పీకె హై క్యా?

samvedana logo copy(1)పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది మన సమాజానికి అవసరమైన ఒక అంశాన్నిపరిమితుల్లోనైనా చర్చించగలిగింది. 300 కోట్ల వసూళ్లవైపు దూసుకెళ్తోంది అని చదివినప్పుడు కాదు గాని పీకె అంటే ఏమిటి అనేది ఐదో తరగతి పిల్లలు చర్చించుకుని చివరకు పాగల్‌ కుత్తా అని వాళ్లొక అబ్రివేషన్ ఇచ్చేసుకున్నారని తెలిశాక హిరానీ సక్సెస్‌ అయినట్టు అనిపించింది. పీకె సినిమాకు పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెట్టుబడి పెట్టిందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించినపుడు భలే అనిపించింది. సిటీకొచ్చి ఇన్నేళ్లయినా దేడ్‌ దిమాక్‌ అంటే సరిగా తెలిసేది కాదు. ఇపుడే తెలిసింది. కొత్త ఆశ్చర్యాలు, కొత్త విషాదాలు లేని నిస్సత్తువ కాలంలో ఎంత వినోదం, ఎంత విషాదం?

పీకెలో కొత్త అంశాలేమీ లేవు. అన్నీ మనకు తెలిసినవే. అందులోనూ మనం నాస్తికులమో హేతువాదులమో కమ్యూనిస్టులమో అయిఉంటే ఎప్పుడో ఒకసారి ఆ జోకులన్నీ వేసే ఉంటాం.అవేవీ పూర్తిగా ఏలియన్‌ విషయాలు కావు. కోడలు దిద్దిన కాపురం నాటినుంచో ఇంకా అంతకుముందునుంచో అక్కడక్కడా అపుడపుడూ కొన్ని శకలాలు చూస్తూనే ఉన్నాం.

ఓ మైగాడ్‌తో కూసింత ఎక్కువే చూశాం. కాకపోతే హిరానీ అలాంటి ఎలిమెంట్స్‌ని పూర్తిస్థాయిలో మెయిన్‌స్ర్టీమ్‌ లోకి తెచ్చి అల్లిన తీరు కొత్తది. ఈ దేశంలో మనోభావాలు అనే పదం ఒకటి ఏడ్చింది. దేవుడు లాంటి అమూర్తమైన పదార్థం అది. అది ఎవరైనా ఏలు పెడితే బొక్కడిపోయేంత సున్నితము. అత్తిపత్తి వలె అలా తాకితే ఇలా ముడుచుకుపోయేంత సున్నితము. పీకెకు దేవుని రూపరేఖా లావణ్యములు తెలీనట్టే మనకూ ఈ మనోభావాలు అనేవి ఎలా ఉంటాయో ఎందుకంత సున్నితంగా ఉంటాయో తెలీదు. కాకపోతే ఒకటి తెలుసు. ఇతరుల మీద దాడులు చేసి చంపేసేవారు, త్రిశూలాలతో తల్వార్లతో ఊరేగేవారికే ఇట్లా సున్నితమైన మనోభావాలు ఉంటాయని చరిత్ర మనకు తెలుపుచున్నది.

ఒక ఆర్టిస్టును దేశం విడిచిపోయేట్టు చేసినవారు, ఆడపిల్లలపై విధించిన స్థలకాల ఆంక్షలను ధిక్కరించినందుకు-అంటే మగవారికి మాత్రమే పరిమితమైన రాత్రిపూట రోడ్లమీద తిరుగుట, పబ్బుల్లో క్లబ్బుల్లో కనిపించుట వగైరా చేసినందుకు దాడులకు పాల్పడువారు. వాలంటైన్స్‌ డేనాడు తిట్టి కొట్టి బలవంతపు పెళ్లిళ్లు చేయువారు. ఒక నవల రాసినందుకు తలతీస్తాం అని ఫత్వా విధించినవారు, పబ్లిగ్గానే దాడులు చేయగలిగిన వారు. వీరందరి మనోభావాలూ సున్నితమైనవే. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట! ఇదిగో ఈ బ్యాచ్‌ ఇపుడు రోడ్డున పడింది. ఇలాంటివారితో డీల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.

pk1

ఇక్కడ చాలా నేర్పుగా జాగ్రత్తగా వ్యవహరించారు రాజూ హిరానీ. నేర్పుగా అంటే సబ్‌ ఠీక్‌ హై అని కాదు. సర్దుబాట్లే కాకుండా కొన్ని రాజీలు కూడా ఉన్నాయి. ఇంత జేసినా ఈ మనోభావాల గుంపులకు తృప్తి లేదు. ఊరుకుంటే మెత్తదనం అనుకుంటారేమో, పైగా మనోడు పదవిలో ఉన్నపుడు కూడా మనం హడావుడి చేయకపోతే మన ఆధిపత్యం ఏమైపోవాలి అని తీర్మానించేసుకుని బజార్న పడుతున్నారు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇది మతాన్ని కించపరిచే సినిమా అనలేడు అని స్టేట్‌మెంట్‌ ఇవ్వచ్చుగానీ అన్నం బదులు చపాతీతింటే ఒకేనా అనొచ్చు.

అభిప్రాయాల్లో కూడా వైవిధ్యం ఉండొచ్చును. మన అభిప్రాయమే అంతిమం కావాలని   అనుకోకూడదు. విభేదాలున్నవారు రాసుకోవచ్చు. హిరానీ అనే పెద్దమనిషి ఒక సినిమా తీశాడు, నీకు నచ్చకపోతే ఇంకో సినిమా తీస్కో. లేదంటే ఒక వ్యాసంరాస్కో. నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. “నా చేతిలో కర్ర ఉండాది కాబట్టి అందరూ నా మాట వినాలనిపిస్తాది” అంటే ఏం బాగుంటాదప్పా! అని మనం అడగాల్నా వద్దా! ఒకవైపు ప్రజాస్వామ్యంఅంటావు. ప్రజాస్వామ్యం చాలా గొప్పదని మీ నాయకుడు పార్లమెంట్‌ మెట్లకు సాష్టాంగనమస్కారాలు వగైరా పెడతాడు, నువ్వేంది స్వామీ, కర్రలు తీసుకుని వీధుల్లో పడతావ్ అని అడగాల్నా వద్దా! ఈ డ్యూయల్‌ రోల్‌ రహస్యమేంటో చెప్పమని డిమాండ్‌ చేయాలా వద్దా! ఏదో ఒకటి చెప్పండి, అట్లాగే ఖాయం చేసుకుందారి అనాల్నా వద్దా1 ఏ రోటి కాడ ఆ పాట అంటే ఎలాగబ్బా వీళ్లతో వేగడం. జ్ఞానానికి అవధి ఉంటుంది, అజ్ఞానానికి ఎక్కడా! అనుకుని ఊరుకోవడానికి లేదు. ఇది జ్ఞానాజ్ఞానాలకు సంబంధించిన విషయం కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదానికి సంబంధించిన విషయం.

ఇపుడు కాస్త పెద్దమనిషి తరహాలో గంభీరంగా మాట్లాడుకుందాం. వీళ్ల గొడవేంటసలు. అహా, ఏంటసలు అని! అసలైతే వీళ్లతో మనం మాట్లాడలేం. వాదించలేం. మాట్లాడకూడదు, వాదించకూడదు. వాదిస్తే ఏమవుద్దో నీషే చెప్పాడు కదా! కానీ కొందరు చాలా పెద్దమనిషి తరహాగా తర్కపు ముసుగేసుకుని గొంతును బేస్‌ వాయిస్‌లోకి మార్చి ఆ రూట్లో ముందుకు వస్తుంటారు. స్వాములోర్లలో మాత్రం అందరూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారే ఉంటారా. అక్కడక్కడా కాస్త లాజికల్‌గా కనిపించాలని ప్రయత్నించువారు ఉంటారు. చర్చించకపోతే వీళ్లసలు ఊర్కోరు. వీళ్లేమంటారు?

images

ఈ దేశంలో హిందువులు అందరికీ చులకనైపోయారు. ఎవరుపడితే వారు నాలుగు రాళ్లు విసిరేయడమే అంటారు. అదే ఇస్లాంను అనగలరా, క్రైస్తవాన్ని అనగలరా! అమీర్‌ ఖాన్‌ అనే ముస్లిం కాబట్టి ఇలా చేశాడు అంటారు. ఈ చివరి ప్రశ్న జోలికి మనం పోకనక్కర్లేదు. అది దేడ్‌ దిమాక్‌ కంటే ఒక దిమాక్‌ తక్కువైన మాట. ఆనంద్‌ పట్వర్థన్‌ ఏ మతంలో పుట్టారని ఆయన సినిమాలను డాక్యుమెంటరీలు ఆంక్షల నడుమ నలిగిపోతున్నాయి. సంజయ్‌ కాక్‌ ఏ మతంలో పుట్టాడు? దీపా మెహతా ఏ మతంలో పుట్టింది? ఇక ఇతరత్రా విషయాల్లోకి వెళ్దాం. అదే అమీర్‌ ఖాన్‌ మసీదు లోకి మద్యం బాటిళ్లతో వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ముగ్గురు భార్యల మొగుడైన ముస్లిం వ్యక్తికి కోపం తెప్పిస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ఇస్లామిస్ట్‌ టెర్రరిస్టుల దాడికి చలించిపోతాడు. చనిపోయిన తన మిత్రుడి చెప్పు మోసుకుని తిరుగుతాడు. అసలు ఇంత బాలెన్సింగ్‌ యాక్ట్‌ అనవసరం. ఇందులో కొన్ని అంశాల్లో ప్రత్యేకించి ముగ్గురుభార్యల సెటైర్‌లో స్టీరియోటైప్‌ వ్యవహారం ఉంది. హిరానీ ప్రమాదకరమైన పర్వతాల మధ్యలో తాడుమీద నడిచే మాదిరి విన్యాసం చేశాడు. అయినా ఈ గుంపులకు ఆనలేదు.

ఇపుడు హిందూ దేవతలే హిందూ బాబాలే దొరికారా అనే ప్రశ్న దగ్గరకు వద్దాం. ఇది హిందూ మెజారిటీ దేశం. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా ఏ మతంలో ఉన్న దురాచారాల గురించి ఫోకస్‌ చేయాలి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లి ఇస్లాంను ఇట్లా చిత్రించగలరా అనేవారు ఈ దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారా అనేదానికి సమాధానం చెప్పాలి. ఎదుటోడు కన్ను పొడుచుకున్నాడు కాబట్టి మనం కూడా పొడుచుకోవాలి అనడం   తప్ప ఇందులో ఏమైనా ఉందా! అట్లాంటి స్థాయికి తీసికెడితేనే కానీ వీళ్లు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించడానికి అవకాశం దొరకదు. అదీ అసలు విషయం.

ఏ దేశంలో నైనా పురోగామిగా ఆలోచించే శక్తులుంటాయి. ఏదో ఒక స్థాయిలో అక్కడి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. క్రైస్తవ ఆధిపత్యంలోని దేశమైనా ఇస్లాం ఆధిపత్యంలోని దేశమైనా అన్ని దేశాల్లోనూ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. మనం చూడదల్చుకోకపోతే వేరే విషయం. బాబాల అవతారమెత్తి ఒక్కొక్కడు ఎన్ని రకాల నీచాలకు మోసాలకు పాల్పడుతున్నారో తెలిసి కూడా మా హిందూ బాబాలను అలా అంటావా అంటున్నారంటే వీరికి కనీసం తమ మతాన్ని సంస్కరించుకోవాలనే కోరిక కూడా లేదని అర్థమవుతోంది.

అక్కడక్కడా కొన్ని మౌలిక అంశాలు లేవనెత్తినప్పటికీ మొత్తంగా చూసినపుడు వివేకానంద స్కూల్‌కు దగ్గరగా ఉండే సంస్కరణ వాద వ్వవహారం ఈ సినిమా. తిరుగుబాటు వ్యవహారం కానేకాదు. చివర్లో బాబాతో చర్చ సందర్భంగా దైవాన్ని ప్రశంసించి అది సాంత్వనకు అవసరం అని చెప్పి భక్తులను సంతృప్తి పరిచే పని కూడా చేశాడు హీరానీ. కానీ మెయిన్‌స్ర్టీమ్‌ సినిమాలో ఆ మాత్రం ప్రయత్నం చేయడం, అది ఎక్కువమందికి చేరే విధంగా చేయడం రాజూ హీరానీ సాధించిన విజయం. అభినందించాల్సిన విషయం.

   -జి ఎస్‌ రామ్మోహన్‌

 

మీ మాటలు

  1. సుజాత says:

    కొత్త సంవత్సరం ప్రారంభం ఒక మంచి విశ్లేషణ చదవడం తో ప్రారంభం!! చాలా బాగుంది రామ్మోహన్ గారూ

  2. Srikanth M says:

    ఉఫ్.. కమ్యూనిష్టులయ్యుండాలా? నేను కాదు.. అయినా నేను కొన్నింటిని సమర్ధిస్తా.. “గుడికెల్లేది భయముతోనే” లాంటి వాటిని తప్ప. మన మతాన్ని మనం సంస్కరించుకోవాలి.. మన దేశం ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు… అలా అని సోవియట్ రష్యాకూడా కాకూడదు..!!

  3. చాలా బాగా రాశారు రామ్మోహన్ గారూ!

    మీ వ్యాసంలోని వ్యంగ్య వైభవానికి వంద మార్కులు. >> వీరందరి మనోభావాలూ సున్నితమైనవే. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట! >> వాహ్.

    మనో భావాలు రానురానూ నున్నితమైపోతున్న పోకడల గురించి బాగా వ్యాఖ్యానించారు. అయితే … ఈ సినిమాను తిరుగులేనివిధంగా విజయవంతం చేసిన.. ఇష్టపడి చూస్తున్న కోట్ల మంది ప్రేక్షకుల మనోభావాల సంగతేమిటి?

  4. పవన్ సంతోష్ says:

    హింసాత్మక కార్యకలాపాలను ఎవరూ సమర్థించడానికి లేదు కానీ ‘‘అమీర్ ఖాన్ అక్కడ. గోప్ప దేశభక్తుడు. ఇప్పటివరకూ ఇన్ని మంచి సినిమాలు తీశాడు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందేం? ఏం?’’ అని కొందరు గర్జిస్తోన్నా పీకె హై క్యా అనే అనిపిస్తోంది. ఇంతాచేసి జాతీయస్థాయిలో చర్చ లేవనెత్తడానికి కాదా ఆయన తీసింది అని అనాలనిపిస్తోంది. అనొచ్చంటారా? లేదా అమీర్ బాబాని, హిరాణీనంద స్వాములవారిని జస్ట్ అలా ఫాలో అయిపోవాల్సిందేనంటారా?

  5. ఘాఠు గా ఉంది. సహేతుకంగా ఉంది, ముందు ముందు ఇటువంటి గొంతుకల అవసరం చాల ఉంది .

  6. MALLIKARJUNA RAO CHINTALA says:

    NICE

  7. ఒక విమర్శకుడు ‘గుడి కెల్లేది భయంతో’ నచ్చ లేదని చెప్పాడు. కాని అది హిందూ మతానికి మాత్రమే వర్తించేది కాదు. హేతువాద దృక్పదంతో చెప్తే భయం మనిషిని చర్చికి, మసీదుకు వెళ్ళ డానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. కమ్యునిస్టులు అంటే సోవియెట్ రష్యా అని కాదు. ఒక ఐడియాలజీ, అవగాహన అవసరం. గాంధీ , గాడ్సే ఇద్దరూ ప్రాక్టీ సింగ్ హిందువులే కాని ఒకరికి హిందూ మతంలో అహింసా, లౌకిక, సౌబ్రాత్రుత్వం కనపడితే ఇంకొకతనికి హింసా, సంకుచిత మతోన్మాదం మాత్రమే కనపడింది.

    ఇప్పుడు ఉన్న ఎడ్యుకేటేడ్ అర్బన్ మిడిల్ క్లాస్ వారిలో మితి మీరుతున్న కుల గజ్జి, మత గజ్జి, ప్రాంతీయ, జింగొఇసమ్ చూస్తుంటే బాధతో పాటు భయం కూడా వేస్తుంది.

    • Srikanth M says:

      హేతువాదమైనా, కమ్యూనిజమైనా “దేవుడి గుడికి వెల్లేది భయం తో” అని చెబితే అంగీకరించనని చెప్పాలనుకున్నానండి. గుడికెల్లేది భక్తితో, నమ్మకం తో .. భయముతో కాదు. వాటికి చాలా తేడా ఉంది. కమ్యూనిజం అంటే సోవియట్ రష్యాకాదు అంటున్నారు… అక్కడ నా ఉద్దేశ్యం దేవుడు అంటే గిట్టని కమ్యూనిస్టు భావజాలం .. వారికి ఎంతో ప్రీతి పాత్రమైన సోవియట్ రష్యాలో అమలయిన “స్టేట్ ఎథిజం” (State Atheism). అసలు మతము/ దేవుడు ఉండకూడదు అంటూ సాగించే నిరకుశ ధోరని.. ఈ తరహా నిరంకుశ ధోరణి సోవియట్ రహ్స్యాలో, స్టాలిన్ హయాములో బాగానే నడిచింది. అందుకే అన్నాను .. నాకు సెక్యులర్ రాజ్యం కావాలే కానీ “సోవియట్ రష్యా’ తరహా రాజ్యం అవసరం లేదు అని.

      నాకు అవగాహన ఉందండి. అందుకే చెప్పాను.

      • సాహితి says:

        భయం లో నుండే భక్తీ వచ్చేది. బయానికి మరో పేరు భక్తీ.

  8. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట..యస్ ..చాలా బాగుంది రామ్మోహన్ జీ ..

  9. alluri gouri lakshmi says:

    చాలా చాలా బాగా వ్రాసారు రామ్ మోహన్ గారు ! అభినందనలు !

  10. rachakonda srinivasu says:

    చాల బాగా వ్రాసారు. మీ కోపాన్ని దిగమింగి , సుతి మెత్తగా తగాలల్సినచోట తగిలేల ,తల దిమ్మరిల్లెల , డిరెక్టర్ల బాలన్స్ చేసినట్టు మీరు చేసారు .

  11. Thirupalu says:

    చాలా బాగుందండి రామ్మోహన్‌ గారు! ఈ భావ జాల గర్షణను ఎదుర్కోక తప్పదు. లేక పోతె మన దేశం నాజీ జర్మన్‌ అవటానికి చాలా రౌలు పట్టదు.

  12. 1) ఒక ఆర్టిస్ట్ ని ఈ దేశం నుండి పంపించారు : M F Husain ని ఎవరు పంపించారు ఈ దేశం నుంచి ?? అతనే వెళ్ళిపోయాడు.దేశ బహిష్కారం ఏమి విడించలేదు మన కోర్ట్ లు గాని , మన government గాని. సరే అతను వెళ్ళింది ఎ దేశానికి ?? కతర్ కి . మరి కతర్ లో వాళ్ళ రాయల్ ఫ్యామిలీ న్యూడ్ పెయింటింగ్స్ ఎందుకు వెయ్యలేదు ఆయన. వేస్తే అక్కడ వుండే వడ ? ఇస్లాం గురించి అలంటి పెయింటింగ్స్ వేస్తె 92 ఏళ్ళు బతికేవాడా ? ఇలాంటి ఒంటి కన్ను secularism వల్లే జనాలు భ్ఝ్ఫ్ వైపు వెళ్తున్నారు

  13. రామ్మొహన్ గారు… కమల్ విశ్వరూపం గురించి రాసారా ?

  14. వాట్ అబౌట్ కమల్ విశ్వరూపం ?

    • విశ్వరూపం చూడ లేదండీ

      • రామ్మోహన్ గారు,

        మీరు చూడరు. చూడలేరు . అమ్మో, ఇస్లాం ని విమర్శిడమే?

    • వ్యాసం చదివినట్టు అనిపించలేదండీ!

      • మీ ఈ వ్యాసమే కాదు మిగతావి కూడా చదివాను. Consumerism ని ఖండిస్తూ మీరు రాసే వ్యాసాలు అంటే నాకు చాల ఇష్టం కానీ అందరు communists లాగానే మీరు ఒంటి కన్ను secularism ని పాటించడం చుస్తే బాధగా వుంది. పైన చెప్పినట్టు దీని వల్లే communism & socialism అన్న జనాలకు నమ్మకం పోతోంది.

  15. Srikanth M says:

    @సాహితి
    << భయం లో నుండే భక్తీ వచ్చేది. బయానికి మరో పేరు భక్తీ.
    కొంత మందికి అలా కూడా వస్తుంది. కానీ భక్తికి అదే కారణమంటే తప్పు అని చెప్పక తప్పదు.

    • సాహితి says:

      అసలు దేవుడు పుట్టిందే భయంలో నుండి

      • Srikanth M says:

        కొంత మంది హేతు(టు)వాదుల సృష్టి (కల్పన) అది. దేవుడు భయం నుండి పుట్టాడు అనుకోవడం.

    • అవును కానండీ ..,
      ఇప్పటి రోజుల్ని బట్టి సాహితి గారి మాటల్నే
      దగ్గర దగ్గరగా ఖాయం చేసుకోవచ్చండీ …

      • Srikanth M says:

        అంటే ఒకప్పటి రోజుల్లో అయితే కాదన్న మాట.. !
        హ్మ్ .. నేను చెప్పేది అదే నండి. మూలం భయం కాదు. .!!

  16. రామ్మోహన్ గారు,
    అనాలిసిస్ అనేక కోణాలలో బాగుందండి. మరి విశ్వరూపం కూడా అనలైజ్ చేసి
    శంకర్ మరియు కుమార్ గార్ల ‘ఒంటికన్ను సెక్యులరిస్ట్’ ముద్ర నుంచి
    బయటపడితే బాగుంటుందేమో ?
    ఆలోచించండి.

  17. మిత్రులారా!
    ఒంటికన్ను ఎవరిది? మనం రెండు కళ్లతో చూడదల్చుకోక ఎదుటి వాళ్లకు కన్నులోపాన్ని ఆపాదించడం లోలోపల దాగిన మతకోణాన్ని చాటుతున్నది. వ్యాసం చదివినట్టు అనిపించలేదన్న తర్వాతైనా శ్రద్ధ పెట్టి ఉంటే పొరబాటేమో అనుకోవడానికి ఆస్కారముండేది. ఇపుడదీ లేదు. వ్యాసంలో సల్మాన్‌ రష్డీపై విధించిన ఫత్వా గురించి, తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడి గురించి వాళ్ల పేర్లు పెట్టకుండానే ప్రస్తావించాను. రెండు కళ్లతో చదివి ఉంటే అవి అర్థమై ఉండేవి. కనీసం రష్డీ గుర్తుకొచ్చి ఉండేవారు. మీరు చూడదల్చుకోలేదు.
    విశ్వరూపం చూడలేదంటే మీరు చూడరు, చూడలేరు, అమ్మో ఇస్లాం గురించి రాయడమే అని విరుపొకటి! తస్లీమా నస్రీన్‌పై హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో దాడి జరిగినపుడు-అంటే దాదాపు ఏడున్నరేళ్ల క్రితం “మన చేతులు చిన్నవి” అని ప్రాణహిత వెబ్‌ మ్యాగజైన్‌కు వ్యాసం రాసి ఉన్నాను. ( http://www.pranahita.org/2007/09/mana_chetulu_chinnavi/ ) “తస్లీమాపై జరిగిన దాడిని ఏ శిబిరమూ సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు” అని నా అసంతృప్తిని కూడా వ్యక్తి చేసి ఉన్నాను. అదెందుకు చదవలేదు- మీది ఒంటికన్ను అని నేను అనొచ్చునా! ఎట్లా అంటాం! అన్ని సినిమాలను అందరూ ఎలా చూడలేరో అలాగే అన్ని వ్యాసాలను అందరూ చదవలేరు. సినిమాలైనా, వ్యాసాలైనా చూడడానికి అది మనల్ని ఆకర్షించడానికి దానిమీద స్పందించడానికి చాలా చాలా అంశాలు పనిచేస్తాయి. అవిక్కడ ఈ కామెంట్‌ పరిధిలో వివరించడం కష్టం. మీరేదో ఆపాదించారు కాబట్టి శీలపరీక్ష చేసుకోవడానికి నేనిక్కడ ఇది రాయడం లేదు. ఆ అవసరం నాకు లేదు. ఆలోచనా పద్ధతి గురించి అందులోని పరిమితుల గురించి చెప్పాలనిపించింది.
    మనం ఒక అంశం గురించి ప్రధానంగా చర్చిస్తున్నపుడు ఇంకోటి పోటీ పెట్టి దాని గురించి ఎందుకు చర్చించరు, మీది ఒంటికన్ను అనడంలో ఔచిత్యం లేదు. మీకు అది చర్చించాల్సిన అంశం అనిపిస్తే రాయండి-తప్పేముంది? దానిమీదా చర్చించొచ్చు. నాని, ఆజాద్‌ , ఖడ్గం వగైరా సినిమాలమీదా కూడా చర్చించొచ్చు. వాస్తవానికి పీకె నేపథ్యంలో వాటిమీద చర్చ జరగాలి.వాటి ప్రస్తావన తీసుకురాబోయి కూడా వ్యాసం పరిధి పెద్దదవుతున్నదని ఆపేశాను. ఏ మతోన్మాదమేదైనా మానవాళికి ప్రమాదకరమే. అందులో ఫలానాది మేలు అనేదేమీ ఉండదు. కాకపోతే మనం హిందూ మెజారిటీ దేశంలో ఉంటున్నాం కాబట్టి దానిమీద అనివార్యంగా దృష్టి కేంద్రీకృతమౌతుంది. అవ్వాలి కూడా! కాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టు లెక్క. అదే సరైన దృష్టికోణం అనిపించుకుంటుంది. దానర్థం మనం ఇంకో మతోన్మాదాన్ని ఆమోదిస్తున్నట్టు కాదు. మతంలో లోపం ఉందని తెలిసి కూడా ఎవరైనా విమర్శిస్తే వెంటనే ఆవేశపడి అదిగో ఆ మతం లోపాల్ని కూడా విమర్శించు అంటున్నాం అంటే మనం ఒంటికన్నుతో చూస్తున్నామని, మన దృష్టికోణంలో లోపం ఉందని అర్థం.
    మిత్రులారా, పుడతా వట్టిది. పోతా వట్టిది. మధ్యలో వచ్చిన ఈ మతం గోచీ పీకేయండి. పుట్టుకతో మతం లేదు. పుట్టినపుడు ఎలా బరిబత్తలుగా మతాలు, కులాల గొడవలు లేకుండా ఉన్నామో అలా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది. ప్లీజ్‌ ఘర్‌ వాపసీ! ఏ తాళ్లూ మతపు రంగు దుస్తూలూ లేని మతరహిత ప్రపంచంలోకి ఘర్‌ వాపసీ!

    • బాగా చెప్పారు రామ్మోహన్ గారు.

    • తెలుగులో ‘సదా సద్దాం’ అన్న పుస్తకం వచ్చింది. మరెందుకో మలాలా గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకబ్బా ..

    • DHANUNJAYA MURTHY says:

      ”మనం హిందూ మెజారిటీ దేశంలో ఉంటున్నాం కాబట్టి దానిమీద అనివార్యంగా దృష్టి కేంద్రీకృతమౌతుంది. అవ్వాలి కూడా! కాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టు లెక్క. అదే సరైన దృష్టికోణం అనిపించుకుంటుంది”. అవునా? ఎందుకలా? హిందూ మెజారిటి దేశం అని ఏ కాలిక్యులేషన్ ప్రకారం చెప్పుతున్నారో, అర్థం కావటం లేదు. కమ్యునిస్టులు, నాస్తికులు, నాకు ఏ మతం లేదు.. అని చెప్పుకునే వాళ్ళు, ఇతర మతాల్లోకి మారిపోయి రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలలో హిందువులు గా చెలామణి అవ్వుతున్న వాళ్ళు, అందర్నీ తీసేవేసిన తర్వాత మిగిలే విగ్రహారాధకులను మీరు హిందువులుగా భావిస్తే…..మిగిలిన అన్ని మతాలవారికన్నా, వారే మైనారిటీ అండీ. ఒకటి మాత్రం స్పష్టం. ప్రగతిశీల వాది ఒకడు గడ్డం పెంచి, రోజుకు 5 సార్లు నమాజు చేయచ్చు కానీ, పిలక పెట్టుకొని నామాలు మాత్రం రాసుకోకూడదు. వాడి ఇంట్లోని ఆడవాళ్ళు బురఖాలు లేనిది బయటకు రాకూడదు. మడి కట్టుకొని వంట మాత్రం చేయకూడదు. ఒకసారి ప్రగతి శీల వాదులమని చెప్పుకొనే వారి విశ్వాసాలకు సంబంధించిన జీవన శైలిని ఆత్మవంచన లేకుండా గమనిస్తే, తెలుస్తుంది.

  18. Allam Vamshi says:

    పీకె సినిమా కన్నా ఈ వ్యాసమే ఇంకా మంచిగుంది..

  19. Allam Vamshi says:

    పీకె సినిమా కన్నా ఈ వ్యాసమే ఇంకా మంచిగుంది..

  20. బ్లాగుల్లో ఒక మత అసహనపు మూక తయారయ్యింది. ఎవరైనా ఒకదానిని విమర్శిస్తే, ఖచ్చితంగా మిగిలిన అన్నింటినీ విమర్శించి తమ balancing act అనబడే పాతివ్రత్యాన్ని ఆచరించి తీరవలసిందేనని వీరి అభిప్రాయం. ఇలాంటివాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళనే ఈ దేశభక్తులు మతోన్మాదులు అంటారు. వీళ్ళలోని అదే భావజాలాన్నిమాత్రం వీళ్ళు గుర్తెరగరు. వీళ్ళుమాత్రం ఏదో ప్రతి దొంగస్వామీజీనీ బ్లాగుల్లో నిశితంగా విమర్శిస్తున్నట్లు. అందరూ మాత్రం అలాకాదూ, తమ ఆసక్తినిబట్టి, తమ అవగాహనలోకి వచ్చినవాటిపైనే ఎవరైన వ్యాఖ్యానిస్తారు.

    నాకు విశ్వరూపమూ, పీకే రెండూ సమాజానికి అవసరమైన సినిమాలుగానే అనిపించాయి. ఇప్పుడేంటట?

    భక్తి అనేది కేవలం దేవుడి ముసుగు తొడుక్కున్న భయం (నరకం conceptలేని ఆస్థిక మతమేది?). అంతకు మించి begging. నాకు అది కావాలి, ఇదికావాలి అంటూ బదులుగా నీకు అదిస్తాను, ఇదిస్తాను అంటూచేసే లంచగొండి వ్యాపారం. మీరు ఏకోరికలూకోరకుండానే, ఏకోరికలూ లేకుండానే దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి. దేవుడన్నభావన మనుషుల్ని అదుపులో పెట్టడానికని బ్లాగులోని స్వామీజీ ఒకసారి అన్నారు. అప్పుడు మీరు దాన్ని ఖండించలేదేం అని నేనంటే మీరేం చేస్తారు?

    • DHANUNJAYA MURTHY says:

      ”భక్తి అనేది కేవలం దేవుడి ముసుగు తొడుక్కున్న భయం (నరకం conceptలేని ఆస్థిక మతమేది?). అంతకు మించి begging. నాకు అది కావాలి, ఇదికావాలి అంటూ బదులుగా నీకు అదిస్తాను, ఇదిస్తాను అంటూచేసే లంచగొండి వ్యాపారం”. ఇది మీ ప్రకటన. “మీరు ఏకోరికలూ కోరకుండానే, ఏకోరికలూ లేకుండానే దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి”. ఇది మీ ప్రశ్న లేదా సలహా. ఏ కోరికలు కోరకుండా, ఏ కోరికలు లేకుండా ప్రార్థన చేసే మతాలకు అతీతమైన కాన్సెప్ట్ ఒకటి ఉంటుందని మీకు తెలుసా? తెలియదా?

  21. పసునూరు శ్రీధర్ బాబు says:

    రామ్మోహన్ గారూ…
    వ్యంగ్యం అద్భుతంగా రాశారు. వివేకానంద సంస్కరణకు దగ్గరగా ఉండే కథనం.. తిరుగుబాటు కానే కాదు. ఎక్సైట్ అయినట్లు కాకుండా చాలా బాలెన్స్ డ్ గా రాస్తూనే అనాల్సినవన్నీ అనేశారు. సినిమాలోని సీన్ల కన్నా సినిమా హిట్ అవడం వల్లే ఆ మూకల మనోభావాలు దెబ్బతిన్నట్లున్నాయ్. పిచ్చివాగుడు బ్యాచ్ కు తాము మైనారిటీ అయిపోతున్నామనే భయం పట్టుకున్నట్టుంది.

  22. DHANUNJAYA MURTHY says:

    ”భక్తి అనేది కేవలం దేవుడి ముసుగు తొడుక్కున్న భయం (నరకం conceptలేని ఆస్థిక మతమేది?). అంతకు మించి begging. నాకు అది కావాలి, ఇదికావాలి అంటూ బదులుగా నీకు అదిస్తాను, ఇదిస్తాను అంటూచేసే లంచగొండి వ్యాపారం”. ఇది మీ ప్రకటన. “మీరు ఏకోరికలూ కోరకుండానే, ఏకోరికలూ లేకుండానే దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి”. ఇది మీ ప్రశ్న లేదా సలహా. ఏ కోరికలు కోరకుండా, ఏ కోరికలు లేకుండా ప్రార్థన చేసే మతాలకు అతీతమైన కాన్సెప్ట్ ఒకటి ఉంటుందని మీకు తెలుసా? తెలియదా?

  23. MadhuCharan says:

    “బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా”
    “సిటీకొచ్చి ఇన్నేళ్లయినా దేడ్‌ దిమాక్‌ అంటే సరిగా తెలిసేది కాదు. ఇపుడే తెలిసింది. ”
    ” కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇది మతాన్ని కించపరిచే సినిమా అనలేడు అని స్టేట్‌మెంట్‌ ఇవ్వచ్చుగానీ అన్నం బదులు చపాతీతింటే ఒకేనా అనొచ్చు.”

    ఇవన్నీ పత్రికలో ప్రచురింపబడాల్సిన వ్యాసంలో ఉండాల్సిన భాష అని అనిపించడం లేదు. సారంగలో ఎడిటింగ్ బాగుండటం లేదు. సంపాదకులెందుకు కత్తిరింపు చేయరో!

  24. ఫై.కె. సినిమా చూసా భాష అర్తం కాక ఇబ్బంది పడ్డాను .మీ విశ్లేషణ బాగుంది. అయ్యా ఈ భూమ్మీద అన్దరూ పిరికి సన్నాసులు వారు “దేవుడు” అనే మత్తు మందు తాగాకుంటే బతకలేరు. ఒక బతక నేర్చిన వర్గం వాళ్ళను ఆ మందుకు బానిసల్ని చేసింది. మీ విశ్లేషణకు ధన్యవాదాలు.

  25. మృత్యుంజయరావు says:

    రామ్మోహన్ గారి వ్యాసంలో ధ్వనిస్తున్న అసహనం అర్థం చేసుకోదగిందే! ఐతే ఇలాంటి విషయాలు చర్చించేటప్పుడు వ్యంగ్యం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. సీరియస్ గా చర్చించాల్సిన అంశం వ్యంగ్యం వల్ల పలచనైంది. ‘పీకెలో కొత్త అంశాలేమీ లేవు. అన్నీ మనకు తెలిసినవే. అందులోనూ మనం నాస్తికులమో హేతువాదులమో కమ్యూనిస్టులమో అయిఉంటే ఎప్పుడో ఒకసారి ఆ జోకులన్నీ వేసే ఉంటాం.’ అవును. కానీ మనం అవేవీ కానప్పుడు మతం లోనే ఉంటాం. మన ఆలోచనను మతమే ప్రభావితం చేస్తుంది. అసలు మతం (దానిపేరు ఏదైనప్పటికీ) ప్రపంచం లోని ముక్కాలు మందిని ఎలా ప్రభావితం చెయ్యగలుగుతోంది? దాని కంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. శాస్త్రీయ విద్య, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా దాని ప్రాభవం ఎందుకు తగ్గలేదు? దేవుడి అవసరం రోజురోజుకూ ఎందుకు పెరుగుతోంది? గుళ్ళూ గోపురాలూ మసీదులూ ప్రార్ధనా మందిరాలూ అపరిమితంగా ఎందుకు పెరుగుతున్నాయి? చట్టాల పరిధిలోకి రాని సామాజిక విధి నిషేధాలకూ, వ్యక్తిగత విలువలకు (ఇక్కడ నేను నైతికత అనే పదం ఉద్దేశపూర్వకంగానే వాడట్లేదు) మతాలు బోధించే సూత్రాలమీదే ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఎందుకుంది? సమాజానికి చట్టం తప్ప నీతి అక్కరలేదా? ఉంటే, మతం నుంచి నీతిని విడదీయాల్సిన అగత్యాన్ని గురించి ఎవరు మాట్లాడాలి? వైరుధ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు పీకే సినిమా చూసినవారిలో తప్పకుండా కలుగుతాయి. రామ్మోహన్ గారు ఆ వైపు వెళ్ళకుండా ఘర్ వాపసీ అంటున్నారు. మతరహితమైన ఆదిమ సమాజం వారి ఊహల్లో ఉందేమో నాకు తెలియదు. సమాజ వికాసంలో మతావిర్భావం కూడా ఒక పెద్ద అడుగే! దాన్ని మనం కాదనలేం! ఐతే, మతం దుష్ఫలితాలనిస్తున్నప్పుడు దాన్ని సంస్కరించుకోవడమా, దాన్ని పూర్తిగా తిరస్కరించడమా అనేది దానికి ప్రత్యామ్నాయమైన మరో వ్యవస్థను మనం నిర్మించుకోగలిగినప్పుడే సాధ్యమౌతుంది.
    గతంలో ఏ సినిమాలోనూ చూడని ఒక అంశాన్ని ఇందులో దర్శకుడు స్పృశించాడు. అది భాష గురించి. భాష మనుషుల్లో ద్వంద్వ ప్రవృత్తికి అవకాశం ఇస్తోందని పీకే సినిమాలో ఒక సూచన ఉంది. దాన్ని గురించి రామ్మోహన్ గారు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు.
    ఏమైనా ఆధునిక కాలంలో చర్చకు రావాల్సిన, విశ్లేషించుకోవాల్సిన అనేక అంశాలవైపు పీకే సినిమా వెలుగు ప్రసరించింది. అందుకు అమీర్ ఖానూ, హీరానీ అభినందనీయులు. రామ్మోహన్ గారి నుంచి మరో వ్యాసం కోసం ఎదురుచూస్తాను.

  26. buchireddy gangula says:

    చిన్నప్పటి నుండే — దేవుడు —matham– పొగలు –తాయితలు — మొక్కులు —
    పూజలు — బొట్లు —గుళ్ళు — పుట్టెంటుకలు —వ్రతాలు —వ్వర్జ్యం — ముహూర్తం —యిలా
    అన్నింట్లో పలు పంచుకునేలా — చేసింది —family…. ప్లస్ సమాజం

    జియ్యం గారి ప్రవచానాలు వింటే — పుణ్యం ప్లస్ స్వర్గానికి వీసా వస్తు0 దన్న ఆశ — నమ్మకం —వారు మన యింటి కి వస్తే —లక్ష్మి దేవి – — యింట్లో నిలిచిపోయి —అంతా
    మంచే జరుగుతుందని —నమ్మకం తో 5000 // 10000 డాలర్ల కర్చు తో —అమెరికా లో
    దొరలూ — అగ్రకులాల వాళ్ళు — డబ్బు ఉన్నోళ్ళు —జరుపుతున్న తతంగం —నిజాలు —
    వాళ్ళింటికి లక్ష్మి దేవి వచ్చింది — మనం చేస్తే — మనింటికి కూడా — antoo—-

    అమెరికా లో తెలుగు సంగాల లా — ఊరికో గుడి — త్వరలో — వీ ధీ కో గుడి కూడా
    రాక పోదు — విరాళాలు వసూలు చేయడం — గుడి నిర్మాణం — దానికి ఓక క మే టి —
    ఎన్నికలు —- లోల్లుల్లు — స్టే ఆర్డర్లు — కోర్ట్ చుట్టూ తిర్గడాలు —-రాష్ట్ర రాజకీయాల్లా —
    పేచీలు —-చాల గుళ్ళలో చూస్తున్న నిజాలు —–

    విరాళాలు వసూలు చేయడం కూడా ఒక art… ముఖ్య అతిథి — చిరు — బాలయ్యః —
    మోహన్ బాబు — అంటూ — ఎన్నో పేర్లతో — అన్ని రకాల ఫండ రేసింగ్ లు —-
    చూసాం — చూస్తున్నాం ——-
    (for..examples—తెలుగు సంగాలు –కుల సంగాలు —-గుడి సంగాలు —- family– పేరుతో
    . పేరుతో foundation…లు //////)—అమెరి కా అయినా — అమలాపురం అయినా —- గుళ్ళు
    -మందిరాలు —- పెరుగుదలకు కారణం డబ్బు వసూలు చేయడం — రాజకీయాలు నడుపుతూ ——– ఆస్తు లు పెంచుకోవడం —చూస్తూ న్న సత్యాలు ??

    మనిషి బతకడానికి kulam——- మతం — దేవుడు అవసరమా ??

    pk… లాంటి సినిమాలు యింకా రావాలి —–రామ్మోహన్ గారు చాలా చక్కగా రాశారు
    —.=====================================================
    బుచ్చి రెడ్డి గంగుల –

మీ మాటలు

*