అదేంకాదు కానీ..

bvv prasad

 

 

 

 

 

అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

 

 -బివివి ప్రసాద్

మీ మాటలు

  1. మైథిలి అబ్బరాజు says:

    ” ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
    పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది ” -అవును కదా. Charms for easy life అంటారు, ఆ సూత్రాలు మీ మాటలు…Thank you always !

  2. అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
    అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
    లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
    జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

    ఎంత అద్భుతమైన వర్ణన, మాటల పొందిక భగవంతు డిచ్చిన వరమేమో.రచన చాలా మనసుకు హత్తుకునేలా వుంది.

  3. బ్యూటిఫుల్ ….మీ కవితలు చదివితే ఒక ఆనందం లాంటి స్ఫూర్తి వస్తుంది ఎప్పుడూ.

    నిజంగా ఇలా జీవించి చూడాలి అనిపించేలా వుంది ఈ కవిత. Great one!

  4. మీ మాటలు ఆలోచనలు మరియు సంబోధనలు మమ్ములను సేద తీర్చుచున్నవని రేపటి రోజుకు తయారు చేస్తున్నాయని చెప్పుటకు మా మాటలు సరిపోవు కదా !

  5. ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
    మరీ అంత లోతుగా ఆలోచించవలసింది
    ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
    పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది …

    ఏముంది ?

    బాగుంది …

  6. _/\_ ప్రతీ మాట, ప్రతీ వాక్యం ఇంత సున్నితంగా “చింతించాల్సినది ఏముంది ? ” అని ప్రశ్నిస్తూనే సమాధానాలు చెప్తూ స్ఫూర్తి దారులలో విడిచి పెట్టింది మీ కవిత . ఇక్కడే ఆగిపోయి “దిగులు సాలెగూళ్ళన్నిటినీ చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి, అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి ” , నిజంగానే మోహన తులసి గారు చెప్పినట్టు “ఒక ఆనందం లాంటి స్ఫూర్తి ” మీ కవిత . Its an amazing anticipation of life. Thank u sir

  7. మిత్రుల సహృదయ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  8. శబాశ్

  9. //ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
    పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది//
    అవును మరి నాకేం కనపడలా!
    సంతోషం దుఖం, వాస్తల్యం, ప్రేమ అన్నీహార్మోనప్రభావ!

  10. “దిగులు సాలెగూళ్ళన్నిటినీ
    చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
    విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి” – మంచి అలొచన. బాగుంది.

  11. కర్లపాలెం హనుమంత రావు says:

    మీ అక్షరాలు మీద కురిసినప్పుడల్లా దుమ్ము కొట్టుకు పోయిన తర్వుతి అద్దంలా స్వచ్చంగా ఐపోతుంది మనసు ఓ కాసేపు. ప్రసాదు గారూ! అక్షరంలోనా.. అది పక్క అక్షరంతో కలిసి చేసే శబ్దంలోనా.. మొత్తం మీద కవిత చదువుతున్నంత సేపూ ఓ పచ్చని చెట్టు కింద నిలబడి కొద్దికొద్దిగా తడుస్తూ వాన జోరును చూస్తున్నట్లు..

మీ మాటలు

*