ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను
అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో
వెలుగుతో చెరచబడి
ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది

గాలిలా స్నేహించాలనుకుంటాను నేను
అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట సుడిగుండం బిగి కౌగిలిలో
ఋతువుతో అవమానింపబడి
దిక్కు తోచని దిక్కు లేని తనమే తోడౌతుంది నాకు

కనీసం

చేపలా ఏకాకి తనాన్ని అనుభవించాలనుకుంటాను నేను
ఎప్పుడన్నా కొన్ని నీటి ముద్దులతో – అప్పుడప్పుడు
నీటి బుడగల్లాంటి మనుష్యుల మధ్య ప్రయాణం తో
పారే నీటిలో ప్రతి క్షణం
మొప్పల్లో నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది

జీవించడం రెండు భూగోళాల మధ్య
రూపమే లేని పాల పుంతలా ఉంది
సరే !
ఆశల విలువ బతుకు కంటే అమూల్యమైనది కదా ! !

-ఆంధ్రుడు

My photo-1

డిశెంబరు చలి గాలి పటాలు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

1
నిగ నిగ లాడుతున్న రేగుపండు,
కొరికితే వకటే వగరు
2
ఎటు పోయింది
మద తుమ్మెదల గుంపు!
పూలు నిగారింపు కోల్పోయి
విరహ నిట్టూర్పులతో తలవాల్చి…
3.
మత్తు కిటికీ తెరుస్తూ
పురాతన బౌద్ధ సన్యాసి-
మోహ చీమల బారు,
ఈ రాత్రికి ఇంకేమి కావాలి?
4.
ఈ బాహువులకి
వొక జన్మంత చలి,
బహు దూరపు చలి మంట
చేరేలోపునే ఆరిపోయింది.
5
చాలా దూర ప్రయణం,
మంచు కప్పేసుకున్న
దారి కంటికి పొరల్ని తొడుగుతూ-
6
ప్రాత: కాలం,
మాలి పూలవనం ఊడుస్థుంటే
రంగు రంగుల అలల నర్తనం-
7
వాళ్ళు అంటున్నారు
ఈ తరుణం మంచిది కాదని-
నేనంటున్నాను
అనుభవానికి ఇదే హుషారు కాలమని-
8
గూట్లోని ముసలి జంట కలవరిస్తున్నారు
నిన్నటి యవ్వనాన్ని శపించుకొంటున్నారు
కీళ్ళ నొప్పుల్ని స్వప్నిస్తున్నారు
రేపటి సరిజోడుని-
9.
ముదురు చలి
లేత యవ్వన విరహ వితంతువు చుట్టూతా ఇనుప వల-
కలలు కూడా
దోమ తెర ఆవలే తచ్చాడుతున్నాయి-
10
అదే పనిగా
కురుస్తున్న మంచు పరదాలను వొలుచుకొంటూ
వొంటరి పక్షి ఎదురేగుతుంది
రేపటి ఉదయానికి ఏ కొమ్మ మీద వాలునో?
11.
మరో కాలి బాట వేయాలి
దారిలో మరెన్నో దీపాల్ని వెలిగించాలి
మరో ఊట చెలమను తోడాలి-
-ఇక్బాల్ చంద్

Iqbal chand

అయ్య యాది-2

ఉయ్యాల లూగింది యాద్లేదు నాకు

భుజాలమీదాడింది మర్శిపోనెన్నట్కి

కన్నదమ్మే గాని కంట్కి రెప్పోలె

కాపాడ్త్వి నువ్వు పుట్టినకాడ్నించి

 

అంగడ్కి బోతప్డు   ఆఠాణ అక్కకిచ్చి

అందర్కి బంచమని శెప్పిపోతుంట్వి

పొద్దూక పండ్లు దెచ్చి తలోటిచ్కుంట

ఏమేం జేశిర్రని ఎర్క దెల్సుకుంద్వు

 

బుర్రిగోనాడ్తనని  బుర్రి శెక్కియ్యమంటె

శిర్రెగోనంటరని ఎక్కిరిస్తుంటె

ఎహ్ పోయె ఏదోటి  శేషియ్యమంటె

యాప బుర్రి నువ్వు ఎమ్మటే ఇచ్చేది

 

మారెమ్మ బోనాలెల్లినంక  శెట్ల కింద్కి బోతె

పొద్దీకి బువ్వ దిన్కముందు కల్లు దాగ్తప్డు

రేక గాంగ మిగిల్న కమ్మతోటి  పీకె జేశిచ్చేది

పీకె ఊద్కుంట బువ్వకు బిల్శేది నిన్ను

 

శిన్నగున్నప్పుడె ఈత నేర్వాల్నన్జెప్పి లొట్టల కట్టనీప్కుగట్టి

పుట్టోన్బాయి మెట్ల మీన మొదల్బెట్టి

తర్వాత తాడ్తోని మోటర్దాకి రమ్మన్న యాది

ఎండకలామెప్డు ఈతక్బోయ్న గాడ్కి

 

గోటీలాటాడ్కుంట ఆకిట్ల అన్ననేన్గొట్కుంటే

శిన్న పెద్ద లేక నోట్కొచ్చింది దిట్కుంటె

అక్కలొద్ధంటుంటె ఐనినకుంట

ఇంటెన్క  ఇద్దర్ని కడ్కి గట్టేశి గొడ్దువు

 

రోజుకొక్కంగడి దిర్గుకుంట నువ్వు

మబ్బుల్నే లేశి మల్లెప్పుడొచ్చేదొ

సప్పుడైతుంటె సాయ్మాన్ల నీది

సప్పుడుగాకుంటొచ్చి పక్కపొంటి  గూసుంటుంటిమి

 

శెర్వు పెద్దది మనూర్ది  శాపలెక్వనుకుంట

పట్టరాదే నాకు పడయయ్యి అంటుంటె

ఉష్కె దొంతులూకెనె బడ్తయని శెప్కుంట

ఎర్రలను అంటించి గాలం శేతికిస్తుంటివి

 

బుడ్డవర్కలొద్దు మేం బువ్వ దిన్మంటె

శాపలయిపొయ్నయని శెర్వు లూటి బొయ్నంక

రవ్వలూ బొచ్చెలూ బొచ్చెడు బట్కొచ్చి

ముండ్లు  దీశి దిన్మని ముంద్ట బెడ్తుంట్వి

 

ఎండకాలమంత సల్లగుండె ఇల్లు

ఆనకాలమొస్తె ఆగమాగమైతుండె

ముసురు ఆనకె మనిల్లు మస్తు గురుస్తుంటె

పెంకలన్నీ సద్రి ఇల్లు మల్ల గప్పేది మేస్త్రివై

 

ఇర్వయేండ్లకె నిన్ను ఎద్రిస్తుంటే మేం

అర్వయేండ్లకొచ్చి ఐద్గురు బిడ్డల దండ్రైనగాని

ఎద్రుజెప్పలె మా అయ్యకేనాడని

తాత నీ ఎమ్మటి వడి  కట్టిశ్రి , కశ్రిచ్చిన ముచ్చట జెప్దువు

 

శేతులెంకకు బెట్టి ఒరం మీన బోతుంటె

ఎన్నడ్సూడ్నొల్లు గూడెర్కబడ్తుండ్రు నీ కొడ్కులని

నడ్సుడు నీతీర్గ, నవ్వుడూ నీలాగ

గడ్సుడే బర్వైంది ఇడ్శినప్పటి సంది

 

ఎప్పుడెద్గినమొ మేమెర్కనేలేదంట్వి

ఎద్గినొళ్ళను ఎక్వొద్ధులు సూస్కోనెపోత్వి

ఏండ్లేండ్లు నడ్సబట్టే  యాడ్కి బోయ్నవే నువ్వు

ఎన్నడేడ్వనొళ్ళనేడ్పిచ్చుకుంట……..

కూరెళ్ళ స్వామి

Kurella Swamy

ఓ కప్పు సూర్యోదయం

picasso

 

 

 

 

 

 

 

తూర్పు కొండల్లో… రూపాయి కాసులా
పొద్దు పొడుచుకొస్తున్నప్పుడు
ఆమె… చీకటిని వెన్నెలను కలిపేసి
మిణుక్ మంటున్న నక్షత్రాలను
ఓ చెంచాడు పోసి
కప్పుడు సూర్యోదయాన్ని అతడికిస్తుంది
ఆ పొద్దంతా… అతని కంటిలో
మీగడ తరకలాంటి
ఆమె నవ్వు నిలచిపోతుంది

* * *

దరల మంటల్లో మండిన రూపాయి
పడమటి కొండల్లో పొద్దయి వాలుతున్నప్పుడు
ఆమె… కాసింత దుఃఖాన్ని పోసి
అదేపనిగా కన్నీరును కాచి
ఓ కప్పుడు చీకటిని అతడికిస్తుంది
ఆ రాత్రంతా…
వడలిన మల్లెమొగ్గలాంటి ఆ ఇంటిలో
విరిగిన పాల వాసనేస్తుంది

-మొయిద శ్రీనివాసరావు

Moida

గుప్పెట్లోని సీతాకోకలు

1376331_10154732143770363_4527960677229738295_n

 

 

 

 

 

 

 

1.
నువ్వూ నేను
ఒకరిలో ఒకరం మాట్లాడుకుంటాం
ఎన్నో చెప్పాలని ఎదురొస్తానా
అవే మాటల్ని కుదురు దండలా పట్టుక్కూచుని నువ్వు.
 
గుప్పెట్లోని సీతాకోకలన్నీ
చప్పున ఎగరడం మానేసి
చెవులన్నీ నీ గుండెకానిస్తాయి
 
2.
విలవిలలాడుతూ తీసుకున్న నిన్నటి వీడ్కోలును
వెక్కిరించే యత్నంలో
ఎలానో నాముందుకొస్తావు
కొన్ని సార్లుగా
పగలు మొత్తంగా
 
నీ సాయంత్రపు దిగులుగూడుకి
నను తాకెళ్ళిన వెలుగురేఖ ఆనవాలు వొకటి
వెంటేసుకుని వెళ్తున్నట్టు చెబుతావు
 
శీతాకాలానికి భయపడి దాక్కున్న
పచ్చదనాన్ని మాత్రం
పొద్దున్నే తోడ్కొని వస్తావు
 
ఎన్నిమార్లు నిద్దురలో నా జ్ఞాపకాన్ని కొలిచావో
రేపెప్పుడైనా చెప్పడం మరువకేం!
 
3.
ఆగీ ఆగీ
వెనక్కి తిరిగి చూస్తావలా
 
కష్టం కదూ
వేళ్ళమధ్యలో నీ స్పర్శని
మరోసారి వరకు శోధిస్తూ కూర్చోవడం
 
రోజుకి రెండు పగళ్ళు,
ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ!
 
4.
నా అరచేతిరేఖ మీద పయనిస్తూ
కొన్ని కారణాలు అల్లుకున్న కధలేవోచెబుతూ
సముద్రాల్ని, సరస్సు అంచుల్ని
పూల గుబురుల్ని, వచ్చిపోయే వసంతాలని,
ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మబ్బుల్ని తాకుతూ
ఆ చెయ్యే నీ గమ్యమంటావు ఆత్మీయంగా.
 
రేయంతా మేలుకుని వెన్నెలపోగులు విడదీస్తూ
చుక్కల నమూనా ఏదో తేల్చుకున్నట్టుంటుంది.
 
5.
చెప్పేస్తున్నా
నా చిట్టచివరి వెతుకులాటవి నువ్వేనని.
                               -మోహనతులసి

నువ్వో నియంతవి

 

painting: Rafi Haque

painting: Rafi Haque

నువ్వో నియంతవి ఈ రాత్రికే

రాత్రి గుడ్లను పాలించే చీకటి స్వప్నానివి

నిద్దురలోనో మెలకువలోనో ఒకసారి జీవిస్తావు

కళ్ళలో ఇంత ఆశను నాటుకుంటావు

నువ్వో సేవకుడివి ఈ రాత్రికే

యే ఒంటరి చెరువుతోనో నాలుగు మాటలు పంచుకుంటావు

పొద్దూకులా కబుర్లాడతావు

చెట్ల ఆకుల మీదో వాటి పువ్వుల మీదో కొన్ని పదాలను రాస్తావు నీకొచ్చినట్టు

నీ వెన్నెముక ఇప్పుడొక పసుపుకొమ్ము

సరిగ్గా చూడు వీపునానుకుని

నువ్వో నిశాచరుడివి

ఖాళీ స్మశానంలో సమాధులు కడిగే అనుభవజ్ఞుడివి

తలతో శవాల మధ్య తమాషాలను దువ్వుకునే ఒకానొక ఆత్మవి కాదూ

నిరంతర శ్రవంతిలో కొన్ని ఆలోచనలను వింటూ

గడిపే ఒంటరి క్షణాలకు యజమానివి

నువ్వో శ్రామికుడివి

భళ్ళున పగిలే నడకల్లో అడుగులు మిగుల్చుకునే సంపన్నార్జున మనిషివి

ఒకటో రెండో అంతే పంచభూతాలను అంటుకట్టడం  తెలిసిన నిర్మితానివి

కళ్ళల్లోని అనాధ స్వప్నాలకు ఈ పూటకు భరోసా

కనురెప్పలు కిటికీలై తెరుచుకునేదాకా

ఇంకేమిటి

ఇప్పుడొక తాత్వికుడివి ఈ కాసిని వాక్యాల్లో.

-తిలక్ బొమ్మరాజు

15-tilak

డియర్ రెడ్!

untitled

ఏ ఇందిరా పార్క్ దగ్గరో కొందరు బక్కపలచని స్త్రీలు
ఎర్ర జెండాలని భుజాలపై పెట్టుకుని
గొంతు తుపాకుల్లోంచి నినాదాల
తూటాలు పేలుస్తూ సాగిపోతుంటారు

డియర్ రెడ్ !
నీవు ఎప్పుడు ఇట్లా రెపరెపలాడుతూ కనిపించినా
కొన్ని పురా జ్ఞాపకాలు వెంటాడుతాయి
చిన్నతనంలో ఉదయం లేచి చూస్తే
తెల్లటి ఇళ్ళ గోడల పైన ఎరుపెరుపు అక్షరాలు వుండేవి
‘కామ్రేడ్ జన్ను చిన్నాలు అమర్ హై ‘
‘కామ్రేడ్ జార్జిరెడ్డి అమర్ హై’
‘విప్లవం వర్ధిల్లాలి ‘

‘డాక్టర్ రామనాథం ని చంపేశారు
స్కూలుకి సెలవని’ తెలిసిన రోజున
నా జ్వరానికి తీయటి మందులిచ్చిన డాక్టర్ని
ఎందుకు చంపారో తెలియక
ఏడ్చిన రోజు ఆ రోజు గుర్తుకొస్తుంది

ఎవరీ జన్ను చిన్నాలు ?… ఎవరీ జార్జిరెడ్డి?
ఎందుకు విప్లవం ? డాక్టర్ రామనాథం చేసిన నేరమేమి ?
డియర్ రెడ్ ! నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో
కొంత ముందుకు సాగేక,
ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను
* * * *

కాసేపటి తరువాత, ఆ ఇందిరా పార్క్ దగ్గరి స్త్రీలు
కొన్ని లాటీలు, భాష్పవాయు గోలాల దాడులతో
బహుశా, చెల్లాచెదురు కావొచ్చు

డియర్ రెడ్ !
అన్ని విజ్ఞాపనలు, వేడుకోళ్ళు అయిన పిదప
చివరగా నిన్నే నమ్ముకుని వాళ్ళు రోడ్డెక్కి వుంటారు
రోజూ ఎవరో ఒకరు, నిన్నే నమ్ముకుని
ఈ నగర రహదారుల పైకి దూసుకొస్తుంటారు

కానీ డియర్ రెడ్ !
అసలీ నగరాలు, నగర అమానవులు
మనుషులుగానే పరిగణించని కొందరు మానవులు
పూర్తిగా నిన్నే నమ్ముకుని, అక్కడెక్కడో
ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట
దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?

(డిసెంబర్ 2014)

కోడూరి విజయకుమార్

vijay

తోటివారిని

 

మన తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా

గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా
అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా మనం తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయ స్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

-బివివి ప్రసాద్

bvv

నీలాలు కారితే నే చూడలేను!

Neelaalu kaaritee_Naresh Poem_illustration (2)

మోళీవాడి కనికట్టులా
మొదల్లేని ఏడుపు పాయై
ధారగడ్తావు

జంట కంటి కంగారు నలుసై కారిపోతాను

నెత్తిమీద నీళ్లకుండ
జులపాల్లేని నీ జుట్టుక్కూడా
లెక్కతేలని చిక్కులేస్తుంది.

గంగవెర్రుల గంగాభవానిలో సత్తు కాసై మునిగిపోతాను

ముందే జరిగిన కప్పల పెళ్లికి బొంతకాకి కబురు
మూరెడు లేని సొరబూరలో ఎండనే ఎండని ఏరు

**           **           **

ఆదమర్చిన ఆల్చిప్పలో ఆవలింతల ఆకాశం
ఉట్టి మీద సట్టిలో తొణికిన ఉప్పుసంద్రం

కట్ట తెగే నీ కంటి దొరువులో
మూతి చాలని బుంగనై
మునకలేస్తాను
లొడలొడ బుడగల ఊటబావిని
చేంతాడు బొక్కెనై
చేదబోతాను
వైనాల వెక్కిళ్ల
వొంపు కాల్వలో
ఉగ్గిన్నెల యాతమేస్తాను

మంచు బూచోడికి భూగోళం కొసన కొరివి
విరిగిన వంతెన్ల మీద పగటికలల సవారి

దుఃఖనదివై కలకబారితే
దిగులు ద్వీపాన్నై
నొగిలిపోతాను
ఉవ్వెత్తు ఉప్పెన్లకి
నావ విరిగిన నోవానై
బిక్కబోతాను

పిందె గాయాల నీటికి నాలుకే లేపనం
గుట్టు చెప్పని చేప నాల్కకి ఖండనే దండనం

**           **           **

వెదురుబద్ద వెన్నెముక
మబ్బుదుబ్బుల మాటు
ఏడురంగుల్లో ఒంగిపోతుంది

చెట్టు మెటికలో నీటి సడికి ఊసరవెల్లై ఉలికిపడతాను

దుర్గమ్మ ముక్కెరని
పోటు కిట్టమ్మై
ముంచెత్తుతావు

చీదేసిన శ్లేష్మాన్నై జిగురు చాలక జారిపోతాను

మరిక మర్రాకు మీద నువ్ తెప్పతేలితే
బోసినోట్లో ఆ బొటనవేలేంటని
గద్గదంగా గదమాయిస్తాను

**           **           **

ఏడున్నర శ్రుతుల ఏడుపులో నాన్నని ఎడంచేసే నా చిన్నతల్లి ప్రహర్షకి

నరేష్ నున్నా

పొయెమ్ లాంటి నువ్వు

 

పొయెమ్ లాంటి నిన్ను
నీలాంటి పొయెమ్ ను
ప్రేమిస్తున్నాను

1

రాత్రి
చీకటిని మత్తుగా తాగి
మూగగా రోదిస్తుంటుందేమో
సరిగ్గా నిద్రపట్టనే పట్టదు
కలత నిద్రలో
దిగుల్ దిగులుగా కొలను కనిపిస్తుంది
దిగుల్ దిగులుగానే
వొక పువ్వు విచ్చుకుంటుంది
తెల్లారికి
దిగుల్ పొయెమ్ వొకటి
అరచేతుల్లోకి వచ్చి చేరుతుంది
ఏ అలికిడి లేని
వొంటరి కొమ్మమీద కూర్చొని
రెక్కల్లోకి తలని దూర్చి
దిగుల్ ముఖంతో చూస్తున్న
పావురంలాంటి పోయెమ్
నీలాంటి పొయెమ్
నీలాంటి పొయెమొకటి
తెలతెలవారగానే
కళ్లముందు తేలుతుంది –

2

ఉదయం
రాత్రి చీకటి మత్తుని వొదిలి
కొత్తగా
ఊపిరి పోసుకోవాలనుకుంటుందేమో
కువకువలాడుతున్న పావురం రెక్క
– నీ చూపే
చేతిలో
దిగుల్ దిగులుగా వున్న
దిగుల్ పొయెం కళ్లల్లో
తెల్లగా విప్పుకుంటుంది
దిగులు
ఎటో ఎగిరిపోతుంది
ఆ కాసేపటికే
పొయెమ్
కాంతిని నిండా తాగి
కాంతితో తూగుతుంది
..
యింకా
ఎదిగి ఎదగని
నీలాంటి పొయెమ్ ను
పొయెమ్ లాంటి నిన్ను
నిజంగా
పసిపాపని ప్రేమిస్తున్నట్టే
ప్రేమిస్తున్నాను

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

రోబోసెపియన్ వరాహకస్

Painting: Rafi Haque

Painting: Rafi Haque

పైసలున్నవి
పోరియున్ గలదు
గ్రిల్డ్ చికెన్ గుండెకాయ
ఫిష్ ఫ్రై చర్మము
-ఎంథిరన్!
స్విమ్మింగ్ ఇన్ ద బౌల్
వాకింగ్ ఆన్ ద ట్రెడ్ మిల్
స్పర్శకు రుచి తెలియదు
సోడాబిల్లేడ్ కళ్లకు తడి తగలదు
ఓరీ ఎంసీపీ
(లోకము కన్నెర్ర చేసెను)
కోపం సేయకు దొరా
నన్నంటావుగానీ తన సంగతేందిరా
పోనీ ఒక పజిల్ ను పూరించుము
తేడాలను కనుక్కోండి
ఏది ఉక్కులాంటి ఆకసము
ఏది పచ్చాపచ్చాని నేల
ఏ రెక్కల సవ్వడి
ఏ గండభేరుంఢ ధ్వానము
ఏది అవకాశమేదియాపద
ఆకలికి అన్నము
వాక్యమునకు అక్షరము
అక్షరమునకు ధ్వని
వినరా సోదర వీరకుమారా
ఫోనెటిక్సు నీవూ
“యే నిట్టూరుపు వెనుక
యే భావ ప్రయోగము దాగిఉన్నదో
తెలుసుకోలేనంత కాలమూ
‘పురుష్’లు ముఖము పచ్చడి
చేసుకుంటూనే ఉంటారు”
చూ-24:16:82- మేల్ కొలుపు
వేషము మార్చి భాషను నేర్చి
నవ్వుల జడిలో కరెన్సీ సడి
కొంచెం కీన్ గా చూడు
-ఆ పెదవులు
పర్సులా తెరచుకున్నవి కదూ ;)
హుహ్…బేబీడాల్!
ఓకే ఓకే
అయాం సారీ
అంటే అన్నానంటారుగానీ
నీ సంగతేంది బే?
శూన్యము కానిచోట
పదార్ధము జమపడజాలదు
ఇనుములో
హృదయమూ జనించజాలదు
శుష్క్ ఇష్క్!
చిట్టి చిట్టి రోబో
నా చిన్నిచిన్ని రోబో
మానవుడా మగవాడా
మెట్రోపాలమగారాజా
హోమోసెపియన్ మోడర్నికసుడా
భ్రమ వీడరా
ఒరేయ్ రోబోసెపియన్
బాహర్ నికాల్!
అరుణ్ సాగర్
arun sagar

మరల యవ్వనానికి…

10801844_1547986905415644_141749359838664061_n

painting: Mamatha Vegunta

 

పరవశంతో
నిలువెల్లా విరబూసిన
మునుపటి పడుచుదనపు మహదానందం
ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు

కాలం
ముంచుకొచ్చిన తుఫానుగాలి
ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ

కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ
అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ
అన్నీ మరల మరల చిగురువేయించు
చేవగల నిండు గుండెలోనుంచి
గుత్తులుగా పుష్పవర్షం కురిపించు

మునిమాపుల్ని లెక్కపెడుతో
అంటిపెట్టుకుని వున్నది
పక్షిరుతాల్లేని ఖాళీగూడు
శిశిరావృత నగ్నదేహాన్ని
ఉత్తిచేతులతో మోయలేదు
ఏటెల్లకాలం చెట్టు

కింద ధరిత్రీమాత
మీద ఆకాశదేవత
ఎవరి తరమూ కాదు మరి పునర్నవం

ఆదివనిత నువ్వు మహిమాన్విత నువ్వు
అత్యనురాగం అంతర్భందనం నువ్వు
ఒక్క నువ్వే
నీ రామచిలుక వన్నె వలువలో
ఇచ్ఛానుసారం ఓ తంతువుని తెంచి
విసురు బహుదూరపు కీకారణ్యం నుంచి
ఇటువేపే
ఈ మోడుమీదికి సరాసరి రివ్వున
నా తనివితీరా చుట్టబెట్టు
ఆ మోసులెత్తే చైత్రపర్వపు ఆచ్ఛాదన

-నామాడి శ్రీధర్‌

namadi sridhar

రెండు పాదాల కవిత

   

వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని

ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను

అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు

 

ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై రోజుల నిర్దాక్షణ్యతను తొలుచుకుని బారులు సాగుతునప్పుడు-

“కవిత్వమా అది”- అనే కదా నేనడుగుతాను

 

అప్పుడు జల్లెడలా తూట్లు పడి దేహమంతా తడిసి ముద్దయి బహుశా నొప్పితోనే కాబోలు

వణుకుతున్న చేతితో జేబులో నుండి తడిసిన ఆ కాగితాన్ని ఒక చిన్ని మిణుగురులా బయటకు తీసి

ఒక్కసారి చూసుకొని తిరిగి జేబులో దాచుకుంటున్నావు

 

చావును బతుకును కలుపుతూ వంతెనలా నువ్వు

వెలుగుకు చీకటికి నడుమ పలుచని వెలుతురులా నీ జేబులోని వొచ్చీ రానీ ಆకవిత్వమూ

 

ఆ వెలుతురులో ఆ వంతెన మీదుగా అటునుండీ ఇటూ ఇటునుండీ అటూ పిచ్చి పట్టినట్టూ తిరుగుతున్నప్పుడు

చేయి పట్టుక పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు నువ్వే ఇలా అంటున్నావు

 

బహుశా ఒక అమరగీతం రాసే ఉంటావు నువ్వు, తుంటరి దొంగ సుమా వీడు –

దొరికినదంతా దోచుక పోగలడు

తాగి తాగి వొదురుతూ రాసిన మీ అక్షరాల మీద ఒంటేలు పోసి పళ్ళికలించగలడు

 

ఒక మనిషి ఎప్పుడు ఎలా పరిణమించగలడోనని మీరు ఆసక్తిగా చూస్తుంటారు

కానీ అటూ ఇటూ చెదరని నిశ్చితాల మీదనే మీ గురి-

 

కొత్త బట్టలేసుక రోడ్డు మీద తిరుగుతున్నందుకు గుడ్డలిప్పదీయించిన పెద్దమనిషి

తుపాకీ ముందర చేతులుకట్టుకొని “అనా, అనా” అని వొరపోతున్నప్పుడు లోపల ఎట్టా కుతకుతమంటదో మీరూహించగలరు గానీ

 

పక్కన ఎప్పుడూ ఊహించనంత డబ్బు

ఎటు పక్కనించీ ఏ పోలీసొస్తాడోనన్న భయం

భుజాలనొరుసుకుంటూ మావో నిలిపిన ఆదర్శం-

 

రోట్లో వేసి కలిపి దంచినట్టూ మనసు ఎన్ని పరిపరి విధాలుగా పోగలదో మీరూహించలేరు

చోరజాలని ఇరుకిరుకు సందులలో మురికి పెంటల మీదగా జీవితం ప్రవహించడం మీరు చూడలేరు –

 

తలెత్తిన ఆకాశంలో మేఘాల పరిభ్రమణంలా గిర్రున తిరుగుతూ తన లోతులలోనికి చేయి పుచ్చుకొని ఈడ్చుక పోతున్నపుడు

తనను ముట్టుకొని అలా వెళ్ళిన వాడివి మరలా ఎందుకిలా తిరిగి వచ్చావు అని అడగాలనుకున్నాను

 

తిరిగి తను అర్థాంతరంగా వదిలేసిన పాదాలే –

 

ఒకటి మరొక దానిని కలుపుతూ ఒక దృశ్యాన్ని విడదీస్తుంటుంది

మొదటిది రెండవ దాని నుండి విడిపోతూ ఒక భావాన్ని నెలకొలుపుతుంది.

-అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

వేళ్ళ గులాబీలు

 15-tilak
కొత్తగా ఒక చితి
చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా
నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో
పదునుగా కనిపించే తలల తనువులనో
ఇన్నాళ్ళు అందంగా పెరిగి
నీ నుండి ఒక్కసారే అలా విడివడడం కొత్తేమి కాదు వాటికి
ఆకులను పువ్వులను తాకుతూ ఇన్నాళ్ళు నీలో నుండి
తడియారని ఒక పచ్చిక ముఖాలకు పులుముకుంటూ ఉండని రోజులను నదుల్లో గదుల్లో దాచుకోవడం కూడా అలవాటే
చీము నెత్తురుతో సహవాసం చాన్నాళ్ళ కిందదే
స్పర్శ తెలియని అనుభూతి
అలంకారమో
మరోటో
గీసిన గీతలు ఒకచోట మొదలయి ఎక్కడికో తప్పిపోవడం గమనించనేలేదు నువ్వు
వాటి ఆనవాళ్ళను ఇక్కడే ఎక్కడో పారేసుకున్నావు
సరిగ్గా వెతుకు మరోక్షణం
నీ ఆలోచనలను విస్తరింపజెయ్యి
గులాబీ రెమ్మలు కొన్ని
వర్షంలో పూర్తిగా తడిసిపోయాక స్పృశించుకోవడం ఎంత బాగుంటుంది
అవింకా మన మధ్య ఆరని మరీచికలేగా ఎప్పుడూ
అద్దుతూ
ఈదుతున్న పరాన్న జీవులేగా ఇప్పటికీ వేలు వేలు చివరనా.
                                                  -తిలక్ బొమ్మరాజు

కొన్ని అద్భుతాలంతే అలా జరిగిపోతాయి!

 

అదెప్పుడూ నన్ను వీడిపోదు

అమ్మకొంగు పట్టుకొని వేలాడే బాల్యపు చిరునవ్వులా

నా చుట్టే దాని భ్రమణం

 

కాలపు జరిచీర మీద అంచు కదా

దాని జిలుగుకు తరుగులేదు

 

ఏ కాస్త నవ్వు నా ముఖము పై తళుక్కుమన్నా

ఏ కాస్త నవ్వు నా పెదవులపై తారాజువ్వలా ఎగిసినా

ఏ కాస్త ఆనందం నాలోకి మధువులా దిగినా

రూపం సారం దానిదే!

నా రూపు రేఖలన్నీ దానివే!!

 

అలుపు సొలుపు లేకుండా అలా అహరహం

నాలో చలించే శక్తి నాలో జీవమై అలా ప్రవహిస్తూనే వుంటుంది.

 

సూర్యుడెలా నీడకు తోడౌతాడూ?

జలబిందువుల వస్త్రం సముద్రంలా పుడమినెలా అల్లుకుంటుందీ?

నల్లని మానుకు పచ్చనాకులేలా అలంకారాలౌతాయీ?

ముత్యమంత గింజలో మహావృక్షం ఎలా ఒదిగిపోతుంది?

 

కొన్ని అధ్బుతాలంతే అలా జరిగిపోతాయి.

 

తొలకరి జల్లులాంటి తొలిపలుకుల మొదలు

దారప్పోగులై విడిపోయి నా నరనరం రుధిరపు హోరై

కణకణంలో మొగ్గల్నెలా పూయిస్తుందీ?

 

నిశ్శబ్దం శబ్దంలా రూపాంతరం చెందే

దృగ్ప్రంపచపు లయబద్ధత

మాటల తోటలాగా, పదాల పుట్టలాగా, కవనగానంలాగా

నాలో ప్రతిధనిస్తుంది

 

వేలవేల పిట్టల పాటలుగా

పాటలు తీగలై వొంపులు తిరిగే పూలచెట్టు ఆకుల సవ్వడిగా

పదుగురు సంగీతకారుల సామూహిక వయోలీన్ రాగాల రెసొనెన్స్

వీణ తంత్రుల పై నుంచి జారే వేలి కొసల నుదుళ్ళపై రాయబడ్డ మ్యూజికల్ నోట్స్ లాగా

ధ్వనుల నుంచి ధ్వనుల జననం

ధ్వనులక్షరాలౌతాయి

ధ్వనులు పదాలౌతాయి

పదాలు పుస్తకాలౌతాయి

పుస్తకాలు గ్రంధాలౌతాయి

గ్రాంధాలే పూలై వేలాడే మనోగతపు వృక్షం

అంతరంగపు చెట్టుకు పూసె పూల చుట్టూ వలయాలై ఎగిరే పరిమళం

ధ్వని అంటే ప్రపంచం

ప్రపంచం ధ్వనుల బీజాక్షరం

ధ్వనిని పలకరించే అధర వసంతం ధమనుల్లోని సాగరకెరట సంచలనమై

లోకపు గడయారానికి నే వేలాడుతున్న లోలకం

 -మహమూద్

On an autumn night

autumn

Painting : Aruna

నీలోపలి వణుకు చూసే
గదినిండా చలి
నీ చేతుల్ని వెలిగించింది
చీకటి
**
నీ పిలుపువిని
నదుల్లోపలి ప్రతిధ్వనిలో
హృదయాన్ని దాచుకుని-
నీ సరిహద్దులు తెలీక
దిగంతరేఖని చెరిపివచ్చాను.
**
నీ పరిమళం భూమినిండాలని
గాలి తనని తాను చీల్చుకుపోయింది.
నంద కిషోర్

నందకిశోర్

 

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

painting: Mamatha Vegunta

painting: Mamata Vegunta

 

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు

లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.

ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?

నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?

వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!

ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని
చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో…

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి

లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!

ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో

కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

                                            -నిషిగంధ

కాసింత సంతోషం!

 

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు

అవును, కచ్చితంగా అప్పుడే

కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.

ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో

వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

 

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

 

1

బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు

వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్

శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని

రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

 

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,

ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,

వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

 

2

పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ

కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు

వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి

నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

 

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,

అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి

నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,

ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

 

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ

నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో

వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో

అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

 

కాసింత సంతోషంగా వున్నప్పుడు

కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై

వూయల వూగామే అనుకో,

అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

 

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,

అలలోపలి సంతోషపు కడలిలో

కొంచెమే అయినా సరే,

తేలిపో.

యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో

కళ్ళలోని వెల్తురు నీడల్లో

కొంచెమే అయినా సరే,

వెలిగి రా!

4

జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

అఫ్సర్

ఓ దిగులు గువ్వ

 1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్న గుర్తు
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోవడమూ గుర్తు.

3

చుక్కలు నవ్వితే మెచ్చనిదెవరు కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి గుర్తొచ్చేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..

               -మానస చామర్తి

ఎలా వున్నావ్!

Rekha

మొదటిసారి నువ్వడుగుతావు చూడు

“ఎలా వున్నావ్? ” అని

అప్పుడు చూసుకుంటాను నన్ను నేనొక్కసారి

చాలా కాలం నుంచీ కాలానికి వదిలేసిన నన్ను నేను

అప్పుడు చూసుకుంటాను ,

నీకు ఒక సరైన సమాధానం చెప్పడానికి

అప్పుడు చూసుకుంటాను నా బాగోగులు

“బాగున్నాను “అని నీకు బదులు ఇవ్వడానికి

“ఏవీ నీ కొత్త వాక్యాలు , పట్టుకురా ” అని అడుగుతావు చూడు

అప్పుడు చూస్తాను ఒత్తైన దుమ్ములో ఒత్తిగిలి రంగు మారి

అంచులు చిరిగిన నా పేద కాగితపు పూవుల్ని

వాటి మీద ఆశగా చూస్తూ మెరుస్తూన్న

కొన్ని పురాతన భావాక్షరాలని

అయినా సరే ఎలా నీ చేతిలో పెట్టేది , ఎలాగో

అతి కష్టం మీద ఓ దొంగ నవ్వు వెనకగా దాచేస్తాను

నీ నుంచి రాబోయే మరో ప్రశ్న తెలుస్తోంది

ఎక్కడున్నాయి నా రంగులు, నా కుంచెలు? అని

లోలోనే వెదుక్కుంటాను , తవ్వుకోలేక

తల వంచుకొని నిలబడతాను

వెల్లవెలసిన నా ముఖం చూసి మౌనంగా వుండిపోతావు

మరేదైనా దీనికి సమానమైన శిక్ష ఉంటే బాగుండునేమో కదా !!

ఆ మూలగా తీగలు తెగిన వీణ ,

బీడువారిన పెరడు కూడా నీ కంట పడతాయేమో అని

ఎంత కుచించుకు పోతానని !

నిజమే !

నీవీ వాకిలికొచ్చి విచారించ బట్టి తడుముకున్నాను కానీ ,

నన్ను భూమి మీదకు పంపుతూ నీవు అమర్చిన సహజ కవచ కుండలాలన్నీ

బ్రతుకు పందెంలో ఎప్పుడో తాకట్టు పెట్టేశాను !

మా తండ్రివి కాదూ

ఈ ప్రాణం ఉండగానే మరొక్క అవకాశం ఇవ్వవూ

మిగిలిన సమయంలోనైనా ఆ తాకట్లు కాస్తా విడిపించుకొనేందుకు !!

-రేఖా జ్యోతి

జ్ఞాపకాల యాత్ర

sindhumadhuri
మెడకి కుట్టుకున్న దండ బిగిసి

రక్త నదుల ఎదురెదురు మోత

వళ్ళంతా గాట్ల మాంసం.

కోతలన్నీ  కప్పి ఉంచే  గవురవం

విత్తనాల పండగ మొలకలన్నీ

మొటిమలై  మాడిన నేల మొకం

కబురుల కీటకాల రొదన

భూమీ ఆకాశాలు లాగి తన్తే

మళ్ళీ నీ  నీ జ్ఞాపకాల చూపు

రెప్పల పొరల   కోతకి కన్నీళ్ళ  వణుకు

లోకమంతా  పోయినాక ఎముకల

కోలాటం మోత  బందాలు

ప్రమాణాల  ముళ్ళకంచ కొక్కానికి
ఉగుతున్న గుండె దేగేసిన ముళ్ళ లో

స్వరం స్పర్శా వాతాన పడి

 

ఒకటి పక్కన ఎన్ని సున్నా లలో
శరీరం మట్టి మట్టి శరీరం
 చీల్చే సాయ వ్యవసాయాలు
 తిరిగి కౌగిలి దున్నె తలపులు
కోరికని కడుపులో కుక్కుకుని
నన్ను నరికే కత్తి  నా   వెన్నుపూస
గాలి లో అడతన్న మాసపు కండల రుచీ రంగూ
వేట సింహం దగ్గరకు లక్కుని వాసన చూసి
ఇష్టంగా త్రుప్తి గా  తింటా పోగేసిన
సమాది పునాది ఎముకలు
మూసిన కళ్ళ తో గాయపు
పేడు తడిమి పురుగు పట్టిన
పున్దుని ఎండలో పెట్టీ  కదలికలు
కనపడి నిన్న పడిన వాన  ఉమ్మి ,
మల్లెల జల్లుగా రక్తపు మట్టీ
కాసిని వాసన లేని కనకాంబరాలు
జల్లి oచుకునే  కళే బర  యాత్ర ని
( రైతుబజారు  హక్కుల కోసం పోరాడే తమ్ముడు కర్రి రవీంద్ర సాయి ని,  నమ్మిన స్నేహితులే ఎండ్రిన్ తాగించి చంపేసిన దుర్ఘటన మనసు ని కోసేస్తున్నప్పుడు రాసిన కవిత )
                                                   -మన్నం సింధు మాధురి

లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

Mohan Rushi

 

 

 

 

 

 

ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

పాటలనే పాడి పరవశించాలి.

 

చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

 

ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. నిజాల మీద నిప్పులు పోసి

పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ

                                                           – మోహన్ రుషి

మరో మొనాలిసా

Mamata K.
న్యూయర్క్ జిలుగుల 
నీడల్లో ఓ పక్కకి ఒదిగి 
నెలలు నిండిన పొట్ట నిమురుకుంటూ 
ఒక మెక్సికన్ యువతి.
ఆమె చేతిలో
వడలి పోతున్న ఎర్రగులాబీ 
బొకేలనుంచి తేలివచ్చింది
దశాబ్దకాలపు గ్నాపకం.
ప్రపంచానికి ఆవలి తట్టున, ఇలాంటివే 
మసిబారిన కాంక్రీటు దుమ్మల మధ్య
ఒక చేతిలో చిట్టి చెల్లాయిని
మరో చేతిలో 
తాను మోయలేనన్ని మల్లెమాలలతో
నా కారులోకి ఆశగా చూస్తూ
ఏడెనిమిదేళ్ళ పాప.
తన దగ్గరనుంచి 
ఒక్క పువ్వూ 
తెచ్చుకోలేకపోయిన
ఊగిసలాట  మరుగున నా స్వార్థం
ఇదిగో ఇప్పుడిలా నా రీర్ వ్యూ మిర్రర్లో
నిరాశ దు:ఖాన్ని దాచేసి
నిర్వికారమైన చిరునవ్వు నావైపు విసిరి
ఎన్నటికీ మాయని గాయాన్నింకొకదాన్ని 
నా గుండెలో రేపి
రోడ్డు మలుపులో మాయమయ్యింది.

అతనూ నేనూ

నాకేం తొందరలేదు అతని లాగే

నన్ను నేను పరుచుకుని కూర్చున్నాను తననే  చూస్తూ
నాలోంచి చూపుల్ని వెనక్కి లాక్కుని
రెప్పల కింద అతను దాచుకున్నపుడు
కొలుకుల్లోంచి కణతల మీదుగా నాచు పట్టిన చారికలు
మళ్ళీ కొత్తగా తడిసిన చప్పుడు
ఉండుండీ  అతని లోపలి కఫపు అలికిడి
మా చుట్టూ కోట కట్టుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ
ఏ జ్ఞాపకాలు ఆత్రంగా తడుముకున్నాయో
వట్టి పోయిన  పెదాల మీద చెమ్మ చెమ్మగా చిరునవ్వు
గుప్పెడు గుండె చేస్తున్న ఒంటరి పోరాటం
అతని మెదడు మెలికల్లోకి మంచి రక్తాన్ని ఎగదోస్తూ
చిక్కుల దొంతరల మధ్యన ఆశగా నిలబడి
ఓర్పు పాఠాన్ని దొంగిలిస్తున్న నేను
శరీరం పై తేరిన ముడతల అడుగున
వయసుతో బరువెక్కిన అతని స్పష్టమైన చరిత్ర
వేళ్ళ వంకర్ల మధ్య నుండి స్వేచ్ఛగా
రాక పోకల్ని సాగిస్తూ గాలీ వెలుతురూ
ఇద్దరివీ ఎదురు చూపులే
తన ప్రాణాన్ని తీసుకెళ్ళే యమ పాశం కోసం అతను
నాకోసం ప్రాణాలిచ్చే అల్ప జీవి కోసం నేను
ఎటొచ్చీ అతనిది ముసలి శరీరం, నాది బలమైన సాలె గూడు అంతే తేడా
                                                             – సాయి కిరణ్ 

శిలాక్షరం

Popuri1

అక్షరం   నన్ను    కుదిపేస్తోంది
కన్ను అక్కడే    అతుక్కుపోయినా..
ఆలోచన    స్తంభించిపోయినా –
అంతరంగపు  ఆవేదనను
అంతర్లోకపు   అనుభూతిని
అక్షరాలు   అనుభవించమంటున్నాయి.
ప్రస్తుతించిన    గతం     భవిష్యత్తులో
వర్తమానమై   ఘనీభవించినా
అక్షరాలున్నాయే     అవి
పుస్తకాల    అతుకుల్లో     ఎక్కడో     ఒక చోట     నిర్లిప్తమై      వుంటాయి    కదా,
మనసు గదిలోని   మానవత్వపు  గోడల్ని  తడుముతూనే
మంచితనపు   పొరల్ని  తాకుతూనే
కదలిక     లేని     కఠినమైన    గుండె     తాలూకూ స్పందనను
ఏకాంతం లో      వున్నప్పుడు  ఒంటరి  కన్నీరుగా  మారుస్తూనే-

-పోపూరి సురేష్ బాబు

వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

 

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

ఎందుకో మరణం గుర్తొచ్చిందివాళ

ఇటీవల కాస్త అనారోగ్యం చేసింది

ఏదో ఒకనాడు చనిపోతాను గదూ-

 

చెప్పో చెప్పకుండానో కాస్త ముందుగానో వెనగ్గానో

తాపీగానో తొందరగానో మొత్తానికి చనిపోతాను

అయితే బ్రతికి చనిపోవడం నాకిష్టం

బ్రతుకుతూ చనిపోవడం నాకిష్టం

 

కొంచెం కొంచెం చనిపోతూ మిగిలుండడం

అప్పుడెప్పుడో చనిపోయీ ఇంకా ఇక్కడే

చూరుపట్టుకు వేలాడటం

చనిపోవడం కోసమే బ్రతికుండటం..

అసలిష్టం లేదు నాకు

 

***

ఎప్పుడు ఎలా చనిపోయామన్నది ముఖ్యం కాదు

ఎప్పుడు ఎలా బ్రతికామన్నది ముఖ్యం

చావుకంటే బ్రతుకు ముఖ్యం

 

***

ఎవడి పొలానికి వాడు గెనాలు వేసుకుని

ఎవడి స్థలానికి వాడు తెట్టెలు కట్టుకుని

ఎవడి పెట్టెకు వాడు తాళాలు వేసుకుని

ఎవడి పశువుకు వాడు పలుపు గట్టుకుని

ఎవడి చావు వాడు చస్తున్నప్పుడు

ఎవడి ఏడుపు వాడేడవాల్సిందే-

 

***

కానీ

వాళ్ళ చావులకు నాకేడుపువస్తున్నది

చంపబడుతున్న వాళ్ళకోసం ఏడుపు వస్తున్నది

గెనాలను దున్నేసే వాళ్ళ కోసం

తెట్టెలు కొట్టేసే వాళ్ళకోసం

యుద్ధాన్నొక పాటగా హమ్ చేస్తున్నవాళ్ళకోసం

కళ్ళు సజలమవుతున్నవి

-కానీ ఒట్టి రోదనలతో ఏమిటి ప్రయోజనం..

 

దుఃఖించడం నాకిష్టం లేదు

ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతూ బ్రతకడం

ఇష్టం లేదని ముందే చెప్పానుగా-

 

బ్రతుకుతాన్నేను

బ్రతకడం కొంత తెలుసు నాకు

మాటలే చెబుతానో

పాటలే కడతానో

కధలే అల్లుతానో

వాళ్ళకోసం దారులేస్తాను

వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను

వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.

 

-ఆర్. రాఘవ రెడ్డి

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

Amma Paapa

నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా, ఏదో భావాన్ని భాషతో చిత్రించలేకపోయినట్టు, నీ వెనుక గిరికీలు కొడుతూ మేము చల్లే వెలుగుల్ని తూచలేరెవ్వరూ.

ఎక్కడిదో మంచు మల్లెపూలుగా మారి చారెడేసి కళ్ళలో చలువ పందిళ్ళు వెయ్యడం, ఒక్క వాన చుక్క వెయ్యి వాక్యాలుగా విడిపోయి, మనసు పల్లాలోంచి జారి గుండెలో ఊట బావిగా స్థిరపడటం, ఎక్కడ విరిసిన పూలో గుండె గోడల మీద ఆడుకోవడం, ఇప్పుడిక్కడున్నవాళ్ళందరూ అనుభూతిస్తారు.

అదిగో, విశ్వసంబరాల్ని సంధ్య ప్రమిదలోకి జార్చి, ఆకు కొసల్ని వెలిగిస్తోంది చూడు వెన్నెల. రెక్కలింక ముడుచుకుని, గూటికి తిరిగి చేరేముందు వెన్నెల్ని చుట్టేసి పట్టుకెల్దాం మర్చిపోకేం.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

ఎవరైనా చేసేది వెదకడమే

Ramachandramouli

 

 

 

 

 

రాత్రి
తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది
ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు
ప్రక్కనే కిటికీ
గాలి ఒక రైలు కేకను ఇనుప చప్పుళ్ళతోపాటు మోసుకొస్తూ
టక టకా పట్టాలపై చక్రాలు పరుగెత్తుతున్న జీవధ్వని
యాత్రించడమొక వ్యసనం
గడపదాటిన ప్రతిసారీ
ఎవరైనా చేసేది వెదకడమే..రోడ్లను..మనుషులను..కాలపు పొరల లోతులను
ఒంటరిగా వెళ్ళడం..సమూహమై తిరిగి తిరిగి
మళ్ళీ ఒంటరిగానే తిరిగి రావడం
కొన్ని కూడికలు..కొన్ని తీసివేతలు..అంతే
ప్రశ్నలేమో పరుగెత్తే అరికాళ్ళకింది గాజుముక్కలు
కారుతున్న రక్తానికి ఉనికుంటుందా..చిరునామా ఉంటుందా
ఉక్కపోస్తూ ఉక్కిరిబిక్కిరౌతున్నపుడు
మార్చురీ గదుల మౌనరోదన..రక్తహీనతతో పాలిపోయిన చంద్రుడు
అర్థరాత్రులు బీట్ కానిస్టేబుల్ కంకకట్టె కణకణ చప్పుడు
అలసి నిద్రపోలేక దుఃఖించే రోడ్లు
ఎక్కడినుండో ఏడుస్తూన్న కుక్క స్పృహ
ఏదో జరుగుతోంది..అని తెలుస్తూనే
ఏదీ జరుగడంలేదన్న అసత్య నిర్ధారణ
శరీరంలోనుండి బయటకు వెళ్ళిపోవడం
ఎప్పుడో మళ్ళీ తిరిగి రావడం..అప్పుడప్పుడు రాకపోవడం
మరణమా అది.?

ఒక ఖాళీ ఊయల ఊగుతూంటుంది దూరంగా..ఒంటరిగా
ఇనుపగొలుసుల చప్పుడు గాలిని చెరుస్తూ
హృదయంనిండా ఒట్టి ఎడారి
ఇసుకతుఫానులో కొట్టుకుపోతూ ఒక నువ్వూ ఒక నేనూ
శేష నిశ్శేషాల స్పృహ
చేయిని విడిచి నువ్వు కోర్ట్ అవరణలోనుండి నడిచివెళ్తున్నప్పటి
నిశ్శబ్ద వియుక్తత
ఏమిటో..అన్నీ లెక్కలు లెక్కలుగా మనుషులు భాగించబడుతున్నపుడు
కన్నీటిని తుడుస్తున్న వ్రేలు విలువెంత..వ్చ్
కనీసం కంటినిండా నిద్రపోవాలన్న కోరికతీరని వ్యాకులతలో
అన్నీ స్వప్న ఖండాలే శకలాలు శకలాలుగా రాలిపడ్తూ
శేషరాత్రంతా వెదుక్కోవడమే ఎవరికివారు
ముసుగులు తొలగిపోతూ,రంగులు వెలిసిపోతూ
లోపలినుండి దహనం మొదలై మంటలు విస్తరిస్తున్నపుడు
కాలిపోయేదేదో..కాల్చబడేదేదో అర్థంకాని నిశ్చేష్ట –

చాలా దూరమే జరిగింది ప్రయాణం
కదలికలన్నీ వ్యూహాలని అవగతమౌతున్నపుడు
నీ నా చలనాలన్నీ
ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
జవాబు రాదు .. నడక ఆగదు
సరియన జవాబు రావాలంటే
సంధించబడ్తున్న ప్రశ్న సరిగా ఉండాలి
అనిర్వచిత గమ్యంవైపు ఎన్నాళ్ళని నడుస్తూనే ఉంటావు
ఆగు..ఆగి చూచుకో లోపలికి…తొంగి తొంగి గమనిస్తున్నపుడు
దిగుడుబావిలోకి వంగి చూస్తున్నట్టు భయమేస్తోందికదా – ఊc.

– రామా చంద్రమౌళి

 

Everyone has to search…eventually!

-Prof. Raamaa Chandra Mouli

 

It’s night

the banging on the doors continues

who knows who would call whom and for what reason !

Wind blowing through the window carried with it

Taktaka… taktakaa

a hooting and the live trundling noise of wheels on the rails

travel, an addiction

after we step out of the threshold, search is unavoidable:

searching for roads

searching for people

searching the layers of life…

alone we go, as a group we roam and roam

and return alone; some additions, some subtractions

that’s all.

All questions reduce themselves to shards

under the running feet…

does the oozing blood have any identity…an address?

When stifled in humid weather, silent tears are shed

within the confines of the mortuary rooms; bloodless, the moon

appeared pale…night is filled with tap…tap noise of the police-batons…

Unable to sleep, the tired roads weep in insomniac sorrow…

Cognizance of a dog’s wail from somewhere; something is happening…

but a false confirmation of nothing occurring…a feeling of

slipping out of the body and slipping back into it at an impromptu moment;

at times not returning to the body too…is that death?

 

A vacant swing keeps swinging afar…alone;

sound from the iron chains suspended to the swing scatter the wind

desert filling the hearts: a you and an I caught in a simoom

Awareness of all that’s left…

Din of forced separation…of your walking away from the court leaving my hand…

Can’t say anything…when people get divided based on estimates

what might be the value of those loving hands that wipe the tears?

Tch…in the agony of unfulfilled wish for a sound sleep everything is

segments of dreams dropping as fossils;  rest of the night is spent

in each searching for one’s self…the masks lift, colours fade while from within

internal combustion begins and spreads as flames, a shock at

the conundrum of what’s burning and what’s being burnt…

 

it’s quite a long journey.

When it’s realized that all movements are strategies

Your and my efforts are mere unproven equations…

There will not be any answers…the walk is never suspended…

Every answer depends upon the manner the question is put.

How long will you go on walking towards an undefined destination?

Stop…! Stop and look within…deep and deeper…

Aren’t you frightened as if you were bending to look into a very deep well?

 

(original evarainaa cheeseedi vedakatamee)

Transl. Prof. Indira Babbellapati

indira

ఇంకో నేను

15-tilak

 

 

 

 

నేను నేను కాదు అప్పుడప్పుడూ

రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని

అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని

అసంకల్పితంగా

రాలే ఋతువులు

నాలో కొన్ని

నిర్లిప్తాలో

నిస్సంకోచాలో

గోడ మీద అందంగా పేర్చబడ్డ సగం పగిలిన ఆత్మలో

గుర్తులేదు కానీ ఇంకా ఎన్నింటినో

వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు

ఆత్మహత్యకు తయారవుతూ

మునుపో

నేడో

ఎప్పుడో

నిశ్శబ్దం నవ్వులో నుండి

పదాలన్ని వెచ్చని పందిర్లుగా

తెరిచి మూసిన తలుపులు

ఒరుచుకున్న ఆకాశపు మట్టి

భావాలు ఇంకొన్ని

కళ్ళనూ

కడుపునూ కన్నీళ్ళతో కుట్లేస్తూ

పగలో ఆకలి పొట్లం

ఇప్పుడు మళ్ళా నేను కాదు

మధ్యాహ్నం కడుకున్న ఎంగిలిని

కూసింత ఎర్రటి ముసురు

ఒక నిద్ర

మరో మెలకువ

రెండూ నాలోనే

నాతోనే

రాళ్లు పడ్డ పదార్థం

తరంగాలుగా పగులుతూ

నన్ను గుర్తుచేస్తూ

మనిషి నిక్షేపాలు

చెరిగిన చెమ్మ అంచు అంచుపై నిలబడుతూ

నన్ను నేను శోదిస్తూ

 

-తిలక్ బొమ్మరాజు

అదేంకాదు కానీ..

bvv prasad

 

 

 

 

 

అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

 

 -బివివి ప్రసాద్