయర్ల వడ్డింపుల్తో ఆరువరుసల్లో ఉన్న 36 టేబుళ్ళు, మెయిన్రోడ్డువైపున్న ఏడోవరుసలో ఆరుజతల 12 కుర్చీల్తో మనోరమ అంత మనోహరంగా ఏంలే, ఏడోవరుసలో చివర్న అంతగా ఏ.సీ గాలి తగల్దని ఎవరూ కూర్చోడానికిష్టపడని టేబుల్దగ్గిర కూర్చున్నాన్నే ఏకాంతంకోసం అప్పటికే ఐపోయిన కాఫీని తాగలేక మరో కాఫీకి ఆర్డరిచ్చి,, నా ముందు టేబుల్మీద ఓ గడ్డమ్మనిషి, 30 ఉంటాయేమో, ఏదో రాసుకుంటూనో, గీసుకుంటూనో తదేకంగా అంత అల్లర్లోనూ, సప్లయర్ కృష్ణ మరో కాఫీ తెచ్చి నా టేబుల్మీదుంచి కోపంగానో చిరాగ్గానో చూసుంటాడేమోని పోల్చుకునేలోపు ఎప్పుడూ ఎక్కువగా మోగని నా ఫోన్రింగై.

(హలో, సార్నమస్తే, లేద్సార్, ఐపోతుంది, ఖచ్చితంగా ఐపోతుంద్సా, రేపు సాయంత్రంలోగా, నేనే మీకు ఫోన్చేస్తా అయ్యాకా, ఖచ్చితంగా, నిజంగా సార్, ఉంటాన్సా, అలాగే సార్, ష్యూర్ ష్యూర్.. )

మదర్టంగ్ కాకుండా వేరే భాషలో మాట్లాడినప్పుడు మనమెందుకో కొన్ని పదాల్ని రెండ్రెండు సార్లు పలుకుతాం.. ఓకే ఓకే, హెలో హెలో.. ఎందుకో..
ఖచ్చితత్వానికీ నిజానికీ ఎంతతేడా ఉంటుందో, నిజం 1 డైమెన్షనల్, ఖచ్చితత్వం 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ పదాలేమైనా ఉన్నాయా, ఉంటాయా, విస్తృతులు పదాలకా పదాల అర్ధాలకా, ఓర్నాయెనా, చాల్చాలిక ఆలోచన్లాగవ్ కాఫీ చల్లారినా, ఏంటీ ఎవరో అమ్మాయొస్తుందిటువేపు, ఇంత కార్నర్కి, నాకోసమొచ్చేవాళ్ళెవరూ లేరే, మే బీ, ముoదుటేబుల్మీద గడ్డం తాలూకాయేమో, హమ్మయ్య, హా గడ్డం తేబుల్దగ్గిరే కూర్చుందిగా, నా ఏకాంతాన్నెవరూ భగ్నించలేరెహే, ఏంటీ గడ్డం, అమ్మాయొచ్చికూర్చున్నా తలపైకెత్తి కూడా చూడకుండా ఏదో గీస్తున్నాడు, లవ్వా.. లవ్లో కోపమా, Love is a reciprocal torture అన్నది marcel proust ఏనా, చదవడమ్మానేసి చాలాకాలమైంది, ఛ, చదవాలి,  చదవాలన్నీ మరోసారి, Marquis de Sade “philosophy in the bedroom”, Gabriel García Márquez “memories of my melancholy whores”, Joseph Campbell “Hero with a thosand faces” చదవాల్చదవాల్చదవా…

అసలెందుకూ చదవడం, మెదడ్లో అనవసరంగా చెత్త పోగేస్కోడం కాకపోతే, అందరూ చెప్పేదదేగా..ఎవడి అనుభవాలు వాడిగ్గొప్ప. ఉహూ, చెప్పే విధానం గొప్పదోయ్, అందరూ రోజూవాడే పదాల్తో రాయడం మొదలెడ్తేగానీ రీడర్షిప్ పెరగదు ఏ భాషకైనా, ఊరికే తెచ్చిపెట్టుకున్న పటాటోపాలు కూల్చేసుకోవాలి ఎవడికివాడే కుదిర్తే..ఓసోస్, చాల్చాల్లే, నువ్వు చెయ్యవోయ్ ముందు, పతోడూ చెప్పేనాకొడుకే..
కాఫీఐపోతుంది, అసలు ఐపోకుండా ఉండేది ఏమైనా ఉందా, మనం బ్రతికే 60, 70 ఏళ్ళలో ఇది శాశ్వతం ఇది కాదు అని సిధ్దాంతాల్చేయడానికి మనకి బుధ్దుండాలి, సౌందర్యానికి వాలిడిటీ తక్కువ, మనుషుల్ని పురుగుల్లా చూసిన నీషేని కాఫ్కానే మనమెక్కువగా గుర్తుపెట్టుకుంటాం, తిట్టుకుంటూఐనా సరే, మనకు సొంత బుర్రల్లేకుండా చేసేది మన చాదస్తపు పెంపకాలే, రేపటి భయానికి దేవుడున్నాడంటే నమ్ముతాంగానీ దయ్యాల్లేవంటాం, న్యూటన్ని మర్చిపోతామిక్కడ, for every action there is an equal and opposite reaction అని.. ఏమాలోచిస్తున్నానేనసలు, ఛైన్ రియాక్షన్, ఒక న్యూట్రాన్ యురానియాన్ని గుద్ది మూడు న్యూట్రాన్లై, మళ్లీ ఒక్కోటీ ఒక్కో యురాన్నియాన్ని గుద్ది మరో మూడు న్యూట్రాన్లై, ఎక్కడ ఆక్కుండా ఎవ్వర్నీ అడక్కుండా ఆలోచన్లు.. మనవైన ఆలోచన్లు, నాదిర్దీన నాదిర్దీన నాదిర్దీ న, Nadir to zenith.. మురుగదాసా, స్టాలిన్ స్టోరీ ఇదేగా,

ఉమ్మ్ హ..హా..42.7% మత్తు వాసన..మొన్నటి వోడ్కా వొలికిన వాసనింకా గుబాళిస్తుంది షర్ట్ కాలర్ మీద,  స్మిర్నాఫ్ లో కాఫీ ఫ్లేవరొచ్చిందోటి, ఎంత బావుందో, ఇంటికి తీస్కెళ్ళాలి డబ్బులు మిగిల్తే..జీతం లేని జాబేదైనా ఉంటే అది తెలుగు సాహిత్యంలో అత్య”ద్భూ”త కృషి చేయడమేనేమో..ఐనా ఎందుకు రాస్తామో వెర్రిజనాలం కడుపులు కాల్చుకుని పెళ్ళాం పిల్లలని మాడ్చి..,

రేపు సాయంత్రంలోగా సార్వాడి పన్చేసి పెట్టాలి, ముందు టేబుల్మీది అమ్మాయిన్చూస్తుంటే ఇప్పుడే ఇంటికెళ్లాలన్లే, లైట్ పింక్ కలర్ సారీలో ,ఏంటో ఆ పర్ఫ్యూమ్.. టెంప్టేషనా, ఛ, ఎదవా, అమ్మాయికనపడ్తే కుక్కలా వాసన్చూసే అలవాటెప్పుడు పోద్దో, కనీసం కాసేపుండడానికైనా ఆ గడ్డంగాడేమైనా మాట్లాడ్తే బావుండు, పోనీ నేన్మాట్లాడ్తే, ఆపరొరేయ్, టెలుగు సిన్మా కాదిది, సరే

వెయిట్చేద్దాం ఏం మాట్లాడుకుంటారో విందాం, రాయి కరగకపోద్దా!! , ఇందాక మర్చిపోయా.. స్త్రీత్వమే 3 డైమెన్షనల్, అదొక్కటే,

మెల్లగా అల్లర్లు తగ్గాయ్ రెస్తారెంట్లో, నా ఫోన్లో టెంపుల్రన్ ఓ నాలుగుసార్లూ, డ్రాఫ్టెడ్ మెస్సేజెస్ ఓ రెండుసార్లూ చూస్కునేలోపు ఫోన్మోగింది, అమ్మాయి మాట్లాడబోతుందన్తెల్సి నా కుర్చీని మెల్లిగా వాళ్ళవైపు జరిపి కూర్చుని వీపుకి చెవులంటిoచుకున్నా..

-” (హెలో)”, ఏడుపు దాచుకున్న గొంతుతో, -“(హలో,ఇంకోసారి ఫోనెత్తను అన్చెప్పడానికే ఇప్పుడు కాల్ అటెండ్చేసా, you dont deserve me, you are such a filthy coward, i”ll never forgive you, never.. ఛస్తాని బెదిరిస్తున్నావా, ఛావ్పో)”

నిమిషం మౌనం, అమ్మాయేడుపు సన్నగా, గడ్డమింకా మాట్లాడకుండా ఏదో గీసుకుంటూనే, అంటే వాళ్ళిద్దరూ అపరిచితులా, అంతే అన్నట్టేగా, గడ్డమిప్పటికీ మాట్లాడట్లే, ఏడుప్పెంచిందమ్మాయ్, పక్కవరుసలో తలకాయలు కాసేపు తమ అమూల్య మైన గడియారప్పరుగుని ఈ తతంగానికి అర్పిoచి తిరిగి తమ కడుపులో పడుకున్నాయ్, గడ్డమిప్పటికీ ఉహూ.. జన్రల్గా ఇలాంటప్పుడు మగవెధవలంతా ఏడుస్తున్న అమ్మాయికి టిష్యూ పేపరూ, గట్టిభుజమూ ఇచ్చిఓదార్చి ఓదారి చూసుకుంటారు,

లాభంలే, కుర్చీనింకా తిప్పాలి, వాళ్ళిద్దరూ కన్పించేంతగానైనా, నేనెలాగూ కార్నర్లో కాబట్టి నా అత్యద్భుత విన్యాసం ఏవరూ గమనిoచే ప్రమాదం లేదు, చూసినా గాలి తగలక కుర్చీ తిప్పుకున్నాడనుకుంటారేమో, ఓ మూలనుంటే ఇన్ని సౌకర్యాలా, పీకల్దాకా కోపమొచ్చింది, గడ్డండ్గాడింకా గీసుకుంటూనే, అమ్మాయి ఏడుపులోంచి ఎక్కిళ్ళలోకొచ్చింది, టయానికి నీళ్లేవు నా దగ్గిర, ఇచ్చి కుర్చీనింకా దగ్గర చేసుకుందామంటే, ఎక్కిళ్ళ పౌనపున్యం నిమిషాల్లోంచి సెకండ్లలోకొచ్చాక, గడ్డం, కాయితమ్మడిచి బ్యాగ్లోంచి ఓపెన్చేయని వాటర్ బాటిల్తీసి తేబుల్మీదుంచాడు, రెండు గుక్కల్లో బాటిల్ని సగం శూన్యంతో నింపి ఆ అమ్మాయందిలా..

***

 

-” సారీ, మిమ్మల్నడక్కుండా మీ బాటిల్, ..”

“ఆఫర్చేస్తే తాగరేమోనని నేనే అడగలేదు, ఆర్యూ కంఫర్టబుల్ నౌ”

-“—————–”

“కాఫీ ఆర్డర్చేస్తున్నాను, మీకిష్టమైతేనే, ఏడుస్తున్నవాళ్ళని ఎందుకేడుస్తున్నారు అనడగడం ఎంత మూర్ఖత్వమో నాక్తెల్సు, .”

-“అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా, కాస్తాకలిగా….., ”

“కృష్ణా, రెండు కాఫీ, ఓ ఫ్రెంచ్ ఫ్రైస్, కాఫీ కాస్తాగి పంపించు” -“థాంక్యూ”

“రెగ్యులర్గా వొస్తుంటానిక్కడికి, మీరెప్పుడూ కన్పించలేదు నాకు”

-“ఫ్రెండ్ కోసం పక్క షాపింగ్మాల్లో ఎదురుచూస్తుంటే తనొచ్చేసరికి లేటౌతుందని తెల్సింది, కాసేపు కూర్చోడానికిక్కడికొచ్చా, రెస్టారెంటెప్పుడూ ఇంత రష్గా ఉంటుందా”

“వీక్ డేస్లో ఇలా, వీకెండ్లో ఐతే అసలు కాలుకూడా పెట్టలేం”

-“అవ్నా, మిమ్మల్నోటి అడగనా”

“యా, ష్యూర్, ”

-“ఇందాకట్నించి కాయితమీద ఏదో రాస్తున్నారు, పోయెట్రీ ఆ,”

“షిట్, కాదు, అది నా బిజినెస్ వర్క్, జనాలింకా పోయెట్రీ రాస్తున్నారా, అంత ఖాలీగా ఉంటున్నారా”

-“లేదూ, మీ గడ్డం కళ్ళద్దాలు చూసి..”

“చలికాలంగా, పగిల్న మొఖం కనపడకుండా గడ్డం పెంచా, ఫ్రెంచ్ ఫ్రైసొస్తుంది, తినండి, అయ్యాక కాఫీ చెప్తా”

-“డు యూ మైన్డ్ ఇఫ్ ఐ సే సంథింగ్, మీకు గడ్డం బావుంది, ఇంతకీ మీ బిజినె..”

“మీకేదో ఫోనొస్తున్నట్టుంది, మీకేనా..”

-“యా, (హెలొ.. డోoటెవర్ కాల్మీ, డోoట్ డోo డోo , ప్లీజ్, గో అవే ఫ్రం మి, ఆమ్ డన్, వరుణ్, ఆమ్ డన్ ఇన్ ఆల్ వేస్),” బీప్బీప్ బీప్ బీబ్బీబ్బీ ప్….. అయాంసారీ ఫర్ ఆల్ ది న్యూసెన్స్..”

” ——- ——”

-“కన్నీళ్ళెలా ఉంటాయో కూడా తెలీకుండా పెరిగాను, ఇప్పుడు నవ్వడమే మర్చిపోయాను, హ హ, సారీ అగైన్, నన్నొదిలేస్తే నా సోదంతా చెప్పేస్తాను,”

” ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంది, ఇంకేమైనా ఆర్డర్ చెయ్నా, గెస్ యూ ఆర్ హంగ్రీ”

-” —– ——- —–”

” పావుగంట క్రితం మీరెవరో కూడా నాక్తెలీదు, కాసేపట్లో మనం వెళ్ళిపోయాక మళ్ళీ కలుస్తామోలేదో కూడా తెలీదు, సో, మీరు మీలా ఉండలేనంత పరిచయం మనమధ్య ఇంకా పెరగనపుడే, మీరు మీలా ఉండండి, అట్లీస్ట్ బిహేవ్ యాజిఫ్ యూ వర్ యువర్సెల్ఫ్, ”

-“కుడ్ యూ ప్లీజ్ ఆర్డర్ సం చికెన్ సాండ్విచెస్ఫర్ మి, మీకాకలిగా లేదా,..”

“ఆకలేస్తుంది నాక్కూడా, ఐ విల్ గో విత్ ఎ బర్గర్, కృష్ణా రెండు చికెన్ సాండ్ విచెస్, ఒక చికెన్ బర్గర్, నార్మల్గా రెస్టారెంట్లో ఇలా అరవలేం, హ హ , ఇట్స్ అ కనెక్టింగ్ లింక్ బెట్వీన్ ది ఇరానీ కేఫ్ అండ్ ఎ సొఫిస్టికేటెడ్ రెస్టారంట్, ఆహ్, ఎక్స్ క్యూజ్ మి, గాట్ ఎ కాల్, వన్ మిన్, (హెలో, హా సంయు, ప్లీజ్ డోం క్రై, ప్లీజ్ సంయు, నో నీడ్ టు ఎక్స్ ప్లెయిన్ ది థింగ్స్ టు మి,నో నో నో, నథింగ్ లైక్ దట్, నెవర్ నెవర్ నెవర్, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావన్తెల్సు, సో, డోంట్ ఎవర్ బ్లేమ్ యువర్సెల్ఫ్, నువ్వు బావుండు చాలు, నేను బావుంటా.. టేక్కేర్, హా.. బై..)”

-“——– —- —-”

“———, ——–”

-” తను, మీ…”

” మై లవ్, ..”

-“మరేమైంది, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, ”

” — —- —– — ”

***

-” మీరే చెప్పారుగా, మీరు మీలా ఉండలేనంత పరిచయం మనమధ్య పెరక్కముందే మీరు మీలా ఉండండి, ఐ గాట్ ఎన్ ఐడియా, వై డోంట్ వి షేర్ అవర్ స్టోరీస్, మే బి, వి కన్ గెట్ సం రిలీఫ్..”

” హాఅహ్, ష్యూర్, నేనో ఆర్కిటెక్ట్, వర్కింగ్ ఇన్ ఎ ఎమ్మెన్సీ, ఛ, బర్గర్ బాలేదివాళ, సాండ్విచ్చెలా ఉంది బానేఉందా, ఓకే, తను సంయుక్త, పీడియాట్రీషియన్, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం , ఆరేళ్లయిందిప్పటికి, తనప్పుడు మెడిసిన్ చేస్తుంది, నేనపుడు ఎం.టెక్ చేసి జాబ్ ట్రయల్స్ లో ఉన్నా, కొన్నాళ్ళకి తెల్సింది, ఇది స్నేహం కాదని, తను ప్రేమేమో అంది, నాకూ అలాగే అన్పించింది, మూడేళ్ళక్రితం తనకి బెంగుళూర్లో పీడియాట్రిక్స్ సీట్ వొచ్చింది, నాకు బాంబేలో ఉద్యోగమొచ్చింది, రెండేళ్ళు గడిచాయ్, నాకు జాబ్ పర్మెనెంటై హైద్రాబాద్ కి ట్రాన్ఫర్ ఐంది, తను బెంగుళూర్లో పీ.జీ ఫైనలియర్లో ఉందపుడు,ఇక మా విషయం ఇంట్లో చెప్పేద్దామనుకున్నాం, ,”

-“వాళ్ళింట్లో ఒప్పుకోలేదా, తను ఇంట్లోవాళ్ళను బాధపెట్టడం ఇష్టంలేదని చెప్పిoదా, ఇదేగా అన్నిచోట్లా జరిగేది, సాండ్విచ్లో చికెన్ నిన్నటిదనుకుంటా, వాసనేస్తుంది కాస్త,”

“ఉహూ, సంయూ కి బెంగుళూర్లో తను చదూకునేచోటే ‘జై’ అని ఓ డాక్టర్ పరిచయమయ్యాడు, ఆ పరిచయం ఎప్పుడు స్నేహాన్ని నన్నూ మర్చిపోయి చాలాదూరం వెళ్ళేదాకా నాకూ చెప్పలేదెప్పుడూ, మే బి, తనక్తాను స్ట్రాంగ్ మైండెడ్ అనుకునుండొచ్చు, మే బి, తను ఇవన్నీ జరగవు అనుకునుండొచ్చు, కానీ జరిగాయ్, కాఫీ తాగండి చలార్తుంది, ఇక్కడ కాఫీ ఫేమస్,.”

-“యూ లవ్ హర్ స్టిల్?? తనమీద కోపంలేదా, కనీసం ఇదంతా మీకు తెల్సినప్పుడైనా బాధలేదా”

“నేను ఎవర్నైనా ప్రేమిoచగల్ను అనికూడా అనుకోలేదెపుడు, నేను తనని లవ్చేస్తున్నానని తనే నాకు చెప్పిoది, తను జై ని ఇష్టపడ్తున్నా అని కూడా తనే నాకు చెప్పింది, సిల్లీ గా ఉండొచ్చివన్నీ విన్డానికి, కానీ నిజం కంటే సిల్లీ థింగ్ మరోట్లేదు.. కోపమొచ్చింది, నా మీద నాకే, మేము ఫోన్లో స్కైప్లో మాట్లాడుకుంటున్నపుడు తనెన్నోసార్లు చెప్పేది జై గురిoచి ఇండైరెక్ట్ గా, ఇప్పుడు చాలా కోపమొస్తుoది నా మీద నాకే, బెంగుళూర్లో ఉన్నంతకాలం తనెంత మెంటల్ టెన్షన్ అనుభవించిందో తల్చుకుంటుంటే, నేనే కాస్త ముందుగా అర్ధంచేసుకుని తనకు దారివ్వాల్సింది, ఆమ్ ఎ ఫూల్,

బాధ లేకపోడమంటే గాయం మానడం కాదు, నొప్పిని భరించగల్గడం ”

-“మీరు సంయు ని మర్చిపోగల్రా, హావ్ యూ ఎవర్ ట్రైడ్,”

“మర్చిపోడానికి తను మనిషి కాదు, ఐనా ఎందుకూ మర్చిపోడం, ఎక్కడో ఓ చోట తిరిగి కలుస్తాంగా, ప్రపంచం మనం అనుకున్నంత పెద్దది కాదు, ఐనా మర్చిపోకుండా బ్రతకలేమా”

-“యెస్, యూ ఆర్ ఎ ఫూల్, సారీ టు సే దిస్, బట్ యూ ఆర్ ఎ ఫూల్, ప్రాణంగా ప్రేమిo చిన అమ్మాయి నిన్ను కాదని వేరేవాడ్తో వెళ్తే, ఆపలేని మీరు, నిజంగా,.”

“స్టాప్ ఇట్, పెళ్ళిచేస్కోడం ఎంతసేపు.. హా.. పెళ్ళయ్యాకా తనకు నేన్నచ్చకపోతే, సం హౌ షి ఈజ్ కంఫర్టబుల్ అండ్ కంపాటిబుల్ విత్ హిమ్, బెదిరిoచో ఏడ్చో వాడ్ని వొదిలెయ్యమని చెప్పడానికెంతసేపు, వి ఆర్ హ్యూమన్స్, నాట్ స్లేవ్స్, ఇప్పడిదాకా నువ్వెందుకేడ్చావ్ ఐతే, ఇందుకేనా,”

-” —— ———”

” డింట్ వాంట్ టు ఎంబ్రేస్ యూ, చెప్పాలన్పిస్తేనే చెప్పండి,”

-” అదేం లేదు, నేను హోటల్మేనేజ్మెంట్చేసి, మారియట్ లో వర్క్ చేస్తున్నా, రెoడేళ్ళక్రితం ఓ సిన్మా యూనిట్ షూటింగ్ కోసం హోటల్కొచ్చింది, అప్పుడు పరిచయమయ్యాడు వరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ సిన్మా మధ్యలోనే ఆగిపోయింది, కానీ మేమ్మాత్రం ఆపలేదు కలుసుకోడం, కొన్నాళ్ళకి నేను లాబీ మేనేజర్గా ప్రమోటయ్యాను, వరుణ్ స్క్రిప్ట్స్ పట్టుకుని ఫిల్మ్ నగర్లో తిరిగేవాడు, ఎంత బిజీగా ఉన్నా వీకెండ్స్ లో సిన్మాకో షాపింగో వెళ్ళేవాళ్ళం, ఆర్నెళ్ళలా గడిచాకవరుణ్ నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టాడు, సిన్మా ఛాన్సుల్లేక డిప్రెషన్లో ఉన్నాను ఇప్పుడు మాట్లాడళ్ళేను అనేవాడు, నేనూ గట్టిగా అడక్కపోయానపుడు, ఎంత కన్విన్సింగ్గా చెప్పినా ధైర్యం తెచ్చుకునేవాడుకాదు, విపరీతంగా తాగడం అలవాట్చేసుకున్నాడు, ఐ డౌట్, డ్రగ్స్ కూడా తీసుకునే ఉంటాడు, నా ఫోన్ కాల్స్ అటెండ్చేసేవాడు కాదు, వేరే ఫ్లాట్ కి మారాడు, మొదట్సారి నాకు వరుణ్మీద నమ్మకం పోయింది, ఇంట్లో ఏదో సంబంధం చూస్తే విరక్తితో ఒప్పేస్కున్నా, వొచ్చేనెల్లో నా పెళ్ళి, రెణ్ణెల్లక్రితం కాల్చేసాడు, ఏడ్చాడు, అప్పుడు డిప్రెషన్లో ఉండి నన్ను బాధపెట్టానన్నాడు, ఏవో 2 సిన్మా ఆఫర్లొచ్చాయన్నాడు, ఒక్కసారి కలవాలనుoదన్నాడు, ”

” నిన్ను రమ్మని ఫిజికల్గా ఏమైనా…”

-“నో నో, హి నెవర్ టచ్డ్ మి, కానీ నాతో టైమ్ స్పెండ్ చేయాలనుoదన్నాడు, రోజు విడిచి రోజు కలిసేవాళ్ళం, నా పరిస్థితెలా ఐoదoటే వరుణ్తో ఉండడమే జీవితం అనుకునేలా తయారయ్యా”

” వరుణ్కి నీ పెళ్ళి విషయం చెప్పావా”

-“చెప్పాకా తను నాకింకా దగ్గరయ్యాడు, ఉన్న కొద్ది టైమైనా పూర్తిగా నాతోనే ఉండాలనుంది అనేవాడు, నాతో మాట్లాడ్తూ చూస్తూ..నన్ను చేస్కోబోయేవాడి మొహం కూడా మర్చిపోయేంతగా వరుణ్ణన్ను మార్చేసాడు, అలా ఉండకూడదన్తెల్సు, కానీ ఉండలేకపోయేదాన్ని, సిగ్గువిడిచి ఒకరోజు వరుణ్ణడిగాను, నన్ను పెళ్ళి చేసుకుంటావా, ఇంట్లో చూసిన సంబంధం నాకిష్టం లేదని చెప్పేస్తానని’

” ఏమన్నాడు, ఎగిరి గంతేసాడా,”

-“థాంక్స్ టు హిం, ఆ రోజు వాడు మగాళ్ళమీద నాకున్న అనుమానాలన్నీ క్లియర్చేసాడు, కెరీర్ అన్నాడు, సిన్మా షూటింగ్ కోసం ముడ్నెల్లు కేరళ వెళ్ళాల్సొచ్చేట్టుందన్నాడు, ఇప్పుడు పెళ్ళిచేసుకుని నన్ను బాగా చూసుకోగల్ననే నమ్మకం లేదన్నాడు, కొన్నాళ్ళు వెయిట్చేయగలవా అన్నాడు, అల్టిమేట్గా నన్నొదిలిoచుకోవాలనుందని చెప్పకనే చెప్పాడు, ఎంతైనా సిన్మా కథల్రాసేవాడుగా”

” మరిoదాకా నువ్ ఫోన్లో మట్లాడిందంతా, ఎందుకేడ్చావసలు,”

-“వాడే ఫోన్చేసాడు, రియలైజ్ అయ్యాట్ట, నేనుంటే చాలట, కెరీర్ మెల్లిగా ప్లాన్చేసుకుంటాట్ట,.. కొందరు మగాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు గడపడానికి ఓ అమ్మాయ్ కావాలి, పెళ్ళి చేసుకునే ధైర్యముండదు, పైగా దానికి కెరీర్ అని పేరు పెట్టుకుని ముఖంలేక తిరుగుతుంటారు, బ్లడీ కవర్డ్స్, నాకిప్పుడు నేను చేస్కోబోయేవాడు చాలా గొప్పగా అన్పిస్తున్నాడు, ఎక్స్ క్యూజ్మీ,ఫ్రెండ్ ఫోన్చేస్తుంది,

(హలో, హా చెప్వే, పక్కనే ఉన్నా, మనోరమలో, నువ్వెక్కడ, షాపింగ్మాల్లోనే ఉండు, వొచ్చేస్తున్నా, ఫైవ్ మిన్)

పెళ్ళి షాపింకొచ్చా, వెళ్ళాలి, ఆమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ, మీ పేరు కూడా తెలీకుండానే ఇంతసేపు మాట్లాడాను, మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలీదు, ”

” అయాం మనో, మనోజ్, ”

-“నేను రమణి,..రమ..”

“ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్యువర్ ఫ్యూచర్, మనం మళ్ళీ కలవొద్దు, మనం మన్లాగే ఉందాం, ఏమంటారు”

-“అబ్సొల్యూట్లీ, మీకు నా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వనందుకు ఏం అనుకోరనే అనుకుంటున్నాను, హ హ, షల్ వి డిపార్ట్, బిల్ నేను పే చేస్తా..”

“నో నో, ది ప్లెజర్ ఈజ్ మైన్, నేన్చేస్తా, కృష్ణా బిల్ తీసుకురా,”

((సార్, మీ బిల్ పే చేసార్సా, ఇప్పుడే, రెణ్ణిమిషాలైంది, మీ వెనక టేబుల్లో కూర్చున్నతను, మీకు బాగా కావాల్సిన మనిషన్నాడే, అలాగే మీ ఇద్దరికీ థాంక్స్ చెప్పమన్నాడెందుకో))

అబ్బా.. ఇంకా తొమ్మిదిన్నరవలే, బస్సుల్తగ్గాయ్ రోడ్మీద, చలికాలం, మళ్ళీ ఆటో ఎక్కక తప్పేట్టులేదుగా, ఎడిటర్ గాడికి ఫోన్చేయాలిప్పుడే, పెగ్గేసి పడుకుంటాడ్లేపోతే, ఇవాళ బావుందెందుకో , మనోరమ, ఒక్కో మనిషికీ ఇలా ఒక్కో కథుంటే ఎన్ని వందల వేల కోట్ల కథలు కాలంలో కలిసిపోయాయో ఇన్నాళ్ళు,

***

“హలో, సార్నమస్తే, నేనే, ”

-“ఏంటయ్యా, పనైందా”

“హా, రఫ్గా రాసానొకటి, రేపు మద్యాహ్నం వరకిస్తా కంపోజింగ్ కి, ఆదివారానికింకా మూడ్రోజులుందిగా”

-” సర్లే.. ప్లాటేంటి, ”

“మనోరమ, స్టోరీ ఆఫ్ మనోజ్ అండ్ రమణి”

-“లవ్ స్టోరీ ఆ, ఎందుకయ్యా ఆ పిల్లకథలు, ”

“లేద్సార్ రియల్ స్టోరీ,”

-“పబ్లిష్ ఐతే మనకేం ప్రాబ్లం ఉండదుగా, రియల్ స్టోరీ అంటున్నావ్ మరి,”

“బొంగులే, సండే మాగజిన్స్ లో కథల్చదివి పరువునష్టాలకెవడు కోర్టుకెక్కుతాడు, ఏదొ స్పేస్ ఫిల్లింగ్ కోసం మేమేదో రాసూరుకుంటున్నాం,”

-“ఏవంటున్నావయ్యా, విన్పించి చావట్లా, ఇప్పుడూ, మళ్లీ మనకు లవ్ స్టోరీ అవసరమా అని”

“అయ్యో , లవ్ స్టోరీ కాదు సారిది, its not a love story, its a story about love..yeah sir, its story..about..love!”

-వంశీధర్ రెడ్డి

 

అయ్య యాది-2

ఉయ్యాల లూగింది యాద్లేదు నాకు

భుజాలమీదాడింది మర్శిపోనెన్నట్కి

కన్నదమ్మే గాని కంట్కి రెప్పోలె

కాపాడ్త్వి నువ్వు పుట్టినకాడ్నించి

 

అంగడ్కి బోతప్డు   ఆఠాణ అక్కకిచ్చి

అందర్కి బంచమని శెప్పిపోతుంట్వి

పొద్దూక పండ్లు దెచ్చి తలోటిచ్కుంట

ఏమేం జేశిర్రని ఎర్క దెల్సుకుంద్వు

 

బుర్రిగోనాడ్తనని  బుర్రి శెక్కియ్యమంటె

శిర్రెగోనంటరని ఎక్కిరిస్తుంటె

ఎహ్ పోయె ఏదోటి  శేషియ్యమంటె

యాప బుర్రి నువ్వు ఎమ్మటే ఇచ్చేది

 

మారెమ్మ బోనాలెల్లినంక  శెట్ల కింద్కి బోతె

పొద్దీకి బువ్వ దిన్కముందు కల్లు దాగ్తప్డు

రేక గాంగ మిగిల్న కమ్మతోటి  పీకె జేశిచ్చేది

పీకె ఊద్కుంట బువ్వకు బిల్శేది నిన్ను

 

శిన్నగున్నప్పుడె ఈత నేర్వాల్నన్జెప్పి లొట్టల కట్టనీప్కుగట్టి

పుట్టోన్బాయి మెట్ల మీన మొదల్బెట్టి

తర్వాత తాడ్తోని మోటర్దాకి రమ్మన్న యాది

ఎండకలామెప్డు ఈతక్బోయ్న గాడ్కి

 

గోటీలాటాడ్కుంట ఆకిట్ల అన్ననేన్గొట్కుంటే

శిన్న పెద్ద లేక నోట్కొచ్చింది దిట్కుంటె

అక్కలొద్ధంటుంటె ఐనినకుంట

ఇంటెన్క  ఇద్దర్ని కడ్కి గట్టేశి గొడ్దువు

 

రోజుకొక్కంగడి దిర్గుకుంట నువ్వు

మబ్బుల్నే లేశి మల్లెప్పుడొచ్చేదొ

సప్పుడైతుంటె సాయ్మాన్ల నీది

సప్పుడుగాకుంటొచ్చి పక్కపొంటి  గూసుంటుంటిమి

 

శెర్వు పెద్దది మనూర్ది  శాపలెక్వనుకుంట

పట్టరాదే నాకు పడయయ్యి అంటుంటె

ఉష్కె దొంతులూకెనె బడ్తయని శెప్కుంట

ఎర్రలను అంటించి గాలం శేతికిస్తుంటివి

 

బుడ్డవర్కలొద్దు మేం బువ్వ దిన్మంటె

శాపలయిపొయ్నయని శెర్వు లూటి బొయ్నంక

రవ్వలూ బొచ్చెలూ బొచ్చెడు బట్కొచ్చి

ముండ్లు  దీశి దిన్మని ముంద్ట బెడ్తుంట్వి

 

ఎండకాలమంత సల్లగుండె ఇల్లు

ఆనకాలమొస్తె ఆగమాగమైతుండె

ముసురు ఆనకె మనిల్లు మస్తు గురుస్తుంటె

పెంకలన్నీ సద్రి ఇల్లు మల్ల గప్పేది మేస్త్రివై

 

ఇర్వయేండ్లకె నిన్ను ఎద్రిస్తుంటే మేం

అర్వయేండ్లకొచ్చి ఐద్గురు బిడ్డల దండ్రైనగాని

ఎద్రుజెప్పలె మా అయ్యకేనాడని

తాత నీ ఎమ్మటి వడి  కట్టిశ్రి , కశ్రిచ్చిన ముచ్చట జెప్దువు

 

శేతులెంకకు బెట్టి ఒరం మీన బోతుంటె

ఎన్నడ్సూడ్నొల్లు గూడెర్కబడ్తుండ్రు నీ కొడ్కులని

నడ్సుడు నీతీర్గ, నవ్వుడూ నీలాగ

గడ్సుడే బర్వైంది ఇడ్శినప్పటి సంది

 

ఎప్పుడెద్గినమొ మేమెర్కనేలేదంట్వి

ఎద్గినొళ్ళను ఎక్వొద్ధులు సూస్కోనెపోత్వి

ఏండ్లేండ్లు నడ్సబట్టే  యాడ్కి బోయ్నవే నువ్వు

ఎన్నడేడ్వనొళ్ళనేడ్పిచ్చుకుంట……..

కూరెళ్ళ స్వామి

Kurella Swamy

రస్టికేషన్

chinnakatha‘రాం’ యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చాడు.చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కొత్త కళ విరిసింది.పెద్ద పండగ మళ్ళీ ఓ సారి మా తలుపు తట్టినట్లుంది. మా ఒంటరి జీవితాల్లో సందడి చేయడానికి వసంతం మళ్ళీ ఓ సారి సమాయత్తమైంది.

ఎన్నో యేళ్ళ నిరీక్షణ తర్వాత,మహతికి,నాకు పుట్టిన ముద్దు బిడ్డ,మా ఇంటి మహా దీపం రాం.వాడు మాకు లేక లేక కలిగినందువల్లనూ,ఈ భూభారం మరింత పెంచడం ఇష్టం లేక పోవడం మూలానా,మేము మరో ప్రాణికి జన్మనిచ్చే ప్రయత్నం చేయలేదు.అందువల్ల రాంని ఒకింత గారాబంగా పెంచామనే చెప్పాలి.వాడు చాలా సుతిమెత్తని స్వభావాన్ని స్వంతం చేసుకున్నాడు. వాడు పెరిగి పెద్దవుతున్నకొద్దీ అంతర్ముఖుడిగా మారిపోయాడు.

*

రోజులు హుషారుగా సినిమాలతోనూ,షికార్లతోనూ ఒకింత సంతోషంగా గడుస్తున్నాయి.ముగ్గురం కలిసి ఐనాక్స్ థియేటర్లో ‘మనం’ సినిమా చూశాము.కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు.మా ముగ్గురి గుండెలు ఆర్ధ్రమైనట్లు నాకనిపించింది.ముందుగానే ప్లాన్ చేసిన తిరుమల సందర్శన కూడా దిగ్విజయంగా ముగించాము.రోజులు క్షణాల్లా దొర్లిన తర్వాత,రాం తిరిగి వెళ్ళాల్సిన సమయమాసన్నమయ్యింది.కానీ వాడెందుకో ఉన్నట్లుండి మరింత ముభావంగా మారిపోయాడు.

వాడు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ‘ఆంగ్ల మరియు విదేశీ భాషల’ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా బోధన(ఇఎల్టి) విభాగంలో పరిశోధనా విద్యార్ధి.ఊరెళ్ళాల్సినరోజుదయం తను మాకంటే కొంచెం ముందు లేచి తయారవ్వవలసి ఉంది.నేను నిద్రనాపుకోలేని బలహీనుణ్ణి కాబట్టి,నన్ను తర్వాత లేపమని మహతికి ముందురోజు రాత్రే చెప్పి ఉంచాను.కానీ ఉదయమే నన్ను తను తట్టిలేపింది.”ఏమండీ రాం ఇంకా లేవలేదు.ఐదింటికే లేస్తానన్నాడు.మొబైల్లో అలారం కూడా ఆన్ చేసి ఉంచాడనుకుంటా.నేను వాడి గది తలుపు ఎంత గట్టిగా కొట్టినా లేవలేదు,వాడి మొబైల్ కు చేసినా రెస్పాన్స్ లేదు.నాకేంటో భయంగా ఉందండీ”అంది.నేను దిగ్గున లేచాను.ఇద్దరం వాడి రూం తలుపును “రాం,రాం” అంటూ అరుస్తూ గట్టిగా బాదాం.ఏ విధమైన స్పందనా లేదు.నా అనుమానం మరింత బలం పుంజుకుంది.ఎట్లాగో కష్టపడి తలుపు విరగ్గొట్టాం.లోపల మంచం మీద రాం అచేతనంగా పడి ఉన్నాడు.

“రాం లేవరా ఏమయ్యింది?”అంటూ వాణ్ణి పట్టుకు కుదిపాను.తోటకూర కాడలా పక్కకు వాలిపోయాడు.మహతి రోదించడం మొదలు పెట్టింది.నేను తెప్పరిల్లి,ఇద్దరం కలిసి కార్లో వాణ్ణెక్కించి అదృష్టవశాత్తూ దగ్గర్లోనే ఉన్న ‘కేర్’ ఆసుపత్రికి బయలుదేరాం.రాంను ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి క్షణమొక యుగంగా గడపసాగాం.గంటపోయాక డాక్టర్

“స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా మింగడం వల్ల ఇలా జరిగింది.మీరు తీసుకు రావడం ఇంకొంచెం ఆలశ్యమయ్యుంటే అతను బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది” అన్నాడు.నా మెదడొక్కసారిగా మొద్దుబారిపోయింది.డాక్టర్ ప్రాణాపాయం లేదని చెప్పడం వల్ల కొంత ఉపశమనం లభించింది.మహిత కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

*

కొన్నిరోజులు పోయాక రాంను ఇంటికి తీసుకు వచ్చాము.వాడు పునర్జన్మ పొందినట్లు నాకనిపించింది.ఐతే ఏదో అపరాధభావం తాలూకు ఛాయలు మా ముగ్గురి మొహాల్లో స్పష్టంగా తాండవిస్తున్నాయి.మహతికి,నాకు అసలు రాంతో ఏం మాట్లాడాలో,ఎలా మాట్లాడాలో అర్ధం కావటం లేదు.వాడు చదువుకునే యూనివర్సిటీలో సమస్యలున్నట్లు మాకెప్పుడూ చెప్పలేదు.వాడికి నాకంటే మహితో కొంచెమెక్కువ చనువుంది.ఆమెక్కూడా వాడేమీ చెప్పినట్లు లేడు.

నా ఆలోచనలు పరి పరి విధాలుగా పరిభ్రమిస్తున్నాయి.నేను పని చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా,బోధన,శిక్షణ విషయాల్లో సరైన దృష్టి,శ్రధ్ధ పెట్టలేక పోతున్నాను.మహిత తన ఆఫీసుకు సెలవు పెట్టి రాం దగ్గరే ఎక్కువగా ఉంటోది.వాడు మా ఇద్దరితో ముక్తసరిగా మాట్లాడుతున్నాడే కానీ,మనసు విప్పడం లేదు.ముగ్గురం ఎవరి స్థాయిలో వాళ్ళం విపరీతమైన మానసిక క్షోభననుభవిస్తూ ఉన్నాము.ఎక్కువగా రాంను కదిలిస్తే,అది ఈసారి ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని నేను మౌనంగా బాధపడుతున్నాను.

ఈ సంఘటన మా ఇద్దరి జీవితాల్లో ఓ పెద్ద కుదుపు.నేను మహిత అంత త్వరగా తిరిగి కోలుకోలేని పెద్ద దెబ్బ.మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో,వార్తా పత్రికల్లోనూ,యువకులు,యవతులు చిన్న,చిన్న విషయాలకు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం గురించి తెలుసుకోవడం,చదవడం పరిపాటే,కానీ అది మా ఇంట్లో జరగడం, రాం అందులో ఇన్వాల్వ్ కావడం మింగుడు పడడం లేదు.”మనమేం పాపం చేశామని ఇలా జరిగిందండి? మనవెవరికీ హాని చెసే వాళ్ళం కాదు.అలాంటిది మనకీ పరిస్థితేంటి?” మహిత నాతో అంది.”నాకూ అదే అర్ధం కావడం లేదు మహీ,ఒక వేళ మనిద్దరం మన ఉద్యోగపు బాధ్యతల్లో,కరియర్ నిర్మించుకునే తాపత్రయం వల్లా, వాడికి అత్యంత అవసరమైన లేలేత ప్రాయంలో రాంకు తగినంత సమయం కేటాయించలేదని,మన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదేమోనని నాకనిపిస్తూ ఉంది” అన్నాను.”నాతో కూడా వాడేమీ మాట్లాడడం లేదండి.ఆ విషయం కదిలిస్తే అది ఏ మలుపు తీసుకుంటోనని నాకు భయంగా ఉందండి”అంది.ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా తాండవిస్తూ ఉంది.ఆమె మళ్ళీ

“పిల్లవాణ్ణి చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉందండి.ఎవరో బాగా దిష్టి పెట్టినట్లున్నారు.లేకుంటే యూనివర్సిటీలో వీడంటే గిట్టని వాళ్ళు చాతబడిలాంటిదేమన్నా చేయించారేమో!”అంది.”లేదు మహీ,అక్కడ ఏదో జరిగింది,ఒక వేళ లవ్ ఫెయిల్యూర్ లాంటిదేమైనానా?”అనుమానం వ్యక్తపరిచాను.”సమస్య అది కాదేమోనండి.ఐనా అలాంటి విషయాలను ఎదుర్కోలేని అపరిపక్వత మనవాడిలో ఉందని నేననుకోవడం లేదు” అందామె.”ఐతే ఇప్పుడేం చేద్దాం? మహీ? అడిగాను “మీరోసారి హైద్రాబాద్ వెళ్ళి వస్తే బాగుంటుంది.మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా.అతనికి యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న బంధువున్నట్లు ఇదివరలో మీరు నాతో అన్నారు.ఓ సారి వెళ్ళివస్తే అసలు విషయమేంటో తెలుస్తుంది” అంది.

నాకీ ఆలోచన సమంజసంగానే తోచింది.ముందుగా హైద్రాబాద్లో నా ప్రియ మిత్రుడు ప్రవీణ్ ను కలిశాను.ఇద్దరం కలిసి మా వాడు చదివే యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అతని బంధువైన వనమాలిగారిని కలవడానికి బయలుదేరాము.ప్రవేశ ద్వారం దగ్గర చాలా మంది పోలీసులు హడావిడిగా కనిపించారు.మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.లోపల విద్యార్ధుల ఆందోళన జరుగుతూ ఉందని,ఈ రోజు లోపలికెళ్ళడం కుదరదని చెప్పారు.ప్రవీణ్ వనమాలికి ఫోన్ చేశాడు.ఆయన వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు.మమ్మల్ని ఆయన మేము కూర్చొని మాట్లాడుకోవడానికనువుగా ఉన్న ప్రశాంతమైన చోటికి తీసుకెళ్ళారు.పరిచయ కార్యక్రమం పూర్తయ్యింది.వనమాలి గారికి నలభై ఐదు యాభైకి మధ్యలో వయసుండవచ్చు.ఆయన కళ్ళు స్నేహభావం తొణికిసలాడుతూ చాలా ప్రశాంతంగా ఉన్నాయి.చూడటానికి మేధావిలాగున్నాడు.మా సంభాషణ మొదలయింది.

“మీ అబ్బాయి శ్రీరాం గురించి నాకు కొంతవరకు తెలుసు.తనేదో,తన లోకమేదో! ఐతే ఇక్కడ ఒక సమస్య ఉంది.అతను కలిసి తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది,కాంప్లికేటెడ్ విద్యార్ధులున్నారు.వాళ్ళు క్యాంపస్ లో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉంటారు.బ్లాక్లిస్టెడ్ కూడా”ప్రొఫెసర్ వనమాలి అన్నాడు.మళ్ళీ “ఈ మధ్యనే మెన్స్ మెస్ లో ఏదో గొడవ సృష్టించారు.నలుగురైదుగురు అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.ఆ సమయంలో అక్కడ మీ అబ్బాయి కూడా ఉన్నట్లున్నాడు.అడ్మినిస్ట్రేషన్ నలుగురైదుగురిని రస్టికేట్ చేసింది.అందులో శ్రీరాం కూడా ఒకడు”అన్నారు.”రస్టికేషన్!”అంటూ నేను నోరు తెరిచాను.రస్టికేషన్ అంటే తీవ్ర అభియోగాల కారణంగా విద్యార్ధుల్ని సస్పెండ్ చేసే చర్య. అంతలో ప్రవీణ్”అదొక్కటే సమస్య అయ్యుండదు.లోతుగా చూస్తే చాలా విషయాలు దాంతో ముడిపడి వుండవచ్చు” అన్నాడు.దానికి బదులుగా ప్రొఫెసర్ “అవును చాలా నాళ్ళుగా ఇక్కడ కుల,వర్గ,సామాజిక ఇంకా రక రకాల ఇతర విభేదాలు,గొడవలు జరుగుతున్నాయి.మరీ ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ ను యూనివర్సిటీగా మార్చిన తర్వాత అవి ఇంకా ఎక్కువయ్యాయి” అన్నాడు.”మరి వైస్ చాన్స్లర్ ఏమీ యాక్షన్ తీసుకోలేదా?” అడిగాను.అసలు విషయమంతా ఇక్కడే ఉంది.ఈ రస్టికేషన్ ఆయన తీసుకున్న చర్యే.దానికి బదులుగా విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే,విసీనే రస్టికేట్ చేయమని” అన్నాడు.”అది జరిగే పనేనా?” అడిగాను.దానికాయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు.తర్వాత “సార్ క్యాంపస్ లో వాతావరణం అంత ఆరోగ్యకరంగా లేదు.మీరు కావలసిన వాళ్ళు కాబట్టి,మీ అబ్బాయి సమస్యలో ఉన్నందున వివరాలు నాకు తెల్సినంతవరకు చెబుతున్నాను.

“ఇక్కడ చాలా రోజులుగా వర్గపోరాటం జరుగుతూ ఉంది.అసలు వివాదం విద్యార్ధుల్లోంచి పుట్టింది కాదు.వీళ్ళ వెనుక కొంతమంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది రెండు మూడు వర్గాలుగా చీలిపోయి,తమ మాట నెగ్గించుకోవడం కోసం,స్వార్ధం కోసం, వాళ్ళ గ్రూప్ కు చెందిన విద్యార్ధులను పావులుగా వాడుకుంటున్నారు”

“ఒక వర్గం వాళ్ళు అన్ని విషయాల్లో,అంటే వారి ఆహారపు అలవాట్ల దగ్గర్నుంచి,లైఫ్ స్టైల్ వరకు, పాశ్చాత్య ధోరణి కలిగి చాలా ఓపన్ గా సోషల్ గా ఉంటారు.మరొక వర్గం వీరికి భిన్నంగా,సాత్వికంగా కొంతవరకూ అంటీ ముట్టనట్లుంటారు.ఇక అటు,ఇటు కాని మూడో వర్గం తటస్థంగా ఉంటారు.ఘర్షణ,విభేదాలన్నీ మొదటి రెండు వర్గాల మధ్యనే.విద్యార్ధులు కూడా ఏదో ఒక వర్గంలో చేరిపోయి,వాళ్ళాడించినట్లు ఆడతారు.తమ భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరు” అన్నాడు.అంతలో ప్రవీణ్ “స్టూడెంట్సంటే అట్లనే ఉంటరు కదా!”అన్నాడు.వనమాలి మళ్ళీ “ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల ఎప్పుడూ కల్చర్ క్లాష్ నడుస్తూ ఉంటుంది.అదీ కాక కరప్షన్,ఆర్ధికపరమైన అవకతవకలు కూడా,ఈ నాటకంలోని భాగాలే.ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళు,కొందరు విద్యార్ధుల్ని ఎగదోసి,విధ్వంసం సృష్టించి,తద్వారా వీసీని తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు” అన్నాడు.

నాకు కొంత చిక్కుముడి వీడినట్లయ్యింది. “ఐతే ఇప్పుడేం చేద్దాం సార్? మా సమస్యకు పరిష్కారమేంటి?”వమాలిగారినడిగాను.ఆయన సెల్ తీసుకుని రెండు మూడు కాల్స్ చేశారు.ఓ పది నిమిషాల్లో ముగ్గురు విద్యార్ధులు వచ్చారు.నేనెవరో వాళ్ళకు తెలియదు.వాళ్ళతో ఆయన “ఇయల్టీలో రీసర్చ్ చెస్తున్న శ్రీరాం మీకు తెలుసా?”అడిగారు.అందులో ఇద్దరూ ఒకేసారి “అతను మాకు మంచి ఫ్రెండ్ సార్” అన్నారు. మూడో అతను అంగీకారసూచకంగా ఆయనకేసి చూశాడు.”ఐతే మొన్న మెన్స్ హాస్టల్లో జరిగిన సంఘటనలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందా?”అడిగారు.దానికి బదులుగా ఒకతను “అసలు లేదు సార్.శ్రీరాం చాలా రిజర్వెడ్ పర్సన్.ఎవరితో ఎక్కువ మాట్లాడడు,ఏ గొడవల్లోనూ తల దూర్చడు.ఆ సమయంలో అతనక్కడున్నాడంతే.గొడవ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు.కానీ వాళ్ళకి కొందరు ప్రొఫెసర్ల మద్దతు ఉంది.అందుకే వాళ్ళెవరినీ లెక్క చేయరు”అన్నాడు.అందుకు వనమాలి గారు”ఈ విషయాలు వీసీ గారితోనూ,మరేదైనా ఎంక్వైరీలోనూ అవసరమైతే చెపుతారా?”అన్నారు.అందుకు వాళ్ళు ముగ్గురూ సానుకూలంగా స్పందించారు.ఆయన వాళ్ళను పంపించేసి నాతో “మీరు రేపు రండి సార్.ఈ లోపల నేను మరిన్ని వివరాలు సేకరించి ఏంచెయ్యాలో ఆలోచిస్తాను” అంటూ నా చెయ్యి భరోసా ఇస్తున్నట్లు నొక్కారు. “నువ్వే ఏదో ఒకటి చేసి బాబునిందులోంచి బయటపడేయాలన్నా!” ప్రవీణ్ ఆయనతో అన్నాడు.ప్రొఫెసర్ గారు ధైర్యం చెపుతున్నట్లు చిన్నగా నవ్వారు.

వనమాలిగారికి కృతజ్ఞతలు చెప్పి,నేను,ప్రవీణ్ ఎక్సిట్ గేట్ వైపు నడవటం మొదలుపెట్టాము.గోడల మీద,రోడ్లపైన,స్లోగన్లు రాసున్నాయి.’రస్టికేట్ ది వీసీ అండ్ సేవ్ ది స్టూడెంట్స్ అని కొన్ని చోట్లా,’వెన్ దేర్ ఈజ్ కాస్ట్ దేరీజ్ అవుట్కాస్ట్’ అనీ ఇంకా రకరకాలుగా ఉన్నాయవి. యూనివర్సిటీ ఆవరణమంతా పచ్చటి చెట్లతో పూల మొక్కలతో నిండి ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది.లోపల ఉంటే మనం ఉన్నది ఒక మహా నగరంలోనేనా అన్న తలంపు కూడా కలిగింది.ఇలాంటి చోట అంతర్గత వాతావరణం మాత్రం విద్వేషాలతో,వర్గ తారతమ్యాలతో,గొడవలతో నిండి పోవడం అత్యంత విషాదకరమైన వైచిత్ర్యంగా నాకు తోచింది. బయటికొచ్చింతర్వాత మహితకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాను.ఆమె నిట్టూర్చడం నాకు స్పష్టంగా వినిపించింది. నా ఆలోచనలు ఒక్కసారి నా పాతరోజులను గుర్తు చేసుకున్నాయి.

నేను చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు,నాకెదురైన చేదు అనుభవం కళ్ళ ముందు మెదిలింది.నేను హాస్టల్లో ఉండేవాడిని.మేము మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు,వెనుకబడిన కులాల,దళిత విద్యార్ధుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.రాత్రి పూట ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే వాళ్ళు కూడా.ఈ గొడవలనదుపు చేయడానికి,కళాశాల యాజమాన్యం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది.దానిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు సమ్మెకు దిగారు.అది రోజు రోజుకూ ఉధృతమౌతూ ఉంది.ప్రిన్సిపల్,ఈ సమ్మెకు ముఖ్య కారకులని భావించి,కొంత మంది విద్యార్ధులను కాలేజి నుంచి సస్పెండ్ చేశారు.ఐతే అనూహ్యంగా అందులో నా పేరు కూడా ఉంది.నా పేరు చూసిన మా మిత్రులు నాతోబాటు నిర్ఘాంతపోయారు.నేనీ విషయం ఇంట్లో చెప్పలేదు.నోటీస్ బోర్డ్లోకి నా పేరు యెక్కింది.కొన్నిరోజులుపోయాక ఏమయ్యిందో గానీ సస్పెన్షన్ తొలగించారు.

చాలా రోజుల తర్వాత అసలు విషయం బయటకొచ్చింది.మా బ్యాచ్ లోనే,నా పేరుతో ఉన్న మెకానికల్ బ్రాంచుకు చెందిన ఒక కేరళనుంచి వచ్చిన విద్యార్ధి ఉన్నాడు.అతని మేనమామ మా కళాశాలలోనే ఫిజిక్స్ విభాగానికి అధిపతి.ఆ విద్యార్ధి గురించి మాకు బాగా తెలుసు.వాడు చాలా కోపిష్టి,ఎప్పుడూ గొడవల్లో తలమునకలుగా ఉండే వాడు.వాడు ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో ముఖ్యపాత్ర వహించాడు.వాణ్ణి రక్షించడానికి,నన్ను బలి మేకగా చేశారు.ఐతే నన్ను సస్పెండ్ చేసినందుకు కొంచెం బాధ కలిగిందే కానీ,అది నన్ను తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేయలేకపోయింది.నిజానికి మా గిండీ పాత మిత్రులం కలిసినప్పుడు,మేమందరం ఆ విషయాలను గుర్తు చేసుకుని మరీ నవ్వుకుంటాము.అనుభవం చేదుదే ఐనా అది ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది.ఐతే ఇప్పుడు శ్రీరాం స్పందన దానికి విరుధ్ధంగా ఉంది.అలాగే ఈ మధ్యనే,నా మిత్రుడొకరి కొడుకు,బెంగుళూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న వాడి మీద ర్యాగింగ్ అభియోగం మోపబడింది. అతను ఒక సంవత్సరం పాటు కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యాడు.ఆ అబ్బాయి నాకు చిన్నప్పటినుంచి పరిచయం.ఆ ఉదంతంలో నా మిత్రుడు,అతని కుటుంబం చాలా మానసిక వేదనననుభవించారు.ముఖ్యంగా నా మిత్రుని కొడుకు ఎంతో విలువైన ఒక అకడెమిక్ ఇయర్ కోల్పోయాడు.

*

ఆలోచనలు తెగి నేను వర్తమానంలోకొచ్చాను.యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు,శ్రీరాం తన ప్రాణాన్నే తీసుకునేంతగా స్పందిచడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ తరంలో చాలా మంది పిల్లలు చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు సిధ్ధపడుతున్నారు.తరాలు మారుతున్నాయి.వాటితోపాటే వివిధ రకాలైన,అవాంచనీయమైన అంతరాలు బాగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు,పిల్లల మధ్యన మానసిక దూరం కూడా ఎక్కువవుతున్నట్లు నాకనిపిస్తూ ఉంది.లోపం వ్యవస్థలోదో,లేక తల్లిదండ్రుల పెంపకంలోని బాధ్యతా రాహిత్యమో,మరేదైనానో,నా కర్ధం కావడం లేదు. అన్నిటికీ మించి శ్రీరాం మాతో ఈ విషయాలేమీ చెప్పకపోవడం అంతులేని నా మానసిక క్షోభకు కారణమయ్యింది.

మరుసటి రోజు నేను,ప్రవీణ్ వనమాలిగారిని కలిశాము.ఓ గంటపోయాక ఆయన నన్ను వీసీ గారి దగ్గరకు తీసుకెళ్ళాడు.నేను ఆయనకు శ్రీరాం ఎలాంటివాడో,వాడి నడవడిక,సున్నితత్వం తదితర విషయాల గురించి వివరించాను.ఆయన నేను చెప్పింది సావధానంగా విన్నారు.తర్వాత నన్ను కొన్ని ప్రశ్నలడిగారు.చివర్లో “మీకు న్యాయం జరుగుతుంది వెళ్ళండి”అన్నారు.నేను ప్రవీణ్ కు బై చెప్పి,ఒకింత ఆశావహ దృక్పధంతో మా వూరికి బయలుదేరాను.వారం రోజులు పోయాక వనమాలిగారు నాకు ఫోన్ చేశారు.శ్రీరాం మీద రస్టికేషన్ తొలగించబడిందనీ,తను రెండు మూడు రోజుల్లో తరగతులకు హాజరు కావచ్చనీ చెప్పాడు.నేనతనికి మెండుగా కృతజ్ఞతలు చెప్పి,త్వరలో శ్రీరాంను వెంటబెట్టుకు వస్తానని తెలియజేశాను.

ఈ సారి నేను,మహిత శ్రీరాంను యూనివర్సిటీలో దింపి రావడానికి కార్లో బయలుదేరాము.అంతకు రెండు రోజుల క్రితం వాడితో మనసు విప్పి మాట్లాడాము.ఇప్పుడు రాం కొంత ఓపన్ అయినట్లున్నాడు.యూనివర్సిటీలో జరిగిన విషయాల్లో తన ప్రమేయం లేదని,తనంటే అసూయ ఉన్న కొంత మంది విద్యార్ధులు తనని సమస్యల్లో నెట్టడానికి ప్రయత్నించారని, కొందరు ప్రొఫెసర్లక్కూడా తనంటే గిట్టదని, దాని పర్యవసానమే తన రస్టికేషన్ అని చెప్పాడు.ఆ విషయం ఇంట్లో చెపితే మేము అప్సెట్ అవుతామని,అందుకే మా నుంచి దాచానని అన్నాడు. మా సంభాషణ,తన ఆత్మహత్యా ప్రయత్నం గురించి మాట్లాడకుండానే ముగిసింది.అప్పటికే వాడి కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి.మా వ్యక్తిగత సమస్య పరిష్కారమయ్యింది.కానీ వివిధ విద్యాలయాల్లోని మురికిని ఎలా ఎవరు రస్టికేట్ చేస్తారోనని ఆలోచిస్తూ ఉండిపోయాను.మా కారు యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని సమీపిస్తోంది.కార్లోని రేడియోలోనుంచి సన్నగా ‘విద్యార్ధులు నవ సమాజ నిర్మాతలురా’ పాట వినబడుతోంది.

-శివ్

   shiv photo (1)

 

 విజయవాడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్న శివప్రసాద్ ఇప్పటి వరకూ అయిదు కథలు రాశారు.  సోమేపల్లి హనుమంతరావు గారి స్మృత్యర్ధం నిర్వహించిన చిన్న కధల పోటీలో ‘సాదృశ్యం’ అనే కధకు 2013 వ సంవత్సరంలో పురస్కారం అందుకున్నారు. సంగీతంటెన్నిస్ ఆడటంప్రయాణాలు చేయడం ఆయన అభిరుచులు.

గాయపడ్డ మనసులోంచి కరుణ -రసూల్ ఖాన్ “ఓడిన నేను” కవిత

ధిక్కా రం ,తిరస్కారం లాంటివి ప్రతిఫలించే అస్తిత్వోద్యమాలు తెలుగులో ఎన్నో కనిపిస్తాయి.మైనారిటీ వాద కవిత్వానికి,ఇతర అస్తిత్వ వాదాలకు మధ్య ఒక ప్రధాన వైరుధ్యముంది.దళిత, స్త్రీ వాదాలు ప్రాచీన సంప్రదాయాలమీద తిరుగుబాటుచేసాయి.అంతే కాలికంగా గతంపై ధిక్కారాన్ని ప్రకటించాయి.స్త్రీవాదం వర్తమాన భూమికపై ఉద్యమించినా ప్రధానంగా పైతృకసమాజం పై తిరస్కారాన్ని చూపింది. ఈ మార్గంలో చూస్తే ఈ సంఘర్షణ గతాన్ని తిరస్కరించేది.

మైనారిటీ కవిత్వం వర్తమానంలోని అంశంతో సంఘర్షణ పడుతుంది.ఒక దశలో ఈ సంఘర్షణ కారణాలతో విభేదించిన,ధిక్కరించిన వచనమూ లేకపోలేదు.ఇందులో గతితార్కికచర్చ వర్తమానంపై ఆధారపడింది. ఐ.ఏ.రీచర్డ్స్ కవిత్వంలో దృష్టి(Sense)భావన(Feeling)గొంతుక/స్వరం(Tone)బోధి(Intuition)గురించి చెప్పాడు. మైనారిటీ వాదానికి ఇతరాలకు మొదటి రెంటిలో సారూప్యతలున్నాయి. చివరి రెంటిలో ఈ కవిత్వం ప్రదర్శిస్తున్న అనుభవం వేరు. ఒక దశలో తీవ్రత,ధిక్కారం,అసహనం కలగలసిన వాక్యాలు అదేసమయంలో తన స్థితికి సంబంధించిన నిశ్చేష్ట కవిత్వంలో వ్యక్తమయ్యాయి. కొన్ని సార్లు తీవ్రతను ప్రదర్శించినా అనేకసార్లు కారుణ్యాత్మక వచనాన్ని సృజించింది.

ఈ మధ్య కాలపు కవిత్వాన్ని గమనిస్తే అస్తిత్వ వాదపు కవిత్వంలో కూడా ఒకానొక మానసిక ప్రాతినిధ్యం కనిపిస్తుంది. గతంలోని సంఘర్షణకు,ఈ కాలపు కవిత్వంలో కనిపించే సంఘర్షణకు మధ్యనున్న సున్నితమైన వ్యక్తీకరణను ఆతాలూకు గొంతును స్పష్టంగా గుర్తించవచ్చు. రసూల్ ఖాన్ చాలా రోజుల క్రితం “దువా”అనే పేరుతో తన కవిత్వాన్ని వెలువరించారు. ఈ మధ్యన తనురాసిన కవిత. ఒక సున్నితమైన సంవేదనతో మానసిక ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించింది. సంభాషణలా కనిపించే  వాక్యాల నిడివితో ఒక దీర్ఘనిశ్శబ్దాన్ని ఈ కవిత మోసింది.నిజానికి ఈ సంవేదన వెనుక కొన్ని సంవత్సరాల వేచిచూడటం,తన సౌభ్రాతృత్వం అసహనాలపాలవటం లాంటి బాధ కనిపిస్తుంది.

మాటల తూటాలను/ఒకదానిపై మరొకటి ఇటుకలుగా చేసి మోస్తున్నా/బుజాల భారం తప్ప మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను

మాటల తూటాలను మోయటం గతాన్ని చెప్పే స్థితి వాక్యం..ముస్లిం మైనారిటీ కవిత్వం ఒక పరిమితకాల గతాన్నించే తనగొంతును విప్పుకుంది.”బుజాల భారం తప్ప/మనసు లోతు బంధం అవలేక/రాళ్ళక్రింద నలుగుతూ నేను “లో తన వర్తమాన సంఘర్షణకు కారణాన్ని ప్రతిపాదిస్తున్నారు.రెండవవాక్యం లోనూ ఇదే సంవేదన ఉంది.కాని దానికి కొంత కళాత్మక వచనాన్ని జతచేసారు.

మనం అనుకొని చేసినదంతా/మన్నించరాని నేరంగా చూస్తూ అనుబంధాల తోటలోంచి/అమాంతంగా తోసేస్తూ ఒంటరి వాడిని చేసిన నాడు/సగం కాలిన చితిలా నేను

ఒక సంస్కృతిలో,చరిత్రలో భాగస్వామికావాలనుకోవడం.దాన్నుంచి ఒంటరితనాన్ననుభవించడం.”సగం కాలిన చితిలా నేను”అనటంలో వర్తమానానుభవం ధ్వనిస్తుంది.మనుషులలోని చిత్తశుద్ధిని శంకిస్తూ,తన స్థితిని చెప్పడంతో కవిత ముగిసింది.

అన్నీ తానై అల్లుకున్న గూడును/రాళ్ళతో పడగొట్టి నవ్వుతుంటే అమాయకంగా రోధించే పక్షిలా నేను/ఆత్మీయతకు అవసరానికి మధ్య/అనాధలా నేను .”

నిజానికి తన ఉనికిని, అస్తిత్వాన్ని వ్యక్తపరిచే స్పష్టమైన వచనాన్ని ఎక్కడా రాయలేదు.కాని వచనంలోని సంలగ్నసంబంధం,గొంతు అస్తిత్వాన్ని నిరాకరించిన స్వగతాన్ని చెబుతున్నాయి..నిజానికి పై ఉదాహరణలతోపాటు అనేకసార్లు కవిత్వంలో ఈ ఉనికి కనిపిస్తుంది. గతాన్ని, ఒకింత మతపరమైన వర్తమానాన్ని స్పర్శిస్తూ చేసిన వ్యాఖ్యలనుంచి గాయపడ్డ వచనం ఇందులో శక్తినిస్తుంది.

నిజానికి ఈ వచనంలోనుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. గతపు తరం చేసిన అంసాలనుంచి ఈ తరంఅనుభవిస్తున్న వ్యథకు ఈ కవిత అద్దం పట్టింది. బహుశ:వెదక గలిగితే ఈ సంవేదన మరికొందరిది కూడా.

                                                                                  –ఎం.నారాయణ శర్మ

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో...

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో…

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత సొంత అన్నయ్య ఉన్నప్పటికీ, అన్నయ్య అంటే ఆయనే అన్నంతగా మా ఇంట్లో మనిషి, నా హృదయంలో మనిషి, నా విశ్వాసాల మీదా విలువల మీదా ప్రభావం వేసిన మనిషి ఎన్ కె. ఆయన గురించి రాయడం, ఆయనను ఒకింత దూరంగా చూసి, పెట్టి, ఊహించి రాయడం కష్టం. కాని ముప్పై సంవత్సరాల కింద సాహిత్య సాంస్కృతిక రంగాలలో అత్యంత ప్రభావశీలంగా, సమ్మోహకంగా ఉండి, ఎందరినో ఉత్తేజపరచి, కాలక్రమంలో మరుసటి తరానికి దాదాపు తెలియకుండా పోయి, ఆయన ఎవరు అని అడిగే స్థితి వచ్చినందువల్ల ఆయన గురించి చెప్పాలి. ఆయన లేని, ఆయన పాట పాడని, ఆయన మాట్లాడని సభా సమావేశమూ లేని స్థితి నుంచి ఆయన పేరయినా విననివాళ్లు నిండుతున్న సభల రోజుల్లో ఆయన గురించి చెప్పాలి.

చాల శక్తిమంతుడైన కవి, శ్రోతల కంట తడి పెట్టించగల, ఆ కన్నీటిని నిప్పులుగా మార్చగల, నవరసాలనూ తన స్వరపేటికలోంచి పలికించడం మాత్రమే కాదు, శ్రోతల హృదయాల్లో మీటగల గాయకుడు, కార్యకర్త, స్నేహశీలి, ప్రేమాస్పదుడు, మనుషులను ప్రగాఢంగా, బహుశా ఆయన ప్రేమకు లక్ష్యమైనవాళ్లు ఇబ్బంది పడేటంతగా ప్రేమించినవాడు, కనీసం ఇరవై సంవత్సరాలు ఎందరినో ఆకర్షించిన ఉత్తేజకరమైన ప్రజాజీవితం గడిపి, అనేక వ్యక్తిగత, కౌటుంబిక, మానసిక, రాజకీయ కారణాలవల్ల మౌనంలోకి వెళ్లిపోయినవాడు, అక్కడినుంచి అనారోగ్యంలోకీ, చివరికి అకాలంగా మృత్యువులోకీ జారిపోయినవాడూ నెల్లుట్ల కోదండరామారావు (మార్చ్ 6, 1948 – డిసెంబర్ 27, 2014). ఎన్ కె గా సుప్రసిద్ధుడు.

NK Telangana song

ఆయన తండ్రి నెల్లుట్ల రామకృష్ణారావు వరంగల్ జిల్లా కూనూరులో భూస్వామ్య కుటుంబంలో పుట్టి, రామకృష్ణామాత్య పేరుతో 1940ల్లో మెత్తని కవిత్వం రాసినవాడు. తిరుపతి వెంకటకవులను ఎదిరించి కవిత్వం చెప్పినవాడు. “రొమ్ము విరిచి వచింతు విశ్వమ్మునందు ఆంధ్రభారతి మా ఇంటి ఆడపడుచు, ఎవడురా మా యమాత్యుల నీసడించి కలము నడిపెడి మొనగాడు తెలుగునేల” అని సవాలు చేసినవాడు. జాషువాను ఆహ్వానించి, స్వయంగా కాలికి గండపెండేరం తొడిగి, కుల సమాజం నుంచి ‘వెలి’కి గురయినవాడు. ఏ బలవత్తర కారణాలు తోసుకువచ్చాయో తెలియదు గాని, భార్య కేసమ్మనూ, పది పన్నెండు సంవత్సరాల పెద్ద కొడుకు జగన్మోహన రావునూ, రెండు సంవత్సరాలయినా నిండని చిన్న కొడుకు కోదండ రామారావునూ వదిలి ఎటో వెళ్లిపోయాడు. తండ్రి అట్లా ఎప్పటికీ కనిపించని శూన్యంలోకి మాయమయ్యాడనే దుఃఖం బహుశా ఎన్ కె జీవితమంతా వెంటాడింది. ఒకవేళ ఆ తండ్రి ఎక్కడన్నా ఎదురుపడినా ఎట్లా గుర్తుపడతాడు, ఊహతెలియని వయసులో తననుంచి దూరమైన కన్నతండ్రిని? అందుకే యవ్వనంలో రాసిన ఒక పద్యంలో “ఎప్పుడో నీవు అనుకోక ఎదురుపడిన నీటితెర నాకు అడ్డమ్ము నిలుచుననుచు కనుల కొలకుల కన్నీరు కదలనీను కోతపడకుండునా అంత గుండెతీపి కదలి రావయ్య రావయ్య కన్నతండ్రి” అని పద్యాలు రాసుకున్నాడు.

Amma Sparsha

అలా తండ్రి వెళిపోతే తల్లినీ అన్ననూ తననూ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించినవారు పెద్దమేనమామ దేవులపల్లి రామానుజరావు. ఆయన తెలంగాణ సాహిత్య వైతాళికులలో ఒకరు. ఆయన మాత్రమే కాదు, ఎన్ కె మేనమామలు అయిదుగురూ సాహిత్య జీవులే. అన్న జగన్ ప్రభుత్వోద్యోగి అయి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులలో ఒకరయి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథులలో ఒకరుగా నిలిచారు. ఆయన పదునైన కలానికి పెట్టింది పేరు. 1969 ఉద్యమ కాలంలో వరంగల్ నుంచి వెలువడిన కరపత్రాలలో అత్యధిక భాగం ఆయన రాసినవే. ఆయన ప్రభావంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండు వారాలు జైలు జీవితం కూడ గడిపిన ఎన్ కె ఆయన ప్రోద్బలంతోనే తెలంగాణ పతాక గీతం రాశాడు. ఎన్నో చోట్ల పాడాడు.

ఇలా తండ్రి, మేనమామలు, అన్న అందరికందరూ సామాజిక, సాహిత్య ప్రపంచంలోనే ఉన్నప్పుడు, ఒక పద్య శకలంలో తానే చెప్పుకున్నట్టు “తరతరాలుగ మా యింట నరనరాన కవిత ప్రవహించుచుండె రక్తమ్ము బోలి”.

ఈ సాధనకు, ప్రతిభకు తోడైనది 1969-70 వరంగల్ వాతావరణం. నక్సల్బరీ ప్రభావం శ్రీకాకుళ గిరిజనోద్యమం మీదుగా వరంగల్ గోదావరీతీర అరణ్యాలలోకి ప్రవేశించింది. కాకతీయ మెడికల్ కాలేజి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలు విప్లవ రాజకీయాలకూ, విద్యార్థి ఉద్యమాలకూ కేంద్రాలవుతున్నాయి. కాజీపేట క్రైస్తవ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి నుంచి వరంగల్ లో హోటల్ సర్వర్ గా ఉన్న జగదీశ్ వరకు విప్లవోద్యమ నిర్మాణానికి అజ్ఞాతవాసంలోకి వెళుతున్నారు. ఆజంజాహి మిల్స్, ఆర్టీసీ, రైల్వేలలో కార్మికోద్యమ సంచలనం మొదలవుతున్నది. అప్పుడు ఏర్పడిన చందా కాంతయ్య స్మారక కళాశాలలో అధ్యాపకుడిగా వరవరరావు వరంగల్ తిరిగివచ్చారు. ఆయనతో పాటు అధునిక సాహిత్యవేదిక సృజన వరంగల్ కు వచ్చింది.

Lal Bano cover

బంధుత్వం ఉండినప్పటికీ పరిచయంలేని వరవరరావును, ‘భళ్లున తెల్లవారునింక భయము లేదు’ అనే కవిత చదివినప్పటినుంచీ ఐదారేళ్లుగా అభిమానిస్తున్న వరవరరావును కలుసుకోవడానికి ఆయన ఇంటి ముందు నెలరోజులు పడిగాపులు పడ్డానని ఎన్ కె స్వయంగా రాసుకున్నాడు. మొత్తానికి అలా వరవరరావు సాన్నిహిత్యంలోకీ, సృజన లోకీ, విప్లవ రచయితల సంఘంలోకీ ప్రవేశించి రెండు దశాబ్దాల పాటు “చినబాపు చేతి చిటికెనవేలు పట్టుకుని ఎక్కడికంటే అక్కడికి నడిచినవాడి”గా మిత్రులు హాస్యాలాడేంత అవినాభావ మైత్రి ఆ ఇద్దరి మధ్య సాగింది. ఎన్ కె నే ఒకచోట చెప్పుకున్నట్టు “నాకు మా అమ్మ జన్మనిచ్చింది. మా పెద్దమామయ్య రామానుజరావు ఉద్యోగం యిప్పించి ఉపాధి కల్పించాడు. వరవరరావు సారు నాకు జ్ఞానం యిచ్చాడు. ఆయన నా సారథి, నా సఖుడు, నా బంధువు, నా బాంధవుడు, నా గురువు. ఆయనిచ్చిన జ్ఞానమే లేకుంటే నేను ఏనాడో భ్రష్టుపట్టి పోయేవాడ్ని”.

ఎన్ కె వరవరరావును కలిసేటప్పటికే ‘తిరుగబడు’ కవితాసంకలనం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, అప్పటికింకా పద్య రచనలో, కృష్ణశాస్త్రి, చలం వంటి ప్రభావాలలో ఉండడం వల్ల కావచ్చు, ఎన్ కె ‘తిరుగబడు’లో భాగం కాలేదు. కాని ఆ కాలం ఎంత వేగంగా చలనశీలంగా ఉండిందంటే, 1970 ఫిబ్రవరి శ్రీశ్రీ షష్టిపూర్తి నాటికి ‘తిరుగబడు’ కవుల్లో చేరని ఎన్ కె, ఆ తర్వాత మూడు నెలలకే సృజన మే 1970 ముఖపత్రం మీద అచ్చయిన ‘మేడే’ కవితతో ‘తిరుగబడు’ కవులకన్న తీవ్రతతో కవితాలోకంలోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత జూలై 3 న ‘అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించండి’ అని కరపత్రాలు పంచి, పోలీసు లాఠీ దెబ్బలు తిన్న యువకులలో ఉన్నాడు. విప్లవ రచయితల సంఘ స్థాపనలో భాగమయ్యాడు. ఆ చరిత్రాత్మక జూలై 4కు విడుదలైన ‘మార్చ్’ కవితాసంకలనంలో తన కవితలు మూడు ఉన్నాయి.

ఖమ్మంలో 1970 అక్టోబర్ లో జరిగిన విరసం మొదటి మహాసభల్లో ‘తూర్పు పవనం వీచెనోయ్’ పాడానని తానే రాసుకున్నాడు. అప్పటినుంచీ వేరు వేరు పేర్లతో శివసాగర్ రాస్తున్న పాటలన్నిటికీ ఏదో ఒక ట్యూన్ కట్టడం, పాడడం ఎన్ కె పనిగా మారిపోయింది. చెల్లీ చంద్రమ్మా, విప్పపూల చెట్ల సిగను, శత్రు చేజిక్కితినని, తోటారాముని తొడకు, మేరిమి కొండల్లో మెరిసింది మేఘమూ వంటి శివసాగర్ పాటలన్నీ లోకానికి తెలిసినది ఎన్ కె ట్యూన్లతోనే, చాలవరకు ఎన్ కె స్వరంలోనే. 1972 కు ముందు జననాట్యమండలి ఏర్పడకపోవడం, పూర్తి స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండకపోవడం, ఈ పాటలన్నీ సత్యమూర్తి రాసినవనే గౌరవం ఉండడం ఎంత కీలకమైనవో ఎన్ కె స్వరం, గాన శైలి, గానంలో నిమగ్నత అంత కీలకమైనవి. ముఖ్యంగా ఆయా పాటల ద్వారా శివసాగర్ ప్రకటించదలచిన, ప్రసారం చేయదలచిన భావోద్వేగాలను ఎన్ కె చాల శక్తిమంతంగా ప్రసారం చేసేవాడు. కరుణ, వీర రసాలు రెండూ ఎన్ కె గొంతులో అద్భుతంగా పలికేవి.

విరసం ఏర్పాటుకు ముందు నుంచే విప్లవకవిత్వం రాస్తున్న ఎన్ కె కవిత్వం ఆ తర్వాత మరింత పదునెక్కింది. మార్చ్, ఝంఝలను ప్రభుత్వం నిషేధించినప్పుడు “సత్యాన్ని చాటే పుస్తకాల్ని నిషేధించగలరు గాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తారు” అనే నాలుగు పాదాల కవితా ఖండికతో తన కవిత్వ శక్తిని ప్రకటించుకున్నాడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో స్వేచ్ఛ కోరుకుంటున్న బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, యాహ్యాఖాన్ సైనిక దుర్మార్గాలనూ, ఇందిరాగాంధీ విస్తరణ వాదాన్నీ విమర్శిస్తూ వెలువడిన ‘బంగ్లాదేశ్’ తెలుగు కవితా సంకలనానికి సంకనకర్త ఎన్ కె నే.

lal bano engఆ రోజుల్లోనే సొంత పాటలు కూడ రాయడం ప్రారంభించాడు. ‘కలలు మోసే అయ్య కదలి రావాల’ అంటూ అక్టోబర్ 1971లో రాసిన మొదటి పాటలో “ఏయె ఏయె సెల్లె వలయేయె సెల్లె వలయేయె సెల్లె/ వలలొ సేపల మాట వదిలేయె సెల్లె వదిలేయె సెల్లె/ బతుకు సుట్టూరుత బారి సంద్రమ్ము/ సల్లనీ నీళ్లతో సాగు సంద్రమ్ము/ నీటి కడుపులోన నీలాల నిప్పు/ నిప్పుతో మన కళ్లు యిప్పుకుందాము…” అని రాశాడు. విప్లవంలో స్త్రీల పాత్ర గురించి శివసాగర్ రాసిన ‘ఆకాశంలో సగం’ సృజన జనవరి 1975 సంచికలో వస్తే, ఆ ప్రభావంతో ఎన్ కె రాసిన ‘పోదాం కలిసీ’ పాట ఫిబ్రవరి సంచికలో వచ్చింది. “కళ్లు కళ్లు కలుసుకొని / చేసే బాసలు ఏముంటయి/ మనసూ మనసూ పరచుకొని/ చెప్పే ఊసులు ఏముంటయి/ ఉంటే ప్రాణం పోతే ప్రాణం/ కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం” అని రాశాడు. ఈలోగా, సికిందరాబాదు కుట్రకేసులో నిందితుడిగా వరవరరావు 1974 మేలో అరెస్టయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మొదలై సృజన ప్రచురణ ఆగిపోయేదాకా సమష్టిగా సంపాదక బాధ్యత నిర్వహించిన సాహితీమిత్రులు లో ప్రధాన బాధ్యత ఎన్ కె దే. అలా దాదాపు ఐదు సంవత్సరాలు వరంగల్ విప్లవోద్యమంలో, విప్లవ సాహిత్యోద్యమంలో ప్రధానంగా కనబడ్డాడు గనుకనే ఎమర్జెన్సీ విధించగానే అరెస్టు చేసిన మొదటి బృందంలో ఉన్నాడు.

ఎమర్జెన్సీలో జైలులో ఉండగా రాసిన ‘కామ్రేడ్ నాగరాజుకు’ అటు ఎన్ కె, ఇటు మరెందరో ఔత్సాహిక గాయకులు వేలాది సార్లు పాడి ఉంటారు. ఎమర్జెన్సీ ఎత్తివేసి, ప్రజాస్వామ్య వెల్లువ ప్రారంభమైన 1977 ఏప్రిల్ నుంచి 1985లో ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆట, పాట, మాట బంద్ అని అప్రకటిత నిషేధం విధించేదాకా ఆ పాట ప్రతి సభలోనూ మార్మోగేది. ”ఒకచేత్తో కన్నీరు తుడుచుకొనీ/ వేరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొనీ/ అంటాము మేము నాగరాజు/ గుండెలో మండేవు రాజుకొని రోజురోజు” అనే చరణంతో ప్రారంభమయ్యే ఈ పాట, “నిప్పురవ్వె దావానలమగును/ పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టి తీరును/ విజయానికి మైలురాయి త్యాగం/ చిందిన మన నెత్తురులో చివురు తొడుగు జనరాజ్యం”, “దూరాన తెరచాప అంచు/ క్రమించి నావతీరమాక్రమించు/ ఉదయించే తొలివెలుగుల తూర్పు/ ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటి గాడ్పు” అనే చిరస్మరణీయ చరణాలతో చివరికి “తెరచాపలు గాలిలోన ఆడుదాక/ ఆకాశం ఎర్రకాంతులీనుదాక/ ఉంటావు నువ్వు నాగరాజు/ నువు అమరుడివి అమరుడివి ఈ రోజు ఏ రోజూ” అని ముగుస్తుంది.

Lal Bano Kannada cover

‘పరిటాలా రాములూ’, ‘కంఠమ్ము ఎత్తవే’, ‘సరిదారి నీదైతే’, ఎర్రాటెన్నెల దేరో’, ‘ఎర్రజండాకె అయితివా’ వంటి పాటలు కూడ అంతగా జనాదరణ పొందినవే. వీటిలో ప్రత్యేకంగా ‘ఎర్రజెండాకె అయితివా’ గురించి చెప్పుకోవాలి. జన్ను చిన్నాలు వరంగల్ అంచులలోని పైడిపల్లి గ్రామానికి చెందిన పేద దళితుడు. కాకతీయ మెడికల్ కాలేజి లో మెస్ బాయ్ గా జీవితం ప్రారంభించి, విప్లవోద్యమ ప్రభావంలోకి వచ్చి, వరంగల్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగి 1979 నవంబర్ లో గూండాల చేత హత్యకు గురయ్యాడు. చిన్నాలుకు నాగరాజు పాట, అందులో “పడగ విప్పి ఉన్నాము పగను తీర్చుకుంటాము/ నీ నెత్తుటి అప్పును ఇక మానెత్తుట చెల్లిస్తం” అనే పాదాలు చాల ఇష్టం. ఎన్ కె కలిసినప్పుడల్లా పాడమని అడుగుతుండేవాడు. కొన్ని సార్లు ఏదో ఒక కారణంతో ఎన్ కె పాడేవాడు కాదు. చిన్నాలు హత్య తర్వాత రాసిన పాటలో ఎన్ కె “కండ్లల్లొ కండ్లను పెట్టి ఓ చిన్నాలన్నా/ కడుపుతీర సల్లగ నవ్వి/ చేతిలోకి చెయ్యి తీసుక/ చేతివేళ్లు ప్రేమగ దువ్వి/ పదము నువ్వు పాడమంటెను/ ఏదో ఓ వంకను జెప్పి/ అపుడు గాదు యిపుడంటెను/ ఇపుడు గాదు అపుడంటెను/అలిగలిగి నువ్వు పోతెను/ ఆపై నువ్వె వస్తవంటిని/ అయ్యో యిపుడెక్కడుంటివి/ నాగరాజు పాట పాడుతా/ పరిటాలా పదము పాడుతా/ ఏటికి ఎదురీత పాడుతా/ విలుకాని విల్లు ఎత్తుతా/ చెంద్రక్కా కథను సెప్పుతా/ అ అంటే అడవి గీతము/ ఆ అంటే ఆయుధమంటూ/ చారుబాబు సంగతి చెబుతా/ ఎత్తలేక గొంతు చచ్చినా/ నోటిపూత నెత్తురొచ్చినా/ పేగులన్ని పొర్లుకొచ్చినా/ ఏదడిగితే అదే పాడుతా/ ఒక్కసారి వచ్చి యినుమురా/ గద్దరన్న పాట పాడనా/ సికాకులం సీమ కొండనీ/ ప్రసాదన్న పాట పాడనా/ పదం గట్టి పాడాలంటూ/ నువ్వే ఓ పదమైతివా/ నువ్వే నా పాటైతివా/ నువ్వే నా బాటైతివా/ పోరాటం దరువైతివా/ ఇంకిపోని ఎరుపైతివా/ ఎర్ర్రజెండాకె అయితివా/ ఎర్రెర్రని జెండైతివా…” అని రాశాడు.

ఆ సమయంలో సృజన సాహితీమిత్రులు వారానికి ఒకసారి రెండుసార్లు కూడ సమావేశమై రచనల మీద చర్చించేవారు. కవిత్వం విషయంలోనూ, ఇతర రచనల విషయంలోనూ ప్రమాణాల మెరుగుదలకు ఎన్ కె చేసే దోహదం చాల ఉండేది.

వచనకవిత, పాట, వ్యాసం వంటి ప్రక్రియలన్నిటిలోనూ ప్రవేశించినా ఎన్ కె రచనలన్నిటిలోకీ శిఖరాయమానమైనది ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం’. ఆ దీర్ఘ కవిత గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది గనుక మళ్లీ ఇక్కడ అవసరం లేదు గాని, తెలుగులో అంత లోతైన, అంత విశాలమైన చారిత్రక, సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని అంత గొప్పగా కవితాత్మకంగా ఆవిష్కరించిన కవితలు అతి తక్కువ అని మాత్రం చెప్పాలి. అది సుదీర్ఘమైనదైనా, వచన కవిత అయినా, ఇద్దరు ముగ్గురు కూచుని చదువుకున్నప్పుడైనా, పది, ఇరవై వేల మంది ఉన్న సభలోనైనా ఎక్కడ చదివినా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నది. సంఘపరివార వాదనలకు తిరుగులేని జవాబులు చెప్పింది. ఒకసారి సృజనలో అచ్చు కావడం, రెండు సార్లు పుస్తకంగా పునర్ముద్రణ పొందడంతో పాటు, కవితా ఓ కవితా సంకలనంలో కూడ చేరింది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషానువాదాలు పుస్తకాలుగా వచ్చాయి. మోడీ పాలనలో పెరిగిపోతున్న సంఘపరివార్ దుర్మార్గాల నేపథ్యంలో ఇవాళ చదువుకుంటే తాజాగా, వర్తమానానికి అన్వయించేలా, అత్యవసరమైనదిగా ఉంటుంది.

Rehearsal coverరిహార్సల్, లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం తర్వాత సృజనలోనూ, అరుణతారలోనూ మరిన్ని కవితలు రాశాడు గాని అవి ఇంకా పుస్తక రూపం ధరించకముందే, ముందు చెప్పినట్టుగా వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఎన్ కె ను ఈ ప్రవాహం నుంచి తప్పించాయి. ఒడ్డు పట్టించాయి. అయినా ఆ మనిషిలో తడి ఆరలేదు. దేవులపల్లి అమర్, అజయ్ లు ప్రజాతంత్ర వారపత్రిక ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు కవితావ్యాఖ్యలు రాశాడు. తన జీవిత కథను కొంత విమర్శనాత్మకంగా, కొంత స్వీయ సానుభూతితో చూసుకుంటూ, అప్పటికీ తనకు వచన రచన రాదని చెప్పుకుంటూనే ‘అమ్మస్పర్శ’ అనే ఆత్మకథాత్మకమైన అనుభవాల గుచ్ఛం 2009లో ప్రచురించాడు.

దాదాపు మూడు సంవత్సరాలుగా పార్కిన్సన్ వంటి భౌతిక అనారోగ్యంతోనూ, సంచలనశీల క్రియాత్మక ప్రజా జీవితాన్ని గడిపి ఒంటరి అయిపోయిన మానసిక వేదనతోనూ తనలో తనే కుంగిపోయాడు. అది గుండెజబ్బుకు కూడ దారితీసింది. అయినా తేరుకుంటున్నాడు, మళ్లీ మనుషుల్లో పడతాడు అనుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 27 రాత్రి ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచాడు.

డిసెంబర్ 29 మధ్యాహ్నం మా అందరికీ ప్రాణసమానమైన ఆ కుమార్ పల్లి వీథిలో నేలమీద ఏడుకట్ల సవారీ మీద చివరినిద్రకు పడుకున్న అన్నయ్య శీతలదేహం తలమీద చివరిసారి నిమురుతున్నప్పుడు నాలుగు దశాబ్దాల అనుబంధం లోని వేలాది దృశ్యాలతో పాటు, ఆయన తండ్రి రామకృష్ణామాత్య రాసిన పద్యం గుర్తుకొచ్చింది.

“ఏ పొలాల్ వరి పోచలీనుచునున్నవో/పుడమియందలి నాదు పడక గాగ/ ఎవ్వారి బాహువుల్ ఎగయుచు నున్నవో/ నా యొడల్ కాటికి మోయు కొరకు/ ఏ వృక్షమున శాఖ లెదుగుచు నున్నవో/ క్షణమున నన్ను భస్మమ్ము జేయ/ ఏ స్థలం బీ భూమి యీక్షించుచున్నదో/ తనలోన నా బూది దాచుకొనగ/ ఎందరెందరు నా ముందు ఏగినారొ/ ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?”

 -ఎన్ వేణుగోపాల్   

ఎర్రటి ఎన్నియల్లో ఎన్‌కే

10410372_10152573024851700_6156636491804091071_n‘ఎన్‌కే మరణించారు..’ అని ఒక స్నేహితురాలు ఎస్ఎంఎస్ పెడితే ఆఫీసునుంచి వణికించే చలిలో తిరిగి వస్తున్న నా శరీరంలో వెచ్చని నెత్తురు ఎందుకు ప్రవహించింది? దేహాన్ని కోస్తున్న చలిగాలుల మధ్య ఒక వేడిగాలి ఎందుకు నన్ను చుట్టుముట్టింది? గుండెలో ఏదో కలుక్కుమన్న భావన ఎందుకు కలిగింది? అసలు నేనెవరు? ఆయనెవరు?

రోజూ చాలా మంది మరణిస్తుంటారు. పత్రిక పేజీలు తిప్పితే ఎక్కడో ఒక మూల మనకు పరిచయమైన వారి మరణాలు కనిపిస్తుంటూనే ఉంటాయి. శీతాకాలంలో పచ్చటి చెట్లపై మంచు పేరుకుపోయినట్లు, శిశిరంలో ఆకులు రాలినట్లు మనుషులు మరణిస్తుంటారు. కాలం సాగుతూనే ఉంటుంది.

‘ఎన్‌కే’ అనే నెల్లుట్ల కోదండ రామారావు మరణం సహజ మరణమే కావచ్చు. ఏడుపదుల వయస్సు దాటి, అనారోగ్య సమస్యలకు గురై, మంచం పట్టి అనేకమంది లాగా ఒకరోజు శ్వాసవదిలి పొందిన మరణంకావచ్చు. ‘మరణం చిరస్మరణీయమైనదే.. కాని బూడిదను పులుముకోవడం నాకిష్టం లేదు.’. అని మరణం గురించి ఒక కవితలో రాశాను. ఎన్‌కే మరణం చిరస్మరణీయమైనదే. కాని ఆయన చితాభస్మంలో కూడా రగులుతున్న నిప్పుకణాల్లో రేపటి జ్వాలలు కనిపిస్తాయి. ఎగరేసిన ఎర్రజెండ రెపరెపల ధ్వనులు వినిపిస్తాయి. 

కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకరోజు వరవరరావు నివాసంలో సాహితీ మిత్రుల సమావేశంలో ఎన్‌కేను చూశాను. ఆ గాంభీర్యం చూస్తే భయమేసింది. ఆ కరచాలనం గగుర్పాటు కలిగించింది. ఆయనది పూర్తిగా వికసించిన నవ్వు కాదు. అరవిరిసిన ఆ నవ్వులో కూడా ఒక సీరియస్‌నెస్ కనిపించింది. ఇక ఆయన గొంతెత్తి కవిత చదివినా, పాటపాడినా తనను తాను జ్వలింపచేసుకుంటున్నట్లే కనపడేవాడు. ఆయన అభిమానంగానే పలకరించేవాడు. కాని ఆ ఆభిమానంలో కూడా హత్తుకోలేనంత దూరం ఉండేది. 

ఆ రోజుల్లో చాలా మంది విప్లవాభిమానులు, విప్లవ రచయితలు అలాగే ఉండేవారు. వారితో మాట్లాడితే మనలో ఉడుకు నెత్తురు తనంతట తాను ప్రవహించేది. కరచాలనం చేస్తే విద్యుత్ తగిలి నరాలు ప్రకంపించేవి. వారి ఉపన్యాసాలు, కవితలు, పాటలు మైదానాల్ని, జనారణ్యాల్ని రగిలించేవి. రేపే విప్లవం వస్తుందని, మరి కొద్ది రోజుల్లో సమసమాజం ఏర్పడుతుందన్న వీరోత్సాహం కలిగేది. 

ఈ నేపథ్యంలోనే నాటి కవుల కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ వాటిని చదివితే నినాద ప్రాయంగా అనిపించవచ్చు. కాని వారు ఒక కవిత రాసిన వెంటనే అందులో వాక్యాలు గోడలపై నినాదాలుగా మారి, ప్రజల గొంతుల్లో ప్రతిధ్వనించేవని మనం ఈనాడు అర్థం చేసుకోగలమా? నగ్నంగా మండే ఆచ్చాదన లేని అగ్నిజ్నాలలు నాటి కవితలు. అది ఆనాటి సామాజిక అవసరం కావచ్చు. 

జననాట్యమండలి ఉనికిలో లేని రోజుల్లో ఎన్‌కె విప్లవగీతాలు రాసే వారు. తానే పాడేవారు. శివసాగర్ రాసిన అనేక పాటలను స్వరపరిచింది ఆయనే. ఆయన చెల్లీ చెంద్రమ్మ పాడితే విన్న ప్రతివాడికీ నెత్తురు మండేది. ‘కత్తి ఎత్తి ఒత్తి. పొత్తి కడుపులో గుచ్చి.’. అని ఆయన కసిగా అంటే మనమే ఆ భ్వూసామి గుండెలో కత్తి దించినట్లు భావించే వారం. మనమే ‘తోటరాములమై’ మన తొడకు తూటా తగిలిందని బాధపడేవారం. 

విద్యార్థులనుప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రచయితలను దిగంబర, విప్లవ కవిత్వాలు ప్రభావితం చేయకుండా ఉండలేని రోజుల్లో ఎన్‌కే సంచలించారు. వరంగల్‌లో వరవరరావు కరచాలనం చేసి ప్రకంపనలు పొంద కుండా ఉండలేని వారిలో ఒకరయ్యారు. విరసం సభ్యుడయ్యారు. సృజన సాహితీ మిత్రుడయ్యారు. అంతే. ఒక సాధారణ ప్రభుత్వోద్యోగిని విప్లవం ఆవహించింది. అయితే తిరుపతి వేంకటకవులను ఢీకొన్న తండ్రి నెల్లుట్ల రామకృష్ణ కవి, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాన్ని సాయుధం చేసిన దేవులపల్లి రామానుజరావు సోదరి అయిన తల్లి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల నాయకుడైన సోదరుడు జగన్మోహన్ రావు రక్తం ప్రవహించనిదే ఎన్‌కే కలం ఎలా చేపట్టగలరు?


‘తెగిపారిన నెత్తురులో ఎగరేసిన ఎర్రజెండ’ అని ఆయన మేడే పై రాసిన కవిత 1970లలోనే సృజన సంచిక కవర్ పేజీ కవితగా మారింది. అది మేడే నాడు గోడలపై ఎర్రగా మెరిసేది. ‘ఈ వ్యవస్థే ఒకజైలు.. నిర్బంధంలో ఉన్న నీకూ నాకూ తేడా లేదు.. కటకటాలను విరగదన్నుకురా.’.ఈ వ్యవస్థశిరస్సుపై ప్రజాశక్తి పాదాలతో బలంగా అడుగేయి. అని 71లో ఆయన రాసిన కవితా వాక్యాలు నాడు జనంలో శక్తిని నింపేవి. ‘నెత్తుటిలో తడిసిన చెయ్యి పైకెత్తు’ (1973) అని చెప్పినా అదొక ఉత్తేజం కలిగించేది. అలా అని ఎన్‌కే లాంటి కవులకు కవిత్వ ఒడుపు తెలియదని కాదు. కాని జనంలో ప్రవేశించడం కోసం వారు ఒడుపులకోసం పట్టువిడుపుల్ని ప్రదర్శించారు. 

‘అతడు మూసిన పిడి కిలి
శ్రామిక జన నియంతృత్వ స్థాపనకు ముఖద్వారం, 
అతని కదలిక, కదలికలో పొర్లుతున్న అలల కడలి, 
కదులుతున్న శ్వాస, 
పోరాటం బాటలమీదకు ఆహ్వానం రాస్తున్నవాడు, 
నీరు నింగి నేల గాలి తన ఊపిరి పోస్తున్నవాడు.
నాల్గు చెరగులా అంటుకున్న నిప్పు,
నాల్గు దిక్కులా వీస్తున్న తూర్పుగాలి’

అని ఉస్మానియాలో విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి మరణంపై 1974లో ఎన్‌కే రాసిన కవిత ప్రతి విప్లవకారుడికీ ఎనలేని ఉత్సాహాన్ని కలిగించేది. 

ఇవాళ ఒక్కో మరణం మనలో విషాదాన్ని, నిరుత్సాహాన్ని, నిర్వేదనను కలిగించవచ్చు. కాని ఆనాడు ప్రతి మరణంతో విప్లవకవి రగిలిపోయేవాడు. నెత్తుటి రుణాన్ని తీర్చుకుంటానని ప్రతిన చేసేవాడు. వరంగల్‌లో గణేశ్ అనే యువ ఉద్యమకారుడు మరణించినప్పుడు ఎన్‌కే ఈ కవిత రాశారు. 

‘కామ్రేడ్, ఏదో ఒక కొరత, 
ఏదో వెలితి, ఏదోకోత,
అయినా ఈ కళ్లమీద దుఃఖపు తెర దించుకోను, 
ఈ కోతను కత్తిలా వాడుకుంటాను,
ఈ కోతను కవచంలా తొడుక్కుంటాను, 
గుండె మీద కన్నీటి అంచు పెడుతున్న కసి పదును.’.

మరణిస్తామని అందరికీ తెలుసు. కాని పోరాడి మరణించడం అనేది ఒక ఆశయం, ఆకాంక్ష గా మారిన రోజులవి. ప్రతిపాటలోనూ, కవితలోనూ, పోరాడి మరణిద్దాం. మరణించినా అంతిమ విజయం మనదే.. అన్న ఆత్మ విశ్వాసం కనిపించేది. 

‘పోదాం కలిసి పోరాటానికి, వస్తావా నా వెంట
ప్రజలకోసమై ప్రాణం ఇద్దాం
ఉంటావా నా జంట.. 
కళ్లు కళ్లు కలుసుకుని చేసే బాసలు ఏముంటయి, 
మనసు మనసు పరుచుకుని చెప్పే ఊసులు ఏముంటయి
ఉంటే ప్రాణం, పోతే ప్రాణం
కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం'( పోదాం కలిసి 75 ఫిబ్రవరి)

అని ఎన్‌కే రాశారు. ఇదే పాటలో చరణాలు 
‘అడుగడుగూ రక్తం మడుగు, కమ్యూనిస్టులదే ముందడుగు.’. 
‘అలసిన కన్నుల అలజడి గుండెల జలగా పుట్టిన దే మంట.. 
కలసిన చేతుల కసిగా ముడిచిన పిడికిలి బిగింపులేమంట’

అన్న వాక్యాలు గోడలపై ధ్వనించి రాడికల్ విద్యార్థులకు ప్రేరణ కలిగించేవి. 


‘నీ దారిలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది. 
నీదారి రహదారి కాదు 
రహదారి కోసం దారి కాస్తున్న వాడివి నీవు'(రహదారి 78)

అని రాసిన ఎన్‌కే 

‘ఎర్రజెండా ఎత్తి,కూలిదండు గట్టి కదలి రారో.. ఎర్రాటెన్నెలదేరో'(79),
‘ఎర్రజెండేరోరన్నా, ఎర్రజెండేరో మన బతుకు బాటకు వెలుగుదారి ఎర్రజెండేరో'(74)
అన్న శక్తివంతమైన పాటలు రచించారు  వెన్నెల కూడా ఎర్రగా ఉండాలని కవి భావించిన రోజులవి. 

‘వెచ్చని జనం గుండెల్లోనే అచ్చమైన భద్రత ఉన్నది’. అని ఆయన 1980లో ‘భద్రత’ అనే కవితలో రాశారు. ‘బిగిసిన పిడికిట్లో తుపాకి ప్రతిహింసాధ్వానాల ప్రతిజ్ఞలు తీసుకుంటుంది.’. అని ఈ కవితలో రచించారంటే  నాటి మూడ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. 

ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత తర్వాత ఎన్‌కే 1981లో రగల్‌జెండా పేరిట మరో కవిత రాశారు. 

‘తడిసి తడిసి నెత్తురైన జెండా ఒకటి 
నీ సేద దీర్చి నీకు నీడపడుతుంది, 
ఆ జెండాదే అయిన సుదీర్ఘ పోరాట చరిత్ర 
ప్రేమతో నీ శిరస్సునెప్పుడూ ముద్దాడుతుంది’


కసి, కోపం, దుః«ఖం, ఆనందం, ప్రతిఘటన సహజలక్షణాలు. వాటిని కవిగా కాళోజీ కాపాడుకున్నారు. కాని ఆయనలో వర్గపోరాట చైతన్యం లేదు అని ఎన్‌కే నాడు విమర్శించారు. కాళోజీనే కాదు, సోమసుందరం, ఆరుద్ర, గంగినేని, దాశరథి లాంటి తెలంగాణ పోరాట కవుల్నీ తన సాహితీ విమర్శలో దుయ్యబట్టారు. నాడు కవిత్వమే కాదు, సాహితీ విమర్శ కూడా ఇదే ధోరణిలో సాగింది. 

ఎన్‌కే రాసిన అత్యంత శక్తివంతమైన, రాజకీయ సైద్దాంతిక ప్రేరణ కలిగిన కవిత ‘లాల్‌బనో గులామీ ఛోడో.’. 1982లో ఆయన రాసిన ఈ కవితకొక చారిత్రక సందర్భం కూడా ఉన్నది. 1980లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీ నుంచి విడివడి తనకంటూ ఒక రాజకీయ సైద్దాంతిక ఉనికికోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది. ఎమర్జెన్సీ తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత ప్రారంభమైన రోజులవి. ప్రత్యామ్నాయ పార్టీగా జనతా వైఫల్యం చెందడంతో బిజెపి ఒక రాజకీయ వేదికగా ముందుకు వచ్చింది. అప్పటికే ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించడం ప్రారంభించాయి. నక్సల్స్ విజృంభణతో అట్టుడికిపోయిన కొన్ని ప్రాబల్యం గల వర్గాలు రాడికల్ విద్యార్థి సంఘానికి ప్రత్యామ్నాయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను రంగంలోకి దించాయి. ఒక సైద్దాంతిక పోరు దేశవ్యాప్తంగా కళాశాలలు. యూనివర్సిటీల్లో ప్రారంభమైంది. జ్ఞానం శీలం ఏకత, పరిషత్‌కీ విశేషత.. అని గోడలపై నినాదాలు కనపడేవి. యూనివర్సిటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులూ చీలిపోయి కనపడేవారు. నాడు ఆ భావజాలాన్ని ఎన్‌కె ప్రతిభావంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. ఎబివిపి వారు ఉచ్చరించే పదాలనే వాడుకుని వారిని సైద్దాంతికంగా ఢీకొనేందుకు ప్రయత్నించారు. ఆరోజు ఎన్‌కే వేసిన ప్రశ్నలు ఈనాడూ విలువైనవే. నిజానికి ఆ రోజు సంస్కరణలు ప్రారంభం కాలేదు. సంస్కరణల తర్వాత కార్పొరైటీకరణ మరింత విస్తృతం అయింది. అందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు బలగాలు దోహదం చేశాయి. 

‘నేను నా మాతృభూమి గురించి మాట్లాడుతున్నాను 
నా దేశం రత్నగర్భ.. రత్నాలకోసం గర్భాన్ని చీల్చిందెవ్వరు?
అడవులు ఎవరి ఆస్తి, నదులు ఎవరి ఆస్తి.. 
అదిమ సమాజంపై అడవి రంకె ప్రకటించిందెవ్వడు?
ప్రశ్నించిందెవ్వడు?’


అని ఆయన ప్రశ్నించారు. 

‘వందేమాతరం మృతప్రాయమైన నినాదం కాదు, 
మత వాదంకాదు. జపించే భజన మంత్రం కాదు, 
అమ్మ ఒళ్లోనూ, అమెరికాను కలవరించే 
సామ్రాజ్యవాద దాసులు మీరు.’.

అని ఎన్‌కే రాసిన కవితా వాక్యాలు కాంగ్రెస్, బిజెపితో సహా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పలు పార్టీలకు వర్తిస్తాయి. 

‘నాకు స్వాతంత్య్రం రాలేదు.
నా దేశశృంఖలాలు ఈనాటికీ తెగిపోలేదు’.. 

అని ఎన్‌కే రాసిన వాక్యాలు ఇవాళ ప్రతి సామాన్యుడూ వేసుకునే పరిస్థితి ఏర్పడింది. నయా సామ్రాజ్యవాదాన్ని అధికారంలో ఉన్న వారే ప్రోత్సహిస్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు. 

మరి వీటికి జవాబేమిటి? మైదానాల్లో పోరాటాలు రక్తసిక్తమైనప్పుడు అడవి బిడ్డలే ప్రేరణ కలిగించారు. అందుకే ఎన్‌కే 

తేనె బతుకులో ఉప్పును, 
ఇప్పపూవులో నిప్పును చూడు
ఇవాళ ఆవులించి ఒళ్లు విరిచిన
ఆకాశంలో ఇంద్రవెల్లి పాలవెల్లి
అదిలాబాద్ నా కన్నతల్లి’

అని రాశారు. కాని ఇవాళ అడవుల్లో కూడా పోరాటం ఉధృతమైంది. జనం పిట్టల్లా కాలిపోతున్నారు. మైదానాలు మాత్రం ఆధునీకరణ వెలుగులతో జిగేల్ మంటున్నాయి. స్మార్ట్ సిటీలకోసం పరవశమవుతున్నాయి. ఎన్‌కే పిల్లలతో సహా మధ్యతరగతి జీవులంతా విదేశాలకోసం పరుగులు పెడుతున్నారు. సంస్కరణల విశ్వరూపం పారిన నెత్తురుపై ఆందమైన తివాచీని కప్పింది. 

ఎన్‌కే కవితలు, పాటలు ఒకానొక చారిత్రక సందర్భంలో రాసి ఉండవచ్చు. కాని అవి వృధా అయ్యాయా? చరిత్రలో మార్పు అనేది సుడులు, సుడులుగా తిరుగుతున్న వర్తులాకార చట్రం(స్పైరల్). వెనక్కు వెళ్లేది ఏదీ విస్తరించనిది కాదు. సామాజిక మార్పూ అలాంటిదే. ఈ మార్పుకు ఎన్‌కే లాంటి వాళ్లు ఎప్పుడూ దోహదం చేస్తూ ఉంటారు.  ఎన్ కే    రాసిన ‘రిహార్సల్’ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. 

-కృష్ణుడు   

‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

10801896_10152571579726700_7233801900523835577_n ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ ఒక కంఠస్వరం – వొక కవిది ….

“తోటా రాముని తొడకు కాటా తగిలిందాని

చిలుకా చీటీ తెచ్చెరా ఓ విలుకాడ ..”

శివసాగర్ పాట – గొప్ప ఉద్విగ్నత తో పాడుతున్నది – కళ్ళు మూసుకుని పూర్తిగా లీనమై – మూసిన కళ్ళ వెనుక తడి –

మధ్యలో “వాగూ వల వల యేడ్చెరా …” అనే చరణం పాడుతున్నప్పుడు తానే వాగై వల వల యేడుస్తూ .

పాట ప్రవహిస్తోంది –

“చెల్లెలా చెంద్రమ్మా …” అంటూ మరొక పాట శివసాగర్ దే మరింత ఉద్విగ్నతతో –  ఒక చరణం లో

“కత్తి యెత్తి వొత్తి పొత్తి కడుపులో గుచ్చి …”

భూస్వామి కడుపులో చెంద్రమ్మ గుచ్చిన కత్తి కసిని గొంతునిండా నింపుకొని పదునుగా ….

ఆ పాట కాగానే మరొకటి శివసాగర్ దే ….

“మేరిమి కొండల్లో మెరిసింది మేఘం …”

ఉద్యమాల్లో వెనుదిరుగక మునుముందుకే యెన్ని త్యాగాలకైనా సిద్ధమై పడవను నడిపే విప్లవకారుల నుద్దేశించిన పాట –   అట్లా వరుసగా పాడుతూనే ఉన్నారాయన! అలుపు లేదు – గొంతులో అదే ఉద్విగ్నత జీరగా – అరమోడ్పు కళ్ళ వెనుక అదే తడి – అదే ఆవేశం, అదే యెమోషన్ –

ఆయనే యెన్ కే. యెన్ కే పేరు తో కవిత్వం రాసి కవి గా ప్రసిద్దికెక్కిన అతని పూర్తి యెన్ కే రామారావు అని తర్వాత తెలిసింది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లాబ్ లో రసాయనాలతో పని చేసే ఆయన జీవిత సత్యాలని మానవ సంబంధాల రసాయనాలతో ప్రయోగాలు చేసి కనుక్కుని వచన కవిత్వం లోనూ పాటల్లోనూ అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా విరసం సమావేశాలకు, ఆయన వస్తాడు పాడతాడు అని, ఆశగా వెళ్ళేవాళ్ళం.

యెందుకంటే మాకు ఆ అవకాశం వేరే సందర్భాల్లో దొరికేది కాదు. ఆయన కనబడగానే యెన్ కే పాట పాడవా అని అడిగామో లేదో ఒక పక్క కూర్చుని కళ్ళు మూసుకుని పాడే వాడు. శివసాగర్ అగ్నాతంలోనుండి రాసి పంపే ప్రతి పాటకు బహుశా తనదైన ట్యూన్ కట్టి గొప్ప నిమగ్నతతో ఉద్విగ్నతతో పాడే వారు యెన్ కే. ఆయన కవిత్వం కూడా అంతే ఎమోషనల్ గా ఉండేది. ఆయన రాసిన పాటల్లోనూ తనదైన ఒక విశిష్టత – ముఖ్యంగా చిత్తూరు లో బూటకపు యెంకౌంటర్ లో పోలీసులచే హత్య చేయబడ్డ నాగరాజు గురించిన పాట

ఒక చేత్తో కన్నీరు తుడుచుకుని

వేరొక చేత్తో ఎర్ర జండ యెత్తుకుని

అంటాము మేము నాగరాజు

గుండెల మండేవు రాజుకుని రోజు రోజు

తెనాలి సభలో ... (జుగాష్ విలి సౌజన్యంతో)

తెనాలి సభలో …
(జుగాష్ విలి సౌజన్యంతో)

యిది యెన్ కే పాడుతుంటే వినడం ఒక అనుభవం. మొదటి సారి విన్నప్పుడే విపరీతంగా నచ్చేసి నాకు వచ్చీ రాని శ్రుతి లయ తాళాలతో పాడడానికి ప్రయత్నించే వాణ్ణి. ఈ పాట నాకూ నా సన్నిహిత మిత్రబృందం సుధాకిరణ్, ప్రకాష్ లకు చాలా యిష్టం కూడా! అట్లే మిత్ర (అమర్ ) కూడా బాగా యిష్టపడేవాడీ పాటను. నా ట్యూన్ మిత్ర నుండే నేర్చుకున్నా (యెన్ కే పాడే ట్యూన్ కొంచెం వేరని తెలుసు, కానీ నాకెప్పుడూ అది పట్టుబడలేదు – ఆ విషయం విమల (కవి) చెప్పే దాకా నాకు తెలియలేదు ).

దూరాన తెరచాప అంచు

క్రమించి నావ తీరమాక్రమించు

ఉదయించే తొలివెలుగుల తూర్పు

ఆర్పలేదు విప్లవాన్ని యే పడమటి గాడ్పు

తెరచాపలు గాలి లోన ఆడుదాక

ఆకాశం యెర్రకాంతులీనుదాక

అంటాము మేము నాగరాజు

నువ్వు అమరుడివీ అమరుడివీ యీ రోజూ యే రోజూ …

 

యెప్పుడు ఈ పాట గుర్తుకొచ్చినా, నాలో నేను పూర్తిగా పాడుకుని యెన్ కే నూ, విప్లవం లో అమరులైన వేలాది మందినీ గుర్తు తెచ్చుకోవడం నాకు అలవాటయిపోయింది. యింక ఆ యెన్ కే గొంతు యెన్నడూ వినబడదంటే చాలా దుఃఖంగా ఉంది. గొంతు కు శాశ్వతంగా యేదో అడ్డం పడ్డట్టుంది. గ్నాపకాలు తేనెటీగల్లా ఝుమ్మంటూ ముసురు కుంటున్నాయి.

గద్వాల విరసం సభ్లలో యెన్ కే ఒక్ అద్భుతం చేసారు. ఆ రోజుల్లో ప్రగతి శీల శక్తులపై యే బీ వీ పి, ఆర్ యెస్సె స్ శక్తుల దాడులు విపరీతంగా ఉండేవి. దాదాపు వారానికి రెండు మూడు సంఘటనలు జరిగేవి. చాలా మంది ఆర్ యెస్ యూ పీ డీ యెస్ యూ కార్యకర్తలు ఆ దాడుల్లో అమరులయ్యారు కూడా! హైదరాబాదు లో వరంగల్ లో చాలా గోడల మీద యే బీ వీ పి వాళ్ళు ‘లాల్ గులామీ ఛోడో బోలో వందే మాతరం’ అంటూ రాసేవారు . దేశభక్తి అంటే తమ స్వంత సొత్తు అయినట్టు వందేమాతరం పై తమదే హక్కు అన్నట్టు యే బీ వీ పీ కార్యకర్తలు ప్రవర్తించే వారు. దౌర్జన్యానికి పాల్పడేవారు. ప్రగతిశీల విద్యార్థులది విదేశీ సిద్దాంతమని వారి ప్రధాన ఆరోపణ! అట్లా మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా చరిత్రను వక్రీకరించి వీరవిహారం చేస్తున్న రోజుల్లో వారికి ధీటైన సరైన సమాధానం చెప్పడానికి మేమంతా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం’ అంటూ ఒక అద్భుతమైన దీర్ఘకావ్యాన్ని రాసారు యెన్ కే!

మొత్తంగా ప్రపంచ, భారత దేశ చరిత్రనూ, నాగరికతనూ కవిత్వాత్మకంగా చెప్తూ , జాతీయోద్యమ కాలంలో వందేమాతరం యెట్లా ఉద్భవించిందో అది యెట్లా ప్రగతిశీలమైందో సోదాహరణంగా వివరిస్తూ చాలా ఉద్విగ్నంగా అద్భుతంగా , ఒక్కొక్క కవితా చరణం ఒక గొప్ప నినాదమంత గొప్పగా (కవిత్వం నినాదప్రాయం అవుతుందనే వారు, ఒక చరణం నినాదం కావాలంటే యెంత గొప్ప కవిత్వం కావాలో మనకున్న గొప్ప నినాదాలని పరిశీలిస్తే అవగతమౌతుంది) మొత్తం దీర్ఘ కావ్యం సాగుతుంది. ఆ రోజుల్లో మాకు ఆ కావ్యం గొప్ప ఆయుధం. యెక్కడ మతోన్మాద శక్తులతో తలపడాల్సి వచ్చినా ఆ కావ్యం గొంతెత్తి బిగ్గరగా చదివేది. ఆ కావ్యానికి మా ప్రత్యర్థుల దగ్గర సమాధానం ఉండేది కాదు. అట్లా ఆర్ యెస్సె యెస్ యేబీ వీ పి శక్తుల ప్రాబల్యం చాలా బలంగా ఉన్న గద్వాల లో విరసం మహాసభలు జరిపింది.

చివరి రోజు జరిగిన మహా సభలో పాటలు, ఉపన్యాసాల మధ్య యెన్ కే ను ‘లాల్ బనో గులామీ చోడో ..’   చదవమన్నారు. యేకబిగిన ఒక అరగంట పాటు అరుదైన శైలితో, గొప్ప ఉద్విగత, ఆవేశమూ , తడి నిండిన తన గంభీర కంఠస్వరంతో యెన్ కే కావ్యాన్ని గానం చేసారు. వచన కావ్యమైన ‘లాల్ బనో …; ను లయబద్దంగా యెన్ కే చదువుతుంటే వినడం ఆ రోజు ఒక జీవితకాల అనుభవం! యిప్పటికీ యెప్పటికీ మర్చిపోలేని గొప్ప మహత్తర అనుభవం! దాదాపు పది వేల మందికి పైగా హాజరైన ఆ బహిరంగ సభ మొత్తం నిశ్శబ్దంగా పూర్తి నిమగ్నమై విన్నారా కావ్యాన్ని! అయిపోగానే కెరటాల చప్పుడులా కరతాళధ్వనులు! యెన్ కే ను మనసారా అభినందించి కౌగలించుకున్నాము – ఆ రోజునుండీ ప్రగతిశీల శక్తుల చేతుల్లో గొప్ప ఆయుధమైంది యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యం! మా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు యెన్ కే !

తర్వాత దాదాపు పదికి పైగా సభల్లో (నేను హాజరైనవి..) యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యాన్ని గానం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. అనేక ముద్రణలు పొందింది. పాపినేని శివశంకర్ సంకలనం చేసిన ‘కవితా ఓ కవితా ‘ లో చోటు సంపాదించుకుంది. మళ్ళీ మతతత్వ శక్తులు పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో యెన్ కే ‘లాల్ బనో …’ మళ్ళీ వెలుగు చూడాల్సిన అవసరం యింకా యెక్కువ ఉన్నది. ‘లాల్ బనో…’ కావ్యం ప్రగతిశీల శక్తుల అమ్ముల పొదిలో ఒక విలువైన బాణం.

యెన్ కే సృజన సాహితీ మిత్రుల్లో ఒకరనీ, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలూ, కవిత్వమూ అనేకం రాసారని తెలిసి ఆయన మీద గౌరవం పెరిగింది.తర్వాత ఆయనను యెక్కువ ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఆయన సమాచారం తెలుస్తూ ఉండేది. ఆయన కవిత్వం, పాటలు యెప్పుడూ గుండెల్లో మార్మోగుతూ ఉంటుంది. అద్భుతంగా అనేక పాటలని తన గొంతులో ప్రతిధ్వనించిన యెన్ కే అనారోగ్యం పాలయ్యారని, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసి చాలా బాధ కలిగింది. ఇవాళ్ళ యెన్ కే యింక మనకందనంత దూరం వెళ్ళిపోయారని తెలిసి హతాశుణ్ణయ్యాను. ఆయన కంఠస్వరం. కళ్ళలోనూ మనసులోనూ యెన్నడూ ఆరని తడి, గొప్ప ఆత్మీయతా , స్నేహస్వభావం యెన్నడూ మర్చిపోరానివీ, యెప్పుడూ వెన్నంటే ఉంటాయి.

-నారాయణస్వామి వెంకట యోగి

 

లాల్ సింగ్ కవిత్వం గరమ్ గరమ్ చాయ్!

lalsingh1

 

కవులు తమలోకంకి నిజలోకంకి వంతెనలు కట్టలేక  పిచ్చివాళ్ళు గా మారతారో లేదా, ప్రపంచం మీద పిచ్చి ప్రేమ వాళ్ళని కవులుగా చేస్తుందా అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అయితే దానికి పర్ఫెక్ట్  అన్సర్ పేరులోనే ఆకలి రక్తం రంగు పులుముకున్న మన  మనసు కవి  లాల్ సింగ్ దిల్ మాత్రమే .  “నేను అనుభవించిన సామాజిక అన్యాయం, మానసిక వేదన మరియు భౌతిక హింస అన్ని నా కవితలు భాగంగా మారాయి అంటూ తన కవితల గురించి చెప్పుకున్న లాల్ సింగ్ , మనిషిగా వియత్నాం లో చేయలేని మంచేదో  నక్సల్బరి ఉద్యమం నాకీ దేశంలోనే అందించింది అని ఉద్యమం గురించి కూడా గొప్పగానే రాసుకున్న పంజాబీగా చరిత్రలో నిలబడిపోతారు  .

 

తక్కువ కులాల కుటుంబం లో( చమార్ ) పుట్టి కాలేజి చదువులు వరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగానే కాదు అదే విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు గుండెల మీద చెయ్యి వేసుకొని ఇక్కడ నుండేదో జారిపోయిన ఫీలింగ్ అని అపురూపంగా మాట్లాడుకున్న  అందగాడై  ప్రేమ రూబాయిల రచయితగా పేరు తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే

(నిరాధారమయినది

అయినా ఒకే ఆలోచన ,

నాకు ఎప్పటికయినా మోక్షాన్ని

కలిగించేది నీ తల నూనేనెమో

: Forlorn, I contemplate

a single thought:

that your oiled hair

would bring me salvation. – )

lalsingh3

 

అంతే గాఢంగా ప్రేమించిన పెద్ద కులం (జాట్ ) అమ్మాయి తల్లి  ఇంటికి పిలిచి ఇచ్చిన టీ గ్లాసులు పట్టకారుతో నిప్పుల మీద కాల్చి శుద్ధి చేసుకున్న సంఘటనతో వణికిన మనసు పడ్డ వేదన అంతా అక్షరాల్లో రాసుకోగలగడం నిజంగా ఇంకో  ఎత్తు

(ఇక్కడ ఇతర గ్రహాల నివాసులు ఉంటే

ఎప్పటికి పెరగని రాళ్ళు గా మారిపోతారు ,

అదే జంతువులయితే ఈ మానవత్వం

తట్టుకోలేక భయంతో అరుస్తూ అడవుల్లోకి పరిగెడతాయి :

If the inhabitants of other planets

would learn of this

they would turn to stone

and never rise again

If animals were to

experience this

they would run to the forest

screaming in fear of humanity…)

 

అయితే బెణికిన మనసు గురించి రాసుకున్నా , వ్యవస్థ ఉలిక్కిపడే పదాలని వ్యక్తికరించి రాసుకున్నా , మొత్తానికి ప్రేమత్తుల భావనల నుండి  పదును లేని పదాల రోమాన్సుల నుండి పంజాబీ సాహిత్యాన్ని వీపు చరిచి ఆ భాష లో తన మాటలతో పుట్టించిన అగ్నికణాలు రగిలించిన మనిషి గా లాల్ సింగ్ దిల్  ఎప్పటికి గుర్తు ఉండిపోతాడు అంటూ తన కవితలు ఇంగ్లీష్ లోకి అనువదించిన నిరుపమ రాయ్ గారి మాటలు మాత్రం ఎప్పటికీ  అక్షర సత్యం .

 

పోతే , మనం తన రచనల్లో ముఖ్యమయిన sutluj Di Hawa (Breeze from the Sutlej) 1971; Bahut Sarey Suraj (So Many Suns) 1982; and Satthar (A Sheaf) 1997.  Naglok (The World of the Nāgas)  అంతే కాకుండా తన అటోబయోగ్రాఫి పుస్తకం  Dastaan ఇలా అన్ని చదువుకోలేకపోయినా  భారత దేశపు అతి పెద్ద దౌర్భాగ్యం అయిన కులవ్యవస్థ, ప్రపంచంలో మరెక్కడా లేకుండా అన్ని ప్రపంచపు మతాలన్నింటికీ   తనదయిన అసహ్యపు రంగునేదో ఎలా అద్దిందో చెప్పే Caste అనే  కవిత ఒకటి ,  అలాగే నక్సల్బరి ఉద్యమం మీద తన ప్రేమ ని ఒక ఒక విషాద సాయంత్రం గా అందించిన ‘The shades of Evening మాత్రం  తప్పక చదువుకోవాల్సిందే

 

Caste

 

You love me, do you?

Even though you belong

to another caste

But do you know

our elders do not

even cremate their dead

at the same place?

 

 

The shades of evening

 

The shades of evening

Are old once again

The pavements

Head for settlements

A lake walks

From an office

Thrown out of work

A lake is sucking

The thirst of water

Throwing off all wages

Someone is leaving

Someone comes wiping

On his dhoti

The blood of weak animals

On his goad

The shades of evening

Are old once again

Loaded with rebuke

The long caravan moves on

Along with the

Lengthening shadows of evening

 

ఇలా ఎంత చదువుకున్నా ఇంకా ఎంతో మిగిలిపోయే కవుల జీవితాలు , వాటి వెనక దాగున్న విషాదాలు  , చాయ్ వాలా లు ప్రధాని అయ్యారని మురుసుకొనే జనం మధ్యలో అదే జనం కోసం విప్లవోద్యమం లో పాల్గొన్న కవులు చివరి శ్వాసలలో చాయ్ వాలాలుగా  బ్రతకాల్సి వచ్చిన  ప్రజాస్వామ్యాపు అపహాస్య పరిస్తితులు , బహుశ మన దేశం లో ఎప్పటికయినా మారతాయి అని ఆశిస్తూ లాల్ సింగ్ దిల్ అక్షరాలకో లాల్ సలాంతో .

-నిశీధి

 

 

 

 

 

అవును! పుస్తకం కూడా ప్రేమిస్తుంది!

అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు గుడ్డి దీపమై దారి చూపింది పుస్తకమే. ఆశయాలలో ఆవేదనలో తోడై నిలిచి, పెను బాధ శరద్రాత్రి చలి లాగ హృదయాన్ని గడ్డ కట్టిస్తుంటే నులి వెచ్చని నిప్పు కణికల్లాంటి భావాలు మనసులో రాజేసింది పుస్తకమే. ఎదురు దెబ్బలు తిని అలిసి ఉన్న మనసుకు “సాంత్వన” అనే పదం యొక్క నిజ జీవిత అర్థం చెప్పింది పుస్తకమే.

పుస్తకాలకి నా జీవితం లో ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను చదివిన పుస్తకాలు లేకపోతే నేను లేను. నా వ్యక్తిత్వానికీ, నా భావాలకీ, నా అలోచనలకీ, అన్నిటికీ పుస్తకాలే ప్రేరణ. నా జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి సంఘటన నేను చదివిన ఏదో ఒక పుస్తకంలోని ఏదో ఒక సన్నివేశం తో రిలేట్ అవుతూ ఉంటుంది.

image1 నాకు చిన్నప్పటి నుంచి చదవడం ఒక వ్యసనం. అదీ ఇదీ అని లేదు, ఏది దొరికితే అది చదివేసేవాడిని. వారపత్రికలు మొదలు మా స్కూలు లైబ్రరీ, తిరువూరు లైబ్రరీ లో ఉన్న పుస్తకాలన్నీ దాదాపు చదివేసాను. కోలాహలం లక్ష్మణరావు, ధనికొండ హనుమంతరావు లాంటి వాళ్ళు అప్పట్లో బాగా రాసేవారు. ఇప్పటివాళ్ళకి వీళ్ళ పేర్లు కూడా తెలియవు అనుకోండి, అది వేరే సంగతి. 9th క్లాసు కి వచ్చే సరికే నేను చాలా ఫాస్ట్ రీడర్ ని (Fast Reader). పుస్తకం లో ఉన్నదంతా యధాతథంగా చదవడం టైం వేస్ట్ అనుకునేవాడిని. వర్ణనలు ఉపోద్ఘాతాలు పక్కన పడేసి సూటిగా కథ చదవడం అలవాటు అయ్యింది. డిటెక్టివ్ నవలలు రీడింగ్ హ్యాబిట్ పెంచడం లో బాగా ఉపయోగపడతాయి. మధుబాబు, గిరిజశ్రీ భగవాన్, జై భగవాన్ వంటి వాళ్లని బఠాణీలు నవిలినట్టు నవిలేశాను. రోజుకి కనీసం పది నవలలు. నేనే సొంతగా ఒక డిటెక్టివ్ నవల కూడా రాయడానికి ట్రై చేశా. నా డిటెక్టివ్ పేరు Turner. (వాడు enter అవ్వడం తోటే స్టోరీ Turn అయిపోతుందని ఆ పేరు పెట్టా).

ఇలా అనర్గళంగా సాగిపోతున్న నా పుస్తక భక్షణ కి మొదటిసారి అడ్డుకట్ట వేసిన వాడు చలం. అప్పట్లో చలం పుస్తకం కనపడగానే అందరూ మొహం చిట్లించుకునేవారు. 8th క్లాసు లో మొదటిసారి చలాన్ని చదివాను. మైదానం – సూటిగా కథ కోసం వెతుకుతూ, సంభాషణలు మాత్రమే చదవడం వల్ల ఆ పుస్తకం నాకు ఏమీ అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకోడానికి నేను తన్నుకుంటున్న సమయంలో మా నాన్న నా లోపాన్ని ఎత్తి చూపించారు. “రచయిత భావాలని చదవాలి రా. ఉత్త కథ మాత్రమే చదవడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు.” అని చెప్పారు. అప్పుడే మొదటిసారిగా ప్రతి రచయితా తన పుస్తకాల ద్వారా కొన్ని భావాలని ప్రతిపాదిస్తాడనీ, ఆ భావాలకి చాలా importance ఉందనీ తెలిసింది నాకు. అప్పటిదాకా నేను చదివింది అంతా కాలక్షేపం సాహిత్యమే అని కూడా అర్థమయిపోయింది. అప్పటినుంచే పుస్తకాన్ని జీవితానికి దగ్గరగా తీసుకోవడం మొదలుపెట్టాను.

నా జీవితం మీద బలమైన ప్రభావం చూపిన మొదటి పుస్తకం సోవియట్ పుస్తకం “తిమూర్ – అతని దళం”. సోవియట్ సాహిత్యం ఆదరణ బాగున్న రోజుల్లో మా ఊరికి విశాలాంధ్ర పుస్తకాల వ్యాన్ వచ్చేది. image2ఆ వ్యాన్ దగ్గర పాటలు పాడినందుకు బహుమతి గా ఇచ్చారా పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడో మిస్ అయ్యింది. ఎన్నో రోజులు వెతికాను. ఈ మధ్యనే అనిల్ బత్తుల గారి పుణ్యమా అని ఇప్పుడు PDF రూపంలో మళ్లి దొరికింది. గ్రామానికి సేవ చెయ్యడం కోసం ఒక దళం తయారు చేసుకుంటాడు తిమూర్. ఆ పుస్తకం ఇచ్చిన స్పూర్తితో “చిల్డ్రన్ జన సేవా దళ్” అనే పేరుతో ఒక సంఘం పెట్టాము. ఊళ్లో వాళ్ళ కి పనులు చేసిపెట్టేవాళ్ళం, కలిసి పుస్తకాలు అధ్యయనం చేసేవాళ్ళం. ఆ తరవాత దాని పేరు లెనిన్ బాల సంఘంగా మార్చాము. అప్పట్లో “భూభాగోతం” నాటకం ఒక సంచలనం. మా పిల్లల దళం రాష్ట్రం మొత్తం తిరిగి 425 పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

నా బాల్యంలో ఎక్కువ భాగం పినపాక లో మా మామయ్య వాళ్లింట్లో గడిచింది. అక్కడ పేరు తెలియని బండ పుస్తకం ఒకటి ఉండేది. ఎప్పటిదో అట్ట చిరిగిపోయిన పాత పుస్తకం అది. అది ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తులేదు. image3అందులోని ప్రతి సన్నివేశం ప్రతి వాక్యం నాకు బాగా గుర్తు. పొయ్యిలోకి కట్టెలు మండనప్పుడల్లా మా అత్త అందులోంచి నాలుగు పేజీలు చింపి పొయ్యిలో వేస్తుండేది. 1975లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మళ్లి పినపాక వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ఆ పుస్తకం నా కంట పడింది. వందల పేజీల పుస్తకం లో 40 పేజీలే మిగిలాయి. దాని పేరు తెలుసుకోవాలని బలమైన కోరిక పుట్టింది. ఆ బతికిపోయిన 40 పేజీలు పట్టుకుని బెజవాడంతా తిరిగా. లైబ్రరీలు, పాత పుస్తకాల కొట్లు దేన్నీ వదిలిపెట్టలేదు. లాభం లేకపోయింది. చాలా నిరాశ చెందాను.

నూజివీడు కాలేజీలో డిగ్రీ లో చేరాను. ఊరు మారినా వ్యసనాలు మారవు. సంవత్సరంలో సగం రోజులు లైబ్రరీలోనే గడిపేవాడిని. ఆనందనిలయం లాంటి 1000 పేజీల పుస్తకాలు అలా చదివినవే. ఆ సమయం లో చదివిన స్పార్టకస్ , ఏడు తరాలు నా భావాల పైన పెను ప్రభావం చూపాయి. మామూలు నవలే అయినా మేనరికాల మీద కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన “ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల నా మీద ఎక్కువ ప్రభావం చూపింది. సోవియట్ లిటరేచర్, 2వ ప్రపంచ యుద్ధం గురించి వచ్చిన ప్రతి పుస్తకం చాలా ఆసక్తి తో చదివాను. image4తిరువూరు విద్యార్థి ఉద్యమంలో చేరాక మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు రావడంలో ఈ పుస్తకాలన్నీ దోహదం చేశాయి.

చదువయిపోయింది. ఆర్ధిక పరిస్థితుల సహకరించకపోవడంతో ఉద్యమం నుంచి పక్కకి వచ్చి విజయవాడ KVR ట్రావెల్స్ లో పనికి చేరాను. 2 సంవత్సరాలు ఉద్యమాలకి, చదవడానికి దూరంగా గడిచిపోయాయి. చాలా వెలితిగా ఉండేది. ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ అక్కడ ఎక్కువరోజులు ఇమడలేకపోయాను.
దాసరి నాగభూషణం గారి ప్రోద్బలం మేరకు విశాలాంధ్ర బుక్ హౌస్ లో సేల్స్ మాన్ గా చేరాను. తిరుపతిలో పోస్టింగ్. విజయవాడ చంద్రం బిల్డింగ్స్ లో ట్రైనింగ్. అక్కడ ఉన్న అన్ని విభాగాలలో తిరుగుతూ గోడౌన్ దగ్గర ఆగిపోయాను. అదొక పెద్ద పుస్తకాల సముద్రం లాగా ఉంది. ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎన్ని రోజులైందో అన్ని పుస్తకాలు ఒకే సారి చూసి. సంవత్సరాల తరబడి ఎడారిలో తిరుగుతున్న Cow Boy కి నిధి దొరికినట్టు అయ్యింది.

కొత్తవీ పాతవీ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఇక నేను ఆ సముద్రంలో ఈదడం మొదలుపెట్టాను. నాలుగో అలమారలో పై వరస లో ఉన్న పాత పుస్తకాలని కదిలిస్తున్నప్పుడు చెయ్యి జారి రెండు పుస్తకాలు కింద పడ్డాయి. అందులో ఒకటి విచ్చుకుంది. నేను నిచ్చెన దిగుతూ ఆ పుస్తకం కేసి చూస్తున్నాను. దగ్గరవుతున్నా కొద్దీ ఆ పుస్తకంలోని వాక్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందులోని ఒక వాక్యం చదవగానే నా గుండె ఝల్లుమంది. “తనొచ్చిందే గాక తన లంజని కూడా తెచ్చాడు. image5ఏదీ.. ఆ కర్ర ఇలా ఇవ్వు. వీడి బుర్ర బద్దలు గొడతాను” పావెల్, మొట్కా మధ్య సంభాషణ. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాల తెరల కింద శిథిలమైపోయిన ఒక చిరిగిపోయిన పుస్తకం నా కళ్ళ ముందు కదిలింది. అదే.. అదే… పేరు కనుక్కోవడానికి నేను విజయవాడ లో కాళ్ళు అరిగేలా తిరిగిన పుస్తకం ఇదే. ఈ పుస్తకంలో పేజీలు పొయ్యిలో వేసిందనే మా అత్తని నేను రకరకాలుగా తిట్టుకుంది. “కాకలు తీరిన యోధుడు” పుస్తకం పేరు. నికోలాయ్ వొస్త్రోవ్స్కీ రచయిత. పరమానందం కలిగింది. ఎగిరాను, గంతులేసాను, గట్టిగా నవ్వాను. నా ఆనందానికి నాకే ఆశ్చర్యమేసింది. పుస్తకానికీ నాకూ ఉన్న Bonding బలమెంతో అప్పుడే అర్థమయ్యింది నాకు.

విశాలాంధ్రలో పని చాలా తృప్తిగా ఉండేది. ఆర్థికంగా పెద్ద ప్లస్ ఏం కాకపోయినా నాకు నచ్చిన పుస్తకాల మధ్యే నా పని. కాకపొతే షాపులో కూచుని పుస్తకాలు చదువుకోకూడదని రూలు. అదొక్కటే బాధ.

image6పెళ్లి అయిన కొత్తలో ఒక స్లోగన్ పెట్టుకున్నా. “జీతం తప్ప ఏమొచ్చినా పుస్తకాలకే !!” అలోవెన్సులు, బోనస్ లు, O.T లు ఇలా ఏది వచ్చినా సరే. ఇంట్లో గుట్టలు గుట్టలు పుస్తకాలు పేరుకున్నాయి. నాకంటూ సొంత లైబ్రరీ తయారయింది. అన్ని సబ్జెక్టుల్లో క్లాస్సిక్స్ అన్నీ కలెక్ట్ చేశా. రానురాను పుస్తకాలు కొనడం తగ్గించాల్సోచ్చింది. నెలకి 525 రూపాయలతో ఇద్దరం బతకాలి కదా!

1980 ప్రాంతంలో చలాన్ని రెండవ సారి చదవడం మొదలుపెట్టాను. అప్పటికి నా ఆలోచనలలో పరిణితి బాగా వచ్చింది. నాకంటూ కొన్ని భావాలూ రూపుదిద్దుకున్నాయి. చిన్నప్పుడు చదివినవి అన్ని మళ్లి చదివాను. ఈ సారి అధ్యయనం కోసం చదివాను. అప్పుడు అర్థం కాని విషయాలు ఎన్నో ఇప్పుడు అర్థమయ్యాయి. ఈ సారి కొత్తగా రంగనాయకమ్మ, రావి శాస్త్రి, చాసో, బీనాదేవి, తిలక్, శ్రీశ్రీ పరిచయం అయ్యారు. ఏ ఊరు వెళ్ళినా సంచిలో ఒక పుస్తకం పెట్టుకోవడం అలవాటయ్యింది – ప్రయాణం బోర్ కొట్టకుండా.

నా వృత్తి – ప్రవృత్తి ఒకటే కావడంతో నేను నా పని లో ఎంతో చొరవ చూపించగలిగాను. తిరుపతి లో పేరున్న రచయితలతో కలిసి చాలా సంవత్సరాలు “సాహిత్య వేదిక” నిర్వహించాము. రచయితలతో వ్యక్తిగత పరిచయాలు బాగా పెరిగాయి. చాసో, రాంభట్ల, వి.ఆర్.రాసాని, మధురాంతకం నరేంద్ర, ఆంవత్స సోమసుందర్, త్రిపురనేని, పాపినేని .. ఇలా అన్ని రకాల రచయితలతో స్నేహం కుదిరింది. అన్ని రకాల సాహిత్యంతో ప్రేమ కుదిరింది. అభ్యుదయ రచయితల సంఘంతో ప్రయాణం కూడా ఆ క్రమం లోనే మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజానికి ఉపయోగపడే భావాలు ప్రచారం చెయ్యడం కోసం ఈ మధ్యనే “అభ్యుదయ” ని అంతర్జాల పత్రిక రూపంలో తీసుకువచ్చాము. (www.abhyudayaonline.com). దాని బాధ్యతలని కూడా స్వీకరించాను.

ఇన్ని సంవత్సరాల తరవాత ఇవన్నీ నెమరు వేసుకుంటుంటే ఏ మనిషి జీవితం తో అయినా పుస్తకానికి ఉండే అనుబంధం ఇంతే గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఒక మంచి పుస్తకం దాన్ని ప్రేమించే పాఠకుడికి చేరకపోతే ఎంత బాధ! ఇప్పుడు మరి నా పిల్లలు తెలుగు పుస్తకాలే దొరకని ప్రదేశాల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లకి ఈ అనుబంధం రుచి ఎలా చూపించాలి? చదువుకోవడానికి పుస్తకాలే లేకపోవడం ఎంత భయంకరం.!

image7అందుకే మంచి పుస్తకాలకీ పాఠకులకీ మధ్య వారధి నిర్మించాలని అనుకున్నాను. అలా పుట్టినదే www.AnandBooks.com.

ఆధునిక సామాజిక జీవితం గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా, వైవిధ్యాలతో (వైరుధ్యాలతో) నిండి ఉంది. అర్థం చేసుకోవటానికి ఒక ‘వ్యక్తి గత’ జీవిత అనుభవం చాలదు. అందరి జీవితానుభావాల్నీ రంగరించిన పుస్తకాలే, అధ్యయనమే అందుకు మార్గం.

మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లకి మన సాహిత్యం అందాలి. వాళ్ళ మనసుల్లో మంచి భావాలు మొలకెత్తాలి, వ్యక్తులుగా మహావృక్షాలు అవ్వాలి. మార్పు వైపు సాగే పురోగమనంలో భాగస్వాములు కావాలి. మంచిని పంచే మనిషితనంతో ఎదగాలి. ‘ఆస్తి’ తత్వం కంటే, పంచుకునే మనస్తత్వం కావాలి. నాకైతే ఈతరంతో కూడా గౌరవించబడే జీవితం కావాలి…. అంతే.

 

 

(ఈ ఆర్టికిల్ కి బొమ్మలు వేసి పెట్టిన మా అబ్బాయి వినోద్ అనంతోజు కి కృతఙ్ఞతలు)

-ఎ.ఎం.ఆర్.ఆనంద్

Nanna

దొంగ

Kadha-Saranga-2-300x268

 

                         ” అమ్మో! నాకేం తెలీదండీ! కొట్టకండయ్యా! నేనేం తియ్యలేదయ్యా! నేను దొంగని కాదయ్యా! అమ్మో” అంటూ కేకలు పెట్టి యేడుస్తున్న ఆ కుర్రాడి వంకే ఆ హోటల్లో ఫలహారాలుచేస్తున్న వాళ్ళంతా చూస్తున్నారు. హొటెల్ యజమాని లోవరాజూ, అందులోనే పనిచేసే సూరిగాడూ ఒక కుర్ర వాడిని రెక్కలు విరిచి పట్టుకొని బరికెతో బాదుతున్నారు. దారినే పోయే కొందరు అక్కడ పోగై ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. అసలేం జరిగిందో, వాణ్ణెందుకు కొడుతున్నారో వాళ్ళకి అనవసరం లాగుంది.    

సరిగ్గా అప్పుడే నేను నా మోపెడ్ని ఆపి, పాలక్యాన్లతో దిగాను అక్కడ. వాడికగా పోసే పాల క్యాన్లు హొటెల్లో పెట్టి, అక్కడేమైందో తెలుసుకుందామని, వాణ్ణి కొడుతూ వగరుస్తున్న లోవరాజుని ” యేమైంది రాజూ, యెవరీ కుర్రాడు” అని అడిగాను. “యేటవుతాది సత్యంబావా, ఈ దొంగనాకొడుకు వొటేల్లొని కొత్త గళాసులెత్తుకు పోతుంటే మా సూరిగాడు సూసి పట్టీసుకున్నాడు. వారం లో ఆరు గళాసులు పోయేయి. యేటయ్యిందా అనుకుంటన్నాను. దొంగ దొరికేకా మరేటిసెయ్యాలి? మక్కెలిరగదన్ని కనిస్టేబుల్ని పిల్చి ఆడికప్పగిస్తే ఆడే తేలుస్తాడు సంగతి” అన్నాడు లోవరాజు.

ఇంతలో ఆ కుర్రాణ్ణి చొక్కా ఇప్పించి హొటేల్లో ఒక మూలన కూర్చోపెట్టాడు సూరిగాడు. ఖాళీ క్యాన్లు తీసుకొని బయటికి నడుస్తూ ఆ కుర్రాడికేసి చూసాను. పధ్నాలుగేళ్ళుంటాయేమో, నా కొడుకు యీడు వాడేనేమోననిపించింది. చురుకైన వాడి కళ్ళలోనించి ధారలుగా కారుతున్న నీళ్ళు తుడుచుకుంటూ, దెబ్బలకి మండుతున్న ఒంటిని మరో చేత్తో రుద్దుకుంటున్న ఆ కుర్రాణ్ణి చూస్తే యెందుకో కొంచెం జాలి వేసింది. పాలడబ్బాలు పక్కనపెట్టి, వాడి దగ్గరకెళ్ళి, “నీ పేరేంట్రా,యే వూరు మీది ” అని అడిగాను. వాడు నల్లగా, పొడుగ్గ్గా, గుబురు మీసాలతో ఉన్న నన్ను చూసి మరింత భయపడి ముడుచుకొని పొయాడు.

“మాట్లాడవేరా యెదవా! నొట్లో కొరకంచు కూరీగల్ను, నిజం చెప్పాపోతే” అని వాడిమీదికి పోయాడు సూరిగాడు.   ” నువ్వాగరా సూరీ, నేను కనుక్కుంటా” అని నేను వాడి దగ్గరగాపోయి నిల్చున్నాను. ఇంతలో, లోవరాజు ఎప్పుడు కబురుపెట్టాడో ఏమో, కానిస్టేబుల్ అప్పారావు “ఏట్రా లోవరాజూ, యేడా దొంగ లం.. కొడుకు? ” అంటూ లోపలికొచ్చి అటూ ఇటూ చూసాడు. పోలీసుని చూడగానే ఆ దొంగ అనిపించుకున్న కుర్రాడు బెదిరిపోయి లాగు తడిపేసుకున్నాడు.

” ఏట్నేదప్పారావూ, ఈ దొంగెదవ రోజుకో స్టీలుగళాసెత్తుకు పోతునాడు. ఇయాల మా సూరిగాడు సూసి పట్టుకున్నాడు. నాలుగ్గట్టిగా తగిలిత్తే వొట్టుకుపోయిన సరుకంతా తెచ్చిత్తాడు. నిన్ను సూత్తే జడవనోడీవూళ్ళోనే యెవడూ   లేడు! నాలుగు తగిలించేవనుకో, అన్నీ బయటికొత్తాయి. ముందో టీ తాగి పనిసూడు. బజ్జీలేడిగా ఉన్నాయి, తింటావేటి” అన్నాడు లోవరాజు.

* * * *

అది అనకాపల్లికి దగ్గరలోని కొండకొప్పాక అనే చిన్న వూరు. నాలుగు బెంచీలున్న లోవరాజు హొటేలే అక్కడ స్టార్ హొటేలు. రోజుకి మూడు బస్సులు వస్తాయి. అడపాదడపా ఆటోలు వస్తాయి. అంతకు మించి అక్కడ మరే హడావిడే ఉండదు. ఊరికి ఒక చివర్న కొండలున్నాయి. కొండల పాదాల దగ్గర దళితుల కోలనీ ఉంది. దానికి కొంత ముందు పరిషత్తు మిడిల్ స్కూలు ఉంది. ఇలాంటి వూళ్ళో ఇటీవల కొంత జనసంచారం పెరిగింది. వైజాగు కి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఈ వూరి మరొ చివర యేదో ఫ్యాక్టరీ కడుతున్నాడు. దాని కట్టుబడిలో పనిచేసే కార్మికులు దాదాపు వంద మంది అక్కడే నివాసాలుంటున్నారు. వారందరికీ కాఫీలకీ, టీలకీ, టిఫిన్లకీ లోవరాజు హొటేలే దిక్కయింది. పెరిగిన, ముందు మరింత పెరగబోయే గిరాకీనీ దృష్టిలో ఉంచుకుని లోవరాజు ఒక రోజు భార్యాసమేతంగా వైజాగు వెళ్ళి కొత్త ప్లేట్లూ, గ్లాసులూ వగైరాలు కొనుక్కొచ్చాడు.

ఐతే, తెచ్చిన మర్నాటినించే కొత్త గ్లాసులు ఒక్కొక్కటీ మాయమవడం మొదలయింది. సూరిగాడిని అడిగితే ‘నాకేటి తెల్సూ’ అన్నాడు.

“ఓ కన్నేసి ఉంచు, యెవుడట్టుకు పోతన్నాడో. ఈ సారి పోతే నీ జీతం లో వొట్టీసుకుంటాను” అని వార్నింగిచ్చాడు లోవరాజు. దాని ఫలితమే ఈ కుర్రాడు పట్టు బడడం.

*****

నాలుగు బజ్జీలు తిని, టీ తాగి తేంచుకుంటూ ఆ కుర్రాడి దగ్గరకెళ్ళి ” నీ పేరేట్రా? యెక్కణ్ణించొచ్చావు” అని అడిగాడు పోలీసప్పారావు.

“శీనండి” అన్నాడు వాడు బెక్కుతూ!

“గళాసులెత్తుకెళ్ళింది నువ్వేనా? ”

“నేను కాదండి. ఇంటికెళ్తూ దాహం వేస్తే, నీళ్ళు తాగుదామని వచ్చానండి. తాగి, గ్లాసు కడుగుదామని వెళ్తుంటే ఈయన పట్టుకుని నన్ను దొంగ అని కొడుతున్నాడండి”

“ఏరా, ఒళ్ళెలా ఉంది! నువ్వు గళాసట్టుకు పోతుంటే నేను చూడలేదనుకున్నావా” అరిచాడు సూరి గాడు.

“అసలు నువ్వెవడివిరా? ఇటేపెందుకెళ్తున్నావు” అడిగాను నేను.

“మా నాన్న నూకాలయ్యకి అన్నం డబ్బా పట్టుకెళ్ళి మా చిన్నాన్న ఆటో ఆంజనేయులికిచ్చి అనకాపల్లి పంపిస్తానండి. ఇందాకా అలాగే ఇచ్చి ఇంటికెళ్తుంటే, దార్లో దాహం వేసిందండి. నీళ్ళు తాగడానికి ఇక్కడ ఆగానండి”

“మీ నాన్న యేం పనిచేస్తాడ్రా?”   పోలీసాయన ప్రశ్న!

“నలుగురు గుడ్డోళ్ళతో కలిసి రైళ్ళలో అడుక్కుంటాడండి. అనకాపల్లి నించి అన్నవరం దాకా అటూ ఇటూ తిరుగుతాడండి”

“ఆడూ గుడ్డోడేనా”

“కాదండి. ఆ నలుగురికీ రైల్లో దారి చూపిస్తూ, తనూ గుడ్డోళ్ళా నటిస్తాడండి. అది తప్పు నాన్నా అని నేను చెప్తానండి అతనికి”

“ఓయబ్బో, అరిచ్చెంద్రుడు దిగాడండి. తండ్రీ కొడుకూ ఇద్దరూ దొంగనాకొడుకులే నన్నమాట! ఒరేయ్, మీ ఇల్లు చూపించు. దొంగ సరుకంతా అక్కడే ఉంటాది. పద” అంటూ శీనూని తన సైకిలు మీద కూర్చోపెట్టుకుని తీసుకుపోయాడు పోలీసప్పారావు.

ఈ గొడవ వల్ల ఆలస్యం ఐపోయిందనుకుంటూ నేను బయలుదేరుతూ “పోయిన గళాసులు దొరుకుతాయిలే రాజూ! ఐనా అవేం లక్షలు ఖరీదు చెయ్యవుగా” అంటూ బయటికి నడిచాను.

*****

మర్నాడు పొద్దున్నే నేను బయటికి వెళ్తుంటే, ఏడవ క్లాసు చదువుతున్న నా కొడుకు “నాన్నా,నాకు ఇరవై రూపాయలు కావాలి, ఇయ్యవా” అని అడిగాడు.

“ఎందుకు?”

“పాపం, మా క్లాసులో చదివే బత్తుల శీను ని దొంగ అని పోలీసప్పారావు తీసుకుపోయి, స్టేషన్లో పెట్టీసేడు నాన్నా! వాడు చాలా మంచోడు నాన్నా, బాగా చదువుతాడు. వాడు అస్సలు దొంగ కాడు నాన్నా! వాడిని వదలాలంటే ఐదు వందలు అడిగేట్ట పోలీసప్పారావు. వాడి దగ్గర అన్ని డబ్బులుండవు నాన్నా! మేమందరం చందాలు వేసుకుని ఇస్తాం నాన్నా! ప్లీజ్, ఇరవై ఇయ్యవా” అంటూ మావాడు గారాలు పోయాడు.

నాకు వెంటనే జాలిచూపులు చూస్తూ యేడుస్తూ నిలబడ్డ శీను గుర్తొచ్చాడు. వాడు దొంగతనం చెయ్యడనీ, బాగా చదువుకునే కుర్రాడనీ మా వాడు నొక్కిమరీ చెప్పాడు. ఇరవై రూపాయలిచ్చి మావాడిని బడికి పంపాను.   ఆ రోజు నేను వెళ్ళగానే హోటల్ లోవరాజు ని అడిగాను, దొంగతనం విషయం.

“యేమీ తేలలేదు బావా! పోలీసప్పారావు నెతికితే, ఆ కుర్రోడింట్లో రెండు చింకి చాపలూ, మాసిన గుడ్డలూ, ఆడి పుస్తకాల సంచీ, రెండు వొండుకునే మట్టి కుండలూ తప్ప మరేం లేవుట! ” అని వూరుకున్నాడతడు.

ఆ సాయంత్రం స్కూలు నించి ఇంటికొచ్చిన నా కొడుకు, “నాన్నా, పాపం బత్తుల శీను గాడిని పోలీసప్పారావు బాగా కొట్టేట్ట. వొళ్ళంతా వాచిపోయి జొరం వచ్చింది వాడికి. మేమందరం డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాకా వాడిని ” పోరా, దొంగెదవా” అంటూ బయటికి నెట్టేసేడు నాన్నా. పాపం వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు” అన్నాడు.

” పోన్లేరా, తప్పెవడిదో మనకేటి తెల్సు, ఆడు ఇంటికిపోయేడు కద, నువ్వేడవకు ఇంక” అని వాడికి సర్ది చెప్పాను. “రేపు దీపావళి కదురా, సర్దాగా ఉండు, అన్నీ కొనుక్కో” అని వాడికి ఉత్సాహాన్ని కలిగించాను.

*****

నాల్రోజుల తర్వాత లోవరాజు విచారంగా మొహం పెట్టి,”పొరపాటైపోయింది సత్తెంబావా! గళాసులట్టుకు పోయేడని ఆణ్ణి పట్టుకు తన్నాం. అసలుదొంగ మా సూరిగాడే! నిన్న నాగుల్చవితికి పుట్ట దగ్గిరికి మా ఆడోల్లెల్లారు కదా, అక్కడికే సూరిగాడి పెళ్ళం, కూతురు మన కొత్త గళాసుల్లో పాలుపొసుకునెళ్ళారంట బావా! మాయావిడే కొందా గళాసుల్ని బావున్నాయని, తనకి బాగా గేపకమే అయి. సూరిగాడి పెళ్ళాన్ని నలుగురిలోనూ నిల్దీసేసరికి ఒప్పేసుకుంది, ఆడే మన వొటేల్నించి తెచ్చిచ్చేడని! ఆడికి నాల్గు లెంపకాయలు కొట్టి పన్లోంచి తీసీసేను. ఆడింటికెల్తే, పోయిన సామాన్లన్నీ దొరికేయి బావా” అని చెప్పుకొచ్చాడు.

” ఎంత నాటకం ఆడేడు యెదవ! యేవీ( తెలీని కుర్రోణ్ణి పట్టుకుని నాటకం యెలా ఆడేడో” అని నేను ముక్కున వేలేసుకున్నాను..

ఆ మర్నాడు లోవరాజు ” బావా, పాపం ఆ శీనుగాడికి నేను చేసిన అన్నేయానికి బదులు ఆడికేటన్నా సేద్దామనిపించి, ఆడి నాన్నకి కబురెట్టి, సూరిగాడి స్తానం లో వొటేల్లో పనిసేసుకొమన్నాను. దానికి ఆడేటన్నాడో ఇను. “నన్ను నమ్ముకుని నలుగురు గుడ్డోళ్ళు బతుకుతున్నారు, నీదగ్గిరికొచ్చీసి ఆళ్ళకి అన్నేయం సెయ్యలేను. యేదో మా బతుకు ఇలా బతకనీ బాబూ” అన్నాడు అడికున్న నీతి, గేనం మనకుందా బావా” అన్నాడు.

వింటున్న నా కళ్ళలో తిరిగిన నీటిచారను గమనించే మనసు ఒక అమాయకుడిని దొంగగా చూపించిన సూరిగాడికి గాని, దొరికిన యెలాంటి అవకాశాన్నైనా సొమ్ముచేసుకునే పోలీసప్పారావుకి గాని ఉంటే యెంత బాగుండును!

                                                                    -వి. శివరామకృష్ణ

sivaramakrishna

 

 

కవిత్వమై కట్టలు తెంచుకున్న కోపం!

ఆ సాయంత్రం త్యాగరాయ గానసభకి వెళ్ళాను.

వంగూరి ఫౌండేషన్ వారి   నెల నెలా తెలుగు వెలుగు అనే సాహితీ సదస్సులో శ్రీ ద్వానా శాస్త్రి గారు – ’ తన కవిత్వాన్ని తానే విశ్లేషించుకునే’ సాహితీ ప్రసంగాన్ని వింటం కోసం.

ద్వానా గారి  కవితా సంపుటాన్ని  నేనింతకు మునుపొకసారి చదివాను. విభిన్నాంశాలతో కూడిన   కవితల్లోంచి  నాకు నచ్చిన కొన్ని మంచి మంచి వాక్యాలను తీసుకుని, మన ‘సాహిత్యం’ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అందువల్ల, వీరి కవిత్వంతో నాకు పరిచయం తో బాటు, నాకు వీరి కవిత్వం పట్ల సదభిప్రాయమూ వుంది. ఈ సభ కు రావడానికి అదొక ముఖ్య కారణమని చెప్పాలి. అదీ గాక, కవి – తన కవిత్వం మీద తానే  విశ్లేషణ జరుపుకోవడం ఒక వినూత్నమైన ప్రక్రియగా తోచింది. ఎంతో ఆసక్తి కరం గా అనిపించింది. అందుకే, వారి ప్రసంగం వింటం  కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

ముఖ్య అతిధి – జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు  గారు! చాలా దూరం నించి వస్తున్నారనీ, అందుకే సభారంభం ఓ అడుగు అటూ ఇటూ అవ్వొచ్చని  చెప్పారు సుధ గారు.

అప్పటి దాకా ఔత్సాహిక గాయకులు పాడే పాటలు వింటూ గడిపాం.

అంతలో, ఆయన విచ్చేసారు.

అనంతరం, సభ – ఆరంభమైంది.

సాహితీ కిరణం సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

వేదికనలంకరించిన వారిలో – సమీక్షకులు శ్రీ రమణ ఎలమకన్ని గారూ వున్నారు.

అందరి పరిచయాలు, కొందరి ముందు మాటలు అన్నీ సాంప్రదాయక రీతిలో చక చకా జరిగిపోయాక, ద్వానా శాస్త్రి గారు – ప్రసంగించడం కోసం మైకు ముందుకొచ్చారు.

తాను రాసేది కవిత్వమే కాదనే విమర్శకులకు తాను సదా కృతజ్ఞుణ్ని అన్నారు. అలాటి విమర్శలలకు   తనకెలాటి అభ్యంతరం లేదనీ, పైగా, వాటిని ఆనందంగా అహ్వానిస్తానని చమత్కరించారు. మనసులోని భావాలను ఒక అరుదైన పధ్ధతి లో వ్యక్తపరిచేందుకు కవిత్వం సరైన ప్రక్రియ అని తాను భావిస్తున్నట్టు తన అభిప్రాయాన్ని వివరించారు. అసలు తనకు కవిత్వం రాయాలని ఎందుకనిపించిందో చెప్పారు. మొట్ట మొదట గా – క్లాస్ లొ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట వినని విద్యార్ధులను తన వైపు తిప్పుకోడానికి కవిత్వాన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నట్టు సోదాహరణలతో వివరిస్తూ సభికుల్ని నవ్వించారు.

‘నువ్వు కవిత్వం రాయడానికి వీల్లేదన్న’ ఒక విమర్శకుని ఘాటైన మాటలకు కవిత్వం జోలికి పోకుండా  ఊరకుండిపోయారట.

ఆ తార్వాత చాలా కాలానికి జ్యోతి సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం గారి సలహా  మేర తిరిగి కవిత్వాన్ని రాయడానికి పూనుకున్నారట.

అయితే కవిత్వానికి బలమైన ప్రేరణ గా నిలిచింది మాత్రం – ‘’కొండేపూడి నిర్మల గారు రాసిన లేబర్ రూం అనే కవిత..’’ అంటూ ఆగారు.

ఆ మాటలకి నేను,ఒక్క సారిగా అలెర్ట్ అవుతూ, నిఠారై కూర్చున్నా. ఏవిటీ, ద్వానా శాస్త్రి గారు కవిత్వానికి నిర్మల గారి కవిత స్ఫూర్తి గా నిలిచిందా? భలె. భలే. క్వయిట్ ఇంట్రెస్టింగ్!..అని అనుకుంటూ..వారి మాటలను ఎంతో శ్రధ్ధతో ఆలకించ సాగాను.

ద్వానా శాస్త్రి గారు – నిర్మల గారి కవిత ‘లేబర్ రూం’ ను పరిచయం చేసారు. పేపర్ మీద రాసుకున్న కవితా పంక్తుల్ని చదివి వినిపించారు. నిజంగానే మెచ్చుకున్నారు. కవయిత్రి కవిత్వీకరించిన ఆ వైనాన్ని చిన్నగా కొనియాడారు కూడా.

ఆ తర్వాత చిరు విమర్శలాడి నవ్వించారు.

ఆ పైన, కాస్త ఘాటు గానే స్పందించారు.

లేబర్ రూం అనే కవిత చివరి పంక్తుల్లో- స్త్రీ ప్రసవ వేదనకు పురుషుణ్ని కారణం గా చేయడాన్ని, దోషి గా చేసి చూపడాన్ని ..   వ్యతిరేకిస్తూ, ఆయన  తన విమర్శలని గుప్పించారు.

‘ఏం? నేరమంతా మగాడి మీద తోసేయడమేం ఎంతైనా చోద్యమన్నారు. స్త్రీ మాత్రం కారకు రాలు కాదా? ఆమె కోరుకోలేదా? ఆమె మాత్రం (ఎడిట్) లేదా?” అంటూ ఒక ఉద్వేగం లో ప్రసంగిస్తుంటే..వెంటనే స్ఫురించింది. ఆ మాటలు హద్దు మీరుతున్నట్టు! నేను వెంటనే అడ్డంగా  తలూపుతూ నా అభ్యంతరాన్ని తెలియచేసాను . అది సభా కార్యక్రమం. కాబట్టి, ప్రేక్షకుని సంస్కారం అంతవరకే అనుమతిస్తుందనే సంగతి మీకూ అర్ధమయ్యే వుంటుందని తలుస్తాను.

నేను అప్పటి దాకా శాస్త్రి గారి హాస్య ధోరణి కీ, వ్యంగ్యపూరితమైన మాటల విసుర్లకి నవ్వినదాన్నే.

ఎందుకంటే – నేను ఏ ‘ఇస్ట్’ కి చెందిన దాన్ని కాదు కాబట్టి.

ఆయన తన ముందు ప్రసంగంలో ఫెమినిస్ట్ ల మీద హాస్య వ్యంగ్య బాణాలు బాగానే సంధించి వొదిలారు.

భర్త – భార్యని ‘ఏమే’ అని పిలిస్తే  విప్లవం లేవదీయాలా? పెళ్ళాన్ని  అలా పిలిచే  హక్కు, అధికారమూ భర్త కు వుండదా? వుండకూడదా? అని నిలదీసారు ఫెమినిస్టుల్ని.

అంతే కాదు తన పెళ్ళాన్ని చనువుగా ఎలా పిలుచుకున్నా ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆ మాట కొస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు కట్టుకున్న వాణ్ని  ఏరా అని పిలుస్తున్నారు తప్పేముందీ? అని పాయింట్ లాగారు. ఆమె మొగుడు, ఆమె ఇష్టం. ఎలా ఐనా పిలుచుకోవచ్చు మధ్యన అడ్డుపడటానికి, అర్ధం లేని రాధ్ధాంతాలు చేయడానికి మనమెవరం? అని సూటిగా  ప్రశ్నించారు.

వింటున్న పృక్షకులకు వారి  మాటలు సబబు గానే తోచాయి.

కానీ, ఒకానొకఆవేశపు వాక్ప్రవాహం లో (..) అన్న మాటలకే నా కు అభ్యంతరమేసింది.

లేబర్ రూం అనే కవిత్వం లో కవయిత్రి – ప్రసవ వేదన అనే అంశాన్ని   స్త్రీ దృక్కోణం నుంచి  పరిశీలించి, ఆ వ్యధను   అక్షరాలలో పొంగించారు. ఆ నరకపు యాతన అలాటిది మరి.

అలానే, చివరి పంక్తుల్లో, పురుషుణ్ణి మెన్షన్ చేసీ వుండొచ్చు. దీనంతటకీ అతనే కారకుడనీ, అతను మాత్రం సుఖం గా వున్నాడని కూడా అనివుండొచ్చు. సరిగ్గా ఈ అంశం మీద ఎంత చర్చైనా కొనసాగించవచ్చు. తప్పు లేదు.

అంతే కానీ, … ‘ఏం, ఆమె మాత్రం పడుకోలేదా? కావాలనుకోలేదా? సుఖం పొందలేదా ?’ అనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబు గా తోచదు. అదీ, ఒక సభా వేదిక మీద.. ఉహు. మనస్కరించడం లేదు ఇలాటి బహిరంగ వాదాన్ని అంగీకరించేందుకు. అందులో, ఒక గొప్ప వక్తగా, ఒక విజ్ఞాన వేత్త గా నేనెంతో అభిమానించే ద్వానా శాస్త్రి గారు మాట తూలడం..జీర్ణించుకోలేకపోయాననే చెప్పాలి.

అంత వరకెందుకు? ప్రసవ వేదనలో భరించలేని నొప్పులతో భూమి దద్దరిల్లేలా కేకలేస్తూ..ఎందరో స్త్రీలు  కట్టుకున్న వాణ్ణి  తిట్టడం నేను విన్నాను. చూశాను. అలాంటి అసహాయ  స్థితిలో ఆమె కొట్టుమిట్లాడుతుంటే..ఆసుపత్రి స్టాఫ్ – నీచమైన చౌకబారు మాటలనడమూ విన్నాను.   ఆ ఆపద్కాలంలో ఆ తల్లుల పట్ల ఎంతో దయా హృదయం కలిగి వుండాల్సింది పోయి, అంత అసభ్యకరం గా మాట్లాడటం ఎంతైనా శొచనీయం. క్షమిచరాని నేరం.

అలానే, అంతే ఆవేదనతో ఈ సభలో ద్వానా శాస్త్రి గారు మాట్లాడిన  ఆ ఒక్క పదాన్ని కూడా నిరసిస్తున్నాను.

సరే, అసలు విషయానికొస్తాను.

అలా, నిర్మల గారి కవిత్వం – ఆయన లో ఆవేశాన్ని రేపిందనీ,   ఆ కవితకు ధీటుగా తనూ మగాళ్ళను సపోర్ట్ చేస్తూ..  కవిత రాసి గట్టి జవాబివ్వాలని  నిర్ణయించుకున్నారట. ఆ నిశ్చయమే – తన కవితా సాహిత్య పునఃప్రారంభానికి నాంది గా మారిందని తెలిపారు.

 

పిల్లల్ని కననంత మాత్రాన మగాడికి హృదయమే వుండదన్న అపోహ కూడదన్నారు. ఇల్లాలి ప్రసవం ప్రమాదకరం గా మారినప్పుడు, బిడ్డ దక్కకున్నా ఫర్వాలేదు తన భార్య – ప్రాణాలతో దక్కితే చాలని ఆ భర్త డాక్టర్ని వేడుకుంటాడనే సంగతిని గుర్తు చేసారు. మగాళ్లంతా చెడ్డవాళ్ళు, రాక్షసులు అనే అపోహల్ని బలపరిచే రీతిలో రచనలు చేస్తున్న పురుష ద్వేషులైన రచయిత్రుల పట్ల ఆయన తన ఆవేదనని వ్యక్తపరిచారు. మగాళ్ళు పైకి భోరుమని ఏడ్వనంత మాత్రాన కఠినాత్ములని అతని గుండె పాషాణమని ముద్ర వేయడం తగదనే హితాన్ని పలికారు. మగాళ్ళు లోలోనే కుమిలిపోవడం వల్ల వాళ్ళకే గుండె జబ్బులెక్కువొస్తున్నాయనీ, హార్ట్ ప్రాబ్లంస్ తో మరణించే మగాళ్ళ సంఖ్య నానాటికీ పెరిగిపోతోందనీ..మగాడికి హృదయం లేదంటే ఎలా నమ్మడం అంటూ తన ప్రసంగం లో హాస్యాన్ని జోడిస్తూ..సైన్స్ సమాచారాన్ని కూడా అందచేసారు.

అనంతరం తన కవిత ద్వారా చెప్పదలచుకున్న సమాధానాన్ని చదివి వినిపించారు.

dwana

ఆ తర్వాత..శాస్త్రి గారు తన సహజ సిధ్ధమైన సంభాషణా శైలిలోకొచ్చేసారు.

‘నా కవిత్వం – నా  విశ్లేషణ’ అనే  ప్రసంగం లో భాగంగా ‘బాల్యం’ అనే మరో కవితాంశాన్ని తీసుకున్నారు.

కవులందరూ తమ తమ బాల్యాన్ని అద్భుతం, అమోఘం అంటూ పొగుడుకుంటుంటే ఆయనకి ఆశ్చర్యం గానూ, అపనమ్మకంగానూ వుండేదిట. ఎందుకంటే అలాటి తీపి అనుభవాలు కానీ, మధురమైన అనుభూతులు కానీ.. ఏవీ తనకు తెలియనందుకు! పైగా, ఒక కవి కి మించి మరో కవి పోటీ గా ఆ ఆనంద బాల్య దశని వర్ణించడం చూసి మరింత ఆలోచనలో మునిగిపోయేవారట. ఏ కవి ని చూసినా ‘అహా.. ఓహో’ అంటున్నారు, మరి ఇలాటి పరిస్థితుల్లో తను- తన బాల్యం దుర్భరమని రాస్తే   ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోననీ, చిన్న చూపు చూస్తారేమోనని సందేహించారట. ఆ తర్వాత, వున్నదున్నట్టు రాయడానికే నిశ్చయించుకుని, అలానే ఆ కవితని వెలుగులోకి తీసుకురావడం జరిగిందని ఒక చిన్న కథ లా వర్ణించి చెప్పారు.

అన్న దమ్ముల్లో అందర్లోకెల్లా శాస్త్రి గారి నే చిన్న చూపు చూసేవారట వారి తండ్రి గారు.

చదువు దగ్గర్నించీ, దుస్తులు వరకు తనపై చూపిన వివక్షతని, నిర్లక్ష్య ధోరణిని జరిగిన సంఘటనల ద్వారా వివరించి చెబుతుంటే  నేను తలొంచుకుని శ్రధ్ధగా విన్నాను.  నిజమే, ఏ పసివానికైనా ఆ దశలో ఇలాటి అవమానాలు భరింపశక్యం కాని చేదుఅనుభవాలు. పైకి కనిపించని ఈ హృదయ గాయాలు. మనిషి మరణించే దాకా మాయని మచ్చలు.

అసలేమనిషికైనా ఆనందకరమైన బాల్యమే తరగని ధనం.

ఇలాటి  తండ్రుల గురించి    ఎందరో చెప్ప గా విన్నాను. కొందర్ని చూసాను కూడా.

అలాటప్పుడు ఎవరికైనా బాల్యం బంగారం లా ఎలా అనిపిస్తుంది మరి? అనిపించదు. ఆ వ్యధని  యధాతధంగా   కవిత్వీకరించినట్టు ఎంతో ధైర్యంగా చెప్పారు కవి.

అటు పిదప మరో కవితాంశం – కలం!

తాను కంప్యూటర్ జోలికి వెళ్ళనని చెబుతూ, కలం మీద   గల ప్రేమనీ, కలంతో రాసే అక్షరాల పట్ల తనకు గల      అనుబంధాన్నీ, ఆప్యాయతానురాగాలని  వ్యక్తపరిచారు.   ఈ సందర్భం గా కవి శివారెడ్డి గారిని ఉదహరిస్తూ, ఆయన కంప్యూటర్ కాదు కదా, కనీసం సెల్ ఫోన్ కూడా వాడరని తెలియచేసారు.

ఆ ఉపోద్ఘాతానంతరం, తను రాసిన రమ్యమైన ‘కలం ‘కవితని చదివి వినిపించారు. నవ్యలో ప్రచురితమైన ఈ కవితను చూసి తనకు సినారె కితాబిచ్చినట్టు గా కూడా పేర్కొన్నారు.

సభ కొనసాగుతూనే వుంది.

టైం చూసాను. అప్పటికే నాకు ఆలస్యమైంది..నేను ఇల్లు చేరడానికి పట్టే సమయాన్ని దృష్టిలో వుంచుకుని, మెల్లగా నా సీట్లోంచి  లేచి, సభకి మౌనంగా అభివాదం చేసి, వెలుపలికి దారి తీశాను. వస్తూ వస్తూ, శ్రీమతి సుధ గారికి, వంశీ రామరాజు గారికి వీడ్కోలు తెలియచేసుకుంటూ..సడి కాకుండా బయటపడ్డాను.

నాలో నేను తర్కించుకుంటూ..నాతో నేను వాదించుకుంటూ నిశ్శబ్దం గా ఇల్లు చేరాను.

సాహితీ సభలకెళ్లొస్తే, ఒక కావ్యం వెనక దాగిన రహస్యాన్ని     ఛేదించిన ఆనందమేయాలి కదూ!

– ఆర్.దమయంతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మూసలకు లొంగని కవి ఇస్మాయిల్

ismayil painting rainbow

ఎందుకో చెప్పలేను గానీ, నాకు కాలేజీ రోజులనుండీ “బెల్ కర్వ్ (నార్మల్ డిస్ట్రిబూషన్)” అంటే మహా ఇష్టం. బహుశా నా ఆలోచనలు అలా ఏకీకృతం(పోలరైజ్డ్) అయిపోవడం వల్లనో ఏమో గానీ, నాకు ఒక కవి కవిత్వం తీసుకున్నా, కొంతమంది కవులని తీసుకున్నా, వాళ్ళ కవిత్వంలో ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. మనిషి జ్ఞానం పరిధి విస్తృతమవుతున్నకొద్దీ అతని ఆలోచనల సారం మన పూర్వీకులూ (దేశకాలపరిధులతో నిమిత్తం లేకుండా), ముందుతరాల మేధావులూ, అందించిన జీవనసారానికి సమీపంగా అతని ఆలోచనలు ప్రయాణిస్తాయని నా నమ్మకం. దీన్ని ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటూంటాను కూడా. అలాంటి నా ప్రగాఢమైన నమ్మకానికి మరింత దోహదం చేసిన కవుల్లో ఇస్మాయిల్ ఒకరు.

ఇస్మాయిల్ కవిత్వం గురించి చాలామంది చాలా విశదంగానే రాసేరు. అతనిది అనుభూతివాద కవిత్వం అని ఒక ముద్రకూడా ఉంది. నాకు ఈ ముద్రలపట్ల నమ్మకం లేదు. అందులోనూ సమకాలీన కవుల్నీ, కథకుల్నీ ఒక మూసలోకి నెట్టి ఊహించుకోవడం నాకు అంతగా నచ్చని విషయం (ఆ కవులూ, రచయితలూ వాళ్ళ దృక్పథాల మేనిఫెస్టోలు చెప్పుకున్నప్పటికీ). ఎందుకంటే, ఒక రచయిత తన ఆదర్శాల సరాసరికి రాయగా రాయగా చేరుకుంటాడు తప్ప రాసిందంతా దాన్నే ప్రతిఫలించదన్నది నా మరో నమ్మకం. వయసూ, అనుభవంతో పాటే, రాస్తూ రాస్తూ కవిగాని రచయితగాని తన ఆలోచనల, విశ్వాసాల సమాహారంనుండి నెమ్మది నెమ్మదిగా తన తార్కికచింతనని రూపుదిద్దుకుంటాడు. మొదటిరచనలోనూ, చివరిరచనలోనూ ఒక్కలాగే ఉంటే రచయితలో పరిణతి లేదని నాకు అనిపిస్తుంది. నిజానికి ఒక కవిని అతని సమకాలీనులకంటే, తర్వాతి తరాలే, నిష్పక్షపాతంగా బేరీజు వేస్తాయి. వాళ్ళకి ఏ రకమైన ప్రలోభాలూ, నిర్భందాలూ ఉండవుగనుక.

ఇస్మాయిల్ లో నాకు నచ్చిన అంశం అతను ఏ భావపరంపర మూసకూ లొంగకపోవడం. కవి అచ్చం గాజుపట్టకంలా ఉండాలి. ఎవరు ఎటునుంచిచూసినా ఏదో ఒక అందం, రంగు కనిపించగలగాలి. ఏకీకృతఆలోచనలుగల కవులకి అది సాధ్యపడదు.

ఒక తుఫాను భీభత్సాన్ని చెపుతూ “వర్షంలో ఊగే చెట్లు” కవితలో చెట్లని సముద్రం చేసి (సాగరంలా ఊగుతోంది… పారం కనిపించని తోట), సముద్రాన్ని చెట్టు (సాగరవృక్షాగ్రానికి చేరుకుంటాయట ఓడలు) చేస్తాడు. ఇందులో అందమైన పదబంధాలున్నాయి. అయితే, ఆ కవితలో నాకు వేరే అందమైన అంశాలు కనిపిస్తాయి. హుద్ హుద్ లాంటి భౌతికమైన తుఫానులు జీవితంలో ఎన్నో రావు. కానీ, ఇక్కడ చెప్పిన తుఫాను మన మౌలిక విశ్వాసాలని వేళ్ళతో సహా పెకలించివేసే సందర్భం. కొందరికయినా ఇలాంటి తుఫానులు జీవితంలో అనుభవం అయే ఉంటాయి. అటువంటి సందర్భం ఎదురైనపుడు, అది మన విశ్వాసాల మూలాల్ని ప్రశ్నిస్తుంది. శ్రీ శ్రీ చెప్పినట్టు అంతవరకూ కాళ్ళ క్రింద పదిలంగా ఉందనుకున్న మన విశ్వాసాల నేల, పగుళ్ళిచ్చి నమ్మకాల చెట్లు ఒక్కొక్కటే కూకటివేళ్లతో కూలుతున్నప్పుడు, మన వైయక్తికమైన భావపరంపరే, స్వయంగా తర్కించి ఏర్పరచుకున్న విశ్వాసపు విత్తనాలే చివరకి మిగులుతాయి. అవే ఇప్పుడు కురిసిన వర్షంలోంచి ప్రాణప్రదమైన తేమను తీసుకుని కొత్త ఆశలు, కొత్త మార్గనిర్దేశన చేస్తాయి. పక్షులు మళ్ళీ కొత్తపాటలు అందుకుంటాయి.

ఈ భావపరంపర పాతవాళ్లకంటే భిన్నం కాదు. చెప్పే తీరులోనే కవి ప్రత్యేకత. అక్కడే మానవ మేధస్సు సరాసరికి సమీపంగా ప్రయాణం చెయ్యడం. ఈ దృష్టితో ఒకసారి ఆ కవితని మళ్ళీ చదవండి.

వర్షంలో ఊగే చెట్లు

.

సాగరంలా ఊగుతోంది.

భోరున కురిసే వర్షంలో

పారం కనిపించని తోట

అహర్నిశీధులు క్షోభిస్తుందేం?

మహాసముద్రం చోద్యంగా ?

గుండెల్లో నిత్యం వానలు

కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ

ఎగిరిపడి కసిరేసే

వృక్షతరంగాల్నే

పక్షులాశ్రయిస్తాయేం?

తూర్పున నల్లటి ఉచ్చులు

తుఫాను పన్నుకుంటూ రాగా

చప్పున సాగరవృక్షాగ్రానికి

తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి

కూలుతాయి మహావృక్షాలు,

ఊగుతాయి ఆ శూన్యంలో

ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు

చుట్టుకుపోయిన మహాసముద్రాల

అట్టడుగున మిగుల్తాయి

బలిసిన ప్రశ్నార్థకాలతో

కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా

బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి

కొత్తనీడల్ని పాతుతాయి

కొత్తపాటల్ని మొలకెత్తుతాయి

జలనిధికీ, ఝంఝ కీ

అలజడి పైకే కానీ

హృదయాలతి ప్రశాంతమట

– అదీ ఇస్మాయిల్ కవిత.
.

-నౌడూరి మూర్తి

murthy gaaru

Adam and Eve

drunken coupleతెలిసి కాదు, తెలియకనే.

ఒక కారణంగా తీసిన చిత్రాలన్నిటినీ చూసుకుంటూ వస్తున్నాను.

ప్రతిదీ బావుంటుంది. ప్రతీదీ ఒక కథ చెబుతుంది. అసలు మనిషి తన బతుకు తాను బతుకుతుండగానే వేరే వాళ్ల బతుకులను అలవోకగా ఇలా జాగ్రత్తచేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది! ‘మంచిదే’ అని మురిసిపోతూ మళ్లీ చూడసాగాను. సడెన్ గా ఈ చిత్రం కనిపించింది మళ్లీ.ఎంత బాగుంది.
తెలిసి కాదు, తెలియకనే తీశాను.మొదట వాక్యం ఉందనీ తెలియదు.
నిజానికి వాక్యం కన్నా ముందు దృశ్యమే ఉండి ఉంటుందనీ తెలియదు.
తెలిసీ తెలియక తీశాను.
వాళ్లిద్దరూ ఆడమ్ అండ్ ఈవ్ లని కూడా తెలియదు. కానీ, తీశాను.

తీసిన చిత్రాలన్నిటినీ చూస్తుంటే, బహుశా ఇది ఈ సంవత్సరం తీసిన ఒక గొప్పఛాయా చిత్రమా ఏమిటీ అని పొరబాటుగా అనుకున్నాను. ‘గొప్ప’ అనడం ఎందుకూ అంటే ఇందులో వాళ్లిక్కడ లేరు.
వాళ్లను మనం కనిపెట్టలేం. ఎక్కడో  ఉన్నారు. లేదా వాళ్లిద్దరూ ఒకరిలో ఒకరున్నారు.

కౌగిలి సుఖం ఎరిగిన వాళ్లకు తెలుసు. వాళ్లు ఎక్కడున్నారో.
లేదా కౌగిలి అనంతరం కాళ్లు పెనవేసుకుని నిద్రలోకి జారుకున్న వాళ్లందరికీ తెలుసు వాళ్లెక్కడున్నారో.
ఏకమైంతర్వాత మళ్లీ ఏకం చేసేదేమీ ఉండదు. ఇక ఎవరికి వారు తమతో ఉండటంలోనూ ఒక ప్రశాంతత.
అదీ ఈ చిత్రం. ఇవన్నీ కలిసి ‘వాళ్లు ఎక్కడుండాలో అక్కడున్నారూ’ అని చెప్పడం.

గొప్పలు పోవడం కాదుగానీ, నా చిత్రాల్లో ఇదొక అద్వితీయ చిత్రం
ఇది చూస్తే దిగులు చెందని జీవుడు ఉండడు. వీళ్ల బతుకు గురించి విచారించని మానవుడూ ఉండడు.
అదే సమయంలో తమలోకి తాము చూసుకుని, తమ భద్ర జీవితం ‘ఒక జీవితమేనా’ అనుకోని మానవుడూ ఉండడు. అనుకుంటున్నానుగానీ అంతకన్నా ఎక్కువే అనుకుంటారేమో!
అందుకే ఈ దృశ్యాదృశ్యం ఒక అనాది చిత్రం. ఆది మూలం. నిరంతర చలచ చిత్రం కూడా.
అందుకే, నా దృశ్యాదృశ్యాల్లో ఇదొక స్పెషల్. ఒక మత్తులో జోగిన ఘజల్.నిజం. అత్యంత సామాన్యమైన, అత్యంత సరళమైన, సహజమూ సుందరమూ అయిన, మిక్కిలి విచారాన్నో లేదా ఆనందాన్నో పంచే ఒక ఛాయను మనలోంచి మనం ఏరుకోవడమే ఛాయా చిత్రకళ. దృశ్యాదృశ్య కళ. ఆ చిత్రం నాది కావచ్చు, మీది కావచ్చు. కానీ అది మనందరనీ పట్టిస్తుందని మాత్రం ఈ సందర్భంగా దయచేసి చెప్పనివ్వండి. మరోమాట. మిమ్మల్ని ఎవరైనా చిత్రం చేస్తున్నారూ అంటే ఒప్పుకొండి. మీ సొమ్మేం పోదు. అది ప్రపంచ ఆస్తిగామారి మిమ్మల్ని అమరులను చేస్తుంది. వీళ్లకు మల్లే.నిజం. తెలిసీ తెలియక, తప్పతాగి. ఒకరి కౌగిళ్లో ఒకరు అదమరచి, తెల్లవారినప్పటికీ, సూర్యుడి కిరణాలు వాడిగా వేడిగా గుచ్చుతున్నాకూడా లేవనంతటి అలసట, బడలిక, సుషుప్తి ఈ చిత్రం.
ఇంకా తెలవారని జీవితాల ఛాయ ఈ చిత్రం.
చూస్తే మనుషులు తెల్లబోవాలి. ‘ఇదిరా జీవితం’ అనుకోవాలి.
అంత నిర్భయంగా, నిర్లజ్జగా, అభద్రంగా సొమ్మసిల్లాలి.

చిత్రం చేశాక నేనూ అలాగే అయ్యాను. నెకెడ్ అయ్యాను. కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదు. ‘నేనెలా జీవిస్తున్నాను. నాకెలాంటి ప్రియసౌఖ్యం’ వుంది అనిపించింది. ఈ భూమ్మీది సరళ రేఖను, మధ్యరేఖను పట్టుకున్నానే భలే అనుకున్నాను. ‘అవి రెండూ కలిసిన రేఖల్ని ఛాయగా బంధించాను కదా’ అనుకున్నాను.
అసలు భూగోళాన్ని చిత్రికపట్టే వృత్తలేఖిని ఏదైనా ఉంటే అది కెమెరానే కదా అనిపించి, ఆనందంగా వీళ్లనుంచి సెలవు తీసుకున్నాను. ఇపుడు, ఇలా, ఒక వారం ముందుగానే ఈ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,. ‘ఓ మానవులారా…మీ జన్మధన్యం నా వల్ల. నా జన్మ ధన్యం మీ వల్ల’ అనుకుంటూ మనుషులందరికీ కృత.జ్ఞతలు చెబుతున్నాను. మరింత పాత దృశ్యాదృశ్యాలకు భరోసానిస్తూ కొత్త కాలానికి స్వాగతం పలుకుతున్నాను.

హ్యాపీ ఇయర్ ఎండింగ్ ఫ్రెండ్స్…~   కందుకూరి రమేష్ బాబు

జాయపసేనాని -1

OLYMPUS DIGITAL CAMERA

దృశ్యం :1

(క్రీ.శ. 1203వ సంవత్సరం . కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా తీరాంధ్రదేశంపై దండయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో మల్యాల చాముండసేనాని సారథ్యంలో కృష్ణానదీ ముఖద్వార ప్రాంత”మైన తలగడదీవి, హంసల దీవి,  మోపిదేవి, నాగాయ లంక, అవనిగడ్డ మొదలైన వెలనాటి మండల క్షేత్రపాలకుడైన పృధ్వీశ్వరుని ఓడించి అతని సకల సంపదనూ, అనర్ఘ మణిమాణిక్యాలనూ ఓరుగల్లు కోశాగారానికి తరలించి అతని సైన్యాధిపతియైన పినచోడుని జయించి..దివి సీమను కాకతీయ సామ్రాజ్యంలో కలుపుకొనకుండా తన రాజనీతిలో భాగంగా  అయ్యవంశీకుడైన పినచోడున్నే సామంతరాజును చేసి రాజ్యమేలుకొమ్మని ఆదేశించిన క్రమంలో…,

పినచోడుని పరమ సౌందర్యవతులైన యిద్దరు కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహమాడి…అతని ముగ్గురు పుత్రులలో ఒకడైన జాయపలో అజ్ఞాతమై ఉన్న ప్రతిభావ్యుత్పత్తులను గ్రహిస్తున్న సమయంలో..,

గణపతిదేవుని వివాహానంతర విజయవసంతోత్సవ వేడుకల వేదిక.,

పినచోడుని సామంతరాజుగా గణపతిదేవుని ప్రకటన…ప్రతిష్టాపన సందర్భం.

స్వాగత…మంగళధ్వనులు

                                                         పిన్నచోడనాయకుని   ఆస్థాన దృశ్యం:   

 వందిమాగదులు : రాజాధిరాజ .. కాకతీ సామ్రాజ్య రాజమార్తాండ .. శత్రుభీకర కదన వీరాధివీర .. కళాధురీణ .. ప్రతిష్ఠాపనాచార్య.. కదన ప్రచండ..చోడకటక చూఱకాఱ  శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులుంగారికి  వెలనాటి  ఏలిక ద్వీపీలుంటాక .. దివిచూఱంకార .. అయ్యకుల సంజాత .. శ్రీ పిన్నచోడనాయక .. సకల అమాత్య,సైనిక నాయకజన, ప్రజా సమూహాల పక్షాన జయహో..విజయహో.. స్వాగతం . .సుస్వాగతం.

( వెనుకనుండి మంగళ ధ్వనులు వినిపిస్తూండగా గణపతిదేవుడు,తన ఇద్దరు నవ వధువులు నారాంబ పేరాంబ లతో వెనుక ఇతర పరివారంతో ప్రవేశం . గంభీరంగా మెట్లెక్కి , సింహాసనాన్నధిష్టించి ఆసీనుడై .. ఆస్థానంలో పరివేష్టితులై ఉన్న పిన్నచోడనాయకుడు, మల్యాల చాముండదేవుడు, కాటమ నాయకుడు తదాది బుధజన సమూహాలకు ప్రణామంచేసి కూర్చుని విరాజిల్లగానే .. స్వాగత గీతం..3 నిముషాలు)

జన హృదయ విరాజిత భోజా

వన వసంతకాంతులొలుకు రారాజా

స్వాగతం..తామ్రపురికి ఘనస్వాగతం

 

కళాధురీణా..కదన ప్రవీణా

యుద్ధవిద్యలలొ విక్రమతేజా

శతృసంహార..పురవరాధీశ్వరా

పరమ మహేశ్వర..మండలేశ్వరా       జన!!

 

కదన ప్రచండా..విభవ దేవేంద్ర

తిమిర మార్తాండ..లక్ష్మీ నిజేశ్వర

కాకతీరుద్ర..అరివీరభయంకర

గణాధీశ్వరా ..గణపతిదేవా           జన!!                          ( సాంప్రదాయ..కూచిపూడి పద్ధతిలో నిర్వహించాలి)

 

(గణపతిదేవుదు తన ఉన్నత సింహాసనం పైనుండి లేచి .. పినచోడ నాయునివైపూ.. అమాత్య .. సైనికాధిపతులవైపూ.. సభాసదులూ.. పురప్రజలందరివైపూ.. నిర్మలంగా చూస్తూ నిలబడి )

 

 గణపతిదేవుడు: ఈ నిండు పేరోలగంలో ఆసీనులైఉన్న తామ్రపురి పూర్వపాలకులైన చోళాధీశులు,పృధ్వీశ్వరులు,వారి సైన్యాధ్యక్షులు..ప్రస్తుతం కయ్యము విడిచి మాతో నెయ్యముతో వియ్యము గరిపిన పినచోడులుంగారికి..మావెంట యుద్ధములలో పాల్గొని మాకు విజయమును సాధించిపెట్టిన మా సేనాధిపతి మల్యాల చాముండదేవుడు,కాటమ నాయకుడు..తదితర ప్రముఖులకు..మేము మా సువిశాల కాకతీయ సామ్రాజ్యంలో దైవసమానులుగా సంభావించే మా ప్రజలతోపాటు ఈ రోజునుండి మహోజ్జ్వల వీర కాకతీయ సుభిక్ష పాలనలోకి ప్రవేశిస్తున్న మా ప్రియతమ వెలనాటి ప్రజలకూ..ఈ గణపతిదేవుని వినమ్ర ప్రణామములు.

ఈరోజు ఎంతో విశిష్టమైన సుదినము.దివిసీమను కాకతీయ సామ్రాజ్యాంతర్భాగంగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న ఈ విజయోత్సవ వసంత సభలో మేమొక విస్పష్ట స్నేహపూర్వక ప్రకటనను చేస్తున్నాము.ఇక ముందు అయ్యవంశీకులైన పినచోడులుంగారు ఈ వెలనాడు ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తులమైన మా పరిపాలనా విధానాలకు లోబడి ప్రజారంజకంగా,సుభిక్షముగా మా సామంతరాజు హోదాలో ఏలుబడిని కొనసాగిస్తారని ఈ నిండు ప్రజాసభలో సాధికారికంగా ప్రకటిస్తూ..అజ్ఞాపిస్తున్నాము.

పినచోడుడు: ధన్యవాదములు మహారాజా..మా జన్మ చరితార్థమైనది.ప్రజలను కన్నబిడ్డలవలె కాచుకునే మీ పరిపాలనా సూత్రములననుసరించి మేముకూడా మీ అజ్ఞాబద్దులమై జనరంజక పాలననందిస్తామని ఇందుమూలముగా మీకు సవినయముగా హామీ ఇస్తున్నాము.

 గణపతిదేవుడు:మల్యాల చాముండదేవుడుగారూ..ఒకసారి స్థూలముగా మన కాకతీయ పాలనా విధానాన్ని ఈ తామ్రపురివాసులకు తెలియజేయండి.

 చాముండదేవుడు:చిత్తము మహరాజా.రాజు అనగా ఒక కుటుంబమునకు తండ్రివలె తన సామ్రాజ్యములోని ప్రజలందరకూ సంరక్షకుడు మాత్రమే.ప్రజల ధన మాన ప్రాణ రక్షకుడై వారి నిత్యాభివృద్ధికోసం తపిస్తూ జనరంజకముగా అందరినీ సమదృష్టితో,సమన్యాయముతో ధర్మబద్ధంగా పాలించడమే కాకతీయుల విధానము.ప్రతి ఊరూ ఒక గుడితో,ప్రక్కనే పంటపొలాలతో విరాజిల్లే చెరువూ,తల్లి ఒడివంటి బడితో ప్రశాంతముగా వర్థిల్లడమే చక్రవర్తుల అభిమతము.గొలుసుకట్టు చెరువల నిర్మాణం మన సేద్యవిధానం.

 గణపతిదేవుడు:కాటమ నాయకా మీరు చెప్పండి.

 కాటమనాయుడు:చిత్తము మహాప్రభో.ప్రతి పౌరుడూ నైతిక విలువలు నిండిన జీవన విధానముతో ధర్మబద్ధముగా జీవిస్తూ సకల యుద్ధ విద్యలలోనూ,కళా రంగాలలోనూ,వృత్తి నైపుణ్యాలతోనూ పరిపూర్ణుడుగా వర్థిల్లడమే చక్రవర్తుల ఆకాంక్ష.

(ప్రజల జయజయ ధ్వానములు)

 గణపతిదేవుడు:ఇప్పుడు..ఈ దండయాత్రలో మా విజయానికి కారకులైన మా సేనాని మల్యాల చాముండదేవుణ్ణి మేము “ద్వీపలుంటాక”బిరుదుతో సత్కరిస్తున్నాము.ఎవరక్కడ..,

పినచోడుదు:ఏర్పాట్లు చేయబడ్డాయి మహరాజా..(చేయితో సైగ చేస్తాడు)

(మంగళ వాద్యాలతో..ఖడ్గమూ..హారమూ..కిరీటమూ తెస్తారు.గణపతిదేవుడు చాముండదేవునికి వాటిని ధరింపజేసి.,)

చాముండదేవుడు:మహాప్రసాదము మహారాజా.నా జన్మ ధన్యమైనది.మున్ముందుకూడా కాకాతీసామ్రాజ్య పరిరక్షణ బాధ్యతలో నా జన్మను పునీతం చేసుకుంటానని ఇందుమూలముగా ప్రతిజ్ఞ పూనుతున్నాను.

గణపతిదేవుడు:శెహబాస్ చాముండదేవా.ఇప్పుడు ఈ మా సామ్రాజ్య విస్తరణాయాత్రలో మాకు కుడి భుజముగా సహకరించిన మరో యోధుడు కాటమ నాయకుడిని మేము “దీవి చూరకార”బిరుదుతో సత్కరిస్తున్నాము.

(మళ్ళీ మంగళ ధ్వనులు…ఖడ్గము…ప్రదానము )

కాటమ నాయకుడు:నా జన్మ సార్థకమైనది మహారాజా.యుద్ధవిద్యలలో..రాజ్యవిస్తరణ వ్యూహ రచనలో అజేయులైన మా చక్రవర్తులకు బాహుసమానుడనై కంటికి రెప్పవలె నిరంతరమూ అహర్నిశలూ కాపలాదారుడనై ప్రవర్తిస్తాననీ,కాకతీ సామ్రాజ్య రక్షణలో నా జీవిత సర్వస్వాన్నీ ధారపోస్తానని ఇందుమూలముగా ప్రమాణము చేస్తున్నాను.

 గణపతిదేవుడు:భళా కాటమనాయకా భళా.నీవు మాకు నీడవే కాదు బహిర్ ప్రాణానివి కూడా.

ఈ విజయోత్సవ సందర్భంలో మేము ఇష్టపడి పవిత్ర వివాహ కార్యముతో మా దేవేరులుగా స్వీకరించిన మా సామంతరాజు పినచోడులుంగారి కుమార్తెలు నారాంబ మరియు పేరాంబలను మా కాకతీయ సువిశాల సామ్రాజ్య పట్టపురాణులుగా ప్రకటిస్తూ దివిసీమ ప్రజల ప్రేమమయ కానుకగా మా హృదయసీమలో భద్రపరుచుకుంటున్నాము.ఈ శుభ సందర్భముగా విజయోత్సవ సంరంభాలను ప్రారంభించవలసినదిగా మాచే నియమితులైన మా సామంతరాజు పినచోడులుంగారిని ఆదేశిస్తున్నాము.

 పినచోడుడు:చిత్తము మహారాజా..శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశాన్నీ,జాతినీ ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన కాకతీయ మహాసామ్రాజ్యములో ప్రజలకు సంప్రాప్తించినది స్వర్ణ యుగము..స్వర్గ యుగము.మీ ప్రజారంజక పాలనలో నన్ను మీ సామంతునిగా నియమించినందుకు ధన్యవాదములు.నిబద్ధతతో,నిజాయితీగా,మీ ఆజ్ఞాబద్ధుడనై ఈ వెలనాటి సీమను విధేయంగా పాలిస్తానని ఈ నిండుసభలో ప్రమాణము చేస్తున్నాను. మానవుల మధ్య ఉందదగు మానవీయ బంధమును మన మధ్య స్థాపించి మా  కుమార్తెలు నారాంబ,పేరాంబలను మీ ధర్మపత్నులుగా స్వీకరించి మా జన్మలను ధన్యము చేసినారు.ఇక మేము ఈ పవిత్రబంధమును ప్రాణముకన్నా మిన్నగా కాపాడుకుని మీకు వినమ్రులుగా ఉంటామనీ జీవితాంతం ఋణగ్రస్తులమై ఉంటామనీ వాగ్దానము చేస్తున్నాము.

ఇక ..ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగముగా..మొదట మా వీరులచే “ఖడ్గప్రహార ప్రదర్శన”,”శబ్దవేది”,”విలువిద్యా విన్యాసము”,సాహిత్య కళారంగాలలో అభిజ్ఞతగల పండితులచే జ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడ్డాయి.తమరి అనుమతికోసం నిరీక్షణ ప్రభూ.,

  గణపతిదేవుడు:కొనసాగించండి పినచోడ రాజా..మేమూ వీక్షించుటకు ఉత్సుకులమై ఉన్నాము.

  పినచోడుడు:దండనాయకా..వీరులను ప్రవేశపెట్టుము.

(మ్యూజిక్..కోలాహలం..ప్రజలు,వీక్షకుల హడవుడి..ఉత్సుకత..మొద11)

  గణ.దే: దేవీ నారాంబా..అక్కడ ప్రదర్శన క్షేత్రంలోకి ప్రవేశించి కళ్ళకు నల్లని వస్త్రమును ధరించి నిలబడి ఉన్న బాలుడు మీ సోదరుడు జాయపకదా.

  నారాంబ: ఔను మహాప్రభూ..అతను జాయపే…జాయప జన్మతః అద్భుతమైన ప్రతిభాశీలి.గజవిన్యాస శిక్షణలో,గజనియంత్రణలో..ఖడ్గప్రహార విద్యలో..ఇతరేతర సకల సైనిక యుద్ధవిద్యల్లో..ఆయుధ ప్రయోగకళల్లో అతను అజేయుడు.ఏకసంతాగ్రాహి.మా అందరి ఊహలకు మించి మహోన్నతంగా ఎదుగుతున్న పరాక్రమవంతుడు.

 గణ.దే: భళా..బాగున్నది..ముచ్చటైన రూపురేఖలు,నిండైన విగ్రహం..సౌష్టవమైన శరీరం..ఊ..

 పేరాంబ: జాయప ప్రత్యేకముగా ప్రదర్శించే “శబ్దవేది విద్య” ఎంతో ఆసక్తికరమై చూపరులను ఊపిరిసలుపకుండా చేసేది.ఎలా సాధన చేశాడో తపస్సువలె.

 గణ.దే:జాయప అక్కలిద్దరూ సృష్టికే అలంకారాలైన సౌందర్యరాసులైనప్పుడు తమ్ముడు వీరుడూ పరాక్రమశాలి కావడం సహజమేకదా..ఏమంటావు నారాంబా.

 నారాంబ:ఔనంటాను ప్రభూ..చక్రవర్తులెప్పుడూ ఉచితమే తప్ప అన్యము పలుకరుకదా.

( ప్రదర్శన కొనసాగుతూంటుంది..)

 పేరాంబ:ప్రభూ..వివాహానంతరం మేము చక్రవర్తులవెంట రావడం మిగుల ఆనందదాయకమే ఐనా..జాయపను విడిచి.. పన్నెండేళ్ళైనా నిండని మా తమ్ముని సాంగత్యాన్ని కోల్పోయి ఎడబాటును పొందవలసిరావడం కించిత్తు దుఃఖకరముగానే ఉన్నది.జాయన సాంగత్యం చంద్రునితో వెన్నెల వంటిది.

గన దే: ఉహూ..అలాగా..సోదర సాన్నిహిత్య మాధుర్యాన్నీ,వియోగ విషాదాన్నీ ఈ మహరాజు అర్థం చేసుకోగలడు దేవీ..చూడు,జాయన కళ్ళు మూసుకుని ఖడ్గచాలనానికి సిద్ధపడుతున్నాడు.

దండనాయకుడు:.సభాసదులారా.ఇప్పుడు సుశిక్షితుడైన ఒక ఖడ్గవీరునితో కళ్ళకు గంతలు కట్టుకుని పన్నెండేండ్లుకూడా నిండని “జాయన” శబ్దాధార ప్రహార నైపుణ్యంతో మనముందు వీరోచితంగా తలపడబోతున్నాడు..ఇది ఒక రోమాంచితమైన ప్రాణాంతక ప్రదర్శన..వీక్షించండి.

( కాహళి ధ్వని దీర్ఘంగా..క్రీడ ప్రారంభం..ఖడ్గముల కరకు ధ్వని..వీరోచితంగా మధ్య మధ్య కరతాళ ధ్వనులు..కేరింతలు..హాహాకారాలు..ఉద్విగ్నత..)

దండనాయకుడు: బాలవీరుడు జాయప ఖడ్గ చాలన విద్యానైపుణ్యాన్ని వీక్షించిన చక్రవర్తులకు,దేవేరులకు పురప్రముఖులందరకూ ధన్యవాదములు..ఇప్పుడు..వినోదార్థం..యువకిశోరం జాయప కొన్ని సంవత్సరాలుగా తనంత తానుగా వృద్ధిపర్చిన ఒక వింత జంతుభాషతో,హృదయంగమ సాన్నిహిత్యంతో గజసమూహాలతో మనముందు చిత్రమైన గజవిన్యాస క్రీడను ప్రదర్శిస్తారు.గజసాధకునిగా జాయప ఈ రంగంలొ అజేయుడు.

( గజ విన్యాసాలను లైట్ అండ్ షేడ్ పద్ధతిలో..మ్యూజిక్ తో చూపిస్తూ..సౌండ్ ను డిం చేస్తూ..,)

గణ.దే:(పేరాంబనుద్దేశ్యించి) మీ తమ్ములుంగారు ఈ విధముగా భిన్నమైన వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కలిగి విద్యావిశారదుడు కావడం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నది..భళా.,

 పేరాంబ: అదంతా దైవ ప్రసాదిత నైపుణ్యమె ప్రభూ.శివాజ్ఞ.జాయన సాధన..కృషి..పట్టువిడవని తపస్సమాన దీక్ష నిజముగా శ్లాఘనీయమైనదే.ప్రతిదినము ప్రాతఃసమయములో రెండవజాముననే అతను చేపట్టే నిరంతర సాధన మమ్మల్నందరినీ అబ్బురపరుస్తుంది.స్వామీ..మీరన్నట్టు చిత్రమే అతని తత్వము..నైపుణ్యము కూడా.

( ఏనుగుల చిత్ర విన్యాసాల ధ్వని..కొనసాగింపు)

ధ్వనిమాత్రంగా..

దండనాయకుడు:పది ఏనుగులు గల ఈ కరిసమూహముతో జాయన వివిధ భంగిమలలో, భిన్న శ్రేణులుగా,పరిపరి పరిస్థితులలో శాంత..ప్రసన్న..ఉగ్ర..మహోగ్ర..ఉద్విగ్న పద్ధతులలో ప్రవర్తించు విధములను ప్రదర్శిస్తారు..వీక్షించండి..చకితులమౌతాం మనం.. ( సౌండ్..గజ క్రీడ..శబ్దాలు).లైట్స్ ఆన్.

గణ.దే: భళా..బాగున్నది.జాయనయొక్క గజ నియంత్రణ..సాహిణత్వం బహుదా ప్రశంసనీయముగా ఉన్నది.మేము ముదముతో పొంగిపోయితిమి…ఊ..తర్వాత.,

దండనాయకుడు:చివరి అంశము..మహాచక్రవర్తుల సమక్షమున పురుషులు మాత్రమే చేయు సంధ్యాసమయ శివతాండవ శృంగనర్తనమును జాయన ఇపుడు ప్రదర్శిస్తారు..పంచశక్తులైన పృథ్వీ,జల,వాయు,తేజో,ఆకాశ లింగ మూర్తులను స్తోత్రం చేస్తూ..పంచముఖ శబ్దాలతో సునిశితమైన ప్రణవ,ప్రణయ,ప్రళయ నాదాలతో కూర్చిన ఈ నర్తనం కరణ,చారీ,అంగ హారాల సంపుటీకరణతో మనల్ని చకితుల్ని చేస్తుంది.ఈ నాట్యగతిని జాయన తనకుతానుగా రూపొందించుకుని కూర్చిన కళగా మహాచక్రవర్తులకు నివేదించబడుతున్నది..తిలకించండి.

గణ.దే:ఊ..మహదానందముగా ఉన్నది..ఖడ్గ విద్య..గజపాలనా నైపుణ్యము..ఇప్పుడు నృత్తమా.?పరస్పర సంబంధమే లేని ఈ భిన్న కళారంగాలలో నిపుణత్వం నిజముగా విచిత్రమే..అనితర సాధ్యమే ఇది..(పారవశ్యంతో)

“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం

భావాభినయహీనంతు నృత్యమిత్యభిధీయతే

రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే”..

అనికదా తన అభినయ దర్పణములో నందికేశ్వరుడు నాట్య,నృత్త,నృత్యములను నిర్వచించినది. అంటే పూర్వకథాయుతమై,పూజనీయమైన నాటకమే నాట్యము.భావాభినయ హీనమైనది నృత్తము.రసభావవ్యంజనాది యుక్తమైనది నృత్యము ..అని అర్థము.కానివ్వండి..మేము మిగుల ఉల్లాసభరితముగా ఈ ప్రదర్శనను వీక్షిస్తాము.

( గజ్జెల చప్పుడు.శంఖ ధ్వని..మద్దెల..మహా మద్దెల..ఉడుక్కు..పెద్ద కంచు తాళాల మేళప్రాప్తి..మార్దంగికుని బీభత్స రసవిన్యాస క్రీడ.కొనసాగుతూండగా..జాయన రంగప్రవేశం.నర్తనం..ధ్వనిపూర్వక శ్రవణం..మధ్య మధ్య..గణపతిదేవుణి పారవశ్య వ్యాఖ్యలు..భళా..అద్భుతం..మహాద్భుతం..చప్పట్లు..కేరింతలు..నవ్వులు..శ్లాఘత..పరాకాష్టల కరతాళధ్వనుల కెరటం..ఒక ఉత్తుంగ తరంగం ఎగిసి శాంతించిన స్థితి..తర్వాత..నడుస్తూ జాయన తన దగ్గరకు రాగా., )

  గణ.దే:జాయనా..నీ శృంగనర్తనము అపూర్వము..భావ,రాగ,తాళ యుక్తముగా సాగిన శివతాండవము అపురూపము.ఈ వీరనాట్యములో నీవు శివరౌద్రావాహన జరిపిన తీరు మమ్మల్ని పారవశ్యుల్ని చేసింది.భళా..(తన ఇద్దరు భార్యలనూ,పిన చోడునినీ ఉద్దేశ్యించి) ఈ బాలుడు దైవాంశసంభూతుడు..జన్మతః ప్రధాన సృజన విద్యలలో పూర్ణుడైన ఈ బాలునకు సశాస్త్రీయమైన శిక్షణ ఉన్నచో యితడు ఈ సైనిక,కళా విద్యలలో ఎంతో వన్నెకెక్కి జగత్ ప్రసిద్ధి చెందుతాడు.ఇతనిలోని కళాభిజ్ఞతను మేము గుర్తించితిమి..దేవీ..జాయనను మనతోపాటు కాకతీయుల రాజధానియగు ఓరుగల్లు నగరమునకు వెంట తోడ్కొనిపోయి అచట ఈ కళారంగాలన్నింటిలో , యుద్ధవిద్యలలో, నిష్ణాతులైన శ్రేష్టులతో ప్రామాణికమైన, శాస్త్రీయమైన శిక్షణనిప్పించెదము .. పినచోడులుంగారూ, బాలుని మాతోపాటు పంపించి సహకరించండి.

  పిన చోడుడు: ధన్యోస్మి ప్రభూ.కృతార్థులము..మా జాయన భవిష్యత్తు మీ స్పర్శతో సూర్య సందర్శనముతో కమలమువలె వికసిస్తుందిక.సకల సన్నహములను కావించెదము.

 గణ.దే:రేపే ఓరుగల్లు మహానగరమునకు మా పయనము.చాముండ నాయకా..మన సేనా పరివారమును సంసిద్ధులను చేసి జాయనతోసహా మన ప్రస్థానమునకు ఏర్పాట్లు గావింపుము.

 జాయన:( పరుగు పరుగున మెట్లెక్కి వచ్చి గణపతిదేవునికి పాదాభివందనం చేసి..ఎదుట నిలబడి)ధన్యుడను మహారాజా..మీ కరునకు,శ్లాఘతకు పాత్రుడనైన నా జన్మ ధన్యము..ఆజన్మాంతము మీకు నేను ఋణగ్రస్తుడనై,విధేయుడనై ఉంటాను.

గణ.దే:భళా జాయనా..నీవు జన్మతః ప్రతిభాశీలివి..వినమ్రుడవుకూడా.అందువల్ల రానిస్తావు.మాకు జ్వాలలో కాంతివలె తోడుండి కొనసాగు..శుభం..శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

 జాయన:ధన్యులము మహారాజా..ధన్యులము.

(పిన చోడుడు,నారాంబ,పేరాంబలతో సహా..)

గణ.దే:శుభం..కాకతీయ మహాసామ్రాజ్యంలో ఒక భాగమై..దివిసీమ పినచోడుని సుపరిపాలనలో కలకాలం సకల సంపదలతో సంపన్నమై వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..సర్వం శుభం..సకలం సుభిక్షం..సెలవిక.

(గణపతి దేవుడు ప్రాంగణంనుండి నిష్క్రమిస్తారు.వెంట అనుచరగణం..తదితరులుకూడా నిష్క్రమిస్తున్న చిహ్నముగా ధ్వని..కాహళి శబ్దం)

ఓ కప్పు సూర్యోదయం

picasso

 

 

 

 

 

 

 

తూర్పు కొండల్లో… రూపాయి కాసులా
పొద్దు పొడుచుకొస్తున్నప్పుడు
ఆమె… చీకటిని వెన్నెలను కలిపేసి
మిణుక్ మంటున్న నక్షత్రాలను
ఓ చెంచాడు పోసి
కప్పుడు సూర్యోదయాన్ని అతడికిస్తుంది
ఆ పొద్దంతా… అతని కంటిలో
మీగడ తరకలాంటి
ఆమె నవ్వు నిలచిపోతుంది

* * *

దరల మంటల్లో మండిన రూపాయి
పడమటి కొండల్లో పొద్దయి వాలుతున్నప్పుడు
ఆమె… కాసింత దుఃఖాన్ని పోసి
అదేపనిగా కన్నీరును కాచి
ఓ కప్పుడు చీకటిని అతడికిస్తుంది
ఆ రాత్రంతా…
వడలిన మల్లెమొగ్గలాంటి ఆ ఇంటిలో
విరిగిన పాల వాసనేస్తుంది

-మొయిద శ్రీనివాసరావు

Moida

PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

imagesHJG8UATD

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ ! నాకు హిందుస్తానీ అంటే చాలా ఇష్టం – ముఖ్యంగా బడే ఘులాం అలీ ఖాన్ అంటే అని నేను చెప్ప గానే నొసలు చిట్లించి యేం ఇక గాయకులే కరువా? ఆయన తప్ప మరొకరు లేరా? అంటే యెందుకు లేరు ఉస్తాద్ హమీద్ అలీ ఖాన్ , ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉస్తాద్ అమీర్ ఖాన్ అని నేను పేర్లు చెప్తుంటే నన్ను ఆపేసాడు. వద్దు వద్దు ఇంక ఆపు – ఇంకెవరూ లేరా అంటే అప్పుడు కానీ నాకు తట్ట లేదు – ఉన్నారు పండిట్ భీం సేన్ జోషి పండిట్ జస్రాజ్ పండిట్ శివకుమార్ శర్మ అంటూ పేర్లు చెప్తుంటే ఆయన ముఖం కొంచెం వికసించింది. అయినప్పటికీ ముఖం గంభీరంగా పెట్టుకుని నాకందుకే ముస్లిం లు పాడే హిందుస్తానీ సంగీతమన్నా, ఖాన్ లు  డామినేట్ చేసే  హిందీ సినిమాలన్నా అసలు ఇష్టం ఉండదు. మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అంటూ అసహనం ప్రదర్శించాడు. అదేమిటీ అవడానికి ముస్లిం లైనా హిందుస్తానీ సంగీతాన్ని ఔపోసన పట్టి భజనలు కూడా పాడుతున్నారు కదా అన్నాను. యేమో నాకసలు పడదు. హాయిగా కర్ణాటక సంగీతమే బాగుంటుంది హిందుస్తానీ అంటే నాకసలు పడదు అని చివాల్న లేచి వెళ్ళిపోయాడు.

ఒక భిన్నమైన వాతావరణంలో ఉన్నాం మనమిప్పుడు ముఖ్యంగా గత యేడాది కాలంగా, పార్లమెంటు యెన్నికలు జరిగి బీ జే పీ ఆర్ యెస్సెస్స్ శక్తులు అధికారంలోకి వచ్చాక! మనుషుల్ని ఫలానా అని ముద్ర వేసింతర్వాత కానీ వారి టాలెంటుని కానీ విజయాల్ని కానీ అపురూపమైన వారి వ్యక్తిత్వాల్ని చూడడానికి నిరాకరిస్తున్న వాతావరణం. ఒక సంగీత కారుడేమిటి, ఒక నటుడేమిటి ఒక సినిమా యేమిటి యేదైనా అది ఫలానా మతానికి చెందిన వారయితే దాని పట్ల యేహ్య భావం లేదా ముభావం ప్రకటించడం జరుగుతున్న వాతావరణం. ముఖ్యంగా ఇది మతానికీ, మతాచారాలకు , మత గురువులకు, మత సంప్రదాయాలకు సంబంధించిందయితే అది మరీ సున్నితమైన అంశంగా మారి వాగ్వివాదాలకు, ఘర్షణలకు దారి తీయడం జరుగుతోంది.

మతం మీద, దేవుడి మీదా, మత సంప్రదాయాలమీద, మత గురువుల మీదా విమర్శ చేసేటప్పుడు చేసే విమర్శ యేమిటి అది సరయిందా సవ్యమేనా కాదా అందులో నిజమెంత కల్పితమెంత అనే చర్చ కాకుండా విమర్శ చేసిన వాడెవడు, వాడి మతమేమిటి, వాడి కులమేమిటి, వాడి ఫలానా మతం మీదనే యెందుకు చేసాడు, వేరే మతాల మీద యెందుకు చెయ్యలేదు – మిగతా మతాలు సవ్యంగా ఉన్నాయని వాడి ఉద్దేశ్యమా లేక విమర్శ చేస్తే ఆయా మతాల వారి ఊర్కోరు గనక అన్ని విమర్శలనీ  గంగిగోవుల్లా మనమే భరిస్తున్నాం కాబట్టి మనమే తేరగా దొరికామా వాడికి – అంటూ అనేక భిన్న కోణాల్లో విమర్శ చేసిన వాడి మీద దాడి చేస్తారు. ఈ విమర్శ అంతా మనల్ని తెగిడి వేరే మతాల వారిని పొగడడానికీ నెత్తికెక్కించుకోవడానికీ మాత్రమే అని తేల్చి పారేస్తాం.

యింతకీ ఈ చర్చంతా ఈ మధ్యే విడుదలయిన పీకే అనే సినిమా గురించి అని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

పీ కే సినిమాలోకి వెళ్ళే ముందు 2012 లో వచ్చిన మరో సినిమా గురించి చెప్పుకోవాలి. ‘ఓ మై గాడ్ ‘ అనే పేరుతో వచ్చిన సినిమా దేవుని పేరు మీద జరిగే వ్యాపారాల మీదా , తంతుల మీదా, అర్థం పర్థం లేని మత సంప్రదాయాల మీద తీవ్రమైన విమర్శలే చేసింది. ఆ సినిమా లో పరేష్ రావల్ అనే నటుడు ప్రదాన పాత్ర పోషించాడు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించాడు. అయితే అన్ని విమర్శలు హేతువాద దృక్పథంతో చేసిన OMG సినిమా ఆసాంతం కృష్ణ భగవానుని పాత్ర పై ఆధారపడి నడుస్తుంది. బహుశా తన హేతు వాద విమర్శలకు, మత గురువులపై, సంప్రదాయా లపై  విమర్శలకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేమో కృష్ణుని పాత్రని తోడు తెచ్చుకున్నా రు.

అయితే సినిమా గురించి సర్వత్రా ప్రశంసలూ పొగడ్తలూ  సద్విమర్శలూ మాత్రమే వినబడ్డాయి, నటుడు  పరేష్ రావల్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత దాదాపు అట్లాంటి కథాంశం తోనే (అట్లా అంటే పీకే సినిమాని చిన్నది గా  చేసి  చూసినట్టు అవుతుందేమో ) వచ్చిన సినిమా పీ కే,  ఓ యెం జీ ఎక్కడ ఆగిపోయిందో  అక్కడ్నుంచి విమర్శని ముందుకు తీసికెళ్ళింది, యెక్కడ ఓ యెం జీ అధైర్య పడి విఫలమైందో  అక్కడ ధైర్యం చేసి విజయం సాధించింది (పూర్తి అని నేననను – కానీ ఓ యెం జీ కన్న ఒక పది మెట్లు ఎక్కువే) యేది చెప్పడానికి ఓ యెం జీ కృష్ణున్ని యెంచుకుందో దాన్ని మించి చెప్పడానికి పీకే మనిషిని యెంచుకుంది! అందుకే పీకే ఓ యెం జీ కన్నా చాలా అడుగులు ముందుకేసింది . అయితే మరి యెందుకు పీకే కు ఓ యెం జీ కన్నా నిందలు, తిట్లూ, శాపనార్థాలూ  ఎక్కువ వస్తున్నాయి. యెందుకు పీకే గురించి చర్చ మోడరేట్ గా జరగడం లేదు – అయితే ఒక చివర లేదూ మరో చివర అనే తీవ్ర స్థాయిలో యెందుకు జరుగుతోంది. ఓ యెం జీ వచ్చినప్పుడు యెవరూ ఆ సినిమాలో ఒక ఫలానా మతాన్నే యెందుకు విమర్శించారు యితర మతాలనెందుకు విమర్శించలేదు అని యెవరూ అడిగినట్టు గుర్తు లేదు – పీకే ను మాత్రం యెందుకు యితర మతాలని విమర్శించలేదు అని తీవ్రంగా దూషిస్తున్నారు.

నా మట్టుకు నాకు కొన్ని  కారణాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మొదటిది పరేష్ రావల్ మతం, అతని రాజకీయ విశ్వాసాలు, అతని రాజకీయ పార్టీ – రెండోది –పోయిన యెన్నికల్లో ఆ పార్టీ భారీ మెజారిటీ తో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. గత యెన్నికల విజయం తర్వాత భారత దేశ రాజకీయాలని శాసిస్తున్న అభిప్రాయాలు విశ్వాసాలు, యెటువంటి విమర్శలనూ యెంతమాత్రమూ సహించలేని ఒక తీవ్రమైన అప్రజాస్వామిక పరిస్థితి  దేశంలో భౌతికంగానూ, ప్రపంచ వ్యాప్తంగా దేశీయుల virtual world లోనూ నెలకొని ఉన్నది. తామనుకున్న అభిప్రాయాలపై  యెటువంటి  విమర్శను కానీ చర్చను గానీ సహించక దాడులకు దిగే ఒక అప్రజాస్వామిక పరిస్థితి. ముఖ్యంగా ఒక మతం వారిపై ప్రకటిత అప్రకటిత ద్వేషాలతో రగిలిపొతూ వారిని తీవ్రంగా isolate చేసే పరిస్థితి. అందుకే పీకే సినిమా వెనుక ప్రదానంగా ఉండి, తెరపై ఆ పాత్ర పోషించిన ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్లా సినిమా పై విమర్శలూ దాడులూ ప్రధానంగా ఆ కోణం నుండే జరుగుతున్నాయి.

యింతకీ పీకే సినిమా లో ఉన్నదేమిటి? అందులో చిత్రించిదేమిటి, చర్చించిదేమిటి? యెందుకింత రభస జరుగుతోంది? స్థూలంగా పీకే కథ ఇది – మనుషులు నివసించడానికి అనువైన మనలాంటిదే మరో గ్రహం (కొన్ని కాంతి సంవత్సరాల దూరం లో ఉన్నది) నుండి ఒక అంతరిక్షనౌక లో ఒక గ్రహాంతరవాసి భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టీ పెట్టడం తోనే తాను వచ్చిన అంతరిక్షనౌక ను తిరిగి పిలవడానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ చోరీ అవుతుంది. యిక తర్వాత ఆ గ్రహంతర వాసి తన రిమోట్ కంట్రోల్ ని తిరిగి సాధించుకోవడానిక్ చేసే నానా ప్రయత్నాలే సినిమా కథ.

తన గ్రహంపై బట్టలు లేకుండా నగ్నంగా ఉండే గ్రహాంతర వాసి భూమ్మీద మనుషుల్ని చూసి బట్టలు  కట్టుకోవడం తెల్సుకుంటాడు. పోయిన తన రిమోట్ కోసం దేవుళ్ళని ప్రార్థించాలనీ , అందుకు భూమ్మీద అనేక దేవుళ్ళున్నారనీ  , ఆయా దేవుళ్ళకు వేర్వేరు నివాసాలున్నాయని (చర్చి, గుడి, మసీదు వగైరా ), ఆయా దేవుళ్ళకు బ్రోకర్లు, మేనేజర్లు అనేకం ఉన్నారని, ఆయా దేవుళ్ల దగ్గరికి చేర్చడానికి అనేక మార్గాలూ మతాలున్నాయని అర్థం చేసుకుని తన ప్రార్థనలు మొదలు పెడతాడు. అన్ని ప్రార్థనలూ విఫలమౌతాయి. యే  దేవుళ్ళూ ఆయన ప్రార్థనలు వినరు. యింక విసుగొచ్చి, నిరాశ నిస్పృహ లకు లోనయి దేవుళ్ళు కనబడడం లేదు అని కరపత్రాలు పంచుతున్నప్పుడు జగ్గు అనే ఒక టీ వీ రిపోర్టర్ కు పరిచయమౌతాడు. ముందు యితని కథ నమ్మక పోయినా , చేతులు పట్టుకుని మనసుల్ని చదవగలనని నిరూపించిన జగ్గు  తర్వాత అతనికి సాయం చెయ్యాలనుకుంటుంది. పోయిన రిమోట్ కంట్రోల్ తన కుటుంబం అమితంగా గౌరవించి కొలిచే తపస్వి అనే మత గురువు తనకు హిమాలయాల్లొ దొరికిన శివుని గజ్జె అని ప్రచారం చేసుకోవడం చూసి యెట్లాగయినా దాన్ని తిరిగి పీకే కి ఇప్పించాలనుకుంటుంది. అమాయకత్వం తో పీకే వేసే సూటి ప్రశ్నలు మతగురువులు దేవున్ని చేరుకోడానికి రాంగ్ నంబర్లని వాటిని వ్యతిరేకించాలని మీడియా ద్వారా  ఒక ఉద్యమం లేవదీస్తుంది.

అయితే జగ్గు తాను బెల్జియం లో చదువుకునేటప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని ప్రేమిస్తుంది. తన కుటుంబ గురువు అయిన తపస్వి ముస్లిం  మతానికి చెందిన వారంతా నమ్మక ద్రోహులు  కాబట్టి ఆ యువకుడు కూడా ఆమెకు ద్రోహం చేస్తాడని చెప్పడం నిజంగానే తనకు ద్రోహం జరగడం ఆమె మనసులో చెరగని ముద్ర వేస్తుంది. సినిమా చివరి ఘట్టానికి ముందు తీవ్రవాదుల (ముస్లిం) బాంబు దాడిలో తనకు తొట్ట తొలుత ఆశ్రయమిచ్చిన భైరన్ సింగ్ తన రిమోట్ చోరీ చేసిన వ్యక్తీ మరణించడంతో తన చివరి ఆశా కోల్పోయిన పీకే చివరి ఘట్టం లో టీవీ స్టూడియో లో తపస్వి తో తలపడతాడు. దేవుళ్ళనీ , ‘ధర్మాన్నీ’  రక్షించే మహా బాధ్యత మత గురువులు తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అన్నిటికన్న మానవత్వం గొప్పదనీ, దాన్ని కాపాడాలనీ, యెవడూ ఈ భూమ్మీద ఫలానా మతస్తుడనే స్తాంపుతో పుట్టరనీ, అట్లే ఫలానా మతస్తులంతా మోసగాళ్ళో నేరస్తులో కారనీ అందరూ ఆ సృష్టికర్తముందు సమానమనీ, ఆ సృష్టికర్త తన రక్షణ తాను చూసుకుంటే మనుషులు మానవీయతను కాపాడాలనే సందేశంతో ముగుస్తుంది.

మొత్తం సినిమాలో పొరపాట్లు లేవని కాదు . కొంత నాటకీకరణ, కొని నమ్మశక్యం కాని కల్పనలు, సినిమాటిక్ స్వేచ్చలూ, డాన్సింగ్ కార్ల లాంటి వెకిలి తనమూ ఉన్నది. సినిమా హాస్య ప్రదానంగా సాగినా అటువంటివి సినిమాని పలుచన చేస్తాయి. ఒక వేశ్య దగ్గర 6 గంటల్లో భాష మొత్తం నేర్చుకున్న(సినిమాలో తీసుకున్న ఇదో  స్వేచ్చ) పీకే కాండోమ్స్ గురించి తెలవనట్టు ప్రశ్నించడం వెకిలితనానికి పరాకాష్ట. అయినప్పటికీ  ఈ లోపాలనన్నింటిని అధిగమించి సినిమాని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది దాని కథాంశం. దాదాపుగా ఇదే కథాంశంతో ఓ యెం జీ వచ్చిన పీకె ఆ సినిమాని దాదాపు అన్ని అంశాల్లోనూ మించిపోయింది. పాత్ర చిత్రీకరణే ప్రదాన తేడా! పీకే లో ప్రధాన పాత్ర ఒక అమాయకుడు. ఈ లోకం పోకడలు తెలువని ఒక పసివాడి లాంటి వాడు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, మానవీయంగా ప్రవర్తించడం మాత్రమే అతనికి తెలుసును.

ఓ యెం జీ లో ప్రదాన పాత్ర ఒక వ్యాపార వేత్త – వ్యాపార దృష్టి తోనీ దేవుళ్ళనీ దేవుళ్ళ పేర్ జరిగే తంతునీ వ్యతిరేకిస్తాడు. పీకే లో కేవలం ఒక మతం పైననో ఒక దేవుని పైననో మాత్రమే విమర్శ చేయలేదు. అందరు దేవుళ్లనూ అన్ని మతాలనూ హేతుబద్దంగా ప్రశ్నించారు. దేవుళ్లకి బ్రోకర్లుగా మేనేజర్లుగా తమను తాము చెప్పుకుంటున్న వారిని విమర్శించారు. దేవునితో మాట్లాడుతున్నాము, మాట్లా డుతాము మాట్లాడిస్తాము అని,  మనుషుల భయాలనీ, అభద్రతలనీ  మూఢ భక్తి గా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతూ,  రాజకీయ పలుకుబడులతో  అండదండలనీ, భోగభాగ్యాలనూ  అనుభవిస్తూ భారతీయ సమాజం శాస్త్రీయంగా హేతుబద్దంగా ముందుకు పోకుండా అంధకారం లో కి నెట్టి వేస్తున్న నియంతల్లాంటి మతగురువులను యెండగడుతుందీ సినిమా! వారిని గుడ్డిగా నమ్ముతున్న కోటానుకోట్ల భక్త జనానికి కనువిప్పు కలిగించే ప్రయ్నం చేస్తుందీ సినిమా! ఆ ప్రయత్నం లో సినిమా సఫలీకృతమయ్యిందనే చెప్పాలి.

అయితే సినిమా మీద వస్తున్న విమర్శలు చిత్రంగా ఉన్నయి. ఒకటి ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్ల హిందూ మతాన్ని విమర్శించాడనీ (సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రా  హిందువులే మరి) , సినిమా లో పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని మన దేశానికి చెందిన మతగురువు కన్న యెక్కువ నమ్మకస్తునిగా చూపించి మన మతాన్నీ ప్రజలకు ఆరాధ్యులైన మతగురువులని మన ‘శత్రు దేశమైన’ పాకిస్తానీయుని కన్నా హీనంగా చూపించడం ఘోరమైన నేరమనీ మరో  విమర్శ. హిందూ దేవుళ్ళని, విగ్రహారాధనీ తూలనాడాడని, ముస్లింలని క్రైస్తవులనీ యెమీ విమర్శించలేదని యింకో విమర్శ! యివేవీ నిజాలు కావు.

అయినా నిజమైన మానవత్వం యెక్కడున్నా దాన్ని స్వీకరించాలనే కనీస యింగిత ఙ్నానాన్ని మన పొరుగు దేశమ్మీద ఉన్న ద్వేషం మింగేయడం విచారకరం. ప్రతి దాన్నీ మత దురహంకారమూ  , విమర్శ సహించలేని చాందసవాదమనే  నల్ల కళ్ళద్దాలని పెట్టుకుని చూస్తే అట్లానే అనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు అమాయకత్వంతోనో  , వినికిడి ఙ్నానంతోనో కూడా అటువంటి అభిప్రాయం కలగవచ్చు. మన మతాన్ని విమర్శించారు అన్న కోపం కన్నా వేరే మతాలను విమర్శించలేదు అనే క్షోభ సరైంది కాదు. అది మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయదు. పైగా వెరే మతాలు వెనుకబడి ఉన్నాయి, మూర్ఖంగా ఉన్నాయి కాబట్టి మేమూ  అట్లే యింకా వీలయితే అంతకన్నా హీనంగా ఉండడమే బాగుంటుంది అనుకుంటే అది  మనం హాయిగా మరింతగా తిరోగమించడానికి దోహదం చేస్తుంది.

సినిమాలో ప్రొజెక్ట్ చేసి, చర్చించిన అంశాలమీద దృష్టి వుంచి చర్చ జరిగితే అది మన పొరపాట్లని సరిదిద్దుకోవడానికీ మానవీయంగా, శాస్త్రీయంగా, హేతుబద్దంగా  ముందుకు పోవడానికి ఉపయోగబడుతుంది. లోపాల్ని యెత్తి చూపే చూపుడు వేలు యెటువంటిది అది యెవరిది అనే శుద్ద చాందస తర్కంలోనే మునిగిపోతే మనకు ఆ చూపుడు వేలే తప్ప మన లోపాలెప్పుడూ మనకు కనబడవు – మనల్ని మనం యెప్పుడూ సరిదిద్దుకునే అవకాశమూ రాదు యెప్పుడూ మన చూపుడు వేలు వేరే వాళ్ల వైపు ఎత్తి చూపడం తప్ప!

-నారాయణస్వామి వెంకట యోగి

swamy1

తృప్తి ఫలం

Mythili

 

అనగనగా ఒకావిడకి ఇద్దరు  కూతుళ్ళు…రోలీ, పోలీ. వాళ్ళకి తండ్రి లేడు.   చూసేందుకు బాగానే ఉండేవారు కాని దురుసు గా, స్వార్థంగా  ప్రవర్తించేవారు. వాళ్ళు తనలాగే ఉంటారు కనుకే ఏమో, తల్లికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. తండ్రి బ్రతికి ఉండగా తన చెల్లెలు చనిపోతే ఆమె కూతురిని తెచ్చి వీళ్ళతో పెంచాడు. ఆయన పోయాక ఆ అమ్మాయి అక్కడే ఉంటుండేది. ఆమె పేరు క్రిస్టీన్. తనని చూస్తే ఎర్రగా పండిన ఆపిల్ పళ్ళూ విరబూసిన రోజాపూలూ గుర్తొచ్చేవి. అందం, మంచి స్వభావం  ఆమెలో పోటీ పడుతుండేవి. ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. అందుకని వాళ్ళ అత్తకి తనని చూస్తే చిరాకుగా ఉండేది. ఇంటి పనంతా  క్రిస్టీన్ చేయవలసి వచ్చేది.   ఆ తర్వాత ఎండలో తిరుగుతూ బాతులని కాస్తుండేది. ఆమె బట్టలు వెలిసిపోయి, చిరిగిపోయి ఉండేవి. రోలీ పోలీ మాత్రం చక్కటి సిల్క్ బట్టలలో  ముస్తాబై ఊరికే కూర్చునేవారు.

రోలీ , పోలీ లకి మెత్తని రొట్టె, గుడ్లు, చిక్కటి పాలు. క్రిస్టీన్ కి ఎండు రొట్టెలూ నీళ్ళ పాలు. ఆకలి తీరేదే కాదు.

ఒక రోజు క్రిస్టీన్ ఎప్పటిలాగే బాతులని మేపేందుకు కొండ మీది గడ్డి మైదానానికి బయలుదేరింది. చలికాలం రాబోతూ ఉంది. రోలీ పోలీ కి  టోపీల కోసం ఊలు అల్లేందుకు  దాన్నీ అక్కడికి తీసుకుపోతోంది. దోవలో చిన్న సెలయేరు ఉంది. దానీద చిన్న వంతెన. అక్కడొక చెట్టు కొమ్మకి ఊగుతూ  ఎర్రటి టోపీ ఒకటి కనిపించింది. దాని చివర్న ఒక వెండి గంట వేలాడుతోంది. అది చాలా ముద్దుగా ఉంది. క్రిస్టీన్ కాసేపు చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ లేరు, అది ఎవరిదీ అయినట్లు లేదు. ఉండబట్టలేక దాన్ని తీసుకుని జేబులోపెట్టుకుంది. ఎవరైనా అడిగితే ఇచ్చేయవచ్చులే అనుకుంది. కొంచెం దూరం నడిచిందో లేదో, వెనక నుంచి తనని ఎవరో పిలవటం వినబడింది.

చూస్తే చాలా పొట్టిగా , సన్నగా ఉన్న ముసలివాడు. టోపీ తనది, ఇచ్చేయమన్నాడు.

image1

క్రిస్టీన్ కి అతన్ని చూస్తే ఎందుకో సరదా వేసింది. ” మరి , అంత ఎత్తుగా ఉన్న కొమ్మ మీద ఎలా ఉంది నీ టోపీ ? చెప్పు, ఇస్తాను ” అంది.

” అదిగో, అక్కడ నేను చేపలు పట్టుకుంటూ కూర్చుంటే, సుడిగాలి వచ్చి ఎగరేసుకుపోయింది . ఇచ్చేయమ్మా, నీకు అయిదు వెండి నాణాలు ఇస్తాగా ”

క్రిస్టీన్ ఆలోచనలో పడింది. తన టోపీ తను తీసుకునేందుకు అతనెందుకు డబ్బు ఇస్తానంటున్నాడు ?

”ఊహూ. చాలదు. దీనికి వెండి గంట కూడా ఉంది కదా ” అంది, ఏమవుతుందో చూద్దామని.

” నూరు నాణాలు ఇస్తాను అయితే ” అతను అన్నాడు.

క్రిస్టీన్ కి అనుమానం ఎక్కువైంది. ” డబ్బు వద్దు నాకు. నేనేం చేసుకుంటాను ! ” – పెదవి విరిచింది.

” ఇది ఇస్తాను తీసుకో అయితే ” అని బొగ్గులాగా నల్లగా ఉన్న   గింజను చూపించాడు ముసలివాడు.

” ఇదెందుకు నాకు ? ”

” ఇది తృప్తినిచ్చే ఆపిల్  విత్తనం. దీన్ని నేలలో పాతితే ఆపిల్ చెట్టు మొలిచి ఒకే ఆపిల్ పండుని కాస్తుంది. అది అందరికీ కావాలనిపిస్తుంది, కాని నువ్వొక్కదానివే పండుని చెట్టునుంచి కోయగలవు. నీకు ఆకలి వేసినప్పుడు ఆహారమూ చలి వేస్తే వెచ్చ దనమూ ఆ పండు ఇస్తుంది. ఒక పండు కోయగానే ఇంకొకటి కాస్తుంది. చాలా ? నా టోపీ ఇచ్చేయి మరి ”

image2

క్రిస్టీన్ కి అంతకన్న ఏం కావాలి ! సంతోషంగా టోపీ ఇచ్చేసి గింజని తీసుకుంది. ముసలివాడు టోపీ తీసుకుని తలమీద పెట్టుకుని చటుక్కున మాయమై పోయాడు, కొవ్వొత్తి మంట  ఊదగానే   ఆరిపోయినట్లు.

ఇంటికి వెళ్ళాక క్రిస్టీన్ గింజని తన గది కిటికీ పక్కన పాతింది. మర్నాడు పొద్దునే బయటికి చూస్తే అక్కడ పెద్ద చెట్టు మొలిచి ఉంది. దానికి ఒకే ఒక ఆపిల్ పండు. సూర్యకాంతిలో బంగారం లాగా మెరుస్తోంది. వెళ్ళి దాన్ని కోసింది. చాలా తేలికగా ఊడి వచ్చింది అది. వెంటనే మరొక పండు వచ్చింది . క్రిస్టీన్ కి ఆకలిగా ఉండి పండు తినేసింది. అది చెప్పలేనంత రుచిగా ఉంది. ఆకలి పూర్తిగా తీరిపోయింది కూడా.

ఇంతలో ఇంట్లోంచి రోలీ వచ్చి చెట్టుకేసీ పండు కేసీ ఎగాదిగా చూసింది. విసురుగా చెట్టునుంచి తెంపబోయింది. అది అందకుండా పైపైకి వెళ్ళిపోయింది. అందుకునేందుకు రోలీ చెట్టు ఎక్కుతూనే ఉంది, చిటారు కొమ్మ దాకా. ఎంతకీ అది ఆమె చేతికి రాలేదు. అలిసిపోయి దిగిపోయింది. ఆమెకి విపరీతంగా కోపం వచ్చింది.

అప్పుడు పోలీ వచ్చింది. ఆమె కూడా అలాగే పండు కోసుకునే ప్రయత్నం చేసింది. తన పనీ అలాగే అయింది. ఊర్లో వాళ్ళు చాలా మంది కోయబోయారు, భంగపడ్డారు. ఎవరికీ ఆ తృప్తినిచ్చే ఆపిల్ అందలేదు. క్రిస్టీన్  మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోగలిగేది. ఆకలీ దాహమూ అలసటా తీరటమే కాక తను వేసుకున్న అతుకుల బట్టలే చాలా వెచ్చగా సుఖంగా అనిపించేవి. ఇక ఆ చుట్టు పక్క ఊర్లన్నిటిలోనూ క్రిస్టీన్ అంత సంతృప్తిగా ఎవరూ లేరు. ఊరికే  వచ్చే ఆ పళ్ళు తింటూండటం వల్ల క్రిస్టీన్ తిండికి అయే ఖర్చు తగ్గుతోంది కదా అని ఇంట్లోవాళ్ళు సరిపెట్టుకుని ఊరుకున్నారు .

ఒక రోజు ఆ దేశపు రాజు అటువైపు వచ్చాడు. ఈ ఆపిల్ చెట్టు చూశాడు. ఆయన ప్రజల నుంచి ఏదీ ఉచితంగా తీసుకోకూడదని అనుకునేవాడు. భటులని పిలిచి ఎంత డబ్బు అయినా , కుండెడు బంగారమైనా సరే, ఇచ్చి ఆ పండు తీసుకు రమ్మని చెప్పాడు.

వాళ్ళు వెళ్ళి ఇంటి తలుపు తట్టారు.

రోలీ పోలీ ల తల్లి తలుపు తీసి ఏం కావాలని అడిగింది.

” మా రాజు గారికి ఆ పండు కావాలి . డబ్బు ఇస్తారు, కావలిస్తే ”

ఆ చెట్టు మీద తనకేమీ హక్కు లేదని చెప్పకుండా,  ఆమె అంది – ” అబ్బో, అది చాలా ఖరీదుగా. ఎంత ఇస్తారేమిటి ? ”

భటులలో చిన్నవాడు చెప్పాడు- ” ఎంతయితే అంత. ఓ కుండెడు బంగారం సరిపోతుందా ? ‘’

” సరే. ఆ కుండెడూ బంగారమూ అక్కడ పెట్టి  వెళ్ళి కోసుకోండి ”

భటులు అలాగే ఇచ్చి పండు కోయబోయారు.

యథాప్రకారం ఆ పని ఎవరివల్లా కాలేదు. వెళ్ళి రాజుకి చెప్పారు- ఆ ఇంటావిడ పండు అమ్మనైతే అమ్మిందిగాని అది చేతిలోకి రావటం లేదని- ” మహారాజా, చుక్కలూ చందమామా అయినా అందుతాయేమోగాని అది మాత్రం అందటం లేదు’’

రాజు తన సేనాధిపతిని పంపాడు. అతను చాలా పొడుగ్గా , దృఢంగా ఉంటాడు. అయినా వట్టి చేతులతోనే వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.

అప్పుడు రాజు తనే వెళ్ళాడు. తను తప్పకుండా కోయగలననే ఆయన ధీమా. పొద్దుపోయేవరకూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.చేతులకంతా ఆపిల్ సువాసన అంటిందే కాని ఇంకేమీ జరగలేదు. ఇంక చాలించి కోటకి వెళ్ళిపోవలసి వచ్చింది.

అప్పుడు కూడా పండు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నిద్రలో దాని గురించే కలగన్నాడు. అందరు మనుషులలాగే ఆయనకీ ఆ వస్తు వు ఎంతగా అందకపోతే అంతగా కావాలనిపించింది. దిగులుపడిపోయాడు. కొలువు లో బాగా జ్ఞానం ఉన్న ఒకాయన ని పిలిచి రాజు  సలహా అడిగాడు.

ఆయన చెప్పాడు – ” ఆ చెట్టు ఎవరి సొంతమో వారికే ఆ పండు అందుతుంది మహారాజా! ఆ ఇంటావిడని అసలు సంగతి కనుక్కోండి ”

రాజు అప్పటికప్పుడు గుర్రమెక్కి అక్కడికి బయల్దేరి వెళ్ళాడు. ఇంటావిడా, రోలీ, పోలీ ఉన్నారు ఇంట్లో. క్రిస్టీన్ బాతులని మేపేందుకు వెళ్ళి ఉంది.

రాజు మర్యాదగా వాళ్ళని ఆ చెట్టు సొంతదారు ఎవరని అడిగాడు.

” ఇదిగో, మా పెద్దమ్మాయిదే ఆ చెట్టు ” అని రోలీని వాళ్ళ అమ్మ ముందుకి తోసింది.

” అలాగా ! వెంటనే ఆపిల్ కోసి నాకు ఇవ్వమనండి. ఆమెని పెళ్ళాడి ఈ రాజ్యానికి రాణిని చేస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయద్దు ”

ఇంటావిడ అంది ” అలా ఎలా మహారాజా ! వయసులో ఉన్న ఆడపిల్ల కదా, మీ ముందు తను చెట్టెలా ఎక్కుతుంది ? మీరు కోటకి వెళ్ళండి, తను పండు కోసి తెస్తుంది ”

సరే, త్వరగా పండు తెమ్మని హెచ్చరించి రాజు వెళ్ళిపోయాడు.

క్రిస్టీన్ కి కబురు పెట్టి, ఆమె  ఇంటికి రాగానే ఆ పండు వెంటనే కోసి ఇచ్చేయమనీ లేకపోతే తనని బావిలోకి తోసేస్తామనీ వాళ్ళు బెదిరించారు. చేసేదిలేక క్రిస్టీన్ ఆపిల్ కోసి ఇచ్చింది. రోలీ ఆ పండుని అందమైన రుమాలులో భద్రంగా చుట్టి కోటకి వెళ్ళి తలుపు తట్టింది. విషయం చెప్పగానే కాపలావాళ్ళు లోపలికి వెళ్ళనిచ్చారు. రాజు రుమాలు విప్పి చూస్తే ఏముంది…పండు ఉండవలసిన చోట గుండ్రటి రాయి ఉంది.

రాజు సేనాధిపతిని వాళ్ళ ఇంటికి పంపి, నిజంగా ఆ చెట్టు ఎవరిదో గట్టిగా గద్దించి అడగమన్నాడు.

ఈసారి ఇంటావిడ – ” తప్పైందండీ. అసలు ఆ చెట్టు మా చిన్నమ్మాయిది. పెద్దది కదా అని దాని పేరు చెప్పాను. మీరు వెళ్ళండి, అది పండు తెస్తుంది ” అని బుకాయించింది.

క్రిస్టీన్ ని మళ్ళీ భయపెట్టి పండు సంపాదించారు. పోలీ పెద్ద శాలువాలో దాన్ని చుట్టి పట్టుకెళ్ళింది. కోటకి చేరుతూనే

పండు కాస్తా చెక్కముక్కగా మారిపోయింది. రాజు చెడామడా తిట్టాడు. ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.

సేనాధిపతి వచ్చి నిజం చెప్పకపోతే అందరినీ చం పేయాల్సివస్తుందన్నాడు.

అప్పటికి ఇంటావిడ- ” ఆ, ఉందిలెండి, ఎందుకూ పనికిరాని ఒక పిల్ల. దాని దరిద్రపు మొహం రాజుగారికి చూపించటమెందుకులే అనుకున్నాను ” అంది.

” ఎవరయి తేనేం ? ఆమెని వెంటనే పంపి తీరాలి. ముందు నేను చూడాలి ” సేనాధిపతి అన్నాడు. ఇక తప్పక క్రిస్టీన్ ని పిలిపించారు. ఆమె పాతబట్టలలో ఉన్నా కూడా తన చక్కని రూపం, మొహం లో వివేకం, మంచితనం – సేనాధిపతికి కనిపించాయి. చప్పున వంగి నమస్కరించి విషయం చెప్పాడు.

image3

ఆపిల్ కోసుకుని క్రిస్టీన్ అతనితోబాటు బయల్దేరింది. ఆ  బీద అమ్మాయితో సేనాధిపతి వెళుతూండటం కోట చుట్టు పక్కల జనానికి వింతగా తోచింది. కొందరు పైకే నవ్వేశారు కూడా. అతను అదేమీ పట్టించుకోలేదు. రాజు కోరిక ఇప్పుడు తీరబోతోందని అతనికి నిశ్చయంగా తెలుస్తోంది.

” నువేనా చెట్టు సొంతదారువి ? ” రాజు అపనమ్మకంతో  అడిగాడు.

జవాబుగా క్రిస్టీన్ ఆయనకి ఆపిల్ ఇచ్చింది. రాజు  నోట్లోపెట్టుకుని కొరికాడు. వెంటనే ఆయనకి ఎంతో హాయిగా, సుఖంగా అనిపించింది. కోటలో వాతావరణం, మనుషులు- ఎవరి లోనూ ఏ వంకా లేదనిపించింది. ఎదురుగా ఉన్న  క్రిస్టీన్ ఆయనని బలంగా ఆకర్షించింది. ఆమెలాంటి దాన్ని అంతవరకూ చూడనేలేదని, ఆమె తనని పెళ్ళాడితే ఇంకేమీ అక్కర్లేదని , అనుకున్నాడు. క్రిస్టీన్ నిజంగానే అందమైనదీ మంచి దీ అయినా,  తృప్తి ఇచ్చే ఆపిల్ పండు తినటం వల్లనే రాజుకి ఆ విషయం తెలిసివచ్చింది. క్రిస్టీన్ రాజుని పెళ్ళాడేందుకు ఆనందంగా ఒప్పుకుంది.

త్వర లోనే వాళ్ళ పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి విందుకి రోలీ, పోలీ, వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. రాజు ముందు వద్దని అన్నా, క్రిస్టీన్ పెద్దమనసుతో వాళ్ళని రమ్మని పిలిచింది. ఆపిల్ చెట్టు ఇకమీదట తమకే సొంతమవుతుందని వాళ్ళు ఆశ పడ్డారు. అయితే అలా ఏమీ కుదరలేదు వాళ్ళకి. తెల్లా రేసరికి ఆపిల్ చెట్టు, కోటలో క్రిస్టీన్ గది బయట ప్రత్యక్షమైంది. అది ఆమెకి మాత్రమే దొరికిన వరం . ఆమె భర్త కనుక రాజుకీ అది అదృష్టమైంది , అందరిలాగే ఆయనకీ ఆ తృప్తినిచ్చే పండుని అప్పుడప్పుడూ రుచి చూడటం అవసరం కదా.

                                           సేకరణ – Howard Pyle

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

గుప్పెట్లోని సీతాకోకలు

1376331_10154732143770363_4527960677229738295_n

 

 

 

 

 

 

 

1.
నువ్వూ నేను
ఒకరిలో ఒకరం మాట్లాడుకుంటాం
ఎన్నో చెప్పాలని ఎదురొస్తానా
అవే మాటల్ని కుదురు దండలా పట్టుక్కూచుని నువ్వు.
 
గుప్పెట్లోని సీతాకోకలన్నీ
చప్పున ఎగరడం మానేసి
చెవులన్నీ నీ గుండెకానిస్తాయి
 
2.
విలవిలలాడుతూ తీసుకున్న నిన్నటి వీడ్కోలును
వెక్కిరించే యత్నంలో
ఎలానో నాముందుకొస్తావు
కొన్ని సార్లుగా
పగలు మొత్తంగా
 
నీ సాయంత్రపు దిగులుగూడుకి
నను తాకెళ్ళిన వెలుగురేఖ ఆనవాలు వొకటి
వెంటేసుకుని వెళ్తున్నట్టు చెబుతావు
 
శీతాకాలానికి భయపడి దాక్కున్న
పచ్చదనాన్ని మాత్రం
పొద్దున్నే తోడ్కొని వస్తావు
 
ఎన్నిమార్లు నిద్దురలో నా జ్ఞాపకాన్ని కొలిచావో
రేపెప్పుడైనా చెప్పడం మరువకేం!
 
3.
ఆగీ ఆగీ
వెనక్కి తిరిగి చూస్తావలా
 
కష్టం కదూ
వేళ్ళమధ్యలో నీ స్పర్శని
మరోసారి వరకు శోధిస్తూ కూర్చోవడం
 
రోజుకి రెండు పగళ్ళు,
ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ!
 
4.
నా అరచేతిరేఖ మీద పయనిస్తూ
కొన్ని కారణాలు అల్లుకున్న కధలేవోచెబుతూ
సముద్రాల్ని, సరస్సు అంచుల్ని
పూల గుబురుల్ని, వచ్చిపోయే వసంతాలని,
ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మబ్బుల్ని తాకుతూ
ఆ చెయ్యే నీ గమ్యమంటావు ఆత్మీయంగా.
 
రేయంతా మేలుకుని వెన్నెలపోగులు విడదీస్తూ
చుక్కల నమూనా ఏదో తేల్చుకున్నట్టుంటుంది.
 
5.
చెప్పేస్తున్నా
నా చిట్టచివరి వెతుకులాటవి నువ్వేనని.
                               -మోహనతులసి

బతుకంత సమస్యకి ప్రతిబింబం – ‘చావు’ కథ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

చస్తే సమస్యలన్నీ తీరిపోతాయనుకొంటారు కొంతమంది. కానీ ‘చావు’ కూడా చచ్చే చావు కొందరికి. చచ్చిపోయాక కనీస అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని శుష్క శరీరాల సమస్య మరింత జటిలమైనది. బతికినన్ని రోజులు సరైన తిండిగానీ, బట్ట కానీ, సరైన జీవితం కానీ, సుఖం కానీ, ప్రశాంతత కానీ కనీస గౌరవం కానీ లేని జీవితాలను చావు తరువాత కూడా ఇవే సమస్యలు వెంటాడం ఎంత దుర్భరం ?

దళితులకు బతుకే కాదు, చావు కూడా అత్యంత సమస్య అని చెప్పిన కధ ‘చావు’. కాళీపట్నం రామారావు గారు రాసిన ఈ కధ సృజన మాస పత్రికలో 1971 మార్చి సంచికలో అచ్చు అయ్యింది.

రెండు మూడేళ్ళనుంచి వర్షాలు సరిగా లేని కారణంగా పంటలు, పనులు లేక మాలపేట వాళ్ళంతా ఇంటికి ఇద్దరు ముగ్గురు పసిపిల్లలను, ముసలి వాళ్ళను వదిలేసి కోతలు, కుప్పలు, నూర్పిడి వంటి పనుల కోసం పక్క ఊళ్ళకు వెళ్ళారు. ఎరకయ్య, సావాలు కూడా అలా వెళ్ళినవాళ్ళలో ఉన్నారు. ఎరకయ్య తన ముసలి తల్లిని , ఇద్దరు చిన్నఆడ పిల్లలు సిమ్మాద్రి, దాలిని చిన్న కొడుకును ఇంటి దగ్గర వదిలేసి, ఇద్దరు కూతుళ్ళు కొడుకుని తీసుకొని పక్క ఊరికి పొలం పనికి వెళ్ళగా ఇంటి దగ్గర ముసలమ్మ నారమ్మ చనిపోతుంది. పిల్లలు ఎట్లాగో ఎరకయ్యకు కబురు చేరవేస్తారు. ఎరకయ్య, సావాలు మిగతావాళ్ళు ఆ రాత్రి నానా తిప్పలు పడి వస్తారు. ఎముకలు కొరికే చలి రాత్రిలో చనిపోయిన నారమ్మ వడిలి, శుష్కించి పోయిన ముసలమ్మ.

“.. ముక్కూ నోట బొక్కలన్నీ నీళ్ళు కారేసి, ఇనాగ – ముట్టుకుంటె పొట్ల పండు నాగ ఇచ్చిపోతాది శవం.” ఎక్కువ సేపు నిలబడే శవం కాదు. పైగా రాత్రికి కాల్చక పోతే పొద్దున్నే పనికి వెళ్ళలేరు. పేట అందరికీ పనిపోతుంది. కాబట్టి రాత్రికి శవాన్ని ఎలాగైనా తీసెయ్యాలి. తీసేయ్యాలంటే కావిడో – రెండు కావిళ్ళో కర్రలు కావాలి. ఎండాకాలమైతే ఏ వైపు వెళ్ళినా కర్రో, కంపో దొరుకుతుంది. కానీ పొయ్యి మీదకు దొరికే చలి రోజుల్లో పొయ్యి కిందకు దొరకటం కష్టమైన కాలం .. పంటల కాలం. ఇలాంటి స్థితిలో కాల్చటానికి వూళ్ళోవాళ్లను కర్రలు అడిగి తేవాలని కొందరు బయలుదేరతారు. అక్కడే ఉన్న సూరయ్య చనిపోయిన నారమ్మ గురించిన చిన్నప్పటి జ్ఞాపకాలను అందరికి చెబుతాడు.

కర్రల కోసం వెళ్ళిన వాళ్ళు కర్రలు లేకుండానే వెనక్కి వస్తారు. రాత్రిపూట కర్రలు అడిగిన వాళ్ళను కొందరు పొద్దున రమ్మని పంపిస్తారు. కొందరు తిట్టి పంపిస్తారు. ఏం తేకుండా తిరిగి వచ్చిన వాళ్ళను అప్పారావు తన ఆవేశంతో, ప్రశ్నలతో నిలదీస్తాడు. కాల్చటమా, పూడ్చటమా కాదు- అసలు ఏడ్వాల్సింది చచ్చిన శవాలకోసం కాదు – బతికున్నశవాల కోసం అంటాడు. చివరకు పూడ్చాలని నిర్ణయం తీసుకుంటారు కులపెద్దలు. కానీ యువకులు ఆలోచనలో పడతారు. చివరి నిమిషంలో కొందరు యువకులు ఊళ్ళో నుండి కర్రలు దొంగతనంగా ఎత్తుకొస్తారు. శవాన్ని కాలుస్తారు. ఇదీ కధ.

దళితుల జీవితంలోని ఘర్షణనూ దళిత సమాజాన్నీ నిరంతరం నియంత్రించే వ్యవస్థీకృత కుల అణచివేతనూ ఈ కథ ప్రతిబింబించింది.

స్వాతంత్ర్యం దళితుల జీవితంలో పెద్ద మార్పేమీ తేలేక పోయిందనేది సత్యం. గ్రామీణ రాజ్యం ఇంకా కుల పెత్తందారుల చేతిలోనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చింది దేశానికే కానీ, గ్రామాలకు కాదు. గ్రామాల్లో దళితులుగా పుడితే కష్టం! జీవితాంతం బానిసత్వం అనుభవించాల్సిందే! దళితులుగా మరణిస్తే కూడా కష్టమే! శవాన్ని తగలబెట్టటానికి – పూడ్చటానికి కూడా – సమస్యే. ఈ కథలో కాళీపట్నం రామారావుగారు శతాభ్థాల అణచివేతను ‘చావు’ కేంద్రంగా ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. ఈ చావు కధ దళిత వాడల్లో పేరుకొని పోయి ఉన్న “దళిత అబలత్వా”న్ని ప్రశ్నిస్తుంది. దళిత వాడలోని ప్రజలు నిరంతరం ఎదుర్కొనే సమస్యల్లో మచ్చుకు ఒక సమస్య నారమ్మ మరణం.

పని కోసం, డబ్బుకోసం, ప్రతి అవసరం కోసం దళితవాడ జనం గ్రామం మీదే ఆధార పడాలి. ఆఖరికి మనిషి చచ్చిపోతే తగలపెట్టాటానికి కావలిసిన కట్టెల కోసం కూడా! కొంచెం అసంబద్ధంగా అనిపించినా ఇలాంటి స్థితిని దళితులు ఎదుర్కోవడం – ఈ దేశ దుస్థితికి నిదర్శనం.

ఎక్కడా కర్రలు దొరికే కాలం కాదు కాబట్టి ఊళ్ళో ఎవరినో ఒకరిని అడిగి తేవాలని అనుకొంటారు. ఊరంతా తిరిగి అడిగారు. పెదనాయుడి ఇంట్లో ఆయన భార్య కానీ, సుబ్బారాయుడు కానీ అతని భార్య కానీ ఎవరూ కర్రలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. అట్లాగని ఊరివాళ్ళ ఇళ్ళ ముందు “నిల్వ” ఉంచుకొన్న కర్రలు వాళ్ళు కష్టపడి కొట్టి తెచ్చుకొన్నవి కావు. అవన్నీ దళిత శ్రమే. కాని వాళ్ళకు వాటి మీద హక్కు లేదు. పెద్ద కులాల వాళ్ళు చిన్న కర్ర ముక్క ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేరు.

కులం దళితులకు అంటరానితనంతో బాటు లేనితనాన్ని, భావ బానిసతనాన్ని అంటగట్టింది. చిన్న అవసరం నుంచి పెద్ద అవసరం దాకా ఎవరో ఒకరి ముందు చేయి చాపాల్సిందే. ఇదీ యువతరానికి నచ్చలేదు. దళిత వాడల్లో పాత తరానికీ, కొత్త తరానికీ మధ్య నిరంతరం ఒక ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. యువతరం – అణచివేతనూ, బానిస బ్రతుకునూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. యువతరానికి వచ్చే సందేహాలనూ, ఆవేశాన్నీ, వాళ్లలోని తిరుగుబాటునూ – వయసు మళ్లిన తరం “అనుభవం” పేరు చెప్పి అణచివేస్తుంది. అప్పారావు యువతరానికి ప్రతినిధి. నిరంతర లేమి నుండి బయట పడాలనీ ఇతరుల మీద ఆధారపడే బానిసత్వం నుండి బయట పడి సొంత కాళ్ళ మీద నిలబడాలనీ ఆత్మ గౌరవంతో బతకాలనే యువతరం ఆలోచనలకు ఇతడు ప్రతినిధి. చదువు లేకున్నా ఆలోచన ఉన్నవాడు. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను మూఢంగా ఎందుకు విశ్వసించాలని ప్రశ్నించిన వాడు.

‘కర్రలు దొరక్కపోతే కప్పెట్టేస్తారా?’

‘ఏం కప్పెడితే పనికి రాదా?’

‘కప్పెడితే ఏటవుద్దీ?’

అని ప్రశ్నిస్తాడు అప్పారావు. దళితులు భావజాల బానిసత్వం నుంచి, మానసిక సంకెళ్ళ నుంచి విముక్తం కాకుండా దళితుల విముక్తి జరగదు. ఎప్పటి నుంచో ఇట్లా ఒక ఆచారం ఉంది కాబట్టి మనమూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే చేయాలి అనే తర్కం, వివేచన లేని మూఢత్వం నుండి దళిత సమాజం తమను తాము విముక్తం చేసుకోవాల్సి ఉంది. నిజానికి అప్పారావు కూడా పూర్తిగా విముక్తం అయినవాడు కాదు. అతనికి కూడా కాల్చాలనే ఉంది. కాకపోతే కర్రల కోసం అందరినీ బతిమిలాడడం కన్నా – ఎక్కడో ఒక చోట ఎత్తుకొచ్చి పని కానివ్వొచ్చనేది అతని వాదన.

ఒకవేళ కాల్చకుండా పూడిస్తే ముసల్ది దయ్యమై పీడిస్తుందని ఒక మూఢ నమ్మకం. అయితే తురకలు, కంసాలి వాళ్ళు పూడుస్తారు కదా అని ఎరకయ్య లాంటి వాళ్ళ సందేహం. హిందూత్వ బ్రాహ్మణీయ మూఢ విశ్వాసాల నుండి దళితులు బయట పడకుండా విముక్తి సాధ్యం కాదు. దళిత సమాజంలో హిందుత్వపు గీతలు దాటని వాళ్ళు బానిస సంకెళ్ళ భావజాలం నుండి ఊహలో కూడా బయటపడలేరు. చైతన్యవంతులైన అప్పారావులాంటి వాళ్ళు కూడా లోలోపల అంధ విశ్వాసాల బంధాలను పూర్తిగా తెంచుకోలేరు.

వంద తరాలు గడిచాయో, వెయ్యి తరాలు గడిచాయో కానీ – వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా ఉండటానికి కారణం కానీ, కారణం వెనుక దాగి ఉన్న కుట్ర కానీ తెలిసిందనుకొన్న అప్పారావులాంటి వాళ్ళు చట్రం లోపల నిలిచి అయినా కొన్ని ప్రశ్నలు వేసుకొంటారు. తమ దుస్థితికి కారణాలను అన్వేషిస్తారు.

ప్రతిసారీ Human Development Index భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెబుతుంది. సంపద పెరిగిందనీ కోటీశ్వరుల సంఖ్య పెరిగిందనీ చెబుతుంది. కానీ – “ .. సూజ్జూస్తండగే గొల్లలు, శగిడీలు, మాల, మాదిగలు సిన్నసిన్న రైతులందరు దుల్లిపోనారు. ఎవ్వరికీ సెంటు ముక్క మిగల్నేదు. కాపోళ్ళు బాగునేరు, అందల పెద్దనాయిళ్ళకీ సావుకోర్లకే సెందిపోయింది యీ బూదేవతంతా?” అన్న మాటలు వాస్తవ పరిస్థితికి నిదర్శనాలు. ప్రభుత్వాలు మాత్రం అబద్ధాల నివేదికల్ని అంతర్జాతీయ చిత్రపటం పై ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. నానాటికీ దిగజారిపోయే దళిత జీవితాలు నివేదికలకూ లెక్కలకూ ఎక్కకుండా మిగిలి పోతున్నాయి.

కాళీపట్నం రామారావు గారు వాడ గురించి చెబుతూ “చెరువు గట్టున వెచ్చననిపించిన గాలి, వాడ మధ్య చివ్వున వెన్నులో పొడుస్తోంది. అతి యిరుగ్గా వుందా వాడలో – ప్రతి మట్టి గోడలోనూ, చలి పేరుకొని ఉండాలి. శీతాకాలపు పగుళ్ళను పెద్దవి చేసుకుంటూ చలిగాలి చావుగాలిలా వాడంతటా కమ్ముతోంది.” అంటారు. వాడ నిండా చలి ఉంది – గోడల్లో, పగుళ్ళలో పేరుకొని ఉంది. ఈ చలి భయపెడుతుంది. వణుకు పుట్టిస్తుంది. దళితుల్ని భయపెట్టించే ఈ చలి భూతం – “కుల భూతం.” నారమ్మ చనిపోయింది కూడా ఈ చలి సంకటంతోనే. బతికినన్నాళ్ళు ఈ చలితో చీదరింపబడి, అణచివేయబడి అన్ని రకాల దోపిడీకి గురై చనిపోయింది. రెండు కావిళ్ళ కట్టెల మీద కాలిస్తే కానీ ఇన్నాళ్ళ చలి నుండి నారమ్మకు విముక్తి లభించదని భావిస్తుంది కోడలు సావాలు.

కధలో “చలి” పాత్ర కీలకమయినది. “రాత్రి ముందుకు సాగిన కొద్దీ చలి అంతకంతకూ పెరిగి పోతుంది. వయసులో ఉన్న తననే గజగజలాడిస్తున్న చలి” లాంటి మాటలు కథ నిండా కనిపిస్తాయి. చలి – పెత్తందారీతనం. చలి కులం. చలి ఊరి అహంకారం. అప్పారావు “చలి సంకటం మనకి ఎన్నుబావుని పట్టీసింది. ఎవుకలు తీనేసింది. సీవూ నెత్తురు మరేటి మిగల్నేదు.” అంటాడు.

ఈ చలి నుండి దళితులు విముక్తం కావాలన్నది రచయిత కల. అదీ విప్లవం ద్వారా జరుగుతుందన్నది ఒక నమ్మకం. ఆ నమ్మకం కధలో అక్కడక్కడా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది.

చివరికి కొందరు యువకులు ఎక్కడినుంచో కట్టెలు తెస్తారు. సగం తవ్విన గొయ్యిని ఆపి శవాన్ని కట్టెల మీద కాలుస్తారు. “.. చెర్లో ములిగి వచ్చిన ఎరకయ్య తడి తలతో తడి గుడ్డల్తో తల్లి కాష్టం ముందు నిల్చున్నాడు. తక్కిన వాళ్ళు అటూ ఇటూ జరిగి అతనికి చోటిచ్చేరు. ఎర్రని మంటల వెలుగు ఆపాద మస్తకం, ముఖ్యంగా అతని ముఖం మీద ప్రతిఫలిస్తోంది.” అని రచయిత అతని అంతరంగంలో రగులుతున్న విప్లవ భావోద్వేగాన్ని, చలి నుండి విముక్తం కావాలనుకొనే అతని ఆకాంక్షను వ్యక్తీకరిస్తాడు. చలికి వణికినా – సారా తాగనంటాడు ఎరకయ్య. మత్తు లేకుండా – మైకంలో పడి వాస్తవలోకాన్ని మర్చిపోకుండా స్పృహతో ఉండి చలిని ఎదుర్కోవాలని ఎరకయ్య నిశ్చయించుకొంటాడు. తల్లి కాష్టం మంటల్లో వేడెక్కాక శీతాకాలం పట్ల తనకున్న భయం నుంచి విముక్తం కావాలనుకొంటున్నాననీ చెబుతాడు ఎరకయ్య. “.. ఈ సలీ సీకటి ఎప్పటికి తొలిగిపోతాయి? ఎర్రగా పొద్దెప్పుడు పొడుస్తాది? ఎప్పుడెండలో చేరిపోతావు” అని అంటాడు. తల్లిని గుర్తు చేసుకొంటూ చనిపోయాకైనా ఈ చలి నుండి విముక్తం కావాలని తన తల్లి కల కనేదనీ చెబుతాడు. ఆమె కల – జీవితం నుంచి విముక్తం కావడం కాదు – బానిసత్వం నుంచి విముక్తం కావడం – అన్నది – రచయిత దృక్పథం.

కాల్చటం, పూడ్చటం అనేవి రెండు ఈ పాత్రల మధ్య జరిగిన చర్చలో కీలకాంశాలు. నిజానికి ఈ కథలో దళితులు కాల్చే ఆచారం ఉన్నవాళ్ళు. “కుల సంప్రదాయం” అదే అని బలంగా నమ్మినవాళ్ళు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, కులపెద్దలు .. అందరిదీ అదే విశ్వాసం. కర్రలు దొరక్క మధ్యలో పూడ్చాలనుకొంటారు కానీ అనేక సందేహాలూ భయాలూ. చిట్టచివరికి కట్టెలు దొరికి కాలుస్తారు. ఏ ఆచారాలను వదులు కోవటం ద్వారా విముక్తి కలుగుతుందో, అనవసరపు భారం (Drudgery) తగ్గుతుందో వాటిని వదులుకోవాలి – కర్రలు దొరకని కారణంగా కాల్చే సంప్రదాయాన్ని వదులుకోవాలనుకొంటారు. కాల్చటం హిందూ సంప్రదాయం అనీ, పూడ్చటం తురకల వంటివారి ఆచారం అనీ కూడా అనుకొంటారు. పూడిస్తే దెయ్యాలుగా మారతారనే తమ నమ్మకాన్ని తలుచుకొని భయపడతారు. హిందూ దళితులుగా ఈ ఆచారం నుండి విముక్తి కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం జరగదు. మళ్ళీ ఇంకొక ముసలమ్మ చనిపోతే ఏం చేస్తారు? కట్టెల కోసం మళ్ళీ అందర్నీ అడుక్కొంటారా? దొంగతనం చేస్తారా? తిరుగుబాటు చేస్తారా? తమను తాము కట్టడి చేసుకొన్న ఆచారాల నుండి భావజాల బానిసత్వం నుండీ విముక్తి చేసుకోకుండా – తిరుగుబాటు సాధ్యమవుతుందా? మార్పుకి అవకాశం ఉందా?

దళితులు హిందూ మత పరిధిలో ఉండీ కుల వివక్షపై పోరాటం చేసి హక్కులు సాధించుకొనే అవకాశం ఎండమావి లాంటిది. యధాతధ గ్రామీణ సమాజంలో తిరుగుబాటుకి ఆస్కారం లేదు. అణచివేతలోకి, బానిసత్వంలోకి నెట్టే ఆచారాలను ధిక్కరించకుండా విప్లవం సాధించే ఆస్కారం లేదు. కుల బానిసత్వం నించి బయట పడాలని మతం మారి క్రైస్తవం ఇస్లాం లాంటి మతాలను ఆశ్రయిస్తే కుడా హిందూత్వ పెత్తందార్లు వదలడం లేదు. ఇవాళ దేశం నిండా మత మార్పిడులపై తీవ్ర చర్చ జరుగుతోంది. “ఘర్ వాపసీ” పేరిట తిరిగి దళితుల్ని అదే మురికి గుంటలో పాతేయడానికి బ్రాహ్మణీయ హిందూ సమాజం త్రిశూలాలతో బయలుదేరింది. కుల వివక్ష నుంచి విముక్తి జరగా కుండా బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ నుంచి అది పెంచి పోషించిన ఆచార సంప్రదాయాల నుంచి భౌతికంగా మానసికంగా బయట పడకుండా ఉన్నంత కాలం దళితులకు ఈ దేశంలో విముక్తి లేదు. అదే విధంగా హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలాన్ని ధిక్కరించ కుండా – ఆ మానసిక స్థితి నుంచి అణచివేతకు గురైన సమాజాన్ని బయటికి తేకుండా ఈ దేశం విప్లవాన్నిసాధించడం జరగదు.

నిజానికి ఈ కధ వచ్చే నాటికి సాహిత్య చరిత్రను చూస్తే దిగంబర కవుల షాక్ ట్రీట్ మెంట్ నుండి సాహితీ సమాజం ఇంకా బయటపడనే లేదు. కంచికచర్ల కోటేశు కుల అహంకారుల చేతిలో దారుణంగా తగలపెట్టబడ్డాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణ ఉద్యమాల సెగ తగ్గనే లేదు. 1970ల నాటికి విరసం పుట్టుకొని వచ్చింది. మార్క్సిజం ఇచ్చిన భౌతికవాదం హల్ చల్ చేస్తోంది. ఇలాంటి సాహిత్య సందర్భంలో అప్పారావు లాంటి యువకులు ఈ ఆచార వ్యవహారాలకు కేంద్రమైన మురికిగుంట లాంటి బ్రాహ్మణీయ హిందూత్వం ఏర్పాటు చేసిన వర్ణ వ్యవస్థని గుర్తించలేక పోయారు. ఆ మురికి గుంటలోనే నిలబడి కేవలం చుట్టూ ఏర్పడిన తరంగాన్ని ఛేదించాలనుకోవటం అంటే – దీనిని హైందవ విప్లవంగానే మనం గుర్తు పట్టాల్సి వస్తుంది. ఈ దేశపు దళితుల్లో ఈ వర్ణ వ్యవస్థ అంతం పట్ల అవగాహనను పెంచేదీ, దృష్టిని సారింపచేసేదీ కేవలం అంబేడ్కరిజం మాత్రమే. 1970ల నాటికి ఈ దేశంలో అంబేడ్కరిజం చేరుకోవాల్సిన ఊరి చివరి అంటరానివాడల్లో మార్క్సిజం మాత్రమే చేరుకోవటం వలన ఈ మురికి గుంటను గుర్తించలేని అంధులయ్యారు దళితులు.

ఏది ఏమైనా కాళీపట్నం రామారావుగారే చెప్పినట్లు ఈ కధ దళితుల జీవిత సంఘర్షణ. సుదీర్ఘమైన ఈ కధలో చావు కేంద్రంగా సామాజిక ఆవిష్కరణ జరిగింది. పాత తరానికీ కొత్త తరానికీ మధ్య వున్న దృష్టి అంతరం, మార్పును కోరే తరం ఆకాంక్ష అభివ్యక్తమయ్యాయి.

 -ఎం.ఎం. వినోదిని 

వినోదినిడా. ఎం.ఎం. వినోదిని యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. బ్లాక్, ఒక విలన్ ఆత్మహత్య లాంటి సంచలనాత్మక దళిత మహిళా కేంద్రకమైన కధలు రాశారు. ఇంకా బ్లాక్ యింక్, మరియా లాంటి కధలు అనేక పత్రికల్లో వచ్చాయి. వీరి పిహెచ్ డి థీసిస్ ‘స్త్రీవాద కవిత్వం – భాషావస్తు రూప నవీనత’ చాలా యూనివర్సిటీల్లో రిఫరెన్స్ గా వాడుతున్నారు. ఈమె రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కధ ‘Parable of a Lost Daughter’ పేరుతో ఆంగ్లానికి అనువాదమై యూనివర్సిటీ కాలేజీల్లో డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశంగా ఉంది.   2013లో ఈమె ఆంగ్లం నుండి అనువాదం చేసిన ‘దాహం’ నాటకం (The Thirst, Oxford University press) గత తొమ్మిదేళ్ళ నుండి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ కోర్సుకు పాఠ్యాంశంగా ఉన్నది. ఈ సంవత్సరం ‘వేగుచుక్కలు, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం’ పుస్తకాన్ని హెచ్ బిటీ వాళ్ళు ప్రచురించారు.

గత కాలం రచయితల్లో కొడవటిగంటి ఇష్టమని చెబుతున్నారు. మద్దూరి, పైడి, గోగు శ్యామల, జూపాక సుభద్ర, గౌరీలతో బాటు అందరు దళిత అస్తిత్వవాద, ఇతర అస్తిత్వవాద రచయితల రచనలు ఇష్టమని చెబుతున్నారు. తన వర్గాన్ని- అందులో తను ప్రేమించే తల్లిని కూడా కుల దౌష్ట్యం కలిగి ఉండిన కారణంగా నిజాయితీగా విమర్శించి ఎండగట్టిన స.వెం. రమేశు దళితేతర రచయితల్లో ఇష్టమైన వాడని చెప్పారు. ఆయన చూపించిన దళితేతర మార్గం అత్యంత ప్రేమించదగ్గదీ, ఇతర రచయితలకు మార్గదర్శకమూ అని ఆమె అభిప్రాయం. 

వచ్చే వారం ‘హింస’ కధ గురించి బత్తుల రమాసుందరి పరిచయం

 చావు కథ ఇక్కడ:

 

చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి పురస్కారం

Dr. Chintakindi Srinivasarao ప్రముఖ కథారచయిత డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మకమైన  చాసో (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి పురస్కారం లభించింది. చాసో స్ఫూర్తి  సాహిత్య ట్రస్ట్‌ ప్రతినిధి చాగంటి తులసి ఈ మేరకు ఒక ప్రకటన  విడుదలచేశారు. చాసో మార్గాన కళింగాంధ్ర మాండలికంలో ప్రజాజీవితపు కథలు  రచిస్తున్నందుకు గాను శ్రీనివాసరావును ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు ఆమె  పేర్కొన్నారు. పురస్కారాన్ని 2015 జనవరి 17న విజయనగరంలో జరిగే చాసో  శతజయంతి వేడుకల సభల్లో అందజేస్తామని ఆమె తెలియజేశారు.

ఉత్తరాంధ్ర యాసభాషల్లో కథలు రాస్తున్న రచయితగా చింతకింది శ్రీనివాసరావు  తెలుగుపాఠకలోకానికి సుపరిచితులు.  దాలప్పతీర్థం, పాలమ్మ, పిండిమిల్లు కథల  ద్వారా నిరుపేదల, బలహీనుల వ్యదార్థ జీవితాలను ఆయన చిత్రించారు. స్థానీయ  పరిస్థితులపై, మానవజీవితంపై ప్రపంచీకరణ చూపుతున్న ప్రభావాన్ని  వాడుకపదాల్లో కథగా కట్టడం ఆయనకు తెలిసిన కళ. రావిశాస్త్రి, చాసో, పతంజలి  వారసునిగా ఉత్తరాంధ్రలో కథల పంట పండిస్తున్న చింతకింది శ్రీనివాసరావుకు  ఇప్పటికే భరతముని సాహిత్య పురస్కారం సహా పలు అవార్డులు దక్కాయి. తాజాగా  చాసో స్ఫూర్తి లభించడంతో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి  చేరినట్టుగా చెప్పవచ్చు

తెలంగాణా కత 2013 ఆవిష్కరణ 29న!

10583882_10204556357861922_3574023066456842865_n

T katha pamphlet-page-001

హోమర్ చెప్పిన ‘నరు’ని కథ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తమాషా ఏమిటంటే, బృహదశ్వుడనే ఆ ముని నలదమయంతుల కథంతా చెప్పి ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. అప్పటికే జూదమాడి రాజ్యం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు ఇప్పుడా విద్యను ఏం చేసుకుంటాడు? పోనీ నలునిలా జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడా అంటే అదీ లేదు. యుద్ధంలో గెలుచుకున్నాడు.

అలాగే, నలదమయంతులది ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథ అనుకున్నామా…తీరా చూస్తే కథకుడు ఒకచోట కాస్త పరాకు పడ్డట్టున్నాడు. ఇంద్రాదుల మహిమతో అదృశ్యంగా ఉండి దమయంతి దగ్గరకు నేరుగా వెళ్ళిన నలుడు, ఆమె చెలికత్తెలకు ఎలా కనబడినట్టు?

సరే, విషయానికి వస్తే; నలదమయంతుల కథను నాలుగు పొరల్లో అన్వయించుకోడానికి అవకాశం ఉంది:

మొదటి పొర

ఇది మామూలుగా అందరికీ అర్థమైపోయే పొర. ఎటువంటి దేవతారోపాలూ లేని నలుడు-దమయంతి అనే సాధారణ మానవమాత్రుల జంట ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నలుడికి జూదమనే వ్యసనముంది. అతను జూదంలో రాజ్యంతోపాటు మొత్తం సంపదను అంతా కోల్పోయి భార్యతో సహా కట్టు బట్టలతో అడవుల పాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరికీ వియోగం సంభవించింది. ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. చివరికి ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు. తిరిగి అతనికి రాజ్యం లభించింది.

స్థూలంగా ఈ పొర మానవజీవితంలోనూ, సంసారంలోనూ ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి, మానవసంకల్పానికి వ్యతిరేకంగా విధి ఆడే ఆట గురించి, కష్టాలను వెన్నంటే సుఖాలూ ఉండడం గురించి, పురుషప్రయత్నంతో కష్టాల నుంచి గట్టెక్కడం గురించి చెబుతుంది.

ఇది పూర్తిగా ఇద్దరు మానవమాత్రుల గురించి చెబుతున్న కథ అన్నది, ఈ పొరలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరం.

రెండవ పొర

అదనంగా ఈ పొరలో ప్రధానంగా రెండు విషయాలలో కథకుడు అడుగుపెడుతున్నాడు. ఈ కథాచిత్రణ వెనుక తన ఉద్దేశాన్ని లేదా తన దృక్కోణాన్ని వెల్లడిస్తున్నాడు. మొదటిది, యాగాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడం, శౌచం ఎంత ముఖ్యమో చెప్పడం. నలుని ఆవహించడం కలికి మొదట్లో సాధ్యం కాలేదు. ఎందుకంటే, అతడు పుణ్యకార్యాలు చాలా చేశాడు కనుక. కానీ, ఒకరోజు అతను మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు కనుక వెంటనే కలి ఆవహించాడు. అంటే శౌచం ఎంత ప్రధానమో కథకుడు చెబుతున్నాడు. అయితే, అదే కలి నలుని పాచికలలోకి తన బంటును అవలీలగా ప్రవేశపెట్టగలిగాడు. కారణం, జూదం అనేది ఎలాగూ చెడ్డ వ్యసనమే కనుక.

untitled

ఇక రెండవది, కష్టమైనా, సుఖమైనా; భర్త తప్పు చేసినా, ఒప్పుచేసినా అతనిని వెన్నంటి ఉండడమే భార్య ధర్మమనీ, ఆమే పతివ్రత అనీ దమయంతి పాత్ర ద్వారా చెప్పడం మీద కథకునికి ఆసక్తి. దమయంతి పతివ్రత కనుకనే తనను కామించిన కిరాతకుని శపించి చంపగలిగింది. అయితే, పునస్స్వయంవరానికి సిద్ధపడడంతో ఆమె పతివ్రతాగుణంపై నలునికి సందేహం కలిగింది. కేవలం అతనిని తన దగ్గరికి రప్పించే ఉద్దేశంతో ఒక్క ఋతుపర్ణునికి మాత్రమే పునస్స్వయంవరం గురించి వర్తమానం పంపించానని ఆమె చెప్పడంతో అతని సందేహం తీరిపోయింది.

అదే సమయంలో, భర్త ఏ కారణం చేతనైనా భార్యకు చాలాకాలంపాటు దూరంగా ఉన్నప్పుడు ఆమె పునర్వివాహం చేసుకోవచ్చునన్న ఒకనాటి సామాజికనీతినీ ఈ పునస్స్వయంవరం ప్రస్తావన వెల్లడిస్తూ ఉండచ్చు.

మూడవ పొర

ప్రకృతి లేదా స్త్రీ క్రియాశీల, పురుషుడు ఉదాసీనుడన్న సూత్రాన్ని ఈ పొరలో అన్వయించడానికి అవకాశం ఉంది. ఈ కథ నలుని ముఖంగానే చెప్పినట్టు, నలుని పాత్రే ఎక్కువ కొట్టొచ్చేలా ఉన్నట్టు పైకి అనిపిస్తుంది. కథకుడు పురుషప్రాధాన్యవాది అన్న విషయాన్ని ఇతర అంశాలు కూడా ద్రువీకరిస్తూనే ఉన్నాయి. కానీ కొంచెం నిశితంగా చూడండి…తమ ఇద్దరి సంబంధం విషయంలో దమయంతే ఎక్కువ చొరవ తీసుకున్నట్టు, నలుని తన వద్దకు రప్పించుకోవడంలో ఆమే ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతుంది.

దమయంతి మీద నలుడు మనసు పడినా తొలి చొరవ దమయంతిదే. ఆమె నలుని కోసం తపిస్తూ శుష్కించడం తెలిసి తండ్రి నలుని రప్పించడానికే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరడమైతే బయలుదేరాడు కానీ, ఇంద్రాదులు ఎదురై తమ తరపున దూతగా వెళ్ళి తమలో ఒకరిని పెళ్లాడమని దమయంతికి చెప్పవలసిందిగా కోరినప్పుడు అతను వారి కోరిక తీర్చడానికి దమయంతిని వదలుకోడానికి సిద్ధపడ్డాడు. ఆడిన మాట తప్పవని తెలిసే నిన్ను ఈ కోరిక కోరామని ఇంద్రుడు అనేసరికి తన ప్రతిష్టను కాపాడుకోడానికి దమయంతినే త్యాగం చేయడానికి మొగ్గుచూపాడు. దమయంతిని కలసి ఇంద్రాదుల కోరిక చెప్పి, దేవతల ఆగ్రహం నుంచి తనను రక్షించమని నలుడు కోరడంలో దమయంతిపై వలపుమీద స్వార్థానిదే పై చేయి అయింది.

దమయంతి స్పందన వేరు. ఆమె ఎలాగైనా నలుని పెళ్లాడడానికే నిశ్చయించుకుంది. నలుని ప్రతిపాదనకు మొదట్లో దుఃఖంలో కూరుకుపోయినా వెంటనే తేరుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగా అని ఆలోచించింది. నలుడు ఆ ప్రయత్నమే చేయలేదు. ‘ఇంద్రాదుల సమక్షంలోనే నిన్ను వరిస్తాను, అప్పుడు నీకు ఆడి తప్పిన దోషం రా’దని ఉపాయం చెప్పింది. నలుడు చేసిందల్లా ఆమె మాటను ఇంద్రాదులకు చేరవేయడమే.

తీరా ఇంద్రాదులు నలుగురూ ఆమె ఎత్తుకు పై ఎత్తు వేసి నలుని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని, అసలు నలుని గుర్తించి అతని మెడలో దమయంతి దండ వేసింది. ఈవిధంగా నలుని పెళ్లాడడంలో క్రియాశీల పాత్ర దమయంతిదే కాని నలుడిది కాదు.

ఆ తర్వాత నలుడు జూదంలో సమస్తాన్నీ కోల్పోయి అడవి పాలైనప్పుడు కూడా దమయంతి అతనితోనే ఉంది. అందుకు భిన్నంగా ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెను విడిచేసి వెళ్ళినది నలుడే. అంటే, ఇక్కడ కూడా నలుడు తన మనోభావాలకే ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా స్వార్థాన్నే చాటుకున్నాడన్నమాట.

పుట్టింటికి చేరుకున్న దమయంతి నలుని తన వద్దకు రప్పించుకోవడంలోనూ అడుగడుగునా క్రియాశీలంగా వ్యవహరించింది. తల్లితో తండ్రికి చెప్పించి నలుని వెతకడానికి బ్రాహ్మణులను పంపించే ఏర్పాటు చేసింది. నలుడు అజ్ఞాతంగా ఉంటాడన్న సంగతిని ఆమె ఉహించడమే కాదు; భార్యను వదిలేసి వెళ్ళడం న్యాయమా అని వెళ్ళిన ప్రతిచోటా సభలలో ప్రశ్నించమనీ, దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చుననీ బ్రాహ్మణులకు చెప్పి పంపించింది. ఋతుపర్ణుని దగ్గర పనివాడుగా ఉన్న బాహుకుడనే వ్యక్తి తనకు సమాధానం చెప్పాడని తెలపగానే, తనకు ‘రెండు మూడు రోజుల్లో’ పునస్స్వయంవరం జరపబోతున్నట్టు ఋతుపర్ణుడు ఒక్కడికే కబురు అందేలా చూసింది. ‘రెండు మూడు రోజుల్లో’ అని అనిపించడం కూడా నలుని రప్పించే వ్యూహంలో భాగమే. నలుని కంటె వేగంగా రథం తోలగలిగినవారు ఇంకొకరు లేరని ఆమెకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో జరగబోయే పునస్స్వయంవరానికి అయోధ్యనుంచి వందల మైళ్ళ దూరంలో ఉన్న విదర్భకు ఋతుపర్ణుని ఎవరైనా తీసుకురాగలిగితే, అది నలుని గుర్తించడానికి ఒక ముఖ్యమైన ఆధారం అవుతుందని ఆ కబురు పంపేటప్పుడే దమయంతి అనుకుందన్నమాట. ఈవిధంగా దమయంతి క్రియాశీలగానే కాక ఎంతో ఉపాయశాలిగానూ వ్యవహరిస్తుంది. ఇక బాహుకుడే నలుడన్న సంగతిని నిర్ధారణ చేసుకోడానికి అతనితో దమయంతి ఆడిన మైండ్ గేమ్, అందులో విజయం సాధించడం ఆమె బుద్ధికుశలతకు పరాకాష్ట.

నాలుగవ పొర

ఇది సంక్లిష్టమే కాక, కొంత వివరంగా చెప్పుకోవలసిన పొర. ఇందులో కొన్ని తాత్విక అంశాలు చర్చలోకి వస్తాయి. అవి ఎలాంటివో తెలుసుకోవాలంటే, ఒక గ్రీకు ఇతిహాస కథతో నలదమయంతుల కథకు ఉన్న పోలికల గురించి మొదట చెప్పుకోవాలి. ఆ ఇతిహాసం, హోమర్ (క్రీ. పూ. 85౦) చెప్పిన ‘ఒడిస్సే’(Odissey). హోమర్ ఇలియడ్(Iliad) అనే మరో ప్రసిద్ధ ఇతిహాసాన్ని కూడా చెప్పాడు. అది ట్రాయ్ యుద్ధం గురించి. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్(Odisseus) అనే యోధుడి కథ ‘ఒడిస్సే’. ఈ రెండూ ప్రతిపాదించే తాత్వికతలలో మౌలికమైన తేడా ఉంది. ముందుగా, జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో చర్చించిన ఒడిస్సే కథను వీలైనంత క్లుప్తంగా చెప్పుకుందాం.

ఓడిసస్ ఇథకా అనే ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య పేరు పెనెలోప్. ఓడిసస్ ట్రాయ్ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ యుద్ధం పదేళ్ళపాటు జరుగుతుంది. ఆ పదేళ్లూ అతను భార్యకు దూరమవుతాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అతను సహచరులను వెంటబెట్టుకుని పన్నెండు ఓడలలో సాహసయాత్ర ప్రారంభిస్తాడు. ముందుగా థ్రేసియన్లకు చెందిన ఇస్మారస్ అనే పట్టణంపై దాడి చేసి, జనాన్ని చంపేసి అక్కడి సంపదను, స్త్రీలను పంచుకుంటారు. అక్కడినుంచి తిరిగి యాత్ర ప్రారంభించిన తర్వాత జియస్ అనే దేవుడు పెద్ద తుపాను సృష్టిస్తాడు. ఓడ తెరచాపలు చిరిగి చీలికలు పీలికలైపోతాయి. అందరూ పూర్తిగా అదుపు తప్పి తొమ్మిదిరోజుల పాటు కెరటాలు ఎటు నెడితే అటు కొట్టుకుపోతారు. చివరికి తుపాను వారిని తెలిసిన ప్రపంచపు సరిహద్దులను దాటించి అజ్ఞాత ప్రపంచంలోకి తీసుకు వెడుతుంది.

పదో రోజున తామర పువ్వులు తినే(Lotus Eaters) జనం ఉండే భూమికి చేరుకుంటారు. ఓడిసస్ అనుచరులు తామర పువ్వులను తినగానే తామెవరో మరచిపోయి అక్కడినుంచి రావడానికి నిరాకరిస్తారు. ఓడిసస్ వాళ్ళను బలవంతంగా ఓడల్లోకి లాక్కువెళ్ళి, కట్టిపడేసి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఇప్పుడు అడుగడుగునా కష్టాలు, పరీక్షలు ఎదురయ్యే ఒక మార్మిక ప్రపంచంలోకి ఓడిసస్, అతని ఓడలు అడుగుపెట్టాయి. మొదట వారు ఒంటి కన్ను రాక్షసులు ఉండే భూమికి చేరుకుంటారు. వాళ్ళలో ఫోలిఫెమెస్ అనేవాడు మరింత భీకరంగా ఉంటాడు. అతను పోసిడన్ అనే దేవుడి కొడుకు. పోసిడస్ సముద్రంలో పెద్ద పెద్ద అలలకు ప్రభువు. మన వరుణదేవుడి లాంటివాడు. తన పొట్టేళ్ళ మందతో కలసి పోలిఫెమెస్ ఒక గుహలో నివసిస్తూ ఉంటాడు. ఓడిసస్ తన సహచరులలోంచి మెరికల్లాంటి వాళ్ళను పన్నెండుమందిని వెంటబెట్టుకుని ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. లోపల పుష్కలంగా వెన్న, మీగడ, ;పాలు; గొర్రెల మందలు ఉంటాయి. కాసేపటికి ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. అతణ్ణి చూడగానే భయపడి అంతా దాక్కుంటారు. రాక్షసుడు వాళ్ళను కనిపెట్టి అతిపెద్ద బండరాయితో గుహను మూసేసి వాళ్ళలో ఆరుగురిని తినేస్తాడు. ఓడిసస్ వాడికొన ఉన్న ఒక గుంజను సిద్ధం చేసుకుంటాడు. తర్వాత రాక్షసుడి దగ్గరికి వెళ్లి, తన పేరు నోమన్ అని చెప్పి అతనికి ద్రాక్షసారా ఉన్న ఒక పెద్ద తోలుతిత్తిని ఇస్తాడు. రాక్షసుడు ఆ సారా తాగేసి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఓడిసస్ గుంజతో అతని కన్ను పొడిచేస్తాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ చేతులతో తడుముకుంటూ వెళ్లి గుహను మూసిన బండరాయిని తొలగించి ప్రవేశమార్గంలో తను కూర్చుంటాడు. ఓడిసస్, మిగిలిన ఆరుగురు భారీ పొట్టేళ్ల కడుపుకు వేల్లాడుతూ బయటపడతారు.

అక్కడినుంచి ఓడలలో బయలుదేరి అయోలస్ అనే వాయుదేవుడి దీవికి చేరుకుంటారు. ఆ దీవిలో అయోలస్ ఆరుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళతో నివసిస్తూ ఉంటాడు. కొడుకులకు కూతుళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతను ఓడిసస్ కు తొమ్మిదేళ్ళ వయసున్న ఒక ఎద్దు చర్మంతో చేసిన సంచీలో ప్రయాణానికి తోడ్పడే రకాల వాయువులనుల కట్టి ఇస్తాడు. ఆ తర్వాత బలమైన పడమటి గాలి వీచి ఓడలను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళేలా చేశాడు. పదో రోజుకు స్వస్థలానికి దగ్గర అవుతుండగా, ఓడిసస్ నిద్రపోతుండడం చూసి అతని సహచరులు ,అయోలస్ ఇచ్చిన తోలుసంచిలో ఏవో నిధి నిక్షేపాలు ఉంటాయనుకుని దానిని తెరుస్తారు. అంతే, ఒక ప్రచండ వాయువు వీచి ఓడలను అయోలస్ దీవికే తిరిగి తీసుకొస్తుంది. ఈసారి వారికి ఆతిథ్యమివ్వడానికి, సహకరించడానికి అయోలస్ తిరస్కరిస్తాడు.

భగ్నహృదయాలతో అందరూ తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఈసారి ఏ వాయువూ వారికి సహకరించదు. ఏడో రోజున నరమాంస భక్షకులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితులైపోతారు. ఆమె ఆ దేశపు రాజుగారి కూతురు. వారిని తన ఇంటికి తీసుకెడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఒక పర్వతం ఆకారంలో భయంకరంగా ఉంటారు. తండ్రి ఓడిసస్ బృందంలో ఒకడిని పట్టుకుని తినబోతుంటే అందరూ భయపడి ఒడ్డుకు పరుగెడతారు. తండ్రి సింహనాదం చేయగానే అన్ని వైపుల నుంచీ లెక్కలేనంత మంది నరమాంస భక్షకులు వచ్చి వీరి మీద పడతారు. ఎంతో మందిని చంపేస్తారు. ఒక్క ఓడిసస్ ఓడను తప్ప మిగిలిన ఓడలను ధ్వంసం చేసేస్తారు.

Circe_by_cemac

గ్రీకు అప్సరస సిర్సే

 

 

ఓడిసస్ మిగిలిన సహచరులతో కలసి తిరిగి యాత్ర్ర ప్రారంభిస్తాడు. సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుంటాడు. సిర్సే సూర్యుని వల్ల సముద్రానికి కలిగిన కూతురు. మానవాళికి వెలుగునిచ్చేది ఆమే. ఓడిసస్ పంపించిన మనుషులు అడవిలోకి వెళ్లి నునుపు రాళ్ళతో కట్టిన సిర్సే భవంతిని సమీపిస్తారు. ఆ భవంతికి అన్ని వైపులా తోడేళ్లు, సింహాలు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి ఏదో మందు పెట్టడంతో అవి పూర్తిగా సాధుజంతువులుగా మారిపోయాయి. ఓడిసస్ సహచరులను చూసి అవి పెంపుడు కుక్కలలా తోక ఊపాయి. వారికి లోపలినుంచి తియ్యని గొంతుతో సిర్సే పాడుతున్న పాట వినిపించింది. వారు ఆమెను పిలిచారు. ఆమె బయటికి వచ్చి వాళ్లందరినీ లోపలికి ఆహ్వానించింది. వారంతా మంత్రించినట్టుగా లోపలికి వెళ్లారు. యురిలోకస్ అనే అతనికి మాత్రం ఇందులో ఏదో కుట్ర ఉందన్న అనుమానం కలిగి బయటే ఉండిపోయాడు. సిర్సే ఎత్తైన ఆసనాల మీద అందరినీ కూర్చోబెట్టి మందు కలిపిన ఆహారమూ, మద్యమూ ఇచ్చింది. దాంతో వారు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. సిర్సే వారిని మంత్రదండంతో తాకి పందులుగా మార్చేసి వారి ముందు పందులు తినే ఆహారం వేసింది.

ఇది చూసి భయపడిన యురిలోకస్ వెళ్ళి ఈ సంగతి ఓడిసస్ కు చెప్పాడు. ఓడిసస్ ఒక పెద్ద కంచు ఖడ్గాన్నీ, విల్లమ్ములను తీసుకుని సిర్సే భవంతికి బయలుదేరాడు. హెర్మెస్ అనే దేవుడు ఒక యువకుని రూపంలో, స్వర్ణదండం పట్టుకుని అతనికి ఎదురయ్యాడు. సిర్సే మాంత్రికతనుంచి అతన్ని కాపాడే ఒక దివ్యమైన మూలికను ఇచ్చాడు.

“సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు” అన్నాడు.

ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. సిర్సే అతనికి లొంగిపోయింది. తను పందులుగా మార్చిన ఓడిసస్ సహచరులను తిరిగి మనుషులుగా మార్చేసింది. వారు వెనకటి కంటే యవ్వనవంతులుగా, అందగాళ్ళుగా మారిపోయారు. ఓడిసస్ సిర్సే పొందులోనే ఎనిమిదేళ్లు గడిపేశాడు. ఆ తర్వాత సిర్సే,

“నువ్విప్పుడు ఇంకో యాత్ర చేయాలి. అధోలోకానికి( అంటే మన పాతాళం అన్నమాట)వెళ్ళాలి. అక్కడ హేడ్స్, భయం గొలిపే పెరెస్ఫోన్ ఉంటారు. భవిష్యత్తును చెప్పే తేబన్ టిరేసియస్ కూడా ఉంటాడు. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. నీకు మేలు జరుగుతుంది.” అని చెప్పి అతనికి మార్గదర్శనం చేసింది.

ఓడిసస్ తిరిగి ఓడలో బయలుదేరి ప్రపంచం అంచులకు పయనించాడు. సిమ్మేరియన్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పొగమంచుతోనూ, మేఘాలతోనూ కప్పబడి ఉంది. అక్కడ నిరంతరం రాత్రే కానీ పగలు లేదు. ఓడిసస్ అక్కడ ఒక కందకంలో– అంటే ఊర్ధ్వమార్గంలో కాకుండా– అధోమార్గంలో పితృదేవతలకు తర్పణం విడిచాడు. అన్నివైపుల నుంచి ప్రేతాత్మలు వచ్చి ఆశ్చర్యంతో కేకలు పెట్టాయి. అక్కడ ఓడిసస్ తన తల్లిని, టెరేసియస్ ను, ఫియడ్రాను, అగమెమ్నాన్ ను, యాచిలెస్ ను, క్రీటు రాజు మినోస్ ను, ఇంకా ఎందరో పితృదేవతలను, దండం పుచ్చుకుని మృతులకు శిక్షలు విధించే జియస్ కొడుకును (మన యముడన్న మాట) దర్శించాడు. అయితే, పెరెస్ఫోన్ వల్ల తనకు హాని జరుగుతుందేమోనని భయపడి తిరిగి సిర్సే దగ్గరికి వచ్చాడు. ఆమె నుంచి అంతిమ ఆదేశాలు పొంది తిరిగి యాత్ర ప్రారంభించాడు.

మిగతా కథ, విశేషాలు తర్వాత….

-కల్లూరి భాస్కరం