Adam and Eve

drunken coupleతెలిసి కాదు, తెలియకనే.

ఒక కారణంగా తీసిన చిత్రాలన్నిటినీ చూసుకుంటూ వస్తున్నాను.

ప్రతిదీ బావుంటుంది. ప్రతీదీ ఒక కథ చెబుతుంది. అసలు మనిషి తన బతుకు తాను బతుకుతుండగానే వేరే వాళ్ల బతుకులను అలవోకగా ఇలా జాగ్రత్తచేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది! ‘మంచిదే’ అని మురిసిపోతూ మళ్లీ చూడసాగాను. సడెన్ గా ఈ చిత్రం కనిపించింది మళ్లీ.ఎంత బాగుంది.
తెలిసి కాదు, తెలియకనే తీశాను.మొదట వాక్యం ఉందనీ తెలియదు.
నిజానికి వాక్యం కన్నా ముందు దృశ్యమే ఉండి ఉంటుందనీ తెలియదు.
తెలిసీ తెలియక తీశాను.
వాళ్లిద్దరూ ఆడమ్ అండ్ ఈవ్ లని కూడా తెలియదు. కానీ, తీశాను.

తీసిన చిత్రాలన్నిటినీ చూస్తుంటే, బహుశా ఇది ఈ సంవత్సరం తీసిన ఒక గొప్పఛాయా చిత్రమా ఏమిటీ అని పొరబాటుగా అనుకున్నాను. ‘గొప్ప’ అనడం ఎందుకూ అంటే ఇందులో వాళ్లిక్కడ లేరు.
వాళ్లను మనం కనిపెట్టలేం. ఎక్కడో  ఉన్నారు. లేదా వాళ్లిద్దరూ ఒకరిలో ఒకరున్నారు.

కౌగిలి సుఖం ఎరిగిన వాళ్లకు తెలుసు. వాళ్లు ఎక్కడున్నారో.
లేదా కౌగిలి అనంతరం కాళ్లు పెనవేసుకుని నిద్రలోకి జారుకున్న వాళ్లందరికీ తెలుసు వాళ్లెక్కడున్నారో.
ఏకమైంతర్వాత మళ్లీ ఏకం చేసేదేమీ ఉండదు. ఇక ఎవరికి వారు తమతో ఉండటంలోనూ ఒక ప్రశాంతత.
అదీ ఈ చిత్రం. ఇవన్నీ కలిసి ‘వాళ్లు ఎక్కడుండాలో అక్కడున్నారూ’ అని చెప్పడం.

గొప్పలు పోవడం కాదుగానీ, నా చిత్రాల్లో ఇదొక అద్వితీయ చిత్రం
ఇది చూస్తే దిగులు చెందని జీవుడు ఉండడు. వీళ్ల బతుకు గురించి విచారించని మానవుడూ ఉండడు.
అదే సమయంలో తమలోకి తాము చూసుకుని, తమ భద్ర జీవితం ‘ఒక జీవితమేనా’ అనుకోని మానవుడూ ఉండడు. అనుకుంటున్నానుగానీ అంతకన్నా ఎక్కువే అనుకుంటారేమో!
అందుకే ఈ దృశ్యాదృశ్యం ఒక అనాది చిత్రం. ఆది మూలం. నిరంతర చలచ చిత్రం కూడా.
అందుకే, నా దృశ్యాదృశ్యాల్లో ఇదొక స్పెషల్. ఒక మత్తులో జోగిన ఘజల్.నిజం. అత్యంత సామాన్యమైన, అత్యంత సరళమైన, సహజమూ సుందరమూ అయిన, మిక్కిలి విచారాన్నో లేదా ఆనందాన్నో పంచే ఒక ఛాయను మనలోంచి మనం ఏరుకోవడమే ఛాయా చిత్రకళ. దృశ్యాదృశ్య కళ. ఆ చిత్రం నాది కావచ్చు, మీది కావచ్చు. కానీ అది మనందరనీ పట్టిస్తుందని మాత్రం ఈ సందర్భంగా దయచేసి చెప్పనివ్వండి. మరోమాట. మిమ్మల్ని ఎవరైనా చిత్రం చేస్తున్నారూ అంటే ఒప్పుకొండి. మీ సొమ్మేం పోదు. అది ప్రపంచ ఆస్తిగామారి మిమ్మల్ని అమరులను చేస్తుంది. వీళ్లకు మల్లే.నిజం. తెలిసీ తెలియక, తప్పతాగి. ఒకరి కౌగిళ్లో ఒకరు అదమరచి, తెల్లవారినప్పటికీ, సూర్యుడి కిరణాలు వాడిగా వేడిగా గుచ్చుతున్నాకూడా లేవనంతటి అలసట, బడలిక, సుషుప్తి ఈ చిత్రం.
ఇంకా తెలవారని జీవితాల ఛాయ ఈ చిత్రం.
చూస్తే మనుషులు తెల్లబోవాలి. ‘ఇదిరా జీవితం’ అనుకోవాలి.
అంత నిర్భయంగా, నిర్లజ్జగా, అభద్రంగా సొమ్మసిల్లాలి.

చిత్రం చేశాక నేనూ అలాగే అయ్యాను. నెకెడ్ అయ్యాను. కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదు. ‘నేనెలా జీవిస్తున్నాను. నాకెలాంటి ప్రియసౌఖ్యం’ వుంది అనిపించింది. ఈ భూమ్మీది సరళ రేఖను, మధ్యరేఖను పట్టుకున్నానే భలే అనుకున్నాను. ‘అవి రెండూ కలిసిన రేఖల్ని ఛాయగా బంధించాను కదా’ అనుకున్నాను.
అసలు భూగోళాన్ని చిత్రికపట్టే వృత్తలేఖిని ఏదైనా ఉంటే అది కెమెరానే కదా అనిపించి, ఆనందంగా వీళ్లనుంచి సెలవు తీసుకున్నాను. ఇపుడు, ఇలా, ఒక వారం ముందుగానే ఈ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,. ‘ఓ మానవులారా…మీ జన్మధన్యం నా వల్ల. నా జన్మ ధన్యం మీ వల్ల’ అనుకుంటూ మనుషులందరికీ కృత.జ్ఞతలు చెబుతున్నాను. మరింత పాత దృశ్యాదృశ్యాలకు భరోసానిస్తూ కొత్త కాలానికి స్వాగతం పలుకుతున్నాను.

హ్యాపీ ఇయర్ ఎండింగ్ ఫ్రెండ్స్…~   కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

*